ముస్లిం అస్తిత్వవాదం వైపు ఖదీర్ ‘న్యూ బాంబే టైలర్స్’

dani

 దాదాపు పధ్నాలుగేళ్ల క్రితం ‘దర్గామిట్ట’ కథలతో ఖదీర్‌ బాబు సాహిత్యరంగ ప్రవేశం చేశాడు. గడిచిన పన్నెండేళ్ళ కాలంలో రాసిన మరో  పన్నెండు కథల్ని  ‘న్యూబాంబే టైలర్స్‌’ శీర్షికతో ఇప్పుడు మరో  సంకలనం తెచ్చాడు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ ముస్లిం పిలగాడి అల్లరి, చిల్లరి, గడుసు, గడుగ్గాయి యవ్వారం దర్గామిట్ట కతలు. వాటిల్లో, అక్కడక్కడ చూచాయిగా కొన్ని పోకడలు   వున్నప్పటికీ,  దర్గామిట్ట కతల లక్ష్యం ముస్లిం అస్తిత్వవాదం కాదు. ఒకవిధంగా అవి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు’పచ్చనాకు సాక్షి’కి ‘మతాంతీకరణ’ కతలు అనంటే ఖదీర్‌ బాబుకు కూడా అభ్యంతరం వుండకపోవచ్చు. నామిని తనకు గురువని ఖదీరే స్వయంగానూ, వినయంగానూ ప్రకటించుకున్న సందర్భాలున్నాయి.

 

ఖదీర్- నామిని ఒక తలకోన జ్ఞాపకం!

ఖదీర్- నామిని ఒక తలకోన జ్ఞాపకం!

‘న్యూబాంబే టైలర్స్‌’ కథా సంపుటి కతే వేరు. కథా వస్తువు, కథాంశం,  కథనం, శిల్పం, టెక్నిక్‌, మానవ సంఘర్షణ అలా ఏవిధంగా చూసినా’న్యూబాంబే టైలర్స్‌’ లోని కథలు ‘దర్గామిట్ట కథల’కన్నా ఒక తరం ముందుంటాయి. దర్గామిట్ట కథల్లాగ కేవలం తెలుగు-ముస్లిం సమాజపు సాంస్కృతిక వాతావరణాన్ని పరిచయం చేయడంతోనే ఇవి సంతృప్తి చెందవు. ముస్లిం అస్తిత్వవాదం వైపు అడుగులేస్తాయి. అంతేకాదు, ‘కింద నేల ఉంది’ కథలో హిందూ ఆణగారిన కులాలు, స్త్రీల, అస్థిత్వవాద ఛాయలు కూడా  కనిపిస్తాయి. సంకలనంలో చివరి కథ ‘గెట్‌ పబ్లిష్డ్‌’కు  వచ్చే సమయానికి రచయిత తన ఐడెంటిటీని మరింత బాహాటంగా ప్రకటిస్తాడు. తన కథనశిల్ప నైపుణ్యాన్ని మరింత సమర్ధంగా ప్రదర్శిస్తాడు.

విభిన్న మతసమూహాల మధ్య సాంస్కృతిక వైవిధ్యం వుంటుందిగానీ,  సాంస్కృతిక విబేధం వుండదు. హిందువు గుడికి వెళితే ముస్లింలకు వచ్చే ఇబ్బందిగానీ, ముస్లింలు నమాజు చేసుకుంటే హిందువులకు కలిగే అభ్యంతరంగానీ, తనంతటతానుగా, ఏవిూవుండదు. అయితే, రాజకీయార్ధిక  అంశాలు ప్రవేశించాక, పోటీ పెరిగి, సమూహాల ఉనికే సమస్యగా మారుతుంది. అప్పుడు, రాజకీయార్ధిక విబేధాలన్నీ సాంస్కృతిక విబేధాలనే భ్రమను కల్పిస్తాయి. అలాంటి సందర్భాల్లో  రెండు సమూహాలూ, ప్రాణప్రదమైన, రాజకీయార్ధిక  అంశాల్ని పక్కన పెట్టి, బొట్టు, బుర్ఖా, లుంగి, పంచె వంటివాటి గురించి అసంబధ్ధంగా  తలపడుతుంటాయి.

భారత సాంస్కృతికరంగాన్ని, మరీ ముఖ్యంగా, భారతముస్లింల సాంస్కృతిక వికాసాన్ని, 1992కు ముందు, ఆ తరువాత అని విడగొట్టి,అధ్యయనం చేయాల్సి వుంటుంది.        ఎందుకంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, భారత సమాజంలోని రెండు ప్రధాన ప్రజాసమూహాలని సాంస్కృతిక పునాది విూద విడగొట్టాలనే కుట్రతో కొందరు బాబ్రీమస్జిద్‌ ను కూల్చివేసింది ఆ సంవత్సరమే!

