పెట్టుబడి ఊసెత్తని ఉద్యమ సినిమా!

 

 

-శివలక్ష్మి 

~

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  గోతె జెంత్రం (Goethe Zentrum-German film Club) లో నాలుగు సినిమాలు ప్రదర్శించారు. అందులో మార్చ్ 9 న ప్రదర్శించిన రెండు సినిమాలు మాత్రమే నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లోని మహిళల, బాలికల దారుణమైన పరిస్థితుల్ని ఈ రెండు సినిమాలు కళ్ళముందుంచాయి. అందులో మొదటి సినిమా: From Fear to Freedom ending violence against women 35 నిమిషాల నిడివి కల ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. దీనిని ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ (Women’s Learning Partnership) వారు నిర్మించారు.

 

ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు అతికౄరమైన హింస బారిన పడుతున్నారు. ప్రతి దేశంలో, ప్రతి సంస్కృతిలో, ప్రతి మతంలో, వర్గాల కతీతంగా ఉన్నత, మధ్య, అట్టడుగు తరగతుల్లోని మహిళలందరూ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్నఅన్ని రకాల హింసలు అంతం కావాలంటూ, భయాలనుండి స్వేచ్చ కోసం చేసే ప్రయాణమే సినిమా ఇతివృత్తం

 ఐక్య రాజ్య సమితి గణాంకాల ప్రకారం 87% ఆఫ్ఘన్ మహిళలు  గృహ హింస బాధితులు.   కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ లో రోజువారీ 1100 కంటే ఎక్కువమంది  మహిళలు,  బాలికలు అత్యాచారానికి  గురవుతున్నారు. ప్రపంచం లోని 137 దేశాల్లో మానవ రవాణా  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని బారిన పడే 80% మంది స్త్రీలే!

ఈ చిత్రంలో పురుషుల్ని ఒక్కొక్కరినీ “నువ్వెంతమందిని అత్యాచారం చేశావు? అనడగడం కనిపిస్తుంది.ఆ పురుషులు ధీమాగా సిగ్గూ శరం లేకుండా 5, 10, 20 మంది అని చెప్తారు.గ్రామాలు తిరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువమందిని అత్యాచారం చేస్తామని కూడా నిర్భయంగా చెప్తారు. పరువు కోసం చెల్లెల్ని చంపేశానని చెప్తాడొకడు. ప్రతి ఏటా దాదాపు 5000 మందిని పరువు, మర్యాదల పేరిట సొంత కుటుంబ సభ్యులే హత్యలు చేస్తున్నారు.

ఏడేళ్ళ పాపకి పెళ్ళి చేస్తే, ఆమె 15 ఏళ్ళకి ఇద్దరు బిడ్డల తల్లవుతుంది.బాల్య వివాహాలు, గర్భ ధారణలతో చిన్న పిల్లలైన తల్లులు, పసిబిడ్డలు కూడా  ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు దాదాపు చాలా దేశాల్లో చిత్రీకరించడం కనిపిస్తుంది.

“ప్రపంచవ్యాప్తంగా మహిళలు బృందాలుగా ఏర్పడి హింస లేని సమాజం కోసం,స్త్రీల హక్కుల్ని సమర్ధించే మెరుగైన కొత్త చట్టాల కోసం పోరాడుతున్నారు. బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే ప్రజాస్వామ్య భావనలు నెలకొల్పడానికీ, హింసా సంస్కృతిని అంతం చేయడానికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు”- అని అంటారు యునైటెడ్ నేషన్స్ మాజీ సెక్రటరీ జనరల్ గా పని చేసి ప్రస్తుతం ‘ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్’ బోర్డ్ చైర్మన్ గా ఉన్న తొరయా ఒబైడ్ (Thoraya Obaid)

ఇరాన్, అమెరికాలలో ‘ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్’ వ్యవస్థాపక సభ్యురాలైన మెహ్ నాజ్ అఫ్ కామీ (Mahnaz Afkhami) “మా సంస్థ లింగ వివక్ష మూల కారణాలను అన్వేషిస్తుంద”ని అంటారు. దేశ దేశాల్లో పని చేసే వీరందరూ ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్ భాగస్వాములే!

సింధి మేదర్ గౌల్డ్ (Sindi Medar Gould) నాయకత్వంలో నైజీరియాలో పనిచేస్తున్న ఒక సంస్థ మహిళలపై హింసను నమోదు చేస్తుంది.

నైజీరియా నుంచి బాయోబాబ్ అనే సంస్థలో పని చేసే షిబోగూ ఓబెన్వా (Shibogu Obinwa) మహిళలకు జరిగే శరీర హింస నుండి తమను తాము రక్షించుకునే హక్కుల గురించి “నా శరీరం, నా ఇష్టం” అని చెప్పే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తారు.

హఫ్సాత్ ఆబియోలా (Hafsat Abiola) నైజీరియాలో ప్రజాస్వామ్య స్థాపనే తమ ధ్యేయమంటుంది.

టర్కీలో పని చేసే యాకిన్ ఎర్టర్క్ (Yakin Erturk)  మహిళల మీద అమలవుతున్న హింస గురించి ప్రస్తావిస్తారు.

అమెరికా నుంచి ఫ్రాన్సెస్ కిస్లింగ్ (Frances Kisling) మహిళలు లైంగిక పరమైన దుర్గార్గపు ఆలోచనలను ప్రేరేపించేవారుగా, పురుషులు దానికి బలవుతున్న వారుగా సమాజపు నరనరాన ఎందుకు ఇంకిపోయిందో అనేదాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

అమెరికా రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి కరీమా బెన్నౌన్ (Karima Bennoune) అమెరికాలో చట్టాల అమలు గురించి మాట్లాడతారు.

జాక్వెలిన్ పీటాంగ్వై (Jacqueline Pitanguy ) బ్రెజిల్ నుంచి తమ సంస్థ సమాజంలోని స్త్రీ-పురుష అసమానతల గురించి పనిచేస్తుందని చెప్తారు.

బహ్రెయిన్ నుంచి వాజీహా అల్ బహార్న (Wajihaa Albarna) తమ సంస్థ పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తుందని చెప్తారు.

మలేషియా నుంచి బెట్టీ యో (Betty Yeoh) పని ప్రదేశంలో వేధింపుల మీద తమ సంస్థ గురి పెడుతుందంటారు.శక్తివంతమైన అంతర్జాతీయ చట్టాల నుపయోగించి సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తుందని చెప్తారు.

మలేషియా లోని మ్యూస్ వా నుంచి జైనా అన్వర్ (Zainah Anwar) ముస్లిం పురుషులు స్త్రీలను కొట్టి, రకరకాల హింసలకు గురి చేస్తున్నారనే విషయాన్ని ప్రచారం చేసి ప్రజల మద్దత్తుని కూడగట్టడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్తారు.

జోర్డాన్ నుంచి అస్మా ఖాదర్ (Asma Khader) కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్త్రీల సమస్యల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ సంస్థ కృషి చేస్తుందంటారు. పరువు కోసం తన చెల్లెల్ని హత్య చేసిన కేసులో మహిళల నిరసన ఫలితంగా, ఆమె సోదరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి ముఖ్యమైన సందేశం ప్రజల్లో మార్పు తెస్తుందంటారు అస్మా.

లెబనాన్ నుంచి పని చేసే లిన హబీబ్ (Lina Habib) తమ సంస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుందని చెప్తారు.

ఐర్లండ్ నుంచి మేరీ రాబిన్సన్ (MARY ROBINSON) వారి సంస్థ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అని నినదిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందంటారు.

పాకిస్తాన్ నుంచి రబియా హది (Rabia HAdi) స్త్రీల పట్ల హింస అంతం కావాలంటే విద్య ద్వారా సాధికారత సాధించాలంటారు.

1993 డిసెంబర్ 20న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా మహిళలపై హింస నిర్మూలన గురించి ఒక ప్రకటన వెలువడింది. అందులో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తూ “స్త్రీల సమానత్వం, భద్రత, స్వేచ్ఛ, గౌరవం మొ.న హక్కుల పట్ల హామీ పడుతూ స్త్రీల పట్ల వివక్ష తగదని హెచ్చరించింది. మహిళల హక్కులు కూడా మానవ సార్వత్రిక హక్కులలో భాగమేనని ప్రకటించింది.

ఈ హక్కులు అమలు కావడానికి పితృస్వామ్యం పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని చెప్తారు ఈ ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ నాయకులు.

ఒక సంస్థ నుంచి మిగిలిన అన్ని సంస్థలూ సమాచారాన్ని,కష్ట-నష్టాలను పంచుకోవడం, ఒకరినుండి మరొకరు నేర్చుకోవడం ద్వారా వారి మధ్య కొన్ని భావ సారూప్యతలూ – కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వారి వారి లక్ష్యాల దిశగా పని చేస్తూ భవిష్యత్తులో ప్రజాస్వామ్య సమాజాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు.

అన్ని సంస్కృతుల, అన్ని తరగతుల, అన్ని తరాల లింగ పరిధుల్లో సంభాషణ నడుపుతూ మేము సంఘటితమై మా భాగస్వామ్య సామర్థ్యాన్ని పటిష్టపరచుకుంటూ మరింత విస్తరణకు ప్రయత్నిస్తున్నా మంటారు దీని నాయకులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చివరికి 1800 సంవత్సరం నుంచి మొదలై 1910 వరకూ కొనసాగి తమ రాజీ లేని పోరాటాలతో, చివరికి 140 మంది చికాగో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలోని మహిళా కార్మికుల ప్రాణత్యాగాలతో అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళ ఫలితంగా “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” ఏర్పడింది. ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని,సాధించుకోవలసిన సమస్యల కోసం భావి పోరాటాలకు సిద్ధం కావడం “అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” లక్ష్యం. పండగల్లాగా పట్టు చీరల బహుమతులతో,ముగ్గుల పోటీలతో జరుపుకుంటారు “ అంతర్జాతీయ మహిళా దినోత్సవం” – ఈ రెండిటికీ స్పష్టమైన తేడా ఉంది. అందరూ ఈ భేదాన్ని తెలుసుకోవాలి!

మహిళల మీద అమలవుతున్న హింసను ఎంతో హృద్యంగా  దృశ్యీకరించిన ఈ నాయకత్వం అసలు దీనికంతకూ మూలకారణమైన పెట్టుబడిని రవ్వంతైనా ఎక్కడైనా చెప్తారేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళార్పకుండా శ్రద్ధగా సినిమా చూశాను.పొరపాటున కూడా పెట్టుబడి ప్రస్తావన రానివ్వలేదు. అసలు జబ్బేమిటో తెలుసుకోకుండా బస్తాలు బస్తాలు మందులు మింగించినట్లుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సన్నాయి నొక్కుల ఉద్యమాల వల్ల ఉపయోగం ఉండదు.

ఎన్ని చట్టాలు వచ్చినా అవి అమలు కావు.మహిళల మీద హింస ఆగదు.దీనికి కారణం ప్రభుత్వాలను తమ పెట్టుబడితో వెనకుండి నడిపే కార్పొరేట్ శక్తులు.

” పెట్టుబడి అనే బండ రాయి కింద నలిగిపోతున్న చీమలు మన శ్రామికులు. పెట్టుబడి రాక్షసికి ఆహారం జంతువు ల్లాంటి మన శ్రామికులు “అని 16 వ శతాబ్దం లోనే తన “అన్నా కరేనినా నవల్లో నికొలాయ్ అనే పాత్రతో చెప్పిస్తారు టాల్ స్టాయ్. శ్రామికులవే బానిస బతుకులైతే, ఇక బానిసకు బానిసలైన స్త్రీల పరిస్తితి ఎంత హీనంగా ఉంటుందో చెప్పనే అక్కరలేదు !

“బీద వారినే కాదు,ఈ భాగ్యవంతుల్నీ వాళ్ళ గొప్ప తనాల భారాల నించీ, ఊపిరాడని గర్వాల నించీ,మర్యాదల నించీ,ఈర్ష్యల నించీ, చికాకుల నించీ తప్పించి, శాంతినీ, సంతోషాన్నీ, తృప్తినీ ఇచ్చి కాపాడే కమ్యూనిజం రావాల”ని కాంక్షించాడు చలం. అంతో ఇంతో సామాజికంగా,ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్న స్త్రీలకైనా స్వేచ్చ రావాలంటే ఈ అణచివేతలకు మూలకారణాలను అన్వేషించాలి!

*

గురి తప్పిన కథన బాణాలు!

 

-టి.చంద్ర శేఖర రెడ్డి 

~

అనిల్ ఎస్. రాయల్  రాసిన కథాయణం-వ్యాససంకలనంలో దృక్కోణం-1, దృక్కోణం-2 అని రెండు అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాల్లో,  రాసే కథని ఎవరి పరంగా చెప్పాలి అనే దానిమీద ఒక వర్గీకరణ ఉంది.

అందులో మొదటిది ‘ఉత్తమ పురుష’.

ఉత్తమపురుష కథనంలో కథకుడే స్వయంగా ఒక పాత్ర ధరించి కథ చెబుతాడు. అది ఒకటే పాత్రయితే ‘నేను’ కథ చెబుతాడు/చెబుతుంది. పాత్రలు అంతకన్నా ఎక్కువైతే ‘మేము’ కథ చెబుతారు.

దృక్కోణం-1 అనే అధ్యాయంలో ‘ఉత్తమపురుష’ కథనం ఎలా సాగాలి అన్న విషయం మీద కొన్ని సూచనలున్నాయి. ఈ సూచనలు ఇతర రచయితలు/రచయిత్రులు రాసిన కొన్ని తెలుగు కథల్లో ఎలా అమలయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి అన్నది తెలుసుకోవటానికి నేను-కథ 2014 అనే కథల సంపుటిని పరిశీలనకు ఎన్నుకున్నాను.

ఈ కథల సంపుటిలో మొత్తం 14 కథలు ఉన్నాయి. వీటిలో ఉత్తమపురుషలో చెప్పబడ్డ కథలు ఆరు.  అవి చావుదేవర-రచయిత్రి బత్తుల రమాసుందరి, గోధుమరంగు ఆట- రచయిత భగవంతం, నూనె సుక్క-రచయిత కొట్టం రామకృష్ణా రెడ్డి, భీష్మా…నాతో పోరాడు-రచయిత్రి రాధిక, ఐ హేట్ మై లైఫ్-రచయిత సాయి బ్రహ్మానందం గొర్తి.

నూనె సుక్క కథలో కొంత భాగం, అమ్మ చెపుతుంది. కాని, అమ్మ చెప్పిన కథాభాగం, కొడుక్కి  సంభాషణ రూపంలో చెప్పినట్లు ఉంటుంది. అంతే కాని ఆమె తనంతట తాను ‘నేను’ అని కథని చెప్పదు. మిగిలిన కథంతా, కొడుకు ‘నేను’ అని చెపుతాడు. కథలో సింహభాగం ఈ కథనమే ఆక్రమించింది.  అందుకని, అమ్మ మాటల తాలూకు భాగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఈ కథలో కథనాన్ని ఉత్తమపురుష కథనంగానే  స్వీకరించటం జరిగింది.

‘థూ’ కథని రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్- ‘నేను’ అంటూ చెప్పాయి.   అందుకని దీన్ని ఉత్తమపురుష లోనే బహుళ దృక్కోణ (Multiple Point of View) కథనంగా తీసుకోవడం జరిగింది. ఉత్తమపురుషలోఇది కథాయణంలో ప్రస్తావించబడని ఇంకో రకమైన ధోరణి.

పైన ఉదహరించిన ఆరు కథల్లో ఏ కథ కూడా, ‘మేం’ పరంగా చెప్పబడలేదు.

ఈ ఆరు కథల్లో-కథాయణంలో చెప్పబడ్డ సూచనలు ఎలా పాటించబడ్డాయో చూస్తే ఇదీ ఫలితం.

సూచన 1:

ఉత్తమపురుషలో కథ చెప్పేప్పుడు ‘నేను’ అనబడే కథకుడు, తన గురించి తాను వర్ణించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ఆకార విశేషాల, వేషభాషల వివరణ కథనానికి అత్యంత అవసరమైతే తప్ప చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పరోక్షవర్ణనకి దిగటం మెరుగు (వేరే పాత్ర ద్వారా సంభాషణలో చెప్పించటం, అద్దంలో పరికించి చూసుకోవటం, వగైరా).

ఎలా పాటించబడింది:

ఈ ఆరు కథల్లో, ఏ కథలో కూడా ‘నేను’ తనని తాను వర్ణించుకోలేదు.

సూచన 2:

ప్రధానపాత్రకి తెలిసిన విషయాలు, కథకి కీలకమైనవి, సస్పెన్స్ పోషించటానికో లేక ముగింపు దాకా పాఠకుల్ని మభ్యపెట్టటానికో ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టకూడదు.

ఎలా పాటించబడింది:

అలా తొక్కిపెట్టటం, ఏ కథలోనూ జరగలేదు.

సూచన 3:

కథ చెబుతున్న ‘నేను’ అనబడే వ్యక్తి పురుషుడా, మహిళా, చిన్నపిల్లవాడా, ముదుసలా… ఇటువంటి వివరాలు వీలైనంత త్వరగా పాఠకులకి చేరవేయాలి(ఆ వివరం దాచటం కథకి కీలకమైతే తప్ప).

ఎలా పాటించబడింది:

చావుదేవర,  ఐ హేట్ మై లైఫ్ కథల్లో; ‘నేను’ స్త్రీ అనే విషయం తో పాటు చిన్న పిల్లలనే విషయం కూడా  “పిల్ల భయపడింది’ అనే వాక్యం ద్వారా, “పరువు తీస్తున్నావు కదే?” అనే పదాల ద్వారా తెలుస్తుంది.

గోధుమరంగు ఆట, నూనె సుక్క కథల్లో; ‘నేను’ పురుషుడు అనే విషయం “ఈ ఎదురుగా ఉన్నవాడు తొందరగా వెళ్లిపోతే బాగుండును.” అనే వాక్యం ద్వారా,  “అమ్మ తాన కూకున్నోడ్ని”అనే పదాల ద్వారా  తెలుస్తుంది. ఇవే పదాలు, నూనె సుక్క కథలో ‘నేను’ చిన్నపిల్లాడు అనే విషయం కూడా చెపుతాయి.

భీష్మా…నాతో పోరాడు కథలో ‘నేను’ పేడి అనే విషయం 117 వ పేజీలో ఉన్న “మగ పిల్లవాడు పుట్టటం” అనే పదాలూ, అది ‘పాక్షికంగా నిజం’ అన్న విషయాన్ని 118 వ పేజీలో ఆ పాత్ర ప్రవర్తనా తెలుపుతాయి. ఆ తర్వాతి కథనం, ‘నేను’ పెరిగి పెద్దవాడయ్యాడనే విషయం చెపుతుంది.

ఈ వివరం చెప్పటానికి ‘గోధుమరంగు ఆట’ కథారచయిత అవసరమైనదానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నట్లు కనపడ్తోంది. అయితే, అది, పాఠకుడు కథను అనుసరించడానికి ఆటంకంగా పరిణమించలేదు.

థూ- కథని చెప్పిన రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్ గురించిన వివరాలని ఆ పేర్లే చెప్పాయి.

 

 

సూచన 4:

కథ చెపుతున్న పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు (ఇతరుల ఆలోచనలు, తాను లేని సన్నివేశాల్లో సంఘటనలు, వగైరా) ప్రస్తావించకూడదు.

ఎలా పాటించబడింది:

చావుదేవర, గోధుమ రంగు ఆట, ఐ హేట్ మై లైఫ్ కథల్లో ఈ సూచన ఖచ్చితంగా అమలైంది. నూనె సుక్క కథ ముందుకు నడవాలంటే, ‘నేను’ కి తాను లేని కొన్ని విషయాలు గతంలోవి తెలియాలి. కాని, అలా తెలియడం కథనానికి ఎన్నుకున్న ధోరణికి సరిపడదు. అందుకనే, కథకుడు అమ్మ మాటల ద్వారా ‘నేను’ కి ఆ విషయాలు తెలిసేలా చేశాడు. ఉత్తమ పురుష కథనానికి ఈ వెసులుబాటు లేదు. అయినా, కథలో సింహభాగం ఉత్తమపురుష కథన ధోరణికి లోబడి ఉంది కనక ఈ వైరుధ్యం ప్రశ్నార్థకంగా అనిపించలేదు.

భీష్మా…నాతో పోరాడు కథలో మాత్రం; ఒక్క చోట, 121 పేజీలో కుంతి తన కుమారులను సంస్కారవంతులుగా పెంచింది…దగ్గరనుంచి, ద్రౌపదిని అయిదుగురికి భార్యగా చేసింది-అనే పదాల వరకు; కథలో ’నేను’ తాను లేని చోట ఏం జరిగిందో తెలియపరుస్తుంది. ఈ భాగం ఒక్కటే, ఈ కథలో ఉత్తమపురుష కథనధోరణికి వ్యతిరేకంగా నడిచింది.

దృక్కోణం-2 అధ్యాయం మిగిలిన రెండు రకాల కథనం గురించి వివరిస్తుంది.

దాంట్లో ఒకటి  మధ్యమపురుష.

మధ్యమపురుష

ఉత్తమపురుష కథనంలో కథ ‘నా’ కోణం నుండి నడిస్తే, మధ్యమ పురుషంలో అది ‘నీ’ కోణంలో నడుస్తుంది. అలాంటి కథలు అరుదుగా కాని కనిపించవు. తెలుగు కథల్లో ఆ పద్ధతిలో చెప్పబడ్డ కథ వి. ప్రతిమ గారు రాసిన ‘విత్తనం’ కథ. ప్రాతినిధ్య- కథ-2014 సంకలనంలో ఉంది. సంకలనంలో చేరటానికి ముందు ఈ కథ చినుకు మార్చి 2014 సంచికలో, ‘మనిషి విత్తనం’ పేరుతో ప్రచురితమైంది. కథనంలో; నీ, నువ్వు, నిన్ను, నీకు-అనే పదాలే కాకుండా, ప్రధాన పాత్ర భర్తని మీరెడ్డి-మీ ఆయన, మీ అత్తగారు, మీ మామగారు, మీ అత్తగారి తల్లి, మీ అత్తమామలు అనటం కథ పఠనీయతని కొంచెం దెబ్బతీసింది. ఈ సందర్భాల్లో కూడా ‘నీ’ అని రచయిత్రి రాసి ఉండొచ్చును. కాని, అలా జరగలేదు.

మధ్యమ పురుష ధోరణిలో కథ చెప్పినపుడు; కథని చెపుతున్న వ్యక్తి తప్పనిసరిగా కథలో సంఘటనలకి సాక్షి అయి ఉండాలి. అది రచయిత/రచయిత్రి లేదా మరే ఇతర వ్యక్తి అయి ఉండాలి.  కాని, ఈ కథ ఇతివృత్తం దృష్ట్యా ఈ కథలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేనివి. అందువల్ల ఈ కథనధోరణి ఈ కథకి పూర్తిగా నప్పిందని అనిపించలేదు.

 

ప్రథమపురుష

మిగిలిన మూడో పద్ధతి కథనం-ప్రథమ పురుష. నా వర్గీకరణ ప్రకారం కథ 2014 కథాసంకలనంలో ఉన్న-ఆకులు రాల్చిన కాలం-రచయిత పాలగిరి విశ్వప్రసాద్, రోహిణి-తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, ఇస్సాకు చిలక-అద్దేపల్లి ప్రభు, నిశ్శబ్దపు చప్పుడు-మధురాంతకం నరేంద్ర, ప్రవల్లిక నిర్ణయం-యాజి, పాంచాలమ్మ పాట-స.వెం. రమేశ్, ది కప్లెట్-కల్పనా రెంటాల, వాళ్లు ముగ్గురేనా?-విమల; ఈ ఎనిమిది కథలూ ఈ పద్ధతి కథనంలో చెప్పినవి.

ఈ కథలు, ‘ప్రథమ పురుష’ కథనానికి ఎలా, ఎంతవరకు లోబడి ఉన్నాయి- అన్న విషయం మీద పరిశీలన మరో సారి.

-o)O(o-

 

రెండు సంఘటనలూ రెండు పాత్రలూ వొక నిరసన : థూ

 

 

-ఎ.కె. ప్రభాకర్ 

~

 

‘అందరూ నిర్దోషులైతే మరి చుండూరు దళితుల్ని చంపిందెవరు?’

చుండూరు దళితులపై అగ్రవర్ణాల మారణకాండ జరిగిన (1991 ఆగస్ట్ 6) యిరవై మూడేళ్ళకి హైకోర్ట్ డివిజినల్ బెంచ్ ఆ కేసులో యిచ్చిన తీర్పు ( 2014 ఏప్రిల్ 22) ని ప్రశ్నిస్తూ దళిత – హక్కుల – ప్రజా సంఘాలు వేసిన పెను కేక యిది. ఈ ప్రశ్నకి యింకా సమాధానం లభించాల్సే వుంది కానీ ఆ తీర్పుపై బలమైన నిరసనగా వెలువడ్డ సంచలనాత్మక కథ

( విశాలాంధ్ర – ఆదివారం, జూన్ 15 , 2014). రచయితగా పి వి సునీల్ కుమార్ తక్షణ స్పందన సాహిత్య లోకంలో చిన్నపాటి దుమారం లేపింది. కథ లోపలి , బయటి విషయాల మీదా చర్చలు జరిగాయి. కథలో ప్రస్తావితమైన సామాజికాంశాల గురించి సంఘటన పూర్వ పరాల గురించి రచయిత దృక్పథం గురించి దాన్ని కథలోకి తీసుకురావడంలో సాఫల్య వైఫల్యాల గురించి కళావిలువల గురించి రచనా శిల్పం గురించి కథ చదివాకా చదువరుల్లో కలగాల్సిన క్రియాశీల స్పందన గురించి స్థూలంగా సాహిత్య ప్రయోజనం గురించి వొక్క ఫేస్ బుక్ లోనే దాదాపుగా పాతిక పేజీల వరకు చర్చ జరిగింది. కథ యెంత ఆలోచింపజేసిందో ఆ చర్చలు కూడా అంతే తీవ్రంగా బుర్రకి పనిబెట్టాయి.

రచయిత కథలో తన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి భిన్న పద్ధతుల్ని పాటిస్తాడు. సర్వసాక్షి దృష్టి కోణంలో కథ నడిపిపేటప్పుడు  కథనంలోనో ముగింపులోనో రచయితే తన ఆలోచనల్ని స్వయంగా ప్రకటిస్తాడు. ఆ తరహా కథల్లో పాఠకులకి పెద్ద పనేం వుండదు.  సర్వసాక్షి కథనాన్ని రచయితా పాఠకుల మధ్య జరిగే సంభాషణ అనుకొంటే అటువంటి  కథలు యేకముఖ సంభాషణల్లాంటివి. అప్పుడు పాఠకుడు కేవలం శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం వుంది. దాన్నుంచీ తప్పించుకొని పాఠకుల ఆలోచనకి చోటూ వెసులుబాటూ వ్యవధి యివ్వడానికి తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కథకుడు  అనుకూలమైన పాత్రల్ని – కంఠ స్వరాన్ని యెన్నుకొంటాడు. చాలా సార్లు సంభాషణల ద్వారా చెప్పిస్తాడు. లేదా పాత్రల బాహ్య అంతరంగ ప్రవృత్తుల ద్వారా  ఆవిష్కరిస్తాడు. అందుకు అనుగుణమైన సంఘటనల్ని సృష్టిస్తాడు. సంఘర్షణని చిత్రిస్తాడు. ఆ యా సందర్భాల్లో అవసరాన్నిబట్టీ ఆత్మాశ్రయ కథనాన్ని ఆశ్రయిస్తాడు. ప్రతీకలని నిర్మిస్తాడు. అన్యాపదేశాల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఒక్కోసారి టెక్నిక్ పరంగా సరైన జాగరూకత లేకుంటే కథనంలో పాత్రల్లో రచయిత  చొరబాటు జరగొచ్చు. ప్రతిభా నైపుణ్యాలున్న రచయిత మాత్రమే స్వీకరించిన కథా వస్తువు డిమాండ్ చేసిన శిల్పంతో  పాఠకుడికి దగ్గరవుతాడు.

సునీల్ కుమార్ చుండూరు మారణకాండనీ దానిమీద పెద్ద  కోర్టులో వెలువడ్డ జడ్జిమెంట్ నీ కథలో ప్రధాన సంఘటనలుగా – కథాంశాలుగా తీసుకొన్నాడు. కులాలు కాలాలు మార్చలేదు గానీ స్థలాలు మార్చాడు. పాత్రల పేర్లు మార్చాడు. తణుకు ప్రాంతంలో జరిగినట్టు పేర్కొన్నాడు. స్థానికత కోసం  అయితంపూడి లాకులు దగ్గర శవాలు దొరికినట్టు వొకటి రెండు మార్పులు జోడించాడు. కామందు పేరుకి ప్రతీకాత్మకంగా రెడ్డీ నాయుడూ రెండూ తగిలించాడు. మిగిలిన కథంతా అదే.

దళిత కులానికి చెందిన జోసఫ్ కొడుకు సాల్మన్  రాజు అతన్తో పాటు తణుకు కాలేజీలో చదువుకొనే వూరి  ‘కామందుల ఆడపిల్లని యిష్టపడ్డాడు. ఆ పిల్లా ఆడ్ని ఇష్టపడింది… కామందులకి ఇది గిట్టలేదు.’ అది గొడవకి దారితీసింది. కామందుల కుర్రాళ్ళకి మండి ‘ఏరా మాలనాకొడకా’ అని కులం పేరుతో ఘర్షణకి దిగారు.

దీన్ని వూరి కామందు బసివిరెడ్డి నాయుడి మాటల్లో చూద్దాం:

‘మాటా మాటా పెరిగింది . అక్కడితో ఆగాలా ? ఆ రాజుగాడు ఆడికి తోడు మిగిలిన మాలమాదిగ కుర్రనాయాళ్ళు కలిసి కామందుల పిల్లల్ని, కనీసం పెద్ద ఇళ్ళ పిల్లలే అన్న ఇంగితం లేకుండా , పెద్దంతరం , చిన్నంతరం లేకుండా చేయ్యిచేసుకున్నారండి… ఎంత దారుణం.

రామరాజ్యం కోసం కలలు కన్న గాంధీగారు, ఇప్పుడు కలలు కంటున్న మోడీగారూ ఈ సంగత్తెలిస్తే ఎంత కుమిలిపోతారు?

ధర్మం ఇప్పటికే ఒంటికాలి మీద కుంటుతుంది. ఇలా వదిలేస్తే ఇంకేమీ మిగలదు కాబట్టి, ఈ కాస్త ధర్మాన్నన్నా నిలబెట్టడానికి ఈ కడజాతి కుక్కలకి బెత్తం దెబ్బ చూపిద్దాం అని పెద్దలంతా అనుకుని ఓ తీర్మానం చేసుకున్నామండి. అది కాస్త మోతాదు ఎక్కువైంది.’  

మోతాదు ఎంత యెక్కువైందో జోసఫ్ మాటల్లో చూద్దాం:

‘ ఆ రోజు రాత్రి చూడాలి బాబూ. రాములోరి రథ యాత్ర జరిగినట్టు మా మీద దండెత్తేరు. కత్తులు, కటార్లు, ఈటెలు, బళ్ళేలు పట్టుకుని వచ్చేరు… మా గుడిసెలకి నిప్పెట్టేరు. మా అమ్మల్ని మానాల మీద తన్నేరు. మా ఆడబిడ్డల్ని మళ్ళా పాడుచేసేరు. దొరికినోడ్ని దొరికినట్టు నరికేరు. ఎంటపడ్డారు. ఎగబడ్డారు. నరికేశారు. కిందేసి తొక్కేశారు. గోనెసంచుల్లో కుక్కేశారు. పంట కాలవలో పడేశారు.’

ఆ దాడిలో ఇరవై ఏళ్ళు అత్తారబత్తంగా పెంచుకున్న జోసఫ్ కొడుకు (రాజు)తో సహా మొత్తం పదిమందిని చంపేశారు. ఒక కుంటోడు జోసఫ్ కాలిరగ్గొట్టి అతన్ని కుంటి జోసఫ్ చేసాడు.

అదిగో … అప్పుడు … ఆ పాశవిక దాడిలోనే  ఇగిరిపోయింది జోసఫ్ నోట్లో తడి. అతనికి యెన్నోసార్లు  ‘ఉయ్యాలనుంది… దేవుళ్ళ మీదా … మమ్మల్ని మనుషులు కాదన్న వాళ్ళమీదా … కడజాతివాళ్ళని అన్నవాళ్ళమీదా …’ ఉయ్యాలన్నా ఉయ్యలేడు.

అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో కింది కోర్టులో దాడిచేసినవారికి శిక్షలు పడ్డాయి(చుండూరు కేసులో విచారణకి సంఘటనా స్థలిలోనే స్పెషల్ కోర్టు యేర్పాటైంది – దళితులపై దమనకాండని  విచారించడం కోసం వొక ప్రత్యేక కోర్టు యేర్పడడం దేశంలో అదే తొలిసారి. సంఘటన జరిగిన పదహారేళ్ళకి  2007 లో యాభై ఆరు మందిని దోషులుగా నిర్ధారించి ఆ కోర్టు శిక్ష విధించింది).

కానీ పై కోర్టులో రెడ్డి తోక తగిలించుకొన్న జడ్జి యిచ్చిన తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొన్న వారికి అశనిపాత విస్మయం కల్గించింది.

న్యాయమూర్తి అందరూ నిర్దోషులే అని తీర్పు చెబుతూ ‘ఇంకా కులాలెక్కడున్నాయి?’  అన్నాడు.

‘దొంగ కేసు’ అని తేల్చేసాడు.

జోసఫ్ ‘నోట్లోంచి మాట రాలే … మాట బదులు ఉమ్మొచ్చింది…’

‘ముంతలో పడాల్సింది పొరపాట్న ఆయన మొగాన పడింది …

థూ …’

అదీ కథకి ముగింపు.

p v sunil kumar

కథలో వాస్తవానికి రెండు దాడులు జరిగాయి. మొదటిది దళితులపై భౌతికంగా జరిగిన దాడి. రెండోది – దాని వ్యవస్థీకృత రూపం.  కులమే  రెండుచోట్లా కారణం. బాధితుడి నోట్లో తడి ఆరిపోయి ఉమ్మి రాకుండా నోరెండిపోయి నెరళ్ళు విచ్చుకున్న బీడు పొలంలా తయారయ్యే పరిస్థితికి కారణమైన సంఘటన మొదటిది. అది తరాలుగా అమలౌతున్న సామాజిక క్రౌర్యాన్ని ఆవిష్కరించిన భయావహ సంఘటన. అది ఆంధ్రప్రదేశ్, తమిళ్నాడు , బీహార్ , మహారాష్ట్ర, రాజస్తాన్ – దేశంలో యే మూలైనా దాడి చేసేది రెడ్డినాయుళ్ళు, భూమిహారుల రణవీర్ సేన , కుంబీలు , జాట్ లు వంటి ‘కులీను’లైతే   వేటాడబడేది బలయ్యేది మాత్రం ‘కులహీను’లైన దళితులే. రాజ్యాంగ బద్ధమైన సామాజిక న్యాయం కోరడమే ఆత్మగౌరవంతో పీడన లేకుండా బతకాలనుకోవడమే  వేటకి కారణం. మూడేళ్ళ పసి బిడ్డా    డెబ్భై యేళ్ళ వృద్ధులా – ఆడా మగా అని చూడకుండా విచక్షణా రహితంగా చంపేసిన  కిలవేన్మణి (1968) మొదలుకొని – బథానీ టోలా (1996)లో రణవీర్ సేన సాగించిన మారణహోమం , ఖైర్లాంజీ దురాగతాల  మీదుగా నిన్న మొన్నటి లక్షింపేట , యివాల్టి వేముల రోహిత్  హత్యల వరకూ అన్ని దారుణాలలో నేరస్తులంతా శిక్షలు లేకుండానే బయటపడతారు. హతులు వుంటారు – హంతకులుండరు.  హంతకుల కులం పాలకుల కులం న్యాయమూర్తుల కులం వొకటే కావడం యెంత చక్కటి రాజకీయ నీతి?

ఈ వ్యవస్థీకృత దుర్నయం పట్ల తీవ్రమైన అసహ్యాన్ని వ్యక్తంచేయడానికి ఛీత్కారాన్ని ప్రకటించడానికి జోసఫ్ నోట్లో  వుమ్మడానికి మళ్ళీ నోట్లో నీరూరాయి. ‘థూ …’ ఆ విధంగా రచయిత ధర్మాగ్రహ ప్రకటన రాజకీయ – సామాజిక  నిరసన.

వాస్తవ సంఘటనలు వాటికవే కథలు కావని కొందరు , బసివిరెడ్డి నాయుడు కుంటి జోసఫ్ యీ రెండు పాత్రల్ని తీసేస్తే యిది కేవలం వొక వార్త మాత్రమేననీ మహా అయితే వార్తాకథనం కావొచ్చేమోనని కొందరూ, సంఘటనలు జరిగిన సందర్భాల్లో తత్క్షణ ప్రతిస్పందనలుగా వచ్చే యిటువంటి రాతలకు సాహిత్య విలువని ఆపాదించలేమని  మరికొందరూ, బసివిరెడ్డి నాయుడి పాత్ర చిత్రణలో శిల్ప విషయికంగా జరిగిన పొరపాటు వల్ల మంచికథ కాలేకపోయిందని , ఆ విధంగా రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని యింకొందరూ విమర్శపెట్టారు. కథని బాధితుల పక్షం నుంచి చూడాలన్న వాదాన్ని కూడా యెద్దేవ చేసారు. జరిగిన ప్రతి సంఘటనా సాహిత్య వేషం ధరించి విసువు పుట్టిస్తుందని కొత్తదనం వుండడం లేదని అందువల్ల మూస కథలు మాత్రమే వస్తున్నాయని  కథా ప్రేమికులు బాధపడ్డారు. సున్నితమైన  సమకాలీన  సంఘటనల్ని వర్ణించినంత మాత్రాన కథని మెచ్చుకొని తీరాలా అని వాదించారు. శిల్పాన్ని ముందుకు తెచ్చి కథలో  స్వీకరించిన  వస్తువుపట్ల కూడా అసహనం వ్యక్తం చేసారు  (అట్రాసిటీ గురించి గాక అట్రాసిటీ చట్టాల దుర్వినియోగం గురించి కథ రాస్తే ఆహ్వానించడానికి వారికి అభ్యంతరం లేదు).

ముందుగా గుర్తించాల్సిన విషయం – సమకాలీన సామాజిక సంఘటనలు సాహిత్యంలోకి యెక్కకూడదని గిరిగీసుకోవాల్సిన అవసరం లేదు. అలా గీసుకొంటే చివరికి మనకి మిగిలేవి అలౌకికమైన దెయ్యాలు – భూతాల హారర్ కథలూ గ్రహాంతరవాసుల సూడో సైన్స్ ఫిక్షన్ కథలూ అభూతకల్పనా ప్రపంచపు కథలేనేమో!  [కిలవేన్మణి దళితుల వూచకోత – యథార్థ సంఘటన నేపథ్యం చేసుకొని  ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుతిప్పునల్’ నవలకి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు (1977) వచ్చింది. ఆ తర్వాత అది సినిమాగా కూడా గొప్ప ప్రశంసలు పొందింది – వాస్తవాలు కళలై చరిత్రలోకెక్కడానికి యిదొక ఉదాహరణ మాత్రమే]

వాస్తవాన్ని కళగా రూపొందించడంలో శిల్ప వస్తువుల ప్రాధాన్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అనివార్యమైన అవసరాన్ని మరోసారి ‘థూ…’ కథ కల్పించింది అనడంలో యెటువంటి సందేహం లేదు. నిజమే కథ వుపన్యాసంలానో వ్యాసంలానో వుండకూడదు. వస్తువుని వున్నతీకరించడానికి అవసరమైన శిల్పాన్ని సమకూర్చుకోవాలి. అది రచయిత దృక్పథాన్ని ఆవిష్కరించడానికి దోహదం చెయ్యాలే గానీ ఆటంకంగా పరిణమించ కూడదు. కథకి ఆత్మ దృక్పథమే. అది యే మేరకు  పాఠకులకి చేరింది అన్నదాన్ని బట్టీ కథ మంచి చెడ్డలని నిర్ధారించాలి.

థూ… కథలో కథ చెప్పిన రెండు పాత్రలు – బసివిరెడ్డి నాయుడు , జోసఫ్  భౌతికంగానే కాదు  గ్రామంలో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా కూడా   సంఘర్షించుకొనేపాత్రలు. ఒక సామాజిక భీభాత్సానికి భిన్న దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిద్వంద్వి పాత్రలు. రెండు వైపుల అటు చివర యిటు చివర వైరి శిబిరాల్లో  నిలబడ్డ భిన్న పాత్రలు. వాటి గొంతు వేరు , భాష వేరు , జీవితానుభవాలు వేరు. వాటి సారం వేరు. వీటి మాధ్యమంగా కథ చెప్పదల్చుకొన్నప్పుడు సాంప్రదాయిక రచనా పద్ధతులననుసరించి  రచయిత యేదో ఒక వైపు వుండాలి ; ఒక నిర్దిష్ట కంఠ స్వరాన్ని  యెన్నుకోవాలి. కానీ ఈ కథలో రచయిత పాటించిన టెక్నిక్ ఇద్దరి ద్వారా కూడా తను చెప్పదల్చుకొన్న భావజాలాన్ని ప్రకటించడం. అదే విమర్శకి కారణమైంది. బసివిరెడ్డి నాయుడి సంభాషణలకి వ్యంగ్యాన్ని ఆశ్రయించడం  నప్పలేదనీ  , పాత్రౌచిత్యం దెబ్బతిందనీ  విమర్శకులు భావించారు.

అయితే యీ విమర్శలన్నిటికీ సమాధానమా అన్నట్టున్న రచయిత చెప్పిన మాటలు గమనార్హాలు :

‘బాణం గుండెలో దిగితే బాధలా ఉంటుంది. అదే బాణం గుండెలో దింపినవాడికి వినోదంలా ఉంటుంది. వస్తువు అదే, కానీ అది ఒకడికి సంతోషాన్ని, మరొకడికి చావుని ఇస్తోంది. వ్యవస్థ అయినా సంఘటన అయినా బలిసినవాడికి ఒకలా , బక్కోడికి మరోలా కనబడతాయి. వ్యవస్థలో ఏ ఒక్క సంఘటనా కారణం లేకుండా జరగదు. సామాన్యుడికి సత్యం తెలిస్తే వాడు వ్యవస్థని ఎలా సమ్మానిస్తాడో అదే … ఈ థూ…. ఇది కథ కాదు, వ్యవస్థ ఎక్స్ రే, సి.టి.స్కాన్ …’ (కథ 2014 , కథాసాహితి)

అవును కదా – ఎక్స్ రే, సి.టి.స్కాన్ పిల్మ్ లు కలర్ ఫొటోగ్రాఫ్ లంత అందంగా కనపడకపోతే టెక్నీషియన్ని తప్పుపట్టలేం.

నిజానికి సవర్ణులు మనసు లోపల అనుకొనే మాటల్నే రెడ్డినాయుడు బయటికి అన్నాడు. న్యాయాన్ని బలిమితో చెరబట్టినవాడు కోర్టు మెట్ల మీదే బసివిరెడ్డి నాయుడులా మాట్లాడగలడు. పాఠకులు ఆ మాటల వెనక వున్న అగ్రకుల అహంకారాన్నీ ఆధిపత్య స్వభావాన్నీ  రాజకీయ అధికారం ఇచ్చిన పొగరుమోతుతనాన్నీ చట్టాల్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన నిర్లక్ష్యాన్నీ  న్యాయవ్యవస్థ మొత్తం తమ కనుసన్నల్లోనే నడుస్తుందన్న  ధీమానీ స్పష్టంగా చూడగలరు. ఒకటి రెండు చోట్ల అవి అతిశయించిన దాఖలాలు యెత్తిచూపగలమేమో గానీ రెడ్డినాయుడి మాటలు అసహజాలు కావు ; ప్రస్తావితమైన అంశాలు అసత్యాలైతే అసలు కానే కావు.

ఇటీవల పాటియాలా కోర్టు ఆవరణలోనే కన్హయ్య మీద లాయర్లు దాడి చేయడం  , మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం , అందుకు సన్మానాలు చేయించుకోవడం , జైలుకెళ్ళి అక్కడకూడా అతన్ని కొడతామనీ అంతుచూస్తామనీ బహిరంగంగా మీడియా ముందు హెచ్చరించడం , కన్హయ్య నాలుక కోసినవాడికి లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఫత్వాలు జారీ చేయడం యివన్నీ చూసినపుడు బసివిరెడ్డి నాయుడు మాటల్లో అహంకారం గానీ వ్యంగ్యంగానీ కృత్రిమంగానో అనుచితంగానో అనిపించవు. తన ఫ్యూడల్ ఆలోచనలకి ఆచరణకీ ప్రజాస్వామ్యం ముసుగు వేసుకోవాల్సిన అవసరం సందర్భం అతనికి కనిపించలేదు. సమాజంలో రెడ్డినాయుళ్ళు బోరవిరుచుకొని తిరుగుతూ సాహిత్యంలోకి జబర్దస్తీగా తోసుకురావడంలో వైపరీత్యం యేమీ లేదు.

అందుకే  వర్ణ ధర్మ పరిరక్షణ అవసరం గురించి రామరాజ్య స్థాపన గురించి అందుకు పాలక వర్గాలు పడుతున్న కష్టాల గురించి స్వాతంత్ర్యం తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయాధికార బాధ్యతలతో ప్రజా పాలన భారంతో పై కులాల ప్రభువులు చేస్తున్న త్యాగాల గురించి తాము దయతో జాలితో అమలు జేస్తున్న యస్సీ యస్టీ రిజర్వేషన్ల గురించి వోటేసి తమకు అధికారం కట్టబెట్టినందుకు ఔదార్యంతో తాము ప్రవేశపెట్టిన  మాల మాదిగల సంక్షేమ పథకాల గురించి    రెడ్డి నాయుడు తన దృష్టికోణం నుంచి చాలా విస్తృతంగానే యేకరువు పెట్టాడు. కథలో యివన్నీ యిమడతాయో లేదోనన్న ప్రశ్నని  కాసేపు పక్కనబెడితే బసివిరెడ్డినాయుడి ముఖత: వెలువడ్డ మాటల్ని  పదే పదే చదవగా అతడి portrait ని చిత్రించడం రచయిత వుద్దేశం కాదనీ –  అగ్రకుల పెత్తందారీ తనానినికి archetypical caricature గా అతణ్ణి బ్లాక్ అండ్ వైట్ లో గీయడమేననీ నాకు బోధపడింది. ఆ గీతల్ని పతంజలి వ్యంగ్యచిత్రాల్తో పోల్చడం సాహసమే గానీ , రాజు గారి బామ్మర్ది అయిన కారణంగా న్యాయస్థానంలో న్యాయాన్ని తిమ్మిని బమ్మి చేయడానికి పూనుకొన్న శూద్రకుడి శకారుడితో కొంతవరకు పోల్చవచ్చు.  అందువల్ల రెడ్డినాయుడి మాటల్లో ఆధునిక మనువాదం వికృతంగా వినిపించడం అసంగతమేం కాదు. శిల్పానికొచ్చిన లోటేం లేదు. ఆధునిక కథా నిర్మాణ సూత్రాలూ కొలతలూ పక్కనబెట్టి సంప్రదాయ దేశీయ కథా రీతుల వెలుగులో చూస్తే రచయితగా సునీల్ కుమార్ నడిచిన దారి తెల్లమౌతుంది.

చిందు కళాకారులు ప్రదర్శించే జాంబ పురాణం దాదాపు యీ టెక్నిక్ లోనే నడుస్తుంది. చిందు జాంబ పురాణం సంవాద రూపంలో వుంటుంది. రెండే పాత్రలు – వొకరు  బ్రాహ్మణుడు మరొకరు మాదిగ ఆదిజాంబవుడు. అందులో బ్రాహ్మణుడు వర్ణ దురహంకారానికీ  ఆది జాంబవుడు ఆత్మగౌరవానికీ ప్రతీకలు. అక్కడ కూడా బ్రాహ్మణుడు అచ్చు బసివిరెడ్డి నాయుడిలానే ప్రవర్తిస్తాడు. ఆది జాంబవుడు తార్కికంగా జవాబులు చెబుతాడు.  అయితే రెండు పాత్రలూ నటించేది చిందు మాదిగలే కాబట్టి బ్రాహ్మణుడి ఆలోచనల్లోకి సంభాషణల్లోకి అహంకార ప్రకటనల్లోకి ఆ కళాకారుడు తన జీవన నేపథ్యంతో సహా చొరబడతాడు. అప్పుడు అతని మాటల్లోకి వ్యంగ్యం హాస్యం అధిక్షేపం అసహనం అవహేళన  అన్నీ వచ్చి చేరతాయి. అవన్నీ ప్రదర్శన రక్తి కడటానికే దోహదం చేస్తాయి తప్ప ప్రేక్షకులకి యెబ్బెట్టుగా తోచవు. చిందు ప్రదర్శన జాంబవుడి విజయంతో అంతమైతే ‘థూ…’ కథ కుంటి జోసఫ్ నిరసనతో ముగుస్తుంది.

చిందు జాంబ పురాణంలో బ్రాహ్మణ జాంబవుల పాత్రలు రంగం మీదకి రావడానికి వొక ప్రవేశిక ( prologue ) వుంటుంది. దాన్ని సూత్రధారుడిలాంటి వారు నిర్వహిస్తారు. ‘థూ…’ కథ లో రచయిత పాత్ర కూడా రెడ్డి నాయున్ని , జోసఫ్ ని అలాగే ప్రవేశపెట్టి నిష్క్రమిస్తుంది. అయితే కథలో రచయిత – కథా రచయితా వొకరు కాదు. కథలో రచయిత వొక పాత్ర. అతడు కూడా  వొక వర్గానికి ప్రతినిధి. పేదల ఏడుపులూ పెడబొబ్బల కథలు అతనికి నచ్చవ్ , ప్రేమకతలు కావాలి. ఈ పాత్రని నెపం చేసుకొని సాహిత్యంలో పాతుకుపోయిన విలువల పైన నిలవ యీస్తటిక్స్ పైన కూడా సునీల్ కుమార్ వ్యంగ్యాన్ని గుప్పించాడు (కథలోని ఈ పొర కూడా కొందరికి వూపిరాడనివ్వలేదేమో!). తను ప్రతిపాదించే వస్తువు పట్లా వాడిన టెక్నిక్ పట్లా సాహిత్యకారుల ప్రతికూల స్పందనని అతను ముందుగానే వూహించినట్లున్నాడు.

తరతరాలుగా అనేక సామూహిక బృందాల గూడుకట్టుకొన్న దు:ఖానికీ ఆగ్రహానికీ అక్షరావిష్కరణ ‘థూ…’ . సంవత్సరాల తరబడి న్యాయం కోసం యెదురుచూసి భంగపడ్డ వారి క్రోధాక్రందన అది. ఏడుపు అందంగా లేదనో ఆలంకారికంగా లేదనో కళాత్మకంగా లేదనో యింకాస్త బాగా యేడవొచ్చుగదా అనో ఫిర్యాదు చేసేవాళ్ళకి యేదైనా అనుభవంలోకి వస్తేగానీ తత్త్వం బోధపడదు.

జోసఫ్ తాత మూతికి ముంత కట్టుకొని వుమ్మొస్తే నేల మీద వుయ్యకుండా ముంతలో వూసేవాడు. ముడ్డికి యేలాడే తాడూ దాని చివర తాటాకు – అతను నడిచించోట అది తుడిచేసేది. అంటరానివాడొత్తన్నాడు తొలగండని చేతిలో గంట వాయిస్తూ  బేపనవారికి హెచ్చరిక చేసేవాడు. జోసఫ్ కొడుకు తరానికి వచ్చేసరికి ఆ ‘మర్యాద’ నుంచీ బయటపడి ముడ్డి మీద మంచి గుడ్డ కట్టుకొని బడికెళ్ళి నాలుగక్షరాలు నేర్చుకొని మనిషిలా బతకాలని కోరుకోవడం  నేరమైంది. చావుకి కారణమైంది. దళితుల అటువంటి చావులు దేశంలో సగటున రోజుకి రెండు జరుగుతూ వుండగా అందుకు వ్యవస్థీకృతమైన మద్దతు ఆమోదం లభిస్తున్నప్పుడు ఆ సామాజిక విషాదాన్ని దురన్యాయాన్ని యిన్ సైడర్ గా వొక దళిత రచయిత మాత్రమే బలంగా ఆవిష్కరించగలడని చెప్పడానికి  ‘థూ …’ మంచి వుదాహరణ. సరైన సమయంలో అవసరమైన కథని యింత నిర్దిష్టంగా నిజాయితీగా  రాసినందుకు సునీల్ కుమార్ కి అభినందనలు.

తాజాకలం  : బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూనే పాలకులు ఆయన 125 సంవత్సరాల జయంతి వేడుకలు జరపడం గొప్ప ఐరనీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత గురించి అంబేద్కర్ ఆలోచనల గురించి  కరీంనగర్ బార్  అసోసియేషన్  ఏర్పాటుచేసిన సభలో చుండూరు కేసులో తీర్పు యిచ్చిన జడ్జి వుపన్యాసాన్ని కొందరు న్యాయవాదులు అడ్డుకొన్నారు(చూ. http://indiatoday.intoday.in/story/ex-hc-judge-faces-lawyers-protest-over-dalit-murder-verdict/1/593897.html). మర్నాడు అందుకు బాధ్యులైన నలుగురు  లాయర్లని బార్ అసోసియేషన్  సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వార్తకీ ఈ కథకీ చుట్టరికం వుండడం వల్ల యిక్కడ నమోదు చేయడమైంది తప్ప యిప్పుడు మనం చేయవలసిన పని వొక్కటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం యెదురుచూడటం లేదా కుంటి జోసఫ్ లోని తడిని ఫీలై అతని చేతికర్రగా మారడం.

*

బాహుబలానికేనా బహుమతి ?

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

ల.లి.త.

‘మొత్తానికి మన తెలుగువాళ్ళకి వందకోట్ల లాటరీ తగిలినట్టు ఏకంగా ఉత్తమ సినిమా జాతీయ పురస్కారం వచ్చేసిందోచ్’ అని సంబరపడాలో లేక మన సినిమాతో ఉత్తమ సినిమా బహుమతి స్థాయి కిందకి దిగిందని విచారించాలో తెలియటం లేదు. పక్కనున్న తమిళ, మళయాళ, కన్నడ, మరాఠీ సినిమాల్లా బుద్ధిబలంతో కాకుండా బాహుబలంతో సాధించిన బహుమతిలాగా ఉందిది.  వేరే సినిమాలేవీ చూడకుండానే తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు రాలేదేమని నూతిలోకప్పల్లా బాధపడేవాళ్ళకి మాత్రమే ఈ గుర్తింపు ఆనందాన్నిస్తుంది.

అందరినీ అలరించే పాపులర్ సినిమా, కొంతమంది మేధావుల సృష్టికే పరిమితమయే ఆర్ట్ హౌస్ సినిమాల మధ్య అవార్డుల పోటీలో ప్రభుత్వం ఇచ్చే సినిమా పురస్కారాలు ఆర్ట్ హౌస్ కే ఇంతవరకూ దక్కుతున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికయే సినిమాకు ఖచ్చితంగా మంచి ప్రమాణాలను అనుసరిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉత్తమ నటుడు, నటి బహుమతులు నెమ్మదిగా ఆర్ట్ హౌస్ నుంచి ప్రధాన స్రవంతి సినిమాలకు కూడా రావటం మొదలయింది. ఇప్పుడు బాహుబలికి ఉత్తమచిత్రం పురస్కారం రావటంతో ఈ అత్యున్నత బహుమతి కూడా  ప్రధానస్రవంతి సినిమావైపుకి చూడటం మొదలు పెట్టిందని అనుకోవచ్చు. ఇది ఎలాంటి మార్పుకు ప్రారంభమో చూడాలి.

ఒక చిత్రం గానీ ఒక రచనగానీ ఉత్తమమైనదని నిర్ణయించటానికి దాని జనరంజకత్వాన్ని లెక్కలోకి తీసుకునే పద్ధతి సరైనది కాదు. ఈ ప్రమాణం సాహిత్యంలోకి కూడా వస్తే చేతన్ భగత్ కి  సాహిత్యంలో అత్యున్నత పురస్కారం ఇవ్వాలి.  ప్రపంచంలో ఎక్కడైనాసరే పాపులర్ సినిమా ఏ ప్రశ్నలూ వెయ్యదు.  కొత్త ఆలోచనలకు అవకాశం అక్కడ తక్కువ. ఓ రెండుగంటలు ప్రేక్షకులకు కలల్ని అమ్మటమే దానిపని.  వ్యాపారవిలువల్ని పక్కనపెట్టి, జీవితాన్ని అన్నిరంగుల్లోనూ నిజాయితీగా చూపించే ప్రయత్నం ఆర్ట్ హౌస్ సినిమాల్లో ఎక్కువగా ఉంటుందిగనుక జాతీయ బహుమతులు వాటికే వస్తాయి.  కలల్ని అమ్మి జనాన్ని నిద్రపుచ్చే సినిమాలు కాకుండా నిజాలు చెప్పి జనాన్ని ఆలోచింపజేసే సినిమాలకు బహుమతులు ఇవ్వటం ప్రభుత్వధ్యేయంగా ఉండేది. ఉండాలి కూడా.  సహజంగానూ  కళాత్మకంగానూ సినిమా తీసే పద్ధతిలో నిజానికి ఆర్ట్ హౌస్, పాపులర్ సినిమాల తేడా రానురానూ చెరిగిపోయి  మల్టీప్లెక్స్ సినిమాగా కుదురుకుంది.  కానీ అవి  నగరాల్లోని మధ్యతరగతి జీవితాన్నీ ప్రముఖుల జీవితచరిత్రలనే  ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.  సారంలో మాత్రం తక్కువ డబ్బుతో తీస్తున్న ప్రాంతీయ సినిమాదే ఇప్పటికీ పైచేయి. సరైన ఆకృతి దిద్దుకోకపోయినా  సారవంతమైన సినిమాకే  ఉత్తమ చిత్రం బహుమతి వచ్చిన సందర్భాలూ లేకపోలేదు.  నేలమీద నిలబడటమే ఉత్తమ చిత్రం బహుమతికి  ప్రధాన అర్హతగా ఉంటూ వస్తోంది ఇప్పటివరకూ. డెబ్భైల్లో ఎక్కువగా వచ్చే ప్రాంతీయ సినిమాల మధ్య ఈ బహుమతి కోసం పోటీలూ వివాదాలూ లేకపోలేదు గానీ బాలీవుడ్ వీటి మధ్యలో ఎప్పుడూ దూరలేకపోయింది.

తెలుగులో తీసిన సినిమాలకు జాతీయ స్థాయిలో ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అందులో అనుమానం లేదు. తెలుగులో మృణాల్ సేన్ తీసిన ‘ఒకవూరి కథ’ ( ప్రేంచంద్ కఫన్ కథ ఆధారంగా తీసిన సినిమా), రవీంద్రన్ తీసిన ‘హరిజన్’, గౌతమ్ ఘోష్ తీసిన ‘మాభూమి’, శ్యాం బెనెగల్ తీసిన ‘అనుగ్రహం’  చాలా బలమైన సినిమాలు. ‘ఒకవూరి కథ’ కనీసం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానైనా ఎన్నికయింది. మిగతా మూడిటికీ ఏ బహుమతీ రాలేదు. ‘హరిజన్’ ప్రింట్ కూడా మిగలకుండా మాయమవటం గొప్ప విషాదం. కానీ ఈ సినిమాలను తెలుగువాళ్ళు కాదు, ఇతర భాషల దర్శకులు తీశారు. బహుమతులు రాకపోయినా ఎంతోమంది మెప్పు పొందిన సినిమాలివి.

సాహిత్యమూ సినిమా చెయ్యాల్సిన పని జీవితపు కిటికీలన్నిటినీ తెరిచి వెలుగు ప్రసరించటం ఒక్కటే కాదు. ఆ వెలుగుల్ని సొగసుగా పట్టి చూపిస్తేనే అది మంచి సాహిత్యమో  సినిమానో అవుతుంది. జీవమున్న చిత్రాలకు బహుమతులు రావటంతోపాటు వాటిని జనం అంతో కొంతో ఆదరించిన మంచిరోజులు ఉండేవి. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రాలను చాలామంది చూసేవాళ్ళు.  రానురానూ ఉత్తమ జాతీయ చిత్రాలుగా ఎన్నికైన ప్రాంతీయ సినిమాల గురించి మీడియాలో పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారు.  నెమ్మదిగా జాతీయ బహుమతులు ప్రధాన స్రవంతి సినిమావైపుకు రావటంతో వీటికి ఆకర్షణ పెరిగినట్టయింది. అంటే ఇవి కూడా  ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లాగా మారుతున్నాయని అనుకోవాలి.  దీని అర్థం .. చివరికి బాలీవుడ్ కే అన్నీ దక్కుతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాంతీయ సినిమా బడుగులు ఈ బహుమతుల ఆశ కూడా వదులుకోవాల్సిందే. బాలీవుడ్ మెరుపుల ముందు ప్రాంతీయ సినిమాల లోచూపూ నిరాడంబరత్వమూ ఎక్కడ ఆనుతుంది? బాహుబలికి వచ్చిన బహుమతి తెలుగువాళ్ళ కళాత్మక దృష్టికి వచ్చిన మెప్పుకోలు కాదు. CGI హంగులతో హిందీలో బాలీవుడ్ నీ, కరణ్ జోహార్నీ, రమేష్ సిప్పీవంటి వ్యాపార సినిమా దర్శకుడినీ మురిపించినందుకు వచ్చిన బహుమతి. జ్యూరీలో ఉన్న సభ్యుల తెలివిమీద కూడా అనుమానాలు వచ్చే సందర్భం ఇది. సాంస్కృతిక సంస్థల సింహాసనాలమీద ఆ రంగాల్లో కనీసార్హతా, విద్యా లేని అనామకులు కూర్చుంటున్న రోజుల్లో రమేష్ సిప్పీ జ్యూరీ విచక్షణకూడా ఏమంత గొప్పగా లేదు.

హాలీవుడ్ లా భారీ సినిమాలు తీయటమే సినిమా కళ అనుకుంటే అస్థిపంజరానికి కిలోలకొద్దీ నగలు తగిలించినట్టే ఉంటుంది. రక్తమాంసాలున్న మనుషులను చూపించే సినిమాలనూ, మనఆలోచనలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళి మానవత్వాన్ని ఆవిష్కరించే సినిమాలనూ  ప్రోత్సహించటం ఒక్కటేకాదు. వాటిని ప్రచారం చేసి జనంలోకి తీసుకెళ్ళే పని కూడా నిజానికి ప్రభుత్వమే చేయాల్సిన రోజులివి. ప్రభుత్వమే ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు వచ్చిన సినిమాలను దేశంలోని అన్నిభాషల్లోకీ డబ్ చేయించి అన్ని ప్రైవేటు టీవీ చానెల్స్ లో వేయటాన్ని తప్పనిసరి చేస్తే ఎంత బాగుంటుందో!  కానీ, అందరికీ కావలసిన చదువునీ వైద్యాన్నే వదిలేసిన ప్రభుత్వాలు కళాపోషణ పనుల్ని  నెత్తిన వేసుకుంటాయనుకోవటం అత్యాశ.  కనీసం ఉన్న అవార్డులు ఇచ్చేటప్పుడైనా బాధ్యత వహించకపోతే  బాలీవుడ్ అన్నిటినీ మింగేస్తుంది. కిందటి సంవత్సరం ఉత్తమ చిత్రంగా బహుమతి పొందిన ‘కోర్ట్’ సినిమా చూద్దామంటే ఎక్కడా దొరకదు. ‘షిప్ ఆఫ్ తిసియస్’ ను కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ లు భుజాన వేసుకున్నారు కాబట్టి నలుగురికీ తెలిసింది. బాలీవుడ్ తారలకు జాతీయ బహుమతి వస్తే ప్రముఖ వార్త అవుతుంది. ట్రాన్స్ జెండర్ గా నటించిన సంచారి విజయ్ కి కిందటి సంవత్సరం ఉత్తమ నటుడి బహుమతి వచ్చింది. ఒక్క కన్నడిగులకు తప్ప అతనెవరో దేశంలో ఎవరికీ తెలియదు.

బాహుబలిని జ్యూరీ “మహోన్నత స్థాయి నిర్మాణ విలువలతో సినిమాటిక్ మెరుపుతో తెరమీద కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన ఊహాత్మక చిత్రం” అని మెచ్చుకుంది.  చిన్నపిల్లకి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ అని తెలిసిపోయే దృశ్యాలు బాహుబలిలో చాలా ఉన్నాయి. శివలింగాన్ని ఎత్తటంలో, వందలమంది లాగలేని విగ్రహాన్ని ఒంటి చేత్తో ఆపటంలో, ఒక్కోటీ కిలోమీటరు దూరానున్న కొండలమీదనుంచి దూకటంలో హీరో దైవ సమానుడిలా ఉంటాడు.  అలసట, కష్టం వంటివి అంటని మానవాతీత హీరోని చూస్తూవుంటే  ఏ ఉద్వేగమూ కలగదు.  కొన్నిచోట్ల చాలాబాగా, చాలాచోట్ల నాసిరకంగా ఉన్న గ్రాఫిక్స్ ని బాహుబలి సినిమాటోగ్రాఫర్  సెందిల్ కుమార్ కూడా సమగ్రంగా ఉన్నాయని అనలేకపోయాడు.  సరిగ్గా అతకని గ్రాఫిక్స్ నీ దేవుళ్ళలాంటి హీరోలనీ పూజించే సినిమాల్లో తెలివైన ప్రేక్షకుల ఊహలు ఎంతదూరం వెళ్ళగలవు? అక్కడే చతికిలబడతాయి. అద్భుతకాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన బాహుబలిలో, విశ్వాసం పేరుతో బానిసత్వాన్ని romanticise చేయటం ఉంది. యుద్ధవిద్య నేర్చిన అమ్మాయిని వొట్టి అందమైన బేలగా మార్చటం ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ లోకాల్లో తిరిగే మూసలు తప్ప మనుషులు లేరు. తెలుగు పాపులర్ సాంఘిక సినిమాలోంచి బాహుబలిలోకి పాకిన మూసలివి.  సుమోలు గాల్లో పేల్చేసి, యాభైమందిని నరికి పారేసే తెలుగుసాంఘికాల హీరో  జానపద బాహుబలిలో గ్రాఫిక్ కొండలమీదా జలపాతాలమీద దూకుతూ తేలుతూ, బాలీవుడ్ చేరి, అవార్డు కొట్టేశాడు. ‘దబాంగ్’ లాంటి మగ దబాయింపు మూస హిందీ చిత్రసీమలో ఎలాగూ ఉండనే ఉంది.  తల్లిస్థానంలో స్త్రీని కీర్తిస్తూ, భార్యగా ప్రియురాలుగా స్త్రీని తనకంటే తక్కువగా చూసే మగవాళ్ళు ఎక్కువగా ఉన్న ఉత్తరాదికి, దాన్నే తెరమీద  చూపించిన బాహుబలి నచ్చటంలో ఆశ్చర్యం లేదు. బాహుబలి అందించినది ఏ కొత్తదనమూ సున్నితత్వమూ లేకుండా ఒట్టి వ్యాపారంగా మారిపోయిన కళ.

బాహుబలి హాలీవుడ్ సినిమాలాగా వచ్చిందని చాలామంది సంతోషపడుతున్నారు. మరి ఏ ఒక్క హాలీవుడ్ చిత్రంలోనైనా ఆ కథ జరిగిన స్థల కాలాలు మనకి అర్థం కాకుండా ఉంటాయా? నాసిరకం హాలీవుడ్ సినిమాల్లో కూడా ఆ మనుషులు తిరిగే చోట్లు, బతికిన కాలం, నివసించే భవనాలు ఎలా ఉండాలో ఆలోచించుకున్నాకే వాళ్ళు సినిమా తియ్యడానికి దిగుతారు.  బాహుబలిలో నయాగరాని మించిన జలపాతాలు, ఆపైన మంచు కొండలు, ఇంకా పైన పచ్చని నేలలో దేవాలయాలలాంటి కోటలూ, యుద్ధం చేసే చోట తాటితోపులూ ఉంటాయి.  ఈ సినిమా కోసం భూగోళాన్ని ఇన్నిరకాలుగా సాగ్గొట్టేరు. మనకి తెల్సిన జాగ్రఫీ మర్చిపోవాల్సిందే. ఎంత చందమామ కథ అనుకున్నా ఇలాంటి రసహీనతని భరించటం కష్టం.  ఇంత అడ్డూ అదుపూ లేని కాల్పనిక ప్రపంచంలో విహరింపజేయటం హాలీవుడ్ కి కూడా చేత కాదు. వాళ్ళ సినిమాల్లో ఎంత పెద్ద హీరో అయినా పాత్రలోకీ ఆ పాత్రకు సంబంధించిన ప్రపంచంలోకీ చుట్టూరా ఉండే మనుషుల మధ్యలోకీ ఒదగాల్సిందే. మన హీరోలు దేవతలు కాబట్టి,  వాళ్ళకోసం పాత్రలనూ ప్రదేశాలనూ దర్శకులు రత్నాలు పొదిగిన దుస్తుల్లా తయారుచేసి తొడుగుతారు. ఆ దేవతావస్త్రాలను మెచ్చుకు తీరాలి కాబోలనే నిరంతర భ్రమలో వున్న జనం చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు.  ఇప్పుడు ప్రభుత్వం కూడా చప్పట్లు కొట్టడానికి తయారయింది.

సున్నితమైన కొత్త ఫాంటసీలా కథ చెప్తూ ‘ఈగ’ తో దేశమంతటినీ ఆకర్షించిన రాజమౌళి మంచి ప్రజారంజక దర్శకుడు. ఇప్పుడు పెద్ద హీరోల అహంకారానికీ దర్జాకూ తగ్గ కథల దుస్తులు అల్లుతూ, హాలీవుడ్ కలలుకంటూ, ఆత్మలోపించిన సినిమాలు తీస్తున్నాడు. ఆయన్ను అందుకు తగ్గట్టే గుర్తించి, బాహుబలికి ఉత్తమ ప్రజారంజక సినిమా కేటగిరీలో బహుమతి ఇచ్చివుంటే బాగుండేది. ఒకప్పటి ప్రమాణాల ప్రకారం శంకరాభరణం ఉత్తమ ప్రజారంజక సినిమాగానే ఎన్నికయింది. ఇప్పటి భారీ ప్రమాణాల ప్రకారం బాహుబలిని ఈ విభాగంలోనే చేర్చొచ్చు.

బాహుబలికి (అదీ ఇంకా సగం సినిమానే) అర్హతలేని బహుమానం దక్కింది. మన సినిమాల ఆరోగ్యానికి ఈ కొత్తధోరణి జాతీయ బహుమతులు మంచి చెయ్యవు.

 

 

 

ఖమ్మం సాహిత్య చరిత్ర రచనకి ఇది శ్రీకారం!

 

kaifiyath

సాంస్కృతిక  పునర్వికాసానికి ఖమ్మం జిల్లా తోడ్పాటు చిరస్మరణీయమైనది. ఆధునిక కాలంలో తెలంగాణాలో  సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది హైదరాబాద్‌లో 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో పడింది.. ఈ భాషానిలయం స్థాపనంలో తెంగాణలోని ప్రముఖమైన సంస్థానాధీశులు వారికి తోడుగా కొమర్రాజు క్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, మైలవరపు నరసింహారావు, ఆదిపూడి సోమనాథరావు తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఈ ప్రముఖ సంస్థానాధీశుల్లో నేటి ఖమ్మం జిల్లాకు చెందిన పాల్వంచ సంస్థానాధీశులు రాజా పార్థసారథి అప్పారావు ఆర్థికంగా ఆదుకోవడమే గాకుండా లైబ్రరీ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు కూడా. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానియానికి జీవితాంతం రాజపోషకునిగా ఉన్నారు. ఈయనకు ‘సాహిత్య విశారద’ అనే బిరుదు కూడా ఉంది. పాల్వంచలో ‘ఆంధ్రవాఙ్మయ సేవాసమితి’ని స్థాపించి దాని తరపున ప్రత్యేక సాహిత్య సంచికను ‘కిన్నెర’ పేరిట ప్రచురించారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వ్యాసభారతాన్ని యథాతథంగా అనువదించి అచ్చేసేందుకు అనేకమంది పోషకుల్ని ఆర్థిక సహాయం అర్థించాడు. అందరూ నిరాకరించారు. చివరికి పార్థసారథి అప్పారావు చేసిన సహాయముతో దాన్ని ఆయన ముద్రించాడు. అంతేగాదు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం స్థాపన కాంలో 11 ఏళ్ళ బాలుడిగా సమావేశానికి వచ్చిన వారందరికీ తాంబూలాలు అందించి అనంతర కాలంలో తెలుగుజాతి గర్వించే పరిశోధనలను, రచనలు చేసిన ఆదిరాజు వీరభద్రరావు కూడా ఖమ్మం జిల్లా (మధిర తాూకా, దెందుకూరు) వాడే! అంటే తెంగాణ పునర్వికాసానికి ఖమ్మం తోడ్పాటు ఏమిటో అర్థమౌతుంది. చందాల కేశవదాసు, మాడపాటి తిరుమలరావు, మాడపాటి రామచంద్రరావు, జమలాపురం వెంకటేశ్వరరావు, సోమరాజు రామానుజరావు, సోమరాజు ఇందుమతీ దేవి, జమలాపురం కేశవరావు, పండిట్‌ రుద్రదేవ్‌, హీరాలాల్‌ మోరియా, సర్వదేవభట్ల నరసింహమూర్తి, సర్వదేవభట్ల రామనాథం, ఊటుకూరి రంగారావు, కౌముది, సుగ్గు అక్షయలింగం గుప్త, ఎ. పూర్ణానంద గుప్త, గెల్లా కేశవరావు, ఉత్ప సత్యనారాయణాచార్య, ఇటికాల నీలకంఠరావు, దాశరథి సోదరులు, కోదాటి నారాయణరావు, బొమ్మకంటి సత్యనారాయణ, చేకూరి కాశయ్య, శీలం సిద్ధారెడ్డి, జలగం వెంగళరావు, డి.రామలింగం, బెల్లంకొండ రంగాచార్యులు, బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, బెల్లంకొండ లక్ష్మణసూరి, పబ్బరాజు గోపాలరావు, పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు, పాలడుగు వెంకటేశ్వరరావు, జాతశ్రీ, విశిష్ట పరిశోధకులు దూపాటి వేంకటరమణాచార్యుల మిత్రులు అన్నపరెడ్డి పల్లికి చెందిన జమీందారు కాళ్లూరి వెంకటరామారావు ఇలా ఎందరో మహానుభావు తెంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో తమదైన ప్రత్యేకమైన ముద్రను వేసిండ్రు.

