జయహో జైపూర్!

 

సత్యం మందపాటి

 

satyam mandapati మేము మూడేళ్ళ క్రితం భారతదేశం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశంతో పాటూ ఢిల్లీ, అమృత్సర్, వాఘా, జైపూర్, ఆగ్రా వెళ్లామని చెప్పాను.  ఢిల్లీ, అమృత్సర్, వాఘాల గురించి ఇదే శీర్షికలో మా యాత్రా విశేషాలు వ్రాశాను కూడాను. ఈసారి జైపూర్ గురించి మా అనుభవాలు చెబుతాను.

ఢిల్లీ నించీ ట్రైన్ తీసుకుని జైపూర్ వెళ్లి అక్కడ ఒక మంచి హోటల్లో దిగాం.

జైపూరులో చూడవలసినవి చాల వున్నాయి. వాటిల్లో మాకు బాగా ఇష్టమైనవి, చూడాలనుకుని చూసినవి ఏమిటో చెబుతాను.

ముందుగా జైపూర్ చరిత్ర, అక్కడి మహారాజులు చరిత్రా కొంత చెబుతాను. తర్వాత మా విహార యాత్రా విశేషాల గురించి మాట్లాడుకుందాం.

నాకు మొదటినించీ భారతదేశ చరిత్రా, మిగతా దేశాల చరిత్రా, ఆయా దేశాల సాంస్కృతిక మానవ శాస్త్రం (Cultural Anthropology) గురించి చదవటం, తెలుసుకోవటం సరదా అని ఇంతకుముందే చెప్పాను. కాకపొతే ఆ చరిత్ర వ్రాసినవారి బట్టి రకరకాలుగా వుంటుంది. ఉదాహరణకి భారతదేశ స్వతంత్ర పోరాటం గురించి పాకిస్తాన్ చరిత్రకారులు వ్రాసిన దానికీ, మనవాళ్ళు వ్రాసినదానికీ ఎంతో తేడా వుంటుంది. అందుకని, ఒక పుస్తకంతో సరిపెట్టుకోకుండా, కొంచెం లోతుగా చదవటం అవసరం.

ఆ నేపధ్యంలోనే జైపూర్ మహారాజుల గురించీ చదివాను. ఇప్పుడు జైపూర్ వెళ్లేముందు, కొంచెం ఎక్కువగానే చదివి, ఈ మహారాజులు ఎలాటివారో, వారి నిజ స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను.

అలా చదివిన తర్వాత తెలుసుకునే నిజాలు చాల ఆశ్చర్యంగా కూడా వుంటాయి. ఉదాహరణకి అలెక్జాండర్ ది గ్రేట్.. గ్రేట్ కానే కాదు. ఎంతోమంది చేత చావుదెబ్బలు తిన్న యుద్ధ పిపాసి. కొలంబస్ ఒక సముద్రపు దొంగ. అతను అమెరికాని కనుక్కోక ముందే, అమెరికా లక్షణంగా మా ఇంటి ముందరా, వెనకా వుండనే వుంది. సుబ్బారావుగారింటికి బయల్దేరి, అప్పారావుగారింటికి వెళ్లి, అదే సుబ్బారావుగారి ఇల్లు అనుకున్న వెర్రి మాలోకం. ఇండియా వెళ్లి, అక్కడి నించీ సిల్కు, బంగారం, రత్నాలు, మిరియాలు తెస్తానని స్పానిష్ మహారాణిని వూరించి, ఆవిడ దగ్గర ప్రయాణ ఖర్చులు కొట్టేసి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టకుండా పడమటి దేశాలకు వచ్చిన, దిక్కూ దివాణం తెలియని మనిషి. మొదటిసారి బహామా ద్వీపాలకి వచ్చి అదే ఇండియా అన్నాడు. రెండోసారి వెనిజువేలా వచ్చి అదే ఇండియా అన్నాడు. మూడోసారి మధ్య అమెరికా వచ్చి అదే ఇండియా అన్నాడు. వాళ్ళని ఇండియన్స్ అన్నాడు. అందుకే ఇక్కడ ఆ రోజుల నించీ వున్న ప్రజలని ఇండియన్స్ అంటారు. కొలంబస్ మాత్రం అమెరికాని ‘కనుక్కున్న’ గొప్పవాడిగా మా అమెరికా చరిత్ర చెబుతుంది. సంవత్సరంలో ఒక రోజు కొలంబస్ డే అనే పేరుతో సెలవు కూడావుంది. అలాగే అక్బర్ జీవితం.  అక్బర్ భారతదేశాన్ని ఉద్ధరించటానికి రాలేదు. మొగలాయీల దోపిడీలో పెద్ద భాగస్వామి. వారి సామ్రాజ్య విస్తరణకి, ఎంతో కృషి చేసి భారతదేశంలో కొంత భాగాన్ని, తన కాళ్ళ క్రింద పెట్టుకున్న పెద్దమనిషి. జోదాని పెళ్లి చేసుకున్నది, హిందూమతానికి దగ్గరయి, తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవటానికి. ఈనాటి మన సినిమాల్లో చూపిస్తున్నట్టు, పరమత సహనంతో కాదు. అలాగే సంస్కృత భూయిష్టమైన హిందీ భాషలో, ఎన్నో పర్షియన్ మాటలు తీసుకువచ్చి, సంస్కృతాన్ని లేకుండా చేసిన భాషా ప్రియుడు. ఇప్పుడు ఇండియాలో రోడ్డు మీద మాట్లాడే జనవారీ హిందీలో, మీకు వినపడేవి ఎన్నో పర్షియన్ పదాలే. మహాభారత్, రామాయణ్ లాటి సీరియల్స్ చూస్తేనే మనకి హిందీలో సంస్కృతం మళ్ళీ వినిపిస్తుంది.

అలాటి అక్బర్ మహారాజు ఏం చేశాడో చూద్దాం.

రాజపుత్ మహారాజు మాన్ సింగ్ (మొదటి మాన్ సింగ్) గురించి మొదలుపెడదాం. అతను అంబర్ రాజ్యానికి రాజు. మొగలాయీలకి తొత్తుగా మారి, వాళ్ళ కాళ్ళు వత్తటం మొదలుపెట్టాడు. దానితో అక్బర్ సంతోషించి అతన్ని తన సభలో నవరత్నాలలో ఒకడిగా గుర్తించాడు. అంతేకాదు, అంతటి రాజుగారినీ కాళ్ళ క్రింద తొక్కిపెట్టి, తనకి సైనికాధికారిగా చేసుకున్నాడు. మాన్ సింగుకి జోధాబాయి అత్త అవుతుంది.

మాన్ సింగుని, రాణా ప్రతాప్ సింగ్ దగ్గరకి రాయబారం పంపించి ఆ రాజ్యాన్ని కూడా దక్కించుకోవాలని చూశాడు అక్బర్. ‘నేను యుద్ధం చేసి చావటానికయినా సిద్ధమే కానీ, నా భారతదేశాన్ని ఆక్రమించి, విస్తరించాలనుకుంటున్న ఈ మొగలాయీలకి తొత్తుగా మాత్రం మారను’ అన్నాడు ప్రతాప్ సింగ్.

అలాగే చివరి శ్వాస వదిలేవరకూ, పోరాడి యుద్దంలో చనిపోయాడు రాణా ప్రతాప్ సింగ్. అందులో ప్రధాన పాత్ర వహించింది మాన్ సింగ్.

మాన్ సింగ్ తర్వాత, జగత్ సింగ్, మహా సింగ్, జై సింగ్ 1, తర్వాత కొంత కాలానికి జైసింగ్ 2.. ఇలాటి రాజపుత్ తొత్తుల కాలచక్రం ఇక్కడ తిరుగుతుంటే, అక్కడ అక్బర్ తర్వాత షాజహాన్, ఔరంగజేబ్.. అలా నడిచింది మొగలాయీల దురాక్రమణ.

మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ ఏడుసార్లు మొగలాయీల మీదకు దండయాత్రకు వచ్చినా, తమ బలగాల సహాయం మొగలాయీలకి పూర్తిగా ఇచ్చి, శివాజీని ఏడుసార్లూ ఓడించిన ఘనత కూడా ఈ తొత్తు రాజులదే!

ఈనాటి జైపూర్ రెండవ జైసింగ్ (సవాయ్ జై సింగ్) 1727లో స్థాపించాడని అంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో వుంది. ప్రస్తుత జనాభా ఆరున్నర లక్షలు. దీనికి పింక్ సిటీ అనే పేరు కూడా వుంది.

లెక్ఖలు, నక్షత్ర శాస్త్రం, జ్యోతిష్యం మీద సరదా, నమ్మకం వున్న జైసింగ్, బెంగాల్ నించీ విద్యాధర్ భట్టాచార్య అనే వాస్తుశిల్పిని పిలిపించి, ఈనాడు మనం చూస్తున్న ఎన్నో రాజకోటలని, భవనాల్ని నిర్మించాడు. ఇక మిగతా చరిత్ర వెండి తెరమీద, బుల్లి తెరమీద కాకుండా, మంచి పుస్తకాల్లో చదువుకోండి.

ఇహ ఈనాటి జైపూర్ గురించి చూద్దాం.

ఇక్కడ చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది, నేను ఇంజనీరుని కనుక, జంతర్ మంతర్. ఇక్కడ ఎన్నో నక్షత్ర శాస్త్ర ప్రాతిపదిక ఆధారంగా కట్టిన యంత్రాలు వున్నాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క విషయాన్ని చూపిస్తుంది. ఒకటి సమయాన్ని చూపిస్తే, ఇంకొకటి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చూపిస్తుంది. ఇంకొకటి రకరాల గ్రహాలు మనం చూస్తున్న ఆ సమయంలో ఎక్కడెక్కడ వున్నాయో చూపిస్తుంది. ఇలా ఎన్నో వున్నాయి. వాటిల్లో అన్నిటిలోకి స్పష్టంగా కనపడేలా నుంచునేది, 90 అడుగుల ఎత్తుగల సామ్రాట్ యంత్ర అనే సూర్య గ్రహ సూచిక. ఇక్కడ ఇంకా చక్ర యంత్ర, దక్షిణ భిట్టి యంత్ర, రామ యంత్ర, దిశ యంత్ర, ధ్రువ దర్శక్ యంత్ర, రాశి వలయ యంత్ర, కపాల యంత్ర….  ఇలా ఎన్నో వున్నాయి.

 

jantar1

 

తర్వాత చూడతగ్గది సిటీ పాలస్. అంతా గులాబీ రంగుతో కట్టబడినది. ఇదే కాదు, ఈ పాలస్ బయట వున్న రోడ్లూ, భవనాలూ, షాపులూ అన్నీ గులాబీ రంగువే. రాజుగారు ఎంత ధనికులో చూపించేదే ఈ పాలస్. ఎంతో పెద్ద భవనాలూ, చుట్టుతా సరోవరాలు, ఉద్యాన వనాలూ. అద్దాలు పొదిగిన నెమలి ద్వారం. ఒక పక్క రాజస్థానీ అలంకారాలు, ఇంకో పక్క మొగలాయీల అలంకారాలు. ఇక్కడే మ్యూసియం, చిత్రకళా క్షేత్రం కూడా వున్నాయి.

 

నాకు అన్నిటిలోకి బాగా నచ్చింది హవా మహల్. 1799లో కట్టిన ఈ భవనం, రాణీవాసపు స్త్రీలు బయట వారికి కనిపించకుండా, అక్కడ కూర్చుని షాపులూ, రోడ్ల మీద వెళ్ళేవారిని చూడటానికి కట్టారుట. అది వేడి ప్రదేశం కనుక, గాలి చక్కగా వేచే విధంగా ఎన్నో కిటికీలు కట్టి, దానికా పేరు పెట్టారు. క్రింది ఫోటో చూడండి.

అంబర్ కోట, పాలస్ కూడా చాల బాగుంటుంది. అక్కడే గుర్రాల మీద, ఒంటెల మీద సవారీ కూడా చేయవచ్చు.

 

fort1

అలాగే ఇంకా జైఘర్ కోట, నహర్ ఘర్ కోట, కోతుల గుడి (ఈ కోతుల గుడిలో వున్న సరోవరం దగ్గర కొన్ని వేల కోతులు వుంటాయిట), జల్ మహల్, రాంబాగ్ పాలస్…  ఇలా ఎన్నో వున్నాయి.

ఓపిగ్గా చూడాలే కానీ, రాజుగారు తలుచుకుంటే.. భవనాలకీ, కట్టడాలకీ కొదువా?

౦                 ౦                 ౦

నిదుర లేని వనాల్లో…అలుపు లేని నడకలు!

సత్యం మందపాటి

 

satyam mandapati     ఇండియానించీ మనవాళ్ళు చుట్టం చూపుగానో, స్నేహం చూపుగానో అమెరికా వచ్చాక మామూలుగా చూసేవి, న్యూయార్క్, హ్యూస్టన్, చికాగోలాంటి పెద్ద పెద్ద నగరాలూ, వాషింగ్టన్ కాపిటల్ భవనాలూ, నయాగరా జలపాతం, అటు లాస్ ఏంజలీస్, ఇటు ఫ్లారిడాలలో డిస్నీలాండూ, లాస్ వెగాస్ కసీనోల్లో ధర్మరాజుల్లా జాదాలూ, ముడుపులూ, పిట్స్బర్గ్ వెంకటేశ్వర్లుగారి గుడిలో మొక్కుబడులూ, మళ్ళీ ముడుపులూ, అమెరికాలోని ఎన్నెన్నో ఇతర గుడులూ, గోపురాలూ చూపించటం, వాటి తర్వాత మళ్ళీ భారతదేశానికి వెళ్లబోయే ముందు షాపింగ్ చేయటం… పనిలో పని అనుకుని దగ్గరలో వున్న మిగిలిన గుడులు కూడా చూసేసి విమానం ఎక్కేయటం మామూలయిపోయింది.

డిస్నీ, సీ వరల్డ్, ఎప్కాట్ సెంటర్, యూనివర్సల్ స్టూడియో, నయాగరా లాటివి ఎంతో బాగుంటాయి. అలాగే అమెరికాలో ఒక సిటీ చూస్తే, దాదాపు అన్ని సిటీలు చూసినట్టే. ఇండియానించీ వచ్చేవారికి, ఇక్కడ గుడులు చూడటం పెద్ద అవసరం అని, వాళ్ళు నన్ను కోప్పడినా కూడా, నేను అనుకోను. కానీ నా ఉద్దేశ్యంలో అమెరికాలో చూడవలసినవి, ప్రపంచంలో ఇంకెక్కడా లేనివీ చాల వున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఇక్కడి నేషనల్ పార్కులు, వనాలు. ఎన్నో ప్రకృతి వనరులతో కూడిన వనాలు. అందమైన ఉద్యానవనాలు. ఒక దానిని మించినదింకొకటి. వాటి గురించే చెప్పుకుందాం ఈసారి.

౦                           ౦                           ౦

అమెరికాలో సహజ ప్రకృతి సంపదని పరిరక్షించటం అనేది 1832లో జార్జ్ కాట్లిన్ అనే ఒక కళాకారుడి కృషి ఫలితం అని నాపుస్తకాల పరిశోధన చెబుతున్నది. ఆయన డకోటా రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు అక్కడి వన, వృక్ష, పర్వత సంపదా, వాటి అందాలూ చూసి, వాటిని పరిరక్షించకపోతే కార్చిచ్చులా వ్యాపిస్తున్న నాగరికతకి అవి ఎలా నాశనమయిపోతాయో అని భయపడ్డాడు. బాధపడ్డాడు. ఆ స్పూర్తితో నేషనల్ పార్కుల పేరుతో, ప్రభుత్వం వాటి పరిరక్షణని తమ చేతుల్లోకి తీసుకొవాలనీ, ప్రకృతి అందాలని ప్రభుత్వ సహాయంతో కాపాడాలనీ గొడవ చేశాడు. అలా మొదలైన ఆ నేషనల్ పార్కులు ఈనాడు అమెరికాలో అన్ని రాష్ట్రాలలోనూ కొన్ని వందలు వున్నాయి. ఒక్కొక్కటి కొత్త రకం ప్రత్యేకతతో కనులకి ఇంపుగానే కాక, ప్రకృతి అద్భుతాలని చూసి ఆశ్చర్యపడేలా చేస్తాయి.

1864లో కాలిఫోర్నియాలోని యోసిమిటీ పార్కు ప్రారంభమయింది. 1872లో వయోమింగ్, మోంటేనా రాష్ట్రాలలోని ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు – ప్రజల ఉపకారానికీ, ఉల్లాసానికీ అంకితం చేయబడింది. అప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు లేనందున, అమెరికా ప్రభుత్వమే ఆ పార్కు బాధ్యతని తీసుకుంది. ఇలా మొదలయింది ఈ నేషనల్ పార్కుల పరిరక్షణ. దాని తర్వాత వరుసగా సెకోయా నేషనల్ పార్క్, మౌంట్ రైనర్, క్రేటర్ లేక్, గ్లాసియర్ నేషనల్ పార్కులు వచ్చాయి. ఆ అందాలను చూడటానికి వచ్చే జనానికి కావాలసిన రవాణా, వసతి, ఆహారం, ఇతర సరదాలూ మొదలైన సౌకర్యాలని కూడా సిద్ధం చేయాల్సివచ్చింది. ప్రకృతి సహజ సౌందర్యాలని పాడు చేయకుండా, అ సదుపాయాలు ఇచ్చారు. ఈనాడు ప్రతిచోటా, అన్ని రకాల ఆర్ధిక స్థోమతలకీ అనుగుణంగా ఇక్కడ హోటళ్ళూ, మిగతా సౌకర్యాలూ వున్నాయి.

ప్రకృతి అందాలనే కాక, చారిత్రాత్మకమైన శిలలూ, శిధిలాలూ, జంతువుల అవశేషాలూ, కాలగతిలో శిలలయిపోయిన వృక్షాలూ.. ఇలా చరిత్రకి ఆధారమైనవేమైనా ఈ పరిధిలోకి తీసుకువచ్చారు. అలాటి వాటిలో ఆరిజోనాలోని కేసా గ్రాండే, కోలరాడోలోని మేసా వర్డే ఈ కోవలోకి వస్తాయి. థియోడర్ రూస్వేల్ట్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు 18 నేషనల్ మాన్యుమెంట్లని ఈ పరిధిలోకి తీసుకువచ్చాడుట. వీటిల్లో చెప్పుకోదగ్గవి, న్యూమెక్సికో లోని ఎల్మోరో, ఆరిజోనాలోని పెట్రిఫైడ్ అడవి, గ్రాండ్ కాన్యన్ మొదలైనవి.

1916కి 14 నేషనల్ పార్కులూ, 21 నేషనల్ మాన్యుమెంట్లూ ప్రభుత్వపు పరిధిలోకి వచ్చినా, వాటి నిర్వహణ కోసం వేరే డిపార్ట్మెంట్ లేదు. అవసరాన్ని బట్టి ఆర్మీని పంపించేవాళ్ళు. ఆరోజుల్లో వాళ్ళే కావలసిన రోడ్లనీ బిల్దింగులనీ సమాయత్తం చేసేవారుట. ఈ పార్కుల్లో జంతువులని వేటాడటం, చెట్లని నరకటం మొదలైనవి నిషిద్ధం చేశారు. కొంతమంది స్వార్ధపరులు, అంటే రీసెర్చి కోసం తమకు కావలసిన సమాచారంతో పాటు, శిధిలాలని కూడా చెప్పాపెట్టకుండా తీసుకువెళ్లటం మొదలుపెట్టారు. మాథర్, ఆల్బ్రైట్ అనే పెద్దలు, ప్రభుత్వంతో భేటీ పడి, సాటర్డే ఈవెనింగ్ పోస్ట్ లాంటి పేపర్లో ప్రచారం చేసి, మొత్తానికి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్‌ని ఒప్పించి ఆగస్టు 25, 1926 తేదీన నేషనల్ పార్క్ సర్వీస్ అనే సంస్థని కేంద్ర ప్రభుత్వం క్రింద వుండేటట్లు చేశారు. నేషనల్ పార్కుల్నీ, మాన్యుమెంట్లనీ, అన్నిటినీ నేషనల్ పార్కుల క్రిందకే తీసుకువచ్చారు. అంతేకాక ఈ విషయంలో ఎంతో పాటుపడిన మాథర్ని పార్క్ సర్వీసుకి మొదటి డైరెక్టరుగానూ, ఆల్బ్రైట్ని అసిస్టెంట్ డైరెక్టరుగానూ నియమించారు. వారిద్దరి ఆధ్వర్యంలో ఈ సంస్థ చాల అభివృద్ది సాధించింది. ఈ పార్కుల్లో చక్కటి రోడ్లు, బస్సు సౌకర్యాలు, హోటళ్ళు, మ్యూజియంలు, సమాచారా కేంద్రాలూ, వాటికి సంబంధమైన పుస్తకాలూ అన్నీ సమకూర్చారు.

అప్పటిదాకా అమెరికాలో పడమటి రాష్ట్రాలలోనే నేషనల్ పార్కులు అభివృద్ది చెందాయి. అందుకని 1926 నించీ తూర్పున కూడా షెనండో, గ్రేట్ స్మోకీ మౌంటెన్, మేమత్ కేవ్ మొదలైన నేషనల్ పార్కులు వచ్చాయి.

అమెరికా ఒక దేశంగా పుట్టిన మొదటి రోజుల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటి చరిత్రని నిలపటానికి కొన్ని వార్ మెమోరియల్స్ని కూడా ఈ పార్కుల క్రిందకే తీసుకురావాలని, 1933లో ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్ ప్రెసిడెంటుగా పదవీ స్వీకారం చేశాక, ఆల్బ్రైట్ ఆయనని ఒప్పించాడు. దాని ఫలితమే ఈనాటి వాషింగ్టన్ మెమోరియల్, లింకన్ మెమోరియల్, వైట్ హౌస్ లాటివి. రూస్వెల్ట్ చేసిన గొప్ప పనులలో ఒకటి సివిలియన్ కన్సర్వేషన్ కార్పొరేషన్ అనే సంస్థని ప్రారంభించటం. ఎంతోమంది యువకులు దీంట్లో చేరి, పార్కుల పరిరక్షణ, వాటి అభివృద్ధితో పాటూ ప్రకృతి భీభత్సాలనించీ పార్కులనీ, ప్రజలనీ కాపాడే కార్యక్రమాల్లో కృషి చేశారు.

