కలలో మనుషులు

 

-అల్లం వంశీ

~

 

allam-vamsi“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”  ఆరో తరగతి చదివే కొడుక్కు అన్నం తినిపించుకుంట అన్నడు రాజన్న..

ఏంది బాపూ, ఎప్పుడేదడిగిన గిట్లనే అంటవ్..!! మూతి చిన్నగ చేస్కోని అన్నడు సతీషు..

నాకు తెలుస్తె చెప్పనారా? నిజంగనే నాకెర్కలేదు నాయినా..

ఏ పో బాపూ.. ఊకె గిట్లనే అంటవ్.. ఇంకోసారి నిన్నేదడగద్దు..

అరే.. అన్నీటికి గట్ల అలుగుతె ఎట్లరా??  ఇంగో ఈ బుక్క తిను.. బడికి ఆలిశమైతాంది, మళ్ల బస్సెళ్లిపోతది..

సతీష్ బుక్క నోట్ల పెట్టుకోకుండ “వద్దన్నట్టు” తలకాయి అడ్డం తిప్పిండు..

రాజన్న “ఇగ ఏదన్నొకటి చెప్పకపోతె వాడు తిండి తినడని” తనకు తోచిందేదో చెప్తాండు-

గాందీతాత అంటె…. గాంధీతాత అప్పట్ల, ఎనుకట ఉండేటోడు.. అప్పటికింక మీం పుట్టలే కావచ్చు!

ఇగో ఈ బుక్క తిను… చెప్తానగారా.. తినుకుంట ఇను.. ఇగో.. ఆ.. ఆ… అని సతీషు నోట్లోబుక్కపెట్టి-

అప్పట్ల మనకాడ తెల్లోల్లుంటుండేనట..

తెల్లోల్లంటే?

తెల్లోలంటె తెల్లోల్లేరా.. గీ.. మనా… గీళ్లను సూళ్ళేదా.. టీవీ ల అప్పుడప్పుడత్తరు సూశినవా?? గిట్ల ఇంగిలీషుల మాట్లాడుతరు సూడు.. గాళ్లు.. ఇంగో.. బుక్క వెట్టుకో..

ఆ..

రాజన్న ఇంకో బుక్క వెట్టి-

ఆ.. ఆళ్లున్నప్పుడు మరి ఈనె మనకు మంత్రో.. మరోటో ఉంటుండే గావచ్చురా..

ఎవలు.. గాంధితాతా?

ఆ.. ప్రెదాన మంత్రో.. ముక్యమంత్రో… మొత్తానికైతే ఏదో ఓటి ఉంటుండెనట…

ఆ..

అప్పుడు సొతత్రం అదీ ఇదని పెద్ద లొల్లుంటుండెనట.. ఇంగో బుక్కవెట్టుకో..

సొతంత్రం అంటే??

సొంతంత్రం అంటె…

సొతంత్రం అంటే సొతంత్రమే ఇగ.. మొన్నటిదాంక తెలంగాణ లడాయి లేకుండెనా?

ఆ..

అట్లనే అప్పుడు దేశం కోసం సొతంత్రం లడాయుండెనన్నట్టు.. ఇoగో ఈంత బుక్క వెట్టుకో…

ఆ.. లడాయైతుంటె??

అయినా, అయన్ని మనకెట్ల తెలుత్తయిరా.. ఇప్పటివేరం అప్పుడేమన్న పేపర్లా? టీవీలా?? అసలప్పుడు మనూరు మొత్తం కలిపి రెండిండ్లే ఎరికేనా??

మీ చిన్నప్పుడు టీవీల్లెవ్వా బాపూ??

టీవీలా?? టీవీలు కాదు నాయినా.. మాకసలు సైకిలంటెనే ఎర్కలేకుండే… అప్పుడు గియన్నెక్కడియిరా…..  అనుకుంట ఇంకో బుక్క పెట్టబోతే సతీష్ “కడుపు నిండిందన్నట్టు” అంగీలేపి బొత్త సూయించిండు… మిగిలిన రెండు బుక్కలూ రాజన్న నోట్లేసుకోని ఖాళీ కంచం బాయికాడ బోర్లేశిండు…

ఇంతలనే సతీషు జబ్బకు సంచేసుకోని బడికి తయారైండు… వాళ్లమ్మ పాత స్ప్రైట్ సీసను మంచిగ కడిగి నీళ్లు పోశిచ్చింది.. ఆమెకు టాటా చెప్పి తండ్రికొడుకులిద్దరు సైకిల్ మీద మొండయ్య హోటల్ కాడికి బయలెల్లిన్లు..

తొవ్వపొంటి రికామనేదే లేకుంట కొన్ని వందల ప్రశ్నలు అడుగుతనే ఉన్నడు సతీషు..

హోటలుకాడికి పొయ్యేపోవుడుతోనే “పల్లె వెలుగు” బస్సు రానే వచ్చింది…  అది మండల్ హెడ్ క్వార్టరుకు పొయ్యే బస్సు.. ఇక్కడికి పది కిలో మీటర్లు దూరం.. సతీష్ తోని పాటే ఇంకో నలుగురైదుగురు పిల్లలు బస్సెక్కిన్లు….

వాళ్లందరు సదివేది ఒక్క బల్లెనే.. సర్కార్ బడి.. ఆ హెడ్ క్వార్టర్లనే ఉంటదది..  వీళ్ల లెక్కనే చుట్టుపక్కల ఉన్న ఓ పది పన్నెండు ఊళ్లకేంచి చానమంది పిల్లలు ఇట్లనే రోజు బస్సులెక్కో, సైకిల్లు తొక్కో అదే బడికి వస్తుంటరు…

లోకలోల్లకూ,  ప్రైవేటు స్కూలు పిల్లలకు ఈ బాదుండదు, మంచిగ పొద్దుపొద్దుగాల్నే స్కూల్ బస్ ఇంటి గల్మలకే అచ్చి ఎక్కించుకుంటది, మళ్ళ పొద్దూకంగ అదే గల్మల పడగొట్టిపోతది… సతీషులాంటోళ్లకు అసొంటి బడికి పోవుడనేది ఎడారిల “ఒయాసిస్సే”… అదటుంచుతే సర్కార్ బల్లె అయితే ‘మాపటీలి తిండి’ ఉంటదికదా…!!!

******

అరేయ్… గాంధీతాత గురించి నేర్సుకచ్చుకొమ్మన్నగారా.. నేర్సుకచ్చుకున్నరా?? సార్ అడిగిండు..

ఈ సార్ మొన్న మొన్ననే జిల్లా హెడ్ క్వార్టరు కాంచెళ్లి ఈ బడికి ట్రాన్స్ ఫర్ అయి అచ్చిండు..

ఏందిరా?? ఎవ్వలు సప్పుడు చేస్తలేరు?? నేర్సుకచ్చుకున్నరా లేదా??

“నేర్సుకచ్చుకున్నం సార్” అని కొందరు.. “నేర్సుకచ్చుకోలేద్ సార్” కొందరు అంటున్నరు..

ఏందిరా?? నపరొక మాటoటాన్లు?  అసల్ నేర్సుకచ్చుకున్నారా లేదా?? గొంతు పెంచి అడిగిండు సారు..

గుంపుల గోవిందలెక్క ఈసారి అందరు గట్టిగ “నేర్సుకచ్చుకున్నం సార్” అన్నరు తలకాయలూపుకుంట.. అనుడైతె అన్నరుకని “నన్నెక్కడ లేపి అడుగుతడో” అని ప్రతి ఒక్కరికి లోపట లోపట గజ్జుమంటాంది.

“మందల గొర్ల వేరం అందరు తలకాయలూపుడు కాదురా,  ఒక్కొక్కన్ని లేపి అడుగుతె అప్పుడు బయట్వడ్తయ్  మీ యవ్వారాలన్ని..”  అనుకుంట క్లాసు రూం మొత్తం కలె చూస్తూ బేంచిల మద్యలనుంచెళ్లి లాష్టుబేంచిల దిక్కు నడిశిండు  సారు..

ఆ మాట వినంగనే అప్పటిదాంక మంచిగ సాఫ్ సీదా ఉన్న పిల్లల నడుములు ఒక్కసారిగ వంగి, గూని అయినయ్!

అట్ల వంగి కూసుంటే సార్ కు కనిపియ్యమని వాళ్ల నమ్మకం.. తలకాయలుకూడ నేల చూపులు చూస్తున్నయి… ఎవలకువాళ్లు మనసుల- “సార్ నన్ను లేపద్దు.. సార్ నన్ను లేపద్దు” అనుకుంటాన్లు…

అరే.. నారిగా.. లే రా…

లాస్టు బేంచిల అటునుంచి ఫష్టుకు కూసున్న నరేషు భయం భయంగ లేశినిలుసున్నడు..

చెప్పురా.. గాంధితాత ఎవరూ? ఆయినె దేశానికేం చేశిండు??

సార్.. అంటే.. అదీ.. సార్.. అని మాటలు నములుతాండు తప్పితే నోట్లెకేంచి కూతెల్తలేదు నరేషుకు..

ఏందిరా?? నేర్సుకచ్చుకోలే?? మీరు పుస్తకాలెట్లా తియ్యరు.. కనీసం ఇంట్లోల్లను అడిగన్న తెల్సుకచ్చుకొమ్మని చెప్పిన గారా.. అని సట్ట సట్ట రెండు మొట్టికాయలు కొట్టిండు సారు..

అబా… అద్దు సార్ అద్దుసార్.. నిన్న ఆణ్నే బొడుసులేశింది సార్.. అద్దు సార్.. అద్దుసార్ అని నెత్తి రుద్దుకుంటూ బతిమాలిండు నరేషు…

అరే రాజుగా నువ్వు చెప్పురా…

సార్.. అదీ.. సార్.. నిన్న మా అవ్వ పత్తేరవొయ్యింది సార్… ఇంటికి రాంగనే ఈ ముచ్చట్నే అడుగుదామనుకున్న సార్.. కని అచ్చేవరకే బాగ నెరివండుండే సార్.. అందుకే….

అందుకే అడగలేదంటవ్?? సాప్ మట్టల్ సాప్..

“ఫాట్”.. “ఫాట్”… సదువు రాదుకని సాకులు మాత్రం అచ్చు.. దినాం కొత్త సాకు.. సాపు..

“ఫాట్”.. “ఫాట్”…

ష్ష్ .. అబ్బా.. అద్దు సార్ అద్దు సార్ అనుకుంట మట్టలను జాడించిండు రాజు…

మీ లాష్ట్ బేంచి బతుకులెప్పుడు గింతేరా.. గిట్లనే గంగల కలుత్తయ్ మీ బతుకులు…. అని పక్కకున్న ఇంకిద్దరిని కూడ తలో నాలుగు దెబ్బలు సరిశి ముందుకు అచ్చుడచ్చుడే-

అరే సత్తీ… లేరా… చెప్పూ.. గాంధి తాత ఎవరూ? ఆయినేం జేశిండు??

గట్టిగ చెప్పు.. అందరికినవడాలే..

ఫస్ట్ బేంచిల కూసున్నవాళ్ళకు అన్నీ తెలుస్తయని సారు నమ్మకం.. నమ్మకానికి తగ్గట్టే, సతీష్ సుత ఏ మాత్రం భయపడకుండ ఠక్కున లేశి చేతులు కట్టుకోని చెప్పుడు వెట్టిండు..

సార్.. గాంధి తాతా.. అప్పట్ల… తెల్లోల్లున్నప్పుడు… మన మంత్రి ఉండేటోడు…

ఏందీ???

మంత్రి సార్.. మినిష్టర్..

ఏం మినిష్టర్ రా???

సార్ మాటల వ్యంగ్యం సతీష్ కు అర్థంకాక ఇంకింత ఉత్సాహంగ-

ప్రధాన మంత్రో, ముఖ్య మంత్రో ఉంటుండే సార్.. ఏదో తెల్వదు కని ఈ రెండీట్ల ఏదో ఓటుంటుండె సార్..

సార్ మొఖం ఎర్రగ అయింది…

“గాంధి తాతా మంత్రారా?? ఆయినె ముఖ్యమంత్రని నీకు మీ నాయిన చెప్పిండారా?” అనుకుంట  గిబ్బ గిబ్బ రెండు గుద్దులు గుద్దిండు సారు….

కాద్సార్ కాద్సార్.. ప్రెధాన మంత్రి సార్.. ప్రెధానమంత్రి సార్..

“మీ నాయినే చేశిండట్నారా ప్రధానమంత్రిని? ఆ??”                        వెన్నుబొక్క మీద ఇంకో రెండు గుద్దులు..

మా బాపు చెప్పింది చెప్పినట్టే అప్పచెప్పినా సుత సార్ కొడ్తుండేందని సతీషుకు మస్తు దుఃఖమస్తాంది కని ఆపుకుంటాండు.. ఎంత ఆపుకున్నాగని గుడ్లెంబడి నీళ్లు రానే అచ్చినయ్..

ఇంకో ఇద్దరు ముగ్గురు ఫష్టు బేంచోళ్ళను లేపి అడుగుతెసుత అసొంటి జవాబులే వచ్చినయ్.. గాంధి తాత గరీబోడూ, బట్టలుసుత లేకుండెనట అని ఒకరు చెప్తే, గాంధితాత ఉన్నోడేగని, ఉన్నది మొత్తం గరీబోల్లకు దానమిచ్చి అట్లయిండని ఇంకోడు చెప్పిండు.. ఇవన్ని వింటున్న సారుకు బీపీ పెరిగింది..

వాళ్ళ వేల్ల మధ్యలో చాక్ పీసు పెట్టి వొత్తిండు..

వాళ్లు “వావ్వో.. వావ్వో అద్దుసార్ అద్దుసార్” అని మొత్తుకుంటున్నా సార్ కు వినపడ్తలేదూ , విడిచిపెట్టబుద్ధైతలేదు.!

“థూ.. ఏం పోరగాన్లురా మీరు?? దునియాల గాంధి తాత గురించి ఎర్కలేనోడు ఉంటడారా?? ఓడు మినిష్టరంటడు, ఓడు గరీబోడంటడు, ఓడు అదంటడు ఇంకోడు ఇదంటడు..!! ఏడికెల్లి దాపురించిన్లురా ఇసంటి సంతంత!!! తినున్లిరా అంటె గిద్దెడు తింటరు ఒక్కొక్కడు.. సదువు మాత్రం సున్నా.. ఎందుకస్తర్రా ఇసొంటి గాడిదికొడుకులు మా పానం తినడానికి?  థూ..” నాలుక కొస్సకు ఇంక చాన మాటలున్నయి.. కని ఆపుతున్నడు..

పిల్లలందరూ తప్పు చేసినట్టు తలలు కిందికి వేస్కున్నరు..

మీకు తెల్వకపోతె తెల్వదు.. కనీసం మీ ఇంట్లోల్లనన్న అడిగి తెల్సుకోని రావద్దారా? ఆ? మీ నాయిన్నో, అవ్వనో.. ఎవరో ఒకల్ని అడిగి నేర్సుకోని రావద్దా??

నీన్ అడిగిన సార్..  సతీషు మెల్లగ అన్నడు..

మాద్దండి అడుగుడడిగినవ్ పో.. అదే చెప్పిండార మీ నాయిన?? గాంది తాత.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రని??

ఔన్ సార్..

“ఎవడ్రా మీ అయ్యకు సదువుచెప్పినోడు? గాంధీజీ మన ముఖ్య మంత్రా?? ఆ?? చెప్పూ.. ముఖ్యమంత్రా??” చెవు మెలివెట్టిండు సారు..

ఆ.. ఆ.. ఎమ్మో సార్.. కాద్సార్.. కాద్సార్..

మీ అయ్య ఊళ్లె ఉంటాండా?? అడివిల ఉంటాండారా?? ఆ?? గాంధితాత ఎర్కలేదారా మీ అయ్యకు??

అని మళ్ళ క్లాస్ అంత కలెతిరిగి చూస్తూ- సరే వీళ్ల నాయినకు ఎరుకలేదట.. మరి మీ అందరి సంగతేందిరా??

మావోళ్లుసుత ఎర్కలేదన్నరు సార్.. అందరు మళ్ల గుంపుగ జవాబిచ్చిన్లు..

ఎవడన్న వింటె ముడ్డితోని నవ్విపోతడు ఎర్కేనా? మీ వొళ్లంత ఊళ్ళె ఉంటాన్లా జంగిల్ల జంతువుల్తోటి ఉంటాన్లా? గాంధి తాత గురించి తెల్వదనుడేందిరా? మీ నకరాలు గాపోతె…. ఇట్ల కాదుకని ఇయ్యాల మీ సంగతి చూశినంకనే ఇంకో పని..

ఒక్కొక్కడు లేశి మీ నాయినలేం జేత్తరో చెప్పున్లిరా… మీ ఈపులు మొత్తం సాఫ్ చేశే పోత ఇయ్యాల…  చెప్పుర సంతు మీ నాయినేం జేత్తడ్రా…

సార్… మా బాపు.. మా బాపు చాపల వడ్తడు సార్..

ఏందీ?

ఔ సార్.. మా బాపు చాపల వడ్తడు.. మా బాపు గాలమేత్తె కం సె కం కిలకు తక్కువ చాప వడదు సార్.. ఇగ వలేత్తెనైతె వశపడదు సార్..

సార్.. మా బాపు ఉట్టి చేతుల్తోటిసుత చాపలు పడ్తడు సర్..

ఆ..!!

మా బాపు నీళ్లల్లకు దిగిండంటే  చాపలే ఆయినకు ఎదురత్తయంటరు సార్ మా ఊరోళ్ళు..

ఇంకా??

Kadha-Saranga-2-300x268

“మా బాపు ఎవుసాయం జేత్తడు సార్… నారు వోశిన కాంచి అడ్లు కొలిశేదాక మొత్తం అన్ని చేత్తడు సార్ మా బాపు..” ఓదెలు అందుకున్నడు.

ఆ..

అడ్లను ఒక్కచేత్తోనే గుప్పిట్ల ఇట్ల వట్టుకోని ఆటిని నలిపి బియ్యం తీత్తడు సార్ మా నాన.. బియ్యం నలుపుతె పిండి పిండి అయితసార్ నిజంగా…

అచ్చా.. ఇంకా..

మా నాయిన పడువ తోల్తడు సార్.. మనూరోల్లు శివారానికి, ఏలాలకు పోవాల్నన్నా, ఆ ఊళ్ళోల్లు మనూళ్ళెకు రావాల్నన్నా మా నాయిన పడువొక్కటే సార్…

అచ్చా!!

నిరుడు హోళి అప్పుడు ముగ్గురు పోరగాన్లు కయ్యలల్ల వడి మునుగుతాంటె ఆళ్లను మీదికిగ్గింది మా నాయినే సార్.. ఇప్పటిదాంక అట్ల బొచ్చెడుమందిని బచాయించిండుసార్ మా నాయిన..

ఆ..!!

సార్.. మన జిల్లా మొత్తమ్మీన ఆనా కాలం, గంగ ఇటొడ్డు కాంచి అటొడ్డుకు ఈత కొట్టే మొగోడు మా నాయినొక్కడే అట సార్.. మా కాక చెప్తడు..

ఇంకా..??

సారు విసుగుతో, వ్యంగ్యంతో అంటున్న “ఇంకా” అనే మాట ఆ పిల్లల కు చాన పాజిటివ్ గ అనిపించింది… మా సార్ మా నాయినలు గురించి తెల్సుకోవాల్నని అడుగుతున్నడు అనుకోని ఇంకింత ఉత్సాహంతో తమ తమ తండ్రుల గురించి చెప్పుడు షురూ చేశిన్లు ఒక్కొక్కరు..

మా అయ్య అమాలి పనికి పోతడు సార్… మొత్తం లారెడు లోడు ఒక్కన్ని ఎక్కియ్యమన్నా ఎక్కిత్తడు సార్, మళ్ల దించుమంటె సుత అప్పటికప్పుడు దించుతడు సార్ మా అయ్యా..  రవి చెప్తున్నడు..

ఆ..

పేనేడాది గా బుచ్చన్నోళ్లు, కచ్చరమ్మీద అడ్ల బస్తాలు చేరగొడ్తాంటే జొడెడ్లల్ల ఒక ఎద్దు తొవ్వల్నే సచ్చిపేంది సార్.. అప్పటికే ఆయిటిపూని ఎప్పుడు వానకొట్టేది ఎర్కలేకుంటున్నది.. కచ్చరంల పదిహేను కింటాల్ల అడ్లున్నయట సార్, కప్పుటానికి బర్కాల్ సుత లెవ్వు.. సరిగ్గ అదే టయానికి మా అయ్య అటుకేంచి పోతాంటె సమ్మన్నా జర సాయం పట్టరాదే అన్నరట సార్.. గంతే.. కనీ వట్టుకోని కచ్చురాన్ని అమాంతం లేపి జబ్బ మీదికెత్తుకున్నడట సార్.. కనీకి ఓ దిక్కు ఎద్దు ఇంకో దిక్కు మా నాయిన… అట్ల ఆరు కిలమీటర్లు ఇగ్గుకచ్చి అడ్లు ఇంటికి చేరగొట్టిండు సార్… మా బుచ్చన్నమామ ఇప్పటికి చెప్తడు…

ఆహా..! ఇంకా?

సార్… మా నాయిన కోళ్లు పెంచి అమ్ముతడుగని ఆయినెకు పామ్మంత్రం, తేలు మంత్రం ఎరికెసార్… షరీఫు లేశి అన్నడు.

ఆ..

నా అంతున్నప్పుడే మా నాయిన నాగుంబాములు ఉట్టి చేత్తోటి వట్టిండట సార్.. నాగుంబాం కుట్టినా, కట్లపాం గుట్టినా, చిడుగువడ్డా.. మా నాయినకాడ మొత్తం అన్నీటికి మందున్నది సార్… అసల్ ఇప్పటిదాంక ఒక్కర్నిసుత సచ్చిపోనియ్యలేసార్ మా నాయిన..

“ఇదెక్కడి లొల్లిరా బాబు..” సార్ మనసులోనే అనుకుంటాండు..

సార్ మా బాపు కల్లు గీత్తడు సార్.. తాళ్లుంటయి గద సార్.. పొద్దుగాల పదింటికి దాని నీడ ఏడి దాక వడ్తదో ఎర్కెగద సార్??  అగో.. ఆ నీడ మీద మనం ఇటుకేంచి అటు నడిశి, మళ్ల అటుకేంచి ఇటూ ఎనుకకు మర్రచ్చేంతల మా బాపు ఆ తాడెక్కి లొట్లుసుత వట్టుకోని దిగుతడు సార్.. గంత జెప్పన ఇంకెవలెక్కర్ సార్.. పవన్ చాతి ఉబ్బించి మరీ చెప్పిండు.

మాట మాటకు సారుకు విసుగు పెరిగిపోతాంది…

సార్..  మా నాన బట్టల్ కుడ్తడు సార్… అంగీలు, లాగులు, ప్యాంట్లు, బనీన్లు మొత్తం అన్ని కుడ్తడు సార్… అసల్ చేతుల టేపు వట్టకుండ, కొల్తలు తియ్యకుంట ఉట్టిగ మనిషిని చూత్తె సాల్ సార్, బరాబ్బర్ ఎవలి సైజుల వాళ్ళకు బట్టలు కుట్టిత్తడు సార్ మా నాన… చెప్పిండు రమేషు..

సార్ మా నాయిన సాకలోడు సార్.. సార్ మా బాపు పాలమ్ముతడు.. మా బాపు మంగలాయినె సార్… మా నాయిన కట్టెలమ్ముతడు.. మేస్త్రి పని చేత్తడూ..  చాయి బండి.. సాలె మగ్గం.. కుమ్మరి కుండలు.. ఇస్తిరి డబ్బా… పాతినుపసామాన్… అని ఒక్కొక్కరు మస్తు సంబురంగ సార్ సార్ అనుకుంట తమ తండ్రుల గురించి చెపుతున్నరు.. క్లాస్ అంతా పిల్లల ఉత్సాహంతోని నిండిపోయి.. మంచి ఆహ్లాదకరంగా మారిపోయింది..

కాని ఇంతలనే “నీ యావ్… ఇగ సాలు ఆపున్లిరా…” అన్న మాట ఆ గదిల ప్రతిధ్వనించింది..

పులిని చూశి భయపడ్డట్టు పిల్లలందరు ఒక్కసారి గజ్జున వణికిన్లు సార్ కోపం చూసి..

చెప్పుమన్నకదా అని ఒక్కొక్కడు మా అయ్య మినిస్టరు, మా అయ్య కలెక్టరు అన్న లెవల్ల చెప్తాన్లేందిరా??

అసలొక్కటన్న మంచి పని ఉన్నదార మీరు చెప్పిన దాంట్ల?? నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..

పిల్లల మొఖాలు మాడిపొయినయ్..

ఓడు పాలమ్ముతడట.. ఓడు చాపల్ వడ్తడట.. గివ్వారా పనులంటే? ఆ?? గివ్వేనా??

పిల్లల పానం సల్లవడుతాంది, సారుకు మాత్రం ఒళ్లంత మంట వెట్టినట్టయితాంది..

మూటలు మోశుడూ, బర్ల ముడ్లుకడుగుడూ ఇయ్యారా పనులు? ఆ??

నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..  ఊరోళ్లూ.. ఊరి కథలు… నీ.. యవ్.. మిమ్ముల గాదుర నన్నీడికి ట్రాన్స్ ఫర్ చేశినోన్ని అనాలె ముందుగాల.. థూ.. ఇసొంటి మనుషుల్ని నీనేడ సూల్లేదవ్వా… ఓ సదువులేదు ఓ తెలివి లేదు..

గాంధీజి ముఖ్యమంత్రట.. చత్.. మరీ గింత అనాగరికంగ ఎట్లుంటర్రా మనుషులు?? ఎసొంటోల్లత్తర్రా మా పానాల మీదికి?? అని ఇంకేదో అంటున్నంతలనే అన్నం బెల్లు కొట్టిన్లు..

పొట్ట చీరుతె అక్షరం ముక్క రాదుగని, టైముకు తిండి మాత్రం పెట్టాలె మీకు!! నాన్ సెన్స్ అని నాన్ సెన్స్.. చత్… ఏం రాజా బతుకురా మీది!!  అనుకుంటూ తొవ్వలున్న కుర్చీని కోపంగ పక్కకు నూకి బయటికి నడిచిండు సారు…

మాములుగ బెల్లుకాంగనే “మధ్యానం భోజనానికి” కంచాలువట్టుకోని గ్రౌండుకాడికి ఉరికే పిల్లలు ఇయ్యాల మాత్రం కూసున్న కాంచెల్లి లేవలే..

ఇన్ని రోజులు వాళ్ళు తమ తండ్రులు చేసే పనులు మహ మహా అద్భుతాలనుకున్నరు.. కని సార్ మాత్రం ఇంకో తీరంగ అంటున్నడు.. ఎందుకట్లన్నడనేదే వాళ్లకు సమజైతలేదు..

ఎవ్వరికి అన్నానికి లేవ బుద్దైతలేదుకని ఆ రోజు ఉడ్కవెట్టిన కోడిగుడ్డు ఇచ్చే రోజు.. వారానికి ఇచ్చేదే రెండ్లు గుడ్లు..  అందుకే గుడ్డు మీద ఆశకొద్ది పాపం అందరు కంచాలు వట్టుకోని బయటికి నడిశిన్లు…

******

సాయంత్రం ఏడింటికి..

“సార్” వాళ్ళింట్ల టీవీ చూస్కుంట ఫోన్ మాట్లాడుతున్నడు..

“ఎక్కడ బావా!! రూపాయి దొర్కుతె ఒట్టు…  మాదేమన్న మీలెక్క రెవెన్యూ డిపార్టుమెంటా చెప్పు? మీరు కుక్కను తంతె పైసల్ రాల్తయ్.. మా ముచ్చట అట్లకాదుకదా.. అందుకేగదా ఇయన్ని యవ్వారాలు..”

అవతలి మనిషి ఏదో అన్నడు..

vamshi

వంశీ కథాసంపుటి ఆవిష్కరణ సందర్భంగా…

అయన్ని కాదు కని బావా నువు కొంటానవా లేదా ఒకటే ముచ్చట చెప్పు.. బయటోళ్లకైతె నాలుగ్గుంటలు పదికిత్తా అంటున్నరు, నువ్వు మనోనివి కాబట్టి నీకు ఆరుకు ఇప్పిస్త.. సరేనా?? నా కమిషన్ టెన్ పర్సెంట్ లెక్క అలగ్ మల్ల…

డ్యాడ్….. “సార్” కొడుకు వరుణ్, తండ్రిని పిలిచిండు..

“డ్యాడ్” కొడుకును పట్టించుకోకుండ ఫోన్ ల మాట్లాడుతనే ఉన్నడు..

ట్రాన్స్ ఫర్ అంటే ఉట్టిగనే అయితదా బావా? ఎన్ని చేతులు తడుపాల్నో నీకెర్కలేదా! అందుకేగా ఇన్ని తిప్పలు.. ఫైవ్ పర్సెంట్ అంటె కాదుగని ఎనిమిది చేస్కో బావా నువ్ కాబట్టి లాష్ట్ ఇంక…

డ్యా…..డీ…. ‘కుర్ కురే’ నములుకుంటూ కొంచం గట్టిగ పిలిచిండు కొడుకు.

వాట్ బేటా??

ఐ హ్యావ్ అ డౌట్ డ్యాడ్…

యా??

వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ “పండిత పుత్ర పరమశుంఠా”??

అతనికి తన కొడుకేమంటుండో ఒక్క నిమిషం అర్థంకాలేదు..

వ్వాట్?? వ్వాట్ బేటా??

వాట్…. ఈస్…. ద…. మీనింగ్…. ఆఫ్…. “పండిత పుత్ర పరమశుంట??”..

అప్పటిదాక పక్కకుపెట్టి పట్టుకున్న ఫోన్ లో “నీన్ మళ్లీ ఫోన్ చేస్త బావ..” అని చెప్పి కాల్ కట్ చేసి.. కొడుకును దగ్గరికి రమ్మన్నడు ” డ్యాడ్”..

కొడుకు కుర్ కురే ముక్కను నోట్లె సిగరెట్ ముక్కలెక్క పెట్టుకోని తండ్రిని ఇమిటేట్ చేస్కుంట చాన క్యాజువల్ గా వచ్చి “డ్యాడ్” పక్కన కూచున్నడు..

నౌ, టెల్ మీ వాట్ హ్యాపెండ్??  అసల్ ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా నీకు??

నథింగ్ డ్యాడ్.. మా సర్ ఇవ్వాల నన్నామాట అన్నడు..

ఎందుకు?? ఎందుకట్లన్నడు??

వాడు వట్టి వేస్ట్ ఫెలో డ్యాడ్…

వరుణ్.. టెల్ మి అంటున్న కదా..

అదంత పెద్ద స్టోరీ డ్యాడ్.. లైట్ తీస్కో.. దానికి మీనింగ్ చెప్పు చాలు…

రేయ్.. మంచిగ అడుగుతున్నకదా.. చెప్పు.. అసల్ ఆ మాటెందుకన్నడు వాడు?

అరే.. ఈసీ డ్యాడ్.. ఇవ్వాల లంచ్ అవర్ లో బాక్స్ ఓపెన్ చేస్తే అందులో మళ్లీ బాయిల్డ్ ఎగ్గ్ కర్రీనే ఉండే.. మమ్మీ కి పొద్దున్నే ఫ్రై కర్రి చెయ్యమని చెప్పినాకుడ వినకుండా మళ్లీ అదే బోరింగ్ బాయిల్డ్ ఎగ్స్, టొమాటో కరీ వేసి పెట్టింది డ్యాడ్.. అందుకే మమ్మీ మీద కోపమొచ్చి బాక్స్ విసిరి కొట్టిన… బట్ అన్ ఫార్చునేట్లీ ఎగ్సాక్ట్  అదే టైం కి మా మ్యాక్స్ సర్ గాడు అక్కడికొచ్చిండు..

ఆ?? వస్తే??

వొచ్చి.. ఈ బాక్స్ ఎవరిది అన్నడు… ఐ సెడ్ ఇట్స్ మైన్… బట్ వాడు “ఎందుకు విసిరికొట్టినవ్..” అదీ ఇదీ అని పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసాడు డ్యాడ్…

అంటే?? నువ్ ఇవ్వాల కూడ లంచ్ చెయ్యలేదా వరుణ్? పక్కనే టీవీ చూస్తున్న వాళ్ల మమ్మీ అడిగింది..

గీతా.. ప్లీస్ డోంట్ చేంజ్ ద టాపిక్.. చెప్పు వరుణ్ తర్వాతేమైంది??

నతింగ్ డ్యాడ్.. నా లంచ్ నా ఇష్టం అని నేన్ కూడా ఫుల్ ఆర్గ్యూ చేసిన….

ఆ??

ఆ వేస్ట్ గాడు అక్కడో పెద్ద సీన్ చేసి నాకు క్లాస్ పీకాడు..

ఆ?

అప్పుడు  ఫైనల్ గా వాడొకటన్నాడు డ్యాడ్.. “అన్నం విలువ తెలిస్తె నువ్విట్ల చెయ్యవ్ వరుణ్” అని.. నాకు ఫుల్ కోపమొచ్చింది.. నాకు తెల్సు అన్న.. కని వాడు ఇంక ఎక్స్ట్రా చేస్తూ “అసల్ నువ్ తినే అన్నానికి బియ్యం ఎక్కన్నుంచి వొస్తాయో చెప్పు” అన్నడు..

నేన్ బియ్యం- “బియ్యం చెట్లకు” కాస్తయని చెప్పిన…

అంతే డ్యాడ్, ఆ వేస్ట్ గాడు నాతో ఇంక ఆర్గ్యూ చెయ్యలేక “పండిత పుత్రా పరమ శుంఠా” అని సాన్స్ క్రిట్ లో ఏదో అనుకుంటూ అక్కణ్నించి ఎస్కేప్ అయిండు… అసల్ ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఏంది డ్యాడ్??

“దానికి మీనింగ్ కాదురా.. అసల్ ఆ మాటన్న సార్ గాడెవడో చెప్పు.. వాని తోలు ఒలిచి పారేస్తా..

వానికెంత బలుపుంటె ఆ మాటంటడు వాడు నా కొడుకును? ఆఫ్ట్రాల్ ప్రైవేట్ టీచర్ గానికి గంతగనం మోరనా?? వాని…  లక్షల్ లక్షల్ ఫీజులు కట్టేది గిందుకోసమేనా? లంజొడుకు… నోటికి ఏదస్తె అదనుడేనా సాలెగాడు!!అసల్ ఏం అనుకుంటాండ్రా వాడు??  రేపైతె తెల్లారని.. వాన్ని డిస్మిస్ చేయించి పారేస్త స్కూల్లకెల్లి.. … …. నాన్సెన్స్ అని నాన్సెన్స్..”

******

రాత్రి ఎనిమిదయితుంది..

సతీషు అన్నం తింటలేడని వాళ్ల బాపు బతిమాలుతాండు..

“తిను నాయినా.. దా.. ఒక్క బుక్క.. దా దా.. మా సత్తి మంచోడుగదా.. దా.. ఒక్క బుక్క తిను రా నాయినా.. దా..” అనుకుంట అన్నం బుక్క నోటిముంగటే పెట్టినా సతీషు మాత్రం నోరు తెరుస్తలేడు..

“నా బంగారం కదా.. దా బిడ్డా.. ఒక్క బుక్క.. ఒక్కటంటె ఒక్కటే బుక్క.. దా నాయినా… నెరివడ్తవ్ రా రా..” అమ్మసుత మస్తు బతిమాలుతాంది కని సతిషు మాత్రం నోరు తెరుస్తలేడు..

అసల్ ఎందుకలిగినవ్ రా? ఏవలన్న ఏమన్న అన్నరా??

సత్తి మాట్లాడలేదు..

చెప్పు కొడుకా.. ఏమైందిరా??  బిస్కిటు పొడ తేవాల్నా, “ఛా”ల ముంచుకోని తినేవు??

ఉహూ..

పోని చాకిలేట్లు తేవాల్నా??

సత్తి వద్దన్నట్టు తల అడ్డంగ ఊపిండు..

మరేంగావాల్నో చెప్పురా?? ఉట్టిగనే అట్ల మా మీద అలుగుతె ఎట్లరా మరి…  దా… మా బుజ్జి కదా.. ఒక్క బుక్క తిను.. దా నాయినా..

“నాకద్దు పో.. నీన్ తినా అని చెప్పిన కదా… ఊకె ఎందుకట్ల సతాయిస్తున్లు.. నాకద్దు.. నీన్ తిన..”

సత్తి గొంతుల కోపం కన్నా దుఃఖం ఎక్కువున్నదని ఆ తల్లిదండ్రులకు ఉట్టిగనే అర్థమైంది..

ఏమైందిరా?? ఏవలన్న ఏమన్న అన్నరా??

బల్లె సారు గిట్ల కొట్టిండారా??

సత్తి కండ్లల్ల ఒక్కసారిగా నీళ్ళు ఊరుకచ్చినయ్.. ఠక్కున అమ్మ ఒడిల వాలి పొయ్యి చీర కొంగును మొఖం మీదికెళ్లి ఏసుకున్నడు..

వాడి కన్నీళ్ల వెచ్చదనం ఆ తల్లిదండ్రుల మనసుకు తెలుస్తనే ఉంది…

ఊకో నాయినా.. ఊకో రా.. దా దా దా.. అనుకుంట చేతులున్న కంచం పక్కకువెట్టి కొడుకును ఎత్తుకున్నడు బాపు..

ఎవల్రా?? మీ సారు కొట్టిండా??

మ్మ్… సత్తి ముక్కు చీదుకుంట అన్నడు..

అమ్మ ఊకో బిడ్డా ఊకో అనుకుంట కొంగుతోని కండ్లు తుడుస్తాంది..

అరెరే.. అందుకు అలిగినవా కొడుకా?? ఊకో.. ఊకో..  బాగ కొట్టిండారా సారు??

మ్మ్..  మస్తు కొట్టిండు బాపూ.. ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు.. అనుకుంట బనీను లేపి చూపించిండు..

అమ్మ కండ్లల్ల నిళ్ళచ్చినయ్ కని కొడుక్కు కనపడకుండ వెనకనే నిలుచుని అతని వెన్నును చేత్తో రుద్దుతోంది… సత్తికిసుత మళ్ల కండ్లల్ల నీళ్లస్తున్నయ్..

అరే.. ఊకో నాయినా.. నీను అటెప్పుడన్నచ్చినపుడు “మావోన్ని కొట్టద్దని” మీ సారుకు చెప్త సరేనా?? ఆ.. ఇంగో..

నోరు తెరువు… ఇగో.. ఆ.. ఆ.. ఈ బుక్క తిను… రేపు బడికిపోంగ నీకు ఉప్పు బిస్కిటుపొడ కొనిస్త సరేనా?? అనుకుంట  నోట్లో బుక్క పెట్టిండు బాపు..

సతీషు బుక్క నములుతూ- నీను రేపటి కాంచి బడికి పోను బాపూ.. మా సార్ ఉట్టుట్టిగనే మస్తు కొడ్తాండు.. మా దోస్తులుసుత బడి బంజేత్తా అంటున్లు..

