చాయ్ కప్పులో గోదారి!

(త్వరలో ప్రచురణ కానున్న భాస్కరభట్ల కవిత్వ సంపుటికి రాసిన ముందు మాట)

గోదావరి నాలో మొదటి సారి ఎప్పుడు గలగల్లాడిందో చెప్పాలి ఇప్పుడు భాస్కరభట్ల గురించి రాయాలంటే! నదితో కాపురమున్నవాడి గురించి రాయాలంటే నది నించే మొదలెట్టాలి, ఎందుకంటే అతని మూలం నదిలో వుంటుంది కాబట్టి! ఈ “పాదముద్రలు” భాస్కరభట్ల దాచుకున్న పదముద్రలు, నెమలీకలు.  తనే అన్నట్టు:

ఇప్పుడంటే రెండేగానీ…

చిన్నప్పుడు నాకు మూడు కళ్లు!

పుస్తకంలో

దాచుకున్న

నెమలికన్నుతో కలిపి!!!

కవిత్వంతో మొదలైన జీవితం చివరికి  పాటతో ముడిపడడం గోదావరి జీవులకి కొత్త కాదు. అది దేవులపల్లి కావచ్చు, నండూరి సుబ్బారావు కావచ్చు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కావచ్చు, సిరివెన్నెల కావచ్చు, భాస్కరభట్ల కావచ్చు. వాళ్ళు కవిత్వం రాసినా అందులో గోదావరి గలగలే  పల్లవి అందుకుంటాయి.  నేను ఎంతో ఇష్టపడే ఇస్మాయిల్ గారి తొలినాళ్ళ కవిత్వంలో కూడా ఆ పాట వినిపిస్తుంది,  “తొలి సంజ నారింజ ఎవరు వలిచేరూ?” అంటూ.

అయితే, ఇస్మాయిల్ లాంటి కవులు పాటలాంటి గోదావరి ప్రవాహంలోంచి కవిత్వ సెలయేటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతే, భాస్కరభట్ల అటు ఆ ప్రవాహంలోనూ ఇటు ఈ సెలయేటిలోనూ రెండీట్లోకి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే, ఇప్పటికీ అతన్ని నడిపించే దారి  గోదారే అని నా నమ్మకం.

భాస్కరభట్ల ఆ గోదారి మీంచి హైదరాబాద్ దాకా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన 1998 నాటి రోజులు నాకు మంచి జ్ఞాపకాలు. అప్పుడు నేను ఆంధ్రభూమి దినపత్రికలో ఫీచర్స్ ఎడిటర్ గా వుండే వాణ్ని. తెలుగు జర్నలిజంలోనే మొట్ట మొదటి ప్రయోగంగా ప్రతి వారం నాలుగు పేజీల సినిమా స్పెషల్ “వెన్నెల” ని అప్పుడు మొదలు పెట్టాం. అదిగో అక్కడ కలిశాం నేనూ భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ. ఆ ఇద్దరూ రాజమండ్రిలో ఒకే నది వొడ్డున తిరిగారు, ఒకే బడిలో పెరిగారు, ఒకే కవిత్వపు ఒడిలో కరిగిపోయారు. ఆ స్నేహపు అందమైన ఒరవడి వాళ్ళ జీవితాల్ని ఇప్పటికీ వెలిగిస్తోంది.

చాలా అమాయకమైన అప్పటి ఆ ఇద్దరి ఆ లేత నవ్వు  కళ్ళల్లో  జీవితం మీదా, అక్షరాల మీద బోలెడు ప్రేమ కురుస్తూ వుండేది. సాయంత్రాలు మేం అలా నడుచుకుంటూ వెళ్లి, గార్డెన్ కేఫ్ లో హైదరాబాదీ చాయ్ లు తాగుతూ కవిత్వమూ కబుర్లూ…జీవితం చాలా బిజీగానూ వుండేది, ఆ బిజీలో బోలెడంత బిజిలీ కూడా వుండేది. ఇప్పుడు బిజీ మాత్రమే మిగిలి, బిజిలీ మాయమయ్యింది కానీ…

పులగం చిన్నారాయణ  సినిమా పత్రికా రచయిత. సినిమా గురించి ఏం అడిగినా క్షణాల మీద రాసివ్వగలిగిన మేదోజీవి. అతనికి భిన్నంగా భాస్కరభట్ల ఊహాజీవి. అందమైన ఊహలే ప్రాణంగా పాటలూ కవిత్వమూ అల్లుకుంటూ వుండే కాల్పనికుడు. కాని, పాపం, పొట్ట కూటి కోసం సినిమా వ్యాసాలు రాసిచ్చే వాడు మాకు. అతని కల మాత్రం ఎప్పుడూ పాటే! పాట అతన్ని రాత్రీ పగలూ వెంటాడేది! లోకాన్నంతా వొక్క  పాటగా మాత్రమే ఊహించుకుంటూ హాయిగా బతికేసే simple philosophy అతనిది. అందుకే, అందులో ఎలాంటి complications, implications వుండవ్. అతని నవ్వులోని ఆ simple innocence అతని వాక్యాల్లోకి హాయిగా తర్జుమా అవుతుంది ఇప్పటికీ- బహుశా, అందువల్లనే అతను మహామాయామేయ జగత్తులో వుండి కూడా, తన అందమైన అద్దాన్ని పోగొట్టుకోలేదు. ఆ శబ్ద దర్పణానికి మాయలు నేర్పలేదు.

ముఖ్యంగా, భాస్కరభాట్లలో వొక చమత్కారి వున్నాడు. తనతో మాట్లాడిన అనుభవం వున్న స్నేహితులకి అదేమీ కొత్త సంగతి కాదు. అతని మాట “పన్”చ దార పలుకు. అయితే, ఎప్పుడూ వొక చక్కని అనుభూతి చిలుకు. ఈ పదముద్రలో పన్ లేదు కాని, మంచి పరిమళభరితమైన అనుభూతి వుంది-

శీతాకాలం

తెలావారు ఝాము

మంచు కురుస్తోంది…

అప్పుడే వాయతీసిన

వేడి వేడి ఇడ్లీలమీద పొగలా!

తనకి  పదాల రాహస్యం బాగా తెలుసు. శ్రీశ్రీ లోంచీ, తిలక్ లోంచీ మొదలైన వాడికి పదాలూ వాక్యాల లోగుట్టు తెలియడంలో వింత లేదు. పన్నెండేళ్ళ నించీ కవిత్వంతో కాపురం చేస్తున్నవాడికి ఆ అందంలోని ప్రతి మెరుపూ తెలుసు. చాలా లోతైన విషయాలు కూడా సరళంగా చెప్పడం కూడా ఈ మెరుపు విద్యలో భాగమే.

ఇద్దరం..

మధ్యలో మరికొందరు..

మళ్ళీ మనిద్దరమే..!!

 

గుండె కలుక్కుమనే ఇంకో భావం:

హుండీలో వేసిన

అజ్ఞాత భక్తుడి కానుకలాగ

అనాధపిల్లలు..!!

 

కవిత్వ పదాల్ని  మహా పొదుపుగా వాడ్తాడు భాస్కరభట్ల. కథనంగా కవిత్వాన్ని సాగదీయడం కాకుండా, వొక మెరుపులా మెరిపించే గజల్ సౌందర్యమేదో అతని కవిత్వంలో కనిపిస్తుంది. క్లుప్తత దాని అంతర్/ బహిర్ సౌందర్యం. గజల్ కవిలానే భాస్కరభట్ల రెండు పంక్తుల్లో ఇహపరాల పారమెరిగిన వాడు. ఉదాహరణకి:

కనుపాపల మగ్గం మీద

కలల్ని నేస్తోంది

నిద్ర!!

మరో సందర్భంలో:

చీకటి చూరుకి

వేలాడుతున్న

వెలుతురు ఖడ్గంలా

వీధి దీపం !!

తనలోని తాత్వికుడు ఎక్కడ దొరుకుతాడూ అంటే, సహజమైన ప్రకృతికీ, మనిషి సృష్టించుకున్న అసహజమైన వికృతాలకూ మధ్య విరోదాభాసలో-

ఉదాహరణకి :

మా ఊరు

తప్పిపోయింది…

ఫ్లై-ఓవర్ వచ్చి..!!

~

‘Well’ settled

అనుకుంటుందేమో

నూతిలో కప్ప..!!

~

ఆకాశం

అదేపనిగా

ఎన్నిసిగరెట్లు కాలుస్తోందో ఏమో..

లేకపోతే

ఇన్ని పొగమబ్బులెక్కడివీ?

విస్తరించి చెప్పడం ఏనాడూ భాస్కరభట్ల లక్షణం కాదు, చెప్పాల్సిందేదో చెప్పేసి చక్కా వెళ్ళిపోతాడు వచ్చిన దారినే! కాని, తను చెప్పింది మాత్రం మనలోపల మిగిలిపోతుంది, మంచి స్నేహవాక్యంలాగా- పాదముద్రలన్నీ అలాంటి అనుభవరసం నింపుకున్న నిమ్మతొనలే. మన మానసిక ఆరోగ్యానికి రోజూ కొన్ని కావాలి ఇవి.

తొలినాటి వొక స్నేహితుడు తన చిరునామా మళ్ళీ కవిత్వంలో వెతుక్కుంటున్న ఈ సమయం నాకు అర్థవంతమైన కవిసమయం!

*

 

నేనొచ్చేశాన్లే మళ్ళీ…

1

తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు –

2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,

లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ

3

రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!

4

పగలగొట్టేయ్యాలన్నంత

కోపమొచ్చేసే గడియారపు బుడి బుడి నడక

వొంటి మీద మెత్తగా గీసుకుపోయే కత్తి

5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో

అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.

ఊహూ,

ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.

6

కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.

7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ…

*

 

మీ స్మృతిలో మో …

 

(ఇంకో మో అంటూ వుండరు..ఇంకో  ‘బతికిన క్షణ”మూ వుండదు. ఇంకో “చితి-చింత” కూడా వుండదు. అసలు వొక మనిషి ఎప్పుడూ ఇంకో మనిషిని replace గానీ, displace గానీ చేయడం అంటూ వుండదు. అందుకే, వొక మనిషి- అందునా  ఆ మనిషి తనదైన వాక్యాల అడుగుల్ని వెతుక్కున్న మనిషి వెళ్ళిపోయినప్పుడు భరించలేని నిశ్శబ్దం వెంట పడ్తుంది మనల్ని! మో- ఈ జనవరి అయిదున పుట్టారన్నదే నాకు గుర్తుంది. ఆయన వెళ్ళిపోయిన రోజు ఇంకా నా మనసులో సరిగా రిజిస్టర్ కావడం లేదు. మీలో చాలా మందికి అంతే అయి వుండాలి. మీలో చాలా మందికి మో తెలుసు, కవితంలోనూ, వ్యక్తిగతంగానూ, ఉత్తరాల్లోనూ..అలాంటివి మాకు రాయండి. వొక అరుదైన అద్భుతమైన కవిని తలచుకుందాం..)

మజిలీ మాత్రమే!

afsar1

 

విత్వం వొక గమ్యం కాదు,

అదెప్పుడూ వొక మజిలీ మాత్రమే.

అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం. దీన్ని ఎవరూ ఏ ఆనకట్టా వేసి బంధించలేరు. బంధించిన చోట కవిత్వం నిలవ నీరైపొతుంది. కట్టుగొయ్యలూ కృత్రిమమైన కట్టుబాట్లూ ఆకవిత్వాన్ని మాత్రమే రాయించగలవు. ప్రవాహం కవిత్వ లక్షణం. గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు. ప్రవాహ గమనమే కవిత్వం. ఇక్కడే వుంటానన్న సుస్థిర భావన అకవిత్వం. ఇక్కడే వుండిపోలేనన్న అస్థిరమైన వలస జీవనం కవిత్వం.

afsar4

-ఇవన్నీ కవిత్వానికి నిర్వచనాలు కాకపోవచ్చు. ఇవి నా నమ్మకాలు మాత్రమే. ఇవి మూఢ నమ్మకాలైనా నాకు ఇష్టమే. ఎవరి ఇష్టానిష్టాల కోసమో కవిత్వం రాయడం నాకు కష్టం కాబట్టి.

కవిత్వ ప్రయాణం ఇవాళ కొత్తగా మొదలు కాలేదు. నాకు మాత్రం నా ప్రతి కవితా వొక కొత్త ప్రయాణమే. ప్రాణాన్ని పొదిగే వాక్యాలు విఫలమైన నా కోర్కెలు.  ఆ వాక్యాలు ఆదిమ గోడ మీద అస్పష్టమైన చిత్రాలే ఇప్పటికీ!

afsar2కవిత్వ ప్రయాణం ఇప్పటికిప్పుడో రేపో మాపో అంతమయ్యేదీ కాదు. దేవుడు మరణించాడని చెప్పిన  వాళ్ళు కూడా కవిత్వం మరణిస్తుందని మాత్రం చెప్పలేరు. పుస్తకాలు మ్యూజియంలో తప్ప ఇంకెక్కడా కనిపించవని నమ్మబలుకుతున్న కాలంలోనూ కవిత్వం బతుకుతుంది. కవిత్వం అంటే నల్లగా మారిన కాయితం కాదు కాబట్టి-

కవిత్వం అచ్చులోంచి పుట్టిన మూస కాదు. లిఖిత లిపి కాదు. గుండెలోంచి గొంతులోంచి పొంగుకొచ్చే శబ్దానికి శైశవ రూపం. ఎన్ని కరువుకాలాలు వెంటాడినా, ప్రకృతి ఆకుపచ్చదనాన్ని మరచిపోయినా ఆకాశం నీలిమని రాల్చుకున్నా గాలి ఊపిరాడక వురేసుకున్నా …నేల ఉన్నంత కాలం కవిత్వం వుంటుంది. నేలని వెతుక్కుంటూ ఇంకో నేల వున్న చోటికే వలస పోతుంది. అందుకే స్థలరాహిత్యంలో మాత్రం అది బతకదు.

కవిత్వం విశ్వజనీనం సార్వకాలీనం అనే భ్రమలు బద్దలైన కాలంలోకి మనం వచ్చాం. సర్వ కాల సర్వావస్థల్లోనూ వుపయోగవస్తువు కాగలిగిన కవిత్వాన్ని బాగా శంకించాలి. ఈ కాలాన్ని కాదని అతీతరేఖల మీద సాహంకారంగా సంచరించే అక్షరాల్ని వొదులుకోవడమే ఇప్పటి కవిత్వ జీవలక్షణం. ఎప్పటికీ ఎవరూ వదిలించుకోలేని వర్తమానం కవిత్వ ప్రాణం. సమకాలీన స్థల కాలాల్లోకీ…ముఖ్యంగా తన కాలంలో వొదగలేని కవిత్వం ఇప్పుడు బొత్తిగా అనవసరం. ఆ మాటకొస్తే కవి తన స్థలకాలాల్ని అన్వేషించడానికే రాస్తాడని నాకు అనిపిస్తుంది.

జీవితం అంటే నలుపూ తెలుపూ కాదనీ, ఇతరేతర రంగు తేడాలూ వున్నాయని, వ్యవస్థ అంటే వున్న వాళ్ళూ లేని వాళ్ళే కాదనీ ఇంకా ఇతరేతర స్థాయీ భేదాలున్నాయని ఇప్పుడేమీ నేను కొత్తగా చెప్పడం లేదు. ఈ నిర్దిష్టత అర్ధమైన తరవాత ఇప్పటి దాకా మనం రాస్తున్నదల్లా అమూర్త కవిత్వమే అన్న నిజం తెలిసింది. జీవితం వ్యాఖ్యానాలలో లేదనీ, క్రూరమైన వాస్తవికతలో ఉందనీ అర్థమైంది. ఆ మేలుకొలుపులోంచి వచ్చిన రెండు తరాలని చూస్తూ వాళ్ళ అంతరంగాల అలజడిని వెతకడానికి భాష చాలక రోదించిన క్షణంలో ఈ పాటలన్నీ పాడుకున్నాను. ఇందులో నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొక మూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట మానసాన్ని.

నిన్నటి కన్నా ఎక్కువగా భయపెడ్తున్నా ఇవాళ్టినే ప్రేమిస్తున్నా. ఇవాళ్టి కన్నా అస్థిరంగా కనబడుతున్నా రేపటినే కళ్ళలోకి నిలుపుకొంటున్న అనేక సమూహాల అస్తిత్వ వేదనని నేను.

afsar5

afsar3

నిన్నటి నించి ఇవాళలోకీ, ఇవాళ్టి లోంచి రేపటిలోకీ వలసపోతున్న జీవన యాతన నేను. అందుకే, నా వాక్యాల్లోని ఏక వచనం నేను కాదు, అనేకం! నేను ఇప్పుడు ద్వీపం కాదు, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న లాంతరు అనుక్షణిక వెలుగు.

ఈ చిన్ని వెలుగులోనే దారి వెతుక్కోవాలి. కాస్త చోటిమ్మని నేలని అడగాలి. ఆగకుండా సాగిపోయే కాలం నించి అర అర క్షణాలుగా బతుకు క్షణాల్ని అప్పడగాలి.

అప్పో సప్పో చేసి ఆగిపోకుండా నడవాలి, నడుస్తూనే వుండాలి.

నేలని నమ్ముకున్న వాడికి ఆకాశమే దారి చూపిస్తుందని ప్రవక్త ఎందుకన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. వలస పాదాలక్కూడా అదే దారి. నేల అంతమయ్యే చోట అవి తెగిపోతాయి, దారిలానే!

తెలియని దారిలో వొంటరిగా వెళ్తున్నప్పుడు భయంతో అరుస్తాం. ఏవేవో మాటలు పాటలుగా పాడుకుంటాం. మొండి ధైర్యంతో కాళ్ళని నేలకేసి కొడతాం. అలా నడవని నేలకూ, నడిపించే కాళ్ళకూ, దగ్గిరే దగ్గిరే అనిపించే ఆకాశానికీ మధ్య వెతుకులాట ఇదంతా.

దీనికో గమ్యం మాత్రం లేదు, అదొక్కటీ అడక్కండి!

 

(12 డిసెంబర్ 2000)

డిసెంబర్ ఇరవై హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం సందర్భంగా  మళ్ళీ…

telugu-award

అక్షరాల్లో బతికిన మాట!

Velturu2

1

1980ల  చివరి రోజులు-

వొక శనివారం  సాయంత్రం పురాణం గారింటి మేడ మీద “సాక్షి క్లబ్” సమావేశం ముగిసింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో  నండూరి గారు నన్ను ఆపారు. “నువ్వు కృష్ణశాస్త్రి కవిత్వం ఎంత చదివావ్?” అని అడిగారు. నిజానికి నేను అప్పటికి కొంత మాత్రమే చదివాను, నా  ప్రాణమంతా  ఇంగ్లీషు కవిత్వంలో  వుంది కాబట్టి! “కొంత కూడా చదవలేదు!” అన్నాను సిగ్గేమీ  పడకుండా! (సిగ్గేలా తెలుగు కవికి?!) “ఇవాళ్టి నించి రెండు నెలలు నీకు కృ.శా. క్రాష్  కోర్సు!” అని అప్పటికప్పుడు ఆయన వాళ్ళింటికి తీసుకువెళ్ళి, కృష్ణశాస్త్రి గారి పుస్తకాలు అరువిచ్చారు. అప్పుడు తన  దగ్గిర వున్న గొప్ప  నిధిని కూడా నాకు చూపించారు. అవి కృష్ణశాస్త్రి గారు మాట పడిపోయాక చేసిన లిఖిత సంభాషణల చీటీలు! మాట పడిపోయినా ఆయన మాట్లాడడం మానుకోలేదు. చిన్ని చిన్ని కాయితాల మీద రాతపూర్వక సంభాషణలు చేసే వారు. నండూరి ఆ చీటీలన్నీ ఎంతో శ్రద్ధగా దాచి పెట్టుకున్నారు. “మాట- విలువ మనకి తెలీదు నోరు పనిచేస్తున్నంత కాలం! కాని, ఆ నోరు పడిపోయినప్పుడు ఎంత వేదన లోపల గూడు కట్టుకొని వుంటుందో కృ.శా. ని చూస్తూ ఎంత బాధపడే వాడినో! ఈ  కాలంలో మనకి నోరుంది కాని మాటల్లేవ్. మాట్లాడాలీ అన్న ఆయన తపన ముందు మూగతనం వోడిపోయింది!” అన్నారొక సారి నండూరి!

నేను పెన్ యూనివర్సిటీకి వచ్చినప్పటి నించి నెలరోజులుగా రోజూ చదువుతున్న కవి – తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ (Tomas Transtromer)! జీవితానికి ఎంత  దయలేదో ఎప్పుడూ అర్థం కాదు. పలికితే ముత్యాలు రాశిపోసినట్టుండే ఈ స్వీడిష్ మహాకవికి కూడా మన కృష్ణశాస్త్రిలాగానే మూగతనం వచ్చేసింది. ఇరవై ఏడేళ్ళ కిందట అంటే తనకి యాభై తొమ్మిదేళ్ళ వయసులో విపరీతమైన ప్రయాణాలూ, వెళ్ళిన చోటల్లా అద్భుతమైన ప్రసంగాలూ చేస్తూ వచ్చిన తోమాస్ కి గుండెపోటు, పక్షవాతం వల్ల నోరు పడిపోయింది. కాని, జీవితం పట్ల ప్రేమా తపనా తోమాస్ ని బతికించింది. కృష్ణశాస్త్రి గారు అన్నట్టు – “ముసలి తనంలో మూగతనం భయంకరం- శిథిల మందిరంలో అంధకారంలాగు!” కాని, ఆ ఇద్దరూ అక్షరాల్లో మాటల్ని వెతుక్కున్నారు. వాళ్ళ సమక్షం ఎవరికీ  మాటల్లేనితనాన్ని గుర్తుచేయలేదు, సంభాషణ ఎప్పటికీ ఆగిపోలేదు!

 

2

తోమాస్ ని ఎందుకు ఇంతగా చదువుకుంటున్నానో నాకు ఇంతదాకా తెలియదు. బహుశా, కొందరు కవులు మనతో పాటే కొంత దూరం నడుస్తారు, మన భుజాల మీద చేతులేసి! ఆ చేతుల స్పర్శలోని భద్రభావమేదో ఆ కవిని మనకి దగ్గిరగా తీసుకొస్తుంది. ఈ కవి  ఈ క్షణంలో నా తోడు నిలవాలి అనిపిస్తుంది. అలాంటి భావనే కావచ్చు!

మాట పడిపోయాక తోమాస్ కూడా కృష్ణశాస్త్రి గారిలాగానే చిన్న చీటీల మీద రాతపూర్వక సంభాషణలు చేసేవాడు. ఆ చీటీల్ని కూడా ఎంత ప్రేమించాడో తోమాస్! అతనికి అవి తన టీనేజ్ లో కాలేజీ పాఠాల మధ్య లెక్చరర్ల కన్నుకప్పి,  స్నేహితులతో పంచుకున్న చీటీల్ని గుర్తుకు తెచ్చాయట! అందుకే వాటికి “Inspired Notes” అని పేరు పెట్టుకున్నాడు తోమాస్!

తోమాస్ తో నా ప్రయాణం ఆ Inspired Notes అనే కవిత్వ పుస్తకంతోనే మొదలయింది. తోమాస్ అంటున్నాడు:

“నా కవితలు సంగమ స్థలాలు. సాంప్రదాయ భాషా, దృష్టీ అంతగా పట్టించుకోని వివిధ వాస్తవాల మధ్య ఆకస్మిక చుట్టరికాలు కలపడం కవిత్వం చేసే పని. వొక లాండ్ స్కేప్ లోని చిన్నా పెద్దా వివరాలన్నీ కలుస్తాయి, భిన్న సంస్కృతులు, మనుషులూ కలుస్తారు. ప్రకృతీ యాంత్రికత కూడా సంగమిస్తాయి. చూడగానే ఇదొక సంఘర్షణ అనిపించేది ప్రతీదీ కవిత్వంలోకి వచ్చేసరికి స్నేహమైపోతుంది!”

కవిత్వం ఎందుకూ అనే ప్రశ్నకి అనేకమంది అనేక సమాధానాలు వెతుక్కున్నారు. దేనితోనూ సమాధానపడకపోవడమే కవిత్వం అనిపిస్తుంది నా మటుకు నాకు! మాటపోయిందని మూగతనంతో సమాధానపడలేదు అప్పటి కృష్ణశాస్త్రి, ఇప్పటి తోమాస్!

The organ stops playing and there is deathly silence in

The church but only for a few seconds- అనుకున్నాడు తోమాస్.

ఇంకో కవితలో అంటున్నాడు:

మాటల్ని నింపుకొచ్చిన వాళ్ళందరితోనూ

విసిగిపోయాను

కేవలం మాటలే కదా, భాషలేని మాటలు!

 మంచు కప్పిన ద్వీపానికి వెళ్లాను

అక్కడ  మాటలేమీ లేవు

కాని,

రాయని పేజీలెన్నో

నల్దిక్కులా పరచుకొని వున్నాయి.

ఆ మంచులోనే

అడివి జింకల అడుగుల్ని దాటుకుంటూ వెళ్లాను

అదంతా భాషే,

మాటల్లేని భాష!

tomas-transtrc3b6merw

 

3

స్టాక్ హోం లో 1931 ఏప్రిల్ పదిహేను పుట్టాడు తోమాస్. తల్లి స్కూల్ టీచర్. తండ్రి విడాకులు ఇవ్వడంతో తోమాస్ తల్లితోనే వుండిపోయాడు. స్టాక్ హోం యూనివర్సిటీలో సైకాలజీ చదువుకున్నాడు. కేవలం పదిహేడు కవితలతో 1954 లో మొదటి పుస్తకంతో మొదలయింది తోమాస్ అక్షరయానం. 2015లో చనిపోయే నాటికి పదిహేను కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి. 2011లో కవిత్వానికి నోబెల్ అందుకున్నాడు.

తోమాస్ పిల్లల జైల్లో సైకాలజిస్ట్ గా పనిచేసే వాడు. కవిత్వం అంటే తోమాస్ కి ఎంత ప్రేమ అంటే- వొక సారి న్యూయార్క్ లో కవిత్వం చదివాక ఇష్టాగోష్టి జరుగుతోంది. “మీ వృత్తి అంటే పిల్లల జైల్లో పని మీ కవిత్వం మీద ప్రభావం చూపించిందా?” అని అడిగారు. దానికి ఆయనేదో సమాధానం చెప్పాడు కాని, ఆ సమాధానాన్ని ముగిస్తూ “ కాని, ఆ ప్రశ్న – మీ కవిత్వం మీ వృత్తి మీద ఏమైనా ప్రభావం చూపించిందా” అని అడిగితే చాలా సంతోషించే వాణ్ని” అన్నాడు. కవిత్వం అనేది దానికదే వొక స్వతంత్ర భావంగా మిగలాలని తోమాస్ చివరిదాకా కోరుకున్నాడు.

నిజానికి తోమాస్ తనదైన కవిత్వ లోకంలోనే బతికాడు. ఎక్కడ ఎలాంటి స్థితిలో వున్నా, కవిత్వమే అతని ఊపిరి. అతని ఆప్త మిత్రుడు, ప్రసిద్ధ అమెరికన్ కవి Robert Bly అన్నట్టు- “తోమాస్ కవితలు వొక రైల్వే స్టేషన్ లాంటివి. బహుదూరం నించి అక్కడికి రైళ్ళు వచ్చి, కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాయి. వొక రైలు కింద రష్యన్ మంచు కనిపించవచ్చు. ఇంకో రైలు చుట్టూరా  ఎక్కడివో పూల పరిమళాలు ఉండచ్చు. సుదూరం నించి పలకరించే వొక రహస్యమేదో అతని కవిత్వంలో వుంటుంది.”

 

4

నాకు చాలా నచ్చిన వొక కవితతో తోమాస్ నించి సెలవు తీసుకుంటాను ఇక-

 

వొక ఉత్తరానికి జవాబు

~

ఆ సొరుగు అట్టడుగున

వొక వుత్తరం-

ఎప్పుడో ఇరవై ఆరేళ్ళ కిందటిది.

వుద్విగ్నమైన ఉత్తరం

ఇప్పుడు తెరిచినా అది రొప్పుతూనే వుంటుంది.

 

యీ యింటికి అయిదు కిటికీలు

నాలుగు కిటికీల్లోంచి

పగలు మెరుస్తుంది ప్రశాంతంగా-

అయిదోది మటుకు

చీకటి ఆకాశంలోకీ, ఉరుములు మెరుపుల్లోకీ ముఖం తిప్పుకొని వుంటుంది.

 

ఆ ఐదో కిటికీ ముందు

నిలబడి వున్నాను,

అది ఆ ఉత్తరం-

 

అప్పుడప్పుడూ ఓ రెండ్రోజుల మధ్య

అగాధమేదో తెరచుకుంటుంది.

ఆ ఇరవై ఆరేళ్ళూ

జారిపోతాయి వొక్క క్షణంలో-

 

కాలం ముందుకే సాగిపోయే సరళ రేఖ కాదులే!

అదొక రహస్య వలయం.

ఎదో వొక గోడకి వొత్తిగిలి

హడావుడిగా పరిగెత్తే అడుగులూ గొంతుకలూ వింటావ్-

 

అవతలి వైపు నించి నువ్వే

గతంలోకి జారిపోతూ వుండడమూ వింటావ్-

ఆ వుత్తరానికి ఎప్పుడైనా జవాబంటూ వెళ్ళిందా?!

గుర్తు లేదు,

ఎప్పటిదో కదా  ఆ వుత్తరం!

 

ఎన్నో కెరటాలు అటూ ఇటూ తిరుగాడుతూనే వున్నాయి,

తడిసిన నేల మీద గంతులు వేసే కప్పలా-

మనసు

వొక్కో క్షణాన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది.

తుఫానుల్ని కనబోతున్న కారుమబ్బుల్లా పేరుకుపోయాయి జవబివ్వని ఉత్తరాలు.

సూర్యకిరణాల వేడిని కూడా అవి చిన్నబుచ్చుతున్నాయి.

 

ఎప్పుడో వాటికి

జవాబివ్వాలి నేను!

ఎప్పుడో వొకప్పుడు వెళ్ళిపోతాను కదా

అప్పుడైనా వాటి వైపు కాసింత సేపు చూడాలి.

లేదూ

ఇక్కణ్ణించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి

నన్ను నేను తవ్వుకోవాలి కనీసం-

 

ఎప్పుడో వాటికి జవాబివ్వాలి నేను

యీ నగరపు తొక్కిసలాటలో నలిగిపోక ముందే –

వేల వుత్తరాల సందోహంలో

ఆ పాత వుత్తరం కనుమరుగు కాకముందే-

*

 

 

 

నిన్ను వోడించే యుద్ధం!

dali-hiroshima-melancholy1

ఉన్నట్టుండి

యెప్పటిదో గాయం

తలుపు తెరచుకుని నీ ముందు నిలబడుతుంది

వూహించని మెరుపు తాకిడికి

నీ కలల్తో సహా నువ్వు వులుకులికి పడ్తావ్

అప్పుడిక అందరూ తలా వొక వాయిద్యం మోగిస్తూ

నీ గాయానికి శబ్ద లేపనాలేవో పూస్తూ వుంటారు

నువ్వు గాయాన్నే చూసుకుంటూ  వుంటావ్ గానీ

నిన్ను గాయపరచిన శత్రువెవరో తెలియనివ్వని

మంత్రగానమే  వింటూ వుంటావ్  గానీ

అంతకంటే యేమీ తెలియని అమాయకత్వంలోకి

తలకిందులుగా జారుకుంటూ వెళ్ళిపోతావే

అప్పుడనిపిస్తుంది నీ కోసం కాసింత జాలి కూడా నేరమే అని-

 

2

వొక నిండు దేహాన్ని

రెండు ముక్కల కింద తెగనరికినప్పుడు కూడా నువ్వు అంతగా చలించలేదు గానీ

యిప్పుడు సరికొత్తగా తొడుక్కున్న చొక్కాలో

నీది కాని కవచంలో నిన్ను ఎంత పిరికిగా మడత పెట్టేశారో తలచుకుంటే

నాకు  అన్నమూ సయించదు, నిద్రా దారి చూపదు

ఎటైనా పారిపోదామంటే లోకమెల్లా ఖైదుకొట్టమే కదా!

నిన్ను రెండుగా  చీల్చి, నీకు హద్దులు గీసినప్పుడు

ఆ హద్దులన్నీ నీ కోసమే అని కదా నువ్వు సంబరపడ్డావ్

నిన్ను కప్పిన అంబరానికి ఖడ్గం దూసి-

ఇవాళ సరే

యింకెప్పటికైనా  తెలుస్తుందా  సరిహద్దుల సర్జికల్ కోతలు

నీ కోసం  కానే కాదని!

 

3

తొలియవ్వనాల మెరుపు శరీరాల్తో వెళ్ళిన వాళ్ళు

వొట్టి గాలి తిత్తులై యింటికొచ్చారని

కలల ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు

నెత్తుటి ముద్దలై తరలి వచ్చారని

రోజుకిన్ని కన్నీళ్లు  ధారపోస్తున్నావే కాని

యెవరి యుద్ధం ఇది

యెవరి ఆయుధాలు వాళ్ళు

అని మాటవరసకైనా నీ పగిలిన అద్దంలో జిన్నానో

నీ నెత్తిన ఊరేగుతున్న  మాటల మోళీనో

అబద్ధమై రాలిపోతున్న నిన్ను నువ్వో  అడగలేదుగా నువ్వు!?

యీ  యుద్ధాలు నీ కలలు కావు

నీ నాలుగు మెతుకుల కోసమూ  కాదు

ఆ సరిహద్దుల మాదిరిగానే-

 

4

యివాళ నువ్వు తాగుతున్న నీళ్ళలో నెత్తురూ

నువ్వు తినబోతున్న అన్నంలో నిషిద్ధ మానవ మాంసాల తునకలూ విసిరి

వాళ్ళు ఆడుకుంటున్న ఆటలో

నువ్వే వోడిపోతావ్ ఎప్పుడూ!

నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని

దాన్ని భక్తిగా తర్జుమా  చేసుకోలేను యెప్పటికీ,

నువ్వు క్షమించకపోయినా సరే!

 

నాకు యే దేహమైనా అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది యెప్పుడూ,

యే “దేశ”మైనా ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగే కనిపిస్తుంది యెప్పుడూ-

యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ

అక్కడ ఆ గరీబు వొంట్లోనూ

వొకే ఆకలి కేక

వొకే వెతుకులాట-

 

వొక్కటే అనుకుంటాను,

నిన్ను శవంగా కూడా మిగలనివ్వని

యీ ఆటకి నువ్వే డప్పు వాయిద్యానివి!

యుద్ధమూ ఆగదు, డప్పూ ఆగదు ఆకలిదప్పుల్లాగే!

శవాలు ఇంటికొస్తూనే వుంటాయి

అన్నీ తుడిచేసుకొని కేవలం అంకెలయి-

 

5

నువ్వు ఎదురుచూస్తూ వుంటావ్

నీ అంకె ఎప్పుడా అని-

కల గురించే.. (సంవాద కవిత)

rafi1

 

ఎవరు  నీవు? ఇది రోజు రోజుకూ విస్తృతమవుతున్న ప్రశ్న. నీ అస్తిత్వం నీకే ప్రశ్నార్థకం అవుతోంది. మనకు తెలియకుండానే మనపై ముద్ర. మన జననానికి, మరణానికీ సంబంధం లేని ప్రశ్న ఇది. మన ఆలోచనలకూ చైతన్యానికి సంబంధం లేని ప్రశ్న ఇది. నీతో సంబంధం లేకుండా ఒక సంఘర్షణ లో భాగమవుతున్నావు. నీ ప్రమేయం లేకుండానే నీవు గాయపడుతున్నావు. కొన్ని ఉద్యమాల తర్వాత, కొన్ని పోరాటాల తర్వాత కొన్ని ఊచకోతల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే, నీలో నీవు లేవు. నీ ప్రశ్నలకు సమాధానాలు లేవు. 2010 ప్రథమార్థం లో అఫ్సర్, కృష్ణుడు ఢిల్లీ లో కలుసుకున్నప్పుడు రాసుకున్న గొలుసు కవిత ఇది. అంతకు 20 ఏళ్ళ క్రితం ఈ ఇద్దరూ మరో నలుగురు కవులతో కలిసి ఇవే ప్రశ్నలు వేసుకొని ‘క్రితం తర్వాత ‘ అనే గొలుసు కవిత రాశారు. కాలం మారుతున్న కొద్దీ పథ ప్రశ్నలకు సమాధానం లభించదు. కొత్త ప్రశ్నలు తలెత్తక మానవు. ప్రశ్నించి జవాబులు వేసుకొనే ప్రతి కవితా సమకాలీనమే. ఆరేళ్ళ క్రితం రాసిన ఈ కవితలో నేటి సామాజిక సంక్లిష్టత బీజాలు లేకపోలేదు. 
~

అఫ్సర్:
కల గురించే మళ్లీ,
మరిచిపోని కల గురించే మళ్లీ..
కలతలో, తలపోతలో
చిటుక్కుమని పగిలిపోయిన
ఒకానొక కల గురించే
మళ్లీ.. ఇప్పుడు..

కృష్ణుడు:
పాత అంగీ జేబులోంచి
పడిపోయిన కాగితం కోసం
చెట్టుబెరడులాంటి ముఖంలో
మధుర మందహాసం కోసం
ఎప్పుడో తాగిన ఇరానీచాయ్ రుచికోసం..
తెల్లవారుజామున వచ్చిన
సుందర స్వప్నం కోసం..

అఫ్సర్:
ఇరుదేహాల ఇరుకిరుకు గోడల్ని
లోపల్నించీ తంతున్న
ఒకే ఒక్క పద్య శిశువు
జారిపోయిన మాటకోసమో..
రాలిపోయిన కలకోసమో..
కొస తెలిసీతెలియని కాలినడక.
ఈ సందు చివర గోడలు లేని బావి ఉందో,
ఇంకో దారిలో తెరుచుకునే నిప్పుకన్నుందో తెలీదు..
కల నడుస్తోంది
నిన్నటి కాళ్లతో, రేపటి కళ్లతో!

కృష్ణుడు:
నిన్న తిరిగిన రాత్రుళ్లలో
మేల్కొల్పిన పగళ్లు
కుప్పకూలిన కట్టడాల్లో
చితికిపోయిన జ్ఞాపకాలు
కరచాలనం కోసం చేతులు లేవు
చిరునవ్వుకోసం పెదాలు లేవు
ప్రతిపరిచయంపై పరుచుకుంది
ఏదో ఒక విషపు నీడ!

అఫ్సర్:
ఇవాళ ఈ దేహం
ఒక ఆలోచన కాదు
ఒక ఉద్వేగం కాదు
ఒక కల కానే కాదు
ఎప్పుడో తయారై ఉన్న మూస
ఒక స్త్రీ,
బ్రాహ్మణ్యం
మాల మాదిగ తురక
బిసీ ఏబీసీడీ
ఏ మూసలోనూ ఇమడకపోతే
ఒక వైఫల్యం
ఒక అపజయం
ఒక గాఢాంధకార మార్గం

కృష్ణుడు:
నిన్నటివరకూ
నీవు నా స్నేహం
నా రక్తంలో రక్తం
నా నేలలో నేల
నీ ప్రతి అక్షరంలో
నా చైతన్యం
ఇప్పుడు ఇద్దరి మధ్యా
ముళ్లకంచెలు
నీ ప్రతి శబ్దంలోనూ
నీ పుట్టుకే ధ్వనిస్తోంది..
నీవు మా వాడివేనా?

అఫ్సర్:
మేం వాళ్ల అడ్డంకి
వాళ్లు మా అవతలి దిక్కు
వినూత్న శత్రునిర్మాణం
తక్షణ విధ్వంసవ్యూహం
‘నేను’ ఎవరి ఎజెండా?
ఉమ్మడి కల ఓడిపోయింది
పరస్పర ఆత్మహనన శోకాల కింద;
ఉమ్మడి ఆకాశం చచ్చిపోయింది
ఎటూ కలవని దిక్కుల మృత హస్తాల కింద;
ఈ షికాయతు అందరిమీదా,
నాలోని మీమీదా
మీలోని నా మీదా
కలవనివ్వని దారుల మీదా
కలయికల్ని తెంపిన పొలిమేరల మీదా!

కృష్ణుడు:
కుళ్లిపోయిన మనసుల్లోంచి
చ చ్చిపోయిన ఆలోచనల్లోంచి
పాతిపెట్టిన నినాదాల్లోంచి
ఒక అభావం, ఒక అభద్రత
ఒక నిస్ప­ృహ, ఒక నిట్టూర్పు..
పెల్లుబుకుతున్న లావాలో
ధగ్దమవుతున్న
నా అనామక శవంలోంచేనా
ఈ దుర్వాసన?

అఫ్సర్:
ఒక కల
ఒక కళేబరం
కుళ్లిపోతోంది దశాబ్దంగా
మిగిలిన అరకొర అవయవాలు
పట్టివ్వవు ఆనవాలు
కల గురించే మళ్లీ
ఎలాగూ తెగిపోయిన
కల
గురించే
మ…ళ్లీ..
ఒక్కసారి

మాట్లాడనివ్వండి
మీరు కప్పిన కఫన్ గుడ్డల
అడుగున పడి ఉన్న కలని!
అది స్త్రీ కాదు,
బ్రాహ్మణి కాదు
ఎస్సీ, ఎస్టీ, బీసీ తురకా దూదేకులా కాదు
కాస్త మాట్లాడనివ్వండి

కృష్ణుడు:
బొందిలోప్రాణాలను శబ్దాలు కానివ్వండి
శబ్దాలను చైతన్యాలను కానివ్వండి
ప్రతి సమాధినీ ప్రతిధ్వనించనివ్వండి..

రోహిత్ యిప్పుడు రెక్క విప్పిన ఉప్పెన !

 

 

We want solid words
that resist in the middle of the night

rock-hard
unyielding words.

-Roque Dalton

 

1

 

బహుశా వొక లాటిన్ అమెరికా కవో, యింకో ఆఫ్రికన్ కవో, మరింకో  ఇరాక్  కవో, మన దాకా వస్తే కచ్చితంగా ఏ దళిత ముస్లిం కవో యీ మాట యింతగా తెగేసి చెప్పగలరు. మనం వూహించినట్టే Roque Dalton లాటిన్ అమెరికన్  కవి. ఇవాళ రోహిత్ గురించి వెల్లువైన యీ కవిత్వ వుప్పెన మధ్య నిలబడితే, నన్ను Roque Dalton ఆవహిస్తున్నాడు. విప్లవోద్యమ రణక్షేత్రం మధ్యలో నాలుగు పదుల వయసులో రాజ్యానుకూల శత్రువుల చేతుల్లో దారుణ హత్యకి గురైన వాడు Roque Dalton.

మనం యిప్పుడు తలచుకుంటున్న రోహిత్ అతనిలాంటి కవి కాకపోవచ్చు, కాని- అందమైన కల చూస్తూ చూస్తూ బలవంతాన కళ్ళు మూసుకున్న స్వాప్నికుడు. ప్రతి స్వాప్నికుడూ తనదైన వొక కవిత్వ సీమలో జీవిస్తూ వుంటాడు. ప్రతి మాటా, ప్రతి చర్యా కవిత్వ ఉద్విగ్నంగా బతుకుతాడు.

కవిత్వ భాషలోనే చెప్పాలంటే- యీ లాటిన్ అమెరికన్ కవి అన్నట్టు- solid words- లో యీ కాలపు ఉద్యమకారుడూ, ఉద్యమ కవీ బతుకుతాడు. మాటలు సర్రు సర్రున జారిపోతున్న విష సర్పాలు  మాత్రమే అవుతున్నప్పుడు, చలి చీమల్లాంటి చురుక్కున కరిచే పదాలు కావాలి, బలవంతమైన సర్పాన్ని బంధించడానికి! లేని నిశ్శబ్దాన్ని వూహించుకొని, లోపలి labyrinth అడవుల్లో  తెలుగు కవులు అదృశ్యమై పోతున్న కాలం ఇది. ఉద్యమం అనేది బహిష్కృత భావన అయిపోతున్న దశ. కవి అంటే కేవలం కవి మాత్రమే అనే archaic ఆలోచన చుట్టుముడుతున్న స్థితి. సోషల్ మీడియా మాయలో భాష స్పృహ తప్పిన అకాలం,  విపరీత బలవంతపు “ఇష్టాల”, ఇచ్చి పుచ్చుకునే కామెంట్ల negotiation మాత్రమే మిగిలి ఉంటున్న వ్యాపార కాలం. ఇది కవుల మీద ఫిర్యాదు కాదు, మొత్తంగా మన మధ్య మాటలు వొట్టిపోయిన స్థితి మీద ఎలిజీ. సాహిత్యం తన పాత్రని సరిగ్గానే పోషిస్తోందా అన్న ప్రశ్న వొకటికి పది సార్లు ఆలోచనల్లో తూట్లు పొడుస్తున్న గాయాల మధ్య వెతుకులాట.

ఇదిగో- యీ కృత్రిమ తగరపు మెరుపుల మధ్య రోహిత్ నిష్క్రమణ వొక విస్ఫోటనం!

 

 

2

రోహిత్ యిప్పుడు వొక phenomenon. రోజూ చస్తూ బతికే రొటీన్ గుండెల మీద పిడుగుపాటు లాంటి phenomenon. దీనికి వొక కులమో యింకో మతమో అక్కర్లేదు. మన వునికి రాహిత్యాన్ని చెరిపేయాల్సిన అవసరాన్ని చెప్పడం కోసం తనని తానే వొక erasure గా మార్చుకున్నాడు రోహిత్. యిలా అనడం అంటే అతని మరణాన్ని కీర్తించడం కాదు. వొక అధ్యాపకుడిగా నేను అలా నా విద్యార్థిని చూడలేను, లేదూ, వొక స్నేహితుడిగా అతని చివరి చర్యని యెట్లా అయినా సమర్ధించే పని  చేయలేను, లేదూ వొక ఉద్యమ ప్రేమికుడిగా అతని ఆ చివరి నిర్ణయంలో కారణాన్ని వెతకలేను. కాని, ఎన్నింటికి కారణాలు వెతికే శక్తి మనలో వుంది?!

యీ పుస్తకంలోని కవితల్లో కవులు ఏకరువు పెట్టిన అనేక “ఎందుకు” ల వరస క్రమం ఇదీ:

 1. ఎందుకో ఏకాగ్రత శిబిరాలు అని పిలవరుగానీ

మన పెరట్లో పూసిన భావజాల పువ్వులే వధ్యశిలమీద రాలిపోతుంటాయి (విల్సన్ సుధాకర్)

 1. ఏందోగాని అబయా !

మన పాలిటనే ఫిర్యాదులన్నీ ఫిరంగులౌతయ్

ఉత్తరాలన్నీ ఉత్తరించే కత్తులౌతయ్

వివక్షరాలే వెలివాడలూ , ఉరితాడులూ

ఇనుప గోరీలుగా మారిపోతయ్ (కృపాకర్)

 1. ఎందుకనుకున్నావ్ ?

నీ రాజీనామా తర్వాత నువ్వుండవని! (మిథిల్)

యిలా యింకా కొన్ని ఎందుకు అన్న శోధనలన్నీ వెతకవచ్చు.

 

ఇలాంటివి జరిగినప్పుడు శుభ్ర స్థిమితంగా, శుద్ధ నిబద్దంగా  కవిత్వం రాయాలనుకునే మనస్తత్వం వున్నవాళ్ళు సందిగ్ధంలో పడిపోతారు. ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో  ఆదర్శంగా నిలబెట్టుకున్న స్థిమిత సందర్భం ఇది కాబట్టి! కళ్ళ ముందు కదులుతున్న వాస్తవికత వాళ్ళని కలవరపరుస్తుందో లేదో కాని, అది వాళ్ళ కవిత్వంలో మాత్రం ప్రతిఫలించదు. కవిత్వ స్వచ్చ స్ఫటికత గురించి ముందే ఏర్పరచుకున్న నిర్వచన నియామాలూ, నిబంధనలూ వాళ్ళ వ్యక్తీకరణని అటకాయిస్తాయి. “ఎందుకు” అన్న ప్రశ్న యిక్కడ నిష్ఫల యాగమై పోతుంది. ఈ సంకలనంలో పలకరిస్తున్న కవులకి అలాంటి సంశయాలు లేవు, తాము రాస్తున్నది కవిత్వమేనా కాదా అన్న విచికిత్సా లేదు. కళ్ళ ముందు జరిగిన వొక  దారుణానికి వాళ్ళ ముఖాల్లోకి పొంగిన నెత్తుటి యేరుని దాచుకోకుండా దాన్ని వాక్యాలలోకి మళ్ళించే restless ప్రయత్నం వీళ్ళది.

