రాచకురుపు

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

ఇరవై రెండేళ్ల ప్రాయంలో, అమెరికాలో గాలన్ పెట్రోలు పాతిక సెంట్లు ఉన్న రోజునుంచి అది మూడు డాలర్లుకి పెరిగే రోజులొచ్చేసరికి, నలభై ఐదేళ్ళు పనిచేసి రిటైరైపోయాడు విశ్వం. ముగ్గురు పిల్లల్ని కని, పెంచి ఓ ఇల్లు కొని తీరిగ్గా నడుం వాలుద్దామనుకునేసరికి రిటైర్మెంటు ఎదురుగా వెక్కిరిస్తూంది. పిల్లల్లో ఒకడు డాక్టర్ అవగలిగేడు గానీ మిగతా ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పిల్లలందరూ ఏవో ఉద్యోగాల్లో కుదురుకున్నారు వాళ్ళ ఓపికా, కోరికల ప్రకారం. విశ్వం రిటైరయ్యేనాటికి యామినికి ఇంకో ఐదేళ్ళు పనిచేసే జవసత్వాలు ఉన్నా మరో రెండేళ్ళకి ఆవిడా రిటైర్మెంట్ తీసుకుంది, రిటైరైన అందర్లాగానే ఇద్దరూ కలిసి ప్రపంచం చూసిరావడానికి.  ప్రపంచం అంతా కాకపోయినా ఇలా ఓ మూలకీ అలా రెండో మూలకీ తిరిగొచ్చేసరికి మొహం మొత్తింది ప్రయాణాలంటే. అప్పట్నుండీ టి.వి చూసుకోవడం, అప్పుడో సారీ, ఇప్పుడో సారీ దగ్గిర్లో గుడికెళ్ళడం, మరెప్పుడైనా పిల్లల్తో ఫోన్లూ, రాకపోకలూ, హితులూ, స్నేహితులూ హలో అంటే హలో అనుకోవడం; వంకాయ, కాకరకాయ, దొండకాయ, బెండకాయల్తో రెగ్యులర్  గా గడిచిపోతున్న జీవితంలో ఒక్కసారి విశ్వానికి ఎప్పుడూ తగలని ఎదురుదెబ్బ తగిలింది. ఓ రాజు రాత్రి లేచి లఘుశంకకి వెళ్ళినప్పుడు రక్తం పడడం గమనించాడు. ఏదో వేడి చేసిందేమో అనుకోవడానికి లేదు జనవరి నెలలో. ఇంతటి చలిలో కూడా రక్తం పడేంత వేడి చేయడం తన వయసుకి అసంభవం కాకపోయినా విశ్వానికి అర్ధంకాలేదు ఎందుకలా అయిందో. తాను తినే శాకాహార భోజనానికి రక్తం పడే అవకాశం లేదే?

అర్ధరాత్రి యామినిని లేపి ఆవిడ బుర్ర తినేయకుండా మర్నాడు చెప్పాడు రక్తం సంగతి. మొదటగా ఆవిడ చేసిన పని డాక్టర్ కొడుక్కి ఫోన్ చేయడం.

బిజీగా ఉన్న కొడుకు ఫోన్ ఎత్తలేదు కానీ మరో గంటలోపున వెనక్కి ఫోన్ చేసాడు. విషయం అంతా విన్నాక చెప్పాడు. “దీన్ని హిమాటూరియా అంటారు. దానికి కారణాలు అనేకం. ఇన్ ఫెక్షన్ కావొచ్చు, బ్లేడర్, కిడ్నీలలో రాళ్లవల్ల కావొచ్చు. ప్రోస్టేట్ గ్రంధి వల్ల కూడా కావొచ్చు,” కేన్సర్ అనే పదం నోట్లోంచి రాకుండా జాగ్రత్తపడుతూ.

యామిని ఫోన్ చేతికిస్తే వేరే గదిలోకి ఫోన్ తీసుకెళ్ళి విశ్వం అడిగాడు, “ఒరే దీని మూలాన నాకు యూరిన్ బ్లాక్ అవుతుందా, దానికో గొట్టం, ఓ బ్యాగూ తగిలిస్తే దాన్ని నేను జీవితాంతం మోస్తూ తీసుకెళ్ళాలా?”

తండ్రి గొంతుకలో ఆదుర్దా గమనించి చెప్పాడు, “డాడ్, మరీ అంత కంగారు పడకండి. ఉత్తి ఇన్ ఫెక్షన్ అవ్వొచ్చు. చిన్న మందుతో పోతుంది. డాక్టర్ దగ్గిరకి అంటే యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళండి వెంఠనే.”

ఫోన్ పెట్టేసేముందు విశ్వం “ఇది కేన్సర్ అవొచ్చా?” అనే ప్రశ్నకి డాక్టర్ కొడుకు సమాధానం చెప్పకుండా, “ముందు యూరాలజిస్టుని కలవండి, తర్వాత చూద్దాం” అన్నాడు.

ఫోన్ పెట్టేసిన విశ్వం కొడుకు డాక్టర్ సురేష్ ఆలోచనలు పరిపరి విధాలా పోయేయి. తనకి తెల్సినంతలో విశ్వం తల్లి బ్రెస్ట్ కేన్సర్ పోయింది. ఆవిడ రోజుల్లో ఇంతమంది డాక్టర్లూ లేరు, ఇన్ని మందులూ లేవు. పోయే రోజుకి రెండు మూడు నెలలముందు మాత్రం ఆవిడకి తెలిసింది కేన్సర్ అని. ఏవో ఆయుర్వేదం మందులూ, తాయెత్తులూ కట్టారు గానీ అప్పటికే పూర్తిగా ఆలస్యమైంది. ఆవిడ పోయేనాటికి కేన్సర్ మెటాస్టసైజ్ అయ్యి అంగాంగాలకీ పాకిపోయి ఉండొచ్చు. ఆ పరిస్థితిల్లో ఎవరేం చేయగలరు? లింఫ్ నోడ్స్ లోకి చాపకింద నీరులా పాకిపోయే కేన్సర్ ని ఆ మృత్యుంజయుడైనా బాగుచేయగలడా? ఏవో కొన్ని చోట్ల నోడ్స్ ని సర్జరీతో తీసేసినా అది పాకుతూనే ఉంటుంది…” తల విదిల్చి ఆలోచనలు తప్పించడానికి రెసెప్షనిస్టు తో చెప్పి ఆఫీసులోంచి బయటకొచ్చి మెల్లిగా రోడ్డుమీద నడవడం సాగించాడు. ఎవరో ఒక్కసారి షాక్ లాగా కుదిపినట్టూ ఓ ఆలోచన బుర్రలో చొరబడింది, “తన తండ్రి విశ్వం వేసిన ప్రశ్నే తన పేషెంట్ వేసి ఉంటే ఏమి సమాధానం చెప్పి ఉండేవాడు? అసలు ఏది చెప్పాలో, చెప్పకూడదో నిర్ణయించుకోవడం ఎలా? పేషెంట్ తో అబద్ధం ఆడకూడదు సరే మరి నిజం చెప్తే పేషెంట్ తట్టుకోగలడా?” ఎటూ తేల్చుకోలేక కాసేపు అలా తిరిగి మళ్ళీ ఆఫీసులోకి వచ్చి పేషెంట్లని చూడ్డం మొదలుపెట్టాడు.

* * * * * * * * *

విశ్వానికి యూరాలజిస్టు దగ్గిర అపాయింట్ మెంట్ దొరకడానికి మరో మూడు రోజులు పట్టింది. అప్పటికి ఓ సాంపిల్ లేబ్ కి తీసుకెళ్ళడంతో యూరాలజిస్టు రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పేడు, “ముందీ మందు ట్రై చేయండి. తర్వాత ఓ ఎం.ఆర్. ఐ, ఓ సి.టి స్కాన్ తీయించండి. అన్నట్టు మీరు గతంలో ఎప్పుడైనా పి.ఎస్.ఏ టెస్టు చేయించుకున్నారా? వాటి తాలూకు రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? కాలనోస్కోపీ చేయించారా ఈ మధ్య?”

యామిని చెప్పింది సమాధానం, “పి.ఎస్.ఏ టెస్ట్ చేయించి రెండేళ్ళవుతోంది. అప్పట్లో మామూలుగానే ఉందన్నారు ఈయన డాక్టర్. కాలనోస్కోపీ తీయించి అయిదేళ్ళు అవుతోంది.”

“అయితే మరో సారి చేయించండి. ప్రోస్టేట్ సంబంధించినది అయితే చిన్న వాపు అయినా, ఇన్ ఫెక్షన్ అయినా కావొచ్చు.”

“ఇది కేన్సర్ కావొచ్చా?” విశ్వం అడిగేడు మొహం పాలిపోతుంటే.

కాసేపు సాలోచనగా చూసి యూరాలజిస్ట్ అడిగేడు, “మీ వంశంలో ఎవరికైనా కేన్సర్ ఉందా?”

“మా అమ్మగారు బ్రెస్ట్ కేన్సర్ తో పోయారు దాదాపు ముఫ్ఫై ఏళ్ల క్రితం. మరెవరికీ లేదు.”

తల పంకించేడు యూరాలజిస్టు, “సరే అయితే, ఇది కేన్సరా కాదా అనేది ముందు ముందు తెలుస్తుంది ఈ టెస్టులన్నీ చేసాక. అప్పటిదాకా ఏమీ నిర్ధారించలేం. మందు వాడి చూడండి, ఏమైనా గుణం కనిపించవచ్చు.”

మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాతి వారంలో అన్ని స్కాన్ లూ తీయించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటిగా చూసుకోవాల్సింది ఇన్స్యూరెన్స్. డాక్టర్ రోగ నిర్ధారణ ఇంకా చేయలేదు కనక ఈ స్కాన్ లన్నింటికీ చాలా మటుక్కి ఇన్స్యూరెన్స్ ఇచ్చింది డబ్బులు. అయినా సరే విశ్వం జేబులోంచి మరో అయిదారు వేల డాలర్లు పడ్డాయి కో-పే అనే పేరుతోటీ, కో- ఇన్స్యూరెన్స్ అనే పేరుతోటీను. ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రజల బాగు కోసమా వాటి బిజినెస్సు బాగు పడ్డానికా? ఏదైనా ప్రశ్నలడిగితే “అరే, మీరు కట్టిన ప్రీమియం డబ్బులకీ మేము ఇచ్చిన ట్రీట్ మెంటు డబ్బులకీ ఓ సారి పోలిక చూసుకోండి” అనే దెప్పడం ఎప్పుడూ ఉన్నదే.

స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చి మరోసారి యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళవల్సి వచ్చేసరికి విశ్వానికి మందు గుణం ఇస్తున్నట్టు కనిపించింది. రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. ఈ సారి యూరాలజిస్ట్ దగ్గిరకెళ్ళేసరికి కొడుకు సురేష్ కూడా వచ్చేడు.

రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పాడు యూరాలజిస్ట్, “పి. ఎస్. ఏ టెస్టులో 7.5 అని వచ్చింది. మందు వాడుతున్నారు కదా ఏదైనా గుణం కనిపించిందా?”

సురేష్ తండ్రికేసి చూస్తే విశ్వం చెప్పాడు సమాధానం “రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. మరో కొన్ని రోజులు వాడమంటారా?”

“వాడి చూడండి. మీ స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. వాటిలో మీ ప్రోస్టేట్ వాచినట్టు ఉంది. దానికి బయాప్సీ చేస్తే తెలియవచ్చు. కానీ ఒక్కోసారి మందులతో కూడా తగ్గడానికి ఆస్కారం ఉండొచ్చు. బయాప్సీ చేస్తే మరిన్ని తెలుస్తాయి.”

యూరాలజిస్టు చెప్తున్నది విశ్వం విన్నాడో లేదో కానీ “డాక్టర్, అర్జెంట్ గా బాత్రూం కి వెళ్ళాలనిపిస్తోంది. ఈ లోపుల మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారా?”

“వెళ్ళిరండి, ఏం ఫర్వా లేదు”

విశ్వం లేస్తుంటే డాక్టర్ అన్నాడు యామినితో, “మీరు కూడా వెళ్ళండి ఆయనికి తోడుగా”

వాళ్ళటు వెళ్ళగానే సురేష్ అడిగాడు యూరాలజిస్టుని, “స్కాన్ లలో కేన్సర్లాగా ఏదైనా కనబడిందా?”

“క్రిస్ట్ మస్ లైట్స్”

“అంటే?”

“మీ నాన్నగారికి కేన్సర్ లాంటి కణితి ప్రతీ అవయవంలోనూ ఉన్నట్టు రేడియాలజిస్ట్ రాసారు.” స్కాన్ లో కేన్సర్ కణితిలు క్రిస్ట్ మస్ లైట్లలాగా ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి.”

“మై గాడ్”

యూరాలజిస్ట్ ఏమి చెప్పాలో తెలియక తల పంకించాడు.

మరో కొద్ది క్షణాలు ఆగి సురేష్ నోరు ఎండిపోతూండగా అడిగేడు, “సర్జరీతో తీసేయవచ్చు కదా?”

“అది నేను చెప్పలేను. ఇప్పుడు మీకు చెప్పేదొక్కటే. అర్జెంట్ గా ఆంకాలజిస్ట్ ని కలవండి. ఎంత తొందరగా అయితే అంత మంచిది.”

కాసేపటికి వచ్చిన విశ్వాన్నీ తల్లినీ తీసుకుని ఇంటికొచ్చాడు సురేష్. ఆ పై వారంలో ఆంకాలజిస్ట్ ని కలిసాక మరిన్ని టెస్టులూ, ప్రోస్టేట్ బయాప్సీ చూసి చెప్పేడు ఆంకాలజిస్ట్, “మీ నాన్నగారికి మూడో స్టేజ్ కేన్సర్. ఇది ప్రస్తుతానికి లివర్ లో, కిడ్నీలలో, ప్రోస్టేట్ లో ఉందని గుర్తించాం. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళి ఉంటుందని నా అనుమానం. పెద్ద, చిన్న పేగుల్లోకి వెళ్ళిందా అనేదానికి ఇంకా రకరకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది.