ఈ పార్కులలో ఒక రోజునించీ పది రోజుల దాకా గడపటానికి ఎన్నో విశేషాలు వున్నాయి. కొన్ని చోట్ల కాంపింగ్ చేయవచ్చు. పార్కుల్లోనూ, కొండల్లోనూ నడవటానికీ, సైకిల్ తొక్కటానికీ, ఈత కొట్టటానికీ, కొండలు ఎక్కటానికీ.. ఇలా ఎన్నో రకాల వ్యాపకాలకి ఆస్కారం వుంది. ఇంత వైవిధ్యం వున్న నేషనల్ పార్కులు అన్నీ చూడటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. వాటి గురించి వివరంగా చెప్పటానికి, ఎన్నో పేజీలు పడుతుంది. అందుకని కొన్ని ముఖ్యమైన వాటి గురించి కొంచెం రుచి చూపిస్తాను. ఇహ మీ ఇష్టం…

వీటన్నిటిలోకి ఎంతో గొప్పది, ప్రపంచంలో ఇంకెక్కడా లేనిదీ గ్రాండ్ కాన్యన్. దాని గురించి ఒంకొక వ్యాసంలో చెప్పుకుందాం. దాని పక్కనే వుంది బ్రైస్ కాన్యన్. గ్రాండ్ కాన్యన్లో కనపడే ఎర్రటి కొండలూ, ఆకుపచ్చటి కోనలూ, నీలి ఆకాశపు సౌందర్యం, రంగు రంగుల రాళ్ళతో మనకి ప్రకృతి ఇచ్చిన వరాలైతే, బ్రైస్ కాన్యన్లో అదే ప్రకృతి మనకి అందించినది, గడ్డ కట్టిన ఎర్రటి మట్టి కట్టడాలు, కొన్ని మైళ్ళ తరబడి మనల్ని ఈ లోకంలో నించీ బయటకు తీసుకువెడతాయి. నారాయణరెడ్డిగారు చెప్పినట్టు ‘కారడవుల మునులవోలె’ నుంచొని కనపడతాయి.

satyam1

 

అలాగే ఆర్చస్ నేషనల్ పార్కు. ఎక్కడా చూసినా పెద్ద పెద్ద ద్వారాలు. ఎర్రటి మట్టి   రాయిగా మారి, యుగయుగాలుగా గాలి ఒరవడికి రాతి ముఖద్వారాలుగా మారి మనల్ని ఆహ్వానిస్తుంటాయి.

పెట్రిఫైడ్ అడవికి వెడితే, కొన్ని యుగాలనాటి చెట్లు, ఈనాడు ఎన్నో రంగురంగుల శిలలుగా మారి, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తుంటాయి.

ఎల్లో స్టోన్ పార్కు ప్రకృతి సౌందర్యానికి ఒక అమోఘమైన నిర్వచనం. అక్కడినించీ బయటికి వెళ్ళబుద్ది కాదు. అక్కడికి వెళ్ళేదాకా, అన్ని సహజమైన రంగులు వుంటాయని నేను కలలో కూడా ఊహించలేదు. బహుశా ఏ చిత్రకారుడి కుంచెకూ అవి అందవేమో!

భూమిలోనించీ రకరకాల రసాయనాలూ, వేడివేడిగా వాయువు, ఆవిరి, నీళ్ళ రూపంలో బయటికి వస్తూ, వాడిగా పాతిక రంగుల్లో మనవేపు చూస్తుంటాయి. కొన్ని మృదువుగా గీజర్ల రూపంలో బయటికి వస్తుంటే, కొన్ని భూమిని చీల్చుకుని ఫౌంటెన్లలాగా ఎంతో ఎత్తుకి వేడుతుంటాయి. వాటిల్లో ‘ఓల్డ్ ఫైత్ఫుల్’ (Old Faithful) అని ఒక గీజర్ వుంది. అది ఒక్కటే అక్కడ ఒక క్రమమైన సమయాలలో వస్తుంది. అందుకే దానికా పేరు పెట్టారు. అది రోజుకి ఎన్నోసార్లు, దాదాపు పదిహేను నిమిషాలకి ఒకసారి, భూమిలో నించీ దాదాపు 180 అడుగుల ఎత్తుకి ఒక ఫౌంటెన్ లాగా పైకి వెళ్లి నృత్యం చేస్తూ, వేడివేడి నీళ్ళను వెదజల్లుతుంది. ఆ నృత్యం నాలుగైదు నిమిషాలే అయినా, చూడటానికి అద్భుతంగా వుంటుంది. దాంట్లో నించీ 8400 గాలన్ల నీళ్ళు ప్రతిసారీ బయటికి వస్తాయిట. ఆ నీటి ఉష్ణోగ్రత 204 డిగ్రీలు ఫారన్‌హీట్ లేదా 95.6 డిగ్రీలు సెంటిగ్రేడ్.

satyam3

ఇక్కడ రకరకాల సైజుల గీజర్లు 10000 పైన వున్నాయి. పెద్ద పెద్ద గీజర్లే 300 పైన వున్నాయిట. కొన్నిటిలో నించీ వచ్చే ఆ నీళ్ళు – గంధకం, భాస్వరం లాటి రకరకాల రసాయనాల మిశ్రమంతో, లేత నీలం, సిరా రంగు, ఆకాశ నీలం లాటి ఎన్నో రకాల నీలం రంగులూ, లేతాకు పచ్చ, ముదురాకు పచ్చ, నీలం ఆకుపచ్చ కల్నేత, పసుపు పచ్చ, కనకాంబరం, కాషాయం, ఎరుపు, గులాబి.. ఇలా ఎన్నెన్నో రంగులలో కనిపిస్తుంటాయి. ఎవరో ఎన్నో డబ్బాల రంగుల పైంట్ పారబోసుకున్నారేమో అనిపిస్తుంది కొన్ని చోట్ల. సముద్రానికి 8860 అడుగుల ఎత్తుగా వున్న ఈ ఎల్లో స్టోన్ పార్కు గురించి తెలుసుకోవాలంటే చాల వుంది. మీకు ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం, కుతూహలం వుంటే, ఎన్నో విడియోలు వున్నాయి. ఇంటర్నెట్లో ఎంతో సమాచారం వుంది. ఓపిగ్గా వెతకాలి. అంతే!

అమెరికాలో అన్నిటిలోకి ముఖ్యంగా చూడదగ్గ ప్రత్యేక ప్రదేశాలు, నా ఉద్దేశ్యంలో, ఒకటి: గ్రాండ్ కాన్యన్, రెండవది: ఎల్లో స్టోన్ పార్క్.

అలాగే సెకోయా పార్కులో ప్రపంచంలో ఎక్కడాలేని 275 అడుగుల ఎత్తైన చెట్టు వుంది. ఇది ఇరవై ఐదు అడుగుల వ్యాసంతో, 2700 సంవత్సరాల వయసుతో, ఇంకా నిటారుగా నిబడే వుంది.

 

satyam4

 

అలాగే గ్రాండ్ టీటన్ పార్కులోని రెండు మంచు పర్వతాలు. సూర్యరశ్మిలో మెరిసిపోతూ, పక్కపక్కనే వుండి,  ఎంతో దూరం నించీ కనిపిస్తూ కనులకు విందు చేస్తాయి.

 

satyam5

మేమీ దేశానికి వచ్చినప్పటినించీ, అంటే మూడున్నర దశాబ్దాలుగా, చూసిన నేషనల్ పార్కులు ఎన్నో వున్నాయి, చూడవలసినవి ఇంకా ఎన్నో వున్నాయి. నేను ముందే చెప్పినట్టు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఒక చోట చూసినవి ఇంకొక చోట కనపడవు. అలాగే షియాన్ నేషనల్ పార్క్, నయాగరా, డెనోసోర్ నేషనల్ పార్క్… ఇలా ఎన్నో వున్నాయి.

చూసే వాళ్లకి చూసినంత! తర్వాత మీ ఇష్టం!

౦                 ౦                 ౦

 

 

 

 

తెల్లటి నుదుటి మీద నల్లటి మచ్చ!

సత్యం మందపాటి 

 

  satyam mandapati    నాలుగేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఢిల్లీ, జయపూర్, ఆగ్రాలతో పాటు, అమృత్సర్, వాఘ సరిహద్దులు కూడా చూశాం. ఈ శీర్షికలో ఢిల్లీ గురించి ఇంతకుముందే వ్రాశాను. జయపూర్, ఆగ్రాల గురించి కూడా త్వరలో వ్రాయాలని వుంది. ఈసారికి అమృత్సర్, వాఘ సరిహద్దుల గురించి మా అనుభవాలు వ్రాస్తాను.

మేము అమృత్సర్ వెళ్ళటానికి కారణం ఒకటి సిక్కుల హర్మందిర్ సాహిబ్ (బంగారు గుడి) చూడటం ఒకటయితే, మరో ముఖ్య కారణం, జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగిన చారిత్రాత్మక ప్రదేశం చూడటం.

భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి మరచిపోలేనంతగా స్పందించిన నాకు, ఆ విషయాల గురించి ఎన్నో పుస్తకాలు చదివిన నాకు, ఎన్నాళ్ళనించో ఆ ప్రదేశం చూడాలనే బలమైన కోరిక వుండేది. భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి చదివినప్పుడల్లా, నాకు ఒక గగుర్పాటు, ఒక మరువలేని అనుభూతి కలుగుతాయి. అందుకని ఇన్నాళ్ళకి ఆలస్యమయినా వదలకుండా అక్కడికి వెళ్ళాం. అంత దూరం వెళ్ళాం కనుక, దగ్గరలోనే వున్న వాఘ సరిహద్దులో భారత సైన్యం చేసే విన్యాసాలు కూడా చూశాం.

౦                           ౦                           ౦

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్, భారతదేశంలో ఈశాన్య దిశన, పాకిస్తాన్ ఇండియాల వాఘ సరిహద్దుకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరాన వుంది. సిక్కు గురు రాందాస్ పేరున, దీనికి రాందాస్ పూర్ అనే పేరు కూడా వుంది. ఇప్పుడు పన్నెండు లక్షల జనాభా వున్న నగరం.

అమృత్‌సర్‌లోనే ఒక హోటల్ తీసుకుని వున్నాం. అక్కడే ఉపాహారం చేసి, ప్రొద్దున్నే మేము దగ్గరలోనే వున్న,  ఎన్నాళ్ళనించో చూడాలనుకుంటున్న ‘జలియన్ వాలాబాగ్’ స్మృతిచిహ్నం చూడటానికి వెళ్ళాం.

ఈ చారిత్రాత్మక చిహ్నం గురించి మీకందరికీ తెలుసునని నాకు తెలుసు. అయినా నాలుగు మాటలు చెప్పాలని వుంది.

1919వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన, వైశాఖి పండగ రోజున, ‘ఖల్సా’ వార్షికోత్సవం రోజున, అక్కడ జరగరాని సంఘటన ఒకటి జరిగింది. మానవత్వానికి మసి పూసిన సంఘటన అది.

అది తెల్లవాడి నుదుటి మీద కలకాలం చెరగని, చెరిగిపోలేని నల్లటి మచ్చ.

అది జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డైయ్యర్ అనే దురహంకారి వల్ల జరిగింది.

న్యూఢిల్లీలోని సిక్కుల గురుద్వార ‘రాకబ్ గంజ్’ గోడల్ని పగులుకొట్టిన బ్రిటిష్ సేనలకు నిరసనగా, మహాత్మా గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం ప్రోత్సాహంతో, ఎంతోమంది సిక్కు మతస్తులు సమ్మె చేశారు. ఆ ఏప్రిల్ పదవ తేదీన పాదయాత్ర చేస్తున్న యాభై వేల మంది సిక్కుల మీద బ్రిటిష్ సేనలు కాల్పులు జరిపి, శాంతియుతంగా సమ్మె చేస్తున్న ముఫై మందిని హతమార్చారు.

మూడు రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ పదమూడవ తేదీన, కొన్ని వేల మంది సిక్కులు, హిందువులు, ముస్లిమ్ మతస్తులు, ‘జలియన్ వాలా బాగ్’ తోటలో వైశాఖి పండగ జరుపుకోవటానికి వచ్చారు.

ఆరోజు కూడా మామూలుగా ప్రార్ధనలతో సాయంత్రం నాలుగున్నర గంటలకి కార్యక్రమం మొదలుపెట్టారు.

అప్పుడే అరవై ఐదు మంది గూర్ఖా, ఇరవై ఐదు మంది బలూచివారి  సైన్యంతో వచ్చాడు జనరల్ డయ్యర్.

ఎవరూ పారిపోకుండా, అక్కడున్న ఒకే ఒక్క  గేటుని మూయించాడు. ప్రార్ధన చేసుకుంటున్న వేల మంది భారతీయుల మీద, బులెట్ల వర్షం కురిపించాడు. ఏమీ ఆయుధాలు లేని ఆ అమాయకుల మీద, పది నిమిషాలు ఆగకుండా కాల్పులు జరిపాడు. పారిపోవటానికి ఎటూ దారిలేక ప్రాణాలు కోల్పోతుంటే, అక్కడ వున్న నూతిలోకి దూకారు చాలమంది పిల్లలు, స్త్రీలు, పురుషులు. వారిని కూడా వదలకుండా కాల్చి చంపాడు డయ్యర్. అంతా రక్త మయం, హాహాకారాలు, వాలిపోయిన అసహాయ ప్రాణాలు. డయ్యర్ పక్కన అతని కుడి భుజం ఆనాటి పంజాబ్ గవర్నర్ మైకేల్ ఒడియర్ నుంచుని, ఆ హత్యాకాండలో భాగస్వామి అయాడు.

ఆరోజున అక్కడ జరిగిన మారణహోమం, బ్రిటిష్ వారు చెప్పినట్టు మూడు వందల డెభై తొమ్మిది మంది ప్రజలకి కాదు, తెల్లవాడి మానవత్వానికి. ఆరోజున అక్కడ జరిగిన హత్యాకాండ, భారతీయ జాతీయ కాంగ్రెస్ చెప్పిన వెయ్యి మంది ప్రాణ త్యాగం చేసిన అమాయక ప్రజలకు కాదు, కొవ్వెక్కిన బ్రిటిష్ వారి విలువలకి.

అక్కడికి వెళ్ళిన మరుక్షణం నాకు గుర్తుకి వచ్చింది, రిఛర్డ్ అట్టిన్బరో గారు “గాంధీ” సినిమాలో కనులకు కట్టినట్టు తీసిన ఆ సంఘటన. అక్కడ గోడల మీద ఇంకా ఆరోజున బులెట్లు చేసిన రంధ్రాలు ఎన్నో వున్నాయి. పక్కనే ప్రాణ భయంతో ఎంతోమంది దూకిన నూయి కూడా ఆనాటి సంఘటనకి ఒక సాక్షిగా అలా నిలబడి వుంది. ఆ లోపలి వెళ్ళటానికి వున్న చిన్న ద్వారం చూస్తుంటే, అది మూసేసి డయ్యర్ కాల్పులు చేస్తుంటే, లోపల చిక్కుకు పోయిన వెయ్యిమంది, ప్రాణభీతితో ఎంతగా విలవిల్లాడివుంటారా అనిపించింది. ఆ నరక బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అది మనమీనాడు ఏమాత్రం ఊహించలేనిది.

amrit1

 

ఇది జరిగిన ఎనిమిది సంవత్సరాలకి డైయ్యర్ మరణించాడు. కానీ ఆరోజున ఈ హత్యాకాండని ప్రత్యక్షంగా చూసి, అందులో దెబ్బతిన్న ఉద్దంసింగ్ మాత్రం నిద్రపోలేదు. దెబ్బ తీయటానికి అవకాశం కోసం చూస్తూనే వున్నాడు. ఆ అవకాశం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత, అంటే 1940వ సంవత్సరంలో అతనికి లభించింది. భగత్సింగుకి కుడిభుజంగా పనిచేసి, స్వాతంత్ర పోరాటంలో జైలుకి కూడా వెళ్లాడు. ఉద్దంసింగ్ జైలు నించి విడుదల కాగానే లండన్ వెళ్ళాడు. కాక్స్టన్ హాలులో ఉపన్యాసం చేయబోతున్న డయ్యర్ కుడిభుజం మైకేల్ ఒడియార్ని, రెండు బులెట్లతో కాల్చి చంపేశాడు. ఉద్దంసింగ్ పారిపోవటానికి కూడా ప్రయత్నం చేయలేదు. తను చేయవలసిన పని పూర్తి చేసి, వారికి లొంగిపోయాడు. ఆ తర్వాత అతన్ని బ్రిటిష్ వారు ఉరి తీసి చంపేశారు.

ఇలాటి వివరాలు ఈనాటి భారతీయులకి తెలియటం ఎంతో అవసరం. అందుకే మిమ్మల్ని మన స్వాతంత్ర పోరాటం మీద వున్న ఎన్నో పుస్తకాలలో, కనీసం ఒకటో రెండో అయినా చదవమని కోరుతున్నాను.

మేము అమృత్‌సర్‌లో చూసిన ఇంకొక ముఖ్యమైనది సిక్కుల బంగారు దేవాలయం. దీనినే హర్మందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సిక్కుల మత గ్రంధం ‘గురు గ్రంధ్ సాహిబ్’  ఇక్కడే వుంది.

ఎంతో అందమైన దేవాలయం. నాలుగు పక్కలా పెద్ద ప్రహరీ గోడలతో కూడిన భవంతుల మధ్య చక్కటి కట్టడం. లోపల గుడికి నాలుగు పక్కలా అందమైన సరోవరం. దానిమధ్యలో దేవాలయం. పూర్తిగా బంగారు కవచంతో నిర్మించబడింది. అక్కడికి వెళ్ళటానికి సరోవరం మధ్య నించీ సిమెంటుతో కట్టిన ప్రవేశ వారధి. దీని నిర్మాణం గురు రాందాస్ మొదలుపెడితే, గురు అర్జన్ పూర్తిచేసాడుట. 1604లో దీని నిర్మాణం పూర్తి అయింది.  ఈ బంగారు దేవాలయం చూడటానికి రోజుకి లక్ష మంది పైగా యాత్రీకులు వస్తారుట.

సిక్కు మతస్తుల సంప్రదాయం ప్రకారం, బయట కాళ్ళూ చేతులూ కడుక్కుని, తలని జేబు రుమాలతో కప్పుకుని, లోపలికి వెళ్ళాం.  అన్ని మతాల వాళ్ళూ ఆహ్య్వానితులే అని చెప్పటానికి, నాలుగు తలుపులు వున్నాయి. లోపల వారి పవిత్ర మత గ్రంధం వుంది. లోపలికి వెళ్ళటానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది కానీ, నీళ్ళ మీద నించీ చల్లటి గాలి వీచటం వల్లా, పక్కనే జోకులు వేసే మేనల్లుడు వుండటం వల్లా బోరు కొట్టలేదు.

ఆ మధ్యాహ్నం మేము 32 కిలోమీటర్ల దూరంలో వున్న ఇండియా-పాకిస్థాన్‌ల వాఘ సరిహద్దుకి వెళ్ళాం. ఈ వాఘ సరిహద్దు పాకిస్థాన్ ఇండియాల మధ్య వున్న అన్ని సరిహద్దుల లాటిది కాదు. దానికి కారణం ఇక్కడ రోజూ సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు జరిగే  ‘సరిహద్దు కార్యక్రమం’. పాకిస్థాన్ వేపు రెండు మూడు వందల మంది అది చూడటానికి వస్తే, భారతదేశం వేపు ఎన్నో వేల మంది జనం వస్తారు.

మేము దానికి కొంచెం ముందుగానే వెళ్ళాం అక్కడికి. అక్కడ నాకు నచ్చనిది ఏమిటంటే, లోపలికి వెడుతున్నప్పుడు, ఆడవాళ్ళని ఒక పక్కకీ, మగవాళ్ళని ఒక పక్కకీ పంపించారు. అన్ని వేలమంది జనాభాలో ఎవరు ఎటు వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి. సెల్ ఫోన్లు కూడా అక్కడ సరిగ్గా పనిచేయలేదు. ఆ కార్యక్రమం అయాక, మళ్ళీ మేము కలవటానికి కొంచెం సమయం అయినా, చివరికి కథ సుఖాంతం అయింది. అది వేరే విషయం అనుకోండి.

ఆరోజు కార్యక్రమంలో ముందుగా, మన దేశం వేపు, దేశభక్తి పాటలతో హోరెత్తించారు. మధ్యలో ఎంతోమంది లేచి, ఆ పాటలకి తగ్గట్టుగా డాన్సులు చేస్తుంటే, వాతావరణంలో ఎంతో దేశభక్తీ, ఒక విధమైన ప్రేమతో కూడిన ఉద్రేకం కనపడ్డాయి.

తర్వాత రెండు పక్కలా సైనికుల కవాతులు మొదలయాయి. పాకిస్థాన్ వేపు చాల మామూలుగానూ, మన వేపు వేలమంది జనం ఉత్సాహంగా అరుస్తుంటే ఎంతో సందడిగానూ వుంది. ఒక్కొక్క సిపాయి కాళ్ళు ఎంతో పైకెత్తి నడుస్తూ, సరిహద్దు గేటు దాకా వెళ్ళి వెనక్కి వస్తుంటే, అక్కడ వున్న జనంలో కోలహలం ఎక్కువ అవటం మొదలయింది.

amrit3

తర్వాత కొంతమంది సిపాయీలు కవాతు చేస్తూ, సరిహద్దు దాకా వెళ్ళి నుంచున్నారు. అప్పుడే సరిహద్దు గేట్లు, మన వేపూ, పాకిస్థాన్ వేపూ తెరుచుకున్నాయి. సిపాయీలు రెండు పక్కలనించీ మధ్యకు వెళ్ళి, ఒకళ్ళని ఒకళ్ళు స్నేహపూర్వకంగానే కవ్వించుకున్నారు. తర్వాత రెండు దేశాల జాతీయ గీతాలు ఆలాపిస్తుంటే, జాతీయ పతాకాలని క్రిందకి దించారు. వాటిని అందంగా మడిచి, సిపాయీలు అవి తీసుకుని, మళ్ళీ కవాతు చేస్తూ వెనక్కి వచ్చారు. రెండు దేశాలవారూ గేట్లు మూసేశారు. తర్వాత మళ్ళీ దేశభక్తి పాటలతో మార్మోగిపోయింది.

అంతటితో సరిహద్దు కార్యక్రమం సమాప్తం అయింది.

ఆరోజు రాత్రి ట్రైన్ ఎక్కటంతో మా అమృత్సర్ యాత్ర కూడా అలా విజయవంతంగా సమాప్తం అయింది.

౦                           ౦                           ౦

హలో…హలో..అలోహా!

 సత్యం మందపాటి

 

 satyam mandapati ఎన్నాళ్ళనించో చూడాలనుకుంటున్న ‘హవాయీ ద్వీపాలు’ చూసి రావటం కూడా కొన్నేళ్ళ క్రితమే జరిగింది.  పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా వారి ఎనిమిది ద్వీపాల సముదాయమే హవాయి. అమెరికాలోని  యాభై రాష్ట్రాల్లో ఒకటి. అక్కడ ఈ ఎనిమిది ద్వీపాలు పక్కపక్కనే వున్నా, ఎక్కువ జనాభా వున్నవీ, చాలామంది యాత్రీకులు వెళ్ళేవీ నాలుగు లేదా ఐదు ద్వీపాలు మాత్రమే.

