ఆల్బర్ట్ కామూ కథ … అతిథి

camus

 

సెరెన్‌ కీర్కెగార్డ్‌ (1813-55) అనే డేనిష్‌ తత్త్వవేత్త రచనలు ఆధారంగా ప్రారంభమైన  ఒక తాత్త్విక సిద్ధాంతం, నేడు “అస్తిత్వవాదం”గా ప్రచారంలో ఉంది. జర్మన్‌ తత్త్వవేత్త ఫ్రీడ్రిక్‌ నీచ (‘నీచ’ సరైన ఉచ్చారణే!)(Friedrich Nietzsche), ఫ్రెంచి తత్త్వవేత్త జఁపాల్‌ సార్‌ట్రె (Jean Paul Sartre) ఈ వాదాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. కీర్కెగార్డ్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి తనజీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చుకుని, అటువంటి జీవితాన్ని నిజాయితీగానూ, నిష్టగానూ జీవించడంలో సమాజానికీ, మతానికీ ఏమీ సంబంధంలేదు, అలాజీవించడంలో వ్యక్తికి పూర్తి  స్వేచ్ఛ ఉంది. “Existence Precedes essence” అంటే, అన్నిటికంటే ముందు వ్యక్తి … స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని కార్యాచరణ చెయ్యగలిగిన జీవి… ఆ తర్వాతే అతనికున్న బహురూపాలు, సిద్ధాంతాలూ, నమ్మకాలూ, విశ్వాసాలూ… అన్నది ఈ సిద్ధాంతపు మూల భావన. ఒకే సమాజంలో ఉన్నా, ఒకే మతంలో ఉన్నా, ప్రతివ్యక్తికీ తనవంటూ కొన్ని మౌలికమైన విశ్వాసాలూ, నైతికభావనలూ ఉంటాయి. అవే అతను సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు  నిర్ణయం తీసుకుందికి సహకరించి నడిపిస్తాయి.    
 
ఆ తాత్త్విక భావనకు అనుగుణంగా వ్రాసిన కథ ఆల్బర్ట్ కామూ “అతిథి” అని చాలా మంది విశ్లేషిస్తారు. మూలభాషలో వాడిన పదానికి అతిథి (ఇక్కడ అరబ్బు), అతిథేయి( దారూ) అని రెండర్థాలు ఉన్నాయి. ఒక రకంగా ఈ కథలో దారూ పాత్ర, కామూకి ప్రతిబింబమే. జీవితంలో ఎంచుకోడానికి ఎప్పుడూ అవకాశాలుంటాయి. లేనిదల్లా ఎంపిక చేసుకోనక్కరలేకుండా ఉండగలగడం. (All that is  missing is the independence not to choose anything.) ఎందుకంటే, మనిషి ఎప్పుడూ “you are damned if you do; you are damned if you don’t do” పరిస్థితులలోనే చిక్కుకుంటాడు. ఈ కథలో దారూ, అరబ్బూ అటువంటి పరిస్థితిలో వాళ్ళనిర్ణయాలు వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలపై ఎలా ఆధారపడి ఉన్నాయో ఇందులో గమనించ వచ్చు. 

 
ఆల్బెర్ట్ కామూ (7 నవంబరు 1913 – 4 జనవరి 1960) ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెలు బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. అతను “The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని “వ్యక్తి స్వేచ్ఛగురించి లోతుగా పరిశీలిస్తూనే, నిహిలిజాన్ని వ్యతిరేకించడానికే సరిపోయింది”. (నిహిలిజం తార్కికంగా  జీవితానికి ఏదో ఒక గమ్యం,లక్ష్యం ఉన్నాయన్న ప్రతిపాదనని ఖండిస్తుంది). టెక్నాలజీని ఆరాథనాభావంతో  చూడడానికి అతను పూర్తి వ్యతిరేకి. అతనికి ఏ రకమైన తాత్త్విక ముద్రలూ ఇష్టం లేదు…. ముఖ్యంగా ఎగ్జిస్టెన్షియలిస్టు అన్న పదం.  

—————————————————————————————————————————————————————————-

స్కూలు మాస్టరు వాళ్ళిద్దరూ కొండ ఎక్కుతూ తనవైపు రావడం గమనించాడు. ఒకరు గుర్రం మీద ఇంకొకరు నడిచి వస్తున్నారు. కొండవాలులో కట్టిన ఈ స్కూలుభవనం చేరడానికి అకస్మాత్తుగా ఎక్కవలసిన మిట్ట దగ్గరకి వాళ్ళింకా చేరుకోలేదు. ఎత్తుగా విశాలంగాఉన్న ఈ ఎడారివంటి మైదానంమీద మంచుతోనూ, రాళ్లతోనూ నిండిన త్రోవలో శ్రమిస్తూ నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఉండిఉండి ఆ గుర్రం అడుగులు తడబడుతోంది. చప్పుడు వినపడకపొయినప్పటికీ తను దాని ముక్కురంధ్రాలగుండా వస్తున్న బరువైన పొగలుకక్కుతున్న ఊపిరులని చూడగలుగుతున్నాడు.  ఆ ఇద్దరిలో కనీసం ఒక్కడికైనా ఈ ప్రాంతం బాగా పరిచయమే అని తెలుస్తోంది. ఎందుకంటే మురికి తేరిన   మంచుపొరల క్రింద ఎన్నో రోజుల క్రిందటే కప్పడిపోయిన త్రోవని వాళ్ళు సరిగానే గుర్తించగలుగుతున్నారు. స్కూలుమాస్టరు వాళ్లకి కొండ ఎక్కడానికి కనీసం అరగంట పడుతుందని అంచనా వేసుకున్నాడు. చాలా చలిగా ఉంది. అందుకని స్వెట్టరు తెచ్చుకుందికి వెనక్కి స్కూల్లోకి వెళ్ళేడు.

2

అతను ఖాళీగా, చల్లగా ఉన్న తరగతిగది దాటేడు. గత మూడురోజులబట్టీ, బ్లాక్ బోర్డు మీద నాలుగు రంగుసుద్దలతో గీసిన ప్రాన్సుదేశపు నాలుగునదులూ తమ సంగమస్థలాలకి పరిగెడుతూనే ఉన్నాయి. వర్షం ఎత్తిగట్టేసిన ఎనిమిదినెలల అనావృష్టితర్వాత, అక్టోబరునెల మధ్యలో వర్షాకాలం లేకుండా ఒక్కసారిగా మంచు కురవడం ప్రారంభించింది. దానితో ఈ మైదానప్రాంతంలో చెల్లాచెదరుగాఉన్న గ్రామాల్లోంచి రావలసిన ఆ ఇరవైమంది విద్యార్థులు బడికి రావడం మానేశారు. మళ్ళీ వాతావరణం మెరుగయ్యాకే వాళ్ళు స్కూలుకి వచ్చేది. అందుకని తరగతిగదిని ఆనుకుని తూర్పువైపు మైదానానికి తెరుచుకునే తను కాపురముంటున్న గదినే ‘దారూ’ వెచ్చగా ఉంచుకుంటున్నాడు. తరగతిగది కిటికీల్లాగే తన గది కిటికీ కూడా దక్షిణం వైపుకే తెరుచుకుని ఉంటుంది. అటువైపు నుండి చూస్తే స్కూలు భవనం … మైదానం దక్షిణానికి ఒరిగినట్టు కనిపించే చోటునుండి కొద్ది కిలోమీటర్ల దూరమే. నిర్మలమైన వాతావరణంలో ఊదారంగు పర్వతశ్రేణి మధ్య ఖాళీ … ఎడారి దిక్కు చూస్తూ కనిపిస్తుంది.

