రాలిపోయిన వొక వాక్యం గురించి రెండు మాటలు …!

 

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో....

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో….

ఆగస్టు 30 పొద్దున్న.

వొక కవి చనిపోయిన రోజు మనసెలా  వుంటుంది?

ఇప్పుడు నేను మాత్రం వాన నీళ్ళు భారంగా దేహంలోకి ఇంకుతున్న పొడి నేలలాగా వున్నాను. కొన్ని నల్ల మబ్బులు తిరుగుతున్న బరువయిన గాలిలాగా వున్నాను.

ఆ కవి నాకేమీ బంధువు కాదు. స్నేహితుడూ కాదు. నన్ను రోజూ పలకరించే నా సహోద్యోగి కూడా కాదు. అసలు నాదీ అతనిది వొక భాష కూడా కాదు. వొక దేశం అసలే కాదు.

కాని, వొక కవి! పాతికేళ్ళుగా అక్షరాలా పలకరిస్తున్న కవి. పలవరిస్తున్న కవి – సీమస్ హీని ఇక లేడు! ఇవాళ పొద్దున్న ఆఫీసుకి వెళ్లి కూర్చోగానే ఈ-లేఖలో చిరకాల మిత్రుడు, అమెరికన్ కవి  మాథ్యూ గిన్నెట్ పలకరింత. “విన్నావా? సీమస్ హీని ఇక లేడు! ఇవాళ నువ్వూ నేనూ కలిసి మనిద్దరికీ ఇష్టమైన అతని కవిత ‘The Republic of Conscience’ చదువుకుందామా?”

అప్పటికప్పుడు నాకు చాల ఇష్టమయిన సీమస్ కవిత్వ సంపుటి OPENED GROUND తీసి, ఆ కవితలోంచి వొక్కో కవితా చదువుతున్నప్పుడు కంటి రెప్పలు తడుస్తో పోతున్నాయి.  కొంత దూరం చదివేసరికి అక్షరాలూ అల్లుకుపోయాయి  తడి పొరల కింద. నాకు తెలుసు- ఏడేళ్ళుగా అతని గుండె ఇక పని చేయను అని బలహీనంగా సడి  చేస్తూనే వుంది.

ఇక చదవలేక ఆఫీసులోంచి బయటికి వచ్చి అక్కడే వున్న Turtle pond అనే చిన్న కొలను పక్కన కూర్చొని, అక్కడి నీళ్ళనీ, అందులోని రాళ్ళ మీదికి మెత్తగా పాకుతున్న తాబేళ్లనీ చూస్తూ కూర్చున్నాను. సీమస్ హీని లేడు…అన్న రెండు పదాలు మెదడులోపల మోగుతున్నాయి. శరీరం చాలా అసౌకర్యంగా వుంది. మనసు లోపల్లోపల వెక్కిళ్ళు పెట్టుకుంటోంది.

ఎందుకీ కవి ఇంతగా నాలోపల మిగిలిపోయాడు? డెబ్బై నాలుగేళ్ల అతని దేహ నిష్క్రమణని ఎందుకు వొప్పుకోలేకపోతున్నాను?

కొంత కాలంగా వొక విధమయిన వ్యక్తిగత వైరాగ్యమూ, వైముఖ్యమూ, నా మీద నాకే కోపమూ  లోపల్లోపల పేరుకుపోయి, “ఇంక నేనేమీ రాయను, రాయలేను!” అని మనసూ, చేయీ రాయి చేసుకొని, రాయాల్సిన వాక్యాలన్నీ మనసులోనే భ్రూణ హత్య అయిపోతున్న సమయంలో సీమస్ నా చేత ఈ రెండు మాటలూ  రాయిస్తున్నాడు.

Seamus-Heaney-006

1

సీమస్ హీని నాకు తండ్రి లాంటి వాడు. మా నాన్నగారూ, అతనూ వొకే ఏడాది – అంటే 1939- లోనే పుట్టారు. ఇవాళ పత్రికలో సీమస్ చివరి ఫోటోలో అతని ముగ్గుబుట్టవంటి తలని చూస్తున్నప్పుడు మళ్ళీ నాన్నగారు గుర్తొచ్చారు. బహుశా, ఈ రెండు మరణాల స్మృతి భారం నన్ను మరింత దిగుల్లోకి నెట్టి వుంటుంది. తండ్రిలాంటి స్మృతి…కాని, సీమస్ వాక్యాలు ఎప్పుడూ వొక స్నేహ పరిమళం వీస్తున్నట్టు వుంటాయి.

ఎమ్మే ఇంగ్లీష్  చదువుతున్న సమయంలో నాగార్జున యూనివర్సిటీ కాంపస్ లో మొదటి సారి మా ప్రొఫెసర్ రంగన్ గారు నాకు ఈ ఐర్లాండ్ కవి వాక్యాలు చెప్పారు. అప్పటి నించీ సీమస్ ని వెతికి పట్టుకోవడం నాకొక వ్యాపకంగా మారింది. బెజవాడ గాంధీనగర్ లో ప్రబోధ బుక్ హౌస్ నించి మా ఆస్టిన్ లైబ్రరీ దాకా దొరికిన చోటల్లా సీమస్ కవిత్వం, వచనమూ వొకటికి రెండు సార్లు చదవడం, మననం చేసుకోవడం — ఈ పాతికేళ్ళుగా అతని కవిత్వం చదువుతున్నప్పుడు ఏనాడూ అతని వయసు అడ్డంకి కాలేదు నాకు. అతని భాష అతని దేశమూ పరాయీ అనిపించలేదు. అతని వదల్లేక వదిలిన వూరు నాదే, అతని చనిపోయిన క్రిస్ అన్నయ్య నా అన్నయే! అతను పాఠాలు చెప్పిన ఎలిమెంటరీ స్కూలు కూడా నాదే! అతన్ని మెప్పించిన ఈట్స్, ఇలియట్, థామస్ హార్డీ, టెడ్ హ్యూ నన్నూ మెప్పించారు. చాలా తక్కువ మంది కవులు ఇలా వుంటారు, మనల్ని తమలోకి ఇంకించుకునే వాళ్ళు! తలుపులు బార్లా తెరిచిన మనసుతో వాక్యాల వెంట తోడు తీసుకు వెళ్ళే వాళ్ళు!

భుజమ్మీద చేయి వేసి, ధైర్యం చెప్తూ కాసేపు, నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అనునయిస్తూ కాసేపు, నా కళ్ళలోకి చూస్తూ ‘జీవితాన్ని కాస్త ప్రేమించవూ’ అని బతిమాలుతూ కాసేపు–వొక కవి కేవలం కొన్ని వాక్యాల ఆసరాతో ఇన్ని రకాల role-plays చేయగలడా అని విస్మయానికి లోను చేస్తూ–గత పాతికేళ్ళుగా సీమస్ అక్షరాలా తోడుగా వున్నాడు. ఇవాళ అలాంటిదేదో వొక తోడు తెగిపోయింది. లోపల మిగిలివున్న ఆ ధైర్యపు మాట ఏదో పుటుక్కున  దారం తెగిన దండలాగా రాలిపోయింది. వొక నిస్త్రాణ – శరీరంలో, మెదడులో!

ఆ కొలనులో నీటి గలగలల మధ్య అతను లేనితనంలోంచి అతని మాటల్ని వెతుక్కుంటూ కూర్చున్నాను. ‘కవిత్వం ఏమిటీ’ అన్న నా ప్రశ్నకి లోపల్నించి సీమస్ ఇలా సమాధానమిస్తున్నాడు: “నేను పుట్టిందీ పెరిగిందీ పొలాల మధ్య..పొలం పనుల మధ్య! అదీ నా వాస్తవ ప్రపంచం. ఆ పనుల మధ్య కొంచెం అలసట తీర్చుకోడానికి నేను ఆడుకోడానికి వెళ్ళే వాణ్ని. ఆ ఆటలో నన్ను నేను, నా వాస్తవ ప్రపంచాన్ని మరచిపోయే వాణ్ని. అంటే, ఆటస్థలం నా ఊహా ప్రపంచం. ఆ రెండీటి మధ్య వున్న ప్రపంచమే కవిత్వం నాకు!”

ఇంకా కొంచెం ముందుకు వెళ్లి మాట్లాడుకుంటే, జీవనోపాధి వల్ల తను పుట్టిన వూరికి దూరంగా వెళ్ళిపోవడం సీమస్ ని ఎప్పుడూ బాధించేది. వొక చిన్న వూళ్ళో బడిలో పాఠాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి హార్వర్డ్ దాకా చేరుకున్నాడు సీమస్. ఈ సుదూర ప్రయాణంలో ఎంత ఆనందం వుందో, అంత బాధా వుంది అతనికి!

వొక కవితలో ఆ బాధని ఇలా చెప్పుకున్నాడు:

ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది గాలిపటం.

దాని దారం నీ చేతుల్లో

నీ గుండెని హత్తుకొని ఎలా వుంటుందో చూసావా?

నిజానికి  దారమొక్కటే నీ చేతుల్లో వుంది.

నీ గాలిపటం అందాలన్నీ

ఎక్కడో ఏ శూన్యాన్నో  అలంకరిస్తున్నాయి.

సీమస్ కవిత్వ రహస్యం అంతా ఆ దూరంలోని బాధ చెప్పడమే! ఎక్కడో వొక వూళ్ళో పుడతాం, కొన్నాళ్ళకి ఆ వూరు విడిచి వెళ్ళిపోతాం. వొక్క రోజు కూడా విడిపోతే వుండలేమనట్టుగా తల్లి కొంగు పట్టుకు తిరుగుతాం. ఆ కొంగుని వదిలేసి ఏడు సముద్రాలూ దాటి వెళ్ళిపోతాం. నాన్న భుజాల మీద ఆడుకోలేని రోజులు అర్థరహితంగా అనిపిస్తాయి. చివరికి అలాంటి అర్థరహితమయిన రోజులే జీవితంలో పెరిగిపోతుంటాయి. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి తిరిగిన చెలకలూ, తవ్వి తీసిన చెలమలూ, హోలీ రంగుల కోసం కోసుకొచ్చిన పూలూ, అల్లరి చేస్తూ గడిపిన పండగ రోజులూ ఇవి లేని బతుకు ఏనాడూ వద్దనుకుంటాం.

కాని, అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగానే గతస్మృతులు అయిపోతాయి. ఇప్పటి దూరపు బతుకు వొక్కటే మనకి మిగిలి వుంటుంది. సీమస్ కవిత్వమంతా ఆ ఇంటి పలవరింత, ఆ బంధాల పలకరింత. దూరమయిపోయే దగ్గరితనాల తలపోత. అందుకే, సీమస్ వాక్యాలు చదువుతున్నప్పుడు నా మటుకు నాకు అతని అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంటుంది. నా కాళ్ళని వెనక్కి నడిపించి గతంలోకి తోసుకుంటూ వెళ్ళే బాల్యమిత్రుడు సీమస్.

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ...అతని కవిత్వానికి ఊపిరి

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ…అతని కవిత్వానికి ఊపిరి

2

నాకు తెలిసీ, నాకు వున్న పరిమితమయిన అనుభవంలోంచి చెప్పాల్సి వస్తే,   కవిత్వం రాయడమే కష్టం. కోరి కోరి మనసుని నొప్పించుకోవడం! వొక్కో వాక్యం వొక్కో  రకం  నొప్పి. కాని, రాయకుండా వుండడం ఇంకా నొప్పిగా వుంటుంది. ఆ రాయలేని నొప్పి కన్నా రాస్తూ పడే నొప్పి సహించడం తేలిక. అందుకే, బాధపడుతూనే రాస్తాం. సీమస్ అంటున్నాడు:

I am tired of speculations about the relation of the poet’s work to the workings of the world he inhabits, and finally I disagree that ‘poetry makes nothing happen.’ It can eventually make new feelings, or feelings about feelings happen, and anybody can see that in this country for a long time to come a refinement of feelings will be more urgent that a reframing of policies or of constitutions.