‘జవిూన్‌’ కథలో కసాబ్‌  గల్లీ, మాలపాళెం గొడవ కూడా అలాంటిదే. కొట్లాటల్లో సత్తా కోసం కొందరు గాడిద పాలు తాగేవారని ఖదీర్‌ రాశాడుగానీ. నిజానికి వాళ్లకు ఆ అవసరంలేదు!. ఎందుకంటే, రాజకీయ గాడిదలే అలాంటి పనులు చేస్తాయి!!. కనుక, వాళ్ళు ప్రత్యేకంగా గాడిద పాలు తాగాల్సిన పనిలేదు.

బాబ్రీమస్జిద్‌ – రామ్‌ మందిర్‌ వివాదంలో సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు పక్షాన కేసు వేసిన, మొహమ్మద్‌ హాషిమ్‌ అన్సారీ, దిగంబర్‌ అఖార నిర్వాహకుడు రామచంద్ర పరమహంస దాస్‌, నిజజీవితంలో, ‘జవిూన్‌’ కథలో హుస్సేన్‌, బ్రహ్మయ్య లాంటివాళ్ళే. మసీదులో నమాజ్‌ జరగడంలేదనే బెంగతో ఒకరు,రామమందిరంలో దీపంపెట్టే దిక్కు కూడా లేకపోయిందనే ఆవేదనతో మరొకరు  1961లో ఫైజాబాద్‌ కోర్టులో కేసు వేశారు.

అన్సారీ, పరమహంస ఇద్దరూ, భక్తులు. మంచి స్నేహితులు. వాజ్యం  నడుస్తున్న కాలంలోనూ ఒకరినొకరు కలవకుండా ఒక్కరోజు కూడా వుండేవారుకాదు. రోజూ సాయంత్రం పూట పరమహంస ఇంటి దగ్గర కలిసి పేకాడుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. వాయిదావున్న రోజుల్లో ఇద్దరూ కలిసి ఒకే సైకిల్‌ పై కోర్టుకు వెళ్ళొచ్చేవాళ్ళు.  వయసులో పరమహంస పెద్ద, అన్సారీ చిన్న. పరమహంసని వెనక క్యారియర్‌ పై కూర్చోబెట్టుకుని  అన్సారీ సైకిల్‌ తొక్కేవాడు. కోర్టు ఫీజులకు డబ్బులు సరిపోకపోతే ఒకరికొకరు సర్దుకునేవాళ్ళు. కేసు కాగితాలు మర్చిపోతే, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. అవసరమైనప్పుడు ఒకరి కొకరు జావిూను ఇచ్చుకునేవాళ్ళు. చివరకు ఒక సందర్భంలో (బహుశ ఎమెర్జెన్సీ  రోజులు కావచ్చు)  ఇద్దరూ ఒకే జైల్లో ఒకే సెల్లో  వున్నారు. (బహుశ, ఆ సెల్లోనే, ఎవరి దిక్కుకు వాళ్ళు తిరిగి, నమాజ్‌, పూజలు జరుపుకునివుంటారు.)  వయసు మళ్ళి పరమహంస చనిపోయాక,  నిర్మోహీ అఖారా అధ్యక్షుడయిన మహంత్  భాస్కర దాస్‌ తో కూడా అన్సారీ అదే స్నేహబంధాన్ని కొనసాగించాడు.

బాబ్రీమసీదు వివాదంలో, హిందూ-ముస్లిం స్నేహబంధం మీద ఇప్పటికీ నమ్మకం కుదరనివాళ్ళు వుండొచ్చు. వాళ్లు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి“V Hashim Ansari — A Long Wait’   అని కొట్టి నివృత్తి చేసుకోవచ్చు. అప్పట్లో, ’ద హిందూ’, ’ఫ్రంట్ లైన్’ పత్రికల్లో కూడా అన్సారీ, పరమహంసల మిత్రబంధంపై చాలా వార్తలొచ్చాయి.

