ధింసా ఆడే కాళ్ళు..

Artwork: Rafi Haque

Artwork: Rafi Haque

జనపథపు ఆనందంతో వెలిగిపోయిన ముఖాలు
పోరాట సంబరాన్ని చిందించే ముఖాలు
ఏవేవో ఆశయాలతో రక్తం ఉరకలెత్తే ముఖాలు….
ఈ ముఖాల్ని యూనిఫారం తొడుకున్న హైనాలు పట్టి పీకాయి
రాజ్యం కత్తిపీటై క్రూరంగా చెక్కేసింది
పోరాటం చేసేవాళ్ళు సజీవులుగానే కాదు
శవాలుగా కూడా రక్తాన్ని మరిగింప చేస్తారు
ఒక్కో మృతదేహానికి ఒక్కో సజీవ చరిత్ర
అది వాళ్ళ స్తంభించిన కనుపాపల్లో కనిపిస్తుంది
****
రండి కార్పొరేట్ బాబులూ
ఇనుమడించిన ఉత్సాహంతో రండి
పలుగు పారలు డైనమేట్లు బాంబులు పొక్లైనర్లతో రండి
ధ్వంసంచేసి దోచుకున్నదాన్ని ఎత్తుకెళ్ళడానికి
బహుళజాతి కంటైనర్లతో రండి
మీ తరపున యుద్ధం చేసి
రాజ్యం పరిచిన నెత్తుటిమడుగుల రెడ్ కార్పెట్ల మీద
పరుగులెత్తుతూ రండి
బాయొనెట్లతో పొడిచేసిన ముఖాల్ని
ముఖాల్లేని మొండేల్ని
తెగిపడ్డ అవయవాల్ని తొక్కుకుంటూ ఉబలాటంగా  రండి
లక్షల ఏళ్ళుగా నిటారుగా ఎగిసిన
కొండలనన్నింటినీ పేల్చిపారేయండి
భూమిని బద్దలు చేయండి
చెట్లని బాంబులతో కూల్చి
పత్రహరితం పేగుల్ని మెడలో వేసుకు తిరగండి
కొండల రొమ్ముపాలులాంటి
జలపాతాలకి నిప్పెట్టండి
ఆదివాసీల అందమైన అమాయకపు
ధింసా ఆడే కాళ్ళు నరకండి
కొమ్ముబూరల్ని పగలగొట్టండి
దండారీ కొలాంబోడీ పండగల్లో
ఒళ్ళుమరిచి పులకరించే గూమేలా కోడల్ డప్పుల్ని
మోకాళ్ళకేసి కొట్టి విరగ్గొట్టండి
కాలికోం, పేప్రి, కింగ్రి వాయిద్యాల పీక నులిమేయండి
రేలపాటల గొంతుల్లో సీసం పోయండి
గోండు గుస్సాడీ కిరీటాల్ని విరిచేసి నెమలిపింఛాల్ని తగలబెట్టండి
వాళ్ళ కాళ్ళ గజ్జెల్లోని తుంగగడ్డల పూసల్ని చిందరవందరగా విసిరేయండి
గదబ గిరిజనుడి గుడిసె ముందున్న మట్టి అరుగు మీదే
మొదటి గునపం పోటెయ్యండి
ఏ ప్రకృతి విలయం చేయలేని
వినాశనానికి పూనుకోండి
అడవినంతా ఓ కబేళాగా మార్చి
నగరాల్లో ఫ్లై ఓవర్లు, పబ్బులు క్లబ్బులు కాఫీ షాపులు కట్టుకోండి
ప్రకృతి సంపదని
డబ్బుకట్టల్లోకి విలాసాల్లోకి
మార్చుకోవడమేగా నాగరీకత అంటే!
అడవి కడుపు కొల్లగొట్టి అక్కడి ఖనిజాల్ని
బులియన్ మార్కెట్లలో షేర్లు షేర్లుగా
అమ్ముకోవడమేగా పరిపాలన అంటే!
దండయాత్రలు చేసేవాడు
స్వదేశీయుడైతనేం విదేశీయుడైతేనేం?
*****
కానీ వీళ్ళు మాత్రం
పుడుతూనే విల్లంబులు బాణాలతో పుట్టినవాళ్ళే!
*

అన్నదాత మరణమృదంగ వాయుధ్వని!

1973-2 మనలో ఎంతమందిమి అన్నం తినేటప్పుడు రైతు గురించి ఆలోచిస్తాం? అసలీ వ్యవసాయక దేశంలో ఇంతవరకు ఏ రైతుకూ ఎందుకని భారతరత్న అవార్డు రాలేదు?” ఇవి నటరాజ్ మహర్షి వేసిన ప్రశ్నలు, తనకు తానే వేసుకున్న ప్రశ్నలు. అతనికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. బహుశ వాటికి జవాబులు దొరక్కపోవచ్చు. కానీ రైతుకి తన రుణం మాత్రం తీర్చుకోవాలనుకున్నాడాయన. ఫలితమే “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” అనే లఘు చిత్రాన్ని నిర్మించారు.

నిజానికి నటరాజ్ కి ఇది మొదటి సినిమా కాదు. ఈ సినిమా కి ముందుగా ఓ ఫిలిం మేకర్ గా ఆయన చేసిన ప్రయాణం వుంది. “న్యూయార్క్ ఫిలిం అకాడెమీ” అనుబంధంతో కాలికట్ లో జరిగిన వర్క్ షాప్ లో శిక్షణ పొందిన నటరాజ్ అక్కడ మెథడ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత నవ్య యుగపు నవీన భావాల దర్శకులందర్నీ కలుసుకున్నానని చెప్పారు. ఆ తరువాత ముంబైలో సెటిల్ ఐన నటరాజ్ 2014 లో “డ్రాయింగ్ బ్లడ్” అనే ఇంగ్లీష్ సినిమా తీసారు. అది ఒక పెయింటర్ కథ. ఆ తరువాత కెరీర్లో ఎదగటం కోసం తనని తాను కోల్పోయిన ఒక గజల్ గాయని మీద “మేరా ఆలాప్” అనే హిందీ లఘు చిత్రం 2015లో తీసారు. తన అన్ని సినిమాలకీ తనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, తనే స్క్రిప్ట్ రైటర్, తనే దర్శకుడు. ప్రతి షాట్ ని ఎంతో శ్రద్ధగా చిత్రిస్తారు ఆయన. లైటింగ్, కెమెరా యాంగిల్స్ వంటి అన్ని విషయాల్లో మంచి క్రాఫ్ట్స్ మెన్ షిప్ కనబరుస్తారు. ప్రేక్షకుడి మూడ్ ని ఎలవేట్ చేసే నేపధ్య సంగీతం గురించి, ఎడిటింగ్ గురించి శ్రద్ధ తీసుకుంటారు. నేను ఆయనతో మాట్లాడిన మేరకు ఆయనలో ప్యూరిటానిక్ కళాకారుడు ఉన్నాడు. ఇది ఆయన మొదటి ఫీచర్ సినిమా “డ్రాయింగ్ బ్లడ్” లో కనిపిస్తుంది. జీవిత పరమార్ధం ఆధ్యాత్మిక దృక్పధంలో దొరుకుతుందనే ఆలోచన ఆయనలో వుంది. ఇది ఆయన షార్ట్ ఫిలిం “మేరా ఆలాప్” లొ స్పష్ఠంగా కనబడుతుంది. ఆయన ప్రస్తుతం “ద స్కల్ప్టర్” అనే డాక్యుమెంటరీ నిర్మాణంలో వున్నారు. ఇది కాకుండా “అనోనా” అనే ఫీచర్ ఫిలిం కూడా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ తీసినా దాని ముందు, తరువాత చాలా పని చేస్తానంటారు నటరాజ్.

“1973” సినిమాలో నటరాజ్ ఏ చెప్పారు? వర్తమాన రైతు సమస్యల మీద, రైతుల ఆత్మహత్యల మీద తీసిన సినిమా కాదిది. తనకేమైన కష్టం వస్తే ఎవరికీ పట్టని రైతు ఒంటరితనం గురించి, నిస్సహాయత గురించి, ఎవరికీ వినిపించని రైతు ఆర్తనాదం గురించి, దుఖం గురించి, అభద్రత గురించి, నిన్నటి దాకా పంటకి నీరు పెట్టిన రైతు హఠత్తుగా కనిపించక పోతే పట్టించుకోని సమాజ నిర్లక్ష్యం గురించి నటరాజ్ చెప్పారు. నీరందని పంటలాగా ఎండిపోతున్న రైతు గురించి చెప్పారు. రైతు భూమిలో వనరుల మీద కన్నేసి అతని భూమిని దక్కించుకోవాలన్న పొలిటీషియన్ స్వార్ధం గురించి, క్రూరత్వం గురించి చెప్పారు. ఎవరూ చెప్పని ఓ రైతు గురించి చెప్పారు. నిస్సహాయంగా గాలిలో కలిసిన అతని ఆక్రందనని మనకు వినిపించారు. అసలు భవిష్యత్తులో రైతనే వాడుండని హెచ్చరించారు.

నిజానికి నటరాజ్ ఏమీ చెప్పలేదు. కేవలం చూపారు. చాలా చూపించారు. దేశం మీద ప్రేమతో జెండా కింద సేద్యం చేసిన రైతు నిబద్ధత గురించి చూపించారు. ఆ రైతు వెక్కిళ్ళు మన దోసిలిలో పోసి చూపించారు. “దాహం వేస్తుంది. నీ భూమిని ఇస్తావా?” అనే రాజకీయ నాయకుడి స్వార్ధం చూపించారు. పెద్దగా డైలాగులు లేని ఓ ఇరవై నిమిషాల లఘు చిత్రంలో ప్రేక్షకుడి మనసుని కదిలించే విధంగా ఆయన ఇవన్నీ చూపించారు. జెండాని సంక్షేమ రాజ్యానికి చిహ్నంగా చూపించి బలవంతుడి దౌష్ట్యం ముందు రాజ్యాంగం పూచీపడే సంక్షేమం ఎంత బలహీనమో చూపించారు. రైతుని కొట్టడానికి జెండా కర్రని వాడుకున్న మంత్రి చివర్లో జెండా విశిష్ఠతని గురించి రేడియోలో ఉపన్యసిస్తాడు. ప్రతీకలు కలిగించే మిధ్యావేశంలో మనం బతికేస్తుంటాం కదా!

1973-3

1973లో ఖమ్మం జిల్లాలో ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టిన నటరాజ్ కి ఆయన తండ్రి అదే సంవత్సరంలో తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతుకి జరిగిన అన్యాయాన్ని వివరించి చెప్పారు. ఎవరికీ తెలియకుండా చరిత్ర కాలగర్భం లో కలిసిపోయిన ఆ రైతు కథ ఇప్పుడు నటరాజ్ చేతిలో ఓ సినిమాగా ప్రాణం పోసుకుంది.

“వాయుధ్వని ప్రొడక్షన్స్” సమర్పణలో నటరాజ్ మహర్షి తానే స్వయంగా రాసి, తీసిన “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” ఇప్పటికి 5 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎంపికైంది. ఆల్ లైట్స్, బెంగళూరు, రుమేనియా, మన్ హట్టన్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ లో ఈ సినిమా ఎంపికైంది. ఇది ఓ తెలంగాణ యువకుడు సాధించిన ఘనత.

ఈ సెప్టెంబర్ 24 నుండి 27 వరకు రామోజీ ఫిలిం సిటిలో జరగబోయే “ఆల్ లైట్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్”లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. “షార్ట్ ఫిలిం కార్నర్”లో తెలుగు నుండి అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన రెండు సినిమాల్లో ఇదొకటి. కెవీఅర్ మహేంద్ర తీసిన “నిశీధి”మరొకటి. ఇది తెలంగాణ చిన్న సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ విజయం. మొన్నీమధ్యనే 1973 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ని విడుదల చేసారు. ఈ సినిమా చూసి నగ్నముని గారు స్పందించిన వీడియో కూడా యూట్యూబ్ లో లభ్యమౌతుంది.

స్లాప్ స్టిక్ కామెడీ తోనో, చీప్ డైలాగులతోనో నాసిరకపు సాంకేతిక, సంగీత నాణ్యతా విలువలతో కనబడతాయి తెలుగులో షార్ట్ ఫిలింస్ యూ ట్యూబులో. వాటికి భిన్నంగా మంచి అభిరుచితో, బాధ్యతతో సినిమాలు తీసే వృత్తిరీత్యా ఫాషన్ ఫోటోగ్రాఫర్ ఐన నటరాజ్ మహర్షి వంటి ఫిలిం మేకర్స్ ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీదుంది. మనం ప్రోత్సహించాలే కానీ ఆయన దగ్గర చాలా మెటీరియల్ వుంది. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్!
Official Trailer – 1973 An Untold Story (2016) Short Film

 

ఉదయాన్నే వెలిసిన వర్షం

ఉదయ్యాన్నే

 

రాత్రంతా కురుస్తూ ఉదయాన్నే వర్షం వెలసిన అనంతరం  ఎలా వుంటుంది?  అచ్చం తన అంతరంగ లోతుల్నుండి భావోద్వేగాలను తోడుతూ కవిత రాసిన అనంతరం కవి మనస్తితిలా వుంటుంది.  నిజాయితీగా తనదైన ఒక కవితని  రాయాలంటే కవి బాధో ఆనందమో ఎంత హోరుని అనుభవించాలి? వికాసమో విలాపమో జ్ఞాపకాల్లో ఎంతగా ఉక్కిరిబిక్కిరైపోవాలి?  దుఖం నుండో ఆనందం నుండో వచ్చిన కన్నీటిలో ఎంత తడిసిపోవాలి?

కిటికీగుండా చూస్తేనో లేక తలుపు తెరిచి గుమ్మం బైట తల పెడితేనో ఒక నిండైన దృశ్యం కనబడితే రామానుజరావుగారిలాంటి కవి ఊరుకోగలడా?  అందుకేనేమో ఆయన కవిత్వం నిండా దృశ్యాలు పరుచుకుంటాయి.

***

కవిత్వం గురించి ఆలోచించేప్పుడు చాలా ఆలోచనలొస్తాయి.  అసలు కవిత్వం అంటే ఏమిటి, ఏది కవిత్వం అని సందేహాలొస్తాయి.  కవిత్వం అంటే ఎదైనా కావొచ్చు. అది లిఖితం కావొచ్చు. మౌఖికం కూడా కావొచ్చు. నిర్వచనీయం కావొచ్చు లేదా అనిర్వచనీయం కావొచ్చు.   అయితే ఈ సందేహాల్ని దృష్థిలో పెట్టుకొని, ఒక నిర్వచన స్పృహతో కవిత్వం రాస్తే మాత్రం కవి దారుణంగా విఫలమౌతాడు.  ఒక కవిత్వ విమర్శకుడో లేదా ఒక మంచి పాఠకుడో నిర్వచనాల జోలికి పోవాలి కానీ “ఒక మంచి కవితకి ఇవిగో ఇవీ లక్షణాలు, ఇంకా ఈ లక్షణాలు నేనిప్పుడు రాయబోయే కవితలో ప్రతిఫలించాలి” అని కవి అనుకుంటే కవి ఊహాశక్తికి క్రోటన్ కత్తెర్లు పడతాయి.  ఒక గొప్ప కవి రాసిన కవిత్వంలో ఫలానా లక్షణాలు ప్రస్ఫుటమయ్యాయి కాబట్టి తాను కూడా అలాగే వస్తువు పరంగా, ఎత్తుగడ పరంగా, నడక పరంగా కవిత్వం రాస్తే అది ఎట్టి పరిస్తితుల్లోనూ మంచి కవిత్వం కాబోదు.

