అథో అన్నం వై గౌః

 

ఆక్రోశ్

~

అఖ్లాక్ నీ చేతిలో చావడమే మంచిదైంది

ఇప్పుడు స్వర్గంలో

కమ్మగా వండిన ఆవు మాంసాన్ని

లొట్టలేసుకుంటూ జంకూగొంకూ లేకుండా తింటున్నాడు..

బతికినప్పుడు నిండుగా తీర్చుకోలేని జిహ్వ రుచిని

చచ్చాకైనా నీ పుణ్యమాని

నీకు దక్కని స్వర్గంలోనే దర్జాగా ఆస్వాదిస్తున్నాడు..

ఇంద్రుడు, అగ్ని, మరుత్తులు ప్రేమతో కండలు వడ్డిస్తున్నారు

యాజ్ఞవల్క్యుడు భాండంలో ఏరిఏరి మరీ మెత్తని ముక్కలు అందిస్తున్నాడు..

అథో అన్నం వై గౌః

ఆవు నిశ్చయముగా ఆహారమే..

రుత్వికులు వేదాలు, ఉపనిషత్తులు వల్లిస్తున్నారు..

ఉత్తిపుణ్యానికి

అఖ్లాక్ ను గొడ్డళ్లతో, కొడవళ్లతో నరికి చంపిన నిన్ను

ఘోరాతిఘోరంగా శఠిస్తున్నారు..

అఖ్లాక్ హంతకః వినశ్యతు..

క్షయం ప్రాప్తిరస్తు

రోగం ప్రాప్తిరస్తు

నరకం ప్రాప్తిరస్తు..

 

అఖ్లాక్ ఇంట్లో దొరికిన మేకమాంసాన్నీ శఠిస్తున్నారు..

మేషః నశ్యతు, అజః నశ్యతు

గొర్రెలు చావాలి, మేకలు చావాలి

కుక్కుటః నశ్యతు, కుక్కుటా నశ్యతు

కోడిపుంజు చావాలి, కోడిపెట్ట చావాలి..

మత్స్యః నశ్యతు, కర్కటః నశ్యతు

చేపలు చావాలి, పీతలు చావాలి..

 

అథో అన్నం వై గౌః

ఆవే కమ్మని భోజనం..

అఖ్లాక్ దాన్ని ఇక్కడైనా కడుపారా భుజించనీ..

 

 

(ఉత్తరప్రదేశ్ లోని బిషాదా గ్రామంలో గోమాంసం తిన్నాడనే అనుమానంతో మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన అఖ్లాక్ వంటి మరెందరికో నివాళిగా..)

*

 

 

 

  ‘తప్పంతా వాళ్లదే!’

   ఆక్రోశ్

మన ఘనత వహించిన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉద్దేశంతో కానీ, ఉద్దేశ రహితంగా కానీ చంపడం ఏమంత పెద్ద నేరం కాదని సల్మాన్ ఖాన్ కేసు తీర్పుతో మరోసారి తేలిపోయింది. సల్మాన్ తాగిన మైకంలో నిర్లక్ష్యంగా కారు నడపడంతో ‘కుక్క’ లాంటి ఒక మనిషి చచ్చిపోయి, ‘కుక్కల్లాంటి’ మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు కనుక కోర్టు ఐదేళ్ల శిక్షతో సరిపెట్టింది. దొంగలను, రేపిస్టులను పిట్టల్లా కాల్చేసి తక్షణ న్యాయం చేయాలని బాధ్యతగల పౌరులు డిమాండ్ చేస్తున్న వర్తమానంలో పదమూడేళ్లకు పైగా నడిచిన ఈ కేసులో.. చివరకు కాస్త శిక్షతోనే అయినా వచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గదే.