అన్సారీ,  ఓ ఇంటర్వ్యూలో, అప్పుడు వాతావరణం ఏమాత్రం చెడిపోలేదు”  (“కోయీ మహోల్ నహీ బిగడా తబ్”)   అన్నాడు. అప్పుడు ….  అంటే, మత ప్రాతిపదికపై జనాన్ని చీలిస్తేనేగానీ, తమకు అధికారం దక్కదని సంఘ్‌ పరివారం భావించడానికి ముందు;  రాజకీయాల్లోనికి భారతీయ జనతా అనే ఒక పార్టి పుట్టక ముందు; లాల్‌ కిషన్‌ అద్వానీ అనే ఒక రాజకీయ నాయకుడు అశ్వమేధ యాగాలుచేసి, యాగాశ్వాన్ని దేశం విూదికి సవాలుగా వదలడానికి ముందు అని అర్ధం. ఖదీర్  జవిూన్‌ కథలో అయితే, బ్రహ్మయ్య కొడుకు రవణ ”తెల్లారిలేచి, యింతెత్తు బొట్టుపెట్టుకుని, యింతెత్తు కర్రపట్టుకుని” పోవడం మొదలెట్టక ముందు (పేజీ 38) అని అర్ధం. మతతత్వ రాజకీయ నాయకులు భక్తినీ, స్నేహాన్నీ కూడా ఇంతగా కలుషితం చేసేస్తారని వాస్తవ జీవితంలో అన్సారీ, పరమహంసలకు తెలీదు. ఖదీర్‌ కథలో హుస్సేన్‌, బ్రహ్మయ్యలకూ తెలీదు.

ఖాళీ స్థలాన్ని చూస్తే చాలా మందికి ఖాళీ స్థలమే కనిపిస్తుంది. కానీ, ఓ తాపీ మేస్త్రికి అందులో ఒక అందమైన ఇల్లు కనిపిస్తుంది. ‘ద థింగ్‌ ఇన్‌ ఇట్‌ సెల్ఫ్‌’!. దక్షణ దిక్కున మొదలెట్టి, నైరుతీ మూలన ఎత్తుపెంచి, ఆగ్నేయాన మంటపెట్టి, వాయువ్యాన్ని గాలికి వదిలి, ఈశాన్య మూలన పల్లంచేసి,నిర్మాణాన్ని ముగించడం ఎట్లాగో తోస్తుంది. ఇసక, కంకర, సిమెంటు, ఇటుకలు, లావుకడ్డీలు, సన్న కడ్డీలు, బైండింగ్‌ వైరు ఏవి ఎంతెంత కావాలో టకటకా బుర్రలోకి వచ్చేస్తాయి. కథా శిల్పంలో, ఖదీర్‌ అలాంటి ఓ మంచి తాపీమేస్త్రి. కథా నమూనా (పారాడిజిమ్‌)  తనకు బాగా తెలుసు. పైగా అతనికి ఈ వాస్తు గొడవ లేదు. నిర్మాణం కచ్చితంగా  తెలుసు గాబట్టి, కథను ఏ మూల మొదలెట్టినా, అనుకున్న రూపంలో దాన్ని సమర్పించవచ్చనే, రచయిత, ధీమా  ప్రతి కథలోనూ కనిపిస్తుంది.

కథకు మానవ సంఘర్షణే ప్రాణం. దాన్ని ఏ నమునాలో చెప్పాలన్నది రెండో అంశం. ఈ రెండు పనులు పూర్తి అయ్యాక, కథకు కండ పుష్టిని అందించడానికి, సజీవంగా మార్చడానికి, ఆయా పాత్రల గురించీ, వాటి వృత్తుల గురించి, అవి తిరుగాడిన పర్యావరణాన్ని గురించి, రచయితలు, వాస్తవ జీవితంలో విస్తృతంగా పరిశోధన సాగించాలి.

కొంతమంది రచయితలు ఈ క్రమాన్ని తలకిందులుగా చేస్తుంటారు. వాస్తవ జీవితంలో దొరికిన కొన్ని పాత్రల్ని  తీసుకొచ్చి, అక్షరాల్లో పొదిగితే దానికదే కథ అయిపోతుందనుకుంటారు. చాలాచాలా అరుదుగా మాత్రమే అలా కుదరవచ్చు! ఎందుకంటే,  వాస్తవ జీవిత పాత్రలకు ఒక పరిమితి వుంటుంది.  ఒక దశలో అందరికీ ఎంతో ఉత్తేజాన్నిచ్చిన వ్యక్తులు కూడా ఆ తరువాతి కాలంలో చచ్చుబడి పోతుంటారు. నాలుగున్నర దశాబ్దాలుగా, భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయ స్రవంతిగా కొనసాగుతున్న నక్సల్‌ బరీ ఉద్యమానికి ‘తొలి హీరో’ జంగల్‌ సంథాల్‌ జీవిత చరమాంకం ఏమిటీ? అందువల్ల, వాస్తవ జీవితం నుండి దేన్నీ స్వీకరించాలో, ఏ మోతాదులో స్వీకరించాలో, దేన్ని వదిలెయ్యాలో, దేన్ని సవరించాలో, దేన్ని కల్పన చేయాలో రచయితలకు కచ్చితంగా తెలియాలి.  అలాంటి సృజనాత్మక సాహిత్య విచక్షణా జ్ఞానంలో ఖదీర్‌ సిధ్ధహస్తుడు.

