తొలికలుపు

                                              అన్వీక్ష నీలం

  

ఆ రోజు స్కూల్ నుండి వస్తూనే బ్యాగ్ తన రూంలో పడేసి పరుగెత్తుకొచ్చాడు. ఏదో డిమాండ్ తో వస్తున్నట్టు అర్ధమైంది. ఈ మధ్య పిల్లల అవసరాలు కూడా వాళ్లకు కలిగేవి కాదాయే. అవి వాళ్ళ స్నేహితులో, స్కూలో నిర్ణయిస్తుంది. చక్కగా ఫ్రెష్ అయి ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని పరుగెత్తుకొస్తుంటే క్రితం సారి నేను చేసిన ప్రమాణం పూర్తి చేయాల్సిన సమయం వచ్చినట్టే ఉందనిపించింది. క్రితం క్వార్టర్లీ ఎక్సామ్స్ మొదలైనప్పుడు అనుకుంటా  వాడి కోరిక నా ముందు ఉంచాడు.

” మమ్మీ మా క్లాస్ లో దినేష్ లేడు. వాడికి వాళ్ళ డాడి  ఒక డాగ్ గిఫ్ట్ ఇచ్చాడు తెల్సా. లాబ్రడోర్ బ్రీడ్ అంట. అచ్చం హ్యూమన్ బీయింగ్ లాగే బిహేవ్ చేస్తుందంట. వాడు రోజు దానితో ఆడుకుంటున్నాడంటా. మొన్న వాళ్ళింటికెళ్ళా కదా అది నాతో కూడా ఎంత బాగా ఆడుకుందో తెల్సా. ప్లీజ్ మమ్మీ వై డోంట్ యు గెట్ మీ దట్ ప్లీజ్ “అని అడిగాడు. “డాగ్?నో నో “కుదరనే కుదరదు అని అప్పుడే ఖరాకండిగా చెప్పేసా వాడికి. వాడు వింటేనా? వాడి కోసమే కదా ఇవన్నీ చేసేది. వాడు సంతోషంగా లేనప్పుడు మేమెలా సంతోషంగా ఉండగలం అని వెంటనే ఇంకో ఆలోచన. వాడు మా ఒక్కగానొక్క కొడుకు లోహిత్. ఇపుడు ఫోర్త్ స్టాండర్డ్.

******

వాడికి వాల్లమ్మమ్మ అంటే ఎంతిష్టమో. అమ్మమ్మ నుంచి ఫోన్ రాగానే వాడి ముఖంలో సంతోషం చూడాలి. ఇవాళ  స్కూల్ కెళ్ళద్దు ఇంట్లో ఉండమంటే ఉండే సంతోషం ఉంటుందే అంతకు వంద రెట్లు. ఒకప్పుడు మా అమ్మమ్మతో మాట్లాడాలంటే ఎక్కడి ఫోన్లు? ఒక ఉత్తరం ముక్క రాసిపడేస్తే ఎప్పటికో సమాధానం వచ్చేది. అదీ మా మావయ్యలకు సమయం కుదిరినప్పుడు. కొన్ని మాటలు భావాలు ప్రయాణానికి సమయం తీసుకున్నా జీవితపు పుస్తకంలో తిరిగిరాసుకోనవసరం లేనంత స్థిరంగా ముద్రించబడతాయి.

