మేముకోరుకుంటున్నకళింగం!

 

 

చికాగో ఆటా సభలో… ఉత్తరాంధ్ర కధా ప్రయాణం పై  అట్టాడ  అప్పల్నాయుడు  ప్రసంగానికి ఇది వ్యాసరూపం    

*

         అందరికీ నా నమస్కారాలు. ఇవ్వాళ నాకెంతో ఉద్వేగంగా ఉంది.శ్రీకాకుళానికీ చికాగోకీ రాజకీయ నెత్తుటి సంబంధముంది. ఆ నెత్తుటి సంబంధమే నన్ను ఆటా సభలో పాల్గొనేట్టు చేసిందనుకుంటాను.నాకిచ్కిన సమయమ్ లో సాధ్యమయినంత మేరకు వందేళ్ళ పై బడ్డ ఉత్తరాంధ్రా కధను సంక్షిప్తంగా మీ ముందుంచుతాను.

దిక్కుపేరుతో పిలువబడే ఒక దిక్కుమాలిన ప్రాంతం…ఉత్తరాంధ్ర. కళింగాంధ్ర అనే చారిత్రాత్మక పేరు చెరిగిపోయింది. గోదావరి నుంచి మహానది దాకా కళింగాంధ్ర అంటారు. ఇవ్వాళ ఆ సరిహద్దులు కుదించుకోవాలి. మాకు గూడా ఇపుడా కళింగం   మేముకోరుకుంటున్నకళింగం.  అదేఉత్తరాంధ్ర.

ఆధునిక తొలి తెలుగుకధ !దిధ్దుబాటు’ అనంటే ఇవ్వాళ అందరూ అంగీకరించకపోవచ్చుగానీ,కళింగాంధ్ర తొలి ఆధునిక కధ మాత్రం దిధ్దుబాటు అని చెప్పే హక్కు మాకుంది. కళింగ సమాజం ప్రయాణించిన మేర కళింగ కధ కూడా ప్రయాణించింది. సంస్కరణవాదం,జాతీయోద్యమం,అభ్యుదయోద్యమం,విప్లవోద్యమం…తర్వాతి ప్రపంచీకరణ,విధ్వంశ వ్యతిరేక ప్రజాఉద్యమాల వెంట కళింగకధ నడచింది. తొలి ఆధునిక కధ వచ్చిన 1910 నాటికి కళింగాంధ్ర…జమీందారీ,ఈనాందారీ పాలనతో పాటు ఆంగ్లేయుల పెత్తనంతో ముప్పేట పాలనలో వుండేది. దాదాపు 37 చిన్నా,పెద్దా జమీందారీలు,మరికొన్ని ఈనామ్ దారీలు. ఫ్యూడల్ భావజాలం ..నిండివుంది. అగ్రవర్ణ, ఉత్పత్తేతర కులాల వారికి మాత్రమే విద్యా,ఉపాధి అవకాశాలు.

ఆంగ్లేయుల పాలన రెండు రకాల ప్రభావాలను వేసింది. వారి ఆధునిక శాస్త్రీయ భావజాలమూ,ప్రజాస్వామిక ధోరణులూ…విద్యా,ఉపాధి అవకాశాలు పొందిన ఉత్పత్తేతర కులాలపై…సంస్కరణవాద ప్రభావాన్ని వేస్తే: ముప్పేట పాలనలో కష్హ్టఫలం నష్టపోయిన ఉత్పత్తికులాల పై తమ ఉపాధికోసం సమరబాట పట్టాల్సిన స్తితి కలిగించింది. అడవిమీద హక్కు కోల్పోయిన ఆదివాసీలు సమరం చేస్తే పితూరీలన్నారు వాటిని ఆంగ్లేయులు. జమీందారీ రైతులు ఇచ్చాపురం నుండి చెన్నపురి దాకా రైతు రక్షణయాత్ర చేసారు. గ్రామీణవ్రుత్తుల వారు విధ్వంసానికి గురయ్యారు. కళింగనేల బొమ్మా,బొరుసూ స్తితి ఇది.

ఈ స్తితిలో సమాజం లోని ఫ్యూడల్ భావజాలం లోని చెడుని  వ్యతిరేకించే, ముఖ్యంగా మత మౌడ్యాన్ని,అవిద్యను,స్త్రీ పట్లవివక్షను,  బాల్యవివాహాలను  వ్యతిరేకిస్తూ సమాజాన్ని భావజాల రంగం లో సంస్కరించే సాహిత్యం 1910 నుంచీ దాదాపు 1945 దాకా వచ్చింది.గురజాడ రాసిన దిద్దుబాటు,మెటిల్డా,పెద్దమసీదు,దేవుళ్ళారా మీ పేరేమిటి…సంస్కర్తహ్రుదయం కధల్లో పైన చెప్పిన సంస్కరణవాద భావజాలమే కన్పిస్తుంది. ఆ తర్వాతి తరం రచయితలు…పూడిపెద్ది వెంకటరమణయ్య,వలివేటి బాలక్రిష్ణ్,స్తానాపతి రుక్మిణమ్మ,పిల్లలమర్రి వేదవతి,విశ్వనాధ కవిరాజు,కాలూరి నరశింగరావు,మండపాక పార్వతీశ్వరశర్మ మొదలయినవారు కూడా గురజాడ బాటలోనే,కధలు రాసారు.

నీలాటిరేవు,అమ్మోరుదేవత,క్షవరకల్యాణం,యుక్తిమాల ,దయ్యాలు వంటి శీర్షికల్తో కధలు రాసారు. స్తానాపతి రుక్మిణమ్మ…ఆనాటి నీలాటిరేవు ఆడవారికి ఒక సమావేశ స్తలంగా అనేక విశయాలు కలబోసుకునే ప్రదేశంగా యెలా ఉపయోగపడేదో కధలు రాసారు. అలాగే దయ్యాల గురించీ. ఆనాడు దయ్యం పడని ఆడది లేదని కందుకూరి గారు వ్యాఖ్యానించారంటే దయ్యాల ప్రభావం యెంతటిదో తెలుస్తుంది. ఇక,పూడిపెద్ది వారయితే ప్రజల నానుడిలోని అనేక సామెతలను కధలు చేసారు…కాకర పువ్వు వచ్చి కాళ్ళమీద పడితే,నొచ్చిందా అనడగడు,ఈ ముండ సంసారం నేను చెయ్యలేనమ్మాఅన్న సామెతతో ఒక కధ, ఓపిక ఉందని ఇద్దర్నిపెళ్ళాడితే,ఒకామె తెల్లవెంట్రుకలనూ,  మరొకామె నల్లవెంట్రుకలనూ పీకిందట…సామెత కధ. వీరు పూలగుత్తి అనే పత్రికను కూడా కధల కోసం నడిపేరు.

మొత్తానికి గురజాడ గారన్నట్టు…మంచీ,చెడుల విచక్షణ,మంచివేపు మార్చే సంస్కరణ వాదమూ ఈ తరం కధల్లో చూస్తాం.వీరిలో మరి కాస్తా ముందుకు చూసినవారు…శెట్టి ఈశ్వరరావు,పండిత అ.న.శర్మ. ఈశ్వరరావు గారి హిందూ,ముస్లిం:తిండిదొంగ కధలు,అ.న.శర్మగారి..వారసత్వం కధ కేవలం ఆదర్శవాద దృష్టి గాక,నిజ జీవితాన్ని చిత్రించి చూపాయి.

ఇక జాతీయోద్యమాన్ని చిత్రించిన కధలకు వస్తే…ఇక్కడినుండి తక్కువ కధలే వచ్చాయి. బహుశా అప్పటి రచయితలు సంస్కరణవాద భావజాల ప్రభావితులేమో. కందుకూరి ప్రభావితం చేసినంతగా అల్లూరి ప్రభావితం చేయలేదేమో. ప్రజాపోరాటాలపట్లగానీ,జాతీయోద్యమం పట్లగానీ…సంశయాలే యెక్కువేమో అన్పిస్తుంది,కాంగ్రెస్ సభ ల మీద గురజాడ వ్యంగ్య రచన…మనకు ఈ అనుమానాన్ని కలిగిస్తుంది. అయితే…జాతీయోద్యమ సందర్భాన్ని కధనం చేసిన రెండు కధలు చెప్పుకోవచ్చు…ఒకటి..బంకుపల్లి రామజోగశాస్త్రి గారి విమలాదేవి కధ,మరొకటి…గోవిందరాజు రామశాస్త్రి గారి నీళిజోళ్ళమరమ్మత్తు కధ.జాతీయోద్యమం లో పాల్గోనందుకు భర్తను వ్యతిరేకించి,భర్తను వదిలేసి ఉద్యమం లోకి నడచిన ఓ స్త్రీ కధ విమలాదేవి కధ. పాత సాంప్రదాయాలే కాదు,పాత పాలనలే కాదు దేశం మరమ్మత్తు చేయబడాలని తెలిపే కధ నీళిజోళ్ళ మరమ్మత్తు కధ.

ఇక స్వాతంత్ర్యం రావడం,మనల్ని మనం పాలించుకోవడం…ప్రజల జీవితంలో యెటువంటి మార్పు లేకపోవడం…మన స్వాతంత్ర్యం ఒక మేడిపండు,మన దారిద్ర్యం ఒక రాచపుండు అన్న స్తితిని గమనించిన రచయితలు…పాలనను విమర్శించడం,ప్రజల బాధలను వివరించడమ్…కధనం చేసారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు,అవసరాల సూర్యారావు,మసూనా,భరాగో,బలివాడ కాంతారావు తదితరులు…చీకటిరోజులు,ఒడ్డుదాటినవాడు,పడగనీడ,పూర్ క్రీచర్స్,గమనశ్రమ వగయిరా శీర్షికల కధలు రాసేరు. వీరిలో అవసరాల వారి సమ్మె కధ అప్పట్లోనే  కాంగ్రేస్ పై ఇప్పటికి సరిపోయే వ్యాఖ్య చేస్తుంది. వీధులు తుడిచేవారు సమ్మె చేస్తుంటే,ఆ సమస్య పట్టించుకోకుండా…వీధులు దుమ్ముపట్టినాయని కాంగ్రేస్ వాలంటీర్లు…చీపుర్లు పట్టి వీధులు ఊడ్వడం చేస్తారు…దాన్ని వ్యాఖ్యానిస్తూ…కాంగ్రెస్ తన గత కీర్తిని తానే ఊడ్చి వేస్తోందంటాడు  రచయిత.

ఈ దశల కధలను రావిశాస్త్రి అయ్యో,అయ్యో కధలన్నారు. నిజానికి ఆయనకూడా ఆరు సారో కధలు రాసారు. గానీ త్వరలోనే మారని పాలన రీతుల వెనుక గల రాజ్య స్వభావాన్ని గుర్తించారు.బహుశా అప్పటికే వామపక్ష భావజాలం కళింగాన చోటుచేసుకోవడంతో…చాసో,రావిశాస్త్రి,కారా,శ్రీపతి వంటివారు పాలకులది ఒక వర్గమనీ,ప్రజలది ఒక వర్గమనీ..ఇది వర్గసమాజమనీ,వర్గసమాజం లో ఏదీ వర్గాతీతంగా ఉండదనీ తెలియపరిచే కధలు రాయడం జరిగింది.చాసొ గారి…కుంకుడాకు,భల్లూకస్వప్నం,బూర్జువాకుక్క,రావిశాస్త్రి గారి పిపీలికం,సారాకధలు,కారాగారి యగ్యం …అభ్యుదయ దృక్పధాన్ని అందించే కధలు. తాను యెవరో ఎరుక పొందాలనుకునే ఒక చీమకు శత్రువయిన ఒక సర్పం …తాను కష్టజీవి అని ఎరుకను కలిగించిందనీ,శత్రువుని శ్రమజీవులంతా కలిసి యెదుర్కొని హతమార్చడాన్ని ఈ కధలో చిత్రించారు.  రావిశాస్త్రి గారి పిపీలికం ఒక గొప్ప మార్క్సిస్ట్ తాత్విక కధ. దాదాపు మూడు పంచవర్ష ప్రణాళికలు ధనిక,పేదలమధ్య వ్యత్యాసాన్ని పెంచాయి.ఇటు కళింగాంధ్రలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం,తెలంగాణా సాయుధపోరాట ప్రభావం,అరసం యేర్పాటు,ఆదివాసీప్రాంతాల్లో సంగాల నిర్మాణం,పాలకవర్గవ్యతిరేక ఉద్యమ వాతావరణం నిండివుండిన కాలమ్ లో కారా మాస్టారి యగ్యం కధ వచ్చింది.తొలి తరం రచయిత- అప్పు తీర్చడానికి తన సంతానాన్ని వారసుడిగా పెంచదలచిన ఒక తండ్రిని…వారసత్వం అనే కధలో చూపిస్తే…కారా మాస్టారు…అప్పు కోసం సంతానం బానిస బతుకు బతకడానికి వీల్లేదని,సంతానాన్ని గ్రామ పంచాయితీ మండపం సాక్షిగా చంపిన ఒక తండ్రిని చూపిస్తారు. భవిష్యత్ తరం బానిసలు కాగూడదనే ఆకాంక్షతో విముక్తి పోరాటబాట నడచింది శ్రీకాకుళ రైతాంగం.దాని పూర్వదశను యగ్యం చూపింది.