పాత్రల పర్యావరణాన్ని గురించి ఖదీర్‌ పరిశోధన ఎంత విస్తృతంగా సాగుతుందంటే, అతను చిత్రించే కల్పిత పాత్రలు సహితం నిజజీవిత పాత్రలేనేమో అని భ్రమను కల్పిస్తాయి. ‘న్యూబాంబే టైలర్స్‌’  కథలో పీరూభాయి మద్రాసు వెళ్ళి, హార్బర్లో బిల్లులు లేకుండా రెండు సింగర్‌ మిషిన్లు కొంటాడు. మూర్‌ మార్కెట్‌ అంతా  తిరిగి కత్తేర్లు, స్కేళ్ళు, టేపులు కొంటాడు. (పేజీ-9) ఇలాంటి సూక్ష్మ వివరాలు కథని దాదాపు వాస్తవ  జీవితంగా మార్చేస్తాయి.

ఖదీర్‌ పరిశోధన ఫలితాలు, ఆయా వృత్తుల వారికి, వాస్తవ జీవితంతంలో ఒక కొత్త అర్ధాన్నీ, ఉత్తేజాన్ని కల్పిస్తాయి. ‘న్యూబాంబే టైలర్స్‌’  కథలో, ”గుడ్డలు కుట్టడమంటే, కొలతల్నిబట్టి కుట్టడంకాదు. మనిషినిబట్టి కుట్టడం” (పేజీ-11) అంటాడు పీరూభాయి. ఉత్పత్తిరంగంలో,  మాస్‌ కస్టోమైజేషన్‌ కు,ఇండివిడ్యువల్‌  కస్టోమెరైజేషన్‌ కు ఎప్పుడూ ఒక ఘర్షణ వుంటుంది. ఒకటి సాధారణమైనది. మరొకటి ప్రత్యేకమైనది. పీరూభాయి మాటల ద్వారా  సాంప్రదాయ దర్జీ వృత్తికారులకు ఒక ఉత్తేజకర నినాదాన్ని ఇస్తాడు ఖదీర్‌!

సృజనాత్మక రచయితల సమర్ధత అక్షరాల్లో వుండదు; అక్షరాలు మాయమైపోవడంలో వుంటుంది. కథ చదవడం  మొదలెట్టిన కొద్దిసేపటికే,పేజీల్లోంచి అక్షరాలు మాయమైపోవాలి.    పాఠకుల వ్యక్తిగత అనుభవం మేరకు, ఊహాశక్తి మేరకు, ఆ కాగితాల్లోంచి, కొన్ని పాత్రలు పుట్టుకొచ్చి, ఒక కొత్త పర్యావరణంలోనికి పాఠకుల్ని తమవెంట లాక్కుపోవాలి. చదువుతున్నారో, చూస్తున్నారో తెలీని ఒక  చిత్తభ్రమకు పాఠకుల్ని లోనుచేయాలి. రచనల్లో మనం చూస్తున్నది సజీవ వ్యక్తుల్ని అనుకున్నప్పుడే పాఠకులు పాత్రల ఉద్వేగాల్లో లీనమైపోయి, ఆనందించడమో, బాధపడ్దమో, నవ్వడమో,ఏడ్వడమో చేస్తారు.  సాహిత్య ఆస్వాదన అనేది రచయిత, పాఠకులు , పాత్రలు ముగ్గురూ  కలిసిచేసే జుగల్‌ బందీ! కొంచెం శాస్త్రబధ్ధంగా చెప్పుకోవాల్సివస్తే,  ‘గతితార్కిక సంబంధం’ అనుకోవచ్చు! అయితే, పాఠకులకు అలాంటి ఉద్వేగానికి గురిచేయగల దినుసుల్ని, ప్రణాళికాబధ్ధంగా,అందించగల సమర్ధత రచయితలకు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

కొన్ని కథలు చదువుతున్నప్పుడు ఆద్యంతం అక్షరాలే కనిపిస్తుంటాయి. అంటే, ఉద్వేగాన్ని కల్పించగల దినుసులు వాటిల్లో పడలేదని అర్ధం. మరి కొన్ని కథలు చదువుతున్నప్పుడు, అక్కడక్కడైనా, అక్షరాలు మానవావతారం ఎత్తి మనల్ని ఒక ఉద్వేగానికి గురిచేస్తాయి. అంటే, ఉద్వేగాన్ని కల్పించగల దినుసులు వాటిల్లో పడ్డాయని అర్ధం. ఇలాంటి అనుభూతి ‘న్యూబాంబే టైలర్స్‌’ కథల్లో తరచుగా కలుగుతుంది.