అన్నిటిలోకి పెద్దది ‘బిగ్ ఐలండ్’. దాన్నే ‘హవాయి ద్వీపం’ అని కూడా అంటారు. తర్వాత ‘మావి’ (Maui),

‘ఉవాహు’ (Oahu), కవూయి (Kauai) పెద్దవి. దాని తర్వాత వైశాల్యంలో ‘మలోకా’, ‘లానా’, ‘నీహావ్’, ‘కహులావి’   ద్వీపాలు వున్నాయి. (ఉవాహు ద్వీపాన్ని ఉఆహు అని కూడా పలుకుతారు)

వీటన్నిటి మీదా కొంచెం పరిశోధన చేసి, చివరికి నాకూ శ్రీమతికీ రెండు వారాలే సెలవు దొరికింది కనుక, ఒక వారం ఉవాహులోనూ, ఇంకొక వారం మావిలోనూ సరదాగా, విశ్రాంతిగా గడుపుదామని నిర్ణయించుకున్నాం. ‘బిగ్ ఐలండ్’ కూడా వెడదామనుకున్నాం కానీ, తీరిగ్గా చూడటానికి రెండు ద్వీపాలు చాలనిపించింది. కొంతమంది మిత్రులు, విమానంలో ఉవాహు వెళ్లి, అక్కడినించీ ఏడు రోజుల క్రూజ్ తీసుకుని, అన్ని ద్వీపాలు చూసి వచ్చారు. కానీ, మాకు అదీ అంతగా నచ్చలేదు.

మేము ఆ రెండు ద్వీపాలనే ఎందుకు చూద్దామనుకున్నామో, ఆ ద్వీపాల గురించి చెబుతుంటే మీకే అర్ధం అవుతుంది. చిత్తగించండి.

౦                           ౦                           ౦

ఆస్టిన్ నించీ లాసేంజలిస్, అక్కడినించీ ఉవాహు ద్వీపం మీద వున్న ‘హానొలూలు’ నగరానికి విమాన ప్రయాణం చేసి, అక్కడే వైకీకి బీచ్ మీద వున్న ఒక హోటల్లో వారం రోజులు బస చేశాం.

మా గది కిటికీలోనించీ, వెన్నెల్లో సముద్రం, వెండి రంగులో మెరిసిపోతున్న సముద్ర తరంగాలు, ఎంతో అందంగా వున్నాయి. రోజుకి కనీసం ఒకటి రెండుసార్లన్నా, ఆ సముద్రం ఒడ్డున రెండు మూడు మైళ్ళు నడుస్తూనే వున్నాం.

చక్కటి సముద్రం, దానిపక్కనే ఎన్నో హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపులు, పెద్ద పెద్ద భవనాలూ, శుభ్రమైన రోడ్లతో హానలూలు నగరం, ఫ్లారిడాలోని మయామీలాగా వుంటుంది. మయామీ చూసేశాం కనుక, అక్కడికి ఎందుకు వెళ్ళామంటే, ముఖ్య కారణం రెండవ ప్రపంచ యుద్ధంలో అక్కడే జరిగిన ‘పెరల్ హార్బర్’ భీభత్సం. తర్వాత

ఎన్నో పాలినీషియన్ ద్వీపాల సంస్కృతి ఇక్కడ కనపడటం. ఎంతోఅందమైన హనౌమా బే, వైకీకి బీచ్ లాటి ఎన్నో అందమైన సముద్ర తీరాలు.. ఇలాటి చూడవలసిన ప్రదేశాలు ఇక్కడ ఎన్నో వున్నాయి. ఈ ద్వీపం ఇటు ప్రకృతి సౌందర్యానికి, అటు ఎంతో అందమైన కట్టడాలకి నెలవే కాకుండా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం వున్న ప్రదేశం. అందుకే ముందుగా “ఉవాహు” ద్వీపానికి వెళ్ళాం.

hawai1

హవాయి భాషలో ఉవాహు అంటే, ప్రజా సముదాయం కలిసే కూడలి అని అర్ధం. ఈరోజుల్లో ఇక్కడికి వచ్చే జనాన్ని చూస్తే, ఆ పేరు సార్ధక నామం అని తెలుస్తూనే వుంటుంది. రెండు అగ్ని పర్వతాల మీద నించీ వచ్చిన లావాతో ఏర్పడిన ద్వీపమిది. ఆరువందల చదరపు అడుగుల వైశాల్యంతో, ఒక మిలియన్ జనాభా వున్న ద్వీపం.

మొట్టమొదటగా బస్ టూర్ తీసుకుని, పెరల్ హార్బరుకి వెళ్ళాం. అక్కడే USS ఆరిజోనా మెమోరియల్ యుద్ధ నౌక వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారి పేర్లతో పాటు, చరిత్ర మీద సరదా వున్న వారికి, ఇక్కడ చూడవలసినవి ఎన్నో వున్నాయి, సమాచారం ఎంతో వుంది.

తర్వాత పాలినీషియాన్ సాంస్కృతిక కేంద్రానికి వెళ్ళాం. హవాయి, తహితి, ఫిజి, టోంగా, సమోవ మొదలైన ద్వీపాల తెప్పల మీద వారి సంస్కృతిని తెలిపే నృత్యాలు చేస్తూ, రంగురంగుల దుస్తులతో పాటలు పాడుతూ, ఆడుతూ మనకి కన్నుల విందు చేసే ప్రదర్శన ఎంతో బాగుంటుంది.

 

అక్కడే కొబ్బరి చెట్లు గబగబా ఎక్కి, ఒక కొబ్బరిబొండాం కోసి, క్రిందికి దిగి వచ్చి దాన్ని ఎంత త్వరగా వలిస్తే వాళ్ళు గెలవటం, రకరకాల పాలినీషియాన్ నృత్యాలు చేసి చూపించటమే కాకుండా, మనకి కూడా నేర్పిస్తూ, వాళ్ళతో పాటూ మనమూ డాన్స్ చేయటం సరదాగానూ, చాల ఆకర్షనీయంగానూ వున్నాయి.

ఇంకా ఇక్కడ మాకు బాగా నచ్చింది హనౌమ బే.  పైన నీలి ఆకాశం, అందమైన సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు, వాటికి ఎన్నో రంగురంగుల పూలు… ఎంతో సుందరమైన ప్రదేశం. ‘డోల్’ అనే కంపెనీ వారి పైనాపుల్ తోట బాగుంది. అప్పటికప్పుడు కోసిన పైనాపుల్ ముక్కల రుచి, మనం ఇక్కడ తినే వాటి కన్నా ఎంతో బాగుంటుంది. హవాయి ఆర్ట్ మ్యూసియం, అలోహా టవర్,  డైమండ్ హెడ్.. ఇలాటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు వున్నాయి.

వారం రోజులు వైకీకీ బీచ్ ఒడ్డున ఉవాహులో గడిపి, అక్కడి నించీ మావి ద్వీపానికి విమానంలో వెళ్ళాం.

హనొలూలు విమానాశ్రయంలో దిగుతున్నా, వెడుతున్నా ఎంతోమంది రంగురంగుల దుస్తులు వేసుకున్న అమ్మాయిలు ‘అలోహా’ అంటూ మన మెడలో పూలదండ (హవాయి భాషలో లై అంటారు) వేస్తారు. కలిసినప్పుడు వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు ‘అలోహా’ అంటారు. అంటే మన ‘నమస్తే’, ‘ఉంటామండీ’ లాగా అన్నమాట. అలోహా అనే మాటకు అసలు అర్ధం శాంతి, అనురాగం, దయ అని గూగులమ్మగారు చెబుతున్నారు.

మావి 730 చదరపు మైళ్ళ వైశాల్యంతో, దాదాపు లక్షన్నర జనాభా వున్న ద్వీపం. ఇది ఈ హవాయి పెద్ద ద్వీపాల సైజులో రెండవది. మావి ద్వీపానికీ, ఉవాహు ద్వీపానికీ వున్న పెద్ద తేడా, మావిలో కాంక్రీటు, స్టీలు కన్నా ప్రకృతి అందాలు ఎక్కువగా కనిపిస్తాయి. బీచ్ ఒడ్డున హోటల్ బిల్డింగులు కూడా అక్కడా ఇక్కడా కొన్ని తప్ప అన్నీ ఒకటి లేదా రెండు అంతస్తుల భవనాలే.

ఇక్కడ కూడా సముద్రం ఒడ్డునే ఒక రిసార్టులో గది తీసుకున్నాం. మా గది కిటికీలోనించీ సముద్రం, దానితో పాటు కొంచెం దూరంగా పక్కనే వున్న ఇంకొక ద్వీపం కూడా కనిపిస్తుండేవి.

ఇక్కడ చూడవలసిన వాటిలో ముఖ్యమైనది ‘హలేకలా నేషనల్ పార్క్’. ఇది సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తున, పర్వతాల మీద వున్నది, ఇది ఒక అగ్నిపర్వతం. ఇప్పుడు లావా బయటికి రావటం లేదు కానీ, అంతర్గతంగా ఇది అగ్ని పర్వతమే. ఎప్పుడు ఆ వేడి బ్రద్దలయి, అది బయటికి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళటానికి వున్న ఘాట్ రోడ్డు ఎన్నో మెలికలు తిరుగుతూ పైకి వెడుతుంది. అక్కడే ఒక పెద్ద క్రేటర్ కూడా వుంది. క్రేటర్ అంటే ఆకాశంలోనించీ Asteroids భూమి మీద పడ్డప్పుడు ఏర్పడే ఎంతో పెద్ద గుంట. క్రింద మేము చూసిన క్రేటర్ ఫోటో కూడా ఇస్తున్నాను.

hawa3

మేము కారు అద్దెకి తీసుకున్నా కూడా, ఈ ప్రదేశానికి టూరు బస్సులోనే వెళ్ళమని చెప్పింది మా హోటల్లో వున్న అందమైన రిసెప్షనిస్టు.

‘మీరు ఆ మెలికల రోడ్డులో డ్రైవింగ్ మీద దృష్టి పెడితే, అక్కడి ప్రకృతి అందాలను సరిగ్గా ఆస్వాదించలేరు’ అని మెలికలు తిరుగుతూ అందంగా చెప్పింది.

సరే ‘మావి పాప’ చెప్పింది కదా అని, అప్పటికి అలా కానిచ్చి టూర్ బుక్ చేసుకున్నాము. అది ప్రొద్దున వెడితే, ఇక చీకటి పడ్డాకే తిరిగి రావటం. ప్రొద్దున్నే సాండ్విచ్ పాక్ చేసుకుని వెళ్ళాం.

దారిలో ఎన్నో రకాల పూల చెట్లు. పచ్చటి వృక్షాలు, మామిడి, బొప్పాయి, అరటి, పైనాపుల్ లాటి ఎన్నో పళ్ళ చెట్లు. పక్కనే క్రింద సముద్రం.. పైన నీలాకాశం. మధ్యే మధ్యే చిన్న చిన్న జలపాతాలు, లోయలు, అక్కడక్కడా చిన్న చిన్న గుహలు. ఇక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు. వాటి పక్కనే పళ్ళ తోటలు, పూల తోటలు. ఎన్నో ప్రకృతి అందాలు. ఆ అందాలను వర్ణించటం నాకు సాధ్యం కాదు.

మా గైడ్/డ్రైవర్ కూడా సరదాగా జోకులు వేస్తూ, ఆరోజుని మరువలేని రోజుగా మామీద ముద్ర వేశాడు.

 

hawa4

మావిలో మేము ఉత్సాహంగా చూసిన ఇంకొకటి – వేల్ వాచింగ్. అంటే సముద్రంలో తిమింగలాలను చూడటం.

ఒక బోటులో, పది మంది వుంటారేమో – రెండు గంటలసేపు తిమింగలాలను చూడటానికి వెళ్ళాం. అవి చటుక్కున బయటికి వచ్చి వెంటనే, ఒక పెద్ద కదులుతున్న ఆర్చిలా, వెంటనే నీళ్ళల్లోకి వెళ్లిపోయేవి. ఎవరికి అవి కనపడినా పెద్దగా అరుపులు, అందరూ కెమెరాలు అటు తిప్పి ఫోటోలు తీసేలోగా, అవి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోవటం. అదొక ఆటలా సరదాగా గడిపాం.

ఇంకా మావి ద్వీపంలో చూడాలనుకునేవి, చేయాలనుకునేవి చాల వున్నాయి. హెలికాప్టరులో ద్వీపం అంతా చుట్టి రావచ్చు. స్నోర్క్లింగ్ చేయవచ్చు. స్కూబా డైవింగ్ చేయవచ్చు. పైనాపుల్ గార్డెన్స్ టూర్ వెళ్ళచ్చు. సర్ఫింగ్ చేయవచ్చు. బొటానికల్ గార్డెన్స్ చూడవచ్చు. ఇవన్నీ చేయాలన్నా, చూడాలన్నా వారం రోజులు నిజంగా చాలవు.

మా ‘మావి’ ప్రయాణం ఈ హవాయి ట్రిప్పులో ముఖ్యాకర్షణ.

అవకాశం దొరికితే, మళ్ళీ వెడతామా?

తప్పకుండా!

౦                           ౦                           ౦

 

ప్యారీ.. పారీ.. పారిస్!

సత్యం మందపాటి

satyam mandapati ప్రపంచమంతటా అందరూ ఏనాటికైనా చూడాలి అనుకునే నగరం పారిస్! (Bucket List అన్నమాట)

ప్రతిరోజూ కొన్ని లక్షలమంది ఎక్కడెక్కడినించో వచ్చి, విహరించే నగరం పారీ.. అదే పారిస్!

పారీ అని ఎందుకు అన్నానో, ఒక చిన్న కథ చెబుతాను.

నేను రెండు సార్లు బిజినెస్ పని మీద, ఒకసారి శ్రీమతితో కలిసి విహారయాత్రకి పారిస్ వెళ్ళాను. చాలాసార్లు పారిస్ చార్లెస్ డిగాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వెళ్ళాను కానీ, మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలు  ఎన్నో చూసిన నాకు, ఏమాత్రం నచ్చని విమానాశ్రయాల్లో అదొకటి!

ఇక్ష్వాకుల కాలంలో మొట్టమొదటిసారిగా పారిస్ వెళ్ళినప్పుడు, ఒక చిన్న డిక్షనరీ కొన్నాను. ఇంగ్లీషు నించీ ఫ్రెంచిలోకి, ప్రయాణానికి కావలసిన చిన్న చిన్న వాక్యాలకి ఇంగ్లీషు అనువాదాలు. అంటే హలో బాగున్నారా, రెస్ట్ రూము ఎక్కడ, ఫలానా చోటుకి పోవాలి ఎలా వెళ్ళాలి, రైలు టిక్కెట్లు ఎక్కడ ఎలా కొనాలి… లాటి చిన్న చిన్న వాక్యాలు చెప్పటానికి సులువుగా వుంటుందని. నేను చైనా, జపాన్.. ఇలాటి భాష రాని ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఇలా డిక్షనరీలు కొనటం అలవాటయిపోయింది మరి. ఆ విషయమే స్నేహితుడు మూర్తిగారికి చెబితే, ఆయన పెద్దగా నవ్వాడు.

“ఫ్రెంచ్ భాష మాట్లాడటం అంత సులభం కాదు. వాళ్ళు వ్రాసిన సగం అక్షరాలు పలకరు. అదీకాక, ఆ యాస కూడా మీకు రెండు రోజుల్లో రావటం కష్టం. మన ఇండియన్ ఇంగ్లీషు యాస వాళ్లకి అసలు అర్ధం కాదు. అంతేకాదు మీ కొలీగ్ ఫ్రాంక్ కూడా మీతో వస్తున్నాడా?” అని అడిగాడు.

నేనూ, ఫ్రాంక్ ఒక ఇండియా రెస్టారెంటుకి వెళ్ళినప్పుడు, అక్కడికి వచ్చిన మూర్తికి పరిచయం చేశాను      అతన్ని ఒకసారి. అందుకే మూర్తికి అతను బాగా తెలుసు. అవును ఇద్దరం కలిసే వెడుతున్నామన్నాను.

పెద్దగా నవ్వుతూ అన్నాడు మూర్తి, “ఫ్రాంక్ అమెరికాలో వుంటున్నా, గట్టి బ్రిటీష్ యాసతో ఇంగ్లీష్ మాట్లాడతాడు. వాళ్లకి బ్రిటిష్ వాళ్ళంటే నచ్చదు. అందుకని మీరే మాట్లాడండి. ఇంగ్లీషులో కాదు. తెలుగులో.     కాస్త సంజ్ఞలు చేస్తూ, మాట్లాడితే వాళ్ళు అర్ధం చేసుకుంటారు”

అతను ఆ మాటలు సరదాగానే అన్నా, అక్కడ చాల చోట్ల అది నిజమేనని అనిపించిన సందర్భాలు కూడా వున్నాయి.

ఉదాహరణకి మా వూళ్ళో ఒకప్పుడు టీవీలో వార్తలు చదివే ఒకాయన పేరు బాబ్ బుడ్రో. బుడ్రో అనేది ఫ్రెంచి పేరు. దాన్ని ఇంగ్లీషులో ఇలా వ్రాస్తారు, Budreaux అని. ‘బు’ బాగానే వుంది కానీ, ఆ స్పెల్లింగులో ‘డ్రో’ ఎలా వచ్చిందో అర్ధం కాదు. ఆ అక్షరాలు అన్నీ పలికితే ఎవరికీ అర్ధం కాదు. అలాగే పారిస్ నగరాన్ని కూడా ఫ్రెంచి భాషలో పారీ అంటారు. వాళ్ళ భాష, వాళ్ళ ఇష్టం!

ఇలాగే కొన్ని మాటలు, మన తెలుగులోలాగా అన్ని అక్షరాలూ ఫ్రెంచిలో పలుకుతూ మాట్లాడుతుంటే, వాళ్ళు అర్ధంకాక మధ్యలోనే వెళ్ళిపోయేవారు!

పారిస్ గురించి రెండు మాటలు. ఈ నగరాన్ని, క్రీస్తు పూర్వం మూడవ దశాబ్దంలో, కెల్టిక్ ప్రజలు ‘పారిసై’ అనే పేరుతో స్థాపించారని, వల విసిరితే అంతర్జాలంలో చెప్పారు. క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వచ్చేసరికీ పారిస్ యూరప్‌లోనే అతి పెద్ద నగరంగానూ, గొప్ప వ్యాపార కేంద్రంగానూ తయారయింది. పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగాక, ఆధునికతతో పారిస్ ఎన్నో రంగాల్లో బాగా ఎదిగిపోయింది. ఈనాటికి పారిస్ నలభై ఒక్క చదరపు మైళ్ళ వైశాల్యంతో, ఇరవై మూడు లక్షల జనాభాతో, యూరప్‌లోనే ఒక పెద్ద నగరం. అంతేకాదు, ప్రపంచంలో గొప్ప విహారయాత్రా స్థలం అయిపోయి, సంవత్సరానికి దాదాపు ముఫై మిలియన్ల యాత్రీకులని ఆకర్షిస్తున్నది!

మేము లండన్ నించీ, ఇంగ్లీష్ ఛానల్ నీళ్ళ క్రింద నించీ వేసిన ట్యూబ్ రైల్లో పారిస్ చేరాం. అక్కడ మూడు రాత్రులు, అంటే మూడు నిద్రలు చేయాలని ముందే నేనూ, శ్రీమతీ ప్లాన్ చేసుకున్నాం

మేము మొట్టమొదటగా పారిస్‌లో చూసింది, అవును – మీరు అనుకున్నది రైటే, ఐఫిల్ టవర్. టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాక, ‘టవర్ పైకి వెళ్ళటానికి, లిఫ్ట్ తీసుకోవచ్చు, మెట్లు ఎక్కవచ్చు, ఇక మీ ఇష్టం’ అందంగా అన్నది అక్కడ అందంగా నుంచుని వున్న అందమైన ఫ్రెంచి సుందరి.

సరే, ఏదో చక్కటి పిల్ల ఇంకా చక్కగా చెప్పింది కదా అనుకుని, ఇంచక్కా మెట్లు ఎక్కి వెడితేనే, అన్నీ చూసుకుంటూ తీరిగ్గా వెళ్ళవచ్చు అని కూడా అనుకుని, మా కాళ్ళకి పని చెప్పాం.

paris1

 

ఈ ఐఫిల్ టవర్ 1887వ సంవత్సరంలో మొదలు పెట్టి, 1889లో పూర్తిచేశారు. అక్కడ అప్పుడు జరిగిన వరల్డ్ ట్రేడ్ ఫైర్ చూడటానికి వచ్చిన వారికి అదొక పెద్ద ఆకర్షణ అయింది. దీని మీద మనం వెళ్ళగలిగిన ఎత్తు 896 అడుగులు. దానిపైన ఇంకా కొంత నిటారుగా వున్న కట్టడంతో కూడా కలుపుకుంటే, దీని ఎత్తు 986 అడుగులు. దీన్ని కట్టిన కంపెనీ, “Compagnie des Etablissements Eiffel” అనే పేరు మీద దీనికి ఐఫిల్ టవర్ అనే పేరు వచ్చింది.

ఈ టవర్ కట్టడంలో ఉద్దేశ్యం, ఒకటి రేడియో ప్రసారం కోసం, రెండు దీనిని ఒక నగర వీక్షణ ఆకర్షణగా చేయటం.

దీనిలో మూడు పెద్ద అంతస్తులు వున్నాయి. మూడు చోట్లా టవర్ చుట్టూతా నగర వీక్షణకు ఒక డెక్ లాగా కట్టారు. ఈ మూడు అంతస్తులకీ వెళ్ళటానికి, తొమ్మిది లిఫ్టులు వున్నాయి. మేము పైదాకా వెళ్లి, పారిస్ నగరాన్ని అన్ని కోణాల్లోనూ చూసాం. ఎంతో అందమైన నగరం పారిస్ అని ఇంకోసారి అనుకున్నాం.

పారిస్‌లో తప్పకుండా చూడవలసిన ఇంకొకటి “ది లూవ్”. ‘లూవ్’ మ్యూసియం. లూవ్ స్పెల్లింగ్ కూడా ‘Louvre’ అని వ్రాస్తారు. ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగులు, శిల్పాలు ఎన్నో వున్నాయి. మైకలాంజిలో,  రాఫయేల్,  డ వించి, రెంబ్రాంట్, పుస్సీన్, వాన్ డైక్.. ఇలా ఎందరో మహానుభావుల కళా వైదుష్యం ఇక్కడ చూడవచ్చు.

‘డ వించి’ చిత్రించిన ప్రముఖ చిత్రం “మోనా లిసా” ఇక్కడే వుంది.

ఆరున్నర మిలియన్ల చదరపు అడుగుల భవంతులలో, ఎంతో ప్రాచీన కాలంనించీ ఇప్పటి దాకా వేసిన చిత్రాలూ, చెక్కిన శిల్పాలూ దాదాపు ముఫై ఐదు వేల కళాఖండాలున్నాయి. అన్నీ పూర్తిగా చూసి ఆనందించాలంటే, ఒకరోజు చాలదు.

paris2

 

 

ఇక్కడి చిత్రాలకీ, శిల్పాలకీ ఫోటోలు తీయవచ్చు. కానీ “మోనా లీసా” చిత్రాన్ని రెండు అద్దాల  కేసులో బిగించటం వల్ల, ఆ అద్దాల్లో ప్రతిబింబం రాకుండా ఫోటోలు తీయటం కుదరలేదు. అదీకాక ఆ చిత్రపటం దగ్గర వున్నంత క్యూ ఇంకెక్కడా లేదు. తీరిగ్గా లైటు చూసుకుంటూ ఫోటో తీసే సమయమూ దొరకలేదు.

ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ప్రపంచంలో రకరకాల జాతి మనుష్యులు, ఎవరి మతం వాళ్ళు సృష్టించుకుని, ఎవరి కథలు వాళ్ళు వ్రాసుకున్నాక, ఎన్నో పురాణగాథలు ఎక్కడినించీ ఎక్కడికి వెళ్ళాయో కానీ, ఇక్కడి చిత్రాలూ, శిల్పాలూ, వాటి వెనుక ఊహాగానం చూస్తుంటే అవి దాదాపు ఒకటిగానే కనపడ్డాయి నాకు.

ఉదాహరణకు కృష్ణుడు, ఏసుక్రీస్తు ఇద్దరూ గొల్లవారే. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుకుంటూ గోవులు కాచుకుంటుంటే, క్రీస్తు పిల్లనగ్రోవి ఊదుకుంటూ గొర్రెలు కాచుకునేవాడు. మోసెస్ వెడుతున్నప్పుడు రెడ్ సీ విచ్చుకుని అతనికి దారి ఇస్తే, వసుదేవుడు వెడుతున్నప్పుడు యమునా నది విచ్చుకుని దారి ఇచ్చింది. కన్యగా వున్న మేరీమాత సూర్యుడి అంశతో క్రీస్తుకి జన్మనిస్తే, కన్యగా వున్న కుంతీదేవి సూర్యుడి అంశతో కర్ణుడికి జన్మనిచ్చింది. ఇక్కడి చిత్రాలు చూస్తుంటే, ఇలాటివి ఎన్నో వింతలు  కనపడ్డాయి. తర్వాత కొంతమంది మిత్రులని, ఇవి ఎక్కడి నించీ ఎక్కడికి వచ్చాయి అని అడిగితే, వారి వారి మతాల నించే ఇతర మతాలకి వెళ్లాయని ఆధారాలతో సహా బల్లగుద్ది మరీ చెప్పారు. అందుకని ఈ వ్యాసంలో ఈ విషయాన్ని ఊహామాత్రంగానే చూసి, ఈ విషయం మీద పరిశీలనో, పరిశోధనో  చేసుకునే వాళ్లకి ఈ వాదన వదిలేద్దాం!

ఇంకా పారిస్ వెళ్ళే వాళ్ళు చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది, నోటర్ డామ్ కేథడ్రల్. 1163లో కట్టటం మొదలు పెడితే, 1345లో పూర్తిచేసిన చర్చి ఇది. అంటే నూట ఎనభై ఏళ్ల పైన తీసుకుంది. దీని మీద ప్రముఖ ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో ఒక నవల కూడా వ్రాశాడు. మంచి అందమైన కట్టడం. 387 మెట్లు ఎక్కగలిగితే, పైదాకా వెళ్లి చూడవచ్చు.

paris3

 

పారిస్‌లో చెప్పుకోదగ్గ ఇంకో కట్టడం, చాంప్ ఎలీస్. ఇది అక్కడ రోడ్డుకి అడ్డంగా కట్టిన కట్టడం. దీని చుట్టూతా  కార్లు, బస్సులు వెడుతుంటాయి. ఇక్కడ మంచి షాపింగ్ కూడా వుంది.

 

 

పారిస్‌లో ఇంకా ఎన్నో అందమైన కట్టడాలు వున్నాయి. వాటి గురించి వ్రాసే కన్నా, ఫోటోలు పెడితే చూడటానికి మీకు బాగుంటుంది కానీ, ఈ వ్యాసంలో పేజీలు పెరిగిపోతాయి.

మీకు వీలున్నా, లేకపోయినా తప్పకుండా వెళ్ళవలసింది వెర్సాలీ (Versailles). ఇది పారిస్ నగరానికి పడమటి దిశగా పదిహేడు కిలోమీటర్ల దూరంలో వుంది. ముందే బుక్ చేసుకుంటే టూరిస్టు బస్సులు చాల వున్నాయి.

paris5

 

లూయి-14 మహారాజు కట్టిన ఈ కట్టడం, ఆయనకీ తర్వాత వచ్చిన రాజులు లూయి-15,  లూయి-16 లకు నివాసమయింది. తర్వాత వచ్చింది ఫ్రెంచి రివల్యూషన్. తర్వాత నెపోలియన్ ఇక్కడ ఒకే ఒకరోజు వుండి, వెళ్లిపోయాడుట.

ఇప్పుడిక్కడ ఎన్నో చిత్ర పటాలూ, శిల్పాలే కాక, అద్దాలతో అలంకరించిన గదులు, ఎంతో ఖరీదయిన సోఫాలు, డైనింగ్ టేబుల్సు, బంగారం పొదిగిన సామాన్లు, రంగురంగుల వేలాడే దీపాలు, పొడుగాటి కర్టెన్లు, ఒకటేమిటి ఎన్నో వున్నాయి. ఇవన్నీ ఆనాడు రాజులు ప్రజల సొమ్ముతో ఎంత దర్పంగా బ్రతికేవారో తెలుస్తుంది.

ఇక్కడ కూడా కనీసం ఒక రోజు గడపటానికి సమయం చేసుకుంటే బాగుంటుంది.

పారిస్ అందాల కట్టడాలకీ, దీర్ఘమైన చరిత్రకే కాక, ఫ్రెంచి భోజనానికీ (French Delicacies), ఫాషన్లకీ, అందమైన మనుష్యులకీ, వైన్ తదితర మధ్యపానాలకీ కూడా ఎంతో ప్రసిద్ధి. ప్రతివారూ కనీసం ఒక్కసారయినా చూడవలసిన నగరం.

౦                           ౦                           ౦

కోణార్క్ శిల్ప కళా వైభవం!

      పోయిన నెలలో, మా ఇండియా ప్రయాణంలో భాగంగా, ఒరిస్సా (ఇప్పుడు ఒడిశా అంటారు) రాష్ట్రంలో కొన్ని వూళ్ళకి కూడా వెళ్ళాం. భువనేశ్వర్, పూరి, కొణార్క్, చిల్కా లేక్ మొదలైనవి చూశాం.

ఒరిస్సా (నాకు ఇలా అనటమే అలవాటు మరి, ఏం చేయను?) భారతదేశంలోనే వెనుకపడిన రాష్ట్రాలలో ఒకటి అని చదివాను కానీ, ఎన్నడూ చూడలేదు. అందుకేనేమో ఆ రాష్ట్రం చూస్తుంటే కొంచెం బాధ వేసింది కూడాను. అక్కడి ప్రజలు స్నేహపూరితంగానే వున్నా, రోడ్లను అశుభ్రంగా వుంచటం, ఎక్కడపడితే అక్కడ ఎర్రటి జర్దా కిళ్ళీ ఉమ్ములు వేయటం, మెయిన్ రోడ్ల పక్కన కూడా బహిరంగంగా మూత్ర విసర్జన చేయటం చూస్తుంటే మనం ఎక్కడ వున్నాం అనిపిస్తుంది. భువనేశ్వర్‌లో కానీ, పూరీలో కానీ, సరైన రోడ్లు కూడా లేవు.

మేము భువనేశ్వర్‌లో రైలు దిగి, ముందే మూడు రోజులకి బుక్ చేసుకున్న టాక్సీలో పూరీ వెళ్ళాం. పూరి లోనే ఒక రిసార్ట్ హోటల్లో రెండు రాత్రులు వున్నాం. అక్కడ పూరీ, కొణార్క్ చూసుకుని చివరగా భువనేశ్వర్ చూసుకుని, బెంగుళూరు వెళ్ళే విమానం ఎక్కాం.

౦                           ౦                           ౦

పూరీలో జగన్నాధుని గుడి దగ్గర రోడ్డు, వాతావరణం ఎంతో అశుభ్రంగా వున్నాయి. ఎక్కడ చూసినా ఆవులు కాగితాలు తింటూ, పేడ వేస్తూ, మూత్రం విడుస్తూ పాడు చేస్తున్నాయి. రోడ్ల పక్కన ఇటూ అటూ బారులు తీర్చి కూర్చున్న ముష్టివాళ్ళ చుట్టూ దుమ్మూ, ధూళీ, బురద. రోడ్డు మీద ఎర్రటి కార్పెట్ వేసినట్టుగా జర్దా కిళ్ళీ ఉమ్ములు. ఎప్పుడు బయట పడదామా అనిపించింది. అందుకనే, దీని గురించి ఇంకా ఎక్కువగా ఏమీ వ్రాయటం లేదు.

దానికి విరుధ్ధంగా ఎంతో శుభ్రంగా, గొప్పగా వున్నది కోణార్క్ సూర్య దేవాలయం. ఇప్పుడు అక్కడ పూజలూ పునస్కారాలూ ఏవీ లేవు. కోణార్క్ శిల్ప కళా సంపద మాత్రం ఎంతో బావుంది.

ముందుగా కొంచెం కోణార్క్ గురించి తెలుసుకుందాం.

౦                          ౦                           ౦

కోణార్క్ బంగాళా ఖాతం సముద్ర తీరాన, ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరానికి అరవై ఐదు కిలో మీటర్ల దూరంలో వుంది. ఇక్కడ ఎప్పుడూ వుండే జనాభా దాదాపు పదహారు వేలు.

అదృష్టవశాత్తూ మాకు దొరికిన టూర్ గైడ్ కోణార్క్ చరిత్రా, ఆ శిల్ప కళా వైశిష్టం గురించీ కూలంకుషంగా తెలిసినవాడు. అంతేకాక ఇంగ్లీషులో తనకు తెలిసిన విషయాలన్నీ ఎంతో చక్కగా వివరించి చెప్పాడు.

‘నరసింహ దేవ’ అనే కళింగ మహారాజు పదమూడవ శతాబ్దంలో ఇక్కడ సూర్యుడికి కట్టిన మందిరం ఈరోజుకి కూడా వేల మంది యాత్రీకులని విశేషంగా ఆకర్షిస్తున్నది. ఈ కట్టడాన్ని పూర్తిగా నల్లటి రాళ్ళతో కట్టినందు వల్ల, బ్రిటిష్ వారు దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అనేవారు.

ఇప్పుడు చాలవరకూ శిధిలమైంది ఈ శిల్ప కళా వైభవం. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో దీన్ని ఒక మ్యూసియంలా నడిపిస్తున్నారు.

satyam1

ఈ కట్టడాన్ని పదమూడవ శతాబ్దంలో కట్టినప్పుడు, దీన్ని సూర్యుని రధంలా కట్టారు. పన్నెండు జతల చక్రాల ఒక పెద్ద రధాన్ని, ఏడు గుఱ్రాలు లాగుతున్నట్టుగా కట్టినట్టు చరిత్ర చెబుతున్నది. ఒక్కొక్క రధ చక్రం మూడు మీటర్ల వ్యాసంతో, ఎంతో అందమైన నగిషీ చెక్కడాలతో ఆనాటి శిల్పుల కళా వైదుష్యాన్ని చాటి చెబుతున్నాయి.

ఈ సూర్య దేవాలయం తూర్పు – పడమరల దిశగా కట్టబడింది. ఇది పూర్తిగా కళింగ సాంస్కృతిక పరంగా కట్టిన శిల్ప కళ. కోణ అంటే కోణం. ఆర్క అంటే సూర్యుడు. సూర్య గమనానికి అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగింది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో కనిపిస్తుంది. 16 ఫిబ్రవరి 1980 తేదీన వచ్చిన సంపూర్ణ సూర్య గ్రహణ మార్గంలో కోణార్క్ దేవాలయం వచ్చింది అంటారు. 12 వందల మంది నైపుణ్యంగల శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

1568వ సంవత్సరంలో అక్బర్ తొత్తు అయిన ముకుంద గజపతిని ఓడించి, ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన బెంగాల్ సుల్తాన్ సులైమాన్ ఖాన్ కర్రాని కోణార్క్ దేవాలయాన్ని నాశనం చేయాటానికి కారకుడయాడు. ఆ సుల్తాన్ క్రింద జనరల్ కాలాపహాడ్ ఆధ్వర్యంలో కోణార్క్ సూర్య దేవాలయాన్ని సర్వనాశనం చేశారు. తర్వాత పదిహేడవ శతాబ్దంలో మొగలాయీ చక్రవర్తి జహంగీర్ ఎన్నో దేవాలయాల్ని నాశనం చేస్తూ, ఈ కోణార్క్ సూర్య దేవాలయంలో మిగిలిన శిల్పాలను కొన్నిటిని నేల మట్టం చేశాడు.

satyam2

ఇప్పుడు ఏడు గుఱ్రాలలో, ఆరు గుఱ్రాలు మాత్రం శిధిలావస్థలో మిగిలి వున్నాయి. అలాగే చాల చోట్ల,

అంత చక్కటి శిల్పాలను నేల మట్టం చేయటానికి జహంగీరుకి చేతులెలా వచ్చాయో కానీ, ఆ విరిగిపోయిన శిల్పాలు ఇంకా చరిత్రను మాత్రం చెరపకుండా చూపిస్తున్నాయి.

అక్కడి శిల్పాలు ఎన్నో శిధిలాలుగా మిగిలిపోయినా, ఆ శిల్ప కళా సౌందర్యం మాత్రం ఇంకా సౌరభాలు వెదజల్లుతూనే వుంది.ఇప్పుడు వాటిని చాలవరకూ మళ్ళీ నిలబెట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక్కడ చెప్పవలసినది ఇంకొక విషయం వుంది. కుజరహో లాగానే ఇక్కడ కూడా ఎన్నో వందల కామ సూత్ర సంబంధమైన శిల్పాలు వున్నాయి. రకరకాల భంగిమలతో కొన్ని ఆశ్చర్యకరంగా కూడా వున్నాయి. నేను చాల ఫొటోలు తీశాను కానీ, ఈ కుటుంబ పత్రికలో ప్రచురిస్తే బాగుండదని ఇక్కడ చూపించటం లేదు. ఏనాడో చదివిన తాపీ ధర్మారావుగారి “దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు?” అనే పుస్తకం గుర్తుకొచ్చింది.

satyam4

తర్వాత చిల్కా లేక్ మీద పడవ విహారం కూడా చేశాం. చాల సరదాగా బాగుంది. మా సరంగు మాట్లాడిన భాష అర్ధమయి వుంటే ఇంకా బాగుండేదేమో!

కొంచెం ఎండగా వున్నా, చల్లటి గాలి తగులుతుంటే ఆహ్లాదకరంగా వుంది. అక్కడ రకరకాల పక్షులతో పాటూ, నీళ్ళల్లో కొన్ని డాల్ఫిన్లను కూడా చూశాం.

అలా అయింది మా ఒరిస్సా యాత్ర!

-సత్యం మందపాటి

satyam mandapati  

మహాత్ముడి అడుగు జాడల్లో….

satyam mandapati రెండేళ్ళ క్రితం మేము ఇండియా వెళ్ళినప్పుడు, ఆస్టిన్ నించీ ముందు భారత రాజధాని ఢిల్లీకి వెళ్ళి, తర్వాత ఆంధ్రాకి వెళ్ళాం. నేను ఎప్పుడో, కొన్ని దశాబ్దాల క్రితం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు, మా కాలేజీ విజ్ఞాన యాత్రలో వెళ్ళానుగానీ, ఇప్పుడు ఇన్నాళ్ళకి శ్రీమతితోనూ, మా వంశోధ్ధారకుడితోనూ వెళ్ళాం.

ఢిల్లీలో చూడవలసినవే కాక, ఆగ్రా, జైపూర్, అమృత్సర్, వాఘా సరిహద్దు మొదలైనవి కూడా చూశాం.

ఈ వ్యాసంలో మాత్రం ఒక్క ఢిల్లీ గురించే వ్రాస్తున్నాను.
ఎన్నో దశాబ్దాల తర్వాత డిల్లీ చూస్తున్నానేమో, అంతా వింతగా కనిపించింది. ముఖ్యంగా ఆరోజుల్లో ఢిల్లీ చూసినప్పుడు, ఏ విషయాలు పట్టించుకోకుండా, మిగతా స్టూడెంట్ కుర్రాళ్ళతో కలిసి సరదాగా చూశాం. ఇప్పుడు, ఎన్నో దేశాల రాజధానులు, ఇతర పెద్ద నగరాలు చూసిన తర్వాత, డిల్లీ నగరాన్ని ఇంకొక కొత్త కోణంలో చూశాను.
నేను మామూలుగా ఈ విహారయాత్రలు వ్రాస్తున్నప్పుడు, ముందుగా ఆయా ప్రదేశాల గురించి కొంత చరిత్ర కొన్ని గణాంకాలు ఇవ్వటం ఒక అలవాటుగా చేసుకున్నాను. అందుకని ఢిల్లీ గురించి కొంచెం తెలుసుకుందాం.
బ్రిటిష్ వారు వచ్చేదాకా, భారతదేశం అనే ఒక దేశం ఈనాటి ఎల్లలతో మనకి లేనే లేదు. రకరకాల సామ్రాజ్యాలు ఢిల్లీ రాజధానిగా వుండేవిగానీ, నేను చారిత్రకంగా అంత వెనక్కి వెళ్ళటం లేదు.
మొఘల్ సామ్రాజ్య కాలం నుండి, ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఆ సామ్రాజ్యానికి మాత్రం, ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. తర్వాత బ్రిటిష్ రాజ్ కాలంలో, డిసెంబరు 1911 వరకూ భారత రాజధానిగా కలకత్తా నగరం వుండేది.1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. బ్రిటిష్ రాజ్ పెద్దలు పరిపాలనా సౌలభ్యం కోసం, రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించారు. భారత చక్రవర్తి 5వ జార్జి, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని ప్రకటించాడు.
భారత స్వాతంత్ర్యం తరువాత, 1947లో, కొద్దిపాటి స్వయంప్రతిపత్తిని ఇచ్చి, భారత ప్రభుత్వంచే నియమించబడ్డ ప్రధాన కమీషనరుకు పరిపాలనాధికారాలు ఇవ్వబడ్డాయి. 1956లో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటింపబడింది, అలాగే ప్రధాన కమీషనర్ స్థానే లెఫ్టినెంట్ గవర్నర్‌ని నియమించారు. పూర్వపు జాతీయ రాజధాని ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
ఢిల్లీ – న్యూ ఢిల్లీ ప్రాంతీయ వైశాల్యం 17,841 చదరపు మైళ్ళు, అందులో 21,753,486 జనాభా వున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక దేశానికి రాజధాని నగరం ఎంత అందంగా, శుభ్రంగా వుండాలి అనేది న్యూడిల్లీ నగరం చెబుతుంటే, అదే రాజధాని చెత్తా, చెదారంతో ఎంత అశుభ్రంగా వుంటుందో పాత ఢిల్లీ చెబుతుంది.

satya3
కొత్త ఢిల్లీ నగరం నన్ను ఆకట్టుకుందనే చెప్పాలి. పెద్ద పెద్ద రోడ్లు, శుభ్రంగా వున్నాయి. కార్లు, స్కూటర్లలో వెళ్ళేవాళ్ళు మన హైద్రాబాదులోలా కాకుండా, రూల్స్ పాటించి ఒక పద్ధతిగా, రోడ్డు మీద వెడుతుంటే ముచ్చటగా వుంది. పెట్రోలు వాడకం తగ్గించి, నాట్యురల్ గాస్ వాడుతున్న విధానం కూడా నాకు నచ్చింది. బస్సులూ, ఆటోలు, టాక్సీలు, నాట్యురల్ గాస్ మీద నడుస్తుంటే, వాటికి ఆకుపచ్చరంగు వేశారు. చాల రోడ్లకి ఇరుపక్కలా, పచ్చటి చెట్లూ, పూల మొక్కలూ, అందాన్నే కాక చల్లటి నీడనూ ఇస్తున్నాయి.
ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, మన ఉత్సాహాన్ని బట్టీ, అభిరుచిని బట్టీ ఎన్నో వున్నాయి. చరిత్ర మీద సరదా వున్నవారికి, ఇక్కడ చూడటానికి ఎన్నో వున్నాయి.

satyam1మొగలాయీల కాలం నాటి, కుతుబ్ మీనార్, జమా మసీదు, ఎర్రకోట, హుమాయూన్ సమాధి.. ఇలా ఎన్నో వున్నాయి. కుతుబ్ మీనార్ ప్రపంచం మొత్తం మీద, ఇటుకలతో కట్టిన ఎత్తయిన బురుజు అని చెప్పారు. దీన్ని1206వ సంవత్సరంలో కట్టారుట. దీనిమీద ఖురాన్ లోని కొన్ని నీతి వాక్యాలు చెక్కారు. అక్కడే ఒక ఇనుప స్థంభం, ఏనాటిదో ఇంకా తుప్పు పట్టకుండా వుంది.

తర్వాత ఎర్ర కోట చూశాం. దాన్ని 1638లో ఆనాటి మొగల్ చక్రవర్తి షాజహాన్ కట్టించాడు. దీన్ని రెండు వందల సంవత్సరాలు, నలుగురు చక్రవర్తులు తమ నివాస స్థలంగా వాడుకున్నారు. గోడలు రెండు మైళ్ళ పొడుగున వున్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ నిర్మాణ విశేషాలు చూసి, ఇది కట్టారు అంటారు. ఇక్కడ రాత్రి పూట లైట్ అండ్ సౌండ్ షో వుంటుంది అన్నారు కానీ, మేము అక్కడికి పగలు వెళ్ళటం వల్ల అది చూడలేదు. 
జమా మసీదు దగ్గరలోనే వుంది. దాన్ని 1650లో కట్టారు. ఇది భారతదేశంలోకల్లా పెద్ద మసీదు. దీనిని కట్టటానికి 13 సంవత్సరాలు పట్టిందిట. 25,000 మంది భక్తులు పట్టేంత స్థలం వుంది అక్కడ. ఇది కూడా షాజహాన్ కట్టించినదే.

హుమాయూన్ సమాధి 1570లో కట్టారు. రెండవ మొగల్ చక్రవర్తి హుమాయూన్ అక్కడే సమాధి చేయ బడ్డాడు.
బహాయ్ మతం వారు కట్టిన ‘లోటస్ టెంపుల్’ ఇంకొక చెప్పుకోదగ్గ కట్టడం.

ఇక జంతర్ మంతర్ కూడా ఢిల్లీలోనే వుంది, కానీ మేము జైపూరులో అది చూసినందువల్ల అక్కడికి వెళ్ళలేదు.
పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ మొదలైనవి బయట నించే చూశాం. విశాలమైన రోడ్లు, రకరకాల చెట్లతో ఎంతో అందంగా వుండే ప్రదేశం.
చెప్పుకోదగ్గ ఇంకొకటి, ఇండియా గేట్. మేము సాయంత్రం వెళ్ళటం వల్ల, పగటి పూట ఎలా వుంటుందో చూశాం, రాత్రి పూట లైట్లలో ఎలా వుంటుందో చూశాం. 1921లో కట్టిన, 138 అడుగుల ఎత్తైన గొప్ప కట్టడం ఇది.

satya2
ఇక మేము, ముఖ్యంగా నేను, ఢిల్లీ వెళ్ళిన కారణం చెబుతాను. నాకు మొదటినించీ మహాత్మా గాంధీ అంటే ఎంతో గౌరవం, భక్తీ, ప్రేమ, ఒక విధమైన ఆరాధనా భావం వుంది. ఒక అతి సామాన్యుడైన మనిషి, ఒక దేశ చరిత్రనే మార్చగల శక్తిమంతుడవుతాడెలా అవుతాడో, చేసి చూపించిన మనిషి. ప్రపంచంలో మూడు వంతుల దేశాల్ని, తమ చేతుల్లో పెట్టుకుని ఆటలాడిస్తూ, దేశ సంపదని దోచుకుంటున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఒక్క అంగవస్త్రం కట్టుకుని, కేవలం అహింసా మార్గంతో, వారిని గడగడలాడించిన ధీరుడు, మహాత్ముడు మన గాంధీ. మార్టిన్ లూధర్ కింగ్, మాండేలా, మదర్ థెరేసా లాటి వారందరూ మహాత్ముడికి ఏకలవ్య శిష్యులే! అలాటి నా అభిమాన మహాత్ముడి సమాధి దగ్గర నివాళి అర్పించటం, ఆయన తన జీవితంలో చివరి మూడు నెలలు పైగా గడిపిన బిర్లా భవన్ చూడటం, నా తీరని కోరికలు. అందుకే ఒక రోజంతా, ఆ రెండూ చూడటానికే కేటాయించాం.
ఆరోజు ప్రొద్దున్నే బిర్లా భవన్ చూడటానికి వెళ్ళాం. దాదాపు సాయంత్రం దాకా అక్కడే వుండి, తర్వాత గాంధీ సమాధి చూడటానికి వెళ్ళాం.