లె ల్లే.. తప్పు కొడుకా అట్లనద్దు.. మీకు సదువు మంచిగ రావల్ననేగారా మీ సార్లు కొట్టేది..  గాయింత దానికే సారుమీద అలుగుతరా చెప్పు..

అట్లకాదు బాపూ.. ఆయినే మాదండోడు..

సదువు చెప్పే సారును అట్లనద్దురా.. తప్పు నాయినా.. ఇంగో బుక్క వెట్టుకో..

మీరందరు మంచిగ సదువుకోని రేప్పొద్దుగాల మంచి మంచి నౌకర్లు చేత్తె ఆ సారుకు ఏమన్నత్తదా చెప్పు?? మీ బతుకే మంచిగైతది కదా?? సార్లు ఓ మాటన్నా, ఓ దెబ్బ కొట్టినా అదంత మీరు మంచిగుండాల్ననేకని మిమ్ముల కొట్టుడు వాళ్లకేమన్న ఖాయిషా కొడుకా??  ఇంగో బుక్క తిను…  ఇంకెప్పుడు సదువు చెప్పే సార్లను అట్లనకు సరేనా..

సరే..

చెంపలేస్కో..

చెంపలు వేస్కుంటూ… “చిన్న చిన్న బుక్కలు వెట్టు బాపు” అన్నడు సత్తి..

నాయిన బుక్కను సగంచేసి పెట్టిండు.. అది నములుకుంటూ సత్తి అన్నడు- “అయినా.. ఇయ్యాల నువ్వు చెయ్యవట్టికే మా సార్ నన్ను కొట్టిండు బాపూ..”

నీన్ చెయ్యవట్టా?? నీనేం చేశిన్రా??

పొద్దుగాల “గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

******

తండ్రికొడుకులిద్దరు రాత్రి కల్లం కాడికి కావలిపొయ్యి, చిన్నపాటి గడంచెల నడుం వాల్శిన్లు.. సత్తి, బాపు చెయ్యిమీద తల పెట్టుకోని…. బొత్త మీద కాలూ-చెయ్యి ఏశి గట్టిగ పట్టుకోని పడుకున్నడు..

“బాపు” కండ్లు మూసుకున్నడు కని నిద్రపడ్తలేదు… కొడుకన్న మాటలే చెవులల్ల మళ్ల మళ్ల వినపడుతున్నయ్..

“గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

“పాపం..  నీన్ చెయ్యవట్టే నా బిడ్డ దెబ్బలు తిన్నడియ్యాల.. పాపం.. కొడుకు…” అనుకుంట కొడుకు తలను, ఎన్నునూ ప్రేమగ నిమిరిండు బాపు.. అతని కండ్లల్ల కన్నీళ్ళు..

పిలగానికి ‘జో’ కొడుతూ కొడుతూ ఏ రాత్రో తనూ నిద్రలకు జారుకున్నడు..

చిమ్మ చీకటి…

చిక్కటి నిశ్శబ్దం…

పైన చుక్కలూ..

కింద చుట్టూ.. చెట్లూ చేమల మధ్యల…  చల్లటి గాలి జోలపాటకు, కన్నంటుకోవల్సిన ఆ “అనాగరికులు”..

కలత నిద్రలో…

ఒకే కలవరింపు…

“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”

*

ప్రొఫెషనల్ కిల్లర్స్

 

 vamsi

-అల్లం వంశీ 

~

చిక్కటి కన్నీటి బొట్లు… ఒక్కొక్కటిగా రాలుతున్నాయి…

“నేనియ్యాల బడికి పోనమ్మా,” ఆరేండ్ల చింటూ ఏడ్చుకుంట అన్నడు.

“మా బుజ్జికదా.. ప్లీస్.. ప్లీస్.. ఇయ్యాలొక్కరోజు పొయిరా నాన్నా. ఇయ్యాలొక్కరోజు పొయ్యస్తే మళ్ళ రేపెట్లాగో ఆదివారమే కదా! కావాల్నంటె రేప్పొద్దంత ఆడుకుందువులే,” అని బుద్రకిస్తూ కొంగుతోని పిలగాని కన్నీళ్లు తుడుచుకుంట స్కూల్ ఆటో ఎక్కించింది వాళ్లమ్మ.

చింటూ అలిగిమూతి ముడుచుకున్నడు.

అమ్మ నవ్వుతూ ముద్దిచ్చి “టాటా నానా,” అని చెయ్యి ఊపింది.

కొడుకు మొఖం అటుతిప్పుకున్నడు తప్పితే టాటా మాత్రం చెప్పలేదు.

ఆటో ముందుకు కదిలింది. అమ్మ ఇంట్లకు నడిచింది.

******

ఆటో హారన్ వినిపించుడుతోనే, బాచు గాడు ఇంట్ల లొల్లి షురూ చేశిండు.

“నేనా బడికి పోను డాడీ.. ప్లీజ్.. నాకా బడద్దు..”

“తలకాయ్ తిరుగుతాందా, రోజు నాకీ లొల్లేందిరా?” అనుకుంట వాళ్ల డాడీ, బాచుగాన్ని రెక్కవట్టుకోని బయటికి ఇగ్గుకచ్చిండు.

“ప్లీజ్ డాడీ, నేనీ బళ్లె సదువుతా..”  అనుకుంట వాళ్లింటి పక్కకే ఉన్న బడిని చూయించిండు బాచు.

ఆ బడి ఉట్టి బడి కాదు, సర్కార్ బడి. గోడమీద రాసుండాల్సిన “ప్రభుత్వ పాఠశాల” అన్న అక్షరాలు గాల్లో కలిసిపొయ్యి చాన రోజులైంది. గోడలు ఓ సగం కూలిపొయ్యీ, మిగిలిన సగం మధ్యాన్నభోజనం పొగలకు మాడిపొయ్యీ, నల్లగ పాడుబడిపొయినట్టున్నదా బడి.  బడికి తగ్గట్టే అక్కడి పిల్లలున్నరు. మాసిపొయిన బట్టలతోనీ, చెప్పులు లేని కాళ్లతోనీ, దుబ్బలపడి ఆడుకుంటున్నరు.

“అన్ల సదువుతె సదువచ్చినట్టే నీకిగ. నడు నడు సప్పుడుచేక ఆటో ఎక్కు,” డాడి అన్నడు.

“ప్లీజ్ డాడీ.. నేనా బడికి పోను..”

“బడికి పోకుంటె ఏంజేత్తవ్? బర్ల కాత్తవారా? చల్ నడూ.. ఆటో ఎక్కు..”

“బడికి పోత డాడీ.. కని, ప్లీజ్ ఇగో… ఈ బడికి పోతా… సర్కార్ బడికి..”

“సంక నాకిపోతవ్ అన్లకు పోతె.. ఎన్నడన్న ఒక్క సారు పాఠం చెప్పంగ చూశినవార అన్ల? సర్కార్ బడట సర్కార్ బడి.. ఓ సారుండడు, ఓ  సదువుండదు అదేం బడిరా.. దిక్కుమాలిన బడి.. నడూ.. సక్కగ ఆటో ఎక్కు..” అని గద్రకిచ్చుకుంట మొత్తానికి కొడుకుని ఆటోల కుక్కిండు డాడీ.

ఆటో టైర్లు ముంగటికురికినయ్. డాడి కాళ్లు, వాళ్ల షాపు తొవ్వ పట్టినయ్.

******

హారన్ కొట్టాల్సిన పని లేకుంటనే పింకీ, వాళ్ళ మమ్మీ ఇద్దరూ ఇంటి గేటు ముంగట నిలుచోని ఉన్నారు.

“మమ్మీ… ఆటో అంకుల్ కి ఇవ్వాలైనా స్లో గా వెళ్లమని చెప్పవా.. ప్లీజ్.. కొంచం గట్టిగా చెప్పుమమ్మీ,”  పింకీ అన్నది.

“సరే బేటా. నువ్వైతె ముందు జాగ్రత్తగ కూచో,” అని తనని ఆటో ఎక్కించి, డ్రైవర్ తోని-

“బాబూ, కాస్త మెల్లగానట వెళ్ళవయ్య.. పిల్లలు భయపడుతున్నరు పాపం,” మమ్మీఅన్నది.

“సరే..”

“నువ్వు రోజు ‘సరే’ అనే అంటున్నవ్, కాని మళ్లీ స్పీడుగనే వెళ్తున్నవట కదా?”

“మీరు పంపినట్టు అందరు పిలగాన్లను టైముకు పంపద్దానమ్మా? రోజూ ఎవ్వలో ఒక్కలు లేట్ జేత్తనే ఉంటరు. మరి అందర్ని బల్లె ప్రేయరు టైముకు ఆడ దింపాల్నా వద్దా? అందుకే జరంత ఫాస్ట్ గా తోల్త, గంతేగని పిలగాన్లను భయపెట్టుడు నాకేమన్న సంబురమా ఏందీ?” అని అటు మాట్లాడుకుంటనే ఇటు గేర్ మార్చిండు డ్రైవరు.

మమ్మీ ఇంకేమో అన్నది కనీ ఆ మాటలు ఆటో చప్పుడులో కలిసిపొయినయ్.

ఆటో మూల మలిగింది. గేటు మూసి లోపటికొచ్చింది.

******

తొవ్వల ఇట్లనే ఇంకో ఐదారుగురు పిల్లలు ఆటో ఎక్కిన్లు. ఆరోజు శనివారంకదా, అందుకే పిల్లలందరు తెల్ల యూనిఫాములల్ల ముత్యాల్లెక్కన అందంగ మెరిసిపోతున్నరు.

అందరు ఎక్కినంక ఇగ డ్రైవర్ సెల్ఫోన్ ల ఓసారి టైము చూసుకున్నడు. పావు తక్కువ ఎనిమిది. “బల్లె ప్రేయర్ ఎనిమిదింటికి స్టార్ట్. ఈన్నుంచి బడికాడికి పది కిలో మీటర్లు. అంటె, ఇంకో పావుగంటల నీను పది కిలోమీటర్లు పోవాల్నన్నట్టు”  మనసులనే లెక్కలు వేసుకోని, బండి టాప్ గేర్లకి మార్చిండు.

మెయిన్ రోడ్డు ఎక్కంగనే ఆటో స్పీడు విపరీతంగ పెరిగింది.  ఐతే, అది పేరుకే మెయిన్ రోడ్డుకానీ రోడ్డుమీద మొత్తం లొందలు, బొందలే. అందుకే వాటినుంచి పొయినప్పుడల్లా ఆటో ఎటు వంగుతుంటే లోపట పిల్లలు కూడా అటుదిక్కే వంగుతున్నరు. దీనికి తోడు ఆటో బయటికున్న ఒక కొక్కానికి వాళ్ళందరి స్కూలు బ్యాగులూ, లంచు బ్యాగులూ వేలాడేశుతోని ఆటో మొత్తం ఒక పక్కకు ఒరిగిపోయ్యున్నది.

ప్రతి రోజు అన్నట్టుగనే, ఇయ్యాల కూడా పింకీ- “ప్లీజ్ అంకుల్ కొంచం స్లో గా వెళ్లండి,” అన్నది.

డ్రైవర్ కూడా ఎప్పటిలెక్కనే ఇయ్యాలకూడా ఆమె మాటలు పట్టించుకోకుండ ఇంకింత స్పీడు పెంచిండు.

ఇంతల రోడ్డు మీద ఒక పెద్ద లొంద.

డ్రైవర్ దాన్ని తప్పించపేండు కనీ, చానా స్పీడ్ మీద ఉండుడుతోని బండి కంట్రోల్ కాలే.

కన్నుమూశి తెరిచినంతల.. ఏదైదే జరగద్దో అదే జరిగింది.

ఖతం..  అంతే.. నల్లటి రోడ్డు ఎర్రగయ్యింది.

మహా విషాదం..

ఒక్క క్షణం ముందు వాళ్ళు కడిగినముత్యాలే. కానీ ఇప్పుడా ముత్యాలు నెత్తుటిమడుగుల్లో పడున్నయ్. మూసిన కన్నులతోనీ.. చలనంలేని శరీరాలతోని..

కొన్ని క్షణాల నిశ్శబ్దం…

ఆ వెంటనే అలజడి. చుట్టూ జనం మూగిన్లు, అరుస్తూ కేకలు పెడుతూ కాపాడే ప్రయత్నాలేవో చేస్తున్నారు.

సరిగ్గా అప్పుడే కొద్దిదూరంల ఓ కారు ఆగింది. లోపట ఏదో పాట మోగుతాంది. డ్రైవర్ మోహన్ కార్ దిగి, ఏమైందో చూద్దామని జనం గుంపుల కలిశిండు.

ఆ కార్ వెనుక సీట్ల ముగ్గురు పిల్లలుకూచోని ఉన్నరు. చందూ, అలేఖ్య, దినేష్. కొంచం పెద్ద “చిన్నపిల్లలు”. తొమ్మిదో క్లాసు వాళ్లు.

పాట ఆపి వాళ్లు ముగ్గురు కూడ కిందికి దిగి చూశిన్లు, ఏమైందోనని.

చెల్లా చెదురుగా పగిలిన అద్దం ముక్కలూ.. విసిరికొట్టినట్టు ఎగిరిపడిన పుస్తకాల బ్యాగులు.. తెరుచుకున్న టిఫిన్ బాక్సులూ.. కలిపి ఉన్న అన్నం ముద్దలూ.. వాటి మధ్యలో చిందర వందరగా చెదిరిపోయి, ఆటోకింద నలిగిపోయిన చిన్న చిన్న పిల్లలు… అది చూసిన అలేఖ్య చక్కెరచ్చి కిందపడ్డది. చందూ, దినేష్ ఆమెను లేపి కార్లో కూచోబెట్టి ఏసీ వేసి తాగడానికి ఇన్ని నీళ్ళిచ్చిన్లు.

లేవంగనే అలేఖ్య అడిగింది- “పాపం.. ఎవరట? అసలేమైందట? ఎట్లైందట?” అని.

వాళ్లు- “ఎమ్మో, ఎవరో చిన్నపిల్లలే ఉన్నట్టున్నరు- స్కూల్ బ్యాగ్స్ కనిపిస్తున్నయ్,” అన్నరు.

అంబులెన్సులు వచ్చినయ్. దానెనుకే పోలీసులూ…

టైము ఎనిమిదింబావు అయితాంది.

జరసేపటికి మోహన్ వచ్చి ఏం మాట్లాడకుంట సైలెంటుగ కార్ల కూచున్నాడు. ఆయినె చేతులకు, అంగీకి ఆడీడ నెత్తుటి మరకలున్నాయి. అవి ఎక్కడివని ఈ పిల్లలు అడగలేదు. ఎందుకంటే అవెక్కడియో వాళ్లకు తెలుసు..

వీళ్లు ముగ్గురూ చిన్నప్పట్నించీ మంచి దోస్తులు.  అందరు చదివేది ఒకే క్లాసు. ఒకే స్కూలు.

దినేష్ వాళ్ల డాడి ఆర్ టీ వో, చందు వాళ్ల డాడి గవర్నమెంటు టీచర్, అలేఖ్య వాళ్ల డాడి గవర్నమెంట్ ఆర్ అండ్ బీ రోడ్ కాంట్రాక్టర్. వాళ్లు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్, ఉండేది కూడా పక్కపక్క ఇండ్లల్లనే అవుడుతోని అందరూ దినేష్ వాళ్ళ డాడి కార్లనే రోజూ ఇట్లా స్కూల్ కి పొయ్యస్తుంటరు.

మోహన్ ఓసారి గట్టిగా ఊపిరి తీసుకోని కారు స్టార్ట్ చేశి రివర్స్ తీస్కున్నడు.

కారు వచ్చిన దార్లనే వెనక్కి పోతోంది.

vamsi

“అంకుల్ స్కూలూ?” చందూ అడిగిండు.

“వాళ్లు మీ స్కూలు పిల్లలే చందూ,” ప్రశాంతంగా చెప్పిండు మోహన్.

ఒక్క క్షణం పిల్లలకు షాక్ కొట్టినట్టయింది.

“అర్రే.. ఔనా? ఏ క్లాస్ వాళ్లట పాపం?”

“ఎమ్మో, అందరు చిన్న చిన్న పిల్లలే! ఫస్టో సెకండో ఉంటరు కావచ్చు”

ముగ్గురికి మస్తు బాధైతుంది కని ఏమనాల్నో తోస్తలేదు.

మళ్ల జరసేపు అంతా నిశ్శబ్దం.

“అసల్ ఎట్ల అయ్యిందట అంకుల్?” దినేష్ అడిగిండు.

“రోడ్డు మీద పెద్ద లొందస్తే, దాన్ని తప్పించపొయ్యి రోడ్ డివైడర్ కు గుద్దిండట..”

“అరెరే.. పాపం…” అలేఖ్య అంది.

అడగాల్నా వద్దా అనుకుంటనే దినేష్ అడిగిండు- “ఎంతమందట అంకుల్?”

“ముగ్గురు పిల్లలున్నూ ఆ డ్రైవరూ. మొత్తం నలుగురు.  మిగిలినోళ్లకు సుత బాగనే తాకినయ్”

“మెల్లగా వెళ్ళుంటే తప్పించుకునేవాళ్ళేమో కదా? అసలు తప్పంతా ఆ డ్రైవర్ దీ, డొక్కు ఆటోదే,” అలేఖ్య కళ్లు తుడ్చుకుంటూ అన్నది.

“కరెక్టే కని, టైముకు ప్రేయర్ కు అందకపోతే మన స్కూల్ల పనిష్మెంటు ఎట్లుంటదో తెల్సుకదా? అందుకే వాడు ఫాస్ట్ గ పొయ్యుంటడు. వాని తప్పేంలేదు. అసల్ తప్పంత మన స్కూలోళ్లదే! తొమ్మిదింటికి పెడ్తె ఏం పోవును చెప్పు! ఛ, పాపం వాళ్లు మన స్కూల్ కాకున్నా అయిపోవును కదా, మంచిగ బతికిపోతుండే,” చందూ అన్నడు.

“మన స్కూల్ తొమ్మిదింటికి పెట్టినా, పదింటికి పెట్టినా ఆటోవోళ్లు అట్లనే అస్తర్రా. తప్పు ఆటోవోంది కాదు, మన స్కూలోళ్లదికాదు. ఆ రోడ్డున్నది చూశిన్లా – తప్పంత ఆ రోడ్డుదీ, దాని మీదున్న లొందలూ బొందలదీ. అవేగిన లేకుంట రోడ్డు మంచిగ సాఫ్ ఉంటె అసల్ ఇట్లయ్యేదా? ఆ రోడ్డేష్నోన్ని తన్నాలె ముందు,” దినేష్ అన్నడు.

ఇట్లా పిల్లలు ముగ్గురూ, ఇండ్లు దగ్గరికచ్చేదాంక తప్పు వీళ్లదంటే వీళ్లదని వాదిచ్చుకుంటనే ఉన్నరు. మోహన్ మాత్రం నిశ్శబ్దంగా వాళ్ల మాటలు వినుకుంట, కారును మెల్లగా ముందుకు పోనిస్తున్నడు.

“ఏం మాట్లాడ్తలెవ్వేందంకుల్? చెప్పున్లీ.. తప్పెవరిది?”

“మీరు ముగ్గురు చెప్పింది కరెక్టే. కానీ తప్పు చేసినోళ్లను తిడ్తెనో, తంతెనో సమస్య తీరిపోదు కదా?”

“మరింకేం చేస్తమంకుల్? మనతోటేమైతది?”

“అచ్చా? మరి ఎవరితోని ఐతది?”

“ఎవరితోనంటే- పెద్ద పెద్దోళ్ళుంటరు కదా? అవన్ని వాళ్లు చూస్కోవాలె. ఏదన్నుంటె వాళ్లతోనే ఐతది.”

“పెద్ద పెద్దోళ్లంటే?”

“ఆ.. పెద్ద పెద్దోళ్లంటే… పెద్దోళ్లంటే…” అని పిల్లలు కొంచంసేపు ఆలోచించిన్లు కని ఆ పెద్దోళ్లెవరో వాళ్లకు తెలుస్తలేదు.

కొంచంసేపటికి అలేఖ్య అంది. “పెద్దోళ్లంటె గవర్నమెంట్ అంకుల్. అవన్ని గవర్నమెంట్ చూస్కోవాలి.”

చందూ దినేష్ లు కూడ మాట కలిపి- “ఆ.. అదే… ఎమ్మెల్యే.. మినిష్టర్.. సీ యం.. వీళ్లంత ఉంటరుకదా గవర్నమెంటుల.. వాళ్లే.. వాళ్లే చూస్కోవాలె ఇసొంటియన్ని,” అన్నరు.

ఆ మాటలకు, అంత విషాదంల కూడా  మోహన్ మొహంలో చిన్న చిరునవ్వు మొలకెత్తింది.

అతనెందుకు నవ్వుతున్నడో పిల్లలకు అప్పుడు అర్థంకాలేదు…

******

కొన్ని రోజులు గడిచినయ్..

స్కూల్ల ‘హాఫ్ ఇయర్లీ ఎగ్జాంస్’ మొదలైనయ్. పిల్లలందరు ఆ విషాదాన్ని మరిచిపోయి, పరీక్షలు రాస్తున్నరు.  ఒక్క ఈ ముగ్గురు తప్ప.

వీళ్లుకూడా పరీక్షలు రాస్తున్నరు కానీ ఇదివరకటిలాగా కాదు. ఒకప్పుడు పరీక్షలంటెనే భయంతోని బేజారయ్యే వీళ్లు, ఇప్పుడు పరీక్షలెగ్గొట్టి నిర్రందిగ బజార్ల తిరిగే  స్థాయికి చేరుకున్నరు.  ఆ మరణాలు వీళ్ల ముగ్గురిలో పెద్ద మార్పునే తీసుకొచ్చినయ్.

చందూ, దినేష్ మ్యాథ్స్ పరీక్ష ఎగ్గొట్టిన్లు. అలేఖ్య పరిక్షకు హాజరైంది కానీ తెల్ల కాగితం ఇచ్చింది.

డ్రైవర్ మోహన్ కి ఈ విషయం ముందే తెల్సినా, వాళ్ల ఇండ్లల్ల చెప్పలేదు.

పరీక్షలు అయిపేనయ్. క్లాస్ లో పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులిచ్చి, పేరెంట్స్ తోని సంతకం చేయించుకోని తీసుకురమ్మన్నారు.

******

“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” డాడికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చిండు దినేష్.

“ఏందిరా ఇదీ? లెక్కల పరీక్షలో ఆబ్సెంట్ అని ఉందీ? పరీక్ష రాయలే?”

“రాయలే..”

“రాయలేదా? ఎందుక్ రాయలే??”

“ఉట్టిగనే.. నాకు రాయ బుద్ది కాలే.. రాయలే.. నువ్వైతె సంతకం పెట్టు డాడీ”

“ఏందిరా?  పరీక్షెందుకు రాయలేరా అంటే మళ్ల బౌరుబాబ్ మాట్లాడుతున్నవ్?”

“రాయబుద్ది కాలే అని చెప్తున్నగా. ఆ రోజుసినిమాకు పోయిన, అందుకే రాయలే.”

“గాడిది కొడక. పరీక్ష ఎగ్గొట్టి సిన్మాకు పేంది కాకుండ మళ్ల పెయ్యిల భయం లేకుంట నాకేఎదురుమాట్లాడుతున్నవా,” అని తిట్టుకుంట బెల్ట్ తీసి నాలుగు దెబ్బలు సరిశిండు వాళ్ల డాడి.

పెయి మీద వాతలు తేలినయ్ కని దినేష్ కంట్లో ఒక్క చుక్క కన్నీళ్ళు కూడ రాలే.

“కొట్టుడు ఐపేందా? ఇగో ఈ రెండు వందలు తీస్కోని సంతకం పెట్టు.”

ఒక్క క్షణం వాళ్ల డాడికి ఏం సమజ్ కాలే.

“ఏందిరా ఇది??”

“పైసలుడాడీ, నాకాడ ఇవ్వే ఉన్నయ్. ఇగో తీస్కో, తీస్కోని సంతకం పెట్టు..”

కోపంతోని ఊగిపోవుకుంట గట్టిగ ఇంకో రెండు దెబ్బలు సరిశిండు వాళ్ల నాన.

“పైసలిస్తే, పాడైపోయిన పాత బండ్లకు పర్మిట్లు ఇచ్చుడూ, పచ్చితాగుబోతులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చుడు నీకు అలవాటే కదా డాడీ.. ఇది కూడ అట్లనే అనుకో. ఈ రెండువందలు తీస్కోని నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టు..”

******

vamsi“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” అనుకుంట డాడి చేతిల ప్రోగ్రెస్ కార్డ్ పెట్టిండు చందు.

“ఏందిరా ఇదీ? లెక్కల పరీక్ష ఆబ్సెంట్ అని ఉందీ? పరీక్ష రాయలే?”

“రాయలే..”

“ఎందుక్ రాయలేరా?”

“ఉట్టిగనే.. నాకు రాయ బుద్ది కాలే.. అందుకే రాయలే.. నువ్వైతె సంతకం పెట్టు డాడీ..”

“సువ్వర్ కే… నోరు బాగా లేస్తుందేందిరా,”  అని పట్టపట్ట నాలుగు దెబ్బలు సరిశిండు వాళ్ల నాన్న.

ఒక్క దెబ్బ పడినా అమ్మా అని బిగ్గరగా ఏడ్చే చందూ ఇప్పుడు మాత్రం ఎందుకో అస్సల్ ఏడుస్తలేడు.

“ఎందుకు రాయలేదంటే మాట్లాడ్తలెవ్వేందిరా? చెప్పూ ఎందుక్ రాయలే…” ఇంకో దెబ్బ.

“ఉట్టిగనే రాయలే… నువ్వైతె సంతకం పెట్టు..”

“బగ్గ బలిశి కొట్టుకుంటానవ్రా నువ్వూ. చెప్పు.. స్కూలుకుపోతున్నా అని పొయినవ్ కద ఆరోజు? మరి పరిక్ష రాయకుంట బడెగ్గొట్టి ఏడికి తిరుగపోయినవ్రా?” ఇంకో దెబ్బ.

“నువ్వో గవర్నమెంటు టీచర్ వి అయ్యుండి వారానికి నాలుగు రోజులు స్కూల్ ఎగ్గొట్టి బయట తిరుగుతలెవ్వా?  నేను కూడ అట్లనే స్కూలెగ్గొట్టి బయట తిరిగినారోజు..”

“పిస్స లేశిందారా.. ఏం మాట్లాడ్తున్నవ్?”

“నువ్వు రోజు స్కూలుకు పోకున్నా, నీ జీతం నీకైతె వస్తుందిగా డాడీ? అట్లనే నేను కూడా  స్కూలుకు పోకపోయినా నా మార్కులు నాకస్తయనుకున్న…”

******

“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” అనుకుంటూ ప్రోగ్రెస్ కార్డ్ డాడికి ఇచ్చింది అలేఖ్య.

“లెక్కల్లో వందకి వందా? వారెవ్వా… శభాష్ బేటా.. నువ్వెప్పుడు ఇట్లనే మంచిగ చదుకోవాలె,” అనిబిడ్డను మెచ్చుకుంటూ అలవాటు ప్రకారం సంతకం పెట్టబొయ్యి, ఒక్క క్షణం ఏదో అనుమానం అనిపించి ఆగిండు డాడీ.

“ఇదేందమ్మా! నీకు మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రావాలెగా. మరిక్కడ ఫోర్ ఫిఫ్టీ అని ఉన్నది? మీ టీచర్ కు లెక్కల్ రావా?”

“మా టీచర్ కరెక్టే వేసింది డాడీ..”

“నీ మొఖం. కరెక్ట్ ఏడుందే, టోటల్లో వంద తగ్గింది. నువ్వన్న చుస్కోవద్దా?”

“లేదు డాడి కరెక్టే ఉంది. సంతకం పెట్టు..”

“అరే.. మళ్ళ అదే మాట. కావాల్నంటె నువ్ లెక్కపెట్టు ఓసారి. ఆరు సబ్జెక్టులు కలిపి మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రావాలె.”

“లేదు డాడీ, ఆ టోటల్ కరెక్టే. మ్యాథ్స్ లో నాకు సున్న వస్తే, నేనే దాన్ని వందగా మార్చిన.”

“ఏందీ??”

“ఔను డాడీ, సున్నాను వంద చేసిన..”

“ఎందుకు??”

“ఉట్టిగనే.. ఇందాక మీరు శభాష్ మెచ్చుకున్నారుకదా, అట్లా మెచ్చుకోవాలనే. సంతకం పెట్టు డాడీ..”

“సిగ్గులేదా అట్ల తప్పుడు మార్కులు వేస్కోడానికి? నిన్ను వేలకు వేలు ఫీజులుకట్టి చదివించేది ఈ దొంగ మార్కులకోసమేనా- ఆ??”

“మరి గవర్నమెంటు మీకు లక్షలకు లక్షలు సాంక్షన్ చేసేది ఆ నాసిరకం రోడ్లకోసమేనా డాడీ?”

“ఏందే? ఏమ్మాట్లాడ్తున్నవ్??”

“ఆ డబ్బులన్నీ మింగేసి, చివర్లో మీరు కూడా వాళ్లకు దొంగ లెక్కలు చూపెడ్తున్నరుకదా? మరి అలాంటి దొంగపని చెయ్యడానికి నీకు సిగ్గులేదా?”

******

బయట కారులో, మోహన్ ప్రశాంతంగ కండ్లు మూసుకోని ఒరిగిండు. అతని మొహంలో, అప్పుడు కనిపించిన చిరునవ్వే మళ్ళీ ఇప్పుడూ కనిపిస్తోంది.

సరిగ్గా అదే టైముకు ఇక్కడ ఇండ్ల లోపట,  ఆ పిల్లల గొంతునుంచి కొత్త మాటలు మొలకెత్తినయ్-

“మీ డ్యూటీని మీరు సరిగ్గ చేసుంటే, పాపం ఇయ్యాల ‘ఆ నలుగురు’ మంచిగ బ్రతికుంటుండే కదా డ్యాడీ? Yes.. You killed them all.. and you are not a Public Servant dad.. You are a Professional Killer..”

తమ పిల్లలు అంటున్న మాటలకు ఆ తండ్రుల గొంతు తడారి పొయ్యి, మాట పడిపోయింది.

కానీ..

కానీ..   వాళ్ల గుండెలు మాత్రం తడయ్యి, ఆ కరిగిన మనసులకు గురుతుగా..

“చిక్కటి కన్నీటి బొట్లు…. ఒక్కొక్కటిగా రాలుతున్నాయి…”   

 

*

మిరకిల్

 

 

అల్లం వంశీ  

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

ఆ లోపట..వెలుతురు కూడా అచ్చం చీకటిలెక్కనే కనపడ్తాంది..

ఎందుకంటే,అన్ని బార్లల్ల ఉన్నట్టే ఈడకూడా “తక్కువ వెలుతురు,ఎక్కువ చీకటి” అన్న ప్రాథమిక సూత్రం అమల్లఉన్నది.. అట్లా డిమ్ము లైటుకింద తాగుతె మస్తు “ఎక్కుతదనేది” తాగేటోళ్ల నమ్మకమైతే, ఆ లోవెలుతురుల వాళ్లు ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతరనేది అమ్మేటోళ్ల అనుభవం..

బారంటె మళ్ల వట్టి బారు కాదది, జనతా బారు.. “ఎవరుపడితె వాళ్ళు, ఏడపడితె ఆడ కూసోని.. తాగ బుద్ధైంది తాగుకుంటా, తిన బుద్ధైంది తినుకుంటా.. ఎక్కేటోనికి ఎక్కనిస్తూ,  కక్కేటోన్ని కక్కనిస్తూ… కోపమస్తె కొట్టుకుంటా, దుఃఖమస్తె చీదుకుంటా.. ఒర్రేటోన్ని ఒర్రనిస్తూ, బొర్రేటోన్ని బొర్రనిస్తూ..ఇట్లా.. ఒక మనిషిని మొత్తానికి మొత్తంగా నూటికి నూరుపాళ్లు వానికి నచ్చినట్టువాన్ని ఉండనిచ్చే గ‘మ్మత్తైన’చోటు..”

ఆ వాతావరణమంతా చల్లచల్లటి ఆల్కహాలు వాసనలు, వేడివేడి సిగరెట్ పొగలు.. గల గల గ్లాసులూ, కర కర ముక్కలూ.. డొక్కు డొక్కు బల్లలూ,  ముక్క ముక్క మనుషులూ..మత్తు మత్తు చూపులూ, ముద్ద ముద్ద మాటలు…

వీటన్నీటి మధ్యల.. తాగేటోల్లు తాగుతనే ఉన్నరు, వాగేటోల్లు వాగుతనే ఉన్నరు..

 

******

వెనక నుంచి ఆరో టేబుల్ మీద, చేతిల బీరు గ్లాసుతోని ఉన్న మనిషే కార్తిక్, ఎర్ర టీషర్ట్ తొడుక్కోని ఉన్నడు చూశిన్లా? అగో ఆయినే.. అతనికి ఎదురుంగ సిమెంట్ కలర్ టీషర్ట్ ఏస్కొని కూచున్నాయినె వినయ్.. అదే, ఆ గ్లాసులకు నిమ్మళంగ బీరువంపుతున్నడు చూడూ.. ఆ పిలగాడు.. ఇంతకుముందు లోపటికచ్చింది వీళ్లిద్దరే..

నువ్ బీర్ మస్తు పోస్తవ్రా భై,అస్సల్ నురుగు రాకుండ.. కార్తిక్ అన్నడు..

అరే.. నీకెక్కిందిరా…

అరే మామా..  నిజంగనేరా… నిజ్జంగ నిజం చెప్తానా, ఆ వెయిటర్ సుత నీ అంత పర్ఫెక్ట్ పొయ్యడెర్కేనా?

సాల్తియ్ గనీ ఈడికి ఆపేద్దామా, ఇంకో రెండు చెప్పాల్నా??

ఏంది అప్పుడేనా?? ఇయ్యాల నీన్ మస్త్ తాగుదామని ఫిక్స్ అయిన్రా భై… ఇప్పుడప్పుడే నువ్ చాల్ అనే మాటనకు..

సరే ఐతె ఇంకో రెండు చెప్తానమరి…

అరే… అంత ఏగిరం దేనికిరా? ఇదైతే ఒడ్వనియ్యరాదు. ఇప్పుడే చెప్తే మళ్ల చేదెక్కుతయ్.. బొచ్చెడ్ టైమున్నది, నువ్వైతె పుర్సత్ గ కూసోని  తాగు..

సరేపటు కానియ్…

ఇద్దరు గ్లాసుల్లేపి చెరి రెండుబుక్కలు తాగిన్లు.

ముంగటున్న చికెన్ పకోడి నోట్లేసుకుంటూ కార్తిక్ అన్నడు- అరేయ్.. మామా… నువ్వే చెప్రా… మా అయ్యదో చిన్న చికెన్ సెంటరూ.. మీ అయ్యదేమో సింగరేణిల బాయిపని.. అంతేనాకాదా?

ఔ.. అంతేగారా..

ఆ.. అని ఇంకో బుక్క తాగుకుంట.. “మీ అయ్య రోజుకు ఎన్మిది గంటలు పనిజేస్తె నెలకు యాభైవేలు జీతమస్తది.. మా అయ్య చీకటి తోని లేచింది మొదలు మళ్ల చీకటి వడేదాంక చికెన్ కొట్టుకుంట కూసున్నా నెలకు ఇరువై వేలు మిగుల్తె మస్తెక్కువ..  అంతేనా కాదా?”

గంతేగని..ఇప్పుడు వాళ్ల ముచ్చటెందుకు మతికచ్చిందిరా నీకు?

ఉట్టిగనేకనీ..ఇది చెప్పు.. మీకు సింగరేణోల్లు డబుల్ బెడ్రూం క్వాటరిచ్చిన్లు… మాది మాత్రం మూడు రూముల కిరాయి కొంప.. అంతేనా గాదా??

ఇప్పుడు అయన్నెందుకురా.. వేరే ఇంకేమన్న మాట్లాడరాదు..

అరే? మాట్లాడంగ మధ్యల రాకురా నువ్వు.. నేన్ చెప్పేది మొత్తమిను…

తాగితె కార్తిక్ ఎవరి మాట వినడని వినయ్ కి ఎరికే కాబట్టి సప్పుడు చెయ్యకుంట కూచున్నడు..

ఆ.. చెప్రా… మీకో రెండెకరాల జాగున్నది కదా ఊళ్ళె?

మ్మ్… పత్తి వెట్టిన్లట ఈ యేడు..

ఆ చేనుకు అందాదకు రేటెంతుంటదిరా?

ఎకురం పది చిల్లరుంటది కావచ్చురా… నిరుడు బోరేపిచ్చినం కదా, నీళ్ల సౌలతున్నది కావట్టిఈయేడు ఇంకో లక్ష పెరిగినట్టేఅనుకోవాలె!

ఇద్దరికీ ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మందు ఎక్కుతాంది.. మాటలు ముద్ద ముద్దగ వస్తున్నయి..

Kadha-Saranga-2-300x268

“రైట్.. రైట్… గంతే ఉంటదిగనీ..”

అని చికెన్ ముక్క నములుకుంట- మా అయ్య కూడ, ఇల్లు కట్టనీకి ఏన్నన్న ఓ రెండు గుంటల జాగా దొర్కుతె కొందామని చూశిండుకనీ, ముప్పై లక్షలకు తక్కువలేదు మామ మన కాడ..

ఔరా.. తెలంగాణచ్చినంకమనకెళ్లి రేట్లు మస్తు పెరిగినయ్.. ఐనాసుత ఏదైతె అదైంది ఏన్నో ఓకాడ కొనిపారెయ్యున్లిరా ఇప్పుడే, పోను పోను ఇంకింత పిరమైతయ్..

ఏంది కొని పారేశుడా??అయిపైసలాలేకుంటే పెంకాసులా?? గా పైసలే ఉంటే గియన్ని తిప్పలెందుకుపడ్దుము..మంచిగ ఈపాటికి ఇల్లే కడ్తుండేగారా! మా అయ్య కాడ ఓ పదిహేనిర్వై ఉన్నట్టున్నయ్గంతే.. వాస్తవానికిఅయిసుత చెల్లె పెండ్లికోసం పక్కకు పెట్టినయ్…

మ్మ్..

గ్లాసులు, సీసలు ఖాళీ అవుడుతోని వినయ్ వెయిటర్ ను పిలిచి ఇంకో రెండు బీర్లూ చెప్పిండు…

అరే.. నువ్వియాల ఫష్టు సాలరీ ఎత్తినవని సంబురంగ దావతిస్తాంటే, నేనిట్ల మాట్లాడ్తానా అని తప్పుగ అనుకోక్రా భైప్లీజ్..

నీయయ్యా, నేనెందుకట్లనుకుంటరా??  ఎవని ప్రాబ్లంస్ వానికుంటయ్…

యా… థ్యాంక్స్ రా మామా, నా బాధ నీకు సమజైంది… లవ్యూ రా మామా.. అంటుండoగ, వెయిటర్ ఇంకో రెండు తీస్కచ్చి ఇద్దరి గ్లాసులు నింపిపొయిండు.. ఇద్దరు మళ్ల చెరో బుక్క తాగినంక కార్తిక్-

మామా..మనిద్దరం సిక్స్త్  క్లాస్ కాంచి జబ్బకు జబ్బ దోస్తులం గారా??

