ఆరు ముత్యాలున్న అడవి!

 

-భవాని ఫణి

~

wild tales1

రోడ్డు మీద మన మానాన మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తెలీని వ్యక్తి వచ్చి మనల్ని తీవ్ర పదజాలంతో దూషిస్తేనో లేక అవమానిస్తేనో మనమేం చేస్తాం?. ఈ ప్రశ్నకి ఒక్కటే సమాధానం ఉండదు. ఎవరికి వారు, వారి వారి పరిణితిని బట్టీ, విజ్ఞతని బట్టీ, ధైర్యాన్ని బట్టీ, అవకాశాన్ని బట్టీ,పరిస్థితుల్ని బట్టీ విభిన్నంగా స్పందిస్తారు. మనుషులందరిలో ఉండే భావోద్వేగాలు ఒకే విధమైనవి అయినప్పటికీ, వారవి ప్రదర్శించే స్థాయిలో మాత్రం హెచ్చు తగ్గులు తప్పనిసరిగా ఉంటాయి. నిజానికి కాస్తంత వివేకమో, భయమో ఆపలేనప్పుడు, పగా ప్రతీకారాలు మనిషిచేత ఎటువంటి నీచ కార్యాలనైనా చేయించగలవు. ఎంతటి అధమ స్థాయికైనా దిగజార్చగలవు. విచక్షణని కోల్పోయేలా చేసి, అతని స్వంత గౌరవాన్నీ, మర్యాదనీ, ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పణంగా పెట్టించగలవు. చివరికి అతడిలోని పశు ప్రవృత్తిని వెలికి తీయగలవు.
అటువంటి పగనీ, ప్రతీకారాన్నీ కథా వస్తువుగా తీసుకుని మనిషిలోని సహనపు స్థాయిని ఒక విభిన్నమైన కోణంలోనుండి సమీక్షించి నిర్మించిన బ్లాక్ కామెడీ చలన చిత్రం “వైల్డ్ టేల్స్” (Spanish: Relatos salvajes). 2014 లో విడుదలైన ఈ ‘అర్జంటైన్ – స్పానిష్’ సినిమా, అర్జెంటీనా సినిమా చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.  2015 ఫారిన్ లాగ్వేజ్ ఆస్కార్ కి నామినేట్ చేయబడింది కూడా . పోలిష్ సినిమా “ఇదా”తో పోటీపడి గెలవలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్నీ చూరగొంది.
wild-tales-2
ఆరు భాగాలు గల ఈ యాంథాలజీ చలన చిత్రపు మొట్టమొదటి కథ “Pasternak”. ఒక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులంతా, తామందరూ ఒక సారూప్యతని కలిగి ఉండటాన్ని గమనిస్తారు. వీరంతా ఏదో ఒక సమయంలోనో, సందర్భంలోనో Pasternak అనే వ్యక్తిని మోసంచెయ్యడమో, ఇబ్బందికి గురి చెయ్యడమో చేసిన వారే. Pasternak ఆ విమానానికి కేబిన్ చీఫ్ అనీ, వారంతా ఒకే విమానంలో ప్రయాణించడం యాదృచ్ఛికం కాదని వారు గుర్తించేలోపుగానే ఆ విమానం నేలకూలిపోతుంది. ఇక్కడ ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎంత చిన్న విషయంలోనైనా అన్యాయానికి గురికావడమనేది మనిషిని తీవ్రంగా బాధిస్తుంది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదలిస్తే, మరి కొందరు తిరుగుబాటు బాట పడతారు. రెండూ చెయ్యలేక పదే పదే అన్యాయానికి, అసమానత్వానికీ బలవుతున్నానని ఒక వ్యక్తి భావించినప్పుడు, అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనై చివరికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, తనకి తోచిన రీతిలో న్యాయాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.  “Pasternak”,అందుకు సరైన ఉదాహరణ.
 రెండో కథలో, లేట్ నైట్ కావడం వల్ల నిర్మానుష్యంగా ఉన్న ఒక హోటల్ కి ఒక వ్యక్తి రావడం, అక్కడ పని చేసే ఒకమ్మాయి అతన్ని, తన తండ్రి చావుకు కారకుడిగా గుర్తించడం, తన బాధని తనతో పాటుగా పని చేసే ఒక ముసలి వంటామెతో పంచుకోవడం, ఆ  ముసలామె ఈ  అమ్మాయి అడ్డు చెబుతున్నా వినకుండా  ఆ వ్యక్తిని చంపెయ్యడం జరుగుతుంది. ఇక్కడ ముసలామె, అమ్మాయి ప్రతీకారాన్ని తనదిగా భావించి ముక్కూ మొహం తెలీని వ్యక్తిని పొడిచి చంపేస్తుంది. ఇందుకు కారణమేమిటా అని ఆలోచిస్తే, ఒకప్పుడు ఆమె ఎదుర్కొన్న అన్యాయానికి  ఈ విధంగా న్యాయం పొందినట్టుగా భావించి ఉండవచ్చని అనుకోవచ్చు. లేదా తన సహోద్యోగిని బాధ ఆమెని అంతగా కదిలించి అయినా  ఉండవచ్చు. లేదంటే ఆమెలోని హింసాత్మక ప్రవృత్తి అటువంటి సందర్భం కోసం వెతుక్కుంటూ ఉండి కూడా ఉండవచ్చు. మొత్తానికి ఈ కథ వేరొకరి పగకి ప్రతీకారం తీర్చుకోవడమనే అంశాన్ని గురించి చర్చిస్తుంది. ఈ కథ పేరు “The Rats”.
ఇక మూడవ కథ “The Strongest” తాత్కాలికమైన చిన్నపాటి రోడ్ రేజ్ సంఘటన కలిగించే కసీ, ద్వేషానికి సంబంధించినది.  కారుకి దారివ్వని కారణంగా రోడ్డు మీద మొదలైన చిన్న గొడవ ఇద్దరు వ్యక్తుల్ని ద్వేషంతో రగిలిపోయేలా చేసి, చివరికి ఇద్దర్నీ కాల్చి బూడిద చేస్తుంది. తాత్కాలికమైన ఆవేశం, తర్వాత కలిగే కష్టనష్టాల గురించి కూడా ఆలోచించనివ్వనంతగా విచక్షణని పోగొడితే ఏం జరుగుతుందో తెలియజేస్తుందీ కథ.
పాలక వ్యవస్థలో గల లోటుపాట్లూ, అది చూపే నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజానీకంలో ఏర్పడే అసహనం, అసంతృప్తుల యొక్క  తీవ్ర రూపాన్ని అతిశయంగా చూపిస్తుంది నాలుగో కథ “Little Bomb”. పార్క్ చెయ్యకూడని స్థలమని స్పష్టమైన సూచనల్లేని ప్రదేశాలనించి, తన కార్ ని మాటి మాటికీ తీసుకెళ్లి జరిమానా వేస్తున్న నిర్లక్ష్యపు వ్యవస్థపై కోపంతో,
అసంతృప్తితో Simón Fischer అనే వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ని బాంబ్ తో పేల్చేస్తాడు. ఈ కథలో మాత్రం సమాజంలో కదలిక ఏర్పడినట్టుగా, Simón న్యాయాన్ని పొందే దిశగా అడుగు వేస్తున్నట్టుగా  అనిపించే విధంగా ఉంటుంది ముగింపు. మొదటి మూడూ పూర్తి స్థాయి హింసాత్మక ప్రతీకారానికి చెందిన కథలైతే, ఇది మాత్రం చైతన్యంతో కూడిన హింసగా దర్శకుడు అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తుంది.
ఒక్కోసారి మన వల్ల ఎదుటివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా, అది మనకి జరుగుతున్న అన్యాయంగా ఊహించుకుని, ఎదుటి వ్యక్తికి కూడా అటువంటి అభిప్రాయాన్నే కలిగించగలిగితే ఎలా ఉంటుందన్నది ఐదో కథ “The Proposal”. తన కుమారుడు చేసిన ఒక కార్ యాక్సిడెంట్ నేరాన్ని తనపై వేసుకునేందుకు తోటమాలిని ఒప్పిస్తాడు ధనికుడైన ఒక వ్యక్తి. కానీ ఒప్పందం సమయంలో లాయరు, ప్రాసిక్యూటరు, తోటమాలీ డబ్బు విషయంలో తనని మోసం చేస్తున్నారని భావించి, వారికి కూడా అదే అభిప్రాయాన్ని కలిగించి చివరికి
తనకి కావలసిన విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడతను. అంతా అతనికి అనుకూలంగా జరిగిపోబట్టి సరిపోయింది కానీ ఆ ఒప్పందం కుదరకపోతే తన కన్నబిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న నిజాన్ని, అతను తన కోపానికి పణంగా పెడతాడు.
కొత్తగా పెళ్లైన ఒకమ్మాయి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి వేరే అమ్మాయితో శారీరక సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఆ కోపంలో, ఆవేశంలో ఆమె తీవ్రమైన దుఃఖానికి లోనై, తన సహజమైన మృదుత్వాన్నీ, సామాజిక లక్షణాన్నీ కోల్పోతుంది. తత్ఫలితంగా తీవ్రమైన విశృంఖలత్వాన్నీ, హింసాత్మక ధోరణినీ ప్రదర్శించి తన పెళ్లి పార్టీలోనే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. చివరికి భర్త చొరవతో స్పృహలోకి వచ్చి సర్దుబాటు చేసుకుంటుంది. ఈ కథ బ్లాక్ కామెడీ అన్న పదానికి పూర్తి న్యాయాన్ని చేకూరుస్తుంది. అమ్మాయి రోమినా ప్రదర్శించే ‘గాలొస్ హ్యూమర్’ చాలా అసహజమైందే అయినప్పటికీ,  నవ్వడానికి కూడా మనస్కరించనంతగా మనల్ని తనలో లీనం చేసుకుంటుంది. ఇది ఈ యాంథాలాజీ సినిమా కథల్లోని ఆఖరి కథ “Till Death Do Us Part”. రోమినాగా నటించిన ‘ఎరికా రివాస్’ అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది.
ఈ కథలన్నిటినీ కలిపే చక్కని సంగీతం, ‘ఇది ఒక కామెడీ సినిమా సుమా’ అని చెప్పే ప్రయత్నం చేసినా, ఆలోచింపచేసే థ్రిల్లర్స్ గానే మనం వీటిని స్వీకరిస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే “అన్యాయాన్ని ఎదిరించగలిగినప్పుడు కలిగే ఆనందానికి చిరునామా”గా ఈ చలన చిత్రాన్ని అభివర్ణిసాడు దర్శకుడు Damián Szifron.
*

తెలుగు వాడి బావుటా !

 

సూర్య-కుమారి-గూటాల-గారు

లండన్ లో తెలుగు భాషా, సాహిత్యాలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు గూటాల కృష్ణ మూర్తి గారే! 88 ఏళ్ల వయసులో గత వారం విశాఖపట్నంలో జూలై 13, 2016 నాడు పరమపదించారు అన్న వార్త ఎంతో విచారం కలిగించింది. ఆయనతో నేను గడిపిన మధుర స్మృతులు మననం చేసుకుంటూ ఆయన ఈ ఆత్మీయ నివాళి సమర్పిస్తున్నాను.

అది 1980 వ సంవత్సరంలోమంచి రోజున మా మహాకవి శ్రీశ్రీ గారి కవితలని అప్పుడే హ్యూస్టన్ లో అడుగుపెట్టిన మంచి గాయని చంద్రకాంత చేత పాడించి ఓ గ్రామఫోన్ రికార్డు చేస్తే ఎలా ఉంటుందీ అనే ఆలోచన దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు అనే మా ఊరి పెద్దాయన కి వచ్చి నన్ను సంప్రదించి దానికి మహాకవి శ్రీశ్రీ గారి అనుమతి సంపాదించే బాధ్యత నా మీద  పెట్టారు. శ్రీశ్రీ గారికి ఫోన్ చేసే ధైర్యమూ, ఆ నాటి ఇండియా ఫోన్ కాల్ కి అయ్యే వంద డాలర్లు డబ్బూ నా దగ్గర లేక నేను వెంటనే శ్రీశ్రీ గారి మద్రాసు చిరునామాకి భయం, భయంగానే ఉత్తరం వ్రాశాను.  ఆయన దగ్గర నుంచి రెండు నెలలు అయినా సమాధానం రాకపోతే “గొప్ప వాళ్ళతో అంతేలే” అనుకుని ఆశ వదిలేసుకుంటూ ఉండగా లండన్ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. ‘మనకి లండన్ లో ఎవరూ తెలీదే’ అని ఆశ్చర్యంగా ఆ ఎయిరోగ్రాం ఉత్తరం తెరిచి చూస్తే అది శ్రీశ్రీ గారి నుంచే! ఆయన ప్రస్తుతం లండన్ లో గూటాల కృష్ణ మూర్తి గారి ఇంట్లో ఐదారు నెలలు గా ఉన్నట్టూ , నా మద్రాసు చిరునామా ఉత్తరం ఆయనకి బట్వాడా చేయగా అందినట్టూ, చంద్రకాంత చేత పాడించడానికి అభ్యంతరం లేదు అనీ, తను అమెరికా వచ్చి దాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందా అని అడగడం ఆ ఉత్తరంలో సారాంశం.

EPSON MFP image

ఆ విధంగా నాకు గూటాల గారితో పరోక్షంగా పరిచయం అయింది. ఆ సమయంలో గూటాల గారు ఒక తెలుగు వాడు కనీ వినని ఒక మహత్తరమైన కార్య సాధనలో ఉన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి సారిగా ఒక కవి స్వదస్తురీతో, ఆ కవితని ప్రతిబింబించే ఉన్నత స్థాయి బొమ్మలతో సహా పుస్తక రూపంలో ముద్రించి దానికి అనుబంధంగా ఆ కవి స్వయంగా చదివిన ఆ కవిత ని ఆడియో కేసెట్ గా అనీ కలిపి ఒక అపురూపమైన కానుకగా రూపొందించడమే ఆ మహత్కార్యం.  గూటాల గారు ఎన్నుకున్న కవి మహాకవి శ్రీశ్రీ . ఆ కవిత మహా ప్రస్థానం. ఆ చిత్రకారుడు బాపు. వారిద్దరినీ,శ్రీశ్రీ గారి సతీమణి సరోజ గారినీ, తోడుగా పురిపండా అప్పల స్వామి గారినీ ఆయన లండన్ ఆహ్వానించారు. ఈ బృహత్ కార్యం తలపెట్టడానికి మరొక ప్రధాన కారణం ఆ మహా ప్రస్థానాన్ని అత్యున్నత స్థాయి ప్రచురణని పరిశీలనకి పంపించి తద్వారా మహాకవి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి ప్రయత్నం చెయ్యడం. ఆయన ప్రణాళిక ప్రకారం శ్రీశ్రీ గారు సతీ సమేతంగా లండన్ లో గూటాల గారి ఇంట్లో ఆరు నెలలు ఉన్నారు. ఆయన ఆశయాలకి అనుగుణంగా బాపు గారు ఎంతో స్ఫూర్తితో వేసిన నాలుగే నాలుగు అద్భుతమైన బొమ్మలతో “మహా ప్రస్థానం” ఆడియో కేసెట్ తో సహా 1981 లో ప్రచురించబడింది. అమెరికాలో ఆ పుస్తకాన్ని కిడాంబి రఘునాథ్ గారు పంపిణీ చేశారు. కేవలం 100  కాపీలు మాత్రమే ముద్రించబడిన ఆ అపురూపమైన పుస్తకం 90 వ కాపీని నాకు గూటాల గారు స్వయంగా నా కోరిక మీద హ్యూస్టన్ వచ్చి నాకు బహూకరించారు. నా అదృష్టానికీ, ఆయన ఔదార్యానికీ ఇంత కంటే నిదర్శనం   ఏం కావాలీ?

ఆయన మా ఇంట్లో ఉన్న వారం రోజులూ మా ఆవిడ గిరిజ మీద ఎంతో అభిమానం పెంచుకున్నారు. ఇద్దరిదీ విశాఖ పట్నమే కదా! వాళ్ళ ‘యాస’ లో హాయిగా మాట్లాడుకునే వారు. పైగా శ్రీశ్రీ గారూ అక్కడి వారే. గూటాల గారు రాక ముందే శ్రీశ్రీ గారు అమెరికా రావడం, హ్యూస్టన్ లో ఆయన స్వహస్తాలతో సిప్రాలి రాయడం జరిగింది. కానీ గూటాల గారి ‘మహా ప్రస్థానం’ వెనక నోబెల్ బహుమానం ఆసక్తి ఉంది కాబట్టి గూటాల గారు ఆ సంగతులు కొన్ని నాతో పంచుకున్నారు. ఉదాహరణకి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి అంతకు ముందు ఆ బహుమానం అందుకున్న రచయితలో, ఇతర అర్హతలు ఉన్న వారు మాత్రమే ఆయన పేరు, కవిత సూచించాలి అనే నిబంధన ఉందిట. అందుకని గూటాల గారు శ్రీశ్రీ గారిని ప్రొఫెసర్ బట్లర్  ఇంటికి తీసుకెళ్లారుట. లోపల డ్రాయింగ్ రూమ్ లో కూచున్నాక బట్లర్ గారు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళారుట. అక్కడ బల్ల మీద ఉన్న లండన్ టైమ్స్ పేపర్లో సగం పూర్తి చేసి ఉన్న క్రాస్ వర్డ్ పజిల్ శ్రీశ్రీ గారు చూసి, అది తీసుకుని పూర్తి చేశారుట. ఈ లోగా బట్లర్ గారు వెనక్కి వచ్చి ఆ పూర్తి చేసిన క్రాస్ వర్డ్ పజిల్ చూసి గుండెలు బాదుకుని ‘అయ్య బాబోయ్, నేను పొద్దున్న ఆరు గంటల నుంచీ తంటాలు పడుతున్నాను. మీరు ఎలా చెయ్య గలిగారూ?” అని ఆశ్చర్య పోయారుట. మరి శ్రీశ్రీ గారి మహా ప్రస్థానాన్ని నోబెల్ ప్రైజ్ కి పంపించే ఉంటారు కదా!

EPSON MFP image

తెలుగు కవిత తో పాటు ఇంగ్లీషులోకి ఒరిజినల్ తర్జుమా కూడా పంపించినా, ఈ వార్త తెలుసుకున్న కొందరు తెలుగు ప్రముఖులు తమ అనువాదాలు కూడా పంపించి అవే ఒరిజినల్ అని చిన్న వివాదం సృష్టించి మహా ప్రస్థానానికి లేకుండా పుణ్యం కట్టుకున్నారూ అని  కానీ తరువాత తెలిసిన వార్త. ఇక్కడ విశేషం ఏమిటంటే గూటాల గారూ, శ్రీశ్రీ గారూ కూడా ఇది ఎక్కువగా  పట్టించుకున్నట్టు లేదు. ఆ రోజుల్లో గూటాల గారితోటీ, శ్రీశ్రీ గారితోటీ కాస్తో, కూస్తో నేను సన్నిహితంగా ఉండే వాణ్ని కాబట్టి ఈ మాట  చెప్పగలుగుతున్నాను.  ఆనాటి మహాప్రస్థానం పుస్తకానికి బాపు గారు ఎంతో అరుదుగా -ముళ్ళపూడి వెంకట రమణ గారితో కలిసి కాకుండా – తనంత తనే వ్రాసిన ముందు మాట, అప్పుడు వేసిన బొమ్మలు ఇందుతో జతపరుస్తున్నాను.

ఇంతకీ గూటాల గారికి ఇంత ఆసక్తికి కారణం ఆయనకి ఆంగ్ల సాహిత్యం మీద ఇంగ్లీషు వారికి కూడా లేని పాండిత్యం ఉండడం. ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన 1928 లో పర్లాకిమిడిలో పుట్టారు. చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ లోనూ, విజయనగరం లోనూ పెరిగి, విశాఖ పట్నం ఎవి ఎన్ కాలేజ్ లో రోజులలోనే ఆయన లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ప్రభావానికి లోనై చదువులలో వెనకబడ్డా, 1955 లో ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీష్ లిటరేచర్  ఆనర్స్ పూర్తి చేశారు. ఆ తరువాత అమలాపురం లోనూ, మధ్య ప్రదేశ్ లో బిలాస్ పూర్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయులు గా పని చేశారు. సాగర్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉండి, 1962 లో  కేవలం గుమాస్తా ఉద్యోగం కోసం  లండన్ వెళ్ళిన గూటాల గారు అక్కడే 1967 లో డాక్టరేట్ చేశారు. తరువాత ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ సర్వీసులో చాలా విద్యాలయాలలో అధ్యాపకులు గా పని చేశారు.  విద్యావంతురాలైన వెంకట రమణ గారిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకి ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు.

EPSON MFP image

బాపు రేఖల్లో సూర్యకుమారి

ఈ జీవిత వివరాలు సాధారణంగానే కనపడవచ్సును కానీ ఆయన ఆంగ్ల సాహిత్యంలో 1890 వ దశకాన్ని ఔపోసన పట్టి ఆ విక్టోరియన్ దశకంలో వచ్చిన రచనల మీద విస్తృతమైన పరిశోధనలని చేసి ఆంగ్ల సాహిత్యంలో సుస్థిర స్థానం కలిగించారు. అలనాడు CP బ్రౌన్ వేమన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినట్టుగా ఫ్రాన్సిస్ థామ్సన్ కవిత్వానికి  గూటాల గారు ప్రాచుర్యం కలిగించారు. ఆయన సంస్థాపించి దశాబ్దాల పాటు నిర్వహించిన ఫ్రాన్సిస్ థామ్సన్ లిటరరీ సొసైటీ, ద 1890 సొసైటీ లు యావత్ ఆంగ్ల సాహిత్య ప్రపంచానికి ఆదర్శ ప్రాయాలుగా నిలిచాయి.  1890 దశకం లో పురి విప్పుకున్న ఫ్రాన్సిస్ థామ్సన్, రస్సెల్, టి.ఎస్. ఎలియట్, బెర్నార్డ్ షా, సోమర్సెట్ మామ్ మొదలైన వారి సమగ్ర  రచనలని, వారి జీవిత విశేషాలని ఆయన సేకరించి తన లైబ్రరీ లో పొందు పరిచారు. ఆయన నిర్వహించే ఆంగ్ల సాహిత్య సభలలో  తెలుగు కవులైన ఆరుద్ర, తిలక్ మొదలైన వారి కవిత్వాన్ని అంగ్ల కవులకి పరిచయం చేసే వారు. ఈ నాడు తెలుగు భాషని ప్రపంచ భాషగా చేసి పారేద్దామని మన వంటింట్లోనే సభలు నిర్వహించుకుంటూ జబ్బలు చరుచుకునే వారికి గూటాల వారి అలనాటి ప్రయత్నాలు కనువిప్పు కలిగించాలి కానీ గుడ్డి వాడికి లోకమంతా చీకటే కదా!

గూటాల గారి జీవితంలో అత్యంత ఆశ్చర్యకరం, ఆచరణలో మామూలు వారికి అసాధ్యం అయినది ఆయన స్వయానా ఆచరించి చూపించే గాంధేయ వాదం. నమ్మండి, నమ్మకపొండి….ప్రతీ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు, అలాగే జనవరి 30 గాంధీ వర్థంతి నాడు ఉదయం 10 గంటల నుంచీసాయంత్రం ఐదు గంటల వరకూ లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ లో ఉన్న మహాత్ముడి విగ్రహం దగ్గర కూర్చుని చరఖా తిప్పుతూ నూలు వాడికే వారు. ఇలా ఎన్నేళ్ళు చేశారో నాకు తెలీదు కానీ  అసలు భారత దేశం లోనే అందరూ మర్చిపోయిన మహాత్ముడి దివ్య  స్మృతులని   పరాయి దేశం లో ఎవరైనా, ఎక్కడైనా ఈ విధంగా మననం చేసుకుని ఆచరించే వారు ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు.

1982 లో గూటాల గారు హ్యూస్టన్ వచ్చాక, మా పరిచయం ఇరవై ఏళ్లకి పైగా ఉత్తరాల ద్వారానే జరిగింది. ఆయన చాలా చిన్న, చిన్న  ఉత్తరాలు ఎంతో ఆర్టిస్టిక్ గా వ్రాసీ వారు. ;ఇంత బాగా ఎలా రాస్తారు, గురువు గారూ ?’ అని అడిగితే ‘ఆ రోగం బాపు దగ్గర నుంచి అంటింది’ అన్నారు నవ్వుతూ. వారిద్దరికీ ఉన్న అనుబంధం మాటలకి అందనిది. నేను 2005 లో అని జ్ఞాపకం – ఓ సారి బాపు గారి ఇంటికి మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన ‘జికే’ గారి గురించి మాట్లాడి నాకు పరిచయం చేశారు. అన్నట్టు, జికే అనేది గూటాల గారి కలం పేరు. ఆ కలం పేరుతో ఆయన కథలూ, వ్యాసాలూ వ్రాసే వారు. జుబ్బా లేని అబ్బాయి, భాజ గోవిందం, కుకునం (వంట చెయ్యడం), క్లిననం (గిన్నెలు కడగడం), కననం (పిల్లల్ని కనడం) మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని.  గూటాల గారు “ఋషి పుంగవుడు” “కర్మ యోగి” అన్న  అన్న బాపు గారి మా మాటలు  తర్వాత సంవత్సరం ఒక అతిముఖ్యమైన పని మీద లండన్ లో గూటాల గారి ఇంట్లో వారం రోజులు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అనుభవం లోకి వచ్చింది.

EPSON MFP image

మా ఇద్దరినీ మరింత దగ్గరగా కలిపినది టంగుటూరి సూర్య కుమారి….ఆయనా, చాలా మంది దగ్గర వాళ్ళు పిలుచుకునే పేరు ‘సూర్య’. టంగుటూరి సూర్య కుమారి పేరు వినని వారు, ఆవిడ పాడిన శంకరంబాడి సుందరాచారి గారి ‘మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ’ వినని, పాడని, పాడించని తెలుగు వారు ఉండరు. నేను ఆవిడని ఒక్క సారే చూశాను- ఆవిడ హ్యూస్టన్ వచ్చినప్పుడు. కానీ ఆవిడ మద్రాసులో కళా కారిణి గా ఎదుగుతున్న తొలి రోజులలో మా చిన్నన్నయ్య బాగా సన్నిహితుడు..– అనగా 1957 లో టాగూర్  వ్రాసిన ‘చిత్ర’ అనే చిన్న నాటకాన్ని తన పాటలతో ‘చిత్రార్జున’ అనే ఒక పెద్ద డాన్స్ డ్రామా గా రూపొందిస్తున్న రోజుల్లో దానికి దర్శకులు సింగీతం శ్రీని వాస రావు అయితే మా చిన్నన్నయ్య ప్రభాకర మూర్తి రాజు, నటుడు విజయ చందర్ అసిస్టెంట్ దర్శకులు. సూర్య కుమారి లండన్ లో స్థిరపడి 1973 లో హెరాల్డ్ ఎల్విన్ ని వివాహం చేసుకుని , కళాకారిణి గా అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకుని ఏప్రిల్ 25, 2005 న పరమపదించారు.

ఎలిజబెత్ మహారాణి తో 1968 లో ఒక సారి, 1972 లో రెండో సారి కరచాలనం చేసి , జూలై 11, 1972 నాడు బకింగ్ హం పేలస్ మధ్యాహ్న విందు భోజనం అంకితం చెయ్యబడిన ఏకైక తెలుగు …ఆ మాట కొస్తే భారతీయ కళాకారిణి టంగుటూరి సూర్య కుమారి—జికె గారికి ‘సూర్య’ గా ఆత్మీయురాలు. సంతానం లేని సూర్య కుమారి అంత్యక్రియలు గూటాల గారే నిర్వహించారు. సూర్య మరణం తరువాత ఆమె జీవిత సమగ్రంగా ఒక అద్వితీయమైన గ్రంధంలో నిక్షేపించాలి అని గూటాల గారు తలపెట్టారు. ఇలాంటివి ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాలు, పెద్ద సంస్థలూ చెయ్య వలసిన ఇటువంటి పనిని వాటి వాటి దౌర్భాగ్యానికే వదిలేసి, గూటాల గారు ఏక వ్యక్తి సంస్థ గా ఈ బృహత్ కార్యాన్ని తలకెత్తుకున్నారు. దానికి బాపు గారు కొమ్ము కాశారు. అమెరికాకి సంబంధించి సూర్య జీవిత విశేషాలు సంపాదించే గురుతర బాధ్యత ‘బాపు’ గారి సలహా మీద నాకు అప్పగించారు గూటాల గారు. “మీ గురించి బాపు గారు చాలా చెప్పారు” అన్నారు ఉపోద్ఘాతంగా ఆ ఫోన్ కాల్ చేసినప్పుడు. “నా గురించి ఆయన ఏం చెప్పారో కానీ, మీ గురించి నాకు చాలానే చెప్పారు. భలే భయం వేసింది’ అన్నాను సమాధానంగా…

మొత్తానికి 2005 లో ఆమెరికాలో సూర్య కుమారి జీవితం గురించి ఆయన సేకరించిన వివరాలు నాతొ పంచుకుని నేను చెయ్య వలసిన పనులు స్పష్టంగా ఆయన ‘విజన్’ నాకు అర్థం అయ్యేలా చెప్పారు. ఆ ప్రయత్నంలో నాకు పున:పరిచయం అయిన వారు సూర్య పిన్ని కుమార్తె, ఆమె ఇండియా రోజులలో ఇంచు మించు పెర్సనల్ సెక్రటరీ గా అన్ని వ్యవహారాలూ చూసుకునే ఇవటూరి అనసూయ గారు (బొకా రేటన్) ఒకరు. వైజాగ్ లో 1960 దశకం లో నేను ఇవటూరి అనసూయ గారింటికి వెళ్ళే వాడిని. గూటాల గారి ద్వారా మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చి. ఫ్లారిడా లో ఉన్న ఆవిడ వృద్దాప్యంలో ఇంట్లో సహాయానికి ఇండియా నుంచి వచ్చి రెండేళ్ళు ఉండడానికి ఒక నర్సుని ఇక్కడికి రప్పించడానికి నేను సహాయం చేశాను. అనసూయ గారితో మూడు వారాల క్రితం నేను మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ బాగానే ఉన్నారు కానీ ఆ తరువాత కొద్ది రోజులలో ఆవిడ అనారోగ్యంతో పరమపదించడం ఎంతో విచారకరం.

EPSON MFP image

గూటాల గారి సూచన మీద అప్పుడు హ్యూస్టన్ లో ఉండే దేవగుప్తాపు శేష గిరి రావు గారినీ, తదితరులనీ మొత్తం అమెరికాలో ‘వెతికి’ పట్టుకుని, వారి చేత సూర్య కుమారి మీద వ్యాసాలు వ్రాయించ గలిగాను. ఇంకా అనేక పద్దతులలో సూర్య కుమారి అమెరికా ఫోటోలు సంపాదించ గలిగాను. ఉదాహరణకి న్యూయార్క్ లో సూర్య కుమారి నివసించిన అపార్ట్ మెంట్ ఫోటో కి మిత్రులు కలశపూడి శ్రీని వాస రావు గారిని కోరితే ఆయన శ్రమ పడి అక్కడికి వెళ్లి ఆ రోడ్డు జంక్షన్ తో సహా ఫోటోలు తీసి పంపించారు. ఈ సమాచారం అంతా పట్టుకుని నేను 2006 లో లండన్ వెళ్లాను. ఎప్పుడో 1982 లో కలుసుకున్న తరువాత , ఫోన్ లో చాలా సార్లు మాట్లాడుకున్నా అప్పటికే 75 ఏళ్లు దాటిన గూటాల గారి ఆరోగ్య పరిస్థితి కానీ, మరే విధమైన వ్యక్తిగత వివరాలు కానీ నాకు తెలియవు. కేవలం సూర్య కుమారి పుస్తకానికి నేను సేకరించిన వ్యాసాలూ. ఫోటోలు తీసుకెళ్ళి ఆ పుస్తకం రూప కల్పన మీద పనిచెయ్యడం కోసమే నా లండన్ ప్రయాణం. అప్పటికే ఆ  పుస్తకం ఆయన నడిపే విదేశాంద్ర ప్రచురణలు, వీలుంటే వంగూరి ఫొండేషన్ ఆఫ్ అమెరికా తో సంయుక్తంగానూ ప్రచురిస్తే బావుంటుంది అనీ అనుకున్నాం. ఆ విషయాలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే బావుంటుంది కదా అని కూడా మా ఇద్దరి ఉద్దేశ్యం. లండన్ లో వారం ఉండి అక్కడి నుంచి నేను ఇండియా ప్రయాణం పెట్టుకున్నాను.

నేను అనుకున్నట్టుగా గూటాల గారు కానీ, మరెవరూ కానీ లండన్ ఎయిర్ పోర్ట్ కి రాలేదు. నేను లండన్ వెళ్ళడం అదే మొదటి సారి. ఎలాగో అలాగా కష్ట పడి, భారీ సూట్ కేసులతో లండన్ ‘ట్యూబ్’ ..అంటే అండర్ గ్రౌండ్ రైళ్ళు పట్టుకుని,  తర్వాత లండన్ కేబ్ పట్టుకుని మొత్తానికి బర్టన్ రోడ్ మీద ఉండే గూటాల గారి ఇంటికి వెళ్లి తలుపుకొట్టాను. అది ఒక టౌన్ హోమ్ …అంటే మూడు అంతస్తులలో ఎపార్ట్ మెంట్ లా ఉండే చాలా ఇళ్ళు ఒకే బిల్డింగ్ లో వరసగా ఉంటాయి. అప్పటికే ఆ పెట్టెలు మొయ్య లేక చచ్చే ఆయాసం వచ్చింది. బజ్జర్ మోగగానే స్పీకర్ లోంచి తలుపు తోసి లోపలికి వచ్చి , ఎదురుగా కనపడే మెట్లు ఎక్కి మూడో అంతస్తుకి వచ్చెయ్యండి.” అన్నారు గూటాల గారు తెలుగులో.  నేను అలాగే లోపలికి వెళ్లి, సూట్ కేసులు లోపలి గుమ్మంలో వదిలేసి మెట్లెక్కి పైకి వెళ్లాను. పైన ఒక చిన్న గదిలో పడక్కుర్చీలో నోట్లో పైపు తో గూటాల గారు నన్ను ఆహ్వానించారు. చుట్టూ కొన్ని వందల పుస్తకాలు. అంతా చిందర వందరగా ఉంది. ఓ మూల చిన్న కిచెన్. ‘కాఫీ ఇమ్మంటారా?” మెల్లిగా, అతి మెల్లిగా లేచారు గూటాల గారు. నేను బొత్తిగా ఉహించని విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్ కేసి నాలుగే నాలుగు అడుగులు వేసి ‘గిరిజ భోజనం మళ్ళీ తినాలని  ఉంది. అప్పుడే ఇరవై ఏళ్లయి పోయింది. మీతో తీసుకు రావలసింది. బావుండును” అన్నారు.

అప్పటికి నాకు ఆయన “ఋషి పుంగవుడు, కర్మ యోగి’ అని బాపు గారు ఎందుకు అన్నారో అర్థం అవడం మొదలు పెట్టింది. ఆయన భార్యా, పిల్లలూ ఇండియా లోనూ, అమెరికాలోనూ ఉన్నారు. ఈయన ఒక్కరే, నడవ లేని పరిస్థితిలో, ఇతర కారణాలు ఎలా ఉన్నా, లేక పోయినా తను చెయ్యదల్చుకున్న సాహిత్య పరమైన కార్యక్రమాల కోసమే అనుకోవాలి- లండన్ లో చాలా ఏళ్ళుగా, ఏకాంతంగానే, జీవితం గడుపుతున్నారు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలలో  టంగుటూరి సూర్య కుమారి పుస్తకం ఒకటి. 1890ల నాటి ఆంగ్ల రచయితల సమగ్ర జీవిత విశేషాలు, వారి రచనల ప్రచురణ మరొకటి. ఆ గది క్రింద అంతస్తులో మరొక చిన్న గది. అక్కడ ఒకే ఒక్క పడక. అక్కడ కూడా కొన్ని వందల పుస్తకాలు. మొత్తం కుటీరం అంతా ఇంతే! పుస్తకాల మయం. ఆ నాడు మహా కవి శ్రీశ్రీ,  బాపు , ఈ నాడు నా బోటి సర్బ సాధారణ మానవుడు ఆతిధ్యం పొందినది అక్కడే. ఎవరైనా ఇంటికి వస్తే గూటాల గారు ఎక్కడ నిద్ర పోతారో తెలియదు. పై గదిలో ఆయన పడక్కుర్చీ పక్కనే డజన్ల కొద్దీ ఫైల్స్ లో సూర్య కుమారి పుస్తకానికి ఆయన ఎలా సేకరించారో తెలియదు కానీ, మొత్తం మెటీరియల్ అంతా అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఉంది. మరో బల్ల మీద నేను ఆయనకీ అప్పుడప్పుడూ పంపిస్తున్న మా పుస్తకాలు అన్నీ ఉన్నాయి. అన్నింటి కన్నా పైన బాపు గారి తిరుప్పావై ఉంది. మరో మూల..అవును గాంధీ గారి చరఖా..దాని మీద ఒక పూల దండ!

EPSON MFP image

బాపు మాట

ఆ తరువాత వారం రోజులూ ఇద్దరం సూర్య కుమారి పుస్తకం మీదే పనిచేశాం. ఒకే ఒక్క సారి కష్టపడి బయటకి వచ్చి బస్సులో వెళ్లి కూరలు, మందు సామగ్రి కొనుక్కుని వచ్చాం. ఆయనకీ చాలా ఇష్టమైనదీ, రోజూ వండుకునేదీ తోటకూర పప్పు. అది మోపులు, మోపులు కొన్నారు. బిల్లు నేను చెల్లిస్తానంటే ‘కాదంటానా? సూర్య పుస్తకానికి ఆ డబ్బు వాడుకుంటాను’ అన్నారు. ఆ వారం రోజులలోనూ, ఆయన వ్రాసిన కథలు – ఆయా పత్రికలలో ఉన్నవి చదివాను. “మీ  లైబ్రరీ లో ఉన్న 1890 ల నాటి ఆంగ్ల కవుల పుస్తకాల విలువ ఎంత ఉంటుంది సార్ ?” అని అడిగితే “ఏమో కానీ ఒక మిలియన పౌండ్స్ కి ఇన్స్యూరెన్స్ చేశాను” అన్నారు…నా గుండె గుభేలు మనేలా. అవే కాదు. ఆయన దగ్గర ఉన్న అపురూపమైన కలెక్షన్ లో సరోజినీ నాయుడు గారు కవిత్వం వ్రాసుకున్న ఒక పెద్ద పుస్తకం. ఆ మహా కవయిత్రి స్వదస్తూరీతో, అక్కడా, అక్కడా కొట్టి వేతలు, మార్పులు, చేర్పులతో, ఆ నాటి ఇంక్ లో ఉన్న ఆ మేనుస్క్రిప్ట్ పేజీలు నా చేతులతో తిరగేస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయో? ఏమిటో? గూటాల గారి లాంటి కారణ జన్ములు సేకరించిన అటువంటి అపురూప సంపదని దాచుకునే అదృష్టం ఉండీ,  ఆ అవకాశాలు అంది పుచ్చుకుని గర్వించే ఆలోచనలు లేని దౌర్భాగ్యులు తెలుగు వారు అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. బతికి బావుంటే ఏనాడైనా ‘తెలుగు సారస్వత భవనం” అనే నిర్మాణం చేసి మన సాహితీవేత్తలు వాడిన వస్తువులు, స్వదస్తూరీతో ఉన్న వారి రచనలు మొదలైనవి పదిల పరచాలని నాకు ఎంతో కోరికగా ఉంది.  కానీ అమరావతిలో అంగుళం కూడా ఖాళీ లేదు అలాంటి వాటికి!

EPSON MFP image

మొత్తానికి సూర్య కుమారి పుస్తకం మెటీరియల్ అంతా మద్రాసు లో బాపు గారికి అందించడం నాకు గూటాల గారు నిర్దేశించిన పని. మా ఇద్దరికీ సంయుక్త ప్రచురణ మీద ఒప్పందం కుదరక పోయినా నాకు ఇబ్బంది కలగ లేదు. ఒక మహత్కార్యం లో, బాపు గారు, గూటాల గారు లాంటి మహానుభావుల దిశానిర్దేశం లో ఒక చారిత్రక పుస్తక ప్రచరణ లో అతి చిన్న పాత్ర వహించగలగడమే నా పూర్వ జన్మ సుకృతం. నేను చేసిన సహాయానికి గూటాల గారు “Suryakumari-Elvin” అనే 270 పేజీల పుస్తకం Acknowledgements లో ఒక కృతజ్ఞతా వాక్యం వ్రాశారు. అది చాలు. ఇందుతో పాటు ఆ అపురూపమైన గ్రంధం ముఖ చిత్రం. బాపు గారు వేసిన సూర్య కుమారి చిత్రం, సూర్యకుమారితో గూటాల గారి ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.

EPSON MFP image

లండన్ లో 2006 తరువాత ఆపుడప్పుడు ఫోన్ లో పలకరించుకుంటూనే ఉన్నా, 2012 లో ఒక సారి లండన్ వెళ్ళినప్పుడు డా. వ్యాకరణం రామారావు గారు, వింజమూరి రాగ సుధా, నేనూ ఆయన్ని చూడడానికి వెళ్లాం. మళ్ళీ 2014 లో లండన్ లో నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా ఆయన్ని ప్రధాన అతిథిగా సత్కరించడానికి నేనూ, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారూ, డా. దాసోజు రాములు గారూ ఆయనింటికి వెళ్లాం. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఎక్కడికీ వెళ్ళే శారీరక పరిస్థితి లేదు. అయితే అందరం కలిసి గూటాల గారితో CP బ్రౌన్ సమాధి దర్శించుకున్నాం. Wheelchairలో తీసుకు వెడుతున్నా ఆ మాత్రం కదలిక కూడా  భరించ లేక ఆ సమాధికి ఆయన దూరం నుంచే నమస్కారం పెట్టుకున్నారు. అదే నేను ఆయన్ని ఆఖరి సారి చూడడం.

కొన్ని నెలల క్రితం ఆయన కుటుంబం ఆయన్ని విశాఖపట్నం తరలించినట్టు యార్లగడ్డ గారి ద్వారా తెలిసింది. ఈ వ్యాసం లో కొన్ని విషయాలు ఆయన ద్వారా నాకు తెలిసినవే!.  వచ్చే నెల ఇండియా వెళ్ళినప్పుడు గూటాల గారిని చూద్దాం అనుకుంటూ ఉండగానే ఆయన నిర్యాణ వార్త తెలిసింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. జికె అనే గూటాల కృష్ణ మూర్తి గారికి ఈ అశ్రు నివాళి అర్పిస్తున్నాను..

*

ఈ భరోసా…ఎంతవరకు?!

murugan

-దగ్గుమాటి పద్మాకర్

~

నేను నా వృత్తిరీత్యా ఇప్పటివరకు రకరకాల స్కూళ్లలో లక్షమంది పైగా విద్యార్థులతో వారి క్లాసుల్లో  10-15 నిముషాల సమయం గడుపుతూ ఉంటాను. వారంతా 2-7 తరగతుల మధ్య చదువుకునే పిల్లలు.  వారితో మాట్లాడే విషయాలు ముఖ్యంగా వాళ్లందరూ తమకి ఒక మెదడు ఉందని గుర్తించడం, అదే చాలావరకు తమని నడిపిస్తుందని పలు ఉదాహరణలతో గ్రహించేలా చెయ్యడం.  అలాగే ఆమెదడుని వారు తమ అదుపులో ఉంచుకోవాలని కూడా గ్రహించేలా చెయ్యడం, అందుకు కొన్ని ప్రాక్టికల్గా ఉదాహరణలు చూపించడం.  సందర్భాన్ని బట్టి వారెందుకు
చదువుకుంటున్నారో, అక్షరం విలువేమిటో కూడా వివరించడం చేస్తుంటాను.

ఈక్రమంలో ఒకసారి 4 వ తరగతి పిల్లలని క్లాసులో భాషకి, లిపికి తేడా చెప్పమన్నాను.  వారికి పెద్దగా అర్ధం కాలేదు.  సరే మాటకీ, అక్షరానికీ తేడ
తెలిస్తే చెప్పమన్నాను.  తెలిసిందేగదా, పిల్లలకి అవకాశం ఇవ్వంగాని ఇస్తే ఆలోచనలు మథిస్తారు!

ఒకమ్మాయి అంది, మూగవాళ్లు ఇతరులతో మాట్లాడాలంటే మాటలు రావుగాబట్టి అక్షరాల్లో రాసి చూపిస్తారు అనింది.  అందరితోపాటు నేనూ చప్పట్లు కొట్టాను.  నేను ఆతర్వాత చొరవ తీసుకుని భాషవల్ల  ఇంకో ముఖ్యమైన  ప్రయోజనం చెప్తానన్నాను.  “ఇప్పుడు ఇక్కడ అక్షరం వల్ల ప్రయోజనం గురించి  మనం మాట్లాడుకున్న విషయం మనం కొద్దిరోజులకి మర్చిపోతాం! ఇవన్నీ , ఇంకో వంద సంవత్సరాలకైనా ఇతరులు తెలుసుకోవాలంటే ఎలా? అక్షరమే గదా సాధనం” అన్నాను. ఈ అక్షరాల వల్లనే గదా మీరు టెక్స్టు పుస్తకాల ద్వారా ఎవరో ఎప్పుడో రాసిన
అనేక విషయాలు తెలుసుకో గలుగుతున్నారు అన్నాను.

2

సరే! ఇదంతా ఎందుకంటే కోర్టులు అక్షరం విలువని ఇన్నాళ్లకు గుర్తించాయి! జడ్జీలు వాయిదాలు, పాయింట్లు, తీర్పులు డిక్టేట్ చేస్తుంటే టైపిస్టులు అక్షరాలు సృష్టిస్తుంటారు గాబట్టి జడ్జీలనడిగితే అక్షరాలు సృష్టించే వాళ్లకంటే ఆలోచనలు సృష్టించే వాళ్లే గొప్పవాళ్లని తప్పకుండా
ఒప్పుకుంటారు.  ఇటీవల పెరుమాళ్ మురుగన్ కేసువిషయమై ఇచ్చిన తీర్పులో మద్రాసు హైకోర్టుకూడా ఒప్పుకుంది. కోర్టుల్లో ఇదొక గుణాత్మకమైన మార్పుగా గోచరిస్తుంది.  ఆలోచనలని ఔపోసనపట్టి అక్షరాలకు ఒక కళారూపాన్ని జతచేసి రచనలుచేసే వాళ్లని “మీరు రాయండి” అని; “ఒక కళారూపమైన సాహిత్యంలోని భావాలు నచ్చనివాళ్లు నచ్చకపోతే పుస్తకం మూసేసుకోవచ్చు” అనీ  కోర్టు ఒక రచయిత భుజం తట్టినట్టుగా మద్రాసు హైకోర్టు పెరుమాళ్ మురుగన్ కి భరోసా ఇవ్వడం నిజానికి హృదయాలు పులకించే విషయం.

కానీ ఏడాది కిందటి వరకూ “మిలార్డ్” అంటూ బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగించిన కోర్టులనుంచి మనం ఇలాంటి భరోసాలు నిరంతరం ఆశించడం అత్యాశే కావచ్చు.

3

అయితే కనీసం పెరుమాళ్ మురుగన్ కారణంగా అయినా కళా సాహిత్య రంగాలకు మద్రాసు హైకోర్టు ఈ రకంగా అయినా వెన్నుదన్నుగా నిలవడం వెనుక కారణాలు అన్వేషిస్తే నావరకు అనిపిస్తున్నదొకటే.  వెల్లువెత్తుతున్న వర్చువల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలాంటి కత్తిరింపులు, ఎవరి అనుమతులు అవసరం లేకుండా దూసుకెళుతున్న కాలంలో మనం వుండడమే ఇందుకు కారణం.  కళాకారులపై రాజ్యాంగ
వ్యవస్థలో భాగమైన పోలీసులు ఫ్యూడల్ భావాజాలానికి కొమ్ముకాస్తూ నియంత్రించినప్పుడు వారి చర్యలు ప్రపంచమంతా క్షణాలలో ప్రచారం, ప్రసారం జరిగిపోతున్నాయి. ఈ పరిణామం కారణంగా అభివృద్ది చెందిన దేశాలు భారతదేశాన్ని అభివృద్ది చెందుతున్న దేశంగా కాక ఇంకా వెనకబడ్డ దేశంగానే గుర్తించడం జరుగుతుంది.  అలాంటప్పుడు భారత దేశంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ కంట్రోల్లో లేదనే సంకేతాలు ప్రచారమవుతాయి.  బహుశా పెరుమాళ్ మురుగన్ కేసులో న్యాయ వ్యవస్థపై ఈరకమైన వత్తిడి కూడా పనిచేసి వుండే అవకాశం వుంది.

4

అయితే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇంకా మాట్లాడితే ఏరకమైన స్వేచ్ఛ గురించి అయినా ఇటీవలికాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవలసి వుంటుంది.

సమాజంలోని ప్రజలకు తగినంత మెచ్యూరిటీని, ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే సామాజిక వ్యవస్థలని చిదిమేసి బట్టీ విద్యా విధానంతో జ్ఞానాని
తెల్లకాగితంగా మిగిల్చి వ్యవస్థ అందించే స్వేచ్ఛ చివరికి ఏ పరిణామాలకి దారితీస్తుందో ఇటీవలి సంఘటన ఒక ఉదాహరణ. వయోజనుడైన ఒక పాతికేళ్ల ఐటీ ఉద్యోగి కార్పొరేట్ హాస్పిటల్ ప్రకటనలని నమ్మి ఎత్తు పెరగడానికి కనీసం ఇంట్లోకూడా చెప్పకుండా తన రెండుకాళ్లను తెగ్గొట్టించు కోవడం  వ్యక్తిగత స్వేచ్ఛయొక్క దుష్పరిణామమని చెప్పుకోవాలి.  అంటే ఈదశలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చివరికి వినియోగదారుడిగా మారే స్వేచ్ఛకి దారితీస్తుంది.

చెప్పుకోవాలంటే యువత ఎక్కువగా వున్న భారతదేశంలో రాబోయేకాలంలో ఇలాటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలెక్కువ. ఇప్పటికే మన సినిమాలలో చూపించి చూపిస్తున్నట్టు గుణగణాలతో సంబంధం లేకుండా ఆకర్షణే ఆధారంగా జరిగే ప్రేమపెళ్లిళ్లకి ఒకలెజిటమసీ వచ్చేసింది.  మన సినిమాలలో మొదట హీరో స్నేహితులు,  ఆతర్వాత కాలేజీ లెక్చరర్లు, ఆతర్వాత చివరికి తల్లిదండ్రులు అంతా హీరో ప్రేమని సఫలం చెయ్యడానికి ప్రయత్నించేవారే!   కారణాలేవైతేనేం 18 దాటిన వాళ్లకి మద్యం సేవించే స్వేచ్ఛ వచ్చేసింది.  మద్యం అమ్మకాలకి ప్రభుత్వమే టార్గెట్స్ పెట్టి  అమ్మిస్తూంది.  ఇండైరెక్టుగా మద్యం హాయిగా తాగొచ్చని సందేశాలు పంపుతూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చేత డ్రగ్స్ కి, గంజాయికీ వ్యతిరేక ప్రచారం చెయ్యిస్తుంది.  మీడియా అంతా పేజీలకింత అనేదశ దాటి టోకుగా కూడా అమ్ముడు పోతున్నాయి. ఈదశలో ఇప్పుడు రచయితలకి అందిన స్వేచ్ఛని కూడా మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి వుంది.

5

సమాజంలో స్వేచ్ఛకి మితిమీరిన ప్రాచుర్యం లభించాక ఆ పదానికి ఒక ఆచరణీయత, అనుసరణీయత ప్రజల్లో లభిస్తుంది.  ఇప్పుడున్న వాతావరణంలో స్వేచ్ఛని ఎక్కువగా పైపై వర్గాలే వినియోగించుకుంటాయి.  అంటే  కార్మికులు యూనియన్లు పెట్టుకునే హక్కుని నిరాకరిస్తూ యజమానుల సంఘం మాత్రం క్రియాశీలంగా పనిచేసినట్టు అన్నమాట.  ఇలాంటి సంఘటనలు భారత దేశంలో కోకొల్లలు.
ప్రభుత్వాలు తమపార్టీలకు నిధులందించే ఇండస్ట్రియలిస్టుల కొమ్ముకాయడం , ఎన్నికల హామీలు గాలికి  వదిలి నియంతృత్వ పోకడలు పోతున్నప్పుడు క్రమేపీ ప్రజా సమూహాల గొంతెత్తే హక్కు, నిరసన తెలిపే హక్కు, అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు… ఇలాంటివన్నీ ప్రభుత్వాలు కాలరాస్తున్నప్పుడు దృతరాష్ట్ర న్యాయం ప్రదర్శించే కోర్టుల పట్ల పెరుమాళ్ మురుగన్ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకింత సానుకూలత కలిగిస్తుందనేది రచయితలుగా మనం మరిచి పోకూడదు.

పెరుమాళ్ మురుగన్ కి ఇచ్చిన స్వేచ్ఛని అడ్డం పెట్టుకుని  కోర్టులు తాము మరింత ప్రజాస్వామికంగా వున్నట్టు మనని నమ్మిస్తాయి. నిజానికి హక్కులు, స్వేచ్ఛ కారణంగా వర్ధిల్లే బూతు సాహిత్యం ఎక్కువ!  కోర్టుల నిస్సహాయత బయట పడేది ఇక్కడే!

అసలు పెరుమాళ్ మురుగన్ భయానికిగురై రచయితగా తాను మరణించినట్టు ప్రకటించడానికి కారణమైన సంస్థలు, అధికార వ్యవస్థలను కూడా కోర్టులు ఏమీ చెయ్యలేవన్నది నిజం.  ఒకవేల అలాచేయాలని అనుకున్నా అది కత్తి పట్టుకుని పైపైకి వచ్చేవాడిని కళ్లురిమి అదుపు చేయాలనీ అనుకోవడం లాంటిదే! ఆపరిమితి కోర్టులకున్నది.  కోర్టుల నిస్సహాయత గురించి చెప్పుకోవలసి వస్తే మన రాజకీయాలు ఎంత దుర్మార్గమైనవి అంటే అవి ఒక సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ చేతకూడా పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టించ గలవని మనకి తెలిసిన విషయమే.

6

నాలుగు రోజుల కిందట  ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ఒక కేసులో బెయిలుపై బయటికి రాగానే మరొక ధర్నా కేసంటూ వెంటనే అరెస్టు చేసి వెంటనే కోర్టుకి పెట్టారు. ఆయనేం మావోయిస్టు కూడా కాదు.  ప్రతిపక్ష ఎమ్మెల్యే.  సహజంగా పోలీసులకి వుండే పవర్ ఇది. ఈ పవర్ గురించే రావిశాస్త్రి తనకథల్లో పదేపదే చెప్పింది. కోర్టులు కూడా అధికార వ్యవస్థల్లో మరో వ్యవస్థ కాబట్టి సహజంగా తనకి కలిగిన “కళ్లురిమే” అదృష్టాన్ని అనవసరంగా  కాలదన్ను కోవడానికి సిద్ధపడవు.

కొన్నిసార్లు కోర్టులు పార్లమెంటుని సైతం ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తాయి గాని టెక్నికల్గా బాహాటంగా దొరికితే తప్ప అవి ప్రభుత్వాల పీక
పట్టుకోవన్నది నిజం.  ప్రభుత్వాలే మద్యం అమ్మకాలు చేయించడాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తూ ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి
మారడాన్ని, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు కొమ్ముకాసి దేశ సంపదని దోచి పెట్టడం గానీ ప్రశ్నిస్తూ కోర్టులు సుమోటోగా కేసులు పెట్టినప్పుడు
కోర్టుల్లో గుణాత్మక మైన మార్పులు వచ్చాయని మనం నమ్మొచ్చు.

అందాకా తప్పేమీ లేదు మిత్రమా!

ప్రపంచం అంతటా నీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని కొల్లగొట్టడానికి ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది.  ఈడ్రామాని నువ్వు జీవితం అనే మొత్తాన్ని ఖర్చుచేసి టిక్కెట్టు కొని చూస్తున్నావు.  నిజమా  కాదా అని అనుమానించడంలో తప్పేమీలేదు.  ప్రతి మార్పునీ, ప్రతి తీర్పునీ ఒక గీటురాయి మీద గీసి చూసుకో!