ఎన్ని వాదాలు చేసినా, వివాదాలు పడినా కవిత్వం వొక అనుభూతి. రాయడం వొక అనుభూతి, చదవడం వొక అనుభూతి, నలుగురితోనూ కవిత్వం గురించి మాట్లాడుకోవడం వొక అనుభూతి. ఎవరైనా నాలుగు కవిత్వ వాక్యాలు వాళ్ళ గొంతులోంచి పలుకుతూ వుంటే వినడం వొక అనుభూతి.

అందుకే, సీమస్ ఎప్పుడూ అంటాడు: “The main thing is to write/ for the joy of it … It’s time to swim/ out on your own and fill the element/ with signatures on your own frequency.”

సీమస్ చివరిదాకా ఆ ‘రాయడం’ అనే ప్రక్రియలోని  అనుభూతిని కాపాడుకున్నాడు, అది ఎంత నొప్పెట్టినా సరే!

ప్రపంచాన్ని చదివించిన ఆమె..!

Malathi-candoor-Banner

చాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న!

వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు వేసుకుంటూ వస్తారు?

 చెప్పడం కష్టమే!

కాని, మన చదువు అనుభవాలను నెమరేసుకుంటూ ఓ పది నిమిషాలు సాలోచనగా కూర్చున్నప్పుడు వొక్కో రచయితా వొక్కో రచనా వొక్కో మజిలీలా కనిపిస్తాయి. కొన్ని మజిలీలు మనల్ని విస్మయంలో పడేస్తే, ఇంకా కొన్ని మజిలీలు ప్రశ్నలవుతాయి. ఇంకా కొన్ని జవాబులవుతాయి. మాలతి చందూర్ ఏదీ కాదు! అసలు ఆమె రచనలు నేనెప్పుడూ సీరియస్ గా చదవలేదు. ఆమెని నేను సీరియస్ రచయిత్రిగా ఎప్పుడయినా తీసుకున్నానో లేదో తెలీదు. దానికి బలమయిన కారణం వొక్కటే: అసలు సాహిత్యాన్ని వొక సీరియస్ వ్యాపకంగా తీసుకోని కాలం నించీ నేను ఆమె రచనలు చదువుతూ ఉండడమే!

కాని, ఆశ్చర్యం ఏమిటంటే, జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె రచనలు ఎదో వొకటి చదువుతూనే వున్నా. వొక రచయితని ఇన్ని దశల్లో ఇన్ని వయసుల్లో చదువుతూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

2

నేను మిడిల్ స్కూల్ లో – అంటే ఆరో తరగతి-  చదువుతున్న రోజుల్లో మా అమ్మ గారు రంగనాయకమ్మగారికి వీరాభిమాని. రంగనాయకమ్మ రచనలన్నీ ఆమె మళ్ళీ మళ్ళీ చదివేది. ‘ఆ పుస్తకంలో ఏముంది రెండో సారి చదవడానికి ?’ అని నేను అడిగినప్పుడల్లా నాకు అర్థమయ్యే భాషలో కథలాంటిది ఎదో చెప్పేది. కాని, వాటి మీద నాకు ఆసక్తి వుండేది కాదు. నాకు నాటికల పిచ్చి వుండడం వల్ల కేవలం నాటికల పుస్తకాలే చదివే వాణ్ని ఆ రోజుల్లో!  అవి చదవడానికి బాగుండేవి. పైగా, ఆ డైలాగులు కొట్టుకుంటూ తిరిగే వాణ్ని.

ఇంకో వేపు మా అమ్మగారు మంచి వంటలు చేసేది కాబట్టి, ఎక్కువ సమయం నేనూ అమ్మా వంట గదిలో గడిపే వాళ్ళం. అలా వంటల మీద ఆసక్తి పెంచుకుంటున్న రోజుల్లో ఉన్నట్టుండి వొక రోజు మా ఇంట్లో-వంట గదిలో-   ‘వంటలు- పిండివంటలు’ పుస్తకం ప్రత్యక్షమయింది. మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా ఆసక్తిగా చదివిన తొలి పుస్తకాల్లో ఇదీ వొకటి అని ఖాయంగా చెప్పగలను. ఈ పుస్తకం ఎంత ఉపయోగంలో పెట్టానంటే, ఏడాది తిరిగే సరికి నూనె, కూరలూ, పసుపు మరకలతో ఈ పుస్తకం ఇక చదవడానికి వీల్లేకుండా పోయింది. నాన్నగారు బెజవాడ వెళ్తున్నప్పుడు పనిమాలా చెప్పే వాణ్ని “ మాలతి చందూర్ పుస్తకం ఇంకో కాపీ తీసుకు వస్తారా?” అని!

అలా ప్రతి ఏడాది ‘వంటలు-పిండి వంటలు’ పుస్తకం కొత్త ఎడిషన్ మా ఇంట్లో చేరేది. అది చదవడం వల్ల నాకు జరిగిన లాభం ఏమిటంటే, రెండు వందల పేజీల పుస్తకం ఏదన్నా అలవోకగా ధీమాగా  చదివేయడం! అది ‘చందమామ’ చదివే అనుభవం కన్నా భిన్నమయింది నాకు – మెల్లిగా నా చేతులు మా అమ్మగారి పుస్తకాల మీదకి మళ్ళాయి. నాటికలే కాకుండా, కథలూ నవలలూ చదవడం మొదలెట్టాను. అవి చదవడం మొదలెట్టాక మాలతి చందూర్ ‘వంటలు- పిండివంటలు’నా పుస్తక  ప్రపంచంలోంచి నిష్క్రమించింది.

ఏడో తరగతిలో మేం పట్నం- అంటే ఖమ్మం- చేరాం. కాన్వెంటు చదువు నాకు పెద్ద కల్చర్ షాక్. మిగతా పిల్లలు వాళ్ళ ఇంగ్లీషు పలుకులు వింటున్నప్పుడల్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్! అసలు నాకేమీ తెలియదు, ఎలాగయినా సరే ఈ లోకాన్ని ఉన్నపళాన అర్థం చేసేసుకోవాలి అని ఆబ. తెల్లారేసరికి మంచి ఇంగ్లీషు మాట్లాడేయాలి, క్లాస్ మేట్ల మైండ్ బ్లాంక్ అయిపోవాలి అని తీర్మానించుకున్న రోజుల్లో  కనిపించిన ఇంగ్లీషు పుస్తకమల్లా చదివేయడం! పిచ్చి పట్టినట్టు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకాన్ని మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేయడం…శంకరనారాయణ నిఘంటువులో రోజూ కొన్ని పేజీలు  బట్టీ కొట్టడం!

నా అవస్థలు చూసి నాకే అవస్థగా వుండేది. అప్పుడు దొరికింది స్వాతి మాసపత్రిక! అందులో మాలతి గారి కెరటాల్లోకి దూకేసాను. మొదటి సారి చదివిన ఇంగ్లీష్ నవల ‘ of human bondage.’ ఆ నవల చదవడానికి ముందు మాలతి గారి వ్యాసం చదివి, అందులో events అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని, ఆ పాత్రల పేర్లు కాగితం మీద తెలుగులో రాసుకొని, ఇంగ్లీషు నవల చదవడం! ఇదీ సాధన! అలా మాలతి గారి సపోర్టుతో  ప్రతి నెలా వొక ఇంగ్లీషు నవల చదవడం, ఆ నవల గురించి ఇంగ్లీషులో సమ్మరీ రాసుకొని, కొన్ని సార్లు మాలతి గారి కెరటాల వ్యాసాన్ని నా బ్రోకెన్ ఇంగ్లీషు  అనువాదం చేసుకోవడం ….అలా, ఏడాది తిరిగే సరికి మాలతి గారు నా చేత పన్నెండు నవలలు చదివించారు. డికెన్స్, థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్, వర్జీనియా వూల్ఫ్….ఇలా నా బుర్ర నిండా ఇంగ్లీషు పేర్లు!

ఈ క్రమంలో మాలతి గారు నాకు నేర్పిన పాఠం: జ్ఞానానికి భాష అడ్డంకి కాదు- అని! ఆమె ఎంత కష్టమయిన నవల అయినా సరే, అతి తేలికయిన భాషలో చెప్పేస్తుంటే, అంత లావు లావు నవలలు కూడా ‘వీజీ’ అయిపోయేవి. పైగా, ఆ పిచ్చి అవేశాల ఉద్వేగాల టీనేజ్ లో ఆ చిన్ని వ్యాసాల  గడ్డిపోచ పట్టుకొని ఎంత పొగరుమోత్తనంతో ఎంత గోదారి ఈదానో!

 

4

ఆ తరవాత మాలతి చందూర్ సొంత రచనలు ఏం చదివానో పెద్దగా గుర్తుండని స్థితి కూడా వొకటి వచ్చేసింది. పైగా, ఆమె ‘ప్రశ్నలూ జవాబుల’ శీర్షిక ఆవిడ పట్ల నా గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది కూడా!  ఇంత చదువుకొని ఈవిడ ఎందుకిలా మరీ నాసిగా రాస్తారా అనుకునే రోజులు కూడా వచ్చేసాయి. సొంతంగా రాయడం ఎంత కష్టమో కదా అని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితి! ఆవిడే పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం అంతా చదివాక, ఆవిడ సొంత రచనలు మరీ అన్యాయంగా అనిపించడం మొదలయింది. చూస్తూ చూస్తూ ఉండగానే, నా చదువు పటంలోంచి  మాలతిగారు నిష్క్రమించేసారు.

కాని, ఆమె ‘కెరటాలే’ తోడు లేకపోతే, నాకు ఈ మాత్రం ఇంగ్లీషు వచ్చేది కాదు. ప్రపంచ సాహిత్యం చదవాలన్న తపన నాలో పుట్టేది కాదు. కాని, నా ముందు పరచుకున్న ప్రపంచంలో మాలతి గారిని ఎక్కడ locate చేసుకోవాలో ఇప్పటికీ నాకు తెలియదు.

afsar— అఫ్సర్

 

 

 

 

సైరన్ మోతల మధ్య మేలుకున్న స్వరం

devipriya

దేవీప్రియ

దేవిప్రియ సాహిత్య ప్రస్థానం గురించి వ్యాసాలను ‘సారంగ’ ఆహ్వానిస్తోంది. 

 

విశాఖ మొజాయిక్ సాహిత్య సంస్థ, ఎస్వీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ప్రసిద్ధ కవి, ఎడిటర్ దేవిప్రియ సాహిత్యానుశీలనం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ వ్యాసం పునర్ముద్రిస్తున్నాం. ఈ వ్యాసం అఫ్సర్ 1992 లో వెలువరించిన సాహిత్య వ్యాసాల సంపుటి “ఆధునికత- అత్యాదునికత” నించి తీసుకున్నాం. ఇది ఇరవై వొక్క సంవత్సరాల కింద రాసిన వ్యాసం కాబట్టి,  ఇందులో అఫ్సర్ చేసిన విశ్లేషణ  అంత సమకాలీనం కాకపోవచ్చు. 