పాఠకుల్లో భావోద్వేగాల్ని మేల్కొలిపే అనేకానేక దినుసుల గురించి ఖదీర్‌ కు బాగా తెలుసు. వాటిని అతను సమయానుకూలంగా వాడడమేగాక,అత్యంత ఆధునిక పధ్ధతుల్లో వాడుతాడు. ‘కింద నేల వుంది’ కథలో ”దార” అని ఒకే ఒక పదంతో ఒక పేరా వుంటుంది. (పేజీ – 60). అంటే ”కాస్సేపు వర్షాన్ని ఆస్వాదించి రండి” అంటూ పాఠకులకు ఒక రిలీఫ్‌ ఇస్తాడు రచయిత! అలాగే, కొన్ని చోట్ల పాఠకులు  నవ్వుకోడానికీ,  ఏడ్వడానికీ కొంత జాగా వుంచుతాడు.  దీని అర్ధం ఇతరుల రచనల్లో, ఇలాంటి సందర్భాలు ఉండవనికాదు. దాన్ని ఒక విధానంగా, ఒక శైలిగా అలవర్చుకున్నాడు ఖదీర్.

సృజనాత్మక సాహిత్యంలో మరో విశేషం వుంటుంది. రచయిత ఒక అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే, ఆ ఉత్తేజంతో, పాఠకులు దానికి తమ సృజనాత్మకతను కూడా జోడించి, రచయిత కూడా ఊహించని కొత్త భావోద్వేగాలకు గురవుతారు. ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది.  తెర విూద హీరో, హీరోయిన్లే కనిపిస్తే  ప్రేక్షకులు సినిమాలో లీనంకారు. నిజజీవితంలో తమకు తెలిసిన పాత్రలు మదిలో మెదలాలి. రచనల్లో అలాంటి చిన్న కొక్కేన్నీ  రచయిత పెడుతూ వుండాలి.

రెడీమేడ్‌ అపెరల్‌  ఫ్యాక్టరీలు వచ్చి, ఊర్లోని సాంప్రదాయ దర్జీలందర్ని, బకాసురుడిలా వరసపెట్టి మింగేశాక, పీరూభాయి వంతు వస్తుంది. ఆరోజు ….. ”తెల్లారి అజాన్‌  వినిపించడంతోనే తాళాలు తీసుకుని రైల్వే రోడ్డుకు వచ్చాడు. తలెత్తి బాంబే టైలర్స్‌ బోర్డు చూసుకున్నాడు. షాపు తెరచి ఒకసారి మిషన్లనీ, బల్లనీ చూసుకున్నాడు.  బయట కుర్చీ వేసుకుని బుగ్గ కింద పాన్‌ అదిమి పెట్టి ఆ చల్లటి గాలిలో మౌనంగా కూర్చున్నాడు. పదకొండు గంటలకు వచ్చాడు కొడుకు” అంటాడు రచయిత.

ఈ సన్నివేశంలో,  దాదాపు ఐదు గంటలపాటూ పీరూభాయి ఒంటరిగా దుకాణంలో కూర్చున్నాడు అని  గమనించిన పాఠకులు తప్పనిసరిగా ఒక ఉద్వేగానికి గురవుతారు. ఇన్నాళ్ళూ  జీవనభృతినీ, జీవితాన్నీ, గౌరవాన్నీ, వ్యక్తిత్వాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఉనికినీ ఇచ్చిన ఆ కత్తెర, ఆ బల్ల,  ఆ కుట్టుమిషన్లను వదిలేయాల్సి వచ్చినపుడు పీరూభాయి విలపించకుండా వుండగలడా?జీవితకాలం తన కుడిచేతికి కొనసాగింపుగా మసిలిన ఆ కత్తెరని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకుని వుంటాడు?  ఆ కుట్టుమిషన్ని ఎన్నిసార్లు ఆలింగనం చేసుకునివుంటాడూ? ఆ బల్ల ఒడిలో తలపెట్టి ఎంతసేపు ఏడ్చి వుంటాడూ?.

మనుషులు ప్రకృతితో మాట్లాడడం  జానపద సాహిత్యంలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరైనా, చెట్లు, జంతువులు, రాళ్ళు, యంత్రాలతో మాట్లాడుతుంటే వాళ్ళను మన వైద్యనిపుణులు మానసికరోగులు అంటారు. మాట్లాడడానికి సాటి మనిషి దొరకనపుడు మనుషులు నిజంగానే యంత్రాలతో ముచ్చటించుకుంటారు. అది యంత్రయుగపు విషాదం మాత్రమే కాదు; కొందరికి అనివార్యమైన నిట్టూర్పు కూడా!