ఆనాటి బిర్లా భవన్, పేరే ఈనాటి ‘గాంధీ స్మృతి’.

మహాత్మా గాంధీ, తన చివరి నూట నలభై రోజులు, ఇక్కడే ప్రశాంతంగా గడిపారు.

satya4
ఆయన నివసించిన గది, పరుపు, రుద్రాక్షమాల, వ్రాసుకునే బల్లా, చరఖా, ఒక చిన్న చెంబు, చేతి కర్ర, మూడుకోతుల బొమ్మ – ఇవే ఆయన చిరాస్థులు… కోట్లమంది ప్రజల హృదయాలే ఆయనకి స్థిరాస్తులు మరి!

ఆయన జీవిత విశేషాలూ, ఆయన ఆచరించి, చెప్పిన ఎన్నో సూక్తులు, ఆయన గురించి ప్త్రపంచ ప్రసిద్ధులైన కొందరు చెప్పిన మాటలు… కొన్ని వందల ఫొటోలు, చిత్రాలూ వున్నాయి. ఒక్కటీ వదిలిపెట్టకుండా అన్నీ దీక్షగా చూడటమే కాక, నేనూ వాటికి ఫొటోలు తీసి, భద్రంగా దాచుకున్నాను. కొన్ని విడియోలు, వార్తా చిత్ర సినిమాలు చూపిస్తున్నారు.
ఆయన చివరిరోజు, ప్రార్ధన చేయటం కోసం వెడుతున్నప్పుడు, వెళ్ళిన దారిలో ఆయన పాదాలను ముద్రించారు.

satya

చివరికి ఆయన చనిపోయిన చోటు చూస్తుంటే, నిజంగా నాకు కన్నీరు ఆగలేదు.
ఎంతటి మహాత్ముడి జీవితం ఎలా అంతమయింది అని బాధ వేసింది.

ఢిల్లీ దరిదాపుల్లోని చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళ స్కూలు అధికారులు తీసుకు వచ్చి, మహాత్ముడి జీవిత విశేషాలని వివరించి చెబుతుంటే, నాకు ఎంతో ముచ్చట వేసింది. ఈ తరం పిల్లలకు మన స్వాతంత్ర పోరాటం గురించీ, ఆ పోరాటంలో అసువులు బాసిన మహోన్నత వ్యక్తుల గురించీ చెప్పటం ఎంతో అవసరం.

చివరగా యమునా నదీ తీరాన వున్న రాజ్ ఘాట్ చూశాం. అక్కడే నెహ్రూ, ఇందిర మొదలైన పలువురు రాజకీయ నాయకుల సమాధులు వున్నాయి. నాకు అవేవీ చూడబుధ్ధవలేదు. సరాసరి గాంధీ సమాధి దగ్గరకు వెళ్ళాం.

stya1ఆ సమాధి దగ్గర, కళ్ళు మూసుకుని మౌనంగా నుంచుని వుంటే.. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అలా దాదాపు ఒక పావుగంట పైనే, కదలకుండా నుంచున్నాను. మనసులో ఎన్నో ఆలోచనలు. స్వాతంత్ర సమరం, మహాత్ముడి జీవితం, నేను ఆయన గురించి చదివిన పుస్తకాలు, ముఖ్యంగా ఆయన వ్రాసిన పుస్తకం, “My Experiments with Truth”, అట్టిన్బరో తీసిన ‘గాంధీ’ సినిమా అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. అలా ఎంత సేపు నుంచున్నానో నాకే తెలియలేదు. తర్వాత శ్రీమతి అంది, ‘ఏమిటి.. అంతసేపు కదలకుండా నుంచున్నావ్. నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని వూరుకున్నాను” అని.

 

అంతటి మహాత్ముడికి మనం ఇచ్చే నివాళి ఒక్కటే! ఆయన చెప్పిన, చేసిన గొప్ప పనులు మనమూ పూర్తిగా అర్ధం చేసుకోవటానికి, కనీస ప్రయత్నం చేయటం! అర్ధమయినవి మనసా, వాచా ఆచరించటం!

-సత్యం మందపాటి

satyam mandapati

ఎప్పుడు చూసినా నిత్యనూతన నయాగరా!

     ఈమధ్య ఇండియా నించీ మాకు చుట్టాలొచ్చారు. మా తమ్ముళ్ళిద్దరు, మేనకోడలు, వాళ్ళ కుటుంబాలు. అట్లాంటాలోని మా మేనల్లుడితో సహా, మొత్తం పన్నెండు మందిమి, ఒక వాన్ తీసుకుని మా యాత్రా స్పెషల్ మొదలుపెట్టాం. అట్లాంటా నించీ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాలు చూసుకుంటూ, నయాగరా దాకా వెళ్లి వచ్చాం. మేము చూసిన ఆ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాల గురించి ఇక్కడ వ్రాస్తే, నేను వ్రాస్తున్నప్పుడూ, మీరు చదువుతున్నప్పుడూ, ఈ కథనం ఇవాళ మొదలుపెడితే, మర్నాడు ప్రొద్దున్న భళ్లుమని తెల్లవారే దాకా, అలా నయాగరా జలపాతంలా పోతూనే వుంటుంది. అందుకని ఈసారికి ఒక్క నయాగరా గురించే వ్రాస్తాను.

ప్రపంచంలో జలపాతాలు గురించి చదివితే, కొన్ని బాగా ఎత్తయినవి, కొన్ని బాగా వెడల్పయినవి, కొన్ని నీటి పారుదల దృష్ట్యా చాల పెద్దవి, కొన్ని ఎంతో అందమైనవి… ఇలా ఎన్నో రకాలున్నాయి. అందుకని, మా గుంటూర్లో పిచ్చి కిష్టయ్యలా, ఇవన్నీ కలిపేసి చూస్తే, నయాగరా జలపాతాలు ప్రపంచంలో తొమ్మిదో రాంకులో వున్నాయి. మొదటి మూడూ ఏమిటంటే, మొదటిది – లావోస్ దేశంలో వున్న ఖోన్ ఫాల్స్. 35,376 అడుగుల వెడల్పు జలపాతం. దీని ఎత్తు మాత్రం 69 అడుగులే! ఇక రెండవది – వెనిజువేలా దేశంలో వున్న, సాల్టోపారా జలపాతం. దీని వెడల్పు 18,400 అడుగులు. మూడవది – మధ్య ఆఫ్రికాలోని గాబన్ అనే దేశంలోని కొంగో ఫాల్స్. ఇవి 10,500 అడుగుల వెడల్పు. ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ల ఘనపుటడుగుల నీళ్ళు పారుతుంటాయి.

ఇహ.. నయాగరా ఫాల్స్ సంగతి చూద్దాం. ఇవి అమెరికా దేశానికి ఉత్తరాన, కెనడా దేశానికి దక్షిణాన వున్నాయి. అంటే అమెరికాలో ఈశాన్య దిక్కున, ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దుల్లా వున్నాయన్నమాట.

నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, ఆంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!

నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి.

మొదటి ప్రపంచ యుధ్ధం అయిపోయాక, నయాగరా జలపాతం చూడటానికి వచ్చే జనాభా ఎక్కువైనారుట.

నయాగరా జలపాతం అందాలు అమెరికా వేపున చాల బాగుంటాయి. అవి చూడాలంటే, సరిహద్దులు దాటి, కెనడా వేపు వెళ్ళి చూస్తే బాగుంటుంది.

మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు, రెండు పక్కల నించీ చూశాం కానీ, ఈసారి ఒక్క అమెరికా వేపు నించే చూశాం.

satyam1

 

అంతేకాదు, ఈ జలపాతంలోని నీటి శక్తిని ఉపయోగించుకుని, ఇక్కడ రెండున్నర మిలియన్ల కిలోవాట్స్ ఎలక్ట్రిసిటీని ఉద్పాదిస్తున్నారు. ఇది పడమటి ప్రపంచంలో కల్లా ఎంతో పెద్దదయిన హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్టు.

ఇదీ క్లుప్తంగా నయగరా చరిత్ర, సాంకేతిక వివరాలు. ఇక మా యాత్రా విశేషాలు చూద్దాం.

అక్కడికి చేరగానే, హోటల్ గదుల్లో సామానంతా పడేసి, ఇక రంగంలోకి దిగాం. మా హోటల్ కూడా జలపాతానికి నడక దూరంలో, నయాగరా స్టేట్ పార్క్ పక్కనే వుంది.

ఇక్కడ చూడవలసినవి చాల వున్నాయి.

ముందే అనుకున్నట్టుగా, సరాసరి ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. టిక్కెట్లు అన్నీ హోటల్లోనే కొన్నాం కనుక, అక్కడికి వెళ్ళగానే – లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళే ఇస్తారు. అవి వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. ఈ బోటుకి రెండు అంతస్థులు. ఇది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ… అదొక అందమైన అనుభవం. ఆ హడావిడిలోనే, కెమెరాలు, సెల్ఫోనులూ బయటికి తీసి, అందరం ఫొటోలు తీస్తూనేవున్నాం. కొన్నిచోట్ల, మా బోటు గాలికి వూగుతుంటే, జనం

అరుపులు పెడుతుంటే… (భయంతో కాదు, సంతోషంతో), మేమేదో సాహసయాత్ర చేస్తున్నామన్నంత సరదా!

satyam2

 

అక్కడనించీ రాగానే, “కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గరికి వెళ్ళాం. అక్కడికి కొంచెం దూరమే అయినా, ఆ చల్లటి వాతావరణంలలో నడుస్తుంటే హాయిగా వుంది.

“కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గర కూడా, మళ్ళీ పాంచోలు వేసుకుని, క్రిందికి దిగి వెళ్ళాం. చిన్న చిన్న చెక్కలతో కట్టిన ప్లాట్‌ఫారాల మీద నడుచుకుంటూ, ఒక జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హోరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీళ్ళు కూడా, మన మీద మద్దెల దరువు వేస్తుంటాయి. ఎంత పెద్దవాళ్ళయినా, పిల్లల్లాగా ఆడుకోవటానికి అనువైన ప్రదేశం.

satyam3

ఇంకా ఇక్కడ చూడవలసిన వాటిల్లో, డిస్కవరీ సెంటర్. అక్కడ ఎంత సమాచారం కావాలంటే అంత దొరుకుతుంది. అక్కడి నించీ, నడిచి క్రింద దాకా వెళ్ళాలనుకునే వాళ్ళకి, మంచి వాకింగ్ ట్రైల్స్ కూడా వున్నాయి.

హాయిగా సినిమా హాల్లో కూర్చుని నయాగరా అందాలు చూద్దామనుకునే వాళ్ళకి, ఒక అడ్వెంచర్ థియేటర్ కూడా వుంది.

ఆఁ! చెప్పటం మరచిపోయాను. నయాగరా ‘సీనిక్ ట్రాలీ బస్’ కూడా వుంది. ఒకచోటు నించీ, ఇంకా చోటుకి వెళ్ళటానికి బాగుంటుంది. దారిలో ఎన్నో పార్కులు, పూల మొక్కలూ, మధ్యే మధ్యే ఆ జలపాతపు నీటి మీద, రంగురంగుల ఇంద్రధనస్సులు. ఎంతో అందమైన ప్రదేశం.

రాత్రి పూట, అమెరికా వైపునా, కెనడా వైపునా రంగురంగుల లైట్లు వేసి, సౌండ్ అండ్ లైట్ షో వేస్తారు. ఆ నీటి మీద, గాలిలోని తేమ మీద, ఆ దీపాలు పడి, ఎంతో అందంగా వుంటుంది. తప్పక చూడవలసిన వాటిల్లో ఇది ఎంతో ముఖ్యమైనదని నా ఉద్దేశ్యం.

ఈ షో అయిన, కాసేపటికి టపాకాయలు కాల్చి, ఇటు క్రింద నీటిలోనే కాక, ఆకాశంలో కూడా రంగులు పులిమేసి, ఆ రేయిని కాసేపు పగలుగా మార్చేస్తారు. అదంతా అయిపోయినా, అక్కడనించీ కదల బుధ్ధి అవదు.

ఏనాడో నేను ఈ నయాగరా జలపాతం మీద విన్న ఒక జోకు చెప్పి, ఈ వ్యాసం ముగిస్తాను.

నయాగరా జలపాతం చూడటానికి, అందరూ ఆడవాళ్ళే వున్న టూరిస్ట్ బస్ ఒకటి వచ్చిందిట.

ఆ బస్సులో వున్న గైడ్, పెద్దగా కబుర్లు చెప్పుకుంటున్న ఆడవారితో అంటాడు, ‘మీరంతా కాసేపు నిశ్శబ్దంగా వుంటే, ఈ నయాగరా జలపాతం చేస్తున్న హోరు వినవచ్చు’ అని!

ఏది ఏమైనా, అవకాశం దొరికితే తప్పక చూడవలసిన ప్రదేశాల్లో నయాగరా జలపాతం ఒకటి!

-సత్యం మందపాటి

satyam mandapati

 

“ఇష్ లీబె దీష్!”

1964లో ‘సంగం’ అని ఒక హిందీ సినిమా వచ్చింది. రాజ్ కపూర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం. ఆరోజుల్లో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన రంగుల చిత్రం. వైజయంతిమాల, రాజేంద్రకుమార్ ఇతర నటులు. శంకర్ – జైకిషన్ సంగీతం ఈనాటికీ మరచిపోలేం.
ఆ సినిమాలో కొన్ని పాటలు మొట్టమొదటిసారిగా స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో చిత్రించారు. అందులో నాకు బాగా ఇష్టమైనది ఒక పాట. ‘ఇష్ లీబె దీష్!’ అనేది. జర్మన్ భాషలో ‘ఇష్ లీబె దీష్’ అంటే ఇంగ్లీషులో ‘ఐ లవ్ యు’ అని. అది ‘వివియన్ లోబో’ పాడిన చక్కటి పాట. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణి దగ్గర వైజయంతిమాల, రాజేంద్రకుమార్లతో చిత్రీకరించాడు రాజ్ కపూర్. ఆ సినిమాలో ఆల్ప్స్ పర్వతాల అందాలు చూసి, ఆనాడే జీవితంలో ఒక్కసారయినా స్విట్జర్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. చాల దశాబ్దాల తర్వాత, ఇన్నాళ్ళకి అక్కడికి వెళ్ళాం.
౦ ౦ ౦
ఇటలీలోని వెరోనానించి రైల్లో, మిలానో మీదుగా స్విట్జర్లాండ్‌లోని జెనీవాకి వెళ్ళాం. అక్కడినించీ వెంటనే ఇంకొక రైలు తీసుకుని ‘ఎంగెల్బర్గ్’ అనే వూరికి వెళ్లి, అక్కడే ఒక వారం రోజులు వున్నాం. రైలు ప్రయాణాలు ఎంతో సౌకర్యంగా, వేగంగా వుండటం వల్ల, ఒకే వూరిలో బిచాణా పెట్టి స్విట్జర్లాండ్‌లోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూడాలని మా ఉద్దేశ్యం. ఇప్పుడు కొంచెం స్విట్జర్లాండ్ ఎక్కడ వుందో చెప్పటం అవసరం.
పశ్చిమ యూరప్ మధ్యన వుంది స్విట్జర్లాండ్. ఉత్తరాన జర్మనీ, దక్షిణాన ఇటలీ, పశ్చిమాన ఫ్రాన్స్, తూర్పున ఆస్ట్రియా. ఎంతో పెద్దదయిన Alps పర్వత శ్రేణి ఈదేశంలోనే వుంది. ఇక్కడ గమ్మత్తేమిటంటే, జర్మనీ వేపున, ఆస్ట్రియా వేపున వున్న ప్రదేశాల్లో జర్మన్, ఇటలీ వేపున ఇటాలియన్, ఫ్రాన్స్ వేపున ఫ్రెంచ్ భాషలు మాట్లాడుతారు. ఇక్కడ సర్వత్రా వినిపించే భాష, మన అదృష్టం కొద్దీ, ఇంగ్లీష్.
పదహారు వందల చరపు మైళ్ళ వైశాల్యంలో వుండేది, ఎనభై లక్షల జనాభా మాత్రమే. జెనీవా, జూరిచ్ ఇక్కడ వున్న పెద్ద నగరాలు. బెర్న్ అనే చిన్న వూరు ఈ దేశానికి రాజధాని.
ఇక్కడ తల ఒక్కింటికి వున్న సగటు ఆదాయం, ప్రపంచలోనే ప్రధమ స్థానంలో వుంది. ఎక్కువ కాలం ప్రజలు బ్రతికే దేశాల్లో, ఇది రెండవ స్థానంలో వుంది.
వెరోనా నించీ రైల్లో స్విట్జర్లాండ్ వెడుతున్నప్పుడు, మా ఆవిడకి ఒక చిన్న క్విజ్ పెట్టాను, “స్విట్జర్లాండ్ కనీసం ఐదు రంగాల్లో, దేనికి ప్రపంచ ప్రసిద్దమో చెప్పగలవా” అని.
ఆవిడకి చాకొలేట్, ముఖ్యంగా డార్క్ చాకొలేట్ అంటే బాగా ఇష్టం. అందుకని వెంటనే చెప్పేసింది.
“సరే.. చాకొలేట్ ఒకటి. ఇంకా నాలుగు చెప్పాలి..” అన్నాను.
“రెండు ఛీజ్. స్విస్ ఛీజ్”
“బాగా చెప్పావు. మరి మూడోది..”
“స్విస్ బంగారం నాణాలు”
“అవును. స్విస్ క్రూగరాండ్స్. తర్వాత..” అడిగాను.
“రెడ్ క్రాస్. ఇక్కడే మొదలయి, ప్రపంచ వ్యాప్తమయింది” అన్నది.
“గుడ్! స్విస్ జెండా మీద కూడా వుంటుంది ఆ రెడ్ క్రాస్. దీంతో నాలుగు చెప్పావు. మరి ఐదోది..”
“నేను నాలుగు చెప్పానుగా. నువ్వు చెపు ఐదోది” అన్నది.
“ఐదోదా.. స్విస్ గడియారాలు. ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆరోది కూడా వుంది. ఇండియాలోని రాజకీయ నాయకులు, నల్ల బజారు పెద్ద మనుషులూ, అప్పనంగా ప్రజల సొమ్ము దోచుకుంటున్న గవర్నమెంటు ఉద్యోగులు, సినిమా యాక్టర్లు, బెట్టింగ్ చేసే క్రికెట్ ప్లేయర్లు.. వాళ్ళ కోట్ల కోట్ల కోట్లు – కోట్లు కాదు – రూపాయలు దాచుకుంటున్నవి స్విస్ బాంకుల్లోనే! ప్రపంచ ప్రసిద్ధి మరి!”
“అవును. అవొక్కసారి చూద్దాం ఎలా వుంటాయో…”
“బయటనించీ చూస్తే, మన అమెరికన్ బాంకుల్లాగానే వుంటాయి. కాకపొతే లోపల వుండే డబ్బే! కొందరు మనుష్యుల్లోని మానవత్వానికి మసి పూసిన నల్ల డబ్బు. మనిషి కాపీనానికి నిదర్శనం. బయటనించీ చూడటానికి ఇబ్బంది ఏముంటుంది. జెనీవా వెళ్ళినప్పుడు చూద్దాం” అన్నాను.
౦ ౦ ౦

satyam1
మా రైలు జెనీవా వెడుతున్నప్పుడే చూశాం. జెనీవా సరోవరం. చాల పెద్దది. వెనక తెల్లగా మెరుస్తున్న కొండలతో, నీలం, ఆకుపచ్చ రంగులతో ఎంతో అందంగా వుంటుంది.

జెనీవాలో రైలు దిగి, వెంటనే లుజర్న్ వెళ్ళే రైలు ఎక్కాం. కొండల్లో పైకి వెడుతూ, ఆ రైలు ప్రయాణం ఇంకా బాగుంటుంది. లుజర్న్ వెళ్ళాగానే, మేము వెళ్ళవలసిన ఎంగెల్బర్గ్ రైలు సిద్ధంగా వుంది. వెంటనే ఎక్కేశాం.
ఎంగెల్బర్గ్ రైల్వే స్టేషన్, మా రోజుల్లో గుడివాడ రైల్వే స్టేషన్లా వుంది. రెండే రెండు చిన్న ప్లాట్‌ఫారాలు. రైళ్ళు అక్కడితో ఆగిపోతాయి.
రైలు దిగగానే, ఎదురుగా ప్రపంచంలో ఎంతో ఎత్తయిన Alps పర్వత శ్రేణిలో భాగామయిన మౌంట్ టిట్లిస్ ఎదురుగా, సూర్య కాంతిలో తెల్లగా మెరిసిపోతున్నది.
ఒక కిలోమీటర్ దూరంలోనే వున్న మా హోటలుకి నడుచుకుంటూనే వెళ్ళాం. కొంచెం చల్లగా వున్నా, ఎండలో నడుస్తుంటే హాయిగా వుంది. హోటల్లో మా గది కిటికీ తెరిస్తే, మౌంట్ టిట్లిస్. దాని మీద దుప్పటిలా కప్పిన తెల్లటి మంచు పొరలు. ఎండలో మెరిసిపోతూ మనోహరంగా వుంది.
మర్నాడు ప్రొద్దున్నే మా కిటికీ తలుపు తెరవగానే చూశాను. వాతావరణం పూర్తిగా మారిపోయింది. విపరీతంగా మంచు పడుతున్నది. సమయం ఎనిమిది దాటినా ఇంకా ఎండ రాలేదు. కొండ మీదికి వెడితే ఆ మంచులోనే వెళ్ళాలి. అందుకే వేడివేడి కాఫీ త్రాగి, వెంటనే మౌంట్ టిట్లిస్ ఎక్కటానికి బయల్దేరాం.

satyam2

టిక్కెట్లు తీసుకుని వచ్చేసరికీ, అప్పటికే ఎక్కెడెక్కడినించో వచ్చిన స్కీయింగ్ చేసే వాళ్ళు, చాలమంది లైన్లలో నుంచుని వున్నారు. కొండ క్రింద నించీ, నలుగురు మాత్రమే పట్టే కేబుల్ కార్లు, కనీసం వందో ఆ పైనో వుంటాయి, వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పైకి వెడుతున్నాయి. అంతమంది వున్నా, కొద్ది నిమిషాల్లోనే మేమూ ఒక కేబుల్ కారు ఎక్కాం.
కేబుల్ కారులో, ఆ వర్ణనాతీతమైన ప్రకృతి ఒడిలో, నేనేప్పటి నించో చూద్దామనుకుంటున్న పర్వతాల మీదకి వెడుతుంటే, ఒళ్ళు, బయట చలిగా వున్నా, పులకరించింది. ఆ అందాలు చెప్పే బదులు, చూస్తేనే సరిగ్గా అర్ధమవుతాయి. అందుకే వాటిని వర్ణించే ప్రయత్నం చేయటం లేదు, “ఇష్ లీబె దీష్” అని మరోసారి పాడుకోవటం
తప్ప.
దారి మధ్యలో కేబుల్ కారు ఆగుతుంది. ఆరు వేల అడుగుల ఎత్తున వున్న ట్రౌబ్సీ అనే చోట, ఈ నలుగురు ఎక్కి కూర్చునే కేబుల్ కారు దిగి, నలభై మంద దాకా పట్టే, కేబుల్ బస్సు ఎక్కాం. దానిలో అందరూ నుంచోవాలి. మనుష్యుల మధ్య స్కీయింగుకు వెళ్ళే వాళ్ళ సరంజామా.

satyam3

చివరికి పది వేల అడుగుల ఎత్తున వున్న మౌంట్ టిట్లిస్ మీద దిగాం. విపరీతమైన గాలి, చలి. ఇంకా మంచు పడుతూనే వుంది. కానీ ఆ అద్భుతమైన ప్రకృతి అందాలు చూస్తుంటే, మనసుకి హాయిగా వుంది. అక్కడే ఒక రుచికరమైన సాండ్విచ్ తిని, వేడివేడి కాఫీ త్రాగాం. క్రిందకి చూస్తే ఎంతోమంది, స్కీయింగ్ చేస్తూ మంచులో అలా పరుగులెడుతున్నారు.