1970లలో వొక సంధికాలానికి సమాధానంగా బయలుదేరిన విప్లవోద్యమం విలువైన  కవిత్వ వారసత్వాన్ని మిగుల్చుకుంది. కవిత్వ ప్రయోజనానికి స్పష్టమైన గిరి గీసింది. అభ్యుదయోద్యమంతో స్థిరపడిన లక్ష్యనిబద్ధతతొపాటు నిమగ్నత అనే మరో ఆచరణాత్మకమైన పదం కవిత్వ విమర్శలో చేరింది. నిబద్ధతకీ, నిమగ్నతకీ మధ్య వొక వూగిసలాట ప్రారంభమైంది. కవికి నిబద్ధత వుంటే చాలదు, నిమగ్నత కూడ అవసరమేనన్న వాదం వొకవైపు సాగుతుండగా, మధ్యతరగతి కవుల్లో ఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం ఏర్పడింది. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. మొదటిది విప్లవోద్యమ ప్రత్యక్ష ప్రభావం. రెండవది ఆ ప్రభావాన్ని జీవితంలో అన్వయించుకోగలిగినా భౌతిక పరిస్థితులు లేక పరోక్షంగా విప్లవ భాగస్వామ్యం తీసుకోవడం … శివారెడ్డి, దేవిప్రియలవంటి సీనియర్ కవులనుంచి గుడిహాళం రఘునాధం, నందిని సిద్ధారెడ్డి దాకా ఈ విధంగా ఒక వర్గీకరణ కిందికి వస్తారు. అయితే  శివారెడ్డికీ, ఈ వరసలోని మిగిలిన కవులకీ మరో తేడా వుంది. మిగిలిన కవులతో పోల్చినప్పుడు శివారెడ్డిలో అంతర్ముఖత్వం తక్కువ. వీళ్ళందరితో పోల్చినప్పుడు దేవిప్రియలో అంతర్ముఖత్వం ఎక్కువ. దీని కారణాలు ఆయా కవుల భౌతిక జీవన పరిస్థితుల్ని బట్టి వుంటాయి. వీళ్లందరి మీద పని చేస్తున్న ప్రభావాలు వొక్కటే. కాని వీళ్లలో వొక్కొక్కరిది వొక్కొక్క తరహా జీవితం.

దేవిప్రియ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ‘పొగాకు కంపెనీ సైరన్ మోత ‘ జీవితాన్ని శాసించే నేపథ్యంలో దేవిప్రియ పుట్టేరు. ‘ఒక గుడిసె కథ’ కవితలో దేవిప్రియ తన కవిత్వానికి ప్రాధమిక ముడిసరుకులేమిటో చెప్పారు. తన పంచేంద్రియాల ద్వారా సంపాదించుకునే జ్ఞానం కవితకి ఎప్పుడూ ప్రాధమికమైందే. ప్రేరణలు ప్రభావాలుగా స్థిరపడకముందు కవిలో నిక్షిప్తమైన భావసంపుటి అది. వ్యక్తి జీవన సారాన్ని సాంద్రతరం చేసేవి ఈ భావాలేనని ఫ్రాయిడ్ అంటాడు. దేవిప్రియ జీవన తాత్వికతని నిర్దేశించి చూపుడువేళ్లు ‘ఒక గుడిసె కథ’లో కనిపిస్తాయి.

“ఈ ‘గుడిసెలో’ నేనా ప్రపంచం వుదయించింది అని కవి అంటున్నప్పుడు ఆ ప్రపంచం కేవలం భౌతిక ప్రపంచం కాదు. కొత్త వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే తాత్విక ప్రపంచం. ఈ కవితలో గతం మీద జాలి, ప్రేమ మాత్రమే కాదు వర్తమానం నుంచి భవిష్యత్తులోకి  సాధికారికంగా నడిచి వెళ్లగల ఆత్మస్థయిర్యం వుంది.

అయితే దేవిప్రియ ఆలోచనల మీద ముద్ర వేసిన పరోక్ష అనుభవాల ప్రస్తావన ‘పుట్టినరోజు గురించి’ అనే కవితలో వుంది.

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను” అంటారు.

ఇక్కడ సూచించిన నాలుగు పేర్లు కేవలం   పేర్లు కాదు. ఈ వరస క్రమంలో ఒక చారిత్రక వికాసం వుంది. ఆధునిక కవిత్వంలో సామాజిక చైతన్యం ఎన్ని మలుపులు తిరిగిందో ఈ నాలుగు పాదాల్లో కనిపిస్తుంది.

ఈ రెండు కవితలు ముందు చదివితేగాని కవిగా దేవిప్రియ యేమిటో పూర్తిగా అర్ధమయ్యే అవకాశం లేదు. ‘పైగంబరకవి’గా కన్ను తెరిచిన దేవిప్రియ ‘నీటిపుట్ట’లో ఏ వర్గం భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది. “కవిత్వ నిత్య నిబద్ధం” అని ఆయన నమ్ముతారు. అందుకే చిరకాల స్వప్నాన్ని వాస్తవం చేసిన ” ‘శ్రామికస్వర్గం’ నరకంగా మారుతున్నప్పుడు నిస్సంశయంగా నిరసన వ్యక్తం చేయగలిగారు.

తూర్పు యూరప్‌లో సంభవించిన పరిణామాలు ఏ సామ్యవాద కవికైనా ఆశనిపాతం వంటివే. గ్లాస్‌నొస్త్, పెర్రిస్త్రోయికాల ముసుగులో సోవియట్‌లో ప్రవేశించిన పెట్టుబడిదారీ స్వభావం  ఇక సోషలిస్టు వ్యవస్థ స్వప్నప్రాయమేనని భయపెట్టింది. మనిషి ఆనందానికి ఏ వ్యవస్థ సరిపడ్తుందో తెలియని గందరగోళం యేర్పడింది. ‘ఏది నీ మానవాంశని పరిపూర్ణం చేస్తుందో నాకు అంతుబట్టడం లేదు’ అని వేదన వ్యక్తం చేస్తారు. “ఎర్రబల్బుల్లా వెలిగిన కళ్లలో కలర్ టీవీ వర్ణబింబాలు కదలాడుతున్నప్పుడు, తరతరాల ధార్మిక దాస్యాన్ని ధిక్కరించిన చేతుల్లో కోకాకోలాలు చెమ్మగిల్లుతున్నప్పుడు” సామ్యవాది హృదయ ప్రకంపనలు ఇలాగే వుంటాయి.

ఇదే ధోరణిలో రాసిన మరొక అద్భుతమైన కవిత ‘హిట్లర్ నవ్వు’. ఇది ప్రజాస్వామ్య శిలలమీద ఎర్రపూలు రాలుతున్న రుతువు – అంటూ మొదలయ్యే ఈ  కవితలో దేవిప్రియ రాజకీయ భావాల తీవ్రత తెలుస్తుంది. ఒక శ్రీశ్రీ, ఒక చెరబండ రాజు వారసత్వం నుంచి వచ్చిన కవి మాత్రమే ఈ భావాన్ని ఇంత బలంగా వ్యక్తం చెయ్యగలడు. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవిప్రియ కవిత్వ సంవిధానం ప్రత్యేకంగా గమనించాలి. ఇక్కడ కవి పదం మీద ఎక్కువ దృష్టి నిలుపుతాడు. సాధారణంగా  దేవిప్రియ కవితకి ఒక రూపపరిమితి వుంది. అలవాటుపడిన గేయ చందస్సుల నడక ప్రతి కవితలో కనిపిస్తుంది. ‘హిట్లర్ నవ్వు’ ‘ఆదిరహస్యం మానవుడు’ కవితల్లో కూడా ఆ నడక వుందిగానీ, భావాల తీవ్రత దాన్ని అధిగమించింది. కవితలో కొసమెరుపులు ఇవ్వడం ‘రన్నింగ్ కామెంటరీ’ లక్షణం. ఆ లక్షణాన్ని మామూలు కవితలో కామిక్ రిలీఫ్‌గా మార్చుకుని నిర్మాణంలో ఒక సౌలభ్యం సమకూర్చారు దేవిప్రియ. దీనివల్ల ఆయన ఇతర ఆధునిక కవుల్ని బాధిస్తున్న నిర్మాణ సంక్లిష్టత నుంచి బయటపడ్డారు.

గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ  సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలు అదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్విక సంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.

వైరుధ్యాల చిత్రీకరణలో దేవిప్రియ కవిత్వ వ్యక్తిత్వం  కనిపిస్తుంది. నిబద్ధత వుండి ఉద్యమాలలో నిమగ్నం కాలేక పోయాననే ఆవేదన చాలా సందర్భాల్లో వ్యక్తమవుతుంది. కాని ఇలాంటి అనేక రకాల వైరుధ్యాల పొరల్ని విప్పి చూసుకునే నిజాయితీ దేవిప్రియలో వుంది. నిజానికి నిబద్ధత విషయంలొ ఏమాత్రం తెలివి వుపయోగించకుండానే ఎవరినైనా ఇట్టే మోసం చెయ్యవచ్చు. కాని లోపల నిజమైన కవి దేవులాడుతున్నవాడు కవిత్వంలో పగటి వేషం వెయ్యలేడు. ఉద్యమం గాలి అయినా సోకని కవులు కూడా ఒక ఫాషన్‌గా ఉద్యమ కవిత్వం రాస్తున్న ఈ కాలంలో ఒక కవి నిమగ్నత గురించి నిజాయితీగా కంఠం విప్పడం విడ్డూరంగానే కనిపించవచ్చు.

 

గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి

రుచిమరిగిన వాణ్ణి నేను

ఫ్యాను విసిరే చల్లగాలిలో

శరీరాన్ని ఆరేసుకోవడానికి

అలవాటు పడ్డవాణ్ని నేను

అయినా అడివీ

నువ్వంటే నాకిష్టం‘ (‘అమ్మచెట్టు’లో)

ఇక్కడ అడవి దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలో ఒకవైపు ఉద్యమం తీవ్రతని అందుకుంటున్నప్పుడు మరోవైపు మధ్యతరగతి జీవితంలోకి నయా సంపన్న లక్షణాలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధికంగా కొద్దికొద్దిగా స్థిరపడుతున్న ఈ వర్గంలో అసంతృప్తికి తగిన కారణాలు లేవు. సామాజిక చైతన్యం వున్న మధ్యతరగతి మేధావులలో ఈ స్థితిపై అసహనం వుంది. ‘అడవి’ కవితలో దేవిప్రియ ఈ స్థితిని బలంగా వ్యక్తం చేశారు. అంతేకాదు,

ఈ దేశాన్ని

ప్లాస్టిక్ తీగల విషపుష్పాల ఉద్యానవనాల నుంచి కాపాడడానికి,

ఏదో ఒకనాడు,

నేను నీ సాయమే కోరతాను..” అని వాగ్ధానం చేయగలిగారు..

1984లో దేవిప్రియ ఇలాంటిదే మరో కవిత రాశారు. ఇది దాదాపు ‘అడవి’కవితకు ఒకరకమైన కొనసాగింపు. ఎనభయ్యో దశకం వచ్చేసరికి విప్లవోద్యమం మీద పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గుత్తపెట్టుబడిదారీ మనస్తత్వాల ముందు గొప్ప ఆదర్శాలు కూడా వీగిపోతాయని తీవ్రవాద కమ్యూనిస్టులు కూడా మరోసారి నిరూపించారు. సిద్ధాంతాలను పణంపెట్టి ‘వ్యక్తి’వాద ముఠాలుగా చీలిపోయారు. దేవిప్రియ అన్నట్టు ‘వర్తమానానికి నిన్నటి గుణపాఠాల వర్తమానం అదేమిటో ఇంకా అందలేదు. నేను నడుస్తోన్న ఈ రోడ్డు నా కళ్లు యేరయ్యేదాక నా కాళ్ళు తెడ్లయ్యేదాకా ముగిసేట్టు లేదు.’. ఎదురుచూపులు ఫలించకుండానే కళ్లముందు మళ్లీ చీకటి అలుముకుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఏర్పడిన ఈ స్తబ్దతని కవి ‘అర్ధరాత్రి నిశ్శబ్దంలోని అనిర్వచనీయ శబ్దం’గా అభివర్ణించారు. ఈ ‘నిశ్శబ్దశబ్దం’ తనని భయపెడుతుందనడంలో ఒక మానసిక అంతరాన్ని సూచించారు.