అసలు ఇంత Restlessness – అశాంతి- అనేది వుందా అని naïve గా అడిగే వాళ్ళని ఏమీ అనలేం, జాలి పడడం తప్ప! కాసినీ పూలూ రెమ్మలూ ఆకాశాలూ పచ్చని నేలా వూరికే  సోమరిగా తిరిగే మబ్బు తునకలే కవిత్వం అనుకుంటే చేయగలిగేదీ లేదు. అంతకంటే ముఖ్యంగా ఏదో అంటీ ముట్టనట్టుగా నాలుగు వాక్యాలు “శుద్ధం”గా రాసుకొని, జీవితం ఎంత  హాయిగా వుందీ అనుకునే మాయదనమూ వుంది. కాసేపు ఏ యోగినో, మహర్షినో తలచుకొని, కళ్ళు మూసుకునే అంతర్జాల మార్జాల కవులూ వున్నారు. నిజానికి వీళ్ళ లౌకిక జీవితం మూడు సత్కారాలూ ఆరు అవార్డులుగా వర్ధిల్లుతూ వుంటుంది. వీళ్ళ చుట్టూ కవి సమూహాలు మోకరిల్లి వుంటాయి. వొక అబద్దాన్ని శుద్ధ కవిత్వంగా మోసుకుంటూ తిరుగుతూ వుంటారు.  ఇలాంటి వాళ్ళని రోహిత్ చాలా ఇబ్బందిలో పెట్టాడు.

హెచ్చార్కె అన్నట్టు:

బుద్ధి కేంద్రాలలో కాదు, ఆత్మ క్షేత్రాలలో పోరు

తప్పుడు తర్కాలు, వంచన వ్యూహాలు చాలవు

మనస్సులే ఆయుధాలు. ఒకడు నిలబడింది

ఫెన్సింగ్ కి ఎటు వైపని కాదు, వాడి రొమ్ముల్లో

ఏమైనా కొట్టుకుంటూ వుంటే అది నీ పక్షాననే

అవుతుంది, లేదా వాడొక నడుస్తున్న శవమని

రుజువవుతుంది

ఇవాళ్టి వుద్యమజీవుల కంటే కూడా  సాహిత్య జీవులకి ఇలాంటి “తప్పుడు తర్కాలూ, వంచన వ్యూహాలూ” పెద్ద సవాల్ అవుతున్నాయి. వీళ్ళు ఎంత దూరం వెళ్తారంటే రోహిత్ మరణం మీద కవిత్వం ఏమిటీ అని అసింటా వెళ్ళిపోతారు. మనకి తెలియకుండానే పాత సాహిత్య వాదాలన్నీ మళ్ళీ కొత్త చొక్కా వేసుకొని వస్తున్నాయి. అందులో వొకటి: సాహిత్యం సాహిత్యం కోసం మాత్రమే అన్నది! సాహిత్యానికి సామాజిక సందర్భం వుందనడం వీళ్ళ దృష్టిలో విపరీత వాదం అవుతోంది. అలాంటి వాళ్లకి రోహిత్ లాంటి వాళ్ళు ఎంత మంది చనిపోయినా, లేదా, ఎంత మంది అన్యాయంగా చనిపోతూ వున్నా మనసు చలించదు. లేకపోగా, వెంటనే వాళ్ళు చాలా సుఖంగా సాహిత్య శుభ్ర యాగంలో తలమునకలై పోతారు.

యీ బాధల సందర్భంలో యిలాంటి సంపుటిలో భాగమైన ప్రతి కవినీ మనం అభినందించాలి. ఇందులో ఎంత కవిత్వం వుందనే తూనికలూ కొలతలూ అక్కర్లేదు. యీ బాధలో యెంత నిజాయితీ వుందన్నదే ముఖ్యం. యిందులో కొన్ని కవితలు చదివి, కవిత్వ రూపం యెంత మరకలు పడిందీ అని క్షోభించే కవి హృదయాలకు నా దగ్గిర సమాధానం లేదు, వాటినలా క్షోభిస్తూ వుంటే చూసి జాలిపడడం తప్ప!

సుబ్బాచారి అన్నట్టు:

ఇక్కడ ఒక జింక కూలిపోతే మాత్రం

చుట్టూ ఉన్న జింకలు కొద్దిగానే ఉన్నాయి.

కాని అక్కడ పులులు, సింహాలదే పెద్దసంఖ్య

సహానుభూతి అనేది కవిత్వ లక్షణం కాకుండా పోతున్న సందర్భం ఇది. సహానుభూతికి బదులు సాహిత్య రాజకీయాలు పెత్తనం చేస్తున్నసందర్భం కూడా- సహానుభూతిని వ్యక్తం చేయడానికి అర్హతల్ని, ప్రవేశ రుసుముల్ని నిర్ణయించి పెట్టిన కాలం ఇది. కొంత మంది మాత్రమే కొన్నీటి గురించి మాట్లాడాలీ అన్నది యిందులో వొకటి. యీ గిరి గీసిన వాళ్ళు కూడా శుద్ధ సాహిత్య వాదులే! మళ్ళీ అదే గిరుల మధ్య మనం విలువల్ని వురేస్తున్నాం, యిన్ని చర్చలూ ఉద్యమ సాహిత్య అనుభవాల తరవాత కూడా! కొత్త ప్రశ్నల్ని కొత్త తలలెత్తకుండా యెప్పటికప్పుడు వుత్తరించడం అనేది శుద్ధ వాదపు అబద్ధపు పునాది. ఆ పునాదిని యిప్పటికీ బలపరిచే వాదాలు ప్రత్యామ్నాయ శిబిరాల్లోనూ వినిపించడం అసంబద్ధంగా కనిపిస్తుంది నా మటుకు నాకు!

3

 

అరుణ్ బవేరా అన్నట్టు:

త‌ప్పు చేయ‌నివాడినే కాదు..

చెమ్మగిల్లనివాడినీ గురి చూద్దాం

అక్కడ ఈ వాక్యాన్ని ఉరి తీద్దాం..

కవిత్వ నరాల్లో నెత్తురు ఎక్కించాల్సిన కాలం మళ్ళీ వచ్చింది. వాక్యాలకు వాక్యాలనే తిరగరాసుకోవాల్సిన కాలమిది. రోహిత్ మరణం అలాంటి కొత్త కాలానికి వొక ప్రవేశ ద్వారం- ఈ సంకలనంలో అనేక కవితల్ని అనేక ధోరణులకు ప్రతిరూపంగా ఉదాహరించుకుంటూ వెళ్ళవచ్చు. ప్రతి కవినీ ఆత్మీయంగా పలకరించి, ఆ వాక్యాల్ని మళ్ళీ వినిపించమని పదే పదే వినవచ్చు. ఆ వాక్యాల లోతుల్లో ఆరిపోని నిప్పు సెగల్ని తాకి రావచ్చు.

ఇది రోహిత్ సందర్భం కాబట్టి, యీ మరణం నన్నింకా కలవరపెట్టే చేదు పీడకలగానే వుంది కాబట్టి- అతనిలాంటి మరణాన్ని అనుభవించిన  Roque Dalton వాక్యాలతోనే ముగిస్తాను.

The dead are getting more restless each day.

But not anymore
the dead
have changed.

They get all ironic
they ask questions.

It seems to me they’ve started to realise
they’re becoming the majority!

(A Warrior’s Resting Place)

రోహిత్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు యింకా దొరకలేదు. కాని, అనేక మంది రోహిత్ లు మనలో వున్నారు. వాళ్ళందరిలోనూ నిర్జీవ రక్తం గడ్డకట్టక ముందే మనం పలకరిద్దాం. ఆ పలకరింతల్లోంచి కొత్త వాక్యాలు రాద్దాం.

 

రోహిత్  కోసమే  కాదు…

 

 

 

-అఫ్సర్ 

~

 

1

నొప్పెడుతుందని చెప్పుకోలేని

వొకలాంటి రాత్రిలోంచి  యింకోలాంటి  రాత్రిలోకి వెళ్లిపోయావే తప్ప

రెండు కలల మధ్య  చావుని మాత్రమే అల్లుకుంటూ పోయావే తప్ప

యెవరి చీకట్లోకి నువ్వు

నీ దేహంతో సహా గబుక్కున దూకేశావో,

యెవరి గోడల్ని

పిడిబాకులాంటి  పిడికిళ్ళతో బాదుకుంటూ వుండిపోయావో

ఆ రాత్రికో ఆ వొంటరి తనానికో

యిప్పుడు నీడగా అయినా  కన్పించని నీకో తెలుసా?

 

2

మరణంలో మాత్రమే

నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే

పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్ళం కదా,

నువ్వున్నంత కాలమూ ప్రతి క్షణమూ  కన్పించని/ కన్పించనివ్వని

తెలియని/ తెలియనివ్వని

లెక్కలేనన్ని గోడలకి మాత్రమే చెప్పుకున్న కథలన్నీ

నిస్సహాయ అంతః శోకంలో పంచుకున్న కేకలన్నీ

యిప్పుడే విన్పిస్తున్నాయా నాకూ నా లోకానికీ?

 

3

అద్దాలు అడ్డం పడుతున్నాయి నిజాలకి,

విదూషకుడి మాయవరణంలో నువ్వొక అబద్దమై రాలిపడుతున్నావ్!

కచ్చితంగా నువ్వు గుర్తు పట్టినట్టే

నీ గుర్తులన్నీటికి మకిలి పట్టించాక

నువ్వేదో అంతుపట్టవు యీ  కళ్ళల్లో!

 

యీ  పూటకి

కాసింత  కాలాన్ని చంపే దృశ్యమై తేలిపోతున్నావ్ నువ్వు

యీ  గుడ్డి చూపుల దర్బారులో!

ఏదో వొక దృశ్యమేగా యీ  కంటి మీద  వాలాలి

ఆ తరవాతి మత్తు నిద్రకి మాత్రలాగా-

 

4

జీవితం యింకాస్త అందంగా

యింకాస్త ప్రశాంతంగా

యింకా కాస్త నిర్మలంగా వుంటే బాగుణ్ణు అనుకొని

నిన్నటి నిద్రలోకి జారిపోతూ యీ  పొద్దుటి కల రాసుకుంటూ వున్నానా

అదే  అరక్షణ శకలంలో  నువ్వు

చివరి పదాల ధిక్కారాన్ని వాక్యాలుగా పేనుతూ వున్నావ్,

కొండని పిండి చేసే ఆగ్రహమై కాసేపూ

అంత ఆగ్రహమంతా నీటి చుక్కయి రాలిపోయే నిట్టూర్పువై ఇంకాసేపూ-

 

5

యీ పొద్దున్న

యింకో సారి అద్దం కూడా నవ్వింది

నీకు నువ్వు తెలుసా అని!

నీలోపల పేరుకుపోతున్న ఆ పెదవి విప్పని  చీకటి పేరేమిటి అని!

 

నీ చూపు చివర

వైఫల్యమనే మాయలాంతరొకటి యింకా  కాచుకునే వుంది, చూశావా? అని-

 

యింకోలాగా  మాట్లాడలేనందుకు నువ్వు క్షమిస్తావో లేదో కాని

యింతకంటే నిజం యింకోలా లేనందుకు

యివాళ

యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను-

 

*

 

 

 

నమ్మకమైన యింకో పడవ ప్రయాణం!

 

 

1

లెబనీస్ కవి ఖలీల్ జిబ్రాన్ కీ, అరుణ్ బవేరాకి చుట్టరికమేమీ లేదు; వాళ్ళ భాషా, వేషమూ, దేశమూ వొక్కటి కాదు. కాని, కవిత్వం అనేది భాషలకీ, వేషాలకీ, దేశాలకీ అతీతమైంది అనుకుంటే, అటు జిబ్రాన్ గుండెలోనూ, ఇటు అరుణ్ మనసులోనూ వొకే రంగు జెండా రెపరెపలాడుతోంది. వీళ్ళిద్దరూ వొకే పడవ మీద రెండు భిన్న సముద్రాల్ని ఎదుర్కొంటూ వెళ్తున్నారు. ఆ మాటకొస్తే, ప్రతి వర్తమాన కవిలోనూ నాకు ఎంతో కొంత జిబ్రాన్ అంశ కనిపిస్తూనే వుంటుంది, యీ కవిత్వ భాష విషయానికి వస్తే!

రంగస్థలం మీదికి  కవి ప్రవేశం వూరికే జరగదు. వచ్చేటప్పుడు కవి చాలా నిశ్శబ్దంగానే వస్తున్నాడు కదా అనిపిస్తుంది. కాని, అతను వెళ్ళిపోయాక అతనేమీ నిశ్శబ్దంగా రాలేదనీ, కొన్ని కొత్త శబ్దాల్ని పలికించి వెళ్ళిపోయాడనీ కచ్చితంగా తెలిసిపోతుంది. ఇలా అనిపించడానికి అతని కవి పేరుకి ముందు “మహా” అనే రెండక్షరాలేమీ అక్కర్లేదు. ఇంకో మాట అనాల్సి వస్తే, ఈ “మహా” అనేది చాలా పొడి మాట. అర్థంలేని అసంబద్ధ అబద్దం. అందుకే, నేను పనికట్టుకొని ఇప్పుడు ఎక్కడో వున్న జిబ్రాన్ నీ, ఇక్కడే మన పక్కనే వున్న అరుణ్ నీ కలిపి మాట్లాడుతున్నా.

జిబ్రాన్ అంటున్నాడు:

By poet, I mean the sailor who hoists a third sail on a ship that has only two, or the builder who builds a house with two doors and two windows among houses built with one door and one window, or the dyer who mixes colors that no one before him has mixed, in order to produce a new color for someone who arrives later on to give the ship of the language a new sail, the house a new window, and garment a new color. (1923)

అరుణ్ కవిత్వం అంతా చదివాక ఇతని కొత్త పదాలు ఏమిటీ, కొత్త సందర్భం ఏమిటీ అన్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో పడ్డాను. ఇతని కవిత్వానికి వొక వర్ణం వుందీ అనుకుంటే ఆ వర్ణానికి వొక పేరుందా అనీ అడుగుతూ ఉండిపోయాను నాలోని చదువరిని!

ఆ మూడు ముఖ్యమైన ప్రశ్నలకూ ప్రతి కవీ ఎంతో కొంత సమాధానం ఇవ్వగలిగి వుండాలని నా నమ్మకం. ఆ సమాధానం వచనంలో కాకుండా ఖాయంగా కవిత్వంలోనే  ఉండి తీరాలని యింకో గాఢమైన నమ్మకం.

 

2

సందర్భం తెలిసిన కవి అరుణ్. అంతే కాదు, యింకో ప్రత్యామ్నాయ కొత్త సందర్భం సృష్టించుకోవాల్సిన అవసరం వుందని నమ్ముతున్న కవి కూడా.

ఒక సందర్భం – క్రిక్కిరిసిన మనుషుల మధ్య గోలగా…

మరో సందర్భం ఖాళీగా…ఒంటరిగా…శూన్యంలా వేలాడుతూ.

ఈ రెండు వాక్యాలలోని రెండు సందర్భాలూ మనకి తెలుసు. మన చుట్టూ ఎంత శబ్దం వుందో, అంతటి నిశ్శబ్దం కూడా వుంది. కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలీనంతగా-  ఇంకా కొన్ని విషయాలు చాలా చాకచక్యంగా నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నాం, ఇంటర్నెట్లోకి! ఇప్పుడు నడిచేదంతా చరిత్రే అయితే, ఆ చరిత్రని ఎట్లా రికార్డు చేయాలన్న సందిగ్ధంలో పడేస్తున్నాం చరిత్రకారుడిని!

కాని, ఇంత సందిగ్ధంలోనూ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతూ, రాబట్టుకోవాల్సిన సమాధానాలు రాబట్టుకోవడం ఏమిటో అరుణ్ కి తెలుసు. అతని ప్రతి కవితా వొక ప్రశ్నలోంచి మొలకెత్తి, సమాధానంలోకి ప్రయాణిస్తుంది. అదిగో, అలాంటి ప్రయాణాలే తన కవిత్వంగా నమోదు చేస్తూ వెళ్తున్నాడు అరుణ్.

అయితే, సందర్భాన్ని మాట్లాడే కవి చాలా సందర్భాల్లో వాచ్యమైపోతూ వుంటాడు. అరుణ్ కి అలాంటి ప్రమాదం లేదు. మరీ వాచ్యం అనిపించే సందర్భాన్ని కూడా తీసుకొని, అందులో కవిత్వాన్ని పొదగడం ఏమిటో, ఆ పరుసువేది ఏమిటో తెలిసిన వాడు అరుణ్. ఉదాహరణకి పైన పేర్కొన్న కవిత చూడండి, ఎలా ముగించాడో!

నువ్వో ఆకాశం, నేనో ఆకాశంగా

మాట్లాడుకుందాం

ఎప్పుడైనా-

ఈ నమ్మకాలు గుర్తొస్తే

జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా

పెనవేసుకుందాం.

చాలా అందమైన భావనతో ముగిసింది ఈ కవిత. అరుణ్ ప్రతి సందర్భాన్నీ అంతే శ్రద్ధగా చెక్కుతాడు కవిత్వ శిల్పంగా- అది ఆ సందర్భం మీద పట్టు వున్నప్పుడే సాధ్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు కదా! ఇంతకుముందు జిబ్రాన్ అన్నాడే – the dyer who mixes colors that no one before him has mixed- అని, కచ్చితంగా అదే పని.

సందర్భం మాత్రమే కవిత్వం కాదు, సందర్భం తన రూపాన్ని తానే discover చేసుకోదు. నిపుణుడైన కవి ఇంకో కొత్త రూపంలోకి వెళ్తే, ఆ సందర్భం పదునెక్కుతుంది. అరుణ్ వొక కవితలో అన్నట్టు:

నాలోని ప్రతి పాత్రా

నిండుతున్నట్టే వుంటుంది,

కాని- మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఖాళీ అవుతుంది.

అన్న వొక సంశయం కవికి నిరంతరం వుండాలి. అప్పుడు సందర్భాన్ని ప్రశ్నించే శక్తి కూడా అతనికి వస్తుంది. అలాంటి శక్తి నిండిన కవిత్వం యిక్కడి యీ ప్రయాణంలో ఎదురవుతుంది.

arun

3

తన ప్రయాణానికి వొక సందర్భం వుందీ అని నాలోని చదువరిని గట్టిగా నమ్మించాడు అరుణ్. ఇది చిన్న విజయమేమీ కాదు. అయితే, ఆ నమ్మకం దగ్గిరే నిలిచిపోయి, అరుణ్ చెప్పినదంతా/రాసిందంతా బంగారం అనుకునే స్థిరత్వం ఈ చదువరికి లేదు. ఇతని కొత్త పదాలేమిటీ అని మెతుకు మెతుకునీ పట్టి వెతుక్కునే దప్పికలో వున్నాను. కొన్ని అందమైన వాక్యాలకే ఈ దప్పిక తీరదు. వాక్యాలకి అతీతమైన జీవజ్వాల ఏదో కనిపించాలి. దాన్ని నేను “తాత్వికత” అనుకుంటున్నాను.

ముఖ్యంగా ఎటు చూస్తే అటు కవిత్వమే వినిపిస్తున్నప్పుడు ఈ తాత్వికత నాకు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం సమకాలీన కవిత్వంలో వాక్యాల వెంట పరుగు కనిపిస్తోంది. వాక్యాన్ని దీపంగా వెలిగించే ప్రయత్నం తక్కువగా కనిపిస్తోంది. వాక్యం దీపం కావాలంటే, కవికి దాని చుట్టూ వున్న చీకటిని సరిగ్గా చూసే కన్ను కావాలి.

అరుణ్ అన్నట్టు:

జీవితం

ఒక నిర్వచనం స్థాయి నుంచి ఎదగడం లేదు.

 అదే మాటని యింకాస్త విస్తరిస్తే, కవిత్వం కూడా వాక్యం స్థాయిని దాటి వెళ్ళడం లేదు. కవులు తమ వాక్యాల్ని తామే ప్రేమించుకోవడంలో తలమునకలై వున్నారు. తన నీడని తానే ముద్దాడుకుంటూ మురిసిపోయే narcissism బాహాటంగా పెరిగిపోతోంది. వొకానొక కాలంలో కవి చాలా సిగ్గరి. యిప్పుడు అలాంటి సిగ్గూ ఎగ్గూ లేదు. కొన్ని సార్లు కవిత్వం మీదనే వెగటు పుట్టించే స్థాయిలో ఆత్మ ప్రేలాపనలు సాగుతూ వున్నాయి. తనని తాను వెతుక్కునే అంతర్నేత్రం మూసుకుపోతోంది. అట్లాగని, బహిర్నేత్రం బలపడుతోందని కాదు. అది మరీ బలహీనమవుతోంది.

అరుణ్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ స్థితుల్ని దాటుకుంటూ వెళ్తున్న వొక composure కనిపిస్తోంది, బహుశా, అది అతని పునాదిలో వున్న వామపక్ష దృక్కోణం నించి వచ్చి వుండాలి. అతని వాక్యాల్ని వేటినీ మనం విడివిడిగా కేవలం కవిత్వంగా చదవలేం. ఉదాహరణకి:

 1. ఒక్క -కల కోసం

కొన్ని వేల సార్లు నిద్రపోవడం

ఒక్క- కరచాలనం కోసం

వేల శరీరాల్ని తవ్విపోయడం.

 

 1. వాన కురుస్తోందంటే

చెట్లు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలనుంది.

 

 1. మనుషులు ఖాళీ చేసిన వూరు

సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతున్న దుఃఖం.

 

 1. ఈ జీవితాన్ని ముందెప్పుడో జీవించినట్టు

యిప్పుడంతా ఖాళీ.

 1. ఏదీ లేకపోవడం లోంచి

ఏదైనా రగిలే వాంఛ.

 

 1. యివాళ మనుషులందరూ

దీక్షా శిబిరాలుగా విడిపోయిన సందర్భంలో

బ్రతకడం అంటే –

దేనికి నిరసనో చెప్పాలి.

ఇవి కేవలం వాక్యాలు కావు. కావుకావుమనే సగటు కవిలోకపు cacophony లో సమాధి అయిపోయే నినాదాలూ కావు.

తన ప్రాణం పెట్టి మాటని బతికించే తపన ఇది. తన కన్నుని దారిదీపంగా వెలిగించి ముందుకు నడిపించే ప్రవాహపు ప్రయాణం  ఇది. యిలాంటి వెలుగు  ప్రయాణాలు మరిన్ని కావాలి, నిజమైన సందర్భాలు అసందర్భాలై పోతున్న ఈ కాలంలో!     *

*

ఆగ్రహం నగ్నముని కవిత్వ వ్యాకరణం!

-అఫ్సర్

~

[డిసెంబర్ 6 హైదరాబాద్ లో  యాభయ్యేళ్ళ దిగంబర కవిత్వం సందర్భంగా  “ఛాయ” ఏర్పాటు చేస్తున్న  నగ్నమునితో సంభాషణ సందర్భంగా…

 

సామాజిక సాహిత్య రూపాల పరస్పర సంబంధం 1955 పరిణామాల తర్వాత స్పష్టమయింది. సాహిత్య రూపాలపై క్రమంగా మధ్యతరగతి పట్టు  పెరగటం వల్ల వచన కవిత్వం బాగా విస్తరించింది. చాలా కొద్ది కాలంలోనే వచన కవిత్వానికి కూడా రూపపరంగా వొక ఫార్ములా యేర్పడిపోయింది. రాజకీయ, సామాజిక రంగల్లో వున్న స్తబ్దతా, మధ్య తరగతిలో కళారూపాల పట్ల ఏర్పడుతున్న పరాన్ముఖతా వచన కవిత్వంలోని ఈ ఫార్ములాని కొంతకాలం నిరాటంకంగా సాగ నిచ్చాయి.  ఈ నమూనాని చేధించి, మొత్తంగా కాకపోయినా శకలాలుగానైనా జీవన వాస్తవికతకి దగ్గరగా వెళ్లాలనే ప్రయత్నం ఆరుద్ర, అజంతా, నగ్నముని,  బైరాగి, వజీర్ రెహ్మాన్, ఇస్మాయిల్  లాంటి కవులు చేస్తూ వచ్చారు.

’60 ల మొదటి దశలో నగ్నముని ‘ఉదయించని ఉదయాలు’ వెలువడేనాటికి అదొక ప్రత్యేకమైన గొంతు. అంత్యప్రాసలకి అంత్యక్రియలు చేసి,  కొత్త నిర్మాణ వ్యూహాలతో నగ్నముని వొక కెరటంలాగా తెలుగు కవిత్వాల పొడి  వాతావరణంలోకి దూసుకొచ్చాడు. “అంతా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి, ఏదో పనిలో తమని తాము పోగొట్టుకుంటున్న”స్తబ్ధస్థితిలో మనిషిని, మనసులోని కొత్తగోళాల వైపు నడిపించడమే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. బహుశా, నగ్నముని ఈ దశలో చేసింది. కొత్త సంపన్నుల వరసలో చేరాలని తపించే మధ్యతరగతిపై నిరసన ప్రకటించడం.

“గుద్దేసి వెళ్ళిపోయిన కారు కింద పడ్డ మనిషి చుట్టూ జనం ఈగల్లా ముసురుతున్నారు. తిరిగి అంతా అతన్ని వదిలేసి మాట్నీకి వెళ్లిపోతున్నారు….

మధ్యతరగతి తన చుట్టూ   జరుగుతున్న వాటి గురించి కావాలని పెంచుకుంటున్న Alienation, కందమూలాలు ఏరుకోడంలో జీవితం అయిపోతున్నా,  కోర్టుల్లో కాలం ఉరి తీయబడుతున్న అక్షరాలు అర్ధాలు కోల్పోతున్నా, అంతా బావున్నారులే అకాశం కింద –

వాస్తవికతకి దూరంగా పారిపోతే తప్ప, మధ్యతరగతి తన ఊహాప్రపంచాన్ని పకడ్బందీగా నిర్మించుకోలేదు. చుట్టూ ఏమీ జరగడం లేదనుకోవాలి. అంతా బాగుందనుకోవాలి. తను తప్ప సమాజమంతా సుఖంగా వుందనుకోవాలి. ఇలా ఎండుటాకుల మీద చప్పుడు కాకుండా నడవాలనుకునే ఈ ధోరణిని నగ్నముని ఎండకట్టాడు.

2006021617180301_996062e

నగ్నముని మొదటినుంచీ చాలా Conscious poet. తనదేదో ఒక వింత దంత గోపురాన్ని నిర్మించుకొని అక్కణ్నించి దిగి రాకూడదని భీష్మించు కూర్చోడు. నేలమీద నిటారుగా నిల్చొని సూటిగా సూర్యుడి వైపు ప్రయాణించాలనుకుంటాడు. అందుకే నగ్నముని తనదైన ఒక ఏకాంత  స్వప్నాన్వేషణలో తడబడు గొంతుకతో మట్లాడలేదు. స్పుటంగా  పలకడం అతనిలోని శాబ్దిక బలం వల్ల కాదు. తాత్విక బలం వల్ల వచ్చిన లక్షణం. నిశబ్దంలో నిశ్శబ్ధ భావాల్ని పలికేటప్పుడు కూడా నగ్నముని బాహ్య జీవితాన్ని గురించి నిష్కర్షగా చెప్పగలడనడానికి ‘మార్లిన్ మన్రో కోసం’ రాసిన కవితే నిదర్శనం.

దిగంబర కవిగా అవతరించిన తర్వాత నగ్నముని యధాతథ వ్యవస్థ మీద కత్తి కట్టినట్టు కవిత్వం రాశాడు. వ్యవస్థని వెనక్కి నెట్టే లేదా ఎక్కడికక్కడే స్తబింపజేసే ఏ శక్తినీ నగ్నముని క్షమించలేకపోయాడు. ప్రతిఘటన, ఆగ్రహం తన కవిత్వానికి పర్యాయపదాలుగా మార్చుకున్నాడు. కవిత్వంలో  కప్పలా బెక బెక మంటున్న,  మేకలా మే మే అంటున్న   అసహాయపు కీచురాయి గొంతుని దగ్గరికి రానివ్వలేదు. అవకాశవాదమే జీవిత విధానంగా అన్ని విలువల్నీ వంచిస్తున్న నకిలీ వ్యక్తిత్వంపై నగ్నముని రెండో ఆలోచన లేకుండా కొరడా ఝళిపించాడు. ఇలాంటి కవితల్లో నగ్నముని సాధ్యమైనంత Satirical heights కి వెళ్లిపోతాడు. ఉదాహరణ: దేశభక్తి కవిత.

ఆధునిక జీవితానికి సంబంధించిన కొత్త కోణాలెన్నింటినో దిగంబర కవిత్వం వస్తువుగా తీసుకుంది. అయితే, 70లలో విప్లవోద్యమం వచ్చినప్పుడు నగ్నముని దృష్టి ‘తూర్పుగాలి’  వైపు మళ్లింది. దిగంబర కవిగా నగ్నముని అసహన, ఆగ్రహ ప్రకటనకే పూర్తిగా పరిమితం కాలేదు గానీ, ‘తూర్పుగాలి’ లో ఆ కోపానికో దిక్కు దొరికింది. దేన్ని కోప్పడాలి, ఎందుకు కోప్పడాలి అనేది ‘తూర్పుగాలి’ లో నగ్నమునికి సూటిగా తెలిసిపోయిందని పాఠకుడికి కూడా ఇట్టే తెలిసిపోతుంది.

మనిషిగా వర్గ చైతన్యంతో మనం ముందుకు వెడదాం అంటున్న నగ్నముని దిగంబర కవికాదు. వర్గచైతన్యం అనే పదం నగ్నముని  నిఘంటువులో కొత్తది. ఈ దశలో ఈ నగ్నముని నీలోనూ నాలోనూ  వున్నవాడు. మననుండి విప్లవాల్నీ, త్యాగాల్నీ నిరీక్షిస్తున్నవాడు.

విప్లవ కవిగామారిన తర్వాత నగ్నముని గొంతులో ఒక బాలెన్స్ వచ్చినట్టనిపిస్తుంది. భావాల్ని ఆవేశం స్థాయిలో కాకుండా ఆలోచన ప్రమాణంగా వ్యక్తం చేస్తున్నాడనిపిస్తుంది.

01-nagnamuni

విప్లవ కవిత్వం తరవాతి  దశకూడా నగ్నముని కవితల్లో కనిపిస్తుంది. “కొయ్య గుర్రం” ముగింపు వాక్యాల్లో కనిపించేది. మళ్ళీ కొత్త నగ్నమునే నమ్మాల్సిన వాటినన్నింటినీ నమ్మి, మోసపోయిన తర్వాత వుండే నిర్లిప్తతతో, జీవితాన్ని పునః ప్రారంభించాలనే అమాయక తపన కనిపిస్తాయి. అయితే, నగ్నమునిలో రకరకాల రూపాల్లో బహిర్గతమయ్యే సంఘర్షణా, అలజడీ అంత తేలిగ్గా దేనికీ లొంగవు. అంతా నిశ్శబ్దంగా వున్నప్పుడు నిప్పులు కురిపిస్తాడు. అంతా మౌనంగా వున్నప్పుడు శబ్దాల్ని వర్షిస్తాడు. ఈ నిశ్శబ్దం, ఈ మౌనం రెండు ఆయనకి భయంకరమైన ఉపద్రవాల్లా, శత్రువుల్లా కనిపిస్తాయి. అందుకే ఉద్యమాలు తగ్గుముఖం పట్టి, పోరాట పటిమ బలహీనపడిందని భావించి స్తబ్ద వాతావరణాన్ని వేలెత్తి చూపించాడు. విప్లవ నినాదం కాక, ఈ సమాజాన్ని కదిలించాల్సిన కొత్త శక్తి ఏదో కావాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య గొంతుకని సవరించుకున్నాడు. ఈ రెండు నినాదాల్లోనూ, వివాదాల్లోనూ నగ్నముని రాజీలేని తనమే కనిపిస్తుంది.

బాహ్య, అంతర్లోకాల సరిహద్దులు స్పష్టంగా గుర్తెరిగిన వాడవడంతో నగ్నముని కవిత్వరూపం సర్రియలిజంకి దగ్గిరగా వెళ్లిందనిపిస్తుంది. చాలా మామూలు మాటలూ, వాక్య నిర్మాణంలోనే ఎలాంటి ప్రయాసా పడకుండా అసాధారణ శైలిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధోరణి ‘ఉదయించని ఉదయాల్లో’  కాస్త తక్కువగా, దిగంబర కవిత్వంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ‘ఉదయించని ఉదయాల్లో’  లాండ్ స్కేప్ లాంటి కవితతో Para-linguistic features కనిపిస్తాయి. అంత్య ప్రాసల వచన కవిత్వ శైలి ప్రధానంగా వున్నప్పుడు దాన్ని ధిక్కరించి ‘దిక్’ల వైపు సాగే ప్రయత్నం ‘లాండ్ స్కేప్’లోనే కనిపిస్తుంది. ఈ Para-linguistic రూపాన్ని తర్వాత్తరవాత వజీర్ రెహ్మాన్,  స్మైల్ ఇంకా బలంగా, అర్ధవంతంగా వుపయోగించగలిగారు. ఇలా అత్యాధునిక కవిత్వ రూపానికి సంబంధించిన కొన్ని నమూనాల్ని నగ్నముని తన కవితల ద్వారా చూపించాడని చెప్పవచ్చు.

సాధారణ వచన కవిత్వ శైలిలో ఎంతకాదన్నా శబ్దం పంటికింద రాయిలా తగుల్తుంది. పైగా  అంత్య ప్రాసలవల్ల కవిత్వ వాతావరణం కొంత అసహజంగా వుంటుంది. ఈ రెండింటినీ నిరాకరించినది అత్యాధునిక కవిత్వ రూపం. ఈ రూపంలో భాష వొక వాహికగా వుంటుంది తప్ప తనే కవిత్వంగా మారదు. తిలక్ తరహా అలంకారిక శైలిని అత్యాధునిక కవిత్వంగా  కనీసం ఊహించలేం. అలాగే కుందుర్తి తరహా అంత్యప్రాసల అసహజ ప్రయాస కొత్త రూపంలో కనిపించదు.

8215_front_cover

ఈ కొత్త ధోరణికి చెందినవాడవడం వల్ల నగ్నముని కవిత్వంలో భాష కనిపించదు. అంతర్వాహినిలా వొక ఆధునిక మానవుడి సంభాషణ వినిపిస్తుంది. ఈ సంభాషణా శైలీ వ్యూహాన్ని నగ్నముని చాలా యాంత్రికంగా ప్రవేశపెట్టాడని అనుకోడానికి లేదు. తర్వాత్తర్వాత నగ్నముని కవిత్వరూపంలో ఎన్ని మార్పులొచ్చినా, మౌలిక నిర్మాణ ప్రాతిపదిక ఈ సంభాషణా వ్యూహమే. ఈ సంభాషణకి వొక క్రమం వుంది. నగ్నముని ప్రతి కవితలోనూ రెండు పాత్రలు కనిపిస్తాయి. ఒకటి కవి. రెండు తను లక్ష్యంగా వ్యక్తి లేదా వ్యక్తి ప్రతీకగా వున్న వ్యవస్థ. ఈ రెండు పాత్రల మధ్య సంభాషణలో గట్టి తర్కం వుంటుంది. నిర్మొహమాటంగా సాగే భావాల మార్పిడి వుంటుంది. ఒకే అంశాన్ని అనేక కోణాలనుంచి పరీక్షించి వీక్షించే వైరుధ్యమూ, విశాలత్వమూ వుంటాయి. ఇది (Monologue)గా మిగలదు. కచ్చితంగా (Dialogue) రూపంలో సాగుతుంది.

మొట్టమొదట , చిట్టచివరి కొమ్మన మనసు దిగంబరం కావాలి  – అని నగ్నముని చెప్పింది వ్యక్తీకరణ సమస్యే. ఈ దశలో నగ్నముని కవిత్వ శైలిలో అక్కడక్కడా అశ్లీలం పలకడం కూడా ఆశ్చర్యమేమీ కాదు. నగ్న సంభాషణలో శీలం, పాతివ్రత్యం, అశ్లీలం అంటూ ఏవీ మిగలవు. మాటల మీది ముసుగుని తొలగించడమే ఇక్కడ కవిత్వం పని. ఈ దిశగా నగ్నముని సాధించింది ఎంతో మిగిలింది. ఎన్ని వాదాలూ, అపవాదాలూ చేసినా అది ఖనిజం లాంటి నిజం

[నగ్నముని కవిత్వం మీద  1992లో తెనాలి పొయెట్రీ ఫోరం వారు “సంతకాలు” కవిత్వ పత్రిక నగ్నముని ప్రత్యేక సంచికకి  రాసిన గెస్ట్ ఎడిటోరియల్ ని ప్రచురిస్తున్నాం. ఈ రచనని ఇన్నేళ్ళ పాటు భద్ర పరచి మాకు పంపించిన పసుపులేటి వెంకట రమణ గారికి కృతజ్ఞతలు]

~

సగం ఆకాశంపై ఇంకో సంతకం!

 

 

  (ఆగస్టు 23 మెర్సీ మార్గరెట్ తొలి కవిత్వ సంపుటి “మాటల మడుగు” ఆవిష్కరణ సందర్భంగా)

 

నేను వెతుక్కుంటున్న ప్రపంచం దొరకడం లేదు

కొత్త నేలా, కొత్త ఆకాశమూ దొరకడం లేదు

సర్లే, కొత్త నేలా కొత్త ఆకాశమూ దొరికాయి కదా అనుకుంటే

కొత్త మానవుడి ఆచూకీ దొరకడం లేదు ఎక్కడా!

-చాలా కాలం కిందట యేదో ఆడియో క్యాసెట్ లో విన్న కైఫీ ఆజ్మీ ఘజల్ గుర్తొస్తోంది, ఇవాళ మెర్సీ కవిత్వం రెండో సారి చదవడం పూర్తి చేసాక! ఆ వెంటనే, రెండు ప్రశ్నలు నా ఆలోచనల నిండా అలముకున్నాయి.

కవిత్వం రాయడం అనే ప్రక్రియ కవికి ఎందుకు అంతగా అవసరం? నాలుగు కవిత్వ వాక్యాల తరవాత ఆ కవి ప్రపంచం గానీ, అది  చదివిన చదువరి ప్రపంచం గానీ కొంచెమైనా మారుతాయా? ఈ రెండు ప్రశ్నలు అడగడం తేలిక; వాటి సమాధానాలు అంత తేలిక కాదు.

కాని, కవిత్వాన్ని తన సంభాషణకి సాధనంగా ప్రకటించుకున్నాక, ఆ కవి ప్రపంచం చాలా మారిపోతుంది. తన అనుభవాన్నీ, చెప్పాలనుకున్న విషయాన్ని ఆవిష్కరించడంలో ఆ కవి వెతుక్కునే దారులు అప్పటిదాకా మనకి అపరిచితంగా వున్నా, కొద్దిసేపట్లో అవి పరిచితమై, వొక ఆత్మీయమైన బంధం కవికీ, చదువరికీ మధ్య మొలకలెత్తుతుంది.

అంటే, వొక ఆత్మీయ నేస్తం లేని లోటుని ఆ కవిత్వం నెమ్మదిగా భర్తీ చేయడం మొదలెడుతుంది. అలాంటప్పుడు ఆ కవి ఎవరు, అతను/ ఆమె భౌతిక ఉనికి ఏమిటీ అన్న ప్రశ్నలు అర్థరహితంగా కనిపిస్తాయి. వాక్యాలతో మొదలైన ఆ బంధం జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలలో కూడా ఆ వాక్యాల ఆసరా వెతుక్కునేట్టు చేస్తుంది.

అలాంటప్పుడు, చాలా సంక్లిష్టంగా అనిపించే జీవన ప్రహేళికలో వొక నేలా, ఆకాశమే కాదు, కొత్త మానవత్వపు చిరునామా కూడా దొరికినట్టే! అలాంటి అనుబంధాన్ని అల్లుకునే కవిత్వపు వంతెన – మెర్సీ మార్గరెట్ కవిత్వం.

1

సాధారణ స్త్రీవాద కవిత్వం దాదాపూ తగ్గుముఖం పట్టి, దళిత, ముస్లిం, తెలంగాణా  స్త్రీవాదాల నిర్దిష్టత (local –specific feminism) ముందుకొస్తున్న దశలో మెర్సీ కవిత్వం మనం చదువుతున్నాం. అలాగే, భావప్రకటనకి సంబంధించి వ్యక్తిగత ధోరణి యింకో రూపం ఎత్తుతున్న దశలో కూడా మనం వున్నాం. ప్రపంచీకరణ తరవాతి extreme individualism తెలిసో తెలియకో ప్రతి కవిలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. ఇది క్రమంగా  సామాజిక నిరాకరణగా మారిపోతోందా అన్న సంశయమూ వొక్కోసారి వస్తోంది. ఆ సంశయాలని తుడిచేస్తూ, ఈ రెండీటినీ బ్యాలెన్స్ చేసే స్వరాల్లో మెర్సీ వొకటి.

mercy

మెర్సీని కవిత్వ లోకంలో బలంగా పరిచయం చేసిన కవిత “ప్రశ్నలగది.” ఈ కవితలో మెర్సీ అన్వేషణకి ఎన్ని రూపాలున్నాయో అవన్నీ అద్దంలో ప్రతిఫలించినట్టు కనిపిస్తాయి. వొకే వొక కవితలో కవి వ్యక్తిత్వాన్ని చూపించాలనుకోవడం దురాశే కాని, ఎందుకో నాకు నమ్మకం- అలా చెయ్యచ్చు అని! కవి ఏదో వొక కవితలో తన మొత్తం ప్రాణం పొదుగుతాడు; తన ప్రయాణానికి ఆ కవిత తెలియకుండానే benchmark అవుతుంది. అది ఎలా అన్నది అర్థం కావాలంటే “ప్రశ్నలగది” కవిత మొత్తం ఇక్కడ quote చేయాలి.

అప్పుడప్పుడు

ఆ గదిలోకెళ్ళడం అవసరం

అంటూ వొక అనివార్యత(inevitability)ని మన ముందు సృష్టించి అప్పుడు కవితలోకి తీసుకెళ్తుంది మెర్సీ. ఇది మంచి శిల్పం అయితే, అక్కడితోనే ఈ కవిత ఆగిపోదు.  ఇందులో మెర్సీ నిబద్ధతని చెప్పే వాక్యాలు చాలా వున్నాయి. ప్రశ్నల గదిలోకి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న వెనక మెర్సీ చూపించిన rationalization  ఈ కవితకి మూల బిందువు.

కవి వ్యక్తిత్వాన్ని- అది సొంతమైనా, కవిత్వమైనా- ఆమె వెతుకులాటతో మాత్రమే సరిగా measure చేయగలమని అనుకుంటాను. అన్నట్టూ, వెతుకులాట అంటే మళ్ళీ ఇప్పటికీ ఇస్మాయిల్ గారి కవితే గుర్తొస్తుంది.

నింగి దేనికోసం
వంగి వెతుక్కుంటుంది?
నేల దేనికోసం
నీలంగా సాగుతుంది?
కాసార మెవరికోసం
కన్నార్పక చూస్తుంది?
ఆకలి దప్పులు లేని గాలి
వాకిళ్ళనెందుకు తెరుస్తుంది?
బొడ్డులో కన్ను తాపుకుని
బావి ఏమి గాలిస్తుంది?
ఒక్క చోటనే చెట్టు నిత్య
మెక్కడికి ప్రయాణిస్తుంది?

ఇస్మాయిల్ గారు ఈ కవితలో చెప్పిన భిన్న స్తితులకు కవి గానీ, కవిత్వ సృజన గానీ  ఏ మాత్రం భిన్నం కాదు. ఇందుకవితని లో ఇస్మాయిల్ గారు అడుగుతూ వెళ్ళిన ప్రశ్నలకి ఈ కాలంలో ఈ క్షణంలో నేను మెర్సీ “ప్రశ్నల గది” కవితని వొక సమాధానంగా చూస్తున్నా.

అన్ని సమాధానాలూ  దొరుకుతాయన్న హామీ లేదు జీవితంలోనూ, కవిత్వంలోనూ!

వెతుకులాట ఎక్కడో వొక చోట ఆగిపోతుందన్న హామీ అంతకంటే లేదు. అయితే, కవిత్వం వొక హామీ ఇస్తుంది. జీవితంతో ఉద్వేగ బంధాన్నిస్తుంది. ఎడరతెరపి లేకుండా ప్రశ్నించే సహనాన్నిస్తుంది. ఈ  మూడింటి కోసమే మనం కవిత్వాన్ని ఇంతగా ప్రేమిస్తాం. నమ్ముకుంటాం. చాలా కవితల్లో మెర్సీ కవిత్వ పుట్టుక గురించీ, నడక గురించీ ఆలోచించడం కనిపిస్తుంది. కవిత్వాన్ని  వొక savior గా నమ్మినప్పుడు మాత్రమే ఈ ఆలోచన ఇన్ని రూపాల్లో కనిపిస్తుంది. ఇలాంటి నాకు బాగా నచ్చిన సందర్భం- “కవులు-కాగితం” అనే కవిత. చాలా తేలికగా వుండే కవిత ఇది. కాని, బరువైన ఆలోచనని దాచుకున్న కవిత.

అవును,

కవులు కాగితాలపై కలుస్తారు

సగం దూరం ప్రయాణించిన తరువాత

బాటసారుల్లా కొందరు

 

నదుల్లా వెంటాడుతూ, మనతో

మన ఆలోచనల్లో

ఇంకొందరు

కవిత్వాన్ని గురించి ప్రతి కవీ తనదైన వూహ చేయకుండా ఉండడు. ఆ ఊహని చదువరి కోణం నించి చేయడం ఈ కవితలో విశేషం. కవీ, చదువరీ వొకే దారిలో వెళ్తూ కూడా రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతారు. అంటే రెండు  వాక్యం చదువుతూ కూడా భిన్నమైన వూహల్లో తమని తాము నిలబెట్టుకుంటారు. ఆ రెండు వూహలూ నిజమే. వాటిని ఇద్దరూ సమానంగా value చేయగలిగినప్పుడే కవిత ఇద్దరి మనసుల్లోనూ బతుకుతుంది, లేదా నిలిచి వుంటుంది. కొన్ని సార్లు అంతకు ముందు అనుకున్న వాటిని కొట్టివేసే సహనమూ వున్నప్పుడే ఇది అర్థవంతమైన ప్రయాణం అవుతుంది.

మెర్సీ అంటుంది:

పునర్లిఖించుకోవాలి

నన్ను నేను

పాత మాటలకు నిర్దాక్షిణ్యంగా కత్తెర వేసి

ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి

పాత పాళీకి కొత్త మాటలు అభ్యాసం చేయించి…

ఇదంతా ఆ  అర్థవంతమైన ప్రయాణంలో భాగమే. ఈ ప్రయాణానికి అర్థం వుంది అనుకున్న తరవాత మెర్సీ యెన్ని కవిత్వ దూరాలు వెళ్లిందో అక్కడల్లా తన footprints లాంటి వాక్యాల్ని ముద్రించి సాగిపోయింది.

 

2

వెతుకులాటే కవిత్వం ఉనికి అనుకుంటే, వెతికి సాధించేది కాదు, వెతుక్కుంటూ వుండడమే కవిత్వం.

ఈ కవితా సంపుటి చదువుతున్నప్పుడు మెర్సీ ఎన్ని వ్యక్తిగత, సామూహిక అనుభవాలు తన కవిత్వంలో రికార్డు చేసిందో చూస్తే, కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె తన ఏకాంతపు గాఢమైన అనుభూతిని ఎంత చెప్పిందో, సామూహికంగా తన అస్తిత్వాన్ని అంతే వివరంగా చెప్పుకుంటూ వెళ్ళింది.

వొక కవితలో తనే చెప్పుకున్నట్టు:

తడిమే ప్రతి చూపులో

వినే ప్రతిమాటలో నూత్న వెలుగుతో

నన్ను నేను కాల్చుకోవాలి

కాల్చుకోవడం అనేది ఇక్కడ తపనకి పరాకాష్ట. స్త్రీవాదం ఎక్కడో వొక చోట ఆగిపోవాలని ఎదురుచూస్తున్న వాళ్లకి నిరాశా, వొక షాక్ ఇచ్చేట్టుగా మెర్సీ తనలోని స్త్రీచైతన్యంతో రాసిన కవితలు ఇందులో చాలా వున్నాయి. Feminine sensibility,  gendered identity అనేవి సిద్ధాంతపు గోడలు దాటి అనుదిన జీవితంలోంచి నేరుగా కవిత్వంలోకి ప్రవేశిస్తే ఎలా వుంటుందో చెప్పే ఉదాహరణలు ఈ కవిత్వంలో కనిపిస్తాయి. “విత్తనపు వీర్యం ఆడా? మగా?” లాంటి కవితలు వొకానొక ఉదాహరణ మాత్రమే.

