మా చిన్న చెల్లెలు

 

Kadha-Saranga-2-300x268

ఉదయాన్నే హాస్పిటల్ కు పోవడానికి తయారవుతున్నగాయత్రికి ఫోనొచ్చింది.

“చిన్నమ్మమ్మా,  ఏంటీ పొద్దుటే ఫోన్‌ చేశావు? బాగున్నావా?”

“నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లాడాలి. వచ్చేటప్పుడు దోవలో కూరగాయలేవైనా కొనుక్కురా,” అంది ఆమె.

“సరే, ఏం తీసుకురమ్మంటావు?”

“ఏవైనా సరే, నీకు ఇష్టమైనవి తెచ్చుకో, మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం? రాత్రికి ఉండి పొద్దుటే పోదువుగాన్లే. రేపెటూ సెలవేగదా,” అంది చిన్నమ్మమ్మ జయలక్ష్మి.

*

సాయంత్రం బజార్లో దొండకాయలూ, తోటకూరా, నాలుగు అరటికాయలూ కొనుక్కుని గాంధీ నగర్ లో ఉన్న జయలక్ష్మి ఇంటికి చేరింది గాయత్రి. వస్తూనే, “చిన్నమ్మమ్మా, నువ్వెందుకూ ఒక్కదానివే ఇంతదూరాన ఉండటం, వచ్చి మాతో ఉండరాదూ?” అంది, కూరగాయలు టేబుల్ మీద పెడుతూ. జయలక్ష్మి నవ్వి వూరుకుంది. ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళమ్మమ్మ రాజ్యలక్ష్మి చనిపోయినప్పటనుంచీ ఈ పిల్లలు తనని వాళ్ళతో వచ్చి ఉండమని అడుగుతూనే ఉన్నారు. కానీ తనకు బాగా అలవాటైన తన ఇల్లు వదిలేసి వెళ్ళాలనిపించడం లేదు.

ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ సీసా తీసుకుని వచ్చి జయలక్ష్మి పక్కనే కూర్చుంది గాయత్రి.  “ఏంటి చిన్నమ్మమ్మా, ఏదో మాట్లాడాలన్నావు?”

ముందు  దొండకాయకూర చేద్దామా, అరటికాయకూర  చేద్దామా  అని  ఆలోచిస్తూ,  ఆమెవైపు చూడకుండానే మృదువుగానే అడిగింది జయలక్ష్మి. “నువ్వు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లోపెట్టుకున్నావని విన్నాను. నిజమేనా?”

“అవును, నిజమే,” అంది గాయత్రి. ఆ అమ్మాయి గురించి చెప్పడం ఎక్కడ మొదలుపెట్టాలా  అని ఆలోచిస్తూ.

“ఎవరా అమ్మాయి?”

“మా చెల్లెలే. నాన్న రెండో భార్య కూతురు,” అంది గాయత్రి, క్లుప్తంగా.

“అలాగానా? అతనికి మీరుగాక ఇంకా  బిడ్డలున్నారని నాకు తెలియదే.”

“మాకూ తెలియదు.  పోయిన ఏడో తేదీన నీకు ఫోన్‌ చేశాం గుర్తుందా? ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్‌ చేసి మీ నాన్న చనిపోయాడు, అంత్యక్రియలకు రమ్మని చెప్పారని. ఆ ఫోన్‌ చేసింది ఈ అమ్మాయే. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది,  అమ్మను వదిలేసి నాన్న ఒకావిడతో వెళ్ళిపోయాడే, ఆమె ఒక బిడ్డను కని మూడు సంవత్సరాల తర్వాత చనిపోయిందట. తర్వాత నాన్న మళ్ళా పెళ్ళిచేసుకున్నాడట. ఆ  మూడో  భార్య  గురించి  నాకు  పెద్దగా  తెలియదు  గాని,  ఆమెకు  ఏవో  సమస్యలున్నట్లున్నాయి. చివరి రోజుల్లో నాన్నకు సపర్యలు చేసింది రెండో భార్య కూతురే. చనిపోయాడని మాకు ఫోన్‌ చేసింది కూడా ఆ అమ్మాయే.”

జయలక్ష్మి ముభావంగా మౌనంగా ఉండిపోయింది కొంతసేపు. అరటి కాయలను సింక్ దగ్గరకు తీసుకుపోయి కడుక్కొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా తరుగుతూ, “నువ్వు తీసుకొచ్చింది ఆ అమ్మాయినా?” అని అడిగింది.

“అవును చిన్నమ్మమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవ్వరూలేరు. ఆ అమ్మాయి మమ్మల్ని ఏమీ అడగలేదు. అంత్యక్రియలు తనే చేసింది. మేం వస్తామని అనుకోలేదనుకుంటాను. తిరుగు ప్రయాణం రోజు,  వచ్చినందుకు మాకు కృతజ్నతలు చెప్పి వెళ్ళబోతుంటే, నేనే అడిగాను తన గురించి. ఆ అమ్మాయికి పదిహేను సంవత్సరాలు. హైస్కూల్లో చదువుతుంది. తనకెవ్వరూ లేరు. ఆ అమ్మాయి మా చెల్లెలేకదా? పెద్ద కూతురుగా చివరి రోజుల్లో నాన్నకు నేను చెయ్యాల్సిన పనులు ఆ అమ్మాయి చేసింది. మా ముగ్గురికీ ఏవో ఉద్యోగాలున్నాయి. తిండికి లోటులేదు. పెద్ద ఇల్లుంది. నేనే మాతో వచ్చి ఉండమన్నాను. పల్లవి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు పల్లవి. మా అడ్రెస్ ఇచ్చి నీకు ఇష్టమైనప్పుడు మా దగ్గరకు రావచ్చు అని చెప్పాను. పోయిన వారం వచ్చింది.”
జయలక్ష్మి  కొంచెంసేపు ఈ విషయాలన్నీ జీర్ణించుకుంటున్నట్లు ఉండిపోయి, “అయితే ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అనుకుంటున్నావా?” అని అడిగింది.

“అవును. తల్లిలేకుండా పెరిగింది. హాయిగా ఉండాల్సిన  చిన్న వయసులో నాన్నకు సేవలు చేస్తూ గడిపింది. ఇప్పుడు వచ్చి వారం రోజులయింది కదా. ఇంటి పన్లన్నీ తనే చేస్తానంటుంది. ఏదన్నా అడిగితేగాని మాట్లాడదు. ఆ అమ్మాయిని  చూస్తుంటే పాపం ఎన్ని కష్టాలు పడ్డదో అనిపిస్తుంది.”

“సరే, అమ్మాయి మంచిదే. కానీ ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అని నువ్వెందుకనుకుంటున్నావు? ఇద్దరు చెల్లెళ్ళను పెంచావు చాలదా?”

“అలా అంటావేం చిన్నమ్మమ్మా? మేము కాకపోతే ఆ అమ్మాయికి ఇంకెవరున్నారు?”

“ఉన్నారా లేరా అని కాదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? నీకు లేకుండా  పోయిన బాల్యం ఆ అమ్మాయికికూడా లేకుండా పోయిందని నువ్వు విచారిస్తున్నావు. మీ అమ్మా నాన్నలు పనికిమాలిన వాళ్ళు కావటంతో చిన్నప్పుడే బాధ్యతలు నీ మీద పడ్డాయి. ఆ అమ్మాయిక్కూడా నీలాగే చిన్నతనంలోనే బరువైన బాధ్యతలు మొయ్యాల్సొచ్చింది. ఆ అమ్మాయిలో నువ్వు నిన్ను చూసుకుంటున్నావు. కానీ పదిహేను సంవత్సరాల అమ్మాయిని పెంచడం ఎంత బాధ్యతతో కూడిన వ్యవహారమో తెలుసు కదా? నువ్వు ఇంకా పెళ్ళిచేసుకోలేదు. పెళ్ళికావాల్సిన చెల్లెళ్ళు ఇంకా ఇద్దరున్నారు. ఇప్పుడు ఇంకొక చెల్లెలా?” అందామె.