పుస్తకాల పిరమిడ్‌లో మరొక మమ్మీగా మారిపోతానేమోనన్న ఆందోళన వెలిబుచ్చారు. చివరికి ఒక ఆశ. దిగులు  తనని ఎంతగా ఆవరిస్తున్నా నిరీక్షణ ఆగిపోదన్న ధైర్యం. ఉద్యమంలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోయి రేపటి చరిత్రని కొత్త రంగుల్లో రాయగలనన్న ధీమా. దేవిప్రియలో Negative element ఏ కోశానా లేదనడానికి ఈ కవిత ఒక్కటే చాలు నిదర్శనంగా.

అఫ్సర్

తెలుగు వాడి నవ్వు నరం…

mullapudi budugu

(రమణ గారు కన్ను మూసినప్పుడు..)

 

తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది.

తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు.

మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , “ఓ ఫైవ్” కోసం మన చుట్టూ గ్రహంలా తిరిగే అప్పారావుల “నోటు” మాటలు విన్నప్పుడల్లా, చటుక్కున అక్కడ ముళ్ళపూడి ప్రత్యక్షమయిపోతారు. కాబట్టి, ముళ్ళపూడికి కన్నుమూతా, పెన్నుమూతా లేవు.
ముళ్ళపూడి నవ్వుల నావలో ఈ ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది? బుడుగుతోనేనా? ఆ నోటు బుక్కు సైజు పుస్తకం, కాస్త పెద్దచ్చరాలు, మధ్యలో బాపు వొయ్యారి గీతల్లో ప్రాణం పోసుకొని వివిధ భంగిమల్లో బుడుగూ, సీగాన పసూనాంబ..చూస్తున్నప్పుడే కాదు, పుస్తకం మూసి, రమణాక్షరాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా కన్ను కొట్టినట్టుండే కొంటె గీతలు…అటు నించి వాక్యాల వెంట ప్రాణాలని లాక్కుపోయే రమణ గారి

మాటలు…బొమ్మ ముందా, మాట ముందా అంటే ఎటూ తేలని సందిగ్ధం. మొత్తానికి బుడుగు ఒక అనుభవం. మనలోపలి చిలిపితనాలని, కొంటె కోణాన్ని నిద్రలేపే రసార్ణవం.
వాక్యాలు అందరూ రాస్తారు. డయలాగుల లాగులు రైటర్ టైలర్లంతా కుడతారు. కాని, కొన్ని లాగులు అరువు లాగుల్లా వుంటాయి. బరువు మూటల్లా వుంటాయి. కాని, ఈ టైలరు అసలు ఎలాంటి కొలతలూ తీసుకోకుండానే మనసుకి కొలత పెట్టి డయలాగులు కుట్టేస్తాడు.

ముళ్ళపూడి డయలాగులు వదులూ కావు, బిగువూ కావు. మనసుకి వొదిగి పోతాయి. కాబట్టే, తెలుగు వాక్యం ఆయన దగ్గిర చాలా కాలం ఆగిపోయింది. ఆయన వొంపు సొంపుల రేఖల నించి తప్పించుకోవడానికి దానికి చాలా కాలం పట్టింది. ఆ మాటకొస్తే, ఆ వాక్యం ఇంకా అక్కడే ఉండి పోయిందేమో అనీ అనిపిస్తుంది. కనీసం మన నవ్వులు అక్కడ చిక్కడిపోయాయి.

(25 ఫిబ్రవరి 2011, ‘ఆవకాయ’ నించి..)

ఏకాంత దేశంలోకి…త్రిపురలోకి వొక సాలిలాకీ!

tripuraవొక రచయిత తన పాఠకుడి జీవితంలోకి ఎంతవరకూ రాగలడు? వాళ్ళిద్దరూ కలిసి సహప్రయాణం – సఫర్ – చేయగలరా? చేస్తే, వొకరికొకరు ఎట్లా అర్థమవుతారు?

          త్రిపురని తలచుకున్నప్పుడు ఈ మూడు  ప్రశ్నలూ నన్ను వుక్కిరిబిక్కిరి చేస్తాయి. త్రిపుర కథల వెంట, ఆయన సృష్టించిన పాత్రల వెంటా నేను సాగించిన ప్రయాణాలు వొక్కోసారి నాకు ప్రశ్నలూ, ఇంకో సారి జవాబులు కూడా! కానీ, ప్రశ్నకీ, జవాబుకీ మధ్య ఇంకో స్థితి కూడా ఏదో వుంది. ఆ స్థితిలోకి నన్ను చాలా సార్లు నెడుతూ వచ్చాడు త్రిపుర. అసలు జీవితంలో అసంబద్ధతకి ఆ స్థితే తల్లివేరు అనుకుంటా.

ఏ వాస్తవికతా నన్ను స్థిరంగా వుండనివ్వని వయసులో నా కంట పడ్డాడు త్రిపుర. ‘స్థిరతా నహీ నహీ” అని ఎందుకో పాడుకుంటున్నప్పుడు –నా పందొమ్మిదో ఏడు దాటాక-మధ్యాన్నపుటెండలో ఉద్వేగంగా  వేగంగా నడుస్తూ పోతున్నప్పుడు అకస్మాత్తుగా అపరిచితుడిలా ఎదురుపడి “ ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్!” అనేసి వెళ్లిపోయాడు. అప్పటినించీ ఆ పేరు రకరకాలుగా మా మిత్రుల మధ్య నలిగిపోవడం మొదలయ్యింది. మా సమకాలీన అసంబద్ధతకి అలఖ్ నిరంజన్ వొక కొండ గుర్తు అయిపోయాడు. ఆ సమయంలో “అప్పుడే కలలోంచి లేచి కొత్త ప్రపంచాన్ని చూస్తున్న” అనుభూతి త్రిపుర కథలన్నీ!

1

          ఆ మొదటి సారి చదువుతున్నప్పుడు త్రిపుర నిజంగానే కొత్తగా అనిపించాడు. బయటి వాస్తవికత మీద నాలోపల పెరిగిపోతున్న నిరసనకి ఇక్కడో భాష దొరికిందనిపించింది.

“బాల్యం…బాల్యపు అనుభూతులు…బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారిలాంటి ‘యధార్థం’ గుండెల్లో బలమయిన వ్రేళ్లతో పాటుకుపోయి స్థిరపడ్డ కొలదీ…నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో…జీవితానికి అర్థం లేదు, అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ, నా పూర్ణ శక్తితో వెనక్కి…వెనక్కి పరుగెడదామనుకుంటాను….తిరిగీ, నా బాల్యంలోకి…క్షణానికీ, క్షణానికీ, క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బతకడం…..”

ఈ భాష మొదటిసారి విన్నప్పుడు అంతకు ముందు చదివిన బైరాగీ, అజంతా కొంత కొంత గుర్తుకు వచ్చారు కానీ, లోపల పేరుకుపోతున్న శూన్యానికి వాళ్ళెవరూ వచనరూపం ఇవ్వలేదు కదా అన్న అసంతృప్తి వుండేది. పందొమ్మిది దాటి ఇరవైలోకి అడుగుపెడ్తున్న వయసులో, విద్యార్థి ఉద్యమాలూ, కాలేజీల్లో శ్రీశ్రీ వరవరరావుల ప్రసంగాలు ఇంకా చెవుల్లో గింగిరాలు తిరుగుతున్న వేడిలో వచ్చాడు త్రిపుర వొక జెర్కిన్  వేసుకుని…శూన్యాన్ని సఫర్ గా మార్చేస్తూ…!

1980. కొత్త వాస్తవికతని చెప్పడానికి – త్రిపుర భాషలో చెప్పాలంటే- “ఇమేజ్ దొరకడం లేదు.” జీవితంలోంచి “పోయేటిక్ వెదర్” తప్పించుకుంది. బీట్ నిక్స్ కోసం ఎదురుచూపులు. “రూట్ లెస్ ఫెలోస్” గా మారిపోతున్న చెట్లు కూలిపోతున్న దృశ్యం. అవున్నిజమే, “ఎంగ్రీ యంగ్ మెన్” ఇప్పుడు అత్యవసరమనే ఆవేశం. “మాటలు దేన్నీ వ్యక్తపరచలేవు…ఇటుకల్లాగా ప్రాణం లేకుండా కట్టుకుపోతాయి” అన్న భావమూ గట్టిపడుతున్న మనోస్థితి.

అప్పుడొచ్చాడు త్రిపుర…అతని మల్లిపూవు తెల్లని కాయితాల పుస్తకంతో! దాని మీద నల్లని అట్టతో…ఆ అట్ట మీద నిర్వర్ణ ముఖాలతో..! త్రిపుర కథల్ని ఆవురావురుమని చదవలేం. ఆగి ఆగి వొక్కో వాక్యాన్ని చదవాలి. తిరగ తిరగ చదవాలి. మొదట్లో నేను రోజుకో కథ చదివే వాణ్ని. ఆ వాక్యాల్ని మననం చేసుకుంటూ…ఆ భాషలోకి వలసపోతూ చదివే వాణ్ని. చదివిన వాక్యాల వెంట తూనీగలా పరుగులు పెట్టే వాణ్ని. నన్ను క్షణం సేపు నిలవనీయని ఆ పరుగులు కావాలి నాకు.

2

          ఎందుకో తెలీదు బెజవాడ మొగల్ రాజపురం కొండ నాకు చాలా ఇష్టం. ఆ కొండ పక్కనే రెండు గదుల్లో నేను అద్దెకి వుండేవాణ్ణి. నాతోపాటు నా చెల్లి. ఇంటి పక్క కొండపల్లి కోటేశ్వరమ్మ గారూ, ఇంకో పక్క వేణుగోపాలూ, ఇంకో రెండడుగులు వేస్తే డానీ, ఖాదర్, భట్టు గారూ,  మో…సిద్ధార్థ కాలేజీ నించి స్టెల్లా కాలేజీ దాకా సాయంత్రపు నడకలూ…అదీ జీవితం! అలాంటి వొక సాయంత్రం “నీతో నేనూ నడుస్తాను పద..!” అంటూ తోడొచ్చారు త్రిపుర.

“నాకు మాటలు రావేమో!” అన్నాను.

“మాటలు అక్కర్లేదు. వచ్చినప్పుడే రానీ!” అన్నారాయన.

నిజమే…ఇప్పుడొచ్చినన్ని మాటలు అప్పుడు రావు నాకు. అసలు నా నవ్వు తప్ప నా గొంతు వినని వాళ్ళు చాలా మంది వుండే వాళ్ళు అప్పుడు.

“Do you know you’ve a pleasant voice and a singer’s face?!” అన్నారాయన.

“నేనేమిటో నాకు ఇంకా తెలీదు!” అన్నాను సిగ్గుపడుతూ. నా ఇరవయ్యో  ఏడు అమాయకత్వం!