 

ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వర్తమాన తెలుగు కవుల్లో అనేకమంది ఎవరో ఒకరి కవిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవటం జరుగుతున్నది.  కవిత్వం రాయటానికి మరో గొప్ప కవిని ఆదర్శంగా తీసుకోవటం మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు.  అందుకే వారిలో ఒక స్వంత గొంతుక లోపిస్తున్నది.  తనదైన ఊహ, డిక్షన్ చాలామందిలో కనిపించటం లేదు.  ఒక గొప్ప కవిత్వం చదివాక కవి మనసులో ఒక గాఢమైన కవిత్వ వాతావరణం ఏర్పడాలి.  ప్రభావం వేరు, అనుసరణ వేరు.  కవిత్వంలోకి స్వంత రక్తాన్నెక్కించి పరుగులు తీయించటానికి ప్రభావం అడ్డుకాబోదు.  కానీ కలంలోకి పరాయి రక్తాన్నెక్కించుకొని రాస్తున్నట్లుంటుంది అనుసరణ కవిత్వం.

*****

రామానుజరావు గారు ఎంతోమంది అంతర్జాతీయ కవుల్ని చదివారు.  కానీ ఆయన ఎవర్నీ అనుసరించ లేదు.  ఆయన అనువాదాలు కూడా చేసారు.  ఆయన అనువాద కవితలకి, తెలుగులో స్వంతంగా రాసిన కవితలకి ఎక్కడా పోలిక లేదు.

 

కవి రాజకీయ, ప్రాపంచిక దృక్పధం ఏదైనా కావొచ్చు.  ఒకరి కవిత్వం ప్రధానంగా దృశ్య వర్ణనగా వుంటుంది.  మరొకరి కవిత్వం జీవితం గురించి, సమాజం గురించి వ్యాఖ్యానంగా వుంటుంది.  ఎలాగైనా వుండొచ్చు.  ఇలా రాస్తేనే కవిత్వం అంటే అదో రకపు మూర్ఖత్వం, నిరంకుశత్వం.  రాసే పద్ధతిని చర్చించొచ్చు.  కానీ నిర్దేశించటం సరైంది కాదు.

 

తనదైన శైలిలో వర్ణన ప్రధానమైన కవిత్వం రామానుజరావు గారిది.  కొన్ని చోట్ల భావుకమైన ఊహలు చేసినప్పటికీ  జీవన గాఢతని పట్టించే దృశ్య వర్ణన ఈ కవిలో ప్రధానంగా కనిపిస్తుంది.  ఆయనెంచుకున్న దృశ్యాలు భిన్న వర్ణ సముదాయం.  భిన్న భావోద్వేగాల సమ్మేళనం.  భిన్న సందర్భాల మాగమం.  అది భర్తని కోల్పోయిన స్త్రీ కావొచ్చు. అంధ భిక్షువు కావొచ్చు, అమ్మ కావొచ్చు.  తూర్పు దిక్కుగా దిగులుగా చూస్తూ పార్కు చీకటి దుప్పటి కప్పుకునే ముందటి సందడి కావొచ్చు. మోటార్ సైకిల్ మీద జాంఝామ్మని హుషారుగా షికారు చేసే  జంట కావొచ్చు.

 

కేవలం దృశ్య వర్ణనే కవిత్వం అయిపోదు  ఆ దృశ్యంలో తనను ఇముడ్చుకుంటేనే కదా కవిత్వం అయ్యేది.  తానెంచుకున్న దృశ్యం తాలూకు ఆనందంలో, దుఖంలో,  ప్రేమలో, పరవశంలో తాను మానసికంగా భాగం కాగలిగినప్పుడు,  ఆ దృశ్యాన్ని తన హృదయంలోకి ఆవాహన చేసి తనదైన అవగాహనతో మన ముందు పెట్టినప్పుడే కదా ఆ వర్ణన కవిత్వం కాగలిగేది.  చూడగానే మనసుని తడిమే ఒక దృశ్యం మీదుగా కవి జీవితాల్లోకి తొంగి చూడగలగాలి.  జీవితాల్లోని బాధలకి, ఆనందాలకి హేతువుని, మనుషుల్ని నియంత్రించే ఆర్ధిక, సాంస్కృతిక శక్తుల్ని పట్టించుకోకుండా కేవలం ఒక రసాత్మక స్పందన మంచి కవిత్వం కాజాలదు.  అయితే ఇదంతా ఒక్క కవితలో జరగక పోవచ్చు.  కానీ ఒక కవి రాసిన మొత్తం కవిత్వంలో ఆ అంశ ప్రతిఫలించాలి.  ఈ కవి సరిగ్గా అదే పని చేసారు.  కవి తన ఒక కవితలో ఇలా అంటారు:

“హృదయాన్ని తాకిన రూపమేదైనా

నా నరాల తీగెలను మీటే

ఆర్ద్రతే నా రస దృష్టి”.

కవిత్వ ప్రధాన లక్షణాల్లో ఒకటైన ఆర్ద్రతని తన రసదృష్టిగా  చేసుకున్నారు.

****

 

ప్రకృతి ప్రేమ, మానవసంబంధాలు, రొమాన్సు, ప్రాంతీయ అసహనాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, స్త్రీ సౌందర్యం, కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీ, పార్కులలో వ్యాహ్యాళి, నాన్న, డాబాపై కురులార పోసుకునే అమ్మాయి, అమ్మ…ఇలా జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, జీవితాన్ని ఆవరించి వుండే వాతావరణం, జీవితాన్ని సుసంపన్నం చేసే అనుభవాలు, జీవితం మీద ప్రేమని పెంచే భావోద్వేగాలు, సౌందర్య దృష్టి…అన్నింటినీ కవిత్వంగా స్వీకరించారు కవి.

 

 

“ఇంద్ర ధనుస్సు రంగుల్లో స్నానించిన పాలపిట్టొకటి

కారు బానెట్ పై వాలి ముక్కుతో పొడుస్తూ

మధ్యమధ్య తలెత్తి చూస్తూ మోగిన హారను శబ్దాన్ని

రెక్కలతో అదిలించి ఎగిరిపోతుంది”

 

“వాన చినుకుల్ని తాగి మత్తెక్కినట్లున్న రోడ్డుపై

మట్టి వాసన మోసుకొస్తున్న గాలితో పోటీ పడుతూ

సైకిల్ పై గడ్డి మోసుకొస్తున్న యువకుడు”

 

“అసహనం దుమ్మ్ పట్టిన కారు అద్దాల వెనక

నా పట్నవాసపు మితృడు

అకస్మాత్తుగా గొడ్లకాపరిగా మారి పిల్లనగ్రోవి ఊదుతూ

తన్మయత్వపు జడివానలో తడిసిపోతూ నేను” (“ఓరుగల్లుకు ఒక రోజు”)

 

“ఓరుగల్లుకు ఒక రోజు” ప్రకృతిలో జీవన సౌరభాన్ని వెతుక్కున్న కవిత.  ప్రకృతి ఎంత అందంగా వుంటుందో అంత అందంగానూ జీవితాన్ని చెక్కిన కవిత ఇది.  ప్రకృతిని ఇంత నాజూగ్గా పట్టుకొన్న మరో కవిత “ఉదయాన్నే వెలసిన వర్షం”.  ఇక్కడి దృశ్యవర్ణనలో మానవాంశని కవి హైలైట్ చేసిన తీరు బాగుంటుంది.  ఉదయాన్నే వెలసిన వర్షం ఏ దృశ్యాన్ని మంజూరు చేస్తుంది?

 

“వేకువనే వెలుగులిచ్చి వెళ్ళిపోతుంది

తూర్పు సముద్రంలో స్నానించి సూరీడు తేలి వస్తున్నాడు

ఇంటిముందు పారిజాతం చెట్టు

పులకరించి పూల దోసిళ్ళు విప్పార్చింది

ప్రేమ పావురాలు రెండు సన్ షేడ్ పై వాలి

క్రీనీడలో కువకువలాడుతున్నాయి”

 

“మా ఇంద్రపురి వీధిలో బాల గంధర్వుడొకడు

తలెత్తి అమృతం చినుకుల్ని ఆస్వాదిస్తున్నడు”

 

ఆయనొక ప్రాపంచిక దృక్పధానికి చెందిన కవి కారు.  కానీ అయన కవిత్వంలో హేతువు కనబడుతుంది.  ఆరోగ్యకరమైన ప్రతిస్పందన కనబడుతుంది.  ఆయన కవిత్వంలో ప్రశ్నలు లేకపోయినా పాఠకుల్లో అనివార్యంగా ప్రశ్నలు రేకెత్తుతాయి.  ఉదాహరణకి “గుజరాత్ గాయం” అన్న కవితలో ఇలా అంటారు.

 

“హింస ఒక వ్యసనమైతే

బోధివృక్షాల వేళ్ళు తెగుతాయి

చంపడమొక నాగరికత అయితే

ఏ సబర్మతీ తీరాన స్వాతంత్ర్యాలు అనర్హమౌతాయి

 

శతాబ్దాల యుద్ధాలు, భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు”

 

నిజమే “శతాబ్దాల యుద్ధాలు భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు” అన్నప్పుడు ప్రశ్నలు రేకెత్తకుండా వుంటాయా?

 

“నేనొక్కడినే” అన్న కవితలో “ఆ రాత్రి చెట్ల ఆకులు / ప్రసవ వేదనతో అల్లల్లాడుతూ” అంటారు.  ప్రసవ వేదనతో అల్లల్లాడే రాత్రి చెట్ల ఆకులు నిజానికి ఏదో నిగూఢ అంతరంగ అశాంతికి సంకేతం.  కవిత్వం రాస్తున్నప్పుడు తోచిన ఏ ప్రతీకైనా నిజానికి నిష్కారణంగా బైటికొచ్చేదీ కాదు, నిర్వ్యాపకంగా వుండదు.  చాలాసార్లు తన ప్రతీకలు ఏ కవికైనా ఆశ్చర్యం కలిగిస్తాయి.  కవిత్వం రాసే సమయం కవి జీవితంలో చాలా ప్రత్యేకమైనది.  తనను తాను కొత్తగా, మరింత లోతుగా పరిచయం చేసుకునే సందర్భం అది.  అటువంటి కొన్ని సందర్భాల్లో “వీధి కుక్కల వంతపాటలో స్రవించే విషాదాన్ని” అంచనా వేయటానికి అధివాస్తవిక ప్రతీకలతో “అంధ బిక్షువు” లాంటి కవిత పలుకుతుంది.

 

“రాత్రి

చీకటి దేహావృతమై

నక్షత్రాల వంకీ కర్ర ఆధారంగా

ఒక దయార్ద్ర హృదయ అన్వేషణలో

వీధి అంతా గిరికీలు కొడుతుంది

మూసిన తలుపుల ముందు కీచురాయి గొంతుతో

దీనంగా వేడుకుంటుంది”

 

అమెరికా లోని యూసమైట్ కొండల్లో సెలయేటిని చూసి అక్కడి ప్రశాంతతకి ఉక్కిరిబిక్కిరయిన కవి “ఇక్కడ అలలు లేవు”కవితలో అనుభూతుల జుగల్బందీని వినిపిస్తారు.

“చేతి పట్టు దాటి నీట తప తప తన్నే

ఆనందం

పిల్లల చుట్టూ ప్రవహిస్తుంది

ఇసుకలో కట్టిన గుజ్జన గూళ్ళు

కదిలి వస్తున్న పసితనాల పావురాలు

నిశ్శబ్దం నీట మునిగి కోలాహాలం”

 

ఇక్కడ నేను ప్రస్తావించని కొన్ని మంచి కవితలు ఇంకా వున్నాయి.  ద్రవ్యోల్బణం మీద రాసిన “రూపాయి”,  జంట ప్రయాణ ప్రణయాన్ని వర్ణించే “వాళ్ళిద్దరూ”, నోస్టాల్జియా మీద రాసిన “నాన్న” కవితలు చదవాల్సిన కవితలు.

కవిత్వంతో చాలా కాలం నుండి ప్రయాణం చేస్తున్నా చాలా తక్కువగా కనిపించిన రామానుజరావు గారు తన నడక వేగాన్ని పెంచాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళగల సత్తా ఆయనకుందని ఉదయాన్నే వెలసిన వర్షం సాక్ష్యం చెబుతుంది.

 

*

 

చంద్రవంకల ఆత్మఘోష గురించి…. 

 