సాయుధ పోరాట కాలంలో పర్చా దుర్గాప్రసాదరావు, పి.వెంకటేశ్వరరావు, వట్టికొండ రామకోటయ్య, అడ్లూరి అయోధ్యరామకవి(?), తాళ్ళూరి రామానుజస్వామి, కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా, డి.రామలింగం, విరివిగా రచనలు చేసిండ్రు. ఇందులో కమ్యూనిస్టులున్నారు. కాంగ్రెస్‌ సానుభూతి పరులూ ఉన్నారు. తమ భావాజాలాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి కృషి చేసిండ్రు.

మరుగున పడ్డ ఎన్నో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక, చారిత్రక అంశాలను మలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించిన పరిశోధకులు శేషాద్రి రమణకవులు. ఇంకా వెలుగులోకి రావాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ పరిశోధనంతా చేసింది రమణకవులు పేరిట దూపాటి వేంకట రమణాచార్యులు. ఖమ్మం జిల్లాకు ఈయనకు విడదీయరాని బంధం ఉంది. దూపాటి రెండో సోదరి భద్రాచలం దగ్గరలోని అన్నపరెడ్డిపల్లిలో నివాసం ఉండేది. అందువల్ల తరచూ అక్కడికి వస్తూ ఉండేవాడు. ఈయన మొట్టమొదట తెంగాణాలో పరిశోధన మొదలు బెట్టింది ఖమ్మం జిల్లా నుంచే! ఎర్రుపాలెం కరణం, భాషాప్రియులైన జమలాపురం వెంకటకిషన్‌రావు ఇంట్లో ఆయన తోడ్పాటుతో పరిశోధక ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో కొన్ని వందల అముద్రిత తాళపత్రాలను సేకరించారు. ఇదే గ్రామానికి చెందిన అడ్వకేటు మాడపాటి తిరుమలరావు కూడా అండగా నిలిచాడు. అలా తెలంగాణ పరిశోధనకు చేయూత లభించింది. అంతకముందు 1922లో ఆదిరాజు వీరభద్రరావు హైదరాబాద్‌లో ఆంధ్ర పరిశోధక మండలిని ఏర్పాటు చేసిండు.

ఈ పరిశోధక మండలి 1923లో కొమర్రాజు క్ష్మణరావు చనిపోవడంతో అది ‘కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర పరిశోధక మండలి’గా మారింది. ఈ మండలి తరపున ‘తెంగాణ శాసనాలు’ ప్రచురించడంలోనూ, ఆ తర్వాత ఆధునిక తెంగాణ ఆత్మగౌరవాన్ని సాహిత్య రంగంలో సగౌరవంగా నిబెట్టిన ‘గోలకొండ కవుల సంచిక’ మలువడడంలోనూ ఆదిరాజు వీరభద్రరావు విశేషమైన కృషి చేసిండు. ఇది ఖమ్మం జిల్లాకే గౌరవ కారణం. ఈ గోలకొండ కవు సంచికలో ఖమ్మం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది కవున్నారు. ఇందులో జ్ఞానమాంబ, సోమరాజు ఇందుమతీదేవి రచనలు కూడా చోటు చేసుకున్నాయి. వీరిద్దరు కూడా కవిత్వ పుస్తకాలను అచ్చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ముందే అర్వపల్లి సత్యవతీదేవి, పబ్బరాజు ఇందిరాదేవి లాంటి కథకులు ఈ ప్రాంతం నుంచి రాసిండ్రు. సోమరాజు ఇందుమతీదేవి సోదరుడు సోమరాజు రామానుజరావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిలో నిలిచిపోయే రంగూన్‌ రౌడీ, స్వరాజ్య రథం లాంటి నాటకాలు రాసిండు. అనేక నవలలు  వెలువరించిండు. ఇందులో స్వరాజ్య రథం నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇందుమతీదేవి ఖండిక సంపుటి విజయవాడ నుంచి వెలువడింది. సరిహద్దు ప్రాంతం కావడంతోటి ఆంధ్రప్రాంతంతో ఇక్కడి రచయితలకు సన్నిహిత సంబంధాలుండేవి. వేలూరి శివరామ శాస్త్రితో పాటు అనేకమంది ఆంధ్రప్రాంత కవి పండితులు ఈ జిల్లాతో మొదటి నుంచి పెనవేసుకుపోయిండ్రు. తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఈ జిల్లా రచయితలను ప్రభావితం చేసింది. గ్రంథాలయోద్యమంలో ఇక్కడి విజ్ఞాన నికేతనం, కుకునూరు, పాల్వంచ, ఎఱ్ఱుపాలెం, రేమిడిచర్ల, మధిర తదితర గ్రంథాయాలు కీలక పాత్ర పోషించాయి. తెంగాణలోనే మొట్టమొదటి సారిగా సింగరేణిలో అఖిలాంధ్ర గ్రంథాలయ సభలు జరిగాయి. ఈ సభకు హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డితో పాటు చాలామంది హాజరయ్యారు. ఇది స్థానికుల్లో చాలా చైతన్యాన్ని నింపింది.

khammam kathalu

ఖమ్మం జిల్లా రచయిత మీద ఉర్దూ, ఇంగ్లీషుతో బాటుగా పక్కనున్న ఆంధ్రప్రాంతం వారి ప్రభావం కూడా ఉండింది. హీరాలాల్‌ మోరియా, కవిరాజమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)పై ప్రేమ్‌చంద్‌, కిషన్‌చందర్‌ లాంటి ఉర్దూ కవుల, కథకుల ప్రభావం ఎక్కువగా ఉండింది. ఖమ్మం జిల్లా నుంచి మొదట ఆధునికత రీతిలో కథలు రాసింది మాడపాటి రామచంద్రరావు. ‘తిమిర ఝంజుమ్’ అనే కవితా సంకలనాన్ని ప్రచురించిన ‘మంజు’దావూద్‌ అలీ కాశ్మీరీ భాషలో కూడా రచను చేసిండు. ఉర్దూ కవి సికిందర్‌ మొహసిన్‌ గురజాడ ‘దేశమును ప్రేమించుమన్న’ గేయాన్ని ఉర్దూ పాఠకుకులకు అందించిండు. మోరియా, కవిరాజ మూర్తి ఇద్దరూ ఉర్దూలో కవిత్వం, కథలు, నవలలు రాసిండ్రు. వీరు ఉర్దూలో రాసినవి ఊటుకూరు రంగారావు, ఇటికాల నీకంఠరావు, కొలిపాక మదుసూదనరావు, గిడుతూరి సూర్యం లాంటి వాండ్లు తెలుగులోకి తర్జుమా చేసిండ్రు. అలాగే డి.రామలింగం లాంటి వారు తెలుగుసాహిత్యాన్ని ‘ఇండియన్‌ లిటరేచర్‌’ సంచిక ద్వారా 60వ దశకం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిండ్రు. ఇప్పటికీ ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ఈయన రాసిన వ్యాసాలే ప్రధాన ఆధారం. ఖమ్మం కథకుల్లో ఎక్కువ మంది, ఆనాటి మాడపాటి రామచంద్రుడు మొదలు షంషాద్‌ బేగం వరకూ  తాము పుట్టినూరు నుంచి వివిధ ప్రాంతాలకు, దేశాలకు ‘వలస’ లేదా జీవనోపాధి కోసం ప్రయాణం చేసినవారే కావడం విశేషం. మొబిలిటీ (చలనశీలత) కథకుడికి కొత్త కోణాల్ని అందిస్తుంది. కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వాతావరణం అన్నీ కగలిపి తాము అనుభవిస్తున్న, అనుభవించిన జీవితాలను పోల్చి చూసుకొని కథలుగా రికార్డు చేసిండ్రు. మెరుగైన సమాజం కోసం చేసిన సాహితీ కృషి ఇది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ తెలుగులో రాసే ముస్లిం రచయితలు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా ఖమ్మమే అని చెప్పొచ్చు. షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ.రెహమాన్‌, దిలావర్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, షంషాద్‌ ఇట్లా అనేకమంది కవులు, రచయితలు తెలుగులో రాసిండ్రు. ఇంకా రాస్తున్నరు. అయితే వీళ్ళందరూ స్వాతంత్య్రానంతర తరం(?) కావడం, అప్పటికి ఉర్దూ మాధ్యమంలో బోధించే స్కూల్స్  ఖమ్మం ప్రాంతంలో లేకపోవడం, చుట్టూ తెలుగు వాతావరణమే ఉండడంతో అనివార్యంగా వీళ్ళు తెలుగులో రాయాల్సి వచ్చింది. దాని వల్ల ఉర్దూ సాహిత్యం నిఖార్సయిన తెలంగాణ జీవితాన్ని రికార్డు చేసే అవకాశం కోల్పోయింది.         ఈ ద్వివిదీ భావం చరిత్రలో కూడా కనబడుతుంది. దాశరథీ శతకముతో పాటు తన కీర్తనతో ‘ఎవడబ్బా సొమ్మాని కుకుతు వున్నావ్‌’ అని రాముడినే ప్రశ్నించిన కంచర్ల గోపన్న (రామదాసు) తానీషా కాంలో ఖైదు అనుభవిస్తాడు. అలాగే భద్రాచం ప్రాంతం వాడైన భల్లా పేరయకవి తన ‘భద్రగిరి శతకము’లో ముస్లిం రాజుల్ని నిందిస్తాడు.

‘‘అచ్ఛిద్ర కర్ణుయాజ్ఞ నుండగలేక

తురకల కెదురుగా పరుగ లేక

చేరి ఖానులకు తాజీములీయగ లేక

మును నమాజు ధ్వనుల్‌ వినుగలేక

‘‘కాడు చేసిరి కదా కళ్యాణ మండపా

గార వాహన గృహాంగనమలెల్ల

‘‘సంస్క తాంధ్రోక్తుల సారంఋడివోయె

నపసవ్య భాషల నమరె జగము

సత్రశాలంగణల్‌ చలువ పందిరులు

బబ్బరట ఖానుల చప్పరముయ్యె

‘‘పారిపోవగ నైన పట్టెలె నాకక

విడుతరే వైష్ణవ వితతి నెల్ల’’ అని రాసిండు.

jwalitha

జ్వలిత

అయితే ఇదే జిల్లాలో ఆరో నిజామ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ చనిపోయిన తర్వాత ఆయన పేరిట 1911 జూలై 16వ తేదీనాడు ఎఱ్ఱుపాలెంలో జమలాపురం రామారావు, వెంకటకిషన్‌రావు, మాడపాటి తిరుమలరావు తదితయి పూనుకొని ‘మహబూబియా గ్రంథాలయా’న్ని ఏర్పాటు చేసిండ్రు. అలాగే మధిరలో మిరియాల నారాయణగుప్త గారు ‘ఉస్మానియా ఆంధ్ర భాషానియం’ పేరిట గ్రంథాయాన్ని ఏర్పాటు చేసిండు. ఇవి రెండు చాలా కాలం పాటు ప్రజలకు ఉచిత పుస్తక, పత్రికా పఠన సౌలభ్యాన్ని కలిగించాయి. ముస్లిం రాజు పేరిట కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసిన ఈ గ్రంథాయాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి. విదేశాల్లో కొన్ని వందల యేండ్ల క్రింతం స్థాపించబడ్డ లైబ్రరీలు ఆధునిక కాంలో కూడా నిరంతరంగా నడుస్తూ ఉన్నాయి. మన దగ్గర మాత్రం లుప్తమై పోతున్నాయి. రాజుని రాజుగా కాకుండా హిందూత్వ దృక్కోణం నుంచి చూసినప్పుడే సమస్య లెదురవుతున్నాయి. ఇప్పుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ అంటే దుర్మార్గుడు, రాక్షసుడు, నిరంకుశుడు పేరిట ‘కమ్యూనిస్టు, బీజేపీ వాళ్ళు’ ఒకే రీతిగా పిలుస్తున్నారు. కమ్యూనిస్టులు మొదటి నుంచీ ఈ జిల్లాలో బలంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా సాయుధ పోరాట ఉద్యమం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి. పోరాట వారసత్వాన్ని కాపడుకోవడం పేరిట నిజాంను నిందించడం ఎంత వరకు సమంజసమో కూడా ఆలోచించాలి.

స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ అంతటా ఎక్కువ భాగం ఉర్దూ మాధ్యమంగానే ఉన్నత విద్య బోధన జరిగేది. అట్లా చదువుకున్న వారిలో సర్వదేవభట్ల నరసింహమూర్తి ఒకరు. ఈయన సాయుధ పోరాట కాంలో ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని చివరికి అనివార్య కారణాల వల్ల  హైదరాబాద్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే ‘మై గరీబ్‌ హూ(’, లాహూ కీ ఖీర్‌ లాంటి ఉర్దూ నమ రాసిండు. ఇవి తరువాత తెలుగులోకి తర్జుమా అయ్యాయి. తెలుగు మాతృభాషగా ఉండి ఎక్కువ భాగం ఉర్దూలో రాసిన రచయిత కవిరాజమూర్తి. ఈయన స్వాతంత్య్రానంతరం ‘ఉత్తర’, ‘దక్షిణ’ అన్న మారు పేర్లతో పటంచెరువు (ఇక్రిసాట్‌, మెదక్‌ జిల్లా) వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగం చేస్తూ అనేక వ్యాసాలు వెలువరించాడు. అలాగే హీరాలాల్‌ మోరియా కూడా ఉర్దూలో అనేక కథలు, నవలలు  రాసిండు. వాటన్నింటినీ ఖమ్మం మిత్రులే తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించేవారు. ఊటుకూరు రంగారావు స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూలోకి కథలు తర్జుమా చేసిండు. శరధార అనే అద్భుతమైన కవితా సంపుటిని మెవరించిండు. ఇలా అటు ఉర్దూ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి ఏక కాంలో అనేక రచనలు అందజేసిన వీరి గురించి, వీరి రచనల గురించీ ఎక్కువగా తెలియడం లేదు. వీరి సమగ్ర రచన సంపుటి వెలువడ్డట్లయితే తెలుగు సమాజం ఉర్దూ సాహిత్యంలో ఎట్లా రికార్డయ్యిందో వివరంగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఈ ప్రాంతానికున్న చరిత్ర కూడా పూర్తిగా ఇంకా వెలుగులోకి రాలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన మూలాల్ని మనం వెతికి పట్టుకునే పని ప్రారంభమయింది. అలాంటి పునాది పని ఈ ‘ఖమ్మం కథలు’ద్వారా జ్వలిత గారు చేస్తున్నారు. ఇక్కడి చరిత్రను కూడా తవ్వితీయడానికి ఇదొక సందర్భం కూడా. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్రుంది. అది అరకొరగా కొంత రికార్డయింది. రామాయణంలోని సీత నివసించిన పర్ణశాల భద్రాచలం ప్రాంతంలోనే ఉందని ప్రముఖ పరిశోధకుడు కొమర్రాజు క్ష్మణరావు మహారాష్ట్ర పండితుల వాదనను ఖండిస్తూ నిరూపించిండు. రావణుడు ఇదే పర్ణశాల నుంచి సీతను ఎత్తుకెళ్తూ ఉంటే జఠాయువు పోరాటం చేసి నేలకొరిగిండని  ఆ ప్రాంతంలో1870ల్లో నివసించిన జాన్‌ కెయిన్‌ అనే ఆంగ్లేయుడు పత్రికల్లో పరిశోధక వ్యాసాలు మెవరించిండు. జఠాయువు`రావణాసురుడి పోరులో ఆ ప్రాంతమంతా దుమ్మురేగడంతో దానికి దుమ్ముగూడెం అని, రావణుడి రథం తాక్కుంటూ వెళ్ళిన గోదావరి ఆవలివైపు గుట్టను రథపు గుట్ట అని, జఠాయువు పాక ఉన్న ప్రాంతాన్ని జటపాక అని అదే ఏటిపాక అనీ ఆయన రాసిండు.

గ్రంథాలయోద్యమం, విద్యాలయాల స్థాపన, పరిశోధన, పత్రిక నిర్వహణ, ఆంధ్రమహాసభ, వర్తక సంఘాలు, పుస్తకప్రచురణ, రైతు ఉద్యమాలు, కమ్యూనిస్టుల కార్యకలాపాలు అన్నీ కగలిసి ఇక్కడి ప్రజల్లో చైతన్యానికి దోహదం చేశాయి. ఖమ్మంలో 1936లో స్థాపించబడ్డ విజ్ఞాన నికేతనం గ్రంథాలయ వారోత్సవాల్లో ఆంధ్రప్రాంతానికి చెందిన విశ్వనాథ సత్యనారాయణ, అంబటిపూడి వెంకటరత్నం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మ్లంపల్లి సోమశేఖరశర్మ, మారేపల్లి రామచంద్రశాస్త్రి, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వీటి కొనసాగింపుగా 1944లో సింగరేణి కారీస్‌లో 25వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ జరిగింది. ‘విశాలాంధ్ర’కు ఇక్కడే బీజాలు పడ్డాయి. అంతకుముందు కరువు పీడిత ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాయసీమ నుంచి పుష్కంగా నీళ్లున్న ‘బనిగండ్ల పాడు’లాంటి ప్రాంతానికి వలసవచ్చిన వారు ఇక్కడి చైతన్య, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దాదాపు వందేండ్లకు ముందు ఇక్కడికి వలస వచ్చినవారు స్కూల్స్, వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవడంలో ముందున్నారు.

1930ల్లోనే ఇక్కడి దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. వివిధ సంస్థల కార్యకలాపాల వల్ల  ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యంతోటే 1934లో ఖమ్మం జిల్లా పెదమండువ గ్రామంలో దళితు కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిండ్రు. ఈ పాఠశాలలో సుండ్రు రంగయ్య అనే అతను ఉపాధ్యాయుడిగా ఉండేవారు. ఆయన కూడా దళితుడే! తర్వాతి కాంలో నిజాం రాష్ట్ర హరిజన సేవక సంఘం వాళ్ళు ఈ పాఠశాలను ఆర్థికంగా ఆదుకున్నరు. పుస్తకాలు, పలకలు ఉచితంగా ఇవ్వడమే గాకుండా భవన నిర్మాణానికి కూడా ఈ సంస్థ సాయం చేసింది. దాదాపు ఇదే కాంలో ఖమ్మం తాూకాలోని ముష్టిగుంట్ల గ్రామంలో పోలీసు ఉన్నతాధికారి మౌల్వీ మహమ్మద్‌ తబియుద్దిన్‌ పూనిక మేరకు అస్పృశ్యత నివారణకు, స్త్రీ సమానత్వం కోసం సభలు జరిగాయి. ఇందులో చాలా మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. విశేషమేమిటంటే దళితులను కూడా సభా వేదికపై కూర్చుండబెట్టి సమావేశాలు నిర్వహించడం. ఈ సమావేశంలో ఖమ్మంకు చెందిన సనాతనధర్మదారణ సభ వారు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు జరగలేదని గోలకొండ పత్రికలో పేర్కొన్నారు. అలాగే మధిర తాలూకా గుండిపూడికి చెందిన నియోగి బ్రాహ్మణు జమీందార్‌ అయిన కాళ్ళూరు వెంకటరావు పినపాకలో చనిపోయారు. ఆయన స్మృత్యర్థం వారి కుమారులు రామకిషన్‌రావు, ఉమామహేశ్వరరావు ఖమ్మం పట్టణంలో హరిజన హాస్టల్‌ని      1941లో నిర్మించిండ్రు. నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్‌ ఆవలి ప్రదేశంలో దళితు అభ్యున్నతికి ఎక్కువ కృషి జరిగింది ఖమ్మం జిల్లాలోనే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ జిల్లా విశిష్టమైనది.

 

మొత్తం తెంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాది ఒక ప్రత్యేకమైన స్థితి. భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్యం బలవంతంగా విలీనమైనప్పుడు ఖమ్మం జిల్లా ఉనికిలోనే లేదు. నిజానికి 1905వరకు వరంగల్‌, ఖమ్మం రెండు జిల్లాల్ని కలిపి ఖమ్మం జిల్లాగానే పిలిచేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం 1905లో జిల్లా కేంద్రాన్ని వరంగల్‌కు మార్చి ‘వరంగల్‌’ జిల్లాగా మార్చారు. భౌగోళికంగా మిగతా తెంగాణ జిల్లాతో పోల్చి చూస్తే పూర్తిగా భిన్నమైంది. గోదావరి, శబరి, కిన్నెరసాని, మున్నేరు లాంటి నదులతో, బయ్యారం ఉక్కుగనులతో, బొగ్గుగనులతో, పాలేరు నీటి వసతితో కొంత మెరుగైన పరిస్థితి ఉండింది. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏర్పడ్డ మొట్ట మొదటి ఇంకా చెప్పాంటే ఏకైక జిల్లా ఇది. హైదరాబాద్‌ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతిభద్రతలు కాపాడేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం వరంగల్‌ జిల్లాను విభజించి 1953 అక్టోబర్‌ ఒకటిన ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడమైంది. జిల్లా ఆవిర్భావ కాలంలో ఖమ్మం, ఇల్లందు, మధిర, బూర్గుంపాడు, పాల్వంచ తాలూకాలు మాత్రమే భాగంగా ఉండేవి. ఖమ్మం తాలూకాలోని కామేపల్లి, సిరివోలు గ్రామాలను ఖమ్మం తాలూకా నుంచి తొలగించి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ తాలూకాలో కలిపారు. ఇవ్వాళ ఆంధ్రలో కలిపిన గ్రామా ప్రజల గోడు వింటూంటే వాళ్ళ గొంతు ఎట్లా నొక్కబడుతుందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు ఆంధ్రా ‘మేధావులు’ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలంని కూడా ఆంధ్రాలో కలపాలని డిమాండ్‌ చేసిండ్రు. భద్రాచలం ప్రాంతమనేతమ ది వారి వాదన. అయితే చారిత్రకంగా చూసినట్లయితే అది అసంబద్ధ వాదన.

 

1854లో ఆర్థర్‌ కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట కట్టే సమయంలో  పరిపానా సౌలభ్యం కోసం సూగూరు, భద్రాచం తాలూకాను బ్రిటీష్‌ వారికి ఇవ్వాల్సిందిగా నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పురస్కరించుకొని వాటిని బ్రిటీష్‌ ప్రభుత్వానికి బదలాయించారు. భద్రాచం, రేకపల్లి తాలూకాలు 1860 వరకూ నిజాం ఆధీనంలోనే ఉండేవి. 1860లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వీటి అజమాయిషీని బదలాయించారు. ఆ తర్వాత ఈ తాలూకాని 1874లో సెంట్రల్‌ ప్రావిన్స్‌ నుంచి మద్రాసు ప్రావిన్స్‌కు బదలాయించిండ్రు. 1953లోనూ, 1959లోనూ భద్రాచలం ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి. వీటిని నదికి ఆవలితీరంలో చాలా దూరంలో ఉన్న జిల్లా కేంద్రం నుంచి పాలించడం కష్టసాధ్యమయ్యేది. దాంతో ప్రజల ఇబ్బందులను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాను ఖమ్మం జిల్లాలో కలిపారు. ఈ ఉత్తర్వు 1959 నవంబర్‌ 30 నుంచి అమల్లోకి వచ్చింది. భద్రాచలం ప్రాంత ప్రజలది మొదటి నుంచీ దయనీయమైన స్థితి. 1959లో తెంగాణలో కలపడంతో ముల్కీ రూల్స్‌ వారికి వెంటనే అమలు కాకపోవడంతో స్థానికంగా కళాశాలల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలు రెండూ దక్కలేదు. దానిపై వాణీ రమణారావు లాంటి గిరిజన ఎమ్మెల్యేలు పోరాటం చేయడంతో వారిని ముల్కీలుగా గుర్తించేందుకు జలగం వెంగళరావు చొరవ తీసుకొని చట్టంలో మార్పు తీసుకొచ్చారు. అయితే ఈ మార్పుల్ని ఆసరాగా ఎక్కడెక్కడి వారో తాము కూడా తెంగాణ వారమే అని ఉద్యోగాకు పోటీపడ్డారు. నిజానికి  ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి పునాది కూడా ఖమ్మం జిల్లా నుంచే పడిందంటే అతిశయోక్తి కాదు. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులను 1969 జనవరి పది తారీఖులోగా తొలగించి  తెంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ‘కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌’ సంఘం కార్యదర్శి వి.వై.గిరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది ఆచరణకు రాకపోవడంతో విద్యార్థి రవీంద్రనాథ్‌ అమరణ నిరాహార దీక్ష చేపట్టిండు. ఇది విస్తరించి తెంగాణ అంతటా ఉద్యమానికి దారితీసింది.

 

నిజానికి 1961లో తెంగాణ కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ నిధుల నుంచి ఈ ‘కొత్తగూడెం పవర్‌ థర్మల్‌ స్టేషన్‌’ ప్రారంభ మయింది. ఇందుకోసం రైతులు 1300 ఎకరాల భూమిని ధారదత్తం చేయాల్సి వచ్చింది. ఒక వైపు భూములు పోయాయి. మరోవైపు కరువు పరిస్థితులు, తమ కండ్ల ముందట రోజువారీ ఉద్యోగాలకు కూడా ఉన్నతస్థాయి ఆంధ్ర అధికారులు తమ ప్రాంతంవారిని పిలిపించి ఉద్యోగాలిచ్చారు. ముల్కీ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘించి స్థానికంగా భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా ఆంధ్ర ప్రాంతం వారికే కట్టబెట్టారు. మొదట ఎం.ఎన్‌.ఆర్‌ అని తాత్కాలిక ఉద్యోగాల పేరిట వారిని పనిలోకి తీసుకొని, తర్వాతికాంలో ‘అనుభవం’ ఉన్నవారు అని సాకు జెప్పి వారికే ఉద్యోగాలిచ్చిండ్రు. మొత్తం 1200 ఉద్యోగాల్లో తెంగాణ వారు కేవం 200 మంది కూడా లేరు. తెంగాణలో అప్పటికే 30వేల మంది ఇంజనీరింగ్‌, డిప్లొమా, డి.టి.ఐ, హెచ్‌.ఎస్‌.సి, డిగ్రీలు పాసయినవారున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న అటు ప్రభుత్వం గానీ, ఇటు ఎపిఎస్‌ఇబీ గానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. నిజానికి తెలంగాణకు ఉన్న రక్షణల్ని ఆంధ్రాధికారులు ఉ్లంఘించిండ్రు. ఈ సేఫ్‌గార్డ్స్‌ 1958 నుంచీ అమల్లో ఉన్నాయి. కండ్ల ముందట అన్యాయం జరుగుతున్నా అడ్డుకోలేని అశక్తత ఆగ్రహానికి దారి తీసింది. అలా ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి పునాది పడింది. రెండో సారి 2009లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనప్పుడు రోశయ్య ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి ఖమ్మంకు తరలించింది. ఖమ్మంలో తెంగాణ ఉద్యమం బాలహీనంగా ఉండడంతో అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత రాదు అనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. అయితే ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మం ఒక్కటిగా తరలి వచ్చి పోరాటానికి బాసటగా నిలిచింది. లాఠీలకు వెరవకుండా ఉద్యమకారులు చూపిన తెగువ మిగతా తెంగాణ బిడ్డకు స్ఫూర్తిగా నిలిచింది.

ఈ పోరాట స్ఫూర్తితో జ్వలిత గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 104 కథలతో ఈ సంకలనాన్ని వెలువరించారు.  ఈ సంకలనం మిగతా జిల్లాల వారికి స్ఫూర్తి కావాలని స్ఫూర్తి కొరుకుంటూ …

(“ఖమ్మం కథల”కు రాసిన ముందుమాటలో కొంత భాగం)

 

తెంగ్లిష్ భూతం.. వేపమండల వైద్యం…

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

“భాషంటే ఓ అంటురోగం. అంతకు మించేం లే..”  ధాటిగా చెప్పేడు మా చెడ్డీల్నాటి నేస్తం సీనుగోడు.

“సగంనిజాల్ని గెట్టిగా చెప్పీసీవాళ్ళలో ముందువరస నీదే.  భాషంటే ఇంకా చాలావుందని చెప్పిన శాస్తుర్లంతా మొత్తుకోరూ? దానికెంత పెద్ద శాస్త్రముందిరా!” కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాను వాడి పళ్ళెంలో మరో దిబ్బరొట్టి ముక్క వేస్తూ.

“సుబ్బలచ్చిమి కవుర్లు సెప్పకే… అదంతే..” అని అల్లంపచ్చడీ రొట్టిముక్కపెచ్చుతో పాటు మాటల్ని కూడా నొక్కి నవిలీసేడు వాడు.

“నిరూపించరా అప్పారావ్..” అని నేనూ తగ్గకుండా నిలేశా.

“ఇవాళ దిబ్బరొట్టి వేస్తున్నాతల్లీ”. “ఇంకో రొట్టిముక్క వేసుకోరా” అని  వెన్నపూసిన దిబ్బరొట్టి జపం మీ అమ్మ వందలసార్లు చేసేకేకదా, దీనిపేరు ‘దిబ్బరొట్టి’ అని మన బుర్రల్లో నాటుకుంది! ఇంత కష్టపడి రెండు మూడు తరాలుగా మాటలు నాటి పెంచుతూ ఉంటేనే కదా భాష తేనెలో ముంచిన రొట్టెలా రుచులూరేది!”

“అంటురోగం అని చెప్తూ భాష నాటుడు కార్యక్రమంలోకి పోయావ్.  తిండెక్కువైనప్పుడల్లా పీతలా నడిచే నీ మెదడు లక్షణం ఏ మాత్రం మారలేదురా.” అని పొగిడేను.

“తిండెక్కువ పెట్టి గెరిల్లాయుద్ధం చేసే నీ బుద్ధీ అలాగే ఉందిగా”.. వాడూ పొగిడేడు నన్ను.

“బాసింపట్టు వేసుకున్నావుగా దిగరా ఇంక వాదంలోకి!”

“సుబ్బరంగా ‘మఠఁవేసుకుని’ కూచున్నానే.  విజయవాడెళ్ళి మన ‘మఠా’న్ని ‘బాసింపట్టు’ చేసీసేవు. ఇదీ అంటురోగమంటే. ఒక్కటే దెబ్బకి నిరూపించి పారేసినానా నేదా సుబ్బలచ్చిమీ”

“మఠం వెయ్యడాన్ని ఒక్కో వూళ్ళో ఒక్కోలా అంటార్లేరా బంకుశీనూ. నాలాంటి పండితుల్ని విడిచిపెట్టి సాధారణీకరించవోయ్.”

“రెండూర్లు తిరిగి నాలుగు ముక్కలు ముక్కునట్టుకున్న నీలాటోల్లంతా శాత్రం మాటాడీసీవోలే.  గట్టిగా పదివాక్యాలు గుంటూరుభాషలో మాట్లాడు నీ సంగతి తేలుస్తా.”

“అల్లంపచ్చడి ఘాటు తలకెక్కేక నీమాట నువ్వే వినవురా మహేశ్ బాబూ. నామాటలేం వింటావు?”

“ఇదీ నీ గెరిల్లా యుద్ధతంత్రం. కాలికేస్తే మెడకీ మెడకేస్తే కాలికీ.. నీ మొగుడు ఎప్పుడూ లాగిపెట్టి తన్నలే?” ఉక్రోషం వొచ్చీసింది శీనయ్యకి.

“నువ్వు తన్నగలిగేవనా అతను తన్నడానికి?”  ప్రకాశ్ రాజ్ లాంటి శీనుగాడి ఆకారాన్ని చూస్తూ కొంచెం భయంగా  అన్నాను.

“నీతో ఇలా లాభం లేదు.  నేను పూర్తిగా చెప్పేకే నీకు మాటాడ్డానికి అనుమతి ఉంది.”  అంటూ నా మాట చొరనివ్వకుండా కన్హయ్యా కుమార్ లా రంగఁవెక్కి కదం తొక్కేడు మావాడు.  వాడి ‘ఆగ్న’ దాటలేక బ్రాకెట్లలో నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాన్నేను. దాని విధానమిది …

“దిబ్బరొట్టె పేరుతో తరాలుగా మన తలకెక్కిన ఈ అద్భుత పదార్థాన్ని మనచేత ఎవరైనా ‘పాన్ కేక్’ అనిపిస్తే అది   అంతర్జాతీయ కుట్ర. రసాయనాయుధాలకంటే బలమైనది అన్యభాషాప్రసారం.  ఇది గమనించకుండా అన్యమత ప్రచారం అంటూ ఊగిపోతున్న ఆంధ్రదేశపు హిందూవాదులు తెంగ్లిష్ ప్రచారాన్ని ఎందుకు ఖండించరని అడుగుతున్నా.  అడుగుతున్నా నేనడుగుతున్నా.. మొబైల్ ఫోన్ని “చరవాణి” అని వాడుకలోకి తెస్తూ తరవాణిని   గుర్తుకు తెప్పిస్తున్న పత్రికాధిపతిని! (అబ్బ. పొద్దున్నే వాము కలిపిన తరవాణిలో ఆవకాయో మిరపకాయో కొరుక్కుని బొజ్జనిండా తిని, బళ్ళో మత్తుగా ఊగిన రోజుల్ని ఏమన్నా తిరగదోడేవా ప్రియనేస్తం!)  ఏమనీ? తెలుగు వార్తాపత్రికలూ టీవీచానెళ్ళ మధ్య నలుగుతున్న తెలుగోళ్ళని ఒక్కసారంటే ఒక్కసారి… రక్తాశ్రువులొలుకుతున్న తెలుగుతల్లి కళ్ళలోంచీ  పరిశీలించమని… ఓపక్క పత్రికల్లో తెలుగుని ఉద్ధరిస్తూ  మరోపక్క కొత్త కొత్త దూరదర్శన పాయల్ని (టీవీ చానెల్స్)  మూర్ఖానందపు పెట్టె (టీవీ) లోకి పంపిస్తూ వాటిద్వారా తెలుగుభాషా కల్పవృక్షాన్ని నాశనం చెయ్యటం కోసం పరదేశీ వేరుపురుగుల్నీ, కాండంతొలిచే పురుగుల్నీ అగ్గితెలుగునీ, అదే.. అగ్గితెగుల్నీ వ్యాపింపజేస్తున్న తీరుని ప్రశ్నిస్తున్నా. దీనివల్ల జనం, చదూతున్న పత్రికలభాషనీ చూస్తున్న టీవీ తెంగ్లిష్ నీ  వింటున్న ఎఫ్ఫెమ్ రగడనీ (బాగా చెప్పేవ్. తెంగ్లిష్ నగిషీల్లో ఆర్జేల పనితనం తనిష్క్ ని మించినదే)  కలిపి గిలకొట్టి,  కొత్తరకం కంగారుభాష మాటాడుకుంటూ గెంతుకుంటూ పోతున్నారని నేను సోదాహరణంగా వివరించగలను మీడియా మహారాజులారా!  చిత్తశుద్ధి లేని మీ శివపూజల్ని నేన్నిరసిస్తున్నా”. (ఉపన్యాసం బాగుంది గానీ ‘లక్స్ సినిమాతారల సౌందర్య సబ్బు’ నాటి రోజుల్నుండీ ఈనాటిదాకా టీవీ యాడ్ లు కూడా తెలుగుని మరీ దుంపనాశనం చేసిపెడుతున్నాయిరా నాయినా).

ఊపిరి పీల్చుకోడానికి ఆగేడు శీనుగాడు.

“ఈ మధ్య మనకీ కొత్త కొత్త వంటల చానెళ్ళు వొచ్చీసేయి పిల్లా చూసేవా నువ్వు?  నీలాటి బక్కప్రాణికి అన్నిరకాల  వంటల పేర్లు వింటేనే నీరసం వొచ్చిస్తుంది. మీ అమ్మ వంటలు మర్చిపోతావ్.  మ్మ్.. అలా కాదులే.  మీ అమ్మా అమ్మమ్మల వంటలని కూడా ఎలా చెయ్యాలో వీడియో తీసి ఆ చానెల్ కి పంపిస్తే కాస్త పేరూ డబ్బూ కూడా వస్తుందనుకుంటా చూసుకో.  ఒకటి మర్చిపోకు సుమా.  ఆ వంటెలా చెయ్యాలో పూర్తిగా తెలుగులోనే చెప్పాలని వాళ్లకి షరతు పెట్టు. (‘షరతు’ అనే మాట ఎక్కణ్ణుంచి వచ్చిందో తెల్సుకోవా శీనూ)  ఆ చానెల్ చూసి తీరాల్లే. చక్కగా బొద్దుగా ఉండే అమ్మాయిలే అంతానూ.  (అంతా నీలాగే గుండ్రంగా ఉంటే ఎంతానందంరా నీకూ!)  అరె…  అలా అనుమానంగా చూసి శీలశంక చెయ్యకు. (అదేంట్రా మూలశంకలా?)  స్త్రీవాదమే మాటాడుతున్నాలే. సున్నాకొలత వొదిలి మనుషులంతా ఎవరి కొలతల్ని వారు ప్రేమించుకోవాలని నా ఆశయం. (అలా నీ పొట్ట చుట్టుకొలతని ప్రేమించుకుంటూ ఉండు. గుండెపోటొచ్చీగల్దు.)

ఇంతకీ నువ్వు మాటాడకుండా ఉంటే ఎటో వెళ్తున్నాన్నేను. (మీ మగాళ్ళంతా అంతేగా. దార్లో పెట్టడానికే మేమున్నాం.)  అసలు విషయం ఏమిటంటే అమ్మలూ.. చిన్న అనుకరణ చేసి చూపిస్తా చూడు ఓ కార్యక్రమాన్ని!” –  శీనులోని నటుడు ఆవలిస్తూ నిద్రలేచాడు.

***

పాలకోవా వ్యాపారి  శంకర్రావు గారి దగ్గరకు వంటల చానెల్ అమ్మాయి వచ్చింది.

అమ్మాయి :  “అసలు మీ పాలకోవాకున్న ఇంత టేస్ట్, ఇంత స్పెషాలిటీ ఏంటో అర్జంట్ గా తెల్సుకోవాలని వచ్చేసానండీ.”

శంకర్రావు :  “తప్పకుండా.. రండి… ఊక పొయ్యి మీదే కోవా వండుతామండి. ధాన్యం మిల్లు నుండి తీసుకొస్తామండి ఊక..  రైస్ మిల్లులో రైస్ సెపరేట్ అయ్యేక వొచ్చే పొట్టుని ఊక అంటారండి.

అమ్మాయి :  “జెనరేషన్ ఇంత ఫాస్ట్ గా వెల్తోంది కదా..  గాస్.. గాస్ స్టవ్స్, ఇంకా అప్డేటెడ్ చాలా వచ్చాయి కదా. మీరెందుకింకా ‘ఊక’ వాడ్తున్నారు? (ఊక అనే మాటనే అంత బెరుగ్గా అంటావెందుకు తెలుగుపిల్లా?)  మీ సీక్రెట్స్ లో వన్ అఫ్ ది సీక్రెట్స్ ఊకపొయ్యి అన్నమాట…  సరే. కోవా రెడీ అవడానికి ఎంత టైం పడుతుందండీ?”

శంకర్రావు:  “పదిలీటర్లు పాలు కోవాగా తయారవటానికి గంట, గంటన్నర పడుతుందండి”.

అమ్మాయి :  “ఓకే ఓకే. ఆ పాలు టెన్ లీటర్సాండీ ?

శంకర్రావు:  “అవి ఫార్టీ లీటర్స్అండీ. ఇవి టెన్ లీటర్స్ అండీ.”  (ఒప్పేసుకున్నా శీనూ. భాష వొట్టి అంటురోగమే. పాపం ఆయనకీ అంటించేసిందీ పిల్ల. అసలే అన్యభాషా వ్యాధినిరోధకశక్తి లేనివాళ్ళం).  … కోవాకి పాలు బాగా మరిగి చిక్కబడాలి”.

అమ్మాయి :  “అంటే బాగా రెడ్డిష్ రావాలాండీ?”

శంకర్రావు:  “ఔనండీ రెడ్డిష్ రావాలి”. (ఇదేంబాధ శంకర్రావుగారూ మీకు? మధ్యలో మా కళ్ళు రెడ్డిష్..  ఛ ఛా .. ఎర్రబడిపోతున్నాయ్ ఆర్. నారాయణమూర్తిలా).

అమ్మాయి :  “పెద్దలు నడిచిన ‘మాట’లో (బాట అనే మాట తెలీదీ పిల్లకి) మనమూ నడిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పొందుతామనటంలో మీరు ట్రూ ఇన్స్పిరేషనండీ. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండీ?

శంకర్రావు :  పందొమ్మిది వందల యాభైలో నాన్నగారు స్టార్ట్ చేశారండీ.. (మీకూ ‘స్టార్ట్’ అయిందండీ అంటువ్యాధి.)

అమ్మాయి :  శివరావు గారంటే మీ ఫాదర్ గారాండీ? మీది పుట్టుకతోనే ‘సంపున్న’ కుటుంబమా?” (నీ సంపుడేంది తల్లీ ?)

***

“ఇప్పుడేమంటావ్? ఈ అమ్మాయిని వేషం మార్చి శంకర్రావుగారింట్లో రెండ్రోజులుంచి వాళ్ళంతా మాటాడుకునే భాషలో ముంచి తీస్తే తప్ప ఈ పిల్ల తన వొచ్చీరాని వింగిలీష్ని ఆయనకీ అంటించడం ఆపదు.  నువ్వూ నేనూ, తెలుగులో కథలూ కబుర్లూ రాసే అల్పసంఖ్యాక వర్గాలవాళ్ళూ, తెలుగు భాషాశాస్త్రవేత్తలూ (ఈ జాతి ఇంకా మిగిలుందంటావా?)  పిల్లలకి బడుల్లో తెలుగు నేర్పించే అభాగ్యులూ మనభాష గురించి ఆలోచిస్తే చాలదు తల్లీ.  టీవీకి తెంగ్లిష్ చీడ వదిలిన్నాడే  తెలుగుజాతి మొత్తం బాగుపడేది. అదెలగంటావా? మొదటగా తెలుగు టీవీ చానెల్ యజమానులందర్నీ కూచోబెట్టి,  దేశభక్తికంటే గెట్టిగా తెలుగుభక్తిని ఒళ్లంతా నలుగుపిండిలా రుద్ది తలంటు పొయ్యాలి.  (తెంగ్లిష్ మదగజాన్ని అణచగలిగే అంకుశాలున్న అసలైన మావటీలెవరో బానే కనిపెట్టేవుగానీ వాళ్ళని లాక్కొచ్చి ఆ ఉద్యోగంలో పెట్టే శక్తి ఎవరికుందో చెప్పలేవు శీనూ నువ్వు.).  తెలుగుమాటల మధ్యలో అతిగా ఇంగ్లీష్ ముక్కలు వేస్తూ దీన్నో వ్యాధిలా అందరికీ అంటించడాన్ని దేశద్రోహనేరమంత..  అదేలే.. భాషాద్రోహనేరమంత  హీనంగా చూస్తూ వేళాకోళం చెయ్యాలి.  ఎవరైనా “సండే.. థర్టీయత్ నైట్.. టూ లాక్స్ తీస్కుని స్టార్ట్ అవుతున్నా”… అంటుంటే  “టీవీ, కంప్యూటర్, కామెరా లాంటివాటికి సరేగానీ  ‘ఆదివారం.. ముప్పయ్యో తేదీ రాత్రి… రెండులక్షలు తీస్కుని బయల్దేరుతున్నా’ అని చెప్పడానికి ఇంగ్లీషుముక్కలెందుకు బంగారూ?” అని నెత్తిమీద సోలడు నూనింకిపోయీలా కొట్టీయాలి. తెలుగుమాటలు అందిస్తూ అంటిస్తూ పోవాలి.  (ముక్యమంత్రిగోరే  తెంగ్లిష్ ని నాలికమీదున్న సరస్వతీదేవిలా మొక్కీసోట  ఇయన్నీ చేసీదెవులో చెప్పకుండా నీ గోలేందిరా?)  ఇంతకు ముందు ఇరుగు పొరుగుల్తో సుబ్బరంగా తెలుగులో మాటాడుకునే ఇల్లాళ్ళభాషని కూడా చెడగొట్టి తెంగ్లిష్ ని నాటుకుంటూపోతున్న టీవీ చానెళ్ళని ఏం చేసినా పాపం అంటదు.  తెలుగు మాటా పాటా మర్చిపోయి,  బుల్లితెరల మీద సినిమాపాటలు పాడి ఎగురుతూ,  టీవీ పీతబుర్రలు కనిపెట్టిన వెర్రాటలాడుతూ, ‘ఆరెంజ్ కలర్ టాప్ మీద జరీ వర్క్ చేసిన హాండ్స్ తో గ్రీన్ కలర్ బాటమ్, కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ చున్నీ ఉన్న డ్రెస్ నో, పింక్ కలర్ బాడీమీద రెడ్ కలర్ ప్రింట్స్ వేసిన రిచ్ సిల్క్ సారీనో బ్యూటిఫుల్ గిఫ్ట్స్ గా కొడుతూ’ కాలం దొర్లించేస్తున్నారు కొంతమంది ఇల్లాళ్ళు.

అసలూ,  తెలుగురాని వింతజీవాల్ని ఏంకర్స్ అనే పేరుతో మనమీదికి వొదుల్తున్న టీవీ చానెల్ యజమానులు ఇంగ్లీష్ ముక్కలతోనే జ్ఞానం వొచ్చీసిందనుకునే జడ్డితనాన్ని పక్కనపెట్టి,  ఓ చిన్నపని చెయ్యొచ్చుగా!  ఒక్క రెండునెల్లంటే రెండునెల్లు.. టీవీ వ్యాఖ్యాతలుగా ఉద్యోగమిచ్చి తీసుకున్న వాళ్ళనందర్నీ ఓచోట కూచోబెట్టి తెలుగులో శిక్షణ ఇప్పిస్తే వాళ్ళకున్న కోట్లు కరిగిపోతాయా? నడ్డివంచి తెలుగుని వడ్డిస్తే, ఇప్పుడు మాట్లాడుతున్న పిచ్చిభాష మళ్ళీ మాటాడే ధైర్యం చెయ్యగలరా ఈ వ్యాఖ్యాతలు?  చైనావాళ్ళంతటి వాళ్ళే మనవాళ్ళతో ‘మీ పేరేమిటి?’ అనడగటానికి ఎంతోకష్టపడి ఇంగ్లీష్ లో మర్యాదగా ‘వ్హాటార్యూ?’ అంటూ పాపం తప్పోతడకో ఏదోటి మాటాడేసి వ్యాపారవృద్ధి  చేసుకుంటూపోతుంటే,  ఉద్యోగం నిలబెట్టుకోవడంకోసం మనవాళ్ళు మనభాషని ఆపాటి నేర్చుకోలేరా?”

“ఒక కీలకం ఉంది సుబ్బూ.. ‘అన్యాయాలో, అక్రమాలో, హిందూమతపు జడలదెయ్యాలో, వర్గపోరాటాలో, ఆలో పొలో’మంటూ ఆయాసపడేవాళ్ళ  పూలు పుయ్యని ముళ్ళగులాబీపొదలాంటి భాషని టక్కున కత్తిరించి పడేసి సరికొత్త జాతీయాన్ని అందుకుని శైలీ ప్రకటన (స్టైల్ స్టేట్మెంట్ ని ఇలా తెలుగు చేశారా గురూగారూ ?) చేసీసేడు చూడూ.. ఆ కుర్రాడిలా దారి తియ్యాలి.  భావాల ఎత్తూ ఆదర్శాల లోతూ ఇవాళ ఎవరికీ అక్కర్లేదమ్మీ!  దేనిగురించైనా ప్రచారం ఎంత తెలివిగా చేసేవాఁ అన్నదే కిటుకు. తెంగ్లిష్ మీద విరుచుకుపడి, ‘చక్కగా తెలుగు మాట్లాడ్డమే, తెలుగుతో ప్రయోగాలు చెయ్యడమే నాగరికత’ అనుకునేంతగా తెలుగువారందరిలోనూ స్వాభిమానం గంతులు వేసేలా శైలీప్రకటన చెయ్యగల ధీరులు వొచ్చేవరకూ ఇంతే సంగతులు” రొప్పుకుంటూ ఆగింది బండి.

అవకాశం దొరికింది కదాని ముందుకి దూకి,

“ఓకే బాస్. ఏదో పెరిఫెరల్గా మాట్లాడుతూ, ఇంగ్లీష్ వైరస్ ఇంతగా గ్రో అవడానికీ మన రెసిస్టన్స్ లేమికీ గల కారణాలజోలికి వెళ్ళకుండానే ప్రాబ్లెమ్ ని మీరు డీప్ ఫ్రై చేసారనీ,  సాల్వ్ చేసే వర్క్ కి పూనుకున్నారనీ అర్థం అవుతోంది. ఏదెలావున్నా మీరు చెప్పినట్టు తెలుగువంటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చెయ్యడం ముఖ్యం.  మొదటిగా తెలుగులాంగ్వేజ్  మిల్క్ ని విలేజెస్ నుంచి ముందురోజు నైట్ కలెక్ట్ చేస్కుని, దాన్లోవున్న కొద్దిపాటి ఇంగ్లీష్ నలకల్ని ఫిల్టర్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీనికి భాషాభిమానం అనే సుగర్ ని ఏడ్ చేసి, పరభాషాద్వేషం అనే చిటికెడు ఇలాచీ పొడిని మిక్స్ చెయ్యాలి.  ఇది ఎక్కువేస్తే పాకం స్పాయిల్ ఔతుంది సుమా.. తరువాత  డయలెక్ట్ అనే ఊక స్టవ్ మీద నేటివిటీ అనే ఇత్తడి కడాయిపెట్టి ఈ మిక్స్ ని డైరెక్ట్ గా వేసి కంటిన్యువస్ గా ఇడియమ్ అనే తెడ్డుతో తిప్పితే ఒకటి రెండు డికేడ్స్ అయ్యాక చక్కటి తెలుగుకోవా స్మూద్ గా టేస్టీగా వస్తుంది. ఈ పని కలెక్టివ్ గా తెలంగాణా ఉద్యమం రోజుల్లో రోడ్లమీద చేసిన వంటలంత ఇంటెన్సివ్ గా చెయ్యాలి.  నీ ప్రభావంతో నేను కూడా ఈజీ సొల్యూషన్స్ చెప్పేస్తున్నా చూసేవా శీనూ!  పోనీ కుంభకర్ణుణ్ణి బుల్లి రాక్షసులు నీడిల్స్ తో పొడిచినట్టు ఆన్లైన్ పిటిషన్స్ పెట్టి మీడియాని పొడుద్దామా?  సరే.  అదలా వుంచి, మన తెలుగు పాలకోవాలోకి వచ్చేద్దాం. డిఫెరెంట్ రుచున్న ఈ స్పెషల్ తెలుగు డిష్ వెరైటీని కొత్త జెనరేషన్ పిల్లలు ఎంజాయ్ చెయ్యటం స్టార్ట్  చేసారంటే తెలుగుమమ్మీ శ్రమ ఫలించినట్టే.  ఎక్సెలెంట్ టేస్ట్ తో ఉన్నఈ కొత్త తెలుగుభాష కాన్సెప్ట్ సినిమాల్లోకి ‘వర్కౌట్’ ఔతుంది. తెలుగు ఫిక్షన్లోకి కూడా ఇంపోర్ట్ ఔతుంది”  అని  చెప్పుకుపోతూ అంతలో తెలివి తెచ్చుకుని,  “అయ్యో, ఏంటో శీనూ, ఒక్కరగంట ఏ తెలుగు టీవీచానెల్ చూసినా, వాటిలో మూడోతరం తెలుగు సినిమా హీరోలూ ముంబై హీరోయిన్ల ముచ్చట్లు విన్నా నాకిలాంటి మాటలే ఒచ్చిస్తున్నాయ్.  వీళ్ళ మధ్య ఝాన్సీ లాంటి మేలిమి బంగారు  వ్యాఖ్యాతలక్కూడా కిలుం పట్టిపోతోంది.” అని గింజుకున్నాను.

“ఇంగ్లీష్, తెలుగు అనే రెండు అందమైన భాషలు పెళ్ళాడి బుజ్జి తెంగ్లిష్ ని ఎప్పుడు పుట్టించేయో మనకి సరిగ్గా అర్థం కాకముందే అది వామనావతారంలా ఎదిగి మననెత్తిన కాలు పెట్టేసింది. ఈ బిడ్డకి ఊబవొళ్ళు వొచ్చేసిందని  అనుకునేవాళ్ళు తక్కువమంది. ఆ కాలు కిందే ఇంకెన్ని తరాల తెలుగువాళ్ళు బతుకుతారో తెలీటం లేదు. ఇప్పటికే సగం చచ్చిన తెలుగు ఇంకే అవతారం ఎత్తుతుందో అంతకన్నా తెలీదు.  ఏంచేస్తాం? ఇప్పుడు నెమ్మదిగా మన చిన్నప్పటి తెలుగుపాఠానికి రా.  చెంపకు చెయ్యి పరంబగునపుడు కంటికి నీరాదేశంబగును. తెంగ్లిష్ నీకు ఎక్కినపుడల్లా చిన్నప్పటి ఈ సంధిసూత్రం గుర్తు తెచ్చుకుంటూ లెంపకాయ్ వేసుకో.  బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా అన్నాడు వేమన. తెలుగుటీవీ ఏంకర్లనే గ్రహాంతరవాసుల్లోంచి ఉద్భవించి, సమాజానికంతటికీ పట్టిన తెంగ్లిష్ భూతాన్ని పచ్చపచ్చని తెలుగువేపమండల్తో తన్ని మరీ వదిలిస్తే తప్ప మనజాతి బాగుపడదు. జాతి మొత్తం గొడవ మనకెందుగ్గానీ నీపాటికి నువ్వు ఎప్పుడైనా టీవీ చూస్తే తెలుగు వేపమండల వైద్యం చేసుకుంటూ ఉండు” అంటూ ప్రకాశ్ రాజ్ లా నవ్వేడు మా శీనుగాడు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గన్నుతో కాదు….గుడ్లురిమి చిదిమేస్తా!

 

 

‘ఇక్కడ కాదు. బయటికి నడు నీ పని  చెప్తా ’ అంది ఫ్లెమింగో, గుడ్ల గూబ ని చూసి!

‘నువ్వే దయచెయ్. మరో క్షణం నాదగ్గరుంటే కళ్ళార్పకుండా  చంపేస్తా. నువ్వు వీగిపోయినప్పుడు ఓదార్పనేది లేకుండా కడిగేస్తా…ఇహిహి ”  ఉరిమినట్టుండే గుడ్లను మరింత ఉరిమింపజేసి  చూసింది గుడ్ల గూబ!

‘ఏంటలా గుడ్లురిమి చూస్తావ్? అలా చూస్తే మేం భయపడి ఎగిరి పోవాలా? గూబ గుయ్ మంటది జార్త!’ అంది ఫ్లెమింగో!

‘ఏం మాడుతున్నావ్ ఫ్లెమీ? మా గుడ్ల గూబ కళ్ళెప్పుడూ అలానే ఉంటాయ్! అది కోపం తో కాదు. నీతో నవ్వుతూనే చెబుతున్నా ‘దయచేయ్’ అని“

“నకరాలు చేయకు. నా చేతులో ఇత్తడై పొతావ్”

“ఇత్తడంటే …లోహం. అంటే ‘లోహ విహంగం’ అవుతానన్నమాట! అహ్హహా.ఒహ్హోహో..! ఒకప్పుడు మా దగ్గరున్న ‘లోహ పాదం’ ఏనాడో నీ దగ్గర అడుగు పెట్టిందిగా. అలాటి పాదాలని జతచేసుకుని  నువ్వు పార్టీని ఈదాలంటే  చాలాకష్టమే మరి. అహ్హాహా…ఒహ్హోహో  ”

“నువ్వు నవ్వుతున్నాననుకుంటున్నావేమో. నాకు తెల్సు. అది నవ్వు కాదు. అవహేళన అని తెలుస్తూనే ఉంది ”

“నా కనుగుడ్లు ఎల్లప్పుడూ  విచ్చుకోవడమే ఉంటుంది. ప్రత్యేకించి  ఉరమడం అనేది ఉండదు. ఇంత నవ్వుతున్నా ఉరిమానంటావేం? నా గుడ్ల మాన్యుఫాక్క్చరింగే అంత అనుకోవచ్చుగా. అహ్హహ్హ  !”

“మరి అలా ఆ చూపుడు వేలు ఎందుకు గుచ్చినట్టు  చూపిస్తున్నావ్?”

“మళ్ళీ అహ్హ హ్హ….నేను రెక్క ఎత్తిచూపిస్తున్నా, అది నీకు వేలు ఎత్తి చూపిస్తున్నట్టుందేం? నేనిక్కడ కూల్ గా  నిన్ను చూస్తున్నా కూడా నీకు ఉరిమినట్టుంటుంది. సరే …ఇహ నేను నవ్వను గాక నవ్వను. సీరియస్ మోహమేసుకునే  ఉంటా!సరేనా.”

“నీ ఫేసుకలాంటి ఫ్రస్ట్రేటెడ్  స్టాంపే బెటర్! అర్థం కాలేదా? అంటే నీ వదనానికి ఆ మథన ముద్రే బాగుంతుందంటున్నా! అయినా నీ సంగతిలా  కాదు. పక్షుల ప్రత్యేక  సమావేశంలో నీ ప్రసంగాన్ని దుయ్యబట్టి ఏ ఈకకి ఆ ఈక  పీకి పారేస్తా!”

“హలో! ఏమ్మాడుతున్నావ్? ప్రస్తుత  ప్రసంగంలో ఏం పీకావని కొత్తగా  వేరే పీకుతావ్? సందర్భం లేకుండానే విర్రవీగిన నీ ‘అవిశ్వాసమే’ వీగిపోయింది “

“అదిగో మళ్ళీ గుడ్లలా ఉరమకన్నానా? నీ గుడ్లంటే నాకో ‘ఫోబియా’. తోటి పక్షిని కాబట్టి అలా ‘పీకడం’ లాంటి అన్ పార్లమెంటరీ పదాలు నాపై వాడుతున్నావ్ గానీ, మనుష్య భాషలో అదో పెద్ద బూతు. నీకా విషయం తెల్సా?”

“ఈకలంటూ ఉన్నాక  పీకించుకోకుండా ఉంటామా?లేదా పీకకుండా ఉంటామా? అందులో అన్ పార్లమెంటరీ ఏముంది? అర్ధం లేని ఏడుపు నీది.”

“ఏడిశావ్……ఇప్పుడు నువ్వన్న  ‘ఏడుపు’  అనేదే అసలైన  అన్ పార్లమెంటరీ. దాన్ని రికార్డులోంచి పీకించాలి.”

“ఏడుపు అన్ పార్లమెంటరీ కాదు….నువ్వంటోన్న ‘ఏడిశావ్’ అనేది అన్ పార్లమెంటరీ. అయినా నేను ఏడిశానంటావ్…మీ అయ్య పనీ పాటా లేకుండానే తెగ ‘నవ్వుతూ’ ఉండేవాడు….గుర్తుందా? పనికిమాలిన నవ్వుకన్నా పనికొచ్చే ఏడుపు మిన్న కదా!  అదలా ఉంచి నీ వద్ద నున్న పక్షులన్నీ  నా వద్దకు వలస వచ్చేశాయి …ఇంకొన్ని వచ్చేస్తున్నాయి ”

“ఆ …. మావన్నీ మీవద్దకు వస్తే  వలసలు అంటారు…..అదే పొరుగు ఊళ్ళో మీకిదే జరిగితే –  మమ్మల్ని ‘గద్ద’ తన్నుకెళ్ళింది   అంటూ ‘ముక్కు’ సూటిగా అనేస్తావు.  ….అంతేగా? అక్కడ ముక్కుకు లొంగిపోతావ్ ….ఇక్కడ ముక్కుకు తాడు వేస్తానంటావ్. నువ్వేంటో ఒక్క ముక్కా అర్థం కావురా బాబూ ”

“ఫ్లెమీ బ్రదర్….ఏమ్మాడుతున్నారు? రెండు కళ్ళకీ అంతటి దేదీప్యమానమైన  ప్రాధాన్యాన్ని ఇచ్చాను గాబట్టే … ఇవ్వాళ నీకు నా గుడ్లు ఉరిమినట్టు కనిపిస్తుంది. నిజానికి జరిగిందేమేటంటే ఇరుపక్షులకీ … సారీ … ఇరు పక్షాలకీ సమన్యాయం చేయాలన్నదే నా ‘ఉభయ గుడ్ల’ తత్వం. అయినా నన్నంటావేమిటి? నేను పక్షినైతే నువ్వు ప్రతిపక్షివి!  నేను ప్రతిపక్షినైతే నువ్వు పక్షివి!  మీ అయ్య ఊరకే పిచ్చ పిచ్చగా నవ్వుతుండేవాడు ఊరపిచ్చుక లా! అప్పట్లో  నేను ప్రతి పక్షినిగదా…అంచేత దానికి విరుద్ధముగా కడు సీరియస్ గా ఉండేవాణ్ణి. మాట్లాడుతుంటే అడుగడుగునా  కళ్ళు ‘మూసుకు’నేవాడు. నేను ప్రతి పక్షిని గావున తద్విరుద్ధముగా  కళ్ళు  ‘బార్లా తెరిచి’ చూచెడివాడిని. ఇటుల … అటువైపునుంచి  ఈ వైకల్యం ఏ…నా…డో  నాకంటుకొనగా … నేడేదో పిల్ల పక్షి నాయొవద్దకు వచ్చి గుడ్లురిమెదవేమీ గుడ్లురిమెదవేమీ యనుచు వ్యర్ధ ప్రేలాపముసేయుటెందులకు?” అంది గుడ్ల గూబ, గుయ్ మనేలా.

“ఇదిగో …నన్నేమయినా అను. ఊరుకుంటా. ఏలోకాలకో రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోయిన ఓ పెద్ద పక్షిని పట్టుకుని, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడకు. మెదడు పాక్షికంగా దెబ్బతింటుంది. ఇంగో నా శాపం! ” అంటూ  శాపం పెట్టింది ఫ్లెమింగో!

“ఛీ! జైలు పక్షిలా ఎంత అసయ్యంగా మాడుతున్నావ్? పడమట అస్తమించడానికి సిద్ధంగా ఉన్న  నీతో నోరు కలపడం నాదే తప్పు. అయినా నేను అర్జంటుగా అప్పుతెచ్చుకోడానికి  ఉత్తరానికి వెళ్లాల్సిన పనుంది. నిన్ను రేపటి ప్రత్యేక సమావేశంలో తూర్పార బడతాను. అప్పటివరకూ నువ్వు తక్షణమే  దక్షిణ దిశగా పో!” అంది గుడ్లగూబ అక్కడినుంచి ఎగరబోతూ!

“వామ్మో. నేనుకూడా తొందరగా వెళ్లకపోతే కొంప కొల్లేరు సరస్సయ్యేట్టుంది. పిల్ల పక్షులంతా సరిగ్గా తిని తొంగున్నారో లేక ఇంకేవైనా హడావిడి చేస్తున్నారో చూసొస్తా. అసలే ఎవరు స్వపక్షమో ఎవరు అక్కుపక్షమో తెలిసిచావడం లేదు. అది తెలుసుకుందామనుకున్న నా  అవిశ్వాసానికి విశ్వసనీయత లేకుండా వీగి పోయింది ” అంటూ ఉన్నపళంగా గాల్లోకి లేచింది ఫ్లెమింగో!

పెద్ద బంగాళా లాంటి చెట్టు గూటికి చేరి చూసుకునేసరికి అనుకున్నట్టే పిల్ల పక్షుల కిలకిలలు పెద్దెత్తున వినిపించాయి. అన్నీ కలిసి గానా బజానా చేసుకుంటున్నట్టుగా ఉంది. అంతే కాదు. అవిపాడుకునే పాట వినేసరికి తన ప్రతి రెక్కలోని ప్రతి ఈకా భయంతో నిక్కబొడుచుకుంది. మోడు బారబోతున్న చెట్టు సాక్షిగా గానాభజానాల  పాట జోరుగా సాగుతోంది.

“ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…… ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…”

$$$

 

 

 

 

 

 

కథలో మాండలికం ఎంత వరకూ?!

 

-టి. చంద్రశేఖర రెడ్డి

~

ఈ వ్యాసం-విభిన్న మాండలికాల్లో తెలుగు కథలు రాయటం గురించి.

ఒకప్పుడు కథలు గ్రాంథిక వచనంలో రాయబడేవి. తర్వాత అవి వ్యావహారిక భాషలో రావటం మొదలైంది. అడపాదడపా ఆ దశలోనే కథలు మాండలికంలో రావటం కూడా ఆరంభమైంది. ఈ ధోరణి ఊపందుకని ఇప్పుడు చాలా కథలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భిన్నప్రాంతాల మాండలికాల్లో వస్తున్నాయి. తెలంగాణా, రాయలసీమ, కోస్తా జిల్లాల మాండలికంలో; దాంతో పాటు ఇంతకు ముందు ఉపయోగించిన వ్యావహారిక భాషలో; ఆయా ప్రాంతపు రచయితల కలాలనుంచి కథలు జాలువారుతున్నాయి. ఈ ధోరణిలో స్పష్టంగా కనపడే విషయం-ఒక ప్రాంతపు రచయితలు, వాళ్ల కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలోనే రాయకుండా, ఒకప్పుడు విస్తృతంగా ఉపయోగంలో ఉన్న వ్యావహారికభాషలో సైతం రాయటం.

కథ రెండు భాగాలుగా చెప్పబడుతుంది. కథకి సంబంధించిన నేపథ్యం, ప్రస్తుత పరిస్థితులూ, పరిసరాలూ మొదలైనవి ఒక భాగం. రెండో భాగం పాత్రల మధ్య సంభాషణ.

కొంతమంది రచయితలు, కథలో రెండు భాగాలనీ అంటే మొత్తం కథని; వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాస్తున్నారు. ఉదాహరణకు కె. ఎన్. మల్లీశ్వరి గారి కథ “టెంకిజెల్ల”(ఆదివారం వార్త, 2 అక్టోబర్ 2011; కథ 2011 కథా సంకలనం), కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె  సుక్క’ (బతుకమ్మ,3 ఆగస్ట్ 2014, ప్రాతినిధ్య 2014 కథా సంకలనం), స. వెం. రమేశ్ గారి కథ ‘పాంచాలమ్మ పాట’ (విశాలాక్షి అక్టోబర్ 2014-ప్రాతినిధ్య 2014 కథా సంకలనం).

కొంతమంది రచయితలు పాత్రల సంభాషణని మాత్రమే వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాసి, మిగిలిన కథని; పైన చెప్పిన వ్యావహారికభాషలో రాస్తున్నారు. ఉదాహరణ-బెజ్జారపు రవీందర్ గారు రాసిన ‘మూడు తొవ్వలు’ కథ (ఆదివారం ఆంధ్ర జ్యోతి 23 అక్టోబర్ 2011, కథ 2011 కథా సంకలనం).

కొన్ని మాండలికాల్లో,  ఒక ప్రాంతపు వాళ్లకి తెలిసిన పదాలు, కొంచెం మార్పుతో మిగిలిన ప్రాంతాల్లో సైతం వాడబడతాయి. అలాంటి పదాల్ని ఏ మాండలికంలో రాసినా, ఆ మాండలికంతో పరిచయం లేని  పాఠకులు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. దీనికి కారణం, ప్రాథమికంగా వాళ్లకు పరిచయమున్న పదమే, ఉచ్ఛారణ పరంగా కొంత మార్పుకు లోనయి కథలో కనబడటం.

ఉదాహరణకు-చెప్పాడు అనే పదం. ఇది- చెప్పిండు, చెప్పినాడు గా మిగిలిన ప్రాంతాల్లో వాడబడుతోంది. దీని వలన చెప్పాడు అనే పదంతో పరిచయం ఉన్న  పాఠకుడు; చెప్పిండు, చెప్పినాడు పదాల విషయంలో చదవటానికి కానీ, అర్థం చేసుకోవటానికి కానీ ఎలాంటి అసౌకర్యానికీ గురి కాడు.   కాని, కొన్ని పదాలు పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితం. పాంచాలమ్మ పాట కథలో ఉపయోగించబడ్డ- బడిమి, ఇడవలి, అడిమ లాంటివి.

ఏ కథలో అయినా తెలిసిన పదాలని చదవడం, అవి చదవగానే అర్థం అవుతుంటే ముందుకు సాగడం సులభం. కారణం, ఉచ్ఛారణపరంగానైనా, అవగాహనపరంగా అయినా ఆ పదాలు తెలిసిన వాళ్లకి కథని అవగాహన చేసుకోవడంలో అవరోధాలు అనిపించవు కనక. నిజం చెప్పాలంటే ‘టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’,  ‘పాంచాలమ్మ పాట’ కథలతో పోల్చుకుంటే ‘మూడు తొవ్వలు’ కథ నేను నాకున్న పరిమిత తెలుగు భాషా జ్ఞానంతో ఎక్కువ సౌకర్యవంతంగా చదవగలిగాను. కారణం-అందులో కథనం నాకు తెలిసిన భాషలో ఉండి, సంభాషణల వరకు మాత్రమే, సంబంధించిన పాత్రలు వాటి మాండలికంలో మాట్లాడుకున్నట్లు రచయిత రాయటం.

కథ చదవటం వేరు, కథని అర్థం చేసుకోవటం వేరు, కథని అనుభవించటం వేరు. టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’, ‘పాంచాలమ్మ పాట’ కథలు, పూర్తిగా ఆయా ప్రాంతపు మాండలికాల్లో రాయటం వల్ల, వాటిల్లో ఎంత చదివించే గుణం ఉన్నా; చాలా పదాలకి అర్థం తెలియక పోవటం వలన నేను పట్టిపట్టి చదవాల్సి వచ్చింది. దీని వల్ల నేను ఆ కథలని చదవటం వరకే పరిమితమయ్యానని అనిపించింది. అర్థం చేసుకోవటం, అనుభూతిని పొందటం విషయంలో నన్ను నేను పూర్తిగా సంతృప్తి పరుచుకోలేక పోయినట్లుగా కనిపించింది.

బహుశా ఈ అనివార్య పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను-కొన్ని కథల చివర, ఆ కథలో ఉపయోగించబడ్డ ఏ పదాలైతే మిగిలిన ప్రాంతాల పాఠకులకి తెలియటానికి అవకాశం లేనివని అనిపిస్తున్నాయో వాటి పట్టిక, అర్థాలతో  ఇస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ పట్టిక, కొన్ని కారణాల వల్ల ఇవ్వబడిన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలమవుతోంది. ఎలాగంటే-

పాంచాలమ్మ పాట కథలో నాకు తెలియని పదాలు 97.   ప్రాతినిధ్య 2014 కథా సంకలనంలో ఈ కథ క్రింద, ఆ కథలో వాడబడిన మాండలిక పదాల పట్టిక వాటి అర్థాలతో ఇవ్వలేదు. అప్పటికీ ‘శబ్దార్థ చంద్రిక’ ని సంప్రదించి దడము, అలమట, కయ్య అనే పదాల అర్థం తెలుసుకుని ఆ పదాలను వాడిన సందర్భాలను అవగాహన చేసుకోగలిగాను. కాని. నిఘంటువులొ సైతం లేని అడిమ లాంటి పదాల విషయంలో ఏమీ చెయ్యలేకపోయాను. ఆ పదం నిఘంటువులో  చేర్చబడక పోవటానికి కారణం-నిఘంటువులో ఉన్న విధంగా రచయిత ఆ పదాన్ని రాయకపోవటమా? రాసినా అది ముద్రారాక్షసచర్యలకి గురి కావటమా? తెలుసుకోలేక పోయాను. వెలుతురు ప్రసరించాల్సిన సందర్భంలో ఇలా కొన్ని పదాలు, వాటి పెదాలు విప్పకపోవటం వలన అవగాహనారాహిత్యపు అంధకారంలో  చిక్కుకుపోయాను.

టెంకి జెల్ల కథలో నాకు తెలియని పదాలు 41 ఉన్నాయి.  అందులో 20 పదాలకు మాత్రమే, కథ 2011 సంకలనంలో కథ చివర అర్థం ఇవ్వబడింది. అందులో ఒకే అర్థం వచ్చే పదాలు 12 ఉన్నాయి.  మిగిలిన తొమ్మిది పదాల అర్థం తెలుసుకోవటానికి శ్రమించాల్సి వచ్చింది.  ఇది కాక, ఈ కథ విషయంలో నాకు ఇంకొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కథకి పేరుగా పెట్టబడిన ‘టెంకి జెల్ల’ పదానికే అర్థం తెలియలేదు. జెల్లకాయ అంటే చెంప దెబ్బ అని, నిఘంటువు చెపుతోంది. టెంకిజెల్లకి అర్థం కనపడలేదు. కథ చివర అర్థం ఇవ్వబడిన మాండలికాల్లో; జాకర్లు, కమ్మగట్టడం అనే పదాలు ఉన్నాయి. కానీ, ఆ పదాలు కథలో ఎక్కడా కనపడలేదు. నబవరులు అనే పదం కూడా ఇచ్చారు. కానీ కథలో సబవరులు అనే పదం మాత్రమే ఉంది. రెండిట్లో ఏది ముద్రణా దోషమో తెలియ లేదు.  గత్తర-అంటే ‘చెత్త’ అని అర్థం ఇచ్చారు. నాకు తెలిసి ఆ పదం అర్థం ‘ఉపద్రవం’. తెలుగు నిఘంటువు కూడా అర్థం అదే చెపుతోంది. పట్టికలో ఇచ్చిన ‘చెత్త’ అనే అర్థం, కథలో ఆ పదం వాడబడిన సందర్భంలో సరిగా ఇమడలేదు.