అలా కొన్ని సాయంత్రాలు నడిచాక ఆయన వెళ్ళిపోయారు, “మనం ఉత్తరాలు రాసుకుంటున్నాం!” అని ఇద్దరి తరఫునా డిక్లేర్ చేసేసి!

కాగితాల మీద చూసిన త్రిపురకీ, ఎదురుగా నిలిచిన/ తోడుగా నడిచిన త్రిపురకీ పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరూ వొక్కటే అవడం నాకు చాలా ఆశ్చర్యం.

అలా ఆయన వెళ్ళిపోయిన ఆ రాత్రి నించి మరికొన్ని రోజులు త్రిపుర కథలు చదువుతూ కూర్చున్నా. నాకు త్రిపుర తెలుస్తున్నాడో లేదో తెలియడం లేదు! నాకు చాలా తెలియడం లేదు అని మోనోలాగ్ తో నన్ను నేను కొన్ని రోజులు త్రిపురాక్షరాల అద్దంలో నిలబడి తల దువ్వుకొని కొన్నిసార్లూ దువ్వుకోకుండా కొన్ని సార్లూ అడుక్కుంటూ వుండిపోయా. యవ్వనం చాలా desperate గా వుంటుంది కొన్ని సార్లు. అప్పుడు త్రిపుర నాలోని ఆ desperate mood లోకి ప్రవేశించే వాడు.

అప్పుడే మళ్ళీ కామూ వొకడు నా ప్రాణం తోడేయడానికి! “ఒరేయ్…వాడు నీ చమడాలు తీసేస్తాడ్రా…” అని ‘మో’ బెదిరింపులు. కామూ The Myth of Sisyphus చదువుకుంటూ…గడిపిన రాత్రుల్లో త్రిపుర కూడా!

In a universe that is suddenly deprived of illusions and of light, man feels a stranger. His is an irremediable exile…this divorce between man and his life, the actor and his setting, truly constitutes the feeling of Absurdity.

ఏమిటీ Absurdity లో ఆ A capitalize అయిపోయి నా అస్తిత్వాన్ని నన్నూ కడిగి ఉతికి పారేస్తూ…గది ముందు దండేనికి వేలాడుతున్న చొక్కాలా నేను!

3

Nothing happens, nobody comes, nobody goes; it’s awful!

ఇంకో పదేళ్ళకి చాలా అమాయకంగా ఆ Samuel Becket వాక్యం దుప్పట్లా కప్పేసుకునే human condition.  “…అర్థరాత్రి స్వప్నాల్లో …ఆ కనిపించని ద్వారం తెరుచుకుంటుంది. ఎవరో పచ్చటి వేళ్ళతో తట్టి లేపుతారు. లోపలకు వెళ్తావు. తలుపు మూసుకుంటుంది. చప్పుడు చేయదు. అప్పుడే సీజర్, జీసస్…..జూడాస్ కూడా!”

త్రిపుర పాత్రలు సృష్టించాడా? లేదు. అవి నా బహురూపాలు. నా భిన్న ముఖాలు. నా వొక్కో ముఖాన్ని వొలిచి వాటికి వేరే పేర్లు పెట్టాడు త్రిపుర.

త్రిపుర వేరే జీవితం చెప్పాడా కథల్లో? కాదు. అది నేను జీవించే జీవితమే. నేను జీవిస్తున్నాను అని చెప్పుకోడానికి నిరాకరించే జీవితం!

అందుకే –

త్రిపుర నిష్క్రమించడు. వొక కనిపించని ద్వారం తెరిచి అందులోంచి మనల్ని ప్రవేశపెట్టి, కాసేపు మన సంభాషణకి మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు ఇదిగో ఇక్కడి దాకే!

వచ్చేస్తాడు ఏదో వొక క్షణం, ఇక్కడే వున్నట్టుగా!

 

 

 

 

 

 

 

అఫ్సానా మేరా…

M_Id_379644_Shamshad_Begum

1

నువ్వొట్టి పాటవే అయితే

ఇంత దిగులు లేకపోను,షంషాద్!

నువ్వు కొంత నా బాల్యానివి, కొంత నా తొలియవ్వనానివి.

ఇంకా కొంత సగం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన నిండుయవ్వనానివి.

వొక్కొక్క తలుపూ మూసుకుంటూ వచ్చిన గుమ్మం ముందు చతికిలబడిన నా కోరికల దేహానివి.

అప్పుడంతా అల్లరి చేయాలనుకొని గమ్మున వుండిపోయిన నా లోపలి ఆకతాయితనానివి.

 

వేళ్ళ శక్తి కొద్దీ చెవులు బిగబట్టుకొని నన్ను లాక్కు వెళ్ళి ఏ ఆకాశం కింద ఎండలోనో ఆరేశావ్ చొక్కాలా,

ఆ తరవాత రెపరెపలాడుతూ వుండిపోయా నీ గొంతు అనే మెరుపు తీగ మీద వేలాడుతూ.

 

చినుకు పడితేనే వెంట వెంటనే సుతారంగా తుడిచేసుకునే నన్ను

కట్టిపడేసి వొక జలపాతంలోకి గడ్డివామిలోకి తోసినట్టు తోసేశావ్!

 

అప్పుడంతా

నువ్వు నన్ను ఆటపట్టిస్తున్నావనుకున్నానే కానీ

నా సంశయాల సంకోచాల దుమ్ము దులిపేస్తున్నావని అనుకోలేదు.

నా మీదికి నన్నే తిరుగుబాటుకి పంపిస్తున్నావని అసలే అనుకోలేదు.

 

2

పాటలు అందరూ పాడతారు, షంషాద్!

కానీ ఇంత చిలిపితనాన్ని ఎవరు పాడతారు,నువ్వు తప్ప

ఇంత అల్లరల్లరిగా మాటల్ని ఎవరు రువ్వుతారు నువ్వు తప్ప

ఇంత నిర్లక్ష్యంగా ఎవరు నవ్వుకుంటూ వెళ్తారు వొక్క నువ్వు తప్ప!

 

3

ఇన్నేసి

పాటల్ని కెరటాల్లా రువ్వీ రువ్వీ

చివరికి నువ్వు ఎక్కడో ఈ ప్రపంచానికొక మూల

ఆ అజ్నాత దిగంత రేఖ మీద వున్నావనే తెలియదే,

రహస్యంగా పాడుకుంటూ వున్నావనే తెలియదే!

 

నిజంగా చెప్పు,

నిజానికి ఈ లోకానికి నువ్వూ నేనూ కావాలా?

ఇన్ని పాటల అలజడివాన కావాలా?

ఈ ఉద్వేగాలు పొదువుకున్న మాటల నురగలు కావాలా?

 

4

వెళ్లిపోతావ్

నువ్వు గొంతులోకి గుండెని వొంపి పాడుతూ పాడుతూ.

నేనేమో అక్షరాల్లోకి నా ప్రాణమంతా ధారపోస్తూ పోస్తూ వెళ్లిపోతాను.

నీ కథ కొన్ని స్వరాల్లోకి నా కథ కొన్ని కాగితాల మీదికి జాలిగా జారిపోతుంది.

భలే పాడుకున్నావు గా నువ్వు,

“అఫ్సానా మేరా బన్ గయా అఫ్సానా కిసీకా!” అంటూ.

 

5

ఇద్దరమూ

వొకే ఖాళీతనంలోకి వొలికిపోయాక

మన ఇద్దరి ఈ కథలూ ఎవరి కథలుగానో మిగిలిపోతాయి.

ఆఖరి కథ ఎవరు చెప్పుకొని ఎలా నవ్వుకుంటారో తెలియదే!

 

6

“హమే మాలూమ్ హై… మాలూమ్ హై”

అంతా తెలుసు తెలుసు అని పాడుకొని

వెంటనే నాలిక్కర్చుకొని

‘లేకిన్’…

కానీ కానీ…అన్నావే….

అదిగో

అదే

అసలు జీవితమంతా!

*

 

(జలియన్ వాలా బాగ్ విషాదం జరిగిన మర్నాడు అంటే 1919 ఏప్రిల్ 14న అమృత్సర్ లో షంషాద్ బేగమ్ అనే చిలిపి కోయిల పుట్టింది. నాకు ఆమె గొంతులో చిలిపిదనం నచ్చి, చిలిపి కోయిల అంటున్నా గాని, అన్నీ రకాల పాటలూ పాడింది షంషాద్. హిందీ సినిమా లోకంలో తొలితరం నేపధ్య గాయని.  ఆమె ఎంత గాఢమయిన ముద్ర వేసిందంటే, పాడితే ఆమెలానే పాడాలని లతా ఆషా భోంస్లే లని సినిమా లోకం  రాసి రంపాన పెట్టేది. ఆమెలా ఎవరూ పాడలేరని వాళ్ళిద్దరూ బాహాటంగానే వొప్పుకున్నారు. మొన్న ఏప్రిల్ 23న ఆమె కన్నుమూసిన రోజు నా కంటి మీద కునుకు లేదు! ఆమె పాటల హోరుగాలి నా కళ్లని, నన్నూ చుట్టుముట్టి, వొక అలలాగా నన్ను నేను కనిపించని తీరానికి కొట్టుకుంటూ వుండిపోయా)

 

ఏ నీటి వెనకాల ఏముందో?!

afsar dukeమొదటి సారి ఎక్కడి నించో వొక వాన చినుకు పడ్డప్పుడు ఆ అనుభూతిని నేను ఏ భాషలోకి తర్జుమా చేసుకుని వుంటానో?

అక్షరాలేమీ తెలియనప్పుడు అది వొక ఆనందపు కేరింత అయి వుంటుంది.

వొక సారి నేను మా పెదనాన్నగారి వూళ్ళో కాళ్ళు ఎటు నడిస్తే అటు వెళ్ళి ఎక్కడో వొక చెట్ల గుంపులోకి దారి తప్పాను. దాన్ని అడివి అంటారని కూడా తెలియని వయసులో –ఆ అడివి మధ్యలో ఏ మూల నించో వొక జలపాతం రహస్యంగా చప్పుడు చేసినప్పుడు  భయపడ్డానా? ఆశ్చర్యంలోంచి తేరుకోలేక అలా కూర్చుండి పోయానా?

అప్పుడు కూడా నా చేతుల్లో భాష లేదు.

ఇంకోసారి వొక నిమ్మతోట మధ్యలోంచి వెళ్తూ ఆ పరిమళాల ఉక్కిరిబిక్కిరిలో చివరికి వొక కాల్వ పక్కన నేను తేలాను. రాత్రి చీకటి పడే దాకా ఆ కాల్వలో మునకలు వేస్తూ వొళ్ళు కరిగిపోయేలా స్నానం చేశాను.

అప్పటికింకా  కవిత్వస్నానాలకు ఇంకా అలవాటు పడలేదు.

ఇంకా చాలా సార్లు పూలతో, మామిడి చెట్లతో, రాత్రి నేను నడిచే దారుల్లో అడ్డొచ్చి నన్ను ముందుకు వెళ్లనివ్వని నైట్ క్వీన్ పరిమళాల్లో నేనేమయిపోయానో తెలియదు –

వాటిని వాక్యాల్లోకి మార్చే రహస్యం వొకటి వుందని తెలియని కాలాల్లో!

ఇవన్నీ భాషలోకి తర్జుమా చేసుకుని, వాటిలో నన్ను నేను వెతుక్కునే కాలం కోసం చాలా ఎదురుచూడాల్సి వచ్చింది. నాకు కవిత్వం అంటే ఏమిటో తెలిసిన రుతువు వచ్చేంత వరకూ వాటిని దాచిపెట్టుకోవాల్సి వచ్చింది ఎక్కడో మనసు ముడతల కింద- ఇంకా చిన్నప్పటి ఆటల భాషలో చెప్పాలంటే ఎక్కడో వెన్నెల కుప్పల్లో…!

