ఆ పాప నవ్వో, ఏడుపో!

chandra-kaanthaalu

 

ఇప్పుడిప్పుడే పుట్టిన ఓ పాప

అప్పుడప్పుడూ నిద్దురలో నవ్వుతూ ఉంటుంది

 

కనుకొలికిల్లోంచి జారిపడే కన్నీటిచుక్క లా నవ్వడం

ఒక్క పాపకి మాత్రమే వస్తుంది

 

మనఃగర్భాల్ని దాచిపెట్టే ఉపరితలపు నీటిముఖాలన్నిటినీ

తెరలు తెరలుగా తొలగించిపెడుతూ గులకరాయిలా నవ్వుతుంది

 

గొంతెండిపోతున్నా గుక్కెడు నీళ్ళెవరినీ అడగలేని

మహావృక్షపు అహంకారదాహాన్ని వానధారలా తీర్చే నవ్వును నవ్వుతుంది

 

వెచ్చగా వెలుగుని కప్పుకుని విశ్రమిస్తున్న ఆకాశమ్మీదకి

గుప్పిళ్ళకొద్దీ అంతఃజ్ఞానాన్ని విసిరికొట్టే చిక్కని చీకటిలానూ నవ్వుతుంది

 

పంజరాలే తమ ప్రాణమనుకునే పంచవన్నెల చిలకల్ని చూసి

తెరిచిపెట్టిన తలుపుల సాక్షిగా విశాలంగా నవ్వుతుంది

 

మండు వేసంగిలో పూసే మల్లెపువ్వులా

అరుదుగానైనా ఆ పాప, అతికమ్మగా నవ్వుతుంది

 

ఆ పాపే ఎప్పుడూ ఏడుస్తుంటుంది కూడా

సుందర స్వప్నమయ లోకాలనొదిలి మెలకువలోకి నిదురించడాన్ని సాధన చేస్తూనో ఏమో!!

 

***********************