దీన్ని బట్టి అనిపించిందేమిటంటే- ఆ కథలో మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియనివనుకుని  పదాల పట్టిక తయారు చేసినవాళ్లు, అన్ని ప్రాంతాల పాఠకుల భాషాజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ పట్టికని తయారించలేదని.

నేను ఆ కథ చదివిన సంకలనంలో కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె సుక్క’ చివర కూడా; పాఠకుడికి తెలియని పదాలూ, వాటి అర్థాలూ ఇవ్వబడలేదు. అయినా, కథలో వాడిన భాష; ఉద్యోగరీత్యా నేను కొన్ని సంవత్సరాలు నివసించిన ‘మహబూబ్ నగర్’ జిల్లాది కావటం వలన కథలో నాకు తెలియని పదాలు తక్కువగా ఉన్నాయి.  మిగిలిన తెలియని పదాల అర్థాలు కూడా, రచయితకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. కాని, ఒక ప్రాంతపు మాండలికాన్ని అర్థం చేసుకోవటానికి, అలా ఆ ప్రాంతంలో నివసించి ఉండటం అనే అవకాశం అందరికీ దొరకనిది.

నేననుకోవటం-‘పాఠకుడికి తెలియని పదాలు’ అన్నది ఒక అయోమయానికి గురి చేసే పదసమూహమని.   ఎందుకంటే, ఆ పదాలని, కథ రాసిన రచయిత గుర్తిస్తే, ఆ పట్టిక అసంపూర్ణంగా ఉండే అవకాశం ఎక్కువ.  టెంకి జెల్ల-కథ చివర్లో ఇచ్చిన పట్టిక, దీనికి దృష్టాంతం. వాస్తవానికి, ఒక ప్రాంతంలో వాడే పదాల్లో, మిగిలిన ప్రాంతానికి తెలియని పదాలు; ఆ మిగిలిన ప్రాంతాల వాళ్లే నూటికి నూరు శాతం గుర్తించగలరు. అలా గుర్తించబడిన పదాలకు, అసలు కథా రచయిత ద్వారా అర్థాలు చెప్పిస్తే ఆ పట్టిక తనకు నిర్దేశించిన పనిని నిర్దిష్టంగా చేయగలదు. అలా కాకుండా, ఏ కథ చివర ఏ కథారచయితయినా తానే తయారు చేసి ఒక పట్టిక ఇస్తే, అది ‘కంటి తుడుపే’ కాగలదు.

కథని చదవడం పాఠకుడిగా నాకు నేనై నా భుజాల మీద ఎత్తుకున్న బాధ్యత కనక, అది ఏ రూపంలో ఉన్నా చదవడం నాకు అవసరం. ఏ  కథలో పాత్రలు ఐనా ఒక ప్రాంతపు జీవితాల్లోంచి తీసుకోబడినపుడు, ఆ పాత్రలు ఆ ప్రాంతపు భాషలో మాట్లాడటం సహజం. కథకుడు, ఆ పాత్రల సంభాషణని ఆ ప్రాంతపు భాషలో వ్రాయటం కూడా సముచితం. కాని, సంభాషణలు కాక మిగిలిన కథంతా అదే భాషలో ఉండటం అవసరమా?

అవసరమే అని అలాంటి కథా రచయితలు విశ్వసిస్తే, ఒక ప్రాంతపు జీవితాల్ని  మిగిలిన ప్రాంతాల వాళ్లకి ఆ రచయితలు సంపూర్తిగా పరిచయం చేయాలనుకుంటే, ఆ ప్రాంతపు భాషలో మిగిలిన ప్రాంతాల వాళ్లకి తెలియటానికి అవకాశం లేని పదాలన్నిటినీ ఆ కథతో పాటు విధిగా పరిచయం చెయ్యాలి. అప్పుడే రకరకాల ప్రాంతాల మాండలికాల్లో రాసిన కథలని; తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల పాఠకులు అర్థం చేసుకోగలరు. సరైన అనుభూతి పొందగలరు. అది సమగ్రంగా జరగనంతవరకూ, కొన్ని కథలు నాలాంటివాళ్లకి అసమగ్రంగానే అర్థమవుతాయి. అసంతృప్తిని మిగులుస్తాయి.

నా దృష్టిలో ఈ సమస్యకి పరిష్కారం: కథ అర్థం కాని, చేసుకోలేని పాఠకుల చేతుల్లో లేదు. కొంత కథారచయితల చేతుల్లో, మిగిలింది ఆ కథలు ప్రచురిస్తున్న మాధ్యమాల చేతుల్లో ఉంది.

ఈ పరిశీలన చేస్తున్న సమయంలో నేను చదవడం తటస్థించిన ఓ ప్రాంతపు మాండలికంలో రాయబడ్డ-ఒక కథ విషయంలో, కొంత స్వేచ్ఛ తీసుకుని నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకున్నాను. ఆ కథ చదివిన అనుభూతి నాలో ఇంకా పచ్చిగానే ఉండగనే, ఆ కథని మొత్తం నాకు తెలిసిన వ్యావహారిక భాషలో రాసుకున్నాను. అసలు కథ పేరుకి సమానార్థం ఉన్న, నేను మాట్లాడే మాండలికంలో ఉన్న పదాన్ని, కథకి పేరుగా పెట్టుకున్నాను. అసలు కథ చదివిన అనుభూతిలోనుంచి పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత, ఆ కథ నా స్మృతిపథంలోంచి చాలా వరకూ మరుగయేదాకా, మానసిక విరామం ఇచ్చి; నేను తిరగ రాసుకున్న కథని మరోసారి చదివాను. కథ ముగింపు ముందే తెలిసి ఉండటంవలన నాలోంచి తొలిగిపోయిన ఉత్కంఠతని మినహాయించి; అసలు కథ అందించిన అనుభూతికీ, నేను రాసుకున్న  కథ చదివి పొందిన అనుభూతికీ చెప్పుకోదగినంత తేడా చవిచూడలేక పోయాను.

ఈ అధ్యయనం వల్ల, మానవజీవితాలకు సంబంధించిన కొన్ని అనుభూతులకు, ప్రాంతాల ప్రమేయం ఉండదని నా వరకు నాకు తోచింది. ఇక పోతే, భాష అవరోధమా కాదా అనేది ఒక కథలో వాడిన మాండలికంతో అసలు పరిచయం లేని ఇంకో పాఠకుడెవరైనా ఆ కథని చదివి చెప్పవలసిన విషయం అని అనిపించింది.

అయితే, కథనం మాత్రం ఒక ప్రాంతపు మాండలికంలో ఉండి; సంభాషణలు అందరికీ పరిచయం ఉండటానికి అవకాశం ఉన్న భాషలో రాయబడ్డ కథలు ఇంతవరకూ నేను చదవటం తటస్థించలేదు. రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయేమో?

ఈ లోపులో కోరుకోవాల్సిన విషయం మరోటుంది. ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి; ఆ ప్రాంతపు భాషతో విస్తృత పరిచయం ఉన్న రచయితలు; తమకు పరిచయం లేని మాండలికంలో కథలు పూర్తిగానో, సంభాషణల వరకో రాసి ఆ కథలని బలహీనపర్చే ప్రయత్నం చేయకుండా ఉంటే చాలని. ఈ ధోరణి ఈ మధ్య ఒక కథలో కనపడింది. అందుకనే ఈ మాట కూడా చెప్పాల్సి వచ్చింది.

***

కాళ్ళూ చేతులూ లేని కవిత్వం…

 

గురూగారు పతంజలి  చనిపోయి మరో సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఆయన మన సామూహిక జ్ఞాపకంలో అపురూపమైన భాగమైపోయారు. ‘నలుగురు కూచుని నవ్వే వేళల’ మాత్రమే కాదు, నలుగురు కూచుని రోధించే వేళ, కుట్రదారులైన పాలకులపై కుపితులైన వేళ పతంజలి గారు గుర్తుకువస్తారు.

ప్రజాస్వామ్యం నగుబాటైన, అవుతున్న సందర్భాల్లో, మెజారిటీ మత దాష్టీకాలు పెచ్చరిల్లుతున్న సందర్భాల్లో పతంజలి గారు గుర్తుకు వస్తారు.
పతంజలి గారు ఏ పదమూ, ఏ వాక్యమూ నిద్రపోయినట్టు వుండదు. నీరసంతో, ఉదాసీనతతో జీవచ్ఛవం లా వుండదు. పతంజలి గారి పదాలు, వాక్యాలు కరెంటు తీగల్లాగా వుంటాయి. అవి కల్లోలాలని చిత్రించే గొప్ప చిత్రకారుడి చేతులు. అవి ముడి జీవితాన్ని ప్రేమించిన అక్షరాలు.
జీవితమే కాదు దాన్ని చిత్రించే సాహిత్యం కూడా స్తబ్దుగా వుంటే పతంజలి గారికి ఇష్టం వుండదు. 1996-97 మధ్య రాసిన ఈ కవిత చదివితే మీకు అర్ధం అవుతుంది పతంజలి గారికి నంగిరి మనుషులంటేనే కాదు, నంగిరి కవిత్వమన్నా చాలా అసహ్యమని. జవాసత్వాలు లేని సాహిత్యాన్ని ఆయన కాళ్ళూ చేతులూ లేని కవిత్వమని, అది దుర్వాసన వేస్తోందని అంటారు. నేలలోకి వేళ్ళు దిగని, కలల్ని కనని, భూమితో మాట్లాడని కవిత్వమంటే పతంజలి గారికి పట్టరాని ఆగ్రహం.
రాజ్యం చేస్తున్న కుట్రల్ని, మతం చేస్తున్న దాడుల్ని, సమాజంలోని కల్లోలాల్ని, బతుకులోని హింసనీ, జీవితంలోని సున్నిత అంశాల్నీ పట్టుకోకుండా గాలిలో విన్యాసాలు చేస్తున్న కవిత్వం పట్ల పతంజలిగారికి contempt.
   చచ్చు పుచ్చు కవిత్వం పట్ల ఎప్పటెప్పటి కోపం పేరుకుపోయిందో ఏమోగానీ, పతంజలి గారు ఈ కవితని అప్పటికప్పుడు (‘మహానగర్’ సాహిత్య పేజీలో వెయ్యడానికి మంచి కవిత దొరకక) రాసేశారు. తన పేరు పెట్టుకోకుండా కాకుండా, గనివాడ కారునాయుడు పేరుతో కంపోజింగ్ కి పంపించారు.
ఆయనతో (ఆయన కింద, ఆయన దగ్గర వంటి expressions వాడితే ఆయనకి కోపం వచ్చేది. మనిద్దరం వీళ్ళ కింద పనిచేస్తున్నామని MD రూమ్ వైపు చూపించి అనేవారు) ‘మహానగర్’ లో పనిచేసిన ఆ కొద్ది నెలలూ గొప్ప అనుభవాన్ని మిగిల్చాయి.
myspace

*

ఏమో?

– గనివాడ కారునాయుడు (పతంజలి)

తెల్లవారగట్ట మెలకువ వచ్చినప్పుడు
కరగడానికి ఇష్టపడని చీకట్లో
దెయ్యాలో, నా భయాలో
నా కాంతి ముందు చనిపోయిన వాళ్ళో
కదిలినట్టయి, అట్టిటు నడిచినట్లయి
నాకు భయమేసిందని, గొంతు తడారిపోయిందని
రాయొచ్చునో లేదో?
పొద్దున కిటికీలో పేరుకున్న మట్టిలోంచి
జానెడెత్తు మొలిచిన కుక్క గొడుగు
పొద్దుటి గాలికి తలైనా వూపలేదని
మధ్యాహ్నానికి దాని శిరస్సుని
ఎవరో నరికి కింద పారేసినట్టు
నాకు అనుమానంగా వుందని
రాయొచ్చునో లేదో
శవ పేటికల్లాంటి పుస్తకాల్లో
చనిపోయిన అక్షరాలు
కంపుకొడుతున్నాయనీ
కడుపులో తిప్పుతున్నాదనీ
రాయొచ్చునో లేదో?
కొన్ని రకాల జంతువుల వలె
కొన్ని రకాల పక్షులవలె
కొన్ని రకాల కీటకాలవలె
కొన్ని రకాల మాటలు కూడా అంతరించిపోతున్నాయనీ
కొన్ని పదాలు కనుమరుగౌతున్నాయనీ
రాయొచ్చునో లేదో
కాళ్ళూ చేతులూ లేని కవిత్వం
నరవాహనం లేనిదే కదలలేక పోతున్నాదనీ
దాన్దగ్గిర కొంచెం దుర్వాసనలొస్తున్నాయనీ
కొంచెం కాలిన వాసనొస్తున్నాదనీ
దాని కంట్లో పువ్వులు పూసాయనీ
రాయొచ్చునో లేదో?
ఉంచుకున్న దానికి పిల్లలు పుట్టకుండా
జాగ్రత్త పడినట్టు
ఉంపుడు కవిత్వానికి కలలు రాకుండా
జాగ్రత్త పడుతున్నారనీ
జ్యోతిష్యం కార్డు తీయడానికి మాత్రమే
చిలకను ఉపయోగిస్తున్నారనీ
రాయొచ్చునో లేదో?
చెలమలోంచి ఊరిన నీరులాగా కాకుండా
కొబ్బరిలో ఊరిన నీరులాగా కాకుండా
చెడు భూమిలో ఇంకని వాన నీరులాగా
తాటి బురికెలో పోసిన నిలవ నీరులాగా
ఈ కవిత్వం తేడాగా వున్నదని
రాయవచ్చునో లేదో?
ఎవరైనా ఏమైనా అనుకొంటారో ఏమిటో?
( మార్చి 29, 1952 – మార్చి 11, 2009)

సామూహిక జ్ఞాపకంలోంచి ….ఒక అన్వేషణ!

 

 

-ఎన్ వేణుగోపాల్

~

(అఫ్సర్ ఆక్స్ ఫర్డ్  ప్రచురణ  “‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్” గురించి యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ లో  మార్చి తొమ్మిదిన జరగబోతున్న ప్రత్యేక చర్చా గోష్టి సందర్భంగా..)

venuప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన, కవిమిత్రుడు అఫ్సర్ గ్రంథం ‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’  మన గతం గురించీ వర్తమానం గురించీ అద్భుతమైన పరిశోధన. గూగూడు పీరు స్వామి గురించి వివరిస్తూ, సామాన్యుల మతవిశ్వాసాలనూ ఆచారాలనూ వాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలను విశ్లేషిస్తూ మతం గురించి కొత్త ఆలోచనలను ప్రేరేపించే పుస్తకం అది. వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ, విశ్లేషిస్తూ మరొక పుస్తకమే రాయగలిగినంత, రాయవలసినంత విలువైన, విశాలమైన, లోతైన పుస్తకం అది. అఫ్సర్ ను ఇంతకాలం కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా చూసినవాళ్లకు ఈ పుస్తకం అఫ్సర్ గురించి ఒక కొత్త తెలివిడిని ఇస్తుంది. అఫ్సర్ లోని నిశితమైన పరిశీలకుడినీ, నిష్ణాతుడైన విశ్లేషకుడినీ, అద్భుతమైన సామాజిక చరిత్రకారుడినీ పరిచయం చేస్తుంది. కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా తాను ఇదివరకే సాధించిన వివరణాత్మక, వర్ణనాత్మక శైలినీ, విభిన్న పొరల ఆలోచనలు ప్రేరేపించగల శక్తినీ అన్వేషణకూ, ఆ అన్వేషణాసారాన్ని వ్యక్తీకరించడానికీ ఎలా వాడుకున్నాడో ఈ పుస్తకం చూపుతుంది.

‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’ ఏకకాలంలో నన్ను ఎంతో రాయడానికీ పురికొల్పుతున్నది, అసలేమైనా రాయగలనా, ఎంత రాస్తే ఆ పుస్తకానికి తగిన న్యాయం చేయగలను అని భయపెడుతున్నది. ముఖ్యంగా కరడుగట్టిన మతోన్మాదం జడలు విప్పుతున్న నేపథ్యంలో, ఇతర భావాల పట్ల హంతక అసహనాన్ని ప్రదర్శిస్తున్న మత భావజాలాల, మతోన్మాదాల వాతావరణంలో ఈ పుస్తకం అవసరం గురించి చెప్పవలసినది చాల ఉంది. రాయలసీమలో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా సాగుతున్న హిందూ ముస్లిం మత సామరస్యం (బహుశా మత సామరస్యం కూడ కాదేమో, మత అభేదం, మత సమ్మేళనం అనాలేమో) పునాదిగా మన బహుళత్వ సమాజానికి ఎత్తిపట్టిన దర్పణంగా ఈ పుస్తకానికి ఇవాళ చాల ప్రాసంగికత ఉంది. ఈ పుస్తకంలో ప్రతి వాక్యమూ, ప్రతి వాదనా, ప్రతి పుటా, ప్రతి అధ్యాయమూ నన్ను గత వర్తమానాల ఆశ్చర్య విషాదాల మధ్య ఊగిసలాడేలా చేశాయి.

పీర్ల పండుగ అనే ఒకానొక గ్రామీణ విశేషాన్ని ఆధారం చేసుకుని అనేక సంక్లిష్ట, సంకీర్ణ, బహుళత్వ ఆలోచనలనూ వాద ప్రతివాదాలనూ ముందుకు తెస్తూ, అంతకన్న లోతైన ఆలోచనలు సంఘర్షించేలా చేస్తూ సాగిన ఈ పుస్తకం గురించి రాసేముందు అసలు ఈ పీర్ల పండుగ గురించి నా అనుభవంతో ప్రారంభిస్తాను. తెలంగాణ అంతటా పీర్ల పండుగ వ్యాపించి ఉంది. నేను మా రాజారంలో ఉన్న నా పన్నెండో ఏటివరకూ ప్రతి ఏటా పీర్ల పండుగ చూశాను. ఇరవయో ఏట ఆ ఊరితో సంబంధం పూర్తిగా తెగిపోయింది గనుక ఆ తర్వాత పీర్లపండుగను పట్టణాల్లో, నగరాల్లో చూశాను గాని ఆ అనుభవాలు కాస్త భిన్నమైనవి. ఇక్కడ పూర్తిగా బాల్యానికి సంబంధించిన అనుభవాన్ని మాత్రమే పంచుకుంటాను. మా ఊళ్లో పీర్ల పండుగ ఊరందరి పండుగలాగే జరిగేది. ఊళ్లో ఉన్న పీర్ల కొట్టం నుంచి పీరీలను తీసి అలంకరించి, పది రోజులు గద్దె మీద ఉంచేవారు. పదోరోజున ఆ పీరీలను ఎత్తుకుని ఊరివాళ్లందరూ, ప్రధానంగా శూద్రకులాలు, దళితులు కూడ ఊరేగింపు చేసేవారు. ముందర మాదిగడప్పులు మోగుతుండేవి. ఆ పీరీల ఊరేగింపు ఊరంతా తిరిగేది. బ్రాహ్మల, కరణాల, రెడ్ల ఇళ్లు పెద్దవి గనుక వాళ్ల ఇళ్లముందూ, వాడల్లో అక్కడక్కడా ఆగేవి. ప్రతిచోటా ఇళ్లలోంచి ఇంటి పెద్దలు స్వయంగా కుండలతో, బిందెలతో నీళ్లు తెచ్చి పీరీలు ఎత్తుకున్నవాళ్ల కాళ్లమీద గుమ్మరించేవాళ్లు. ఆ పీరీల వెంటనడిచే వాళ్లు ఇచ్చే “విభూతి”ని తీసుకునేవాళ్లు. ఫతేహాలు చదువుతుంటే వినేవాళ్లు. అది “తురక దేవుడి” ఆరాధన అనీ, పీరీలు ముస్లింల ఆచారమనీ, అది ముహర్రం అనే ముస్లిం సంస్మరణ సందర్భమనీ, అందులో ముస్లిమేతరుల పాత్ర ఏమిటనీ ఆలోచనలు ఆ నైసర్గిక గ్రామీణ అవగాహనల్లో ఎంతమాత్రం ఉండేవి కావు. నిజానికి అప్పటికి మా ఊళ్లో ముస్లిం కుటుంబాలు మూడు నాలుగు కూడ లేవు. నాకు తెలిసినవి పోస్ట్ మాన్ లాల్ మియా, చిన్న చిల్లర దుకాణం నడుపుతుండిన అబ్బాస్ అలీ రెండు కుటుంబాలు మాత్రమే. అప్పటికి ఐదారువందల గడప ఉన్న ఊళ్లో నాలుగు కుటుంబాలంటే ఊరి జనాభాలో ఒక్క శాతం కూడ కాదు. కాని ఆ ఒక్కశాతం ప్రజల సంస్మరణ ఆచారం ఊరందరి ఆచారంగా జరిగేది. అదంతా నాలుగున్నర దశాబ్దాల వెనుకటి కథ. ఇప్పుడు మా ఊళ్లో కూడ పీర్ల పండుగ అంత బహుళత్వంతో అంత సామూహికంగా జరుగుతున్నదో లేదో తెలియదు.

కాని అనంతపురం జిల్లాలో గూగూడు అనే చిన్న గ్రామంలో ప్రతి ఏటా పీర్ల పండుగ మహోజ్వలంగా జరుగుతున్నది. ఆ ఊళ్లో ముస్లిం జనాభా స్వల్పమే. మొత్తం జనాభా దాదాపు మూడు వేలు కాగా, ముస్లింలు (దూదేకులు) రెండువందల లోపు. కాని ఆ ఊరు ఊరంతా ఆ పండుగను సొంతం చేసుకుంటున్నది. కనీసం మూడు లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవం మత విభజనలను అధిగమించింది. ఒకానొక మత విశ్వాసపు మౌలిక అంశాల మీద నిర్మాణమైనప్పటికీ ఇతర మత విశ్వాసాలు కూడ కలగలిసినది. ఒక సామూహిక నైసర్గిక సంస్మరణ ఉత్సవం అది. ఆ ఉత్సవం నేపథ్యంగా ‘దక్షిణ భారతదేశంలో జనప్రియ ఇస్లాం – సాముదాయక భక్తి’ అనే విశాలమైన పరిశోధన, అన్వేషణ, వివరణ, విశ్లేషణ సాగించడానికి పూనుకున్న అఫ్సర్ తొమ్మిది నెలల పాటు ఆ గ్రామంలోనూ, సంబంధిత స్థలాల్లోనూ పరిశోధించి ఈ పుస్తకం రాశాడు.

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, ముగింపు కాక ఐదు అధ్యాయాలున్నాయి. ‘గూగూడు: సాముదాయక భక్తి స్థలం ఆవిర్భావం’ అనే మొదటి అధ్యాయం గూగూడు ప్రాధాన్యత గురించీ, దాని ఆవిర్భావ వికాసాల గురించీ వివరిస్తుంది. ‘టోపీ పెట్టుకున్న పీర్: కుళ్లాయప్ప కథనం’ అనే రెండో అధ్యాయం గూగూడు ప్రాముఖ్యతలోకి రావడానికి మాలమైన కుళ్లాయప్ప అనే పీర్ గురించి ఉన్న కథనాలను వివరిస్తుంది. ‘కుళ్లాయప్ప – ముహర్రం బహిరంగ ఆచారాలు’ అనే నాలుగో అధ్యాయం పదమూడు పరిశుద్ధ దినాలలో రోజువారీ జరిగే కార్యక్రమాలను, ప్రత్యేకంగా ఏడో రోజు, పదో రోజు జరిగే ఆచారాలను వివరిస్తుంది. ‘ఫకీరి: తాత్కాలిక సన్యాస ఆచరణ’ అనే నాలుగో అధ్యాయం కుళ్లాయప్ప భక్తిలో భాగంగా ప్రజలు ఆచరించే ఫకీరి ఉపవాసదీక్ష గురించి వివరిస్తుంది. ‘ఆచారాల చర్చ: ‘శుద్ధ’ ఇస్లాం రాజకీయాలు’ అనే ఐదో అధ్యాయం సమకాలీన మతతత్వ విస్తరణ నేపథ్యంలో గూగూడు ముహర్రంను పోల్చి చూసి విశ్లేషిస్తుంది. దాదాపు ఇరవై పేజీల పాదసూచికలు, నాలుగు పేజీల అర్థ వివరణలు, ఏడెనిమిది పేజీల ఉపయుక్త గ్రంథ సూచి రచన ఎంత పకడ్బందీగా సాగిందో చూపుతాయి. అఫ్సర్ తన కవితల, కథల, సాహిత్య విమర్శ వ్యాసాల నిర్మాణంలో ఎటువంటి శ్రద్ధ చూపుతాడో ఈ రెండు వందల పేజీల రచనలో అంతకు మించిన శ్రద్ధ కనబరచాడు.

ఈ పుస్తకం గురించి చెప్పుకోవలసిన అనేక అంశాలలో ఒకటి, మన గ్రామసీమల్లో హిందూ ముస్లిం సంప్రదాయాలు, బహుశా అవి వేరువేరని కూడ తెలియనంతగా ఎంత గాఢంగా కలిసిపోయాయనేది. ఇవాళ మతోన్మాద రాజకీయాలు చూపుతున్నట్టుగా హిందూ, ముస్లిం అస్తిత్వాలు విభిన్నమైన, ఎదురుబొదురుగా నిలబడిన, నిత్య సంఘర్షణాయుతమైన, వైరి అస్తిత్వాలు అనే ఆలోచన దాదాపుగా లేని సమాజపు ఆచారవ్యవహారాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. బహుశా భిన్న భావాల పట్ల సహజంగా ప్రజాస్వామిక సహనం పాటించే, ఆదాన ప్రదానాలతో సాగే, బహుళత్వ చిహ్నాలను ఆమోదించే గ్రామీణ సమాజ వివేకపు చిత్రణ ఇది. ఈ వివేకం భాషలో, భావనల్లో, ఆచారాల్లో అన్ని చోట్లా కనబడుతుంది.

అసలు కర్బలా యుద్ధంలో చనిపోయిన మహమ్మద్ ప్రవక్త మనుమల సంస్మరణలో రూపొందిన విషాద సంస్మరణ ఆచరణ ముహర్రం. దానికి షియా ముస్లింల వ్యాఖ్యానం, అది దక్షిణ భారతదేశంలోకి సూఫీల ద్వారా వచ్చిన తీరు, అది చివరికి ప్రధానంగా ముస్లిమేతర (హిందూ కాదు, హిందువులు అనడానికి కూడ వీలులేని అనేక సమూహాలు మన గ్రామసీమల్లో ఉన్నాయి) భాగస్వామ్యంతో, వారి కథలతో, వారి ఆచారవ్యవహారాలతో, వారి ఆదానప్రదానాలతో కలగలిసి ఒక అమాయక సామూహిక మత ఉత్సవంగా మారిందో అఫ్సర్ చాల వివరంగా, విశ్లేషణతో చూపుతాడు.

గూగూడులో ఉన్నది ప్రధానంగా ముస్లిం పీర్ ప్రార్థనాస్థలం. ఆ పీరు పేరు కుళ్లాయప్ప. కుళ్లాయి (తల మీది వస్త్రం – టోపీ) అనే పర్షియన్ మాటకూ అప్ప అనే రాయలసీమ మాటకూ మైత్రి కుదిరి కుళ్లాయి పెట్టుకున్న అప్పగా రూపాంతరం పొందింది. అలా ఆయన పీరు స్వామి అయ్యాడు. ఆయన స్థలం, ఆరాధనా స్థలం, ఆశ్రయం – పీర్, మకాన్ (ఇల్లు) అనే రెండు మాటలు కలిసి, మొదటి మాట అజంతంగా తెలుగీకరణ పొంది, మకానం అనే కొత్త మాట పుట్టుకొచ్చి పీరు మకానం అయింది. నిజంగా ప్రజల సృజనాత్మకత ఎంత విశిష్టమైనది! అలాగే ముస్లిం సంప్రదాయంలోంచి ఒక మాట ముస్లిమేతర, హిందూ సంప్రదాయంలోంచి మరొక మాట కలిసి గూగూడు పదజాలం చాల తయారయింది. జియారతు దర్శనం, ఫతేహా ప్రసాదం, ముజావరు పూజారి, దీన్ గోవిందా, షహర్ గస్తీ – సెరిగట్టి, ఎర్రదారం కట్టుకుని ఫకీరు దీక్షకు పూనుకోవడం, ఫకీరి ఉపవాసాలు, ముహర్రం జాతర, కందూరి సామూహిక భోజనాలు లాంటి ఎన్నో పదాలు పుట్టుకొచ్చాయి. చదివింపులు, ప్రదక్షిణలు, నిప్పుల గుండం నుంచి బూడిద తీసి నుదుటికి, వంటికి రాసుకోవడం, పీరు మకానంలో ఒక పక్కన ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టడం, కుంకుమ తీసుకోవడం, పొర్లు దండాలు, విశ్వరూపం, పీర్ ను అవతారం (రాముడి అవతారం)గా, విష్ణువు పదకొండో అవతారంగా భావించడం వంటి ఎన్నో ప్రధానంగా హిందూ లేదా అంతకు ముందరి ఆచారాలు ఈ పీరు ఆరాధనలో కలిసి పోయాయి. బలి ఇవ్వడానికి ముస్లిమేతరులు తెచ్చిన జంతువులను కూడ ముస్లింలు ఫతేహా చదివి బలి ఇచ్చినతర్వాతనే వండుకోవడం జరుగుతుంది. అనేక సందర్భాలలో అది ఇస్లాం ఆచారమా, హిందూ ఆచారమా, హిందుత్వతో సంబంధంలేని శూద్ర కులాల ఆచారమా చెప్పలేని స్థితి ఉంటుంది. నియ్యా అనే అరబిక్ మాట నియ్యతు (పరిశుద్ధ సంకల్పం) గా మారడం, బర్కత్  (దైవ ప్రసాదం) అనే మాట బర్కతుగా మారడం సరే సరి. ప్రతి ఏటా గూగూడు ముహర్రం ఉత్సవాలు (వాటిని బ్రహ్మోత్సవాలు అనడం కూడ మొదలైంది!) చూడడానికి రావడం తీర్థయాత్రలాగ భావించేవాళ్లూ, పేదవారి హజ్ యాత్రగా భావించేవాళ్లూ కూడ ఉన్నారు. ఇతర చోట్ల ముహర్రం గాథలనుంచి గ్రహించి మార్చుకున్నవీ, సొంతంగా తయారు చేసుకున్నవీ ఎన్నో గూగూడు కథలు, గాథలు, సంగీతం, పాటలు, నమ్మకాలు పుట్టుకొచ్చాయి.

గూగూడుకు దానిదైన ఒక ప్రత్యేక స్థల పురాణం కూడ ఉంది. అది దండకారణ్యలో భాగమైన ప్రాంతమని, అది సీతారామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చిన గుహుడి గూడు అని ఒక కథనం. కాలక్రమంలో అది చంద్రాయణపేట అయింది. ఆ గ్రామం ఏ కారణం వల్లనో దగ్ధమైపోయింది. ఆ గ్రామదహనం, కొత్త గ్రామ పునర్నిర్మాణం బహుశా మారుతున్న నాగరికతలకు, పాత గ్రామాలు విధ్వంసమై కొత్త గ్రామాలు రూపొందడానికి ప్రతీకలు కావచ్చు. పాత గ్రామంలో పోషణ లేని చెన్నకేశవస్వామి ఆలయం ఇంకా ఉంది. ఆ దగ్ధమవుతున్న గ్రామం నుంచి బైటపడడానికి చేసిన ప్రయత్నమే తరతరాల సంచిత జ్ఞాపకంలో నిప్పుల గుండం మీద నడకగా మారి ఉండవచ్చు. అక్కడి నుంచి జనాన్ని కుళ్లాయప్పే ఇక్కడికి తీసుకువచ్చి తన మకానం చుట్టూ కొత్త ఊరు ఏర్పరచాడు. కుళ్లాయప్ప వాస్తవానికి ముస్లింల పవిత్ర ప్రతీక అయిన పంజా. పాత గ్రామం తగులబడిపోయినప్పుడు కంసాలులు బావిలో పడేసిన ఆ ప్రతీకను కొండన్న అనే వ్యక్తి తీసుకువచ్చి పీరు మకానంలో స్థాపించాడు. ఇప్పటికీ కొండన్న వారసులే ఈ ఉత్సవంలో ప్రధానభాగం వహిస్తారు. ఇది చదువుతున్నప్పుడు నాకు బుద్ధుడు మొట్టమొదట తన బోధనలను వినిపించిన ఐదుగురు శిష్యులలోని కొండన్న గుర్తుకు వచ్చాడు. ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసానికి మారడానికి, లేదా రెండు విశ్వాసాల సమ్మేళనానికి కొండన్న ప్రతీక కావచ్చునా?

ఈ క్రమంలో గూగూడు ప్రాదేశిక సరిహద్దులు, గూగూడు భూగోళం కూడ కొత్త అర్థాలు సంతరించుకున్నాయి. కొత్త వ్యాఖ్యానాలు పొందాయి. “పీరు రాకముందు ఇదంతా దట్టమైన అరణ్యం. పీరు రాకతోనే ఇది సంపన్నమైంది” అంటాడు హుస్సేనప్ప. కర్బలా యుద్ధం వాస్తవంగా ఇవాళ్టి ఇరాన్ లో జరగలేదని, గూగూడు సరిహద్దులలోనే జరిగిందని, అందులో ప్రవక్త మనుమలతో పాటు కుళ్లాయప్ప కూడ పోరాడి అమరుడయ్యాడని, కర్బలా అమరులు హసన్, హుసేన్ లు కుళ్లాయప్ప తమ్ములని ప్రజల విశ్వాసం. అలాగే వాస్తవ కర్బలా గాథలో హసన్, హుస్సేన్ లను చంపిన యాజిద్, గూగూడు గాథలో మొఘల్ చక్రవర్తికి సామంతుడైన స్థానికుడిగా మారిపోతాడు. మొఘల్ చక్రవర్తి కుళ్లాయప్పతో సహా తొమ్మిదిమంది పీర్లను నిర్బంధించడానికి ప్రయత్నించినప్పుడు వారందరూ ఆ పోరాటంలో చనిపోయారని స్థానిక కథనం చెపుతుంది. నిజానికి కథనం అని ఏకవచనంలో చెప్పడం కూడ సరికాదు. పునాదిగా ఒక మౌలికాంశం ఉండవచ్చు గాని దాని మీద లేచి నిలిచిన అనేక కథనాలున్నాయి. కులం, లింగం, ప్రాంతం, సాన్నిహిత్యం, ఆరాధనాపద్ధతి, సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలు ఆ కథనాలకు కొత్త కోణాలను కలుపుతున్నాయి. ఏకీకృత, శిలాసదృశ, సార్వజనిక మత విశ్వాసం గురించి ఇవాళ మాట్లాడుతున్నవాళ్లు గూగూడు సూక్ష్మ ఉదాహరణ నుంచి పరిశీలిస్తే భారత సమాజంలో మతవిశ్వాసాల బహుళత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది.

pirsఅసలు కుళ్లాయప్ప “ఆరాధన”లో కొంత అధిభౌతిక శక్తి ఆరాధన, కొంత హేతురహితమైన విశ్వాసం కూడ ఉండవచ్చుగాని అంతకన్న ముఖ్యంగా అది ఒక గ్రామీణ సమాజ సామూహికతా చిహ్నం. అది వ్యవస్థీకృతం కానంతవరకు అమాయకంగా, బహుళత్వంతో, ప్రజాస్వామికంగా కూడ ఉన్నది. మత విశ్వాసం వల్ల గూగూడు జన్నత్ కా దర్వాజా (స్వర్గ ద్వారం) అని ముస్లింలు భావించవచ్చు, వైకుంఠం అని ముస్లిమేతరులు భావించవచ్చు. కాని గూగూడు నుంచి నలబై ఐదు సంవత్సరాల కింద కర్నాటకకు వలస వెళ్లిపోయి, ప్రతి సంవత్సరం ముహర్రంకు మళ్లీ గూగూడుకు వచ్చే మదార్ సాహెబ్ మాటల్లో, “కుళ్లాయప్ప గాని, ముహర్రం గాని లేకపోతే మేం ఒకరిని ఒకరం కలుసుకోవడానికి, సంబంధంలో ఉండడానికి అవకాశమే దొరకదు” అన్నట్టు ఇది సామూహిక కలయిక వేడుక.  ఈ సామూహికతలో హిందూ బ్రాహ్మణీయ మత కార్యక్రమాలకు భిన్నంగా శూద్ర, దళిత, మహిళా భాగస్వామ్యానికి అవకాశం ఉంది. విభిన్న కులాల వ్యక్తులు, ముస్లింలు, మహిళలు, ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు, చిరు వ్యాపారస్తులు, ఇతర ప్రాంతాలలో ఉన్న కుళ్లాయప్ప భక్తులు వంటి ఎంతో మంది అభిప్రాయాలు ఈ సంకీర్ణతను వివరిస్తాయి.

అట్లని ఇది మత రహితమైన, అంధవిశ్వాస రహితమైన సామాజిక ఉత్సవం మాత్రమే అనడానికీ వీలులేదు. ఇక్కడ మహత్యాలున్నాయి. నాదస్వర వాద్యాలున్నాయి. స్వర్గపు ఆలోచనలు, పునర్జన్మ ఆలోచనలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే, అసలు పీరు మకానంలోనే ఆంజనేయ విగ్రహం ఉంది. పక్కనే పెద్దమ్మ ఆరాధన ఉంది. పొరుగున పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం బోధించిన కొండ ఉంది. హిందూ బ్రాహ్మణీయ మడి – వెలికి సమానమైన నిరంకుశత్వంతో కాకపోయినా పవిత్రత – అపవిత్రత ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలకు సమాంతరంగానే శూద్రకులాల సమైక్యత ఉంది.  అందువల్ల, ఈ ముహర్రంలో ప్రవక్త, అమరులైన ప్రవక్త కుటుంబసభ్యులు, ఖురాన్ ఫతేహా, జియారత్, నియ్యత్, బర్కత్ వంటి భావనలు ఉన్నప్పటికీ దీన్ని పూర్తిగా ముస్లిం ఉత్సవంగా చెప్పడానికీ వీలులేదు.

అసలు పీర్ల పండుగ అనడమే ముస్లిం మౌలిక ఆచారానికి భిన్నమైనది. పీర్లు కర్బలా యుద్ధంలో మరణించిన హసన్, హుసేన్ ల ప్రతిరూపాలు. విగ్రహారాధనను వ్యతిరేకించే ఇస్లాంలో ఆ మృతవీరుల చిహ్నాలను స్మరించడం, ఆరాధించడం కూడ “అనాచారాలే”. అలాగే మరణాన్ని సూచించే రోజును పండగగా జరపడం మరొక “అనాచారం.” కాని వాటిని అనాచారాలు అనడం కూడ ప్రామాణికత వైపు నుంచి, ఛాందస ఆచారాల వైపు నుంచి, ఆచారాలలో మార్పులేనితనం వైపు నుంచి చూసినప్పుడే గాని, మత విశ్వాసాలూ, ఆలోచనలూ, ఆచారాలూ ప్రజల నిత్యజీవిత వ్యవహారంలో, సంబంధాలలో, ఆచరణలో రూపొంది తలెత్తి లేచి నిలుస్తాయని, నిత్యం మార్పులకు లోనవుతాయని కూడ గుర్తించవలసి ఉంది.

“హిందువులు లేరు, ముస్లింలు లేరు. అందరిదీ ఒకటే మతం. దానిపేరు కుళ్లాయప్ప భక్తి” అని సత్తార్ సాహెబ్ అన్నమాట ఇవాళ్టి వివాదాల నేపథ్యంలో మతాన్ని కొత్తగా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని సూచిస్తున్నది. అలాగే గూగూడులో ఈ పీర్ల పండుగ, ముహర్రం జరిపే పద్ధతి కూడ ఇతర ప్రాంతాలకూ, హైదరాబాద్ కూ భిన్నంగా ఉన్నదని సత్తార్ సాహెబ్ ఎత్తి చూపుతాడు. హైదరాబాద్ లో మాతం పేరుతో కొరడాలతో, ముళ్ల గొలుసులతో శరీరాల మీద కొట్టుకుంటూ నెత్తురు కార్చే ఆధారం ఉంది. గూగూడు నిప్పుల గుండంలో నడక దాని స్థానంలోనే వచ్చి ఉండవచ్చు.

ఈ మొత్తంలో కనబడేది స్థానిక ఆరాధనా పద్ధతులు, ఆచారాలు పెద్ద ఎత్తున సంలీనం కావడం, ప్రతి ఆచారమూ పునర్నిర్వచనానికి, భిన్నమైన ఆచరణకు గురికావడం. మొత్తం మీద కుళ్లాయప్పకు ఉన్న అనేక వ్యాఖ్యానాలలో, అర్థాలలో గ్రామదేవత, ముస్లిం ఆరాధనా చిహ్నం, కుల దైవం, అమరుడైన మహాత్ముడు అనే నాలుగు ప్రధాన అర్థాలున్నాయి. ఈ నాలుగు భిన్న నిర్వచనాలకు భిన్నమైన సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలున్నాయి.

ఇవాళ్టి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణంలో హిందూత్వవాదులు చెపుతున్నట్టు ఇస్లాం అనేది పరాయి నేల నుంచి వచ్చిన దురాక్రమణ మత విశ్వాసమే అయితే అది ఒక స్థానిక బహిరంగా ప్రజాస్థలంలో ఎటువంటి పరివర్తన పొందిందో, ఎంతగా స్థానికతతో మమేకమైందో, ఎంతగా స్థానికమైందో అనే ఆసక్తిదాయకమైన చర్చకు గూగూడు పరిశీలన వీలు కల్పిస్తుంది. అయితే సమస్య కేవలం హిందూత్వ వాదుల ‘వాతాపిజీర్ణం’ వాదానిదో, గుత్తాధిపత్యానిదో మాత్రమే కాదు. గూగూడు మార్పు చేర్పులను ఇస్లాం కూడ సమాదరించడం లేదు. అసలు వ్యవస్థీకృత మతాలకు ప్రజల అవ్యవస్థీకృత, ప్రజాస్వామిక, నైసర్గిక ఉమ్మడి మత జీవనం గిట్టదు.

ఈసందర్భంగానే కుల విభజనలు లేని, సార్వజనిక సోదరత్వాన్ని ప్రతిపాదించే ఇస్లాం, కుల విభజనల, అంతరాల హిందూ సమాజంలో ప్రవేశించినప్పుడు ఎలా మారుతుంది, దేన్ని మారుస్తుంది, ఏ కొత్త రూపాలను సంతరించుకుంటుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు అఫ్సర్ విశ్లేషణలు దారితీస్తాయి. తాత్విక పరిభాషలో చెప్పాలంటే సాధారణత్వానికీ ప్రత్యేకతకూ, సార్వజనీనతకూ నిర్దిష్టతకూ మధ్య ఐక్యత, ఘర్షణలు ఎలా ఉంటాయో విస్తృత చర్చ చేయడానికి నమూనాగా నిలుస్తుంది గూగూడు గాథ.

ఇక్కడ అఫ్సర్ స్థానిక ఇస్లాం, స్థానికీకృత ఇస్లాం అనే విశ్లేషణా పరికరాలతో ఈ సమస్యను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. ‘స్థానిక ఇస్లాం’ గురించి గతంలోనే కొందరు పరిశోధకులు చర్చించి ఉన్నప్పటికీ గూగూడు దృశ్యం మరింత సంక్లిష్టమైనదనీ, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో సూక్ష్మాంశాలను, మరెన్నో పొరలను విప్పిచూసే పరిశోధనాపద్ధతి అనుసరించాలని అఫ్సర్ అంటాడు. స్థానిక ఇస్లాం అనేది గూగూడు లాగ అనేక మత విశ్వాసాల సమ్మేళనం కాగా, ‘స్థానికీకృత ఇస్లాం’ విశ్వవ్యాప్త, ఏకశిలా సదృశ మత విశ్వాసాన్ని మాత్రమే అస్లీ ఇస్లాంగా అభివర్ణిస్తుంది. దాన్నే గీటురాయిగా పెట్టుకుని స్థానిక ఆచారాలను పరిశీలిస్తుంది. అందువల్ల సహజంగానే గూగూడు ‘స్థానికీకృత ఇస్లాం’కు విమర్శనీయ ఉదాహరణగా కనబడుతుంది. గూగూడు ముహర్రం విశ్వాసాలను సంస్కరించవలసి ఉందని అన్నవారిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. దేవుడు ఒక్కడే, మరెవరినీ దేవుడితో సమానం చేయగూడదు అని భావించే ఇస్లాం కుళ్లాయప్ప స్థానాన్ని ప్రశ్నిస్తున్నదని అఫ్సర్ చూపాడు. చివరికి కుళ్లాయప్ప పేరు మీద ప్రచారంలో ఉన్న మహిమలను విమర్శిస్తూ, ఆ విమర్శకు హేతుబద్ధతను తోడు తెచ్చుకున్న ఒక మతాధిపతిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. ఈ అస్లీ ఇస్లాం ప్రభావం యువతరం మీద ఎక్కువగానే ఉన్నదని, అందుకు ఇస్లామిక్ గ్రంథాలు స్థానిక భాషల్లో విరివిగా వెలువడడం కూడ దోహదం చేస్తున్నదనీ వివరంగా చర్చించి, ఈ ఆలోచనలు ముందుకుసాగితే, గూగూడు ముహర్రం ఉత్సవాలలో ముస్లింల పాత్రకు ఏమవుతుంది అని కూడ ఆలోచనలు చేస్తాడు.

చిట్టచివరిగా, ముగింపులో భారత సమాజం వంటి మత బాహుళ్య సమాజాలలో ఎటువంటి సమన్వయ, సర్వాంగీణ, సమ్యగ్ దృక్పథం ఉండాలో చర్చించే ప్రాతిపదికను సూచించడానికా అన్నట్టు గురజాడ వంద సంవత్సరాల వెనుక రాసిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ లో పీర్ల ప్రస్తావనతో వచ్చిన చర్చను ప్రస్తావిస్తాడు. వంద సంవత్సరాల తర్వాత నిసార్ రాసిన ‘ముల్కీ’ కథను ప్రస్తావించి సమకాలీన సమస్యలనూ సూచిస్తాడు.

మొత్తానికి ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. తరతరాల సామూహిక జ్ఞాపకం ఒక సమకాలీన బహుళత్వ ఉత్సవంగా మారి ఏకీకరణ, గుత్తాధిపత్య ఆలోచనలకు ఎదురుగా ఎలా నిలుస్తున్నదో ఒక సజీవ ఉదాహరణనుంచి చూపడమే ఈ పుస్తకపు విశిష్టత.

*

available at: http://www.amazon.in/Festival-Pirs-Popular-Shared-Devotion/dp/0199997594/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1457107819&sr=1-1&keywords=afsar%20mohammad

http://www.flipkart.com/festival-pirs-english/p/itmdhsyu8e4cknhg?pid=9780199997596&ref=L%3A2859794214406078613&srno=p_1&query=afsar%20mohammad&otracker=from-search

ఈ ఇరానీ సినిమా ఒక కొత్త రుతువు!

 

-భవాని ఫణి

~

 

సినిమాల్లో అయినా , నిజ జీవితంలో అయినా నాటకీయత అనే అంశానికి ఆకర్షణ ఎక్కువ . ఒక చిన్న కుతూహలం ఒక్కోసారి ఎక్కడివరకైనా మనల్ని నడిపించి తీసుకెళ్తుంది. లోపలున్న బహుమతి ఏమిటో తెలీనప్పుడు గిఫ్ట్ ప్యాక్ ని ముక్కలు ముక్కలుగా చించైనా వెంటనే తెలుసుకోవాలనుకునే పసిపిల్లవాడి ఆత్రం, ఎంత ఎదిగినా అతన్ని వదిలిపెట్టదు. మూసిఉన్న పిడికిలి తెరిచి చూసేవరకు మనశ్శాంతిగా ఉండనివ్వదు. అపరాధ పరిశోధనకి చెందిన కథల్లో, చలన చిత్రాల్లో ఇటువంటి పధ్ధతిని ఎక్కువగా అవలంబించినా, వాటిలో నాటకీయత పాళ్లు ఎక్కువ కావడం వలన, మనకి కలిగే కుతుహలంలో కొంత కృత్రిమత్వం ఉంటుంది  అదే ఒకవేళ  సాధ్యతరమని అనిపించే సహజమైన అంశాలతో నాటకీయతని సృష్టించగలిగితే, అది కలిగించే కుతూహలం అంతా ఇంతా కాదు . ఆ పట్టుని అంత బాగా పట్టుకున్న దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ మాత్రమే అని చెబితే అది అబద్ధం కాకపోవచ్చు.  నలభై మూడు సంవత్సరాల ఈ ఇరానియన్ దర్శకుడు,తన నేర్పరితనంతో అద్భుతమైన చలన చిత్రాలకి ప్రాణం పోసాడు .

అన్నీ మనం రోజూ చేసే పనులే, చూసే విషయాలే కదా అనిపిస్తాయి. కానీ కథలో అతను ఎక్కడ ఎలా ఎప్పుడు మెలిక పెడతాడో మాత్రం అర్థం కాదు. కథ అల్లడంలోని ఆ నేర్పరితనం మనల్ని తన్మయత్వానికి గురి చేస్తుంది. ఏ సైన్స్ ఫిక్షన్లు గానీ , సైకలాజికల్ థ్రిల్లర్స్ గానీ , మర్డర్ మిస్టరీలు గానీ కలిగించనంతటి ఆసక్తిని అతని సినిమాలు కలిగిస్తాయి. అంతే సహజమైన ముగింపుతో సంతృప్తి పరుస్తాయి. ఎక్కడా ఏ సందర్భంలోను విసుగు కలగనివ్వనంత బిగువుగా కథ అల్లబడి ఉంటుంది.  ఆ కథనాన్ని ఆస్వాదించడం తెలిస్తే దర్శకుడి ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం .
అంతేకాక ఫర్హాదీ చిత్రాలలో పాత్రల్ని మంచి చెడుల ఆధారంగా విడగొట్టడం వీలు కాదు. , పెరిగిన సమాజం, పరిస్థితుల ప్రభావం వంటివి మనిషి స్వభావాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని అవగతం చేసే విధంగా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఈ విధమైన పధ్ధతి వల్ల ప్రేక్షకుడు కేవలం ఏదో ఒక పాత్రకే ఆకర్షితుడు కాకుండా, అందరి వైపునుండీ అలోచించి వారి వారి ప్రవర్తనలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
అతని చలన చిత్రాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు చిత్రాలు. మొదటి స్థానంలో ఇరాన్ చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి ఆస్కార్ ని సంపాదించి పెట్టిన  ” ఎ సెపరేషన్(A Separation) ఉంటుంది. చిక్కగా గుచ్చబడిన దండలో దారం ఎక్కడుందో తెలీనట్టుగానే అసలు విషయాన్ని అతను ఎక్కడ దాచిపెట్టాడో చాలా సేపటి వరకు తెలీదు. దాంతోపాటుగా ప్రేమ, జాలి, అహంకారం, అపరాధ భావం వంటి మనిషిలోని సహజలక్షణాలు అంతర్లీనంగా అవసరమైనంత మేరకు తమ తమ పాత్రల్ని పోషిస్తూ ఒక నిండైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.  ఈ సినిమా చూసిన తర్వాత కథ ఎవరికీ చెప్పాలనిపించదు. ఎవరికి వారే చూసి ఆ ఆనందాన్ని అనుభవిస్తే బాగుండునని అనిపిస్తుంది . అయినా చెప్పక తప్పదనుకుంటే ఇలా చెప్పడం మంచిది .
నాడెర్ , సిమిన్ భార్యా భర్తలు . వాళ్లిద్దరూ విడిపోవడం కోసం కోర్ట్ లో వాదించుకోవడంతో కథ ప్రారంభమవుతుంది . భార్య ఇరాన్ లోని కఠిన పరిస్థితుల మధ్య తమ పాప పెరగడం ఇష్టం లేక విదేశాలకి వెళ్లడం కోసం పట్టుపడితే, నాడెర్ మాత్రం, అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని వదిలి రావడానికి ఇష్టపడకపోవడంతో పంతం మొదలై ఇద్దరూ విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకపోవడంతో సిమిన్ పంతం కొద్దీ విడిగా వెళ్లిపోతుంది.  వారి కుమార్తె పదకొండేళ్ల తెర్మెహ్ మాత్రం తండ్రి దగ్గరే ఉండిపోతుంది. ముసలివాడైపోయి, ఆల్జీమర్ కారణంగా ఏదీ గుర్తుడని స్థితిలో ఉన్న తన తండ్రి కోసం నాడెర్ ఒక స్త్రీని నియమిస్తాడు. ఆమె పేరు రజియా. ఐదారేళ్ల వయసున్న పాపని వెంట బెట్టుకుని రెండు ట్రైన్లు మారి నాడెర్ ఇంటికి వస్తూ ఉంటుంది రజియా. పైగా ఆమె గర్భవతి కూడా. ఇంట్లో పనీ, ముసలాయన్ని సంబాళించడం ఆమెకి చాలా కష్టమైపోతుంది.
నాడెర్ ఆఫీసు నించి వచ్చేవరకు ముసలాయన్ని కనిపెట్టుకుని ఉండటం రజియా చెయ్యవలసిన ముఖ్యమైన పని . కానీ ఒకసారి తొందరగా ఇంటికి వచ్చిన నాడెర్ కి ఇల్లు తాళం వేసి కనబడుతుంది . డూప్లికేట్ కీ తో లోపలి వెళ్లి చూస్తే కింద పడిపోయి ఉన్న తండ్రి కనిపిస్తాడు. పైగా అతను మంచానికి కట్టేసి ఉంటాడు. తండ్రి బ్రతికి ఉన్నాడో లేదో అర్థం కానంత ఉద్వేగంలో నాడెర్ విపరీతమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ కోపంలో, అప్పుడే బయటి నించి వచ్చిన రజియాని ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు. తర్వాత ఆమెకి అబార్షన్ అయిందని తెలుస్తుంది . అందుకు నాడెర్ కారణమని రజియా భర్త కోర్ట్ లో కేస్ వేస్తాడు . ఇంతకీ అసలు జరిగింది ఏమిటి? భార్యా భర్తలు మళ్ళీ కలుసుకున్నారా అన్న అంశాలతో ఎంతో ఆసక్తికరంగా మలవబడిన కథ ఇది. నటీనటుల నటన కథకి జీవాన్ని సమకూర్చింది.  సమాజపు స్థితిగతులనే ఈ చలన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలబెట్టగలగడం కూడా పెద్ద విశేషం.
ఇక రెండోది ‘ఎబౌట్ ఎలీ (About Elly)’.  చిత్రం పేరు సూచిస్తునట్టుగానే కథ ‘ఎలీ’ అనే అమ్మాయి గురించి. ఆమె ఒక కిండర్ గార్డెన్ స్కూల్ టీచర్. ఆమె స్కూల్ లో చదివే ఒక విద్యార్థిని తల్లి సెపిదే, ఆమెని తమ స్నేహితుల కుటుంబాలతో పాటుగా పిక్నిక్ కి తీసుకుని వెళ్తుంది. జర్మనీ నించి వచ్చిన ఒక స్నేహితుడికి ఎలీని చూపించి , అతనికి నచ్చితే వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యాలన్నది సెపిదే ఆలోచన . కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం, ఎలీ గురించి వారిలో ఎన్నో సందేహలని రేకెత్తిస్తుంది. ఒక్కో పాత్రా దాచిపెట్టిన చిన్న చిన్న విషయాల్ని మెల్లగా అన్ ఫోల్డ్ చేస్తూ చూపడం వల్ల ఆద్యంతం ఒక విధమైన ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ సినిమా కూడా కథ తెలుసుకోకుండా చూస్తేనే బాగుంటుంది.  .
ఇక మూడోది ‘ది పాస్ట్ (The Past)’. ఈ కథ ఫ్రాన్స్ లో జరుగుతుంది. భర్త నుండి విడాకులు తీసుకుని, మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఇద్దరు పిల్లల తల్లి మేరీ కథ ఇది. ఆమె వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి భార్య కోమాలో ఉంటుంది . మేరీ కుమార్తెకి వారి వివాహం ఇష్టం ఉండదు. అతి సాధారణమైన కథాంశంలా అనిపించినప్పటికీ ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న రహస్యాలు ఉంటాయి . కథని పొరలు పొరలుగా తవ్వుకుంటూ వెళ్తూ, ఎక్కడో ఓ ఊహకందని మలుపు దగ్గర నిలబెట్టగల దర్శకుడి నైపుణ్యత ఈ సినిమాకి కూడా మనల్ని కట్టి పడేస్తుంది.
కానీ A Separation , About Elly లతో పోలిస్తే The Past కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ చలన చిత్రంలో  ఫర్హాదీ, సస్పెన్స్ కంటే మానవ సంబంధాల స్వరూప స్వభావాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాడు. సహజమైన ఆవేశకావేశాలు, అపార్థాలు మనిషి విచక్షణా జ్ఞానాన్ని మరుగుపరుస్తాయి. ఆ సమయంలో అవి మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి . ఆ ఒక్క క్షణం కొద్దిపాటి సంయమనాన్ని పాటించే ప్రయత్నం చెయ్యగలిగితే ఏమానవ సంబంధమైనా అంత తొందరగా ఒడిదుడుకులకి లోనుకాదు అన్నది ఈ చిత్రం చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశాలలో ఒకటి. అయినా ఫర్హాదీ చిత్రాలు మనిషి స్వభావాన్ని నిర్దేశించవు. కేవలం అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాయి. చేయిస్తాయి .
కథ చెప్పే విధానం ఒక్కటే కాదు. చిత్రీకరణలోనూ, సినిమాటోగ్రఫీలోనూ, నటీనటుల ఎంపికలోనూ కనిపించే వైవిధ్యతలు అతని చలన చిత్రాల్ని అరుదైన వజ్రాల మాదిరిగా మెరిపిస్తాయి .ఎక్కడా  నేపధ్య సంగీతమే  వినిపించదు. కేవలం మాటలూ, అవసరమైన శబ్దాలూ మాత్రమే వాడి, అతను సహజత్వాన్ని కనబరచడమే కాదు వినిపించేలా కూడా చేస్తాడు.
చివరగా చెప్పేదేమిటంటే అస్ఘర్ ఫర్హాదీ సినిమాలు చూడని సినీప్రియులు, కొన్ని ఋతువుల్ని అనుభవించనట్టే.  కొన్ని దారుల్ని కనుగొననట్టే. కొంత ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే.
*

అనిల్ ‘కథాయణం’ నుంచి ‘నాగరికథ’ దాకా!

kathayanam

-టి. చంద్రశేఖర రెడ్డి 

~

 

సారంగ-లో కథారచయిత అనిల్ ఎస్. రాయల్ తో వేంపల్లి షరీఫ్ గారి ముఖాముఖీలో ‘కథాయణం’ వ్యాససంపుటి, ‘నాగరికథ’ కథల సంపుటి గురించి ప్రస్తావన ఉంది. కథాయణం చదివింతర్వాత, నేను చదివిన ఇతర కథలను, కథాయణంలో  ఉన్న సూచనల్తో పోల్చి చూస్తే ఆ కథలకూ,  ఈ సూచనలకూ పొంతన లేదనిపించింది. అంతే కాదు. కథాయణంకు అనుబంధంగా కథనకుతూహలం-లో చెప్పిన క్లుప్తత ఆ కథల్లో లేనట్లు కనిపించింది.

కథాయణంలోనూ-కథనకుతూహలంలోనూ ఉన్న సూచనలు మిగిలిన రచయితల కథల్లో ఎందుకు అమలు కాలేదు? అవి అమలు చేయకూడనివా? అమలు చేయలేనంత కష్టమైనవా? అన్న అనుమానం వచ్చింది. నివృత్తి కోసం; ఆ సూచనలిచ్చిన రచయిత వాటిని తన కథల్లో ఎంతవరకు, ఎలా పాటించారో తెలుసుకోవాలని ప్రయత్నించాను. దాని ఫలితమే ఇది.

శీర్షిక గురించి సూచనలు: అవి ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

 1. కథల విషయంలో శీర్షిక వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది.

నాగరికథ-కథ ఒక నాగరికత ఎలా అంతమైందో శాస్త్రీయంగా తెల్సుకోటానికి చేసిన ఒక ఊహ. అందువల్ల కథకి నాగరికత అని కానీ, ఆ పదాన్ని నాగరి’కత’ గా మార్చి ‘కత’ నాగరికత కి సంబంధించిన కథ అనిపించేలా  శీర్షికగా పెట్టుకోవచ్చు. కానీ నాగరి’కత’ లో ఇమిడి ఉన్న ‘కత’ అనే పదం ఎక్కువమంది దృష్టిని  ఆకట్టుకోపోవచ్చు. అందుకనే, కత, కథగా మారి ‘నాగరికథ’ అయింది. కథాంశాన్ని క్లుప్తంగా, గుప్తంగా సూచించింది. విభిన్నంగా ఉంది.

 1. శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది.

రెండు విరుద్ధ విషయాలని సూచించే పదబంధం వెంటనే ఆకట్టుకుంటుంది. ప్రియశత్రువు అలాంటి రెండు  విభిన్న పదాల మేళవింపు. అందుకే ఆ కథ పేరులో నూతనత్వం, వైవిధ్యం ధ్వనించింది. కథలో ప్రధాన పాత్ర పేరు ‘ప్రియ’ అవటం వలన కథాంశం అంతర్లీనంగా పాఠకుడికి అందింది.

 1. శీర్షిక చూడగానే, అర్థమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి.

కుంతీకుమారి కథ, మహాభారతంలో కుంతీదేవిలానే కుమారిగానే తల్లిగా మారిన స్త్రీ కథ.  కనుక ఈ కథకి  ‘కుంతీదేవి’ అని పేరు పెట్టొచ్చు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఈ కథ కూడా పెళ్లికి ముందే తల్లి అయిన ఒక స్త్రీ కథ అని పాఠకులు  ప్రక్కన పడేయొచ్చు. అలా కాక, కుంతీకుమారి అని కథకి పేరు పెడితే, మహాభారతంలో కుంతికి పుట్టింది కర్ణుడు. కుంతికి కొడుకు కాకుండా కూతురు పుట్టటమేమిటి? అనుకుని కథలోకి పాఠకుడు ఆకర్షించబడొచ్చు. మహాభారతంలో కుంతీదేవి ముందు తల్లి, తర్వాత శ్రీమతి అయింది. కుంతీకుమారి కథలో,  ప్రధానపాత్ర కుమారిగానే మిగిలిపోయింది. కథకి పెట్టిన పేరు పరోక్షంగా కథాంశాన్ని కూడా సూచించింది.

 1. కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే మంచిది.

మరో ప్రపంచం కథ,  పారలల్ యూనివర్సెస్ గురించి. తెలుగులో ఆ కథకి పెట్టిన పేరు ఆ కథాంశానికి నిగూఢ సూచన ఇచ్చింది. అలానే మిగిలిన రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, మరపురాని కథ-కథల  పేర్లు కూడా.

 1. కథలకి పేర్లు పెట్టే క్రమంలో చాలా మంది ఔత్సాహిక రచయితలు/రచయిత్రులు చేసే పొరపాటు: కథలో ప్రధాన పాత్ర పేరునే కథ పేరుగా ఎంచుకోవటం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, తొమ్మిదింటికి పాత్రల పేర్లు కథ పేరుగా లేవు. ఒక్క మినహాయింపు ‘కల్కి’ ప్రధాన పాత్ర  అయిన ‘కల్కి’ కథ. ఆ కథకి ‘కల్కి’ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అన్న దాని గురించి కథాయణంలో వివరణ ఉంది.

 1. చప్పగా, సర్వ సాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఏ కథకీ సామెతలు పేర్లుగా లేవు.

 1. ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంత వరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు.

నాకు తెలిసి కథలకి పెట్టిన పేర్లు  ప్రసిధ్ధకథల పేర్లు, ఇతర ప్రసిద్ధ సాహితీ ప్రక్రియల పేర్లు కూడా కావు.

 1. కథ పేరు ఎంత పెద్దదిగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం.

నాగరికథ-లో ఉన్న కథల్లో; అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలు, రెండే పదాలు ఉన్న పేరు-‘మరపురాని కథ’.  మిగిలిన తొమ్మిది కథల్లో, ఆరు కథలకు ఒక పదమే పేరు. మిగిలిన మూడిటికీ ఒక పదబంధం శీర్షిక.

 1. శీర్షికలో ఓ రకమైన అర్థాన్ని సూచిస్తూ, కథ పూర్తిగా చదివాక అందులో మరో అర్థం గోచరించేలా పేరు పెట్టటానికి నేను ప్రాధాన్యతనిస్తాను.

కథల పేరుకి వాడిన పదాలు వాటి అసలు అర్థమే సూచించటం; నాగరికథ, ప్రియశత్రువు, కుంతీకుమారి భిన్నమైన పదప్రయోగాలు కావడం; వాటివల్ల అందిన సూచన ప్రకారం కథ ఉండకపోవటం-ఈ కథల కథాంశం, శీర్షికల ద్వారా వేసుకున్న అంచనాకి భిన్నంగా ఉండటం సంబంధిత సూచన అమలుకు నిదర్శనం.

కొసమెరుపు:

 1. నాగరికథ కథాసంకలనంలో ఉన్న పది కథల్లో అయిదు కథల పేర్లు; రహస్యం (1967), మరపురాని కథ (1967)), మరో ప్రపంచం (1970), శిక్ష (1985), కల్కి (1997) కథలు ప్రచురించబడటానికి ముందే విడుదలైన తెలుగు చలనచిత్రాల పేర్లు. ఇది యాదృచ్ఛికం కావచ్చు-కాని గమనార్హం. కుంతీకుమారి లాగే ధ్వనించే కుంతీపుత్రుడు 1993 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రళయం కథ ముద్రితమైన తర్వాత 2015 లో అదే పేరుతో ఒక తెలుగు సినిమా విడుదలైంది. రీబూట్ కంప్యూటర్ కే కాదు చలనచిత్రరంగానికి కూడా చెందిన ప్రక్రియ.

ఎత్తుగడ పై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

 1. అత్యవసరమైతే తప్ప కథని వర్ణనలతో మొదలు పెట్టను. అత్యవసరమైనా కూడా కథని సర్వసాధారణమైన సన్నివేశంతో మొదలు పెట్టను.

నాగరికథ, మరో ప్రపంచం, కల్కి,  ప్రియశత్రువు కథలు ఒక సంభాషణతోనే మొదలవుతాయి. శిక్ష కథ  కథాయణంలో ఒప్పుకున్నట్లు ఒక వర్ణనతో, వైవిధ్యం కోసం  ప్రాస ఉన్న పదాల్తో మొదలైంది. ప్రళయం కథ సంభాషణతో కాకుండా ఒక గమనికతో మొదలవుతుంది.  రీబూట్, రహస్యం, మరపురాని కథలు భిన్నంగా మొదలయ్యాయి. మరపురాని కథ ఒకటే ఒక సాధారణమైన సన్నివేశంతో మొదలయినట్లనిపిస్తుంది.  కుంతీకుమారి అనువాదకథ. దాని ఎత్తుగడ మీద అనువాదకుడికి స్వేచ్ఛ లేదు.

 1. మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వీలైతే మూడు నాలుగు లైన్లకు మించకుండా. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది.

నాగరికథ కథలో ఈ సూచన ఏడు లైన్లతో కొంచెం దారి తప్పింది. మరో ప్రపంచం, రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, కుంతీ కుమారి; రెండు లైన్లతో; కల్కి, ప్రియశత్రువు, మరపురాని కథ ఒక లైనుతో మొదలయ్యాయి.

 1. మొత్తమ్మీద, ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి చదవబోయే కథపై ఉత్సుకత కలిగించాలి.

ఎత్తుగడతో ఉత్సుకత ఎలా కలిగించవచ్చో అన్నదానికి, నాగరికథ కథ మొదలే ఒక ఉదాహరణ. అది  కథాయణంలో ప్రస్తావించబడింది. కల్కి కథ అయితే మరీ క్లుప్తంగా రెండు పదాల్తోనే పాఠకుడ్ని కథలోకి లాక్కు వెళుతుంది. ఆ రెండు పదాలూ “ఇద్దర్ని చంపాలి.”

ముగింపుపై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

1.A.      ఎత్తుగడ భాగంలో, ‘కథని ఎలా మొదలెట్టినా ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అని ఉంది. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి అని చెప్పబడింది.

1.B.      అవి అరటిపండు వొలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెతుక్కోవటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి.

ఉదాహరణకు-నాగరికథ కథ తీసుకుందాం. దీనిలో ‘ఎత్తుగడ’ టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణం చేయడం గురించి. హైస్కూలు విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇస్తున్న ఓ అణుశాస్త్రవేత్త వివరణతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత తాత గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కాలంలో వెనక్కెళ్లి ఆయన్ను చంపెయ్యడం గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. కాలయంత్రం ద్వారా కాలప్రయాణం  గురించి  పాఠం చెపుతున్నపుడు అణుశాస్త్రవేత్తకి వాళ్ల తాతగారి గురించి సెల్ ఫోన్ ద్వారా ఒక వార్త వస్తుంది. క్లాసు అర్ధంతరంగా ఆగిపోతుంది. తాతయ్య దగ్గరకి హడావిడిగా మనవడి ప్రయాణం మొదలవుతుంది. దీంతో పాఠకుడి మెదడులో టైమ్ మెషీన్ గురించీ, అందులో వెనక్కి వెళ్లడం గురించీ, తాతయ్య గురించి వచ్చిన వార్త ఏమిటనే దాని గురించీ ప్రశ్నలు మొదలవుతాయి.

ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకుడు తప్పనిసరిగా మిగిలిన కథలోకి వెళతాడు. కథనంలో టైమ్ మెషీన్ ఉందా? లేదా? ఉంటే ఎలా తయారయింది? దాన్ని ఎవరు తయారు చేశారు? అందులో కాలంలో ఎవరైనా వెనక్కి ప్రయాణం చేశారా? వెళ్లింది ఎలా? వెళ్లింది ఎవరు? ఆ ప్రయాణఫలితం ఏంటి? అనే దాని మీద తగినంత సమాచారం ఒక దాని తర్వాత ఒకటి కథకుడు అందిస్తాడు.

ఈ ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు కథలో నేరుగా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి అవసరమైన ఆధారాలు కథలో ఉంటాయి. ప్రధాన పాత్ర ప్రత్యక్షపద్ధతిలో తెలిసిన వాటిని మొదట నమ్మదు. కాని నమ్మక తప్పదు. పరోక్షంగా తెలిసిన వాటిని మనవడు నమ్ముతాడో లేదో రచయిత స్పష్టంగా చెప్పడు.  నమ్మాలో వద్దో విశ్లేషించి తెలుసుకోవాల్సింది మనవడూ, అతడితో పాటు మనమూ.

 1. A. కథలకి రెండు రకాల ముగింపులుంటాయి-ప్రధానపాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ కథలకి వర్తిస్తుంది.

2.B. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధానపాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనావిధానంలో కలిగే పరిణతి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం…ఇలాంటి విషయంతో ముగుస్తాయి.

నాగరికథ కథ పై రెండు వర్గాల్లో ఏ విభాగానికి చెందినది అనేది అప్రస్తుతం అనుకుంటే; ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో; లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం ఏమిటో; కథ ముగింపు చెప్పాలి.

ఈ కథలో ప్రధాన పాత్ర అణుశాస్త్రవేత్త. అతడిని వేధించే సమస్యా, పాఠకుడిని వేధించే ప్రశ్నల సారాంశం ఒకటే. సూచన 2-A ప్రకారం, ఆ పాత్ర తన సమస్యని పరిష్కరించుకోవాల్సింది, సూచన 2-B ప్రకారం ఇవ్వాల్సిన  సమాచారం. దాన్ని కథకుడు తాత ద్వారా, మనవడికి అందిస్తాడు. దాన్ని విశ్లేషించి మనవడు ఒక నిర్ధారణకి వస్తాడు. కాని, అదేంటో రచయిత పాఠకులకి చెప్పడు. దాన్ని కథ ముగింపిడికిట్లో పెట్టి, తెరిచి ఏముందో చూసే బాధ్యత పాఠకులకే వదిలేస్తాడు. అది సవ్యమా, సంభావ్యమా అన్నది వదిలేస్తే, అదిక్కడ చెప్పటం భావ్యం కాదు.

 1. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలో వదిలేస్తే కుదరదు.

నాగరికథ కథలో రచయిత కాడిని పాఠకులతో పాటు తాను కూడా మోసి కంచికి కూతవేటు దూరం దాకా  వచ్చాడు. ఊరు బయట తాను కాడిని వదిలేసి పాఠకులకి మిగిలిన ప్రయాణం ఎలా చెయ్యాలో, గమ్యస్థానం ఎలా చేరాలో చెప్పాడు. తమంతట తాము గమ్యం చేరిన తృప్తి కలగాలంటే ఆ కాస్త దూరం ప్రయాణించాల్సింది పాఠకులే.

 1. కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి.

ఈ సూచన కథలో ఎలా పాటించబడిందో చెపితే, కథ ఇంకా చదవని పాఠకులకి కథ చదువుతున్నపుడు కలిగే ఉత్సుకత మిగలదు.

 1. మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు.

నాగరికథ కథ లో అలాంటి మార్పేదీ లేదు.

 1. ముగింపు ఎలా ఉండబోతోందో కథనిండా క్లూస్ వదులుతూనే, మరో వైపు పాఠకుడిని మాయచేసి పెడదారి పట్టిస్తూ, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే అసలు ఊహాతీతమైన ముగింపు.