సల్మాన్ హత్య చేయలేదు, నిజమే! కానీ తాగి కారు నడుపుతూ, ఫుట్ పాత్ పైకి దూసుకెళ్తే, అక్కడున్న జనం చస్తారని అతనికి తెలియదనుకోలేం. సినిమాల్లో డూపులు పెట్టుకునే ఆయనకు ఈ సంగతి ఇతరులకంటే మరింత బాగా తెలిసి ఉంటుంది. సినిమా కోర్టు సీన్లలో తిమ్మిని బమ్మిని చేసే వాదనలు, కూట సాక్ష్యాలు కూడా బాగా తెలిసిన ఆయన తాను కారు నడపలేదని నిన్న కూడా కోర్టులో చెప్పాడు. అప్పుడు కారు నడిపింది తన డ్రైవర్ అశోక్ సింగ్ అని కేసు చివరి దశలో చెప్పిన సల్మాన్ ఆ ముక్క 13 ఏళ్ల కిందటే ఎందుకు చెప్పలేదని ప్రాసిక్యూషన్ మంచి ప్రశ్నే వేసింది. చచ్చిన మనిషి  కారు కింద పడి చనిపోలేదని, ప్రమాదం తర్వాత కారును క్రేన్ తో ఎత్తుతుండగా కారు కిందపడ్డంతో చనిపోయాడని లాయర్ తో మరో సినిమా కథ చెప్పించాడు సల్మాన్.

ప్రమాదం తర్వాత తన నుంచి సేకరించిన రక్తంలో ఆల్కహాల్ ఉందని ఫోరెన్సిక్ నిపుణుడు ఇచ్చిన సాక్ష్యం కూడా చెల్లదన్నాడు ఆయన. ఆ నిపుణుడికి అసలు రక్తం సేకరించడమే తెలియదన్నాడు. ఇలాంటి తైతక్కలెన్నో ఆడాడు. కోర్టు ఇవేవీ నమ్మలేదు. ఇవన్నీ లా పాయింట్లు. బాధ్యతగల పౌరులకు అక్కర్లేదు. వాళ్లకు కావాల్సింది తక్షణ న్యాయం. అది 2012లో జరగలేదు. 2015లో కాసింత తక్షణంగా జరిగింది. హత్య కేసులే కాదు, సామూహిక ఊచకోత కేసులు కూడా దశాబ్దాల తరబడి నడుస్తున్న, పేలపిండిలా తేలిపోతున్న ఈ దేశంలో ఇది పెద్ద విశేషమేమీకాదు కనుక దీని గురించి చర్చ అనవసరం. కానీ ఈ కేసు తీర్పు తర్వాత సల్మాన్ కు మద్దతుగా కొందరు బాధ్యతగల సినీప్రముఖులు  చేసిన వ్యాఖ్యలు చూశాక చర్చ అవసరమనిపించింది.

‘కుక్క రోడ్డుపై పడుకుంటే కుక్క చావు చస్తుంది. రోడ్లు పేదల సొత్తు కాదు. రోడ్లున్నది కార్లకోసం. ముంబై ఫుట్ పాత్ లు అలగాజనం పడుకోవడానికా? ఫుట్ పాత్ నిద్ర ఆత్మహత్యలాంటి నేరమే.  సల్మాన్ కు అండగా నిలబడండి’ అని బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ట్విటర్లో రాశాడు. తళుకెబెళుకుల జ్యుయెలరీ డిజైనర్ ఫరా ఖాన్ వంతపాడుతూ, ‘ఫుట్ పాత్ ల మీద పడుకునేవాళ్లు వాహనాల కిందపడి చావడానికి సిద్ధంగా ఉండాలి. మందు, డైవర్ను నిందించకూడదు. వేరే దేశంలో అయితే సల్మాన్ కారు మనుషులమీదికి పోయేదు కాదు. ఒకడు పట్టాలు దాటుతూ రైలు కింద పడి చనిపోతే రైలు డ్రైవర్ ను శిక్షించినట్లు ఉంది, సల్మాన్ కు వేసిన శిక్ష’ అంది(అందుకే ఈమెకు ఎవరో ‘ఇండియా మేరీ ఆంటోనెట్’ అనే బిరుదు కట్టబెట్టారు. ఈమెకు ఆంటోనెట్ గతి పట్టకుండుగాక).