మ్మ్…

“మ్మ్” కాదు..మంచిగ చెప్పు…

మ్మ్ అంటే ఔననేరాహౌలే..

అట్ల కాదుబే, నువ్ మంచిగ నోరు తెరిచి నోటితోని చెప్పాలె..

ఔ..ను.. మనం చెడ్డీలకాంచి జాన్ జిగిరీ జబ్బల్ జబ్బల దోస్తాం.. ఐతేందిరా ఇప్పుడూ..

విను విను…ఓకే…. మనిద్దరిది ఒకటే బడా కాదా??

యా.. ఇద్దరిది సేంటు సేం ఒకటే బడి.. ఒకటే క్లాసు.. ఒకటే బేంచూ..

చలో, మరి ఇంటర్, డిగ్రీ??

అన్ని సేం సేమే బే..ఒక్కదాన్నే ఎన్ని సార్లడుగుతవ్రా?

వాళ్ల కండ్లల్ల మత్తు ఇప్పుడు స్పష్టంగా కనిపడ్తాంది.. మాటల్లో ముద్దతనం ఉండనే ఉన్నది..

అరే.. మొత్తం ఇన్రా…మరి మనిద్దరిల సదువుల ఎవడ్రా టాపరు??

నువ్వే మామా.. మన చిన్నప్పటికాంచి మొత్తం అన్నీట్ల నువ్వేగారా టాపరువు..

ఆ.. మళ్ల పీజీ ఎంట్రన్స్ ల నా ర్యాంకెంత మతికున్నదారా నీకు??

ఎందుకు మతికిలేద్రా.. నీది డెబ్బై ఎన్మిది, నాది రెండొందల నాలుగు..

కదా?? అంత మంచి ర్యాంకచ్చిసుత నాకెన్ల సీటచ్చింది, నీకెన్ల సీటచ్చిందిరా??

నాది ఓయూ క్యాంపస్.. నీది అదేదో ప్రైవేట్ కాలేజ్ మామా నాకు దాని పే..రూ.. అదేదో సెయింట్ లూనిజో..లూయిసో.. లారిసో…ఏందో ఉండెగారా? మతికస్తలేదు!!

పోనియ్ అదిడ్శిపెట్టుగనీ.. అంత నప్పతట్ల కాలేజిల సదివిసుత నేన్ పీజిల యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టిన్నాలేదా?

అరే మామా నేన్ ఆల్రడీ మస్తుసార్ల చెప్పినా, మళ్ళిప్పుడు చెప్తున్నా..ఎప్పుడన్నగానీ, ఏడనన్నగానీసదువుల నిన్నుకొట్టినోడేలేడ్రా భై.. నువ్ తోపురా నిజంగా..

“కదా??కనిఇయ్యాల నేన్రోడ్డుమీద బేవార్సూ, నువ్వు మాత్రంసెంట్రల్ ఎక్సైస్ డిపార్టుమెంటుల ఇన్స్పెక్టరూ…”

“దాంట్లె ఏముందిరా.. ఐపేంది ఇడ్శిపెట్టి, నెక్స్ట్ ఇయర్ ఇంకింత సీరియస్ గ సదువురా భై, వట్టిగనే పోస్టు కొడ్తవ్ నువ్వు.. నీ ట్యాలెంటుకు అసలది విషయమే కాదు..”

అచ్చా??? నీ ఏజ్ ఎంతరా ఇప్పుడు?

ముప్పై? ఐతే??

మరి నాకెంతరా?

మనిద్దరి ఏజ్ సేమేగాబే.. నాక్ ముప్పై ఐతె నీకు ముప్పయే…

కదా?? మరి ముడ్డికింద ముప్పయ్యేండ్లున్నా నన్ను ఎక్సాం రాయనిచ్చుటానికి వాడేమన్న నా బామ్మర్దా??

అర్రెర్రే..!! కరెక్టే మామా, సారీరా….నాకా ముచ్చటే యాదికిలేదు..

ఎందుకుంటదిరా? మీకు రిజర్వేషన్ ఉన్నది, ఈసారి కాకపోతె ఇంకోసారి.. రాకుంటె మళ్ళోసారి… ఇంక ఐదారేండ్లుకాదు, నువ్ ముసలోనివయ్యేదాంక రాసుకోవచ్చు..ఫీజు కట్టేదున్నదా, చదివి కొట్టేదున్నదా?? ఉట్టిగ క్వాలిఫై ఐతె జాబు… ఇంకనా గురించెందుకు యాదికెందుకుంటదిరా..! అస్సల్ ఉండది..

అరే.. అట్లంటవేందిరా.. నేనేమన్న కావాల్నని అన్ననా? లైట్ తీస్కోరా భై.. అని చివరి చికెన్ ముక్క నోట్లెవెట్టుకున్నడు వినయ్..

“ఏంది లైట్ తీస్కోవాల్నా?ఎందుకు తీస్కోవాల్రా లైటు? ఆ?? చెప్పు ఎందుకు తీస్కోవాలె??  మొన్నటి ఆ ఎక్సాం ల   నాకు టూ ఫార్టీ ఔటాఫ్ థ్రీ హండ్రెడ్ వస్తే నీకెన్నచ్చినయ్రా? ఆ?? చెప్పు ఎన్నచ్చినయ్?? టూ నాట్ సెవన్… ఔనా కాదా?? రెండొందల ఏడచ్చిన నిన్నేమో పిలిచిమరీ ఉద్యోగమిచ్చిన్లు, నీకంటె ముప్పై మూడు మార్కులెక్కువచ్చిన నన్ను మాత్రం పిలిచినోడులేడు, అడిగినోడులేడు.. ఇయ్యాల నువ్ నెలకు నలభై వేలు సంపాయిస్తుంటె, నేన్ మాత్రం బేవార్స్ గానిలెక్క రోడ్లువట్టుకోని తిర్గవడ్తి.. ఎందుక్ తీస్కోవాల్రా లైటూ?? ఛత్..” అని ఎత్తిన గ్లాసు దించకుండ గటగట గ్లాసుడు బీరును ఒక్కబుక్కల తాగి.. ఇంకో రెండు బీర్లకూ, చికెన్ లెగ్ పీసులకూఆర్డరిచ్చిండు కార్తిక్..

వినయ్ ఏం మాట్లాడకుంట తన బీరు లాస్ట్ సిప్పు తాగుతున్నడు..

పోని మళ్లోసారి రాద్దామంటె కూడ “మాకు” ఏజ్ లిమిట్ అని కాలవడే.. ఛత్.. నీ… రిజర్వేషన్లకున్న పారేత్తు..  అసలీ రిజర్వేషన్లను #@Y%*#%………

ఛీ..నాకు జాబ్ అస్తె నువ్ మంచిగ ఖుషీగ ఫీల్ ఐతవ్ అనుకున్నగని గిట్ల మాట్లాడ్తవ్ అనుకోలేర భై.. ఛీఛీ.. నేన్ పోతున్నా.. అనుకుంట వినయ్ లేవబోయిండు..

కార్తిక్ అతన్ని ఆపి కూచోబెడుతూ- అరే ఆగుబే.. నేన్ చెప్పేది మొత్తం ఇను.. దా కూసో..అన్నీటికి ఫీల్ ఐతవేందిరా నువ్వు…! అసల్ నీ మీద నాకు కోపమెందుకుంటది చెప్పురా?మనిద్దరం చెడ్డీల కాంచి దోస్తులం, నీకు జాబ్ అచ్చినందుకు దునియల ఫష్ట్ ఖుషీ అయింది ఎవడన్న ఉన్నడా అంటె అది నీనే మామా.. నిజ్జంగ చెప్తున్నా.. నీక్ జాబ్ అచ్చినందుకు నేన్ పిచ్చ ఖుష్ రా.. నాకేం నీమీద జెలస్ లేద్రా భై..

మరి ఇంతక్ ముందు మాట్లాడిందంత ఏందిరా?? ఖుషీ అయినోడు అట్ల మాట్లాడ్తడా??

అరేయ్.. మామా.. నా బాధ నీకు సమజ్ కాలేరా…

ఇంతలనే వెయిటర్ బీర్లూ, లెగ్ పీసులు తెచ్చి టేబుల్ మీద పెట్టి పొయిండు..

MIRACLE1వీళ్లు,ఎవరి బీరు వాళ్లు నోటితోని తెరుచుకున్నరు కని గ్లాసుల్ల పోశింది మాత్రం కార్తికే.. అందుకే మీద కొద్దికొద్దిగ నురుగు కనపడ్తాంది..ఇద్దరు మళ్ల చెరొక బుక్కతాగినంక, వినయ్ కు లెగ్ పీస్ అందిచ్చుకుంట కార్తిక్- “అరేయ్.. మామా.. నేనెందుకు రంది వడ్తున్ననో నీక్ సమజ్ కాలేరా.. నా పొజిషన్ల ఉంటె తెలుస్తదిరా ఆ బాధేంటిదో… అంత కష్టపడిచదివీ, మంచి మార్కులు కొట్టినాసుతా జాబ్ రాకపాయే! పోనీ మళ్ల రాసి చూద్దామంటె ఏజు లేదాయే… మనం సదివిన తొక్కల ఎమ్మెస్సీకి ప్రైవేట్ ల టీచర్ జాబ్ తప్ప ఇంకో జాబేముంటరా?? వాడిచ్చే మూడు నాలుగు వేలకు అటా జాబు చెయ్యలేనూ, ఇటు గవర్నమెంటు జాబు కొడ్తామంటె అదేమో ఒకమానంగ వచ్చి కాలవడదు..  నీక్ తెల్వద్రా భై నా పొజిషన్..  నీకు సమజవుడు కూడ కష్టమే..  అరే,నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు,నేనా జాబ్ కోసం ఎంత కష్టపడ్డనోనీకెర్కలేదారా??

నిజమేరాకష్టపడ్డవ్..నేన్గిన కాదన్ననా?కని దానికి నేనేo చేస్త చెప్పు? నాకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి లక్కుల జాబచ్చిందీ.. నీకు లేదు కాబట్టి రాలేదు.. దానికి ఎవలేం చేస్తర్రా?? కిస్మత్.. గంతే…

కిస్మతేందిరా కిస్మతు? కష్టపడ్డోనికి నౌకరియ్యాలెగని కిస్మతున్నోనికి ఇచ్చుడేందిరా? మళ్ళ నిన్ను అంటున్నా అనుకునేవ్రో!! నేన్ మన సిస్టం ను తప్పు వడ్తున్నా..

ఎమ్మోరా భై.. నాకు జాబస్తె  నువ్ గింత ఘోరంగ రియాక్ట్ అయితవని నేనైతె ఎన్నడు అనుకోలే…

అగో మళ్లగదే మాట? నేన్ నిన్నంటలేను మామా.. ఈ మొత్తం సిస్టమ్ను అంటానా.. నన్ను బకరాగాన్ని చేసి బలి పశువును జేస్తె నాక్ కోపం రావొద్దా చెప్పు??  అసల్ దునియా మొత్తమ్మీద ఏన్నన్న ఉన్నదారా ఇట్ల? సదివినోడు సంక నాకి పోవాల్నట, సదువురానోడు మాత్రం సర్కార్ నౌకర్లు చెయ్యాల్నట! నీ య్.. ఇదేం లెక్కరా భై?? అని గ్లాసులేపి రెండు బుక్కల్లో మొత్తం బీరు తాగి, ఇంకింత ఆవేశంగ మాట్లాడుతున్నడు కార్తిక్..

పొద్దున లేశిందిగుత్తా రాజ్యాంగం రాజ్యాంగం అని గొంతులు చింపుకుంటరు కని, అన్ల “అందరు సమానం” అని రాశున్న మాటను ఒక్కడు పట్టించుకోడేందిరా భైనాకర్థంగాదు? “మాకు” సమాధులు తొవ్వుకుంట, మీకు కోటలు కట్టిచ్చుడేనారా సమానమంటే?ఇదేక్కడి సామ్యవాదం, సౌభ్రాతృత్వం భై నాక్ తెల్వక అడుగుతా..?చత్..మీకు మాకంటె ఎక్కువ ఆస్థులున్నయ్, మీ అయ్యకు సర్కార్ నౌకరున్నది, క్వార్టర్స్ ఉన్నయ్, ఇన్సురెన్సులూ, అలవెన్సులూ, సబ్సిడీలూ, హెల్తుకార్డులూ, పెన్షన్లు తొక్కా తొండం సవాలక్షున్నయ్.. అయినా నీకు రిజర్వేషన్ ఉంటది, నువ్వెన్నిసార్లైనా పరిక్ష రాయచ్చూ, తక్కువ మార్కులచ్చినా జాబ్ కొట్టచ్చూ.. మాకో గజం జాగ లేదు, అయ్యకు పర్మినెంటు నౌకరిలేదు, రోగమచ్చినా రొప్పచ్చినామంచి దావఖానకుపోను దిక్కులేదు, అసల్ బతుక్కే భరోసా లేదుర భై.. అసొంటిది మాకు రిజర్వేషన్ ఉండదు,  టాప్ మార్కులచ్చినా జాబురాదూ,పోనీమళ్లోసారి రాద్దామంటె ఏజు చాన్సుండదు!ఏం న్యాయమ్రా భై ఇదీ??  మస్తు బాధైతున్నది మామా నాకు…  అరేయ్.. మళ్ల చెప్తున్నా నేన్ నిన్నంటలేను భై, మన సిస్టం ను అంటున్నా.. సిస్టం మొత్తం ఖరాబైపేందిరా ఏడికాడికి..

వినయ్ఏం మాట్లాడకుంట, చేతిలో ఉన్న చికెన్ బొక్కను ఖాళీ గ్లాసుకు కొట్టుకుంటూ కార్తిక్ చెప్పేది వింటున్నడంతే..

ఇంకో బుక్కెడు బీరు తాగినంక కార్తిక్ గొంతు ఇంకోరకంగ మారింది.. “అసల్ నన్నడుగుతె ఆ రాజ్యాంగంల రిజర్వేషన్ ఆర్టికిల్సు మొత్తం మలిపేశి, మళ్ల కొత్తగ రాపియ్యాల్రా భై… ఒకనికి రిజర్వేషన్ మీద మంచి సర్కార్ జాబ్ అస్తె ఇంక వానికి పుట్టేటోళ్లకు రిజర్వేషన్ ఇయ్యద్దు మళ్ల… కొత్తగ మంచిగ,ఈసారి కరెక్టుగమళ్లఅందరికి కొత్త “ఇన్ కం సర్టిఫికెట్” లు ఇప్పిచ్చి ఎవడైతె న్యాయంగ గరీబోడుంటడో వాడే కులపోడైనా సరే వానికి రిజర్వేషన్ పెట్టాలె.. బలిశినోడుంటె వాడే కులపోడైనాసరే రిజర్వేషన్ పీకిపారెయ్యాలె…”ఇంక ఇసొంటియే మంచి మంచి పాయింట్లుఆలోచించి అన్ల కలపాలెఅంతేగనివాళ్ళేందిరా భై, గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఆడఏమున్నదో ఏంలేదో చూడకుంట, ముందు వెనక ఏం ఆలోచించకుంట పదేండ్లకోసారి పొడిగించుకుంట పోతనే ఉన్నరు! ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి ఇప్పటికే నలభై తొమ్మిదిన్నర శాతం రిజర్వేషన్లున్నయ్.. అంటె దాదాపు సగం.. పోనీ మిగిలిన యాభైల ఏమన్న కాంపిటిషన్ తక్కువుంటదా అంటె అన్ల మళ్ల వీళ్లందరితోని పోటీయేనాయే! అరేయ్ నువ్వే చెప్పురా అప్పుడు రాజ్యాంగం రాశిన కాలం నాటికీ, ఇయ్యాల్టికీ మీ బతుకుల్లో కొద్దిగసుత మార్పు రాలేదారా?? మొత్తం కాకపోయిన ఎంతోకొంత, ఓ చారాన మందమన్న మీ పరిస్తితి మంచిగ్గాలేదా చెప్పు?? నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు మామా…

ఆ? ఐతే??

ఐతే ఏందిరా..  సిచువేషన్ ఓ చారాన మందం మంచిగైందీ అన్నపుడు రిజర్వేషన్లల్ల ఓ చారన మందం కట్ చెయ్యాల్నా వద్దా? చెప్పు నువ్వే.. యేడాదికొక్క శాతం తీసుకుంటపేనా, మొత్తం తీసెయ్యడానికి యాభైయ్యేండ్లు పడ్తదిగారా భై??  ఒకటేసారి మొత్తం తీశేత్తా అంటె అలవాటుపడ్డ పానం ఊకుంటదా? లొల్లి లొల్లి చెయ్యరారా.. అందుకే ఇప్పటికెళ్లే యేడాదికొక్క పర్సెంటన్న కోసుకుంట పోతె, ఇంకో యాభై యేండ్లవరకన్న సిచువేషన్ జర సెట్ ఐతది.. అంతేగని ఆ పని చెయ్యకుంట ఓట్లకోసం ఎవనికి వాడు యేటికేటికి దొరికినంత పెంచుకుంట పోతున్నరుతప్ప, నా అసొంటోళ్ల బతుకు నాశనమైపోతాందని అసల్ ఒక్కడన్న ఆలోచిస్తున్నడార భై? చత్..నా రందంత అదే మామా…

అని చెప్తున్నంతల..కార్తిక్ సెల్ రింగ్ అయింది..మాటలాపి తను కాల్ లిఫ్ట్ చేసిండు..అవతలి వైపు మాట్లాడుతున్నది కార్తిక్ వాళ్ల చెల్లె కీర్తి.

ఆ హలో.. కిట్టూ?? చెప్పురా..

ఆ అన్నా. ఎక్కడున్నావ్??

నేను వినయ్ గానితోని బయటికచ్చిన్రా.. నాకు లేటయితదిగని మీరు తిని పడుకోన్లి..

సరేగనీ.. ఆ మంచిరాల సంబంధమోళ్లు సాయింత్రం నానకు ఫోన్ చేసి,ఫోటోస్ నీ మెయిల్ కి పంపినమని చెప్పిన్లట.. వచ్చినయా అని అడుగమంటున్నడు నాన..

ఔనా?? ఎమ్మోనే మరి నేన్ సూళ్లేదు… నా ఫోన్ల నెట్ బ్యాలెన్స్ అయిపేందిగనిరాంగ రాంగ ఏయించుకోనస్తా, రేప్పొద్దున చూద్దాంతీ.. నానకు చెప్పు..

మర్శిపోకు మరి..

నాక్ మా మతికుంటదిగని, నువ్వైతెఆ తాళం చెయ్యి పూలకుండీ కింద పెట్టుడు మర్శిపోకు..

ఓకే.. ఓకే..

ఓకే అనుడుగాదు.. పేనసారి ఇట్లనేఅని నువ్ మర్శిపొయిపంటె, నేన్ గేటు దూకంగనే నాన లేశిండు.. అందుకె మళ్ల మళ్ల చెప్తున్నా, గేటుకు తాళమేశినంక తాళం చెయ్యి మంచిగ చెయ్యికి అందేటట్టుఆపూలకుండీకింద పెట్టు.. సరేనా??

అబా సరేఅన్నా.. పెడ్తా అంటున్నకదా!నువ్వైతె నెట్ బ్యాలెన్స్ వేయించుకోనిరా.. అని కాల్ కట్ చేసిందామె..

కార్తిక్ ఫోన్ పక్కవెట్టి మళ్ల గ్లాస్ పట్టుకున్నడు..

ఏందటరా? జల్ది రమ్మంటున్నదా?? వినయ్ అడిగిండు..

రమ్మనుడు కాద్రా.. అదేదో సంబంధం గురించి… వాళ్లు పిలగాని ఫోటోల్ నా మెయిల్ కు పంపిన్లట, వచ్చినయా అని అడగటానికి చేసింది…

అచ్చా.. ఓకే ఓకే…

మాదాన్ల ఆడపిల్లలున్నోళ్లకు కష్టమ్రా భై నిజంగ… ప్రైవేట్ నౌకర్ చేసేటోనిక్కుడ కం సే కం ఇర్వై లక్షలియ్యలె.. ఇగ గవర్నమెంటోడంటె యాభైకి తక్కువడగడు, మళ్ళ బండీ, బట్టలూ, బోళ్లూ.. బొచ్చెడుంటయ్రా అయ్యా!! ఇయన్నివోను మళ్ళ పెండ్లిఫంక్షను ఖర్చు అలగ్.. పెద్ద పరేషాన్ పట్టుకున్నదిరా మాకైతె! ఆ జాగను అమ్మైనా సరేగని, మంచి సంబంధం దొర్కుతె చేశేద్దామనుకుంటున్నమ్రా ఈ యేడు..

అచ్చాచ్చా.. ఓకే ఓకే… అనుకుంటనే వినయ్ గ్లాస్ బీరును ఒక్క బుక్కలో తాగి, మిగిలిన చికెన్ బొక్కను కంకుకుంట అన్నడు-

అరే.. మామా..  నేన్ ఒకటడుగుత చెప్రా..

ఏందిరా?

ఇట్లంటున్నా అని నువ్వేం అనుకోవద్దు మరి?

అనుకోనుచెప్పుబే..

మామా.. మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కంటె జర రిచ్చేగారా??

జరంతేందిబే?? జమీన్ ఆస్మాన్ ఫరఖ్….         ఇంకో బీర్ చెప్పాల్నారా?

నాకిప్పటికే ఎక్కువైoది..నీగ్గావాల్నంటె చెప్పుకో..

నాక్కూడ మస్తైందిగని, ఇంకొక్కటి చెప్తావన్ బై టూ తాగిపోదాం ఓకేనా?

సరే చెప్పు…

వెయిటర్ ని పిలిచి ఇంకో బీర్ ఆర్డర్ ఇచ్చిండు కార్తిక్…

అయిపేందా?? ఇoగ నేనడిగిందానికి చెప్పు.. నా నౌకరి మంచిదేనా కాదా?

అరే మంచిందేందిరా? కిరాక్ నౌకర్ర భై నీది.. సెంట్రల్ ఎక్సైస్ ఇన్స్పెక్టర్ అంటేందిరా?? ఫుల్లు పైసల్.. స్టాటింగ్ స్టాటింగే నలభైవేల్ జీతం, ఏ వన్  క్వాటర్సూ, అలవెన్సులు, ఇన్సురెన్సులు…  కథా కార్ఖానా…. సెంట్రల్ గౌట్ జాబంటె మాటలార? లొల్లంటె లొల్లి నౌకర్రా భై నీది..

అదే అదే… సరేమరి నేను చూపుకు ఎట్లుంటర? ఐ మీన్ మంచిగ అందంగ ఉంటనా అని?

ఔ నీ హైట్ ఎంతో ఉండేరా? సిక్సా, సిక్స్ వన్నా?

సిక్స్ వన్..

ఆ..! సిక్స్ వన్ హైటున్నోడు అసల్ మన కాలేజిలనే ఎవ్వడులేకుండెగారా? డిగ్రీల మన క్లాసోల్లందరు గా సుమలత ఎంబడివడ్తుంటె, ఆమె మాత్రం నీకు ప్రపోస్ చేశేగార అప్పట్ల? వట్టిగ ఇడ్శిపెట్టుకున్నవ్గని ఆమెను చేస్కుంటే మస్తుంటుండె భై ఇప్పుడు..

లైట్ గనీ.. అంటె మొత్తానికి నేన్ మంచిగనే ఉంటా అంటవ్!

నీకేందిరా భై… పిచ్చ స్మార్ట్ నువ్..

కదా?? ఐతె.. మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తరా మామా? నాకు కీర్తి అంటె మస్తిష్టం..

కార్తిక్ కి ఒక్క క్షణం వినయ్ ఏమంటున్నడో సమజ్ కాలేదు..

నాకు నయా పైసా కట్నం వద్దు మామా, మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తే చాలు, మొత్తం పెళ్లి ఖర్చులుకూడ మేమే పెట్టుకుంటం..

అరేయ్?? ఏం మాట్లాడ్తున్నవ్ బే?? దిమాగ్గిన ఖరాబైందా??

లేద్ నిజంగనే అంటున్నరా, నాకు మీ చెల్లంటె నిజంగ మస్తిష్టం మామా.. దునియాల ఏ మొగడు చూస్కోనంత మంచిగ చూస్కుంటరా మీ చెల్లెను, ప్లీస్.. అని వినయ్ మాట పూర్తికాక ముందే.. కార్తిక్-

అరేయ్.. అసల్ ఏం మాట్లాడుతున్నవ్ సమజైతుందారానీకు?? మందెక్కువై మెదడు ఖరాబైనట్టున్నది.. చల్.. మస్త్ ఎక్కువైంది ఇంక పోదాం పా..

ఏ.. ఆగురా.. కూసో కూసో… మొత్తం ఇనుబే.. ప్లీస్… అని కార్తిక్ ను బలవంతంగ మళ్ల కూచోబెట్టి- అట్లంటవేందిరా?నాకేం తక్కువ చెప్పు.. మంచి నౌకరున్నదీ.. ఆస్థి పాస్థులున్నయీ… మంచిగ అందంగుంటా.. నాకేం తక్కువరా భై?  పైకెళ్లి నాకు నయా పైసా కట్నం కూడ వద్దంటున్నగారా?? ఇంకేం గావాల్రా మీకు?? మీ చెల్లెను కూడ మంచిగ చూస్కుంటా అని చెప్తున్న గదామామా.. ప్లీస్ రా..

తలకాయ్ తిరుగుతాందారా?? వద్దన్నకొద్ది మళ్ళ అదే మాట మాట్లాడుతున్నవ్.. నువ్వస్తెరా లేకుంటెలేదు నేన్ పోతున్నా.. అని లేవబోతుంటె వినయ్ మళ్ల అతన్ని కూచోబెట్టి-

అరేయ్.. నేనేం తాగి మాట్లాడ్తలేను.. నిజంగ సీరియస్ గనే అంటున్న.. నాకు మీ చెల్లెలంటె చాన ఇష్టమ్రా, నాకు జాబ్ వచ్చేదాక అడగొద్దనే ఇన్ని రోజులు అడగలేదు బట్ ఇయ్యాల జాబ్ వచ్చిందికాబట్టే ధైర్యంగ అడుగుతున్నరా… ప్లీస్ మామ మస్తు మంచిగ చూస్కుంటర, వేరే సంబంధాలు చూడకండీ.. నేన్ చేస్కుంటరా మీ చెల్లెను..

అరేయ్.. లాష్ట్ అండ్ ఫైనల్ చెప్తానా..ఇంక ఈ టాపిక్ ఇక్కడికి ఇడ్శిపెట్టు…కార్తిక్ బలవంతoగ కోపాన్ని ఆపుకుంట అన్నడు..

నేన్ మంచోన్ని కాదారా?చిన్నప్పట్నుంచినన్ను చూస్తనేఉన్నవ్ గారా.. నలుగురికి మంచే చేస్తగని ఎప్పుడన్న ఎవనికన్న చెడుపు చేషిన్నారా నేను? నాగురించి ఎర్క లేదారా నీకు?

నువ్ మంచోనివిగావట్టే ఇంతసేప్ నీతోని మాట్లాడ్తున్నా అదే ఇంకోడింకోడైతె ఈపాటికి వాని గూబ గుయ్యిమంటుండే..

అరేయ్.. ప్లీస్.. అర్తంచేస్కోరా భై..

నువ్ మంచోనివని నాకెర్కే కని అయన్ని కాని ముచ్చట్లు.. వట్టిగ నువ్ డిస్టర్బ్ గాకు నన్ను డిస్టర్బ్ చెయ్యకు..ఇప్పటికే మస్తైంది, ఇంక ఆపు..

అరేయ్ మంచోన్నే ఐతె మరి ఒప్పుకోడానికేందిరా?నువ్వుకూడా నన్ను అర్థం చేస్కోపోతె ఎట్లరా..

వెయిటర్ బీర్ తెచ్చి రెండు గ్లాసుల్లో చెరి సగం పోశి వెళ్ళిపోయిండుగని వాళ్లిద్దరు ఆ గ్లాసుల్ని ముట్టలే..

MIRACLE1

ఒక నిమిషం గట్టిగ ఊపిరి తీస్కోని కార్తికే ఓపిగ్గ చెప్పుడు వెట్టిండు- అరేవినయ్..  నువ్ మంచోనివే.. నీకు మంచి ఉద్యోగం, ఆస్థిపాస్తులు.. మొత్తం అన్ని ఉన్నయ్.. పైకెళ్ళి  మీ ఇంట్లోల్లు కూడ కట్నానికి ఆశపడే మనుషులు కాదు.. ఆ ముచ్చట కూడ నాకెర్కే..  ఇంక సాఫ్ సీదా చెప్పల్నంటే, మేం సొంతంగ వెతికినాసుత ఇంతమంచి సంబంధం మా చెల్లెకు దొర్కదు గావచ్చు… కనీ… కని మా చెల్లెను నీకిచ్చి చేశుడన్నది  కాని ముచ్చట… అర్థం చేస్కో.. సరేనా?? అంతే ఇంక.. ఈ టాపిక్ ఇక్కడికి విడిచిపెట్టు.. ఆయింత తాగు.. పోదాం..

అరేయ్.. అన్నితీర్ల మంచి సంబంధం అని నువ్వే అంటున్నవ్గారా?? మరి ఒప్పుకోడానికేంది చెప్పు? ముందుగాల నీకిష్టమా కాదా చెప్పు? నీకు ఓకే అంటే అటేంక మీ ఇంట్లోళ్లను మనిద్దరం కలిశి ఒప్పియ్యొచ్చు..

అద్దన్న పాటే ఊకె పాడక్రా.. నేనూ, మా చెల్లె ఇద్దరం ఒప్పుకున్నా మా అమ్మనానలుఒప్పుకోరు.. ప్లీజ్… దయచేసి ఇంకా ముచ్చట విడిశిపెట్ర భై..

అట్లకాదు నువ్ చెప్పు.. నీకిష్టమేనా?

కార్తిక్ నిశ్శబ్దంగ తన గ్లాస్ ను చేతులకు తీసుకోని మెల్ల మెల్లగ తాగుతున్నడే తప్పితే ఓ రెండు నిమిషాలు అసలేం మాట్లాడలే.. సగం గ్లాసు ఖాళీ అయినంక-

నాకిష్టమే రా.. ఇప్పుడే చెప్పినకదా మా అంతట మేం సొంతంగ వెతికినా కూడ నీ అంత మంచోన్ని మా చెల్లెకు తేలమని.. ఆ మాట వాస్తవం..ఎందుకంటె నిజంగ నా లైఫ్ ల నీ అంత పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నోన్ని  నేనిప్పటిదాంక చూల్లే…

ఎవడో ముక్కు మొఖం తెల్వనోనికి మా చెల్లెనిచ్చి పెండ్లి చేశుడుకంటే, చిన్నప్పటికెళ్ళి మాతోనే కలిశిపెరిగినోనివి, అన్నితీర్ల మంచోనివీ.. నీకిచ్చి చేస్తెనే మా చెల్లె మంచిగుంటదని నాక్కూడ అనిపిస్తుందిరా.. కని…

వినయ్ మొఖంలో చిన్న వెలుగు..

కని? కని ఏంది చెప్పురా..

అరేయ్.. నేన్ ఫ్రాంక్ గ ఒకటిచెప్తరా.. నువ్ ఫీల్ ఐతె మాత్రంనేన్ చేశేదేం లేదుముందే చెప్తున్న..

నేనేం ఫీల్ గానుచెప్పురా..

మా నానమ్మ ఎర్కేగదా.. చిన్నప్పుడు నువ్ మా ఇంటికచ్చినప్పుడు ఆమేం చేశేదో నీకెరికేనా??

ఎమ్మోరా?ఏం చేశేది?..

మంచి నీళ్లిచ్చినా, చాయ్ ఇచ్చినానీకు సెపరేట్ గఓ బుగ్గెండి గ్లాసుల పోశిస్తుండే మతికున్నదా..

ఆ.. ఆ.. కరెక్టే రా.. ఎప్పుడన్నెప్పుడన్న మీ అమ్మ స్టీల్ గ్లాసుల పోశిచ్చినాసుత తిడ్తుంటే..

ఆ.. అదే.. మా నానమ్మ ఒక్క నీకనే కాదు… మా ఇంటికి “తక్కువోళ్ళు” ఎవ్వరచ్చినా ఆ బుగ్గెండి గ్లాసులనే పోశిస్తది.. ఇంక మేం చిన్నప్పుడు లొల్లి వెట్టుకునేది కాబట్టి ఆయింత నిన్నొక్కన్ని ఇంట్లకు రానిచ్చేదిగని వేరేటోల్లైతెఅసల్ ఇంటి గలమ లోపటికి రానియ్యకపొయ్యేది..

అంటే??

అంటేందిరాఅంటే?? మాకన్న “తక్కువోళ్లను” అసల్ మా ఇంటి గడుపకూడ దాటనియ్యకపొయ్యేది అంటున్న.. నువ్వచ్చి పొయినంక కూడ మా నానమ్మ నువ్ కూసున్న జాగల నీళ్లుపోశి కడిగేది ఎర్కేనా?? అగో అంత ఉంటది వాళ్లకు “ఎక్కువ తక్కువా” అని..

కావచ్చురా, కని ఇప్పుడు మీ నానమ్మ లేదుకదా…. మరింకేంది ప్రాబ్లం?

మొత్తం విన్రా.. మా అమ్మా నానాలు, మా నానమ్మంత ఘోరంగ నీతోని ఎప్పుడు ప్రవర్తించకపోవచ్చు… వాళ్లు నిన్నెప్పుడు తక్కువ చేసి చూడకుండ మాతోని సమానంగనే నిన్నుకూడ కలుపుకపోవచ్చూ.. కని అంత మాత్రాన ఇప్పుడు నువ్ మా చెల్లెను చేస్కుంటా అనంగనే వాళ్లు ఒప్పుకుంటరు అనుకోకు..

మా పెద్దనానోళ్ల కొడుకు రఘన్న కూడా చిన్నప్పటినుంచి మా ఇంట్లనే పెరిగిండు నీకెర్కే కదా?? ఆయినె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్కున్నందుకే మా నాన ఇప్పటికి మూడేండ్ల నుండి ఆయినెతోని మాట బంజేషిండు.. ఇంటిగ్గాదుకదా దుకాణం కాడికిసుత రానిస్తలేడు..అసొంటోడు సొంత బిడ్డను నీకిచ్చి పెడ్లి చెయ్యమంటె చేస్తడా చెప్పూ?? అందుకే చెప్తాన, అయన్ని కాని ముచ్చట్లురా భై.. వుట్టిగ కలల్ కనకు..

కదా?? మరి మాకు రిజర్వేషన్ ఉండుట్ల తప్పేమున్నదిరా??

ఏందిరా?? పిస్స గిన లేశిందా? అసల్ నేన్ చెప్పిందానికీ, నువ్వనేదానికీ ఏమన్న సంబంధం ఉన్నదా??

ఉన్నది.. ఉన్నది కాబట్టే అంటున్న..

ఒక్క అరగంట ముంగట నువ్వేం మాట్లాడినవో నీకు మతికున్నదా? మాకన్నున్నయ్ అయినా రిజర్వేషన్ దేనికీ అదీ ఇదని అడిగినవ్ కదా?? అగో,దానికి జవాబు చానా స్పష్టంగా సూటిగ నీ నోటితోనినువ్వే చెప్పినవ్ చూడు..

కార్తిక్కి విషయం మెల్లమెల్లగ అర్తమైతుంది..

నీకు తెల్సింది మీ నాన్నమ్మ ఒక్కలే.. కని అసొంటి నానమ్మల అనుభవాలు నాకు కోకొల్లలు.. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల యేండ్లకెళ్లి ఆ “తక్కువ”నూ, వాళ్లు చూసే “చిన్న”చూపును భరించుకుంటస్తున్నమ్రా మేమూ.. నీకు తెల్సింది రెండు గిలాసల పద్దతొక్కటే.. కాని మేం పడ్డ అవమానాలు కొన్ని వందల రకాలు..ఇంతకన్నా వేల రెట్లకుట్రలను, వివక్షలను ఎదుర్కోని ఎదుర్కోని ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మనుషుల్లెక గుర్తించబడ్తున్నంరా మేము..

అంటే? మా తాత ముత్తాతలు చేసిన తప్పులకు ఇప్పుడు మేం శిక్ష అనుభవించాల్నారా?

మీ మూడు తరాల చూపుల్లో తేడాను ఇప్పుడు నువ్వే చెప్పినవ్ గారా?మీ నానమ్మ కాలంలో మేం మీకంటె “తక్కువ” వాళ్లం.. మీ నానతరంలో మేం కేవలం మీకుమనుషులుగా “సమాంతరం” అంతేకనీ మీలో కలవడానికి వీలులేదు.. కని ఇప్పుడు మనదగ్గరికొచ్చేసరికి మనిద్దరం సమానం..అదేరాభై రిజర్వేషన్ లు మా బతుకుల్లో తెచ్చిన తేడా…అవే లేకపొయ్యుంటే?? ఊహించుడు కూడ కష్టంమామా..!!అది శిక్ష అని నువ్వనుకుంటున్నవ్.. కని అది మాకు రక్ష అని మేం అనుకుంటున్నం…ఇది నీకు సమజయ్యేటట్టు చెప్పాల్ననే మీ చెల్లెను పెండ్లి చేస్కుంటా అని మజాక్ చేసిన్రా.. తప్పుగ అనుకోక్రా భై.. సారీ మామా..

కార్తిక్ కి అసల్ ఏం మాట్లాడాల్నో తెలుస్తలేదు… అంత “క్లియ్యర్ ఈక్వేషన్” విన్నంకఇంకేం మాట్లాడ్తడు..!

ఒక రెండు నిమిషాలకు పరిస్తితి కొద్దిగ సల్లవడ్దది..

అంటే? నువ్ మా చెల్లెను నిజంగ ఇష్టపడలేదారా?

లేదు మామా, నీకు చెల్లైతె నాకు చెల్లే గారా..

సాలె గా.. ఎంత షాక్ ఇచ్చినవ్రా నాకు..

మరిలేకపోతె ఏందిరా నువ్వు.. ఇగ చూస్తున్న అగ చూస్తున్న, ఒక మానంగ రిజర్వేషన్లను తిడ్తనే ఉన్నవ్.. అందుకే..

అరే నిజమే భై.. కని నువ్వే చెప్పురా.. మా నానమ్మ కాలానికీ ఇప్పటికీ మార్పులేదా?? వాళ్లు అసల్ ఇంట్లకు రానియ్యకపొయ్యేది.. మా నాన వాళ్లు ఇంట్లకు రానిస్తరూ కలవనిస్తరు అన్నిచేస్తరుకని పెండ్లంటె మాత్రం ఒప్పుకోరు.. కని నేన్నిన్నెప్పుడన్న చిన్నచూపు చూశిన్నారా భై? ఇప్పుడే పెండ్లికిసూత ఓకే అంటినిగారా?? నిన్ను సమానంగ అనుకోందే ఆ మాటంటనారా? మరింకిందెకురా నీకు రిజర్వేషన్?