నాగరికథ కథలో మనవడికి కలిగిన అనుమానాల ద్వారా పాఠకులు పొందింది, వాళ్లకు అందిందీ అదే.

తుది మాట:

మిగిలిన తొమ్మిది కథల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడాల్సింది పాఠకులే.

*

 

ఇది ఆకలి కత కాదు – అవమానాల వెత

 

 -ఎ . కె . ప్రభాకర్

~

 

ఒక్కో కథ చదివాకా ఆ  కథ లో పాత్రలు చాలా కాలం గుర్తుండిపోతాయి.  కొన్ని పాత్రలైతే వెంటాడతాయి. పాత్ర పేరు చెప్పగానే కథంతా స్ఫురణకి వస్తుంది. కొన్ని కథల్లో సంఘటనలు కథని మరచిపోనివ్వవు. ఏక వాక్య కథలుగా కొన్ని మనసులో పాతుకుపోతాయి ; సారం చెప్పగానే కథ యాదికొస్తుంది. కొన్ని కథలు రచయిత శిల్ప కౌశలం కారణంగా కేవలం విలక్షణమైన టెక్నిక్ ద్వారా  మెదడు పొరల్లో జ్ఞాపకాలుగా కదులుతూ వుంటాయి. చాలా తక్కువ కథలు మాత్రమే శీర్షిక పేరు చెప్పగానే కథలోని పాత్రలూ వాటి ప్రవర్తన సంఘటనలూ సన్నివేశాలూ సంభాషణలూ యితివృత్తం దాని నిర్వహణా కథనపద్ధతీ భాషా వాటిని వాహికలుగా మలచుకొన్న రచయిత దృక్పథం అన్నీ వొక దాని వెంట మరొకటి కళ్ళముందు దృశ్యమానం అవుతాయి. అటువంటి అరుదైన కథల్లో వొకటి ఎమ్ ఎమ్ వినోదిని రాసిన

(తొలి ముద్రణ : అరుణతార  – జనవరి, 2015 ,  ‘బ్లాక్ ఇంక్’ సంపుటిలో పునర్ముద్రితం). ఆ కథ అరుదైనది కావడానికి మొదటి  కారణం స్వీకరించిన వస్తువు. రెండోది చెప్పిన వైనం.

***

చానాళ్ళ కిందట వూరినుంచి పనిమీద నగరానికి వచ్చి అక్కడ అభివృద్ధి చెందిన రాజపథాల్లో వుచ్చ పోసుకోడానికి మరుగు దొరకక విలవిల్లాడిన మహిళ  క్షోభని కథగా చదివి క్రోధంతో రగిలిపోయిన జ్ఞాపకం వుంది. దశాబ్దాలు నడిచి వచ్చాకా  యిప్పుడు వినోదిని కట్ట చదివినప్పుడూ అదే అనుభూతి. జపాన్ సింగపూర్ నమూనాల వర్తమాన చరిత్ర కూడా అంతే సంబడంగా వుందని గుండె జలదరించేలా ‘కట్ట’ మరోసారి నిరూపిస్తుంది.

దళితవాడ నుంచి పై చదువుకోసం హాస్టల్లో చేరి అక్కడ లెట్రిన్ సౌఖ్యం అనుభవించే పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి ‘సొరూప’ సెలవలకి యింటికి వచ్చినప్పుడు మరుగుదొడ్డి సదుపాయం లేక రైలు పట్టాల మీదకి ‘దొడ్డికి’ పోవాల్సినప్పుడు అనుభవించిన బాధల పరంపర కట్ట.

ఆస్టల్లో వుప్పూకారం లేని కూరలు తినటం మూలాన నాలికంతా చప్పబడిపోయిన సొరూప అమ్మ చేసిన ‘గోంగోర పచ్చిమిరగాయాలు వుడకబెట్టి నూరిన పచ్చడి’ వేసుకొని యిష్టంగా రెండు ముద్దలు అన్నం యెక్కువే తింది. ఫలితంగా తెల్లారక ముందే ‘దొడ్డి నెప్పి’. కూర్చుంటే రెండు మడాలూ తడిసి పోయేంత పెద్ద యిరోచనం. ఇక తెల్లారుతూనే మొదలైంది నరకం.

కరుణామయుడు సినిమాలో ‘యేసయ్య సిలవ మీద చచ్చిపోయినపుడు – కొండరాళ్ళు దొర్లుతయ్ , సముద్రాలు వుప్పొంగుతయ్ , అగ్నిపర్వతాల కుండ మీద మూత పేలిపోయి , మంట యెక్కువైతే పప్పుచారు పొంగినట్టు లావా పొంగిపోద్ది . అట్టా వుంది నా కడుపులో.’  స్వరూప తన  శారీరిక బాధని తనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేయడానికి పడడిన అవస్థ యిది.

తలమీద ముళ్ళకిరీటం బెట్టి లోపలికేవరో గట్టిగా వొత్తుతున్నట్టున్న సొరూప పడ్డ బాధని ఆమెతో పాటు కథ చదివే వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ అసలు సమస్య – పగటి పూట పదే పదే కట్ట మీదకి పోవాల్సి రావడమే.

‘చెంబు తీసుకొని యిళ్ళ మజ్జ నడుచుకుంటా బోవాల. ‘యెప్పుడొచ్చావమ్మాయ్?’– అని అందరూ పలకరిస్తావుంటారు. దానికి తోడు కట్టకి పొయ్యొచ్చే మా గేరి మొగోళ్ళు యెదురవుతావుంటారు. అన్నయ్యలూ , అంకుళ్ళు. నాతోపాటు మా లూథరన్ హైస్కూల్లో చదువుకున్న సీనియర్లు , జూనియర్లు కూడా వుంటారు. వీటన్నిటికీ మించి పగలు ఆడోళ్ళు కట్టమీద కూర్చోడానికి లేదు! కట్ట పక్కన డవున్లో వున్న ముళ్ళ కంచెల్లోపలికి వొంగొంగి నడుచుకుంటాబోయి కూర్చోవాల. అసలే పెంటలరొచ్చు. రోతగా వుంటది. దానికి తోడు రాత్రంతా వానబడివుంది. కుప్పలన్నీ చింది, చుట్టూ చెల్లాచెదరుగా యెగిరిపడి వుంటాయ్. యెంత కష్టమో నడవడం. తావు వెతుక్కోవడం.’

అందుకే సెలవలు వస్తే లేటుగా లేస్తామని చెప్పుకొనే వాళ్ళని చూస్తే స్వరూపకి అసూయ.  ‘తెల్లగా తెల్లవారడం’ గురించి పంచుకోలేని  భయం , చెప్పుకోలేని ఆందోళన.

‘స్వచ్ఛ భారత్’ ప్రాంగణాల్లో కెమెరాల ముందు చీపుర్లతో దర్శనమిచ్చి  ‘నమో’ వాక్యాల భజన చేసే రాజకీయ దుర్గంధ నాయుళ్ళందరూ కట్ట మీదినుంచి వీచే యీ గవులును వొక్కసారి పీల్చి సిగ్గుపడాల్సిన అవసరాన్ని గుర్తుచేసే యీ కథలోని  వస్తువుతో కొందరికి పేచీ అయితే రచయిత సొరూప ముఖత: వర్ణించిన చీదర కొంతమందికి కడుపులో కెలికినట్టు చేసింది.

‘నా యెడం పాదం ముందు నుంచి – నలుపు మీద నాలుగు యర్ర మచ్చలున్న పురుగు పోతావుంది. అది ముందుకాళ్ళతో కుంకుడు గింజంత పియ్యి వుండని దొర్లించుకుంటా పోతావుంది. దొర్లించుకుంటా పోటం వలనేమో , వుండ బో గుండ్రంగా , చూట్టానికి చిన్నసైజు లడ్డులాగా వుంది.

‘ … పాదాల్నిండా పియ్యి. కజాబిజి తొక్కానేమొ , అతుక్కుపోయింది. యేళ్ళ మజ్జ నుంచి పొడుచుకొచ్చి , అంచుల్లోకెల్లకొచ్చి …! చెప్పుల్లేకుండా నల్లమట్టి పొలంలో నడిస్తే మట్టి బూట్లొస్తాయే , అట్లొచ్చినయ్ పియ్యబూట్లు!’

యిటువంటి వర్ణనలు చాలా మంది కథా శిల్ప ప్రేమికులకి , సమీక్షకులకి మింగుడు పడలేదు. ఇది కథ కాదు అని కంగారు పడ్డారు. ఇన్నాళ్ళూ కథలకి గీసుకొన్న కొలతల్లో యిమడని  రచనా శైలి యిది. ఈ శైలే  ప్రధాన స్రవంతి పత్రికలకు ఈ కథ పట్ల అసహ్యం కలిగి ప్రచురించకపోటానికి కారణమయింది. మన యీ సభ్య నాగరిక సమాజం లోపలి – బయటి  కల్మషాన్నంతా పై నుంచీ కిందకి ‘చేపని కడిగినట్టు సుబ్బరంగా రుద్ది’ కడిగి పారేయడానికే రచయిత కావాలనే యీ ముళ్ళ దారిలో నడిచిందని  గ్రహించాలి. నిజానికి మనం యింకా  యిటువంటి సమాజంలో బతుకుతున్నందుకు దిగులుతో  సిగ్గుతో బెంగతో  ‘సిరిసెవట్లు’ పుట్టాలి గానీ పీతుర్ల వర్ణనల పట్ల అసహ్యం కలగనేల?

నాకైతే కథ చదివాకా చదివిన ప్రతిసారీ రోజుల తరబడి నిద్ర పట్టలేదు. కారణం యిదంతా – యీ చీదరంతా – చెరువు గట్టున పందుల కుమ్ములాటలోనో , కాలవ వొడ్డున రెల్లు దుబ్బుల చాటునో , రోడ్డు వార కంచె తుమ్మ కంపల మధ్యనో   కాలేజీ చదువు పూర్తయ్యేదాకా నేనూ అనుభవించా. అది కేవలం  స్వీయానుభవం మాత్రమే కాదు; నా చెల్లీ తల్లీ అక్క అవ్వ కుటుంబ స్త్రీలు మా వాడకట్టులోని ఆడవాళ్ళందరూ అనుభవించారు. వాళ్ళందరికీ చెంబట్టికొని వెళ్ళే ఆ చీకటి కార్యక్రమం యెంత అవమానాస్పదమైనదో యెంత లజ్జాభరితమైనదో యెన్ని యిబ్బందులకు హేళనలకు నెలవో యెంత హింసకు పాదో  ఆ వయసులో నాకు తెలీదు. ఆ తర్వాత తెలిసొచ్చింది. కానీ  వినోదిని కట్ట చదువుతుంటే ఆ అవమాన గాయాల్ని మళ్ళీ మళ్ళీ కెలికినట్టయింది. చాలా డిస్టర్బ్ అయ్యా.  అయాం అగైన్ యిన్  డీప్ షిట్ !

ఈ బహిర్భూమి కార్యక్రమం స్త్రీలకు అనునిత్యం చిత్రహింసే. కూర్చొని వుండగా అంతదూరంలో రైలు బండి వస్తుందంటే , యెవరైనా ‘మొగమనిషి కనబడ్డాడంటే లేచి నిలబడాల్సిందే!’. ఆడవాళ్ళకి మాత్రమే యీ  హింస. ‘యిట్లా మజ్జలో లేచి  నిలబడే అవసరముండ’ని మగపుటకకి ఆడజన్మలో లేని గొప్ప వెసులుబాటు వుందని అనుకొన్న స్వరూప పాయింట్ లోని చేదు ‘అనుభవించినోళ్లకే తెలుస్తది’.

అంతేకాదు అక్కడ పియ్యి తినడానికొచ్చే పందులతో కుక్కలతో యుద్ధమే చెయ్యాలి. అన్నిటికీ మించి తమ లేకి చూపులతో గాలి మాటలతో వెకిలి చేష్టలతో అత్యాచారానికి పూనుకొనే మగకుక్కల బారిన పడకుండా కాపాడుకోడానికి అనుక్షణం అప్రమత్తంగా వుండాలి.  ఒక విధంగా యిన్ని అవమానాల మధ్య ఆడదానికి  కాలకృత్యం తీర్చుకోవడం దినదిన గండమే , జీవన్మరణ సమరమే.

పగటి పూట కట్ట పక్కన ముళ్ళ కంచెల్లో సిగ్గుతో నొప్పితో సతమతమవుతున్న స్వరూప వొక పోకిరీ వేధింపుకి భయపడి ముళ్ళ కంచెల్లో పరుగెత్తినపుడు ఆమె అనుభవించిన శారీరిక – మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిది. పాపం అరికాళ్ళలో గుచ్చుకొన్న ముళ్ళని తీయగలిగినన్ని తీసి (యిరిగి లోపలే వుండిపోయినవి కాక యిరవైమూడు) పొట్లం కట్టి అమ్మకి చూపించిన సందర్భంలో స్వరూప యేడుపుకి కరగని పాఠకులుండరేమో! ఇక  ‘సెవిటి కరుణమ్మదొడ్డికెల్లి రైలు కిందబడి’ చనిపోయే ముగింపు అయితే హృదయవిదారకం.

***

జీవితాన్ని వున్నది వున్నట్టుగా యథాతథంగా చిత్రిస్తే అది కళ కాదు ; కేవల వాస్తవానికీ కళకీ మధ్య వున్న రేఖని స్పష్టంగా గుర్తించడంలోనే రచయిత మెళకువ చూపాలి – అని చెప్పే రొట్టకొట్టుడు విమర్శ సూత్రాలకి అందని కథ యిది. జీవిత సత్యావిష్కరణ కంటే మించిన కళ వుండదన్న స్పృహతో చెక్కిన మొరటు శిల్పం యిది. ఎటువంటి మేలి ముసుగులు అలంకారాల తొడుగులు లేకుండా వొక దు:ఖ భాజనమైన – అవమాన భరితమైన పేద దళిత జీవన పార్శ్వాన్ని సామాజిక బీభత్సంతో అన్వయించిన కథనం యిది. నోట్లో వెండి చెంచాల్తోనూ యింట్లో అటాచ్డ్ ప్రాచ్య – పాశ్చాత్య స్నానాగారాల ఫ్లషవుట్లతోనూ పుట్టి బతికే నాగరికులకు అర్థంకాని దుర్భరమైన వేదన యిది.

జుగుప్స కలిగించే పియ్యి పీతుర్ల వర్ణనల్లేకుండా యీ కథ రాయడం యిదే కథలో తెనాలి రామలింగడు వొకానొక విద్వాంసుడితో చాలెంజ్ చేసినట్టు పాస్ పొయ్యకుండా దొడ్డిక్కి కూర్చోవడమంత కష్టం అని రసజ్ఞులైన భావుక విమర్శకులు తెలుసుకోవాలి (ఈ చీదరని భరించలేని తనం నుంచి బయట పడటానికే జీవితంలో , కథలో దొడ్డికి చుట్టూ జోకులూ పిట్టకథలూ చోటుచేసుకొన్నాయేమో!).

అయితే రైలు కట్ట పట్టాల పక్కన పెంటలు ‘చూడ్డానికి ఇరగబూసిన బంతిపూల్లగా, చేమంతి పూల చెండుల్లాగా కనపడతయ్’ అని రచయిత వొకచోట చేసిన  ఆలంకారిక వర్ణన శుద్ధ కళా వాదుల ముఖమ్మీద రచయిత ఐచ్ఛికంగా విసిరి కొట్టిన అశుద్ధమే. సాహిత్య భావుకులకీ  సౌందర్య పిపాసువులకీ కళారాధకులకీ  చెంప పెట్టులా గబ్బిల దౌత్యం నెరపిన మహాకవి గుర్రం  జాషువా వారసత్వమిది. పదాల మాటునో అంతరార్థాల వెనకో దాక్కోకుండా ముక్కుసూటిగా మాట్లాడే దళిత తత్త్వమిది. కళ్ళముందు కనపడే వాస్తవాలతో  యెటువంటి దాపరికాలకీ తావులేని యింత సాదాసీదా కథని నేనిటీవల చదవలేదు.

కేవల యథార్థ జీవిత చిత్రణకి ప్రలోభపడి  వినోదిని కథానిర్మితి విషయంలో యెక్కడా యే మాత్రం అశ్రద్ధ చూపలేదు. కథ చెప్పేది యింటర్మీడియట్ చదివే అమ్మాయి. ఆమె సామాజిక నేపథ్యం పేద దళిత క్రైస్తవ జీవితం.  పదహారేళ్ళ ఆ  పిల్ల మౌఖిక కథనంలో అనేక  ఆర్ధిక – సాంస్కృతికాంశలనీ , వాటితో ముడివడి వున్న భాషనీ  అతి సహజంగా తీసుకువచ్చే విషయంలో  రచయితగా వినోదిని చూపిన నేర్పు ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.  కథా గమనంలో అనేక సామాజికాంశాలు ప్రస్తావనకొస్తాయి. ఆ యా సందర్భాల్లో రచయిత  దృక్పథం కూడా స్పష్టంగానే తెలుస్తుంది. కథ ప్రారంభమే అందుకు మంచి వుదాహరణ.

కాలేజికి సెలవలని వినగానే  స్వరూపకి అందరిలా సంతోషం కలగలేదు. ‘గుండెల్లో రాయి పడింది. ఆస్టల్ అన్నంలో దొరికేంత చిన్నసైజు కాదు. రైలుకట్ట మీదుంటదే , చేతిలో సరిపోయేంతది, అంతది.!’

మొదటి పంక్తుల్లోనే కథాంశం , కథా సారం రెండూ వొకేసారి  వ్యక్తమయ్యాయి. రచయిత ప్రతిపాదించదల్చుకొన్న విషయం హాస్టల్ అన్నం , అన్నంలో రాళ్ళ సమస్య కాదు – వాటిని మించిన భీతావహమైన సమస్య యింట్లోనో బయటో మరుగుదొడ్డి లేకపోవడం అని తెలుస్తుంది.  అందువల్ల యిది ఆకలి కత కాదు – అవమానాల వెత . ఆకలికే కాదు అవమానాలకి కూడా పాదు పేదరికమేనన్న స్పృహ  రచయిత  యే సందర్భంలోనూ మర్చిపోలేదు.

యూరియా సంచులు కలిపి కుట్టి నాలుగు మూలలా పాతిన బొంగుల ఆసరాతో మూడు గోడల్లా చుట్టి , తలుపు బదులు పాత చీర అడ్డంగా కట్టిన బాత్రూం , నున్నగా అలికిన నేలమీద బొంతేసుకొని పొణుకోవడం ,  ఇంటి తాటాకు కప్పులోంచి కురిసే వానకి కప్పుకున్న దుప్పటి తడవడం , నీళ్ళు కారిపోయే చిల్లు రబ్బరు చెంబు , కిరసనాయిలు దీపం బుడ్డీ , చిన్న చిన్న బట్టల సబ్బు ముక్కల్తో వొళ్ళు రుద్దుకోవడం , బయటుండి చదువుకొనే గేరి పిల్లలు సెలవలకి యిళ్ళకొచ్చినపుడు కూలి పనులకి పోయి పుస్తకాలకీ బట్టలకీ నాలుగు డబ్బులు సంపాదించడం … యిలా   కథావరణానికి అవసరమైన సామగ్రి యేదీ  ఆమె దృష్టి నుంచి తప్పించుకుపోలేదు.

నిజానికి వాస్తవ జీవిత చిత్రణ దానికదే కథ అయిపోదు. యథార్థతని గ్రహించడానికి , గ్రహించినదాన్ని సరైన మాధ్యమంలో ఆవిష్కరించడానికీ సమ్యగ్ దృక్పథంతో కూడిన సునిశితమైన పరిశీలన అవసరం. అది వినోదినిలో నిండుగా వుందని కట్ట నిరూపిస్తుంది. ఆమె కన్ను కెమెరా కన్ను. చూపు మైక్రోస్కోపిక్ చూపు. చిత్రణ మల్టీ డైమన్షనల్. వాడిన రంగులు సహజ సిద్ధమైనవి. కాన్వాస్ జీవితమంత విశాలమైనది.

అందుకే – బొట్టు బొట్టుగా యింట్లోకి కారే వాన నీళ్ళు గిన్నెలోకి పడుతున్నప్పుడు చేసే శబ్దానికి నిద్ర చెడకుండా వుండడానికి గిన్నెలో బన్నీ (బనియన్) వేయడం , కట్ట మీదకెళ్ళినపుడు చిల్లు చెంబులో నీళ్ళు కారిపోతే పక్కవాళ్ళనుంచి పంచుకోవడం , పీతుర్ల మధ్య చెంబు పెట్టడానికి బెత్తెడు చోటులేక పాదమ్మీదే పెట్టుకోవడం , దొడ్డిక్కూడా వొక్కచెంబులోనే నీళ్ళు తీసకపోయే సావాసాలు , పక్కపక్కనే కూర్చుని చెప్పుకొనే కతలు – కబుర్లు , దసరా సంక్రాంతి పండగలప్పుడు స్కూల్లకీ కాలేజీలకీ అన్నేసి రోజులు సెలవలిచ్చి క్రిస్టమస్ కి వొక రోజు సెలవివ్వడంలో కనిపించే ఆధిపత్య మత భావన గురించిన ప్రస్తావన , కూర్చుంటంటేనే తినడంకోసం కాసుకున్న పందుల ఆరాటం , కట్ట మీద నుంచి తిరిగొచ్చేటప్పుడు చెంబు కుడి చేత్తోనే పట్టుకురావాలని గుర్తుచేసుకోవడం , చెంబు మళ్ళీ గాబులో ముంచేముందు అడుగు కడగడం , యిరోచనాలు కట్టుకోడానికి మాత్తర్లేసుకొనే సొంత వైద్యాలు – సగ్గుబియ్యం గంజి తాగడం – పంచాదారేసుకొని యిడ్లీ తినడం , కాకెత్తక పోద్దని వొంటి సబ్బు యింట్లో దాచిపెట్టుకోవడం  … వంటి నిర్దిష్ట జీవితానికి సంబంధించిన అనేక సూక్ష్మాంశాలు కథలోకి అలవోకగా వొచ్చి చేరాయి. వాటితోబాటు యింటా బయటా గేరీ మనుషుల్లో మాటల్లో కనిపించే వినిపించే క్రైస్తవ సంస్కృతి కథకి మరింత సహజ పరిమళాన్ని అందించింది.

అయితే వీటిలో యేవీ రచయిత దృష్టికోణం నుంచి చూపినవి కావు. ఇంటర్ చదివే టీనేజి అమ్మాయి చూపు ద్వారా కథలోకి యెక్కినవే ( ఇస్లాం పేట మసీదు నుంచీ విన్పించే అజా తప్ప). ఆ వయసు పిల్లల ఆలోచనలు , భయం ఆందోళన సంతోషం దు:ఖం వంటి మానసిక వుద్వేగాలు , వాటి వ్యక్తీకరణ రీతులు , అందుకు వుపయోగించిన భాష – పదజాలం , వుచ్చారణా పద్ధతులు – అన్నిటినీ అపూర్వమైన నైపుణ్యంతో రచయిత ఆవిష్కరించి ఆత్మకథాత్మక  కథనానికి విశ్వసనీయతని సాధించింది. అదే యీ కథలో అంతర్గతంగా కనపడని శిల్పం. అదే ఈ కథలోని బలం కూడా. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతపు గేరీల భాషని వినోదినిలా యింత అద్భుతంగా సాహిత్యంలోకి యింతకుముందు యెవరూ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అందుకే అపూర్వమనడం.

***

నీళ్ళులేని కమ్యూనిటీ టాయిలెట్లకి సంబంధించిన విషయాన్ని యితివృత్తం చేసుకొని తీవ్ర క్రోధంతో  శాంతి నారాయణ రచించిన  ‘అసలవి లేనప్పుడు …’ కథ  దీని తర్వాతి  కాలంలోనే ( ప్రజాసాహితి , జూలై – 2015) వచ్చింది. మధ్యాహ్నం పూట చెంబు పట్టుకొని జొన్నతోట్లోకి వెళ్లి ఎలుగుబంటి కి చిక్కి చచ్చిపోయిన  మండల ప్రెసిడెంటు మాదిగ మారెక్క వుదంతాన్ని పేర్కొంటూ  ‘ఒక ఆడడానికి ఈ దేశంలో స్వేచ్ఛ కంటే మరుగుదొడ్డి చాలా ముఖ్యమని’ ఆత్మ గౌరవ ప్రకటన చేసిన పద్మావతి , ‘సాగునీల్ల కత దేవుడెరుగు , కడాకు తాగడానికి గుటికెడు మంచినీల్లూ ముడ్డి కడుక్కోడానికి చెంబెడు నీల్లూ ఈలేనప్పుడు ఈ రాట్రం బంగారుదైతే మాకేమొత్తది , యెండిదైతే మాకేమొత్తది?’ అని రాష్ట్రాన్ని సింగపూరో జపానో చైనానో చేస్తామని వూదరగొట్టే నాయకుల్ని ప్రశ్నించి రాజకీయ చైతన్యం చూపిన రామన్న , ‘నీల్లు ఎటూ దొరకవు , దినామూ బయటికి ‘దొడ్డికి’ పోయినంక ముడ్డి తుడుసుకుందేకి’ గులకరాళ్ళు పంపించమని కలెక్టర్ ని నిలదీసి అధిక్షేపించి హేళన చేసిన సుబ్బమ్మ యీ కథలో గొప్ప పోరాట యోధులుగా దర్శనమిస్తారు.

‘కట్ట’ కథలో యిటువంటి పాత్రలు లేవు. రాత్రిపూటే కావొచ్చు రోడ్డు పక్కనే కూర్చోవాల్సి వచ్చినప్పుడు యెల్తుర్లో ఆ యిబ్బంది నుంచి అవమానాల నుంచి తప్పించుకోడానికి ‘కరెంటు స్తంబం మీద లైటు పగల్నూకిన’  అంజమ్మత్త చేతిలోని రాయి కేవలం గౌరవం కాపాడుకొనే సాధనంగానే కాకుండా తమ దురవస్థకి కారణమైన వ్యవస్థపై ఆయుధంగా మార్చుకొంటే బాగుండుననిపిస్తుంది.

కథ మధ్యలోనో చివరనో  ఒక చూపుడు వేలి కోసం వెతుక్కోవడం తప్పుకాదేమో! సూచ్యంగానో వాచ్యంగానో అటువంటి భరోసానివ్వని కథ కంప్లైంట్ కథగా మిగిలిపోయే ప్రమాదముంది. దాన్నుంచి తప్పించడానికే రచయిత కరుణమ్మ మరణాన్ని కథకి ముగింపుగా మలచినట్టు అనిపిస్తుంది. చీకట్లో మొదలై చీకట్లోనే ముగిసే రోజువారీ బతుకు వెతలపై నిరసనే ఆగ్రహ ప్రకటనే ఆ అవ్వ మరణం. ఈ దేశంలో దొడ్డికెళ్ళడం కూడా చచ్చేచావు అన్న పచ్చినిజం కోపానికి కారణమవుతుంది. కట్ట మీద దొడ్డిక్కూర్చోడానికెళ్ళిన సెవిటి కరుణమ్మవ్వ రైలు కింద పడి చనిపోవడం పాఠకుల్లో ‘పెద్ద రైలుకూతలా  గుండెల్లో దుఖ్ఖాన్ని’ మాత్రమే కలిగించదు ;  ఆగ్రహాన్నీ ఆవేశాన్నీ సైతం  రగిలిస్తుంది.

ఫిర్యాదు కథల ముద్రకి గురికాకుండా వినోదిని తీసుకొన్న యిటువంటి జాగ్రత్తల గురించి పి. సత్యవతి స్పష్టంగానే గుర్తించారు. అందుకే  ‘కన్నీళ్లు  తెప్పించడం ఈ  కథల ప్రయోజనము లక్ష్యము ఏ మాత్రం కాదు … నిలవ నీటిలో ఆనందం పొందే మొద్దు చర్మాలని అంకుశంతో పొడవాల్సిందే – ఆ అంకుశాన్ని తన కలం చేసుకుంది వినోదిని’ ( ‘బ్లాక్ ఇంక్’ పుస్తకానికి ముందు మాటలో) అంటారామె. నిజానికి కథ పొడవునా రచయిత ప్రాపంచిక దృక్పథం పరచుకొని వుండడం వల్ల కూడా వినోదిని కథలు కేవలం ఫిర్యాదు కథల్లా మిగిలిపోవు. దళిత సామాజిక వాస్తవికత వినోదిని కథలకి ఆయువుపట్టు. దానికి క్రైస్తవ సంస్కృతీ , స్త్రీ చైతన్యం జోడించడంతో ఆమె కథలు విశిష్టతనీ  ప్రత్యేకతనీ అనితరతనీ సాధించుకొన్నాయి.

ఇళ్ళలో సరైన టాయిలెట్ల సదుపాయం లేని ‘గరీబు ముస్లిం ఆడోల్ల బతుకు’ దైన్యంలోని భిన్న కోణాన్ని పదేళ్ళ కిందే షాజహానా కథగా రాసింది( వతన్ – 2004). అప్పుడు అదేదో ఘోషాలోని మైనార్టీల కడుపు నొప్పి అని యే కొందరో వుపేక్షించారేమో గానీ   ‘ఊర్ల ముస్లింలు కానోల్లంతా ఊరి బైటికెల్తరు గదా .. వీళ్లు గూడ ఎల్తేంది ??’ అని సోచాయించే కొత్త దుల్హన్ , నయీ బహూ షమీమ్ బాధకి కారణమైన సామాజిక – ఆర్థిక నేపథ్యం చాలామందిని ఆలోచింపజేసింది.  సండాస్ లో షమీమ్ అనుభవించిన వేదన , కట్ట మీద స్వరూప పడిన యాతన వొకటే. రెండుచోట్లా అందుకు కారణం పేదరికమే.

ఇటువంటి  నిజాల్ని దాచిపెట్టి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేసినందుకు హేళనగా చప్పట్లు కొట్టే అడ్వర్టైజ్మెంట్ వొకటి యీ మధ్య టీవీ లో వస్తుంది. యెంత శాడిజం! మరుగుదొడ్డి లేని యింట్లో పిల్లనివ్వవద్దని చెప్పే విద్యాబాలన్ మరుగుదొడ్లు కట్టివ్వని పాలకులకు వోటెయ్యొద్దని ప్రచారం చేస్తే బావుణ్ణనిపిస్తుంది. కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ దళారులు లక్షలు స్వాహా చేసి కట్టిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ యెంత గొప్పగా వుంటుందో చూస్తే మొత్తం వ్యవస్థ మీదే రోతపుడుతుంది. పెయిడ్ పబ్లిక్ టాయిలెట్ల బాగోతం మళ్ళీ వేరే.

అంతర్జాతీయ మార్కెట్లో మెకిన్ యిండియా నినాదంతో  వూదరకొడుతోన్న పాలకులకి కట్ట , సండాస్ , అసలవి లేనప్పుడు … వంటి కథలు గొంతులో పచ్చి వెలక్కాయల్లా మింగుడు పడక పోవచ్చు. కంట్లో నలుసుల్లా మెరమెరలాడవచ్చు. దేశమంతటా వీస్తోన్న యీ గవులు వారికి పెద్ద విషయం కాకపోనూవచ్చు. కానీ సామాన్యుడికివ్వాళ కావాల్సింది – డిజిటల్ ఇండియా కాదు  టాయిలెట్స్ ఇండియా అని యీ కథలు ముక్కు మీద గుద్ది మరీ చెబుతున్నాయి. దేశభక్తుల పన్నులతో నడిచే వొక విశ్వ విద్యాలయంలో పనిచేస్తూ దేశ గౌరవాన్ని మంటగలిపే యిటువంటి కథ రాసినందుకు వినోదినిని  దేశద్రోహనేరం కింద విచారణ లేకుండానే అసహనంతో శిక్షిస్తారేమోనని అనుమానంగా వుంది. సృజనాత్మకతనే ఆచరణగా మార్చుకొన్న వినోదిని నిబద్ధతకు (దీన్నేFawzia Afsal-Khan ‘artivism’  అంటారు) సంఘీభావం ప్రకటించాల్సిన సందర్భమే యిది.

తాజా కలం : స్మార్ట్ సిటీల విశ్వ నగరాల అంచుల్లో కొత్తగా వెలిసే వెలివాడల్లో సిగ్గులేకుండా దొడ్డికి కూర్చోడానికి యెక్కడెక్కడ సదవకాశాలున్నాయో స్మార్ట్ ఫోనుల్లో క్షణాల్లో తెలుసుకొనేందుకు వీలుగా ‘మహిళా బహిర్భూమి యాప్’ తయారీకోసం  స్టార్టప్ మేధావులకి ప్రభుత్వాలు లోన్స్ సాంక్షన్ చేస్తాయనీ , అందులో భాగంగా పల్లె పల్లెకీ వాడవాడకీ వై ఫై సదుపాయం కలగజేస్తారనీ   మన్ కీ బాత్ లో ప్రధాని వరమివ్వబోతున్నట్టు యిప్పుడే  వార్త అందింది. ఇక  కూర్చున్నప్పుడు ‘పిర్రలమీద దోమలు కుట్టి దద్దుర్లు కట్టడానికి’ ఆస్కారం యివ్వని ఎ సి వాష్ రూమ్ ల కోసం గూగుల్ మేప్ లో వెతుక్కొని  చూడ్డమే యిప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యమ్. అంత వరకూ కట్టల మీద సెవిటి కరుణమ్మవ్వల సహజ / అసహజ  మరణాలు తప్పవు. ఆధునికీకరణ లో రూపాంతరం చెంది రైలు కట్టలన్నీ  బుల్లెట్ ట్రైన్ ట్రాక్ లుగా మారిపోబోతున్నాయి కాబట్టి  అటువంటి బహిరంగ ప్రదేశాల్లో మల/మూత్ర విసర్జనలు చేసినందుకు లోకల్ బాడీ అధికారులు విధించే జరిమానాలు కట్టుకోడానికి సిద్ధంగా వుండక తప్పదు. ఇతి శమ్ … బే షరమ్.

*

 

 

 

జింబో బొంబాయి నగర ప్రవేశం

 

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

chitten rajuకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాశాక..ఆ మాట కొస్తే రాయడానికి కొన్ని నెలల ముందే “తరవాత ఏమిటీ?” అనే ప్రశ్న మా క్లాస్ మేట్స్ అందరినీ వేధించేది. కొంత మంది పై చదువుల కోసం ఆలోచిస్తూ ఉంటే మరి కొందరు ఉద్యోగాల వేట మొదలుపెట్టే వారు. ఆ రోజుల్లో పై చదువులు అంటే.ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ నాకు తెలిసీ మొత్తం ఆంధ్రాలో ఎక్కడా లేదు. హైదరాబాద్ ఉస్మానియాలో ఉందేమో కానీ అందరి దృష్టీ బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సి లేదా మద్రాసు, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. ల మీద మాత్రమే ఉండేది. చాలా తక్కువ సీట్లు ఉండే వాటిల్లో అడ్మిషన్ కావాలంటే డిగ్రీ పరీక్ష లో ఫస్ట్ క్లాస్ వస్తే చాలదు. అందరి కంటే ఎక్కువగా డిస్టిన్క్షన్ కూడా వస్తే ఇంటర్వ్యూ కి అర్హులు అయ్యే చాన్స్ ఉంది. ఆ తరువాత ఆ ఇంటర్వ్యూ లో నెగ్గాలి. ఇక ఉద్యోగాల విషయాల కొస్తే..ముఖ్యంగా మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగం కావాలంటే యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏవో అర డజను పంచదార ఫేక్టరీలు, వైజాగ్ లో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ….ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవలసిందే. సివిల్ ఇంజనీర్స్ కి నాగార్జున డామ్ లో జూనియర్ ఇంజనీరింగ్ లాంటివి ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి రావచ్చును. ఆ మాట కొస్తే సివిల్ ఇంజనీర్లకి తప్ప ఇతర బ్రాంచ్ వాళ్ళెవరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు లేనే లేవు….బహుశా ఇప్పుడు కూడా…అంచేత అటు ఉద్యోగానికి కానీ, పై చదువులకి కానీ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవలసినదే.

నా విషయంలో నేను అప్పటికీ పై చదువులు చదవాలి అని నిశ్చయించేసుకున్నాను కానీ మా కుటుంబం ఆర్ధిక పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఎలాగా ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా, ఎక్కడో అక్కడ స్కాలర్ షిప్ రాకపోతుందా అనుకున్న నాకు రిజల్ట్స్ పెద్ద అశనిపాతంలా తగిలాయి. నా పేరు సెకండ్ క్లాస్ లో ఉంది. నా జన్మలో అలాంటి అనుభవం అదే మొదటి సారి. అప్పటి దాకా చిన్నప్పటి నుంచీ నేను ఏ నాడు ఏ పరీక్ష రాసినా నూటికి 60 % తప్పకుండా వచ్చేవి. అలాంటిది ఇంజనీరింగ్ ఫైనల్స్ లో మార్కులు వచ్చాక చూస్తే నేను ఏ నాడూ ఊహించనట్లుగా రెండు సబ్జెక్ట్ లో 40 శాతం..అంటే పాస్ మార్కులు…వచ్చాయి. ఇండస్ట్రియల్ ఎడ్మినిష్త్రేషన్ & మెటలర్జీ… ఆ రెండూ కూడా నేను చాలా బాగా రాసిన పేపర్లే. కేవలం పాస్ మార్కులే వేశారూ అంటే ఎక్కడో, ఏదో తేడా ఉంది అనిపించి ఆ పేపర్లు ఎవరు దిద్దారూ అని కాలేజ్ కి వెళ్లి ఆరా తీశాను. అప్పుడు తెలిసింది ఆ పేపర్లు దిద్దిన ఇద్దరు లెక్చరర్లు దగ్గర స్నేహితులు. అందులో ఒకాయన మాకు బంధువే కానీ ఎందుకో మా కుటుంబం అంటే పడదుట. మాకు ఆయన పాఠాలు చెప్పేటప్పుడు నన్ను కొంచెం చులకన గానే చూసేవాడు కానీ నేను ‘నలుగురిలో నారాయణా’ బాపతే కాబట్టి అసలు పట్టించుకోలేదు. అంచేత అంతా బాగా రాసినా నాకు అత్తిసరుగా పాస్ మార్కులు వెయ్యడానికి ఇతర కారణాలు ఏమీ కనపడక ఆయన వ్యక్తిగతంగా ఈ పని చేశాడు అనే అనుకోవలసి వచ్చింది. కానీ చేసేది ఏమీ లేదు. రివాల్యుయేషన్ కి అప్లై చెయ్య వచ్చును అని ఎవరో సలహా ఇచ్చారు కానీ అదేం జరిగే పని కాదు అని తెలుసును. ‘ఎప్పటికైనా బ్రాహ్మడికి బ్రాహ్మడే శత్రువు’ అని కూడా ఎవరో అన్నారు. యాభై ఏళ్ల తరువాత అమెరికాలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది.

BE V Marks Sheet

ఆ రోజుల్లో ఈ ఫస్ట్ క్లాస్ ..అంటే 60% శాతం మొత్తం అన్ని మార్కులూ కలిపి రావాలి. నాకు ప్రాక్టికల్స్ లో 61.5%, సెషనల్స్..అంటే వైవా పరీక్షలలో 65 శాతం వచ్చాయి. కానీ పైన చెప్పినట్లు రెండు సబ్జెక్టులలో   జరిగిన అన్యాయం వలన థీరీ లో 57.12 శాతం వచ్చాయి. మూడూ కలిపి మొత్తం మీద చూస్తే మార్కుల ప్రకారం నా సగటు మార్కులు 60.37 శాతం. కానీ దురదృష్టవశాత్తూ అప్పటి రూల్స్ ప్రకారం థీరీ, ప్రాక్టికల్స్ మాత్రమే కలిపి చూశారు. ఆ సగటులో నాకు 58.22శాతం వచ్చి, కేవలం 1100 లలో 1.78 మార్కు తక్కువ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోలేక పోయాను. అలాంటి నాకు నలభై ఏళ్ల తరవాత 2006 లో మా కాలేజ్ వజ్రోత్సవాలలో నన్ను “Distinguished Alumni” అని చిరు సత్కారం చేసినప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది.

ఆ రోజుల్లో క్లాసులో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే దిష్టింక్షన్..అంటే 70 శాతం మార్కులు…తెచ్చుకున్న వాళ్ళకీ,  ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి కూడా ఐఐటిలు, ఐఆఎస్ సి ల లో పై చదువు, లేదా మద్రాసు, బెంగుళూరు లలో పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు బాగానే వచ్చేవి కానీ, నా లాంటి వారికి ఎదరంతా ఎడారే!. ముఖ్యంగా రాజకీయ పలుకుబడి కానీ, వ్యాపార వారసత్వాలు కానీ లేని అగ్రకుల సంజాతుడి పరిస్థితి అధోగతే అనిపించేది. ఎటు నుంచి ఎటు చూసినా రాష్ట్రం వదలి వెళ్లి పోవడం తప్ప గత్యంతరం లేనే లేదు. ఏ రాష్ట్రం లో అయినా ఉన్నత విద్యావకాశాలు కానీ, ఉద్యోగాలు ఉన్నాయి అంటే అవి కేవలం ఆయా రాష్ట్రాల నుంచి వెలువడే ఇంగ్లీషు దిన పత్రికలలో ప్రకటనలు మాత్రమే ఏకైక ఆరాధం. లేదా, పెట్టే, బేడా సద్దేసుకుని ఏ మహా నగరంలో మనకి బంధువులో, స్నేహితులో ఉంటే అక్కడికి వెళ్లి పోయి గుమ్మాలు తొక్కి వెతుక్కోవడమే! ఆ రోజుల్లో బొంబాయి నుంచి వెలువడే టైమ్స్ ఆఫ్ ఇండియా, మద్రాస్ నుంచి ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్….ముచ్చటగా మూడే మూడు ఇంగ్లీషు పేపర్లు కాకినాడలో కనపడేవి. వాటిల్లో ఆదివారం నాడు స్థానిక రాష్ట్రాల ప్రకటనలు ఎక్కువగానే ఉన్నా, దేశం మొత్తానికి సంబంధించిన ప్రకటనలు ఈ మూడింటి లోనూ ఉండేవి.

ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆ రోజుల్లో పై చదువులకి అమెరికా వెళ్ళవచ్చును అనే ఆలోచనే అస్సలు రాలేదు. ఆ మాటకొస్తే ఆ ఆలోచన మా కాలేజ్ లో చాలా తక్కువ మందికి ఉండేది. ఇంజనీరింగ్ డిగ్రీ చేతికొచ్సినా, జీవితంలో ఏం చెయ్యాలో తెలియక ఆయా పత్రికలలో నేను గమ్యం వెతుక్కుంటున్న ఓ శుభ సమయంలో బొంబాయిలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లో దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం దరఖాస్తులు కోరుతూ ఒక ప్రకటన చూశాను. నాకున్న డిగ్రీ కి నేను ఎటువంటి ఐఐటి అర్హుడిని కాదు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేను దాన్ని కాదని వెంటనే అప్లికేషన్ పంపించి ఆ సంగతి మర్చి పోయాను. కానీ అదే విషయంలో మరో సంగతి ఖచ్చితంగా గుర్తు ఉంది. అదేమిటంటే గోవిందరాజులు కూడా నాతో బాటే బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు.

మా క్లాస్ లో ఇద్దరు గోవింద రాజులు  ఉండే వారు. వారిలో ఆర్. గోవిందరాజులు ఎలెక్ట్రానిక్స్ చదివి ఆ తరువాత వరంగల్ కాలేజీ కి వెళ్లి అక్కడ పి.జి. చేశాడు. ఆ తరువాత అక్కడే ప్రిన్సిపాల్ గా కూడా పని చేశాడు అని విన్నాను కానీ 1966లో మా కాలేజ్ రోజుల తరవాత అతన్ని ఇప్పటి దాకా చూడ లేదు. ఇక రెండో వాడు ఎన్. గోవిందరాజులు కాకినాడ వాడే. జగన్నాధ పురంలో ఉండే వాడు. అతని నాన్న గారు మైన్ రోడ్ లో మసీదు పక్కన చుట్టలు చుట్టే వ్యాపారం చేసీవారు. ఇతనూ, ఇతని అన్నయ్యలూ మంచి బాడీ బిల్డర్స్. కండలు తిరిగిన శరీరంతో మా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న ఐదేళ్ల పాటూ అతనే మిస్టర్ కాలేజ్. మిత భాషి. అతనికి తెలిసిన తిట్టు అల్లా “సంపేత్తాను”. అలా అనడమే కానీ ఎప్పుడూ ఎవరిమీదా చెయ్యి చేసుకునే వాడు కాదు. ఒక సారి మటుకు మా కాలేజ్ వాళ్ళు ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ లో రంగరాయ మెడికల్ కాలేజ్ టీమ్ తో కోకో ఆట ఆడుతున్నప్పుడు ఇతను పరిగెడుతూ కేవలం గట్టిగా వీపు మీద “ముట్టు” కోగానే పాపం ఆ దెబ్బకి డాక్టర్ చదువుతున్న ఒకానొక అర్భకుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇతను కావాలనే కొట్టాడు అని వాళ్ళ టీమ్ నానా గొడవా చేసి ప్రిన్సిపాల్స్ దాకా తీసుకెళ్ళారు. అది ఇంకా పెద్ద గొడవ అవును కానీ గోవిందరాజులు హాస్టల్ లో ఉండే పై ఊరి వాడు కాక స్థానికంగా కాకినాడ వాడే కాబట్టి సరిపోయింది. ఏమైతేనేం, నాకు మటుకు అతను చాలా మంచి స్నేహితుడు. నాతోబాటే అతను కూడా బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు. నాకంటే మంచి మార్కులు వచ్చాయి కాబట్టి బెంగుళూరు ఐఐఎస్ సి కి కూడా అప్లై చేశాడు.

ఓ రోజు అనుకోకుండా ఆ ఐఐటి నుంచి మా ఇద్దరికీ ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది. గోవిందరాజులు కి అది రావడంలో ఆశ్చర్యం లేదు కానీ నాకు కూడా ఒక ఐఐటి …అందునా ఎక్కడో అవతలి తీరాన్న ఉన్న బొంబాయి ఐఐటి నుంచి మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నేను ఎగిరి గంతేశాను కానీ మా నాన్న గారు “అంత దూరం పై చదువులకి పంపించడానికి డబ్బు లేదు.” అని చెప్పేశారు. అప్పుడు నాకు కావలసిన మొత్తం డబ్బు కాకినాడ నుంచి  బొంబాయి రానూ, పోనూ రైలు టిక్కెట్టు 60 రూపాయలు, నాలుగు రోజులు తిండికీ, ఇతర ఖర్చులు 50 రూపాయలు, ఒక వేళ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వంద రూపాయలు ఫీజు వెరసి సుమారు 200 రూపాయలు. మా పెద్దన్నయ్య ని అడగగానే ఎప్పటి లాగానే పొలం పనులు ఉన్నాయి అంటూ పొలం పారిపోయాడు. అప్పుడే లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టినా ఇంకా ఆదాయం లేని మా చిన్నన్నయ్య “ఇది చాలా మంచి చాన్స్ రా. వదులుకోకు.” అని ఓ వంద రూపాయలు ఇచ్చాడు. నా పై అన్నయ్య సుబ్రహ్మణ్యం మణిపాల్ లో మెడిసిన్, మా తమ్ముడు కాకినాడ లోనే ఇంజనీరింగ్ మూడో ఏడు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం లేదు. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ కలిసి ఇద్దరికీ కావలసిన మొత్తం మూడు, నాలుగు వందలు పోగేసి బొంబాయి వెళ్ళడానికి రైలు ఎక్కేశాం. రాత్రి కాకినాడలో ఎక్కి, మర్నాడు పొద్దున్న హైదరాబాద్ లో దిగి, అక్కడ మా అక్కా, బావ గార్లని పలకరించి, రాత్రి బొంబాయి రైలు ఎక్కి మర్నాడు మధ్యాహ్నం ఒంటి గంట కి బొంబాయి దాదర్ స్టేషన్ లో దిగాం నేనూ, గోవిందరాజులూనూ.

అంతకు ముందుటేడు మేము ఇంజనీరింగ్ ఫైనల్ సంవత్సరం లో ఎడ్యుకేషనల్ టూర్ లో మా బేచ్ అంతా బొంబాయి వచ్చి, చాలా ఫేక్టరీలు చూసినా, మాకు అక్కడ ఎవరూ తెలియదు. దాదర్ స్టేషన్ లో దిగి “ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా?” అని అడగగానే “పక్కనే మాటుంగా లో మద్రాసీ హోటల్స్ ఉంటాయి” అని ఓ టాక్సీ వాడు మా ఇద్దరినీ మాటుంగా తీసుకెళ్ళి ఓ అయ్యర్ హోటల్ దగ్గర దింపాడు. 48 గంటల రైలు ప్రయాణంలో ఒళ్లంతా బొగ్గు నుసితో నీరసంగా ఉన్న మమ్మల్ని చూసి రూములు ఖాళీ లేవు కానీ స్నానం చేసి బట్టలు మార్చుకోడానికీ, కావాలంటే రాత్రి వరండాలో పడుకోడానికి మడత మంచాలు ఇస్తాను అన్నాడు ఆ అయ్యర్ గారు. ఆ చుట్టుపక్కల అంతా అచ్చు మద్రాసు అడయార్ వాతావరణమే. అందరూ లుంగీలతోటే, నిలువు బొట్లూ, అడ్డ వీభూతులతోటే ఉన్నారు.

ఇక భాష ఎలాగా తమిళమే….బొంబాయి నడిబోడ్డులో తమిళుల ఒయాసిస్ ఆ మాటుంగా అనే ప్రాంతం. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ స్నానాలు చేసి రెడీ అయి, ఆ మర్నాడు ఇంటర్వ్యూ లు కాబట్టి ముందే అక్కడికి వెళ్లి చూసి వద్దాం అని మా అయ్యర్ గారిని పవయ్ అనే ప్రాంతం లో ఉండే ఐఐటికి ఎలా వెళ్ళాలో కనుక్కుని, లోకల్ రైలు ఎక్కి, విక్రోలి స్టేషన్ లో దిగి అక్కడ బస్సు ఎక్కి సాయంత్రం ఐదు గంటలకి ఐఐటి మైన్ గేట్ దగ్గర దిగాం. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ వాళ్ళని చూసి కొంచెం భయం వేసింది కానీ వాళ్ళు కార్లలో వెళ్ళేవాళ్ళనే ఆపి వివరాలు అడిగి అప్పుడు పెద్ద గేటు తియ్యడం చూసి ధైర్యంగా నడిచి చిన్న గేటు లోంచి లోపలకి వెళ్ళిపోయాం. సిమెంట్ రోడ్డుకి అటూ, ఇటూ పోక చెట్లతో ఎంతో హాయిగా ఉన్న రోడ్డు మీద భయం భయంగా నడుస్తూ ఒకాయన కనపడగానే మా వివరాలు చెప్పి మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ ఎక్కడో చెప్పగలరా అని అడిగాం. ఆయన చెప్పినట్టు ముందు పచ్చటి తివాసీ లా పరుచుకున్న అందమైన లాన్ లో ఓ పెద్ద బిల్డింగ్ కనపడగానే ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాం. అదే నాలుగంతస్తుల మైన్ బిల్డింగ్.  లోపల ఆహ్వానం పలుకుతూ ఈ ఐఐటి అనే అత్యున్నత స్థాయి సాంకేతిక విద్యాలయాల ఆలోచనకి మూల పురుషుడూ, ఆ భవనానికి శంఖుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో, స్వాగత వచనాలు మాలో మరింత హుషారు పెంచాయి. 1958 లో నెహ్రూ గారు శంఖుస్థాపన కోసం వచ్చిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అందులో ఆయనతో కరచాలనం చేస్తున్న ఆయన బ్రిగేడియర్ బోస్ గారు, పక్కన ఉన్నాయన ఎ.కె. కేల్కర్ గారు.

Nehru-Bose Handshake నేను ఐఐటి లో ఉన్న మొదటి మూడేళ్ళు బోస్ గారు’, ఆ తరువాత మూడేళ్ళు కేల్కర్ గారు డైరెక్టర్లుగా పని చేశారు. బొంబాయిలో నిరంతరం కురిసే వర్షాలలో తడవ కుండా అన్ని డిపార్ట్ మెంట్ ల భవనాలనీ కలుపుకుంటూ ఒక పొడుగాటి కారిడార్ ఐఐటి భవన సముదాయాల ప్రత్యేకత. వాటిల్లో ఒకటయిన మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కి మేము వెళ్లినా అప్పటికే చీకటి పడింది కాబట్టి అక్కడ కూడా కాపలా ఉన్న సెక్యూరిటీ వాడు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వ లేదు. మొత్తానికి ఆ మర్నాడు ఇబ్బంది లేకుండా ముందు రోజే అన్నీ చూసుకుని, నేనూ, గోవిందరాజులూ వచ్చిన దారినే వెనక్కి మాటుంగా వెళ్లి ఆ రాత్రి మడత మంచాల మీద వరండాలో పడుకున్నాం. మా ఇద్దరి పెట్టెలూ ఆ మంచాలకే గొలుసులతో తాళం వేసుకోమని ఆ అయ్యర్ గారు ఇచ్చిన సలహా పాటించాం.

ఆ మర్నాడు నా జీవితాన్నే మార్చేసిన ఇంటర్వ్యూ  తతంగం గురించి….వచ్చే సారి ….నమ్మండి, నమ్మకపొండి, ఆ రోజు తరువాత నేను ఇప్పటి దాకా..అంటే గత యాభై ఏళ్లలో గోవిందరాజులుని మళ్ళీ చూడ లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడని విన్నాను.

ముసుగు

 

 

-భువన చంద్ర

~

bhuvanachandra (5)‘సుమీ ‘ అంటే చలనచిత్ర పరిశ్రమలో ఎవరికీ తెలియదు. ‘సుమీ ‘ అసలు పేరు ‘సుమిత్ర ‘.

‘నల్లమణి’ అంటే ‘ ఆవిడా ‘ అని అందరూ అంటారు. తెలుగులో ‘నల్ల ‘ అంటే నలుపు. తమిళంలో ‘ నల్ల ‘ అంటే ‘మంచి’ అని అర్ధం. సుమీని ‘నల్ల మణి ‘ అనడం కేవలం ఆమె మంచితనాన్ని గుర్తించడానికే. అలాగని సుమీ అరవ పిల్ల కాదు. పదహారణాల తెలుగు పిల్ల.  పిల్ల అనడం తప్పే. ఆవిడ వయసు ఎట్టా చూసినా ముప్పై అయిదుకి తగ్గదు … ముప్పై ఆరుకి మించదు.

ఆమె ఉత్సాహం చూస్తే మాత్రం పదహారేళ్ళ పడుచుపిల్లలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే.

‘తలలో నాలుక ‘ అంటారే  అలా వుంటుంది అందరికీ. కార్తవరాయన్ పెళ్ళానికి పురుడొచ్చినప్పుడు వాడు వూర్లో లేకపోతే తనే హాస్పటల్ లో జేర్పించి, డిశ్చార్జ్ అయ్యే వరకు తోడుండి మరీ ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టింది.

“గాజులేమయ్యాయి?” అనడిగిన  ‘తాలాట్టు  సరళ ‘ కి “హాస్పటల్ బిల్లు కింద మారినై ” అని సమాధానం చెప్పిందిట.

“ఆ తాగుబోతు చచ్చినాడు నీకు గాజులు కొనిచ్చినట్టే! ” అని తాలాట్టు సరళ దెప్పిపొడిస్తే “వాడో సిగ్గోసిరి .. వాడివ్వడని నిండుచూలాల్ని రోడ్డు మీద వదుల్తామా? ” అని నవ్విందిట.

కోడంబాకం మొత్తంలో ఏనాడూ తలుపు మూయని ఇల్లు ఏదైనా వుంటే అది సుమీదే. అదేమీ ఆవిడ సొంతిల్లు కాదు. నెలకి ఏడొందలకి తీసుకున్న మేడ మీద పాకలో ఓ గది. ఆ పాకలో మొత్తం ఐదు పోర్షన్లు . అవన్నీ కొబ్బరాకుల తడికల్తో  సెపరేటు చేసినవే కానీ, గోడలతో కాదు. స్నానానికీ, టాయిలెట్టుకీ కింద వుండే రెండు బాత్ రూమ్ లు , టాయిలెట్లే గతి. అవి కామన్వి కనుక ఎవరూ కడగరు. రోజుకి రెండుసార్లైనా వాటి అతీగతీ  చూసేది సుమీనే.

“నీకెందుకే? ” అని పక్క పోర్షన్ లో వుండే కాటరింగ్ సావిత్రి అడిగితే ” ఆ.. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అందరం చస్తాము. సౌతాఫ్రికాలో గాంధి గారు అనుసరించిన మార్గాన్నే నేనూ అనుసరిస్తున్నాను. ” అన్నదట. అదీ ‘సుమీ ‘ అనబడే సుమిత్ర వ్యక్తిత్వం.

ఈ ‘ట ‘ లు ఎందుకంటే సుమిత్ర మొదట్లో నాకూ తెలియదు. ఆరుద్ర గారి ఇంటి ఎదుట వున్న ‘భగవతీ ‘ విలాస్  దగ్గర కనబడేది. అక్కడ ‘ప్రొడక్షన్ ‘ డిపార్టుమెంటు’ వాళ్ళుండే వాళ్ళు. పొద్దున్నే సినిమా కంపెనీలకి టిఫిన్లు ‘భగవతి ‘ విలాస్ నుంచే ఎక్కువగా సప్లై అయ్యేవి. గిన్నెలు అవీ కడగడానికి ‘కార్డు’ వున్న ఆడవాళ్లని ప్రొడక్షన్ వేన్ లలో ఎక్కించుకొని పోతూ వుండేవాళ్ళు. మొదట్లో సుమిత్ర కూడా అదే బాపతు అనుకున్నాను. కానీ కాదు.

ఆవిడ ఓ హీరోయిన్ కి “టచప్  విమెన్ “. సదరు హీరోయిన్ గారు సుమిత్ర ని పాండీబజార్ కారు ఎక్కించుకునేది. ఆ కారు వచ్చే వరకు సుమిత్ర ప్రొడక్షన్ వాళ్ళతో కబుర్లాడుతూ మంచీచెడ్డ తెలుసుకుంటూ వుండేదిట. అక్కడా సాయం చేయడమే లక్ష్యం.

మామూలుగా అయితే పరిచయం అయ్యే అవకాశం లేదు. ఎవరు ఎవరికి ఎప్పుడు తారస పడతారో అప్పుడే వారు తారసపడతారని మా అమ్మగారనేది. “ఇంతమంది అన్నల్ని, అక్కల్ని వదిలి నువ్వు ఇంత దూరంగా ఢిల్లీలో   ఎందుకున్నావో తెలుసా? ఏ జన్మలోనో అక్కడి నేలా, నీరు, గాలీ నీకు ఋణమున్నాయి. ఎప్పుడో నువ్వక్కడ పుట్టి వుండకపోతే అక్కడకి ఎన్నడూ పోలేవు. ” అన్నది ఢిల్లీ నుండి వచ్చిన రోజున. ఎడార్లో వున్నప్పుడు అదే మాట అనేది.

సుమిత్ర నాకు తారస పడటం ” —–  గెస్టు హౌస్ ‘ లో నేను పాట రాయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, నన్నా గెస్టుహౌజ్  లో పెట్టారు. రూంస్ చాలా కాస్ట్లీ. కానీ బ్రహ్మాండంగా  వుండేది. భోజనం రుచిగానూ, శుచిగానూ వుండేది.  హీరోయిన్ కూడా అక్కడే దిగేది. విశాలమైన గదులు, చక్కని గార్డెన్.

రెండో రోజు మెట్లెక్కుతూ జారిపడ్డాను. కాలికి మెట్టు కొట్టుకొని విపరీతమైన బాధ. ఆ శబ్ధానికి ఎదుటి గదిలో నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. చెయ్యి ఆసరా ఇచ్చి పై అంతస్తులో వున్న నా గది దాకా నడిపించింది. భుజం కూడా ఆసరా అయ్యింది.

గంటలో మా వాళ్ళు వచ్చి  ఏక్స్ రే అవీ తీయించారు. ఏదీ విరగలేదు కానీ మజిల్ రప్చర్ అయ్యిందన్నారు. మళ్ళీ నా గదిలో ‘బెడ్ రెస్ట్ ‘ అంటూ దిగబెట్టారు. న్యాయంగా నాకు సేవ చేయాల్సిన అవసరమో , నన్ను చూసుకోవాల్సిన బాధ్యతో ఆమెకి లేదు.

కానీ తనంతట తానే వచ్చి కాలుకి కాస్త కాపడం పెట్టడం , డాక్టర్ ఇచ్చిన లిక్విడ్స్ పూయడం , నేను వీలుగా పడుకుంటే టిఫిన్ ప్లేట్లో, భోజనం ప్లేట్లో చేతికివ్వడం, మంచి నీళ్ళు తాగాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేట్లు తను పట్టుకొని నాకు మంచినీళ్ళు తాగే వీలు కల్పించడం లాంటి సేవలు చేసేది.  నేను మొహమాట పడితే ” ఇందులో ఏముందండీ? అయినా మీ పాటలంటే నాకు ఇష్టం… పోనీ ఏ పాటలోనైనా నా పేరు ఇరికించండి. ” అనేది నవ్వుతూ.

ఆ ‘హీరోయిన్ ‘ కూడా వచ్చి పలకరించేది. వస్తూ పళ్ళు అవీ తీసుకొచ్చేది. “ఎందుకివన్నీ ” అని నేను మొహమాట పడితే “, “నాకో సూపర్ హిట్ సాంగ్ ఇస్తారని కాకాపడుతున్నా ” అనేది.

వారంలోగా రెండు పాటలు పూర్తి చేశాను. కాలూ బాగుపడింది. సాయంత్రాలు ముగ్గురం కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. పాటలు రాశాను కనక వెళ్ళిపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ మరో నాలుగు రోజులు వుండమన్నారు. కారణం ఇంకో రెండు ట్యూన్లు రెడీ అవుతున్నాయిట.

“మీదేవూరండీ?” అడిగింది సుమిత్ర ఓ ఉదయమే. “ఫలానా ” వూరని చెప్పాను. పకపకా నవ్వి “చూశారా! నేను అనుకున్నదే నిజమయ్యింది. నిన్న మీరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సరదాగా “చేద్దాం.. చూద్దాం ” అంటూ యాసలో మాట్లాడారు. ఆ యాస మా పక్కదే.”

“అంటే?” నవ్వాను

“మీ వూరి దగ్గరే మా వూరూనూ! అయినా పొట్ట చేత పట్టుకున్నవాళ్ళకి ఏ వూరైతేనేం. కానీ, ఏదో పాశం పుట్టిన గడ్డకి లాగుతూనే వుంటుంది. ” మామూలుగా అన్నా ఓ చిన్న బాధ ధ్వనించింది.

“సుమిత్ర గారు! నేను చాలా కాలం నుండి  మిమ్మల్ని చూస్తున్నాను… భగవతీ హోటల్ దగ్గర. మా వూరి దగ్గరే మీ వూరు అన్నారు కనక అసలు మద్రాస్ ఎలా వచ్చారో  చెప్తారా? కేవలం కుతూహలంతో అడుగుతున్నా! ” అన్నాను.

“అందరూ నన్ను ‘మణి ‘ అనో, ‘నల్లమణి ” అనో, పిలుస్తారు. తెలిసిన వాళ్ళు సుమీ అనో, సుమిత్ర అనో లేకపోతే ఒసేయ్ సుమిత్ర అనో పిలుస్తారు. మీరు మాత్రం ‘గారూ ‘ అన్న గౌరవవాచకం తగిలించి నా నెత్తిన కిరీటం పెట్టారు. మొదట మనిషిగా చూసినందుకు థాంక్స్. ఇక నా కథ అంటారా… కోడంబాకంలో వున్న నాలాంటి వాళ్లందరిదీ ఒకటే కథ. మరీ ప్రత్యేకమైనది ఎమీ లేదులెండి. ” తేలిగ్గా నవ్వేసింది.

“చూడటానికి, వినడానికి అన్నీ ఒకేలా వున్నా , ఎవరి కథ వారిదేనండీ. ఎవరి కథ ఎవరిని ఎలా మార్చగలదో ఎవరికి తెలుసు? నేనూ ఒకరి జీవితాన్నించి స్ఫూర్తి పొంది మద్రాసుకి వచ్చాను. కుతూహలంతోనే అడిగాను సుమిత్ర గారు. ఇందులో బలవంతం ఏమీ లేదు ” అనూనయంగా అన్నాను.

“చెప్పకూడదని ఏమీ లేదండి. చెప్పినా నష్టం లేదు. నిజం చెబితే చెప్పాలనే వుంది. అన్నట్లు మీరు “చినరాయుడు’ లో “చెప్పాలనుంది సుందరి … కథ విప్పి చెబుతాను సుందరీ ” అని పాట కూడా రాశారుగా. నేనూ చెబుతా. .. అయితే నాకు  కొంచం టైం ఇవ్వాలి. ” చిన్నగా నవ్వి అన్నది.

“ఓ పదేళ్ళు తీసుకోండి ” నవ్వి దిండు మీదకు వాలాను.

“హి.. హి.. మరీ అంత తక్కువ టైమా? సరే! చిన్నప్పటి నుంచీ ‘ప్రేమ ‘ అంటే నాకు అసహ్యం. నా ఫ్రెండ్స్  లో ‘ప్రేమ ‘ పేరుతో చాలా మంది కన్యత్వాన్ని సమర్పించుకున్నారు. కొంతమందైతే రహస్యంగా డాక్టర్లని కూడా బ్రతిమాలుకొని ‘బుద్ధి ‘ తెచ్చుకున్నారు ” ఆగింది. నేను పడుకున్నవాడిని కాస్తా మళ్ళీ వీలుగా కూర్చున్నాను. మరింత అటెంటివ్ గా.

“నాకు తెలియని విషయం ఏమిటంటే ‘ప్రేమ’ ని కంట్రోల్ చేసుకోవడం తేలికేగానీ ‘పెళ్ళి’ ని కంట్రోల్ చేయడం కష్టం అని. మగాళ్ళలో ఓ మాదిరి తెలివిగలవాళ్ళు ‘మూర్ఖులు ‘ , ‘ప్రేమ ‘ పేరుతో ఆడదాన్ని ప్రలోభ పెట్టే పద్ధతి ఎన్నుకుంటే, మహా  తెలివైనవాళ్ళూ , ప్రేమకు ‘సొడ్డు ‘ కొట్టడం తెలిసినవాళ్ళు ‘పెళ్ళి ‘ పేరుతో వలవేస్తారు. నా విషయంలో జరిగింది వేరు. ” ఓ క్షణం ఆగి కళ్ళు మూసుకుంది. బహుశా గతపు నీడల్లోకి పయనించి వుండొచ్చు.

“అతని పేరు సుధాకర్. నేను డిగ్రీ రెండో సంవత్సరం , అతను అప్పటికే బ్యాంక్ ఉద్యోగి . నేను కాలేజీకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఎదురుపడ్డాడు కానీ , ఎప్పుడూ వెకిలిగా బిహేవ్ చేయ్యలా! అలాగే నేను చామనఛాయ కంటే కొంచం తక్కువ. అతనేమో ‘ఫారన్ ‘ కలర్. అంటే గోల్డన్ బ్రౌనన్న మాట. ఓ రోజు సడన్ గా “సుమిత్ర గారు… మిమల్ని చాలా రోజుల నుంచీ గమనిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు నేనంటే మంచి అభిప్రాయం వుంటే ‘పెళ్ళి ‘ చేసుకుందాం.. మీరెప్పుడు ఓ.కే అంటే ఆ క్షణాన్నే మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో మాట్లాడుతా. పెళ్ళైంది కదా అని మీరు చదువు మానక్కర్లేదు. డిగ్రీనే కాదు.. పోస్ట్ గ్రాడ్యేషన్ కూడా నేనే చేయిస్తా… నో కట్నం. ఆలోచించుకొని చెప్పండి. ” అని వెళ్ళిపోయాడు. నాకు షాకు. అసలు నా పేరు అతనికి ఎవరు చెప్పారో కూడా నాకు తెలియదు. ” మళ్ళీ ఆగింది సుమిత్ర. కొన్ని క్షణాలు మౌనం పాటించాము.

“తరవాత” కుతూహలంగా అడిగాను.

“అతను డైరెక్ట్ గా అడిగిన విధానం నచ్చి నేను ఓ.కే. చెప్పాను. అతనూ మాట తప్పకుండా మా ఇంటికి వచ్చాడు. అయితే అతను వచ్చిన రోజు ఇంట్లో నేను వదినా తప్ప పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కారణం మా నాయినమ్మ చనిపోవడం. అతను చెప్పదలచుకున్నది మా వదినతోటే సూటిగా స్పష్టంగా చెప్పాడు. ” మళ్ళీ ఓ బ్రేక్.

“మీ కులం ఏమిటి? ” ఒకే ఒక ప్రశ్న అడిగింది మా వదిన. మా ఒదిన అంటే చాలా పెద్దదని అనుకునేరు. ఆవిడ నాకంటే కేవలం ఐదేళ్ళే పెద్దది. ” సుమిత్ర పెదవుల మీద చిరునవ్వు.

“ఊ.. ” అన్నాను.

“అవసరమా? సరే.. నా కులం ఏమిటో నాకే తెలియదు. ‘ఫలానా ‘ కులం వాళ్ళు నన్ను పెంచుకున్నారు గనక నా కులం ‘ఫలానా ‘ దే అనుకోవచ్చు” అన్నాడతను.

“అయితే.. ఈ జన్మకి మావాళ్ళు ఒప్పుకోరు. మీ కులానికి మా కులానికి పురాణ వైరం వుంది. మా వాళ్ళు

ప్రాణాలన్నా  వదులుకుంటారు కానీ కులాన్ని వదులుకోరు ” స్పష్టంగా చెప్పింది మా వదిన. ఆవిడ అన్న మాట తప్పు కాదు. మా వాళ్లకి ‘కులం ‘ అంటే చెప్పలేనంత అభిమానం ” నిట్టూర్చింది సుమిత్ర.

“అదీ నిజమేలెండి. ఇవాళ మనిషిని సంస్కారాన్ని బట్టి ఎవరూ గుర్తించడం లేదు. గుర్తించేది కేవలం కులంతోటే ” నవ్వాను నేను.

“అంతేగా! ఆ తరవాత మా వదిన ఒక సలహా ఇచ్చింది! ” నవ్వింది

“ఏమని? ”

“లేచిపొమ్మని!” నవ్వింది

“లేచిపోతే మా ప్రేమని దక్కించుకున్నట్టు అనడమే కాక, ఎప్పుడో ఒకప్పుడు మావాళ్ళు ఒప్పుకోవచ్చు . ఒప్పుకుంటే వేరీ గుడ్, ఒప్పుకోకపోతే ప్రేమైనా దక్కుతుంది గదా.. అదీ ఆవిడ రీజనింగు ” మళ్ళీ నవ్వింది సుమిత్ర.

“నవ్వుతారెందుకూ? మంచి సలహానేగా? “అన్నాను.

“మంచి సలహానే. రెండు నెలల క్రితం వాళ్ళ చెల్లెలు ఇదే సమస్య తో మా వదినని సలహా అడిగితే “పెద్దవాళ్ళని క్షోభపెట్టి మీరేమి బావుకుంటారు, నోరు మూసుకొని అమ్మానాన్న కుదిర్చిన సంబంధం చేసుకో. ప్రేమా గీమా అంటూ పిచ్చివాగుడు వాగకు ” అని నానా తిట్లు తిట్టింది ” ఈ సారి పగలబడి నవ్వింది  సుమిత్ర.

“ఇంత నవ్వెందుకంటారా? నేను ప్రేమ పేరుతో లవ్ మారేజ్ చేసుకుంటే నా పెళ్ళి ఖర్చు తప్పుతుంది. ఆస్తిలో కూడా చిల్లిగవ్వ ఇవ్వక్కర్లేదు. మొత్తం మా అన్నవదినలకే దక్కుతుంది. ఇంత దూ(దు) రాలోచన వుంది…. ఆ సలహా వెనుక.

“మరేం చేశారు? ” కుతూహలంగా అడిగాను

“సుధాకర్ కి సారీ చెప్పాను. కానీ..” నిట్టూర్చింది…

“ఊ…”

“నెలరోజుల పాటు ఆలోచించి ఆలోచించి అతని దగ్గరకే వెళ్ళి “మీకు ఓ.కే అయితే నాకూ ఓ.కే ” అని చెప్పాను.

దానికతను నవ్వి ” సారీ సుమిత్ర గారు! మీరెప్పుడైతే నో అన్నారో అప్పుడే నేను మావాళ్ళు చెప్పిన సంబంధం ఓ.కే అని చెప్పాను, ప్రేమ గొప్పదా?.. కాలం గొప్పదా? అనడిగితే నా దృష్టిలో కాలమే గొప్పది . ప్రేమించినవాళ్ళు ప్రేమించిన వారి కోసం కొన్నాళ్ళు ఆగొచ్చు. కానీ కాలం క్షణం సేపు కూడా ఆగదు అన్నాడు ” ఈ సారీ సుధీర్ఘంగా  నిట్టూర్చింది సుమిత్ర.

“తరవాత?”

“మా వదిన చెడ్డది కాదు, అలాగనీ మంచిదీ అనలేను. సుధాకర్ విషయం మా వాళ్ళతో చెప్పింది. అప్పటినుంచి నా బ్రతుకు ఘోరమైంది.

“ఎందుకు చెప్పావు? ఆల్రెడీ అతనికి పెళ్ళి కుదిరింది కదా ‘ అని అడిగితే ” ఏమో మీవాళ్ళూ సరే అంటే నీ ప్రేమ సఫలం అవుతుందని ఊహించాను.   అందుకే మీ అన్నయ్యకి చెబితే, మీ అన్నయ్య మీ అమ్మానాన్నకు చెప్పారు. ఇలా అవుతుందనీ నాకేం తెలుసు ” అని దీర్ఘం తీసింది.