అమ్మతో ఎప్పుడు ఫోన్ మాట్లాడినా  -“అమ్మమ్మా నువ్వెప్పుడొస్తున్నావ్ ?”అన్నదే  వాడి మొదటి ప్రశ్న. ఒక్కడే కదా  వాడికెంత బోర్ కొడుతుందో ? అందుకే అమ్మొస్తే వాడి ఒంటరి తనానికి వెలకట్టలేని  తోడు దొరుకుతుంది. ఉదయం ముగ్గురం ఒకేసారి ఇంటి నుంచి బయలుదేరతామా. నేను, ఆయన ఆఫీస్కి.  వాడు స్కూల్కి. మేమొచ్చే సమయానికన్నా ముందే వాడొస్తాడని వాడి కోసం స్పెషల్ క్లాసులు పెట్టిన్చాం. ఎక్స్’ట్రా కర్రికులర్ యాక్టివిటీస్ , స్పోర్ట్స్ ఉంటాయి. నేనొచ్చి ఏదో ఒక చిరుతిండి చేసేలోపు వాడొస్తాడు. భోజనానికి ముందు ఏ సమయానికో ఆనందొస్తాడు. పాపం ఎన్నెన్ని విషయాలు వాళ్ళ నాన్నతో భోజనమప్పుడు చెప్పాలనుకుంటాడో, కాని అలసిపోయి చెప్పలేక  ఏవో రెండు మాటలు మాట్లాడి పడుకుంటాడు.

అప్పుడప్పుడు లోహిత్ ని చూస్తుంటే “వాడితో గడపాల్సిన ప్రొడక్టివ్ టైం గడపలేక పోతున్నాం” అని బాధపడతాం నేను ఆనంద్. కాని మా జీవనశైలి, ప్రపంచం మమ్మల్ని తీయిస్తున్న పరుగు  విశ్రాంతి తీసుకోడానికి కూడా సమయముండడం లేదు అన్న భావనమాది. ఉరుకులు, పరుగుల జీవితం. పాపం వాడికి రాత్రుళ్ళు ఎప్పుడైనా కథలు వినాల్సి వస్తే వాళ్ళ నాన్న ట్యాబ్ లోంచి అన్నయ్యకు కాల్ చేస్తే వీడియో కాలింగ్ లో అమ్మమ్మతో మాట్లాడుతూ  కధలు వింటాడు. టెక్నాలజీ పెరిగిపోయిందని సంతోషించాలా ? లేక టెక్నాలజీ జీవితాల్ని ఇంత శాసిస్తుందా ? అని బాధపడాలా  తెలియట్లేదు.

ఉదయాన్నే  వాణ్నికూడా లేపి తనతో పాటు వాకింగ్ కని తీసుకెళ్ళే మంచిపని మాత్రం చేస్తాడు ఆనంద్. వాళ్ళ నాన్నతో పోటీ పడి లేవడం వాడిక్కూడా భలే ఇష్టం. నాన్న కన్నా ముందే లేచి షూస్ వేసుకొని వాళ్ళ నాన్నను కొన్ని సార్లు వాడే నిద్రలేపుతాడు. వాకింగ్కెళ్ళి వస్తూ వస్తూ కొన్ని కాగితపుపూలు , మందారాలు , గన్నేరుపూలు ఇంకా నందివర్ధనాలు చేతులనిండా పట్టుకొచ్చి వాడిరూంలో ఉండే వాజ్లో వాడే అలంకరిస్తాడు. ఆ వాజ్ వాడు చేసుకున్నదే. వాళ్ళ స్కూల్లో ఇన్నోవేటివ్ పీరియడ్ లో వాళ్ళ టీచరమ్మ ఇచ్చిన ప్రాజెక్ట్ అది. అది వాడి ప్రాజెక్ట్ లా కాక  నా పనిష్మెంట్లా అనిపించింది. ప్రాజెక్ట్ వర్క్  వాడిది పని నాది ఇప్పటికీనూ. అయినా అనకూడదు కాని వాడు శ్రద్ధగా ఆ పనీ ఈ పనీ  సహాయపడతాడుగా. ఆ వాజ్ గురించి కుండలు తయారు చేసే కుమ్మరి వాళ్ళ దగ్గరకూ వెంటతీసుకుపోయా. అయినా జగమెరిగిన సత్యమే కదా.

