మీటితే చాలు, పలికే మురళి!

balamurali

మంగళంపల్లి బాల మురళి గారు పరమపదించారు అన్న వార్త నేను కాకినాడలో మా ఇంటి ముందు వరండాలో వాలు కుర్చీలో కూచుని మా మామిడి చెట్టుని చూస్తూ  అమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో నాకు చెప్పిన ఆ మానవుడిని లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. ఎందుకంటే అబద్ధాలాడే వారంటే నాకు అయిష్టం.

కానీ, వెనువెంటనే అప్పుడే వచ్చిన రోజు వారీ పత్రికలూ, నేను ఇండియాలో అరుదుగా చూసే టీవీల వలన ఆ వార్త  నిజమే అని తెలియగానే నా మనసు 1968, జనవరి మూడో వారానికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బొంబాయి I.I.T లో M. Tech చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో మా కేంపస్ లో “స్వరాంజలి” అనే శాస్త్రీయ సంగీత అభిమానుల గుంపు ఉండేది. మహమ్మద్ షేక్ అనే అతను ప్రధాన నిర్వాహకుడు. సమస్య అల్లా.. ఆ గుంపు లో ఉన్న వారందరికీ భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే కేవలం హిందూస్థానీ మాత్రమే. బెంగాలీ వారి రబీంద్ర సంగీత్, మరాఠీ వారి సంగీతం మొదలైన కచేరీలు కూడా ఏర్పాటు చేసే వారు..కానీ కర్నాటక సంగీతం అనగానే చిన్న చూపుతో ఒక్క కార్యక్రమం కూడా జరగ లేదు. అప్పటికి చాలా చిన్న వయసులో ఉన్న నా దృష్టిలో వారి అవగాహనా రాహిత్యం ఒక కారణం అయితే, కేంపస్ లో ఉన్న దక్షిణ భారతీయులు కొందరు బెంగాలీ, మరాఠీ, హిందూస్థానీ సంగీతాలని ఆస్వాదించడం ప్రగతి పథంలో పయనించి తమ విశాల దృక్పథం ప్రదర్శించుకోవడంగా భావించుకునే వారు. కర్నాటక సంగీతాన్ని పట్టించుకునే వారు కాదు.

సరిగ్గా ఆ తరుణంలో మంగళంపల్లి వారు సయాన్-మాటుంగాలో ఉన్న షణ్ముఖానంద వేదికలో కచేరీ చేస్తున్నారు అనే వార్త వచ్చింది. నేనూ, నా ఆప్త మిత్రులు భాగవతుల యజ్ఞ నారాయణ మూర్తీ,  పులపాక రామకృష్ణా రావు (గాయని పి. సుశీల తమ్ముడు) ఆ కచేరీకి టిక్కెట్లు కొనేసుకున్నాం. కానీ మా కేంపస్ లో విశ్వనాథన్ గారూ (చిట్టి బాబు సహాధ్యాయిగా మంచి వీణా విద్వాంసులు), AIR మొదటి గ్రేడ్ లో అద్భుతమైన గాయని నాగరాజ మణీ నటరాజన్, ఇతర కర్నాటక సంగీతాభిమానులూ పట్టుపట్టి “స్వరాంజలి” వారిని ఒప్పించి బొంబాయి IIT కేంపస్ లో మొట్టమొదటి శాస్త్రీయ కర్నాటక సంగీత కచేరీ…బాల మురళి గారిచే చేయించే ఏర్పాట్లు చేశారు.  ఐ ఐ టి లో అనగానే బాలమురళి గారు తక్షణం అంగీకరించారు.

కానీ ఒక సమస్య వచ్చింది. ఏ కారణానికో ఇటువంటి సంగీత కార్యక్రమాలు జరిగే “లెక్చర్ థియేటర్” అనే 300 మంది పట్టే ఆడిటోరియం దొరక లేదు. అందుచేత  మా మైన్ బిల్డింగ్ లో నాలుగో అంతస్తులో ఒక సర్వ సాధారణమైన హాలులో ఈ కచేరీ ఏర్పాటు చేశారు. అంటే పెద్ద స్టేజ్ , హంగులూ, ఆర్భాటాలూ లేకుండా ఒక చాంబర్ కాన్సెర్ట్ లా అనమాట. ఒక వేపు హిందుస్థానీ పద్దతిలో రొజాయిలూ. దిండ్లు పెట్టి పాడే వాళ్లూ, వినే వాళ్లూ అందరూ నేల మీదే కూచోడమే! రాత్రి భోజనాల తర్వాత 9 గంటలకి బాలమురళి కొలువు తీరారు. ఇప్పుడు 90 సంవత్సరాల అన్నవరపు రామస్వామి గారు వయోలిన్, దండమూడి రామ్మోహన రావు గారు మృదంగం. సుమారు వంద మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు…అంతే…ఆ రోజు బాలమురళి రెచ్చి పోయారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లారగట్ట  ఒంటి గంట వరకూ..

ఆ రోజు ఆయన చేయని సంగీత విన్యాసం లేదు. చెయ్యని ప్రయోగం లేదు. పాడని కృతి లేదు. అలుపూ, సొలుపూ అసలు లేనే లేదు. మా…లేదా మన దురదృష్టవశాత్తూ ఆ రోజుల్లో కెమేరాలూ, విడియోలూ లేవు. అరా కోరా ఉన్నా ఎవరికీ అందుబాటులో లేవు. అదృష్టవశాత్తూ …నా మనోఫలకం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెరిచే ఉంటుంది..నాకు నేనే ఎప్పడు కావాలంటే అప్పుడు ఆవిష్కరించుకుంటూ ఉంటాను. గత వారం రోజలుగా నేను నలభై ఏళ్ల నా బాలమురళీ పరిచయాన్ని ఆవిష్కరించుకుంటున్నాను. ఆయనతో నా తొలి పరిచయం 1968 లో బొంబాయి లోనే!

ఆ తరువాత గత నలభై ఏళ్లుగా ..ఒకటా రెండా .కనీసం పాతిక సార్లు ఆయన కచేరీలు వినడం కానీ, నిర్వహించడం కానీ జరిగాయి. ఆ మహానుభావుడితో వ్యక్తిగత అనుబంధం పెంచుకోవడం నా పూర్వ జన్మ సుకృతం. ఆయన హ్యూస్టన్ ఎన్ని సార్లు వచ్చినా ఆయనతో కచేరీలు ఆనందించడమే కాకుండా ఆయనతో కాలం గడపడం, విహారాలకి తీసుకెళ్లడం, ఆయన చిద్విలాసంగా చెప్పే కబుర్లు వింటూ ఆనందించడం ..అవన్నీ తీపి గుర్తులే! ఆయన పోయిన మర్నాడు మా కాకినాడ సరస్వతీ గాన సభ -సూర్య కళామందిరంలో జరిగిన సంతాప సభలో నా జ్ఞాపకాలు నెమరువేసుకున్నాను. ఆయన ఆ సభకి బాలమురళి గారు గౌరవాధ్యక్షులు. అలనాటి సూర్య కళా మందిరాన్ని ఆధునీకరణ చేసి 2003 లో బాలమురళి గారే పున:ప్రారంభం  చేశారు. ఆ వేదిక బాలమురళిగారికి అత్యంత ఆత్మీయమైన వేదిక. ఆ సభలో స్థానిక ప్రముఖులు, మునుగంటి శ్రీరామముర్తి గారి కుమారులు వెంకట్రావు గారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

బాలమురళీ గారి సంగీత ప్రాభవం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కానీ, ఒక వ్యక్తిగా ఆయన హాస్య ప్రవృత్తి గురించి నేను విన్నవీ, స్వయంగా తెలిసినవీ  కొన్ని మాటలు చెప్పగలను. ఒక సారి ఒక పెద్దాయన మృదంగం నేర్చుకున్న తన కొడుకు బాల మురళి గారితో ఒక కచేరీలో వాయిస్తే చాలు. అతని కెరీర్ కి ఉపయోగపడుతుంది అని బతిమాలితే ఆయన ఒప్పుకున్నారు. కచేరీ అయ్యాక ఈ తండ్రి బాలమురళి గారిని “మా వాడికి తన్యావర్తనం అవకాశం కూడా ఇస్తారు అనుకున్నాను. అంటే కచేరీ మధ్యలో మృదంగం ప్రతిభ చూపించుకునే అవకాశం. దానికి బాలమురళి గారు “ఇవ్వకేం ..మొత్తం మూడు గంటలూ తను చేసింది తన్యావర్తనమేగా. నేనేదో పాడుతున్నాను. అతనేదో వాయించుకు పోయాడు. అంత కంటే ఏం కావాలి” అని చురక అంటించారుట.

అలాగే ఒక సారి ఆయనా, మరి కొందరూ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మీద రైలు కోసం ఎదురుచూస్తూ ఉంటే “ఫలానా రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుచుచున్నది” అని స్పీకర్ల లోంచి ఒకావిడ మెసేజ్ వినపడింది. అందరూ విసుక్కుంటూ ఉంటే బాలమురళి గారు “పాపం ఆ ఏనౌన్సర్ ని ఏమీ అనకండి. ఆవిడే ఒప్పుకుందిగా రైలు నడుచుచున్నదీ అని. రైలు పరిగెడితే సమయానికి రాగలదు కానీ నడుస్తుంటే ఆలస్యం అవదూ” అని వాతావరణాన్ని తేలిక పరిచారు.

ఆయనకీ వచ్చిన బిరుదులు కేవలం యాదృచ్చికం. ఆయనకీ అవసరం లేనివి. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ “నేను ఒక వాయిద్యం లాంటి వాడిని, మృదంగం మీద చిన్న దెబ్బ వేస్తే ఆ దరువు వినపడుతుంది. వీణ మీటితే నాదం వినిపిస్తుంది. అలాగే నన్ను మీటితే సంగీతం వస్తుంది. నాకు ఎక్కువ సాధన అక్కర లేదు. నా సహ వాయిద్యం వారికోసం సాధన చేస్తాను” అన్నారు.

అపర త్యాగరాజు, కర్నాటక సంగీతానికి, యావత్ భారతీయ సంగీతానికి రారాజు శ్రీ మంగళంపల్లి బాల మురళి గారి కి ఇదే నా ఆత్మీయ నివాళి.

*

 

 

హ్యూస్టన్ లో అడుగు పెట్టిన వేళా విశేషం…!

 

గత సెప్టెంబర్ 2-3-4, 2016 తేదీలలో మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాలు దిగ్విజయంగా జరిగాయి. కేవలం $350,000 బడ్జెట్ తో మిలియన్లు ఖర్చుపెట్టి జాతీయ సంఘాలు ప్రతీ ఏడూ జరిపే జాతర్ల స్థాయిలో ఈ సంబరాలు జరిగాయి. అంటే సినిమా తారలు, రాజకీయ నాయకులూ, (అప) హాస్య గాళ్లూ, తదితర దిగుమతి చేసుకున్న వారికి పెద్ద పీట వేసినా, స్థానికులకి కూడా చోటు దొరికింది. ఆ  నలభై ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా టీసీయే పుట్టిన క్షణం నుంచీ ఈ నాటి వరకూ టీసీయే తో నాకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆ తొలి దశకంలో నా జ్ఞాపకాలు కొన్ని పంచుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.  ఇందులో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చును. కొందరు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం మర్చిపోయి ఉండ వచ్చును. ప్రస్తావించిన వారి అందరి కృషీ తగిన స్థాయిలో నేను వ్రాసి ఉండక పోవచ్చును. ఆ నాడు అందరూ సమానులే కానీ ఎవ్వరూ ఎక్కువ సమానులు కాదు. అన్ని తప్పోప్పులకీ నేనే పాపాల భైరవుడిని కాబట్టీ, ఏదీ బుద్ది పూర్వకంగా చేసిన పొరపాటు కాదు కాబట్టీ పెద్ద మనసు తో ఈ చిన్న వాడిని మన్నించమని ముందే మనవి చేసుకుంటున్నాను. అలాగే నా ‘సొంత డబ్బా’ ఎక్కువగా వినపడితే కాస్త వాల్యూమ్ తగ్గించుకోండి.

నా హ్యూస్టన్ ‘‘రంగ ప్రవేశం”

van1అప్పుడు హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. మా తమ్ముడు చికాగోలో ఉండే వాడు కాబట్టి నేను అప్పటికి మూడు నెలల ముందు ఇండియా నుంచి ఆ ఊళ్ళో అడుగుపెట్టాను – జేబులో బొంబాయి లో యు.ఎస్. కాన్సలేట్ వారు నన్ను మెచ్చి ఇచ్చిన గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్, భారత ప్రభుత్వం వారు దయతో మంజూరు చేసిన అక్షరాలా ఎనిమిది డాలర్లు, ఐదారు చొక్కాలు, చెడ్డీలు, పంట్లాలు, నా ఐఐటి డాక్టరేట్ పట్టా తో అన్నీ సద్దుకున్న రేకు పెట్టె…అదీ నా మొత్తం ఆస్తి. చికాగోలో ఆ రెండు నెలలలోనూ ఆర్ధిక మాంద్యంలో ఇరుక్కున్న ఆ ప్రాంతాలలో ఉద్యోగ సద్యోగాలు మనకి దొరకవు అని అర్థం అయిపోయింది. అప్పటికి చికాగోలో నాకు మంచి మిత్రుడు ప్లంజేరి శంకర్ “టెక్సస్ బాగా బూమింగ్ గా ఉంది. అక్కడికి వెళ్లి ట్రై చెయ్యి “ అని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో అమెరికా చలి ప్రాంతాలు ఆర్ధిక మాంద్యంలో ఉంటే టెక్సస్ లాంటి ఆయిల్ ఎకానమీ రాష్ట్రాల ఎకానమీ పుంజుకునేది. అంచేత నా లాగా నిరుద్యోగులుగా ఉన్న తణుకు తాలూకు ఈమని శాస్త్రి, అతని తమ్ముడు రఘురాం, (వీళ్ళిద్దరూ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో బాగా జూనియర్లే కానీ అక్కడ తెలియదు.) బసంత్ పట్నాయక్ అనే ఒరియా స్నేహితుడు ఆ రోజు సాయంత్రమే ఓ చిన్న కారులో మాకున్న ఆస్తులన్నీ “డిక్కీలో పడుకోబెట్టేసి” ఎక్కడా ఆగకుండా 24 గంటలలో హ్యూస్టన్ వచ్చేశాం. మాలో ఎవరికీ హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. అది 1975 మార్చ్ నెలలో ఓ రోజు -41 సంవత్సరాల క్రితం.

ఆ రాత్రి హిల్ క్రాఫ్ట్ అనే రోడ్డు  -ఇప్పుడు ఆ ప్రాంతం లిటిల్ ఇండియా – మీద ఓ రెండు రోజులు కారులోనే పడుకుని, ఇక లాభం లేదు గురూ అనుకుని ఎవరైనా ఇండియన్ కుర్రాళ్ళు ఉండక పోతారా అని రైస్ యూనివర్సిటీకి వెళ్లి వాకబు చేశాం. అనుకున్నట్టుగానే అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు కనపడగానే పరిచయం చేసేసుకున్నాం. వాళ్ళలో మా దగ్గర బంధువు – కేంపస్ లో ఒకే ఒక్క తెలుగు విద్యార్థి కూడా ఉండడం కేవలం యాదృచ్చికం.

ఆ తరువాత నా వ్యక్తిగత జీవితం ఎన్ని ఒడుదుడుకులని ఎదుర్కొన్నా, అప్పుడు జరిగిన అతి ముఖ్యమైన విషయం తలచుకుంటే ఇప్పటికీ మహానందం వేస్తుంది.  ఓ రోజు సొంతంగా వండుకునే వంట తిన లేక విసుగొచ్చి రైస్ యూనివర్సిటీ లో డాక్టరేట్ చేస్తూ మిత్రులు అయిపోయిన మా బంధువు కుంటముక్కుల మూర్తి, గౌరంగ్ వ్యాస్, పట్నాయక్ కి మిత్రుడు , తోటి భువనేశ్వర్ వాడు అయిన మహంతీ “ఇక్కడే ఉన్న మహారాజా అనే ఇండియన్ రెస్టారెంట్ కి వెడదామా?” అనుకుని…ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క వేసుకుని మొత్తం పదిహేను డాలర్లు జమ అవగానే “పరవా లేదు. అక్కడ ఇడ్లీకి, కాఫీకీ సరిపోతాయ్ అందరికీ” అని యూనివర్సేటీ దగ్గరే టైమ్స్ బులావార్డ్ మీద ఉన్న మహారాజా రెస్టారెంట్ కి వెళ్ళాం. లోపలకి అడుగుపెట్టగానే ఒకాయన “వెల్ కం” అని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతూ అతని మొహం చూసి ఆశ్చర్య పోయాను…ఎక్కడో చూశానే..ఎక్కడ చెప్మా అని బుర్ర గోక్కుని “మీ పేరు ఏమిటి సార్” అని ఇంగ్లీషులో అడిగేశాను. “అనిల్ కుమార్” అని వెంటనే అతను కూడా నాకేసి అనుమానంగా చూశాడు. ఇంచు మించు ఇద్దరం ఒకే సారి “గురూ, నువ్వా” అంటే “హారినీ, నువ్వా ఇక్కడేమిటీ ?  అనేసి కావలించుకుని ఒకరినొకరు గుర్తు పట్టేసుకున్నాం.  విషయం ఏమిటంటే ఈ అనిల్ కుమార్ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఏడాది సీనియర్. కాలేజ్ ప్రోగ్రాములలో నిహార్ అనే కాశ్మీరీ కుర్రాడు ఎకార్దియన్ వాయిస్తూ ఉంటే ఇతను డ్రమ్స్, బేంగోస్ లాంటివి వాయించే వాడు. అప్పుడప్పుడు అరుపులూ, పెడ బొబ్బలతో “మోసేసే వాళ్ళం”. ఆ రోజుల్లో ఎక్కువ పరిచయం లేదు కానీ ముఖ పరిచయం బాగానే ఉంది. అందుకే పదేళ్ళయినా ఇప్పుడు ఒకరినొకరు గుర్తు పట్ట్టగలిగాం. ఆ రోజుల్లో యావత్ టెక్సస్ రాష్ట్రం అంతటికీ ఈ మహారాజా ఒక్కటే ఇండియన్ రెస్టారెంట్ అంటే ఈ రోజుల్లో నమ్మ బుద్ది కాదు. అనిల్ తో పాటు దువ్వూరి సూరి, శేష్ బాల, వెంకట్ కలిసి సరదాగా ఈ రెస్టారెంట్ మొదలుపెట్టి ఎవరికీ వ్యాపారానుభావం లేక కొన్నాళ్ళకి మానేశారు. ఇప్పుడు సరిగ్గా అదే చోట “శివ” అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది.

ఆ విధంగా నాకు హ్యూస్టన్ లో పరిచయం అయిన మొదటి తెలుగు వక్తి అనిల్ కుమార్. అప్పటి నుంచీ గత ఏడాది పరమపదించేదాకా అనిల్ కుమారే నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు.

హ్యూస్టన్ లో తొలి తెలుగు వారు

van2

టెక్సస్ అనగానే గుర్రాలూ, తుపాకులూ , పేద్ద పది గేలన్ల టోపీలూ అనుకుని, ఇవన్నీ మనకెందుకులే అనుకుని భారతీయులు, అందునా తెలుగు వారు అమెరికాలో ఇతర రాష్టాలకి మాత్రమే వలస వరస కట్టిన రోజులలో, విశాఖపట్నానికి చెందిన (స్వర్గీయ) దువ్వూరి అచ్యుత అనంత సత్య నారాయణ రావు గారు , కుటుంబ సమేతంగా , ఆస్ట్రేలియా, కెనడాలలో చదువు తరవాత  హ్యూస్టన్ లోని టెక్సస్ సదర్న్ యూనివర్శిటీలో ఫిజిక్స్ విభాగం ప్రారంభించడానికి 1957 లో హ్యూస్టన్ వచ్చారు. ఆయనే టెక్సస్ కి, అమెరికా లోని ఇతర దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి తెలుగు వారు.

