ఫియర్‌లెస్

-అరుణ్‌సాగర్
 ~
arunఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. ఇది సినిమా కాదు. సంభాషణల రచయిత రాసే రొటీను మాటా కాదు. ఎందుకో భయమైతున్నది ప్రభూ. యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు. భయమైపోతున్నది. రాజ్యము బలమూ మదమూ నీవే నీవే. మరియూ మతమూ నీవే. టూ బీ వెరీ క్లియర్ బోత్ రెండూ నీవే. అక్కడ గాఢ కల్బూరిక్ ఆమ్‌లవాయుగోళాలైనా ఇక్కడ ద్రోహముద్రలు వేసే తూటాలైనా. భయమైతున్నది ప్రభూ మాట్లాడాలంటే, నడవాలంటే, తల ఎత్తాలంటే, నినదించాలంటే. వాగర్ధాం వివ సంతృప్తం, వాగార్ధ ప్రతిపత్తయే. ప్రతిపత్తి. అభివ్యక్తి. భిన్నాభిప్రాయమిప్పుడు ప్రమాదసంకేతం. సర్వము నీవే ప్రభూ. సర్వాధికారము నీదే. వాక్కు. మా యొక్క వాక్కు. మా యొక్క హక్కు. ఆదియందు ఉండెడిదది ఇపుడేమున్నది. చెట్టుకు వేలాడే శవాలు తప్ప నినదించు శరీరమొక్కటైనను ఎక్కడ మొలకెత్తును. ఎక్కడ మేల్కాంచును. బాంచెనని కాల్మొక్కెటోళ్లము. వేడుకొనగలము. నినుజేరి నీ దివ్యసముఖమున కష్టమూ సుఖమూ చెప్పుకుని విప్పుకుని. వినరా దొరా కనీసము. దేవా నిను ప్రార్ధించనీ, ఒక ప్లకార్డు, ఒక విన్నపము, కేవల అభిప్రాయమైనను. ఒక్క గుంజుడు గుంజి, డిసియం వ్యాన్‌లో విసిరేసి, గోషామహల్ స్టేషన్ కాంపౌండ్‌వాల్‌లో పడేస్తే….భక్తా! నిన్నేరా తుకారాం. మైడియర్ రెబల్‌స్టార్. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకున్నావా. లక్కీ ఫెలో యు ఆర్! మా దేవుడిని నిందాస్తోత్రమైననూ చేయలేని పిరికిపందలము మేము. కలికాలము. ప్రభూ, భయమైతున్నది ప్రభూ. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకుని ఈ మూకలను `కానిండుమని ఆనతినిస్తివా`. నిటారుగా నడవాలన్నా గొంతు విప్పాలన్నా పాటలు పాడాలన్నా భయమైతున్నది. ఈ చిరుగు చొక్కాలకు ఒక నిరసన బ్యాడ్జ్ తగిలించుకుని నలుగురం పోగయి ఒక్క బక్క కర్రకు గుడ్డజెండా కట్టుకుని చౌరస్తాలో నిలబడాలంటే భయమైతున్నది. ఎంత భయమైతున్నదంటే మేమంటే మాకే భయమైతున్నది. భయపడి భయపడి చచ్చిపోతమేమోనన్నంత భయమైపోతున్నది. భయాన్ని జయించలేక శునకమరణము పాలగుదుమేమోనని భయమైతున్నది. గుండెల్లో దాచిపెట్టుకున్న జెండాలు జఠరికలూ కర్ణికలను పేల్చి పైకి లేచి ఆకాశాన్ని మట్టుపెడతయేమోనని భయము నిలువెల్లా వణికిస్తున్నది. గొంతులు పోయి, వెన్నులు విరిగి, మెదళ్లు బూజుపట్టి కాలానికి కలానికి కాగితానికి తెలియకుండా మరుగైపోయే బోడిబతుకు బస్టాండగునేమోనని భయకంపితమవుతున్నది. కానీ ప్రభూ, కొన్ని భయములు జయించని ఎడల మరణమునూ జయించలేమేమోననే శంక కూడా పీడిస్తున్నది. ఇక అందుకే ఆ పరమేశ్వరుని ప్రార్ధించుచున్నాము. లార్డ్ శివా అండ్ మదర్ పార్వతి, హూ ఆర్ ఇన్‌సెపరబుల్ యాజ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్ టూ గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్. మాకు వాక్కు నిమ్ము. ఉక్కుముక్కల వంటి వాక్యముల నిమ్ము. వాగర్ధం వివ సంతృప్తం! నీ భయం కంటే మా భయం పెద్దదయితున్నది ప్రభూ. నోరు పడిపోతే, కాలూచేయి పడిపోయి పక్షవాతమొస్తే. పగోడికి కూడా వద్దు. ఆయినెవరో అన్నడు కదా ‘నీ అభిప్రాయంతోని నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కాపాడడానికి నేను ప్రాణాన్నయినా ఒదులుకుంటా’నని! నీవంటే భయమైతుల్లే ప్రభూ. ఒక్కసారి ఆలోచించుకుంటే మా బలహీనత చూసే మాకు మిక్కిలి భయమైతున్నది. ఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది. వాక్యాలకూ వాక్యాలకూ మధ్య `ఎంటర్` కొట్టకపోయినంత మాత్రాన అది కవిత్వం కాకపోదురొరేయ్. భయం ఈజ్ నాట్ ఎటర్నల్. మాకు తెలుసు యు ఆర్ స్టేట్. యూ డోంట్ టాలరేట్. ఇక్కడ విషయమేమంటే: వియ్ ఆర్ పీపుల్. వియ్ ద పీపుల్. మైండిట్ మాణిక్యం!
*
Painting: Akbar