నేను ఎవరితో లేచిపోతానో అనే భయంతో నా కాలేజి చదువు మానిపించారు. అంతే కాదు రోజంతా ‘నడవడిక ‘ గురించీ పరువూ- ప్రతిష్టల గురించీ క్లాసులు! ” మొహంలో నైరాశ్యంతో కూడిన నవ్వు కానీ నవ్వు.

“ఊ…” అన్నాను. ఓ ఎమోషన్ లో వున్నవారిని మాటల్తో విసిగించేకంటే ‘ఊ..ఊ… ‘ల భాష ఉపయోగించడమే మంచిది.

“సార్… పెద్దవాళ్ళు ఒకరకంగా మూర్ఖులు.. పిల్లలకేదో ‘బుద్ధి ‘ చెబుతున్నామనకుంటూ ‘పిచ్చి ‘ పుట్టిస్తారు. చెప్పిందే వందసార్లు చెప్పి విసిగిస్తే ఏమౌతుందీ? మెదడూ, మనసూ కూడా మొద్దుబారతాయి. నాకు జరిగిందీ అదే! ‘తిక్క ‘ పుట్టుకొచ్చింది. చదువు మాన్పించడంతో ‘కచ్చ ‘ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో పరిచయమయ్యాడు బదిరీ… అంటే బదిరీనారాయణ ” మళ్ళీ మౌనంలోకి జారిపోయింది.

రాలిపోయిన క్షణాల్ని ఏరుకోవాలంటే మౌనం ఒక్కటే ఆయుధం “అతను అందగాడు కాదు. అనాకారి. కానీ గొప్ప మనిషి. ఒకసారి  మా అమ్మతో పాటు గుడికెళ్తే అక్కడ పరిచయమయ్యాడు. మా అమ్మని “మీరు ఫలానా కదూ ” అనడిగి పరిచయం చేసుకున్నాడు. అతనిదీ అమ్మ వాళ్ళ వూరే. నాకంటే పదిహేనేళ్ళు పెద్దవాడు. ఓ రోజు నా బాధలు అడిగి తెలుసుకున్నాడు. మావాళ్ళు అతన్ని మాయింటికి రానివ్వడానికి కారణం అతను మా కులం వాడే. మెల్లగా మా వదిన రాజకీయం నడిపింది , నాకు అతన్ని ‘పెళ్ళికొడుకుగ్గా ‘ మాట్లాడేట్లు మా వాళ్ళని వొప్పింది.

ఇదో కొత్త ట్విస్ట్ .. అయితే అసహజమైనది కాదూ. ఘనత వహించిన భారతీయ సగటు తల్లిదండ్రులకి ‘పిల్లలకంటే, వాళ్ళ భవిష్యత్తు కంటే, ‘పరువు-ప్రతీష్టలే ‘ ముఖ్యం అని పురాణకాలం నుంచీ స్పష్టమైన ఆధారాలు మనకున్నాయి.

‘చచ్చినా సరే.. పెళ్ళి చేసుకొని చావు ‘ అనేది ఇంగ్లీషు రాజ్యంలా , అన్ రిటెన్ కాన్స్టిట్యూషన్.

“నా వాళ్ళ దగ్గర వుండే కంటే నరకంలో వున్నా గొప్పగానే వుంటుందని నేను పెళ్ళికి ఒప్పుకున్నా.

“సుమిత్రా.. కాలం మనకోసం ఆగదు. ఆగని దాన్ని మనమెందుకు గుర్తించాలి? ప్రేమ ఆగుతుంది… ఎన్నాళ్ళయినా.. ఎన్నేళ్ళయినా .. అందుకే నువ్వు నీ మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవరకూ నేను ముట్టుకోను. రేపే కాలేజీలో చేరు… ట్యూషన్ తీసుకో. డిగ్రీ తెచ్చుకొని తీరాలి! ” అన్నాడాయన శోభనం రోజు ! ”

సుమీ దీర్ఘంగా నిట్టూర్చింది. ప్రతి నిట్టూర్పు వెనకాల కొన్ని వేల ఆలోచనలు సమాధుల్ని చీల్చుకొని బయటకొస్తున్నాయని నాకు అర్ధమయింది.

“టైమ్‌కి విలువిచ్చి సుధాకర్ వేరేదాన్ని పెళ్ళిచేసుకుంటే, ప్రేమకి విలువిచ్చి బదరీ నాకు స్వేచ్చనీ, చదువునీ ప్రసాదించాడు. అందం ‘వయసు ‘ తోనూ ‘తనువు ‘ తోనూ వుండదనీ , అందుండేదీ ‘ మనసు ‘ లోనేననీ నాకు అర్ధమవడానికి సంవత్సరం పట్టింది.

పట్టుపట్టి పరీక్షలు పాస్ అయ్యాను. డిగ్రీ చేతికొచ్చిన రెండో సంవత్సరానికల్లా  ఓ బిడ్డకి తల్లినయ్యాను ” ఓ చిన్న నిట్టూర్పు..

“ప్రతి కష్టం ఓ సుఖానికి పునాదే అని ఎవరూ చెప్పరు. కానీ అది నిజం. ఉద్యోగం చేస్తున్న బదిరి, సడన్ గా పోవడంతో భయంకరమైన శూన్యం నన్ను ఆవహించింది.అదృష్టం ఏమిటంటే, అతను చేస్తున్న ఉద్యోగమే ఆ కంపెనీ వారు నాకు యిచ్చి నన్ను ఆదుకున్నారు ” మళ్ళీ మౌనం.

“అయ్యా జరిగింది జరిగినట్టుగా, వరుస క్రమంలో చెప్పాలంటే , ఓ నవల తయారవుతుంది. ఒకటి మాత్రం నిజం ఆడకానీ మగ కానీ ఒంటరిగా వుండటం చాలా కష్టం. యవ్వనం ఎటువంటిదంటే ఎంతకైనా తెగింపచేస్తుంది. బదరీ వాళ్ళ అమ్మ వచ్చి ఓ రోజున నాతో దెబ్బలాట పెట్టుకుంది… మాకు పుట్టిన పిల్లాడిని తనకు ఒప్పజెప్పాలని. మొదటి నుంచీ నా విషయంలో ఆమె దురుసుగానే వుంది. కారణం నేను అంతకు ముందే ‘ప్రేమ ‘ లో పడ్డానని ఆమెకు ఎవరో ‘ఉప్పు ‘ అందించడమే. ఓ పక్కన భర్త పోయిన బాధ, రెండో పక్క అత్తగారితో దెబ్బలాటలు నా మనశ్శాంతిని  వంచించాయి. అప్పటికే ‘ఓదార్పు ‘ పేరుతో నాతో కొంచం సన్నిహితంగా వచ్చిన  ‘వినోద్ ‘ నాకు ధైర్యం చెప్పాడు. వినోద్ నిరుద్యోగి.. కానీ గొప్ప నటుడు. అతని డ్రామాలు నాలుగైదు అంతకు ముందే మా వారితో  కలిసి చూశాను. ఓ విధంగా అతను మా వారికి ఓ మాదిరి స్నేహితుడే! ” గుక్క తిప్పుకోవడం కోసం ఆగింది.

“ఎందుకు .. ఎలా అనేదాని కంటే , బిడ్డను అత్తగారికిచ్చేసి వినోద్ తో నేను మద్రాస్ వచ్చేశాను. నాలుగేళ్ళపాటు పాండీబజారులో ‘ఫలానా ‘ షాప్ లో సేల్స్ గార్ల్ గానూ, ఆ తరవాత ఎకౌంటెంట్ గా, ఆ తరవాత ‘ఫలానా ‘ హోటల్లో హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ గా , బోలెడు అవతారాలెత్తాను. నిజం చెపితే వినోద్ అవకాశాలు వెతుక్కోడానికి అవకాశం కల్పించాను. ”

“వినోద్ అంటే? ”

“తొందరెందుకు సార్ , మామూలు ఎగస్ట్రా వేషాల్నించి ‘హీరో ‘ గా ఎదిగిన ‘ఫలానా ‘ వ్యక్తి గురించే నేను చెప్పేది ” నవ్వింది.

“మై గాడ్ కోట్ల మీదేగా అతని సంపాదన? ” షాక్ తిన్నాను.

“అవును నిచ్చెన ఉపయోగపడేది మేడ ఎక్కడానికే. ఎక్కాక నిచ్చెనతో పనేముంది? ” నిట్టూర్చింది.

“మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ తరవాత అర్ధమయింది. ‘వినోద్ ‘ అనే రాయిని ‘శిల్పం’ గా మార్చాలనేది నా కోరిక. నిచ్చెనగా ఉపయోగపడమని అతను నన్ను అడగలేదు.  శిల శిలగా ఉన్నప్పటి కథ వేరు. శిల శిల్పమైతే? దాని అసలైన స్థానం ఏమిటో అక్కడకి అది చేరి తీరుతుంది. వినోద్ కూడా అతని చేరాల్సిన స్థానానికి చేరాడు. అతని తప్పేముంది? “మళ్ళీ ఓ సుదీర్ఘ నిట్టుర్పు. నిజంగా నాకు షాక్. వినోద్ (అసలు పేరు వాడలేదు) అంత ఎత్తుకి ఎదుగుతాడని మేము ఎన్నడూ వూహించలేదు. అతని టాలెంట్ కాక అదృష్టమూ అతని తలుపు తట్టింది. అదే, సుమిత్ర తలుపు మూసేసింది.

“తరవాత?” మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను.

“ఏ ‘మగవాడి ‘ దగ్గర పనిచేసినా వాడి చూపులు “శరీరం” మీదే వుండేవి. కోరికకీ – అందానికి సంబంధం పెద్దగా వుండదేమో. ఒకరు నన్ను ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ఇంకొకరు నన్ను పెళ్ళి చేసుకొని ప్రేమించారు. మరొకరు నన్ను ఓదార్చే ప్రయత్నంలో దగ్గరై మరో స్థాయికి చేరారు. నేనూ మాత్రం ఏం చెయ్యనూ? నా అత్తమామలకి వారసులు లేరు గనక , నా బిడ్డని వాళ్ళ వారసుడిగా వారికే వప్పచెప్పాను. ప్రేమ మీద నమ్మకం లేని నాకు ప్రేమే కరువయ్యింది. కానీ , ఆ ప్రేమ కోసం శరీరాన్ని తాకట్టు పెట్టలేదు. ఈ హీరోయిన్ నాకు చాలాకాలం నుండి పరిచయం వున్న వ్యక్తే. అందుకే ఆమె దగ్గర “టచప్ వుమెన్ ” గా చేరాను. నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తోంది. ఇక కంఫర్ట్ అంటారా? అంతెక్కడా? ” మళ్ళీ ఆగింది.

“మరి.. ” ఓ ప్రశ్న వెయ్యబోయి ఆగాను.

“ఇప్పటి జీవితం గురించా? నిజం చెబితే చాలా ఆనందంగా వున్నాను. గురూజీ.. ‘ఫలానా ‘ది కావాలని అని కోరుకున్నంత కాలం నేను అనుభవించింది క్షోభే. కానీ ఇప్పుడు ‘నాకేదీ వద్దు ‘ అనుకున్నాను కనక హాయిగా వుంది. అసలేం కావాలి డబ్బా? పదవులా? పెద్ద ఉద్యోగమూ, జీతమూ పరపతి అవా? అవన్నీ వుంటే సౌకర్యం వుంటుందే కానీ ‘సుఖం ‘ దక్కుతుందా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు నన్ను చాలా కాలం వెంటాడాయి. ఇవన్నీ వున్నవాళ్ళు సుఖపడుతున్న దాఖలాలేవీ నాకు కనిపించలేదు.

డబ్బు సంపాదన పెరిగే కొద్ది అనవసరమైన వస్తువులు  కొనడం, అర్ధం లేని ఆడంబరాలకు పోవడం, తప్ప ‘నిజమైన సుఖం ‘ నాకు అవగతం కాలేదు. ‘రేపటి మీద ‘ ఆశలతో మనిషి ‘ఈనాడు’ ని నిర్వీర్యం చేసుకున్నాడని అనిపించింది. అందుకే, అన్నీ వదిలేసి అతిసామాన్యులు వుండే పాకలో వుంటున్నా. నాకు తోచినంతగా పదిమందికీ వుపయోగపడే ప్రయత్నం చేస్తున్నాను ” ఆగింది.

“సరే.. పాకలో వుంటే ఏమి తెలిసిందీ? ” కుతూహలంగా అడిగాను

పకపకా నవ్వింది సుమిత్ర “కవిగారూ.. మీలో ఇంకా ఆ ‘సైనికుడి ‘ మనస్తత్వమే వుంది కానీ, సినిమా మనస్తత్వం రాలేదు. అయ్యా, తాజ్ మహల్లో వున్నా, పూరి గుడిసెలో వున్నా మనుషుల ‘ నిజమైన ‘ మొహాల్ని ఎప్పటికీ చూడలేమని అర్ధమయ్యింది. గొప్పవాళ్ళు ఒక రకం ‘ముసుగులు ‘వేసుకొని కృత్రిమంగా జీవితం గడుపుతుంటే , పేదవాళ్ళు మరోరకం ముసుగులు తగిలించుకొని కృత్రిమమైన జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. నాకు నిజంగా అర్ధమైనదేమిటంటే , పేదా గొప్ప తేడాలు ‘ఆస్తిపాస్తుల్లో ‘ లేవని కేవలం ‘మనసుల్లో ‘ మాత్రమే వున్నాయని అర్ధమైంది! ” అన్నది.

బహుశా పేద గొప్పలకి ఇంత పెద్ద నిర్వచనం ఇచ్చింది సుమిత్ర ఒకతేనేమో! మనిషి యొక్క గొప్పతనము, పేదతనమూ నిజంగా డబ్బుతో కాదు , మనసు బట్టి ఆధారపడి వుంటుందన్న మాట ఆ తరవాత 72 గంటల్లో ఋజువైంది.

ఈ సంభాషణ జరిగిన రోజే నేను చెన్నై వచ్చేశా యీవినింగ్ ఫ్లైట్ లో. కారణం ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజింగ్ రికార్డింగ్ చెన్నై లో చేద్దామనుకోవడం వల్ల.

రెండు రోజుల తరవాత పాండీబజారు లో ‘సుమీ ‘ కనిపించింది.

“అదేంటీ? ఈ నెలాఖరు వరకు మీ షెడ్యూల్ వుందన్నారుగా? క్యాన్సిల్ అయ్యిందా? “ఆశ్చర్యంగా అడిగాను.

సన్నగా నవ్వింది సుమిత్ర.

“షెడ్యూల్ మామూలుగానే వుందండీ.. నాకే పని “ఊడిపోయింది! ” అన్నది.

“అదేంటీ? మీకూ హీరోయిన్ కి …. ” ఆగాను..

“ఊహూ.  సినిమాహిరో గారితో ప్రాబ్లం వచ్చింది. మొన్నటి వరకు అన్నీ హీరోయిన్ ఓరియంటెడెడ్ సీన్లు , మిగతా సీన్లు షూటింగ్ జరిగాయి.  మొన్న హీరో గారు ఎంటర్ అయ్యారు. వారు నన్ను చూసి ఇబ్బంది పడ్డరనుకుంటాను. ‘సెట్ ‘ నుంచి నన్ను తప్పించమని వారు డైరెక్టర్ కి చెబితే , డైరెక్టర్ ప్రొడ్యుసర్ కి, ప్రొడ్యుసర్ హీరోయిన్ గారికి చెప్పారుట. చివరికి హీరోయిన్ గారు నన్ను పిలిచి “సారీ సుమీ.. నిన్ను చూసి బహుశా హీరోగారికి మొహం చెల్లలేదనుకుంటా… ఏమైనా, అతనా టాప్ హీరోలలో ఒకడు. నేనింకా అంతగా నిలబడిపోలేదు. నువ్వే అర్ధం చెసుకొని.. ” అంటూ చెక్కుబుక్కు తీసింది. ఇంకేం చెస్తా, నాకు రావల్సిన మొత్తం మాత్రం తీసుకొని ట్రైనెక్కాను ” నిట్టూర్చింది సుమిత్ర.

“మరి.. ఇప్పుడు… “ఆగిపోయాను “అంటే ఆ హీరో వినోదేనా?” ఆత్రంగా అడిగాను.

“అవును.. ఒకప్పుడు నా మీద ఆధారపడ్డవాడు నన్ను ఆఫ్ట్రాల్ ఓ టచప్ విమెన్ గా ఎలా చూడగలడూ? అందుకే… ” పకపకా నవ్వింది.

“మరి.. ఇప్పుడు ” ఇందాకటి ప్రశ్నే మళ్ళీ అడిగాను.

“జీవితం చాలా విశాలమైనది సార్.. ఎన్ని తలుపులు మూసుకుపోయినా ఏదో ఒకటి మళ్ళీ తెరుచుకుంటుంది. అయినా యీ మాత్రం సస్పెన్సు లేకపోతే జీవితం నిస్సారంగా నడుస్తుంది కదూ! ” నవ్వీ నడక సాగించింది సుమీ అనబడే సుమిత్ర ఉరఫ్ నల్లమణి. నేను అక్కడే నిలబడ్డా.. చాలా సేపు.. నడిచే సినిమా చూస్తూ…

మీడియాలో మేలుకొలుపు!

 

‘ఒకసారి కలుద్దాం…ఛానల్ కి రండి.’ అంటే వెళ్లాను. వెళ్లి ఎదురుగా కూర్చోగానే, substance లేని స్వీట్ నథింగ్స్, purpose లేని ఫార్మాలిటీలు లేకుండా, సూటిగా సుత్తిలేకుండా,”మీ రైటింగ్ లో జర్నలిస్టిక్ స్టైల్ ఉంది. ఫిల్మ్ అనాలిస్ లో డెప్త్ ఉంది. ఫుల్ టైమ్ జర్నలిజం కెరీర్ గురించి ఎందుకు ఆలోచించలేదు?” అని ఒక న్యూస్ చానల్ CEO అడిగితే ఎంచెప్పాలో తేలిక ఒక పిచినవ్వు నవ్వి ఒక పాజ్ తీసుకున్నాను.

అడిగింది అరుణ్ సాగర్. ఆ పిచ్చి నవ్వు నాదే.

కాస్సేపు ఆలోచించి చెప్పాను. ‘జర్నలిజంకన్నా ఫిక్షన్ నాకు ఇష్టం. అది pursue చేసే luxury కూడా లేకపోతే NGO సెక్టర్ లో ఇన్నాళ్లూ పనిచేసి ఇప్పుడే సినిమాల్లో ఫుల్ టైమ్ అనుకుని వచ్చాను. కాబట్టి కొన్నాళ్ళు ఈ ట్రయల్స్ లో ఉంటాను.” అని కాస్త confidant గా చెప్పేసాను. సరే…ఫేస్ బుక్ లో రాసే ఫిల్మ్ రివ్యూస్ మా ఛానెల్ లో చెప్పొచుగా అని డైరెక్ట్ ప్రశ్న సంధించారు. కాదనడానికి పెద్ద కారణం కనిపించలేదు. కాకపొతే, కుండ పగలగొట్టినట్టు చాలా సార్లు. చెంపపెట్టు లా మరికొన్ని సార్లు ఉండే నా రివ్యూల వల్ల చానల్ ఆదాయానికి గండిపడే అవకాశంతో పాటూ సినిమా పరిశ్రమతో అనవసరపు సమస్య ఛానెల్ కి వస్తుందేమో అనే డౌట్ వచ్చి అడిగేసాను. దానికి అరుణ్ సాగర్ చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ గురుతుంది.”అనుకున్నది చెప్పే సిన్సియారిటీ నీకు ఉంటే, దాన్ని అక్షరం పొల్లుపోకుండా ఎయిర్ చెయ్యగలిగే నిబద్దత నాకుంది. ఇష్టముంటే ఈవారం నుంచీ మొదలెట్టొచ్చు.”

mahesh

గుండెల మీద చెయ్యేసుకుని ఇలాంటి నిబద్దత గురించి మాట్లాడగలిగేవాళ్ళు మొత్తం పాత్రికేయరంగంలో ఎంత మంది ఉన్నారో లెక్కెంచితే పదివేళ్ళు దాటవు. అంత అరుదైన వ్యక్తి అరుణ్ సాగర్. మా పరిచయం పాతదే అయినా, స్నేహం మాత్రం ఫేస్ బుక్ లో నేను యాక్టివ్ అయ్యాక మాత్రమే అని చెప్పొచ్చు. 10Tv లో నా రివ్యూలు మొదలయ్యాక ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయో నాకు తెలుసు. అయినా, తను మారలేదు. మాటతప్పలేదు. ఆరంభంలో ఒకటన్నారు, నేషనల్ మీడియాలో రాజీవ్ మసంద్, నిరుపమ చోప్రా స్థాయిలో మంచి ఫిల్మ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు తెలుగులో లేరు. ప్రింట్ మీడియాలో అక్కడక్కడా బాగారాసేవాళ్ళు ఉన్నా, టివిలో ఆ లోటు సుస్పష్టంగా తెలుస్తుంది.ఆ లోటు భర్తీ చెయ్యగలిగితే, నీకున్న సినిమా ప్రేమ రివ్యూలలోనూ కనిపిస్తే ష్యుర్ గా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని. నేను ఏ సినిమా రివ్యూ చెప్పాలనుకున్నా, ఈ మాటలే గుర్తుపెట్టుకుంటాను.

మొదటిసారి రివ్యూ చెప్పడానికి టివి ముందుకు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, అరుణ్ సాగర్ నాకు ధైర్యం ఇవ్వడానికి స్టుడియో ఫ్లోర్ కి వచ్చారు. నాపైన ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంటే, ఫ్లోర్ లో ఉన్నవాళ్ళకి బహుశా విచిత్రం అనిపించిందేమో. దానితోపాటూ నేనేవరో స్పెషల్ అనే ఫీలింగ్ వచ్చి గౌరవించడమూ మొదలెట్టారు. నాకు మోరల్ సపోర్టుతో పాటూ అన్యాపదేశంగా వాళ్ళ స్టాఫ్ కి నాపైన గౌరవం కలిగించడం కూడా ఒక మానవతావాది మ్యానేజ్మెంట్ టెక్నిక్ అనే అనుకోవాలి. ఆవిధంగా నన్నొక “ప్రముఖ ఫిల్మ్ రివ్యూయర్”ని చేసిన క్రెడిట్ అరుణ్ సాగర్ దే. కొత్త జర్నలిస్టుల అక్షరాలు దిద్దటం నుంచీ ఆలోచనల్ని సరిదిద్దడంవరకూ చెయ్యగలిగిన ాతికొద్దిమంది ఎడిటర్లలో అరుణ్ సాగర్ ఉన్నారు కాబట్టే సగానికి పైగా న్యూ-ఏజ్ జర్నలిస్టులు అతన్ని గురువుగా భావిస్తారు. అలాంటి గురువు నా హితుడు స్నేహితుడు టెలివిజన్ కెరీర్ కి బాటలు వేసిన సారధి అవ్వడం నా అదృష్టం.

అరుణ్ సాగర్ వచనం, కవిత్వం, శైలి, ఐడియాలజీ అన్నీ నాకిష్టం. వ్యక్తిగా తను చూపే స్నేహం, ప్రేమ అత్యంత ప్రీతిపాత్రం. కలిసి ఆలోచనల్ని పంచుకునే అవకాశం, కలిసి ప్రయాణాలు చెయ్యగలిగిన సహవాసం అన్నీ అద్భుతమైన అనుభవాలు.  ’మేల్ కొలుపు’ చదివాక నేను రాసిన సమీక్ష చదివి ఎంతో ఆనందంతో నన్ను దగ్గర తీసుకుని, ’ఒక కొత్త తరానికి మళ్ళీ నా పుస్తకాన్ని పరిచయం చేశారు’. అన్నదగ్గరనుంచీ, మొన్నటికి మొన్న ఖమ్మంలో తన పుస్తకం ‘మ్యూజిక్ డైస్’ ఆవిష్కరణకు నన్ను తనతో తీసుకెళ్ళినదగ్గరి వరకూ ఎన్నో మధురమైన, ఆలోచనాపూరితమైన, insightful క్షణాలు.

చనిపోయారనే వార్త తెలియగానే, అర్థమవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. ఇప్పటికీ ఇంకా ఆ నిజాన్ని నా మనసు జీర్ణించుకోలేదు. ఆ కఠోర సత్యాన్ని ఇప్పట్లో అంగీకరించలేను కూడా. అందుకే తన ఆత్మలేని శరీరాన్ని చూడటానికి నేను వెళ్ళలేదు. జ్ఙాపకాలలో మిగులున్న అరుణ్ సాగర్ మాత్రమే నాకు కావాలి. తను నిర్జీవంగా ఉన్న దృశ్యాలు నా కళ్ళ ముందు ఎప్పటికీ రాకూడదు. He will live on in my memory and thoughts.

ఆయన ఇంకా పాడుతున్నారు!

             

     – పన్నాల సుబ్రహ్మణ్యభట్టు

~

 

రజనిగారిని చూస్తుంటే ఇన్ని పాటలు  రాసి స్వరపరచిన ఆయన భుజబలం  ఎంత గొప్పదో ఎన్ని కల్పనల  లేసులు  అల్లినదో అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఆయన సృజన ఒక ప్రహేళిక వంటిది.  జటిలంగా పాట రాసి అంత జటిలంగానూ సంగీతం సమకూర్చడం ఎలా సాధ్యమయిందీ అని ప్రశ్న ఉదయిస్తుంది.  వింటున్న కొద్దీ వివేచన పెరుగుతుంది.  సరే సంగీతం వింటుంటే ఆలోచించడానికి వీలవుతుందా, వివేచనకి వీలు  అవుతుందా అనేది సెమినారు మడి సంభాషణ. అదో సరిపెట్టలేని తీర్మానం.

ఈ కాలానికి ఆయన రాసిన కొన్ని పాటలనీ, వరుసల్నీ తలచుకొని మురిసిపోవటమే సరైన పని.  అయినా అందర్నీ చకితుల్ని చేసే మాట ఒకటి నేను చాలాకాలంగా చెప్తున్నాను ‘త్యాగరాజు తర్వాత అంతటి వాగ్గేయకారుడు పాట, సంగీతం రెండూ సమకూర్చినవాడు రజనిగారు తప్ప వేరొక ప్రతిభావంతుడు లేడు ’ అని ఆ ప్రకటన సారాంశం.  ఒకసారి తెలివిమీరిన నేను ఆయనకి ఆమాటే చెప్పి ‘మీకు బాగా గాలిపెట్టానా’ అని నవ్వాను కుర్రతనంతో. ఆయన ‘ఎక్కువే’ అని నవ్వారు.

rajani2

కానీ, ఆ గాలి ఎక్కువ కాదనే తోస్తుంది నాకు ఇప్పటికీ.  త్యాగరాజుగారి లక్ష్యయాత్ర వేరు, కాని ఇద్దరి శోధననాళిక దారీ ఒక్కటే.  స్వామివారికి రాము వారి చరిత్రగానం లక్ష్యం.  అందుకు ఆయన తీసుకున్న రాగతాళాల ఎంపిక ఒక సంగీత విధాన నిరూపణ కోసం. మళ్ళీ ఆ రాగాల లోతుపాతుల అన్వేషణ కీర్తన తెచ్చే పదాల ముళ్ళను స్వరసంచారంతో పులమడంలో గల రక్తి ప్రసాదం ఆయన పని. అదొక మేథోపరమైన కృషి.  ఆ కాలపు వాగ్గేయకారులకు అదొక కాంట్రాక్టు.

రజనిగారి లక్ష్యం మాత్రం వేరు.  త్యాగయ్యగారి లాంటి ఏకముఖమైన నైవేద్యం, నివేదన కాదు ఈయన లక్ష్యం.  ఈయన రాసిన గీతాలు అనేక రసాల దృష్టినీ, సంఘటనలనీ, ఇతివృత్తాలనీ పోగులుగా ఎత్తే పూలసేవ ఇది.  సన్నివేశ కల్పనకీ, మానసికమైన వ్యవహారగతులకీ, కాల్పనికమైన లౌకికమైన దక్షతకీ రెక్కలు  కట్టే దృష్టి గల పాటలు  ఇవి.  ఆనాటి వాగ్గేయకారుల కీర్తనలవలె ` ఇవన్నీ భజన సంప్రదాయానికి లొంగవు.

bhattu

రజనితో భట్టు

అయినా ఇదొక రకంగా భజనే ` ప్రేమభజన, ప్రేయసికి లేఖ, ఆకాశంలో మేఘం నడిచిన రీతుల  వర్ణన, సూర్యుడి ప్రతాపం, నదీ ప్రవాహ ఝరి, ప్రకృతి ప్రకోపాలు, ఇలా ఇన్ని వర్ణించి, పాట చివరి తీగ లాగుతూ, సంగీతం డొంకమీదకి ఎక్కించాలి…  కష్టమైన ప్రొసీజర్‌, ఈ భజనల్ని శ్రోతలకు అందించటం ఎలా? త్యాగరాజుగారికి శిష్యులే శ్రోతలు, మూలవిరాట్టే వేరుగా ఉన్నారు.  కాని రజనిగారికి గల శిష్యులు, శ్రోతలు, తనపాట నచ్చే శ్రోతల్ని ఆయనే తెచ్చుకోవాలి.  అలా అక్కడే ఉంచుకోవాలి, వారికి అనేక పాటలనే వంటకాల్ని సంగీతంలో వేయించి ఊరిస్తూ ఉంచుకోవాలి.  ఇందుకు వేరే పల్లకీ ప్రబంధాలనీ, నౌకా యాత్రలనీ రచించాలి.  అంటే గేయనాటికలు, సంగీతరూపకాలు, స్వరసంకలనాలు  రచించి సంగీత వాక్యాలతో సిద్దపరచాలి.  రజనిగారిది భక్తి సామ్రాజ్య అనురక్తి కాదు. ప్రజాస్వామ్యంలో శ్రోతలనే ఓటర్ల సేవ.  అందులో సినిమా సంగీత కల్పనా  ఘట్టం కూడా తప్పదు.  పురాణ గాథ సందర్శన కూడా తప్పదు.  ఆకాశంకేసి చూసి విస్తుపోవటం భూమిలో చూసి కూరుకుపోవటము తప్పదు. రాములవారిని కాదంటే ఇంతలా జటిలమైపోయే దృశ్యం లలిత సంగీత రచనలో ఉంది.  ఈ రచనకి తనే పదకర్తయి పాటలుగా కూర్చడం గొప్పే.  నిజానికి రజనిగారికి పాట పుట్టడమే పేగు సంబంధంతో పుడుతుంది.  ఆ ముడిని ఆయన మోసినా శ్రోత మోసినా కత్తిరించలేరు.  ఆ పాట రచనలోని పరుసవేది సంగీతంతోనే ప్రకాశిస్తుంది.  ముచ్చట గొల్పుతుంది.  మురిపిస్తుంది.  విడదీసి చూస్తే ఇదొక పాట రచనా అని విసిగిపోతారు, విస్తుపోతారు.   వాటిలో తాళగతులకు ఇరికేలా రాదామనే సగటు పాట రచయిత తాపత్రయం కనబడదు.  గుర్తుకు తెచ్చుకోండి ` ఎలాగయినా, ఏ గీతశకమైనా, ఏ వరుస గుర్తుకున్నదైనా ! సంగీతాన్ని తోసుకుంటూ, పొదలోంచి పాములా, సంగీతం నాలుకలు  చాచే కనబడుతుంది కదా!

ఉదా : ‘తొంగలి రెప్ప చెంగల్వ పూవే…. తొంగి చూచెనదిగో కన్నావే!’

rajani3

ఆంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థి గా – 1937-40

సంజెకెంజాయవీవనలు, క్రొంజిగువురు గుబురు జాలరులు,  తల్లీ, నీయడుగు

దామరులు!  అరుణ దరహాసమో, చందనమరున్ని శ్వాసమో’

ఇలా ఎన్నయినా గుర్తుకు తెచ్చుకోవచ్చు.  ఆ పదాల మేరకు ఊహించనివీ, ప్రకృతి రమణీయంగానో, పదగుంభనంగానో ఎవరూ దర్శించని నీతి, రచన, దృశ్య పేటికలు.  ఆ పదాలతో తెరవడం  రజనిగారి పాటల్లో ఒక మాట ‘క్రీడ’.  ఒక సంగీతపు ఊయల ఊపు.

పాట అనే ఫుట్‌బాల్‌ క్రీడలో బంతి అనే మాటను ఈ కోణంలో ఆటగాడు ఇలా నడిపిస్తాడు అని ఊహించేవారుంటారు కాని అందుకు భిన్నంగా రజనిగారు మాటని నడుపుతారు.  ‘మెస్సీ’ అనే విజేతలాగ. అంత చలన వేగంతో గోల్‌ కొట్టే శక్తి రజనిగారిది.  ఆయనకే తెలిసిన లయ విభ్రాంతితో ఆ పదాన్ని అలవోకగా అక్కడకు చేర్చడం ఆయన నేర్పు.  తెలుగు గేయ / గీత సాహిత్యంలో రజనిగారి లాంటి ఆటగాడు అవతరించలేదు.  కారణం సంగీతమనే ప్రేగుతో సహా పదం జనిస్తుంది.  లౌకిక భావకవితారక్తిమతో అలా పాట పొట్ట తట్టడం ఎవరికీ అబ్బలేదు.  త్యాగరాజు తర్వాత కొంతమందికి ప్రయత్నపూర్వకంగా సాహిత్య రచనలో ఈ విద్య అబ్బి ఉండవచ్చు.

rajani1

అలవాటులో లేని రాగాలలో పాటకి వరుస కూర్చడం ఎక్కడైనా ఉంటుంది అనుకున్న వరుసలో రాగాలలో పాటనప్పడం ఆనాటి వాగ్గేయకారుల నుండి ఈకాలపు సంగీత దర్శకులకీ అలవాటే.  పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌ అనే స్వామి వారి శిష్యుడి నుండి ఈనాటి ఆసామీ గాయకులకీ సాగే విద్యే వారికి తాళాలూ  మాటలూ  సర్దడం సమకూర్చుకుంటూ పోవటం శ్రమే.

కానీ లలిత సంగీతంలో పాట ముందు ఆముఖం వినిపించే పరిచయ ఆహార్యం, చరణాలకీ, చరణానికీ మధ్య పొడిగించే, నడిపించే సుఖనిద్ర కల్పించే, సకల భోగాలు వండటం అందరికీ అలవడే విద్యకాదు.  రజనిగారు అందులో స్పెషలిస్టు వరసిద్ధిపొందినవారు.  సంగీతంలో నుండే పాటను పుట్టించి తానే సంగీత చరణాల మధ్య అలంకరాలనూ, ఘోష చైతన్య స్ఫూర్తినీ స్వరబంధంగా మలచి ఒక సాకారమూర్తిని ప్రదర్శించటం రజనిగారి పాటలోని విశేషం.  ఆయనది అంతటి కల్పనా  ప్రకాశం.  ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.  అటు పాటగానూ, సంగీతంగానూ ఆ పాట ఎంత ముద్ర వేయగలదో చూపవచ్చు.  లేకపోతే తుఫాను గురించి ‘నిష్పడన మంధానం’ అని కూర్చగలరు?  తుఫాను నాశనం చేసిందని ‘ధ్వంస విధి విధానము, నివాత శూన్య స్థంభం అని ఎత్తుగడను శూన్యంలోకి దించటం ఎంత రిస్కు.  ఇంకా గగుర్పాట్లు! అది ‘పరిభ్రామ్యమాణరోదసీ రాక్షసి నిటలాక్షం’ట.  పశుపక్షి మనుష్య సౌఖ్యహరణ జీవనాటంకం’  పాటకి ఇన్ని ఆటంకాలా అని మరొకరెవరైనా జారిపోయేటంత ప్రతిభ రజనిది.  ఇక ఆ పాట ఆముఖ సంగీతం వినవలసినదే.  ఇంకా ఆశ తీరక ‘పలువంకల స్వార్థ ప్రజపాపాల్‌ చిలికే కవ్వం’ అన్నారు.  అందుకే ఆయన సూటి సంగీత తంత్రవేత్త మాట మంత్రవేత్త దేశంలోని సమకాలీన లయకారులలోనే ఉండరు.  తెలుగు జాతి భాషలో మాత్రం త్రిమూర్తుల తర్వాత ఇలా సంగీత సాహిత్యాలని సాగు చేసినవాడు లేడు.  ఆయనా వారిలాగే, మనలాగే ఈ నేల మీద నడిచారనీ, ఇప్పటికీ 96 ఏళ్ళుపైనా బడినా నిజంగా నడుస్తున్నారని  ఒక ఆనందం.  ఇంత పులకింత.

*

రేపటి మీదే ఆశ!

 

చందు తులసి

~

chanduకథంటే…
కథంటే సమస్యలు కాకపోవచ్చు….
కథంటే పరిష్కారాలు కూడా కాకపోవచ్చు, కానీ…, కథంటే జీవితం. కథలో జీవితం వుండాలి. ఇదైనా ఒప్పుకుంటారా…? ఇది ఇటీవలే జరిగిన కథసాహితీ పాతికేళ్ల సభలో ప్రముఖ రచయిత, విమర్శకులు ఎన్. వేణుగోపాల్ అడిగిన ప్రశ్న .

కథలెలా పుడతాయి. జీవితంనుంచా..? సమాజం నుంచా..? లేక కేవలం సృజనకారుల ఆలోచనల్లోంచేనా..? సృజన అంటే కల్పనే. కానీ ఏ తరహా కల్పన. జీవితాన్ని మరిపించే కల్పనా…? జీవితాన్ని నడిపించే కల్పనా..?
***
గత ఏడాది సారంగ కథల్లో సమకాలీన సమాజానికి దూరంగా వున్న కథలు కొన్నైతే… సమాజాన్ని, జీవితాలను చిత్రించిన కథలు కొన్ని వున్నాయి. అన్నదాత ఆత్మహత్యలాంటి సీరియస్ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని కలాన్ని ఛర్నాకోలలా ఝళిపించిన కథ ప్రసాద మూర్తి – ఓ రైతు ప్రార్థన. తెలుగులో అరుదైపోతున్న…వ్యంగ్య రచనా శైలిలో వచ్చిన కథ. రాజకీయ చదరంగంలో రైతుల జీవితాలు ఎలా పావులుగా మారుతున్నాయో ప్రభావవంతంగా చెప్పిన కథ.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని భూ సేకరణ నేపథ్యంలో….అమరావతి, దాని చుట్టుపట్టు పల్లెల్లో వచ్చిన సామాజిక పరిణామాలను చర్చించిన కథ ఎమ్వీ రామిరెడ్డి త్రిశంకు స్వప్నం . కలలో కూడా ఊహించని విధంగా అమాంతంగా పెరిగిపోయిన భూముల ధరలు….ఆ ప్రాంతంలోని మానవ సంబంధాల్ని ఎలాంటి మార్పులకు దారితీస్తున్నాయో ఆసక్తికరంగా వివరించిన కథ.  ఇంచు మించు అదే ఇతివృత్తంతో ఆ ప్రాంతంలోనే జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను వివరిస్తూ వచ్చిన కథ బుద్ధి యజ్ఞమూర్తి మాయ.
అలాగే తెలుగులో దాదాపూ అంతరించి పోతోందేమో అని ఆందోళన కలిగించే ప్రక్రియ ఆరోగ్యకరమైన హాస్యకథ.  ఆ లోటునూ తీర్చిన కథ డా.కోగంటి విజయ్ బాబు రాసిన ఎవరు కవి. నిజాయతీ, చిత్తశుద్ధి లేని కవులు, వారి కవిత్వం దండగ అని తేల్చిచెప్పి, ఆత్మీయంగా స్పందించే చిన్న మాట గొప్ప కవితకు ఏ మాత్రం తీసిపోదు అని విలువైన సందేశం ఇచ్చిన కథ. వెర్రితలలు వేస్తున్న మతమౌఢ్యం, భక్తి పేరిట జరుగుతున్న మోసాల గుట్టు విప్పిన కథలు కే.సుభాషిణి- నీలకంఠం పి.హెచ్.డీ, శివ్-అపరిచితులు కథలు. మూఢాచారాలను ప్రశ్నించిన ఇంద్రగంటి మాధవి- భోక్త కూడా అలాంటిదే. ఈ కథలు చదివిన తర్వాత…మొత్తానికి తెలుగు కథకులు అప్రమత్తంగానే వున్నారన్న సంతోషం తప్పక కలుగుతుంది.
బలవంతులు తమ అధికారం, బలం ఉపయోగించి ప్రకృతి వనరులు కొల్లగొట్టడం….ప్రత్యక్షంగా కనిపించని దోపిడి. ఈ నేరం ఎవరిదైనా శిక్ష మాత్రం అందరూ అనుభవించాల్సిన దుస్థితి. అందుకే ఈ దిశగా పాఠకులని మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత సాహిత్య కారులపైన ఉంటుంది. ఈ బాధ్యతనే స్వీకరిస్తూ… పర్యావరణ మార్పులు, పర్యవసానాలు… సైంటిఫిక్ ఫిక్షన్ తరహాలో ఆసక్తి కరంగా చెప్పిన కథ కొట్టం రామకృష్ణారెడ్డి 3456జీబీ. భవిష్యత్ లో తెలుగు కథలు విరివిగా రావడానికి అవకాశం ఉన్న విభాగం పర్యావరణ పరిరక్షణ. ఐతే ఈ దిశగా మరింత పరిశోధన, అధ్యయనం చేయాల్సి వుంటుంది.

ఇక ఈ కథల్లో అస్తిత్వవాద కథలూ ఒకటి, రెండు వచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కథ కృష్ణజ్యోతి  నేను తోలు మల్లయ్య కొడుకుని. వర్ణం, కులం, లింగం అన్ని వర్గాల వేదనల్ని సున్నితంగా చర్చిస్తూనే…పరిష్కారాన్ని కూడా చూపించిన కథ. ఇతివృత్తంతో పాటూ…రాసిన తీరు కూడా కొత్తగా ఉన్నకథ.  అలాగే కత్తి మహేశ్ నా హీరోకోసం కూడా మరో మంచి కథ. హాలీవుడ్ స్థాయికి ఎదిగాం అని సంబరపడిపోతోంది తెలుగు సినిమా.  ఓ వైపు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయడానికి ఆరాటపడుతూ…మరోవైపు ఇక్కడే వున్న దళిత, అణగారిన వర్గాల కళాకారులని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమపై సంధించిన ప్రశ్న కత్తి మహేశ్ కథ.  దగ్గర దగ్గర వందేళ్ల చరిత్రకు చేరువవుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ..ఒక్క దళితుడు హీరోగా లేకపోవడాన్ని, కనీసం ఓ గుర్తింపు పొందిన కళాకారుడు లేకపోవడాన్ని ఏమనాలి. ?  తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన…ముఖ్యంగా అద్భుతమైన పాటను సృష్టించిన దళిత సృజనకారులు సినిమారంగంలో కనీసం ప్రవేశాన్నికూడా ఎందుకు పొందలేకపోయారు…? పోయే కొద్దీ లోతైన చర్చకు దారితీసే అంశమిది. మొత్తానికి ఆ దిశగా ఓ చర్చను
లేవనెత్తిన కథ నా హీరోకోసం.

ఇక ఫెమినిస్టు కథలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే చాలా కథలు మహిళలే రాయడం “సారంగ” కథల్లో కనిపించిన ఒక ప్రత్యేకత.  గ్లోబలైజేషన్ తదంతర పరిణామాలు మహిళల్ని కూడా వేగంగా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములని చేశాయి.  పర్యవసానంగా….కొత్త ప్రపంచాన్ని, కొత్త మనుషుల్ని, మనస్తత్వాల్ని మగువలు ఎదుర్కొంటున్నారు. సహజంగానే కొంత సున్నితత్వం, స్పందించే తత్వం ఉన్న స్త్రీ ఈ ఇతివృత్తాల్ని సాహిత్య రూపంలోకి అనువదించేందుకు ఆరాటపడుతోంది. ముఖ్యంగా వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత…ప్రచురించే అవకాశాలు బాగా పెరిగాయి. ఫలితంగా అటు కవిత్వంలోనూ, కథా ప్రక్రియలోనూ మహిళలు అధికంగా రావడం మొదలైంది. తరతరాలుగా తమలోనే ఇంకిపోయిన భావాలను…బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చేందుకు…చర్చించేందుకు మహిళలకు అవకాశం లభిస్తోంది. ఐతే రకరకాల కారణాల వల్ల అంతర్జాల పత్రికల్లో సంపాదకీయం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం తక్కువ.  అక్షర దోషాలు, అన్వయ దోషాలు కూడా సవరించకుండానే పాఠకుల ముందుకు రావడం దీన్నే రుజువు చేస్తోంది.  పెరుగుతున్న వెబ్ పత్రికల అవసరాల్ని తీర్చే సంఖ్యలో రచనలు రాకపోవడం వల్ల…సంపాదకులు ప్రమాణాల విషయంలో ఓ మేర రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.  ఫలితంగా వెబ్ పత్రికల వల్ల ప్రమాణాలు తగ్గుతున్నాయనే విమర్శా వినిపిస్తోంది. ఈ విమర్శలో వాస్తవం ఉన్నా, క్రమక్రమంగా రచయితల సంఖ్య పెరుగుతున్నందున… వాటంతటవే ప్రమాణాలు కూడా పెరిగే రోజు రాక తప్పదు.
ఏదైమైనా వెబ్ పత్రికల పుణ్యమాని…మున్ముందు సరికొత్త ఇతివృత్తాలను, భిన్న కోణాలు తెలుగు కథల్లో చూసేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఆ పరిణామానికి సూచనలుగా కనిపించే కథలు…రాధిక-ఆలోక.  ఆర్. దమయంతి-అమ్ములు,  రాజ్యలక్ష్మి కథ-మహాలక్ష్మి , పాలపర్తి జ్యోతిష్మతి- వారిజాక్షులందు. . అన్నీ ఉదాత్త పాత్రలున్న ఆలోక కథ ఓ మంచి అనుభూతినిచ్చే కథ. రేపటి తరం గురించిన ఆవేదన వ్యక్తం చేస్తూ….వారిని నిర్లక్ష్యం చేస్తే
వచ్చే పరిణామాలను చూపిస్తూ హెచ్చరించే కథలు… శాంతి ప్రభోద-బాల్యం మోస్తున్న విషాదం,  అన్వీక్ష-తొలి కలుపు,  మమత కొడిదెల-బరువు. ఈ కథలు బహుశా మహిళలు మాత్రమే రాయగలిగినవి. అలాగే సారంగలో వచ్చిన చిన్న కథలు నిడివిలో చిన్నవైనా…. పెద్ద కథలకు ఏ మాత్రం తీసిపోనివి. మా రోజుల్లో అంతా బాగుండేది….అంటూ పెదవి విరచడం కన్నా… కాలంతో పాటూ మనం మారాలని చెప్పే కథ లక్ష్మీ రాఘవ –అనుబంధాల టెక్నాలజీ.  కణ్ణగి-
పిచ్చుకలు, వినోద్ అనంతోజు- చింటూ అమ్మెక్కడ..? లాంటి కథలు.., సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా…తక్కువ పరిధిలోనే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించిన కథలు.
చిన్న కథల్లో ఎక్కువగా….కొత్తగా రాస్తున్నవారు, యువత వుండడం గమనార్హం. బహుశా కొత్త తరం రాస్తున్న కథల ద్వారా… తాము ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారో….చెప్పకనే చెపుతున్నారని అనుకోవచ్చు.

ముఖ్యంగా మేడి చైతన్య, ఎండ్లూరి మానస, ప్రజ్ఞ వడ్లమాని చిన్న కథలు విరివిగా రాస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలుగు కథల్లో ఇటీవల తాత్విక చింతన, అంతరంగ అన్వేషణ కథలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరలో వచ్చిన కోడూరి విజయ్ కుమార్-చివరాఖరు ప్రశ్న,  బి.హరిత-అన్వీక్షణ కథలు ఆ కోవకు చెందినవే. మానసిక ప్రపంచంలోని అలజడిని, అంతస్సంఘర్షణను కవితాత్మకంగా చిత్రించిన కథ చివరాఖరు ప్రశ్న. అన్వీక్షణ కథ ఆంగ్ల కథా రచయిత ఎండీ వెయిర్ రాసిన ది ఎగ్ స్ఫూర్తితో రాసిన కథ అని స్పష్టంగానే తెలుస్తోంది.( మూల కథను అనిల్.ఎస్.రాయల్ బ్రహ్మాండం పేరుతో సారంగలోనే అనువదించారు.) ఐనా తొలి కథలోనే రచయిత్రి చూపిన పరిణతి,  చేసిన ప్రయోగం అభినందించేలా చేస్తుంది.

ఇక ప్రాంతీయ అస్తిత్వ వాద కథలు ఒక్కటి కూడా లేకపోవడం లోతుగా తరచి చూడాల్సిన అంశం. ఇతర ప్రాంతాల సంగతి ఎలావున్నా….తెలుగు సాహిత్యంలో  ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్న…తెలంగాణ ప్రాంతీయ ఇతివృత్తంతో ఒక్క కథ కూడా లేకపోవడం గమనార్హం.  అల్లం వంశీ (రెండు పట్టాలు...) కథ,  స్కైబాబా-అన్ మోల్ రిష్తే...కథ కనిపించినా అవీ కూడా పూర్తిస్థాయి ప్రాంతీయ కథలుగా చెప్పుకోలేం. తెలంగాణ జీవితాల్ని కానీ, సమస్యలను కానీ పట్టించిన కథలు కానీ లేకపోవడం… ఈ ప్రాంత రచయితల్లో నెలకొన్న ఒక స్తబ్ధతను (ఆన్ లైన్ పత్రికలకు సంబంధించినంత వరకైనా) తెలియజేస్తుంది.  అసలు కథలు రావడం లేదా..వచ్చినా వెలుగులోకి రావడం లేదా…? అని తరచి చూసుకుని ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ఆ ప్రాంత సాహితీకారులపై వుందన్నది స్పష్టం.

స్థూలంగా చూస్తే రాసిన కథలు బాగానే వున్నా రాయాల్సిన కథలు ఇంకా చాలా  వున్నాయనిపిస్తుంది.  సమాజంలో అనునిత్యం చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించకుండానో, నిర్లక్ష్యం చేస్తూనో, లేదా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తూనే రావడం కొంత మింగుడు పడని అంశం. ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యం లేదా సాహిత్య ప్రక్రియలో అయినా ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్యం ద్వారా ఆనాటి ప్రజల జీవితాల్ని, జీవన విధానాల్ని, సమాజాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించడం సహజం. ఆ రకంగా సాహిత్యం సమకాలీన జీవితాల్ని ఎంతో కొంత తప్పక ప్రతిబింబించాలి.
గత ఏడాది సారంగలో వచ్చిన కథలు సామాజిక కోణంలోంచి చూసినపుడు కొంత నిరాశ కలిగిస్తాయి.  ఇతివృత్తాల ఎంపికలో, కథలను నడిపించిన తీరులో, ముగింపులో ఇలా అడుగడుగునా ఒక కొత్త ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నవారు….సమకాలీన సామాజిక అంశాలను  ఇతివృత్తాలుగా స్వీకరించేందుకు  వెనుకంజవేయడం బాధాకరం.
రచయిత ఏ కథ రాయాలనేది అతని స్వేచ్ఛ. అందులో సందేహం లేదు.  ఆ విషయం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ సామూహికంగా చూసినపుడు ఆ (రచయితలు, సృజనకారుల ) సమాజం మొత్తం దూరంగా ఉండడం వెనక కోణాల్ని, కారణాల్ని మాత్రం తప్పక చర్చించాల్సి ఉంటుంది.  సమాజాన్ని విస్మరించి వచ్చే సాహిత్యం…పెయిన్
కిల్లర్ లాగా తక్షణ సంతృప్తినివ్వవచ్చునేమో కానీ ….దీర్ఘకాలంలో నష్టాన్ని చేస్తుంది. తాత్కాలిక ఆనందాన్నిచ్చే సాహిత్యం….దాని అసలు ప్రయోజనాన్ని, సమాజపు అవసరాల్ని తీర్చలేదు. మొత్తంగా ఇటు వెలుగు, అటు చీకటి అన్నట్లుగా….సారంగ కథలన్నింటిని సింహావలోకనం చేసుకుంటే ఒకింత ఆశ, మరింత నిరాశ కలుగుతుంది. సీనియర్ల స్తబ్ధతను చీల్చుకుంటూ…ఎప్పటికప్పుడు కొత్త కలాలు వెలుగుచూడడం ఆశాభావాన్ని కలిగిస్తుండగా, ఆ రచనల్లో సామాజిక జీవితాన్ని ప్రతిబింబించకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది.

సాహిత్యం సమకాలీన జీవితంతో ఎంతోకొంత ప్రభావితం కావాలి. అలాగే తానూ సమాజాన్ని ప్రభావితం చేయాలి.

మొదటి వ్యాసంలో చెప్పినట్లు ….చాలా మంది  కాలమే  మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం. ఈ మార్పు కొత్త సంవత్సరం కథల్లోనైనా కనిపిస్తుందని ఆశిద్దాం.

***

రోహిత్ ఆత్మహత్య: ఒక సరికొత్త/పాత సందర్భం

 

 

-భాస్కరం కల్లూరి

~

 

హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అంతఃకరణను కలచి వేసే ఒక భావోద్వేగ సందర్భం. అదే సమయంలో లోతుగా తరచి చూసి అర్థం చేసుకోవలసిన ఒక సరికొత్త/పాత సందర్భం కూడా. ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య వార్త జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడం చూసి ఒకింత ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల వార్తలు మరీ ముఖ్యమూ, సంచలనాత్మకమూ అయితే తప్ప జాతీయ మీడియాలో ప్రముఖంగా రావు. ఆ పైన రోహిత్ ఆత్మహత్యపై దాదాపు అన్ని జాతీయవార్తా చానెళ్లూ చర్చ జరపడం ఆశ్చర్యాన్ని పెంచింది. ఆ చర్చ వరసగా కొన్ని రోజులపాటు జరగడం ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది. దాంతోపాటు ఆలోచనలనూ రేకెత్తించింది.

దేశ వ్యాప్తంగా జరుగుతున్నట్టే, నిన్నటి అవిభక్త, నేటి విభక్త తెలుగు ప్రాంతాలలోనూ ఆత్మహత్యలు, దళితులపై హింస ఎంతోకాలంగా జరుగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ ఉద్యమసమయంలో జరిగిన ఆత్మాహుతులు తెలిసినవే. దళిత హింసకు వస్తే; కారంచేడు, చుండూరు, పదిరికుప్పం; మహారాష్ట్రలో ఖైర్లాంజీ లాంటి ఘటనలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. స్థూలంగా చెప్పుకుంటే, ఆ క్రమంలో రోహిత్ ఆత్మహత్య, పునరావృతమైన ఒక పాత సందర్భమే అవుతుంది.  అయితే, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో చర్చనీయం అయినంతగా పైవేవీ కాలేదు. అప్పటికి మీడియా వ్యాప్తి ఇంత లేకపోవడం ఒక కారణం అనుకున్నా; ఇప్పటికీ జాతీయ మీడియా వింధ్య అవతలి ప్రాంతాలపై, ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలపై పెడుతున్నంత ఫోకస్; వింధ్య ఇవతలి ప్రాంతాలపై పెట్టడం లేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే రోహిత్ ఆత్మహత్యపై దాని స్పందన విలక్షణంగానే కనిపిస్తుంది. ఆవిధంగా అదొక సరికొత్త సందర్భం. వెరసి అదొక సరికొత్త/పాత సందర్భం.

ఇలా రోహిత్ ఆత్మహత్యను కొత్త సందర్భంలోకి తీసుకొచ్చినది సాక్షాత్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని భావసారూప్య వర్గాలే. అందుకు కారణం, అవి అనుసరించే ఒక నిర్దిష్ట భావజాలం. కానీ విచిత్రమేమిటంటే, రోహిత్ ఆత్మహత్య పాత సందర్భానికి కొనసాగింపు మాత్రమే తప్ప కొత్త సందర్భం ఎంతమాత్రం కాదని అవి నొక్కి చెబుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో దళితుల ఆత్మహత్యలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి. ఒక దళిత విద్యార్థి ఆత్మహత్యను జాతీయస్థాయికి పెంచి మీడియా రభస చేయడం వెనుక మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జరుగుతున్న మతపరమైన ఘటనలు, అసహనం పెరిగిపోవడం గురించిన ఆరోపణల విషయంలోనూ బీజేపీ, దాని మిత్రవర్గాలూ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చాయి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వదలుకోదన్న కోణంలో చూస్తే ఇది నిజం కావచ్చు కూడా.  అయితే, బీజేపీ, దాని మిత్రవర్గాలు ప్రస్తుతం తామున్న ఒక విలక్షణ పరిస్థితిలో; జరుగుతున్నవన్నీ పాతసందర్భానికి కొనసాగింపులే తప్ప కొత్తవి కావని చెప్పడానికి కూడా దీనిని తెలివిగా వాడుకుంటున్నాయి.

అయితే, వాటి అసలు లక్ష్యం దేశాన్ని పాత సందర్భం నుంచి తప్పించి కొత్త సందర్భంలోకి తీసుకెళ్ళడం! ఎందుకంటే, వాటికి తమవైన నిర్దిష్ట భావజాలమూ, ఆచరణా ఉన్నాయి. ఆ భావజాల అవసరాల రీత్యా కుల(దళిత)-మత(ముస్లిం)పరమైన అస్తిత్వాలకు కొత్త నిర్వచనం ఇచ్చి, కొత్తసందర్భంలోకి తీసుకురావడమనే ఒక ముఖ్యమైన అజెండా వాటికి ఉంది.  దీనిని వారు కూడా కాదనరు. అధికారంలో ఉండడం ఆ అజెండా అమలుకు మంచి వెసులుబాటు. తమ భావజాల అజెండాను అమలు చేయలేనప్పుడు అధికారంలో ఉండడమే అర్థరహితం అవుతుంది. అయితే, విచిత్రంగా అవి చేస్తున్నదేమిటంటే;  దేశాన్నికొత్త సందర్భంలోకి తీసుకురావడమనే తమ అసలు లక్ష్యాన్ని తమే కప్పి పుచ్చుకుంటూ;  తమ అజెండా అమలును పాత సందర్భానికి పొడిగింపుగానే అవి చెబుతున్నాయి. చాలా విషయాలలో అవి చేసే వాదనలో ఇదే వైరుధ్యం కనిపిస్తుంది. ఆయా కుల, మత అంశాలను కొత్త సందర్భంలోకి తీసుకు రావడంలో తమకు దేశవ్యాప్తంగా ఏర్పడే ప్రతికూలవాతావరణంలో ఒకవైపు ఆత్మరక్షణలోకి జారిపోతూనే; ఇంకోవైపు కిందపడినా పై చేయి మాదే నని చెప్పుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే, మరో ఎన్నికల తరుణంలో మళ్ళీ అదే అజెండాను పైకి తీస్తున్నాయి. అలాగే, అధికారపక్షంగా ఒకవైపు రాజ్యాంగ పరిధిలో పని చేయవలసి రావడం, ఇంకోవైపు కొత్త సందర్భంలోకి దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ రాజ్యాంగ పరిధిని లేదా స్ఫూర్తిని తనే దాటడం అనే జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. ఇప్పుడున్న ఎన్నికల రాజకీయాల చట్రంలో అవి దళిత, ముస్లిం ఓటర్లను పూర్తిగా దూరం చేసుకోలేవు కనుక; ఒకవైపు కుల, మత పరమైన ఆ గుర్తింపులను దృష్టిలో ఉంచుకుంటూ తమ బ్రాండ్ ‘సంతుష్టీకరణ’ విధానాలను అనుసరించక తప్పదు. మరోవైపు, అలాంటి గుర్తింపులకు అతీతంగా ఒక ఏకశిలా జాతీయతను నిర్మించడమనే తమ భావజాల లక్ష్యం వైపు అడుగులు వేయకతప్పదు.

ఈవిధంగా వాటిది అనేక వైరుధ్యాలు నిండిన దాగుడుమూతలాట. మోదీ అధికారంలోకి వచ్చిన గత ఇరవై మాసాలుగా ఈ దాగుడుమూతల ఆట వివిధ రూపాలలో సాగుతూనే ఉంది. ఒక ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం పాత సందర్భానికి కొనసాగింపుగా కనబడడానికి ప్రయత్నిస్తుంది. కానీ పార్టీ, దాని భావజాలవర్గాలు దేశాన్ని కొత్తసందర్భంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రభుత్వం పైకి నిశ్శబ్ద ప్రేక్షకరూపంలోనూ; అది సరిపోనప్పుడు లోపాయికారీగా ఇతరేతర రూపాలలోనూ ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల నేపథ్యం వాస్తవానికి గత ఇరవై మాసాలుగా సాగుతున్న ఈ దాగుడుమూతల ఆటకు కొనసాగింపే.

రోహిత్ అంబేడ్కర్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు. ఆ యూనివర్సిటీలో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) సహా మరికొన్ని విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. భావజాల విభేదాలు ఉన్న విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం, అవి ఒక్కోసారి హింసాత్మకం కావడం దాదాపు అన్నీ యూనివర్శిటీలలో మామూలే. వాటి పరిష్కారాలు, శిక్షలు యూనివర్సిటీ నాలుగు గోడల మధ్యా; ఇంకా అవసరమైతే శాంతి భద్రతల పరిధిలో జరిగిపోతూ ఉంటాయి. అలా చూసినప్పుడు ఇది పాత సందర్భం. కానీ బీజేపీతో భావజాల మైత్రి కలిగిన ఏబీవీపీ దానిని కొత్త సందర్భంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. విద్యార్థిరంగంలో దళిత/దళితేతర కులాల గుర్తింపులకు అతీతంగా హిందూత్వ ప్రాతిపదికపై అన్ని కులాలను కూడగట్టడం; హిందూ యేతర మతాలను కట్టడి చేయడం దాని లక్ష్యం. పాత సందర్భానికి అదనంగా ఇప్పుడు ఏబీవీపీకి ప్రభుత్వం అనే కొత్త అండ ఉంది. దానిని వాడుకోడానికి ప్రయత్నించింది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగానే ఉంది. దాని ఫలితమే ఏబీవీపీకి అనుకూలంగా  కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, మానవవనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీల జోక్యం. యూనివర్సిటీ పాలక వ్యవస్థ తన ప్రత్యేక ప్రతిపత్తిని పక్కన పెట్టి ఆ జోక్యానికి దారి ఇచ్చింది. రోహిత్ ఆత్మహత్యతో ఇవన్నీ బయటపడేటప్పటికి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఎప్పటిలా, ఇది పాత సందర్భానికి కొనసాగింపే తప్ప, కొత్తగా జరిగింది ఏమీలేదని తనను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. అది విఫల యత్నంగానే పరిణమించింది. ఇలా ఆత్మరక్షణలో పడిపోవడం-ఏదో విధంగా సమర్ధించుకోవడం గత ఇరవై మాసాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక స్క్రీన్ ప్లే.  ఎన్నిసార్లైనా దీనిని పునరావృతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప మడమ తిప్పే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే, దాని అంతిమలక్ష్యం తన భావజాలాన్ని జనంలోకి తీసుకువెళ్లి, దేశాన్ని తను కోరుకునే కొత్త సందర్భంలోకి తీసుకువెళ్లడం.  లోక్ సభలో తిరుగులేని మెజారిటీ, మోదీ లాంటి వ్యక్తి నాయకత్వమూ అందుబాటులో ఉన్న ఈ తరుణంలో ఈ పని  చేయలేకపోతే ఇంకెప్పుడూ చేయలేమని అది భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈవిధంగా దానిది విజయమో, వీరస్వర్గమో తేల్చుకోవలసిన పరిస్థితి.

ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని రాజ్యాంగ నియమనిబంధనలు, ఔచిత్యాల వంటి రకరకాల హద్దులను దాటిస్తే తప్ప పనిజరగదు. ప్రభుత్వమూ, పార్టీ, దాని భావసారూప్య వర్గాలూ పూర్తి స్పృహతో, ఏకీభావంతో ఈ హద్దుల ఉల్లంఘనకు సిద్ధమయ్యాయి. ఎంతోకాలంగా సాగుతున్న ఆత్మహత్యలు, దళిత హింసకు భిన్నంగా, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశం చేసింది ఇదే. నిజానికి కులవివక్షకు, దళిత హింసకు కాంగ్రెస్ తో సహా దాదాపు ప్రధానస్రవంతి పార్టీలు ఏవీ అతీతం కావు. వ్యవస్థాపరంగా చెబితే కులదాష్టీకాన్ని అణువణువునా జీర్ణించుకున్న భూస్వామ్యంతో స్వాతంత్ర్యం తర్వాత కూడా అన్ని ప్రధానపక్షాలూ మమేకమై దానిని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే, సూత్రరీత్యానైనా కులమత వివక్షలేని లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రక్రియకు గత ఆరుదశాబ్దాలుగా మనం అలవాటు పడ్డాం. భూస్వామ్య శక్తులు పూర్తి బలంతో తెరముందుకు రాకుండా ఈ ప్రక్రియ, మళ్ళీ సూత్రరీత్యానైనా వీలైనంతవరకు నిరోధిస్తూ వచ్చింది. ఇంతవరకు అధికారంలో ఉన్న సోకాల్డ్ లౌకిక పక్షాలు రాజకీయంగానూ, లోపాయికారీగానూ కులమత ఆధిపత్యశక్తులతో అంటకాగుతూనే, ప్రభుత్వస్థాయిలో తగుమేరకు తటస్థ పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. కోర్టులు, చట్టాలు, విద్యాసంస్థలు, ఇతర బహిరంగ వ్యవస్థలు పోషించవలసింది అటువంటి తటస్థపాత్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇన్నేళ్లలో కుల, మత హింస చెలరేగినప్పుడల్లా ప్రభుత్వాన్ని కాక, తెరవెనుక శక్తులను దోషులుగా నిలబెట్టడం జరుగుతూవచ్చింది. ఆయా ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలు భిన్న, భిన్న; పరస్పర శత్రుత్వపూరిత భావజాలాల అభివ్యక్తికి స్వేచ్ఛ నిస్తూనే వాటిని రాజ్యాంగం, చట్టాల పరిధి దాటకుండానూ; శాంతి భద్రతల పరిధిలోనూ నియంత్రిస్తూ యధాశక్తి తటస్థ భూమిక పోషిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ ఈ తటస్థత అనే పలచని పొరను కూడా తొలగిస్తున్నాయి. రోహిత్ ఉదంతంలో జరిగింది అదే. ఫలితంగా, ముక్కూ, మొహం లేని వ్యవస్థ స్థానంలో;  రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన, స్పష్టమైన రూపురేఖలు కలిగిన ఒక ప్రభుత్వం ఇందులో దోషిగా నిలబడింది.  రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయికి ఎక్కవలసిన తీవ్ర పరిణామం అయినది అందుకే.  అయినాసరే, ఎంత అప్రతిష్ట పడినా, ఎన్నికల ఓటమి రూపంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు ఆత్మరక్షణలో పడవలసివచ్చినా ఈ తటస్థత అనే పొరను ఎన్నిసార్లైనా ఉత్తరించడానికి బీజేపీ, దాని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ కంకణం కట్టుకున్నాయి. ఎలాగైనా సరే తమ భావజాలాన్ని నెగ్గించుకుని, దేశాన్ని ఎప్పటికైనా పూర్తిగా కొత్త సందర్భంలోకి తీసుకువెళ్ళే కృతనిశ్చయంతో ఉన్నాయి. తటస్థ ప్రదేశంలోకి ప్రభుత్వం చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఉదాహరణలు ఈ ఇరవై మాసాలలో ఇంకా చాలా కనిపిస్తాయి. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగం కల్పించిన తటస్థభూమిక ఎప్పుడైతే బలహీనపడిపోతుందో అప్పుడిక ఈ దేశంలో ఎంతో చరిత్ర కలిగిన రకరకాల శత్రు పక్షాలూ, భావజాలాలూ బలాబలాలు తేల్చుకోడానికి పూర్తి శక్తియుక్తులతో, అత్యంత నగ్నంగా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టడం సహజ పరిణామం. వివిధ భావజాలాలను హద్దుల్లో ఉంచుతూ నియంత్రణ పాత్రను పోషించే ‘రిఫరీ’ అదృశ్యమైనప్పుడు అప్పుడిక NO HOLDS BARRED!

ఇప్పుడు అదే జరుగుతోంది. చూస్తున్నది, చూడబోతున్నది కచ్చితంగా వందలు, వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఒక సంకుల సమరం. అక్షరాలా భిన్న భావజాలాల మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. పాత/కొత్త సందర్భాల మధ్య అమీ తుమీ తేల్చుకోడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న, ఇంకా ముమ్మరం కాబోతున్న పెనుగులాట. ఈ క్షణాన ఢిల్లీలో జరుతున్నది దేశగమనాన్ని గత ఆరుదశాబ్దాల అనుభవానికి భిన్నమైన మలుపు తిప్పగల ఒక అతి పెద్ద రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోగం! ఇది ఎలా పరిణమిస్తుందన్నది కాలానికి విడిచిపెట్టవలసిన ప్రశ్న.

*

 

 

 

 

వారిదే కథాకాశం..!

 

-చందు తులసి

~

 

చందు“రాయడమంటే ……నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం..!

రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.”

ఈ వాక్యాలు  గత ఏడాది సారంగలోనే వచ్చిన వెంకట్ సిద్ధారెడ్డి-సోల్ సర్కస్ కథలోనివి.

***
నిజమే. రాయడమంటే మన లోపల మనం చేసే అన్వేషణ. ప్రస్తుత మన స్వరూపమేమిటో తరచి చూసుకొనే పరీక్ష. ఆదర్శాలు, విలువల రాళ్లతో ఘర్షణ పడి కుబుసం వదిలించుకొని…సరికొత్త రూపం పొందటానికి పడే ఘర్షణ.  ఈ ప్రయాస ఎదుర్కొనేందుకు చాలా కష్టపడాలి. బహుశా అందుకేనేమో ఒక దశ దాటిన కథకుల వేగం తగ్గిపోతుంది.  ఒక్క అక్షరం రాయడానికి వేయి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే తెలుగులో ఇప్పుడు సీనియర్ కథకులు చాలామంది అస్త్ర సన్యాసం చేశారు. ఒకరిద్దరు మాత్రం అప్పుడప్పుడూ చాలా తక్కువగా రాస్తున్నారు.  ఓ వైపు  సీనియర్ కథకులు క్రమంగా తెరమరుగవుతుంటే ఏడాదికేడాది కొత్త కథకులు వేదికపైకి వస్తున్నారు.

గత ఏడాది నామిని రాసిన కథ కోరిన కొండ మీద వాన. తిరుపతి నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరిగే కథ.  భూములకు పెరుగుతూ , మనుషులకు తగ్గిపోతున్న ”విలువ” గురించి జమునమ్మ  అనే పాత్ర నేపథ్యంలో చర్చిస్తుంది. అలాగే మరో సీనియర్ కథకుడు రామా చంద్ర మౌళి రాసిన కథ దిగడానికి కూడా మెట్లు కావాలి. చక్కని శిల్పంతో పాటూ…చిక్కని కథనంతో సాగిపోయే కథ. జీవితంలో ఎదుగుదల కోసం ఉష అనే గాయని సాగించిన గాథ… కథలా కాకుండా ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాగా అనిపిస్తుంది. ఎదుగుతున్నామనుకుంటూ…ఎటు దిగజారుతున్నామో లోతుగా చర్చిస్తుంది.

పురుషాధిక్య భావజాలం, పేద ముస్లింల జీవితాలు, పేదరికంలోని అనుబంధాలను సున్నితంగా వివరించిన కథ  స్కైబాబా రాసిన అన్ మోల్ రిష్తే. టీవీ ప్రోగ్రాములు, ప్రకటనల ద్వారా మనం ఏం కోల్పోతున్నామో, దానికి పరిష్కారమేంటో కొత్తగా చెప్పిన కథ అరిపిరాల సత్యప్రసాద్ రాసిన  అబ్సలీట్ రియాలిటీ.  మహలక్ష్మమ్మ అనే చారిత్రక పాత్ర చుట్టూ అల్లిన ప్రయోగం దాట్ల దేవదానం రాజు కథ మన్యం వోరి మేడ. ఇలా సీనియర్ కథకులు తమదైన ముద్రతో సాగిపోతుంటే….కొత్త రచయితలు కూడా విభిన్న రకాల ప్రయోగాలతో ఆకట్టుకున్నారు.

గత ఏడాది వచ్చిన కొత్త తరం కథకుల్లో ప్రత్యేకించి చెప్పాల్సిన వాళ్లు కొంతమంది ఉన్నారు. రకరకాల కారణాలతో…రంగురంగుల ముసుగులు కప్పుకొని…పైకి ఆనందపు భ్రమల్లో జీవిస్తూ, అంతర్లీనంగా మౌనంగా కుమిలి కుమిలి రోదించే అంతరాత్మలకు, పరదాలను తొలగించి… అసలు జీవించడం అంటే ఏమిటో చూపించిన కథ వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్.  కథ  పేరు దగ్గర నుంచి… కథను నడిపించిన తీరు, కొటేషన్లలా దాచిపెట్టుకోదగిన వాక్యాలు, కథ ముగింపు…ఇలా అన్ని రకాలుగా ప్రత్యేకత సంతరించుకున్న కథ.  సారంగలో మాత్రమే కాకుండా గత ఏడాది వచ్చిన తెలుగు కథల్లోనే ఉత్తమ కథగా సోల్ సర్కస్ ను చెప్పుకోవచ్చు.  అలాగే ఈ కథలోని చిత్వాన్ పాత్ర కూడా పాఠకులను చాలా కాలం వెన్నాడుతుంది.  వెంకట్ సిద్దారెడ్డి రాసిన కాక్ అండ్ బుల్ స్టోరీ, టైం ఇన్ టూ స్పీడ్ కథలు కూడా పాఠకులను ఆకట్టుకున్నాయి. ఐతే కాక్ అండ్ బుల్ స్టోరీ మాత్రం..కథను నడిపించడంలో కొంత సమన్వయం తప్పినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఇతివృత్తం ఎలాంటిదైనా శిల్పంతో ఆకట్టుకోవడం వెంకట్ సిద్దారెడ్డి కలం బలం.