ఆ తరువాత పదేళ్ళలో 1970 నాటికి పట్టిసపు రామజోగి గంగాధరం గారు, పోతు నరసింహారావు గారు మొదలైన కుటుంబీకులూ, అనిల్ కుమార్, మణ్యం మూర్తి, గుంటూరు సీతాపతి రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావు, చింతపల్లి అశోక్ కుమార్ లాంటి బ్రహ్మచారులూ వెరసి ఇంచుమించు 20  మంది తెలుగు వారు హ్యూస్టన్ లో నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పుడు అందరూ ముందు భారతీయులూ, తరవాతే తెలుగు వారు. భారతీయులందరూ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో కలుసుకుని హిందీ సినిమాలు వేసుకునీ, పిక్నిక్స్ జరుపుకునే వారు. తెలుగు పండుగలకీ, తెలుగులో మాట్లాడుకోవడానికీ నారాయణ రావు గారు, నరసింహా రావు గారూ, గంగాధరం గారి ఇళ్ళలో అందరూ కలుసుకునే వారు. వారందరి “లివింగ్ రూము” లే ఆ నాటి తెలుగు సాంస్కృతిక వేదికలు. ఆ నాటి తొలి తెలుగు వారిలో చాలా మంది ఇప్పటికీ హ్యూస్టన్ లోనే ఉండడం, అందులో కొంత మంది ఇంకా ఈ నాటి మన తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పుకోదగ్గ విశేషమే!

1975 ప్రాంతాలకి హ్యూస్టన్ లో ఇంచుమించు యాభై మంది తెలుగు వారు సమకూడారు. వారిలో నాటకాలూ, శాస్త్రీయ సంగీతమూ, కూచిపూడి నృత్యమూ మొదలైన కళలలో అతున్నతమైన మంచి ప్రావీణ్యం ఉన్న ఐదారుగురు కళాకారులు కూడా ఉండడంతో, అందరూ మామూలుగా కలుసుకోవడం, పండగలు చేసుకోవడమే కాకుండా, ఏదో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండేవి. అవన్నీ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, టెక్సస్ సదరన్ యూనివర్శిటీ లేదా మెడికల్ సెంటర్ ఉన్న హాళ్ళలో జరిగేవి. అప్పటికే అమెరికా ఇతర పెద్ద నగరాలలో తెలుగు సంఘాలు, వాటితో చిన్న, చిన్న రాజకీయాలు మొదలయ్యాయి. నాకూ బొంబాయి లో ఉన్న అనుభవంతో మనకి ఇక్కడ కూడా ఒక తెలుగు సమితి ఉంటే బావుంటుంది అనే ఆలోచన లేవనెత్తాను. అంతకు ముందు కూడా ఆ ఆలోచనలు వచ్చాయి కానీ, ఒక తెలుగు సంఘం నిజంగా అవసరమా, ఒక వేళ తెలుగు సంఘం పెట్టుకుంటే, రాజకీయాలకి అతీతంగా దాన్ని ఎలా తీర్చిదిద్దాలనీ అని ఒక ఏడాది పాటు రకరకాల చర్చలు జరిగాయి. మొత్తానికి 1976 లో  తెలుగు సాంస్కృతిక సమితి అనే పేరుతో హ్యూస్టన్ లో లాభాపేక్ష లేని సంస్థగా వెలిసింది. ఆ సమితి ఆశయాలనికీ, నిర్మాణ నిబంధనావళి రచించడానికీ దువ్వూరి నారాయణ రావు, పోతు నరసింహా రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావులతో ఒక కమిటీ చెయ్యబడింది. వారు అందరితో చర్చలు జరిపి, అప్పటికే దేశంలో ఉన్నమూడు, నాలుగు తెలుగు సంస్థల తీరుతెన్నులూ, సమస్యలూ పరిశీలించి తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి “రాజ్యాంగం”…అంటే “ప్రారంభ నిబంధనలు, సూత్రాలు” ..అంటే Constituition ప్రచురించారు. వంగూరి చిట్టెన్ రాజు తెలుగులో  అక్షరరూపం కలిగించి, హ్యూస్టన్ లో ఉన్న తెలుగు వారందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ  క్రింది తొలి పత్రంలో తెలుగు సాంస్కృతిక సమితి ఆశయాలు:

“తెలుగు భాష మీద తెలుగు సంస్కృతి మీద అభిమానము, అభిరుచి గల వ్యక్తుల సమన్వయమీ తెలుగు సాంస్కృతిక సమితి. లాభాపేక్ష, రాజకీయ విషయములలో జోక్యము చేసుకునే ఆసక్తి లేనిదిది. సభ్యులు తరచు కలుసుకొనుటకు, తెలుగు సంస్కృతికి సంబంధించిన కార్యకలాపములలో పాల్గొనుటకు అవకాశాములను కల్పించుటే ఈ సమితి ప్రధానాశయము. ఈ ప్రాంతములోని తెలుగు వారి సమైక్యతను పెంపొందించి, వారి సంస్కృతికి సంబంధించిన అవసరములు తీర్చుటయే కాక ఆ సంస్కృతిని తెలుసుకోవాలనే ఆపేక్షగల హ్యూస్టన్ మహానగర నివాసుల వాంఛాసాఫల్యమునకు కూడా ఈ సమితి తోడ్పడుతుందని ఆశించవచ్చును”

ఈ కమిటీ వారు మన సాంస్కృతిక సమితికి “అధ్యక్షులు” అనే పదవి అధికారకాంక్షను పెంచే విధంగా ఉండి, రాజకీయాలకు దారి తీస్తుందని భావించి, సమితి  సభ్యులందరూ కలసి ఏడుగురు వ్యక్తులను  నిర్వాహక వర్గం  సభ్యులుగా ఎన్నుకోవాలనీ, ఆ ఏడుగురూ తమలో తామే ఒకరిని “సమన్వయ కర్త” గానూ, మరొకరిని “సహ సమన్వయ కర్త” గానూ నిర్దేశించుకుని, సమితి కార్యకలాపాలన్నింటినీ సమిష్టిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం, 1977 జనవరిలో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి కార్యనిర్వాహక వర్గానికి  కోనేరు తాతయ్య సమన్వయ కర్త గానూ, వంగూరి చిట్టెన్ రాజు (నేను) సహ సమన్వయ కర్త గానూ, పుచ్చా వసంత లక్ష్మి, పోతు రాజేశ్వరి, తుమ్మల కుటుంబ రావు, పట్టిసపు గంగాధరం, కొడాలి సుబ్బారావు, తమ్మారెడ్డి చంద్ర శేఖర రావు  గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మొదటి ఉగాది: -1977

”కాళయుక్త” నామ సంవత్సర ఉగాది (1977) మన మొట్టమొదటి అధికారిక కార్యక్రమం. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, స్ట్యూడెంట్ సెంటర్ మూడవ అంతస్తులో ఉన్న హ్యూస్టన్ రూమ్ లో జరిగిన ఆ నాటి తొలి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులలో కొందరు పొలాని జానకి రామయ్య & శారద, బిలకంటి గంగాధర్, రవి తమిరిశ, కిరణ్ తమిరిశ, పుచ్చా వసంత లక్ష్మి & మల్లిక్, రత్నపాప & అనిల్ కుమార్, వంగూరి చిట్టెన్ రాజు, కామేశ్వరీ గంగాధరం, రూపా కోనేరు, రఘు చక్రవర్తి, చావలి రామసోమయాజులు & బాల, చేగు లలిత,  విజయ మరియు రాధ దేవరకొండ, దువ్వూరి సూరి & హీరా, గొల్లపూడి మణి, రేణుకా రెడ్డి, తోట రాణి & సూర్యారావు, సూర్యకుమారి & మహాబలి రాజా, జానీ బేగమ్ & మస్తాన్ వాలీ, తుమ్మల కుటుంబ రావు & కుసుమ  మొదలైన వారు. ఆ తొలి రోజులలో నాకు జ్ఞాపకం ఉన్న అప్పటి తెలుగు వారు కొడాలి సుబ్బా రావు, అనంతనేని ప్రకాశ రావు, కేశవరావు, గోగినేని రమేష్, కొడాలి సూర్యం, ఏలూరు గోపాల కృష్ణ, రేణుకా రెడ్డి, అడవల్లి జనార్ధన రెడ్డి, గోగినేని సుబ్బారాయుడు మొదలైన వారు. ఎవరి పేర్లు అయినా మర్చిపోతే నన్ను మన్నించాలి. ఆ రోజుల్లో పదేళ్ళ లోపు చిన్న పిల్లలు రాధ తమిరిశ, గిరీష్ పుచ్చా, కల్యాణి పొలాని, హరి రాజా, మాధవి చావలి మొదలైన ఐదారుగురు మాత్రమే.

van3

ఈ కార్యక్రమంలో యావత్ అమెరికాలోనే మొట్ట మొదటి తెలుగు సాంఘిక నాటకం వేశాం. ఆ హాస్య నాటిక  “బామ్మాయణం అను సీతా కల్యాణం “ నేనే అంతకు నాలుగేళ్ల ముందు బొంబాయిలో ఉన్నప్పుడు వ్రాశాను. ఇక్కడ వేసినప్పుడు నేను బామ్మ వేషం, అనిల్ కుమార్, మోహన రావు బ్రహ్మచారులు, దువ్వూరి నారాయణ రావు గారు పరంధామయ్య పాత్ర వేశారు.

ఆ తరువాత మే 28-29, 1977 లో న్యూయార్క్ లో “ప్రప్రధమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం” జరిగింది. దానికి మన సమితి తరఫున రత్న పాప, అనిల్, సూరి, నేనూ వెళ్లాం. ఇక్కడ ఒక తమాషా విషయం చెప్పాలి. అప్పుడే మొదలయిన మన సమితికే కాదు, ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు కాబట్టి ఓ పాట్ లక్ డిన్నర్ పెట్టి, అందరినీ పిలిచి, ప్లేటుకి పాతిక రూపాయలు విరాళం పెడితే  ఓ అరవై మంది వస్తారు కదా…వారి విరాళాలతో అప్పుడు అందరినీ టీసీయే స్పాన్సర్ చెయ్యవచ్చును అనే ఆలోచన వచ్చింది. ఓ క్లబ్ హౌస్ లో ఏర్పాట్లు చేసి అందరినీ పేరు, పేరునా పిలిచాం. దానికి సూర్య కుమారి, దేవరకొండ సుబ్బలక్ష్మి, వసంత, బాల, హీరా, మరో ఇద్దరు ముగ్గురు మొత్తం వంట అంతా చేసి పట్టుకొచ్చారు. తీరా చూస్తే ఆ వంట చేసి పట్టుకొచ్చిన కుటుంబాలు, నా బోటి బ్రహ్మచారులం నలుగురమూ తప్ప పట్టుమని పది మంది కూడా రాలేదు. చచ్చినట్టు మేమే ప్లేటుకి వంద డాలర్ల చొప్పున కొనుక్కుని, ఏడవ లేక జోకులేసుకుంటూ మా టిక్కెట్లు మేమే కొనుక్కున్నాం!

ఆ న్యూయార్క్ సభలలో సూరి, అనిల్, నేనూ బొబ్బిలి యుద్దం బుర్ర వేశాం. నేనే వ్రాశాను. అమెరికాలో ఆ మొట్ట మొదటి బుర్ర కథ. అందులో మా ఒరిజినల్ హాస్యం గురించి అప్పటి వారు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ ఫోటోలు ఇక్కడ జతపరిచాను. న్యూయార్క్ లో మరో విశేషం ఇండియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన సీత-అనసూయ పాడుతుండగా వాళ్ళమ్మాయి, మన రత్న పాప “మొక్క జొన్న తోటలో” జానపద నృత్యం అత్యద్భుతంగా చెయ్యడం. మరో విశేషం ఆ సభల లోనే అమెరికా మొత్తానికి ఒక “అంబ్రెల్లా’ సంస్థ ఉండాలని అందరం అందుకుని, దానికి రూప కల్పన చెయ్యడానికి ఏడుగురు సభ్యులతో ఒక గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎన్నుకోవడం. వారిలో నేను ఒకడిని. దాని ఫలితమే తానా సంస్థ ఆవిర్భావం.

తెలుగు డైరెక్టరీ

1979లో అనుకుంటాను. ఇక్కడ తెలుగు వారందరికీ ఉత్తరాలు పంపించి సమాచారం అందించడానికి ఒక డైరెక్టరీ తయారు చేసుకోవలసిన అవసరం వచ్చింది. నేనూ, మల్లిక్, కొడాలి సుబ్బారావూ ఆనాటి టెలిఫోన్ డైరెక్టరీ లో ఒక్కొక్కళ్లూ  సుమారు వంద  పేజీలు చొప్పున  పంచుకుని, వాటిల్లో ఎక్కడైనా రావు, రెడ్డి, శాస్త్రి మొదలైనవే కాక ఏ మాత్రం తెలుగు ఇంటి పేరులా కనపడిన వారందరినీ పిలిచి, అయిన వాళ్లకి తెలుగు సమితిని పరిచయం చేసి, తెలుగేతరుల చేత చివాట్లు తిని, మొత్తానికి ఆరు నెలలలో ఒక సమగ్రమైన డైరెక్టరీ తయారు చేశాం. దాన్ని అశోక్ కుమార్ భార్య మేరీ ఎగ్నెస్ టైప్ చేసి పెటింది. మొత్తం 154 పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలతో సహా. ‘మాకు ఇలాంటివి అక్కరలేదు’ అన్న తెలుగు బుద్ధి  వాళ్ళు ఆ రోజుల్లో పదుల సంఖ్యలో ఉంటే ఈ నాడు వేల సంఖ్య లోఉన్నారు.

అప్పట్లో ఇంకా అంత ప్రాముఖ్యం లేని షుగర్ లాండ్ , కేటీ, సైప్రస్, క్లియర్ లేక సిటీలలో తెలుగు వారు లేరు. అందరూ మెడికల్ సెంటర్ చుట్టు పక్కలా, సౌత్ వెస్ట్ లోనూ ఉండేవారు.

మధురవాణి ప్రారంభం:

అప్పట్లో, ఇప్పటిలా తెలుగు సంస్కృతికి సినిమా పర్యాయపదం కాదు. సంస్కృతి అనగానే భాష, సాహిత్మం, నృత్యం, సంగీతం అనే అర్థాలు ఉండేవి. శాస్త్రీయ నృత్యాలకి ..అందునా కూచిపూడి ప్రాభవానికి రత్నపాప 1975 లోనే స్థాపించిన అంజలి సెంటర్ ఫర్ పెఫార్మింగ్ ఆర్ట్స్ ఎలాంటి డాన్స్ లకైనా సరే…కేంద్ర బిందువు. ఆ తరువాత కోసూరి ఉమా భారతి మరింత విస్తరింప చేశారు. సంగీతానికీ, జానపద సంగీతానికీ, మంచి సినిమా పాటలకీ –కెవ్వు కేక బాపతు కానే కాదు- హీరా & సూరి, వసంత, చావలి బాల, సుసర్ల కుమారి, పొలాని జానకి రామయ్య, శారద, బిలగంటి గంగాధర్, తుమ్మల కుటుంబ రావూ, అప్పుడప్పుడు నేనూ పాడేవాళ్ళం. అన్ని కార్యక్రమాలకీ రవి తమిరిశ, రఘు చక్రవర్తి తబలా, మృదంగం వాయించే వారు. 1978 లో సీత -అనసూయ హ్యూస్టన్ వచ్చినప్పుడు వాళ్ళ చేత స్టూడియో లో రికార్డింగ్ చేయించి ఒక 78 RPM గ్రామఫోన్ రికార్డు విడుదల చేశాం. అదే అమెరికాలో మొదటి తెలుగు ఆల్బం. 1980 లలో చంద్ర కాంత డేవిడ్ ల రాక పాటకి పట్టం కట్టింది. మరి కొన్నేళ్ళ తరువాత అనుకుంటాను ఉమా మంత్రవాది, మణి శాస్త్రి మన సమితి సంగీత స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు.

ఇక భాషా సాహిత్యాలకి ఏం చెయ్యాలా అనుకున్నప్పుడు నాకు తట్టిన ఆలోచన ఒక పత్రిక ప్రారంభించడం, వెను వెంటనే ఆ ఆలోచన అందరికీ నచ్చడం, కేవలం సంస్థాగత సమాచారాన్ని అందించే వార్తా పత్రికల కాకుండా దాని సాహిత్య పత్రికగా తీర్చిదిద్డాలి అని “మధుర వాణి” అని నామకరణం చేసి మొదటి సంచిక 1978 ఉగాది ప్రత్యేక సంచికగా వెలువరించాం. సుమారు యాభై పేజీలు  అంతా నా చేతి వ్రాతలోనే.  ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ క్సీరాక్స్ యంత్రాలు ఉండేవి కాదు. ఉన్నా పేజీకి రెండు డాలర్లు ఖరీదు. అంచేత నేను శని, ఆదివారాలు అప్పుడు నేను పనిచేసే పెద్ద కంపెనీ ఆఫీసుకి వెళ్లి పోయి దొంగతనంగా వాళ్ళ పెద్ద క్సీరాక్స్ మీద యాభై కాపీలు తీసేశాను. ఇంచు మించు 1980 దాకా అదే తతంగం. ఆ మొదటి సంచిక నుంచి సుమారు పదేళ్ళు నేనే మధుర వాణి ప్రధాన సంపాదకుడిని. వసంత, హీరా, కలపటపు వేణుగోపాల్, చావలి రామం, శౌరి నందగిరి మొదలైన వారు సంపాదకులు. ముత్యాల సీత ముఖ చిత్రాలు వేసేవారు. ఆనాటి మధురవాణి తొలి సంచికల   ముఖ చిత్రాలు కొన్ని, లోపలి పేజీల నుంచి కొన్నీ ఇందుతో జతపరుస్తున్నాను. 1984 లో వావిలాల కృష్ణ శాస్త్రి మధుర వాణి ని ఇండియాలో టైప్ చేయించి ముద్రించారు. తరువాత, మరో ఐదేళ్లకి చిక్కి శల్యమై, మరో పదేళ్ళకి ఇంటర్నెట్ ప్రభావంలో మదుర వాణి అంతరించింది. కానీ ఇటీవలే హ్యూస్టన్ లో కొందరు ఔత్సాహికులు అదే పేరిట అంతర్జాల సాహిత్య పత్రికని ప్రారంభించి, మళ్ళీ ప్రాణం పొయ్యడం మళ్ళీ పుట్టినంత  సంతోషంగా ఉంది అని వేరే చెప్పక్కర లేదు కదా!

ఆ నాటి తెలుగు నాటకాలు

పైన పేర్కొనట్టు 1977 లో మొదటి తెలుగు నాటకం వేశాక, మరో పది, పదిహేనేళ్ళు ఏడాదికి కనీసం ఒక్కటైనా ఒక మంచి నాటకం ఉగాదికో, దసరా, దీపావళికో వేసే వాళ్ళం. అవి నేను వ్రాసినా, ఎవరు వ్రాసినా, అన్నింటిలోనూ నా పాత్ర ఉండి తీరవలసినదే! 90 శాతం అనిల్ డైరెక్ట్ చేసే వాడు. మా ఇద్దరిదీ నూటికి నూరు పాళ్ళు ఒకే పంథా. రిహార్సల్స్ లో రెచ్చి పోయి ఆనంద పడేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో మేము కొనుక్కోగలిగే అత్యంత చవక రకం ద్రావకం – బక్ హార్న్ అనే బీర్. అది 99 సెంట్ల కి 12 డబ్బాలు. రుచి వర్షం నీళ్ళలో వేప రసం పిండినట్టు ఉండేది. మేము ఎన్ని కౌనుక్కుని తంటాలు పడినా ఆ కంపెనీ దివాళా తియ్యడానికి ఎక్కువ కాలం పట్ట లేదు.

van5

1975-85 కాలంలో అన్నీ జ్ఞాపకం లేవు కానీ మేము వేసిన నాటకాలలో కొన్ని కుక్క పిల్ల దొరికింది (రావు కొండల రావు), వాంటెడ్ ఫాదర్స్ (ఆదివిష్ణు), ఇల్లు అమ్మ బడును (డి.వి. నరసరాజు), గుండెలు మార్చ బడును (జంధ్యాల). నేను వ్రాసినవి “మగ పాత్ర లేని నాటిక”, ఆఠీన్ రాణి”, “యమ సభ” మొదలైనవి. నాటకం వెయ్యని కార్యక్రమంలో నేను ఏదో ఒక ఏక పాత్రాభినయనం చేసే వాడిని. అందులో జ్ఞాపకం ఉన్నవి “గిరీశం”, “ఎస్ట్రోనాట్ ఆర్ముగం”, “ఈ నాటి దుర్యోధనుడు”, “పోలీస్ వెంకట స్వామి”, “నాదెళ్ళ భాస్కర రావు”,  “యమ సభ” మొదలైనవి. వీటన్నిటిలోనూ నటీ నటులు నేనే కాక, అనిల్, వసంత, ముత్యాల సీత, సత్య ప్రభ రెడ్డి, స్వరూప్ రెడ్డి, రఘు చక్రవర్తి, చార్వాక, అశోక్ కుమార్, కోనేరు ఆంజనేయులు, ఎ.వి,ఎన్. రెడ్డి, జగన్నాథ శాస్త్రి, మణి, వెంకట్ ముక్కు, మోహన్ రావు, చివుకుల కృష్ణ, నారాయణ రావు గారు, కంచెర్ల సుభాష్, బాబ్జీ రావు, కనకం బాబు, పొలాని కల్యాణి, హరి రాజా, దేవరకొండ రమేష్, బళ్లారి పావని మొదలైన వారు. ఇవి కాక సుమారు పదేళ్ళ పాటు ప్రతీ ఉగాది కార్యక్రమం నా హాస్య పంచాంగ శ్రవణం తోటే ప్రారంభం అయ్యేది. ఆ మాట కొస్తే మా నాటకాలు, ఏకపాత్రాభినయనాలూ, అన్నీ హాస్య ప్రధానమే! మధ్య మధ్యలో తెలుగు సామెతలకి చిన్న చిన్న నాటికలు రాసుకుని ప్రేక్షకులని ఆ సామెత ఏమిటో చెప్పమని పోటీ పెట్టె వాళ్ళం.

van4

van6

తెలుగు బడి, తెలుగు గ్రంధాలయం

1980 ల నాటికి పిల్లలకి తెలుగు నేర్పాలి అనే తపన మొదలయింది. దాని ఫలితంగా ముత్యాల సీత, చావలి రామ సోమయాజులు, కలపటపు వేణుగోపాల రావు ల ఆధ్వర్యంలో తెలుగు బడి నిర్వహణ మొదలయింది. రెండు ప్రాంతాలలో జరిగేది అని జ్ఞాపకం. ఇండియా నుంచి తెలుగు వాచికాలు తెప్పించుకుని ఇక్క గరాజ్ లలో ప్రతీ వారాంతం లోనూ ఈ తరగతులు నిర్వహించే వారు. భాష నేర్పడంతో బాటు పిల్లలకి నీతి పద్యాలూ, పాటలూ నేర్పేవారు.

