మొండెమే లేని లేత మల్లె ఒకటి

resize

మా ఇంట్లో
నేను , మా అమ్మ , ఒక మొగాడు

సెలయేటి అంచులా
మాత్రమే అమ్మ
నిశ్శబ్ద చప్పుడు చేస్తూ

నా గదిలో –
సమాధి లాంటి ఒక నోరు ,
గోడల మేకులకు వేలాడే
మాటల ఆత్మలు ,
ఒక ఖాళీ పడక –
చేయి మెలిపడ్డ బార్బీ దానిపై

నా గదిలో ఎడారి
మా ఇంట్లో ఒక ఉప్పెన
కలిసే ఉంటాయి
పొంచి ఉన్న పులుల్లా

పెట్టీ కోట్
పడకపై దుప్పటి
శిశిర కపోతం తెగిపడ్డ మెడతో
రుద్దేసుకున్నట్టు
అన్నీ ఎప్పుడూ విశాదిస్తూనే ఉంటాయి
ఏదో విశదీకరిస్తుంటాయ్

మా ఇంట్లో ఒక
మొగాడు !

సాంభ్రాణి ధూపం లో
తలారబోసుకుని 
నేరము నిద్రిస్తుంది
మాతోనే ఉంటుంది నేరమొకటి 

నేను మానాన్ని
గుప్పిట్లో పట్టి
లుంగలు చుట్టుకుని 
వెక్కిళ్ళు పెడుతున్నప్పుడల్లా
ఉలిక్కి పడుతుంది అది

మొగాడు
ఇళ్ళంతా కలియ తిరుగుతున్నాడు
అర్ధాకలి పడ్డ మత్తేభం లా ……………….

( Dedicated to all those delicate flower buds living in terrifying conditions day in and day out…..)

 -ఆంధ్రుడు 

andhrudu

ఎప్పుడన్నా నేను

రాత్రిలా అలంకరించుకోవాలనుకుంటాను నేను
అక్కడక్కడ చుక్కలతో – ఎక్కడో నెలవంకతో
వెలుగుతో చెరచబడి
ఉదయం నెత్తుటితో మొదలయ్యే జీవితం అవుతుంది నాది

గాలిలా స్నేహించాలనుకుంటాను నేను
అక్కడక్కడ స్పర్శలతో – ఇంకో చోట సుడిగుండం బిగి కౌగిలిలో
ఋతువుతో అవమానింపబడి
దిక్కు తోచని దిక్కు లేని తనమే తోడౌతుంది నాకు

కనీసం

చేపలా ఏకాకి తనాన్ని అనుభవించాలనుకుంటాను నేను
ఎప్పుడన్నా కొన్ని నీటి ముద్దులతో – అప్పుడప్పుడు
నీటి బుడగల్లాంటి మనుష్యుల మధ్య ప్రయాణం తో
పారే నీటిలో ప్రతి క్షణం
మొప్పల్లో నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది

జీవించడం రెండు భూగోళాల మధ్య
రూపమే లేని పాల పుంతలా ఉంది
సరే !
ఆశల విలువ బతుకు కంటే అమూల్యమైనది కదా ! !

-ఆంధ్రుడు

My photo-1