“జీవితమంటే ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు.  జీవితం…ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు చేయాల్సిన సాధన”  అంటూ చిన్నచిన్న పదాలతోనే జీవితానికి సరికొత్త భాష్యం చెప్పిన కథ పింగళి చైతన్య తనదే ఆ  ఆకాశం.  సహజంగా,  సరళంగా…ఒక ప్రవాహంలా సాగిపోయే కథ.  ఒక ఒంటరి మహిళపట్ల సమాజానికుండే అభిప్రాయాలు, సందేహాలకు …తనదైన సొంత వ్యక్తిత్వంతో సమాధానం ఇచ్చిన లక్ష్మి కథ. సాధారణ ఫెమినిస్టు కథలకు భిన్నంగా ఉండడంతో పాటూ లక్ష్మి పాత్రను నడిపించిన తీరు, రచయిత్రి శైలి కూడా పాఠకులను ఆకట్టుకుంటుంది. అలాగే కులాంతరం వివాహం చేసుకున్న మహిళ సమస్య…నామాలు కథ కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Untitled-2

అల్లం కృష్ణ చైతన్య రాసిన …చుక్కలు తాకిన చేతులు కథ కూడా శైలి పరంగా భిన్నమైన కథ. రెండు వేరు వేరు కథలను…రషోమాన్ తరహా టెక్నిక్ తో చెప్పిన ఈ కథలోని మార్మికత పాఠకులను మెప్పిస్తుంది. ఇక భిన్న నేపథ్యంతో పాటూ, తనదైన భాషను, తనదైన ముద్రతో దూసుకొస్తున్న మరో కలం అల్లం వంశీ. ఒక సమస్యను కేవలం ఏకరవు పెట్టడం  కాకుండా…సున్నితంగా చర్చించడం,  మానవ సంబంధాలను బలంగా చెప్పడం వంశీ బలాలు. రిజర్వేషన్ అంశాన్ని మిరకిల్ కథలోనూ, తెలంగాణ-ఆంధ్ర జీవితాల్లో వైవిధ్యాన్ని రెండు పట్టాలు-ఒక రైలు కథలో చర్చించిన తీరు….సహచరి కథ నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి.

వైవిధ్యమైన ఇతివృత్తాలను, కవితాత్మకంగా చెపుతున్న మరో రచయిత్రి వనజ తాతినేని.  ఫేస్ బుక్ అనుబంధాలకు మతం, లింగ బేధం లేదని చెప్పే స్నేహితుడా! రహస్య స్నేహితుడా.., మీడియా రంగంలో మహిళలపై వేధింపులను చర్చిస్తూ కుక్కకాటుకు-చెప్పుదెబ్బ లాంటి పరిష్కారాన్ని చూపిన కథ పిడికిట్లో పూలు. ఇతివృత్తాన్ని అందంగా చెప్పే వనజ తాతినేని కథలు ఆసాంతం చదివిస్తాయి. శైలి పరంగా షాజహానా-మనిషి పగిలిన రాత్రి ప్రత్యేకమైన కథ. అద్భుతమైన చైతన్య స్రవంతి పద్ధతిలో,  ఒక మహిళ భావాలకు అద్దం పట్టిన కవిత్వం లాంటి కథ.
బొట్టు, అదే ప్రేమ లాంటి కొత్త తరహా ఇతివృత్తాలతో ఆకట్టుకున్న మరో యువ రచయిత్రి ఎండ్లూరి మానస. ముఖ్యంగా అదే ప్రేమ కథలో ఒక సున్నితమైన అంశాన్ని చర్చకు పెట్టారు. స్వేచ్ఛ, లెటర్స్ , కీమాయ కథలతో ప్రజ్ఞ వడ్లమాని కూడా మెప్పించారు.  మైడి చైతన్య రాసిన నెర్లిచ్చిన అద్దం, అసంపూర్ణం కథలు శిల్పం, శైలి పరంగా ఆలోచింపజేస్తాయి. ది ప్రొఫెషనల్ కథతో గమన,  కృష్ణజ్యోతి కథ- పతి పత్నీ ఔర్ జస్ట్ నథింగ్, స్నాప్ ఔట్ కథతో మమత కొడిదెల, మయూఖ కథతో సెలవు లాంటి రచయితలు కొత్త తరం….భవిష్యత్ కథపై ఆశాభావాన్ని, భరోసాని కలిగిస్తారు. మొత్తంగా కొత్త తరం రాస్తున్న కథలని పరిశీలిస్తే  ఇతివృత్తం కన్నా శైలికి, శిల్పానికి ప్రాధాన్యం పెరగడాన్ని మనం గమనించవచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు, భిన్న పోకడలతో  ప్రత్యేక గుర్తింపు కోసం,  తెలుగు కథని ఇంకో మెట్టు ఎక్కించడానికి కొత్త తరం కలిసి కట్టుగా చేస్తున్న ప్రయత్నించడం నిజంగా సంతోషకరం.

శైలి, శిల్పం పరంగా కె.ఎన్. మల్లీశ్వరి రాసిన రూబా, శైలజా చందు-వాన కథ, మైథిలి అబ్బరాజు- రాజహంస,  జి. వెంకట కృష్ణ-స్మృతి, ఉత్తమ కథలు. ఇంకొన్ని కథల్లో అసలు తీసుకున్న ఇతివృత్తాలే చర్చకు దారి తీసిన కథలూ ఉన్నాయి. వాటిల్లో పి. వసంత లక్ష్మి రాసిన వారిజ కథ ప్రధానంగా చెప్పుకోవచ్చు. తల్లి కావడానికి పెళ్లి చేసుకోకుండా…జీవితంతో కొత్త ప్రయోగం చేసిన మహిళ కథ వారిజ.  సహజీవనాన్ని కేవలం మాతృత్వానికి మాత్రమే పరిమితం చేసిన వారిజ నిర్ణయం కొత్తగా ఉన్నా …ఆచరణ సాధ్యమా అనే సందేహాన్ని, ఆ తర్వాత పర్యావసానాల గురించి ఆలోచింపచేస్తుంది. తాత్కాలిక ఆకర్షణలకు లోనై వివాహ బంధాన్ని చిన్నాభిన్నం చేసుకున్న మహిళ కథ బుద్ధి యజ్ఞమూర్తి రాసిన తెగని గాలి పటం. ఈ కథలో కమలిని పాత్ర ప్రవర్తన, అందుకు ఆమె భర్త శేఖర్ ప్రతిస్పందన విచిత్రంగా ఉంటాయి.

ఇదే తరహా అంశంతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ గురించి చర్చించిన మరో కథ కృష్ణవేణి రాసిన తెగిన గాలిపటం. ఈ తరహా కథలన్నీ ఆధునిక మహిళల ఆలోచనలకు అద్దం పడుతూ… వివాహ వ్యవస్థలో ఇమిడిపోలేక ఎదుర్కొంటున్న సంఘర్షణను చూపిస్తాయి. కానీ వాటికి రచయితలు చూపిన పరిష్కారం సమంజసమా ( ముఖ్యంగా వారిజ కథలో ) అనే సందేహం కలుగుతుంది.
ఇక్కడో ఆసక్తి కరమైన విషయమేమిటంటే…మిగతా సాహిత్య ప్రక్రియల సంగతి ఏమోకానీ ఇటీవలి కాలంలో కథా ప్రక్రియలో పురుషుల కన్నా మహిళా రచయితలే అధికంగా రాస్తున్నారు. ఒకప్పుడు నవలా ప్రక్రియను మహారాణుల్లా ఏలిన మహిళలే…సమీప భవిష్యత్తులో తెలుగు కథను కూడా తమ చేతుల్లోకి తీసుకొనే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐతే ఇందుకు దారితీస్తున్న పరిస్థితులేమిటి..?  ఏ కారణాల చేత మహిళా రచయితలు అధికంగా రాస్తున్నారు.?  ఏ అంతర్గత సామాజిక పరిస్థితులు వారిని ఈ దిశగా నడిపిస్తున్నాయన్నదీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

( ముగింపు వచ్చేవారం )

కవిత్వం కాకి బంగారం కాదు: అనిశెట్టి రజిత

 

boorlaకవయిత్రి సామాజిక ఉద్యమ కారిణి అనిశెట్టి రజిత తన చిన్ననాటి నుండే ప్రజా ఉద్యమాలతో మమేకమైనవారు. కాళోజీ అడుగుజాడల్లో నడిచినవారు. ఇప్పటి వరకు ఐదు కవితా సంపుటాలు, తన సంపాదకత్వంలో అనేక కవితా సంపుటాలు ప్రకటించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల తెలంగాణ రచయితల వేదిక అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా అన్నవరం దేవేందర్, బూర్ల వేంకటేశ్వర్లు వారితో జరిపిన ముఖాముఖి.

 • అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం స్వీకరిస్తున్నారు కదా! ఎలా అనుభూతి చెందుతున్నారు. అలిశెట్టి ప్రభావం మీ కవిత్వం మీద ఉన్నదా? ఆయన కవిత్వం పై మీ వ్యాఖ్య?

#  అలిశెట్టి ప్రభాకర్ స్మృతిలో ఒక పురస్కారం ఒకటి కరీంనగర్ తెలంగాణ రచయితల వేదిక నెలకొల్పడం, ప్రతి సంవత్సరం 12జనవరిని చరిత్రాత్మకం చేస్తుంది.  ఈ పురస్కారానికి ఈ సంవత్సరం నన్ను ఎంచుకోవడం ఆనందం కలిగినా చాలా ఆలోచిస్తున్నాను.

39 ఏళ్ల వయసు నాటికి ఒక అరాచకత్వంతో, క్రమ శిక్షణా రాహిత్యంతో, దారిద్ర్యం పడగ నీడలో బతికిన మంచి కవి సాహితీలోకం నుండి నిష్క్రమించడం తలుచుకుంటే విషాదం కమ్ముకుంటున్నది.

అలిశెట్టి కవిత్వంతో నాకు ఉన్న పరిచయం అప్పట్లో ఎక్కువేమీ కాదు. గత మూడు సంవత్సరాలుగా చాలా లోతైన అనుబంధం ఏర్పడింది. ఎంత పదునైన కవిత్వం అది. అంత చిన్న పదాల్లో అత్యంత పెద్ద భావన, చురుక్కుమనిపించే మినీ కవితలో లోకం తీరును అనితరసాధ్యంగా ప్రతిబింబిస్తుంది ఆ కవిత్వం. simply he is a great poet. పరోక్షంగా ఆయన కవిత్వ ప్రభావం నాపైన ఉన్నదనే అనుకుంటాను.

 • నలభై ఏళ్లకు పైగా సాహత్య రంగంలో ఉన్నారు. ఇప్పటికి ఐదు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, నానీలు, హైకూలు, కథా సంపుటి, ఎనిమిది సంకలనాలకు సంపాదకత్వాలు వెలువరించారు. ఒకరకంగా చెప్పాల్సివస్తే తక్కువగా రాసినట్టే…క్రియాశీల ఉద్యమాల్లో పాల్గొన్నందున ఇలా జరిగిందా!

#  పైన పేర్కొన్న ప్రక్రియలే కాకుండా మరో రెండు ప్రక్రియలు వ్యాసం, పాట కూడా నేను రాసాను… రాస్తున్నాను. ప్రచురించబడిన రచనలు ఉన్నట్లే సంకలనం కాని రచనలు వివిధ పత్రికల్లో వచ్చినవి ఎన్నో ఉన్నాయి… కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పని చేస్తూ సమయం సరిపోక ఇంకా ఎక్కువగా రాయలేక పోయాను అనేది లేదు.

నిజానికి ప్రజాతంత్ర ఉద్యమాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొనడం వల్లనే రాయగలుగుతున్నాను. ఆ క్రియాశీల భాగస్వామ్యమే లేకపోతే బహుశా నేనూ “వాలుకుర్చీ” రచయితగా మిగిలిపోయి ఉందును as a careerist and as a professional writer గా…

 • మీరు పౌర, స్త్రీ వాద, ప్రజాతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు కదా! ఆయా ఉద్యమాల ప్రభావం సమాజం మీద క్రియాశీలంగా పని చేస్తుందా! ఫలితాలెలా ఉన్నాయి…

#  ఉద్యమాలు క్లిష్టమైన సామాజిక సాంస్కృతిక సమస్యల నుండే కదా పుట్టేది! వాటిలో పాల్గొనడం అంటే ప్రతి రోజూ ప్రతి క్షణం ఒక సంక్షోభం… అందుకే నేనంటాను ఉద్యమాలు ఉల్లాస క్రీడలు కావు అవి ప్రతినిత్యం జీవన్మరణ వేదనలని..

ఉద్యమాల ప్రభావం సమాజం మీద శాశ్వతంగానో సుదీర్ఘంగానో ఉండదు… అది తాత్కాలికంగానే ఉండదు… ఒక ఉద్యమం లోని కొన్ని డిమాండ్లు pass కాగానే సమూల మార్పులు జరిగిపోవు.. ఉద్యమాలకు చివరి అధ్యాయాలుండవు… ఒక తేదీన మొదలయి మరో తేదీన ముగిసిపోవదమూ ఉండదు. ఫలితాలు కూడా పాక్షికంగానే ఉంటాయి. సంపూర్ణతకు అర్థం లేదు. ఈ యథాతథ సమాజం కూలిపోయి సరికొత్త సమాజం ఏర్పడినపుడే ఉద్యమాలు మరో సృజనశీల రూపం తీసుకొని ప్రజా బాహుళ్యాన్ని  చైతన్య శీలురుగా మారుస్తాయి.. ఉద్యమాలు ఇంకెంతో పెరుగాల్సి ఉన్నది.. హేతు బద్ధత విస్తరించాల్సి ఉన్నది…

 • తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం అనుకున్న నిర్మాణానికి అడుగులు పడ్తున్నయా, ఎట్లా ఫీల్ అవుతున్నారు! ‘పునర్నిర్మాణం’ ‘బంగారు తెలంగాణ’ పట్ల మీ భావం ఏమిటి?

#  తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, భౌగోళికంగా సాధించుకున్నాం.. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తన భావజాలంతో పని చేస్తున్నది.. అంతేనా..? ప్రత్యేక రాష్ట్రం కోసం కదిలిన సకల జనుల ఉద్యమ పాత్ర అయిపోయినట్టేనా..? చేయాల్సింది చేసినం. ఇక చేయవలసిందంతా సర్కారే అనుకుంటే అతి పెద్ద ప్రమాదం… దీనివల్ల అంతా సమసిపోయిందనే అనుకోవాల్సి వస్తుంది.

ప్రజలు ఆలోచించడం.. పని చేయడం ఆగిపోయి ఎదురుచూడటం… అడుక్కోవడం మొదలయ్యిందంటే ఉద్యమ ప్రభావం అంతరించినట్టే… ఉద్యమాన్ని గతంలోకి నెట్టేస్తే ఈ నిర్మానంగానీ, పునర్నిర్మాణంగానీ, ప్రజా తెలంగాణ గానీ ఏదీ సాధ్యం కాదు.

ప్రజలు సంతోషంగా ఉన్నారా.. మెలకువతో ఉన్నారా.. సుభిక్షమైన తెలంగాణే బంగారు తెలంగాణంటే.. దాని కోసం తమ భాగస్వామ్యాన్ని గుర్తిస్తున్నారా.. తమ పని అయిపోయిందని చేతులు దులుపేసుకుంటున్నారా.. తమ ఆకాంక్షలు ఏమిటి? అవి తీరే దారి ఏమిటి? వీటి గురించి చిత్త శుద్దితో ఆలోచిస్తేనే ఏదైనా సాధ్యం…

 • ప్రస్తుత కవితారంగం ఎటువైపు ప్రయాణిస్తున్నది? ఇంకా ఎలాంటి మార్పును తీసుకోవలసి ఉన్నది?

#  కవిత్వం మన లోపల కాలుష్యాలను ప్రక్షాళనం చేసి మంచి వైపుకే లాక్కుపోతుంది. కవితారంగం బాగా రాణిస్తున్నది…పురోగమిస్తున్నది… ఎటొచ్చీ కవులే కార్మికులు కాకుండా వైట్ కాలర్ ఉద్యోగుల్లా ప్రవర్తిస్తున్నారు. ముసుగు వీరుల్లా ముసుగు మనుషుల్లా సొంత డబ్బాలు మోగిస్తూ.. కోటరీలను తయారు చేసుకుంటూ..లొంగిపోయి బతుకుతున్నారు.

దేనికి లొంగిపోయి అంటే తమ వ్యక్తిగత అవకాశాల కోసం, కీర్తి కండూతి కోసం తమను తాము గొప్ప కవులుగా ప్రమోట్ చేసుకోవడానికీ.. సొంత దుకాణాలను బాగా అభివృద్ధి చేసుకొని ‘యాజమాన్యం’ చెలాయించడానికి దొంగ దారుల్లో.. పక్క దారుల్లో.. తప్పుడు దారుల్లో అడ్డదారులు పట్టి ఎగబడిపోతున్నారు. అందమైన తొడుగుల్నీ, ముసుగుల్నీ వేసుకొని చెలామణి అయిపోతున్నారు. సామాజిక స్పృహను కోల్పోయి దృష్టి హీనత్వం తెచ్చుకుంటున్నారు..

కవిత్వం కాకి బంగారంలా సింగారించబడి అహో ఒహోల్ల్లో సుడి చుట్టుకపోతున్నది. మనిషి కానివాడు కవెట్లయితడు? ఈ ముసుగులూ తొడుగుల్నీ చీల్చుకొని నిఖార్సైన మనుషుల్లా కవులు బయిటికి రావాల్సి ఉన్నది.. వ్యక్తిగత కాలుష్యాల నుండి కవిత్వరంగం ప్రక్షాళన కోరుకుంటున్నది.

 • తెలంగాణ ఆవిర్భావం తర్వాత కవి/రచయితల పాత్ర ఎట్లా ఉన్నది? ప్రస్తుత కర్తవ్యం ఏమిటి?

#  చాలా మంది కవులు అయోమయంలో ఉన్నారు… కిం కర్తవ్యం అనే డైలమాలో పడిపోయారు.. దారి తప్పిపోయిన వాళ్ళూ.. దారి తెలియక తచ్చాడుతున్న వాళ్ళుగా చీలిపోయారు.. ఉమ్మడి లక్ష్యం తెలంగాణ వచ్చేసింది.. ఇంకేమున్నది అన్న నిర్లిప్తతలో ఉన్నారు. నిశ్శబ్దం గుహల్లో దాక్కుంటున్నారు.. పిరికితనంతో ముడుచుకుపోయి మూగగా రోదిస్తున్నారు.

ప్రస్తుతమైనా ఎప్పుడైనా కవీ, రచయితా, మేధావీ సమాజానికి సరైన దిశా నిర్దేశకత్వం చేయాలి.. ప్రజా పక్షంలో ఉండాలి.. సమాజాన్ని కాపాడుకోవడం.. ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు చేస్తుండటం మన పని. ఏ బాధ్యతా లేదు, ఏ పనీ లేదు.. ఏ మేధావిగా ఆలోచనా రాదు అనుకుంటే కవిగా, రచయితగా, మేధావిగా, అంతా end అయినట్టే…

ఇప్పుడు కవులూ రచయితలూ చాలా మంది తమకో కర్తవ్యం బాధ్యత అస్తిత్వం ఉందనుకుంటున్నారా? అచేతనం నీడలో విశ్రమించకుండా ‘సోయి’ లోకి రావడం తక్షణ కర్తవ్యం. ఎటు గాలి వీస్తే అటు కొట్టుకపోవడం అగమ్యం.. అరాచకం.. దీన్ని గుర్తెరిగి కవులు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది.

 

 

 • ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నారా?

నేనింకా చెప్పదల్చుకున్నది.. కవులు తమ బాధ్యత గుర్తెరుగక పొతే, మాట్లాడటం ఆగిపోగానే మనిషి నత్తగుల్లలోకి పలాయనం చిత్తగించినట్టవుతుంది. లాలూచీలు, రాజీ పడటాలు, పటాటోపాలు, తళుకు బెళుకులు కవులు రచయితలకు సంబంధించిన లక్షణాలు కావు.

అటు ఇటు కాకుండా ఏదో కవిత్వం కెలికి కవులమని రచయితలమని పురస్కారాలు పుచ్చుకుంటే అది ఆత్మవంచనకు పరాకాష్ట. సమాజం కోసమే కలం పట్టాలె… ప్రజల కోసమే నిలబడాలె. అదీ కవంటే.. అదీ కవిత్వమంటే.. ఇయ్యాల అలిశెట్టి ప్రభాకర్ కవిగా అందుకే చిరంజీవుడు.

ఇప్పుడున్న ఇంకొక ట్రెండ్ అకవిత్వం… అకవుల బెడద.. కవిత్వం సాధన చేయకుండా అకవులు వెల్లువెత్తుతున్నారు.. ఇక బోగస్ కవులూ పుడ్తున్నారు.. అవకాశవాదం ఎంతకైనా లోబడుతుంది. లోబడు కవులూ తేలుతున్నారు. ఈ చరిత్ర ద్రోహం నుండీ, చరిత్ర హీనత్వం నుండీ బయట పడమని నేను కవులనూ రచయితలనూ కోరుతున్నాను.

 

2015: కొత్త కలాల కథాకళి

      

( కథా సారంగ-2015 సమీక్ష )

~

chanduఅనంత గమ్యం వైపు సాగిపోతున్న మహా ప్రవాహం కాలం.  చాలా మంది  కాలం మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం.
***

గడిచిన ఏడాది 2015 మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపింది.  మన చుట్టూ తనదైన ముద్రలను ఎన్నో వదిలి వెళ్లింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాల వల్లనే కాక సాహిత్య పరంగా కూడా గత సంవత్సరానికి ఓ విశిష్టత ఉంది. సాధారణంగా సాహిత్యం, సాహిత్య కారులు…రాజకీయ పాలనా అంశాలను ప్రభావితం చేసే సందర్భాలు చాలా తక్కువ. ఏ అవార్డులో, పురస్కారాల సందర్భంలో తప్ప… సాహిత్యం,  రచయితలు ప్రధాన వార్తా స్రవంతిలో ఉండడం చాలా అరుదు. అలాంటిది… గడచిన ఏడాదిని సృజనకారులే నడిపించారని చెప్పుకోవచ్చు. వివిధ రకాల అంశాలపై వారి స్పందన పట్ల…. విభిన్న రకాల అభిప్రాయాలున్నా కూడా, మొత్తానికి సృజన కారులు అప్రమత్తంగానే ఉన్నారన్న భావన ఎవరికైనా సంతోషాన్ని కలిగించేదే.  మన తెలుగు నాట కూడా ఇదే సందడి కొనసాగింది.  రకరకాల వాదనలు, చర్చలు, అభిప్రాయాలు, నిరసనలు…ఇలా 2015  వేగంగా గడిచిపోయింది.

వీటన్నింటిని నేపథ్యంగా తీసుకుంటూ సారంగ పత్రికలో గత ఏడాది కాలంలో వచ్చిన కథలను పరిశీలిస్తే… మనకు చాలా విషయాలు అవగతమవుతాయి.  గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ సంవత్సర కాలంలో యాభై మూడు పెద్ద కథలు, పందొమ్మిది చిన్న కథలు వచ్చాయి.  ఇవి కాకుండా  అనిల్-ఎస్-రాయల్  అనువాద కథ బ్రహ్మాండం,  అనురాధ నాదెళ్ల రాసిన గూడెం చెప్పిన కథలు లాంటి ఇతర కథలు కూడా వచ్చాయి. నామిని,  రామాచంద్రమౌళి లాంటి సీనియర్ కథకులు ఎప్పటిలాగే తమ కథాయజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.  అలాగే వెంకట్ సిద్ధారెడ్డి,  పింగళి చైతన్య, అల్లం ‌వంశీ, రేఖా జ్యోతి వంటి….చాలామంది  కొత్త రచయితలు వెలుగు చూడడం సంతోషకరం. పేరుకే కొత్త రచయితలైనా…వస్తువు ఎంపిక, శైలి, శిల్పం పరంగా మంచి పరిణతిని చూపిస్తున్నారు.

Artwork: Bhavani Phani

Artwork: Bhavani Phani

ఈ ఏడాది కథలన్నీ చదివిన తర్వాత…ముందుగా ఒకటి చెప్పాలి. “తెలుగు భాష త్వరలోనే అంతరించిపోతుందని” ప్రచారం చేసే వారికీ, “అవునా..?” అని భయపడేవారికి.  మరేం ఫర్వాలేదు,  తెలుగు భాషకే కాదు… తెలుగు కథకు కూడా ఇప్పట్లో ఏ ప్రమాదమూ లేదని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.

ముద్రణా పత్రికల కథలతో పోలిస్తే…, సారంగలాంటి అంతర్జాల పత్రికల కథలకు కొన్ని తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. రకరకాల కారణాలతో దినపత్రికలు లేదా ఇతర వార పత్రికలు  కొన్ని రకాల ఇతివృత్తాలను అంగీకరించలేని పరిస్థితి. పైగా ఎంత కాదన్నా అక్కడ సీనియర్ కథకులు, పేరు మోసిన వారి కథలకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటోంది. ఎప్పడో తప్ప కొత్త రచయితల కథలు రావు. ఇందుకు ఇతర కారణాలూ ఉండొచ్చు.  ఆ రకంగా ఆన్ లైన్ పత్రికల కథల్లో కొత్త రక్తం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటోంది.  దాంతోపాటూ ఏ తరహా ఇతివృత్తానికైనా ఆన్ లైన్ పత్రికలు కొంత వెసులు బాటు ఇవ్వడం కూడా కొత్త దనం కనిపించడానికి కారణమవుతోంది. అలా కథా సారంగ ద్వారా పాఠకులకు చాలా కొత్త కలాలు పరిచయమయ్యాయి.

ఆ రకంగా వస్తున్న కొత్త తరంలో విభిన్న ఇతివృత్తాల ఎంపిక,  శైలి శిల్ప పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ కొందరు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అప్పటికే చాలామంది రాసిన ఇతివృత్తాలని కూడా…. మూలాల్లోకి వెళ్ళి అన్వేషించి కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. కొన్ని కథలైతే..అనుభవజ్ఞులైన రచయితలకూ తీసిపోని విధంగా ఉన్నాయి.

ఐతే ఇదంతా ఒకవైపే. మరో వైపు ఊహాజనిత సమస్యలు,  కృత్రిమ ఇతివృత్తాలు సృష్టించిన వాళ్లూ ఉన్నారు.  తమ సొంత గొడవలనే కథల పేరుతో దేశం మీదికి ప్రయోగించిన వాళ్లూ లేకపోలేదు.  కొన్ని కథలైతే డైరీలో దినచర్యను తలపించినవి కూడా లేకపోలేదు.  అయినా కూడా  కథలు రాయాలన్న తపనతో… ఓ అడుగు ముందుకు వేసినందుకు వీరినీ భుజం తట్టాల్సిందే. చిన్న చిన్న లోపాలున్నా… కొత్త కథకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారినీ పరిగణనలోకి తీసుకుంటున్న సారంగ సంపాదకులనూ అభినందించాల్సిందే.

చాలా మంది కొత్త రచయితలు  తమకు ఎదురైన సాధారాణ సంఘటనలనే కథలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. కథలు రాసే కొత్తల్లో ఏ రచయితలకుండే ఆవేశం, అత్యుత్సాహం వల్ల… కనిపించే ప్రతీ ఘటననూ కథలుగా రాయాలనుకుంటారు. పొద్దున సిటీ బస్సులో సీటు దొరక్క పోవడం నుంచీ…రాత్రికి సీరియల్ లో లేడీ విలన్ ప్రవర్తన  దాకా…కనిపించే ప్రతీ ఘటనను కథలుగా సంధించాలనుకుంటారు. అది మంచిదే. కథలు రాయాలన్న తపన అభినందనీయమే కానీ ప్రతీ అనుభవమూ కథ కాదని తెలుసుకోవాలి.  కథకు సంబంధించిన కొన్ని మౌలిక లక్షణాలపై  కొత్త రచయితలు మరింతగా అధ్యయనం చేయాలి. కవితకు సరిపోయే తక్షణ భావావేశం… కథగా మారినపుడు మాత్రం సంతృప్తి పరచదు.

అలాగే  కొత్త రచయితలే కాక…సీనియర్లు కూడా దృష్టి కోణంలో వ్యక్తిగత జీవిత పరిధిని దాటలేక పోతున్నారు. తమకు తెలిసిందే రాయాలన్నదే మంచి నిర్ణయమే ఐనా కేవలం తమ కతలే….కథలు కాబోవని కూడా గుర్తించాల్సి ఉంది.   సృజనకారులకు వ్యక్తి గత జీవితం, వ్యక్తిగత బాధ్యతలే కాదు… సాంఘిక జీవితం, సామూహిక బాధ్యతా ఉంటాయి.  తమ వ్యక్తిగత దృక్కోణంలోంచే కాకుండా….సమాజ కోణంలోంచి కూడా  అంశాలను తప్పక పరిశీలించాలి.

artwork: Srujan

artwork: Srujan

ఇక ఇక్కడ లోతుగా చర్చించాల్సిన విషయమూ ఇంకొకటి ఉంది. మాండలికం కథల గురించి.  ఏదీ మాండలికం..? ఏదీ యాస…? ఏదీ గ్రామ్యం…ఏది వ్యవహారం…? అంటూ ప్రశ్నించాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే కొందరు మాండలికం పేరుతో….కేవలం గ్రామ్యం రాస్తున్నారు.  నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొన్ని పదాల ఉచ్ఛారణను తమకు అనుగుణంగా మార్చుకున్న వాటినే మాండలికం అనుకుంటున్నారు. కథకు తగిన విధంగా, పాత్రకు అనుగుణంగా  ఏభాష వాడినా అభ్యంతరం ఉండదు. కానీ ఓ పక్క గ్రామ్యం రాస్తూ….మళ్లీ మధ్య మధ్యలో  సంస్కృత భూయిష్ట సమాసాలు, ఆంగ్ల భాష పదాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?

కొంచెం ఇష్టం కొంచె కష్టం అన్నట్లుగా….కొంచెం కథ రాసి, ఇంకొంచెం కవిత్వం కలిపి రాసిన వాళ్లూ ఉన్నారు.  తెలుగు కథల్లో వస్తున్న ఓ ఆధునిక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది.     అలాగే  ఒక సున్నిత సమస్యను తీసుకొని …దాన్ని వ్యతిరేకించేవారు కూడా అద్భుతం అని మెచ్చుకునేలా రాసిన కథలూ ఉన్నాయి.  వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్ కథ, పింగళి చైతన్య -తనదే ఆకాశం, అల్లం వంశీ మిరకిల్…ఎండ్లూరి మానస అదే ప్రేమ..కథలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంచుకున్న ఇతివృత్తాలు వివాదాస్పద అంశాలైనా…చెప్పిన కోణం, ఒప్పించిన తీరుతో పాఠకుల్ని ఆకట్టుకున్నాయి.

రైతు ఆత్మహత్యలు, కొత్త రాజధాని కోసం భూ-సేకరణ, కరువు, వివేక్, శృతి ఎన్ కౌంటర్… లాంటి అంశాలు గత ఏడాది తెలుగునాట తీవ్రంగా చర్చకు వచ్చాయి. కానీ ఈ కథల్లో అలాంటివేమీ కనపడవు. రైతు ఆత్మహత్యలు, భూ సేకరణ మీద మాత్రం ఒక్కో కథ వచ్చాయి.  అంటే సామాజిక సమస్యలు రచయితలను స్పందింప జేయలేకపోయాయా..? లేదా రచయితలు స్పందించలేకపోయారా..?

వివాహేతర సంబంధాల పట్ల ఆసక్తి, స్వలింగ సంపర్కుల  సమస్యలు వంటి సున్నిత అంశాలపైన కూడా స్పందిస్తున్న మన కథకులు … సామాజిక సంక్షోభాల్ని, సమాజాన్ని కుదిపేస్తున్న తీవ్ర పరిణామాలను మాత్రం ఎలా పక్కకు పెట్టగలుగుతున్నారు…?  ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నారా అన్న సందేహమూ కలుగుతుంది…?
ఇలా రకరకాల అభిప్రాయాలకు తావిస్తున్న కథా సారంగ కథలను వివరంగా చర్చిద్దాం.

                                      (మిగతా వచ్చే వారం)

స్మితా పాటిల్: వెలిగి నిలిచిన రూపం…

 

 

ల.లి.త.

~

 

    ల.లి.త.

మట్టిప్రమిదలో వెలిగిన దీపం ఆమె. చుట్టుగుడిసె ముందు పెట్టిన మట్టిప్రమిదలోని దీపానికి ఉన్న ఆకర్షణకి ఏది సాటి? నూనెదీపం చీకటి అసల్లేనేలేదనే భ్రాంతి కలిగించదు. చీకట్లని చిన్నగా చెదరగొడుతూ వెచ్చటి కాంతిని పరుస్తుంది. గాలేస్తే వణుకుతుంది. చినుకు మీదపడబోతే ఆరినంతపని చేస్తుంది. నూనె సరిగ్గా అందకపోతే కొడిగడుతుంది. ఎక్కువ అందితే పెద్ద జ్వాలవుతుంది. భ్రమించిన రెక్కలపురుగుల్ని చుట్టూ తిప్పుకుంటుంది. పంచభూతాలనీ పరవశించి మరీ నశిస్తుంది.

‘స్మితాపాటిల్’ అనుకోగానే అందంగా గాఢంగా వెలిగే మట్టిదీపం, మెత్తటి నాగేటి చాలు, ఆషాఢపు జల్లుకు తడిసిన నేలవాసనా, బలమైన సరుగుడు చువ్వా గుర్తొస్తాయి. స్మిత జీవితం పుస్తకంగా వస్తే బాగుండుననిపించేది. ఇన్నాళ్ళకి వచ్చేసింది. స్మిత జీవితంలోని ఒక్క మలుపునీ మెరుపునీ కూడా వదిలిపెట్టకుండా మైథిలీ రావు “Smitha Patil, A brief Incandescence” ను ఎంతో ప్రేమతోనూ ఇష్టంతోనూ రాసింది.  స్మిత జీవితఝరిని తమ జ్ఞాపకాల దోసిళ్ళలోంచి ఆమె తల్లీ, ఆమె స్నేహాన్ని ఎప్పటికీ మరచిపోలేని స్నేహితులూ అందిస్తే  మైథిలీరావు ఆ గంగను అందరికీ పంచింది.

ఒక్క పన్నెండేళ్ళే. అంతకంటే ఎక్కువ లేదు స్మితాపాటిల్ సినిమాల్లో నటించిన కాలం. 1955లో పుట్టిన ఈ నల్లటి బక్కపిల్ల న్యూ వేవ్ సినిమాని వెలిగిస్తుందని ఎవరూ ఊహించలేదు. తల్లి విద్యాతాయి నర్స్ గా పనిచేసింది. సంఘసేవిక కూడా. తండ్రి శివాజీరావు పాటిల్ రాజకీయాల్లో ఉండేవాడు. ఇద్దరూ తమ కులమేమిటో పిల్లలకు చెప్పకుండా పెంచిన ఆదర్శవాదులు. అందరికీ ఉపయోగపడటమే జీవితం అనుకున్నవాళ్ళు.  వాళ్ళ ముగ్గురాడపిల్లల్నీ రాష్ట్రీయ సేవాదళ్ అనే గాంధీవాద సంస్థలో చిన్నప్పుడే చేర్పించారు. దానితో వాళ్లకి కులమతభేదాలు లేకుండా అందరూ సమానమే అనుకోవటం చేతనయింది. చిన్న స్మిత tomboy లా తిరుగుతూ మగపిల్లలతో వాలీబాల్ ఆడుతూ, వాళ్ళని తిడుతూ తిరిగేదట.

సినిమాల్లోకి వస్తానని స్మిత ఎప్పుడూ అనుకోలేదు.  దూరదర్శన్లో మరాఠీ న్యూస్ ప్రెజెంటర్ గా స్మితను రోడ్డుమీద టీవీ షాప్ లో చూసిన అరుణ్ ఖోప్కర్ తన ఇరవై నిముషాల FTII డిప్లొమా ఫిల్మ్ “తీవ్ర మధ్యమ్ (1974)” లో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. బహుమతులతోపాటు మంచిపేరు కూడా వచ్చిన డిప్లొమా ఫిల్మ్ అది.  అందులో తాన్పురా పట్టుకుని నిశ్చలంగా నిర్మలంగా ఉన్న స్మిత రూపాన్ని షబానా అజ్మీతో సహా చాలామంది కళ్ళు ఫోటో తీసుకున్నాయి.  కామెరా ఆమెతో ప్రేమలో పడిపోవటం అక్కడే మొదలైందంటారు మైథిలీ రావు.

తరువాత శ్యాంబెనగల్ ‘చరణ్ దాస్ చోర్’ లో చిన్న వేషమిచ్చాడు. ఇక వరుసగా జబ్బార్ పటేల్, బెనెగల్, ముజఫర్ అలీ, మృణాల్ సేన్ ఇంకా న్యూ వేవ్ సినిమా మహామహులందరికీ స్మితాపాటిల్ ముద్దుబిడ్డయిపోయింది. 70, 80 ల్లో దేశమంతటా పరమచెత్త అని ఏకాలంలోనైనా ఎవరైనా చెప్పగల సినిమాలు వచ్చేవి. మరోపక్క సత్యజిత్ రాయ్ నీ, ఫ్రెంచ్ న్యూ వేవ్ నూ, రిత్విక్ ఘటక్ నూ అనుసరిస్తూ సినిమా అంటే ఒట్టి కలే కాదు మన బతుక్కూడా కావచ్చని చెప్పేవీ,  సినిమాకి ‘కళా’యిపూత పెడితే మెరుస్తుందని కూడా చెప్పేవీ కొన్ని సినిమాలు వచ్చేవి. 90ల నుండీ ప్రపంచవ్యాపారంతో మనం ఏకమవటం మొదలెట్టాక ‘న్యూ వేవ్ సినిమా’ సారంలోనూ రూపంలోనూ అరుదై, పూర్తిగా నశించింది.

స్మితాపాటిల్ దశావతారాలు గా 10 సినిమాలను ఎన్నుకుంది మైథిలీ రావు. అవి మంథన్, జైత్ రే జైత్ (మరాఠీ), భూమిక, అకాలేర్ సంధానే(బెంగాలీ), చక్ర, ఉంబర్తా(మరాఠీ)/సుబా(హిందీ), అర్థ్, బాజార్, తరంగ్, ఆఖిర్ క్యూఁ.  వీటిలో ఒక్క ‘అర్థ్’ మాత్రం పూర్తిగా షబానా అజ్మీ సినిమా.  తను షబానా పక్కన చిన్నగీత అవుతానని తెలిసీ స్మిత అందులో వెయ్యటం గొప్పధైర్యంతో చేసిన పని. సాటి స్త్రీ సంసారాన్ని పాడుచేసిన(?) రెండో స్త్రీగా అప్పటి సమాజం ఏ మాత్రం సానుభూతికి చోటివ్వని బలహీనమైన పాత్ర.  ఆ బలహీనురాలి  split personality ని తను ఎంతబాగా చూపించగలదో తెలియచెప్పడానికే స్మిత ‘అర్థ్’ లో చేసి ఉండొచ్చు. ఏదయినా చేసెయ్యగలనన్న ధైర్యం తనకుండేది. (‘ఇజాజత్’ లో అనూరాధా పటేల్ వేసిన neurotic other woman ను చూస్తే ‘అర్థ్’ లో స్మిత నటనలోని పస తెలుస్తుంది).

smita1

చిన్న వూరినుంచి వచ్చి (అప్పటి పూణేకు ఇప్పటంత నాజూకుతనం లేదు. పైగా స్మిత చదివింది కాన్వెంట్ లలో కాదు) సినిమాల్లో నిలదొక్కుకోవటమే కష్టంగా ఉన్న స్మితకు షబానాఅజ్మీతో పోటీ పెద్ద బాధ అయిపోయింది.  ఉప్పూ నిప్పూలాంటివాళ్ళు ఇద్దరూ. షబానాలో మనసుకంటే బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. స్మిత సరిగ్గా ఆమెకు వ్యతిరేకం. పైగా తమ ఇద్దరి నటనకీ పోలిక తేలేని ‘అర్థ్’ లాంటి సినిమాలో పోలిక తెచ్చి,  స్మిత రెండో నాయికగానే పనికొస్తుందని షబానా అనటం ఆమెను మండించింది.  ‘అర్థ్’ లో స్మిత నటనను ఆమె దశావతారాల్లో ఒకటని చెప్పి   మైథిలీరావు షబానామీద sweet revenge తీసుకున్నారు.

‘చక్ర’, ‘మంథన్’ లాంటి సినిమాల్లో ఊరిని ఒంటినిండా నింపుకున్న స్మితను చూశాక,  తనకు బైక్ నీ  కార్లనీ   వేగంగా నడపటం ఇష్టమనీ, ఎప్పుడూ జీన్స్ లోనే ఉండేదనీ తెలుసుకోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఫోటోలు కూడా చక్కగా తీసేదట. దూరదర్శన్లో వార్తలు చదివేటప్పుడు జీన్స్ మీదే మంచి నూలుచీరలు కప్పుకుని చదివేసేదట. స్టార్ కి ఉండాల్సిన లక్షణాలు అసల్లేవని దిలీప్ కుమార్, రాఖీ మూతులు విరిచారట. చిన్నప్పటి రాష్ట్రీయ సేవాదళ్ స్నేహితుడు తరువాత జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తే అంత మందిలోనూ స్నేహంగా వాటేసుకుని అతన్ని ఇబ్బందిలో పెట్టేసిందట. అల్లరిస్మితనీ,  సాయం చెయ్యటానికి ఎప్పుడూ ముందుకురికే స్మితనీ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకున్నారు స్నేహితులు. ‘అకాలేర్ సంధానే’ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సర్దుకుపోతూ, అందరూ మాంసం, చేపల్తో భోజనం లాగిస్తుంటే, వంటమనిషినడిగి ఓమూల స్టవ్ మీద తను అన్నం, కూరగాయలు వండుకు తినేదట. కరువు ప్రాంతంలోని పేద రైతుకూలీగా ఆమెను తప్ప వేరెవరినీ ఊహించలేనని ధ్రితిమాన్ చటర్జీ (నటుడు) చెప్పాడు. “ఆమెలో పల్లెటూరి అమ్మాయిల ఒంటికదలికల్లాంటి ఒక లయ ఉంటుంది.. మిరపకాయకో రుచీ వాసనా ప్రత్యేకంగా ఉన్నట్టే  స్మిత వ్యక్తిత్వానికి ప్రత్యేకత ఉంటుంది”  అంటాడు అరుణ్ ఖోప్కర్.

ఈ వజ్రాన్ని మెరుగు పెట్టినవాడు శ్యాంబెనెగల్.  మరాఠీనటి హంసావాడ్కర్  జీవితం ఆధారంగా తీసిన “భూమిక’ లో చేసేనాటికి స్మిత వయస్సు ఇరవై ఒక్కేళ్ళు. ఇంకా జీవితమే తెలీని ఆవయసులో,  మొగుడితో బాధలు, ముగ్గురు మగవాళ్ళతో ప్రేమలు, నటన, నాట్యం, పాట … ఇలా ఎన్నో అలజడులున్న హంసా వాడ్కర్  పూర్తి జీవితంలోని ప్రతివొక్క షేడ్ నీ చూపెట్టేస్తుంది స్మిత.  తను మిగతావారిలా NSDలోగానీ  FTIIలో గానీ నటనలో శిక్షణ తీసుకోలేదు. అయినా పుణేలోని FTII  లో స్నేహితులతో తిరుగుతూ ఎప్పుడూ కనిపిస్తూ ఉండటంవల్ల  FTII లో చదువుతోందేమో అనుకునేవారట. నిజానికి శ్యాం బెనెగలే స్మితకు గురువు. ఏదైనా ఇట్టే పట్టేసే చురుకుతనం ఆమె జీవలక్షణం.  సంతోషమొస్తే చిన్నపిల్లలా కీచుగొంతుతో నవ్వే స్మితనవ్వును హస్కీగా తీర్చి, ‘గుండెలోంచి మాట్లాడు’ అని చెప్పి ఆమె ‘నిండుగొంతుక’ను బైటకు తెచ్చాడట శ్యాం బెనెగల్.

స్మిత అందం కూడా వేరే.  నలుపురంగు. ఎదుటివాళ్ళని నిలబెట్టేసే సాంద్రమైన కళ్ళు.  పక్కనుంచి చూస్తే చెక్కిన శిల్పంలాంటి మొహం, పొడవైన మెడా, ‘సన్నగా ఉన్నానని నా శక్తిని తక్కువ అంచనా వెయ్యకండ’ని హెచ్చరించే దృఢమైన చెక్కిళ్ళూ, నిండు పెదవులూ, చువ్వలా నిటారుగావుండే ఆకారం .. ఇవీ స్మితంటే. పెద్దగా ఆరోగ్యవంతురాలు కాదు. ఏ కోణంలోనుంచి చిత్రీకరించినా ఆమె అందంగానే ఉంటుందంటాడు గోవింద్ నిహలానీ.  నిజానికి మరీ అందం ఉట్టిపడే ఐశ్వర్యా రాయ్ లాంటి నటుల్ని చూస్తూ, నటన కంటే మనం వాళ్ళ అందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తూ ఉండిపోతాం. స్మిత ఫోటోజనిక్ మొహంలోంచి సినిమాపాత్ర వ్యక్తిత్వం, బలం, బలహీనతా అన్నీ ముందుకు వస్తాయి. గాఢమైనకళ్ళతో మాట్లాడే మనదేశపు ఆడవాళ్ళ sensuality ని  స్మితాపాటిల్ తో ఎంతబాగా చూపించవచ్చో అర్థమయింది ఆర్ట్ హౌస్ సినిమా దర్శకులకు. ‘భూమిక’, ‘మంథన్’ (శ్యాం బెనెగల్), ‘ఉంబర్తా’ (జబ్బార్ పటేల్), ‘చిదంబరం’ (అరవిందన్), ‘తరంగ్’ (కుమార్ సహానీ) సినిమాలు ఆమె స్త్రీత్వానికి హారతిచ్చేశాయ్. ‘నమక్ హలాల్ ’ లో ‘ఆజ్ రపట్ జాయేతో హమే నా ఉఠయ్యో’ అంటూ స్మిత, అమితాబ్ బచ్చన్లతో ప్రకాష్ మెహ్రా  చేయించిన వానపాటలో ఆమె ఆడతనం చిన్నబోయింది.  ఆ పాట చేశాక స్మిత బాగా ఏడిస్తే  అమితాబ్ తనని ఎదగమని(?!!) సలహా యిచ్చి ఓదార్చేడట. ‘ఉంబర్తా’ లాంటి స్త్రీవాద చిత్రాన్నీ ‘నమక్ హలాల్’ లాంటి పక్కా కమర్షియల్ సినిమానీ  ఒకేసారి చేసిందట. పదిరోజులు ‘ఉంబర్తా’ షూటింగ్ చేస్తే మరో పదిరోజులు ‘నమక్ హలాల్’.  నటిగా ఆమెది ఎంత స్కిజోఫ్రెనిక్ బ్రతుకో  చెప్పటానికి ఇది చాలంటాడు జబ్బార్ పటేల్. వ్యాపార, సమాంతర చిత్రాల్లో దేనికెలా చెయ్యాలో సరిగ్గా అర్థం చేసుకునే తెలివి ఉంది కాబట్టే అంతబాగానూ రెండిట్లోనూ నెగ్గిందని ఓంపురి అంటాడు.

 

‘చక్ర’ సినిమాలో ఆమె చేసిన స్నానంసీను పెద్దపోస్టరైపోయి  అంతటా కనిపించటం స్మితను బాధించింది. నిజానికి ఆ దృశ్యం ఉద్దేశ్యం మురికివాడల్లో ఉండేవాళ్ళ జీవితంలో దేనికీ ఏకాంతం దొరకదని చూపించటమే. అక్కడ ఆడవాళ్ళు బైట పంపు దగ్గర స్నానం చెయ్యటం చాలాసహజం. ఇప్పుడా సీన్ పెద్దవిషయం కాకపోవచ్చు గానీ 80ల్లో సాహసమే.   స్మిత గట్టినిజాయితీతో  ‘చక్ర’ లో ‘అమ్మ’ పాత్రకున్న బలాన్నీ  ధైర్యాన్నీ చూపిస్తూ  ఆ సినిమాలోని ‘voyeurism’ ను దాటి నిలవగలిగిందని మైథిలీ రావు అంటారు.

smita4

వ్యాపార చిత్రాల్లో చేస్తే స్టార్ డమ్ వస్తుంది కాబట్టి ఆ ఆకర్షణతో తను చేసే సమాంతర సినిమాలకు ఎక్కువమంది జనం వస్తారనీ, అలా సమాంతర సినిమాను గెలిపించాలన్న ఆలోచనతోటే వ్యాపార చిత్రాలు చేస్తున్నాననీ  స్మిత చెప్పేది. అలా అనుకుంటూ చెత్త సినిమాలు కూడా చేసేసింది. వాటిలో ‘ఆఖిర్ క్యూఁ’ తప్ప చెప్పుకోదగ్గది లేదు. అయినా వాటిలో ఆమె ఎంత నిజాయితీగా చేసిందో వివరిస్తూ ఆ సినిమాకథలు కొన్ని రాసుకొచ్చింది  మైథిలీరావు . విసుగనిపించినా స్మితాపాటిల్ చేసిన ప్రతి పాత్రనూ ఆవిడ వర్ణించటం వల్ల సమాంతర, వ్యాపార చిత్రాలు ఎంత భీకరమైన తేడాలతో ఉండేవో బాగా అర్థం అవుతుంది.  ప్రతి దృశ్యంలోనూ ఆమె నటనను వర్ణిస్తూ మోహంలో పడిపోతారు మైథిలి.  నిజానికి స్మితను ఎప్పుడూ కలవనేలేదట ఆవిడ.

స్మితాపాటిల్ అంటే గాఢత (intensity) కు నిర్వచనం అంటారు ప్రతి ఒక్కరూ.  “తనే పాత్రగా మారిపోయి లీనం కావటం స్మిత పధ్ధతి కాదు. దర్శకుడికి తనలోని నటిని పూర్తిగా అప్పచెప్పి ఆమె మనసుకు తోచినట్టు నటిస్తుంది. లోపలున్న intensity  ఆమె వేసే పాత్రల మనసు మూలాల్లోకి  ప్రవహిస్తుంది. అందువల్ల చెత్త సినిమాల్లో కూడా ఆమె చేసినపాత్రల ఉద్వేగాలు మనల్ని నమ్మిస్తాయి.  స్మితలాంటి గొప్ప నటులు నటనలో చాతుర్యాన్ని కూడా దాటేసి ఆ సినిమాలు మన జ్ఞాపకాల్లో భాగమైపోయాక కూడా ఎప్పటికీ మనల్ని తాకుతూనే ఉంటార”ని బంగారంలాంటి మాటంది మైథిలీ రావు.

స్మితాపాటిల్  తను నటిస్తున్న పాత్రలు ఎలాటిచోట పుట్టేయో ఎలా నడిచి ఎలా నవ్వి  ఎలా మాట్లాడి  బతుకుతాయో, ఎలాటి బట్టల్లో కనిపిస్తాయో లోతుగా తెలుసుకుంటుందని, ఆలాంటి కుతూహలం అందరిలోనూ ఉండదనీ ‘అనుగ్రహం’ సినిమాకి పనిచేసిన ఆరుద్ర అనేవాడు.

స్మిత తల్లి విద్యాతాయి గట్టిగా కర్రపట్టుకుని పిల్లలను పెంచింది. ఆవిడతో ఎంత ఘర్షణ పడ్డా తల్లే స్మితకు రోల్ మోడల్. ‘ఉంబర్తా’లో సంఘసేవికగా వేస్తున్నప్పుడు ప్రతి నిముషం అమ్మను గుర్తుచేసుకుంటూ నటించిందట. ‘ఉంబర్తా’ కథ విన్నాక జబ్బార్ పటేల్ తో ‘ఈ సినిమా నాదే. ఇంకెవరినైనా తీసుకుంటే నిన్ను చంపేస్తా’నందట. రాజ్ బబ్బర్ తో స్మిత పెళ్లిని విద్యాతాయి ఒప్పుకోలేకపోయింది. బిడ్డను దూరం చేసుకుంది. స్మిత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు ఫిల్మ్ జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించారు. ఒక్క స్నేహితులే వ్యక్తిగా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. “సమాంతర సినిమాకి  పోస్టర్ గర్ల్ లాంటి  స్మితాపాటిల్, నిజజీవితంలో పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నవాడిని  ప్రేమించటాన్ని ఆమె వ్యక్తిత్వంలో భాగంగా సమాజం చూడలేకపోయింద”ని చెప్తాడు మహేష్ భట్. స్మితాపాటిల్ లో కూడా ‘అర్థ్’ లో ఆమె వేసిన పాత్రలోని వైరుధ్యం లాంటిదే ఉందంటాడు. స్మిత చిన్నప్పటినుంచీ తాననుకున్నదే చేసేదట. ‘తను బొహీమియన్’ అంటాడు ఓం పురి. ఓరాత్రి  అందరు స్నేహితులూ కలిసి మాట్లాడుకుంటూ ఓ గదిలో ఉండగా ఓంపురి ఒక్కడినీ బైటకు తీసుకుపోయి నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ఆవరణలో కాసేపు కూర్చుని మాట్లాడిందట. “ఆమెను చూసి ఐదు నిముషాల్లోనే  ప్రేమలో పడని మగవాళ్ళు ఉండరు. ఆమెతో మాట్లాడిన ప్రతివాడూ తననే ప్రేమిస్తోందనీ అనుకుంటాడు. తన ఉద్దేశ్యం అదికాదని ఆమె స్పష్టం చేశాక ఒడ్డునవేసిన చేపలా గిలగిలా కొట్టుకుంటాడు” అంటాడు మోహన్ అగాషే.

రాజ్ బబ్బర్ తో తన పెళ్ళిని అందరూ ఒప్పుకోవాలని అనుకోవటం ఆమె అమాయకత్వం.  పసుపు కుంకుమలూ, పేరంటాలకు విలువిచ్చేదనీ, సీమంతం కోసం ఆరాటపడిందనీ చెప్తుంది మైథిలీరావు కథనం. తను సహచరులుగా ఎన్నుకున్న మగవాళ్ళు కూడా ఆమెకు తగనివాళ్ళే.  “మగవాళ్ళకు నాతో బతకటం చాలా కష్టం. నన్ను నేను ఎంతగా ఇచ్చుకుంటానో అంతగానూ నావాడి నుండి తీసుకోవాలనుకుంటాను. అంత ఆదర్శంగా పరిస్థితి లేద”ని చెప్పిందట స్మిత. గంగమ్మలాంటి స్మితను మోయగల నిబ్బరం ఉన్న శివుడు ఆమె సర్కిల్లో దొరకటం అంత అసాధ్యమేమీ కాదనిపిస్తుంది.  పెళ్లి విషయంలో తనను గట్టిగా తప్పుపట్టిన జర్నలిస్టులను పట్టించుకోకుండా ఉండలేకపోయింది. వ్యాపార చిత్రాల్లో  తెగ నటించి ఆమె అంతరాత్మ అలిసిపోయింది. ఇక ఎక్కువకాలం అవి చెయ్యలేని పరిస్థితి కూడా వచ్చింది. పెళ్ళయిన స్టార్లకే రెండోభార్యలుగా మారిన హేమమాలిని, షబానాఆజ్మీ, శ్రీదేవిల నిర్ణయాలను కొన్నాళ్ళకి సమాజం ఒప్పుకుంది.  ఎలాంటి వ్యాపార చిత్రాల్లో నటించాలో ఎన్నుకోవటంలో కూడా షబానాయే స్మిత కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించింది.

దీపక్ సావంత్ స్మితాపాటిల్ కి సొంత మేకప్ ఆర్టిస్టు. వ్యాపార సినిమాల్లో ఆమెను సున్నంకొట్టినట్టు కాకుండా సరైన లేతరంగుల మేకప్ లో చూపించటం అతని ప్రతిభ. స్మిత అతన్ని పదేపదే ఓ వింత కోరిక కోరేదట. తను చచ్చిపోయినప్పుడు తనను పుణ్యస్త్రీ (సుహాగన్)గా సాగనంపాలని..  Premonitions  తనకు వస్తుండేవట.  పిల్లలంటే చాలా ఇష్టం. గంపెడు పిల్లల్ని కనాలని కోరిక. కుటుంబంతో స్నేహితులతో సడలని బంధాలను అల్లుకుంది. తనా పరా అనేదిలేకుండా   ప్రేమను పంచుతూ పోవటమే.  సేవ చెయ్యటం, పరిచయమైన అందరితో కలిసిపోవటం, కోపమొస్తే తిట్టటమే తెలుసు. ఇప్పటికీ సినిమావాళ్ళు వాళ్ళ ప్రేమల గురించి పత్రికలతో మాట్లాడరు. ఎనభైల్లోనే స్మిత తనకు వినోద్ ఖన్నాతో  సంబంధం ఉండేదని ఫిల్మ్ ఫేర్ కి చెప్పేసుకుని తరువాతి  గోలను తట్టుకోలేకపోయిందట.  ‘తారా’ధూళిని  వెదజల్లటం చేతకాని మామూలు మనిషి…

స్మిత అమ్మకాబోయే రోజుల్లో నెమ్మదిగా విద్యాతాయికి దగ్గరయింది. సముద్రం విశాలంగా కనిపించే చోటా, బాల్కనీలో పడే వానజల్లుల్లో తను హాయిగా తడిసే వాలూ వీలూ ఉన్నచోటా ఒక అపార్ట్ మెంట్ ను బొంబాయిలో కొనుక్కుంది. తనఇంటిని కట్టడంలో శ్రమపడిన కూలీలే గృహప్రవేశానికి మొదటి అతిథులవాలనుకుంది. బిడ్డను కన్నాక  రాజ్ బబ్బర్ ను వదిలేస్తానని స్నేహితురాలితో చెప్పిందట. కొత్త ఇంట్లోకి వెళ్ళకముందే, ప్రతీక్ ను ప్రసవించిన రెండు వారాలకే డిసెంబరు 13, 1986 న బ్రెయిన్ ఫీవర్ తో మరణించింది. బాలెంత జ్వరంతో మూడురోజులు ఆమె హాస్పిటల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోవటం అర్థంకాని పజిల్. పరిస్థితి విషమించాక జస్లోక్ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు.

“ఆమె స్థానాన్ని ఇంకెవరూ పూరించలేరు” అన్నాడు సత్యజిత్ రాయ్. దీపక్ సావంత్ స్మితను సుహాగన్ లాగే ముస్తాబు చేసి సాగనంపాడు.

***

ఈ పుస్తకాన్నిబట్టి,  స్మిత చిన్నతనమూ 1974 నుంచీ 1980 వరకూ వేసిన సినిమాలూ చూస్తే, అభ్యుదయవాదులతో, మేధావులతో, కళాకారులతో సావాసం, స్వేచ్ఛ, తనకు సంతోషాన్నిచ్చే పాత్రలు, షబానాతో పోటీ.. ఇదీ ఆమె జీవితం. ‘80 నుంచీ ’86 లో  చనిపోయేవరకూ వ్యాపారచిత్రాలూ, వాటి జర్నలిస్టులూ, తారలూ కూడా తన జీవితాన్ని ఆక్రమించారు. రెండుచోట్లా బాగానే చేస్తున్నట్టు కనిపించినా రెండురకాల సినిమాల ప్రభావమూ ఆమె మీద పడిందేమో! బొహీమియన్ గా కనిపించిన మనిషి, పెళ్ళీ పసుపు కుంకాల సెంటిమెంట్లలోకి వెళ్లి మనసు బాధ పెట్టుకుందంటే, రెండు ప్రపంచాల మధ్యా సరిగ్గా రాజీ పడలేకపోవటమే అయుంటుందేమో అనిపించింది. నిండైన స్త్రీత్వం కూడా ఒక బాధే…

smita3

స్మితాపాటిల్ జీవితాన్ని తలుచుకుంటే నాకు అరుంధతీరాయ్ ‘గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్’లోని ఒక వాక్యం గుర్తు వస్తుంది. అందులో  రాహెల్ తనతల్లి అమ్ము చనిపోయిన వయసును (31 వ ఏట అమ్ము చనిపోతుంది) ‘a viable die-able age’ అంటుంది. 31 వ ఏటనే చనిపోయిన స్మితాపాటిల్ సినిమాజీవితం వరకూ ‘viable die-able age’ లోనే పోయింది. ఇంత నిస్పృహతో ఎందుకంటున్నానంటే ఆ తరువాత సినిమాల్లో వచ్చిన స్త్రీ పాత్రల్లో దమ్మున్నవి ఎంతవరకూ ఉన్నాయి? “మరో ‘ఉంబర్తా’ నా కోసం తియ్యవా?” అని జబ్బార్ పటేల్ ను బతిమాలారట తబూ, మాధురీ దీక్షిత్.  గాఢతలో స్మితాపాటిల్ కు తీసిపోని తబూ లాంటి నటులకు ఎన్ని మంచి సినిమాలు దొరికాయి?

ఊళ్లలో వాడల్లో ఉన్న ‘మిర్చ్ మసాలా’లాంటి  సోనుబాయ్, ‘మంథన్’ లో ‘బిందు’లాంటి దళితమందారం, ‘చక్ర’ ని తిప్పిన మహాశక్తి ‘అమ్మ’, ‘చిదంబరం’ శివగామి లాంటివాళ్ళని సినిమాల్లోకి తెచ్చేవాళ్ళెవరూ ఇప్పుడు లేరు.  సరైన సమయంలో పుట్టి, సరైన సమయంలో సరైన సినిమాల్లో వేసి వెళ్ళిపోయింది ఆమెలోని ఆర్టిస్ట్.  కానీ నిండుగా  జీవితాన్ని అనుభవించాల్సిన మానవి స్మితాపాటిల్ కథ అర్ధాంతరంగా ముగిసిపోయింది.  బతికుంటే 90ల నుంచీ తనకు తగ్గ సినిమాల్లేక మానసిక హింస పడేదేమో అనిపిస్తుంది, ఈ పుస్తకంలో ఆమె వ్యక్తిత్వం ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాక..

ఆంగ్ల సాహిత్య నేపధ్యంవున్న మైథిలీరావుకి నటన అంటే ఏమిటో బాగా తెలుసు. “Smitha Patil, A brief Incandescence”  చదివితే స్మితాపాటిల్ సినిమాలు చూడనివాళ్ళకు వెంటనే అన్నీ చూసేయాలనిపిస్తుంది.  స్మిత నిండైన స్త్రీ. పరిపూర్ణమైన కళాకారిణి. ఆమె జీవితచరిత్రను మైథిలీరావు లాంటి మనసున్న స్త్రీ రాయటం మరీ సంతోషం.

స్మితాపాటిల్ ను తలుచుకుంటూ శ్యాంబెనెగల్ విద్యాతాయికి ఉత్తరం రాస్తూ, జలాలుద్దీన్ రూమీ కవితను ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో చేర్చిన ఆ కవితతోనే …..

I died mineral and turned plant.

Died a plant to turn sentient.

Died a beast to wear human clothes.

So when by dying did I grow less?

Again from manhood I must die,

And once again released,

Soar through the sky

And here as well I must lose place.

Everything passes, but His face.

*

 

 

 

 

నమ్మకమైన యింకో పడవ ప్రయాణం!

 

 

1

లెబనీస్ కవి ఖలీల్ జిబ్రాన్ కీ, అరుణ్ బవేరాకి చుట్టరికమేమీ లేదు; వాళ్ళ భాషా, వేషమూ, దేశమూ వొక్కటి కాదు. కాని, కవిత్వం అనేది భాషలకీ, వేషాలకీ, దేశాలకీ అతీతమైంది అనుకుంటే, అటు జిబ్రాన్ గుండెలోనూ, ఇటు అరుణ్ మనసులోనూ వొకే రంగు జెండా రెపరెపలాడుతోంది. వీళ్ళిద్దరూ వొకే పడవ మీద రెండు భిన్న సముద్రాల్ని ఎదుర్కొంటూ వెళ్తున్నారు. ఆ మాటకొస్తే, ప్రతి వర్తమాన కవిలోనూ నాకు ఎంతో కొంత జిబ్రాన్ అంశ కనిపిస్తూనే వుంటుంది, యీ కవిత్వ భాష విషయానికి వస్తే!

రంగస్థలం మీదికి  కవి ప్రవేశం వూరికే జరగదు. వచ్చేటప్పుడు కవి చాలా నిశ్శబ్దంగానే వస్తున్నాడు కదా అనిపిస్తుంది. కాని, అతను వెళ్ళిపోయాక అతనేమీ నిశ్శబ్దంగా రాలేదనీ, కొన్ని కొత్త శబ్దాల్ని పలికించి వెళ్ళిపోయాడనీ కచ్చితంగా తెలిసిపోతుంది. ఇలా అనిపించడానికి అతని కవి పేరుకి ముందు “మహా” అనే రెండక్షరాలేమీ అక్కర్లేదు. ఇంకో మాట అనాల్సి వస్తే, ఈ “మహా” అనేది చాలా పొడి మాట. అర్థంలేని అసంబద్ధ అబద్దం. అందుకే, నేను పనికట్టుకొని ఇప్పుడు ఎక్కడో వున్న జిబ్రాన్ నీ, ఇక్కడే మన పక్కనే వున్న అరుణ్ నీ కలిపి మాట్లాడుతున్నా.

జిబ్రాన్ అంటున్నాడు:

By poet, I mean the sailor who hoists a third sail on a ship that has only two, or the builder who builds a house with two doors and two windows among houses built with one door and one window, or the dyer who mixes colors that no one before him has mixed, in order to produce a new color for someone who arrives later on to give the ship of the language a new sail, the house a new window, and garment a new color. (1923)

అరుణ్ కవిత్వం అంతా చదివాక ఇతని కొత్త పదాలు ఏమిటీ, కొత్త సందర్భం ఏమిటీ అన్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో పడ్డాను. ఇతని కవిత్వానికి వొక వర్ణం వుందీ అనుకుంటే ఆ వర్ణానికి వొక పేరుందా అనీ అడుగుతూ ఉండిపోయాను నాలోని చదువరిని!

ఆ మూడు ముఖ్యమైన ప్రశ్నలకూ ప్రతి కవీ ఎంతో కొంత సమాధానం ఇవ్వగలిగి వుండాలని నా నమ్మకం. ఆ సమాధానం వచనంలో కాకుండా ఖాయంగా కవిత్వంలోనే  ఉండి తీరాలని యింకో గాఢమైన నమ్మకం.

 

2

సందర్భం తెలిసిన కవి అరుణ్. అంతే కాదు, యింకో ప్రత్యామ్నాయ కొత్త సందర్భం సృష్టించుకోవాల్సిన అవసరం వుందని నమ్ముతున్న కవి కూడా.

ఒక సందర్భం – క్రిక్కిరిసిన మనుషుల మధ్య గోలగా…

మరో సందర్భం ఖాళీగా…ఒంటరిగా…శూన్యంలా వేలాడుతూ.

ఈ రెండు వాక్యాలలోని రెండు సందర్భాలూ మనకి తెలుసు. మన చుట్టూ ఎంత శబ్దం వుందో, అంతటి నిశ్శబ్దం కూడా వుంది. కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలీనంతగా-  ఇంకా కొన్ని విషయాలు చాలా చాకచక్యంగా నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నాం, ఇంటర్నెట్లోకి! ఇప్పుడు నడిచేదంతా చరిత్రే అయితే, ఆ చరిత్రని ఎట్లా రికార్డు చేయాలన్న సందిగ్ధంలో పడేస్తున్నాం చరిత్రకారుడిని!

కాని, ఇంత సందిగ్ధంలోనూ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతూ, రాబట్టుకోవాల్సిన సమాధానాలు రాబట్టుకోవడం ఏమిటో అరుణ్ కి తెలుసు. అతని ప్రతి కవితా వొక ప్రశ్నలోంచి మొలకెత్తి, సమాధానంలోకి ప్రయాణిస్తుంది. అదిగో, అలాంటి ప్రయాణాలే తన కవిత్వంగా నమోదు చేస్తూ వెళ్తున్నాడు అరుణ్.

అయితే, సందర్భాన్ని మాట్లాడే కవి చాలా సందర్భాల్లో వాచ్యమైపోతూ వుంటాడు. అరుణ్ కి అలాంటి ప్రమాదం లేదు. మరీ వాచ్యం అనిపించే సందర్భాన్ని కూడా తీసుకొని, అందులో కవిత్వాన్ని పొదగడం ఏమిటో, ఆ పరుసువేది ఏమిటో తెలిసిన వాడు అరుణ్. ఉదాహరణకి పైన పేర్కొన్న కవిత చూడండి, ఎలా ముగించాడో!

నువ్వో ఆకాశం, నేనో ఆకాశంగా

మాట్లాడుకుందాం

ఎప్పుడైనా-

ఈ నమ్మకాలు గుర్తొస్తే

జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా

పెనవేసుకుందాం.

చాలా అందమైన భావనతో ముగిసింది ఈ కవిత. అరుణ్ ప్రతి సందర్భాన్నీ అంతే శ్రద్ధగా చెక్కుతాడు కవిత్వ శిల్పంగా- అది ఆ సందర్భం మీద పట్టు వున్నప్పుడే సాధ్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు కదా! ఇంతకుముందు జిబ్రాన్ అన్నాడే – the dyer who mixes colors that no one before him has mixed- అని, కచ్చితంగా అదే పని.

సందర్భం మాత్రమే కవిత్వం కాదు, సందర్భం తన రూపాన్ని తానే discover చేసుకోదు. నిపుణుడైన కవి ఇంకో కొత్త రూపంలోకి వెళ్తే, ఆ సందర్భం పదునెక్కుతుంది. అరుణ్ వొక కవితలో అన్నట్టు:

నాలోని ప్రతి పాత్రా

నిండుతున్నట్టే వుంటుంది,

కాని- మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఖాళీ అవుతుంది.

అన్న వొక సంశయం కవికి నిరంతరం వుండాలి. అప్పుడు సందర్భాన్ని ప్రశ్నించే శక్తి కూడా అతనికి వస్తుంది. అలాంటి శక్తి నిండిన కవిత్వం యిక్కడి యీ ప్రయాణంలో ఎదురవుతుంది.

arun

3

తన ప్రయాణానికి వొక సందర్భం వుందీ అని నాలోని చదువరిని గట్టిగా నమ్మించాడు అరుణ్. ఇది చిన్న విజయమేమీ కాదు. అయితే, ఆ నమ్మకం దగ్గిరే నిలిచిపోయి, అరుణ్ చెప్పినదంతా/రాసిందంతా బంగారం అనుకునే స్థిరత్వం ఈ చదువరికి లేదు. ఇతని కొత్త పదాలేమిటీ అని మెతుకు మెతుకునీ పట్టి వెతుక్కునే దప్పికలో వున్నాను. కొన్ని అందమైన వాక్యాలకే ఈ దప్పిక తీరదు. వాక్యాలకి అతీతమైన జీవజ్వాల ఏదో కనిపించాలి. దాన్ని నేను “తాత్వికత” అనుకుంటున్నాను.

ముఖ్యంగా ఎటు చూస్తే అటు కవిత్వమే వినిపిస్తున్నప్పుడు ఈ తాత్వికత నాకు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం సమకాలీన కవిత్వంలో వాక్యాల వెంట పరుగు కనిపిస్తోంది. వాక్యాన్ని దీపంగా వెలిగించే ప్రయత్నం తక్కువగా కనిపిస్తోంది. వాక్యం దీపం కావాలంటే, కవికి దాని చుట్టూ వున్న చీకటిని సరిగ్గా చూసే కన్ను కావాలి.

అరుణ్ అన్నట్టు:

జీవితం

ఒక నిర్వచనం స్థాయి నుంచి ఎదగడం లేదు.

 అదే మాటని యింకాస్త విస్తరిస్తే, కవిత్వం కూడా వాక్యం స్థాయిని దాటి వెళ్ళడం లేదు. కవులు తమ వాక్యాల్ని తామే ప్రేమించుకోవడంలో తలమునకలై వున్నారు. తన నీడని తానే ముద్దాడుకుంటూ మురిసిపోయే narcissism బాహాటంగా పెరిగిపోతోంది. వొకానొక కాలంలో కవి చాలా సిగ్గరి. యిప్పుడు అలాంటి సిగ్గూ ఎగ్గూ లేదు. కొన్ని సార్లు కవిత్వం మీదనే వెగటు పుట్టించే స్థాయిలో ఆత్మ ప్రేలాపనలు సాగుతూ వున్నాయి. తనని తాను వెతుక్కునే అంతర్నేత్రం మూసుకుపోతోంది. అట్లాగని, బహిర్నేత్రం బలపడుతోందని కాదు. అది మరీ బలహీనమవుతోంది.

అరుణ్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ స్థితుల్ని దాటుకుంటూ వెళ్తున్న వొక composure కనిపిస్తోంది, బహుశా, అది అతని పునాదిలో వున్న వామపక్ష దృక్కోణం నించి వచ్చి వుండాలి. అతని వాక్యాల్ని వేటినీ మనం విడివిడిగా కేవలం కవిత్వంగా చదవలేం. ఉదాహరణకి:

 1. ఒక్క -కల కోసం

కొన్ని వేల సార్లు నిద్రపోవడం

ఒక్క- కరచాలనం కోసం

వేల శరీరాల్ని తవ్విపోయడం.

 

 1. వాన కురుస్తోందంటే

చెట్లు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలనుంది.

 

 1. మనుషులు ఖాళీ చేసిన వూరు

సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతున్న దుఃఖం.