అందరు నీలెక్క ఆలోచిస్తె మంచిగునే ఉండురా భై.. ఆలోచించరు కాబట్టే వాటికింకా వ్యాలిడిటీ పెంచుతున్నరు.. నిజంగ ఇంకో పది ఇర్వై ఏండ్లల్ల నీలెక్కనే మన తరం అందరు “ఆ సమాంతరాన్ని సమానం చేశిపారేశిన్లంటె” మనస్పూర్తిగ నా రిజర్వేషన్ నేనే తీపిస్తసరేనా? ఐ మీన్ నా పిల్లలకు, రిజర్వేషన్ తీపిస్త..

అంటె వాళ్లుకూడ అప్పుడు జెనెరల్ ఇగ? మెరిట్ ల కొట్టాల్సిందేఅంటవ్..

మరి అంతేగా మామా.. అని ఇద్దరు ఆ మిగిలిన బీర్ చీర్స్ కొట్టుకోని తాగేశిన్లు..

ఇంకోటి చెప్దామా? చాలా?? వినయ్ అడిగిండు

సాల్ రా భై, మస్తైంది.. బిల్లు తెమ్మనిగ పోదాం..

అరేయ్ మరి ఫుడ్డూ?? ఒక చికెన్ బిర్యాని చెప్పల్నా.. చెరిసగం తిందాం?

వద్దూ.. బయట తిందాం…

వినయ్ బిల్లుకట్టి, టిప్ ఇచ్చి వచ్చిండు.. ఇద్దరు సొలుగుకుంట బయటకు నడుస్తున్నరు..

అరే మామా చెల్లె గురించి అట్లన్నందుకు సారీరా..

అరే లైట్ బే.. నేనే సారీ మామా అట్ల మాట్లాడినందుకు, నువ్ ఫష్ట్ సాలరీ ఎత్తి సంబురంగ నాక్ దావతిస్తుంటేనేనే నీ మూడ్ పాడ్ చేశినా.. సారీరాభై..

అరే లైట్ బే…చోడ్ దే.. ఔన్రా, మన స్టేట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డట్టున్నదిగారా అప్లై చేష్నవా? దానికి జెనెరలే ముప్పై ఐదేండ్లున్నట్టున్నదిగా..

ఆ చేష్న మామా, సదూతున్న..

ఆ.. మంచిగ సదూరా నీకుట్టిగనే అస్తదది.. కావాల్నంటె కోచిన జాయిన్ గా మామా.. ఫీజ్ నేన్ కడ్త..

ఏ.. ఎందుక్ బే.. వద్దద్దు.. ఇప్పటికే నాకొరకు యాభై అర్వై వేలు పెట్టినవ్..  ఇంక సాల్ మామా.. లైట్..

అరేయ్? అయన్నెందుకు లెక్కలు వెడ్తున్నవ్రా.. నేనెమన్న మందికి వెడ్తున్ననా.. నీకేకదా.. ఇగో ఈ ఏటీయం కార్డ్ తీస్కపో.. కోచింగ్ కు ఎంతైతదో కనుక్కోని మంచి దాంట్ల జెయిన్ గా… సరేనా.. పాస్ వర్డ్ ఎరికేగా.. అనుకుంట కార్డును కార్తిక్ జేబుల పెట్టిండు వినయ్..

లవ్ యూ రా మామా..

అరేయ్.. నీకు మందెక్కువైందిబే..

కదా?? అయినా సరే బైక్ నేనే నడుపుతా..

సరే సరేగని తొవ్వల ఏన్నన్న ఆపి నెట్ బ్యాలెన్స్ ఏయించుకో.. చెల్లె చెప్పిందికదా..

ఆ రైటే మామా నేనసల్ మర్శేపేన..

కార్తిక్ బైక్ స్టార్ట్ చేసిండు.. వినయ్,కార్తిక్ వీపునే “మెత్త”లెక్క చేసుకోనిబైక్ మీదనే పడుకున్నడు.. చీకటి వెలుగుల రోడ్లను దాటుకుంటూ దాటుకుంటూ ముందుకు పొయ్యీ పొయ్యీ బైక్ ఒకదగ్గర ఆగింది..

కార్తిక్, వినయ్ని లేపుతున్నడు..

అరే లేరా.. లే.. నువ్ లోపటికి నడు, నేన్ రీచార్జ్ చేయించుకొస్తా అని వినయ్ ని అక్కడ దించి కార్తిక్ పక్క షాపుదిక్కుకు  నడిశిండు..

“ఏంది అప్పుడే అచ్చిందా” అని కండ్లు నులుముకుంట వినయ్ ఒక్క రెండడుగులు బిర్యాని సెంటర్ దిక్కు వేశిండోలేదో సడన్ గ ఎవరో పట్టి ఆపినట్టు ఠక్కున ఆగిపొయిండు..ఎదురుంగ ఎర్రని రంగుల పెద్ద పెద్ద అక్షరాలు రాసున్న ఒక బోర్డు కనపడ్తాంది..

అప్పుడే కొత్తగ అక్షరాలు చదవడం నేర్చుకున్నోడు చదివినట్లుచదువుతున్నడు వినయ్ ఆ బోర్డును- “ముబారక్…క..ళ్యా..ణి… బి..ర్యా..నీ… సెంటర్..”

తను చూస్తున్నది నిజమో కాదోనని అవే అక్షరాలను ఒకటికి రెండు సార్లు చదివిండు.. కనిఎన్నిసార్లు సదివినా అవి మారలేదు.. తను చూస్తున్నది నిజ్జంగ నిజమే..అవి అవే అక్షరాలు..

క…..ళ్యా….ణీ…. బి…..ర్యా……నీ…

ఇంతల కార్తిక్ రీచార్జ్ చేయించుకోనివచ్చి, నోరెళ్లబెట్టి నిలుచున్న వినయ్ జబ్బ మీద చెయ్యేసిండు.. వినయ్ ఆశ్చర్యంతోని అట్లనే గుడ్లు పెద్దవిచేసి చూస్తూ-

ఏందిరా?? ఈడికి పట్కచ్చినవ్?? మందెక్కువైమజాక్ చేస్తున్నవా?లేకుంటె నిజంగనే దిమాగ్ఖరాబైందా??”

సమాంతరాన్ని సమానం చెయ్యాలెగా మామా..చలో పారా.. ఇయ్యాల్టికెళ్ళి నేన్ సుత నీ తిండి తింటా..

ఇన్నిరోజులు తాను గొడ్డు మాంసం తింటా అంటెనే తీవ్రంగ అసహ్యించుకునే కార్తిక్, ఇప్పుడు తనంతట తానుగా  తింటా అనేసరికి వినయ్ కి అస్సల్ ఏం అనాల్నో తెలుస్తలేదు…కాని ఆ అద్భుత క్షణంలో, అప్పటిదాకా జీవితంలో ఎన్నడు తన నోటి నుంచి రాని మాటలు వాటంతట అవి అప్రయత్నంగనే బయటికొచ్చినయ్..

లవ్ యూ మామా..వినయ్ అన్నడు..

లవ్ యూ టూ రా భై…..

ఇప్పుడా రెండు మొఖాల్లోనూ చిన్న చిరునవ్వూ.. పెద్ద సంతృప్తీ..

ఆ కళ్లకిప్పుడు చీకటి కూడా వెలుగులెక్క కనపడుతోంది…

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

 

*

allam-vamsi

అభిమన్యులు

అల్లం  వంశీ

 

allam-vamsi“కష్టం రా.. మొన్ననే నాలుగు నెల్లకింద మా నాన ‘దానికి’ వచ్చిపేనగదా.. మళ్ళ ఇప్పటికిప్పుడు వచ్చుడంటే చానా కష్టంరా… ఈసారి కాదుగనీ మళ్లెప్పుడన్న వీలుచూసుకోని వస్తలే..”
ఆఫీస్ ఫోన్ ల నుంచి చాటుగ ‘గుస గుసగ’ మాట్లాడుతున్నడు రమేషు..
“అరే.. అప్పుడు నువ్వు వచ్చిన సంధర్భం వేరే, ఇప్పుడు నేన్ రమ్మంటున్న సంధర్భం వేరే.. రా.. రా..” ఊర్లో ఎస్టీడీ బూతుల నుంచి ఊరందరికి వినిపించేటట్టు మాట్లాడుతున్నడు మనోహరు..
వీళ్లిద్దరు చిన్నప్పటికాంచి మంచి దోస్తులు. పుట్టి పెరిగింది ఓ చిన్న టౌన్ ల.. రమేష్ పీజీ దాక చదివి హైదరాబాద్ ల ఏదో గవర్నమెంట్ నౌకరి సంపాదించుకోని అక్కడే ఉంటున్నడు.. మనోహర్ మాత్రం పుట్టిపెరిగిన ఆ ఊళ్లెనే ఓ బట్టల దుకాణం పెట్టుకోని నడుపుకుంటున్నడు. ప్రస్తుతం ఇద్దరికీ చెరో ముప్పయ్యైదేండ్లు ఉంటయి..
“మొన్నచ్చినప్పుడే వారం రోజులు లీవ్ పెట్టిన్రా.. మళ్లిప్పుడే లీవ్ అంటె కష్టం భై.. చానా కష్టం..”
అట్ల కాద్రా.. మన సార్ రిటైర్మెంటు ఫంక్షన్లనన్న అందరం ఓసారి కలవొచ్చని రమ్మంటున్న..
“అందరంటె” ఎందర్రా?? మా అంటె ఆడ లోకల్లున్నోళ్లు ఓ నలుగురున్నరుకావచ్చు.. అంతేకదా??

Kadha-Saranga-2-300x268
అంటే?
అంటేలేదు గింటేలేదు.. బయట నౌకర్లు చేసేటోళ్లు ఎందరస్తున్నరో చెప్పు? ఒక్కడు వస్తా అన్నా, నేను కూడ వస్తా సరేనా??
అరేయ్, అందరు ఇట్లనే అంటున్నర్రా.. ఒక్క రెండురోజులకు వచ్చిపోతె ఏమైతుంది చెప్పు??
ప్లీస్ రా భై.. తప్పుగ అనుకోకు… నేనిప్పుడు లీవ్ పెట్టే పరిస్తితిల లేను, ఈ యేడాదే నా ప్రమోషన్ గూడ ఉన్నది.. ఊకూకె ఇట్లనే లీవులు పెట్టినా అంటె అంతే ముచ్చటిగ..
అయినా అమ్మ కూడ ఇక్కడ ఒక్కతే ఉన్నట్టున్నదికదా? ఓసారి వచ్చి కల్శి పేనట్టుంటది.. రా రా..
ఇంకో నాల్ రోజులుపోతె అమ్మే ఇటస్తా అన్నదిరా.. అయినా మొన్నటిదాక అమ్మతోనే ఉంటి, అమ్మ ముచ్చట ఇడ్శిపెట్టు కని సారుకే ఏదన్నొకటి చెప్పురా.. పాపం నేనంటె మస్తు పావురపడ్తుండే, నేన్ రాలేదంటె ఫీల్ అయితడుకావచ్చు!! నా తరుపున ఓటి మంచి శాలువా ఇయ్యిరా, సరేనా? పైసల్ మనం కలిసినప్పుడిస్తా..

vamsi
******
కాలం ఓ పదేండ్లు ముందుకు కదిలింది..
“అబో కష్టం రా… ఇప్పుడెక్కడ వీలైతదిరా అయ్యా!” రమేషు, ఇంట్లోని ల్యాండ్ లైన్ ఫోన్ ల మనోహర్ తోని మాట్లాడుతున్నడు…
నువ్వు ఊకె ఏదో ఒక సాకు చెప్పకురా.. ఈసారి మాత్రం నువ్వస్తున్నవ్ అంతే.. ఇంక మాట్లాడకు…
అరేయ్.. అట్ల కాదురా.. మా పిలగాన్లకు పరీక్షల్ నడుస్తానయ్.. ఇప్పుడు వాళ్లను ఇడ్శిపెట్టి నేనటస్తె ఆమెకూ, పిల్లలకు ఇబ్బంది కాదా? వద్దు వద్దు.. నాకు వీలుకాదు..
అందరు రావాల్సిందిపొయ్యి, కనీసం నువ్వొకనివన్న రా రా అంటె అంత ఇసం చేస్తానవేందిరా? నువ్ ఫోన్ చెల్లెకియ్యి ముందు, చెల్లెతోని నేన్ చెప్తా..
అరే!! ఆమె పొమ్మన్నా నేన్ వచ్చుడు కష్టమేరా. పిల్లల పరీక్షలొక్కటేకాదు, ఈడ ఆఫీస్ ల సుత నేనిప్పుడు బయటికి కదిలేటట్టులేదు.. మార్చి నెల కదా, ఇయర్ ఎండింగ్ లెక్కలూ కతా కార్ఖానా.. అదంత పెద్ద లొల్లి రా.. చెప్పినా నీకు సమజ్ కాదుగని.. విడ్శిపెట్టు..
నా కొడుకు పుట్టెంటికలప్పుడు రాలె, బిడ్డకు చీరకట్టిచ్చినప్పుడు రాలే.. నీనేమన్న అన్ననా??
నిరుడు మా నాయిన పోతెసుత కబురుచెప్తి.. పోనీ అప్పుడన్న అచ్చినవా??
రాలేకదా?? ఈసారి మాత్రం నువ్ రాకుంటె ఊకునేదిలేదు చెప్తున్నా.. నువ్వచ్చినంకనే మేం ఇండ్లల్లకు పోవుడు.. గంతే..
అరే.. అట్లంటవేందిరా? రావాల్నని నాకు మాత్రం ఉండదా చెప్పు? కాని ఇక్కడ పరిస్తితి అట్ల ఉండదురా..
ఏం పరిస్తితిరా? పదేండ్లు దాటింది ఎర్కేనా??
అరేయ్… నాకు లేటయితుంది ప్లీస్.. ఏమనుకోకురా.. అర్థంచేస్కో.. ఇగో అమ్మ మాట్లాడుతదట, ఫోన్ అమ్మకు ఇస్తున్న.. మాట్లాడు.. నాకు లేటయితుంది నేన్ పోతున్నా… రైట్ రా… కొత్తిల్లు కట్టుకున్నందుకు మళ్లొక్కసారి కంగ్రాట్స్..
******
కాలం ఆగలేదు.. ఇంకో పది క్యాలెండర్లు మారినయ్..
“నువ్ మొన్న చెప్పినా వస్తుంటిరా.. ఇప్పుడైతె కష్టమిగ!” బయట పార్క్ లో వాకింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నడు రమేషు..
ఎందుకు? మొన్నటికీ ఇయాల్టికే ఏం మారింది?
మొన్నటిదాక నాకు పెద్దగ పనేం లేకుండ వట్టిగనే ఉంటి.. కాని ఎల్లుండి మావోడు అమెరికా నుంచి వస్తుండురా..
ఔనా? ఐతె ఇంకా మంచిది.. పిల్లల్లనూ, చెల్లెనూ అందరిని తీస్కోనే రారా మా బిడ్డ పెండ్లికి…
రావాల్ననే నాక్కూడ ఉన్నదికనీ. వాడేమంటడోరా? ఉండేదే ఒక్కనెల, అందుకే వాడెట్లంటె అట్లనే ఇగ. వానిష్టం..
పిలగాడచ్చినంక ఓసారి నాతోని మాట్లాడిపియ్.. నేన్ మాట్లాడ్త వానితోని..
చేపిస్తగనీ, అనవసరంగ వానికి అదోటి ఇదోటి చెప్పి పరేషాన్ చెయ్యకు.. ఈ ఎండలు వానికి పడ్తయో పడయో!! అమెరికాల ఉండవట్టి మూన్నాలుగేండ్లైతాందికదా, అలవాటు తప్పుంటది..
ఇంకోటేందంటే, మా బిడ్డకుసుత సంబంధాలు చూస్తున్నం.. ఒకట్రెండు మంచియే వచ్చినయ్ గని మావోడచ్చినంకనే ఏదన్నొకటి ఫైనల్ చేద్దామని ఇన్నిరోజులు ఆగినం.. ఆ పని కూడ ఓటున్నది మాకు..
సరే.. సరే చూడన్లి మరి.. కనీసం ఒక్క రోజుకోసమన్న వచ్చే ప్రయత్నం చెయ్యున్లి..
తప్పకుండా.. మంచిదిరా మరి..
******
కండ్లు మూసి తెరిచినంతల చెరి అరవయ్యైదేండ్లకు వచ్చిన్లు..
“విపరీతమైన మోకాల్ నొప్పులురా.. వచ్చేవారమే ఆపరేషన్ ఉన్నది..” ఆరాం కుర్చీలో ఒరిగి కూచోని సెల్ ఫోన్ ల లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నడు రమేషు..
మోకాల్ నొప్పులు నీక్కూడ వచ్చినయారా??
ఆ.. సర్వీస్ ల ఉన్నన్ని రోజులు ఏ రోగం, నొప్పి లేకుండేకని రిటేరైనంకనే ఇది షురూ ఐంది..
మ్మ్.. ఇయ్యాలరేపు ఇరవయ్యేండ్ల పోరగాల్లకే మోకాల్ నొప్పులస్తున్నయ్.. మనమే అదృష్టవంతులమ్రా..
ఏం అదృష్టమో ఏందోరా.. కాళ్లు మస్తు సలుపుతున్నయ్.. సులుకు సులుకున పొడిశినట్టైతుంది నాకైతే.. ఆపరేషన్ అయినంకనన్న ఏమన్న తగ్గుతదేమో సూడాలె..
తగ్గుతదిరా, మా వియ్యంపునికి అదే సమస్య ఉంటుండే.. అంతకుముందు ఒంటికిలేవాల్నన్నా ఇంకో మనిషి సాయిత పట్టుకోని తీస్కపొయ్యేది, అసొంటిది ఆప్రేషన్ అయినంక ఇప్పుడు ఒక్కడే పొద్దుకు పదిమాట్ల పొలంకాడికి పొయ్యస్తున్నడెరికేనా? నువ్వుట్టిగ రందివెట్టుకోకు.. వట్టిగనే తగ్గుతదది..
అవునా.. మంచిదే ఐతే.. ఓసారి ఆయినె నంబర్ నాకియ్యి చేషి మాట్లాడ్తా..
నంబరెందుకురా, నువ్ ఈడికస్తే ఇటు నా కొడుకు కొత్త షోరూం ఓపెనింగుకు వచ్చినట్టుంటది, అటు మా వియ్యంపునితోని మాట్లాడినట్టుంటది.. రా రా.. ఈసారన్న ఓ రెండ్రోలు వచ్చిపో..
అబ్బో.. ఇప్పుడు నాతోనికాదురా.. ఆపరేషన్ చేపిచ్చుకోని అటేంక పుర్సత్ అటే వస్తిగ.. ఇప్పుడైతె నంబర్ ఇయ్యి..
******

vamsi
మళ్లీ ఫోన్ మోగడానికి పదిహేనేండ్లు పట్టింది.. ఇటువైపు మాట్లాడేది మనోహరే కాని అటువైపున్నది మాత్రం రమేష్ కాదు..
అంకుల్.. నేను.. రమేష్ వాళ్ల కొడుకు రాహుల్ ని మాట్లాడుతున్నా..
ఎవరూ? ఏ రమేషు నాయినా?
నేనంకుల్.. రమేష్ తెల్సుకదా.. పింగని రమేషు.. వాళ్ల కొడుకు రాహుల్ నూ..
ఆ.. ఆ.. చెప్పు బిడ్డా మంచిగున్నవా?? నాయిన మంచిగున్నడా??
అంకుల్.. అదీ.. నిన్న మార్నింగ్..
ఆ??
నిన్న మార్నింగ్ డ్యాడీకి నిద్రలోనే స్ట్రోక్ ఒచ్చిందంకుల్.. మమ్మీ వాళ్లూ హాస్పిటల్ కి తీస్కెళ్లేలోపే.. దార్లోనే..
అయ్యో దేవుడా… ఎంత పనాయిపాయే.. అని మనోహర్ ఏడుస్తూ దుఃఖంలో ఏవేవో మాటలు అంటున్నడు కని రాహుల్ కు అవి వినేంత టైమూ, ఓపికా లెవ్వూ..
అంకుల్.. అంకుల్.. ప్లీస్ నేన్ చెప్పేది వినండి..
ఆ.. ఆ.. చెప్పు నాయినా… దేవుడెంతన్యాయం చేసేగదా కొడుకా… రమేషా..
ఆ.. ఆ.. అంకుల్ ప్లీస్ ఏడుపాపి వినండి…. మా డ్యాడీ చనిపోయే ముందు మమ్మీతో – తన.. ఆ “చివరి కార్యక్రమం”.. తను పుట్టి పెరిగిన ఆ ఊళ్లోనే జరిపించమన్నారట..
ఆ..
ఆ ఊళ్లో నాకు తెల్సింది మీరొక్కరే…. సో… అంకుల్.. ప్లీస్.. మీరూ… హెల్ప్…
అయ్యో ఎంతమాట నాయినా.. మీరు జల్ది బయలెల్లున్లీ.. మీరు వచ్చేలోపట నేనిక్కడ అన్నీ తయార్ చేపించి ఉంచుతా.. సరేనా..
సరే అంకుల్.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ వెరీ మచ్.. మేం బయల్దేరుతున్నం..
******
సరిగ్గా నాలుగు నెలల తర్వాత-
అమెరికాల ఉన్న రాహుల్.. ఆఫీస్ బ్రేక్ టైం లో, హైదరాబాద్ ల ఉన్న దోస్తు కౌషిక్ తోని “స్కైప్” వీడియో కాల్ లో మాట్లాడుతున్నడు-
“కష్టం రా.. మొన్ననే నాలుగు నెల్లకింద మా నాన ‘దానికి’ వచ్చిపేనగదా.. మళ్ళ ఇప్పటికిప్పుడు వచ్చుడంటే చానా కష్టంరా… ఈసారి కాదుగనీ మళ్లెప్పుడన్న వీలుచూసుకోని వస్తలే..”

*

లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్…

అల్లం వంశీ

 

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”
ఉట్టిగనే.. రాస్తుంటే మంచిగనిపిస్తుంది కాబట్టి రాస్తున్నా..

మంచిగనిపించుడంటే?
ఓ కథ రాస్తా.. అది ఎన్లనో ఒక దాన్ల పబ్లిష్ ఐతది.. అది చదివి ఓ నలుగురు ఫోన్ చేసి మంచిగున్నది అంటరు.. ఇంకొందరు అక్కడికి ఆగకుంట “నీ కథల, మమ్మల్ని మేం చూస్కున్నం.. అదంత చదివినంక మావోళ్లు మతికస్తున్నరు. మా ఇల్లు మనాది సలుపుతున్నది, పొయి రావాలె.. మాక్కొద్దిగ మారాల్ననిపిస్తున్నది..” అని ఇంకో రెండు మూడు ముక్కలు ఎక్కువ మాట్లాడుతరు.. బస్… అది చాలు.. దిల్ ఖుష్.. అందుకే మంచిగనిపిస్తది అంటున్న..

గంతేనా? ఇంకేం లేదా??
లేదా అంటే మా ఉన్నదికని అందంత చెప్తే క్లాస్ పీకినట్టు ఉంటదని చెప్తలేను..

పర్వాలేదు చెప్పు..
చదువుకుంటె మనిషి సంస్కారవంతుడైతడు అంటరుకదా, అది వంద శాతం నిజం.. కాకపోతే “ఏం” చదువుకుంటే సంస్కారవంతుడైతడనేది చానమందికి తెలువకపోవుడే అసలు సమస్య..
న్యూటన్ గమన నియమాలు బట్టీకొడితెనో, మైటోకాండ్రియా నిర్మాణం పొల్లుపోకుండ యాదుంచుకుంటెనో, మొఘల్ చక్రవర్తుల వంశ వృక్షం మక్కీకి మక్కి అప్పజెప్పగలిగెతెనో కుప్పలు తెప్పలుగా సంస్కారం వచ్చిపడుతది అనుకుంటరు చానమంది!

అంటె? చదువుకు సంస్కారానికి సంబంధంలేదనా నీ ఉద్దేశ్యం?
అరే.. మొత్తం వినూ.. అదే చెప్తున్నా… ఇంతకుముందు చెప్పినయన్ని చదువుతె ఆ సబ్జెక్టుల నాలెడ్జీ పెరుతది కావచ్చు కని దునియాల మంచీ చెడుల గురించి ఏం తెలుస్తది చెప్పు??
ఇక్కడ నీకో చిన్న ఉదాహరణ చెప్తె మంచిగ సమజైతదికావచ్చు! నూట యాభై దేశాల రాజధానులూ + వాటి కరెన్సీలు టకా టక్ అప్పజెప్పే పదేండ్ల పిలగాడొకడు నాకు తెల్సు.. (మా సైడ్ బాగ ఫేమస్, “మస్తు తెలివిగల్లోడు” అని)… ఆ పిలగాడు మొన్నోసారి వాళ్ల కుక్క తోకకు సుతిల్ బాంబు కట్టి పేల్చిండు, పాపం దాని తోక తెగిపొయి, తొడలు మొత్తం కాలి పుండై రక్తం కారుతుండే.. అట్ల చేసినందుకు వాళ్ల అమ్మనాన (ఇద్దరూ గవర్నమెంట్ టీచర్స్) పిలగాన్ని ఏమనకపోంగా ఆ కుక్కను మా కుక్క కానే కాదన్నట్టు ఊరవుతల ఇడ్శిపెట్టచ్చి చేతులు కడుక్కున్నరు.
ఇక్కడ పిలగాడు చదువుకున్నోడే, వాళ్ల అమ్మనానలూ చదువుకున్నోళ్లే! మరి అందరు మంచోళ్లే అయినంక ఆ కుక్క బతుకు నిజంగనే “కుక్క బతుకెందుకైతది” చెప్పు…?

ఎందుకైందంటవ్ మరి?
వాళ్లు చదువుకున్నోళ్లే కనీ, సంస్కారం లేనోల్లు కనుక అట్లైందన్నట్టు..

నువ్ రాసే కథల గురించి నేనడుగుతుంటే, నువ్వింకేదో పిట్టకథల్ చెప్తున్నవ్??
పిట్టకథల్ కాదు భై.. మంచి సాహిత్యానికీ మనిషి వ్యక్తిత్వానికి సంబంధం ఉంటదని చెప్తున్నా.. “మనిషి మనిషి లెక్కనే ప్రవర్తించాలంటే” రెండే రెండు దారులుంటయ్.. ఒకటి మంచోళ్ల సోపతి, ఇంకోటి మంచి పుస్తకాలతోని దోస్తాని..
నీకు తెల్సో తెల్వదో కని, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ప్రపంచం.. ఒక్కో కథ ఒక్కో జీవితం.. అందుకే ఎంత చదివితే మన “ఆలోచనలకు” అంత మంచిది..

అచ్చా.. సమజైంది.. ఇంతకు నువ్వెందుకు రాశుడు షురూ చేష్నవో చెప్పలే..
ఈ రాశుడు సెవెంత్ క్లాస్ ల షురూ అయ్యి ఇక్కడిదాంక వచ్చింది.. అప్పుడు వార్త పేపర్లో “మొగ్గ” అని చిన్న పిల్లల పేజి ఒకటి వస్తుండే, దానికి పోస్టుకార్డు మీద కథలు రాసి పంపుతె ఓ రెండు మూడు సార్లు వాళ్లు పబ్లిష్ చేశిన్లు, అప్పుడు చూడాలె మా స్కూల్ల నా ఫెయితూ.. కథా కార్ఖానా.. అగో అప్పుడు షురూ అయి, నా కథ ఇక్కడి దాంక వచ్చింది..

అప్పటికీ ఇప్పటికీ ఏమన్న తేడా ఉన్నదా లేదా మరి?
అప్పుడు చిన్నగున్నప్పుడు కథ పడకపోయినా పర్వాలేదుకని పేపర్లో మన పేరు కనపడాలె, అది చూశి అందరు మస్తు పొగడాలె అని ఉండేది.. ఇప్పుడు మాత్రం రివర్స్ ల నా పేరు వెయ్యకపొయిన మంచిదే కని కథ మాత్రం బాగ మందికి రీచ్ కావాలె అనిపిస్తుంది.. ఇదికూడా కొంతవరకు స్వార్థపు ఆలోచనే కావచ్చుగని.. నిజాయితిగ చెప్తున్న, నాకైతె అట్లనే అనిపిస్తున్నది, చానమంది చదవాలె అని..
చదివి అందులో వాళ్లను వాళ్లు పోల్చుకోని లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్ తీసుకుంటె చాలు.. ఖుష్..

vamsi

 

వాళ్ల లైఫ్ పాజిటివ్ టర్న్ తీసుకుంటే నీకెందుకు ఖుష్? (నీకేంది లాభం?)
ఇంత పిచ్చి ప్రశ్న నా జిందగీల ఇంకోటి విన్లే.. ఇది చదువుతున్న వాళ్లల్లో చానామందికి దీనికి జవాబు ఎరికేగనీ.. ఇంకేమన్న అడుగవోయ్..

ఓకే.. ఓకే.. సినిమాలకు పనిచేసినట్టున్నవ్.. దాని గురించి కొంచం..
సినిమా రైటర్ ప్రస్థానం మస్తు పెద్ద కథ..
రెండేండ్లల్ల మూడున్నర సినిమాలు రాసిన.. (రెండున్నర వాటికి కథలూ+మాటలు, ఒక దానికి ఉట్టి మాటలు).. వాటిల్లో ఏ ఒక్కటీ కూడా ఇంకా రిలీస్ కాలే.. ఒకటి షూటింగు ఐందని తెలుసు, మిగిలిన రెండున్నర అసల్ సెట్ల మీదికి ఎక్కినయా/ఎక్కుతయా లేదా అన్నది నాకింక డౌటే.. “ఆ ప్రపంచం” మంచిగనే ఉంటది కని రచయితకు వంద “బార్డర్లు” గీసి మద్యల నిల్చోపెడ్తరు… బడ్జెట్ అనీ, భాష అని.. వంద ఉంటయ్..

 

బార్డర్లంటే?? కొంచం క్లియర్ గ చెప్పరాదు..
ఒకరు బూతు జోకులుండాలంటే, ఇంకొకరు పంచు డైలాగులు పడాలంటరు.. ఒకరు లాజిక్స్ లేకున్న పర్వాలేదుకని ఫ్రేము ఫ్రేముకీ ఫిమేల్సు కనిపించాలంటే, ఇంకొకరు నువ్వేం చేస్తవో నాకు తెల్వదు సాంగ్ అయిపోయిన వెంటనే గన్ ఫైర్ జరిగి స్క్రీన్ అంత రక్తం కారిపోవాలె అంటరు!!
తలకాయి తోక ఉండొద్దుకని గొర్రెను గియ్యమంటరు.. ముక్కూ చెవులు ఉండకున్నా మొహం అందంగా రావాలంటరు.. అదే సినిమా ప్రపంచం.. (అందరు అసొంటోళ్లు ఉంటరని కాదు.. కొందరు కత్తిలాంటి మహేషన్నలు, మంచి మహేందరన్నలు కూడా ఉంటరు.. కాని మస్తు అరుదు).. అందుకే అవన్ని నాతోటి కావనిపించి, ఆ ఫీల్డులో మనుషులు నాకు నచ్చినా, “ఆ సిస్టం” నచ్చక వదిలేష్నా..
ఇంక ఆ టాపిక్ లైట్.. వేరే ఏమన్న మాట్లాడుదాం..

ఓకే.. ఓకే.. ఇందాక సాహిత్యం అనుకున్నం కదా మరి సాహిత్యంలో కథా, కవిత, నవల, పాట, పద్యం.. ఇట్ల ఎన్నో ప్రక్రియలు ఉండంగ నువ్వు కథనే ఎందుకు ఎన్నుకున్నవ్?
ఇక్కడ చిన్న థియరీ చెప్పాలె.. “కడుపు నిండుగా తిన్నా కానీ, నోట్లో ఇంకా ఆకలవడం” అన్న కాన్సెప్టు నువ్వెప్పుడన్న విన్నవా?

అహా విన్లే..
చెప్త విను.. – నాకు చిన్నప్పటి నుంచి ఆకలైనపుడు ఎన్నిరకాల ఓల్డ్ స్టైల్ టిఫిన్లు(అంటే ఫర్ ఎక్సాంపుల్ రొట్టె/పూరీ/ గారె/ దోశే లాంటివి) తిన్నా, ఎన్నిరకాల లేటెష్ట్ వెరైటీలు (లైక్- పిజ్జా/బర్గర్/ నూడిల్స్ గీడుల్స్ లాంటివి) తిన్నా.. నా కడుపైతె మస్తుగ నిండుతది కని ఆకలి మాత్రం అస్సల్ తీరదు.. ఇంకా “ఏదో” తక్కువైన ఫీలింగ్ ఉంటది.. చిన్నప్పుడు మా అమ్మకు అదే చెప్పేటోన్ని- “కడుపైతె నిండిందికని నోట్లో ఇంకా ఆకలైతుందమ్మా” అని.. (వాస్తవానికి అది నోట్లో ఆకలవడం కాదుగాని, “తిన్న ఫీలింగ్” రాకపోవడం అన్నట్టు.. దాన్నే తెలుగుల “తృప్తిగా భోంచెయ్యడం” అంటరనుకుంట!) అప్పుడు మా అమ్మ ఆ టిఫిన్లు పక్కకు పెట్టి, ఇంతంత అన్నంలో కూరో చారో కలిపి తినిపించేది.. అదేం విచిత్రమోకాని ఒక్క రెండు బుక్కల అన్నం తిన్నా చాలు టక్కున ఆకలి తీరిపొయ్యేది.. ఇప్పటికి తిండి విషయంలో నాదదే థియరీ, “అన్నం” ఒక్కటే నా ఆకలి తీరుస్తదీ అనీ..
ఈ కథంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే- అన్నం ఎట్లైతె నా ఆకలి తీరుస్తదో, “కథ” కూడ సేం అట్లనే రాయాలన్న నా “కూతి”ని తీరుస్తది..

ఏం “కూతో” ఏందో.. ఇంత వెరైటీ పోలిక నేనైతె ఇప్పటిదాంక విన్లే!!
థాంక్యూ..

రకరకాల టిఫిన్లు ట్రై చేసినట్టు, సాహిత్యంలో కూడా అన్ని రకాలు ట్రై చేసే ఉంటరు కదా?
కావల్సినన్ని ట్రై చేశ్నా… కవితలూ, వ్యాసాలు, పాటలు, మాటలు(సినిమాలకు), కాలేజీల కామెడీ స్కిట్లూ + సగం రాసి విడిచి పెట్టిన నవలలూ…. నేన్ చెయ్యని ప్రయోగంలేదు..

మరి వాటిని ఎందుకు విడిచి పెట్టినట్టు??
నేను వాటిని విడిచి పెట్టుడుకాదుగనీ, అవే నన్ను విడిచి పెట్టినయ్… కథొక్కటే నన్ను పట్టుకోని ఉన్నది పాపం..

అట్లకాదు, కరెక్ట్ కారణం చెప్పు..
ఒక్కటని ఏం చెప్పను..! కవితలను, రాసిన నేను తప్ప ఇంకొకరు చదవకపోవడం కావచ్చు.. పేపర్లకు రాసి పంపిన వ్యాసంలో పావో, సగమో తప్ప మిగిలినదాన్ని వాళ్లు “ఎడిటింగు” చేసి నేన్ రాసినట్టు కాకుండా వాళ్లకు కావల్సినట్టు మార్చడం కావచ్చు, పాటల రికార్డింగు ఖర్చుతో కూడుకున్నదని కావచ్చు, నవలరాస్తుంటే ఒళ్లు బద్దకమవుడు కావచ్చు, స్కిట్ లు రాద్దామంటే ఇప్పుడు నేను కాలేజీలో లేకపోవడం కావచ్చు.. సవాలక్ష కారణాలు..

ఒక్కటడుగుతె ఇన్ని చెప్తున్నవ్? సరే సరే మళ్లీ “కథలోకి” వద్దాం.. ఇంకా చెప్పు కథలెందుకు ఇష్టం..
ఒకటే ప్రశ్నను మార్చి మార్చి ఎన్నిసార్లు అడుగుతవ్ చెప్పు..!

నువ్వు మంచి సాలిడ్ & వ్యాలిడ్ రీజన్ చెప్తలెవ్వు.. అందుకే మళ్ల మళ్ల అడుగుతున్నా ..
కవిత రాస్తే నాకు నేనే(ఎవరో ఒక్కరే) మాట్లాడుకున్నట్టు ఉంటది, మహా ఐతె ఇంకొకర్ని చొప్పించచ్చు కావచ్చు..
కాని కథల అట్లకాదు ఎంతమందిని కావాల్నంటే అంతమందితోని మాట్లాడిపియ్యొచ్చు…

కథలో-“మనకు నచ్చిన విషయం- నచ్చిన పాత్రతోటి- నచ్చిన సంధర్భంలో- నచ్చిన పద్ధతిలో- నచ్చిన చోట- నచ్చిన టైముకు- నచ్చిన భాషలో- నచ్చిన యాసలో- నచ్చిన పదజాలంతోని చెప్పే అద్భుతమైన సౌలత్ ఉంటది”.. (ఇవన్ని నచ్చకపోతే, రచయితగా మనం కూడా ఆ కథా సన్నివేశంలోకి దూరి మరీ మనమేం చెప్పాలనుకున్నమో చెప్పవచ్చు).. “కథ”ల ఇన్ని సౌలత్ లు ఉంటయి కాబట్టే నాకు మిగిలినవాటికన్నా “కథలు” రాశుడంటెనే ఎక్కువ ఇష్టం..

అంత సాలిడ్ గ లేదు కని, కొంచం వ్యాలీడ్ గనే ఉంది కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా…
అవునా.. థ్యాంక్స్..

ఇంకా.. నువ్వు రాసిన కథలకు సంబంధించి హ్యాపీగ అనిపించిన సంధర్భాలు??
చాన్నే ఉన్నయ్.. చదివిన వాళ్లు ఫోన్ చేసి “చదివినం, మంచిగుంది” అన్న ప్రతీసారి నాకు పండుగే.. ఇంకా మస్తు మంచిగనిపించె విషయమేందంటే చాన మంది సీనియర్ రచయితలు కూడా ఎక్కడో ఓకాడ నా కథ ఏదో ఒకటి చదివి, గుర్తుపెట్టుకోని మరీ కాలో, మెసేజో చేస్తున్నరు.. అటువంటివాళ్లు మంచిగుందన్నా, మాములుగ ఉన్నదన్నా నాకానందమే… చదవనైతె చదివిన్లు కాబట్టి..
ఇక్కడ అఫ్సరన్న కు ప్రత్యేకంగ కృతఙ్ఞతలు చెప్పుకోవాలే, ఎందుకంటే ఆన్ లైన్ మ్యాగజైన్ అనే మాధ్యమం తోని మస్తుమంది కొత్తవాళ్లను మస్తు ఎంకరేజ్ చేస్తున్నందుకు.. (ఈ విషయంల అఫ్సరన్న తర్వాతనే ఇంకెవరైనా..)
ఈ ఆన్ లైన్ మ్యాగజైన్స్ గొప్పతనం ఒకటున్నది, అదికూడ ఈ సంధర్భంల చెప్పుకోవాలె…

అదేందంటే… 24X7, 365 రోజులూ దునియాల అందరికీ ఇవి అందుబాటుల ఉంటయ్.. వీక్లీ పేపర్ల అచ్చైనవైతే ఆదివారం దాటితే మళ్ల మనకంటికి కనపడవు, కానీ ఆన్ లైన్ లో పబ్లిష్ అయినవాటిని ఇవ్వాల కాదుకదా ఇంకో పదేండ్లకు కావాల్నన్నా మనకు ఒక్క క్లిక్కు దూరంలనే ఉంటయి.. నాకందుకే ఈ పద్దతి మస్తు నచ్చింది..
(అఫ్సరన్న & టీం తోని పాటూ మిగిలిన ఆన్ లైన్ మ్యాగజైన్స్ నిర్వాహకులందరికీ మళ్లొక్కసారి కృతఙ్ఞతలు..)