3

కొంచెం ఒళ్ళు వెచ్చబడనిచ్చి దారూ మొదటిసారి తను ఇద్దరినీ గమనించిన కిటికీ దగ్గరకి వచ్చి నిలుచున్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఆ మిట్ట  ఎక్కినట్టే. మంచుకురవడం రాత్రే ఆగిపోవడంతో, ఆకాశం మరీ అంత చీకటిగా లేదు. మేఘాల తెరలు తొలగడం ప్రారంభించడంతో ఉదయం చీకటిగా ప్రారంభమయినా మధ్యాహ్నం రెండుగంటలయేసరికి, రోజు అప్పుడే ప్రారంభమయిందా అన్నట్లు ఉంది. వదలని చీకటిలో తరగతిగది రెండు తలుపులూ టపటపా కొట్టుకునేట్టు గాలి వీస్తూ ఏకధాటిగా ముద్దలా మంచుకురిసిన గత మూడురోజులతో పోల్చుకుంటే, ఇది నయమే.  అప్పుడయితే తను ఎక్కువభాగం తనగదిలోనే గడపవలసి వచ్చింది … బొగ్గులు తెచ్చుకుందికో, షెడ్డులోని కోళ్లకి మేతవెయ్యడానికో వెళ్ళిరావడం మినహాయిస్తే. అదృష్టవశాత్తూ మంచుతుఫానుకి రెండురోజులు ముందరే ఉత్తరాన అతిదగ్గరగా ఉన్న తాడ్జిద్ గ్రామంనుండి సరుకురవాణా వాహనంలో తనకి కావలసిన అత్యవసర సరుకులు వచ్చేయి. ఆ వాహనం మళ్ళీ రెండురోజుల తర్వాత వస్తుంది.

4

అది రాకపోయినా, తనకి ఇలాంటి మంచుతుఫానులని తట్టుకుందికి కావలసినంత అత్యవసర సరుకు నిల్వఉంది… ప్రభుత్వం అనావృష్టిబారినపడ్డ ఇక్కడి విద్యార్థుల కుటుంబాలకి సాయంచెయ్యడంకోసం ఇచ్చిన గోధుమబస్తాలతో ఆ చిన్నగది చిందరవందరగా ఉంది. నిజానికి వాళ్ళందరూ కరువు బాధితులే, ఎందుకంటే అందరూ నిరుపేదలే. ప్రతిరోజూ దారూ వాళ్ళకి దినబత్తెం కొలిచి పంచేవాడు. పాపం, ఈ కష్టసమయంలో వాళ్ళెంతగా దాన్ని పోగొట్టుకుంటున్నారో తనకి తెలుసు.  బహుశా వాళ్ళలో ఏ పిల్లవాడి తండ్రో ఈ మధ్యాహ్నం రాకపోడు. వస్తే, వాళ్ళకి ఆ గింజలు కొలిచి ఇవ్వగలడు. మళ్ళీ పంట చేతికొచ్చేదాకా ఏదోలా నెట్టుకురాగలిగితే చాలు. అప్పుడే ఫ్రాన్సునుండి ఓడల్లో గోధుమలు వచ్చేస్తున్నాయి. కనుక గడ్డురోజులు తొలిగిపోయినట్టే. కానీ, ఆ దైన్యపురోజులు మరిచిపోవడం చాలా కష్టం… ఒక్క చినుకైనా రాలక నెలల తరబడి పచ్చని మైదానాలలో దయ్యాలు తిరుగుతూ, ఎండకి మాడి మసయిపోయి, కొంచెంకొంచెంగా నేల బీటలుబారుతూ, అక్షరాలా దహించుకుపోయినట్టయి, కాళ్ళక్రింద పడిన ప్రతిరాయీ గుండగుండయిపోవడం తనకింకా గుర్తే. గొర్రెలు వేలసంఖ్యలో మరణించాయి. అక్కడక్కడ మనుషులుకూడా… ఒక్కోసారి ఎవరికీ ఆనవాలు చిక్కకుండా చనిపోయిన సందర్భాలున్నాయి.

5

ఆ పేదరికంతో పోలిస్తే, ఈ ఒకమూలకి విసిరేసినట్టున్న స్కూలుభవనంలో బిక్షువులా గడిపిన తను, ఈ తెల్లగా సున్నం వేసిన గదిగోడలూ, ఇరుకైన మంచం, రంగువెయ్యడానికి నోచుకోని బీరువాల మధ్య, తనకి వారానికి సరిపడా ఉన్న ఆహారమూ నీటివసతితో,  ఇక్కడి జీవితం ఎంత కఠినంగా ఉన్నా, దర్జాగా మహరాజులా బ్రతుకుతున్నట్టే. కానీ, ఇదిగో … ఏ వానసూచనలూ హెచ్చరికలూ లేకుండా అకస్మాత్తుగా ఇలా మంచుతుఫానులు వచ్చేస్తుంటాయి. ఇక్కడివాతావరణం తీరే అంత… బ్రతకడం మహా కష్టం, మనిషి అన్న వాడి జాడ లేకుండా…  ఉంటేమాత్రం ఏమిటి? పరిస్థితులేమీ మెరుగుపడేది లేదు. దారూ ఇక్కడే పుట్టాడు. ఇంకెక్కడున్నా, అతనికి ప్రవాసంలో ఉన్నట్టే ఉంటుంది.

6

స్కూలు భవనం ముందున్న దిన్నె మీదకి ఎక్కేడు. ఆ ఇద్దరు వ్యక్తులూ మిట్ట సగం దూరం ఎక్కినట్టు కనిపిస్తోంది. అందులో గుర్రం మీదున్న వ్యక్తిని గుర్తుపట్టేడు తను… చాలా కాలం నుండి తనకి పరిచయమున్న పోలీసు బాల్డూక్సి. అతని చేతిలో ఉన్న తాడుకి రెండో కొసని  రెండుచేతులూ బంధింపబడి, తలదించుకుని, గుర్రానికి వెనక ఒక అరబ్బు నడుస్తున్నాడు. పోలీసు దారూని చూస్తూ అభివాదసూచకంగా చెయ్యి ఊపేడుగానీ, వెలిసిపోయిన నీలి ‘జెలాబా’ తొడుక్కుని, కాళ్ళకి ముతక ఊలు మేజోళ్ళతో, సాండల్స్ వేసుక్కుని, తలమీద బిగుతుగా పొట్టిగా ఉన్న ‘చెచే’తో నడుస్తున్న అరబ్బును గూర్చిన ఆలోచనలలో మునిగిపోయిన దారూ దాన్ని గమనించలేదు. వాళ్ళిద్దరూ సమీపిస్తున్నారు. అరబ్బుకి ఇబ్బందికలగకుండా బాల్డూక్సి తన గుర్రాన్ని నిలువరిస్తున్నాడు. ఆ గుంపు (గుర్రంతో సహా) నెమ్మదిగా సమీపిస్తోంది.

7

కూతవేటు దూరంలోకి రాగానే, బాల్డూక్సి కేక వేసాడు: “అల్ అమూర్ నుండి ఈ మూడు కిలోమీటర్ల దూరం నడవడానికీ గంట పట్టింది.” దారూ సమాధానం చెప్పలేదు. మందంగా ఉన్న స్వెట్టరు తొడుక్కుని, పొట్టిగా, చదరంలా కనిపిస్తున్న దారూ … వాళ్ళు ఆ మిట్ట ఎక్కడం గమనిస్తున్నాడు. ఒక్కసారికూడా ఆ అరబ్బు తల పైకిఎత్తి చూడలేదు. వాళ్ళు మిట్టమీదకి చేరుకోగానో, “హలో’ అంటూ దారూ పలకరించాడు. “రండి, రండి. చలి కాగుదురు గాని,” అని ఆహ్వానించేడు. తాడుని వదలకుండా, బాల్డూక్సి కష్టపడి గుర్రం మీంచి దిగేడు. నిక్కబొడుచుకున్న గుబురుమీసాలలోంచి స్కూలుమాష్టరుని చూసి నవ్వేడు. కందిపోయిన నుదిటిమీద లోపలికి పొదిగినట్టున్న నల్లని చిన్న కళ్ళూ, మూతిచుట్టూ ముడుతలు దేరిన చర్మంతో అతను చాలా జాగ్రత్తమంతుడుగా, పనిపట్ల శ్రద్ధగలవాడుగా కనిపిస్తున్నాడు. దారూ కళ్ళేలు అందుకుని గుర్రాన్ని షెడ్డులో కట్టడానికి  తీసికెళ్ళి వచ్చేసరికి ఈ ఇద్దరూ స్కూలుదగ్గర అతనికోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళని తనగదిలోకి తీసుకెళ్ళి, “నేను తరగతిగది వెచ్చగా ఉండేట్టు చేస్తాను. అక్కడయితే మనకి మరికొంత సౌకర్యంగా ఉంటుంది,” అన్నాడు. తను మళ్ళీ గదిలోకి వెళ్ళేసరికి బాల్డూక్సి మంచంమీద కూర్చున్నాడు. అరబ్బు పొయ్యికి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అరబ్బు చేతులు ఇప్పటికీ బంధించబడేఉన్నాయి. బాల్డూక్సి తన చేతికున్న కట్లు విప్పుకున్నాడు.  అరబ్బు తలమీదనున్న ‘చెచే’ని కొంచెం వెనక్కితోసి, అతను కిటికీదిక్కు చూస్తున్నాడు. దారూ ముందు గమనించింది  నీగ్రోవేమో అనిపించేట్టున్న అతని బలమైన, నున్నటి, విశాలమైన పెదాలు. అరబ్బు ముక్కు మాత్రం నిటారుగా ఉంది. అతని కళ్ళు చిక్కగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. వెనక్కి తోసిన ‘చెచే’ అతని ఎత్తైన నుదిటిని సూచిస్తే, ఎండకీ వానకీ నిలదొక్కుకున్న అతని చర్మం, ఇప్పుడు చలికి పాలిపోయి కనిపిస్తోంది. అతను వెనక్కి తిరిగి సూటిగా తన కళ్ళలోకి చూడగానే, దారూకి అతని ముఖంలో అలసటా, ధిక్కారమూ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించేయి . “ఆ గదిలోకి వెళ్ళు! ఈలోగా నేను మీకు పుదీనా టీ తీసుకు వస్తాను,” అన్నాడు. బాల్డూక్సి, “థేంక్స్!” అన్నాడు. “ఎన్ని అవస్థలురా బాబూ! ఎప్పుడు రిటైరవుతానా అని అనిపిస్తోంది,” అని తనలోతాను అనుకుని, ఖైదీవంక తిరిగి అరబ్బీ భాషలో, “నిన్నే! కదులు,” అన్నాడు. ఆ అరబ్బు నెమ్మదిగా లేచి, ఇంకా బంధించి ఉన్న చేతులు ముందుకి చాచుకుంటూ మెల్లగా తరగతిగదిలోకి నడిచాడు.

