కె. శివారెడ్డి @ 72

అరణ్యకృష్ణ
మట్టి మీద
మట్టి నుండి లేచిన చెట్టు మీద
చెట్టు మీదెక్కిన పిట్ట మీద
 
సముద్రం మీద
సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెల మీద
ఇసుక తిన్నెల మీది పాదముద్రల మీద
 
ఆకాశం మీద
ఆకాశం పైని చీకట్ల మీద
చీకట్లు విసిరే కాంతిపుంజాల మీద
 
అడవుల మీద
అడవులు పెంచిన ఆకుపచ్చని ఆశల మీద
ఆకుపచ్చని ఆశలతో సాయుధమైన కలల మీద
 
పల్లె మీద
పల్లె ఒంటి గాయాల మీద
గాయాలు మిగిల్చిన కసి మీద
 
మనిషి మీద
మనిషంతటి ప్రేమ మీద
ప్రేమతో పరితపిస్తూ హత్తుకునే హృదయం మీద
 
గుండె మీద
గుండె లోతుల్లోని స్నేహం మీద
స్నేహం కురిపించే అత్తరు జల్లుల మీద
 
కళ్ళ మీద
కంటి కొసల నీటి మీద
కన్నీళ్ళు నింపుకున్న కలాల మీద
 
కవిత్వం జెండా ఎగరేసిన వాడు!
*
aranya

కవిత్వంలో ఉన్నంతసేపూ…

 

అరణ్యకృష్ణ

కవిత్వమెప్పుడూ ఓ అనుభూతుల వర్ష సమూహమే
సమాంతరంగా రాలే చినుకులన్నీ నేలజేరి
ఒకదాన్ని మరొకటి
ఘర్షిస్తూ కౌగిలిస్తూ సంగమిస్తూ ప్రవహించినట్లు
ఇష్టపడే ముద్దాడే వేటాడే వెంటాడే
జ్ఞాపకాల తాలూకు అనుభూతులన్నీ
నా ఉనికి మీద కురిసి నేనో కవితనై ప్రవహిస్తాను
అంతరంగ గర్భంలో నీళ్ళింకి
కుతకుతా ఉడుకుతున్న మట్టి మీదకి
నీటిమబ్బులు ఘీంకారధ్వానంతో
కుంభవృష్ఠిగా జారిపోతూ దబ్బున పడ్డట్లు
ఏ సుషుప్తి గర్భంలోనో సెగలు కక్కుతున్న విచలితదృశ్యాలేవో
నన్నో కవిసమయంగా పెనవేసుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
నా దేహం మీద వర్షం
నా ఉనికి మీద కవిత్వం కురిసి
రెండింటినీ పరిశుద్ధం చేస్తాయి
నిజం!
కవిత్వంలో ఉన్నంతసేపూ
వర్షంలో తడుస్తున్న భూమిలా
నేనూ అమలినంగా ఉంటాను
పేడపురుగుల మీద పూలచెట్ల మీద
సమానదయతో కురిసే వర్షంలా
నా కవిత్వం నిష్కల్మషంగా ఉంటుంది
కురవని మేఘాల్లాంటి దాచుకున్న కన్నీళ్ళన్నీ
మట్టి వాసనతో నెత్తుటి రంగుతో
కవిత్వమై విప్పారుతాయి
గుండె మీది ఆకురాలు కాలాల్ని తుడిచిపారేసి
కవిత్వం వానచెట్టులా ఎదుగుతుంది.
*
aranya