*

ఇదిగో ఈ వాక్యాల ఆసరా కూడకట్టుకొని వెళ్ళాను, నార్త్ కెరోలీన స్టేట్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ వేదిక మీదికి!

కవిత్వాన్ని గురించి యూనివర్శిటీ వేదికల మీద మాట్లాడ్డం నాకు కొత్త కాదు. అమెరికా వచ్చాక నా క్లాస్ రూముల్లో సరే, బయటి యూనివర్శిటీలలోనూ మాట్లాడుతూనే వుంటాను. కానీ, ఏప్రిల్  19, 20 తేదీల్లో నార్త్ కెరోలీన స్టేట్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీలు కలిసి నిర్వహించిన Environment Across the Disciplines:  Perspectives from India and Beyond సదస్సులో మాట్లాడడానికి ఆహ్వానం వచ్చినప్పుడు మొదట నేను సంశయించాను.

ఎందుకంటే, అందులో మొదటి రోజు సదస్సులో మాట్లాడే నలుగురూ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ రంగంలో నిపుణులు. రెండో రోజు మాట్లాడే నలుగురిలో వొకరు చరిత్రకారులు, ఇంకొకరు రాజకీయ నిపుణులు, మరొకరు ఆర్థిక నిపుణులు. నాలుగో వాణ్ని చివరి వాణ్ని నేను! వాళ్ళు అంకెల్లో మాట్లాడ్తారు, గ్రాఫులతో మాట్లాడతారు. కవిత్వాన్ని గురించి మాట్లాడే నేనేం చేయాలి? అంకెల్లో నేను మహా పూర్! గ్రాఫులతో నాకు ఎప్పుడూ పని లేదు. నా కవిత్వ భాష వాళ్ళకి అర్థమయ్యే ప్రసక్తే లేదు అనుకున్నా.  వెంటనే నేను ఆ ఆహ్వానాన్ని వద్దనుకున్నా.

కానీ, అవతల నించి ఎప్పటి నించో తెలిసిన Sandria Freitag, నేను ఏ అకడమిక్ సమావేశంలో కనిపించినా నన్ను వెంటనే డిన్నర్ కి లాక్కు వెళ్ళి కబుర్లలో ముంచెత్తే David Gilmartin రంగంలోకి దిగారు, ‘వచ్చి తీరాల్సిందే!” అంటూ!

“ నేనొక పెద్ద disaster అవుతాను ఆ సైంటిస్టుల మధ్య!” అనేశాను ఎలాంటి సంకోచం లేకుండా! “అవన్నీ కాదు. నువ్వొస్తున్నావ్!” అని ఏకంగా టికెట్ పంపించేశారు.

అంతే! నాకు అలవాటు లేనే లేని  ప్రేక్షక సమూహంతో మాటలు కలపడానికి నేను సిద్ధం కాక తప్పలేదు.

2

            “I begin where numbers fail and fumble, I turn my face to what these lines of graph not dare to capture the curved lines of emotions and senses. Here I speak straight into an emotional face of humanity that we miss in the name of statistics.”

ఆ మొదటి వాక్యానికి చప్పట్లు మోగాక నా గుండె చప్పుళ్ళు కుదుట బడ్డాయి. మొదటి వాక్యం నెగ్గుకొచ్చాక తరవాతి నడక దానికదే సాఫీగా సాగిపోతుందన్నది నా కవిత్వ ఫిలాసఫీ.

నేను మాట్లాడాల్సిన విషయం: Fluid Poetics: Visions and Revisions in Contemporary Indian poetry. అయితే, అక్కడ Fluid అన్న మాట కేవలం కవిత్వ శిల్పానికి సంబంధించిందే కాదు. కవిత్వ వస్తువు కూడా…దాన్ని నేను water అనే అర్థంలోకి మార్చుకున్నా. అంటే, నేను ఈ environment గురించిన సదస్సులో ‘నీటి’ ని వస్తువుగా తీసుకున్న కవిత్వం ఎలాంటి ప్రవాహగతితో సాగిపోతుందో చెప్పడానికే పరిమితమయ్యాను. కవులు నీటి చుట్టూ ఎలాంటి అనుభవాలు చెప్తారో, ఆ అనుభవాలని నడిపించే vision ఏమిటో, కాలగతిలో ఆ vision ఎలాంటి  revision కి లోనవుతుందో చెప్పుకుంటూ వెళ్లాలన్నది నా ఉద్దేశం. ఈ సందర్భంలో అప్పుడు నీటికి సంబంధించిన నా  అనుభవాలు- వాన చినుకు, నదిలో ఈత, కాల్వతో శరీరం పరుగులు – ఇవన్నీ నాకు వస్తువులే. ఇస్మాయిల్ గారు నది మీద రాసిన పద్యాలే కాదు, కొంచెం కవితాత్మకంగా అనిపించే పెద్దిభొట్ల గారి గ్లాసులో నీళ్ళ కథ ని కూడా వదల్లేదు.

అంటే, వాన గురించీ, నదుల గురించీ కవి వొక దశలో అమాయకంగా మాట్లాడినా, ఇంకో దశలో ఆ అమాయకత్వాన్ని వదులుకొని, వాస్తవికత వేపు వెళ్ళక  తప్పదని నా మౌలిక వాదన. అందుకే, ఇస్మాయిల్ గారికి బావి సొట్టపడ్డ బుగ్గలా కనిపిస్తుంది. అదే బావి సతీశ్ చందర్ కి రెండు కలవని కనుపాపలుగా కనిపించి అతని దళిత అస్తిత్వాన్ని చెప్తాయి. మామూలు కవికి సముద్రాన్ని చూడగానే మనసు కేరింతలు కొడితే, తెరేష్ బాబు లాంటి అస్తిత్వ ముద్ర వున్న కవికి హిందూ మహా సముద్రంలో ‘హిందూ’త్వం కనిపిస్తుంది.

గ్లాసెడు నీళ్ళ కోసం తపించే చోటే ఆ నీళ్ళు వ్యాపార వస్తువు అయిపోవడం గోపి లాంటి కవిని గాయపరుస్తుంది. చిన్నప్పుడు కలిసి ఈతలు కొట్టిన చెరువులే వున్నట్టుండి ‘మతం’ ముద్రలు పడే ఎడబాటు వొక ముస్లిం కవిని దిగులు పెడ్తుంది. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే గుండె ఉప్పొంగే నేల ఇంకో చోట ఆ గుక్కెడు నీళ్లూ అందక నోరెండిపోతుంది. అంటే, నీరు అనుకున్నంత సరళమూ కాదు, అమాయకమూ కాదు. ఆ నీటి వెనక గతముంది,  బాధలున్నాయి, కథలున్నాయి. మన భవిష్యత్తూ వుంది.

3

          వొక నలభై అయిదు నిమిషాల నా ప్రవాహం తరవాత సదస్సుని చైర్ చేసిన దక్షిణాఫ్రికా ఆర్థిక నిపుణుడు క్లిఫర్డ్ గ్రిఫిన్ చర్చ మొదలు పెట్టారు. నా ప్రసంగం అంతా వొక ఎత్తు, ఆ తరవాత అరగంట పైగా జరిగిన చర్చలో  నేను ఉక్కిరిబిక్కిరయిన సన్నివేశం ఇంకో ఎత్తు. అది మరో సందర్భంలో…!

కొసమెరుపు:

సదస్సు అయిపోయిన తరవాత రాత్రి డిన్నర్ లో ఈ సదస్సు నిర్వహించిన అయిదుగురూ చేతులూ జోడించి “మీరు వచ్చు వుండకపోతే, మేము disaster అయి వుండే వాళ్ళం! You really struck the real chord!” అందరి ముందూ అనడంతో నా మనసు తేలిక పడింది.

వొక నిండైన వాక్యం కోసం…

mandira5afsar

One day the Nouns were clustered in the street,

An adjective walked by, with her dark beauty

The Nouns were struck, moved, changed.

The next day a Verb drove up, and created the Sentence.

 

ప్రసిద్ధ అమెరికన్ కవి కెన్నెత్ కోక్ ఎప్పుడో యాభై మూడేళ్ళ క్రితం రాసుకున్న కవితలో కొంత భాగం  అది. ఈ కవిత ఆసాంతం మొదటి సారి చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది.

ఈ కవిత  చదివిన మర్నాడు – ఈ సెమిస్టర్ నేను చెప్తున్న ‘Modern Indian Poetry and Religions’ క్లాస్ లో వినిపించాను. ఆ క్లాస్ లో వున్న యాభై మంది విద్యార్థులూ  చాలా సేపు హాయిగా నవ్వుకున్నారు. కానీ, ఆ తరవాత ఆ కవితకి వాళ్ళలో కొద్దిమంది చెప్పుకొచ్చిన వ్యాఖ్యానాలు, అన్వయాలూ నా మెదడులో కొత్త పొద్దు పొడుపులు. వాటన్నిటినీ అల్లుకుంటూ పోతే, చివరికి ఆ కవిత నాలో అనేక భావనలతో  నిండిపోయింది.  వొక పాత పద్యమే కొత్త అర్థాల వస్త్రాలతో నా ముందుకొచ్చింది.  అప్పటి నించీ ఈ కవితలోని  ప్రతి వాక్యం నా వెంటే వుండి, నా లోపలే సుడి తిరుగుతూ, కచ్చితంగా ఈ క్షణాన అది నా కోసమే రాసినట్టు అనిపిస్తోంది, అందులోని కొన్ని ఆలోచనలు ఈపాటికే  నా సొంతమయిపోయాయి కనుక.

కవిత్వంలో అయినా, వచనంలో అయినా వొక వాక్యం ఎలా తయారవుతుందన్నది నాకెప్పుడూ ఆశ్చర్యం! వాక్యం తయారవడం అంటే ఆలోచనలు వొద్దికగా కుదురుకోవడం! లోపలి సంవేదనలన్నీ వొక లిపి కోసం జతకూడడం! అన్నిటికీ మించి – నేను ఇతరులతో , ఇతరులు నాతో మాట్లాడుకోవడం! వాక్యంలోని  నామవాచకాలూ, విశేషణాలూ, క్రియల మధ్య ఎలాంటి స్నేహం కుదరాలో నాకూ నా లోపలి నాకూ, నా బయటి లోకానికీ అలాంటి స్నేహమే కుదరాలి. అది కుదరనప్పుడు నేను వాక్యవిహీనమవుతాను. నా బయటి లోకం అర్థవిహీనమవుతుంది.  నాకొక వ్యాకరణం లేకుండా పోతుంది. ఇప్పటిదాకా అర్థమయిన జీవన పాఠం ఏమిటంటే: అసలు వెతుకులాట అంతా ఆ వ్యాకరణం కోసమే! సమాజాలకూ, సమూహాలకు కూడా అలాంటి వ్యాకరణమే కావాలనుకుంటా.