ఈ బాధ్యతల భారం గాయత్రికి తెలియని విషయం కాదు.  కాని, ఎవ్వరూ లేని చెల్లెలిని అలా ఎలా వదిలేస్తుంది? పైగా ఆ అమ్మాయి ఎంత బాధ్యతగా చివరి రోజుల్లో నాన్నను చూసుకుంది!

గాయత్రి లేచి తోటకూర ఆకుని సింకులో శుభ్రంగా కడుగుతూ అక్కడే కొంచెంసేపు నిలబడింది.

జయలక్ష్మి కూడా అరటికాయ ముక్కల గిన్నెను తీసుకుని స్టౌ దగ్గరకు వచ్చి గాయత్రి భుజం మీద చెయ్యి వేసి, “వయసుతోపాటు రావాల్సిన తెలివి మీ అమ్మకు రాలేదు. నీకేమే వయసుకు మించిన తెలివీ మంచితనం ఇచ్చాడు భగవంతుడు,” అంది.

*

పల్లవి చీరాల వచ్చి దాదాపు మూడు నెల్లయింది. సులభంగానే అక్కలతో కలిసిపోయింది. హైస్కూలునుంచి రాగానే బట్టలుతకటమో, వంటచెయ్యడమో, ఇల్లు శుభ్రం చెయ్యడమో, బయట దొడ్లో పూలమొక్కలకూ కూరగాయల పాదులకూ నీళ్ళుపొయ్యడమో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. పెద్దక్క గాయత్రి అంటే గౌరవం, కొంచెం భయం కూడా. గాయత్రి అక్క కంటే, అమ్మలాంటిది అనే అభిప్రాయం ఏర్పడింది పల్లవికి. రెండో అక్క శివాని ఒక బాంక్ లో పనిచేస్తుంది. అక్కడ తనతో పనిచేసే ఒకతనంటే ఇష్టం లాగుంది. వీలు దొరికినప్పుడల్లా అతని మంచితనం గురించి చెప్తూ ఉంటుంది. చిన్నక్క వాసంతి పల్లవి కంటే మూడు సంవత్సరాలు పెద్దది.  వాగుడుకాయ. టౌన్లో ఒక చెప్పులషాపులో పనిచేస్తుంది. తన బాయ్ ఫ్రండ్ కూడా తనలాగే వాగుడుకాయ. సాయంత్రం ఎప్పుడన్నా ఇంటికి వస్తాడు. అందరికీ కబుర్లు చెప్తాడు. ప్రస్తుతం ఉద్యోగం ఏదీ ఉన్నట్లు లేదు.

వాసంతితో మాట్లాడటం సులభంగా ఉండేది పల్లవికి. ఇద్దరి మధ్యా వయసులో పెద్ద తేడా లేదు. గాయత్రితో మాట్లాడటం అంటే కొంచెం భయంగా ఉండేది. కానీ తొందరలోనే ఇద్దరి మధ్య మంచి అనుబంధం  ఏర్పడింది.  తండ్రి ఇల్లు వదలిపోయేటప్పటికి గాయత్రికి ఇప్పుడు పల్లవికున్న వయసు.  ఆరోజుల్లో ఆయనకు సాయంత్రం సముద్రపు ఒద్దున నడవడం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. తనకు కూడా సముద్రం అంటే ఇష్టం అవడంవల్ల ఎప్పుడూ నాన్నతో వెళ్ళేది గాయత్రి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు  కూడా ఆయనకు నడవడం అంటే ఇష్టంగా ఉండేదని చెప్పింది పల్లవి. నాన్న బయటకు వెళ్ళినప్పుడు పల్లవి వెంటవెళ్ళేది. తండ్రితో గడిపిన సమయం గురించి మాట్లాడుకుంటూ, ఆ జ్నాపకాలు  పంచుకుంటూ పల్లవీ గాయత్రీ కొంత దగ్గరయ్యారు.

*

ఒక సాయంత్రం తన ఫ్రండ్ తో సినిమాకి వెళ్ళడానికి తొందర తొందరగా రెడీ అయి ఇంట్లోంచి బయటకు పరుగెట్టిన శివాని రబ్బర్ బంతిలాగా తిరిగి ఇంట్లోకొచ్చి పెద్దగా అరిచింది, “అమ్మా, చిన్నమ్మమ్మా వస్తున్నారే గాయత్రీ!”

అక్కా  చెల్లెళ్ళు ముగ్గురూ పరుగెత్తుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చారు. పల్లవి తలుపు వెనక నిలబడింది. వీళ్ళను ఇదివరకు ఆ అమ్మాయి చూడలేదు.

అమ్మ మూడు సంవత్సరాలప్పుడు వదిలేసివెళ్ళిన వాసంతికి ఆమె రూపురేఖలు ఎలావుంటాయో తెలియదు. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంతో అందంగా, హుందాగా కనిపించింది. దాని బుగ్గలు నిమిరి, “నువ్వు వాసంతివి కదూ, ముద్దుగా ఉన్నావు,” అంది శారద. శివానిని దగ్గరకు తీసుకుని తలమీద ముద్దుపెట్టింది. గాయత్రి ముందుకు రాలేదు. చెల్లెళ్ళ వెనుక నిలబడి ఉంది. ఆమెకు ఎదురుగా నిలబడి, “బాగున్నావా?” అంది శారద. గంభీరంగా అలాగే మాట్లాడకుండా నిలబడింది గాయత్రి. ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి ఇంట్లోకి నడిచింది శారద.

హాల్లోకి  వచ్చి  ఒక్కసారి  చుట్టూ చూసింది శారద. పదిహేను సంవత్సరాల నాడు వదిలేసి వెళ్ళిన ఇల్లు. పెద్దగా మారలేదు.

ఐదుగురూ  హాల్లో  కూర్చున్నారు.  అక్కచెల్లెళ్ళకు ఎన్ని  ప్రశ్నలో.  మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి పోయావు? ఇప్పుడెక్కడుంటున్నావు? ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా? ఇప్పుడెందుకొచ్చావు? కానీ, అడిగే ధైర్యం లేదు, చనువూ లేదు. వాళ్ళకి ఇప్పుడామె పరాయి మనిషి.

తన పూర్వ చరిత్ర గురించి మాట్లాడే ధైర్యం ఆమెకూ లేదు. ఇప్పుడు సంజాయిషీలు  చెప్పి  ప్రయోజనం కూడాలేదు.  వాళ్ళకు  తన  అవసరం లేదిప్పుడు.  తను  లేకపోయినా,  ఆమె  బతికున్నన్నాళ్ళూ  అమ్మ  మనుమరాళ్ళను  బాగానే  పెంచింది. అదృష్ట వశాత్తూ పిల్లలు బాగానే పెరిగి  పెద్దవాళ్లయ్యారు.

ఏవో పైపై మాటలూ, ఉద్యోగాలూ, తోటలో మొక్కలూ ఇలాంటి విషయాల మీద సాగింది వాళ్ళ సంభాషణ.

సడెన్‌గా ఏవొక్కరివైపూ కాకుండా ఎదురుగా కూర్చున్న కూతుళ్ళ వైపు చూస్తూ, “ఇల్లు అమ్మేద్దాం  అనుకుంటున్నాను,” అంది శారద.

“ఏ ఇల్లు?” అడిగింది గాయత్రి.

“ఈ ఇల్లే.”

“ఈ ఇల్లు అమ్మటానికి నువ్వెవ్వరూ? పదిహేను సంవత్సరాలుగా ఈ ఇంటిని చూసుకుంది మేము. ఇంటి చుట్టూ శుభ్రం చేసింది మేము.  దొడ్లో మొక్కలకు నీళ్ళు పోసింది మేము. ఇప్పుడొచ్చి  ఇల్లు  నీదైనట్లు  మాట్లాడ్డానికి  సిగ్గులేదూ?