cover page of mudava manishi
-అరణ్య కృష్ణ
~
మనుషులెన్ని రకాలంటే రెండు రకాలని, అది ఆడా మగా అని చెప్పే దురహంకారం మనది.  సంసారం ఈతి బాధలు మోస్తూ మగాడు, పురుషాహంకారానికి బలైపోయే స్త్రీల వెతలే మనకు తెలుసు. వాటికే సాహిత్య గౌరవాన్ని ఇచ్చే సంకుచిత్వం మనది.  ఈ రెండు రకాల మనుషుల బాధలకి స్పందించే మనం, కళ్ళనీళ్ళు పెట్టుకునే మనం, కారాలు మిరియాలు నూరే మనం, తిరుగుబాట్లు ప్రబోధించే మనం, సమానత్వం గురించి ఘోషించే మనం మనుషుల్లో మనలాగే పుట్టిన మూడోరకం మనుషుల పట్ల మాత్రం అమానుషంగా వ్యవహరిస్తాం. విలన్లుగా ప్రవర్తిస్తాం.  అజ్ఞానమూ, దురహంకారమూ, అశాస్త్రీయమూ కలగలిసిన విచిత్ర వికృత ప్రవృత్తితో వారిని చూసి ఫక్కున నవ్వుతాము, హేళన చేస్తాము, అనుమానిస్తాము, అవమానిస్తాము కూడా. కడుపున పుట్టినా, తోడపుట్టినా కూడా కనికరించము. నిజంగానే పలుకాకుల్లా పొడుచుకు తింటాం.  తరిమేస్తాం.  వాళ్ళను చూడగానే నవ్వటానికి ఏం వాళ్ళు మన వినోదం కోసం పుట్టారా?  వాళ్ళను అనుమానంగా చూడటానికి, అవమానించటానికీ  వాళ్ళేమన్నా మన కట్టు బానిసలా? జాత్యహంకార చరిత్రలో కూడా ఏ తెల్లవాడూ మరో నల్లవాడ్ని చూడనంత ఘోరంగా మనమెందుకు చూస్తాం?  జననాంగాల చలనశీలతే కదా తేడా వాళ్ళకీ మనకు?  మనం పేద్ద పోటుగాళ్ళం, పోటుగత్తెలమై పునరుత్పత్తి కార్యక్రమానికి దోహదం చేస్తున్నామనేగా మన మిడిసిపాటు.  మిగతా అంతా వాళ్ళూ, మనమూ ఒకటే కదా! మనసు, హృదయం, స్పందన ఒక్కటే కదా! మనకైనా, వారికైనా చర్మాన్ని గాటు పెడితే వచ్చేది నెత్తుటి బొట్లే కదా. కడుపుకి వేసే ఆకలొక్కటే కదా! గాయపడ్డ గుండె కార్చే ఉప్పటి కన్నీరు ఒక్కటే కదా!  ఎందుకు సాటి మనుషుల్ని గౌరవించలేక పోతున్నాం? సాటి మనుషుల్ని చూసి ఏమిటా కుసంస్కారపు గగుర్పాటు? నిజానికి ఒక గొప్ప విషయం ఏమిటంటే థర్డ్ జెండర్ వారు ప్రధానంగా తమని తాము స్త్రీలుగా ప్రకటించుకుంటారు.  బహుశ కష్టాల్ని, కన్నీటిని, ప్రేమరాహిత్యాన్ని, ఎడబాటుని తాము స్త్రీలైతేనే భరించగలమేమొ అన్న అసంకల్పిత ఆలోచనే అందుకు కారణమేమో! వారో ప్రత్యేక సమూహంగా కదులుతారు. తమదైన లోకాన్ని, బంధాల్ని, బంధనాల్ని సృష్ఠించుకుంటారు.
రేవతి అనే హిజ్రా ఈ సమాజానికి పెద్ద ఝలక్ ఇచ్చారు.  ఆమె తన జీవిత చరిత్రని “ఒక హిజ్రా ఆత్మ కథ”గా మన ముందుకు తెచ్చారు.     ప్రకృతి పరంగానే ఒక మనిషిలో రెండు అస్తిత్వాల మనుగడ, రెండు లింగాల వైవిధ్య సమ్మేళనం వలన కలిగిన ఇబ్బందుల్ని ఆమె మనతో పంచుకున్నారు.  అతడుగా మొదలైన ప్రయాణం మధ్యలో ఆమె గా మారి, ఇంక ఎప్పటికీ ఆమెగానే కొనసాగే సాహసిక ప్రయాణంలో తన అనుభవాల్ని ఆమె మనతో పంచుకున్నారు.  ఆ ప్రయాణాన్ని చదివి, స్పందించి రేణుక అయోల “మూడవ మనిషి” అనే ఒక దీర్ఘకవిత రాసారు.  తెలుగులో అనే కాదు, ఏ భాషలో అయినా థర్డ్ జెండర్ మీద వచ్చిన సాహిత్యం అతి తక్కువ. అందుకుగాను రేణుక అయోల గార్ని ముందుగా అభినందించాలి.  నిజానికి దీర్ఘ కవిత ఒక క్లిష్టతరమైన కవ్విత్వ ప్రక్రియ.  పాఠకుడి ఆసక్తి ఎంతమాత్రం దెబ్బతినకుండా కవ్వితని నిర్వహించాలి.  వాక్యనిర్మాణం, నడకలతో కూడిన శిల్పంలో పరిపక్వత కనిపించాలి.  ఎక్కడా ఫీల్ చెడకూడదు.  భావోద్వేగ ప్రవాహం నిరంతరాయంగా కొనసాగాలి. దాన్లో చిన్న తేడా వచ్చినా యాంత్రిక వ్యక్తీకరణ ప్రస్ఫుటంగా కనిపించి, ఆసక్తి నీరసించి కవిత పఠనం కుంటుపడుతుంది.  అందుకే ఇదో చాలెంజ్.  అందుకే శివారెడ్డి గారు దీర్ఘ కవిత ఒక సవాలని, మంచి కవులు ఆ సవాలుని స్వీకరించాలని చెబుతుంటారు.  ఈ సవాలుని రేణుక స్వ్వీకరించారు.  స్వీకరించి పరకాయ ప్రవేశం చేసారు.  మొత్తం పదిహేను భాగాలుగా సాగిన ఈ 53 పేజీల కవిత మొత్తాన్ని ప్రధమ పురుషలోనే  నడిపించారు.  ఇదేం చిన్న విషయమేం కాదు.  ఇక్కడ సవాలు రెండు రకాలు. ఒకటి దీర్ఘ కవితే ఒక సవాలు కాగా, రెండోది ఎంచుకున్న వస్తువు.  అందరూ ముఖం తిప్పేసుకునే వస్తువు. ఇదేం చోద్యం అని బుగ్గలు నొక్కుకునే వస్తువు.  ఈ రెండూ కష్టమైన సవాళ్ళే.    ఇటువంటి కవిత రాయటానికి కేవలం సానుభూతి మాత్రమే కాక చాలా అవగాహన కావాలి.  ఒక మామూలు మనిషి ఒక వయసు వచ్చాక హిజ్రాగా మారే పరిస్తితుల పట్ల అవగాహన వుండాలి.  సాంఘీక పరిస్తితుల మీద, జెండర్ అంశాల మీద, దైహిక ప్రక్రియల మీద పూర్తి అవగాహన కావాలి.  ఇది వైద్యపరమైన సబ్జెక్ట్. సాంకేతికమైన సబ్జెక్ట్.  మనో వైజ్ఞానిక సబ్జెక్ట్.  అందుకనే ఇది కత్తిమీద సాము.  ఈ విషయంలో రేణుక గారు చాలావరకు సఫలమయ్యారు.
“రూపాన్ని వ్యక్త పరచలేని
ఒక దేహ చరిత్ర రాసుకోవాలనుకున్నప్పుడు
అక్షరాల గాయాలు రహిదారిలో నిలబడి
దిక్కులు చూస్తున్నాయి”
నిజమే సందిగ్దతే హిజ్రా అస్థిత్వం.  ఎందుకంటే “ఒక శరీరం రెండు రూపాలతో కొట్టుమిట్టాడు”తుంది కనుక.  ఆ కొట్టుమిట్టాడినతనాన్ని ఎలా చెప్పారంటే:
“కొన్నిసార్లు మరణించి
కొన్నిసార్లు జీవించి
ఆ రెంటి పొలిమేరల్లో బతుకుని ఒడొసిపట్టుకుని
ఈ కాగితం మధ్యలో నిలబడి
బతుకు గోడు చెప్పుకోవాలనుకున్నప్పుడు
ఒక నిశ్శబ్దపు నీలివర్ణం
నా చుట్టూ పేరుకుంది”
ఎదిగాకే మూడవ మనిషి. కానీ పుట్టినప్పుడు అందరూ మొగ పిల్లాడనే అనుకున్నారు.  సంబరపడ్డారు. అమ్మకి మాత్రం సందేహమే.
“చీరబొంతలో తమలపాకు కట్టలా నన్ను దాచి
సందేహంలో  పడిపోయిన అమ్మ
ఎన్నిసార్లో నా పసి దేహన్ని పట్టి చూసుకుందో”
మగపిల్లాడిగా పుట్టి ఆడతనపు ప్రవర్తనతో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ జీవన ప్రస్థానాన్ని వివిధ దశల్లోని క్రూర ఘోర అనుభవాల్ని కళ్ళకు కట్టినట్లు చెబుతారు కవి.   ఆమె జీవితంలోని ప్రతి భావోద్వేగ సందర్భాన్ని  రేణుకగారి సహానుభూతి కవితాత్మకం చేసింది.  ప్రకృతిపరంగా తన ఆత్మ బంధువుల్ని కలిసినప్పుడు, చీర కట్టుకున్నప్పుడు, స్త్రీగా మారిపోవటానికి పురుషాంగం తీయించేసుకున్న ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, ఇంటికి తిరిగివస్తే వెలివేయబడ్డప్పుడు, ఆకలి తీర్చటం కోసం వ్యభిచారం చేసినప్పుడు…ఇలా ప్రతిసందర్భంలోనూ మంచి వాక్యాలు రాసారు.  మచ్చుకి కొన్ని పంక్తుల్ని కింద ఇస్తున్నాను. చూడండి.
“ఒంటిని విడవని చీరకట్టు
కవచంలో కాపాడే చీరకట్టు
కలలో మెలకువలో వెంటపడ్డ ఆనందం
మెత్తని పక్షి ఈక ఒంటిని నిమురుతూ
జీవించటానికి తాగుతున్న అమృతం
మెడచుట్టూ గిల్టు నగలు
అద్దం కాంతికి మెరిసే తెల్లటి రాళ్ళు”
“నా చేతినిండా ఆకలి చుట్టూతా ఆకలి
ఆకలి చల్లార్చడానికి బజారున పడ్డ శరీరాలు
చప్పట్లు చరుస్తూ మీద మీద పడుతూ
దండుకునే రూపాయల నిండా దుఖం”
“గాయపడ్డ నరం చిట్లినప్పుడు
లోలోపల ప్రవహించే నెత్తురు చప్పుడు
కళ్ళ కొసలలో ఆగిపోయేది”
“శరీరం చెట్టు నుండి
కొమ్మలు నరకాలి అనుకున్నప్పుడు
కూకటివేళ్ళతో సహా పెకిలించబడింది
శరీరం నుండి చిన్న అంగం తెగిపడింది
చుట్టూతా నిశ్శబ్దం
జీర్ణం కాని జడత్వం
చల్లారిన అగ్నిపర్వతం”
“ఇప్పుడు నేను స్త్రీని
అదమైన జీవితంతో
నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని
రేపటి వెలుగులోకి తొంగి చూస్తున్న
ఒంటరి నక్షత్రాన్ని”
“రోడ్డు మీద గోడవారగా
రేకు తలుపులు ఆనుకొని
దేహాన్ని అమ్మకానికి పరిచిన ప్రతిసారి
ఒక నొప్పి పేగులు తెంచుకొని
రక్తాన్ని బైటకి తెస్తుంది”
“ఈ శరీరాలకి వెల వుంది
ప్రేమకి వెల లేదు
దాహానికి నోటు వుంది
ఆప్యాయతకి ఆసరా లేదు
చేతినిండా దాహపు పాత్రలే”
ఇలా గుర్తించదగ్గ, గుర్తుపెట్టుకోదగ్గ పంక్తులు ఈ దీర్ఘ కవితలో కనిపిస్తాయి.  ఈ భూమ్మీదకి మనందరిలాగానే వచ్చి ఒక తీవ్ర అంతర్ అన్వేషణతో తన అస్తిత్వాన్ని నిర్ధారించుకునే “మూడవ మనుషులు” గురించి వేదనాత్మకంగా రాసిన అర్ధవంతమైన కవిత ఇది.  మొదటి నుండి చివరి వరకు చదివించగల సరళవంతమైన నడక, నిర్వహణ కనబడుతుంది.  అక్కడక్కడా కొంత వాచ్యంగా అనిపించొచ్చు.  కొంత ఎడిట్ చేసుకోతగ్గ పంక్తులూ లేకపోలేదు. అయినా మొత్తం మీద వస్తువు, రూపం, నిర్వహించిన తీరుతో ఒక విలువైన కవితగా రూపొందించారు. అభినందనలు రేణుక గారూ!
(“మూడవ మనిషి” దీర్ఘ కవిత. రచన రేణుక అయోల, 8-3-677/ఎ/2, యూకో ఆర్కేడ్, ఫ్లాట్ నం.2, నవోదయ కాలని, యెల్లారెడ్డిగూడ, హైదరబాద్-500037. వెల రూ.50. ప్రచురణ జె.వి.పబ్లికేషన్స్.)

ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో…

Kasepu

-అరణ్య కృష్ణ

~

 

“కాసేపు” అంటూ ఒక 22 సంవత్సరాల క్రితం  తీరైన కవిత్వం చెప్పి మళ్ళీ కనిపించకుండా పోయాడు వాసు.  అంత మంచి కవులు ఏదో కాసేపు – అంటే ఒక ఐదారేళ్ళ పాటు కవిత్వం చెప్పి మళ్ళీ కలం పట్టుకోక పోతే ఎలా?  అలాంటీ వాసుని పరిచయం చేయటం ఈ వ్యాసం ఉద్దేశ్యం.  1987 నుండి 1994 వరకు సుమారు 7 సంవత్సరాల కాలంలో కేవలం ఒక 15 కవితలు మాత్రమే రాసిన వాసు కవితల్లో అధిక భాగం “ఆంధ్రజ్యోతి” వారపత్రికలోనే ప్రింటయ్యాయంటే కవిగా అతని సత్తా ఏమిటో తెలుస్తుంది.  ఆయన తన కవితల సంకలనం “కాసేపు” 1994లో ముద్రించారు.  ఈ సంకలనం నగ్నమునికి అంకితమిచ్చారు.

అతి సరళమైన వ్యక్తీకరణలో భావోద్వేగాల జుగల్బందీ వినిపించటం వాసు ప్రత్యేకత.  ఈయన కవితలు పల్లెలోనూ, సంస్కృతిలోనూ లోతైన పునాదులు కలిగివుండి బతుకుతెరువుకి నగరానికి వచ్చిన అనంతరం  కోల్పోయింది పొందలేక, ఉన్నదాన్ని స్వంతం చేసుకోలేని ఒక అస్తిమిత మానసిక స్థితిని తెలియచెబుతాయి.  వాసు చెప్పినట్లు “కాలం ముందుకే పోతుంది/మనసు వెనక్కి కూడా పోగలదు”.  ముందుకురుకుతున్న కాలంకి వ్యతిరిక్తంగా బాల్యంలోకి, బాల్యంలో మాత్రమే ఆస్వాదించగల మానవ సంబంధాల పరిమళాల్లోకి కవి జారుకుంటాడు.  అలా జారుకున్నప్పుడే “సంప్రదాయానికి నమస్కారం” అన్న కవిత వస్తుంది.  ఈ కవిత శీర్షికలో లేని కవిత్వమంతా కవితలో వుంది.

“అది ఎగరటానికి రెక్కలక్కర్లేని వయసు

అనుక్షణం ఆనందం ఒక్కటే మనకి నేస్తం

నేస్తం కట్టడమే పసిపిల్లల చాదస్తం”

 

“తుపాకీ పేలిస్తే పువ్వులు రాలేవి

కన్నీళ్ళు పోస్తే నక్షత్రాలు మొలిచేవి”

 

ఇంతకంటే సరళంగా బాల్యాన్ని నిర్వచించటం ఎవరికైనా సాధ్యమా?  గడిచిపోయిన కాలాల్లోకి దూకి బతికిన క్షణాల్ని నెమరేసుంటాడు కవి అలా.  ఎందుకంటే “బాల్యానికి కాలం పట్టదు / బాల్య స్మృతులకు కాలదోషం పట్టదు”

“నాకూ చెట్టుకూ పెద్ద తేడా ఏముంది?

పండిన ఆకుల ముడతలతో

పువ్వుల కవళికలతో

చెట్టు నాకు అద్దం పడుతుంది

నడుస్తూ నేను చెట్టుకు కదలికనవుతాను

వేళ్ళు భూమిలో పాతుకుపోయి

కదలలేని శక్తిహీన ఈ చెట్టు

కాళ్ళు కదపగలిగీ శక్తిహీనుణ్ణి నేను”

 

“చెట్టుతో సంభాషణ అనవసరం

చెట్టు దగ్గర దాపరికం అసాధ్యం”

 

“ఎవరో చెట్టుకున్నవన్నీ వొలిచేసి

మోకాళ్ళ మీద కూచోబెట్టారు”

 

“చెట్టూ చిగురిస్తుంది

చెట్టులా నిలిచిపోవటానికి

చెట్టంత ప్రయత్నం చేస్తూ” (ఎర్రగన్నేరు)

వాసులోని అనుభూతి కవితాధోరణికి అద్దం పట్టే కవిత ఇది.  మానవజీవితంలోని రకరకాల అనుభూతులన్నింటినీ చెట్టులో చూడగలిగిన కవి తన కవితా వస్తువుతో ఎంతగా తాదాత్మ్యీకరణం చెందగలడో ఈ కవిత నిరూపిస్తుంది.  పాఠకుడి మనసులో ముసురు పట్టించగల కవిత ఇది.

“ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో

రాత్రి ఒక్కణ్నీ మేల్కొని కూర్చుంటాను” అంటూ మొదలయ్యే “జననం” కవిత ఏకాంతాల చుట్టూ ఏర్పడే ప్రాకారాల్ని, తొలి కదలిక కోసం చేసే నిరీక్షణని వివరిస్తూ

“అసహనం చీకట్లో అనంతంగా పెరిగిపోయి

జిరాఫీ మెడలో కొండ చిలువ వొళ్ళు విరుచుకున్నప్పుడు

రాత్రిని ఉషస్సు జయిస్తుంది

టేబుల్ మీద మహా ప్రస్థానం

నన్ను కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పిస్తుంది” అంటూ ముగుస్తుంది.  జిరాఫీ దేహం మీద ప్రాకృతిక డిజైన్ని అసహనంతో వొళ్ళు విరుచుకుంటున్న కొండ చిలువ తో పోల్చటం కవి నిర్నిబంధ ఊహాశక్తికి అద్దం పడుతుంది.  టబుల్ మీద మహా ప్రస్థానం తనని కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పించటమే కవితా జననం.