 

 1. ఈ జీవితాన్ని ముందెప్పుడో జీవించినట్టు

యిప్పుడంతా ఖాళీ.

 1. ఏదీ లేకపోవడం లోంచి

ఏదైనా రగిలే వాంఛ.

 

 1. యివాళ మనుషులందరూ

దీక్షా శిబిరాలుగా విడిపోయిన సందర్భంలో

బ్రతకడం అంటే –

దేనికి నిరసనో చెప్పాలి.

ఇవి కేవలం వాక్యాలు కావు. కావుకావుమనే సగటు కవిలోకపు cacophony లో సమాధి అయిపోయే నినాదాలూ కావు.

తన ప్రాణం పెట్టి మాటని బతికించే తపన ఇది. తన కన్నుని దారిదీపంగా వెలిగించి ముందుకు నడిపించే ప్రవాహపు ప్రయాణం  ఇది. యిలాంటి వెలుగు  ప్రయాణాలు మరిన్ని కావాలి, నిజమైన సందర్భాలు అసందర్భాలై పోతున్న ఈ కాలంలో!     *

*

మరల రాని మధుర “వసంతం”

 

 

 

వంగూరి చిట్టెన్ రాజు

~

chitten rajuఅది సెప్టెంబర్ 29, 2015. ఆ రోజు హ్యూస్టన్ మహా నగరం లోని నాసా అంతరిక్ష కేంద్రం చూడడానికి వెళ్ళిన వేలాది సందర్శకులు అక్కడి మిషన్ కంట్రోల్ భవనం మీద ఉన్న అమెరికా జాతీయ పతాకం సగం క్రిందకి దించబడి ఉండడం గమనించి “పాపం ఎవరో గొప్ప వ్యక్తి మరణించి ఉంటారు” అనుకున్నారు. మరో కొన్ని నెలలలో సందర్శకులు అదే ప్రాంగణం లో అమెరికా ప్రభుత్వ వ్యవస్థ అయిన నాసా వారు  మరణించిన ప్రముఖుల జ్ఞాపకార్థం సగౌరవంగా నాటిన వృక్ష సముదాయంలో మరో పారిజాతం పరిమళాలు వెదజల్లుతూ కనపడుతుంది. ఆ వృక్ష నివాళి లో భారతీయ సంతతి కి చెందిన వారు ఇద్దరే. ఇద్దరూ మహిళలే. మొదటిది 2003 లో జరిగిన “కొలంబియా” రోదసీ నౌక ప్రమాదంలో అసువులు బాసిన ఏకైక భారతీయ వ్యోమ గామి కల్పనా చావ్లా. రెండోది గత సెప్టెంబర్ 28, 2015 నాడు ఎవరూ, ఊహించని విధంగా “కపాల మోక్షం” చెందిన పదహారణాల తెలుగింటి ఆడపడుచు, నాసా శాస్త్ర వేత్త డా. పుచ్చా వసంత లక్ష్మి. ఆ వృక్షానికి నేను పెట్టుకునే పేరు “వసంత వృక్షం”. ఎందుకంటే అటువంటి పరిపూర్ణమైన మహిళ  కానీ, ఆ పేరిట కలకాలం నిలిచే వృక్షం కానీ న భూతో, న భవిష్యతి.

గత సెప్టెంబర్ 23, 2015 నాటి దౌర్భాగ్య దినాన ఎప్పటి లాగానే వసంత మధ్యాహ్నం లంచ్ సమయంలో “ఇప్పుడే అరగంట లో వస్తాను” అని తన సాటి వారితో చెప్పి, ఆ మర్నాడు ఒక కాన్ ఫరెన్స్ కోసం కాలిఫోర్నియా వెళ్ళడానికి ఏర్పాట్ల కోసం కారు లో బయలు దేరి, దారి తప్పి, సెల్ ఫోన్ లో ఒక సహా ఉద్యోగిని పిలిచి సరి అయిన దారికి మళ్ళుతున్న క్షణం లో …అంటే ఉదయం 11: 12 నిముషాలకి దేముడు పిలిచాడు. ఏ విధమైన సూచనలూ లేకుండా హఠాత్తుగా బ్రైన్ హేమరేజ్ వచ్చి, కారు అదుపుతప్పి, ఒక రెస్టారెంట్ వారి భవనం గోడ కి దూసుకు పోయింది. అది చూసిన వారు 911 కి ఫొన్ చెయ్యగానే ఆంబ్యులెన్స్ వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. వెను వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ధరించిన నాసా బేడ్జ్ ని గుర్తించి, వివరాలు సేకరించి, ఒక ఆమె భర్త మల్లిక్ కి వసంత రోడ్డు ప్రమాదం వార్త మధ్యాహ్నం 1:30 కి అందించ గలిగారు. నాకు కూడా మల్లిక్ చెప్పగానే హుటాహుటిన నలభై మైళ్ళ దూరం లో ఉన్న హాస్పిటల్ కి 2:30 కి వెళ్లాను. ఆ తరువాత ఐదు రోజులు అన్ని రకాల వైద్యులు, ఎన్ని రకాల చికిత్సలు చేసినా వసంత ని మాకు దక్కించ లేక పోయారు. సెప్టెంబర్ 28, 2015 సాయంత్రం మా అందరి సమక్షంలో వసంత ఆ దేవుడి దగ్గరకి వెళ్ళిపోయింది. ఆ నాలుగు రోజులూ మేము ఎంత క్షోభ అనుభవించామో ఆ దేవుడు అంతే ఆపేక్ష గా వసంత కోసం నిరీక్షించి ఉంటాడు. నాకు అందుకే ఆ దేవుడంటే చాలా అసూయ.

NASA Award

ప్రతిష్టాత్మక నాసా పురస్కారం అందుకుంటూ..

నలభై ఏళ్లగా నాకూ, మా ఆవిడకీ ఏకైక గాఢ స్నేహితురాలిగా, మా పిల్లలకి “బొడ్డు కోసి పేర్లు పెట్టిన “పెత్తల్లి” గా వసంత గురించి వ్రాయాలంటే ఎక్కడ మొదలెట్టాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది. అమెరికా లో ఫార్మకాలజీ శాస్త్రవేత్తలలో ఆమెకున్న అగ్రశ్రేణి స్థానం గురించి వారి కుటుంబానికీ, నాకూ తప్ప చాలా మందికి తెలియని విశేషాలు ముందుగా ప్రస్తావిస్తాను.

1946  లో అంబటిపూడి నరసింహం, శ్రీహరి దంపతులకి ఏకైక సంతానంగా కాకినాడ లో తాత గారైన మద్దూరి సోమయాజుల గారి ఇంట్లో పుట్టిన వసంత లక్ష్మి తండ్రి  గారి ఉద్యోగ రీత్యా విశాఖపట్నం, కాకినాడ, రాయపూర్, భిలాయ్ నగరాలలో బయాలజీ శాస్త్రాలలో మాస్టర్స్ డిగ్రీ దాకా చదువుకుంది. 1968 లో పుచ్చా మల్లిఖార్జున వెంకట సుబ్రమణ్యం (మల్లిక్) తో వివాహం అయిన తరువాత నాలుగేళ్ళు బెంగుళూరు లో మల్లిక్ భారత ఎలాక్రానిక్స్ కంపెనీ లోనూ, వసంత హెబ్బల్ లో అగ్రికల్చురల్ యూనివర్సిటీ లోనూ పనిచేసి, 1972 లో ముందు మల్లిక్, ఏడాది తరువాత నాలుగేళ్ల కొడుకు గిరీష్ తో వసంతా హ్యూస్టన్ వలస వచ్చారు. రాగానే వసంత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ముందు బయాలజీ లో చేరి, ఫార్మకాలజీ లోకి మారి వరసగా మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ 1980 లో పూర్తి చేసింది. వెనువెంటనే అమెరికా ప్రభుత్వం వారి నేషనల్ రిసెర్చ్ కౌన్సిల్ వారి పోస్ట్ డాక్టరల్ ఫెలోగా నాసా అంతరిక్ష కేంద్రం వారి బయో సైన్సెస్ విభాగంలో చేరింది.

అదే ఫెలో షిప్ తో కొన్నేళ్ళు నార్త్రప్ అనే కంపెనీ లో మూడేళ్ళు కొనసాగుతూ మంచి పరిశోధకురాలిగా పేరు సంపాదించుకుంది. ఆ కారణంగా నాసా వారు 1989 లో అక్కడ ఫార్మకాలజీ లేబొరేటరీ సంస్థాపన బాధ్యతలు వసంత కి అప్పగిస్తూ ఆ ప్రభుత్వ సంస్థ లోనే కీలకమైన పదవి లో నియమించారు అప్పటి నుంచీ వసంత ఇక శాస్త్ర వేత్తగా వెను తిరిగి చూడ లేదు. అచిర కాలం లోనే అమెరికాలో అత్యున్నత స్థాయి ఫార్మకాలజీ పరిశోధనాలయం నాసా వారిదే అనే విధంగా ఆ లేబోరేటరీని తీర్చి దిద్దింది.  నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ స్పేస్ బయో మెడికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్, అమెరికా ప్రభుత్వ నౌకాదళం మొదలైన జాతీయ స్థాయి సంస్థల నుండి అనేక మిలియన్ డాలర్ల రిసెర్చ్ గ్రాంట్స్ సంపాదించి అంతరిక్షం లో మానవ శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, కేవలం జీరో గ్రావిటీ లో మాత్రమే తయారు చెయ్యగల మందుల తయారీ మొదలైన అనేక శాస్త్రీయ విషయాలపై అగ్ర స్థాయి పరిశోధనలు చేసింది మన వసంత. అనేక అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో సుమారు వందకి పైగా పరిశోధనా పత్రాలు, పది విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్య పుస్తకాలలో అధ్యాయాలు, మూడు పేటెంట్లతో నాసా లో ఉన్న నలభై వేల మంది ఉద్యోగస్తులలో సీనియర్ సైంటిస్ట్ లు పదముగ్గురి లో మన తెలుగు ఆడబడుచు వసంత ఉన్నత స్థానం లో నిలబడింది…కేవలం స్వయం కృషి తో. అంతే కాదు, తను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ తోనూ, అనేక దేశాలలోని అగ్ర సంస్థల తోనూ నాసా తరఫునా, వ్యక్తిగతంగానూ విశేషమైన సేవలు అందిస్తూనే, నాసా వారికి ప్రవేటు సంస్థలతో అనుబంధం కలిగించి, అంతరిక్ష యానంలో ఏస్ట్రోనాట్స్ తరచూ వచ్చే మోషన్ సిక్ నెస్ నివారణకి తను స్వయంగా కనిపెట్టిన మందులు వ్యాపార పరంగా తయారు చెయ్యడానికి పూర్తి ఏర్పాట్లు చేసింది వసంత. మల్లిక్ కూడా నాసా లోనే ఉద్యోగం చేసేవాడు కాబట్టి వాళ్ళిద్దరినీ “స్పేస్ కపుల్” అని అందరూ పిలిచే వారు.

ఒక శాస్త్రవేత్తగా వసంత కి ఉన్న స్థాయి గుర్తింపు కి మరొక ఉదాహరణగా సెప్టెంబర్ 30, 2015 నాడు ఆమె అంతిమ యాత్రకి నాసా ఉన్నత అధికారులు వచ్చి, నాసా తరఫున అమెరికా జాతీయ జండాని ఆమె కుటుంబానికి తమ నివాళి గా సమర్పించారు. అమెరికా దేశంలో ఇది అత్యంత గౌరవప్రదమైన నివాళి గా పరిగణిస్తారు. వ్యక్తిగా వసంత అంటే ఆమె సహాధ్యాయులకి ఎంత గౌరవం అంటే నవంబర్ 8, 2015 నాడు “Celebration of Vasanta’s Life” అని ఆమె కుటుంబం నిర్వహించిన ఆత్మీయ కార్యక్రమానికి 35 సంవత్సరాల క్రితం వసంత మాస్టర్స్ & డాక్టరేట్ కి గైడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ స్టువార్ట్ సేల్ద్మన్ గారు జార్జియా నుంచీ, ఆమెతో పని చేసిన నాసా డైరెక్టర్ డా. కేరోలైన్ హంటూన్,  ఇతర ప్రాంతాల నుండీ అనేక మంది సిబ్బందీ ప్రత్యేకంగా వచ్చి తమ జ్ఞాపకాలని పంచుకున్నారు.

 

వసంతకి ఉన్న ఒక గుణం ఏమిటంటే వృత్తి రీత్యానూ, ఒక అగ్రశ్రేణి శాస్త్ర వేత్త గానూ తను సాధించిన విజయాలని, ఎదురైన ఇబ్బందులనీ స్నేహ బృందంతో ఎక్కువగా పంచుకునే అలవాటు లేదు. కానీ ఆ అదృష్టానికి నేను నోచుకున్నాను. పైన ఉదాహరించిన చాలా వివరాలు అప్పటికప్పుడే నాకు వసంత పిలిచి చెప్పి సంబరపడుతున్నప్పుడు “మన వాళ్ళందరికీ చెప్పావా?” అని అడినప్పుడల్లా “ఎందుకు రాజూ, ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకుంటారు. పోనీ ఇదేమైనా ఓ ఆటా, పాటా వ్యవహారమా” అనేది. అందుకే ఆమె అసంఖ్యాక మిత్ర బృందానికి వసంత ఆటా, పాటల గురించే ఎక్కువ తెలుసును కానీ శాస్త్రవేత్త గా ఉన్న అఖండమైన ప్రఖ్యాతి తెలియదు.

ఇక నాకూ, వసంత కీ పరిచయం చిన్నపుడు పరోక్షంగానూ, అమెరికా లో ప్రత్యక్షం గానూ జరిగాయి. రెండూ తమాషా సంఘటనలే. అప్పుడు మా ఇద్దరికీ పదిహేనేళ్ళు ఉంటాయేమో. మేము కాకినాడ గాంధీ నగరంలో ఉంటే వసంత వాళ్ళ తాత గారు మద్దూరి సోమయాజుల గారింట్లో రామారావు పేట లో పి.ఆర్. కాలేజీ & కుళాయి చెరువు దగ్గర ఉండే వారు. మా ఇద్దరివీ లాయర్ల కుటుంబాలే కాబట్టి రాకపోకలూ, పేరంటాలూ వగైరాలు కూడా ఉండేవి కానీ నాకు అవేమీ తెలియదు. కానీ ఒక సారి మా నీల పిల్లి అనే భలే పేరు ఉన్న మా చాకలి వాడు ఉతికి తెచ్చిన బట్టల మూట లో మా బట్టల బదులు వసంత వాళ్ళ ఇంటి తాలూకు మూట పట్టుకొచ్చి ఇచ్చి వెళ్లి పోయాడు. ఆ తరువాత మూటల మార్పిడి జరిగింది కానీ నాకూ, వసంత కీ మొట్ట మొదటి పరోక్ష పరిచయం మాకున్న కామన్ చాకలివాడు నీలపిల్లి ధర్మమా అనే జరిగింది. ఈ విషయం మేమిద్దరం అమెరికా లో ప్రత్యక్షంగా కలుసుకున్నాక మాటల కాకినాడ కబుర్ల సందర్భంలో తెలిసింది. మరో ముఖ్యమైన మరో పరోక్ష పరిచయం మేమిద్దరం కాకినాడ పి.ఆర్. కాలేజ్ లో ప్రి యూనివర్శిటీ లో ఒకే బేచ్ వాళ్ళం. కానీ నాది MPL..అంటే మేథమేటిక్స్, ఫిజిక్స్ & లాజిక్ అయితే వసంత ది BPC, అంటే బయాలజీ, ఫిజిక్స్ & కెమిస్ట్రీ. అంచేత ఎక్కడా ఏ క్లాస్ లోనూ కలిసే  అవకాశం లేదు. ఆ రోజుల్లో అమ్మాయిల సంఖ్య అతి తక్కువ కాబట్టి ఇతర విద్యార్ధుల లాగా గర్స్ వైటింగ్ రూమ్ చుట్టూ తిరిగితే కనపదేదేమో కానీ నేను “రాముడు మంచి బాలుడు” కాబట్టి ఏదో నా చదువూ, నా క్రికెట్టు ప్రపంచాలలోనే ఉండే వాడిని. అంచేత నేనూ, వసంతా అప్పుడు ఒకళ్ళకి మరొకరం గుంపులో గోవిందా బాపతే. ఇది కూడా మేము అమెరికాలో కలుసుకున్నాక పి.ఆర్. కాలేజ్ సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే తెలిసిన సంగతే.

Vasantha & Raju 1975

1975 లో…వసంతతో…

ఇక 1975 లో నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టిన నెల తిరక్కుండానే మల్లిక్, వసంత లని కలుసుకోవడం కూడా తమాషాగానే జరిగింది. కొన్నాళ్ళ నిరుద్యోగం తర్వాత అప్పుడే నేను యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరాను. ఒకరిద్దరు తెలుగు వారు కాని యూనివర్శిటీ విద్యార్థులు తప్ప ఎవరూ తెలియదు. ఓ వారాంతంలో మేము మాకు 200 మైళ్ళ దూరం లో ఉన్న సాన్ ఏంటోనియో నగరం చూడడానికి వెళ్ళాం. అక్కడ “రివర్ వాక్”…అంటే నదిలో బోట్ షికారు చాలా ప్రసిద్ది చెందింది. మా కుర్రాళ్ళం నలుగురం పైన వంతెన మీద నుంచుని క్రింద నదిలో పడవలలో విహరిస్తున్న మనుషులని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక పడవలో మన భారతీయులలాగా కనపడుతున్న ఒక కుటుంబాన్ని చూశాం.  ఆ రోజుల్లో భారతీయులు కనపడడం అపురూపం కాబట్టి గబ గబా చేతులు ఊపేసి హాయ్ అని చెప్తూ నేను అనుకోకుండా ఉత్తినే వేళాకోళానికి “ఏమండీ బావున్నారా?” అని తెలుగు లో గట్టిగా అరిచాను. వెంటనే ఆ పడవలో అమ్మాయి “ఆ బావున్నాం. మీరెలా ఉన్నారూ?” అని తిరిగి అరుస్తూ చెయ్యి ఊపింది. ఆ అమ్మాయే వసంత. ఆ తర్వాత వాళ్ళు ఒడ్డుకి వచ్చాక పరిచయాలు చేసుకుని తక్షణం జీవిత కాల స్నేహితులం అయిపోయాం. అప్పటికి నేను బ్రహ్మచారిని. మల్లిక్, వసంత లకి కొడుకు గిరీష్ కి నాలుగేళ్ళు. వారి సహజ సిద్దమైన ఆప్యాయత కీ తొలి ఉదాహరణ ఏమిటంటే అలా సాన్ ఏంటోనియో లో కలుసుకున్న వారం రోజులలో నేను మా ఇంజనీరింగ్ లాబ్ లో పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను వెతుక్కుంటూ పలకరించడానికి వచ్చి కేంటీన్ లో కాఫీ ఇప్పించారు. అప్పటి నుంచీ నా పెళ్ళయ్యే దాకా ఏదో వంక పెట్టుకుని వాళ్ళింటికి వెళ్లి పోయి వారానికి చాలా సార్లు అక్కడే తెలుగు భోజనం చేసేవాడిని. అందుకే మా అమ్మ తరువాత నాకు ఏమి ఇష్టమో వసంతకే ఎక్కువ తెలుసు. “రేపు గుమ్మడి కాయ వడియాలు చేస్తానురా” అనో “అరటి కాయ ఆవ పెట్టిన కూర నీకోసం రెడీగా ఉంది. వస్తావా?” అనీ “అనుజ్ గాడి కోసం ముక్కల పులుసు చేశాను. వాణ్ణి కూడా తీసుకోస్తావా. నీతో డబ్బాలో పట్టుకెళ్తావా? మీ పిల్లలందరికీ అది ఇష్టం మరి” అనో ఆప్యాయంగా వినిపించే ఆ వసంత పిలుపులు ఇక రావు.

Scan0036

వసంత, గిరిజ: ఇద్దరు నేస్తాలు

ఆ విధంగా 1975 మొదలైన మా పరిచయం గాఢ స్నేహంగా మారడానికి ఎన్నాళ్ళో పట్ట లేదు.  బ్రహ్మచారిగా ఉన్న మల్లిక్ & వసంత నాకు హ్యూస్టన్ లో మొట్ట మొదటి కుటుంబ స్నేహితులు కావడంతో నాకు కావలసిన కుటుంబ ఆత్మీయత వాళ్ళ దగ్గరే వెతుక్కుని తనివి తీరా ఆనందించాను. క్రమంగా మరో పది కుటుంబాలు పరిచయం అయినా పండగలు, పిక్నిక్ లు, షాపింగ్ లు, విహార యాత్రలు, సినిమాలు చూడ్డం, పేకాడుకోడం, దెబ్బ లాడుకోడం ..ఒకటేమిటి..అన్నీ వాళ్ళ తోటే. ఆ రోజుల్లోనే రత్న పాప కూడా అనిల్ కుమార్ ని పెళ్ళాడి హ్యూస్టన్ లో అడుగు పెట్టింది. అప్పటికే పాప చాలా పేరున్న కూచిపూడి నర్తకి. వసంత కి కూడా  చిప్పప్పటి నుంచీ శాస్త్రీయ నృత్యం, కర్నాటక సంగీతం లో ప్రావీణ్యం ఉండడమే కాక నలుగురినీ పోగేసుకుని ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం చెయ్యడానికి తెగ ఉవ్విళ్ళూరుతూ ఉండేది. అందుకే యూనివర్శిటీ లో మాస్టర్స్ డిగ్రీలో చేరగానే ఇండియన్ స్ట్యూడెంట్స్ యూనియన్ కి సెక్రటరీ గా అందరినీ పోగేసి నానా హడావుడీ చేసేది.

ఆ రోజుల్లో  అదొక్కటే యావత్ హ్యూస్టన్ మహా నగరానికీ కలిపి ఉన్న ఒకే ఒక్క ఇండియన్ సంఘం. అప్పుడే ఇండియా కల్చర్ క్లబ్ అని గుజరాతీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు మొదలుపెట్టి నప్పుడు మేమూ కలిసి మెలిసి రిపబ్లిక్ డే లాంటివి చేసే వాళ్ళం. ఊళ్ళో ఇండియన్ రెస్టారెంట్స్ లేవు కాబట్టి ఉన్న గృహిణులే ఆరు బయట కార్యక్రమాలకీ, అమెరికన్ ఫెస్టివల్స్ లో ఇండియన్ స్టాల్ పెట్టీ వంటలు చేసే వారు. అందులో దక్షిణాది వంటలకి వసంత ఎప్పుడూ ముందు ఉండి ఇడ్లీలు, దోశలు వందల కొద్దీ అలా వేస్తూనే ఉండేది. మేం అంతా మేత మేస్తూ సహాయం చేసే వాళ్ళం. 1975 ఏడాది చివరికి కేవలం తెలుగు కళాభిమానమే కాక కావలసిన ప్రావీణ్యం కూడా ఉన్న వాళ్ళం తగిన సంఖ్యలో హ్యూస్టన్ చేరడంతో అందరం తర్జన భర్జన పడి అమెరికాలో తొలి తెలుగు సాంస్కృతిక సంఘాల లో ఒకటయిన హ్యూస్థన్ తెలుగు సాంస్కృతిక సమితి కి శ్రీకారం చుట్టాం. తద్వారా అప్పటి దాకా దాసట, బీసటగా ఎవరో ఒకరి ఇంట్లో కొనసాగుతున్న చిన్నచిన్న సాంస్కృతిక కార్యక్రమాలూ, పండగలూ మొదలైనవి క్రమబధ్ధీకరించి స్థాయి పెంచడం లో కృతకృత్యులయ్యాం. మా సమితి మొట్ట మొదటి కార్య నిర్వాహక వర్గంలో ఊళ్ళో ఒక పెద్ద అయిన కోనేరు తాతయ్య గారు సమన్వయ కర్త, నేను సహా సమన్వయ కర్త కాగా వసంత, దువ్వూరి నారాయణ రావు గారు, పోతు నరసింహా రావు గారు & రాజేశ్వరి గారు, తమ్మారెడ్డి చంద్ర శేఖర్, పట్టిసపు గంగాధరం గారు, తుమ్మల కుటుంబ రావు సభ్యులు. అందులో పెద్దలు దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు 1957 లో హ్యూస్టన్ మాత్రమే కాక అమెరికా దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి భారతీయుడు. ఆయన వసంత పెద నాన్న గారు. అంటే వసంత తల్లి శ్రీ హరి గారు, నారాయణ రావు గారి భార్య కి స్వయానా చెల్లెలు.

1979 (1)

 

వీరిలో అందరూ ఊహించినట్టుగానే సాంస్కృతిక కార్యక్రమాలకి చైర్ పెర్సన్ ఇంకెవరూ…వసంతే. తన తో పాటు రత్న పాప, అనిల్, నేను, హీరా & సూరి దువ్వూరి, బాల & రామం చావలి. పొలాని జానకి రామయ్య, రవి తమిరిశ మొదలైన వాళ్ళం కలిసి నాటకాలు, డాన్సులు, బొమ్మల కొలువులు, పిల్లలకి భోగి పళ్ళు. ఉగాది పచ్చడి, దీపావళి టపాసులు, వన భోజనాలు, ఆటల పోటీలు…..ఒకటేమిటి అనేక రకాల కార్యక్రమాలతో తెగ సంబడం గా ఉండేది. అందరిలోకీ ఎక్కువ సంబరంగా ఉండేది ఎప్పుడూ వసంతే! ఎప్పుడైనా పొరపాటున తనని సలహా అడగక పోయినా, మరొకరితో ఎక్కువ మాట్లాడినా ప్రాణం తీసేసేది వసంత. అప్పుడే కాదు …మొన్న మొన్నటి దాకా కూడా ..మళ్ళీ అన్నీ మామూలే…. ఆ అలక అంతా అ క్షణమే! మర్నాడు ముక్కల పులుసు రెడీ!

 

1976 లో మా టీసీయే (తెలుగు సాంస్కృతిక సమితి కి హ్రస్వ రూపం) కాస్త నిలదొక్కుకోగానే నాకు మనం ఒక పత్రిక పెడదాం అని ఆలోచన వచ్చింది. అయితే ఇతర నగరాలలో లాగా కేవలం కమ్యూనిటీ వార్తల కోసమే కాకుండా ఒక సాహిత్య పత్రిక లా కథలూ, కవితలూ వేస్తే బావుంటుంది అని కూడా అనిపించి, ముందు వసంత ని పిలిచాను. “నీ బుర్ర బానే పని చేస్తోందే…కానీ కథలు, కవితలు ఎక్కడి నుంచి వస్తాయి?” అంది వసంత….అలా అందే కానీ అప్పటికే ఆ ఐడియా నచ్చేసింది అని నాకు అర్థం అయిపోయింది. కాస్సేపు మాట్లాడుకుని “ఇద్దరం చెరో కథా ముందు రాద్దాం” అని అనేసుకున్నాం. అలా నేను నా మొట్ట మొదటి కథ “జుల పాల కథ “ అనో చిన్న కథ వ్రాస్తే, వసంత “ఆవగింజ ఆంతర్యం” అని ఓ చిన్న కథ వ్రాసింది. ఒకరి కథ మరొకరు చదువుకుని “పరవా లేదులే” అనుకున్నాం. ఇక పత్రిక పేరు “మధుర వాణి” పెట్టి నేను ప్రధాన సంపాదకుడి గానూ, వసంతా, దువ్వూరి హీరా సహ సంపాదకులుగానూ మాకు మేమే నిశ్చయించేసుకున్నాం. ఆ పేరు మీద తర్జన భర్జనలు  ముఖ్యంగా “మధుర వాణి” అని గురజాడ పాత్ర పేరులా వ్రాయాలా, లేక “మధుర-వాణి” అని మధురమైన వాణి అనే అర్థ వచ్చేలా వ్రాయాలా అనే దాని మీద మా ముగ్గురి తగాదా రత్న పాప తీర్చింది…”మధ్యలో ఆ గీత ఎందుకూ అడ్డంగానూ” అంటూ…

ఆ విధంగా “ఆవగింజ ఆంతర్యం” కథ వ్రాయగానే ఆగ లేదు వసంత. దానికి తన కలం పేరు “వలపు” అని పెట్టుకుంది…అంటే ..”వసంత లక్ష్మి పుచ్చా” కి కుదింపు….ఎంత పొందిక గా కుదిరిందో కదా. దటీజ్ వసంత..ఏం చేసినా సొంత ముద్ర ఉండాల్సిందే! ఆ తరువాత ఉద్యోగం లోనూ, ఇతరత్రానూ ఎక్కువ రాయ లేదు కానీ నా సతాయింపు భరించ లేక “అసంకల్పిత ప్రతీ కార చర్య” అని మరో కథా, “మధ్యాప్యం” మొదలైన కవితలూ అడపా దడపా రాసేది. పదేళ్ళ క్రితం తెలుగు కథ శత వార్షికోత్సవం సందర్భం గా స్వర్గీయ భార్గవీ రావు గారు  “ఈ శతాబ్దంలో మహిళా రచయితల హాస్య కథలు” సంకలనం వేసినప్పుడు నేను ఈ “ఆవగింజ ఆంతర్యం” పంపిస్తే ఆవిడకి ఎంతో నచ్చి, ఆ సంకలనంలో ఎంపిక చేశారు. దానికి వసంత చాలా సంబర పడింది.

వసంత కి డ్రామాలంటే భలే ఇష్టం. “నన్ను హీరోయిన్ గా పెట్టి ఓ డ్రామా రాయకూడదూ? అస్తమానూ మీ మగాళ్ళేనా వేసేది?” అనేది. తన కోసమే మేము స్త్రీ పాత్రలు ఉన్న “ఇల్లు అమ్మబడును”, “ఆదివిష్ణు రాసిన డ్రామా మొదలైనవి వేశాం. అంతెందుకూ?  ఓ సారి జంధ్యాల రాసిన “గుండెలు మార్చబడును” వేద్దాం అనుకుంటే అందులో స్త్రీ పాత్ర లేదు కానీ ప్రధాన పాత్ర అయిన మగ డాక్టర్ మధు పాత్రని ఆడ పాత్రగా వసంత కోసం నేను తిరిగి వ్రాయవలసి వచ్చింది.

Telugu drama 1

1970-80 దశకం లో  నేనూ, అశోక్ కుమారూ మరి కొందరు బ్రహ్మచారులమూ మల్లిక్ & వసంత, అనిల్ & రత్న పాప, బాల & రామం, కుమారి & సుసర్ల శర్మ  కుటుంబాలూ  ఒకే వయసు వాళ్ళం కాబట్ట్టి బాగా కలిసి మెలిసి ఉండే వాళ్ళం. 1978 లో నేను ఇండియా వెళ్లి మా అమ్మ చెప్పిన అమ్మాయి గిరిజతో పెళ్లి ముహూర్తం కుదిరినప్పుడు అమెరికాలో ఒక్క వసంత, మల్లిక్ లకే ఫోన్ చేసి ఆ వార్త చెప్పాను. ఆ రోజుల్లో అక్కడ నుంచి అమెరికా ఫోన్ చెయ్యడం అంటే తలప్రాణం తోకలోకి వచ్చేది. మా పెళ్లి సమయానికి అమెరికా నుంచి వచ్చిన ఏకైక గ్రీటింగ్స్ టెలిగ్రాం కూడా వసంత, మల్లిక్ ల దగ్గర నుంచే! పెళ్ళయ్యాక గిరిజ అమెరికాలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజునే మా మిత్ర బృందం అందరినీ కలుసుకున్నా “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” వసంత తోటే. ఆ క్షణం నుంచీ వసంత మా ఆవిడని తనకి లేని సొంత చెల్లెలిలాగానే చూసుకుంది తన జీవితాంతం. మా ఆవిడకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నీ వసంత తోటే చెప్పుకునేది.

అన్నట్టు వసంత అమెరికా వచ్చిన కొత్తలో తనకి డ్రైవింగ్ నేర్పించిన ఘనత అశోక్ కుమార్ దే.  అతను కొన్నేళ్ళ క్రితం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్థన్ లో ఉండగానే ఓ అమెరికా అమ్మాయిని ప్రేమించాడు. ఇక పెళ్లి కూడా చేసుకోడానికి నిశ్చయించుకోగానే ఎంతయినా గుంటూరు వాడు కాబట్టి మన హిందూ సాంప్రదాయం లో పెళ్లి చేస్తే బావుంటుంది అని అనుకున్నాం కానీ ఆ రోజుల్లో హ్యూస్టన్ లో ఏదో నామకహా గా గుజరాతీ వాళ్ళ గుడి ఒకటి ఉండేది కానీ మన తెలుగు పద్ధతికి అది పనికి రాదు కదా! ఇంకేముందీ…మల్లిక్ & వసంత పూనుకుని అశోక్ కుమార్ పెళ్లి తెలుగు పద్ధతిలో అప్పుడే కొనుక్కున్న వాళ్ల ఇంట్లోనే చేద్దాం అని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి ఎలా చెయ్యాలో ఎవరికీ సరిగ్గా ఏమీ తెలియదు. అంచేత అందరం ఎవరికీ జ్ఞాపకం ఉన్న తంతులు, మంత్రాలు, సినిమాలలో ఉన్నవీ కలిపి, సన్నాయి వాయిద్యాలతో సహా “పెళ్లి చేయించుట ఎలా?” అని ఒక ఆడియో కేసెట్ తయారు చేసుకుని మల్లిక్ ని పురోహితుడిగా నియోగించాం. ఊళ్ళో ఉన్న తెలుగు వారినందరినీ పిలిచి అశోక్ & మేరీ ఏగ్నేస్ పెళ్ళి 1978లో అరిటాకులలో నేల మీద కూచుని భోజనాలు చెయ్యడంతో సహా అన్నీ వసంత ఆధ్వర్యంలోనే జరిపించాం. విశేషం ఏమిటంటే పురోహితుడు కూడా అయిన మల్లిక్, వసంత పెళ్ళిపీటల మీద కూచుని కన్యాదానం చేశారు. ఆ పెళ్లి ఫోటో లు గుంటూరులో ఉన్న అశోక్ తల్లి సరస్వతి గారు చూసి “అదేమిట్రా, జంధ్యం తప్పు వేశారూ?” అన్నారుట. ఆ విధంగా పెళ్లి తంతులలో ఎన్ని లోపాలు ఉన్నా అశోక్ & మేరీ ఏగ్నెస్ గత 38 ఏళ్లగా హాయిగా సంసారం చేస్తున్నారు.

raju1

అపూర్వ తో…

వసంత కి ఉన్న మరో వ్యాపకం మొక్కలు పెంచడం. అదైనా ఏదో సరదాగా నాలుగు వంగ మొక్కలు వేసేసి గొప్పలు చెప్పుకోడం కాదు. ఆ మాట కొస్తే 1970-80 లలో మన కూరగాయలలో ఒక్క టొమేటో, బెండ మొక్కలు తప్ప ఇంకేమీ దొరికేవి కాదు. అంచేత వంగ, దోస, తోటకూర, గోంగూర, పొట్ల, బీర వగైరా విత్తనాలు అన్నీ ఇండియా వెళ్ళినప్పుడు బంగారం లా జాగ్రత్తగా తెచ్చుకునే వాళ్ళం. ఇప్పటి లాగా ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్ లేని ఆ రోజుల్లో విత్తనాలు ఎలాగో కష్టమ్స్ వాడి కళ్ళు కప్పి పెట్లో అట్టడుగున దాచేసి తీసుకు వచ్చే వాళ్ళం కానీ దొండ, తమల పాకులు లాంటి తీగెలు తీసుకు రావడం కోసం వసంత నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేది నేను ఇండియా వెళ్ళే ముందు. అదేమిటంటే కణుపులతో ఉన్న దొండ పాదుకానీ, నాలుగైదు ఆకులతో ఉన్న తమల పాకు తీగె కానీ తడి గుడ్డలో చుట్టి పొట్టకి దారంతో గట్టిగా కట్టుకుని, పైన బనీను వేసుకుని నిటారుగా నడవడం నేర్పేది. కాకినాడ నుంచి బొంబాయి దాకా మామూలుగానే పట్టుకొచ్సినా, బొంబాయిలో అలా అవి పొట్టకి కట్టుకుని అక్కడ నుంచి న్యూ యార్క్ లో దిగే దాకా కూచున్నా, నుంచున్నా, నడిచినా నిట్టనిలువుగా జాగ్రత్తగా వాటిని పట్టుకొచ్చి వసంత కి ఇచ్చే దాకా ప్రాణం కటకటలాడిపోయేది. నలభై ఏళ్ల తరువాత కూడా ఈ నాడు మా హ్యూస్టన్ లో అందరి ఇళ్ళలోనూ పెరుగుతున్న దొండ పాదు, తమల పాకు తీగెలూ ఆ విధంగా స్మగ్లింగ్ అయి వచ్చిన నాలుగో తరం పాదులని చెప్పుకోడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటిదే మనకి ఆత్మీయమైన మల్లె మొక్క. ఆ కొన్ని నర్సరీల లో సాండ్బాగ్ జాస్మిన్ అనే పేరుతో  ఇప్పుడు మల్లె మొక్కలు, కనకాంబరాలు  దొరుకుతున్నాయి. ఇక  వసంత ఎక్కడెక్కడి చైనా వాళ్ళ నర్సరీ లకి వెళ్లి అకడ నుంచి మామిడి, జామ, నంది వర్ధనం, సన్న జాజి, సంపెంగ, రక రకాల మందారాలు మొదలైనవి తెచ్చి తన తోటలో వేసి, రోజూ సాయంత్రం ఇంటికి రాగానే చీకటి పడే దాకా అక్కడే గడ్డి పీకుతూనో, నీళ్ళు పోస్తూనో అన్ని మొక్కలనీ పలకరిస్తూ మూడు, నాలుగు గంటలు గడిపాకే ఇంట్లో అడుగుపెట్టేది. అలాగే అన్ని రకాల కూరగాయలూ, దబ్బ, నిమ్మ, నారింజ, దానిమ్మ, జామ..ఆఖరికి నేరేడు మొక్క కూడా వసంత తోటలో ఉంటాయి.

ఆ నాటి ఇతర స్నేహితుల ఆర్ధిక స్థాయి పెరుగుతున్న కొద్దీ అంతరాలు కూడా పెరిగినా కేవలం వసంత తో అనుబంధం నలభై ఏళ్ల గా ఒకే స్థాయిలో మా కుటుంబానికి కారణం ఆమెకి ఉన్న ఎంతో సహజమైన ఆడంబరం… అదే కల్మషం లేని ఆత్మీయత. అనదల్చుకున్న మాట అనేయడం ఆ ఆత్మీయత వ్యక్తీకరణ లో ఒక భాగం. 1981 లో తనకి పుట్టబోయే అమ్మాయికి ఏం పేరు పెట్టాలా అనే సంప్రదింపులలో వసంత రమ్యశ్రీ అనే పేరు ఎంచుకుంది. నేను రమ్య అంటే చాలు, మళ్ళీ అదేదో కవి గారి కలం పేరులా రమ్యశ్రీ ఎందుకూ అంటే భలే కోప్పడింది. రమ్య పుట్టిన రోజు మల్లిక్ అందరికీ హవానా చుట్టలు పంపిపెట్టి ఆడపిల్ల పుట్టినందుకు మహానందపడిపోతే, ఆ క్షణం నుంచీ వసంత జీవితం రమ్య కేంద్రబిందువుగానే సాగింది అని చెప్పవచ్చును.

వసంత ఆత్మీయతకి చొరవకి అతి మంచి ఉదాహరణ 1988 లో జరిగిన రెండు విశేషాలు. ఆ ఏడు మా అమ్మ అమెరికా వచ్చి మా తమ్ముడి దగ్గర కాలిఫోర్నియాలో ఆరు నెలలు, హ్యూస్టన్ లో మా ఇంట్లో ఆరునెలలూ ఉండి ఇక వెనక్కి మళ్ళీ కాకినాడ వెళ్ళే ప్రయత్నంలో ఉంది. ఒక్కర్తినీ పంపించడం కుదరదు కాబట్టి మాలో ఎవరో ఒకరు తీసుకెళ్ళి దిగబెడదాం అనుకుంటూ ఉంటే వసంత “ఎందుకూ. మేము ఎలాగా గిరీష్ ఒడుగు చెయ్యడానికి ఇండియా వెళ్తున్నాం. మీ అమ్మ మా అమ్మ కాదా ఏమిటీ? నేను కూడా జాగ్రత్తగా తీసుకెళ్తాను” అని ఎంతో ఆత్మీయంగా, దారిలో విమానం ఎనిమిది గంటలు ప్రాంక్ఫర్ట్ లో ఆగిపోవలసి వచ్చినా మా 75 ఏళ్ల మా అమ్మకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇండియా తీసుకెళ్లింది. అదే వసంత కాక పొతే మేము మా అమ్మని అలా పంపించే వాళ్ళం కాదు. ఆ తరువాత మరో పదేళ్ళు ఎప్పుడు మా అమ్మతో మాట్లాడినా “వసంత ఎలా ఉందిరా?” అనేదే మొదటి ప్రశ్న. ఇది వ్యక్తిగతం అయితే గిరీష్ ఉపనయనం వసంత వ్యక్తిత్వానికీ, చొరవకీ మరో ఉదాహరణ. అప్పటికి రెండేళ్ళ ముందు ఎన్టీ రామా రావు హ్యూస్టన్ వచ్చినప్పుడు మేం అందరం ఆయన్ని కలుసుకున్నాం కాబట్టి వసంతకి అది గుర్తుకి వచ్చి, హైదరాబాదులో తిన్నగా ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లి గిరీష్ ఉపనయనం ఆహ్వానం ఎన్టీ రామారావు గారికి అందజెయ్యమని ఆయన సెక్రటరీకి ఇచ్చింది.  ఎవరూ ఊహించని విధంగా రామారావు గారు ఆ ఉపనయనానికి వెళ్లి ఆశీర్వదించి అందరికీ ఆశ్చర్యం, ఆనందం కలిగించారు. ఆ ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అదీ మా వసంత అంటే !

With NTR

నందమూరిని కలిసిన క్షణాలు…

ఇక మాకు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి పుట్టినప్పుడూ పేర్లు  ఎంపిక చెయ్యడంలో వసంత ప్రధాన సలహాదారు. వాళ్ళు పుట్టిన దగ్గరనుంచీ పెద్ద వాళ్ళు అయ్యాక కూడా పుట్టిన రోజులు, హై స్కూల్ గ్రాడ్యుయేషన్, మా అమ్మాయిలు రత్న పాప దగ్గర కూచిపూడి నృత్యానికి సలహాలు, 1998 లో వాళ్ళ రంగ ప్రవేశానికి మేకప్ తో సహా అన్ని ఏర్పాట్లు, మా రెండో అమ్మాయి పెళ్ళి దగ్గర ఉండి జరిపించడం ..ఒకటేమిటి ….మా కుటుంబంలో అంతర్భాగంగా ఉన్న వసంత ఇప్పుడు కనుమరుగు అయినా మా అందరి మనోఫలకం లో కలకాలం ఉంటుంది. నా కంటే, మా కుటుంబం కంటే ఎక్కువ సన్నిహితులు వసంతకి ఉన్నారు. అందులో ఆశ్చర్యం లేదు. వారు ఇంత కంటే మంచి స్మృతులతో సమగ్రమైన వ్యాసం వసంత గురించి వ్రాయగలరు. నేను కూడా ఇంకా చాలా విశేషాలు వ్రాయగలను. కానీ కొన్ని లోపల దాచుకుంటేనే వాటికి ఎక్కువ విలువ. ఈ వ్యాసం లో వసంత గురించి కొంత అయినా అందరితో పంచుకోవాలని పించి, నా జీవన ప్రస్థానంలో ఒక ఆత్మీయ స్నేహితురాలిగా ఆమెకి ఉన్న స్థానాన్ని అక్షర రూపంలో ఈ ఆత్మకథలో పదిలపరుచుకునే ప్రయత్నం చేశాను.

2015 ఓ విధంగా మాకు చాలా బాధనే ఇచ్చింది. నా అమెరికా జీవితంలో తొలి రోజుల నుంచీ అత్యంత ఆత్మీయులైన స్నేహితులు అనిల్ కుమార్ గత ఫిబ్రవరిలోనూ, సెప్టెంబర్ మొదటి వారంలో సుసర్ల శర్మ, ఆఖరి వారంలో వసంత ఏ మాత్రం ఊహించలేని విధంగా పరమపదించారు. ఇక డిశంబర్ లో మా ఆస్థాన పురోహితుడు గుళ్ళపల్లి ఉదయ కుమార్ కేవలం 40 వ ఏట గుండె పోటు తో మరణించారు. వీరందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ 2016 అందరికీ శాంతి సౌభాగ్యాలని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

దేహ భాష తో మౌనంపై యుద్ధం – “కప్లెట్”

 

-ఏ.కె. ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

ఇద్దరు స్త్రీల మధ్య చోటుచేసుకొనే శృంగారానుభావాన్ని లైంగిక హక్కుల్లో భాగంగా ప్రతిపాదిస్తూ సాహిత్యీకరించడం  మన సమాజంలో సాహసమే.  స్థిరీకృత విలువల్నీ సాంప్రదాయిక ఆలోచనల్నీ వ్యవస్థీకృత భావనల్నీ ధ్వంసం చేసి కొత్త దృష్టికోణాన్ని ఆమోదయోగ్యం చేయడం అంత సులువేం కాదు. ఆ సాహసాన్ని యిష్టపూర్వకంగా చేయడానికి పూనుకొన్న రెంటాల కల్పన రాసిన కథ కప్లెట్. ఈ కథ రాయడానికి  వస్తు స్వీకరణ దశలోనే రచయిత సంఘర్షణ యెదుర్కొన్నట్టు తెలుస్తుంది. పాఠకులు అంగీకరిస్తారో లేదోనని సంకోచం వొకవైపు ,  లోతుగా పాతుకుపోయిన సామాజిక కట్టుబాట్లనీ బలమైన చట్టాల్నీ ప్రకటిత అప్రకటిత నిషేధాల్నీ అభేద్యమైన నిశ్చిత నిశ్చయాల్నీ అన్నిటికీ మించి ప్రాకృతిక నియమాల్నీ  సహజమైన సంబంధాల్నీ కాదని అతిక్రమించడానికి తన్నుతాను సంసిద్ధం చేసుకోవడం మరోవైపు , వీటిని బ్యాలన్స్ చేస్తూనే వొక నిర్దిష్ట దృక్కోణాన్ని ప్రతిపాదించే పనిలో కళాత్మక విలువలు దెబ్బతినకుండా కథని  తీర్చిదిద్దాల్సిన అవసరం యింకోవైపు  యిదంతా వొక ‘సోషియో లిటరరీ వార్’ లో భాగంగానే జరిగినట్టనిపిస్తుంది.

స్త్రీ పురుషుల శృంగారాన్ని ప్రణయ భక్తిగాథల మధ్య వర్ణించిన తెలుగు సాహిత్యంలో మాయ , వైష్ణవి మధ్య శృంగారానుభవం రాయటం రాసి మెప్పించటం , మెప్పించి లెస్బియన్ బంధం కూడా సక్రమ సంబంధమేనని ఒప్పించటం అంత సులువుగా ఏమీ జరగలేదు. నాకే తెలియకుండా నా లోపల ఉన్న అప్రకటిత సెన్సార్షిప్ ను ఎంతో కొంత వదిలించుకొన్నాకే ఈ కథ రాయగలిగాను … … … కప్లెట్ కథను ప్రచురించటానికి తెలుగు పత్రికలు ఇంకా సిద్ధంగా లేవు అని వెనక్కు తిప్పి పంపటం సమాజానికి , సాహిత్యానికి ఉన్న ఒక పెద్ద దూరాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.

(కల్పనా రెంటాల : ‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’ (తెలుగు సాహిత్యంలో స్త్రీ పాత్రల పరిణామం)  20వ తానా సభలు – సాహిత్య సమావేశం,  జూలై 2 – 4 , 2015 లో చేసిన ప్రసంగ పాఠం నుంచి)

కల్పన చెప్పిన పై మాటలు చదివాకా కొత్త వస్తువుతో కొత్త కథ రాయడానికి రచయితకీ పాఠకులకీ మధ్య వున్న గోడల్ని అధిగమించడానికి రచయిత యెంత  వొత్తిడికి గురైందో తెలుస్తుంది. సాహిత్య వ్యవస్థ నిర్దేశించిన అలవాటయిన మార్గానికి భిన్నంగా కొత్త దారి పరుస్తూ  కప్లెట్ లాంటి కథ రాయడం , రాసి మెప్పించడం వొక యెత్తు అయితే తాను ప్రతిపాదించదల్చుకొన్న లెస్బియన్ సంబంధం ‘సక్రమమే’నని వొప్పించడం మరో ఛాలెంజ్. ఆ క్రమంలో కల్పన గుర్తించిన మరో అవరోధం సమాజానికీ సాహిత్యానికీ మధ్య వున్న దూరం , ఆ దూరాన్ని తొలగించాల్సిన పత్రికలు యింకా అందుకు పూర్తిగా సిద్ధంగా లేకపోవడం. ఇవన్నీ బయటికి కనిపించే  కారణాలైతే కనపడని లోపలి కారణం తనకు తాను విధించుకొన్న అప్రకటిత సెన్సార్ షిప్. ఏమైతేనేం వీటన్నినీ తెంచుకొని కథ మన ముందుకొచ్చింది.

మై బాడీ మై ఛాయిస్ అన్న భావనని  తెలుగు పాఠకులకి కల్పన మరీ కొత్తగా యేం పరిచయం చేయడం లేదు. స్త్రీ వాదం చేసిన ప్రయాణంలో యిదో మలుపేనన్న స్పృహ కూడా ఆమెకు వుంది. కాకుంటే స్త్రీల లైంగికతని ఆమె కేవలం  శరీర రాజకీయంగా మాత్రమే కాకుండా హక్కుల రాజకీయంగా కూడా  చూస్తుంది.

స్త్రీల శృంగారానుభవం గురించి ముద్దుపళని రాసిన రాధికాసాంత్వనం పుస్తకాన్ని నిషేధించి చదువుకున్న మేధావులు చేసిన కువిమర్శల దాడి మొదలుకొని ఇప్పటి వరకు స్త్రీలు లైంగికత్వం గురించి , లైంగికానుభావాల గురించి రాయటంలో ఎన్నో ఆటుపోట్లను , ఎదురు దెబ్బలను ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణించారు. (‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’)

అయితే తన దృక్పథాన్ని కథీకరించడంలో చాలా జాగరూకత వహించాలనే వొక యెరుక ఆమెకు వుంది. ఆ యెరుకవల్ల  కథ  కళాత్మకంగా రూపొందింది. అలా తీర్చి దిద్దడానికి రచయిత చేసిన  కాన్షియస్ ప్రయత్నం కథ పొడవునా కనిపిస్తుంది. లేకుంటే యే సపరి ‘వార’ పత్రికలోనో సెంటర్ స్ప్రెడ్ స్టోరీ గా యెవరూ చూడకుండా రహస్యంగా చదువుకొనే  సరస శృంగార కథగా తయారయి వుండేది. సరైన దృక్పథాన్ని సరైన రీతిలో బట్వాడా చేయగల కథా నిర్మాణ నైపుణ్యం వొక్కటే అటువంటి ప్రమాదం నుంచి కాపాడగలదు. అందులో భాగంగానే రచయిత్రి పాత్రల నిర్మితిలో గొప్ప నేర్పు ప్రదర్శించింది. కథలోని పాత్రల బయటి లోపలి స్వరూప స్వభావ ఆవరణల్ని ఆవిష్కరించింది. భిన్న ప్రవర్తనలకీ వుద్వేగాలకీ  సంఘర్షణలకీ అనుగుణమైన భిన్న నేపథ్యాలు నిర్మించింది. దేశ కాలాలు పాత్రల మధ్య లోపల సంఘర్షణకి కారణమౌతాయి.

స్వలింగ సంపర్కం గురించి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వొకే విధమైన సామాజిక నియమాలూ నైతిక విలువలూ చట్ట నిబంధనలూ లేవు. యూరప్ అమెరికాల్లో చాలా మేరకు LGBT లకు చాలా వరకు స్నేహం – ప్రేమ – కలిసి జీవించడం – శారీరిక సంబంధం కల్గి వుండడం – గోప్యత అవసరం లేని స్వలింగ సంపర్కం- పెళ్లి చేసికోవడం – పిల్లల్ని పెంచుకోవడం  – సొంత కుటుంబం యేర్పరచుకోవడం వంటి స్వేచ్ఛ  వుంది. ఆసియా ఆఫ్రికా దేశాల్లో అవన్నీ నిషిద్ధాలు.  ఇండియాలోనే కాదు 80 శాతం కామన్వెల్త్ దేశాల్లో సైతం స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. కఠిన శిక్షకి కారణమయ్యే నేరం . ఒకే జెండర్ కి చెందినవారి మధ్య వైవాహిక హక్కులు లేవు. భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని  చట్ట బద్ధం చేయమని పిటిషన్లు (నాజ్ ఫౌండేషన్), చట్టసభల్లో ప్రైవేటు బిల్లులు , కొండొకచో వీథి ప్రదర్శనలు , సెక్షన్ 377 (నిషేధ చట్టం) ని రద్దు చేయమని న్యాయస్థానాల్లో హక్కుల పోరాటం వంటివి ఇటీవలి పరిణామాలు. చట్టాలని సైతం పక్కన పెట్టి ఖాప్ పంచాయితీలు సగోత్రీకుల మధ్య పెళ్ళిళ్ళకి కులాంతర వివాహాలకు క్రూరమైన శిక్షలు పరువు హత్యలు అమలు జరిపే పరిస్థితుల మధ్యే  ఫైర్ నుంచీ అఫైర్ వరకూ సినిమాలు తయారవుతున్నాయి. ఈ సందర్భాన్నుంచే కప్లెట్ కథని చూడాలి .

వైష్ణవి సంప్రదాయ భారతీయ హిందూ కుటుంబానికి చెందినది. ఆమె బాల్యం పదమూడేళ్ళ వరకూ ఇండియాలోనే గడిచింది. ఆ తర్వాత అమెరికా వచ్చేసినా చిన్నప్పటినుంచీ అనేక ఆంక్షల మధ్య పెరిగింది. వయసు పెరుగుతోన్న కొద్దీ వాటికి యెదురు తిరగడం మొదలైంది. కూచిపూడి డాన్సర్. కూచిపూడినీ ప్రపంచంలోని యితర నృత్యరీతులనీ తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి  తల్లిదండ్రుల కట్టడి నుంచి బయటపడి వారికి దూరంగా ఆస్టీన్ వచ్చింది. అక్కడ  సొంత ఇంటిలో మొదటిసారి స్వేచ్ఛని అందులోని ఆనందాన్నీ అనుభవిస్తోంది.

మాయ మెక్సికన్ అమెరికన్ అమ్మాయి (1871నుంచే మెక్సికోలో  LGBT లకి ప్రత్యేక హక్కులు వున్నాయి. ఆ విషయంలో అమెరికాకన్నా ముందుంది).  చిన్నప్పటి నుంచే స్వేచ్ఛగా పెరిగింది. ‘మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన ఉంది. మగపిల్లల కంటే ఆడపిల్లలంటేనే ఇష్టంగా ఉండేది.’ హైస్కూల్లోకి వచ్చాకా అబ్బాయిలతో డేటింగ్ చేసింది. ‘కానీ ఏనాడూ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది.’  ఎదిగే క్రమంలో ఫెమినిస్టు భావజాలాన్ని వొంటబట్టించుకొంది. ‘Woman’s Body-Feminism-Sculpture’  ని ప్రధానాంశంగా పరిశోధన చేయాలని ఆమె ఆకాంక్ష.

మాయా వైష్ణవీ ల అభిరుచులూ ఆసక్తులూ కలిసి అవసరాల రీత్యా యూనివర్సిటీ క్యాంపస్ కి దగ్గరగా వొకే యింటిని షేర్ చేసుకొంటారు. అదే విధంగా అభిప్రాయాల్నీ పంచుకొన్నారు. ఒకానొక సాయంత్రం  వొక ‘మోహపు ముద్దు’ వాళ్ళిద్దర్నీ శారీరికంగా దగ్గరచేసింది. చీరకట్టులో ‘సెక్సీ’ గా ‘స్పైసీ’ గా  వున్న వైష్ణవిని మాయ ‘ఆర్తిగా’ ముద్దు పెట్టుకొంటే వైష్ణవి ఆమెను ‘గట్టిగా అల్లుకుపోయింది’. ‘మాయ ముద్దు పెట్టుకున్నాప్పుడు అబ్బాయిలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయిందో అలాగే లేదా అంతకంటే ఎక్కువ ఫీల్ అయింది .’ అది మొదలు యెన్నోసార్లు   మాయ వైష్ణవి ‘దేహంలోకి ప్రవహించింది’.

ఆ కలయికల్లో కలిగే ‘అనేక అందమైన అనుభవపు అనుభూతుల సుగంధం’ వైష్ణవి మనసుకి యిష్టంగానూ సహజంగానూ వున్నప్పటికీ ఆమె పుట్టి పెరిగిన  కుటుంబ సమాజ నేపథ్యం కారణంగా ప్రతిసారీ  ‘మాయా మోహపు మంత్రజాలం నుండి బయటకు వచ్చాకా’ ఏదో తెలీని అపరాధభావనకి గురయ్యేది. కానీ మాయ ‘చేతుల్లోని మంత్ర దండానికో చూపుల్లోని శక్తిపాతానికో వద్దు వద్దు అనుకుంటూనే పసిపాపలా’ లొంగిపోయేది.

అయితే తమ సంబంధాన్నిబాహాటం చేయకుండా  యింటి నాలుగు గోడలవరకే వుంచాలని వైష్ణవి , వైష్ణవి పట్ల ఇష్టాన్ని, ప్రేమ ను కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే చూపిస్తూ బయట తానెవరో పరాయి వ్యక్తి లాగా దూరం దూరం గా తిరగటానికి యిష్టపడని మాయ (‘ఇంట్లో ఒక లా, పబ్లిక్ లో మరోలా ఉండటం నాకు రావట్లేదు’ ) , యిద్దరి ఆలోచనల్లో  వున్న  యీ  వైరుధ్యమే సంఘర్షణకి కారణమౌతుంది . వైష్ణవికి లభించిన కొత్త మగ స్నేహం పట్ల కూడా మాయకి రిజర్వేషన్స్ వున్నాయి. వైష్ణవి తన చేజారిపోతుందేమోనని అనుమానం అభద్రతా ఆరాటం మాయని అసహనానికి గురిచేసాయి. దాంతో ఆరోపణలూ ప్రత్యారోపణల్తో యిద్దరి మధ్య మాటలు చురకత్తులయ్యాయి. ‘కలిసి ప్రేమనుపంచుకున్న ఇద్దరూ ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కత్తులతో సమూలంగా రెండువైపులా నుంచి నరికేసుకున్నారు’. గొడవ తెగేదాకా (బ్రేకప్) సాగింది . ఆ సంబంధాన్ని నిలుపు కోవాలా వద్దా నిలుపుకోడానికి యే ఆలోచనలు ప్రేరేపించాయి అన్నదే మిగతా కథ.

ఒకే జెండర్ కి చెందిన యిద్దరు వ్యక్తులమధ్య యేర్పడే శారీరిక ఆకర్షణ మానసిక వైవిధ్యమా మానసిక వైకల్యమా అన్న ప్రశ్న లోతుల్లోకి వెళ్ళకుండా లింగ భేదం లేకుండా తమకు నచ్చిన వ్యక్తితో కలిసి వుండే స్వేచ్ఛ ప్రతి వొక్కరికీ వుండాలనే హక్కులకోణం నుంచి రాసిన కథ కావడంతో చర్చకి తెరలేపినట్టైంది.

ఇద్దరు స్త్రీలు కావొచ్చు యిద్దరు పురుషులు కావొచ్చు వారి మధ్య చోటు చేసుకొనే యిటువంటి సంబంధాలు కేవలం ప్రైవేటు వ్యవహారాలేనా ? వాటికి సామాజిక కోణాలు లేవా ? అన్నది వొక ప్రశ్న.

ప్రకృతి విరుద్ధం అసాధారణమైన (uncommon) వికృతమైన అనారోగ్యానికి దారితీసే సెక్సువల్ పద్ధతులన్నిటినీ వ్యక్తి స్వేచ్ఛ పేరున ఆమోదించగలమా? వావివరసలు అక్రమ సంబంధాలు మొదలైన పదాల అర్థాలు భిన్న దేశ కాలాల్లో మారేవే అయినప్పటికీ విధి నిషేధాలు మనిషి కల్పించుకోనేవే అయినప్పటికీ  మానవ హక్కుల పేరున ఉల్లంఘించగలమా?  తిరుగుబాటు కోసమే తిరుగుబాటు చేయాలా? అని మరో ప్రశ్న.

పిల్లల్ని కనడానికి స్త్రీ పురుషులు  అవసరం అవుతారు కానీ ప్రేమకీ స్నేహానికీ వొకే జెండర్ కి చెందిన వాళ్లైనంత మాత్రాన తప్పేంటి? ఒకవేళ పిల్లల్ని కావాలనుకొంటే కలిసి పెంచుకొంటారు. సమాజంలో యెవరికీ యిబ్బంది కల్గించని అటువంటి సంబంధం మానవ హక్కులకు భంగం కలిగించేది కాదు కదా! అన్నది యెదురు ప్రశ్న.

ఇటువంటి ప్రశ్నల్ని కథ బయటి విషయాలుగా కొట్టిపారేయొచ్చునేమోగానీ కథ లోపలి విషయాలు కూడా  కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

‘మనసుకి ఏ తొడుగు లేకుండా స్వేచ్ఛ’ గా వొకటైనప్పటికీ  మాయా వైష్ణవీల  మధ్య సైతం అసమ సంబంధమే యేర్పడినట్టు తోస్తుంది . వారిద్దరి భావాల్లో ఆలోచనల్లో వాటి వ్యక్తీకరణలో వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మాయ ప్రవర్తనలో పురుషాధిపత్య స్వభావం  , వైష్ణవి అనుభూతుల్లో స్త్రీ సౌకుమార్యం  గోచరిస్తుంది .  హోమో సెక్సువల్ రిలేషన్ లో కూడ వొకరికి   ఆధిపత్య స్వభావం  సహజమేనని అంగీకరించగలమా ?  ‘సమాన ఛందం’గా వుండాల్సిన ‘జంట’ (కప్లెట్ నానార్థాలు) సంబంధంలో సైతం యేర్పడే వైరుధ్యాల్ని పరిహరించే పరికరాలెలా యెక్కడ సమకూర్చుకోగలం?

మాయ స్థానంలో వైష్ణవి భర్త వుండి యింటో బయటో ఆమెకి ఇష్టం లేనప్పుడు దగ్గర కావడానికి ప్రయత్నిస్తే …. వేరే సంబంధంలోకి వెళ్తున్నావని అనుమానించి అవమానిస్తే … మరొకరితో ఆత్మీయంగా వున్నందుకు అసూయ పడితే … స్త్రీవాదులుగా మన స్పందన ఎలా వుంటుంది? గాఢమైన ప్రేమలో యివన్నీ సహజమేనని స్వీకరించగలమా?

వైష్ణవి కేవలం తనకు మాత్రమే చెందాలని ఆమె తన సొంత ఆస్తి అన్న విధంగానే మాయ ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి (మాయ ఫెమినిస్టు అయినప్పటికీ వైష్ణవిపట్ల ఆమె ఆలోచనలూ స్పందనలూ మగవాడి ధోరణిలోనే వుండడం గమనించాలి)?

రాహుల్ తో వైష్ణవి సాన్నిహిత్యాన్ని స్నేహాన్ని అసూయతో చూసి అసహనానికి గురయ్యే కన్నా వైష్ణవి స్వభావంలోని ద్వంద్వాన్ని  బై సెక్సువాలిటీగా స్వీకరించవచ్చు కదా! లేదా మల్టిపుల్ రిలేషన్ ని గౌరవించి అంగీకరించ వచ్చు కదా!

మాయే వైష్ణవిని తన మాటలతోనూ చేతలతోనూ లోబరచుకొని చివరికి బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వచ్చిందన్న ఆలోచన కూడా పాఠకుల్లో కలుగుతుంది . అందువల్ల కామన్ రీడర్ మాయ మోహం నుంచి వైష్ణవి బయట పడాలని భావించే అవకాశం వుంది .

అదే సందర్భంలో వైష్ణవి మాయల  మధ్య బంధం శారీరిక అవసరాల రీత్యా ఏర్పడిందా  మానసిక అవసరాలకోసం ఏర్పడిందా అన్న ప్రశ్న కూడా వుత్పన్నమౌతుంది. పురుషాధిపత్యం పై నిరసనగా లేదా ధిక్కారంగా   ఫెమినిస్టులూ ,  గర్భధారణ సమస్య లేని సురక్షిత సంబంధమనీ టీనేజి ఆడపిల్లలూ భావించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్ల సంఖ్య పెరుగుతోందని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.  హాస్టల్ మేట్స్ జైల్ మేట్స్ మధ్య  నిర్బంధమో అనివార్య ఆవశ్యకతో బలవంతమో హోమో సెక్సువల్ రిలేషన్ యేర్పడటానికి  కారణాలౌతున్నాయి . అటువంటి ప్రత్యేక కారణాలు  లేకుండానే  మాయా వైష్ణవీ యిద్దరూ ‘సహజంగా యిష్టంగా’ దగ్గరయ్యారని రచయిత్రి వైష్ణవి ముఖత: ప్రస్తావించింది .

అంతే  కాదు; స్త్రీ పురుషులమధ్య మాత్రమే సెక్సువల్ సంబంధాన్ని అంగీకరించడం స్టుపిడ్ నెస్ అని మాయ నమ్మకం. అది సంప్రదాయ శృంఖలాలను తెంచుకోలేక పోవడం అనికూడా ఆమె వుద్దేశం. అందుకే తనతో వున్న సంబంధాన్ని బాహాటం చేయడానికి యిష్టపడని వైష్ణవిని జాతి మొత్తంతో కలిపి స్టుపిడ్ ఇండియన్స్ అని మాయ తిడుతుంది. మాయకి తన మనసుతో లోపలి ఘర్షణతో వ్యక్తం చేసిన భయ సంకోచాలతో ప్రమేయం లేదనీ  యేక పక్షం వ్యవహరిస్తోందనీ వైష్ణవి బాధ. వెరసి కథ మనస్సు – శరీరం – సమాజం – స్వేచ్ఛ అనే నాలుగు నాలుగు స్తంభాల చుట్టూ సంచలిస్తూ చివరికి రాజకీయ ప్రకటన దిశగా పయనిస్తుంది.

శరీరం అనే అడ్డుగోడని కూడా దాటిన ప్రేమబంధం ది కప్లెట్. సెక్సువాలిటీ అనేది ఇవాళ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక పర్సనల్ బెడ్ రూమ్ వ్యవహారంగా ఎందుకు మిగలలేదని ప్రశ్నిస్తుంది వైష్ణవి. మాయా ఈజ్ మై ఛాయిస్ అన్న అవగాహనకు వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య మాత్రమే బంధాలను నియంత్రించే సామాజిక నియమాలను చట్టాలను ధిక్కరించే ఈ కథ లైంగిక హక్కుల అవగాహనకు ఒక ఉదాహరణ.(శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …)

kalpan.profile.photo.1

మాయా వైష్ణవీ ల మధ్య ప్రేమ శరీరాల్ని అధిగమించిందా? అన్నది ప్రధానమైన ప్రశ్న. కథలో వాళ్ళిద్దరి మానసికావసరాల గురించిన ప్రస్తావనలు లేవు. మగవాళ్ళతోగానీ ఆడవాళ్ళతోగానీ  అంతకు మునుపు వైష్ణవికి యెటువంటి సాన్నిహిత్యం లేదు , మాయకి మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన వుందనే విషయం గమనించాలి.

అందువల్లే మాయ దృష్టి ఎంత సేపూ వైష్ణవి శరీరం మీదే వుంది. వైష్ణవి అంగసౌష్టవం వంపు సొంపులే మాయని కవ్వించాయి. శిల్పకళ మీద పరిశోధన చేసే మాయని వైష్ణవి శారీరిక సౌందర్యమే ఆకర్షించింది. వైష్ణవి శరీరంతో ఆమె ఆడుకొంది. వైష్ణవికి స్నానం చేయించాలని ఆమె వుబలాటం. వైష్ణవి మనసుతో ఆమెకి పని వున్నట్టు కనిపించదు. నాట్యం చేసేటప్పుడు ‘ఎగిరెగిరిపడే’ ఆమె ‘వక్షోజాలూ’ , నాట్యం వల్ల చెమటతో తడిసిన దేహానికి అంటిపెట్టుకొన్న వస్త్రాలూ మాయలోనూ పాఠకుడిలోనూ కోరికలు వుద్దీప్తం కావడానికే దోహదం చేస్తాయి. చీర కట్టులో వైష్ణవినీ నల్లటి జలపాతం లాంటి ఆమె జుట్టునీ ‘శరీరాన్ని అంటిపెట్టుకున్న డిజైనర్ బ్లౌజ్ పైనా కిందా ఆమె అర్ధ నగ్నపు వీపునీ ఎడమవైపు నడుం వంపునీ’  చూసినప్పుడు ఆమె మీద మాయకి కంట్రోల్ చేసుకోలేని యేదో అలజడి అంటుకుంటుంది. ‘లోపలి నుంచి ఒక కాంక్ష మాయను నిలువెత్తునా ముంచెత్తుతోంది.’

అప్పుడే కాదు ప్రతి సందర్భంలోనూ మాయ వైష్ణవిని సెక్సువల్ ఆబ్జెక్ట్ గానే చూసింది.  రచయిత కూడా వైష్ణవిని మాయ దృష్టికోణం నుంచే చూపించింది. ‘వైషు  శిల్ప శరీరం’ పట్ల రచయిత్రికి కూడా మోహం పుట్టినట్టుంది. ఆమె దేహభాషతోనే ఆమె  చుట్టూనే కథ అనేకానేక వొంపులు తిరుగుతుంది. ‘దేహ తంత్రులు ఒకదానినొకటి కొనగోటితో మీటుకొనే,  కాంక్షలు అల్లరిగా ఆడుకొనే’   శృంగారానుభవ వర్ణన మగ రచయిత నుంచి వస్తే  మనం యెలా స్వీకరించే వాళ్ళం ? అన్న   ప్రశ్న పుడుతుంది. అయితే  వారిద్దరి పరస్పర స్పర్శలో ‘ఒకరికి ఊరట , సాంత్వన ; మరొకరికి ధైర్యం , నిశ్చింత అన్న వాక్యంతో  ఆ సన్నివేశం ముగిసింది . దాంతో  వారి సాన్నిహిత్యం శరీరాల్ని అధిగమించిందనీ సాంగత్య సౌరభం మనసుల లోతుల్ని తాకిందని వాచ్యంగానే తెలిపినట్టైంది.

రచయిత్రి ఆ సన్నివేశాన్ని వుద్వేగ భరితమైన సంఘటనకీ ఆలోచనాత్మకమైన సంఘర్షణ కీ మధ్య అల్లింది . ఆ విధంగా   ఇద్దరు స్త్రీల మధ్య శృంగారాన్ని బెడ్ రూమ్ నాలుగ్గోడల మధ్య జరిగే ‘ప్రవేటు వ్యవహారంగా’ చూడాల్సిన అవసరం వైపు ,  స్త్రీల లైంగిక స్వేచ్ఛకీ దాన్ని హరించే వ్యవస్థీకృత భావజాలానికీ మధ్య నెలకొన్న దూరాల్ని ఛేదించడానికి వ్యక్తిగా వైష్ణవి చేసే మానసిక యుద్ధంవైపు , తనకేం కావాలో తెలుసుకోలేక తాను స్ట్రైటో లెస్బియనో బైసెక్సువలో తేల్చుకోలేక తన్ను తాను assert చేసుకోలేక తల్లడిల్లే ఆమె అంతరంగ సంఘర్షణవైపు , ఆమె తనలోకి తాను  చూసుకొంటూ చేసే అస్తిత్వ అన్వేషణ వైపు , వ్యక్తి స్వేచ్ఛని నిరోధించే కౌటుంబిక సామాజిక శాసనాల వైపు , వాటి మధ్య వైరుధ్యాలవైపు , మాయా వైష్ణవిల మధ్య సంబంధంలో కూడా యెక్కడో తెలియకుండానే చోటుచేసుకొన్న అసమానతవైపు పాఠకుల దృష్టి మళ్లేలా చేసింది.

వైష్ణవి మనసులో సుళ్ళు తిరిగే సంఘర్షణే కథకి ఆయువుపట్టు. ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు బయట స్నేహితులు వాళ్ళ మధ్య తన పెర్సనల్ ‘ఇమేజి’ … అంతా లెస్బియన్ లేబుల్ అంటించి తనని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్టు భావిస్తుంది. హోమో సెక్సువాలిటీ పట్ల వ్యక్తుల లైంగిక హక్కుల పట్ల తన భావాల్ని వ్యక్తం చేయడానికి రచయిత్రి వైష్ణవినే తన కంఠస్వరంగా యెన్నుకొంది. అందుకే చివరికి వైష్ణవి అన్నిటినీ ఛేదించుకొని  తన మనశ్శరీరాలు కోరుకున్నదాని వైపే మొగ్గింది.

‘మృత దేహాల్ని మార్చురీలో పెట్టినట్లు నేను కూడా ఈ దేహాగ్నిని ఐస్ గడ్డల మధ్య చల్లర్చుకోనా’ అన్న వైష్ణవి ఆవేదనని నెపం చేసుకొని  ‘కొన్ని లక్షల మంది’ (ప్రపంచ బాధిత స్త్రీల సంఖ్యలో యిది చాలా తక్కువ శాతమే కావొచ్చు) గొంతుకలకు ప్రాతినిధ్యం వహిస్తూ శరీర రాజకీయాలనుంచీ  లైంగిక రాజకీయాల దాకా స్త్రీవాద ప్రస్థానాన్ని రచయిత్రి నిర్వచించదల్చుకొన్నట్టు స్పష్టమౌతుంది.