“ముగ్గురు  బిడ్డల్నొదిలేసి  నీ  దోవ నువ్వు పోయావు. అమ్మమ్మ లేకపోతే మేం ఏమైపోయేవాళ్ళం? పాపం అంత  వయసులో  ఎన్ని  కష్టాలుపడిందామె  మాకోసం!  ఆమె పోయినప్పుడుకూడా రాలేదు నువ్వు. నీకు తల్లీ అక్కర్లేదు, బిడ్డలూ అక్కర్లేదు. నువ్వసలు మనిషివేనా?” ఇన్నాళ్ళూ దాచుకున్న కోపాన్నంతా ఒక్కసారిగా  వెళ్ళగక్కింది గాయత్రి.

తల్లి  చనిపోయిన  విషయం నిన్న  పిన్ని చెప్పిందకా శారదకు తెలియదు.  కొంచెం సేపు తలవంచుకుని మౌనంగా ఉండిపోయిందామె. ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని నొక్కింది జయలక్ష్మి. భావోద్రేకం కొంచెం తగ్గిన తర్వాత, “మీ నాన్న నన్నూ మిమ్మల్నీ వదిలేసి ఆవిడతో లేచిపోయి….. నాకీ  వూళ్ళో తలెత్తుకు తిరగడం వీలుకాకుండా చేశాడు,” అని మాత్రం అంది శారద.

“ఆయనొక పనికిమాలిన వాడు, నువ్వు అంతకంటే ఏమీ తక్కువ కాదు. ఏదో మీ చావు మీరు చచ్చారు. ఈ ఇల్లు  మాత్రం నీది కాదు, మాది. ఇల్లు అమ్మే అధికారం నీకు లేదు,” అంది గాయత్రి.

శారద చేతిని మళ్ళా నొక్కిపట్టుకుంది జయలక్ష్మి.

“సరే, నీ ఇష్టం. ఎపార్ట్మెంట్లు కట్టుకునేవాళ్ళు అడిగితే మీక్కూడా ఎపార్ట్మెంట్లయితే సులభంగా ఉంటుందేమో అనుకున్నాను. కొంత  డబ్బిస్తామన్నారు.  మూడు ఎపార్ట్మెంట్లు కూడా  ఇస్తామని అన్నారు. సరే మీ ఇష్టం,” అంది శారద.

“మాకు వాళ్ళ ఎపార్ట్‌మెంట్లు అవసరం లేదు. ఇక్కడయితే అందరం కలిసుంటాం. పైగా, ఇప్పుడు మేము ముగ్గురం కాదు,  నలుగురం,” అని “పల్లవీ” అని పిలిచింది గాయత్రి.

తలుపు వెనుక నుంచి వచ్చి గాయత్రి పక్కన నుంచుంది పల్లవి.

“ఈ అమ్మాయి నాన్న రెండోభార్య కూతురు,” అని పరిచయం చేసింది.

పల్లవి రెండుచేతులు జోడించి తల వంచి నమస్కారం చేసింది.

“పిన్ని చెప్పింది నిన్న,” అని, పల్లవిని దగ్గరకు రమ్మని పిలిచి, ఆ అమ్మాయి తల నిమిరింది శారద.

*

ఒక గంటసేపు ఉండి పిన్నితో వెళ్ళిపోయిందామె. వెళ్తూ తనకూతుళ్ళకూ పల్లవికీ తీసుకొచ్చిన డ్రెస్సులు ఇచ్చిపోయింది.

ఆమె వెళ్ళిపోగానే, “నువ్వెప్పుడూ అంతేనే గాయత్రీ, నీకు ఆమంటే ఎప్పుడూ కోపమే. కొంచెం బాగా మాట్లాడితే నీదేం పోయేది?” అని తప్పుపట్టింది వాసంతి.

“నీకంత ఇష్టంగా ఉంటే ఆమెతో వెళ్ళు, నేనేమీ బలవంతం చెయ్యడం లేదు నిన్ను ఉండమని,” అంది గాయత్రి.

“ఎందుకే అక్కని అలా అంటావు. ఆమె వదిలేసిపోతే మనల్ని సాకింది అక్కేగదా? అక్కకు ఆమాత్రం కోపం రాదా? అక్కా అమ్మమ్మా నీకు ఎలాంటి లోటూ రాకుండా పెంచారు. అందువల్ల నీకు తల్లిలేని లోటంటే ఏంటో తెలియదు. సంతోషంగా ఉండాల్సిన రోజుల్లో అక్కమీద ఎంత బాధ్యత పడిందో నీకేం తెలుసు?” అని జాడించింది శివాని.

“తెలుసులేవే. కానీ అది అంతా అమ్మ తప్పేనా? ఆ దరిద్రపుది పెళ్ళై, ముగ్గురు బిడ్డలున్నవాడిని వల్లో వేసుకుని తీసుకుపోయింది. మరి అమ్మకు కష్టంకదా? పాపం, ఎంత బాధపడిందో!” అంది వాసంతి.

పల్లవి తన గదిలో ఉందేమో, అంతా వినపడుతుందేమో అని సంకోచిస్తూ,  “తప్పంతా పరాయివాళ్ళమీద నెడితే ఎలాగే? నాన్నకు బుద్ధుండొద్దూ? ముగ్గురు బిడ్డలున్నవాడు ఇంకొకావిడతో సంబంధం పెట్టుకోవడమేంటీ?” అంది శివాని.

“అవును ఆయన బుద్ధిలేనివాడే. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడంతప్పే. మరిప్పుడు  అక్క చేస్తుందేమిటీ? దాని ఫ్రండ్ కి పెళ్ళయింది కదా? మరి ఇన్ని తప్పులుపట్టే అక్క అతనితో స్నేహం చెయ్యటం తప్పుకదా?” అని గాయత్రి వైపు చూసింది వాసంతి.

గాయత్రి చివాలున అక్కడనుంచి లేచి తన రూమ్‌ కి వెళ్ళిపోయింది. తలుపు వెనకనుంచి అంతా వింటున్న పల్లవి తన గదిలోకి వెళ్ళిపోయింది.

*

రెండుమూడు రోజులు ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. నిజానికి మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నం చేశారేమో.

ఒక రాత్రి భోజనాల తర్వాత పల్లవి గదిలోకి వచ్చింది గాయత్రి. మంచం మీద ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. శారద వచ్చిపోయింతర్వాత ఇద్దరూ ఏకాంతంగా కలవడం ఇదే మొదటి సారి. తలవంచుకుని కూర్చున్న పల్లవి కళ్ళవెంట నీళ్ళు రావడం గమనించింది గాయత్రి.

“ఎందుకు పల్లవీ, నువ్వెందుకూ ఏడుస్తున్నావు?”

“మీ అందరికీ నావల్లే కదక్కా  ఇన్ని కష్టాలు. నేను పుట్టకపోతే మీరందరూ బాగుండేవాళ్ళు కదూ?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందా అమ్మాయి.

“అదేంటి పిచ్చి పిల్లా. ఇందులో నీ తప్పేముందీ. మా నాన్నా, మీ అమ్మా వెళ్ళిపోయినప్పటికి నువ్వింకా పుట్టలేదుకదా? ఇందులో నీ తప్పు ఏముందీ?”

“మా అమ్మే కదా అక్కా మీ కుటుంబాన్ని నాశనం చేసింది.”

పల్లవిని దగ్గిరకు తీసుకుని తల  నిమిరింది గాయత్రి.

“చానాళ్ళు  నేనూ  అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకొవడం లేదు.”

తలపైకెత్తి గాయత్రి కళ్ళల్లోకి చూసింది పల్లవి.