అలాగే తెలుగు పుస్తకాలు చదవదల్చున్న వారికి నవలలు, కథ పుస్తకాలూ సేకరించి కలపటపు వేణుగోపాల్ కారులో పెట్టుకుని ప్రతీ కార్యక్రమానికీ తీసు కొచ్చి ఒక సంచలన గ్రంధాలయం నిర్వహించే వారు. ఐదారేళ్ళ తరువాత కాలంలో కమిటీలలో ఈ ఆసక్తి కనపడ లేదు.

ప్రముఖుల సందర్శనం

 

నాకు తెలిసీ 1973 ప్రాంతాలలోనే వాణిశ్రీ,  గుమ్మడి, రాజ్ బాబు మొదలైన వారు హ్యూస్టన్ రావడమే ప్రముఖుల రాకకి తొలి మెట్టు. ఇక్కడ నాకు అశోక్ కుమార్ చెప్పిన జోక్ ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఇక్కడికి రాగానే వాణిశ్రీ “అసలు డేటింగ్ అంటే ఏమిటీ, ఎలా ఉంటుందీ?: అని అడిగిందిట అమాయకంగా. అప్పుడు అశోక్ కుమార్ బేచలర్ కాబట్టి అతను వాణిశ్రీ ఒక్క దాన్నీ రెస్టారెంట్ కి డేటింగ్ కి తీసుకెళ్లాడుట. వెనక్కి వచ్చాక “ఓస్ ఇంతేనా డేటింగ్ అంటేనూ? ఇంకా ఏమిటో అనుకున్నాను“ అందిట. ఈ జోక్ కి ఇప్పటికీ నవ్వుకుంటాం మా తరం వాళ్ళం!

 

1975-85 దశకంలో హ్యూస్టన్ వచ్చి, మన ఆతిధ్యం స్వీకరించిన ప్రముఖుల వివరాలు TCA History At a Glance లో చూడ వచ్చును. ప్రత్యేకంగా గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా, ఎంత మంది వచ్చినా అందరికీ ఆతిధ్యం మా ఇళ్ళ లోనే.  వంటలు మావే! హోటళ్ళు, కేట రింగు లాంటి మాటలు ఎప్పుడూ విన లేదు. అందుకే నా బోటి వారికీ వారందరూ వ్యక్తిగతంగా మిత్రులయ్యారు.

వ్యాస విస్తరణ భయం చేత వారి వెనకాల కథలు వ్రాయడం లేదు. వీలుంటే 50వ వార్షికోత్సవ సంచికలో వ్రాస్తాను…

van7

 

ఆ నాటి తెలుగు సినిమా ప్రదర్శనలు

ఆ రోజుల్లో తెలుగు మాట వినడానికి ఎవరో ఒకరికి ఫోన్ చెయ్యడం ఒకే ఒక్క మార్గం. టీవీలలో, రేడియోలలో, సినిమాలలో, పేపర్లలో, బయట నూటికి నూరు పాళ్ళు అమెరికా ఇంగ్లీషు వాతావరణమే. ఆ పరిస్థితులలో ఎలాగైనా, ఎంత చెట్టది అయినా సరే…ఒక్క సారి తెలుగు సినిమా చూడగలిగితే ఎంత బావుంటుందో అని ఆ తరం వారు పడిన తపన, దానికి పడిన కష్టాలు స్మార్ట్ ఫోన్ లో సినిమాలు చూసి స్టెప్పులు వేసే వారు అధిక సంఖ్యాకులలో ఉన్న ఈ తరం వారికి అర్థం కాదు. అప్పుడప్పుడు అమెరికాలో ఎక్కడో అక్కడ తెలుగు సినిమా వేశారూ అంటే ఆ వార్త దావానలంలా వ్యాపించి పోయేది అన్ని ఊళ్లకీ. అది 35 mm సినిమా అయితే ఎంత ఇష్టమో వెయ్యడం అంత కష్టం…ఎందు కంటే ఒకే ఒక్క షో వెయ్యడానికి సినిమా హాలు వాళ్ళు నిరాకరించే వారు. ఇక రెండో మార్గం 16 mm సినిమాలు. ఈ ఫిల్మ్ సైజు లో సినిమాలు ఆ నిర్మాత ప్రత్యేకం విదేశాలకోసం తయ్యారు చేస్తే కానీ దొరకవు. బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు , సినిమా ఇండస్ట్రీ తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికా నుంచి ఇండియా వెళ్లి దొరికిన ప్రింట్స్ వారి స్తోమతకి తగ్గవి కొనుక్కొచ్చి అన్ని నగరాలకీ పంపిణీ చేసేవారు. ఆ ప్రింట్ ఖరీదు ఐదారు వేల డాలర్లు ఉండేది కాబట్టి ఆ పెట్టుబడి వెనక్కి రాబట్టు కోడానికి అవస్త పడే వారు.

కానీ తెలుగు సినిమా మీద అభిమానం కొద్దీ, లాభాలు ఆశించకుండా మాయా బజార్, మిస్సమ్మ లాంటి సినిమాల 16 mm ప్రింట్స్ కొనుక్కొచ్చి న వారిలో గర్వించదగ్గ వ్యక్తి మన హ్యూస్టన్ నివాసి డా. రవి తమిరిశ గారే! ఆ సినిమాలు వెయ్యడానికి కావలసిన 16 mm ప్రొజెక్టర్ మా ఆఫీసు లో ఉండేది. స్పెషల్ పెర్మిషన్ తీసుకుని అది పట్టుకెళ్లే వాడిని. ఏదో ఒక హాలులో గోడ మీద తెల్ల దుప్పటీ కట్టి  అనిల్, నేనూ దాన్ని ఆపరేట్ చేసీ వాళ్ళం. ప్రింట్ క్వాలిటీ ని బట్టి ఆ సినిమా రసపట్టులో ఉండగా..అంటే హీరో, హీరోయిన్లు ఘంటసాల -సుశీల పాట రొమాంటిక్ గా అభినయుస్తూ ఉండగా ఆ ఫిల్మ్ ఠకీ మని తెగిపోయేది. చచ్చినట్టు దాన్ని స్కాచ్ టేపు తో అతికించి మళ్ళీ వేసేటప్పటికి సగం డ్యూయెట్ కట్ అయిపోయేది. ఆ తరువాత రవి గారే ఒక ప్రొజెక్టర్ కొన్నట్టు జ్ఞాపకం.  అంత కన్నా ముఖ్యంగా తెలుగు సాంస్కృతిక సమితి తరఫున చందాలు పోగేసి వెయ్యి డాలర్లు పైగా ఉండే ప్రొజెక్టర్ కొనుక్కున్నాం. అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో?

van8

నాకు గుర్తున్నంత వరకూ హ్యూస్టన్ లో వేసిన మొదటి సినిమా “సుడి గుండాలు”. అది దువ్వూరి నారాయణ రావు గారు టెక్సస్ సదరన్ యూనివర్సిటీ లో ఫిజిక్స్ పాఠాలు చెప్పే గదిలో బ్లాక్ బోర్డ్ మీద తెల్ల దుప్పటీ కట్టి, అందరం క్లాసు బెంచీల మీద కూచుని చూశాం. ఆ తరువాత విశ్వశాంతి నిర్మాత యు. విశ్వేశ్వర రావు గారు తన “తీర్పు: అనే సినిమా ప్రింట్ పట్టుకొచ్చారు. ఆయన సమక్షంలో ఆ సినిమా కూడా  లాగే చూశాం.

అప్పటినుంచి (1976) ఇప్పటి దాకా, అన్ని ఒడుదుడుకులనీ తట్టుకుని, అన్ని సమస్యలనీ సామరస్యంగా పరిష్కరించుకుని, ఉత్తర అమెరికా మొత్తంలో ఒకే తాటిపై నడుస్తున్న ఏకైక అమెరికా తెలుగు సంస్థ అని ప్రపంచవ్యాపంగా అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన తెలుగు సాంస్కృతిక సమితి ఇక ముందు కూడా అదే బాటలో పయనించి, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకి మరింత సేవలు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

*

 

తెలుగు వాడి బావుటా !

 

సూర్య-కుమారి-గూటాల-గారు

లండన్ లో తెలుగు భాషా, సాహిత్యాలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు గూటాల కృష్ణ మూర్తి గారే! 88 ఏళ్ల వయసులో గత వారం విశాఖపట్నంలో జూలై 13, 2016 నాడు పరమపదించారు అన్న వార్త ఎంతో విచారం కలిగించింది. ఆయనతో నేను గడిపిన మధుర స్మృతులు మననం చేసుకుంటూ ఆయన ఈ ఆత్మీయ నివాళి సమర్పిస్తున్నాను.

అది 1980 వ సంవత్సరంలోమంచి రోజున మా మహాకవి శ్రీశ్రీ గారి కవితలని అప్పుడే హ్యూస్టన్ లో అడుగుపెట్టిన మంచి గాయని చంద్రకాంత చేత పాడించి ఓ గ్రామఫోన్ రికార్డు చేస్తే ఎలా ఉంటుందీ అనే ఆలోచన దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు అనే మా ఊరి పెద్దాయన కి వచ్చి నన్ను సంప్రదించి దానికి మహాకవి శ్రీశ్రీ గారి అనుమతి సంపాదించే బాధ్యత నా మీద  పెట్టారు. శ్రీశ్రీ గారికి ఫోన్ చేసే ధైర్యమూ, ఆ నాటి ఇండియా ఫోన్ కాల్ కి అయ్యే వంద డాలర్లు డబ్బూ నా దగ్గర లేక నేను వెంటనే శ్రీశ్రీ గారి మద్రాసు చిరునామాకి భయం, భయంగానే ఉత్తరం వ్రాశాను.  ఆయన దగ్గర నుంచి రెండు నెలలు అయినా సమాధానం రాకపోతే “గొప్ప వాళ్ళతో అంతేలే” అనుకుని ఆశ వదిలేసుకుంటూ ఉండగా లండన్ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. ‘మనకి లండన్ లో ఎవరూ తెలీదే’ అని ఆశ్చర్యంగా ఆ ఎయిరోగ్రాం ఉత్తరం తెరిచి చూస్తే అది శ్రీశ్రీ గారి నుంచే! ఆయన ప్రస్తుతం లండన్ లో గూటాల కృష్ణ మూర్తి గారి ఇంట్లో ఐదారు నెలలు గా ఉన్నట్టూ , నా మద్రాసు చిరునామా ఉత్తరం ఆయనకి బట్వాడా చేయగా అందినట్టూ, చంద్రకాంత చేత పాడించడానికి అభ్యంతరం లేదు అనీ, తను అమెరికా వచ్చి దాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందా అని అడగడం ఆ ఉత్తరంలో సారాంశం.

EPSON MFP image

ఆ విధంగా నాకు గూటాల గారితో పరోక్షంగా పరిచయం అయింది. ఆ సమయంలో గూటాల గారు ఒక తెలుగు వాడు కనీ వినని ఒక మహత్తరమైన కార్య సాధనలో ఉన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి సారిగా ఒక కవి స్వదస్తురీతో, ఆ కవితని ప్రతిబింబించే ఉన్నత స్థాయి బొమ్మలతో సహా పుస్తక రూపంలో ముద్రించి దానికి అనుబంధంగా ఆ కవి స్వయంగా చదివిన ఆ కవిత ని ఆడియో కేసెట్ గా అనీ కలిపి ఒక అపురూపమైన కానుకగా రూపొందించడమే ఆ మహత్కార్యం.  గూటాల గారు ఎన్నుకున్న కవి మహాకవి శ్రీశ్రీ . ఆ కవిత మహా ప్రస్థానం. ఆ చిత్రకారుడు బాపు. వారిద్దరినీ,శ్రీశ్రీ గారి సతీమణి సరోజ గారినీ, తోడుగా పురిపండా అప్పల స్వామి గారినీ ఆయన లండన్ ఆహ్వానించారు. ఈ బృహత్ కార్యం తలపెట్టడానికి మరొక ప్రధాన కారణం ఆ మహా ప్రస్థానాన్ని అత్యున్నత స్థాయి ప్రచురణని పరిశీలనకి పంపించి తద్వారా మహాకవి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి ప్రయత్నం చెయ్యడం. ఆయన ప్రణాళిక ప్రకారం శ్రీశ్రీ గారు సతీ సమేతంగా లండన్ లో గూటాల గారి ఇంట్లో ఆరు నెలలు ఉన్నారు. ఆయన ఆశయాలకి అనుగుణంగా బాపు గారు ఎంతో స్ఫూర్తితో వేసిన నాలుగే నాలుగు అద్భుతమైన బొమ్మలతో “మహా ప్రస్థానం” ఆడియో కేసెట్ తో సహా 1981 లో ప్రచురించబడింది. అమెరికాలో ఆ పుస్తకాన్ని కిడాంబి రఘునాథ్ గారు పంపిణీ చేశారు. కేవలం 100  కాపీలు మాత్రమే ముద్రించబడిన ఆ అపురూపమైన పుస్తకం 90 వ కాపీని నాకు గూటాల గారు స్వయంగా నా కోరిక మీద హ్యూస్టన్ వచ్చి నాకు బహూకరించారు. నా అదృష్టానికీ, ఆయన ఔదార్యానికీ ఇంత కంటే నిదర్శనం   ఏం కావాలీ?

ఆయన మా ఇంట్లో ఉన్న వారం రోజులూ మా ఆవిడ గిరిజ మీద ఎంతో అభిమానం పెంచుకున్నారు. ఇద్దరిదీ విశాఖ పట్నమే కదా! వాళ్ళ ‘యాస’ లో హాయిగా మాట్లాడుకునే వారు. పైగా శ్రీశ్రీ గారూ అక్కడి వారే. గూటాల గారు రాక ముందే శ్రీశ్రీ గారు అమెరికా రావడం, హ్యూస్టన్ లో ఆయన స్వహస్తాలతో సిప్రాలి రాయడం జరిగింది. కానీ గూటాల గారి ‘మహా ప్రస్థానం’ వెనక నోబెల్ బహుమానం ఆసక్తి ఉంది కాబట్టి గూటాల గారు ఆ సంగతులు కొన్ని నాతో పంచుకున్నారు. ఉదాహరణకి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి అంతకు ముందు ఆ బహుమానం అందుకున్న రచయితలో, ఇతర అర్హతలు ఉన్న వారు మాత్రమే ఆయన పేరు, కవిత సూచించాలి అనే నిబంధన ఉందిట. అందుకని గూటాల గారు శ్రీశ్రీ గారిని ప్రొఫెసర్ బట్లర్  ఇంటికి తీసుకెళ్లారుట. లోపల డ్రాయింగ్ రూమ్ లో కూచున్నాక బట్లర్ గారు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళారుట. అక్కడ బల్ల మీద ఉన్న లండన్ టైమ్స్ పేపర్లో సగం పూర్తి చేసి ఉన్న క్రాస్ వర్డ్ పజిల్ శ్రీశ్రీ గారు చూసి, అది తీసుకుని పూర్తి చేశారుట. ఈ లోగా బట్లర్ గారు వెనక్కి వచ్చి ఆ పూర్తి చేసిన క్రాస్ వర్డ్ పజిల్ చూసి గుండెలు బాదుకుని ‘అయ్య బాబోయ్, నేను పొద్దున్న ఆరు గంటల నుంచీ తంటాలు పడుతున్నాను. మీరు ఎలా చెయ్య గలిగారూ?” అని ఆశ్చర్య పోయారుట. మరి శ్రీశ్రీ గారి మహా ప్రస్థానాన్ని నోబెల్ ప్రైజ్ కి పంపించే ఉంటారు కదా!

EPSON MFP image

తెలుగు కవిత తో పాటు ఇంగ్లీషులోకి ఒరిజినల్ తర్జుమా కూడా పంపించినా, ఈ వార్త తెలుసుకున్న కొందరు తెలుగు ప్రముఖులు తమ అనువాదాలు కూడా పంపించి అవే ఒరిజినల్ అని చిన్న వివాదం సృష్టించి మహా ప్రస్థానానికి లేకుండా పుణ్యం కట్టుకున్నారూ అని  కానీ తరువాత తెలిసిన వార్త. ఇక్కడ విశేషం ఏమిటంటే గూటాల గారూ, శ్రీశ్రీ గారూ కూడా ఇది ఎక్కువగా  పట్టించుకున్నట్టు లేదు. ఆ రోజుల్లో గూటాల గారితోటీ, శ్రీశ్రీ గారితోటీ కాస్తో, కూస్తో నేను సన్నిహితంగా ఉండే వాణ్ని కాబట్టి ఈ మాట  చెప్పగలుగుతున్నాను.  ఆనాటి మహాప్రస్థానం పుస్తకానికి బాపు గారు ఎంతో అరుదుగా -ముళ్ళపూడి వెంకట రమణ గారితో కలిసి కాకుండా – తనంత తనే వ్రాసిన ముందు మాట, అప్పుడు వేసిన బొమ్మలు ఇందుతో జతపరుస్తున్నాను.

ఇంతకీ గూటాల గారికి ఇంత ఆసక్తికి కారణం ఆయనకి ఆంగ్ల సాహిత్యం మీద ఇంగ్లీషు వారికి కూడా లేని పాండిత్యం ఉండడం. ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన 1928 లో పర్లాకిమిడిలో పుట్టారు. చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ లోనూ, విజయనగరం లోనూ పెరిగి, విశాఖ పట్నం ఎవి ఎన్ కాలేజ్ లో రోజులలోనే ఆయన లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ప్రభావానికి లోనై చదువులలో వెనకబడ్డా, 1955 లో ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీష్ లిటరేచర్  ఆనర్స్ పూర్తి చేశారు. ఆ తరువాత అమలాపురం లోనూ, మధ్య ప్రదేశ్ లో బిలాస్ పూర్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయులు గా పని చేశారు. సాగర్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉండి, 1962 లో  కేవలం గుమాస్తా ఉద్యోగం కోసం  లండన్ వెళ్ళిన గూటాల గారు అక్కడే 1967 లో డాక్టరేట్ చేశారు. తరువాత ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ సర్వీసులో చాలా విద్యాలయాలలో అధ్యాపకులు గా పని చేశారు.  విద్యావంతురాలైన వెంకట రమణ గారిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకి ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు.