ఇంటర్నేషనల్ స్కూల్ అని తగిలించుకున్న వాటిలో చదువు కన్నాఈ కార్యకలాపాలకే డబ్బులు కట్టాలని. లేదంటే పిల్లోడు ఎక్కడ వెనకపడిపోతాడోనన్న భయం. సంవత్సరానికి షుమారు 60 వేలు ఒక సాధారణ ఇంటర్నేషనల్ స్కూల్ లో. అదే మా ఇంటి పక్కనే ఉన్న మా ఆయన కొలీగ్ సూర్యనారాయణ గారి  అబ్బాయి ఇంకేదో ఇంటర్నేషనల్ స్కూల్ అట సంవత్సరానికి లక్ష రూపాయలు. నా చదువంత అవడానికి పట్టినన్ని డబ్బులు వీడి ఒక్క సంవత్సరం ఫీజు. ఇక ఇక్కడితో మొదలు పెట్టి మున్ముందు వాడి చదువుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుని డబ్బుపొదుపు  చేయడానికి మార్గాలు కనిపెట్టడం ఇప్పటి మా భాద్యత. కాదామరీ రేపు వాడు పెద్దయ్యాక మీరేం చేశారు అని ప్రశ్నిస్తే ? . ఈ మధ్య తల్లిదండ్రులు కావాలనుకుంటున్న వాళ్ళను వెంటాడుతున్నప్రశ్న ఇది మరీ. అందుకే జీవితంలో మంచి ఉద్యోగంతోనో, మంచి పదవితోనో, జీతంతోనో స్థిరపడితే తప్ప పెళ్లి చేసుకోవడం లేదు  ఆడైనా మగైనా.

toli kalupu.anveeksha

ఇప్పుడు జీవితాల్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే సూత్రంతో కొలుచుకొని, పక్కవారితో పోల్చుకొని చూసుకుంటూ బ్రతుకుతున్న రోజులు.  ప్రొఫెషన్ ట్యాగ్ లేకపొతే కేర్ చేసే వాళ్ళున్నారా అసలు? పదో తరగతవగానే ఇంటర్ కోసం CEC గ్రూప్ తీసుకుంటాను అంటేనే ఎన్నిమాటలు తిట్టారు మా మావయ్య నన్ను. ఏది చదవాలి ఏది వద్దు అన్నది కూడా మన చుట్టుపక్కల వాళ్ళే నిర్ణయించేస్తున్న కాలం మరి. ఎలా బ్రతకాలో కూడా సమాజమే నిర్ధారిస్తున్న రోజులు.

అమ్మొచ్చినప్పుడల్లా ఇదే గొడవ ఇంకొకరిని కంటే వాడికి తోడు ఉంటుంది కదా అని. ఒక్కడికే మంచి భవిష్యత్తు ఇవ్వడం కష్టమవుతున్న రోజులివి . ఒకప్పుడు ఇద్దరూ లేదా ముగ్గురు చాలు . తర్వాత ఇద్దరు చాలు అనేవాళ్ళు  కానీ ఇప్పుడు ఒక్కరే ముద్దు అనే పరిస్థితొచ్చింది. కాని ఆశ్చర్యమేస్తుంది అమ్మ ఆరుగురిని ఎలా పెంచిందా అని. అందరూ మంచి స్థితిలోకే వచ్చాం. కాని ఇప్పుడు ఒక్కరిని పెంచడమే ఇంత పెద్ద భాద్యత మాకు. భాద్యత అని మేమనుకుంటున్నామా ? సమాజ ముఖచిత్రమే మా భాద్యతల్ని కూడా నిర్ధారిస్తుందా ?? అప్పుడప్పుడు అర్ధమవదు.
* * * * *
ఇక ఇప్పుడు నా బాధ వాడికి కుక్కను కొనివ్వడం కాదు. దాన్ని తెచ్చాక దాని సేవలు చేయాలంటే కూడా నేనే. ఎవరు పెట్టుకున్న పనులు ఇవ్వన్నీ అని. కాని లోహిత్ పట్టుపట్టాడంటే ఇక వదలడం కష్టమే. అందుకే అన్నాను -” నువ్వు  క్లాస్ ఫస్ట్ వస్తే కొనిస్తానని”. వాడు అన్నట్టుగానే క్లాస్ ఫస్ట్ వచ్చాడు. రయ్యి మనొచ్చి కూరగాయలు కోస్తున్న నా ముందు ప్రోగ్రెస్ కార్డుంచి నా భుజాలచుట్టూ చేతులేసి – ” మమ్మీ నౌ ఇట్స్ యువర్ టైం టు కీప్ యువర్ ప్రామిస్ “అన్నాడు. గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉందిప్పుడు నా పరిస్థితి. ఒక వైపు వాడు  ఫస్ట్ పొజిషన్ కొచ్చాడని సంతోషపడాలా లేక కుక్కను తెచ్చి నా ఒత్తిడినింకా పెంచుకోవాలా?.  వాడి సంతోషం కన్నా ఎక్కువేముందిలే అనుకున్నా ఆ క్షణం -“డాడీ వచ్చాక మాట్లాడి చెప్తాను “అని వాణ్ని కొద్ది సేపు ఆడుకోమని పంపా. వాడు ఆడుకోవడం అంటే ఏమాడుకుంటాడు? వీడియో గేమ్స్ లేదంటే ఏ కార్టూన్ నెట్వర్క్ చానెలో పెట్టుకొని చూస్తాడు.