విశ్వం మొహం పాలిపోయింది. ఆ తర్వాత సురేష్, అంకాలజిస్ట్ మాట్లాడుకున్న మెడికల్ పదాలు విశ్వానికి, యామినికీ అక్కడక్కడా అర్ధమయ్యాయి కానీ ఇంకా గజిబిజిగా ఉంది. తానింకా చాలా కాలం బతుకుతాడనీ మరో డాక్టర్ దగ్గిరకో, మరో హాస్పిటల్ కో వెళ్తే బాగుండొచ్చనీ లేకపోతే హోమియోపతీయో, ఆయుర్వేదమో పనిచేస్తుందనీ పేషంట్ ఎప్పుడూ డాక్టర్ కన్నా పాజిటివ్ గా ఉంటాడా?

ఇంటికొస్తూంటే విశ్వం కారులో కళ్ళుమూసుకున్నాడు. మందు ప్రభావమో మరొకటో గానీ నిద్ర పట్టినట్టుంది. యామిని దార్లో సురేష్ ని అడిగింది, ” సురేష్, అంకాలజిస్ట్ చాలా సార్లు మెటాస్టసైజ్ అనే మాట అన్నారు. అంటే ఏమిట్రా?”

కొరడా దెబ్బ మొహం మీద ఛెళ్ళున తగిలిన భావన. డ్రైవ్ చేస్తోన్న కారు స్టీరింగ్ కంట్రోల్ తప్పి పక్క లేన్ లోకి వెళ్ళబోతూంటే అక్కడొచ్చే కారు అదే పనిగా హార్న్ కొట్టడంతో సురేష్ తెలివి తెచ్చుకుని సరిగ్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. తల్లి మళ్ళీ అడిగింది, “మెటాస్టసైజ్ అనేది కేన్సర్ కి సంబంధించినదేనా?”

“ఇంటికెళ్ళాక చెపుతానమ్మా, ఇప్పుడు డ్రైవ్ చేయాలి. ఇప్పుడే పక్క లేన్ లోకి వెళ్ళిపోబోయాను చూసావా?”

* * * * * * * * *

రాత్రి విశ్వం పడుకున్నాక ఆలోచనలు బుర్ర తినేస్తూంటే మనసు మరల్చడానికి టి.వి చూస్తూ కూర్చున్నాడు సురేష్. యామిని వంటపని పూర్తయ్యాక వచ్చి కూర్చున్నప్పుడు చిన్న గొంతుకతో చెప్పాడు “మెటాస్టసైజ్ అంటే కేన్సర్ వేరే అంగాలకి పాకుతోందని అర్ధం. ఎంతవరకూ ఎన్ని చోట్లకి పాకింది అనేది పూర్తిగా టెస్టులు చేస్తే గానీ చెప్పరు. కానీ మందులూ కీమో థెరపీ వాడి చూడొచ్చు.” మాట్లాడుతూంటే తన గొంతులో తనకీ, అమ్మకీ నమ్మశక్యంగా ఏమీ చెప్పలోకపోతున్నాడనే ధ్వని గమించాడు సురేష్. లోపల మాత్రం మూడో స్టేజ్ కేన్సర్ అంటే తండ్రి మహా అయితే మరో రెండేళ్ళు బతుకుతాడేమో అనిపించింది.

ఓ వారం అక్కడే ఉండి తండ్రిని కీమో థెరపీకి, అమ్మని వీటన్నింటినీ చూడడానికి కుదుర్చిపెట్టాక ఇంటికి బయల్దేరాడు. ఇవి అలా జరుగుతూండగానే రోజులు పరుగెడుతూ ధేంక్స్ గివింగ్ దగ్గిరకొచ్చింది. శెలవులకి పిల్లలందరూ కుటుంబాలతో ఓ చోట చేరారు తల్లినీ తండ్రినీ చూడ్డ్డానికి.

తల్లీ తండ్రీ పడుకున్నారనుకున్నాక సురేష్ మిగతా అందరితో చర్చించేడు తండ్రికొచ్చిన కేన్సర్ విషయం. అంతకు ముందు ఫోన్ లో విన్నదే అయినా ఇప్పుడు తండ్రిని చూసేసరికి తెలుస్తూన్న విషయం – ఆయనింకెంతో కాలం బతకడు. నిర్జీవమైన కళ్ళూ, కీమో థెరపీ వల్ల ఊడిపోయే జుట్టూ, బయాప్సీల వల్ల నిరంతరం పడే నెప్పీ, వాటికి మందులూ ఇవన్నీ ఓ ప్రహసనం. ఎంత మనసు వేరే దానిమీద పెడదామన్నా నిరంతరం మనసుల్లో కదిలే ఒకే ఒక పదం  “కే-న్స-ర్.” మనిషి జీవితాన్ని అత్యల్పంగా చేసి తోలుబొమ్మలాగా నిరంతరం ఆడించే ఒకే ఒక వదుల్చుకోలేని దారుణమైన జాడ్యం. అదృష్టవంతులైన వాళ్ళలో రిమిషన్ ఉండొచ్చేమో కానీ నూటికెంతమంది రిమిషన్ కి నోచుకునేది? అయినా ఈ వయసులో తండ్రికి రిమిషన్ వచ్చేనా? అందరికన్నా ఎక్కువ కంగారు పడినది మొదటి సంతానం అయిన కూతురు. సురేష్ ఇంతకుముందు డాక్టర్లతో మాట్లాడాడు కనక కాస్త కుదురుగానే ఉన్నాడు. మూడో సంతానం వినీత్ కి ఏమి చేయాలో తెలియక అలాగే స్తబ్దుగా కూర్చున్నాడు. మొదటగా నోరు విప్పినది వాడే. “సురేష్, ఇప్పుడు నాన్నకి వచ్చిన కేన్సర్ కి అన్ని టెస్టులూ చేయించి, అంతమందికి చూపించాలి కదా మరి ఆయన ఇస్యూరెన్సూ, మెడికేర్ ఇవన్నీ కవర్ చేస్తాయా?”

“కొన్ని చేస్తాయి, కొన్ని చేయొచ్చు చేయకపోవచ్చు. చివరిదాకా ఈ పోరాటం కేన్సర్ మీదా, ఇన్స్యూరెన్స్ కంపెనీల మీదాను.”

“మరి ఇన్స్యూరెన్స్ కవర్ చేయకపోతే ఎలా?”

“జేబులోంచి పెట్టుకోవాలి. కొంత నేను సర్దగలను. అందరూ తలో చేయి వేస్తే సులభం.”

వెంఠనే కూతురు అంది, “నేను ఒక్క సెంటు కూడా సర్దలేను. పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉద్యోగం మానేసి రెండు నెలలైంది; మరో రెండేళ్ళు ఆగి మరో ఉద్యోగం చూడాలి. మా ఆయన్ని అడిగితే మహా అయితే ఐదువేలు సర్దొచ్చు.”

చివరి కొడుకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు మాట్లాడకుండా కూర్చున్నాడు. ఓ పావుగంట గడిచాక సురేష్ అడిగాడు వినీత్ ని, “ఏరా, నువ్వు ఎంత డబ్బులు సర్దగలవు?”

“మహా అయితే పదో, పదిహేనో.”

“మీరిచ్చే ఇరవై, కేన్సర్ ట్రీట్ మెంటుకి ఈ మూలకి? కనీసం యాభై సర్దుతారేమో అనుకున్నాను.”

“…”

సమాధానం లేకపోవడం చూసి కూర్చున్న సురేష్ లేచి చెప్పాడు గోడకేసి తిరిగి ఎవరికో చెప్తున్నట్టూ, “నేను ఇంటిమీద రెండో అప్పు తీసుకుని ఈ కేన్సర్ పని పట్టాలి అయితే; కని పెంచిన నాన్నకి ఇలా అయిందని తెల్సినా మీరిద్దరూ ఇలా అన్నారంటే …”

ఈ మాటలన్నీ నిద్రపోకుండా పై గదిలోంచి పడుకున్నాడనుకున్న విశ్వం, యామినీ విన్నారని పిల్లలకి తెలియలేదు.

* * * * * * * * *

శెలవులు అయిపోయాక ఇంటికెళ్ళబోయే ముందు అందర్నీ కూచోపెట్టి చెప్పాడు విశ్వం, “నాకు డభ్భై దాటుతున్నాయి. ఈ వయసులో వచ్చే రోగాలు మందులకి తగ్గడం కష్టం. ఈ కేన్సర్ మందులతో, కీమోథెరపీతో నా వళ్ళు హూనం అవుతోంది. నాకిప్పటికి అర్ధమైనదేమిటంటే, నేను మూడో స్టేజ్ లో ఉన్నాను. ఇక్కడ్నుంచి ఆంకాలజిస్టూ, యూరాలజిస్టూ మిగతా డాక్టర్లూ ఎంత నన్ను నమ్మించడానికి  ప్రయత్నం చేస్తున్నా ఇది వన్ వే ట్రాఫిక్కే. ఎందుకంటే కేన్సర్ లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిందని చెప్పారు. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిన కేన్సర్ తగ్గడం దాదాపు అసంభవం. ఈ కేన్సర్ పాకిన ఒక్కో అవవయం తీసేసి నన్ను మరో రెండేళ్ళు బతికించవచ్చేమో. అప్పుడు నేను జీవఛ్ఛవాన్నే కదా? దీనిమీద ఖర్చులు చూడబోతే కోతిపుండు బ్రహ్మరాక్షసి లాగా తయారౌతున్నై. ఇలా ఒక్కో స్టేజ్ దాటుకుంటూ చావడం కంటే అన్ని ట్రీట్ మెంట్లూ మానేసి మూడు నాలుగు నెలల్లో పోవడమే మంచిది. ఇప్పుడు అద్దంలో నా మొహం చూసుకోవడానికీ నాకే భయం వేస్తోంది. దీనికి డబ్బులు తగలేయడం శుద్ధ దండుగ. యామినితో చెప్పాను కూడా. నేను పోయాక లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయి. అవి యామినికి సరిపోతాయి సోషల్ సెక్యూరిటీ డబ్బులతోటి. అందువల్ల మీరందరూ కంగారు పడి డబ్బులు వేస్ట్ చేయకండి. అందరం ఎప్పుడో ఒకసారి పోవాల్సినవాళ్ళమే. ఇప్పుడు నాదీ వంతు.”

సురేష్ చెప్పేడు వెంఠనే, “అలాక్కాదు, మీకు కేన్సర్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. అయినా ఈ కేన్సర్ ని ధైర్యం గా ఎదుర్కోవాలి గానీ అలా డీలా పడిపోకూడాదు. నాకు తెల్సున్న కొంతమంది డాక్టర్లు ఉన్నారు. నేను కనుక్కుంటా. డబ్బులదేవుంది; కుక్కని కొడితే రాల్తాయి. అప్పు తీసుకున్నా తర్వాత కట్టేయవచ్చు.”

విశ్వం కళ్ళలో కాస్త మెరుపు కనిపించింది. అది కొడుకు తనని బాగా చూసుకుంటున్నాడనా లేకపోతే కేన్సర్ నిజంగా తగ్గిపోయి తన ఆరోగ్యం బాగై పోతుందనా?

వెంఠనే అందరూ ఏక కంఠంతో అన్నారు, “అవునవును కేన్సర్ కి అలా లొంగిపోకూడదు. పోరాడవల్సిందే.”

అంతా విన్న విశ్వానికి ఇంక తప్పలేదు. సురేష్ తనకున్న ఇంటిమీద హోం ఇంప్రూవ్ మెంట్ లోన్ తీసుకోడానికీ, కేన్సర్ మీద పోరాటానికీ నిశ్చయం అయిపోయింది. విశ్వం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితి.

* * * * * * * * *

మూణ్ణెల్లు గడిచాయి. సురేష్ తీసుకున్న అప్పు అలా పెరుగుతోందే కానీ విశ్వానికేమీ తేడా కనిపించినట్టు లేదు. దీనికితోడు అటూ ఇటూ రాకపోకలవల్ల సురేష్ ప్రాక్టీస్ కుంటుబడడం, రాబడి తగ్గడం మొదలైంది. చాప కింద నీరులా కేన్సర్ అలా పెరుగుతూనే ఉంది. కొంతమందికి కేన్సర్ ఖర్చులు మొదట్లో ఎక్కువగా ఉన్నా అవి మెల్లిగా తగ్గిపోతాయి కేన్సర్ తగ్గే కొద్దీ. వీళ్ళు మొదటి జాతి అదృష్టవంతులు అనుకోకుండానో, తెలిసో తమకి కేన్సర్ వచ్చినట్టు అతి చిన్న స్టేజ్ లో పట్టుకున్న వాళ్ళు. వీళ్ళు మరో ఇరవై ఏళ్ళదాకా బతకొచ్చు రోగం తిరగబెట్టకపోతే. తిరగబెడితే వీరి అదృష్టం తీరిపోయి రెండో కోవలోకి వస్తారు. ఈ రెండో కోవలో మొదట ఖర్చులు తడిసిమోపెడయ్యాక, కేన్సర్ మెల్లిగా తగ్గినట్టు అనిపించేసరికి ఖర్చులు తగ్గుతూ వస్తాయి. కానీ కొంతకాలాని కేన్సర్ మళ్ళీ వంటిమీదకి పాకడం మొదలుతుంది అప్పుడు ఖర్చులు పుంజుకుంటాయి. ఆ పుంజుకోవడం ఆకాశమే హద్దా అన్నట్టూ ఉండడంతో పేషంట్ కీ, అతనికి తెల్సిన చుట్టాలకీ స్నేహితులకీ అందరికీ అదో మానసిక పోరాటం. మొదటి అదృష్టవంతులకి ఖర్చు ఎక్కువగా మొదలై రోజులు గడిచే కొద్దీ టేపర్ అవుతాయి. రెండో దురదృష్టవంతులకి టేపర్ అయినట్టు కనిపించి ఖర్చు యు అక్షరం ఆకారంలో పడగ చాస్తుంది. ఎప్పుడైతే ఆ కోడె తాచు పడగ విప్పడం  మొదలైందో అప్పుడే ఆశలన్నీ వదులుకోవటం మొదలౌతుంది. కానీ మానవ జీవితంలో ఆశకీ కోరికకీ అంతులేదు కదా? పడగ నీడన ఏదీ మొలవదని తెలిసీ, ఆ ట్రీట్ మెంటు మింగలేకా, కక్కలేకా కొనసాగించాల్సిన పరిస్థితి.