పరాయి నగరంలో ఏదో ఒక రూంలో ఒంటరిగా బతికే బ్రహ్మచారి జీవితమో సంక్లిష్ట దశ.  కొంత విచిత్రంగానూ ఉంటుంది. పుస్తకాలు చదువుతూ, సిగరెట్లు ఊదిపడేస్తూ, బద్ధకంగా బతికేస్తూ….గొప్ప విచిత్రంగా ఉంటుంది.  రూం తాళం తీసుకుంటూ లోపలికెళ్ళిన ప్రతిసారి బహుళత్వాన్ని తలుపు బైటనే వదిలేసి లోపలికి  మళ్ళీ బైటకి వొచ్చేవరకు ఏకాత్మతో ఒక గొప్ప ఏకాంకిక నడుస్తుందిలే! అది అనుభవించినవాడికే తెలుస్తుంది (“అనుభవించిన వాడికే” అని ఎందుకన్నానంటే ఆడపిల్లలంత బుద్ధిగా మగపిల్లలుండరుగా రూముల్లో).  రూంలోని ఏకాంతంలోనే కవి తన సజీవతని, నిర్జీవితనీ కనుగొన్నాడు. మళ్ళీ రూంనుండి బైటకొచ్చినప్పుడెలా వుంటుంది మరి?

“నేను రూం బైట నిలబడి

తాళం వేస్తూ గడప మీద నించుంటే

ఆ దృశ్యం ఉబ్బిన పుట్టుమచ్చలోంచి

వెంట్రుక బైటపడుతున్నట్లుంటుంది”

మనసులోని సంక్లిష్టతని వివరించటానికి “ఉబ్బిన పుట్టుమచ్చలోంచి వెంట్రుక బైటపడటం”ని మించిన ప్రభావవంతమైన ప్రతీక ఏమన్నా వుంటుందా ప్రియ పాఠకులారా?

వాసు రాసిన మరో కవిత “కూల్ డ్రింక్ పార్లర్లో…..” పొద్దుట్నుండి రాత్రివరకు కూల్ డ్రింక్ పార్లర్లో పని చేసే బాల కార్మికుడి జీవన వ్యధార్తి దృశ్యం ఈ కవిత వస్తువు.  1988లో రాసిన ఈ కవిత ఇటువంటి వృత్తిగతమైన విచలిత దృశ్యాల్ని ఆవిష్కరించే కవితలకి నాంది అని నౌదూరి మూర్తిగారు అభిప్రాయపడ్డారు.  తల్లెత్తకుండా రబ్బరు సంచీలో ఐసుముక్కలేసి కర్ర సుత్తితో ముక్కలు చేసుకుంటూ పోయి ఎండిపోయిన ఐస్ కుర్రాడి కళ్ళల్లో స్వప్నసీమల కోసం కవి అన్వేషిస్తాడు.

“వాడలా వున్నప్పుడు

వాడలా వుండి పోవాలనుకున్నప్పుడు

రెండు ఐస్ తునకలు కంట్లో పడి

కళ్ళల్లో ఐస్ మేఘాలు కరిగి

వాడి చెంపల మీదుగా హిమవాహినీ చారికల్ని గీసి

కింద పడిపోతాయి”

“వాడి జీవితం చాలనంత మంచు

వాడి భవిష్యత్తులో వుంది”

ఎవరికైనా నోస్టాల్జియాలో జ్వరం రావటం ఖచ్చితంగా ఉంటుంది.  జ్వరం ఒక తియ్యని బాధ.  జ్వరం వచ్చినప్పుడు మీరు చాలా ప్రత్యేకం.  రోజూ మీతో పోట్లాడే వారికి మీ మీద అనురాగం చూపించే ఒక గొప్ప అవకాశం.  ఆ జ్వర తీవ్రతని కవి ఎలా వివరిస్తాడో చూడండి-

“దేహం పక్క మీదకి వాలగానే

నెత్తుర్లో మంచు ముక్కలు తేల్తాయి

ఉడుకు తగ్గిన నెత్తురు

చేతులోంచి వేళ్ళలోకి ప్రవహిస్తుంది

దట్టమైన అరణ్యంలో కొమ్మల్ని చీలుస్తూ

పాయలై తెగిన వెన్నెల్లాగ”

కానీ కవి అన్నట్లే “జ్వరమూ తరుచుగా రాదు”. అయ్యో కదా!

“లెక్క తెగట్లేదు” వాసు అత్యుత్తమ కవితల్లో ఒకటి.  తనకి లెక్కలు బాగా వివరించి చెప్పే మిత్రుడు నాయుణ్ని ఉద్దేశిస్తూ చెప్పిన కవిత ఇది.

“అప్పుడు నువ్వేం చెప్పే వాడివో!

నీ వెనుక నడుస్తూ నేనేం వినేవాడ్నో!

ఒక సముద్ర శాఖ దూసుకొచ్చి

ఒడ్డుని చీపురు కట్టలా ఊడ్చేసి

అఖండ భూభాగం చీలిపోవడం చెప్పేవాడివి

బతుకుతెరువు తోడలై

సరళ జీవన కాంక్షా కురంగాన్ని పట్టుకోవడానికి

పూలమొక్కల వెనక పొంచున్న సంగతి చెప్పేవాడివి”

తనకింత చెప్పిన నాయుడితో కవి చివర్లో ఏమంటున్నాడో వినండి.

“ఇవాళ నేను ఆ పాటలే వింటూ అవే లెక్కలు చేస్తున్నా!

లెక్క తెగట్లేదు నాయుడూ”

 

జీవితం ఎప్పుడూ తెగని లెక్కే. నిజానికి లెక్క తెగితే మాత్రం జీవితంలో మజా ఏముంటుంది?  మృత్యువు లోని అనూహ్యతే కదా జీవితం మీద ఆసక్తిని పెంచేది.  జీవితం లెక్క శాశ్వతంగా తెగేది మృత్యువుతోనే మరి.  అందుకే లెక్క తెగకపోవటమే ఆసక్తికరం.

మరికొన్ని మంచి కవితలతో పాటు ఇంకొన్ని అనువాద కవితలు కూడా “కాసేపు”లో కనిపిస్తాయి.  కాసేపట్లోనే చదవటం పూర్తయ్యే ఈ సంకలనం చాలాకాలం మీ మనసులో వుంటుంది. చదవండి. నిజానికి వాసు కవిత్వం చదువుకుపోవాల్సిన కవిత్వం.  ఈ పరిచయం కేవలం నామమాత్రమే. అదికూడా ఎందుకంటే వాసు కవిత్వాన్ని ఈ తరానికి పరిచయం చేయటంతో పాటుగా వాసుకూడా తానొకప్పుడు కవినేనన్న విషయం గుర్తు చేయటం కోసం, మళ్ళీ కవిత్వం వైపు పురికొల్పటం కోసం!

*

వెన్నెలదారుల్లో మంచుపూలవాన…

 

-అరణ్య కృష్ణ

~

 

కుప్పిలి పద్మ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.  ఆమె జగమెరిగిన స్త్రీవాద రచయిత్రి.  స్త్రీవాద దృక్పధంతో దాదాపు గత 20 సంవత్సరాలుగా ఎంతో క్రియాశీలకంగా రచనలు చేస్తున్నారు.  కథ, నవల, పత్రికా కాలం, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్….ఇలా అన్ని రకాల రూపాల్లోనూ స్త్రీవాద భావజాలన్ని బలంగా వినిపిస్తున్నారు.  అయితే ఏదో స్త్రీ స్వేచ్చ గురించి ఉపరితల స్పర్శతో వాపోవటంగా కాక మారుతున్న వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళి, అక్కడ వస్తున్న మార్పులు వ్యక్తుల మీద, తద్వారా మానవసంబంధాల మీద, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద చూపుతున్న ప్రభావాన్ని ఒడిసి పట్టుకోవటం, ప్రతికూల ప్రభావాల్ని తన స్త్రీ పాత్రలు అవగతం చేసుకొని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొనే విధానాన్ని సూచించటం కూడా ఆమె రచనల్లో కనిపిస్తుంది.

పద్మ మొత్తం ఆరు కథా సంకలనాలు వెలువరించారు.  ఒక్కో కథా సంకలనం లో స్త్రీలకి సంబంధించిన ఒక్కో అంశం బాటం లైన్  గా ఉంటుంది.

ఒక స్త్రీవాదిగా కుప్పిలి పద్మ తన కథల్లో సమాజాన్ని అవగతం చేయటమే ముఖ్యంగా కనిపిస్తుంది.  అస్తిత్వవాద సాహిత్యకారులందరిలాగే ఆమె ఏ సిద్ధాంత రాజకీయ దృక్పథానికి కట్టుబడినట్లు కనబడరు.  స్త్రీల అస్తిత్వం చుట్టూ మానవసంబంధాల్లో జరిగే రాజకీయాల్ని గొప్పగా పట్టుకున్నప్పటికీ ఎక్కడా వర్తమాన రాజకీయాల ప్రస్తావన వుండదు.  బహుశ ఈ విధానం వలన ఇంకా ఎక్కువమందికి తను రీచ్ అయ్యే అవకాశం వుండొచ్చని ఆమె భావన అయ్యుండొచ్చు.

ఆమె ఎంచుకున్న వస్తువుకి సంబంధించిన పాత్రల నివాస వాతావరణం, ఆహారం, వస్త్రధారణ, భాష….అన్నింటిమీద ఆమెకున్న మంచి పట్టు కనబడుతుంది.  అది హోటల్ కావొచ్చు లేదా ఇల్లు కావొచ్చు లేదా ఆఫీస్ కావొచ్చు…తన పాత్రలు సంచరించే, తన పాత్రల్ని ప్రభావితం చేసే వాతావరణాన్ని చాలా పకడ్బందీగా మన కళ్ళముందుంచగలరామె.  ఆమె తనకు తెలియని వ్యక్తుల జీవితం గురించి, వాతావరణం గురించి ఎప్పుడూ రాయలేదు.  ఇది కథకి ఎంతో బలాన్నిచ్చే అంశం.  ఆమె ప్రధానంగా అర్బన్ రచయిత్రి.   మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, అక్కడక్కడా ఉన్నత వర్గాల స్త్రీలే ఆమె కథానాయికలు.

ఇప్పటి సమాజంలో స్త్రీ ఒంటరి అయినా, వివాహిత అయినా సమస్యలు మాత్రం తప్పవు.  ఒంటరి స్త్రీలకు వారి కష్టాలు వారికుంటాయి.  చుట్టు పక్కల వారి మోరల్ పోలీసింగ్ పెద్ద సమస్య.  సింగిల్ వుమన్ అనగానే చుట్టుపక్కల వారికి అత్యంత సహజంగా చులకన భావం కలగటమో లేదా మోరల్ పోలీసింగ్ చేయటమో లేదా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చి పెత్తనం చేయటమో జరుగుతుంది.  స్వంత కుటుంబ సభ్యులైతే ఆమె సంపాదన మీద, కదలికల మీద, స్వేచ్చా భావనల మీద పెత్తనం చేస్తారు.  శ్రేయోభిలాషుల రూపంలో అధికారం చెలాయిస్తుంటారు.

ఈ సింగిల్ వుమన్ యాతనలన్నీ మనకు “ముక్త” (1997) సంకలనంలో  ఎక్కువగా కనబడతాయి.  ఈ కథల్లోని కథానాయికలు ఇన్నాళ్ళూ స్త్రీల మనశ్శరీరాల మీద అమలవున్న భావజాలాల్ని నిక్కచ్చిగా ప్రశ్నిస్తారు.  “ముక్త” కథలో వర్కింగ్ వుమన్ అయినా     ముక్త తన కుటుంబసభ్యుల చక్రబంధం నుండి విముక్తమయ్యే తీరే కథాంశం. ఇంక “కేసు” అన్న కథలో ఒంటరి స్త్రీని ఒక “కేసు”గా చూసే అనైతిక నైబర్స్ యొక్క విశృంఖల నైతిక పెత్తనం కనబడుతుంది.  “గోడ” కథ స్త్రీలు తమ శరీరాలపై తామెందుకు అధికారం కలిగి ఉండాలనే విషయంపై పద్మగారి సునిశిత అవగాహన, విశ్లేషణ తెలియచెప్పే కథ.  పురుషుడి పట్ల ప్రేమని, మోహాన్ని అధిగమీంచేంత నియంత్రణ ఆడవారికి తమ శరీరాలపై ఎందుకుండాలనే విషయాన్ని ఎంతో ప్రభావవంతంగా చెప్పిన కథ.  ఒక లిబరేటెడ్ వుమన్ అయినంత మాత్రాన స్త్రీలెందుకు ఆచితూచి సంబంధాలేర్పరుచుకోవాలో తెలియచెప్పే కథ.  “నిర్ణయం” కథలో స్త్రీ తను తల్లి అవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం స్త్రీకే వుండాలని బలంగా చెప్పిన కథ.   సూటిపోటి మాటలతో ఎటువంటి సంకోచం లేకుండా దాడి చేసే మొగుళ్ళు,  కొంతవరకు ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ముందుకొచ్చిన పురుషుల్లోనూ కీలకమైన సమయాల్లో స్త్రీకి మద్దతుగా నిలవలేని తనం, వారి దృష్ఠిలో స్త్రీ-పురుష సంబంధాల్లో అస్తిత్వ గౌరవం కంటే శారీరిక సంబంధమే ప్రధానంగా మిగిలిపోవటమే బాధ కలిగించే విషయంగా “నిర్ణయం, గోడ” వంటి కథలు చెబుతాయి.  “విడీఅరెల్” అన్న కథలో పెళ్ళైన యువతి గైనిక్ సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోలేనితనం, ఎవరూ బాధని అర్ధం చేసుకోకుండా ఏకాకిని చేయటం కథాంశం.  అత్యంత సహజమైన శారీరిక సమస్యల్నెదుర్కోవటంలోని ఏకాకితనపు దుర్భరతనాన్ని విశదంగా చిత్రించిన కథ అది.

“మసిగుడ్డ” కథ స్త్రీ సంసార నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వున్నప్పటికీ , ఆమెకు దక్కే అప్రాధాన్య గుర్తింపుని ఎత్తిచూపుతుంది.  పిల్లలు పైకొస్తే “నా పిల్లలు” అని గర్వంగా చెప్పుకునే భర్త అదే పిల్లలు తప్పటడుగు లేస్టెనో లేదా వెనకబడిపోతేనో “ఏం చేస్తున్నావ్ అసలు? నీ పెంపకం అలా ఏడిసింది” అంటూ భార్యని నిష్ఠూరమాడతాడు.  వంటగది తుడుచుకోవటానికి ఉపయోగించే మసిగుడ్డ లాంటి అస్తిత్వాన్ని మోసే స్త్రీల ఆవేదన ఈ కథలో ప్రస్ఫుటంగా కనబడి మనల్ని విచలితుల్ని చేస్తుంది.  “ఆడిపాడిన ఇల్లు” ఒక వైవిధ్య కథాంశం.  తను ఆడిపాడి పెనవేసుకుపోయిన ఇంటికి సంబంధించిన నోస్టాల్జియా ఈ కథాంశం.  శిధిలమైన ఆ ఇల్లు తిరిగి కొనుక్కునే అవకాశం వచ్చినా వసుధ వద్దనుకుంటుంది.  శిధిలమైపోయిన ఇంటిని చదును చేసి ఓ మూడంతస్తుల ఇల్లు కట్టొచ్చు కానీ  ఆ నాటి ఇల్లవదుగా? “ ఆ నాటి బాల్యస్మృతుల ఆనవాలు లేని ఆ ఇల్లెందుకు? వద్దు” అనుకుంటుంది.  ఇలాంటి సున్నిత భావుక ప్రధానమైన అంశంతో కూడిన కథ కూడా ఈ సంకలనంలో వుండటం విశేషమే.