EPSON MFP image

బాపు రేఖల్లో సూర్యకుమారి

ఈ జీవిత వివరాలు సాధారణంగానే కనపడవచ్సును కానీ ఆయన ఆంగ్ల సాహిత్యంలో 1890 వ దశకాన్ని ఔపోసన పట్టి ఆ విక్టోరియన్ దశకంలో వచ్చిన రచనల మీద విస్తృతమైన పరిశోధనలని చేసి ఆంగ్ల సాహిత్యంలో సుస్థిర స్థానం కలిగించారు. అలనాడు CP బ్రౌన్ వేమన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినట్టుగా ఫ్రాన్సిస్ థామ్సన్ కవిత్వానికి  గూటాల గారు ప్రాచుర్యం కలిగించారు. ఆయన సంస్థాపించి దశాబ్దాల పాటు నిర్వహించిన ఫ్రాన్సిస్ థామ్సన్ లిటరరీ సొసైటీ, ద 1890 సొసైటీ లు యావత్ ఆంగ్ల సాహిత్య ప్రపంచానికి ఆదర్శ ప్రాయాలుగా నిలిచాయి.  1890 దశకం లో పురి విప్పుకున్న ఫ్రాన్సిస్ థామ్సన్, రస్సెల్, టి.ఎస్. ఎలియట్, బెర్నార్డ్ షా, సోమర్సెట్ మామ్ మొదలైన వారి సమగ్ర  రచనలని, వారి జీవిత విశేషాలని ఆయన సేకరించి తన లైబ్రరీ లో పొందు పరిచారు. ఆయన నిర్వహించే ఆంగ్ల సాహిత్య సభలలో  తెలుగు కవులైన ఆరుద్ర, తిలక్ మొదలైన వారి కవిత్వాన్ని అంగ్ల కవులకి పరిచయం చేసే వారు. ఈ నాడు తెలుగు భాషని ప్రపంచ భాషగా చేసి పారేద్దామని మన వంటింట్లోనే సభలు నిర్వహించుకుంటూ జబ్బలు చరుచుకునే వారికి గూటాల వారి అలనాటి ప్రయత్నాలు కనువిప్పు కలిగించాలి కానీ గుడ్డి వాడికి లోకమంతా చీకటే కదా!

గూటాల గారి జీవితంలో అత్యంత ఆశ్చర్యకరం, ఆచరణలో మామూలు వారికి అసాధ్యం అయినది ఆయన స్వయానా ఆచరించి చూపించే గాంధేయ వాదం. నమ్మండి, నమ్మకపొండి….ప్రతీ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు, అలాగే జనవరి 30 గాంధీ వర్థంతి నాడు ఉదయం 10 గంటల నుంచీసాయంత్రం ఐదు గంటల వరకూ లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ లో ఉన్న మహాత్ముడి విగ్రహం దగ్గర కూర్చుని చరఖా తిప్పుతూ నూలు వాడికే వారు. ఇలా ఎన్నేళ్ళు చేశారో నాకు తెలీదు కానీ  అసలు భారత దేశం లోనే అందరూ మర్చిపోయిన మహాత్ముడి దివ్య  స్మృతులని   పరాయి దేశం లో ఎవరైనా, ఎక్కడైనా ఈ విధంగా మననం చేసుకుని ఆచరించే వారు ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు.

1982 లో గూటాల గారు హ్యూస్టన్ వచ్చాక, మా పరిచయం ఇరవై ఏళ్లకి పైగా ఉత్తరాల ద్వారానే జరిగింది. ఆయన చాలా చిన్న, చిన్న  ఉత్తరాలు ఎంతో ఆర్టిస్టిక్ గా వ్రాసీ వారు. ;ఇంత బాగా ఎలా రాస్తారు, గురువు గారూ ?’ అని అడిగితే ‘ఆ రోగం బాపు దగ్గర నుంచి అంటింది’ అన్నారు నవ్వుతూ. వారిద్దరికీ ఉన్న అనుబంధం మాటలకి అందనిది. నేను 2005 లో అని జ్ఞాపకం – ఓ సారి బాపు గారి ఇంటికి మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన ‘జికే’ గారి గురించి మాట్లాడి నాకు పరిచయం చేశారు. అన్నట్టు, జికే అనేది గూటాల గారి కలం పేరు. ఆ కలం పేరుతో ఆయన కథలూ, వ్యాసాలూ వ్రాసే వారు. జుబ్బా లేని అబ్బాయి, భాజ గోవిందం, కుకునం (వంట చెయ్యడం), క్లిననం (గిన్నెలు కడగడం), కననం (పిల్లల్ని కనడం) మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని.  గూటాల గారు “ఋషి పుంగవుడు” “కర్మ యోగి” అన్న  అన్న బాపు గారి మా మాటలు  తర్వాత సంవత్సరం ఒక అతిముఖ్యమైన పని మీద లండన్ లో గూటాల గారి ఇంట్లో వారం రోజులు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అనుభవం లోకి వచ్చింది.

EPSON MFP image

మా ఇద్దరినీ మరింత దగ్గరగా కలిపినది టంగుటూరి సూర్య కుమారి….ఆయనా, చాలా మంది దగ్గర వాళ్ళు పిలుచుకునే పేరు ‘సూర్య’. టంగుటూరి సూర్య కుమారి పేరు వినని వారు, ఆవిడ పాడిన శంకరంబాడి సుందరాచారి గారి ‘మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ’ వినని, పాడని, పాడించని తెలుగు వారు ఉండరు. నేను ఆవిడని ఒక్క సారే చూశాను- ఆవిడ హ్యూస్టన్ వచ్చినప్పుడు. కానీ ఆవిడ మద్రాసులో కళా కారిణి గా ఎదుగుతున్న తొలి రోజులలో మా చిన్నన్నయ్య బాగా సన్నిహితుడు..– అనగా 1957 లో టాగూర్  వ్రాసిన ‘చిత్ర’ అనే చిన్న నాటకాన్ని తన పాటలతో ‘చిత్రార్జున’ అనే ఒక పెద్ద డాన్స్ డ్రామా గా రూపొందిస్తున్న రోజుల్లో దానికి దర్శకులు సింగీతం శ్రీని వాస రావు అయితే మా చిన్నన్నయ్య ప్రభాకర మూర్తి రాజు, నటుడు విజయ చందర్ అసిస్టెంట్ దర్శకులు. సూర్య కుమారి లండన్ లో స్థిరపడి 1973 లో హెరాల్డ్ ఎల్విన్ ని వివాహం చేసుకుని , కళాకారిణి గా అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకుని ఏప్రిల్ 25, 2005 న పరమపదించారు.

ఎలిజబెత్ మహారాణి తో 1968 లో ఒక సారి, 1972 లో రెండో సారి కరచాలనం చేసి , జూలై 11, 1972 నాడు బకింగ్ హం పేలస్ మధ్యాహ్న విందు భోజనం అంకితం చెయ్యబడిన ఏకైక తెలుగు …ఆ మాట కొస్తే భారతీయ కళాకారిణి టంగుటూరి సూర్య కుమారి—జికె గారికి ‘సూర్య’ గా ఆత్మీయురాలు. సంతానం లేని సూర్య కుమారి అంత్యక్రియలు గూటాల గారే నిర్వహించారు. సూర్య మరణం తరువాత ఆమె జీవిత సమగ్రంగా ఒక అద్వితీయమైన గ్రంధంలో నిక్షేపించాలి అని గూటాల గారు తలపెట్టారు. ఇలాంటివి ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాలు, పెద్ద సంస్థలూ చెయ్య వలసిన ఇటువంటి పనిని వాటి వాటి దౌర్భాగ్యానికే వదిలేసి, గూటాల గారు ఏక వ్యక్తి సంస్థ గా ఈ బృహత్ కార్యాన్ని తలకెత్తుకున్నారు. దానికి బాపు గారు కొమ్ము కాశారు. అమెరికాకి సంబంధించి సూర్య జీవిత విశేషాలు సంపాదించే గురుతర బాధ్యత ‘బాపు’ గారి సలహా మీద నాకు అప్పగించారు గూటాల గారు. “మీ గురించి బాపు గారు చాలా చెప్పారు” అన్నారు ఉపోద్ఘాతంగా ఆ ఫోన్ కాల్ చేసినప్పుడు. “నా గురించి ఆయన ఏం చెప్పారో కానీ, మీ గురించి నాకు చాలానే చెప్పారు. భలే భయం వేసింది’ అన్నాను సమాధానంగా…

మొత్తానికి 2005 లో ఆమెరికాలో సూర్య కుమారి జీవితం గురించి ఆయన సేకరించిన వివరాలు నాతొ పంచుకుని నేను చెయ్య వలసిన పనులు స్పష్టంగా ఆయన ‘విజన్’ నాకు అర్థం అయ్యేలా చెప్పారు. ఆ ప్రయత్నంలో నాకు పున:పరిచయం అయిన వారు సూర్య పిన్ని కుమార్తె, ఆమె ఇండియా రోజులలో ఇంచు మించు పెర్సనల్ సెక్రటరీ గా అన్ని వ్యవహారాలూ చూసుకునే ఇవటూరి అనసూయ గారు (బొకా రేటన్) ఒకరు. వైజాగ్ లో 1960 దశకం లో నేను ఇవటూరి అనసూయ గారింటికి వెళ్ళే వాడిని. గూటాల గారి ద్వారా మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చి. ఫ్లారిడా లో ఉన్న ఆవిడ వృద్దాప్యంలో ఇంట్లో సహాయానికి ఇండియా నుంచి వచ్చి రెండేళ్ళు ఉండడానికి ఒక నర్సుని ఇక్కడికి రప్పించడానికి నేను సహాయం చేశాను. అనసూయ గారితో మూడు వారాల క్రితం నేను మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ బాగానే ఉన్నారు కానీ ఆ తరువాత కొద్ది రోజులలో ఆవిడ అనారోగ్యంతో పరమపదించడం ఎంతో విచారకరం.

EPSON MFP image

గూటాల గారి సూచన మీద అప్పుడు హ్యూస్టన్ లో ఉండే దేవగుప్తాపు శేష గిరి రావు గారినీ, తదితరులనీ మొత్తం అమెరికాలో ‘వెతికి’ పట్టుకుని, వారి చేత సూర్య కుమారి మీద వ్యాసాలు వ్రాయించ గలిగాను. ఇంకా అనేక పద్దతులలో సూర్య కుమారి అమెరికా ఫోటోలు సంపాదించ గలిగాను. ఉదాహరణకి న్యూయార్క్ లో సూర్య కుమారి నివసించిన అపార్ట్ మెంట్ ఫోటో కి మిత్రులు కలశపూడి శ్రీని వాస రావు గారిని కోరితే ఆయన శ్రమ పడి అక్కడికి వెళ్లి ఆ రోడ్డు జంక్షన్ తో సహా ఫోటోలు తీసి పంపించారు. ఈ సమాచారం అంతా పట్టుకుని నేను 2006 లో లండన్ వెళ్లాను. ఎప్పుడో 1982 లో కలుసుకున్న తరువాత , ఫోన్ లో చాలా సార్లు మాట్లాడుకున్నా అప్పటికే 75 ఏళ్లు దాటిన గూటాల గారి ఆరోగ్య పరిస్థితి కానీ, మరే విధమైన వ్యక్తిగత వివరాలు కానీ నాకు తెలియవు. కేవలం సూర్య కుమారి పుస్తకానికి నేను సేకరించిన వ్యాసాలూ. ఫోటోలు తీసుకెళ్ళి ఆ పుస్తకం రూప కల్పన మీద పనిచెయ్యడం కోసమే నా లండన్ ప్రయాణం. అప్పటికే ఆ  పుస్తకం ఆయన నడిపే విదేశాంద్ర ప్రచురణలు, వీలుంటే వంగూరి ఫొండేషన్ ఆఫ్ అమెరికా తో సంయుక్తంగానూ ప్రచురిస్తే బావుంటుంది అనీ అనుకున్నాం. ఆ విషయాలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే బావుంటుంది కదా అని కూడా మా ఇద్దరి ఉద్దేశ్యం. లండన్ లో వారం ఉండి అక్కడి నుంచి నేను ఇండియా ప్రయాణం పెట్టుకున్నాను.

నేను అనుకున్నట్టుగా గూటాల గారు కానీ, మరెవరూ కానీ లండన్ ఎయిర్ పోర్ట్ కి రాలేదు. నేను లండన్ వెళ్ళడం అదే మొదటి సారి. ఎలాగో అలాగా కష్ట పడి, భారీ సూట్ కేసులతో లండన్ ‘ట్యూబ్’ ..అంటే అండర్ గ్రౌండ్ రైళ్ళు పట్టుకుని,  తర్వాత లండన్ కేబ్ పట్టుకుని మొత్తానికి బర్టన్ రోడ్ మీద ఉండే గూటాల గారి ఇంటికి వెళ్లి తలుపుకొట్టాను. అది ఒక టౌన్ హోమ్ …అంటే మూడు అంతస్తులలో ఎపార్ట్ మెంట్ లా ఉండే చాలా ఇళ్ళు ఒకే బిల్డింగ్ లో వరసగా ఉంటాయి. అప్పటికే ఆ పెట్టెలు మొయ్య లేక చచ్చే ఆయాసం వచ్చింది. బజ్జర్ మోగగానే స్పీకర్ లోంచి తలుపు తోసి లోపలికి వచ్చి , ఎదురుగా కనపడే మెట్లు ఎక్కి మూడో అంతస్తుకి వచ్చెయ్యండి.” అన్నారు గూటాల గారు తెలుగులో.  నేను అలాగే లోపలికి వెళ్లి, సూట్ కేసులు లోపలి గుమ్మంలో వదిలేసి మెట్లెక్కి పైకి వెళ్లాను. పైన ఒక చిన్న గదిలో పడక్కుర్చీలో నోట్లో పైపు తో గూటాల గారు నన్ను ఆహ్వానించారు. చుట్టూ కొన్ని వందల పుస్తకాలు. అంతా చిందర వందరగా ఉంది. ఓ మూల చిన్న కిచెన్. ‘కాఫీ ఇమ్మంటారా?” మెల్లిగా, అతి మెల్లిగా లేచారు గూటాల గారు. నేను బొత్తిగా ఉహించని విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్ కేసి నాలుగే నాలుగు అడుగులు వేసి ‘గిరిజ భోజనం మళ్ళీ తినాలని  ఉంది. అప్పుడే ఇరవై ఏళ్లయి పోయింది. మీతో తీసుకు రావలసింది. బావుండును” అన్నారు.

అప్పటికి నాకు ఆయన “ఋషి పుంగవుడు, కర్మ యోగి’ అని బాపు గారు ఎందుకు అన్నారో అర్థం అవడం మొదలు పెట్టింది. ఆయన భార్యా, పిల్లలూ ఇండియా లోనూ, అమెరికాలోనూ ఉన్నారు. ఈయన ఒక్కరే, నడవ లేని పరిస్థితిలో, ఇతర కారణాలు ఎలా ఉన్నా, లేక పోయినా తను చెయ్యదల్చుకున్న సాహిత్య పరమైన కార్యక్రమాల కోసమే అనుకోవాలి- లండన్ లో చాలా ఏళ్ళుగా, ఏకాంతంగానే, జీవితం గడుపుతున్నారు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలలో  టంగుటూరి సూర్య కుమారి పుస్తకం ఒకటి. 1890ల నాటి ఆంగ్ల రచయితల సమగ్ర జీవిత విశేషాలు, వారి రచనల ప్రచురణ మరొకటి. ఆ గది క్రింద అంతస్తులో మరొక చిన్న గది. అక్కడ ఒకే ఒక్క పడక. అక్కడ కూడా కొన్ని వందల పుస్తకాలు. మొత్తం కుటీరం అంతా ఇంతే! పుస్తకాల మయం. ఆ నాడు మహా కవి శ్రీశ్రీ,  బాపు , ఈ నాడు నా బోటి సర్బ సాధారణ మానవుడు ఆతిధ్యం పొందినది అక్కడే. ఎవరైనా ఇంటికి వస్తే గూటాల గారు ఎక్కడ నిద్ర పోతారో తెలియదు. పై గదిలో ఆయన పడక్కుర్చీ పక్కనే డజన్ల కొద్దీ ఫైల్స్ లో సూర్య కుమారి పుస్తకానికి ఆయన ఎలా సేకరించారో తెలియదు కానీ, మొత్తం మెటీరియల్ అంతా అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఉంది. మరో బల్ల మీద నేను ఆయనకీ అప్పుడప్పుడూ పంపిస్తున్న మా పుస్తకాలు అన్నీ ఉన్నాయి. అన్నింటి కన్నా పైన బాపు గారి తిరుప్పావై ఉంది. మరో మూల..అవును గాంధీ గారి చరఖా..దాని మీద ఒక పూల దండ!

EPSON MFP image

బాపు మాట

ఆ తరువాత వారం రోజులూ ఇద్దరం సూర్య కుమారి పుస్తకం మీదే పనిచేశాం. ఒకే ఒక్క సారి కష్టపడి బయటకి వచ్చి బస్సులో వెళ్లి కూరలు, మందు సామగ్రి కొనుక్కుని వచ్చాం. ఆయనకీ చాలా ఇష్టమైనదీ, రోజూ వండుకునేదీ తోటకూర పప్పు. అది మోపులు, మోపులు కొన్నారు. బిల్లు నేను చెల్లిస్తానంటే ‘కాదంటానా? సూర్య పుస్తకానికి ఆ డబ్బు వాడుకుంటాను’ అన్నారు. ఆ వారం రోజులలోనూ, ఆయన వ్రాసిన కథలు – ఆయా పత్రికలలో ఉన్నవి చదివాను. “మీ  లైబ్రరీ లో ఉన్న 1890 ల నాటి ఆంగ్ల కవుల పుస్తకాల విలువ ఎంత ఉంటుంది సార్ ?” అని అడిగితే “ఏమో కానీ ఒక మిలియన పౌండ్స్ కి ఇన్స్యూరెన్స్ చేశాను” అన్నారు…నా గుండె గుభేలు మనేలా. అవే కాదు. ఆయన దగ్గర ఉన్న అపురూపమైన కలెక్షన్ లో సరోజినీ నాయుడు గారు కవిత్వం వ్రాసుకున్న ఒక పెద్ద పుస్తకం. ఆ మహా కవయిత్రి స్వదస్తూరీతో, అక్కడా, అక్కడా కొట్టి వేతలు, మార్పులు, చేర్పులతో, ఆ నాటి ఇంక్ లో ఉన్న ఆ మేనుస్క్రిప్ట్ పేజీలు నా చేతులతో తిరగేస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయో? ఏమిటో? గూటాల గారి లాంటి కారణ జన్ములు సేకరించిన అటువంటి అపురూప సంపదని దాచుకునే అదృష్టం ఉండీ,  ఆ అవకాశాలు అంది పుచ్చుకుని గర్వించే ఆలోచనలు లేని దౌర్భాగ్యులు తెలుగు వారు అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. బతికి బావుంటే ఏనాడైనా ‘తెలుగు సారస్వత భవనం” అనే నిర్మాణం చేసి మన సాహితీవేత్తలు వాడిన వస్తువులు, స్వదస్తూరీతో ఉన్న వారి రచనలు మొదలైనవి పదిల పరచాలని నాకు ఎంతో కోరికగా ఉంది.  కానీ అమరావతిలో అంగుళం కూడా ఖాళీ లేదు అలాంటి వాటికి!

EPSON MFP image

మొత్తానికి సూర్య కుమారి పుస్తకం మెటీరియల్ అంతా మద్రాసు లో బాపు గారికి అందించడం నాకు గూటాల గారు నిర్దేశించిన పని. మా ఇద్దరికీ సంయుక్త ప్రచురణ మీద ఒప్పందం కుదరక పోయినా నాకు ఇబ్బంది కలగ లేదు. ఒక మహత్కార్యం లో, బాపు గారు, గూటాల గారు లాంటి మహానుభావుల దిశానిర్దేశం లో ఒక చారిత్రక పుస్తక ప్రచరణ లో అతి చిన్న పాత్ర వహించగలగడమే నా పూర్వ జన్మ సుకృతం. నేను చేసిన సహాయానికి గూటాల గారు “Suryakumari-Elvin” అనే 270 పేజీల పుస్తకం Acknowledgements లో ఒక కృతజ్ఞతా వాక్యం వ్రాశారు. అది చాలు. ఇందుతో పాటు ఆ అపురూపమైన గ్రంధం ముఖ చిత్రం. బాపు గారు వేసిన సూర్య కుమారి చిత్రం, సూర్యకుమారితో గూటాల గారి ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.