ఔను కరెక్టే.. నేనూ అట్లనే అనుకుంటా… సో… ఇంకా?? మరి బాధనిపించిన సంధర్భాలు ఏమన్న ఉన్నయా? (కథలకు సంబంధించి)
ఆ.. అవికూడ కొన్నున్నయ్.. నా దగ్గరి దోస్తులల్ల చానమందికి తెలుగు చదువుడురాదు.. చదువరాదంటే మొత్తానికి రాదని కాదుగని, బస్ మీద “హైదరాబాద్” అనో “వరంగల్” అనో బోర్డు చదవటానికే వాళ్లకు అర నిమిషం పడ్తది.. ఇగ “కండక్టర్ కు సరిపడ చిల్లర………..” చదవటానికైతే సగం జర్నీ ఐపోతది..
అసొంటోళ్లు ఒక కథను చదవాల్నంటే కనీసం ఒక నెలో నెలన్నరో పడ్తది, అందుకే వాళ్లు చదవరు!!! (నా దోస్తులనే కాదు, ఇప్పుడు “బిలో థర్టీ” ఉన్నోళ్లు చానమంది అందుకే తెలుగు పుస్తకాలు చదువుతలేరు) అదొక బాధ.. పోనీ వాళ్లకు సమజయ్యేటట్టు నేనే ఇంగ్లీషులో రాద్దామంటే, రాయస్తలేదు.. అందుకు ఇంకో బాధ..

అబో.. మంచిది.. మంచిది! చివరగా.. ఇంకా నీకున్న ఆశలూ – ఆశయాలూ??
పెద్దగ ఏం లెవ్వు కానీ..
వల్డ్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ ల కనీసం నాయొక ఆరేడు పుస్తకాలన్న పట్టేటట్టు చెయ్యాలె.. ఇంకా..
కుడి చేతిలో నోబెల్ ప్రైజూ, ఎడమ చేతిలో ఆస్కార్ అవార్డూ..
బ్యాగ్రౌండ్ లో జన గణ మన..
ఫ్రంట్ రో లో అమ్మా నానా అన్నా..
మనశ్శాంతీ…..
ప్రపంచ శాంతీ… …. …… ………

అరేయ్.. లే.. వంశీ.. అరేయ్ వంశీ.. లే రా..
ఆ?? ఏందీ?? ఏందిరా??
ఏందో శాంతీ శాంతి అని కలవరిస్తున్నవ్? ఏంది కతా?? ఆ?? లే.. లేశి ఇన్నన్ని మంచినీళ్లు తాగు..
ఏందీ!! కలవరిస్తున్ననా??… షిట్..!! ఇదంత కలనా ఐతే?
(కొన్ని మంచినీళ్లుతాగి మళ్ల పడుకున్నంక సందీప్ గాడు మెల్లగ అడుగుడు బెట్టిండు)-

ఏం కలచ్చింది మామా?? శాంతెవర్రా??
శాంతిలేదు గీంతిలేదు.. అదేదో కలచ్చిందిరా..
ఏం కల రా??
అదేదో ఇంటర్వ్యూ మామా.. నన్నెవరో ఇంటర్వ్యూ చేస్తుండే..

ఇంటర్వ్యూనా? మంచిగ చెప్పినవా మరి? జాబ్ అచ్చిందా రాలేదా??
ఏ…. జాబ్ ఇంటర్వ్యూ కాద్ బే.. అదేదో “కథ”లకు సంబందించింది..

అచ్చా అదా… ఏమడిగిండేంది..?
అదే యాదికస్తలేద్రా.. కొద్దిగ ముక్కల్ ముక్కల్ మతికస్తుందంతే..

ఆ ముక్కలే చెప్పుమంటున్న..
ఆ.. ఆ.. ముందుగాల ముందుగాల ఓ కొచ్చనైతె అడిగిండురా నాకు బాగ మతికున్నది..
ఏం కొచ్చను??

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”

*

రెండు పట్టాలు, ఒక్క రైలు…

అల్లం వంశీ

 

allam-vamsi“యాత్రికన్ కృపయా ధ్యాన్ దే….”
స్టేషన్ ల ఉత్తరంబాజు నుంచెళ్లి ఏదో అనౌన్స్ మెంట్ వినస్తుందిగని సందీప్ కయాల్ దానిమీదలేదు..
ఇప్పట్కే మస్తు ఆలిశమైందిగదా, అందుకే ముంగటున్నోల్లను పక్కక్ దొబ్బుకుంట జెప్పజెప్ప ఉరుక్కుంట్టస్తుండు, బండి కాడికి… ఈ పిలగానిది పురాగ ఆగం కత…
శృతికి కూడా చాలా ఆలస్యం కావడంతో, ఎదుటివాళ్లను ప్రక్కకు నెట్టుక్కుంటూ వడివడిగ పరుగెత్తుకుంటూ వస్తోంది, ట్రేన్ దగ్గరికి.. ఈ అమ్మాయిది పూర్తిగా గందరగోళం వ్యవహారం..
చార్మినార్ ఎక్స్ ప్రెస్..
సందీప్ దొరికిన డబ్బాలకు సొర్రిండు.. అది జెన్రల్..
అరే జరుగన్నా.. జర లోపటికి నిల్సోరాదు.. భయ్యా.. కొంచం సైడ్… ప్లీజ్..
అరే తొవ్వల కూసోని ఉల్టా నన్నే మోరసూపులు సూడవడ్తివీ?? చల్.. జర్గవయా.. లోపట్కి పోవాలె నేన్..
జనాలను తప్పించుకోని మెల్లమెల్లగ, ఎట్లనో అట్ల ఎస్ 6 కు చేరిండు..
శృతి కనిపించిన పెట్టెలోకి దూరింది.. జెనరల్ కంపార్టుమెంట్..
ఎక్స్క్యూజ్ మీ.. అంకుల్.. కొంచం సైడ్ ఇవ్వరా.. ఆంటీ ప్లీస్.. జరగరా..
దారిలో కూచున్నది మీరు, మళ్ళీ మీరే కోపంగ చుస్తున్నారా?? బాగుంది..
తప్పుకోండి.. తప్పుకోండి.. లోపటికెళ్లాలి నేను..
అంతమందిని దాటుకుంటూ నెమ్మదినెమ్మదిగా, ఎలాగోలా ఎస్ 6 కి వచ్చేసింది..
అతని బెర్త్ 31, సైడ్ లోయర్.. ఆమె బెర్త్ 32, సైడ్ అప్పర్…
ఎవ్వరులేరుకదాని కాళ్లు సాపుకోని ఆరాం సే కూసున్నడు సందీప్..
ఎక్స్క్యూజ్ మీ.. మీరు కొంచం ఆ కాళ్ళు తీస్తే నేను కూడ కూర్చుంటా..
‘సారీ..సారీ.. ఎవ్వల్లేరుగదానీ.. కూసోన్లి..’ అంటూ కాళ్ళు తీసి సక్కలం ముక్కలం పెట్టుకున్నడు…
ఆమె పైన 32 లో బ్యాగ్ పెట్టుకుని, 31 లో అటు దిక్కు కిటికీ దగ్గర కాళ్ళు ముడుచుకోని కూచుంది..
ఆమె ఎదురుగా అతనున్నడు..
అతని ముంగట ఆమె ఉన్నది..
పక్కపొంటి సీట్లల్ల ఉన్నోళ్ల గురించి అతనికి అక్కెర్లేదు.. ఆమెకు అనవసరం..
బండి స్పీడ్ పెరిగింది..

Kadha-Saranga-2-300x268
రోడ్ల మీద కనపడే లైట్లు, కార్లూ, బండ్లూ, మనుషుల ఆకారాలు.. అన్నీ దమ్మదమ్మ ఎనుకకు పోతుంటే సందీప్ గుడ్లెళ్ళవెట్టి వాటినే చూశుడువెట్టిండు.. ఒక్కొక్కదాన్ని లెక్కవెడ్తుండా అన్నట్టు చూస్తుండు..
పాపం ట్రెయిన్ ఎక్కడం మొదటిసారి కాబోలు అనుకుంది కానీ.. అతనట్లనే తలను ఫాస్ట్ ఫాస్ట్ తిప్పుకుంట చూస్తూండడంతో ఇంక ఉండబట్టలేక అడిగింది..
అలా వెనకకు వెళ్లేవాటినే పట్టిపట్టి చూస్తుంటే కళ్లుతిరగవా మీకు??
ఏందీ??
అదే.. తల తిప్పినట్టు అవుతుంది కదా అని…
“చక్కెరచ్చుడా?? నిజంగ అట్ల రావాల్ననే సూస్తున్నకని అస్తలేదు.. చిన్నప్పుడట్లనే అస్తుండె మంచిగ.. కని ఇప్పుడు ఎంత కోషిష్ చేశ్నా చెక్కెరస్తలేదు” నవ్వుకుంట చాన నార్మల్ గ చెప్పిండు సందీప్..
“ఓ.. ఓకే..” ఆమె ఇంకేం మాట్లాడకుంట.. టికెట్ తీసి చూసుకుంటుంది..
మిమ్మల్ని పడగొట్టుటానికి ఎవ్వలు రాలేదా??
ఏంటీ??
అదే.. మిమ్మల్నేవరు పడగొట్టలేదా అంటాన్న??
అసలేం మాట్లాడ్తున్నరు మీరు?? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్..
ఆమె అంతగనం కోపానికెందుకస్తందో సందెప్ కు సమజ్ కాలే..
నాన్ సెన్స్.. గట్టిగనే గొణుక్కుందామె..
హలో.. ఏంది.. గులుక్కుంటాన్లు??
ఆమె ఇంకా కోపంగ చుసింది.. న్యూసెన్స్ అన్నట్టు..
పడగొట్టడానికెవ్వల్ రాలేదా అంటే దానికింత ఇసం చెయ్యవడ్తిరి..
మీరు నోరు దగ్గిరుంచుకుంటే మంచిది.. లేదంటే నేన్ టీసీ ని పిలవాల్సొస్తుంది..
అరే.. ఇప్పుడు నీనేమన్నా అని.. ఇంతగనం….. సందీప్ మొత్తం మాట అనకముందే..
విల్ యూ ప్లీస్ షట్ అప్..
ఆమె ఎందుకట్ల కసురుకున్నదో నిజంగ సందీప్ కు సమజ్ కాలే.. మస్తు గుస్సాలేశిందికనీ ఆడోళ్ల నోట్లనోరువెట్టదని ఊకున్నడు.. మొఖం మాడిపేంది..
ఆమె మూతి ముడుచుకుంది..
ఇదే సందన్నట్టుగా మధ్యలో ఒకాయన సొచ్చిండు.. “అక్కెర్లేదు” అనుకున్నం కదా, అందులో ఒకడు. ఇప్పుడక్కెరకొచ్చిండు..
అమ్మా…. ఆ బాబు, “మిమ్మల్ని దిగబెట్టడానికి స్టేషన్ కి ఎవరు రాలేదా” అని అడిగాడు.. మీరది తప్పుగ అర్థంచేస్కున్నట్టున్నారు….
అని ఆమె కండ్లు తెరిపించేదాకా సందీప్ కి సుత ఆమె తన మాటలను తప్పుగ సమజ్ చేస్కున్నదనే ఆలోచనే రాలె.. అందుకే తప్పు నాదేనని సారీ చెప్పబోయిండు..
“సారీ అండీ..” ఆమెనే గబుక్కున అనేసింది..
నీనే సారీ.. అతను లటక్కన ఆమె మాట అందుకున్నడు..
అయ్యో.. నేనే మిమ్మల్ని తప్పుగ..
పర్వాలేదు… ఇంకా ముచ్చట ఇడ్శిపెట్టున్లి..
ఇంతలనే టీసీ రావడం తో ఇద్దరి మాటలు ఆగినయ్..
టికెట్లు టిక్కు వెట్టుకోని టీసీ ముంగటికిపొయిండు..
సందీప్ మళ్ల బయటికి చూస్తుండు.. ఆమె కూడ చూస్తోంది…
ఆ… చాయ్… కాపీ..
గరం గరం చాయ్ కాపీ..
ఏక్ చాయ్ దేవో భై..
సందీప్ కు చాయిచ్చి..
మేడం మీకూ.. చాయ్??
టీ వద్దు.. కాఫీ ఇవ్వండి…
సందీప్ పైసలిచ్చిండు.. ఆమె డబ్బులిచ్చింది..
జనం ఎవరి పనిల వాళ్ళున్నరు..
శృతి వేడివేడి కాఫీ తాగుతోంటే, సందీప్ గరం గరం చాయ్ తాగుతాండు..
లోపట అతనికి ఆమెతోని ఏదన్నొకటి ముచ్చట వెడ్దామనే ఉన్నదికని ఏం మాట్లాడ్తే ఏం తప్పులవడ్తదో అని సప్పుడుజేకున్నడు.. చూశి చూశి ఆమెనే మాట్లాడింది..
ఇందాకటి దానికి నిజంగా సారి అండి..
అయో పర్వాలేదు.. నాకసలా ముచ్చట్నే మతికిలేదు..
హ్మ్..మ్మ్.. మీరూ చెన్నైకేనా??
ఆ..
అక్కడే ఉంటారా..

వంశీ ౧

చిత్రం: అల్లం వీరయ్య

అహా.. బేస్తారం ఓ ఇంటర్వ్యూ ఉన్నది.. అందుకే పోతాన..
ఓ!! అని మళ్లీ మాట్లాడకుండా టీ తాగుతూ కూచుంది..
మీరుసుత అటేనా??
ఆ.. నేనూ చెన్నైకే… అవునూ.. ఇందాక.. బెస్తా అని ఏదో అన్నారుకదా…
ఔ.. బేస్తారం..
అంటే ఏంటి??
బేస్తారమంటే గురువారమన్నట్టు..
ఓహ్.. అలాగా.. నేన్ ఫస్ట్ టైం వింటున్నా అందుకే.. సారీ, ఏం అనుకోవొద్దు ..
అయ్యో.. అన్ల అంకోటానికేముంది.. చోడ్ దొ..
ఏం ఇంటర్వ్యూ మరి? సాఫ్ట్ వేర్ ఆ??
కాదు.. రైల్వే ల.. సర్కార్ నౌకరి.. సెంట్రల్..
ఓకే.. ఓకే.. కూల్..
ఇద్దరి కప్పులూ ఖాళీ అయినయ్..
ఆమె తన కప్పును బయటికి విసిరింది.. అతనూ గిలాసను ఔతలికి మొత్తిండు..
చెప్పండింకా.. హైడ్రబ్యాడ్ లో ఎక్కడుంటరు?
మాది హైద్రాబాద్ కాదు.. మంథిని..
మంథినా? ఎక్కడది?
కరీం నగర్ ఎర్కెగా? ఆ జిల్లే..
మరి మీరు సికిండ్రబ్యాడ్ లో ఎక్కారు!
ఆడ మా దోస్తులుంటరు.. వాళ్లను కల్శత్తున్న అట్ల..
ఓకే..
మీరు హైద్రాబాదేనా?
లేదు.. మాది విజయవాడ..
అచ్చా… మీరు కూడ దోస్తుల్ని కల్శస్తున్లా!
అహా.. మా నేటివ్ విజయవాడకానీ మేము ఉండేది హైడ్రబ్యాడ్ లోనే.. కూకట్ పల్లి..
ఓ!! మరి చెన్నైల? జాబ్ ఆ??
మా అక్కయ్య వాళ్లింటికెళ్తున్నా.. ఊరికే అలా.. ఓ వన్ వీక్ ట్రిప్..
అచ్చా..
మా బావగారు కూడా చాల రోజుల్నించి అడుగుతున్నరు.. నాకిప్పటికి కుదిరింది..
మీ బావేంజేస్తడు?
తను సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. టీసీయస్ లో..
టాటా వోళ్లదికదా!! జోర్దార్ కంపినే…
టాటా వాళ్లదికాదూ.. టీసీయస్..
సందీప్ సప్పుడు చెయ్యలేదు..
ఆమెకూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది..
ట ట ట్ట ట్టట్.. ట ట ట్ట ట్టట్.. రైలు చప్పుడు చేస్తూ పోతోంది..
బండి గీరల సప్పుడు గమ్మతుంటది కదా… ట ట ట్ట ట్టట్.. ట ట ట్ట ట్టట్ అనుకుంట..
ఆ.. చక్రాల శబ్దం ఓకే కానీ, అప్పుడప్పుడు వాటినుండి ఏదో కాలినట్టు వాసనొస్తుంది కదా అదే నచ్చదు నాకు..
ఔ.. నాక్ సుత..
కిటికీలోంచి సల్లగ గాలస్తుంటే… సందీప్ సలికి వణుకుతుండు..
చల్ల గాలికి చెక్కిలిగింతలు పెడ్తున్నట్టుంది మీకు??
చెక్కల్ గుల్ ఆ?? ఇగంపెట్టి గజగజ వణుకుడస్తాంది..
హ.. హ…
సందీప్ కిటికీ బంజేషిండు…
శృతి కూడా కిటికీ మూయడానికి ప్రయత్నించిందికనీ రాలేదు..
కొంచం ఈ విండో కిందికి లాగరా ప్లీస్..
సందీప్ కిటికీ రెక్క కిందికి ఇగ్గిండు..
కిటికీ బంజెయ్యంగనే ఒక్కసారే మొసమర్రనట్టయ్యింది
ఆమెక్కూడ ఊపిరాడనట్టే అనిపిస్తోంది..
కానీ అది కొంచం సేపే…
ఆ.. స..మ్మోసా.. కర.. కర.. గరం గరం మ..స్సాలా సమోసా.. ప్యాలాలుంటె పైసల్ వాపస్.. ఆ సమోసా.. కర.. కర.. గరం గరం మ..స్సాలా సమోసా..
ఆ అబ్బాయేమంటున్నాడు?? ప్యాలాలేంటి? సందీప్ ని అడిగింది శృతి..
ప్యాలలంటె “బోల్ పేలాలు”.. ఈ మద్య సమోసాల్ల వాటిన్నింపే అమ్ముతాండ్లట కదా..
ఏమో! నాక్ తెలీదు… బోల్ పేలాలంటే ఏంటి??
బోల్ పేలాలంటె తెల్వదా?? ఎట్ల చెప్పాలే!! అదేనోయ్.. ఇట్ల బియ్యం నానేశి చేస్తరు చూశిన్లా… కరకర ఉంటయ్..
అటుకులా??
అటుకుల్ అలగ్ మల్ల.. బోల్ పేలాలంటే ఇవ్వి.. అని… ఏదో చెప్పే కోశిష్ చేస్తుండు సందీప్.. కానీ అతనికి ఎట్ల చెప్పాల్నో తెలుస్తలేదు..
ఆ.. ఇట్ల పీనుగులమీద సల్లుతరు చూశిన్లా..
ఈ పోలిక ఆమెకు అర్థమైంది.. “శవాన్ని” ఊహించుకోని మొఖం ఇబ్బందిగ పెట్టుకొంది..
అబా.. ఇంకేం దొరకనట్టు ఆ ఎక్సాంపులే దొరికిందా మీకు..
అంటె నాకు జెప్పన వేరేదేం యాదికిరాలే..
మరమరాల గురించి చెప్పడానికి శవాల్ని గుర్తుచేస్కునే వాళ్లను మిమ్మల్నే చూస్తున్న.. చిన్నగ నవ్విందామె..
సందీప్ కు నవ్వాల్నో వద్దా సమజ్ కాలే..
సమోసాల్ గావాల్నా??
వొద్దు బాబూ…
సందీప్ కు తిన బుద్ధైతాందికని ఐదు రూపాలకోటి అనేసరికి ఊకున్నడు…
మన చిన్నప్పుడు ఆఠానకోటి ఉంటుండే.. ఇప్పుడు బాగ పిరమైనయ్..
అయ్యో.. అర్థ రూపాయ్ కాదూ.. మేం విజయవాడలో ఉన్నప్పుడైతే సినిమాహాల్లో పావలాకొకటి కొనుక్కునే వాళ్లం తెల్సా..
చారాన్నా?? అగ్గువనే..
అగ్గువ అంటే??
సందీప్ ఏదో చెబ్దామని నోరు ఎళ్లబెట్టిండుకని, ఇంతల్నే వెనక సీట్ దగ్గర “చక్ చక్” మని సప్పుడు..
అటు చూడంగనే సందీప్ నోట్లె మాట నోట్లెనే గాయబ్ ఐపేంది..
అతని మాట ఎందుకు మాయమైందో శృతికి అర్థమైంది…
“చక్ చక్..” ఈ సప్పుడు, రైల్ ఎక్కేటోల్లందరికి ఎర్కైందే..
చక్ చక్..
బావా.. పది రూపాల్…
లెవ్వక్కా..
బావా అని పావురంగ పిలుత్తె అక్కా అనవడ్తివి? సందీప్ చెంపనొత్తుతూ అన్నదామె..
సందీప్ కు మస్త్ ఇజ్జత్ అనిపిస్తాంది..
“చక్ చక్” …. తియ్యి తియ్యి.. జల్ది పోవాలె.. చక్ చక్..
లెవ్వక్క… చిల్లరుంటె చాయ్ తాగిన..
తమ్ముడెంత ఇగురం ఉషార్ పిట్ట సూశిన్లా… పక్కోళ్ళతోటి అనుకుంట మళ్ల సందీప్ చెంప గిచ్చిందామె..
నిజంగానే లెవ్వు..
జెప్పన తియ్యి తమ్మీ.. తియ్ తియ్… అక్కనుట్టిగ పంపుతారు.. చక్ చక్..
మూడు రూపాలుంటె తీసిచ్చిండు సందీప్..
మాద్దండి దయగల్ల తమ్మునివిపో!! తిట్టిందో పొగిడిందో ఏర్పాటువళ్లే… “అక్కెర్లేనోళ్ళు” మనిషికో పది రూపాల్ దానం చెయ్యంగనే.. వెళ్ళిపోయిందామె… చక్ చక్ మని కొట్టుకుంటూ..
వీళ్ళకు డబ్బులివ్వకపోతే “గొడవ” చేస్తారట కద?
లొల్లంటే, లొల్లి అని కాదుగని… అదంత అలగ్ కతిగ.. ఏమన్నంటె మర్లవడి మళ్ళ మనల్నే తిడ్తరు.. ఆ లంపాటకమంత దేనికని..
వాళ్లేనా తిరగబడేది? జనాలు తిరిగి అనలేరా..
సందీప్ కు నామోషనిపించి జరసేపు ఖామోషైండు.. ఎటు సైస్తలేదు.. సెల్లుదీశి టైం చూశినట్టు చేశి మళ్ళ లోపటవెట్టుకున్నడు..
ఎంతైందండీ టైం??
టైం చుశిండుగని నిజంగ ఎంతైందో మతికిలేదు.. ఏందో మావుల!! అసలది పట్టించుకోలే తను..
యాదికిలేదు.. చూశి చెప్తాగున్లి అని మళ్ల సెల్లు తీశి, చూశి చెప్పిండు..
ఎన్మిదింబావ్..
శృతి మనసులో నవ్వుకుంటోంది సందీప్ సిగ్గు చూసి..
“ఉన్నదే గింతంత ఇజ్జతు.. అదికూడ గంగలగలిశే!” సందీప్ కు మస్తు తక్లీఫ్ ఐతాంది..
బండి మాంచీ జోషుల పోతాంది.. భోన్ గిర్, జనగాం… ఒకదానెంబటి ఒకటి స్టేషన్లు ఎనుకకుపోతనే ఉన్నయ్.. ఇంకరగంటైతె కాజీపేటనంగ డిన్నర్ ఆర్డర్ తీస్కునేటాయిన డబ్బలకచ్చిండు…
ఆ సార్ డిన్నర్ సార్.. వేజ్.. అం..డా.. చిక్కిన్ బిర్యాని, కర్డ్ రైస్..
ఆ జల్ది చెప్పాల్సార్.. వేజ్.. అం..డా.. చిక్కిన్ బిర్యాని, కర్డ్ రైస్..
శృతి, సందీప్ తో..
అవును మీరు డిన్నర్ చేసారా??
అహా తిన్లే.. ఈడ చెప్పుకుంట…
ఇక్కడా??
ఆ ఈణ్నే.. దానికంత పరేషాన్ కైకూ??
అలాని కాదండీ.. వీళ్లు బిర్యానీ పులావ్ అని చెప్పి వట్టి టొమాటో రైస్ పెడ్తారు తెలీదా?? మళ్లీ అది చాలా కాస్ట్లీ.. అనౌసరంగా డబ్బులు దండగ..
పైసలదేముందికానీ…
డబ్బుల గురించికాదండీ.. ఆ కిచెన్ చూసారా ఎప్పుడైనా.. చాలా అసహ్యంగా ఉంటుంది.. అన్ హైజీన్..
వండుడు గలీజ్ వండినా, ఉడుకుడుకుది తింటే ఏంకాదుగదా… తప్పదిగ.. ఎట్లున్నా తినుడే..
అబ్బ ఛా..! మీకోసం స్పెషల్ గా వేడివేడిగ వండి వడ్డిస్తారా ఏంటి!!
అంతే అంటరా.. కనీ ఈ బిర్యానీకాపోతే మళ్లిగ ఇగం పట్కపొయిన ఇడ్లీలో, వడాలో తినవడ్తది.. నాకవ్వంటెనే ఓకారం..
అంత కష్టపడాల్సినపనేం లేదు.. నేన్ చపాతీలూ, బంగాళదుంప వేపుడు తీస్కొచ్చానూ.. ఇద్దరికి సరిపోతాయ్..
అయ్యో.. అద్దద్దు.. నేన్ ఏదో ఓటి ఆర్డర్ ఇచ్చుకుంట..
అలాక్కాదండి.. మా అమ్మ చాలా పెట్టిచ్చారు.. ఇబ్బందేం లేదు…
వద్దద్దు.. అట్లనేంలేదు.. ప్లీస్..
యాక్చల్లీ నేను డిన్నర్ తెచ్చుకోకూడదనుకునే ఈవినింగ్ హెవీగా భోంచేసాను. కానీ మా అమ్మా విడిచిపెడ్తేకదా, డిన్నర్ డిన్నర్ అని వెంటపడి మళ్లీ బాక్స్ కట్టిచ్చారు. ఒక్కదానికి చాలాఎక్కువైపోతుంది. ప్లీస్.
“ఉట్టిగ మిమ్ముల ఇబ్బంది పెట్టుడు…”
అంటుండగా ఆమె ఇంకేం మాట్లాడద్దన్నట్టుగ చేయి చూపించి, మీద ఉన్న బ్యాగ్ లోనుండి టిఫిన్ బాక్స్ తీసి.. దాని మూతలో చపాతీలూ, బంగాళదుంప వేపుడూ పెట్టి సందీప్ కి ఇచ్చింది..
థాంక్యూ..
యువర్ వెల్ కం…
ఈ పిల్ల మస్తు దిల్ దార్ అనుకున్నడు మనసులో…
నాకు రొట్టెలు, ఆల్ గడ్డ కూరంటే మస్తిష్టం..
ఔనా.. నాక్కూడా..
మంచిగుంది.. ఓ బుక్క నోట్లో పెట్టుకుని అన్నడు..
బావుందా.. ఇంకొంచం వేస్కోండి..
అద్దద్దద్దు… ఇదే బొచ్చెడుంది..
“చాలా” ఏంలేదు.. ఇంకొంచం వేస్కోండి..
సాల్ సాలు..
వాస్తవానికి సందీప్ కు గోలిచ్చిన ఆల్గడ్డల కూరంటే పానం. కని మళ్ల మళ్ల ఏస్కుంటె “అగడువడి ఉన్నడ”నుకుంటదని ఏస్కుంటలేడు.
శృతికి కూడ బంగాలదుంప వేపుడంటే పిచ్చి.. కానీ ఎక్కువ తింటే తిండికి “మొహంవాచిపోయి ఉన్నద”నుకుంటాడేమో అని వేసుకోవట్లేదు..
మధ్యలో ఆమెకు పొలమారింది..
అర్రెర్రె సరం తప్పిందా.. అంటూ జెప్పన తన నీళ్ల సీస తీసిచ్చిండు..
మా అమ్మే అయ్యుంటుంది.. తలుచుకుంటున్నట్టున్నారు….
ఆ.. కావచ్చు..
ఇద్దరి తినడమూ పూర్తయినా, బాక్స్ లో ఇంకా కూర మిగిలిపోయుంది.. సందీప్ నీళ్లసీస మాత్రం పూరా ఖాళీ ఐంది.
సందీప్ వాష్ బేసిన్ కాడికిపొయ్యి ప్లేట్ కడుగుదామని చూశిండుకనీ సబ్బో, పీసో లేకుంటే ఆ సమరు పొయ్యేట్టులేదు..
ఇంతలోనే శృతి వచ్చి.. ఆ ప్లేట్ లాక్కుని..
మీరు భలే ఉన్నారే.. చెయ్యి కడుక్కోండి చాలు..
పర్వాలేదూ.. అదిసుత కడిగిస్త..
ఛా!!! మరీ అంత ఫార్మాలిటీస్ ఔసరంలేదు.. ఐనా ఆ నూనిజిడ్డు అంత ఈసీగా పోదుకని.. మీరు లైట్ తీస్కోండి..
అంటూ ఆమె బాక్స్ మూత పెట్టేస్కోని.. చేయి కడుక్కుంది..
టైం తొమ్మిదిన్నర దాటింది… చలి విపరీతంగ పెరిగిపోయింది.. కాజీపేట.. వరంగల్ కూడా దాటి, మెహబ్బాదో, డోర్నకలో వచ్చింది..
ప్లాట్ ఫార్మ్ మీద చాయలు, కాఫీలతోనిపాటు “పదిరూపాలకు మూడు” అనుకుంట సంత్రాలుసుత అమ్ముతాన్లు..
సంత్రాలట.. తింటరా.. తీస్కుంటా??
అమ్మో బత్తాయిలా!! అసలే శీతాకాలం.. జలుబు చేస్తే ఇంక ఐనట్టే.. వద్దే వద్దు..
సంత్రాలు తిన్నా తినకున్నా చలికీ, ఈ దుబ్బకూ సర్ది లేశుడు కామన్.. బండి కదుల్తాంది.. జల్ది చెప్పండి.. తీస్కోవన్నా..
వొద్దొద్దు.. ప్లీస్స్..
పోనీ చాయ్??
వద్దు.. మళ్లీ నిద్దర్రాదు..
రైలు కదిలింది..
ఒక్కొక్కరే బిస్తరేస్తున్లు..
“మీరు కూడ ఆ లైట్ కట్టేయండి..” అనవసరం బ్యాచులో ఓ గొంతు ఆర్డర్ వేసినట్టు చెప్పింది..
సందీప్ లైట్ బంజేశిండు..
“మీకూ.. ఇబ్బందేం లేదంటే పై బెర్త్ లో పడుకుంటారా?? నాకు కింద బెర్త్ ఐతే కంఫర్ట్ గా ఉంటుంది”.. శృతి సందీప్ ను అడిగింది..

వంశీ ౧
నాకే బెర్త్ ఐనా రందిలేదు.. మీరు పడుకోన్లి.. అతను పైకెక్కిండు..
చెద్దరూ, తువ్వాల తీస్కోని.. తన బ్యాగునూ, పక్కకే ఉన్న ఆమె బ్యాగునూ కిందికిస్తే ఆమె వాటిని బెర్త్ కింద పెట్టింది..
చెద్దర్ తెచ్చుకోలే?
అహా లేదు.. దుప్పటి తీసుకెళ్లమని మా నాన్న మరీ మరీ చెప్పారుకాని.. అనవసరంగా మోయడం దేనికని నేనే పెట్టుకోలేదు.. అసలింత చలి ఉంటుందనుకోలేదు నిజంగ..
మంచిపనిచేశిన్లు పో.. మోతకోలు కదానీ అసలైందే ఇడ్శిపెట్టచ్చిన్లా? ఇంగో.. ఈ చెద్దర్ తీస్కోన్లి..
వద్దొద్దు…. పర్లేదు..
అరే.. తీస్కోండి పర్వాలేదు..
అహా.. వద్దు ప్లీస్..
మీరు మరీ ఎక్కువ మోహమాటపడ్తున్లు…. తీస్కోండి…. అంటూ ఆమెకు చెద్దరిచ్చిండు..
మరి మీకు?
నేన్ ఇంకో అంగీ తొడుక్కుని పడుకుంటా..
అబ్బా.. చొక్కా తొడుక్కుంటే చలి ఆపుతుందా?? వొద్దు.. మీ దుప్పటి మీరు తీస్కోండి..
అరే.. మా ఆపుతదోయ్.. నాకాడింకో మందపు తువ్వాలున్నది… అదిసుత కప్పుకుంట.. సరేనా.. మీరా చెద్దర్ కప్పుకోన్లి.. కిందపడుకుంటాన్లు కదా, సలెక్కువుంటది..
థాంక్యూ..
యు ఆర్ వెల్ కం…
ఈ అబ్బాయి చాలా మంచోడు అనుకుందామె.. మనసులో..
నిద్ర మద్యలో దాహమైతే తీస్కోండి అంటూ వాటర్ బాటిల్ చూపించింది…
ఇంత సలికి దూప కాదులే ఇగ.. అక్కెరవడ్తె తీస్కుంటా.. మీ దగ్గరే ఉంచుకోండి….
సరే..
ఆమె హ్యాండు బ్యాగును దిండులాపెట్టుకోని నడుం వాల్చింది..
అతను తువ్వాలను మెత్తలెక్క పెట్టుకోని ఒరిగిండు..
ఆమెకు నిద్ర రావట్లేదు..
అతనికి నిద్రవడ్తలేదు..
ఇద్దరి మనసుల్లో ఒకటే ఆలోచన.. చేతుల్లో సెల్ ఫోన్ లు..
“అబ్బే.. ఏం జేత్తానవ్రా?? ఇప్పుడే ఖమ్మం పేంది.. పొద్దుగాలచ్చేటాల్లకు ఎంతైదిరా??” దోస్తుకు మెసేజ్ కొట్టిండు సందీప్..
ఎన్మిదైతదిరా.. ఏడున్నరుకు నాక్ ఫోన్ కొట్టి లేపు.. సరేనా.. ఓ పదినిమిషాల్ అటిటైనా ఉట్టిగ ఆగం గాకు..
మా జేత్తగని, బర్రెలెక్క పండి పదింటికచ్చేవాయింత! జెప్పన రా.. బండి స్టేషన్ కు రాకముందే నువ్వాడుండాలే..
మీ అయ్య కట్టిచ్చిండాబే స్టేషన్? ముందుగాలచ్చేం జెయ్యలె.. నువ్ దిగేటల్లకు ఆడుంట సరేనా.. చలో మరి.. ఉంటానా..
నీ.. మబ్బు మొఖంల చెప్పు… మంచిది.. మంచిది.. ఇగ పండు.. నేన్సుత పంటున్న..
అరే.. విజయవాడ దాటేదాన్కా పండుకోకురా హౌలా..
కరక్టే.. మొన్న చెప్పినవ్ గదా!! సరే సరే.. మళ్ల మెసేజ్ కొట్టకు.. పండుమరి.. చలో ర భై..
చలో కాకా.. పయిలం…
ఆ మంచిది.. రైట్ రా… చివరి మెసేజ్ కొట్టి ఫోన్ లోపట వెట్కున్నడు సందీప్.. ఓ 2-3 నిమిషాలు గడిచినయ్.. “టింగ్ టింగ్” అని మళ్ల మెసేజ్ అచ్చిన సప్పుడు..
అరేయ్.. అప్పాల్, సకినాల్ తెత్తానవారా???
మా తెత్తాన… మెసేజ్ కొట్టుకుంట కొట్టుకుంట అట్లనే కన్నంటుకున్నది సందీప్ కు…
***
“హాయ్ అక్కా.. ఇంకాసేపైతె విజయవాడొచ్చేస్తుంది.. చెన్నై రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందే??” అక్కయ్యకు మెసేజ్ పెట్టింది శృతి..
సరిగ్గా ఏడున్నరకి చెన్నైలో ఎంటర్ అవుతావ్.. ఉదయం ఆరున్నరకల్లా నీకు ఫోన్ చేసి లేపుతాను, ముందే లగేజ్ అంతా సదురుకో.. దిగేప్పుడు హడావుడి పడాల్సిన పనుండదు..
ఏడున్నరకు చేరుకోవడమైతే.. ఆరున్నరకు లేపి ఏంచేస్తావే బాబు!! ఏడింటికి మెసేజ్ పెట్టుచాలు నేన్ లేస్తాను..
గేదెలా కాళ్ళుచాపుకోని పడుకోడానికి అదేమైనా మన ఇల్లనుకుంటున్నవా?? రేపొక్కరోజు పెందరాళేలే.. ఎల్లుండినుంచి నీ ఇష్టం..
సరే సరే… ఇంక నాకు నిద్దరొస్తుంది.. పడుకుంటున్నా…
ఆ పడుకో గానీ.. నీ బ్యాగ్ నీ దగ్గిరే పెట్టుకో, సీట్ కింద పెట్టకు.. మెళ్లో చైన్ కూడా తీసేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో.. జాగ్రత్తా.. సరేనా.. ఫోన్ సైలెంట్ లో పెట్టకు.. పొద్దున నువ్వొచ్చేసరికి అక్కడ ఉంటాము..
ఉండనా.. బాయ్ మరి..
ఆ సరేనే… అన్ని సరిగ్గానే పెట్టుకున్నా.. బాయ్.. గుడ్ నైట్ అక్కా..
జాగ్రత్త బుజ్జమ్మా.. గుడ్ నైట్..
ఓ 2 నిముషాల తర్వాత మళ్లీ టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చిన శబ్దం..
కాళ్ల పట్టీలు గోల్డ్ వి వేస్కున్నావా?? గోల్డ్ వే అయితే అవికూడ తీసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవే..
ఆల్రడీ తీసానక్కా అని మెసేజ్ పెడ్తు పెడ్తూ అలాగే నిద్రలోకి జారిపోయింది శృతి..
***
తెల్లారింది..
సందీప్ కు తెలివివడ్డది.. ముందు సెల్లుల టైం చూశి, అటేంక లేశి కిందికి చూశిండు…. శృతి అప్పటికే లేచి కూచుంది..
సందీప్ కిందికి దిగిండు..
ఇదిగోండి దుప్పటి..
సందీప్ చెద్దర్ ను బ్యాగ్ ల కుక్కి బాత్ రూముకు పేండు..
అతనొచ్చాక తన హ్యాండ్ బ్యాగ్ చూసుకొమ్మని చెప్పి తను కూడ వెళ్లొచ్చింది..
ఈ సీట్లలో నల్లులు ఉన్నట్టున్నాయి కదా.. దురద పెడుతోంది కొద్దికొద్దిగ…
గోకుడా? అయ్యో.. నాకవి కనిపియ్యలేగని.. బాత్రూముల మాత్రం మస్తు జిర్రపురుగులు కనవడ్డయ్..
అదృష్టం.. నాకైతె ఒక్క బొద్దింక కూడా కనిపించలేదు.. అవి అంటేనే నాకు చిరాకు..
ఇద్దరికీ ఫోన్లొస్తున్నాయి.. “ఎక్కడిదాక వచ్చారని!”
“ఇదేందో ఒర్రెకు ఎక్కువా వాగుకు తక్కువున్నది కాకా.. అది దాటినం ఇప్పుడే”.. సందీప్ ఫోన్ ల చెప్తాండు..
పెద్ద చెరువసంటిదత్తది సూడ్రా… మొత్తం కర్రెగ, గలీజ్ నీళ్లుంటయ్… మోరి నీళ్లవేరం.. అగో అది దాటిన్లంటె ఇగ అచ్చినట్టే.. దోస్తు చెప్పిండు..
“ఇదేదో పిల్ల కాలువలా ఉందక్కా.. అది క్రాస్ చేసామిప్పుడే.. శృతి చెప్తోంది..”
తర్వాతొకటి పెద్ద చెరువులాంటిది వొస్తుంది చూడు బుజ్జీ.. నల్లగా, కంపు కొట్టే నీళ్ళతో ఉంటుంది.. మురికికాలువలోలా… అది దాటేసావంటే ఇరవై నిమిషాలు అంతే…
“ఇంకో ఇరవై నిమిషాల్లో చెన్నై సెంట్రల్ వొస్తుందంట, మా అక్కయ్య చెప్పింది”
ఆ..ఆ.. మావోడుసుత అదే అన్నడు..
సో.. ఇంకేంటి మరీ..
ఇంకేమున్నది.. ఇంకా.. చిన్న నవ్వు నవ్విండు సందీప్..
ఎన్ని రోజులు మరిక్కడ?
ఐతారం దాన్క ఓ మూడొద్దులైతె పక్కా ఉంట….తర్వాత సూడాలిగ..
ఓహ్..
మరి మీరు??
నిన్న చెప్పాను కదా.. ఓ వారం పాటుంటాను..
ఓ.. ఓకే.. ఓకే..
ఔను మీ పేరేంటి?
సందీప్.. ఫేస్ బుక్ లో ఐతే.. “సందీప్ లొల్లి” అని ఉంటది..
మీ పేరు?
శృతి..
ఫేస్ బుక్ ల ఏమని ఉంటది?? ఉబ్బాగక అడిగేశిండు..
అతని అత్యుత్సాహానికి శృతి లోలోపట నవ్వుకుంది..
నేన్ మీకు యాడ్ రిక్వెస్ట్ పంపిస్తాను లెండి..
సిగ్నల్ కోసం ట్రేన్ ఏదో చిన్న లోకల్ స్టేషన్ లో ఆగింది.. అక్కడ కొండముచ్చులు కట్టేసున్నాయ్..
అరే.. అటుచూడటుచూడు.. కొండముచ్చులు… ఇక్కడివాళ్ళు కొండముచ్చులు పెంచుకుంటారల్లే ఉంది!!
అయో అది పెంచుకునేటందుగ్గాదు..
మరి??
కొండెంగలను జూస్తె కోతులు గజ్జుమని ఉరుకుతయ్.. అందుకే కోతుల్ని గెదిమేతందుకు వాటినిట్ల ఆడీడ పెడ్తాంటరు…
ఏంటీ?? కొండముచ్చుల్ని చూస్తె కోతులు పరిగెడతాయా?? నేనైతె ఎప్పుడు చూళ్లేదలాగ… కనీసం ఎక్కడ వినను కూడా వినలేదు..
అర్రే.. నిజంగనోయ్…
మీరేదో వేళాకోళానికి చెప్తున్నట్టున్నరు.. నేన్ నమ్మను..
అరే.. నీన్ ఒళ్లెక్కాలకు అంటలేను.. నిజంగనే చెప్తున్నా…
అయ్యుండొచ్చులేండి.. చిన్నగ నవ్విందామె..
ఇంతలోనే….. ఆ ఇడ్లీ.. ఇడ్లీ అని.. పిలుపులు.. అరుపులు షురూ..
నాష్తా చేద్దామా??
అహా.. అక్కయ్య ఆల్రడీ టిఫిన్ చేసిందంట ఇంట్లో.. ఇందాక చెప్పింది… మీరు తినండి పర్లేదు..
నేన్సుత దిగినంక మావోనితోటి కల్శితింటిగ.
ట్రైన్ కదిలింది… ఐదు నిమిషాల్లో చెన్నై సెంట్రల్ వచ్చేశింది… అందరితోపాటూ వీళ్ళూ దిగిన్లు.. ఎటుచూశినా మస్తుమంది జనం.. గుంపులు గుంపులుగా..
“అరే హౌలే… ఈడ.. ఈడ.. ఇటు బే… ” దూరంగ జనం మధ్యలనుంచి దోస్తు పిలుస్తాండు..
అతని పక్కనే ఉన్న ఒకామె “బుజ్జమ్మా.. ఇక్కడ.. ఇక్కడ.. ఇటు వైపు…” అంటూ శృతిని పిలుస్తోంది..
ఇద్దరూ అటు నడిచారు..
ఏమ్రా.. అంతమంచేనా.. పురాగ ఎండుకపేనవేందిరా??
పొద్దెల్ల ప్రయాణంగా కాకా.. జర నెరివడి అట్లగొడ్తున్నగంతే.. నువ్వెట్లున్నవ్రా..
అనుకుంట దోస్తులిద్దరు అలాయ్ బలాయ్ తీస్కున్నరు..
నీను మస్తున్నగని మనోళ్లంత ఎట్లున్నరూ, ఏం కత.. అనుకుంట సందీప్ చేతిల బ్యాగ్ గుంజుకోని జబ్బకేస్కున్నడు..
ఇటు పక్క శృతి వాళ్లక్క..
బావున్నావా బుజ్జీ.. ఇలా చిక్కిపోయావేంటే?
అబ్బ ఛా.. అంతలేదులే.. లాంగ్ జర్నీకదా కాస్త అలిసిపోయి అలా కనిపిస్తున్నానంతే.. నువ్వేలా ఉన్నావ్… బావగారు రాలేదా??…
మాట్లాడుకుంటూనే అక్కచెల్లెల్లిద్దరూ హత్తుకున్నరు..
ఆఫీస్ లో ఏదో ప్రెజెన్టేషన్ ఉందట, అందుకే నన్నిక్కడ డ్రాప్ చేసేసి ఆయన ఆఫీస్ కెళ్లిపోయారు.. నీ ప్రయాణం బాజరిగిందా.. అంటూ బ్యాగ్ లాక్కోని భుజానికి వేస్కుంది..
ఆ బానే జరిగిందే.. అదిగో అతనే కంపెనీ ఇచ్చాడు.. అంటూ సందీప్ ని చూపించింది..
సందీప్ ఆమెతో..
నమస్తే అక్కా..
“నమస్కారం బాబు.. మీరు కూడా ఆంధ్రానా..?”
“ఆహా…. మాది తెలంగాణ…” చెప్పిండు సందీప్ దోస్తు..
అందరూ కలిసి బయటికి నడుస్తున్నరు….
స్టేషన్ ల దూరంగ దక్షిణంబాజు నుంచెళ్లి ఏదో అనౌన్స్ మెంట్ వినస్తుంది….
“యాత్రికన్ కృపయా ధ్యాన్ దే….”