“సాలభంజిక” (2001) కథా సంకలనంలోని కథలు విశ్వవ్యాపితమై, మూడో ప్రపంచపు మానవసంబంధాలను అతలాకుతలం చేస్తున్న గ్లోబలైజేషన్ మీద రాసినవే.  గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే మేధావులు సైద్ధాంతికంగా, ఆర్ధికాంశంగా దాన్ని వ్యతిరేకిస్తే రచయితలు అవి సామాన్యుల జీవితాల్ని అల్లకల్లోలం చేసే తీరుని ఒడిసిపట్టుకోవాల్సి వుంది.  పద్మ గారు ఈ బాధ్యతని గొప్పగా నిర్వహించారు.  “ఇన్ స్టెంట్ లైఫ్” కథలో చిన్న చేపని పెద్ద చేప చందంగా పెట్టుబడి బలంతో ఇడ్లీబండీ ని ఒక ఆధునిక ఈటింగ్ జాయింట్ మింగితే,  దాన్ని మరో స్టార్ హోటల్ మింగుతున్న క్రమానికి సమాంతరంగా కథానాయకి మునీరా జీవితంలో వచ్చిన మార్పులను అనుసంధానిస్తూ చెప్పిన తీరు విస్మయం కలిగిస్తుంది.  ప్రపంచీకరణ బాంకుల దగ్గర ఆగిపోకుండా పడగ్గదుల్లోకి చొచ్చుకొచ్చిన వైనాన్ని చెప్పిన కథ ఇది.  మనిషిని మనిషి అర్ధం చేసుకోవటానికి కార్పొరేట్ ప్రపంచానుకూల వ్యక్తిత్వ వికాస తరగతులు అనివార్యమైన విషాద సందర్భంలో రాసిన కథ ఇది.

“ప్రకంపనం” కథ కార్పొరేట్ రంగం అన్ని సామాజిక పార్శ్వాలకూ వ్యూహాత్మకంగా విస్తరించి వృత్తులను, బతుకు తెరువును పెట్టుబడితో కొల్లగొట్టి, బతుకుల్ని లొంగతీసుకునే క్రమాన్ని, ఈ లొంగుబాటు ఫలితంగా మనుషుల అంతరాత్మల్లోనూ, జీవనశైలుల్లోనూ వచ్చిన మార్పులవల్ల కంపేటిబిలిటీ చెడిపోయి అగాధాలు ఏర్పడిన తీరుని వెల్లడించిన కథ.  ఈ కథలో కార్పొరేట్ వ్యూహాల్ని కూడా సమర్ధవంతంగా చెప్పటం జరిగింది.  ఆర్ధిక పశుబలంతో వస్తువులను మార్కెట్లో తక్కువకు సప్లై చేసి, తద్వారా దేశీయ పెట్టుబడిదారులకు నష్టం కలిగించి, వారు తమ కర్మాగారాలను తమకే అమ్మేసే పరిస్తితి కలిపించి, టేకోవర్ చేసుకున్నాక, పోటీ ఉత్పత్తిదారుడు లేని పరిస్తితుల్లో ఉత్పత్తుల ధరల్ని పెంచేసే కార్పొరేట్ మాయాజాలాన్ని తేటతెల్లం చేసిన కథ ఇది.

“సాలభంజిక” కథ కార్పొరేట్ వ్యాపారం ప్రవేశపెట్టిన ఎస్కార్ట్ విధానం (విదేశీయులు భారత్ వచ్చినప్పుడు వారికి “తోడు”గా వుంటూ ఉల్లాసం కలిగించటం) ఊబిలోకి అమ్మాయిలు ఎలా జారిపడతారో, ఫలితంగా వారి మానసిక, శారీరిక ఆరోగ్యాలు సంక్షోభంలోకి ఎలా వెళ్ళిపోతాయో చెప్పే కథ.  అమ్మాయిల దయనీయ కుటుంబ పరిస్తితులు, భావోద్వేగాల బలహీనతల్ను స్వార్ధపరులు ఎలా ఉపయోగించుకుంటారో చెప్పే కథ ఇది.  ఈ కథ చదివాక మనసు కకావికలమై పోతుంది.   “కుబుసం” కథ కుటుంబ సంబంధాల్లో సరసరా సంచరిస్తూన్న కార్పొరేట్ పాము కక్కే విషం మీద కథ.  లాభార్జనే ధ్యేయంగా మసలే కార్పొరేట్ సంస్కృతికి అనుకూలంగా కుటుంబసంబంధాల్ని పునర్నిర్వచించే యంత్రాంగాన్ని బట్టబయలు చేసే కథ.  కుటుంబం దగ్గరుంటే, సహచరి పక్కనుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉద్యోగులు పనిచేస్తారనే కార్పొరేట్ లాభాపేక్ష ఒక కుటుంబంలో పెట్టిన చిచ్చు ఈ కథాంశం.

“మంచుపూల వాన” (2008) సంకలనం లోని కథలు ప్రేమ, కుటుంబం, దాంపత్యం వంటి విషయాల్లో స్త్రీల భావోద్వేగాలకు సంబంధించిన కథలు.  ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొనే ఎమోషనల్ వయోలెన్స్ గురించి రాసిన కథలు.  “వర్షపు జల్లులలో” కథ సాధారణంగా అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఉండే ఆకర్షణ, అమ్మాయిలకు అబ్బాయిల పట్ల కలిగే భావోద్వేగ స్పందనలతో డీల్ చేసిన కథ.  ఇందులో కథానాయకి మహి తల్లి దెబ్బతిన్న కూతురికి చెప్పే మాటలు చాలా బాగుంటాయి “కొన్ని సార్లు గాయపడటం అనివార్యం. అవసరం. ఒక కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది.”  “మంచుపూల వాన” కథ పెళ్ళికి ముందున్న విలువలు మర్చిపోయి డబ్బు మనిషిగా తయారైన భర్త నుండి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని ఎదుర్కొని అతని నుండి బైటపడ్డ మేఘ కథ.  రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చే ఇన్స్టెంట్ లాభం మనుషుల్ని ఎంతగా పతనం చేస్తుందో చెప్పే కథ ఇది.   “చలెగచలెగా యే ఇష్క్ కా జమానా” కథ కొంత హిలేరియస్ గా సాగుతుంది. ఈ సంకలనంలో ఇదో భిన్నమైన కథ.  తన గర్ల్ ఫ్రెండ్ ప్రేమని పొందటం కోసం ఆమె సామాజిక బాధ్యతగా ఫీలయ్యే విషయాల్లో పాలు పంచుకొనే కుర్రాడి అవస్థ భలేగా అనిపిస్తుంది.  “మంత్రనగరి సరిహద్దులలో” కథ  మంత్రముగ్దంగా సాగే కథ.  ఈ కథలో భావోద్వేగాల హింస కనబడదు కానీ ప్రేమ పట్ల స్త్రీ భావోద్వేగాల ఫోర్స్ కనబడుతుంది.  హృద్యమైన మోహప్రపంచం గురించి పద్మగారి భావుకత పరవళ్ళు తొక్కిన కథనం వున్నదిందులో.   ఒక ఆత్మగౌరవంగల స్త్రీ తనంత తానుగా మోహపడాలంటే  పురుషుడిలో ఎటువంటి ప్రవర్తన వుండాలో సూచించే కథ ఇది.

“వాన చెప్పిన రహస్యం” ఒక వైవిధ్యపూరితమైన కథనంతో సాగుతుంది.  తనని ప్రేమించలేదని క్లాస్ మేట్ మీద కత్తితో దాడి చేసిన యువకుడికి తనకు తెలియకుండానే, అనుకోకుండా ఆశ్రయమిచ్చిన అమ్మాయి కథ ఇది. ప్రేమ గురించి, ప్రేమైక అనుభవం గురించి తనకు ఆశ్రయమిచ్చిన ఆ అమ్మాయి ఆలోచనలతో ఇంటరాక్ట్ అయిన కుర్రాడి పరోక్ష కథ ఇది. “సెకండ్ హజ్బెండ్” కథలో భర్త చనిపోయాక రెండో వివాహం చేసుకున్న యువతి యాతన కథాంశం.  ఆ రెండో భర్త ఇంట్లో తన మొదటి భార్య పటం పెట్టుకోగలడు.  ఆమె పుట్టినరోజుని ఘనంగా చేయగలడు. అందుకు అందరూ అతన్ని ఎంతో మెచ్చుకుంటారు కూడా.  కానీ తన రెండో భార్య తన దివంగత భర్త ఫోటోని అతని వర్ధంతి రోజున బైటకి తీస్తే తట్టుకోలేక పోతాడు.  అతని తల్లి కూడా అభ్యంతర పెడుతుంది.  అతను తన కోపాన్ని లైంగిక హింసలో చల్లార్చుకుంటాడు.  ఇటువంటి పడగ్గది హింసని విచారించే ఏ న్యాయ వేదికలూ ఉండవు.  మంచాల మీది నేరాలు ఏ చట్ట పరిధిలోకీ రావు.  అయితే ఈ కథలన్నింటిలోనూ ముఖ్య పాత్ర సమాజాన్ని, అందులో భాగమైన తననీ అర్ధం చేసుకుంటుంది.  ఎలా నిలబడాలో తెలుసుకుంటుంది.

“ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్” కథ దర్శన, విహాస్ ల మధ్య వుండీ లేనట్లుగా దోబూచులాడే ప్రేమ భావన కథాంశం. వారి మధ్య ప్రేమ అసత్యం కాదు.  కానీ అది సజీవమూ కాదు.  బతకాలంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మరొకరికి లొంగాలి, అబద్ధాలు చెప్పాలి.  ఇంకెక్కడి అమాయకత్వం, స్వచ్చత?  “నా స్నేహితురాలి పేరు సుధీర” కూడా క్విక్ మనీ, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ల క్యాట్ రేస్ లో తనని, తన మనసుని, ఆ మనసులోని సున్నితత్వాన్ని మర్చిపోయి, చివరికి జీవితంలో చతికిల బడ్డ స్నేహితుణ్ని అక్కున చేర్చుకొని “ఇది మన జనరేషన్ క్రైసిస్.  ఇది గ్లోబల్ ఎకానమీ సృష్ఠించే వికృతం” అని ఓదార్చిన సుధీర కథ.   పెళ్ళి చేసుకుంటే తనకొక ఇల్లు ఏర్పడటం కాకుండా తను పెళ్ళి చేసుకున్న వాడింటికి తను వెళ్ళటమనే పరిస్తితి మీద తెలివిగా తిరుగబాటు చేసిన గ్రీష్మ కథ “ఫ్రంట్ సీట్”.

స్త్రీ శరీరాన్ని సరొగసీ రూపంలో సరికొత్త పద్ధతిలో వెలగట్టి వాడుకునే ప్రపంచీకరణ విశృఖలత్వం “మదర్ హుడ్ @ రియాలిటీ చెక్” కథలో కనబడుతుంది.  ఈ కథ ఒక ప్రత్యేక కథనంతో పరుగులు పెడుతుంది.  అద్దె గర్భం చుట్టూ వ్యాపారం చేసే వికృతస్వభావాలు బట్టబయలు చేస్తారు రచయిత్రి.  “హ్యుమన్ టచ్” ఎలిమెంటుతో ఎక్కువ టి.ఆర్.పి.ల కోసం లేని మెలోడ్రామా కోసం ప్రయత్నం చేసే చానెళ్ళ వాళ్ళు, ఎక్కడికక్కడ దండుకునే మధ్యవర్తులు, వచ్చిన సొమ్ముని దోచుకునే కుటుంబసభ్యులు అంతా స్త్రీ గర్భం మీద ఆధారపడే వాళ్ళే. చాలా కదిలించే కథ ఇది.  “గాల్లో తేలినట్లుందే” కథ యువత ఎలా పెడదారి పడతారో, వారు అలా పెడదారి పట్టడాన్ని ప్రోత్సహించే వ్యాపార సంస్కృతి ఏమిటో తెలియచెప్పే కథ.  “మౌన” కథ చాలా భిన్నమైన కథ.   ఇద్దరు స్త్రీల మధ్య పుట్టిన అనురాగం శారీరిక అనుబంధంగా ఎదిగిన తరువాత ఏర్పడిన కల్లోలాన్ని వివరించే కథ.  ఎన్.వేణుగోపాల్ ఈ సంకలనానికి ముందు మాటలో రాసినట్లు “ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవటాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్ధం చెసుకోవలసి ఉంది. అది సంఘ్ పరివార్, ఖాఫ్ పంచాయితీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురుషాధిపత్య అర్ధంలో మాత్రమే  జరగడం లేదు. సంక్లిష్ట, అసాధారణ రూపాల్లో జరుగుతున్నది”.  ఆ అసాధారణ, సంక్లిష్ట రూపాలన్నింటినీ తన కథల్లో పద్మ గారు ప్రస్ఫుటంగానే చూపించారు.

ఆమె కథలన్నీ వర్ష బిందువులు, చిరుజల్లులు, పున్నాగపూలు, మంచు ముత్యాలు, తుషారాలతో నిండి వుంటాయి.  ఒక్కోసారి కథలో ప్రవేశించటానికి ఈ ప్రకృతి మోహం కొన్ని ఆటంకాల్ని కలుగచేస్తుంది కూడా.  ఇంక పాత్రల పేర్లైతే గ్రీష్మ, ధాన్య, దక్షిణ, సుధీర, దర్శన వంటి అందమైన పేర్లతో అలరారుతుంటాయి.  జీవితం ఎంత బీభత్సంగా ఉన్నా సరే,  మొత్తానికి పాత్రలన్నీ జీవితంతో ఘర్షణ పడుతుంటాయి.  మర్రిచెట్లు కూలుతున్న నేపధ్యంలో అవి లొంగిపోకుండా తుఫాను గాలికెదురొడ్డి నిలబడ్డ చిన్న మొక్కల్లా తమని బతికించుకుంటాయి.  అందుకే ఈ కథలు చదివాక జీవితం మీద ధైర్యం, ఆత్మ విశ్వాసం కలిగించే అవకాశం వుంది.  పద్మగారి కథల్లో అమ్మ పాత్రకి చాలా విలువుంది. చాలా కథల్లఉజ జీవితాన్ని అర్ధం చేసుకోవటంలో అమ్మ చాలా దోహదం చేస్తుంది.  అమ్మ అంటే ఒక గొప్ప సపోర్ట్ అనే భావన బలంగా కలుగుతుంది.

సమాజం మీద, జీవితం మీద అపారమైన అవగాహన, నమ్మకం మాత్రమే కాక ప్రేమని కూడా కలిగివున్న కుప్పిలి పద్మ ఇప్పటికే తనదైన సంతకం చేసారు.  ఆమె నుండి మరిన్ని మాస్టర్ పీసెస్ ఆశిస్తూ…

peepal-leaves-2013

అడివిలోంచి దూసుకొచ్చిన అక్షరం..

 

-అరణ్య కృష్ణ

~

 

“అన్నా! నేనిప్పుడు బతుకుతున్నది నా బోనస్ లైఫ్.  నేనో మెడికల్ వండర్ని”..ఇదీ అరుణ్ సాగర్ కొన్నాళ్ళ క్రితం నాతో అన్న మాటలు.

