
art: satya sufi
art: satya sufi
Art: Mandira Bhaduri
-అరుణ గోగులమండ
~
ఆమె..
అద్దాలమేడలాంటి అందమైన లోగిలిలో
నగిషీ పట్టిన బొమ్మల్లో ఓ అందమైన బొమ్మగా
ఆమె కదులుతుంటుంది.
యెత్తైన గోడల ఆవల-
కట్టుదిట్టమైన భధ్రత మధ్యన
ఖరీదైన ఖైదీలా
ధిలాసాగా బ్రతుకుతుంటుంది.
తులసికోట పూజలూ లెక్కలేనన్ని వ్రతాలూ
దీపారాధనలూ, మడీ తడీ ఆచారాల్లో
తన ఉనికిపట్టు మర్చిపోయి,
మసిబారిన దీపపు సెమ్మెలా,
అఖండజ్యోతిలోని ఆరిపోని వత్తిలా
నిరంతరంగా కాలుతూ
రెపరెపలాడుతూ బ్రతుకీడ్చుతుంటుంది.
సాంప్రదాయపు పంజరంలో
పంచదార చిలకలా-
ప్లాస్టిక్ నవ్వుల్నియెండినపెదవులపైపూసి
నిప్పులుకడిగే వంశాల అసలు కధల్ని మరుగుచేసే
నివురుగా మిగులుతుంది.
ఊరిచివర విసిరేసిన
చీకటిగుడిసెల సముదాయంలో
మట్టిలో మకిలిలో
పేడకళ్ళెత్తుతూ కట్టెలు చీలుస్తూ
తాగుబోతు మొగుడి దాష్టీకానికి బలైన
ఆమె వెన్నుపూస.వాతలుతేలిన ఒళ్ళు
చేవలేని యెముకలపై వేలాడుతున్న చర్మం.
అంటరాని వాడలో..అగ్రకులపు అహంకారంతోయేకమై
తమ పురుషాహంకారం సైతం..
వెలివేసిన ఆడతనం ఆమెరూపం.
చీత్కారాలు మింగుతూ
బలత్కారాల శిలువల్ని
ఇంటాబయటా నిర్వేదంగామోస్తూ,
నాట్లలో కోతల్లో
తమ బ్రతుకుల్నే పాతేసుకుని
మొలకెత్తడం మరచిన నిర్జీవపు విత్తనంలాంటి ఆమె
తరతరాల బహురూపపీడనా పర్వాల
మూర్తీభవించిన నగ్నత్వం.
తానుండే ఇంటిలాగా
తమ ఉనికినిసైతం ఎత్తు గోడల ఆవల మూస్తూ
మూడుసార్లు బొంకితే ఓడిపోయే కాపురాల్ని,
తుమ్మకుండానే ఊడిపోయే భరోసాలేని జీవనాల్ని
బురఖాల మాటున దాచి..
లిప్ స్టిక్ రంగుల చాటున పెదవుల నిర్వేదాన్నీ
నల్లని సుర్మాలకింద ఉబికొచ్చే కన్నీటినీ
అదిమిపట్టి బ్రతుకుతూ..
మతమౌఢ్యపు తంత్రాలకు బలైన
పాతకాలపు యంత్రం ఆమె.
అందమైన శరీరాలనే అద్దింటి బ్రతుకుల్ని..
యేడాదికోసారి కనిపించిన భర్తల యాంత్రిక కాపురాల
గురుతుల పెంపకంలో ఖర్చుచేస్తూ
రోజుకైదుసార్లు పిలిచినా
బదులివ్వని దేవుడికి నిష్టగా మొరపెడుతూ..
నల్లటిపరదాల మాటున
మతం మత్తు ఇరికించిన
ఊపిరాడని దేహంతో
చాందసవాదపు చీకటికి అనాదిగా బందీ ఆమె.
తమదనే బ్రతుకేలేని అతివల బ్రతుకు చిత్రపు నలిగిన నకలూ
గెలుపెరుగని తరతరాల శ్రమజీవీ
నిలువెత్తు పురుషాహంకారం నిర్మించిన
నిచ్చెనమెట్ల సమాజంలో కొట్టేయబడ్డ మొదటి మెట్టూ
హక్కుల లెక్కల్లో అట్టడుగుకు నెట్టేయబడి,
కుటుంబవ్యవస్థ సిద్ధంచేసిన
కుట్రపూరిత బంధనాల తరతరాల బలిపశువూ..
నిత్య పరాన్నజీవిపాత్రకే కుయుక్తితో నిర్దేశింపబడ్డ
అసమాన ప్రతిభాశాలి
ఆ
మె.
*
ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2022 Saaranga Publishers
తాజా కామెంట్లు