ఇలా వొక భావజాలాన్నిప్రాతిపదిక చేసుకొని నిర్మించే  కథలో పాత్రలు ఫ్లాట్ గా తయారయ్యే అవకాశం వుంది . కానీ కల్పన  మాయ  వైష్ణవి పాత్రల్ని రౌండ్ క్యారెక్టర్స్ గా మలచడంలో గొప్ప  నేర్పు చూపింది . వ్యక్తికీ సమాజానికీ వ్యక్తికీ వ్యక్తికీ  వ్యక్తి  లోపలి  ద్వంద్వాలకి మధ్య చోటుచేసుకున్న వైరుధ్యాలూ వాదోపవాదనలూ వేదనలూ వాటి మాధ్యమంగా  చిత్రితమైన  బలమైన సంఘర్షణతో   కథకి కావాల్సిన అన్ని హంగులూ సమకూరాయి. వర్తమానం నుంచి గతానికీ గతం నుంచీ వర్తమానానికీ – వంటి రోటీన్ కథన శిల్పం కూడా కల్పనా చేతిలో కొత్త శోభని సంతరించుకుంది.

కథలో వైష్ణవి అనుభవించే యాతన పట్ల పాఠకులకు సానుభూతి లేదా  సహానుభూతి – ఆమె అంతిమంగా తీసుకున్న నిర్ణయం పట్ల యేకీభావం కలుగుతాయో లేదో గానీ కథ చదువుతోన్నంత సేపూ పైన లేవనెత్తిన ప్రశ్నలేవీ నిజానికి అడ్డురావు . రచయిత  వొక వుత్కంఠ భరితమైన కథావరణంలోకి తీసుకుపోయి ‘మంత్రదండం’ వుపయోగించి కదలకుండా కట్టిపడేస్తుంది . బయటికి వచ్చాకా అంతా  వొక వైష్ణవ మాయ అనిపిస్తుంది. అంతిమంగా కథ లెస్బియన్ సంబంధానికి లెజిటమసీ సాధించడానికి తోడ్పడుతుందో లేదో గానీ మౌనాన్ని బద్దలుగొట్టి ఆలోచనల్ని తట్టిలేపడానికి దోహదం చేస్తుందని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. తెలుగు కథలో వస్తు వైవిధ్యం కొరవడుతోందని ఆరోపించి బాధపడేవారికి యీ కథ  ఊరట , సాంత్వన , ధైర్యం , నిశ్చింత  కలగజేస్తుంది.

తాజా కలం   : కప్లెట్ కథ తర్వాత – ఇద్దరు స్త్రీల సహజీవనం చట్టబద్ధం కాకపోవడం వల్ల వాళ్ళిద్దరిలో వొకరు అకస్మాత్తుగా చనిపోతే రెండో వ్యక్తి యెదుర్కొనే  సామాజిక ఆర్ధిక అభద్రతని కేంద్రం చేసుకొని కుప్పిలి పద్మ రచించిన ‘మౌన’ కథ (  – చినుకు జూలై 2015 ప్రత్యేక సంచిక)  – లెస్బియన్ సంబంధం లోని మరో కోణాన్ని స్పృశించి యిదే వస్తువుకి  విస్తృతిని సాధించింది ; కానీ  గే ప్రేమని వస్తువుగా ఎండ్లూరి మానస రాసిన  ‘అదే ప్రేమ’ కథ   (సారంగ 24-9-15) మాత్రం చాపల్యంతో పనిగట్టుకు చేసిన ప్రయోగంలా అనిపించింది .

*

 

 

కొన్ని యువ హృదయాలూ – వాటి కలలూ!

testament-of-youth

-భవాని ఫణి
~

bhavaniphaniఅనగనగా అవి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు రోజులు .

చదువే ప్రాణమైన ఓ బ్రిటిష్ అమ్మాయి .
రహస్యంగా వర్డ్స్ వర్త్ నీ,షెల్లీనీ,బైరన్ నీ చదువుకుంటూ, ఆ ప్రేరణతో తను రాసుకున్న కొద్దిపాటి రాతల్ని ఎవరికైనా చూపించడానికి కూడా మొహమాటపడి దాచుకునే ముత్యంలాంటి అమ్మాయి.
ఆత్మ విశ్వాసమే అలంకారంగా కలిగిన దృఢ మనస్విని.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం  ఆమె ఆశయం . స్వప్నం.
ఎంతో కృషితో, పట్టుదలతో అక్కడ అడ్మిషన్ సంపాదించుకున్న ఆనందం,సంబరాలని అంబరానికి తాకిస్తున్న ఓ మంచి తరుణంలో అనుకోకుండా యుద్ధమొచ్చింది. అంతా తలక్రిందులైంది.
అన్న,స్నేహితుడు, ప్రేమికుడు అందరూ సైనికులుగా మారి , యుద్ధంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటుంటే తనకి చేతనైనది తను కూడా చెయ్యాలన్న ఆశతో, కోరికతో, కలల సౌధమైన ఆక్స్ఫర్డ్ నీ, ఎంతో ఇష్టమైన చదువునీ కూడా వదిలిపెట్టి వార్ నర్స్ గా మారుతుంది ఆ ధైర్యశాలి.
పట్టుబడ్డ జర్మన్ సైనికులని ఉంచిన టెంట్ లో విధులు నిర్వహించే బాధ్యత ఆమెకి అప్పగించబడుతుంది.
అలా అక్కడ తీవ్రంగా కలిచివేసే పరిస్థితుల మధ్య,  గాయపడిన శత్రు సైనికులకి సేవలందిస్తుండగా అంతులేని శోకం వెతుక్కుంటూ వచ్చి ఆమె జీవితాన్ని మరింత అల్లకల్లోలం చేస్తుంది .
ముందుగా ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమికుడు , తర్వాత ప్రాణప్రదమైన నేస్తం , ఆ తర్వాత ఆరో ప్రాణం వంటి సోదరుడు ఇలా ఎంతో ప్రియమైన వారంతా ఒకరి తర్వాత ఒకరు రక్కసి యుద్ధపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే ఆ లేత మొగ్గ ఏమైపోవాలి? ఆ మారణ హోమానికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలి?
 ఈ యుద్ధాలూ , ఈ పోరాటాలూ  ఇవన్నీ ఎందుకని ,ఎవరికోసమని లోలోపల బాకుల్లా పొడిచే సందేహాల గాయాలకి ఎటువంటి సమాధానాల్ని లేపనంగా పూయాలి?
ప్రాణాలు శరీరాలని విడిచి గాల్లో కలిసిపోతున్నప్పుడు ఏ మనిషి బాధైనా ఒకటి కాదా ? మనమంతా మనుషులమైనప్పుడు , మనుషులంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒకర్నొకరు ఎందుకు చంపుకోవాలి? చంపుకుని ఏం సాధించాలి?
ఇటువంటి ప్రశ్నలు మాత్రమే చివరికి ఆ అమ్మాయి దగ్గర మిగిలినవి.
ఆప్తుల మరణం వల్లనా, ఎంతో క్షోభకి గురిచేసే యుద్ధ వాతావరణంలో పని చేసి ఉండటం వల్లనా ఆమె తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతుంది . ఒక స్నేహితురాలు అందించిన సహాయంతో ఆ క్రుంగుబాటు నుండి బయటపడి తన జీవితాన్ని ముందుకు నడుపుకున్నా తన వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని బలమైన నిర్ణయం తీసుకుని , చివరి రోజుల వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటుంది.
ఇదంతా వీరా మారీ బ్రిట్టైన్ అనే ఒక స్త్రీ వాది అయిన రచయిత్రి కథ . ఒక్కోసారి నిజ జీవితపు కథలు, కల్పన కంటే ఆసక్తికరంగా ఉండి హృదయానికి పట్టుకుంటాయి . ఎందుకంటే ఆ కథలోని పాత్రలు , మలుపులు ఎవరో ఏర్పరిస్తే ఏర్పడినవి కాదు .. అవి అలా జరిగిపోయినవి అంతే . అందుకే అవి ఎందుకు అలాగే జరిగాయని ఆలోచించి వాదించే  అవకాశం మనకి ఉండదు. వీరా కథలో అటువంటి ఆసక్తికరమైన మలుపులేవీ లేవు గానీ విధి ఆమెతో ఆడుకున్న విషాదకరమైన ఆట ఉంది .జీవిత కాలానికి సరిపడే దుఃఖమూ ఉంది . అవే ఆమెని యుద్ధ వ్యతిరేకిగా మారుస్తాయి. తర్వాతి  కాలంలో పాసిఫిస్ట్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆమెని ప్రేరేపిస్తాయి.
వీరా బ్రిట్టైన్, తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని వివరిస్తూ రాసుకున్న “టెస్టమెంట్ అఫ్ యూత్” అనే పేరుగల ఆత్మకథ ఆధారంగా ఈ చలన చిత్రాన్ని నిర్మించారు. సరళంగా ఉన్న స్క్రీన్ ప్లే, కథ అర్థం చేసుకోవడంలో మనకి ఇబ్బంది కలిగించదు . ఏదో నిజంగా అక్కడే జరుగుతున్నట్టే ఈ దృశ్య ప్రవాహం కళ్ల ముందు నుండి అతి సాధారణంగా సాగిపోతుంది .ఈ ఆత్మకథలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ లోని సామాజిక పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపడం జరిగింది . అంతే కాక ఆత్మ విశ్వాసం , ధైర్యం మెండుగా కలిగిన ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ స్త్రీ అయిన కారణంగా, వీరా తనకి ఇష్టమైన కెరీర్ ని ఎంచుకోవడం కోసం ఎంత ఘర్షణ పడాల్సి వచ్చిందో కూడా మనకి ఈ కథ వివరిస్తుంది.
ముఖ్య పాత్రధారిణి అయిన “అలీసియా వికండెర్” అత్యున్నతమైన నటనని కనబరిచి తన పాత్రకి సరైన న్యాయాన్ని చేకూర్చింది. ఉత్తమమైన ఆత్మకథల్లో ఒకటిగా పేరు సంపాదించిన ఈ వార్ టైం మెమోయిర్ ని అంతే ఉత్తమంగా తెరకెక్కించడంలో దర్శకుడు జేమ్స్ కెంట్ విజయం సాధించారు. కథలోని ఆత్మని పట్టుకుని దృశ్యంగా మలిచి మన కళ్ల ముందు నిలపగలిగారు.
*

ఒక Enigma ఆత్మకథ..

 

-నరేష్ నున్నా

~

మోహన్‌కి అరవై ఐదేళ్లు! !

అందమైన వాక్యం (అన్న భ్రమ)లో చెప్పాలంటే… మోహన్‌కి అరవై ఐదు వసంతాలు!!

ఇంతకంటే విచిత్రమైన, విపరీతమైన, విడ్డూరమైన వాక్యంనా దృష్టిలో మరొకటి లేదు.

ఈ విరిగిన కుర్చీ పదేళ్ళుగా పడి ఉంది
నా పదవీ విరమణకి ఇంకా నాలుగు సంవత్సరాలు
ఆ కూలిన బ్రిడ్జి కట్టి గట్టిగా పుష్కరమైనా అయితేనా…
……. ఇలాంటివే కాదు మరికొన్ని అర్థవంతమైన వాక్యాల్నిచెవికెక్కించుకోగలను. ఇంకా జియాలజిస్టులు పళ్లూడిన రాళ్ళ వయసు, బోటనిస్టులు గూడు జారినచెట్ల ఆయుష్షు….. అన్నేళ్లు….ఇన్ని శిశిరాలు…అంటూ లెక్కలు కడుతుంటారు. అవేవీతప్పని, నేరమనీ అనిపించదు గానీ, మోహన్‌కి ఈడొచ్చిందనో, జోడుకు వయసొచ్చిందనో….అంటూంటే ఆశ్చర్యమేస్తుంది.

అక్కడెక్కడో మహాశూన్యంలోమన అగణిత బుర్రలకి ఊహకైనా అందని మహావేగంతో భూమండలం చేస్తున్న ఆత్మప్రదక్షణలకి, సూర్యచంద్రుల ఋజువర్తనా చమత్కారాల కనుగుణంగా ఎగిరే కాలం రెక్కలకి ఖగోళ గందరగోళాల లెక్కలు వేలాడదీశాం, మన దుర్భలత్వానికి చిహ్నంగా. ఆ లెక్కల జమాబందీ ఉచ్చుల్లో చిక్కుకుని, గడియారాలు పంచాంగాల్లో ఇరుక్కున్న ఏళ్ళూపూళ్లు, వారాలూ వర్జ్యాలు, ఘడియలు-విఘడియలతో ‘సమయా’నికి తగు ‘తాళం’ వేస్తుంటాం, మన దిక్కుతోచనితనానికి గుర్తుగా. అంతమాత్రం చేత ఎంత అల్పత్వాలున్నప్పటికీ, ‘తగుదునమ్మా’ అని మోహన్ వయో పరిమితుల్ని, ప్రాయ- చిత్తాల్ని కొలిచే యశః కాయకల్ప చికిత్సకి తెగబడతామా? ఏకాంతాన్ని భగ్నం చేసే,  చైతన్యాన్ని నిలువరించే, మధుమోహాల్ని రద్దుపరిచే వస్తువులు, స్థలాలు, రాళ్లురప్పలకి గానీ, అటువంటి జడపదార్థాల్లానే బతికేస్తున్న మనుషులకేమో గానీ,మోహన్ వంటి చైతన్యశీలికి వయస్సేమిటి?

ఆయన ‘కాలం’ మనకి తెలిసిన, అర్థమైన కాలం కాదు. ‘టైమ్’కి మాత్రమే కాదు, ఆయన ‘టెన్స్’కి కూడా సాధారణ వ్యాకరణార్థంలో తెలిసిన భూత, వర్తమాన, భవిష్యత్ అర్థాలు లేవు. చూరునుంచి ఒక్కొక్కటిగా జారి ఇసుకలో ఇంకిపోతున్న వానచుక్కని ఒంటరిగా పట్టి ‘కాలనాళిక ‘లో ఒకసారి పరీక్ష చేయాలి. అందులో కదలాడే ఆయన టెన్స్‌ ని. అది గతించిన గతమా? తళుక్కుమనే తక్షణమా? ఆగామి అగమ్య గోచరమా?ఈ మూడు కలగలిసిపోయిన  ఫోర్త్ పర్సన్ సింగ్యులర్‌లా, ఫోర్త్ డైమన్షన్ ఇన్విజిబుల్లాంటి హ్యుమన్ టెన్సా?

ఇసుక డొంకల్లో నగ్న పాదాల్తో చేతిలోని ఇప్పపూల దోనెతో పరుగులు తీస్తున్నప్పడు అందులోంచి చిందిపడే తేనేబిందువుల తుళ్లింతను పోలిన హ్యుమన్ టెన్స్‌ తో సంతులితమైన క్షణాలు. ఆ క్షణాల సమాహారమే మోహన్. అందుకే, 365 తేదీలుగా రద్దయిపోయే కేలండర్‌లో ‘డిసెంబరు 24’ అన్న ఒక్క రోజుమాత్రమే ‘పుట్టిన రోజు ‘ పేరిట ఆయనకి సంబంధించినదని అనడం విడ్డూరంగా ఉంటుంది.

mohan1

వ్యావహారిక పరిభాషలో మోహన్ ఒక చిత్రకారుడు, కార్టూనిస్టు, యానిమేటర్, ఇంకా మంచి రచయిత, చింతనాశీలి. ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఆర్టిస్టు గురించి రెండుముక్కలు రాయడానికైనా కొంత అర్హత అవసరం. రాత- గీత రంగాలలో పాత్రికేయ స్థాయి ఉపరితల అవగాహనైనా ఉండాలి. ఆంధ్ర దేశంలో ఆర్టు గురించి తెలిసిన అతిమైనారిటీ వర్గానికి చెందకపోయినా, అధిక సంఖ్యాకులకి ఉండే బండ బలమున్నా చాలు. పువ్వుల నేవళం గురించి తెలియకపోయినా, వాటిని గుదిగుచ్చిన దారాన్నివిడిచిపెట్టని మొండితనమున్నా చాలు. ఆ బండ, మొండితనంతోనే నా ఈ వ్యాసమనే ఉపరితల విన్యాసం: మోహన్ అనే ‘అసలు’గురించి కాదు, మోహనీయమనే ‘కొసరు’ గురించి. ‘మోహనీయమంటే మోహన్ తనమే,అదే దారం అనే motif!

సుమారు పాతికేళ్లు (మధ్య మధ్యలో విరామాలున్నప్పటికీ) దాదాపుగా ఆయనను రోజూ చూస్తూనే ఉన్నాను. అరికాళ్ల అంచున అలల ఘోష నిరంతరాయంగా ఉన్నా, కడుపులో చల్ల కదలనట్టుగా ప్రశాంతంగా తోచే సముద్ర గర్భాన్ని రోజూ చూసినా ఏం అర్థమవుతుంది? గుండుసూది కూడా దూరని రాతి ఒంపుల్లోకి ఉలిని పరుగులెత్తించి మలచిన మహాశిల్పాన్ని నిత్యం చూసినంత మాత్రాన ఏం తెలుసుకోగలం? అందులోనూ ఎన్ని పరిమళాల్తోను ఎదురొచ్చి ఆహ్వానించినా పరిచయమున్న పూలమొక్కంటే చులకన ఉన్నట్లు, పరిచయమైన కొద్దీ మనుషులుకూడా చవకవుతారు. అయినా ‘రోజూ చూస్తూ ఉండటం’ అనే బోడి క్వాలిఫికేషన్‌తోనే రాయక తప్పడం లేదు.

పైన ఇంతకుముందు ఏదో నాన్ సీరియస్ స్థితిలో, ఒక ఊపులో ‘చైతన్యశీలి ‘ అన్న విశేషణం వాడేశాను గానీ,మోహన్ ఎంతమాత్రం చైతన్యశీలికారు. ఒక సాధారణ అర్థంలో రక్తమాంసాలు, కామక్రోధాలు ఉన్న మనిషే కాదు. ఆయన ఒక phenomenon గామారిపోయారు కాబట్టి తరచి చూడకపోతే, ఆయనని పైకి స్థితప్రజ్ఞుడంటూనే జడుడని, enigmatic అంటూనే కొరకరానికొయ్యని అంటాం. పెదాల్తో నవ్వుతూ నొసట్లతో వెక్కిరించే అల్ప మానుషత్వంతోనే ఆయన స్నేహశీలిఅని, ఆపద్భాంధవుడని రకరకాల ముసుగు పేర్లతో శ్లాఘిస్తాం. మనఃశరీర సంబంధిత రాగద్వేషాల్లోనే రెండు కాళ్లునిలిపి, కుదుళ్ళుజొనిపి, మామూలుకంటికి కనిపించని సృజనాత్మక సౌందర్యం, తాత్విక సృజనావరణాల్లోకి తన మూర్తిమత్వపు శాఖోపశాఖల్నిచాపి విస్తరించిన మహావృక్షాన్ని పెరట్లో చెట్టులా చూస్తే అసలు రూపం ఎప్పటికీ బోధ పడదు.కుదుళ్ళకి, కొమ్మలకి ఉన్న బంధంలాంటి అంతర్నిహిత ప్రసారం ఒకటి ఆ వృక్షం లోపల జరుగుతుంటుంది. వేర్లలోని భౌతిక శక్తిని కొమ్మల్లోని ఆదిభౌతిక సత్తాలో అనుసంధానించడమనేది మోహన్‌లో నిరంతరం జరిగే ప్రక్రియ. అటువంటి మానవాతీతమైన అనుభవం వల్ల నిత్యమైన సృజనశీలిలో అన్నిభావోద్వేగాలు ఒక ఉచ్ఛస్థాయికి వెళ్లిపోతాయి. సుఖదుఃఖాలు, బాధానందాలు, వెలుగుచీకట్లు, నలుపుతెలుపుల వంటి ఎన్నోవిరోధాభాసలకి అందని ఒక ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాయి. అటువంటి ఆర్టిస్టులు ఏ ఉద్యమాల్నినడపరు; ‘ఎయిడ్స్ నుంచి రక్షణగా కండోమ్స్ వాడండ’ని జనాల్ని మేలుకొలపరు; ‘కల్లుమానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్’ అని పిలుపులివ్వరు; ఒక భార్య, ఒక జాణ, ఒకే బాణమని సుద్దులు చెప్పరు………దేనితో తలపడరు, దేనినీ మార్చరు. వాళ్లు చైతన్యశీలమైన ప్రవాహాలు కానే కాదు, ప్రవాహ గతిని మార్చే నిశ్చలమైన రెల్లు దుబ్బులు. సమాజాన్ని మార్పు దిశగా నడిపించే నాయకులకి స్ఫూర్తి దాతలు!

ఇటువంటివారు ముక్కుమూసుకుని ఏ గుహాంతర్భాగాల్లో ఉన్నా వారి ప్రభావం మాత్రం అమేయం. కానీ మోహన్ అలా అజ్ఞాతంగా, అజ్ఞేయంగా ఉండేవారేం కాదు. ఆయన మీద ప్రేమతో రకరకాల సందర్భాల్లోవ్యాసాలు రాసిన వారి ప్రకారం, మోహన్ ఒక గ్యాంగ్‌లీడర్. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన డెన్ ఎప్పడూ కోలాహలంగా ఉంటుంది. ఆయన తన పరివారం, బంధుగణం శిష్య ప్రశిష్యుల మధ్య పరివేష్టితులై ఉంటారు. ఈ నిత్యకృత్యం లాంటి దృశ్యంలో అబద్ధం లేదు, దృశ్యాల్ని అన్వయించుకోవడంలో తేడా ఉందేమో. నాతో సహా ఆయన బంధుమిత్ర సపరివారమంతా మోహరించి ఉన్నప్పడు, ఒక అనంతమైన విషాదం ఆ దృశ్యంమంతా పిగిలి పొర్లిపోతుంటుంది. ఈ ప్రపంచగతిని మార్చే నెత్తురు మండే శక్తులు నిండే సైనికుల్నిపుట్టించి, ఎగదోయగలిగిన ఆర్టిస్టు ఒక వీల్‌ఛైర్‌లో కూర్చొన్న సాధారణ భంగిమలో మామూలు కంటికికన్పిస్తూనే, వేరే ఉన్నతపార్శ్వంలో యోగముద్రలో ఉన్నప్పడు ఆ టేబుల్‌కి ఇటుపక్కన ఆ planeకి ఏ మాత్రం సంబంధంలేని ఒక పోచుకోలు గుంపు ఉండటం-

– ఒక దుర్భర విషాద దృశ్యం!

మానుష స్థాయిలో మోహన్‌లోకొన్ని తెంపరి లక్షణాలు ఉన్నాయి (లేదా ఉన్నాయని నా పరిశీలనా ఫలితం). స్థిర, లేదా చర సంపదల పట్ల పూర్తి వైముఖ్యం, అధికారం, హోదాల పట్ల మహా నిర్లక్ష్యం, స్వోత్కర్ష ఏ రూపంలో లేకపోవడం, పొగడ్తల పట్ల చెడ్డ యావగింపు, …..ఇంకా వ్యక్తీకరణల్లోకి ఇమడని ప్రేమా బాధ్యతల్ని వర్షించడం, చదువుకి- జ్ఞానానికి వంతెనలు వేసుకునే బాల్య కౌమార తృష్ణల్నిసజీవంగా నిలుపుకోవడం మొదలైనవి మరెన్నో. ఇన్ని దశాబ్దాలుగా ఆయన చుట్టూ తిరిగే ఏ ఒక్కరికీఈ లక్షణాల్లో ఏ ఒక్కటి సావాసదోషంతోనైనా అంటుకోకపోవడం విచిత్రమైతే, అసలా లక్షణాల ఉనికే వారికితెలియక పోవడం మరోవిచిత్రం. దొంగ మర్యాదలు, కుర్చీని బట్టి గౌరవాలు, అవసరార్థం అరదండాలు….వంటి లౌకికనైచ్యాన్ని తన పరిసరాల్లోంచి పూర్తిగా నిషేధించాలని ఆయన చేసిన అకర్మక క్రియ వంటి అప్రయత్నప్రయత్నం మరోలా వికటించింది. అదేదో సినిమాలో ‘ఈ పూట మనం ఫ్రెండ్స్’ అని ప్రొఫెసర్ అన్న వెంటనే’సరే సోడా కలపరా’ అనికుర్ర స్టూడెంట్లు చనువుతీసుకున్నట్లు, భేషజాలు లేని వాతావరణం ఉండాలని మోహన్ ఆశిస్తే, ఆకాశమంత ఎత్తున ఉన్నఆయన భుజంమీద చెయ్యేసి, వారివారి స్థాయి ఊకదంపుడు ఉపన్యాసాలకి ఆయన్ని శ్రోతని చేసి,కోటలు దాటే ఆ కోతలతో అంతులేని  కాలహరణం చేస్తుంటారు.

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

ఇవన్నీ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది- ఆయన అలిగి కూర్చున్నారేమోనని. అలిగిన వారిని బుజ్జగించడం అయిన వాళ్ళకి ఒక ముచ్చట, ఒక మురిపెం, అంతకు మించిన బాధ్యత. అయితే అలిగినట్లే అర్థంకాక పోవడం కంటే దురదృష్టం మరేముంది? ‘నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ము లేదు…’ అని దిగులు పడటం కంటే మించిన దురదృష్టం. నాలుగు దశాబ్దాల పై చిలుకు ఆయన చేస్తున్న సంతకం ఆయనది కాకపోవడం, అది ఒట్టి ఫోర్జరీసంతకమని ఎవరికీ పట్టకపోవడం ఎంత అన్యాయం! నీకోసం, నా కోసం మరేదో జెండా కోసమో గీసినగీతలు కాకుండా, తనకోసం తాను గీసుకున్న బొమ్మలెన్నో, గీయాలనుకున్న బొమ్మలెన్నెన్నో! ఎగ్జిబిషన్ల పేరిటో, కేలండర్ల కిందనో తనవైన ఆ బొమ్మల్ని ప్రదర్శించుకోవడం చెడ్డ చిరాకు ఆయనకి. కే.సి.డే మధుర స్వరాన్ని పందుల గురగురలు, వాహనాల చీదుళ్ళ మధ్య వినడానికి చలం పడిన చికాకులాంటిదది. అంకార్ వాట్, రామప్ప దేవాలయం….ఇంకా ఎన్నో మహోన్నతమైన చిత్ర, శిల్పకళాఖండాల దిగువున ఏ సంతకాలున్నాయని ఎదురు దెబ్బలాడతారు మోహన్. సంతకం చేయకపోవడమే భారతీయత అంటారు. ఇది కాళిదాసు విరచితమని, కవి నృప జయదేవ కృతియని, ఇంకా ఎందరో కవులు పద్య, శ్లోక మకుటాల్లో చేసిన సంతకాల్నిచూపించి, ‘ఇవి భారతీయం కాదా మోహన్!’ అని దబాయించి, ఆయన దాచుకున్నవి బయటకు లాగొచ్చు, ఆయన చేత బలవంతాన నిశానిముద్రలేయిస్తూ.

అయితే అంత కంటే ముందు ఆ స్థాయి ఆర్టిస్టు ప్రతి ఒక్కరికీ తమని ఏకాంత పరిచే ఒక అనంగరాగాన్నివినే వెసులు బాటు కల్పించాలి. ఆ  labyrinth of solitude లో కళాకారుడు చిక్కుకుపోవాలి; అలా చిక్కుకుపోయే సావకాశం ఏర్పాటుచేయాలి- నిజమైన బంధుమిత్ర సపరివారం. అప్పడే సృజనకి అవకాశం. అలా లేనప్పడు ఏ కళాకారుడైనా మోహన్‌లానే అలుగుతాడు. ఆయన అలక తీర్చేవాళ్ళలో కాకుండా, దానికి కారణమైన గుంపులో నేనొక్కడ్నిఅయినందుకు నన్ను ఎంతో కక్షతో ఐనా క్షమించుకోగలనా?

*

సావిత్రి- ఎప్పటికీ ఒక అద్భుతం!

 

– కొత్తింటి సునంద 

~

FullSizeRender (1)1996 సంవత్సరానికి గాను ఆంగ్ల సాహిత్యానికి అత్యున్నత పురస్కారం నోబెల్‌ బహుమతి పొందిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ రచయిత్రి టోని మారిసన్ను ఇంటర్వ్యూ చేసిన పత్రిక విలేఖరి ‘‘మీరు ఆంగ్ల భాషను ఇంత అందంగా  ఎలా రాయగలరు’’ అని అడిగాడట. దానికావిడ ఆంగ్ల భాషలోకేవం 26 అక్షరాలు  మాత్రమే ఉన్నాయి. ప్రపంచమంతటా వ్యాపించిన ఆంగ్లభాషను వాడే వ్యక్తులు  కోట్ల సంఖ్యలో ఉంటారు. వీరందరు వాడి వాడి ఆ అక్షరాలు  అరిగి పోయుంటాయి. మకిలి పట్టుంటాయి. వాటిని మర పాలిష్‌ చేసి మెరుగుపెట్టి వాడాల్సి ఉంటుంది. నేనదే చేస్తానుఅందట. మనకందుబాటులో వున్న దానికి మెరుగు పెట్టడమనే సూత్రం అన్ని రంగాలకు వర్తిస్తుంది. అది కళారంగంలో మరీ ముఖ్యం. ఉదాహరణకు సప్తస్వరాను లయబద్ధంగా  పలికించడమే సంగీతానికి ఆయువుపట్టు. మనకు వేలాది మంది గాయకులు , గాయనీమణులున్నారు.అందరూ  ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి  స్థాయిని చేరుకోలేకపోయారు. సినీ నటనారంగంలో అత్యున్నత స్థాయిని చేరుకొన్న నటి సావిత్రి ఆ కోవకు చెందిందే. కొన్ని తరాలపాటు దక్షిణభారత సినీ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాణి లాగ ఏలిన నటి సావిత్రి..  తమిళులు ఆవిణ్ణి నటిగర్‌తిలకం అని, కలైమామణి అని అభిమానంగా పిలుచుకొన్నారు.

నటనకు ఆంగికం, వాచికం, ఆహార్యం అతిముఖ్యమైన హంగు. తమకున్న శరీరాకృతిని పాత్రోచితంగా  మలచుకోడం, దానికనుగుణంగా  నడుచుకోడం, ఆయా సంఘటన ప్రకారం తమ గొంతును సరిచేసుకోడం, రకరకాల  మాడ్యులేషన్‌తో సంభాషణను పలికించడం, భావ ప్రకటనచేయడం. తగిన దుస్తులు  ధరించడం ఇవన్ని ముఖ్యం. హీరోయిన్‌ నడుమిలాగ ఉండాలి, శరీరం ఇంత పొడవుండాలి అని కొలతలతో కూడిన శరీరాకృతి కాదు సావిత్రిది. మొదట్లో వేసిన కొన్ని సినిమాలలో తప్ప ఆవిడ దాదాపు అన్ని సినిమాలో లావుగానే ఉంది. మూగమనసుసినిమాలో రెండు పుస్తకాలు  చేతపట్టుకొని కాలేజి విద్యార్థిగా  ఎంతబాగా చెలామణి అయ్యిందో కదా అని మెచ్చుకొన్నారు శేఖర్‌ కమ్ముల. అదే లావుపాటి శరీరంతో డాక్టర్  చక్రవర్తి సినిమాలో “నీవు లేక వీణ” పాటకు అభినయించే సన్నివేశంలో మెట్లమీద వాలి ఆమె ఒలక బోసినవయ్యారం, కళ్ళలో పలికించిన విరహం ప్రతి మగవాడి గుండెల్లో గుబులు  పుట్టించి ఉంటుంది. ఆడవారిలో అసూయ రేకెత్తించి ఉంటుంది. “కలసి ఉంటే కలదు సుఖం” సినిమాలో గంప నెత్తికెత్తుకొని “అద్దమంటి  మనసు ఉంది అందమైన సొగసు ఉంది ఇంతకంటే ఉండేదేందిచెప్పయ్యా ” అనే పాటకామె నడుము ఊపుతూ, వయ్యారంగా  నడిచే సన్నివేశాన్ని మనం మరవగలమా. హంసలా నడచి వచ్చే చిట్టెమ్మో అని హీరోగారామెకు కితాబివ్వనే ఇస్తాడు. గుండమ్మ కథలో “కోలు కోలోయన్న”  పాటలో కూడ మేల్ మేలో యన్న మేలో పెద్దమ్మి చిలకలాకులికేను బాలా అని మురిసి పోతాడు హీరో. కులకడానికి ఆమెకు తన లావు అడ్డం కాలేదు. ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు తమకున్న వనరునే అద్భుతంగా  వాడుకోడమనేదానికి ఇదొకమంచి ఉదాహరణ. అసలాపాట ఆ సినిమాకే హైలైటు. సాదా సీదా గెటప్పు. అందులో సావిత్రిముద్దుగా, గోముగా, మూతితిప్పినట్లుగా  ఇంకెవరైనా తిప్పగలరా అనిపిస్తుంది. మూతితో పాటు కళ్లను చక్రాల్లాగ తిప్పడం ఆమెకొక్కదానికే సాధ్యమనిపిస్తుంది.

ఒక వయ్యారమనే కాదు. ఆ బొద్దు శరీరంతో చెంగు చెంగుమని ఎగరడం, చలాకీగా  గెంతులేయడం, చకచకమని నడవడం ఎన్ని సినిమాలలో చూడలేదు మనం. “మంచి మనసులు ”  సినిమాలో ఏమండోయ్‌ శ్రీవారు పాట ఆవిడ ఎంత హుషారుగా , ఎంత ఉల్లాసంగా ,ఉత్సాహంగా అభినయించింది. అప్పుడామె వయస్సు గాని, లావు గాని మనకు గుర్తుకొచ్చాయా అదీ సావిత్రి నటనా చాతుర్యం.  ఇక మాయా బజారు సినిమాలో మాయా శశిరేఖగా  ఆమె చేసిన అల్లరి  అంతా ఇంతా కాదు. ఆ నటన గురించి, ఆ వన్నె చిన్నెల  గురించి ఒక వ్యాసమేరాయొచ్చు. అహ నా పెళ్ళంట పాట కామె చేసిన నాట్యం గాని, ప్రదర్శించిన హావభావాలు  గాని నభూతో నభవిష్యతి. నటనలో విశ్వరూపమే చూపిందావిడ. ఆ వేగమూ, ఆ విరుపు, మెరుపు, ఆ హోయలు  చాలా ప్రత్యేకం. అవన్ని ఒకెత్తు అప్పటికప్పుడు (ఆ పాటంతా ఒకే టేకులో తీసారంట – అదొక రికార్డు) వయ్యారి ముద్దుగుమ్మ కాస్త ఆజానుబాహుడైన ఘటోత్కచుడిగా  బారమైన అడుగు వేయడం, చిందు వేయడం, హుందాగ మగసిరిని ఒలకబోయడం, అంతలోనె గొంతు సవరించుకోడం, తడబడడం, గబగబ సర్దుకోడం, అల్లరిగా  నవ్వడం ` ఎన్ని కళలు! పరకాయ ప్రవేశం చేయడమంటే ఇదేనేమో. ఎన్నేళ్ళయింది చూసి ఆ సీను ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంది. ఆ షూటింగు చూస్తూ నిల బడిన కళాకారులు, టెక్నీషియన్స్‌ అప్పుడు ఆమెకి  స్టాండిరగ్‌ ఒవేషన్‌ ఇచ్చారట.  అదండి సావిత్రి తడాఖా. అసలా సినిమా విజయానికి సావిత్రి,ఎస్వి రంగారావులే ముఖ్య కారకులని చాలామంది అభిప్రాయం.

ఈ సందర్భంగా  మిత్రులొకరు చెప్పిన విషయం గుర్తొస్తున్నది. నటనకు, డైలాగు డెలివరికి మారుపేరని ఖ్యాతి గాంచిన ఎస్వీఆర్‌ తనకు సావిత్రితో షూటింగుంది అన్న రోజు ఇంట్లో చిరాకు పడి చిటపటలాడే వాడట. సావిత్రి నటన పక్కన తన నటన ఎక్కడ తేలిపోతుందోననిభయపడిపోయేవాడట. బాగా రిహార్సల్స్‌ చేసిగాని షూటింగుకి వెళ్ళే వాడు కాడట. ఎన్ని సినిమాలలో వారిద్దరు తండ్రికూతుళ్ళుగా  పోటీపడి నటించారో!  ఆ కాంబినేషన్లో సినిమాలు  చూసిన మనమెంత అదృష్టవంతులం!  తెలుగు  సినీ చరిత్రలో 50, 60, దశాబ్దాన్ని  స్వర్ణయుగమని పిలుస్తారు. దానికిగాను ఈ ఇద్దరూ   చేసిన దోహదం అంతా ఇంతా కాదు.

mayabazar

నాదీ ఆడజన్మేలో సావిత్రి ధరించిన పాత్ర చాలా ఛాలెంజింగ్‌ పాత్ర. అందము, ఆకర్షణ లేని నల్లని  రూపుతో వున్న స్త్రీ. అంతేకాదు చదువు సంధ్య లేని నిరక్షరకుక్షి. ఎవరి ప్రేమకు నోచని అభాగ్యురాలు. అయినా అందరి ఆనందం కోసం తాపత్రయపడే ఉత్తమ ఇల్లాలు.  ఆపాత్రలో సావిత్రి జీవించింది. అటువంటి పాత్రనంగీకరించడానికెంతో ధైర్యము, ఆత్మస్థైర్యము కావాలి. ఒకపక్క అందానికి పేరుపడ్డ ఎన్టీఆర్‌ పక్కన అందవిహీనంగా  కనపడడం, ఇంకొక పక్క నటనలో మేరునగధీర సమానుడైన ఎస్వీఆర్‌తో పోటీపడి నటించడం ఒక్క సావిత్రికే చెల్లు. మనిషికి అందము, ఆకర్షణ చదువు సంధ్యలే కాదు మనసు, మమత ముఖ్యమని ఆ సినిమా సందేశం. కుటుంబానికి ఆధారభరితమైన ఇల్లాలికవేవీ లేకపోయినా ఫరవా లేదనే ఆ సందేశాన్ని నూటికి నూరుపాళ్ళు ప్రజ మనసులోకి సూటిగా  తీసుకొని వెళ్ళగలిగింది సావిత్రి నటన.

ఎన్టీ రామారావు పక్కన ఎన్నో సినిమాలలో నటించి విజయఢంకా మోగించిన సావిత్రి రక్తసంబంధం సినిమాలో అతడికి చెల్లెలిగా  నటించింది. చాలామంది ప్రేక్షకులు  మిమ్మలని  అన్నా చెల్లెళ్ళగా  మెచ్చరు. మీరాపాత్ర ఒప్పుకోవద్దన్నారట. కాని వారిద్దరూ కూడ పక్కాప్రొఫెషనల్స్‌. తమ నటనాశక్తి మీద అపారమైన నమ్మకమున్నవారు. ఆ పాత్రలో వారు జీవించారు. నిజమైన అన్నా చెల్లెళ్ళేమో అన్నంత సహజంగా  నటించారు.

సినిమాలో చేరాలని సావిత్రి మద్రాసు చేరినప్పుడు ఆమెకు 15 ఏళ్ళ వయసు. సంసారం సినిమాలో హీరోయిన్‌గా  తీసుకోవాలనుకొన్నారు. ఏఎన్నారందులో హీరో. అతడిని విపరీతంగా  అభిమానించి అతడిని చూడాలనే కోరికతో విజయవాడలోని ఒక థియేటర్‌కెళ్లి ఆ తోపులాటలో కిందపడిన ఆ అమ్మాయికి ఏకంగ అతడి పక్కన హీరోయిన్‌గా వేషమేయడమంటే బెదరిపోయింది. బెంబేలు  పడింది.  ఈ అమ్మాయి హీరోయిన్‌ వేషానికి తగదని ఏదో ఒక చిన్న వేషమిచ్చి పంపారట. అటువంటి సావిత్రి మా పక్కన సావిత్రి కథానాయికగా ఉంటేగానిమేము నటించము అని హీరోలూ,  ఆమె లేకపోతే మా పిక్చర్‌ ఆడదని నిర్మాతలు  ఆమె కోసం పడిగాపులు  పడే స్థితికి చేరింది సావిత్రి. అది ఓవర్‌నైటు జరగలేదు. సినీ పాఠశాలలో చేరి అంచెలుగా ఎదిగి మహోన్నత స్థానం చేరుకొన్నది. నటనలో ఎంత పరిణతి చెందిందంటే తానుఎవరి పక్కన హీరోయిన్‌గా  పనిచేయడానికి భయపడిందో ఆ నాగేశ్వరరావుకే నటనలో డైలాగు డెలివరిలో పాఠాలు  చెప్పే స్థాయికి! నటనలో ఆమెకు ఆమే సాటి. నటనలో ఆమెతో పాటీ పడే స్థాయి తనకు కూడ లేదంటారు నాగేశ్వర్రావు. ఇది సుమంగళి సినిమా తీసేటప్పుడు జరిగింది. సినిమా షూటింగ్లోనే నేరుగ తెలుపలేని పాత్ర మనోగతాన్ని, మానసిక సంఘర్షణని గోడమీద పడే నీడ ద్వారా చిత్రీకరిస్తే బాగుంటుందని దర్శకుడికి సూచించింది. సినిమా కళనంతగా జీర్ణించుకొందప్పటికి.

సుమంగళి సినిమాలో ఆవిడ ధరించిన పాత్ర వైవిధ్యభరితమైనది. చాలా క్లిష్టమైనది. ప్రేమ పెళ్ళికి దారి తీసింది. ఇక దాంపత్య జీవనానికి నాంది పలికే శోభనం జరగడానికి ముందు జరిగిన ప్రమాదంలో భర్తకు వంద్యత్వం సంప్రాప్తిస్తుంది. అతడికి ఆ విషయం తెలపకూడదనికట్టడి. ఒక వంక వయసులో ఉన్న తనలో చెలరేగే కోరిక ఉధృతిని, తాపాన్ని చల్లబరచుకోవాలి. ఇంకొక వంక తమకంతో తన దరికి చేరుతున్న తన ప్రియుడిని కంట్రోల్ చేయాలి. మరొక వంక తన మీద నిఘాపెట్టిన అత్తకు అనుమానం రాకుండ మానేజి చేయాలి. వీటన్నిటి మధ్యనలిగిపోయే ఒక అసహాయమైన స్త్రీగా  సావిత్రి నటించిన తీరు అనన్య సామాన్యము. సినిమా మొత్తం కేవలం  తన చూపుతోటే నడిపిందంటే అతిశయోక్తి కాదేమో. అమితాబ్‌ బచ్చన్‌ కోసమె పాత్రను సృష్టించడం, ఆ పాత్రలతో సినిమాలు  తీయడం మనకు తెలుసు . అప్పట్లోనేసావిత్రిని దృష్టిలో పెట్టుకొని పాత్రను సృష్టించడం, సినిమాలు  తీయడం జరిగి ఉంటుంది. సందేహం లేదు. సావిత్రి వంటి నటి మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా మరి.

మనం మొదట్లో చెప్పుకొన్నాం ఆహార్యం గురించి. ఒంపు సొంపు గురించి. సావిత్రికి ఒంపుసొంపు లేవు. కాని మనకా సంగతే గుర్తు రాదు. ఆమె చందమామ లాంటి మోమును చూస్తూ మైమరచిపోతాము. చాలా అరుదైన అందమైన మొఖం సావిత్రిది. అందమైన సరస్సులోవిచ్చిన కమలాలు  ఆమె కళ్ళు. స్వచ్ఛమైన తటాకంలో ప్రతిబింబం ప్రతిఫలించినట్లే సావిత్రి కళ్ళలో ప్రతిఫలించని భావం లేదు. కళ్ళే ఆమె ఆభరణాలు. . కళ్ళే ఆమె ఆయుధాలు. అవి చల్లని  వెన్నెల  కురిపించ గలవు. నిప్పులూ  కురిపించగవు. చిలిపి నవ్వు రువ్వగలవు.చిరాకునూ ప్రదర్శించగవు. సావిత్రి ఏనాడూ అసూయ, ద్వేషాలున్న పాత్ర ధరించలేదు. ఉంటే కష్టాలు  కన్నీళ్ళు ఉంటాయి. లేదా బలిదానాలూ , త్యాగాలుం టాయి. లేదా చిలిపితనం, హుషారు ఉంటాయి. వాటిని ప్రదర్శించడం ఆమెకు బాయే హాత్‌కి ఖేల్‌ హై.

devadasu

బరువైన పాత్రలని సావిత్రి ఎంత అద్వితీయంగ పోషించగల దంటే, అటువంటి పాత్రను పోషించడంలో ప్రఖ్యాతి గాంచిన హిందీతార మీనాకుమారి మద్రాసుకొచ్చినప్పుడల్లా సావిత్రి సినిమాలు  చూసి, ఈ పాత్రను నేను ఇంతబాగా చేయగలనా అని ప్రశ్నించుకొనేదట. బాధాతప్తస్త్రీ వేదనని సావిత్రి ప్రజెంట్‌ చేయడంలో ఒక వరవడినే ఆమె సృష్టించింది. అంతకు ముందు కడవలతో కన్నీళ్ళు కార్చడమే దుఃఖాన్ని ప్రదర్శించే విధానం.  తాను కన్నీళ్ళే కార్చకుండ మన గుండె  పిండేసే విధంగ నటించడం సావిత్రి వంతు. అటువంటి పాత్రలు  పోషించడందేవదాసుతోనే మొదలు . అప్పటికామె వయసు పదహారో పదిహేడో, సాహిత్యంతో పెద్దగ పరిచయం లేని బ్యాగ్రౌండు. నటనానుభవము అంతంత మాత్రమే. ముందా పాత్రకి భానుమతిని గాని జానకిని గాని తీసుకోవాలను కొన్నారట. అయినప్పటికి ఆ పాత్రలో ఆమె జీవించింది.దేవదాసంటే నాగేశ్వర్రావే, పార్వతంటే సావిత్రే.. వారి స్థానంలో మరొకరిని ఊహించుకోలేము అన్నంత గొప్పగ వారిద్దరు నటించారందులో. ఆ సినిమా రికార్డు బద్దలు  కొట్టింది. అజరామరంగా నిచిపోయింది. పెద్ద నటనానుభవం లేకపోయినప్పటికీ  అంత చిన్న వయసులో అంతగాఢమైన భావాలనేలా  పలికించ గలిగిందో ఆశ్చర్యం కలు గుతుంది. కొన్ని సన్నివేశాలలో కళ్ళల్లో శూన్యభావాన్ని ప్రతిఫలింప చేయగలగడం మనకు కన్పిస్తుంది. అదెంత కష్టమో కదా. అంతేకాదు తన గొంతులో, డైలాగు పలికిన తీరులో నిరాశను, బాధను, వేదాంత సరళిని పలికించినతీరు కూడ గొప్పగ ఉంటాయి. మొహము, హావభావాలు  ఒకరివి – గొంతు,  డైలాగు డెలివరి మరొకరివి ఐన నేటి యుగంలో అన్ని కళలను తనలో ఇముడ్చుకొన్న సావిత్రి వంటి నటిని మళ్ళీ  చూడగమా అనిపిస్తుంది. అప్పట్లో అందరూ  తమ డబ్బింగు తామేచెప్పుకొనేవారేననుకోండి. అందులో ప్రత్యేకంగా  చెప్పుకొనే వారిలో ఎస్వీఆర్‌, జగ్గయ్య, ఎన్టీఆర్‌, సావిత్రి ముఖ్యులు.

ఇందాక కన్నీళ్లు కార్చడం గురించి అనుకొన్నాము కదా. అందులో సావిత్రి ప్రతిభ గురించి ఒక కథనముంది. మాయాబజార్‌ సినిమాలో “నీకోసమె నే జీవించునది” పాట చిత్రీకరిస్తున్నారట. “అమ్మాయ్‌ నీవిప్పుడు కన్నీరు కార్చాలి గ్లిసరిన్‌ తీసుకో”మన్నారట దర్శకు కె.వి.రెడ్డి. దానికి సావిత్రి “కన్నీరు కార్చడానికి నాకు గ్లిసరిన్‌ అవసరం లేదు. చెప్పండి మీరే కంటిలో కార్చమంటే ఆ కంటిలోనే కారుస్తా కుడికన్నా, ఎడమ కన్నా, అంతే కాదు ఎన్ని చుక్కలు  కార్చమంటే అన్ని చుక్కలే కారుస్తా”నందట. దర్శకుడికి పంతం కలిగి ఛాలెంజ్‌ చేసాడట.అప్పటికే ఆ యూనిట్‌ వాళ్ళంతా అక్కడ చేరారట. ఎవరు నెగ్గుతారో చూద్దామని. అందరిలో ఉత్కంఠ.  ఏ కన్ను కెమెరావైపున కనిపిస్తూ వుందో ఆ కంటినుండి మాత్రమే ముచ్చటగ మూడంటే మూడు కన్నీటి చుక్కలు  రాల్చిందట సావిత్రి. అటువైపున్న కంట్లో ఒక్కటంటే ఒక్క చుక్కరాల్చలేదట. ఆ అద్భుతాన్ని చూసి అందరూ అవాక్కై ఉంటారు. కాదంటారా!

ఇటువంటి చోద్యాలు  సావిత్రి నట జీవితంలో మరెన్ని జరిగాయో మనకేం తొలుసు. నటనలో ఉద్దండపిండాలైన నటులకే చెమటలు  పట్టించిందని తెలుసుకొన్నాం కద. సావిత్రి నటనా దురంధరతను గూర్చి ఏఎన్‌ ఆర్‌ మరొక సందర్భంలో ఇలా అన్నారు. సావిత్రి నటనఆర్భాటంతో కూడినది కాదు. బహు సున్నితంగా, సూచన ప్రాయంగా  ఉంటుంది. ఆంగ్లంలో” సటిలిటి” అంటారు. అంటే అతి సూక్ష్మమైన భావాను సైతం నటనలో ప్రతిఫలింప చేయటమన్నమాట. సుచిత్రాసేన్‌ కథానాయికగా  బెంగాలి భాషలో 1959లో “దీప్‌ జ్వలే జాయె” అనేసినిమా తీసారు. 1960లో దానినే సావిత్రితో “చివరికి మిగిలేది” అనే సినిమాగా  తీసారు. 1968లో వహీదా రెహమాన్‌ హీరోయిన్‌గ హిందీలో “ఖామోషి” తీసారు. ముగ్గురూ అగ్ర శ్రేణి నటీమణులు.  తమ హావభావాను అతి సున్నితంగా  డైలాగు అవసరం లేకుండచూపుతోనే తెలుపగల దిట్టలు.  అది చాలా బరువైన పాత్ర..  వారు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలరనే నమ్మకంతో ఆయా నిర్మాతలు , దర్శకులు  వారిని ఆ పాత్ర పోషించడానికి ఎన్నుకోవడం జరిగింది. ఎవరిమట్టుకు వాఋ అత్యద్భుతంగా  నటించారు.. ఎవరికి వారేగొప్ప వారు. అయినప్పటికీ సావిత్రి చూపించిన “సటిలిటి” నీ  ప్రత్యేకంగా చెప్పుకోవసిన అవసరముంది. ఆ పాత్ర ఒక నర్సుది. ఒకానొక రోగికి పరిచర్య చేయడానికి ప్రత్యేకంగా  నియమించబడినది. ఆ రోగి మానసిక స్థితి దుర్భరంగా   ఉండటం వలన అతడితో ప్రేమగా  ఉండమని,కంటికి రెప్పలాగ కాపాడవసిన అవసరముందని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఆ నర్సు నిజంగానే ఆ రోగి ప్రేమలో పడిపోతుంది. అతడికి శుశ్రూష చేయడం కేవలం  తన విధి మాత్రమే అనుకోదు. అది తన భాగ్యమనుకొంటుంది. అందులో లీనమై తానెవరో ఏమిటో మరచిపోయేస్థితికి చేరుకొంటుంది. ఆ రహస్యాన్ని మదిలోనే దాచుకొని ఉంటుంది. ఆమె చేసిన సేవల వలన ఆరోగ్యం కుదుటపడి ఆస్పత్రి నుండి డిస్చార్జికి సిద్ధపడతాడు. దీనికంతటికి కారకురాలైన నర్సును పిలిచి అభినందిస్తాడు డాక్టరు.

నిజమేమిటో తెలియని అతడు నీవు గొప్పగ నటించావు.నీది నిజమైన ప్రేమ అని నమ్మిన రోగి బాగుపడ్డాడు. అంతే చాలని మెచ్చుకుంటాడు. ఆ మాటలు  విన్న ఆ నర్సు దుఃఖంతో తల్లడిల్లిపోతుంది. గద్గద స్వరంతో సావిత్రి ఆ వేదనను అభివ్యక్తీకరించిన విధానం అనన్యసామాన్యం. కపటనాటకం ఆడడం ఎలా, నటన నా వల్ల  కాదు’ అనిరోదించే సన్నివేశం మనని కదిలించి వేస్తుంది. ఆ సినిమా మొత్తం తన భుజస్కందాల మీద మోసింది సావిత్రి.. ఆ సినిమా కమర్షియల్గా  విజయవంతమయ్యిందో లేదో కాని అదొక క్లాసిక్‌గా మిగిలిపోయింది. పెద్ద హీరోల తోనే కాదు అంతగా ప్రాబల్యం లేని వారితోకలసి  నటించడానికావిడ వెనకాడలేదు. తనమీద తనకు, నిర్మాతకు ఆవిడ మీద ఉన్న నమ్మకమటువంటిది.

kanyasulkam

మన తెలుగు సాహితీ సౌరభాలను దశదిశలా వెదచల్లిన వారిలో ముఖ్యులు  గురజాడ. ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైన వంద కావ్యాలో కన్యాశుల్కం ఒకటి .  వంద గొప్పస్త్రీ పాత్రలలో  మధురవాణి ఒకటి. అంతటి ప్రాధాన్యమున్న ఆ పాత్రను పోషించడానికి సావిత్రి కాక మరి ఎవరు తూగగలరు. మధురవాణి ఒక నెరజాణ. తన ఆటపాటలతో మగవారి మనసు రంజింప చేయడమే కాకుండ తన కబ్జాలో చిక్కిన వారిని జారిపోనీకుండా  ఒడిసి పట్టుకొనిఉండే చాకచక్యం కలిగిన  జాణ. ఇతరుల  నొప్పింపక తానొవ్వక తిరిగగలిగిన చమత్కారి మధురవాణి. వృత్తికి సానే కాని ప్రవృత్తి హుందాతనం, దయ, అంతఃకరుణ కలిగిన స్త్రీ రత్నం. తన తెలివితేటల తో లుబ్దావధాన్లతో, రామప్పంతులు వగైరాతో మాట్లాడే సమయంలో ఆడే మాటలోఎకసెక్కం, వెటకారం నిండి ఉంటాయి. పెదవులు  నవ్వుతుంటాయి. నొసలు వెక్కిరిస్తుంటుంది. సావిత్రి బుగ్గనటుఇటు ఆడిస్తుంది. బుగ్గను నొక్కుకొంటుంది. కళ్ళను వంకరగా  పెట్టి ఓరచూపు చూస్తుంది. కళ్ళను చికిలిస్తుంది. మాటతూటాల నొదులు తుంది. మాటను విరుస్తుంది.దీర్ఘాలు తీస్తుంది. ఎదుటి వారి ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది. తన మనసులోని మాట బయటపడనీకుండా  ఎదుటి వారిని మాయలో ఉంచడానికి వారిని ఆనందింప చేస్తుంది. విసవిస నడుస్తుంది. రుస రుస లాడుతుంది. చిరుకోపం నటిస్తుంది. వారిని మోహావేశంలో ఉంచడానికిఅగ్గిపుల్ల వెలిగిస్తుంది. అదే కరటకశాస్త్రి, అతడి శిష్యుడిని చూసినప్పుడు మాత్రం అవ్యాజానురాగాలు  కురిపిస్తుంది. వారిని చూసే చూపే వేరు. మిస్సమ్మ సినిమా రిలీజయ్యేసరికి సావిత్రి అంతగా పేరు ప్రఖ్యాతి గాంచలేదు. అసలాపాత్రకి ముందు భానుమతిని ఎన్నిక చేశారట.హాస్యపాత్రను చేయడంలో ఆవిడ అందెవేసిన చేయి. మిస్సమ్మ ఆద్యంతం హాస్యభరితమైన సినిమా. భానుమతి మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేకూర్చగల దని వారి నమ్మకం. కొన్ని కారణాల వల్ల భానుమతి తప్పుకుంది . అదే పాత్రను సావిత్రి అద్భుతంగా పోషించడమూ . ఆసినిమా విజయ దుందుభి మోగించడమూ మనకు తెలుసు. బరువైన పాత్రలే కాదు హాస్యభరిత పాత్రను కూడ పోషించగల దని రుజువు చేసుకుంది సావిత్రి .  విజయా సంస్థ సావిత్రిని, సావిత్రి విజయా సంస్థను వదిలి పెట్టలేదు. ఎస్వీ రంగారావు, సావిత్రి కాంబినేషను అప్పటినుండేమొదలైందనుకుంటా.

ఇక మిస్సమ్మ  పాత్రను గురించి చెప్పుకుందాం. సావిత్రి చూసే చూపు, పడే చిరాకు మనం మరచిపోలేము. ఎన్టీఆర్‌ను కూడా ఒక పట్టాన నమ్మదు. గమనిస్తూ ఉంటుంది. పెళ్లికాని అమ్మాయి తీసుకోవలసిన జాగ్రత్తలు  తీసుకొంటూ  ఉంటుంది. ఆ ఇద్దరు కలసి  పండించినహాస్యం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీకు గుర్తుండే ఉంటుంది. కాలికి తగిలిన దెబ్బ ఉత్తుత్తిదని కట్టుతీసి అటూ ఇటూ చకచక తిరుగుతున్న అతడి వెంటపడి తిరిగే సావిత్రి కళ్లలో సంభ్రమాశ్చ ర్యాలులు చూడాల్సిందే కాని వర్ణించలేం. అతడి మీద నమ్మకం, ఇష్టం కలిగిన తరువాత ఆభావాల ను అవ్యక్తంగా వ్యక్తీకరించిన తీరు భేషుగ్గా  ఉంటుంది. “ఏమిటో నీ మాయా ఓ చ్లని రాజా ” పాటను ఎంత మధురంగా , ఎంత సున్నితంగా  అభివ్యక్తీకరించిందో గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ జమున ఎన్టీఆర్ ని  ఎగరేసుకొని పోతుందో నని భయపడడం, జమునని కసురుకోడం,రుసరుసలాడడం ఎంత సహజంగా  ఉన్నాయో, అసూయతో ఏఎన్నార్ని ఎగదోసే తీరు, అతడికి పాట నేర్పే సన్నివేశం తెలుగు  సినిమా చరిత్రలో హాస్య సన్నివేశాలో మకుటాయమానం. అందులో నటించిన ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, సావిత్రి, రేలంగి, బాలకృష్ణ, ఆ సన్నివేశాన్ని కల్పించినదర్శకుడు అజరామరంగా  నిలిచి ఉంటారు. శ్రీమంతం సీనులో కూడ ఆ తతంగాన్నంత విధిలేక భరిస్తున్నట్లు సావిత్ర మొహంలో కనబరిచే హావభావాలు  చూడముచ్చటగా ఉంటాయి. చివర్లో అందరూ తనవారే అని తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరుస్తు అందరినీ  అక్కున చేర్చుకొన్నతీరు అత్యంత సహజంగా ఉంటుంది. సావిత్రి తరువాత వచ్చిన నటీమణులకు ఏవేవో బిరుదులిచ్చారు ప్రేక్షకులు. నటనకే భాష్యం చెప్పగలిగిన సావిత్రినేమని పిలవగలరు మహానటి అని కాకుండా !.

సామాన్యజనం నుండి మేధావుల  వరకు ఆమె నటనకు నీరాజనాలిచ్చిన వారే. ప్రజాకవి గద్దర్‌ ఆమెను గురించి ఇలా అన్నారు. మనసున్న మారాణి సావిత్రి. హీరోలు  రాజ్యమేలు తున్న తరుణంలో వారికి ధీటుగ నిలచిన సావిత్రి హీరోకు హీరో. తారలు  రావచ్చు తారలు  పోవచ్చు కానీ కలకాలం నిలిచే ధృవతార సావిత్రి. “సాము నలుపుదాన సక్కని దాన సల్లంగ ఉండాలె  సెల్లె నీవు” అని పాట కూడ రాశారు.

ఆనాడే సినిమాకి లక్ష  రెమ్యునరేషన్‌ తీసుకొన్న సత్తా కలిగిన తార సావిత్రి.. సినిమా ప్రపంచంలో ఉన్న ముగ్గురు శిల్పుల్లో  సావిత్రి ఒకరన్నారట శ్రీశ్రీ.  1960లో ఆవిడ కథానాయికగా  నటించిన 21 సినిమాలు  రిలీజయ్యాయట. అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్టులే. ఆంధ్రయువతీ మండలి వారు ఆమెను ఏనుగు అంబారీ మీద ఊరేగించారట. ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అంబారీకి ఎదురేగారట.  సావిత్రి తన తరువాత వచ్చిన నటీమణుందరికీ  నటనలో మార్గదర్శకురాలు . దాదాపు అందరూ ఆమెలా నటించాలని కోరుకొన్నవారే. ఆమెను అనుకరించినవారే.

( డిశంబర్ 26 సావిత్రి వర్ధంతి సందర్భంగా ) 

   ఓరి బ్రహ్మ దేవుడా..!

 

-బమ్మిడి జగదీశ్వర రావు

~    

bammidi

ఓరి బెమ్మ దేవుడా..!

నీకు రిమ్మ గాని లెగిసిందేట్రా.. యేట్రా.. ఆరాతేట్రా.. యే మొకం పెట్టుకొని రాసినావురా.. సేతికొచ్చింది గాని రాసేనావా యేటి? బెమ్మరాత యెవుడుకీ అర్థం కాదంతారు.. యిదేనేటి? యిలగేనేటి? రాత నీదైనా నుదుల్లు మావి గావేటి? యిష్టం వొచ్చినట్టు యెలాక్కలగ రాసీస్తే పడతామనుకుంతన్నావేటి? నువ్వు యిలాపింటోడివి కాబట్టే పూజకి నోసకుండ అయిపోనావు, సాల్దా? మనిసి పుట్టుక పుట్టు తెలుస్తాది.. కలవపువ్వు మీద సరస్పతీదేవి పక్కన పరాసికాలు ఆడుతూ కూకోడం కాదు, ఈ మట్టీమీదకి రా.. నువ్వు బగమంతుడివైనా బెమ్మదేవుడువైనా నువ్వీ మట్టీల మట్టీ కాకపోతే అడుగు.. నువ్వు యెలాగ అవుతారం సాలిస్తావో నీక్కూడా తెల్దు.. నిన్ను పుట్టించినోడికి కూడా తెల్దు..

అసలు నాకొక అగుమానం.. నీకు గాని పవర్లు పోయినాయేటో? నువ్వు రాసినట్టుగా యేది జరగడం లేదు.. అంతా తలా తోకా లేకండా జరగతంది.. నువ్వు తలకిందులుగా రాస్తావు గాని తలా తోకా లేకండా రాయవు. మరి యిదేటిది?

సావుపుట్టుకలు నీ సేతిలో వుంతాయంతారు. అది అబద్దము కాదేటి? యిప్పుడు నొప్పులొచ్చినప్పుడు యెవులు కంతన్నారు? యెక్కడ కంతన్నారు? మంచిరోజు సూసి.. మూర్తాలు తీసి.. యెలితే మనకు యెప్పుడు కావాలంతే అప్పుడు డాకటేరుకి యీలయినప్పుడు సిజేరియను సేసి పిల్లలని కోసి తీస్తన్నారు. కుట్లేస్తన్నారు. నువ్వేటి సేస్తన్నావు? నువ్వేటి సూస్తన్నావు? నీ నయినాలు తీసి యే గైనాన దోపుకున్నావు సామీ..

పుట్టుక సరే, సావో? నీ రాత సంతకెల్ల.. నువ్విలాటి సావులు మునుపు యెప్పుడైనా సూసినావా రాసినావా? నీకు నాలుగు జతల నయనాలున్నాయి.. యేల? కళ్ళు పెద్దవి.. సూపు మద్దిము అన్నట్టుగుంది నీయవ్వారం.. యిలగ అంతన్నానని యేటి అనుకోకు.. నీ రాత.. అదే మా తలరాత యేమి బాగోలేదు.. తిన్నగ నేదు.. ముప్పైమూడు వొంకర్లు అరవైయ్యారు సిత్రాలు తిరిగున్నాది..

ఆవుసు తక్కవ పుట్టక పుడితే యే పామో  గీమో పొడిసీసిందంటే కరమ్ము కాలిపోయింది అనుకోవచ్చును.. యిదేటిది యెలకలు కరిసీసి ముక్కలుతీసీసి పిల్లడు సచ్చిపోడమేటి? అదీ ఆస్పెట్లిలోట? పురిటికందుకీ గాచ్చారమేటి? యిది నరుడు రాసిన రాతా? నారాయుడు రాసిన రాతా? అసలిది రాతేనా?

అర్రే.. అయిదరాబాదు నీలోపర్రు ఆస్పెట్టిల్ల పంకాలు పడిపోయి పసిపిల్లలు సచ్చీజావులై పొడమేటి? సిమెంటు పెచ్చులు ముక్కముక్కలు వడగళ్ళ వానలాగా రాలడమేటి? ఏటీ యిడ్డూరం? ఆస్పెట్టిల్లు పేనాలు పొయ్యడాకో తియ్యడాకో దేనికో తెల్డంనేదు..!

మా కాలంల అడివిలోకి యెల్తే పులో బుట్రో వొచ్చి దాని బయ్యానికో గియ్యానికో గాండ్రమనుకొని మీద పడిపోయి సట్టలు సీరీసీది.. మరి యిదేటిది? యిచిత్రం కాదా.. యీదిలోకి యెల్తే పిల్లల్ని కుక్కలు సట్టలు సట్టలు సీరీడమేటో సంపీడమేటో యేటి తెల్డం నేదు..!

ఓరే.. యీలమ్మ కడుపు కాల.. యీల అత్తోరింట్ల పీనుగెల్ల.. యెక్కడికక్కడ కాలవలు తవ్వీసి ముయ్యకుండ వదిలిస్తే యేటవుతాది? యెనకటి కుల్లు కాలవల పడ్డ పిల్లాడు దొరకనేదు.. యింతల పిల్ల పడిపే.. వారం పోద్దోయికి దొరికింది.. సక్కన బడికెల్లి వొస్తున్న పిల్ల.. కాలవలన్నీ ములిగీ తేలీ తిరిగెల్లి సంద్రంల కలిసి కడకి పీనుగయి యింటికొచ్చింది..

అదేమి వూరు.. గేపకం నేదు, పేపర్లల్ల యేసినారు.. మా మనవడే సదివినాడు.. పిసరంత వోర్త.. పొటోవు యేసినారు.. ఊష్టమొచ్చి మంచాన పడితే బెల్లంకి సీమలు పట్టినట్టు మనిసికి సీమలు పట్టేనాయి.. ఒళ్ళు వొలుసుకు తినేనాయి.. సచ్చిపే.. ఊరిడి కాదు, వోడ వోర్త కదా.. అందరం మరిసేపోనాం..

సీమలు సరే, మరి దోమలో? కుడితే జొరాలు.. జబ్బులు.. బొంగో డెoగో.. కుడితే చావు.. ముడితే చావు.. అదేమి ప్లూ అనీసి బయపెడతన్నారు గానీ యిస జొరాలకి యేలమంది సప్పుడు సెయ్యకండా సచ్చిపోతన్నారు, తండాల్లో తట్టుకోలేక సచ్చిపోతన్నారు. గూడేల్లో గుట్టు సప్పుడు కాకండా సచ్చిపోతన్నారు. యిల్లిల్లూ పీనుగుల పెంటలే..

కలికాలం కాపోతే.. గురువే.. గురువమ్మే.. తల్లి తరవాత తల్లి.. దైవం తరవాత దైవం.. పెళ్ళంతో సాలలేక పేడకుప్పకి తన్నినట్టు పిల్లలకి తన్నీడిమేటో.. కొట్టి బెత్తంతో బాది సంపీడిమేటో.. పిల్లలు బడికెలతన్నారో కబేలాలకి యెలతన్నారో తెల్డం నేదు.. అదికాదు.. పిచ్చికి పిల్లంత సిన్న పిల్లమీద యెనుబోతు లాగా మేస్టు కన్నెయ్యిడమేటమ్మా.. కవుకులు యెట్టడమేటమ్మా.. కామంకి కల్లు నేవంతారు యిదేగావల్ల..?

యిక్కడ అమ్మా అయ్యిలకి కడుపులోటుoడగాన బడిలేసీయాల. పుట్టగాన బడిలేసీయాల. బొడ్డుతాడు కొయ్యక ముందే బడిలేసీయాల. కూసోడం నిల్సోడం రాకముందే బడిలేసీయాల. అడుగులెయ్యడం రాకముందే ఆడీయాల. మాటలాడడం రాకముందే పాటాలు నేర్సీయాల. యిలాటి అమ్మా అయ్యిలని యే బడిలెయ్యాలో? సదువు యాపారమయ్యాక కనికట్టు సేసినట్టు కనగాన బడిల పడీయాల. ఒడిల పడీసినట్టు కాదు. డబ్బుకు పడుసుకున్నోలు పిల్లల్ని గాలికిదిగో యిలగే వొదిలేసి పొతే.. లిప్టుల యిరకన తలలు రాలిపోవా? ఆల యాపారాలు దిబ్బయిపోను..

ఎక్కడా అలగే వుంది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు అంతారు.. పడ్డాయి కళ్ళు.. వొకరివికావు.. నలుగురివి.. పదమూడేళ్ళ పిల్లని సిటీ రోడ్డుల్లంట తిప్పుకుంటా సెరుసుకుంటా తిరిగినారట.. టీవీలల్ల సూపించినారు గదేటి? పోలీసు గండలు పొట్టలు పెంచుకోని యే మంత్రి యింటికాడ డూటీలు సేత్తన్నారో.. యెవులి ముడ్డి నాకతన్నారో.. అయినా ఆలేటి యిదమూ పదమూ వున్నోలా? లాకప్పుల్లోట వున్నోలిని సేరిసిన గనులేనా? మరేటే?

అందరు అలగే వున్నారు. కత్తి పదునుగుందని పీక కోసుకుంతామా? మన రత్తం.. మన కండ.. కండని కొండ సెయ్యల్సింది పోయి.. బతుకు కష్టముగుందని నూతిల తోసి పిల్లల్ని కాసిన అమ్మానాయినే సంపీడమేటో.. యెన్న ముద్ద లేదని యిసపు ముద్ద యెట్టి సంపీడమేటో.. యీల పిల్లల మీద యీలకి అక్కు వుంతాది నిజిమే, సంపీ అక్కు అక్కేనా? అన్నిం పున్నిం యెరగని యీ పిల్లలకేటమ్మా తల్లీ దండ్రీ ముచ్చు దేవతలైపోడమేటి?

ఏటిది? ఆపమంటే ఆపలేదని పోలీసోడు లాటీ యిసరడమెంత? బండి మీద పిల్లలు బొమ్మల్ల పడడమెంత? బుర్ర నేలకి గుద్దడమెంత? గుండె ఆగిపోవడమెంత?

రొట్టి గొంతుల అడ్డంపడి వొకలు.. యిడ్లీ ముక్క యిరుక్కొని వొకలు.. నీళ్ళ టేంకులపడి మరొకలు.. వుయ్యాట్ల నైలాను సీర సుట్టుకొని యింకొకలు.. ఆకులు రాలినట్టు రాలిపోతన్నారు.. పచ్చాకప్పుడే రాలిపోతన్నారు. నాలాటి పండుటాకుని తీసికేలిపోతే యెవులు వద్దంతన్నారు?

ఆకలికి సచ్చిపోతన్నారు. అన్నానికి సచ్చిపోతన్నారు. రోగాలకి సచ్చిపోతన్నారు. మందులకి సచ్చిపోతన్నారు. వయిద్దిం అందక సచ్చిపోతన్నారు.

సచ్చిందాక సావులు తప్ప బతుకు సూడనా? నా కళ్ళు గుడ్డయిపోయినా బాగున్ను.. నా ఆవుసు తీసుకో.. పిల్లలకి పొయ్యి దేవుడా..

దేవుడా.. నువ్వు అమురుతం తాగు. మాకు నీల్లియ్యి.. అన్నమియ్యి.. ఆవుసియ్యి.. మొగ్గలోన తెమ్పీకు.. మొగ్గలీడిన దాక వుంచు.. పువ్వులు పూసిన దాక వుంచు.. రేకులురాలినట్టు మీము రాలిపోతాము గానీ నీలాగ వుండిపోయి వుట్టిగట్టుకు వూరేగాలని మాకెవరికీ లేదు..

యిది నీ రాత కాదు, నువ్వు రాసింది కాదు, నీకు పెతినిదిగా పెట్టుకున్నాము గాదా.. ఆగండలు సేసిందిది.. మా నీడర్లనంతే వొప్పుతారా? జైల్లెట్టించీరా? దేవుడా.. నీవంతే మూగోడివి! మాగోడిది అని మొరెట్టుకున్నా నీకే! మొట్లెట్టుకున్నా నీకే! నువ్వంతే పడతావు.. అందుకే నీ మీద పడ్డాను.. వొక్క మాట.. పిల్లలకి యీలు కాని రాజ్యం పిశాచాలకి నెలవంతారు.. మమ్మల్ని యేలతున్న పిశాచాల పీక నువ్వయినా నొక్కవా..?

బెమ్మ దేవుడా! నీ రాత బాగుండాల. మాబతుకు బాగుంటాది. రూళ్ళ బుక్కు తెచ్చి వొరవడి రాస్తావో.. యేటి సేస్తావో.. నీ రాత కుదురుండాల. మా జీవితాలు కుదురుండాల. పిల్లల్లోన దాగున్న బగమంతుడూ బాగుండాల..

యింతే సంగతులు.. సిత్తగించవలెను..

యిట్లు

మీ దాసాను దాసురాలు