ఈ కాలం లో అప్పటిదాకా మధ్యతరగతి ఇళ్ళల్లో ఉండిపోయిన కధ…వీధుల్లోకీ,బజారులోకీ,పంటపొలాల్లోకీ నడచింది..రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీవులను,అల్పజీవులను సాహిత్యం లోకి   తీసుకువచ్చింది.

శ్రీపతి నర్తోడు,పతంజలి..మోటుమనిషి,రావిశాస్త్రి..రాకెట్టప్పారావు, కారా…అప్పల్రాముడుఆనాటి కష్టజీవులూ..కష్టఫలితాన్ని కోల్పోయిన నష్టజీవులు. సర్వేజనా సుఖినోభవంతు అని అమాయకంగా ఆశించిన గురజాడ తరం నుండి ఈ తరం…శ్రామిక జన సుఖినోభవంతన్న శ్రామికవర్గధోరణికి కధను నడిపింది.

ఆ తర్వాత శ్రీకాకుళ గిరిజన రైతాంగపోరాటం సాయుధరూపం తీసుకోవడం…ఆ పోరాటం లో మేధావులూ,ఉపాధ్యాయులూ,కవులూ పాల్గోవడం,విశాఖ విద్యార్దులు..రచయితలారా మీరెటు వేపు అని ప్రశ్నించడం,విరసం యేర్పాటు…కళింగసాహిత్యావరణం లోకి రక్తసిక్త సాయుధ గిరిజనుడొచ్చాడు. అడివంటుకుంది,ఇదేదారి,తీర్పు,పులుసు వగయిరా భూషణం గారి కధలు, నర్తోడు,నక్సలైట్ రాత్రులు వంటి శ్రీపతి కధలు,ఎన్నెస్ ప్రకాశరావ్,ప్రకాశరావ్,బి.టి.రామానుజం వగయిరా కధకులు విప్లవకధా పతాకను యెగురవేసారు.

శ్రీకాకుళాన్ని కల్లోలితప్రాంతంగా ప్రకటించడం,అడవినీ,గిరిజనగూడేలనూ దగ్దం చేయడమ్,ఎన్ కౌంటర్ పేరిట చంపడం…మొత్తానికి ఉద్యమాన్ని అణచివేయడం చేసిన ప్రభుత్వం ఇంకోవేపు సంక్షేమ పధకాల పేరిట ప్రజలకు ఆశలు రేకెత్తించి ఉద్యమానికి దూరం చేయడం ఎనభయిల నాటి కళింగ స్తితి. ఈ స్తితిని భూషణం గారి కొత్తగాలి కొన్ని కధలూ,అప్పల్నాయుడి పోడు..పోరు, కొలతలు…కధలు చిత్రించాయి.

తొంభయిలనాటికి ప్రవేశించిన సరళీకరణా,ప్రయివేటీకరణా,ప్రపంచీకరణా తమ ప్రభావాన్ని కళింగాంధ్రలో గూడా కలిగించాయి. నడువని పరిశ్రమలు (జూట్,సుగర్) ,ప్ర్రూర్తిగాని నీటిప్రాజెక్టులు, ఫైనాన్స్ కంపెనీలు,ఫోర్లైన్ల రోడ్లూ, మార్కెట్ పంటల జూదం లో ఓడిన రైతులూ, ఉపాధులు కోల్పోయిన గ్రామీణ చేతివ్రుత్తులవారూ… వలసబాట పట్టిన బతుకులు…వీటిని శ్రీకాకుళసాహితి… గావలికధలు, వంశధారకధలు, జంఝావతికధలు,వేగావతికధలు పేరిట సంకలించింది. బమ్మిడి జగదీశ్వరరావు … మట్టితీగలు, గంటేడ గౌరునాయుడు…ఒక రాత్రి రెండు స్వప్నాలు,సువర్నముఖి…సువర్నముఖి   కధలు,మరి కొందరి కధాసంపుటాలు దాదాపు దశాబ్దకాలపు మార్పుల్ని చిత్రించాయి. ఆ తర్వాత వర్తమానమ్ లో కళింగాంధ్రాలోకి విదేశీకంపెనీలతో పాటూ, ఇతరప్రాంతాల పెట్టుబడుల ప్రవాహం రావడమ్…ఇక్కడి పంటభూములను సెజ్ లుగా మార్చడం,ధర్మల్,అణువిద్యుత్ కుంపట్లు పెట్టడం,అడవీ,కొండల్లోని అపార ఖనిజాలను దొలుచుకు పోవడం,సముద్రతీరాన్ని యురేనియం కోసం, మత్స్యసంపదకోసం జల్లెడపట్టడం…ఈ పరిణామాలకు వ్యతిరేకంగా మైదాన ప్రాంతాన రైతులు, దళితులు,బహుజనులూ,అటవీప్రాంతాన ఆదివాసీలు, తీరప్రాంతాన మత్స్యకారులు పోరాడుతున్నారు.

తాము కోల్పోయే  నేలకోసం,. ఉపాధికోసం ఉద్యమిస్తున్నారు…ఈ స్తితిని.. మల్లిపురం జగదీశ్…శిలకోల,గాయం,బల్లెడనారాయణమూర్తి…ఉద్దానంకధలు,బజరా…హింసపాదు,గౌరునాయుడు…మాయ,అప్పల్నాయుడు..సందిగ్దాకాశమ్,దయ్యపుభరోసా, వంటి కధల్లో గమనించవచ్చు. అలాగే చింతకింది శ్రీనివాసరావ్, కె.యెన్.మల్లీశ్వరి,  డాక్టర్.బి.ఎసెన్.మూర్తి,పి.వి.బి.శ్రీరామమూర్తి,ఎ ఎన్ జగన్నాధశర్మ వంటివారి కధల్లో వర్తమాన కళింగజీవితాన్ని చూడవచ్చు.

ముగించే ముందుగా…కొందరు విలక్షణ రచయితల గూర్చి చెప్పవల్సివుంది. వ్యక్తుల గుణగణాల మీదా,వ్యక్తుల ప్రవర్తనల మీదా తాత్విక విమర్శగా కొన్ని కధలూ,మరికొన్ని మానవజీవితం లో యెదురయే ఘటనల గూర్చిన చింతనను తెలిపేకధలు రాసిన బలివాడ కాంతారావు గారూ,హాయి అయిన హాస్య కధలు రాసిన భరాగో గారూ,వేటకు సంబంధించిన కధలు రాసిన అల్లం శేషగిరిరావుగారూ, రాజుల శిధిలవైభోగాలను రాసిన…పూసపాటి క్రిష్ణమ్రాజు,దాట్ల నారాయణమూర్తిరాజూగారూ.. వీరితోపాటూ తప్పకా చెప్పుకోవాల్సిన విలక్షణ,విశిష్ట రచయిత పతంజలి గారు. ఈ విలక్షణ,విశిష్టరచయితల రచనలు కళింగాంధ్రా కధా పతాకకు వన్నె తెచ్చిన రచనలు.

సంస్కరణవాద భావజాలంతో ఆరంభమయిన కళింగ కధ,సమరబాటనూ నడచి..విఫలమయిన విప్లవాన్నించి వర్తమానం దాకా కళింగసమాజ ప్రయాణాన్ని చిత్రిస్తూనే ఉంది.

ఎన్నెలో యెన్నెలా… !

 

 

-అట్టాడ అప్పల్నాయుడు

~

 

 

ఆ ఇంట్లో టీ.వీ అతని మరణాన్ని ప్రసారం చేస్తోంది. మరణం వెనక కారణాలను విశ్లేషిస్తోంది. రోజులో యింకేవీ వార్తలు లేనప్పుడూ, అడ్వర్టయిజ్ మెంట్ల తర్వాతా మూడు రోజులుగా టీ.వీ ఛానళ్లన్నీ అతని గురించి చెపుతూనే వున్నాయి. న్యూస్ ఏంకర్లు వారి రిపోర్టర్లను యెప్పటికప్పుడు అప్ డేట్సుని అడుగుతూ, వాట్ని ప్రసారం చేస్తూ, కొన్ని విజువల్స్ వేస్తూ, యిటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు కనబడుతున్నారు. అప్పటికి అతను చనిపోయి నాలుగోరోజు.

అతను చనిపోలేదు, హత్యచేసారంటారు అతని మిత్రులూ, సహచరులూ.  అతన్నెవరూ హత్యచేయలేదు, అతనికతనే ఉరి వేసుకుచనిపోయేడు. బతకడం ఇష్టంలేక తనే చనిపోతున్నాని, బతుక్కంటే చావు హాయిగా వుందని ఉత్తరం రాసి చనిపోతే హత్యంటారేమిటీ అసహనంగా ప్రశ్నించేరు కొందరు. ఆ కొందరే అతని మరణానికి కారణమని యింకొందరూ ! ఇన్నోసెంట్ ఛైల్డ్ , టేక్ హిజ్ లైఫ్ ఫర్ నో కాజ్.. అని వాపోయిందొకామె. అంతేకాక- ఆ చావుకి తమను బాధ్యుల్ని చేసి మాటాడిన ప్రతికక్షుల్ని… ఉతికి ఆరేసింది. రాజకీయాలు శవాలతో చేయకండి. ఊపర్ భగవాన్ హై.. పాపోంకో ఓ నహీ ఛోఢేగీ… అని నిప్పుకళ్లతో హుంకరించింది. భగవాన్ కూడా ఆ క్షణాన ఆమెను చూస్తే హడలిఛస్తాడు.

భగవాన్ ఆప్ జైసే మహిళా నహీ… భగవాన్ పురుష్ హో, నహీ ఛోడీగీ నహీ, నహీఛోఢేగా భోలో అని ఇంకొందరు అభ్యంతరం చెప్పేరు. ఆమె ధీమాగా – ఓటర్ తమ పక్కనున్నారన్నట్టు.. భగవాన్ హమారే సాధ్ హై… అనన్నది ! ప్రతికక్షులవేపు నిసాకారంగా చూసి – ఇన్నోసెంట్ ఛైల్డ్ టేక్ హిజ్ లైఫ్.. అని రుద్ద కంఠంతో పలికి… భగవాన్ నహీ ఛోడేగీ అనన్నది మళ్లీ !

” .. చూసేవమ్మా, నువ్వెప్పుడూ అల్లరి పిల్లడివని తిట్టేదానవి. ఆమె నన్నెపుడూ చూడనేలేదు. నా శవాన్నిగూడా చూడలేదు. అయినా ( ఇన్నోసెంట్ ఛైల్డ్ ) తెలివిలేని పిల్లడని బాధపడింది. నువ్వూ వున్నావెందుకూ ? నన్నాడిపోసుకోడానికి ? అని బుంగమూతి పెట్టేడు అతను ! టీ.వీ చూస్తోన్న తల్లి బదులివ్వలేదు. అతని ఒడలంతటినీ స్పర్శించింది. కౌగిలించుకుంది. జుత్తులోకి వేళ్లు జొనిపి, జుత్తు గట్టిగా పీకింది. అతను హాయిగా నవ్వి ఆమె కౌగిలిలో ఇమిడిపోయేడు.