పల్లవి చేతులను తన చేతుల్లోకి తీసుకుని, “మీ అమ్మకు ఆరోజుల్లో ఏవో ఇబ్బందులుండేవి. ఆమెకు నాన్న సహాయం చేస్తూ దగ్గరయ్యాడు. మా అమ్మ వాళ్ళను అనుమానిస్తూ నాన్నను దూరం చేసుకుంది. ఇందులో అందరి ప్రవర్తనలో లోపాలున్నయ్. తప్పంతా మీ అమ్మది అనడం సరైంది కాదు,” అంది గాయత్రి.

“కానీ, నాన్న అప్పటికే పెళ్ళైనవాడు కదా. మా అమ్మ…..”

“పల్లవీ, మొన్న వాసంతి అన్న మాటలు విన్నావుగా నువ్వు. అక్క చేస్తుంది కూడా తప్పేగదా అంది గుర్తుందా?”

తల ఊపింది పల్లవి

“మీ అమ్మను తప్పు పట్టడం సులభం. కానీ…ఒక మనిషి పరిచయం అవుతాడు. ఆ మనిషి మంచితనం, పనితనం, సభ్యతా, అందరికీ అతను ఇచ్చే గౌరవం నీకు ఇష్టం అవుతాయి. ఆ మనిషి మీద గౌరవం ఏర్పడుతుంది. మనసులో అతనితో ఏవో తెలియని సంబంధాలు  బలపడతాయి. కాని అతనికి పెళ్ళయిందని తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ముందు పెళ్ళయిందో లేదో కనుక్కుని, కానివారికే దగ్గిరవాలా? అలా  చేస్తే  అదేదో వ్యాపారం లాగా ఉండదూ?”

పల్లవి ఏమీ సమాధానం చెప్పలేదు.

“మా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ భరద్వాజ్ అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య స్నేహం ఏర్పడ్డాక చాలా కాలానికి నాకు అతని వ్యక్తిగత విషయాలు తెలిశాయి. అతనికి పెళ్ళయి దాదాపు పదేళ్ళయింది.  మొదటి రెండు మూడేళ్ళు బాగానే ఉండేవాళ్ళట. ఆ తర్వాత క్రమంగా ఒకరికొకరు దూరం అవుతూ వచ్చారు. వాళ్ళ మనస్తత్వాలు వేరు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా వాళ్ళ మధ్య సఖ్యత అయితే లేదు. అతనికి పెళ్ళి అయింది కాబట్టి  నేను అతన్ని దూరంగా ఉంచాలా? స్నేహాన్ని తెంపేసెయ్యాలా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. మీ అమ్మ కూడా ఇలాంటి సందిగ్ధంలో పడి ఉంటుంది. మనం పెళ్ళిచేసుకుందాం అని చాలా సార్లు అడిగాడు భరద్వాజ్. నేను ఇంతవరకూ ఒప్పుకోలేదు. నాకు బాధ్యతలున్నాయనీ, నేను పెళ్ళిచేసుకోలేననీ చెప్తూ వచ్చాను. కానీ పెళ్ళయింది కాబట్టి అతనికి జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా బ్రతికే హక్కు లేదా? ఇష్టంలేని మనిషితోనే జీవితం గడపాలా? అతనితో స్నేహం చెయ్యడం తప్పా? పెళ్ళికి ఒప్పుకోకపోవడం తప్పా? ఏమో. అన్నీ ప్రశ్నలే. సంతృప్తికరమైన సమాధానాలే లేవు.”

పల్లవి ఏమీ మాట్లాడలేదు.

పల్లవి తల నిమురుతూ, “ప్రశ్నల దగ్గరే  ఆగిపోయాన్నేను. మీ అమ్మ ధైర్యం చేసి ఒక బాటను ఎంచుకుంది. ఇంత మంచి అమ్మాయిని మాకిచ్చి వెళ్ళిపోయింది,” అని పల్లవి తల మీద ముద్దు పెట్టి తన గదికి వెళ్ళిపోయింది గాయత్రి.

ప్రఖ్యాత జపాన్‌ రచయిత్రి అకిమి యోషిడా రాసిన ఉమిమాచి డయరీ ఆధారంగా.

 

ఏది నేరం ?! హజారీబాగ్ కథలు

hajaribagh

 

బి. అనూరాధ పుస్తకం “ఏది నేరం ?! హజారీబాగ్ కథలు” మీద డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు ఫిబ్రవరి 2016 లో జరిపిన చర్చాసారాంశం. పాల్గొన్నవారు: మద్దిపాటి కృష్ణారావు, పిన్నమనేని శ్రీనివాస్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, నర్రా వెంకటేశ్వరరావు, భూపతి రాజు ఉష, రుద్రరాజు సుధ, వేములపల్లి పద్మ, ఆరి సీతారామయ్య.

చర్చా సమీక్ష: ఆరి సీతారామయ్య

విరసం ప్రచురించిన ఈ పుస్తకంలో 16 కథలున్నాయి. “కథల వెనుక కథ” అనే శీర్షికతో కథల నేపథ్యం గురించి రచయిత్రి వివరంగా రాశారు. ముందు ఈ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం.

డిగ్రీ వరకూ చదివిన అనూరాధ కొంతకాలం  బాంక్ లో ఉద్యోగం చేశారు. 1990 లో పౌరహక్కుల సంఘంలో చేరి కార్యకర్తగా పనిచేశారు. 1993 నుండి మహిళా సమస్యలపై పనిచెయ్యడం మొదలుపెట్టారు. చైతన్య మహిళా సమాఖ్య / సంఘం లో రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. 2006 నుండి బీహార్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నారీ విముక్తి సంఘ్ వారితో పనిచేశారు. ఝార్ఖండ్ లో ఆదివాసీలు “మావోయిస్టు సిద్ధాంత మార్గదర్శకత్వంలో” మైనింగ్ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు.

ఏపిఎస్‌ఐబి వారు 2009 అక్టోబర్లో రచయిత్రిని పాట్నాలో అరెస్ట్ చేసి, నాలుగు రోజులు  అజ్ఞాతంగా నిర్బంధించి, తర్వాత ఝార్ఖండ్లో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అప్పటినుండి ఆగస్ట్ 2013 వరకూ ఆమెను ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ కేంద్ర కారాగారంలో ఉంచారు. తను రాజకీయ ఖైదీనని రచయిత్రి రాసుకున్నారు.

మన సమాజంలో “సంపన్నులు చెప్పిందే న్యాయం”. “దానిని  కాపాడేది రాజ్యం.” ప్రజాస్వామ్యం పేరిట ధనస్వామ్యం చలామణీ అవుతుంది.” “దోపిడీ సమాజంలో ఏ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలూ విడిగా ఉండవు. ఈ సమాజాన్ని ప్రస్తుతం పీడిస్తున్న భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి, వారికి ఊడిగం చేస్తున్న దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావడానికి నేను ఎంచుకున్న రంగం మహిళారంగం. దానికే పరిమితం కావాలని కూడా అనుకోలేదు. అంతిమంగా కమ్యూనిస్టు సమాజంలోనే మనిషిని మనిషి దోచుకోగలిగే పరిస్థితి అంతరిస్తుందనేదే నా స్పష్టమైన అవగాహన.” ఇవి అనూరాధ రాజకీయాభిప్రాయాలు.

మన సమాజం ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న ధనస్వామ్యం అనేది నిస్సందేహం. రచయిత్రితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మన రాజ్యాంగాలు, న్యాయస్థానాలు, పొలీసు వ్యవస్థలు ధనికులకు అనుకూలంగా ఉంటాయి. వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచెయ్యవచ్చు, కాని వారి అధికారానికి ప్రమాదం లేనంతవరకు మాత్రమే. ప్రమాదం రావచ్చు అనుకుంటే వ్యవస్థ ఎన్‌కౌంటర్లు జరిపిస్తుంది. ప్రాణాలు తీస్తుంది. ముమ్మాటికీ నిజం.