*     *      *      *

పీడ కల 

gopi

లోగో: భవాని ఫణి

 

~
(చూస్తూ  ఉండగానే  ఇంకో రాజధాని మన కోసం  వెలిసింది. ఈ వెలుగు వెనక అన్నీ వెలుగులే కాదు, కొన్ని చీకట్లూ వున్నాయి. చింతలూ వున్నాయి. బతుకు వెతలూ  తలరాతలూ వున్నాయి. అరుదుగా  రాసే  అతి నిక్కచ్చి  కథకుడు  దారా గోపి. అనేక సంవత్సరాల కిందట  గోపి “గుడిసె ఏసోబు.కథలు” ఒక సంచలనం. గోపి కలం నించే  మళ్ళీ  ఇన్నాళ్ళకి  ఈ రాజధాని కథలు)
*
కృష్ణా కరకట్ట మీద, చుట్టూ పచ్చని పంటపొలాల మధ్య నడుస్తున్నా.
ఒక పక్క నది … ఇంకో పక్క మా వూరు.
అరటి తోటలు…
కూరగాయల తోటలు…
ఆకుకూరల తోటలు… పూల తోటలు…
ఒక్కటేంటి… ఎన్ని రకాల తోటలో….
యెవురో యెనకపక్కనుండి బుజంమీద కండవ లాక్కుండు.
యెనక్కి సూత్తే నవ్వుతుండు.
ఒయ్ ఎవురయ్య నువ్వు అనేలోపు లుంగి పంచ లాక్కుండు.
మల్లీ నవ్వుతుండు.
నా కండవ, లుంగీ లాక్కునే ప్రయత్నం చేశా
నన్ను తోసేసి సొక్కా లాక్కోబోయిండు..
నవ్వుతుండు… నన్ను ఎగతాలి సేత్తుండు.
దిగ్గున మెలుకువొచ్చింది… కళ్ళు తెరిచి చూసా…
అప్పుడర్ధమైంది… ఇదంతా కలని.
యిదేం కల? ఒంటిమీద గుడ్డలు గుంజుకున్నడు?!
ఆచ్చర్యమేసింది… భయంకూడా…
మంచమ్మీదనుండి లేసి గుడిసెలోంచి బయటికొచ్చా..
బయట పండు ఎన్నెల… తొలి కోడి కూసినట్టుంది…
మల్లీ యింట్లోకొచ్చా…
పిల్లలూ, తనూ నిద్రపోతున్నారు.
మంచంమ్మీద పక్కసరిసేసి, దుప్పటి దులిపి పడుకున్న.
“యేంటి మెలుకువొచ్చింది”
కప్పుకున్న దుప్పటి ముసుగు తీసి అడిగింది.
“ఏం లేదే… యేదో కలొచ్చింది”
“పీడ కలా? మంచికలా?”
“యేదో పిచ్చిదే… ఒంటిమీద గుడ్డలేవురో లాక్కున్నట్టు… సూసి నవ్వుతున్నట్టు”
“అదేం కల? పిచ్చికల”
నేనేం మాట్లాడలేదు.
తనే అంది… “దరిద్రపు కల… కాసిన్ని మంచినీలు తాగిపడుకో… “
నాకు మల్లీ మంచమ్మీదనుండి లేవాలనిపించలేదు. అట్టే పడుకున్న. ఇక నిద్రకూడా పట్టేట్టు లేదు.
అటూ, యిటూ దొర్లినా నిద్రొచ్చేట్టు లేదు.
“మంచినీల్లు తాగావా? పోనీ పక్కకి తిరిగన్నా పడుకో”
పక్కకి తిరిగి పక్కలో వున్న సంటిగాడిమీద సెయ్యేసి పడుకున్న. నిద్రొచ్చేట్టులేదు. కలే గుర్తొత్తంది.
“అదేం కల! ఒంటిమీద బట్టలు గుంజుకోటం యేంటి”
ఆలోసిత్తుండగానే తెల్లారింది. పిల్లలు, తనూ నిద్ర లేచారు.
“యేంటి తెల్లార్లూ పిచ్చికలలు కని తెల్లారేక నిద్రపోతున్నవా?”
“అదేం లేదే… నిద్రేడ పట్టింది”
“మరి లేవ్వా? పొలానికి పోవా?”
ఇక లేవక తప్పలేదు. మీదున్న దుప్పటి తీసి మంచమ్మీదనుంచి లేసి బయటికొచ్చిన. గుమ్మం ముందు రోడ్డుమీద శానామందున్నారు.
శీను, ప్రసాదు, రాంబాబు, యెంకటేసు, గోపాళం … శానమందే… రాతి బల్లమీద కూసున్నారు.
బద్దకంగా వొల్లరిసుకుంట ఆల్లకాడికెల్లిన.
“ఏంట్రా సూరీ నీకిప్పుడు తెల్లారిందా?”
 శీనుగాడు ఎకసెక్కంగ పలకరిచ్చిండు.
“యిప్పుడేంట్రా తొలికోడి కూసినప్పుడే మెలుకువొచ్చింది. యేదో పీడకలొచ్చింది… తర్వాత నిద్ర పట్టలేదు.”
“పీడకలొచ్చిందా? మానాయనే… యికనుంచి అదేపనిలే… పిచ్చికలలేం కర్మ మంచికలలు కూడా కనుకుంటా మంచమ్మీదనే వుండొచ్చు”
“యేమైందిరా?”
“యీడిప్పుడే నిద్రలేచిండు. సెప్పండ్రా యేమైందో”
“పేపర్లో, టీవీల్లో మనూళ్ల  పేర్లే పలుకుతున్నయ్. తెలవదా?”
ఇసుగొచ్చింది నాకు.
“యెహే, యేమైంది సెప్పండ్రా” అని గట్టిగా అరిసిన.
“ఉండ్రా బాబూ… యెందుకరుతున్నవ్… “
“మరి లేకపోతే ఏంట్రా. సంగతేంటో సెప్పకుండా ఎకసెక్కాలేంటి పొద్దున్నే”
“సర్లే .. ముందా నిద్రకళ్ళు తుడుసుకో… మనూళ్ళనే రాజధానిగా ప్రకటించారు. రాజధాని ఇక్కడే కడతారంట”
శీను చెప్పిండు. కానీ నాకేం అర్ధం కాలేదు.
“అయితే యేంటట?”
“యేంటంటవేంట్రా? రాజధాని కట్టేది మన భూముల్లోనే”
“అంటే”  అన్న బుర్రగోక్కుంట. నాకింకేం అర్ధం కాలేదు.
అక్కడున్నోల్లంతా పగలబడి నవ్వుతున్నారు నన్ను సూసి.
“ఏంట్రా యీడు మరీను… యింకా అర్థం కాలేదా? మన పొలాల్లోనే రాజధాని కడతారంటారా. మన పొలాలు తీసుకుంటారంట”
ఒక్కసారి దిమ్మదిరిగినట్టయింది. నోటెంట మాటరాలేదు. తెల్లారుజామునొచ్చిన కల గుర్తొచ్చింది… భుజమ్మీద కండవా, ఒంటిమీద లుంగి లాక్కొని నవ్వుతున్న మనిసి కనిపిచ్చిండు.
“వార్నీ … యిదేరా తెల్లారుజామున నాకొచ్చిన కల… ఒక మనిషి నా భుజమ్మీద కండవా, ఒంటిమీద లుంగీ లాక్కొని, సొక్కా కూడా లాక్కోటానికి సెయ్యేసిండు… పైగా నవ్వుతుండు”
కలగురించి సెప్పిన… అందరూ నవ్వుతున్నారు..
“మేం పేపర్లు, టీవీల్లో సూత్తే నువ్వు కల్లోనే సూసినావా…”
“ఒరేయ్ మల్లెల్లి పొడుకో… యింకేం జరుగుద్దో మాకంటే నీకే ముందు తెలుసుద్ది”
అందరూ నవ్వుతూ యెగతాలి సేత్తన్నారు.
ఇక అక్కడ ఉండలేకపోయా. యింట్లోకొచ్చిన. మనసేదో పరిపరి విధాల పోతంది.
పొలాలు పోతే ఎట్టా? బతికేదెట్టా? ఏం పనులు సేసుకోవాలా? ఏం తినాల?
అంతా అయోమయంగా ఉంది. ఏం తోచట్లా…
అయినా ఇదేం కల? తెల్లారగానే ఇదేం వార్త?
“ఓయ్… నిన్నే… “
యింట్లోకెల్తూ పిలిసిన. అది పొయ్యికాడ కూసుంది. తెల్లారిందంటే పిల్లోల్లకి ఆకలేసద్ది. వొండి వొక ముద్ద ఆల్లకెయ్యకపోతే గోలే.
“ఏంటీ” పొయ్యికాడ కూసోనే అరిసింది.
“యింట్లోకి రావే”
“వత్తన్నా…. ” లేచి యింట్లోకొచ్చింది.
ఏంటి సంగతి అన్నట్టు నా మొహంలోకి సూచింది.
“తెల్లారుజామున కలొచ్చిందని సెప్పాగా… “
“అవును సెప్పినవ్… అదేదో మనిసి ఒంటిమీద గుడ్డలు లాక్కున్నాడనీ… “
“ఆఁ … అదే … గుడ్డలు కాదే … బతుకే లాక్కుంటన్నారు”
“ఏంటయ్యా నువ్వు సెప్పేది… “
“అదేనే మనూళ్ళని రాజధానిగా యెన్నుకున్నారంట”
“యెవురయ్య… యెవురు యెన్నుకుంది”
“యింకెవురే … గవర్మెంటోల్లు…”
“అయితే?”
“అయితేంటి నీ మొకం… మన పొలాలు తీసుకుంటారంట… అందులోనే రాజధాని బిల్డింగులు కడతారంట…”
“యెందుకు?”
“యెందుకేంటే పిచ్చిమొకమా… మనకి కూడా ఒక హైదరాబాదు కావాలిగా?”
“అదెందుకయ్యా?”
“యెందుకంటావేంటి? కోర్టు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి యిళ్ళు అన్నీ కావాలంట. అయ్యన్నీ యిక్కడే మన పొలాల్లోనే కడతారంట”
“యెవురు సెప్పారు నీకు?”
“అదిగో … రోడ్డుమీద ఆల్లందరూ అంటన్నారు”
బయటికొకసారి తొంగిసూసింది. ఆళ్లంతా యింకా అక్కడే కబుర్లాడుతున్నారు.
“ఆళ్ల మాటలకేం గానీ… ”  అని మళ్ళీ తనే అంది “పెద్ద పెద్ద ఊళ్ళన్నీ వొదిలి మనూళ్లకే వత్తరా యేంటి నీ పిచ్చి గాని.. ఆళ్ళు సెప్పటం … నువ్వు నమ్మటం”
నావైపు యెగా దిగా సూసి మళ్ళీ పొయ్యికాడికెల్లింది.
తను సెప్పేది నిజమేనేమో అనిపించింది ఒక్క సారి. అదే నిజమైతే బాగుండు అనిపించింది. పొలాల్లేకపోతే యెలా? యేపని సేసుకోవాలి? ఏంతిని బతకాలి?
పిచ్చెక్కినట్టుంది. ఏం తోచట్లేదు. ఎటూ పాలుపోట్లేదు.
ఇక లాభం లేదు. ఒక్కసారి కరకట్ట మీదకి ఎల్లొత్తే యేమైనా తెలుసుద్దేమో అనుకుంట అలా బయటికొచ్చిన.
“ఏడకెల్తన్నవ్” పొయ్యిమీద అన్నం కుండ దింపుతూ అడిగింది.
“యాడికి లేదులే… కరకట్ట దాకా పోయోత్త” అనుకుంటా రోడ్డున నడక మొదలెట్టిన.
***
పచ్చని పంట పొలాలు…
యేడాది పొడుగునా పంటలే
సిన్నప్పుడు మా తాత సెప్పిండు యేడాది పొడుగునా వంద రకాల పంటలు పండుతాయంట యిక్కడ.
కొన్ని పంటలు 45 రోజుల్లో సేతి కొత్తే, యింకొన్ని 90 రోజులకి, మిగతాయి 120 రోజులకి తయారు.
నాబోటి కూలోళ్ళకి నిత్యం పనుంటది. మా యింట్లో మొగుడూ పెళ్ళం యిద్దరం రోజు కూలీపనికొత్తం. నాకూలి 400 రూపాయలు. నా పెళ్ళానికి 250 రూపాయలు.
నాకిద్దరు పిల్లలు… కొడుకు బళ్ళోకెళతండు. బిడ్డ సిన్నది. ఆళ్ళమ్మతోనే వుంటది.
“ఏంట్రా సూరిగా… పొద్దున్నే పొలానికా?”
యెదురుగా మావూరి పెద్ద రైతు సుబ్బయ్య నాయుడుగారు.
“యెల్లెల్లు… యింకెంతకాలంలే”
“అదేంటయ్యా… అంతమాటన్నారు?”
“ఏంటంటావేంట్రా? నీకింకా తెలవలేదా? మనది రాజధాని ప్రాంతం ఇకనుండి. మన పొలాల్లోనే బిల్డింగులు కడతారు. మంత్రులు, అధికారులు అందరూ ఇక్కడే ఉంటారు”
“మరి మనం?”
“మనం ఇక్కడే ఉంటాం. కాకపోతే ఈపొలం పనులు గట్రా ఉండవు.”
“ఈ పనులు లేకపోతే మనం బతికేదెట్టాయ్యా?”
ఇప్పుడు సుబ్బయ్య నాయుడు గారు సెపుతుంటే రాత్రి నాకొచ్చిన కల, పొద్దున్నే సీను గాదోళ్లు సెప్పింది నిజమని నమ్మకం కలిగింది.
“పెద్ద పట్టణం కట్టబోతుంటే బతికేదెట్టా అంటావేంట్రా? మీ బామ్మర్ది హైద్రాబాదులో బ్రతకట్లేదా? రేపు నువ్వూ అంతే.”
తాపీగా సెప్పిండు సుబ్బయ్య గారు.
“నా బామ్మర్దంటే … అక్కడ ఏదో అపార్టుమెంట్లో వాచెమేనో ఏదో అన్నడు.”
“ఆ అదే… రేపు ఇక్కడ అలాంటి అపార్టుమెంట్లే వందలకొద్దీ వస్తాయ్. అప్పుడు నువ్వెంటి, నీ బామ్మర్ది కూడా ఇక్కడికే రావొచ్చు.”
నా వీపుమీద మెత్తగా సరసి నవ్వుకుంటూ ముందుకెళ్లిండు సుబ్బయ్య నాయుడు గారు.
“ఏంటి అపార్టుమెంట్లో వాచ్మేనుగా పనిసేయాలా? అదేం బతుకు? ఇప్పుడు మా తాత సంపాదించిన అరెకరం పొలంలో సక్కగా కూరగాయలు, ఆకు కూరలూ పండించుకుంటా దర్జాగా బతికేస్తున్నా. నాకు నేనే రాజుని. ఇప్పుడేంటి వాచ్మెను పనా?”
భయం వేసింది. గుండె దడ దడగా కొట్టుకుంటంది. నిజమేనా? నేను వాచ్మెనుగా మారిపోవాల్సిందేనా? నా అరెకరం పొలం పోతదా?
ఈ సుబ్బయ్య నాయుడు గారేంటి ఇంత ధీమాగా ఉన్నడు? మా ఊళ్ళో పెద్ద ఆసామి అలా అన్నడేంటి?
నిజమేనా? నేను వాచ్మెనుగా మారిపోవాల్సిందేనా? నా అరెకరం పొలం పోతదా?
బుర్ర వేడెక్కినట్టయింది.
తెల్లారుజామునొచ్చిన పీడకల మల్లీ గుర్తొచ్చింది.
ఒంటిమీద గుడ్డలెవరో లాక్కుంటున్నారు… నన్ను సూసి నవ్వుతున్నారు.

పెరుమాళ్ మురుగన్ కి అక్షరాలా పునర్జన్మ!

image of judgement

-రమా సుందరి 

~

“పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతను దేవుడు కాదు. మళ్ళీ అవతారమెత్తడు. అసలు అవతారాలను నమ్మడు. ఇప్పటి నుండి పెరుమాళ్ మురుగన్ ఒక టీచరుగానే బతుకుతాడు.”

పోయిన  జనవరి 12న పెరుమాళ్ మురగన్, తమిళ నవల మాదోరుబాగన్ రచయిత తీవ్ర మనో వత్తిడితో యిచ్చిన  ప్రకటన.

“తనలో దాగున్న అత్యంత ప్రతిభతో సహా రచయితకు పునర్జన్మ ఇద్దాము. పెరుమాళ్ మురగన్ నువ్విక రాయి.”

ఈ సంవత్సరం జులై 5న రచయిత పెరుమాళ్ మురగన్ కు మద్రాస్ హై కోర్టు జడ్జి సంజయ్ కిషన్ కౌల్ యిచ్చిన గొప్ప హామీ.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను  శక్తివంతమైన శబ్దార్ధంతో వ్యక్తీకరించిన తీర్పు యిది. న్యాయస్థానాల అర్ధం కానీ పరిభాషకు భిన్నంగా – హృదయానికి దగ్గరగా, కవితాత్మకమైన భాషలో వెలువడిన ఈ తీర్పు సంవత్సరన్నర కాలంగా రచయితలు, కళాకారులు పడుతున్న మనో వేదనపై చిరుజల్లులు కురిపించి ఊరట కలిగించింది. సాహిత్యాన్ని, చట్టాన్ని  సమతూకంలో తూచి జయహో అనిపించుకొన్నది. “పుస్తకం అరుదుగా గాయం చేస్తుంది. ఎందుకంటే దాన్ని మూసి వేయటం తేలిక” అన్న ఒక రచయిత సల్మాన్ రష్దీ లాగానే “చదవటం యిష్టం లేకపోతే, పుస్తకాన్ని విసిరి కొట్టు” అంటూ మద్రాస్ హైకోర్ట్ జడ్జిలు సంజయ్ కిషన్ కౌల్, పుష్ప సత్యన్నారాయణలు రచయితల పక్షం వహించారు.

సంజయ్ కిషన్ కౌల్ కళాకారుల పట్ల ప్రేమతో వ్యవహరించటం, కళాత్మక సృజనకు గౌరవం యివ్వటం ఈ రోజు కొత్త కాదు. 2008లో ప్రవాసంలోకి వెళ్ళి పోయిన ఎమ్మెఫ్ హుస్సైన్ కు దన్నుగా ఇదే జడ్జి నిలబడ్డారు. ఆ రోజు ఢిల్లీ హై కోర్టు జడ్జిగా ఉన్న సంజయ్ కౌల్  ప్రాచీన, నవీన కళలు నగ్నత్వాన్నిఎప్పుడూ ఉపయోగించుకొన్నాయని  ఆ నాటి తీర్పులో పేర్కొన్నారు. స్త్రీ పురుషుల మధ్య కలయిక, లైంగిక పూజ.. ఈ రెండిటినీ ప్రాచీన కళ ఎప్పుడు తోసి పారేయలేదని చెప్పారు. అదే వాక్యాన్ని ఈ రోజు పెరుమాళ్ మురుగన్ కేసులో సంజయ్ మళ్ళీ వాడారు. ఎమ్మెఫ్ హుస్సైన్ తీర్పులో ఆయన దేశం ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం ఛాందసవాదం అని చెప్పారు. ఇప్పుడు పెరుమాళ్ మురుగన్ కేసులో ‘మన సహనపు హద్దులు కిందకు పడిపోతున్నాయి. నిజమో అబద్దమో, ఎవరైనా సామాజిక ఆచరణ గురించి రాస్తే అది మనకు ఎంత మాత్రము ప్రమాదకరం కాదు’ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఆర్ధిక శాస్త్రంలో పట్టా పొంది,  కాంపస్ లా కాలేజ్ నుండి ఎల్ ఎల్ బీ డిగ్రీ పొందారు సంజయ్. మద్రాసు హైకోర్టుకు రాక ముందు ఆయన పంజాబ్, హర్యానా హై కోర్టులకు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు.

నువ్వొక పుస్తకం రాస్తావు. ఆ పుస్తకం 5000 కాపీల వరకు అమ్ముడు పోతుంది. దాని అనేక అవార్డులు వస్తాయి. ఒక నాలుగు సంవత్సరాలు గడిచాక అది ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతుంది. హటాత్తుగా కొందరు వ్యక్తులు అది మత భావాలను అవమానిస్తుందని బయటకు వస్తారు. అందులో భాష అసభ్యంగా ఉందంటారు. అసభ్యమైన అంశాలు ఉన్నాయని, అవి స్త్రీలను అవమానిస్తున్నాయని మొదలు పెడతారు. కులాన్ని భ్రష్టు పట్టిస్తుందని అంటారు. నడిరోడ్డులో పుస్తకాన్ని తగలబెడతారు. బంద్ కు పిలుపు యిస్తారు. ఊర్లో షాపులు బలవంతంగా మూయిస్తారు. (వ్యాపారస్తులు చాలా మందికి సాహిత్యం అంటే ఏంటో కూడా తెలియదు) కొంతమంది స్త్రీలు కూడా ఈ ఆందోళనకారులతో ఉంటారు. జిల్లా పాలనా యంత్రాంగానికి అది శాంతిభద్రతల సమస్యగా కనిపిస్తుంది. కలక్టరు ఆఫీసులో కట్టా(ఖాప్) పంచాయితీ జరుగుతుంది. రచయిత మెడలు అధికారులు వంచుతారు. ఆయనకు ‘సమ్మన్స్” జారీ చేస్తారు.  జరిగిన విషయాలకు ‘తీవ్ర పశ్చాత్తాపం’ ప్రకటిస్తున్నానని రచయిత అంటే ఆ పదాన్ని ‘షరతులు లేని క్షమాపణ’గా మార్పిస్తారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న డొల్లతనాన్ని మద్రాసు హైకోర్టు తప్పు పట్టింది. ఒక నవల తన స్వభాషలో నాలుగు సంవత్సరాలు నానింది అంటే అది ప్రజల ఆమోదం  పొందినట్లే. ఇంగ్లీష్ అనువాదం తమిళ మాతృకకు ఆధునిక రూపం మాత్రమే. అందులో తమిళంలోని వాడుక పదాలు కానీ, నుడికారాలు కానీ, జనపదాలు వాడే మొరటు భాష కానీ ఉండవు. సొంత భాషలో లేని అసభ్యత ఇంగ్లీషులో ఎలా కనిపించింది? అని ప్రశ్నించింది. పాలనా యంత్రాంగానికి ఈ పుస్తకం పట్ల ఎలాంటి అభ్యంతరం లేకుండానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి భద్రతల పేరుతో అది ఇప్పుడు ఈ విషయంలో కలగచేసుకొన్నది. కళలు సంస్కృతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ యంత్రాగం ప్రమేయం ఎంతవరకు ఉండాలి అని హైకోర్టు ప్రశ్నించింది. ఒక కళాకారుని వ్యక్తీకరణను చంపటానికి కేవలం ఒక గుంపు ఆవేశాన్ని ప్రాతిపాదికగా తీసుకోకూడదని చెప్పింది. పాలనా యంత్రాంగంతో కూడిన ఈ చట్టాతీత కోర్టులు తమ సొంత సిద్దాంతాల తోటి సామాజిక, నేర విషయాలను పరిష్కరించబూనుకోవటాన్ని తప్పు పట్టింది. మాట్లాడిన తరువాత స్వేచ్ఛ కాపాడక పోవటం అంటే ‘మాట్లాడటానికి స్వేచ్ఛ’  అనే మాటకు అర్ధం ఉండదని స్పష్టం చేసింది.

ఇంత వివాదానికి కారణమైన మదోరుబాగన్ లో ఉన్న కధాంశం కేవలం పిల్లలు లేని తల్లిదండ్రులకు సమాజం నుండి వచ్చే వత్తిడి గురించిన అంశం మాత్రమే. ఆ వత్తిడి స్త్రీ, పురుషులకు యిద్దరికీ ఉన్నప్పటికీ  స్త్రీల మీద పడే భారం చర్చించటమే ఈ కధలోని  అంశం. పెళ్లయ్యి పన్నెండు సంవత్సరాలు అయిన తరువాత కూడా సంతానం కలగక పోవటం కాళి(పురుషుడు), పొన్న(స్త్రీ)లకు పెద్ద సమస్యగా దాపురిస్తుంది. అలాంటి సందర్భంలో తిరుచెంగొడులో ఉన్నఅర్ధనారీశ్వర ఆలయానికి జరిగే తిరనాళ్ళలో పధ్నాలుగోనాడు జరిగే రధోత్సవ సమయంలో అపరిచితులైన మగవాళ్ళతో సంపర్కించి స్త్రీలు సంతానాన్ని పొందుతూ ఉంటారు. అలా పుట్టిన పిల్లలు దేవుడి పిల్లలుగా చలామణి అవుతుంటారు. ఈ కధలోని పొన్న కూడా అలా సంతానాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంది.

Kishan-Kaul_YT

ఒక కధ సమాజం మీదా ఎలాంటి ప్రభావం కలుగచేస్తుందో తెలుసుకోవాలంటే  రచయిత చెప్పుల్లో కాళ్ళు పెట్టి చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు వివిధ స్థాయిల, వయసుల పాఠకుల దృష్టి కోణం నుండి కూడా చూడాలని అభిప్రాయపడింది. హేతుబద్దత, బలమైన వ్యక్తిత్వం, దృఢమైన మనస్తత్వం కల వ్యక్తి దృష్టికోణాన్ని గీటురాయిగా తీసుకోవాలి కానీ, చిన్న చిన్న విషయాలను ప్రమాదకరంగా భావించే వారి దృష్టికోణాన్ని స్టాండర్డ్ గా తీసుకోకూడదని కోర్టు వ్యాఖ్యానించటం విశేషం. అలా చూస్తే ఈ కధలో తప్పు ఏమీ కనబడలేదని కూడా చెప్పింది. ఈ కధ నవలీకరణ చెందిన చరిత్ర కాదని, జనపదాల్లో ప్రచారంలో ఉన్న సంగతులనే రచయిత కాల్పనికం చేశాడని చెప్పింది. ఇది విజేతల చరిత్ర కాదనీ, సామాన్యప్రజలు రోజూవారి పడుతున్న కష్టాల కధ అని చెప్పింది. కోర్టు స్త్రీల వైపు నిలబడి..   స్త్రీలు పరపురుషుడితో, అందునా అపరిచిత పురుషునితో స్త్రీలు సంపర్కానికి యిష్టపడరనీ, పిల్లల కోసం సమాజం వాళ్ళను ఆ పని పురికొల్పి వుండే అవకాశం ఉందని అన్నది.

ఈ కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రచురణకర్తల వైపు నుండి వాదించిన లాయర్ సురేశ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన  సంగతులు ముందుకు తీసుకొని వచ్చారు. ‘రధోత్సవంనాడు పిల్లలు లేని స్త్రీలందరూ పురుషుల కోసం వీధుల్లో సంచరిస్తుంటారు’ అని పెరుమాళ్ రాయటం స్త్రీలకు అవమానకరం అని పెరుమాళ్ మీద దాఖలు చేసిన పిటీషన్ ను ఉద్దేశిస్తూ సురేశ్ వర్ధమాన కాలంలో స్కానింగ్ సెంటర్లను గురించి ప్రస్తావించారు. అక్కడ స్త్రీలు స్కానింగ్ తీయించుకోవటానికి గుంపులు గుంపులుగా పొద్దున తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు వరకు వేచి ఉండటం పెరుమాళ్ళు వర్ణించిన రధోత్సవం నాటి స్త్రీల గుంపులను గుర్తుకు తెస్తుందని అన్నారు. ఒక స్త్రీ స్కానింగ్ కోసం మంచం మీద బట్టలు తొలగించి పడుకొని ఉండగా, ఇంకొక స్త్రీకి అదే స్థితిలో స్కానింగ్ తీస్తూ ఉంటారని చెప్పారు. ఒక్కోసారి పురుషులు కూడా అక్కడికి డాక్టర్ తో మాట్లాడటానికి వస్తుంటారనీ, ఆ స్థితిలో ఉన్న స్త్రీలను వాళ్ళు కూడా చూస్తూ ఉంటారని చెప్పారు. ఆ అవమానాన్ని పిల్లల కోసం స్త్రీలు పడుతుంటారని అన్నారు. పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉంటే ఇతర పురుషుల వీర్య కణాలు కూడా స్వీకరించి స్త్రీలు గర్భవతులవుతున్నారనీ, అందుకు పురుషుల ఆమోదం కూడా ఉంటుందని అన్నారు. పెరుమాళ్ళు కధను తప్పు పడుతున్న నైతిక పోలీసులు ఈ విషయంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. వంద సంవత్సరాల క్రితం అమలులో ఉందని చెబుతున్న ఒక ఆచారాన్నికధలో జొప్పిస్తే తప్పేమిటని ఆయన వాదిస్తూ ఈ నవల ఈ ఆచారాన్ని గ్లామరైజ్ చేసి వాడుకోలేదని చెప్పారు.

పెరుమాళ్ మీద పిటీషన్ వేసిన గోవిందరాసు(అరుల్మిగు అర్ధనారీశ్వర గిరివాల), కె. చిన్నుసామి (హిందూ మున్నని సంస్థ) మొదలైన వారు వాదిస్తున్నట్లుగా ఈ విషయం సెక్షన్ 292 కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. యాంత్రికంగా  సెక్షన్లు వల్లించటం, పదజాలాన్ని వాడటం మంచిది కాదనీ, సెక్షన్ 292 లో పేర్కొన్న అశ్లీలత ఈ కధలో లేదని చెప్పటం సరైన నిర్ధారణ. నవలలోని చిన్న చిన్న ముక్కలను తీసుకొని తప్పు పట్టటం కాకుండా, మొత్తంగా నవల ఏమి చెబుతుందో పరిశీలించాలని అన్నది. సమాజానికి ఎలాంటి చెడు చేసే ఉద్దేశం ఈ కధకు లేదనీ తీర్మానించింది. కామేచ్ఛ కలిగించేటట్లుగా ఈ కధలోని విషయాలు లేవనీ, కేవలం ఆలోచనలు రేకెత్తించే అంశాలే ఉన్నాయని స్పష్టం చేసింది.

 

సంజయ్ కిషన్ కౌల్ సాహిత్య కారుల పట్ల ప్రదర్శించిన ప్రేమ అభిమానం గొప్పవనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే నవలలోని కధను సమర్ధించటానికి ఆయన ప్రాచీన సాహిత్య ఔన్నత్యాన్ని అతిగా పొగిడినట్లు అనిపిస్తుంది. స్త్రీలకు సంబంధించి పురాతన సాహిత్యంలో అన్నీ మంచి విషయాలే ఉన్నాయన్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుడు (పాత కాలంలో) శృంగారం గురించి యదేచ్ఛగా చర్చించేవారనీ, బ్రిటీష్ వాళ్ళు వచ్చి అంతా పాడు చేశారన్నట్లు మాట్లాడారు. ఒకానొక చోట దేవదాసీ పద్దతిని కూడా వెనకేసుకొచ్చినట్లు అనిపించింది. మహాభారతంలో అంబిక, అంబాలిక, కుంతి, మాద్రిలను  ప్రస్తావనలోనికి తీసుకొచ్చారు. భర్తలు లేకుండా వీళ్ళు పిల్లలను కనటం ఉదాహరణగా చూపించారు. ఈ రకమైన ఆచారాలు ప్రాచీన సమాజంలో ఉండేవి, వాటి అవశేషాలు వందేళ్ళ క్రితం సమాజంలో ఉండి ఉండవచ్చు అని చెప్పటంలో అర్ధం ఉంది కానీ, అవన్నీ మనం కోల్పోయామన్నట్లు వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రాచీన, మధ్య యుగాలలో ఉన్న  భూస్వామ్య సమాజంలో వ్యక్తిగత ఆస్తి విధానాన్ని కాపాడటానికి స్త్రీలను పరికరాలుగా వాడుకొన్నారనేది వాస్తవం. వాళ్ళ సెక్సువాలిటీ మీదా వారికే హక్కు లేని కాలంలో అది వారి శృంగార స్వేచ్ఛగా భావించటం సరైదేనా? దేవాలయాల మీద బూతు బొమ్మలను కూడా ప్రస్తావించారు. ఆ బొమ్మల్లో కూడా పితృస్వామ్య సమాజపు అసలు స్వరూపం నగ్నంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని ఒక నాటి మన చరిత్రగా చెబుతూ దాన్ని కూడా నిషేదిద్దామా అని ప్రశ్నించారు.

‘మళ్ళీ లేచి నిల్చొంటానని’ పెరుమాళ్ళు మురుగన్ అనటం ఆనందకరం. కల్బుర్గీని, పన్సారేని కోల్పోయిన సాహిత్య లోకం గట్టిగా ఊపిరి పీల్చుకోంటోంది. వేల గొంతులతో, సంతోషం నిండిన హృదయాలతో ఈ తీర్పును ఆహ్వానిస్తోంది. అయితే సెక్షన్ 292 పాము పడగ కిందే యింకా సృజనకారులు ఉన్నారు. రచయిత హృదయం ఎరిగిన సంజయ్ కిషన్ లాంటి న్యాయాధీశులు మనకు ఎంత మంది ఉన్నారు? ఎమ్మెఫ్ హుస్సేన్ నుండి పెరుమాళ్ మురుగన్ వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను రక్షించడానికి అవిరామంగా కష్టపడిన  జడ్జీలు ఎందరు? తొంభై ఏళ్ల చిత్రకారుడు తన కాన్వాస్ దగ్గర బొమ్మలు వేసుకొంటూ తన యింట్లోనే ఉండాలని వాంఛించిన అత్యున్నత న్యాయ స్థానాలు మనకు ఎన్ని? చట్టాలను దాటి  రచయితల కోసం సౌందర్యాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకొస్తున్న వారు ఎవరు? ‘కళ రెచ్చగొట్టేటట్లే ఉంటుంది. అది అందరి కోసం కాదు. అందరూ తనను వీక్షించాలని కూడా కోరుకోదు. చూసేవాళ్ళ అభిరుచి  మీద అది ఆధారపడి ఉంటుంది.’ అనగల దమ్మున్న జడ్జీలు సంజయ్ కాకుండా మనకెవరు ఉన్నారు?

*

 

 

 

అనువాదాల అవసరం

 

 

-వేలూరి వేంకటేశ్వర రావు

~

(జూలై 3 వతారీకున ఆటా సాహిత్యసదస్సులో ఇచ్చిన ఉపన్యాసం)

తెలుగు వాళ్ళు  అమెరికాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున  సాంస్కృతిక సంబరాలు చేసుకోవటం 1977 లో మొదలయ్యింది. కొన్నేళ్ళపాటు రెండేళ్ళకోసారి ఈ పండుగ చేసుకొనేవారు.  మరి పండుగలు ప్రతిఏడూ జరుపుకోవాలిగదా! అందుకనో, మరెందుకనో, ప్రతిఏడూ ఈ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవటం పాతికేళ్ళక్రితం మొదలయ్యింది. నా శ్రీమతి  ఇంగ్లీషు పుట్టింరోజు, తెలుగు పుట్టింరోజూ చేసుకుంటుంది; అంటే సంవత్సరంలో రెండు పుట్టింరోజులు!  అల్లాగే ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు ఈ సాంస్కృతిక సంబరాలు ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటున్నారు.

తెలుగు సినిమా మన సంస్కృతిలో ప్రథానమైనది.  అందుకని, సంస్కృతి పేరుతో తెలుగు సినిమాల వాళ్ళు ముమ్మరంగా వస్తారు, అమెరికాకి!  సంస్కృతి పేరుతో రాజకీయనాయకులు కూడా వస్తారు; సంస్కృతికి రాజకీయానికీ ఉన్న సంబంధం  నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.  నాకు ఇకముందు అర్థం అవుతుందన్న ఆశకూడా లేదు.

ఈ సాంస్కృతిక సంబరాలలో సాహిత్యానికి ప్రత్యేకంగా ఒక చిన్ని పీట ఎప్పుడూ ఉంటుంది. ఒక్కక్కప్పుడు అది ముక్కాలిపీట అవుతుంది కూడా!  తెలుగు నాడు నుంచి, కవులు, కథకులు, నవలా రచయితలు. విమర్శకులు, పత్రికలవాళ్ళు వగైరా వగైరా ఆహ్వానితులుగా వస్తారు. వారికి తోడుగా చిన్న తమ్ముళ్ళుగా అమెరికా రచయితలు కూడా పిలిపించుకుంటారు, –“ డయాస్పోరా”  రచయితలం అనుకుంటూ!

(కథలో కథ చెప్పాలి, పిట్టకథలాగా! 1985 లో నారాయణరెడ్డి గారిని అడిగాను; మీకు ఇప్పటివరకూ వచ్చిన కీర్తి చాలదూ? ప్రతిఏడూఒక కవితా సంకలనం అచ్చువెయ్యాలా?  మా బ్రాహ్మలు సంవత్సరీకాలు పెట్టినట్టు, అన్నాను. ఆయన మృదువుగా తనశైలిలో చెప్పారు: అలా ప్రతిఏడూ ఒక సంకలనం అచ్చువెయ్యకపోతే జనం మనని  మరిచిపోతారు” అన్నారు.)

పోతే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది  ముక్తకంఠంతో మనభాష ఎంతగొప్పదో, మనసాహిత్యం ఎంతగొప్పదో, మన సంస్కృతి  ఎంత పురాతనమైనదో మనకి మరీమరీ నూరి పోస్తారు. ఇక్కడి వాళ్ళు—అంటే అమెరికా డయాస్పోరా రచయితలు  “ మమ మమ” అని అర్ఘ్యమ్  పుచ్చుకుంటారు.  పునః పునః.  ఏడాదికి రెండు సార్లు!

నిజమే! మనభాష, సాహిత్యం, సంస్కృతీ గొప్పవే! కాదనం.

అయితే ప్రపంచ సాహిత్యంలో మన సాహిత్యానికి  ఉన్న స్థానం ఏమిటి? మనని ఎవరు గుర్తిస్తున్నారు? మనం ఎంతవరకూ గుర్తింపబడ్డాం? పాశ్చాత్య సాహితీ వేత్తలు, పాఠకులు, అసలు ఎవరైనా  మనని గుర్తిస్తున్నారా? మన ఘోష వింటున్నారా?

సరేనయ్యా!  వాళ్ళు మనని గుర్తించవలసిన అవసరం ఏముంది? లేదా వాళ్ళు గుర్తించనంతమాత్రాన మన ఘనత తగ్గుతుందా? అని అనే వారితో నాకు పేచీ లేదు. వారితో నాకు వాదించే ఓపిక కూడాలేదు.  అంతర్జాతీయంగా తమతమ సాహిత్యాలు గుర్తించబడాలని ప్రతి భాషలో రచయితలు, సాహితీపరులూ కోరుకుంటారు.  వాళ్ళ ఆలోచనలు, అనుభవాలు  మనకి, మన ఆలోచనలు మన అనుభవాలు వాళ్ళకీ పరస్పరం తెలుపుకోవటం అవసరం అనుకునే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఈ విషయమై నాతో ఏకీభవించేవాళ్ళు ఉన్నారని అనుకుంటాను.

మన సాహిత్యం గురించి ఇక్కడ అమెరికాలో గాని, యూరప్‌ లోగాని ఎంతమందికితెలుసు, అని మనని మనం ప్రశ్నించుకున్నప్పుడు, మన భవిష్యత్ కర్తవ్యం బోధపడుతుంది.

మనసాహిత్యం, — సంప్రదాయ సాహిత్యం, ఆథునిక సాహిత్యం ముందుగా ఇంగ్లీషులోకి తర్జుమా  చేసుకోవలసిన అవసరం ఉన్నది.  ఆ తరువాత ఇతర యూరోపియన్ భాషలలోకి అనువదించేచే ప్రయత్నాలు మనం చేసుకోవాలి.  ఇంగ్లీషులోకి అనువదించటం కేవలం వాళ్ళకోసం కాదు; నిజం చెప్పాలంటే మనకోసమే! మనపిల్లలకి తెలుగు చదవటం రాదు;  తరువాతి తరం వారికి  తెలుగు అంటే ఏమిటోకూడాతెలియని పరిస్థితి రాకూడదు. భాష రాకపోయినంతమాత్రాన, ఆ భాషలో సాహిత్యం, ఆ సాహిత్యానికున్నప్రత్యేకత, మన వారసులకి తెలియవలసిన అవసరం ఉన్నdi. ఇంగ్లీషులోకి అనువదించటం మూలంగా,  You kill two birds at one shot.

veluri

ఆటా సాహిత్య సదస్సులో…

ఒక ఉదాహరణ:  “#Zoque#” అనే భాష కేవలం 70,000 మంది మాత్రమే మాట్లాడుతారు.  ఆ భాషలో కవిత్వం ఇవాళ ఇంగ్లీషులోకి అనువదించబడుతున్నది.

తెలుగు ప్రాచీన సాహిత్యం, ఏవో ఒకటి రెండు ప్రబంధాలనో, కావ్యాలనో తీసివేస్తే నిజంగా అంతా అనువాద సాహిత్యమేకదా! ఇప్పటికే మనకి, ఇంగ్లీషునుంచి, ఫ్రెన్‌చ్‌ నుంచి, రష్యను నుంచి కొల్లలుకొల్లలుగా అనువాద సాహిత్యం వచ్చింది. ఇప్పటికీ, దక్షిణ అమెరికను సాహిత్యాన్ని, స్పానిష్ సాహిత్యాన్ని మన రచయితలు విరివిగా అనువదిస్తున్నారు. అది వద్దనను.  అయితే, అదే బిగిలో  మనసాహిత్యం వారిభాషల్లోకికూడా వెళ్ళేటట్టు చేయగలగాలి.

#Quid Pro Quo# అనండి.

మన దురదృష్టం ఏమిటంటే, మన భారతీయభాషల సాహిత్యమే ఒకభాషనుంచి మరొకభాషలోకి  ఎక్కువగా అనువదించబడలేదు. ఎక్కడో ఒకటో రెండో కవితలు, కొన్ని కథలూ అడపా తడపా ఒకటో అరో నవల ఇతరభాషలలోకి వెళ్ళాయి. అది చాలులే అని సమర్థించుకొని సంతృప్తి పడే మంచి లక్షణం నాకు లేదు.

అయితే ఈ పని ఎవరుచేస్తారు?  ఈ దేశంలోను, ఇతర యూరోపియన్‌ దేశాలలోనూ యూనివర్శిటీలు పురమాయించో, ప్రోత్సహించో ఈ పని చేస్తాయి. ఆంధ్రలో గాని, తెలంగాణాలో గాని ఉన్న విశ్వవిద్యాలయాలు ఇటువంటి పని ఇప్పట్లో చేస్తాయని నేను అనుకోను. అక్కడ వాళ్ళకున్న ఈతి బాధలు వాళ్ళవి. వాళ్ళ సాహిత్యరాజకీయాలు వాళ్ళవి.  మరి, ఇక్కడి సాంస్కృతిక సంస్థలు పూనుకోగలవా?  ఈ సంస్థలు తమంతతామే చేయలేకపోయినా,  ఊతం ఇవ్వగలvu.  అందుకు డయాస్పోరా కమ్యూనిటీ యే పూనుకొని, సంస్థలని ప్రోత్సహించాలి.

ఈ సందర్భంలో నారాయణరావుగురించి ప్రస్తావించాలి. అతను ఒక్కడూ, మరొకరిద్దరి   సహకారంతో, ఎన్నో సంప్రదాయసాహిత్యగ్రంధాలని ఇంగ్లీషులోకి అనువదించాడు. ఇంగ్లీషులో కవితా సంకలనాలు తెచ్చాడు. శ్రీనాథుడి సాహిత్యచరిత్ర (#Literary Biography#) రాసాడు. A first of its kind. ఆథునికుల కవితలు, కథలూ  కూడా అనువదించాడు.  వ్యాఖ్యానాలు రాసాడు. అవి ఓపికగా, జాగ్రత్తగా చదవకండా  తెలివితక్కువ విమర్శలు చేసే బదులు, అంతకన్నా మంచి అనువాదం తేవాలన్న అభిలాషతో, నిష్పాక్షికంగా పనిచేయాలి.  ఆ పని అసాధ్యం కాదనుకుంటున్నాను.

నాకు ఈ కోరిక 2002-2003 లో 20th Century Telugu Poetry, Hibiscus on the Lake, —  ఈ రెండుపుస్తకాలు వచ్చిన తరువాత కలిగింది. నా స్వంత అనుభవం: మా మేనకోడలికి ఇస్మాయిల్‌ కవితల అనువాదాలు చదివి వినిపించాను. ఆ పిల్ల అప్పట్లో ఇక్కడ కాలేజీలో పేపర్‌కి సబ్-ఎడిటర్‌. ఆ అనువాదాలు విని ఇవి, elijabeth barret browning పద్యాల్లా వినపడుతున్నాయి అన్నది.  ఆహా!  That’s it అనిపించింది.  అంటే ఇక్కడి పాఠకుల “ఇడియం “ పట్టుకొని అనువదించాలన్నమాట!

1960 లో #UNESCO# రెండు తెలుగు పుస్తకాలు ఫ్రెన్‌చ్‌ లోకి అనువదించమని  ఆంధ్రా యూనివర్సిటీకి ఒక “ఆల్బర్ట్” ని పంపింది. మొదటిది వేమన శతకం. అతను అనువదించాలి. అది జరిగిందోలేదో తెలియదు కాని, అతనితో స్నేహం పట్టిన మాకు వైన్‌ తాగటం మాత్రం అలవాటయ్యింది.  రెండో పుస్తకం కళాపూర్ణోదయం.  అది నారాయణరావు ఈ మధ్యనే అనువదించాడు, ఏ అంతర్జాతీయ సంస్థయొక్క ప్రమేయం లేకుండానే! అప్పుడప్పుడు UNESCO సాహిత్య అకాడమీ తో షరీకయి భారతీయ భాషల పుస్తకాలు అనువదింపజేస్తుంది. తెలుగు పుస్తకం ఒక్కటికూడా వాళ్ళ జాబితాలో లేదు.

ఇక్కడ పదవశతాబ్దపు లాక్షణికుడు  రాజశేఖరుడి శ్లోకం గుర్తుచెయ్యటం అవసరం.

ఏకస్య తిష్ఠతి కవేర్గృహ  ఏవ కావ్యమ్

అన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్,

న్యస్యా విదగ్ధవదనేషు పదాని శశ్వత్

కస్యాపి ఞ్చరతి విశ్వకుతూహలీవ. –  రాజశేఖరుని కావ్య మీమాంసా, 4:10

 

ఒక కవిరచించిన కావ్యము అతని ఇంటిలోనే పడి ఉంటుంది. మరొకడురాసిన కావ్యము మిత్రుల ఇంటి వరకూ పోతుంది. ఒక్కొక్కని కవిత్వము, ప్రపంచయాత్ర చేయుటకు కుతూహలము చూపిస్తూ ఎల్లప్పుడూ సంచరించుతుంది. ( అంటే,  సామాన్య విద్యావంతులు కూడా చదువుతూ ప్రచారము చేస్తారు, అని భావం)

ఈ కాలంలో,  మనసాహిత్యం ప్రపంచయాత్ర చేయడానికి  మనప్రేరణ, ప్రయత్నం  ఉండాలి.

ఆఖరిగా ఈ మాట చెప్పాలి.

ఇజం నిజం కాదు; నిజం ఇజంలోకి పోదు.  ఇజాల గందరగోళంలో పడకుండా మనం ఉమ్మడిగాఏమిచేయగలం అన్న విషయంపై నాకుకొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి మరొక వ్యాసంలో పొందు పరుస్తాను.

ఇప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను.

శలవ్‌

 

ఆడంబరం లేని అబ్బాస్!

 

ఇంద్రగంటి మోహన కృష్ణ

~

 

mohanakrishnaఆంద్రెయ్ తార్కోవిస్కీ  (Andrei Tarkovsky) అనే ఒక గొప్ప రష్యన్ ఫిల్మ్ మేకర్ ఒక మాటన్నారు. కళలో అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే పరిపూర్ణమైన నిరాడంబరత అనేది చాలా కష్టమని అన్నారు. .అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే ఎటువంటి హంగులూ ఆర్భాటాలూ లేకుండా ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సరళంగా  చెప్పగలగడం .

సరళంగా చెప్పగలగడం అంటే తెలివితక్కువగా సింప్లిస్టిక్ గా చెప్పడం అని కాదు. ‘సరళంగా చెప్పగలగడం అనేది ఒక అద్భుతమైన కళ’ అని తార్కోవిస్కీ అన్నారు. అలా అంటూ ఆయన, సంగీతంలో యొహాన్ సెబాస్టియన్ బెక్ (Johann Sebastian Bach)సంగీతమూ, సినిమాల్లో రాబర్ట్ బ్రెస్సోన్(Robert Bresson) సినిమాలూ ఇందుకు తార్కాణాలుగా పేర్కొన్నారు . నా దృష్టిలో వాళ్ల తర్వాత అబ్బాస్ కిరొస్తామీ(Abbas Kiarostami)సినిమాలు ఈ అబ్సల్యూట్ సింప్లిసిటీకి గొప్ప ఉదాహరణలు. దీనినే పరిపూర్ణమైన నిరాడంబరత అని కూడా అనవచ్చు.

అంటే ఎంచుకున్న విషయం చిన్నదైనా కూడా ఒక గొప్ప లోతునీ, ఒక అద్భుతమైన జీవిత సత్యాన్నీ అత్యంత సరళంగా ఆవిష్కరించగలిగిన  చాలా కొద్ది మంది దర్శకుల్లో నా దృష్టిలో కిరొస్తామీ ఒకరు.  ‘వైట్ బెలూన్’ గానీ, ‘ద విండ్ విల్ క్యారీ అజ్’ గానీ, ‘టేస్ట్ ఆఫ్ చెర్రీస్’ గానీ, ‘వేర్ ఈజ్ ద ఫ్రెండ్స్ హోం’ గానీ ఇలా ప్రతి సినిమాలోనూ ఒక దర్శకుడి యొక్క అహం గానీ, అహంకారం గానీ  కనబడకుండా అద్భుతమైన పారదర్శకతతో, సింప్లిసిటీతో ఎటువంటి ఆడంబరాలకీ, స్టైలిస్టిక్ టచెస్ కీ, అనవసరపు హంగామాలకీ పోకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూడటం, ఆ చూడటం ద్వారా అతి చిన్న విషయాలని కూడా  పరిశీలించడమెలాగో నేర్పించిన దర్శకుడు అబ్బాస్ కిరస్తామీ.  అది చాలా చాలా కష్టమైన కళ.

అబ్బాస్ కిరస్తామీ నా దృష్టిలో చనిపోలేదు. ఆయన అవసరం ఉంది కనుక కొంతకాలం మన భూమ్మీద నివసించడానికి వచ్చారు. ఇక వేరే గ్రహాల్లో, వేరే అంతరిక్షాల్లో, వేరే లోకాల్లో కూడా ఆయన అవసరం పడి ఉండటం వల్ల ఇలా వెళ్లిపోయారని అనుకుంటున్నాను. కాబట్టి థాంక్ యూ అబ్బాస్ కిరస్తామీ.

(సాంకేతిక సహకారం: భవాని ఫణి)

 

వెలుతురు పూవుల జాలు 

 

 

ఆమె కల్లోలం లో పుట్టి పెరిగారు , అందుకని దాన్ని తిరిగి సృష్టించాలని అనుకోలేదు.

యూదు జాతి తలిదండ్రులకి , 1925 లో , ఆస్ట్రియాలోని వియన్నా లో జన్మించి – నాజీ ల విద్వేషం తో ఎంత పడాలో అంతా పడ్డారు.

బ్రిటన్ లో ఆశ్రయం పొంది తన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టుకున్నారు కనుక , ఆ ఆశను రాసినదానిలో నింపి ఇచ్చారు, మరింకే నిరాశ లోనైనా చదివితే పనికి వచ్చేందుకు.

చిన్న వయసు లోనే అమ్మా నాన్నా విడిపోయారు – ఇద్దరి మధ్యనా తిరిగే నిలకడ లేని బాల్యం. అయితేనేం  , అమ్మమ్మ , ఆంట్ లూ ఉన్నారు కదా, లంగరు గా. విడాకులు తీసుకున్న తలిదండ్రులకి పుట్టిన పిల్లల వివాహాలూ నిలబడవనే పరిశీలనని అబద్ధం చేసి ,  ప్రేమించి పెళ్ళాడిన భర్త తో-   ఆయన వెళ్ళిపోయేదాకా ,  యాభై ఒక్కేళ్ళ పాటు ప్రేమించే ఇల్లాలి గానే బ్రతికారు.

పిల్లల కోసం రాసిన రచయిత్రులు వాళ్ళ పిల్లలతో సరిగ్గా లేరని – మనకి అక్కర్లేని కొన్ని నిజాలని A.S.Byatt – వంటి వారు చెప్పుకొచ్చారు[ The Children’s  Book] . ఈవిడ దానికీ మినహాయింపే – ముగ్గురు కొడుకులూ ఒక్క కూతురు …అందరినీ గారాబంగా , ఇష్టం గా పెంచుకున్నారు .

ఇలా కూడా జీవించవచ్చుననే విశ్వాసాన్ని , నిన్న మొన్నటి వరకూ ఇస్తూనే ఉన్నారు నా వంటి వారికి.

రాసినవాటి లో ఎక్కువ ప్రఖ్యాతి వచ్చింది చిన్న పిల్లల పుస్తకాలకే. The Great Ghost Rescue తో 1975 లో మొదలు పెట్టి 2010 వరకూ దాదాపు 15 నవలలు. పిల్లల తోబాటు వాటిలో దయ్యాలు – మనసులున్న దయ్యాలు, మంచి దయ్యాలు, నవ్వించే దయ్యాలు , ఇక్కట్లు పడే దయ్యాలు …అబ్బే , భయపెట్టవు ఏమాత్రం, మనుషులని పట్టవు కూడానూ. తొమ్మిది నుంచి పన్నెండేళ్ళ పిల్లలకి తెలియవలసినన్ని నిజాలు, ఇవ్వవలసినంత వినోదం , చెప్పీ చెప్పకుండా నేర్పగలిగినంత జ్ఞానం.  కళ్ళు మూసుకుని recommend  చేయచ్చు అన్నిటినీ.

Dated 02-08-2004 Childrens author Eva Ibbotson at her writing desk at home in Newcastle upon Tyne. FAO: Kate - Daily Telegraph

Eva Ibbotson 

వాటిలో ఒకటైన  Secret  of Platform 13  అనే పుస్తకం లోంచి ఒక విషయాన్ని J.K.Rowling  తన  Harry Porter లో వాడుకున్నారని అందరికీ తెలుసు.

[ ఆ మాటకొస్తే J.K.Rowling   రాసినదానిలో పాత రచనల నుంచి తీసుకున్నది ఎక్కువే ఉంటుంది. ఆమె కి ముందరా ఆంగ్ల సాహిత్యం లో పిల్లల కోసం  గొప్పfantasy  లు రాసిన ఉద్దండులు –Lloyd Alexander , Diana Winnie Jones  ,Madeleine L ‘Engle  , Ursula Le guin , Susan Cooper –  ఇంకా చాలా మంది ఉన్నారు .  వారెవరికీ రాని ప్రసిద్ధి J.K.Rowling కి వచ్చినప్పుడు సహజం గానే వారిలో కొందరు  చిరాకు పడ్డారు. సీరియస్ young adult fantasy చదువరులకి Harry Potter series   మీడియోకర్ పుస్తకాల నే అనిపిస్తాయి. ]

ఆ మాట అడిగితే ఈ పెద్దావిడ అంటారూ – ” Ms. Rowling తో నేను కరచాలనం చేస్తాను. మేమంతా రచయితలం   కదా- ఒకరి నుంచి మరొకరు అరువు తెచ్చుకోకుండా ఎలా కుదురుతుంది ? ” అని. వ్యంగ్యం గా కాదు, మనస్ఫూర్తిగా. ఆమె అలాంటివారు.

చిన్నప్పటి విధ్వంసాల గురించి పారిపోవాలనుకోలేదు –  ఆ వెళ్ళగొట్టబడటం, ఎవరికీ చెందక పోవటం – అవన్నీ కొన్ని నవలలలో అతి విపులంగా , కానీ సున్నితంగా కనిపిస్తాయి. ఆ పాత్రలు కష్టాలు పడుతూన్నా చిన్న చిన్న ఆనందాలకి అంధులు కారు. చుట్టూ ఉండేవారిలో ముళ్ళ కంచెలూ ఫలవృక్షాలూ పూల తీగ లూ – అన్ని రకాల మనుషులూ ఉంటారు. ప్రవాసం ఆమె చెప్పిన కథలలో ప్రధానమే , కాని ముఖ్యంగా ప్రతిపాదించినది అమాయకత్వాన్ని , అందులోంచి వచ్చే ఆహ్లాదాన్ని.

నా వరకు ఆమె రచనల లో మాణిక్యం అనదగిన Star Of Kazan లో – అప్పటి ఆస్ట్రియా వాతావరణమంతా అతి సాధికారం గా ఉంటుంది …అక్కడి అతి ప్రత్యేకమైన కేక్ ల, పేస్ట్రీ ల సువాసన ఉంటుంది ఆ పుటలకి. తర్వాత – సంగీతం. ఓపెరాల ఒద్దికలు, నాటకశాలలు , ఆ శాంతి మీద పడిన నాజీ పిడుగులు…

ఆమె రొమాన్స్ లు గా ఉద్దేశించి రాసిన నవలలు – 2000 సంవత్సరం తర్వాత , సహజం గానే , young adult సాహిత్యం గా ముద్రించబడుతున్నాయి. The Countess Below Stairs, The Secret Countess అని రెండు పేర్లున్న నవల ఎంత బావుంటుందో చెప్పలేను. రష్యన్ విప్లవం తర్వాత , ఇంగ్లండ్ కి పారిపోయివచ్చిన ఒక జమిందారీ కుటుంబం.  సేవికా వృత్తి ని అవలంబించిన ఒక ముగ్ధ అయిన అమ్మాయి. చివరలో ఆమె మళ్ళీ జమిందారిణి అయిపోవటమేమీ ఉండదు కనుక మనకి అభ్యంతరం ఉండక్కర్లేదు – హాయిగా చదువుకోవచ్చు. నిజానికి ఆమె కులీనత ని గొప్ప చేసిన వారూ కారు. 1998 లో భర్త మరణించాక , కాస్త గంభీరం గా రాసిన నవల Journey To River Sea  లో ఒక పెద్ద జమిందారీ కి హక్కుదారుడైన కుర్రాడు  తన స్థానం లో ఇంకొక అబ్బాయి  ని పంపించేసి తను దేశ దిమ్మరి గా ఉండిపోతాడు. ఆ రెండో పిల్లాడికి అది ఇష్టమే కూడానూ- తెరప !

ఒక ముఖాముఖి లో తనను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ప్రశ్నిస్తే Frances Hodgson Burnett  రాసిన అన్ని పుస్తకాలు , ముఖ్యం గా The Secret Garden  ;  L.M.Montgomery రాసిన Anne Of Green Gables అని చెప్పారు. ఉల్లాసం , చిన్న గర్వం – నాకు, జాడలు తీయగలిగినందుకు.

జంతువులు , వాటి పట్ల మన విధులైన వాత్సల్యం, స్నేహం ,  బాధ్యత – అతి సుందరం గా చాలా పుస్తకాలలో ఉంటాయి. The Beasts Of Clawstone Castle లో ఆ జంతువులు గోవులు – వాటిని పూజించే సంస్కృతి గురించిన ప్రస్తావన. [ఆమె ఫిజియాలజీ లో పట్టా పుచ్చుకున్నారు గాని అందులో ముందుకి వెళ్ళాలనుకోలేదు – ఆ పరిశోధనలలో ప్రాణులని బాధ పేట్టాల్సి వస్తోందని.]

కొన్ని కోట్స్ ని ఇక్కడ అనువదిస్తున్నాను – ఆమె ఏమిటో మచ్చు చూపేందుకు.

” మంచి సంగతులని మటుకే గుర్తుంచుకుంటే ఎలా ” – ఆమె అంది – ” చెడ్డవాటిని కూడా గుర్తుంచుకోవాలి, లేదంటే అదంతా నిజమేననిపించదు కదా ”

*****

eva1

” బాధ్యత అనేది ఉంది, అది వాస్తవం. మనం పొందిన కానుకనో మనకి ఉన్న సామర్థ్యాన్నో అక్కర ఉన్న వారితో

పంచుకోవలసిందే. అది నిర్భయత్వం, స్వార్థం లేకపోవటం – మనని మనం తెరిచి ఉంచుకోవటం ”

*****

 

” ఆ రోజుల్లో  ప్రపంచం ఎంత అందమో తెలుసా , అన్నికా ! పువ్వులు, సంగీతం, పైన్ చెట్ల సుగంధాలు… ‘  ఇప్పుడూ ఉంది అలాగే ‘ – అన్నిక అంది – ‘ నిజంగానే ఉంది ‘ ”

*****

 

” ‘ అయితే,  దేని గురించి భయం నీకు ? ‘- అతను అడిగాడు.

ఆమె ఆలోచించింది. ఆ అలోచన మొహం లో ఎంత కనిపిస్తుందో చేతుల్లోనూ అంతే – అతనికి తెలుసు. తన ఆలోచనలని అరచేతుల్లో నింపుకునేలాగా దోసిలి పడుతుంది.

‘ చూడలేకపోవటం- దాని గురించీ భయం నాకు ‘

‘ అంటే , గుడ్డితనమా ? ‘

‘ ఉహూ. కాదు. అది చాలా కష్టమే గాని, హోమర్ ఉండగలిగారు గా అలాగ. మా పియానో టీచర్ మాత్రం..ఎంత ప్రశాంతం గా ఉంటారని ! నేననేది – ఒక గొప్ప మోహం కప్పేసి తక్కిన ప్రపంచాన్ని మూసివేయటం గురించి. వ్యామోహమో , వ్యసనమో – మరింకేదో – ఆ భీషణమైన ప్రేమ …ఆకులూ పక్షులూ చెర్రీ పూగుత్తులూ – వేటినీ కనిపించనీని ప్రేమ – కేవలం,  అవేవీ అతని ముఖం కాదు గనుక… ‘ ”

*****

 

ఆమె  చెప్పిన ఒక నిజమైన  ఉదంతాన్నీ అనువదిస్తున్నాను ఇక్కడ – పంచుకోక ఉండలేక .

‘’ బ్రిటన్ కి శరణార్థిగా వచ్చినప్పుడు నాకు ఎనిమిదేళ్ళుంటాయి. అంత ఉత్సాహం గా ఉన్నానని చెప్పలేను . వియన్నా లో మా స్కూల్ లో ప్రతి ఏడూ క్రిస్మస్ ముందు క్రీస్తు జననం నాటిక[nativity scene ]  ఉంటుంది  కదా- అంతకు ముందంతా ఆవు వేషమో గొర్రె వేషమో వేస్తుండేదాన్ని …ఆ యేడు ,  ఎట్టకేలకి  నాకు కన్య మేరీ వేషం ఇచ్చారు .

ఆలోపే ,  అప్పుడు –  హిట్లర్ వచ్చాడు.

చిర్రుబుర్రులాడే అమ్మమ్మ, అయోమయపు పిన్ని, ఎక్కడో ఆలోచిస్తుండే కవయిత్రి  అమ్మ – మా అడ్డదిడ్డపు గుంపు అంతా 1934 లో లండన్ చేరాము. బెల్ సైజ్ పార్క్ కి అప్పట్లో ఏమంత మంచి పేరుండేది కాదు, అక్కడి ఇళ్ళూ బాగుండేవి కావు – ఇంచుమించు కూలిపోబోతున్న ఒక మూడంతస్తుల మిద్దె  ఇంట్లో అద్దెకి దిగాము. మాతోబాటు అందులో ఇంకా చాలా మంది కాందిశీకులు – అందరూ చేతిలో డబ్బు ఆడనివారే. వాళ్ళలో లాయర్ లు, డాక్టర్ లు, పరధ్యానపు ప్రొఫెసర్ లు – ఎవరికీ జర్మన్ తప్పించి మరే భాషా రాదు. నాకు స్నేహితులెవరూ లేరు, బళ్ళోకి వెళ్ళటం లేదు, ఆడుకుందుకు చోటు లేదు.

అప్పుడొక రోజు- అమ్మమ్మ ఏవో సరుకులు పట్టుకు రమ్మంటే , హాంప్ స్టెడ్ వైపు వెళ్ళాను. ఒక గుట్ట మీద , తెరిచి ఉన్న తలుపులతో- పెద్ద భవనం. లోపలికి అడుగు పెట్టాను. అంతా నిశ్శబ్దం గా ఉంది. బోలెడన్ని పుస్తకాలు ! తేలిక రంగు జుట్టున్న ఒకావిడ బల్ల ముందు కూర్చుని ఉన్నారు .  నన్ను వెళ్ళిపొమ్మంటారనుకున్నాను – కాని ఆమె చిరునవ్వు తో , ” లైబ్రరీ లో చేరతావా ? ” అని అడిగారు.

నాకు ఇంగ్లీష్ బాగా రాదు గానీ ఆ మాటలు అర్థమైనాయి. ‘ చేరటం ‘ అనే మాట ఎంతో అందం గా వినిపించింది. నా దగ్గర డబ్బులు లేవన్నాను. ఆవిడ – మిస్ పోల్ – చెప్పారు – ” ఊరికే చేరచ్చు. డబ్బు కట్టక్కర్లేదు గా ” అని.

చేరాను. చేరి అక్కడ ఉండిపోయాను. జర్మన్ చదివినంత బాగా ఇంగ్లీష్ చదవటం ఎప్పుడు మొదలు పెట్టానో సరిగా గుర్తు లేదు గానీ ఎక్కువ రోజులైతే పట్టలేదు. కొద్ది వారాలు గడిచేసరికి వాడుక గా వచ్చేవారంతా తెలిసిపోయారు – ఒకాయన న్యూస్ పేపర్ లో రేసు ల వార్తలు చదువుతుండేవారు  .  ఆయన బూట్లకి చిల్లులుండేవి – వెచ్చదనం కోసం కూడా వచ్చేవారనుకుంటాను. మరొకావిడ , ఇంట్లో అత్తగారి పోరు పడలేక కాస్త గాలి పీల్చుకుందుకు వచ్చేవారు. ప్రత్యేకించి – నాకు మంచి స్నేహితులైన హెర్ డాక్టర్ హెలర్. నా లాగే ఆయనా శరణార్థే – కాకపోతే బెర్లిన్ నుంచి వచ్చారు.

డా. హెలర్ , లైబ్రరీ కి బాగా పొద్దుటే వచ్చేసేవారు, చాలా రాత్రయే దాకా ఉండిపోయేవారు. ఆయన ముందు గుట్టలు గుట్టలు గా మెడికల్ పుస్తకాలు  – మోకాళ్ళ వ్యాధులు, లింఫ్ గ్రంథుల అస్తవ్యస్తాలు … ఇంకా చాలా. అవన్నీ ఇంగ్లీష్ లో ఉండేవి. జర్మనీ లో ప్రసిద్ధికెక్కిన ప్రసూతి వైద్యశాల లో Head of the department  అయిన ఆయన, ఆ గొప్ప స్త్రీ వైద్య నిపుణుడు –  ఇంగ్లీష్ లో మళ్ళీ పరీక్షలకి కూర్చుని పాసయితే గాని ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు లేదు.

eva2

అప్పటికి ఆయన వయసు ముప్ఫై అయిదూ నలభై మధ్య ఉండేదనుకుంటాను. ఒక భాష నుంచి మరొకదానికి అవలీల గా మారిపోవటం ఆ వయసు లో కష్టం – చిన్నపిల్లలకైతే సులువు గాని. ఆయన చాలా సార్లు నిట్టూర్చటం చూశాను . కొన్నిసార్లు – నిస్పృహ తో కళ్ళు తుడుచుకోవటమూ గమనించి – మిస్ పోల్ , నేనూ ఒకరి మొహాలొకరు  చూసుకునేవాళ్ళం. ఆవిడ కి ఆయన పట్ల చాలా అక్కర ఉండేది – ఆయన వచ్చీ రాగానే లావుపాటి జర్మన్- ఇంగ్లీష్ dictionary ని తెచ్చి అక్కడ పెట్టేసేవారు. తరచూ ఆయన కోసమని లైబ్రరీ ని ఇంకొంత ఎక్కువ సేపు తెరిచి ఉంచేవారు. డాక్టర్ గారు ఉండేది చిన్న ఇరుకు గదిలో, దాన్ని వెచ్చగా ఉంచుకుందుకు ఆయన దగ్గర డబ్బు లేదు –  అందుకని చదివేదేదో లైబ్రరీ లోనే కానివ్వాలి.

వేరే బాధ లూ ఉండేవి ఆయనకి. ఆయన భార్య ‘ ఆర్యన్ ‘ జాతికి చెందినదట- అందుకని ఆమె జర్మనీ లోనే ఉండిపోయింది , ఈయన వెంట రానందట. ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట  చదివి మర్చిపోయిన పాఠాలన్నింటినీ , ఇప్పుడొక పరాయి భాషలో – గొప్ప సహనం తో చదువుకుంటుండేవారు.

అంతలో – అనుకోకుండా , నాకొక బోర్డింగ్ స్కూల్ లో సీట్ వచ్చింది. ఒక దూరపు  పల్లెటూళ్ళో Quaker  మతస్తులు నడిపే బడి అది. అందరం లండన్ వదిలేసి వెళ్ళిపోయాము. మా లైబ్రరీ ని మూసేసి వేరే ఇంకొక పెద్ద లైబ్రరీ లో కలిపేశారు.