ఆ ఐదు గంటల్లో పీరూభాయి అవేదన గురించి  పాఠకుల్లో కలిగే ఉద్వేగాల్ని కాగితం విూద పెడితే  ‘దర్జీవిలాపం’ అని ఒక ఖండకావ్యం అవుతుంది. ఇది రచయిత రాసిందికాదు. పాఠకులు తమ సృజనాత్మకతతో కొనసాగించింది. ఇలాంటి కొనసాగింపులు ఎంత విస్తృతంగా జరిగితే, ఆ రచన అంతగా సార్ధకం అయినట్టు.  నిపుణులైన రచయితలు తాము సృజనాత్మకంగా రాయడమేగాక, పాఠకుల్లోని సృజనాత్మకతను కూడా మేల్కొల్పగలుగుతారు. ఖదీర్‌ కూడా అలాంటి కోవలోకే వస్తాడు.

క్రిష్టోఫర్ నోలన్ సినిమా ’ఇన్సెప్షన్’ (2010) చూసినప్పుడు ఒక విస్మయ అనుభవం కలుగుతుంది. ఒకే సమయంలో, ఒకే పాత్రలు, మూడు భిన్నమైన ప్రదేశాల్లో, మూడు భిన్నమైన చలన వేగాలతో ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి కథన ఎత్తుగడ మనకు  మహాభారత రచనలో, పిండ రూపంలో,  కనిపిస్తుంది. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెపుతున్న కథను, వేరే కాలంలో వేరే చోట, శౌనకాది మహా మునులకు సూతుడు చెపుతుంటాడు. భీష్మపర్వం మొదలయ్యాక ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర యుధ్ధ విశేషాలు చెపుతుంటాడు. అంటే, ఒకేసారి మూడుచోట్ల, మూడు కాలాల్లో ’కథ చెప్పడం’ కొనసాగుతూవుంటుంది. పోతనామాత్యుని భాగవతంలో గజేంద్రమోక్షం సన్నివేశంలో ఒక్కొక్క పద్యానికీ సంఘటన స్థలం మారిపోతుంటుంది. ఒక పద్యం భూలోకంలో గజేంద్రుని దీనావస్తను వివరిస్తుంటే, ఆ వెంటనే మరో పద్యం వైకుంఠంలో విష్ణమూర్తి కదలివస్తున్న తీరును వివరిస్తుంటుంది,  1980వ దశకం చివర్లో, క్వెంటిన్ టారంటినో ప్రవేశం తరువాత, హాలివుడ్ సినిమాల్లో ఆధునిక నాన్-లీనియర్ కథనాలు ఊపందుకున్నాయి. ఆడియో-విజువల్ మీడియాలో కొత్తగా వస్తున్న అనేక ఆధునిక టెక్నిక్కుల్ని ప్రింట్ మీడియాకు వర్తింపచేయడానికి ఖదీర్ గట్టిగా కృషిచేస్తున్నాడు. తద్వార కథాంశాలతోపాటూ, కథన శైలిలో కూడా  కొత్తదనాన్ని తీసుకురావడం అతనికి సాధ్యం అవుతోంది. అందుకు ’గెట్ పబ్లిష్డ్’  కథ మంచి ఉదాహరణ.

ఒక జటిలమైన కథాంశాన్ని, గాడితప్పకుండా  చెప్పడం అంత సులభంకాదు. ఇందులో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు టూ లోని మసీద్‌ సెంటర్‌ లో మొదలైన కథ, చార్మినార్‌ చుడీ బజార్‌, లుంబినీపార్క్‌ గోకుల్‌ ఛాట్‌ పేలుళ్ళు, ముస్లిం యువకులపై తప్పుడు కేసులు, ఢిల్లీ జామియానగర్‌ షూట్‌ అవుట్‌,  సిడ్నీలో డాక్టర్‌ హనీఫ్‌, బెంగళూరులో హనీఫ్‌ భార్య, గుల్బర్గా గొడవలు, సమాచారశాఖామంత్రి నష్టపరిహార ప్రకటన, పోలీసు చిత్రహింసలు వగయిరాల చుట్టూ తిరుగుతుంది. పైగా, ఒకే సమయంలో కథ రెండు మూడు చోట్ల జరుగుతూ వుంటుంది. మరీ ఇంత పెద్ద కాన్వాస్‌ తీసుకున్నప్పుడు రచయితగానీ, పాఠకులుగానీ గందరగోళపడే ప్రమాదం వుంటుంది. కానీ అలా జరక్కుండా  చాలా సమర్ధంగా ముగింపుకు తీసుకుపోతాడు ఖదీర్‌. డ్రైవర్‌ నయాబ్‌, ఫకీర్‌  ఫాతిమా, వాళ్లబ్బాయి ముష్టాక్‌ పాత్రలు కథ ముగిశాక కూడా పాఠకుల్ని వెంటాడుతాయి. అవి నిజజీవిత పాత్రలన్నట్టుగా సాగుతుంది ఖదీర్‌ శిల్పనైపుణ్యం. అతని పరిశోధనా విస్తృతి అలాంటిది.