సల్మాన్ అమాయకుడని కొందరు, ఏదో తెలీక చేస్తే ఇంత కఠిన శిక్షవేస్తారా అని కొందరు, అతడు దానవీరశూరకర్ణుడు, అపర గౌతమబుద్ధుడు కనుక వదిలేయాలని కొందరు వత్తాసు పలికారు. సారాంశం ఏమంటే.. సల్మాన్ ను శిక్షించకుండా వదిలేసి ఉండాల్సిందని, లేకపోపోతే నెలో, రెండు నెలలో ’అత్తగారింటికి‘ పంపి ఉండాల్సిందనీ. సల్మాన్ వీళ్లకు స్నేహితుడో, సాటి సినీ జీవో, బంధువో, గింధువో, అతనితో కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలో కావొచ్చు కనుక మద్దతు పలకడం సహజమే. సల్మాన్ బ్యాడ్ బాయ్ చేష్టలు, జింకలవేటలు, అతిలోకసుందరుల కోసం తోటి హీరోలతో చేసిన బాహాబాహీలన్నీ కన్వీనియంట్ గా మరచిపోయిన వీళ్ల వాదనతో బీదాబిక్కీకే కాదు, జనసామాన్యానికంతా పెద్ద ప్రమాదముంది. వీళ్ల మహత్తర ‘అభిప్రాయాలపై కాస్త ఆలోచించాలేమో, వీళ్లంటున్నది సమంజసమేనేమో’ అని మధ్యతరగతి బుర్రలు కూడా అప్పుడే ట్వీట్లు కొట్టేస్తున్నాయి. అసలే మనది సినిమాల వాళ్ల, రాజకీయ నాయకుల మాటలను వేదవాక్యంలా భావించే అమాయక చైతన్యవంతులున్న దేశమాయె! కార్లు, లారీలు రోడ్లపై వెళ్తాయో, పుట్ పాత్ లపై వెళ్తాయో తెలిసిన మహాజ్ఞానుల దేశమాయె!

‘తీర్పు ఇంత ఆలస్యంగా వస్తే ఏం ప్రయోజనం? నా కాలు పోయింది. బతుకు తెరువు పోయింది. జీవచ్ఛవంలా పడున్నా. వచ్చిన 3 లక్షల పరిహారంలో ఒకటిన్నర లక్ష లాయర్ ఫీజుకింద పోయింది..’ అని ఒక క్షతగాత్రుడు.., ‘నా తొడ చితికిపోయింది. వచ్చిన రూ. ఒకటిన్నర లక్ష చికిత్సకే సరిపోలేదు. ఇప్పుడు సల్మాన్ దోషిగా తేలితే మాత్రం నా కడుపు నిండుతుందా?’ అని మరో క్షతగాత్రుడు వెళ్లబుచ్చిన ఆక్రోశం మాత్రం సోషల్ మీడియా ప్రేమికుల చెవుల్లోకి ఎక్కలేదు. రోడ్లపై పడుకునోళ్లను చంపితే నేరం కాదు, పేదవాళ్ల కారణంగానే సల్మాన్ పాపం జైలుకెళ్లాల్సి వచ్చింది( సల్మాన్ ఇంకా జైలుకెళ్లలేదు, బెయిలు పుచ్చేసుకుని ఇంటికెళ్లాడు) అని బెంగటిల్లుతున్న సల్మాన్ అభిమానుల వాదనకే ఈ మీడియాలో, మామూలు మీడియాలో విపరీత ప్రచారం లభించింది.

వీళ్ల వాదన శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను పిట్టల్లా  చంపేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల, ఆ రాష్ట్ర మంత్రుల వాదనలా, ఆలేరులో ఐదుగురు తీవ్రవాద నిందితులను చంపేసిన తెలంగాణ పోలీసుల వాదనలా ఉంది(దొంగలు గతంలో అటవీ అధికారులను చంపడం, తీవ్రవాద నిందితులు పోలీసులు చంపడం నిజమే అయినా). దొంగతనంగా చెట్లు కొట్టేస్తే(మమ్మల్ని చంపితే, కాల్చితే ఊరుకుంటామా?) అని ఆ పోలీసులు చెప్పినట్లే.. ఫుట్ పాత్ లపై ఆదమరచి పడుకుంటే తాగినోళ్లు కార్లతో గుద్ది చంపకుండా పోతారా అన్నట్లుంది మహానటకుడి సమర్థకుల వాదన.