8

hqdefault

టీతో పాటే, దారూ ఒక కుర్చీకూడా తీసుకు వచ్చేడు. అప్పటికే బాల్డూక్సి అతనికి దగ్గరగా ఉన్న పిల్లల రాతబల్లమీద ఎక్కి కూర్చున్నాడు; అరబ్బు కిటికీకి డెస్కుకీ మధ్యనున్న పొయ్యికి అభిముఖంగానూ, టీచరుబల్లకి ఎదురుగానూ నేలమీద చతికిలబడి కూర్చున్నాడు. అతనికి టీ గ్లాసు అందించబోయి, అతని చేతులకి ఇంకా కట్లుండడం చూసి దారూ కాసేపు తటపటాయించేడు. “అతని చేతులకి కట్లు విప్పొచ్చేమో,” అన్నాడు. “తప్పకుండా,”అన్నాడు బాల్డూక్సి. “ఆ కట్లు ప్రయాణం కోసమే,” అని చెప్పి లేవబోయాడు. కానీ దారూ గ్లాసుని నేలమీద ఉంచి, అరబ్బుకి ప్రక్కన మోకాళ్లమీద కూర్చున్నాడు. ఏమీ మాటాడకుండా అరబ్బు తన తీక్ష్ణమైన చూపులతో దారూని గమనించసాగేడు. చేతుల కట్లువిప్పేక, వాచిపోయిన చేతులని ఒకదానితో ఒకటి రాసుకుని, టీ తీసుకుని, మరుగుతున్న టీని ఆత్రంగా చప్పరించసాగేడు… ఒక్కొక్క గుక్కా…”

9

“బాగుంది,” అని, దారూ,”ఇంతకీ ఎక్కడికి మీ ప్రయాణం?” అని అడిగేడు బాల్డూక్సిని.

టీలో మునిగిన తన మీసాన్ని బయటకి తీస్తూ, బాల్డూక్సి. “ఇక్కడికే !”

“చిత్రమైన విద్యార్థులే! అయితే ఈ రాత్రికి మీ మకాం ఇక్కడేనా?”

 

“లేదు, లేదు. నేను రాత్రికి అల్ అమూర్  వెళిపోవాలి. నువ్వు ఈ మనిషిని టింగ్విట్ లో అప్పచెప్పాలి. అతను పోలీసు హెడ్ క్వార్టర్సులో ఉండాలి.”

బాల్డూక్సి స్నేహపూర్వకంగా నవ్వేడు దారూని చూస్తూ.

“ఇదేమిటి ఈ వ్యవహారం? నాతో వేళాకోళం ఆడటం లేదు కద?” అన్నాడు స్కూలు మాష్టరు.

“లేదు, నాయనా. అవి ఉత్తర్వులు.”

“ఉత్తర్వులా? నే నేమీ…” అంటూ ఆర్థోక్తిలో ఆగేడు, ఆ కార్సికన్ పోలీసు అహాన్ని దెబ్బకొట్టడం ఇష్టం లేక.

“నా ఉద్దేశ్యం, అది నా పని కాదు అని.”

“అలా అనడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి? యుద్ధ సమయంలో అందరూ అన్ని పనులు చేయాల్సిందే.”

“అలా అయితే, యుద్ధ ప్రకటనకి ఎదురు చూస్తుంటాను!”

బాల్డూక్సి తల పంకించేడు.

“సరే! ఉత్తర్వులయితే ఉన్నాయి. అవి మీకుకూడా వర్తిస్తాయి. కాకపోతే రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడో తిరుగుబాటు జరగొచ్చని అనుమానంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, మే మందరం దానికి సంసిద్ధులుగా ఉన్నాం.”

దారూ ముఖంలో ఇంకా ఆ ధిక్కార ఛాయలు తొలగిపోలేదు.

 

10

“చూడు నాయనా,” బాల్డూక్సి చెప్పబోయాడు, “నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్నర్థం చేసుకోడానికి ప్రయత్నించు.  అల్ అమూర్ లో మేం  ఓ డజనుమందిమి మాత్రమే ఉన్నాం ఆ ప్రాంతం అంతా గస్తీ తిరగడానికి. నేను త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలి. నాకిచ్చిన ఉత్తర్వు ప్రకారం నేను ఇతన్ని నీకు అప్పగించి ఆలస్యం చెయ్యకుండ వెనక్కి వెళ్ళిపోవాలి. అతన్ని అక్కడ ఉంచడం కుదరదు. అతని గ్రామంలో తిరుగుబాటు జరగబోతోంది. వాళ్లు అతన్ని వెనక్కి తీసుకుపోవాలనుకుంటున్నారు. రేపుసాయంత్రానికల్లా నువ్వతన్ని టింగ్విట్ లో అప్పగించాలి.  సన్నగాఉన్న నీలాంటి వాడికి ఇరవై కిలోమీటర్లు ఒక లెఖ్ఖ కాదు.  ఆ పని పూర్తయేక, నీ బాధ్యత పూర్తవుతుంది. నువ్వు యధాప్రకారం నీ పాఠాలు చెప్పుకోడానికీ, నీ సుఖమైన జీవితానికీ మరలిపోవచ్చు.”

11

గోడ వెనక గుర్రం అసహనంగా సకిలించడం, నేలమీద గిట్టలతో రాయడం తెలుస్తోంది. దారూ కిటికీలోంచి బయటకి చూస్తున్నాడు. వాతావరణం మెరుగవడం ఖచ్చితంగా తెలుస్తోంది; మంచుతడిసిన ఆ మైదానంమీద వెలుగు క్రమంగా పెరగనారంభించింది. మంచు అంతా కరగనిచ్చి, సూర్యుడు మళ్ళీ అందుకుంటాడు… ఈ రాళ్లతో నిండిన పొలాల్ని మంటపెడుతూ. మనిషితో ఏ మాత్రం సంపర్కంలేని ఈ ఏకాంత ప్రదేశంమీద ఏ మార్పూలేని ఆకాశం రోజులతరబడి అలా ఎండవెలుగుని కుమ్మరిస్తూనే ఉంటుంది.

అతను బాల్డూక్సివైపు తిరిగి, “ఇంతకీ, అతను చేసిన అపరాథం ఏమిటి?” అని అడిగేడు.

ఆ పోలీసు నోరుతెరిచి బదులుచెప్పేలోపునే తిరిగి, “అతనికి ఫ్రెంచి మాటాడడం వచ్చునా?” అని అడిగేడు.

“లేదు. ఒక్క ముక్క కూడా రాదు. అతని కోసం మేం నెల్లాళ్ళుగా గాలిస్తున్నాం. వాళ్లతన్ని దాచిపెట్టేరు. అతను తన దగ్గర బంధువుని హత్యచేశాడు.”

“అతను ఏమైనా దేశద్రోహా?”

12

“అలా అనుకోను. కానీ, మనం ఏదీ రూఢిగా చెప్పలేం.”