సామూహక అస్తిత్వం అనేది గట్టిగా వినిపించే ప్రతి వర్తమాన సందర్భాన్నీ మెర్సీ కవిత్వం చేసింది. “అమానత్ స్వరం” కవిత చూడండి –ఈ కవిత కొంత వాచ్యం అయిన మాట నిజమే కాని, ఇందులో వినిపిస్తున్న ఘోష మన గుండెల్ని పిండేస్తుంది.

ఇప్పుడు

కన్నీరు కార్చి అయ్యో అనకండి

మా అక్కో చెల్లో తల్లో కాదని

తప్పుకుపోకండి

తల్లిదండ్రులారా,

వీలయితే మీ కొడుకులను స్త్రీలను గౌరవించడం

నేర్పండని

ఎలుగెత్తి ఏడుస్తూ ఘోషిస్తుంది

అమానత్ స్వరం!

ఇందులో కవిత్వం ఏముందన్న ప్రశ్నకి ముందే ఈ వాక్యాలలోని విసురూ, ఆవేశం మనల్ని చుట్టుముడ్తాయి. దీన్ని ఇంగ్లీషులో అయితే attitudinal poetry అనవచ్చేమో! కేవలం వొక attitude చెప్పడం వరకే ఆ కవిత పని. ఇవి మెర్సీ మామూలుగా రాసే కవితలకి భిన్నంగా వుంటాయి. మామూలుగా మెర్సీ కవిత్వంలో వుండే సాంద్రతా, imaginary coherence, symbolic integrity వంటివి వీటిలో కనిపించవు. “కాల్చుకోవాలి” అన్న క్రియని మెర్సీ ఇంతకు ముందు వొక కవితలో వాడింది. అలాంటి అత్మదహన ప్రక్రియ ఈ attitudinal poetry లో కనిపిస్తుంది. తనలోని వొక ఆవేశాన్ని తక్షణమే చెప్పాలన్న తపన నిలవనీయనప్పుడు కవి అసలు తన లోపల సాగుతున్న అంతర్యుద్ధాన్ని యింకా విడమరచి చెప్పలేని వూపిరాడనివ్వని స్థితిలో రాసిన కవితలు ఇవి.

3

కవిత్వంలో ఇది మెర్సీ తొలి అడుగు.

కాని, ఇందులో చాలా కవితలు ఆమె ఆలోచనా పరిపక్వతనీ, కవిత్వ శిల్ప పరిణతినీ చెప్తాయి. కొన్ని కవితలు తొందరలో రాసినట్టనిపించి కొంచెం అసంతృప్తి కలిగిస్తాయి కూడా – బలమైన కవితలు ఎక్కువ వుండడం వల్ల అలాంటి బలహీనమైన కవితలు తేలికగా మన మనః ఫలకమ్మీంచి జారిపోతాయి.

వస్తుపరంగా మెర్సీ ఇంకా విస్తృతిని సాధించవచ్చు అనిపిస్తుంది. తెలుగుసాహిత్యంలో క్రైస్తవ జీవన అస్తిత్వం అంతగా ప్రతిబింబించిన దాఖాలాలు లేవు. ఈ దిశగా కవిత్వంలో విల్సన్ సుధాకర్, కథల్లో వినోదిని చేస్తున్నలాంటి కృషికి తగినంత కొనసాగింపు లేకపోవడం పెద్ద లోపం. మెర్సీ కొన్ని కవితల్లో ఆ ప్రయత్నం చేసింది కాని అది ఇంకా బలపడాల్సిన అవసరం వుంది. తనదైన జీవితం నించి తెచ్చే ఏ అనుభవమైనా – అది కొంత వాచ్యం అనిపించినా కూడా- ఇప్పుడు చాలా అవసరం.

మెర్సీ మలి అడుగు అటు వేపు పడాలని కోరుకుంటున్నా.

-అఫ్సర్

ఆగస్టు 17, 2014.

 

 

 

 

 

నదిలో వొదిలిన పాదం..

 

అఫ్సర్ 

 

1

యింకేమీ చెప్పలేను ఆట్టే-

యెన్ని సార్లయినా నది చుట్టూ తిరుగుతాను.

అదే ఆకాశాన్నీ, అదే నీటినీ,

నడుమ యెక్కడో మెరిసే తడి నేలనీ

మళ్ళీ మళ్ళీ కొన్ని మెటఫర్లలోనో ప్రతీకల్లోనో దాచేసుకుంటాను,

మొత్తంగా నదిని నాదైన అనుభవంగా మార్చుకునే మాయా దర్పణమేదీ దొరక్క-

 

2

చాలా వాట్ని విదిలించుకొని

బహుశా నన్ను నేను కూడా వదిలించుకొని

నది భుజమ్మీద చేతులేస్తూ

యెన్ని వందల అడుగులైనా నడిచే వెళ్ళిపోతాను,

ప్రతి అడుగులో నది నన్నేమేం అడుగుతూ వచ్చిందో

వాటికి కొన్ని సమాధానాలు గాల్లో రాస్తూ వెళ్ళిపోతాను.

అన్ని సమాధానాలూ నీలోనే వున్నాయి కదా,

ఎందుకలా దిక్కుల్ని తడుముకుంటూ వుంటావని అడుగుతూనే వుంటుంది  నది,

విడిపోయే అడుగు దగ్గిర కాసేపు నిలబడి వెనక్కి చూపిస్తూ.

 

ఆ సమాధానాలన్నీ మళ్ళీ నీలోనే రాలిపోయాయని అంటాను నిస్సహాయంగా-

 

3

అప్పటిదాకా లేని వొంటరి తనమేదో

తను వెళ్ళిపోయాకే నన్ను చుట్టేస్తుంది,

వెళ్ళిపోయిన తన రెండు చేతుల మధ్యనే యింకా నేను వున్నానని తనకూ తెలుసు.

 

అప్పటిదాకా నేను విదిలించుకొని వచ్చేసిన

అన్ని బెంగలూ, అన్ని చీకట్లూ మళ్ళీ నన్ను అలుముకుంటాయి,

యింకా మిగిలిపోయిన ఆ సాయంత్రపు చీకట్లోకి జారిపోతాను,

యింక ఈ రాత్రిని యెట్లా గట్టెక్కాలా అని లోపలా బయటా మసకబారుతుంది లోకమంతా.

 

4

అప్పుడొక్క అరక్షణం వెనక్కి తిరిగి

నన్ను వదిలి వెళ్ళిన నదిని

తడిసిన కళ్ళతో చూస్తాను,

“అంతా బాగుంది కానీ,

నీలోకి నన్ను వొంపుకోవడం యెలానో నీకు యింకా తెలియలేదు.

నీలోపల తడి వున్నంత మేరా నేనే వున్నాను, వొక్క సారి తడిమి చూసుకో.”

అంటుంది నది.

 

5

బహుశా,

నాలోకి ప్రవహించిన తన అడుగులు కనిపించకే అనుకుంటా,

మళ్ళీ మళ్ళీ నది దగ్గిరకి వస్తాను,

అలా వచ్చిన ప్రతి సారీ యింకొన్ని నీటి దీపాలు వొంట్లో

వెలిగించుకొని వెళ్ళిపోతాను,

నాలోపలి చీకటి వొడ్డు మీదికి.

*

Painting: Cartoonist Raju

నేల కంపిస్తుందని తెలియని నీకు…

అఫ్సర్ 

1.

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టి, లేదూ  కాస్తయినా జారిపోలేదు కాబట్టీ,  నీకు యింకా చాలా తెలియవ్. నిజానికి ఈ వివర్ణ ముఖాల నగరపు చలి  తప్ప యింకే జీవన్మరణ ప్రకంపనలూ తెలియవు కాబట్టి నీకు నువ్వో ఆ అవతలి ఇంకొక ముఖమో తెలియనే తెలియదు.

చలిలో ఎండాకాలాన్నీ, ఎండలో చలికాలాన్నీ అందంగా పునఃసృష్టించుకునే తెలివో తేటదనమో నీకు ఉండనే వుంది కాబట్టి అసలే జీవితం ఎలా తెల్లారుతుందో, అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు.

కాని, అసలవేవీ జీవితమే కాదంటావే, అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై  లేకుండా!

 

2.

యెప్పటి నించి ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు, యెప్పటి నించి దేన్ని యెలా అనుభవించడం మొదలెట్టావో నువ్వు, వొక బాధలో యింకో వొంటరితనంలో మరింకో చావు కన్నా పీడలాంటి బతుకులో యేది యెందుకు యెలా కమ్ముకొస్తుందో యెవరిని యే క్షణం యెలా కుమ్మేస్తూ పోతుందో ఏదీ ఏదీ  నీ వూహకి కూడా అందదు.

నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ వుంటావ్! దాన్ని  తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!

నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో, నీ పక్కన పడుకున్న దేహంలో కొంత  వెచ్చదనం చచ్చిపోయిందనో, నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప, యింకో గుండెలోకి  ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు.

వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులో తొందరపాటులో కూడా అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక  నీకు.

మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.

 

3

ఇవాళ నేలా వణికి పోతుంది గజగజ.

రేపు ఆకాశమూ తొణికిపోతుంది వానచుక్కలా.

యీ సూర్యుడూ యీ చంద్రుడూ యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.

జీవితం కొన్ని చేతుల్లోంచి యెట్లా పట్టుతప్పి పోతుందో

అలాగే కచ్చితంగా అలాగే ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,

నీకేమీ చెప్పకుండానే.

 

4.

నిజంగా

నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!

*

 

ఇప్పుడు కావాల్సింది శ్రీశ్రీ వచనం!

అఫ్సర్ 

 

1980.

అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని “మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్…” అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు. “నీ రాత స్ట్రోక్స్ శ్రీ శ్రీలా వున్నాయి” అని వొకరికొకళ్ళం కితాబులు ఇచ్చి పుచ్చుకునే అమాయక కాలం. కాని, ఇంకా శ్రీ శ్రీ కవిత్వం పూర్తిగా చదవలేదు అప్పటికి.

అలాంటి వొకానొక సాయంత్రం చీకటి వైపు పరుగు తీస్తుండగా…

అది చరమ రాత్రి అయితే బాగుణ్ణు అనిపించిన రాత్రి అది. ఆ రాత్రి శ్రీ శ్రీని కలిశాను. ఆయన వొక నిజం నిషాలో, నేను మరో రకం నిషాలో వున్నాం. ఆలోచన అలలు మాటల రూపంలో కొన్ని సార్లు అందంగా పెనవేసుకుంటున్నాయి.

ఆ రాత్రి మా ఇద్దరినీ కలిపినవాడు జేంస్ జాయిస్. అది కూడా నిజమే! పిచ్చి పట్టినట్టు జాయిస్ రచనలు చదువుతూన్న ఆ సమయంలో నా దగ్గిర వొక అమూల్యమయిన పుస్తకం వుండేది. దాని పేరు ” పిక్టొరియల్ గైడ్ టు యులిసిస్”. పుస్తకం ఎంత అందంగా వుండేదంటే,ఇంటికి తీస్కువెళ్ళి మరీ చాలా మందికి ఆ పుస్తకం చూపించేవాణ్ణి. అది నేను హైదరాబాద్ ఆబిడ్స్ లో వొక ఆదివారం రోడ్డు పక్క ఆ రోజుల్లో నాలుగు వందలు పెట్టి కొన్న పుస్తకం.

మాటల మధ్యలో ఆ పుస్తకం సంగతి చెప్పాక, శ్రీ శ్రీ గబుక్కున లేచి,గబ గబా చొక్కా వేసేసుకొని “ఇప్పుడే ఈ క్షణమే ఆ పుస్తకం చూడాలి” అంటూ నన్ను బయటికి లాక్కు వచ్చాడు.
“మీరు ఇక్కడే వుండండి. నేను తీసుకొస్తా.” అన్నాన్నేను.
“ఇక్కడ వున్నట్టే , రా!” అని హుకుం జారీ చెయ్యగానే నేను నా డొక్కు సైకిలు(చలం గారి భాషలో ముసలి గుర్రం) మీద రెక్కలు కట్టుకుని యెగిరిపోతున్నట్టుగా, రివ్వున దూసుకుపొయి, ఆ పుస్తకం తెచ్చి శ్రీ శ్రీకి చూపించడం మొదలెట్టాను. విద్యార్థి రాజకీయాల వల్ల, చదువు వెనక్కి పట్టి, ఇంట్లో అసమ్మతి పవనాల్ని యెదుర్కొంటున్న వొక ఇంటర్మీడియట్ కుర్రాడి అసంత్రుప్త బతుకులో అదొక అపూర్వ క్షణం. చాలా రోజుల శ్రమ, చాలా కన్నీళ్ళు ఆ పుస్తకం సంపాదించడం వెనక వున్నాయి. వొక్క క్షణంలో అవన్నీ యెగిరిపోయాయి.

ఆ పుస్తకంలో జాయిస్ “యులిసిస్”లో వర్ణించిన వూళ్ళూ, భవనాలూ, వాటి చరిత్రా వున్నాయి. ఆ నలుపూ తెలుపూ బొమ్మలు చాలా కాలం నా కలల్లోకి వచ్చి వెళ్ళిపొయేవి. ఒక రచయిత నిజం నించీ ఊహలోకీ, కల నించి తన ఇరుగుపొరుగులోకీ ఎలా ప్రయాణిస్తాడో బొమ్మ గీసినట్టుగా చూపించే పుస్తకం అది.

ఆ చిత్రాల్ని చూస్తూ, తన వృద్ధాప్యంముసురుకున్న వేళ్ళతో ఆప్యాయంగా తాకుతూ ఆ పుస్తకం తను చదివిన అనుభవాల్ని, అసలు తన వచనంలోకి చాలా భాషల చాలా మంది రచయితలు పరకాయ ప్రవేశం చేయడాన్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ రాత్రి శ్రీ శ్రీతో కలిసి వుండకపోతే, శ్రీ శ్రీ అంటే చాలా మందికి మల్లెనే నా ఆలోచన కూడా ‘మహాప్రస్థానం’ దాకానో, ‘మరో ప్రస్థానం’ దాకానో ఆగిపొయ్యేది. ఆ రెండు విస్తృతమయిన ప్రపంచాలని కాసేపు పక్కన పెట్టి, వచనంలో శ్రీ శ్రీ ఆవిష్కరించిన తనదయిన ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాసం.
*
శ్రీ శ్రీ అనే సంతకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ వొక కొత్త గాలిని వెంటబెట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం “ఆధునికత” అనుకున్నా, ఇంకో పేరుతో పిలిచినా, ఏదో వొక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించడం దాని తక్షణ లక్షణం. ఈ కొత్తదనం వస్తువులోనూ, రూపంలోనూ కనిపిస్తుంది. వస్తుపరంగా శ్రీ శ్రీ ఎప్పుడూ రాజీ పడలేదని ఇప్పుడు నేను విడిగా చెప్పకరలేదు, కాని, ఆ వస్తు నవీనత ఎలాంటి రూపాల్లో అతని వచనంలో వ్యక్తమయ్యిందో ఇప్పటికీ ఒక సంక్లిష్టమయిన విషయమే. ఒకే దృక్పథాన్ని అంటి పెట్టుకున్న అనేక వస్తువుల భిన్న రూపాల కలయిక శ్రీ శ్రీ వచనం.
వచనంలో శ్రీ శ్రీ – అటు సొంత రచనలూ, ఇటు అనువాదాలూ చేశాడు. అవి రెండూ వొక యెత్తు అయితే, ఉత్తరాల రూపంలోనో, వివిధ వ్యాసాల రూపంలోనో, ప్రసంగాల రూపంలోనో శ్రీ శ్రీ విస్తారమయిన/ సారవంతమయిన వచన సేద్యం చేశాడు. ఆ ప్రతి వచన రచనా విడిగా కూలంకషంగా చర్చించదగిందే. కాని, అది ఒక పెద్ద పరిశోధనా గ్రంధమే అవుతుంది. కాబట్టి, ఆయా వచన రచనలు వడపోసిన వొక సారాంశాన్ని మాత్రమే ఇక్కడ చూద్దాం.
శ్రీ శ్రీ కవిత్వం కానీ, వచనం కానీ వొకే వొక అంతస్సూత్రాన్ని అంటి పెట్టుకుని వుంటాయి. అది శ్రీ శ్రీ భవిష్యత్ వాదం: అంటే, రేపటిని ఈ క్షణాన దర్శించగలిగిన ముందు కాలపు చూపు. శ్రీ శ్రీ కవిత్వం రాస్తున్న కాలానికి అతను మార్క్సిజం చదివాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. కానీ, మార్క్సిజాన్ని ఒక పుస్తక రూపంలోనో, సిద్ధాంత రూపంలోనో చదవడానికి ముందే శ్రీ శ్రీ చుట్టూ ఒక పారిశ్రామిక వాడ వుంది. కార్మిక సమూహం అతనికి ఇరు వైపులా కాకపోయినా కనీసం వొక వైపు అయినా వుంది. ఆ స్థానిక ప్రపంచంలో శ్రీ శ్రీ లీనం అయి వున్నాడనడానికి అతని జీవన కథనాల్లో చాలా దాఖలాలు చూడ వచ్చు. అది శ్రీ శ్రీ చూస్తున్న వర్తమానం. కాని, అక్కడితోనే నిలిచిపోతే అది శ్రీ శ్రీ వ్యక్తిత్వం కాదు.
స్థానికత, వర్తమానం గీసిన బరిని దాటుకుని వెళ్ళే చూపు శ్రీ శ్రీది. ఒక వలస రాజ్యం సృష్టించిన నగరం విశాఖ. అక్కడి పరిశ్రమలూ, జన జీవనం, కళా సాంస్కృతిక రంగాల మీద ఆ వలస పాలన నీడలు కనిపిస్తాయి. శ్రీ శ్రీకి వాటి స్పృహ కూడా వుంది. కాని, వాటిని దాటి వెళ్ళే వలసానంతర వాదం శ్రీ శ్రీది. ఈ ప్రయాణం మనకి శ్రీ శ్రీ వచనంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వచనంలో శ్రీ శ్రీ స్థానికతని బయటి లోకంతో ముడి పెట్టే అంతర్జాతీయ వాది. వర్తమానాన్ని విమర్సనాత్మకంగా చూసే భవిష్య వాది.
ఈ వ్యాసాన్ని నేను జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన అభిమానంతో మొదలు పెట్టాను. జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన ఆతృతని జాగ్రత్తగా గమనిస్తే, అందులో ఒక శ్రీ శ్రీ సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వొక అంశ వుంది. అది తన పరిసరాలకీ, తన స్థానికతకీ ఎడంగా స్పందించడం! (బహుశా, కొత్త అంశాల పట్ల తెగని ఆకర్షణ కూడా వుంది). తన కాలానికి చెందని వొక ఆలోచనని అందుకోవాలన్న వొక ఉబలాటం వుంది. శ్రీ శ్రీ వచన రచనల్లో నేను ఆ లక్షణం చూశాను. అయితే, ఆ ఆలోచనని తన కాలంతో ముడి వేసి, ప్రయోగించడం శ్రీ శ్రీ దారి. శ్రీ శ్రీ తన వచనాన్ని వూహించే ముందు ఇలాంటి కొంత మంది రచయితలు తనని ఆవహించేంతగా ఆ పఠనంలో మునిగిపోయాడు. కాని, ఆ మునక తరవాత మళ్ళీ వొడ్డుకి చేరడం ఎలాగో తెలిసిన వాడు కనుక, అతని అంతర్జాతీయ దృష్టి మళ్ళీ స్థానికతలోకి క్షేమంగా చేరుకుంది.
శ్రీ శ్రీ వచనంలో అనువాదాలు ఎక్కువే.అవి వివిధ దేశాల వివిధ రచయితలవి. కాని, ఈ అనువాదాలన్నీ ఒక్క సారిగా చదివితే, ఆ విడి విడి లోకాల్ని శ్రీశ్రీ ఒకే సూత్రంతో కట్టే ప్రయత్నం చేసాడని మనకి అర్ధం అవుతుంది, విలియం సారోయన్ మొదలుకొని ఆంటాన్ చెఖోవ్ దాకా. అదే చేత్తో, అతను చిన్న కథల్నీ, నాటికల్నీ, వ్యాసాల్నీ, సంభాషణల్నీ కలిపాడు. అనువాద వచన రచనలు శ్రీ శ్రీలో ఎదుగుతున్న/ క్రమ పరిణామం చెందుతున్న ఒక నవీన పంథాని ఆవిష్కరిస్తాయి. ఈ పనిని రెండు రకాలుగా చేశాడు శ్రీ శ్రీ. ఒకటి: అనువాదాల్ని అందించడం; రెండు: ఆ అనువాదాల వచనాన్ని తన సొంత రచనల్లోకి ప్రయోగించి చూడడం. ఇవి రెండూ విడదీయలేని కోణాలు.

అనువాదంలో శ్రీ శ్రీ ఆయా రచయితల వచన రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే, తన సొంత రచనల్లో ఆ రూపాలను స్థానిక సంస్కృతికి మార్చి, పరీక్షించి చూసుకున్నాడు. ఇలా చెయ్యడం ద్వారా కొత్త రూపాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక వాతావరణంలోకి ఎలా తీసుకు రావచ్చో బేరీజు వేసుకున్నాడు. “చరమ రాత్రి” దీనికి బలమయిన ఉదాహరణ. అది ఎంత బలమయిన వుదాహరణ అంటే, శ్రీ శ్రీ సాధారణ కవిత్వంతో తృప్తి పడని వాళ్ళు కూడా ఆ రచనని వొప్పుకునేంతగా!

అలాగే,ఈ వ్యాసం మొదట్లో నేను సమకాలీన సాహిత్యంతో నా అసంతృప్తిని కూడా చెప్పాను, వొక పాఠకుడిగా! శ్రీ శ్రీ వచన రచన ద్వారా ఏం చెప్పాడన్న దానికి అందులో ఒక సమాధానం వుంది.
శ్రీ శ్రీ వచన రచనలో పాఠకుడు చాలా ముఖ్యమయిన కోణం. తన పాఠక వర్గాన్ని తానే సృష్టించుకున్నాడు శ్రీ శ్రీ. అది ఎలాంటి వర్గం అన్నది అతని కవిత్వంలో కన్నా బలంగా అతని వచనంలోనే కనిపిస్తుంది. అది – పూర్వ సాహిత్య రూపాలని ప్రశ్నించి, కొత్త జవాబులు వెతుక్కునే తరం- పాత భావాలని ధిక్కరించి ఆధునికతని అక్కున చేర్చుకునే వర్గం. ఈ పాఠక వర్గానికి కావల్సిన కొత్త అలవాట్లని నేర్పే అనువాదాలూ, ప్రయోగాత్మక వచనం కొంచెం కొంచెం రుచి చూపించి, అభిరుచిని పెంచిన లాబరేటరీ ఆ వచనం అంతా!
ఈ రోజు శ్రీ శ్రీకి మనం ఇవ్వదగిన కానుక – ఆ వచన పాఠాల్ని తిరగదోడడమే!

(పాత వ్యాసమే…పునర్ముద్రణ…అఫ్సర్ బ్లాగ్ నించి…http://afsartelugu.blogspot.com/2010/08/blog-post_05.html)

ఆత్మ రంగు తెలుసుకున్న వాడు…

Velturu2

We live unsettled lives

And stay in a place

Only long enough to find

We don’t belong.

ఈ వాక్యాలు తన తొలినాళ్ళలో రాసుకున్నాడు Mark Strand – అంటే, 1960 లలో!

రెండు నెలల  కిందట కన్ను మూసేటప్పుడు కూడా అతని చివరి పదాలు అవే! జీవితంలోని అస్థిరత్వాన్ని, మనిషిని ఎక్కడా ఎప్పుడూ వొక్క క్షణం నిలవనీయని అశాంతినీ, మనం ఎప్పుడూ కోల్పోతూనే వుండే sense of belongingని దాదాపు వెయ్యి పేజీల కవిత్వం చేశాడు మార్క్.

జీవితం పట్ల వొక అంటీముట్టని తనాన్ని (detachedness) యింకో విధంగా చెప్పాలంటే- always living, always dying-లాంటి తత్వాన్ని చివరిదాకా అంటిపెట్టుకొని వుండిపోయాడు మార్క్. కాని, ఎవరూ చెప్పలేని మాటల్ని కవిత్వం అడ్డుపెట్టుకొని ధైర్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. 1960ల తరవాతి ఆధునిక జీవితంలోని అంతస్సూత్రాన్ని అతి తేలికైన మాటల్లో ఎంత మృదువుగా పొదుగుతాడో, అంతే పదునుగా కూడా విసుర్తాడు. Everyone who has sold himself wants to buy himself back లాంటి వాక్యాలు వినడానికి తేలికగా వుంటాయి కాని, అలాంటి వాక్యాలు రాయడానికి కవి నరాలు తెగిపోయే బాధనే అనుభవించి వుంటాడు.

మొదటి సారి మార్క్ గురించి వినడం ఆ పైని చెప్పిన నాలుగు ముక్కల ద్వారానే! పదిహేనేళ్ళ కిందట మాడిసన్ లో వొక పాత పుస్తకాల షాపులో మొదటి సారి దొరికిన మార్క్ కవిత్వాన్ని ఆ తరవాత వెతికి  వెతికి పట్టుకొని  యింకొన్ని సార్లు చదువుకున్నప్పుడు అతనేమిటో నాకు  అంతగా అర్థమయ్యాడని అనుకోలేను. మార్క్ చెప్తున్న sense of belonging లో వుండే వేదన తెలీక కాదు. తెలిసిందే అయినా దాన్ని వొక తెలియనితనంగా  గుర్తుచేసే కవిత్వ లక్షణమే అది అనుకుంటా. మొదటి సారి చదివినప్పుడు అందులోని వొక్క అర్థం మాత్రమే రెక్క విప్పుకుంటుంది, పదే పదే చదువుతున్నప్పుడు ఇంకా కొన్ని అర్థాలకు రెక్కలొస్తాయి. ఏ రెక్కలో నిజమైన అర్థం వుందో తెలియకపోవడం కవిత్వంలోని మిస్టరీ. బహుశా, అలాంటి మిస్టరీ కోసమే కవిత్వం చదవాలనిపిస్తుంది. ప్రతీసారీ ఇంకో అర్థాన్ని వెతుక్కోవాలనిపిస్తుంది.

మొదటి సారి మార్క్ కవిత్వం చదివినప్పుడు అది నన్ను నిజంగా అలాంటి తెలిసీ తెలియనితనంలోకి తీసుకెళ్ళి సవాల్ చేసింది. నేను రాయడానికి నిరాకరించే చాలా విషయాలు నిష్పూచీగా రాసి చూపిస్తున్నాడు మార్క్. నా కవిత్వ వ్యాకరణాన్ని మార్చుకోవాలని మందలిస్తున్నాడు. జీవితంలోని బలహీనతలని ఇంకా బలంగా చెప్పవచ్చని, చెప్పి తీరాలని నన్ను నమ్మించాడు చివరికి-

అసలు జీవితంలోని ఖాళీని అప్పటికే చాలా మంది కవులు పాడడం నేను విన్నాను.

నాలోపలి పురుగుని తొలిచిన కాఫ్కా అంటే ఇష్టం అప్పటికే-

అసంబద్దతని తాత్వీకరిస్తూ సాహిత్యీకరించిన Becket ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను అలవాటైనంత తేలికగా-

Wallace Stevens వాక్య ప్రయోగాల చిక్కుముడులలో అసంతృప్త క్షణాల విచ్చిన్నతని అర్థం చేసుకుంటున్నాను. కష్టమే అయినా-

Walt Whitman పొడుగాటి వాక్యాల వూపిరాడనితనం అంటే ఎందుకో మహా ఇష్టమవుతూ వుంది ఆ సమయంలోనే!

అదిగో, అప్పుడు దొరికాడు మార్క్!

mark2

2

కవిత్వం చేయదగిన పనుల జాబితా ఏమిటో ఇంకా నాకు తెలీదు. ఎప్పటికైనా తెలుస్తుందన్న హామీ లేదు.

కాని, బహుశా అది కొన్ని నిజాలు చెప్పడం నేర్పుతుంది, అలాగే, కొన్ని అబద్ధాలు చెప్పడం కూడా నేర్పుతుంది. అబద్ధాలకు తొందరగా అలవాటు పడే కవులే మనకి ఎక్కువ, అబద్ధానికి వుండే తగరపు ఆకర్షణ వల్ల- అదనపు తక్షణ కీర్తి వల్ల; కాని, మార్క్ లాంటి కవులు ఎప్పుడూ నిర్వచనానికి అందని నిజంలో – కవిత్వం అద్దమే అయినా, ఆ అద్దం- అతనే  అన్నట్టు- The mirror was nothing without you- అన్న ధ్యాన నిమగ్నతలో రాస్తారు. కవి ఈ లోకంలోనే వుంటూ ఈ లోకాన్ని నిరాకరించే ధ్యాని లేదా అంతర్లోకపు పక్షి  అనుకుంటాను ఇలాంటి కవుల్ని చదువుతున్నప్పుడు.

నిజానికి మార్క్ మొదట్లో చిత్రకారుడు. యేల్ స్కూల్లో చిత్రకళ విద్యార్థిగా వున్నప్పుడు అనుకోకుండా Wallace Stevens కవిత్వాన్ని చదివాడు. అంతే, ఇక అతని లోకంలోంచి చిత్రకళ నిష్క్రమించింది; కవిత్వ చిత్కళ ప్రవేశించింది.  ఆ తరవాత చదువుతూ వచ్చిన అమెరికన్ కవిత్వం అతన్ని కట్టి పడేసింది. కవిత్వ విద్యార్థిగా 1960 లో ఇటలీ వెళ్ళాడు. 1964 లో అతని మొదటి కవిత్వ సంపుటి Sleeping with One Eye Open అచ్చయింది. అప్పటి నించీ మొన్న చనిపోయేదాకా మార్క్ వి పదకొండు కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి.

జీవితాన్ని నడిపించే సూత్రం Absence అంటాడు మార్క్. వొక లేనితనంలోంచి వాక్యాల్ని అల్లుకోవడమే కవిత్వం అంటాడు. “మనం అన్నీటికీ అర్థాలు వెతుక్కోగలం అనుకుంటాం. కాని, అలా వెతుక్కోలేకపోవడమే జీవితం అని ఎప్పుడూ అనుకోం. మనకి మిస్టరీ అంటే ఇష్టమే. కాని, జీవితం అన్నిటినీ మించిన మిస్టరీ అంటే మాత్రం వొప్పుకోం,” అంటాడు.

What cannot be seen will define us, and we shall be prompted

To say that language is error, and all things are wronged

By representation. The self, we shall say, can never be

Seen with a disguise, and never been seen without one.

అని వొక కవితలో అంటాడు కూడా-

అయితే, మార్క్ తన కవిత్వం అంతటా చెప్పే అసంపూర్ణత అనే భావనలో ఇదొక కోణం మాత్రమే. సంపూర్ణత అనేది మానవ సాధ్యం కాదని మార్క్ కచ్చితమైన అభిప్రాయం. అందుకే, కవిత రాస్తున్నప్పుడు కూడా కవి తనకే తెలియని వొకానొక స్థితిలోకి ప్రయాణమై వెళ్తాడు. అక్కడ ఎదురుచూడని/వూహించని మిస్టరీలాంటి నిజమే తనకి కనిపిస్తుంది. ఆ స్థితినించి వెనక్కి వచ్చి, దానికి మళ్ళీ అర్థం కల్పించాలని తను తపనపడ్తాడు, కాని- అది తపన మాత్రమే! అలా వెనక్కి చేరుకున్నప్పుడు తను అబద్ధాలు చెప్పడం మొదలెడతాడు, అంటే, ఆ కవిత్వ నిజస్థితిలో మాత్రమే తనకి తాను నిజదర్పణం. మిగిలిన వేళల్లో తను disguise కింద మారిపోతాడు.

mark1

3

ముసుగు తొలగిపోవాలి, ఆ ముసుగు ఎంత నిజాయితీగా ఎంత నిజంగా తొలగిపోతుందన్న దాన్ని బట్టి కవిత్వ తీవ్రత వుంటుంది.

మార్క్ కవిత్వంలో అలాంటి  ముసుగు తన కవిత్వాన్ని తనే  గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నల ద్వారా తొలగిపోయింది. కవిత్వం ఎందుకు రాయాలన్న విషయం మీద కనీసం పది కవితలు రాసుకున్నాడు మార్క్. ఉదాహరణకు చూడండి ఈ కింది వాక్యాలు:

For us, too, there was a wish to possess

Something beyond the world we knew, beyond ourselves,

Beyond our power to imagine, something nevertheless

In which we might see ourselves.

మనిషి తనని తాను నిక్కచ్చిగా చూసుకునే క్షణాలు తప్పకుండా వుంటాయంటాడు, కవికి అలాంటి క్షణాలు అతని వాక్యంలో దర్శనమిస్తాయని మార్క్ నమ్మకం. అలాంటి నమ్మకం గాయపడిన సందర్భాల్లో మార్క్ చాలా సార్లు మౌనంలోకి జారిపోయాడు, అందుకే అతని  కవిత్వ ప్రయాణంలో నిశ్శబ్దాలు ఎక్కువే వున్నాయి. అసలేమీ  తెలియని మౌనంలోకి కూరుకుపోయిన సందర్భాలు  చాలానే అతన్నివుక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి ఏదో  బలమైన బలహీన  సందర్భంలో మార్క్ అంటాడు, రచన అన్నది వొక  నిద్రలో నడకలాంటి స్థితి అని- ఆ వెంటనే అంటాడు మళ్ళీ, అసలు writing అన్నదంతా selfish act అని-

You were mine, all mine; who begged me to write, but always

Of course to you, without ever saying what it was for

Who used to whisper in my ear only the things

You wanted to hear….

మార్క్ కవిత్వం అంతా Self-assertive act – తనని తాను గుర్తుకు తెచ్చుకొని, తను వినాలనుకున్న లోపలి మాటేదో బయటికి నెట్టే మానసిక ప్రక్రియ.

As if there were something

You wanted to know, but for years had forgotten to ask

మార్క్ రోజువారీ జీవిత పదచిత్రాల్ని దాటి ఎక్కడికీ వెళ్ళడు. పైన చెప్పిన ఆ మరచిపోయిన something ఎలా వుండాలో చెప్తున్నాడు ఇలా-

నువ్వు రాసుకుంటున్న టేబుల్ మీద

ఏటవాలుగా వొంగిన సూర్యకాంతి

వొక తెలిసిన చెయ్యి ఎత్తినట్టు

వొక ముఖం నీ వేపు తిరిగినట్టు

దూరం నించి – కొండ మలుపులో వొక కారు మాయమైనట్టు-

మార్క్ కవిత్వం నిండా ఇలాంటి రోజువారీ కదలికలు అతని మానసిక స్థితితో అందంగా లీనమైపోతూ కనిపిస్తాయి. అంటే, ఏది రోజువారీ ప్రతీక, ఏది కవిత్వ భాష అనే గీత చెరిగిపోతుంది అతని కవిత్వంలో-

నాకు తెలిసీ అర్థమయ్యీ, ఇది అతనికి Walt Whitman నించీ, Wallace Stevens నించీ అలవాటైంది. ఇతర కవుల్ని చదవడం అంటే ఇదీ అని నాకు అర్థమైంది ఈ ముగ్గురికీ మధ్య ఏర్పడ్డ పరోక్ష కేవల కవిత్వ సాన్నిహిత్యం చూశాక- ఎప్పుడూ కలవని ఈ ముగ్గురు కవులు కవిత్వంలో వొకరికొకరు ఆత్మబంధువులు, ఆ ముగ్గురి మధ్యా అనురాగ పరాగం మార్క్ ప్రతి వాక్యంలోనూ ఇంకిపోయిన వర్ణ విశేషం.

4

మొన్న నవంబరు చివరి వారంలో మార్క్ చనిపోయినప్పుడు నాకు వొక్కటే అనిపించింది- నాకు తెలిసిన కవిత్వలోకంలో వొక రంగు – నాదైన ఇష్టమైన రంగు వొకటి- వెలిసిపోయిందని –

ఇంకో మార్క్ పుడతాడా అంటే పుట్టవచ్చు. కాని, ఆ రంగు -అదే తాజాదనంతో- మళ్ళీ కనిపించదు కదా అనిపించింది.

 -అఫ్సర్

 

 

 

 

అక్కడితో బాల్యం అంతమైంది!

 ismayil painting rainbow

[ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా ఆయన నాకు ఆత్మబంధువు. కాని,అంత కంటే ఎక్కువగా ఆయన బంధువు కూడా. ఆయన చివరి రోజుల జీవితాన్ని దగ్గిరగా చూసిన వాణ్ని కావడం వల్ల ఈ వ్యాసం పైపైన రాసినట్టే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ- కాని, ఆయన మరణానికి తక్షణ నివాళి ఇది. నా దగ్గిర లేని ఈ వ్యాసం ప్రతిని పంపిన మిత్రుడు విన్నకోట రవిశంకర్ కి ధన్యవాదాలు]

 

1

ఇస్మాయిల్ గారి ఈ నిశ్శబ్దం ఇక చిట్ట చివరిది.

ఆయన ఇంక అసలే మాట్లాడరు. మనకు ఈ నిశ్శబ్దం అలవాటై, అయిదేళ్ళ పైనే అయింది. మనం ఏదైనా అన్నప్పుడు అయితే చిరునవ్వుతో, కాదంటే వొక పెద్ద నవ్వుతో సమాధానం చెప్తున్నారు కొంత కాలంగా ఆయన- లేదూ, మనం చెప్పింది నచ్చనప్పుడు చిన్న నవ్వుతో చెయ్యి జెండాలా వూపుతున్నారు తప్ప మాట లేదు. ఆయన మాటలన్నీ మనం చూస్తూండగానే ఆయన వుండగానే నిన్నటి జ్ఞాపకాలయ్యాయి. ఆయన మల్లెపూవులాంటి నవ్వునీ, చిరుగాలిలాంటి అందమైన కదలికల్నీ వొక తెల్లవస్త్రం దాచెయ్యడం ఏమిటి?! ఆయనకి చివరిసారి భుజాన్ని అందించలేని దూరంలో నేను వుండడం ఏమిటి?

మాటల్లో ఏమైనా చెప్పడం కష్టం. అందుకే ఆయన మొదటినించీ నాకూ మనకీ నిశ్శబ్దాన్ని అలవాటు చేస్తూ వచ్చారు. ఇంత దూరంలోంచి నిశ్సబ్దంగా నిశ్శరీరంగా భుజాన్నివడంలో ఎన్ని దిగుళ్ళున్నాయి?! ఎన్ని జ్ఞాపకాలున్నాయి?గొంతు దాటని ఎన్ని మాటలున్నాయి? పోయిన నెల ఆయనకి చివరిసారి భుజాన్నిచ్చిన స్నేహితులందరి భుజాల మీదా వొక చిన్ని ముద్దు!

నమ్మలేకపోతున్నాను!

వొక నాటి రోజుల్లో ఎర్రసిరా తారీఖూ ఆకుపచ్చ అక్షరాలూ కనిపించగానే ఎంత ఆనందం! చిన్న చిన్న వాక్యాల మధ్య స్వచ్చమైన కలకల నవ్వు వొక్కోసారీ, పదునైన వ్యంగ్య బాణాల విసురు మరోసారీ – ఇప్పుడేమీ కనిపించవూ వినిపించవు కదా!

ఇస్మాయిల్ గారిని తలచుకోగానే నా మటుకు నాకు తక్షణం గుర్తొచ్చేవి – అవును, ఆ ఆకుపచ్చ అక్షరాలే! అలాంటి ఆకుపచ్చా పచ్చని వుత్తరం మొదటి సారి ఇరవయ్యేళ్ళ కిందట అందుకున్నాను.

2

అప్పటికింకా “రక్త స్పర్శ” అచ్చు కాలేదు. “శిధిల నేత్రాలు” అనే నా కవిత ఆంద్ర ప్రభలో అచ్చులో చూసి వెంటనే ఆయన వుత్తరం రాశారు, “ఇది తెలుగు పద్యంలా లేదు!” అని! ఆయనేమంటున్నారో నాకు అర్థం కాక, వెంటనే నేను మళ్ళీ వుత్తరం రాస్తే, వారం పది రోజుల తరవాత (ఈమెయిల్ లేని కాలంలో ఆ ఎదురుచూపు ఎంత నరకమో!) ఆయన సమాధానం. “తెలుగు పద్యం అంటే ఇప్పుడు మనకి ఒక స్థిరమైన చట్రం వుంది. ఈ చట్రం శబ్దంలోనూ, అర్థంలోనూ గట్టిగా బిగుసుకొని వుంది. మీరు చట్రాన్ని తప్పించుకుంటున్నారు లేదా దాన్ని ముక్కలు చేస్తున్నారు. మీ గొంతు ఈ కాకిగోలలో మునిగిపోవచ్చు. లేదా, మీకు శక్తి వుంటే కాకుల్ని మీరే తరిమేయచ్చు.” అసలు వాక్యం రాయడానికే సిగ్గుతో చితికిపోతున్న కుర్రకవికి ఆ మాటలు కొన్ని రోజుల పాటు నిద్రాభంగమయ్యే పెద్ద సత్కారం.

బహుశా, ఈ బందాల్నీ, చట్రాల్నీ నిరాకరించడమే ఆయన తన కవిత్వంలోనూ, వచనంలోనూ, చివరికి వొక్క క్షణమూ శాంతినివ్వలేని జీవితంలోనూ చేశారేమో! ఇప్పుడనిపిస్తుంది, వొక్క వాక్యంలో ఇస్మాయిల్ గారి గురించి చెప్పాలంటే – అలాంటి చట్రరహితమైన జీవనస్వేచ్చకి ఆయన ప్రతీక. నలభయ్యేళ్ళ పైబడి తెలుగు కవిత్వంలో ఆ ప్రతీకని వొక చెట్టు రూపానికి పరిమితం చేసి మనం మాట్లాడుతూ వచ్చాం. ఆ ప్రతీక మనలోని సాంప్రదాయపు వేళ్ళని పెళ్లగించింది. ఆలోచనల్ని బిగించి పెడుతున్న మూసల్ని చెదరగొట్టింది. పదాల మారుమూలల్ని శుభ్రం చేసింది. మామూలు పదాలకు అమామూలు శక్తినిచ్చింది. జీవితంలోని ముచ్చట ఎక్కడో లేదనీ, మనలోనే మన చుట్టే వుందని మనల్ని మన పరిసరాల్లోకి మళ్ళీ ప్రతిష్టించింది.

ఈ పరిసరాల స్పృహలోంచి ఇస్మాయిల్ రెండు ముఖ్యమైన పనులు చేశారనుకుంటాను. వొకటి: జీవితం చుట్టూ, సాహిత్యం చుట్టూరా పేరుకుపోయిన కాలుష్యాల్ని తుడిచిపెట్టడం; రెండు: సిద్ధాంతం అనేది వొక బ్రహ్మ పదార్ధం లాంటి metanarrative కాదనీ, అది మన కళ్ళ ముందే పరచుకొని వుందనీ అసిద్ధాంతీకరించడం (ఇప్పుడు దీన్ని మనం deconstruction / de-schooling అనుకుందామా?) ఈ రెండూ ఆయన పుస్తక జ్ఞానంలోంచి కాకుండా తన ఆనుభవిక చైతన్యంలోంచి చెప్పడం ఆయనలోని overarching phenomenon.

కవిత్వానికి గొప్ప వస్తువు అంటూ అక్కర్లేదు. నిజమే, కాని, అలా అనుకున్న తరవాత నిజంగా కవిత్వం రాయబోయేసరికి ఆ గొప్పది కాని విషయాన్ని అర్థం చేసుకొని రాయడం అన్నది అంత తేలిక కాదు. అసలు తేలికగా కవిత్వం చెప్పడం అంత తేలిక కాదు. తేలిక మాటల్ని అనుభవాల బరువుతో తూకం వేయడం చిన్న సంగతీ కాదు. పదచిత్రాలూ, ప్రతీకలూ ఇతర అలంకారాలేవీ లేకుండా కేవలం వొక భావమే ప్రాణంగా కవిత్వాన్ని బతికించుకుంటూ పోవడానికి కవికి చాలా శక్తి కావాలి. ఇప్పటిదాకా మనం చేస్తూ వచ్చిన పొరపాటు ఏమిటంటే, కవిత్వం జీవితమంత బరువుగా వుండాలేమో అనుకొని దాని మీద గాడిద బరువు మోపుతున్నాం. ఇస్మాయిల్ గారి కవిత్వంలో గాడిదల ప్రస్తావన చాల చోట్ల వస్తుంది. బహుశా, గాడిదలకి అంత సాహిత్య పాపులారిటీ ఇచ్చిన రచయిత కిషన్ చందర్ తరవాత ఇస్మాయిల్ గారే కావచ్చు. కవులు గాడిదలు కాకూడదన్న సందేశం ఇస్మాయిల్ కవిత్వంలో వుందని వేరే చెప్పక్కర్లేదు కదా!

ఆ గాడిద బరువు లేకుండా కవిత్వం నిరలంకారంగా వుండాలన్న టాగోర్ ని సదా బాలకుడని వో పద్యంలో వర్ణించారు ఇస్మాయిల్. నిజానికి సదాబాల్యం ఇస్మాయిల్ కవిత్వానికి అంతర్వస్తువు (Internalized theme). ఆయన బాల్యం గురించి రాసిన పద్యాల్లో కేవలం బాల్యం గురించే ఆయన చెప్పలేదు. ఆ మాటకొస్తే, బాల్యం ఆయనకొక గతానుభవం కాదు. ఆ నిన్నటి బాల్యంలోంచి ఆయన గుర్తుచేసే/ గుర్తించే వర్తమానం ముఖ్యమైంది. జీవితంలోని స్వచ్చతని పదిలంగా కాపాడే శక్తి బాల్యానికి మాత్రమే సొంతం. ఆ స్వచ్చతని చెప్పడానికే ఆయన పసితనం గురించీ, పసివాళ్ళ గురించీ రాస్తారు.

గుర్రప్పిల్ల కాళ్ళతో

పరిగెత్తుకుంటూ వచ్చాడు

బడి వదిలినట్టున్నారు.

బుర్రనీ, కాళ్ళనీ

బంధించిన సంకెళ్ళు విప్పేయగానే

మధ్యాహ్నపు ఎండ బయళ్ళు

మహోత్సాహంతో ఆహ్వానించాయి

ఎంత స్వేచ్చ! ఎంత హాయి!

అన్న పద్యపాదాల్లోంచి కనిపించేది ఆయన మనవడా? ఇస్మాయిల్ గారా? మనమా? నన్నడిగితే అది వొకే సమయంలో ఒకే దృశ్యంలో ముగ్గుర్ని బంధించే కవిత. ఆ తరవాత ఆ మనవడు చేసే పనుల జాబితాలోని పనుల్ని యింకో కోణంలోంచి చూస్తే, అవి ఇంకో రూపంలో మనకీ స్వేచ్చనిస్తాయి. రోజువారీ బతుకులో పోగొట్టుకుంటూ వస్తున్న మన స్వేచ్చని గుర్తు చేస్తూ- చివరికొచ్చేసరికి మనం పోగొట్టుకున్న ఆ స్వేచ్చని అందంగా అప్పగించడం ఈ కవిత చేసే పని. అలా అందుకోడానికి మనకి కాసింత వెసులుబాటు దొరకాలి అంతే! ఆ కాస్త వెసులుబాటే దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుంది. అలాంటి అర్థాన్ని వెతుక్కునే దారినే ఆయన “ఉత్సవం”గా వర్ణించారు వొక సందర్భంలో-

“చెట్టు నా ఆదర్శం” నించి ఇటీవలి “కప్పల సముద్రం” దాకా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన పోనుపోనూ బాలకుడైపోతున్నాడని అనిపిస్తుంది. అది ఆయన తీసుకునే ఆయన వస్తువులోనూ కనిపిస్తుంది. ఆయన రాసుకునే భాషలోనూ అనిపిస్తుంది. లేకపోతే-

తరుచాపము వీడిపోయి

గురిమరచిన బాణంలా

తిరుగాడును పిట్ట

అంటూ అత్యంత గంభీరంగా రాసిన కవి, పదచిత్రాల మీదా, కొండొకచో అంత్యప్రాసల మీదా ఆధారపడిన కవి నెమ్మదిగా ఆ ఆధారాల్నీ, ఆ అలంకారాల్నీ వొదిలేసి-

నా కోసం పూర్తిగా

నగ్నవైనపుడు మాత్రమే

నా దానివి

అని తనే వొక కవితలో అన్నట్టు తన ‘self’ ని ఆవరిస్తున్న ఆచ్చాదన గుర్తెరిగి రాయడం ఆయన కవిత్వంలోని ఇంకో రహస్యం అనుకుంటాను. ఆ ఆచ్చాదనల్ని చింపేసిన ఉత్సవ సమయంలోనే ఆయన “గోళీకాయలు” “బెల్లంకాయ” లాంటి కవితలు రాశారనుకుంటాను. ఆ సమయంలో చుట్టూ వున్న లోకంలోంచి వొక సంతోషాన్ని, వొక ఆశ్చర్యాన్ని తోడుకునే విషయాలన్నీ ఆయనకు కవిత్వమవుతాయి. ధనియాలతిప్ప అనే స్పష్టమైన స్థలం చూస్తే ఎంత ఆనందమో, అస్పష్టమైన వొక వాన్ గొ చిత్రం చూసినా అదే ఆనందం. పాముల వాణ్ని చూస్తె ఎంత సంభ్రమమో, పికాసో బొమ్మని చూస్తే అంతే సంభ్రమం. చుట్టూ పరచుకొని వున్న చెట్లనీ, నదుల్నీ, మనుషుల్నీ చూస్తే ఎంత సంతోషమో, ఎక్కడో వున్న పారిస్ మహానగరాన్ని చూసినా అంతే సంతోషం. ముఖ్యంగా, వ్యక్తులూ, స్థలాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత సున్నితంగా ప్రేమగా రాసిన ఇంకో కవి ఎవరైనా వున్నారా అంటే లేరనే అనిపిస్తుంది నాకు. చాలా మంది ఆయన కేవలం ప్రకృతి గురించే రాశారని పొరబడతారు కాని, నిజానికి ఆ ప్రకృతిలో లీనమయ్యే కల కంటున్న మనుషుల్ని గురించే ఆయన రాస్తున్నారని నేను అనుకుంటాను.