మా చిన్నతనంలో  సాయంకాలం మేమంతా ఈ సమయానికి వీధిలోకి చేరి ఎన్ని ఆటలాడేవాళ్ళం. కాని వాడి బాల్యం చూస్తుంటే బాధగానే ఉంది. పరువు ప్రతిష్ట  అదీ ఇదీ అని ఇక్కడ  గేటడ్ కమ్మ్యూనిటీలో ఇల్లు కొన్నాక జీవితాలకు కూడా గేట్ పెట్టుకున్నట్టే ఉంటుంది. పేరుకు మాత్రం పార్కు, స్విమింగ్ పూల్ ఎన్ని ఉన్నా ఏం లాభం ?. పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకున్న పాపానికి పోరు ఇక్కడ జనాలు. పండగలకు మాత్రం ముస్తాబయి నగలు చీరలు కార్లు చూపించుకోడానికి గుమ్మి గూడి ఆడిపాడతారు అందులో కూడా దర్పం చూపించుకోవడమే. ఎంత మారిపోయాయి  జీవితాలు. పాపం వాడు ఎంతో పెద్దకోరిక కూడా కోరలేదుగా వాడి  ఈ చిన్న కోరికైనా తీర్చాలనుకున్నాను.

* * * *

రాత్రి తొమ్మిదిన్నరకొచ్చాడు ఆనంద్. ఫ్రెష్ అయి భోజనానికి కూర్చున్నాడు. -” లేటయ్యిందేంటి ఆనంద్? . లోహిత్  క్లాస్ ఫస్టొచ్చాడు. నీతో షేర్ చేసుకుందామని పాపం నీ గురించి చూసి చూసి ఇప్పుడే పడుకున్నాడు” భోజనం వడ్డిస్తూ విషయాన్ని ముందుంచా.  -” ఒహ్ అవునా ? ఏం చేయను కొత్త ప్రాజెక్ట్. కొత్త టీం . వర్క్ అలొకేట్ చేసి పోర్ట్ఫోలియో తయారు చేయడానికి ఇంత టైం పట్టింది. రేపటి నుంచి ఇంకొంచెం బిజీ అవ్వచ్చు హేమా ” అంటూ భోజనం చేస్తూ  ఆ రోజుటి ఆఫీస్ విషయాలు షేర్ చేసుకున్నాడు ఆనంద్.” ఇంకేంటి విషయాలు ? “అన్నం కలుపుతూ అడిగాడు ఆనంద్ .
– ” ఏముంది ? మీ సుపుత్రుడు ఒక చిన్న కోరిక కోరాడు ” పెరుగు వడ్డిస్తూ పెట్టిన పిటీషన్ అది.
– ” ఫస్ట్ వచ్చినందుకు నువ్వే ఏదో లంచం ఇవ్వజూస్తున్నావ్ అని చెప్పు ” అన్నాడు ఆయన నవ్వుతూ.