తన సున్నితమైన గుండెకున్న ఒక్క ఊపిరితిత్తితోనే కవిత్వాన్ని, జీవితాన్ని శ్వాసించినవాడు అరుణ్.  పైకి హాండ్సం గా, హుషారుగా మాట్లాడే అరుణ్ లోపల కొన్ని ముఖ్యమైన అవయవాలు శిధిలమైపోయాయి.  గాజుబొమ్మలాంటి శరీరంతో తరుచూ అస్వస్థతకు గురౌతూ కూడా జీవితాన్ని అద్భుతంగా ప్రేమించినవాడు.  మృత్యువు గుమ్మం ముందు కూర్చొని వుంటే దాన్ని కన్నుగీటి తోసుకుంటూ వెళ్ళినవాడు.  2012 నుండి అదనపు జీవితాన్ని గడుపుతున్నానన్న సంబరంలోనే వుండేవాడు కానీ చావు తనచుట్టూ తారట్లాడుతుందనే భయంలో మాత్రం వుండేవాడు కాదు. ఆకర్షణీయంగా వుండటం, అంతే ఆకర్షణీయంగా రాయటం అరుణ్ వ్యక్తిత్వంలో భాగమే.  ఎంత విభిన్నంగా కనిపించేవాడు.  ఫార్మల్ గా డ్రెస్ చేసుకున్నా, లేదా క్యాజువల్‌గా జీన్స్ వేసుకున్నా అతని స్టైలిష్ యాటిట్యూడ్ కనిపిస్తుంది.   ఫ్రెంచ్ కట్ బియర్డ్ తో, కళ్ళజోడులోంచి చూస్తూ చేసే మందహాసం మనోహరంగా వుండేది.  విభిన్నంగా ఆలోచించటం,  కళనీ, కౌశలాన్ని ఒకే స్థాయిలో మిళితం చేసి వైవిధ్యంగా వ్యక్తీకరించటం అరుణ్ కే చెల్లింది.

ఒక కవిగా, కాలమిస్టుగా, పాత్రికేయుడిగా “బుల్స్ ఐ” లోకి గురిచూసి కొట్టే మాట అతనిది.  పాలకులు సామాన్య ప్రజలకు పెట్టే భ్రమల గుట్టు విప్పి చెప్పటంలో కానీ, అభివృద్ధి పేరుతో సిద్ధం చేస్తున్న విధ్వంస ప్రణాళికల్ని బట్టబయలు చేయటంలో కానీ తిరుగులేని నిబద్ధత చూపిన వ్యక్తి, శక్తి అరుణ్!  అతను స్పర్శించని అంశం ఏమిటి?  సినిమా, జెండర్, సామాజికాభివృద్ధి, మానవ వికాసం, కృంగిపోతున్న పల్లెలు, “అభివృద్ధి” చెందుతున్న నగరాలు, రాజకీయాలు, బాల్యం, ఆర్ధికాంశాలు, ప్రపంచపరిణామాలు, యుద్ధాలు…ఇలా అతను ముట్టుకోని అంశం ఏదీ లేదు.  సృజనాత్మక పద ప్రయోగంతో, లలితతమైన భాషద్వారా దారుణవాస్తవాల్ని వొక ప్రవాహవేగంతో సాగిపోయే అతని శైలీవిన్యాసం మనల్ని చకచ్చకితుల్ని చేస్తుంది.  దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.  జ్ఞానాన్నిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఉడుకెత్తిస్తుంది.  ప్రేరేపిస్తుంది.

“హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేసా” అని చంద్రబాబన్నప్పుడు ఆ అభివృద్ధి ధనవంతుల ఇళ్ళల్లో వాటర్ ఫౌంటేయిన్ల నుండి వారి ప్రహరీలు దాటి బైటకొచ్చే నీటి జల్లని తేల్చిపారేసాడు.  నగరాల స్త్రీల వెతల్ని మాత్రమే ఫోకస్ చేసే మీడియా టీ.ఆర్.పి. లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్న గ్రామీణ స్త్రీల గురించి పట్టించుకోదని ఈసడించాడు.  స్మశానవాటికకు ఎదురుగా అందమైన అమ్మాయి హోర్డింగుని చూసి నవ్వుకున్నాడు.  బాహుబలి గురించి అంతర్జాతీయ స్థాయని తెగ ఊదరగొడుతుంటే “ఈ బూటకపు కబుర్లని కట్టిబెట్టండి, సీరియస్లీ” అని హెచ్చరించాడు.  “అవతార్” సినిమా పరమార్ధాన్ని అద్భుతంగా విశదీకరించాడు.  పురుషుడంటేనే దుర్మార్గుడని, నయవంచకుడన్న ముద్రని నిరసిస్తూ “మేల్ కొలుపు”, “మియర్ మేల్” సంకలనాలు రాసాడు.  అందరూ అమ్మని కీర్తిస్తారే కానీ నాన్న శ్రమని, బాధ్యతని గుర్తించరని ఎత్తిచూపాడు.  “ఓ తండ్రీ నిను దలంచి” అని నాన్నను స్మరించుకున్నాడు.  ఆధునిక సమాజంలో నాన్న పాత్రకున్న విలువని ఎలిగెత్తి చాటాడు.  దేని గురించి రాసినా, ఎలా రాసినా, వచనం రాసిన, కవిత్వం రాసినా అందులో తనదైన విశిష్ఠ వాక్యంతో  కవిత్వమే రాసేవాడు. ఇంగ్లీష్, తెలుగుల సమ్మేళనంతో అతని వాక్యం పరిమళించేది.

ఇంక అరుణ్ కవిత్వం గురించి కొత్తగా చెప్పేదేముంది?  అదో జీవధార.  సామాన్యుడి కడుపుమంట అది.  అతని తాజా సంకలనం “మ్యుజిక్ డైస్” అతను మనకిచ్చిన చివరి కానుక.  పోతూ పోతూ ఒక సాహిత్య ఉద్యమ బాధ్యతని మన చేతుల్లో పెట్టిపోయాడు.  ఇంకా ఆ పుస్తకం గురించి “అరుణ్ చాలా బాగా రాసావు. ధన్యవాదాలు భాయి” అని మనం చెప్పే లోపలే తన బోనస్ జీవితాన్ని కత్తిరించేసుకొని వెళ్ళిపోయాడు.  బహుశ “మ్యుజిక్ డైస్” గురించే జీవితాన్ని పొడిగించుకున్నాడేమో! ఇంకా కొన్నాళ్ళ తరువాత ఈ పుస్తకం తెచ్చుండాల్సింది అరుణ్, నువ్వింకా కొన్నాళ్ళుండేవాడివేమో!  “మ్యుజిక్ డైస్ అను ఒక మరణవాంగ్మూలము” అన్న ఈ సంకలనంలో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నశించిపోనున్న ఆదివాసీలందరి తరుపున వాంగ్మూలం ఇచ్చి తను మరణించాడు అరుణ్.

జాతుల్ని, వాటి సంస్కృతుల్నే కాదు ప్రకృతిని, పర్యావరణాన్ని అభివృద్ధి పేరుతో ధ్వంసించే పాలకుల దళారీ చర్యల మీద ఏదో ఒక కవిత రాసి ఊరుకోలేదు.  ఒక కవితల సంకలనమే తెచ్చాడు అరుణ్.   ఇది అరుణ్ సాగర్ మాత్రమే చేయగల మహత్కార్యం. ఎంత ఆవేదన, జ్ఞానం, అవగాహన, నిబద్ధత, పోరాట పటిమ లేకపోతే ఇంత గొప్పపని చేయగలడు?  అమరవీరుల స్తూపం ముందు ఎగురుతున్న ఎర్రజెండాకి పిడికిలెత్తి లాల్ సలాం చెబుతూ సగర్వంగా ఫోటో వేసుకొని తన పుస్తకాన్ని “పోడు కోసం గూడు కోసం తునికాకు రేటుకోసం అటవీహక్కుల కోసం జెండాలై ఎగిరిన తల్లులకు తండ్రులకు అక్కలకు అన్నలకు” అంకితమిచ్చిన అరుణ్ ప్రాపంచిక దృక్పధం తేటతెల్లమే.

 

“చెట్టుపుట్టలు కూలుస్తున్న ఒక పొక్లయిన్

గుండె బరువెక్కి మొరాయించినది

కానీ ఒక్క మట్టిపెళ్ళా పెకిలించలేక కూలబడినది

కాంక్రీటు మర ఒకటి నిస్సహాయంగా  తిరుగుతూనే ఉన్నది

ఆ శబ్దము దుప్పిపిల్ల అరణ్య రోదనలాగున్నది

సాయిల్ టెస్ట్

మట్టినింపిన పరీక్ష నాళిక రక్తముతో చెమ్మగిల్లినది

 

నది దిగులుపడి లుంగలు చుట్టుకు పోతున్నది

అమ్మ ఒడిలో చేరి 

వాగులు వంకలు ఏరులు పారులు

భోరున సుడులు తిరిగి

దుఖపడి పెగిలిపోతున్నవి”...అంటూ అడవితల్లి తరపున, ఆ తల్లి బిడ్డలకోసం మరణశోకాన్ని ఆలపించినవాడు అరుణ్.  “అరణ్యాన్ని ఆవాసాన్ని ఆవరణాన్ని లేడిపిల్లల్ని అడవి బిడ్డల్ని రెవిన్యూ రికార్డుల్నుండి తొలగించే” పాలక ముష్కర చర్య గురించి మనల్ని హెచ్చరించాడు.

“కథలు కన్నీళ్ళు

కూలిపోతున్న ఇళ్ళు

ఇళ్ళ నిండా  నీళ్ళు

ఇళ్ళ కళ్ళ నిండా నీళ్ళు

లక్ష టియంసీల నీళ్ళు

వెల్లికిలా తేలియాడుతున్న

కోటానుకోట్ల కళ్ళు

ఇంతింత కళ్ళేసుకున్న ఈళ్ళు

కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న గాధలు

అన్నా…మన కథలు“…అంటూ బావురుమన్నవాడు మనవాడు అరుణ్!

నశించబోతున్న నది మెరిసేలా నవ్వే సీదర సెంద్రయ్య గురించి, ఒడ్డున బతుకుతున్న రావిచెట్టు గురించి, ఒక పోరగాడు విసిరిన గులకరాయి గురించి, ఒక పోరి చూసిన పచ్చని, వెచ్చని చూపు గురించి బెంగ పెట్టుకున్నాడు అరుణ్. భోరుమన్నాడు అరుణ్.  కోపగించాడు అరుణ్. మనల్ని రెచ్చగొడుతూ దుడుకుగా తనెళ్ళి పోయాడు అరుణ్.  ఎక్కడికెళ్ళాడు అరుణ్?  ఈ మనుషులు, నేల, దేశం, ఖండం, మొత్తం భూమి, ఈ సౌరకుటుంబం, ఈ పాలపుంత చాలక అంతరిక్షంలో మన పొరుగున వున్న గెలాక్సీ “ఆండ్రొమెడా”ని కూడా ప్రేమించిన అరుణ్ తన పుస్తకాలన్నీ “ఆండ్రొమెడా ప్రచురణలు” కింద ముద్రించి మురిసిపోయాడు. బహుశ అక్కడ సేద తీరుతున్నాడేమో!

సమాజానికి అతనో మేధావి, కవి, కాలమిస్ట్, జర్నలిస్ట్ కావొచ్చు.  అతని పరిచయస్థులకు మాత్రం అతనో గొప్ప మానవీయ వనరు.  అద్భుత స్నేహశీలి.  నిరాడంబరుడు.  అతనికి నేను గొప్ప ఆప్తుణ్ని కాను కానీ చాలా మంచి పరిచయం వుంది.  కవి శ్రీకాంత్ పెళ్ళిలో నాకు పరిచయం అయిన మొదటి సారి నుండి “అన్నా” అనే పిలిచే వాడు.  “మీ సంకలనం నాకెవరు ఇచ్చారో తెలుసా? త్రిపురనేని శ్రీనివాస్ ఇచ్చాడు. అది మీ కవిత్వమనే కాదు త్రిశ్రీ ఇచ్చినందుకు కూడా భద్రంగా ఉంచుకున్నాను” అంటూ చెప్పాడు.  ఆ రకంగా ఒక ఆపేక్ష బంధం ఏర్పడింది అతనితో.  మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆవిష్కరణ సభలు, సాహిత్య సమావేశాల్లో తరుచూ కలిసాను.

చివరిసారిగా మొన్న జనవరి 24న తెలుగు యూనివర్శిటీలో కలిసాను.  అప్పుడే “అన్న అరణ్యకృష్ణకు” అంటూ రాసి “మ్యుజిక్ డైస్” ఇచ్చాడు.  అరుణ్ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు.  చుట్టూ పెద్ద స్నేహబృందం ఉంటుంది.  ఒక టీవీ చానెల్‌కి సీయీవో స్థాయిలో వున్నా ఎక్కడా ఆ దర్పం కనిపించనిచ్చేవాడు కాదు. సాహిత్య సమావేశాల తర్వాత ప్రెస్ క్లబ్ కి తీసుకెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టేవాడు.  అటువంటి ఆత్మీయ జ్ఞాపకాలు నాబోటి మిత్రులెందరికో పంచాడు.  వాళ్ళ ఆఫీసుకి రమ్మంటే ఒకసారి వెళ్ళాను.  నేనో మామూలు గుమస్తాని.  సాంఘికంగా నాకంటే ఎన్నో రెట్ల పరపతి ఉన్న పొజిషన్లో వున్నా ఎక్కడా అది కనిపించలేదు.  చాలా సహజంగా వుండేవాడు.  వాళ్ళాఫీసులో కాసేపు కూర్చొని తిరిగి వెళ్ళిపోతుంటే కింద దాకా వచ్చి సాగనంపాడు.  ఎంతమందికుంటుంది అంతటి డీక్లాసిఫైడ్ ప్రవర్తన, నిరాడంబరత?  అరుణ్, నువ్వు నీ సాహిత్యాన్నే కాదు ఒక ప్రవర్తనని కూడా ఇచ్చి వెళ్ళావు.

ఇంక ఆపేస్తున్నాను.  నీ కడపటి చూపు కోసం వెళ్తున్నాను. నిన్ను కడసారి చూసాక నేనీ నాలుగు ముక్కలు కూడా రాయలేనేమో! అందుకే ఇప్పుడే హడావిడి పడుతున్నాను. క్షమించు అరుణ్, ఇంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు.