పిల్లల్ని గురించి, అంత కంటే ఎక్కువగా తన స్నేహితుల్ని గురించి రాయన రాసిన కవితలు నన్ను ఎప్పుడూ విస్మయంలో పడేస్తాయి. సూఫీలు కలకంటున్న వొక ప్రాపంచిక జీవిని ఈ మూడింటి కలయికలోంచి చూపిస్తున్నారా అనుకుంటాను. మా ఇద్దరి సంభాషణల్లో సూఫీ మహాకవి హఫీజ్ ని ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించే వారో లెక్కలేదు. మొదట్లో నేను హఫీజ్ ని చదవడానికి బద్దకిస్తున్నప్పుడు “అయ్యో…హఫీజ్ ని చదవకుండా, ఎట్లా రాస్తారు మీరు అసలు?” అని వొక సారి గట్టిగా మందలించే వారు కూడా- ఈ కాలంలో అలా మనల్ని ఫలానా చదవలేదే అని మందలించే వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది కొన్ని సార్లు! అలాంటి క్షణాల్లో ఆయన మాటలు గుర్తొచ్చి మొదట ఆయన మాటనీ, తరవాత ఆయన్నీ పోగొట్టుకున్నాను కదా మరణం అనే ఈ తెర అడ్డుపడి అనుకుంటూ వుంటాను.

4

కవిత్వం విషయంలో నాకూ మా నాన్నగారికి మొదటి నించీ చుక్కెదురు. మా నాన్నగారు కమ్యూనిస్టు సాహిత్య జీవి. నాకు కవిత్వ ఊహలు అప్పుడప్పుడే అందుతూ వస్తున్న నా డిగ్రీ రోజుల్లో “లేచిపోదామా?” అని చిలిపి హుషారుగా అనే అమ్మాయిలా ఇస్మాయిల్ గారు అనిపించారు నాకు. కవిత్వ పరంగా నేను ఆయనతో లేచిపోయాను, మా నాన్నగారి కమ్యూనిస్టు పంజరం విడిచి-

అయితే, నా మొండితనం మీద గాఢమైన నమ్మకం వుండడం వల్ల నాన్నగారు నన్ను ఇస్మాయిల్ గారి మైదానంలో హాయిగా వదిలేశారు. నాన్నగారు మంచి సాహిత్య వక్త. ఖలీల్ జిబ్రాన్ గురించీ, కొంత మంది పర్షియన్ కవుల గురించి నాన్నగారి రేడియో ప్రసంగాలు విని, ఇస్మాయిల్ గారు “కౌముదీ, మీలోని నిజమైన వ్యక్తీ ఇదిగో ఇక్కడున్నాడు! మీరు ఎందుకలా తప్పించుకు తిరుగుతారు అతన్నించి!” అని వొక సారి కార్డు ముక్క రాశారు. అదే వుత్తరం కింద నా కోసం “అఫ్సర్, నాన్నగారి మార్క్సిస్టు మాటలు మినహాయించుకొని, ఇదిగో హాయిగా ఈ పర్షియన్ కవుల్ని చదువుకో నువ్వు! ఆయన మార్క్సిస్టు కాని వేళల్లో సాహిత్యం గురించి చక్కగా మాట్లాడతారు.” అని రాశారు.

ఇక నించి అలాంటి ఆకుపచ్చ ఉత్తరాలూ, అందమైన వాక్యాలూ రావు కదా!

ఇలా వెళ్లిపోతారని తెలిస్తే, ఇంకాసిని ఎక్కువ మాటలు ముందే మాట్లాడి వుండే వాణ్ని కదా, ఇంకా కొన్ని కాలాలు నాలో దాచుకోడానికి!

(లోగో: సాయి కిరణ్)

 వచ్చే గురువారం: విన్నకోట రవిశంకర్ వ్యాసం “ఆ ఇద్దరూ సదాబాలకులే!”

 

కాసింత సంతోషం!

 

గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు

అవును, కచ్చితంగా అప్పుడే

కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు.

ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో

వొక్క సారి- కనీసం వొక్కసారి- వూహించు.

 

మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు.

 

1

బహుశా మండుటెండ విరగబడే మధ్యాన్నంలో నువ్వు

వూరిచివర చెరువుని వెతుక్కుంటూ వెళ్లి వుంటావ్

శరీరాన్ని గాలిపటం చేసి ప్రతినీటి బిందువులోనూ వొక ఆకాశాన్ని దిగవిడుచుకొని

రంగురంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ వుండి వుంటావ్.

 

యిప్పుడు అంతగా గుర్తు లేదేమో కాని,

ఆ చెరువుతోనూ ఆ ఆకాశమూ నువ్వూ వొకే భాషలో మాట్లాడుకొని వుండి వుంటారు,

వొకరిలోకి ఇంకొకరు తొంగి చూసుకొని వుంటారు నీటిలోపలి చందమామలా.

 

2

పల్లె రాదారి మీద ముగ్గురు నలుగురు పిల్లలు యీ లోకాన్ని బేఖాతర్ చేసేస్తూ

కబుర్ల సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తున్నప్పుడు

వాళ్ళల్లో యెవరిదో వొక పసిచూపులోకి చెంగున గెంతి

నీ బాల్యపు చేలన్నీ పెద్ద పెద్ద అంగలతో దాటేసి వుంటావ్ వెనకెనక్కి-

 

యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,

అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి

నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,

ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

 

ఎవరికీ చెప్పలేకపోవచ్చు కానీ

నువ్వు ఎంత దిగులుపడ్తున్నావో

వొక్కో సారి రాత్రీ పగలూ తెలియని కాలాల్లోకి యెలాగెలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావో

అటు ఇటు ఎటు మళ్ళినా ఏడుపువై ఎలా పగిలిపోతున్నావో తెలుసు కాని-

 

కాసింత సంతోషంగా వున్నప్పుడు

కచ్చితంగా ఆ క్షణంలో నువ్వూ నేనూ యిద్దరు పిల్లలమై రెండు వూహలమై

వూయల వూగామే అనుకో,

అప్పుడు యీ దేహాలూ ఈ నిజాలూ గాలికన్నా తేలిక.

 

యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో,

అలలోపలి సంతోషపు కడలిలో

కొంచెమే అయినా సరే,

తేలిపో.

యిప్పుడు నువ్వు కనీసం వొక దీపం కళ్ళల్లో

కళ్ళలోని వెల్తురు నీడల్లో

కొంచెమే అయినా సరే,

వెలిగి రా!

4

జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు

కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

అఫ్సర్

చిరిగిన ఆకాశాన్ని కుట్టే కవి ఇదిగో!

 

బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

 

[ఈ నెలలో విడుదల అయిన బాల సుధాకర్ మౌళి కవిత్వ సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ ముందు మాట ఇది]

 

చిన్న విషయం చెప్పాలి, బాల సుధాకర్ కవిత్వంలోకి వెళ్ళే ముందు-

ఫ్రెంచ్ ప్రతీకవాదపు ఆఖరి కిరణం Paul Valery ని ఎవరో అడిగారట – “అసలు దేన్ని మంచి రచన అనాలి?” – అని.

ప్రతీకలలో మాట్లాడడానికి ఏ మాత్రం తడుముకోని Valery అన్నాడట: “వొక రచన చదివాక ఎవరైనా I am a page of literature అనుకుంటే అదీ మంచి రచన.”

నిజమే అనిపిస్తుంది చాలా సార్లు; వొకప్పుడు రావిశాస్త్రి, యింకోప్పుడు శ్రీశ్రీ, యిప్పుడు ఉత్తరాంధ్ర నించి వీస్తున్న ఉత్తమ సాహిత్య పవనాలు కొంచెమైనా తాకినప్పుడు – మరీ ముఖ్యంగా – యెక్కడో వున్న నెల్లిమర్ల నించి వొక స్వరం గట్టిగా వినిపిస్తున్నపుడు literary pages ఎంత వేగంగా మారిపోతున్నాయో కదా అనిపిస్తుంది.

మారుమూల ఏ అంతర్జాల మాయాప్రపంచపు మరీచికలూ తాకీ తాకని చోట, కరెంటు వుండే వేళల కంటే లేని వేళలే యెక్కువగా వుండే చోట జీవితం వీధి లాంతరు గుడ్డి దీపం కన్నా బలహీనమైన వెలుగు ప్రసరిస్తున్న చోట – ఈ బాలసుధాకర్ మౌళి అనే కవి ఈ సాహిత్య పుటలు ఎలా తిప్పేస్తూ వుంటాడా అనే వూహ నన్ను యెప్పుడూ లోపల్నించి బాధగా మెలిపెడుతూ వుంటుంది.

చాలా కష్టం, అనేక మార్పులు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నప్పుడు వొక చిన్న వూరి నించి ప్రయాణం మొదలెట్టడం! ప్రపంచ పటం మీద తన వూరినీ తననీ కనీసం చిన్ని చుక్కగా చూసుకోడానికైనా ఆ కవికి చాలా భరోసా కావాలి. “నేను ఈ ప్రపంచంలోనే వున్నానా?” అన్న ఉనికి వేదన అతన్ని వూపిరాడనివ్వదు. “I am a page of literature,” అనుకోడానికి కావాల్సిన ambience దొరకదు.

అలాంటప్పుడు Paul Valery చెప్పింది కొంత వరకే నిజం! ఎందుకంటే, ప్రపంచ పటం మీద వుండే వాళ్లు చాలా మంది వొకే పేజీ మీద వుండరు. సాంకేతికంగా సరే, మానసికంగా అది అంతగా సాధ్యపడదు. అలాంటప్పుడు నెల్లిమర్ల కవి వొక్కడూ – వొక మూల ఎదో బడిలో పాఠాలు చెప్పుకుంటూ బతికే కవి – ఏం చేస్తాడు ఈ ప్రపంచ పటం మీద?!

ఈ ప్రశ్నకి కనీసం వొక సమాధానం దొరికితే చాలు, బాలసుధాకర్ కవిత్వంలోకి మనకి వొక ఎంట్రీ దొరికినట్టే.  నాకు దొరికిన సమాధానం ఏమిటంటే ముఖ్యంగా అతను తాను సాహిత్యంలో పేజీని అనుకోవడం లేదు. కేవలం సాహిత్యమే పేజీ అనుకోవడమూ లేదు. అతనికీ యీ లోకానికీ యింకా పెద్ద పేచీనే వుంది. అసలు అతని కవిత్వానికీ, కథలకీ, వ్యాసాలకీ, అతని క్షణచర్యల్ని రికార్డు చేస్తున్న ముఖపుస్తకపు అనుదిన క్షతగాత్ర వదనంమీద అతను విసిరే శకలాలకీ ఈ పేచీలోనే key వుంది.

అతన్ని సింబాలిస్ట్ Paul Valery కాదు, అతనికి తెలీకుండానే Rolland Barthes అనే విప్లవోన్మాది ఆవహించి వున్నాడు. వొక్క బాలసుధాకర్ ని మాత్రమే కాదు, 1968 మే లో ఫ్రాన్సులో పెట్టుబడిని గజగజ వణికించిన ప్రజా వుద్యమ పంథాలో నిలబడి, Rolland Barthes సాహిత్యం కేవలం సాహిత్యం కాదు అని సింహగర్జన చేయడం ప్రపంచమంతా వినిపించింది. అతను అన్న మాట: I am not a page of literature. ఆ వాక్యం ప్రపంచ సాహిత్య చరిత్రలో historical discourse అన్న భావనకి తొలి పునాది. సాహిత్యంలోని విపరీత కాల్పనికతని ధిక్కరించిన భావన.

సరే, I am not a page of literature అన్న రచయితలూ కవులూ ఏం చేస్తారు? వాళ్ళు యింకో చరిత్ర కోసం కలలు కంటారు, కళల్ని కంటారు. బాలసుధాకర్ కవి కాబట్టి, అతని కలలన్నీ కవిత్వంలో వుంటాయి. అతను కల కంటున్న కొత్త చరిత్ర సమస్తం కవిత్వ వాక్యాల్లోకి బట్వాడా అవుతుంది.

1968 ని బాల సుధాకర్ చూసి వుండడు. కాని, అతను పుట్టిన వూరూ, ఆ చుట్టుపక్కల యింకా మిగిలి వున్న శ్రీకాకుళం విప్లవాగ్నుల కొలిమి సెగల్ని దాచుకునే వుంది. ఆ చరిత్ర లేకుండా బాలసుధాకర్ లేడు. అతని ప్రతి కలవరింతా పలవరింతా ఆ అనుభవం చుట్టూనే కాబట్టి, అతని కవిత్వం – historical discourse- అని నా ప్రతిపాదన. అతను రాస్తున్న పేజీలు  కేవలం సాహిత్య పుటలు కావు. Rolland Barthes చెప్పిన reality effect ని పొదువుకున్న సామాన్యుడి దస్తావేజులు. పీడితుల కైఫియత్తులు.

Paul Valery మాదిరిగా ప్రతీకల మీద బతికే కవి తన కవిత్వాన్ని పీడితుల కైఫియత్తుగా మార్చగలడా? తన దగ్గిర వున్న అరకొర సాధనాలని చరిత్రకారుడిలాగా చాకిరీ చేయించగలడా?చేయగలడా?

అవును, ముమ్మాటికీ చేయగలడు అని నిరూపిస్తూ వెళ్తున్నాడు బాలసుధాకర్.

Layout 1

1

బాలసుధాకర్ కవిత్వం చదివేటప్పుడు నన్ను బాగా ఆకట్టుకునేది అతను కవిత్వాన్నీ, వాస్తవికతనీ juxtapose చేసే పధ్ధతి. ఈ “ఎగరాల్సిన సమయం” సంపుటిలో మొదటి కవితలోనే సుధాకర్ ఆ రెండీటి మధ్యా వంతెన కట్టుకునే పనికి దిగుతాడు ఈ వాక్యంలో-

కల్లోల దేశాన్ని

కవిత్వం చేస్తున్నప్పుడు

కవిత్వం పసిపిల్లలా వుండాలనుకోవడంలో

                               తప్పేముంది?

అంటూ-

 

కాని, ఆ కవిత అసలు రహస్యం ఆ తరవాతి పంక్తిలో వుంది.

పసిపిల్లలాంటి నిర్మలమైన, నిర్భయమైన

పద్యాన్ని సృజించే వరకూ

       రాత్రుళ్ళు యిలానే-

అటు ప్రపంచ సాహిత్యంలోనూ ఇటు భారతీయ సాహిత్యంలోనూ యుద్ధానంతర వాస్తవికతని చెప్పిన కవులూ రచయితలూ పసిపిల్లల కళ్ళతో వాటిని దృశ్యం చేయడం కనిపిస్తుంది, యుద్ధ కల్లోలంలోని కరకుదనం, పసి కళ్ళ నిర్మలత్వాన్ని ఎదురెదురుగా చూపిస్తూ-

బాలసుధాకర్ కి ఆ నిర్మలత్వమే కాదు, నిర్భయమూ కావాలి. వొక మంచి పద్యం ఎంత నిర్మలంగా వుంటుందో, అంత నిర్భయంగానూ వుంటుంది. మొదటి కవితలోనే తన కవిత్వమార్గానికి తానే అలా నిర్వచనం చెప్పుకున్నాడా సుధాకర్?!

ఆ తరవాతి కవితలో అవును నిజమే అని ఖాయం చేస్తున్నాడు ఇలా –

కవులూ

పిల్లలూ

ఏ దేశానికైనా ప్రాణ వీచికలు.

ఆ తరవాత ఎన్ని కవితల్లో పిల్లలు ఎగురుకుంటూ వస్తారో మీరే చూడండి. నిజానికి, ఈ కవిత్వ సంపుటి శీర్షిక “ఎగరాల్సిన సమయం” అలా పిల్లల్లా ఎగిరే నిర్మల నిర్భయ సమయ సందర్భాల్ని సూచిస్తోందేమో!

కాని, అవి కేవలం నైరూప్య సమయ సందర్భాలు కావు.

బాలసుధాకర్ కేవలం కవి మాత్రమే అయి వుంటే, అతనికి నైరూప్యత చాలా అవసరమయ్యేది. కవి మాత్రమే కాకుండా, భవిష్యత్తుని రోజూ కళ్ళారా చూస్తూ వుండే ఉపాధ్యాయుడు కూడా అవడం వల్ల అతని నైరూప్య వూహలూ, కవిసమయాలూ రోజూ కొంత కొంత విచ్చిన్నమైపోతూ వుంటాయి. తరగతి గది అతని సమయసందర్భాల్ని redefine చేస్తూ వుంటుంది. అతని బలాల్నీ, బలహీనతల్నీ రోజూ కొంత కొంత ఎండగడుతూ వుంటుంది. అతను గతమ్మీద బతికే వీలు లేకుండా భవిష్యత్తుని దర్శించి తీరాల్సిన చరిత్రభారాన్ని అతని మీద పెడుతూ వుంటుంది. ఆ భారాన్ని మోసుకుంటూ ఎలా కలల్లోకి ఎగురుతున్నాడన్నదే బలసుధాకర్ కవిత్వ ప్రయాణం. అనేక ప్రతికూలతల మధ్య తన సమయాన్ని తను నిర్దిష్టంగా reinvent చేసుకోవడం ద్వారా ఈ ప్రయాణానికి వొక తాత్విక సారాంశాన్ని జోడిస్తున్నాడని నేను అనుకుంటున్నా.

2

సమయసందర్భాలు చరిత్రకారుడికి అక్కరకొచ్చే పనిముట్లు. కవి సుధాకర్ కి కూడా!

కవికి భాష ముఖ్యమైన సాధనం. తన సందర్భాన్ని reinvent చేసుకునే కవి- భాషనీ reinvent చేసుకోవాలి. అంటే, భాషకి అంతకు ముందు వున్న నిర్మాణ వ్యవస్థని కవి ప్రశ్నించాలి, వీలయితే అందులో ధ్వంస రచనకి దిగాలి. అంటే, Writing అనే ప్రక్రియ ఏదైతే వుందో దాన్ని కొత్తగా నిర్మించుకోవాలి.   మళ్ళీ Rolland Barthes దగ్గిరకే వద్దాం. కొత్త చారిత్రక సందర్భంలో Writing ని నిర్వచిస్తూ ఇలా అంటాడు:

Writing is integrally “what is to be invented,” the dizzying break with the old symbolic system, the mutation of a whole range of language.

ఈ రెండేళ్ళ తెలుగు కవిత్వ సందర్భంలో సుధాకర్ ప్రవేశం వొక ఆశ్చర్యం చాలా మందికి! మొదటి కొన్ని కవితలతోనే సుధాకర్ వొక విస్మయ వలయాన్ని తన చుట్టూ నిర్మించుకున్నాడు. ఇతని భాష, ఇతని వాక్యం కొత్తగా వుందన్న talk వచ్చేసింది. దానికి ప్రదాన కారణం: సుధాకర్ కవిత్వ భాషలో తెచ్చుకున్న మార్పులు. కవిత్వ భాష అనగానే అందులోని ప్రతీకలు, పదచిత్రాలూ. సుధాకర్ కవిత్వంలో అవేవీ పాత వాసన వేయవు. ఆ పాతదనాన్ని వదిలించుకోవాలన్న బలమైన ప్రయత్నం సుధాకర్ కవిత్వ భాషలో కనిపిస్తుంది. అయితే, ప్రయోగం పేరుతో యెక్కడికో పలాయనం చిత్తగించకపోవడం అతని శిల్ప ఆరోగ్యానికి, వస్తు నిబద్ధతకీ సంకేతం. శిల్పంలో సుధాకర్ ఎన్ని కొత్త పోకడలు పోతాడంటే, ఆ పోకడ చాలా subtle గా వుంటుంది. ఈ సంపుటిలోని ప్రతి కవితా దీనికి వేర్వేరు కోణాల నించి వొక ఉదాహరణగా నిలుస్తుంది.

అయితే, శిల్పం కంటే కూడా సుధాకర్ వస్తు విస్తృతి నాకు ప్రత్యేక ఆకర్షణ. బహుశా, అతికొద్ది కాలంలో సుధాకర్ ఎక్కువ మంది అభిమానుల్నీ, నిరంతర చదువరుల్నీ సంపాదించుకోడానికి ఈ వస్తు వైశాల్యమే ముఖ్య కారణం అని అనుకుంటున్నాను. సుధాకర్ ఎన్ని రకాల కవిత్వ వస్తువుల్ని తడుముకుంటూ వెళ్ళాడో! స్త్రీలూ, పిల్లలూ, ఊళ్ళూ, బళ్ళూ, నీళ్ళూ, క్యూబాలూ, నియంతలూ, నిరాశలూ, ఆశలూ – ఇలా ఈ వరస ఎక్కడ అంతమవుతుందో తెలీదు. కాని, వీటన్నిటి వెనకా సుధాకర్ ని నడిపించే శక్తి వుందే, అది బలవత్తరమైంది.

సుధాకర్ ఉత్తమ చదువరి. వొక రచయిత పేరు వింటే, అది వెంటనే అతని మనసుని వెంటాడడం మొదలెడుతుంది. అతని చేతులు ఆ పుస్తకాన్ని చేరుకునే దాకా నిద్రపోవు. కారణాలేమైనప్పటికీ, ఈ మధ్య కాలంలో చదువు పట్ల ఇంత దాహం వున్నవాణ్ని నేను చూడలేదు. తన కవిత్వం మీద తనకి శ్రద్ధ ఉండడంలో ఎవరికైనా ఆశ్చర్యం లేదు. కాని, సుధాకర్ ఇతరుల కవిత్వాల్ని కూడా అంతే ప్రేమగా చదువుకుంటాడు. బహుశా, వొక ఉత్తమ అధ్యాపకుడికి వుండాల్సిన ప్రేమ అది. కాని, అదే ప్రేమ వొక కవికి కూడా వుంటే, ఆ కవి దిగంతం ఎప్పుడూ కొత్తగా వొక హరివిల్లుని పూస్తుంది. ఈ సంపుటిలోని కవితలూ, వాటి ప్రేరణలూ, ప్రభావాలూ గమనిస్తే, సుధాకర్ ఎక్కడెక్కడి నించి పరిగెత్తుకుంటూ వస్తున్నాడా అనిపిస్తుంది. “ప్రేమతో ఆలింగనం చేసుకోడానికి/ సరిహద్దులు అడ్డం కావు” అని వొక కవితలో అన్న వాక్యం సుధాకర్ వ్యక్తిత్వానికి tagline లాంటిదే.

అంటే, వొక కవి తన సమయాన్నీ, సందర్భాన్నీ పునర్నిర్మించుకునే బలాన్ని ఎక్కడి నించి తీసుకుంటాడో చెప్పడం కోసం సుధాకర్ లోని ఈ వ్యక్తిత్వ విశేషాన్ని వివరించాను. ఇలా చెప్తున్నప్పుడు కూడా సుధాకర్ లో వున్న ఆ చరిత్ర కోణమే నేను నొక్కి చెప్తున్నాను. ఆ చరిత్ర కూడా వొక subjective slant వున్న వర్తమాన కోణం. ఇలాంటిది మనకి తెలుగు కవిత్వంలో వొక వరవరరావులోనో, శివసాగర్ లోనో మాత్రమే కనిపిస్తుంది. మనకి తెలిసిన black poets – Langston Hughes, Amiri Baraka లోనూ, మనకి అంతగా తెలియని కాశ్మీరీ దీప కళిక Agha Shahid Ali లోనూ బలంగా కనిపిస్తుంది. వ్యక్తులూ దేశ చరిత్రలూ జాతుల చరిత్రలూ ఎప్పుడూ విడివిడి ద్వీపాలు కావనీ, అవి కలిపి కుట్టిన బొంత దుప్పటి వంటివనీ వీళ్ళ కవిత్వం వల్ల అర్థమవుతుంది. సమకాలీన తెలుగు కవిత్వంలో సుధాకర్ లో ఈ అంతర్జాతీయ ప్రగతిశీల సాహిత్య దృక్కోణ వారసత్వం నెల్లిమర్ల నేల భాషలో localize అవ్వడం ఈ సంపుటిలో చూస్తాం.

కచ్చితంగా ఇదే సమయంలో నేను మన సుధాకర్ లాంటి ఇంకో అమెరికన్ black poet ని చదువుతున్నాను. అతని పేరు Jamaal May. ఇతనూ సుధాకర్ వొకే ఈడు వాళ్ళు అయి వుండాలి. వొకే ఈడులో వున్న కవులూ రచయితలూ ప్రపంచ పటంమీద భిన్న బిందువుల మీద నిలబడి ఏం మాట్లాడుతూ వుంటారా అని మనసు రిక్కించి చదువుతూ వుంటాను. వొకరు నెల్లిమర్లలో యింకొకరు డిట్రాయిట్ యంత్ర నగరిలో! కాని, ఇద్దరి కవిత్వ వాక్యాలూ వొకే రకమైన mechanization ని సవాల్ చేస్తున్నాయి. Jamaal గురించి నాకు ఇష్టమైన మరో కవి Natasha Trethewey అంటోంది: Jamaal has a fine ear, acutely attuned to the sonic textures of everyday experience. ఇవే మాటలు సుధాకర్ కి కూడా చక్కగా వొదుగుతాయి.

వొక కవితలో అతను అంటున్నాడు:

I have come

to stitch all

this torn sky back together.

ఈ పూట సుధాకర్ కవిత్వాన్ని పరిచయం చేయడానికి అంత కంటే ఇంకో మంచి వాక్యం దొరకడం లేదు నాకు! మీలోపలా బయటా చీలిపోతున్న ఆకాశపు పోగులు అతికించి ఈ చలి రాతిరి మీ కోసం వెచ్చని దుప్పటి కుట్టే కవిత్వం ఇదిగో!

 • -అఫ్సర్

ఆస్టిన్,

ఆగస్టు 15, 2014.

 

 

 

 

 

వాక్యం ఆగిపోయిన చోట…

1

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!

వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ్టికి దగ్గిర దగ్గిర రెండు నెలలు అవుతున్నాయా చే.రా. మాస్టారు వెళ్ళిపోయి!

అప్పట్నించీ లోపలి సజీవమైన అవయవమేదో వున్నట్టుండి నిర్జీవమైపోయినట్టు- లేదూ- వొక వెలితి యింక దేన్తోనూ నింపడానికి వొప్పుకోనట్టు – లేదూ- ఆ మరణపు వొక్క క్షణం అబద్ధమే అని యింకా అనుకుంటూ వున్నట్టుగా వుంది.

మరణాలు కొత్త కాదు. కానీ, ప్రతి మరణమూ కొత్తగా ఏడ్పిస్తుంది. అంతకు ముందు వెళ్ళిపోయిన మనుషులూ తక్కువ కాదు, కాని ఈ క్షణం వెళ్ళిపోయిన ఈ మనిషి యిలా వెళ్లి వుండకూడదనీ, మృత్యువు మరీ ఎక్కువ తొందరపెట్టి లాక్కు వెళ్ళిందనీ అనిపిస్తుంది.

నాన్నగారు పోయినప్పుడు- మట్టి కింద ఆయన్ని నేనే రెండు చేతులా  కప్పెట్టి వచ్చిన తరవాత చాలా రోజులు ఆయన మరణం అంతా అబద్దమనీ, ఆ మట్టి కింద నించి ఆయన వచ్చేస్తారనీ నమ్మేవాడిని. గాఢ నిద్రలో వున్న నిక్షేపంలాంటి మనిషిని తటాలున తీసుకువెళ్ళి మట్టిలో కలిపి వచ్చామనీ అనుకునేవాణ్ణి. అది అబద్దమని తెలిసినా సరే, అలాంటి వొక అబద్దంలో బతికాను కొన్నాళ్ళు. జీవితం ఆయన్ని మళ్ళీ వెనక్కి పిలుస్తుందనీ, “నీ విషయంలో మృత్యువు పొరపాటు చేసింది కౌముదీ!” అని సంజాయిషీ ఇచ్చుకొని, సెకండ్ చాన్స్ ఇస్తుందని కూడా పిచ్చిగా అనుకునేవాణ్ణి.

నాన్నగారు పోయాక చాలా మంది వెళ్ళిపోయారు. కాని, అలా జీవితం వెనక్కి పిలిచి రెండో వంతు ఇస్తుందని ఆశ పడింది వొక్క చే.రా. గారి విషయంలోనే!
అందుకే, యిప్పటికీ ఆయన మరణం నా మనసుకీ నా శరీరానికీ అలవాటు పడని చేదునిజం.

నాన్నగారు పోయినప్పుడు చాలా పత్రికలూ, మీడియా వాళ్ళు ఏమన్నా రాయండీ, చెప్పండీ అని అడిగీ అడిగీ అలసిపోయారు. కాని, ఏమీ రాయలేకపోయాను ఏడాది దాకా!

ఇప్పుడు చేరా విషయంలోనూ అంతే! కూర్చునే కుదురు లేదనీ కాదు, రాయాల్సినవి లేవనీ కాదు. తెలియని మౌనం వొకటి మనసులో కొంత భాగాన్ని తలుపు మూసి వుంచేసింది.

యిప్పటికీ ఈ రాసే నాలుగు వాక్యాల్లో నిగ్రహం వుంటుందని నేను అనుకోవడం లేదు. రాయాలని అనుకున్నది రాయకుండానే మనసూ, కాగితం రెండూ మడత పెట్టుకొని వెళ్ళిపోతానేమో కూడా తెలియదు.

2

టీనేజికీ, సైగల్ పాటలకీ జత కలవదు కానీ, ఎందుకో సైగల్ అలా వచ్చేశాడు అతని మంద్రస్వరంతో నా యవ్వనంలోకి! ఆ “సైగల్ పాట” అనే కవిత రాసి వుండకపోతే, చేరా కూడా నా జీవితంలోకి మరీ అంత నవయవ్వన కాలంలో వచ్చేవారు కాదు. మా యిద్దరి బంధంలో సైగల్ వొక live wire.

నిజానికి అంతకు ముందు నించీ చేరా గురించి folklore కొంత వుండింది మా వూళ్ళో! డబ్బు లేక ఆయన అమెరికాలో వొక ఫ్రెండ్ కి వంట చేసిపెడుతూ కష్టపడి చదువుకున్నారని, ఇక్కడి నించి అంత దూరం ఆయన అమెరికా వెళ్లి తెలుగు వాక్యం మీద రిసెర్చ్ చేసారనీ…ఇలా! నేను డిగ్రీలోకి వచ్చే సరికి ఈ folklore కి ఇంకా కొన్ని juicy details వచ్చి చేరాయి- చేరాగారూ ఆయన ప్రొఫెసరూ కలిసి మందు కొట్టేవారని! ఈ కథ ఎందుకో నాకు అప్పట్లో అంతగా నచ్చలేదు, నాలోపల puritan ఎవడో పీఠం వేసుకొని వుండడం వల్ల! అసలు అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ వొకటి వుందని కూడా ఆ తొలినాటి folklore వల్లనే తెలిసింది. చివరికి నేనూ అక్కడికే చేరుకుంటానని అప్పటికి నా వూహలో కూడా లేదు. సరే, ఈ పుక్కిటి పురాణాల సంగతి పక్కన పెడితే –

58

చిర్నవ్వే చేరా చిరునామా!

సైగల్ పాట కవిత అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది. బహుశా, అచ్చయిన నా తొలి కవితల్లో అదీ వొకటి. నేను రాసేది కవిత్వమనే నమ్మకం ఆ రోజుల్లో నాకు ఏ కోశానా లేదు. ఈ కవిత అచ్చయిన వారం రోజులకి నాకు చేరా గారి వుత్తరం వచ్చింది.  ఆ ఉత్తరం వచ్చిన వారం రోజులకి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఆయన కాలమ్ “చేరాత”ల్లో దాదాపు సగం పేజీ కేవలం ఆ సైగల్ పాట కవిత మీదే రాసేసరికి ఉత్సాహం కాస్త ఉరకలేసింది.  నా గురించి రాసినందుకు కాదు- పదిహేను లైన్లు కూడా లేని చిన్న కవిత మీద దినపత్రికలో సగం పేజీ రాయడం అంటే మాటలు కాదు. అంటే, వొక చిన్న కవిత వెనక ఇన్ని పెద్ద ఆలోచనలు సాధ్యమా అన్న ఉత్సాహం!

కవిత్వం పట్ల విపరీతమైన మోహం తప్ప కవిత్వ విమర్శ మీద పెద్దగా ఆసక్తి లేని నాకు ఆ వ్యాసం విశాలమైన కనువిప్పు. కవిత్వాన్ని గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే ఆశ్రయించే వాణ్ని ఆ రోజుల్లో! కవిత్వాన్ని కవిత్వ భాషలో మాత్రమే వ్యాఖ్యానించడం వీలవుతుందని వొక థియరీ కూడా చేసిన వాణ్ని. నా థియరీని రకరకాల పద్ధతుల్లో de-construct చేసి, “లేదు, కవిత్వాన్ని గురించి మనం నిరాడంబర/ నిరలంకార వచనంలో విమర్శ రాయాల్సిందే” అని నన్ను విమర్శ వైపు నెట్టిన నా తొలి ఉపాధ్యాయుడు చేరా.

ఆ రోజుల్లో చేత్తో వుత్తరాలు రాసే అలవాటు ఎక్కువగా వుండడం వల్ల ఎప్పటికప్పుడు తోచినప్పుడల్లా ఆయనకి రాసే వాణ్ని. ఆయన కూడా వెంటనే సమాధానం రాసే వారు. ఈ వుత్తరాలు రాసే అలవాటు నాకు ఎంత లాభించిందో చెప్పలేను. ఇస్మాయిల్ గారి ఉత్తరం ఎప్పుడూ కార్డుముక్క దాటి వెళ్ళేది కాదు. కాని, చేరా గారి వుత్తరం కనీసం మూడు అర ఠావు కాయితాలు వుండేది. చాల వోపిక ఆయనకి ఆ విషయంలో! విషయం డొంక తిరుగుడుగా వుంటేనో, కవితాత్మకంగా వుంటేనో వెంటనే ఆయన్నించి అక్షరాలా మొట్టికాయలు పడేవి. చేరాతో వుత్తరాల వల్ల నా వచనంలో అందమైన కవిత్వం లేకుండా పోతోందని చాలా మంది మిత్రులు ఆ రోజుల్లో బాధపడే వాళ్ళు కూడా! కాని, వచనం అనేది వొక thought process అనీ, rationalization అనీ నేనూ క్రమంగా నమ్మడం మొదలెట్టాక వాళ్ళ బాధ కొంత తగ్గింది. వొక రకంగా చేరాతో సాగిన ఆ వుత్తరాయణం అంతా నాకు వచనరచనలో శిక్షణ అన్నమాట.

సైగల్ పాటతో వొక ఉద్వేగభరితమైన సన్నివేశంతో మొదలైన మా స్నేహం చివరికి అలా ఆలోచనాత్మక దశకి మళ్ళిందన్న మాట.

ఈ స్నేహం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మేం కలిసి సాహిత్య సభలకు ప్రయాణాలు చేయడం మొదలయింది. ఈ ప్రయాణాలు నా సాహిత్య యూనివర్సిటీలు! గంటల తరబడి ప్రయాణాల్లో నిద్ర కూడా పోకుండా రెండు మూడు ఇంగ్లీషు సాహిత్య విమర్శ పుస్తకాలు దగ్గిర పెట్టుకొని, అవి చదువుతూ, నా చేత వాటిని చదివిస్తూ, వాటి సారాంశం వివరిస్తూ, ప్రశ్నలు వేస్తూ, “ఎంతయినా నువ్వు కవివే! అంతే!” అంటూ మధ్యలో నా మందబుద్ధి మీద జోకులు రువ్వుతూ ఆ ప్రతి ప్రయాణం నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం.

అప్పుడే కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన కొత్తగా మాట్లాడుతున్న కాలం అది. అందులో భాగంగా ఆయన విపరీతంగా చదివే వారు. విదేశాలలో అప్పుడే వెలువడిన కొత్త కవిత్వ విమర్శ పుస్తకం ఏదీ ఆయన చూపు నించి తప్పించుకునేది కాదు. చదివిన వెంటనే దాన్ని గురించి మాట్లాడకపోతే ఆయనకి ఇబ్బందిగా వుండేది. అలాంటి చాలా సందర్భాల్లో నేను ఎలాగోలా దొరికే వాణ్ని – వుత్తరంలోనో, ఫోన్లోనో, సాహిత్య సభల్లోనో, లేదంటే ఆయన ఇంట్లోనో, కొన్ని సార్లు తను ఎంతో బిజీగా వుండే ఆఫీసులో కూడా ఆ పని అంతా పక్కన పడేసి మాట్లాడుతూనో!

గత నలభయ్యేళ్ళలో కవిత్వాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు చేరా. సంపత్కుమారతో మొదలయిన వచన పద్య లక్షణ చర్చ నించి ‘చేరాతల’ కాలమ్ దాకా బహుశా ఆధునిక వచన కవిత్వం గురించి అంత విస్తారంగా చర్చించిన మరో విమర్శకుడు మనకు లేరనే అనుకుంటాను. అవన్నీ వొక ఎత్తు, 1985 తరవాత కేవలం కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఇంకో ఎత్తు. (ఈ కవిత్వ వ్యూహాల గురించి ఆయన కల్పన కవిత్వ సంపుటి “నేను కనిపించే పదం”లో కూడా ప్రస్తావించారు.)

ఆధునిక భాషా వేత్తలు ఇప్పుడు కేవలం భాషకి మాత్రమే పరిమితమై మాట్లాడడం లేదు. భాష చుట్టూరా వుండే ఇతర సామాజిక మానసిక సాంస్కృతిక అంశాలను కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు. వొకవిధంగా భాష అనేది సాంస్కృతిక అంశంగా (cultural pattern) గా మారింది. కవిత్వంలో వాడే భాష, వాక్య నిర్మాణాలూ, idiom, కవి తనకంటూ నిర్మించుకునే individual grammar, కవిత్వ వాక్యాల మధ్య వదిలేసే ఖాళీ జాగాలూ ఇవన్నీ ఇప్పుడు కవిత్వ రసనకి అవసరమవుతున్నాయి. అంటే, para-linguistic features కవిత్వ భాషలో భాగమవుతున్నాయి. 1985 తరవాత వొక భాషావేత్తగా చేరా మాస్టారు కవిత్వ విమర్శలో సాగిస్తూ వచ్చిన interventions ని స్థిమితంగా ఆలోచిస్తే, ఆయన్ని గురించి విమర్శపరంగా మనం చేసే ఆలోచనలు అర్థవంతంగా వుంటాయి. ఈ కోణం నించి చేరా అన్వేషణ ముత్యాల సరాల ఛందస్సు మీద చర్చతో మొదలయిందని నేను అనుకుంటున్నా.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్. (ఫోటో సౌజన్యం: చేకూరి సంధ్య)

నా మటుకు నాకు 1990 లో బెంగుళూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు వ్యక్తిగతంగా మంచి అనుభవం. ఆ మహాసభల వేదిక మీద కవిత్వం చదవమని నాకు ఆహ్వానం రావడం పెద్ద ఆశ్చర్యమైతే, ఆ సభల కోసం హైదరాబాద్ నించి బెంగుళూర్ కి చేరా గారితో రైలు ప్రయాణం, ఆ వూళ్ళో నాలుగైదు రోజులు ఆయనతో కలిసి వుండడం ఇంకా అద్భుతమైన అనుభవం. నాకు తెలిసిన వాళ్ళలో నాయని కృష్ణకుమారి, ఎన్. గోపి గార్లు, శిఖామణి, కొండేపూడి నిర్మల, యాకూబ్ కూడా ఈ సభలకు వచ్చారు.

ఆ ప్రయాణంలోనే చేరాగారు ముత్యాల సరాలు ఛందస్సు మీద మాకు సుదీర్ఘ క్లాస్ తీసుకున్నారు. ముత్యాలసరాలతో గురజాడ గాని, శ్రీశ్రీ గాని ఎందుకు అంత ప్రేమలో పడ్డారో అప్పుడే నాకు గట్టిగా అర్థమైంది. అయితే, అది గురజాడ, శ్రీశ్రీ కంటే ఎక్కువ ఇప్పుడు చేరా విమర్శ గురించి చెప్పే సాధనం.

అప్పటివరకూ వున్న భాషనీ, దాని నిర్మాణాల్ని పడగొట్టి, కొత్త idiom ని కట్టుకుంటూ రావడంతో కొత్త కవిత్వం వస్తుంది. పునాదిలో కొంత పాత వున్నప్పటికీ కొత్త వాక్యం కొత్త గూడులా కట్టుకోకపోతే కవికి చిరునామా మిగలదు. ఆ చిరునామా కోసం వెతుకులాట కేవలం అనుభూతికో, కవిత్వ ఉద్వేగానికో సంబంధించిన విషయం కాదు. అంతకంటే ఎక్కువగా అది భాషకి సంబంధించిన ఉద్వేగం. మొన్నటి గురజాడ గాని, నిన్నటి శ్రీశ్రీ గాని, ఇవాళ్టి కొత్త కవి గాని ఆ పని వున్నపళాన చేయలేరు. వాళ్ళు పాతవాటిలో కొన్నిటికి కొత్త స్ఫురణ యిస్తారు, కొత్తవాటిని బలంగా చెప్పడానికి వీలుగా.

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో...

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో…

ఇలాంటి కృషిలో కవికీ, కవిత్వ విమర్శకుడికీ పెద్ద తేడా ఏమీ వుండదు. చేరా తను కొత్తగా చెప్పబోయే వచన కవిత్వ నిర్మాణ వ్యూహాలకు కావలసిన పరిభాష, తాత్విక పునాది ఏర్పర్చుకోడానికే ముత్యాలసరాల దాకా వెళ్ళారని నాకు అర్థమైంది. ముత్యాలసరాల్లో వ్యక్తీకరణకి సంబంధించి వొక linguistic/metrical ease వుంటుంది. అది షేక్స్పియర్ sonnet నించి తీసుకున్న ease లాంటిది. చేరా గారు కూడా కొత్త కవులు భాషలో తీసుకువస్తున్న ఈ linguistic/metrical ease ని చెప్పడానికే ముత్యాల సరాల దాకా వెళ్ళారు. ఇవాల్టి కవి వాడుతున్న భాష వెనక నిర్మితమవుతున్న/ లేదా వినిర్మితమవుతున్న కొత్త వ్యాకరణం అర్థం కావాలంటే ఆ ఇద్దరు మహాకవులూ ముత్యాలసరాలని ఎట్లా చాకిరీ చేయించారో తెలియాలి. ఈ విషయం కొంత నేను ఇదివరకే అచ్చయిన వ్యాస సంపుటి “ఆధునికత- అత్యాధునికత” (1992) లో చర్చించాను కనుక వాటి వివరణలోకి ఇప్పుడు వెళ్ళడం లేదు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం ద్వారా నేనేం సాధించానో నాకు గుర్తు లేదు కాని, ఆ నాలుగు రోజుల పాటు చేరాతో కలిసి వేసిన అడుగులూ, తాగిన కాఫీలూ, భోజన సమయాలూ సాయంత్రపు నడకలూ అటు ఇటు ప్రయాణాల్లో ఆయన విమర్శ హృదయానికీ, ఆయనలోని నిరాడంబర తాత్వికుడికీ దగ్గిరయ్యాను కదా అనిపించింది.

4

అలా దగ్గిరయ్యాక-

2000 లో మాడిసన్ నించి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అని విపరీతమైన డైలమాలో వున్నప్పుడు గంటల తరబడి చేరాతో చర్చలు. ఉద్యోగ రీత్యా నేను మంచి స్థితిలో వున్నప్పుడు, యింకా ముందుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నప్పుడు మాడిసన్ వెళ్లి సాధించేదేమిటి అన్నది నా ప్రశ్న. ఇప్పుడు వెళ్ళకపోతే తరవాత repent అవుతావని ఆయన సూటిగానే చెప్పేశారు. చేరాకి మాడిసన్ అన్నా, విస్కాన్సిన్ యూనివర్సిటీ అన్నా ప్రత్యేకమైన ప్రేమ అని నాకు తెలుసు. 2007 లో కూడా నేను వొక గ్రాంట్ మీద ఇండియాలో వుండడమూ, అదే సమయంలో ఇండియా యూనివర్సిటీలలో వొకటి రెండు ఆఫర్లతో వూగిసలాడుతున్నప్పుడు కూడా ఇప్పటికి ఈ వుద్యోగాలు మంచి ఆకర్షణే కాని తరవాత నెమ్మదిగా అసంతృప్తి మొదలవుతుంది అని నీళ్ళు నమలకుండా నన్ను మళ్ళీ అమెరికా వేపు దాదాపూ నెట్టేశారు ఆయన.

మరీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే, హైదరాబాద్ లో వుండగా నేను మానసికంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో వున్నప్పుడు ఆ రెండు రకాలుగా కూడా వొక ఆత్మీయ స్నేహితుడిగానే ఆయన నన్ను ఆదుకున్నారు. ముందూ వెనకా ఏమీ ఆలోచించకుండా నా కోసం పరుగుపరుగున వచ్చారు. సాధారణంగా తెలుగు సాహిత్యలోకంలో ఇలాంటి ఆత్మీయతలు అరుదు.

వొక అక్షర స్నేహం కొన్ని సంవత్సరాల తరబడి కొనసాగినప్పుడు అందులో వ్యక్తిగతం, సాహిత్య గతం అని విభజన రేఖలు సాధ్యపడవు. స్నేహం ఎన్నాల్టిది అన్న ప్రశ్న కూడా వుండదు. కాని, ఏ ఇద్దరు వ్యక్తుల జీవితంలో అయినా ముప్ఫయ్యేళ్ళు అన్నది చాలా దీర్ఘ కాలమే! ముప్ఫయ్యేళ్ళలో ఎన్ని సంభాషణలూ, ఎన్ని కలయికలూ, ఎన్ని ప్రయాణాలూ! వాటన్నిటిని చెప్పుకుంటే పోతే సగం జీవిత చరిత్ర గడిచిపోతుంది.

5

 

2014: హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్, వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు.

హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్, వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు (ఫోటో: డాక్టర్ కే. రాందాస్)

వొక నిష్క్రమణ గురించి చెప్పడానికి ఎప్పుడూ మనసొప్పదు. భాషా వొప్పుకోదు. కవిత్వమూ రాదు. వచనంలోనా, ఆ వుద్వేగాలేమీ నిలవవు.

వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారు మనుషులు. ఈలోపు వాళ్ళు అత్మీయులవుతారే…అవుతూ అవుతూనో, మరీ దగ్గిరగా వచ్చి గుండెలో వొక చిన్ని అర కట్టుకొని, వొక వుదయాన చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారే…అక్కడ మొదలవుతుంది pain- ఈ pain అనేది చాలా చిన్న మాట అనిపించే పెద్ద వెలితి.

వున్నట్టుండి వొక మనిషి మన మధ్య నించి వెళ్ళిపోవడం అంటే చూస్తూండగానే అక్కడ ఆ మనిషి లేని జ్ఞాపకం పుట్టుకురావడం! కొన్ని మాటలు ఆగిపోవడం! మనకై విరిసే కొన్ని చిర్నవ్వుల కళ్ళలోంచి చూపుల మెరుపులు రాలిపోవడం!

అంతకంటే pain – అవన్నీ ఇప్పుడు వొట్టి కాగితాల మీద తప్ప కనిపించకపోవడం!

*

ఆరుద్ర రైలు కాస్త లేటుగా అందుకున్నా…

arudra1

       శ్రీ శ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు.