ఏం చేస్తాం కోరిక వాడిది. వేడుకోవడాలు నావి. -” హా అలాంటిదే అనుకోండి.  లోహిత్ వాళ్ళ ఫ్రెండ్ దినేష్ లాబ్రడర్ డాగ్ కొనుక్కునాడట వీడూ అది కావాలంటున్నాడు ” మొత్తానికి కోరిక ఆయన పెన్ను కిందకొచ్చింది ఇక సంతకమే తరువాయి. – ” అనుకున్నా .. లాస్ట్ టైం నువ్వు ప్రామిస్ చేసేప్పుడే చెప్పా ఆలోచించి మాటివ్వు వాడికి  అని ” భోజనం ముగించి చేయి కడుగుతూ అన్నాడు ఆనంద్.  -” ఇప్పుడు కాదంటే వాడు ఇంకా చిన్న బుచ్చుకుంటాడానంద్ ప్లీజ్ “.   బ్రతిమాలించుకోవాలి అనే సరదా ఆనంద్ ఇలా తీర్చుకుంటున్నాడు. -“నాకేం ప్రాబ్లం లేదు. కాని దానికి కూడా సేవ చేసే అంత ఓపిక నీకు ఉంటే తెచ్చుకో “ అని మొత్తానికి ఒప్పుకున్నాడు ఆనంద్.

* * * *

ఇక ఆ కుక్కని కొనడం ఇప్పుడు నా టాస్క్ .ఉదయాన్నే పనంతా అయిపోయాక బ్రేక్ ఫాస్ట్ చేసేప్పుడు చెప్పా –“  లోహిత్  డాగ్ కొనడానికి డాడీ  సరే అన్నారు  . ఎక్కడ కొనేది ఏమైనా తెలుసా ?”. వాన్నే అడిగా ఎప్పుడైనా కొంటే కదా తెలిసేది ఏ విషయమైనా. – “అమ్మా నేనిప్పుడే దినేష్ కి ఫోన్ చేస్తాను” అని పరుగెత్తుకెళ్ళి ఫోన్ చేసి విషయాలన్ని వివరంగా తెలుసుకునొచ్చాడు. ఇంత కమ్మ్యూనికేషన్ డెవలప్మెంట్ చూస్తుంటే ఇంకా మున్ముందు ఎన్నెన్ని మార్పులు చూడబోతానో అని భయమేస్తుంది అప్పుడప్పుడు.
“అమ్మా ఇవ్వాళ ఆదివారం . ఇవ్వాళే కోనేద్దామా ? ” వాడి తొందరకి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. వాడు డాగ్ కొంటునట్టు అమ్మమ్మ కు కూడా ఫోన్ చేసి చెప్పేసాడు. ఫ్రెండ్స్ కి చెప్పేసాడు. –“నా పనంతా అయ్యాక ఇక వెళ్దామా” అని నేను తయారై బయటికి రాగానే వాడు నన్ను చూసి పకపకా నవ్వాడు. నాకెందుకో సందేహం కలిగింది బాగోలేనా ఏంటని?.