మరో మూడు వారాలు పోయాక అంకాలజిస్ట్ విశ్వానికి చెప్పాడు, ” ఈమధ్య ఒక ఎక్స్ పెరిమెంటల్ మందు మా దగ్గిరకి వచ్చింది. అది కంపెనీలు ఇంకా టెస్ట్ చేస్తున్నారు. మీకున్న లక్షణాలవల్ల ఈ రీసెర్చ్ కి సరిపోతారు. ట్రై చేస్తారా?”

“ఇది మీరు కవర్ చేస్తారా లేకపోతే ఇన్స్యూరన్స్ ని అడగాలా?” అప్పటికీ పూర్తిగా జవసత్వాలు పోయిన విశ్వం అడిగాడు, కనీసం ఆర్ధికంగానైనా దెబ్బతినకుండా ఉండడానికి.

“మందు పూర్తిగా మేము కవర్ చేస్తాం. కానీ హాస్పిటల్ లో ఉండడానికీ డాక్టర్లకీ అలా కొంత చొప్పున ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.”

“ఆ ఖర్చు ఎంతవరకూ ఉండొచ్చు?”

“చెప్పలేమండి. మందు పనిచేస్తే తక్కువకాలం హాస్పిటల్లో ఉండడం. చేయకపోతే ఎక్కువ రోజులుండడం. ఏ ఒక్కరి కేసూ ఒక్కలా ఉండదు కదా?”

“సరే అయితే నేను ఇన్స్యూరెన్స్ కి ఫోన్ చేసి కనుక్కుని చెప్తాను.”

“అలాగే, మీ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు.”

* * * * * * * * *

ఇంటికొచ్చిన యామిని ఓ గంటపాటు ఇన్స్యూరెన్స్ కంపెనీతో ఫోన్ మీద కుస్తీ పట్టాక వాళ్ళు చెప్పారు, “మీ డిటైల్స్ అన్నీ రాసుకున్నాము. ఎక్స్ పెరిమెంటల్ అన్నారు కనక అది మా మేనేజర్ ని అడిగి మీకు ఉత్తరం రాయాలి. దానికి మూడు నుంచి అయిదు రోజులు పడుతుంది….”

“మరి ఇది కేన్సర్ కదా, వెంఠనే ట్రీట్ మెంట్ మొదలు పెడితే గుణం కనిపించవచ్చు. అంతకన్నా ముందు చెప్పలేరా?”

“… అసాధ్యం. ఈ కేన్సర్ కేసులన్నీ ఒక్కొక్కటీ ఒకో టైపు. దేనికదే విడివిడిగా చూస్తాం. మాకున్న రూల్స్ ప్రకారం ఇలాంటివి అప్పుడప్పుడూ తొందరగానే ఆమోదించినా ఫోన్ మీద ఆమోదించరు. కానీ మీకు మరీ అంతగా కావాలంటే మరోసారి మంగళవారం ఫోన్ చేయండి.”

ఇన్స్యూరెన్స్ ఎలాగా ఒప్పుకుంటారనుకునీ, తర్వాత వారితో మాట్లాడొచ్చుఅనుకునీ యామిని విశ్వాన్ని ఎక్స్ పెరిమెంటల్ మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ డాక్టర్ ఆఫీసుకి చెప్పేసింది. ఆ వారం నుంచే మందు వాడడం మొదలైపోయింది. అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా త్వరలోనే తలనెప్పిగా తయారవబోతోందని ఇద్దరికీ తెలియలేదు. బేంకుల్లో డబ్బులు దాచుకుంటే మనకి మంచిదా బేంకుకి మంచిదా? బేంకులు బిజినెస్సు చేసుకుంటాయి గానీ మనగురించి నిజంగా పట్టించుకున్నదెప్పుడు? అలాగే ఇస్యూరెన్స్ కంపెనీలూను.

* * * * * * * * *

ఆ పై వారంలో సోమవారం విశ్వం బాత్రూంలో పడి ఉంటే కొంచెం లేటుగా లేచిన యామిని కంగారుగా వెళ్ళి చూసింది. బాత్రూం నేలంతా రక్తం; నోట్లోంచి వచ్చిందే అని తెలుస్తోంది. ఓ 911 ఫోన్ కాల్ తర్వాత ఆఘమేఘాల మీద విశ్వం ఎమర్జన్సీలో ఎడ్మిట్ చేయబడ్డాడు. తర్వాత విషయాలు అన్నీ అందరి కేన్సర్ పేషంట్లకీ తెలిసొచ్చినట్టే విశ్వానికీ, యామినికీ కూడా పూర్తిగా తెలిసొచ్చాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలన్, ఇలా కేన్సర్ లేని అవయవం లేదు విశ్వానికి. మరో పెద్ద న్యూస్ ఏమిటంటే ఇప్పుడు కేన్సర్ అయిదో స్టేజ్ లో ఉంది. విశ్వాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి డాక్టర్ ఒప్పుకునేసరికి మరో మూడ్రోజులు పట్టింది. ఈ కంగార్లో హాస్పిటల్లో మంచం మీద తెలివి లేకుండా పడి ఉన్న విశ్వాన్ని చూసుకుంటూ మంగళవారం ఇన్స్యూరెన్స్ ఫోన్ చేయమన్నారన్న సంగతి యామినికి ఏ మాత్రం గుర్తు రాలేదు.

ఇంటికెళ్ళేసరికి ఇన్స్యూరెన్స్ దగ్గిర్నించొచ్చిన ఉత్తరం రడీగా ఉంది, “మీరు మాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలు మా మానేజర్ చూసారు. మీరు చెప్పిన మందులూ అవీ ఇంకా ఎక్స్ పెరిమెంటల్ అన్నారు. అవి పనిచేస్తాయో లేదో ఝూడీగా తెలియదు. మందులు మీ డాక్టర్ ఆఫీసు కానీ మందుల కంపెనీలు కానీ ఇచ్చినా మిగతా ఖర్చులన్నీ తడిసి మోపెడు అవుతాయి. ఇంతా చేస్తే ఈ మందు ఎఫ్. డి. ఏ అప్రూవ్ చేసినట్టు లేదు. అందువల్ల మేము ఈ ఖర్చులు భరిండానికి ఒప్పుకోము. మీకు ఈ విషయంలో మేము ఏమీ సహాయం చేయలేము. మీకు కలిగిన పరిస్థితికి మేము విచారిస్తున్నాము.”

విశ్వాన్నీ ఎలాగా మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ చెప్పేసారు కనుక ఇన్స్యూరెన్స్ కంపెనీ డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా, ఇంక వెనక్కి చూసుకోకుండా కొడుకు సలహా తో మందు కంటిన్యూ చేయడానికి నిశ్చయం అయిపోయింది. ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు ముందూ వెనకా చూసుకోవడం అనవసరం. ఇన్ని రోజుల్లోనూ అమ్మాయీ, రెండో కొడుకూ అప్పుడప్పుడూ వచ్చి చూస్తున్నా, ఫోనులు చేస్తున్నా డాక్టరైన సురేష్ దగ్గిర ఉన్నాడని ఏదో భరోసా కాబోలు, వాళ్ళిద్దరికీ అంత పట్టలేదు తండ్రి గురించి. ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ ఒకేలాగ ఉండాలని ఎక్కడుంది?

 

* * * * * * * * *

ఫోన్ మీద తల్లి చెప్పినవన్నీ విన్నాక సురేష్ తండ్రి దగ్గిరకి బయల్దేరాడు. ఈ సారి అంతా ఖాయం అయినట్టే. అయిదో స్టేజ్ లోంచి కేన్సర్ పేషెంట్ ని బాగుచేసి మామూలుగా చేయడం భగవంతుడిక్కుడా సాధ్యం కాకపోవచ్చు. బయల్దేరేముందు రోడ్డుమీద అలా నడుస్తూంటే అదే బ్లాకులో ఉంటున్న డేవిడ్ కనిపించాడు. డేవిడ్ ఏదో బిజినెస్ చేస్తూంటాడు. వాళ్ళావిడకి కూడా కేన్సర్ అని తెలుసు కానీ ఎప్పుడూ దాని గురించి మాట్లాడ లేదు. తన తండ్రికి కేన్సర్ వచ్చినప్పటునుండీ అసలు ఈ మధ్య ఎవరినీ కలవడం కానీ చూడ్డం కానీ కుదరనే లేదు. ఈ సారి డేవిడ్ పలకరించాడు, “హలో డాక్టర్ ఎలా ఉన్నారు?”

“ఏదో, అలాగే ఉంది. మీరో?”

“ఏం బాగు లెండి జీవితంలో ఢక్కా మొక్కీలు తప్పడం లేదు. మా ఆవిడ జెన్నీకి కేన్సర్ అని తెలుసు కదా? తనకి ఇంక తగ్గదనీ ట్రీట్ మెంట్ వద్దనీ చెప్పేసింది. ఈ కేన్సర్ డాక్టర్లు ఏదో చేస్తామన్నారు కానీ, ఒక్కో అవయవం తీసేసి జీవితాన్ని ముందుకి లాగుదామని చూస్తారు. వాళ్లు మాత్రం ఏం చేస్తారు? అలా బతకడం కంటే పోవడమే మంచిదని జెన్నీ వాదన. కొన్ని రోజులు ఈ డాక్టర్ల చుట్టూ తిరిగే సరికి నాక్కూడా అదే నిజం అనిపించింది. మూడు వారాల క్రితం జెన్నీని ఫ్లోరిడా తీసుకెళ్ళాను ఆఖరుసారిగా వెకేషన్ పేరుమీద. అక్కడే హాస్పిటల్లో పోయింది. పోనీ లెండి అంత నొప్పితో, నరకం అనుభవించడం కన్నా అదే మంచిది. జెన్నీని బతికించుకోవడం బాగానే ఉండుండేది కానీ ఇలా అవయవాలు ఒక్కోటి తీసేసాక ఏమిటి బతికి ప్రయోజనం? రొమ్ము కేన్సర్ వచ్చాక సర్జరీ చేయించుకున్న మహిళలు మానసికంగా నరకం అనుభవిస్తారని ఎక్కడో చదివాను. అస్తమానూ నా స్వార్ధం చూస్కోవడం ఎలా? పోనీ లెండి, చివరికి ఎలగైతేనేం అయాం హేపీ ఫర్ హర్.”

సురేష్ చెప్పిన సారీ విని సురేష్ తండ్రికి కూడా కేన్సర్ అని విన్నాక మెకానికల్ గా ఓ సారీ చెప్పేసి ముందుకి సాగిపోయేడు డేవిడ్. వీళ్ళెంత ఈజీ మనుషులు? స్వంత భార్య పోయినందుకు మనసు ఎంత కష్టపెట్టుకున్నాడో పెద్దగా తెలియదు కానీ జెన్నీ చివరి రోజుల్లో కోరుకున్నట్టూ చేసి అయాం హేపీ ఫర్ హర్ అనగలిగేడు. మరి తానో? బుర్ర విదిల్చి చిన్నగా గొణుక్కుంటూ ముందుకి నడిచేడు.

* * * * * * * * *

తండ్రిని చూడ్డానికొచ్చిన సురేష్ కి చూడగానే మైన విషయం – తన తండ్రి మరో రెండు వారాలు బతికితే గొప్పే. సురేష్ వచ్చిన మూడో రోజు విశ్వానికి తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో చేయగలిగింది అంతా చేసాక ఎమర్జన్సీ డాక్టర్ చెప్పాడు బయటకొచ్చి, “రక్తంలో తయారైన క్లాట్ ఊపిరితిత్తుల్లోకి ఒకటీ, బ్రైన్ లోకి ఒకటి వెళ్ళాయి. మేము టి.పీ.ఏ మందు ఇచ్చినా ఏమీ గుణం కనిపించలేదు. ఈ క్లాట్ కేన్సర్ మందుల వల్ల వచ్చిందా, మరోదాని వల్లా అనేది చెప్పడానికి లేదు. ఇప్పుడు హెమొరేజ్ వల్ల వళ్ళు తెలియదు ఆయనకి. కానీ మరి తెలివి వస్తే మీతో మాట్లాడ్డం కానీ, మామూలుగా జీవించడం కానీ అసంభవం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచితే మరో కొన్ని రోజులు బతకొచ్చు. బతికినా ఎవర్నీ గుర్తుపట్టడం గానీ మాట్లాడ్డం కానీ జరగదు అని మా మెడికల్ టీం అభిప్రాయం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచమంటారా, తీసేయమంటారా?”

కడుపులో ముఫ్ఫై అంగుళాల కత్తి వెన్నెముకకి అంటుకునేలా గుచ్చి ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగితే ఏమిటి సమాధానం? సురేష్ వెంఠనే చెప్పేడు, “ఓ పది నిముషాలు ఆలోచించుకోవచ్చా?”

“తప్పకుండా” ఎమర్జన్సీ రూం డాక్టర్ లోపలకి నడిచేడు.

యామిని అక్కడే కుర్చీలో నిశ్చేతనంగా కూలబడింది. తల్లిని వదిలేసి బాత్రూంలో దూరేడు కన్నీళ్ళు కనపడకుండా ఉండడానికి. చిన్నప్పుడు సరిగ్గా అన్నం తినకుండా ఇల్లంతా పరిగెడుతూంటే తనని కూర్చోపెట్టి కధలు చెప్తూ ఒక్కొక్క చెంచాతో అన్నం తినిపించిన తండ్రికి ఫీడింగ్ ట్యూబ్ ఉంచమని చెప్పాలా? తీసేయమని చెప్పాలా? నాన్నా, ఇలా సిమ్మింగ్ క్లాస్, అదిగో బేస్ బాల్ ప్రాక్టీస్, ఇక్కడ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని పోరుతుంటే ఎక్కడకి పడితే అక్కడకి తీసుకెళ్ళిన తండ్రిని ఏంచేయాలి? తాను హిందువు కనక ఆ ధర్మం ప్రకారం ఫీడింగ్ ట్యూబ్ తీసేయడం మంచిదా? ఉంచడం మంచిదా? మోరల్ గా అయితే ఏం చేయాలి? తనదొక్కడిదీ కాదు నిర్ణయం. అయినా తల్లిని ఇప్పుడు ఏమని అడగాలి? అమ్మా ట్యూబ్ తీసేయమని చెపుదామా అని చెప్పాలా? లేకపోతే ఉంచుదాం, అప్పుడు తండ్రి బతికితే నువ్వు క్షణం కూడా ఖాళీ లేకుండా ఆయన్ని చూసుకో అని చెప్పాలా? ఇప్పటికే ఈ కేన్సర్ వల్ల తల్లి చితికిపోయింది మానసికంగా, ఆర్ధికంగా, శారీరకంగానూ….. బుర్ర తినేసే ప్రశ్నలన్నీ ఒకదానిమీద ఒకటి సమ్మెట దెబ్బల్లా తగులుకుంతూంటే తల బద్దలౌతోంది. ఒక్కసారి చణ్ణీళ్లతో మొహం కడుక్కున్నాడు. కొంత తెరిపి పడ్డాక బయటకొచ్చాడు అయిదు నిముషాలకి.