“ఎందుకు చంపేడు?”

“ఏదో కుటుంబకలహం. ఒకరు ఇంకొకరికి ధాన్యం బాకీ పడ్డట్టున్నారు. అయితే ఖచ్చితంగా తెలీదు. టూకీగా చెప్పాలంటే, అతను అతని బంధువుని కొడవలిలాంటి కత్తితో చంపేడు. ఎలా అంటే గొర్రెని వేటు వేస్తారే అలా… క్రీక్…” అంటూ బాల్డూక్సి గొంతుక్కి అడ్డంగా చెయ్యి గీతలాగీస్తూ ఒక అభినయం చేశాడు. ఆ చేష్టకి అరబ్బుదృష్టి అతనిపై పడి అతని వంక ఆదుర్దాగా చూసేడు. దారూకి మనుషులమీద కోపం వచ్చింది… మనుషులందరిమీదా, వాళ్ల అర్థం పర్థం లేని వైషమ్యాలకీ, అదుపులేని వైరాలకీ, వాళ్ళ రక్తదాహానికీ. పొయ్యిమీద ఉన్న కెటిల్ కూతపెట్టడంతో గుర్తొచ్చి రెండోసారి బాల్డూక్సీకి  అరబ్బుకి కూడా టీ ఇచ్చేడు. అరబ్బు రెండు చేతులూ పైకెత్తి అంత ఆత్రంగానూ టీ తాగడంతో, ఒంటిమీద ఉన్న ‘జెల్లబా’ తెరుచుకుని, స్కూలు మాష్టరుకి అతని కండదేరిన పీనవక్షం కనిపించింది.

“సరే, అయితే. థేంక్స్. నేను వెళ్ళొస్తా.” అన్నాడు బాల్డూక్సి.

లేచి అరబ్బు వైపు నడిచేడు జేబులోంచి చిన్న తాడుని బయటకి తీస్తూ.

“ఏం చేస్తున్నారు?” అని అడిగేడు దారూ యథాలాపంగా.

కంగారుపడ్డ బాల్డూక్సి చేతిలో ఉన్న చిన్న తాడుని చూపించాడు.

“దాని అవసరం లేదు.”

ఆ ముసలి పోలీసు కాసేపు సంకోచించి, “సరే, నీ ఇష్టం. నీ దగ్గర రక్షణకి ఆయుధం ఉందికదా?” అని ప్రశ్నించేడు.

“నా దగ్గర షాట్ గన్ ఉంది.”

“ఎక్కడ?”

“పెట్లో.”

13

“అది నీ పడక పక్కనే అందుబాటులో ఉండాలి.”

“ఎందుకూ? నాకు భయపడడానికి తగిన కారణం కనపడదు.”

“నువ్వు నిజంగా పిచ్చి వాడివేనురా అబ్బాయ్. ఒకసారి తిరుగుబాటు తలెత్తిందంటే, ఎవరి క్షేమానికి హామీ ఉండదు. మనందరం ఒక నావలో ప్రయాణిస్తున్న వాళ్ళమే.”

“నన్ను నేను రక్షించుకోగలను. వాళ్లు నా వైపుకి వస్తున్నప్పుడు చూడడానికి నాకు తగిన సమయం ఉంటుంది.”

బాల్డుక్సి నవ్వ సాగేడు. అతని గుబురు మీసాలు అతని పలువరసని దాచిపెట్టేయి.

“నీకు అంత సమయం ఉంటుందా? సరే అయితే. నే చెప్పబోయేదేమిటంటే నువ్వెప్పుడూ కొంచెం తిక్కగా మాటాడుతుంటావు. అయినా, ఎందుకో నాకు అది నచ్చుతుంది.” అంటూనే అతని జేబులోంచి ఒక రివాల్వరు తీసి టేబిలుమీద ఉంచేడు.

“ఇది నీ దగ్గర ఉండనీ. ఇక్కడనుండి అల్ అమూర్ వెళ్ళేలోపు, నాకు రెండు తుపాకులవసరం లేదు.”

టేబులుకి వేసిన నల్లరంగు నేపథ్యంలో తుపాకీ మెరుస్తోంది. పోలీసు అతని వైపు తిరగగానే, స్కూలు మాష్టరుకి తోలువాసనా, గుర్రపుచర్మం వాసనా ఒకేసారి ముక్కుకి సోకింది.

అకస్మాత్తుగా దారూ, “చూడు బాల్డూక్సీ! ఇదంతా నాకు గొప్ప చికాకు తెప్పిస్తోంది… ఇక్కడ మీరూ, మీ ఖైదీను. అతన్ని నేను అప్పగించను. పోరాడవలసి వచ్చిందా, తప్పకుండ పోరాడతాను. అంతేగాని అప్పగించను.”

ఆ ముసలి పోలీసు అతనికి ఎదురుగా నిలబడి అతనివంక తీక్ష్ణంగా చూడసాగేడు.

“నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు,” అన్నాడు నెమ్మదిగా. “నాకూ అతన్ని అప్పగించడం ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనిషి చేతిని తాళ్లతో బిగించడం అలవాటవదు. అలా చెయ్యాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది. నిజం. సిగ్గు చేటు. అలాగని, వాళ్లని వాళ్ళ ఇష్టానికి వదిలీనూ లేము.”

“నే నతన్ని అప్పగించను.” అన్నాడు దారూ ఖరాఖండీగా.

“అది ఉత్తర్వురా అబ్బాయ్. మరో సారి చెబుతున్నా. అది ఉత్తరువు,”

“సరే. అయితే ఆ ఉత్తర్వు ఇచ్చిన వాళ్ళకి నేను మీతో చెప్పింది చెప్పండి: నే నతన్ని అప్పగించను.”

14

బాల్డూక్సి ఏమిటి సమాధానం చెప్పాలా అని ఒకసారి ఆలోచించాడు. దారూని, అరబ్బునీ మార్చి మార్చి చూశాడు. చివరకి ఒక నిశ్చయానికి వచ్చి,

“లేదు. వాళ్లకి నే నేమీ చెప్పదలుచుకోలేదు. మమ్మల్ని వదుల్చుకుందామనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నేను కాదనను. నాకు ఈ ఖైదీని నీకు అప్పగించమని ఉత్తర్వులు ఉన్నాయి. అందుకే నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నా కోసం ఈ కాగితం మీద సంతకం చెయ్యి.”

“ఆ అవసరం లేదు. నువ్వు అతన్ని నాకు అప్పగించలేదని అబద్ధం ఆడను.”

“నాతో అలా మరీ అన్యాయంగా ప్రవర్తించకు. నాకు తెలుసు. నువ్వు నిజమే చెబతావని. నువ్వు ఇక్కడ పుట్టిపెరిగిన వాడివి. మీదు మిక్కిలి నువ్వో మగాడివి. కానీ, నువ్వు సంతకం చెయ్యాలి. అది పాటించవలసిన నిబంధన.”

దారూ డ్రాయరు తెరిచి, గులాబిరంగు ఇంకు ఉన్న చిన్న చదరపు సీసానీ, తను చక్కని చేతివ్రాత నమూనాలు తయారుచెయ్యడానికి వినియోగించే ఎర్ర ‘సార్జంట్ మేజర్’ పెన్ను ఉంచుకునే కర్ర స్టాండునీ బయటకు తీసి, కాగితంమీద సంతకం చేశాడు. పోలీసు దాన్ని జాగ్రత్తగా మడిచి పర్సులో పెట్టుకున్నాడు. అతను నిష్క్రమించడానికి వీధి తలుపువైపు నడిచాడు.

“నేను దిగబెడతాను. పదండి,” అన్నాడు దారూ.

“వద్దు,” అని గట్టిగా అన్నాడు బాల్డూక్సి, “ఇప్పుడు మర్యాదగా ప్రవర్తించి ప్రయోజనం లేదు. నువ్వు నన్ను అవమానించావు.”

15

అతను ఉన్నచోటే కదలకుండా ఉన్న అరబ్బుని ఒకసారి చిరాగ్గా చూసి, ఒక సారి గట్టిగా నిట్టూర్చి, ద్వారం వైపు నడిచేడు.

“బిడ్డా, శలవు.” అన్నాడు.