   మరీ లేత వయసులో– అంటే టీనేజీ అని నా ఉద్దేశం- శ్రీశ్రీని ప్రత్యక్షంగా కలిసి వున్న అనుభవం కూడా దీనికి కారణమయి వుంటుంది! అయితే, ఆంధ్రజ్యోతి లో చేరిన కొత్తలో మంచి వచనం రాయడం ఎలాగా అని తెగ మథనపడే రోజుల్లో శ్రీశ్రీ వచనం, మరీ ముఖ్యంగా శ్రీశ్రీ వ్యాసాలు, నాకు పెద్ద ఆకర్షణ. అలా శ్రీశ్రీని వొక కవిగా కంటే గొప్ప వచన రచయితగా సొంతంగా డిస్కవర్ చేస్తున్న కాలం అది. ‘నువ్వు నీలాగే రాయ్” అని నండూరి అనే వారు. అయినా, ఏదో తాపత్రయం!

అలాంటి 1986 రోజుల్లో ఒక తెల్లారుజామున బెజవాడ బందర్ రోడ్డులో వేంకటేశ్వర స్వామి వీధిలో వున్నమా వొంటరి గది – ఈ ఇరుకు గదిలో నేనూ, రుద్రాభట్ల కిషన్ చాలా ఏళ్ళు ఒకే మంచం ఒకే కంచంగా బతికాం. ఆ గది తలుపు తట్టారెవరో! తలుపు తీస్తే ఎదురుగా వొక అపరిచిత వ్యక్తి.

అతను నన్ను పరిచయం చేసుకొని, “సార్, ఆరుద్ర గారు కబురు చేశారు. ఇవాళ మీకు వీలు కుదిరితే రమ్మన్నారు.” అన్నాడు.

ఆరుద్రగారు వూళ్ళో వున్న సంగతి నాకు తెలుసు కానీ, నా పొగరు వల్ల (పొగరు అనే కంటే శ్రీ శ్రీ పట్ల వున్న ప్రేమలోని “విగరు” వల్ల అనుకోవచ్చు) ఆ విషయం నేను అంతగా పట్టించుకోలేదు.

“సరే, వస్తాను”

“ఇప్పుడు వెంటబెట్టుకొని రమ్మన్నారండి” అన్నాడతను కదలకుండా.

నేను అంత తేలికగా కదిలే ఘటం కాదని అతనికి తెలీదల్లే వుంది. అప్పట్లో నాదయిన ఒక చచ్చు/నచ్చు క్రమశిక్షణ నాకుండేది. పొద్దున లేవగానే బందరు రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్ పక్కన ఎప్పుడూ వొకే టిఫిన్ సెంటరులో ఎప్పుడూ అదే ఇడ్లీ వడ సాంబారు లాగించి, ఎప్పుడూ అదే దారిలో వున్న ప్రబోధ బుక్ సెంటరులో మధ్యాన్నం దాకా పుస్తకాలు చదువుతూ కూర్చోడం అప్పటి అలవాటు. (అప్పుడంతా మధ్యాన్నమో, రాత్రి డ్యూటీలో వుండేవి కనుక, పుస్తకం కొనడం అంటే నెల జీతంలో సగమో, మూడు వంతులో “ధార” పోయడమే కనుక, ఆ క్రైస్తవ దుకాణం నాకు మంచి ఆశ్రమం అయ్యింది). మూడు నాలుగు గంటల చదువు తరవాత, విశ్వేశ్వర రావు గారి మెస్ (అవును, ఇప్పటి ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వర రావే!) లో మధ్యాన్న భోజనం! బ్రహ్మాదులు వచ్చినా ఆ రొటీన్ మారేది కాదు.

‘నేనొస్తాను, మీరు పదండి” అని అతన్ని అప్పటికప్పుడు పంపించేసి, తరవాత నిదానంగా నేను నా డొక్కు ర్యాలే సైకిలెక్కి ఆరుద్ర దిగిన హోటల్ చేరుకున్నా.

వెళ్ళేసరికి ఆరుద్ర అప్పటికే రెడీగా వున్నారు, “రండి…మీరొస్తే కలిసి టిఫిన్ చెయ్యొచ్చని కూర్చున్నా” అంటూ కింద రెస్టారంట్ కి దారి తీశారు.

ఆరుద్ర గారు నాకంటే తాపీ మేస్త్రీ! చాలా తాపీగా పనులు చేసే మనిషిలా కనిపించారు మొదటి పరిచయంలోనే. ఆయన కదలికలూ, మాట తీరు చూసి, “మీరు కూడా తాపీ ధర్మారావు గారేనా?” అన్నాను సరదాగా. అసలు అంత నెమ్మదిగా వొక్కో వాక్యం తూచినట్టుగా మాట్లాడ్డం సాధ్యమా అని ప్రతిసారీ అనిపిస్తుంది ఆయన మాటలు వింటూ వుంటే!

దానికి ఆయన పెద్దగా నవ్వేసి, “అవును అందరం ఆ తాపీ తానులో గుడ్డలమే కదా!” అన్నారు, అదీ తాపీగానే! “నేనెక్కాల్సిన రైలు ఎప్పుడూ జీవిత కాలం లేటు” అని ఆయన ఎందుకు అంత అథారిటీగా అనగలిగారో అప్పుడే అర్ధమవడం మొదలయ్యింది.

“మీ గడ్డం ఇన్స్పిరేషను కూడా ఆయనేనా?”

“లేదు, లేదు. కేవలం నా బద్దకం వల్ల, తీరిక లేక, వదిలేశాను గడ్డం!” అన్నారాయన.

టిఫినీ కార్యక్రమాలు అయ్యాక, ఆయన నెమ్మదిగా విషయంలోకి వచ్చారు.

‘నేను ఒక సంకలనం పని మీద మీ కోసం కబురు చేశాను. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు నాకు అప్పజెప్పిన పని. వాళ్లకేమీ కాలం పట్టింపు లేదు. కానీ, నాకు వుంది. ఈ సంకలనంలో 1975 తరవాత కవిత్వం ఎక్కువ వుండాలి అనుకుంటున్నా.”

“అవును, 75 తరవాతే బాగుంటుంది. కనీసం అంతకు ముందు వచ్చిన కవిత్వం అంతా ఏదో వొక విధంగా సంకలనాలకి ఎక్కింది. పైగా, 75 తరవాత చాలా కొత్త తరం వచ్చింది.” అన్నాను నేను.

“ఇంకో మాట ఏమిటంటే, ఈ సంకలనం వచ్చేనాటికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కనీసం 75 ని ఒక కొండగుర్తుగా గుర్తిస్తే మనం సాహిత్యాన్ని చూసే దృష్టి మారుతుంది. కానీ, ఇటీవలి రాస్తున్న వాళ్ళ గురించి నాకు ఆట్టే తెలియదు. అక్కడ మీ సాయం కావాలి. మనం ఇద్దరం కూర్చొని వొక జాబితా తయారు చేసి, వాళ్లందరినీ కలిసి సంప్రదిద్దాం.” అన్నారాయన.

‘నండూరి గారు, శ్రీకాంత శర్మగారు ఇంతకు ముందు “మహా సంకల్పం” చేశారు. వారిని అడిగితే బాగుంటుందేమో?!’ అన్నాను నేను.

“వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళే మీ పేరు చెప్పారు.” అన్నారు ఆరుద్ర.

ఆ తరవాత చాలా సేపు మా చర్చ అప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళూ, వాళ్ళ కవిత్వాల చుట్టూ తిరిగింది. కానీ, చాలా సేపటి కబుర్ల తరవాత నాకు అర్ధం అయ్యిందేమిటంటే, సమకాలీన కవిత్వాన్ని ఆయన చాలా శ్రద్ధగా చదువుతున్నారని! నన్ను అడగడం కేవలం క్రాస్ చెక్ చేసుకోవడం కోసం మాత్రమేనని!

మేము అలా చర్చిస్తూ వుండగానే, అక్కడికి నండూరి, పురాణం గార్లు కూడా వచ్చారు. ఇక నేను నిష్క్రమించడం మంచిదని అనుకుంటూ, లేవడానికి ప్రయత్నిస్తూ, “నేను మళ్ళీ కలుస్తాను” అనబోతుండగా, నండూరి గారు “ఏం పర్లేదు, వుండవోయ్, కాసేపు!” అన్నారు.

Arudra

కానీ, ఆ కాసేపటి తరవాత ఆరుద్ర గారు “అఫ్సర్ గారూ, నేను వొక రెండు రోజులు ఈ చుట్టు పక్కల గుంటూరు, తెనాలి, బందరూ అన్నీ తిరిగి, కొత్త రచయితల్నీ, కవుల్ని కలుద్దామని అనుకుంటున్నా. మీరొస్తే బాగుంటుంది.” అన్నారు. నేను నండూరి గారి వైపు తిరిగాను, ప్రశ్నార్థకంగా.

“పరవా లేదు, వెళ్ళు. ఈ వారం సాహిత్య పేజీ ఇచ్చి వెళ్ళు, సరిపోతుంది” అన్నారాయన. ఆంధ్రజ్యోతి సాహిత్య వేదికని నిండు సాహిత్య పేజీగా మార్చిన కాలం అది. చాలా కొత్త శీర్షికల వల్ల సాహిత్య వేదిక అందరినీ ఆకట్టుకుంటున్న కాలం కూడా – రచనలు, లే ఔట్ విషయంలో ఇద్దరం చాలా శ్రద్ధ పెట్టేవాళ్లం. ప్రతి అక్షరం పట్టి పట్టి చదివే వాళ్ళం. కానీ, రచనల ఎంపిక విషయంలో నాకు పూర్తి స్వేచ్చ వుండేది. నేను వెంటనే ఆఫీస్ కి వెళ్ళి, ఆ సాయంత్రానికల్లా పేజీ ముస్తాబు చేసి, ఇచ్చి, హోటల్ కి వచ్చి, మళ్ళీ ఆరుద్రగారిని కలిశాను.

2

సాయంత్రం అయిదు గంటలకి మేము బెజవాడ నించి కారులో బయలు దేరాం. ఆ రెండు రోజుల ప్రయాణాలు నేను మరచిపోలేనివి. పూటకి ఒక ఊళ్ళో దిగడం, అక్కడి కవులూ, రచయితలతో మాట్లాడ్డం…! వెళ్ళిన వూళ్లలో కొద్ది సెపే వున్నాం కానీ, వొక వూరి నించి ఇంకో వూరికి ప్రయాణం మా ఇద్దరి మధ్య చాలా కబుర్లకూ, కథలకీ అవకాశం ఇచ్చింది.

ఆరుద్రని నేను నా చిరకాల స్థిర నిశ్చిత పూర్వ అభిప్రాయాల నించి కాకుండా, ప్రత్యక్షంగా చూడడం మంచిదే అయ్యింది. ఆరుద్రగారికి వున్న అనేక ఆసక్తుల్లో స్థల పురాణం వొకటి. దారిన కనిపించే ప్రతి వూరి కథా పురాణం ఆయనకి తెలిసినట్టే అనిపించింది, ఆయన చెబుతూ వుంటే! అలాగే, దాదాపు ప్రతి వూరు సాహిత్య చరిత్ర ఆయన కి కొట్టిన పిండి. అక్కడి రచయితలూ, వారి జీవన విశేషాలూ చెప్తూ వుంటే, ఇంత చరిత్ర దృష్టి వుండడం సాధ్యమా అని ఆశ్చర్యపోవడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు. ప్రాంతీయ, స్థానిక చరిత్రల గురించి ఇప్పుడు ఇంత కంఠ శోష పెట్టినా, అసలు ఆ చరిత్రల్ని తవ్వి తీయగల శక్తి మనకి వుందా అనిపిస్తోంది నాకు! అసలు మన జాతి (అది “ఆంధ్రా” అయినా, “తెలంగాణ” అయినా, “రాయలసీమ’ అయినా) సాంస్కృతిక చరిత్ర గురించి అంత దీక్షగా పనిచెయ్యగలిగే అంకిత భావం మనకుందా అని!

అవన్నీ పక్కన పెట్టి, మా మధ్య జరిగిన కొన్ని సాహిత్య కబుర్లు మాత్రమే ఇప్పుడు చెప్తాను.

శ్రీశ్రీ గురించి మొదలయిన కబుర్లు ఆరుద్ర తొలినాళ్ళ దాకా వెళ్ళాయి. నాలో చాలా కాలంగా నలుగుతున్న ప్రశ్నల్ని బయటికి రువ్వే అదను దొరికింది. “ఇదే అదను…” అనుకుంటూ వొక్కోకటీ నెమ్మదిగా సంధించడం మొదలెట్టాను. ఆయన తాపీగా సమాధానాలివ్వడం మొదలెట్టారు.

‘మొదట్లో మీరు డిటెక్టివ్ నవలలు రాశారు, అవి ఎందుకూ?”

“డిటెక్టివ్ నవలలే కాదు, ఇంకా చాలా రకాలు రాసి, ఒక విధంగా చెప్పాలంటే, పారేశాం. మీ శ్రీశ్రీ కూడా డిటెక్టివ్ నవలలూ, కథలూ రాశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మేం చేసిన పని ఏమిటో మీకు అర్థమవుతుంది. మేము అసలు పాఠకులు అంటూ కొత్తగా ఒక వర్గం తయారవుతున్న కాలంలో చేసిన రచనలు అవి. ఆధునికత వచ్చింది. పత్రికలు వస్తున్నాయి. అప్పుడప్పుడే కొత్త పాఠకులు తయారవుతున్నారు. ఎవరీ పాఠకులు? కాస్తో కూస్తో ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళే కాదు, తెలుగులో పత్రికలకు, రాత సాహిత్యానికీ అలవాటు పడుతున్న వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళు. ఇంకా కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించని కాలం అది. పాఠకుడికి వామపక్ష స్వభావమో, ఇంకోటో అంటూ ఏర్పడని కాలం అది. వాళ్ళకి చదివే ఆసక్తి పెంచడం వొక్కటే అప్పట్లో మా పని. దాని కోసం కొన్ని పనులు పని కట్టుకుని చేశాం. ఇంగ్లీషులో డిటెక్టివ్ కథలు వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి వుండి తీరాలి. ఇంగ్లీషులో స్కేచెస్ వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి మనం రాసి తీరాలి. ఇలా అన్న మాట! అందులో సాహిత్యం వుందా లేదా అన్నది అప్పట్లో ముఖ్యం కాదు. అవి కొత్త పాఠకుల చేత చదివిస్తున్నామా లేదా అన్నది మా తాపత్రయం. ఇవన్నీ దాదాపూ అనుకోని చేశాం మేం!”

నిజమే, అచ్చు సంస్కృతి అప్పుడప్పుడే విస్తరిస్తున్న కాలంలో వాళ్ళు పడ్డ కష్టాలేమిటో నిజంగానే ఇంకా మనకి తెలియదు, శ్రీ శ్రీ “అనంతం”లో, శ్రీపాద “అనుభవాలూ జ్నాపకాల”లో కొన్ని ఉదాహరణలు తప్ప –

కానీ, ఆరుద్ర ఆ డిటెక్టివ్ తరహా వచనంలోంచి సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం దాకా తెలుగు వచనాన్ని తీసుకువెళ్లడం చాలా పెద్ద మలుపు. అది కేవలం సాహిత్య చరిత్ర కాదనీ, మొత్తంగా సాంస్కృతిక చరిత్ర నిర్మాణమే అనీ నా అభిప్రాయం.

బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆరుద్ర సభ అఫ్సర్ అధ్యక్షతన...

బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆరుద్ర సభ అఫ్సర్ అధ్యక్షతన…

అనేక రకాల పనులు చేస్తూ కూడా సమగ్రాంధ్ర సాహిత్యం మీద పని చెయ్యడం ఎలా సాధ్యపడిందని అడిగాను. “ఏమీ లేదు. కొంచెం బండగా అంత కంటే మొండిగా కూర్చొని తెల్లారే లేచి రాయడం మొదలుపెట్టాను. లేకపోతే, ఎక్కడ అవుతుంది, ఆ సినిమాల గోలలో, నానా రకాల వ్యాపకాలలో? కానీ, అలాంటి పనుల్లో రాయడం కంటే కూడా పరిశోధనకి ఎక్కువ సమయం కావాలి. సరే, ఆ పుస్తకం నా జీవితకాలం రచన అనుకున్నాను కాబట్టి అదే కాస్తో కూస్తో మిగిలే రచన అనుకున్నాను కాబట్టి దీక్షగా రాశాను.” అన్నారు ఆరుద్ర. ఆ రచన పరిశోధనకి ఆయన పడిన కష్టాలు, అన్నిటికీ మించి కొన్ని నిర్ధారణలకు రావడానికి ఆయన పడిన సంఘర్షణని చక్కగా పూసగుచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు “పూసగుచ్చినట్టు” అంటే గుర్తొచ్చింది, ఆ మాట ఆరుద్ర మాట్లాడే శైలికి చక్కగా సరిపోతుంది నిజానికి.

సాంస్కృతిక చరిత్ర నాకు మొదటి నించీ చాలా ఆసక్తికరమయిన రంగం. ఆ విషయం మీద ఆయన ఆలోచనలూ, పరిశోధనా పద్ధతి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కొన్ని సంభాషణలు అటు తీసుకువెళ్లాను.

అప్పుడు ఆయన అన్న వొక మాట మా చర్చనీ వేరే దారి పట్టించింది . “మన చరిత్రలో విదేశీ చరిత్రల్లో మాదిరిగా సాంస్కృతిక చరిత్రని గాని, సాహిత్య కళా చరిత్రల్ని కానీ సామాజిక రాజకీయ చరిత్రల నుంచి విడిగా చూడడం సాధ్యం కాదు. ఉదాహరణకి ఇంగ్లీషులో రొమాంటిక్ ఉద్యమం వుందనుకోండి, అక్కడ మీరు వర్డ్స్ వర్తు, కీట్సు, షెల్లీని విడదీసి వాళ్ళ సాంస్కృతికతని చూడవచ్చు” అన్నారు.

ఠక్కున కౌంటర్లు ఇవ్వడం నాకు పుట్టుకతో అబ్బిన విద్య కాబట్టి, వెంటనే నేను దానికి కౌంటరు కొట్టేశాను.

“అది నిజం కాదేమో! ఏ సాంస్కృతిక చరిత్ర అయినా సమాజంతోనో, రాజకీయాలతోనో ముడిపడి వుంటుంది. వర్డ్స్ వర్తుని, కీట్సుని కూడా వాటికి విడిగా అధ్యయనం చేయలేం అనుకుంటా. వర్డ్స్ వర్తు చాలా స్పష్టంగానే తన రాజకీయాలు చెప్తాడు. కీట్సు చెప్పకపోవచ్చు, కానీ అలా చెప్పకపోవడం కూడా రాజకీయమే. కీట్సులోని నైరాశ్యానికి కేవలం అతని వ్యక్తిత్వమే కారణం కాదు, అతని చుట్టూ వున్న రాజకీయాలు, సమాజం సమానంగా కారణం” అన్నాను.

“ఆ…కావచ్చు. కానీ స్పష్టంగా చెప్పే రాజకీయాలకూ, చెప్పని రాజకీయాలకూ తేడా వుంటుంది” అన్నారాయన అంత తేలికగా నన్ను కాదనలేక, అవునని కూడా అనలేక.

“తెలుగు వాళ్ళం మనం షెల్లీని, కీట్సుని కొన్ని చరణాలుగా (stanzas) మాత్రమే చదువుతాం. ఆ మేరకే అర్ధం చేసుకుంటాం, అందుకే మనం మన కృష్ణ శాస్త్రి గారిని ఆంధ్రా షెల్లీ అని అమాయకంగా పేరు పెట్టుకున్నాం. నిజానికి కృష్ణ శాస్త్రి గారికీ, షెల్లీకి ఏ విషయంలోనూ పోలిక లేదు. షెల్లీకి వున్న స్పష్టత కృష్ణ శాస్త్రి గారికి లేదు, ఎందుకంటే, కృష్ణశాస్త్రి గారికి విషాదం అంటే అదేదో వేరే లోకం నుంచి ఉత్పత్తి అయిన వస్తువు.” అన్నాను నేను.

“ఇదేదో నాకు కొత్త సంగతి. కాస్త ఆలోచించనివ్వండి నన్ను- కృష్ణ శాస్త్రి గారి గురించి మీరు చెప్పింది నిజమే!” అన్నారాయన నేను వొక పట్టాన ఆ విషయం వదిలేట్టు లేదని అర్థమయినట్టుగా- “మీరు ఇంగ్లీషు కవిత్వమూ తెలుగు కవిత్వం మధ్య పోలికలు చూపిస్తూ మంచి వ్యాసాలు రాయాలి” అని ఆ పూట ఆయన మంచి సలహా ఇచ్చారు కానీ, అది మంచి సలహా కాబట్టి నేను వినలేదు!

ఆ ప్రయాణాల సందర్భంగా ఆరుద్ర గారు తన రాత క్రమశిక్షణ గురించి చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చాయి. అంత క్రమశిక్షణ శ్రీశ్రీ కి వుంటే ఎంత బాగుండేది అనుకున్నా. ఆ విషయమే ఆయన్ని అడిగా.

“శ్రీ శ్రీ యవ్వనంలో వున్నప్పుడు బాగా క్రమశిక్షణగానే వున్నాడు. అందుకే చూడండి, ఎన్ని అనువాదాలు చేశాడో! అతని వచనం చాలా గొప్పది. కానీ, వొక్క సారిగా ‘మహాకవి’ అన్న ముద్ర పడ్డాక అతను ఆ వచనం జోలికి వెళ్ళలేదు. ఎంతో శక్తి వుండి కూడా ఏమీ చేయకుండా వుండి పోయాడు. రాజకీయ పర్యటనలు అతని సమయాన్ని బాగా తిన్నాయనుకోండి. నాకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదని అనను గాని, అలా తిరగడం మీద ఆసక్తి లేదు. నేను ఏమన్నా తిరిగితే ఇదిగో ఇలా సాహిత్యం పనులు పెట్టుకొనే తిరుగుతాను”

నిజమే! కానీ, శ్రీశ్రీకి అలాంటి తిరుగుళ్ళు వుండబట్టే, కొత్త తరంలోనూ అతని కవిత్వం బతికింది. అది కాదనలేని సత్యం. శ్రీశ్రీ గురించి ఆయన ఇంకా చాలా వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడారు కానీ, వాటిలో సగం విషయాల మీద నాకు ఆసక్తి లేదు, అవి నిజమని కూడా నాకు నమ్మకం లేదు! కాబట్టి, ఇక్కడ చెప్పడమూ లేదు.

మొత్తం మీద ఈ ప్రయాణం తరవాత ఆరుద్ర వ్యక్తిత్వంలోని కొత్త కోణాలు నాకు చాలా దగ్గిరగా అర్థమయ్యాయి. ఆయన మీద అంత అయిష్టం వుండక్కరలేదు అని కూడా అర్థమయింది. అప్పటి నించి ఆరుద్ర రచనల్ని తిరిగి ఇంకో సారి చదవడం మొదలెట్టాను, ఈ సారి నాకు తెలిసిన వ్యక్తిత్వపు వెలుగులో!

చాలా ఆశ్చర్యంగా వుంటుంది. జీవితం ఎప్పుడూ వొక ప్లాట్ ఫారం లాగానో, రైలు ప్రయాణమో అనుకుంటే, కొన్ని సార్లు మనం ఎక్కాల్సిన రైళ్లు మనం చూస్తూండగానే వెళ్లిపోతాయి. వొక్కో సారి అదృష్టం బాగుంటే, మనం ఎక్కిన కోచ్ లోనే మనకి బాగా ఇష్టమయి ఎన్నాళ్లుగానో కలవాలని ఎదురుచూస్తున్న వ్యక్తిని కలవవచ్చు. కాస్త మాట్లాడుకునే అవకాశమూ దక్కవచ్చు.

ఆ రెండు రోజుల ప్రయాణాల తరవాత ఆరుద్ర అనే రైలు నేను కాస్త లేటుగా ఎక్కానని అనిపించింది. కానీ, అది జీవిత కాలం లేటు కానందుకు ఇప్పటికీ సంతోషంగా వుంటుంది.

ఆ తరవాత ఆయన కన్ను మూసినప్పుడు మా ఎడిటర్ యంవీయార్ శాస్త్రి గారు ఆంధ్రభూమిలో ఆయన్ని గురించి ప్రత్యేక సంపాదకీయం రాయించారు. అది ఆరుద్రగారికి నేనిచ్చిన చివరి అక్షర నివాళి.

(‘ఆవకాయ’ వెబ్ పత్రిక సౌజన్యంతో- ఆగస్టు 31 ఆరుద్ర పుట్టిన రోజు కోసం )

రచనలో వినిపించే స్వరం ఎవరిది?!

 10565093_10152677529194683_7972848941163645770_n

పసునూరు రవీందర్ కథలు చదువుతున్న సమయంలోనే యింకో వేపు సమకాలీన అమెరికన్ కథ మీద జరుగుతున్న వొక చర్చ నన్ను అమితంగా ఆకట్టుకుంది – రవీందర్ తన కథల్లో సాగిస్తున్న అన్వేషణకీ, ఈ చర్చకి చాలా దగ్గరి చుట్టరికం వుందికాబట్టి. ఈ చర్చలోంచి మూడు విషయాలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాలి:

ఒకటి – వొక సమకాలీన సందర్భం లేదా సంఘటన అది ఇంకా జరుగుతూ వుండగానే దాన్ని కథ చేయగలమా? అంటే- ఇంకో రకంగా చెప్పాలంటే, జీవితంలోని immediacy (తక్షణికత)ని కథా లక్షణంగా మార్చగలమా?

రెండు: కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు?

మూడు: భిన్నకులాలూ మతాలూ వున్న సమూహాల్లో భిన్నస్వరాలు ఎలాంటి ప్రాతినిధ్యాన్ని (representation) కోరుకుంటాయి?

రవీందర్ కథల్లో ఈ మూడు విషయాలూ వొక బలమైన వాదాన్ని వినిపిస్తాయి. రవీందర్ తన కథల్ని “తెలంగాణా దళిత కథలు” అంటున్నాడు. ఆ విధంగా తన కథల్ని భిన్నంగా చదవడానికి తనే వొక తలుపు తీసి మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు.

అయితే, అలాంటి వొక “తెలంగాణా దళిత” తలుపు తెరచి, తన చదువరిని ఆ తలుపులోంచే తనని చదివి తీరాలని అతనేమీ మంకు పట్టు పట్టడం లేదు. నేను చదివినంత వరకూ, నాకు అర్థమైనంత వరకూ కథని discourse గా మార్చి, ఆ కథలోంచి వొక చర్చని సహనంతో తీసుకువచ్చి, అంతే సహనంతో మిగిలిన గొంతులు వినడానికి కూడా సిద్ధంగా వుండే కొద్దిమంది రచయితల్లో రవీందర్ వొకడని కచ్చితంగా చెప్పగలను.

అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సంపుటిలో కథకుడిగా రవీందర్ మనం తెలిసీ తెలిసీ దాచిపెట్టే కొన్ని కీలకమైన విషయాలను uncover చేస్తున్నాడు.

Uncover అనే మాటని నేను “to allow (something) to be seen by removing a covering” అనే కచ్చితమైన అర్థంలో వాడుతున్నాను, ఎందుకంటే రవీందర్ ఈ సంపుటికి ఇచ్చిన శీర్షిక ద్వారానే కాకుండా, పుస్తకం లోపలి కథల్లో కూడా ఖాయంగా చేస్తున్న పనే అదే కాబట్టి! ఈ uncovering కీ, పైన ప్రస్తావించిన మూడు విషయాలకూ –immediacy, authorial voice, representation కీ చుట్టరికం వుంది. రవీందర్ కథల్లో ఇతరేతర అంశాలు చాలా వున్నప్పటికీ, అతను అతనుగా ఈ కథల్లో అచ్చంగా ఏం చేస్తున్నాడో చెప్పడం మాత్రమే యిక్కడ నా ప్రయత్నం.

1

ఇప్పటికి అరవయ్యేడు ఏళ్ల కిందట అమెరికా కథానిక వొక రూపాన్ని వెతుక్కుంటున్న సమయంలో Martha Foley అనే విమర్శకురాలు ఇలా రాసింది : It is a literary truism that there must be a period of distillation before the real impact of some tremendous event, either historical or personal, can emerge in writing.

ఆమె ప్రధానంగా కథలో సమకాలీనత గురించి మాట్లాడుతోంది. వొక సంఘటన జరిగిన వెంటనే లేదా, వొక సందర్భం కొనసాగుతూ వుండగానో దాన్ని కథగా మలచలేమన్నది ఆమె వాదం. కొంత కాలం గడిస్తే తప్ప ఆ సంఘటనా, సందర్భం నిజమైన ప్రభావం ఏమిటో తెలీదనీ, అది తెలిస్తే గాని దాన్ని కథగా మలచలేమనీ ఆమె అభిప్రాయం. అంటే, ఆ అనుభవం పక్వమయ్యే దాకా ఎదురుచూడాలని ఆమె అనేది.

ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచనాలు చెప్పినా, కవిత్వం ఉద్వేగ కళ. వొక వుద్వేగాన్ని వ్యక్తీకరించగలిగితే కవిత్వం పని చాలా మటుకు అయిపోయినట్టే. దానికి భిన్నంగా కథ అనేది ప్రధానంగా ఆలోచనకి సంబంధించిన ప్రక్రియ. కేవలం వుద్వేగానికే పరిమితమయిపోతానంటే ఆ కథని అంత తేలికగా వొప్పుకోలేం. అనుభవ సారం ఎంతో కొంత కథలో ఇమడాలి. కథ చదివాక కొంత నిగ్రహమైన ఆలోచనని కూడా చదువరి కోరుకుంటాడు. ఆ మేరకు Martha Foley వాదంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. కాని, అది కొంత మాత్రమే!

కాని, 9/11 తరవాత వచ్చిన అమెరికన్ కథకులూ, విమర్శకులూ ఈ వాదాన్ని పడనివ్వడం లేదు. వొక ఏదో సందర్భంలో శ్రీశ్రీ అన్నారట: దినదినాభివృద్ది కాదు, క్షణ క్షణాభివృద్ది కోరుకుంటున్నానని! అభివృద్ధి వేగాన్ని క్షణాలతో కొలుస్తున్న కాలం ఇది. ముఖ్యంగా సాంకేతిక విప్లవం వచ్చాక ప్రపంచం చాలా మారిపోయింది. భౌతిక సాంకేతికత, వ్యక్తి మానసికతా రెండూ వొక విధమైన అంతుపట్టని యుద్ధంలో కూరుకుపోతున్న దశ ఇది. ఈ రెండీటికి మధ్యా వుండే దూరాన్ని ఇప్పుడిప్పుడే తెలుగు కథా రచయితలు పట్టించుకుంటున్నారు. కథల్లో అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలూ, సోషల్ మీడియా నెట్ వర్కుల ప్రస్తావనా, వాటి పర్యవసానాలూ కథల్లోకి అనివార్యంగా ప్రవేశిస్తున్నాయి. అంటే, గ్లోబలైజేషన్ కి సంబంధించి రెండో దశలోకి తెలుగుకథ ప్రవేశించిందనే చెప్పాలి. రవీందర్ ఈ కథా సంపుటికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని పేరు పెట్టడం ఈ దశకి బలమైన సంకేతం. అలా పేరు పెట్టడం ద్వారా జీవితంలోని immediacy (తక్షణికత)ని తన కథా లక్షణంగా చెప్పక చెప్తున్నాడు రవీందర్.

రవీందర్ వ్యక్తీకరణలో ఈ తక్షణికత ఎలాంటి కథలుగా మారుతోంది? కాలానికి అతీతమైన నిర్జీవ విషయాల్నితన కథకి వస్తువుగా ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోలేడు రవీందర్. తన కాలంలో తన స్థలంలో నిలబడి మాట్లాడడం అతని కథకి జీవలక్షణం. ఈ సంపుటిలోని మొదటి కథ –వెరేవర్ యు గో -అనే కథలోనే రవీందర్ ఈ లక్షణానికి నాంది పలుకుతాడు. ఇప్పటికీ మనలోని కొంత మంది “లౌకికులు” మనకే కులాలూ మతాలూ ప్రాంతాలూ లేవని వొక అమూర్త మానవ ముఖాన్ని(abstract human face) తొడుక్కొని వుంటారు. వాళ్ళు తొడుక్కుంటే పర్లేదు కాని, ఇతరులు కూడా అలాంటిదేదో ముసుగు తొడుక్కోకపోతే అనుమానంగా చూస్తారు. కాని, కులాలూ మతాలూ ప్రాంతాలూ ఇంకా ఇంకా బలంగా మన ఉనికిని నిర్ణయిస్తూనే వున్నాయని, అవి వేరే రూపం దాల్చి మన మధ్యనే   వున్నాయని గుర్తించడానికి నిరాకరిస్తారు. ఇది తెలిసీ తెలిసీ నిరాకరించడం! “ఎహె గీ కాలంల …క్యాస్ట్ గీస్ట్ ఎక్కడిది సార్?!” అనే పెద్దమనిషి తరహా ముసుగు uncover చేసే కథ ఇది.

రవీందర్ కథల్లో చాలా మటుకు కులం ముఖ్యమైన విషయంగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు. పది నిజాల కంటే వొక అబద్దం ఎక్కువ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. పైగా, ఆ అబద్ధం ఆ పది నిజాల్ని కప్పిపుచ్చేది అయితే కోపం ఇంకా కట్టలు తెచ్చుకుంటుంది. రవీందర్ కథల్లో ఈ సామాజిక అధర్మం మీద ధర్మాగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, వొక్కో కథనీ దగ్గిరగా చదువుకుంటూ వెళ్తే, అతనిలో కేవలం కోపం మాత్రమే లేదనీ, ఆ కోపాన్ని నిగ్రహించుకొని మాట్లాడే శక్తి కూడా చాలానే ఉందనీ అర్థమవుతుంది. ఆ నిగ్రహం తన చుట్టూ వున్న అధర్మాన్ని ఆలోచనతో చూడడం వల్ల సాధ్యపడిందనీ అర్థమవుతుంది. ఉదాహరణకు: గోవర్ణం కథ. మొదటి సారి ఈ కథ చదివినప్పుడు ఇందులోని కథాంశాన్ని నేను నమ్మలేకపోయాను. అంటే, నాగరికుల మీద నాకూ కొన్ని భ్రమలున్నాయని, ఆ భ్రమ వల్లనే ఈ కథని నేను మొదట నమ్మలేకపోయాననీ తరవాత నన్ను నేను తర్కించుకుంటే అర్థమైంది. ఈ కథలోని విషయం నా కవరేజీ పరిధిలో లేకపోవడం కూడా ఇంకో కారణం కావచ్చు.

రవీందర్ కథలు ఎలాంటి కనువిప్పు కలిగిస్తాయో అదొక ఉదాహరణ మాత్రమే. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలో వొక పాత్ర చేత అనిపిస్తాడు రవీందర్. “పట్నంల కూడా కులముంటదే. కాకుంటే బయిటికి కనిపించకుంట దాని పని అది చేస్తుంటది. దానితో దెబ్బతిన్నోల్లకే అది కనిపిస్తది దాన్ని పాటిస్తూ, ఆదిపత్యం చెలాయించే పెద్దకులపోళ్ళకి అది లేనట్టుగా భ్రమింప జేస్తది. గందుకే, ఇగ బాధపదేటోళ్ళు బాధపడుతుంటే, బాధపెడ్తున్నోల్లు మాత్రం కులమెక్కడిదని నీతులు చెబ్తుంటరే!” ఇది వొక పాత్రలోంచి రవీందర్ ఆవేదన, ఆగ్రహం!

సమకాలీనం అన్న మాటని తెలుగు సాహిత్యంలో చాలా అన్యాయంగా వాడేస్తున్నారు. నిజానికి సమకాలీనం అనదగ్గ రచనలు చాలా తక్కువగా వస్తున్నాయి. రచయితలు వొక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని, అదే సమకాలీనం అనుకుంటూ ఆ లోకంలోనే అందరూ ఉండాలన్న అందంగా నిర్మిస్తున్న కాలం ఇది. ముఖ్యంగా చాలా మంది కథకులకు (ఇక కవుల సంగతి చెప్పక్కరలేదు!) సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకునే శక్తి లేదు. వాళ్ళ చదువూ అవగాహనా అందుకు సరిపోవడం లేదన్నది నా అభిప్రాయం. తమ చుట్టూ వున్న లోకం రాజకీయ అతీతంగా, పరిశుద్ధంగా ఉండాలన్న భ్రమ ఇంకా చాలా మందిలో వుంది. కార్పోరేట్ జమానాలో కులాలు లేవనడం ఎంత అబద్దమో దానికి పది రెట్లు అబద్దం ఈ రాజకీయాతీత కలవరింత. అయితే, రాజకీయ లోకంలో ఇంకా వేరే భ్రమలు కొన్ని వున్నాయి. అలాంటి భ్రమల నిలువుటద్దం ఊగి..ఊగి ఉయ్యాల కథ.

రవీందర్ కథలు అచ్చంగా సమకాలీన కథలు- నాకు అర్థమైనంత వరకూ ఆ సమకాలీనత ఎంత సమకాలీనం అంటే అవి ఈ క్షణపు వేగాన్ని అందుకుంటున్న కథలు. ప్రతి కథలోనూ వొక పట్టి పీడిస్తున్న ఇప్పటి సమస్యా, దాని ఆనుపానులు తెలుసుకోవాలనుకునే తపనా, అన్నిటికీ మించి రవీందర్ పరాయీ స్వరాల మీద ఆధారపడకుండా తన గొంతుకతో మాట్లాడాలన్న వెతుకులాటా ఈ కథల లక్షణం.

ఈ కథల్లోంచి రవీందర్ స్వరాన్ని ఎలా వినాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు? అన్న రెండో విషయానికి వద్దాం.

1545666_10152155164074683_826845966_n

 

2

 

“What do you have to say?”

“This. I have this to say, and I want you to listen to my voice, to the tone of my voice, because that will tell you what I have to say.”

–          Elizabeth Strout, 2013.

కథలో గానీ కథనంలోగానీ రచయిత కనిపించకూడదనీ, రచయిత స్వరం వినిపించకూడదనీ చాలా కాలంగా వొక సాహిత్య సౌందర్య భ్రాంతిని మనం నమ్ముతూ వచ్చాం; ఇప్పటికీ నమ్ముతున్నాం. అలాంటి స్వరాన్ని సవరించుకునే నెపం మీద చాలా మంది కథకులు సాహిత్యంలో సమకాలీన లేదా తక్షణ వాస్తవికతని వాయిదా వేస్తూ వెళ్తారు. ఆ అనుభవం పరిపక్వమైన తరవాతనే మాట్లాడుకుందామనుకునే ధోరణి తక్షణ జీవితాన్ని గురించి ఏమీ అనలేని స్థితికి రచయితని నెట్టేస్తుంది. అంటే, తక్షణ జీవితం మొత్తంగానే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయిపోతుంది మన సాహిత్యంలో!

అస్తిత్వవాద రచనల్లో రచయిత స్వరం మీద ఎలాంటి కట్టుబాట్లూ లేవు. ఇలాంటి రచనల్లో సౌందర్యం కేవలం రూపపరమైన పరిమితుల్లో మాత్రమే వుండిపోదు. రచయిత చెప్పదలచుకున్న విషయమూ దాని సూటిదనం కూడా రచనా సౌందర్యంలో విడదీయలేని భాగమవుతాయి. ఫలానా విషయం కచ్చితంగా మాట్లాడి తీరాలన్న అస్తిత్వ కట్టుబాటు రచనని నడిపిస్తుంది. అయితే, ఆ “ఫలానా” రచయితని బలహీనపరచవచ్చు కూడా- అంటే, వొక విధంగా కథన సౌందర్యం పట్ల ప్రత్యేక దృష్టి వున్న రచయిత కంటే, అస్తిత్వవాద రచయితకి శిల్పం ఎక్కువ కత్తి మీద సాము అవుతుంది, తన స్వరం బలహీనపడకుండా కథనం కుంటుపడకుండా చదువరిని వొకే దృక్కోణంలో ఖైదు చేయకుండా కథ నడిపించాలి కాబట్టి!

రవీందర్ కథనంలో ఇలాంటి సందిగ్ధం కనిపించదు. ఏం చెప్పాలో అతనికి కచ్చితంగా తెలుసు. అంతకంటే ముఖ్యంగా ఎలా చెప్పాలో కూడా తెలుసు. ఉదాహరణకు పెంజీకటి కథ. జీవితంలోని కొన్ని అనుభవాల్ని వొక మహాకావ్యం లేదా మహానవల (శ్రీశ్రీ, రావిశాస్త్రిలు వాడిన అర్థంలోనే) గా వ్యక్తం చేయాలన్న సృజనాత్మక కోరిక మనవాళ్ళలో కొత్త కాదు. కాని, అవి రెండూ సైజుకి సంబంధించిన అంశాలు అనుకున్నప్పుడే సమస్య. సాహిత్య రూపం అనే భావన స్వభావం మారింది అనుకోడానికి సిద్ధంగా వుంటే, చిన్న కవిత చిన్న కథ కూడా వొక మహాకావ్యం, మహానవల చేయగలిగే పని చేస్తుంది. శ్రీశ్రీ ‘ఆహా” కవిత నా దృష్టిలోమహాకావ్యమే, అలాగే, రావిశాస్త్రి ‘పిపీలికం’ మహానవలే! రవీందర్ కథ పెంజీకటి ఇక్కడ అచ్చులో కొన్ని పేజీలే కాని, ఆ కథ ఆవిష్కరించే జీవితం వొక మహానవల పరిమాణంలో వుంది.

ఈ కథని ఊహించడంలో రవీందర్ వెళ్ళిన దూరాలు నాకు ఆసక్తి కలిగించాయి. ఈ కథారూపంలో నాటకానికి సంబంధించిన నిర్మాణ అంశాల్ని చాలా సహజంగా, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. అంతకంటే ఎక్కువగా వొక నవలకి కావలసిన జీవితపు ముడిసరుకు తీసుకొని, దాన్ని కొన్ని పేజీల కథలోకి కుదించడం రవీందర్ శిల్ప విజయం.

అయితే, రవీందర్ కథనస్వరానికి వున్న నిర్దిష్టత వల్లనే ఇది సాధ్యపడిందని నా నమ్మకం. కథావస్తువుని objective గా తీసుకొని, అందులో subjective tone ని కాపాడుకుంటూ వెళ్ళడం ద్వారా రవీందర్ ఈ కథల్లో శిల్పపరంగా కనీసం రెండు మూడు అడుగులు అదనంగా నడుచుకుంటూ వెళ్ళాడని నేను అనుకున్నా. ఈ నడవడంలో అతనిలో వున్న కథకుడు వొక కొత్త ఆత్మవిశ్వాసంతో మెరవడం కూడా నేను చూస్తున్నా.

సాహిత్య వాతావరణం ఆసక్తికరంగా కనిపిస్తున్నప్పటికీ- రచయిత వ్యక్తిగత స్థాయిలో ఎంతో కొంత నిరాశలోకీ, దిగులులోకి నెట్టివేయబడుతున్న కాలం కాని కాలంలో ఆ రచయితస్వరంలో, నడకలో ఈ ఆత్మవిశ్వాసం ఎటు నించి వస్తుంది?

నాకు తెలిసీ అది ఆ రచయిత తనని తాను ధీమాగా ధిక్కారంగా అలాగే కొంచెం open గా తెరుచుకునే representative vision (ప్రాతినిధ్యపు దృష్టి) నించి వస్తుంది. అస్తిత్వ వాద రచయిత ఇతర బహుముఖాలకి ఎంత open గా వుండగలడు? అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది.

 

3

రవీందర్ కథలు రాస్తున్న ప్రస్తుత దశలో కేవలం తెలంగాణా కథలే కాదు, దళిత కథలే కాదు. ఇతర అస్తిత్వాల రచనలూ వస్తున్నాయి. కాని, ఈ కథలకి రవీందర్ “తెలంగాణా దళిత కథలు” అని ఉపశీర్షిక పెట్టుకున్నాడు. అలా బహిరంగంగా తన అస్తిత్వం ప్రకటించుకోవడంలో వొక సౌకర్యమూ అసౌకర్యమూ వున్నాయి. ఆ అస్తిత్వ కోణం నించి మాత్రమే తనని చూడాలన్న కట్టడి అతను చదువరికి పెడ్తున్నాడా? పెడితే, అప్పుడు చదువరి కోరుకునే స్వేచ్చ ఏమవుతుంది?

ముఖ్యంగా సాహిత్య రంగంలో అన్ని వేపులా చదువరి వొక open-endedness ని కోరుకుంటున్న కాలం ఇది. అదే సమయంలో అనేక రకాల ప్రాతినిధ్యాలు రచనలలోకి వస్తున్నాయి. రవీందర్ కథల్ని నేను రవీందర్ చెప్పిన “తెలంగాణా దళిత” కోణం నించి మాత్రమే కాదు, వాటిని నా వైపు నించి – అంటే నాకు వుండే భిన్న అస్తిత్వాల – నించి కూడా చదువుతాను. నా reading ని రవీందర్ కట్టడి చేయలేడు, చేయాలనే వుద్దేశం కూడా అతనికి వుండకపోవచ్చు. కాని, వొక చదువరిగా నేను నా ప్రపంచంలోకి రవీందర్ ని ఎలా పిలుచుకోవాలి?

The other – అన్యత్వం- అన్న భావన ఇప్పుడు సాహిత్య రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ పెద్ద సమస్యే. ఎందుకంటే, సమాజంలోని representations తప్పనిసరిగా సాహిత్యంలోకి వస్తాయి కాబట్టి-

If literature is a “representation of life,” then representation is exactly the place where “life” in all its social and subjective complexity, gets into the literary work. (W.J.T. Mitchell)

ఈ విషయాన్ని ఎలాంటి సంశయాలూ లేకుండా వొప్పుకుంటాను కాబట్టి, రవీందర్ open చేసే “social and subjective complexities” నాకు కావాలి. అయితే, చదువరిగా నాకు వుండే అవే complexities తోనే నేనూ రవీందర్ ప్రపంచంలోకి వెళ్ళాలి. “తెలంగాణా” “దళిత” అన్నప్పుడు రవీందర్ నాకు వొక doubly oppressed identity కేంద్రంగా పనిచేసే ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాడు. అంటే, రెండు ప్రాతినిధ్యాల మధ్యకు తీసుకు వెళ్తున్నాడు. అవి రెండూ కాని నాదైన ప్రాతినిధ్య భూమికతో నేను ఈ కథల్లోకి వెళ్ళాలి. అంటే, మా ఇద్దరి మధ్య వొక dialogic space తెరుచుకోవాలన్నమాట.

మన సాహిత్యంలో ఇలాంటి dialogic space కి ఇంకా అనువైన కాలం రాలేదు. తన సానుకూల క్షేత్రం (comfort zone) నించి విడివడి ఇతర spaces లోకి వెళ్ళే మానసిక సంసిద్ధత లేదా స్వాతంత్రం ఇంకా రాలేదు మనలో చాలా మందికి – అలాంటి మానసిక స్వాతంత్రం లేనప్పుడు రవీందర్ గాని ఇంకో రచయిత కాని, తను ఫలానా అని కచ్చితంగా చెప్పుకున్నప్పుడు అది మొదట్లో చాలా అసౌకర్యంగా, uneasy గా వుంటుంది. కాని, అలా వుండడమే మంచిది. ఆ తరవాతి సంభాషణ హాయిగా వుంటుంది. నా భిన్నమైన అస్తిత్వ కోణం నించి నేను రవీందర్ “తెలంగాణా” “దళిత” కథలు చదువుతున్నప్పుడు యీ కథల్లోని జీవితం, వాతావరణం, పాత్రలు, సంఘర్షణలూ, ఉద్యమాలూ, ఆశలూ నిస్పృహలూ నాకు తెలిసిన లోకంలో నా కవరేజ్ ఏరియాలో లేని సంగతుల్ని, లేదా నేను కవర్ చేయడానికి ఇష్టపడని/ నిరాకరించే విషయాల్నీ రవీందర్ నాకు “ఇదీ” అని pointed గా చూపిస్తున్నాడు. సాహిత్యంలో తన representation గురించి resolute concerns వున్న బుద్ధిజీవి అయిన రచయిత మాత్రమే ఇలాంటి concern తో మనల్ని పలకరిస్తాడు. అయితే, నేను ఇక్కడ resolute అని దాన్ని qualify చేయడాన్ని మీరు గమనించాలి.