EPSON MFP image

లండన్ లో 2006 తరువాత ఆపుడప్పుడు ఫోన్ లో పలకరించుకుంటూనే ఉన్నా, 2012 లో ఒక సారి లండన్ వెళ్ళినప్పుడు డా. వ్యాకరణం రామారావు గారు, వింజమూరి రాగ సుధా, నేనూ ఆయన్ని చూడడానికి వెళ్లాం. మళ్ళీ 2014 లో లండన్ లో నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా ఆయన్ని ప్రధాన అతిథిగా సత్కరించడానికి నేనూ, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారూ, డా. దాసోజు రాములు గారూ ఆయనింటికి వెళ్లాం. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఎక్కడికీ వెళ్ళే శారీరక పరిస్థితి లేదు. అయితే అందరం కలిసి గూటాల గారితో CP బ్రౌన్ సమాధి దర్శించుకున్నాం. Wheelchairలో తీసుకు వెడుతున్నా ఆ మాత్రం కదలిక కూడా  భరించ లేక ఆ సమాధికి ఆయన దూరం నుంచే నమస్కారం పెట్టుకున్నారు. అదే నేను ఆయన్ని ఆఖరి సారి చూడడం.

కొన్ని నెలల క్రితం ఆయన కుటుంబం ఆయన్ని విశాఖపట్నం తరలించినట్టు యార్లగడ్డ గారి ద్వారా తెలిసింది. ఈ వ్యాసం లో కొన్ని విషయాలు ఆయన ద్వారా నాకు తెలిసినవే!.  వచ్చే నెల ఇండియా వెళ్ళినప్పుడు గూటాల గారిని చూద్దాం అనుకుంటూ ఉండగానే ఆయన నిర్యాణ వార్త తెలిసింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. జికె అనే గూటాల కృష్ణ మూర్తి గారికి ఈ అశ్రు నివాళి అర్పిస్తున్నాను..

*

బొంబాయి ఐ.ఐ.టి –తెలుగులో తొలి అడుగులు   

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

తారీకు గుర్తు లేదు కానీ అది 1966 జూన్, జూలై లలో ఒక రోజు. బొంబాయిలో అరవ్వాళ్ళు ఎక్కువగా ఉండే మద్రాసు మాంబళం లాంటి మాటుంగా అనే చోట మడత మంచాల హోటల్ లో పొద్దున్నే లేచి నేనూ, గోవింద రాజులూ లోకల్ రైలూ, BEST వాళ్ళ బస్సూ ఎక్కి అంతకు ముందు రోజే రిహార్సల్స్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండానే పవయ్ అనే ప్రాంతంలో ఉన్న ఐఐటి కి మా ఇంటర్వ్యూ కోసం చేరుకున్నాం. మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ లో అడుగుపెట్టగానే పట్ట పగలే అన్ని ట్యూబులైట్లూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడం  నాకు మొట్టమొదట ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంత వరకూ కాకినాడలో నేను ఎప్పుడూ మా ఇంట్లో కానీ, కాలేజ్ లో కానీ పగలు లైట్లు వేసుకోడం చూడ లేదు. పైగా పొరపాటున వేస్తే “వెధవ కరెంట్ ఖర్చు అయిపోతుంది” అనే మాటలు వినపడేవి. ఆ రోజు మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూకి దేశంలో అన్నిచోట్ల నుంచీ సుమారు 300మంది పైగా వచ్చారు… అందరితో బాటూ భయం, భయంగా కూచున్నాం. మా లాగే ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్ళలో కొందరు బొంబాయి లోనే చదువుకున్న వాళ్ళు, కొందరు కేరళ, గుజరాత్, బెంగాల్..ఇలా అన్ని రాష్ట్రాల నుంచీ వచ్చిన వాళ్ళు ఉన్నా బొంబాయి వాళ్ళకి మాత్రం మేము కాస్త బైతుల్లాగా కనపడ్డాం అని నాకు అనుమానం వేసింది. ఎందుకంటే వాళ్ళ వేషభాషలు, ధైర్యం, కలుపుగోలుదనం ఇతర రాష్ట్రాల వాళ్ళ కంటే కొంచెం దర్జాగా ఉంది. పైగా ఇంగ్లీషు మాట్లాడడం బావుంది. ఆప్పుడే నాకు తెలిసిపోయింది మనకి ఆ భాష గొప్పగా మాట్లాడడం రాదు సుమా అని. ఇప్పటికీ అది నిజమే కదా!

అంత మందిలో నేనూ, గోవిందరాజులూ భయం భయంగా కూచుని ఉండగా అప్పుడు మా గదిలోకి కొంత మంది ప్రొఫెసర్లు వచ్చి ఇంటర్వ్యూ పద్ధతులు వివరించారు. అందులో మా కొంప ముంచే రెండు “బాంబ్ షెల్స్” ఉన్నాయి.  అందులో మొదటిది మెకానికల్ ఇంజనీరింగ్ లో మెషీన్ టూల్స్, మెషీన్ డిజైన్, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్ లాంటి ఐదారు బ్రాంచ్ లు అన్నింటికీ కలిపి ఉండే సీట్లు మొత్తం ముఫై లోపేట.   అంటే ఒక్కొక్క విభాగం లోనూ మాస్టర్స్ డిగ్రీ కి ఐదారు సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ విషయం తెలిసి మూడు వందల మందిలో ముఫై సీట్లయితే “ఎక్కడో ఆంధ్రా బాపతు గాళ్ళం, మన పని ఉట్టిదే గురూ. అనవసరంగా వచ్చి చచ్చాం” అని నేనూ, గోవిందరాజులూ అనుకుంటుంటే, రెండో బాంబ్ షెల్ ఏమిటంటే కేండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదటి ఎలిమినేషన్ రౌండ్ గా ఎంట్రెన్స్ పరీక్ష పెట్టడానికి వారు నిర్ణయించుకున్నారుట. అది వినగానే కాస్త దడ పట్టుకుంది. ఎందుకంటే, ఇంజనీరింగ్ పరీక్షలు అంటే లెక్కలు కట్టడానికి కనీసం స్లైడ్ రూల్ అయినా ఉండాలి. అది లేక పొతే చేతి వేళ్ళతో ఇంజనీరింగ్ లెక్కలు చెయ్యలేం. కేలుక్యులేటర్ లాంటి మాటలు అప్పటికి పుట్ట లేదు. పైగా ఆ పరీక్షలో ఏమైనా డ్రాయింగులు గియ్యమని అని అడిగితే టీ-స్క్వేరు, పెన్సిళ్లు, డ్రాయింగ్ పరికరాలు ఉండాలి. మన దగ్గర అవేమీ లేవు. అంచేత పరీక్ష రాయడానికి ముందే ఫెయిల్ అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ ఇంటర్వ్యూకి వచ్చిన ఎవరి దగ్గరా కూడా అవి లేక పోయే సరికి నాకు కాస్త ధైర్యం, ఇంకాస్త అనుమానం వచ్చి అక్కడ టై కట్టుకుని హడావుడి గా తిరుగుతున్న ఒక ప్రొఫెసర్ గారితో “మాకు ముందు ఈ పరీక్ష గురించి తెలిస్తే అన్నీ తెచ్చుకునే వాళ్ళం” అని నా గోడు వెళ్ళబుచ్సుకున్నాను. ఆయన ఓ నవ్వు నవ్వి  “అవేం అక్కర లేదు. ఈ పరీక్షలో ఇది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.  కరెక్ట్ ఆన్సర్ టిక్కు పెట్టడమే” అన్నాడు. ఈ రోజుల్లో ఎవరూ నమ్మరు కానీ, ఆ రోజుల్లో మా కాకినాడ కాలేజ్ లో కానీ ఆంధ్రా ప్రాంతాలలో మరెక్కడా కానీ ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నా పత్రాల పద్ధతి లేదు. ఒక్క ప్రాక్టికల్స్ తప్ప పరీక్ష ఏ సబ్జెక్ట్ లో అయినా ప్రతీ ప్రశ్నకీ పోలోమని దస్తాల కొద్దీ ఆన్సర్లు రాసెయ్యడమే. పైగా ఎన్ని పేజీలు  రాస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుని పెద్ద పెద్ద అక్షరాలతో పేజీలు  నింపేసే వాళ్ళం. అప్పటి వరకూ మల్టిపుల్ చాయిస్ గురించి వినడమే కానీ అలాంటి పరీక్షలు రాయ లేదు. మొత్తానికి వాళ్ళు సైక్లో స్టైల్ కాపీలు అందరికీ ఇచ్చి పరీక్ష పెట్టారు. అప్పటికి ఈ క్సీరాక్స్ అనే పేరే ఎవరూ వినలేదు. దేనికైనా కాపీలు కావాలంటే ఒక స్పెషల్ పేపరు మీద టైపు కొట్టి, ప్రింటింగ్ యంత్రం లాంటి దాంట్లో పెట్టి అలాంటి స్పెషల్ పేపర్ల కాపీలు తీసే వారు. ఆ పరీక్షకి సరిగ్గా గంట టైమ్ ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ లోనూ సుమారు వంద ప్రశ్నలు….ప్రశ్నకి ఒక మార్కు వేసినా  తప్పు ఆన్సర్ రాస్తే అర మార్కు తీసేస్తారు. అంచేత ఖచ్చితంగా సరి అయిన సమాధానం తెలిస్తేనే టిక్కు పెట్టాలి. లేక పొతే నెగెటివ్ మార్కులు వస్తాయి. మొత్తం ఉన్న సీట్లు 30 కాబట్టి వచ్చిన మూడు వందల మందిలోనూ వంద మందిని మాత్రమే పెర్సనల్ ఇంటర్వ్యూ కి ఎంపిక చేసి మిగిలిన వాళ్ళని పంపించేశారు. ఈ పరీక్షలో పాస్ అయి నేనూ, గోవిందరాజులూ ఇంటర్వ్యూ కి ఎంపిక అయ్యాం. అప్పుడు ఎంపిక అయిన ఆ వంద మందిలో ఉన్న ఎనిమిది బ్రాంచ్ లకీ సీట్లు ఐదేసి ఉంటే ఇంటర్వ్యూ కి పదేసి మంది చొప్పున మళ్ళీ ఎవరికీ ఏ బ్రాంచ్ కావాలో చెప్పమని మరో పత్రం ఇచ్చారు. అప్పటికే ఉన్న అన్నింటిలోనూ ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచ్ లు – అంటే మెషీన్ టూల్స్,  మెషీన్ డిజైన్ లాంటి నాలుగు బ్రాంచ్ లలో మనకి ఎలాగా సీటు రాదు అని తెలిసిపోయింది కాబట్టి మరో రెండు బ్రాంచ్ లకి మేం ఇద్దరం మా పేర్లు ఇచ్చి పిలుపు కోసం కూచున్నాం. సాయంత్రం నాలుగు గంటలకి ఆ ఇంటర్వ్యూలు అయ్యాయి. వాటిల్లో నాకు సీటు రాదు అని అనుమానం వచ్చి విచారంగా కూచున్నప్పుడు ఒక ప్రొఫెసర్ గారు వచ్చి ఫ్ల్యూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ లో ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూకి రావచ్చును అని ప్రకటించారు. చెప్పొద్దూ..అప్పటి దాకా అలాంటి బ్రాంచ్ ఉంది అనే మా ఇద్దరికీ తెలియదు. మరో అవకాశం ఉంది అని వినగానే ఇద్దరం పేర్లు ఇచ్చేశాం. ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న ముగ్గురు ముందుగా నా ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్ష మార్క్ షీట్ అడిగి, “నీకు  హైడ్రాలిక్స్ లో మంచి మార్కులు వచ్చాయే” అని మెచ్చుకుని ఆ సబ్జెక్ట్ లో తప్ప ఇంజనీరింగ్ తప్ప ఇతర రకాల మామూలు ప్రశ్నలు అడిగారు. గోవింద రాజులు కూడా తన ఇంటర్ వ్యూ బాగానే అయింది అని చెప్పాడు. మొత్తానికి రాత్రి ఎనిమిది గంటలకి అన్ని బ్రాంచ్ ల ఇంటర్ వ్యూలూ అయ్యాక, ఎంపిక అయిన అభ్యర్థుల లిస్టు ఆయా బ్రాంచ్ తాలూకు ప్రొఫెసర్లు అక్కడ నోటీసు బోర్డ్ లో పెట్టారు. అల్లా ఒక్కొక్క నోటీసూ చూసుకుని, ఎందులోనూ మా ఇద్దరి పేర్లూ లేకపోవడంతో ఎంపిక అయిన వాళ్ళ నవ్వు మొహాల్లో మేము ఏడుపు మొహాలు పెట్టుకుని వెళ్లిపోడానికి సామాను సద్దేసుకుంటూ ఉండగా ఆఖర్న ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ వాళ్ళ లిస్టు వచ్చింది. ఎంపిక చేసిన ఐదుగురులో నా పేరు చూసి కళ్ళు తిరిగాయి. నా కంటే ఎక్కువగా గోవింద రాజులు కళ్ళు తరిగాయి. ఎందుకంటే నా కన్నా అన్ని విధాలుగానూ ఎక్కువ మార్కులు వచ్చిన అతని పేరు సీటు వచ్చిన వాళ్ళ లిస్టులో లేదు కానీ  ప్రొవిజినల్ లిస్టు లో ఉంది. అంటే సెలెక్ట్ అయినా ఐదుగురిలో ఒక వేళ ఎవరైనా చేరక పొతే ఆ ఖాళీలో అతను చేర వచ్చును అనమాట.

ఎక్కడో కాకినాడ నుంచి మా ఇద్దరిలో ఎక్కువ అర్హత ఉన్న గోవిందరాజులు బదులు  బదులు నాకు సీటు రావడంతో ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచనలో పడ్డాం. అప్పుడు నాకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఆ ప్రొఫెసర్ గారి ఇల్లు ఎక్కడో కనుక్కుని ఆయన ఇంటికి వెళ్లాం ఇద్దరం. అప్పుడు రాత్రి 10:30. పాపం ఆయన కూడా పొద్దుటి నుంచీ ఇంటర్వ్యూలు చేస్తూ చాలా అలిసిపోయి భోజనానికి కూచుని మేము తలుపు కొట్టగానే తలుపు తీసి “ఎవరు మీరు?” అని అడిగాడు. “నాకు మీ బ్రాంచ్ లో సీటు ఇచ్చినందుకు కృతజ్ఞలు చెప్పుకుందాం అని వచ్చాం” అనగానే ఆయన ఆశ్చర్యం గా “నాకు మీ మొహాలు గుర్తు లేదు. అయినా ఇంత రాత్రి ఇలా రావడం ఎందుకు. రేప్పొద్దున్నే ఫీజు కట్టేసి చేరిపోండి” అన్నారు విసుగ్గా. “అది కాదు సార్. మే ఇద్దరం తూర్పు తీరం లో ఉన్న కాకినాడ నుంచి కలిసి వచ్చాం. మీరు నాకు ఒక్కడికే సీటు ఇచ్చారు. ఇతనికి ప్రొవిజినల్  గా బదులు క్లాసులో చేర్చుకుంటే మీ ఋణం తీర్చుకోలేం. ఇద్ద్దరం కలిసి చదువుకుంటాం” అని మా సమస్య వివరించాను. ఆయన ఇంకా ఎక్కువ ఆశ్చర్య పోయి “అసలు నువ్వే ఎవడివో నాకు తెలీదు. ఇంకోడిని రికమెండ్ చెయ్యడానికి అర్థ రాత్రి వచ్చావా?” అని కోప్పడి తెలుపులు వేసేసుకున్నారు. ఇంక చేసేది ఏమీ లేక ఇద్దరం ఆఖరి బస్సు పట్టుకుని మాటుంగా వెళ్లి పోయాం. మర్నాడు రైల్లో గోవింద రాజులు బెంగళూరు ఇండియన్ ఇన్స్ టిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఇంటర్వ్యూ కి వెళ్ళిపోయాడు. ఇది 1966 జూన్ లో జరిగింది. ఆ తరువాత ఇప్పటిదాకా – అంటే 50 ఏళ్లలో  గోవిందరాజుల్ని మళ్ళీ చూడ లేదు.

ఇలా బొంబాయి IIT లో నాకు ఎడ్మిషన్ రావడం నా జీవితంలో చాలా పెద్ద మలుపు. అనుకోని, ఆశించని మంచి మలుపు. నేను చాలా అదృష్టవంతుడిని అని అనుకోడానికి ఒక దృష్టాంతం. అంతే కాదు. నాకు తెలిసినంత వరకూ కాకినాడ నుంచి బొంబాయి ఐఐటి లో చేరిన మొట్టమొదటి వాడిన నేనే! నా తరువాత మా డిపార్ట్మెంట్ లోనే చేరడానికి పరోక్షంగానూ, నా ప్రమేయం వలనా నా జూనియర్లు చాలా మంది అక్కడ చేరడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం.

1966 నుంచి 1974 దాకా నా బొంబాయి జీవితం వివరాలు – త్వరలోనే….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“అమ్మా పిన్ని” ఇక లేదు!

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

మే నెల 17, 2016…పొద్దున్నే ఫోన్. అంత పొద్దున్నే ఎవరా అని ఫోన్ అందుకోగానే “అమ్మా పిన్ని” పోయింది అనే వార్త. విని నిర్ఘాంత పోయాను. ఆవిడకి 92 ఏళ్ళు అనీ తెలుసు. గత ఐదారేళ్ళ గా డిమెంషాయా అనే అనారోగ్యంతో ఉన్నారనీ తెలుసును. కొన్ని రోజులగా డాకర్లు నిరాశ వ్యక్తంచేస్త్తున్నారు అనీ తెలుసును. అన్నీ తెలిసినా, ఎంత తెలిసినా, అప్పుడే తెలిసిన ఆ నిర్యాణ వార్తకి కళ్ళు చెమర్చాయి.

తెలుగు జానపదానికి, ఎంకి పాటలకి, లలిత సంగీతానికి “నేను సైతం గొప్ప గొంతుక”  అరువు ఇచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. కావడానికి ఆవిడ అవివాహిత. కానీ మా అందరికీ ఆవిడ “అమ్మా పిన్ని”. అక్కయ్య అనసూయా దేవి గారి పెద్ద కుమార్తె రత్న పాపని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ పాప ఇల్లే తన ఇల్లుగా గత పదేళ్ళకి పైగా హ్యూస్టన్ లో నివసిస్తున్నారు. విశేషం ఏమిటంటే సరిగ్గా అంతకు మూడు రోజుల ముందే పెద్దావిడ అనసూయ గారి 97 వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తెలుగు తిథుల ప్రకారం అనసూయ గారికి 100 ఏళ్ళు వస్తే సీత గారికి 97.

 

 

ఓ విధంగా చూస్తే సీత గారి జీవితంలో రెండు అధ్యాయాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మొదటిది సీత – అనసూయ …లేదా వింజమూరి సిస్టర్స్ …అనగానే తెలుగు జానపదమే మనసులో మెదులుతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనగోడళ్ళు అయిన వారిద్దరూ 1930 దశకంలో ఆయన కవితలకీ, ఇతర భావకవుల గేయాలకీ బాణీలు కట్టి, సభారంజకంగా పాడుతూ దేశమంతటా తిరుగుతూ ఐదు దశాబ్దాల పాటు అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూనే మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదాలని వేల సంఖ్యలో సేకరించి వాటికి సభా గౌరవాన్ని కలిగించిన జంట స్వరాలు.

 

ఎక్కడా స్వయం ప్రకటిత ఆర్భాటాలకి పోకుండా తన స్వరాన్నీ, సర్వస్వాన్నీ అక్క అనసూయా దేవికే అంకితం చేసిన ఆదర్శ సోదరి గా సీత గారికి గుర్తింపు కూడా వచ్చింది.  అతి చిన్నతనం లోనే వారి ప్రతిభకి ఇందుతో జత పరిచిన ఫోటో అద్దం పడుతుంది. ఈ ఫోటో 1934 నాటిది. అప్పుడు సీత గారి వయసు పదేళ్ళు.