ఇంతలోనర్శిం వచ్చేడు. ఒక క్షణం మౌనంగా కూచున్నాడు. ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి – నక్షత్ర చావుకి ఒకరు గాదమ్మా.. నీచే, నాచే, వరమడిగిన కుంతిచేతన్… అలాగ ఆరుగురేటి బతికున్న మనందరమూ కారకులమే అనన్నాడు. తల్లి గతుక్కుమంది. కొడుకు- సైగ చేసేడు, నాలుకను బయటకు పెట్టి నర్శిం మామ చెప్పేది నిజంకాదన్నట్టు. అతనే నక్షత్ర ! ఆమె నక్షత్రను పొదివి పట్టుకుంది.

నక్షత్ర చనిపోయేడంటే యిప్పటికీ నమ్మలేకపోతున్నాను., కాలిబూడిదయి నాల్రోజులయినా- అనన్నాడు నర్శిం. నక్షత్ర మరణ వార్తను నర్శిమ్మే తెచ్చేడు. పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేడు. చీకటి, చిట్టడవీ, భోరున గాలీవానా  – చిందువ యెత్తుకెళిపోయిన జింక పిల్ల తల్లిలా ఒణికిపోతూ, నిలువెల్లా నీరయి… తల్లి కూలబడిపోయింది. నర్శిం యేడుస్తూ –

నక్షత్రలాంటివాళ్లు తమ వాడలోనే కాదు, భూమ్మీదనే యెక్కువమంది పుట్టరు. చిత్రమయిన పిల్లాడు. బతుకు గురించి అందరమూ యేదో అనుకుంటాంగానీ నక్షత్ర భవిష్యత్ బతుకు గురించి మాటాడేవాడెపుడూ. రేపేంజేద్దామ్మామా అనడిగేవాడు. గడనీయిరా… ఈరోజేనేవాడు నర్శిం. కాదు, మామా ఈరోజు గడవడం రేపటికోసమే అననేవాడు. రేపటికోసమే జీవించేవాడు. ఊరుకి దూరంగానున్న స్కూలుకి నడిచివెళ్లేవాడు. పెద్ద రైతుల, ధనికుల పిల్లలు నక్షత్రను యెందుకో ఒకందుకు అవమానపరిచేవారు. తల్లీదండ్రులు కులభ్రష్టులనో, కులహీనులనో.. ! ములకోల పోట్లతో దుక్కిపశువు నాగేటిచాళ్లు పోసినట్లుగా హైస్కూల్, కాలేజీ చదువుల్ని సాగించేడు రేపటి మీద ఆశతో !

లేదు మామా, నేనింకా బతుకు ఆరంభించకముందరే ముగింపుకొచ్చేసాను. దుక్కిపశువు నాగేటిచాళ్ల మీదే ఆఖరి శ్వాస తీసింది- సూసైడ్ నోట్ లో ఈ వాక్యం లేదుగానీ, నర్శింకి లేఖ సారాంశమంతా యీ వాక్యరూపంలో అర్ధమైంది. అందుకే… బతికున్న అందరమూ  దోషులమంటున్నాడు.

ఇందిరమ్మకోలనీ కోసం, బంజరభూములకోసం, రిజర్వేషన్లకోసం, దేవాలయప్రవేశాల కోసం – నర్శిం ఆందోళనలూ, ఉద్యమాలూ ! మామా, వీటి కోసమేనా మన జన్మలు ? వాళ్లూ, మనం అంతా కూడా మనుషులమే కదా ? వాళ్ల కలలూ, మన కలలూ ఒకటే కాజాలవా అనేవాడు. నక్షత్రకు ఆశయాలున్నవిగానీ, అవెలా తీరతాయో, వాట్నెవరు అడ్డుకుంటున్నారో యెరుక లేదు. నర్శింకి కూడా వివరించే శక్తి లేదు. నక్షత్ర ఓ రోజు నర్శిం భుజమ్మీది ఎర్రతువ్వాలుని తీసేసి, నీలి రంగు తువ్వాలు కప్పేడు. ఏవేవో విషయాలు మాటాడేడు. యూనివర్షిటీలో తోటి విద్యార్ధుల ఆశలు, ఆవేదనలు, రేపటి కోసం కార్యాచరణలు… ! ఏడాదిగా యెపుడు కలిసినా యివే ఊసులు !

అపుడే – ఊరిలో ఏదో బహుళజాతి కంపెనీ ధర్మల్ విద్యుత్ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. డిపట్టా భూమలయిన తమ భూముల్ని అప్పగించమని కలెక్టర్ ఉత్తర్వులు. తాము ఉద్యమం చేయటం. కోర్టు నుంచి స్టే తేవడం ! కలకలంగా ఉంది వాడంతా !

యేమనుకున్నాడో నక్షత్ర – పండీ, యెండని భూములెందుకు మామా, వొదిలేయండి, ఉద్యోగాలిప్పించమనండన్నాడు.

నక్షత్రా – పండీ, యెండనివి కాదు. అలా చేసేరు, రైతు బతుకుని. మట్టిలోన సాముదప్పా మాకేమి తెలుసు నక్షత్రా ? మట్టిని లాక్కున్నోడు మమ్మల్ని ఉద్దరిస్తాడంటే నమ్మమంటావా అని గదా అడిగేడు నర్శిం.

నక్షత్ర చాలాసేపు మాటాడలేదు. ఒక దీర్ఘనిట్టూర్పు విడిచి – యేం చెప్పాలో బోధపడడంలేదుమామా అని ఆకాశంవేపు చూస్తూ వెళిపోయేడు ఇంటికి !

picasso_cubism

మళ్లీ యిదిగో పదిపదిహేను రోజుల కిందట ఓ రాత్రి ఫోను చేసేడు – మామా ఊళ్లల్లో  వెలిని దాటి వచ్చేంగానీ మేమిక్కడ వెలిని దాటలేకపోయేం. వెలివాడలోవున్నామని – తమ పనిష్మెంటూ, దాన్ని యెత్తివేయడానికి చేసిన పోరాటం, సహచరుల నిరాశలూ, నిస్తబ్దతలూ… ఎన్నాళ్లీ చీకట్లు మామా అనడిగేడు ! అపుడు, నర్శిం ఆకాశం వేపు చూసేడు !

నర్శింకి అన్నీ కదలాడి -ఆకాశంలో యేమి బోధపడింది నక్షత్రా ? అని కుమిలిపోసాగేడు.

కూలబడిన తల్లి  స్పృహ కోల్పోయింది. నర్శిం ఆందోళనతో ఇంట్లోకెళ్లి మంచినీళ్లు తెచ్చి, ఆమె మొహమ్మీద చల్లేడు. ఇరుగూ పొరుగూ కోసం కేకలు పెట్టేడు. ఇరుగుపొరుగూ చేరేరు. యేవేవో సపర్యలు చేస్తున్నారు. ఆ రోజే సాయాంత్రానికి యూనివర్సిటీకి చేరేరు. నక్షత్ర శవం చుట్టూ పోలీసులు దడిగట్టేరు. విద్యార్ధులెవర్నీ దరిచేరనీయటంలేదు. నర్శింనీ, తల్లినీ రానిచ్చేరు. వారితో యేమీ మాటాడకుండా నక్షత్ర శవాన్ని వేనెక్కించి స్మశానానికి తీసుకువెళ్లేరు. పోలీసులు కాటికాపరులయ్యేరు. కన్నపేగులు కాలుతున్న బాధతో కూలిపోయింది.. ఆ తల్లి ! నర్శిం తీసుకొచ్చేసాడు. గొడవలూ, ఆందోళనలూ… కన్నీళ్లూ, ఎగజిమ్మిన ఆక్రోశాలూ ! తల్లి ఇంటికొచ్చేసింది.

రెండో రోజు… నక్షత్ర తల్లి దగ్గరకు వచ్చేడు. అమ్మా అని పిలిచేడు. ఇటు చూడన్నాడు. తల్లి చూసింది. నక్షత్రమండలానికీ, భూమండలానికీ మధ్య కన్పించేడు. ఎర్రెర్రగా, నీలినీలిగా వున్నాడు. మొహం కాంతివంతంగా వుంది. ఏ కొత్త బతుకునో అందుకోబోతున్న వాడిలా వున్నాడు. నవ్వేడు. ఆ నవ్వే ఆమెకిష్టం. చిన్నప్పటి నుంచీ యెలా వచ్చిందోగానీ వాడికి ఆ నవ్వు – పున్నమిచంద్రుడిలా ముచ్చటేస్తుంది. ఆమె కూడా నవ్వింది. యేడ్వకన్నాడు. నీ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గరకు వచ్చేనంతే. కాదు, కాదు. అమ్మమ్మ దగ్గరకు యింకా చేరలేదు. పదకొండోరోజు మీరేదో క్రతువు చేస్తేగానీ ఆత్మ బయటపడదని బేమ్మర్లంటారుగదా అన్నాడు.

బ్రాహ్మణ్లను అలా బేమ్మలనీ, బాపన్లనీ పల్లెవాళ్ల పలుకు బడిలో పలుకుతాడు నక్షత్ర ! నక్షత్రకు ఓ బ్రాహ్మణ స్నేహితుడున్నాడు. అతణ్ణి మాత్రం – నువ్వు బ్రాహ్మల్లో తప్ప బుట్టేవయ్యా అంటాడు.

” … అతను కూడా యేడుస్తున్నాడమ్మా. యిపుడే అతనికి యేడ్వద్దని చెప్పొచ్చా. మరోజన్మలో నువ్వు మా కులం లోనా, నేను నీ కులంలోనా పుట్టి ఒకరి రుణం మరొకరం తీర్చేసుకుందాంలే అనన్నానమ్మా ” అని చెప్పేడు.

ఆ తల్లికంతా అయోమయంగా వుంది. నక్షత్ర మళ్లీ తల్లితో –

” … ఈ పదకొండు రోజులూ నీతోనే వుంటానమ్మా. పదకొండు జన్మలకు సరిపోయే ఊసులాడుకుందాం, పదకొండుజన్మల అనుభూతిని మూటగట్టుకుందాం… లే.. ” అన్నాడు. లేచింది తల్లి. నాల్రోజులుగా ఊసులే ఊసులు…

ఇందిరమ్మకోలనీ ట్విన్ను ఒక భాగంలో వుంటుందామె. ఇద్దరు కూతుళ్లు, మరో అబ్బాయీ సంతానం. ఉదయం పదిన్నరవేళ. ట్టిన్ను ముందరి గడపలో శీతకాలపు ఎండ పడే చోట కూచుంది. కూతుళ్లూ, కొడుకూ బయటకు వెళిపోయేరు. సెలవులకు ఇంటికొచ్చిన నక్షత్ర రాత్రి బాగా లేటుగా పడుకున్నాడేమో ఎండవేళకి లేచేడు. కళ్లు పులుముకుంటూ గడపలోకి వచ్చేడు. తల్లి ఎండపట్టున దిగాలుగా కూచోడం చూసేడు. ఆమెకు దగ్గరగా వచ్చి కూచుని –