అప్పుడు యుద్ధం మొదలైంది.  మిస్ పోల్ సహాయకదళం లో చేరారని తెలిసింది. ఆశ్రయం కోసం వచ్చిన శత్రు దేశాల మనుషులకి ప్రత్యేక శిక్షణ లు ఇచ్చే కార్యక్రమాలని బ్రిటిష్ ప్రభుత్వం మొదలుపెట్టింది.

నా జీవితమైతే తర్వాత సజావు గానే నడిచింది. స్కూల్ లో చదువు అయాక యూనివర్సిటీ లో చేరాను. ఆఖరి సంవత్సరం లో ఉండగా – అప్పుడే బర్మా లో పనిచేసి విరమించి వచ్చిన ఒకరిని కలుసుకుని , ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నాను. మరుసటి ఏడు – ప్రసవం కోసం క్వీన్ ఆలిస్ ప్రసూతి వైద్యశాల లో చేరాను. ఆ హాస్పిటల్ చాలా పేరుమోసినది, కేవలం అదృష్టం కొద్దీ నే నాకు అక్కడ ప్రవేశం దొరికింది.

మా పాప పుట్టాక ఆ మర్నాటి ఉదయం హాస్పిటల్ అంతా పెద్ద హడావిడి. నర్స్ లు యూనిఫారాలు సర్దుకుంటున్నారు, పేషెంట్ లని శుభ్రంగా తయారు చేస్తున్నారు, పక్క బట్టలు సవరిస్తున్నారు, వార్డ్ లన్నిటినీ అద్దాల్లాగా తుడుస్తున్నారు…మాట్రన్ కుర్చీ లోంచి లేచి నిలబడే ఉన్నారు.  అప్పుడొచ్చింది ఊరేగింపు. ఆ గొప్ప మనిషి, సీనియర్ నిపుణులు – మందీ మార్బలం తో  – morning rounds కి వచ్చారు. ఒక పక్కన registrar , ఈ పక్కన house surgeon  , ఇద్దరు వైద్య విద్యార్థులు – ఆయన నోట్లోంచి రాగల ప్రతి మాటకోసమూ ఆత్రంగా వేచి చూస్తూ.

మెల్లగా ఆయన పేషెంట్ ల మంచాల మధ్య నడుస్తున్నారు.  పలకరించే సాహసం చేయాలనుకోలేదు కాని, నా మంచం దగ్గరికి వచ్చినప్పుడు బాగా తేరిపార చూడకుండా ఉండలేకపోయాను – గుర్తు పడతారేమోనని ఆశ. గుర్తు పట్టారు. ఒక్క క్షణం నుదురు చిట్లించి వెంటనే నవ్వేశారు. ” నా చిన్నారి లైబ్రరీ నేస్తం !!! ” అని సంతోషంగా  ప్రకటించుకుని, తన పరివారానికి నా గురించి చాలా చెప్పారు. నేను ఆయనకి సాయం చేశాననీ ప్రోత్సహించాననీ ఎంతో ధైర్యం ఇచ్చాననీ …అవునా ? ఇచ్చానా ? ఇచ్చాను కాబోలు !!!

ఇంకొక్క మాట మిగిలింది , అదీ చెప్పాలి. డిస్చార్జ్ అయాక పాప తోబాటు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ చక్కని డ్రాయింగ్ రూం లో టీ పాట్ వెనక…ఆమె ఎవరు ? ఓహ్ ! మిస్ పోల్ …ఆయన ఆమెని పెళ్ళాడారు ! ఎంత బావుంది….ఎంత బావుంది ! ”

https://en.wikipedia.org/wiki/Eva_Ibbotson

http://www.amazon.in/s/ref=nb_sb_ss_i_1_12?url=search-alias%3Dstripbooks&field-keywords=eva+ibbotson&sprefix=Eva+Ibbotson%2Caps%2C316

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆ జోలెలో మిగిలింది రక్తమేనా?!

 

– నిశీధి

~

నీ వారని పరాయని లేకుండా అందరి మాట  మన్నించే దేవ దేవా

ఇదుగో ఈ క్షణం గుమ్మంలో జోలె పట్టుకు నిలబడ్డాను

నీ వాకిలి ముందు నిలబడ్డ ప్రపంచానికి ఏమేమి దొరకలేదని ,

ఇహనిప్పుడు దురదృశ్టాలని అదృష్టంగా మార్చే వరకు

ఖాళీ చేతులతో వెనక్కి మరిలే పరిస్థితే లేదు , నా జోలె నింపి పంపు ప్రభూ

 

ప్రతి కవ్వాలిలో బహుశ  అమ్జాద్ ఫరీద్ సబ్రీ మనస్పూర్తిగా తలవంచి తను నమ్ముకున్న చిష్తి సూఫిజాన్ని గుండెలు  నింపుకొని  ఇదేగా పాడింది!! ఈతి బాధల నుండి రక్షించే మరణమే అల్టిమేట్ డెస్టినీ కాబట్టి సబ్రీ జోలె తాను కోరుకున్న కోరికలతో నిండిందని ఈ రోజు మనం అంతా  సంతోషించాలా  లేక తనకి అడ్డొచ్చే  ప్రతిప్రాణిని , తనని కాదన్న  ప్రతి ఆత్మని మూలంతో సహా నలిపేస్తూ రక్తాన్వేషిలా   ముందుకు వెళుతున్న మతమారణహోమాలని చూసి వణికిపోవాలా ?

జీవుల్లో అతి తెలివయిన జంతువుగా  మనిషి మారిపోయాక,  ఆ తెలివయిన  జంతువుకి ఒక  సంఘ జీవనం,  ఆ సంఘానికి ఒక కట్టుబాటు ఏర్పరచడానికి , ఒక ఆరోగ్యకరమయిన క్రమశిక్షణ అందించే క్రమంలో  మతం ఒక పదునయిన  ఆయుధంగా వాడబడటం , భూమి మీద హ్యూమన్  ఎవల్యూషన్ మొదలయిన ప్రతి చోట దాదాపు అలాంటివే ఒకేరకమయిన బీజాక్షరాలు,  మతం ఏదయినా  అయి ఉండొచ్చు  కాని అది మానవ మనుగడకి సపోర్టింగ్  సిస్టంగానే మొదలయింది అన్న  విషయాన్ని ఎవరం మర్చిపోలేం.  అలాగే ఎవల్యూషన్లో భాగంగా ఎదిగిపోయిన మనిషి మెదడులో మతాలూ సంఘాలు లాంటి ఎలాంటి నియంత్రణకి లోబడని క్రియేటివ్ ఆర్టిస్టిక్ భాగమూ అతి ముఖ్యమైనదేనని  బేసిక్ సైన్స్  చదువుకున్న అందరికి  తెలుసు. అయితే ఇపుడు ఇక్కడ సమస్య ఏమిటంటే కాలంతో పాటు ప్రాపంచిక విషయాలన్నింటినీ తనదిగా చేసుకుంటూ ఏక ఆధిపత్య ధృవంగా మారిపోతున్న మతం,  మతం తాలూకు  భయం , నెమ్మదిగా క్రియేటివిటీని కూడా మింగేస్తూ , తనని హైలైట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ఒక పక్క వాద్యంగా కళలనన్నింటిని వాడుకోవడమే  కాకుండా తనకి సపోర్ట్గా రాని ప్రతి కళని కళాకారులని మింగేస్తూ పోతుంటే చివరికి మిగిలే మరుభూమిలో సంఘాలు రాజ్యాలుగా , రాజ్యాలు  అధికారికంగానో అనధికారికంగానో మత రాజ్యాలుగా రూపాంతరీకరణ చెందుతున్న కాలంలో జనప్రియత కోరుకొనే కళ ఎక్కడ నిలబడాలి ? అటు కళ ఇటు మతం  రెండు మనసుని హాయిపరిచేందుకో లేక కొంత ఓదార్పుకోసమే అయితే రెండిటి అంతిమ లక్ష్యం  ఒకటే అయినపుడు ఒక వ్యవస్థ పూర్తిగా  ఇంకో వ్యవస్థని  తినేయడం  వలన జరిగే నష్టం నుండి మానవుడు   తేరుకోగలడా? లేదా ఇప్పటికే  తన నడవడి తో పాటు తన ఆలోచనలని నియంత్రిస్తున్న మతం  గుప్పిట్లో మరింతగా ఇరుక్కుపోయి ఇంకొంత  కుదించుకుపోతాడా ? కుదించుకుపోవడం అంటే తానూ మాత్రమే లేదు తానూ నమ్ముకున్న తనని కమ్ముకున్న మతం మాత్రమే  మిగలడం అంటే ఇహ సంఘ జీవనం కి , సహజీవనంకి అర్ధం ఏముంది ?

 

చరిత్ర సాక్ష్యం , పదకొండో  శతాబ్దం  అంతంలో బాగ్దాద్  మీద మంగోలియన్ దాడి జరిగినప్పుడు ముందు టైగ్రీస్ నది అక్కడి మనుష్యుల రక్తంతో ఎర్రబారింది ఆ తరువాత విలువైన అక్షరాల సిరానలుపు తో నల్లబడింది అని . మనుష్యులని మాత్రమే కాదు  సమూలంగా ఆ జాతి తెలివితేటలని  , భవిష్యత్తుని కూడా నాశనం  చేయడం మధ్య యుగంలో  యుద్ధాలకే కాదు ప్రస్తుతం సాగుతున్న  మత యుద్ధాలు , మతం పేరుతో మానవాళి పై ఏక జాతి చేయాలనుకొనే దాష్టికాలు ఇంకా  నడుస్తూనే  ఉన్నాయి అనిపిస్తుంది . ఒక జాతి లేదా  ఒక మత యుద్ధం మొదలయింది  అంటే ముందు స్త్రీలు పిల్లలు తరవాత ఆ జాతి రత్నాలయిన  కళాకారులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన  పరిస్థితులు రాతి యుగం నుండి ఈ కాలం వరకు సాగడం అసహ్యకరమయిన  తప్పని పరిస్తితిలా మారిపోయింది .

 

రాజ్యానికి మతానికి  అతీతంగా కళని ఆస్వాదించలేని  కుత్సితంలోకి  మనిషి , మనిషి పెంచుకున్న  వ్యవస్థలు లోబడిపోతున్నప్పుడు  సౌదీ  మరణ శిక్ష నుండి ఆఖరి నిముషంలో ప్రాణం నిలుపుకున్న  ఆశ్రాఫ్ ఫాయద్ లు , తమ నేలని  వదిలిపెట్టి పరాయి దేశాల్లో బ్రతకాల్సి వచ్చే తస్లీమా లు , సల్మాన్  రష్దీలు , MF హుస్సేన్లు ఒక పక్క ఆత్మని  అమ్ముకోకుండా  రాజ్యానికి మతానికి ఎదురునిలబడే క్రమంలో తమని తాముకోల్పోవడం చూస్తూ  ఉండగానే మరో పక్క  ఒక చార్లీ హెబ్డో , ఒక కల్బుర్గి , ఒక సబ్రీ , ఒక వాంగో ( 2004లో కాల్చి చంపబడిన  హలాండ్ ఫిలిం మేకర్ ),  ఒక Pippa Bacca ( 2008 లో చంపబడిన ఇటాలియన్  పర్ఫార్మెన్స్  ఆర్టిస్ట్ ) దాదాపు ప్రతి నేల మీద మత వ్యతిరేఖ ప్రతీకార చావులలో అస్థిత్వాన్నే  కోల్పోవడం సామాన్యంగా  మారిపోయింది  .

End of the day art is the only noblest form of human evolution అని నిజంగానే  మనం అందరం నమ్మినట్లయితే  ,ప్రపంచవ్యాప్తంగా సో కాల్డ్ ఒక మతపు జీహాదీలు , పేరు లేకుండా చాప కింద నీరులా కళలని కళాకారులని మట్టి చేస్తున్న ఇతరమతాల మూర్ఖత్వాలకి  వ్యతిరేఖంగా విశ్వవ్యాప్తంగా అందరు ఆర్టిస్ట్లు  ఆ కళలని  అభిమానిస్తున్న సామాన్య జనం మతరహిత మానవీయ దిశలో కళలనే కాదు  కళాకారులని  కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ప్రస్తుతం   కనిపిస్తుంది .

 

ముఖ్యంగా  చరిత్ర  మొదటి నుండి   ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు  ఎన్నిసార్లు రెక్కలు  తెంచినా   తిరిగిలేచే ఫీనిక్స్ పక్షిలా  కొత్త ఊపిర్లు పోసుకుంటున్న మితవాద సూఫీఇజం ఇప్పటికయిన కనిపించని దేవుడి ముందు జోలెలు పట్టుకు తిరిగే ఆశల్ని పక్కనపెట్టి కనిపిస్తున్న ఇస్లామిక్ టెర్రరిజపు మత మూర్ఖత్వాన్ని  ఇస్లాం నుండి పూర్తిగా  బహిష్కరించి ఒంటరిని చేసే దారులు ఆవిష్కరించడం తక్షణ కర్తవ్యం  . పై వాక్యం అన్ని మతాలకి ముఖ్యంగా  హైందవం భారత సంస్కృతని ఒకప్పుడు వైష్ణ శైవుల మధ్య పరస్పర హత్యలు . తరువాత కాలంలో చదువుకున్న , క్రియేటివిటీ  ఉన్నప్రతి దళితుడ్ని  ఎదో విధంగా అడ్డుకొని  ఇపుడు మళ్ళీ  మనదేశంలో    కొత్తగా  పేట్రేగుతున్న మతోద్దారుకులని వెనకేసుకొచ్చే  ఉదారవాద మత విశ్వాసులు కూడా అర్ధం చేసుకోవడం  ముందు ముందు  రాబోయే నష్టాన్ని అంచనా వేసుకొని గంజాయి మొక్కలు ఎదగక ముందే జాగ్రత్త పడటం చాలా అవసరం. లేదంటే  తొందరలో మనం కూడా మన తోటి దేశపు  మత విద్వేషపు విషాలలో మనదయిన హవిస్సులు నమామి  అనిపించడం  ఖాయం .

  • భర్ దో జోలీ యా  మొహమ్మద్ అంటూ సూఫీఇజపు తాత్విక పరిమళాలకి తనదయిన గంభీరత వదిలివెళ్ళిన అంజాద్ సబ్రీ పాటల  జ్ఞాపకంలో .

 

 

.

 

బ‌తుకుపాట‌ల జాడ‌..మ‌న గూడ‌

 

g1

                    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

~

“నేను మీ చ‌ప్ప‌ట్ల కోసం పాడ‌టం లేదు

నేను మీ అభినంద‌న‌ల కోసమూ పాడ‌టం లేదు

నేను నా దేశ స్వాతంత్య్రం కోసం పాడుతున్నాను” అన్నాడు చీలీ దేశ ప్ర‌జాగాయ‌కుడు విక్ట‌ర్ జారా. స‌రిగ్గా అంత‌టి ప్ర‌జావాగ్గేయ‌కారుడు గూడా అంజ‌య్య‌. ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ఉద్య‌మాల‌కోసం పాట‌ల ప‌హారా కాసిన క‌న్ను గూడ అంజ‌య్య‌. తెలుగు స‌మాజానికి సుప‌రిచ‌త‌మైన ప్ర‌జార‌చ‌యిత‌ గూడ అంజ‌య్య‌. ఆయ‌న పాట‌ల‌న్ని గురిచూసి గుండెల్ని తాకే చూపున్న పాట‌లు. ఆయ‌న పాట పాడుతున్నా, వింటున్న ఈ దేశంలో తిండి, బ‌ట్ట‌, నీడ‌కు అల్లాడే పేద‌ల దుఃఖం ఒక దృశ్య‌కావ్య‌మై మ‌న‌ల్ని క‌దిలిస్తది. రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేసే నెత్తుర‌సొంటి శ‌క్తి అంజ‌న్న పాట‌ల‌ది. అవి ఉద్య‌మాల్ని ర‌గిలించి మండించి, పేద ప్ర‌జ‌ల వేద‌న‌ల్ని, అంట‌రానివాళ్ల సంవేద‌న‌ల్ని అర్థం చేయిస్తాయి. దోపిడి కోట‌ల్ని కూల్చ‌డానికి, బ‌డుగుజీవుల‌కు స‌రికొత్త శ‌క్తిని నూరిపోస్తాయి.

 

పాట రాయాలంటే, మిగిలిన ర‌చ‌యిత‌ల లాగ ఆయ‌న పుస్త‌కాల్లోకి తొంగిచూడ‌డు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి పోయి, వారితో మాట్లాడి, వారి బాధ‌ల‌ను ప‌ల్ల‌వులుగా, వారి క‌ష్టాల‌ను చ‌ర‌ణాలుగా మ‌లుస్తాడు. అందుకే గూడా అంజ‌య్య పాట‌లు మ‌న‌లో ఒక తాత్విక చ‌ర్చ‌ను రేపుతాయి. అల‌తి అల‌తి ప‌దాల‌తో బ‌తుకును స‌జీవంగా కండ్ల‌ముందుంచ‌డం, ఆ జీవితాలు అలా ఎందుకు అయ్యాయో విడ‌మ‌రిచి చెప్ప‌డం అత‌ని పాట‌ల ల‌క్ష‌ణం. అందుకే బ‌తుకును పాట‌ల‌కు ఒంపిన జాడ మ‌న గూడ‌.

 

నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు నేల మీద అంజ‌య్య పాట‌లు ఉద్య‌మాల‌కు  ఊపిరిపోశాయి. ఒక్క ఉద్య‌మంలో పాల్గొంటేనో, ప‌నిచేస్తేనో ఒక మ‌నిషి జీవితకాలం పూర్త‌వుతుంది. కొన్నిసార్లు ఆ ఉద్య‌మం గ‌మ్యానికి చేరుకోక ముందే ఉద్య‌మ‌కారుడు అల‌సిపోవ‌డమో, అందులోనుండి నిష్క్ర‌మించ‌డమో జ‌రుగుతుంది. అలాంటిది గూడా అంజ‌య్య మాత్రం త‌న ప‌ద‌హార‌వ‌యేట‌నే విప్ల‌వోద్య‌మంలో అడుగు పెట్టి, అందులో అనేక పాట‌లు రాసి పాడి, ప్ర‌జ‌ల మ‌ధ్య, జీవితాన్ని ఆరంభించాడు. అలా విప్ల‌వోద్య‌మమే కాదు తెలుగునేల మీద పుట్టిన ద‌ళితోద్య‌మంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. రెండు ఉద్య‌మాల్లో ప‌నిచేసినా స‌రే త‌ను అల‌సి పోలేదు. ప్ర‌పంచం త‌ల‌తిప్పి చూసిన మ‌హ‌త్త‌ర తెలంగాణ ఉద్య‌మంలో కూడా త‌న‌దైన పాత్ర‌ను విజ‌య‌వంతంగా పోషించాడు. తెలంగాణ ప్ర‌జ‌ల విముక్తి కోసం కూడా సిద్ధ‌మై ప‌దునైన పాట‌ల‌నందించాడు. ఇలా అనేక ఉద్య‌మాల్లో ముందుండి ప‌నిచేసిన ఘ‌న‌త గూడ అంజ‌య్య‌దే.

 

నిత్యం పోరాటాల‌తో అల‌రారే తెలంగాణ నేల మీద అనేక మంది వాగ్గేయ‌కారుల‌న్నారు. వారంద‌రిలో గూడా అంజ‌య్య పాట‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. ప్ర‌జ‌ల ప‌దాల‌తో పాట‌గ‌ట్టి, చ‌దువురాని మ‌ట్టిబిడ్డ‌ల‌కు సైతం క‌మ్యూనిజాన్ని అలవోక అర్థం చేయించింది. అలా పుట్టుకొచ్చిందే ఊరు మ‌న‌దిరా…ఈ వాడ మ‌న‌దిరా పాట‌. నిజానికి ఈ పాట క‌మ్యూనిస్టు మ్యానిఫెస్టో ఏం చెబుతున్న‌దో, స్థానిక ప‌రిస్థితుల‌కు సుల‌భంగా అన్వ‌యం చేశాడు అంజ‌య్య‌. ఉద్య‌మాల‌కు పాట‌ల‌ను అందించింది ద‌ళితులే. అలా ద‌ళితునిగా పుట్టిన అంజ‌య్య భార‌త‌దేశ గ్రామీణ స్వ‌రూపాన్ని స‌రిగా ప‌ట్టుకున్నాడు. ఊరిలో చాలా కులాలు శ్రామిక కులాలే. అగ్ర‌వ‌ర్ణాలే భూస్వాములుగా పెత్త‌నం చేస్తుండ‌డం అంజ‌య్య‌ను క‌ల‌వ‌ర ప‌ర‌చింది. విప్ల‌వోద్య‌మం ప్ర‌జ‌ల‌కు అర్థం కావాలంటే ఈ దోపిడిని విడ‌మ‌రిచి చెప్పాల‌ని భావించాడు. అందుకే ఊరు మ‌న‌దే, వాడా మ‌న‌దే…న‌డుమ దొరా ఏందిరో, వాని పీకుడేందిరో అని ఘాటుగానే నిల‌దీశాడు అంజ‌య్య‌. అదే ప్ర‌జ‌ల‌కు న‌చ్చింది. అది తెలంగాణ ప్ర‌జ‌ల్లో ర‌గులుతున్న భావ‌న‌. ఆ భావ‌న‌కు పాట‌రూప‌మిచ్చాడు అంజ‌య్య‌.

 

ఈ పాట విన్న మ‌ట్టిబిడ్డ‌లు ఇది నా పాటే. ఇది మా ఊరి చ‌రిత్రే అని ఓనే చేసుకున్నారు. ప్ర‌జ‌ల నాలుక‌ల మీద ఈ పాట ద‌శాబ్దాల కాలం న‌డ‌యాడింది. ఈ పాట‌లో అంజ‌య్య‌లోని ద‌ళిత‌త‌త్వం కూడా పాట‌కు మ‌రింత అద‌న‌పు అందాన్ని తెచ్చింది. అన్ని ప‌నుల కాడ ముందుండే ద‌ళితుల జీవితం ఎందుకిట్ల కూన‌రిల్లుతున్న‌ది. ఏ ప‌నిచేయ‌ని ప‌టేల్‌, ప‌ట్వారి దొర‌లు ఎలా కూర్చుండి తింటున్నార‌నే చ‌ర్చ‌ను ముందుకు తెచ్చింది.

గూడ అంజ‌య్య తొలిపాట “ఊరిడిసి నేబోదునా…అయ్యో ఉరిపెట్టుకొని స‌ద్దునా”.  ఈ పాట‌కూడా గ్రామాల్లో దొర‌ల దాష్టికాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. రైతుల‌కు అప్పులిచ్చి పంట‌లు జ‌ప్తు చేసే దొర‌ల దుర్మార్గాల‌కు బ‌లై, ఊరిడిసి వ‌ల‌స‌పోయే ఓ పేద‌రైతు బాధ‌ను పాటీక‌రించాడు అంజ‌య్య‌.

 

ఈ పాట‌లో రైతు బాధ‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా, త‌న‌ను ప‌ల‌క‌రిస్తే వ‌ల‌పోసే తీరును స‌రిగా ప‌ట్టుకున్నాడు ర‌చ‌యిత‌. అందుకే అప్పుతెచ్చిన మాట‌నిజ‌మే. అది వ‌డ్డీకి తెచ్చింది నిజ‌మే అంటాడు. ఈ పాట‌తో మొద‌లైన అంజ‌య్య ప్ర‌స్థానం విప్ల‌వోద్య‌మం మీదుగా ద‌ళిత‌, తెలంగాణ ఉద్య‌మాల‌ను చేరి మ‌రింత ప‌దునెక్కింది. గూడా అంజ‌య్య పాట‌ల్లో బాణీలు కఠినంగా ఉండ‌వు. సామాన్యుడు సైతం, కోర‌స్‌గా గొంతుక‌లిపే విధంగా ఉంటాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్ర‌జ‌ల బాణీల‌ను తీసుకొని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వ‌స్తువుగా జ‌త‌చేసిన  బండియాద‌గిరి, సుద్ధాల హ‌నుమంతుల‌కు వార‌సుడు గూడ అంజ‌య్య‌. అందుకే వారి బాట‌లోనే వారిలాగే ప్రాణ‌మున్న పాట‌ల‌ను ర‌చించాడు. పాట‌కు త‌గిన బాణి, భావానికి త‌గిన ప‌దాల పొందిక‌, అందులో అంజ‌య్య జాగ్ర‌త్త‌గా ఇమిడ్చే ప్ర‌జ‌ల నుడికారాలు, సామెత‌లు పాట‌ను శ‌క్తివంతంగా తీర్చిదిద్దుతాయి.

తొంభ‌య‌వ ద‌శ‌కంలో తెలుగునేల మీద ద‌ళితోద్య‌మం పుట్టింది. ఆ ఉద్య‌మంలో కూడా అంజ‌య్య ముందున‌డిచాడు.

 

“ద‌ళిత ర‌చ‌యిత‌ల క‌ళాకారుల మేధావుల ఐక్య‌వేదిక” ఏర్పాటుకు 1992లోనే పునాది వేశాడు. కంచిక‌చ‌ర్ల‌ల‌లో ద‌ళితుడైన కోటేశును స‌జీవ‌ద‌హ‌నం చేసిన‌పుడు అంజ‌య్య ఆ దారుణం మీద పాట రాశాడు. అప్ప‌టిదాకా పాట‌లు మాత్ర‌మే రాసిన అంజ‌య్య‌, ద‌ళితోద్య‌మంలో ప‌నిచేసే క్ర‌మంలోనే సాహిత్యంలోనే మిగిలిన ప్ర‌క్రియ‌ల వైపు మ‌ర‌లాడు. అంబేద్క‌రిజం ప‌రిచ‌య‌మ‌య్యాక అంజ‌న్న‌కు సాహిత్య ప్ర‌క్రియ‌ల‌తో మ‌రింత ప‌రిచ‌యం ఏర్ప‌డ్డ‌ది. ద‌ళిత‌క‌థ‌లు రాసి పుస్త‌కం వెలువ‌రించాడు. అలాగే “పొలిమేర‌లు” అనే న‌వ‌ల రాసి, తెలుగు విశ్వ‌విద్యాల‌యం చేత‌, ఆ యేటి ఉత్త‌మ న‌వ‌లగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇది అంజ‌య్య‌లో మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక ల‌క్ష‌ణం. వాగ్గేయ‌కారులంతా పాట‌ల ర‌చ‌న‌వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారు. అంజ‌య్య మాత్రం ఉద్య‌మ అవ‌స‌రాల్లో భాగంగా, ద‌ర‌క‌మే సాన్నిహిత్యంతో క‌థ‌కునిగా, న‌వ‌లాకారునిగా మారాడు.

 

తెలంగాణ ఉద్య‌మానికి పాటే ప్రాణం పోసింది. క‌నిపించ‌ని శ‌త్రువును, కాటేసే కుట్ర‌ల‌ను కండ్ల‌ముందుంచింది పాటే. తెలంగాణ ఉద్య‌మం అర‌వైతొమ్మిదిలో పాల‌కుల చేతిలో ద‌గాకాబ‌డి మ‌ళ్లీ 90ల త‌ర్వాత పుంజుకోవ‌డానికి పాటే ఆయుధంగా నిలిచింది. అలాంటి స‌మ‌యంలో గూడా అంజ‌య్య ర‌చించిన అనేక పాట‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని ప‌ల్లెప‌ల్లెకు చేర్చాయి. “నా తెలంగాణ…న‌నుగ‌న్న నా త‌ల్లి నా తెలంగాణ” అంటూ పాట‌రాశాడు.  అది మొద‌లుగా తెలంగాణ ఉద్య‌మం కోసం అంజ‌న్న రాసిన పాట‌ల్లో పుడితె ఒక‌టి స‌త్తెరెండు రాజ‌న్న ఒరె రాజ‌న్న అన్న పాట సుమారు ద‌శాబ్దంన్న‌ర కాలం పాటు తెలంగాణ ప‌దిజిల్లాలో మార్మొగింది. ప్ర‌జ‌ల‌ను ఉర్రూత‌లూగించే ఈ పాట బాణీ, ఉద్య‌మానికి జ‌వ‌జీవాల‌నిచ్చింది.

 

అంజ‌న్న ఈ పాట‌లో ఉద‌హ‌రించిన ఊర్ల‌పేర్లు, వ్య‌క్తుల పేర్లు తెలంగాణ‌లో బాగా పాపుల‌ర్‌వే కావ‌డం మ‌రింత ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించింది. ఈ పాట‌లో తెలంగాణ ఉద్య‌మానికి ఒక దిశానిర్ధేశం చేశాడు. తెలంగాణ రాదేమో అని నిరాశ చెందేవారికి గొప్ప ధైర్యాన్నిచ్చిండు. బ‌రిగీసి బ‌డితందుకోర రాజ‌న్న ఒరె రాజ‌న్న‌, తెలంగాణ రాకుంటె ఒట్టు రాజ‌న్న మా రాజ‌న్న అంటూ ఈ పోరాటం వృధాపోదు, తెలంగాణ వ‌చ్చి తీరుతుంద‌ని ధీమాను వ్య‌క్తం చేశాడు. ధూంధాం వేదిక‌ల మీద ఈ పాటొక ఫిరంగిలా పేలింది.

ఆక‌లిపోరాటం మాత్ర‌మే కాదు, తెలంగాణ ఉద్య‌మంలో ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య కూడా ఇమిడి ఉంది. అందుకే గూడ అంజ‌య్య పాట‌లో ఆ ఆరాటం ప్ర‌తిధ్వ‌నించింది. తెలంగాణ ప్ర‌జ‌ల యాస‌ను బాస‌ను కించేప‌రిచిన వారిని నిల‌బెట్టి క‌డిగిపాడేసాడు. “అయ్యోనివా నువ్ అవ్వోనివా…” అనే పాట‌లో ఆంధ్రాపెట్టుబ‌డిదారులను నిల‌దీశాడు. అంతేకాదు వారిని తెలంగాణ కోసం ఏం చేశార‌ని ప్ర‌శ్నించాడు. “చార్మినారుకు సున్న‌మేసిన‌వా…గోలుకొండ‌కు రాళ్లు మోసిన‌వా” అంటూ అంజ‌న్న తెలంగాణ ప్ర‌జ‌ల ఆవేద‌నకు పాట రూప‌మిచ్చాడు.

 

తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌తీ వేదిక మీద ఈ పాట మార్మోగింది. అయిదున్న‌ర ద‌శాబ్దాల న‌లిగిపోయిన త‌నం నుండి వ‌చ్చిన ఈ ప్ర‌శ్న‌లు అంజ‌య్యవి మాత్ర‌మే కాదు, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌వి కూడా అందుకే జ‌నం గుండెను సూటిగా తాకి ఆక‌ట్టుకున్నాయి. అలాగే ఆధిప‌త్యాన్ని పెంచి పోషించేవారికి ముచ్చెమ‌ట‌లు పోయించాయి.

 

అంజ‌య్య పాట‌లే కాదు, చాలా వ‌ర‌కు సామాజిక ఉద్య‌మాల్లో వ‌చ్చిన పాట‌లు కూడా రెండు ర‌కాల బాణీల్లోనే ఎక్కువ‌గా వెలువ‌డ్డాయి. ఒక‌టి ప్ర‌జ‌ల జీవితాన్ని పాట‌లుగా మ‌లిచేట‌పుడు వారు ప‌డుతున్న బాధ‌ల తీవ్ర‌త‌ను అర్థం చేయించ‌డానికి క‌రుణ‌రాస‌త్మ‌క బాణీలు, రెండవ‌ది ఉద్య‌మానికి సిద్ధం చేసే వీరర‌సబాణీలు. అందుకే అంజ‌న్న పాట‌ల్లో ఈ రెండు ర‌కాలైన బాణీల‌తో కూడిన పాట‌లే క‌నిపిస్తాయి. అవి కూడా సాదాసీదాగా రాయ‌డం అంజ‌న్న‌కు తెలియ‌దు. ఉద్య‌మ‌ల‌క్ష్యం నెర‌వేరేందుకు అందులో సంపూర్ణస్థాయికి చేరేలా పాట‌ను మ‌లుస్తాడు.  అందుకే ఉద్య‌మాల‌తో స‌మానంగా అంజ‌న్న పాట‌లు సినిమారంగంలో కూడా చెర‌గ‌ని స్థానాని ఏర్ప‌ర్చుకున్నాయి. “భ‌ద్రం కొడుకో నా కొడుకో కొముర‌న్న జ‌ర” అంటూ ముప్ఫై ఏళ్ల  క్రితం తాను రాసిన సినిమా పాట అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌ను పొందింది.

 

అలాగే స‌ర్కార్ ద‌వ‌ఖాన‌ల దీనావ‌స్థ‌ను తెలుపుతూ రాసిన నేను రాను బిడ్డో స‌ర్కారు ద‌వాఖాన‌కు పాట, కొడుకు కొముర‌న్నా…నువ్ కొల‌క‌టేరువ‌నూకుంటునిరో అంటూ రాసిన పాట వెండితెర మీద అంజ‌న్న మార్కు సంత‌కాన్ని చేశాయి.

 

ప్ర‌జ‌ల‌కోస‌మే క‌లం ప‌ట్టి, కడ‌దాకా ఉద్య‌మాల‌కోస‌మే బ‌తికిన ప్ర‌జావాగ్గేయ‌కారుడు గుడా అంజయ్య‌. అడ‌విబిడ్డెల అమ్మవొడి ఆదిలాబాద్‌లో ఒక మారుమూల గ్రామం లింగాపురంలో 1955లో పుట్టిన అంజ‌న్న 61 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే జీవించాడు.  అందులో నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా ఉద్య‌మాలకే కేటాయించాడు. ఫార్మ‌సిస్టుగా కొలువు చేసిన‌ప్ప‌టికీ, పోరాటాల్లోనే అత‌ని జీవిత‌మంతా గ‌డిచింది. అలా ప్ర‌జ‌ల‌కోసం బ‌తికి, ప్ర‌జ‌ల‌కోసం క‌లంప‌ట్టి జీవ‌మున్న పాట‌ల్ని రాసిన అంజన్న‌ను కోల్పోవ‌డం, తెలంగాణ‌కే కాదు యావ‌త్ తెలుగు స‌మాజానికి ఒక తీర‌నిలోటు. ఆయ‌న క‌ల‌గ‌న్న పీడ‌న లేని లోకాన్ని సాధించ‌డ‌మే ఆ మ‌హావాగ్గేయ‌కారునికి నిజమైన నివాళి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చూపులందు ‘మగచూపు’ వేరయా…

 

 

-ల.లి.త.

~

 

 

“There is always shame in the creation of an object for the public gaze”  —  Rachel Cusk.

చూపులు వెంటాడతాయి. చూపులు తడుముతాయి. చూపులు గుచ్చుకుంటాయి.

మగచూపుల తాకిడి… వయసు వచ్చినప్పటినుంచి ఇంటి బైట అడుగుపెట్టిన ప్రతి ఆడపిల్లకీ తప్పదు. ఆ చూపులు ఆరాధిస్తున్నట్టు కనిపిస్తే గర్వంగా, వొట్టికామం కనిపిస్తే అసహ్యంగా అనిపించటం కూడా జెట్ స్పీడ్ లో జరిగిపోతూ ఉంటుంది. ఏరకం చూపులెలాంటి వొంకరలు పోతున్నాయో అప్రయత్నంగా తెలిసిపోతుంది ఆడవాళ్ళకి. చూపులు ముసుగులు వేసుకున్నా కొంచెంసేపట్లోనే ఆ ముసుగుల వెనుక ఏ భావముందో చెప్పగలరు. మగచూపుని గుర్తుపట్టే ప్రాథమికజ్ఞానం వయసుతో పాటే పెరిగి వృక్షం అవుతుంది.

సినిమాలు తీసేవాళ్ళూ రాసేవాళ్ళూ వాటిలో వేసేవాళ్లూ మూడొంతులమంది మగవాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళను చూడగానే కళ్ళతో చేసే స్కానింగ్ సినిమాల్లోకి రావటం కూడా అసంకల్పిత చర్యే. అది డబ్బులకోసం  సినిమావాళ్ళు చేసే సంకల్పిత చర్యకూడా. ఎలా చూస్తామో అలాగే రాస్తాం. తీస్తాం. అసలు సినిమా అనేదే ఒక voyeuristic tool. మనుషుల్ని ఎలా కావాలంటే అలా,  ఏ పరిస్థితిలో కావాలంటే ఆ పరిస్థితిలో చూపెడుతుంది. ఇతర్ల జీవితాల్లోకీ, ఇళ్ళలోకీ, పడగ్గదుల్లోకీ తిరిగి చూపించటానికి కావలసినంత స్వేచ్ఛ ఉంది మూవీ కామెరాకి.  సినిమా చూడటంలోని సామూహిక వాయరిజంలోని దృష్టికోణం కూడా మగవాళ్ళదే.  స్త్రీల శరీరాలను ఇష్టమొచ్చినంతమేరా చూపించే అవకాశం ఉండటంతో మేల్ డామినేటెడ్ సొసైటీలో సినిమా ‘మేల్ గేజ్’ నే ధరిస్తుంది.  ఈ విషయాన్ని గ్రహించని ఆడవాళ్ళు ఉండరు గానీ  దాన్నెలా ఎదుర్కోవాలో అర్థంకాదు.  ‘స్త్రీలను సినిమాల్లో అసభ్యంగా చూపిస్తున్నార’ని గోలపెట్టేది ఇందుకే.  కానీ ‘ఇది సభ్యత, ఇది అసభ్యత’ అని గిరులు గీయలేనిది కళాభివ్యక్తి.  ఇదే అదనుగా చాలామంది చేతుల్లో మూవీ కామెరా చెలరేగిపోతూ ఉంటుంది.

లారా ముల్వే స్త్రీవాది. ఫిలిం క్రిటిక్ కూడా. 1975లో  ఆమె ‘మేల్ గేజ్’ అనే మాటను మొదటిసారిగా వాడుతూ సినిమాల్లో ‘మేల్ గేజ్’ గురించి సిద్ధాంతీకరించింది. సినిమాల్లో, వ్యాపారప్రకటనల్లో, టీవీల్లో కనపడుతూ ఉండే మేల్ గేజ్ స్వరూపాన్ని వివరించింది.  మేల్ గేజ్ రెండురకాలు. ఒకటి సినిమాలోని పాత్రల చూపు.  రెండోది సినిమా చూస్తున్న ప్రేక్షకుల చూపు. ఎక్కడైనా చూసేది మగవాళ్ళు. చూడబడేది ఆడవాళ్ళు. సినిమాలోని పాత్రల చూపునీ బయటున్న ప్రేక్షకుల చూపునీ ఏకం చేసేది టెక్నాలజీ. అంటే సినిమాటోగ్రఫీ.  ఒక సీన్లో అమ్మాయి నడుస్తూ వెళ్తోంది. హీరో ఆమెని చూస్తుంటాడు. కామెరా హీరో చూపుని అనుసరిస్తూ వెళ్తుంది.  అమ్మాయిని హీరో ఎక్కడెలా చూస్తాడో ప్రేక్షకులను కూడా అక్కడలా చూసేలా చేస్తుంది.  సినిమా కథని నడిపేది హీరోనే.  అతనిలోనూ చూసేవాళ్లలోనూ శృంగారపరమైన ఉత్సుకత రేపే రూపంతో హీరోయిన్ కనిపించాలన్నది సినిమా ముఖ్యసూత్రం. సినిమాటోగ్రాఫర్ బలమైన విజువల్స్ తో ఈ రూల్ ని పాటిస్తాడు. మేకప్ ఆర్టిస్టులు, దుస్తులు కుట్టేవాళ్ళు హీరోయిన్లను అందంగా ప్యాక్ చేస్తారు. ఇదే అలవాటు  వ్యాపారప్రకటనల్లోనూ కనిపిస్తుంది.

 

లారా చెప్పిన ‘మేల్ గేజ్’ కి క్లాసిక్ ఉదాహరణగా చాలామందికి గుర్తొచ్చేవి జేమ్స్ బాండ్ సినిమాలు. 1962లో వచ్చిన  ‘డాక్టర్ నో’ సినిమాలో ఉర్సులా ఏండ్రెస్ సముద్రంలోంచి రావటాన్ని కామెరా, బాండ్ వేషం వేసిన సీన్ కానరీ, ప్రేక్షకులూ తదేకమైన మగచూపుతో చూస్తారు. అలాంటి దృశ్యాన్నే నలభై ఏళ్ల తర్వాత 2002 లో వచ్చిన ‘డై ఎనదర్ డే’ లో హేల్ బెరీతో మరోసారి తీసినపుడు మగచూపు ఆమెను మరీ ఎక్కువగా తడుముతుంది. ఆడవాళ్ళ ఇమేజ్ అంటే మగవాళ్ళని రెచ్చగొట్టేలా ఉండాలని చెప్తున్నట్టుగా ఉంటాయి జేమ్స్ బాండ్ సినిమాలు.

సినిమాల్లో స్త్రీలు రెండురకాలుగా ఉంటారని చెప్తుంది లారా. లైంగికంగా చురుగ్గా ఉండేవాళ్ళు ఒకరకం. బొత్తిగా బలహీనులు రెండోరకం. ఆమె హాలీవుడ్ గురించే చెప్పినా, మన సినిమాల్లో కూడా ఇవే మూసలు కనిపిస్తాయి. మొదటిరకం ఆడవాళ్ళను అప్పట్లో వాంప్ లనేవారు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ గర్ల్స్ అంటున్నారు. వాళ్ళు శృంగారం కోసమే కనబడుతూ ఉంటారు.  రెండోరకం కథ నడకకి అడ్డం పడుతూ కన్నీరుకార్చే సచ్చీలురైన కలకంఠులు. అమ్మ, ఇంట్లోనే ఉండే భార్య, చెల్లెళ్ళ మూసలివి. వీళ్ళు కరుణరస ప్రదాయినులు. ఈ రెండు రకాలూ కాకుండా సగం శృంగారం, సగం పొగరూ లేదా మంచితనంతో హీరోయిన్ రూపాన్ని తయారు చేస్తారు. ఈ ఫార్ములాలు పెట్టుకుని వందల సినిమాలు వచ్చాయి.

మన సినిమాల్లోకి మొదట్లో  స్త్రీలు అడుగుపెట్టటమే అరుదు, అపురూపం. సినిమా వేషాలకోసం వచ్చినవారి కనుముక్కుతీరు, వాచకం బాగుంటే వేషాలిచ్చేవాళ్ళు. ఇప్పటి అందం కొలతల్లో ఇమడని భారీశరీరాలతో ఉన్న హీరోయిన్ల మీద కామెరా తన ప్రతాపం అంతగా చూపించలేదనే చెప్పాలి.  బిగుతైన బ్లౌజులు, పల్చటి పైటలు వేసుకునేవారుగానీ, వాళ్ళ అభినయంమీదా ముఖాలమీదే అందరి దృష్టీ ఉండేది.  తరువాత అరవైలనుండీ టైట్ పాంట్స్, బిగుతుషర్టుల్లో ఉన్న స్త్రీల శరీరాలమీద కామెరా క్లోజప్ షాట్స్ తో తన అజమాయిషీ మొదలెట్టింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మితల శరీరాలమీద మేల్ గేజ్ విశృంఖలంగా పాకింది. 70, 80, 90ల్లో వచ్చిన సినిమాల్లో ముఖ్యంగా మలయాళం సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో శృంగారం పేరుతో ఆడవాళ్ళ శరీరాలను ప్రదర్శనకు పెట్టారు.

lalita2

సినిమా చూసేటప్పుడు స్త్రీలు కూడా ‘మేల్ గేజ్’ తోనే చూస్తారని చెప్తుంది లారా. హీరోయిన్ల వొంటితో తమ వొంటినీ  బట్టలనూ పోల్చుకుని ఆడపిల్లలు కూడా మగవాళ్ళ కళ్ళలోంచే తమను తాము చూసుకుంటారు. మహిళాదర్శకులు కూడా ఎంత చేటు మేల్ గేజ్ తో  సినిమాలు తీశారో భానుమతి, విజయనిర్మలల సినిమాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ సినిమాల్లో రేప్ సీన్లు మగదర్శకులు తీసేవిధానానికి ఏమీ తీసిపోకుండా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి.

కళాత్మక సినిమాలు తీస్తున్నానంటూ కామెరాలోంచి స్త్రీల శరీరాలను మర్యాదలన్నీ అతిక్రమించి తడిమేశాడు రాజ్ కపూర్. ఈయన సినిమాల్లో హీరో (అంటే తనే) హీరోయిన్ కళ్ళలోకే తప్ప ఇంకెక్కడా చూడడు. మూడు రకాల మేల్ గేజ్ లలో రెండో రకాన్ని వదిలిపెట్టి హీరోచేత అమాయకపు మొహం పెట్టించి, ఆ మేరకి కామెరాతో ఆడవాళ్ళమీద మరింత దౌర్జన్యం చేస్తాడు. చిన్న దుస్తుల్లో తిరుగుతూ మోడల్స్ లా నడిచే పల్లెటూరి అమ్మాయిల వేషాల్లో ఆడవాళ్ళను  చూసి లొట్టలు వేసుకున్న సెన్సార్ మెంబర్లు రాజ్ కపూర్ mammary obsession ని కళాత్మక అభివ్యక్తిగా కొలిచారేమో అనిపిస్తుంది.

‘జ్యోతి’ లాంటి మంచి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఒక్కసారిగా తీసుకున్న చారిత్రాత్మక యూటర్న్ గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్ళ శరీరభాగాలను ముక్కలుకోసి పళ్ళూ ఫలాల్లా మగవాళ్ళ కళ్ళముందర పళ్ళెంలో పెట్టి అందించాడు. రాఘవేంద్రరావు టెక్నిక్ ని చాలామంది అనుసరిస్తూ పోయారు. పోర్న్ స్టార్ సన్నీలియోన్ కి కూడా మన హీరోయిన్లలాగే బట్టలుకట్టి సినిమాల్లో చూపిస్తుంటే సంతోషంగా మగాళ్ళు చూస్తున్నారంటే ఇలాంటి titillation టెక్నిక్ కి దేశంలో ఉన్న ఆకర్షణ ఎంతటిదో తెలుస్తోంది. ‘వేదం’ లాంటి కొంచెం భిన్నంగా ఉండే సినిమాలో కూడా  ‘ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ’ పాటలోనూ ఇంకా చాలా దృశ్యాల్లోనూ అనుష్క మీద వాడిన కామెరా ఏంగిల్స్,  సెక్స్ వర్కర్ పాత్రేకదా అన్న సాకుతో molest చేస్తాయి.  పాటల చిత్రీకరణలో హీరోయిన్ బొడ్డూ పిరుదులూ రొమ్ముల క్లోజప్ లూ, ఆమె నడుంపట్టుకు వేలాడే హీరోలూ తెలుగు సినిమాలో కొల్లలు.

బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీల కథలను తీర్చిదిద్దిన దర్శకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళ సినిమాల్లోకూడా  మేల్ గేజ్ లేకుండా ఉండదు. వుమన్ ఓరియెంటెడ్  సినిమాల్లో కూడా ఎక్కడో ఓ చోట మూవీకామెరా చూపు దానిపని అది చేస్తూనే ఉంటుంది. స్త్రీల సమస్యలమీద మంచి సినిమాలు తీసిన బాలచందర్ కూడా చాలాచోట్ల చూపులు తప్పాడు. ‘అంతులేనికథ’లో కామెరా జయప్రదతో ప్రేమలో పడిపోయి వదల్లేకుండా అయిపోవటాన్ని గమనించటం కష్టమేమీ కాదు. అలాగే ‘మరోచరిత్ర’ కూడా. ‘చక్ర’ సినిమాలో స్మితాపాటిల్ స్నానాన్ని చూపిస్తూ అప్రయత్నంగా కామెరా కొంచెంగా మోహంలో పడిపోయిందనిపిస్తుంది. అందం, బలమైన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ అంటే మోహం, ప్రేమ సినిమాటోగ్రాఫర్లలోనూ దర్శకుల్లోనూ కలగటం చాలా సహజం. దాన్ని అదుపుచేసి సినిమాని స్క్రిప్ట్ కి తగ్గట్టు తీసినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. కానీ సినిమా ఆడాలంటే మేల్ గేజ్ ని పూర్తిగా వదిలేసే ప్రయోగాలు చెయ్యకూడదని పాపులర్ అయిన దర్శకులందరికీ తెలుసు. హీరోయిన్ అంటే ఖచ్చితంగా అందంగా ఉండాల్సిందే.

 

హాలీవుడ్ లో బలం, ధైర్యం ఉండి, యుద్ధాలు చేసే స్త్రీలుగా Uma Thurman (Kill Bill),  Angelina Jolie (Lara Croft etc.), Sigoumey Weaver (Alien) ల ఇమేజెస్ నిలుస్తాయి. అయినా వాళ్ళలోని ఆకర్షణని దర్శకుల మేల్ గేజ్ కొంతయినా ఎత్తి చూపిస్తూనే వచ్చింది. స్త్రీ శరీరాన్ని ఇష్టమొచ్చినట్టు చూపించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అణచివేతలోని బాధనీ అన్యాయాన్నీ తీవ్రంగా చూపించిన ‘బాండిట్ క్వీన్’ ని  మేల్ గేజ్ కి చాలావరకూ మినహాయింపనే చెప్పుకోవచ్చు. బాండిట్ క్వీన్ తీసిన శేఖర్ కపూరే ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవి మీద పూర్తిగా మగచూపుని ఎక్కుపెడితే జనం డబ్బుల వర్షం కురిపించారు.

సినిమాకళతో చాలా ప్రయోగాలు చేసిన యూరోపియన్ సినిమాలో మేల్ గేజ్ అన్వయింపు సులభం కాదు. పాత్ర స్వభావం ఏమిటన్నదే వాళ్ళ దృష్టి. నగ్నత్వం ఎంతగా ఉన్నా దానిలో రెచ్చగొట్టే కోణం ఉండదు. నగ్నత్వం దానంతట అదే అసభ్యత అయిపోదు. చిత్రీకరించిన పద్ధతిని బట్టి అది ఆ సన్నివేశానికి అవసరమా లేక titillation కోసమేనా అన్నది ఎవరికైనా అర్థమౌతుంది. ఉదాహరణకి Jean Luc Godard సినిమాల్లో స్త్రీ అంటే ఒక వ్యక్తిత్వమే. దానికి తోడు ‘బ్రెక్టియన్ ఎలియనేషన్’ టెక్నిక్ కూడా వాడి, అరాచకాన్నీ అన్యాయాన్నీ బట్టలిప్పి చూపిస్తాడు. Godard సినిమాలో పాత్రలకంటే ఆ పరిస్థితులే మనకి భయానకంగా గుర్తుండిపోతాయి.  కొరియన్, చైనీస్ జాపనీస్ సినిమాల్లో ఎవరి కల్చర్ కి వాళ్ళు మేల్ గేజ్ ని కలిపి తీసినవీ, మేల్ గేజ్ ని వదిలి తీసినవీ కూడా గమనించొచ్చు. తరాల సంస్కృతికి  మేల్ డామినేషన్నీ ఆధునికత్వాన్నీ కలిపితే వచ్చే మగచూపులోంచి రకరకాల సినిమాలూ వ్యాపార ప్రకటనలూ తయారౌతున్నాయి.

lalita3

మేల్ గేజ్ ఉండకూడదని మడి కట్టుకుంటే శృంగారాన్నీ మోహాన్నీ సినిమాల్లో ఎలా చిత్రించాలన్నది ప్రశ్న. మంచి ఈస్తటిక్ సెన్స్ ఉన్న దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు శృంగార దృశ్యాలు తీసేటపుడు ఆ పాత్రల మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు కథలో ఏ సామాజిక వర్గానికి చెందినవారన్నది కూడా గుర్తిస్తూ శృంగారాన్ని చిత్రీకరిస్తారు. కథనిబట్టి అది మొరటుగా ఉండొచ్చు, సున్నితంగా ఉండొచ్చు, హింసాత్మకంగానైనా ఉండొచ్చుగానీ స్త్రీలని మాంసఖండాలుగా చూపించేటట్టు మాత్రం ఉండదు. మన సినిమాల్లో ఆడవాళ్ళని వస్తువులుగా చూపించవద్దని  అనుకునేవాళ్ళు శృంగార సన్నివేశాల జోలికే పెద్దగా పోకుండా సినిమా లాగించేస్తారు.  Titillation లేకుండా శృంగారాన్ని చక్కగా తీసేవాళ్ళు తక్కువ.  సెక్స్ ని సహజంగా చిత్రీకరించటంలో ఇప్పుడొస్తున్న మల్టీప్లెక్స్ హిందీ సినిమా, కామెరా తడుములాటకి దూరంగా కొంత ముందుకి వెళ్ళింది.  మిగతా పాపులర్ సినిమాల్లో మేల్ డామినేషన్ ఎలాగూ తప్పదుగానీ, మన వారసత్వసంపద, అదే.. మన తెలుగుహీరోలు.. వాళ్ళ సినిమాల్లోలా వ్యక్తిత్వంలేని ఆడవాళ్ళను  మేకప్ కిట్స్ తో సహా దొరికే బార్బీ డాల్స్ లా చూపించకుండా ఉండే మేల్ గేజ్ మేలనుకోవాలి ప్రస్తుతానికి.

మేల్ గేజ్ ని ఎదుర్కోవాలంటే విజువల్ మీడియాలో ఫిమేల్ గేజ్ ని తీసుకురావాలని కొంతమంది చెప్తారు.  ఫిమేల్ గేజ్ చెయ్యాల్సిన పని,  మేల్ గేజ్ కున్న వాయరిస్టిక్ లక్షణాన్ని అందిపుచ్చుకుని దానిలాగే తెరను ఆక్రమించటం కాదనీ  మగచూపుకున్న అధికారాన్ని తగ్గించటానికి కృషి చెయ్యాలంటే వేరే రకాలుగా కూడా దృశ్యాలను చూపించటం నేర్చుకోవాలనీ అంటోంది Lorraine Gamman.  అంటే తెరమీది స్పేస్ ని స్త్రీపురుషులిద్దరూ పంచుకోవాలని చెప్తోంది.  సినిమాటోగ్రాఫర్లలో స్త్రీలు చాలా తక్కువ. సరైన దర్శకులతో పోటీ పడగల సమర్థత ఉండి, స్త్రీవాదికూడా అయిన సినిమాటోగ్రాఫర్ ఎవరైనా, అలవాటైన మేల్ గేజ్ ని వదిలించుకుని, ప్రయత్నపూర్వకంగా తనవైన కామెరా ఏంగిల్స్ చూపిస్తూ సినిమా తియ్యగలిగిననాడు ఆడచూపును కూడా నిర్వచించవచ్చేమో.                 

***

యాభై ఏళ్ల కిందటైతే వెకిలిచూపులు ఎదురైతే చీరకొంగు భుజాలచుట్టూ నిండా కప్పుకుని తప్పుచేసినట్టుగా తల వొంచుకునేవాళ్ళు భద్రమహిళలు. ఇప్పుడు బహిరంగస్థలాల్లో మగవాళ్ళతో ఇంచుమించు సమానసంఖ్యలో తిరగ్గలగటం వల్ల వొచ్చిన ధైర్యంతో తలెత్తి లెక్కలేనట్టు మామూలుగా హాయిగా తిరుగుతున్నారు. ఆడవాళ్ళ బాడీలాంగ్వేజ్ ఎక్కడున్నా ఏ ఇబ్బందీ లేనట్టుగా మారిపోయింది.  స్త్రీవాదం, ఉద్యోగాలు, ఆత్మవిశ్వాసం స్త్రీలను నిటారుగా నిలబెట్టేవరకూ తెచ్చాయి. ఇదెంతో బాగుంది. కానీ మధ్యలో అన్నిటికీ నేనున్నానంటూ సర్వవ్యాపి మార్కెట్ జొరబడిపోయి, ఉన్న స్వరూపాలని మార్చి గందరగోళం చేస్తుందే!  “నీ శరీరాన్ని అందంగా వీటితో అలంకరించు ఒంటిని తీర్చిదిద్దుకుని చక్కగా స్వేచ్ఛగా ప్రదర్శించు. నీ స్వేచ్ఛకి ఆకాశమే హద్దు” అని ఫెయిర్ అండ్ లవ్లీలాంటి వేలకొద్దీ వస్తువులతో చుట్టుముట్టి  అన్ ఫెయిర్ ఆటలు ఆడుతోందే!  అసలే అలంకార ప్రియులేమో, మార్కెట్ దెబ్బను సగటు అర్భకపు ఆడప్రాణాలు ఎలా తట్టుకోగలవు? వొంటిని కుదించీ పెంచీ, రంగులద్దీ,   ప్రకటనలు ఎలా ఆదేశిస్తున్నాయో అలాగే తయారవటానికి పరుగు పెడుతుంటాయి.

lalita1

నువ్వు నీలాగే ఉండమంటూ ఆ ‘నువ్వు’ ఎలా ఉండాలో చెప్తున్నారు.

 

సైజ్ జీరోలుగా చాలామంది అన్నపానీయాలు మానేసి రోగగ్రస్తులయాక అమెరికన్ fashion diva ‘కిమ్ కడాషన్’ ఈమధ్య కొత్త ట్రెండ్ ఒకటి తీసుకొచ్చింది. ఆమె తన పిరుదుల్ని సర్జరీతో పెద్దవిగా చేసుకుని అందమంటే ఇదేనంది. దానితో ‘బూటీ’ అని ఆడామగా అందరూ ముద్దుగా పిల్చుకునే పెద్దపిరుదుల మీదే ధ్యాసయిపోయింది కొంతమంది ఆడపిల్లలకి.  అవి పెద్దగా లేకపోతే బెంగ.  రేప్పొద్దున్న ఇంకే ఫాషన్ సీతాకోకచిలకో లేదా పిరుదుల్ని సాఫుచేసే మిషన్లని తయారుచేసేవాళ్ళో ముందుకొచ్చి,  ఫ్లాట్  హిప్స్ లేకపోతే బతుకు వ్యర్థమని  ప్రచారం చేస్తే ఆడపిల్లలకి కొత్తబెంగలు పుట్టుకొస్తాయి. మరోపక్క ‘నా వొళ్ళు నాయిష్టం’ అని సినిమాతారలు స్త్రీస్వేచ్ఛకి అర్థం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందంకోసం ముక్కులూ మూతులతో సహా శరీరభాగాలని కోయించుకుని, క్రీములు పూసుకుని మార్కెట్ గేజ్ కి తగ్గట్టు తయారై  ‘నాశరీరం నాయిష్టం’ అని చెప్పటం ఎంత తెలివితక్కువతనమో గమనించలేనంత మత్తులో మునిగున్నారు.  మన శరీరాలను తీర్చిదిద్దుకోవటంలో ఇప్పుడు మన ఇష్టం ఏమీ లేదనీ, కాస్మెటిక్ సర్జన్లూ బిలియన్లడాలర్ల కాస్మెటిక్ వ్యాపారం చేసేవాళ్ళూ బట్టలమ్ముకునేవాళ్ళూ కలిసి పిల్లలతో సహా అందరిమీదా మత్తుమందు జల్లుతున్నారనీ ఎవరికెవరు చెప్పగలరు?

పిట్టలపోరు పిల్లి తీర్చినట్టు ఈ మేల్ గేజ్  ఫిమేల్ గేజ్ ల గొడవని ‘మార్కెట్ గేజ్’ పరిష్కరించింది. ఇప్పుడు అన్నిటికంటే అదే బలమైనదని ఒప్పుకోవాలి. ఆడా మగా అందర్లోనూ నిద్దరోతున్న ‘Exhibitionism’ ని తట్టిలేపి దువ్వి ముద్దుచేస్తూ వేల వెరైటీల వస్తువులు అమ్ముకుంటోంది. అదీ మార్కెట్ చూపు.  సిక్స్ పాక్ ఛాతీలు ప్రదర్శించే ఫాషన్ వచ్చాక మగశరీరాన్ని కూడా ఖండాలుగా ప్రదర్శించేశారు.  అందరూ ఇప్పుడు ఉదారంగా, హక్కుగా, ఇష్టంగా తమ అందచందాలను ప్రదర్శిస్తున్నామని అనుకుంటున్నారు.

ముందు మనని మనం ప్రేమించుకున్నాక ఆ ప్రేమను అందరికీ చూపించుకోవాలి.  ఒకరు చేతిలో మొబైల్ ఫోన్ ని ఎత్తిపట్టుకుంటే ఐదారుగురు దానివైపే చూసే చూపు ట్రెండీ సెల్ఫీ గేజ్. ఎవరిని వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటూ (narcissistic) అందరికీ తమని చూపెట్టుకుంటూ (exhibitionistic) ఉండేలా మార్కెట్ తన కనుసన్నల్లో జనాన్ని ఉంచుకుంటోంది.  మార్కెట్ గేజ్ ని ఎప్పటికైనా దాటగలిగితేనే కదా మన చూపుల్లో వేరే పోకడలు కూడా ఉండొచ్చని మనకు తెలియవచ్చేది!

*

 

 

 

 

 

మన కవిత్వం ఇంకా సుఖ జీవన సౌ౦దర్యమేనా ?

 

-కొండేపూడి నిర్మల

~

 

నిర్మల

ఇటీవల ఉత్తర తెలుగు అమెరికా  అసోసియేషన్  తెలుగు కవిత నూతన దృక్కోణం అనే విషయం మీద సెమినార్ నిర్వహించింది. భిన్న అస్తిత్వాలు వస్తు రూపాలు అనే విషయం మీద నేను ప్రసంగించాల్సి వుంది. అఫ్సర్, నారాయణ స్వామి, విన్నకోట రవిశంకర్ , పాలపర్తి ఇంద్రాణి మిగిలిన వక్తలు. మొదటి ప్రసంగం చేసిన ఇంద్రాణి  “కవిత్వానికి ప్రేరణ” గురించి మాట్లాడింది. పనిలో పనిగా  అస్తిత్వవాదులకు కొన్ని చురకలు వెయ్యడానికి నిర్ణయించుకుంది. మెత్తని మృదువైన కవిత్వం రాస్తూ, అనుభూతి, ఆహ్లాదము  కవితా లక్ష్యం గా వున్న ఈ కవయిత్రి  శబ్దానుకరణ విద్యలో అల్లసాని పెద్దన వంటిదని ఆమె పుస్తకానికి ముందు మాటలో మరొక కవి కితాబు ఇచ్చారు.

అల్లసాని పెద్దన అనగానే మనకు గుర్తొచ్చే పద్యం “తూగుటుయాల, రమణి ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడేము, ఉహ తెలియంగల లేఖక పాటకోత్తములు -కవితా రచనకు కనీస అవసరాలు అని కదా. అంత కాకపోయినా ఈ ఆధునిక కవయిత్రికి కూడా  ప్రేరకాలుగా కొన్ని సదుపాయాలు౦డాలట,

“మ౦చి కవి మిత్రులు, సరళమైన జీవన విధానం, ప్రకృతితో మమేకం, ఈ అన్నిటితో కూడిన ఏకాంతం” ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ మాటకొస్తే కవిత్వం రాయడానికే కాదు బిడ్డకు పాలిచ్చే కూలి తల్లికి , మగ్గంమీద బట్ట నేస్తున్న ముసలి తాతకి కూడా ఏకాంతం అవసరమే..