“పుష్ప విలాపమో, బతుకు విషాదమో నీ జనమే పోరాడుతున్న చోటా కనీసం గొంతైనా కలపకపోవటం నేరం! కవిత ఆచరణకు సాటిరాదు.  అయితేగియితే ఒక సహానుభూతి. ఒక మద్దతు ప్రకటన. ఒక విధాన అనుసరణ.  ఒక ధైర్యవచనం.  ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటని చూసి వ్యధ లోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం. ఇది మరణవాంగ్మూలం వినిపించడం మాత్రమే.  మిలార్డ్!  ఆపై రేలపాట ఫీనిక్స్ వలె ఆకాశం నుండి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వణుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి నమూనా మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.” (అరుణ్ సాగర్ “మ్యుజిక్ డైస్” కి రాసుకున్న ముందుమాట నుండి)

*

 

ఓడిపోని యుద్ధం గురించి నీతో…

-అరణ్య కృష్ణ
~
అవమాన గరళాన్ని దుఖపు బిరడాతో గొంతులోనే ఒత్తిపట్టిన నీలకంఠా!
నీలిజెండా రెక్కలతో ఎగురుకుంటూ ఎచటికి పోయావీ రాత్రి?
కులమతాల వైతరిణీలకు తావులేని
ఏ నక్షత్రాల వీధిలో రోదశీ మానవుడిగా విహరిస్తున్నావు రోహిత్?
నానా రకాల మృతపదార్ధాలతో కుళ్ళిపోయిన హృదయాల మధ్య
పుట్టుకే ఓ భయంకర ప్రమాదమైన వ్యవస్థలో
దేహానికి హృదయానికి మధ్య వైరుధ్యం  నీ ఒక్కడిదేనా?
అంతర్వీక్షణలో చీకటికోణాల మీద అబద్ధపు ముఖమల్ దుప్పట్లు కప్పి
రాక్షస ముఖాల వికృతత్వాన్ని మర్యాదల మేకప్‌లో దాచేసుకునే దుర్మార్గులమే కదా  మేమంతా!
చావు పుట్టుకలనే రెండు శిఖరాగ్రాల మధ్యలోని జీవితం లోయ మీద
అప్పుడే మొలిచిన రెక్కలను కూడతీసుకొన్న తూనీగలా
స్వేచ్చగా ఎగరాల్సిన నీ బాల్యం
వేల ఏళ్ళ సాలెగూడులో
నువ్వు పుట్టకముందే చిక్కుకుంది రోహిత్!
ఇల్లంటే మానవసంబంధాల వేదిక కాదని
ఇల్లంటే ప్రేమానురాగాల పండగ కాదని
ఇల్లంటే ఆత్మలు చచ్చిన మనుషులు సాగించే నిరంకుశ పాలనా వ్యవస్థ అని
నీకు తెలిసేటప్పటికే నీ శరీరమ్మీద బతుకు కొరడా మచ్చలు మిగిలాయి
నీ పసితనం నీకే
కరెంటు తీగలకు వేళ్ళాడే పక్షి కళేబరంలా కనిపించింది
వరసలు పెట్టుకొని పిలుచుకునే మానవసంబంధాల కర్కశత్వాలు
వేటకొడవళ్ళలా వెంటాడి వీపులొకి దిగినప్పుడు
ఆ నొప్పి నీకే తెలుస్తుంది నాన్నా!
మనిషిని మనిషి వాహనంగా చేసుకొని ఎక్కి ఊరేగే వ్యవస్థలో
ఇంటా బైటా వరసలన్నీ ఉరితాళ్ళే కదా!
*****
అవును ఈరోజు నీ చావుకి పేనిన ఉరితాడు
నువ్వు పుట్టినప్పుడు నీ బొడ్డుతాడుతోటే పుట్టింది
చెప్పులు చేతబట్టుకొని
మూతికి ముంత కట్టుకొని
బెదురు కళ్ళతో తడబడే అడుగులతో వెలివాడల్లోనే నేలరాలిన
నీ పూర్వీకుల రక్తమేదో ఇప్పుడు నీలో ఎలుగెత్తి అరిచింది
అందుకే
నీ అపరూప సృజనాత్మక హృదయం మీద
చతుష్పాద మనువు శూలాలతో దాడి చేసి చిల్లులు పొడిచాడు
నీ అద్భుత మేధో కౌశలాన్ని
రాతిరధాలనెక్కొచ్చిన శతృవులు క్రూరంగా తూట్లు పొడిచారు
ఆకాశం భూమి చెట్టూ చేమ మనుషులు…. అంతా
అనంత విశ్వంలో భాగమైన ఓ విజ్ఞాన పదార్ధంగా పరిమళించాల్సిన విద్యావనాలు
నెత్తిన కులం కొమ్ములతో నారింజ రంగు వృషభాల కారడివిగా మారిపోతే
మొసళ్ళు నిండిన ఏ దిగుడు బావిలోనో దిగుళ్ళతో చిక్కడిపోయినట్లే వుంటుంది
బహుశ అప్పుడు నీ కలలు కూడా నిన్ను వెక్కిరించే వుంటాయి
బతుకు పోరాటమైతే పర్లేదు కానీ
బతుకంటే ఓడిపొయే యుద్ధం చేయటమే అనిపిస్తే
మనుషులందరూ శూన్యపు గొట్టాలుగా తిరుగుతూ కనబడుతుంటారు
శూన్యం నుండి విస్ఫోటనతో సృష్ఠి ఏర్పడినట్లు
నీచుట్టూ ఆవరించిన శూన్యం నీలో మృత్యుకాంక్ష బద్దలుచేసిందా?
నిజానికి ఇంతటి మానవ మహా శూన్యపు ఎడారిలో
చర్మంలో నీళ్ళు దాచుకున్న నీబోటి ఒంటెల్లాంటి వాళ్ళు
నీకు అసలు కనిపించనే లేదా రోహిత్?
****
దేశపటాన్ని కసిగా కరిచిన
కండచీమ దేహాన్ని ఉరితీసి ఆనందించే రాజ్యం చర్యని తప్పుబట్టి
నువ్వో దేశద్రోహివయ్యావు
దేశమంటే చుట్టుకొలతల విస్తీర్ణమని
దేశభక్తి అంటే సరిహద్దుల ఆవల శత్రుత్వాన్ని ఆపాదిస్తూ
మనుషులకంటే దేశపటాల్ని, ప్రతీకల్ని ప్రేమించే వాళ్ళ దృష్ఠిలో
నువ్వో దేశద్రోహివయ్యావు
వాళ్ళకేం తెలుసు?
దేశాన్ని ప్రేమించటమంటే మనుషుల్ని ప్రేమించటమని!
వ్యవస్థని ద్వేషించకుండా మనుషుల్ని ప్రేమించలేమని!
మనుషుల్ని ప్రేమించటమంటే విభజన రేఖలతో యుద్ధం చేయటమని!
ఆయుధాలతో నిమిత్తం లేని ఆ యుద్ధంలో
నీ గుండె నెత్తురోడింది రోహిత్
ఇంత తొందరగా అలసిపోతావని నీక్కూడా తెలియదేమో
****
నీ తండ్రే కులంలో ఎవతెకి పుడితే ఏమిటి?
నువ్వే అమ్మకి పుట్టావన్నదే ముఖ్యం
ఆ అమ్మ ఏ మట్టి వేళ్ళతో
నిన్ను సాకిందనేదే ముఖ్యం
బీజవిసర్జనతో చేతులు దులుపుకునేవాడి గొప్పదనమేమున్నది?
ఐనా బీజాలది మాత్రమేమున్నది?
గాలికి ఎగిరి కొట్టుకుంటూ కూడా రాగలవు
క్షేత్రమే కదా పొదివి పట్టుకొని
గర్భంలోకి తీసుకొని ఊపిర్లూది
బొడ్డుతాడుతో అంటుకట్టుకొని
తన నెత్తురూ నీరూ పోసి ఉపరితలమ్మీదకి తెచ్చేది
తను తిన్న అన్నం ముద్దని
చనుబాలుగా మార్చి సహాజత ఉద్వేగంతో రొమ్ముకదుముకొని
నీ చిట్టినోటిగుండా ప్రాణప్రతిష్ఠ చేసే అమ్మకే కదా బిడ్డవి
అమ్మ ఇచ్చిన పుట్టుమచ్చలే కదా నీకో గుర్తింపునిచ్చేది
అమ్మ చెంగుని పట్టుకొని
అమ్మ భుజాల మీదుగా లోకాన్ని పరిచయం చేసుకుంటూ ఎదిగి ఎదిగి
లోకం మీదకి దండెత్తి, కలబడి, అలిగి
తీరా నువ్వెళ్ళిపోతే
నీ దేహం మీద పంచనామాలో
ఓ నమ్మకం లాంటి నాన్న వాంగ్మూలం ఏమిటి?
ఐనా అమ్మ ప్రేమని తెలిసిన వాడివి కదా
ఉరి బిగుసుకుంటున్నప్పుడు
అమ్మకి కలిగే నొప్పికి విలవిల్లాడక వుంటావా?
మట్టిపనిలో కమిలిన అమ్మ చేతులు
కుట్టుపనిలో పగిలిన ఆమె మోకాళ్ళు
నీకు గుర్తుకు రానంతగా ఎంతటి ఆగ్రహ ప్రకటన చేసావు రోహిత్?
స్వేచ్ఛా ప్రబోధం చేసిన వీరుడు
చౌరస్తాల్లో తర్జనితో తాను నడిచొచ్చిన దారిని చూపిస్తూ ధైర్యాన్నిచ్చే ఆ వీరుడు కూడా
నీకు నమ్మకం ఇవ్వలేదా రోహిత్?
****
నువ్వొక్కడివే హతుడివి
హంతకులు మాత్రం కోట్లాదిమంది
మా కళ్ళల్లో ఎంత దిగులుమేఘంగా నువ్వు తారట్లాడినప్పటికీ
మా కన్నీటి చుక్కల్లో కూడా అపరాధ భావముంది
అందుకేనేమో ఒక్కో కన్నీటి బొట్టు
ఒక్కో చెంపదెబ్బలా తగులుతున్నది !

“మాటల మడుగు”తో మెర్సీ మరో అడుగు..

 

-అరణ్య కృష్ణ

~

“మేఘాల మీదుగా భూమిపైకి చూడటం నేర్చుకున్నప్పుడే
ఇంద్రధనుస్సు ఆకారం పరిపూర్ణంగా కనబడేది
వర్షంలో తడుస్తున్న భూమిని
కళ్ళారా నింపుకోగలిగేది”
మెర్సీ సరిగానే చెప్పారు.  జీవితాన్ని ఓ కవి అలానే చూడాలి.
మెర్సీ మార్గరెట్! ఎంతో అందమైన ఇంగ్లీష్ పేరు.  “మార్గరెట్ కవిత్వం చదివారా?” అని ఎవరైనా ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్ధినడిగితే “ఓ! బ్రహ్మాండంగా!” అంటాడేమో.  కానీ మెర్సీ మార్గరెట్ పదహారణాల తెలుగమ్మాయి.  వర్తమాన సమాజ బీభత్సాన్ని లలితమైన పదాలతోనే కవిత్వంగా తూర్పారపట్టిన తెలుగమ్మాయి.  ఒక దళితురాలిగా, మైనారిటీగా, స్త్రీగా ఎంతటి వివక్షతను, అశాంతిని అనుభవించాలో అంతటినీ మంజూరు చేసిన వర్తమాన సమాజాన్ని ఒకసారి ఆర్ద్రంగా, మరోసారి కసిగా నిలదీసిన పదహారణాల తెలుగు కవి మెర్సీ.  ఆ మూడు రకాల అస్తిత్వ మీమాంస మెర్సీ కవిత్వం లో కనబడుతుంది.  ఆధునిక కవిత్వం అంటే ప్రధానంగా భావానికి, భావాల సంఘర్షణని వ్యక్తీకరించటానికే  అన్న విషయాన్ని మెర్సీ కవిత్వం మరోమారు నిరూపించింది. వాడ్రేవు చినవీరభద్రుడు, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్ లాంటి ముగ్గురు ప్రసిద్ధుల నుండి ముందుమాటల ద్వారా కితాబులందుకున్న మెర్సీ “మాటలమడుగు” నిజానికి కవిత్వ సెలయేటిలో కొత్తపాయ.
         కవిత్వం కాల్పనిక భావోద్రేకాలకు చెల్లుచీటీ చెప్పాలని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది.  కవిత్వంలో ఏదో ఒక సామాజికాంశ లేకుండా చదవటానికి ఏ పాఠకుడూ సిద్ధంగా లేడు.  సామాజికాంశ అంటే సామాజిక వాస్తవికతే.  వైయుక్తిక స్థాయిలో వ్యక్తీకరించినప్పటికీ సాటి మనుషులతో పంచుకోతగిన ఆవేశమే కవిత్వం కాగలదు. లేకుంటే అదేదో గందరగోళంగానే మిగిలిపోతుంది.  అయితే కేవలం వాస్తవాల కోసమే అయితే ఒక వార్తాపత్రిక చదువుకోవచ్చుగా మరి అన్న ప్రశ్న వస్తుంది.  ఒక అత్యాచార వార్త చదవటం వేరు, దానిమీద కవిత చదవటం వేరు.  నిర్భయ మీద ఎన్నో కవితలొచ్చాయి. తెలిసిన విషయమే కదా. మరెందుకు చదివాం?  కవిత్వం మనలోని మనతనానికి అప్పీల్ చేస్తుంది.  మనం మనుషులుగా హృదయంతో స్పందింపచేస్తుంది.  కనుకే కవిత్వం అంటే వాస్తవికమైన అనుభవాన్నో, పరిశీలననో భాషా మాద్యమం ద్వారా హృదయం నుండి హృదయానికి ప్రయాణింపచేసే కళాత్మక ప్రక్రియ.  సరిగా మెర్సీ ఇక్కడే సఫలమయ్యారు.
అవాస్తవాలకు, అతిశయాలకు పోకుండా సరళంగా వ్యక్తీకరించిన నిండుకుండ లాంటిది మెర్సీ కవిత.  కోపగించుకున్నా, వెటకారం చేసినా, ప్రతీకాత్మకంగా వ్యక్తీకరించినా, మార్మికంగా గుసగుసలాడినా….ఎలా చెప్పినా మొత్తం మెర్సీ కవిత్వం వేదనాపూర్వక అనుభూతి ప్రధానమైనదే.    స్త్రీ లైంగిక స్వేచ్చ వంటి స్త్రీవాద కవిత్వం ప్రతిపాదించిన లోతైన వివాదాంశాల జోలికి వెళ్ళకుండానే స్త్రీ శరీరం మీద అమలయ్యే పురుషాధిక్య భావజాలాన్ని కవిత్వంలో ఎండగట్టడంలో మెర్సీ సఫలమయ్యారు.  ఆమెను ప్రధానంగా స్త్రీవాద కవిగా గుర్తించటం కష్టం.  స్త్రీవాద చాయలు కొంతమేరకు కనబడ్డా ఆమె ప్రధాన దృక్పధం కానీ, లక్ష్యం కానీ స్త్రీవాదం కాదు.  దళితుల మీద వివక్ష, మైనారిటీల వ్యధలు, స్త్రీగా ఎదుర్కునే ఆటంకాలతో పాటు కాలుష్యం, ప్రపంచీకరణ, యాంత్రీకరణ, యాంత్రిక జీవితం, కన్స్యూమరిజం వంటి సమకాలీన అంశాల మీద కూడా ఆమె కవితలు రాసారు.  ముఖ్యంగా చుట్టూ ఆవరించివున్న నిరాశాజనక పరిస్తితులు సృష్ఠించే మనోవైకల్యాల మీద ఒక కవితాత్మక నిరసనగా మెర్సీ కవిత్వాన్ని చెప్పొచ్చు.
     ఆధునిక కవిత్వంలో ఎటువంటి సీరియస్‌నెస్ నేను కోరుకుంటానో అది మెర్సీ కవిత్వంలో కనబడింది.  అది వస్తువుకి, శిల్పానికి రెండింటికీ సంబంధించినదే.  మెర్సీ కవిత్వం అత్యున్నత స్థాయి కవిత్వమని ఆకాశానికెత్తను కానీ మంచి కవిత్వమని, మంచి అనుభూతి కలగచెయ్యగలదని మాత్రం భరోసా ఇవ్వగలను.  ప్రతి కవిత మీద ఆమె మంచి శ్రద్ధ పెట్టిన విషయం తెలుస్తుంది.  ప్రతి కవితకి ఒక ఎత్తుగడ, నడక, ముగింపుల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించారావిడ. అందుకే మంచి ప్రామిసింగ్ గా కనిపించారు ఆవిడ.
        మనుషుల్తో మాట్లాడటం విఫలమైనప్పుడలా కవి కవిత్వాన్ని ఆశ్రయించటం జరుగుతుంది.  దీన్నే మెర్సీ కవిత్వం బలపరుస్తుంది.  తన పరిశీలన, తన అనుభవం లోకి వచ్చిన ప్రతి అంశాన్ని ఆమె కవిత్వం చేసారు.  ఎంతటి కర్కశమైన వాస్తవాన్నైనా ఒక మార్దవంతో, ఆర్తితోనే వ్యక్తీకరించారు.  ఆర్తి లేని కవిత్వం పత్రికా సంపాదకీయమే అవుతుంది.  ఈమె కవిత్వం లో మాటలు, ఆలోచనలు, అక్షరాలు అన్న పదాలు ప్రధానంగా కనబడతాయి.  దాన్నిబట్టే చెప్పగలం ఆమె తన కవిత్వం ఆలోచనాస్ఫోరకంగా ఉండాలని బలంగా కాంక్షించారని.   “కొట్టివేతల నుండి కొత్తగా పుట్టుకురావాలి” అన్న వినిర్మాణ (డీకన్స్ట్రక్షన్) స్పృహతో మొదలై సంకలనం చివర్లో చోటు చేసుకొని అన్ లెర్నింగ్ కోసం తపించిన “మైనస్లతో మైత్రి”  వరకు  ఆమె కవిత్వం తన ప్రస్థానమేంటో స్పష్ఠంగా చెబుతుంది.
“ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి
మాటలకు మొలకల వేళ్ళుండేవి
పచ్చగా మొలకెత్తేందుకు అవి
సారవంతమైన నేలలు వెతికేవి” (మాటలమడుగు) తప్పిపోతున్న మనిషిని మాటల్లేనితనం లోనే పట్టుకోగలం కదా!
ప్రతి మనిషిలో ఒక ప్రశ్నలగది వుంటుంది.  అందులోకి ప్రవేశించటానికి అందరికీ భయమే ఆ గదిలో
“ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు
చిక్కులు చిక్కులు గా వుండలు చుట్టి పడేసిన ప్రశ్నలు
మసకబారిన చిమ్నీల్లాంటి ప్రశ్నలు
శ్వాస పీల్చుకోలేక వేలాడుతున్న క్యాలెండర్ లాంటి ప్రశ్నలు” తాండవమాడే అంతరంగ ప్రశ్నలగదిలోకి వెళ్ళాలని చెబుతారు కవి (ఫ్రశ్నల గది) ఎందుకంటే ప్రశ్న అంతరాత్మ మాతృభాష కదా మరి.
వర్ణాల్లో అందాలు చూసే వాళ్ళ పట్ల గొప్ప నిరశన “చీకటిదీపం”లో కనబడుతుంది.
“వర్ణాల బేధం లేకుండా పూలన్నిటినీ హత్తుకునే
చీకటి
ఎంతటి సహృదయ
నిశ్శబ్దాన్ని గుండెల నిండా నింపుకోడానికొచ్చే వారిని
దరిచేర్చుకునే వైద్యురాలు”
“హృదయపు మెతుకు” ఈ సంకలనంలోని ఉత్తమకవితల్లో ఒకటి. స్థూలకాయురాలైన భార్య వంటలో ప్రేమని కాక ఏదో ఒక రకంగా ఎత్తిపొడవటానికి వంకల్ని వెతుక్కునే భర్తల వైఖరిపై నిప్పుల్లాంటి కన్నీళ్ళు విసురుతుందామె.
“”బరువెక్కిన కాళ్ళు కళ్ళు  నదులై ప్రవహించేదాక
అన్నంలా ఉడుకుతుందామే
……………………..
ట్రెడ్ మిల్ పై చిననాటి తప్పటడుగుల్ని జ్ఞాపకం చేసుకుంటూ
తననెవరైనా గంజిలా వార్చమని
ఉబ్బినట్లున్న శరీరావయవాలను నిమురుకుంటుందామె
……………………….
“ఈ మధ్య నీ ధ్యాసెటుంటుది?
అన్నం పలుకుపలుకుంది
పాతబియామే కదా ఇంత లావెందుకున్నయని?”
అతడు చిదిమిన అన్నం మెతుకులో
ఆమె హృదయం కూడా ఉందని
అతడు చూసుకునే లేదు”
మెర్సీ ఊహాశక్తికి తార్కానంగా నిలువగల “కాదంబరి” “తలాష్” “వెన్నెల స్నేహితా” వంటి కవితలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. చెట్టులో మనిషితనపు అన్వేషణని ప్రతిబింబించే ‘చిప్కో”, వదిలివెళ్ళిన స్నేహాత్మ కోసం రాసిన “తనతోనే నేను”, విభిన్న జ్ఞాపకాల మీద రాసిన “చీకటిదండెం”, కాలానుగత మార్పులకు సాక్షీభూతమైన “మైలురాయి”, మృత్యువు మనిషి జీవితంలోని వ్యర్ధత్వాన్ని నిరూపించటం మీద వేదాంతంగా రాసిన “ఇంతేనా మనిషంటే”, తండ్రుల నియంతృత్వాన్ని ప్రశ్నించమనే “ఇంటికిరాని వెన్నెల”, స్నేహితురాలి ఆత్మహత్య మీద “గాజుమనసు”, లక్షింపేట మీద రాసిన “ఉలిక్కిపడుతున్న ఊరి తలుపులు” వంటికవితలు కూడా చదవించే కవితలే.
53 కవితలతో అందమైన ముద్రణతో “మాటలమడుగు” రూపొందించారు. మనం చదువుకోవాల్సిన కవిత్వం రాసిన మెర్సీ మనం ఆహ్వానించతగ్గ కవి.
“అక్షరాలు గుండెను చీలుకొని
బయటికొచ్చి పసిపిల్లల్లా నవ్వుతాయి
వాటిని దోసిట్లోకి తీసుకొని
నేను ఏడ్చేప్పుడు
కన్నీళ్ళ లాలపోసుకొని
కాగితపు ఊయల్లో నిద్దరోతాయి”
(“మాటలమడుగు” కవితల సంకలనం. రచన మెర్సీ మార్గరెట్.  వెల రూ.100.  ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలు. హౌ. నం. 1-4-61, రంగ నగర్, ముషీరాబాద్, హైదరాబాద్-500090.)