” రాత్రి మంచి కల వచ్చిందమ్మా. అమ్మమ్మ దేవుడిని బతిమాలుకొని కిందకి వచ్చి నన్ను తీసుకెళ్లింది. దేవుడేమో నన్ను చూసి పలకరించేడు. మీ అమ్మమ్మ యెప్పుడూ నీ గురించే మాటాడుతుంటుంది. నీ ధ్యాసే ఆమెకు. నువ్వు వచ్చేయగూడదూ అమ్మమ్మ దగ్గరకూ అనన్నాడు. నేనాయన అడిగినదానికి బదులివ్వకుండా – ఇక్కడేమేమి వున్నాయీ అనడిగేను. దేవుడికి బోధపడలే. అమ్మమ్మే జవాబిచ్చింది. అన్నీ వున్నాయనీ, నక్షత్ర మండలం చూడచక్కగా వుంటాదనీ చెప్పింది. ఒకో నక్షత్రం ఒక దేశంలా వుంటాదట. మన భూమండలంలో వున్నంత మంది కాదుగానీ మోస్తరుగా వుంటారట మొత్తం నక్షత్ర మండలమంతా కలిపితే ! అందరూ బాగుంటారట. ఎవరికీ యే బాధా వుండదట. పనిచేయడం, తినడం, పాటలు పాడుకోవడం, ఆటలాడుకోవడం, నృత్యాలూ – ఒవ్వో అనంది. అందరూ ఉమ్మడిగా వుంటారట. స్వంతమనేదేదీ ఎవరికీ వుండదట, గానీ అందరికీ అన్నీ స్వంతమట…. ” అనన్నాడు. ఆ మాటలు తల్లికి అర్ధంకాలేదు. ప్రశ్నించబోయింది. కానీ నక్షత్ర తన ధోరణిలో తాను –

” … దేవుడు ఒక్కోరోజు ఒక్కో మండలంలో వుంటాడట. అమ్మమ్మ వాళ్ల మండలానికి దేవుడు  వచ్చిన నాడు పర్మిషన్ అడిగిందట, నన్ను తీసుకురాడానికి ! మళ్లీ నేను వెళ్లే రోజుకి దేవుడు వచ్చేడు. మరి ఇక్కడ చదువుకొనే స్కూల్లూ, కాలేజీలూ, యూనివర్సిటీలూ వుంటాయా అనడిగేను. నక్షత్రమండలమ్మీద పరిశోధనకి నాకు అవకాశమిస్తారా – అనడిగేను. దేవుడు యెందుకో నవ్వేడు. మా వీసీ కూడా అలాగే నవ్వుతాడు. పరిశోధనకు వచ్చేం సార్ అని భక్తిగా నమస్కరించి చెపుతామా, యిలగే నవ్వుతాడు. ఆ నవ్వు మా వెన్నుపూసల ఇల్లు కట్టేసుకొని వుండిపోయిందమ్మా.

ఎస్, ఆ రోజు యిలాగే నవ్వి, ఆ తర్వాత ప్రతీవాడూ పరిశోధకుడే. గోంగూర కంటే చవకయిపోయింది పరిశోధనన్నాడు వీ.సీ. అపుడు, గోంగూర కంటే చవకయితే మాలాంటోళ్లెంతమందో పరిశోధకులయిపోయుండాలి కదా ? అన్పించింది. ఆ మాటే అన్నాను వీసీతో. కళ్లెర్రజేసి, వేలు చూపి అక్కడికి ఫో అనన్నాడు. వెళ్లేను. అక్కడ ఒకాయన వున్నాడు. తెల్లగా వున్నాడు. షర్టూ, ఫ్యేంటూ వేసుకున్నాడు గానీ – అవి పంచే, లాల్చీల్లా వున్నాయి. మనూరి బేమ్మడిలా నుదుటన బొట్టూ, మండకి ఎర్రని దారాల కట్టా… ! నా మీదకి చూపు విసిరి, కొద్దిగా యెడంగా జరిగి చేయి చాపాడు. నా సర్టిఫికేట్ల  ఫైలిచ్చాను. చూసేడు. నోటి నిండా కిల్లీ ! సర్టిఫికేట్ లు చూడగానే ఉమ్మొచ్చిందేమో, అవతలకి నడిచి ఉమ్మేడు. చేత్తో నోరు తుడుచుకొని, ఆచేత్తో నా  ఫైలు పట్టుకున్నాడు. కిల్లీ మరక నా ఫైలుకి అంటుకుంది. అదోలా అన్పించింది.. ఆ మరక నాకే అంటినట్టు. ఫరవాలేదు, మరక పోయిందిగా అడ్వర్టయిజ్ మెంటు అప్పుడే గుర్తొచ్చి, నవ్వొచ్చింది. ఆయనకి కోపమొచ్చింది. ఇది, మీ వాడ కాదు. ఎవడు బడితే వాడు, ఎపుడుబడితే అపుడు, ఎలాబడితే అలా నవ్వీడానికి అనన్నాడు. నవ్వడానికి కూడా సమయాలూ, అర్హతలూ వుంటాయని రూల్స్ చూపించేడాయన తన కోపంతో ! అప్పుడు చుట్టూ చూస్తే  నవ్వడం తెలీని జీవుల్లాగ ఆ ప్రాంతంలో చాలామంది కుర్రాళ్లు కన్పించేరు. వెళ్లూ – అని దీర్ఘం తీసి వేలు చూపించేడా పంచెకట్టు ఫేంటాయన. ఎటు వెళ్లాలో తెలీక నిల్చుంటే  ఫైలు విసరబోయేడు, చేను మీద పడే పిట్టల మీదకి రాళ్లు విసిరేట్టు ! నేను ఎగిరిపోయేను, కాదు యెవరో కుర్రాడొచ్చి హాస్టల్ కి తీసుకుపోయేడు….

తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగేయి…. కొడుకు కల చెప్తున్నాడా, తన రోజువారీ అనుభవాలు చెప్తున్నాడా ? కల చెప్పరా, నాయనా అనందామనుకుంది. కల ఆమెకు గూడా బాగుంది. దేవుడు, నక్షత్రమండలం, తన తల్లీ… వినడానికి సంతోషంగా వున్నాయి.

అంతలో ఆమెకిదంతా గతంలో నక్షత్ర చెప్పిన కల అనీ గ్యాపకమొచ్చింది. దుఖం పొంగుకు వచ్చింది.

నర్శిం అప్పటికి తేరుకున్నాడు. కాసేపు ఆమెతో యేమేమో మాటాడేడు. సంస్మరణ సభలూ, ధర్నాకార్యక్రమాలూ యేవేవో జరుగబోతున్నాయనీ… ఆమె వీటిల్లో పాల్గొనాలనీ, కొడుకు కోసమే కాదు, అలాంటి మరికొందరు కొడుకుల్లాంటి వాళ్ల బతుకుల కొరకు దుఖాన్ని దిగమింగుకోవాలనీ చెప్పేడు. ఆమె విన్నది. పక్కనే వున్న నక్షత్ర తల్లి మొహంలోకి చూసేడు – యేమనుకుంటున్నాదోనని. ఆమె మొహంలో యే భావమూ కనబడలేదు. ఇపుడే కాదు, యెపుడూ ఆమె మొహంలో యే భావమూ కనబడదు. గుండ్రటి మొహం, విశాలమయిన నుదురు, ఆవుకళ్లల్లా నల్లకళ్లూ… !

అప్పటికామె తెరిపిన పడినట్టుంది. నర్శిం కూడా వెళ్తానని లేచేడు. ప్రక్క టౌనులో అంబేద్కర్ సంఘం వారు సంస్మరణ సభ పెడతారట, రమ్మన్నారు. తయారయి వుండమనీ, అరగంటలో వస్తానని చెప్పి నర్శిం వెళిపోయేడు. ఆమె కూడా లేచింది.

అప్పుడే టీ.వీ. లో నక్షత్రఫోటో, తనగురించిన వార్తలూ వస్తున్నాయి… ఒక నాయకుడు, యేదో సభలో ఉపన్యసిస్తూ… దేశమాత ఒక బిడ్డను కోల్పోయిందనన్నాడు. నక్షత్రకు నవ్వాగలేదు. చప్పట్లు కొడుతూ, గెంతుతూ నవ్వుతూ -అమ్మా, నువ్వు కాదట, దేశమాత ఒక బిడ్డని కోల్పోయిందట ! నువ్వేమో నీ బిడ్డని కోల్పోయేవని యేడుస్తావు. అదేంటమ్మా. తప్పు, తప్పు అనన్నాడు. ఆమె టీ.వీ. వేపు చూసి, ఒక నిట్టూర్పు విడిచి స్నానానికి వెళిపోయింది.

నక్షత్ర కాసేపు తన ఇంట్లో తిరిగేడు. తండ్రి తమను వదిలేసి వెళిపోయిన తర్వాత బతకడానికి తల్లి కూలీనాలీ పనులకు వెళ్లడం, అలసి, సొలసి యింటికి చేరడం… భూమి కంపించినట్టుగా… రాత్రుళ్లు ఒకోసారి తల్లి కుమిలికుమిలి యేడ్వడం. మెలకువ వచ్చేది. తల్లిని కరచుకొని పడుకొనేవాడు. ఇక్కడే, యీ అరుగు మీదే, యీ తుంగచాప మీదనే ! కాసేపు వాలేడు దానిమీద.

ఆ తర్వాత పక్కింటి వేపు చూసేడు. అది జానేసు ఇల్లు. జానేసెపుడూ రాత్రివేళ మంచిపదాలు పాడేవాడు. అది గెడ్డా, యిది గెడ్డా – నడిమిన పడిందిరా నాయుడోరి పడ్డా అనే పాటా ; రాక రాక వచ్చేనమ్మా గోంగూరకీ… గోంగూరకీ… పాటా, యిలాటివే యేవేవో పాటలు ! జానేసు భార్య – తొంగోరాదా, రాత్రేళ యీ పాటలేటి, అని కేకేసేది. ఆ పాటలెందుకు మానేసాడో మానేసి… ఒత్తన్నాడొత్తన్నాడు, ఆ భూములున్న బుగతోడు, సూడు సూడు పోలీసులతోడు తోడు… పాటలకి మారేడు. ఆ పాటలు  పాడుతున్నాడని పోలీసులొచ్చేరు, పట్టుకుపోయేరు. తర్వాత యేమయ్యేడో తెలీదు. జానేసు భార్య నిద్రరాక యిపుడు… నీ దయలేదా యేసా, పాడతోంది.

నక్షత్రకు మళ్లీ యనివర్సిటీ కేంపస్ గుర్తొచ్చింది. నాలుగురోజులుగా ఆత్మ అక్కడా, యిక్కడా తిరుగుతోంది. విశాల భవంతులు, ఇరుకిరుకు గుండెల ఆచార్యులు. ఆచార్యులన్న పదానికి నవ్వుకున్నాడు. ద్రోణాచార్యులవారి వారసత్వమింకా దిగ్విజయంగా కొనసాగుతోంది. హుం…

బొటనవేళిని వెనక్కి మడచి, ఎర్రని గుడ్డ కట్టి… వెలివాడలో తిరుగుతున్నాడు… ధృవ. అతణ్ణి అనుసరించుతూ… అరుంధతి, భాగ్య మరో యిద్దరూ బొటనవేళికి ఎర్రనిగుడ్డ చుట్టుకున్నారు. నక్షత్రకు వాళ్ల వేళ్లను స్పర్శించాలన్పించింది. తన స్మారకస్తూపం ముందర శోకమూర్తులై… వందలాది సహచరులు… జోహార్ నక్షత్ర…. జోహార్ ; మనువాదం నశించాలి… నినాదాలు ! నక్షత్రకు నినాదమివ్వాలన్పించింది. పిడికిలి బిగించబోతే వేళ్లు మడతబడడం లేదు. నోరు పెగలడం లేదు. సహచర సమూహమంతా రంగభూమిలో వీరుల్లా కన్పిస్తుంటే – కళ్లల్లో నీళ్లు తిరిగేయి నక్షత్రకు. బతికుండాల్సిందన్పించింది… నక్షత్రకప్పుడు !

హుం… బతుకూ, చావూ కేవలం నా చేతిలో లేదు… అననుకున్నాడు నక్షత్ర ! చాలా సేపు దుఖించేడు. బతకడానికి యెన్నెన్ని కష్టాలు అనుభవించేను ? నా కంటే నా తల్లి యింకా కష్టాలు అనుభవించింది. ఇన్ని కష్టాల తర్వాత, యింత శ్రమ తర్వాత గూడా భవిష్యత్ చీకటి, చీకటిగా.. !? అమ్మా, నీ గర్భకుహరంలోకి మళ్లీ వెళ్లే అవకాశం వుంటే యెంతబాగుణ్ను ! కాదు, చనిపోతే నక్షత్రమండలం చూడొచ్చు… నక్షత్రా అని ఇందుకేనా అమ్మా నాకు పేరుపెట్టేవు ? నక్షత్ర మనసులో అనేక విషయాలొక్కసారిగా ఆకాశంలో రెక్కలుగొట్టుకు యెగిరే పిట్టల్లా యెగురుతున్నాయి.