220px-V_Seetha_Devi

ఆ నాటి “తెలుగు స్వతంత్ర” అనే పత్రికలో “మన మధుర గాయకులు” అనే శీర్షికలో ఈ అప్పచెల్లెళ్ళ గురించి ప్రచురించబడిన ఒక సమగ్ర వ్యాసంలో “ఆ నాటికి పన్నెండేళ్ళకి మించని ముక్కు పచ్చలారని వయస్సు, సభాసదులకి వెరవని ధైర్య స్థైర్యాలతో పెద్దమ్మాయి అనసూయ, తగిన మెళకువలతో చాకచక్యంగా వాయించుకునే హార్మొనీ, అక్క వేపే క్రీగంటి దృక్కులు నిముడ్చుకుని కీచుమనే సన్న గొంతుతో చిన్నమ్మాయి సీతాంబ వంత పాట – ఆ గానానికి ముగ్ధులు కాని వారు ఆ నాడు సాధారణంగా కంటిలో కలికానికైనా ఉండే వారు కాదు” అని మెచ్చుకున్నారు. కాలక్రమేణా సీత గారి గొంతు అసమానమైన శ్రావ్యత, వెల్వెట్ లాంటి మృదుత్వం సంతరించుకుని, దానికి అనువైన అయిన బాణీలు సమకూర్చుని తనదే అయిన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఆ విధంగా 1930 వ దశకం నుండి అనేక దేశాలలో వేల కొద్దీ కచేరీలతో సాగిన సీత –అనసూయ ప్రస్థానం మూడు దశాబ్దాలు అద్వితీయంగా జరిగింది. తరువాత ఇప్పటి దాకా కొనసాగుతూనే ఉన్నా 1960 దశకంలో సీత గారు సమిష్టి కుటుంబ నివాసం అయిన మద్రాసు నుంచి చదువుల కోసం హైదరాబాద్ తరలి వెళ్ళడంతో ఆమె “సొంత గొంతుక” ఎక్కువగా వినపడడం ఆమె జీవితంలో రెండో అధ్యాయం అని చెప్పుకో వచ్చును.  తెలుగునాట సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న తొలి మహిళ గా వింజమూరి సీతా దేవి చరిత్ర సృష్టించారు. వెనువెంటనే 1963 లో ఆలిండియా రేడియో లో జానపద సంగీత విభాగానికి మొట్ట మొదటి మహిళా ప్రొడ్యూసర్ గా మరో చరిత్ర సృష్టించి 1984 లో పదవీ విరమణ చేశారు.

# 6

సీత గారి ఆధ్వర్యం లో రూపొందించబడిన కొన్ని వేల సంగీత కార్యక్రమాలు, రేడియో నాటికలు ఎంతో ప్రాచుర్యం పొంది ఆమెకి ఒక అగ్రశ్రేణి రేడియో ప్రయోక్త గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతే కాక వందల కొద్దీ ఔత్సాహిక గాయనీ గాయకులకి తన శిక్షణ ద్వారా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఇవన్నే ఒక ఎత్తు అయితే 1980 లో విడుదల అయిన “మా భూమి” సినిమాకి సంగీత దర్శకురాలిగా సీతా దేవి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

యావత్ దేశంలోనే భారత దేశం సినిమాలకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్ ల తరువాత అటువంటి ఖ్యాతి తెచ్చుకున్న తొలి తెలుగు సినిమా “మా భూమి”. తెలంగాణా సాయుధ పోరాటం (1940-48) నేపధ్యంలో బి. నరసింగ రావు నిర్మించిన ఆ చిత్రంలో సీతా దేవి గారు ఐదు పాటలకీ స్మగీతం సమకూర్చారు. అందులో బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడకో.. అనే పాట వినని, పాడుకోని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. గద్దర్, సంధ్య, మోహన్ రాజు చేత ఆయా పాటలు పాడించడమే కాక మహా కవి శ్రీ శ్రీ గారి గేయాలకి బాణీలు కట్టి ఆ సినిమాలో ఎంతో సముచితంగా వాడుకున్నారు సీతా దేవి గారు. బెర్లిన్, కైరో, సిడ్నీ మొదలైన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టి వల్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఆ తరువాత “మా ఊరి కథ” అనే సినిమాకి కూడా సీత గారు సంగీత దర్శకురాలు. ఆమె సేవలకి గుర్తింపు గా గృహ లక్ష్మి స్వర్ణ కంకణం మొదలైన వందలాది పురస్కారాలు అందుకున్న విదుషీ మణి మన వింజమూరి సీతా దేవి గారు.

anasooya - sitha - gruhalakshmi 1934

సీత గారితో నా మొదటి పరిచయం 1977 లో ఆమె మొదటి సారి అమెరికా వచ్చినప్పుడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆమెకి నేనూ, మా ఆవిడ, మా పిల్లలూ అంటే ఎంతో ఆప్యాయత. నేనే కాదు. ఎవరైనా సరే అందరినీ అదే ఆప్యాయత తో పలకరించి కబుర్లు చెప్పే వారు. ముఖ్యంగా ఆవిడ హ్యూస్టన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు మా తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలు జరిగినా సంగీతం కార్యక్రమాలని సొంతం చేసుకుని తన అసమాన అనుభవంతో అందరికీ మంచి పాటలు నేర్పి ఆయా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించే వారు. ఆవిడ నిస్వార్థ సేవలకి మేము అందరం ఎంతో ఋణపడి ఉన్నాం.

 

సీత గారు మంచి రచయిత్రి. జాన పదాలు, ఎంకి పాటలు, స్త్రీల పాటలు మొదలైన పుస్తకాలు తెలుగులోనూ, అందరూ నేర్చుకుని పాడుకోడానికి వీలుగా ఇంగ్లీషు లోనూ సంగీతం నోటేషన్ తో సహా ప్రచురించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప గాయని, రేడియో ప్రయోక్త, సంగీతం టీచర్ గా తన సుదీర్ఘ జీవితంలో వేలకొద్దీ కళాకారుల, సంగీత ప్రేమికుల గౌరవాభిమానాలని పొందిన అమర గాయని మా అందరి “అమ్మా పిన్ని”, డా. వింజమూరి సీతా దేవి గారికి వ్యక్తిగతంగానూ, అశేష అభిమానుల తరఫునా నివాళి అర్పిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

 

జింబో బొంబాయి నగర ప్రవేశం

 

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

chitten rajuకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాశాక..ఆ మాట కొస్తే రాయడానికి కొన్ని నెలల ముందే “తరవాత ఏమిటీ?” అనే ప్రశ్న మా క్లాస్ మేట్స్ అందరినీ వేధించేది. కొంత మంది పై చదువుల కోసం ఆలోచిస్తూ ఉంటే మరి కొందరు ఉద్యోగాల వేట మొదలుపెట్టే వారు. ఆ రోజుల్లో పై చదువులు అంటే.ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ నాకు తెలిసీ మొత్తం ఆంధ్రాలో ఎక్కడా లేదు. హైదరాబాద్ ఉస్మానియాలో ఉందేమో కానీ అందరి దృష్టీ బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సి లేదా మద్రాసు, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. ల మీద మాత్రమే ఉండేది. చాలా తక్కువ సీట్లు ఉండే వాటిల్లో అడ్మిషన్ కావాలంటే డిగ్రీ పరీక్ష లో ఫస్ట్ క్లాస్ వస్తే చాలదు. అందరి కంటే ఎక్కువగా డిస్టిన్క్షన్ కూడా వస్తే ఇంటర్వ్యూ కి అర్హులు అయ్యే చాన్స్ ఉంది. ఆ తరువాత ఆ ఇంటర్వ్యూ లో నెగ్గాలి. ఇక ఉద్యోగాల విషయాల కొస్తే..ముఖ్యంగా మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగం కావాలంటే యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏవో అర డజను పంచదార ఫేక్టరీలు, వైజాగ్ లో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ….ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవలసిందే. సివిల్ ఇంజనీర్స్ కి నాగార్జున డామ్ లో జూనియర్ ఇంజనీరింగ్ లాంటివి ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి రావచ్చును. ఆ మాట కొస్తే సివిల్ ఇంజనీర్లకి తప్ప ఇతర బ్రాంచ్ వాళ్ళెవరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు లేనే లేవు….బహుశా ఇప్పుడు కూడా…అంచేత అటు ఉద్యోగానికి కానీ, పై చదువులకి కానీ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవలసినదే.

నా విషయంలో నేను అప్పటికీ పై చదువులు చదవాలి అని నిశ్చయించేసుకున్నాను కానీ మా కుటుంబం ఆర్ధిక పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఎలాగా ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా, ఎక్కడో అక్కడ స్కాలర్ షిప్ రాకపోతుందా అనుకున్న నాకు రిజల్ట్స్ పెద్ద అశనిపాతంలా తగిలాయి. నా పేరు సెకండ్ క్లాస్ లో ఉంది. నా జన్మలో అలాంటి అనుభవం అదే మొదటి సారి. అప్పటి దాకా చిన్నప్పటి నుంచీ నేను ఏ నాడు ఏ పరీక్ష రాసినా నూటికి 60 % తప్పకుండా వచ్చేవి. అలాంటిది ఇంజనీరింగ్ ఫైనల్స్ లో మార్కులు వచ్చాక చూస్తే నేను ఏ నాడూ ఊహించనట్లుగా రెండు సబ్జెక్ట్ లో 40 శాతం..అంటే పాస్ మార్కులు…వచ్చాయి. ఇండస్ట్రియల్ ఎడ్మినిష్త్రేషన్ & మెటలర్జీ… ఆ రెండూ కూడా నేను చాలా బాగా రాసిన పేపర్లే. కేవలం పాస్ మార్కులే వేశారూ అంటే ఎక్కడో, ఏదో తేడా ఉంది అనిపించి ఆ పేపర్లు ఎవరు దిద్దారూ అని కాలేజ్ కి వెళ్లి ఆరా తీశాను. అప్పుడు తెలిసింది ఆ పేపర్లు దిద్దిన ఇద్దరు లెక్చరర్లు దగ్గర స్నేహితులు. అందులో ఒకాయన మాకు బంధువే కానీ ఎందుకో మా కుటుంబం అంటే పడదుట. మాకు ఆయన పాఠాలు చెప్పేటప్పుడు నన్ను కొంచెం చులకన గానే చూసేవాడు కానీ నేను ‘నలుగురిలో నారాయణా’ బాపతే కాబట్టి అసలు పట్టించుకోలేదు. అంచేత అంతా బాగా రాసినా నాకు అత్తిసరుగా పాస్ మార్కులు వెయ్యడానికి ఇతర కారణాలు ఏమీ కనపడక ఆయన వ్యక్తిగతంగా ఈ పని చేశాడు అనే అనుకోవలసి వచ్చింది. కానీ చేసేది ఏమీ లేదు. రివాల్యుయేషన్ కి అప్లై చెయ్య వచ్చును అని ఎవరో సలహా ఇచ్చారు కానీ అదేం జరిగే పని కాదు అని తెలుసును. ‘ఎప్పటికైనా బ్రాహ్మడికి బ్రాహ్మడే శత్రువు’ అని కూడా ఎవరో అన్నారు. యాభై ఏళ్ల తరువాత అమెరికాలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది.

BE V Marks Sheet

ఆ రోజుల్లో ఈ ఫస్ట్ క్లాస్ ..అంటే 60% శాతం మొత్తం అన్ని మార్కులూ కలిపి రావాలి. నాకు ప్రాక్టికల్స్ లో 61.5%, సెషనల్స్..అంటే వైవా పరీక్షలలో 65 శాతం వచ్చాయి. కానీ పైన చెప్పినట్లు రెండు సబ్జెక్టులలో   జరిగిన అన్యాయం వలన థీరీ లో 57.12 శాతం వచ్చాయి. మూడూ కలిపి మొత్తం మీద చూస్తే మార్కుల ప్రకారం నా సగటు మార్కులు 60.37 శాతం. కానీ దురదృష్టవశాత్తూ అప్పటి రూల్స్ ప్రకారం థీరీ, ప్రాక్టికల్స్ మాత్రమే కలిపి చూశారు. ఆ సగటులో నాకు 58.22శాతం వచ్చి, కేవలం 1100 లలో 1.78 మార్కు తక్కువ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోలేక పోయాను. అలాంటి నాకు నలభై ఏళ్ల తరవాత 2006 లో మా కాలేజ్ వజ్రోత్సవాలలో నన్ను “Distinguished Alumni” అని చిరు సత్కారం చేసినప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది.

ఆ రోజుల్లో క్లాసులో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే దిష్టింక్షన్..అంటే 70 శాతం మార్కులు…తెచ్చుకున్న వాళ్ళకీ,  ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి కూడా ఐఐటిలు, ఐఆఎస్ సి ల లో పై చదువు, లేదా మద్రాసు, బెంగుళూరు లలో పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు బాగానే వచ్చేవి కానీ, నా లాంటి వారికి ఎదరంతా ఎడారే!. ముఖ్యంగా రాజకీయ పలుకుబడి కానీ, వ్యాపార వారసత్వాలు కానీ లేని అగ్రకుల సంజాతుడి పరిస్థితి అధోగతే అనిపించేది. ఎటు నుంచి ఎటు చూసినా రాష్ట్రం వదలి వెళ్లి పోవడం తప్ప గత్యంతరం లేనే లేదు. ఏ రాష్ట్రం లో అయినా ఉన్నత విద్యావకాశాలు కానీ, ఉద్యోగాలు ఉన్నాయి అంటే అవి కేవలం ఆయా రాష్ట్రాల నుంచి వెలువడే ఇంగ్లీషు దిన పత్రికలలో ప్రకటనలు మాత్రమే ఏకైక ఆరాధం. లేదా, పెట్టే, బేడా సద్దేసుకుని ఏ మహా నగరంలో మనకి బంధువులో, స్నేహితులో ఉంటే అక్కడికి వెళ్లి పోయి గుమ్మాలు తొక్కి వెతుక్కోవడమే! ఆ రోజుల్లో బొంబాయి నుంచి వెలువడే టైమ్స్ ఆఫ్ ఇండియా, మద్రాస్ నుంచి ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్….ముచ్చటగా మూడే మూడు ఇంగ్లీషు పేపర్లు కాకినాడలో కనపడేవి. వాటిల్లో ఆదివారం నాడు స్థానిక రాష్ట్రాల ప్రకటనలు ఎక్కువగానే ఉన్నా, దేశం మొత్తానికి సంబంధించిన ప్రకటనలు ఈ మూడింటి లోనూ ఉండేవి.

ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆ రోజుల్లో పై చదువులకి అమెరికా వెళ్ళవచ్చును అనే ఆలోచనే అస్సలు రాలేదు. ఆ మాటకొస్తే ఆ ఆలోచన మా కాలేజ్ లో చాలా తక్కువ మందికి ఉండేది. ఇంజనీరింగ్ డిగ్రీ చేతికొచ్సినా, జీవితంలో ఏం చెయ్యాలో తెలియక ఆయా పత్రికలలో నేను గమ్యం వెతుక్కుంటున్న ఓ శుభ సమయంలో బొంబాయిలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లో దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం దరఖాస్తులు కోరుతూ ఒక ప్రకటన చూశాను. నాకున్న డిగ్రీ కి నేను ఎటువంటి ఐఐటి అర్హుడిని కాదు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేను దాన్ని కాదని వెంటనే అప్లికేషన్ పంపించి ఆ సంగతి మర్చి పోయాను. కానీ అదే విషయంలో మరో సంగతి ఖచ్చితంగా గుర్తు ఉంది. అదేమిటంటే గోవిందరాజులు కూడా నాతో బాటే బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు.

మా క్లాస్ లో ఇద్దరు గోవింద రాజులు  ఉండే వారు. వారిలో ఆర్. గోవిందరాజులు ఎలెక్ట్రానిక్స్ చదివి ఆ తరువాత వరంగల్ కాలేజీ కి వెళ్లి అక్కడ పి.జి. చేశాడు. ఆ తరువాత అక్కడే ప్రిన్సిపాల్ గా కూడా పని చేశాడు అని విన్నాను కానీ 1966లో మా కాలేజ్ రోజుల తరవాత అతన్ని ఇప్పటి దాకా చూడ లేదు. ఇక రెండో వాడు ఎన్. గోవిందరాజులు కాకినాడ వాడే. జగన్నాధ పురంలో ఉండే వాడు. అతని నాన్న గారు మైన్ రోడ్ లో మసీదు పక్కన చుట్టలు చుట్టే వ్యాపారం చేసీవారు. ఇతనూ, ఇతని అన్నయ్యలూ మంచి బాడీ బిల్డర్స్. కండలు తిరిగిన శరీరంతో మా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న ఐదేళ్ల పాటూ అతనే మిస్టర్ కాలేజ్. మిత భాషి. అతనికి తెలిసిన తిట్టు అల్లా “సంపేత్తాను”. అలా అనడమే కానీ ఎప్పుడూ ఎవరిమీదా చెయ్యి చేసుకునే వాడు కాదు. ఒక సారి మటుకు మా కాలేజ్ వాళ్ళు ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ లో రంగరాయ మెడికల్ కాలేజ్ టీమ్ తో కోకో ఆట ఆడుతున్నప్పుడు ఇతను పరిగెడుతూ కేవలం గట్టిగా వీపు మీద “ముట్టు” కోగానే పాపం ఆ దెబ్బకి డాక్టర్ చదువుతున్న ఒకానొక అర్భకుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇతను కావాలనే కొట్టాడు అని వాళ్ళ టీమ్ నానా గొడవా చేసి ప్రిన్సిపాల్స్ దాకా తీసుకెళ్ళారు. అది ఇంకా పెద్ద గొడవ అవును కానీ గోవిందరాజులు హాస్టల్ లో ఉండే పై ఊరి వాడు కాక స్థానికంగా కాకినాడ వాడే కాబట్టి సరిపోయింది. ఏమైతేనేం, నాకు మటుకు అతను చాలా మంచి స్నేహితుడు. నాతోబాటే అతను కూడా బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు. నాకంటే మంచి మార్కులు వచ్చాయి కాబట్టి బెంగుళూరు ఐఐఎస్ సి కి కూడా అప్లై చేశాడు.

ఓ రోజు అనుకోకుండా ఆ ఐఐటి నుంచి మా ఇద్దరికీ ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది. గోవిందరాజులు కి అది రావడంలో ఆశ్చర్యం లేదు కానీ నాకు కూడా ఒక ఐఐటి …అందునా ఎక్కడో అవతలి తీరాన్న ఉన్న బొంబాయి ఐఐటి నుంచి మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నేను ఎగిరి గంతేశాను కానీ మా నాన్న గారు “అంత దూరం పై చదువులకి పంపించడానికి డబ్బు లేదు.” అని చెప్పేశారు. అప్పుడు నాకు కావలసిన మొత్తం డబ్బు కాకినాడ నుంచి  బొంబాయి రానూ, పోనూ రైలు టిక్కెట్టు 60 రూపాయలు, నాలుగు రోజులు తిండికీ, ఇతర ఖర్చులు 50 రూపాయలు, ఒక వేళ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వంద రూపాయలు ఫీజు వెరసి సుమారు 200 రూపాయలు. మా పెద్దన్నయ్య ని అడగగానే ఎప్పటి లాగానే పొలం పనులు ఉన్నాయి అంటూ పొలం పారిపోయాడు. అప్పుడే లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టినా ఇంకా ఆదాయం లేని మా చిన్నన్నయ్య “ఇది చాలా మంచి చాన్స్ రా. వదులుకోకు.” అని ఓ వంద రూపాయలు ఇచ్చాడు. నా పై అన్నయ్య సుబ్రహ్మణ్యం మణిపాల్ లో మెడిసిన్, మా తమ్ముడు కాకినాడ లోనే ఇంజనీరింగ్ మూడో ఏడు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం లేదు. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ కలిసి ఇద్దరికీ కావలసిన మొత్తం మూడు, నాలుగు వందలు పోగేసి బొంబాయి వెళ్ళడానికి రైలు ఎక్కేశాం. రాత్రి కాకినాడలో ఎక్కి, మర్నాడు పొద్దున్న హైదరాబాద్ లో దిగి, అక్కడ మా అక్కా, బావ గార్లని పలకరించి, రాత్రి బొంబాయి రైలు ఎక్కి మర్నాడు మధ్యాహ్నం ఒంటి గంట కి బొంబాయి దాదర్ స్టేషన్ లో దిగాం నేనూ, గోవిందరాజులూనూ.