ఇక్కడ వున్న పర్వత శ్రేణిలో మౌంట్ టిట్లిస్ పెద్ద పెద్ద శిఖరాలలో ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాటివి ఎన్నో శిఖరాలు వున్నాయి. దీనితోపాటు పడమట జుంగ్ ఫ్రౌ, మ్యూంక్, సాన్టిస్, మోంటే రోసా…, తూర్పున ముట్లర్, పిజ్ ప్లాటా.. ఇలా ఎన్నో వున్నాయి.
ఇంటర్లాకెన్ అనే వూరి మీదుగా రైల్లో వెళ్లి, జుంగ్ ఫ్రౌ శిఖరం కూడా చూసి వచ్చాం. అక్కడ ఒక పక్క తెల్లటి మంచుతో కప్పబడిన శిఖరాగ్రం, మేము వున్న గుట్ట మీద ఆకుపచ్చని లాన్, దాని క్రింద రైల్వే స్టేషన్. రకరకాల రంగులతో, ఎంతో చాల బాగుంటుంది.

satyam6

దాని తర్వాత లూసర్న్ అనే వూరికి వెళ్ళాం. చిన్నదయినా ఎంతో అందమైన నగరం. చూడవలసినవి చాల వున్నాయి ఇక్కడ. ఎంతో షాపింగు కూడా వుంది.
జెనీవాకి కూడా వెళ్ళాం. అక్కడ యునైటెడ్ నేషన్స్ ఒప్పందాలు ఎన్నో జరిగాయి. చక్కటి నగరం.
జెనీవా ఒక పెద్ద వ్యాపార కేంద్రం. ఎన్నో రకరకాల షాపులు. ఇక్కడ అన్నీ ఖరీదులు ఎక్కువే. స్విస్ వస్తువులు అక్కడికన్నా, అమెరికాలోనే చౌక.
జెనీవాలో ఒక నాలుగు రోడ్ల కూడలిలో చుట్టూ చూస్తే, అన్నీ బాంకులే. పెద్ద పెద్ద బిల్డింగులు. వాటి మధ్య నుంచుని వున్నప్పుడు అనిపించింది. మన రాజకీయ నాయకులూ, వాళ్ళ మిత్రులూ, మన ప్రభుత్వ అవినీతి ఉద్యోగులూ దాచిన డబ్బు నా కళ్ళ ఎదురుగా కాకపోయినా, కాలి దూరంలో ప్రతి చోటా వుంది అక్కడ. ఆ బిల్డింగుల సిమెంటు గదులలో ఎన్నో ఏళ్లుగా బంధించబడి వుంది. బహుశా అది దాచుకున్న వాళ్లకు తెలియదేమో, ఏ మతం వాడయినా సరే, చివరికి పైకి వెళ్ళేటప్పుడు, ఏ విధమైన లగేజీ తీసుకువెళ్ళనీయరని. లగేజీ చార్జీలు లక్షల్లో కట్టినా వీలులేదని!
దానిలో కనీసం పదో వంతు, భారతదేశ అభివృద్ధికి ఖర్చుపెడితే, మన దేశం ఎంత ముందుకి వెడుతుందో కదా అని అనిపించింది.
౦ ౦ ౦

ఫ్లారెన్స్ టు పీసా!

 image1

నాకు ఎప్పటినించో ఫ్లారెన్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ వున్న చారిత్రాత్మక ప్రదేశాలని చూడాలని కోరికగా వుండేది. ఎందుకంటే, ఆ ప్రదేశం ‘రెనెసాన్’ ఉద్యమం పుట్టిన ప్రదేశం. ‘రెనెసాన్’ కాలంలో వెలిగిపోయిన చిత్రకళా వైభవం, శిల్పకళా సౌందర్యం మనమిక్కడ ఇంకా చూడవచ్చు. రొమ్ నగరంలోలా కాకుండా, ఇక్కడ వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు.

ఫ్లారెన్స్ దగ్గరే వున్న పీసా కూడా చూస్తే, ఒకే దెబ్బకు రెండు పిట్టలనుకుని, రైల్లో ఫ్లారెన్స్ వెళ్ళాం. ముందుగానే అక్కడ ఏమేం చూడాలో తెలుసుకున్నాం కనుక, వెళ్ళగానే ఇక రంగంలోకి దిగాం.

ముందుగా ఫ్లారెన్స్ చరిత్ర కొంచెం తెలుసుకుందాం.

ఫ్లారెన్స్ క్రీస్తు పూర్వం 80వ శతాబ్దంలోనే ఫ్లుయంషియా అనే పేరుతో రోమన్ సామ్రాజ్యంలో ఒక ప్రాంతంగా వుండేది. దరిమిలా అది ఫ్లొరెంషియాగా పేరుపడింది. అదే ఈనాటి ఫ్లారెన్స్.

ఫ్లారెన్స్ 14-16 శతాబ్దాలలో, ఇటాలియన్ రెనసాన్ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది. సాంస్కృతిక పరంగానే కాకుండా, రాజకీయ, ఆర్ధికపరంగా కూడా ఫ్లారెన్స్ ఎంతో ప్రముఖంగా వున్నది. మతపరంగా సరేసరి!

ఆ రోజుల్లోనే ఫ్లారెన్స్ ప్రాంతం, యూరప్‌లోని ఎన్నో దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం వారి ‘వంద సంవత్సరాల యుద్ధానికి’ కూడా పెట్టుబడి పెట్టింది.

ఈ దేశ చరిత్ర గురించి ఇంకా ఎక్కువగా వ్రాయటం లేదు. శ్రీశ్రీ అన్నట్టు ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, పర పీడన పరాయణత్వం..’ అని. కాకపొతే ముఖ్యమైన కొంత ఉపోద్ఘాతం, తరువాత ఈనాడు అక్కడ మనం చూడగలిగే కళాత్మక విశేషాలు మాత్రం చెబుతాను.

ఫ్లారెన్స్ ఇటలీలోని టస్కనీ ప్రాంతానికి రాజధాని. టస్కనీ ప్రాంతంలో వున్న ఫ్లారెన్స్ రాష్ట్రానికి కూడా ఇదే రాజధాని. 102 కిలోమీటర్ల (40 చదరపు మైళ్ళ) వైశాల్యం. సముద్ర మట్టానికి 50 మీటర్ల (160 అడుగుల) ఎత్తున వుంది. ఇక్కడ జనాభా మూడున్నర లక్షల పైన. ఫ్లారెన్స్ మెట్రో ప్రాంతం కూడా కలుపుకుంటే ఒకటిన్నర మిలియన్లు. అంటే 15 లక్షలు. ప్రపంచం నలుమూలలనించీ ఇక్కడికి సంవత్సారానికి 18 లక్షల నించీ, 20 లక్షల మంది దాకా యాత్రీకులు వస్తారుట. దీన్ని ప్రపంచంలోనే ఎంతో అందమైన నగరాల్లో ఒకటి అని ‘ఫోర్బ్స్’ పత్రిక కీర్తించింది.

ఆ సన్నపాటి సందుల్లో, ఇటూ అటూ ఎత్తుగా వున్న భవనాలూ, వాటిలోనించీ బయటికి రాగానే, పెద్ద పెద్ద రోడ్లూ, ఫౌంటెన్లూ, మధ్యే మధ్యే ఎంతో అందమైన శిల్పాలూ.. చాల శుభ్రంగా వుండే చక్కటి నగరం ఫ్లారెన్స్.

ఇక్కడ చూడదగ్గ విశేషాలలో, మొట్టమొదటిది “ఎకాడమియా”.

మాకు అక్కడవున్న క్యూలో నిలబడి లోపలికి వెళ్ళటానికి రెండు గంటలు పట్టింది. కానీ లోపలికి వెళ్ళాక అంతసేపు వేచి వుండటం మంచిదే అనిపించింది. మైకలాంజెలో చెక్కిన అందమైన శిల్పాలు ఎన్నో వున్నాయి అక్కడ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పం “డేవిడ్” ఇక్కడే వుంది. చేతి వేళ్ళల్లో, కాళ్ళల్లో నరాలు కూడా కనిపిస్తాయి. ఎన్నో చిన్నచిన్న వివరాలని కూడా మైకలాంజెలో ఎంతో కళాత్మకంగా జాగ్రత్తగా చెక్కిన శిల్పం ‘డేవిడ్’.

ఇంకా ఎన్నో చక్కటి శిల్పాలు చూడాలంటే వెళ్లవలసిన ప్రదేశం ‘ది గల్లేరియా డిగ్లి ఉఫ్ఫిజి’. అక్కడ చాల ప్రఖ్యాతిగాంచిన బాటిచెల్లి, డవించి, రాఫయేల్, మైకలాంజెలో మొదలైన వారి శిల్పాలు ఎన్నో వున్నాయి. అన్నీ తెల్లటి పాలరాతిలో చెక్కినవే!

‘పొంటె శాంట ట్రినిట’ బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎంతో పురాతనమైన బ్రిడ్జ్. ‘బార్తలోమియో అమ్మనాటి’ అనే ఆయన కట్టిన అందమైన బ్రిడ్జ్. రెండవ ప్రపంచ యుద్ధంలో పాడయిపోయినా, దాన్ని మళ్ళీ ఏమీ మార్పులు చేయకుండా బాగుచేసారు.

image2

ఫౌంటెన్ ఆఫ్ నెప్ట్యూన్ ఎంతో బాగుంటుంది. 1565వ సంవత్సరంలో ప్రముఖ శిల్పి ‘బార్తలోమియో అమ్మనాటి’ చెక్కిన అందమైన శిల్పాలతో నిర్మించిన నీటి ఫౌంటెన్.

 

image3

ఇంకా ఇక్కడ చూడవలసినవి, నేషనల్ మ్యూసియం ఆఫ్ బార్గెల్లో. లోపలా బయటా కూడా ఇక్కడ ఎంతో అందంగా వుంటుంది, ఆ కట్టడాలు, శిల్పాలు. ఇక్కడే నా కేరికేచర్ బొమ్మ కూడా ఒకటి గీయించుకున్నాను.

తర్వాత ‘మెర్కాటో నోవో’ అంటే కొత్త బజారు. మైకలాంజెలో స్క్వేర్. పియాజా డెల్లా సిగ్నోరియా. ఇది ఎంతో పేరు పొందిన ప్రదేశం. ఎన్నో శిల్పాల మధ్య, చుట్టూ పెద్ద పెద్ద భవనాలతో, షాపులతో, హోటళ్ళతో, ఎంతోమంది యాత్రీకులు సందడి చేసే ప్రదేశం. శాంటా మారియా డెల్ కార్మిన్ చర్చితో సహా ఎన్నో కాథలిక్ చర్చిలు. మీకు ఎంత సమయముంటే అన్ని చర్చిలు వున్నాయిక్కడ!

పీసా అనే వూరు ఇక్కడికి దగ్గరే. రైలులో వెడితే ఒక గంట ప్రయాణం. ఒకరోజు పొద్దున్నే వెళ్లి, సాయంత్రానికి తిరిగి రావచ్చు.

పీసా టస్కనీ ప్రావిన్స్ లోనే, ఆర్నో నది పక్కనే వుంది. 88 వేల మంది జనాభాకి, ఇరవై పైన చర్చిలు వున్నాయిట ఇక్కడ!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ గలీలియో పుట్టి, పెరిగింది ఇక్కడే.

అంతేకాదు. మనందరికీ పరిచయమైన ‘లీనింగ్ టవర్’ కూడా ఇక్కడే వుంది! దాన్ని నా భాషలో ‘వంకర టింకర శిఖరం’ అంటాను.

చాలామంది, కావాలని ఇలా వంకరగా కట్టింది ఈ శిఖరం అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

క్రీస్తు శకం 1173లో మొదలు పెట్టి, 1372లో ఈ టవర్ కట్టటం పూర్తి చేసారు. అంటే దీన్ని కట్టటానికి రెండు వందల ఏళ్లు పట్టిందన్నమాట. ఈ శిఖరం ఎత్తు క్రింది వేపు 55.86 మీటర్లు (183.27 అడుగులు). పై వేపు 56.67 మీటర్లు (185.93 అడుగులు). పదహారు వేల టన్నుల బరువు. ఎనిమిది అంతస్తుల కట్టడం. మొత్తం 296 మెట్లు వున్నాయి. ఇది ఒకప్పుడు 5.5 డిగ్రీలు వంగి వుండేది. కానీ ఇప్పుడు 3.9 డిగ్రీలు వంగి వుంటుంది.

ఈ శిఖరం కట్టేటప్పుడు నిలువుగానే కడదామనుకున్నారుట. కానీ కడుతున్నప్పుడు నేల మరీ మెత్తగా వుండటం వల్ల, పునాది సరిగ్గా లేక, ఒక పక్కకి వంగటం మొదలుపెట్టింది. అలా వంగటం మొదలు పెట్టిన టవర్ పూర్తి ఆయే సమయానికి, కొంచెం ఎక్కువగానే వంగింది. కానీ దాని గురుత్వ కేంద్రం (Center of Gravity), భూమి మీద ఆ టవర్ వ్యాసం పరిధిలోనే (within the base diameter) వుండటంతో, అది కూలిపోకుండా నిలబడింది. అప్పుడు ఇంజనీర్లు, దానికి అలాగే నిలవటానికి ఇంకా బలం ఇచ్చేటట్టు మార్పులు చేసి, దాని కాళ్ళ మీద దాన్ని నిలుపగలిగారు. అలా మొదలైన లీనింగ్ టవర్, ఎన్నో లక్షలమంది యాత్రీకులని ఆకర్షిస్తున్నది. అదీ కథ.

image4

మీకు స్టీవ్ రీవ్స్ నటించిన పాత ‘సూపర్ మాన్’ సినిమా గుర్తుందా? దాంట్లో ఒక చక్కటి హాస్య సన్నివేశం వుంది. పీసా టవర్ పక్కనే ఒకతను చిన్న చిన్న పింగాణీవి, వంగిన టవర్లు అమ్ముతుంటాడు. ఆకాశంలో ఎగురుతూ వెడుతున్న సూపర్ మాన్, వంగిపోయిన టవర్‌ని చూసి దిగి వస్తాడు. అది పడిపోతున్నదనుకుని, నిఠారుగా నిలబెట్టి వెళ్ళిపోతాడు. అది చూసి షాపు అతను, ఏం చేయాలో తెలియక, షాపులోని పింగాణీ టవర్లు అన్నిటినీ విసిరి పగలగొట్టేస్తాడు. మళ్ళీ నిఠారుగా నిలుచున్న టవర్లు తయారు చేయించి, అమ్మకం మొదలు పెట్టబోతుంటాడు. తన తప్పు గ్రహించిన, సూపర్ మాన్ తిరిగి వచ్చి, టవర్‌ని ముందు ఎలా వంగి వుందో అలాగే వంచి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. షాపు అతనికి మళ్ళీ ఏం చేయాలో తెలీక, తన పింగాణీ టవర్లని కోపంతో విసిరేసి పగలకొడతాడు. ఎంతో హాస్యభరితంగా చిత్రించిన సంఘటన. అది గుర్తుకి వచ్చింది ఆ టవర్ పక్కనే గడ్డిలో పడుకుని, విశ్రాంతి తీసుకుంటుంటే!

image5

ఆ టవర్ మీదే ఒక బొమ్మ చూస్తే, ఉత్సాహం వచ్చి పై ఫోటో తీశాను. మానవ పరిణామ సిద్దాంతం ప్రకారం (Theory of Evolution), మనం కోతులలోనించీ వచ్చాం. దాన్నే చక్కగా పీసా టవర్ మీద చెక్కారు. ఇద్దరు కోతి మనుష్యులు, పూర్తిగా రూపాంతరం చెందకముందు, తోకలతో కూర్చున్న శిల్పం. అది నాకు బాగా నచ్చింది.

– సత్యం మందపాటి

 

 

వెన్నెల్లో వెనిస్!

నీటి మీద తేలుతున్న నగరం!

ప్రపంచంలోనే అరుదైన అందమైన నగరం! వెనిస్!

ఇటలీలోనేకాక, ప్రపంచంలోనే ప్రేమికుల ప్రముఖ ప్రణయ నగరం!

ఒక్క రోడ్డు కూడా లేని పెద్ద నగరం. ఊరంతా నీటి మీదే! అక్కడే టాక్సీలు, బస్సులూ, హోటళ్ళ షటిల్ బస్సులూ, స్కూలు బస్సులూ. ‘లాహిరి, లాహిరి’ పాడుకోటానికి గండోలాలు.

ఇదో వింత అనుభవం!

౦                 ౦                 ౦

ఎన్నో కాలువలతోనూ, బ్రిడ్జీలతోనూ, రకరకాల నీటి వాహనాలతోనూ, పో – పియావే నదుల మధ్యన 118 చిన్న చిన్న దీవులని కలిపి, చిందరవందరగా వున్న మనుష్యులను దగ్గరకు తీసిన నగరం. ఇటలీలో వెనేటో ప్రాంతానికి రాజధాని. మొత్తం 160 చదరపు మైళ్ళు లేదా 415 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. వెనిస్ గ్రాండ్ దీవి మీద 60,000మంది జనాభా అయితే, మొత్తం 118 దీవులూ కలుపుకుంటే 270,000 జనాభా. సగటున రోజుకి యాభై వేల మంది పైన యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారని చెప్పారు.

౦                 ౦                 ౦

మేము వెరోనా అనే నగరం నించీ ట్రెయిన్లో వెళ్లి వెనిస్ నగరంలో దిగాం. అక్కడికి ట్రైన్ ఒక బ్రిడ్జ్ మీదుగా వెడుతుంది. అక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వుంది. నీటి పైన ఎగురుతూ వచ్చి ఈ దీవి మీద విమానాలు దిగుతాయి.

ట్రైన్ స్టేషన్లో దిగాక, అదే దీవిలో అయితే కాలి నడక. దగ్గరగా వున్న మిగతా దీవులకీ వెళ్ళాలంటే కూడా బ్రిడ్జిల మీద కాలి నడక. లేదా కొంచెం దూరంగా వున్న దీవులకి వెళ్ళాలంటే టాక్సీలు, బస్సులూ. అన్నీ నీటి మీదే.        అప్పుడే నాకు బాపుగారు వేసిన ఒక కార్టూన్ గుర్తుకు వచ్చింది. ఒక స్వామిగారు నీటి పైన నడిచి వెడుతుంటాడు. అది చూసి ఒకతను అంటాడు, “అరె, చూడు ఆయన నీటి మీద ఎలా నడిచి వెడుతున్నాడో” అని. అప్పుడు రెండో అతను అంటాడు, “పాపం, ఆయనకి ఈత రాదేమోరా.. అందుకే నడిచి వెడుతున్నట్టున్నాడు” అని!

ఇక్కడ ఆ సన్నటి సందులూ గొందుల మధ్య నడుచుకుంటూ వెడుతుంటే ఎంతో బాగుంటుంది. మధ్యాహ్న సమయాల్లో కూడా ఎండగా వున్నా, చల్లటి గాలి తగులుతుంటే నడవటానికి బాగుంటుంది. కాకపొతే అక్కడ వున్న కొన్ని సైన్ బోర్డులు గందరగోళంగా వుంటాయి. అక్కడ ఎవరినైనా అడగటం మంచిది.

venice1

మేము దిగిన హిల్టన్ హోటల్ చాల దూరంగా ఇంకొక ద్వీపం మీద వుంది. గమ్మత్తేమిటంటే, ఆ ద్వీపం వున్నదంతా మా హోటలే. హోటల్లోనించీ ఏవైపు బయటికి వచ్చినా నీళ్ళే. ముందు వైపున నీళ్ళల్లో మాత్రం హోటల్ వారి షటిల్ బస్సూ, టాక్సీలు ఆగటానికి నీళ్ళల్లోనే ఒక బస్టాపు. గ్రాండ్ దీవి నించి మేము హోటల్ వారి షటిల్ బస్ తీసుకుని, హోటలుకి వెళ్ళాం.

ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాల వున్నాయి. అన్నిటిలోకి ముఖ్యమైనది సైంట్ మార్క్స్ స్క్వేర్. దీన్ని ఇటాలియన్ భాషలో శాన్ మార్కో పియాజాజ్ అనికూడా అంటారు. వెనిస్ వచ్చిన ప్రతి యాత్రీకుడు చూడవలసిన ప్రదేశం ఇది. ఎంతో అందంగా కట్టిన కట్టడాలు. మూడు పక్కలా ఎన్నో రెస్టారెంట్లు, ఆరు బయట షామియానాలు, కొన్ని గొడుగులు. వాటి క్రింద జనం కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూస్తూ, జలపుష్పాల పాస్టా తింటూ, కూర్చుని వుంటారు. ఎక్కడ చూసినా ఇటాలియన్ వైన్ సీసాలు. దాని పక్కనే సైంట్ మార్క్స్ బసీలికా చర్చి. చాల అందమైన కట్టడం. లోపలా, బయటా కూడా బాగుంటుంది. ఆ పియాజాజ్ మధ్యలో ఎన్నో పావురాలు, ఆహారం పడేస్తుంటే అక్కడే ఎగురుతూ ఇంకా ఎంతో అందాన్నిస్తాయి.

venice2

 

ఇక్కడ చీకటి పడేసరికీ అంతా మారిపోతుంది. ఎన్నో వేల లైట్లతో వెలిగిపోతుంటుంది. మూడు నాలుగు చోట్ల, కొంతమంది చిన్న స్టేజ్ మీద పియానో, వయోలిన్, చల్లో, డ్రమ్స్ మొదలైన వాయిద్యాలతో చెవులకి ఎంతో హాయిగా వుండే సంగీతం. కొన్ని చోట్ల ఇటాలియన్ భాషలో మధురమైన పాటలు కూడా పాడుతుంటారు. మేము రాత్రి భోజనానంతరం, ఎనిమిది గంటల నించీ పదకొండు గంటల దాకా అక్కడ తిరుగుతూనే వున్నాం.

venice3

 

అక్కడ చాలామంది బంగ్ల్లాదేశ్ వాళ్ళు లైట్లతో ఎగిరే బొమ్మ విమానాలు, వెలిగే మంత్రదండాలు మొదలైనవి అమ్ముతుంటారు. అవి కొనమని మన వెంటపడతారు కూడా.