రోజూ యెందుకో ఒకందుకు మేమే దోషులుగా వీసీకి, మిగిలిన ఆచార్యులకూ కనబడతాం. రేషన్ కట్, స్కాలర్ షిప్ కట్, క్లాస్ కట్, డిగ్రీ కట్ ! ఒరేయ్, మీ ఫ్యూచర్ కట్ రా… యూనివర్సిటీ గోడల్లో ప్రతిధ్వనిస్తుంటాయి ! ఏలికలారా, మా బతుకుల పాలకులారా… ఎన్నెన్ని ఆయుధాలున్నాయి మీదగ్గర ? మా దగ్గర పిడికిళ్లు మాత్రమే వున్నాయి. అవే మీ కళ్లకు.. ఫిరంగులో, పిడుగులో !

గురుద్రోహులని పూర్వం శిక్షించేవాళ్లు, యిపుడు రాజద్రోహులని శిక్షిస్తున్నారమ్మా – అనన్నాడు తల్లితో ! అప్పుడే ఆమె చీరకట్టుకొని, బయటకు వెళ్లటానికి సిద్ధమై వచ్చింది.

అమ్మా, కొంచెం విచారంగా వున్నట్టు కన్పించమ్మా.. అన్నాడు నక్షత్ర.. ఆశ్చర్యపోయింది తల్లి. నేనలా కన్పించటంలేదా ? నాయినా, విచారం లేని క్షణమేది నా జీవితంలో ? నీకెలా కన్పించానోగానీ, పాడుబడిన ఇల్లులా వుంటావంటారంతా నన్ను ! అనగూడదుగానీ, అందుకనే నా కోసం మగపురుగేనాడూ రాలేదు అనంది. నక్షత్ర నొచ్చుకున్నాడు. అనవసర వ్యాఖ్యతో తల్లిని బాధపెట్టేననుకున్నాడు. నిజమే, అమ్మ.. దుఖపుమూటలా వుంది.

అప్పుడే నర్శిం తిరిగొచ్చేడు – దళితసంఘాలవారు సభ అన్నారుగానీ, మళ్లీ యెందుకో రద్దు చేసుకున్నారు. ప్రెస్ మీట్ మాత్రమే పెడతన్నారట. దానికి మనమెందుకు ? అని ప్రశ్నించేడు నర్శిం. తల్లికేమి చెప్పాలో బోధపడలేదు. నక్షత్రకు ఆ వార్త యేదో సంశయాన్ని కలిగించింది. అంతలోనే.. ఛఛా అనుకున్నాడు. తానెప్పుడూ అన్నింటినీ సంశయించడం వలననే యిలా… అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు.

అప్పుడు నక్షత్ర చెంప ఛెళ్లు మన్పించింది… ఆత్మ ! నేనెన్నడూ విమర్శ చేసుకోలేదు. నువ్వెవడివిరా ఆత్మవిమర్శ అనడానికని అడిగింది. నక్షత్ర చెంప తడుముకున్నాడు. ఓహో… నా కిపుడు స్వవిమర్శ చేసుకునే అవకాశంగూడా లేదన్నమాట ! జీవించినపుడు… పరవిమర్శ చేయగూడదు. మరణించేక ఆత్మవిమర్శ చేయగూడదు అననుకున్నాడు మనసులో. ఆత్మ దానికీ ఒప్పుకోలేదు. ఆత్మ విమర్శ యెపుడూ చేసుకోవచ్చు. ఎవరయినా చేసుకోవచ్చు. గానీ నీకు ఆ అవకాశం లేదు. నువ్వు చనిపోవాలనుకున్నపుడు ఆత్మను అడిగేవా ? అడక్కుండా ఉరిబోసుకు చచ్చేవు. దమ్ముంటే నిన్ను యిబ్బంది పెట్టినోడ్ని చంపవొల్సింది. నన్ను చంపావెందుకురా ? ఎవడ్రా యీ చావుకి ఆత్మహత్య అని పేరుపెట్టింది. ఆత్మను హత్య చేసిన హంతకుడివి నువ్వు… ఆత్మ రెచ్చిపోసాగింది. నక్షత్ర మరణించి కూడా దోషిగా కనబడుతున్నందుకు చింతించసాగేడు… అప్పుడే, వీ.సీ. గారి మాటలు గుర్తొచ్చేయి…

” … చదువుకోసం రాలేదండీ. హాస్టల్ భోజనం, స్కాలర్ షిప్, బేఖాతర్ తిరుగులూ… వీటి కోసం వచ్చేరు. వీళ్లింతేనండీ. ఆ కుర్రాళ్లు చూడండి, చక్కగా భరతమాత భజన చేస్తారు. రామాయణం పారాయణం చేస్తారు. గురుపూజలు చేస్తారు. ద్రోణాచార్యుల పీఠానికి మాలలు వేస్తారు. స్వామీజీలని రప్పించి సభలు పెడతారు. ముద్దొస్తారు… ముండాకొడుకులు.. ” అని మురిపెంగా వీసీ యెవరితోనో చెప్తున్నాడు.

ముద్దొచ్చినా ముండ కొడుకులేనా- నీ నోట్లో మూత్రం పొయ్యా… మనసులో అనుకున్నాడు నక్షత్ర.. కాసేపు గదిద్వారం దగ్గర నిల్చున్నాడు. ఆ మధ్య  -దళిత విద్యార్ధులూ, బహుజన విద్యార్ధులూ కలిసి ‘ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ‘ పెట్టుకున్నారు. అసోసియేషన్ వివరాలను రాసిచ్చి -ఇక నుంచీ విద్యార్ధుల సమస్యలేవేనా అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి వద్దామని వెళ్లేరు. రిప్రజెంటేషన్ తీసుకున్నాక వీ.సీ…. ఎదురుగా వున్నాయనతో అవీ మాటలు.

మళ్లీ నిల్చున్న నక్షత్రావాళ్ల వేపు వేళ్లు చూపి, ఎదుటవ్యక్తితో –

” ..వీళ్లో… రాజకీయాలు మాటాడతారు ? రాజ్యాంగమూ, హక్కులూ అంటారండీ ! ఎందుకండీ అవన్నీ ? అసలీ ప్రశ్నలేమిటండీ ఆచార్యుల మీద శిష్యులు ? ఎక్కడేనా వుందా ? వ్రేళడిగితే వ్రేళూ, శిరసడిగితే శిరసూ యిచ్చేయలేదండీ పురాణకాలం శిష్యులు ? పోయే కాలం, పిదపబుద్ధులూ ! ” కులపతి సెలవిచ్చుతున్నారు. ఎదుటివ్యక్తి – కాదు కాదు, పిదపబుద్ధులు కావు, విదేశీబుద్ధులు ! దేశద్రోహబుద్ధులు అని సవరించేడు. నక్షత్రకు యిపుడు తను సాధారణ నేరస్తుడు కాడనీ, దేశద్రోహి నేరస్తుడనీ అర్ధమవుతోంది…..

తల్లి గడపలో ఒక మూలకు చేరబడి కూచుంది. నర్శిం – ప్రెస్ మీట్ కోసం అంత కష్టపడి వెళ్లొద్దులే ! నాకో పని వుంది, చూసుకొని సాయంత్రం వస్తాను. ఒకటి మాత్రం ఖాయం -నక్షత్ర చావుకి కారణమయిన వారిని శిక్షించాకగానీ, నక్షత్ర అస్తికల నిమజ్జనం చేయొద్దని కరాఖండిగా ఒక ప్రకటనలాగా చెప్పి వెళిపోయేడు.

తల్లి- నక్షత్రను వదిలేది లేదు, నా గర్భంలో దాచేసుకుంటానని మనసులో గట్టిగా అనుకున్నది. సరిగ్గా అప్పుడే నక్షత్ర – అమ్మా, నీ ఒడిలో బజ్జుంతా, వొక జోలపాట పాడవా అనడిగేడు. తల్లి ఒడిలో బజ్జున్నాడు. తల్లి జోకొడుతూ – జోముకుందా, జోజోముకుందా… లాలి పరమానంద… లోగొంతుకతో పాడగా, నక్షత్ర ఒడిలోంచి లేచి – ముకుందుడూ లేడు పరమానందుడూ లేడు. మన పాట పాడే తల్లీ అనన్నాడు ! రావనాసెందునాలో యెన్నెలా, రాజా నీకొందనాలో… యెన్నెలా యెత్తుకుంది తల్లి ! నక్షత్రకు మెల్లగా నిద్ర కమ్ముకుంటోంది.

కొంతసేపటికి… వీధిలో ఒక పెద్ద ఊరేగింపు – నీలిసలాం, లాల్ సలాం… నీలాల్ సలాం నినాదాల్తో వస్తోంది ! నర్శిం గొంతునరాలు బిగించి నినదిస్తున్నాడు. తల్లి గభాల్న లేచి వీధిలోకి నడచింది. తమ ఊరి యువకులూ, పొరుగూరి యువకులూ యెందరో పిడికిల్లు బిగించి నినదిస్తున్నారు… పరికించి చూడగా అందరూ నక్షత్ర లాగే కనిపిస్తున్నారు. కళ్లు పులుముకొని మళ్లీ చూసింది… నక్షత్రలే కన్పించేరు. ఆ తల్లికి వాళ్లంతా తన బిడ్డలే అన్పించి కళ్లు తుడుచుకుంది… భ్రమలోంచీ, కలలోంచీ బయటపడి, వాస్తవంలోకి వచ్చి సమూహంలో కలిసింది !

*

ఇక కథా నిలయం తెలుగు ప్రజల బాధ్యత : కారా మాస్టారు

IMG_0011

 

ఒక వీసెడు బరువున్న పదార్ధమేదో సుందరరామయ్య ఒడిలో పడింది … (తీర్పు కధ మార్చి 1964)

టక్ దబ్ మన్న శబ్దంతో ఒక తలా, చిన్న దేహమూ … పంచాయితీ మండపం ముందు గోనెసంచీలోంచి రాలేయి. (యజ్ఞం కధ రచనాకాలం 1964 జనవరి – ఏప్రిల్ ప్రచురణ 01-01-1966)

బహుశా, ఇటువంటి బరువైన పదార్ధం, ఇటువంటి శబ్దం, అంతకు ముందర తెలుగు కధాసాహిత్యం యెరిగుండదు. ఆనాటి నుండీ, తెలుగు కధా సాహిత్యావరణాన్ని తొలినాట పెను శబ్దంతోనూ, యిపుడు పెను మౌనంతోనూ ప్రభావితం చేస్తున్న యేకైక వ్యక్తీ .. శక్తీ శ్రీ కాళీపట్నం రామారావు. యజ్ఞం రాసినందుకు కధా సోమయాజి అనంటుంటారు. (సోమయాజి యజ్ఞం వేరూ, కారా యజ్ఞం వేరూ అయినా సరే, మరో పోలిక లేకేనేమో?) ఒక సడలని దీక్ష, అంకిత భావం, విరామమాశించని శ్రమతత్వం … కలగలసిన వ్యక్తిత్వం కాళీపట్నం! కధ పట్ల గల వల్లమాలిన ప్రేమకీ, సమాజమ్మీద యెనలేని గౌరవానికీ (సాహిత్య సమాజం), సమాజం నుంచి పొందినదేదయినా ఋణమనీ, దాన్ని తిరిగి తీర్చాలన్న ఆదర్శానికీ … నిలువెత్తు రూపం కాళీపట్నం రామారావు నిర్మించిన, శ్రీకాకుళంలోని కధానిలయం!