అంతకు ముందుటేడు మేము ఇంజనీరింగ్ ఫైనల్ సంవత్సరం లో ఎడ్యుకేషనల్ టూర్ లో మా బేచ్ అంతా బొంబాయి వచ్చి, చాలా ఫేక్టరీలు చూసినా, మాకు అక్కడ ఎవరూ తెలియదు. దాదర్ స్టేషన్ లో దిగి “ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా?” అని అడగగానే “పక్కనే మాటుంగా లో మద్రాసీ హోటల్స్ ఉంటాయి” అని ఓ టాక్సీ వాడు మా ఇద్దరినీ మాటుంగా తీసుకెళ్ళి ఓ అయ్యర్ హోటల్ దగ్గర దింపాడు. 48 గంటల రైలు ప్రయాణంలో ఒళ్లంతా బొగ్గు నుసితో నీరసంగా ఉన్న మమ్మల్ని చూసి రూములు ఖాళీ లేవు కానీ స్నానం చేసి బట్టలు మార్చుకోడానికీ, కావాలంటే రాత్రి వరండాలో పడుకోడానికి మడత మంచాలు ఇస్తాను అన్నాడు ఆ అయ్యర్ గారు. ఆ చుట్టుపక్కల అంతా అచ్చు మద్రాసు అడయార్ వాతావరణమే. అందరూ లుంగీలతోటే, నిలువు బొట్లూ, అడ్డ వీభూతులతోటే ఉన్నారు.

ఇక భాష ఎలాగా తమిళమే….బొంబాయి నడిబోడ్డులో తమిళుల ఒయాసిస్ ఆ మాటుంగా అనే ప్రాంతం. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ స్నానాలు చేసి రెడీ అయి, ఆ మర్నాడు ఇంటర్వ్యూ లు కాబట్టి ముందే అక్కడికి వెళ్లి చూసి వద్దాం అని మా అయ్యర్ గారిని పవయ్ అనే ప్రాంతం లో ఉండే ఐఐటికి ఎలా వెళ్ళాలో కనుక్కుని, లోకల్ రైలు ఎక్కి, విక్రోలి స్టేషన్ లో దిగి అక్కడ బస్సు ఎక్కి సాయంత్రం ఐదు గంటలకి ఐఐటి మైన్ గేట్ దగ్గర దిగాం. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ వాళ్ళని చూసి కొంచెం భయం వేసింది కానీ వాళ్ళు కార్లలో వెళ్ళేవాళ్ళనే ఆపి వివరాలు అడిగి అప్పుడు పెద్ద గేటు తియ్యడం చూసి ధైర్యంగా నడిచి చిన్న గేటు లోంచి లోపలకి వెళ్ళిపోయాం. సిమెంట్ రోడ్డుకి అటూ, ఇటూ పోక చెట్లతో ఎంతో హాయిగా ఉన్న రోడ్డు మీద భయం భయంగా నడుస్తూ ఒకాయన కనపడగానే మా వివరాలు చెప్పి మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ ఎక్కడో చెప్పగలరా అని అడిగాం. ఆయన చెప్పినట్టు ముందు పచ్చటి తివాసీ లా పరుచుకున్న అందమైన లాన్ లో ఓ పెద్ద బిల్డింగ్ కనపడగానే ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాం. అదే నాలుగంతస్తుల మైన్ బిల్డింగ్.  లోపల ఆహ్వానం పలుకుతూ ఈ ఐఐటి అనే అత్యున్నత స్థాయి సాంకేతిక విద్యాలయాల ఆలోచనకి మూల పురుషుడూ, ఆ భవనానికి శంఖుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో, స్వాగత వచనాలు మాలో మరింత హుషారు పెంచాయి. 1958 లో నెహ్రూ గారు శంఖుస్థాపన కోసం వచ్చిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అందులో ఆయనతో కరచాలనం చేస్తున్న ఆయన బ్రిగేడియర్ బోస్ గారు, పక్కన ఉన్నాయన ఎ.కె. కేల్కర్ గారు.

Nehru-Bose Handshake నేను ఐఐటి లో ఉన్న మొదటి మూడేళ్ళు బోస్ గారు’, ఆ తరువాత మూడేళ్ళు కేల్కర్ గారు డైరెక్టర్లుగా పని చేశారు. బొంబాయిలో నిరంతరం కురిసే వర్షాలలో తడవ కుండా అన్ని డిపార్ట్ మెంట్ ల భవనాలనీ కలుపుకుంటూ ఒక పొడుగాటి కారిడార్ ఐఐటి భవన సముదాయాల ప్రత్యేకత. వాటిల్లో ఒకటయిన మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కి మేము వెళ్లినా అప్పటికే చీకటి పడింది కాబట్టి అక్కడ కూడా కాపలా ఉన్న సెక్యూరిటీ వాడు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వ లేదు. మొత్తానికి ఆ మర్నాడు ఇబ్బంది లేకుండా ముందు రోజే అన్నీ చూసుకుని, నేనూ, గోవిందరాజులూ వచ్చిన దారినే వెనక్కి మాటుంగా వెళ్లి ఆ రాత్రి మడత మంచాల మీద వరండాలో పడుకున్నాం. మా ఇద్దరి పెట్టెలూ ఆ మంచాలకే గొలుసులతో తాళం వేసుకోమని ఆ అయ్యర్ గారు ఇచ్చిన సలహా పాటించాం.

ఆ మర్నాడు నా జీవితాన్నే మార్చేసిన ఇంటర్వ్యూ  తతంగం గురించి….వచ్చే సారి ….నమ్మండి, నమ్మకపొండి, ఆ రోజు తరువాత నేను ఇప్పటి దాకా..అంటే గత యాభై ఏళ్లలో గోవిందరాజులుని మళ్ళీ చూడ లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడని విన్నాను.

మరల రాని మధుర “వసంతం”

 

 

 

వంగూరి చిట్టెన్ రాజు

~

chitten rajuఅది సెప్టెంబర్ 29, 2015. ఆ రోజు హ్యూస్టన్ మహా నగరం లోని నాసా అంతరిక్ష కేంద్రం చూడడానికి వెళ్ళిన వేలాది సందర్శకులు అక్కడి మిషన్ కంట్రోల్ భవనం మీద ఉన్న అమెరికా జాతీయ పతాకం సగం క్రిందకి దించబడి ఉండడం గమనించి “పాపం ఎవరో గొప్ప వ్యక్తి మరణించి ఉంటారు” అనుకున్నారు. మరో కొన్ని నెలలలో సందర్శకులు అదే ప్రాంగణం లో అమెరికా ప్రభుత్వ వ్యవస్థ అయిన నాసా వారు  మరణించిన ప్రముఖుల జ్ఞాపకార్థం సగౌరవంగా నాటిన వృక్ష సముదాయంలో మరో పారిజాతం పరిమళాలు వెదజల్లుతూ కనపడుతుంది. ఆ వృక్ష నివాళి లో భారతీయ సంతతి కి చెందిన వారు ఇద్దరే. ఇద్దరూ మహిళలే. మొదటిది 2003 లో జరిగిన “కొలంబియా” రోదసీ నౌక ప్రమాదంలో అసువులు బాసిన ఏకైక భారతీయ వ్యోమ గామి కల్పనా చావ్లా. రెండోది గత సెప్టెంబర్ 28, 2015 నాడు ఎవరూ, ఊహించని విధంగా “కపాల మోక్షం” చెందిన పదహారణాల తెలుగింటి ఆడపడుచు, నాసా శాస్త్ర వేత్త డా. పుచ్చా వసంత లక్ష్మి. ఆ వృక్షానికి నేను పెట్టుకునే పేరు “వసంత వృక్షం”. ఎందుకంటే అటువంటి పరిపూర్ణమైన మహిళ  కానీ, ఆ పేరిట కలకాలం నిలిచే వృక్షం కానీ న భూతో, న భవిష్యతి.

గత సెప్టెంబర్ 23, 2015 నాటి దౌర్భాగ్య దినాన ఎప్పటి లాగానే వసంత మధ్యాహ్నం లంచ్ సమయంలో “ఇప్పుడే అరగంట లో వస్తాను” అని తన సాటి వారితో చెప్పి, ఆ మర్నాడు ఒక కాన్ ఫరెన్స్ కోసం కాలిఫోర్నియా వెళ్ళడానికి ఏర్పాట్ల కోసం కారు లో బయలు దేరి, దారి తప్పి, సెల్ ఫోన్ లో ఒక సహా ఉద్యోగిని పిలిచి సరి అయిన దారికి మళ్ళుతున్న క్షణం లో …అంటే ఉదయం 11: 12 నిముషాలకి దేముడు పిలిచాడు. ఏ విధమైన సూచనలూ లేకుండా హఠాత్తుగా బ్రైన్ హేమరేజ్ వచ్చి, కారు అదుపుతప్పి, ఒక రెస్టారెంట్ వారి భవనం గోడ కి దూసుకు పోయింది. అది చూసిన వారు 911 కి ఫొన్ చెయ్యగానే ఆంబ్యులెన్స్ వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. వెను వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ధరించిన నాసా బేడ్జ్ ని గుర్తించి, వివరాలు సేకరించి, ఒక ఆమె భర్త మల్లిక్ కి వసంత రోడ్డు ప్రమాదం వార్త మధ్యాహ్నం 1:30 కి అందించ గలిగారు. నాకు కూడా మల్లిక్ చెప్పగానే హుటాహుటిన నలభై మైళ్ళ దూరం లో ఉన్న హాస్పిటల్ కి 2:30 కి వెళ్లాను. ఆ తరువాత ఐదు రోజులు అన్ని రకాల వైద్యులు, ఎన్ని రకాల చికిత్సలు చేసినా వసంత ని మాకు దక్కించ లేక పోయారు. సెప్టెంబర్ 28, 2015 సాయంత్రం మా అందరి సమక్షంలో వసంత ఆ దేవుడి దగ్గరకి వెళ్ళిపోయింది. ఆ నాలుగు రోజులూ మేము ఎంత క్షోభ అనుభవించామో ఆ దేవుడు అంతే ఆపేక్ష గా వసంత కోసం నిరీక్షించి ఉంటాడు. నాకు అందుకే ఆ దేవుడంటే చాలా అసూయ.

NASA Award

ప్రతిష్టాత్మక నాసా పురస్కారం అందుకుంటూ..

నలభై ఏళ్లగా నాకూ, మా ఆవిడకీ ఏకైక గాఢ స్నేహితురాలిగా, మా పిల్లలకి “బొడ్డు కోసి పేర్లు పెట్టిన “పెత్తల్లి” గా వసంత గురించి వ్రాయాలంటే ఎక్కడ మొదలెట్టాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది. అమెరికా లో ఫార్మకాలజీ శాస్త్రవేత్తలలో ఆమెకున్న అగ్రశ్రేణి స్థానం గురించి వారి కుటుంబానికీ, నాకూ తప్ప చాలా మందికి తెలియని విశేషాలు ముందుగా ప్రస్తావిస్తాను.

1946  లో అంబటిపూడి నరసింహం, శ్రీహరి దంపతులకి ఏకైక సంతానంగా కాకినాడ లో తాత గారైన మద్దూరి సోమయాజుల గారి ఇంట్లో పుట్టిన వసంత లక్ష్మి తండ్రి  గారి ఉద్యోగ రీత్యా విశాఖపట్నం, కాకినాడ, రాయపూర్, భిలాయ్ నగరాలలో బయాలజీ శాస్త్రాలలో మాస్టర్స్ డిగ్రీ దాకా చదువుకుంది. 1968 లో పుచ్చా మల్లిఖార్జున వెంకట సుబ్రమణ్యం (మల్లిక్) తో వివాహం అయిన తరువాత నాలుగేళ్ళు బెంగుళూరు లో మల్లిక్ భారత ఎలాక్రానిక్స్ కంపెనీ లోనూ, వసంత హెబ్బల్ లో అగ్రికల్చురల్ యూనివర్సిటీ లోనూ పనిచేసి, 1972 లో ముందు మల్లిక్, ఏడాది తరువాత నాలుగేళ్ల కొడుకు గిరీష్ తో వసంతా హ్యూస్టన్ వలస వచ్చారు. రాగానే వసంత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ముందు బయాలజీ లో చేరి, ఫార్మకాలజీ లోకి మారి వరసగా మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ 1980 లో పూర్తి చేసింది. వెనువెంటనే అమెరికా ప్రభుత్వం వారి నేషనల్ రిసెర్చ్ కౌన్సిల్ వారి పోస్ట్ డాక్టరల్ ఫెలోగా నాసా అంతరిక్ష కేంద్రం వారి బయో సైన్సెస్ విభాగంలో చేరింది.

అదే ఫెలో షిప్ తో కొన్నేళ్ళు నార్త్రప్ అనే కంపెనీ లో మూడేళ్ళు కొనసాగుతూ మంచి పరిశోధకురాలిగా పేరు సంపాదించుకుంది. ఆ కారణంగా నాసా వారు 1989 లో అక్కడ ఫార్మకాలజీ లేబొరేటరీ సంస్థాపన బాధ్యతలు వసంత కి అప్పగిస్తూ ఆ ప్రభుత్వ సంస్థ లోనే కీలకమైన పదవి లో నియమించారు అప్పటి నుంచీ వసంత ఇక శాస్త్ర వేత్తగా వెను తిరిగి చూడ లేదు. అచిర కాలం లోనే అమెరికాలో అత్యున్నత స్థాయి ఫార్మకాలజీ పరిశోధనాలయం నాసా వారిదే అనే విధంగా ఆ లేబోరేటరీని తీర్చి దిద్దింది.  నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ స్పేస్ బయో మెడికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్, అమెరికా ప్రభుత్వ నౌకాదళం మొదలైన జాతీయ స్థాయి సంస్థల నుండి అనేక మిలియన్ డాలర్ల రిసెర్చ్ గ్రాంట్స్ సంపాదించి అంతరిక్షం లో మానవ శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, కేవలం జీరో గ్రావిటీ లో మాత్రమే తయారు చెయ్యగల మందుల తయారీ మొదలైన అనేక శాస్త్రీయ విషయాలపై అగ్ర స్థాయి పరిశోధనలు చేసింది మన వసంత. అనేక అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో సుమారు వందకి పైగా పరిశోధనా పత్రాలు, పది విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్య పుస్తకాలలో అధ్యాయాలు, మూడు పేటెంట్లతో నాసా లో ఉన్న నలభై వేల మంది ఉద్యోగస్తులలో సీనియర్ సైంటిస్ట్ లు పదముగ్గురి లో మన తెలుగు ఆడబడుచు వసంత ఉన్నత స్థానం లో నిలబడింది…కేవలం స్వయం కృషి తో. అంతే కాదు, తను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ తోనూ, అనేక దేశాలలోని అగ్ర సంస్థల తోనూ నాసా తరఫునా, వ్యక్తిగతంగానూ విశేషమైన సేవలు అందిస్తూనే, నాసా వారికి ప్రవేటు సంస్థలతో అనుబంధం కలిగించి, అంతరిక్ష యానంలో ఏస్ట్రోనాట్స్ తరచూ వచ్చే మోషన్ సిక్ నెస్ నివారణకి తను స్వయంగా కనిపెట్టిన మందులు వ్యాపార పరంగా తయారు చెయ్యడానికి పూర్తి ఏర్పాట్లు చేసింది వసంత. మల్లిక్ కూడా నాసా లోనే ఉద్యోగం చేసేవాడు కాబట్టి వాళ్ళిద్దరినీ “స్పేస్ కపుల్” అని అందరూ పిలిచే వారు.

ఒక శాస్త్రవేత్తగా వసంత కి ఉన్న స్థాయి గుర్తింపు కి మరొక ఉదాహరణగా సెప్టెంబర్ 30, 2015 నాడు ఆమె అంతిమ యాత్రకి నాసా ఉన్నత అధికారులు వచ్చి, నాసా తరఫున అమెరికా జాతీయ జండాని ఆమె కుటుంబానికి తమ నివాళి గా సమర్పించారు. అమెరికా దేశంలో ఇది అత్యంత గౌరవప్రదమైన నివాళి గా పరిగణిస్తారు. వ్యక్తిగా వసంత అంటే ఆమె సహాధ్యాయులకి ఎంత గౌరవం అంటే నవంబర్ 8, 2015 నాడు “Celebration of Vasanta’s Life” అని ఆమె కుటుంబం నిర్వహించిన ఆత్మీయ కార్యక్రమానికి 35 సంవత్సరాల క్రితం వసంత మాస్టర్స్ & డాక్టరేట్ కి గైడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ స్టువార్ట్ సేల్ద్మన్ గారు జార్జియా నుంచీ, ఆమెతో పని చేసిన నాసా డైరెక్టర్ డా. కేరోలైన్ హంటూన్,  ఇతర ప్రాంతాల నుండీ అనేక మంది సిబ్బందీ ప్రత్యేకంగా వచ్చి తమ జ్ఞాపకాలని పంచుకున్నారు.

 

వసంతకి ఉన్న ఒక గుణం ఏమిటంటే వృత్తి రీత్యానూ, ఒక అగ్రశ్రేణి శాస్త్ర వేత్త గానూ తను సాధించిన విజయాలని, ఎదురైన ఇబ్బందులనీ స్నేహ బృందంతో ఎక్కువగా పంచుకునే అలవాటు లేదు. కానీ ఆ అదృష్టానికి నేను నోచుకున్నాను. పైన ఉదాహరించిన చాలా వివరాలు అప్పటికప్పుడే నాకు వసంత పిలిచి చెప్పి సంబరపడుతున్నప్పుడు “మన వాళ్ళందరికీ చెప్పావా?” అని అడినప్పుడల్లా “ఎందుకు రాజూ, ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకుంటారు. పోనీ ఇదేమైనా ఓ ఆటా, పాటా వ్యవహారమా” అనేది. అందుకే ఆమె అసంఖ్యాక మిత్ర బృందానికి వసంత ఆటా, పాటల గురించే ఎక్కువ తెలుసును కానీ శాస్త్రవేత్త గా ఉన్న అఖండమైన ప్రఖ్యాతి తెలియదు.

ఇక నాకూ, వసంత కీ పరిచయం చిన్నపుడు పరోక్షంగానూ, అమెరికా లో ప్రత్యక్షం గానూ జరిగాయి. రెండూ తమాషా సంఘటనలే. అప్పుడు మా ఇద్దరికీ పదిహేనేళ్ళు ఉంటాయేమో. మేము కాకినాడ గాంధీ నగరంలో ఉంటే వసంత వాళ్ళ తాత గారు మద్దూరి సోమయాజుల గారింట్లో రామారావు పేట లో పి.ఆర్. కాలేజీ & కుళాయి చెరువు దగ్గర ఉండే వారు. మా ఇద్దరివీ లాయర్ల కుటుంబాలే కాబట్టి రాకపోకలూ, పేరంటాలూ వగైరాలు కూడా ఉండేవి కానీ నాకు అవేమీ తెలియదు. కానీ ఒక సారి మా నీల పిల్లి అనే భలే పేరు ఉన్న మా చాకలి వాడు ఉతికి తెచ్చిన బట్టల మూట లో మా బట్టల బదులు వసంత వాళ్ళ ఇంటి తాలూకు మూట పట్టుకొచ్చి ఇచ్చి వెళ్లి పోయాడు. ఆ తరువాత మూటల మార్పిడి జరిగింది కానీ నాకూ, వసంత కీ మొట్ట మొదటి పరోక్ష పరిచయం మాకున్న కామన్ చాకలివాడు నీలపిల్లి ధర్మమా అనే జరిగింది. ఈ విషయం మేమిద్దరం అమెరికా లో ప్రత్యక్షంగా కలుసుకున్నాక మాటల కాకినాడ కబుర్ల సందర్భంలో తెలిసింది. మరో ముఖ్యమైన మరో పరోక్ష పరిచయం మేమిద్దరం కాకినాడ పి.ఆర్. కాలేజ్ లో ప్రి యూనివర్శిటీ లో ఒకే బేచ్ వాళ్ళం. కానీ నాది MPL..అంటే మేథమేటిక్స్, ఫిజిక్స్ & లాజిక్ అయితే వసంత ది BPC, అంటే బయాలజీ, ఫిజిక్స్ & కెమిస్ట్రీ. అంచేత ఎక్కడా ఏ క్లాస్ లోనూ కలిసే  అవకాశం లేదు. ఆ రోజుల్లో అమ్మాయిల సంఖ్య అతి తక్కువ కాబట్టి ఇతర విద్యార్ధుల లాగా గర్స్ వైటింగ్ రూమ్ చుట్టూ తిరిగితే కనపదేదేమో కానీ నేను “రాముడు మంచి బాలుడు” కాబట్టి ఏదో నా చదువూ, నా క్రికెట్టు ప్రపంచాలలోనే ఉండే వాడిని. అంచేత నేనూ, వసంతా అప్పుడు ఒకళ్ళకి మరొకరం గుంపులో గోవిందా బాపతే. ఇది కూడా మేము అమెరికాలో కలుసుకున్నాక పి.ఆర్. కాలేజ్ సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే తెలిసిన సంగతే.