యామిని, దగ్గిరకొచ్చిన కొడుకుని తలెత్తి  చూసింది. ఓ క్షణం ఆగి చెప్పింది, “మీ నాన్న ఇష్టం మొదట్నుండీ తెలుస్తూనే ఉంది. ట్రీట్ మెంట్ వద్దని చెప్పినా మనమే కొనసాగించాం. ఇంక ఈ దశలో ఏ మాత్రం ఉపయోగం లేదని డాక్టర్లు చెప్తున్నారు కదా, ట్యూబ్ తీసేయడమే మంచిది.”

తాను ట్యూబ్ తీసేయమంటే తల్లి ఏమంటుందో, అసలెలా చెప్పాలా అనుకుంటున్న సురేష్ కి తలమీదనుంచి పెద్ద బరువు దింపేసినట్టు అయింది. తల్లికేసి కాసేపు చూసి తన చేతిని అమ్మ చేయి మీద వేసి “అలాగే” అన్నాడు.

* * * * * * * * *

ఆ తర్వాత జరగవల్సినవన్నీ జరిగిపోయాయి. అమ్మాయీ, రెండో కొడుకూ వచ్చాక శరీరాన్ని దహనానికి అప్పగించడానికీ, అస్థికలూ అవి తీసుకుని ఇండియా వెళ్ళి గంగలో కలపడానికీ నిశ్చయించుకున్నాక ఎవరి పనుల్లోకి వాళ్ళు తయారయ్యారు. ప్రపంచం ఒక్క మనిషికోసం ఆగదు కదా?

మరో రెండు రోజులు పోయాక అక్కనీ, తమ్ముణ్ణీ ఇంట్లో వదిలి యామినితో అస్థికలు తీసుకురావడానికి బయల్దేరాడు సురేష్. ఫ్యూనరల్ హోం లో వాటికోసం చూస్తూంటే ఎక్కడలేని నీరసం, నిస్సత్తువా ఆవరించాయి. వెనక్కి తిరిగి ఓ సారి చూసుకుంటే తనకి కొండచిలువలా తాడి ఎత్తున వికట్టహాసం చేస్తూ పెరిగిన అప్పు. ఇంత ఖర్చు పెట్టినా తన తండ్రి పడ్డ నిరంతర నరకం తప్పలేదు. ఏనాడూ తనని ఏదీ అడగని తండ్రి చివర్లో కూడా తమ శ్రేయోభిలాషే. తానెలాగా పోతాననీ దానికోసం ఇంత డబ్బు వేస్టు చేయొద్దనీ అడిగితే తానేమన్నాడు? తనకి తల్లీ తండ్రి తప్ప మరెవరూ బంధువులు లేరనీ, ఆయనపోతే తాము ఏకాకి అయిపోతారనీ తెలిసి తండ్రిని బతించుకోవడానికి – మిగతా ఇద్దరికీ పట్టకపోయినా – అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఇదంతా చూస్తే తానో పూర్తి స్వార్ధపరుడు. డేవిడ్ చెప్పినట్టూ తాను కూడా నిస్వార్ధంగా తండ్రిని ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్తే చివరకి మనశ్శాంతితో హాయిగా పోయి ఉండేవాడా? ఇదంతా తన స్వార్ధం వల్లేనా? తలెత్త లేక అలా నేల చూపులు చూస్తూంటే పక్కనే ఉన్న తల్లి చేయి తన భుజం మీద పడటం గమనించాడు. ఒక్కసారి శోకం ముంచుకొచ్చింది. చటుక్కున బాత్రూములోకి దూరి వెక్కి వెక్కి ఏడిచాడు హృదయం పగిలేలా.

ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టాడా, ఖర్చుపెట్టిన డబ్బులకి ఎంత ఫలితం ఉందా అనేమాట పక్కన పెడితే, డాక్టరై ఉండీ ఏం సాధించాడు తాను? ఇన్నాళ్లూ తాను పోరిన పోరాటం శుద్ధ దండుగ. ఎంత నిబ్బరంగా ఉండి కేన్సర్ తో పోరాడి విజయం పొందుదామనుకున్నా, ఆఖరికి ఆ రాచకురుపే గెల్చింది. తమ పోరాటం ఆషామాషీ రోగంతో కాదు. నిరంతరం అనేక లక్షలమంది చేస్తున్నదే. తన తండ్రి బతుకుతాడా పోతాడా అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీలకి గానీ, ప్రతి రోజూ ఇటువంటి కేసులని చూసే హాస్పిటళ్లకి గానీ పట్టలేదు. వాళ్ల ఉద్యోగాలు వాళ్ళు చేసారు. ఫలానా ఎక్స్ పెరిమెంటల్ మందు పనిచేస్తే అది పనిచేసినట్టు కేన్సర్ మీద ఓ పేపర్ రాసుకునేవారేమో. అయినా వాళ్ల తప్పేం ఉంది ఇందులో? తన తండ్రి అనగా ఎంత? ఈ జన సముద్రంలో ఆయన కూడా ఓ నీటి బొట్టు…. మనసు మరల్చుకోవడానికి ఓ సారి తండ్రి చదివే భగవద్గీతలో శ్లోకం గుర్తు తెచ్చుకున్నాడు సురేష్, “జాతస్య హిధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్యచ, తస్మాద పరిహార్యే ర్ధే నత్వం శోచితు మర్హసి”

విశ్వం అస్థికలూ, చితాభస్మం ఉన్న డబ్బా పట్టుకుని ఫ్యూనరల్ హోం నుంచి తల్లి యామినితో వెనక్కి వస్తూంటే సురేష్ మదిలో ఎందుకో ఒక్కసారి మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్ పాఠం చెప్తూ అన్న మాట గుర్తొచ్చింది “కేన్సర్ అనేదో రాచకురుపు. అది మనిషి జీవితాన్నే కాదు, మనసులనీ, మనుషుల మనఃస్తత్వాన్నీ, మన మధ్య బాంధవ్యాలనీ మన బేంక్ ఎకౌంట్లనీ, ముందు రాబోయే రోజులనీ అన్నింటినీ పూర్తిగా మార్చి వేయగల అసాధారణ శతృవు. కేన్సర్ వచ్చిన మనిషి ఒకేసారి ఛస్తాడు, కానీ ఆ తర్వాత పేషంట్ తాలూకు చావు దెబ్బ తగిలిన మృతశేషులు అంటే సర్వైవర్స్, ప్రతీ రోజూ ఛస్తూనే ఉంటారు చాలా కాలం వరకూ.”

కళ్ళలో నీళ్ళు చిమ్ముతూంటే పక్క సీట్లో కూర్చున్న తల్లికి కనబడకుండా వాటిని అదిమిపెట్టి కాలు బలంగా ఏక్సిలెరేటర్ మీద నొక్కాడు. ఏక్యురా కారు కీచుమంటూ ఇంటివేపు దూసుకుపోయింది.

* * * * * * * * *

 

గోదావరి మళ్ళీ లేటు

చిత్రం: రాజశేఖర్

చిత్రం: రాజశేఖర్

 

-ఆర్. శర్మ దంతుర్తి

~

విశాఖపట్నం రైల్వే స్టేషను. సాయింత్రం ఐదింటికి ఇంకో అరగంటలో బయల్దేరబోయే గోదావరి ఎక్స్ ప్రెస్ ని సాగనింపడానికి సిద్ధమౌతోంది. ప్లాట్ ఫాం ని ఆనుకుని ఉన్న తూర్పు రైల్వే విద్యుత్ ఇంజినీరు వారి కార్యాలయం పక్కనే ఎస్ సిక్స్ కోచ్ ఆగి ఉంది. కోచ్ దగ్గిర నిల్చున్న కుర్రాళ్ళు గోల గోలగా కబుర్లు చెప్పుకుంటూంటే లోపల కూచున్న అమ్మాయిలు వాళ్ళ గోలలో వాళ్ళున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కుర్రాళ్ళు వేసుకున్న ఇండస్ట్రియల్ టూర్ కి ఎస్ సిక్స్ అంతా నిండిపోయి ఉంది. ఇద్దరు ముగ్గురు కుర్ర లెక్చరర్లు కూడా వస్తూండడంతో కుర్రాళ్ళకి అమ్మాయిల్తో మాట్లాడ్డానికి అంత వెసులుబాటు లేదు. బయటనుంచుని దొంగచూపులు చూడ్డమే.

కుర్ర ఇంజినీర్లకి చూపించడానికి ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా హైద్రాబాదులో మహీంద్రా వారి ఫేక్టరీ, రిఫ్రిజిరేటర్లు చేసే మరో కంపెనీ, పటాన్ చెర్వులో ఉన్న ఒక కెమికల్ కంపెనీ చూసుకుని మర్నాడు సాఫ్ట్ వేర్ కంపెనీ లన్నీ ఓ చుట్టు చుట్టాలి. ఇదీ ప్లాను. హోటళ్ళూ అవీ ముందే ఆన్ లైన్లో బుక్ చేసుకోవడం అయిపోయింది. ఇంటర్నెట్టా, మజాకా? ఇంకా ఫోన్లు వాడేది ఎవడు? గూగిలమ్మని అడిగితే క్షణంలో పదోవంతు చాలు ఎక్కడ హొటల్లో ఖాళీ ఉందో తెలుసుకోడానికి.  అయినా కుర్రాళ్ళు అమ్మా నాన్నలు లేకుండా బతగ్గలరు కానీ ఫోనూ, లేప్ టాపూ లేకుండా బతగ్గలరా? అందులోనూ లేప్ టాప్ చేత్తో పట్టుకుని ట్రైన్ ఎక్కితే పక్కనున్న జనాలు, రైతు బిడ్డలూ డంగై పోరూ? పని ఉన్నా లేకపోయినా ట్రైన్ బయల్దేరగానే ఓ సారి లేప్ టాప్ బయటకి తీస్తే చుట్టూ ఉన్న జనాలు కళ్ళు విప్పార్చి చూడరూ? ముక్కూ మొహం తెలియని వాళ్ళు లేప్ టాప్ కేసి అలా చూస్తే ఒరిగేదేమిటని అడుగుతారేం? అందరి ముందూ ఎంత గొప్ప! మొన్న మొన్నటి దాకా ఇంజినీరింగ్ లో అప్లైడ్ మెకానిక్స్ లోనూ, థర్మో డైనమిక్స్ లోనూ డింకీ కొడితే మాత్రం ఇప్పుడు కుర్రాళ్లందరికీ విజువల్ బేసిక్కూ, జావా వచ్చును కదా? అవి చాలవూ లక్షలు తెచ్చే ఉజ్జోగాలు రావడానికి? పోదురూ మీ బడాయి, ఏదో ఈ ఇంజినీరింగ్ డిగ్రీ అంటారు కానీ ఈ అప్లైడ్ మెకానిక్సూ, లాప్లాసు రూల్సూ, ఫోరీయర్ ట్రాన్స్ ఫార్మూ, కార్నో సైకిలూ తిండిపెట్టేవేనా? వాళ్ళు పాఠాలు చెప్పాలి కనక అలా చెప్తారు, మనకి కావాల్సింది కంప్యూటర్ ప్రోగ్రామింగు. ఎలెక్ట్రికల్ ఇంజినీరింగూ, వాళ్ళు చెప్పే ఆ ఇన్వర్టర్లూ, కన్వర్టర్లూ చదువుతూ కూచుంటే ఉజ్జోగాలు చేసినట్టే.

బయటనుంచున్న కుర్రాళ్ళలో ఒకడన్నాడు గట్టిగా “ఒరేయ్ అందరూ ఫోన్లూ, లేప్ టాప్ లూ తెచ్చుకున్నారా? వాటికి ఛార్జర్లు లేకపోతే మనం ఎందుకూ పనికిరాం మరి.”

పక్కనున్న లక్ష్మీ పుత్రొడొకడు సమాధానం చెప్పేడు, “ఓరి నాయనో చిన్న వైరు ముక్కలకే ఇంత రాద్ధాంతం ఎందుకురా? అవి తెచ్చుకోకపోతే హైద్రాబాదులో ఏ కొట్లో అయినా కొనుక్కోవచ్చు. యాభై రూపాయలు పారేస్తే చవకబారు ఛార్జరు దొరకదూ? నేను ఈ మధ్యనే రెండు మూడు కొన్నాను ఇంట్లో రూముకొకటి ఉంచుకోవడానికి. మన వాడకానికి అవి చాలవూ? పుట్టె మునిగిపోయిందేమీ లేదు.” నవ్వులు సాగాయి. కోచ్ లో కూర్చున్న అమ్మాయిలు కూడా నవ్వు కలిపేసరికి లక్ష్మీ పుత్రుడి ఛాతీ నాలుగంగుళాలు పెరిగింది.

“ఉన్న డబ్బై బెర్తుల్లో దాదాపు అందరం ఫోన్లూ, లేప్ టాపులు తెచ్చేసుకున్నట్టేనన్నమాట.”

“ఒరేయ్ నాయనా గట్టిగా అనకు. మన ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గారు వింటే వీటన్నింటికీ ఎంత పవర్ అవుతుంది ఎన్ని ఏంపియర్లు ఖర్చౌతాయ్ అన్నీ చెప్పమని క్లాసు పీకుతాడు. అసలే మనం వెళ్ళేది జాలీ ట్రిప్పుకి”.

మళ్ళీ నవ్వులు.