అతని వెనకే తలుపు మూసుకుంది.  బాల్డూక్సి అకస్మాత్తుగా కిటికీ దగ్గర ప్రత్యక్షమై, మళ్ళీ మాయమయ్యాడు. అతని అడుగులచప్పుడుని నేలమీద పరుచుకున్న మంచు మింగేసింది. గోడవెనక గుర్రం కదిలిన చఫ్ఫుడుకి, కోళ్ళన్నీ భయంతో అరిచేయి.  ఒక క్షణం తర్వాత మళ్ళీ కిటికీదగ్గర ప్రత్యక్షమయ్యాడు బాల్డూక్సీ కళ్ళెంతో గుర్రాన్నిపట్టుకుని నడుపుకుంటూ. వెనక గుర్రం అనుసరిస్తుండగా, అతను వెనక్కి తిరిగైనా చూడకుండా మిట్టదాకా నడచి, తర్వాత కనుమరుగయ్యాడు. క్రిందకి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వెళ్ళడం వినిపించింది. దారూ ఖైదీవైపు నడిచాడు; అతను కూచున్నచోటునుండి ఒక్కపిసరు కదలకపోయినా, రెప్ప వాల్చకుండ దారూనే గమనిస్తున్నాడు.

“ఇక్కడే ఉండు,” అని అరబిక్ లో చెప్పి తన పడకగదివైపు వెళ్ళేడు. అతను ద్వారంలోంచి వెళుతూ మళ్ళీ పునరాలోచనలోపడి, వెనక్కి డెస్కుదగ్గరకి వచ్చి, దాని మీదనున్న పిస్తోలుని తన జేబులో దోపుకున్నాడు. మరి వెనక్కి తిరిగి చూడకుండా తన పడకగదిలోకి ప్రవేశించాడు.

16

కొంతసేపు తన పక్కమీదవాలి, నిశ్శబ్దంగా, ఆకాశంకేసి చూడసాగేడు… చీకటి దాన్ని కనుమరుగుచేసేదాకా. ఇక్కడకి వచ్చిన కొత్తలో, ఈ నిశ్శబ్దమే అతనికి బాధాకరంగా ఉండేది. ఎగువనున్న మైదానాలనీ, ఎదురుగాఉన్న ఎడారినీ వేరుచేసే పర్వతపాదాల చెంతనున్న చిన్న ఊరికి తనని బదిలీ చెయ్యమని అర్జీ పెట్టుకున్నాడు. అక్కడ పచ్చగా, నల్లగా ఉత్తరానికీ… గులాబీ, పాలిపోయిన ఊదారంగులో దక్షిణానికీ… ఉన్న గోడలు సతతగ్రీష్మాన్ని సూచిస్తుంటాయి. ముందు అతనికి ఈ మైదానంలో ఇంకా ఉత్తరానికిఉన్న ఒకచోట నియామకానికి ప్రతిపాదన జరిగింది. ఎటుచూసినా రాళ్ళూరప్పలతో నిండిఉన్న ఈ నిర్జనప్రదేశంలో ఒంటరితనమూ, నిశ్శబ్దమూ భరించడం కష్టంగా ఉండేది. అక్కడక్కడ పొడవాటి చాళ్ళలా కనిపిస్తే వ్యవసాయం జరుగుతోందేమో ననుకునేవాడు తను. తీరా చూస్తే అవి భవననిర్మాణంలో ఉపయోగపడే ఒక రకమైన రాయిని తవ్వడానికి చేసిన చాళ్లు అవి. ఇక్కడ జరిగే ఒకే ఒక్క వ్యవసాయం రాళ్ళుతవ్వడం. అక్కడక్కడ రాళ్ళ మధ్యనున్న గతుకుల్లో చేరిన మెత్తని మట్టిని చెదురుమదురుగా ఉన్న గ్రామ ఉద్యానాల్లో వెయ్యడానికి అప్పుడప్పుడు గోకి, తవ్వి తీసుకెళుతుంటారు.

ఇక్కడి నైసర్గిక స్వరూపమే అంత. నాలుగింట మూడొంతులు భూబాగమంతా రాళ్లతో, గుట్టలతో నిండి ఉంటుంది. పట్నాలువెలిసి, అభివృద్ధిచెంది, అంతరించిపోయాయి. మనుషులు వచ్చేరు; ఒకర్నొకరు అభిమానించుకోడమో, తీవ్రంగా కలహించుకోడమో చేసి, చివరికి అంతా మరణించారు. ఈ ఎడారిలాంటి భూభాగంలో… తనైనా, తన అతిథి అయినా ఒక్కటే… ఎవరి ఉనికికీ విలువలేదు.  అలాగని, వాళ్ళిద్దరిలో ఎవరూ ఇంకెక్కడైనా బ్రతకగలరా అంటే, ఈ ఎడారికి బయట ఇంకెక్కడా బ్రతకలేరనీ దారూకి తెలుసు.

17

అతను లేచికూచునేటప్పటికి తరగతిగదిలోంచి ఏ చప్పుడూ వినిపించడం లేదు. అరబ్బు పారిపోయి ఉంటాడనీ, తనింక ఏ నిర్ణయమూ తీసుకోవలసిన అవసరం లేదనీ తన మనసులో ఒక క్షణకాలం మెదిలిన ఆలోచన ఇచ్చిన అచ్చమైన ఆనందానికి దారూకి ఆశ్చర్యం వేసింది. కానీ ఖైదీ పారిపోలేదు. అక్కడే ఉన్నాడు. అతను డెస్కుకీ, పొయ్యికీ మధ్య కాళ్ళు బారజాపుకుని పడుక్కున్నాడు. అంతే! కళ్ళు విశాలంగా తెరుచుకుని, లోకప్పువంక తేరిపారచూస్తున్నాడు. ఆ స్థితిలో, దళసరిగాఉన్న అతని పెదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి … బుంగమూతి పెట్టినట్టు .

“దా,” అని పిలిచేడు దారూ.

అతను లేచి దారూని అనుసరించాడు. తనగదిలో కిటికీకింద టేబిలుని ఆనుకున్న కుర్చీ చూపించాడు కూర్చోమని.

దారూ నుండి దృష్టి మరల్చకుండా అందులో కూచున్నాడు అరబ్బు.

“ఆకలిగా ఉందా?”

“అవును,” అన్నాడు ఖైదీ.

n127099

18

దారూ ఇద్దరికి భోజనం ఏర్పాటు చేశాడు. పిండీ, నూనె తీసుకుని పెనంమీద రొట్టెలా వేసి సిలిండరుగాసుతో పనిచేసే చిన్న స్టౌ వెలిగించాడు. రొట్టె అలా కాలుతుంటే, జున్నూ, కోడిగుడ్లూ, ఖర్జూరం, గడ్డపాలూ తీసుకురావడానికి బయట షెడ్డులోకి వెళ్ళేడు. రొట్టె తయారయేక అది చల్లారడానికి కిటికీలో ఉంచేడు. గడ్డపాలు పొయ్యిమీదపెట్టి కొంచెం నీళ్ళు కలిపాడు పలచన చెయ్యడానికి. గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్టు వేశాడు. అలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు అతని కుడి జేబులో ఉన్న రివాల్వరుకి చెయ్యి తగిలింది. గిన్ని కిందపెట్టి, తరగతిగదిలోఉన్న డెస్కుడ్రాయరులో దాన్ని పెట్టేడు. మళ్ళీ తనగదిలోకి వచ్చేసరికి అప్పుడే బాగా చీకటిపడిపోతోంది. దీపంవెలిగించి అరబ్బుకి భోజనం వడ్డించేడు.

“తిను,” అన్నాడు.

అరబ్బు ఒక చిన్న ముక్క తీసుకుని ఆత్రంగా నోటిదాకా తీసుకెళ్ళి, ఒక్క సారి ఆగి,  “మరి నీ సంగతి?” అని అడిగేడు.

“నువ్వు తిన్నాక తింటానులే.”

ఆ దళసరి పెదాలు కొంచం విచ్చుకున్నాయి. కొంచెంసేపు వెనకాడి, తర్వాత తినడానికి నిశ్చయించుకున్నాడు.

భోజనం అయిన తర్వాత, అరబ్బు స్కూలుమాష్టరువైపు చూస్తూ, “నువ్వేనా, న్యాయాధికారివి?” అని అడిగేడు.

“కాదు. రేపటిదాకా నేను నిన్ను నాతో ఉంచుకుంటున్నాను. అంతే.”

“మరి నాతో ఎందుకు భోజనం చేస్తున్నావు?”

“నాకూ ఆకలేస్తోంది.”

19

అరబ్బు మౌనంగా ఉండిపోయాడు.