వృత్తిరీత్యా మాస్టారయిన కాళీపట్నం ప్రవృత్తి రీత్యా గూడా కధ మాస్టారైనారు. ఎందరెందరో సవ్యసాచులూ, ఏకలవ్యులూ (గురుదక్షిణ చెల్లించకుండానే!) వున్నారతని శిష్యబృందంలో! కధల మాస్టారు, కాళీపట్నం రామారావు మాస్టారు తొంబయి ఒకటవ జన్మదిన శుభ సందర్భాన, సారంగ పత్రిక మాస్టారి రచనలను మళ్ళీ పరిచయం కాదు .. పరిశీలించడం చేస్తుండడమేగాక, మాస్టారిని ఇంటర్వ్యూ చేయదలచి, నన్ను సంప్రదించడం, మాస్టారి అనుమతి తీసుకోవడం (సహజంగా ఆయన ఇంటర్వ్యూలకు సాధ్యమయినంత యెడంగా ఉంటారు, అందులోనా యిపుడు వయోభారం) జరిగింది. మాస్టారితో ఇంటర్వ్యూకి నేను యేవో కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకొని వెళ్ళి, ఆరంభించినా, యెక్కువగా కబుర్ల రూపంలో సాగింది. ఆ కబుర్లలో, నా ప్రశ్నలకేగాక, అదనంగా, వీటివలన ఆయనకు గుర్తుకొచ్చిన యెన్నెన్నో భోగట్టాలు చెప్పారు (సాహిత్యపరమైనవే). ఆ భోగట్టాలల్లో ఆయన తన వ్యక్తిత్వాన్ని, సాహితీ వ్యక్తిత్వాన్నీ యెలా నిర్మించుకొచ్చారో, యేమేమి నేర్చుకున్నారో, (ఇప్పటికీ నేర్చుకుంటుంటానంటూ – ఒక వివినమూర్తి, రాయుడు గారు, రజనీకాంత్ వగైరా కొన్ని పేర్లు చెపుతూ) తెలియజేశారు.

యేదయినా కొత్త విషయాన్ని వినడానికి సంశయించకూడదనీ, వినీ దానిని మనదైన పరిశీలనతో మంచి, చెడ్డల విశ్లేషణ చేసుకొని నిర్ధారణకు రావాలనీ … అపుడే మార్పులపట్ల సాంప్రదాయక ఆలోచనాధోరణిని తొలగించుకోవడం సాధ్యమవుతుందనీ (ఇది మార్క్సిస్టులకూ, నాన్ మార్క్సిస్టులకూ యిరువురికీ వర్తించుతుంది) చెప్పారు.

IMG_0006

చాలా సందర్భాల్లో యెన్నో విషయాలు (నేను గ్రహించాననుకున్నవి) –

జీవితాన్ని చిత్రించడం, విశ్లేషించడం, అవగాహన పెంచడం, పాఠకుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడం కధ లక్ష్యం…

జీవితంలో దుఃఖముంది. కానీ దానికి కారణం సమాజంలో వుంది. సమాజంలోని వర్గమూలాల్లో వుంది….

లోకంలో జరుగు అతి చిన్న దోషాల నుండి మహాదోషాల వరకు వాటి మూలాలను చూసి కారణాలను వెదికి పట్టుకొని చిత్రించితే రచన నిజాయితీగా, ఆదర్శంగా వుంటుంది….

మనం అనుభవించే సౌకర్యాలుగానీ, మనం తీర్చుకునే రోజువారీ జీవనావసరాలుగానీ, కేవలం మన శ్రమతో మాత్రమే లభించడంలేదు గదా, అనేకుల శ్రమ వలన లభిస్తున్నవి గదా, గనుక అనేకుల పట్ల మనకు బాధ్యత వుంది. అనేకులే సమాజం –

యిలా కొన్ని చెప్పాననీ … ఇంటర్వ్యూలిచ్చాననీ, నేనెందుకు రాసేనూ, నేనూ నా జీవనదృక్పధం వంటి శీర్షికల పేర్లు చెప్పారు. అలాగే యజ్ఞం, కుట్ర, తీర్పు వంటి కధల మీదా, వాటి నేపధ్యం (ఇటీవల జీవధార నేపధ్యం, కధా నేపధ్యం-1) గురించీ చెపుతూ, తాను ఆదిలో రాసిన కధల దారి నుంచి మళ్ళడం వెనక మారిన తన దృష్టికోణం, దృక్పధాల గురించీ గూడా చెప్పాననీ, అవన్నీ మనసు ఫౌండేషన్ కాళీపట్నం రామారావు రచనలు పుస్తకంలో వుండొచ్చనుకుంటానన్నారు (ఉన్నవి గూడా).

దీంతో అటువంటి పాత ప్రశ్నలు వేయకు సుమా అని మాస్టారు చెప్పక చెప్పారనిపించింది. మాస్టారు తన సృజనాత్మక రచనల్లో చెప్పక చెప్పడమనే మార్మిక శైలి ఉండదు … కుండలు బద్దలు గొడతారు. సృజనాత్మకేతర రచనల్లోనే యీ గుప్తతా, మర్మం. అది అతని వ్యక్తిత్వ శిల్పం. దీన్ని ఆతని రచనాశిల్పమని కొందరు విమర్శకులు సూత్రీకరించేరు, గాని ఆ సూత్రీకరణ కరెక్టు కాదు.

‘చావు వంటి కధలో మాస్టారు, పాఠకునికేమి యెరుక చేయాలనుకున్నారో, కధాంతాన (మొత్తం కధలో వ్యక్తమైనా సరే) .. “ముసిల్ది నిన్న పోతే యీ వేళ్టికి రెండు. కాని, సంధికాలంలో తెలివేసి వున్నవాళ్ళకలా అన్పించదు. నిన్నానేడూ అంతా ఒక్క లాగే వుంటుంది.” అని చెప్పారు. ఇది మాస్టారి మరికొన్ని కధల్లో గూడా చూడవచ్చు.

అలాగే, చెప్పక చెప్పడం, గుప్తం, మర్మం వంటి వాక్యాలు వ్యాసాల్లోనా, అభిప్రాయాల ప్రకటనల్లోనా, లేఖల్లోనా చూడగలం. ఇందుకొక ఉదాహరణ … చావు కధ మీద ఒక సంపాదకుడి అభిప్రాయానికి జవాబుగా రాసిన సంజాయిషీ! (మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘కాళీపట్నం రామారావు రచనలు’, పుట.344) ఇది చదివితే మాస్టారు, తనదైన అభిప్రాయాన్ని, ఆలోచననీ, తన ధోరణినీ చెప్పక చెప్పారనిపిస్తుంది. నిజానికది సంజాయిషీ శీర్షికతో వున్నదిగానీ, అది సంజాయిషీ కాదు, తన రచనా దృష్టి కోణాన్నీ, శైలినీ సమర్ధించే వాదన. వాదన మాత్రమే కాదు అవతలివారికి బోధన (వెల్చేరు నారాయణరావుగారు పోల్చుకున్నారు!) ఈ విషయాన్ని ఔనంటారా, కాదంటారా మాస్టారూ అనడిగితే నవ్వుతూ ఔనన్నారు.

అప్పుడే – మాస్టారొకచోట, తనమీద తన మిత్రుడు (టీచర్ ట్రైనింగ్ కాలంలో ) రాసిన పద్యాన్ని తన పుస్తకంలో రాసుకోగా చూశాను … “వచన కవిత్వం వైఖరుల వ్రాయసకాడు…” అని ఆరంభమయి “… రామారావు మొగమాటమొకింతయు లేనివాడా, రామారావు మాస్టారని!’ ఆ ముక్కే అడిగేను.

IMG_0007

మాస్టారెంతటి మొగమాటో అని లోకమనుకుంటోంది. ఏది నిజం మాస్టారూ..?

అప్పుడూ, యిప్పుడూ, యెప్పుడూ భావజాలం దగ్గరా, దృష్టికోణం దగ్గరా నిర్మొహమాటినే. కాకపోతే, ఆ సంజాయిషీలా వుంటుందిప్పటి శైలి – అని బదులిచ్చేరు! “బాబయ్యా! నువ్వెంతకైనా సాహసివి …” (యజ్ఞం కధలో అప్పల్రాముడు, శ్రీరాములు నాయుడితో) అనుకున్నాను మనసులో.

దేశీయత, కధా నిర్మాణం, వ్యక్తీకరణ మొదలైన వాటిలో నేర్పు వల్ల శిల్ప సౌందర్యమేర్పడుతుంది… అని మాస్టారు అంతకుముందర చెప్పిన విషయమేగానీ శైలి విషయం చర్చకు రావడంతో మళ్ళీ వివరించేరు. దాంతో – శిల్పం కోసం సాహిత్యాన్నీ, వస్తువు కోసం జీవితాన్నీ అధ్యయనం చేయాలని కొ.కు. అన్నారు గదా… మీ అనుభవంలోంచి దీని సాధికారత చెప్తారా? అంటే, నాకిక్కడ కొ.కు.తో విభేదమేమీ లేదు గానీ, వస్తువే రూపాన్ని(శిల్పాన్ని) యెంచుకుంటాదంటారు …. ఈ మాటకీ పై మాటకీ తేడా వున్నట్టుంది కదా? పైగా శిల్పానికి ప్రాధాన్యతనిచ్చినట్టుగా మీ కధలుండవు, కొ.కు. కధలు గూడా! శిల్పమనే అంశమ్మీద చర్చించే యెక్కువమందికి శిల్పం మీదగల భావనను దృష్టిలో పెట్టుకుని యీ సంశయం నాకు … మీరేమంటారు, అని ప్రశ్నించేను.

మాస్టారు కాసేపు మౌనంగా తలవాల్చి , తర్వాత కిల్లీ కోసం కళ్ళతో వెదకబోయేరు. నాకర్ధమైంది. యే సందర్భాల్లో కిల్లీ యెందుకు వేయబోతారో, యెరిగున్న వాణ్ణి గనక మాస్టార్నీ ఈ ప్రశ్న నుంచి మళ్ళించదలచి – ఆదివారం వంటి మంచి కధను గూడా మీరు నాలుగేళ్ళు అచ్చుకివ్వకుండా దాచిపెట్టానన్నారుగదా, యెందుకలా? ఏ అసంతృప్తి వలన? మాకేమో యివ్వాళ గూడా అందులో అసంతృప్తేమీ కనబడలేదు, చెప్పరా అనడిగేను.

అప్పటికాయన సర్దుకున్నట్టుంది – వుండుండు… శిల్పం గురించి గదా, అడిగేవు” అనంటూ – నా వరకు శిల్ప సౌందర్యమంటే ప్రయోజనమే! ఇంతకుముందీ విషయమ్మీద యెవరెవరో ప్రశ్నిస్తే చెప్పాను గూడా … మైసుర్ దగ్గర డామ్, తాజ్ మహల్ అనేదో అన్నాను. ఇపుడూ, శ్రీపాద వారి ‘వడ్లగింజలు’, రావిశాస్త్రిగారి ‘తప్పు, పిపీలికం, వేతనశర్మ’ వంటి కధలున్నాయా? అవి, ప్రయోజనాన్ని సాధించడంతోపాటు అవి అందంగా తయారవడానికి శిల్ప సౌందర్యం కారణం… అని ఆగిపోయేరు. ఇంక మరి దీని మీద మాటాడరు, మనమే యిప్పుడు మాటాడినదాన్ని బట్టీ, గతంలో చెప్పినదానిని బట్టీ, దీని గురించి ఆతని అభిప్రాయానికి రావాలంతే! రావచ్చు గూడా!

కాసేపటి తర్వాత, ‘ఆదివారం’ కధ గురించి – “ఆ కధ బాగానే ఒచ్చింది. అయితే, అందులో శ్రమ ఉత్పత్తి శ్రమ కాదు. సేవకశ్రమ, ఉత్పత్తి శ్రమ వేరు, సేవాశ్రమ వేరు. గడుసుదా పిల్ల. అటువంటి పాత్రను సృష్టించేను. నాకేమిటంటే ఆ అత్తగారికీ పోటీ పెడితే తెలివైనదనుకున్న కోడల్నిగూడా యీ పిల్ల జయించడం…. దీని కోసం కధ రాసేను. అది తక్కిన వాటి లాంటి సబ్జెక్టు కాదు. అంచేత వుంచేశాననుకుంటాను…. అని చెప్పారు.