అది కాక కవిత్వాన్ని ఆటంకపరుస్తూ, చికాకు పెట్టే విషయాల చిట్టా కూడా మన ముందు వుంచింది. అదేమిటంటే,

“కవి నిరంతర అధ్యయనపరుడు కావాలి కాని సదరు  పుస్తకాలు  ప్రసంగాలో, సిద్ధాంతాల పట్ల ఆకర్షణ పెంచేవో కాకూడదు. నేను ఫలానా బాధిత వర్గానికి చెందిన స్త్రీని , ఫలానా మతానికి, కులానికి ప్రతినిధిని అని కూడా భావించరాదు. అప్పుడు అది మీ పరిమితిని సూచిస్తుంది.. మార్పులు, వయసు  పెరగడం , అనుభవాలను సృష్టించుకోవడం (?) కూడా కాని పనులే, ఉద్యమకారులు ఉద్యమాలు చేసుకోవాలి కాని కవులవడానికి వీల్లేదు.”

ఇవి   కేవలం వ్యక్తిగత అభిప్రాయాల్లాగా చెబితే ఈ చర్చ  అవసరం లేదు, కాని ఆర్కిమెడిస్ సిద్దాంతంలాగా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. కాబట్టి ఇటువంటి ప్రకటనల పట్లా, వాటి వెనక వున్న  భావజాలం పట్లా నాకున్న స౦దేహల్ని మీతో పంచుకొవాలను కుంటున్నాను.

ఇవికాక ప్రసంగం లో, తన వస్తు ప్రాధాన్యత  గురించి చెబుతూ,  గుడి దగ్గర పూలు అమ్ముకునే అమ్మాయి జ్వరంగా వుంటే తను జ్వరం గురించే రాస్తానని చెప్పింది, జ్వరం పక్కన పెట్టి పూలపుప్పొడి గురించి కూడా రాయచ్చు.

వస్తువు ఎంపికలో వ్యక్తీకరణలో కవికి స్వేచ్చవుంది. ఆ స్వేచ్చను ప్రశ్ని౦చే హక్కు ఎవరికి లేదు.

పూల మీద రాస్తావా? పూలపిల్ల జ్వరం మీదరాస్తావా ? జ్వరంలో వున్నా సరే  పూలు అమ్మక తప్పని గతి మిద రాస్తావా? పువ్వుల పంట చినుకు  లేక ఎండి పోవడాన్ని రాస్తావా? పంట భూములు పోగొట్టుకున్న నిర్వాసితులమీద రాస్తావా? దానికి కారణమవుతున్న సర్కారీ ధోరణి గురించి రాస్తావా? అది కవి తీసుకున్న కాన్వాసుని బట్టి వుంటుంది

ఏ వస్తువు ఎంతవరకు వ్యక్తి గత మవుతుంది, ఏ సరిహద్దు దగ్గర సామాజికమవుతుంది ? నిర్ణయించడం కష్టం.

వ్యక్తిగతమంతా రాజకీయమే అని రుజువైపోయిన చోట కవి కార్యకర్తగా ఎదగడం అనివార్యం కాదా. జీవితంలో అన్నివిధాలా స్థిరపడ్డ కవికి వున్న సుఖ జీవన సౌదర్యం కార్యకర్త కి వుండకపోవచ్చు.

కవులు సరస్వతీ పుత్రులు, సభలు  ఈశ్వర స్వరూపాలు అనుకున్నంత కాలమూ వారిని మోయడానికి నడుం కట్టిన బోయీలు కాని,  కట్టడాలకు రాళ్ళు మోసిన కూలీలు కాని  వస్తువులు కాలేవు.

ఒకవేళ పువ్వులు అమ్మే పిల్ల అక్షరాస్యురాలు అయితే ఆమె అనుభవమే ఒక రచన అవదా ?. అక్షరాస్యతతో సంబంధమే లేక౦డా  గుండె కరిగించే పాట అవదా ? దానికి కావ్య గౌరవం వుండదా?

రచనా ప్రేరకాలుగా ఆ పూలపిల్లకి “బయట వేడి గాలులు తరిమికొడుతూ వుంటే , ఇ౦ట్లో వేడి భోజనం “ అవసరం లేదు. ఆకలి చాలు, వేదన చాలు, వేదన ఒ౦టరిది కాదనే స్పృహ చాలు. అవే ఆమె వ్యక్తీకరణకు కారణాలు.

కవిత్వం బాధకు పర్యాయపదం అన్నాడు కదా శ్రీ శ్రీ .

శ్రీ శ్రీ కి ముందు వచ్చిన భావ కవిత్వాన్ని అంతకు ముందు వచ్చిన పద్య కవిత్వాన్ని కూడా హాయిగా చదువుకున్నాం.

“రాత్రి జిప్పును విప్పుతో కారు ప్రయాణం “అని రాసిన ఇస్మాయిల్ కవితలో సిమిలీలు  ఎవరం మర్చిపోలేం.

“పది రాత్రులు ప్రకృతితో గడిపినవాడేవ్వడు పరుల్ని ద్వేషించలేడు” చిన్నప్పుడెప్పుడో చదువుకున్న వాక్య౦ యిది.

కవి పేరు మర్చిపోవచ్చు కాని కవిత్వం మర్చిపోలేం. ఈ నేలమీద అన్ని ధోరణులు సమాంతరంగా ప్రవహిస్తూనే వుంటాయి. వాళ్ల మధ్య మీరు కుస్తీ పోటీలు కండక్ట్ చేయనక్కర్లేదు.

అస్తిత్వవాద కవులకి ఈస్తటిక్ సెన్స్ ఉండదనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో వుంది. ఏ కవి అయినా వాదాలకోసం పుట్టడు. వాద ప్రచారం కోసం రాయడు. జీవితాన్ని కవిత్వం చెయ్యడంలో విభిన్న వస్తువులు వచ్చి చేరాయి. అది చాలా అవసరం కూడా.

ఈ పుస్తకానికి రాసిన ముందు మాట చూడండి.

“స్త్రీలలో ఉద్వేగాలు జాస్తి. కవిత్వ మూలాలు అక్కడే వున్నా దానివల్ల కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజనం నాస్తి, కారణం దానికి అవసరమయ్యేది రసదూరం పాటి౦చగల నిర్లిప్తదోరణి. స్త్రీలలో అది బహు సకృతు. కాబట్టే మాయో ఏ౦జిలో , ఎలిజిబెత్ బిషప్ లాంటి పేరొందిన కవయిత్రుల్లో కూడా శిల్ప దోషాలు కనిపిస్తాయి. ఇక తెలుగు లో రాస్తున్న కవయిత్రుల గురించి ఎంత తక్కువ  మాట్లాడుకుంటే అంత మ౦చిది. కవులు కూడా అదే బంతిలో కూచుని భోజనాలు కానిచ్చి చేతులు కడిగేసుకు౦టున్నవారే. నానా వాదాల చెత్తను మిగల్చకుండా ఊడ్చి, కొత్త కవిత్వానికి ఇంద్రాణి కనక నాంది పలికితే ఆంధ్ర సారస్వతానికి కావలాసి౦దేమీలేదు.” దీనిభావమేమి యదుకులేశా ?

ఉద్వేగాలు జాస్తి అనే మాట తప్ప ఇంకోటి అర్ధమయితే ఒట్టు. కవిత్వ మూలాలు అక్కడే వున్నా అంటే ఆమెలో, లేక ఆమె చుట్టూరా లేక ఆమెకు అoదే౦త దూరంలో అనేనా? మరి అంత సమీప వస్తువు గురించి ఆమె రాసినప్పుడు కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజం నాస్తి ఎలా అవుతుంది? రసదూరం పాటించగల నిర్లిప్త ధోరణి ఆమెలో లేదా?

ఇది ఎవరికయినా అర్ధం అయితే నాకు చెప్పండి ప్లీజ్,

పదిమ౦దిని దూషిస్తే తప్ప పదకొండో వాడ్ని గౌరవించడం కష్టమనుకు౦టే అది వారి వ్యక్తిగత బాధ. సామాజికం కావాల్సిన కవిత్వాన్ని వ్యక్తిగతం అని నేర్పి, వ్యక్తిగత రాగద్వేషాలు సైద్ధాంతిక సత్యాల మాదిరి చెబుతుంటే అచ్చంగా చెవిలో పువ్వులు పెట్టినట్టే వుంది.

సహజ ప్రేరణకి అడ్డుపడుతూ, కవిత్వాన్ని కృత్తిమoగా మార్చడం ఎలా జరుగుతుందో  ఇ౦ద్రాణి చెప్పి౦ది. నేను తనతో  తప్పక ఏకీభవిస్తాను. అదేమిటంటే ,

“మొదట్లో మనకోసం రాసుకున్న కవిత్వాన్ని ఎవరికయినా చూపగానే , ముఖ్యంగా ఎప్పటి ను౦చొ రాస్తున్నకవులకి చూపగానే వాళ్ళు అనే మాటలు, అభిప్రాయాలు, గుర్తింపు, అహం , బ్రాండ్ ఇమేజ్ ని ఇస్తాయి.”

ఇప్పుడు ఒక మ౦చి కవి/కవయిత్రి అలాంటి ప్రమాదాన్ని౦చి బైటికి రావాల్సి వుంది.

 

“ఇదీ ఓ కథే”

 

 

-భువనచంద్ర 

~

 

అదో పిచ్చిముండ. చెప్పినా విని చావదయ్యా.. ఏం చెయ్యనూ? “పటపటా తలబాదుకుంటూ అన్నది శేషారత్నం. శేషారత్నంది కృష్ణాజిల్లా. పుట్టింది పల్లెటూళ్ళో అయినా పెరిగింది మాత్రం విజయవాడలో. తల్లిదండ్రీ ఉన్నవాళ్లు గనక 10thవరకు చదివి, ఫస్టుక్లాసులో పాసై, డిగ్రీ 2nd  yearలో ప్రేమలో పడి, వాడికోసం నగానట్రాతో సహా మద్రాసు పారిపోయి వచ్చింది. తోడొచ్చినవాడు తెచ్చినవన్నీ ఊడ్చుకుపోతే, ఎలాగోలా మళ్లీ తల్లిదండ్రుల పంచన చేరి జీవితాన్ని మళ్ళీ సజావుగా మలుచుకునే  ప్రయత్నంలో సక్సెస్ అయింది.”అక్షమాల” శేషారత్నం కూతురు. మహా మొండి. అయితే ఆ పిల్ల అందం చెప్పనలవిగాదు.

ఆడపిల్ల అందగత్తె కావడం అదృష్టమే. కానీ, ఆడపిల్లకి తాను అందగత్తెనని తెలిస్తేనే తలనొప్పులు వచ్చేది. అక్షమాలకి నూటికి నూరుపాళ్ళు తాను అందగత్తెనని తెలుసు. అందుకే పట్టుపట్టింది. విషయం చాలా సింపుల్. హైద్రాబాదులో నూతన నటీనటులకోసం ‘సెలక్షన్’ నిర్వహిస్తున్నారు. అక్షమాల అందులో పాల్గొంటానంటుంది. శేషారత్నానికి ఏమాత్రం ఇష్టం లేదు.

“శేషమ్మా.. ఎట్లాగూ వినదని తెలుసుగదా.. పోనీ ఓసారి పంపిస్తే ఏంబోయిందీ? సెలక్టయితే వెరీగుడ్. కాలేదనుకో.. తిరిగొస్తుందీ! అంతేగా..!” నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు తిరగలినాయుడు. తిరగలినాయుడిది ఏలూరు. అసలు పేరు రాజశేఖరనాయుడు. అతనిది చిత్రమైన వ్యాపారం. రోళ్ళూ, రోకళ్ళూ, తిరగళ్ళూ ఉన్నాయి.. ఊరగాయలకి కావలసిన సమస్తం అంటే కారం, ఆవపిండి, మెంతిపిండీ, పసుపూ, అన్నీ మేన్యువల్‌గానే తయారుచేయిస్తాడు. పప్పునూనె, కొబ్బరినూనె, నువ్వుల నూనె, వేరుసెనగనూనె కూడా గానుగ ఆడే సిద్ధం చేస్తాడుగానీ,, మిల్లునూనెలతో వ్యాపారం చెయ్యడు. నిఖార్సయిన సరుకు సప్లై చెయ్యాలంటే నాయుడి తరవాతే ఎవరైనా. ఖరీదు కాస్త ఎక్కువయినా క్వాలిటీలో నంబర్ వన్ గనక వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయల్లా వృద్ధి చెందుతోంది.

నాయుడికీ శేషారత్నానికి పరిచయమైంది మద్రాసులోనే. పారిపోయి వచ్చినప్పుడు టి.నగర్‌లో ఉన్నది శేషారత్నం(తోడు వచ్చినవాడితో).  ఆ పక్కనే మరో గదిలో అద్దెకుండేవాడు నాయుడు. తోడొచ్చినవాడు ఉడాయించినప్పుడు ఆదుకుని, ఆదరించి, మంచీ చెడూ వివరించి, దగ్గరుండి మరీ తల్లిదండ్రులకి అప్పగించిన నాయుడంటే శేషారత్నానికి దేవుడితో సమానం.

దేవతలూ దానవులూ కూడా ఉండేది మనుషుల్లోనే. నాయుడు నిజంగా గొప్పమనిషి. అంతేకాదు కాలంతోపాటు మార్పు సహజం అనుకునే మనస్తత్వం  వున్నవాడు. తప్పని పరిస్థితుల్లో ఏటికి ఎదురీదాలనీ అతనికి తెలుసు.

సినిమాల్లో ‘పాదరసం’లాంటివాళ్ళు చాలామందే వున్నారు. రాకేష్ అలాంటివాళ్లల్లో ఒకడు. పదిహేడో ఏట సినిమా మీది పిచ్చితో మద్రాసు వచ్చాడు. ‘రెండురోజులు మాత్రం వుంటానని రిక్వెస్టు చేసి, ఆ ఇంట్ళోనే నెలరోజులున్నాడు. ఆ నెల రోజుల్లోనే ‘వడపళని’లో ఓ తమిళియన్ ఇంట్లో రూం సంపాదించి, ఓనర్ మనవరాల్ని మెల్లగా ముగ్గులో దించాడు. ఇతనికి పదిహేడూ పద్ధెనిమిది మధ్య.  ఆ పిల్లది 28. పెళ్ళి కాలేదు. ఇతనేమో అందగాడే. ఆ పిల్ల అనాకారి కాదుగానీ అందగత్తె కూడా కాదు. ఇంటద్దె మొత్తం దొంగతనంగా ఆ అమ్మాయే రాకేష్ చేతికిచ్చి, ఆ డబ్బుని వాళ్ల తాతకి ఇప్పించేది. అంతే కాదు పాకెట్ మనీ కూడా ఇచ్చేది. ఆ పిల్లకి తల్లిదండ్రీ చిన్నప్పుడే పోయారు. తాత అమ్మమ్మలే పెంచారు. అమ్మమ్మ కూడా రెండేళ్ల క్రితం కాలం చేసింది. ఆ అమ్మాయి పేరు ‘అఖిల’.

ఇంటి ఓనర్ పేరు తోతాద్రి. వాళ్లు తమిళ బ్రాహ్మళ్లు. తోతాద్రి తహసీల్‌దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. బాగా సంపాయించాడు. టి.నగర్‌లో మూడు ఇళ్లున్నాయి. ఒక్కో ఇంట్లోనూ నాలుగు పోర్షన్లు. పెన్షన్ + ఇంటి అద్దెలు కలుపుకుంటే  బ్రహ్మాండమైన రాబడి. ఒక్కతే కూతురు. ఆ కూతురు, అల్లుడు చనిపోయారు. తోతాద్రికి మిగిలింది అఖిల ఒక్కతే.

“నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నిన్నెవరు చూస్తారూ?”అంటూ ఇంతకాలం పెళ్ళి చేసుకోకుండా వున్న అఖిల అంటే ఆయనకు ప్రాణం.

రాకేష్ అఖిలని ముగ్గులోకి దించడం గమనించినా, గమనించనట్టు వూరుకున్నాడు తోతాద్రి.’చిన్నవాడో, పెద్దవాడో ఎవడైతేనేం. అఖిల ‘సెటిల్’ కావడం ముఖ్యం’ అనుకున్నాడు.

రాకేష్‌కి హాయిగా గడిచిపోతోంది. మొదట్లో ‘మెస్’కి వెళ్ళేవాడు. అదీ అఖిల ఇచ్చే డబ్బులతోనే. ఆ తరవాత అఖిలే ‘పేయింగ్ గెస్ట్’పేరిట అతనికి కూడా వండేది.

అఖిలకి ఆ ‘యావ’ ఎక్కువ. ప్రతి శుక్రవారం మొహం, కాళ్లూ, చేతులకి చక్కగా పసుపు రాసుకుని, తలంటి పోసుకుని  మహాలక్ష్మిలా కనిపించేది. అందగత్తె కాకపోయినా ఆమెకి వున్న తెలివితేటలు అమోఘం.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా వెంటబడుతున్న రాకేష్‌ని జాణతనంతో దూరంగా పెడుతూ, మళ్లీ తనే  దగ్గరగా వచ్చినట్టు వస్తూ ఓ బ్రహ్మాండమైన కైపులో ముంచింది.  ఒకసారి ఆ ‘రుచి’ మరిగినవాడెవడూ వదిలి పోలేడని అఖిలకి తెలుసు.

తోతాద్రికి జరుగుతున్నదంతా తెలుసని అఖిలకి తెలుసు. ‘రాకేష్’ మాత్రం ఫ్రీ బోర్డింగ్ , లాడ్జింగ్‌ని సంపాయించుకున్నందుకు మహదానందంగా వున్నాడు.

పొద్దున్నే దిట్టంగా టిఫిన్ పట్టించి పాండీబజారుకి పోవడం. అక్కడ చెట్లకింద వాలే సినీపక్షులతో పరిచయాలు పెంచుకోవడం చేశాడు. రాకేష్ ‘పాదరసం’లాంటివాడని ముందే అనుకున్నాం కదా.. ఆమాటే నిజం చేశాడు. కరెక్టుగా అఖిలతో ‘పరిచయం’ పెరిగిన నెలరోజులకల్లా సూపర్ డైరెక్టర్ మోహన్ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు. మోహన్  ప్రసాద్ పట్టిందంతా బంగారమే. ఆయన చేసిన సినిమాల్లో 90% నూర్రోజులకి పైగా ఆడినవే. మిగతావీ ఎబౌ ఏవరేజేగానీ, ఒక ఫ్లాప్ కూడా లేదు.

మోహన్ ప్రసాద్ కి ముగ్గురూ ఆడపిల్లలేగానీ మగపిల్లలు లేరు. రాకేష్‌ని చూడగానే ఆయనకి మనసులో మెదిలిన వ్యక్తి తన మూడో కూతురు. పెద్దపిల్లలిద్దరూ బుద్ధిమంతులు. చెప్పినట్టు వింటారు. మూడోపిల్ల మహా పెంకిది.తను పట్టుకున్న కుందేటికి రెండే కాళ్లు అనే రకం. అదీగాక కులం పెర్‌ఫెక్టుగా కలిసింది. మెల్లిగా కుర్రాడ్ని దారిలో పెడితే పైకి రావడమేగాక ‘ఇల్లరికం’ కూడా తెచ్చుకోవచ్చు.

వేలు చూపిస్తే చెయ్యి మింగేసే  రకం రాజేష్. డైరెక్టర్‌గారిదగ్గర సిన్సియర్‌గా పని నేర్చుకుంటూనే ఆయనకి చేతిలో పెన్నూ, తలలో నాలికలాగ మారాడు.

“పూర్ణానందంగారూ, యీ కుర్రోడు చాకూ, కత్తీ లాంటోడు గాదు, పుటుక్కున పొట్టలో దిగే కైజార్‌లాంటోడు. మోహన్‌గారు అమాయకంగా నమ్ముతున్నాడీయన్ని. ఏదో ఓ రోజు యీడు ఆయనకే వెన్నుపోటు పొడవకపోతే నన్ను చెప్పెట్టి కొట్టండి.” అన్నాడు కో డైరెక్టర్,   సీనియర్‌మోస్ట్ రైటర్ పూర్ణాంద్‌తో. చిన్నగా నవ్వాడు పూర్ణానంద్. ఆయన పక్కా మితభాషి మాత్రమే కాదు. ఎక్కడ, ఎవరితో, ఎంతసేపు మాట్లాడాలో ఖచ్చితంగా తెలిసిన మేధావి. “ఇదిగో సురేషూ, విత్తనం ఎక్కడిదీ, ఎవరిచ్చారూ అనేది ముఖ్యం కాదయ్యా. మొక్క ఎలా పెరుగుతోందనేది ముఖ్యం.

వీడు ఎవర్ని ముంచుతాడో, ఎవర్ని వెన్నుపోటు పొడుస్తాడో తరవాత సంగతి. ఒకటి మాత్రం నిజం. వీడు గనక వీడికున్న తెలివితేటల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మరో దిగ్దర్శకుడవుతాడయ్యా…!” అన్నాడు పూర్ణానంద్ 555 సిగరెట్ పీలుస్తూ. ఏడాది గడిచింది.

కొందరి మాటలు ఫలిస్తాయి. కారణం చెప్పలేం. పూర్ణానంద్ మాట ఫలించింది. ఓ పేద్ద హీరో రాకేష్‌కి డైరెక్షన్ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు, “నేనితని వయసు చూడలా. పరిణితిని మాత్రమే చూశా.!” అని ఓ గొప్ప స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక్కడి పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, నీ పక్కన వుంటూ,  నీ మీల్స్ టికెట్ మీద భోంచేస్తున్నవాడే, వాడికి లాభం వుందనుకుంటే నీ మీదే విషం చిమ్మగలడు.

తెలివైనవాడు సినిమా సినిమాకీ, పదింతలు ఇరవయ్యింతలు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే, ‘లౌక్యం’ తెలీనివాడు ఎన్ని హిట్లిచ్చినా పేరు తప్ప ‘డబ్బు’ కూడబెట్టుకోలేడు. అందుకే రచయితలు చాలామంది బీదగా మిగిలేది. ఎందరో క్రియేటివ్ డైరెక్టర్స్ పరిస్థితీ అదే.

సినిమా స్క్రిప్ట్ తయారవుతోంది. కథ, మాటలూ పూర్ణానంద్‌గారివే. చిత్రంగా కోడైరెక్టర్ మళ్ళీ  సురేషే. ఈ పరిశ్రమలో ఇదో విచిత్రం. ఇక్కడ సీనియరా, జూనియరా అనేది ఎప్పుడూ నిజంగా కౌంట్ కాదు. సక్సెస్సా కాదా అనేదే ముఖ్యం. ఓ  పెద్ద హీరో కాల్‌షీట్ ఇచ్చాడంటే , పిక్చర్ సంగతెలా వున్నా నూటికి 50 శాతం సక్సెస్ సాధించినట్టే.

అన్నిటికంటే చిత్రం ఏమిటంటే, మూడో కూతురి కోసం రాకేష్‌ని ట్రెయిన్ చేసిన మోహన్‌ప్రసాద్‌గారే, రాకేష్‌కి ఆఫరొచ్చాక ఆశీర్వదించి పంపడమేకాక తన కోడైరెక్టర్‌ని కూడా రాకేష్ దగ్గర పెట్టాడు. రాకేష్‌కి 10% పని తెలిస్తే, సురేష్‌కి 95% తెలుసు. అలాంటివాడ్ని కోడైరెక్టరుగా పెట్టుకుంటే సినిమా తియ్యడం నల్లేరు మీది నడకే.

మనిషికి ఏది ముఖ్యం? నిజంగా మనుషులు దేన్ని కోరుకుంటారు? కొందరు ధనం అంటే, కొందరు ప్రేమ అంటారు. కొందరు పదవీ పేరూ అంటే, కొందరు మనశ్శాంతి అంటారు. అయితే ఇవన్నీ మామూలుగా చెప్పేవి. పనిలో పడితే తప్ప అసలు సిసలు వ్యవహారం తేలదు.

పని లేనంతకాలం ‘ప్రేమ’ అద్భుతం అనిపిస్తుంది. ఎంతగా మురిపిస్తుందంటే, చిన్న చిన్న అలకలూ, కోపాలూ, బుడిబుడి దీర్ఘాలు, ముక్కు చీదటాలూ కూడా అద్భుతంగా, అత్యంత సుందరంగా కనిపిస్తాయి. యుగమో క్షణంలా గడుస్తుంది.

సరేనయ్యా.. అదృష్టం తలుపుతట్టి బ్రహ్మాండమైన పని చేతిలో పడ్డాక? ??

అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేవాడు మూర్ఖుడు. అవకాశాన్ని సృష్టించుకునేవాడు బుద్ధిమంతుడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకునేవాడు మహాజ్ఞాని. ఎవరికీ  దొరకని అదృష్టం రాకేష్‌కి దొరికింది. “నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి గురూజీ. మీరు ఎంతో అనుభవం కలవారు. దయచేసి నన్ను ‘గైడ్’ చేయ్యండి. ఒకవేళ నేను తప్పు చేస్తున్నాననిపిస్తే వెంటనే హెచ్చరించండి. అస్సలు సందేహించకండి..” ఈ ఒక్క డైలాగ్‌తొ రాకేష్ సురేష్‌ని పూర్తిగా గెల్చుకున్నాడు. అదీ. పూర్ణానంద్ ముందర.

“ఏదో అనుకున్నాగానీ పూర్ణానందంగారూ,యీ కుర్రోడు పెద్దలతో ఎలా మెలగాలో తెలిసినవాడండీ!” ఉబ్బిపోయి మహాసంతోషంగా అన్నాడు సురేషు.

“అందుకే ఇన్నేళ్ళయినా నువ్వు కోడైరెక్టరుగా వున్నావు. ఉత్తి వెర్రిమాలోకానివి.” లోపల్లోపలే సురేష్ గురించి అనుకున్నాడు పూర్ణానంద్. ఒకటి మాత్రం నిజం. రాకేష్ పగలూ రాత్రీ స్క్రిప్టు మీదే కూర్చొంటున్నాడు. ఎవ్వరూ ‘పిండనంతగా’ పూర్ణానంద్‌ని బెటర్‌మెంట్ కోసం పిండేస్తున్నాడు. సిట్టింగ్స్ సవేరా హోటల్లో జరుగుతున్నాయి. అఖిలని కూడా పక్కకు నెట్టి ‘మేక్జిమం’ టైం అక్కడే గడుపుతున్నాడు రాకేష్.

అఖిల అంతా చూస్తూనే వుందిగానీ ఏ మాత్రం బయటపడలేదు. అల్లరి చేసి లాభం ఏమిటీ? అదీగాక పెళ్లి కూడా కాలేదాయె. అప్పటికే చుట్టుపక్కలవాళ్లు కొంచెం చెవులు కొరుక్కుంటున్నారని  అఖిలకి తెలుసు. కారణం వయసుల్లో వున్న తేడా.

తుఫాను గాలికి చెట్లు పడిపోయినా , గడ్డిపోచలు అలానే ఉంటాయి. ఓ సమస్య వచ్చినప్పుడు గడ్డిపోచలా నిబ్బరంగా ఉండగలిగేవారిదే గెలుపు. తొడలు కొట్టి జబ్బలు చరుచుకుని చాలెంజ్ చేసేవాళ్లది కాదు.

అఖిల అవసరమైతే వృక్షమూ కాగలదు, సమస్య వస్తే గడ్డిపోచలాగానూ మారగలదు. ఇప్పుడామె గడ్డిపోచగా మారి పరిస్థితిని నిబ్బరంగా ఎదుర్కొంటోంది.

సినిమాఫీల్డుకి ‘దేవుడు’ అంటే చచ్చేంత సెంటిమెంటు. పూజ అంటే చాలు బోలెడు ఖర్చు చేస్తారు. ముహూర్తం షాట్లు చూడండి. ఎంత వినయంగా, ఎంత భక్తితో వొంగి వొంగి దండాలు పెడుతూ వుంటారో

దర్శకులూ ,నటీనటులూ  నిర్మాతలూ .

రోజూ ,అంటే , రాకేష్ ఇంటికి  రాని రోజుల్లో ఠంచనుగా తొమ్మిదింటికల్లా మహాలక్ష్మిలా, ‘ముప్పత్తమ్మ’ గుడినించి ప్రసాదం తీసుకుని, సవేరాకి వెళ్ళేది అఖిల. అప్పటికే పూర్ణానంద్, సురేషూ, మిగతావాళ్లూ అక్కడ వుంటారని ఆమెకి తెలుసు. భక్తిగా అందరికీ ప్రసాదం పంచి, “మీరందరూ వెయ్యేళ్ళు చల్లగా, సుఖంగా ఉండాలి. ఎప్పుడూ విజయం మీ వెంట నీడలా వుండాలి.. ఇదే నేను రోజూ మొక్కుకునేది. అందరికంటె ‘ఆయన’ చిన్న. అయినా మీరంతా వున్నారుగా..!” అని వినయంగా నమస్కరించి బయటికొచ్చి ఇంటికెళ్ళే బస్సెక్కేది. అఖిలగురించి మొదట్లో కొంత ‘వింత’గా వాళ్ళనుకున్నా, తరవాత్తరవాత ఆమె ‘చూపించే’ వినయానికి ఫిదా అయిపోయారు.

“ఏజ్ ది ఏవుందోయ్! కృష్ణుడికన్నా రాధ పెద్దదికాదూ, ఉండాల్సింది స్వచ్చమైన ప్రేమ!” అంతటి పూర్ణానందే అఖిలని చూసి ముచ్చటపడి అనేవాడు.

సినిమా మొదలైంది. ఓ రోజున మోహన్‌ప్రసాద్‌గారు రాకేష్ వర్క్ ప్రోగ్రెస్ చూద్దామని సవేరాకి వచ్చారు.. అదే సమయానికి అఖిల ప్రసాదం తీసుకొచ్చింది. మామూలుగానే వినయంగా ప్రసాదం పంచి, నాలుగు మంచి శుభాకాంక్షల్ని అందించింది.

“ఎవరీవిడా?” కుతూహలం బయటికి కనపడకుండా మామూలుగా అడిగినట్టు అడిగాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లింట్లోనేనండి రాకేష్ వుండేది!” ఉత్సాహంగా చెప్పాడు కో.డై.సురేష్.

“మరి యీ ప్రసాదాలేంటి?” నవ్వి అన్నాడు కానీ లోపలలోపల ఓ అనుమానం సుడి తిరుగుతోంది.

“సినిమా సూపర్  హిట్టు కావాలనిట. అబ్బ… ఆ అమ్మాయికి ఎంత వినయమో!” అద్దంలాగా మనసుని బయటపెట్టాడు సురేష్. “అలాగా!” అని బయలుదేరాడాయన. ఆయనతోబాటు పూర్ణానంద్ బయటికొచ్చాడు.

“ఏమిటి పూర్ణా యీ పిల్ల వ్యవహారం…!” నెమ్మదిగా అన్నాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లిద్దరి మధ్యా ఎఫైర్ ఉందనుకుంటాను. ఆ పిల్ల సిన్సియరే. రాకేష్ మహాతెలివైనవాడు.”క్లుప్తంగా చెప్పాడు పూర్ణానంద్.

ఆ మాత్రం హింట్ చాలు. ఆ అమ్మాయి సిన్సియర్. రాకేష్ తెలివైనవాడంటే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టగలిగే నేర్పు వుందనేగా… ,  నిశ్చింతగా ఇంటికెళ్లాడాయన. ఎఫైర్స్ ఎన్నున్నా ఫరవాలేదు. పెళ్ళి మాత్రం ఒకటే వుండాలి. భార్యా ఒక్కతే వుండాలి. చిన్న యిళ్ళు  ఎన్నున్నా , పెద్దిల్లు పెద్దిల్లేగా! మోహన్‌ప్రసాదూ ఒకప్పుడు గ్రంధసాంగుడే. ఏ హీరోయిన్నీ వదల్లేదని పెద్దపేరుఆయనకి .

స్క్రిప్టు రెడీ. ఇంకో మూడు రోజుల్లో షూటింగ్ మొదలు కాబోతుంది..’విజయా డీల క్స్   లో సాంగ్ రికార్డింగ్.  ‘విజయ’లో రికార్డింగ్ అంటే’విజయం తథ్యం’ అని అందరికీ నమ్మకం.

(నా పాట  మాత్రం ప్రసాద్ old, థియేటర్లో రికార్డయింది. సినిమా పేరు: నాకూ పెళ్లాం కావాలి‘. నటీనటులు, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, కల్పన, నిరోషా). దర్శకత్వం శ్రీ విజయాబాపినీడు. నిర్మాతలు: ఆలపాటి రంగారావు, శ్రీ శివలింగేశ్వరరావు. సంగీతం వాసూరావుగారు. గానం: SPB, పల్లవి ” వినోదాల విందురా, బాధలన్నీ బంద్‌రా.. సినిమా సాటి లేదురా.. డాన్సూ ఫైటూ మిక్స్రా.. మళ్లీ మళ్లీ మళ్లీ చూడరా” Date of Recording 1-1-1987)

 

అతిరధమహారధులందరూ విజయా గార్డెన్స్   కి వచ్చారు. ఓ కుర్రాడ్ని డైరెక్టర్‌గా చూడ్డం అందరికీ ఆశ్చర్యమే.

******                                     *******                           **********

సినిమా సూపర్‌హిట్. అఖిల ఆ రోజున ముప్పత్తమ్మ గుళ్ళో 101 కొబ్బరికాయలు కొట్టింది.. రాకేష్‌తో కలిసి వచ్చి.

వారం రోజుల్లో రెండో సినిమా మొదలు. ఈసారి ‘స్క్రి ప్ట్  వర్క్’ పెద్దగా జరగలేదు. కారణం ఆ సినిమా ‘తమిళం’నించి తెలుగులోకి రీమేక్. స్క్రిప్టుని పూర్ణానంద్‌గారే సవరించి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చారు.

సురేష్ కో డైరెక్టర్. మిగతా అందరు  టెక్నీషియన్స్ మొదటి సినిమాకి పని చేసినవాళ్ళే కావడంతో చకచక షూటింగ్ నడిచి మూడు నెలల్లో పూర్తయింది.

అదీ సూపర్ హిట్టే.

మూడో సినిమా.. మళ్లీ తమిళ్ టు తెలుగు రీమేక్.

నాల్గో సినిమా హిందీ టు తెలుగు రీమేక్.

నాలుగో సినిమా రిలీజ్ నాటికి అఖిలకి వాంతులయ్యాయి.

సరిగ్గా ఆ రిలీజ్ డేట్ ముందు రోజునే మోహన్‌ప్రసాద్‌గారు తన మూడో కూతుర్ని రాకేష్‌కివ్వడానికి రాకేష్‌తో సంప్రదించాడు.

రాకేష్ వినయంగా అఖిల గురించి చెప్పాడు. “ఆ అఫైర్ నాకు తెలుసు. ఒకవేళ అది బయటపడ్డా అందరూ ఆవిడే నిన్ను చిన్నవాడ్ని చేసి ముగ్గులొకి దించిందని బ్లేమ్ చేస్తారు గానీ, నిన్నెవరూ ఏమీ అనరు బాబూ, నువ్వు నిచ్చెనమెట్లు ఎక్కుతున్నావు. కానీ ఇదో వైకుంఠపాళీ అని నీకు తెలీదు. నిచ్చెనల పక్కనే పాములూ వుంటై. కాటు వెయ్యడానికి సిద్ధంగా…! అన్ని అనుభవాలు కలిగినవాడ్ని.. నువ్వు నా అల్లుడివైతే సంతోషిస్తా. లేదంటే నీ యిష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు”   అని  తన బ్రాండ్ నవ్వుతో నవ్వుతూ చెప్పాడు మోహన్‌ప్రసాద్. ఆ మాటల వెనక హెచ్చరిక రాకేష్‌కి స్పష్టంగా అర్ధమయింది.

********                          ************                             ********

తోతాద్రి చనిపోయి దశాబ్దంన్నర దాటింది. అఖిల ఇప్పుడు ప్రతిరోజూ ముప్పత్తమ్మ గుడికి వస్తూనే వుంటుంది. ఆవిడ కొడుక్కి ఇప్పుడు ఇరవై రెండేళ్ళు. చదువులో ఏవరేజ్ అయినా సినిమా  నాలెడ్జి మాత్రం అద్భుతం. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైద్రాబాదుకి తరలి వెళ్లిపోవడంతో ఆ పిల్లాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడని అఖిల నాతో అన్నది. అన్నట్టు ఆ పిల్లాడికి తెలుగు రాదు. నేర్పేవాళ్లెవరూ? తల్లికీ, తాతకీ వచ్చిన తమిళాన్నే అతనూ నేర్చుకున్నాడు.

మీకు అనుమానం రావొచ్చు. పిల్లాడి తండ్రి ఎవరా అని.. ఆ విషయంలో ఎవరైనా  ఖచ్చితంగా చెప్పగలరు  తండ్రి రాకేషేనని. కానీ అఖిల మాత్రం కొడుక్కి అబద్ధం చెప్పింది, తండ్రి మిలటరీలో పని చేస్తూ చనిపోయాడని.

ఇహ రాకేష్ సంగతా      ?   మోహన్‌ప్రసాద్‌తో జరిగిన సంభాషణని యథాతథంగా పూర్ణానంద్‌కి  చెప్పి అతని సలహా అడిగాడు….. పూర్ణానంద్ అఖిలకీ,  మోహన్‌ప్రసాద్ కూతురికీ  వున్న ప్లస్‌లూ, మైనస్‌లూ వివరించి, నిర్ణయాన్ని రాకేష్‌కే వదిలేశాడు.

తిరుపతిలో జరిగిన రాకేష్, వింధ్యల పెళ్లికి అతిరథమహారథులందరూ ఎటెండై, మోహన్‌ప్రసాద్‌గారిని అభినందనలతో ముంచెత్తారు. అదో ‘టాక్ ఆఫ్ ద  టౌన్..’! దేవుడు గొప్పవాడు. అందుకే చిట్టచివరిదాకా తోతాద్రిని సంరక్షించడమే గాక, అతను సంతోషంగా ఆడుకోవడానికి ఓ మనవడ్ని కూడా ఇచ్చాడు.

మొగుడు లేకుండా బిడ్డని కన్నదని అయినవాళ్లూ, కానివాళ్లూ ఆడిపొసుకున్నా, అఖిల మాత్రం చలించకుండా నిలబడటం నిజంగా గొప్పవిషయమే. ఆ మాటే నేనంటే..,

“అన్నా… ప్రపంచం ఎప్పటికప్పుడు కోరేది కొత్త వింతల్నేగానీ, పాతవికాదు. అయినా పాట విషయాలు  ఎంతకాలం గుర్తుంచుకుంటుందీ?సంవత్సరమో, రెండేళ్ళో మాట్లాడతారు.. ఆ తరవాత?” అని పకపకా నవ్వింది.

లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక ‘కాలపు అల’  రాకేష్‌ని అంతెత్తున నిలబెడితే, మరో ‘అల’ అతన్ని నేలమీదకి విసిరింది.

రోజూ అతను ‘అఖిల’ గురించి కనీసం పదిసార్లయినా ఆలోచిస్తాడు. ‘వింధ్య’ పెంకితనం నానాటికీ పెరుగుతూనే వుందిగానీ తరగలేదు. మోహన్‌ప్రసాద్‌గారు అనారోగ్యంతో బయటికి రావడం లేదు. ఆయనకి ఎనభై రెండేళ్ళు. రాత్రిళ్లు నిద్దర పట్టదు. కానీ,

రాకేష్ వొంటరిగా ‘మందు కొట్టడం’ మాత్రం అతను రోజూ చూస్తూనే వుంటాడు. కూతురు క్లబ్ నించి వొచ్చేసరికి రాత్రి రెండు దాటుతుంది. అప్పుడు కూడా వాళ్లిద్దరూ భార్యాభర్తల్లా వుండరు. ఎవరి పక్క వారిదే, ఎవరి భోజనాలు వాళ్లవే. వాళ్లకి పుట్టిన పిల్లలిద్దరూ కూడా ‘పోష్’ టైపు.

మోహన్‌ప్రసాద్ అప్పుడప్పుడు బాధపడుతూ వుంటాడు. ‘’లెక్కలేనంత ‘ఆస్తి’ సంపాయించి తప్పు చేశానా? ‘’ అని.

ఒకమాట చెప్పకపోతే అఖిలకి నిజంగా అన్యాయం చేసినట్టు అవుతుంది.

రాకేశ్ పెళ్లి అయ్యాక అఖిల ఎవ్వరినీ దగ్గరకి చేరనివ్వలా , ఆఖరికి రాకేష్ ని  కూడా !  సిన్సియర్ గా చిబితే  ఆమె లాంటి ఆడది మాత్రం సినీ ఫీల్డ్  లో  ఈనాటివరకూ నా కంటబడలా   !

మళ్లీ కలుద్దాం

మరో కథతో

మీ

భువనచంద్ర.

 

అసమ దాంపత్య బంధంలో ఎక్స్ ట్రా నాట్!

 

 

-ఎ . కె . ప్రభాకర్

~

 

స్త్రీవాద రచయితల్లో గీతాంజలి (డా. భారతి)ది విలక్షణమైన గొంతు. ప్రగతిశీలమహిళా వుద్యమాల్లో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తగా స్వీయ జీవిత అనుభవ నేపథ్యం నుంచి ఆమె రచించిన ‘ఆమె అడవిని జయించింది’ నవల నూత్నవస్తు – శిల్పాల స్వీకృతి కారణంగా గొప్ప సంచలనం సృష్టించింది. కుటుంబంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాల నిరసన   – స్త్రీల సమస్త శక్తి యుక్తుల్ని హరించి వాళ్ళను బోన్సాయ్ మొక్కలుగా మార్చే ఇంటి చాకిరీలోని అమానవీయ కోణాలు –  కనపడని గృహహింసకు బలయ్యే స్త్రీల ఆవేదన – పసిపిల్లలమీద జరిగే అత్యాచారాలు – ఆడదాని గర్భసంచి చుట్టూ అల్లుకొన్న రాజకీయాలు  గీతాంజలి తొలినాళ్ళలో రచించిన కథలకి (బచ్చేదానీ – 2004 ) ముఖ్య వస్తువు. ఓల్గా లాగానే స్త్రీ శరీరాన్ని కేంద్రం చేసుకొని అమలయ్యే పురుషాధిపత్య రాజకీయాలను బలంగా యెండగట్టడంతో గీతాంజలి ఆగిపోలేదు. ఒక డాక్టర్ గా , సెక్సాలజిస్టుగా ఫేమిలీ కౌన్సిలింగ్ కోసం తన దగ్గరకొచ్చే స్త్రీల హృదయవిదారకమైన జీవితాలను గొప్ప ఆర్తితో వర్ణించింది. ఆ కథల్లో ( పహెచాన్ – 2007) యెక్కువ భాగం ముస్లిం స్త్రీలకు చెందినవే కావడం విశేషం. దుర్భర దారిద్ర్యంలో నలిగిపోతూ కమ్యూనిటీ లోపలా బయటా పురుషాధిపత్య – మత భావజాలంతో పెనుగులాడే ముస్లిం మహిళల  దు:ఖ మూలాల్ని వెతికే క్రమంలో తనది కాని జీవితాలతో మమేకమౌతూ సాటిలేని సహానుభూతితో డా. గీతాంజలి కలం నుంచి వెలువడ్డ కథలు అనితర సాధ్యాలు. షాజహానా వంటి ఇన్ సైడ్ రచయితలు మాత్రమే రాయగలిగినవి.

ఇవన్నీ వొక యెత్తయితే  రైతుని నమ్ముకొన్న నేలకి దూరం చేసే సెజ్ లకు వ్యతిరేకంగా ఆమె కలం పదునెక్కింది. కరువు కోరల్లో చిక్కుకొని బతుకు తెరువు వెతుక్కుంటూ దేశాలు పట్టిపోయే పాలమూరు వలస కూలీల వెతల్ని జీవన్మరణ పోరాటాన్ని వాళ్ళ భాషలోనే (పాలమూరు వలస బతుకు చిత్రాలు – 2015) చిత్రించింది.

రచయితగా సామాజిక కార్యకర్తగా  సమాజంలో పాతుకుపోయిన సకల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే ‘మూసి ఉన్న తలుపులు వెనకాల పెళ్లి , దంపత్య జీవితం , రొమాన్స్ పేర్లతో … పెళ్లి , భర్త అనే చట్టబద్ధమైన లైసెన్సులతో  … స్త్రీల మనో దేహాల మీద జరిగే దాడి … సెక్సువల్ వయోలెన్స్’ ఎంత భయానకంగా ఉంటుందో తెలియ జేస్తూ ‘మగవాళ్ళను సెన్సిటైజ్ చేయాలనే’ వొక బలమైన ఆశతో స్త్రీల లైంగిక రాజకీయాల గురించి నిర్దిష్టమైన అవగాహనతో   గీతాంజలి రాస్తోన్న కథల పరంపరలో – శిలగాని శీల , ఫ్రిజిడ్ , నింఫోమేనియా మొదలైన  కథలు సాహిత్య ప్రపంచంలో తీవ్రప్రకంపనాలు సృష్టించాయి. ఆ క్రమంలో యింతకు మునుపు యే రచయితా స్పృశించని విలక్షణమైన వస్తువుతో వచ్చిన కథ ‘ హస్బెండ్ స్టిచ్’ ( విహంగ , మహిళా సాహిత్య మాస పత్రిక – జనవరి 2014) .

  కథ  లింక్   :  http://vihanga.com/?p=10972#sthash.25kbCw4h.dpbs

 

 

పాపినేని శివశంకర్ ‘మనుషులు వదులవుతారు’ (కథ – 1999) కథలో వొక  భర్త వయసు పెరిగిన భార్య వొదులై పోయిందని వేరే స్త్రీతో సంబంధం కోసం ప్రయత్నిస్తుంటాడు . అతనలా వెంపర్లాడుతున్నాడని తెలుసుకొని ‘నేనంటే నా ఒళ్ళు మాత్రమేనా’ అని ప్రశ్నించుకొని ఆమె వాపోతుంది. ‘మాయదారి సంసారాల్లో ఎక్కడో పెద్ద మోసం దాగుంది’ అని గ్రహిస్తుంది.

శివశంకర్ కథలో ‘సతీ సావిత్రి’ కి తన శరీరమ్మీద కనీసం గౌరవమైనా మిగిలి వుంది. సంసార సంబంధంలో యేదో మోసం వుందన్న యెరుక వుంది.  గీతాంజలి కథలో పాపం సుశీలకి ఆ రెండూ లేవు. ఆమె తనను నిర్లక్ష్యం చేసిన భర్త శంకర్రావుని మళ్ళీ తన దగ్గరకు రప్పించుకోడానికి పడరాని పాట్లు పడింది.

‘సంవత్సరం నుంచి మా మధ్య శారీరక సంబంధం లేదు’ … ‘నాతో సెక్స్ బాగోలేదట – నీది ఒదులైపోయింది అందుకే రావాలన్పించడం లేదంటాడు … ‘ఆయన మళ్ళీ నా దగ్గర్కి రావాలి. రావాలంటే నేను ఆపరేషన్‌ చేయించుకుని పెళ్ళికి ముందులా తయారవ్వాలి’ అని సుశీల తన  స్నేహితురాలు మంజులకి సిగ్గు విడిచి చెప్పుకొంది.

మాయదారి సంసారాల్లో దాగున్న మోసాన్ని గ్రహించలేక తన అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టక ఎక్స్ ట్రా నాట్ కి సిద్ధపడింది. అందుకు తాహతుకి మించిన అప్పుచేయడానికి సైతం వెనకాడలేదు. డాక్టర్ హెచ్చరించినా వినక ప్రాణం మీదకి తెచ్చుకొంటుంది. ఇదీ ‘ హస్బెండ్ స్టిచ్’ లో స్థూలంగా కథ .

సుశీల అభద్రతకీ భయానికీ దు:ఖానికీ  కారణాలని రచయిత కథ నుంచీ పక్కకు వెళ్లి యెక్కడా ప్రత్యక్షంగా పేర్కొనక పోవడంలో గొప్ప సంయమనం ప్రదర్శించింది. దాంపత్య జీవితంలోని లైంగికత గురించి –  నియంత్రణల గురించి – పురుషానుకూలగా యేక పక్షంగా పాతుకుపోయిన  సామాజిక చట్రాల గురించి – భావజాలం గురించి పాఠకుల్లో సవాలక్ష ఆలోచనలు , ప్రశ్నలు పుట్టాడానికి అవకాశం యిచ్చే విధంగా కథాగమనంలో  అనేక పొరలు నిర్మించింది. గీతాంజలి రచించిన యితర కథలనుంచి ఈ కథ ప్రత్యేకంగా రూపొందడానికి అందులో వాడిన విశిష్టమైన శిల్పమే కారణమైంది ( గీతాంజలి కథల్లో కథ పొడవునా వొక వొడవని దు:ఖం చెవులు హోరెత్తేలా గుండెలు అవిసేలా వినిపిస్తూ వుంటుంది. కానీ ఈ కథలో మాత్రం దు:ఖ కారణాలే అక్షరాల మాటున దాగి రహస్యంగా ధ్వనిస్తాయి) .

వస్తు స్వీకరణ దగ్గర్నుంచీ యెత్తుగడ , యితివృత్త నిర్వహణ,  పాత్రల యెంపిక , ముగింపు అన్నీ చక్కగా అమరిన కథ యిది. దాంపత్య సంబంధంలో లైంగిక ప్రక్రియలో మాధుర్యం గురించి పురుష దృష్టికోణం నుంచే నిర్వచించే భావజాలాన్ని నిరసిస్తూ పడక గదుల్లో అమలయ్యే పురుషాధిపత్య లైంగిక రాజకీయాల మూలాల్ని  స్త్రీవాద సాహిత్యం చాల చోట్ల చర్చకి పెట్టినప్పటికీ ‘‘ హస్బెండ్ స్టిచ్’’ లాంటి వస్తువుని యెవరూ యెక్కడా స్వీకరించిన దాఖలాల్లేవు. అందువల్ల గీతాంజలి కథల్లోనే కాదు ; స్త్రీ వాద సాహిత్యంలో సైతం యీ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది.

బిడ్డ సైజ్ పెద్దగా వున్న కారణంగానో , సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేని కారణంగానో , బిడ్డకో తల్లికో ప్రాణాపాయం యెదురైన హడావిడిలో కాన్పు చేసే  కారణంగానో … ప్రసవ సమయంలో స్త్రీ జననాంగం చిరగడం వల్ల కావొచ్చు లేదా ప్రసవం తేలికగా కావడానికి కట్ (episiotomy ) చేయడం వల్ల కావొచ్చు ;  ప్రసవానంతరం మళ్ళీ పూర్వ స్థితి కోసం కుట్లు వేయాల్సిన అవసరం యేర్పడుతుంది.  అలా కుడుతూ – దాంపత్యంలో భర్తకి తృప్తి కలగడానికి వొకటి రెండు కుట్లు అదనంగా వేస్తారు. చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియలో ఆ స్త్రీ ప్రమేయం వుండదు. కోసినట్టుగానీ అదనపు కుట్లు వేసినట్టుగానీ ఆమెకు తెలియజేయడం జరగదు. ఒక్కోసారి యిది భర్త కోరిక మేరకు చేస్తారు. లేదా డాక్టరే స్వయంగా నిర్ణయం తీసుకొని చేస్తారు. భర్త కోసం వేసే అదనపు కుట్టు కాబట్టి దీన్ని హస్బెండ్ స్టిచ్ అనీ ఎక్స్ ట్రా నాట్ అనీ అంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి ,మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని నమ్మే స్త్రీలు కూడా ఉంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం వుండదనీ తర్వాతి కలయికల్లో స్త్రీలు నరకాన్ని అనుభవిస్తారనీ , భర్తలు కూడా సుఖపడరనీ సర్వేల ద్వారా పరిశోధనలద్వారా తెలుస్తోంది (వివ . Mama Birth – July 28 , 2013). వ్యాపార దృష్టి లేని మంచి  డాక్టర్లు ఈ ప్రొసీజర్ ని ప్రోత్సహించరు.

‘కాన్పులనీ , కుట్లనీ , సిజేరియన్లు , హిస్టెరెక్టమీలు – ట్యూబెక్టమీలు రీకేనలైజేషన్లనీ అన్ని గాట్లు, కాట్లు ఆడవాళ్ళకు అవుతూనే ఉంటాయనీ’ అలా స్త్రీ శరీరమ్మీద పెద్ద వైద్య వ్యాపారం జరుగుతోందని చెప్తూ  , అందాల అంగడిలోనూ –   ఆరోగ్య విపణిలోనూ స్త్రీ శరీరం సరుకైన వైనం చుట్టూ అల్లిన సాహిత్యం చదువుకొన్నాం. ఆ క్రమంలో వచ్చిన డా. గీతాంజలి ‘హస్బెండ్ స్టిచ్’  బలమైన కథగా రూపొందడానికి కారణం – వస్తు శిల్పాల చక్కటి సమన్వయమే. కథలో కథని మాత్రమే చెప్పాలన్న సూత్రాన్ని రచయిత నిక్కచ్చిగా పాటించింది.

కథకి అవసరమైన సాంకేతికమైన  వైద్య పరమైన విషయాల్ని  కథలో రచయిత్రి  నేరుగా ప్రస్తావించకుండా డాక్టర్ ముఖత: చెప్పించడంతో ప్రతిపాదితాంశాలకి   ప్రామాణికత విశ్వసనీయత లభించాయి. సుశీల దాంపత్య జీవితంలో యెదుర్కొనే సమస్యనీ , అందుకు ఆమె యెంచుకొన్న పరిష్కారాన్నీ , అందులోని సాధక బాధకాల్ని విప్పి చెప్పడానికి  గీతాంజలి కథని నెరేటివ్ స్టైల్లోగాక సంభాషణ శైలిలో నడిపింది. అందువల్ల కథలో రచయిత ప్రమేయం దాదాపు శూన్యమే. సుశీల తన బాల్య స్నేహితురాలు మంజులతో , పక్కింటి సుమతితో , డాక్టరమ్మతో చేసిన మూడు సంభాషణల్లో రచయిత్రి కంఠస్వరం డాక్టర్ పాత్రలో స్పష్టంగా వినిపిస్తుంది. రచయిత్రి నిజ జీవితంలో  తన దగ్గరకి కౌన్సిలింగ్ కోసం వచ్చే సుశీల లాంటి పేషంట్ల పట్ల చూపే సహానుభూతే డాక్టర్ మాటల్లో ప్రతిధ్వనించింది.

‘కాన్పు తర్వాత యోని కండరాలు మళ్ళీ సంకోచించి పోతాయి. వాటికి సాగే గుణంతో పాటు ముడుచుకునే గుణం కూడా ఉంటుంది. చాలా తక్కువ కేసుల్లో 10,12 మంది పిల్లల్ని కన్న వాళ్ళల్లో, నీలా పల్లెల్లో మంత్రసానులతో కాన్పులయిన వాళ్ళలో ఈ సమస్య వస్తుంది

‘నీ భర్తను ఒకసారి కౌన్సిలింగ్‌కి నా దగ్గర్కి తీసుకురా అతనికి అంతా వివరంగా చెప్పి నిన్నిలా వేధించద్దని చెప్తాను. నీకు కొన్ని ఎక్సర్‌ సైజులు చెప్తాను , అవి చేస్తే ఇంకా బిగుతయ్యే అవకాశం ఉంటుంది.

‘ఈ ఆపరేషన్‌ అయ్యాక అంతా బాగవుతుందనుకోవద్దు. నీ భర్తకు బాగుండచ్చు కానీ కుట్లు మరీ బిగుతై పోయి కలయిక భరించలేనంత నొప్పిగా ఉండి దాంపత్య జీవితం పట్ల భయం కలుగవచ్చు. మధ్య మధ్యలో యోని నించి రక్తప్రావం అవుతూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి.’

డాక్టర్ చెప్పే మాటల్లోని సారాంశం భరోసా హెచ్చరిక  సుశీలకి యెక్కలేదు. జీవితంలోని అభద్రతే ఆమెని భయపెట్టింది. అందుకున్న యితరేతర కారణాలని కూడా రచయిత సుశీల అంతర్మథనం ద్వారా స్పష్టం చేస్తుంది. నిజానికి సుశీల ‘పెళ్ళైన వాడని తెల్సీ’ ఎందుకో శంకర్రావంటే  ‘పిచ్చి ఆకర్షణ కలిగి అతనితో పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసేస్కుంది. అమ్మ, నాన్న వెళ్ళగొట్టారు. అతని మొదటి భార్య విజయ ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికింది . ఆమెకిద్దరు మగ పిల్లలు. తనకు కవల ఆడపిల్లలు పుట్టారు.’

సుశీలకి పెళ్లై నాలుగేళ్లే. కానీ దాంపత్య జీవితంలో ఎన్ని రకాల దు:ఖాల్ని మోసుకు తిరుగుతుంది? అందుకు కారణం తాను వొదులై పోవడమా? ఆడపిల్లల్ని కనడమా? రెండో భార్య కావడమా ?ఆమెకు అర్థం కాదు. అసలు కారణం శంకర్రావులోని చావనిస్ట్ మగాడు. కన్న బిడ్డలు తండ్రి ప్రేమకి దూరం కాకుండా వుండడానికి ఆమె తోటి స్త్రీతో పోటీకి దిగింది. భర్త తన కొంగు వదలకుండా వుండేలా చేసుకోడానికి దేనికైనా సిద్ధపడింది. తన శరీరాన్ని పణ్య వస్తువు చేసుకొని మొగుడిని ఆకర్షించే ఆలోచనలు చేసింది. ఆకట్టుకొనే దారులు వెతికింది. అటువంటి పరిస్థితుల్లో పక్కింటి సుమతి   [పేర్ల ఎంపికలో కూడా రచయిత్రి  దృక్పథం వ్యక్తమౌతుంది ; స్త్రీని కేవలం శరీరంగా , సెక్స్ అవసరాలు తీర్చే యంత్రంగా భావించే శంకర్రవులాంటి శృంగార పురుషుల్ని అన్నివిధాలా సుఖపెట్టడానికే అంకితమైన – పాతివ్రత్య ధర్మాలు జీర్ణించుకొన్న పురాణ పాత్రలు ]  మాటలు సుశీలకి అమృతోపమమయ్యాయి.

కాన్పు అయ్యాక మానం వెడల్పుగా సాగుతుంది కదా భర్తకు తర్వాత కలయిక బాగుండాలని, అక్కడ బిగుతుగా ఉండాలని ఒక కుట్టు ఎక్స్‌ట్రా వేస్తార్లే. నేను నా రెండు కాన్పులకీ వేస్కున్నానాకు ముందే తెల్సు. డాక్టరమ్మని ముందే అడిగా. ఎక్స్‌ట్రా మనీ అడిగిందనుకో, కాపురం కంటే ఎక్కువా చెప్పు? మా ఆయనా పోరు బెట్టాడనుకో డాక్టరమ్మ ఎంత డబ్బడిగితే అంతిచ్చాడు తెల్సా ? నువ్వూ అట్లా చేయించుకోవాల్సింది’

సుమతి సుశీలతో అన్న మాటల్లో కాపురాలు కాపాడుకోటానికి దాంపత్య సంబంధాల్ని సడలకుండా చూసుకోడానికి స్త్రీలు పడుతున్న అవస్తలే కాదు ; ఎక్స్ ట్రా నాట్ లు డాక్టర్లకి ఎక్స్ ట్రా మనీ మూటలు కట్టడానికి యెంతగా తోడ్పడుతున్నాయో తెలుస్తుంది. అందుకు భర్తలు యెంత వుదారంగా వుంటారో దూరదృష్టితో ప్రవర్తిస్తారో అర్థమౌతుంది.

నా దగ్గర్కి ఆయన రావాలి మేడమ్‌. పిచ్చెక్కుతోంది ఆయన రాకపోతే. సెక్స్‌ కోసం కాదు మేడమ్‌ నాకు ఆయనంటే ప్రేమ. పిల్లలు నాన్న కావాలంటారు. నా దగ్గర ఆకర్షణ లేకపోతే ఎందుకొస్తారు మేడమ్‌? నాకు ఎక్స్ ట్రా నాట్‌ కావాలి . పల్లెటూల్లో కాన్పు కావడం వల్ల అక్కడ మీ లాంటి డాక్టరమ్మ కాకుండా మంత్రసాని తో కాన్పు చేయించుకున్నా . అందుకే వదులై పోయింది మేడమ్‌. నేను టైట్‌ చేయించుకోవాలనుకుంటున్నా.

అని సుశీల డాక్టరమ్మని ప్రాధేయపడింది. సుశీల యెదుర్కొన్న హైన్యం మనస్సుని కలచివేస్తుంది. స్త్రీని యింతగా బలహీనురాల్ని చేసున్న సామాజిక – సాంస్కృతిక నిర్మాణాల పట్ల క్రోధం కల్గుతుంది.

డాక్టరమ్మ వద్దని యెంత కౌన్సిలింగ్ చేసినా వినకుండా  సుశీల చేయించుకొన్న ఆపరేషన్ సఫలం కాలేదు. సంసారాన్ని నిలబెట్టుకోడానికి వేయించుకొన్న ఎక్స్ ట్రా నాట్ తో ఆమె భర్తని కట్టివేయలేకపోయింది. భర్త మీద అలవికాని ప్రేమను చూపుతున్నాను  అనుకొని అసమ దాంపత్యంలో హింసని అనుభవించింది.

‘కలయికలో నొప్పి భరించలేక గావు కేకలు పెట్టలేక పళ్ళు బిగువన కన్నీళ్ళు కారుతుంటే భరించింది సుశీల. తర్వాత కలయిక అంటే చచ్చేంత భయం ఏర్పడినా భర్త కోసం ఆ భయంకరమైన నొప్పిని భరించసాగింది. భర్త కళ్ళ ముందుంటే చాలు అనుకుంది.’

పంచ కన్యల పురాణ గాథలు – వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు , సిలికాన్ యింప్లాంటేషన్ లు వెజైనోప్లాస్టీ – ఎక్స్ ట్రా నాట్ ల వరకూ   అన్నీ లైంగిక తృప్తిని  పురుష కేంద్రంగానే నిర్వచించి డిజైన్ చేయడంలో భాగంగానే పడగ్గదుల్లోకి ప్రవేశిస్తున్నాయనే స్పృహ కథ చదువుతున్నంతసేపూ మనకు కలుగుతూనే వుంటుంది. దాంపత్యంలో సమ భావన , సమ భాగస్వామ్యం లేకుండా చేసిన పురుషస్వామ్య భావజాలంలోని హింస యెరుకవుతూనే వుంటుంది. ఒకరికి యిద్దరిని కట్టుకొని విలాసంగా రొమ్ము విరుచుకొని తిరిగే శంకర్రావుల కాళ్ళ దగ్గరే పడివుండాల్సిన అగత్యాన్ని , దుస్థితిని  స్త్రీలకు  కల్పిస్తున్న సమస్త  కారణాల పట్ల – భావజాలం పట్ల అసహనం కలుగుతుంది. కథ పొడవునా రచయిత వుద్దేశ్యం స్పష్టమౌతూనే వున్నప్పటికీ ముగింపు దగ్గరకొచ్చేసరికి  కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.