రూప వినిర్మాణం కోసం…

-అరణ్య కృష్ణ
~
aranya
ఎవరో కిరసనాయిల్లో ముంచిన గుడ్డముక్కలకి నిప్పెట్టి
గుండె లోపలకి వదుల్తున్నారు
గంధకం పొడిని ముక్కుదూలాల్లో నింపుతున్నారు
కుక్కపిల్ల తోకకి సీమటపాకాయ జడ కట్టి వదిలినట్లు
రోడ్ల మీద పరిగెడుతున్నాం
భస్మ సాగరంలో మునకలేస్తున్నాం
మాటల్లో పెదాలకంటిన బూడిద
ఎదుటివాడి కళ్ళల్లో ఎగిరి పడుతున్నది
మనిషో మోటారు వాహనంలా శబ్దిస్తున్నాడు
ఇంజిన్ల శబ్దాల్లో మాటలు
పాడుపడ్డ బావుల్లోకి ఎండుటాకుల్లా రాలిపోతున్నాయి
పలకరింపులు బీప్ సౌండ్లలా మూలుగుతున్నాయి
మనుషుల ముఖాలు సెల్ ఫోన్లలా చిన్నబోతున్నాయి
నెత్తిమీద ఏంటెన్నాను సవరించుకుంటున్న పరధ్యానం
ముఖాల మీద తారట్లాడుతున్నది
ఏవో మూలుగులు పలవరింతలే తప్ప
చిర్నవ్వుల పరిమళాల్లేవ్
కరచాలనాల్లో చెమట చల్లదనం  తప్ప
చర్మ గంధం తగలటం లేదు
ఒకర్నొకరు గుర్తుపట్టలేని బంధాలు
గుంపు కదలికల్లో విఫలమైపోతున్న ఆత్మ సం యోగాలు
హోర్డింగులు నిర్దేశిస్తున్న జీవన వాంచలు
ప్రేమల ప్రాణవాయువులందక హృదయాల దుర్మరణాలు
నగరం మానవాత్మల మీద మొలుస్తున్న మహా స్మశానం
నేను మాత్రం రూపవిచ్చతి కోసం గొంగళిపురుగులా
ఒక తావు కోసం వెతుక్కుంటున్నాను .
*

తరగతిగది హత్య

-అరణ్య కృష్ణ
కొమ్మలకు ఊగాల్సిన ఈ పూలేంటి
ఇలా ఉరికొయ్యలకు వేలాడుతున్నాయి?
 
మనలో చెట్టుతనం చచ్చిపోయిందిలే
****
 
పుస్తకాల బరువు మోయలేకో
ఊపిరి తీసుకోనివ్వకుండా వెంటాడే గడియారాన్ని తప్పించుకోలేకో
ప్రేమగా హత్తుకోవాల్సిన అమ్మనాన్నల ఆకాంక్షల కర్కశత్వాన్ని తట్టుకోలేకో
రక్తం జుర్రుకునే రాగింగ్ కి తలవంచలేకో   
దేహాల్ని కళేబరాలు చేసుకున్నారా చిట్టితల్లులూ?
 
తోటల్లేవ్ పాటల్లేవ్ అనుభూతుల పక్షుల్లేవ్
 
చదువొక పిశాచమై రక్తనాళాల్ని పేల్చేస్తుంటే
పుస్తకాలు భూతాలై గుండెకింది చెమ్మనంతా పీల్చేస్తుంటే
ఎదిగే మొక్కలాంటి జీవితం అస్తిపంజరమైపోతున్టే
నీళ్ళు పోయాల్సిన తోటమాలులందరూ
ద్రోహంతో వేళ్ళ మొదళ్ళలో విషం కుమ్మరిస్తుంటే
బతుకుమీద తేళ్ళు కొండేలతో పొడుస్తున్నట్లుంటుంది
****
 
చదువు వ్యాపారంలో
కొనుగోలుదారులే అమ్మకపు సరుకులు
బాల్య యవ్వనాలు తూకానికి అమ్ముడుపోతాయ్
ఇక్కడ పిల్లలందరూ పుట్టుకతోనే ఖైదీలు 
పసిపిల్లల వీపుల మీద
అక్షరాలు లాఠీచార్జీలై గద్దిస్తుంటాయి
స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళన్నె జైళ్ళే
టీచర్లు హెడ్మాస్టర్లు వార్డెన్లందరూ పోలీసులే
బార్బ్ డ్ వైర్ ఫెన్సింగ్ తో ఎత్తైన గోడల మధ్య
చదువెంత క్రూరమైందో హెచ్చరించే ఆల్సేషియన్ల పహారాలో
దివారాత్రాలు భయం నిర్బంధం
క్లాసు నుండి క్లాసుకి అస్తిమిత యాంత్రిక పరుగులు
వికసించే వయసుల సంక్లిష్ట మనోనేత్రం మీద భీతావహ దృశ్యాల ముద్ర
పల్లానికి పరవళ్ళు తొక్కే హార్మోన్ల అలజడిలో ఉద్రేక నైరాశ్యల వెల్లువ
 
శతృదేశం కాన్సంట్రేషన్ క్యాంపుల్లో
యుద్ధఖైదీలు మాతృదేశం మీద బెంగపడ్డట్లు
అర్ధరాత్రి అమ్మ గుర్తుకొస్తే నాన్న తలంపుకొస్తే
ఉలిక్కిపడి లేస్తే
చుట్టూ నిద్రలోనే పాఠాలు వల్లెవేస్తూ పలవరించే
సాటి పాక్షిక అనాధలు
 
పశువుల కొట్టంలో కట్టేసిన దూడకైనా
పక్కనే పాలుతాపే పొదుగుల్నిండిన తల్లులుంటాయి
మరిక్కడ ఏ సన్నని ఇనుపమంచం
అమ్మ కౌగిళ్ళను మంజూరు చేయగలదు?
పోలీసు లాఠీల్లా పంతుళ్ళ బెత్తాలు భయపెట్టినప్పుడు
ఏ వసారాల గోడలు నాన్న భుజాల్లా కాపు కాయగలవు?
నెలకొకసారి అమ్మానాన్న మునివేళ్ళ ములాఖత్ ల కోసం ఎదురుచూపు
వాళ్ళొస్తారు
ఎదురు చూసిన భుజం మీద తలవాల్చితే బండరాళ్ళ స్పర్శ!
****
 
నిఘంటువుల్లో కొత్తపదాన్ని చేర్చండి
ఎన్ కౌంటర్, లాకప్ డెత్ తో పాటు  
తరగతిగది హత్యని!
*
aranya

అన్నం మెతుకు ఆత్మఘోష!

 

అరణ్య కృష్ణ

 

మహాశయా!
అద్భుతమైన కలలాంటి జీవితాన్ని చూపించి వెళ్ళిపోయావు
అందమైన కలల్ని దేశానికి దానం చేసి మరీ పొయావు

అది సరేకానీ
దేశమంటే ఎవరు మహాశయా?
వీధుల్లో పడవల్లా కార్లు తిరిగే నగరాలేనా?
విరిగిపోయిన తెడ్లతో బురద నదుల్ని దాటలేక
తిరగబడిపోయిన తెప్పల్లాంటి పల్లెలు కాదా!

ఇక్కడి చిన్నారుల కళ్ళు కలలు కనగలిగేవేనా?
పొయ్యిలో పడుకున్న గండుపిల్లి కళ్ళలాంటి ఆకలి
వీళ్ళ కన్రెప్పల్ని ఎత్తిపట్టి వుంచుతుంటే
ఇక నిద్రెలా పట్టేది చెప్పు!
గేదెల్ని కడుగుతూ గొర్రెల్ని మేపుతూ
సొమ్మసిల్లిన పసి కడుపుల్లో పసికర్లు నిండిపోతుంటే
ఆవులింతలు మాత్రం ఎలా వస్తాయి
అయ్య వలసపోతేనో అమ్మ కూలికెళ్తేనో
తమ్ముళ్ళని లాలించే పసితల్లులకి
నీ కలల మెరుపుల గురించి ఏం తెలుస్తుంది?

విశాల ప్రాంగణాల్లాంటి నువ్వు బోధించే కాన్వెంట్ కలలు
కూలే కప్పుల కింద పడిపోయిన బడిగోడల మధ్యనేం వికసిస్తాయి
మడత నలగని యూనిఫారాలతో తళతళలీనే టెర్లిన్ కలలు
ముడ్డిమీద పిగిలిపోయి మట్టిగొట్టుకు పోయిన
బట్టలమీదేం తళుక్కుమంటాయి
కాఫీ షాపుల్లో లాప్ టాప్ మీద అసైన్మెంట్లు చేయాలన్న కలలు
పశువుల కొట్టాల్లో కార్ఖానాల్లో ఏం కళకళలాడ గలవు?

చికెన్ పకోడా మంచూరియాల టిఫిన్ బాక్సులకి అర్ధమయ్యే నీ ఆదర్శాలు
అక్షరాలకోసం కాక అన్నం మెతుకుల కోసం బడికెళ్ళే
చిల్లులుపడ్డ సత్తు ప్లేట్లకేం బోధపడతాయి

జాతిద్రోహాల్ని ప్రశ్నించని క్షిపణిమహాత్మా!
నువ్వు ఆదర్శాలు మాత్రమే మాట్లాడే నిజాయితీపరుడివి
అందుకేనేమో
దేశం మొత్తం నీ కలల క్షిపణి మీదెక్కి
భ్రమల అంతరిక్షంలోకి చక్కర్లు కొడుతుంది.

*