ఈ కబుర్లన్నీ దూరంగా నుంచుని వింటూ వీళ్ళనే గమనిస్తున్న రైల్వే లైన్ మేన్ అప్పన్న లోపలకి పరుగెత్తుకుని వెళ్ళి ఏదో చెప్పాడు.  అక్కడే ఉన్న రామారావు క్షణంలో పదోవంతు ఆలోచించి లేచి నిల్చుని ఎదురుగా ఉన్న ఇంజినీర్ తో చెప్పాడు. “బండి కాసేపు ఆలస్యం చేయమని స్టేషన్ మాస్టర్ కి ఫోన్ చేసి చెప్పండి. నేను వెళ్ళి బండి విజయవాడ చేరేలోపుల వీళ్ల సంగతి చూస్తా,” అంటూ ఆఫీసు లోపల ఉన్న బాత్రూంలోకి దూరేడు బట్టలు మార్చుకోవడానికి, సమాధానం కోసం చూడకుండా.

టేబిల్ దగ్గిరున్న ఇంజినీరు “సరేనండి,” అంటూ కంగారుగా స్టేషన్ మేస్టర్ కి ఫోన్ చేసి చెప్పాడు. వెంఠనే ఒక ప్రకటన వెలువడింది ప్లాట్ ఫాం మీద. “దయచేసి వినండి. ఈ రోజు సాయింత్రం 5:30 కి బయల్దేరవల్సిన హైదరాబాదు వెళ్ళే గోదావరి ఎక్స్ ప్రెస్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని నిముషాలు ఆలస్యం అవుతోంది.” మళ్ళీ అదే ప్రకటన ఇంగ్లీషులోనూ, హిందీలోనూ చెప్పబడింది యధావిధిగా.

Kadha-Saranga-2-300x268

బాత్రూంలోంచి బయటకొచ్చిన రామారావు చెప్పేడు లైన్ మేన్ అప్పన్నతో “రావోయ్, వీళ్ళ సంగతి చూద్దాం. మళ్ళీ నాతోబాటు పొద్దున్నలోపులే వెనక్కి వచ్చేయవచ్చు,” స్టేషన్ ఎలెక్ట్రికల్ ఇంజినీర్, అప్పన్నల మొహాలలో కనబడే ఆశ్చర్యం పట్టించుకోకుండా బయటకి నడిచేడు కోచ్ ఎస్ సిక్స్ వేపు రామారావు.

రామారావు రైల్వే కూలీ అవతారం చూసి స్టేషన్ ఇంజినీర్ నోరు వెళ్ళబట్టి అసంకల్పితంగా సరే అన్నాక, ఆఫీసులోంచి రామారావు బయటకి రావడం, లైన్ మేన్ అప్పన్న తో బాటు ఇంజినీరింగ్ కాలేజీ కుర్రాళ్ళ కోచ్ కేసి కదలడం చూసాడు.

అప్పన్నా, రామారావు కోచ్ లోకి ఎక్కబోతూంటే ఒకరిద్దరు కుర్రాళ్లు వారించేరు – “ఇది మేం రిజర్వ్ చేసుకున్న కోచ్. ఇందులో ఎక్కడానికి లేదు.”

“బాబు, ఇక్కడకేనండి. రాజమండ్రీ రాగానే దిగిపోతాం” అప్పన్నా, రామారావు బతిమాలుతున్నట్టూ అడిగేరు.

ఓ కుర్రాడు, “పోనియ్ గురూ” అనడంతో ఏ కళనున్నారో, వద్దనలేకపోయేసరికి ఎస్ సిక్స్ లోపలకి దూరిపోయేడు రామారావు అప్పన్నతో.

మరో పది నిముషాలకి, గంట లేటుగా – ఇటువంటి ఆలశ్యాలు సర్వసాధారణం అన్నట్టూ గోదావరి నత్తలాగా కదిలింది ముందుకి.

 

*****

 

బండి ఇంకా దువ్వాడ చేరకుండానే కుర్రాళ్ళందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టూ లేప్ టాపులూ, ఫోన్లూ బయటకి తీసి ఛార్జ్ చేయడం కోసం కోచ్ లో ఉన్న ఎలెక్ట్రికల్ సాకెట్లకి కనెక్షన్లు పెట్టేసి కీ బోర్డులు టకటకలాడించడం మొదలుపెట్టేరు. ఇదంతా చూస్తున్న రామారావుకి ఒళ్ళు మండింది. ఓ కుర్రాడి పక్కనే కూర్చుని అప్పన్న చూస్తూండగా మాటలు కలిపేడు, “ఎక్కడెకెళ్తన్నారు బావూ?”

సీరియస్ గా ఏదో టైప్ చేస్తున్న కుర్రాడు తలెత్తి చూసాడు – నోట్లోంచి తాయిలం ఎవరో లాగేసుకున్నట్టు మొహం పెట్టి స్టైలుగా చెప్పేడు, “హైద్రాబాద్”

“ఏం చదూకుంటన్నారు బాబు?”

“ఇంజినీరింగు.”

“అబ్బో, కరెంటు వింజినీర్లాండి? లేకపోతే బిడ్జీలు కట్టేవోరా?”

“అవన్నీ పనికొచ్చేవి కాదోయ్, మేం ఏం చదివినా చేసేదొక్కటే ఉజ్జోగం – కంప్యూటర్ ప్రోగ్రామ్మింగు.” ఈ సరికి చుట్టూ చేరిన మిగిలిన కుర్రాళ్ళు గట్టిగా నవ్వేరు.

“మీ ఒళ్ళో ఉండేది ఏటండి అది?” రామారావు ఎప్పుడూ లేప్ టేప్ చూడనివాడిలా అడిగేడు.

“లేపీ అంటారోయ్ దీన్ని”

“ఏటండి? లేపయ్యడవేనా?”

“లేపీ అంటే లేప్ టాప్!”

“అమ్మో అంటే దాంతో టాపు లేచిపోద్దాండి?” రామారావు నోరు వెళ్ళబట్టేడు. అప్పన్న నవ్వురాకుండా నోటికి తువ్వాలు అడ్డంబెట్టుకోవడం చూసి కుర్రాడు చెప్పాడు అందరికీ వినబడేటట్టూ “ఒరేయ్ వినండ్రా ఈ బైతు ఏవంటున్నాడో.”

ఒక్కసారి మరో పది పదిహేనుమంది రామారావు చుట్టూ చేరేరు. “నాను తప్పు ఏటన్నాను బావూ?”

“అబ్బే, నువ్వు టాఫు లేచిపోద్దా అంటే నవ్వొచ్చింది. దీన్ని టాపులు లేపడానిక్కాదు వాడేది. ఇదో కంప్యూటరు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ చేస్తాం దీంతో.”

“పోగ్గామింగా? అంటే ఏటంటారు?”

మళ్ళీ నవ్వులు. ఓ కుర్రాడు ముందుకొచ్చి చెప్పేడు, “ఎప్పుడన్నా సినిమా చూసేవా?”

“ఎప్పుడో ఓ సారి చిన్నప్పుడు మా నాయన చూపిత్తే ఎళ్ళానండి. అదేం చిన్మా? ఆ! సిరంజీవి చిన్మా. జగదేక ఈరుడు, ఏదో అతి బువన సుందరి కాబోల్ను.”

కొంతమంది అమ్మాయిలు ఆసక్తిగా చూడ్డంతో సమాధానం చెప్పే కుర్రాడు రెచ్చిపోయాడు, “ఆ సినిమా వెయ్యాలంటే వెనకనుంచి ఓ డిస్కులో సినిమా ఉంచి అది తిప్పుతారు. అలా తిప్పితే అందులో ఉన్న సినిమా బొమ్మలన్నీ మనకి తెరమీద కనిపిస్తాయ్. అలా కనిపించాలంటే ఆ డిస్కు తిరగడానికి ఇలాంటి ఓ కంప్యూటరు లాంటిదే అనుకో ఒకదాన్ని వాడతారు…..”

“చినిమాకీ ఈ పోగ్గామింగుకీ ఏటండి లంకె? చినిమా కనబడేటప్పుడొచ్చే మిసి మిసి బల్బు ఈ కంపూట్రా?”

“అదే కదూ చెప్తూంటా? మరి డిస్కు తిరుగుతుంటే ఆ బొమ్మలన్నీ తెర మీద కనిపించడానికి కొంత కష్టపడాలి. కంప్యూటర్ అంటే ఒక మెషీన్. దానికి డిస్కుని ఎలా తిప్పాలో అనేది చెప్పాలి. ఇలా డిస్కు తిప్పూ, అలా బొమ్మ చూపించు, అలా పాట బయటకి తీయ్ అంటూ. ఇవన్నీ ఓ వరుసలో పెట్టి చెప్పడాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. ఇలా డిస్కు తిప్పడం బదులు మరో పని కూడా చేయించొచ్చు. అంటే ఉద్యోగాలు చేసే కుర్రాళ్ళకి జీతం ఎంతివ్వాలి? ఎన్ని రోజులు శెలవ ఉంది, ఎన్ని రోజులు వాడుకున్నారు, అనేవన్నీ కాయితం మీద ప్రింట్ చేయొచ్చు. అంటే కంప్యూటర్ ఒకటే కానీ రకరకాల పనులు దాంతో చేయించుకోవచ్చు. అది మనం ఎలా చెప్తే అలా చేస్తుంది. మరి దానికొచ్చిన బాషలో ఇదిగో ఇలా డిస్కు తిప్పు, ఇలా వారానికోసారో నెలకోసారో జీతం ఎంతివ్వాలో చూపించు అనేవి రాసి ఉంచుతాం. అలా రాయడాన్నే ప్రోగ్రామింగ్ అనడం. అర్ధం అయిందా?”

“ఆ, ఏటో బావు. డిస్కు తిప్పడం, డబ్బులివ్వడం అంతా కలబెట్టేసినారు.” బుర్ర గోక్కున్నాడు రామారావు. అప్పన్న కిసుక్కున నవ్వేడు.

ఆంధ్రా యూనివర్సిటీ మళ్ళీ నవ్వులు.

ఈ సారి లేప్ టాప్ పక్కనే ఉన్న ఛార్జర్ కేసి చూపించి, “ఇదేటండి ఈ నల్లగా ఉన్న ఇటుకముక్క” అడిగేడు రామారావు.

“దాన్ని ఛార్జరంటారు. ఇటుకముక్కకాదు.”

“అద్దేనికండి?”

“మన గోదావరి ఎక్స్ ప్రెస్సు ఎలా నడుస్తుందో తెలుసా?” కాసేపు ఆలోచించి అడిగేడు కుర్రాడు

“అంత తెల్దుగానండి, పైన ఏవో తీగలున్నాయి. అందులోచి వింజను కరెంటు లాగుతాది. ఆ కరెంటే బండిని నడుపుతాదంటారు మరి” అంటూ అప్పన్న కేసి తిరిగి అన్నాడు రామారావు, “అప్పన్నా నేంజెప్పింది రైటేనా?” అప్పన్న తలూపేడు అవునన్నట్టూ.

వేగం పుంజుకుంటూ గోదావరి అనకాపల్లె దాటింది.

“అప్పన్న మీ తమ్ముడా?” ఓ రంధ్రాన్వేషి అడిగేడు.

“లేదండి, నాతో పనిజేస్తాడు ఈ రైల్వేలోనే”

“ఓ, నువ్వు రైల్వేలోనా ఉద్యోగం?” హాశ్చర్యపడిపోయింది ఆంధ్రా యూనివర్సిటీ బృందం.

“సరే విను అయితే. పైన తీగల్లో కరెంటు ఉంటుంది కదా? గోదావరి అంత పెద్ద బండి నడవాలంటే మరి పెద్ద పెద్ద లావు తీగలుండాలి. మన కంప్యూటర్ చిన్నది కాబట్టి అంతపెద్ద కరెంటు దీనిమీద వదిల్తే ఏమౌతుందో తెలుసా?”

“కాలిపోదండీ?” రామారావు కళ్ళు పెద్దవిచేసుకుని చెప్పేడు.

“కరెక్టు.” అప్పటిదాకా ఇదంతా వింటూ జోక్యం చేసుకోకుండా ఉన్న ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చెప్పేడు. ఈయనెప్పుడొచ్చాడ్రా అనుకుంటూ కుర్రాళ్లు ఆయనకేసి చూసారు.

“ఆ లావు తీగలమీదనుంచొచ్చే కరెంటు ఈ కంప్యూటర్ కి సరిపోడానికి దాన్ని తగ్గించి ఇందులో వదిలేదే ఈ ఛార్జరు.” మొదట్నుంచే అన్నీ ఓపిగ్గా చెప్తున్న కుర్రాడు చెప్పేడు.

“ముట్టుకోచ్చాండి?” అంటూ రామారావ్ ఛార్జర్ మీద చెయ్యేసాడు. వేడిగా తగిలింది. “అమ్మో చెయ్యి కాల్తన్నాదండి.”

తుని రాబోతూండగా రామారావు లేచి అప్పన్నతో కంపార్ట్ మెంట్ తలుపు దాకా వెళ్ళి చెవిలో ఏదో చెప్పేడు. అప్పన్న సరే అన్నట్టూ తలూపి తలుపు దగ్గిరే నిలబడ్డాడు. బండి తునిలో ఆగింది. తలుపు దగ్గిరే నుంచుని ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడ్డం సాగించేడు. లోపలకి ఎక్కేవాళ్ళని అక్కడే వారించి వాళ్లందర్నీ వదిలేసి తలుపు లాక్ చేశాడు అప్పన్న.

మూడు నిముషాల హాల్టుని పదిహేను నిముషాలకి ఏ కారణం లేకుండానే పొడిగించాక గోదావరి బయల్దేరింది తునిలోంచి బయటకి.

*****

 

కుర్రాళ్లందరూ సమోసాలూ, టీలు కానిచ్చేక బండి కదుల్తుంటే రామారావు వెనక్కొచ్చి మళ్ళీ కుర్రాళ్లతో కబుర్లు మొదలెట్టాడు, ఈ సారి ఎలెక్ట్రికల్ ఇంజీనీరింగు ప్రొఫెసర్ తోటీను. “బావూ, మరి ఇన్నేసి లేప్ టాపులు, ఆ ఫోన్లూ అలా తగిలించేస్తే తీగలు కాలిపోవండీ?”