కానీ, దీనికంతటికీ విరుగుడు కమ్యూనిజం అని రాశారు రచయిత్రి. వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో మావోఇస్టు మార్గాన్ని ఎంచుకున్నారు కూడా. కమ్యూనిస్టు సమాజాల్లో, మావోఇస్టు మార్గంలో ప్రజాస్వామ్యం ఉందా? లెనిన్‌, మావో, స్టాలిన్‌, పోల్ పాట్‌లు వారి వ్యతిరేకులను ఏం  చేశారు?   అంటే ధనస్వామ్యంలోనైనా కమ్యూనిజంలోనైనా అధికారానికి ప్రమాదం వస్తే పాలకులు సహించరనే కదా పాఠం. వారికి వ్యతిరేకంగా నిలబడ్డ వారిని మావోఇస్టులు ఏం చేశారు? అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న మావోఇస్టులు ఇప్పుడే అధికారంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక అధికారంలోకి వస్తే వారు ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తారా?

కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానావకాశాలు ఉండేలా చూడడం ప్రజాస్వామ్య లక్షం. ఆ గమ్యానికి చేరడానికి మిలిటెంట్ మార్గాలు చేపట్టిన వారు (రష్యా, చైనా) చాలా సాధించారు. కాని సాధించిన మార్పులను ఆ సమాజాలే తిరస్కరించాయి. సోవియట్ యూనియన్‌, చైనాల్లో జరిగిన దాన్నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఏమీ నేర్చుకోకుండా అదే దారిన మళ్ళా ప్రయాణం చేద్దామనడం అవివేకం కాదా?

“సంఘటితంగా చేసే ఈ పోరాటాలు ప్రజలలో మిలిటెన్సీని, చైతన్యాన్నీ పెంచుతాయి” అని రాశారు రచయిత్రి. చైతన్యాన్నీ, మిలిటెన్సీనీ పెంచుతాయని రాస్తే కొంత సబబుగా ఉండేదేమో. అయినా సంఘటితంగా చేసే పోరాటాలు మిలిటెంట్ గా ఉండనవసరం లేదు. స్త్రీవాద ఉద్యమం ఉదాహరణగా తీసుకుందాం. చైతన్య  వంతులైన  స్త్రీలు  వోటింగ్ హక్కుకోసం, కుటుంబ నియంత్రణ కోసం, సమాన జీతాల కోసం పోరాడారు. పోరాడుతున్నారు. ఈ  పోరాటాలు మిలిటెంట్ గా జరగలేదు, జరగడం లేదు. కానీ ఎంతో మార్పును తేగలిగాయి. అంటే చైతన్య వంతులైన వారంతా మిలిటెంట్ లు కానవసరం లేదు అనే కదా? మావోఇస్టులు మిలిటెన్సీని  చైతన్యం గా  భ్రమపెడుతున్నారు. దూరంగా ఆలోచించలేనివారు నమ్మేస్తున్నారు.

ఈ పుస్తకానికి శీర్షిక “ఏది నేరం?!” వ్యవస్థ చేస్తుంది నేరమా? దానికి వ్యతిరేకంగా పోరాడటం నేరమా?  రచయిత్రి దృష్టిలోలాగే మా దృష్టిలో కూడా వ్యవస్థదే నేరం, నిస్సందేహంగా. ఎలెక్షన్లు  జరుగుతున్నా  మన  ప్రభుత్వాలు  (ఇండియాలోనూ,  అమెరికాలోనూ) ప్రజల  చేతుల్లో  లేవనేది  నిస్సందేహం. కానీ వాటికి  వ్యతిరేకంగా  ప్రజాస్వామ్యం  కోసం  జరిగే  పోరాటాలు  ప్రజాస్వామికంగా, పోరాట  ఫలితాలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా జరగాలి. ప్రజాస్వామ్య పోరాట  మార్గాలమీద అన్వేషణ జరగాలి. ఇది వరకు జరిగిన తప్పులు మళ్ళా జరక్కుండా చూసుకోవాలి.  అలా కాకుండా ఊరికే  “ప్రజాస్వామ్య”  అని  పేరు  పెట్టుకున్నంత  మాత్రాన ఏ అప్రజాస్వామ్య  సంస్థనూ నమ్మే దశలో లేరు ప్రజలు.

*

ఇక కథల గురించి.

కథా, కథనం, భాషా, అన్ని విధాలా ఈ పుస్తకంలోని  కథలు మంచి కథలని చెప్పుకోవచ్చు. సులభంగా చదివించిన కథలు. తల్లులతోబాటు జైల్లో ఉంటున్న చిన్న పిల్లల గురించి రాసిన రెండు కథలు, “బేబీస్‌ డే అవుట్”, “చందమామని చూడని వెన్నెల,” మా అందరికీ ఎంతగానో నచ్చాయి. బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియకుండా పెరుగుతున్న ఈ పిల్లల గురించి ఎంతగానో విచారిస్తూ రాసినా, పిల్లల సహజ ప్రవర్తనను, మాటల స్థాయినీ, అనుభవాలనూ చక్కగా ఆవిష్కరించారు రచయిత్రి.

“చందమామని చూడని వెన్నెల” కథలో “కానిచోట కాసావే వెన్నెలా, కారడవుల కాసావే వెన్నెలా,” పాట గురించి రాస్తూ, “అడివిలోనే పుట్టి పెరిగి అడివినే ఇళ్ళుగా చేసుకున్న వాళ్ళు”  కూడా  ఉన్నారన్న విషయాన్ని మరిచో, పట్టించుకోకనో, “అడవి కాచిన వెన్నెల” లాంటి సామెతలను వాడే వారిని సున్నితంగా ఖండించారు. “మనుషులు లేని అడవిలోనయినా ఎన్నో జీవాలూ, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు! సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే సాంత్వన కలగజెసే చందమామ మీద హక్కు ఎ ఒక్కరిదో ఎలా అవుతుంది?” అని గొప్ప భావుకతతో ప్రశ్నించారు రచయిత్రి.

మంచి కథ రాయడానికి సూక్ష్మమైన పరిశీలనా స్వభావం సహకరిస్తుంది. “మున్నీ బద్‌నామ్‌ హుయీ” కథలో ఈ సన్నివేశం చూడండి. “నాకేం అర్థం కాలేదు. ఎందుకంత భావోద్వేగం కలిగిందామెకు? అని ఆశ్చర్య పోయాను. నా ఆశ్చర్యం గుర్తించి, చెప్తాను అనబోయింది కానీ, గొంతు గాద్గదికంగా అయిపోయింది. దానిని దగ్గు వెనక దాచేసి, గబుక్కున నవ్వేసింది. అయినా ఒక కంటినుండి బుగ్గమీదకు సగం వరకు ఒక కన్నీటి చుక్క జారిపడింది. జుట్టు వెనక్కి తోసుకుంటూ దానిని రెప్పపాటులో తుడిచేసింది. నేనుకూడా గమనించనట్టే ఊరుకొన్నాను. మంచినీళ్ళ సీసా తీసి నేను ఒక గుక్క తాగి, యథాలాపంగా అందించాను. తాను ఒక గుక్క తాగి, గలగల నవ్వేసి అంతకు కొన్ని క్షణాల ముందు ఉన్న మున్నీ ఆమేనా కాదా అని నాకే అనుమానం వచ్చేలా ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.” ఎంత  అద్భుతంగా రాసారో కదా! మనుషుల మానసిక స్థితిని అంత సూక్ష్మంగా పరిశీలించి రాయగలగడం గొప్ప విషయం.