నొప్పి భరించైనా భర్తతో బంధాన్ని కాపాడుకోవాలని సుశీల అనుకొన్నప్పటికీ ‘ఎక్స్ ట్రా నాట్ మహిమ’ తో లభించిన భోగం మూడు నెలల ముచ్చటే అయ్యింది. సమస్య మళ్ళీ మొదటికి రావడంతో భర్త తిరస్కారంతో సుశీల బీపీ పెరిగి పక్షవాతానికి గురై ఆసుపత్రి పాలయ్యింది.

కథని నిర్మాణ పరంగా కొంత ఎడిట్ చేసుకొంటే బాగుండేది అనిపించినా రచయిత తాను చర్చించదలచుకొన్న సమస్యకి (కథా వస్తువుకి) – సుశీలనీ , పాఠకులకి – సుశీల పట్ల సానుభూతి చూపే మంజులనీ , సమస్య చుట్టూ నిర్మితమైన సామాజిక విలువలకీ భావజాలానికీ – సుమతినీ , రచయిత్రి గొంతుకి – డాక్టరమ్మనీ ప్రతినిధులుగా యెంచుకొని కథ నడిపినట్టు తోస్తుంది. ఇది కథలో దాగి వున్న అంతర్గత నిర్మాణం.

సుశీల వైవాహిక జీవితాన్ని మొదట్నుంచీ యెరిగిన ఆమె స్నేహితురాలు మంజుల దయనీయమైన ఆ పరిస్థితిని చూసి చలించిపోయింది. పాఠకులకి కలిగే ప్రశ్నలే కథ ప్రారంభం నుంచీ మంజులకి కూడా కలుగుతాయి. టీచర్ గా పనిచేస్తున్న మంజులకి జీవితంలో కొత్త పజిల్  యెదురైంది.

ముఫ్పై నిండిన మంజుల మొన్నొచ్చిన సంబంధానికి అవునని చెప్పాలో, కాదని చెప్పాలో తేల్చుకోలేకుండా ఉంది.

 

ఇదీ రచయిత్రి కథకిచ్చిన ముగింపు. పాఠక దృష్టికోణం నుంచి యిచ్చిన యీ  యేక వాక్యపు ముగింపు   కథలో రచయిత్రి చెప్పిన విషయాల గురించే గాక చెప్పని విషయాల గురించి , మంజుల అంతరంగంలో మెదిలిన అనేక ప్రకల్పనల గురించి యెంతగానో ఆలోచించేలా చేస్తుంది. రేపు తన భర్త కూడా శంకరరావు లాంటి వాడే అయితే అన్న సందేహం ఆమెకు కల్గిందని వొక్క మాటలో తెల్చివేయలేం. అటువంటి  సందేహ ప్రస్తావన కథ మధ్యలో కూడా వచ్చింది. మంజుల మనస్సులో కల్గిన వూగిసలాటకి కారణాలు కేవలం వైయక్తికమైనవి కావు. సుశీల – సుమతి – తనూ వ్యవస్థీకృత విలువలకి బానిసలవుతున్న పరిస్థితులన్నిటి గురించీ  విమర్శనాత్మక దృష్టితో విశ్లేషిస్తూ క్రాస్ రోడ్ల కూడలిలో ఆమె నిలబడింది.

 

స్త్రీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే హింస పట్ల భయం ,  పెళ్లి అనే వ్యవస్థ పట్ల అనుమానమూ  , స్త్రీపురుష సంబంధంలో  అసమానతలని వైరుధ్యాలని  సృష్టించిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలం వల్ల కాపురాల్లో సంభవించే  కల్లోలాల గురించిన  లోచూపూ ,  ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన అన్నీ వొక్కసారిగా ఆమెను చుట్టుముట్టి   వుంటాయి. పెళ్లి పేరున మొత్తం స్త్రీ జాతి అనుభవిస్తున్న బంధనాలు ఆమెను పెళ్లి గురించి పునరాలోచించేలా  చేశాయి.

 

సాధారణంగా ముగింపు వాక్యం రచయిత దృక్పథాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగ పడుతుంది. గీతాంజలి యీ కథని కేవలం ఎక్స్ ట్రా నాట్ గురించి మాత్రమే వుద్దేశించి రాయలేదనీ ముడివడని అసమ దాంపత్య సంబంధాలన్నిటినీ చర్చకు పెట్టడమే ఆమె లక్ష్యమనీ , పురుష ఆధిపత్య వ్యవస్థీ కృత విలువల్ని ప్రశ్నించడానికి ప్రేరేపించడమే ప్రధానమైన ఆశయమనీ  ముగింపు ద్వారా నిరూపించింది. ఆ ప్రయత్నంలో ఆమె అన్ని విధాల సఫలమయ్యింది.

మగవాళ్ళనందరినీ శంకరర్రావు పక్కన నిలబెట్టి ప్రకృతి సహజమైన స్త్రీ పురుష సంబంధాన్నే తిరస్కరించే దిశగా గాక మనస్సుతో నిమిత్తం లేకుండా దేహభాషకే పరిమితమైన  శృంగారంలో  తృప్తి – భావప్రాప్తి వంటి పదాల చుట్టూ అల్లుకొని వున్న పురుష  లైంగిక రాజకీయాల గురించి పాఠకులు ఆలోచించడానికి ఆస్కారం కల్గించడానికే రచయిత యిటువంటి open ముగింపుని యిచ్చినట్లు  తోస్తుంది.

మగవాళ్ళని సెన్సిటైజ్ చేయడం కూడా తన యీ కథల రచనోద్దేశాల్లో వుందని రచయిత్రి చెప్పినప్పటికీ  స్త్రీలను అనేక రూపాల్లో కట్టిపడేస్తున్న “బంధాల” గురించి సరైన అవగాహన కల్గించడానికి యీ కథ బలంగా దోహదం చేస్తుంది. ప్రధాన స్రవంతిలో యిటువంటి కథలు మరెన్నో  రావాల్సి వుంది. ఆ దిశలో డా. గీతాంజలి చేస్తున్న కథా వ్యాసంగాన్ని మనసారా స్వాగతిస్తున్నాను.

 

బొంబాయి ఐ.ఐ.టి –తెలుగులో తొలి అడుగులు   

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

తారీకు గుర్తు లేదు కానీ అది 1966 జూన్, జూలై లలో ఒక రోజు. బొంబాయిలో అరవ్వాళ్ళు ఎక్కువగా ఉండే మద్రాసు మాంబళం లాంటి మాటుంగా అనే చోట మడత మంచాల హోటల్ లో పొద్దున్నే లేచి నేనూ, గోవింద రాజులూ లోకల్ రైలూ, BEST వాళ్ళ బస్సూ ఎక్కి అంతకు ముందు రోజే రిహార్సల్స్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండానే పవయ్ అనే ప్రాంతంలో ఉన్న ఐఐటి కి మా ఇంటర్వ్యూ కోసం చేరుకున్నాం. మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ లో అడుగుపెట్టగానే పట్ట పగలే అన్ని ట్యూబులైట్లూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడం  నాకు మొట్టమొదట ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంత వరకూ కాకినాడలో నేను ఎప్పుడూ మా ఇంట్లో కానీ, కాలేజ్ లో కానీ పగలు లైట్లు వేసుకోడం చూడ లేదు. పైగా పొరపాటున వేస్తే “వెధవ కరెంట్ ఖర్చు అయిపోతుంది” అనే మాటలు వినపడేవి. ఆ రోజు మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూకి దేశంలో అన్నిచోట్ల నుంచీ సుమారు 300మంది పైగా వచ్చారు… అందరితో బాటూ భయం, భయంగా కూచున్నాం. మా లాగే ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్ళలో కొందరు బొంబాయి లోనే చదువుకున్న వాళ్ళు, కొందరు కేరళ, గుజరాత్, బెంగాల్..ఇలా అన్ని రాష్ట్రాల నుంచీ వచ్చిన వాళ్ళు ఉన్నా బొంబాయి వాళ్ళకి మాత్రం మేము కాస్త బైతుల్లాగా కనపడ్డాం అని నాకు అనుమానం వేసింది. ఎందుకంటే వాళ్ళ వేషభాషలు, ధైర్యం, కలుపుగోలుదనం ఇతర రాష్ట్రాల వాళ్ళ కంటే కొంచెం దర్జాగా ఉంది. పైగా ఇంగ్లీషు మాట్లాడడం బావుంది. ఆప్పుడే నాకు తెలిసిపోయింది మనకి ఆ భాష గొప్పగా మాట్లాడడం రాదు సుమా అని. ఇప్పటికీ అది నిజమే కదా!

అంత మందిలో నేనూ, గోవిందరాజులూ భయం భయంగా కూచుని ఉండగా అప్పుడు మా గదిలోకి కొంత మంది ప్రొఫెసర్లు వచ్చి ఇంటర్వ్యూ పద్ధతులు వివరించారు. అందులో మా కొంప ముంచే రెండు “బాంబ్ షెల్స్” ఉన్నాయి.  అందులో మొదటిది మెకానికల్ ఇంజనీరింగ్ లో మెషీన్ టూల్స్, మెషీన్ డిజైన్, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్ లాంటి ఐదారు బ్రాంచ్ లు అన్నింటికీ కలిపి ఉండే సీట్లు మొత్తం ముఫై లోపేట.   అంటే ఒక్కొక్క విభాగం లోనూ మాస్టర్స్ డిగ్రీ కి ఐదారు సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ విషయం తెలిసి మూడు వందల మందిలో ముఫై సీట్లయితే “ఎక్కడో ఆంధ్రా బాపతు గాళ్ళం, మన పని ఉట్టిదే గురూ. అనవసరంగా వచ్చి చచ్చాం” అని నేనూ, గోవిందరాజులూ అనుకుంటుంటే, రెండో బాంబ్ షెల్ ఏమిటంటే కేండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదటి ఎలిమినేషన్ రౌండ్ గా ఎంట్రెన్స్ పరీక్ష పెట్టడానికి వారు నిర్ణయించుకున్నారుట. అది వినగానే కాస్త దడ పట్టుకుంది. ఎందుకంటే, ఇంజనీరింగ్ పరీక్షలు అంటే లెక్కలు కట్టడానికి కనీసం స్లైడ్ రూల్ అయినా ఉండాలి. అది లేక పొతే చేతి వేళ్ళతో ఇంజనీరింగ్ లెక్కలు చెయ్యలేం. కేలుక్యులేటర్ లాంటి మాటలు అప్పటికి పుట్ట లేదు. పైగా ఆ పరీక్షలో ఏమైనా డ్రాయింగులు గియ్యమని అని అడిగితే టీ-స్క్వేరు, పెన్సిళ్లు, డ్రాయింగ్ పరికరాలు ఉండాలి. మన దగ్గర అవేమీ లేవు. అంచేత పరీక్ష రాయడానికి ముందే ఫెయిల్ అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ ఇంటర్వ్యూకి వచ్చిన ఎవరి దగ్గరా కూడా అవి లేక పోయే సరికి నాకు కాస్త ధైర్యం, ఇంకాస్త అనుమానం వచ్చి అక్కడ టై కట్టుకుని హడావుడి గా తిరుగుతున్న ఒక ప్రొఫెసర్ గారితో “మాకు ముందు ఈ పరీక్ష గురించి తెలిస్తే అన్నీ తెచ్చుకునే వాళ్ళం” అని నా గోడు వెళ్ళబుచ్సుకున్నాను. ఆయన ఓ నవ్వు నవ్వి  “అవేం అక్కర లేదు. ఈ పరీక్షలో ఇది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.  కరెక్ట్ ఆన్సర్ టిక్కు పెట్టడమే” అన్నాడు. ఈ రోజుల్లో ఎవరూ నమ్మరు కానీ, ఆ రోజుల్లో మా కాకినాడ కాలేజ్ లో కానీ ఆంధ్రా ప్రాంతాలలో మరెక్కడా కానీ ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నా పత్రాల పద్ధతి లేదు. ఒక్క ప్రాక్టికల్స్ తప్ప పరీక్ష ఏ సబ్జెక్ట్ లో అయినా ప్రతీ ప్రశ్నకీ పోలోమని దస్తాల కొద్దీ ఆన్సర్లు రాసెయ్యడమే. పైగా ఎన్ని పేజీలు  రాస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుని పెద్ద పెద్ద అక్షరాలతో పేజీలు  నింపేసే వాళ్ళం. అప్పటి వరకూ మల్టిపుల్ చాయిస్ గురించి వినడమే కానీ అలాంటి పరీక్షలు రాయ లేదు. మొత్తానికి వాళ్ళు సైక్లో స్టైల్ కాపీలు అందరికీ ఇచ్చి పరీక్ష పెట్టారు. అప్పటికి ఈ క్సీరాక్స్ అనే పేరే ఎవరూ వినలేదు. దేనికైనా కాపీలు కావాలంటే ఒక స్పెషల్ పేపరు మీద టైపు కొట్టి, ప్రింటింగ్ యంత్రం లాంటి దాంట్లో పెట్టి అలాంటి స్పెషల్ పేపర్ల కాపీలు తీసే వారు. ఆ పరీక్షకి సరిగ్గా గంట టైమ్ ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ లోనూ సుమారు వంద ప్రశ్నలు….ప్రశ్నకి ఒక మార్కు వేసినా  తప్పు ఆన్సర్ రాస్తే అర మార్కు తీసేస్తారు. అంచేత ఖచ్చితంగా సరి అయిన సమాధానం తెలిస్తేనే టిక్కు పెట్టాలి. లేక పొతే నెగెటివ్ మార్కులు వస్తాయి. మొత్తం ఉన్న సీట్లు 30 కాబట్టి వచ్చిన మూడు వందల మందిలోనూ వంద మందిని మాత్రమే పెర్సనల్ ఇంటర్వ్యూ కి ఎంపిక చేసి మిగిలిన వాళ్ళని పంపించేశారు. ఈ పరీక్షలో పాస్ అయి నేనూ, గోవిందరాజులూ ఇంటర్వ్యూ కి ఎంపిక అయ్యాం. అప్పుడు ఎంపిక అయిన ఆ వంద మందిలో ఉన్న ఎనిమిది బ్రాంచ్ లకీ సీట్లు ఐదేసి ఉంటే ఇంటర్వ్యూ కి పదేసి మంది చొప్పున మళ్ళీ ఎవరికీ ఏ బ్రాంచ్ కావాలో చెప్పమని మరో పత్రం ఇచ్చారు. అప్పటికే ఉన్న అన్నింటిలోనూ ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచ్ లు – అంటే మెషీన్ టూల్స్,  మెషీన్ డిజైన్ లాంటి నాలుగు బ్రాంచ్ లలో మనకి ఎలాగా సీటు రాదు అని తెలిసిపోయింది కాబట్టి మరో రెండు బ్రాంచ్ లకి మేం ఇద్దరం మా పేర్లు ఇచ్చి పిలుపు కోసం కూచున్నాం. సాయంత్రం నాలుగు గంటలకి ఆ ఇంటర్వ్యూలు అయ్యాయి. వాటిల్లో నాకు సీటు రాదు అని అనుమానం వచ్చి విచారంగా కూచున్నప్పుడు ఒక ప్రొఫెసర్ గారు వచ్చి ఫ్ల్యూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ లో ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూకి రావచ్చును అని ప్రకటించారు. చెప్పొద్దూ..అప్పటి దాకా అలాంటి బ్రాంచ్ ఉంది అనే మా ఇద్దరికీ తెలియదు. మరో అవకాశం ఉంది అని వినగానే ఇద్దరం పేర్లు ఇచ్చేశాం. ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న ముగ్గురు ముందుగా నా ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్ష మార్క్ షీట్ అడిగి, “నీకు  హైడ్రాలిక్స్ లో మంచి మార్కులు వచ్చాయే” అని మెచ్చుకుని ఆ సబ్జెక్ట్ లో తప్ప ఇంజనీరింగ్ తప్ప ఇతర రకాల మామూలు ప్రశ్నలు అడిగారు. గోవింద రాజులు కూడా తన ఇంటర్ వ్యూ బాగానే అయింది అని చెప్పాడు. మొత్తానికి రాత్రి ఎనిమిది గంటలకి అన్ని బ్రాంచ్ ల ఇంటర్ వ్యూలూ అయ్యాక, ఎంపిక అయిన అభ్యర్థుల లిస్టు ఆయా బ్రాంచ్ తాలూకు ప్రొఫెసర్లు అక్కడ నోటీసు బోర్డ్ లో పెట్టారు. అల్లా ఒక్కొక్క నోటీసూ చూసుకుని, ఎందులోనూ మా ఇద్దరి పేర్లూ లేకపోవడంతో ఎంపిక అయిన వాళ్ళ నవ్వు మొహాల్లో మేము ఏడుపు మొహాలు పెట్టుకుని వెళ్లిపోడానికి సామాను సద్దేసుకుంటూ ఉండగా ఆఖర్న ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ వాళ్ళ లిస్టు వచ్చింది. ఎంపిక చేసిన ఐదుగురులో నా పేరు చూసి కళ్ళు తిరిగాయి. నా కంటే ఎక్కువగా గోవింద రాజులు కళ్ళు తరిగాయి. ఎందుకంటే నా కన్నా అన్ని విధాలుగానూ ఎక్కువ మార్కులు వచ్చిన అతని పేరు సీటు వచ్చిన వాళ్ళ లిస్టులో లేదు కానీ  ప్రొవిజినల్ లిస్టు లో ఉంది. అంటే సెలెక్ట్ అయినా ఐదుగురిలో ఒక వేళ ఎవరైనా చేరక పొతే ఆ ఖాళీలో అతను చేర వచ్చును అనమాట.

ఎక్కడో కాకినాడ నుంచి మా ఇద్దరిలో ఎక్కువ అర్హత ఉన్న గోవిందరాజులు బదులు  బదులు నాకు సీటు రావడంతో ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచనలో పడ్డాం. అప్పుడు నాకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఆ ప్రొఫెసర్ గారి ఇల్లు ఎక్కడో కనుక్కుని ఆయన ఇంటికి వెళ్లాం ఇద్దరం. అప్పుడు రాత్రి 10:30. పాపం ఆయన కూడా పొద్దుటి నుంచీ ఇంటర్వ్యూలు చేస్తూ చాలా అలిసిపోయి భోజనానికి కూచుని మేము తలుపు కొట్టగానే తలుపు తీసి “ఎవరు మీరు?” అని అడిగాడు. “నాకు మీ బ్రాంచ్ లో సీటు ఇచ్చినందుకు కృతజ్ఞలు చెప్పుకుందాం అని వచ్చాం” అనగానే ఆయన ఆశ్చర్యం గా “నాకు మీ మొహాలు గుర్తు లేదు. అయినా ఇంత రాత్రి ఇలా రావడం ఎందుకు. రేప్పొద్దున్నే ఫీజు కట్టేసి చేరిపోండి” అన్నారు విసుగ్గా. “అది కాదు సార్. మే ఇద్దరం తూర్పు తీరం లో ఉన్న కాకినాడ నుంచి కలిసి వచ్చాం. మీరు నాకు ఒక్కడికే సీటు ఇచ్చారు. ఇతనికి ప్రొవిజినల్  గా బదులు క్లాసులో చేర్చుకుంటే మీ ఋణం తీర్చుకోలేం. ఇద్ద్దరం కలిసి చదువుకుంటాం” అని మా సమస్య వివరించాను. ఆయన ఇంకా ఎక్కువ ఆశ్చర్య పోయి “అసలు నువ్వే ఎవడివో నాకు తెలీదు. ఇంకోడిని రికమెండ్ చెయ్యడానికి అర్థ రాత్రి వచ్చావా?” అని కోప్పడి తెలుపులు వేసేసుకున్నారు. ఇంక చేసేది ఏమీ లేక ఇద్దరం ఆఖరి బస్సు పట్టుకుని మాటుంగా వెళ్లి పోయాం. మర్నాడు రైల్లో గోవింద రాజులు బెంగళూరు ఇండియన్ ఇన్స్ టిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఇంటర్వ్యూ కి వెళ్ళిపోయాడు. ఇది 1966 జూన్ లో జరిగింది. ఆ తరువాత ఇప్పటిదాకా – అంటే 50 ఏళ్లలో  గోవిందరాజుల్ని మళ్ళీ చూడ లేదు.

ఇలా బొంబాయి IIT లో నాకు ఎడ్మిషన్ రావడం నా జీవితంలో చాలా పెద్ద మలుపు. అనుకోని, ఆశించని మంచి మలుపు. నేను చాలా అదృష్టవంతుడిని అని అనుకోడానికి ఒక దృష్టాంతం. అంతే కాదు. నాకు తెలిసినంత వరకూ కాకినాడ నుంచి బొంబాయి ఐఐటి లో చేరిన మొట్టమొదటి వాడిన నేనే! నా తరువాత మా డిపార్ట్మెంట్ లోనే చేరడానికి పరోక్షంగానూ, నా ప్రమేయం వలనా నా జూనియర్లు చాలా మంది అక్కడ చేరడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం.

1966 నుంచి 1974 దాకా నా బొంబాయి జీవితం వివరాలు – త్వరలోనే….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చిగురంత ఆశ ..ఈ చిన్ని సినిమా!

 

siva

 

శివలక్ష్మి 

~

గర్ల్ రైజింగ్ (Girl Rising)  అనే ఈ స్పెషల్ ఇంట్రస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ న్యూయార్క్ లో చిత్రీకరించబడింది.

ఈ చిత్ర దర్శకుడు రిచర్డ్ రాబిన్స్ .

ఈ సినిమా నిడివి గంటా 41 నిమిషాలు.

 

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆడపిల్లలు పుట్టిన దగ్గరనుంచి పెరుగుతున్న క్రమంలో పడుతున్న దారుణ మైన హింసల్ని రికార్డ్ చేసిన చిత్రమిది. బాల్య వివాహాలు,  పిల్లల బానిసత్వం, నిరక్షరాస్యత, పేదరికం, మానవ రవాణా మొదలైన సమస్యల గురించి హృదయ విదారకమైన కథలు చెబుతుంది. 9 దేశాల ప్రతినిధులుగా 9 మంది బాలికలు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తామని గొప్ప ఆశావాదాన్ని వినిపిస్తారు.

కంబోడియా మురికి వాడ నుంచి వచ్చిన అనాధ “సోఖా” చురుకైన విద్యార్ధిగా, ‘నర్తకి’ గా మారిన విధానాన్ని మనసులో నిల్చిపోయేటట్లు చిత్రించారు.

నేపాల్ నుంచి “సుమ బలవంతపు దాస్యం నుంచి తాను తప్పించుకుని మిగిలిన తనలాంటివారిని తన సంగీత విద్య ద్వారా బాధ్యతగా తప్పించే పనిలో నిమగ్న మవడం చూస్తాం.

ఇండియా నుంచి కలకత్తాలో రోడ్డు పక్కన నివసించే ఒక తండ్రి తన చిన్నారి పాప  “రుక్సానా లోని ఆర్టిస్ట్ ని గుర్తించి ఆమె కోసం కుటుంబమంతా తమ  ప్రాధమికావసరాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. రోడ్డు మీద నివశించే వారి కుటుంబం ఒకసారి కురిసిన తుఫాన్ లాంటి వర్షంలో అల్లాడిపోతుంది.”వెయ్యి నదులు కక్షతో ప్రవహిస్తున్నట్లు వర్షిస్తుంటే,నిలువ నీడలేని మా అందరితో పాటు నా చిత్రలేఖనాలు కూడా రోదిస్తున్నట్లనిపిస్తుంది. నానిపోయిన నా డ్రాయింగ్స్ ని ఏమూల ఆరబెట్టాలి?” అంటుంది రుక్సానా ఏడుపు గొంతుతో.

అలాగే పెరూ దేశం నుంచి “ సెన్నా” అనే పాప పేరుని క్లాస్ రిజిస్టర్ నుంచి స్కూలు ఫీజ్ కట్టనందు వల్ల    తీసేస్తారు.తల్లిని చదువుకుంటానని అడుగుతుంది. తల్లి “మన దగ్గర డబ్బుల్లేవమ్మా” అని చెప్తుంది. తల్లికి సహాయం చేస్తూనే మళ్ళీ క్లాస్ కెళ్తుంది. బహుశా అది పేద దేశమైనందు వల్లనో ఏమో స్కూలు బిల్డింగ్  లాంటి వేమీ ఉండవు.ఒక ఖాళీ జాగాలో టీచర్ పాఠాలు చెప్తూ ఉంటుంది.నిశ్శబ్దంగా మన పాప వెనక బెంచీలో కూర్చుని పాఠాలు వింటూ ఉంటుంది. టిచర్ చూసి “మీ అమ్మ స్కూలు ఫీజ్ ఇచ్చిందా”? అనడుగుతుంది.పాప ధైర్యంగా “లేదు. మా దగ్గర డబ్బు లేదం”టుంది.ఐతే క్లాస్ నుంచి  వెళ్ళిపొమ్మంటుంది టిచర్. మొదటిసారి నిరాశగా వెళ్ళిపోతుంది సెన్నా. చదువుకోవాలనే కోరిక ఆ పాపని నిలవనీయదు. ఎన్నిసార్లు వెళ్ళమన్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది.ఇక చివరికి టీచర్ కి ఆ పాప పట్ల ఇష్టం పెరిగిపోయి చిరునవ్వుతో చూస్తూ ఉండిపోతుంది.చిత్రం ముగుస్తుంది.

“నేను చదువుతాను. నేను చదువుకుంటాను. నేను నేర్చుకుంటాను. మీరు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నేనింకా బలంగా పోరాడతాను” – అని కధకురాలు తన గొంతుతో చెప్తుంది గానీ ఆ పాప తాను చదువుకోవాలనే విపరీతమైన తన కాంక్షను తన నటన ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించింది. “ఒకవేళ మీరు గనక నన్ను దూరంగా పంపిస్తే మీరు ఉండమనేవరకూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను” అని చెప్తూ నటించడం కాకుండా ఆ చిన్ని పాత్రలో జీవించి చూపించింది.కాకరాల గారంటారు “పాత్రలలో చిన్నా, పెద్దా అని తేడాలుండవు. ప్రతిదీ ప్రత్యేకమైనదే”అని.

అమ్మాయిలందరూ ఎవరికి వారే సాటి అని అనిపించినప్ఫటికీ ఈ సెన్నాపాప కథ చాలా ఆశాజనకంగా ఉండి నాకు విపరీతంగా నచ్చేసింది. అసలు సినిమాలో ఈ పాప కథని నడిపించే సంగతేమిటంటే  “వారియర్ ప్రిన్సెస్ సెన్నా”లా పెరగాలని తండ్రి ఆమెకు ఆ పేరు పెడతాడు. అతను సెన్నాకి పాఠశాలకి వెళ్ళి బాగా చదవాలని చెప్తుండేవాడు. తర్వాత తండ్రి ఒక బంగారు గని మైనింగ్ ప్రమాదంలో మరణిస్తాడు. ఆమె తండ్రి ఆదేశం ప్రకారం స్కూలుకి వెళ్ళడానికి తన శక్తికి మించి ప్రయత్నించి తన కోరికే కాక తండ్రి ఆశయాన్ని నెరవేర్చే దిశగా దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తుంది. పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం గారిని హైదరాబాద్ లోని దిల్ శుక్ నగర్ లో నడిరోడ్డుమీద గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెడితుంటే వాళ్ళ పాప మాత్రం (పదేళ్ళుంటాయేమో) నిబ్బరంగా ఉంది. అస్సలేడవలేదు.”ఏంట్రా, నీకేడుపు రావట్లేదా?” అనడిగితే “బాపు నాకు ఏడవద్దని చెప్ఫాడు” అని చెప్పింది. తండ్రి చెప్పిన మాటను తు.చ. తప్పకుండా పాటించాలనుకునే సెన్నాని చూసినప్పుడు నాకది గుర్తొచ్చింది!

అసలెందుకిలా జరుగుతుంది? ఈ అమ్మాయిలేమీ అసాధ్యమైన, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా? ఈ పిల్లలు భావి ప్రపంచపౌరుల కిందికి రారా? వీళ్ళు విద్యావంతులవ నవసరంలేదా? అనే భావాలతో హృదయం తల్లడిల్లిపోయింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి “అమీనా” “నా తండ్రి నాకు పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు నాకు 11 సంవత్సరాలు” అని అంటుంది.

అలాగే తొమ్మిది మంది  బాలికల కథలు తొమ్మిది రకాలైన ప్రత్యేక కథనాలైనప్పటికీ ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వ వ్యాపితమైనవే. ఎక్కడో జరుగుతున్నట్లనిపించవు.మన చుట్టూ మనం చూస్తున్న సంఘటనలే అనిపిస్తాయి!

“ఇంత  అందమైన ప్రపంచంలో అందం,ఆనందాలతో పాటు ఇంత కౄరమైన నీచత్వం ఒకే చోట  ఎలా కలగలిసి ఉంటున్నాయి?” అని అంటుందొక పాప.

“బాలికలు ఎప్పటికీ సమస్య కాదు. వారు అన్నిటికీ పరిష్కారాలు సూచించగలరు. మీరు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టాలన్నా, ప్రపంచ ఆర్థికపరిస్థితిని మెరుగు పరచాలన్నా అమ్మాయిల్ని చదివించండి” అని అంటుందింకొక అమ్మాయి.

“నేను మా ప్రాంతాల్లో అమ్మాయిల వేలం  పాట విన్నాను.పురుషులను కూడా అలాగే వేలం  వెయ్యండి” – అని ఒక పాప అంటే,

“నావిషయంలో ఏంజరిగిందో ప్రతిదీ నేను మీకు చెప్పలేను. కానీ ఆ హింసను నేను నాజన్మలో మర్చిపోలేను” – అని మరొక అమ్మాయి అంటుంది.

సామాజిక కార్యకర్త మరియాసియర్రా ఒక ఇంట్లో బానిస చాకిరీ చేస్తున్న ఒక అమ్మాయికి స్వేచ్చ నివ్వమని అడుగుతుంది. ఆ యజమాని నిరాకరించినప్పుడు ఆమె వివిధ చట్టాల గురించి వివరించి చెప్పి ఆయన నొప్పించి అమ్మాయికి విముక్తి కలిగిస్తుంది.

“మీరు గనక నన్ను ఆపివేస్తే, నా వెనక లక్షలమంది అమ్మాయిలు ఈ కారణం కోసం పని చేస్తారు”.

“చదువుతో ఏదైనా చేయగలనని భావిస్తున్నాను.ఆడపిల్లల ప్రపంచాన్ని మార్చే శక్తి వస్తుంది”.

“చదువుకుని ఆర్ధికంగా నా కాళ్ళమిద నేను నిలబడగలిగితే నాకు నేనే స్వంత మాస్టర్ నవుతాను”

“నేను మేకల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అమ్మాయిల కంటే మేకలే మంచి స్థితిలో ఉన్నట్లనిపించింది”.

ఈ విధంగా అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తమ వ్యక్తిగత బాధామయ ప్రయాణాలను ప్రపంచంతో పంచుకోవడం ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ఉపాధ్యాయురాలి లాగా మారినట్లు ప్రేక్షకులకు కనిపిస్తారు. సినిమా చూచిన వారందరికీ మెరుపు తీగల్లాంటి తొమ్మిదిమంది అమ్మాయిలు మన మనో ఫలకంపై ముద్ర పడిపోతారు. ఆడపిల్ల  చదువుకుని విద్యావంతురాలైతే ఆమె జీవితం లోనే కాక ప్రపంచాన్నే మార్చగలిగిన శక్తి వస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తారు.

ఈ కథ సాధారణమైనదే! ఇది మొదలూ కాదు, అంతమూ కాదు. కానీ ఈ పిల్లల్లో కనిపించే గొప్ప ఉత్తేజం ఆనందం కలిగిస్తుంది. ఒక్కొక్కరినీ చూస్తుంటే శతాబ్దాలుగా చెత్త పోగులో పడి ఉన్న “ఆమె” ఇప్పుడు కటిక చీకటిలో అందమైన మిణుగురుల పంట పండిస్తుందనిపించింది!

ఇది వినూత్నమైన పద్ధతిలో నిర్మించిన ఒక కథా చిత్రం. ప్రపంచ మంతటా ఎదుర్కొనే ప్రమాదకరమైన అసమానతలను విశ్లేషించారు. తీవ్రంగా కలతపెట్టే సమస్యల చర్చలున్నాయి. ఆడపిల్లల సాధికారత, విద్య, సమానత్వాల గురించి చర్చించినప్పటికీ, ఈ అమ్మాయిలు ఎలా దోపిడీ అణచివేతకు గురౌతున్నారో చిత్రించడానికి భయానక శబ్దచిత్రం గా రూపొందించారు. ఎదుగుతున్న తరం కూడా తమ స్త్రీజాతి ఇక్కట్ల గురించి తెలుసుకోవాలని, అవగాహన కలిగించాలని ఒకవేళ వారి తల్లిదండ్రులు ఎవరైనా అనుకుంటే ఈ సినిమా చూపించడానికి  ప్రయత్నించే వీలే లేదు. తమ టీనేజ్ ఆడపిల్లలతో కూర్చుని ఈ చిత్రాన్ని చూడడం గానీ, వాళ్ళకు ఈ కల్లోల పరిస్థితుల్ని వివరించి చెప్పడం గానీ, ఆలోచనలు పంచుకోవడం గానీ కుదరదు. వారి పెద్దలకు చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటుంది!

ఒక్కో అమ్మాయి కథను కు చెందిన ఆయా దేశాలకు చెందిన ఒక్కో ప్రఖ్యాత రచయిత రాశారు. సామాజిక కార్యకర్త మరియా-సియర్రా గొంతుతో పాటు, ఆయా దేశాల ప్రముఖ నటీమణుల స్వరాలతో కధనాన్ని హృద్యంగా దృశ్యీకరించారు దర్శకులు రిచర్డ్ రాబిన్స్. ఆయన ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటేరియన్.

మొత్తానికి పాఠశాలకు వెళ్ళాలని  కలలు కంటున్న  అద్భుతమైన అమ్మాయిలు వీళ్లంతా! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బాలికలు 66 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తుంది. ఒక్కోఅమ్మాయి ధైర్యంగా చదువుకోవాలని ఆరాటపడడం చూస్తే ఎవరికి వారు వారి వారి దేశాల్లో విప్లవాలు చేసేటట్లున్నారు !

ఇంత గొప్ప దర్శకులు రిచర్డ్ రాబిన్స్ పిల్లల్ని విప్లవాలనుంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నారా అనే విషయం నిరాశ పరిచింది. నిజంగా స్పష్టమైన మూల కారణాలను అన్వేషించే ప్రయత్నమైతే కనిపించలేదు.  రిచర్డ్ రాబిన్స్ బాలికలకు విద్యా, సమానత్వం కోరుతూ పని చేసే  “10” అనే ఒక సామాజిక సంస్థ డైరెక్టర్. ప్రపంచమంతా దీని శాఖలున్నాయి.

“అదిగో చూడండి,అక్కడ పీడితులున్నారు.బాధితులున్నారు” అని చెప్పడానికి అసలు విషయం చెప్పకుండా నిజమైన స్ట్రగుల్స్ నిర్మించకుండా వారిని దిష్టి బొమ్మలుగా చూపిస్తూ తమ భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకుంటారు కొందరు ఎన్ జీ వో  సంస్థల నాయకులు. పీడితుల వెతల్ని హృదయ విదారకంగా వర్ణిస్తూ మన రచయితల్లాగే అవార్డులూ, రివార్డులూ ఆస్కార్ నామినేషన్లూ సాధించుకుంటారు. కానీ పీడితుల, బాధితుల పరిస్థితులు ఎప్పటికీ మారవు. ప్రభుత్వాలు కోరుకుంటున్నట్లే వీళ్లకు కూడా  యధా తధ పరిస్థితులు  కొనసాగాలి. చిత్ర నిర్మాణాలకు దర్శకులకు,రాయడానికి రచయితలకు మాత్రం వాళ్ళ బాధలు కావాలి,ఆ తర్వాత బాధితులు ఎలా చస్తే మనకెందుకు మన బహుమతులు మనం గెల్చుకోవాలి అని కోరుకుంటారు!

“పిల్లలు స్త్రీలు బలహీనులు.నిరుపేదలు.సమానత్వాన్ని కోరుకుంటారు.బలవంతులకి ఆ ఆలోచనే ఉండదు”- అని అరిస్టాటిల్ 348 B.C.లోనే చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ హింసను కొనసాగిస్తున్న ప్రపంచ పాలకుల, వారి మద్దతు దార్ల ఘనతను ఏమని కొనియాడాలి?

మానవత్వం అనేది ఏమిటో మచ్చుకైనా తెలియని పెట్టుబడి చేస్తున్న విధ్వంసమిది!మార్కెట్ కి వినియోగదారులుగా పనికిరాని, కొనుగోలు శక్తి లేని పేద ప్రజలను ఏకంగా  మట్టుబెట్టాలని చూస్తుంది. ఈ సినిమాలో కనిపించే అసలు రహస్యం ఇదే! దీనంతటికీ మూల కారణాలైన కేపిటల్ గురించీ, మార్కెట్ గురించీ చెప్పకుండా చేసిన ఈ దృశ్యీకరణ ఎంత బాగున్నప్పటికీ, పేదలపట్ల జరుగుతున్న ఈ ఘోరకలిని మెచ్చుకోలేం!

“సాధారణ ప్రజలు మనకంటే చాలా తెలివైనవాళ్ళు. ఈ కష్టాల వ్యవస్థలో ఎలా బతకాలో వాళ్ళకి తెలుసు.ఎవరూ ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు. మీరందరూ హాయిగా బతకండి.  కానీ వారి ఉద్యమాలకు వెనకుండి మద్దతు నివ్వండి” అని అంటారు  మహాశ్వేతా దేవి. మన వంతుగా కనీసం అది చేసినా చాలు!

నేనీ సినిమా గోతెజెంత్రం (జర్మన్ ఫిల్మ్ క్లబ్) లో చూశాను.

 

~

మిత్రస్పర్శ

 

 

తేలిక కాదు –  ఎద లోపలి ఎదను స్పృశించటం … ఆ సుకుమారమైన చోట్లను ఈ కథ తాకటమే కాదు , నెమ్మదినీ ఇస్తుంది.  బహుశా అందుకనే – ఫ్రెంచ్ లో తీసిన Intouchables సినిమా , సబ్ టైటిల్స్ తో 32 దేశాలలో విజయవంతమైంది.

‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ ని పల్లకీ ఎక్కించినందువలన. మొట్టమొదట కొడవటిగంటి (కొ.కు.) చెబితే తెలిసొచ్చింది – ఇంకొకరికి సహాయం చేయాలనిపించటమూ ఒక instinct వంటిదేనని. అడ్డం పడకండి-  మన కడుపు ఎంతోకొంత  నిండాకనే, పోనీ.

ఏముంది ఇందులో ? చాలా  predictable కథ. చాలా సంపన్నుడైన పరాధీనుడు ఒకరు, తన పైన తనకు అదుపు లేని బీద మనిషి ఒకరు.   ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆప్తులవుతారు.

అవునవును, స్నేహం సమానుల మధ్యనే ఉంటుందని అంటారు నిజమే , కాని అవసరార్థం మొదలైన సంబంధాలు కూడా ఎత్తుకి ఎదగటమూ జరుగుతుంటుంది. చమత్కారం ఇది – ఈ కథ ఇంచుమించుగా ఇలాగే నిజంగా జరిగింది.

వాస్తవాధీనమైనంత మాత్రాన ఒక కళారూపానికి విలువ హెచ్చదని నా నమ్మకం – అలా చూస్తే ఇది యాదృచ్ఛికమంతే.   మంచం లో పడిఉండి, నిరంతరమూ సేవలు చేసేవారిని చీదరించుకోగలవారు లేరా ? ఉన్నారు, నా కళ్ళతో చూసి ఉన్నాను.  ఇక్కడొస్తుంది – వ్యక్తిగతమైన ఔన్నత్యాల ప్రాముఖ్యం

జాలి పడే సేవకుడు నాకు వొద్దని డబ్బుగలాయన Philippe కి పంతం. బీదవాడు Driss కి జాలీ గీలీ ఏం ఉండవు –  నీ కాళ్ళూ చేతులూ పనిచెయ్యవు గదూ  అని చిన్న పిల్లాడిలాగా వేళాకోళం చేస్తాడు, వేడి వేడి నీళ్ళు పోస్తే నీకు కాలదు గదా అని ఆడుకుంటుంటాడు. అదొక అపచారం అనిపించదు, మనకీ నవ్వొచ్చేస్తుంది.

Ludovico Einaudi సంగీతం – ఊరట, విడుదల. ఒక్కడే సింగపూర్ నాన్ యాంగ్ లో చదువుకుంటూ మా అబ్బాయి ఈ సినిమా చూసి ఆ దివ్య ధ్వనులలో  తల్లకిందులుగా మునిగిపోయాడు. ఒక సినిమా నేపథ్యసంగీతం లోంచి ఆ విద్వాంసుడిని కనుగొనటం దృశ్య మాధ్యమానికి గొప్ప గౌరవం. Ludovico పద్ధతిని alternate classical  లేదా classical crossover అని అంటుంటారు.  కదా, శాస్త్రీయమైనదాన్ని కాస్త అటూ ఇటూ మార్చుకుంటే జీవనం లో అన్నన్ని సందర్భాలకూ పాడుకోగల వీలు. అలా అని , తక్షణ ఉత్సాహాన్ని తెచ్చి పెట్టగల సంగీతాన్ని ఇందులో మెచ్చుకోకపోయింది లేదు. ఒకానొక ఉత్సవం లో Driss  అందరినీ ఆ లయకి నాట్యం చేయించేస్తాడు.

intouchables

Break the rules, Out of box thinking  అని రెండు స్థాయిల అరాచకపు ధోరణులున్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులకి గరళం వాడేవారు గుర్తుందా – అలాగ, అంతకన్న చెడేదేమీ లేనప్పుడు -ఏం చేస్తేనేం ? ఆ సమర్థనే తోచకపోతే ఆ మితిమీరిన వాహనవేగాన్ని చూసి ఊరుకోబుద్ధి అవునా ! అయితే – కేవలమొక ఉద్వేగపు చెల్లింపు కోసం తలపెట్టుకునే paragliding, car racing లాంటి ప్రాణాంతక క్రీడ లని  మాత్రం నేను శాపనార్థాలు పెట్టుకుంటాను.

ధనికుడు తెల్లవాడూ సేవకుడు నల్లవాడూ అయారని అమెరికా లో దీనికి రేసిస్ట్ ముద్ర వేసి కొందరు అభిశంసించారు. ఏదీ కాని మనలాంటి వారికి వాళ్ళు ఇదీ అదీ వీళ్ళు అదీ  అయినా పట్టింపు ఉండదు- న్యాయంగా హక్కులు కొని తెలుగు లో తీసిన ‘ ఊపిరి ‘ కి ఆ దోషం పట్టనూ లేదు.

పునర్నిర్మాణం లో – రెండు యుగళ గీతాల జోడింపు తప్పించి రసాభాస ఏమీ జరగలేదు . చాలా సంతోషం.

” ఆ తిండి తినీ తినీ నోరు చవి చచ్చిపోయింది. కొంచెం చారు చేసి పెడతావా ” అని  తెలుగు రుచిని  తెచ్చి నింపారు.

నిజం చెప్పాలంటే , తెలుగు [ తమిళం లో కూడా ఒకేసారి తీశారు ] లో కొన్ని సంఘటన లు ఇంకా ఎక్కువ నిండుగా ఉన్నాయి – చెల్లి పెళ్ళి, తమ్ముడి రక్షణా లాంటివి , మనకి అలాగే well rounded గా  నచ్చుతాయి- తప్పేమిటట ?  డబ్బూ పరపతీ ఉన్నాయి – మనసు పుట్టి,  ఉపయోగించి  ఆదుకున్నాడు – లేకపోతే ఏమయిఉండేదీ అనటం లో ఏమీ అర్థం ఉండదు.

కార్తి ఇంత బాగా చేస్తాడని నాకు తెలీనే తెలీదు , ఊపిరి అతను నిజంగా. నాగార్జున చక్కగా తూగాడు [ ఈయన గురించి ఈ మాట అనుకోగలనని ‘ మనం ‘ చూసేదాకా ఊహించాను కాను ]

voppiri

కార్తి తమ్ముడి వేషం వేసిన అబ్బాయి ఫ్రెంచ్ సినిమా లో మెత్తగా గొప్పగా కనిపించిన పక్క ఎక్కి తొక్కుతుంటాడు , ఒక పక్కన హత్యా నేరం మీద పడి ఉండి. తెలుగు లో అది తీసేశారు. లాలాజలం తుడవటమూ  మరింకొన్ని శరీరధర్మాల ప్రసక్తీ కూడా పరిహరించబడింది తెలుగులో – మన sensibilities వేరు. కార్తి పెయింటింగ్ ని ప్రకాష్ రాజ్ చేత కొనిపించటం, దాన్ని ప్రకాష్ రాజ్ వైన వైనాలుగా కార్తి కే వివరించటం- తట్టుకోలేక ఇతను ఉన్నమాట చెప్పేయటం – తెలుగు లో ఎక్కువ ఆహ్లాదకరం గా ఉంది.

ఫ్రెంచ్ లో తమన్నా పాత్ర lesbian  . తెలుగు లో-  మరొక సందర్భం లోgay  విషయాల్లోంచి హాస్యాన్ని ఉద్దేశించారు. మా అమ్మాయి అంది – 90 ల వరకూ అక్కడా దాన్ని కామెడీ చేసేవారని. No comments.

శ్రీ శ్రీ 1960 ల్లో ‘ వెలుగునీడలు ‘ లో ఒక పాట రాసి తర్వాత నాలుక కరుచుకున్నారు . ” ఉన్నవారు లేని వారి కష్టాలను తీర్చు దారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ” అని.

ఆ అక్కరే లేని రోజులు వస్తే ఎంతో ఆనందం – ఇప్పటికింతే, తప్పులు వెతకొద్దు. ఇదంతా fantasy  అంటారా , మీ ఇష్టం!

*

వాగ్దానపర్వం 

 

 

 

~

రాన్రానూ రాజకీయాలు కష్టమైపోతున్నాయ్ రా బాబూ. మా  తాత ఎలక్షన్లలో నిలబడ్డ రోజుల్లో అంతగా నోరు పారేసుకోకుండానే, పుసిక్కిన   గెలిఛేసేవాళ్లు. ఇప్పుడలా కాదు. ఓ బలమైన వాగ్దానం చేయాలి. అంతే కాదు. గెలిచాక అది నెరవేర్చాలి” అన్నాడు ‘టామ్’ మీసాలకంటిన పాలు తుడుచుకుంటూ!

అది విని అప్పుడే తొర్రలోంచి బయటికొచ్చిన జెర్రీ – “నువ్వేం వర్రీ అవకు.

వాగ్దానాలు ఏమేమి ఇవ్వాలనేగా నీ ప్రాబ్లం? అదేదో నీ జోబీ లోంచి ఏదో తీసిచ్చే అపోహలో ఏవన్నా ఉన్నావుటోయ్ వాగ్దానం ఇవ్వడం అంటే? ఆరోజుల్లో  భూదానం  గట్రా లాటివన్నీ  భావే లాటి బుర్రలేనోళ్లూ … పుచ్చలపల్లి లాంటి పిచ్చోళ్ళూ  ఇచ్చేసుకుని ఇల్లు గుల్ల  చేసుకున్నారు  గానీ, మనలాంటి అల్ట్రా మాడ్రన్ గాళ్ళు అవలంబించే  కార్యక్రమమా అది నువ్వే చెప్పు? అసలు ‘వాగ్దానం’ అంటే ఎంటనుకుంటున్నావ్ నువ్వు? భూమ్మీద సమస్త దానాల్లోకెల్ల అతి గొప్ప ‘దానం’ ఏంటయ్యా అంటే అదే ‘వాగ్దానం’. అందునా,  అతి సహజంగా అనాయాసంగా లేదా అప్పనంగా దొరికేవాటిని  నీవిగా స్వంతం చేస్కుని ఎడాపెడా  ప్రా’మిస్’లు చేయటమే నేటి నిఖార్సైన వాగ్దానం ! అన్నప్రసాదానికి అంగూళీయక మానించి, అంగట్లోకి ముట్టించి … ఆవిధంగా  అంగుళమంత కడుపుకి పట్టించి అన్నప్రాశనం అనేది ఒకటి  చేస్తాం కదా బొడ్డూడిన బుడతడికి! రాజకీయ వాగ్దానమైనా  అంతే అనుకో! ఉత్తినే మెతుకు నాలిక్కి కతుకుతామ్ … బుడ్డోడు ఓసారి గట్టిగా  చప్పరించి ఊరుకుంటాడు. అంతే! అలాగని అప్పటినుంచీ మొదలుపెట్టి ఎడాపెడా  భోజనం చేయించే  ఏర్పాట్లు చేస్తామా యేమ్?” ఏక బిగినుగా చెప్పాడు జర్రీ తెగ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తూ.

అర్ధం గాలేదని చెప్పలేక ‘సింబాలిగ్గా’ బుర్ర గోక్కున్నాడు టామ్  నెత్తిన కించిత్ దురద లేకపోయినా!

“ఆ  గోక్కొడమ్ ఆపు. నీకర్ధం కాలేదని నాకర్ధవైంది. వాగ్దానం పారేయడానికి పేద్ద తెలివితేటలు ఏడవక్కర్లేదు. విను. ఉదాహరణకు – నీకు కాసిన్ని మంచినీళ్లు తాగాలనిపించిందనుకుందాము. నీకులానే ఓటేసే ప్రజలక్కూడా నీళ్ళు తాగాలనిపిస్తుందిగా.  పాత కాన్సెప్టుని వలిచిపారేసి, దాన్ని సృజనాత్మకంగా మలిచిపారేసి – ఇంటింటికీ ఉచితంగా  చెంబెడు  నీటిని అందించడమే మా పార్టీ ధ్యేయం ’ అని ఉచిత రీతిన అనేసేయ్…బకెట్లు బకెట్లుగా ఓట్లు కురుస్తాయ్! “ చెప్పాడు జర్రీ.

‘మరో ఉదాహరణ  చెప్పు’ అన్నాడు టామ్  మళ్ళీ బుర్ర గోకితే నిజాయితీగా ఉండదనిపించి.

“అంత తేలిగ్గా అర్ధమైతే నువ్వు టామ్ ఎందుకవుతావు. విను మరో ఉదాహరణ –ఏ సాయంత్రం వేళో నీ ఫార్మ్ హౌస్ లోని ఇసకో మట్టో గర్వంగా కెంజాయ మెరుపులతో మిలమిలా మెరుస్తోందనుకో. నీకులాగానే  ప్రజల కంట్లో కూడా మెరుపు చూడాలనిపించదూ.  వేంఠనే – ‘మీ ఇంటి పెరట్లో మట్టి ఇకనించీ ఉచితంగా మీపాటికి  మీరే శుభ్రంగా తవ్వుకోవచ్చు. ఎవడి పర్మిట్లూ అక్కరలేదు’  – అని  ప్రకటించు. ఎలా ఉంది అయిడియా?” అంది జెర్రీ.

“ఓహోహో! మట్టికొట్టుకున్నట్లుంది. ఓహ్ …సారీ!  భూ-చక్రమ్ తిప్పినట్టుంది. అదిసరే…భూమైపోయింది … ఇహ ‘గాలి’ అంటావేమో?” అన్నాడు టామ్ .

“బాగా గుర్తు చేశావ్ .. కాస్కో మరో ఉదాహరణ. ….’ప్రతి పొద్దుటా ప్రతి మనిషికీ పచ్చి ప్రాయాననే స్వచ్చమైన పచ్చిగాలి దొరికేలా ప్రతి ఉదయాన్నీ మీకు అందుబాటులోకి  తెస్తామ్’ – అని ప్రకటించు! అలా సరాసరి   ‘గాలి’ ని వదలొచ్చు. అదేనోయ్… వాగ్దానానికి గాలినలా వాడుకోవచ్చు.”

“జనాలు మరీ అంత పిచ్చోళ్ళా? గాలి ఫ్రీ – అంటే నమ్మడానికి?” బుకాయించాడు టామ్!

“మరదే! సాంకేతికంగా చెబితేనే గానీ ఏదీ వినవు. కావాలంటే ఈ వాగ్దానాన్నే కొంచె టెక్నికల్ గా … – ప్రతీ ఇంటికీ పచ్చి గాలి పిచ్చ ఉచితంగా 137 ఘనపు మీటర్లు ఉచితంగా అందేలా చేస్తాం – అని ప్రకటించుకో. అలానే ఇందాక చెప్పిన చెంబుడు నీళ్ళు బదులు నీకు తోచిన క్యూసెక్కులను. లేకపోతే ప్రతి పంచలోనూ  8 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కురిపిస్తామను. వోట్లు కురిపించుకో. ”.

“ఇప్పుడు బాగా కుదిరింది. నమ్మబలికేలా కూడా ఉంది.  ‘గాలి’ మాటలు ఎప్పటికీ  చద్ది మూటలు. గాలి లీలల్ని మించి ఏమైనా కలదా? అయినా చిన్న సందేహం.  అలా అన్నేసి  గాలి మాటలు చెబితే ఉత్త ‘గ్యాస్’ అంటారేమో?”

“నీకు కాన్సెప్తు బ్రహ్మాండంగా అర్ధమైపోయినట్టుంది. నాక్కూడా తెగ సజెస్టు  చేసేస్తున్నావ్. యస్! ఏవన్నావ్ ఇప్పుడు ….. గ్యాస్ అని కదూ అన్నావ్? ఈ సారి వాగ్దానాన్ని ఇలా వదిలేయ్ పబ్లిక్ మీదకి – ‘గ్యాసు ఊసే వద్దు. గాడిపొయ్యే నీక్కు ముద్దు’ – అలా స్లోగనిచ్చి  ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్. ఈ క్రమంలో ఇంటింటి కి ఒక ‘గాడిపొయ్యి’ ఉచితంగా  తవ్వించి పెడతామని బృహత్తరమైన వాగ్దానం చెయ్.  ఎక్స్ చెకర్ కి  ఏవన్నా ఖర్చా బొచ్చా?”

“మహాద్భుతం … పబ్లిక్ అడ్మిన్స్ట్రేషన్ నించి పాలిటిక్స్ దాకా ఎవరైనా  మీదగ్గరే నేర్చుకోవాలి. అ…యి…నా ….”

“అర్ధమయింది నీ డౌటు. అలా తాపతాపకీ బుర్ర తక్కువ వెధవలా బుర్ర గోక్కోకు. గాడిపొయ్యి ఆకమడేట్ చేసుకునే స్థలం ఎక్కడేడిచిందీ ఈ రోజుల్లో అనేగా నీ డౌటు? మళ్ళీ  వాగ్దానానికి కొంచెం టెక్నికల్ రంగు పులుము. ‘నీచ నికృష్ట కడు నిరు పేద వెధవాయిలందరికీ గ్యాసు బండ పూర్తిగా ఉచితం’ అని ప్రకటించు”.

“అబ్బబ్బ …తమరి బండ పడ… ఏం టెక్నిక్కు వదిలారు సారువాడూ. చ్చస్తే  నోరూ వాయీ ఉన్న ఏ వెధవాయీ దీనిమీద నోరు చేస్కోడు. ఇది అదుర్స్”

రజనీకాంత్ లాగా గిర్రున తిరిగి కాలిమీద కాలేసుకుని కూర్చుంది జెర్రీ. “పృధ్వాపస్తేజోవాయురాకాశాలని పంచ భూతాలు కదా .. పృధ్వీ, అపస్సూ అయింది. అంటే  భూమైందీ,  నీరైందీ. వాయువూ  అయింది. అంటే గాలీ అయింది.  ఇక అగ్గి , ఆకాశం మిగిలాయి. అంచేత  ఇప్పుడు ‘తేజో’ కాన్సెప్టుని వాడుదాం ….”

టామ్ పరవశం తో తోకూపుతూ  – “అంటే ఇప్పుడు  సమ్మర్ కదా! ఏదన్నా అగ్గిరాముడు వాగ్దానం వదలండి.” అన్నాడు.

“భేషుగ్గా గుర్తు చేశావ్. విను. వేదిక పైన  మైకుచ్చుకున్నాక …. ‘ప్రజలారా… దిమ్మదిరిగే ఈ సమ్మరుకి మీరంతా సమ్మ సమ్మగా ఉండాలని ప్రతి భడవాయికీ ఓ నల్ల కళ్ళద్దాలు ఉచితంగా ఇచ్చిపారేద్దామని నిర్ణయించుకున్నాం’ – అని ఓ వాగ్దాన బాణం వదులు. ఠపీ మని గుచ్చుకుంటుంది.”

“ఎక్కడ? కంట్లోనా?” అడిగాడు టామ్.

kamedee karner

“ఊర వెటకారం అంటే అదే! కూల్ కూల్ కబుర్లు చెబుతుంటే… కంట్లో కారమద్దే మాటలు చెప్పకు. ఖజానాకు ఖర్చు అనుకుంటే… ఆ కూలింగ్ గ్లాసేదో కంటి చూపు వంద శాతం  సరిగా ఉన్నోడికే ఇస్తామని చిన్న రైడర్ పెట్టుకో. ఈ పెపంచకంలో వంద శాతం సరైన కంటి చూపు ఏ జీవికీ ఉండదు.” రీసర్చి స్కాలర్లా  చెప్పాడు జెర్రీ.

“వహ్వా…వాహ్వా! అగ్గి తాలూకు వాగ్దానం పన్నీరు పోసిన బుగ్గిలా అదిరింది.  ఇహ ఆకాశం గురించి సెలవివ్వండి  ….” అన్నాడు టామ్ గోక్కొడమ్ మానేసి అదే చేత్తో మీసాలు అనవసరంగా తిప్పుకుంటూ.

“ ఆ … అక్కడికే వస్తున్నా….విను.  ప్రతి ఆడపడుచు ఇంటికీ వెళ్ళి – ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుందే…నీలా ఉంటుందే -అని చెప్పు.”

“చెప్పుచ్చుకుంటారు.”

“కదా? ఆ చెప్పు చక్కగా రెండు  చేతుల్లోకి తీసుకుని – ‘ఇహ ఈ పాద రక్షలతో అవసరం లేదు ఆడపడుచుగారూ. ఎందుకంటే మీరు ఈ భూమ్మీద నడవరు. ఎంచక్కా రూపాయికే ఆకాశంలో విమానాల్లో ‘వియన్నా’ దాకా వెళ్ళి వచ్చే ఏర్పాటు చేసేలా ‘వియన్నా ఒడంబడిక’ కుదుర్చుకుంది మా పార్టీ – అని చెప్పు! తొక్కలోది … ఆకాశం అమ్మాయవడమేంటి? అమ్మాయే ఆకాశమవుతుంది ఆనందంతో!”

“మరి ఎక్స్ చెకరు మీద భారం … గట్రా….?”

“ ఎక్స్ చెకరా… చైనీస్ చెకరా? ఇలాటప్పుడే సృజనాత్మకతో,  సాంకేతికతో అద్దు అని చెప్పానా? వాగ్దానానికి ఇలా కండిషను పెట్టు.  టికెట్టయితే ఇప్పుడే తీస్కోవచ్చు గానీ … కాక… పోతే…”  దర్పంతో చెప్పుకు పోతున్నవాడల్లా కొం…చెం ఆగాడు   జర్రీ.

“పోతే…?” రెట్టించాడు టామ్.

“ పోతే ఏవుంది? ప్రయాణికురాలి  వయసు 50 దాటిన తరువాతే టిక్కట్టు  చెల్లుతుంది… అని మళ్ళీ ఓ రైడరు వేస్కో! ఎన్నో ఇక్కట్లు పడి టిక్కట్లు  అట్టేపెట్టుకున్నా గానీ,  50 దాటాక…. అప్పటికి పోతే పోతారు! అథవా  ప్రభుత్వం మారగా… వారంతట  వారే  పోతారు!  ఆకాశం అన్నాక ఎప్పటికైనా  పోక పోతారా?”

“హబ్బబ్బ … ఏమి సెప్పితిరి!”

“వాగ్దానం వంకాయలా నవనవలాడుతుండాలే గానీ, గంపగుత్తంగా  జనాలు వత్తాసు పలికేసి  డిన్నర్లోకి  గుత్తొంకాయ వండుకోడానికి రెడీ అయిపోరూ? పొహళింపు పొందిగ్గా ఉండి దీటైన మేటి వాగ్దానపు వడ్డింపు అలాంటిది. దాని ఘుమఘుమే వేరు ”

$$$

 

“అమ్మా పిన్ని” ఇక లేదు!

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

మే నెల 17, 2016…పొద్దున్నే ఫోన్. అంత పొద్దున్నే ఎవరా అని ఫోన్ అందుకోగానే “అమ్మా పిన్ని” పోయింది అనే వార్త. విని నిర్ఘాంత పోయాను. ఆవిడకి 92 ఏళ్ళు అనీ తెలుసు. గత ఐదారేళ్ళ గా డిమెంషాయా అనే అనారోగ్యంతో ఉన్నారనీ తెలుసును. కొన్ని రోజులగా డాకర్లు నిరాశ వ్యక్తంచేస్త్తున్నారు అనీ తెలుసును. అన్నీ తెలిసినా, ఎంత తెలిసినా, అప్పుడే తెలిసిన ఆ నిర్యాణ వార్తకి కళ్ళు చెమర్చాయి.

తెలుగు జానపదానికి, ఎంకి పాటలకి, లలిత సంగీతానికి “నేను సైతం గొప్ప గొంతుక”  అరువు ఇచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. కావడానికి ఆవిడ అవివాహిత. కానీ మా అందరికీ ఆవిడ “అమ్మా పిన్ని”. అక్కయ్య అనసూయా దేవి గారి పెద్ద కుమార్తె రత్న పాపని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ పాప ఇల్లే తన ఇల్లుగా గత పదేళ్ళకి పైగా హ్యూస్టన్ లో నివసిస్తున్నారు. విశేషం ఏమిటంటే సరిగ్గా అంతకు మూడు రోజుల ముందే పెద్దావిడ అనసూయ గారి 97 వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తెలుగు తిథుల ప్రకారం అనసూయ గారికి 100 ఏళ్ళు వస్తే సీత గారికి 97.

 

 

ఓ విధంగా చూస్తే సీత గారి జీవితంలో రెండు అధ్యాయాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మొదటిది సీత – అనసూయ …లేదా వింజమూరి సిస్టర్స్ …అనగానే తెలుగు జానపదమే మనసులో మెదులుతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనగోడళ్ళు అయిన వారిద్దరూ 1930 దశకంలో ఆయన కవితలకీ, ఇతర భావకవుల గేయాలకీ బాణీలు కట్టి, సభారంజకంగా పాడుతూ దేశమంతటా తిరుగుతూ ఐదు దశాబ్దాల పాటు అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూనే మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదాలని వేల సంఖ్యలో సేకరించి వాటికి సభా గౌరవాన్ని కలిగించిన జంట స్వరాలు.