రవీందర్ కి తెలంగాణా దళిత వాదం అతని రచనా జీవన విధానం. అతని అనేక సామాజిక సాంస్కృతిక సాహిత్య అంశాలు దాని చుట్టూ తిరుగుతాయి. దాన్నించి అతన్ని విడిగా చూడలేనట్టే, అతని imaginative realm ని కూడా వొక వేరే ద్వీపంగా ఊహించలేం. అదే realmలో వుంటూ వొక కథకుడిగా రవీందర్ చాలా జీవితాన్ని ఈ కథల్లో కవర్ చేస్తున్నాడు. దాన్ని నేను resolute concern అని అంటున్నా. అస్తిత్వవాదం విధించే కనిపించని సంకెలని గౌరవిస్తూనే, జీవితంలోని ఇతర ప్రాతినిధ్య అంశాలని సృజనాత్మకంగా అక్కున చేర్చుకోవడంలో రవీందర్ మూలతత్వం అర్థమవుతుంది. బహుశా, ఆ కారణంగానే రవీందర్ ఆవిష్కరిస్తున్న తెలంగాణా దళిత దృశ్యం ఇక్కడ నిండు కాన్వాస్ మీద convincing గా కనిపిస్తుంది. అయితే, ఇంకాస్త ముందుకు వెళ్లి, రవీందర్ కథలు కేవలం “తెలంగాణా దళిత” కథలు కావనీ, “తెలంగాణా దళిత రాజకీయ” కథలనీ చెప్పడం అతని కథాతత్వానికి అతికినట్టు సరిపోతుంది. అస్తిత్వవాద రాజకీయ కోణం అనేది తెలుగు సాహిత్యంలో ఇంకా సరిగా ఆవిష్కారం కావడం లేదన్నది నిజం. ఎందుకంటే, ఆ విషయాన్ని సవిమర్శతో చూసే సంయమనం ఇంకా మనకి రాలేదు. వాదాలని ఉద్వేగ దశలోనే కాకుండా, వాటి తరవాతి ఆలోచనాత్మక దశని కూడా చూడగలిగే వోర్పు వున్నప్పుడు మాత్రమే రచయితకి రాజకీయ విమర్శ సాధ్యపడుతుంది. “పొద్దయింది” “ఊగి ఊగి ఉయ్యాల..” “అన్నీ తానై..”లాంటి కథల్లో ఈ కోణాన్ని చూడవచ్చు. ఉద్విగ్న రాజకీయ సన్నివేశంలో బతుకుతూ కూడా, రచయితగా ఎలాంటి objectivity ని వ్యక్తం చేయవచ్చో రవీందర్ ఇక్కడ రుజువు చేస్తున్నాడు.

4

నాలుగు ముక్కల్లో ఏ రచన గురించి అయినా ఎంత న్యాయం చేయగలమో ఇంకా నాకు అపనమ్మకమే. మన దగ్గిర వున్న విమర్శ సాధనాలు చాలా చాలా కొద్ది. మన ముందు వున్న జీవితాలు సంక్లిష్టంగా వున్నప్పుడు, కథకులు ఆ సంక్లిష్టతని అందుకొని దానికి తగిన కాన్వాస్ కోసం వెతుక్కునే తపనలో వున్నపుడు, విమర్శ స్థాయిలో మాట్లాడేది అంత తృప్తినివ్వదు. అందుకే, చదువరికి తన spaceలో తను సంచరించే స్వేచ్చనిచ్చే రచనని, విమర్శని నేను ఇష్టపడ్తాను. అలాగే, రచయిత తనకి తానుగా ఇచ్చే స్వేచ్ఛ కూడా నాకు ఇష్టం. రవీందర్ కూడా అలాంటి స్వేచ్చని ఇష్టపడే తాత్వికుడు. ఈ కథల్లో నాకు కొన్ని వర్ణనలు నాకు అసంతృప్తి కలిగించిన మాట వాస్తవం. ఉదాహరణకు : “జాగీరు” కథలో “మా ఇద్దరి మధ్య స్నేహ కుసుమాలు విరబూశాయి.” లాంటి వాక్యాలు చాలా archaic గా అనిపించాయి. ఈ కథల్లో సాధారణంగా కనిపించే రవీందర్ వాక్యాలకు పూర్తి వ్యతిరేకమైన వర్ణనా శైలి అది. అది శైలిని మరింత కమ్ముకోకుండానే వాటికి దూరంగా వుండి రాయాలసిన అవసరం ఇప్పటి రచయితలకి వుంది.

ఆ వొక్క చిన్న లోపం మినహాయించి రవీందర్ కథాభాష చాలా హాయిగా వుంటుంది, కొత్త భాషని నిజమయిన యాసని కథలోకి అద్భుతంగా తీసుకువచ్చాడు రవీందర్. అతను తీసుకువస్తున్న paradigm shift కి ఈ భాషతో సహా అతని వస్తువూ, సంవిధానమూ, కథాకథనమూ బాగా వొదిగాయి. తెలంగాణా దళిత జీవితాల్లో balanced diet పెద్ద కల. కాని, తెలంగాణా దళిత కథల్లో ఆ balanced diet కలగా మిగలకూడదన్న మొండి పట్టుదల రవీందర్ లో కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇలాంటి కథా ధోరణికి చాలా అవసరం.

–          అఫ్సర్

జులై 5, 2014.

 

 

 

 

 

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

10419479_10204326595991984_5763381120454654266_n

15న  పులికొండ సుబ్బాచారి “బాడిశ మొక్కబోయింది” ఆవిష్కరణ సభ

సుబ్బాచారి కవిత్వ సంపుటి కి అఫ్సర్ రాసిన ముందు మాట ఇది.

1

మొదలెట్టడం ఎప్పుడూ సమస్యే.. సుబ్బాచారి గురించి ఎక్కడ మొదలెట్టాలి?! నాకు ఇంకా కవిత్వం గాలి సోకని కాలంలో పుస్తకాల పురుగునై లైబ్రరీల మధ్యా, మనుషుల మధ్యా దాహార్తినై సంచరిస్తున్న  తొలి యౌవనకాలంలో తొలినాటి ఖమ్మం సాహిత్య మిత్రబృందంలో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వాడు సుబ్బాచారి. మా బంధం కవిత్వంతోనే మొదలైందో, సుబ్బాచారి కష్టజీవితం పట్ల నాకున్న ఇష్టంతో మొదలయిందో చెప్పడం కష్టం.

కాని, ఆ రోజుల్లో సుబ్బాచారిని చూడడం వొక ఆనందం. వొక ఉత్సాహం. వొక స్ఫూర్తి. తరవాతనే మొదలయింది మా సాహిత్య బంధం! ఇప్పటికీ మరచిపోలేని గుర్తులు ఖమ్మం రికాబ్ బజార్ స్కూలు వెనక కూర్చొని మేం అల్లుకున్న కవిత్వ కబుర్లు. వూరికి ఇంకో దిక్కున ప్రభాత్ టాకీస్ ఎదుట మా కోసమే అన్నట్టుండే వొక శిధిలమైన బెంచీ మీద రైళ్ళ రాకపోకల్ని గమనిస్తూ కలబోసుకున్న ఇంకేవో కబుర్లు. తిలక్ అన్నట్టు- “ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విషాదమో, విషాదం లాంటి ఆనందమో!” కాని, ఆనందమే ఎక్కువ అని చెప్పగలను.

సుబ్బాచారి క్రమంగా సుబ్బన్న అయిపోయాడు. అక్షరాలకు మించిన ఆ ఆత్మీయతే ఇవాళ తనని గురించి ఈ నాలుగు మాటలూ రాయాలని ఉత్సాహపెడుతోంది.

అవును, రాయాలి…శ్రమ సౌందర్యంలోంచి జీవితాన్ని నెగ్గుకు వచ్చిన సుబ్బన్న గురించి, పరిశోధన కోసమే జీవితాన్నీ, చాలా కాలం వరకూ కవిత్వాన్ని కూడా త్యాగం చేసిన సుబ్బన్న గురించి, కాలం కాని కాలంలో జీవితంలో అసలైన విలువల వెంట అమాయకంగా అదే అంకిత భావనతో సూటిగా వెళ్ళిపోతున్న సుబ్బన్న గురించి రాయాలి!

మొన్నా, నిన్నా సుబ్బన్న కవిత్వం చదువుతూ ఏమన్నా రాద్దామని కూర్చున్న వేళలోనే మార్క్వెజ్ మరణ వార్త నన్ను నిశ్శబ్దంలోకి నెట్టేసింది. వొక పాతిక ముప్పయ్యేళ్ళుగా చదువుతూ అనుభవిస్తూ పలవరిస్తున్న రచయిత కన్నుమూసినప్పుడు వాక్యాలు మొరాయిస్తాయి.

సుబ్బన్న గురించి రాస్తూ రాస్తూ నేను మార్క్వెజ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా సుబ్బన్నని చూసాను ఈ వాక్యాల్లో:

Ultimately, literature is nothing but carpentry. Both are very hard work. Writing something is almost as hard as making a table. With both you are working with reality, a material just as hard as wood. Both are full of tricks and techniques. Basically very little magic and a lot of hard work are involved.

ఆ రోజుల్లో సుబ్బన్నని గురించి నాన్నగారు అనే వారు: “చిత్రిక పట్టడం అలవాటైన చేతుల్లో కవిత్వం శిల్పం అవుతుంది. సుబ్బాచారి కవిత్వం మీద దృష్టి పెడితే మంచి కవిత్వ శిల్పి అవుతాడు.” అని!

 

2

 

కాని, వొకే దారిలో వెళ్ళనిస్తే అది జీవితం కాదు కదా!

సుబ్బన్న పరిశోధనలో చాలా దూరాలు వెళ్ళాడు. అతని పరిశోధన విలువని గుర్తించే స్థాయికి ఇంకా మన ప్రమాణాలు ఎదగలేదు. ఇక్కడ అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ఆ పరిశోధన ఎంత విలువైనదో నాకు తెలుసు. శ్రమించే చేయి, చిత్రిక పట్టే ఆలోచనా, అంకితమైపోయే చిత్తం వున్నప్పుడు ఏ రంగమైనా “చిత్తం!” అనేస్తుంది. ఇంత కూడా విరామం లేకుండా పనిచేస్తూనే సుబ్బన్న ఇంకో కిటికీ రెక్క తెరచి పెట్టుకున్నాడు, కవిత్వం కోసం! అదీ కష్టమైన పని.

వొక రంగంలో నిలబడి, ఆ పరిభాషతో తలపడుతున్నప్పుడు కవిత్వమనే సున్నితమైన భాషలోకి రాకపోకలు అంత తేలిక కాదు మరి! కష్ట సాధ్యమైంది సాధించడమే సుబ్బన్న జీవన సారం! శ్రమ పాఠం! ఈ పుస్తకంలో ప్రతి పుటలో మీకు సుబ్బన్న అంతరంగం కనిపిస్తుంది. అతని వేదనల తరంగాలు మిమ్మల్ని తడిపేస్తాయి. కష్టజీవికి ఇరుపక్కలా వుండే వాడే నిజమైన కవి. నిజమే! కాని, కష్టజీవే కవి అయినప్పుడు ఆ కవిత్వం ఎలా వుంటుంది..అందులో పలికే హృదయం ఎలాంటి చప్పుడు చేస్తుంది…మీరే వినండి!

3

తెలుగు సాహిత్యంలో  మనం కష్టజీవుల గురించి మాట్లాడుతూనే వున్నాం. కాని, సాహిత్యంలో ప్రతిఫలించిన కష్టజీవులు చాలా మటుకు అమూర్త మానవులు – అంటే, నిర్దిష్టంగా ఫలానా రకం కష్టజీవి – శ్రీశ్రీ అన్నట్టు కుమ్మరిచక్రం, చేనేత మగ్గం, లేదా ఈ కవిత్వంలో సుబ్బాచారి చెప్తున్న బాడిస బతుకుల జీవన చిత్రం లాంటివి కచ్చితంగా చిత్రిస్తున్న వాళ్ళు అరుదు. ఈ నేపధ్యంలో కష్టజీవికి నిర్దిష్టమైన నిర్వచనం ఇస్తూ, ఆ కష్టానికి తగిన పరిభాషని నిర్మిస్తున్న కవిగా సుబ్బాచారి ఈ కవితా సంపుటిలో కనిపిస్తున్నాడు.

“బాడిస మొక్కబోయింది” అనే కవిత నా మటుకు నాకు ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో వొక అరుదైన వ్యక్తీకరణ రెండు కారణాల వల్ల- 1) అంతకు ముందు మనం కవిత్వంలో విని వుండని వొక నిర్దిష్టమైన కులవృత్తి అస్తిత్వ వేదనని చెప్పడం, 2) ఏ కవిత ప్రత్యేకత అయినా వొక కొత్త వస్తు నిర్దేశం దగ్గిరనే ఆగిపోకూడదు. ఆ వస్తువు తనదైన కొత్త శిల్పాన్ని కూడా ఆవిష్కరించుకోవాలి. ఈ కవితలోని శిల్పాన్ని ఆత్మీయంగా చూసే చదువరికి వొక వుద్వేగ తీవ్రతని చిత్రిక పట్టే కొత్త భాష, పదచిత్ర నిర్మాణం అబ్బుర పరుస్తుంది.

కవిత ఎత్తుగడలోనే సుబ్బాచారి శిల్ప విన్యాసం కనిపిస్తుంది. “ఇంటి నిండా కంటి నిండా /కళని కుమ్మరించిన చెయ్యి”, “దంతే, గంటక, గొర్రు, కాడిమాను, బండిచక్రాలు, పందిరి మంచాలు, కార్నీసు దూలాలు” ఇవన్నీ అమర్చి పెట్టిన చెయ్యిని గుర్తు చేయాల్సి రావడంలో విషాదం వుంది. కాని, ఈ వస్తు సముదాయాన్నంతా గుర్తుచేయడం ద్వారా ఆ శ్రమజీవుల సౌందర్యాన్ని మాత్రమె కాకుండా, వారి జీవన ప్రాముఖ్యతని కావ్యబద్ధం చేసాడు సుబ్బాచారి. ఈ కవిత శిల్పంలో కూడా ఆ రెండు అంశాలు- సౌందర్యం, ఆ కులవృత్తి గతమైన జీవన ప్రాముఖ్యం కలిసి చేస్తున్న ప్రయాణం  వుంది. నిజానికి వొక దీర్ఘ కావ్యానికి కావలసిన సామాగ్రి ఇందులో వుంది.

బిడ్డలా సుబ్బాచారి కవిత్వ వ్యక్తిత్వంలో అది వొక కోణం మాత్రమే. ఈ సంపుటిలో సుబ్బాచారి ఇతర కవితలు అతని వున్న భిన్నత్వాన్ని చెప్తాయి. కవిత్వంలో వైయక్తిక కోణాన్ని దర్శించే పధ్ధతి వొక్కో కవికి వొక్కో విధంగా వుంటుంది. ఈ సంపుటిలో మొదటి కవిత “యుగళయానం” దీనికి వుదాహరణ. ఈ కవితలో నన్ను బాగా ఆకట్టుకున్న సందర్భమూ, వ్యక్తీకరణ:

 బిడ్డల కత్తి పడవలు ఒంటి మీద నడుస్తూంటే

తొణికిన తరంగాల దారి చెదరకుండా నిలబడింది.

 

వ్యక్తిగతమైన సందర్భాల్ని సాధారణీకరించి వాటికి కవిత్వ గౌరవాన్ని ఇవ్వడంలో సుబ్బాచారి నిబద్ధత కనిపిస్తుంది. ఇలాంటి కవితలు కవి దార్శనికతని కూడా చెప్తాయి. ఇలాంటిదే మరి కవిత “ తనువూ తనువూ మధ్య తనూభాష”. ఈ కవితలో చివరి వాక్యం “పెళ్లి ఒక ఉత్తుత్తి మిష” వొక జీవన సందర్భాన్ని తనదైన దృష్టితో చెప్పడం అంటే ఏమిటో చెప్తుంది. వృత్తి వొక సామాజిక సందర్భం అయితే, దాంపత్యం కౌటుంబిక వ్యక్తిగత సందర్భం. ఆ రెండీటి మధ్యా సమతూకమే దార్శనికత. సుబ్బాచారి కవిత్వంలో నాకు ప్రధానంగా కనిపించిన లక్షణం ఇదే!

4

ఈ సంపుటిలో సుబ్బాచారి కవిత్వ అనువాదాలు కూడా వున్నాయి. ప్రసిద్ధ ఉర్దూ కవి ఫైజ్ అహమద్ ఫైజ్ అంటే సుబ్బచారికి ప్రత్యేకమైన అభిమానం వున్నట్టు వుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. బహుశా, జీవితాన్ని శ్రమజీవుల కోణం చూస్తూనే, అందులో ఇమడాల్సిన పద్య సౌందర్యాన్ని పోగొట్టుకోని అరుదైన కవిత్వ శిల్పి ఫైజ్. సుబ్బాచారి ఆ వారసత్వాన్ని నిలుపుకొనే ప్రయత్నంలో భాగంగా ఈ అనువాదాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే, తన కవిత్వ వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే సాధనాలని నిర్మించుకునే దారిలో వాటి ఆసరాని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సుబ్బాచారి.

అలాగే, ఇతర భారతీయ భాషల నించి చేసిన అనువాదాలు కూడా సుబ్బాచారి వ్యక్తిత్వంలో వొదిగే లక్షణాలతో వుంటాయి. ఈ అనువాదాల ద్వారా ఈ తరం కవులకి కవిత్వ అభ్యాసానికి సంబంధించిన పాఠం చెప్తున్నాడు సుబ్బాచారి.

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

సుబ్బాచారికి ఆ ఆనంద రహస్యం తెలుసు.అందుకే, అతనికి చినుకు ఓనమాలు అర్థమవుతాయి. అయితే, ఈ వర్ష ధారలు బలపాలై నేల పలకతో సంభాషించినప్పుడే కవిత్వ వర్షానికి సార్ధకత అని కూడా సుబ్బా చారికి తెలుసు.

ఈ సారవంతమైన సార్ధకమైన కవిత్వ ధార సదా నిలిచి వుండాలని నా ఆకాంక్ష.

*

 

నాన్న అంటే…వొక ఆదర్శం, వొక వాస్తవం!

నాన్నగారి నవల "విజయ" ఆవిష్కరణ సందర్భంగా....ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో...

నాన్నగారి నవల “విజయ” ఆవిష్కరణ సందర్భంగా….ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో…

1

ఇప్పుడెలా వుందో తెలియదు చింతకాని!

          ఖమ్మం పక్కన చిన్న వూరు చింతకాని. ఆ రోజుల్లో చింతకాని స్టేషనులో పాసింజరు రైలు దిగితే వూళ్ళో నడిచి వెళ్లడానికి అర గంట పట్టేది. ఆ స్టేషను నించి వూరి నడి బొడ్డు – పీర్ల చావిడి- దాకా వెళ్తే మధ్యలో వొక పల్లెటూరి బతుకు ఎట్లా వుంటుందో అది అంతా అద్దంలో కనిపించినట్టు కనిపించేది. ఆ ఎగుడు దిగుడు బాటలు, అక్కడక్కడా విసిరేసినట్టుండే ఇళ్ళు, అనేక ఏళ్ల చరిత్ర భారంతో వంగిపోయినట్టున్న పెద్ద పెద్ద చింత చెట్లు, రాగి చెట్లు, మధ్యలో రామయ్య బావి, సీతమ్మ దిబ్బ….అబ్బాని తలుచుకున్నప్పుడల్లా ఈ పొడుగాటి బాట గుర్తొస్తుంది. సాయంత్రం బడి నించి వచ్చాక, రోజూ ఆ స్టేషను దాకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, నేనూ అబ్బా.

స్టేషనుకి చేరాక అప్పటికే ప్లాట్ ఫారం బెంచీల మీద ఇంకో ముగ్గురు నలుగురు టీచర్లు ఆయన కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళు. అక్కడ బెంచీల మీద కూర్చోనో, ప్లాట్ ఫారం మీద నడుస్తూనో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేను స్టేషను ఆఫీసులో బెంజిమన్ మాస్టరు గారితో ఆయన యంత్ర సామగ్రితో ఆడుకుంటూ వుండే వాణ్ని. వొక గంటా, గంటన్నర తరవాత మేము ఇంటి ముఖం పట్టేవాళ్లం. ఈ మొత్తం దినచర్యలో నేను చాలా ప్రశ్నలు రువ్వుతూ వుండే వాణ్ని. కొన్ని మాటలు, కొంత మౌనం. కొన్ని ఆటలు, కొంత అల్లరి. కానీ, ఈ బాల్య అనుభవం వొక పునాది తరవాత నేను చేయబోయే రహస్య సాహిత్య ప్రయోగాలకు! అప్పటికే అబ్బా అనువాద నవల “కళంకిని” (1973) అచ్చయి, తెలుగు సాహిత్యలోకం ఆయన వైపు అబ్బురంగా చూడడం మొదలెట్టింది. వొక రచయిత విజయాన్ని కళ్ళారా చూడడం, చెవులారా వినడం అదే మొదలు నాకు.

చింతకాని స్కూల్లో అబ్బాజాన్ “మధురవాణి” అనే వొక గోడ పత్రిక నడిపే వాళ్ళు. అది రెండు నెలలకి వొక సారి దినపత్రిక సైజులో నాలుగు పుటలుగా స్కూలు లైబ్రరీలో అతి విశాలమయిన బోర్డు మీద అందమయిన ఆయన చేతిరాతతో దర్శనమిచ్చేది. టీచర్ అంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదనీ, విద్యార్థిలో సృజనాత్మకత పెంచే బాధ్యత అని ఆయన భావించే వారు. “సార్ క్లాసులో కూర్చుంటే చాలు, వొక్క సారి వింటే అదే మెదడులో నిలిచిపోతుంది,” అని విద్యార్థులు ఆయన గురించి గర్వంగా చెప్పేవాళ్ళు. కానీ, అక్కడితో ఆగకుండా ఆయన ఎంతో కొంత భాషా ప్రేమ, సాహిత్య సంస్కారం పెంచాలన్న దృష్టితో “మధురవాణి” మొదలు పెట్టారు. ఇందులో కేవలం విద్యార్థుల రచనలు మాత్రమే వేసే వాళ్ళు. వాటిని ఆయనే కొంత ఎడిట్ చేసి, ఆ దిన పత్రిక సైజు పోస్టర్ల మీద రాసే వారు. “సారు చేతిరాత కోసమే చదువుతున్నాం ఇది,” అని విద్యార్థులు అనే వాళ్ళు. ఆలోచనలు ఎంత ముఖ్యమో, చేతిరాత అంత ముఖ్యమని ఆయనకి పట్టింపు వుండేది. విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకుని, వాళ్ళ దస్తూరి దిద్దబెట్టే వారు ఆయన- ఈ “మధురవాణి” పత్రిక గోడమీద పెట్టే రోజుల్లో నేను అయిదో తరగతి. ఆ పత్రికలో నా రచన కనిపించాలని నా పట్టుదల. కానీ, అబ్బా వొక పట్టాన వాటిని వొప్పుకునే వారు కాదు. చాలా సార్లు తిరగరాయించేవారు. నిర్మొహమాటంగా నిరాకరించే వారు. అక్కడ వున్న కాలంలో “మధురవాణి”లో నేను అతికష్టమ్మీద వొక గేయం, వొక కథ మాత్రమే చూసుకోగలిగాను. కానీ, రచయితగా అది నాకొక ప్రయోగ శాల అయ్యింది, చాలా ప్రయోగాలు విఫలమయినా సరే!

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

ఇక ఇంటి విషయానికి వస్తే, పీర్ల చావిడి పక్కనే, మా ఇల్లు వుండేది. మా ఇల్లు అంటే కిలారు గోవింద రావు గారి ఇల్లు. ఆ రెండు గదుల ఇంట్లో తొమ్మిది మంది వుండే వాళ్ళం. దానికి తోడు, ఎప్పుడూ నాన్నగారి ఎవరో వొక సాహిత్య మిత్రుడు ఇంట్లో అతిధిగా వుండే వారు. వాళ్ళు మొదటి గదిని ఆక్రమించేస్తే, మేమంతా రెండో గదిలో ఇరుక్కుని వుండే వాళ్ళం. నేను మాత్రం మొదటి గదిలో ఆ సాహిత్య మిత్రుల సంభాషణలు వింటూ మూగిమొద్దులా కూర్చొని వుండే వాణ్ని. “ఒరే, నువ్వు కాస్త నోరు విప్పరా! నాకు భయమేస్తోంది నిన్ను చూస్తే!” అని వొక సారి దాశరథి గారు బయటికే అనేసి, నన్ను తన కుర్చీ పక్కన చేతుల్లోకి తీసుకుని, మాటల్లో దింపే ప్రయత్నం చేసే వారు. ఉర్దూ గజల్ వొకటి చెప్పి, దాన్ని నా చేత బట్టీ కొట్టించే వారు. అది నాకు ఎంతో వుత్సాహకరమయిన క్రీడ అయ్యింది. ఆ గజల్ రెండు పంక్తులూ నెమరేసుకుంటూ నేను, నా సొంత కవితలు కట్టే వాణ్ని. ముందు వాటిని పాడుకుంటూ తిరిగే వాణ్ని, నా స్నేహితులతో పాడించే వాణ్ని, ఆ తరవాత కాయితం మీద పెట్టే వాణ్ని. ఇదీ నా పాఠశాల!

ఈ మూడు భిన్న అనుభవాల కేంద్ర బిందువు అబ్బా. ఇక నిత్యనైమిత్తిక బతుక్కి వస్తే, ఆర్ధిక పరిస్తితులు బాగుండక, ఇంట్లో ఎప్పుడూ జొన్నన్నం, గోంగూర పచ్చడి మాత్రమే వుండేది. నెలకోసారి తెల్లన్నం, పావుకిలో మాంసం వండిన రోజు పండగలా వుండేది. కిలారు గోవిందరావు గారి ఇంటి నించి అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ పాలు, పెరుగు వచ్చిన రోజున అది మహాప్రసాదంలా వుండేది. కానీ, ఆర్థిక పరిస్తితులు బాగా లేవన్న బీద అరుపులు ఇంట్లో వినిపించేవి కావు. కొత్త పుస్తకాలు ఇంటికి వచ్చేవి, కొత్త కొత్త సాహిత్య మిత్రులు ఇంటికి వచ్చే వారు, చాలా కళకళలాడుతూ వుండేది ఇల్లు. “ఈ మాత్రం బర్కతు వుంది చాలు” అని తృప్తిపడేది అమ్మీ.

ఆ చిన్న వూళ్ళో మా చదువులు ఏమయిపోతాయో ఏమో అన్న బెంగతో కుటుంబాన్ని ఖమ్మం మార్చాలనుకున్నారు అబ్బా. చింతకాని, ఆ చుట్టుపక్కల వూళ్లలో ఈ విషయం తెలిసిపోయి, మా ఇల్లు వొక తీర్థ క్షేత్రమయ్యింది. ప్రతి వూరి నించీ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో ఇరవైల, పాతిక సంఖ్యలో వచ్చి, అబ్బాకి నచ్చచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వూళ్ళో పెద్ద పెద్ద రైతులు, నాయకులు ఖమ్మం జిల్లా పరిషత్తుకి వెళ్ళి అబ్బా బదిలీని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, అబ్బా ఎవరి మాటా వినలేదు. చివరికి మాకు స్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వూరంతా పెద్ద ఊరేగింపుగా స్టేషనుకు వచ్చింది, కళ్ల నీళ్ళు పెట్టుకొని!

2

“మీరు ఖిల్లాలోపల వుండాలి కౌముదీ సాబ్!”

అంటూ ఖమ్మం ముస్లిం మిత్రులు కొందరు ఖిల్లాలో చాలా చవకలో ఇల్లు చూపించారు. కానీ, అబ్బాకి అది ఇష్టం లేదు. “ఆ ఖిల్లా బంది ఖానా లా వుంది,” అనడం నాకు ఇప్పటికీ గుర్తు. కాంగ్రెస్ ఆఫీస్ వెనక ప్రసిద్ధ ఉర్దూ –తెలుగు రచయిత హీరాలాల్ మోరియా గారి ఇల్లు వుండేది. మళ్ళీ రెండు గదుల ఇల్లే, కానీ, చాలా పెద్ద ఆవరణ వుండేది. మోరియా గారు నామమాత్ర అద్దె మీద ఆ ఇల్లు మాకు ఇచ్చారు.

ఖమ్మం మా జీవితాల్లో పెద్ద కుదుపు. అబ్బా ఆలోచనల్లో కొత్త మలుపు. “సరిత” అనే టైటిల్ తో వొక సాహిత్య పత్రిక పెట్టాలని ఖమ్మంలో ఆయన “సాహితి ప్రెస్” పెట్టారు. ఖమ్మానికి ఆ ప్రెస్ అతి కొద్ది కాలంలోనే అదొక సాహిత్య కేంద్రంగా మారింది. కానీ, పత్రిక మొదటి సంచిక వచ్చే లోపలే, అబ్బా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రెస్ నిండా మునిగింది, మేము అప్పుల్లో దిగడిపోయాం. ఆ తరవాత మా ఆర్థిక జీవనం మా చేతుల్లో లేకుండా పోయింది.

ఆ పరిస్థితుల్లో అబ్బా తెలుగు ప్రసంగాలు విన్న వొక క్రైస్తవ మిషనరీ ప్రచురణ సంస్థ ఆయన్ని వాళ్ళ తెలుగు విభాగం డైరెక్టరుగా ఆహ్వానించింది. మంచి జీతము, నాకు ఆస్ట్రేలియాలో కాలేజీ చదువుకి ఉపకారవేతనమూ ఆఫర్ చేసింది. “నా విశ్వాసాలకి దరిదాపుల్లో లేని ఏ పని నేను చేయలేను. పైగా, నా ఈమాన్ (faith) ని అమ్ముకోలేను,” అని అబ్బా ఖరాఖండిగా చెప్పడం నాకు గుర్తుంది. అబ్బా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆయన చిత్తశుద్ధీ, సిద్ధాంత బలమూ కనిపించేవి. ఆయన అరబ్బీ, ఉర్దూ, ఫార్సీ బాగా చదువుకున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంతో పాటు! ఇస్లాం, వేదాలూ, మార్క్సిజం కూడా బాగా చదువుకున్నారు, ప్రాచీన ఆధునిక సిద్ధాంతాలతో పాటు! కానీ, వీటిలో వేటికీ ఆయన పూర్తిగా తలవంచలేదు. “అవన్నీ కళ్ళు తెరిపించాలి కానీ, కళ్ళు మూయకూడదు, అవన్నీ తలలో వుండాలి, కానీ అవే తల చుట్టూ రోకలి కాకూడదు,” అనే వారు. అటు అమ్మీ తరఫునా, ఇటు అబ్బా తరఫునా మా కుటుంబానికి కమ్యూనిస్టు చరిత్ర వుంది. అట్లా అని, వీళ్ళెవ్వరూ ఇస్లాం కి దూరం కాలేదు, అవి వొకే వొరలో ఎట్లా ఇముడుతాయి అని కొందరికి ఆశ్చర్యం కలిగిస్తూ.

తాతయ్య గారు నిజాం కొలువులో పనిచేశారు. దానికి భిన్నంగా నిజాంకి వ్యతిరేకంగా ఆయుధాలు దూసిన కమ్యూనిస్టుల పక్షం వహించారు అటు అమ్మీ తరఫు వాళ్ళు, ఇటు అబ్బా తరఫు వాళ్లు కూడా! పార్టీ కోసం వున్నదంతా వూడ్చిపెట్టారు, బంగారం లాంటి ఇనామ్ భూముల్ని కూడా ఖాతర్ చెయ్యలేదు. తీవ్ర ఆర్థిక కష్టానష్టాల్లో వున్నప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు అమ్మి అప్పుడపుడూ అనేది, “భూములూ ఇళ్ళు వదిలేసి, మీ అబ్బా పుస్తకాల గోనె సంచి వీపునేసుకుని, బెజవాడ వెళ్ళిపోయారు, పార్టీ కోసం!” అని. ఇంతా చేస్తే, అమ్మి కుటుంబం కూడా పార్టీ కోసం చివరి బంగారపు తునక కూడా ఇచ్చేసిన వాళ్ళే! పార్టీ రెండుగా చీలిపోయాక తమ ఇల్లే వాటాలు పడి, చీలిపోయినంత క్షోభ పడ్డారు, ఆ క్షోభ అబ్బాని చివరి దాకా వెంటాడుతూనే వుండింది, ఇలా మిగలాలా అని!

3

394925_10101015978163497_1224429015_n

“షంషుద్దీన్, నువ్వు రచనని అంతగా పట్టించుకోవడం లేదు. నువ్వు చాలా రాయగలవు. రాయాలి,”

అని అబ్బా బాల్యమిత్రులు, ఆనక బంధువులూ అయిన హనీఫ్ పెద నాన్న గారు ఎప్పుడూ అబ్బాని కోప్పడుతూ వుండే వారు. రచయితగా ఆయన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన మిత్రులు చాలా మంది ఇప్పటికీ అంటూ వుంటారు. ఆయన రచనలు ఇప్పుడు పెద్దగా అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం. ఆయన 1960 నించి 1975 వరకూ విశాలాంధ్ర, యువజన, ప్రగతి, జనశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో విస్తృతంగా సమీక్షలూ, కవిత్వం, కథలూ రాశారు, అనువాదాలు చేశారు. అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన ప్రతి ప్రత్యేక సంకలనంలోనూ ఆయన కవిత్వం కనిపిస్తూనే వుండేది. కానీ, ఇదంతా నాకు రచయితగా వూహ తెలియని వయసు ముందే ఎక్కువగా జరిగాయి. బడి పంతులు బదిలీల బతుకులో వొక వూరంటూ స్థిరం లేకపోవడంతో చాలా రచనలు పోయాయి, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి చాలా రచనలు దగ్ధం అయ్యాయని పెద నాన్న గారు అంటూండే వారు. ఇప్పుడు మిగిలిన కొన్ని కవితలయినా పెద నాన్నగారు తన ఇంట్లో భద్రపరచిన నోట్ పుస్తకాల నించి తీసినవి కొన్ని, కవితలు. నేను అక్కడా, ఇక్కడా తీసి దాచిపెట్టినవీ ఇంకొన్ని, ఇప్పుడు ఖాదర్ బాబాయ్ కొత్తగా సేకరిస్తున్నవి కొన్ని.

1975 తరవాత రచనకి సంబంధించి అబ్బా దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. “నాకు ఎందుకో చదవడంలో వున్న ఆనందం, రాయడంలో దొరకడం లేదు,” అనే వారు చాలా సార్లు. “అది రాయకుండా వుండడానికి వొక మిష మాత్రమే!” అని నేనొకటి రెండు సార్లు అన్నాను కూడా! కానీ, పార్టీ చీలిక ఆయన మీద గాఢమయిన ప్రభావం వేసిందని నాకు గట్టిగా అనిపించేది. అట్లా అని, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమీ తగ్గలేదు. ఖమ్మం వచ్చాక ఆయన అరసం సాహిత్య సమావేశాల్లో, సభల్లో నిమగ్నం అయ్యారు. అరసం అధ్యక్షుడిగా ఆయన ఖమ్మం జిల్లాలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. మారుమూల పల్లెలో ఎక్కడ ఏ కవి, ఏ రచయిత దాగి వున్నా, ఖమ్మం పట్టుకొచ్చి, వేదిక ఎక్కించి, వాళ్ళ రచనల్ని తానే పత్రికలకి కూడా పంపించి, అదొక ఉద్యమంగా చేశారు. బెజవాడ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సాహిత్య కేంద్రాలతో ఖమ్మంని అనుసంధానించి, ఖమ్మం జిల్లా సాహిత్య ఆవరణని పెంచారు. ఆ తీవ్రత చూస్తూ, “నువు కావ్యకర్తవి కావాలి కానీ, కార్యకర్తగా మాత్రమే మిగలకూడదు,” అని హనీఫ్ గారు గట్టిగానే మందలించే వారు.

ప్రజా నాట్య మండలి, అరసం వారసత్వ ప్రభావం వల్ల తానే వొక ఉద్యమంగా వుండడం, నిరంతరం జనంలో పని చెయ్యడం ఆయనకిష్టమయ్యింది. అక్షరదీపం కార్యక్రమం మొదటి సారి ప్రవేశపెట్టినప్పుడు, ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోకి ఆయన ఆ దీపాన్ని పట్టుకుని నడిచారు. రోడ్లు దిగని సర్కారీ జీపులకి సైతం పల్లె బాట చూపించారు, జీపు వెళ్లని చోటికి కాలి నడకన వెళ్ళి, తరగతులు నిర్వహించారు. నిరక్షరాస్యుల కోసం కథలూ, పాటలు రాసి, రాయించి, వాటిని పల్లెల్లో మార్మోగేట్టు చేశారు, ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బ తినడం మొదలయ్యింది. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారడం మొదలయ్యింది. నా చేతికి డిగ్రీ రాక ముందే, నేను వుద్యోగంలోకి వెళ్లాల్సి వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలన్నీ వొక్క పెట్టున దాడి చేశాయి.

పరిస్తితులు ఎటు తిరిగి ఎటు వచ్చినా, ఇంట్లో సాహిత్య వాతావరణం మాత్రం స్వచ్ఛంగా అలా మిగిలిపోయింది. అన్ని పని వొత్తిళ్ల మధ్యా, ఈతి బాధల మధ్య కూడా అబ్బా కనీసం అయిదారు గంటలు పుస్తక పఠనంలో గడిపే వారు. ముందు గదిలో పడక్కుర్చీలో అలా పుస్తకం ముందు విధేయంగా వుండే వారు. “నేను పాఠకుడిని మాత్రమే!” అని నిర్ద్వంద్వంగా చెప్పే వారు. “వొక గంట రాస్తే బాగుంటుంది” అనే వాణ్ని. కానీ, ఆయనలోని రచయితని ఉత్సాహ పరచడం అంత తేలిక కాదు. ఆయనలోని వొక పర్ఫెక్షనిస్ట్ ఎప్పుడూ ఆయనకి అడ్డంకి. “రాస్తే ఇట్లా రాయాలి,” అని కొన్ని ఉదాహరణలు చూపించేవారు. రచయితగా ఆయనకి అలాంటి ఆదర్శాలు కొన్ని వుండేవి, అవి ఎన్నడూ వాస్తవికతతో రాజీ పడేవి కాదు. ఆయన ఉదాహరించే రచయితలు అటు సంస్కృతం నించి ఇటు ఆంగ్లం వరకూ వాళ్లు తెలుగులో అనువాదాలకయినా లొంగని శక్తిమంతులే, కానీ – “నిజమే కావచ్చు, కానీ, వాళ్లెవ్వరూ మీరు మాత్రమే రాయాల్సింది రాయలేరు కదా?!” అనే వాణ్ని నేను. అదే దశలో ఆయన మళ్ళీ పత్రికా రచయితగా మారడం వల్ల రచనా వ్యాసంగం వేరే దారికి మళ్ళింది. తరవాత హిందీ ఉర్దూ నించి అనువాదాల కోసం ఎన్ని ప్రచురణ సంస్థలు అడిగినా, ఆయన వొప్పుకోలేదు. “అనువాదం అనేది వొక వ్యసనం. అలవాటు పడితే, అందులో కూరుకుపోతాం. రాయగలిగితే, ఎప్పటికయినా సొంత రచనే చెయ్యాలి. వొక బృహత్తరమయిన నవల రాయాలి,” అనే వారు. ఆ నవల రాసే రోజు రాలేదు, ఈలోపు ఆయన ఆరోగ్యం క్షీణించింది. కనీసం రెటైర్మెంట్ వయసు కూడా రాక ముందే, ఆయన కన్ను మూశారు.

ఆయన రచయితగా రాయాల్సినంత రాయలేదని మా అందరికీ అసంతృప్తి తప్ప, ఆయన మటుకు ఆయన సంతృప్తిగా జీవించారనే నాకు అనిపిస్తుంది. జీవితం మీద ఆయనకి ఫిర్యాదులు లేవు. అది తిరిగిన అన్ని మలుపులూ ఆయనకి తెలిసినవే, అవి ఆయనకి అపరిచితమయినవీ, ఆశ్చర్యకరమయినవీ కావు. అటు రచయితగా, ఇటు వ్యక్తిగా కూడా తన అర్ధాంతర నిష్క్రమణ అబ్బాకి ముందే తెలుసేమో అని చాలా సార్లు అనిపిస్తుంది నాకు. కనీసం అట్లా అనుకొని తృప్తి పడడం మినహా మేం చెయ్యగలిగిందేమీ లేక పోయింది!

*

చూస్తూ చూస్తూ వుండగానే, అతనొక జ్ఞాపకం!

Dsc_7391

ముఖపుస్తకాలు లేని వొక అనగా అనగా కాలంలో స్నేహితులు వొకరి ముఖాలు వొకళ్ళు ఎలా చూసుకునే వారు? పొద్దూ పొద్దున్నే వొక చాయ్ తాగేసి, ఏ పొద్దుటి రైలో, ఫస్ట్ బస్సో అందుకొని దగ్గిరే వున్న స్నేహితుడి ముందు వాలిపోయే వాళ్ళు.

అవును, శేఖర్ – మేం “కంభా” అని పిలిచేవాళ్ళం- అలాగే వాలిపోయే వాడు వో ఆదివారం పొద్దున్న ఖమ్మంలో!

ట్విటర్లూ గట్రా లేని ఆ కాలంలో స్నేహితులు ఎలా పక్షి ముక్కుల్తో పొడుచుకునే వాళ్ళు? బహుశా, ఎక్కడో వొక పబ్లిక్ ఫోన్ పట్టుకొని, వొక పలకరింతో, ఇంకో తిట్టో రాల్చి వెళ్ళిపోయే వాళ్ళు.

అవును, కంభా అలాగే వున్నట్టుండి ఏ నెంబరూ లేని వొక ఫోన్లోంచి కొన్ని మాటలు మెల్లిగా రాల్చి తన వూళ్ళో తన మూలలో ఎక్కడో వొదిగి వుండి పోయే వాడు.

నెట్లూ మొబైల్ సెట్లూ లేని ఆ అనగా అనగా కాలంలోనే బహుశా మనుషులు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. మాట కోసం ఎదురు చూస్తూ వుండే వాళ్ళు. మాట కోసం కలవరిస్తూ వుండే వాళ్ళు. నిద్రలో స్నేహితుల పేర్లు పలవరిస్తూ వుండే వాళ్ళు.

చాలా అమాయకంగా ముఖంమీద ఎలాంటి పేచీ లేని వొక విశాలమైన నవ్వుతో కంభా ఖమ్మంలో మా ఇంటికొచ్చే వాడు. “ఖంభా ఆయారే, బాబూ!” అంటూ మా అమ్మ నవ్వుకుంటూ లోపలికొచ్చి కబురు చెప్పేది. (ఆ రోజుల్లో నేను వంట గదిలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని రాసుకునే వాణ్ని, మధ్య మధ్యలో అమ్మతో కబుర్లు చెప్తూ) శేఖర్ ఇంటి పేరు అమ్మ దగ్గిరకి వచ్చేసరికి ఉర్దూ యాసలో “ఖంభా” – అంటే స్తంభం- అయిపోయేది.

javed

చిత్రం: జావేద్

2

అప్పుడు కార్టూన్ అంటే ఇంకా ఏమిటో కంభాకి పూర్తిగా తెలీదు. పుస్తకాలు విపరీతంగా చదివే వాడు. . కార్టూనిస్టులు ఆ కాలంలో సాహిత్యంతో సంబంధం లేని వేరే లోకంలో వుండే వాళ్ళు నిజానికి!

కాని, కార్టూనిస్టుల లోకంలో కూడా సాహిత్యమూ కవిత్వమూ వుంటాయని అప్పుడే నా మటుకు నాకు సురేంద్ర (ఇప్పుడు “హిందూ” సురేంద్ర) వల్ల అనుభవమైంది. అప్పుడే సురేంద్ర – తన పేరుని సురేన్ద్ర- అని రాయడం మొదలెట్టాడేమో! సురేంద్రలాగానే శేఖర్ కి కూడా సాహిత్యం వొక ప్రాణం! తన అసలు ప్రాణం కార్టూన్ లో వుందని కొంచెం ఆలశ్యంగా తెలిసి వచ్చింది శేఖర్ కి! కాని, ఆ ప్రాణం చిరునామా తెలిసాక వొక క్షణం వృధా చేయలేదు శేఖర్!

శేఖర్, శ్యాం మోహన్, సురేన్ద్ర…ఇలా ఇంకా ఈ తరం కార్టూనిస్టులు అక్షరంలోంచి కుంచెలోకి చేసిన ప్రయాణం చాలా విలువైనదని నాకు అనిపిస్తుంది. ఈ సాహిత్య సహవాసం వల్ల ముందు తరంలో ఏ కొద్ది మంది కార్టూనిస్టులకో పరిమితమైన కొత్త అందం వీళ్ళ కుంచెల్లోకి వచ్చి చేరింది.

శేఖర్ చివరి దాకా ఆ సాహిత్య సహవాసాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాడు. బాగా గుర్తు- మహాశ్వేతా దేవి నవలల్ని చదివిన తాజా ఉద్వేగంలోంచి నడిచి వచ్చి, ఖమ్మంలో వొక ఆదివారం పొద్దున్న శేఖర్ అన్న మాటలన్నీ! “జీవితంలోని ఆ చిన్ని డీటెయిల్స్ మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం?” అని ఆ రోజు అతను నన్ను అడిగాడు. శేఖర్ కి ఆ “చిన్ని డీటెయిల్స్” మీద విపరీతమైన పట్టింపు! సాహిత్య వ్యాసాల రచనతో మొదలైన శేఖర్ ప్రయాణం కార్టూన్ దగ్గిర స్థిర పడడంలోడీటైల్స్ మీది పట్టింపే కారణమని నాకు అనిపిస్తుంది. రోజువారీ జీవితాన్ని కార్టూనిస్టు చూసినంత దగ్గిరగా మరో కళాకారుడు చూడలేడు అని నేను ఖాయంగా చెప్పగలను. ఎందుకంటే, కార్టూనిస్టు daily basis మీద జీవితాన్ని బేరీజు వేసుకోవాలి. వాస్తవికతని చూస్తూనే దాన్ని ఆట పట్టించే క్రిటిక్ అతనిలో వుండాలి. అంత కంటే ఎక్కువగా ఆ వాస్తవికతని దాని అసలు రూపు చెడకుండా నవ్వు పుట్టించే కోణంలోంచి కూడా చూడాలి. కార్టూన్ వెనక వున్న ఈ ఫిలాసఫీ శేఖర్ కి అర్థమైంది. అందుకే, కార్టూన్ని వొక కళారూపంగా గుర్తించి తీరాలని మొండి పట్టుదల అతనికి!

ఇవాళ శేఖర్ మన ముందు లేని ఈ రోజున మీరు అతని కార్టూన్లన్నీ దగ్గిర పెట్టుకొని, వొక్కోటీ చూస్తూ వెళ్ళండి. ఈ కార్టూనిస్టు ఫిలాసఫీ గురించి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది.

శేఖర్ చివరి గీత

శేఖర్ చివరి గీత

3

నిజమే, జీవితం చాలా వేగంగా దూసుకుపోతోంది. మన మధ్య ఎవరున్నారో ఎవరు లేరో కనుక్కునే వ్యవధి మనకెవ్వరికీ లేదు. చూస్తూ వుండగానే, మన కళ్ళ ముందు పెరిగి పెద్దదైన వొక కార్టూన్ గీత నిష్క్రమించింది. వొక చిర్నవ్వు నిశ్శబ్దంలోకి రాలిపోయింది. వొక స్నేహ హస్తం మన భుజమ్మీంచి బలహీనంగా కూలిపోయింది. బతికి వుండగా వొక మనిషి ఎన్ని పాత్రాలు పోషించ గలడో, ఆ పాత్రలన్నీ ధైర్యంగా వాటిల్లో ప్రాణం పొదివినంత పదిలంగా పోషించి వెళ్ళిపోయాడు శేఖర్!

“కలడు కలండు అను వాడు కలడో లేడో!” అన్న నిత్య సంశయంలోకి నేను వెళ్లదలచుకోలేదు కాని, వుంటే, ఇదిగో – ఖాలిద్ హుస్సేనీ నవల The Kite Runners లో వొక పాత్ర అడిగినట్టుగా ఇలా అడగాలని వుంది…

When you kill a man, you steal a life. You steal his wife’s right to a husband, rob his children of a father. When you tell a lie, you steal someone’s right to the truth. When you cheat, you steal the right to fairness. Do you see?

మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!

 – అఫ్సర్

ఇంకో జీవితంలోకి మార్క్వెజ్!

1

A kind of emptiness in his life had begun there. From then on he had been unable to distinguish, to remember what events were part of his delirium and what were part of his real life.

పందొమ్మిదేళ్ళ వయసులో మార్క్వెజ్ రాసుకున్న మొట్ట మొదటి కథలో వొక వాక్యం అది.

