వాన రాత్రి

 

 

-అనిల్ డ్యాని

~

 

కప్పుకున్న ఆకుల చివర్లనుంచి

రాలిన వాన నీటి చెమ్మ

ఇల్లంతా పరుచుకుంది

 

భయం తెలియని పురుగులు

దీపం పైకి దూసుకొస్తున్నాయి

చలి పూసుకున్న దుప్పట్ట్లకి

దేహాల శ్వాశ వేడిని నింపుతుంది

 

చూరు కింద చినుకులకి

రాత్రంతా

చీకటి తడుస్తూనే ఉంది

 

వెలుతురు పెంచుకున్న

దీపం దగ్గర నేల

చలి కాచుకుంటుంది

 

దేహం చుట్టూరా

పరుచుకున్న శూన్యం

కళ్లలో వేడి ప్రవాహం

 

పసి దేహాల మధ్యలో పడుకున్న చాతీపై

రెండు చేతుల ఆలంబన

వాళ్లకి తను తనకి వాళ్ళు

రేపటికి సూర్యుడొస్తే చాలు

 

కిటికీ పక్కన

విరిగి పడిన కొమ్మ గూటి మీద

పక్షుల నోళ్ళు తెరుచుకుంటాయి

కూయడానికి కాదు కూసింత తినడానికి.

*

కొన్నిమాటలంతే …

 

 

అనిల్ డ్యాని  

Anil dani

 

 

మంచు కురిసినప్పుడు

కొంతగడ్డి పూలమీద

కొంత సాలె గూడు తీగల మీద పరుచుకుంటుంది

కొన్నిమాటలూ అంతే నేమో

 

ఈ కాఫీ బాగుంది అని చెప్పేలోపే

కాలి పట్టీల  శబ్దం వంటగది గుమ్మంలోకి

విసవిసా వెళ్ళిపోతుంది

భద్రంగానే ఉంది కదా కాఫీ కప్పు

అయినా ఏంటి గుండెలో ఏదో భళ్ళున పగిలిన శబ్దం

 

స్పర్శ లేకపోయినా

మాటలు భలేగా గుచ్చుకుని పోతాయి

ఇటుక ఇటుక  మధ్యలో మౌనాన్ని

నింపి  నిర్మించాక

నాలుగు గోడల మధ్యన  జీవిత ఖైదు

ఒకానొక అలవాటుగా మారిపోతుంది

 

అవును నీవొక నక్షత్రానివే

నీకై నీవు వెలుగులు నింపాలి

ఎక్కడిదో నీదికాని కాంతిని

పూసుకుని వెలిగి పోవాలి

కాదనలేనంత వైశాల్యం నీకున్నా

వెలిగినంత సేపు వెలిగి

నీ గుమ్మం ముందే కదా   రాలి పోవాలి

 

పోగేసుకున్నంతకాలం

రాయో , రప్పో  పక్కనే ఉంటాయి

వాటితో పాటుగా మాటలూనూ

ఆయుధాలుగా పనికొచ్చేవన్నీ

వదిలి పెట్టి మాటలనే

వాడుతూ పోతే చివరకి మిగిలేది

రాళ్ళు , రప్పలు ,మాటలు చేసిన మౌన గాయాలు

*