*

సహచరి

 Kadha-Saranga-2-300x268

ప్రత్యేక తగ్గింపు ధరలు.. అప్ టూ 60%”

అని ఎర్రరంగులో, పెద్ద పెద్ద అక్షరాలు రాసున్న కార్డుముక్కలు ఆ షాపింగ్ మాల్ లో చాలాచోట్ల కనపడుతున్నాయి.

‘మాల్’ పైకప్పు ఎర్రటి హృదయాకారపు బెలూన్లతో నిండిపోయుంది. వాటి తోకలు, కింద నడిచేవాళ్ల తలలకు కొద్దికొద్దిగా తాకుతుండగా, ఇంకో పక్కన అసలు తలలేలేని డిస్ప్లే బొమ్మలు ఇవేమీ పట్టనట్టు వాటి డ్యూటీ అవి చేసుకుంటున్నయి. ఇవ్వాల వాటి డ్యూటీ కూడా ఎర్రరంగులోనే.. ఎర్ర అంగీలు.. ఎర్ర చుడిదార్లు.. ఎర్ర చమికీ చీరలు.. చేతులకు, ఛాతులకు అతికించిన ఎర్రెర్రని గులాబీలూ… అంత ఎర్రగనే..

గోడలపై నిలుచున్న సినిమా హీరోయిన్లు కూడా నుదుట బొట్టునుండి కాలి గోటివరకు ఎర్రరంగులోనే నిలుచున్నారు.. నవ్వుతూ..

ఇంత “ఎరుపు” దేనికయ్యా అంటే..

ఇవ్వాల “ప్రేమికుల రోజు కాబట్టి”అట.. ఎవరో అనుకుంటుంటే విన్నాను..

అందరి సంగతేమో కాని నాకు మాత్రం ఇవ్వాల మా షాపింగ్ మాల్ చాలా మంచిగనిపిస్తోంది..

ఎటు చూసినా చిరునవ్వులు.. యువజంటల మొహాల్లోనివి..

చల్లటి గాలులు… సెంట్రలైజ్డ్ ఏసీ నుంచి వచ్చేవి…

గులాబిల పరిమళం… రూం ఫ్రెష్నర్ ఫ్లేవర్ అది..

బహు సున్నితమైన సంగీతం… స్పీకర్లలో నుండి…

కొత్తగా.. కొంత మత్తుగా… అబ్బా.. చాలా చాలా మంచిగుందీ రోజు.

అదిగో.. అంత మత్తు కూడా చిత్తయిపోయింది.. అతన్ని చూసిన ఆ క్షణంలో…

ఆకాశం లో చుక్క తెగిపడినట్టు “అతను” ఒక్కసారి ఇలా కనిపించి అలా మాయమయ్యాడు…

“చుక్కరాలితే” మొక్కుకోవాలిగా మరీ!

నేను “తను మళ్లీ కనిపిస్తే బాగుండని కోరుకున్నాను”..

కోరిక తీరింది..

కాసేపటికి తను కనిపించాడు..

కనిపించడం అంటే అలా ఇలా కాదు…

ఓ అద్భుతంలా..

కనిపించాడు..

తనే ప్రపంచంలా అనిపించాడు..!

ఎందుకనిపించాడో తెలీదు.. కానీ అనిపించాడు….

తనకూ నేను కనిపించాను..

నాకూ తను కనిపించినట్టే…

తనకూ నాలాగే అనిపించిందనుకుంటాను..

ఎందుకంటే..

నన్ను చూడగానే అతని మొహం ఎర్రబడింది.. అచ్చం ఇవ్వాల్టి మా మాల్ లాగే…

ఆ ఎరుపును సిగ్గుకి గుర్తు అనుకునేరు..

కాదు..

అది ప్రేమ..

మీకు తెల్సుగా.. ప్రేమరంగు ఎరుపని?

నాకు తెలుసు..

తను నన్ను ప్రేమిస్తున్నాడు..

తనకి తెలుసు..

నేను అతనికోసమే పుట్టాను..

ఇంతలో ఒకడొచ్చాడు.. తన పక్కకి..

స్నేహితుడట..

వినిపించింది..

నచ్చిందా?? స్నేహితుడి ప్రశ్న..

“మ్మ్”.. రెప్పవేయకుండా నన్నే చూస్తున్న ఈయన జవాబు..

ఎంత??

చచ్చేంత..

నేనడిగేది అదికాదురా… స్నేహితుడు ఇంకేదో అనబోయాడు..

ఈయన ఆపాడు..

ఆ వెంటనే నా దగ్గరికొచ్చి..

సహ జీవనం అన్నాడు..

“సరే” అన్నాను.. కళ్ళతోనే…

నన్నెత్తుకుని గాల్లో గిరగిరా తిప్పాడు.. సంబురంగా..

నేను గలగలా నవ్వాను.. హాయిగా..

అతడు ఆగలేదు..

నేను ఆపలేదు..

“లవ్ అట్ ఫస్ట్ సైట్” విన్నారుగా??

మాది “లైఫ్ అట్ ఫస్ట్ సైట్”..

ఇకనుంచి తనే నాజీవితం…

నేనిప్పుడు అతని “సహచరిని”..

******

నన్ను వాళ్ళింటికి తీసుకొచ్చాడు..

అక్కడున్నాయన వాళ్ల నాన్న.. ఈయన పిలిస్తే తెలిసింది…

“ఆయనకు” నేను నచ్చలేదు.

దాన్ని ఎక్కడినుంచి తీసుకొచ్చావో, అక్కడే వదిలేసిరాపో.. అన్నాడు.. నిర్దాక్షిణ్యంగా..

“ఈయన” వినలేదు.. నిర్లక్ష్యంగా..

ఆయన తిట్టాడు.. బాగా..

ఈ ఒక్కవిషయం మాత్రం నా ఇష్టానికి విడిచిపెట్టు నాన్న, ప్లీజ్.. అన్నాడు.. ధైర్యంగా..

ఆయన తిడుతూనే ఉన్నడు.. చాలాసేపు.. గొంతు నొచ్చేదాకా.. దగ్గు వచ్చేదాక..

దగ్గు రాగానే ఆమెకూడా వొచ్చింది.. తండ్రికొడుకుల మధ్యలోకి.. ఈయనకు అమ్మ.. ఆయనకు భార్య.. చూస్తే తెలుస్తోంది..

“నాన్న మాట వినొచ్చు కదరా” అని ఈయనతో అంటూనే ఆయనకు గ్లాసుతో నీళ్లు అందించి ఛాతిని అరచేత్తో రుద్దుతోంది..

ఈ ఒక్కసారికి నాన్నే నా మాట వినొచ్చు కదమ్మా..

“అదిగో మళ్ళీ” అంటూ ఆయన లేవబోతూ మళ్ళీ దగ్గాడు..

అప్పుడొచ్చింది ఇంకో ఆమె.. కాస్త చిన్నది.. ఈయనకు చెల్లె… తర్వాత తెల్సింది..

“నాన్నా, ఇంక వదిలెయ్.. ఇంటిదాకా తీస్కొచ్చాడుకదా!! మళ్ళీ వెనక్కెలా పంపిస్తారూ” అని ఆయనకు చెప్తూనే ఈయన దగ్గరికొచ్చి, నన్ను చూసింది.. ముందు పరీక్షగా… తర్వాత ప్రేమగా..

ఆమెకు నేను నచ్చాను…

“వానికి వంతపాడటానికి ఇదొక్కతి తయారయ్యింది”… ఆయన ఏదో తిడుతూనే ఉన్నాడు..

మేం.. కొత్త జంట..

లోపటికి నడిచాం..

******

అలా నడిచి యేడాది గడిచింది..

“మార్పు” సహజమటకదా? ఎక్కడో విన్నాను..

మాలో అలాంటిదేదీ రాలేదు..

ఆరోజు నుండి ఈరోజువరకు..

మేం ఒకర్నివిడిచి ఒకరం ఒక్కక్షణం కూడా ఉండలేదు..

ఉండలేమూ..

మా బంధం “అద్వైతం”…

కానీ..

వాళ్ల అమ్మది అపార్థం.. అమె కంటికి మేం ఇంకొకలా కనిపించాం..

ఒక్కో కంటిది ఒక్కో చూపుమరి!!

మా బంధం ఆమెకు అసహజం..

మేము ఏం చేసినా అనాగరికం..

నన్నేమీ అనలేక రోజూ అరిచేదామె, కొడుకు మీద…. కోపంతో..

ఇలా..

“ఎప్పుడూ అదే లోకమా? ఇంకో పనేం లేదా??”

“దాన్ని వదిలేసి ఇంట్లో మనుషుల్నో, పనుల్నో పట్టించుకోరాదు??”

“ఇంటిమీదెలాగో సోయిలేదు, కొంచం ఆ ఒంటిమీదన్న సోయుంచుకోరాదూ..” అని… రకరకాలుగా..

తన కొడుకును నేను గుప్పిట్లో పెట్టుకున్నానని ఆమె బాధ…

బాధ కాదు, ఈర్ష్య..

వాస్తవానికి…

నేనే ఈయన గుప్పిట్లో ఒదిగిపోయాను..

కానీ ఆమె అది చూడలేదు, తను చూడలనుకున్నదే చూసింది..

ఆమె ఇష్టం..!!    ఎవరు కాదంటారు!!

వీళ్ల నాన్న..

ఆయనకు నమ్మకాలెక్కువ.. కొడుకు చేసే పనులమీద..

వాటిల్లో ముఖ్యమైనవి రెండు.

తనకొడుకు అందరిచేతిలో వట్టిగా మోసపోతాడు ఒకటీ, అతను పనికొచ్చే పనులేవీ చేయడు రెండు..

ఈ రెండు నమ్మకాలూ, నా వల్ల ఇంకొంత బలపడ్డాయి..

ఆయనకు..

మొదట్లో నేనంటే అయిష్టం అనుకున్నాను.. తర్వాత తెల్సింది అసహ్యం కూడా అని..

“నువ్వు దీని పైపై అందాన్ని చూసి మోసపోయావురా” అని మొదలుపెట్టి

“గడియ రికాం లేదు.. నయా పైస సంపాదన లేదు..

అసలీ పనికిమాలింది చెయ్యబట్టే నువ్విట్లా దేనికి పనికిరాకుండా పోతున్నావ్…

గడ్డి పీకేతందుక్కూడ అక్కెరకురావు.. సంకనాకి పోతవ్ చెప్తున్నా..” అని తిట్టడం..

ఆ తర్వాత దగ్గడం.. ఆయనకు అలవాటయ్యింది..

కొత్తలో కొంచం బాధ అనిపించినా..

పోనుపోను అలవాటయ్యింది..

నాక్కూడా..

వాళ్ళ చెల్లె అంటే చాలా ఇష్టం..

చిన్నది..

మంచిది..

అల్లరి చేస్తుంది..

ఇంట్లో అమ్మని, బయట స్నేహితుల్నీ, గదిలో టివీనీ, బ్యాగులో పుస్తకాలనీ, మనసులో ఊహల్నీ.. ఒకటా రెండా, మొత్తం అన్నీటినీ వదిలి వచ్చేస్తుంది.. నాకొసం..

నాతో ఆడిపాడటం కోసం..

చాలా ప్రయత్నిస్తుంటుంది.. నన్ను అర్థంచేస్కోడానికి..

ఏదైనా అర్థమయినట్టు అనిపిస్తే సంబరపడిపోతుంది..చిన్న పిల్లలా..

చిన్న పిల్లే.. కానీ చిన్నవాటికి మురిసిపోయేంత కాదు..

అందుకే ఆమె సంబరం నాకు ప్రత్యేకం..

కానీ వాళ్ల అమ్మ వ్యతిరేకం..

ఆ పిల్ల మీద కాదు..

నా మీద…

అందుకే తిడుతుంది.. ఆ పిల్లని…

“వాడు చెడిపోయింది చాలదా?? నువ్వొకదానివి తయారయ్యవా కొత్తగా??”

“పో..నడూ.. పొయి పుస్తకాలు తియ్యి..” అంటూ…

ఏ మాటకు ఆ మాట..

‘ఈయన’క్కూడ నేను వాళ్ల చెల్లెతో సన్నిహతంగా ఉండడం అంతగా నచ్చదు..

నేను మొత్తంగా మొత్తం తనకొక్కడికే సొంతం..

తనకు అలాగే ఇష్టం..

నాక్కూడా..

ఎంతైనా తన “సహచరి”ని కదా..

తను చూపించే ప్రేమ ముందు వాళ్ల మాటలు నాకు పట్టింపుకాదు..

తను నాకిచ్చే ప్రాధాన్యతముందు మిగిలిన ప్రపంచంతో నాకు పనిలేదు…

******

ప్రపంచం తలక్రిందులయ్యే క్షణమొకటుందని నాకప్పుడు తెలీదు..

కాసేపలా బయటికి వెళ్లొద్దామని సాయంత్రం పూట బయల్దేరాం.. ఎప్పటిలాగే.. బైక్ మీదే..

ఎవరో తుమ్మారు.. పట్టించుకోలేదు..

చల్లటి వాతావరణం కదా..

చాలా హాయిగా ఉందా ప్రయాణం..

అప్పుడప్పుడే వెలుతురు పోయి కొద్ది కొద్దిగా చీకటి పడుతోంది..

చిన్న ప్రయాణం లాంగ్ డ్రైవ్ గా మారుతోంది..

జోరుగా.. హాయిగా..

రయ్ మని ముందుకు పోతున్నాం..

తను అప్పటిదాకా నాతో మాట్లాడుతూనే ఉన్నడు..

కానీ ఇంతలో ఏమనిపించిందో!!

ఓ పాట పాడమన్నాడు.. నన్ను…

నడిరోడ్డుమీద..

తనకు బాగా నచ్చిన పాటొకటి పాడడం మొదలుపెట్టాను..

నిస్సంకోచంగా..

నా పాటలంటే తనకు చాలా ఇష్టం.

అందుకేనేమో, వింటూ లోకాన్నే మైమరిచిపోతున్నడు.. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో..

ఒక్కపాట తర్వాత మరొకటి.. ఇంకొకటీ.. ఇట్ల ఐదు.. ఆరు… పది..

మా వేగంకూడా అరవై నుండి డెబ్భై.. ఎనభైలుగా.. పెరుగుతోంది..

క్రమక్రమంగా..

పదిహేనో పాట మొదలుపెట్టానోలేదో..

“ముల్లు” ఎనభయ్యైదు దాటింది..

అంతే..

“”ఢాంoo””

పేద్ద శబ్దం…

అంతా శూన్యం..

పాట ఆగింది…

మా ప్రయాణం కూడా..

******

మెల్లగా కళ్ళు తెరిచాను..

బహుశా నరకంలో..

శవాల కంపు…

శవాలనూ, జీవచ్చవాలనూ ఒక్క చోటే చేర్చినట్టు..

కాదు.. పేర్చినట్టున్నారు.. వరుసగా…

కొన్ని దేహాల్లో కొన్ని భాగాలు లేవు..

ఇంకొన్ని దేహాల్లో ఉన్నాయి.. కానీ కొన్నే..

చిన్న చిన్న మూలుగులు..

పెద్ద పెద్ద ఏడుపులు..

వినడానికే ఒక్క మనిషి కూడా లేడు..

తనకోసం చూద్దామనుకున్నను.. కనిపించట్లేదు..

పిలుద్దామనుకున్నాను..

గొంతు రాలేదు.. పోయింది..

నా స్వరం ఒక్కటే కాదు..

సర్వం పోయింది.. నాశనమై..

ఒక్కటి మాత్రం మిగిలుంది..

ప్రాణం..

అదికూడా పోతే మంచిగుండు.. తనని చూసిన తర్వాత..

ఒకే ఒక్కసారి..

 

******

తన గొంతు వినిపించింది..

“లారీ ఆగి ఉండే.. కనీసం ఇండికేటర్ కూడ ఏస్కోలే సాలెగాడు.. చీకటికదా, కనవళ్లే.. అందుకే సడన్ గా.. ”

ఎవరికో చెప్తున్నాడు..

హమ్మయ్యా.. తనకేం కాలేదు…

నా మొహం మళ్ళీ వెలిగింది.. ధైర్యంతో…

ఇద్దరం కలిసి ఇంటికొచ్చేసాం.. ఆటోలో..

అంతా మంచిగనే ఉంది.. కానీ..

తన మొహానికి నాలుగు కుట్లూ, చేతికో కట్టు..

నా సంగతి వేరే..

మనసు తప్ప మిగిలినవన్నీ విరగి ముక్కలయ్యాయి..

అయితే ఏంటి.. తనున్నాడుగా తోడుగా.. కానీ..

తన మొహంలో సంతోషం లేదు..

నా అవస్థ చూసి బాధపడుతున్నాడనుకున్నా.. మురిసిపోయా..

కానీ ఆ మురిపెం, ఇంట్లో నన్నో మూలకు పడుకోబెట్టగానే తీరిపోయింది..

అసలు విషయం తెలిసింది..

ఇకనుంచీ ఆ మూలే నా ఇల్లు..

మొదటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ల నాన్న, అమ్మా నన్ను ఎలా చూసారో ఇప్పుడుకూడా అట్లనే చూస్తున్నారు.. వింతగా..

కాకపోతే.. అసలు వింత అది కాదు..

“ఇప్పుడన్నా మాట విన్నందుకు సంతోషం.. అట్ల బయట విడిచిపెట్టస్తరా ఎవరన్న??

మూలకున్నా మానేగాని, అది మనింట్లనే ఉండాలే.” వాళ్ల నాన్న మొదటిసారి, దగ్గులేకుండా .. నాగురించి, “నాకోసం” మాట్లాడుతున్నడు..

“తీసుకచ్చిండుగదా.. ఇంక ఆ ముచ్చట విడిచిపెట్టుండ్లి..” అని భర్తకు చెప్తూ, నీళ్ళ గ్లాసును కొడుక్కిచ్చింది అమ్మ..

ఈయన నీళ్ళు తాగుతున్నడు.. ఆమె అంటోంది-

“ఎంత పెద్ద గండం గడిచింది కొడుకా.. దేవుని పుణ్యాన చిన్న చిన్న దెబ్బల్తోటి పోయింది.. నా బిడ్డా” అని.. ప్రేమగా దగ్గరకు తీస్కుని నుదుటిన ముద్దుపెట్టుకుంది..”

ఎంత మంచి దృశ్యం..! ఠక్కున ఫోటో తీస్తే బాగుండు అనిపించింది.. కానీ.. నేను లేచే స్థితిలో లేను…

ఇంతలోనే.. ఓ మెరుపు..

“దాని వల్లే ఇదంతా జరిగింది.. అసలది లేకుంటే అన్నకిట్ల యాక్సిడెంటే జరగక పోవును.. దొంగ మొఖం ది..

బయటెక్కడ్నన్న విడిచిపెట్టిరావల్సింది.. అసల్ దాన్ని మళ్లీ ఇంట్లోకెందుకు తెచ్చావ్..” పిడుగుల్లంటి ఆ మాటలు.. తన చెల్లెవి…

మార్పు..

ఆమె గొంతులో.. మనిషిలో కూడా..

“అదేం చేసిందే? దాని తప్పేం లేదు… డ్రైవింగ్ చేసేటపుడు వీనికి జర సోయుండొద్దా..” వాళ్ళ నాన్న తిడుతున్నాడు ..

“అబ్బా.. ఇంక ఈ ముచ్చట విడ్శిపెట్టుమన్నగదా..” అమ్మ అంటోంది..

ఈయన మొహంలో బాధ.. నన్ను చూసి..

“నువ్వేం బాధపడకన్నా.. మనకేం తక్కువ.. అదికాకపోతే ఇంకోటి..” చెల్లెమ్మ సలహా..

నిన్నటిదాకా ఆమె..

చిన్నది.. అల్లరిదీ.. ప్రేమగా నాతో ఆడుకునేది..

కానీ ఇవ్వాల??

ఇవ్వాల కూడా ఆడుకుంటోంది… నా జీవితంతో..

“అది కాకపోతే ఇంకోటట!!”

ఆ మాట వచ్చిన వెంటనే ఈయన ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడనుకున్నాను.. కానీ..

“మీ ఇష్టం.. ఈ సారి నాన్న ఎట్లంటే అట్ల.. ఏదంటే అదే..”తనన్నాడు.. నవ్వుతూ..

చెంప చెళ్ళుమంది!!

నాది…

ఈ మాట వినటానికా కొన ఊపిరితో బ్రతికుంది!!

******

తనతో గడిపిన క్షణాలు.. ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి.. కలలో లాగా…

తన మునివేళ్లతో నా పెదాల్ని స్పర్శించినపుడు.. నా మొహం వెన్నెలయ్యేది..

తన పెదాలే నన్నుతాకినపుడు.. స్వర్గపుటంచులకు చేరినట్టుండేది..

తను నా పాదాలకు చెక్కిలిగింతలు పెట్టినప్పుడు..

నేను గల గల నవ్వుతోంటే ఎంత ఆనందించేవాడు తను!

ఎవరైనా నన్ను పొగిడితే ఎంత గర్వపడేవాడు.. తను!

రాత్రి-పగలు తెలీకుండా, ఎర్రటి ఎండల్లో చల్లటి వెన్నెల్లో ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పేవాడు.. తను!

చాటుగా..

తన చేతుల్తో నా నడుమును చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు… తను!

తను.. తను.. తను…

నా తనువెల్లా తనే..

నాలో ప్రతి అణువెల్లా అతనే..

ఎన్నిసార్లు వాళ్ళ అమ్మానాన్నల్ని ఎదురించాడు.. నా కోసం..!!

కన్నవాళ్లతోనైనా మాట్లాడకుండా ఉన్నాడేమోకాని, నాతో మాట్లాడకుండా ఉండని క్షణం లేదు..

అదంతా గతం…

అప్పుడు మేం అవిభాజ్య కవలలం..

మా బంధం అద్వైతం..

కాలం ఆగదుకదా..

తిరిగింది.. గిర్రున..

మరొక యేడాది ముందుకు…

నేను అలాగే ఉన్నాను.. ఓ మూలకు.. ఉలుకు పలుకు లేకుండా..

తను కూడా అచ్చం ఇదివరకటిలాగే ఉన్నాడు..

చాలా సంతోషంగా.. ఉత్సాహంగా..

కానీ.. మరొకరితో..

కొత్త “సహచరి”తో..

తను..

కొత్తది.. నాకన్నా..

తెలివైంది.. నాకన్నా..

అందంగలది… నాకన్నా..

గలగలా నవ్వుతోంది.. నాకన్నా..

ఎంతోగొప్పగా వెలిగిపోతోంది.. నాకన్నా…

కానీ..

అది నాకు నచ్చలేదు..

“అది” అంటే ఆ కొత్తదని కాదు..

వాడు చేస్తున్న “వ్యవహారం” అని..

అవును “వాడే”..

ఒకప్పుడు నేను లేకుండా క్షణం ఉండలేకపోయిన వాడు..

అనుక్షణం నన్ను గుండెల్లో పెట్టుకున్న వాడు..

నాకు చిన్న దెబ్బతాకినా విలవిల్లాడిపోయే వాడు…

వాడు..

ఇవ్వాల నేనిట్ల జీవచ్చవంలా పడుంటే, నా కళ్లముందే ఇంకో దానితో.. నవ్వుతూ..

నాకు నచ్చలేదు..

వాడూ, వాడి వ్యవహారం..

నా వొళ్ళు మండిపోతోంది..

కడుపు కాలిపోతోందీ…

ఈ మాటలు మాటవరసకి చెప్పటం కాదు..

నిజంగానే..

దహించుకుపోతుంది… నా శరీరం..

ఏదో జరగబోతోంది..

నాకు తెలుస్తోంది…

చచ్చిపోతానని…

నా నరనరాల్లో కరెంటు పారుతున్నట్టుగా మండుతోంది..

నిజంగానే…

ఒళ్లుపేలిపోయేంత మంట.. ఎర్రనిది..

ఎరుపంటే నాకిష్టం..

ఇప్పుడు చావంటే కూడా..

ఎరుపు రంగులో మృత్యువు..

నాకు నచ్చింది..

నేను సిద్ధమే..

కానీ ఊరికే కాదు..

తోడుగా వాడు కావాలి..

తీసుకుపోనా??

Sahachari60

వాడికి కూడా ఎరుపంటే ఇష్టం మరి!!

తీసుకుపోనా??

వద్దులే..

పాపం ఆ పిచ్చిది.. కొత్తది..

వాడిమీద ఎన్నో ఆశలుపెట్టుకుని వచ్చినట్టుంది..

దానికోసం.. కేవలం దానికోసం..

వదిలెస్తా.. వీడిని…

కానీ ఊరికనే కాదు..

నేను గుర్తుండిపోయేలా..

ఓ కానుక ఇచ్చి..

ఆనందంగా..

వెళ్ళిపోతా..

నా ఎడమ వైపుకొక వైర్ వేలాడుతోంది..

హాస్పిటల్ లో పేషెంట్ చేతికి రక్తమో, సెలైనో ఎక్కించే పైపులాంటిది…

అది నన్ను బ్రతికించడానికి పెట్టాడో, సులువుగా చంపాలని పెట్టాడో.. నాకు అనుమానమే..

కానీ చేసేదేం లేదు..

వెళ్లిపోవల్సిందే..

కాలం ఆగదుకదా.. నాకోసం…

ఈలోపే వాడికి ఆ కానుక ఇచ్చెయ్యాలి…

త్వరగా..

అతి కష్టమ్మీద కళ్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నాను..

ఒళ్ళు కాలిపోతోంది.. ముట్టుకుంటే మాడిపోయేంతగా..

ప్రయత్నం ఫలించింది.. కళ్ళు తెరుచుకున్నాయి..

మెల్లగా.. చివరిసారిగా..

నేను కళ్లుతెరవడం చూసి వాడు వెంటనే నాదగ్గరికి ఉరికొచ్చాడు.. కొత్త సహచరిని వదిలేసి..

నా కళ్ళు తెరుచుకున్నాయి..

వాడు నా కళ్లలో కళ్లుపెట్టి చూస్తున్నాడు.. తొలిసారి చూసినట్టు..

కానీ ఆ చూపులో ప్రేమకి బదులు ప్రశ్న కనిపిస్తోంది

“ఇది మళ్లీ లేచిందా??” అని…

అది అనుమానమో.. ఆశ్చర్యమో అర్థంకాలేదు.. నాకు…

ఇంక దగ్గరికి రమ్మని సైగ చేసాను, కళ్లతోనే..

నేను తనకేదో చెప్పలనుకుంటున్నానని దగ్గరగా వచ్చాడు..

నా ఒళ్లు కాలిపోతోంది.. పేలిపోతానన్నంతగా ..

నన్ను చేతిలోకి తీసుకుని పైకి లేపాడు..

తన చెవినీ.. చెంపనీ నాకు దగ్గరగా తెచ్చాడు..

కానుక ఇవ్వాల్సిన సమయం ఇదే…

“”ఢాంoo””

పేద్ద శబ్దం…

******

అప్పుడే తెల్లరుతున్న ఆకాశం ఎర్రగా కనిపిస్తోంది..

ఎక్కడో ఓ ఇల్లు.. ఆ ఇంటి బాల్కనీలో కూచుని ఓ యువకుడు చాయ్ తాగుతూ, న్యూస్ పేపర్ చదువుతున్నాడు..ఒంటరిగా..

పేపర్ లో హెడింగ్..

చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి యువకుడికి స్వల్పగాయాలు”

కింద ఓ ఫోటో..

ఫోటోలో ఉన్న “వాడి” కుడి చెంప ఎర్రగా కనిపిస్తోంది.. రక్తపు రంగులో…

“నీ యవ్.. ఫోన్ కొందామనుకున్న రోజే ఇసొంటి వార్తల్ రావాల్నా.. చత్..

నేన్ మాత్రం పైసలకు సూడకుంట మంచి ఫోన్ కొనుక్కుంట.. ఎప్పటికి ఉండేదిగదా, మంచిదే తీస్కోవాలె ” అని తనలో తానే అనుకుంటూ తర్వాత పేజీ తెరిచాడా ఒంటరి…

అందులో ఎర్రటి ఎరుపు రంగులో పెద్ద పెద్ద అక్షరాలతో ఇంకో హెడింగ్..

ప్రేమికుల రోజు సందర్భంగా..

ప్రత్యేక తగ్గింపు ధరలు.. అప్ టూ 60%”…

అల్లం వంశీ

 

మొలకలు

వంశీ ఇప్పుడు కరీంనగర్‌ జిల్లా మంథని నుంచి వినిపిస్తున్న కొత్త గొంతుక. చెట్టంత కొడుకుల చెంత కాసింత నీడ దొరక్కపోతే .. ఆ తల్లిదండ్రులు తమ ఆప్యాయతల్ని ఎందులో వెతుక్కున్నారో ఎంతో ఆర్ద్రతతో చిత్రించిన కథ ఇది. అల్లం కృష్ణ వంశీ ఫిబ్రవరి 16, 1986లో పుట్టారు. ఎంఫార్మసీ చేశారు. సినిమా రంగం మీద ఆసక్తితో ప్రస్తుతం అక్కడ స్క్రిప్టు రైటర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇది వంశీ రాసిన మూడో కథ.
                                                                                                                                                                             వేంపల్లెషరీఫ్‌

ఏందీ? పదిహేనురూపాలకొక్కటా? మరీగంత పిరంజెప్తున్నవేందయ్యా..

పిరమెక్కడిదమ్మా పదిహేనంటే చానఅగ్గువ..

ఒక్కటికాదు పిలగా,  మొత్తం మూడుకొంటా. ఎంతకిస్తవో ఆఖరుమాట  చెప్పు. .

గదే ఆఖరమ్మా. పదిహేను రూపాలకొక్కటి. మీరు మూడు కొన్నా, ముప్పై కొన్నా గదే రేటు.  గంతే..

అబ్బా ఊకే ఒకటే మాట చెప్తున్నవేందయా, ఇచ్చేమాట చెప్పరాదు, ముప్పైరూపాలకు మూడియ్యిగ.

లేదమ్మా నలభైఐదురూపాలకు  ఒక్కరూపాయి సుత తక్కువ కాదు.

గిదంత కాదుగని లాష్టు ముప్పైఐదు  తీస్కోబాబు.
అర్రే..
నాకే అంత అగ్గువ పడదు గాదమ్మ. ఒక్కదాని మీద నాకు మిగిలేటియే రెండ్రూపాలు. మీరింత బొత్తిల గ్గుంజి బేరం జేస్తే ఎట్లనమ్మా.!  ఇంకోమాట చెప్పున్లి..

సరే ముప్పై ఎనిమిది తీస్కో..గంతే ఇగ.. మళ్ల ఎక్కువ చెప్పకు.

ఉన్నవాటిలోమంచిగున్నఓ మూడింటిని తీశి  ఆమె ఎదురుంగ పెట్టిండు పిలగాడు.

గిది మంచిగలేదు వేరేదియ్యి అని అండ్లనుంచి ఒకదాన్ని వాపసిచ్చిందామె.

దీనికేమైందమ్మా గింత మంచిగుంటే! అనుకుంటనే  దాన్నితీస్కోని  ఇంకోమంచిది తీశి ముంగట పెట్టిండు పిలగాడు.

ముప్పైఎనిమిది  రూపాలు అతని  చేతులపెట్టి ఆ మూడిటిని కట్టలెక్క ముడేషి పట్టుకుని ఎనుకకు తిరిగిందామె.

ఏడికి పోవాల్నమ్మా? రిక్షా అతను అడిగిండు.

వద్దు తాతా మా ఇల్లు గీణ్నే.. నడ్సుకుంటబోత..

ఓ చేతిల సామాన్లుండే, ఇంకో చేతిల ఈటిని పట్కుంటివి. ఒక్కదానివి.. ఆటిని ఇంటి దనుక ఎట్ల మోస్కపోతవమ్మా! ఓ రూపాయి తక్కువకే అస్త, ఎక్కుబిడ్డా..

వద్దు తాతా పర్వాలేదు.. ఇయ్యి అలుకగనే ఉన్నయ్.  అయినా మా ఇల్లుగీణ్నే.. నేన్నడ్సుకుంటబోత..