ఈ కథలు “భారతీయ జైళ్ళలో ఉన్న అమానవీయ పరిస్థితి” ని అందరి దృష్టికీ తీసుకురావాలనే ఉద్దేశంతో  రాసినవి. “జైలును నేను బయటనుంచీ లోపల నుంచీకూడా చూశాను. ఆ బయటా – లోపలికీ మధ్య ఉన్న దూరం మాత్రం అనంతం. ఆ దూరాన్ని తగ్గించగలిగితే అప్పుడు ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం ఉందని చెప్పవచ్చు,” అనీ రాశారు. ఈ కథల్లో ఒక్క హజారీబాగ్ జైలు గురించి మాత్రమే రాశారు కాబట్టి దేశంలోని ఇతర జైళ్ళలో పరిస్థితుల గురించి పాఠకులకు తెలిసే అవకాశం లేదు. కానీ రచయిత్రి ఆవిష్కరించిన జైలు జీవితం ఆధారంగా హజారీబాగ్‌లో పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయనిపించదు. దీని గురించి తర్వాత మరోసారి ప్రస్తావిస్తాను. బయటికీ జైలు లోపలికీ ఉన్న దూరాన్ని తగ్గించ గలిగితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లే అన్నారు రచయిత్రి. అంటే జైలుని బయటి సమాజం స్థాయికి పైకితీసుకురావాలనేకదా? అంటే బయటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నదనే కదా? అలా అయితే సమాజంలో ప్రజాస్వామ్యం లేదు, కమ్యూనిజం మావో ఇజం రావాలి అని ఇంతకు ముందు చెప్పిన అభిప్రాయాలు మర్చిపోయినట్లున్నారు రచయిత్రి.

ఇవి  జైల్లో స్త్రీల విభాగంలో ఉన్న వారి కథలు.  ఒక స్త్రీ జైల్లో ఉందంటే ముందు ఆమె నేరం చేసి ఉండాలి. లేక ఆమె మీద నేరారోపణ జరిగి ఉండాలి. పొలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయ వ్యవస్థ దాని మీద విచారణ జరిపి,  ఆమె నేరం చేసిందని నిర్ణయించి శిక్ష వేసింది. ఇప్పుడు ఆమె జైల్లో ఉంది.  అంటే సమాజం, పొలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ, జైలు – ఈ నాలుగు వ్యవస్థలకూ ప్రతి కేసులోనూ కొంత బాధ్యత ఉంటుంది. అనూరాధ కథల్లో ఉన్న పాత్రలను తీసుకుని ఈ నాలుగు వ్యవస్థలు వీళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాయో చూద్దాం.

మొదట సమాజం ఎలావుందో చూద్దాం. ఈ కథల్లో ఒక 14, 15 సంవత్సరాల అమ్మాయిమీద అత్యాచారం జరిగింది. ఆమె గార్డియన్లు ఆమెకు అండగా నిలబడలేదు. ఒకమ్మాయికి బాల్య వివాహం జరిగింది. భర్త ఆమెను తాగొచ్చి చితగ్గొట్టేవాడు. మరోమార్గం లేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బలవంతులు బలహీనుల మీదా, పేదలమీదా నేరారోపణ చేసి కేసులు పెట్టిన సందర్భాలు రెండుమూడు కథల్లో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో స్త్రీలకు ఎలాంటి మానవహక్కులూ ఉండవు. వాళ్ళకు సమాజంలోకంటే జైల్లోనే ఎక్కువ స్వేచ్ఛగా ఉంటుంది. ఒంటరిగా సమాజంలో బ్రతకటంకంటే జైల్లోనే భద్రత ఎక్కువ కాబట్టి బెయిల్ వచ్చినా జైల్లో ఉంటుంది ఒకామె. దేశంలో ఒకచోట ఉన్న ఆచారాలు (భర్త చనిపోయిన స్త్రీ మరిదిని పెళ్ళి చేసుకోవడం లాంటివి) మరోచోట నేరాలుగా పరిగణించబడతాయి.

న్యాయ వ్యవస్థ ప్రవర్తన: ఈ కథల్లో ఉన్నంత వరకూ న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యలోపం కేసులను విచారించడంలో జరుగుతున్న జాప్యం. ఈ కారణంగా నేరం చెయ్యని వారు కూడా చాలా  సంవత్సరాలు జైల్లో ఉండడం జరుగుతుంది.

పొలీసు వ్యవస్థ: అకారణంగా అరెస్ట్ చెయ్యడం, అరెస్ట్ చేసిన వారిని సకాలంలో మేజిస్ట్రేట్ ముందుకు తీసుకు రాకపోవడం, లంచాలు తిని నేరస్తులను అరెస్ట్ చెయ్యకపోవడం, ఇవీ ఈ కథల్లో ఉన్న వివరాలు.

ఇక జైల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. కథలన్నీ జైలు గురించి రాసినవి కాబట్టి ఈ వ్యవస్థ గురించి ఎక్కువ వివరాలున్నాయి.

ఖైదీలు పగలంతా  జైలు ఆవరణలో ఎక్కడైనా ఉండవచ్చు. ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సాయంత్రం అందరినీ లెక్కపెట్టి లాకప్లో ఉంచుతారు.

జైలు శుభ్రంగా ఉంటుంది.

ఖైదీలు వారికి చేతనయిన పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకావిడ స్వెట్టర్లు అల్లి అమ్ముకుంటుంది.

బయటి సమాజంలోకంటే “ఇక్కడ చాలామంది స్త్రీలు స్వేచ్ఛగా ఉంటారు.”

నియమాల ప్రకారం జైల్లో వంటా మంటా నిషేధం. కాని రెండూ జరుగుతూనే ఉంటాయి. అధికారులు చూసీచూడనట్లు పోతుంటారు.

ఐదు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు తల్లితో జైల్లో ఉండవచ్చు. ఆ తర్వాత బయట బంధువులదగ్గరో, శిశు సంక్షేమ శాఖవారి ఆధ్వర్యంలోనో ఉండాలి. కాని పది సంవత్సారాలు దాటిన పిల్లలుకూడా జైల్లో ఉన్నారు. అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తూంటారు.

జైల్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే, రచయిత్రి కథల నేపథ్యంలో  ఆరోపించిన అమానవీయత మాకు కనపడలేదు. రచయిత్రి చెప్పినదానికీ, చూపించినదానికీ పొంతన లేదు.

మా అందరినీ ఆశ్చర్య పరిచిన సంఘటన “పేదింటిపొగ” కథలో జరిగింది. ఉష, ఆశ జైల్లో పడకముందు ఉద్యోగాలకోసం (డి ఆర్ డి ఎ లో) ఒక పరిక్ష రాశారు. జైల్లో పడిన తర్వాత ఒక రోజు వారి తమ్ముడు ఫలితాలు వచ్చాయనీ, ఇద్దరూ పాసయ్యారనీ, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎల్లుండనీ కబురు పంపాడు. ఇంటర్వ్యూలు టౌన్లో. పరిక్షల ఫలితాలుగానీ, ఇంటర్వ్యూకు కావాల్సిన సర్టిఫికేట్లుగానీ ఆ అమ్మాయిలదగ్గర లేవు. ఇంటర్వ్యూకు వెళ్ళాలంటే, జైలు అధికారి ఒప్పుకోవాలి, కోర్టు  అనుమతికి దరఖాస్తుపెట్టుకోవాలి, పొలీసువారు ఎస్కార్టు ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకోవాలి. ఇదంతా ఎల్లుండిలోగా జరగాలి. ఇదంతా బయటి సమాజంలో జరగడమే ఎంతో మందికి లంచాలుపెడితేగాని జరగని పని. కాని జైల్లో ఉన్న ఈ అమ్మాయిలు ఇంటర్వ్యూలకు వెళ్ళారు, వారికి ఉద్యోగాలు వచ్చాయి, సమయానికి బెయిల్ మంజూరయి ఆ అమ్మాయిలు ఉద్యోగాల్లో చేరారు. ఇదంతా వీలయ్యేట్లు చేసిన జైలర్‌ని అభినందించకపోగా, అంతా సక్రమంగా జరగడానికి కారణం జైలర్ కి ఉన్న కీర్తి కండూతి అని అభిప్రాయపడ్డారు రచయిత్రి.