దారూ లేచి బయటకి వెళ్ళేడు. వస్తున్నప్పుడు షెడ్డులోంచి ఒక మడతమంచం తీసుకువచ్చి, టేబిలుకీ, స్టౌకీ మధ్యగానూ, తన పక్కకి లంబంగానూ ఉండేట్టు వేశాడు. ఒక మూలగా నిలబెట్టబడి తను తనకాగితాలకి అలమరలా ఉపయోగించే పెద్ద సూట్ కేసులోంచి రెండు కంబళీలు తీసి, మడతమంచంమీద పరిచేడు. వాటివల్ల ఉపయోగంలేదని గ్రహించి, ఆగి, తన మంచంమీద కూలబడ్డాడు. అంతకంటే తనింక చెయ్యడానికిగాని, సిద్ధంచెయ్యడానికిగాని ఏమీ లేదు. ఈ మనిషినిచూస్తూ కూచోవలసిందే. అతనిముఖం కోపంతో రగిలిపోతోందేమోనని ఊహించుకుంటూ అతనిపక్క చూసేడు.

నల్లగా మెరుస్తున్న కళ్ళూ, జంతువు పెదాల్లాంటి పెదాలూ తప్ప మరేం కనిపించలేదు.

“అతన్ని ఎందుకు చంపేవు?” అని అడిగాడు. అతని గొంతులో వినిపించిన కాఠిన్యానికి అరబ్బుకి ఆశ్చర్యం వేసింది.

అతను ముఖం అటుతిప్పుకున్నాడు.

“వాడు పారిపోయాడు. నేను అతన్ని వెంబడించాను.”

అతను మళ్ళీ దారూతో చూపు కలిపాడు. అందులో నిశితమైన ప్రశ్నలు ఉన్నాయి.

“వాళ్ళిప్పుడు నన్నేం చేస్తారు?”

“నువ్వు భయపడుతున్నావా?”

అరబ్బు ఒక్క సారి బిర్రబిగుసుకుపోయాడు… ఎటో దిక్కులు చూస్తూ.

“నువ్వు చేసినపనికి పశ్చాత్తాపపడుతున్నావా?”

అరబ్బు అతనివంక నోరువెళ్ళబెట్టుకుని కన్నార్పకుండా చూశాడు. ఆ మాట అతనికి అర్థం కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. దారూకి అసహనం పెరిగిపోతోంది. అదే సమయంలో, రెండు పక్కలమధ్యా చిక్కుకున్న అతని భారీ కాయాన్ని చూసి, కొంచెం ఇబ్బందీ, తన ఉనికి గురించిన స్పృహా కలిగేయి.

అసహనంగా, “అదే నీ పక్క. అక్కడ పడుక్కో,” అన్నాడు.

20

అరబ్బు కదలలేదు.

దారూ తో, “ఒక విషయం చెప్పండి!”

స్కూలు మాష్టరు అతనివంక చూశాడు.

“రేపు ఆ పోలీసు మళ్ళీ వస్తున్నాడా?”

“నాకు తెలీదు.”

“మీరు మాతో వస్తున్నారా?”

“లేదు. అయినా, ఆ విషయం నీకెందుకు?”

ఖైదీ లేచివెళ్ళి కిటికీవైపు కాళ్ళుజాపుకుని, కంబళీమీద వెల్లకిలాపడుకున్నాడు. ఎలక్ట్రిక్ బల్బునుండి కాంతి సూటిగా అతని కళ్లలోకి పడటంతో కళ్ళు ఒక్కసారి మూసుకున్నాడు.

అతని పక్కనే నిలబడి, దారూ మళ్ళీ అడిగాడు, “ఎందుకు?” అని.

కళ్ళు తెరవలేకుండాచేస్తూ పడుతున్న వెలుగులో దారూవైపు కళ్ళు మిటకరించి చూస్తూ, అన్నాడు,  “మాతో రండి.”

21

అర్థరాత్రి అయింది కాని దారూకి నిద్రపట్టలేదు. నగ్నంగా పడుకోడం అతనికి అలవాటు. అందుకని పూర్తిగా దిగంబరంగా పక్కమీద వాలేడు. కానీ అకస్మాత్తుగా అతనికి గుర్తొచ్చింది, ఒంటిమీద ఏమీలేకపోవడమూ, దానివల్ల అతనికి హానికలగబోయే అవకాశమూ. వెంటనే లేచి బట్టలువేసుకుందామా అన్న ఆలోచన వచ్చింది కానీ, మళ్ళీతనే అనుకున్నాడు, తనేమీ చిన్నపిల్లాడు కాదు. అంతవరకూ వస్తే, తను శత్రువుని రెండుముక్కలుగా విరగ్గొట్టగలడు; ఒత్తుగా పడుతున్న వెలుగుకి నిశ్చలంగా కళ్ళుమూసుకుని తన పక్కమీద వెల్లకిలా పడుక్కున్నా, అక్కడనుండి అతన్ని పరికించగలడు. దారూ లైటు ఆర్పేయగానే, చీకటి ఒక్కసారి ఘనీభవించినట్టు అనిపించింది. కిటికీలోంచి కనిపిస్తున్న నక్షత్రాలులేని ఆకాసం నెమ్మదిగా కదులుతుండడంతో క్రమక్రమంగా చీకటి మళ్ళీ చైతన్యంలోకి వచ్చింది. అతని కాళ్ళదగ్గర పడున్న శరీరాన్ని స్కూలుమాష్టరు పోల్చుకోగలిగేడు. అరబ్బు కదలడం అయితే కదలడంలేదు గాని, అతని కళ్ళుమాత్రం ఇంకా తెరుచుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఒక సన్నటిగాలి స్కూలుచుట్టూ ఈలవేసుకుంటూ సాగుతోంది. అది మేఘాల్ని తరిమేస్తే, బహుశా సూర్యుడు రేపు మళ్ళీ కనిపించవచ్చు.

22

రాత్రి గాలిజోరు ఉధృతమైంది. కోళ్ళు ఒకసారి రెక్కలు టపటపలాడించి ఊరుకున్నాయి. అరబ్బు నిద్రలో ఒత్తిగిల్లాడు దారూకి వీపు కనిపించేలా. దారూకి అతని మూలుగు విన్నట్టు అనిపించింది. తర్వాత అతను తన అతిథి … శ్వాస బరువుగా, ఒక క్రమంలో ఇంకా బరువుగా తీసుకోవడం గమనించేడు. నిద్రపోకుండానే, ఆ బరువైనఊపిరి తనకి సమీపంగా ఊహించుకున్నాడు. ఏడాదికిపైగా ఈగదిలో ఒక్కడూ నిద్రిస్తున్న తనకి, మరోవ్యక్తి ఉనికి ఇబ్బందిగా ఉంది. అది మరొకందుకుకూడా ఇబ్బంది పెడుతోంది… అది తను ప్రస్తుత పరిస్థితులలో అంగీకరించకపోయినా: అది ఒకవిధమైన సౌభ్రాతృత్వాన్ని అతనిమీద రుద్దుతోంది. ఒకే గదిని పంచుకునే వ్యక్తులు… ఖైదీలూ, సైనికులూ… చిత్రమైన అనుబంధాల్ని పెంపొందించుకుంటారు… వాళ్ల వస్త్రాలతోపాటే వాళ్ళ ఆయుధాలనికూడా విసర్జించినట్టు; వాళ్ళ విభేదాలకి అతీతంగా ప్రతి సాయంత్రమూ నిద్రా, అలసటల పాతబడిన అనుభవాలలో సౌభ్రాతృత్వాన్ని అలవరచుకుంటారు; కానీ దారూ ఒక్కసారి తల విదుల్చుకున్నాడు; అతనికి అటువంటి ఆలోచనలు నచ్చలేదు; అతనికిపుడు నిద్రపోవడం ముఖ్యం.