మర్నాడు ఆ చుట్టుపక్కల, కొంచెం దూరంగానే వున్న మూడు నాలుగు దీవులకి, ఒక మోటార్ బోటులో టూర్ బుక్ చేసుకుని వెళ్ళాం. వాటిలో ముఖ్యంగా రెండు దీవుల గురించి చెబుతాను. ఒకదాని పేరు మురానో. ఇంకో దాని పేరు బురానో. మా టూర్ గైడ్ అమ్మాయి మురానో, బురానో అంటుంటే ఆ అమ్మాయిలాగానే అందంగా వున్నాయి ఆ మాటలు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటాలియన్ కూడా అజంతా భాష (మాటలు అన్నీ అచ్చులతో అంతమవుతాయని) కనుక అలా అంటారు కానీ, రెండిటికీ ఆ ఒక్కటీ తప్ప వేరే సంబంధం ఏమీ లేదు. ఏ భాష అందం దానిదే అని నా అభిప్రాయం. నేను మాత్రం ఇటాలియన్ భాషని, తెలుగు ఆఫ్ ది వెస్ట్ అనే అంటాను!

మురానో దీవి గ్లాస్ పరిశ్రమకి ప్రసిద్ధి. ఇటాలియన్లు కేథలిక్ క్రిస్టియన్ మతస్తులు కనుక, వారి చర్చిలలో ఎన్నో రకాల గ్లాసు అద్దాలు, బొమ్మలూ, దీపాలు.. వాటిలో చాలావరకూ ఇక్కడే తయారవుతాయి. మనలాటి యాత్రీకుల కోసం, వాళ్ళు రకరకాల బొమ్మలు (గుఱ్ఱాలు, ఏనుగులు, నెమళ్ళు లాటివి), ప్లేట్లు, కప్పులు, పూల గుత్తులూ, కొవ్వొత్తులు పెట్టికునే స్టాండులు.. ఒకటేమిటి ఎన్నో రకాలవి చేస్తారు. అవి ఎలా ఊడుతూ తయారు చేస్తారో చెబుతూ మాకు ఒక చిన్న ప్రదర్శన కూడా ఇచ్చారు. అది ఎంతో కళాత్మకమైన, నైపుణ్యంతో కూడిన విద్య.

బురానో దీవిలో చూసేది, అక్కడ తరాల తరబడి నివసించే వారి సంస్కృతిని ప్రతిబింబించే భవనాలు, వారి దుస్తులూ, నగలూ మొదలైనవి చూడ ముచ్చటగా వుంటాయి. కొనుక్కునేవాళ్ళకి, ఎంత కప్పుకి అంత కాఫీ!

వెనిస్ వెళ్ళినవాళ్ళందరూ చేయవలసిన పని ఇంకొకటి వుంది. అదే ‘గండోలా’ బోటులో ‘లాహిరి లాహిరి’ విహారం. ఎనభై యూరోలు ఇస్తే దాదాపు నలభై ఐదు నిమిషాలు, మనల్ని ఆ చిన్న పడవలో సందుల గొందుల మధ్య తిప్పుతాడు. అప్పుడే నీళ్ళల్లో ఇళ్ళ ఎలా కడతారో తెలుసుకోవచ్చు. మా గండోలా అతను ఇటాలియన్ యాసలో ఇంగ్లీష్ బాగా మాట్లాడాడు. ఇండియా వెళ్లి ఆగ్రా, జైపూర్ చూసి వచ్చాడుట. మంచి జోకులు కూడా వేశాడు.

venice4

నేను అప్పుడు తెలుసుకున్నదేమిటంటే, నీళ్ళల్లో పూర్తిగా మునిగిన చెక్కలు, ఆక్సిజన్ తగలక పాడవవు. అదే చెక్క నీళ్ళలో బయట వుంటే త్వరగా పాడవుతుంది. అదీకాక నీళ్ళని తగులుతున్న ప్రతి భవనం మొదటి అంతస్తు ఖాళీగా వుంచుతారుట. మనుష్యులు వుండేది రెండు, మూడు, ఆ పైన అంతస్తులలో. ఈ గండోలా విహారం చేస్తున్నప్పుడే చూశాం, నీళ్ళ ఒడ్డునే కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు. ఇక్కడ బస్టాపులు, టాక్సీ స్టాండులు కూడా నీళ్ళల్లో తేలుతూ వుంటాయి. మన ఒడ్డు వేపు నించీ ఎక్కి, రెండో పక్కన వున్న బస్సులు ఎక్కుతామన్నమాట! గండోలా విహారం వెన్నెల రాత్రులలో ఇంకా బాగుంటుంది.

ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమైనది గాలరీ డెల్ ఎకాడమియా. ఇక్కడ వెనీషియన్ చిత్రకారులు టిటియాన్, టింటరెట్టో మొదలైనవారి చిత్రాలు వున్నాయి.

మేమూ ఆరుబయట షామియానా క్రింద కూర్చుని పిజ్జాలు పాస్టా తిన్నాం. అమెరికాలో తినే ఇటాలియన్ పదార్దాలకీ, ఇటలీలో తినే వాటికీ చాల తేడా వుంది. అమెరికాలో ఇచ్చినన్ని కాయగూరలు ఇవ్వరు వాళ్ళు. చీజ్ మాత్రం ఎన్నో రకాలు. ఒకే పిజ్జా మీద నాలుగు, ఆరు రకాల చీజులు వేస్తారు.

దగ్గరుండి అన్నీ కనుక్కుని వడ్డించింది మాకు సోనియా.

పాత జేమ్స్ బాండ్ సినిమాలో, రోజర్ మూర్ రోజుల్లో అనుకుంటాను, ఒక సినిమాలో జేమ్స్ బాండుకి ఏ దేశంలో ఎక్కడ చూసినా అదే అమ్మాయి కనపడుతుంటుంది. అలాగే ఇటలీలో ఏ వూళ్ళోనయినా సరే, నాకు ఏ వెయిటర్ని చూసినా, ఆ అమ్మాయి పేరు సోనియా అయివుంటుందేమో అనిపించేది!

౦                 ౦                ౦

 

 

 

అందాల వీధులన్నీ అంతమయ్యే చోటు.. రోమ్ నగరం!

rome1

రోమ్! ఈనాటి రోమ్ నగరం!
ఇటలీ దేశానికి రాజధాని!
రోమ! ఇటాలియన్, లాటిన్ భాషల్లో రోముని రోమ అంటారు!
ప్రపంచాన్ని ఆనాడు గడగడలాడించిన రోమన్ సామ్రాజ్యం!
జూలియస్ సీజర్, మార్క్ ఆంటోనీలను తన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని ఆడించిన, ఈజిప్ట్ ఫారా క్లియోపాట్రా! క్లియోపాట్రా అందానికి బానిసగా మారిన రోమ రాజ్యం!
నేను చదువుకున్న అన్ని దేశ చరిత్రల్లోనూ, నాకెంతో ఉత్సాహాన్ని కలిగించిన ఆనాటి రోమన్ సామ్రాజ్య రాజధానికి వెళ్లటం. ఒక రకంగా అదో అనిర్వచనీయమైన అనుభూతి!
౦ ౦ ౦
పది వేల సంవత్సరాల క్రితమే అక్కడ దొరికిన రాతి ఆయుధాల ఆధారంగానూ, ఇతరత్రా జరిగిన పరిశోధన ద్వారానూ, రోములో దాదాపు 14,000 సంవత్సరాల క్రితమే ఆది మానవులు వుండేవారని తెలుస్తున్నది. మనకి వున్న పురాణాల కథల లాగానే, వీరికీ ఎన్నో పురాణ కథలున్నాయి. (Roman Mythology). రోములస్, రేమస్ అనే అన్నదమ్ములు ఒక తోడేలుకి పుట్టారనీ, తర్వాత రోములస్ రేమసుని చంపి అధికారం చెలాయించాడనీ ఒక కథ వుంది. అతని పేరుతోనే ఆ స్థలానికి రోమ్ అని పేరు వచ్చి వుండవచ్చు. రోమన్ చరిత్ర చాల ప్రాచీనమైనది కనుకా, ఈ వ్యాసానికి ఆ వివరాలు అనవసరం కనుకా, ఆ వివరాలు మీ పరిశీలనకే వదిలేస్తున్నాను.
౦ ౦ ౦
మేము ఎయిర్‌పోర్టు నించీ హోటలుకి వెళ్ళేసరికీ చీకటి పడింది. సామాను గదిలో పెట్టి, ముందు ఆఫీసులో బల్ల వెనుక వయ్యారంగా నుంచున్న బంగారం జుట్టు సోనియాని అడిగాను, ‘ఇక్కడ దగ్గర్లో ఏమైనా ఇండియన్ రెస్టారెంట్లు వున్నాయా, అమ్మడూ!’ అని.
“ఈ పక్కసందులోనే వుంది గాంధీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్. బావుంటుంది” అంది సోనియా.
ఆమె దగ్గరే కొన్ని మ్యాపులు, చూడవలసిన విశేషాలు, వాటి వివరాలు తీసుకున్నాం.
భోజనానంతరం, తర్వాత మూడు రోజులు ఏమేమిటి, ఎప్పుడెప్పుడు చూడాలో ప్లాన్ చేసుకున్నాం.

౦ ౦ ౦
మర్నాడు ప్రొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరి వాటికన్ వున్న ప్రదేశానికి వెళ్ళాం. హోటలుకి దగ్గరే. ఒక అరగంట నడక.

వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దేశంలో దేశం. ఇటలీ దేశంలోని ఒక స్వతంత్ర దేశం. రోమ్ నగరంలో వున్న ఒక చిన్న దేశం! ఇలా అనటానికే వింతగా వుంది కదూ! 109 ఎకరాల్లో, 800మంది జనాభా వున్న దేశం. కాథలిక్ క్రిస్టియన్ మతానికి రాజధాని. 1929లో ఇటలీ దేశంనించీ బయటికి వచ్చి స్వతంత్ర దేశం అయింది. ప్రతి రోజూ ప్రపంచం నలుమూలల నించీ యాత్రీకులు కొన్ని లక్షల్లో ఇక్కడికి వస్తుంటారు.

మేము వాటికన్ వెళ్ళేటప్పటికి సమయం దాదాపు తొమ్మిదీ నలభై ఐదు అయింది. అప్పటికే ఎన్నో వేల మంది జనం, కొన్ని వరుసల్లో నేల మీద బారులు తీర్చి కూర్చునివున్నారు. ఒకావిడని అడిగితే చెప్పింది. ప్రతి బుధవారం, ప్రొద్దున్న పదిగంటలకు పోప్ బెనెడిక్ట్ బయటికి వచ్చి, అందరి మధ్య నించీ వెడుతూ దర్సనమిస్తాడని.
మేము ముందు అనుకోకపోయినా, మా అదృష్టవశాత్తూ ఆరోజు బుధవారం. మేము అక్కడే సైంట్ పీటర్స్ స్క్వేర్‌లో సర్దుకుని కూర్చుంటున్నప్పుడు, దూరంగా పోప్ ఒక గోల్ఫ్ కారులో రావటం చూసాం. మధ్య మధ్యలో ఆగుతూ అందరినీ పలకరిస్తూ వస్తున్నాడాయన. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ, ఉత్సాహంగా ఫోటోలు తీస్తున్నారు. మాకు ఒక వంద గజాల దూరంలో నించి కనపడ్డాడు. చేతులు పైకెత్తి, నవ్వుతూ అక్కడవున్న వాళ్ళని పలకరిస్తున్నాడు. శ్రీమతి ఆనందంతో గంతులు వేసింది. అమెరికాలోని మా పిల్లలకి, వాళ్లకి అర్ధరాత్రి అవుతుందని తెలిసి కూడా, వెంటనే టెక్స్ట్ మెసేజీలు పంపించింది, పొప్ కనపడ్డాడు అని.
అక్కడే వుంది సైంట్ పీటర్స్ బసీలికా చర్చి. దాని పక్కనే వాటికన్ మ్యూసియం, సిస్టిన్ చాపల్ వున్నాయి. ఇవన్నీ చూడటానికి పూర్తిగా ఒక రోజు పడుతుంది. ఇక్కడ ఎన్నో రకాల ప్రఖ్యాత చిత్రాలూ, శిల్పాలూ వున్నాయి. మైకలాంజేలో, పెరూజినో, బాట్టిచెల్లీ మొదలైన వారి కళాఖండాలు చూడవచ్చు. అన్నీ బైబిల్ పురాణ గాధల చిత్రాలు, శిల్పాలు. ఒక దానిని మించి ఇంకొకటి. వాటికన్ మ్యూసియంలో 1400 గదులు వున్నాయి. ఇక్కడ కొన్ని చిత్రపటాలు 3000 సంవత్సరాల క్రితంవి కూడా వున్నాయి. సిస్టిన్ చాపల్ 1473-1481 ప్రాంతంలో కట్టారు. ఇక్కడే పోప్ ఎన్నికలు జరిగేవి. 1506లో స్విస్ కాపలాదార్లు బసీలికా చర్చి తలుపు దగ్గర కాపలా కాసేవారుట. కానీ ఇప్పుడు కాపాలాదారులు స్విస్ వారు కాకపోయినా, స్విస్ దుస్తులు వేసుకుని కదలకుండా అలా నిల్చుని వుంటారు.
ఇక్కడ చెప్పవలసినదొకటివుంది. ప్రతి దానికీ లోపలి వెళ్ళటానికి ఎంతో పెద్ద క్యూలు. మన తిరపతిలో దొంగ దర్శనంలా, కొంతమంది ఏజెంట్లు డబ్బులు ఎక్కువ తీసుకుని లైన్లను తప్పించి లోపలికి కొంచెం త్వరగా తీసుకువెడుతుంటారు. అది ఇక్కడ న్యాయ సమ్మతమే! లేదా ప్రొద్దున్నే ముందుగా వెడితే లైన్లు తక్కువగా వుంటాయి.

rome2

మర్నాడు మేము రోమన్ సామ్రాజ్య శిధిలాలను చూడటానికి వెళ్ళాం. రోమన్ కలోసియం క్రీస్తు శకం 70వ శతాబ్దంలో కట్టిన పెద్ద స్టేడియం. అది ఎంతో పెద్ద కట్టడం. ఇటుకలతో కట్టారు. కొన్ని చోట్ల నాలుగు/ఐదు అంతస్తులు కూడా వుంటుంది. అక్కడే గ్లాడియేటర్ పోట్లాటలు, జంతువులతో మనుష్యుల చెలగాటాలూ జరిగేవి. రాజులు రాణులూ అవి చూసి ఆనందిస్తూ వుండే వారు. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటం అనే సామెత గుర్తుకి వచ్చింది నాకప్పుడు.

rome3

పక్కనే పాలటిన్ హిల్. అక్కడ ఆరోజుల్లో చక్రవర్తులు కొందరు వుండేవారుట. ఇలా శిధిలమైపోయిన చర్చిలూ, ఆర్చిలూ, ఇతర కట్టడాలూ, ఆ చుట్టుపక్కల ఎన్నో వున్నాయి. వాటిని అన్నిటినీ కలిపి రోమన్ ఫోరం అంటారు. నడవటం ఇబ్బంది లేకపోతే, అవన్నీ చూస్తూ నడవవచ్చు.
చూడవలసిన ఇంకొక కట్టడం ట్రేవీ ఫౌంటెన్. అక్కడ శిల్పం బాగుంటుంది. దీన్ని 1762లో కట్టారుట. వచ్చినవాళ్ళు, వెనక్కి తిరిగి కూర్చుని, ఆ ఫౌంటెన్ నీటిలో చిల్లర పడేస్తుంటారు. అలా చేస్తే, అనుకున్నది జరుగుతుందని ఒక మూఢ నమ్మకం.
నేను మాత్రం, నా చేతిలో వున్న చిల్లర, అక్కడ దారిలో కూర్చుని అడుక్కుంటున్న ఒక నడుము వంగిపోయిన ముసలావిడకి ఇచ్చి, ఆవిడకి ఆరోజు కడుపునిండాలని కోరుకున్నాను.
ఊరు మధ్యలో కట్టిన మాన్యుమెంట్ బిల్డింగ్ రోమ్ నగరానికే ఎంతో అందాన్నిస్తుంది.

rome4

ఇక్కడ ఇంకా ఎన్నో మ్యూసియంలు, శిధిలమైన కట్టడాలు వున్నాయి. ఊరు మధ్యలో కొన్ని కాలువలూ, వాటి మీద పెద్ద పెద్ద వంతెనలు వున్నాయి. ఒక్కొక్కటి తీరిగ్గా చూసుకుంటూ వెళ్ళాలంటే, మూడు రోజులు చాలవు.
నాకు ఇక్కడ నచ్చనిది ఏమిటంటే, ఇక్కడ రోడ్ల మీద శుభ్రత కొంచెం తక్కువ అనే చెప్పాలి. కాలువల దగ్గర కొంచెం దుర్వాసన కూడా వుంది. తీర్ధయాత్రా స్థలాలలో చాల చోట్ల ఇలా వుండటం మామూలే అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మిగతా అన్నిచోట్లా, అమెరికా, యూరప్, పసిఫిక్ ఆసియా దేశాల్లో మరి అన్నీ శుభ్రంగానే వున్నాయి!
ఇది ఒక్కటీ పక్కన పెడితే, రోమ్ చూడదగ్గ అందమైన చారిత్రాత్మక నగరం!
౦ ౦ ౦

-సత్యం మందపాటి

satyam mandapati

బార్సిలోనా అనుభవం : తనివి తీరలేదే!!

satyam mandapati ప్రపంచంలోనే ఎంతో అందమైన, ఆధునిక భవనాలు, కట్టడాలు ఎక్కడ వున్నాయి?

ఎంతో పేరు ప్రఖాతులులైన భవన నిర్మాణ శాస్త్ర శిల్పులు ఎక్కడ వున్నారు?

ప్రఖ్యాత వన నిర్మాణ శాస్త్ర నిపుణులు నిర్మించిన చక్కటి ఉద్యానవనాలు ఎక్కడ వున్నాయి?

బార్సిలోనాలోనా?

అవును…. బార్సిలోనాలోనే!

౦                           ౦                           ౦

ఈమధ్య మేము వెళ్ళిన యూరోపియన్ యాత్రలో నాకు బాగా నచ్చిన ప్రదేశాల్లో బార్సిలోనా ఒకటి.

స్పెయిన్ దేశానికి రాజధాని అయిన మెడ్రిడ్ నగరం బార్సిలోనా కన్నా పెద్దది. కాకపోతే బార్సిలోనా ఎంతో ఆధునిక నగరం. ముఖ్యంగా 1992లో ఇక్కడ వేసవి ఒలెంపిక్స్ జరిగినప్పుడు, నగరం మొత్తం కొత్త అందాలను సంతరించుకుని, కొత్త పెళ్లికూతురిలా తయారయింది. అప్పటినించీ ఆ అందాలు పెరిగాయే కానీ తరగలేదు.

బార్సిలోనా స్పెయిన్‌లోని కాటలోనియా ప్రాంతానికి రాజధాని. నగరం సైజు నలభై చదరపు మైళ్ళు. మెట్రో సైజు మూడు వందల పది చదరపు మైళ్ళు. నగర జనాభా 3.2 మిలియన్లు, మెట్రో జనాభా 5.3 మిలియన్లు. ఇది యూరోపియన్ యూనియన్‌లో ఆరవ పెద్ద నగరం. మెడిటెర్రేనియన్ సముద్రతీరంలో వుంది. రోమన్ సామ్రాజ్యంలో ఒక నగరమై, తర్వాత ఆనాటి ఆరగాన్ సామ్రాజ్యంలో చేరి, ఈనాటి స్పెయిన్ దేశంలో అంతర్భాగమైంది బార్సిలోనా.

బార్సిలోనాని మొదటగా హెర్క్యుల్కిస్ స్థాపించినట్టు చెబుతారు. కానీ చరిత్రకారులు దాన్ని అంగీకరించ లేదు. ఎందుకంటే హెర్క్యుల్కిస్ ఒక పురాణ కథలోని పాత్ర. పురాణం (Mythology) అంటేనే కాల్పనికమైనది. అందుకని అది నిజమని ఒప్పుకోరు. పూనిక్ యుద్ధంలో రోమన్లను తరిమేసిన హాన్నిబాల్ తండ్రి అయిన హామిల్కర్ బార్సా పేరున బార్సిలోనా అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.

barce3

బార్సిలోనా.. ఆ మాట కొస్తే యూరప్‌లో ఏ పెద్ద నగరమయినా సరే.. వెడదామనుకునే వాళ్లకి సలహాలు కొన్ని చెప్పాలని వుంది. యూరప్‌లో హోటళ్ళ ఖరీదులు చాల ఎక్కువ. ఇంటర్నెట్లో రకరకాల చోట్ల చూసి ముందే హోటల్ బుక్ చేసుకుంటే చౌక. ఆర్బిట్జ్, హోటల్.కాం, ఇలా చాల వున్నాయి. కొన్ని హోటళ్ళు లాస్ట్ మినిట్.కాంలో కూడా చాల చౌకగా దొరుకుతాయి. మాకు మంచి ఐదు నక్షత్రాలు హోటళ్ళలో డెభై శాతం తక్కువగా గదులు దొరికాయి. లేదా కొన్ని హాస్టళ్ళు, ఎపార్ట్మెంట్లు, ఇళ్ళు మొదలైనవి కూడా ప్రయత్నించి చూడండి. అంతేకాదు, ఏ వూళ్ళో అయినా, మనం చూడదలుచుకున్న ప్రదేశాలకు, కనీసం కొన్నిటికైనా దగ్గరగా వుండే హోటళ్ళు ఇంటర్నెట్లో మాపులతో సహా చూడవచ్చు. ఇక భోజనాల సంగతి చూస్తే, మీ హోటల్ లాబీలో క్లర్కుని అడిగితే ఎన్నో వివరాలు తెలుస్తాయి. మేము బార్సిలోనాలో రాత్రి ఎనిమిదింటికి హోటల్లో దిగి, అక్కడ లాబీ క్లర్కుని అడిగాము, దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్లు ఏమైనా వున్నాయా అని. అతను నవ్వి మీకు ఎన్ని కావాలి అని అడిగాడు.