ఢిల్లీలో ‘నిర్భయ’పై పైశాచికానికి పాల్పడిన ముఖేశ్ సింగ్ కూడా బీబీసీ ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలే అన్నాడు. ‘పరువున్నఆడపిల్ల రాత్రి 9 గంటకు బయట తిరగకూడదు. రేప్ కు మగాడు కాదు, ఆడదే కారణం. ఆడాళ్లకు ఇంటిపనే తగింది. డిస్కోలకు, బార్లకు వెళ్లకూడదు. చెడు పనులు చేయకూడదు(మగాళ్లు చేయొచ్చు!), ఒళ్లు కనిపించే బట్టలు వేసుకోవద్దు. ఆమె(నిర్భయ) మేం రేప్ చేస్తుంటే ప్రతిఘటించకుండా మౌనంగా భరించి ఉండాల్సింది. మా పని అయిపోయాక ఆమె స్నేహితుడిని కొట్టి, ఆమెను చంపకుండా వదిలేసి ఉండేవాళ్లం’ అని అన్నాడు.

ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు అడుగుతున్న, గుంజుకుంటున్న పాలకులు కూడా వాచ్యంగా ఇలా బరితెగించి చెప్పకున్నా ధ్వనిగానైనా ఇలాంటి వాదనలే చేస్తున్నారు, ‘రైతులకు భూములున్నది మాకివ్వడానికి కాక మరెందుకు? భూములు కలిగుండడమే వాళ్ల తప్పు. అవి లేకపోతే మా పని సులభమయ్యేది కదా’ అని.

ముస్లిం, క్రైస్తవులు తతిమ్మా హైందవేతరులందూ హిందూమతం పుచ్చుకోవాలని బెదిరిస్తున్న సంఘ్ పరివార్ కూడా ఇలాగే అంటోంది కదా, ‘ముస్లింలతో హిందూ జనాభాకు ముప్పు ఏర్పడింది. వాళ్లు ఎక్కువ మంది కనేస్తున్నారు. హిందువులూ ఎక్కువ మందిని కనాలి. ఈ దేశంలోని సమస్యలన్నింటికీ మూలం లౌకికవాదులే. వాళ్లు లేకుంటే సమస్యలే లేవు. హైందవేతరులే ఈ దేశానికి పీడ. అందరూ హిందువులైతే సమస్యలే ఉండవు..’

‘తప్పంతా ప్రేక్షకులదే. హింస, బూతు, రక్తపాతాలను ఎగబడి చూస్తున్నారు. అందుకే అలాంటి సినిమాలే తీస్తున్నాం. మమ్మల్ని తప్పుబడితే ఎలా?’

‘వాళ్లకు ఓట్లేసి గెలిపించారు కదా, మరో ఐదేళ్లు అనుభవించండి. అదే నన్ను గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్ కాదు స్వర్గం చేసేసి ఉందును.. గెలిపించలేదు కనుక తప్పంతా మీదే’

‘మేం పాఠాలు బాగానే చెప్పాం. తప్పంతా పిల్లలదే. క్రికెట్ మ్యాచ్ అనీ, సినిమాలనీ సరిగ్గా చదవకుండా ఫెయిలయ్యారు. అయినా గవర్నమెంట్ స్కూళ్లకు వచ్చే పిల్లలకు చదువెలా వస్తుందిలెండి?’

‘లక్షలు పోసి చదివించాం పిల్లలను. ఎందుకూ పనికిరాకుండా పోయారు. తప్పు వాళ్లదే..’

‘లంచాలివ్వకుంటే పనులు జరుగుతాయా? ఆ మాత్రం తెలియకపోతే ఎలా?’