తను రాసుకున్న మొదటి వాక్యాలతో పదే పదే ప్రేమలో పడడం ఏ రచయితకైనా ఎంత ఇష్టంగా వుంటుందో, అంత కష్టంగానూ వుంటుంది. ఆ వాక్యాల నునులేతదనంతో పాటు వాటిలోని అమాయకత్వం అతన్ని ఎప్పుడూ గుచ్చి గుచ్చి చూస్తుంది. తనకి తెలియకుండానే అతను ఆ వాక్యాల్ని తిరగ తొడుక్కుంటూ వుంటాడు, కాని, ఎప్పుడూ వొక కొత్త చొక్కా తొడుక్కునే పిల్లాడిలాగా సంబరపడిపోతుంటాడు. అలాంటి కొన్ని సంబరాల కలయిక – మార్క్వెజ్ ఇప్పటిదాకా గడిపిన జీవితం! అతని ఇంకో జీవితం ఇప్పుడు మొదలవుతుందని నమ్ముతున్నాను కాబట్టి, నా లోకంలో మార్క్వెజ్ కి మరణం లేదు.

ఇవాళ సాయంత్రం మార్క్వెజ్ కన్ను మూశాడని తెలిసిన తరవాత ఆ పందొమ్మిదేళ్ళ వయసు నించి ఇవాల్టి ఎనభయ్యో ఏడు దాకా అతని ప్రయాణం ఏమిటా అని ఆలోచిస్తూ వొక రకమైన అస్థిమితత్వంలోకి జారిపోయాను. ప్రతి వాక్యాన్ని వొక అందమైన జ్ఞాపకంగా చెక్కే శక్తి వున్న మార్క్వెజ్ నిజానికి ఈ రెండేళ్ళ కిందటి నించి వొక్క జ్ఞాపకాన్నీ తలచుకోలేని విస్మృతిలోకి జారిపోయాడు, అల్జీమర్స్ అనే దయలేని వ్యాధి వల్ల!

“What matters in life is not what happens to you but what you remember and how you remember it.”

మార్క్వెజ్ రాసిన ఆ వాక్యం నిన్నటి నించీ విపరీతమైన ఉద్వేగంతో నా లోపల చప్పుడు చేస్తోంది. ఈ చప్పుడు వొక్కో సారి నా చెవుల్ని ఇంకే చప్పుడూ వినలేని స్థితిలోకి తీసుకు వెళ్తోంది. నన్నురకరకాల తలుపుల్లోంచి మార్క్వెజ్ అనే వొక అనేక గదులూ తలుపులూ కిటికీలూ వున్న విశాలమైన సౌధంలోకి లాక్కు వెళ్తోంది.

140417170605-01-gabriel-garcia-marquez-horizontal-gallery

       2     

మొదటి వాక్యాలు రాస్తున్నప్పుడు అతని వయసు పందొమ్మిది. అతని మొదటి వాక్యాలు చదువుతున్నప్పుడు నాకూ పందొమ్మిదే!

కాఫ్కాలూ, కామూలూ, ఇలియాస్ కానెట్టీలూ, పదే పదే చదివే షేక్స్పియర్ మాక్బెత్ లూ, బైరాగి కవిత్వాలలోంచి మళ్ళీ రాస్కల్నికోవ్, హామ్లెట్లూ, డాలీ రేఖలలో కూడా దాక్కున్న అసంబద్ధ వాక్యాలూ, త్రిపుర అనే దేశంలో వొంటరి సంచారాలూ తెగ సందడి చేసే ఆ పందొమ్మిదేళ్ళ అమాయకత్వపు అంతిమ దినాల్లో- బెజవాడ గాంధి నగర్ “ప్రబోధ” బుక్ సెంటర్లో అనుకోకుండా దొరికిన One Hundred Years of Solitude – ఆ యవ్వన కాలపు బైబిల్.

నండూరి సుబ్బారావు గారు “నమిలి మింగిన నా ఎంకి” అని ఎందుకన్నారో అప్పుడే అర్థమైంది. ఈ నవల నన్ను నమిలి మింగేసిందో, నేను ఆ వాక్యాల్ని నమిలి మింగానో తెలియదు. కాని, రాసే వాక్యం మీద చచ్చేంత మమకారాన్నీ, సంశయాన్నీ నింపిన నవల అది.

ఆ తరవాత చాలా కాలం తరవాత Love in the Time of Cholera చదివి, కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాక మార్క్వెజ్ ని తట్టుకునే శక్తి పోయింది నాకు! జీవితానికి మరీ అంత సున్నితత్వం అవసరమా అనే సందిగ్ధంలో పడిపోవడం అప్పుడే మొదలయింది. సున్నితత్వాన్ని మించిన యుద్ధం లేదని ఎక్కడో నేను రాసుకున్న వాక్యానికి మూలం ఆ నవలలో, ఆ నవల చుట్టూ నేను అల్లుకున్న మాయా వాస్తవికతలో వుంది.

కాని, సున్నితత్వాన్ని నిశ్శబ్దంతో కానీ, కృత్రిమమైన మౌనంతో గాని ఆట్టే కప్పెట్టలేమని కూడా అప్పుడే అర్థమవడం మొదలైంది. నా లోపల నేను చేసుకుంటూ పోతున్న యుద్ధంలో నాతో నేనే తలపడే సన్నివేశంలో నేను మాత్రమే రాసుకోగలిగే వాక్యంలో మాత్రమే నాకు విముక్తి వుందని మార్క్వెజ్ నాకు నేర్పడం మొదలు పెట్టాడు. కచ్చితంగా అప్పుడే నాకు ఇంకా చదవాలి చదవాలి ఈ సున్నితత్వపు అంతు చూడాలి అన్న కసిని పెంచుకుంటూ వెళ్ళాడు. Love in the Time of Cholera అనే నవల యాభై ఏళ్ళ తరవాత ఎప్పుడో మళ్ళీ పుట్టుకొచ్చే, ఉబికి వచ్చే ప్రేమ గురించి అనుకుంటాం కాని, నిజానికి ఆ నవలలోపలి అసలు కథ ఈ సున్నితత్వపు పునర్జన్మ కాదా!?

అవును – అనే నా సమాధానం, ఎలాంటి సంశయం లేకుండా!

 

3

images

అయితే, మార్క్వెజ్ తో నా అసలు సిసలు సహప్రయాణం 1995 తరవాతనే!

ఆ ఏడాది మార్క్వెజ్ కథలు Strange Pilgrims ఇంగ్లీషు అనువాదం నా కంట పడింది. వొక ఆదివారం పొద్దున్న బెజవాడ అలంకార్ సెంటర్లో సైడ్ వాక్ మీద పరచుకున్న పుస్తకాల మధ్య రికామీగా తిరుగుతున్నప్పుడు Strange Pilgrims పుస్తకం అట్ట నన్ను నిలబెట్టేసింది.

అప్పట్లో ఉద్యమం ఏమిటంటే: కొత్తగా తెచ్చిన పుస్తకం రెండు రోజుల్లో వేడివేడిగా చదివేయాలి. చదివాక అందులో వున్న వాక్యాలు వొక నోట్ బుక్ లో తిరగరాసుకోవాలి. ఇంకో వారం తరవాత ఆ వాక్యాలు మళ్ళీ చదువుకొని, వాటిని తెలుగులోకి తర్జుమా చేసుకోవాలి. మళ్ళీ చదువుకోవాలి. చదువుకుంటూ నిద్రపోవాలి. నిద్రలో ఆ వాక్యాల్ని కలవరించాలి. ఇవన్నీ జరక్కపోతే ఆ రచయితకి నా లోకంలోకి వీసా లేదు.

కాలేజీలో వున్నప్పుడు మహాకవి టాగూర్ గురించి నాకొక థియరీ వుండేది. టాగోర్ గొప్ప కవీ కాదు, మంచి నవలా రచయిత అంత కంటే కాదు, గొప్ప కథకుడు అని! అలాగే, శరత్ మంచి కథకుడు కాదు, గొప్ప నవలా రచయితా అని! అలాగే… అలాగే, త్రిపుర అసలు కథకుడు కాదు, మనకి తెలియని/ మనల్ని ప్రక్రియ పేరుతో నిరంతరం మోసపుచ్చే రహస్య నవలా రచయిత అని!

Strange Pilgrims చదివాక- అలాంటి థియరీ కనిపెట్టేసాను. అప్పుడు కొంత కాలం నా వాదమూ తగవూ ఏమిటంటే, మార్క్వెజ్ నవలా రచయిత కంటే ఎక్కువగా గొప్ప కథకుడు అని!

మార్క్వెజ్ వొక కొత్త రకం భాష వాడుతున్నాడని, వొక కొత్త రకం వాస్తవికత మాట్లాడుతున్నాడని మనకి కచ్చితంగా అర్థమైతే, అతని అన్ని ప్రాణాల అసలు చిలక Strange Pilgrims లో వుందని మీరు కూడా వొప్పుకుంటారు. ఈ పన్నెండు కథలు రాయడానికి అతనికి పద్దెనిమిదేళ్ళు పట్టిందట. అంటే, ఆ కథల్లో ఎన్ని ప్రాణాలు పొదిగాడో అర్థమై వుండాలి కదా! అందులో మొదటి కథ 1970లలో వొక కలలో పుట్టిందట. ఆ కలలో మార్క్వెజ్ కి అంత్యక్రియలు..దోస్తులంతా వచ్చారట. అంతా అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతున్నప్పుడు, తను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మార్క్వెజ్. అప్పుడు వొక చెయ్యి అతన్ని బలంగా వెనక్కి లాగి, “you’re the only one who can’t go!” అన్నదట. అంతే! మార్క్వెజ్ అక్కడే వుండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మార్క్వెజ్ కి అర్థమైంది: చనిపోవడం అంటే స్నేహితుల్ని మళ్ళీ కలవలేకపోవడం అని!

స్నేహితుల్ని కలవలేని ఆ వెలితిలోంచి పుట్టిన కథలు ఇవి. వ్యక్తిగతంగా నాకు ఈ కథలు ఎందుకు నచ్చాయంటే, మార్క్వెజ్ ఇతర రచనల్లో అతని దుఃఖం చాలా transparent గా కనిపిస్తుంది. కాని, ఈ కథల్లో ఆ దుఃఖాన్ని ఏ చేరుమాలుతోనూ దాచుకోలేనితనం కనిపిస్తుంది. అది అప్పుడే చెంప మీద జారి, ఆరిపోడానికి ససేమిరా నిరాకరించే తడి చుక్కలా గోరువెచ్చగా అనిపిస్తుంది ఈ కథల్లో!

వున్న వూళ్ళోనే దిగడిపోయిన మనిషికి వాస్తవికత అన్ని కోణాలూ అర్థమవుతాయని అనుకోను. వలసపోయిన కళ్ళకి కొత్త చూపుల రెక్కలు వస్తాయి. తన దేశానికి దూరంగా వుండి, తనకి తానూ, తన వాళ్ళూ, ఆ పరదేశంలోని వాళ్ళు కూడా పరాయీగా, లేదంటే కొంత ఎడంగా కనిపిస్తున్నప్పుడు మార్క్వెజ్ ఈ కథలు రాసుకున్నాడు. ఆ దూరపు దుఃఖంలో తన వూరికి తను ఎంత దగ్గిరగా వుండాలనుకుంటున్నాడో ఆ ఎడబాటు బాధలోంచి తనకోసమే రాసుకున్న కథలు ఇవి. అవి, కొన్ని క్షణాల్లో నావి అనిపించాయి అంటే, ఆ క్షణాల్లో నేనూ మార్క్వెజ్ తరహా వాస్తవికతలోకి వెళ్ళిపోయానన్న మాట!

ఎలాంటి వాస్తవికత ఇది?! వినండి మార్క్వెజ్ ఏమంటున్నాడో!

True memories seemed like phantoms, while false memories were so convincing that they replaced reality.

నా మిత్రులు చాలా మందికి తెలుసు, నా ఆలోచనల ప్రయాణం మార్క్స్ తో మొదలయింది, మరీ ముఖ్యంగా : The philosophers have only interpreted the world, in various ways; the point is to change it. అన్న వాక్యం. ఇది నా నోట్ పుస్తకాల్లోనూ, ఖమ్మం గోడల మీద ఎర్రెర్రగా రాసుకున్న రోజులన్నీ గుర్తే!

కాని, ఎంతో కొంత లోకాన్ని చూశాక, ఎన్నో కొన్ని పుస్తకాల్ని చదువుకున్నాక, ఎన్నో సంభాషణల తరవాత నాకు అర్థమైందేమిటంటే: మార్పు సుదూర లక్ష్యమనీ, అసలు వాస్తవికతనే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాల్సి వుందనీ! వేయి పూలలో కనీసం వొక పది పూలయినా పూర్తిగా వికసిస్తే చాలు అని!

తన మరణానికి మరుసటి రోజు – మార్క్వెజ్ మళ్ళీ అదే చెప్తున్నాడు నాకు!

ఈ వాస్తవికతకి నేనెప్పటికీ వొక strange pilgrimని!

 – అఫ్సర్

అమ్మా నాన్నా… కొన్ని అన్నం ముద్దలు!

Velturu2

1

తెలీదు ఎందుకో, అన్నం ముందు కూర్చున్నప్పుడు  కాశిరాజు గుర్తొస్తాడు కొన్ని సార్లు!

ఇంకా

 అసలు ఎప్పుడొచ్చిందో,  చెప్పా పెట్టకుండా ఎప్పుడేలా  పెట్టే బేడా సర్దుకెళ్ళి పోయిందో తెలియని యవ్వనమూ గుర్తొస్తుంది. నోటి దాకా వచ్చిన అన్నం ముద్ద ఇట్టే జారిపోతుందేమో అన్నట్టు  భయపెట్టే జీవితాన్ని గట్టిగా పొదివి పట్టుకోవాలనే పిచ్చి తపన గుర్తొస్తుంది.

చాలా చిత్రంగానే  వుంటుంది జీవితం మరి! దాటిపోయిన మజిలీలన్నీఅలా ఎలా జారిపోయాయా అని కలతబెడ్తాయి. కాని, కవిత్వమనే మాయా లాంతరు పట్టుకొని ఆ దాటిపోయిన వీధుల్లో గాలి కిన్నెర మీటుకుంటూ, సంచారం చేస్తూ పోతున్న వాణ్ని ఈ మధ్య చూసాను నేను! అతనేవో పాడుకుంటున్నాడు, వొక్కో సారి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వొక్కో క్షణపు అసహనంలో పక్కన ఎవరితోనో కాసేపు తగువు పడి, ఆ తరవాత పిల్లాడిలాగా కావిలించేసుకుంటున్నాడు. చాలా సార్లు అతను నేనే అనే ప్రతిబింబం అనిపిస్తాడు అందరికీ!

అతన్ని మనమూ మన లోకమూ  కాశిరాజు అని పిలుస్తున్నాం ఇప్పుడు  ఇంకేమని  పిలవాలో తెలియక!!

 

2

కాశిరాజు కవిత్వం చదువుతున్నప్పుడు ఆకలీ, యవ్వనమూ – వీటి చుట్టూ తిరిగే ఏదో వొక తాత్విక గానం వినిపిస్తుంది. ఇతని వాక్యాల్లో వొక తెలివైన అమాయకప్పిల్లాడు వొక తలుపు రెక్క సగమే  తెరిచి చిలిపిగా చూస్తూ వుంటాడు; ఎదో reflexive mood (స్వానుశీలన)లోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పటి కవుల దాదాపు అందరి కవితల్లోనూ మామూలుగానే కనిపించే ఈ స్వానుశీలన లక్షణం  కాశిరాజులో మాత్రం అదే ప్రధానంగా కేంద్రీకృతమై వుంటుంది.

Reflexivity – అంటే  తన లోపలికి తను చూసుకోవడం మాత్రమే కాదు, తలుపు ఓరగా తెరచి బయటికి చూడడమే కాదు. బయటికి ఎంత దూరం వెళ్తామో లోపలికీ అంతే దూరం వెళ్ళడం – అసలు సిసలు Reflexivity. కాశిరాజు కవిత్వమంతా ఈ Reflexive అలల చప్పుడు! కేవలం లోపలి మనిషి(insider)గా వుండే మామూలు Reflexivity ని కాశి కవిత్వం ఛాలెంజ్ చేస్తుంది. ఇతని కవిత్వంలోని ఈ స్వానుశీలన స్వభావం కేవలం తననే కాదు, బయటి పాత్రల్ని కూడా ప్రేమగా చూస్తుంది.

ఉదాహరణకి ఈ పంక్తులు చూడండి:

వర్షం వచ్చిన జాడ ఆ వాన కళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మకల్లకి నాన్న ఉపనది
మా దాహాలు తీరడానికి వాళ్ళు దు:ఖాల్లా ప్రవహిస్తారని
మాకెవ్వరికీ తెలీదు.

 

అమ్మా నాన్న కాశిరాజు కవిత్వంలో తప్పక కనిపించే పాత్రలు. కాని, అవి కాశిరాజు అనే వ్యక్తి తత్వానికి సంబంధించినంత వరకూ అతని లోపలి పాత్రలు కూడా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కాశిరాజు ఎప్పుడూ తనలోపలికి వెళ్ళిపోయి, అలా తవ్వుకుంటూ కూర్చుంటాడు.  ఇది కవిత్వంలో చాలా  కష్టమైన విద్య. కవి చాలా ఉద్వేగ భారాన్ని మోస్తూ బాలన్స్ చేసుకోవాల్సిన సందర్భం. ఉద్వేగాన్ని కేవలం ఉద్వేగంగా కాకుండా, దాన్ని కాసేపు objective గా కూడా చూడగలిగిన నిబ్బరం వున్నప్పుడే పై వాక్యాలు వస్తాయి.

 

తన కవిత్వం చదివే  పఠితని  కూడా ఆ స్వానుశీలన మూడ్ లోకి తీసుకు వెళ్ళడం కాశి ప్రత్యేకత.  ఇతని వొక్కో కవితా చదివేటప్పుడు గుండె చప్పుడు కాస్త పెరుగుతుంది. చదవడం అయిపోయాక అసలే చప్పుడూ వినపడని నిశ్శబ్దంలోకి శరీరాన్ని బట్వాడా చేసి వచ్చినట్టు వుంటుంది. అందుకే, కాశిరాజు కవితని ఆగి ఆగి చదవాలి. అలా ఆగినప్పుడల్లా అతని వూరులాంటి మన ఊళ్లోకి, అతని అమ్మానాయన లాంటి మన అమ్మానాయనల దగ్గిరకీ, వాళ్ళతో తెగిపోతున్న మన “కమ్యూనికేషన్” లోకి, మనల్ని చుట్టేసి వూపిరాడనివ్వని నగరపు మాయలోకీ వస్తూ పోతూ వుంటాం. మన గురించి మనం ఆలోచించుకునే/ బాధ పడే వ్యవధి ఇస్తూ, వాక్యాల్ని కూర్చుతూ వెళ్తాడు కాశిరాజు. ఆ వ్యవధిలో అతను మనల్ని Reflexive గా మార్చి, తన అమ్మానాన్నా కథలో మనల్ని పాత్రలుగా ప్రవేశ పెడతాడు.

కాశిరాజు కవిత తెగిపోతున్న ఆ తొలి సంభాషణల  గురించి ఎప్పటికీ తెగని మనియాది. ఈ కవిత రాసిన శరీరం ఆ కవిత రాయడం ముగిసాక ఎలాంటి నిద్రలోకి వెళ్తుందో తెలీదు. ఆ నిద్రల్లో అతన్ని ఏ కలల సర్పాలు ఎలా చుట్టుకుపోతాయో తెలీదు. సగం మాత్రమే నిండిన అతని కడుపు ఎంత మారాం చేస్తుందో!

కాశిరాజు

కాశిరాజు

3

కమ్యూనికేషన్

ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని
అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే
ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది
దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని
ఎవరినడిగితే తెలుస్తుంది

కాల్ కట్ చేస్తే

ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న
అన్న సంభాషణ సమాదైపోయి
రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా

దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు
నీరసాన్ని బద్దకంగా చేసుకుని
బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది

మెట్లుదిగి కాస్త ముందుకెళితే
ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు.

నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు
అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

Reflexivity ప్రధాన లక్షణంగా వుండే కవితల్లో dialogue రూపంలో వ్యక్తం కావాల్సిన విషయాన్ని  monologue  కింద మార్చుకుంటాడు కవి. అంటే- బయటికి ఎంతకీ చెప్పలేని, ఎవరికీ చెప్పుకోలేని విషయాన్ని తనలో తానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పైన చెప్పిన కవితలో ఈ కవి చేసిన పని అదే!

వొక మామూలు సంభాషణా వాక్యం- “ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా?”- అనే ఎత్తుగడలోనే కవి reflexive mood కి రంగం సిద్ధం చేసి పెట్టాడు. ఆ తరవాత చెప్పిన శారీరక మనఃస్తితులన్నీ ఆ mood కి భౌతిక ప్రతీకలు మాత్రమే!

ఈ కవితలో నిర్మాణపరంగా కవి వేసిన ఇంకో అడుగు: కవిత్వంలోకి కథనాత్మకత ప్రవేశపెట్టడం! తెలుగులో ఆరుద్ర, కుందుర్తి, శీలా వీర్రాజు, రంది సోమరాజు- మన తరంలో నందిని సిద్దా రెడ్డి, జూకంటి, కొన్ని కవితల్లో కొండేపూడి నిర్మల  కథనాత్మక కవిత్వం రాశారు. అవి దీర్ఘ కావ్యాలో, కవితలో అవ్వడం వల్ల వాటిల్లో కథ ప్రధానమై, కవిత్వం అప్రధానమైంది.

వాటికి భిన్నంగా కాశిరాజు చిన్న కవితలో కథనాత్మకతని తీసుకువచ్చాడు. అంటే, short narrative poem – చిన్న కథనాత్మక కవిత- అనే రూపానికి తనకి తెలియకుండానే నాంది పలికి, దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు కాశి. దీర్ఘ కథనాత్మక కవితలకి భిన్నంగా ఈ తరహా కవితలో దీర్ఘమైన వర్ణనలు వుండవు. పాత్రలు బహిరంగంగా బాహాటంగా మాట్లాడుతూ కూర్చోవు. కథా, పాత్రలు రెండూ కవి అనుభూతిలో భాగమైపోతాయి, ఆ అనుభూతికి గోడచేర్పు అవుతాయి వొక విధంగా!

ఈ కవిత్వ నిర్మాణం సాధించడానికి కాశి వాక్యస్వభావాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఉప్పెనలాంటి వాక్యాలు వొకప్పుడు కవిత్వంలో బాగుండేవి. ఉదాహరణకి: శ్రీశ్రీ కవిత్వ వాక్యాలు సాధారణంగా వేగంగా ఉరవడిగా ప్రవహిస్తాయి. అలాంటి ధోరణి అలాగే కాకపోయినా వేర్వేరు రూపాల్లో ఇప్పటికీ వుంది. ఇప్పటి కవిత్వ వాక్యాలు సెలయేటి నడకలు అని నాకు అనిపిస్తోంది. ఆగిఆగి వెళ్తూ, తనని తానూ తరచి చూసుకునే reflexive mood ఆ నడకలో కనిపిస్తుంది.

ఈ సెలయేటి రహస్యం తెలిసిపోయింది కాశికి!

* 

పాత చొక్కా: వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

Velturu2

అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా
నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది

బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ
సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు

స్నేహితుల తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు
తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు

మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే
రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు

యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు

ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

 

1

IMG_6555

మంచి కవిత్వం ఎలా వుంటుందో యింతవరకూ యెవరూ చెప్పలేదు. చెప్పడానికి కావాల్సిన పదాలు లేవని మాత్రం అంటూనే వున్నాం. మంచి కవిత ఎందుకు మంచిదైందో చెప్పడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే తిరగదోడుతూ వుంటాం. ఎందుకంటే, కవిత్వాన్ని కవిత్వంతో మాత్రమే కొలవగలమనీ, వచనంతో తూయలేమనీ అనుకుంటాం కనుక!

చాలా వరకు ఇది నిజమే! పరిమితమైన  నా అనుభవంలో నాకు తెలిసివచ్చింది కూడా ఇదే!

కవిత్వాన్ని గురించి మొత్తంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సమస్య మామూలే! కాని,  విడివిడిగా వొక కవిత తీసుకొని మాట్లాడుతున్నప్పుడు  చెప్పే మాటలు కూడా నాకు అంతగా తృప్తినివ్వవు. కవిత చదివాక కలిగే వొకలాంటి తృప్తినీ, ప్రశాంతతనీ వచనంలో రాయలేకపోయినా, కనీసం కొంత మాట్లాడితే బాగుణ్ణు అనుకొని, గత కొద్ది కాలంగా కొన్ని కవితల ముందు ఎంతో కొంత నేర్చుకోవాలని తపించే విద్యార్థిలా నిలబడి, మాటలు కూడదీసుకుంటున్న సమయంలో అనుకోకుండా వర్మ రాసిన ఈ “పాతచొక్కా” కవిత తారసపడింది.

పాత చొక్కా…!

కవిమిత్రుడు హెచ్చార్కె కలిసినప్పుడల్లా తనకీ నాకూ జరిగే అనేకానేక సంభాషణల్లో ఈ పాత చొక్కా వొకటి. ఖమ్మంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు హెచ్చార్కె తరచూ విప్లవ రచయితల సంఘం బాధ్యుడిగా ప్రసంగాలు ఇవ్వడానికి వస్తూండే వాడు. అతని ప్రసంగాలంటే నాకు ఇష్టంగా వుండేది. అంతకంటే ఎక్కువగా – అతనెప్పుడూ వేసుకొచ్చే వొక నీలంరంగు చొక్కా అంటే మరీ  ఇష్టంగా వుండేది. టీనేజర్ని కదా, నా జర్నీ కొంచెం అలాగే వుండేది! నాకు కూడా కచ్చితంగా అలాంటి నీలం రంగు చొక్కానే – సన్నటి వైట్ చెక్స్- తో వుండేది.  ఇద్దరమూ ఆ చొక్కాల మీద నిజంగానే   ఇష్టంగానే  మాట్లాడుకునే వాళ్ళం, విప్లవ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేసి!

కొంత కాలానికి మా స్నేహం పాతబడింది, ఆ నీలం చొక్కా మాదిరిగానే!

కాని, ఆ జ్ఞాపకం వుందే, అది ఇప్పటికీ వర్మ చెప్పినట్టు-  “మనసు కొక్కేనికి వేలాడుతూనే” వుంది ఎప్పటికప్పుడు  కొత్తబడుతూ!

ఇప్పుడు ఈ కవిత  చదివాక వెంటనే అనిపించింది, అసలు ఇన్నాళ్ళుగా నాతో వున్న, నాలో వున్న ఈ అనుభవాన్ని నేనే  ఎందుకు రాయలేకపోయానా అని. బహుశా, మంచి కవిత అనేది మనలోని అలాంటి వొక అశక్తతని కూడా కొన్ని సార్లు గుర్తుచేస్తుందేమో!

ఈ  కవిత మొదట చదివిన కొద్దిసేపటికి, ఆ తరవాత ఇంకో రెండు సార్లు చదువుకున్నాక ఇంకా అనిపించింది, రాసినా  నేను  ఈ కవిలా రాయలేను అని! మరీ దగ్గిరగా వుండే అనుభవం రాయడం ఎంత కష్టం!?

వొక  మంచి కవిత చేసే యింకో గొప్ప పని ఏమిటంటే — అది మన మనసు తెలిసో తెలియకో విధించుకున్న కొన్ని పరిమితుల్ని కూడా గుర్తు చేస్తుంది. ఆ పరిమితుల్ని తెగ్గొట్టి ఆ అనుభవాన్ని తిరిగి ప్రేమించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది!

అందరమూ అనుకున్నట్టు- ఇలాంటి పని చేసే కవిత్వానికి, ఆ శక్తి ఆ కవిత్వ వాక్యం నించి మాత్రమే రాదు. గొప్ప కవిత్వ వాక్యాలు రాసే కవులు మనకి చాలా మందే వున్నారు. కాని, వాక్యాలు ముందు పుట్టి తరవాత భావాన్ని చొక్కాలా వేసుకునేది మంచి కవిత్వం కాదని  ఖాయంగా చెప్పగలను.

2

ఈ కవితలో ప్రత్యేకించి చెప్పాల్సింది: metaphorization – పదచిత్రీకరణ.  సాధారణంగా చలనమున్న పదచిత్రాల్నీ(dynamic images),  ప్రతీకల్ని (ఉదాహరణకు: సెలయేరు) తీసుకోవడంలో వున్న సౌలభ్యం చలనరహితమైన పదచిత్రాల్ని(static images), ప్రతీకల్ని (ఉదాహరణకు: ఈ కవితలో పాత చొక్కా) తీసుకోవడంలో లేదు. ఇక అలాంటి చలనరహిత ప్రతీకల్ని చలనశీలమైన భావాల్ని పలికించడానికి ప్రయత్నిస్తే  చాలా సందర్భాల్లో కవిత శిల్పం దెబ్బతింటుంది. ఆ ఇబ్బందిని గట్టెక్కడం శిల్ప పరంగా ఈ కవితలో వొక నిర్మాణ  విశేషం.

ఆ ఇబ్బందిని గట్టెక్కడానికి ఈ కవి  చేసిన పనేమిటంటే, ఆ చలనరహితమైన ప్రతీకలూ వస్తువుల వెంటనే చలనశీలమైన వొక అనుభూతిని ఆసరా తీసుకున్నాడు.

ఉదాహరణకు ఇక్కడ “బొత్తాం” “చినుగు” చూడండి:

 1. బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ…(బొత్తాం – కళ్ళు చిట్లించి, ప్రేమ దారంతో  అమ్మ)
 2. స్నేహితుల తోపులాటలో చినిగి… ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న (చినుగు – దాన్ని కుట్టే నాన్న)

 

ఈ continuity ని  చివరంటా సాధించింది కవిత.

రెండో నిర్మాణ విశేషం: కవి ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న క్రియా పదాలు. కవితలో రెండో పంక్తి లోని “వేలాడుతున్న” అనే పదం మొదలుకొని, చివరి పంక్తిలో వున్న “దాస్తున్న” దాకా క్రియ అనేది నిష్క్రియగా (dysfunctional)  కాకుండా, చాలా నిర్దిష్టమైన పని (very functional) కోసం వుపయోగించడం ఈ కవితలో బలంగా కనిపిస్తుంది.

మూడో విషయం: తన అనుభూతిని కవి ఎలాంటి frame నించి imagine చేస్తున్నాడో, ఆ ఊహకి ఎలాంటి రూపమిస్తున్నాడో అన్నదాన్ని బట్టి కూడా ఆ కవిత గుణం తెలుస్తుంది. అంటే, కవిత మొత్తంలో గుండె చప్పుడూ, ఆలోచనల అలజడీ కలగలిపే వాక్యాలు కొన్ని వుంటాయి. ఆ వాక్యాల్లో కవి పొదుపుగా దాచుకున్న అనుభూతి వినిపిస్తుంది. ఈ కవిత మొత్తం సాంద్రతని వొడిసిపట్టుకున్న వాక్యం నాకు అర్థమైనంత మటుకు ఇది:

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

3

ప్రతి బతుకు పుస్తకంలో అనేక  జ్ఞాపకాలుంటాయి. కొన్ని యిట్టే స్మృతిలోంచి జారిపోతాయి. అవి అలా జారిపోయాయని కూడా మనకి తెలియదు.  అలా జారిపోకుండా పట్టుకోగలిగిన జీవితం ఎక్కువ సఫలమైనట్టు అనుకుంటాను నేను. అలా జారిపోయిన వాటిని పట్టుకొచ్చి మన చేతికిచ్చేది మంచి కవిత అనుకుంటాను. అలాంటి ఎన్ని విస్మృత జ్ఞాపకాల్ని బతికిస్తే అంతగా ఆ కవిత బతుకుతుంది.

ఆ కొలమానంతో ఈ  కవిత – a celebration of the retrieval of a  memory – వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

 – అఫ్సర్

ఇవాళ ఆ ఆకలి మెతుకే గెలిచింది!

557857_3913613231735_1588337585_n

వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం

క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్.

ఆకలి  మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది.

అయినా సరే,

పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది.

చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.

ఆకలి మెతుకు

వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.

నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!

–          ‘రోజ్ రోటీ’ కవిత నించి.. 2010.

 

తెలంగాణా ఉద్యమం బాగా వేడెక్కిన సందర్భంలో 2010లో టెక్సాస్ తో పాటు అమెరికాలోని  అనేక ఊళ్ళల్లో తెలంగాణా సభలు జరిగాయి.  కొన్ని సభల్లో  నేనున్నాను. మాట్లాడాను. ఆ సభల్లో కొన్ని చోట్ల  ప్రధాన వక్తల ప్రసంగాలు అయ్యాక తెలంగాణా పల్లెల నించి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవిత కథలు/ ఇప్పటి పల్లెల పరిస్థితి గురించీ వ్యక్తిగత కథనాలుగా వినిపించే వాళ్ళు. అవి విన్న ప్రతిసారీ ‘ఇది కదా జీవితం’ అని కళ్ళు చెమర్చేవి. మొసళ్ళు కన్నీళ్లు కార్చే ఈ లోకంలో వొక మనిషి కన్నీరు ఇలా కదా వుండాలి అనిపించేది. 

ప్రతిసారీ ఆ సభలనించి వెనక్కి వచ్చేటప్పుడు వొక తీవ్రమైన ఉద్వేగం నన్ను ఉప్పెనలా చుట్టుముట్టేది. అనేక రకాల ఆలోచనల మధ్య నిశ్శబ్దంలో కూరుకుపోయే వాణ్ని. అది నిశ్శబ్దంగా వుండాల్సిన సమయం కాదు. నిట్టూర్పులు విడుస్తూ కవిత్వ వాక్యాల మధ్య దాక్కోవాల్సిన సందర్భం అసలే కాదు. నిస్పృహ లేదనీ కాదు.

కాని, అంతకంటే బలమైన స్పృహ నన్ను ఆవరించి వుండేది.  ఈ సభలు నిర్వహిస్తున్న వాళ్ళంతా తెలంగాణాలోని మారుమూల పల్లెల నించి వచ్చి, సొంత పులుగు మీద జీవితాల్ని అమర్చుకుంటున్న వాళ్ళు. వొక పూట తిని ఇంకో పూట పస్తులుంటూ చదువుకున్న వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళలో కొంత మంది తల్లిదండ్రులు ఆ పాతకాలపు ఎప్పటికైనా కుప్పకూలిపోయే ఇండ్లల్లో బతుకు వెళ్లమారుస్తున్న వాళ్ళే! కాసింత నేలని నమ్ముకొని ఆ నేల చుట్టే జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు.

చాలా ఆశ్చర్యంగా వుంటుంది కొన్ని సార్లు! దిగులు దిగులుగానూ వుంటుంది. ఎక్కడ మొదలయ్యామో వెతుక్కుంటూ వెళ్తే…కొంత మంది పూరిగుడిసెల్లో పుట్టీ పెరిగీ చూస్తూ చూస్తూ వుండగానే మిద్దె మీద మిద్దెలు కట్టుకుంటూ విలాసాలకి చేరువ అవుతారు. ఇంకా కొంత మంది ఇంత దూరం వచ్చి కూడా “అదనపు లాభాలు” సంపాదించే తెలివి తేటలు లేక వున్న చోటే బిక్కుబిక్కుమంటూ వుంటారు. ప్రవాస తెలంగాణా సభల్లో నేను చూసిన చాలా మంది యువకులు అలా బిక్కుబిక్కుమంటూనే కనిపించారు. వీళ్ళు ఇంటికి వెళ్లి ఇంకా ఆ జొన్న అంబలి ఆకలి ఆకలిగా  ఆబగా తాగే వాళ్ళుగానే అనిపించారు. వాళ్ళ ముఖాలు ఇంకా ఆ పచ్చడి మెతుకుల్లాగానే అనిపించాయి.

Untitled

వాళ్ళ అడుగుల్లో  “దూసుకెల్తా…!” అనే పిచ్చి పరుగు  కనిపించలేదు. వాళ్ళ మొహాల్లో ఇతరుల్ని వెర్రినాగన్నలానో, నాగమ్మలానో చూడాలన్న మితిమీరిన తెలివి కళ లేదు. విపరీత వస్తువ్యామోహంలో పరోక్ష ప్రశ్నలతో అవతలి వాడింటి వాసాలు – రాజభవనాల్ని తలపించే మేడలూ, ఆ మేడల్లో ప్లాస్మా స్మార్ట్ టీవీలూ వగైరా వగైరాల ఆరా  తీయాలన్న ఆరాటం లేదు. అన్నిటికీ మించి లేని మేధావితనాన్ని తెచ్చిపెట్టుకున్న సరికొత్త upstart crow వేషాలూ లేవు. అప్పుడే పుట్టుకొచ్చిన ‘అదనపు లాభాల’ పొగరులోంచి అరువు తెచ్చుకున్న నడమంత్రపు నయగారాలూ లేవు!

అవును, ఇది ‘అమాయకత్వం’ అనుకుంటే, తెలంగాణా అలాంటి అమాయకత్వంలోనే కొన్ని దశాబ్దాలుగా బతుకుతోంది. మాయవన్నెలు తెలియక మోసపోతూనే వుంది. గదమయించే నోరు లేక, దబాయించే నీతిమాలిన తనం లేక, చరిత్రని వ్యాపారం చేయలేక, వ్యాపారాన్ని చరిత్ర చేయలేక వున్న చోటనే పడి, పడిగాపులు పడుతోంది.

కాని. ఈ పొద్దున్న తెలంగాణాలో నిజంగా పొద్దు పొడిచింది.

ఆ అమాయక ముఖాల్లో వొక సూర్య కాంతి మెరిసింది. ఈ పొద్దుని  కూడా నకిలీ సూర్యుళ్ళు కిడ్నాప్ చేస్తారన్న భయం కడుపులో లేకపోలేదు. ఈ కాసిని కిరణాల్ని కూడా వాళ్ళు దోచుకుపోయి అదనపు ఆదాయం కింద దాచి వుంచేసుకుంటారన్న దిగులు ఉండనే వుంది. కాని, సూర్యుడు చాలా స్పృహతో తెలంగాణా పంట చేల మీద పొడిచాడు! ఇవాళ ఆకలి మెతుకు గెలిచింది! తెలంగాణా నిరుపేదల చెంపల మీద కొన్ని దశాబ్దాలుగా చారికలు కట్టి వున్న కన్నీటి చుక్క గెలిచింది!

Hyderabad_CITY_Page_758745e

2

ఈ రాజకీయాలతో వొక రచయితకేమిటి? అని అనుకున్న సందర్భం లేదా అంటే వుంది.

ఈ ప్రశ్న మన తెలుగుదేశంలోని సో కాల్డ్ అమాయకమైన (?) సాహిత్య వేత్తలు మాత్రమే వేసుకోగలరని వొక పొగరుమోతు సమాధానం కూడా నా దగ్గిర వుంది. లేదూ, రాజకీయాలు చేస్తున్న సాహిత్యవేత్తలే ఇలాంటి ‘స్వచ్చమైన’ ‘నిర్మలమైన’ సాహిత్య  ప్రశ్న వేయగలరు అన్న కుటిలమైన సమాధానమూ వుంది. కాని, పోరాటాల పురిట్లో పుట్టిన తెలంగాణా రచయిత రాజకీయాలు వద్దని శుష్కమైన కలలో కూడా అనుకోలేడు. అలా అనుకుంటే, అతని మౌనం తెలివైన రాజకీయమే అవుతుంది. అతని కవిలె కట్ట అందమైన పాకేజీలో కట్టబెట్టిన మోసమే అవుతుంది.

రాజకీయాలు అనే మాటని నేను ఇక్కడ సంకుచితమైన అర్థంలో వాడడం లేదు. నేను చెప్పాలనుకున్న నిర్వచనం ఇదిగో చూడండి ఇతనెవరో నా కోసమే చెప్పినట్టుగా వుంది:

Politics is commonly viewed as the practice of power or the embodiment of collective wills and interests and the enactment of collective ideas. Now, such enactments or embodiments imply that you are taken into account as subjects sharing in a common world, making statements and not simply noise, discussing things located in a common world and not in your own fantasy. What really deserves the name of politics is the cluster of perceptions and practices that shape this common world. Politics is first of all a way of framing, among sensory data, a specific sphere of experience. It is a partition of the sensible, of the visible and the sayable, which allows (or does not allow) some specific data to appear; which allows or does not allow some specific subjects to designate them and speak about them. It is a specific intertwining of ways of being, ways of doing and ways of speaking. (Jacques Ranciere, 2004).

ఈ సాహిత్య తాత్వికుడు నా మాదిరిగానే literature as literature అనే ధోరణికి శత్రువు. ఎవరూ నేరుగా రాజకీయ ప్రకటనలు చేయకపోవచ్చు. కాని, వాళ్ళ సాహిత్య శరీర కదలికలు, పెదవి విరుపులు కనిపించని పెప్పర్ స్ప్రే చల్లుతాయి. సోకు చేసుకున్న వాక్యాలు  వెటకారాలూ మిరియాలూ నూరుతుంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో ఇలాంటి పెప్పర్ స్ప్రే విమర్శల్ని ప్రతి  తెలంగాణా రచయిత (నిజమైన తెలంగాణా రచయిత) ఎదుర్కొన్నవాడే!

బాగా గుర్తొస్తుంది ఎప్పుడూ! వొక సారి మాటల సందర్భంలో సి.నారాయణ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. “ఇప్పుడు కాదు కాని, నేనూ దాశరథి కొత్తగా రాస్తున్న కాలంలో ఆంధ్రా వాళ్లలా రాయాలనీ, మాట్లాడాలనీ మా మీద  తెలియని వొత్తిడి వుండేది. అంటే ఊహించు! మేం కలం పట్టి రాసేనాటికి మా కలాల మీద, మా తలల మీద మాది కాని చరిత్ర భారాన్ని మేం మోయాల్సి వచ్చిందన్న మాట!”

తెలంగాణా రచయితలు వాళ్ళ వాళ్ళ యాసల్లో మాట్లాడినప్పుడు/ రాసినప్పుడు  వినిపించిన వెక్కిరింతలు ఆ తరానికే పరిమితం కాదు. ప్రతి తరం అదే సమస్యని ఇంకో రూపంలో తలకెత్తుకుని భరించక తప్పలేదు. భాషని శుభ్రపరిచే పేరుతొ తల్లి భాష వస్త్రాలని నిలువునా అపహరిస్తున్నా తెలంగాణా రచయిత పడ్డాడు. అదనపు లాభాల సంస్కృతీ వోనమాలు కష్టంగా అయినా నేర్చుకున్నాడు. కొందరికే పరిమితమైన కోస్తా తెలుగుని అందరి నెత్తి మీదా మోపేందుకు వొక సాంస్కృతిక రాజ్యాన్ని (colonizing the mind) సాహిత్య రూపంలోనే కాదు, అలాంటి సామ్రాజ్యవాద సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నిర్మించిన పత్రికలూ, సినిమాలూ, భాషా తన గొంతు నులిమేస్తున్నపుడు తెలంగాణా రచయిత వొంటరి వాడయ్యాడు. తెలంగాణా ఆ చీకటి కొట్టంలో మగ్గిపోయింది. వ్యాపార చరిత్ర ముందు సాహిత్య చరిత్ర సిగ్గుపడి ఎటో పారిపోయింది.

నిజమైన తెలంగాణా ఇవాళ కాదు గెలిచింది! ఆ బానిస చరిత్రని ధిక్కరించిన ఇరవయ్యేళ్ళ కిందనే గెలిచింది. యాసని సాహంకారంగా తన అసలైన భాషగా ప్రకటించుకున్న రోజునే తెలంగాణా సాంస్కృతిక విజయం సాధించింది.  ఎడారులుగా మారిపోతున్న/ తమ గడ్డ మీద తామే వలస బతుకీడుస్తున్న తల్లిదండ్రుల శోకాన్ని అక్షరాలకెక్కించిన ప్రతి క్షణమూ తెలంగాణా గెలిచింది. తన వాక్యాల మీద ఇతరులిచ్చే పరిశుద్ధ తీర్పుల్ని ఆకుముక్కల కింద తీసిపడేసిన ప్రతి క్షణమూ తెలంగాణా అక్షరం గెలిచింది.

3

ఎప్పుడైనా ఎక్కడైనా పీడితులే గెలవాలి. పీడితులే చరిత్ర రాయాలి. పీడితులే వుద్యమాలు నడపాలి. పీడితుల అక్షరాలే నిజమైన సాహిత్యంగా నిలబడాలి.

ఇది ఇవాళ తెలంగాణా అనే ఈ ఆకలి మెతుకు నేర్పిన పాఠం!

నా ‘రోజ్ రోటీ’ కవితలోంచి కొన్ని వాక్యాలతోనే చివరి మాటలు ఇదిగో ఇక్కడ:

నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ!

వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే!

నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే!

ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!

చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా,

నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.

కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!

 

రోజ్ రోటీ నా అద్దం.

దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.

 -అఫ్సర్

చిత్రాలు: అన్నవరం శ్రీనివాస్, ఏలే లక్ష్మణ్, యాసాల బాలయ్య

 

“నేను”తో వొక కొత్త విమర్శ ప్రయోగం!

 

(ప్రతిష్టాత్మకమయిన లోక్ నాయక్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కి దక్కింది. ఈ సందర్భంగా ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో అఫ్సర్ రాసిన  వ్యాసం )

19BG_VOLGA_1336248e

నాకు చాలా ఇష్టమయిన పది పన్నెండు ప్రపంచ నవలల్లో వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” వొకటి. అది నేను నా తొలినాళ్లలో చదివిన నవల అవ్వడం వొక వ్యక్తిగత కారణం.   బీయ్యే ఇంగ్లీష్ చేసేటప్పుడు ఆధునిక ఇంగ్లీష్ నవల- సాహిత్య సిద్ధాంతాలు  స్పెషలైజేషన్ గా తీసుకుని, మొదట చదివి, విశ్లేషించిన పది ఆంగ్ల నవలల్లో ఇదీ వొకటి.  మిగిలిన ఆ తొమ్మిది నవలలు అంతగా మళ్ళీ మళ్ళీ చదివిందేమీ లేదు. కానీ  “టు ద లైట్ హౌస్”  నన్ను ఇప్పటికీ వెంటాడే నవల. నాలుగేళ్ళకోసారి నా చేతులు అప్రయత్నంగా ఆ నవలని తీసుకుంటాయి, ఆ చేతులు నొప్పెట్టినా సరే,  చివరి పేజీ దాకా చదవనిదే వదలనివ్వదు నవల .   

ఈ  నవలలో వొక స్త్రీ పాత్ర ఇంకో పురుష పాత్రని అడుగుతుంది,

“ఇంతకీ మీ నాన్నగారు రాసిన ఆ పుస్తకాలన్నీ దేన్ని గురించి?” అని-

అతను ఇంకే తడబాటూ లేక వెంటనే “subject, object and the nature of reality” అంటాడు.

“ఓర్నాయనో! ఏమిటదీ??” అని బిక్క మొహం వేస్తుంది ఆవిడ.

అప్పుడు పాపం, ఆమె  ఏ సాహిత్య కళా వాసనలూ లేని “వంటింటి కుందేలు” అన్న స్పృహ కలిగి,  ఆమెకి అర్థమయ్యే భాషలో చెప్పాలని అతను “ఈ కిచెన్ టేబులు గురించి ఆలోచించు, నువ్వు దాని దగ్గిర లేనప్పుడు!” అంటాడు, కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా, “ఆడముండల్తోనా ఆలోచనా?” లాంటి ఏదో వొక భావంతో!

ఆమెకి ఆ ముక్క  అర్ధమయ్యిందా కాలేదా అన్నది వేరే సంగతి. నాకు మాత్రం చాలా కాలం అర్థం కాలేదు, కానీ, చాలా సందిగ్ధంలో పడి, తరవాత తరవాత శోధిస్తే తేలిందేమిటంటే ఇది నా బాధ కాదు, ప్రపంచం బాధ అనీ!

పాశ్చాత్య సాహిత్య విమర్శలో తల పండిన సాహిత్య విమర్శకులూ, సామాజిక  సిద్ధాంతకర్తలూ  పదే పదే  ఈ సంభాషణని ప్రస్తావిస్తూ వచ్చారు.  వివిధ కాలాల్లో వచ్చిన వీళ్ళంతా  కూడా ఆయా కాలాల్లో ఆయా రకాలుగా దీన్ని అర్థమో, అపార్థమో చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ప్రతి నాలుగేళ్ళకి వొక సారి ఈ నవల నేను చదువుతూనే వున్నా, చదివిన ప్రతి సారీ ఈ సంభాషణ నాకు  వొక్కో కాలంలో వొక్కో  రకంగా అర్ధమయ్యింది. ఒక అర్ధానికీ ఇంకో అర్ధానికీ పొంతన లేదు. అలా పొంతన లేకపోవడానికి కారణం నేను ఆ సంభాషణ గురించి ఆలోచించే స్థితిలో, ధోరణిలో మార్పు రావడమే!