 

ఎక్కడా స్వయం ప్రకటిత ఆర్భాటాలకి పోకుండా తన స్వరాన్నీ, సర్వస్వాన్నీ అక్క అనసూయా దేవికే అంకితం చేసిన ఆదర్శ సోదరి గా సీత గారికి గుర్తింపు కూడా వచ్చింది.  అతి చిన్నతనం లోనే వారి ప్రతిభకి ఇందుతో జత పరిచిన ఫోటో అద్దం పడుతుంది. ఈ ఫోటో 1934 నాటిది. అప్పుడు సీత గారి వయసు పదేళ్ళు.

220px-V_Seetha_Devi

ఆ నాటి “తెలుగు స్వతంత్ర” అనే పత్రికలో “మన మధుర గాయకులు” అనే శీర్షికలో ఈ అప్పచెల్లెళ్ళ గురించి ప్రచురించబడిన ఒక సమగ్ర వ్యాసంలో “ఆ నాటికి పన్నెండేళ్ళకి మించని ముక్కు పచ్చలారని వయస్సు, సభాసదులకి వెరవని ధైర్య స్థైర్యాలతో పెద్దమ్మాయి అనసూయ, తగిన మెళకువలతో చాకచక్యంగా వాయించుకునే హార్మొనీ, అక్క వేపే క్రీగంటి దృక్కులు నిముడ్చుకుని కీచుమనే సన్న గొంతుతో చిన్నమ్మాయి సీతాంబ వంత పాట – ఆ గానానికి ముగ్ధులు కాని వారు ఆ నాడు సాధారణంగా కంటిలో కలికానికైనా ఉండే వారు కాదు” అని మెచ్చుకున్నారు. కాలక్రమేణా సీత గారి గొంతు అసమానమైన శ్రావ్యత, వెల్వెట్ లాంటి మృదుత్వం సంతరించుకుని, దానికి అనువైన అయిన బాణీలు సమకూర్చుని తనదే అయిన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఆ విధంగా 1930 వ దశకం నుండి అనేక దేశాలలో వేల కొద్దీ కచేరీలతో సాగిన సీత –అనసూయ ప్రస్థానం మూడు దశాబ్దాలు అద్వితీయంగా జరిగింది. తరువాత ఇప్పటి దాకా కొనసాగుతూనే ఉన్నా 1960 దశకంలో సీత గారు సమిష్టి కుటుంబ నివాసం అయిన మద్రాసు నుంచి చదువుల కోసం హైదరాబాద్ తరలి వెళ్ళడంతో ఆమె “సొంత గొంతుక” ఎక్కువగా వినపడడం ఆమె జీవితంలో రెండో అధ్యాయం అని చెప్పుకో వచ్చును.  తెలుగునాట సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న తొలి మహిళ గా వింజమూరి సీతా దేవి చరిత్ర సృష్టించారు. వెనువెంటనే 1963 లో ఆలిండియా రేడియో లో జానపద సంగీత విభాగానికి మొట్ట మొదటి మహిళా ప్రొడ్యూసర్ గా మరో చరిత్ర సృష్టించి 1984 లో పదవీ విరమణ చేశారు.

# 6

సీత గారి ఆధ్వర్యం లో రూపొందించబడిన కొన్ని వేల సంగీత కార్యక్రమాలు, రేడియో నాటికలు ఎంతో ప్రాచుర్యం పొంది ఆమెకి ఒక అగ్రశ్రేణి రేడియో ప్రయోక్త గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతే కాక వందల కొద్దీ ఔత్సాహిక గాయనీ గాయకులకి తన శిక్షణ ద్వారా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఇవన్నే ఒక ఎత్తు అయితే 1980 లో విడుదల అయిన “మా భూమి” సినిమాకి సంగీత దర్శకురాలిగా సీతా దేవి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

యావత్ దేశంలోనే భారత దేశం సినిమాలకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్ ల తరువాత అటువంటి ఖ్యాతి తెచ్చుకున్న తొలి తెలుగు సినిమా “మా భూమి”. తెలంగాణా సాయుధ పోరాటం (1940-48) నేపధ్యంలో బి. నరసింగ రావు నిర్మించిన ఆ చిత్రంలో సీతా దేవి గారు ఐదు పాటలకీ స్మగీతం సమకూర్చారు. అందులో బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడకో.. అనే పాట వినని, పాడుకోని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. గద్దర్, సంధ్య, మోహన్ రాజు చేత ఆయా పాటలు పాడించడమే కాక మహా కవి శ్రీ శ్రీ గారి గేయాలకి బాణీలు కట్టి ఆ సినిమాలో ఎంతో సముచితంగా వాడుకున్నారు సీతా దేవి గారు. బెర్లిన్, కైరో, సిడ్నీ మొదలైన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టి వల్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఆ తరువాత “మా ఊరి కథ” అనే సినిమాకి కూడా సీత గారు సంగీత దర్శకురాలు. ఆమె సేవలకి గుర్తింపు గా గృహ లక్ష్మి స్వర్ణ కంకణం మొదలైన వందలాది పురస్కారాలు అందుకున్న విదుషీ మణి మన వింజమూరి సీతా దేవి గారు.

anasooya - sitha - gruhalakshmi 1934

సీత గారితో నా మొదటి పరిచయం 1977 లో ఆమె మొదటి సారి అమెరికా వచ్చినప్పుడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆమెకి నేనూ, మా ఆవిడ, మా పిల్లలూ అంటే ఎంతో ఆప్యాయత. నేనే కాదు. ఎవరైనా సరే అందరినీ అదే ఆప్యాయత తో పలకరించి కబుర్లు చెప్పే వారు. ముఖ్యంగా ఆవిడ హ్యూస్టన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు మా తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలు జరిగినా సంగీతం కార్యక్రమాలని సొంతం చేసుకుని తన అసమాన అనుభవంతో అందరికీ మంచి పాటలు నేర్పి ఆయా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించే వారు. ఆవిడ నిస్వార్థ సేవలకి మేము అందరం ఎంతో ఋణపడి ఉన్నాం.

 

సీత గారు మంచి రచయిత్రి. జాన పదాలు, ఎంకి పాటలు, స్త్రీల పాటలు మొదలైన పుస్తకాలు తెలుగులోనూ, అందరూ నేర్చుకుని పాడుకోడానికి వీలుగా ఇంగ్లీషు లోనూ సంగీతం నోటేషన్ తో సహా ప్రచురించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప గాయని, రేడియో ప్రయోక్త, సంగీతం టీచర్ గా తన సుదీర్ఘ జీవితంలో వేలకొద్దీ కళాకారుల, సంగీత ప్రేమికుల గౌరవాభిమానాలని పొందిన అమర గాయని మా అందరి “అమ్మా పిన్ని”, డా. వింజమూరి సీతా దేవి గారికి వ్యక్తిగతంగానూ, అశేష అభిమానుల తరఫునా నివాళి అర్పిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

 

దైవాన్ని దర్శించే కారుణ్యం!

 

 

-ఫణీంద్ర 

~

 

దేవుడే మనిషిగా అవతరించి మానవులని దగ్గరగా చూస్తే ఏమనుకుంటాడు? ఆశ్చర్యపోతాడా? జాలి పడతాడా? బాధ పడతాడా? బహుశా ఈ భావాలన్నీ కలగలిపిన ఒక మౌనస్థితికి చేరుకుంటాడేమో! అప్పుడు దేవుడి అంతరంగం మనిషికి ఏమని చెప్పాలనుకుంటుంది? “గోపాలా గోపాలా” చిత్రంలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు గేయ రచయిత సిరివెన్నెల తానే గీతాచార్యుడై మనందరికీ ఓ అద్భుతమైన గీతాన్ని అందించారు. మే 20 సిరివెన్నెల పుట్టినరోజు సందర్భంగా ఈ పాటని చర్చించుకుని, ఆకళింపు చేసుకుని, అంతో ఇంతో ఆచరణలో పెట్టడమే ఆయనకి అభిమానులు ఇవ్వగలిగే కానుక.

చిత్ర కథాపరంగా దేవుడైన కృష్ణుడు ఓ మామూలు మనిషై మూఢనమ్మకాలనీ, దేవుడి పేరు మీద లోకంలో చలామణీ అవుతున్న కొన్ని ఆచారాలనీ ప్రశ్నించిన ఓ వ్యాపారికి తోడ్పాటునందిస్తాడు. నిజానికి ఆ వ్యాపారి తన “భక్తుడు” కాకపోయినా, తన “భక్తులుగా” చెప్పుకుంటున్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నా కృషుడు అతని పక్షమే వహిస్తాడు! అతనికీ, అతనితో పాటూ మనుషులందరికీ దైవత్వపు అసలు లక్షణాలని వివరిస్తున్నట్టుగా సాగుతుంది ఈ పాట.

బ్రహ్మలా నేనే నిన్ను సృష్టించాననుకోనా?

బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా?

నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో

ఏమి అంటుందో నీ భావన!

 

నీదే నీదే ప్రశ్నా నీదే!

నీదే నీదే బదులూ నీదే!!

 

మనిషి సాక్షాత్తూ భూలోక బ్రహ్మే! మనసులో మెదిలిన ఊహలని తన మేధస్సుతో శక్తి సామర్ధ్యాలతో సాకారం చేసుకుంటాడు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. భూమండలాన్ని ఏలుతున్నాడు, మిగతా గ్రహాలపైనా కన్నేశాడు! ఇంత గొప్ప మనిషి దేవుడి గురించి చేసిన భావన ఏమిటి? దేవుడు కేవలం కోరిన వరాలిచ్చే గుడిలో ప్రతిమా? “నమ్ముకుంటే” చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు అని కొందరు, రాతిబొమ్మనో, రూపం లేని శక్తిస్వరూపాన్నో నమ్ముకోవడం ఎంత అజ్ఞానం అని నవ్వుకునే వాళ్ళు ఇంకొందరు! మరి దేవుడెవరనే నిజాన్ని ఎలా తెలుసుకోవడం? ప్రశ్నించడం వల్ల. ఇక్కడ “ప్రశ్న” అంటే కేవలం కుతూహలం కాదు, తెలివితేటల ప్రదర్శన కాదు, ఏర్పరుచున్న అభిప్రాయాల వ్యక్తీకరణ కాదు, ఎవరినో/దేనినో వ్యతిరేకిస్తూ అడిగేది కాదు. ఎంతో నిజాయితీగా చేసే ఒక తీవ్రమైన అన్వేషణ, అంతఃశోధన. అలాంటి “ప్రశ్న” నీదైనప్పుడు, బదులూ నీలోంచే వస్తుంది. బయటనుంచి కాదు. దేవుడంటే ఎవరన్నది ఎవరో చెప్పేది కాదు, మతగ్రంధాలు చదివితే తెలిసేది కాదు, నీకు నువ్వు అనుభవించాల్సింది.

 

నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని

నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని

తెలుసుకోగలిగే తెలివి నీకుందే

తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే!

 

నీదే నీదే స్వప్నం నీదే!

నీదే నీదే సత్యం నీదే!

 

దేవుడు కేవలం ఒక భావనే అయితే ఆ భావన ఎంత గొప్పదైనా దాని వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పైగా ఆ భావజాలాల్లో ఫిలాసఫీల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కూడా. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటూ మనని పర్యవేక్షిస్తున్నాడంటే ఆయన మననుంచీ మన జీవితాలనుండీ విడివడి ఉన్నాడని అనుకోవాల్సి వస్తుంది. దేవుడంటే ఇంతేనా? వివేకానందుడు రామకృష్ణ పరమహంసని మొదటిసారి కలిసినప్పుడు, “మీరు దేవుణ్ణి చూశారా?” అని అడిగితే, ఆయన “అవును! నేను ఉపనిషత్తులు క్షుణ్ణంగా చదివి దేవుణ్ణి దర్శించాను. దేవుడంటే ఎవరో తెలుసా?” అంటూ గొప్పగా ధ్వనించే విశేషణాలతో దేవుణ్ణి వర్ణించలేదు. “అవును! నేను చూశాను. నా ఎదురుగా ఉన్న నిన్ను చూసినట్టే, కానీ ఇంకా స్పష్టంగా! దేవుణ్ణి చూడొచ్చు, దేవుడితో మాట్లాడొచ్చు. కానీ ఆయన ఎవరికి కావాలి? భార్యపిల్లల కోసం, ఆస్తిపాస్తుల కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు కోసం కనీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎక్కడున్నారు? ఆర్తిగా వేడుకుంటే ఆయన తప్పక దర్శనమిస్తాడు!” అని చెప్పారు. ఇదీ నిజమైన భక్తంటే, ఇదీ దేవుణ్ణి దర్శించే తీరంటే!

“నీలో నిజాయితీ ఉంటే, ప్రశ్నించే తపనుంటే, నీ ప్రాణజ్యోతి ఆ దేవుడి నవ్వుగా గ్రహిస్తావు. నీ గుండెల్లో నాదం సాక్షాత్తూ ఆ కృష్ణుడి మురళీగానం అవుతుంది. నీకు దేవుడి నిజస్వరూపాన్ని తెలుసుకునే తెలివుంది. నీకు నువ్వే ఏర్పరుచుకున్న స్వప్నాల తెరలను తొలగించు, సత్యం సూర్యప్రకాశంతో కనిపిస్తుంది” అని సిరివెన్నెల మనకి  ప్రబోధిస్తున్నది ఇదే!

 

ఎక్కడెక్కడని  దిక్కులన్ని తిరిగితే  నిన్ను నువ్వు  చూడగలవా?

కరుణతో కరిగిన మది మందిరమున  కొలువై  నువ్వు  లేవా?

అక్కడక్కడని  నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా?

చెలిమిని పంచగా చాచిన చేయివైతే  దైవం నువ్వు కావా?

 

నీదే నీదే ధర్మం  నీదే!

నీదే నీదే మర్మం నీదే!

 

లోకంలో భౌతికవాదులు (materialists), ఆధ్యాత్మికవాదులు (spiritualists) అనే తేడా కనిపిస్తూ ఉంటుంది. స్థూలంగా చూస్తే ఈ ఇద్దరూ వేర్వేరుగా కనిపిస్తున్నా సూక్ష్మంగా చూస్తే ఇద్దరూ ఒకే “ఆనందాన్ని” వెతుకుతున్నారని జ్ఞానులు చెబుతూ ఉంటారు. మన ప్రస్తుతపు ఉనికిలో ఉన్న ఒక లోటుని అధిగమించడానికే కదా మన తపనంతా! ఆ లోటు సామజికమైనది అనిపిస్తే సమాజసేవో, సమాజోద్ధరణో, లేదో సామజికవిప్లవమో మన లక్ష్యమౌతుంది. వ్యక్తిగతమైనదైతే జీవితాన్ని గెలవడమో, డబ్బు సంపాదించడమో, సంఘంలో గౌరవమో మన లక్ష్యమౌతుంది. ఆత్మికమైనదైతే భక్తో, యోగమో, వేదాంతమో సాధనామార్గమౌతుంది. అంతే తేడా! కానీ లోటున్నది నీలో, నీ వెతుకులాటంతా బయట! ఎంత సాధించినా సంతృప్తిలేక తిరిగితిరిగి అలసిసొలసి చివరికి నీలోకి నువ్వే చూసుకున్నప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నాన్ని చేసినప్పుడు, నువ్వు దైవానికి చేరువవుతావు!

ఎందరో మహాగురువులు పదే పదే చెప్పిన ఈ విషయాన్నే సిరివెన్నెల ఎంతో సులభంగా వివరిస్తూ కొన్ని “ప్రాక్టికల్ టిప్స్” కూడా చెప్పారు. “నిన్ను నువ్వు వెతుకుతూ అలజడితో దిక్కులన్నీ తిరగకు, నీ మనసు కరుణకి కొలువైతే నీలోనే నిన్ను కనుగొనలేవా?” అన్నారు. “కరుణ” ప్రేమకి పరాకాష్ట. ప్రేమలో ఇంకా కొంత కోరుకోవడం ఉంటుంది, కరుణ సంపూర్ణమైన నిండుదనమై ఏమీ కోరుకోక ఇవ్వడంలోనే ఆనందపడుతుంది. కరుణతో నిండిన హృదయం దైవనిలయం కాదూ? “నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఆకాశానికి నిచ్చెన వెయ్యకు, ప్రేమతో సాటి మనిషి హృదయానికి వంతెన వెయ్యి” అన్నారు. ఆధ్యాత్మికత అంటే సాటి మనిషినీ, సమాజాన్ని విస్మరించే స్వార్థం కాకూడదు. సమస్తాన్ని తనలో ఇముడ్చుకునే ఔదార్యం కావాలి. అప్పుడు దైవభక్తి లోకకళ్యాణ కారకమౌతుంది. “ధర్మ”మంటే ఇలాంటి ప్రవర్తనమే. ఇదే దేవుణ్ణి చేరుకోవడానికి సులభమైన రహస్యం! ఈ మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు!

సిరివెన్నెల గారికి ముమ్మారు మొక్కుతూ, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను!

 

(ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వీక్షించొచ్చు)

 

 

 

 

 

చూడదగ్గ వి’చిత్రం’ 24

 

 భవాని ఫణి
~

కనీస అవసరాలన్నీ అలవోకగా తీరిపోతుంటే అప్పుడు మనిషికి కలిగే తరవాతి ఆశ ఏమిటి? ఆరోగ్యంగా ఎక్కువకాలం, కుదిరితే కలకాలం జీవించి ఉండాలనేగా. ఈ ఆశని తీర్చగల అతి సులువైన ఊహల్లో  కాలంలోకి ప్రయాణించడం కూడా ఒకటి. అంతేకాక కాలంలో ప్రయాణించగలిగితే పొందగల మిగతా లాభాలు అంకెలతో లెక్కించలేనన్ని. అటువంటప్పుడు అలా కాలం గుండా మనల్ని విహరింపచేయగల యంత్రమేదైనా మనకే, మనకి మాత్రమే దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఎన్ని అద్భుతాలు చెయ్యచ్చు! ఎంత గొప్పవాళ్ళం అయిపోవచ్చు! ఒక వేళ అదే యంత్రం ఒక దురాశాపరుడి లేదా దుర్మార్గుడి చేతిలో పడినట్లయితే జరిగే అనర్థాల్ని కూడా మనం సులభంగానే ఊహించగలం. ఇటువంటి ఆలోచనకే దృశ్యరూపం “24” చలన చిత్రం.

మన దక్షిణాదిన నిర్మితమయ్యే  చలన చిత్ర కళా ప్రక్రియ( జెనెరె)ల్లో సైన్స్ ఫిక్షన్ చాలా అరుదు. విచిత్రంగా మన తెలుగులో అయితే ఆదిత్య 369 ఒక్కటి మాత్రమే అటువంటి చలనచిత్రంగా కనిపిస్తోంది. ( డబ్బింగ్ చిత్రాలని మినహాయిస్తే). నిజానికి ఈ అంశంపై హాలీవుడ్ లో లెక్కలేనన్ని కథలూ, సినిమాలూ సృష్టించబడ్డాయి. మన దేశంలో కూడా హిందీ, బెంగాలీ,తమిళ భాషల్లో ఇటువంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆలోచనలు పాతవే అయినా వాటి వ్యక్తీకరణ జరిగిన విధానాన్ని బట్టి చలన చిత్రపు విజయం ఆధారపడి ఉంటుంది . అటువంటి చెప్పుకోదగ్గ సై. ఫి. చిత్రంగా 24 మిగిలిపోతుందని చెప్పచ్చు.
సైన్స్ పరంగా పెద్దగా తర్కానికి అందని కథైనప్పటికీ ఈ సినిమాలో మనం గమనించాల్సింది దర్శకుడు కథని ప్రజెంట్ చేసిన విధానాన్ని . జరిగిన ప్రతి సన్నివేశానికీ, సంభాషణకీ ఒక అంతరార్థాన్ని కల్పిస్తూ అల్లబడిన బిగువైన దృశ్య ప్రదర్శనగా ’24’ని పేర్కొనవచ్చు. మధ్యలో కమర్షియల్ అంశాలనీ, హాస్యాన్నీ, ప్రాంతీయతనీ చొప్పించినప్పటికీ అవి ఎబ్బెట్టుగా అనిపించని విధంగా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు విక్రం కుమార్.
కథ టూకీగా చెప్పాలంటే సైంటిస్ట్ అయిన డాక్టర్ సీతారాం, కాలం గుండా ప్రయాణించగలిగే ఒక చేతి గడియారాన్ని తయారుచేస్తాడు. ఇక్కడ కాలం గుండా ప్రయాణం అంటే భౌతికంగా కాదు. కేవలం మానసికంగా మాత్రమే. అంటే ఈ వాచ్ ని ఉపయోగించి మన ఆలోచనల్నీ అనుభవాల్నీ వెనక్కి గానీ ముందుకు గానీ పంపవచ్చు. ఉదాహరణకి మనం ఈ వాచ్ సహాయంతో పది సంవత్సరాలు కాలంలో  వెనక్కి ప్రయాణం చేసామనుకోండి. గతంలో  ఉన్న మనకి, తర్వాతి పది సంవత్సరాల కాలానికి చెందిన జ్ఞాపకాలూ, అనుభూతులూ కలుగుతాయి. అక్కడినించి ఆ జ్ఞానాన్నిఉపయోగించి మనం చేసే చర్యల ఫలితంగా మరో కొత్త భవిష్యత్తు సృష్టింపబడుతుంది. అలాగే కాలాన్ని కొంతసేపు నిలిపి వేయవచ్చు కూడా .
సీతారాం, ఇటువంటి ఒక గొప్ప కాల గడియారాన్ని సృష్టించిన ఆనందంలో ఉండగానే దుర్మార్గుడైన అతని కవల సోదరుడు ఆత్రేయ,  ఆ వాచ్ ని చేజిక్కుంచుకుని, కాలాన్ని జయించాలన్న కోరికతో చేసిన కొన్ని దుష్ట కార్యాల కారణంగా ఆ అన్నదమ్ముల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
అటుపైన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత సీతారాం కుమారుడైన మణి, ఆత్రేయ ఆట కట్టించి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాడనేది కథాంశం. కథ గురించి ఇంతకుమించిన వివరాలూ, సినిమాకి 24 అనే పేరు ఎందుకు పెట్టారన్న విషయానికి చెందిన సమాచారమూ సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. మొత్తం కథలో, ఏడాది లోపు వయసున్న పసి పిల్లవాడు, ఇరవై ఆరేళ్ళ మానసికమైన వయసుతో,  అనుభవాలతో, ఆలోచనలతో ఉండిపోవడమనే ఊహ చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి. దాన్ని ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దడంతో పాటుగా, అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తయారుచేసేందుకు
దర్శకుడు చాలా కృషి చేసాడు. ముందు కనిపించే ఒక దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని తర్వాతెప్పుడో జస్టిఫై చేసి జతకూర్చిన తీరు చాలా బావుంది. లాజిక్ చెడకుండా ఉండేందుకు దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా ఆద్యంతమూ కనిపిస్తుంది.
సాధారణంగా సై.ఫి చిత్రాలలో మానవ సంబంధిత భావోద్వేగాలకి చెందిన అంశాల లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కొన్ని కథల్లో అయితే కనీసం స్త్రీ పాత్ర ఉండను కూడా ఉండదు. కానీ 24 లో ఉన్న మెచ్చుకోదగ్గ అంశం ఏమిటంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధ బాంధవ్యాలని, ప్రేమాభిమానాల్ని ఈ సినిమా చాలా సహజంగా ఆవిష్కరిస్తుంది. మణికీ, అతన్ని పెంచిన తల్లి సత్య భామకీ మధ్య నడిచిన కథ, సినిమాని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది.  సినిమాలో అరవై శాతం వరకు ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా సహజంగా ఇమిడిపోయాయి. సూర్య నటన గురించి ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి. అతను ధరించిన మూడు పాత్రల్లో నటనకి అవకాశం ఉన్న మణి, ఆత్రేయ పాత్రలకి అతను పూర్తి న్యాయం చేకూర్చాడు. హీరోయిన్స్ నిత్యా మీనన్, సమంతాలు  సాంప్రదాయబద్ధమైన తీరులో అందంగా కనిపించారు. విభిన్నమైన కోణాల్లో కెమెరాని ఉపయోగించి సినిమాటోగ్రాఫర్ “తిరు” సినిమాకి తన వంతు సహాయాన్ని అందించారు  రెహమాన్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం మాత్రం తీసికట్టుగా ఉన్నా వాటి మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించదు.
మామూలు వాచ్ మేకర్ అయిన మణి, అతని సైంటిస్ట్ తండ్రి సీతారామ్ తయారుచేసిన కాల గడియారంలో సులభంగా మార్పులు చెయ్యగలగడం వంటి చిన్న చిన్న లోపాలూ, వాన చినుకుల్ని ఫ్రీజ్ చేసి చెదరగొట్టడం వంటి  అసంభవమైన అతిశయోక్తులూ కొన్ని కొన్ని ఉన్నప్పటికీ  24 ని ఒక  తెలివైన ప్రయోగంగా పేర్కొనవచ్చు.
*

అవధరించరయ్యా… !

 

 

-ల.లి.త.

~

 

సినిమాగోల లేని రోజుల్లో వినోద ప్రదర్శనలు తీరుతీరులు. ఒగ్గుకథలూ బుర్రకథలూ భజనలూ తప్పెటగుళ్ళూ యక్షగానాలూ.. ఇంకెన్నో.  భాగవతులు వీర శృంగార కరుణ రసాలురికిస్తూ కథలు చెప్పి అందరినీ కూచోబెట్టేవాళ్ళు. సురభి నాటకకంపెనీ భారీగా సెట్స్ వేసి నాటకాలతో ఊరందరినీ ఏకం చేసేది. చందమామా చుక్కలూ కూడా చూపులిటే వేస్తూంటే, ఊళ్ళో జనమంతా చాపలు పరుచుకుని చెంబుల్లో నీళ్ళు తాగుతూ చల్లగా రాత్రంతా ఆ ప్రదర్శనలొక్కటే చూసేకాలంలో ఎందుకు పుట్టలేదా అని నాక్కొంచెం దిగులేస్తుంటుంది. ఆడీ పాడే మనుషుల్ని కళ్ళారా చూసే కాలం అయిపోయి, వాళ్ళ ఛాయల్ని గ్రహణం చేసి తెరమీద ఆడించే సినిమాలొచ్చాయి. అవే వినోదమైపోయాక స్నేహితుల్తో చుట్టాల్తో సినిమాలకు వెళ్లి, నేలమీదా బెంచీలమీదా కుర్చీల్లోనూ కూర్చుని సినిమా చూసి, ఇంట్రబెల్లుకి ‘గోల్డ్ స్పాట్ : ద జింగ్ తింగ్’ తాగి, సినేమాకతలు చెప్పుకు తిరిగేవాళ్ళు జనం. ఇప్పుడు సినిమాకి వెళ్ళటం ఇంకోరకం అనుభవం. చాలామందికది  స్నేహితుల్తో కలిసి మాల్స్ కి వెళ్లి, మెక్ డోనల్డ్స్ తిండి కోక్ తో లాగించి, విండో షాపింగ్ చేసి, ఓ రెండుగంటలు చల్లగా మల్టీప్లెక్స్ థియేటర్ లో కూచుని రావటం. లేదా ఏకాంతంగా టీవీలో చూడటం లేదా సెల్ ఫోన్లో ప్రతిక్షణం ఎక్కడో ఓచోట ఛాయలతో కనెక్ట్ అయిపోవటం.

సినిమాని థియేటర్ లో చూడకుండా టీవీల్లో చూస్తుంటేనే ‘అది reduced experience’ అని గోల పెట్టాడు అదూర్ గోపాలక్రిష్ణన్. మరి సెల్ ఫోన్లో సినిమాలు చూడటాన్ని ‘bonsai experience’ అనాలేమో. విదేశాల్లో ఇప్పుడు టీవీ చూడటం కూడా తగ్గిపోయి ఇంటర్నెట్ లోనే పాటలూ బొమ్మలూ సినిమాలూ అన్నీ చూస్తున్నారట జనం. కామెరా రికార్డు చేసిన ప్రతిదాన్నీ ఇంటర్నెట్ వేగంగా అందిస్తుండటంలో లాభం కూడా లేకపోలేదు.  అలా దొరికిన ఒక పాత సినిమాలోని నృత్యనాటకాన్ని గురించి ఇలా…

***

సినిమాలొచ్చిన కొత్తల్లో అవెలా తియ్యాలో చేతగాకపోవటంతో సినిమాలన్నీ నాటక ప్రదర్శనని మూవీ కామెరాతో చిత్రించినట్టు ఉండేవి. చాలా రోజులవరకూ సినిమాలు తీసేవాళ్ళకి కథలూ నాట్యరీతులూ చూసివున్న అనుభవం వొదలక, సెమీ శాస్త్రీయ, జానపద నాట్యాలను శ్రద్ధగా సినిమాల్లో చూపించేవాళ్ళు. సినిమాకథకి ముడిపెడుతూ హరికథాకాలక్షేపాన్ని చూపించేవారు.  ‘వాగ్దానం’ సినిమాలో రేలంగి ‘భక్తులారా .. ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభై రోజులనుంచీ చెప్పినకథ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా’నని చెప్పుకుంటూ పోతాడు.

 

“ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె జానకీ దేహము, ఒక నిమేషమునందె,  నయము, జయమును, భయము, విస్మయము గదురా!  శ్రీమద్రమారమణ గోవిందో హరి…” – అని ‘వాగ్దానం’ హరికథలో శివధనుర్భంగాన్ని వర్ణిస్తాడు కవి. ఈ పద్యంలోని క్రమాలంకారపు సొబగు ఘంటసాల గొంతులో రెట్టింపవుతుంది.

‘రామా కనవేమిరా’ అంటూ సీతాకళ్యాణ హరికథని మరోసారి సొగసుగా చూపించారు ‘స్వాతిముత్యం’ సినిమాలో.  ‘ఇదెక్కడిన్యాయం?’ అనే సినిమాలో హీరోయిన్ హరికథ చెప్తూ జీవిస్తుంది. నాయికగా వేసిన ‘ప్రభ’ నిజజీవితంలో హరికథా కళాకారిణి కావటంతో హీరోయిన్ని ఇలాంటి కొత్తరకం ఉద్యోగంలో చూపించే ఆలోచన వచ్చింది దర్శకుడికి.

రానురానూ ఈ కళారూపాలు ప్రభుత్వ సాంస్కృతిక సంస్థల్లో విదేశాలవాళ్లకి చూపించుకోడానికీ, దూరదర్శన్ లోనూ  తప్ప జనంమధ్య పెద్దగా లేకుండాపోవటంతో  సినిమాల్లో కూడా అవి కనబడటం మానేశాయి.  ఇవి ఎక్కువగా పురాణకథలు, జానపద కథలు. వీటితో సమకాలీన సమస్యలూ హాస్యమూ కూడా కలిపి సరదాగా చెప్తూ అలరిస్తారు కళాకారులు. వాళ్లకి భాష, నుడికారం, సంస్క్రతుల మీద మంచి పట్టు ఉంటుంది. అచ్చతెలుగు చిందుతో కలిసి సంస్కృత పదాలు నాట్యం చేస్తాయి. కథ చెప్పటంలో లయ, సాగదీత అన్నిటిలోనూ ఉంటాయి. చాలాకథల్లో సృష్టి కథ, ఎల్లమ్మకథ, భారత, రామాయణ గాథలూ, ఇంకా బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం లాంటి స్థానిక వీరగాథలూ ఉంటాయి.

ఈ కళారూపాలను సినిమాలకంటే ఎక్కువగా జాతీయ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తమ ప్రచారంకోసం బాగా వాడుకున్నాయి. డబ్బు పెట్టగలిగేవాళ్ళే సినిమాలు తియ్యగలరు కాబట్టి వాళ్ళ అభిరుచుల ప్రకారమే మొదట్లో సంగీత నాట్యాలు సినిమాల్లోకి వచ్చాయి. అవి శాస్త్రీయ, జానపద ఛాయలతో ఉండేవి. సినిమాల్లో దళితులంటే సానుభూతి చూపిస్తూ వొట్టి బాధితులుగా చూపించటమే ఎక్కువ. వారి కళాభివ్యక్తి ఇంచుమించుగా సినిమాల్లోకి రాలేదు. అందుకే ఒక జాంబపురాణం ఏ సినిమాలోనూ కనిపించదు. పూర్తిగా ఎదగని తెలుగుసినిమా స్థాయి రానురానూ ఏ ఆసక్తీ లేనివాళ్ళు క్రమంగా ఆక్రమించటంతో పల్టీలు కొడుతూ పడిపోయింది.

తెలుగుదేశంలో ఇప్పుడు ఎటుచూసినా కనబడేవి రెండే. ఒకటి ఇంజనీర్లు. రెండు సినిమాలు. సినిమాదెబ్బకి నాటకరంగం నేలకంటుకుపోయుంది. నాటకం కంటే ముందటి కాలానికి చెందిన రకరకాల కతలు మాయం అవటానికి ముందుదశలో ఉన్నాయ్.

***

girija1

అరవైల్లో ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చింది. పేరు ‘రహస్యం’. ఆ సినిమా ఏమీ నడవలేదుకానీ అందులోని  ‘గిరిజాకల్యాణం’ ఆలిండియా రేడియోలోంచీ అందరికీ చేరింది. రేడియోతో పాటు చిన్నప్పుడు “తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిదీ.” అని అర్థం తెలీకపోయినా పాడేసుకుంటుంటే గొప్పగా గుర్రపుస్వారీ చేస్తున్నట్టనిపించేది. పిల్లల్ని కూడా ఆకర్షించగల శబ్దసౌందర్యంతో మల్లాది పాట రాస్తే, దానికి తగ్గ సంగీత ఝరీసౌందర్యంతో ఘంటసాల వరుస కట్టాడని అసలు తెలీదప్పుడు.

పురాణ ప్రేమకథలుగా రుక్మిణీ కల్యాణం, పార్వతీ కల్యాణం ప్రసిద్ధాలు. బ్రాహ్మణుడిద్వారా రుక్మిణి శ్రీకృష్ణుడికి ప్రేమవిన్నపం చెయ్యటం, ఆయన రుక్మిణిని రథంమీద ఎక్కించి తీసుకుపోవటం, అడ్డొచ్చిన రుక్మితో కృష్ణుడు పోరాడి అతన్ని అవమానం చెయ్యటం, ఇదంతా సాహసంతో కూడిన ప్రేమకథ.  పార్వతీ కల్యాణంలో శివపార్వతులకు అంత రొమాన్స్ లేకపోయినా మన్మధుడు పిలవని అతిథిలా వచ్చి శివుడిని రెచ్చగొట్టటమే ఈ కథలోని సాహసకార్యం. మన్మధుడే కలిగించుకోకపోతే పార్వతి అలా శివుడికోసం తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోతే, అసలే విరాగి అయిన శివుడు ఎంతకాలానికి ఆమె వలపునూ భక్తినీ కన్నెత్తి చూడాలి? శివుడి ప్రత్యేకత ఇంకోటుంది. నటరాజు కదా, కోపం వొచ్చినా సంతోషం వొచ్చినా తాండవ నృత్య ప్రదర్శన చేస్తాడు. దీనివల్ల కూడా మన్మధ విలాసంతో కూడిన శివపార్వతుల కళ్యాణ సంరంభం డాన్స్ డ్రామాగా ఎక్కువ బాగుంటుంది. అది కూచిపూడి భాగవతుల ప్రదర్శనైతే ?

కృష్ణాజిల్లా మొవ్వ మండలంలో ఉన్న చిన్నవూరు కూచిపూడి. అక్కడ పుట్టిన కొన్ని వంశాలవారు ఇప్పటికీ ఆ నాట్యాన్ని కొనసాగిస్తున్నారు. ‘దేవదాస్’ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్యదీ కూచిపూడే.  నేర్చుకున్న నృత్యాన్ని ఎంతో మనసు పెట్టి తను తీసిన ‘రహస్యం’ సినిమాలో చూపించాడు.

‘తక్కధింతాం తకతధింతాం’ అంటూ అశ్వగమన లయతో మొదలుపెట్టి, మూలపుటమ్మకూ చదువులతల్లికీ పరాకులు చెప్తూ మొదలౌతుంది ‘గిరిజా కల్యాణం’. తరువాత వినాయకుడు, కుమారస్వాములను తలుచుకుంటారు. స్థానిక దేవతలైన మంగళగిరి నరసింహుడూ, బంగరుతల్లి కనకదుర్గా, కూచిపూడిలో నెలవైన వేణుగోపాలస్వామీ వరుసగా బహుపరాకులు అందుకుంటారు. ఆ తరువాత కథలోకి దిగుతారు కూచిపూడి భాగవతార్లు.

ఆ నృత్యరూపకాన్ని తయారు చేసిన వాళ్ళు సామాన్యులా?  “ప్రౌఢవాక్యాల, ముగ్ధభావాల.. వచనరచనకు మేస్త్రి” అని ముళ్ళపూడి వెంకటరమణ కీర్తించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి చేసిన రచనను నృత్యనాటకంగా తీర్చిదిద్దినది వేదాంతం రాఘవయ్య. సినిమా పాటలకు మెత్తని పట్టుదారాల్లాంటి వరుసలెన్నో అల్లిన ఘనుడు ఘంటసాల ‘గిరిజా కల్యాణా’నికి సంగీతాన్ని కూర్చాడు. (సినిమాపాటల గాయకుడిగా కొన్ని శృంగార గీతాల్లోనూ కెరీర్ చివర్లోనూ కాస్తగా ఫెయిల్ అయాడేమో గానీ,  సంగీత దర్శకుడిగా ఎల్లప్పుడూ మంచిస్థాయి సంగీతాన్నే సినిమాపాటలకిచ్చాడు ఘంటసాల).

సినిమాసంగీతం భాషా భావసౌందర్యాలకు ఎక్కువ విలువ ఇస్తుంది. శాస్త్రీయసంగీతంలో రాగ, స్వర ప్రాధాన్యత ఎక్కువ. భావాన్ని వినసొంపుగా చేయటంకోసం శాస్త్రీయసంగీత లక్షణాన్ని తగ్గిస్తూ లలితసంగీత లక్షణాలను పట్టించుకుంటూ వచ్చింది సినిమాసంగీతం. భాష బాగావచ్చిన కవులూ రచయితలూ, రాగాలు నేర్చి పాటకు వరసలు కట్టే కంపోజర్స్ ఉన్న కాలంలో సినిమాపాట గొప్పవెలుగు వెలిగింది. ‘రావో రావో లోలంబాలక రావో’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి రాస్తే మరో రచయిత (కొసరాజు కావచ్చు) ‘ఉంగరాల ముంగురూల రాజా’ అని జానపద గీతాలతో మనసు దొంగిలిస్తాడు.  ఇక కర్ణాటక సంగీతాన్ని ఎన్నోయేళ్ళు అభ్యాసంచేసి, బడేగులాంఅలీఖాన్ ని కూడా అంతే ఇష్టంతో విన్న ఘంటసాల కూర్చిన తెలుగు సినిమాసంగీతం వినసొంపుగా ఉంటూనే రాగాలకు చక్కగా కట్టుబడి ఉన్న సందర్భాలే ఎక్కువని చెప్తారు. చిత్తూర్ సుబ్రమణ్యం పిళ్ళై లాంటి సంప్రదాయవాది ‘రహస్యం’ కు  ఘంటసాల ఇచ్చిన సంగీతాన్ని మెచ్చుకున్నాడట (వి.ఏ.కె.రంగారావు).

అంబా పరాకు  దేవీ పరాకు  మమ్మేలు మా శారదంబా పరాకు.

ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా బహుపరాక్ బహుపరాక్

చండ భుజామండల దోధూయమాన వైరిగణా షడాననా బహుపరాక్ బహుపరాక్

మంగళాద్రి నారసింహ బహుపరాక్ బహుపరాక్ బంగరుతల్లి కనకదుర్గ బహుపరాక్ బహుపరాక్

కృష్ణాతీర కూచనపూడి నిలయా గోపాలదేవ బహుపరాక్”.

 

అని తాళాలు వాయిస్తూ వేదాంతం రాఘవయ్య సూత్రధారిగా చేసే నృత్యమూ, సరిజోరుగా ఘంటసాల ఇచ్చిన ఆ లయా ఏ పాప్ సాంగ్ ఊపుకీ తక్కువకాదు.

అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా లలిత కళల విలువ తెలియు సరసులు పదింబదిగ పరవశులై”..

అని తమ విద్యను ఆస్వాదించి పరవశులయే వాళ్ళు లలితకళల విలువ తెలిసిన సరసులని గడుసుగా చెప్తూ

ఈశుని మ్రోల హిమగిరిబాల కన్నెతనము ధన్యమైన గాథ అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా అంటారు  సూత్రధారీ వంతపాటగాళ్ళూ.

కణకణలాడే తామసాన కాముని రూపము బాపి, అల కాముని రూపము బాపి, ఆ కోపి, కాకలు తీరి కను దెరచి, తను దెలసి, తన లలనను పరిణయమైన ప్రబంధము అవధరించరయ్యా అని కథను పరిచయం చేస్తారు.

ఇంతలో గిరిబాలా ఆమె చెలులూ ప్రవేశం…

రావో, రావో! లోలలోల లోలంబాలక రావో అని పార్వతిని ఆహ్వానిస్తూ

చెలువారు మోమున లేలేత నగవుల కలహంస గమనాన కలికీ ఎక్కడికే ?” అంటూ సఖులు ప్రశ్న వేస్తే

మానస సరసిని మణిపద్మదళముల రాణించు అల రాజహంస సన్నిధికే అని రాజహంసై వయ్యారం పోతుంది గిరిజ.

వావిలి పూవుల మాలలు కైజేసి, వయ్యారి నడలా బాలా ఎక్కడికే ?” అని నిలదీస్తే

కన్నారా నన్నేల కైలాస నిలయాన కొలువైన అల దేవదేవు సన్నిధికే” అని పరవశిస్తుంది.

ఇంతలో మధ్యవర్తి మన్మధుడు

తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిది. అండగా మదనుడుండగా, మన విరిశరముల పదనుండగా, నిను బోలిన కులపావని తానై వరునరయగ పోవలెనా? ఆఁ ఆఁ ” 

కోరినవాడెవడైనా ఎంతటిఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా, కనుగొనల ననమొనల గాసిజేసి నీ దాసు జేయనా! ఆఁ ఆఁ ఆఁ.

అంటూ ఆర్భాటం చేస్తూ వచ్చేస్తాడు.

ఈశుని దాసుని చేతువా అపసదా! అపచారము కాదా?  కోలల గూలెడి అలసుడు కాడు. ఆదిదేవుడే అతడు. సేవలు జేసి ప్రసన్నుని జేయ, నా స్వామి నన్నేలునోయీ. నీ సాయమే వలదోయీఅని పార్వతి  మదనుడిని వారిస్తే,

చిలుకతత్తడి రౌతా!  ఎందుకీ హుంకరింత ? వినక పోతివా ఇంతటితో నీ విరిశరముల పని సరి. కింకిణి పని సరి. తేజోపని సరి. చిగురుకు నీపని సరి మదనా అని ఆమె సఖులు కూడా హెచ్చరిస్తారు.

సామగ సాగమ సాధారా, శారద నీరద సాకారా, దీనాధీనా ధీసారా. ఇవే కైమోడ్పులు ఇవే సరిజోతలు  అని పార్వతి తపస్సు మొదలెడుతుంది. మన్మధుడు ఆత్రంగా పూలబాణాలు వేసేస్తాడు శివుడి మీద.

కళ్ళు తెరిచి శంకరుడు తాండవమాడగా మన్మధుడు కాలి బూడిదౌతాడు.

రతీదేవి పరుగెత్తుకొచ్చి విరులన్ నిను పూజసేయగా, విధిగా నిన్నొక గేస్తుజేయగా దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ.. పతిభిక్ష ప్రభూ”  అని ప్రాధేయ పడితే,

అంబా యని అసమశరుడు నను పిలిచెను వినవో, జనకుడవై ఆదరణతో తనయునిగా జేకొనవో, శరణంభవ శరణంభవ శరణంభవ స్వామిన్…”  అని పార్వతి శివుడిని వేడుతుంది.

మన్మధుడికి రూపు రావటంతో రతీదేవికి ఆనందం… ఇద్దరూ కలిసి పార్వతీ పరమేశ్వరులకిలా వందనం పాడతారు.

బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికీ జయవందనం జగమేలు తల్లికీ జయవందనం

సూత్రధారి కూడా మళ్ళీ ప్రవేశించి “కూచెన్నపూడి భాగవతుల సేవలందు దేవదేవా శ్రీ వేణుగోపాలా జయమంగళం, త్రైలోక్య మందారా శుభమంగళం అని మంగళం పలుకుతాడు.

సంస్కృతాన్నీ అచ్చతెలుగునీ సవ్యసాచిలా ప్రయోగించిన మల్లాది కవితానైపుణ్యాన్నీ శబ్దార్థసౌందర్యాన్నీ  వర్ణించటానికి నా భాష చాలదు. సినిమాపాటలను అంతెత్తున కూర్చోబెట్టేశాడాయన.

(లోలంబాలక=తుమ్మెదలవంటి ముంగురులు గలది. కోల=బాణం. గాసి=కష్టపెట్టు. అపసద=నీచుడా.  చిలుకతత్తడి రౌతు, అసమశరుడు, రసావతారుడు=మన్మధుడు.  కింకిణి=విల్లు.  గేస్తు=గృహస్థు)

***

ఈ పాట చెవులకి ఎంతగా పట్టేసినా, మల్లాది రవళికి దృశ్యాలను ఊహల్లో పేర్చుకోవటమే తప్ప సినిమా ఎక్కడా  దొరకలేదు. యుట్యూబ్ వచ్చాక ‘రహస్యం’ సినిమా దొరికింది. చక్కటి పాటలూ సంగీతం తప్పించి మిగతాదంతా చప్పగా, ఏవేవో రంగులేసిన భీకరమైన సెట్స్ తో ఉన్న ఆ సినిమాను రెండుగంటలపైగా భరిస్తే, ఈ గిరిజాకల్యాణ ఘట్టం లేనేలేదే! మొత్తానికి యుట్యూబ్ లోనే పాటకూడా రెండు భాగాలుగా కనబడింది. (యూట్యూబ్ లో పెట్టి, దీనిని చూడాలన్న నాలాంటివాళ్ళ చిరకాల వాంఛను తీర్చిన వసంత మాధవ గారికి కృతజ్ఞతలు) అరిగి రంగులుపోయి దీనావస్థలో ఉన్నా, ఈ నృత్యనాటకం చూస్తుంటే కూచిపూడి నాట్యరీతిని బాగానే పాటించినట్టుగా తోస్తుంది. సత్యభామ వేషంలో ఆరితేరిన కళాకారుడు వేదాంతం సత్యనారాయణశర్మ మన్మధుడుగా, కోరాడ నరసింహారావు శివుడిగా అభినయించటం వల్ల ఒక ప్రామాణికత వచ్చిన భావన. సూత్రధారి రాఘవయ్య, వంతపాటగాళ్ళు వేదాంతం రత్తయ్యశర్మ, భాగవతుల యజ్ఞనారాయణశర్మ. పార్వతిగా వేసిన బి.సరోజాదేవి, రతీదేవిగా వేసిన గీతాంజలి సినిమానటులు. మిగతా వేషాలలో కూచిపూడి భాగవతుల చేతనే నటింపజేస్తూ రాఘవయ్య తాను నేర్చిన కళపట్ల ఎంతో ప్రేమతో దీనికి నృత్యదర్శకత్వం చేశాడు. సినిమాసంకరం కాని కూచిపూడి శాస్త్రం దీనిలో ఎంతవరకూ ఉందో నాట్యశాస్త్ర విమర్శకులే చెప్పగలరు.

సంగీత సాహిత్య నృత్యాలు ముద్దుగా కుదురుకుని గర్వించదగ్గ తెలుగు సినిమాపాటగా ‘లలితకళల విలువతెలియు సరసులకు’ రసఝరీయోగాన్నిచ్చిన నృత్యనాటకం ‘గిరిజా కల్యాణం’. ఇది చక్కగా దక్కిన మనదైన తెలుగు వైభవం.

గిరిజా కల్యాణాన్ని ఇక్కడ వినండి.

http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=Girija+Kalyanam&sa=Go%21

 

 

 

 

 

 

స్వేచ్ఛకీ సముద్రానికీ మధ్య…

 

 

” ఇదిగో, ఇక్కడివరకే వెళ్ళాలి – దాటి నడిస్తే నాశనమే ” అన్న కట్టు ఉన్నంతవరకు తెంపుకు పోవాలనే అనిపిస్తుంది. ‘’నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఏమైనా చేసుకోవచ్చు ‘’ నంటే దాన్ని ఉపయోగించుకోవాలని చాలా మందికి ఉండదు. మానవ స్వభావం లోని ఇలాంటి ఒక వైచిత్రి కి ఆవిష్కారం ఇబ్సన్ నాటకం Lady from the Sea లో. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా తీగలు  అక్కడ కదులుతాయి.

ఇబ్సన్ నాటకాలలో చాలా భాగం సమస్యలతో అంతమవుతాయి. ప్రసిద్ధికెక్కిన A Doll’s House  అటువంటిదే. ఎక్కువ వెలుగులోకి రాని విషయమేమిటంటే ఆ నాటకానికి మరొక ఆశాజనకమైన ముగింపు ని కూడా తర్వాతి కాలం లో ఇచ్చి రాశారు . ఈ నాటకాన్నీ దాన్నీ కలిపి ఇబ్సన్ తిరోగమనం గా వర్ణించేవారున్నారు. ఆయన  చివరి నాటకాలలో ఇది ఒకటి .

గోథె ఇట్లా అన్నారట – ” తొలి రోజుల్లో రాగినాణాలో వెండి ముక్కలో  పోగుచేసుకుంటాము, పక్వత వస్తూన్న కొద్దీ వాటిని మారకం చేసి బంగారాన్ని సంపాదించుకోబోతాము ” .  తొలినాళ్ళ సమస్యల కు తాను చెప్పుకున్న సమాధానాల కన్న మెరుగైనవాటిని – ఎదుగుతూన్న కొద్దీ రచయిత అన్వేషిస్తారు – తప్పదు. ఒకరి సృష్టి లో ఒకేలాంటి ఇతివృత్తాలూ   పాత్రలూ పునరావృత్తం అవుతూండటం మనకి తెలిసిందే – రచయిత ప్రశ్నలు తృప్తి పడి  తీరాన్ని దాటేవరకూ ఇది సంభవిస్తూనే ఉంటుంది.

మనిషి – తన లోపలి ప్రేరణలు ఏవైనా గాని, ఆత్మనాశనం వైపుకే వెళ్ళనక్కర్లేదని ఈ నాటకం లో ఇబ్సన్ ప్రతిపాదించారని అంటారు. ఎంత తీవ్రస్వభావానికైనా ప్రపంచం తో లయ కల్పించుకోగల శక్తి ఉండవచ్చుననే భరోసా ఇవ్వదలుస్తారని కూడా [Stephen Unwin ] . ఆత్మనాశనం అన్నది సాపేక్షమే. సాధారణమైన దృష్టి తోనే ఈ మాటలు – మనం ఎంతమందిమి అంత అసాధారణులం నిజానికి ?  మరింకొక స్థాయి లో ,  పరస్పర గౌరవమూ స్వేచ్ఛా ఉన్న పరిస్థితులలో వివాహవ్యవస్థ కొనసాగటం సాధ్యమేనని  ఈ దశ లో ఇబ్సన్ అనుకుని, మనకీ చెప్తారు.

సముద్రాన్ని స్వేచ్ఛకూ నేల మీది జీవనాన్ని నియమబద్ధులై ఉండటానికీ ప్రతీక లుగా తీసు కుంటారు .  ఈ నాటకం లో కొన్ని అతి మానుషాంశాలు ఛాయామాత్రంగా ఉంటాయి,  ఇబ్సన్ ప్రధానంగా వాస్తవిక రచయిత అయినప్పటికీ. తక్కిన ఇబ్సన్ నాటకాల శిల్పానికి ఇందులోది కొంత తగ్గుతుందని విమర్శకులు అంటారు , కాని సత్యదర్శనం లో మరింకే నాటకానికీ ఇది తీసిపోదు – ఒక మెట్టు పైనే ఉంటుంది.

నార్వీజియన్ అయిన ఇబ్సన్  ఈ నాటకానికి ప్రేరణ ని అక్కడి జానపద గాథ ల నుంచి తీసుకున్నారు. హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ Mermaid గాథ ని చిత్రిస్తారు. సగం మనిషీ సగం చేపా అయిన అమ్మాయి ఒకరిని ప్రేమించి పెళ్ళి చేసుకునీ హాయిగా  ఉండలేక , మరణిస్తుంది. Mermen కూడా అక్కడి గాథలలో ఉంటారు – మానవ స్త్రీలని వశం చేసుకోగలవారు. ఈ వైరుధ్యాల కలయికలలో అశాంతీ అంతమూ మటుకే ఉండాలా ? అక్కర్లేదేమోనని ఇక్కడ ఒక సూచన. తర్వాత ఆలోచించవలసిన విషయం-  అంత స్పష్టమైన వైరుధ్యాలు నిత్యమూ భార్యాభర్త ల మధ్యన ఉంటున్నాయా లేదా అనేది.  సున్నితత్వం కొంత ఎక్కువగా ఉందనిపించే ప్రతి స్త్రీ mermaid కాదు .

ibsen

Ellida సముద్ర తీరం లో పుట్టి పెరుగుతుంది. సముద్రమే  ఆమె ఉనికి, సర్వస్వం. పేరు స్పష్టం గా ఉండని ఒక అపరిచితుడు – సాగరమే మానవుడైనట్లు కనిపించేవాడు , వచ్చి ఆమెతో స్నేహం చేస్తాడు. చాలా ఆదిమమూ ప్రాకృతమూ అయిన ప్రేమ వారి మధ్య పుడుతుంది. ఇద్దరి ఉంగరాలూ కలిపి నదిలో వేసి పెళ్ళైపోయిందని ప్రకటిస్తాడు అతను. ఈ లోపు , తన వైయక్తిక న్యాయం ప్రకారం ఒకరిని హత్య చేస్తాడు. ఈ లోకపు మర్యాదలనూ నియమాలనూ చట్టాలనూ పట్టించుకోని వాడు అతను . ఆ తర్వాత నౌకలో సముద్రం మీదికి వెళుతూ ఎదురు చూస్తూండమని ఆదేశం ఇస్తాడు.. ..ఎన్నాళ్ళకీ

రాడు .అక్కడికి వచ్చిన Dr  Wangel  కోరితే వారిద్దరికీ  ప్రాపంచికమైన వివాహం జరుగుతుంది.Wangel  ఒక పల్లెటూరి వైద్యుడు. రెండో పెళ్ళి, ఇద్దరు కూతుళ్ళు. ఆ ఇంట్లో Ellida  కి ఊపిరాడదు. సముద్రపు అనంతత్వం అలవాటయిన ఆమె కి అది ఇరుకైన పరిమితి. రోజూ వెళ్ళి  దగ్గర్లోని చిన్న రేవులో మునిగివస్తుందే గాని, సముద్రాన్ని ఇంటికి తెచ్చుకోలేదు. ఆ పరిస్థితి గురించి రచయిత ఒక సంభాషణ నడిపిస్తారు –

” ఏమిటీ బొమ్మ ? ”

” mermaid ”

” అలా కృశించిపోయి ఉందేం ? ”

” సముద్రానికి దూరంగా బ్రతకలేదు కదా”

” అవును, చేపల సంగతి అంతే. మనుషులు వేరు. వారు అలవాటు పడగలరు ”

అతి ప్రాథమికమైన భావోద్వేగాలకు మనుషులు అస్తమానమూ లోబడిపోనవసరం లేదని రచయిత అభిప్రాయపడతారు.   దారి తప్పిపోయామనుకోవటం    అంత అనివార్యమైనది కాదు.

”  జీవ పరిణామ శాస్త్రం లో మన పాత బంధువులు చేపలూ పక్షులూ. ఆ అంతఃప్రేరణలు కొందరిని సముద్రానికీ ఇంకొందరినీ గాలికీ ఆకాశానికీ ఆకర్షించబడేలా చేస్తాయి – కాని ఆ దశలను మనం దాటివచ్చేశామని తెలుసుకోవలసి ఉంది ” – అంటారు ఆయన. ఇబ్సన్ మార్క్సిజం ప్రభావం ఉన్నవారు, భౌతిక వాది . మానవుడి సార్వభౌమత్వాన్ని ఆయన అంగీకరిస్తారు. ఆ ఆధిపత్యం ప్రకృతి పైనా, తన మీద పని చేసే ప్రకృతి శక్తుల మీదా కూడా – ఈ నాటకం లో.

[ ఇలా అంటే ఆశ్చర్యం గా అనిపించవచ్చు. సనాతన హిందూ ధర్మం లోనూ Victorian morality లోనూ conventional communism లోనూ కూడా ఉద్వేగాలకి విలువ తక్కువ , వివిధ స్థాయిలలో. ]

Ellida ఎవరినీ దేన్నీ పట్టించుకోకుండా కుములుతుంటుంది.  బిడ్డ పుట్టి మరణిస్తాడు – అదీ ఆమెని భయపెడుతుంది, అపరాధ భావన తో. ఒక దశలో భర్త తో ” మన ఇద్దరం బేరం కుదుర్చుకున్నాం అంతే, మనకి జరిగింది పెళ్ళే కాదు ” అనేస్తుంది. ఆ భర్త లౌకికుడైనా సజ్జనుడు, సహృదయుడు.

” అవును, క్రమక్రమం గా నువ్వు మారిపోతున్నావు – తెలుస్తోంది నాకు ” –  తన ఇంటినీ వృత్తినీ వదిలేసి ఆమె ని సముద్రానికి దగ్గరగా వెళ్ళి స్థిరపడదామంటాడు . ఈ లోపు ‘ అతను ‘ వస్తాడు. Ellida తన  భార్యే అతని దృష్టిలో. వెళ్ళిపోదాం రమ్మని, ఆమె వెనుకాడితే రెండు రోజుల వ్యవధి ఇస్తాడు.

మొదట భర్త భరించలేకపోతాడు. తర్వాత , అంచెలంచెలు గా – నిబ్బరించుకుంటాడు.

” నీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది ఇప్పుడు- ఏ నిర్ణయం తీసుకునేందుకైనా ” – అని ప్రకటిస్తాడు చివరికి. దాన్ని ఆమె ఉపయోగించుకోబోతోందనే అనిపిస్తుంది.

తీరా ఆ రోజు మొదలయాక ” నన్ను ‘ అతని ‘ నుంచి రక్షించు ” అంటుంది భర్త తో. ఊహించకుండా వచ్చిపడిన ఆ స్వేఛ్చ ఆమెని కలవరపెడుతుంది. అనంతర పరిణామాలను ఊహించుకుందుకు ధైర్యం చాలదు. భర్త కీ సవతి కూతుళ్ళకీ తన అవసరం ఉందనిపిస్తుంది , ఆ బాధ్యతని తీసుకోవటం ఒక సార్థకత అనుకుని, ఉండిపోతుంది.

స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన ఎవరికీ దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఆమె ఆ risk  తీసుకుని అతనితో ఎందుకు వెళ్ళిపోలేదు ? ఆమె సమస్య  తీరలేదనీ ఈ ముగింపు సుఖాంతం అవదనీ వాదించేవారు ఉన్నారు.

నాకు ఇలా అనిపిస్తుంది – ఆమె లో ‘ భద్రత ‘ ని కోరుకునే లక్షణం కూడా ఒకటి ఉంది. లేదంటే నిరంతరమూ ‘ అతని ‘ కోసం ఎదురు చూస్తూ ఉండిపోవలసిన మనిషి – ఏ కబురూ అందకపోతే మాత్రం , Wangel ని ఎందుకని పెళ్ళాడాలి ? అట్లాంటప్పుడు అతని మీద అంత విపరీతమైన ప్రేమ ఉన్నట్లూ కాదు .  పెళ్ళి ఒక లక్ష్మణ రేఖ  అనిపించినన్నాళ్ళూ ఆమె విలవిలాడింది. దాటరాదు  అన్నంతవరకూ చెలియలికట్టని బద్దలు కొట్టాలనుకుంది.

‘ కాదు ‘ అన్న తర్వాత – అనిశ్చితత్వాన్ని ఎంచుకోలేకపోయింది. ‘ అతని’తో జీవితం ఎంత ఆటవికం గా అరాచకం గా ఉండబోతోందో ఆమెకి స్పష్టంగా తెలుసు, దానికి ఇప్పుడు సిద్ధంగా లేదు . తను మరొకరికి ఉపయోగపడగలను అన్నది మనిషికి చాలా సద్గర్వాన్ని ఇస్తుంది , ఆ  వైపు కి వెళ్ళిపోయింది. ఆమె తత్వం అది –  మనుషులూ పరిస్థితులూ పలువిధాలు . A Doll’s House  లో డోరా ఇల్లు వదిలి వెళ్ళిపోవటాన్ని ఎట్లా సార్వత్రికం గా తీసుకోకూడదో దీన్నీ అంతే. రచయిత నొక్కి చెప్పే ఒక విషయం ‘ఆత్మగౌరవం .

అవును, ఇంతటి contrast ఉంది కనుక ఇక్కడి ఎంపిక సులభమవుతుంది- ఇది నాటకం కదా మరి. ఆ  contrast తగ్గుతూన్న కొద్దీ తేల్చుకోవటం భారమవుతుంది, అదీ నిజమే. సరిగ్గా ఇక్కడే , కళ్ళు తెరుచుకుని ఉంటే , సాహిత్యప్రయోజనం మనకి కనిపిస్తుంది.  కొత్త నియమాలను సిద్ధం చేయటం సాహిత్యం బాధ్యత ఎంత మాత్రమూ కాదు , అది చేయ గలిగినది సహాయమూ  సూచనా మాత్రమే- సందర్భానికి అనుగుణంగా.

కొంచెం పక్కకి వెళితే – అరేబియన్ నైట్స్ లో ఒక కథ – పక్షి తొడుగు తో ఎగిరే గంధర్వ రాజకుమారి , ఆ తొడుగు దొంగిలించిన వాడిని తప్పనిసరై పెళ్ళాడి బిడ్డలను కంటుంది .  తొడుగు ను సంగ్రహించగల అవకాశం రాగానే ఎగిరి వెళ్ళిపోతుంది. అతను అష్టకష్టాలూ పడి ఆమె కోసం వెళితే వెనకాలే వచ్చేస్తుంది – అంతలో ఉంటుందన్నమాట,  కనీసం కొన్నిసార్లు.

చలం గారి ‘ జీవితాదర్శం ‘ ముగింపు ని ఇక్కడ తలచుకోవటం అసందర్భం కాదు. ఏదీ కట్టి పడేయలేని లాలస దేశికాచారి ‘  ఇచ్చిన ‘ స్వేచ్ఛ కి లోబడిపోతుంది. జీవితాదర్శం శాంతి అనిపిస్తారు చలం .

” స్వేచ్ఛ కి ఉండే లక్షణం ఇది – దాన్ని అన్వేషించేకొద్దీ అది చేతికి అందదు – విస్తృతమవుతుంది. ఒక సంఘర్షణ  మధ్యన నిలుచుని ‘ నేను సాధించాను ‘ అన్న మనిషి దాన్ని ఆ క్షణాన్నే పోగొట్టుకుంటున్నాడని అనాలి ”  అని ఇబ్సన్ అంటున్నారు. జీవితపు హద్దులకి ఉన్న చలనశీలతను ఇంత బాగా చెప్పినవారు అరుదు.