ఇంకా కొద్దిగా విస్తరిస్తే, సాహిత్య  రంగంలోకి వచ్చేసరికి ఈ వ్యాకరణం ఎలా తయారవుతుందంటే : రచయితలు రాస్తారు, ప్రచురణకర్తలు లేదా పత్రికల వాళ్ళు అచ్చు వేస్తారు, పాఠకులు చదువుతారు. మధ్యలో కొందరు ఆ రచనల మీద వ్యాఖ్యానాలు చేస్తారు. వాటి మీద ప్రతివ్యాఖ్యానాలు జరుగుతాయి. ఈలోపు కొన్ని అభిప్రాయాలూ కుప్పపడిపోతాయి. వాటిల్లో సారం కోసం – కొన్ని సార్లు గడ్డివామిలో సూది కూడా కావచ్చేమో!- అందరూ పడీ పడీ వెతుక్కుంటారు. ఈ వెతుకులాటలో కొందరు అవసరానికి మించి మరీ పారంగతులవుతారు, ఇంకా కొందరు వెతుక్కోడమే రాక నిస్సహాయులవుతారు. ఇంకా కొందరు వోటమితో రాజీ పడకుండా దరిచేర్చే వారి సాయం కోసం చూస్తూ వుండిపోతారు.

ఇప్పటి విషాదం ఏమంటే, ఇప్పుడీ వాక్యాల వంతెనలన్నీ కుప్పకూలిపోతున్నాయి.

అనేక రకాల భావ వ్యక్తీకరణ సాధనాలూ, కొత్త కమ్యూనికేషన్ దారులూ తెరుచుకుంటున్న ఈ-కాలంలోనే మన మధ్య ఇంకో విధమయిన అపరిచితత్వం కూడా ఏర్పడుతోంది. కుప్పపడిపోతున్న శబ్దాల మధ్య అర్థవంతమయిన మాటలు లేకుండా పోతున్నాయి. సాహిత్యరంగం కూడా దీనికి భిన్నంగా యేమీ లేదనే చెప్పాలి. అంతర్జాలలోకం వొక మాయాజాలంగా మారుతోంది. అంతర్జాల అక్షరాస్యతా, విజ్నానమూ సృష్టిస్తున్న సమాచారాన్ని ప్రోది చేసినంతగా ఆలోచననీ, వూహాశక్తినీ కూడదీయలేకపోతుందా అన్న సందేహం పుట్టుకువస్తోంది.

ప్రసిద్ద శాస్త్రవేత్త ఐనిస్టీన్ ఎక్కడో అన్నాడట: “Imagination is more important than knowledge. For knowledge is limited to all we now know and understand, while imagination embraces the entire world, and all there ever will be to know and understand.” ఈ-కాలం మనుషులు తమకి తెలిసిన సమాచారమే సర్వస్వం అనుకుంటున్నారు. కానీ, ఆ సమాచారం  వడపోత తరవాతే  తమ దాకా చేరుతుందని కానీ, ఆ సమాచారానికి తమదైన దృక్పథంలోంచి చూడాల్సి వుంటుందని గ్రహించలేకపోతున్నారు. ‘put it in a perspective’ అన్న భావనకి అర్థం లేకుండా పోతోంది.  ఇప్పటి సాహిత్య రూపాలు కూడా ఈ రకమయిన భావదారిద్ర్యంతో బాధపడుతున్నాయని నాకు అనిపిస్తోంది.

మనం అందమయిన ప్రతీకలూ, పదచిత్రాలూ, మాంత్రిక వాస్తవికవాదాలూ, అధివాస్తవిక విపరీత వాదనలూ సమకూర్చుకుంటున్నాం నిజమే, వాటి మధ్య అంతస్సూత్రాన్ని సాధించగలుగుతున్నామా అన్నది నా చింత. మనం కప్పుకుంటున్న వస్త్రాలు అందంగా వున్నాయి కాదనడం లేదు కానీ, ఆ వస్త్రాలలోపల వొక తెలియని డొల్లతనమేదో చప్పుడు చేస్తోంది. అంతా స్పష్టంగా కనిపిస్తున్న మాట కూడా నిజమే కానీ ఆ స్పష్టత కింద అంతుపట్టని అస్పష్టత ఏదో వుంది.

నేను పైన చెప్పిన కెన్నెత్ కోక్ పద్యం మీద జరిగిన చర్చలో నా విద్యార్థిని అయిన వొక అమెరికన్ కవయిత్రి క్లాస్ లో చర్చ మధ్యలో చాలా మంచి మాట అంది –“అసలు ఇప్పుడీ లోకంలో మిక్కీ మౌస్ కంటే  గొప్ప ఊహాశక్తి వున్న ప్రాణి ఇంకోటేదీ కనిపించడం లేదు” అని! అప్పుడు నేను వెంటనే “నిజమే కానీ, దాన్ని సృష్టించింది మనిషే కదా!” అన్నాను. “అదీ నిజమే! కానీ, వొక్కో సారి మనిషి సృష్టించినవే మనిషి కంటే ఎక్కువ వూహాశక్తిని సాధించుకుంటాయి. ఉదాహరణకు: దేవుడు!” అందామె నేను ఆశ్చర్యపోతుండగా! అంటే, ఆమె వివరణ ఏమిటంటే, విపరీతమయిన సమాచార వొత్తిడి వల్ల మన వూహాశక్తి కుంచించుకుపోతున్నదని!

ఆ వెంటనే ఆమె తన ఆలోచనని కెన్నెత్ కోక్ పద్యానికి అన్వయిస్తూ “మన సంభాషణల్లో నిండయిన వాక్యాలు లేవు. మనం మాట్లాడుకుంటున్నవనీ క్రియలూ, విశేషణాలూ, చివరికి వాటి మధ్య సంధి కుదిర్చే locatives లేని సంభాషణ. కాదంటారా?” అంది.

నిజమే. ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్నకి నా దగ్గిర సమాధానం లేదు!

కానీ, వొక్కటి మాత్రం మేం అనుకున్నాం – మన వూహల  దిగంత రేఖ ఇంకాస్త విస్తరించాలని! మనం రాసుకుంటున్న వాక్యానికి ఇంకా కొన్ని వూహల పాఠాలు నేర్పాలని!

 

భారతీయ కథలో వేంపల్లె జెండా!

shariff -1

(మన కథకుడు వేంపల్లె షరీఫ్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం
గౌహతి లో మార్చి 22 వ తేదీ అందుకుంటున్న సందర్భంగా)

రాయలసీమ ముస్లిం జీవితాల్ని సన్నిహితంగా చూసిన వాళ్ళకి వొక విషయం ఇట్టే తెలిసిపోతుంది –

మిగిలిన  ప్రాంతాల కంటే కూడా సీమలో ముస్లింలు ఇక్కడ స్థానిక జీవితంలో బాగా ఇమిడిపోయారు అని! సీమలో ముస్లింల ఇంటి పేర్లు మిగిలిన చోట ముస్లింల ఇంటిపేర్లలా మహమ్మద్, షేక్, సయ్యద్ అని మొదలవ్వడం చాలా అరుదు. వేంపల్లె, పెనుకొండ, కొదుమూరు, కలికిరి ఇవీ ఎక్కువ మంది ముస్లింల  ఇంటి పేర్లు. ఇంకాస్త ముందుకు వెళ్ళి, పల్లెల్లో పీర్ల పండగలూ, ఇతర సూఫీ పీర్ల స్మృతి చిహ్నంగా జరిగే ఉరుసు ఉత్సవాలు గమనిస్తే సామూహిక స్థాయిలో హిందూ-ముస్లింల మధ్య ఎలాంటి అనుబంధం వుందో తెలుస్తుంది.

తెలుగు సాహిత్యంలో ముస్లిం కథకుల పేర్లు వినిపించడం విశేషమేమీ కాదు. కానీ, వేంపల్లె షరీఫ్ కథలు చదవగానే అవి సాధారణ ముస్లిం కథలకు భిన్నంగా అనిపించడానికి కారణం షరీఫ్ సీమ నేపధ్యమే! అందుకే, షరీఫ్ కథల్లో కనిపించే మెజారిటీ-మైనారిటీ బంధం కూడా భిన్నంగా వుంటుంది. ఇందులో సంఘర్షణ తక్కువగా వుంటుంది, సామరస్యం ఎక్కువగా వుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు ఆ తేడాని గమనించలేనంతగా ఆ రెండు సమూహాల సంబంధాలూ కలగలిసిపోయి వుంటాయి. ఆ కారణంగా షరీఫ్ తన కథల్లో వర్ణించే ముస్లిం జీవన దృశ్యం కేవలం వొక మైనారిటీ కోణంగా కనిపించదు. స్థానికత అనేది సమకాలీన తెలుగు కథ ప్రధాన లక్షణం అనుకుంటున్న ఈ దశలో షరీఫ్ కథలు ఆ లక్షణానికి  పక్కా ఉదాహరణగా నిలుస్తాయి.

స్థానికతకి వొక ప్రత్యేకమయిన శిల్ప సౌందర్యం కూడా వుంటుంది. స్థానికత ఇరుసుగా వున్న కథ ఎక్కువ అలంకారాలు ధరించదు. సాదాసీదా అందంతో మన ముందుకు వస్తుంది. వొక్కో సారి ఈ అందం వొక అందమేనా అన్న సంశయం కలిగేంతగా ఈ కథలో అందం ఇంకిపోయి వుంటుంది. షరీఫ్ కథలు చాలా మామూలుగా మొదలయి, చాలా మామూలుగా నడుస్తూ చాలా మామూలుగా ముగుస్తాయి. అతని వాక్యాలు సాంద్రత కోసం వెతుక్కోవు.

ఇంత మామూలు వాక్యాలు కథలో ఎలా ఇమిడాయా అని ఆశ్చర్యపోతుండగా చదువరిని చివరి దాకా తీసుకు వెళ్ళే అత్యంత పరిచిత వ్యక్తిలా కనిపిస్తాడు షరీఫ్. కథలో వొక ఆత్మీయ స్వరం వినిపిస్తూ వుంటుంది. బయటి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ఇలాంటి ఆత్మీయ స్వరాన్ని వినిపించడం అంత తేలిక కాదు. ఇది ఖదీర్ బాబు కథల్లో వినిపించే లాంటి ఆత్మీయ స్వరం కాదు. (కథా శిల్పానికి సంబంధించి ఇంకో విషయం: చాలా మంది ఖదీర్ బాబు రచనని నామిని కథాశిల్పంతో ముడిపెట్టి మాట్లాడుతూ వుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. నామిని కథనంలో rationalization అసలు వుండదు. ఖదీర్ కథన శిల్పంలోని వొకానొక జీవధాతువు నామిని నించి వచ్చిందే కానీ, ఖదీర్ కథనశిల్పం నామిని కంటే ఆధునికం, సమకాలీనం. అది అతని rationalization వల్ల సాధ్యమయింది. అందుకే ఖదీర్ కథన సంప్రదాయం అనే మాటని విడిగా వాడుతున్నా)

ఈ ఇద్దరి సంప్రదాయాన్ని   సహజ అందంగా కలిపి ముందుకు తీసుకెళ్తున్న కథకుడు షరీఫ్. ఈ కథల్లోని ఆత్మీయ శిల్పం ఆత్మీయంగా వుంటూనే ముక్కు సూటిగా కొన్ని హేతుబద్ధమయిన ప్రశ్నలు అడుగుతుంది. అసలు అలాంటి ప్రశ్న అడక్కుండా షరీఫ్ కథ ముగింపు దాకా రాదు. కథ ముగిశాక ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంతో ఈ కథల పఠితకి ఇంకో ప్రయాణం మొదలవుతుంది. ‘జుమ్మా’ సంపుటి నించి ఈ సారి “కథాసారంగ”లో ప్రచురిస్తున్న షరీఫ్ సరికొత్త కథ ‘వింత శిశువు’ దాకా ఈ ప్రశ్న వినిపిస్తూనే వుంటుంది. అయితే, ఈ ప్రశ్న స్వరం చెంప మీద చెళ్లుమని కొట్టినట్టుగా కాకుండా, ఆత్మీయ స్వరంతో ధ్వనించడం షరీఫ్ కథనమార్గం!