ఆ మధ్య ఒక సారి టీచర్స్ పేరెంట్ మీటింగ్ అప్పుడు “అమ్మా నువ్వు రావద్దు నేను డాడీని తీసుకెళ్తా “ అన్నాడు. ఎందుకు అంటే నువ్వు మాడ్రన్ గా ఉండవు. మా ఫ్రెండ్స్ మమ్మీలంతా ఎంత మాడ్రన్గా ఉంటారో తెల్సా ? అని నాకొక పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే మా చెల్లి ఊరి నుంచి రాగానే విషయం చెబితే ఎప్పుడూ చూడని బ్యూటి పార్లర్ కి తీసుకెళ్ళి ఏంటేటో చేయించింది. పిల్లలు స్కూలలో ఎన్నెన్ని నేర్చుకుంటున్నారు ?. వాళ్లను వాళ్ళు , వాళ్ళతో ఇతరులను కూడా కంపేర్  చేసుకుంటున్నారు. అసలు టీవీ సీరియల్స్ , సినిమాలు , అడ్వర్టైస్మెంట్ లు అమ్మల్ని వయసుదాటని పడుచుపిల్లల్లా చూపిస్తున్నారు. వయసుదాచడం  అమ్మలు అమ్మల్లా కనిపించకపోవడమే మోడ్రన్ అందమని తెలుస్కోవడంలో నాలాంటి వాళ్ళం ఎంత వెనకబడి ఉన్నామో  అనిపించింది.

“ఎందుకు నవ్వావురా ” అని భయపడుతూనే అడిగా ఈ సారి ఏ విషయం చెప్తాడోనని. వాడన్నాడు – ” అమ్మా నీ దగ్గర స్మార్ట్ ఫోనే కదా ఉంది”. అవునన్నానేను .”మరి నువ్వెందుకు ఇంత వెనకబడి ఉన్నావ్ ? మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు”.  బయటికెళ్ళే శ్రమ తప్పించాడనుకున్నా.  కాని ఆన్లైన్ లో కుక్కల్ని కొనడమా ?.  సరేలే ఎదో ఒకటి కానీ అని నా లాప్టాప్ తెరిచి OLX వెబ్సైట్  తెరిచాను. పెట్ ఆనిమల్స్ అని టైప్ చేస్తే ఎన్నెన్ని పెంపుడు జంతువుల  ఫోటోలో . ఎన్నెన్ని  ధరలో. ఇంట్లో పెంచుకునే ప్రతి పెంపుడు జంతువూ  ఉందక్కడ. లోహిత్  ఆ సైట్ లో ఉన్న ప్రతి కుక్కను ఫోటో పై క్లిక్ చేసి వివరాలు చూస్తున్నాడు.

నాకు మాత్రం మనసంతా ఎదో బాధ. వెలపెట్టి కొనాల్సి వస్తున్న మూగజీవుల ముఖాలు. అవీ వస్తువుల్లా మారిపోయాయా అన్న ప్రశ్నలు? అసలు ఈ ఆన్లైన్ రోజుల్లో  వ్యాపారం చేయలేని ఏ వస్తువు లేదా ? ఇక దేన్నైనా వస్తువులామార్చి అమ్మిపడేసే కాలం  మొదలైందా అనిపించింది. చివరకి మనిషే ఒక వ్యాపార వస్తువు కింద మారిపోయినట్టుగా  అనిపించింది. నా బుర్రనిండా కుంటా కింటే తిరుగుతున్నాడు. అక్కడ కుంటాను కొట్టి బలవంతంగా దేశం కాని దేశం లాక్కెళ్ళారు. బానిసగా అమ్మారు. ఒక బానిసని ఎన్ని సార్లైనా అమ్మకం కొనడం జరిగిన రోజులు , బలం ఉన్నంత వరకు మనిషిని బలమైన ఆస్థిగా భావించి బలం ఉడిగిపోయాక పట్టించుకోని పరిస్థితులు గుర్తొచ్చాయి. ఇక్కడ ఒక కుక్కని బానిస ట్యాగ్ వేయకపోయినా సెకండ్ హ్యాండ్ వస్తువుల్లా ఒక పట్టికలో చేర్చి కొనుక్కోండి అని అమ్ముతున్నారు. అంతే  తేడా అనిపించింది.