23

కొంచెంసేపు గడచిన తర్వాత, అరబ్బు నిద్రలో కొంచెం కదిలేడు. స్కూలుమాష్టరుకి ఇంకా నిద్ర రాలేదు.  ఖైదీ రెండోసారి కదలగానే, అతనొకసారి బిగుసుకుపోయాడు, అప్రమత్తమై. నిద్రలోనడుస్తున్నవాడిలా అరబ్బు మోచేతులమీద నెమ్మదిగా తననితాను లేవనెత్తుకుంటున్నాడు. పక్కమీద నిటారుగా కూచున్న అరబ్బు దారూవైపు తల తిప్పకుండా నిశ్శబ్దంగా నిరీక్షించేడు… ఏదో శ్రద్ధగా వింటున్నట్టు. దారూ కదలలేదు; అతనికి ఒక్కసారి తట్టింది, రివాల్వరు ఇంకా తరగతిగదిలోని సొరుగులోనే ఉందని. ఇప్పుడు తనే ముందు ఏదో ఒకటి చెయ్యాలనిపించింది.  అయినా, అతను ఖైదీని గమనించడం మానలేదు; అతనుకూడా, అంతే చురుకుగా నేలమీద కాళ్ళు మోపి, క్షణకాలం నిరీక్షించి, మెల్లగా నిలబడడానికి ప్రయత్నించసాగేడు. దారూ అతన్ని పిలవబోయేంతలో, అరబ్బు మామూలుగానే కానీ చాలా నిశ్శబ్దంగా నడవడం ప్రారంభించేడు. షెడ్డులోకి తెరుచుకున్న తలుపువైపు నడిచేడు. జాగ్రత్తగా చప్పుడుచెయ్యకుండా గడియతీసి బయటకి వెళ్ళేడు; తన వెనకే తలుపు లాగినా, అది పూర్తిగా మూసుకోలేదు. దారూ కదలలేదు. “అతను పారిపోతున్నాడు” అనుకున్నాడు. “పీడా విరగడయ్యింది.” అని మనసులో అనుకున్నా, జాగ్రత్తగా వినసాగేడు. కోళ్ళు కలవరపడటం లేదు; అంటే తన అతిథి మైదానంవైపు  వెళుతూ ఉండి ఉండాలి… లీలగా నీటి చప్పుడు వినిపించింది అతనికి.  అరబ్బు ఆకారం తిరిగి ద్వారబంధందగ్గర కనిపించేదాకా అదేమిటో అర్థం కాలేదు. అరబ్బు తలుపు జాగ్రత్తగా మూసి, చప్పుడుచెయ్యకుండావచ్చి తన పక్కమీదవాలి  పడుక్కున్నాడు. దారూ వీపు అతనివైపు తిప్పి పడుక్కున్నాడు.  అతనికి నిద్రలో, స్కూలుభవనానికి చుట్టుపక్కల సన్నని అడుగులచప్పుడు వినిపించింది. “నేను కలగంటున్నాను, కలగంటున్నాను” అని అతనికి అతను సమాధానపరచుకుని నిద్రపోసాగేడు.

24

అతనికి తెలివివచ్చేసరికి ఆకాశం నిర్మలంగా ఉంది; తెరిచిన కిటికీలోంచి గాలి చల్లగా వీస్తోంది. ఆ అరబ్బు ప్రశాంతంగా కంబళీలో దగ్గరగా ముడుచుకుపడుక్కున్నాడు, నోరు తెరుచుకుని మరీ. దారూ అతన్ని లేపడానికి కుదపబోతే, అతను భయంతో దారూవంక కళ్ళు విచ్చుకుని తేరిచూడగానే, ఆ కళ్ళలో కనిపించిన భయవిహ్వలతకి, దారూ ఒక అడుగు వెనక్కి వేశాడు. “భయపడకు. నేనే. లే”. అరబ్బు తలఊపి ఆహా అన్నాడు. అతని ముఖంలోకి మళ్ళీ ప్రశాంతత వచ్చింది గాని, ఆ చూపులు ఇంకా శూన్యంగానూ, అలసటగానూ ఉన్నాయి.

25

కాఫీ తయారైంది. రొట్టెముక్కలు నములుతూ మడతమంచంమీద ఇద్దరూ పక్కపక్కన కూచునే కాఫీ తాగేరు. దారూ అరబ్బుని షెడ్డులోకి తీసుకువెళ్ళి తను ఎక్కడ స్నానం చేస్తాడో ఆ జాగా చూపించాడు. తనగదిలోకి పోయి, కంబళ్ళూ, పక్కా మడిచి, తనపక్క జాగ్రత్తగా సర్ది, గదికి ఒక రూపు తీసుకొచ్చేడు. అక్కడనుండి తరగతి గదిలోకీ, గదిముందున్న ఎత్తైన ప్రదేశందగ్గరకి వెళ్ళేడు. నీలాకాశంలో అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎడారిలాంటి మైదానం అంతా సూర్యుడి నులివెచ్చని లేత కిరణాలలో స్నానం చేస్తోంది. కొండశిఖరాలమీద మంచు అక్కడక్కడ కరుగుతోంది. వాటిక్రింద ఉన్న శిలలు బయటపడబోతున్నాయి. ఆ మైదానం అంచున చేతులు దగ్గరగా ముడుచుకు కూచుని నిర్మానుష్యమైన విశాల భూభాగాన్ని పరిశీలించసాగేడు. అతనికి ఎందుకో బాల్డూక్సి గుర్తొచ్చేడు. తను అతని మనసు కష్టపెట్టేడు, ఎందుకంటే అతనికి వీడ్కోలిచ్చిన తీరు అతనితో స్నేహం అక్కరలేదన్నట్టుగా ఉంది. ఆ పోలీసు వెళుతూ వెళుతూ అన్నమాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. కారణం తెలియకుండానే, చిత్రంగా అతనికి అంతా శూన్యంగా కనిపించడంతో పాటు, తను నిస్సహాయుడిగా కనిపించేడు. ఆ క్షణంలో స్కూలుభవనానికి అటువైపునుండి ఖైదీ దగ్గడం వినిపించింది. తనకి ఇష్టం లేకపోయినా అతన్ని వింటూ, చివరకి కోపంతో ఒక గులకరాయి తీసుకుని విసిరాడు. అది గాలిలో రివ్వున దూసుకెళ్ళింది, మంచులో కూరుకుపోయేలోపు. ఆ మనిషిచేసిన తెలివితక్కువ నేరానికి తనకి గొప్ప అసహ్యం వేస్తోంది. అయినా, అతన్ని అప్పగించడం తన గౌరవానికి భంగం. అసలు ఆ ఊహే అవమానంతో కుంగిపోయేలా చేస్తోంది. ఏకకాలంలో ఆ అరబ్బుని తనదగ్గరకి పంపించిన తనవాళ్లనీ, చంపడంలో చూపించిన ధైర్యం పారిపోవడంలో చూపించని అరబ్బునీ తిట్టుకున్నాడు. దారూ లేచినిలబడి, అక్కడికక్కడే గుండ్రంగా తిరుగుతూ, కాసేపు ఏదో ఆలోచిస్తూ కదలకుండ నిలబడి, చివరకి స్కూలుభవనంలోకి ప్రవేశించాడు.

26

షెడ్డులోని సిమెంటు నేలమీద ఒంగుని, ఆ అరబ్బు రెండువేళ్లతో పళ్ళు తోముకుంటున్నాడు. దారూ అతనివంక చూసి, “పద.” అన్నాడు.  ఖైదీకంటే ముందు తనగదిలోకి దారితీసేడు. స్వెట్టరుమీద హంటింగ్ జాకెట్టు తొడుక్కుని, కాళ్ళకి వాకింగ్ షూజ్ వేసుకున్నాడు. అరబ్బు తన ‘చెచే’ ధరించి, కాళ్ళకి సాండల్స్ వేసుకునేదాకా నిలబడి నిరీక్షించాడు. తరగతిగదిలోకి వెళ్ళేక దారూ బయటకిపోయే త్రోవ చూపిస్తూ, “పద. నడుస్తూ ఉండు,” అన్నాడు. అతను ఒక్క అంగుళం కూడ కదలలేదు. “నేను వస్తున్నాను” అన్నాడు దారూ.  అప్పుడు అరబ్బు బయటకి కదిలేడు. దారూ మళ్ళీ తనగదిలోకి వెళ్ళి రస్కులూ, ఖర్జూరం, పంచడార ఒక పొట్లం కట్టేడు. బయలుదేరడానికి ముందు తరగతిగదిలో తన డెస్కుదగ్గర నిలబడి ఒక్క క్షణం తటపటాయించేడు. వెంటనే గదిబయటకి వచ్చి, తాళం వేసేడు. “అదే త్రోవ.” అన్నాడు తోవ చూపిస్తూ.  అతను తూర్పు దిశగా బయలుదేరేడు ఖైదీ అతన్ని అనుసరిస్తుండగా. నాలుగడుగులు వేసేడోలేదో తనవెనక ఏదో అలికిడైనట్టు అనిపించింది. వెనక్కి వచ్చి స్కూలుభవనం నాలుగుపక్కలా వెతికేడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అర్థం చేసుకుందికి ప్రయత్నించకపోయినా, అరబ్బు అతని చర్యల్ని గమనించడం మానలేదు.  “రా,” అన్నాడు దారూ, దారి తీస్తూ.