ప్రతి గురువారం ఇక ‘సారంగ’ వారమే!

mandira1పుస్తకాలు లేని గది మూగది! నిజమే…కానీ-

వొక పదేళ్ళ క్రితం మంచి చదువరి అంటేనో, పుస్తకాల పురుగు అంటేనే చుట్టూ పుస్తకాలు పోగేసుకుని లేదంటే చేతిలో కనీసం వో పుస్తకం కచ్చితంగా ఛాతీకి ఏటవాలుగా అమిరేట్టు పెట్టుకునో కనిపించడం వొక రొటీన్ దృశ్యం! ఇవాళ ఆ దృశ్యం నెమ్మదిగా కనుమరుగయిపోతోంది. ఇది పుస్తకాలకే కాదు, పత్రికలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మూడు నాలుగు పుస్తకాలేమిటి, రెండు మూడు పత్రికలేమిటి వొక్క చిన్న నోట్ బుక్ లాంటి పరికరంలో వందల పుస్తకాలూ పత్రికలూ అగ్గిపెట్టెలో చీరలా ఇమిడిపోతాయి! చూస్తూ చూస్తూ వుండగానే మన పుస్తకాల ‘గది’ ఎంత చిన్నదైపోయిందో! కానీ, ఆ గదిలో ఇమిడిన ప్రపంచం రెప్పపాటులోనే, మన చేతివేళ్ళ ఇంద్రజాలంతో ఇట్టే ఆకాశమంత విస్తరించింది.

చిన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక ఏ రోజు వస్తుందా అని రోజులు – మరీ ఆ సస్పెన్స్ తీవ్రతని నాటకీయంగా  చెప్పాలనుకుంటే- క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేవాళ్లం. నిజంగానే! వారపత్రిక లేని అలనాటి  చదువరి బాల్యాన్ని నేను వూహించలేను. ‘ఈవారం కవిత, కథ’ అనగానే కళ్ళలో చక్రాలు గిర్రున తిరిగి, ఆ పేజీల్లో ఎవరున్నారా అని ఆతృతగా వెతుక్కోవడం, ఆ చదివిన పేజీల్ని, వాటికి వాడిన చిత్రాల్ని అందంగా నెమరేసుకోవడం, ఎప్పటికయినా ఆ పేజీల్లో నేనొక పేజీ కాగలనా అనుకుంటూ కలలు కనేయడం…ఇవాళ నలభైలకి అటూ ఇటూ వున్న ప్రతి రచయితకీ  పఠితకీ అనుభవమే! ‘ఈ వారం మీ పత్రిక చదివాము, ఇంటిల్లి పాదీ ప్రతి పేజీ చదువుకునీ మళ్ళీ చదువుకుని ఎంత హాయిగా కాలక్షేపం చేశామో చెప్పలేను’ లాంటి లేఖలు నిన్నటి నాస్తాల్జియాకి గురుతులుగా మిగిలిపోయాయి. ఆ ‘ఇంటిల్లిపాదీ’ అన్న పదం ఇప్పుడెక్కడా వినిపించనే వినిపించదు ఆశ్చర్యంగా!

చాలా మంది స్నేహితులు ఇప్పటికీ వొక వారపత్రిక వుంటే భలే బాగుంటుంది అని ప్రకాశంగా అనడమూ, ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విషాదమో/ విషాదం లాంటి ఆనందమో!” అంటూ కవి తిలక్ లాగా బాధపడిపోవడమూ తెలుసు. అంటే, వెబ్ లోకంలో  ఇన్ని ద్వైమాసిక. మాస పత్రికలు వున్నా అలాంటి వార పత్రిక లేదే అన్న వెలితి మనలో వుండిపోయింది. ఆ వెలితిని తలచుకుంటూ ఇదిగిదిగో సారంగ సాహిత్య వారపత్రిక! నిస్సందేహంగా ఇది సారంగ బుక్స్ మరో ముందడుగు, మిమ్మల్ని చేరుకోడానికి! మీ పుస్తక ప్రపంచంలో మీ ఆలోచనల్లో మీ ఉద్వేగాల్లో  మీతో వో  కరచాలనానికి!

వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

సారంగ బుక్స్ నించి వొక సాహిత్య వారపత్రిక రాబోతున్నదంటే అది అచ్చు పత్రిక అయి వుంటే బాగుణ్ణు అని ఆశపడ్డారు చాలా మంది సాహిత్య మిత్రులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అక్షర ప్రయాణం మొదలయిన ఈ రెండేళ్లలోనే సారంగ  బుక్స్ అంటే వొక మంచి ప్రచురణ సంస్థ అన్న గౌరవం ఏర్పడింది. ‘సారంగ’ నించి ముందు ముందు ఏ పుస్తకాలు వస్తాయన్న ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, సారంగకి మొదటి నించీ సాంకేతిక వెలుగుల మీద గొప్ప ఆసక్తి. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త వెలుగుల్నీ, మెరుపుల్నీ సాహిత్యానికి ఎలా అద్దగలమన్నదే ‘సారంగ’ అన్వేషణ. ఇవాళ ఈ గురువారంతో ‘సారంగ’ అన్వేషణ వొక కొలిక్కి వచ్చింది. వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

మరో అంతర్జాల పత్రిక అవసరమా అన్న ప్రశ్నకి సారంగ దగ్గిర సమాధానం వుంది. మన రోజు వారీ జీవితంలో కనీసం కొంత భాగం కాగల సాహిత్య వారపత్రిక వుండాలన్నది మొదటి సమాధానం. అయితే, తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో సారంగ బుక్స్ మొదటి నించీ చేయాలనుకుంటున్నది రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలన్నది. లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల. అందులో భాగంగానే ఈ ఏడాది సారంగ బుక్స్ వొక పూర్తిస్థాయి ప్రచురణ సంస్థగా మీ ముందుకు రాబోతోంది. కేవలం ఫిక్షన్ మాత్రమే కాకుండా నాన్- ఫిక్షన్ రచనలు కూడా మరిన్ని తీసుకురావాలనే సత్సంకల్పం వొక ఎత్తు అయితే, ఆ రచనలు అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా మీ చేతుల్లోకి పదిలంగా చేరాలన్నది సారంగ కల. అలాగే, కొత్తగా ఏర్పడుతున్న పాఠక ప్రపంచానికీ సాహిత్యంలో వున్న రెండు భిన్న ప్రపంచాలకూ- వొకటి నిన్నటిదీ, రెండోది ఇవాల్టిదీ- మధ్య వంతెనగా వుండాలన్నది సారంగ ఉద్దేశం. అందుకే, ఈ సంచికలో ఆ రెండు ప్రపంచాల మేలుకలయికని మీరు చూస్తారు. సాహిత్యం పట్ల మీ అభిరుచిని పెంచే భిన్న శీర్షికల్ని మీ ముందుకు తెస్తోంది సారంగ.

ప్రతి గురువారం సారంగ వారపత్రిక మీ కంటి తలుపులు తడుతుంది, మీ పుస్తకాల గదిలోంచి కనుమరుగైపోయిన వారపత్రికా దరహాసమే కాంతిగా! ఈ కాంతిని అక్కున చేర్చుకోండి. ఈ రచనల వెలుగులో కాసింత తడవండి!
శీ ర్షి క లు
ప్రతి నెలా మొదటి గురువారం సారంగ అన్ని శీర్షికలతో కొంచెం ఎక్కువ సందడిగా వస్తుంది. ఆ తరవాతి గురువారాలు పరిమితమయిన శీర్షికలతో వస్తుంది. తెలుగు పత్రికా ప్రపంచంలో సాహిత్య జర్నలిజానికి శ్రీకారం చుట్టిన శ్రీరమణ గారు చాలా కాలం తరవాత ‘సారంగ’ కోసమే రాస్తున్నశీర్షిక  ‘రెక్కల గుర్రం’  మీ కోసం! కథారచనలో ఆరితేరిన పి.  సత్యవతి గారు ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ రోజుకు కొన్ని గంటల తరబడి పస్తక పఠనంలో గడుపుతారు. అలా చదువుతున్న  కొన్ని పేజీల్ని మనతో పంచుకుంటారు. సమకాలీన కథ అనగానే గుర్తొచ్చే ఆత్మీయమయిన పేరు ఆర్. యం. ఉమా మహేశ్వర రావు. ‘సారంగ’ కోసం తన వర్తమాన కథానుభవాన్ని మనసు విప్పి చెప్పబోతున్నాడు ఉమా  ‘కథా సమయం’ లో నెలనెలా!

ప్రతి ఏడాది వొక ప్రముఖ కథా రచయిత  ‘కథా సారంగ’  శీర్షికని నిర్వహిస్తారు. ఈ ఏడాది  ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ నిర్వహించబోతున్నారు. ఈ శీర్షిక కోసం ప్రముఖ కథకులతో ప్రత్యేకంగా కథలు రాయించి మనకి అందించబోతున్నారు వేంపల్లె షరీఫ్. ప్రసిద్ధ సినీగేయ రచయిత భువనచంద్ర చాలా మందికి పాటల రచయితగానే తెలుసు. కానీ,ఆయనలో అందమయిన కథకుడు కూడా వున్నాడు. ఆయన అనుభవాల అమ్ములపొది నించి చేస్తున్న శరసంధానం  ‘Untold stories’  ప్రతి నెలా మీ కోసం!

తెలంగాణ చరిత్ర శోధనకి మారుపేరు సంగిశెట్టి శ్రీనివాస్. తెలంగాణ సాహిత్య చరిత్రని ప్రతి నెలా  మన కళ్ల ముందు వుంచే శ్రీనివాస్ శీర్షిక  ‘కైఫియత్’ . అత్తగారిని కూడా నవ్వించగల అల్లరి కోడలు దాట్ల లలిత కథా శీర్షిక  ‘ఈదేసిన గోదారి’  ప్రతి నెలా మీ ఇంట నవ్వుల పంట! ప్రతి వారం మీ కోసం సీరియల్ నవల  ‘అల’  అనే శీర్షిక కింద మీ కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ఈ సీరియల్ వచ్చే గురువారం మొదలవుతుంది. ప్రపంచ సినిమాని మీకు పరిచయం చేస్తున్నారు  ‘తెర’చాప’  శీర్షికలో మద్దూరి శ్రీరాం.

ఇవిగాక వారానికి కేవలం వొకే వొక కవితతో  ‘తరంగ’  ఈ వారం కవిత మీకు ప్రత్యేకం! వొక కవిత చదివిన అనుభవాన్ని మీ దోసిట వుంచే  ‘అద్దంలో నెలవంక,’  అచ్చయిన కథ వెనక దాచేసిన అసలు కథల్ని చెప్పే  ‘చెప్పని కథ’  శీర్షిక వచ్చే గురువారం.  ‘ఓ కప్పు కాఫీ’   ‘అక్షరాల వెనక’   ‘తలపుల నావ’  శీర్షికలు. మీకు ఇష్టమయిన రచయితలతో హాయిగా గడుపుకునే కాఫీ సమయాలు, ఉత్తమ పాఠకుల వేదిక  ‘పాఠకచేరీ’  మంచి కథల తలపోత  ‘కథనరంగం’  ప్రసిద్ధ రచయితలతో మీ జ్నాపకాల వెలుగు  ‘దీపశిఖ  అప్పుడప్పుడూ!

Painting by Mandira Bhaduri