కుర్రాళ్ళూ, కుర్రమ్మలూ ఈయనేం సమధానం చెప్తాడా అని ఆసక్తిగా చూసేరు ప్రొఫెసర్ వైపు.

ఎలెక్ట్రికల్ ఇంజిరీంగ్ ప్రొఫెసర్ రెండేళ్ల క్రితమే ఉద్యోగంలో జేరేడు, ఇదే కాలేజీలో చదువుకుని, పాసయ్యి నాన్నగారి రికమండేషన్ తోటీ, అక్కడో ఉత్తరం ఇక్కడో దక్షిణా సమర్పించుకుని. సమాధానం చెప్పకపోతే ఈ బైతు ముందూ, ఆత్రంగా చూసే ఈ పిల్లల ముందూ పరువుపోదూ? వెంఠనే చెప్పేడు, “మంఛి ప్రశ్న అడిగావయ్యా, నీ పేరేంటన్నావ్?”

“రామారావండి.”

“సర్లే, పైన ఉన్న కరెంటు తీగలు ఎంత లావున్నాయో చూసావా? గోదారి ఎక్స్ ప్రెస్సు ఎంత కరెంటు లాగుతోందో దానిముందు ఈ కంప్యూటర్ లాగేది ఏ మాత్రం? మరో వంద కంప్యూటర్లు వాడినా ఏమవదు.”

“ఆయ్, బాగా చెప్పేరండి. మరైతే ఆ పైనుంచొచ్చే కరెంటు ఈ లేపుటాపు లోకి తిన్నంగా రాకుండా ఈ ఇటుకముక్క అడ్డుకుంటే ఇదే వేడెక్కిపోతన్నాది. అది కాలిపోదండీ?”

ఈ సారి కాస్త విసుగ్గా అన్నాడు కుర్ర ప్రొఫెసర్, “మరేం ఫర్లేదయ్యా. నేను చెప్తున్నాను కదా? అయినా ఆ తీగల్లో కరెంటు డైరక్టుగా ఇందులోకొచ్చెయ్యదు. మధ్యలో కన్వర్టర్లు అని ఉంటాయి. అవిలేకపోతే ఈ లైట్లూ, పేన్లూ ఏవీ పనిచెయ్యవు.”

“అంటే మద్దెలో మరో ఇటుకముక్కలాటిదున్నాదంటారా? ఎక్కడుంటాదో మరి. అందుకే గదండన్నారు ఈ రైలింజన్లూ, ఈ ఇమానాలు, అంతా తెల్లోడి బిస అనీ. ఆఖరికా తెల్లోడు చంద్రుడిమీదకెళ్ళి కుందేల్ని తడిమాడంట. అబ్బో”

అందరూ నవ్వడంతో వాతావరణం తేలిక పడింది. రామారావు మళ్ళీ నస కంటిన్యూ చేసాడు, “మరి మేష్టారు, ఈ నల్ల ఇటుకముక్కలు ఫోన్లకి వేరేగా ఉంటాయండీ?”

“ఆ ఉంటాయి కాని కాస్త చిన్న సైజులో,” అంటూ ఓ కుర్రాడు ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి వాడే చిన్న ఛార్జర్ చూపించాడు.

“మరో మాటండి, ఈ ఇటుకముక్కలు ఏడెక్కుతూంటే….”

“ఎన్నిసార్లు చెప్పాలోయ్, ఇటుక ముక్క కాదు ఛార్జర్ అనలేవూ?”

“పోనీండి బావ్, ఇయన్నీ ఏడిక్కిపోతే అక్కడే ఉన్న కాయితమో, గుడ్డముక్కో అంటుకుంటే పెమాదం కాదూ?”

“మరీ అంత వేడేక్కిపోదులే. కొంచెం వెచ్చగా ఉండొచ్చు. కానీ నాసి రకం ఛార్జర్లైతే అంటుకుంటాయ్”

“తవరికెలా తెలుద్దండీ ఇయి నాసిరకంవో కావో?”

“దానిమీద పేరు చూసావా? మంచి పేరున్నవి వాడతాం.”

“అలా అంటారేటి బావు, ఈ దేశంలో ఎంత కల్తీ ఉందో తెల్వదా? పేరుదేవుంది అచ్చుగుద్దటవే కదా?”

రామారావ్ ప్రశ్నకి ఈ సారి మొత్తం ఆంధ్రా యూనివర్సిటీ అదిరిపడింది. దీనికి సరైన సమాధానం ఎవరి దగ్గిరా లేదు.

కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చప్పట్లు కొట్టి అన్నాడు, “అదండి అద్భుతమైన ప్రశ్న. బైతు, బైతు అని మనం వెక్కిరిస్తూన్న ఇతనే వేశాడు మనం సమాధానం చెప్పలేని ప్రశ్న”

 

*****

 

బండి పిఠాపురం దాటి సామర్లకోటకి దగ్గిరౌతూండగా రామారావు లేచి బాత్రూంలో దూరేడు.

వెళ్లేటప్పుడు తాను కూర్చున్న చోటునుంచి దగ్గిర్లో ఉన్న బాత్రూంలోకి కాక దూరంగా అటువైపు ఉన్న లావెట్రీ వైపుకి నడిచేడు. వెళ్తూ దారిలో ఎన్ని కంప్యూటర్లున్నాయో ఎన్ని ఫోన్లు ఉన్నాయో ఉరమరగా లెక్కపెట్టేడు. 74 బెర్తులకి ఈ కుర్రాళ్ళు దాదాపు 70 లేప్ టాపులు తెచ్చారు. ఫోనులేని కుర్రాడు కానీ కుర్రమ్మ కానీ లేనేలేదు. మరో కొంతమంది దగ్గిర ఒళ్ళో పెట్టుకుని సినిమాలు చూసే డివిడి ప్లేయర్లుండడం గమనించేడు.

బాత్రూంలోకి దూరిన రామారావు జేబులోంచి సెల్ ఫోన్ బయటకి తీసి సామర్లకోట స్టేషన్ మాస్టర్ నెంబరికి కనెక్టు చేయమని అడిగేడు. రెండునిముషాల్లో అవతలాయన లైన్లోకొచ్చాక చెప్పేడు, “బోగీల దగ్గిర ఎలెక్ట్రికల్ రిపేర్లు చేసే వాళ్లెవరైనా మీదగ్గిర ఉన్నారా సామర్లకోట స్టేషన్లో?”

“లేదండి. మా దగ్గిర చిన్న చిన్న రిపేర్లు చేసేవాళ్లే. ఏదో ఓ లైటూ, ఫేనూ తిరగకపోతే చూడగలరు అంతే గానీ మరీ పెద్ద పన్లు చేయలేరు. మాకు ఆర్డర్లన్నీ రాజమండ్రి నుంచి రావాల్సిందే.”

“అలాగా, రాజమండ్రి ఫోన్ చేసి నేను ఇక్కడ ఎస్ సిక్స్ కోచ్ లో ఉన్నాననీ ఇద్దరు స్పెషలిస్ట్ ఎలెక్ట్రీషిన్లని పంపించమనీ చెప్పండి. బండి రాజమండ్రి లో ఆగాక నేను మళ్ళీ ఫోన్ చేసేవరకూ కదలడానికి లేదు. కాస్త స్తేషన్ కి దూరంగా ఉన్న ప్లాట్ ఫాం మీద కానీ, లూప్ లైన్లో కానీ అపమని చెప్పండి.”

“సరేనండి. ఏదైనా ప్రమాదమా బండికి?”

“ఇంకా ఏమీ లేదు, కానీ ప్రమాదం వస్తే మళ్ళీ ఫోన్ చేస్తాను ఈ సారి ట్రేక్ పక్కనున్న ఫోన్ వైర్ల మీదనుంచి.”

“భోజనం, అవీ… మీకేం కావాల్సినా ఇప్పుడు చెప్పేయండి, నేను చూసుకుంటాను.” కాస్త ఎక్కువగా ఉత్సాహపడిపోయేడు సామర్లకోట స్టేషన్ మాస్టరు.

“ఏమీ వద్దు. చెప్పినది చేయండి చాలు.” మృదువుగానే అన్నా చురుక్కుమని తగిలింది సమాధానం స్టేషన్ మాస్టరికి.

 

****

 

బండి సామర్లకోట వదిలి అనపర్తి దాటుతూండగా ఓ బెర్తు దగ్గిర్నుంచి కేకలు వినిపించేయి. రామారావు ఎంత పరుగెట్టుకుంటూ ముందుకెళ్ళినా కుర్రాళ్ళందరూ అడ్డుండడంతో లోపలకి వెళ్ళే వీలు లేకపోయింది. అరుపుల్లో, కేకల్లో “చైన్ లాగు” అని ఒకరంటూంటే, “నీళ్ళు పోయండి” అని మరొకరు అరుస్తున్నారు. ముందుకెళ్ళే రామారావు అప్పన్నతో చెప్పేడు, “ఆ పక్కన ఎలెక్ట్రికల్ బాక్సు ఆఫ్ చేయగలవేమో చూడు.”

అప్పన్న అటువెళ్ళగానే రామారావు తోసుకుంటూ ముందుకెళ్ళేసరికి మంటలు కనిపించేయి. ఒక లేప్ టాప్ దగ్గిరే ఉన్న బెర్తుమీద ఉన్న దుప్పటి అంటుకుని మంటలు వస్తున్నాయి. వైర్లు ఇంకా కాలుతూనే ఉండడంచేత అది ముట్టుకోడానికెవరికీ ధైర్యం లేనట్టుంది. రామారావు ముందుకెళ్ళి వేసుకున్న హవాయి చెప్పులు రెండు చేతులకీ తగిలించుకుని ఒక్క ఉదుటున కాలుతున్న వైరుని సాకెట్లోంచి బయటకి లాగేడు. కాలిపోయిన వైరు తెగి వచ్చింది.

మంటలు తగ్గడానికి మరో దుప్పటి వేసి పొగ పోవడానికి కిటికీల తలుపులు తీసాక, కుర్రాళ్లందరూ తలో చేయి వేసేసరికి మంటలన్నీ అదుపులోకొచ్చాయి. అప్పన్న ఏదో చేసినట్టున్నాడు, అప్పుడే చిన్న శబ్దంతో కోచ్ అంతా కరెంటు పోయింది. అంతా నిశ్శబ్దం. కంప్యూటర్ల గురించి అనర్గళంగా మాట్లాడిన కుర్రాళ్ళూ, జబ్బలు చరుచుకుని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే ఏమిటో చెప్పిన ప్రొఫెసర్ కీ నోటమ్మట మాటలేదు.

మొత్తానికి రెండు దుప్పట్లు కాలడం, ఇద్దరబ్బాయిలకి చిన్నపాటి గాయాలూ, ముగ్గురమ్మాయిల చుడీదార్ల పైన వేసుకున బట్టలూ కాలాయి అంతే. ప్రాణ నష్టం లేదు; అదో అదృష్టం. రామారావు, అప్పన్నా ఏమీ మాట్లాడకుండా దిగే గుమ్మం దగ్గిరకి పోయి నుంచున్నారు. చిక్కబడుతున్న చీకట్లో గోదావరి పరిగెడుతూనే ఉంది.

కడియం దాటి బండి కాసేపటికి రాజమండ్రిలో ఆగింది.

తలుపుతీసి దగ్గిరలోనే నుంచుని విష్ చేసిన అందర్నీ చూసి రామారావు చెప్పేడు, “ఈ కోచ్ ఖాళీచేయించి మరోటి చూడండి వీళ్లని ఎక్కించడానికి. ఆ తగిలించే కోచ్ కి వెనుకనున్న సర్క్యూట్ బ్రేకర్స్ అన్నీ చూసి చార్జింగ్ పాయింట్స్ అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ కోచ్ ని రిపేర్లకి పంపించే ఏర్పాట్లు చేయండి.  చిన్న చిన్న దెబ్బలు తగిలిన వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఓ గంటలో చేయగలిగితే మంచిది. బండి బయల్దేరే ముందు అన్నీ తనిఖీ చేసిన రిపోర్ట్ నేను చూస్తాను.” చకచకా ఆర్డర్లు వేసి అప్పన్నతో ముందుకి కదిలేడు రామారావు.

ఇదంతా చూస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ నోర్లు వెళ్లబెట్టింది. సామాన్లులన్నీ దింపుకున్నాక వేరే కోచ్ లోకి ఎక్కడానికి మరో నలభై నిముషాలు పట్టింది. ఈ కంగార్లో ఎవరి లేప్ టాపులు పోయాయో ఎవరి ఫోన్ ఎక్కడ తగలబడిందో ఎవరికీ గుర్తులేదు. గుర్తున్నదంతా బైతులా రామారావు వేసిన నాటకం, ఆయన రాజమండ్రీలో రైల్వే వాళ్లకి వేసిన ఆర్డర్లూను.

“మనతో మాట్లాడినాయన పెద్ద రైల్వే ఆఫీసర్లాగున్నాడే?” ఎవరో కుర్రాడు గొంతు పెగుల్చుకుని అన్నాడు.

“ఏమో? ఏం చెప్పగలం?” అంటూ భుజాలు ఎగరేసారు మిగతావాళ్ళు.

*****

దాదాపు గంటా రెండు గంటలు గడిచేక బండి ఎప్పుడు కదులుతుందా అని చూస్తూంటే రామారావు మళ్ళీ అప్పన్నతో కలిసి రావడం కనిపించింది. ఈ సారి వచ్చిన రామారావు హుందాగా ఉన్నాడు బట్టలు మార్చుకుని; ముందు చూసిన బైతు రామారావు కాదు.

చుట్టురా మరో నలుగురున్నారు – రాజమండ్రీ స్టేషన్ మాస్టర్ తో సహా టైలు కట్టుకుని. రామారావు మాట్లాడ్డం మొదలుపెట్టేడు.