కొంతసేపు ఆ కధ గురించే ఆలోచించారో, యేమోకాని….. అన్నింటికి డిపెండెంట్లుగా మనుషులు తయారైనారు. కొన్నింటికి మనుషుల మీద, కొన్నింటికి యంత్రాల మీద. ఇదెక్కువయ్యిందిపుడు. సేవలు కావాలి. సేవల్ని మార్కెట్ సొమ్ము జేసుకోవడం చూస్తున్నాం కదా? ఇదీ… అని దీర్ఘం తీస్తూ ఆగిపోయేరు, యిక మనం తర్వాతది ఆలోచించుకుంటే బోధపడుతుంది.

మార్కెట్ గురించి వచ్చింది గనక వ్యాపార సాహిత్యమనీ, వ్యాపార పత్రికలనీ వేటినయితే మీ కాలంలో (అపుడవి మీకెంతో స్థానాన్నిచ్చినాయి కూడా) అనేవారో (పెట్టుబడికీ కట్టుకధకీ పుట్టిన పత్రికలనీ శ్రీ శ్రీ అన్నారు గదా) అవే యీ నాడు అందరికీ ఆధారభూతమైనాయి. అందులోనే అందరూ కధలు రాయాల్సొస్తోంది, ఏటేటా కధా సిరీస్ లోకి కధలను యీ పత్రికల నుంచే యెక్కువగా తీసుకుంటున్నారు…. కధల పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారొకవేపు. పత్రికల ఆలోచనల్లో మార్పు రావాలని అపుడే గొప్పకధలూ, మంచి కధలూ వస్తాయని కొందరంటున్నారు. దీని గురించి చెప్తారా- అని పెద్ద ప్రశ్నయే అడగ్గా…

సమాజంలో అన్ని విషయాల్లో నిన్నటికీ, నేటికీ మార్పులు వచ్చినట్లే పత్రికల విషయంలోనా వచ్చింది. వ్యాపారమన్నాక, దృష్టి లాభాల మీద వుంటుంది. పత్రికల వలన మాత్రమే మంచి కధలు రావు… అని చెప్తూ ఆగిపోయేరు.

ఆ ఆగిన సంభాషణ, తొలి ప్రశ్నకు అనుబంధంగా – మీరు కధలు రాయడమారంభించిన నాటి కాలంలోని పత్రికారంగ పరిస్థితులకీ, నేటికీ చాలా మార్పు వచ్చింది గదా, ఈ మార్పు సాహిత్యానికి మీ కాలంలోలాగా దోహదపరిచేదిగా వుందంటారా– అన్న మలి ప్రశ్నతో కొనసాగింది.

ఆ కాలపు పత్రికల వ్యవస్థాపకులు సంఘ సంస్కరణకీ, జాతీయ దృక్పధానికీ, సేవాభావానికీ కట్టుబడి వుండేవారు. ప్రసిద్ధ సాహితీపరుల సంపాదకత్వంలో పత్రికలు నడిచేవి. 1950ల్లో పెట్టుబడి ప్రవేశించింది. అంతకుముందూ పెట్టుబడే గానీ, 50ల తర్వాతి పెట్టుబడివంటిది గాదు. అదీ గాక యింకొవేపు భారీ యంత్రాలు వచ్చేయి. పనిగంటలు మిగిలేవి, ఫలితంగా గొలుసు పత్రికలు రావటం, వాటి నిర్వహణ… దానితో విలేకరులు, సంపాదకులు, విస్తరణా, పోటీ … దాంతో గతకాలపు వారి స్థాయికి తక్కువవారి ప్రవేశం జరిగింది. పెట్టుబడి లబ్ది కోసం విలువల రాహిత్యం, పిల్లలు, ఆడవారు, యువత –వార్ని ఆకర్షించడం లక్ష్యం… వార్తలకూ, జీవితమ్మీద విశ్లేషణకూ బదులు సరుకుల ప్రచారం కోసం … నేటి పత్రికలు ప్రాధాన్యమిస్తున్నాయనిపిస్తోంది. ఈ మార్పు సాహిత్యానికి దోహదపడుతుందని యెవరయినా అనగలరని అనుకోనన్నారు….

వస్తువు, భాష, శైలీ వంటి విషయాల పట్ల , యిప్పటి పత్రికలు అప్రకటితంగా తమ విధానాన్ని అమలుచేస్తున్నాయి. మాండలికాలపట్ల, గ్రామీణ జీవిత చిత్రణపట్ల, రాజకీయార్ధిక సంబంధ అంశాల కధల పట్ల పెదవి విరుపుడు, నాన్పుడూ, తిరస్కారమూ కనిపిస్తోంది… అని యెక్కువమంది రచయితలంటున్నారు. మీరు రాయకపోయినా నిత్యం సాహిత్యపఠనంలోనూ, సాహిత్యావరణం లోనూ వుంటున్నారు కదా, మీకేమన్పిస్తోందన్న ప్రశ్నకు –

ఇది నిజమే కావచ్చు. ఇప్పటిలానే, యింతకుముందరా యీ ధోరణి వుంది. ఒక నాడు స్త్రీల రచనలకు, యింకో నాడు సస్పెన్స్, ధ్రిల్లర్ వగైరాలకూ స్థానమిచ్చి, మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేసేవారు. రావిశాస్త్రిగారి రచనలనే పైన పేర్కొన్న రచనల గేప్ లల్లో ప్రచురించేవారు… పెట్టుబడి యిబ్బడిముబ్బడిగా ప్రవేశించాక జరిగిన పరిణామమిదనుకుంటాను … అని ఆగిపోయేరు.

కధల్లో అంతరంగ విశ్లేషణ కనబడే కధలు గొప్ప శిల్పనిపుణతకు ఉదాహరణలంటారు గానీ, మీ కధల్లో అంతరంగ విశ్లేషణ (సంకల్పం, అన్నెమ్మ నాయురాలు, అంతకుముందరి తొలినాటి కధలు తప్పా) తక్కువని నేనంటాను. కానీ గొప్ప దృశ్యీకరణ, నాటకీయత, సహజసిద్ధత, వస్తువులోంచి యెరుకపరిచే కధాంశం… యివీ మీ కధల గొప్పతనాలని నాకన్పిస్తోంది. అపుడు అంతరంగ విశ్లేషణ మాత్రమే గొప్ప శిల్పమనే భావన తప్పు గదా?

నీ విశ్లేషణ సరయినదే… వారి వారి అభిరుచులను బట్టి శిల్పం పట్ల అభిప్రాయాలుంటాయి. ప్రతివ్యక్తికీ అంతరంగం వుంటుంది. ఆ అంతరంగమ్మీద లేదా ఆ వ్యక్తి మీద బాహ్యప్రభావాలుంటాయి. కుటుంబ, సమాజ ప్రభావాలుంటాయి… వీటికి మళ్ళీ ఆ వ్యక్తి ప్రభావం లేదా ప్రమేయం వుటుంది. ఈ పరస్పర ప్రభావాల పట్ల అవగాహన ముఖ్యం…

మీ తొంబయ్యేళ్ళ జీవితమ్మీద మీ వ్యాఖ్య?

ఫలవంతమైనదని అనుకోవచ్చేమో

మీ సాహిత్యమ్మీద మీ వ్యాఖ్య?

రాయవలసినవి కొన్ని రాయలేకపోయా, కానీ రాసినవరకూ దాదాపు తృప్తినిచ్చాయి. కొన్ని అసంతృప్తి కలిగించేవి గుర్తించేను, వాటిని తర్వాత తెలుపుతా…

ఈ ముక్క ఆయనన్న తర్వాత అసంతృప్తి గురించి వివరాలడగాలనిపించింది గానీ, ఆయన యింకేవో కబుర్లలోకి వెళ్ళారు. అవి వింటుండగా, వారి పాత కధలు గుర్తురాగా, ఒక ప్రశ్న వేయాలన్పించింది. అదేమిటంటే- మాస్టారు, తొలి కధల్లో స్త్రీ జీవన అస్తిత్వానికీ, ఆత్మ గౌరవానికీ, పురుషాధిపత్య వ్యతిరేకతకీ (‘పురుషపులి జాతి స్వభావానికి యెలా అప్పగించనూ?’ అని కధా నాయక అంతరంగంలో తర్కించుకుంటుంది. – ‘అవివాహితగానే ఉండిపోతా’ కధ, 1946) ఆలోచనలు రేకెత్తించే (రేవతి, నవచైతన్యం, అవివాహితగానే ఉండిపోతా .. వగైరా) కధలు రాసిన మాస్టారు, ఆ తర్వాత అటువంటి కధలను రాయలేదు. ఇటీవల అస్తిత్వవాదాల సాహిత్యం (స్త్రీ వాద) పై మాస్టారి అభిప్రాయమేమిటి?

మాస్టారు నవ్వేసి, ఆదిలో రాసిన మాట నిజమే. అప్పటికది ఆదర్శవాద దృష్టి కోణం. ఆ కోణానికీ ఈ నాటి స్త్రీవాదానికీ సరిపోల్చగూడదు. అది సానుభూతివాద ఆదర్శం. నేటి స్త్రీ వాదులు తమ అస్తిత్వ చైతన్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇది అనివార్యం. నేనెందుకు రాయలేదంటే, నా దృష్టి కోణం మారిన దశలో యెక్కువగా వర్గ వైరుధ్యాల గురించే పట్టించుకున్నాను. అదీగాక నేను రాయడమే చాలా తక్కువ సంఖ్యలో…. అంచేతనుకుంటానని ముగించారు.

కధా నిలయం గురించి మాటాడకుండా ముగిస్తే మీరొప్పుకోరు. ఆవు వ్యాసంలా యెటూ నుంచి తిప్పినా కధా నిలయంకే వస్తారని మీ గురించంటారు. చెప్పండి, కధా నిలయం నేటి స్థితీ, భవిష్యత్ స్థితి పట్ల మీ ఆలోచనలు…

నేను ఊహించిన దానికంటే బాగుంది. కానీ ఆశ్చర్యపోయేట్టుగా, ఆధునిక టెక్నాలజీ వలన యింకా అభివృద్ధి కావాలి. వివినమూర్తి ఆ దిశలో కృషి చేస్తున్నాడు. ఆదిలో యగళ్ళ రామకృష్ణ, రామారావునాయుడూ, నువ్వూ, మరికొంతమందీ… యిపుడు, వివినమూర్తి, సుబ్బారావు, దాసరి రామచంద్రరావు ప్రత్యక్షంగానూ, యెంతోమంది పరోక్షంగానూ కధా నిలయానికి సేవలందిస్తున్నారు. ట్రస్ట్ సభ్యులూ, కధానిలయం అభిమానులూ … కధా నిలయం భవిష్యత్ పట్ల దిగులు పడాల్సిన అవసరం లేదన్న నమ్మకాన్ని కలిగించారు. ఇంకా తెలుగు ప్రజలు కధా నిలయాన్ని తమ పరం చేసుకోవాలి, యిదీ నా కోరిక…

దాదాపు మాస్టార్ని ప్రశ్నించదలచినవన్నీ అయిపోయేయి. నిజానికి మాస్టారు, నా ప్రశ్నల కంటే యెక్కువ కబుర్లను కలబోసుకున్నారు. యజ్ఞంకధ మీద కొండపల్లి సీతారామయ్య, (సీతారాముడు తన కొడుకుని చంపుకోడం అన్యాయం అంటూ అజ్ఞాత పత్రికలో రాసేరట…) రంగనాయకమ్మ నుంచి యిటీవల విమర్శ రాసిన విద్యాసాగర్ దాకా ప్రస్తావించేరు. వీరెవరికీ సమాధానం రాయలేదనీ, ఆదిలో రంగనాయకమ్మగారి విమర్శకు ఆగ్రహమొచ్చి సమాధానం రాస్తే, చూసిన రావిశాస్త్రి గారు ఆపి వేశారనీ… కధను రాసేసి బయటకు వొదిలేక, యిక దాని గురించి లోకం యేమయినా అనుకుంటుందనీ, దాని గురించి మనం పట్టించుకోకూడదనీ, కన్నకూతురి గురించి తల్లడిల్లే కన్నతండ్రిలా కధ గురించి తల్లడిల్ల రాదనీ… యిలా యేవో రావిశాస్త్రిగారు చెప్పారు. నేనూ ఆలోచనలో పడ్డాను. ఆనాటి నుంచీ, నేను నా కధల మీద వచ్చే యే విమర్శకూ సమాధానం రాయలేదంటూ.. ఆఫ్ ది రికార్డుగా, ముఖ్యమైన, పైన పేర్కొన్న అన్ని విమర్శలకూ తన సమాధానం చెప్పారు.

కాసేపు తర్వాత, మళ్ళీ యజ్ఞం కధ రాయడం గురించి చెప్తూ – ఈ కధలో నేనొక టెక్నిక్ పెట్టుకున్నాను మానసికంగా. ఇందులో ఒక్కొకరినీ, యింకొకళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. శ్రీరాములు నాయుడి గురించి చాలా మంచి అభిప్రాయం మొట్టమొదట్లో వుంటుంది. గమనించేరు గదా, ఆ తర్వాత శ్రీరాములునాయుడేమిటో, యెలాంటి వాడో, అతని నిజస్వరూపమేమిటో అప్పల్రాముడు తన కధనంలో బహిర్గతం చేస్తాడు. ఆ అప్పల్రాముడేమిటో, యెలాంటివాడో, వాడి గురించి సీతారాముడు ఎక్స్పోజ్ చేస్తాడు … యిలా మనసులో అనుకొని ఆ టెక్నిక్ ని ఉపయోగించి రాసేను. కధా వస్తువు సరే …

కధావస్తువు దగ్గర ఆగిన సంభాషణతో – మీ తొలినాటి కధలేమో గాని, యజ్ఞం, తీర్పు వంటి కధల తర్వాత ప్రతికధకూ మీరు లోతుల్లోకి వెళ్ళి, ఆ కధా వస్తువులోంచి, యెరుకగావాల్సిన కధాంశాన్ని చిత్రించడానికి చాలా శ్రమ పడినట్టనిపిస్తుంది. ఏ కధనూ పై పైకి చూసి రాయలేదు. జీవధార గానీ, నో రూమ్ గానీ చివరికి సంకల్పం గానీ! ఒక కధావస్తువు నుంచి పూర్తిగా గ్రహించాల్సిన అంశాల్ని గమనంలోకి తీసుకొని … పాత్రలూ, సంఘటనలూ చిత్రిస్తారు. ఇక వస్తువు నుంచి చెప్పడానికి యేమీ మిగలనంత దాకా వెదుకుతారు. అంచేత, మీ కధలు వైవిధ్యంతో వుంటాయి. చాలా మంది రచయితలు ఒకే వస్తువుని (గతంలో గొప్ప రచయితలు గూడా) మళ్ళీ మళ్ళీ రాసేరు, రాస్తున్నారు. నిజం కాదంటారా? మీ అనుభవాన్ని చెప్పండని ప్రశ్నించగా …

ఇతర రచయితల సంగతేమో గానీ, తొలినాళ్ళల్లో, నేను రచనలారంభించిన కొత్తలోనే అచ్చుకాని నా తొలి రచనల్లో ఒకదానిని చదివిన మా నాన్న – కధలూ, నవలలూ ఏదో చెప్పడానికి రాస్తారు. అవి రాయదలిస్తే ఇతరులకేమైనా చెప్పగల తాహతుండాలి – యిలా యేవో చెప్పారు, ఆ తర్వాత మలినాళ్ళల్లో కొ.కు., రావిశాస్త్రి గార్లను చదువుకోగా, మరికొందరు మిత్రుల సాంగత్యంతో నాలో యేర్పడ్డ దృష్టికోణం కారణంగానూ – రచన యే మంచికి హానీ, యే చెడ్డకు మేలు చేస్తుందో చూసుకోవాలన్న రావిశాస్త్రిగారి మాట కారణంగానూ, నేను నా రచనను అన్ని విధాలా ఆలోచించుకుని తృప్తి కలిగితేనే ప్రచురణకు పంపుతాను. ఇదిగాక, నేనెప్పుడూ నన్ను ప్రేరేపించిన సంఘటననే కధగా రాయను. ఆ సంఘటన పూర్వపరాల వివేచన చేసి, దాని క్రమాన్ని గ్రహించి రాస్తాను. అంచేత మీరన్నట్టుండొచ్చు నా కధలు … అని నవ్వేరు. ఆ నవ్వు వెనక నా మిగిలిన ప్రశ్నకు జవాబున్నది.

మాస్టారు, యెలాగూ తొలినాళ్ళలో అన్నారు గనక, యించుమించు, ఆనాటి కధ అయిన – అప్రజ్ఞాతం రాయడానికి మీకేదో ప్రేరణ వుండి వుంటాదనిపిస్తోంది. అందులో కుర్రాడు, మీరేనేమో అన్పిస్తాది .. ఒక్కోసారి ఆ కబుర్లలోకి వెళ్దామా, అని అడగగా…. నిజమేననీ, ఆ కధలో కుర్రాడు తనేననీ, కాకపోతే ఆ షావుకారికొడుకు జబ్బు పడడం, కుర్రాడు పరీక్ష పోవడం మాత్రం కల్పితమనీ చెప్పారు. దీనికి అనుబంధంగా –

మాస్టారూ, అప్రజ్ఞాతం కధా వస్తువే మీ అవగాహన, రచనా శక్తీ పెరిగాక ‘యజ్ఞం’ అయ్యింది కదా అనంటే, ఔననీ .. అదనంగా యజ్ఞం కధలో కమ్యూనిష్టు పార్టీ ఆలోచనావిధానం పై విమర్శ వుందేమో అనన్నారు.

మీ పక్కనే రావిచెట్టులా అమోఘమైన ప్రతీకలతో వర్ణనలతో రావిశాస్త్రి రచనలు చేస్తుండగా, మీరెలా మీదయిన శైలిని విజయవంతంగా నిలుపుకోగలిగేరు? వస్తుబలం వల్ల మాత్రమే అననకండి. ఇక, మీరు గూడా ఒకటి రెండు కధలు శాంతి, స్నేహం వంటి కధల్లో చిన్నగా రావిశాస్త్రి శైలి జాడల్లాగా కొన్ని దృశ్యాలు, వాక్యాలు రాసేరు. నిజమేనంటారా, కాదా – అన్న ప్రశ్నలకు కాసేపు మౌనం వహించి – శాంతి, స్నేహం కధల్లో శాస్త్రిగారి జాడలు ఉండొచ్చేమో, వస్తువులు పట్నానికి చెందడం వలన అలా వచ్చేయేమో … అనంటూ … యిక నాదయిన శైలి గురించంటావా – అది బహుశా నువ్వొద్దన్నా వస్తువే కారణమేమోననక తప్పదు. కొడవటిగంటి కుటుంబరావుగారు మధ్యతరగతి జీవితాలను రాసేశారు. శాస్త్రిగారేమో అధోజగత్ సహోదరుల జీవితాలను రాసేరు (పట్నపు). ఇక నాకు మిగిలినది గ్రామీణ జీవితం … దాన్ని రాస్తున్న క్రమంలో, ఆ జీవితమే వీరికి భిన్నమైన శైలినిచ్చిందనుకుంటాను… ఆ తర్వాత చాలాసేపు యింకేమీ మాటాడలేదు. నాగ్గూడా యింకే ప్రశ్నా తోచలేదు. మౌనంగా కాసేపు కూచున్నాం. ఈ లోగా దాసరి రామచంద్రరావుగారొచ్చారు .. గత రెండు రోజులుగా రామచంద్రరావుగారు కూడా , యిలా మా కబుర్ల మధ్య లోనో, చివర్లోనో వస్తున్నారు. ఏవో కబుర్లను కదుపుతున్నారు. ఈ సారి ప్రపంచీకరణ గురించి కదిలింది. మాస్టారేమో – ప్రపంచీకరణ ఫలితాలు మాత్రమే కధలలో రాస్తున్నారనీ, దాని వెనుక ఉన్నది రాయలేకున్నారనీ, ప్రపంచ రాజకీయాలనర్ధం చేసుకుంటే తప్పా ప్రపంచీకరణ గురించి సరయిన అవగాహన రాదంటారు. మతమూ, ఆర్ధికమూ, భాషా, సంస్కృతీ వగైరా విషయాల మీద యే శక్తులకు పట్టు వున్నదీ, దాని బలమేమిటీ, వాటి ఐక్యత యెలా జరుగుతున్నదీ, ప్రపంచీకరణనెదిరించే శక్తులేమిటి, వాటి బలహీనతలూ, అనైక్యతలూ వీటి గురించిన పరిశీలనుండాలనన్నారు. ఆశ్చర్యమేసింది … మాస్టారీనాటికీ ప్రపంచాన్నాడించే శక్తుల పట్ల యెంత జాగరూకతనాలోచిస్తారో అన్పించింది. ఈ సారి రామచంద్రరావేదో కదపబోతే … మర్లేదు, మరేం కబుర్లు లేవు. అన్నట్లు .. నవంబర్ తొమ్మిది తర్వాత నేనింకేమి మాటాడను … కష్ట సుఖాలూ, మామూలు పలకరింపులు తప్పా, అని ప్రకటించేరు. మాస్టారు ప్రకటించేరంటే యిక మరి తిరుగు లేదు .. ఎందుకో దిగులు కలిగింది. తెలుగు కధకులందరి దిగులది … మాస్టారి మౌనం పట్ల!

బహుశా, గురజాడ తెలుగు కధను గతంలో నుంచి వర్తమానంలోకి, గ్రాంధికం నుంచి వాడుక భాషలోకి, బ్రాహ్మణ మండువాల్లోకి (దేవుళ్ళారా మీ పేరేమిటి కధ మినహాయింపు) నడిపిస్తే, రావిశాస్త్రి గారు వీధుల్లోకీ , బజారులోకీ నడిపించారు. ఆ కధను పల్లెల్లోకీ , పంటభూముల్లోకీ, పంచాయితీల్లోకీ నడిపించినారు కాళీపట్నం రామారావు మాస్టారు. కధంటే జీవితాల్ని విశ్లేషించడమనీ, సామాజిక చలన మూలాలను యెరుకపరచడమనీ, సాహితీకారులకదో యజ్ఞమనీ … కారా మాస్టారి సాహితీ వ్యక్తిత్వం భోదిస్తుంది. లోకంలో పొందే సకల సదుపాయాలూ… సామాజిక శ్రమ ఫలితాలనీ, (సాహిత్యం గూడాననీ …) సామాజిక సాహిత్య ఋణాలనుతిరిగి తీర్చడాన్ని బోధిస్తుంది … కారా ‘కధానిలయం’! కాళీపట్నానికి పాదాభివందనాలు. రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

(మాస్టారితో నాలుగురోజులుగా, రోజుకు నాలుగు గంటలు కబుర్లు. చాలా చాలా కబుర్లు దొర్లేయి. అవన్నీ ఒక క్రమంలో పెట్టడంలో, సారంగకందించాల్సిన కాల వ్యవధి తక్కువ కావడాన, యింటర్వ్యూ యింకొంత బాగా చేయెచ్చేమోగాని సాధ్యం కాలేదు. ఈ నాలుగు రోజులు మాస్టారినుంచి విలువైనవెన్నో తెలుసుకున్నానని నేనంటే.. మాస్టారు, నా వలన చాలా తెలుసుకున్నాననీ, ఆ విషయం యిందులో రాయమనీ అన్నారు. ఈ మాట నాకెంతో ఆనందాన్నీ, నా పట్ల ఆయనకు గల నమ్మకానికి భయాన్నీ కల్గించేయి. ఈ సందర్భంగా రమాసుందరి గారికీ, సారంగ పత్రికకూ కృతజ్ఞతలు!)

– అట్టాడ అప్పల్నాయుడు