ఇల్లు తగలబడిపోతుంటే ఫొటో కాలిపోయిందని ఏడ్చేవాళ్లను చూస్తే వింతగా వుంటుంది. ఘోర విపత్తులో చిక్కుకున్నప్పుడు నిస్సహాయులూ, దిక్కులేనివాళ్ళు  అలా నిస్పృహతో వింతగానే ప్రవర్తిస్తారు. ప్రధాన సమస్య నుండి బయట పడే మార్గాలు తెలీనపుడు, తెలిసినా సాధించలేమని తెలిసినపుడు, వాళ్ళే ఓ చిన్న సమస్యను వెతుక్కుని వెక్కివెక్కి ఏడుస్తారు. తనను టెర్రరిస్టని అనుమానించి, అవమానించి, ఎత్తుకుపోతున్న పోలీసుల్ని ఏవిూచేయలేని, ఏవిూ అనలేని  డ్రైవర్‌ నయాబ్‌, అత్తరు సీసాకోసం పెనుగులాడే సన్నివేశం నిస్సహాయుల  నిస్పృహ ప్రవర్తనకు  మంచి ఉదాహరణ.

ఆర్ధిక విధానాల్లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వచ్చాక ముందుగా నాశనం అయిపోయింది చేతివృత్తి కార్మికులు. అభివృధ్ధి పేరిట సాగిన విధ్వంసం వెయ్యి ప్రకృతి వైపరిత్యాలకన్నా భయానకమైనది.  మార్కెట్‌ పై విదేశీ సంస్థల దాడులకు వ్యతిరేకంగా చేతివృత్తి కార్మికులు చేసే పోరాటాలకు,సూత్రప్రాయంగా అయితే,  దేశీయ (జాతీయ) పెట్టుబడిదారులు  నాయకత్వం వహించాలి. కానీ అలా జరగడంలేదు. కనీసం, అత్యధిక సందర్భాల్లో అలా జరగడంలేదు. దేశీయ పెట్టుబడిదారులు దళారీ పెట్టుబడీదారులుగా మారిపోయి విదేశీ సంస్థలకు స్థానిక ప్రతినిధులుగా మారిపోతున్నారు.

ఈ అభివృధ్ధి వైపరీత్యాలపై  చేతివృత్తి కార్మికులు, ఇతర ప్రజాసమూహాలతో కలిసి ఎలాంటి పోరాటాన్ని చేయాలి? పీరూభాయి వంటివాళ్ల సంక్షోభాలకు పరిష్కారం ఏమిటీ? వంటి సందేహాలకు జవాబు కోసం ఆర్‌. ఎస్‌. రావ్‌ నో, జాన్‌ మిర్డాల్‌ నో ఆశ్రయించాల్సి వుంటుంది. ”భారత దేశపు ఖనిజ సంపదని దోచుకుపోవడానికి  సామ్రాజ్యవాదులు కుట్ర చేశారు. దీన్ని అడ్డుకోడానికి అడవిలో యుధ్ధం మొదలైంది. ఈ యుధ్ధంలో విూరు ఎటువైపు?”అని ప్రశ్నించాడు జాన్‌ మిర్డాల్‌; ఇటీవల హైదరాబాద్‌ వచ్చినపుడు.

ఉగ్రవాదానికి మతంలేదు. లేదా, ఉగ్రవాదులులేని మతంలేదు. నిజానికి, కొందరు నిస్పృహతో చేసే ఒంటరి చర్యలేతప్పా,  ఏ మతసమాజంలోనూ ఉగ్రవాదానికి ఎన్నడూ ఆమోదాంశంలేదు.     బలహీనదేశాల్లో సహజ వనరుల దోపిడీకీ, సామ్రాజ్యవాదానికీ, దాని స్థానిక దళారులకూ, విశాల ప్రజానీకానికీ, తీవ్రవాదానికీ, ఉగ్రవాదానికీ, మతతత్వానికీ మధ్యనున్న సంబంధాన్ని వివరించే రచనలు విస్తృతంగా రావల్సిన అవసరం ఈనాడు ఎంతో వుంది.

చట్టసభల సభ్యులు, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ, విూడియా కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయని చెప్పే సాహసం ఇప్పడు ఎవరికీలేదు.  ఈ నాలుగు వ్యవస్థలు కలిసి కార్పొరేట్‌ సంస్థల్ని నడుపుతున్నాయన్నది నేటి నిజం.  ఈ మాట విూద అభ్యంతరం ఉన్న  వాళ్ళు, దీన్ని తిరగేసి కూడా చెప్పుకోవచ్చు.   కార్పొరేట్‌ సంస్థలే  ఈ నాలుగు వ్యవస్థల్ని నడుపుతున్నాయి అనుకోవచ్చు!