“మీరందరూ భవిష్యత్తులో కాబోయే ఇంజినీర్లు. మీరు నేర్చుకోవల్సినది ఇంజినీరింగ్. క్లాసులో పాఠాలు బట్టి పట్టేసి పరీక్షల్లో ఉమ్మేస్తే మార్కులొస్తాయేమో కానీ ఇంజినీరింగ్ ఉజ్జోగాలు రావు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఇంజినీరింగ్ అనవసరం. ఈ ట్రైన్లో నాతో మాట్లాడిన కుర్రాళ్ళకి కానీ మీ ప్రొఫెసర్ కి కానీ ఏమాత్రం ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ కానీ కంప్యూటర్ల గురించి కానీ తెలిసినట్టు లేదు. కోచ్ కి ఉన్న సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏమిటో మీకు తెలియదని నాకు అనిపిస్తూంది. ఒక్కో లేప్ టాప్ ఛార్జరూ ఎన్ని ఏంపియర్లు లాగుతుందో తెలుసా? అన్నీ ఒకేసారి కనెక్ట్ చేస్తే ఏమౌతుంది? నాది కెమికల్ ఇంజినీరింగూ, నాది సివిల్ ఇంజినీరింగూ అని తప్పించుకోవడానికి చూడకండి. ఈ బేసిక్ ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ అన్ని బ్రాంచ్ ల కుర్రాళ్ళూ చదవవల్సిందే. అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పండి. మీరు విశాఖపట్నంలో ఎక్కి దువ్వాడ వచ్చేలోపు లాప్ టాప్ లు కనెక్ట్ చేసి ఏం చేద్దామని? పదినిముషాలు లేప్ టాప్ స్క్రీన్ కేసి గానీ, ఫోన్ స్క్రీన్ కేసి గానీ చూడకుండా ఉండలేరా?

ఒక్కొక్క లేప్ టాప్ మూడు నుంచి నాలుగు ఏంపియర్లు కరెంటు లాగుతుందనుకుంటే మీరు తగిలించిన వాటికి మొత్తం ఎంతైంది? అదీ కాక మీరు పట్టుకొచ్చిన చార్జర్లు అన్నీ సరైనవా? నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఇది – మీరు తెచ్చినవాటిలో ఎన్ని సరైన మంచి ఛార్జర్లు? ఎన్ని చవకబారువి? మీరే చూసారు కదా ఒక ఛార్జర్ వేడెక్కగానే మంటలు అంటుకున్నాయి. ఆ ఛార్జర్ ఎంత చవకబారుదో మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా. మంటలు వచ్చే సమయానికి మనందరం నిద్రలో ఉండి ఉంటే? రోజుకో ట్రైన్ కి ఏక్సిడెంటు అవుతోంది. ఏది ఎలా జరిగినా అందరూ మా రైల్వేదే తప్పు అంటారు. మీరు చేసే వెధవ పనులు ఎవరికీ చెప్పరూ, మేము చూపిస్తే ఒప్పుకోరూ.  ఇంతకీ నేనెవర్నో తెలుసా మీకు?”

డభ్భై ఆరు తలలు అడ్డంగా ఊపబడ్డాయి తెలీయదన్నట్టూ.

“నా పేరు వంగపల్లి రామారావు. నేను సౌత్ ఈస్టర్న్ రైల్వే కి సీనియర్ డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ని. మీలాగే ఇంజినీరింగ్ చదివి యూ పి ఎస్ సి వారు రాసిన పరీక్షలో పాసై డైరక్ట్ గా ఇక్కడకొచ్చాను…”

నాన్నారి రికమండేషన్తో ఉజ్జోగంలో చేరిన ప్రొఫెసర్ మొహంలో కత్తివాటుకి నెత్తురుచుక్కలేదు. ఒకప్పుడు తాను ఈ యూ పి ఎస్ సి పరీక్ష రాయడం గుర్తొచ్చింది. ఇంటర్వ్యూ మాట దేవుడెరుగు మొదట అసలు రాత పరీక్షే పాసవ్వలేదు.

“…ఎన్నేళ్ళు కష్టపడ్డారు ఒక్కొక్కరూ ఇంజినీరింగులో సీటు రావడానికి? ఇదేనా మీ ప్రతాపం? మీకు కంప్యూటర్ ఉద్యోగమే కావలిస్తే ఇంత కష్టపడడం దేనికీ?  బి.ఎస్సీ చదివి ప్రొగ్రామింగ్ నేర్చుకుంటే చాలదూ? ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివేమని చెప్పుకుంటున్నారు కదా? మీ ప్రొఫెసర్ గారు చెప్పారే? ఇంకో వంద లేప్ టాప్ లు కనెక్ట్ చేసినా ఏమీ అవదూ, పైన పెద్ద లావుపాటి వైరు ఉంది కరెంటుకి అన్నారే? ఏమి చదువులండీ మీవి? వైర్లు అంటుకుని మంటలొస్తుంటే నీళ్ళు పోయమనీ, చైను లాగమనీ అరుస్తున్నారే? ఏదీ ఆ ప్రొఫెసర్ గార్ని ఇలా రమ్మనండి ముందుకి…”

కాలిపోయిన లేప్ టాప్ ఛార్జరులా మాడిపోయిన మొహంతో ప్రొఫెసర్ ముందుకొచ్చాడు. తలెత్తి చూడ్డానికి ధైర్యం చాలలేదు. కుర్రాళ్ళ సంగతి సరేసరి.

“…. ఏమిటి సార్, పైనున్న కరెంటుని ఇష్టం వచ్చినంత లాగేసుకోవచ్చా? మరి పైనున్న ఏ. సి. హై వోల్టేజ్ కింద మీకు డి.సి. లో కావాలంటే మధ్యలో కన్వర్టరు కి కెపాసిటీ అనేది ఉంటుందా? లేకపోతే నూటొక్క లేప్ టాప్ లన్నింటికీ కరెంటు సప్లై చేయగలదా? పవర్ సప్లై కి లోడ్ కి ఉన్న సంబంధం తెలుసా మీకు? బోగీ కి ఉన్న కన్వర్టర్ నలభై ఏంపియర్లు సప్లై చేయగలదేమో. ఒక్కో లేప్ టాప్ మూడు ఏంపియర్లు లాగితే – అదీ మధ్యలో ఉన్న చవకబారు ఛార్జర్ తో – ఏమౌతుంది? ఇలాగేనా మీరు చదువుకున్నదీ, చదువులు చెప్పేదీ? పేరుకి పెద్ద కాలేజీల్లో చదువుకున్నట్టు కబుర్లా. ఇదా మీ ప్రతాపం? మనం ఇలా ఉండబట్టే మన దేశం ఇలా ఉంది. ఆలోచించారా?”

ఎవ్వరి దగ్గర్నుంచీ సమాధానం రాకపోవడంతో రామారావే మళ్ళీచెప్పేడు, ఈ సారి కాస్త కరుగ్గా – “వెళ్ళండి. ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి. ఇండస్ట్రియల్ టూర్లు అంటే తల్లితండ్రులు కొనిచ్చిన సెల్ పోన్లూ, లేప్ టాపులూ టకటక లాడించుకుంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించడం కాదు.  మీరు ప్లాట్ ఫారం మీద మాట్లాడేవన్నీ విని మా ఆఫీసులో పనిచేసే లైన్ మేన్ అప్పన్న చెప్పాడు మీ గురించి. మీరెలాగా ఇలాంటి పని చేస్తారని ఊహించి వెంఠనే బయల్దేరాను. అసలు మీకేం తెలుసో చూద్దామని పల్లెటూరి బైతులాగా ఓ నాటకం ఆడాను. విశాఖపట్నం నుంచి దువ్వాడ కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం. బుద్ధి అనేది ఉన్న ఎవరైనా ట్రైన్ ఎక్కిన మూడు నిముషాల్లో లేప్ టాప్ తీస్తారా? ఏమిటా అర్జెంటు అవసరం? ఏదో అవతల వాళ్లకి చూపించాలనే తాపత్రయం తప్ప? ఏమిటి మీకొచ్చే శునకానందం ఆ చూపించడంలో? రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు రాగానే గొప్పవాళ్ళైపోతారా? మీ బుర్రల కన్నా మా లైన్ మేన్ అప్పన్న నయం. మిమ్మల్ని విశాఖపట్నం స్టేషన్ లోనే గమనించి నాకు చెప్పాడు.

మీరు ఎక్కబోయే వేరే బోగీలో ఛార్జ్ చేసుకునే సాకెట్లు అన్నింటినీ ఆఫ్ చేయమని చెప్పాను. అవి పని చేయవు. కేవలం లైట్లు, ఫేన్లు పనిచేస్తాయి.  ఒళ్ళు దగ్గిర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి రండి. హైదరాబాదు వెళ్ళేలోపుల మళ్ళీ నేను కనుక్కుంటాను మీ కోచ్ గురించి. ఏమైనా తేడాలొస్తే ఇప్పుడు రాత్రి అవుతోంది కనక పోతే మీ ప్రాణాలే పోతాయి. రోజువారీ ఎలాగా ఫోనుల్లో టెక్స్ట్ మెసేజీలు పంపించుకుంటూ మొహం మొహం చూసుకోవడం మర్చిపోతున్నారు కనక కనీసం ఈ ట్రైన్లో అయినా అవన్నీ పక్కన పడేసి టూర్ లో ఏదో ఒకటి నేర్చుకోండి.”

ఆంధ్రా విశ్వవిద్యాలయం కోచ్ లోకి ఎక్కుతూంటే రామారావు చెప్పినది విని చుట్టుపక్కలనున్న రైల్వే స్టాఫ్ అందరూ చప్పట్లు కొట్టారు. ఆఖరిగా బండి ఎక్కబోయిన ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రామారావు దగ్గిరకొచ్చి “సారీ సర్, మీకేమీ తెలియదనుకుని అలా అన్నాను…” అంటూ నీళ్ళు నవిలేడు.

రామారావు స్టేషన్ మాస్టరు తీసుకొచ్చిన రిపోర్టు చూసి తలాడించి సరేనన్నాక బండి బయల్దేరడానికి పచ్చజండా ఊపేరు. ఇంక మాట్లాడ్డానికేవీ లేదన్నట్టూ రామారావు ప్రొఫెసర్ తో కరుగ్గా చెప్పేడు, “వెళ్ళండి, అప్పుడే సిగ్నల్ ఇచ్చారు.” ప్రొఫెసర్ బండిలో ఎక్కేక వెనకనే అప్పన్నా మిగతా ఒక్కొక్కరూ చేతులుకట్టుకుని నడుస్తూంటే రామారావు రాజమండ్రీ స్టేషన్ ఆఫీసుల వేపు కాలు సాగించేడు. గోదావరి ఎక్స్ ప్రెస్ మొత్తానికి మూడు గంటలు ఆలశ్యంగా తనకి పెట్టిన పేరు సార్ధకం చేసుకోవడానికి ఆ నదిమీద కట్టిన బ్రిడ్జీ వైపు కదిలింది.

గోదావరి ప్రతీరోజూ లేటౌతున్నందుకు ఎప్పుడూ ప్రభుత్వం మీద అరిచే జనం ఈ సారి మూడు గంటలు లేటైనా మర్నాడు పేపర్లో రాబోయే వార్త చూసి ప్రాణాలు కాపాడినందుకు సీనియర్ డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజినీరు రామారావుకీ, భారతీయ రైల్వేకీ, ప్రభుత్వానికీ ధన్యవాదాలర్పించడానికి సమాయత్తమౌతోంది. ప్రాణాల్తో పోలిస్తే బండి లేటైన మూడు గంటలో లెక్కా?

*

సాహిత్యం- సాహిత్తెం

 

 

కలలు చమత్కారంగా ఉంటవి. దెయ్యాలూ భూతాలు కలలోకి వచ్చినా మర్నాడు లేచాక మనకి కనిపించవు కదా? మంచి కలలొస్తే మంచి జరుగుతుందనీ, పాడు కల వస్తే చెడు జరుగుతుందనీ ఎక్కడైనా ఉందా? కల వచ్చిన మర్నాడు పొద్దున్నే కొంత సుఖమో కష్టమో అనిపించవచ్చు గానీ తర్వాత రోజూ పనుల్లో పడి ఇవన్నీ మర్చిపోతూంటాము కదా? కానీ నా కొచ్చిన కల వింతగా ఉంది.

 

లేకపోతే ఇది చూడండి. రాత్రి పడుకున్నానన్న మాటే గానీ ఎప్పటికో గాని నిద్రలేదు. అప్పుడొచ్చిన కలలో నేనూ, బిల్ గేట్సూ, వంగూరి చిట్టెన్ రాజు గారూ కలిసి నడుస్తున్నాం. ఇప్పుడు మనమో విమానం ఎక్కాలి అన్నారు బిల్ గేట్స్. “ఎక్కడికండి మనం వెళ్ళేది? ఇండియాకేనా?” అని ఎంతో ఉత్సాహంగా అడిగేను. సమాధానం లేదు. నాకేమో ఒళ్ళు జలదరిస్తోంది వీళ్ళతో వెళ్ళడానికి. వాళ్ళేమో సమాధానం చెప్పరు. విమానం వచ్చింది. ఎక్కాక పైలట్ కూర్చుని ఏవో మీటలన్నీ నొక్కుతున్నాడు. “బోయ్” మని చప్పుడు. విమానం తూర్పు కేసి ఎగురుతోంది అని నేనంటే వీళ్ళు “ఇండియాకి కాదు వెళ్ళేది ఆఫ్రికాకి” అనడం.

 

గేట్స్ గారితో వెళ్ళడం అంటే ఏ ఫస్టు క్లాసులోనో వెళ్ళచ్చేమో, వైన్ అదీ తాగి, పీక దాకా తినేసి, సీటు నూట ఎనభై డిగ్రీలు వచ్చేదాకా కాళ్ళు తన్ని పడుకోవచ్చు అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఎకానమీలో ఎక్కించారని ఎక్కేదాకా తెలీలేదు. తీరా ఎక్కిన తర్వాత దాహంతో నోరు పిడచగట్టుకుపోతూంటే, ఓ కోక్ ఇమ్మన్నా, కాసిని మంచినీళ్ళిమ్మన్నా గంటు మొహం పెట్టుకుని ఏదో ముష్టి పారేసినట్టు తెచ్చి మొహం మీద విసరడం.

 

ఇంక ఎలాగా తప్పదు కదా? వాళ్ళు పెట్టిన గడ్డీ గాదం (అవే లెండి, ఆంగ్లంలో సలాడ్లు అంటారు కదా) తిని ఓ కునుకు తీసి లేచేసరికి సీటు బెల్ట్ పెట్టుకోమని ఆర్డర్. అప్పటికే రాజు గారూ, గేట్స్ గారూ రడీగా ఉన్నారు. నేనే లేటుగా లేచింది. కిందకి దిగి “ఇది హైద్రాబాదులా లేదే, ఇదే ఊరండి రాజు గారు?” అనడిగాను. సమాధానం లేదు.

 

కాస్త ముందుకెళ్ళాం. ఇక్కడకెందుకొచ్చామో నాకర్ధం కాలేదు. చుట్టూ చూసాను. మమ్మల్ని దింపిన విమానం వెళ్ళిపోతోంది మళ్ళీ. కార్లూ అవీ ఉన్నట్టులేదు. ఇండియా అయితే ఎడ్లబండో, ఏనుగో కనపడాలి కదా విమానం దిగిన పదినిముషాల్లో? రాజుగారి కేసి ప్రశ్నార్ధకంగా చూస్తే ఆయనే చెప్పేరు ఈ సారి – “ఇది ఆఫ్రికా, మనం ఇక్కడ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి.”

 

“మరి బిల్ గేట్స్ గారేరీ?” అన్నాను ఆయన మాతో లేకపోవడం గమనించి.

 

“ఆయనకి వేరే పనులున్నాయి, పోలియో, మలేరియా మందులు ఇప్పించడానికీ, దానికీను. ఆయనరారు మనకి తప్పదు.” చెప్పేరు రాజు గారు.

 

“మనకి ఎందుకు తప్పదు?”

 

“నేను కధలు రాస్తాను. నువ్వు నాకన్నా బాగా రాస్తావు; అందుకని” వెర్రి వెధవని కాకపోతే రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

ఎదురుగా “విలియం ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లైబ్రరీ” అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద భవనం కనిపించింది. “మనమే ఎం.బి.ఏ చేసుంటే నేను ఏ వాల్ స్ట్రీట్ లోనో లక్ష డాలర్లు సంపాదించేవాడిని, నువ్వు ఏ కోటి డాలర్లో తెచ్చేవాడివి గేట్స్ గారిలానే.” నేను ఆ బిల్డింగ్ బోర్డు చూసి నోరు వెళ్ళబెట్టగానే చెప్పేరు రాజుగారు.

 

ఏమైనా నేను కోటి డాలర్లు తెస్తున్నట్టే అనిపించింది. మీరు ఎందుకు ఎం. బి. ఏ చేయలేదని రాజుగార్ని అడుగుదామనుకున్నాను కానీ ఊరుకున్నాను.  జేబులన్నీ వెతికి తుపాకులూ అవీ ఉన్నాయా అనే చూసి, ఏమీలేవని నిర్ధారించుకున్నాక లైబ్రరీ లోపలకి వదిలేరు.

 

పుస్తకాలు కుప్పలకొద్దీ బీరువాల్లో దాచి ఉంచారు. చూస్తూ పోయేసరికి ఓ చోట తెలుగు సాహిత్యం అని ఉంది. కనుబొమ్మలు పైకెత్తి రాజు గారు కేసి చూసాను ఆశ్చర్యంతో.

 

“ఇప్పుడర్థం అయిందా?” అన్నట్టూ నవ్వుతున్నారు ఆయన. ఆయన పబ్లిష్ చేసిన పుస్తకాలూ, అందులో నేను అప్పుడప్పుడూ రాసిన కధలూ అన్నీ ఉన్నట్టున్నాయి.

 

“ఇక్కడకి తెలుగు సాహిత్యం ఎలా వచ్చిందో?” అని నేననుకునేలోపల రాజుగారే చెప్పారు, “తెలుగు వాడు లేని నేల ఎక్కడుందోయ్ ఈ భూమ్మీద?”

 

“ఇక్కడ ఆఫ్రికాలో ఎవరు చదువుతారండీ ఇవి?” అడిగేను ఆయన్ని.

 

“ఎవరో చదువుతారని కాదు, ప్రపంచం నాలుగు మూలలా మువ్వన్నెల తెలుగు సాహిత్య పతాకం ఎగరవల్సిందే,”

 

మళ్ళీ నడవడం మొదలు పెట్టాం. “ఇక్కడ్నుంచి, రచయితల సెక్షన్” అని రాసి ఉంది.

 

మొదటి చోట కొంతమంది తెలుగు వాళ్ళు కాయితాలు ముందేసుకుని ఏవో రాస్తున్నారు. మేము రావడం చూసారు కానీ ఏమీ పట్టించుకున్నట్టు లేదు. కాయితానికి రెండంటే రెండే లైన్లు రాసి పారేస్తున్నారు పక్కన. కాయితాలు ఖరాబు చేస్తున్నట్టు అనిపించి ఏదో అనబోయేను కానీ రాజు గారు నా నోటి మీద చెయ్యేసి నొక్కేసి అక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్ళి చెప్పేరు, “వీళ్ళు రాసేవి నానీలు. నోరెత్తావా, పెన్నుతో పొడిచి చంపేస్తారు.”

 

ఒళ్ళు జలదరించింది.  కాస్త ముందుకెళ్తే కొంత మంది కాయితాల మీదే రాసుకుంటూ కనిపించేరు. దగ్గిరకెళ్ళి చూద్దుం కదా, వాళ్ళు రాసేవి సమస్యా పూరణాలు. ఓక్కో చోట ప్రాసకోసం “గూగిలించుచో” అనో, “యాహూలించుచో” అనో “బింగులించుచో” అని రాసేస్తున్నారు. “ఇదేమిటండీ రాజుగారు ఇవి అంతర్జాలంలో ఉండేవి కదా, అవి తెలుగు పదాలు ఎలా అవుతై?” అనడిగేను. రాజుగారు సమాధానం చెప్పేలోపుల అక్కడే ఉన్న ఒకాయన చెప్పేడు, “కొత్త కొత్త పదాలు మనం సృష్టించపోతే బాష ఎలా ఇంప్రూవ్ అవుద్దోయ్ చెవలాయ్?” మొహం గంటు పెట్టుకుని రాజు గారి కేసి  చూస్తే ఆయన “ఊరుకో, ఊరుకో తెలుగు పద్యాల్లో కాసినేనా తెలుగు పదాలున్నాయని సంతోషపడు” అని చెప్పి ముందుకి లాక్కేళ్ళేరు.

 

ఇంకాముందుకి వెళ్లేసరికి అక్కడంతా కలగా పులగంగా ఉంది వాదోపవాదనలతో. నేను అడిగేలోపులే రాజుగారు చెప్పేరు, “వీళ్ళందరూ ఎడిటర్లు, మనం రాసేది ఎలా తీసిపారేద్దామా అని చూస్తూ ఉంటారు. ఓ రకంగా డాక్టర్ల లాంటి వాళ్ళు, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగమ్ము ఖంఢించి.. లాంటి వాళ్ళనుకో”.

 

“అదేమిటండోయ్, డాక్టర్లకీ ఎడిటర్లకీ పోలిక?” వెర్రిమొహం వేసి అడిగాను.

 

“అదంతే. ఎవడికి ఎప్పుడు రోగం వస్తుందా, ఎప్పుడు పేషంట్ మన దగ్గిరకి వస్తాడా అని డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలాగే ఎవడు ఏమి రాసి రచయిత అవుదామా అని చూస్తూ ఎడిటర్లకి పంపిస్తే వాళ్ళు ఏ కారణం చూపించి రాసినది అవతల పారేద్దామా అని వీళ్ళు చూస్తూ ఉంటారు.” విడమర్చి చెప్పేరు రాజు గారు.

 

“ఛా, అలా అంటారేంటండీ? నాకు అలా అవలేదే? నేనేం రాసినా వేసుకుంటున్నారు ఎడిటర్లు.”

 

“చెప్పేనుగా నువ్వు నాకన్న మంచి కధలు రాస్తావని?” గుంభనంగా నవ్వుతున్నారు రాజు గారు. మట్టిబుర్ర కాకపోతే ఈ పాటికైనా రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

మళ్ళీ ముందుకి నడిచాం.  అందరూ కంప్యూటర్లమీద చక చకా ఏదో టైప్ చేస్తున్నారు. కాయితం లేదు, కలం లేదు. ఏదో రాయడం, పబ్లిష్ చేయడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా చూద్దును కదా, రాజుగారు నన్ను వెనక్కి లాగి చెప్పేరు, “వీళ్ళు బ్లాగు రైటర్లు. అలా చూడకూడదు, అవి పబ్లిష్ అయ్యేదాకా”.

 

“ఇక్కడ చూడకపోతే పబ్లిష్ అయ్యేక ఎలా చూస్తామండి?”

 

“అవి పబ్లిష్ అయ్యేక, మాలిక అనీ కూడలి అనీ బ్లాగుల సమాహారాల్లో వస్తాయి. అక్కడ్నుంచి చూసి కామెంట వచ్చు.”

 

“కామెంటడం అంటే?” కామెర్లు అంటే తెలుసు, కామేశ్వరీ తెలుసు. కామెంటడం అంటే తెలియక అడిగేను సిగ్గు పడుతూ.

 

“వాళ్ళు రాసి పారేసాక మన అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టడాన్ని కామెంటడం అన్నారు. అలాగే ధన్యవాదాలు చెప్పడాన్ని నెనర్లు అనీ, ఈకలనీ ఏవోవో పేర్లు. పక్కనున్న సెక్షన్లో ఇందాకే చెప్పేడు కదా ఒక మహామహుడు, కొత్త పదాలు సృష్టించకపోతే తెలుగు ఎలా నిలబడుద్దో చెవలాయ్ అనీ? అయినా ఇన్ని ప్రశ్నలు అడక్కూడదు.”

 

“రాసేసినవి ఎడిటర్లకి పంపొచ్చు కదా? బ్లాగులో రాసుకోడం ఎందుకో?” నా మనసులో సందేహం అనుకోకుండా నోట్లోంచి బయటకొచ్చేసింది.

 

“చెప్పాను కదా, పాతిక కధలు పంపిస్తే ఎడిటర్లు ఒకటో రెండో వేసుకుంటారు. మిగతావి చెత్తబుట్టలోకే. వాళ్ళు పబ్లిష్ చేయకపోతే నిరుత్సాహ పడిపోకుండా, ఈ బ్లాగుల్లో మనకి మనవే పబ్లిష్ చేసుకోవచ్చు. ఎడిటర్లు నీ రచన బావోలేదు అంటే, నీ సలహా ఎవడిక్కావాలోయ్ ఇదిగో నేనే పబ్లిష్ చేసుకోగలను అని వీళ్ళు ఇలా రాస్తారు.”

 

“అలా ఏది పడితే అది రాసేయొచ్చా బ్లాగులో?”

 

“ఆ, మన ఇష్టం. ఆ తర్వాత ఏదైనా తేడాలొస్తే దాంతో తంటాలు పడాల్సింది కూడా మనమే.”

 

కంప్యూటర్ల దగ్గిర కూచున్నవాళ్ళు మమ్మల్నీ, రాజు గారి చేతిలో ప్రింట్ పుస్తకాలనీ చూసి నవ్వడం. ఈ రోజుల్లో పుస్తకాలెవడు చదువుతాడోయ్ చెవలాయ్ అనడమూను. రాజు గారు పబ్లిషర్ అని చెప్తే ఇంకా నవ్వులు.

 

తెలుగు సాహిత్యం ఎంత పైపైకి పోతోందో, నేనెంత వెనకబడి ఉన్నానో ఇదంతా చూసేసరికి అర్ధమైంది. కళ్ళు తిరిగేయి గిర్రున.  రాజుగారు నా చేయి పట్టుకుని బయటకి నడిపించుకొచ్చేరు. దారిలో తత్త్వ బోధ చేస్తున్నట్టూ చెప్పేరు రాజుగారే, “చూసావా తెలుగు సాహిత్తెపు మువ్వెన్నల  జండా ఎంత గొప్పగా పైపైకి పోతోందో?”

 

“సాహిత్యం అనకుండా సాహిత్తెం అన్నారేమిటబ్బా?”

 

“మన కవులు రాసినదీ సాహిత్యం. ఇప్పుడొచ్చేది సాహిత్తెం. అంతే తేడా”

 

ఇంతట్లో మేడూరు వచ్చి ఉయ్యూరు మీద పడిందన్నట్టూ ఎవరికో నేను కధలు రాస్తానని తెల్సింది. నాకేసి వేలెత్తి చూపించి చెప్పేడు, “జాగ్రత్త, నువ్వు మా గురించి రాసావా, మరి చూస్కో!” అన్నాడు.

 

“ఏం చేస్తారేం?” అని ఇంకేదో అడగబోతుండగా రాజుగారు వారించి నన్ను బయటకి తీసుకొచ్చేరు. లోపలకి వెళ్ళిన దారి వేరూ, బయటకొచ్చిన దారి వేరూను. బయటకి రాగానే తలుపు దగ్గిరే జీరాఫీ, చిరుతపులీ కనిపించేయి.

 

ఇది ఇండియా అయితే జిరాఫీ ఉండదే, చిరుతపులి ఇండియాలో ఉంటే దాన్ని చంపేసి చర్మం అమ్ముకోరూ ఈపాటికి అనుకుంటూంటే వెనకనుంచి చింపాంజీ అరుపు వినిపించింది. భయపడి పక్కనే ఉన్న రాజు గారి చెయ్యి పట్టుకున్నాను.

 

“చూసావా, నేచెప్పలే? ఇది ఆఫ్రికా” అని మృదువుగా చేయి విడిపించుకుని భుజం తట్టేరు రాజు గారు. బుర్ర పక్కకి తిప్పిచూస్తే ఏదో జలపాతం. చల్లని నీళ్ళు మొహం మీద పడ్డాయి. చటుక్కున మెలుకువొచ్చింది.

 

పగటి కలలకి పాటి లేదు. అరచేతి మీద “శ్రీరామ” అని రాసి కళ్ళకద్దుకున్నాను. అంతే!

 

[ఉపసంహారపు చివరితోక:  తెలుగు వారి గోల్డ్ నిబ్బు, విశ్వనాథ గారి ‘జూ’ కధ గుర్తొచ్చిందా? అది చదివాక రాసినదే ఈ కధ. ఆయన కాలిగోరుక్కూడా పనికిరాని వాణ్ణి కనక ఇవే చిట్టెన్ రాజుగారికీ , విశ్వనాథగారికిచ్చే క్షమాపణలు]

 

– ఆర్. శర్మ దంతుర్తి