కాలానుగుణంగా మారుతున్న ఆలోచనలలో  మారుతూ వున్న ‘నేను” ముఖ్యమయిన పాత్ర తీసుకుంటోంది. ఆ “నేను” చుట్టూ మారే స్థల కాలాలు అంతకంటే గట్టి పాత్ర తీసుకుంటున్నాయి.  అటు నించి నరుక్కురావాలంటే, ఇప్పుడు  ఆ మగవాడి మాట అతనికే అప్పజెప్పాలి  స్త్రీత్వపు వైయక్తిక స్వరంతో – ‘విషయం, విషయి, వాస్తవికత స్వభావం’ ఎప్పటికప్పుడు మారిపోతాయి.  అంతే కాదు, ఆ మాటలు ఎవరు అంటున్నారు, ఎవరు వింటున్నారు అన్న ప్రశ్నని బట్టి కూడా వాటి అర్ధాలు మారిపోతాయి. అంటే, పఠనం అనేది కేవలం వొకే వైపు దూసుకెళ్లే ట్రాఫిక్ కాదనీ, అది చదువరి/ శ్రోత/ రచనలోని సాంస్కృతికత/ చదువరి, పఠిత సాంస్కృతికత మొదలయిన అంశాలు పఠనాన్ని ఒక performance గా మారుస్తున్నాయి. ఎవరు ఎవరికోసం చదువుతున్నారన్నది performativity కోణం నించి అడిగే ప్రశ్న. ఎవరు ఎవరి కోసం అన్న ప్రశ్నలో సమాధానాలు  “నేను” లోనే వున్నాయి.  వొక్కో సారి విషయం (subject) మారకపోయినా, విషయి మారకపోయినా, ఈ “నేను’ దాన్ని చూసే “subjective” దృష్టి వల్ల మొత్తం వాస్తవికత స్వభావమే మారిపోవచ్చు.

ఓల్గా గారి “సహిత” వ్యాసాలు చదువుతునప్పుడు ఆ మార్పు ఎట్లా వుంటుందో కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. “సహిత”లో వొక రచయిత తన పఠనానుభవంలోకి తీసుకువెళ్లడం వొక ప్రధాన ప్రక్రియ. అయితే, అదే సమయంలో ఆ పఠనానుభవంలో “తను” ఏమిటి? ఆ “తను” ఎవరికోసం గొంతు విప్పుతోంది? అన్న ప్రశ్నలు కూడా ముఖ్యమవుతున్నాయి.

స్త్రీ వాదం చర్చలోకి వచ్చేంతవరకూ చాలా మంది విమర్శకులు  ఆ సంభాషన్లో “అతను” చెప్పిన ఆ ముక్కకే పరిమితమయి మాట్లాడారు, స్త్రీ వాదులు ఆ విమర్శనంతా తుంగలో తొక్కి, అప్పటి వరకూ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన  ఆవిడ పక్షం తీసుకొని, అసలక్కడ “కిచెన్ టేబులు ఎందుకు ఉదాహరణ కావాలి?” అన్న కొత్త  సాంస్కృతిక వాస్తవిక ప్రశ్న లేవనెత్తారు. అది ఎలాంటి ప్రశ్న అంటే, ఆ నవల రాసిన కాలంలో అంటే 1927లో అలాంటి వొక ప్రశ్నని వర్జీనియా వుల్ఫ్ కూడా వూహించి వుండదు. అదే విధంగా, ఓల్గా “సహిత”లో వివిధ వ్యాసాలలో లేవనెత్తిన సాంస్కృతిక ప్రశ్నలన్నీ సమకాలీన/ దృక్పథ-కేంద్రిత స్పృహలోంచి మొలకెత్తినవి. వొక విధంగా ఈ ప్రశ్నలు ఇప్పుడు మొలకలయిన భావనల అప్పటి అంకురాల అన్వేషణ “సహిత.”

వర్జీనియా వుల్ఫ్ నవలానంతర  ప్రశ్నల  నేపధ్యంలో తలెత్తిన చర్చల్లో ఇంకా వేరే అంశాలు చాలా వున్నాయి, ఒక సామాజిక సిద్ధాంత చర్చే వుంది.  కానీ, నేను ఇప్పుడు ఓల్గా సాహిత్య వ్యాసాల సంపుటి “సహిత” విశ్లేషణలో ఆ చర్చలోని రెండు అంశాలని మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నాను -అందులో మొదటిది  స్త్రీవాద వైయక్తికత (subjectivity), రెండోది: స్త్రీవాద సాహిత్య/సాంస్కృతిక చరిత్ర నిర్మాణం (feminist historiography). ఈ రెండు మౌలిక భావనలకీ వొక దాంతో ఇంకో దానికి సంబంధం వుంది, అలాగే, ఈ రెండూ  ఓల్గా సాహిత్య వ్యాసాల ‘సహిత’ కీ పునాది అని నా అభిప్రాయం. వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” నవలకీ, ఓల్గా తెలుగు సాహిత్య రంగంలో చేస్తున్న పనికీ కూడా కొన్ని పోలికలు వున్నాయి. అది ఇంకా లోతయిన తులనాత్మక విశ్లేషణ జరగాల్సిన విషయం కాబట్టి, ఇప్పటికిప్పుడు  ఆ విషయం జోలికి నేను  పోవడం లేదు.

ఇక ఈ వ్యాసం ముగిసే లోగా నేను చాలా గట్టిగా  వాదించదలచుకున్న అతి ముఖ్యమయిన విషయం ఇంకోటి  వుంది – ఈ  ‘సహిత’ వ్యాస సంపుటి కేవలం సాహిత్య వ్యాసాల సంపుటి కాదనీ, ఇది  ఓల్గా మేధోజీవన ఆత్మ కథ (intellectual autobiography) అని. ఈ వాదన కొంచెం సంక్లిష్టమయింది అని నాకు తెలుసు. కానీ, అది ఈ సందర్భంలో ముఖ్యమయ్యిందని నాకు కచ్చితంగా తెలుసు, ఈ వ్యాసం చదివాక అది  మీకు కూడా తెలుస్తుంది.

1

      వైయక్తికత అనే మాటని కాస్త తేలిక పద్ధతిలో, ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న  వ్యక్తిగతం(పర్శనల్)   అందాం. కానీ, ఈ ‘వ్యక్తి’కేవలం  ‘నేను’ పరిధికి  కుంచించుకు పోయే వ్యక్తి కాదని చెప్పడం కోసం, దాన్ని వొక భావనగా చర్చించే వుద్దేశంతో ‘వైయక్తికత’ అని కొంచెం భిన్నమయిన పదాన్ని వాడుతున్నాం. కానీ, అన్నీ విధాలుగా వ్యక్తిగతం అనే మాట కింద వచ్చే విషయాలే ఇందులో చర్చకి వస్తాయన్నది వాస్తవం. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు అస్తిత్వం అనే భావనకి ఒక రూపాంతరం   వైయక్తికత.

తత్వశాస్త్ర చరిత్ర చాలా కాలం పాటు అస్తిత్వం అనే భావనకి సామూహికత పునాది అంటూ వచ్చింది. అనేక మతాల దర్శనాల్లో కూడా సామూహిక అస్తిత్వానికే పెద్ద పీట వేశారు. దాని ప్రకారం, సామూహికంగా వొప్పుదల అయిన కొన్ని భావనల సమాహారమే వైయక్తికత లేదా అస్తిత్వం. ఆ అస్తిత్వ చర్చలో వ్యక్తికి విడిగా వొక స్థానం అంటూ లేదు. కానీ, ఆధునికత అనే భావనలో  వైయక్తికతని అస్తిత్వానికి వొకానొక ముఖ్యమయిన లక్షణంగా గుర్తించడం మొదలయ్యింది. ఆశ్చర్యంగా ఈ పదాన్ని వొక భావనగా వుపయోగించిన మొదటి  తాత్వికుడు వొక కాల్పనిక కవి కొల్రిడ్జ్. 1821 లో కొల్రిడ్జ్ చెప్పిన అర్ధం– consciousness of one’s perceived states- చాలా కాలం పాటు  అదే ప్రామాణికంగా వుంది.

కానీ, ఈ వైయక్తికత అనేది కేవలం వొక వ్యక్తి అవగాహనా, అనవగాహన మీద ఆధారపడిన స్థితి కాదనీ, ఈ వ్యక్తి అస్తిత్వ భావన అనేక అంతర్ బాహ్య పరిస్తితుల మీద కూడా ఆధారపడి వుంటుందని అత్యాధునిక  సామాజిక శాస్త్రవేత్తలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ కొత్త భావన ప్రకారం సమూహం ఎంత ముఖ్యమో, వ్యక్తీ అంతే ముఖ్యం. కానీ, ఆ వ్యక్తికి ఎన్ని కోణాలు వుంటాయన్నది ఇప్పుడు ముఖ్యమయిన ప్రశ్న.  2001 లో ఆంథోనీ ఎలియట్ ఏమంటున్నాడో చూడండి:

…..the self is also shaped and defined against the backdrop of…..political and public forces; yet the fabrication of the self, psychologically and emotionally, is rightly understood to involve something more subjectivity, particularly in the ways in which desire, emotion and feeling influence the conscious and unconscious experience of sexuality, gender, race and ethnicity.

కొల్రిడ్జ్ నుంచి ఇటీవలి ఎలియట్ దాకా వైయక్తిక అస్తిత్వం వొక భావనగా సాగించిన ప్రయాణంలో మనం చూడాల్సిన మార్పు ఏమిటంటే, వైయక్తిక అస్తిత్వం అనేది మనం అనుకుంటున్నంత వైయక్తికం కాదు. అందులో ఆ అస్తిత్వాన్ని సృష్టించే పబ్లిక్ శక్తుల ప్రమేయం తప్పక వుంటుంది. అత్యాధునిక వాదం పర్సనల్ కీ, పోలిటికల్ కీ మధ్య వుండే పరస్పర బంధాన్ని చెప్పే దాకా వెళ్తుంది ఆ పునాది మీదనే. విశ్వజనీనత అనే భ్రమ నుంచి బయట పడి, చాలా నిర్దిష్టంగా, స్థానికంగా  మాట్లాడడం మొదలెడితే తప్ప ఈ అస్తిత్వ కోణాల్ని సమగ్రంగా చూడలేమని నా వాదన.

గత పాతికేళ్లుగా తెలుగు సాహిత్య/సామాజిక చరిత్రని శాసించిన రెండు మౌలిక భావనలు – నిర్దిష్టత, స్థానికత. ఎన్ని వాదాలు వచ్చినా, ఎని వివాదాలు జరిగినా, ఈ రెండు మౌలిక భావనల్ని అవి తప్పించుకోలేవని నా అభిప్రాయం. తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అంటూ జరిగితే, అది ఈ భావనల పునాదిగా జరగాల్సిందే. కానీ, భిన్న వైయక్తికతలు వుండే కాలంలో సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం ఎలా జరుగుతుందీ, దానికి తగిన వనరులు, ఆధారాలూ, పరికరాలూ మనకి వున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వున్నాయని నా విశ్వాసం. అయితే, ఇప్పుడు వున్న సంకుచిత వైయక్తిక ధోరణుల నించి కాకుండా, వైయక్తికతని దాని నిజమయిన అర్ధంలో అర్ధం చేసుకుని, చర్చిస్తే, మన చుట్టూ వున్న రచయితలే సాంస్కృతిక చరిత్ర నిర్మాతలు అన్న విషయం కూడా మనకి అర్ధమవుతుంది. ఓల్గా సాహిత్య వ్యాసాల్ని ఆ దృష్టి కోణం నుంచి చదివినప్పుడు నేను ఇలాంటి కొన్ని సాంస్కృతిక తీగల్ని కలుపుకుంటూ వెళ్లగలిగాను. వాటన్నిటినీ కలిపి వొక చోటి నించి చూస్తే, సమకాలీన సాహిత్య సాంస్కృతిక చరిత్ర గురించి కొన్ని సాధారణ లక్షణాల్ని క్రోడీకరించే (classification), కోడీకరించే (codification)  అవకాశం కూడా వుంది. ఆ సాధారణ లక్షణాల సమ్మేళనమే కొత్త సాహిత్య చరిత్ర నిర్మాణానికి పునాది అని నేను వేరే చెప్పకర్లేదు కదా!

అంటే, ఈ వ్యాసాలలో చాలా బలమయిన అస్తిత్వ కోణాలు కనిపించినప్పటికీ, వాటి మూలాలు అన్నీ మొత్తం సాహిత్య చరిత్రలో వున్నాయి. అందుకే, ఈ వ్యాస సంపుటి గురజాడతో –  కాదు, కాదు, మధురవాణితో – మొదలవ్వడం కాకతాళీయం కాదనుకుంటా.  తెలుగు సాహిత్యంలో స్త్రీ చర్చకి మంచి ప్రారంభం వుంది కానీ, కొనసాగింపు లేదని నేను గతంలో ఒక సారి చెప్పాను. ఆ ప్రారంభం గురజాడతో జరిగింది. ఓల్గా సాహిత్య వ్యాసాలు ఇప్పుడు ఈ 2011 లో కూడా గురజాడతో ప్రారంభం అవ్వడం నాకు యాదృచ్ఛిక్కమూ అనిపించలేదు, ఆశ్చర్యమూ అనిపించలేదు, గురజాడ తీసుకువచ్చిన ఆధునికత లోతులు ఇంకా మనకు అంతు పట్టనే లేదు కనుక. వర్జీనియా వుల్ఫ్ నవలలో ఇటీవలి సాహిత్య సిద్ధాంత వేత్తలు ‘ఆమె’ పక్షం తీసుకోవడానికీ, ఓల్గా ఈ పుస్తకంలో మధురవాణి పక్షం తీసుకోవడానికీ ఆ సాహిత్య చరిత్రే కారణం. ఆ మాటకొస్తే, మధురవాణి గురించి ఇప్పటి వరకూ తెలుగు సాహిత్యకారులు మాట్లాడలేదా అంటే మాట్లాడారు.

మధురవాణిని తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా బలంగా కాపాడుకుంటూ వస్తున్న లక్షణాలేమిటో ఇక్కడ ఏకరవు పెట్టక్కర్లేదు. కానీ, ఆమెని వాళ్ళు రొమాంటిసైజ్ కూడా చేశారన్నది నిజం. చాలా మందికి ఆమె అనేకానేక కాల్పనిక కావ్యకన్యల్లో వొకటిగా మిగిలిపోయింది తప్ప, ఆమె మాటల కింద ప్రవహిస్తున్న మూల భావనల జాడ వాళ్ళకి అంతుపట్టిందని అనుకోడానికి ఇప్పటివరకూ వున్న పురుష కేంద్రిత విమర్శ సాంప్రదాయంలో తగిన ఆధారాల్లేవు.  ఓల్గా ఇన్నేళ్ల తరవాత ఆమెని ఎందుకు భిన్నంగా చూడగలిగారు అన్న విషయం అర్ధం కావాలంటే నేను పైన ప్రస్తావించిన వైయక్తిక భావన చరిత్ర అర్ధం కావాలి. ఓల్గా చూసిన మధుర వాణికీ, గురజాడ ‘పాత్ర’కీ సంబంధం వుందా అంటే, ఆ విషయం ఇప్పటికిప్పుడు అప్రస్తుతమే అంటాను. ‘ప్రస్తుతం’లోకి  ఆ పాత్ర ఎట్లా అనువదించబడుతోందో అదే ముఖ్యమనీ అంటాను. ప్రతి రచనకీ, ప్రతి పాత్రకీ అనేక జన్మలు వుంటాయి. వొక్కో జన్మ ఆ కాలధర్మాన్ని బట్టి వుంటుంది. ‘ఒక్క నేనే నీకు, పెక్కు నీవులు నాకు” అని ఎంకి నాయుడు బావలు  ఎందుకనుకున్నారో  కచ్చితంగా అదే, వొక రచన విషయంలో కూడా జరుగుతుంది. ఒక్క రచనే, కానీ ‘పెక్కు నీవు’లుగా మారుతుంది. సాహిత్య చరిత్ర మూల మలుపుల్లో వున్నప్పుడు ఈ ‘పెక్కు నీవుల’ బహుళత్వం కొంత సంక్లిష్టంగా కూడా వుండవచ్చు.

మధురవాణి పాత్రని ఓల్గా కుటుంబ కేంద్రిత భావజాలంపై వొక ధిక్కార ప్రకటనగా చూశారు, ఇంటి శ్రమని గుర్తించిన గాఢమయిన వైయక్తికత వున్న ఆధునికవాదిగా విశ్లేషించారు. ఈ విధమయిన దృష్టి అంతకు ముందు లేదు. ఇంకో కోణం నించి అసిరిని విశ్లేషించడంలో ఈ కొత్త విమర్శనా పద్ధతికి విస్తృతి పెరిగింది.  నిజానికి మధురవాణి వ్యక్తిత్వానికి వ్యాఖ్యానం ఇవ్వగల పాత్ర ఆసిరి విశ్లేషణలో ఈ మొత్తం కుటుంబ, బ్రాహ్మణ కేంద్రిత మార్మికీకరణ రహస్యాలు బట్టబయలు చేస్తారు ఓల్గా. ఈ రెండు వ్యాసాలని వొక దాని వెంట వొకటి చదివితే, ఈ రెండీటీ విశ్లేషణకి ఓల్గా ఉపయోగించిన  లెన్స్ వొక్కటే అని అర్ధమవుతుంది. ఆ లెన్స్ ని నేను subjectivity అంటున్నాను.

2

       ఒక వ్యక్తి మనసూ, శరీరం చేసే వ్యాయామాల చరిత్ర ఆత్మకథ అయితే, ఆ వ్యక్తి మెదడు చేసే వ్యాయామాల చరిత్ర మేధో ఆత్మ కథ. అట్లా అని, శరీరానికీ, మెదడుకీ వైరుద్ధ్యం వుందని నేను అనడం లేదు. వాటి మేలు కలయికే మేధో ఆత్మకథ. ఈ వ్యాసం ప్రారంభంలో వర్జీనియా వుల్ఫ్ నవలలో స్త్రీ పాత్ర గురించి పురుషుడికి వున్న ‘సాంప్రదాయిక’ వంటింటికి పరిమితమయిన ఆలోచన ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తరవాత ఆ ఆలోచనపై యుద్ధమే మిగతా నవల అంతా – ఒక వాస్తవికత ఎంత సంక్లిష్టంగా వుంటుందో, అది వొక వైయక్తిక కోణం (subjectivity)  వల్ల ఎంత భిన్నత్వాన్ని సంతరించుకుంటుందో చెప్పే ప్రయత్నమే నవల. నిజానికి, స్త్రీ ఆలోచనకి పురుషుడు ‘నిర్మించిన’ ఆ కిచెన్ టేబులు సాంస్కృతిక రాజకీయ వలయాన్ని ఛేదించడం అంతర్లీన ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే, ఈ నవలలో ఆత్మకథాత్మక లక్షణాలు కూడా అనేకం కనిపిస్తాయి.  ఏ రచయిత సృజనాత్మక రచనలో అయినా ఆత్మకథాత్మకత తప్పనిసరి లక్షణం. కానీ, సాహిత్య వ్యాసాలలోనో, సాహిత్యేతర వచనంలోనూ ఆత్మకథాత్మకత వుండే అవకాశం వుందా? అన్నది ప్రశ్న.

అలాంటి అవకాశం వుందనే “సహిత” నేపధ్యంగా మనకి అర్ధమవుతుంది. ఎందుకంటే, ఈ మొత్తం “సహిత” వ్యాసాలన్నీ ఆయా సాహిత్య సందర్భాలలోని ఆయా స్త్రీ పాత్రల వైయక్తిక అన్వేషణే కనుక. ఈ వైయక్తిక అన్వేషణ ముఖ్యంగా మూడు మార్గాలలో జరుగుతుంది. ఒకటి, ఆ రచయిత అధ్యయనం; రెండు, రచయితకి ఇతర రచయితలతో వుండే వ్యక్తిగత/ సైద్ధాంతిక అనుబంధం; మూడు, రచయిత వివిధ సాహిత్య సిద్ధాంతాల ద్వారానో, ఉద్యమాల ద్వారానో చేసే వ్యక్తిగత/ సైద్ధాంతిక ప్రయాణం. నిజానికి ఈ మూడు అంశాలు వొకదానితో వొకటి ముడిపడి వున్నవే. కానీ, వీటి పరిధుల్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి వీలుగా వాటిని విడివిడిగా చూడడమూ అవసరమే. ఈ మూడింటి కలగలుపు  ప్రయాణమే ఒక రచయిత మేధోజీవన ఆత్మకథ అవుతుంది.

రచయిత అనుభవమూ అధ్యయనమూ ఎప్పుడూ కలగలిసి వుంటాయి. అనుభవాల్లో వైరుద్ధ్యమో,  సంఘర్షణో లేని రచయిత అధ్యయన పరిధి విస్తరించే అవకాశం తక్కువ. అయితే, అనుభవమనే కొలమానం తీసుకుంటే వైయక్తికతలో కొన్ని రాగద్వేషాలు కూడా బలంగానే వుండవచ్చు. అధ్యయనం వల్ల ఆ రాగద్వేషాల మధ్య కొంత సమతూకం సాధ్యపడవచ్చు. ఒక రచన చదువుతున్నప్పుడు రచయితకి  సామరస్యాల్ని బాగా చూసే అలవాటు అవుతుందని అందరం అనుకుంటాం. కానీ, సామరస్యం కంటే కూడా భిన్నత్వాన్ని చూసే అలవాటు బాగా పెరుగుతుంది. అలాంటి భిన్నత్వ దృష్టి ఆ రచయిత వైయక్తికతని బలంగా కుదుపుతుంది. ఓల్గా ఈ వ్యాసాలలో అలాంటి భిన్నత్వపు కుదుపులను చర్చకి తీసుకువస్తారు. అనుభవానికి వుండే  “తను” “ఇతర” అనే రెండు కోణాల నించి సాగే ఈ అధ్యయన ప్రయాణం ఈ వ్యాసాల్లో ప్రతి వాక్యంలోనూ కనిపించడం మొత్తంగా ఆమె ప్రతిపాదిస్తున్న/ సమర్ధిస్తున్న అస్తిత్వవాద రాజకీయాలకూ, వాటిని శరీర రాజకీయాల నించి చూసే తనదయిన ప్రత్యేకతకి సంకేతాలు. ఈ  అనుభవాన్ని చెప్పెటప్పుడు ఓల్గాలో మారుతున్న స్వరాన్ని గమనించినప్పుడు ఆ స్వరంలో ఉద్వేగం ఎంత వుందో, ఆ ఉద్వేగాన్ని ఆలోచనల భాషలోకి కుదించాలన్న తపన కూడా అంతే వుంది. తన వైయక్తికతని చెరుపుకోకుండా, తన స్వరాన్ని అణచుకోకుండా, తన తను ఇతరలోకి వొంపే సునిశితమయిన వొక సాంప్రదాయ విముక్త భాషని ఓల్గా ప్రతి వ్యాసంలోనూ ఉపయోగిస్తారు.

ఈ “ఇతర” ప్రపంచంలోకి ప్రయాణం ఆమెకి వున్న అనుభవ వైవిధ్యం వల్ల, బతుకు సంఘర్షణ వల్ల, వాటిని నడిపించే తాత్విక స్పష్టత వల్లా వివిధ రూపాలు తీసుకుంటుంది. ఒక రచనతో, ఆయా రచయితలతో తనకి ప్రత్యక్షంగా అనుబంధం వున్నప్పుడు – ఉదాహరణకి శ్రీశ్రీ, కొ.కు, చలం- లాంటి రచయితలని గురించి రాసిన వ్యాసాల్ని పఠిత రెండు సార్లు చదవాలి. మొదటి సారి  కేవలం ఆ రచయిత గురించి ఓల్గా ఏం అంటున్నారో వినడానికి చదవాలి. రెండోసారి, ఆ రచయిత లేదా రచనల వెలుగులో తన గురించి ఆమె ఏం అంటున్నారో వినడానికి చదవాలి. ఈ రెండు ప్రక్రియలూ వొకే మాదిరిగా అనిపిస్తాయి కానీ, నిజానికి కాదు. ముఖ్యంగా, శ్రీశ్రీ గురించి వ్యాసం చూడండి. మొదటి సారి చదివినప్పుడు శ్రీశ్రీ గురించి ఓల్గా కొత్తగా ఏం చెప్పారో నాకు అర్ధం కాలేదు. రెండో సారి చదువుతున్నప్పుడు శ్రీశ్రీ అనే కేంద్రాన్ని తొలగించుకొని, అక్కడ కాసేపు ఓల్గానో, నన్ను నేనో కేంద్రంగా తీసుకునో ఆ వ్యాసం చదివాను. అప్పుడు శ్రీశ్రీ గురించీ, అదే సమయంలో తన గురించీ, అదే అదే సమయంలో నా (నా అంటే నాలోని పఠిత) గురించీ ఓల్గా మాట్లాడుతున్నట్టు నాకు అర్ధమయ్యింది.

ఒక రచన గురించో, ఒక రచయిత గురించో మాట్లాడుతున్నప్పుడు – అది వ్యక్తిగత స్మృతి సందర్భం అయినప్పటికీ- మనం “తన” “ఇతర” మధ్య వొక వంతెన కట్టుకుంటాం. ఆ వంతెన మీద ఆ రచయితతో కలిసి కాసేపు జీవన “సంధ్యల” లోకి చూస్తాం (చలానికి కృతజ్నతలతో ఈ వాక్యం). అలా మనతో కలిసి ఎంతో సేపు సంభాషించలేని /వుండలేని రచయిత గానీ, రచన గానీ మన వైయక్తికతలో నించి అతి తేలికగా మనకి చెప్పా పెట్టకుండానే నిష్క్రమిస్తారు. ఆ తరవాత ఇక ఆ రచయిత గురించీ, ఆ రచన గురించీ మాట్లాడాల్సిందేమీ లేదనే అనుకుంటాను. (ఈ విధమయిన వైయక్తికతని reinforce చెయ్యడానికే చలం మ్యూజింగ్స్ రాసారేమో అనిపిస్తుంది ఈ మధ్య నాకు.) తన సంఘర్షణలో తనతో పాటు నిలిచిన రచయితలూ, రచనల ప్రస్తావన ద్వారా మనం నిజానికి మన లోపలి సంభాషణే వినిపిస్తాం. ఆ పని చలం గురించీ, కొ-కు గురించీ, శ్రీశ్రీ గురించీ రాసిన వ్యాసాలలో నైపుణ్యంతో చేశారు ఓల్గా.

ఈ లోపలి సంభాషణ ఏదయినా వొక విస్పష్టమయిన రూపం తీసుకోవాలంటే, తన బయటి లోకంతో  యుద్ధం కూడా వొక కొలిక్కి రావాలి రచయితకి- అది బయట వున్న ఉద్యమాల్ని ఆ రచయిత ఎంతగా internalize చేసుకోగలరన్న విషయం మీద ఆధారపడి వుంటుంది. ఈ దశలో రచయితలు  ఏ ఉద్యమాలతో, ఏ అస్తిత్వవాద చైతన్యంతో ఏ స్థాయిలో మమేకం అవుతున్నారన్న విషయం వాళ్ళ రచనల్లో బాహాటంగానే తెలుస్తుంది. అయితే, ఇదే సమయంలో ఆ రచయితలు ఆయా ఉద్యమాలతో, అస్తిత్వవాద చైతన్యాలతో ఎంత విమర్శ పెట్టగలరన్న విషయం కూడా ముఖ్యమే. ఓల్గా తన గురించి నేరుగా చెప్పుకున్న విషయాల్లోనూ, ఇతరులు వాహికగా తన గురించి పరోక్షంగా చెప్పిన విషయాల్లోనూ ఈ విమర్శనాత్మక ఆత్మశీలన (critical reflexivity) ని కొన్ని సార్లు ఎంత సున్నితంగా వ్యక్తం చేశారో, ఇంకా కొన్ని సార్లు అంతే ముక్కుసూటిగా నిక్కచ్చిగా critical distance గురించి కూడా  చెప్పారు. అంటే, వొక సైద్ధాంతిక క్రమశిక్షణ వున్న రచయితలు  తమ చుట్టూ వున్న ఉద్యమాల వాడినీ, వేడినీ ఎంత వేగంగా స్వీకరించగలరో, అంతే విమర్శనాత్మకంగా వొక ఆత్మీయమయిన “దూరాన్ని” కూడా స్వీకరించగలరు. అలా చెయ్యలేకపోతే, ఆ రచయితకి వున్న వైయక్తికత గాయపడుతుంది. అలా తన వైయక్తికత గాయపడిన సందర్భాల నించి ఓల్గా నేర్చుకున్న కొన్ని పాఠాలు “సహిత”లో వున్నాయి. ఆ పాఠాలు నిజానికి ఎవరికి వాళ్ళు తిరిగి అనుభవిస్తే తప్ప వాటి తీవ్రత తెలియదు, నిజమే, కానీ, ఆ పాఠాల నించి ఓల్గా తన ప్రయాణం నించి స్త్రీవాద చరిత్ర నిర్మాణ సాధనాల అన్వేషణకి బయలుదేరుతున్నారు, అడవిలో చిక్కుబడిన వొంటరి సీత తనలాంటి ఇతర సీతలతో కలిసి  ఇంకో కొత్త రామాయణం – కాదు సీతాయణం – తిరగరాస్తున్నట్టుగా.

3

       ఏక నలుపు అనే పదాన్ని “సహిత”లో ఓల్గా కొన్ని సందర్భాల్లో వాడడం చూస్తాం. అది ఇష్టంతో కాదు, అయిష్టంతో!

చరిత్ర అంటే ఏక నలుపో ఏక తెలుపో లేదా కేవలం తెలుపూ నలుపుల మిశ్రమం మాత్రమో కాదు. “ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది” అన్న వాక్యం ఇటీవల చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ, ఈ పునర్లేఖన ప్రక్రియ ఎలా వుంటుందన్న అవగాహన కలగడానికీ, ఆ ప్రక్రియకి అవసరమయిన పనిముట్లని సాధించడానికి కొన్ని దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది తెలుగు సాహిత్యం.  చరిత్రని వొక మూసలోంచి కాకుండా అనేకత్వంలోంచి చూడాలన్న స్పృహ ప్రధానంగా జాతీయవాద అనంతర/ మార్క్సిస్టు అనంతర ధోరణి. ఒకే ఒక్క ప్రధాన ఆధిపత్య చరిత్ర అంటూ ఏదీ వుండదనీ, ఏక సమయంలో అనేక చరిత్రలు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా, జమిలిగా  పనిచేస్తుంటాయన్న విమర్శనాత్మక చైతన్యం మార్క్సిస్టు, జాతీయవాద చరిత్రల మహా కథనాలని ప్రశ్నించడంతో మొదలయ్యింది. కానీ, ఈ ప్రశ్నించడం అనే ప్రక్రియ సఫలమవ్వడానికి కొన్ని సాధనాలు కావాలి, కొంత సాధనా కావాలి. అలాంటి సాధనాల సాధన మన:కార్మికశాల  “సహిత.”

స్త్రీవాద విమర్శ సాధనాలను ఇంకా సమర్ధంగా వాడుకోలేకపోయామన్న విమర్శ చాలా మటుకు నిజమే. కానీ, ఆ సాధనాలు ఏమిటన్న అవగాహన లేకపోవడం, దానికి సంబంధించిన వచనం తెలుగులో తగినంతగా రూపొందకపోవడం దీనికి  ఒక కారణం.  ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి అన్నట్టుగా, “సహిత”లో ఓల్గా అలాంటి కొన్ని సాధనాలను అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అలా అందుబాటులోకి తీసుకువచ్చే ముందు ఆమెకి స్వయంగా వాటి వాటి అలభ్యత గురించి స్పష్టత వుంది. 1986లో ఓల్గా “మనకి తెలియని మన చరిత్ర” ని సమీక్షిస్తూ అంటారు, “ తెలుగులో స్త్రీవాద దృక్పథం నుంచి రాసిన చరిత్రలు లేవు. చరిత్ర పుస్తకాలే కాదు, మిగిలిన సాహిత్యంలో కూడా స్త్రీ దృక్పథంతో మాత్రమే వచ్చినవి లేవు” ఈ వాక్యం ఇప్పటికీ నిజమే. “మనకి తెలియని మన చరిత్ర” “మహిళావరణం” లాంటి రచనలు ఎన్నో  వచ్చే అవకాశాలూ, భిన్న సందర్భాలూ  తెలుగు సాహిత్య/ సాంస్కృతిక చరిత్ర నిండా వున్నాయి. వాటి పునర్నిర్మాణం అనేక సందర్భాల్లో అనేక వినిర్మాణాలతో ముడిపడి వున్న విషయం కాబట్టి, ఆ వినిర్మాణ/పునర్నిర్మాణ ప్రక్రియలో వుండే వేదనా, శ్రమా రెండీటీని ఎదుర్కొనే శక్తి మన రచయితలకీ, ముఖ్యంగా విమర్శకులకి చాలా తక్కువ. అప్పుడప్పుడూ అరకొరగా సాగుతున్న కృషి వున్నా, అది సరిపోదు.   చరిత్ర నిర్మాణం పట్ల మనలో వున్న అలాంటి అంధత్వాన్ని గుర్తించి, కనువిప్పు కలిగించే సాధనాలు కొన్ని అయినా అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నం “సహిత” లో కనిపిస్తుంది.

అలా ఓల్గా అందుబాటులోకి తీసుకువచ్చిన , మొదటి సాధనం – ఒక వాచకాన్ని దగ్గిరగా, విమర్శనాత్మకంగా, అంతర్దృష్టితో చదవడం (close, critical and reflexive reading). “సహిత”లో మొదటి  నాలుగు వ్యాసాలు గురజాడ కన్యాశుల్కం ని నాలుగు భిన్నమయిన సాధనలతో విశ్లేషిస్తాయి. మొదటి వ్యాసం మధురవాణిని కుటుంబ-కేంద్రిత కోణం నించి చూస్తుంది. రెండో వ్యాసం ఒక పురుష పాత్ర నించి మధురవాణిని ఆవిష్కరించడం, అదే సమయంలో ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే సాధనాన్ని (de-heirarchization) ఉపయోగించారు. ఈ సాధనాల వాడకం దృష్టి నించి చూస్తే, మూడో వ్యాసం చాలా చర్చించదగింది. ఈ వ్యాసం ఫెమినిస్టులు చట్టాన్ని ఎట్లాచూడాలో, దాన్ని తిరిగి సాహిత్య దర్పణంలోంచి ఎట్లా వీక్షించాలో ఓల్గా తగిన ఆధారాలతో చూపిస్తారు. ఇదే వ్యాసంలో ఇంకో ముఖ్యమయిన సాధనాన్ని కూడా ఆమె బాగా వాడుకున్నారు. అది వలసవాదానంతర ధోరణి నించి రచనని చూడడం. బ్రిటిష్ వలస పాలన అనుసరించిన వ్యూహాల వినిర్మాణ ధోరణి  కనిపిస్తుంది.  ఇక నాలుగో వ్యాసం – domestic labor కోణం నుంచి కన్యాశుల్కం విశ్లేషణ. ఈ వ్యాసం ఒక social postmodernist కోణం నించి కూడా అర్ధం చేసుకోవచ్చు.  స్త్రీవాద విమర్శకోణం నించి వొక రచనని ఎట్లా దగ్గిరగా, విమర్శనాత్మకంగా చదవవచ్చో కొన్ని నమూనాల్ని ఓల్గా ఈ వ్యాసాల్లో చూపిస్తారు.

రెండో సాధనం ప్రతిఘటన  రాజకీయాలకి సంబంధించింది.  వొక స్త్రీవాదిగా ఏ రచనని స్వీకరించాలి, ఏ రచనని నిరాకరించాలి అన్నది ఎట్లా తేల్చుకోవడం?! సాధారణ  రచయితల కంటే భిన్నంగా  స్త్రీవాద రచయిత గానీ, అస్తిత్వవాద రచయిత గానీ  మూడు  రకాల అణచివేతల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఒకటి: నిజంగా సంప్రదాయ సాహిత్యం నించి, రెండు: ఆధునికంగా కనిపించే అంతర్గత సంప్రదాయం నించి, మూడు: అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత నించి. వీటన్నిటినీ దాటుకొని వచ్చి స్త్రీ తన స్వరాన్ని ఎట్లా వినిపించాలన్నది తీవ్ర అన్వేషణ. ఇదే క్రమంలో ఇంకొక ముఖ్యమయిన వెతుకులాట కూడా వుంటుంది. అది తనదయిన స్మృతిని/ అనుభవాన్ని తిరిగి రాబట్టుకోవడం(retrieval of the personal memory).  ఇతర అనేక అంశాల మాదిరిగానే ఈ మూడు కూడా పరస్పరాధారిత కోణాలు. ఇక్కడ ఈ “వ్యక్తిగతం” రాజకీయాలకీ, పబ్లిక్ కి అతీతం కాదు. వాటన్నిటి కలయికలోంచి పుట్టిన subjectivity.

“సహిత” వ్యాసాల సారాంశాన్ని వొక వాక్యంలో చెప్పాలంటే, అదంతా ఈ నిరాకరణ-స్వీకరణ రాజకీయాల నుంచి ఓల్గా తనదయిన అనుభవ స్వరాన్ని వెతుక్కునే దారి. కాల పరిమితుల దృష్ట్యా ఓల్గా ఈ వ్యాసాలలో సంప్రదాయ సాహిత్యం జోలికి పోలేదు కానీ, గురజాడ కన్యాశుల్కం విశ్లేషణలో కొంత మేరకు ఆ సాంప్రదాయ అణచివేత ని విమర్శిస్తారు. అది కాక, మిగిలిన రెండు కోణాలు – ఆధునికంగా కనిపించే అంతర్గత సాంప్రదాయం, అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత- ‘సహిత”లో ప్రధానమయిన ఇతివృత్తాలు. వాటి చుట్టూ జరిగే చర్చ కొంత మేరకు సంప్రదాయాన్ని కూడా ప్రశ్నించినా, వాటి యుద్ధ భూమి మాత్రం తక్షణ వర్తమాన  కురుక్షేత్రమే. ఆ కారణంగానే “సహిత” ఈ కాలపు స్త్రీవాదుల ఆత్మచరిత్ర కూడా!

-అఫ్సర్

2012

 

ఇప్పటి కవిత్వానికి కొన్ని తూకం రాళ్ళు!

kasula

( కవిత్వ విమర్శకుడు కాసుల లింగా రెడ్డి కి సాహితీ గౌతమి వారి ‘బొందుగుల అహల్య-సుందరరావు’అవార్డు ప్రదానం 19 న)

*

ఇలా అంటే చాలా మంది మిత్రులకి కోపంలాంటిది రావచ్చు కాని, అనకుండా ఉండలేకపోతున్నా. అతికొద్ది కాలంలో తెలుగులో కవిత్వ విమర్శ అనేది పూర్తిగా కనుమరుగు కావచ్చు. కారణాలు మీకు తెలియనివి కావు.

వొక పదేళ్ళ క్రితమో, పదిహేనేళ్ళ క్రితమో కవిత్వాన్ని తూచే రాళ్ళు లేవని అనుకునే వాళ్ళం. అసలు ఆ రాళ్ళు అవసరమా అన్న కొత్త ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది.  అంతర్జాల మాయాజాలం వల్ల, తక్షణ స్పందనలు శ్రుతి మించిపోయి, కాస్త నిలకడగా వొక మాట అందాం అనే స్పృహ క్రమంగా తగ్గిపోతోంది, ముఖ్యంగా కవిత్వరంగంలో!

వొక కవితని వొకటికి రెండు సార్లు చదివి, కాస్త ఆలోచించి, మాట్లాడదాం అనే ఆలోచనకి విలువ లేకుండా పోతోంది. ఈ స్థితిలో అయితే పొగడ్తలూ కాకపొతే తెగడ్తలూ, మరీ నాసిగా చెప్పాలంటే, ఎదో వొక విధంగా అది పరస్పర పొగడ్తల వొప్పందంగా  మారిపోవడం తప్ప ఇంకో స్థితి కనిపించడం లేదు.

ఇలాంటి స్థితిలో కవిత్వ విమర్శని తన రంగంగా ఎంచుకొని, ఆ రంగంలో తనదైన వొక దారిని ఏర్పరచుకుంటున్న కాసుల లింగా రెడ్డి అరుదయిన కవిత్వ విమర్శకుడిగా కనిపిస్తున్నాడు నాకు.

తను స్వయంగా కవిత్వం రాస్తున్నప్పటికీ, ఇతరుల కవిత్వాన్ని విశ్లేషించడంలో లింగారెడ్డి చూపించే బ్యాలన్స్ అతన్ని మిగిలిన విమర్శకులకు భిన్నంగా నిలబెడ్తుంది.

కవిత్వాన్ని ఆషామాషీ వ్యవహారంగా భావించడం లేదు లింగారెడ్డి. ‘నువ్వు కవిత్వం ఎందుకు రాస్తున్నావనే’ మొదటి ప్రశ్నకీ, ‘కవిత్వ విమర్శ ఎందుకు రాస్తున్నావనే’ రెండో ప్రశ్నకీ లింగారెడ్డి దగ్గిర రెండు  వేర్వేరు సమాధానాలు లేవు. ఆ రెండీటికి అతనిచ్చే సమాధానం వొక్కటే. ఆ రెండీటికి మధ్యా వైరుద్ధ్యం చూపించలేకపోవడం లింగారెడ్డిలో వున్న అందమయిన బలహీనతలాంటి బలం!

తన విమర్శ వ్యాసాల పుస్తకం ‘ఇరువాలు’లో లింగారెడ్డి అంటున్నాడు.

“రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనం ఎందుకంటే నాకు ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరఫున నియమించుకున్న లాయర్ నా కవిత్వం.”

రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను అని ఎవరైనా అంటారు కాని, ఆ తరవాతి వాక్యంలో లింగారెడ్డి కనిపిస్తాడు. అతని ముక్కుసూటి వ్యక్తిత్వం కనిపిస్తుంది. మనలో చాలా సాధారణంగా స్థిరపడి వున్న అభిప్రాయం ఏమిటంటే, వాదన వినిపించేట్టు అయితే వచనమే రాయాలని! కవిత్వాన్ని మనం కేవలం తక్షణ భావోద్వేగ ప్రకటనకే సరిపుచ్చుకుంటూ వచ్చాం కాబట్టి! నిజానికి తక్షణ భావోద్వేగాలలో కూడా వాదనలే వుంటాయి. కాని, అది అంత తేలికగా వొప్పుకోం గాక వొప్పుకోం.

ఉద్వేగాన్ని మించిన విలువ ఇవ్వడం మొదలెడితే కవిత్వం ఏదో ప్రమాదకరమయిన సామగ్రిగా మారిపోతుందన్న ఆందోళన ఈ స్థిరపడి వున్న “కవిత్వ వాదం”లో వినిపిస్తుంది. కాని, అలాంటి ప్రమాదాలతో ఆడుకోవడమే అసలుసిసలు కవిత్వం. అలాంటి ప్రమాదాలని సృష్టించడమే అసలుసిసలు కవిత్వ విమర్శ చేయాల్సిన పని. గత కొద్ది కాలంగా లింగా రెడ్డి కవిత్వ విమర్శకుడిగా చేస్తున్న పని అదే.

lingareddi

లింగారెడ్డి కవిత్వ విమర్శలో అనివార్యంగా రాజకీయ చర్చలు కనిపిస్తాయి. రాజకీయ స్పర్శ లేని సాహిత్యం అతనికి వొంటబట్టదు. అంత మాత్రాన్న ఇతరేతర ధోరణులకు గుడ్డిగా వుండడం అతని లక్షణం కాదు. కవిత్వం అనే పలుకు వుందంటే దాన్ని బంగారంగా కళ్ళకి అద్దుకుంటాడు. ఆ తరవాత అందులో లోతుల్లోకి వెళ్లి, లోపాలూ దోషాలూ నిర్మొహమాటంగా చెప్తాడు. తన కవిత్వ విమర్శ వ్యాసాలకు ‘ఇరువాలు’ అని పేరు పెట్టడంలోనే తన ధోరణి ఏమిటో స్పష్టంగా చెప్పుకున్నాడు లింగారెడ్డి.

ఇరువాలు అంటే రెండు సార్లు.  అది వ్యవసాయ పదం. కవిత్వ వ్యవసాయానికి కూడా అదను చూసి వాడిన పదునైన పదం. నేలని వ్యవసాయ యోగ్యం చేయడంలో – అంటే దున్నడంలో- వుండే రెండు కీలక ప్రక్రియల్ని కవిత్వ విమర్శకి అన్వయిస్తున్నాడు లింగారెడ్డి. నాకు అర్థమైనంత మటుకు అది కవిత్వం చదివే విధానాన్ని అలవాటు చేసే ప్రయత్నంగా చూస్తున్నాను.

ఏ కవితని అయినా రెండు సార్లు చదవడం అనేది ideal. మొదటి సారి చదివినప్పుడు ఆ కవితని అనుభూతిస్తాం. అది అభిరుచిని మొలకెత్తించే ప్రక్రియ. రెండో సరి చదివినప్పుడు అది ఆ అభిరుచిని పెంచే ప్రక్రియ, అంటే- ఆ చదివిన కవితలోని సారాన్ని ఇంకించుకునే ప్రయత్నం. ఈ రెండో దశలో ఎవరికి వాళ్ళు భిన్నమయిన సారాంశాలని గ్రహించవచ్చు. భిన్నమయిన అభిప్రాయాలు ఏర్పడేది కూడా రెండో పఠనంలోనే! ఈ రెండు పఠనాలు ఇప్పటి స్థితిలో అరుదయి పోయాయని నా ఆందోళన. బహుశా, ఈ రెండు పఠనాల మేలు ఎంతటిదో చెప్పడానికే లింగారెడ్డి తన పుస్తకానికి ఈ శీర్షిక పెట్టుకున్నాడని నేను అర్థం చేసుకున్నా.

ఈ పుస్తకంలో లింగారెడ్డి వ్యాసాలు స్వభావ రీత్యా  కొన్ని సమీక్షలు, కొన్ని విమర్శలు. కొన్ని కవిత్వ సంపుటాలూ సంకలనాల మీద రాసినవి. కొన్ని ఇప్పటి ధోరణుల మీద రాసినవి. అసలు ఇతర విమర్శకులు ఎవరూ పట్టించుకోని విలువైన పుస్తకాలూ, కవిత్వ అంశాలని కూడా తీసుకొని, వాటి మీద లోతయిన చర్చ మొదలెట్టడానికి లింగా రెడ్డి ప్రయత్నించాడు. అవి చదివాక- మనం లింగారెడ్డి అభిప్రాయాలతో ఏకీభవిస్తామా లేదా అన్నది పక్కన పెడితే, ఇలాంటి వొక విమర్శకుడు మనకి తక్షణం కావాలి అనిపిస్తుంది. వర్తమానం చీకట్లో అతను వెలిగిస్తున్న దీపపు కాంతి విలువైందనీ అనిపిస్తుంది. కాని, వొక్క మాట అనకుండా ఉండలేను.

లింగా రెడ్డి తన విమర్శని వొక సైద్ధాంతిక కోణం నించి చేస్తున్నాడన్న విషయాన్ని పూర్తిగా గౌరవిస్తూనే, ఆ విమర్శకి అప్పుడప్పుడూ తను వాడుతున్న పరిభాష ఇంకా కొంచెం సరళం కావాలని అనుకుంటున్నా. కొన్ని సార్లు విపరీతమయిన jargon లింగారెడ్డి చెప్పాలనుకుంటున్న/ మనతో పంచుకోవాలనుకుంటున్న ఆలోచనలకి అడ్డంకి గా మార్తుంది. సైద్ధాంతిక నిబద్ధతకీ, jargon కీ సంబంధం లేదని లింగా రెడ్డి గుర్తించాలి. ఆ గుర్తింపు తోడయితే లింగా రెడ్డి విమర్శ భూమార్గం పట్టి, మనందరి ఆలోచనల్లో కొత్త కాంతిని ప్రవేశ పెడ్తుంది.

అదలా ఉంచితే:

ఇవాళ లింగా రెడ్డి  విమర్శ వ్యాసాల సంపుటి “ఇరువాలు” కి లభిస్తున్న ప్రశంసలూ,  పురస్కారాలూ విమర్శకుడిగా అతను చేస్తున్న పనికి వొక legitimacy ని ఇస్తున్నాయి. అతని మార్గం కొందరికైనా నచ్చుతోందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అది మున్ముందు వొక మార్గంగా ఏర్పడవచ్చన్న సంకేతాన్ని చూపిస్తున్నాయి.

-అఫ్సర్

ఇరువాలు on Kinige: http://kinige.com/kbook.php?id=1501&name=Iruvalu