‘తప్పంతా పాఠకులదే.. మేం రాసేవి మంచిపుస్తకాలు కాకపోవచ్చు. కానీ వాళ్లు అలాంటివే చదువుతున్నారు కనుక అవే రాస్తున్నాం’

‘మేం కమ్యూనిస్టులం. కానీ మా షాపుల్లో భారతరామాయణాలు, భగవద్గీతలు, భాగవతాలు, హస్తసాముద్రిక పుస్తకాలు.. ఇంకా కమ్యూనిజానికి బద్ధవ్యతిరేకమైనవన్నీ అమ్ముతాం. పాఠకులు వాటిని కొంటున్నారు కనుక. తప్పు మాది కాదు, వాళ్లదే’

‘…………………………………….’

‘…………………………………….’

‘…………………………………….’

నేరమేదైనా సరే బాధితులదే తప్పు! బాధితులు, పీడితులు లేకపోతే ఏ సమస్యా లేదని సూత్రీకరణ! పేదలు, అబలలు, అనాథలు, అభాగ్యులు లేని లోకం కోసం యమ పరితపించిపోతున్న ఈ దయామయుల, సమసమాజ స్వాప్నికుల, సున్నిత మనస్కుల ఆశయాలను నెరవేర్చడానికి బాధితులారా కదలండి! కదం తొక్కుతూ, పదం పాడుతూ కార్లకిందా, రైళ్లకిందా పడి చావండి! కామపిశాచాల అత్యాచారాలకు సహకరించండి! భూబకాసురుల ఆకలి తీర్చి గంగలో దూకండి! ఈ కరుణామయుల కలల సాకారానికి ఎన్నెన్ని రకాలుగా చావాలో, అన్నన్ని రకాలుగా చావండి!. ఛస్తే పోయేదేమీ లేదు, లోకం బాధలు తప్ప! !

*

 

 

ఆత్మలు అశాంతించుగాక!

    -ఆక్రోశ్

 

అమావాస్య చంద్రుళ్ల వెయ్యినాలుకలు

రంగులన్నీ నాకేశాక

మిగిలిన వట్టి తెలినలుపుల లోకం

పచ్చని అడవిలో పిచికారి కొట్టిన రక్తం

చిదిమేసిన పేరులేని కీటకాల నల్లనెత్తురు

తార్రోడ్డుపై యముని శకటం జుర్రుకున్న దేహాలు

థర్డ్ డిగ్రీ గదిలో నంజుకుతిన్న బూడిదరంగు మాంసం ముక్కలు

 

తెలినలుపుల ఆత్మరక్షణకు

వేట తిరుగులేని ఆయుధమైపోయాక

చర్యకు నిస్సిగ్గు ప్రతిచర్య చట్టబద్ధమైపోయాక

రక్తచందనం దుంగలకు వేలాడిన పీనుగులు

సంకెళ్లకు చిక్కుకున్న తుపాకీ సహిత శవాలు

 

తెలినలుపుల నాగరకతలో

హతులెప్పుడూ హంతకులూ దుర్మార్గులూ

కట్టేసిన చేతులతో ప్రాణాలు తీసేవాళ్లు

కత్తులతో తుపాకులపై గురిపెట్టేవాళ్లు

చివరకు తప్పనిసరిగా హతమైపోయేవాళ్లు

అందుకే హతులెప్పూడు అంతమొందాల్సినవాళ్లు

అంతమొందించేవాళ్లెప్పుడూ వీరాధివీరులు

 

తెలినలుపుల లోకంలో

హతుల చరిత్ర అందరికీ తెలిసిందే

ఎగుడుదిగుడు చరిత్ర దార్లలో పడుతూ లేచినవాళ్లు

ప్రాణాలు తీసినవాళ్లు, ప్రాణాలకు తెగించినవాళ్లు

ప్రాణాలు నిలుపుకోడానికి అడవులకెళ్లినవాళ్లు

నేరాల చిట్టాలను ఎక్కడా పారేసుకోకుండా

సీల్డు బీరువాల్లో భద్రపరచుకున్నవాళ్లు

 

తెలినలుపులకావల

కొన ఊపిరితో కొట్టుకుంటున్నలోకానికి

ఇక తెలియాల్సింది చంపిన వాళ్ల చరిత్ర..

అంతవరకూ హతుల ఆత్మలు అశాంతించుగాక!

~