*

తక్షణ క్రియాశీలత కోరే ‘అసందిగ్ధ కర్తవ్యం’

 

  

-ఏ.కె. ప్రభాకర్

~

 

 “మనది దేశంలో అతి పెద్ద రసాయనిక కర్మాగారం. మనవి అత్యంత కీలకమైన ఉత్పత్తులు … కికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలిస్తే ఆనందంతో కేరింతలు కొట్టి మిఠాయిలు పంచుకొనే ‘వాళ్ళ’ ను కీలక స్థానాల్లో కూర్చుండబెట్టి నిశ్చింతగా కునుకు తీయగలమా? … పై పదవుల్లో ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అనధికారికంగా , దేశభక్తి అనే అంశాన్ని కూడా గుర్తించాలి”

  • -అసందిగ్ధ కర్తవ్యం (ఆడెపు లక్ష్మీపతి)

రాజ్యాంగంలో పొందుపరచిన సమాన హోదా , సమాన అవకాశాలు (Equality of status and opportunity) అన్న  ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే పై విధమైన ఆలోచన మన సమాజంలో యెప్పుడు మొదలైందో తారీఖులు దస్తావేజుల్తో చెప్పలేక పోవచ్చుగానీ , అది యివ్వాళ వ్యవస్థాగతంగా ఆధికారికంగానే అమలౌతుంది. మనువాద పాలకులకి సెక్యులరిజం బూతుమాటయి ‘అసహనం’ కలగజేస్తుంది.

మతతత్త్వం దేశభక్తి ముసుగేసుకొని చట్టసభల నేలమీద వికృతంగా నాట్యం చేస్తున్న ప్రత్యక్ష రాజకీయ సందర్భంలో మనం జీవిస్తున్నాం. ఫాసిస్టు శక్తులు హిందూ రాజ్య స్థాపన నినాదంతో  జాతీయవాదాన్ని భుజానికెత్తుకొని లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనల్ని రూపుమాపడానికి ప్రణాళికా బద్ధంగా  ప్రయత్నిస్తున్నాయి. దేశాధ్యక్ష యెంపికల్లో  రాజకీయ కుట్రలు జరగడం , మతం అందుకు సాధనంగా మారడం మనకు కొత్త కాదు కానీ ప్రభుత్వ యంత్రాంగంలో పాలనా వ్యవహారాల ప్రధాన శాఖల్లో విశ్వవిద్యాలయాల్లో కీలక పదవుల్లో ‘సొంత మనుషుల్ని’ నియమించుకొని  ‘దేశద్రోహుల్ని’ యేరిపారేసే ‘ప్రక్షాళన’ కార్యక్రమం యిటీవల వూపందుకొంది. ఈ వ్యూహం మతవాద హంతకుల చేతికి బాహాటంగానే ఆయుధాలు అందిస్తుంది.

గుజరాత్ ప్రయోగాన్ని దేశమంతటా అమలు చేసే యీ తతంగానికి వొక నిర్దిష్టమైన  ఆధిపత్య ఫిలాసఫీ వుందని ప్రగతిశీలవాదులు గ్రహించి అప్రమత్తమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరుగుతూనే వుంది. కేవలం సంఘటన జరిగినప్పుడే కాకుండా వ్యక్తులూ సమూహాలూ  నిరంతర స్వీయ చైతన్యంతో వున్నప్పుడు మాత్రమే లౌకిక ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోగలం. సామాజిక దైనందిన జీవితాల్లోకి చాపకింద నీరులా చొచ్చుకొచ్చిన మతవాదుల ప్రమేయాల గురించి హెచ్చరిస్తూ నిర్దిష్టంగా  స్పష్టమైన అవగాహనతో ఆడెపు లక్ష్మీపతి రాసిన విశిష్టమైన కథ

’( ఈ వారం జనవార్త , 24 ఫిబ్రవరి , 2 మార్చి 2008 – కథాసాహితి ,కథ 2008 లో పునర్ముద్రితం ).

తెలంగాణా కథా రచయితల్లో విలక్షణమైన శైలి లక్ష్మీపతిది. డెబ్భై యెనభైల్లో అల్లం రాజయ్య , బి యస్ రాములు , తుమ్మేటి రఘోత్తం రెడ్డి , పి చంద్ మొదలైన రచయితలు నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాటాన్నీ అడవిలో వెన్నెలలా విరగ పూసిన గిరిజన గూడేల చైతన్యాన్నీ బొగ్గుగుట్టల్లో కార్మిక వాడల్లో రగిలిన అగ్గికణాల్నీ కథలుగా మలిచిన రోజుల్లోనే  కరీంనగర్ కల్లోల పొత్తిళ్ళలోనే కలం తెరచిన రచయిత ఆడెపు లక్ష్మీపతి. అయితే రాకాసి బొగ్గుగనుల నేపథ్యం నుంచీ , గల్లీదాదాగిరీ స్వైరవిహారం చేసే పారిశ్రామిక వీథుల్లోంచీ , సెమీ అర్బన్ సంస్కృతిలో నెలకొన్న అరాచక స్నేహాలనుంచీ , జేమ్స్ జాయిస్ , వర్జీనియా వుల్ఫ్ , టాల్ స్టాయ్ , మామ్ , కుష్వంత్ సింగ్ , అబ్బాస్ , ముల్కరాజ్ ఆనంద్ మొ. విదేశీ – స్వదేశీ కలాల మీదుగా నడిచి రావడం మూలాన లక్ష్మీపతి కథారచనలో తనదైన ప్రత్యేకతని సాధించుకోగలిగాడు. జీవన్మృతుడు , తిర్యగ్రేఖ , ముసల్దాని ముల్లె , వ్యభిచారం , నాలుగు దృశ్యాలు, విధ్వంస దృశ్యం , త్రిభుజానికి నాలుగో కోణం , అసందిగ్ధ కర్తవ్యం వంటి కథలు వస్తు స్వీకరణలో – శిల్ప నిర్మాణంలో –  కథన సంవిధాన రీతిలో లక్ష్మీపతి చూపించిన వైవిధ్యం తక్కిన సమకాలీన రచయితల నుంచీ అతణ్ణి వేరుచేసి చూడడానికి కారణమౌతుంది.

తెలంగాణాలో  అప్పుడప్పుడే రూపొందుతోన్న ఆధునికానంతర సమాజంలో చోటుచేసుకొంటున్న సంక్లిష్టతల్ని లక్ష్మీపతి పట్టుకొన్నంత వొడుపుగా అతని సమకాలికులెవరూ పట్టుకోలేదంటే తప్పు కాదేమో! ఆ సంక్లిష్టతల్ని ఆవిష్కరించడానికే అతను కావాలనే విభిన్న శిల్పరీతుల్ని వుపయోగించి కథలు అల్లాడు. వస్తురూపాల్లో కొత్తదనం కోసం నిరంతరం తపించాడు. ఇమాన్యుయేల్ కాంట్ ఖలీల్ జిబ్రాన్ సీల్ గ్రాంట్ వంటి రచయితల కథనరీతుల్ని అధ్యయనం చేసిన నేపథ్యం నుంచీ రూపొందినదని విమర్శకుల మెప్పు పొందిన అరుదైన కథ  ‘అసందిగ్ధ కర్తవ్యం’ .

లక్ష్మీపతి యీ కథ రాసింది 2008 లో .  కానీ అప్పటికంటే యిప్పుడు  – సమాజపు ప్రధాన స్రవంతి ఆలోచనల్లో సైతం హిందూ – ముస్లిం అనే ద్విజాతి సిద్ధాంతాన్ని వేళ్ళూనికునేలా , పాలకుకులే ప్రధాన రాజకీయ యెజెండాగా పెట్టుకొని వొక పూనికతో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న సందర్భంలో – ఆ కథ  అవసరం యెక్కువగా వుంది. దాని ప్రాసంగికతను తెలుసుకోడానికి ముందు కథలోని వస్తువు క్లుప్తంగా :

కథ యెంత సరళమైందో అంతక్లిష్టమైంది. పబ్లిక్ రంగానికి చెందిన రసాయన కర్మాగారంలో ఇంజనీర్ గా అంకిత భావంతో పనిచేసే  మౌళి అనే ప్రధాన పాత్ర  అంతరంగ సంక్షోభంగా వుత్తమపురుష దృక్కోణంలో కథ నడుస్తుంది. అతని మానసిక క్షోభకి కారణం వొక వుద్యోగి ప్రమోషన్ విషయమై  పై అధికారులతో యేర్పడ్డ వివాదం.

‘సమయపాలన , విధేయత , విషయపరిజ్ఞానం , విశ్లేషణాపటిమ , రిస్క్ తీసుకొనే చొరవ , నాయకత్వ లక్షణాలు … వగైరా అంశాల్లో మామూలు ‘సంతృప్తికరం’ కన్నా మరింత ఉన్నతమైన రిమార్కులు పొంది వెరసి ‘చాలా మెరుగైన’ అభ్యర్థిని’ ఫోర్ మెన్ స్థానం నుంచి మెరిట్ కేటగరీలో యింజనీర్ గా ప్రమోట్ చేయాలని మౌళి చేసిన సిఫారసు అతని పై అధికారులు చీఫ్ డిప్యూటీ చీఫ్ ఇండస్ట్రియల్ యింజినీర్లకి , పర్సనల్ మేనేజర్ కి నచ్చలేదు. కారణం ఆ అభ్యర్థి అబ్బాసలీ అనే ముస్లిం.

అబ్బాసలీ ముస్లిం అయిన వొకే వొక్క కారణంగా  ప్రమోషన్ కి అనర్హుడై పోయాడు. మతం  ‘పుట్టుమచ్చ’తో దేశద్రోహి అయిపోయాడు. తమకి అనుకూలమైన ‘టెంపుల్ కమిటీ మెంబర్’ని ‘నమ్మకస్తుడిగా’ అందలమెక్కించాలంటే , అబ్బాసలీని చీడపురుగులా చూపాలంటే – చూపి యేరిపారేయాలంటే యేదో వొక కేసు అతని మీద బనాయించాలి. ఉద్యోగ విధుల్ని సరిగా నిర్వర్తించడం లేదని నిరూపించి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. లేదా దేశద్రోహి ముద్ర వేయాలి. వృత్తి పట్ల అతని నిబద్ధతని బద్నాం చేయాలి   ( జె యెన్ యూ లోనూ హెచ్ సి యూ లోనూ  యిటీవలి వ్యవహారాలు గుర్తు రావడం లేదూ!). నిఘా షురూ. వేట మొదలు. అబ్బాసలీ డ్యూటీలో వుండగా లెబనీస్ ఫిలాసఫర్ రాసిన పుస్తకం అతని టేబిల్ మీద కనిపించిందని  (చదువుతున్నాడని కాదు) వింత ఆరోపణ. అందులో యే ఫండమెంటల్ సిద్ధాంతాలున్నాయోనని  విచిత్రమైన అనుమానం. అతనికి వ్యతిరేకంగా డిపార్ట్ మెంటల్ స్థాయిలో డిసిప్లీనరీ యాక్షన్ మౌళియే తీసుకోవాలి. కాదంటే మౌళిని యిరుకున పెట్టడానికి ఫ్యాక్టరీ వ్యర్థాలని వూరి చెరువులోకి వదిలిన కారణంగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత కేసును వెలికి తీస్తారు. అందుకు అతణ్ణి బాధ్యుణ్ణి చేసే వ్యూహాన్ని రచిస్తారు. దీన్నుంచీ బయట పడాలంటే అతను తన సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలి. అబ్బాసలీ కెరీర్ ని నాశనం చేయాలి.

ఈ సందర్భంలో సెక్యులరిజం గురించి దేశభద్రత గురించి అంతర్జాతీయ ‘ఉగ్రవాదం’ గురించి ప్రతిభ గురించి ప్రమాణాల గురించి ముస్లింల ప్రొఫైలింగ్ విషయమై దేశంలో ‘చాప కింద నీరులా అమలవుతున్న విధానాల’ గురించి గ్లోబల్ సందర్భం గురించి పై అధికారుల ముఖత: రచయిత పలికించిన మాటలు రాజ్యాంగం దేశ పౌరులకిచ్చిన హక్కుల్ని పాలక వర్గాలు యెంత బేఖాతర్ చేస్తున్నాయో స్ఫుటంగా తెలియజేస్తాయి.

ఆబాల్యం నమ్మిన – అమ్మ శిక్షణలో నేర్చుకొన్న విలువలకీ వుద్యోగంలో యెదురైన ధర్మసంకట పరిస్థితికీ మధ్య నలిగే మౌళి ‘పంటి నొప్పి’ కారణంగా మెడికల్ లీవ్ పెడతాడు. దాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకోడానికి అధికారులు శాంక్షన్ చేస్తారు. కానీ చివరికి మౌళి అబ్బాసలీకి న్యాయం చేయడానికే నిశ్చయించుకొని యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. అయితే అతనా నిర్ణయానికి రావడానికి కారణమైన చిన్ననాటి సంఘటనే కథకి ఆయువుపట్టు. ఆ సంఘటనకీ పంటి నొప్పికీ వున్న సంబంధాన్ని విప్పి చెప్పడానికీ , ఆ సంఘటనని కథలోకి అన్ ఫోల్డ్ చేయడానికీ లక్ష్మీపతి యెన్నుకొన్న టెక్నిక్కే కథని వుత్తమ కళాఖండంగా రూపొందడానికి దోహదం చేసింది.

సెలవులో వున్న మౌళి టౌన్ షిప్ సంక్షేమ సమితి నిర్వహించే ఉగాది వారోత్సవాల్లో అతని కూతురు నటిస్తున్న ‘చిట్టచివరి యుద్ధం’ నాటికని చూడ్డానికి వెళ్తాడు. ‘ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం గనుక సంభవించి పరస్పర మత, జాతి విద్వేషాలతో వివిధ దేశాలు ఒకదానిపై మరొకటి వినాశకర అణ్వస్త్రాలు , జీవ రసాయనిక ఆయుధాలు ప్రయోగించుకున్నట్లయితే …’ అన్నది నాటిక వస్తువు. స్టేజి మీద యుద్ధరంగాన్ని మౌళి మనసులో ఆశలకూ ఆశయాలకూ నడుమ , అంతరాత్మ ప్రబోధానికీ కెరీరిస్టు ప్రలోభానికీ మధ్య జరిగే సంకుల సమరాన్ని , పంటి నొప్పిని కొల్లేజ్ చేస్తూ గత వర్తమానాల మధ్య కథని ముందుకీ వెనక్కీ స్వింగ్ చేస్తూ చెప్పిన తీరు అమోఘం.

స్టేజి మీద ప్రదర్శన జరుగుతూండగా మౌళికి ‘ఎవరైనా బలంగా కొట్టారా మిమ్మల్ని?’ అని డెంటిస్ట్ అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. కంపినీలో ప్రమాదం సంభవించినప్పుడు అబ్బాసలి ప్రాణాలకి తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సంఘటన కళ్ళ ముందు కనిపిస్తుంది. అతని ప్రమోషన్ని అడ్డుకొనేందుకు పై అధికార్లు పన్నుతోన్న కుట్రలు , వాళ్ళతో తన ఆర్గ్యుమెంట్లూ జ్ఞప్తికొస్తాయి. ప్రదర్శనలో కోతి పాత్రలో యెంతో చురుగ్గా అద్భుతంగా నటిస్తున్నబాలనటుణ్ని చూస్తే చదువులో ఆట పాటల్లో అందరికన్నా ముందుండే తన బాల్యమిత్రుడు సలీం గుర్తొచ్చాడు. ఈర్ష్యతో తను అతనికి చేసిన ద్రోహం , అందుకు అమ్మ తనని బలంగా మూతి మీద కొట్టిన దెబ్బ ‘మస్తిష్కంలో తుఫానులా’ అలజడి చేశాయి. అలాంటి ‘తప్పు ఇంకెప్పుడూ చేయకు’ అన్న అమ్మ హెచ్చరిక తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశించింది. నాటికలో థియేటర్లో ముందువరసలో కూర్చొన్న చీఫ్ యింజినీర్ కళ్ళలోకి నిర్భయంగా చూపులు కలిపి  సెలవు కేన్సిల్ చేసుకొన్నట్టు భార్యకి చెబుతాడు.

స్టేజి పై పిల్లల నాటక ప్రదర్శన  , ప్రేక్షక స్థానంలో కూర్చొన్న మౌళి అంతరంగ శోధన , బాల్యంలో  ముస్లిం స్నేహితుడు సలీం జ్ఞాపకాలు , అతని పట్ల తన ప్రవర్తన , అమ్మ బోధించిన జీవితపు విలువలు వాటిని పాటించలేకపోతున్న అపరాధ భావన , చేసిన తప్పుని దిద్దుకోవాలనే తపన … కథకి అవసరమైన వాతావరణాన్ని, మౌళి  అంతరంగ సంక్షోభ చిత్రణకి కావాల్సిన సంఘర్షణని , యేకకాలంలో మనశ్శరీరాలనుభవించే వేదననీ  కథలోకి తీసుకురావడంలో , వొకేసారి నాలుగు స్థల కాలాల్లో గత వర్తమానాల మధ్య వూయలూగే కథన నిర్మాణంలో లక్ష్మీపతి చూపిన నేర్పు అబ్బురపరుస్తుంది.

వస్తువు రచయిత స్వీయ వుద్యోగ జీవితానుభవం నుంచీ తీసుకున్నందువల్ల , యిన్ సైడర్ కథనం కావడం వల్ల  కథకుడి విషయ పరిజ్ఞానం పట్ల పాఠకుల్లో విశ్వసనీయత కలుగుతుంది. ఫ్యాక్టరీ పాలనా వ్యవహారాలన్నీ ఆధిపత్య మత కుల శక్తుల అధీనంలో వున్నాయని చెప్పడానికి ప్రతి సూక్ష్మాంశాన్నీ రచయిత పరిగణనలోకి తీసుకొన్నాడు( అధికార్లకి పెట్టిన భార్గవ కాశ్యప్ వర్మ వామనరావు వంటి పేర్ల దగ్గర్నుంచీ ).

స్టేజిపై జరిగే ప్రదర్శనని  సమాంతరంగా నడపడం వల్ల అందులోని సన్నివేశాల్ని పాత్రల్ని మౌళి అంతరంగ సంక్షోభానికి కారణమైన సంఘటల్ని వ్యక్తుల్నీ పోల్చి చూసుకొనే అవకాశం రచయితే కల్పించాడు. స్టేజి మీద యుద్ధం మౌళి లోపల యుద్ధం అన్నంత వరకూ , ఏంజిల్ పాత్రలో అనుపమని (మౌళి కూతురు) చూసినపుడు అమ్మ గుర్తుకురావడం , నాటిక పోటీలో ప్రతిభకి గుర్తింపుని అబ్బాసలీ ప్రమోషన్ తో ముడిపెట్టడం వరకూ   బాగానే వుంది కానీ …. నాటికలో  సూక్ష్మ క్రిమి గుర్రం పాము సింహం చివరి మనిషి  వంటి పాత్రలు యేవి యెవరికి ప్రతీకలుగా వున్నాయో తెలుసుకోవడంలో కొంత గందరగోళం యేర్పడి పాఠకుడికి మానసిక శ్రమ కలుగుతుంది. అయితే మౌళి ఆలోచనల్లో సుదూర – సమీప గత వర్తమానాల మధ్య వారధిలా , మరీ ముఖ్యంగా సలీం జ్ఞాపకాలని తవ్వడానికి , ప్రదర్శన చక్కగా వుపయోగపడింది. అంతిమంగా మనిషి మానవీయ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని బోధించింది. కథలోనూ కథ లోపలి కథలోనూ అంతస్సూత్రంగా వున్న యీ సారాన్ని ముడివేయడానికి లక్ష్మీపతి అడుగడుగునా మెలకువతో వర్తించాడు.

సలీం మౌళిల మధ్య చోటుచేసుకొన్న వైరుధ్యంలోని సామాజిక కోణాన్ని ఆవిష్కరించడంలో సైతం రచయిత గొప్ప కౌశలం చూపాడు. సలీం ‘చదువులోనూ ఫస్టు. ఆటల్లోనూ ఫస్టు’. వాడికన్ని శక్తి సామర్థ్యాలు యెక్కడివంటే – వాడి ‘ఇంట్లో ఎద్దు మాంసం తింటార’ ని మౌళి మిత్రులకి  చెబుతాడు. అదే విధంగా మౌళి  మిత్రులంతా కోతికొమ్మచ్చి ఆడడానికి ‘తెల్లగున్నోడు దొరా , నల్లగున్నోడు దొంగ’ అని చప్పట్లు వేసినప్పుడు ‘సలీంది తెల్లనిదీ మిగతా ముగ్గురివీ నల్లనివీ’ వస్తాయి. ఆట నీతి ప్రకారం సలీం దొంగ కాకూడదు. కానీ ఆటలోని సహజ న్యాయాన్ని ‘మెజార్టీ’ బలంతో రద్దుచేసి మౌళి సలీంని దొంగగా తీర్మానిస్తాడు. పాపం సలీం మౌనంగా అంగీకరిస్తాడు. అలా సమకాలీన సమస్యలుగా పరిణమించిన బీఫ్ తినడం , మెజార్టీ ఆధిపత్యం వంటి విషయాలు కథలోకి అలవోకగా వచ్చి చేరాయి.

ఈ కథ యిప్పుడు రాసి వుంటే యీ విషయాల్ని రచయిత కథలో పనిగట్టుకు చొప్పించినట్టు భావించడానికి అవకాశముండేది. కానీ 2008 లోనే యింత లోతైన అంశాల్ని కథలో ప్రస్తావించిన లక్ష్మీపతి క్రాంతదర్శిత్వాన్ని మెచ్చుకోకుండా వుండలేం. అడ్డగోలు పారిశ్రామికీకరణ కారణంగా జీవితాలు విచ్ఛిన్నమైన తన ప్రాంత  ప్రజల  తీరని వెతల్ని స్టోరీగా రిపోర్ట్ చేసిన కడప గ్రామీణ విలేకరి ముస్లిం అయిన కారణంగా (ఇస్మాయిల్) వార్తా పత్రిక ఎడిటర్ అతణ్ణి ‘హిందూ సంపద’కి వ్యతిరేకిగా ముద్రవేసి పత్రికలో న్యూస్ స్టోరీని తిరస్కరించడాన్ని అద్భుతంగా చిత్రించిన కేతు విశ్వనాథ రెడ్డి ‘విరూపం’ కథ (2002) కూడా నాకీ సందర్భంలో  గుర్తుకొస్తుంది. పాఠకులు పాఠ్యం లోతుల్ని అర్థం చేసుకొని రచయిత దృక్పథాన్ని అందుకోడానికి  అవసరమైన పరికరాలు కథ బయటకన్నా కథలోనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిళితమై వుంటాయని  చెప్పడానికి ఆడెపు లక్ష్మీపతి ‘అసందిగ్ధ కర్తవ్యం’ గొప్ప వుదాహరణ. శిల్పం వస్తువుని వున్నతీకరించడానికి యెలా దోహదం చేయగలదో  తెలుసుకోడానికి లక్ష్మీపతి కథలు పాఠ్య గ్రంథాల్లా వుపయోగపడతాయని చెప్పడం యే మాత్రం అతిశయోక్తి కాదు.

తిండిని సంస్కృతిలో భాగంగా భావించిన బుద్ధిజీవులు బీఫ్ ని నిషేధించడం దళితుల మైనార్టీల సాంస్కృతిక అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా , భారతీయ సమాజంలోని బహుళత్వాన్ని నాశనం చేసే యెత్తుగడగా  అభివర్ణిస్తూ వ్యాఖ్యానించడం తరచుగా వింటున్న కోణమే. అయితే నా మట్టుకు నాకు లక్ష్మీపతి రాసిన  ‘అసందిగ్ధ కర్తవ్యం’  చదివాకా యిటువంటి నిషేధం ప్రత్యేకంగా కొన్ని సెక్షన్ల పౌరుల్ని శారీరికంగా బౌద్ధికంగా బలహీనులుగా మార్చడానికి రహస్యంగా నిర్మించుకొన్న అజెండానేమో అన్న అనుమానం సైతం కలుగుతుంది. అంతే కాదు కథలో ఆటలో సలీంని ‘సీసాపెంకుల్లోకి తోసేయాలన్న పాడు ఆలోచన’ మౌళికి కలిగినందుకు అతని అమ్మ యెంతో నొచ్చుకొంటుంది. సలీం తల్లిదండ్రుల్ని ‘రసూల్ మామ బీబీ అత్త’ అని పేర్కొని వాళ్ళ పట్ల సహానుభూతినీ ప్రకటిస్తుంది. తెలిసో తెలీకో కొడుకు చేసిన తప్పుని భవిష్యత్తులో తిరిగి చెయ్యొద్దని శాసించింది.

మౌళి చిన్నతనంలో మన సమాజంలో వుండిన యీ స్నేహ బాంధవ్యాల్ని మాయం చేసి విభజన రేఖలు సృష్టిస్తున్న ‘అసాంఘిక’ శక్తులు యివాళ రెచ్చిపోతున్నాయి. వాటిని  అణచివేయాల్సింది పోయి  వాటికి పాలకులే వత్తాసు పల్కుతున్న సందర్భంలో అబ్బాసలీకి అండగా నిలవడానికి మౌళి నిశ్చయించుకొన్నాడన్న ముగింపు గొప్ప భరోసానిస్తుంది. ‘ద్వేషంతో ఏకపక్ష కోణంలోంచి ఆలోచించకండి’ అని నాటక ప్రదర్శనలో హితవు పల్కిన ఏంజిల్ వేషం కట్టిన కన్నకూతురిలో కన్నతల్లిని చూసుకొని తప్పు దిద్దుకొని ‘మనిషిని కాపాడడానికి’  సిన్సియర్ వుద్యోగిగా తనకున్న సమస్త శక్తులూ –  అస్త్ర శస్త్రాలు -వుపయోగించడానికి వెనుకంజ వేయని మౌళిలోని క్రియా శీలతని అందిపుచ్చుకోవడమే యివ్వాళ మనముందున్న అసందిగ్ధ కర్తవ్యం.

 

*

 

 

 

కథలకు కొత్త వేకువ – లద్దాఫ్ని

 

   kaifiyath

 

   ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’లా గాకుండా గొంతు సరాయించుకొని ధిక్కార స్వరాన్ని, తన సొంత అస్తిత్వాన్ని అంతర్జాతీయ వేదికపై సైతం ఆలాపన చేస్తుంటే అగ్రకుల, బ్రాహ్మణాధిపత్య భావజాల ఆనకొండలు ఎప్పటికప్పుడూ ఆమెను మింగెయ్యాలని చూసినై. అనకొండల నుంచి తప్పించుకుంటూ దిగ్గజాలను ఢీకొంటూ తన సాహిత్యానికి సానబెడుతూ ఉంటే మరోవైపు పితృస్వామ్యం, పురుషాధిపత్యం ఫత్వాలను జారీ చేసింది. కలానికి సంకెళ్ళు వేయజూసింది. ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు, స్వీయ ఉనికిని చాటుతున్న పూల విహంగాన్ని సైలెంట్‌ మిస్సైళ్లతో కూల్చాలని ప్రయత్నం చేసినారు. అయినా తన రేజర్‌ ఎడ్జ్‌ లాంటి షార్ప్‌నెస్‌తో అటు కవిత్వంలోనూ, ఇటు కథల్లోనూ షాజహానా తమ జీవితాల్ని  చిత్రిక గట్టింది. దూదేకుల బతుకుల్ని బాధిత, పీడిత మహిళా దృక్కోణంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా దూదేకుల మహిళ దయనీయ స్థితిని రికార్డు చేసింది. నిజానికి తెలుగు సాహిత్యంలో కుటుంబ, ప్రేమ, రాజకీయ కథలు వచ్చినంతగా పేదరికాన్ని అంత బలంగా చిత్రించిన కథలు ఎక్కువగా రాలేదు. షాజహానా మాత్రం అణగారిన పేద బతుకులకు అక్షరాలద్దింది. బ్రాహ్మణాధిపత్యాన్ని బరిబత్తల చేసింది. కొందరు ఎనుకముందాడుతుంటే ఆమె ‘బిల్లి’మెడలో గంట కట్టి ఊరేగించింది. ‘నాన్‌ వెజ్‌’ని తినిపించింది. చైతన్య స్రవంతి పద్ధతిలో కవితాత్మకంగా కథలల్లింది. ‘మనిషి పగిలిన రాత్రి’లో ‘మంచిరాయి’ని వెతుకుతానని ‘వాదా’ చేసింది. తెలుగు సాహిత్యంలో నెలకొన్న ఖాళీలను కొంత పూరించింది.

తాజాగా వెలువడ్డ ‘లద్దాఫ్ని’ కథల సంపుటిలో వేదనాభరితమైన ముస్లిం/దూదేకుల మహిళల పేదరికాన్ని, దుర్భర జీవితాల్ని, అవిద్య, గుర్తింపుకు నోచుకోని అవిశ్రాంత శ్రమను, ఆచార వ్యవహారాలు, తాగుడు వ్యసనం, తినేతిండి, ప్రేమల్ని కథల్లో చర్చించింది. లైంగిక దోపిడీని నాలుగ్గోడల మధ్య నుంచి నడి రోడ్డు మీదికి తెచ్చింది. సన్నాయి ఊదింది. నిద్ర నటిస్తున్న  వారిని మేల్కొల్పింది. సోయిమాలినోళ్ళ మీద కొరడా ఝులిపించింది. ముసుగులో గుద్దులాట కాదు. తన మనసులో ఏముందో చెప్పింది. మెదడుకు పని పెట్టింది. తన చుట్టూ ఉన్న జీవితాల్ని పెద్దమ్మ, అమ్మమ్మ, అత్తగారిల్లు, పనిచేసే చోటు, కళ్ళముందరి సమాజాన్ని అక్షరీకరించారు. ఇవన్నీ బురఖాల్లో, చీకట్లో, పురుషాధిపత్య సర్పపరిష్వంగంలో ఇప్పటి వరకు కప్పివేయబడి ఉన్నాయి. వాటన్నింటినీ నఖాబ్‌ తొలగించి వెన్నెల్లో ఆరబోసింది. బంధనాలు తెంచుకొని అక్షరాలను తెలుగు వాకిట అలికింది. ‘సితారే జమీ పర్‌ బిఛాతే రహు’ అంటూ ఉంది.

   గతంలో నఖాబ్‌, దర్దీ కవితా సంపుటాలు, స్కైబాబతో కలిసి చాంద్‌తారల్ని పూయించిన షాజహానా కవిగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన కవితల్ని వినిపించారు. ముస్లిం స్త్రీవాద కవిగా తనదైన ముద్ర ఏసిండ్రు. ఇప్పుడు తాజా పుస్తకం ‘లద్దాఫ్ని’తో ముందుకొచ్చింది. వెల్‌కమ్‌ టు లద్దాఫ్ని. నిజానికి ఇంతరకూ ‘ప్యూర్‌ ముస్లింలు’ తమ తోటి దూదేకుల వారిని హేళన చేస్తూ ‘లద్దాఫ్‌’ అని పిలిచేందుకు వాడేవారు. అదే విషయాన్ని దూదేకుల స్త్రీకి అన్వయిస్తూ షాజహానా 1998లో తన స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అవహేళనగా మారిన, అబ్యూజ్‌ అయిన పదానికి ఆత్మగౌరవాన్ని అద్దేందుకు

    ‘‘అబ్‌ సౌబార్‌ సబ్‌కే సామ్‌నే చిల్లావుంగీ

    హా… మై లద్దాఫ్నీ…హు!

           లద్దాఫ్నీ హీ రహూంగీ…’’ అని నినదించింది. తెలుగు అక్షరాల్లో ఉర్దూలో నినదించిందంటే ‘ప్యూర్‌ ముస్లిం’ని టార్గెట్‌ చెయ్యడమే ఉద్దేశ్యం. అందులో ఆమె సఫలీకృతమయింది. ఇప్పుడు ‘లద్దాఫ్ని’ పేరు తన కథల పుస్తకానికి పెట్టుకోవడమంటేనే తన స్వీయ అస్తిత్వాన్ని చాటుకోవడమే గాకుండా, సమాజంలో గౌరవాన్ని సాధించుకోవడంగా చూడాలి. తెంగాణలో ఇంకా చెప్పాలంటే మొత్తం తెలుగు సాహిత్యంలో (ఖాదర్‌ని మినహాయిస్తే) ముస్లిం జీవితాలు రికార్డు కావడానికి గట్టి పునాదులు ఖాజా, స్కైబాబ, అఫ్సర్‌, యాకూబ్‌, షాజహానాలు వేశారంటే అతిశయోక్తి కాదు. వీళ్ళంతా బాబ్రీ, గోద్రా, దాద్రీ, గుజరాత్‌, ముజఫర్‌ నగర్‌, హైదరాబాద్‌ను అతి దగ్గరగా చూడడమే గాకుండా నిరసన గళమెత్తిన దారిదీపాలు. తమ శక్తినంతా  చమురుగా చేసి సాహిత్య కాగడాలుగా వెలిగిస్తున్నారు. దీనికి తోడు షాజహానా తెలంగాణలో ‘మట్టిపూలు’ పూయిస్తున్నారు. స్త్రీ వాదం ముసుగులో కొనసాగుతున్న కోస్తాంధ్ర మనువాదాన్ని నిలదీశారు. నమ్మిన భావాజాలాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా ఆచరిస్తున్నారు.

sha

    ఇవ్వాళ ముస్లింల దుస్థితిని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. ముస్లింల హక్కుల గురించి మాట్లాడితే, ధిక్కార స్వరాన్ని వినిపిస్తే దేశద్రోహిగా ముద్రవేసే దుర్మార్గమైన పరిస్థితి ప్రస్తుతం దేశమంతటా నెలకొంది. ఢిల్లీ జెఎన్‌యూ ప్రధాన కార్యదర్శి షెహ్లా రషీద్‌ ప్రభుత్వ దమనకాండను, హక్కుల అణచివేతను నిలదీసినందుకు హిందూత్వ వాదులు హతమారుస్తామని ఆమెను బెదిరిస్తున్నారు. అదే వర్సిటీ విద్యార్థి ఉమర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసిండ్రు. ఆయన చేసిన ‘నేర’మల్లా ఉరిశిక్ష రద్దు కోరడమే! ఈ దేశంలో ఉండాలంటే మేము చెప్పినట్లు వినాలే లేదంటే పాకిస్తాన్‌కు పోవాలె అని బిజెపి ఎంపీలే ఉగ్రోపన్యాసాలిస్తున్నారు. కాషాయ మూక ప్రవచించేదే దేశభక్తి. వీళ్ల ఉన్మాద నినాదాలకు కోరస్‌ ఇవ్వనట్లయితే కుత్తుకలు ఉత్తరిస్తామని బరితెగిస్తున్నారు. ఆవు మూత్రానికి ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముస్లింలుగా, ముస్లిం స్త్రీలుగా మరింత లోతుగా జీవితాల్ని సాహిత్యీకరించాల్సిన అవసరముంది. ఖాళీలను పూరించాలి. అగ్రకుల సాహిత్య సంస్థలు, మీడియా సైలెంట్‌గా ఉన్న అంశాల్ని ఎజెండా మీదికి తీసుకురావాలి.

    నిజానికి దేశ విభజన, హైదరాబాద్‌ రాజ్యం బలవంతపు విలీనం నుంచి బాబ్రీ మసీదు మీదుగా తెలంగాణ ఏర్పాటు వరకూ ఆ తర్వాతి పరిస్థితుల్లో ముస్లిం/దూదేకుల జీవితాల్లో వచ్చిన, వస్తూ ఉన్న మార్పును కొంచెం సామాజిక స్పృహతో చూసినట్లయితే ముస్లిం సమస్యను మరింత సులువుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. గల్ఫ్‌ వాకిళ్లలో షాదీ పేరిట షేక్‌ల చెరలో చిక్కుకున్న చిన్నారుల జీవితాలు, అత్యాచారాలు అన్నీ సాహిత్యం లోకి రావాలి. ఇవ్వాళ తెలుగులో రాస్తున్న ముస్లిం మహిళల్ని ఒక్క చేతి వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు. అలాగే ఉర్దూలో రాస్తున్న హైదరాబాదీలు మహా అంటే ఇంతకు రెండింతలు ఉండొచ్చు.  అయితే వీళ్లలో ‘ఇస్లాం స్వీకరించినా ‘దూదేకుల’, ‘లద్దాఫ్‌’, ‘పింజారి’ ‘నూర్‌భాష్‌’ లాంటి పేర్లతో పిలువబడుతూ.. అవహేళన చేయబడుతూ..ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధంగా న ఘర్‌ కా న ఘాట్‌ కా’ గా మారిన వారి జీవితాల గురించి కన్సిస్టెంట్‌గా రాస్తున్నది ఒక్క షాజహానానే అంటే అతిశయోక్తి కాదు.

    ‘‘నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు. కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ తాతయ్య, అన్నయ్య ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధి వాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే’’ అని ముస్లిం స్త్రీలపై ఉన్న ఆంక్షల్ని ఎత్తి చూపింది.

    షాజాహానా సంప్రదాయ వ్యతిరేకి. పక్కా ప్రజాస్వామిక వాది. సంప్రదాయాన్ని వ్యతిరేకించినందువల్ల మైనారిటీల్లో మెజారిటీ వర్గం ఆగ్రహానికి గురయింది. దూదేకుల మహిళ కావడంతో సహజంగానే హిందూ ఫండమెంటలిస్టులకు కూడా  ఆమె వైఖరి నచ్చలేదు. దీంతో అటు ముస్లిం, ఇటు హిందూ అతివాదులను ఎదుర్కొంటూ సాహితీ సృజన చేశారు. మతోన్మాదులనే కాదు కులాన్ని అర్థం చేసుకోవడంలో విఫమయిన లెఫ్టిస్టులూ  ఆమెపై కన్నెర్ర జేసిండ్రు. లెఫ్టిస్టులు కులాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా విఫలమయ్యారో ముస్లింలను అర్థం చేసుకోవడంలో కూడా అలాగే విఫలమయ్యారు.  ఎంత సేపు ఆర్థిక దృష్టితోనే సమాజాన్ని చూశారు. కొలిచారు. అరచేతిలో స్వర్గం చూపిచ్చిండ్రు. ఆర్థిక అసమానతలు  తొలగితే సమసమాజం ఏర్పడుతుందనే థియరీనే చెప్పారు తప్ప ప్రాక్టికల్స్‌ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే కుల, మత సమస్యలు వామపక్షీయుల ఎజెండా మీదికి రాలేదు.

    నిజానికి ప్రపంచీకరణే ప్రధాన శత్రువు అని కొత్తతరానికి దిశానిర్దేశం చేసిన వామపక్షీయులు కన్వీనియెంట్‌గా  బాబ్రీమసీదుని ‘కూల్చడం’పై నిశ్శబ్దంగా ఉన్నారు. ముస్లింలను చైతన్య పరిచేందుకు వీరికి అనుబంధంగా పనిచేస్తున్న సాహితీ సంస్థలు, సాహితీ వేత్తలు ఎలాంటి చొరవ చూపలేదు. అన్ని ఎన్‌కౌంటర్లూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు వ్యతిరేకమయినవే! అయితే కొంత మంది మేధావులు మావోయిస్టు ఎన్‌కౌంటర్లను మాత్రమే ఖండిరచి ‘ఆలేరు’ ఎన్‌కౌంటర్‌పై నిశ్శబ్దాన్ని పాటించారు.  చావులో కూడా ముస్లింలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. తెలుగు ప్రాంతాల్లో కారంచేడు, చుండూరు సంఘటనలు దళితోద్యమానికి దిశా నిర్దేశం చేశాయి. అలాగే బాబ్రీ మసీదు షహీద్‌ కావడం, బొంబాయి అల్లర్లు, ఉరితీతలు సాహిత్యంలో స్థానం సంపాదించుకోలేక పోయాయి. కనీసం బహిరంగంగా మాట్లాడుకునేందుకు చర్చనీయాంశాలు కాకుండా పోయాయి. వామపక్ష పార్టీలు, సాహితీవేత్తలు, వారి అనుబంధ సాహిత్య సంస్థలు దాన్నొక ఉద్యమంగా తీర్చి దిద్దడంలో విఫమయ్యారు. గుజరాత్‌ గాయం నుంచి మాత్రమే ముస్లిం సాధకబాధకాలు తెలుగు సమాజానికి తెలియ వచ్చింది. అది కూడా హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ రిహాబిలిటేషన్‌లో పాల్గొన్న ముస్లిం కవుల పుణ్యమా అని ఆ విషయం చర్చనీయాంశమైంది. మొత్తం తెలుగు సమాజాన్ని వీళ్ళు కదిలించగలిగారు. బాధితుల పట్ల సానుభూతిని, వారి పోరాటానికి సంఫీుభావాన్ని సాధించగలిగారు.

    బాబ్రీ మసీదు సంఘటన ఒక కట్టడం కూల్చివేతగా కాకుండా ఒక నమ్మక ద్రోహంగా, గంగా`జమునా తెహజీబ్‌లో దరార్ గాచూడాలి. ఆనాటి నుంచే తెలుగు సమాజం కూడా హిందూ`ముస్లింలుగా చీలిపోవడం ప్రారంభమయింది. ఈ చీలిక జిల్లాల్లో కూడా కనిపించింది. ఈ చీలిక నేపథ్యంలో బిజేపీ, దాని అనుబంధ సంస్థల ఆగడాలు గుజరాత్‌లో గాయాలు చేశాయి. దేశమంతటా చిచ్చు బెడుతున్నాయి. గ్రామాల్లో ముస్లింలు బతకలేని దుర్భరమైన పరిస్థితి నెలకొంది.  పీర్ల పండుగ చేసుకోలేని స్థితి. అట్లనే దర్గాకు పొయ్యెటోళ్ల మీద ఆంక్షలు. వీటన్నింటి నేపథ్యంలో షాజహానా కథల్ని (కవిత్వాన్ని కూడా) పరిశీలించాలి. విశ్లేషించాలి. కథలన్నీ ఒకదానికొకటి సంబంధం లేనివిగా పైకి కనిపిస్తున్నప్పటికీ అత: సూత్రంగా ముస్లిం మహిళా దృక్కోణం కనిపిస్తుంది. అంతేకాదు చైతన్య స్రవంతి పద్ధతిలో కథలు రాసి తన ప్రతిభను చాటుకున్నారు.

    సిల్‌సిలా కథ దుర్భర పేదరికాన్ని రికార్డు చేసింది. తాగుడు వ్యసనాన్ని, అవిద్య, గ్రామాల్లో ఎన్ని పనులు చేసినా రెండు పూటల తినడానికి తిండిదొరకని దయనీయ స్థితి. మాదిగ వాడలకు ఆనుకొని ఉన్న దూదేకుల కరీంబీ ఎన్ని ఢక్కామొక్కీలు తింటూ జీవితాన్ని గడుపుతున్నది షాజహానా హృద్యంగా చిత్రించింది. ‘‘ఇంగ మీ బడెబాపు ఎండా కాలం వాయించబోతడు, కతం, బిడ్డా! గా వాయించబోయినపుడు దెచ్చిన పైసలే పైసలు! ఇంగ పైసా సంపాయించడు. మీంచి దినామూ తాగుడు గావాలె. గా మూన్నెల్ల సంపాదన ఎన్నాలొస్తది నువ్వే చెప్పు బిడ్డా. నిఖా అయిన  కాణ్ణుంచి ఇప్పటిదాంక సుఖమంటేందో ఎర్కలేకపాయె! నాట్లకు, కలుపుకు, కోతకు బోవుడు.. అయినంక పెసలేర, దూదేర, మీర్చేర బోవుడు. ఏ పని దొర్కితే దానికి బొయ్యి పుట్టెడు పుట్టెడు గింజలు దెచ్చి ఇంట్ల బోస్తుంటే సంసారం నడుస్తుండె’’ అంటూ గ్రామీణ ప్రాంతాల్లో దూదేకుల స్త్రీలు పడుతున్న కష్టాలను, తెచ్చిన గింజలు తీస్కపోయి తాగుడుకు అలవాటయిన భర్తల్ని భరిస్తున్న భార్యల్ని షాజహానా కళ్ళకు కట్టిండ్రు. ఏడాదిలో కేవలం మూన్నెళ్ళు మాత్రం పనిదొరికే స్థితిలో మగవాళ్ళు, అందుకు తాగుడు తోడు కావడం మహిళపై భారం ఎంత పడుతుందో ఈ కథ తెలియజెప్పుతుంది. కరీంబీ ఒక్క షాజహాన పెద్దమ్మే కాదు. కింది కులాల వారి ప్రతి ఇంట్లో ఇట్లాంటి పెద్దమ్మో, చిన్నమ్మో కనిపిస్తారు. పేదరికమెంత దుర్భరంగా ఉన్నా ప్రేమ, ఆప్యాయతలకు, కమ్మని కాయి బువ్వకు ఎక్కడా లోటు రాదు.

    ‘సండాస్‌’ పూర్తిగా ముస్లిం స్త్రీ కథ. గ్రామాల్లో కింది కులాల వారందరూ చెంబట్కొని ఊరవుతలికి బహిర్భూమికెల్తరు. అయితే ముస్లిం స్త్రీలు  ఇంట్లోనే సండాస్‌కెల్తరు. పురుగులు జిబజిబలాడే సండాస్‌ కథ సదువుతుంటే ముక్కుకు వాసన పట్టేస్తదంటే కథ శక్తి అర్థం చేసుకోవొచ్చు. అనివార్యంగా కర్చీఫ్‌ని ముక్కుకు అడ్డం పెట్టుకొని కథ చదివేలా ఉంటది. పెండ్లికి ఇల్లు అమ్మి కిరాయింటికి మారే తల్లి, చెల్లి దీనగాథ కూడా ‘సండాస్‌’లో ఉంది. పాయఖాన సాఫ్‌గ ఉన్న తన ఇంటికే భర్తను తోడుకొని వచ్చి కాపురం పెట్టాలని ఆలోచిస్తున్న దశలో తల్లి పెళ్ళి కర్సు కింద యిల్లు అమ్మి రేకుల యింటికీ అదీ సండాస్‌ మాత్రమే ఉన్న ఇంటికే కిరాయికి మారడంతో కథ ముగుస్తుంది. స్త్రీ దృష్టి కోణంలో బహిర్భూమిని కూడా కథాంశంగా చేయడమే గాకుండా ప్రస్తుతమున్న భారీ స్వచ్ఛభారత్‌ పథకాలు, ప్రచారార్భాటాలు లేని కాలం లోనే పేదరికం దాని ద్వారా అంటిన అపరిశుభ్రతని ఆంగ్ల పుస్తకాల్లోకి కూడా ఎక్కించింది. కవితాత్మకంగా చైతన్య స్రవంతి పద్ధతిలో రాసిన మంచిరాయి నిజంగా ఫిలాసాఫికల్‌ అప్రోచ్‌తో సాగుతుంది. అట్లాంటిదే మరో కథ ‘మనిషి పగిలిన రాత్రి’. పెళ్ళుబుకుతున్న దు:ఖ సముద్రాలను, ఎంత అణచుకున్న అణగారని హృదయాంతరాల్లోని అలల్ని అక్షరీకరించారు. ‘వాదా’ ‘నేను’ కథల్ని ప్రేమకు ప్రతిరూపాలుగా ఆవిష్కరించారు. రంది కథా సంకనంలో బిల్లి కథ తీసుకున్నప్పుడు కొంతమంది శైలీ, శిల్పాలను లెక్కబెట్టిండ్రు. ఈ లెక్కబెట్టినోళ్ళంతా అగ్రకుల బాపనోళ్ళే. ‘బిల్లి’ కథలో అలెగరీ పద్ధతిలో బ్రాహ్మణిజాన్ని దోషిగా నిలబెట్టింది. టిఫిన్‌ బాక్స్‌ కథలో కూడా అంటు పాటించే అగ్రకులాల వారికి బుద్ధి చెప్పింది. అలాగే దివారే కథ తాత్విక చింతనను ఒక గైడ్‌, ఫిలాసఫర్‌ లాగా మెదళ్లలోకి ఎక్కేలా చెప్పింది. ఖతీజ గఫూరి కథలో లైంగిక దోపిడీకి గురవుతున్న ముస్లిం సమాజాన్ని ఆర్ద్రంగా చిత్రించింది. కంచెకాకర కథలో ఇంకా మనుషుల్లో మిగిలి ఉన్న మంచిని తెలియ జెప్పింది.

    ఒక దూదేకుల మహిళ చదువుకోవడమే గొప్ప. అలాంటిది పిహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ అందుకున్న విద్యావంతురాలు షాజహాన. చదువుకున్న కాలం నుంచి పనిచేస్తున్న కాలం వరకూ తాను అనుభవించిన, చూసిన జీవితాల్ని అక్షర బద్దం చేసింది. అంబేద్కర్‌ కృషి వల్ల  ‘హిందూ కోడ్‌ బిల్లు’ వచ్చి హిందూ స్త్రీలకు విడాకులు తీసుకోవడానికి వీలు ఏర్పడింది. అయితే ఇందుకు భిన్నంగా ముస్లిం సమాజంలో ఉన్న తలాక్‌ పద్ధతిని వ్యతిరేకిస్తూ కవిత్వమల్లింది. ఈ విషయం ఇప్పుడు మళ్ళీ   రంగం మీదికి వచ్చింది. దేశభక్తి వర్సెస్‌ దేశద్రోహం చర్చలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు హేట్‌ పాలిటిక్స్‌ని, హేట్రెడ్‌ను  ప్రచారం చేస్తున్నారు. సహనానికి తావు లేకుండా అసహనంతో ఊగిపోతున్నారు. క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఓడిపోవాలని ప్రార్థించడం దేశభక్తికి గీటురాయిగా మారింది. ఎవ్వరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలె అంటే దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు. నిజానికి ముస్లింలంటేనే పాకిస్తాన్‌కు పంపించేయాల్సిన వాళ్ళు అని సంఫీుయుల ఉవాచ. పాకిస్తాన్‌లో ఏమో గానీ ఇండియాల మాత్రం ‘దాయాది’ని సాకుగా చూపిస్తూ ప్రజలు ఆకలితో చస్తున్నా అణ్వస్త్రాల స్టాకును పెంచుతున్నారు. దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రకటనలే తప్ప ప్రేమ, ఆప్యాయతలకు ప్రభుత్వ చర్యల్లో తావుండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో షాజహానా రచనలు అటు బురఖాను, తలాక్‌ని ఎదిరించినందుకు ముస్లింలకు, బ్రాహ్మణీయ భావజాలాన్ని, హిందూ అగ్రకుల మతోన్మాదాన్ని నిరసించినందుకు ‘హిందువుకు’ కంటగింపుగా మారాయి. ఇప్పుడు కంటగింపుగా మారినా భవిష్యత్‌లో అందరికీ సమానమైన విలువ దక్కే సమాజ నిర్మాణానికి ‘లద్దాఫ్ని’ కథలు  ఖాళీలు పూరించే ప్రయత్నంలో భాగంగా చూడాలి. మరిన్ని ఖాళీల పూరింపుకు మరిన్ని కథల్ని ఆమె నుండి ఆశిస్తూ…

*

సారీ ! కమలినిని క్షమించలేను !!

 

మబ్బులతో నిండి ఉన్న ఆకాశం ఇక ఒక్క క్షణం కూడా ఆగలేనట్లు వర్షాన్ని పూల రేకుల్లా వెదజల్లుతూ ఉంటే , ఎక్కడి నుంచో ఓ శహన రాగం మనసు ని ముద్దాడి లోపలెక్కడో దాక్కున్న ప్రేమ ను ఒక్క సారి తీసుకొచ్చి ముందు నిలబెడితే…జీవితం మీద మళ్ళీ ఇష్టం మొదలవుతుంది. ఓ మంచి పుస్తకం చదవాలని ఆరాటం కలుగుతుంది. గొడుగులతో ఆపలేని వర్షం, ఆపకుండా చదివించే పుస్తకం, ఇంకేమీ అక్కరలేదని పించే నిలువ నీయలేని ప్రేమ, అతనినో, అతని అక్షరాన్నో చూస్తె చాలు మళ్ళీ మళ్ళీ ఆ ప్రేమ కోసమైనా జీవించాలని పించే క్షణాలు, ఒక కప్పు తాగితే కళ్ళ ముందు కవ్వించే కాఫీ తోటలు…. జీవితం గురించి ఎన్ని కలలున్నాయో….కథల గురించి కూడా అన్ని కలలున్నాయి. ఫేస్ బుక్ లైక్ లకు దూరంగా, వాట్స్ అప్ మేసేజీలకు నిర్లిప్తంగా…..సామాన్య తీసుకెళ్ళే పుష్ప వర్ణ మాసం లోకో, సింధు మాధురి చూపించే విభిన్న వింత లోకపు కలాపి సమక్షం లోకో ఒక్క సారి నిజంగా వెళ్లి చూసి రావాలని అనిపిస్తూ ఉంటుంది. సన్న జాజి పువ్వులా కురిసే వర్షాన్ని చూసినప్పుడో,  ప్రేమికుడి సున్నితమైన ముద్దు లా మురిపించే మంచుపువ్వుల కౌగిలింత ను వెచ్చగా అనుభవిస్తున్నప్పుడో, ఎడారి లా దుఃఖపెడుతున్న జీవితాన్ని మళ్ళీ ప్రేమతో ఆనందంగా జీవించమని ప్రపంచం లో ఏ మూలనో ఎవరో ఒకరికి ఓదార్పు భుజాన్నిచ్చే ఓ మంచి పుస్తకాన్ని చదివినప్పుడో, నా లోపలి మేఘమల్హార్ రాగాల సోయగాలు పోతూ ఉంటుంది. జీవితం పట్ల, సాహిత్యం పట్ల అంత ప్రేమ పెంచుకొన్నాక, ఇటీవల వచ్చిన ఓ కథ చదివితే దిగులేసింది . ప్రతి కథ రాయటానికి ( ఎంత చెత్త కథ అయినా సరే) రచయిత కు ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది . రీడర్ కి నచ్చటానికి, నచ్చక పోవటానికి ఒక్కటి కాదు, వంద కారణాలుంటాయి. ఈ కాలమ్ లో నేను రాసేది అందులో ఒకటి అయి ఉండొచ్చు.

kalpan profile photo-1(1) నాకిష్టమైన సమకాలీన  రచయితలలో సామాన్య ఒకరు. ఆమె ఏం రాసినా ఆసక్తి గా చదువుతాను. ఇటీవలి కథ ”

“ని కూడా అంతే ఇష్టం గా చదివాను. తన శైలి నాకు ఇష్టం. ప్రతి వాక్యం లో గుప్పున పరిమళించే కవిత్వం మరింత ఇష్టం. ఈ కథ లో కూడా ఆ రెండు పుష్కలం గా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు   నచ్చింది. నచ్చనిదల్లా కథలోని అంశాలు.  కేవలం ఒకరికి నచ్చటం, మరొకరికి నచ్చకపోవటం లాంటి చిన్న అంశమే అయితే  “మేఘమల్హార్” లో రాయకనే పోదును. ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్నే పణం గా పెట్టి సామాన్య లాంటి రచయిత్రి  ఈ కథ రాసిందని బాధ కలిగింది.కథ   రాయటానికి ప్రతి రచయిత కి లాగానే సామాన్య కి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నాకు ఆ కారణం తో నిమిత్తం లేదు కానీ నా ” కథానుభవం” చెప్తాను.

కమలిని ఒక శారీరక తప్పు ( ఆమె దృష్టి లో)   చేస్తుంది. పడక గది లో కూర్చొని ఆమె ఈ అపరాధ ఉత్తరం రాస్తుంటే యువ సామాజిక నాయకుడు, శాస్త్రవేత్త అయిన దీపూ అనబడే భర్త, భార్య కు ఇష్టమైన వంట వండుతూ ఉంటాడు. ఈ ఒక్క వూహ తప్ప కథ లో ఇంకేమీ కొత్తదనం లేదు. వివాహ బంధానికి  బయట మరో  అనుభవం పొందిన కమలిని ఇంటికొచ్చి పితృస్వామ్య వ్యవస్థ ప్రతినిధి గా మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది, ఉత్తరం రాస్తుంది . ప్రతి దానికీ కార్య కారణ సంబంధాలు ఉంటాయా? అని అమాయకంగా అడుగుతూనే ఓ అనుభవాన్ని పాతివ్రత్యం, తప్పు, అనైతికత లాంటి భావజాలపు త్రాసు లో వేసి తూచి మాట్లాడుతుంది.

s1

తస్లీమా గురించి గౌరవం తో మాట్లాడే కమలిని కి తన పట్ల తనకు గౌరవం లేకపోవటమేమిటో మనకు అర్థం కాదు. తను ఎవరితో అనుభవం పంచుకుందో ఆ మనిషి మీద ప్రేమ కానీ, ఇష్టం కానీ ,గౌరవం కానీ లేకుండా “ అతనొట్టి స్త్రీ లోలుడు” అని చెప్తుంది. కమలిని పదహారేళ్ళ పడుచు కాదు. నడి వయసు ప్రౌడ. అతను ప్రేమోన్మాదం చూపించి ఆమె కోసం వల వేసి ఆమె చాంచల్యాన్ని బయటకు లాగాడు. కళ్ళు మూసుకొని భర్త పేరు నే కలవరిస్తూ ఆమె అతనితో ఓ అనుభవాన్ని పంచుకొని చీకటి తప్పు చేసి  భర్త దగ్గరకొచ్చి నన్ను క్షమించు. నేనిప్పుడు నెలసరి తో శుభ్ర పడ్డాను. నీ ముందు తప్పు ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పుడూ ఈ తప్పు చేయను, నన్ను క్షమించు అని కాళ్ళా వేళ్ళా పడుతూ ఉత్తరం రాస్తుంది. ఓ భార్య మరొకరితో ఒక రాత్రి గడిపిన తప్పిదానికి భర్త క్షమించి ఆమె ను ఏలుకోవాలంటే తిక్కన కాఆల్సి వచ్చాడు. గురజాడ కావాల్సి వచ్చాడు. ఏ తప్పు చేయని సీత ను వదిలిన రాముడి ప్రస్తావన తెస్తుంది. తస్లీమా భర్త వైవాహికేతర సంబంధాల పట్ల తస్లీమా ఎంత బాధ పడిందో గుర్తు చేస్తుంది.

s2 (1)

ఒక స్త్రీ పర పురుషుడి తో ఓ అనుభవాన్ని పొంది భర్త దగ్గరకెళ్ళి  తానూ చేసిన తప్పును  ఒప్పుకోవటం మాత్రం అయితే ఇంత చర్చ లేకపోను. అది ఆ ఇద్దరికి , లేదా ముగ్గురికి, లేదా నలుగురికి సంబంధించి వ్యవహారం గా ఉండేది. కానీ కమలిని భావజాలం, వాడిన పదజాలం…ఆమె ఆలోచనలు అన్నీ  ఏ యుగాల నాటివో. నిజానికి అది కూడా నిజం కాదు. యుగాల నాడు కూడా ఎవరూ ఇలా ఇంత దీనం గా భర్త కాళ్ళు పట్టుకొని అడిగి ఉండరు. అహల్య కూడా గౌతముడి ముందు,  చేసినది తప్పని కానీ, చేయలేదని అబద్ధం కానీ ఆడలేదు. తాను చేసిన పని ని గౌతముడి ముందు గర్వం గానే ఒప్పుకుంది. ఆ అనుభవాన్ని మనసారా అనుభవించింది. కమలిని కి అటు అనుభవం పంచి ఇచ్చిన పురుషుడి మీద గౌరవం లేదు. అతని సమక్షం లో కళ్ళు మూసుకొని భర్త పేరు ని ఉచ్చరిస్తూ, అతనినే తలుస్తూ అతనిని అవమానించింది. పైగా భర్త కు అతని గురించి చెపుతూ అతనొట్టి స్త్రీ లోలుడని నిరసన చేస్తుంది.  తననే ప్రేమించే, గౌరవించే, అనుక్షణం తనతోనే మనసా, వాచా కర్మణా ప్రవర్తించే భర్త ను కూడా తప్పు చేసి బాధ పెట్టింది. గురజాడ దిద్దుబాటు లో ని కమలిని భర్త ను తెలివిగా మార్చుకున్నట్లు, ఈ రోజు నన్ను నువ్వు నా పొరపాటు కు క్షమించు అని అడుగుతుంది నాటకీయంగా.

కమలిని ఏం చేసిందో, ఎలా చేసిందో చెప్పే ఈ మాటలు ఏవీ నావి కాదు. కమలిని ఉత్తరం నుంచి ఆమె ను అర్థం చేసుకునే క్రమం లో ఆమె వాడిన పదాలతోనే ఆమె గురించి, ఆమె అనుభవం గురించి, ఆమె జీవితం గురించి నాకు కథ ద్వారా అర్థమయినది నేనిక్కడ చెప్తున్నాను.

మొత్తం ఈ కాలం స్త్రీల  తరఫున కమలిని పేరుతో, కథ పేరుతో  సామాన్య మాట్లాడింది. ఇవాళ ఈ ఫేస్ బుక్ లు, వాట్స్ అప్ లు, స్కైప్ లు, ఒంటరి విదేశీ ప్రయాణాలు …వీటన్నింటి లౌల్యాల మధ్య ఇలా జరగక తప్పటం లేదని కమలిని చేత వాపోయెలా చేసింది.  ఆడవాళ్ళ పొట్టి బట్టల వల్లే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని అంటున్న సమాజం లోని కొందరి మాటలకు , సామాన్య ఈ కథ లో మాట్లాడిన ఈ మాటలకు తేడా కనిపించటం లేదు కదా !? రెండూ ఒకే స్వరం నుంచి వచ్చినట్లు లేదూ!?

 

గత వందేళ్ళ  తెలుగు సాహిత్యం లో ఎన్నో మంచి కథలు, విశ్వ సాహిత్యం లో మరిన్ని మంచి కథలు ఇలాంటి సన్నివేశాల్లో, సంఘటనల్లో  ఆడవాళ్ళు ఎంత ఆత్మ విశ్వాసం తో ప్రవర్తించారో, ప్రవర్తించ వచ్చో చర్చిస్తే సామాన్య ఇంత అమాయకంగా కమలిని కథ ఎలా రాసిందా? అని నాకు ఆశ్చర్య మేసింది. పుష్పవర్ణ మాసం లోనూ, మొన్నటి దేవస్మిత లోనూ ఇంకొంచెం ఆధునికంగా ఆలోచించిన సామాన్య ఈ కమలిని పాతివ్రత్యపు భావజాలం లో ఎలా ఇరుక్కుపోయిందో మరి !

సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను.

*

(రేఖా చిత్రాలు: అక్బర్ , “ఆంధ్ర జ్యోతి” నుంచి)

 

  ప్రపంచ శ్రమజీవుల సినిమా “స్ట్రైక్”

strike

 

-శివలక్ష్మి 

 ~

1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అత్యద్భుతమైన ఆవిష్కరణస్ట్రైక్. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్ర నిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం. దీని నిడివి ఒక గంటా,ఇరవై రెండు నిమిషాలు.