నిజానికి ఆణ్నుంచి వాళ్లింటికి చానా దూరమే గాని రిక్షా పైసలు మిగులుతే పిల్లలకు బిస్కిట్లు కొనుక్కపోవచ్చన్నది ఆమె ఆశ. అందుకే రిక్షాఎక్కకుంట నడుసుకుంటనే ఇంటితొవ్వ బట్టిందామె.

***

పెండ్లయిన మొదటి రెండేండ్లూ పిల్లలు పుట్టలేదామెకు. అందుకే పిల్లలు కోసమని  కనవడ్డ ప్రతి దేవునికిమొక్కులు మొక్కింది, ఎన్నో వారాలు ఒక్కపొద్దులున్నది. తర్వాతో ఆర్ణెల్లకు పెద్దోడు కడుపుల   పడ్డడు.

పిల్లల కోసమని చానరోజులు మొక్కులు మొక్కి ఉపాసాలుండుట్ల పెద్దోడు పుట్టేటప్పటికి ఆమెకు పాలు పడలేదు. అందుకే పాపం పిలగానికి డబ్బా పాలే పట్టించాల్సచ్చేది.  ఆ జమానాల అప్పటికి వీళ్లకు చిన్న సైకిలు పంచరు షాపే ఉండుట్ల దాని మీదచ్చే చారానా అఠానా పైసలు పిలగాని పాలకూ, వీళ్ల తిండికీ సాలక పొయ్యేటియి. అందుకే పిలగానికి పాలకోసం వీళ్లిద్దరు రోజుకోపూట తిండి బందుచేసుకున్నరు. పిలగానికి కడుపునిండా పాలుపడుతున్నప్పుడు నిజంగ ఆ సంబురంతో, తృప్తితోటే వీళ్ల కడుపులు నిండేటియి. కోట్లరూపాలు పెట్టిన దొరకని సంబురం.. తృప్తి.

వాడు పుట్టిన కొద్దిరోజలకు సంకల పసి పోరణ్నేసుకుని కాలినడకన్నే మొక్కుకున్న గుడులన్నీటికి పొయ్యి మొక్కులు తీర్సుకున్నదామె. ఆ తర్వాత వర్సగ ఇంకో నాలుగేండ్లల్ల చిన్నోడు, బిడ్డసుత పుట్టిన్లు.. ముద్దుగుండే ముగ్గురుపిల్లలు .. ఇద్దరు కొడుకులూ,ఒకబిడ్డ.ఆ ముగ్గురెంత ముద్దుగుంటరో మనం మాటల్ల చెప్పలేం.అయినా పిల్లలకంటే అందంగుండేది ఏముంటదీ లోకంల! ఆ మొగుడూ పెళ్లాలిద్దరికీ ఇప్పుడా పిల్లలే సర్వం, లోకం.

మొగనికొక చిన్న సైకిలు రిపేరు షాపున్నది.. ఆయినే యేడాది పొడుగూత రికామన్నమాటెర్గక పొద్దుమాపు తేడా లేకుంట గంటల గ్గంటలు రెక్కలుముక్కలుచేసుకుని కట్టపడుతనే ఉంటడు. ఆ రెక్కల కట్టంతోనే ఓ నాలుగు రిక్షాలు ఖరీదు చేశి కిరాయిల కిచ్చుకున్నడు. ఆషాపుమీద, రిక్షాల కిరాయిలమీద వచ్చే సొమ్మును పైసాపైసా కూడబెట్టి మొన్ననే ఓ చిన్న ఇల్లుసుత కట్టుకున్నరు. పెండ్లిచేస్కుని ఉత్తరెక్కల కట్టాన్ని నమ్ముకుని జీవితాన్ని షురూ చేషినవాళ్లకు సంసారాన్ని ఇట్ల ఓకొలిక్కి తీసుకురావటానికి  దగ్గెర దగ్గెర  పదేండ్లుపట్టింది.

***

తొవ్వలోదుకాణమ్ముంగటాగి పిల్లలకిట్టమైన బిస్కిట్లు కొనుక్కోని  ఇంటికిచేరుకుందామె.అమ్మచేతిలబిస్కిట్పొడలుసూడంగనేమస్తుసంబురమైందిపిల్లలకు. వాళ్లకండ్లల్లవెలుగు సూషి అంతకురెట్టింపు సంబురమైంది అమ్మకు.

అమ్మా.. అయ్యేం చెట్లే? బిస్కిట్లు తినుకుంట అడిగిన్లు పిల్లలు.

అయి కొబ్బరిచెట్ల మొలకలురా. మీరు ముగ్గురున్నరని  మూడుతెచ్చిన.

కట్టనిప్పి తలొక మొలకను “ఇదినాది-ఇదినీది”అనుకుంట  తీసుకున్నరు పిల్లలు.

ఏడ పెడుదామే వీటిని? బిడ్డఅడిగింది.

ఇంటి ముంగట ఖాలీ జాగున్నది కదనే ఆడ తొవ్వి పెడుదాం.

నేన్తవ్వుతా  అంటే నేన్తవ్వుతా అని  కట్టెపుల్లలేరు కచ్చుకునే తందుకు ఉరుకిన్లు కొడుకులిద్దరు.

అరె ఎటుర్కుతున్లురా..?? ముందుగాల మీరిటచ్చి ఆ బిస్కిట్లు తినున్లి. కట్టెపుల్లల్తోని పైనపైన తొవ్వి పెడుతె ఆగయిరా ఆ చెట్లు. నానచ్చినంక గడ్డపారతోని పెద్దగ తొవ్వుతడు, అప్పుడు మీరన్ల చెట్లు పెడ్దురుగని రాండ్లి లోపటికి. అమ్మఅన్నది.

లోపటికి నడిశిన్లు పిల్లలు.

నాన ఇంటికి రాంగనే ఎదురుపొయ్యి “నానా మా కొబ్బరిచెట్లు” “నానా మా కొబ్బరిచెట్లు”అని సంబురంగ చూపెట్టిన్లు పిల్లలు.

కొబ్బరి చెట్లెక్కడియి బేటా అనుకుంట బిడ్డను ఎత్తుకుని ముద్దుపెట్టుకున్నడు నాన..

అమ్మ తెచ్చింది నాన.

తర్వాత అతను ఇంటిముంగట మూడు బొందలు తవ్వితే పిల్లలు ఎవరి మొలకను వాళ్లు అండ్ల నాటిన్లు. అమ్మ మట్టితో బొందలు పూడ్శి మూడు చెట్లకూ నీళ్లు పోశింది.

***

రోజు పొద్దుగాల లేవంగనే చెట్లకాడి కురికి ఏమన్న పెద్ద వెరిగినయా లేదా అని చూశేటోల్లు పిల్లలు.

అమ్మా, నానా వాటికి రోజూ నీళ్లు పోషేటోల్లు. ఏదన్నొక పొద్దువాటికి కొత్త ఆకు మొగిలనుంచచ్చినప్పుడు వాళ్ల సంబురం అంతా ఇంతా కాదు. చెట్లు మంచిగ పెరుగుతున్నయి. పిల్లలూ పెరిగి పెద్దోళ్లయితున్నరు.

మన వాడకట్టు పిలగాండ్లందరికీ దోమలు కుడుతే అయేంటియో జొరాలస్తున్నయట. బాంచెన్ ఓ ఫ్యాను కొనుక్క రారాదయ్య..  మొగనికి చెప్పిందామె.

సరే సరే ఈ నెల రిక్షా కిరాయిలు రానియ్యే కొందాం. మొగడన్నడు.

అప్పటిదాంక పిల్లలకుఫ్యానంటేందో తెల్వదు కానీ, ఏదొ కొత్త వస్తువు వస్తుందని మాత్రం ఎరుకై రోజు నాన ఇంటి కచ్చేటాల్లకు హుషారుగ ఎదురురికి ఆయినె చేతులు చూస్తున్నరు.

ళ్లనెప్పుడూ నిరాశ పర్చకుంట ఇంటికి రాంగ పండ్లో, చాక్లెట్లో, బిస్కిటు పుడలోబొమ్మలో రోజూ ఏదన్నొకటి తెస్తనే ఉండేటోడు నాన.

ఒకరోజు నాన ఇంటికి వచ్చేటపుడు చేతిలో బిస్కిటు పొడలతో పాటూ కొత్తవస్తువేదో కనపడింది పిల్లలకు..

నానా ఏందిది?? సంబురంగదాన్నిముట్టుకుంట అడిగింది బిడ్డ.

టేబులుఫ్యాను బేటా.

పిల్లలు ముగ్గురికి మంచిగ గాడ్పచ్చేటట్టు పెట్టి వాళ్ల కాళ్లకట్టకు దోమలు కొట్టుకుంట పన్నరు అమ్మానాన. మొదటిసారి ఫ్యాను గాలి మొఖాలకు తగులంగనే గాల్లె ఎగురుతున్నట్టు గనిపించింది అందరికీ. దాని ముంగట కూసున్నప్పుడు గాడ్పుకు జుట్టెగిరి చెవులకూ, చెంపలకూ తాకుతుంటే చెక్కల్గులయ్యి కిలకిల నవ్వుతూ చప్పట్లు కొట్టిన్లు పిల్లలు.
వాళ్ల నవ్వులు సూశి కడుపు నిండింది అమ్మానానలకు…

***

మొలకలు పెరిగి చిన్న చిన్న చెట్లయినయ్. పిల్లలు బడీడు కచ్చిన్లు.గవర్మెంటు బల్లె ఏద్దామని నాన, లేదు ప్రవేటు బల్లెనే సదివియ్యాలని అమ్మా చాన రోజులే లొల్లివె ట్టుకున్నరు..

ముగ్గురిని ప్రవేటు బల్లేస్తే గంతగంత ఫీజులేడికెళ్లి కడుతమే?? నాన అడిగిండు.

కావాల్నంటే ఇంటి ఖర్చు తక్కువ చేస్కుందాం, ఇంక కావాల్నంటె నేన్సుత మిషిను కుడుత గంతే గని పిలగాండ్ల సదువుల కాడ మాత్రం పైసలకు సూషే ముచ్చటే లేదు. వాళ్లను మంచిగ సదివిపియ్యాలే.. తెగేషి చెప్పింది అమ్మ..

ఇంటికి దగ్గెర్లున్నమంచి ప్రవేటు బల్లేషిన్లు పిల్లల్ని. అమ్మానానల కట్టాన్ని యాదుంచుకుని వాళ్ళుసుత మంచిగ సదువుకుంటున్నరు. ముగ్గురికి ముగ్గురు ఎవల క్లాసుల వాళ్లు ఫష్టే. అంత మంచిగనే ఉన్నదిగనీ… పిల్లలు పొద్దున లేవంగనే బడికి పోవుడూ, మళ్ల సాయింత్రం ఇంటికి రాంగనే హోంవర్కూ, ట్యూషను.. రాత్రిపూట జరసేపు రికాం దొర్కుతె పక్కింట్లకురికి టీవీ చూషుడూ, ఆ తర్వాత పండుకునుడు. ఐతారాలు సుత ఇంట్లుండకుంట దొస్తులతోని ఆటలు. మొత్తంగిదే అయితుంది.. ఇట్ల రోజులు గడుస్తనే ఉన్నయ్. చెట్ల మీన మునుపున్నంత యావ పిల్లలకుఇప్పుడు లేదు. వాస్తవానికి వాటిని సూషేటంత రికాం దొర్కుతలేదు పిల్లలకు.
అమ్మా నానల యావ మాత్రం రోజు రోజుకు ఇంకింత పెరుగుతనే ఉన్నది. పెండేస్తే చెట్లు మంచిగ పెరుగుతయని రోజూఎక్కడెక్కడికో పొయ్యి తట్టలల్ల పెండ పట్కచ్చిచెట్ల మొదట్ల పొయ్యవట్టింది  అమ్మ. నాన రోజూ నీళ్లుకడ్తనే ఉన్నడు..

***

కాలం చాన జల్దిజల్ది ముంగటికి పోతనే ఉన్నది. నాన ఎప్పటిలెక్క రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడుతనే ఉన్నడు. అమ్మసుత ఉన్నదాంట్లె సదురుకుంట సంసారాన్నిసక్కగ ముందుకు నడుపుతాంది.  ఇన్నేండ్లల్ల ఆ చిన్న సైకిలు రిపేరు షాపును ఓ పదిహేను సైకిళ్లుండే పెద్ద సైకిలు టాక్సీ చేషిన్లు. నాలుగురిక్షాలు ఎనిమిదైనయ్.   చేతికిందికి ఇద్దరు పనోల్లను సుత పెట్టుకున్నడు నాన.

కానీ రాంగరాంగ సైకిలుకి  రాయలకుతీస్కునేటోల్లు,తొక్కేటోల్లూ చానవరకు తక్కువైపేన్లు. సైకిల్లకు బదాలు మొత్తం అన్నీ మోటరుసైకిల్లే అయినయ్. ఇటు రిక్షాల ముచ్చటసుత ఆ తీరంగనే ఉన్నది. కొత్తగ ఆటోరిక్షాలని అచ్చినయ్. జెప్పన పోవచ్చని, ఆరాముగుంటదని అందరు వాటిల్నేఎక్కుతున్నరు. ఇంకిన్నిరోజులకు అస్సల్రిక్షలనేటియే పురాగ లేకుంట యినయ్. ఉన్నా, రిక్షాలను తొక్కడానికీ అసల్ ఒక్క మనిషిసుత దొర్కుత లేడు. వాళ్లందరిప్పుడు ఆటోడ్రైవర్లయిన్లు.
మారుతున్న లోకంతో పోటీ పడలేకపొయిండు నాన. అప్పుచేశి ఆటోరిక్షా కొందామనుకున్నా ముగ్గురు పిల్లలు యాదికచ్చి అప్పు చెయ్యబుద్దికాలేదు. ఉన్నరిక్షాలమ్మి కొత్త ఆటో కొందామంటే ఇనుపసామాన్లోడు తప్ప ఇంకెవడు రిక్షాలను కొన అన్నరు. ఇన్నిరోజులు వాళ్లకు తిండిపెట్టి పోషించిన సైకిల్లూ, రిక్షాలుఇప్పుడు మూలకు వడ్డయ్. ఎంత ఖోశిష్ చేశినా మారడం అతని తోటి కాలేదు. పైసలకు కట్టంగనే ఉన్నాఇన్నిరోజులు పిల్లలకు ఆ ముచ్చట తెలువకుంటనే నడుపుకచ్చిన్లు అమ్మానానలు.  కానీ కాలంతో పాటూ మనమూ మారకుంటే  జీవితమనే పరీక్షల ఓడకతప్పదుగా!  ఇంతట్లనే పెద్దోడు  పదోతరగతి మంచిమార్కులతోటి ఫష్టుక్లాసులపాసైండు.

***

సంబురంగా సేమ్యా పాయిసం చేశిపెట్టిందమ్మ.

నానా.. నేను గా పెద్దకాలేజిల సైన్సుగ్రూపుల చేరుత. హుషారుగడిగిండు పెద్దోడు.

నానకు ఏమనాల్నో, ఎట్లచెప్పాల్నోసమజైతలేదు. ఇయ్యాల చెప్పద్దులే అని ఊకున్నడు.

నానా.. నేను గా పెద్ద కాలేజిల సైన్సుగ్రూపుల చేరుత. తెల్లారి మళ్లడిగిండు పెద్దోడు.

చెప్పటానికి ధైర్నం రాలే నానకు. నాకు బయట పనున్నది బేటా పొయ్యస్తా..అని బయటికి నడిశిండు.

ఏందయ్యా పిలగాడు గా కాలేజిల చేరుతా అని రెండ్రోలకెళ్ళి అడుగుతాంటే సప్పుడు చేస్తలెవ్వు. వాని దోస్తులందరు పొయి చేరుతాన్లట. వీణ్ణి సుత ఇయ్యాల ఆడికి పట్కపొయ్యి అండ్లచేర్పిచ్చుకరా.. అమ్మగట్టిగనే అడిగింది.

ఏందే..బహు రుబాబుగ మాట్టాడ్తానవ్? నాతాన పైసలేడున్నయ్ ఆ కాలేజిల సదివిచ్చేతందుకు?

అట్లంటేంటిదన్నట్టు? పొలగాని సదువాపుతవా ఏంది?

సదువాపుడు గాదు. ఇగ పని నేర్పియ్యాలె వానికి. ఒక్కన్నెంతగనమని చేసుకుంట రావాలె.  వానంతున్నప్పుడే మా నాయిన నన్ను పనికి తోలిండు. ఇయ్యాల్టికాంచి వీణ్నిసుత నా యెంబటి  షాపుకు తోల్కపోత ఇగ…  తన నిస్సహాయతను పెండ్లాన్ని తిడుతున్నట్టుగ చెప్పిండు నాన.

జెట్టమొఖపోడా ఏం మాట్లాడ్తున్నవ్. పసిపోరణ్నిపనికి తోల్కపోతావ్? బల్లె పష్టచ్చినోణ్నిసదువు బంజేపిస్తావ్? అసల్మొగోడు మాట్టాడే మాటలేనానయ ఇయ్యి? గయ్యిమని లేశింది అమ్మ.

మొగణ్నిఎంత మాటపడుతె అంత మాటంటవానే లమిడికే అని పెండ్లాం ఈపుల గిబ్బగిబ్బ నాలుగు గుద్దులు గుద్దిండు మొగడు ..

థూ.. నీ చేతులిరిషి పొయిలపెట్ట గదరా. పిలగాండ్ల ముంగట పెండ్లాన్ని తన్నుడు చాతనైతదిగని పోరణ్నిసదివిపిచ్చుడు మాత్రం చాతకాదు నీకు.

ఔమరి. నువు రాంగ ముల్లెలు పట్కచ్చినవ్ గదా నా ఇంటికి. సంపాదిత్తె ఎర్కైతది రూపాయంటేందో, కట్టమెట్లుంటదో..  పొట్టల్పిక్ల తిని ఇంట్లపంటె ఎట్లెరుకైతది నా గోసేంటిదో.

ఇన్నేండ్లు నీకు వండిపెట్టిందానికి నువు నాకేమన్న జీతం కూలిచ్చినవా? రెక్కలు ముక్కల్చేస్కుని ఇంటెడు సాకిరి చేస్కుంట ఒక్కొక్కటి సగవెట్టుకుంటత్తాంటే గుర్రబ్బేవన్లెక్కతినుకుంట..నీ కేడెర్కైతాంది నా ఇలువ. అయ్యన్ని నీకు లెక్కలకు రావా?

ఛత్.. లమిడికే నోర్తెర్వక్. మొత్తం నువ్వే సంసారం నడుపుతన్నట్టు మాట్లాడుతన్నవ్. ఔతలోళ్ల వేరం నేనేమన్న తాగుబోతునా, తిరుగుబోతునా.. పొద్దూకుల కట్టపడి పైసల్పట్కచ్చిస్తే నా మీదకే మర్లవడ్తున్నవ్.. మళ్లగిన నొరిప్పినవంటే మూతిపండ్లు రాల్తయి చెప్తాన్న.

ఆ రాల్తయి రాల్తయి. రిచ్చతొక్కేటోడుసుత పెండ్లానికి పండుగకు చీర కొనుక్కత్తడు. నువ్వెప్పుడన్నపెట్టినవా నాకు? అయినా నిన్నెప్పుడన్ననాక్చీరలు తెమ్మని, బంగారం పెట్టుమని అడిగిన్నానయా నిన్ను? ఉన్నదాంట్లె సదుర్కోని పిల్లల సదివిచ్చుకుంటత్తాంటే లంజెపొడుగు మాటలన్నిమాట్టాడుతన్నవ్..  ఏడుస్తూ అన్నదిఅమ్మ..

ఔ.. నువ్వే సదివిపిత్తన్నవ్కని. ఆన్నన్ని పైసల్కట్టుడు నాతోనైతె కాదు. కావాల్నంటే గౌర్మెంటు కాలేజిల చేరుమను. ఒక్కపూటే కాలేజుంటది, ఇంకోపూట నాతోని పనికి తోల్కపోత. సదివేటోడు ఎన్లున్నాసదువుతడు.. ఆఖరి నిర్ణయం చెప్పి బయటికి నడిశిండు నాన…

అప్పటి దాంక మూలకు నిల్సోని బీరిపొయి సూస్తున్నపిల్లలు నాన పోంగనే ఏడ్సుకుంట అమ్మకాడి కురికచ్చిన్లు. బాగ బెదిరిపొయ్యున్నరు వాళ్లు. ముగ్గుర్నీదగ్గరకు తీస్కోని గట్టిగ కావులించుకుని ఏడవద్దు నానా అన్నదమ్మ.

నొస్తుందా అమ్మా? చిన్నోడు అమ్మ వీపు నిమురుకుంట అడిగిండు..

లేదు నానా.. గదేం లేదు.

ఊకో అమ్మా ఊకో అనుకుంట చెంపలమీది కన్నీళ్లను తుడవబట్టింది బిడ్డ.

అమ్మా.. నువ్వట్ల ఏడవద్దే.. నాకసలు కాలేజేవద్దమ్మా.. రేపటికాంచి నాన తోటి నేన్ సుత షాపుకు పొయ్యి రూపాలు సంపాయించి పట్కస్తనే. మీరిద్దరిట్ల లొల్లి పెట్కోకన్లే.. పెద్దోడన్నడు.
లేదు నానా మీరు మంచిగ సదువుకోవాలె. నాన కోపమచ్చినప్పుడు అట్లనే ఒర్రుతడు. మీరయన్నిపట్టించుకోకన్లి. నేనున్నకద నానా, మంచి కాలేజిల చేర్పిస్త. మిమ్మల్ని మస్తు మంచిగ సదివిపిస్త. మీరేం  రందిపెట్కో కున్లి బిడ్డా.. అమ్మ అన్నది.

వద్దమ్మా. మీరిట్ల లొల్లిపెట్కుంటే మాకు భయమైతాందమ్మా..

లేదునానా. ఏదో కోపంల అట్లనుకున్నం, మళ్ల రేపు కలిశిపోతం..గంతే… మళ్లింకెప్పుడు లొల్లిపెట్కోం బిడ్డ. మీరియన్ని పట్టించుకోకుంట మంచిగ సదువుకోవాలె. మాలెక్క మీరు కట్టాలు పడకుంట పెద్దపెద్ద నౌకర్లు చేసుకుంట మంచిగ బతకాలె నాన.

ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నంక పుస్తెలుతాడు తీశి మొగనికిచ్చిందామె.

ఏందే ఇది? దిమాగ్ గిన ఖరాబైందా?

దీన్నమ్మి పైసలు పట్కరావయ్య. పొలగాని సదువుకైతయ్.

నీకున్నదే గదొక్క బంగారప్పోస. గదమ్ముమంటావ్?? అద్దద్దు. లోపట పెట్కో దాన్ని.

ఇప్పుడు పోరగాండ్ల సదువులు ముక్కెం గని బంగారాందేమున్నదయ్యా. పైసలున్నప్పుడు మళ్లెప్పుడన్న కొనుక్కుందాంతీ..

అరే.. అద్దంటే మళ్ల గదే మాటంటవ్. మీ నాయిన పావురపడి చేపిచ్చిన పుస్తెల అమ్ముకుంటావ్? అద్దద్దు. నేను మాపటీలే వాని ఫీజుకని పెద్ద సేటుకాడా ఇరువైవేల్రూపాలు మాట్లాడి పెట్టిన.. నాకాడ పైసలున్నయ్కని అది ఓరకు వెట్కోపో..

తెల్లారి పెద్దోడు కాలేజిల సైన్సుగ్రూపుల చేరిండు.

ఆ తర్వాత కొద్దిరోజులకే బిడ్డ పెద్దమనిషైంది. అప్పుడు మాత్రం అమ్మపుస్తెల – ఒకగొలుసూ, ఇంకో రెండు చిన్నగాజు లెక్క మారిపేంది.

***

చానేండ్ల తర్వాత మళ్లిప్పుడు చెట్లమీదికి యావమళ్లింది పిల్లలకు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పూత పూశి చిన్న చిన్న పిందెలుపడుతున్నయ్వాటికి. పెద్దోనిదిఈ యేడు డిగ్రీ అయిపొతది. మిగిలినిద్దరూ కాలేజిలకు పోతున్నరు. ఇప్పటికీ ఎవల క్లాసుల వాళ్లు ఫష్టే. రోజూ పొద్దుగాల లేవంగనే పిందెలు ఎంత పెద్దగైనయా అని సూశుడు అలవాటయింది పిల్లలకు. పెద్ద పెరిగిన చెట్లను సూశి అమ్మానాన్నలకూ సంబురంగనే ఉంది.

ఆ మధ్యలో సారి వాటికేదో రోగమచ్చి ఎండిపొయినట్టైతుంటే ఎవరో ఎరువుల డిపోదోస్తును పట్కచ్చి సూపెట్టి పిచికారి మందులేవో కొట్టిచ్చిండు నాన. అమ్మకూడా ఇప్పటికీ రోజూఎక్కడెక్కడికో పొయ్యి తట్టలల్ల పెండేరుకచ్చి వాటికేస్తనే ఉంది.. ఇద్దరూ నీళ్లు కడ్తనే ఉన్నరు.. ఆవాడల ఒకరిద్దరిండ్లల్ల అదే రోగమచ్చి రెండు మూడు చెట్లెండి పొయ్యి సచ్చి పొయినయ్  కనీ ఈడ వీళ్ళు వాటిని పాణంలెక్క కాపాడుకుంటచ్చుట్ల అయి బతికి ఇప్పుడిట్ల కాయలు కాశేదనుక అచ్చినై..

వేన్నీల్లకు సన్నీల్ల తోడన్నట్లుగ పెద్దోడు ఓ దిక్కుకూ సదువుకుంటనే ఇంకో దిక్కు ట్యూషన్లు చెప్పుడు షురూ చేషిండు. ఇంట్లో అడుగనవసరంలేకుంట అతని ఖర్చులమందం అతను సంపాయించుకుంటుండిప్పుడు.

అన్నను సూశి తమ్ముడూ, చెల్లేసుత సదువుకుంటనే చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పుడు షురూ  చేషిన్లు. వాళ్ళు ముగ్గురూ చానా బుద్దిమంతులనీ, మంచిగ సదువుకున్నరనీ చిన్నప్పటికెళ్లి ఆవాడలోల్లందరికీ ఎరుకే గనుక అందరు వాళ్ల పిల్లల్నివీళ్లదగ్గరికే ట్యూషనుకు తోలుడు షురూ చేశిన్లు. కొద్దిరోజులకే మంచిపేరూ, కొద్దోగొప్పో పైసలూ సంపాదించుకున్నరు పిల్లలు.

కొబ్బరిచెట్లక్కూడా ఈ యేడాదినుండే కాయలు మంచిగ కాస్తున్నయ్. ఇంట్లోల్లుఎన్నికాయలుతాగినా ఇంకిన్ని కాయలు మిగిలే ఉంటున్నయ్..అందుకే ఇంట్లకు కొన్నుంచుకోని మిగిలినవాటిని అమ్ముడు పెట్టిన్లు.. వాటినుంచిసుత వెయ్యి-రెండువేలరూపాలఆదాయం వస్తున్నదిప్పుడు.

***

అంత మంచిగున్నదనుకునేటంతల ఓ రోజు అనుకోకుండ ఇంటిమీది కచ్చిపడ్డడు  పెద్ద సేటు.

ఏవమ్మో. ఎవలున్నున్నరాఇంట్లె?

ఎవలయా? ఏంది..ఏంగావాలె?

మీ నాయినున్నడానయ?

లేడు షాపుకాడికి పొయిండు.

షాప్కాడ సూషిన, ఆడ ఔపడ్తలేడనే ఈడికచ్చిన.

ఏదన్న పనుండి ఔతలికి పొయిండు కావచ్చు. ఆణ్నే కూసోకపొయిన్లు అస్తడు కదా.

వారంరోలసంది గదేపని చేస్తున్నబిడ్డా. మీ నాయిన షాపుల పోరన్ని కూసోపెట్టి మాకు దొర్కకుంట ఎటెటోతిర్గుతాండు.

ఏంది ఏమైంది సేటూ? అమ్మబయటికచ్చిఅడిగింది.

ఏం లేదమ్మా. మీ ఆయన చాన రోలసంది గిరిగిరిమిత్తుల మీద మా కాడ మస్తు పైసలు బాకిలకు తీస్కున్నడు. మునుపు బకాయిలు మంచిగనే గట్టేటోడుకని నిరుటి సంది మాత్రం తీసుకునుడే తప్పితే  నయాపైససుత వాపస్ మా చేతికస్తలేదు. ఇగిత్తడు అగిత్తడనే ఇన్నిరోలసంది ఇంటి దిక్కు రాలే. సూశి సూశి యాష్టకచ్చేఇయ్యాలిగ ఇంటికచ్చిన.

ఎన్నిరూపాలు బాకున్నడు సేటూ?

అన్నికలిపి దగ్గెర దగ్గెర లచ్చరూపాలు.

ఆమాటినుడుతోనే గుండె మీన రాయిపడ్డట్టయ్యింది ఆమెకు.

సరే ఆయినచ్చినంక నేన్మాట్లాడుతనయ్యా. ఎంత జల్ది వీలైతె అంత జల్ది మీ బాకి తీరుస్తం.

నీ మాటిని పోతున్నమమ్మా. నెలరోజుల్ల మా బాకీ తీర్వాలె. లేకుంటె మాత్రం మంచిగుండదు చెప్తున్న. అనుకుంటెల్లిపొయిండు పెద్దసేటు.

సంసారం ఇప్పుడిప్పుడే సక్కగైతుందనుకునేటాల్లకు ఇట్లయ్యేసరికి ఒక్కసారిగ మస్తు ఏడుపచ్చింది ఆమెకు.

ఊకో అమ్మా.. నాన రానీ అసలేమైందో మాట్టాడుదాం అని ధైర్నమిచ్చిన్లు పిల్లలు.

సాయింత్రం నానింటి కచ్చిండు. పొద్దుగాల పెద్దసేటచ్చిన ముచ్చట నానకు చెప్పింది బిడ్డ.

నిజంగనే మన కప్పులున్నయానయా? అమ్మఅడిగింది.

ఏం మాట్లాడలే నాన.

ఏంది నానా సప్పుడు చేస్తలెవ్? మనకట అప్పులున్నయ? పెద్దోడడిగిండు.

పైసల ముచ్చట మీకెందుకురా? అయన్ని నేన్సూస్కుంట కదా.

అప్పులోల్లు ఇంటిమీదికచ్చి మమ్మల్నడుగుతాన్లు మరి.. కొద్దిగ గట్టిగనే అన్నడు పెద్దోడు.

నేన్పొయ్యి మాట్లాడుత.. మీరిగిది మర్శిపోన్లి. సరేనా. ఇంకోసారి రారు.

అప్పులోని ముచ్చట పక్కకు వెట్టు. అసలన్ని రూపాలు అప్పెందుకు చేశినవ్ నానా? మాకది జెప్పు నువ్వు ముందుగాల.  నిలదీసినట్టుగనే అడిగిన్లు పిల్లలు.

అయ్యన్ని ముచ్చట్లు మీకెందుకురా? నేన్ మీకు లెక్కలు చెప్పాల్నా ఇప్పుడు? ఏందో మీదిమీదికి లేశి మాట్లాడుతున్నరు? సువ్వర్ కే..  మళ్లనాతాన ఇంకోసారి ఆ ముచ్చటతేకున్లి చెప్తున్నా అనుకుంటనే రుస రుస బయటికి నడిశిండు నాన.

ఇదంత సూస్కుంట అమ్మ ఏడుస్తుందేకని నోరుతెర్శి ఒక్క మాటసుత మాట్లాడలే.

నానెప్పుడన్న వాళ్లను తిడుతాంటె వెంటనే ఆయినె మాటల కడ్డంపడి లొల్లిని మొత్తం ఆమె దిక్కుకు తిప్పుకుని పిలగాండ్ల మీద ఒక్క మాటసుతపడనియ్యకుంట సూస్కునేది అమ్మ. అసొంటి అమ్మ ఇయ్యాల నోరు మెదపకపోవుడుతోటి వాళ్లకు జరంత పరేషాన్ అనిపించినా అప్పు ముచ్చట నాననే న్సూస్కుంట, మీరిది మర్శిపోన్లి అన్నందుకు ధైర్నంగసుత ఉంది.
వాళ్ల సదువుల కోసం, కాలేజీ ఫీజుల కోసమే అతను అప్పు చేస్కుంటచ్చిండని ఆమెకు సమజైందికనీ పిల్లలకు సమజ్ కాలే. వాళ్లతోటి ఆ మాటంటే పిల్లలు బాధపడుతరని ఆ ముచ్చట ఎన్నటికీ చెప్పకుంట తమ కడుపులనే దాస్కున్నరు అమ్మా నాన.

అతనికి పనచ్చుకాబట్టి ఇంకేన్నైనా పనిచేసుకుని మంచిగనే బతకచ్చనే ధైర్యంతో ఉన్న షాపును, రిక్షాలను మొత్తం అమ్మి బాకీ అంత తేర్పిండు నాన. ఆ తర్వాత కొద్దిరోలకు ముందుగాల అనుకున్నట్టుగనే నామోషీ అనుకోకుంట ఓ పెద్ద సైకిలు షోరూముకు పొయి పనికి కుదిరిండాయినె. ఈ ముచ్చట్లెవ్వీ పిల్లలకు తెలువనియ్యలేకనీ ఒక్క బాకి తీరిందన్న ముచ్చట మాత్రమే వాళ్లకు చెప్పిండు.

హమ్మయ్యా. ఇగ మనకే అప్పులూ లెవ్వని హాయిగ ఊపిరిపీల్సుకున్నరు పిల్లలు. పిల్లల మొఖాల్లో సంబురంసూశే కడుపునిండింది అమ్మా నానలకు..

***

నిరుటికంటే ఈ యేడు చెట్లు ఇంకింత మంచిగ కాశినయ్. బిడ్డ పీజీల చేరింది. మగపిల్లలిద్దరి సదువులూ ఐపొయ్నౌకర్లు జెత్తాన్లు. పెద్దోడు అదే ఊళ్ల ఓ కాలేజిల లెక్చరర్లెక్కచేర్తె,  చిన్నోడు పట్నంల అదేదో కంపెన్ల ఇంజనీరు లెక్కచేరిండు.

నాన సైకిలు షోరూముల పనిచేసుకుంటనే పక్కకు చిన్నగ ఆయిలు బిజినెసుసుత నడిపిచ్చుకుంటాండు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయినింకా ఎక్కువ కట్టపడుతనే ఉండు. అమ్మింకా ఎక్కడెక్కడికో పొయ్యి చెట్లకు పెండతీస్కచ్చేత్తనే ఉంది. నాన నీళ్ళు కడుతనే ఉన్నడు.

బిడ్డకు పెండ్లి సంబంధాలు సూషుడు షురూ చేషిన్లు. పిల్లందంగనే ఉన్నాసుత కట్నాలెక్కువిచ్చుకోలేరని సంబంధాలు అచ్చినట్టే అచ్చి ఎనుకకు పోవట్టినయ్.

ఇంతల చిన్నోనికి నౌకరు మీద వేరే దేశానికి పొయ్యి పని చేశే ఔకాశమచ్చింది.

అటుబోతె ఈడికంటె ఎక్కువ జీతమస్తదమ్మా.

జీతానిదేముంది బిడ్డా, నువు కండ్ల ముంగటుంటెనే మాకుతృప్తి కొడుకా. ఇక్కన్నే ఉండరాదురా అడిగింది అమ్మ.

లేదే. కంపెన్ల వందల మందిల ఒక్కనికచ్చే ఛాన్సు నాకిప్పుడచ్చింది. ఒక్కసారి ఇసొంటి ఛాన్సు మిస్సైందంటే మళ్లిగ దొర్కదమ్మా. కాదనకే..

నువు బాగుపడితె నాకు సంబురమే కొడుకా. కని ఈడుంటె వారానికోసారన్నఅచ్చిపొతవాయె.  అటుపోతె మళ్లెప్పుడస్తవో ఏందో బిడ్డా.. నాకదేరందున్నదిరా..

ఎహే.. ఆడికి పొయ్యి ఆణ్నేఉంటమానే ఇగ? పొయ్యి ఒక రెండు మూడేండ్లు ఆడ నౌఖర్చేశినమంటే సాలు ఈడికచ్చి జిందగీబర్కూసోని తినేటంత కమాయించచ్చు. ఇంకెన్నడు పైసలకు ఇబ్బందిపడాల్శిన ఔసరమేరాదు మనకు. ఒప్పుకోవే ప్లీజ్..  గార్వంగ అడిగిండు చిన్నోడు.

సరేబిడ్డా. పయిలంగ పొయిరారా.. యాళ్లకు మంచిగ తిను కొడుకా.. అందరు కలిసి చిన్నోణ్ని సాగనంపిన్లు.

వాడు నాటిన చెట్టు మాత్రం ఇంటికాణ్నేఉన్నది. అదే వాని యాది క్కసూస్కుంటున్నరు అమ్మానాన..

***

ఇంకో యేడాదికి పెద్దోనికిసుత పట్నంల మాంచి పెద్ద కాలేజిల నౌకరచ్చింది.

చిన్నోడెట్లాగో బయటికిపొయిండు కదరా..కనీసం నువ్వన్నఇంటికాడుండరాదు బిడ్డా. బతిమాలినట్టుగనే అడిగిన్లు అమ్మనానలు.

పెద్ద కార్పోరేటు కాలేజిల ఉద్యోగమమ్మా. అది ఇక్కడి వేరం గాదే, ఎంట్రన్సు పరీచ్చలకు కోచింగిచ్చేకాలేజిల నౌకరంటే ఆషామాషీ కాదే. జీతం సుత ఈడికంటె పదివేలు ఎక్కువుంటదమ్మా..

ఇన్నేండ్లల్ల మిమ్ముల్ని డిశిపెట్టి ఎప్పుడులేం నానా. చిన్నోడొక్కడు లేకపోతెనే మస్తు బెంగవట్కున్నది. ఇప్పుడు నువ్వుసుత ఇల్లిడిశిపోతే మాకు కాల్రెక్కలిరిశినట్టైతది కొడుకా..
అరే నేనేడికివోతున్ననే? ఓరెండేండ్లు ఆడ పనిచేషొస్తేగాఎక్స్పీరెన్స్తోని ఈడ మంచి జీతానికితీస్కుంటరే. మళ్ల తప్పకుంట ఇటే అచ్చి సెటిల్ ఐత నేను.. మీరేం ఫిఖర్జెయ్యకున్లి. అయినా వారానికోసారి అచ్చిపోతనే ఉంటకద ఇంటికి. ఇంకెందుకే రందివడుడు.. ఒప్పుకోవే ప్లీజ్..  బతిమాలిండు పెద్దోడు.

సరే బిడ్డా. పయిలంగ పొయిరారా.. యాళ్లకు మంచిగ తిను కొడుకా..

పెద్దోడు చెప్పినట్టుగనే పాత కాలేజిల కంటే ఈడ ఎక్కువ జీతం. కాపోతే ఎత్తుకునే జీతానికి తగ్గట్టుగనే ఎక్కువ పని సుత ఉంటాంది. అందుకే వారానికోసారింటికత్తనన్నకొడుక్కు నెలకోసారి వచ్చెతందుకుసుత టైము దొర్కుతలేదు. పండుగలగో పబ్బాలకో కాలేజికి సెలువులిత్తే అప్పుడే ఇంటికి పెద్దోని రాకటా.. పోకటా..