27

వాళ్ళు ఒకగంట నడిచి, బాగా నిట్రాయిలాఉన్న సున్నపురాయికొండ దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. మంచు త్వరత్వరగా కరగడం ప్రారంభిస్తుంటే, సూర్యుడు అలా గుంటలుగా చేరుతున్న నీటిని అంత త్వరగానూ ఆవిరిచెయ్యడం ప్రారంభించేడు. మైదానం అంతా క్రమంగా పొడిగా తయారవుతూ, నీటిఆవిరి కదలికలకి మైదానమే గాలిలా కదులుతోందేమోనన్న భ్రమ కల్పిస్తోంది. వాళ్ళు తిరిగి నడక ప్రారంభించే వేళకి వాళ్ళ అడుగుల తాకిడికి నేల చప్పుడుచెయ్యనారంభించింది. ఉండిఉండి ఆనందంతో అరుచుకుంటూ ఒక పక్షి వాళ్ల ముందునుండి గాలి చీల్చుకుంటూ ఎగరసాగింది. ఉదయపు తాజా వెలుగులని దారూ కరువుతీరా అస్వాదిస్తున్నాడు. నీలాకాశం గొడుగుకింద కనుచూపుమేర అంతా బంగారపురంగులో కనిపిస్తున్న పరిచయమైన అ విశాలమైన మైదానాన్ని చూస్తూ అతనొక చెప్పలేని ఆనందానుభూతికి లోనయ్యాడు. వాళ్ళు మరో గంటసేపు నడిచేరు…దక్షిణానికి దిగుతూ. పిండిరాళ్ళతోనిండి సమతలంగాఉన్న ఒక ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. మైదానం అక్కడనుండి తూర్పుకి కంపలతో నిండిన లోతైన బయలులోకీ, దక్షిణాన ఆ ప్రాంతం అస్తవ్యస్తంగా కనిపించడానికి కారణమైన చెదురుమదురు రాళ్ళ గుట్టలవైపుకీ వాలుతుంది.

28

దారూ రెండుదిక్కుల్నీ జాగ్రత్తగా పరిశీలించేడు. దిగంతాలవరకూ ఆకాశంతప్ప మరేం లేదు. మనిషి అన్న జాడ కనపడలేదు. తనవైపు శూన్యంగా చూస్తున్న అరబ్బు వైపు తిరిగాడు. అతనికి పొట్లాం చేతికందిస్తూ, “ఇది తీసుకో,” అన్నాడు. “ఇందులో ఖర్జూరం, బ్రెడ్, పంచదార ఉన్నాయి.  వీటితో రెండురోజులు గడపగలవు. ఇదిగో ఈ వెయ్యి ఫ్రాంకులు కూడా తీసుకో.” అరబ్బు ఆ పొట్లాన్నీ, డబ్బునీ అందుకున్నాడు. కానీ తనకిచ్చిన వాటితో ఏమిచెయ్యాలో తెలీదని సూచిస్తునట్టు చేతులు గుండెలకు హత్తుకుని నిలబడ్డాడు. “ఇటు చూడు,” తూర్పువైపుకి సూచిస్తూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు స్కూలుమాష్టరు, “టింగ్విట్ వెళ్ళడానికి త్రోవ అది. రెండుగంటల నడక. అక్కడ అధికారులూ పోలీసులూ ఉంటారు. వాళ్ళు నీకోసం ఎదురుచూస్తున్నారు.” అరబ్బు తూరుపువైపు చూశాడు డబ్బునీ, పొట్లాన్నీ గుండెకు హత్తుకుంటూనే. దారూ అతని భుజాన్ని కొంచెం మోటుగా తిప్పాడు దక్షిణదిక్కుకి. వాళ్ళు నిలబడ్డ ఎత్తైన ప్రదేశం నుండి చూస్తే, ఆ మిట్ట పాదాల దగ్గర వాళ్ళకి ఒక సన్ననిజాడలాంటి బాట కనిపిస్తోంది. “ఈ మైదానం పొడవునా సాగే బాట అది. ఒక రోజు నడిస్తే, నీకు పచ్చని చేలూ, తొలివిడత సంచారజాతులూ కనిపిస్తారు. వాళ్ళు నిన్ను తమలో కలుపుకుని వాళ్ల చట్టానికి తగ్గట్టుగా తలదాచుకుందికి అవకాశం కల్పిస్తారు.”

అరబ్బు దారూవంక చూసేడు. అతని ముఖంలో ఇప్పుడు భయందోళనలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

“నా మాట వినండి,” అన్నాడతను.

దారూ తల అడ్డంగా తిప్పి, “లేదు. మాటాడకు. నేను ఇప్పుడు నిన్నిక్కడ వదిలేసి వెళుతున్నాను.” అన్నాడు.

వీపు అతనివైపు తిప్పి, స్కూలు దిశలో రెండు పెద్ద అంగలు వేసి, కదలకుండా నిలుచున్న అరబ్బుని కాసేపు అనుమానంగా చూసి, మళ్ళీ బయలు దేరాడు.  కొన్ని నిముషాలపాటు అతనికి ఏమీ వినిపించలేదు చల్లటి నేలమీద ప్రతిధ్వనిస్తున్న తన అడుగుల చప్పుడు తప్ప. అతను వెనుదిరిగి చూడలేదు. చేతులు వేలాడేసుకుని, ఆ అరబ్బు కొండఅంచున అలాగే అక్కడే నిలుచున్నాడు స్కూలు మాష్టరుని చూస్తూ. దారూకి గొంతుకి ఏదో అడ్డం పడింది. కోపంతో తిట్టుకుంటూ, గాలిలో ఎవరికో తెలీకుండా చేతులూపి, మళ్ళీ నడక ప్రారంభించేడు. చాలాదూరం నడిచిన తర్వాత మరొకసారి ఆగి వెనక్కితిరిగి చూసేడు. ఇప్పుడు కొండఅంచున ఎవరూ కనిపించలేదు.

29

దారూ సంశయించాడు.  సూర్యుడు అప్పుడే నడినెత్తికి వచ్చి ఎండ మాడ్చడం ప్రారంభించింది. వెనక్కి అడుగులు వేశాడు … ఎటూ నిర్ణయించుకోలేక ముందు సందేహించినా, చివరకి ఒక నిర్ణయానికి వచ్చి. మరొక చిన్నకొండదగ్గరకి వచ్చేసరికి అతను చెమటతో స్నానం చేసినంత పని అయ్యింది. అతను ఎంత తొందరగా ఎక్కగలడో అంత తొందరగా ఎక్కి, ఆగేడు… ఊపిరి అందక. నీలాకాశం నేపథ్యంలో దక్షిణాన రాతిభూములు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ, తూర్పున తుప్పలూ డొంకలతో నిండిన ప్రదేశంలో నీటిఆవిరితో నిండిన వేడి మెల్లగా పైకి లేస్తోంది. ఆ మసక మసకలోనే…  అతన్ని జైలుకి తీసుకుపోయే తోవలో అరబ్బు మెల్లిగా నడవడం గమనించాడు… బరువెక్కిన గుండెతో.

30

కొంతసమయం గడిచిన తర్వాత, స్కూలుమాష్టరు తన తరగతిగది కిటికీదగ్గర నిలబడి విశాలమైదానంనిండా సూర్యకాంతి ప్రతిఫలించడం గమనిస్తున్నాడు కాని, అతనికి ఆ స్పృహలేదు. అతని వెనక, బ్లాక్ బోర్డుమీద పారుతున్న నాలుగు ఫ్రెంచి నదులమధ్యా, అతను అప్పుడే చదివిన గజిబిజిగా సుద్దతో రాసిన మాటలు మెదుల్తున్నాయి:

“నువ్వు మా సోదరుడిని అప్పగించావు. దీనికి నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు.”

దారూ ఆకాశంవంకా, మైదానంవంకా, సముద్రందాకా విస్తరించిన పొలాలవంకా చూస్తున్నాడు. ఈ విశాలమైన ప్రకృతిని అతను ఎంతో ప్రేమించాడు, కానీ ఇపుడు అతను ఒంటరి.

***

Read the Original English Translation by Justin O’Brien here:

http://www4.ncsu.edu/~dsbeckma/the%20guest%20by%20albert%20camus.pdf

http://bradleynorton.blogspot.in/2012/05/literary-analysis-guest-by-albert-camus.html

murthy gaaruఅనువాదం: నౌడూరి మూర్తి