కథలోకి వెళ్ళి క్లుప్తంగా చెప్పుకోవాలంటే – ఒక మెటల్ ఫ్యాక్టరీలో 25 రూబిళ్లు ఖరీదు చేసే ఒక మైక్రోమీటర్  మాయమవుతుంది. ఆ నేరాన్ని యాజమాన్యం యాకోవ్అనే కార్మికుడి మీదకు నెడుతుంది. అవమానభారంతో అతను ఉరి వేసుకుని మరణిస్తాడు. యాకోవ్ ఉరి తీసుకునే ముందు తనకు జరిగిన అన్యాయం గురించి తన సహ కార్మిక సోదరులకు వాస్తవాలను వివరిస్తూ రాసిన ఒక లేఖను వదిలి వెళ్తాడు. ఆ లేఖతో పాటు, యాకోవ్ వేళ్ళాడుతున్న శవాన్ని చూసిన కార్మికులు పట్టరాని ఆగ్రహంతో పని అక్కడికక్కడే ఆపేసి, మిల్లింగ్ గది వదిలేసి మెరుపు సమ్మెకు దిగుతారు. స్ట్రైకర్స్ వదులుగా ఉన్న మెటల్ ని, రాళ్ళని కొలిమి కిటికీల నుంచి విసురుతూ ఫ్యాక్టరీ పనికి ఆటంకం కలిగిస్తారు. అప్పుడు యాజమాన్యం మండిపడుతూ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ గేట్ల లోపల కార్మికులందర్నీ నిర్భందిస్తుంది. కోపించిన శ్రామికులు కార్యాలయాన్ని ఆక్రమించి ఒక అధికారిని బలవంతంగా ఒక బండి చక్రానికి గట్టి కొండ పక్కనున్న వాగు నీటిలో ముంచుతారు. ఆ రోజు నుంచి కార్మికులు పనిని స్తంభింపచేయడం వల్ల ఫ్యాక్టరీ ఖాళీగా ఉండి, కళావిహీనమై పోతుంది. రాబడి ఆగిపోయినందువల్ల యాజమాన్యం ఆగ్రహం రోజు రోజుకీ   పెరిగిపోతూ ఉంటుంది. శ్రామికులు ఐక్యంగా ఉండి, సమిష్టి ఆలోచనలతో తమ డిమాండ్లు రూపొందిస్తారు. అవి

1) కార్మికులందరికీ 8 గంటల పని దినం కావాలి

2) యాజమన్యం శ్రామికులను మర్యాదగా,సాటి మనుషులుగా చూడాలి.

3) 30% వేతనం పెంచాలి.

4) బాల కార్మికులకు 6 గంటలకు మించి పని ఉండరాదు.

ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో తయారైన ఒక రాత ప్రతిని  కార్మికులు యాజమాన్యం ముందుంచుతారు. ఈ దరఖాస్తును యాజమాన్యం – పెట్టుబడి పెట్టిన వాటాదారులు కలిసి కూర్చుని సిగార్ల ధూమపానం పీలుస్తూ, రకరకాల  పానీయాలు సేవిస్తూ మహా విలాసంగా తమ సమావేశంలో చర్చిస్తారు.

ఇంతకీ చర్చల అనంతరం ఏం సెలవిచ్చారనుకున్నారు?

8 గంటల పని దినం చట్ట విరుద్ధమైనదన్నారు!

బాల కార్మికులకు 6 గంటల పని దినం అడగడం అన్యాయమన్నారు!

30% వేతన పెంపకం, తోటి మనిషిని మనిషిగా మర్యాదగా చూడడ మనే మిగిలిన డిమాండ్ కూడా న్యాయ సమ్మతమైనది కాదని నిర్ద్వద్వంగా తిరస్కరిస్తారు!!

ఇదంతా  వాటాదారుల ఆదేశాలతోనే, వాళ్ళ ఆజ్ఞానుసారం ప్రకారమే జరుగుతుంది.

ఆగ్రహించిన కార్మికులు సమ్మెకు దిగుతారు. రోజుల తరబడి సమ్మె కొనసాగుతుంది.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికుల కుటుంబాలు  పసిబిడ్డలతో సహా ఆకలి బాధలకు అల్లాడిపోతుంటారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా తాను పట్టిన పట్టు వీడదు. శ్రామికుల నిరసన తీవ్రరూపం దాలుస్తుంది. పోలీసులు పురికొల్పడంతో శ్రామిక వర్గంలోనే ఉన్న దుష్ట కార్మికులు పోలీసులతో కుమ్మక్కై సోదర కార్మికులకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచే భ్రష్టాత్వనికి పాల్పడతారు. యాజమాన్యపు గూఢచారులు జరుగుతున్న పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా కాపలా కాస్తుంటారు. వీళ్ళందరూ కలిసి – ఆకలి మంటలను సహిస్తూ ,సర్వ శక్తులూ కేంద్రీకరించి సమ్మె చేస్తున్న కార్మికులపై అగ్నిమాపక విభాగంతో, పోలీసులతో దాడి చేయిస్తారు. ఇంతలో సైనిక సిబ్బంది నలువైపులా చుట్టు ముట్టడంతో కార్మిక శక్తి చెల్లాచెదురవుతుంది.

“మాలో పిరికి వాళ్ళు లేరు. దేశద్రోహులు లేరు. మా చివరి రక్తపు బొట్టు వరకూ మేము మా డిమాండ్లను సాధించు కోవడానికి శాయశక్తులా పాటు పడతాం” – అని నినదించిన శ్రమ జీవులందరూ అమరులవుతారు.  ఆ ఆవరణమంతా శ్రమ జీవుల శవాల గుట్టలతో నిండిపోతుంది. సినిమా ఒక విషాద నెత్తుటి టోన్ లో ముగుస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. కానీ ఈ సినిమాని ఐసెన్ స్టీన్ దృశ్యకావ్యంగా మలిచిన విధానం చెప్పాలంటే అదొక గొప్ప వచన కావ్యమవుతుందని సినీ విమర్శకులూ, మేధావులూ అన్నారు.

ప్రస్తుతం నాకర్ధ మైనంత మేరకు మే డే సందర్భానికి వర్తించే విషయాలు ప్రస్తావించుకుందాం!

అప్పటికింకా టాకీలు రాలేదు. అదొక నిశ్శబ్ద యుగం. ఈ ‘స్ట్రైక్’ అనే నిశ్శబ్ద సినిమాకి ప్రధానంగా మూడు గొప్ప  లక్షణాలున్నాయి .

మొదటిది ముందు తరాల విప్లవ చరిత్ర,

రెండోది సమూహాల కథ,

మూడోది మాంటేజ్ తాకిడి అంటే రెండు విరుద్ధ సంఘటనల ఘర్షణ సృష్టించి తాను చెప్పదలచుకున్న కొత్త విషయాన్ని చెప్పడం.

ఐసెన్ స్టీన్ ముందు తరాల కార్మికులు రోజంతా పని, అంతులేని పనిగంటలు, వెట్టి చాకిరీతో విసిగిపోయారు. పని వేళలకోసం, పని స్థలంలో కనీస సౌకర్యాలకోసం, చేసిన చాకిరికి సరైన కూలికోసం, మరీ ముఖ్యంగా 8  గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎక్కడివారక్కడ ఆందోళనలు, ఉద్యమాలు,సమ్మెలు చేశారు. ఫలితంగా  చిలికి చిలికి ఉధృతమైన వడగళ్ళవానగా రూపుదిద్దుకుని 1886 మే 3 న చికాగోలో  బద్దలైంది. ఆరోజు 25000 మందితో కార్మికులు గొప్ప ఊరేగింపులో పరిసరాలు హోరెత్తేలా కదం తొక్కారు. తర్వాత రోజు హే మార్కెట్లో జరుగుతున్న కార్మిక సభపై పోలీసులు అతి కౄరమైన వికృత వీరంగం చేశారు. “మతియాస్ డేగన్” అనే ఒక పోలీసు అధికారిని గుర్తు తెలియని వ్యక్తి పేల్చినందుకు, దుర్మార్గంగా అనేకమంది కార్మికుల్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికా ప్రభుత్వం ఒక బూటకపు ఎన్ కౌంటర్ జరిపి ఆనాటి కార్మిక నాయకులు పార్సన్స్, స్పైజ్, ఎంగెల్స్ లను ఉరి తీసింది.దీని ఫలితంగా 1890  లో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల సమావేశం  మే 1 తేదీనిఅంతర్జాతీయ కార్మిక పోరాటదినంగా పాటించాలని తీర్మానించింది.అప్పటినుంచి ప్రపంచవ్యప్తంగా ఉన్న కార్మికులు చికాగో వీరుల బలిదానాన్ని స్మరించుకుంటూ మేడేని తమ విముక్తి పోరాటాలదినంగా జరుపుకుంటున్నారు.

మహత్తరమైన ఈ మే డే పోరాటాలతో పాటు 1917 లో రష్యన్ కార్మిక వర్గం దేశంలోని జాతులన్నిటినీ ఏకం చేసి జరిపిన అక్టోబర్ విప్లవం అంతర్జాతీయంగా వ్యాపించి ఉన్న కార్మిక ప్రపంచానికి ఒక గొప్ప విస్ఫోటనం లాగా, అద్భుతమైన వర్గపోరాటంగా రూపుదిద్దుకుంది.

తనకు  గొప్ప ప్రేరణ నిచ్చిన  19 వ శతాబ్దంలోని తన ముందు తరాల ఉద్యమాల నన్నిటినీ, విప్లవ పోరాట ప్రభావాలనన్నిటినీ  ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు ఐసెన్ స్టీన్.

ఇక ఈ సినిమా రెండో లక్షణం-సమూహాల కథ. కార్మిక సమూహాల కథ. ఇది ఏ ఒక్కరి కథా కాదు. ప్రాంతం రష్యా కావచ్చు గానీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కోట్లాది శ్రమజీవుల కథ. వస్తువు విశ్వజనీన మైనది. సినిమా ప్రారంభమే వ్లాదిమిర్ లెనిన్  కొటేషన్ – “The strength of the working class is organization. Without organization of the masses, the proletarian is nothing. Organized it is everything. Being organized means unity of action, unity of practical activity” తో మొదలవుతుంది. తర్వాత బాతులు, బాతు పిల్లలు, పిల్లి పిల్లలు, పందిపిల్లలు, మొదలైన జంతువుల యొక్క ఫుటేజ్  కనిపిస్తుంది. యాజమాన్యం-పెట్టుబడి పెట్టిన వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను రసం తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం. కార్మికులు ఐక్యంగా ఉండి వళ్ళంతా కళ్ళు చేసుకుని, ఎంతో శ్రద్ధాసక్తులతో తమ డిమాండ్లను ఒక రాతప్రతి లో రూపొందిస్తారు.యాజమాన్యం-వాటాదారులు అసలు వర్కర్స్ ని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా ఆ దరఖాస్తు ఫారం గురించి అసలు సీరియస్ గా తీసుకోకుండా దానితోనే టేబిల్ మీద చిందిన మత్తుపానీయాలను తుడుస్తారు. కార్మికులు ప్రాణాలుగ్గబట్టి రాసిన దరఖాస్తులోని విషయాలు శ్రమ జీవులకు జీవన్మరణ సమస్యలు. అవే సమస్యలు యాజమాన్యాలకు పనికిమాలినవిగా, అసంబద్ధంగా కనిపిస్తాయి. వేళ్ళతో లెక్కించదగినంత మంది, వేలాది మంది జీవితాలను నిరంకుశంగా శాసిస్తున్న విధానాన్ని (అచ్చం ఇప్పటి కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నట్లే) ప్రేక్షకులకందించి ఆలోచించమంటారు ఐసెన్ స్టీన్. ఉద్రిక్తతలు, కష్టాలు, శ్రామికవర్గ త్యాగం మొదలైన ఉద్విగ్న సందర్భాలను తన కథనం ద్వారా ఏకైక దృశ్య భాష మూకీలో ప్రదర్శించడంలో ఒక అద్భుతమైన అవగాహన, మేధావితనం స్పష్టమవుతుంది. వందల మంది తారాగణంతో సినిమా ఆద్యంతం అద్భుతమైన వివరాలు అందిస్తూ, శ్రామికవర్గ విలువల్ని పటిష్టం చేస్తూ  శ్రామికవర్గ ప్రచారాన్ని  చిత్రీకరించడంలో వల్లమాలిన నేర్పరితనం చూపిస్తారు ఐసెన్ స్టీన్.ఇది చాలా ప్రతిభావంతమైన సమూహాల కథా కథనం.

ఇక మూడోది మాంటేజ్ ఆవిష్కరణ. మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లో ఆకర్షణ అని అర్ధం .ప్రతి చిత్రం ఓ పుట్టుక.ఓ కొత్త జన్మ ఎత్తడం అన్న ఐసెన్ స్టీన్ రెండు పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణలో ఓ నూతన శక్తి ఆవిర్భవిస్తుందనే మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని ఆధారంగా చేసుకుని “మాంటేజ్” కి అన్వయించారు. దీనికి ఆయనే ఆద్యుడు. ఇంతకుముందు మాంటేజ్  దర్శకులు వెర్టోవ్, పుడోవ్ కిన్ లాంటి వారున్నప్పటికీ ఐసెన్ స్టీన్ వాళ్ళకి భిన్నమైనవారు. ఐసెన్ స్టీన్ ఈ సినిమా తీస్తున్న సమయానికి రష్యా ప్రజలు 80% నిరక్షరాస్యులు. రోజు రోజుకీ, క్షణ క్షణానికీ ఉధృతమవుతున్న విప్లవోద్యమంతో ప్రేక్షకుణ్ణి మమేకం చెయ్యడాని కీ, రాజకీయ ఆలోచనలు చెప్పడానికీ  మాంటేజ్ ని ఎన్నుకున్నారు ఐసెన్ స్టీన్. దృశ్య భాష ద్వారా రాజకీయ సందేశాలను తెలియజేసేందుకు మాంటేజ్ లోని విస్తారమైన అవకాశాలను వాడుకుని ప్రజలకు అవగాహన కలిగించి, చైతన్య పరచడానికి ప్రయత్నించారు. విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాకు మించిన కళారూపం మరొకటి లేదనిఅన్న లెనిన్ సూత్రీకరణను నూటికి నూరుపాళ్ళూ వాడుకున్నారు.

మాంటేజ్ ని అర్ధం చేసుకోవడానికి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేసుకుంటారు ఐసెన్ స్టీన్.ఉదాహరణకి సైన్యం చేతిలో కార్మికులు చనిపోతున్న కౄరదృశ్యాన్ని  పశువుల వధ జరుగుతున్నట్లు  గ్రాఫిక్ చిత్రాలతో చూపించి ప్రేక్షకుల దిమ్మ తిరిగేట్లు చేస్తారు. యాకోవ్ మీద దొంగతనం ఆపాదిస్తున్న సీన్ లో యాకోవ్ క్లోజ్ అప్,మేనేజర్ క్లోజ్ అప్ రెండూ కనిపిస్తాయి.రెండు షాట్స్ ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయి. యాకోవ్ ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు అతని పట్ల సహానుభూతితో ఐడింటిఫై అవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఐసెన్ స్టీన్ . మేనేజర్ క్లోజ్ అప్ షాట్ చూస్తున్నప్పుడు మేనేజర్ నేరుగా తనమీదే దొంగతనం నేరారోపణ చేస్తున్నట్లు ప్రేక్షకుడు ఫీలవుతాడు. ఈ రెండు షాట్లనుంచి ఐసెన్ స్టీన్ సాధించదలచుకున్న మూడో ప్రయోజనం-దొంగైనందుకు మేనేజర్ యాకోవ్ ని తిట్టడమే కాదు,తాను దొంగగా భావిస్తున్న యాకోవ్ పక్షం వహిస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా తిడుతున్నట్లు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చెయ్యడం. ఇది ఒక అత్యద్భుతమైన ప్రయోగం.తెలుగులో మన మహాకవి శ్రీ శ్రీ కూడా తన రచనల్లోని చరమరాత్రి కథల్లోనూ,”గుమస్తా కల”మొదలైన రేడియో నాటికల్లోనూ మాంటేజ్ ని ప్రయోగాత్మకంగా శక్తివంతంగా వాడి విజయం సాధించారు.

విప్లవ కాలంలో ఇంజనీరింగ్ చదువు మాని రెడ్ ఆర్మిలో పని చేసిన చైతన్యశీలి ఐసెన్ స్టీన్. 27 ఏళ్ల వయసులో (స్ట్రైక్ సినిమాకి ముందు) 1925 లోనే దృశ్యీకరించిన బాటిల్ షిప్ పొటోంకిన్ ఒక సృజనాత్మక విస్ఫోటనం. ప్రపంచ సినిమా ప్రేక్షకుణ్ణి దిగ్భ్రాంతికి గురి చేసింది. సోవియట్ యూనియన్ లో సోషలిస్టు రాజ్య స్థాపన గురించి తీసిన ఈ సినిమా సృష్టించిన విప్లవ ప్రకంపనాలకు కంపించిన బెర్లిన్, బ్రిటన్ దేశాలు చిత్రాన్ని నిషేధించాయి.అమెరికా కూడా భయంతో చిత్రంలోని కొన్ని భాగాలు కత్తిరించింది. స్ట్రైక్ సినిమా తర్వాత వచ్చిన అక్టోబర్ చిత్రంలో కూడా జార్ చక్రవర్తి “వింటర్ ప్యాలెస్” పై విప్లవ వీరుల దాడిని అమోఘంగా దృశ్యీకరించారు. ప్రపంచాన్ని గజ గజలాడించిన పది రోజులు అనే జాన్ రీడ్ రచన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఇదంతా గమనించినప్పుడు ఐసెన్ స్టీన్ వ్యక్తిత్వం లోనే కార్మిక రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉందనీ, శ్రమజీవుల పట్ల అపూర్వమైన ప్రేమాభిమానాలున్నాయనీ అర్ధమవుతుంది.తన ముందు తరాల విప్లవ పోరాట ప్రభావాలన్నీ ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు. ఆయన ఎవరి మెప్పు కోసం ఈ సినిమా తియ్యలేదు.సమాజంలోని అట్టడుగు మనుషులు, జంతువులకంటే హీనంగా చూడబడుతున్న మనుషుల పక్షం వహించి, వారి పట్ల ఆయనకున్న నిజాయితీ, నిబద్ధతలను చాటి చెప్పారు!

చూడగానే మనసు చలించే   గొప్ప దృశ్యాలు చాలా ఉన్నాయీ సినిమాలో!

ఒక నెత్తుటి ముఖం, ఒక మండే ఆయుధం ఉపయోగించి, సాధించదలచుకున్న మూడో ప్రయోజనాన్ని స్ఫురింపజేస్తారు!!

సైన్యం సమ్మెను విధ్వంసకరంగా అణిచివేస్తుంది. అసలు సైన్యం ప్రజలకు సేవ చెయ్యాలి.కానీ ధనస్వామ్యానికీ బూర్జువా, కులీన వర్గాలకు సేవ చేస్తుందని చెప్పకనే చెప్తారు ఐసెన్ స్టీన్.

యాజమాన్యం-వాటాదారుల విలాసవంతమైన జీవితాలనూ వాళ్ళకి కార్మికుల పట్ల ఉన్న ఏహ్య భావాన్నీ తెలిపే దృశ్యాన్ని ప్రతిమనిషీ చూచి తీరాలి! యాజమాన్యం-వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను జూస్ తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం.

కార్మికుడు తన కుటుంబ పోషణ కోసం పని చెయ్యాల్సింది 6 గంటలు మాత్రమే నంటారు మార్క్స్. కార్మికునికి చెందవలసిన భోజన విరామ సమయాన్ని, ఇతర విశ్రాంతిని కొద్ది కొద్దిగా తగ్గించి తన లాభాలు పెంచుకుంటూ వచ్చాయి యాజమాన్యాలు. ప్రతిరోజూ భోజన విరామ సమయాన్ని పది నిమిషాలు తగ్గించడం ద్వారా ఏడాదికి వెయ్యి పౌండ్లు లాభం వచ్చిందని ఆనందంగా వికటాట్టహాసం చేశాడట ఒక యజమాని. ఇదే స్త్రీల విషయంలో నైతే ఇంకా శ్రమ దోపిడీ చేస్తారు.నేను పని చేసిన ఫెమినైజ్డ్ టెలిఫోన్ ఏక్చేంజి లలో నైతే గంట ఉండాల్సిన భోజన విరామ సమయాన్ని తగ్గించి 10 నిమిషాలే ఇచ్చేవారు! కలుపుకొచ్చుకున్న బాక్స్ల లోని  అన్నాన్ని చార్లీ చాప్లిన్ “మోడరన్ టైమ్స్ ” సినిమాలో యంత్రం ఒక్కొక్క కార్మికుడి దగ్గరకొచ్చి తినిపించినట్లే మేము గుక్కతిప్పుకోకుండా గుటకలు వేస్తూ తినడం ముగించేవాళ్ళం. అరగంట టీ సమయం తగ్గించి 5 నిమిషాలే ఇచ్చేవారు! మధ్యలో అర్జెంట్ గా బాత్రూం అవసరాలొస్తే “ఒన్ మినిట్ ప్లీజ్” అని అడుక్కుని వెళ్ళేవాళ్ళం1!

“తొమ్మిది, పదేళ్ళ పిల్లల్ని, అర్ధరాత్రి రెండు, మూడు, నాలుగు గంటలకు నిద్ర లేపి తెల్లవారి పది, పదకొండు, పన్నెండు దాకా పని చేయిస్తారు.ఆ పరిస్థితిలో వాళ్లు జీవచ్చవాల కన్నా ఎక్కువేమీ కాదు” అని నాటింగాం లోని లేసు పరిశ్రమ గురించి ఆ రోజుల్లో రిపోర్ట్ చేసింది డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక (మార్క్స్ పెట్టుబడి-రచనా క్రమం,ఫ్రాన్సిస్ వీన్, అనువాదం-ముక్తవరం పార్ధసారధి అరుణ తార,ఏప్రిల్ 2016)

వాస్తవాలిలా ఉంటే పెద్దలకు 8 గంటలు, పసివారికి 6 గంటలు కావాలని డిమాండ్ చెయ్యడం చట్టబద్దం కాదట! సాటి మనిషిని మనిషిగా చూడడమనే విషయం  సమాజ నాగరికతలో భాగమవ్వాలి. కానీ అది కూడా ఒక   డిమాండ్ గా పెట్టవలసి రావడం ఎంత విషాదం! పైగా అది న్యాయసమ్మతం కాదట! ఎన్నెన్ని గడ్డుకాలాల్ని దాటి మనకిప్పుడున్న సౌకర్యాలనందించారు మన పూర్వులు? మన ముందు తరాలవారి ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినం ఇవాళ కార్పొరేట్ శక్తుల చేతుల్లో హరించుకుపోయి మళ్ళీ మన తరాలు, మన భావి తరాలు గంటలతరబడి పని చేసే స్థితిలోకి నెట్టబడ్డారు.ఇంకా విచిత్రమేమిటంటే ఇంటి నుంచి పని చెయ్యడం ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నారు.దానివల్ల యాజమాన్యం కార్మికులకు సమకూర్చవలసిన సౌకర్యాల నుంచి, కార్మికులు హక్కులుగా పొందవలసినవాటి నుంచి  యాజమాన్యం ఏ మాత్రం బాద్యత వహించకుండా  హాయిగా తప్పించుకుంటుందని కార్మికులు కూడా గమనించడం లేదు. మార్క్స్ చాలా లోతుగా విశ్లేషించి చెప్పిన శ్రమదోపిడీకి ఇదొక పరాకాష్ట!

పరిశ్రమల యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల నేర్పరచుకొని, గూఢచార వ్యవస్థ ద్వారా చైతన్యవంతులైన కార్మికుల గురించీ, వారి నాయకుల గురించీ రహస్య సమాచార సేకరణ చేసేవారు. అలా కనిపెట్టిన సమాచారాన్ని బట్టి యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల ద్వారా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేవారు. నాయకులను జైళ్ళ పాలు చేసేవారు.

ఎంతో శ్రమకోర్చి ఎన్నో అద్భుతమైన సీన్లను ఈ చిత్రంలో కార్మికుల పక్షం వహించి ఎంతో హృద్యంగా దృశ్యీకరించారు ఐసెన్ స్టీన్.

కార్మికులందరికీ, శ్రామిక సమూహాలన్నీటికీ, ఆ మాటకొస్తే సామాన్య ప్రజలందరికీ విశ్వ వ్యాప్తంగా వర్తించే సామాజిక ఇతివృత్తంతో, మాంటేజ్ టెక్నిక్ ని సమర్థవంతంగా ఉపయోగించి, ఈనాటికీ వర్తించేలా స్ట్రైక్ సినిమాని రూపొందించి చలన చిత్ర చరిత్రలో  తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఐసెన్ స్టీన్.

ఇప్పటి యూనియన్ నాయకులూ, వారి కపట నాయకత్వాలను తలచుకుంటే  నిరాశా, నిస్పృహలు ముంచుకొస్తున్నాయి. కార్మికుల పక్షం వహించిన ఇంత అద్భుతమైన వ్యక్తి ఈ భూమి మీద ఒకప్పుడు సంచరించారంటేనే మనసు సంతోషంతో నిండిపోతుంది.

ఇంకో వెయ్యి సంవత్సరాలకైనా మనదేశంలో ఇటువంటి సినిమాని ఆశించలేము!ప్రేక్షకుల హృదయాలలో లేని జుగుప్సాకరమైన అభిరుచులను వెలికితీసి రెచ్చగొట్టే మన దర్శక నిర్మాతలు కళ ప్రజలకోసం అని గుర్తించి ఎప్పటికైనా ఇంతటి ఉత్తమ విలువలను పోషించే చిత్ర నిర్మాణం చెయ్యగలరా?

శ్రమజీవుల గురించి తపించే వారందరూ ఈ సినిమాని తప్పనిసరిగా చూడాలి! కూలిపోతున్న జీవితాలను నిలబెట్టడానికే కాదు, మనల్ని మనం నిలబేట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి తీరాలి!!

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నేను..!

 shajahana cover
– షాజహానా
~
”నీతో మాట్లాడ్డానికేం లేదు. ఒక్క దేహభాషతో మాత్రమే నీతో మాట్లాడగలను. నీ దేహం అంతిష్టం నాకు. దేహమే మొదలు దేహమే అంతిమం. ఒబామా గురించి మాట్లాడ్డానికి నాకు చాలా మంది మిత్రులున్నారు. నాకు త్వరగా సమాధానం కావాలి. నేను నువ్వనుకున్నట్లు నిన్ను ప్రేమించడం లేదు. నాకు ప్రేమంటే శరీరంలో ఒక భాగం మాత్రమే. శరీరమే ముఖ్యం. నీ మాట కోసం చూస్తుంటాను.”
***
”ఎందుకు వేరే మాట్లాడకూడదు? నేను శరీరం తప్ప ఏమి లేనిదాన్నా? అవయవ సౌష్ఠవం ఉన్నంత మాత్రాన, ముఖవర్చస్సు ఉన్నంత మాత్రాన నేనేమి మాట్లాడ కూడదా? నాకు నీతో ఈ ప్రపంచంలోని విషయాలన్ని మాట్లాడాలని కదా ఉంటుంది? నిన్ను నేను మనసా వాచా కర్మణా ఒక మనిషిని ఎంత ప్రేమించాలో అంతా ప్రేమించాను కదా; నాలో రేగే భావాలన్నింటిని శరీరం మాటున దాచి నీతో నేను… ఎలా?”
***
”అవును.. నువ్వు నాతో పడుకోవడాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మన మధ్య ఏ బంధాలు అనుబంధాలు ఉండవు. నాకు నువ్వు నచ్చావు. అలా అని దాన్ని ప్రేమనుకోకు. ప్రపంచం అందమైంది. నువ్వు దాన్ని కోల్పోతున్నావు. నేను దగ్గరుండి చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడు నన్ను రమ్మంటావు?”
***
”ఇలాంటి స్నేహితుడు నాకు దొరుకుతాడని కలలో కూడా ఊహించ లేదు. శరీరమే ముఖ్యమైతే ప్రపంచంలో ఏదో ఒక శరీరంతో సంతృప్తి చెందొచ్చు కదా! అయినా ఒక్కసారికే దేహదాహం తీరుతుందా? ఇలాంటి విషయాల్లో నేను ఎలా రియాక్ట్‌ అవుతానో కూడా అవసరం లేదా? నువ్వు బంధాలు కోరుకోవు, ప్రపంచం అందమైందని నాకు ఎలా చూపిస్తావు?”
***
”నీలాంటమ్మాయిలకు జీవితం గురించి తెలీదు. ఎలా లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యాలో తెలీదు. ప్రంపంచంలో నేనొక్కడినే మగాడిని కాదు, నాకు నువ్వొక్కదానివే ఆడదానివి కాదు. అందుకే అన్నాను ప్రపంచం అందమైందని. ఇంకా విడమరచి చెప్పాలంటే నీకు చాలా మంది మగ స్నేహితులు ఉండాలి అని నా ఉద్దేశం. కొన్ని రోజుల తర్వాత ఏం చెయ్యాలన్నా ఈ దేహం సహకరించదు. నాకు నువ్వు నీకు నేను నచ్చాక చర్చ లనవసరం, నన్నెపుడు రమ్మంటావ్‌? లేదా ఈ విశాల ప్రపంచంలోకి నువ్వు రా!”
***
”నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ, తాతయ్య, అన్నయ్య, ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధివాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే. ఇక్కడా నువ్వెదురై మనశ్శాంతి లేకుండా చేస్తున్నావ్‌? నువ్వలా అడిగిన దగ్గర్నించి నాకు నిద్ర దూరమైంది.. అన్నం సహించడం లేదు.. ఎప్పుడూ ఎదురుగా నువ్వొచ్చి పదేపదే అడుగుతుంటావ్‌. నేన్నీతో కలిసి నడుస్తాను, మాట్లాడతాను, నవ్వుతాను, బోలెడంత ప్రేమిస్తాను… అంతే, తప్ప నువ్వడిగింది నేనివ్వలేను. ఈ విశాల ప్రపంచం నాది కాదు… నేను ధైర్యంగా బయటికి రావడానికి. ఇక్కడ నేల మీద నా పేరున్నా నా అధికారం ఉండదు. నేను కన్న ప్రపంచం మీద నాకే హక్కు ఉండదు. స్కూళ్ళల్లో బస్సుల్లో ఇంట్లో ఆఫీసుల్లో కాలేజిల్లో  ఎక్కడన్నా నేను ధైర్యంగా ఉండగలిగానా? పుస్తకాల్లో తప్ప. నేను నీకోసం ప్రపంచంలో కొచ్చిన మరుక్షణం నాకిచ్చే ఇరుకుపదం ఏంటో కూడా నాకు తెలుసు? ఏది విశాల ప్రపంచం? ఏది అందమైన ప్రపంచం? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నీలో నామీద కోరికుంది, దానికి సంబంధించి దాపరికం లేదు ఒప్పుకుంటాను, కాని ప్రేమిస్తే అది బాధ్యతవుతుందనే కదా ప్రేమించడం లేదని అంటున్నావు. ప్రేమ లేని దేన్నీ నేనంగీకరించను.”
***
”నేన్నీకు ముందునుంచి చెప్తూనే వస్తున్నాను. ప్రేమించట్లేదని, అలా అని మోసం చేస్తున్నానని అనుకోకు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీమీద కలిగిన ఫీలింగ్స్‌ని ఉన్నదున్నట్లు నీకు చెప్పాను. నేన్నీ మేధస్సునో, ఓదార్పునో కోరుకోవడంలేదు. ఈ శరీరాన్ని నీ శరీరంలోకి ఒంపుకోవాలనుకుంటున్నాను. దానికి నువ్వింత మధనపడాల్సిన అవసరం లేదు. నీకు బాధ కలిగించే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకెప్పుడు నీకు ఎదురుపడను. మాట్లాడను, డిస్ట్రబ్‌ చేయను. ఎప్పుడయినా ఎవరిపైనైనా ఇలాంటి ఫీలింగ్స్‌ కలిగితే దాచుకోకు. నా గురించి ఆలోచించకు. నన్ను అనవసరంగా ప్రేమించకు.”
***
”నీకు ప్రేమంటే తెలీదు. మనుషుల విలువ మనసుల విలువ అంతకంటే తెలీదు. నువ్వు సమాజంలోనే పెరిగావా? అర్ధం కావట్లేదు. నీ నిజాయితీ చూస్తే అపురూపం అనిపిస్తుంది, కాని ప్రేమ లేకుండా కామం ఉంటుందంటే నేనంగీకరించను.. నేను ప్రేమించకుండా ఉండలేను, కాని మరచి పోకుండా కూడా ఉండలేను. మరపు నాకు నన్ను పెంచిన సమాజం నేర్పించింది. నేను పెంచి పెద్ద చేసిన పూలతీగలు, మేకపిల్లలు.. పిల్లి పిల్లలు, నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న, మా ఇల్లు ఇదే అని పరిచయం చేసిన ఇల్లు… ఎందుకూ పనికి రాని చదివిన చదువు అన్నింటిని మరచి పోయేలా చేసిన సౌకర్యవంతమైన సమాజం మనది.. ఇన్నింటిని మరచిపోయిన నేను నిన్ను మరచిపోలేనా? ఇంకెప్పుడూ ఏ అమ్మాయిని ఇలా మాత్రం అడక్కు. ఇంకెప్పుడు నాకు కనిపించకపోవడం నాకు మేలే? నీ లాంటి స్నేహితుడున్నాడని కొంత ఉపశమనాన్ని ఆనందాన్ని పొందేదాన్ని.. ఎప్పుడు తప్పిపోతాడో,  దూరమవుతాడో, ఎవరివల్ల దూరమవుతాడో అన్న బాధ నుంచి విముక్తం అవుతాను.”
***
-ఏం మనిషి? మగవాడిగా ఆలోచిస్తాడే తప్ప నా గురించి ఎందుకాలోచించడు? నాన్న అన్నాడు డిగ్రీ దాకా చాలమ్మ, పిజి చదివితే మళ్ళీ ఎక్కువ చదివిన వాడిని తేవాలి కదా; ఆలోచించు; కాబట్టి ఇక్కడికి చదువునాపెయ్యి. ఇంక నేను ఫీజులు కట్టలేను. కట్నం ఇవ్వాలి కదా? నాన్న మాటలకి తలొంచాలి ఎన్ని ఆలోచనలున్నా బుర్రలో. నేను కాసేపు నాన్నలా మారి నిజమే నిజమేననుకుని ఒప్పేసుకున్నాను కదా పెళ్ళికి, ఇక నాలో నేనెక్కడున్నాను? అమ్మకి ఎప్పుడయినా స్వేచ్ఛ ఉంటే కదా నా గురించి పట్టించుకోవడానికి; నాన్న చెప్పిందే వేదం. కొన్నాళ్ళు కలిసున్నందుకు అమ్మ కూడా మరో నాన్నే !
జీవితమంటే ఏం లేదు ఎదుటివాళ్ళని ఆక్రమించడమేనని అర్ధమై, మౌనమే భాషగా బతుకుతున్న మూగజీవితానికి పరిచయమైన లైబ్రరీ దోస్తు అతడు. ప్రపంచం మొత్తం అతడి మెదడులో నిక్షిపమై ఉందా అని అనుమానం వచ్చేది ఒకోసారి. అతడితో మాట్లాడితే కోల్పోయిందేదో దొరికినట్టనిపించేది, తడారిన మనసుకు జీవం వచ్చేది. అతడే నా కోల్పోయిన జీవన మాధుర్యాల చిరునామా అనుకున్నాను. మంచి స్నేహితుడనుకున్నాను. నాలో ఉన్న నాన్న మీంచి,  భర్త మీంచి, కొడుకు మీంచి తొంగి చూస్తుంటాడు, ఎంత ధైర్యం? క్రమంగా అతడి రూపం కూడా నాలో ఎవరూ తుడిపేయలేనంతగా తీర్చిదిద్దుకుంది. ఎంతమందిని మోయాలి నేను? వీళ్ళల్లో ఒక్కరిలో నైనా నేనున్నానా? ఎంత పరిమితితో ఉండి ఉంటాను?
అతడికి అంతే నేను అఖ్ఖర్లేదు. కావలసింది మనసు కాదు దేహం. కాకపోతే కక్కుర్తి లేదు, మోసం లేదు. అదొక్కటే కాదు కదా నన్ను నేను అర్పించుకోవటానికి, నన్ను నన్నుగా చూడలేకపోవటానికి అతడికి సవాలక్ష కారణాలు ఉండనీ. నా మనసుకు, కన్నీళ్ళకు, చిరునవ్వులకు నా ఆలోచనలకు దేనికీ ప్రాధాన్యం ఇవ్వని అహంకారి. నేను ఎలా అంగీకరించగలను? నేను అతడిని పూర్తిగా కొద్దిగా కొద్దిగా మర్చిపోతున్నాను… ఇప్పుడు నాకు లైబ్రరీ కూడా లేదు.. అతడు కూడా లేడు… ఇప్పుడు నేను ఖాళీగా కనపడుతున్నాను.
నన్ను పూరించుకోడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. పూరించుకోగలనో లేదో కూడా చెప్పలేను. కాని నన్ను నేను గుర్తించుకున్నందుకు ఆనందంగా ఉంది, నన్ను నేను పూర్తిగా ఖాళి చేసుకున్న ఆనందం అది!
shajahana invitation

యెనకటి రావ్ ముందుచూపు

 

 

ఎప్పుడూ ఏదో ట్రెండ్ కావాలని కోరుకునే ఎడిటర్ యెనకట్రావ్ కి … ‘ఈ ఉగాదికి  ‘అశ్లీల కథల పోటీ’ ఓటి పెట్టి పారేస్తే ఎలగుంటది’ …. అనిపించింది! దాన్ని ‘తక్షణమే అమలుపరచెదవుగాక’ అంటూ సబ్బెడిటరు సంకటరావ్ కి పైనించి  కిందకి పామేశాడు సదరు ఆలోచన్ని! ఎప్పుడూ ఏదో ఒహటి మూసుక్కూచ్చుని ఉండటం అలవాటయిపోయున్న సంకట్రావ్,  చేసేదేంలేక అప్పటికి  నోరు  మూసుకుని ఆ వెంఠనే ఓ పత్రికా ప్రకటన వేసిపారేశాడు,  కాల్చిన సిగరెట్టు పీక కారులోంచి వెనక జనమ్మీదకి  విసిరిపారేసినట్టు!

పత్రికా  ప్రకటన చూసిన జనం  పలు పలు విధాలా స్పందించారు. కాపీని తప్పక ముందస్తుగా బుక్ చేసుకోవాలనే చిత్త  చాపల్యం  పెరిగిన క్షణం నుంచి  రసిక  జనాలకి వంటిమీద కౌపీనం నిలవలేదు! ఖానా పీనా  తెలవలేదు!!

“ఏమ్మాయరోగం ఆ ఎడిటరుకి?“ సరాసరి అశ్లీలాన్ని పోటీకి నిలుపుతాడా? “  అంటూ అంతా కూర్చుని ఆయనగార్ని  నిలేశారు మహిళా మండలివాళ్లు. “విషయమ్మీద అంతా కలిసికట్టుగా  ‘సమరం’  చేయుటకొరకు  ఆయత్తమవందే   ముద్దలోకి ‘లవణం’ కూడా తీసుకోవద్దని”  పెసిడెంటు పేరమ్మ ఆధ్వర్యంలో కాలనీలోని అంగనలంతా అంగీకరించి ఆనక  తీర్మానించారు.

మేధావి వర్గం వారైతే ‘కాదేదీ కవితకనర్హం’ లాగా ‘కాదేఅంశం  పోటీకి  అనర్హం’ అన్న నినాదాన్ని సునాదంగా మార్చి గొంతుకొక్కటి విచ్చి మ్రోశారు. ఇంతింత రాజ్యాంగం రాసుకుని,  ఆమాత్రం స్వాతంత్రం లేకపోతే బతుకులెలా వెళ్లమారుస్తాం అంటూ వాళ్ళకు వాళ్ళే బుజాలు చరుచుకున్నారు. వాపసివ్వడానికి తమ వద్ద ఏమేమి అవార్డులున్నాయో రాత్రికి రాత్రే అంతా అటకెక్కి  ట్రంకుపెట్టె వెతుక్కోండని మరో మీటింగులో పిలుపిచ్చారు సభ్యులందరికీ.

ఓ దయ్యాల సినిమా డైరెక్టరు వచ్చి ‘అశ్లీలాన్ని’ మానుంచి దూరం చేసి మా ‘వంట్లో’  భావజాలాల్ని,  ఇంట్లో దూలాల్ని తీసేసినంత వీజీగా తీసేస్తారా? ఎక్కడికి తీసుకెళుతున్నారు ఈ దేశాన్ని? కామి గానివాడు మోక్షగామి కాలేడు! అశ్లీలాన్ని చూడలేనివాడు శీలాన్ని ఇనుమడింపజేసుకోలేడు”  అంటూ స్వీటు చప్పరించినంత  వీజీగా  ట్వీటు చేశాడు! పెద్దోళ్ళకి విరుద్దంగా యేవైనా ట్వీటు చేస్తే ఐటీ ఆక్టు ప్రకారం బొక్కలో యేస్తారెమో అని పామరజనానికే భయంగానీ …ఇలాటి  తింగరిబుచ్చి గాళ్ళకి ఏమీ ఉండదు  అని స్వామీ పవిత్రానందలవంటి వారికి బాగా తెలుసు. పైపెచ్చు  అలా వాకృచ్చిన వారిని ‘మగధీరుడు’,  ‘దమ్మున్నోడు’, ‘పరమ తేడా శిరోమణి’ లాంటి అవార్డులు ఇచ్చి సముచిత రీతిన సత్కరిస్తారు కూడాన్నూ… అంటాడు పవిత్రానంద! అదే ట్వీటు తను చేస్తే ‘నిత్య అశ్లీలానంద’ అని బిరుదిచ్చి ఉద్ధరించేవాళ్లు అని అప్పుడప్పుడూ వాపోతుంటాడు ఏ ఆటోలోనో అటుగా  పోతున్నప్పుడాయనగారు.

“మేము ఎక్డా భాయీ భాయీ కాదు గానీ … బేఅశ్లీలతా కీ బాత్ మే మేమూ భాయీ భాయీ. ఎవరైనా  సౌందర్యం లోప్టా పెట్టుకోవాల్ – బైటా ఓపెన్లో కాదూ”  గట్టి పట్టు పట్టాడు పక్కింటి బాబూ మియా!

అదేం పట్టించుకోకుండా – “ఎందుకూ పెట్కోవాలే? అసల్ కీ ఈ అశ్లీల్ తా అంటే క్యాహై? కౌన్ నిర్వచనం ఇస్తారూ హై?” అన్నాడు కించిత్ వెటకారంగా   రకుల్ కోబాల్ –‘ స్మార్ట్ ‘ ఫోన్ లో ‘స్మార్ట్’ వీడియో చూస్తూ!

ఆ పక్కనే ఉన్న మన్మధ రావ్ “ బొడ్డు మీద ఆపిల్ పెట్టి చూపిస్తే .. బొడ్డు ని చూస్తామా? ఆపిల్ ని చూస్తామా? ఆపిల్ ని అడ్డం పెట్టుకుని బొడ్డుని చూపించే కుట్ర కి మనం తేలిగ్గా లొంగి పోవలసిందేనా? అయినా అనుకుంటాంగానీ ఎర్రటి  ఆపిల్తో అంతర్యామివంటి అశ్లీలాన్ని ఆపలేరు గాక ఆపలేరు. అంచేత అశ్లీలాన్నిఇదమిద్ధంగా  నిర్వచించలేమ్” అన్నాడు నిర్వచనం చెప్పలేక … ‘ఎర్రని సూర్యకాంతిని  అరచేత్తో ఆపలేమ్ గాక ఆపలేమ్’ అన్న చందంగా  !

“నిర్వచనం లేక పోవడమేంటి? ఐపీసీలో ఏనాడో చెప్పారు వెయ్యి సంవత్సరాల కన్నా ముందే” అన్నాడు రకుల్ కోబాల్!

“అదేంటి వోయ్ ? ప్రాధమిక హక్కులకు వ్యతిరేకంగా తగలడ్డ ఆ  పాత చింతకాయ్ పచ్చడి  సెక్షన్నే తీసిపారేసేయ్ మంటుంటే ఇప్పుడున్న  పండితాగ్రేసరులు…..?”  కల్పించుకున్నాడు కస్తూరీ తిలకం బట్టతల నిమురుకుంటూ!

“ నాయనా! ఇప్పుడు నేను ఆ మూడో తలకాయ వారి  ధూర్త అప్రాకృతిక  అనైచ్య అలౌల్య అసందర్భ ఆంగిక  లైంగిక వికటీకృత వైపరీత్య చర్మచాపల్య  చర్య గురించి మాట్లాడటం లేదు! ఆ అంశం వేరు. ఈ అంశం వేరు” పిచ్చ పిచ్చగా ఖండించాడు కోబాల్!

“ ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీరూ మీరూ  ఖండించుకుంటున్నారు సరే! నేను చెప్పేది వింటారా….” మధ్యలో వచ్చింది బాడీమీద  నిండు వస్త్రాలు నిండుకున్న  వస్త్రలత!

ఉలిక్కి పడి తమ తమ  అధో వస్త్రాలు వాటి వాటి స్థానాల్లో పొందికగా ఉన్నాయో లేవో అని పరిశీలించుకుని తృప్తినొందిన పిమ్మట –

“చెప్పండి వింటాం” అన్నారు కస్తూరీ కోబాలుర ద్వయం.

“ అశ్లీలత నిర్వచనం  గురించి మీరు ఏదైనా  చించే ముందు, ‘మా దేహం-మా యిష్టం’  అనే ప్రాధమిక అంశాన్ని మీరు మరువరాదు. ‘వాక్స్వాతంత్ర్యం’ లాంటి ప్రాధమిక హక్కు  ఉందీ అన్నప్పుడు ‘దేహస్వాతంత్ర్యం’ ఉంది అనే ప్రాధమిక హక్కుల  అంశం అందులో ఇమిడి ఉంది. దేహాలకీ, దాహాలకీ అడ్డుకట్ట వేయడం ఫాసిస్టు వికృత చర్య! సృష్టి సహజాతాన్ని పాతరేసే పైశాచిక చర్య! ప్రాకృతిక  రాజ్యాంగం ప్రసాదించిన అంగాంగ వైభోగాన్ని అణగదొక్కే కాముక ఆటవిక చర్య “ అంటూ ఆయాసపడి మధ్యలో ‘ఊపిరి’ తీసుకోడానికి ఆగింది వస్త్రలత.

2016-03-18 23.43.59

“వామ్మో వీరి  పదజాలమే జలఫిరంగుల్ని ఫేస్ చేస్తున్నట్టు  ఉన్నాయి. ‘ఊపిరి’ తీస్కుని మళ్ళీ మొదలెట్టారంటే  భాష్పవాయువు ప్రయోగం చేయించుకున్నట్టే …ఎందుకొచ్చిన గోల … బతికుంటే బూతు సినిమా చూడొచ్చు ” అనుకుంటూ ఇద్దరూ మెల్లగా అక్కడినుంచి తప్పుకున్నారు.

ఈ చర్చ అంతా పక్కన బడ్డీ కొట్టు దగ్గర చాయ్ తాగుతున్న ఇద్దరు ఛానల్ మిత్రులు  ‘అరె… వీటిని కొన్ని ‘బైట్స్’ గా తీసుకుంటే ‘జంగ్లీ  నైట్స్’ ప్రోగ్రామ్ లో పెట్టుకుంటే బాగుండేదే” అనుకున్నారు. ఈ రాత్రే ప్రోగ్రామ్ ఎడిటర్ తో మాట్లాడి,  రేపే కెమెరామాన్ తో గంగని పంపించి ‘స్త్రీ పురుషుల  మధ్య అశ్లీలతా వైవిధ్యం’ అనే చర్చనీయాంశాన్ని షూట్ చేయిద్దాం అనుకున్నారు ఇద్దరూ.

గిర్రున ఓ మూణ్ణెల్లు  తిరిగిపోయాయి. ఎడిటర్  యెనకట్రావ్ ఆనందగా ఉన్నాడు. తన స్కీమ్ ప్రకారం వదిలిన అశ్లీల కథల  పోటీకి కథలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. జడ్జస్ అంతా కలిసి ‘నీ యబ్బ!’ అనే కథ ఉత్తమ అశ్లీల కథగానూ, ‘తోక్కేం కాదూ…’ అనే కథని ద్వితీయ బహుమతి కిందా, ‘జింతాతా చితాచితా” అనే కథని తృతీయంగానూ ఎంపిక చేశారు. పెగ్గు పెగ్గుకూ మధ్య నంజుకునే పచ్చడి పూర్తిగా నాకేశాక – ‘కథల సబ్జక్టు ఒకడబ్బ సొమ్ముకాదు. వైవిధ్యంతో రాసిందేదైనా కథే! దానికి కథకుల నుంచి వచ్చిన ఈ స్పందనే దాఖలా’ అన్నాడు సబ్బెడిటర్ సంకట రావ్ తో యెనకటి రావ్  తబ్బిబ్బైపోతూ.

“ఎంతైనా మన ప్రింట్ మాధ్యమం తాబేలే సార్! ఎలక్ట్రానిక్ మాధ్యమం అయితే సూపర్ ఫాస్ట్గా రిసీవ్ చేస్కుంటారు ప్రజానీకం. అక్కడ ‘జంగ్లీ నైట్స్’ ప్రోగ్రామ్ కి టీయార్పీ  రేటింగే రేటింగు. అటు చూడండి ” అంటూ రిమోట్ నోక్కాడు సంకట్.

“మరి నేవెళ్లొస్తా! మన పత్రిక్కి సన్నీ లియోన్ ఆత్మ కథ ఏమన్నా మన పాఠక దేవుళ్ళకోసం రాసిస్తుందేమో కనుక్కోమన్నారుగా…” అన్నాడు సంకట్రావ్! అతగాణ్ణి పంపించి తలుపేసొచ్చి, ఇంతలో బయట కోలాహలంగా ఉంటే అవతల బాల్కనీ  లోంచి తల ముందుకు చాచి చూచాడు యెనకటి రావ్.

“కావాలీ .. కావాలీ….బూతుకు బంగరు భవితవ్యం కావాలి!! అశ్లీలతా జిందాబాద్!!!” అంటూ కొన్ని గుంపులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వెడుతున్నారు.

యెనకటిరావ్ ఏదో తెలీని సంపృప్తితోనూ, మరేదో తెలీని విజయగర్వంతోనూ ఆ పూటకి లుంగీ లోకి దిగిపోయి, నెక్స్ట్ కథల పోటీ ఏంటా అని వైవిధ్యంతో ఆలోచించడం మొదలెట్టాడు.

*

అంబేద్కర్‌ విగ్రహానికి వాస్తు పరిశీలన!

 

 

-జి ఎస్‌ రామ్మోహన్‌

~

 

అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వ వాస్తు సలహాదారు స్థల పరిశీలన చేస్తున్న చిత్రం పత్రికల్లో వచ్చింది. వాస్తు హిందూ మతానికున్న అనేక అంగాల్లో ఒకటి. అందులో కూడా మూర్ఖత్వానికి పరాకాష్ట అనదగిన ఆచారం. అంబేద్కర్‌ హిందూ మత ఆచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వాడు. అది మతం కాదు, వ్యాధి అని చెప్పినవాడు. ఎవరికి పట్టింది ఈ విషాదం?

రెండు రాష్ట్రాల్లోనూ పోటాపోటీగా అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అంబేద్కర్‌ని విగ్రహమాత్రుడిని  చేసి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం బలంగా జరుగుతున్నది. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం కన్నా హైస్కూల్‌నుంచి  పీజీదాకా కులనిర్మూలనను పాఠ్యాంశంగా చేరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. విగ్రహాల వల్ల కూడా చైతన్యం వచ్చిన దశ ఉండింది. మనం ఇపుడా దశ దాటాం.

అంతకంటే ముందుకు వెళ్లాలంటే ఆయన రచనలను జనంలోకి తీసికెళ్లడం ముఖ్యం. ఆయన పేరు ప్రచారమైనంతగా ఆయన రచనలు ప్రచారం కాలేదు. కనీసం కులనిర్మూలన అయినా జనంలోకి తీసికెళ్లడం ఇవాల్టి అవసరం. అంబేద్కర్‌ ఏ ఆధునిక మానవీయ విలువల కోసం తపన పడ్డాడో ఆ విలువలకు బద్ద శత్రువైన మనిషిని ఆంధ్రప్రభుత్వం  సలహాదారుగా నియమించుకుంది. భర్త లోదుస్తులు భార్య ఉతికితేనే ఐశ్వర్యం ఆరోగ్యం, తానే ఉతుక్కుంటే దరిద్రం అని ప్రవచించిన భయానకమైన అనాగరికుడిని అక్కడ సలహాదారుగా నియమించి ఉన్నారు. రెండు రాష్ర్టాల్లోనూ రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ ప్రవచించిన ఆధునిక విలువలను అపహాస్యం చేసే పనులు అనేకం సాగుతున్నాయి.

samvedana logo copy(1)

రాజుగారి ఆస్థానాలు, అందులో సలహాదారులు, పురోహితులకు సత్కార సన్మానాలు చాలా ఎన్టీఆర్‌ సినిమాల్లో చూసి ఉన్నాం. ఆ ఎన్టీఆర్‌కు ఒకనాడు వీరాభిమానిగా ఉన్న చంద్రశేఖరుల వారు, అల్లుడు అయినటువంటి చంద్రబాబునాయుడుగారు  తమని తాము రాజులుగానే భావించుకున్నట్టు అర్థమవుతున్నది. తాము ఆధునిక సెక్యులర్‌ సోషలిస్ట్‌ ప్రజాస్వామ్య రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులం అనే సోయి ఉన్నట్టు కనిపించడం లేదు. పట్టాభిషేకం జరిగ్గానే తెలంగాణకు ఒక తిరుమల, ఆంధ్రకు ఒక భద్రాచలం అవసరం అని తీర్మానించేసుకున్నారు. విభజన జరగ్గానే వారికి కనిపించిన ప్రధాన లోటు అది. యాదాద్రి ఒంటిమిట్టలు ఆగమేఘాల మీద ముందుకు తోసుకొచ్చాయి.

యాదగిరి గుట్ట అనే అందమైన తెలుగుపేరు సంస్కృతంలోకి మళ్లి యాదాద్రి అయిపోయింది. వందలకోట్ల ఖర్చుతో ప్రణాళికలు సిద్ధమైపోయాయి. వైష్ణవ పండితులకు రెక్కలొచ్చాయి.  రాజసూయ యాగాలను మించిన యాగాలు మొదలయ్యాయి. మనిషి పొడ తగిలితేనే మలినమైపోయినట్టు మొకం పెట్టే ఒక వైష్ణవ సోములోరు, పాదం మోపడానికి లక్షల్లో ప్రసాదం స్వీకరించే సోములోరు రాజగురువుగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖరుల వారు పదే పదే ఆయన పాదాలపై పడి ప్రణమిల్లడం విమానాల్లో వినయంగా తిప్పుతూ ఆయన సలహాల మేరకు వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. దీన్ని మించి ఐదుకోట్ల రూపాయలతో తిరుమలకు కానుకలు సమర్పించేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అది సొంత సొమ్ము కాదు. ప్రభుత్వ ఖజానా. అంటే ప్రజల సొమ్ము.  ప్రజల్లో విశ్వాసులు ఉంటారు. అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసుల్లో కూడా రకరకాల విశ్వాసాలు ఉన్నవారుంటారు.. వ్యక్తిగతమైన విశ్వాసానికి ప్రజాధనాన్ని ఎలా ఖర్చుపెడతావు అని అడిగేవారేరీ! సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ సంగతి సరేసరి! అంత దూరం పోకపోయినా కనీసం పాలకుడు వ్యక్తిగత మొక్కు కోసం ప్రజాధనం ఖర్చుపెట్టకూడదు అని గట్టిగా అడిగే గొంతులు ఎక్కడ?

ఏమాట కామాటే చెప్పుకోవాలి. రాజుగారి మాటలాగే ఇక్కడంతా ఖుల్లం ఖుల్లా. వైష్ణవాన్ని రాజధర్మంగా అధికారికంగా ప్రకటించడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందో లేదో అనే సంశయం ఉండబట్టి కానీ లేకపోతే ఆ పని కూడా బాహాటంగా చేయగలరు. కానీ ఆంధ్రరాజ్యంలో అక్కడి పాలకుడికే తనకి తాను ఏమిటో తెలియని గందరగోళం. నాయుడుగారు విశ్వాసో అవిశ్వాసో తెలీదు. అది విశ్వాసమో ఎత్తుగడో కూడా తెలీదు. మామూలుగా ఆయన మాట్లాడేది భయానకమైన పెట్టుబడిదారీ భాష. అన్ని పాత నమూనాలను విశ్వాసాలను అభివృద్ధి రథచక్రాల కింద నలిపేసుకుంటూ వెళ్లిపోయే భాష అది. దానికి తగ్గట్టే ఆయన సెంటిమెంట్లను ఎగతాళి చేస్తా ఉంటారు. భూమి గురించి ఎవరైనా బెంగ వ్యక్తం చేస్తే అది కమోడిటీగా మారడం వల్ల రైతుకు ఎంత లాభమో చెప్తారు. పాత సెంటిమెంట్లను కడిగేసుకోవాలని చెపుతారు. సెంటిమెంట్లు చాదస్తాలు అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్తారు. వ్యవసాయంలో సాంకేతికత అయినా సెల్‌ టవర్ సిగ్నల్స్‌ అయినా ఏ విషయం ముందుకు వచ్చినా ఆయన పాత విశ్వాసాలను పాతరేసేట్టు మాట్లాడతారు.

కానీ ఆయన పట్టాభిషేకం దగ్గర్నుంచి రాజధాని శంకుస్థాపనల దాకా అన్నీ ముహూర్తాల ప్రకారం, వాస్తు ప్రకారం నడిపిస్తున్నారు.. మనం చేస్తే సెంటిమెంట్‌, అవతలివారు చేస్తే చాదస్తం అన్నమాట. తరతమ బేధాలు ఎక్కడ పాటించాలో బాగా వంటపట్టిచ్చుకున్న మనిషి నాయుడుగారు.. చాగంటి కోటేశ్వరరావు అనే పురాణ కాలపు మనుధర్మపు పెద్దమనిషి ఉన్నారు. ఆడవాళ్లను మాత్రమే కాదు, అన్ని బాధిత సమూహాలను అవమానించేట్టు మాట్లాడతా ఉంటారు. అమానవీయతను అనాగరికతను ప్రబోధిస్తా ఉంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మానవహక్కులకు విరుద్ధం. ఇంకో నాగరక దేశంలో అయితే కటకటాల వెనక్కు నెట్టేవాళ్లు. ఇక్కడ బారాఖూన్‌ మాఫ్‌. అలాంటి ఒక సామాజిక నేరస్తుడికి పద్మశ్రీ పురస్కారం ఇప్పించి ఆస్థానంలో సలహాదారుగా పెట్టుకుని సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు? మనుధర్మాన్ని విశ్వసించే కులఅహంకార పురుష అహంకార అనాగరక మనిషిని సలహాదారుగా పెట్టుకున్న రాజ్యం ఎలాంటి విలువలకు నిలబడుతుందని  అనుకోవాలి? మళ్లీ వీళ్లు అంబేద్కర్‌ -పూలే జయంతులకు వర్థంతులకు రావడం దళితులకు బిసిలకు ఏమేం చేశారో ఏకరువు పెట్టడం చూస్తే ఏమిటీ అబ్సర్డిటీ అనిపిస్తుంది.

విభజనతో పాటే మధ్యతరగతిలో గొంతున్న వర్గాలకు తక్షణ ప్రయోజనం చేకూరింది. పదవులు పెరిగాయి. గొంతున్న వారిని కోఆప్ట్‌ చేసుకోవడం సులభమైంది. ఇక కులసంఘాల్లో నాయకులు ఎవరైనా మిగిలి ఉంటే వారికోసం అడిగిందే తడవుగా నిధులు ఒక భవంతి వగైరా మంజూరు అవుతున్నాయి. తెలంగాణ పాలకులు అలనాటి విజయభాస్కరుల వారి విధానాన్ని కులసంఘాల విషయంలో పాటిస్తున్నట్టు అర్థం అవుతున్నది.

ఆంధ్రలో లెక్కల ప్రకారం అన్ని కులాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ గొంతున్న నాయకులను తన దగ్గరే పోగేసుకుని ఉండడం వల్ల ఆయనకు ఆ ఇబ్బంది కూడా లేదు. ప్రశ్నించే గొంతులు కరువు. కొందరికి తమ పుట్టలో వేలు పెట్టినపుడు తప్ప ఇతరత్రా చురుకు తగలదు. ప్రజాస్వామ్య లిబరల్‌ గొంతులకోసం దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సిన స్థితి. ఎబిసిడి న్యాయమైన డిమాండే కానీ ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింది. అక్కడా గొంతున్న వారికి సంతర్పణలు  ఏదో రూపంలో ఏర్పాటు చేసి పెట్టారు. ఇవి వ్యక్తిగత విశ్వాసాలు, పట్టించుకోకూడదు,  వదిలేయాలి అని కొందరు లౌక్యంగా కృతజ్ఞతా పూర్వకంగా అనగలరు.

కానీ సాంస్కృతిక రంగం ప్రభావం చిన్నదేమీ కాదు. దానిమీద దృష్టిపెట్టకుండా  దాన్ని ఎదుర్కోకుండా సాధించేదేమీ ఉండదు. అంబేద్కర్‌ అందుకే అంత ప్రాధాన్యమిచ్చారు.. పైగా పాలనలో ఉన్నవాళ్లు అంత బాహాటంగా సమాజాన్ని వెనక్కు తీసికెళ్లే ఆచారాలను ప్రదర్శిస్తూ ఉంటే దాని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుంది. అంబేద్కర్‌ ఆశించిన ఆధునిక మానవీయ సమాజం సంగతేమో కానీ రెండు రాష్ర్టాల్లోనూ పూర్తిగా దానికి భిన్నమైన రాజరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

పదే పదే చొక్కా విప్పి జంధ్యాన్ని ప్రదర్శించే గవర్నర్‌ కనుసన్నల్లో రెండు రాష్ర్టాల్లోనూ  ఆధునికత వెనక్కు నడుస్తోంది. అనేక ఉద్యమాలకు నెలవైన తెలుగు రాష్ర్టాల్లో ఇంత దుస్థితిఎన్నడూ లేదు. వాస్తు సలహాదారులు, పౌరాణిక సలహాదారుల  రాజ్యం ఇంత నిస్సిగ్గుగా ఎన్నడూ సాగింది లేదు.  రాజ్యాంగం, ఆధునిక ప్రజాస్వామ్య విలువల గురించి  పాలకులకు గుర్తు చేయాలా, వద్దా!

*