వాడు నాటిన చెట్టు మాత్రం ఇంటికాణ్నేఉన్నది. అదే వాని యాది లెక్క సూస్కుంటున్నరు అమ్మానాన..

***

ఈ యేడు కొబ్బరి కాయలు నిరుటికంటే ఇంకా మంచిగ కాషినయ్. బిడ్డది పీజీ ఐపొయింది. పెద్దోడు, చిన్నోడు ఇద్దరు చెల్లె పెండ్లి కోసమని తలో ఇంత ఇంటికి పంపుతనే ఉన్నరు. అమ్మా నానలు కుడా పైసా పైసా కూడేశి, చిట్టీలు కట్టుకుంట, ఇన్నన్ని పైసలు జమచేశిన్లు. మొత్తం అందరి పైసలుకూడి సూత్తే ఇదివరకటికంటే పెద్దమొత్తమే అయినట్టనిపించింది అమ్మానాన్నలకు. మళ్ల సంబంధాలు సూశుడు మొదలు పెట్టిన్లు. యేటికేటికీ అన్ని వస్తువుల మీన రేట్లు పెరిగుతానట్టుగనే కట్నాల రేట్లుసుత బాగ పెరిగినయ్.

అయినా ఎట్లచేశి ఈ యేడు బిడ్డ పెండ్లి చెయ్యాల్శిందేనని తెలిసిన సుట్టాలకూ, దోస్తులకూ చానమందికే చెప్పి సంబంధాలెతకబట్టిన్లు అమ్మానాన. ఎందుకో తెలువదుకని యేడాదెతికినా మంచి సంబంధాలు దొర్కలే, దొర్కినవాటికి అంతంత కట్నాలు వీళ్లు ఇచ్చుకునేతట్టులేరు. ఇగ బిడ్డ పెండ్లి గురించి రందివట్కున్నది అమ్మా నానలకు..

ఆ రందిలుండగనే తెలిసిన సుట్టమొకామె అమ్మకు ఓ అయ్యగారి గురించి చెప్పింది. ఆయినె ఆ జిల్లా మొత్తానికే చాన ఖతర్నాక్ అయ్యగారట. ఎవలింటికన్న ఒక్కసారచ్చి సూశిండంటే వాళ్ల జాతకం మొత్తం చిటికెల చెప్పి, దోశాలు గీషాలు రెండు నిమిషాల్ల దొర్కవడుతడట. మనక్కావాల్నంటే శాంతి సుత చేశిపోతడత. ఇయ్యన్ని చేశినందుకు ఒక్క ఐదువేల్ రూపాల్ మాత్రం తీస్కుంటడట.  గంతే..

వామ్మో. ఇంటికచ్చి సూశినందుకు ఐదు వేల్ రూపాల? గా పైసల్తోని ఇద్దరు అయ్యగార్లచ్చి పెండ్లికే మంత్రాలు సదివిపోతరు గాదొదినె. అమ్మ జర యెనకకు తగ్గింది.
మరి బిడ్డ పెండ్లంటే ఉత్తగనే ఐతదా ఒదినె. ఇంట్లేదన్న దోషమో గీషమో ఉంటే అయ్యగారికి తెలుత్తదిగనీ మనకెర్కైతదా చెప్పు నువ్వే. మీరిన్నేండ్లెన్ని కట్టాలువడ్డరో నాకెర్కలేదా ఒదినే. బరాబ్బర్ ఈడ ఏదన్నొక దోషం ఉండే ఉంటది. నా ఎర్కల ఇప్పుడు పిల్ల పెండ్లికిసుత అదే అడ్డం వడ్తానట్టుంది. నా మాటిని గా ఐదువేలకు సూడక అయ్యగార్నిపిల్శి ఓసారి ఇల్లు సూపెట్టొదినే. ఏదన్న కీడుంటే సూశి శాంతి చేషిపోతడు. కీడేదన్నుంటె పొయ్యి అన్నా, నువ్వూ, పిలగాండ్లందరు సల్లంగుండాలనే చెప్తున్న ఒదినే. చెప్పాలనుకున్నదంత గుక్కతిప్పుకోకుంట చెప్పింది సుట్టం.

సుట్టమెల్లిపొయినంక మాపటీలి ఇదే ముచ్చట ఉన్నదున్నట్టుగ మొగనికి చెప్పిందామె.

దానియన్ని ఉత్తముచ్చట్లే. అయన్నీటిని నువ్వు పట్టించుకోకు. నేన్ మనకు ఎర్కున్నోళ్లకందరికీ చెప్పిపెట్టిన. అందరు ఎతుకుతనే ఉన్నరు. పెండ్లంటే ఇయ్యాలనుకుంటే రేపయ్యేటిదిగాదుకదా. మంచి చెడ్డలన్నీ ఇచారం చేసుకోవాల్నా వద్దా. అందుకే జరంత ఆలిశమైతది, అప్పటిదాంక ఓపికవట్టాలెగని ఇట్ల ఏగిరపడితె ఐతదా?

అది కాదయ్యా ఇప్పటికే ఆలిశం.. అనుకుంట ఏదో చెప్పబొయ్యింది ఆమె..

అరే.. ఏదెప్పుడు చెయ్యాల్నో నాకు తెల్సు.. నువు ఉత్తగ పరెషాన్ గాకు. నన్ను పరేషాన్ చెయ్యకు. కసురుకున్నడు మొగడు.

ఆ రోజంతా ఇదే ఆలోచించుకుంటున్నదామె. ఎంత యాదికి తెచ్చుకోవద్దనుకున్నా పొద్దుగాల ఒదినె చెప్పిన “దోషం-కీడు” అన్న రెండు మాటలే మాటి మాటికి మతికస్తున్నయ్.
తెల్లారింది.

పొద్దున లేశుడుతోనే దోషం-కీడు ఈ రెండు మాటలే మతికచ్చినయ్. వాకిలూడుస్తున్నా, అలుకు సల్లుతున్నా, బోళ్లు తోముతున్నా, చెట్లకు నీళ్లుపడుతున్నా, వంట చేస్తున్నా, బట్టలుతుకుతున్నా, తింటున్నా, పడుకున్నా, కూసున్నా, లేస్తున్నా.. ఏ పని చేస్తున్నా చెవుల్లో “దోషం-కీడు”, “దోషం-కీడు” అనే చిన్నగ సప్పుడినస్తుంది. అసల్ మనసు మనసుల లేకుంటయ్యింది.

పైసల్ పోతె పొయినయ్ గని అయ్యగార్నిపిలిపిచ్చి సూపిద్దామనుకునేదనుక మనసు నిమ్మళం గాలే ఆమె పాణానికి.

తెల్లరి సుట్టానికి చెప్పిపంపితే పొయి అయ్యగార్ని తోలుకచ్చింది.

జిల్లాలనే ఖతర్నాక్  అయ్యగారు ఇప్పుడు వీళ్లింటికచ్చి సూస్తుండంటెనే ఆమెకు పాణం తేలికపడి పిల్లకు పెండ్లి కుదిరినంత సంబురంగావట్టింది.

ఓ పావుగంట ఇంటిలోపటా, బయటా మొత్తం కలె తిరిగి సూశి లెక్కలుకట్టిండు అయ్యగారు.

ఇన్నేండ్ల సంసారంలో మీరు చానా కష్టాలను దాటుకుంటూ వచ్చారు కదా తల్లీ?

ఔనయ్యగారు.

మొత్తం ఎంతమంది పిల్లలమ్మా?

ముగ్గురన్లి.. ఇద్దరు కొడుకులూ, ఓ బిడ్డా.

ఆహా. మీ పిల్లలెవ్వరికీ ఇంకా పెండ్లిల్లు కాలేదు కదమ్మా?

ఉహు. కాలేదయ్యగారు.

సంబంధాలు కూడా దగ్గరిదాకావచ్చినట్టే వచ్చి కాకుండా పోతున్నాయి కద తల్లీ?

ఆ ఔనయ్యగారు. దండంబెడ్తున్నట్టుగా చేతులు జోడించి చెప్పిందామె. (అయ్యగారు మొత్తం కండ్లముంగట జరుగుతున్నది సూశినట్టే చెప్తున్నరనీ, ఆయినె చానా గొప్పోడని అప్పటికే మనసుల గట్టిగ ఖాయం చేస్కున్నదామె)

అదే..అదే! సమస్య నాకర్థమయ్యింది. ఇక్కడ ఇట్లనే ఉంటే మీరెన్నేండ్లు ఎన్నెన్ని సంబంధాలు సూశినా అవి కుదరవమ్మా. ఎప్పుడైనా కుదిరినట్టనిపించినా చివరి ఘడియలో కూడ వెనక్కు పోతయి సంబంధాలు.

ఇంట్లేదన్న దోషమున్నదా అయ్యగారు?

లేదమ్మా. ఇంట్లో ఏ దోషమూలేకుంట చక్కగున్నది. కాని ఆ బయట దక్షిణం వైపుకున్న మూడు కొబ్బరిచెట్లతోనే మీకిన్ని సమస్యలు.

ఆ చెట్లా? నమ్మలేనట్టుగ అడిగిందామె.

ఔనమ్మా. ఆ చెట్లతోనే మీకిన్ని కష్టాలు. అవే మీ పిల్లలకు సంబంధాలు రాకుంట అడ్డుపడుతున్నయ్.

మరి దోషమో, కీడో పోవాల్నంటే ఏంచెయ్యాలె అయ్యగారు? భయం భయంగ అడిగిందామె.

ఏమీలేదమ్మ. నేనొక మంచిరోజు చెప్తా. ఆ రోజు ఆ మూడుచెట్లను నరికివెయ్యాలి. అప్పుడు మీ దోషం పొయి పిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లిల్లు అవుతాయి. కష్టాలన్ని తీరి సుఖంగ బతుకుతరు.

ఆ మాటతోని నిట్ట నిలువునా కూలిపొయినట్టయ్యిందామె. ఏమన్న మాట్లాడుదామన్నా చానసేపు నోటికెంచి మాటరాలే.

ఆ చెట్లని మా బిడ్డల్లెక్కన పెంచుకున్నమయ్యా.. వాటిని నరుకకుంట దోషం పొయ్యేతట్టు ఇంకేదన్న పూజో, శాంతో చేశి మంత్రమేదన్నేశి పోన్లయ్యగారు, బాంచెన్.. మీకు పుణ్నెముంటది.. గుడ్లనిండ నీళ్ళుగారంగ కండ్లొత్తుకుంట అడిగిందామె.

ఆ చెట్లతోని మీకెంత అనుబంధముందో నాకర్థమయితుందమ్మా. కని మంచి సంబంధాలు రావాల్నంటె, పెండ్లిల్లు జరుగాల్నంటే మాత్రం గుండె ధైర్యం చేస్కోని చెట్లు నరకాల్సిందే తప్ప  ఇంకో దారిలేదు..

అయ్యో భగమంతుడా.. పెద్దగ ఏడ్సుడుపెట్టింది ఆమె.

చెట్లు నరికిచ్చేనాడు ఎవలితోటన్న చెప్పంపుతే పొద్దున్నేవచ్చి చిన్నగ శాంతి పూజ చేస్తా అని చెప్పి ఐదువేలు పట్కోని పొయ్యిండు అయ్యగారు.

మొగడొచ్చినంక అయ్యగారు చెప్పిందంత చెప్పి ఘొల్లుమని ఏడిశింది ఆమె.

ఇసంటి నప్పతట్ల ముచ్చట్లెవ్వో చెప్పి భయపెట్టిచ్చి పైసలుపట్టిత్తరనే నేను ఇయన్ని అద్దని చెప్పిన.  అయ్యగార్లను పిలుసుడెందుకూ, మళ్లిప్పుడిట్ల బాధపడుడెందుకు? కోపానికచ్చిండు మొగడు..

పోరగాళ్లకు పెండ్లిల్లయి పిల్లపాపల్తోని మంచిగుండాల్ననేగదనయా.. దోషాలేమన్నుంటె పోగొడ్తడనే అయ్యగార్ని పిలిషినగని ఇట్లం టడని  నాకెర్కనా. ఇంకా ఏడుస్తనే ఉన్నదామె..
ఊకో.. ఊకో.. దోషం లేదు గీషం లేదు. ఆటిని మనం పాణం లెక్కపెంచుకున్నది కొట్టేస్కునేతందుకానే? ఆ ముచ్చటే లేదు. సంబంధాల కొరకు నేన్ అన్ని తీర్ల కోశిష్ చేస్తనే ఉన్నా. దోస్తులకూ, సుట్టాలకూ అందరికి చెప్పి పెట్టిన అని ఇదివరకే చెప్పినగానే. అందరదే పని పెట్టుకోని సంబంధాలెతుకుతనే ఉన్నరు. వారం పదిరోలల్ల ఏదన్నొకటి మంచిది దొర్కుతదిలే.. పిల్ల పెండ్లి ధూం ధాముగ చేద్దాం. నువ్వేం ఫిఖర్ పెట్కోకిగ.. ఇనవడ్తాందా..  ఏడువకూకో.. ఓదార్చిండు మొగడు.

మొగని మాటలింటుంటే మంచి సంబంధం జెప్పన్నే ఖాయమైతదనే నమ్మకమచ్చి కొండంత ధైర్నమచ్చిందామెకు. అంతే, ఇగ ఏడుపాపి బయటికి పొయి చెట్లను చానసేపు తనివితీరా తడిమి తడిమి సూస్కున్నది..

***

వారం…. పది రోలు… ఇరువై రోలు… సూస్తుండంగనే మెల్ల మెల్లగ నెల గడిశిందిగనీ ఇంతవరకు ఒక్క సంబంధమూ దొరకలే. కండ్లు మూశి తెరిశినంతల ఇంకో రెణ్నెల్లు గడిశినయ్. ఈ రెణ్నెల్లల్ల ఒకటిరెండు దొర్కినట్టే దొరికినయ్కనీ జాతకాలు కలవకనో కట్నాలకాడ లెక్కలు కుదురకుంటనో అవిసుత ఎనుకకు మర్లిపెయినయ్.

మొన్నటిదాక ధైర్నంగనే ఉన్నా, మళ్లిప్పుడు చిన్నగ రంది మొదలైందామెకు. బయటకి కనపడనిస్తలేడుగని మొగనికిసుత అదే రందున్నది మనసుల..

ఇంతల ఓనాడు పొద్దున్నే సుట్టపామె అచ్చిందింటికి.

గా చెట్లకోసమని పొలగాండ్ల బతుకాగం చేసుకుంటవా ఏంది? ఇప్పటికే పిల్లకు ఇరువైఐదేండ్లు వడ్డయ్, ఇంకాలిశంచేస్తే వచ్చే సంబంధాలు సుత రావొదినే. ఇయ్యాల్టిదాంక ఆ అయ్యగారు చెప్పిందేదీ తప్పుకాలే. మంచిగ ఆయినె చెప్పినట్టిని గుండె ధైర్నంచేస్కోని చెట్లు కొట్టేయ్యున్లి, దోషం మొత్తం పొయ్యి సక్కని సంబంధాలు ఎతుక్కుంటస్తయొదినే. నా మాటిను ఈ ఒక్కసారికి. పిలగాండ్లూ, అన్న, నువ్వూ అందరు సల్లంగుండాలనే చెప్తున్నొదినా… చెప్పలనుకున్నది చెప్పి ఎళ్లిపొయ్యింది సుట్టపామె.

ఏంచేద్దామయ్యా? పక్క రూముల్నే చాయ్ తాగుకుంట టీవీజూస్తూ ఈ ముచ్చటంత ఇంటున్న మొగణ్ని అడిగింది.

నీ ఇట్టం.

నా ఒక్క దానిట్టమేందయా? ఏదన్నుంటే ఇద్దరికిట్టంకావాలెగని.

చెట్లు కొట్టకుంట ఇంకేదన్న శాంతి చేశుడో, పూజ చేషుడో కుదురుతదేమో అడుగపేనవోసారి. మనసులున్న మాట బయటవెట్టిండు మొగడు.

అయన్ని ఆ రోజే అడిగిన కని ఇంకేం చేసేతందుకు లేదట. మంచి రోజు సూశి చెట్లుకొట్టేత్తెనే దోషం పోతదన్నడు అయ్యగారు.

పచ్చటి చెట్లు కొట్టెషేతందుకు మంచి రోజు సూడాల్నటనా ఆయినెకు?? థూ..

కానీ నీ ఇట్టం మరి.

ఇంక ఆలిశం చెయ్యకుండ ఆమె అయ్యగారి దగ్గెరకురికితే రేపే మంచి మంచి రోజన్నడాయినె.

ఆ రోజంతా గడెకోసారి ఇంటిముంగటికచ్చి చెట్లను సూస్కోవట్టిన్లు మొగడు పెళ్లాలు.  పెండ్లానికి దుఃఖం  ఆగుతలేదు. పొద్దటికాంచి ఏడ్సుకుంటనే ఉంది. మొగడు ఏడువకుంట గంభీరంగ అట్లసూస్కుంట కూసున్నడంతే. అతను మనసులో ఏం ఆలోచిస్తున్నడో పెండ్లానికెరికే. ఎట్లైతేందీ పిల్లలు మంచిగుంటే అదే సాలని గుండె రాయి చేసుకున్నరు.  ఆ రాత్రి నిద్రపోలే వాళ్లిద్దరూ..

***

తెల్లారింది.

చెట్లకు మంచిగా నీళ్లుపోశి బిడ్డతోనిసుత పోపిచ్చి దండం బెట్కోమన్నరు.

అయ్యగారచ్చి చెట్లకు కుంకుంబొట్టువెట్టి మొక్కి ఎవ్వో మంత్రాలు సదివిండొక పదినిమిషాలు, సదువుడైపొయినంక ఆయినె సుత రాగి చెంబుతోటి నీళ్లుపోశిండు మూడుచెట్లకు.
ఇంట్లోల్లందరినీ మళ్లోక్కసారి చెట్లకు చివరిసారిగ దండంబెట్టుకోమన్నడు అయ్యగారు.

అంతే.. అప్పటిదనుక ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగ కట్టలుతెంచుకున్నది.. చిన్న పిలగాన్నెత్తుకుని కావులించుకున్నట్టే చెట్టును కావులించుకున్నదామె.. మొగడు ఆపలే..
“ఇన్నేండ్లు మిమ్ముల మా పిల్లలే అనుకున్నం. మీ మూడు చెట్లూ మా ముగ్గురు పిలగాండ్లతో సమానంగనే సూస్కున్నం. వాళ్లను పావుర పడ్డట్టే మిమ్ములా పావురపడ్డం. మా చేతుల్తోని పెంచిన మిమ్ముల్ని మేమే తీసెయ్యాల్నంటే మాతోటైతలేదమ్మా, కనీ పిలగాండ్ల పెండ్లిల్లయి వాళ్లు పిల్ల పాపల్తోని సల్లంగుండాల్నంటే మిమ్ముల తీసెయ్యక తప్పదని అయ్యగారు చెప్పిండు. ఇన్నిరోలు అద్దంటె అద్దనే ఊకున్నంగనీ ఇప్పుడిగ తీసెయ్యకుంట తప్పేతట్టులేదు తల్లీ.. కడుపునిండ దుఃఖమున్నా తప్పనిసరై ఇంత పని చేస్తున్నం, తప్పుంటే మన్నించున్లి తల్లుల్లారా”… ఏడ్సుకుంటనే మనసుల దండంబెట్టుకోని క్షమించమని బతిమాలుకున్నరు మొగడు పెండ్లాలిద్దరూ..

గొడ్డలి మొదటిదెబ్బ ఇంటి యజమానులిద్దరు కలిసి కొట్టాలన్నడు అయ్యగారు.

అయ్యో భగవంతా… ఎన్ని పరీచ్చలు పెట్టవడ్తివి మాకు, ఆమె దుఃఖం పెరుగుతనే ఉంది. నేన్ అంతపని చెయ్యలేనయ్యగారు.  కండ్లొత్తుకుంట చెప్పిందామె..

మీ భర్త కొడ్తరుగనీ, మీరుత్తగ ఆయినె చేతికి మీ చేతిని ఆనించి ఉంచండమ్మా చాలు.

టాప్…                      టాప్…                      టాప్..
మూడు చెట్ల మీద మూడు దెబ్బలుకొట్టిన్లిద్దరు కలిసి. పుట్టెడు శోకం తప్ప ఇంకేది మిగులలేదక్కడ.

***

చెట్లు లేకపొయ్యేసరికి ఇల్లంతా కళ తప్పినట్టయ్యింది. అసలా ఇల్లు మాదేనాకాదా అనిపియ్యవట్టింది వాళ్లకు..  దోషం పొయినంక పెండ్లి సంబంధాల వేట ఇంకింత యేగిరం చేశిండు నాన. మళ్ళొక్కసారి దోస్తులకూ, సుట్టాలకు అందరికీ యాది చేశిండు. ఈసారందరికీ దోషం పొయిన ముచ్చటసుత కలిపి చెప్పిండు. కులపోల్లు చానామందికే ముచ్చట చెప్పి పెట్టింది అమ్మ. అన్నలిద్దరుసుత వాళ్ల దోస్తులందరికీచెప్పి చెల్లెకు సంబంధాలెతుకుడువెట్టిన్లు.

రావాల్సిన టైము రానే అచ్చింది. ఓ పదిహేను రోలల్లనే పిల్లకు మంచి సంబంధం ఖాయమైంది. పిలగాడు సక్కగున్నడు, మంచోడూ, మంచి నౌకరీ, మంచి కుటుంబం, వాళ్లందరికీ పిల్ల నచ్చింది, అందుకే కట్నంసుత ఎక్కువడగలే.  ఇంకేంది.. ముహుర్తాలు సూస్కోని అదే అయ్యగారి చేతుల మీదికెళ్లి రెణ్నెళ్ల తర్వాత ధూం ధాముగ బిడ్డ పెండ్లి చేషిన్లు.
ఆ తర్వాత కొద్దిరోలకే పెద్దోనికీ ఈ ఊళ్లెనె కొత్తగవడ్డ పేద్ద కార్పోరేటు కాలేజిల ఎక్కువ జీతంతోని మాంచి నౌకరచ్చింది. ఇప్పుడు పట్నంల చేస్తున్న కాలేజిలకంటే ఇక్కణ్నే ఎక్కువ జీతం. అందుకే తను మళ్లిక్కడికే అచ్చిండు.

చిన్నోనికిసుత ఆ దేశంల నౌకరి పర్మినెంటయ్యి జీతం పెరిగింది. ఈ మద్యనే కొత్త కార్ సుత కొనుక్కున్నడాయినె. ఎప్పటికి అక్కణ్నే ఉండేటందుకు పర్మిషనేదో అచ్చి అతనక్కడ మంచిగ సెటిలయిపెయిండు.

మంచి సంబంధాలు సూశి యేడాదివరకు పెద్దోనికీ, చిణ్నోనికి సుత పెండ్లిల్లు చేషి కోడన్లను తీసుకచ్చుకున్నరు అమ్మానాన. అప్పుడే బిడ్డసుత కడుపుతోని ఇంటికచ్చింది.
ఇల్లంత పచ్చని చెట్టోలిగె కళకళ్లాడుతుందిప్పుడు. ఎటుచూశినా సంబురమే, అన్ని దిక్కుల్ల ఆనందమే.

అంతమంచిగనే ఉన్నదిగని ఆ చెట్లుసుతుంటే ఎంతమంచిగుండేదో అని ప్రతిదినాము వాటిని యాదికి చేసుకుంటనే ఉన్నరు మొగడూ పెండ్లాలు. అవి మతికచ్చినప్పుడల్ల గుడ్లల్లకు నీళ్ళస్తనే ఉన్నయి.

***

సెలువులైపొయినయని చిన్నోడు పెండ్లాన్ని తీసుకుని తిరిగి బయలెల్లటానికి తయారైండు..

రెండేండ్ల తరువాత మళ్ళీడికే అచ్చి ఉంటా అంటివిగద బిడ్డా! ఈణ్నే ఏదన్న నౌకరుచూసుకుని ఉండిపోరాదురా. మంచిగందరం కలిశుండచ్చు.. ఆశగ అడిగింది అమ్మ.

నిజమేగని. అక్కడ ఇప్పుడిప్పుడే జర మంచిగ సెటిలైతున్నమమ్మా. వీసా సుత పర్మినెంటైంది. ఇగ ఈ టైములిటెట్లరమ్మంటవమ్మా. ఇంకో రెండుమూడేండ్లు ఆడుంటే ఇగ జిందగీ భర్ కూసుని తిన్నా సరిపోయేటంత సంపాయించుకరావచ్చు. కాదనకే ప్లీజ్..  గార్వంగడిగిండు చిన్నకొడుకు..

నాక్కుడా అక్కడ సెటిలవుడు ఇష్టంలేదత్తమ్మా.. ఆయినె చెప్పినట్టు ఓ రెండుమూడేండ్లు ఆడుండి మళ్లీడికే వాపసస్తం. మీరేం రంది పడకున్లి.. ధైర్నం చెప్పింది చిన్నకోడలు.

సరే బిడ్డా. పయిలంగ పొయిరాన్లిరా… యాళ్లకు మంచిగ తినున్లి బిడ్డా..  అందరుకలిసి చిన్నోణ్ని, కోడల్ని సాగనంపిన్లు.

ఇంకొన్ని రోలకు బిడ్డకు కొడుకుపుట్టిండు.  మళ్ల ఇల్లంత పసిపిలగాని నవ్వులు పూశి కళవడ్డది. కాని బిడ్డ ఏ నాటికన్న అత్తగారింటికి పోవల్సిందేకద! ఆ రోజూ రానే వచ్చింది.

అల్లుడచ్చి బిడ్డను తీసుకపొయిండు. పెళ్లి అంపకాలప్పుడు ఎంతేడ్శిన్లో మళ్లంతకంటే ఎక్కువ దుఃఖంతోటి సాగనంపిన్లు మనువన్నీ, బిడ్డా అల్లుల్లను..

ఇంకొన్ని నెల్లకు పెద్దకోడలు కడుపుతోని పుట్టింటికి పొయింది. సొంత బిడ్డలెక్క సూస్కున్న కోడలెల్లిపొయ్యేసరికి కాల్ రెక్కలాడలేదు ఆమెకు. పురుడైనంక పండంటి బిడ్డతోని మళ్ళింట్లకచ్చింది పెద్ద కోడలు. పసిపిలగాని నవ్వుల్తోని ఇల్లు మళ్ల పూలతోటే అయింది.

కొద్దిరోజులు గడిశినయ్. మనవడు పెరిగి పెద్దగైతాండు.

ఇంట్లున్నయి మూడు రూములే. రూములెంత పెద్దగున్నాసుత రెండు సంసారాలకు ఆ మూడు రూములు సాలక ఇల్లు ఇరుకుటమయినట్టనిపియ్యవట్టింది పెద్దోనికి. అదే ముచ్చట అమ్మతోనన్నడు అతడు.

ఇల్లు ఇరుకుటమెందుకైతుందిరా? మనం ఐదుగురుం ఇన్లనే ఉంటిమికద బిడ్డా. అమ్మ అడిగింది.

అప్పుడు మీరు ఐదుగురున్నా అదంత ఒకటే సంసారమత్తమ్మా, కని ఇప్పుడు ఇన్ల రెండు సంసారాలు నడవాలెకదా.. అందుకే ఇరుకుటంగున్నది.. పెద్ద కోడలన్నది.

ఇంకేదన్న పెద్దిల్లు కిరాయకు తీసుకోని అందరం అన్లకు మారుదామా? అమ్మ అడిగింది.

ఏం మాట్లాడుతున్నవ్. సొంతిల్లుంచుకోని కిరాయింట్లకు పోతావ్? అమ్మమీదికి కోపంచేశిండు నాన.

అంత పెద్దిల్లు తీసుకోవాల్నంటే కం సే కం పదివేల కిరాయుంటదే. గంత గంత కిరాయిలు మనతోటేడెల్తయే? అదంత కాని ముచ్చట. అందుకే మేమేదన్న రెండు మూడురూములున్న ఇల్లు కిరాయకు తీసుకోని అన్లకు పోతం. మీరీడ మంచిగ మనింట్లనే ఉండున్లే. పెద్దోడన్నడు.

ఒక్కూళ్లె ఉండుకుంట వేరుకాపురం పెట్టుడేంది కొడుకా? నా మాటిని అందరం ఒక్కకాణ్నే ఉందాం బిడ్డా.. కొడుకు, కోడల్లను బతిమాలినట్టడిగింది అమ్మ.

నిజమేకని. ఇల్లు సాలకుంటే మనమేం చేస్తమత్తమ్మా. రేపు మరిది వాళ్లో, మరదలు వాళ్లో వచ్చినప్పుడైనా పిల్లలతోని కలిసి ఇంతమంది ఈ ఇంట్లనే ఉంటే ఇరుకుటమిరుకుటమై మొసమర్రకుంటుండదా? అప్పుడగ్గనగల్ల ఏడికన్నురికి ఇల్లు సూస్కునే తట్టుంటదా అత్తమ్మా? మీరే చెప్పున్లి. కోడలన్నది.

కనీ మీరుసుత లేకుంటబోతే బెంగటిల్లుతం బిడ్డా. ఇంతింట్ల ఇద్దరమే ఉండాల్నంటే మాతోనైతదార?. ఎవల్లేకపోతె పురాగ మూలకు పడ్డట్టయితది కావచ్చు. పోను పోను పెద్దమడుసులైతాంటే ఆపతికో సోపతికో సూశేతందుకన్న దగ్గెరెవలన్న ఉండాలెకద బిడ్డా. ఈణ్నే ఉండిపోరాదున్లమ్మా బాంచెన్.. అడిగింది అమ్మ..

అరే నేనేడికివోతున్ననే? ఇదే ఊళ్లె ఉంటున్నకదా. ఊకె అచ్చుకుంట పోవుకుంటనే ఉంటం అందరం. మీకు ఎప్పుడు రాబుద్ధైతే అప్పుడచ్చి మాతానుండిపోన్లి. వేరే ఊళ్లుంటె కట్టంకని అందరం ఇదే ఊళ్ళుంటె ఇంక రాకట పోకటకు కట్టమేముందే. మీరేం ఫిఖర్ జెయ్యకున్లి. మేమూకె అచ్చికలుస్తనే ఉంటం. నువ్వేం రంది వెట్కోకు నేన్ చెప్తున్నగదా…. ఒప్పుకోవే ప్లీజ్..  బతిమాలిండు పెద్దోడు.

సరే బిడ్డా. పయిలంగ పొయిరాన్లిరా… యాళ్లకు మంచిగ తినున్లి బిడ్డా..  మనవన్నీ, కొడుకూ కోడల్నీ సాగతోలిన్లు అమ్మానాన..

పనిచేశే కాలేజికి దగ్గెరుంటదని ఇంటికి దూరంగ కొత్తిల్లు కిరాయికి తీసుకున్నడు పెద్దోడు.  ఇక్కడసుత పనెక్కువుండుట్ల అసలు రికాం దొర్కకుంటయింది అతనికి. అందుకే ఒక్కూళ్లె ఉన్నాసుత పండుగలకో పబ్బాలకో తప్పుతె ఇంటికి వచ్చిపోవుటానికి అస్సలు వీలు దొర్కుతలేదు వాళ్లకు.

***

పిల్లల్లేని ఇల్లు మొత్తానికే కళతప్పి సందడనేటిదే లేకుంట కూలిపోయిన చెట్టోలిగె ఐపొయింది.  మొగడూ పెండ్లాలిద్దరుకలిసి బతుకెక్కడైతే షురూ చేషిన్లో తిరిగితిరిగి మళ్లాడికే వచ్చినట్టనిపియ్యవట్టింది వాళ్లకు.. పొద్దుగాల లేశి బయటికి రాంగనే చెట్లుండే దిక్కుకు చూషినపుడు మిగిలిపొయిన చెట్ల మొదల్లు- “సమాధుల మీద నిలవెట్టిన పలకల”  వేరం అనిపియ్యవట్టినయ్. ఇంటిముంగటి జాగంతా బొండలగడ్డోలిగె అనిపియ్యవట్టింది.

కాలమెవరికోసమూ ఆగదు కదా.. చూస్తుండంగనే ఇంకిన్ని నెల్లు గడిశిపొయినయ్.. పిల్లలు యాదికిరాని క్షణమూ లేదు. వాళ్లను మరిశిపోయే క్షణమూ రాదు.
కొడుకులు నెల నెలా పైసలు పంపుతున్నరు, ఇప్పుడు చేతినిండా పైసలున్నయి. పిల్లలున్నప్పుడయితే చేతిల పైసలుంటే వాళ్లకు అదికొనియ్యాలే, ఇది కొనియ్యాలే అనుండేటిది కని ఇప్పుడు ఎవలకోసం ఆ పైసల్ ఖర్చుపెట్టాల్నో తెలుస్తలేదు. ఆమెకు చీరలు, నగల మీద ధ్యాసలేదు. అతనికి తాగాలె తిరగాలె జల్సాచెయ్యల్నన్న యావలేదు.

రోజులు గడుస్తున్నకొద్దీ ఇద్దరికీ చాతకాకుంట ఐతున్నది. దానికితోడు మోకాళ్లనొప్పులూ షురూ అయినయ్. ఆ నొప్పుల్తోని పావుగంట నడుశుడే గగనమైతాంది. తిండీ తినబుద్దైతలేదు. రోజుకోపూట వంటచేసుకుని పొద్దు మాపు అదే తిని ఊకుంటున్నరు మొగడూపెళ్లాలు. ఒక్కోనాడు అదిసుత వండుకునే ఓపికలేక ఉత్త తొక్కేసుకునే తింటున్నరు. పెద్దమడుసులైతున్నకొద్దీ పిల్లల మీద యావ ఇంతకింతకు పెరుగుతనే ఉంది. తట్టుకోలేక వాళ్లకు ఫోన్ చేశి ఓ వారం పదిరోలుండటానికి రమ్మంటే అటు కొడుకులకూ, ఇటు అల్లునికీ లీవు దొరుకుడు కట్టమనే సమాధానం..

పిల్లలను యాదికితెచ్చుకోని నిద్రపోని రాత్రులెన్నో.. తెల్లరగట్లెప్పుడో నిద్రపట్టినా నిద్రలసుత వాళ్లగురించే కలవరించుకుంట కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. ఒకరోజిట్లనే నిద్రవట్టకుంటే మబ్బుల్నే లేషి వాకిట్లకచ్చి కూసున్నరు మొగడూపెళ్లాలు. కండ్లెదురుంగ పురాగ ఎండిపోయిన కొబ్బరిచెట్ల మొదల్లు కనవడ్తున్నయి. చానసేపు వాటినట్ల సూస్కుంటనే కూసున్నరిద్దరూ.. కొద్దిగసుత సప్పుడనేటిదేలేకుంట కొన్ని గంటల నిశ్శబ్దం.. చీకటి పరదాల మడుతల్లనే వెలుగుకిరణాల జాడలున్నట్లు.. రాతిరి కొస్సకు ఉదయం పూశినట్టు… ఆ నిశ్శబ్దపు చెక్కట్లనుంచెళ్ళి మెరుపోలిగె ఒక ఆలోచన కదిలింది..

ఆమె లేశి చెప్పులేసుకుని బయటికి నడిశింది.

ఎటు పోతున్నవే అని అడగలేదాయినె.

***

ఏందీ? నూటయాభై రూపాలకొక్కటా? మరీ గంత పిరంజెప్తున్నవేందయ్యా..

పిరమెక్కడిదమ్మా నూటయాభయంటే చాన అగ్గువ..

ఒక్కటికాదు బాబు,  మొత్తం మూడుకొంటా. ఎంతకిస్తవో ఆఖరు మాట  చెప్పు. .
గదే ఆఖరమ్మా. నూటయాభై  రూపాలకొక్కటి. మీరు మూడు కొన్నా, ముప్పై కొన్నా గదే రేటు.  గంతే..

అబ్బా ఊకే ఒకటే మాట చెప్తున్నవేంది నాయినా, ఇచ్చే మాట చెప్పరాదు, మూడొందలకు మూడియ్యిగ.

లేదమ్మా నాలుగొందలయాభైకి ఒక్కరూపాయిసుత తక్కువ కాదు.

గిదంతకాదుగని లాష్టు మూడొందల యాభై తీస్కో కొడుకా.

అర్రే.. నాకే అంత అగ్గువపడదు గాదమ్మ. ఒక్కదానిమీద నాకు మిగిలేటియే ఇరువై రూపాలు. మీరింత బొత్తిలగ్గుంజి బేరంజేస్తే ఎట్లనమ్మా.! ఇంకో మాట చెప్పున్లి..

సరే మూడొందలెనుభై తీస్కో ఇగ గంతే.  ఇంగ మళ్ల ఎక్కువచెప్పకు.

ఉన్నవాటిలో మంచిగున్న ఓ మూడింటిని తీశి  ఆమె ఎదురుంగ పెట్టిండు పిలగాడు.

గిది మంచిగలేదు వేరేదియ్యి అని అండ్లనుంచి ఒకదాన్ని వాపసిచ్చిందామె.

దీనికేమైందమ్మా గింత మంచిగుంటే! అనుకుంటనే  దాన్నితీస్కోని  ఇంకో మంచిది తీశి ముంగట పెట్టిండాయినె.

నవ్వుకుంట నాలుగొందల రూపాలు అతని చేతులపెట్టి ఆ మూడిటిని కట్టలెక్క ముడేషి పట్టుకుని ఎనుకకు తిరిగిందామె.

ఏడికి పోవాల్నమ్మా? ఆటో అతను అడిగిండు.

గీన్నే రాం నగరుకు పోవాలె అని చెప్పి రేటడుగకుంటనే ఆటో ఎక్కి కూసున్నదామె.

ఆటోదిగి లోపటికచ్చేసరికి కొత్త మొలకలు నాటువెట్టుడుకోసం బొందలు తవ్విపెట్టుంచిండు మొగడు.

మొగన్ని సూశి నవ్విందామె. అతనుకూడా నవ్విండు..
పిలగాండ్లతో పచ్చగ కళకళ్లాడే పాత జీవితం మళ్ల షురూ ఐతదనే ఆశతో కొత్తమొలకలు నాటేశిన్లిద్దరుకలిసి….

***

 

(ఈ కథ ఊహించి రాశింది కాదు. ఇండ్లున్న పాత్రల్ల కల్పితమైంది ఒక్కటిసుత లేదు. ఉన్నయన్ని మనందరికీ ఎరుకున్నయే. ఇది అటు పేద్ద పట్టణాల్లోనూ, ఇటు చిన్న పల్లెటూల్లలోనూ కాకుంట “మధ్యరకపుఊళ్లల్ల” బతికే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబపు కథ. కథంత మనకిదివరకే ఎరుక. కాపోతే కథెక్కడ ముగుస్తుందన్నదే చాన మంది ప్రశ్న. బహుషా వాళ్లకు ఇదంత సదివినంక సమాధానం దొర్కుతదేమో! ఇది రాయటానికి స్పూర్తినిచ్చిన మా పెద్దమ్మ గోపతి కరుణ కు నిజంగ చాన ధన్యవాదాలు.)