హంతకులకన్నా ఆర్ధిక నేరస్తులు దేశానికి ప్రమాదకారులని ఇటీవల ఓబుళాపురం మైనింగ్‌ లీజు  కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్‌ హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఒక కోటి నలభై లక్షల టన్నుల ఇనప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించేసి, 4,310 కోట్ల రూపాయల దేశసంపదని దోచేసిన కేసు ఇది. ఒప్పందంలో, కేవలం ‘క్యాప్టీవ్‌’ అనే ఒకేఒక్క పదాన్ని తొలగించివేయడంతో, ఇంతటి అక్రమం అంతా బాజాప్తగా రాజమార్గంలోనే సాగిందంటే  మన ప్రభువులు ఎంత తెలివి విూరిపోయారో తెలుసుకోవచ్చు. దేశభద్రతకు ముప్పుగా, ప్రధానమంత్రి తరచుగా హెచ్చరించే సీమాంతర ఉగ్రవాదం, అంతర్గత తీవ్రవాదాలకన్నా ఇది పెద్ద ముప్పుగా కనిపించకపోతే, మన మెదళ్ళు మొద్దుబారిపోయాయని  భావించవచ్చు. ఇదీ  ఈనాడు మన దేశానికివాటిల్లిన ప్రధాన ముప్పు; ప్రజాసంపదని, దేశసంపదని ప్రైవేటుపరం చేయడం.  దేశాన్ని విదేశాలకు చట్టబధ్ధంగా అమ్మేయడం!   ఇంతటి పెద్ద వ్యవహారాన్ని పక్కనపెట్టి, ఎక్కడో ఏదో ఒక పేలుళ్ల కేసులో పదిమంది ముస్లింలని అరెస్టు చేసినట్టు వార్తలొస్తే, ”ప్రభుత్వం పనిచేస్తోంది. మన భద్రతకు ముప్పులేదని” అనుకుని, ధీమాగా నిద్రపోవడం మనకు అలవాటయిపోయింది.! మనకు అలాంటి ధీమాను తరచుగా కలిగించడానికి ప్రభువులు మరికొందరు అమాయకుల్ని కూడా అరెస్టు చేస్తూవుంటారు.  గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో అయితే, ఎన్‌ కౌంటర్లు కూడా చేస్తుంటారు!

‘న్యూబాంబే టైలర్స్‌’లో, ఛిద్రమై పోతున్న ముస్లింల జీవితాల్ని సృజించడంతో మొదలైన కథా సంకలనం,  చివరి కథ ‘గెట్‌ పబ్లిష్డ్‌’లో,  టెర్రరిస్టుల నెపంతో అమాయక ముస్లింలను వేధిస్తున్న తీరును సృజించడంతో ముగుస్తుంది.  సమస్యను సృజించడమే ఇప్పటికి ఖదీర్‌ లక్ష్యం కావచ్చు.  సమస్యకు పరిష్కారం చూపడం కుదరనప్పుడు, కథకు ఒక అందమైన మలుపు ఇచ్చి ముగించడం మేలు అనే సూత్రం ఒకటుంది.  ఆ సూత్రాన్ని, ఖదీర్‌ సమర్ధంగా వాడుతుంటాడు. బహుశ ఈ కారణంవల్లనే అతని కథల్లో ముక్తాయింపులు, చివరి వాక్యాలు చిన్నగానూ, అందగానూ, శక్తివంతంగానూ వుంటాయి.

రష్యన్‌ మహారచయిత మాక్సిం గోర్కి తన జీవిత అభ్యాసాన్ని  ‘నా బాల్యం’, ‘నా బాల్యసేవ’ (మై అప్రెంటిస్‌ షిప్‌), ‘నా విశ్వవిద్యాలయాలు’ అంటూ మూడు భాగాలుగా రాశాడు. ఖదీర్‌ బాబు ‘దర్గామిట్ట కతలు’ రచయితగా ఖదీర్‌ బాల్యం అనుకుంటే, ‘న్యూబాంబే టైలర్స్‌’ కథా సంపుటి అతని స్నాతకోత్సవంగా భావించవచ్చు. భవిష్యత్తులో ఖదీర్‌ కలం వెంట స్నాతకోత్తర రచనలు కూడా రావాలని  ఆశిద్దాం.

 

(15 ఫిబ్రవరి 2012న పుస్తకావిష్కరణ సభలో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం)