అ … అంటే చందమామ

 ibrahim

ఇంపైన యాస.. సొంపైన వాక్యం.. అది మాధుర్యమైన స్వరం అక్కం పేట ఇబ్రహీం ప్రత్యేకత. రాసింది తక్కువ కథలే అయినా తన స్థానం సమకాలీన సాహిత్యంలో పదిలం. బడుగు, బలహీన వర్గాల పక్షాన మాట్లాడే ఇబ్రహీం జూన్‌ 1, 1975లో పుట్టారు. మొదటి కథ ‘చిన్ని’ ఆంధ్రజ్యోతి వీక్లీలో 2007లో అచ్చయ్యింది. ఇప్పటి వరకు ఏడు కథలు రాశారు. ‘జీవసమాధి’, ‘కాలానికి ఎదురీదేవాడు’ కథలు ఇతని ప్రతిభకు మచ్చుతునకలు. కడపజిల్లా నర్సాపురం సొంత ప్రాంతం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.

—వేంపల్లె షరీఫ్

 

*

వేళ్ళ సందున చురుక్కుమండంతో ఉలిక్కిపడి బీడీముక్కను విదిలించేశాడు మస్తాన్. గోడమీద అతుక్కుపోయున్న చూపును వెనక్కి లాక్కొని కాలిన చోట తడుముకున్నాడు.

అంతసేపూ మనసు లాగేసుకొని ఏవో ప్రశ్నలూ… అనుమానాలూ… రేకెత్తించి ఆలోచనా ప్రవాహంలో ఈడ్చుకొనిపోయిన బొమ్మ, ఏమీ ఎరగనట్లు మౌనముద్రలోకి జారుకుంది. చూపు మళ్లీ దాని మీదికే మల్లుతుంటే బరువుగా లేచి నిల్చున్నాడు. జారిపోతున్న పంచెముడి బిగించుకుంటూ తలెత్తి పైకి చూశాడు.

వర్షం మళ్లీ వంగేటట్లుంది.!

మదపుటేనుగుల్లాంటి మేఘాల గుంపు ఈశాన్యమూలంగా ఆకాశంలోకి ఎగబడతాంది.

ఏదో గొణుక్కుంటూ లోపలికి నడిచాడు.

ఆట! మంచి రసపట్టులో నడుస్తోంది లోపల. పరిసరాల్ని మరిచి లీనమై ఆడుతున్నాడు అన్వర్.

ముడిపడ్డ కనుబొమ్మలు. మునిపల్ల మధ్య పెదవి బిగింపులు.. అతని వాలకం ఏదో భరోసానిస్తోంటే వెళ్లి ముందు కూర్చున్నచోటే గోడకానుకొని గొంతుక్కూర్చున్నాడు.

మనసింకా బయటే… గోడమీది బొమ్మ దగ్గరే వుండిపోయింది.

ఇంతకు ముందు చాలాసార్లు చూసిందే! బడివైపుగా వచ్చిన ప్రతిసారీ కళ్లబడేదే!

అప్పుడే జువ్విన పెన్సిల్ కొసలపై అటొక కాలు, ఇటొక కాలు వేసుకొని కేరింతలు కొడుతున్న పిల్లలు.. వాళ్ల చేతుల్లో ఇమిడి మేమే మీ నేస్తాలం అంటున్న పలకా, పుస్తకాలూ…

బొమ్మలో ఏం మార్పు లేదు. భావంలోనే.. ఇన్నాళ్ళూ పసిగట్టలేకపోయిన వ్యంగ్యం… బొమ్మకింద “అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి” అని చక్కెర పలుకుల్లాగా రుచించిన మాటల్లో ఇప్ప్పుడేదో చేదు తొంగి చూస్తూ…

వాటిని ఆలోచనల్లోంచి తప్పించే ప్రయత్నం చేస్తూ దృష్టి ఆట మీదికి పోనిచ్చాడు.

ఆట అప్పుడే ముగిసినట్లుంది. గెలిచిన వారి ఉద్రేకం, ఓడినవాళ్ల కాంతాలం మాటల  శకలాలై గదంతా ఎగిసింది.

వచ్చిన సొమ్మును హుషారుగా జేబులోకి దొబ్బుకుంటున్నాడు అన్వర్. అతని ముఖంలోని వెలుగు కాసింత మస్తాన్ మొఖాన ప్రతిఫలించి పోతున్న ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఒక అర్ధింపు అప్రయత్నంగా గొంతు పెకలించుకుంది.

“భయ్యా!…”

అది చెవిసోకిందొ లేదో అన్వర్ నవ్వు మొఖాన చేదు చరచరా  పాకింది. ” తాల్రా గబ్బు నాయాలా.. లెక్కలతో పోదెంకొని నేను సచ్చాంతే..” బుస కొట్టినట్టే కసిరాడు.

చిన్నబోయి తనలో తను ముడుచుకుపోయాడు మస్తాన్.

రెండు గంటల్నుంచి ఓపిగ్గా కనిపెట్టుకోనున్నాడు. “ఒక్కాట కానీ.. ఈ ఒక్కాట కానీ.. ” అనే కొద్దీ సహనం తెచ్చుకుంటున్నాడు.

ఇంకా ఎంతసేపు తొక్కాలో అర్ధం కాలేదు.

ఇంటికాడ మున్నా తొక్కులాడ్తా ఉన్నాడేమో?

తన్ను వెతుకులాడ్తూ వీధులమ్మట తిరుగుతున్నాడేమో!

“బేగీన రా నాయనా! లేటు చేయగాకు. నువ్వొచ్చేటప్పటికి నేను రెడీ అయి ఉంటా” వచ్చేటప్పుడు వాడు చేసిన హెచ్చరిక మాటిమాటికి వినబడుతుంటే స్థిమితంగా ఉండలేకపోతున్నాడు.

అప్పుడే  వారం రోజులైంది వాడు బడికి దూరమై.

ఈ వారం రోజులు అన్ని రకాలుగా ప్రయత్నించాడు. అందరి ముందు తన్ను తాను జోలెలా చాచుకున్నాడు. ఒక్కనీక్కూడా కనికరం కలగలేదు.

తను విఫలం అయ్యేకొద్దీ మున్నాలో భయం పేరుకుంటూ పోయింది. పోడుగా, ఏడుపుగా గొంతుదాటుకొచ్చింది.

అది తన చేతగానితనాన్ని ఎండగడుతుంటే, వాడు కూడా తనలాగే కూలోనిగా మారే దృశ్యం కళ్లలో కదలాడుతుంటే.. గుండెల మీద రేక్కంప ఈడ్చినట్లు విలవిలలాడిపోయాడు.

ఆర్రోజులు.. పోరాడి, ఓడి, అలుపొచ్చాక.. నిన్నటి సాయంత్రానికి ఆ కస్మూరు మస్తాన్‌వలి అన్వర్ రూపంలో ఎదురుపడ్డాడు. తన గోడంతా ఆలోచించి అభయమిచ్చాడు. ఆ అభయాన్ని తను కొడుకులోకి చొప్పించాడు. “రేపు బడికి పంపడం ఖాయం” అంటూ నమ్మబలికాడు.

తెల్లవారేటప్పటికి అంతా తలకిందులైంది.

తను పోయేటప్పటికి అన్వర్ ఇంట్లో లేదు. కలనబండ బాయికాడ, పిచ్చయ్య బంకు దగ్గర, గౌరమ్మ అరుగు మీద, అక్కడా, ఇక్కడా వెతుకులాడి ఎక్కడుండేది కనుక్కొని తీరా వచ్చేసరికి… ఆలస్యమైపోయింది.

తనకిస్తానన్న డబ్బులో చాలా భాగం అప్పటికే ఆటలో జారిపోయింది. పోయిన సొమ్ము తిరిగి రావడం, ఆడేది మానుకొని అన్వర్ దాన్ని తన చేతుల్లో పోయడం .. దింపుడు కల్లం ఆశను తలపిస్తాంది.

బీడీ ముట్టించుకుని పొగతో పాటు ఆశను కూడా పీలుస్తూ కూర్చున్నాడు మస్తాన్.

ఆట కోలాహలంగా సాగుతోంది. ఆడేవాళ్లు.. పైనుండి హుషారు చేసేవాళ్లు.. అరుపులు, అదిలింపులతో గది పొంగి పొర్లుతోంది. చుట్టూ ఆవరించిన బీడీల  పొగ బైటి వాతావరణంలోని మేఘాలు లోపలికి జొరబడిన భ్రాంతి కలిగిస్తోంది.

ఏడాది కింద మూతబడ్డ పాఠశాల ఊళ్లోని పోరంబోకులకు జూదశాలగా మారింది.

అక్షరాల గలగలలు పోటెత్తిన చోట ఆటిన్ రాణి,  డైమండ్ రాజాల కేళి.. గోడలపై మసకబారిన గుణింతాక్షరాలపై ఎవరో బొగ్గుతో గీసిన తాజా చిత్రం! మనుషులు బట్టల్తో దాచుకునే వాటిని బటబయలు చేసిన కళాపిపాస….. పగిలిన తలుపులు, విరిగిన కిటికీలు, పెచ్చులూడుతున్న కప్పు.. అచ్చు తన మనసులాగే బావురుమంటోన్న బడి…

దాని శిథిల రూపంలో, జవజీవాలతో తొణికిసలాడిన రోజులు దృశ్యాలై కదలాడుతుంటే, జూదగాళ్ల స్థానంలో బడిపిల్లల కోలాహలం కళ్లకు కడుతుంటే, మస్తాన్ లోలోపల బాధ రాజుకుంటోంది. తన కొడుకుతోపాటు ఊళ్లోని పిల్లలందర్నీ రెక్కల కింద పొదువుకున్న తెల్లకోడిలాంటి బడి ఏ తెగులు కాటుకో విగతజీవిగా మారిన చిత్రం కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.

లావు లావు చినుకుల్తో ఒక్కసారిగా వర్షం మొదలైంది.

ఉప్పువాగు కెగువున బరకల్లో  మెరుపువాగు ఆకాశం నుంచి భూమికి జరజరా పాకింది. చెవులు బద్దలు కొడుతూ ఉరుము శబ్దం ఊరిమీదికురికింది.

ఇంటికాడ మున్నా ఒక్కడే ఉన్నాడు. ఉరుములు, మెరుపులకు భయపడతాడేమో. చినుకు రాలగానే లొడలొడకారే ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నాడేమో.

పోదామనుకుంటూ లేచాడు. పోలేకపోయాడు.

ఉత్తచేతుల్తో పోయి వానికి ముఖం చూపించలేదు. వాడు పోగేసుకున్న నమ్మకాన్ని తన చేతుల్తో చెదరగొట్టలేదు.

ఆలస్యమైనా సరే! డబ్బులు ఇప్పించుకొనే వెళ్లాలి. రేపైనా వాడిని బడికి పంపించి తీరాలి.

ఇప్పుడు పోతే ఎంతో కొంత మినుకుమినుకు మంటున్న అవకాశాన్ని జారవిడుచుకున్నట్టే. లేచిన చోటే కూర్చుండిపోయాడు.

వర్షం ఉగ్రరూపం దాలుస్తోంది. ఆత ఉధృతంగా సాగుతోంది.

 ***

 నీటి దారాలు ఆకాశం నుంచి తెగిపడుతున్నట్లు వర్షం కురుస్తోంది. ఈదురుగాలి తోలినప్పుడల్లా దారాలు తుంపర్లుగా తెగి దూరంగా పడ్తుంటే, ఇంకా మూతలు పడని వాకిళ్లలోంచి తొంగి చూస్తోన్న దీపాల గుడ్డి వెలుగు బయటి చీకట్ల చిక్కదనంలోకి జొరబడలేకపోతోంది.

తల్లి పచ్చడి దంచుతోంటే రోటి దగ్గరే దీపం ముందు పుస్తకం తిరగేస్తున్నాడు మున్నా. కాని చిన్న బుర్రలో ఆశాభంగపు అలజడి ఇంకా రేగుతూనే వుంది.

తండ్రి డబ్బు సంపదించడం గురించే కాదు తన బెంగ. సంపాదించేలోగా ఎన్ని లెసన్స్ మిస్ అవుతాడో! ఎంత వర్క్ ఫ్రెండ్స్ దగ్గర కాపీ చేసుకోవాలో! మ్యాథ్స్ టీచర్ డివిజన్‌లో వర్కింగ్ ప్రాబ్లమ్స్ చెప్తానంది. అవి కూడా మిస్సయ్యాడు.

రెండవ తరగతి దాకా తెలుగులో చదివినందువల్ల ఇంగ్లీషులో తను కొంచెం వీక్. క్లాస్‌లో చెప్పేది వినకుంటే తర్వాత బుక్స్‌లో చదువుకున్నా పెద్దగా అర్ధం కాదు. ఇవన్నీ ఎలాగోలా మేనేజ్ చేసుకున్నా అసలైన పనిష్మెంట్ ఇంకొకటుంది.

ప్రతి టీచర్ తన్ను క్లాస్‌లో నిలబెట్టడం. ఎందుకు ఆబ్సెంట్ అయ్యావంటూ దండించడం. అందరిముందు తను తప్పు చేసినట్టు తలవంచుకోవడం

నులి మంచంలో మునగదీసుక్కూచ్చోని  కొడుకు మనసు చదివే ప్రయత్నం చేస్తున్నాడు మస్తాన్.

చదువుకోవడమంటే ఎంత ఆరాటం వాడికి.

ఎప్పుడన్నా పనిబడి ఒక్కపూట బడి  మానుకోమంటే చాలు దిగులు ముఖం పెట్టుకుంటాడు. హోంవర్క్ చేసుకునేటప్పుడు  చూడాలి. ఒక్కో లెక్క సాధించే కొద్దీ వాని కళ్లలో కాంతి పుంజాలు మెరవడం.

పుస్తకాల బరువు కింద నలిగిపోయే బాల్యపు రూపురేఖలు వాని ముఖాన ఎప్పుడూ కానరాలేదు. నేర్చుకోవడంలోనే ఏదో సంతోషాన్ని సాధిస్తున్నట్లు సాధకుడి దరహాసం వాడి పెదవుల మీద.

అదంతా వాని ఘనతేం కాదు. వాన్నలా తీర్చిదిద్దిన చిన్నప్ప సార్ ఘనత. ఆ సార్ కథలల్లుతాడు. కథలంత కమ్మగా పాఠాలు చెప్తాడు. ఆటతో పాటతో చదువునొక క్రీడగా మలుస్తాడు. ఆయన ఉన్నన్నాళ్లూ వాని గురించే పలవరించెటోడు.

“మస్తానూ! నీ ఇంట ఐన్‌స్టీన్ పుట్టిండబ్బా. నువ్వు పస్తులున్నా పరవాలేదు. వాన్ని మాత్రం బాగా చదివియ్యి. వాడు నీకు పేరు తేవడం ఖాయం” అనేవాడు.

అటువంటి వాన్ని చదివించుకోలేకపోతే… తన్ను తాను శపించుకున్నట్లే!

ఏం చేయాలి? ఏ బాయిలో దూకాలి?

సైదమ్మ ఊరిబిండి నూరడం పూర్తయింది. రోటి కాన్నుండి లేస్తూ

“ఇంగ రాండి. బువ్వ తిందురు గానీ” పిలిచింది.

“కాసేపుండీ.. కరెంటు రానీలే… “అనాసక్తిగా కదిలాడు మస్తాన్.

” ఈ మొబ్బున కూడా కరెంటొస్తదని.. రారాదూ.. “తొందర చేసింది.

అయిష్టంగా పళ్లెమ్ముందు కూచ్చున్నాడు. తిని లేచేసరికి అరచెతుల్ని నెత్తి మీద గొడుగులా కప్పుకొని వసారాలోకి అడుగులేస్తూ ఎవరో…

చేతులు దించి తల ఎత్తేసరికి .. ఆశ్చర్యం! డేవిద్!

“అరరే.. నువ్వా? .. ఎప్పుడొచ్చినవ్.. రా… రా….” ఆశ్చర్యంగా, ఆనందంగా ఆహ్వానించాడు.

పొద్దున్నే వచ్చినాడంట ఒంగోలునుంచి.

ఏదో పనిబడినట్లుంది. లేకుంటే ఇలా మధ్యలో రాడు.

“ఏమిటంటే..” ఇబ్బందిగా చూశాడు. “ఏమీ లేదంటూ” నీళ్లు నమిలాడు. బువ్వ తినమన్నా తినలేదు. బలవంతం చేస్తే..

“ఎన్నో తరగతోయ్ వీడు.. బలే శెర్దగా సదువుకుంటాండే” అంటూ మాట మార్చాడు.

“ఐదో తరగతన్నా! ఇంగ్లీసు మీడియం” కొడుకును పొగడ్డంతో సైదమ్మ  ఉషారుగా జవాబిచ్చింది. అంతలోనే ముఖం చిన్నది చేసుకొని.

“వాడు మాత్రం బాగానే సదువుకుంటాండన్నా.. మేమే వాణ్ని సదివియ్యలేక కిందా మీదా పడ్తాండం” అంటూ బాధపడింది.

“నిరుడు ఇంట్లో అందరికీ చికన్ గున్యా జరాలొచ్చి మనిసికి వెయ్యి రూపాయలు కర్సైనై మామా. జరం తగ్గినా నొప్పులు మటుకు చాన్నాళ్లదాకా వదల్ల్యా. పనులకు పోలేక వాని ఫీజు  కట్టలేకపోయిన” ఒక్క కొడుకును చదివించుకోలేని చేతగానితనానికి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా అన్నాడు మస్తాన్.

“ఇన్ని అగసాట్లు ఎందుకోయ్ మనూర్లోనే బడిపెట్టుకొని?” ఏదో అనుమానం పొడసూపుతుంటే నివృత్తికోసం ఆడిగాడు డేవిడ్.

“ఇంగేడ బడి.. ఎప్పుడో మూతబడిపోయుంటే”

“మూతబడిపోయిందా!?” డేవిడ్ గొంతులో ఆశ్చర్యం, బాధ మిళీతమయ్యాయి. ప్రాధమిక విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తున్న  ఎంజెవోలో పని చేస్తున్నాడు తను. వృత్తిరీత్యా ఎన్నో ఊళ్లు తిరిగాడు. ఎన్నో స్కూళ్లు మూతబడ్డం చూశాడు.

అన్నిచోట్లా చదువులనుండి గెంటేయబడుతోన్న బీదపిల్లలు. పరిస్థితి ఇంత త్వరగా తనూరిదాకా వ్యాపిస్తోందని ఊహించలేకపోయాడు.

“ఎట్ట మూత పన్నెదోయ్?” కారణం తన ఊహకందనిది. కాకపోయిన ఏదో కుతూహలం అతనిచేత అడిగించింది.

“ఇంతకు ముందు చిన్నప్ప సార్ ఉన్నెప్పుడూ బాగానే వున్నెది మామా. ఆ సార్ బదిలీ అయినాక బదులుగా వచ్చిన  సారు అంత శెర్దగా పట్టించ్చుకోల్యా. దానికి తోడు పోరుమామిల్లలో ఇంగ్లీషి మీడియం స్కూళ్లు ఎక్కువైపోయి మనూరి దాకా వస్తా  ఉండై. ఉన్నోల్ల పిల్లోల్లు పోలోమని పోతే, మనలాంటోల్ల పిల్లలు మిగిలిండ్రు. వీళ్లు  తక్కువ మంది ఉండారని స్కూల్‌నే ఎత్తేసిండ్రు.”

ఊళ్లే వేరు… స్కూళ్ల కథ మాత్రం ఒకటే!

ఏదో ఒక కారణంతో చిక్కిపోవటం. తర్వాత చచ్చిపోవటం. ఈ దుస్థితి కారణాలెన్నో.

మస్తాన్‌లాగా అందరికీ స్పష్టంగా కనించేది ఉపాధ్యాయుల బాధ్యతా రాహిత్యం… చీటీలు, ఎల్లైసీలు, షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ దందాలు.. అనేకానేక సొంతపనుల్లో మునిగి తేలే టీచర్లు బడికి ఎగనామం పెట్టి పిల్లల జీవితాల్ను పాడు చేస్తుంటే తలిదండ్రులకి బాధ కల్గుతోంది. అటువంటి టీచర్ల పట్ల అసహ్యం పెరుగుతోంది. ఆ అసహ్యపు పొరల్లోంచి మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని వీక్షించి వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోతున్నారు.

ఫలితం. పిల్లలు ప్రైవేటు స్కూళ్లవైపు తరలిపోతున్నారు. తల్లిదండ్రుల చూపు ఉపాధ్యాయుల్ని దాటి ముందుకు పోవడం లేదు. ఉపాధ్యాయ్లు ‘బడిదొంగ’లవుతోంటే పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్లు? అధికార్లను అదిలించాల్సిన పైవాళ్లు ఎందుకు నిద్రపోతున్నట్లు?నష్టపోతున్నది తమ పిల్లలు కాదు గనుకనా?

ఒక గది, ఒకరిద్దరు టీచర్లు, ఐదు తరగతులతో దశాబ్దాల తరబడి పేదపిల్లల చదువులు ఎంత చిందర వందరగా తయారవుతున్నాయో వాళ్లెప్పుడైనా గమనించారా? గతి లేనోళ్లకు అంతమాత్రం చాల్లే అని సరిపెడుతున్నారా?

కనీస అవసరాల గురించి, నాణ్యమైన విద్య గురించి అడిగినప్పుడల్లా డబ్బుల్లేవంటూ బీదముఖం పెడతారు.

వీళ్ల బీదరికపు నటనలోంచి  కుట్రపూరిత నిర్లక్ష్యంలోంచి   ప్రైవేటు బళ్లకు జీవం పోశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ పాసులిప్పించి ‘బడిదొంగల’ బాధితుల్ని ఈ బళ్లవైపు దారి చూపారు.

ఇపుడూ ప్రైవేటు గాలికి ఇంగ్లీషు దుమారం తోడైతే, మస్తాన్ చెప్పినట్లు ‘గతి’ ఉన్నోల్లంతా పోలోమని  పోతుంటే, ఏ పాపం ఎరుగనట్లు తప్పంతా టీచర్ల నెత్తికి చుడుతున్నారు. వాళ్లు సంపాదించుకున్న అపఖ్యతి చాటున వీళ్ల కుతంత్రాల్ని తెలివిగా దాచుకుంటున్నారు.

వందలాది పర్యవేక్షనాధికారుల పోస్టుల్ని ఖాళీగా వుంచి పాఠశాలల గొంతుల్ని అదృశ్యహస్తంతో పిసికేస్తూ, బయటికి మాత్రం బ్రతికించే ప్రయత్నం చేస్తున్నట్లు క్లిప్, క్లాంప్స్, లెప్.. అంటూ రకరకాల ప్రోగ్రాంలను అమలు చేస్తున్నారు. అంకితభావం కలిగిన టీచర్లను సైతం నివేదికలు తయారుచేసే గుమాస్తాలుగా మారుస్తున్నారు.

ఇంత ఎదురుగాలిలో కూడా చాలామంది ఉపాధ్యాయులు ‘బడి దీపాలు’ ఆరిపోకుండా శక్తులన్నీ ఒడ్డుతున్నారు. తల్లిదండ్రుల ఆసరాతో దీపాల చుట్టూ అరచేతుల రక్షణ వలయాల్ని నిర్మిస్తున్నారు.

అయినా ఒక్కో దీపం ఆరిపోతూనే వుంది.

ఆఖరుకు అన్ని దీపాలు ఆరిపోయి కారు మబ్బులు కమ్ముకుంటాయేమో!

ఆ చీకటి ‘మున్నా’లాంటి నెలవంకల్ని ఎన్నింటిని మింగేయనుందో?

“ఏందన్నా మా వాని కత విని నీగ్గూడా దిగులు పత్తుకున్నెదే?” సైదమ్మ మాటతో ఆలోచనలోంచి బైట పడ్డాడు డేవిడ్..

“ఈ కథ నీ కొడుకు ఒక్కడిది గాదమ్మా.. ఇట్టాటి పిల్లలు ఇంగా చాలామందే ఉండారు” అన్నాడు.

నిజమేననిపించింది సైదమ్మకు.

బడి మూతబడిపోతూ తొమ్మిది మంది పిల్లలను వీధిపాలు చేసింది. వాళ్లలో ప్రైవేటు స్కూళ్ళలో చేరింది మగపిల్లలే! ఆడపిల్లలు చంటిపిల్లల్ని చంకనేసుకొని వీధులెంబడి తిరుగుతున్నారు. మగపిల్లలు కూడా కొన్నాళ్ళయాక ఫీజులు కట్టలేక బడి మాని చేల వెంబడి, చెట్ల వెంబడి తయారయ్యారు..

రెక్కల కష్టంతో బ్రతికేవాళ్లకు లెక్కలతో కొనే చదువు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది.

మస్తాన్ వెల్లబోసుకున్న బాధకు, తను వెల్లబోసుకోలేక ఇబ్బందిగా ఫీలవుతున్న బాధకు మూలం ఒకచోటే తేలాక తన రాకను గురించి గొంతు విప్పాడు.

వినేటప్పటికి మస్తాన్ మనసు మరింత బరువెక్కింది. డేవిడ్ వెళ్ళిపోయాక పడుకుంటే రెప్పల వాకిళ్ళు మూతబడలేదు.

ఒక కంట బడిచెట్టు మీంచి చెదరగొట్టబడ్డ బాల్యపు పక్షులు.. మరోకంట బడి గోడ మీది భ్రమలు పుట్టించే బొమ్మ!

విద్య మా హక్కంటూ నినదిస్తున్న బొమ్మ!

 ***

 ఉప్పు వాగు దాటి జేడెల మీదుగా జిరంగిలా దూసుకుపోతోంది ఆటో. ఆటోలో తండ్రి ఒళ్ళో కూచ్చున్న మున్నా మనసు తూనీగలా తేలితేలి పోతోంది.

దారి పక్క పైర్లు, జేడెల ఎగుడు దిగుళ్ల మీదుగా కదిలిపోతున్న జంగిడి గొడ్లు, రోడ్డును కమ్మేసి ఆటోకు అడ్డం పడుతున్న గొర్లమందలు.. రోజు కంటే అందంగా, కళగా కన్పిస్తున్నాయ్. జరుగుతున్నదంతా కలగా, నిజంగా, కలలాంటి కమ్మటి నిజంగా అన్పిస్తోంది.

బువ్వతిని ఇంట్లోనే పండుకోమని ఎంత బంగపోయినా వినకుండా రాత్రే వెళ్ళిపోయిన డేవిడ్ మామ పొద్దుపొడిచే టప్పటికల్లా తనకోసమే తిరిగి వచ్చాడు.

నాయన ఇంట్ళో లేడూ. దుగ్గిరెడ్డి వాళ్ల గొడ్ల కొట్టం కప్పుతాంటే బోద ఎగేస్తున్నాడు. వెళ్లి పిలుచుకొనొచ్చాడు.

పైజేబులోంచి ఐదువందల కాగితాలు తెచ్చి చేతిలో పెట్టాడు మామ. ” ఈ రెండువేలు తీసుకొనిపోయి పిల్లోని ఫీజు కట్టోయ్. నేను మళ్లా క్రిస్‌మస్ పండకొచ్చినప్పుడు తీసుకుంటాలే” అన్నాడు.

నాయన కళ్లనిండా నీళ్లొచ్చినై.

మామ అన్నంతపని చేసినట్లుంది. ఈ రెండువేలు ఆ డబ్బులోంచి సర్దినట్లుంది. ఊరికే అంటున్నాడు గానీ మామ పండక్కి రాడేమో! వస్తే ఎక్కడుండాలని మధనపడతాడేమో?

ఆటొ నరసాపురం దాటి పోరుమామిల్ల వైపు మలుపు తిరిగింది. వర్షం తెరిపి నివ్వడంతో వరినాట్ల సందడి మొదలైంది. రోడ్డు కిరువైపులా గిలక తోలే వాళ్లు, గట్లు చెక్కేవాళ్లు, అద్దం లాగా సిద్ధమైపోయిన మళ్లలో నాట్లు వేసేవాళ్లూ…

తెలుగ్గంగ నీళ్లు వచ్చినప్పటినుండి అంతో ఇంతో భూ ఆధారకమున్నోళ్లు నిబ్బరంగా ఉంటున్నారు. వర్షాలు పడకపోయినా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్లు ఇవ్వడంతో పైర్లు పెట్టుకొని ధీమాగా ఉంటున్నారు.

తనకు సెంటు భూమి లేదు. ఏ ఆధారకమూ లేదు.

మున్నాగాన్ని బాగా చదివిచ్చుకుంటే వాడే తనకు ఆధారం అవుతాడు.

ఎలాగైనా వాన్ని చదివిచ్చుకోవాలి. తన అశక్తత మూలంగా  ఇంకెప్పుడూ బడికి దూరం కాకుండా జాగ్రత్త పడాలి.

కుటుంబ పరిస్థితులకు, కొడుకు చదువుకు మధ్య అగడ్తను పూడ్చడం కోసం ఒక్కో ఆలోచన్ను గులకరాయిలా దొర్లిస్తోంది మస్తాన్ మనసు.

రాత్రి డేవిడ్ అన్న మాతలు మనసులో మెదిలినై.

“మూడోవానికి మెడికల్లో సీటు రాలేదోయ్. డిగ్రీలో చేరమంటే వినడు. లాంగ్‌టర్ము కోచింగ్ తీసుకుంటాడంట. డబ్బులేవన్నాను. అలిగి బువ్వ తినడం మానుకున్నెడు. వాని బాధ సూల్ల్యాక, ఇల్లమ్మి పోదామని వచ్చినా.”

నెలజీతగాడైన డేవిడ్ చదువుల పెట్టుబడికి తాల్లేక ఇల్లమ్ముకున్నాడు. తన దగ్గరేముంది అమ్ముకోవడానికి.

అనవసరంగా లేనిపోని భ్రమలు పెంచుకుంటున్నాడేమో, చిన్న మొలకను చేతబట్టుకొని చెట్టంతటి నీడ కోసం కలలు కంటున్నాడేమో, మొలకను మానులా మలచడానికి అవసరమైన ఆర్ధిక పోషకాలు తన మట్టి బతుకును ఎంత  పిండుకున్నా దొరకవేమో.

జారిపోతున్న నమ్మకాన్ని చిక్కబట్టుకునే ప్రయత్నం చేశాడు. గుండెలనిండా ధైర్యాన్ని ఎగబీల్చాడు.

ఆటో పోరుమామిళ్ల చేరింది.

బస్టాండు దగ్గర దిగి బద్వేలు రోడ్డులో కాసేపు నడిచేశరికి ఠీవిగా ఎదురుపడింది. విస్‌డమ్ ఇంగ్లీషు మీడియం స్కూల్.

జైలు గోడలాంటి ప్రహరి, కోట గుమ్మంలాంటి గేటు. ఖాకీ యూనిఫాంలో పోలీసును తలపించే వాచ్‌మెన్. సగటు తల్లిదండ్రుల్ని బెదరగొట్టడానికి సరిపడా గాంభీర్యం నిండిన వాతావరణం.

స్కూల్ టైం అవుతోంది.

తండ్రుల వెంట స్కూటర్లమీదొచ్చి దిగుతున్న టౌను పిల్లలు. కుక్కేసి తరలించుకొచ్చిన వ్యానులోంచి పుట్ట పగిలిన చీమల్లా బైటపడుతున్న పల్లెటూరి పిల్లలు.

శుక్రవారం రోజుకి ప్రత్యేకమైన వైటండ్ వైట్ యూనిఫాంలో క్లాసుల్లోకి కదులుతున్న దేవదూతల్లా ఏదో శాపభారాన్ని పుస్తకాల రూపేణా మోస్తు వంగిపోయి.. ఇంద్రధనుస్సులా…

ఆ పిల్లలు, తండ్రులు, వాళ్ల ఒంటిని అంటిపెట్టుకున్న పట్టణ నాగరికతలు, వాళ్ల కోసమే అన్నట్లుగా పెట్టుబడిదారీ తళుకుల నద్దుకున్న స్కూలు పరిసరాలు.. తమ స్థితిగతులకు పొత్తు కలవని ప్రదేశంలో మసలడానికి ఇబ్బంది పడుతూ, న్యూనతతో చితికి పోతూ హెడ్ మాస్టర్ గదిలోకి అడుగుపెట్టాడు మస్తాన్.

అలికిడికి చదువుతున్న ఇంగ్లీషు డైలీలోంచి చివాల్న తలెత్తాడు హెడ్‌మాస్టర్.

వాకిట నిలబడి అనుమతి తీసుకుని వినయంగా లోపలికి అడుగుపెట్టాల్సిన ఆచారం ఒకటి భగ్నమవటంతో అతడి నుదట అసహనం ముడతలు పడింది.

గుడ్డిమైల పది తెలుపుదనాన్ని పూర్తిగా పోగొట్టుకున్న యూనిఫాం, మెలిచుట్టుకొని పోయి వత్తిలాగా వేలాడుతున్న టై, చినిగిపోయి వేళ్లను బైటికి చూపెడుతున్న బూట్లు.. బీదరికాన్ని పోతపోసినట్లు కొడుకు.?

ఎన్నడూ ఇస్త్రీ ముఖం ఎరుగక పైకి ముడుచుకుపోయి కురచగా కనిపిస్తున్న అడ్డపంచె, కూరిపెట్టిన సంచిలోంచి అలాగే వేసుకొని రావడం వల్ల నిండ సొక్కిళ్లు బారిన చొక్కా.. ముతక బతుకుకు అద్దం పడుతూ తండ్రి…!

ఎదుట నిలబడ్డ ప్రాణుల అల్పత్వాన్ని అంచనా వేసేసరికి హెడ్‌మాస్టర్ అసహనంలో ముడతల సంఖ్య పెరిగింది.

వాళ్ల నమస్కారాలకు స్పందించకుండా ఏంటన్నట్లు ఈసడింపుగా చూశాడు.

“ఫీజు కట్టలేదని వారం నుంచి మా వాన్ని బళ్లోకి రానియ్యడం లేదు సార్. స్నేహితుడొకాయన సాయం జేసి ఉంటే కట్టి పోదామని వచ్చిన” చేతులు నలుపుకుంటూ చెప్పాడు మస్తాన్.

అతని మాటల్ని పట్టించుకోనట్లు కొడుకు వైపు చూశాడు.

“వాట్స్ యువర్ నేం? విచ్ క్లాస్?” అంటొ గరగరలాడాడు.

“షేక్ మునార్  భాషా, ఫిఫ్త్ క్లాస్, బి. సెక్షన్”

కీబోర్డుని టకటకలాడించి,మానిటర్ మీద వివరాలు చూసి కళ్లు పెద్దవి చేశాడు. తండ్రీ కొడుకుల్ని ఎగాదిగా చూస్తూ .. ‘ఎంత తీస్కొచ్చావ్?’ అన్నాడు.

ఆఫీసులో కట్టేసి రసీదు తీసుకురా అన్నాడు.

తెచ్చి చూపిస్తే, దాన్ని తనకే ఇచ్చేస్తూ.

“ఇదేందో తెలుసా? నిరుటీ ఫీజుకు రసీదు. మరి ఈ సంవత్సరపు ఫీజు ఎప్పుడు కడతావ్? వచ్చే ఏడాదా?” వెటకారంగా అన్నాడు.

“లేదు సార్! పదిరోజుల్లో అదిగూడ తెచ్చి కడ్తా సర్” భయం భయంగా అన్నాడు మస్తాన్.

“నో.. నో… ” మళ్లీ కంప్యూటర్ వైపు తిరిగాడు.

మౌస్‌ని అటు ఇటు జరిపి క్లిక్ చేసి మానిటర్ వైపు చూపించాడు.

“స్కూలు జరిగిన రెండు నెలల్లో మూడు వారాలు ఆబ్సెంట్లు! ఫీజు అడిగినప్పుడల్లా ఎలా గుడ్లు తేలేస్తున్నావో చూడు. ఇటువంటి కేసుల్ని వి కాంట్ బేర్..” తల అడ్డంగా ఆడించాడు.

అటెండర్ని పిలిచి ఈ అబ్బాయి రికార్డు షీటు ప్రిపేర్ చేయించమంటూ ఆర్డరేశాడు.

జరుగుతున్నదేమిటో అర్ధం అయ్యేసరికి కడుపులో జలదరించి ఆ ప్రకంపనలు మస్తాన్ ఒళ్ళంతా  పరుగులెత్తినై. శక్తంతా తోడేసినట్లు శరీరం తేలికగా అయిపోయింది. గుండె లోపలెక్కడో పియో పియో మంటోంది.

ఇటువంటి సన్నివేశాన్ని తను ఊహించలేదు.

చల్లబడుతున్న ఒంటిని స్వాధీనం లోకి తెచ్చుకుంటూ…

“నా కొడుకును అన్యాయం చేయకు సార్. నీకు పున్నెముంటది. బీదోన్ని రవంత కళ్ల జూడు సార్” రెండు చేతులెత్తి దండం పెట్టాడు.

అతని గోడుకి హెడ్‌మాస్టర్‌కి చీమైనా కుట్టలేదు.

ఫీజు ఒక్కటే కాదు వీళ్లతో సమస్య.

వీళ్ల అవతారం.. చినిగిన బూట్ళు , చింపిరి జుట్లు..

వీళ్లు క్యాంపస్‌లో తిరుగుతుంటే స్కూల్ ఇమేజ్ డామేజ్ అవుతోంది. వీళ్లందరినీ తరిమేసి కొత్త వాళ్లను చేర్చుకోకపోతే ఇమేజ్‌తో పాటు ఇన్‌కం కూడా డామేజ్ అయ్యేట్టుంది.

రికార్డుషీటు ప్రిపేర్ అయ్యి టేబుల్ మీదికి వచ్చింది.

దాంట్లో సంతకం బరికేసి సీట్లోంచి లేచాడు.

“బీదోన్ని అంటున్నావు గదా! నీ స్తోమతకు తగినట్లు ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేరుచుకో ఇక్కడ చదువు కొనడానికి నీ శక్తి చాలదు.”

బయటికి వెళిపోతూ కళ్లతోనే అటెండర్ కేదో చెప్పాడు.

“సార్.. సార్. సార్… నీ దండః పెడ్తా సార్”

“బీదోని బతుకు పాడు చెయగాకు సార్. రొండురోజుల్లో ఫీజు మొత్తం కడ్తా సార్” హెడ్‌మాస్టర్ వెంటబడ్డాడు మస్తాన్.

అటెండర్ మెరుపులాగా కదిలాడు. రెట్ట పట్టుకొని రికార్డుషీటు చేతిలొ పెట్టాడు.

“నువ్వెంత మొత్తుకున్నా ఆయన వినడు. నీ యట్టాటి బీదోళ్లు రోజుకు డజన్ మందిని బైటికి పంపిస్తుండాడు.. పో.. పోయి లక్షణంగా గవర్నమెంట్ బళ్ళో  చేర్పిచ్చుకో పో”.

బయటికి దారి చూపించాడు. కదలకుంటే తోసెయ్యడానికి వెనుకాడనట్లు కరుగ్గా చూశాడు.

ప్రాణం భగ్గుమంది.

అమాయకంగా నమ్మి వచ్చిన గొర్రెను కసాయి కత్తేదో కుత్తుక కోసిన బాధ.

ఇన్నిరోజులుగా కొడుకు కోసం తను పడ్డ ఆరాటం.. ఆఖరు నిముషంలో దేవుడిలాగా అడ్డుపడిన డేవిడ్ ఔదార్యం.. అంతా  మట్టిపాలైపోయింది.

అటెండరు కూడా తన బతుక్కి  గవర్నమెంటు బడి చాలని తీర్మానిస్తున్నాడు.

ఆ బడి ఊపిరాగిపోయి నిర్జీవంగా పడి వుంది. బలుపెక్కిన ఈ బడి బతికుండగానే తన్ను చంపేసింది.

చెమ్మగిల్లిన కళ్లతో కొడుకు ముఖంలోకి చూశాడు. చందమామకు మసి పూసినట్టు చిన్నబోయి వుంది.

చెయ్యందుకొని మౌనంగా బైటికి నడిచాడు.

రోడ్డు మీది గతుకులన్నీ వర్షపు నీటితో నిండి వుండై.

ఎర్రనీళ్లలో నిరాశగా కాళ్ళీడుస్తూ, మాటిమాటికి వెనక్కి తిరిగి స్కూలువైపు చూస్తూ ముందుకు నడస్తన్న కొడుకు.

మనసెక్కడో, మనిషెక్కడో ఐనట్లుగా అడుగెక్కడ పడేదీ స్పృహ లేకుండా నడుస్తన్న తండ్రి..

స్కూలు దారిలోంచి మెయిన్ రోడ్డూ ఎక్కబోతుంటే, తండ్రి చేతిలోంచి కొడుకు చెయి జారిపోతూ “భడక్”మన్న పెద్ద శబ్దం.

అదిరిపడి స్పృహలోకొచ్చి చూసేసరికి నడుములోతు గుంతలో దిగబడిపోయున్న కొడుకు!

ఏ టేలిఫోన్ వాళ్ళో దారికడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన కాలువ పరధ్యానంగా నడిచేవాళ్ల కోసం నోరు తెరుచుకోనుంది.

చొక్కా,నిక్కర్ల మీదుగా చిక్కగా జారుతున్న అడుసునీరు, బ్యాగులోకి దూరి పుస్తకాల్ని ఖరాబు చేసి మూలల గుండా లొడలొడ కారుతున్న వర్షపు నీరు.

ముక్కూ, మూతికి బొట్లు బొట్లుగా బురదంటి వికారంగా తయారైన బిడ్డరూపం.

కడుపులో దేవినట్టై, గుండెల్ని పిండినట్లై, కళ్లలోంచి వొలుకుతున్న దుఖాఁశ్రువయ్యాడు మస్తాన్.

తమ భంగపాటుకు ఎవరో “ఫక్కు”మంటూన్న భ్రాంతి! దిగ్గున తలెత్తేసరికి..

అదే బొమ్మ! బడి గోడ మీది బొమ్మ!

రోడ్డు కవతల బిల్డింగ్‌పై ఇంతెత్తు హోర్డింగ్ మీద.

పెన్సిల్ మీద పిల్లలు దగాపడ్డ తమను చూసి నింగినంటేలా నవ్వుతున్నట్లనిపించింది.

మొనదేలిన పెన్సిల్ బరిసెలా దూసుకొచ్చి గుండెల్లో దిగుతున్నట్లుంది. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలన్న మాటలు “కొందరే చదవాలి.. కొందరే ఎదగాల”న్న వికృతార్ధాన్ని వెక్కిరిస్తున్నాయి.

భవిష్యత్ స్వప్నం ఒకటి బురదలో ఒలికిన బాధ! అందుకోబోయిన అక్షరం అడుసులోకి తొక్కేసిన బాధ!!