మా హోటల్ చుట్టూతా కనీసం నాలుగు ఇండియన్ రెస్టారెంట్లు వున్నాయి. చాల చోట్ల టాక్సీలు పెద్ద ఖరీదు కాదు. మీకు కొంచెం సమయం ఎక్కువగా వుంటే, కొంచెం చొరవ వుంటే బస్సులూ, ట్రాములూ కూడా బాగానే వుంటాయి. చాల నగరాల్లో టూరిస్టు బస్సులు.. హాపిన్-హాపౌట్ బస్సులు అంటారు, అవి ఎక్కితే వాళ్ళే వూరంతా తిప్పుతారు. మీకు నచ్చిన చోట దిగటం, అక్కడ అన్నీ చూసేసిన తర్వాత, మళ్ళీ అదే కంపెనీ వాళ్ళ బస్సు ఎక్కటం. అవన్నీ ఒకే దిశగా వెళ్లి మనం ఎక్కడ బయల్దేరామో అక్కడికే తిరిగి వస్తాయి. ఒకరోజు టిక్కెట్టు కానీ, రెండు రోజుల టిక్కెట్టు కానీ కొనుక్కుంటే, మీరు చూడాలనుకున్నవి చూడవచ్చు.

మేము అలాగే రెండురోజుల టిక్కెట్లు కొనుక్కుని, బార్సిలోనా అంతా తీరిగ్గా చూసాం.

barcelona1

బార్సిలోనాలో చూడవలసింది ఏమిటి అని ఎవరిని అడిగినా, మొట్టమొదట చెప్పేది అక్కడి ఆధునిక భవన

నిర్మాణ వైవిధ్యం. ఒక్కొక్క భవనం ఒక్కొక్క విధంగా నిర్మింపబడి, నగరానికి ఎంతో అందాన్నిస్తున్నది.

ఇంతకుముందు నేను చూసిన నగరాలలో షాంగ్‌హాయ్, దుబాయ్ లాటి నగరాలు ఎంతో బాగున్నాయి అనుకునేవాడిని. బార్సిలోనా చూశాక, నా అభిప్రాయం మారిపోయింది. బార్సిలోనాలోనే ఆ అందాలన్నీ కలబోసి వున్నాయనిపించింది. బార్సిలోనాలో భవనాలు అందంగా ఉండటమే కాదు, ఊరు ఎంతో శుభ్రంగా వుంటుంది. చక్కటి ప్లానింగుతో కట్టిన వీధులు, పార్కులు, నగరం. 1992లో వేసవి ఒలెంపిక్స్ కోసం చేసిన కృషితో, బార్సిలోనా స్వరూపమే పూర్తిగా మారిపోయిందిట.

barce2

ప్రపంచంలోని ఎన్నో దేశాలనించీ, భవన నిర్మాణ శాస్త్రం (Architectural Engineering) చదివినవారు, బార్సిలోనా వచ్చి అక్కడి కట్టడాలను పరిశీలించటం మామూలే! మరి దీనికి కారణం ఏమిటి అనేది ఒక ప్రశ్న!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భవన నిర్మాణ స్థపతులు, ఆంటోని గౌడి, లూయిస్ డోమినేక్ లాటి వారందరూ ఇక్కడివారే! వీరందరిలో కూడా ప్రముఖుడు ఆంటోని గౌడి (1852-1926). స్పానిష్ కాటలాన్ భవన నిర్మాణంలో పేరుగాంచినవాడు. ఆయన నిర్మించిన ‘సగ్రాడా ఫెమిలియ’, ‘మేగ్నం ఓపస్’ బార్సిలోనాలోనే వున్నాయి. పింగాణి, రంగురంగుల అద్దాలు, రకరకాల చెక్కలూ వాడటం గౌడి ప్రత్యేకత. ఆయన శిష్యులే ఈనాటి అధునాతన బార్సిలోనా నిర్మాణంలో ముఖ్యులు. గౌడి కట్టిన ‘కాసా బట్టిలో’ ఎంతో వైవిధ్యమైన కట్టడం. దాన్నే ఇప్పుడొక మ్యూసియంలా మార్చారు. ఈ మ్యూసియం పూర్తిగా చూడటానికి రెండు మూడు గంటలు పడుతుంది. దీనితోపాటు ఈయన డిజైన్ చేసిన కొన్ని ఇతర భవానాలు కూడా చూడటానికి చాల బావుంటాయి.

బార్సిలోనాలో చూడవలసిన వాటిలో ముఖ్యమైనవి, గొథిక్ క్వార్టర్స్. వంకర్లు తిరిగిన చిన్న చిన్న సందులు, అక్కడే ఎంతో షాపింగ్. మధ్యే మధ్యే బారులు తీరిన బారులు. నడిచి వెడుతుంటే బావుంటుంది.

చిత్రకళ మీద ఉత్సాహం వున్నవారికి, పికాసో మ్యూసియం ఎంతో బాగుంటుంది. ఎంత పెద్ద కళాహృదయం వుంటే అంత సమయం గడపవచ్చు ఇక్కడ. అలాగే కాటలూనియా నేషనల్ ఆర్ట్ మ్యూసియం.

barce4

లాస్ రామ్బ్లాస్ అనే రోడ్డు మీద అలా ఎంత దూరమైనా నడుచుకుంటూ పోవచ్చు. రాత్రి పూటయితే లైట్లతో ఇంకా బాగుంటుంది. ఇంకా పలేషియో గ్విల్, కాసా మిలా, కొలంబస్ మాన్యుమెంట్.. ఇలా చూడవలసినవి చాల వున్నాయి.

తర్వాత నాకు ఎంతో నచ్చినది ఒలెంపిక్ స్టేడియం, ఆ చుట్టుపక్కల వున్న ఒలెంపిక్ మాన్యుమెంట్స్. 1992లో వేసవి ఒలెంపిక్స్ జరిగింది ఇక్కడే.

 

ఆ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలు టీవీలో ప్రత్యక్షంగా చూసాను కనుక నాకు గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. స్టేడియం మధ్యన నుంచుని ఒకే ఒక బాణం సంధించి, దానితో ఎంతో ఎత్తున, దూరంగా కట్టిన ఒలెంపిక్ అగ్నిహోత్రాన్ని వెలిగించిన ప్రఖ్యాత స్పానిష్ విలుకాడు ‘అంటోనియో రెబోయో’ నాకింకా గుర్తున్నాడు. అదిప్పుడు ప్రత్యక్షంగా చూసి అతని విలువిద్యా నైపుణ్యానికి అబ్బురపడ్డాను. అలాగే అక్కడ కట్టిన ఒలింపిక్ చిహ్నం కూడా ఎంతో అందంగా వుంటుంది.

– మందపాటి సత్యం

 

ప్రకృతి ఒడిలో అందాల దీపం- కేనరీ ద్వీపం!

విహార యాత్రా స్పెషల్-1

 satyam mandapati

(ఇప్పుడు ప్రేమయాత్రలకి నా వయసు కుసింత ఎక్కువయినట్టుంది. అక్కడ ప్రత్యేకమైన విశేషాలు ఏమైనా వుంటే తప్ప తీర్ధయాత్రలకి మనసెప్పుడూ లేదు. అయినా ఎన్నో విహార యాత్రలు, మరెన్నో వినోద యాత్రలు, ఆఫీసు పని మీద చాల వ్యాపార యాత్రలు చేశాను. కొన్ని ఒంటరిగా ఏకో నారాయణా అనుకుంటూ, కొన్ని అర్దాంగితో కలిసి లాహిరి లాహిరిపాడుకుంటూ, కొన్ని కుటుంబ సభ్యుల సపరివార సమేతంగా, కొన్ని మిత్రులతో సరదాగా, కొన్ని ‘కొలీగుల’తో దేశవిదేశాలు(కాంపులకి వెళ్లారు అనేవాళ్ళు ఇండియాలో). మధ్యే మధ్యే రోమ్, అమృత్సర్, జెరూసేలంలాటి తీర్ధ/చారిత్రాత్మక యాత్రాలూ వున్నాయండోయ్!

లాగులు తొడుక్కునే ప్రతివాడూ ట్రావెలాగులు వ్రాస్తూనే వున్నాడు మళ్ళీ నేనెందుకు వ్రాయటం అనుకున్నాను ముందు. కానీ ‘ఎవరి లాగులూ, ట్రావెలాగులూ వాళ్ళవే కదా, మీరూ వ్రాయండి’ అన్నారు మిత్రులు. సరే అలాహే కానివ్వండి అని ‘విహార యాత్రా స్పెషల్’ అనే ఈ శీర్షిక “సారంగ” అంతర్జాల పత్రికలో వ్రాస్తున్నాను. పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను వ్రాయమని అడుగుతూ, ఆలస్యం చేసినందుకు నన్ను కుంచెం కోప్పడి, ఈ శీర్షిక వ్రాయించుకుంటున్న మిత్రులు అఫ్సర్ గారికి ధన్యవాదాలు. ప్రతి నెలా ఒక్కొక్క ప్రదేశం గురించి వ్రాద్దామనుకుంటున్నాను. వీటిలో చాల వరకూ నేను చూస్తున్న కొత్త ప్రదేశాల మీదా, కొన్ని నా పాత వ్యాసాలకు కొంచెం మెరుగుపెట్టి తిరగ వ్రాసీ, మీ ముందు వుంచుదామని నా ఈ ప్రయత్నం. మీకివి నచ్చినన్ని రోజులు, చదివి ఆనందించండి. నచ్చకపోతే వెంటనే చెప్పేయండి. ముఖమాటం లేదు. ఆపేద్దాం.

మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటుంటే, నా వ్యాసాలు వాటి గురించి మరి కొంచెం అవగాహనని పెంచుతాయని నా ఉద్దేశ్యం. ఇతర కారణాల వల్ల, ఆ ప్రదేశాలకి వెళ్ళొద్దులే అనుకుంటే ఏమీ ఫరవాలేదు, అక్కడికి వెళ్ళినంత సరదాగా ఈ వ్యాసాలు చదువుకోండి! సందర్భానుగుణంగా మీ కోసం కొన్ని ఫోటోలు కూడా జత చేస్తున్నాను మరి!)

౦                           ౦                           ౦

ఈమధ్య మేము ఐదు వారాలపాటు యూరప్ యాత్రకి వెళ్ళాము. స్పెయన్లో కేనరీ ద్వీపాలు, బార్సిలోనా; ఇటలీలో రోమ్, ఫ్లారెన్స్, పీసా, వెరోనా, వెన్నిస్; స్విట్జర్లాండులో ఎంగెల్బర్గ్, జెనీవా, లుజర్న్; ఇంగ్లాండులో లండన్ మొదలైన ప్రదేశాలు చూసివచ్చాం. వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ ఆనాటి చరిత్రలో కానీ, ఈనాటి ఆధునిక జీవితంలో కానీ ఎంతో వైవిధ్యం వున్నదే!

మేము ముందు కానరీ ద్వీపాలకి ప్రయాణం కట్టాం. అమెరికాలోని ఆస్టిన్ నించీ లండనుకి వెళ్ళే విమానం లండన్ హీత్రో ఎయిర్ పోర్టుకి వెడుతుంది. అక్కడినించీ లండన్ గాట్విక్ ఎయిర్ పోర్టుకి వెళ్లి, టెనరిఫే ద్వీపానికి వెళ్ళే విమానం ఎక్కాం. అన్నట్టు మేము ఆస్టిన్ నించీ ఎక్కిన విమానం బోయింగ్ వారి సరికొత్త విమానం. ఎన్నాళ్ళ నించో ఎదురు చూస్తున్న 787 Dream Liner. ఈమధ్యనే నడపటం మొదలుపెట్టారు.

‘అది సరేనయ్యా.. ఎక్కడ వున్నాయి ఈ ద్వీపాలు.. ఏముంది అక్కడ.. ఏమిటి ఆ కథా.. కమామిషు..’ అని మీరు అనబోయే ముందుగా, ఇవిగో ఆ వివరాలు.

కెనేరియాస్ అనబడే ఈ కేనరీ ద్వీపాలు కెనడాలో లేవు. అవి స్పెయిన్ దేశానికి చెందినా, నిఝంగా స్పెయిన్ భూభాగంలోనూ లేవు. ఉత్తర ఆఫ్రికాకి కొంచెం ఉత్తరంగా, ఇంకొంచెం పడమటగా.. అంటే మొరాకో దేశానికి వాయువ్య మూలగా 62 మైళ్ళ దూరంలో, అట్లాంటిక్ మహా సముద్రంలో వున్నాయి.

ఇక్కడ ఏడు పెద్ద ద్వీపాలు, ఎన్నో చిన్న చిన్న ద్వీపాలు, ఇక్కడ వున్న అగ్ని పర్వతాలలోనించీ వచ్చిన లావా ప్రవహించటం వల్ల ఏర్పడ్డాయి. వీటిలో అన్నిటికన్నా పెద్ద ద్వీపం మేము వెళ్ళిన టెనరిఫే. దాని తర్వాత ఇంకా చిన్న ద్వీపాలలో చెప్పుకోదగ్గవి, ఫూర్తే వెంత్యురా, గ్రాన్ కెనేరియా, లా పాల్మ, లా గొమేర మొదలైనవి.

అసలు కేనరీ ద్వీపాలు అంటే అర్ధం, లాటిన్ భాషలో కుక్కలు వున్న ద్వీపాలు అని. ఆ రోజుల్లో అక్కడ ఎన్నో పెద్ద పెద్ద కుక్కలు వుండేవిట. అవి నిజంగా కుక్కల సంతతి కాదు, అవి సీల్ జాతికి చెందిన నీటి కుక్కలు అనీ, తర్వాత పరిణామ జీవనంలో అంతరించి పోయాయనీ ఒక కథ వుంది. మేము ఈ ప్రదేశాలన్నీ చూడక ముందే, వీటి గురించి కొంత చరిత్ర చదివాను. మహాకవి శ్రీశ్రీగారు అన్నట్టు, ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.. నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం.. నరజాతి చరిత్ర సమస్తం, పరస్పరాహరణద్యోగం..”… ఇంగ్లండు, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా… ఏ దేశ చరిత్ర చూసినా అదే!

కేనరీ ద్వీపాల చరిత్ర కూడా అంతే! ఈ ద్వీపాలని ఎన్నో దేశాలు ఒకటి తర్వాత ఒకటి – రోమన్, మొరాకో, గ్రీక్, డచ్, స్పెయిన్ దేశాలతో సహా – ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం కేనరీ ద్వీపాలు స్పెయిన్ దేశం ఆధీనంలో వున్నాయి. 2900 చదరపు మైళ్ళ వైశాల్యంలో 2.1 మిలియన్ల జనాభా వుంది. వీరిలో 77 శాతం కెనేరియన్లు, 8.5 స్పెయిన్ భూభాగం నించి వచ్చినవారు, 14 శాతం విదేశీయులు, అంటే ముఖ్యంగా జర్మనీ, బ్రిటిష్, ఇటలీ, కొలంబియా, వెనిజువేలా, క్యూబా, మొరాకో మొదలైన దేశాల సంతతి. వీరిలో ఒక్క టెనరిఫే ద్వీపంలోనే 785 చదరపు మైళ్ళ వైశాల్యంలో తొమ్మిది లక్షల మంది వున్నారు.

టెనరిఫేలో రెండు ఎయిర్‌పోర్టులు వున్నాయి. బస్సు సౌకర్యం చాల బాగుంది. టాక్సీల అవసరం తక్కువే. కొన్ని చోట్లకి రైళ్ళు కూడా వున్నాయి.

టెనరిఫేకి రాజధాని శాంతా క్రూజ్. ఇక్కడ చెప్పుకునే ఇంకొక పెద్ద వూరు లా లగూన.

టెనరిఫేలో సముద్రం ఒడ్డునే వున్నాం మేము. మా బాల్కనీలో నించీ వంద గజాల దూరంలో సముద్రం, ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతూ, ఇంకొక రోజు గంభీరంగా గర్జిస్తూ కనిపిస్తూ వుంది. ఈ ద్వీపాలు అగ్నిపర్వతాల లావాతో ఆవిర్భవించాయి కనుక, చాల చోట్ల భూమి మీద నల్లటి రాళ్ళు, నల్లటి ఇసక కనిపిస్తుంది. బీచి ఒడ్డున, కొన్నిచోట్ల, బయట నించి ఎన్నో వేల టన్నుల తెల్లటి ఇసుక తెచ్చి పోశారు. అందుకే ఆ నలుపూ తెలుపుల ఇసుక అందం, ఆకాశంలోని నీలి రంగు, ఒడ్డున వున్న చెట్టూ చేమల ఆకుపచ్చ రంగు, సముద్రపు నీలి నీలి నీటి రంగులతో కలిసి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

వెయ్యి మాటల కన్నా ఒక్క చిత్రపటమే ఎక్కువ చెబుతుంది అనే నానుడి వుంది. అందుకని టెనరిఫే ద్వీపంలో ఎక్కువగా చెప్పుకునేవి ఇక్కడి అందాలే కనుక, ఈ వ్యాసంలో ఎక్కువ మాటల కన్నా ఫోటోలే మీకు సరైన అవగాహన ఇస్తాయని, అవే కొన్ని పెడుతున్నాను. చిత్తగించండి.

satyam1

 

satyam2

 

 

ఇక్కడ మేము చూసిన వాటిలో ముఖ్యమైనది, ‘టైడే’ అనే అగ్నిపర్వతం. ఇప్పటికీ అడపా దడపా బుస్సుమంటూ కాసిని నిప్పులు కక్కుతున్న పర్వతం. 18,990 హెక్టారుల భూవైశాల్యంతో 3718 మీటర్ల ఎత్తున, అంటే 12,198 అడుగుల ఎత్తున, టెనరిఫే ద్వీపం మధ్యలో వున్న చల్లటి చక్కటి పర్వతం! ఇది స్పెయిన్ పర్వత శ్రేణిలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతం. రోమనులు పాలన కాలంలో అంత ఎత్తు వుండేది కాదు కానీ తర్వాత వరుసగా లావా వచ్చి, ‘టైడే’ ఎత్తు పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడప్పుడూ లావా కొంచెం కొంచెం వస్తున్నా, చివరిసారిగా పెద్ద ఎత్తున అగ్ని కురిపించినది 1798లో. అప్పుడే ఆ చుట్టుపక్కల లావా ప్రవాహం వల్ల మరి కొన్ని చిన్న ద్వీపాలు కూడా వెలిసాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం అక్కడ వున్న స్థానికులు ఈ పర్వతాన్ని ఒక దైవ సంబంధంగా భావించి పూజలూ కూడా చేసేవారుట!

satyam3

 

మేము వెళ్ళిన రోజున కొండ మీద కొంచెం సన్నగా మంచు పడుతున్నది. బాగా చలి, విపరీతమైన గాలి. అయినా కొంచెం వెచ్చటి దుస్తులు వేసుకుని, ఆ తెల్లటి నల్ల పర్వతం అందాలని చూస్తూ అలాగే చాలా సేపు నుంచున్నాం.

 

satyam4

ఈ పర్వత శ్రేణి మీదనే బాగా ఎత్తున ఒక అబ్జర్వేటరీ కూడా వుంది. అక్కడ ఎంతో నక్షత్ర శాస్త్ర పరిశోధన జరుగుతున్నది.

 

satyam6

ఇక్కడ చూడవలసిన ఇంకొక ప్రదేశం ‘మస్కా’ లోయ. కొండ మీద నించీ ఈ మస్కా లోయని చూస్తుంటే ఎంతో మనోహరంగా వుంటుంది.

ఒక పక్క నీలం రంగు సముద్రం, సముద్రపు అలలు ఒడ్డుకు తగిలి ఎగురుతూ మెరుస్తున్న తెల్లటి నురుగు, ఇంకొక పక్క ఆకుపచ్చని చెట్లతో నిండిన కొండలు, లోయలు. వాటి మధ్య ఎర్రని బంగాళా పెంకులతో కట్టిన రంగు రంగుల ఇళ్ళూ, వాటి పక్కనే నల్లటి తారు రోడ్లూ… ప్రకృతి కన్య విలాసంగా నాజూకు అందాలను సంతరించుకుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టుగా వుంది.

satyam5

ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో రామచిలుకలు వున్న లోరో పార్క్, సియాం నీటి పార్క్, గరాచికో, చిరానానా మొదలైన చారిత్రాత్మక ప్రదేశాలు.. ఇలా ఎన్నో వున్నాయి. మీ ఓపిక, సరదా, గుఱ్ఱం స్వారీ, జేబులోని పచ్చనోట్లుని బట్టి, చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత!

ఇంకో విషయం కూడా చెప్పాలి. మిగతా పెద్ద పట్టణాలలో లాగా ఇక్కడ ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళు తక్కువ. ఎక్కువమంది మాట్లాడేది కెనేరియన్ స్పానిష్. స్పెయిన్ భూభాగంలో మాట్లాడే స్పానిష్ కొంచెం వేరేగా వుంటుంది. ఏ రాయయితేనేం పళ్ళు వూడగొట్టుకోవటానికి అని, మాకు ఏ స్పానిష్ అయినా ఒకటే.. అర్ధం కాదు కనుక. మేము టెక్ససులో మాట్లాడే స్పానిష్ కొంచెం (‘పొకీతో’) వాడదామని ప్రయత్నం చేసాను కానీ, అది వాళ్లకి అర్ధం కాలేదు.

శాకాహార భోజనం ఏమాత్రం దొరకదు. అక్కడక్కడా కొంచెం వివరంగా అడుగుదామనుకున్నా భాషా సమస్య వుండటం వల్ల అదింకా కష్టమయింది. ‘వెహిటేరియానో’ కావాలని అడిగినా, చికెన్, కొన్ని చోట్ల చేపలు వాళ్లకి శాకాహారాలే! శాకాహారాల కోసం మాలో మేమే కొంచెం హాహాకారాలు చేసుకున్నాం. మా ఆస్టిన్ నగరంలో దొరికే టెక్స్ మెక్స్ స్పానిష్ పదార్ధాలు – వెజ్జీ ఎంచిలాడ, బరీటో, వెజ్జీ కేసడీయా లాటివి వాళ్లకి అసలే తెలీదు.

చివరికి ఒక పెద్ద రెస్టారెంటులో, ఒక చిన్న వంకాయ ముక్క మీద కొంచెం ఛీజ్, దాని మీద కొంచెం పెరుగు పోసి, ఒక్కొక్క ముక్కకీ పది డాలర్లు తీసుకున్నాడు. నాలాటి శాకాహారులకి ఆపుల్ పళ్ళు, అరటిపళ్ళు లాటి సాత్విక భోజనం, బ్రెడ్డు, క్రెసాంట్లు, బిస్కత్తులు మొదలైనవి ఇక్కడ ఆరోగ్యానికి మంచివి. హిమక్రీములకి మాత్రం కొదువలేదు. వైనతేయులకి కావలసినంత వైన్. కెనేరియన్లు పూర్వజన్మలో సురాపానం చేసిన సురులై వుండాలి. స్వర్గం లాటి ఈ అందమైన ప్రదేశంలో, పులిసిన ద్రాక్ష రసం త్రాగుతూ జీవితం అనుభవిస్తున్నారు మరి!

సత్యం మందపాటి