ఈ జైల్లో 100-125 మంది స్త్రీలు ఖైదీలుగా ఉన్నారు. ఇక్కడి కథల్లో పరిచయమైన పదిమందిలో ఎక్కువభాగం నేరాలు చేసినవారు కాదు, నేరం మోపబడి అన్యాయంగా జైల్లో ఉన్నవారు. ఈ పదిమందీ కాక మిగతా వారిలో నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న వారు ఎంత శాతం ఉంటారో చెప్పలేము. రచయిత్రి  ఎక్కడా వారి గురించి చెప్పలేదు. అందువల్ల జైల్లో ఉన్న స్త్రీలలో ఎక్కువభాగం అమాయకులు అనే అభిప్రాయం పాఠకులకు కలగవచ్చు. నిజానిజాలు ఈ పుస్తకం ద్వారా తెలిసే అవకాశం లేదు.

ఖైదీలు మాట్లాడేటప్పుడు వారి భాష అనుకోకుండా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు శకున్‌ మాటలు చూడండి (పేజీలు 30-31):  “మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. మా చాచా, చాచీ నా పెళ్ళి చేసేశారు. ఎంత కాలం పోషిస్తారు? పెళ్లయితే ఇంక ఆళ్ళే చూసుకొంటారు కదా!” ఇలా మాట్లాడిన శకున్‌ వెంటనే మరో భాషలో మాట్లాడటం మొదలు పెడుతుంది: “మస్తు తాగుతడు. నన్ను చాలా కొట్టేది. — రోజూ తాగేది. నాకు ఇద్దరు పిల్లలయ్యింరు.” ఆ వరుసలో అన్న మాటల్లో,  “కొట్టేవాడు”, “కొట్టిండు”, “చచ్చిపోయిన్రు”  అంటుంది. ఈ ఉత్తరదేశం స్త్రీ మాటలకు తెలుగు మాండలీకాల అతుకులు ఎందుకు పెట్టారో, అదీ నిలకడగా ఒక భాషో యాసో కాకుండా ఒక యాసమాలిక ఎందుకు ఎల్లారో తెలియదు. ఇది ఒక్క శకున్‌ విషయంలోనే కాదు, మిగతా పాత్రల విషయంలోకూడా ఇలాగే చేశారు.

ఈ పుస్తకం శీర్షిక “ఏది నేరం?!”, ఉప శీర్షిక “జైలు కథలు”. జైల్లో ఉన్న వారు నేరం చేశారో లేదో నిర్ణయించేది జైలు వ్యవస్థ కాదు, న్యాయ వ్యవస్థ. పైగా ఈ కథల్లో జైలు వ్యవస్థ సమాజం కంటే, న్యాయవ్యవస్థ కంటే, పొలీసు వ్యవస్థకంటే మెరుగ్గా పనిచేస్తుందనిపిస్తుంది. రచయిత్రి చూపించదల్చుకున్న అమానవీయత నిష్కారణంగా, చట్ట విరుద్ధంగా అరెస్త్ చేస్తున్న పొలీసు వ్యవస్థలో,   సంవత్సరాలతరబడి విచారణ జరపకుండా జైల్లో ఉంచుతున్న న్యాయవ్యవస్థలో, అయినదానికీ కానిదానికీ బలహీనులమీద కేసులు పెడుతున్న సమాజంలో ఉన్నంతగా జైలు వ్యవస్థలో కనబడదు.

*

కథ జీవితమంత విశాలం కావాలి!

 

-ఆరి సీతారామయ్య

~

సమాజానికి ఏది మంచిదో ఆలోచించడం, దాన్ని ప్రోత్సహించడం, తదనుగుణంగా ప్రవర్తించడం సామాజిక స్పృహ. సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించే శక్తులనూ భావజాలాన్నీ వ్యతిరేకించడం కూడా సామాజిక స్పృహే.

తన వర్గానికి ఏది మంచిదో, లేక తనకు ఇష్టమైన వర్గానికి ఏది మంచిదో  దాన్ని ప్రోత్సహించడం,  ఆ వర్గ పురోగమనాన్ని నిరోధించే శక్తులను  వ్యతిరేకించడం వర్గ చైతన్యం. అస్తిత్వ ఉద్యమాల పేరుతో జరుగుతున్న ప్రాంతీయ, వర్గ, కుల, మత పోరాటాలలో పాల్గొనడం, లేక వాటితో  సహకరించడం వర్గ చైతన్యం.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గురించి అభిప్రాయాలు ఏర్పరచు కోవటం, ఆ పరిణామాల వెనుక ఉన్న చోదక శక్తుల గురించి అవగాహన ఏర్పరచు కోవడం ప్రాపంచిక దృక్పథం.

సామాజిక స్పృహా, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం ఎంతో కొంత ప్రతి మనిషిలో ఉంటాయి. చైతన్యవంతుల్లో ఎక్కువే ఉంటాయి.

కథలు రాయదల్చుకున్న వారికి ఇవన్నీ ఉండటం మంచిదే. కాని తన సామాజిక స్పృహనీ, వర్గ చైతన్యాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్నీ కథలో జొప్పించకుండా, పాత్రల స్వభావాలను  తన వైపు తిప్పుకోకుండా, కథలో పాత్రలను వారివారి స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తించే వారిగా సృష్టించ గలిగితే మంచి కథలు వస్తాయి. అదంతా అవసరం లేదు, కథ మన వర్గపోరాటానికి ఒక సాధనం మాత్రమే అనే వారున్నారు. అలాంటి అభిప్రాయం  ఉన్నవారుకూడా నేర్పూ ఓర్పూ ఉంటే సజీవమైన పాత్రలను సృష్టించగలరు, మంచి కథలు రాయగలరు. నేర్పూ ఓర్పూ లేని వారు వస్తువు బలంగా ఉంటే చాలు, రూపం అంత ముఖ్యం కాదు అని ప్రచారం చే స్తూ కథల్లో తమ సామాజిక స్పృహా, తమ వర్గ చైతన్యం, తమ ప్రాపంచిక దృక్పథాన్నే మళ్ళీ మళ్ళీ  పాత్రలకు అంటిస్తూ నిస్సారమైన పాత్రలతో ఉపన్యాసాలతో పాఠాలతో విసుగు  పుట్టిస్తుంటారు.

సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం గురించి ఆలోచించని  వారు మంచి కథలు రాయగలరా? రాయగలరు అని నా అభిప్రాయం. మంచి కథ అంటే ఏంటో ముందు చెప్పుకుందాం. ఒక భావోద్రేకానికి లోనయిన రచయిత, దాన్ని కథ ద్వారా పాఠకులకి అందించగలిగితే అది మంచి కథ. భావోద్రేకానికి కారణం కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. పాఠకులు ఆ భావోద్రేకాన్ని అనుభవించాలంటే రచయిత సజీవమైన పాత్రలను సృష్టించాలి. కథలో సన్నివేశాలూ సంఘటనలూ రోజువారీ జీవితంలో అందరికీ ఎదురయ్యేవిగా ఉండాలి. అప్పుడు కథ పండుతుంది.

తమచుట్టూ  సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం అని  గిరులు  గీసుకుని,  వీటి  పరిథిలోనే  కథలు  రాయాలి  అనుకునే  వారికి  ఇవి గుదిబండల్లాగా తయారవుతాయని నా అభిప్రాయం. సగటు  తెలుగు సినిమా ఎప్పుడూ పనికి మాలిన వారి ప్రేమకలాపాల చుట్టూ తిరుగుతున్నట్లు, తెలుగు  కథ ఎప్పుడూ సమస్యలూ, వాటి పరిష్కారాల చుట్టూ తిరుగుతుంటుంది. అందువల్ల కథలు ఎప్పుడూ ఒక చిన్న వలయంలో ఉన్న వస్తువుల గురించే వస్తుంటాయి. జీవితంలో ఉన్నంత వస్తువిస్తృతి, భావవిస్తృతి కథల్లో ఉండదు.