వెంటనే అక్క కొడుకు దీపక్కి ఫోన్ చేశా.” దీపక్ , లోహిత్ డాగ్ కావాలంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ OLX  లో కొన్నాడంట. నేను కూడా చూస్తున్నారా.  కొనమంటావా ? ” అని అడిగా. వాడన్నాడు -” పిన్ని వద్దు ఆన్లైన్ లో అమ్మే కుక్కలు మంచి జాతి కుక్కలు కావు. వ్యాపారం కోసం వాటిని వేరే వేరే బ్రీడ్ కుక్కలతో మేట్ చేయిస్తున్నారు. నాకు రెండు రోజుల టైమివ్వు.  నేను కనుక్కొని చెబుతాను ” అని లోహిత్ కి ఫోన్ ఇమ్మన్నాడు.  వాడితో ఎదో మాట్లాడి వాణ్ని ఒప్పించాడు దీపక్.

జాతి కుక్కలు, జాతి కాని కుక్కలు అని వాటిల్లో కూడా తేడాలా ?. పాపం వాటికి వాటి జాతి తెలుసో లేదో. వాటి జాతి ఇదని పేరు పెట్టిన వాళ్ళెవరో అనైనా తెలుసో లేదో ? మనుషులకే అనుకున్నా ఈ జాతులు. కుక్కల్ని కూడా వదిలిపెట్టలేదే అన్న బాధేసింది. లోహిత్ అల్లరి చేయకుండా మౌనంగా ఉన్నాడు. వాడికి డాగ్స్ గురించి  వాటి జాతి ఎరుక గురించి అర్ధమైందనుకుంటా.

– ” మమ్మీ దీపకన్నా వన్ టూ డేస్ లో చెబుతా అన్నాడుగా వెయిట్ చేద్దాం . దినేష్ గాడి కుక్క నిజంగా మంచి జాతి కుక్క అవునో కాదో రేపు క్లాస్ కెళ్ళాక విషయం చెబుతాను వాడికి ” అని మాట్లాడుతున్నాడు లోహిత్. నా కొడుకు జాతుల గురించి మాట్లాడేఅంత ఎదిగాడు. ఇక వాడికి కుక్కల జాతులతో పరిచయం ఎలాగో కలుగుతుంది.  “రేపెప్పుడో మనుషుల జాతుల గురించి, కులాల గురించి , మతాల గురించి తెలుసుకోవాల్సి పరిస్థితి వాడికి ఏర్పడితే?.  వాడుకూడా వీటిల్లోని దేనికో దానికి నిజాలు మూలాలు తెలుసుకోకుండా  అవగాహన లేకుండా అంశాన్నిగ్రహిస్తే?? ఒక తప్పుడు వాదననో సిద్ధాంతాన్నో తనకు తాను ఆపాదించుకుని  అదే నిజమని దానికి పరిమితమయితే?  అన్న ప్రశ్నలు నా  మెదడులో”.

మనుషులు జాతులుగా కులాలుగా మతాలుగా ఎలా విడిపోయారో  లోహిత్ కి నేర్పించాల్సిన అవసరం ఏర్పడిందని అర్ధమైంది నాకు ఆ క్షణంలో. అందుకే ఎనిమిదేళ్ళ క్రితం అట్ట పెట్టెలో పెట్టిన పుస్తకాల్ని తీసి ఆ సాయంత్రం అంతా దులిపి ఖాళీగా ఉన్న షెల్ఫ్ లో సర్దిపెట్టాను. ఇక ఆ రోజు నుంచి ప్రతి రోజు రాత్రి తనకి నేనే కథలు చెబుతానని వాడికి మాట కూడా ఇచ్చాను.  నా పుస్తక నేస్తాలను తనకిప్పుడు పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయం అనిపించింది.  ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం వదిలిపెట్టదలుచుకోలేదు.

ప్రశాంతంగా  సోఫాలో కూర్చుని ఆ పుస్తకాల వైపు చూస్తున్నాను. చక్కగా అట్ట వేసి పెట్టుకున్న అలెక్స్ హేలీ నవల “ The Roots ” లో నుంచి బయటికొచ్చి కుంటాకింటే  నన్ను చూసి ప్రశాంతంగా నవ్వినట్టే అనిపించింది ఆ క్షణం.

*

Image: Bhavani Phani