తెలుగు కథ సమస్యలకూ పరిష్కారాలకూ పరిమితం కావటానికి కారణం ఎవరు? వామపక్షం వారని చాలా మంది అభిప్రాయం. సాహిత్యంలో వామపక్షం వారి ప్రభావం ఎక్కువగా ఉండటం, సమాజాన్ని తమకు ఇష్టమైన దిశగా మార్చటానికి సాహిత్యం ఒక పనిముట్టు అని వారు  భావించటం, ఇప్పుడు ఆ  భావజాలాన్ని  అన్ని ‘అస్తిత్వ ఉద్యమాల’ వారూ పాటించటం, తెలుగు  కథ ప్రస్తుత పరిస్థితికి చేరటానికి కారణం అని  నా అభిప్రాయం.

కానీ ఇది వామపక్షం సృష్టించిన పరిస్థితికాదు. ఆధునిక కథాప్రక్రియకు ముందే మన దేశంలో నీతికథలు ఉండేవి. కథకు ముఖ్యోద్దేశం ఒక నీతిని పాఠకులకు చేర్చడం. ఈ ప్రభావం వల్లనే మనం కథ దేని గురించి? అసలు ఈ రచయిత ఈ కథ ద్వారా ఏం చెప్పదల్చుకున్నాడూ? అని చాలా అనాలోచితంగా అడుగుతూ ఉంటాం. అంటే కథ ఏదో ఒక సమస్య గురించి  ఏదో ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అన్న మాట. మనకు చాలా కాలంగా ఉన్న ఈ  ఆచారాన్నే వామపక్షం వారు  బలోపేతం చేశారు. ఆ గోతిని ఇంకా లోతుగా తవ్వారు.

జీవితం సమస్యలకంటే, భావజాలాలకంటే, అస్తిత్వ ఉద్యమాలకంటే, రాజకీయాలకంటే విస్తృతమైంది. కథని ఒక పనిముట్టుగా వాడుకోవటం మానేసి, జీవితంలో ఉండే అన్ని కోణాల్నీ ప్రతిఫలించనివ్వాలి. అప్పుడు తెలుగు కథకు మంచి రోజులు వస్తాయని నా నమ్మకం.

*

 

గింజలు

47x37_custom_two_birds_in_a_cherry_blossom_branch_original_painting_42b066fd

అక్కా, చెల్లెలూ.

గూటిలోంచి దూకి కొమ్మ మీద వాలాయి.

ఇంకా పొద్దు పొడవలేదు.

చెట్టు చుట్టూ నిశ్శబ్దం.

తూర్పున ఎరుపుముసుగు లేస్తుంది.

ఆకలిగా ఉందక్కా అంది చెల్లెలు.

నేనెళ్ళి గింజలు వెతుక్కొస్తానంది అక్క.

ఒద్దు, పోవొద్దు, అమ్మ లేస్తే, నువ్వు లేక పోతే… అమ్మ భయపడుతుంది, అంది చెల్లులు.

తొందరగా వస్తాగా, గింజలు తెస్తాను. అమ్మకు పని తప్పుతుంది, అంది అక్క.

చిన్ని రెక్కలు విప్పుకుని ఎగిరిపోయింది.

పడమటిగా.

 

ఎండుపొలాలు దాటి,

కొండలు దాటి,

వాగులు దాటి,

పెద్ద వన భూమికి చేరింది అక్క.

అబ్బా, ఎన్ని గడ్డిమొక్కలో!

ఎన్ని గింజలో!

ఆకలి తీరా తిన్నది అక్క.

చెల్లికీ అమ్మకూ గింజలు తీసుకెళ్ళాలి.

పెద్ద కంకి నోట గరిచి కొమ్మెక్కింది.

ఇది రెండురోజులకు సరిపోతుందేమో.

మళ్ళా గింజల కోసం బతుకాట.

 

కొమ్మ మీద గూడు కట్టింది అక్క.

ఒక్కొక్క కంకి తెచ్చి గూట్లో దాచింది.

అమ్మ ఎంత గర్వ పడుతుందో నా బిడ్డ ఇన్ని కంకులు పోగుచేసిందని.

గింజలు పోగుచేస్తూ వచ్చిన కారణం మర్చిపొయింది అక్క.

 

రోజులు గడిచాయి.

అక్క ఒంటరైంది.

చుట్టూ ఎన్నో పక్షులున్నా,

వాటి పలుకు వేరు.

రూపాలు వేరు.

తమ చెట్టు పక్షి ఒక్కటీ లేదిక్కడ.

ఒంటరై పోయింది అక్క.

అయ్యో, గింజల గోల్లో పడి ఇలా అయిపోయానే అనుకుంది.

అప్పుడప్పుడూ తూర్పు వైపు చూస్తుంటుంది.

 

వెళ్ళి పోదామనుకుంది చాలా సార్లు.

కానీ, ఇన్ని గింజలు వదిలేశా? మనసొప్పలేదు.

వీటికోసమేకదా అమ్మ వెతికేది రోజూ?

మరో రోజు ఆగి పోయింది అక్క.

 

అమ్మను కనిపెట్టుకుని ఉంది చెల్లెలు.

ఒక్కో రోజు ఆకలిగానే పడుకుంటుంది.

కాని అమ్మను వదిలేసి వెళ్లలేక పోయింది.

తనుకూడా గింజలకోసం వెళ్తే?

కానీ, భయం.

పాపం ఒక్కతే అయిపోతుంది అమ్మ.

పైగా ఈ వయసులో.

అక్క తప్పకుండా వస్తుంది.

మళ్ళా అందరూ బాగుండే రోజు వస్తుంది.

ఆశగా పడమటి వైపు చూస్తూ ఉంటుంది చెల్లెలు అప్పుడప్పుడూ.

 

రోజులు గడుస్తునాయి.

అక్క ఇంకా రాలేదు.

అమ్మేమో రేపో మాపో అంటుంది.

చుట్టుపక్కల పక్షులు వచ్చిపోతున్నాయి అమ్మను చూట్టానికి.

తల్లికి గింజలు సంపాయించి పెట్టలేని పనికిమాలిన దానివి అంటున్నాయి కొన్ని పక్షులు.

దద్దమ్మను చూసినట్లు చూస్తున్నాయి.

పెద్ద కూతురే ఉంటేనా… ఆమెకీ కష్టాలొచ్చేయి కాదు, అందొక పక్షి.

 

ఇప్పటికీ ఏదో ఒక బంధువు పక్షి ఆమాటలు అంటూనే ఉంటుంది.

విన్నప్పుడల్లా చెల్లి చూపుల్లో ఓ నవ్వు తళుక్కు మంటుంది.

కానీ నవ్వులా ఉండదు.

అది సంతోషమో,

విషాదమో,

అసూయో,

ఉన్మాదమో

ఎవరికి తెలుసూ?

కొమ్మ మీద కూర్చుని దూరంగా చూస్తూ ఉంటుంది చెల్లెలు.

 

-ఆరి సీతారామయ్య

photo

 

 

 

 ఆరి సీతారామయ్య గారు వృత్తిరీత్యా బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్. కథకుడిగా తెలుగు సాహిత్యజీవులకు బాగా తెలిసిన పేరు. పదేళ్ళ కిందట ఆయన రాసిన కథలు “గట్టు తెగిన చెరువు” శీర్షికగా ప్రచురితమయ్యాయి. త్వరలో మరో కొత్త కథ సంపుటి రాబోతోంది.