Vasantha & Raju 1975

1975 లో…వసంతతో…

ఇక 1975 లో నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టిన నెల తిరక్కుండానే మల్లిక్, వసంత లని కలుసుకోవడం కూడా తమాషాగానే జరిగింది. కొన్నాళ్ళ నిరుద్యోగం తర్వాత అప్పుడే నేను యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరాను. ఒకరిద్దరు తెలుగు వారు కాని యూనివర్శిటీ విద్యార్థులు తప్ప ఎవరూ తెలియదు. ఓ వారాంతంలో మేము మాకు 200 మైళ్ళ దూరం లో ఉన్న సాన్ ఏంటోనియో నగరం చూడడానికి వెళ్ళాం. అక్కడ “రివర్ వాక్”…అంటే నదిలో బోట్ షికారు చాలా ప్రసిద్ది చెందింది. మా కుర్రాళ్ళం నలుగురం పైన వంతెన మీద నుంచుని క్రింద నదిలో పడవలలో విహరిస్తున్న మనుషులని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక పడవలో మన భారతీయులలాగా కనపడుతున్న ఒక కుటుంబాన్ని చూశాం.  ఆ రోజుల్లో భారతీయులు కనపడడం అపురూపం కాబట్టి గబ గబా చేతులు ఊపేసి హాయ్ అని చెప్తూ నేను అనుకోకుండా ఉత్తినే వేళాకోళానికి “ఏమండీ బావున్నారా?” అని తెలుగు లో గట్టిగా అరిచాను. వెంటనే ఆ పడవలో అమ్మాయి “ఆ బావున్నాం. మీరెలా ఉన్నారూ?” అని తిరిగి అరుస్తూ చెయ్యి ఊపింది. ఆ అమ్మాయే వసంత. ఆ తర్వాత వాళ్ళు ఒడ్డుకి వచ్చాక పరిచయాలు చేసుకుని తక్షణం జీవిత కాల స్నేహితులం అయిపోయాం. అప్పటికి నేను బ్రహ్మచారిని. మల్లిక్, వసంత లకి కొడుకు గిరీష్ కి నాలుగేళ్ళు. వారి సహజ సిద్దమైన ఆప్యాయత కీ తొలి ఉదాహరణ ఏమిటంటే అలా సాన్ ఏంటోనియో లో కలుసుకున్న వారం రోజులలో నేను మా ఇంజనీరింగ్ లాబ్ లో పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను వెతుక్కుంటూ పలకరించడానికి వచ్చి కేంటీన్ లో కాఫీ ఇప్పించారు. అప్పటి నుంచీ నా పెళ్ళయ్యే దాకా ఏదో వంక పెట్టుకుని వాళ్ళింటికి వెళ్లి పోయి వారానికి చాలా సార్లు అక్కడే తెలుగు భోజనం చేసేవాడిని. అందుకే మా అమ్మ తరువాత నాకు ఏమి ఇష్టమో వసంతకే ఎక్కువ తెలుసు. “రేపు గుమ్మడి కాయ వడియాలు చేస్తానురా” అనో “అరటి కాయ ఆవ పెట్టిన కూర నీకోసం రెడీగా ఉంది. వస్తావా?” అనీ “అనుజ్ గాడి కోసం ముక్కల పులుసు చేశాను. వాణ్ణి కూడా తీసుకోస్తావా. నీతో డబ్బాలో పట్టుకెళ్తావా? మీ పిల్లలందరికీ అది ఇష్టం మరి” అనో ఆప్యాయంగా వినిపించే ఆ వసంత పిలుపులు ఇక రావు.

Scan0036

వసంత, గిరిజ: ఇద్దరు నేస్తాలు

ఆ విధంగా 1975 మొదలైన మా పరిచయం గాఢ స్నేహంగా మారడానికి ఎన్నాళ్ళో పట్ట లేదు.  బ్రహ్మచారిగా ఉన్న మల్లిక్ & వసంత నాకు హ్యూస్టన్ లో మొట్ట మొదటి కుటుంబ స్నేహితులు కావడంతో నాకు కావలసిన కుటుంబ ఆత్మీయత వాళ్ళ దగ్గరే వెతుక్కుని తనివి తీరా ఆనందించాను. క్రమంగా మరో పది కుటుంబాలు పరిచయం అయినా పండగలు, పిక్నిక్ లు, షాపింగ్ లు, విహార యాత్రలు, సినిమాలు చూడ్డం, పేకాడుకోడం, దెబ్బ లాడుకోడం ..ఒకటేమిటి..అన్నీ వాళ్ళ తోటే. ఆ రోజుల్లోనే రత్న పాప కూడా అనిల్ కుమార్ ని పెళ్ళాడి హ్యూస్టన్ లో అడుగు పెట్టింది. అప్పటికే పాప చాలా పేరున్న కూచిపూడి నర్తకి. వసంత కి కూడా  చిప్పప్పటి నుంచీ శాస్త్రీయ నృత్యం, కర్నాటక సంగీతం లో ప్రావీణ్యం ఉండడమే కాక నలుగురినీ పోగేసుకుని ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం చెయ్యడానికి తెగ ఉవ్విళ్ళూరుతూ ఉండేది. అందుకే యూనివర్శిటీ లో మాస్టర్స్ డిగ్రీలో చేరగానే ఇండియన్ స్ట్యూడెంట్స్ యూనియన్ కి సెక్రటరీ గా అందరినీ పోగేసి నానా హడావుడీ చేసేది.

ఆ రోజుల్లో  అదొక్కటే యావత్ హ్యూస్టన్ మహా నగరానికీ కలిపి ఉన్న ఒకే ఒక్క ఇండియన్ సంఘం. అప్పుడే ఇండియా కల్చర్ క్లబ్ అని గుజరాతీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు మొదలుపెట్టి నప్పుడు మేమూ కలిసి మెలిసి రిపబ్లిక్ డే లాంటివి చేసే వాళ్ళం. ఊళ్ళో ఇండియన్ రెస్టారెంట్స్ లేవు కాబట్టి ఉన్న గృహిణులే ఆరు బయట కార్యక్రమాలకీ, అమెరికన్ ఫెస్టివల్స్ లో ఇండియన్ స్టాల్ పెట్టీ వంటలు చేసే వారు. అందులో దక్షిణాది వంటలకి వసంత ఎప్పుడూ ముందు ఉండి ఇడ్లీలు, దోశలు వందల కొద్దీ అలా వేస్తూనే ఉండేది. మేం అంతా మేత మేస్తూ సహాయం చేసే వాళ్ళం. 1975 ఏడాది చివరికి కేవలం తెలుగు కళాభిమానమే కాక కావలసిన ప్రావీణ్యం కూడా ఉన్న వాళ్ళం తగిన సంఖ్యలో హ్యూస్టన్ చేరడంతో అందరం తర్జన భర్జన పడి అమెరికాలో తొలి తెలుగు సాంస్కృతిక సంఘాల లో ఒకటయిన హ్యూస్థన్ తెలుగు సాంస్కృతిక సమితి కి శ్రీకారం చుట్టాం. తద్వారా అప్పటి దాకా దాసట, బీసటగా ఎవరో ఒకరి ఇంట్లో కొనసాగుతున్న చిన్నచిన్న సాంస్కృతిక కార్యక్రమాలూ, పండగలూ మొదలైనవి క్రమబధ్ధీకరించి స్థాయి పెంచడం లో కృతకృత్యులయ్యాం. మా సమితి మొట్ట మొదటి కార్య నిర్వాహక వర్గంలో ఊళ్ళో ఒక పెద్ద అయిన కోనేరు తాతయ్య గారు సమన్వయ కర్త, నేను సహా సమన్వయ కర్త కాగా వసంత, దువ్వూరి నారాయణ రావు గారు, పోతు నరసింహా రావు గారు & రాజేశ్వరి గారు, తమ్మారెడ్డి చంద్ర శేఖర్, పట్టిసపు గంగాధరం గారు, తుమ్మల కుటుంబ రావు సభ్యులు. అందులో పెద్దలు దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు 1957 లో హ్యూస్టన్ మాత్రమే కాక అమెరికా దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి భారతీయుడు. ఆయన వసంత పెద నాన్న గారు. అంటే వసంత తల్లి శ్రీ హరి గారు, నారాయణ రావు గారి భార్య కి స్వయానా చెల్లెలు.

1979 (1)

 

వీరిలో అందరూ ఊహించినట్టుగానే సాంస్కృతిక కార్యక్రమాలకి చైర్ పెర్సన్ ఇంకెవరూ…వసంతే. తన తో పాటు రత్న పాప, అనిల్, నేను, హీరా & సూరి దువ్వూరి, బాల & రామం చావలి. పొలాని జానకి రామయ్య, రవి తమిరిశ మొదలైన వాళ్ళం కలిసి నాటకాలు, డాన్సులు, బొమ్మల కొలువులు, పిల్లలకి భోగి పళ్ళు. ఉగాది పచ్చడి, దీపావళి టపాసులు, వన భోజనాలు, ఆటల పోటీలు…..ఒకటేమిటి అనేక రకాల కార్యక్రమాలతో తెగ సంబడం గా ఉండేది. అందరిలోకీ ఎక్కువ సంబరంగా ఉండేది ఎప్పుడూ వసంతే! ఎప్పుడైనా పొరపాటున తనని సలహా అడగక పోయినా, మరొకరితో ఎక్కువ మాట్లాడినా ప్రాణం తీసేసేది వసంత. అప్పుడే కాదు …మొన్న మొన్నటి దాకా కూడా ..మళ్ళీ అన్నీ మామూలే…. ఆ అలక అంతా అ క్షణమే! మర్నాడు ముక్కల పులుసు రెడీ!

 

1976 లో మా టీసీయే (తెలుగు సాంస్కృతిక సమితి కి హ్రస్వ రూపం) కాస్త నిలదొక్కుకోగానే నాకు మనం ఒక పత్రిక పెడదాం అని ఆలోచన వచ్చింది. అయితే ఇతర నగరాలలో లాగా కేవలం కమ్యూనిటీ వార్తల కోసమే కాకుండా ఒక సాహిత్య పత్రిక లా కథలూ, కవితలూ వేస్తే బావుంటుంది అని కూడా అనిపించి, ముందు వసంత ని పిలిచాను. “నీ బుర్ర బానే పని చేస్తోందే…కానీ కథలు, కవితలు ఎక్కడి నుంచి వస్తాయి?” అంది వసంత….అలా అందే కానీ అప్పటికే ఆ ఐడియా నచ్చేసింది అని నాకు అర్థం అయిపోయింది. కాస్సేపు మాట్లాడుకుని “ఇద్దరం చెరో కథా ముందు రాద్దాం” అని అనేసుకున్నాం. అలా నేను నా మొట్ట మొదటి కథ “జుల పాల కథ “ అనో చిన్న కథ వ్రాస్తే, వసంత “ఆవగింజ ఆంతర్యం” అని ఓ చిన్న కథ వ్రాసింది. ఒకరి కథ మరొకరు చదువుకుని “పరవా లేదులే” అనుకున్నాం. ఇక పత్రిక పేరు “మధుర వాణి” పెట్టి నేను ప్రధాన సంపాదకుడి గానూ, వసంతా, దువ్వూరి హీరా సహ సంపాదకులుగానూ మాకు మేమే నిశ్చయించేసుకున్నాం. ఆ పేరు మీద తర్జన భర్జనలు  ముఖ్యంగా “మధుర వాణి” అని గురజాడ పాత్ర పేరులా వ్రాయాలా, లేక “మధుర-వాణి” అని మధురమైన వాణి అనే అర్థ వచ్చేలా వ్రాయాలా అనే దాని మీద మా ముగ్గురి తగాదా రత్న పాప తీర్చింది…”మధ్యలో ఆ గీత ఎందుకూ అడ్డంగానూ” అంటూ…

ఆ విధంగా “ఆవగింజ ఆంతర్యం” కథ వ్రాయగానే ఆగ లేదు వసంత. దానికి తన కలం పేరు “వలపు” అని పెట్టుకుంది…అంటే ..”వసంత లక్ష్మి పుచ్చా” కి కుదింపు….ఎంత పొందిక గా కుదిరిందో కదా. దటీజ్ వసంత..ఏం చేసినా సొంత ముద్ర ఉండాల్సిందే! ఆ తరువాత ఉద్యోగం లోనూ, ఇతరత్రానూ ఎక్కువ రాయ లేదు కానీ నా సతాయింపు భరించ లేక “అసంకల్పిత ప్రతీ కార చర్య” అని మరో కథా, “మధ్యాప్యం” మొదలైన కవితలూ అడపా దడపా రాసేది. పదేళ్ళ క్రితం తెలుగు కథ శత వార్షికోత్సవం సందర్భం గా స్వర్గీయ భార్గవీ రావు గారు  “ఈ శతాబ్దంలో మహిళా రచయితల హాస్య కథలు” సంకలనం వేసినప్పుడు నేను ఈ “ఆవగింజ ఆంతర్యం” పంపిస్తే ఆవిడకి ఎంతో నచ్చి, ఆ సంకలనంలో ఎంపిక చేశారు. దానికి వసంత చాలా సంబర పడింది.

వసంత కి డ్రామాలంటే భలే ఇష్టం. “నన్ను హీరోయిన్ గా పెట్టి ఓ డ్రామా రాయకూడదూ? అస్తమానూ మీ మగాళ్ళేనా వేసేది?” అనేది. తన కోసమే మేము స్త్రీ పాత్రలు ఉన్న “ఇల్లు అమ్మబడును”, “ఆదివిష్ణు రాసిన డ్రామా మొదలైనవి వేశాం. అంతెందుకూ?  ఓ సారి జంధ్యాల రాసిన “గుండెలు మార్చబడును” వేద్దాం అనుకుంటే అందులో స్త్రీ పాత్ర లేదు కానీ ప్రధాన పాత్ర అయిన మగ డాక్టర్ మధు పాత్రని ఆడ పాత్రగా వసంత కోసం నేను తిరిగి వ్రాయవలసి వచ్చింది.

Telugu drama 1

1970-80 దశకం లో  నేనూ, అశోక్ కుమారూ మరి కొందరు బ్రహ్మచారులమూ మల్లిక్ & వసంత, అనిల్ & రత్న పాప, బాల & రామం, కుమారి & సుసర్ల శర్మ  కుటుంబాలూ  ఒకే వయసు వాళ్ళం కాబట్ట్టి బాగా కలిసి మెలిసి ఉండే వాళ్ళం. 1978 లో నేను ఇండియా వెళ్లి మా అమ్మ చెప్పిన అమ్మాయి గిరిజతో పెళ్లి ముహూర్తం కుదిరినప్పుడు అమెరికాలో ఒక్క వసంత, మల్లిక్ లకే ఫోన్ చేసి ఆ వార్త చెప్పాను. ఆ రోజుల్లో అక్కడ నుంచి అమెరికా ఫోన్ చెయ్యడం అంటే తలప్రాణం తోకలోకి వచ్చేది. మా పెళ్లి సమయానికి అమెరికా నుంచి వచ్చిన ఏకైక గ్రీటింగ్స్ టెలిగ్రాం కూడా వసంత, మల్లిక్ ల దగ్గర నుంచే! పెళ్ళయ్యాక గిరిజ అమెరికాలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజునే మా మిత్ర బృందం అందరినీ కలుసుకున్నా “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” వసంత తోటే. ఆ క్షణం నుంచీ వసంత మా ఆవిడని తనకి లేని సొంత చెల్లెలిలాగానే చూసుకుంది తన జీవితాంతం. మా ఆవిడకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నీ వసంత తోటే చెప్పుకునేది.

అన్నట్టు వసంత అమెరికా వచ్చిన కొత్తలో తనకి డ్రైవింగ్ నేర్పించిన ఘనత అశోక్ కుమార్ దే.  అతను కొన్నేళ్ళ క్రితం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్థన్ లో ఉండగానే ఓ అమెరికా అమ్మాయిని ప్రేమించాడు. ఇక పెళ్లి కూడా చేసుకోడానికి నిశ్చయించుకోగానే ఎంతయినా గుంటూరు వాడు కాబట్టి మన హిందూ సాంప్రదాయం లో పెళ్లి చేస్తే బావుంటుంది అని అనుకున్నాం కానీ ఆ రోజుల్లో హ్యూస్టన్ లో ఏదో నామకహా గా గుజరాతీ వాళ్ళ గుడి ఒకటి ఉండేది కానీ మన తెలుగు పద్ధతికి అది పనికి రాదు కదా! ఇంకేముందీ…మల్లిక్ & వసంత పూనుకుని అశోక్ కుమార్ పెళ్లి తెలుగు పద్ధతిలో అప్పుడే కొనుక్కున్న వాళ్ల ఇంట్లోనే చేద్దాం అని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి ఎలా చెయ్యాలో ఎవరికీ సరిగ్గా ఏమీ తెలియదు. అంచేత అందరం ఎవరికీ జ్ఞాపకం ఉన్న తంతులు, మంత్రాలు, సినిమాలలో ఉన్నవీ కలిపి, సన్నాయి వాయిద్యాలతో సహా “పెళ్లి చేయించుట ఎలా?” అని ఒక ఆడియో కేసెట్ తయారు చేసుకుని మల్లిక్ ని పురోహితుడిగా నియోగించాం. ఊళ్ళో ఉన్న తెలుగు వారినందరినీ పిలిచి అశోక్ & మేరీ ఏగ్నేస్ పెళ్ళి 1978లో అరిటాకులలో నేల మీద కూచుని భోజనాలు చెయ్యడంతో సహా అన్నీ వసంత ఆధ్వర్యంలోనే జరిపించాం. విశేషం ఏమిటంటే పురోహితుడు కూడా అయిన మల్లిక్, వసంత పెళ్ళిపీటల మీద కూచుని కన్యాదానం చేశారు. ఆ పెళ్లి ఫోటో లు గుంటూరులో ఉన్న అశోక్ తల్లి సరస్వతి గారు చూసి “అదేమిట్రా, జంధ్యం తప్పు వేశారూ?” అన్నారుట. ఆ విధంగా పెళ్లి తంతులలో ఎన్ని లోపాలు ఉన్నా అశోక్ & మేరీ ఏగ్నెస్ గత 38 ఏళ్లగా హాయిగా సంసారం చేస్తున్నారు.

raju1

అపూర్వ తో…

వసంత కి ఉన్న మరో వ్యాపకం మొక్కలు పెంచడం. అదైనా ఏదో సరదాగా నాలుగు వంగ మొక్కలు వేసేసి గొప్పలు చెప్పుకోడం కాదు. ఆ మాట కొస్తే 1970-80 లలో మన కూరగాయలలో ఒక్క టొమేటో, బెండ మొక్కలు తప్ప ఇంకేమీ దొరికేవి కాదు. అంచేత వంగ, దోస, తోటకూర, గోంగూర, పొట్ల, బీర వగైరా విత్తనాలు అన్నీ ఇండియా వెళ్ళినప్పుడు బంగారం లా జాగ్రత్తగా తెచ్చుకునే వాళ్ళం. ఇప్పటి లాగా ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్ లేని ఆ రోజుల్లో విత్తనాలు ఎలాగో కష్టమ్స్ వాడి కళ్ళు కప్పి పెట్లో అట్టడుగున దాచేసి తీసుకు వచ్చే వాళ్ళం కానీ దొండ, తమల పాకులు లాంటి తీగెలు తీసుకు రావడం కోసం వసంత నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేది నేను ఇండియా వెళ్ళే ముందు. అదేమిటంటే కణుపులతో ఉన్న దొండ పాదుకానీ, నాలుగైదు ఆకులతో ఉన్న తమల పాకు తీగె కానీ తడి గుడ్డలో చుట్టి పొట్టకి దారంతో గట్టిగా కట్టుకుని, పైన బనీను వేసుకుని నిటారుగా నడవడం నేర్పేది. కాకినాడ నుంచి బొంబాయి దాకా మామూలుగానే పట్టుకొచ్సినా, బొంబాయిలో అలా అవి పొట్టకి కట్టుకుని అక్కడ నుంచి న్యూ యార్క్ లో దిగే దాకా కూచున్నా, నుంచున్నా, నడిచినా నిట్టనిలువుగా జాగ్రత్తగా వాటిని పట్టుకొచ్చి వసంత కి ఇచ్చే దాకా ప్రాణం కటకటలాడిపోయేది. నలభై ఏళ్ల తరువాత కూడా ఈ నాడు మా హ్యూస్టన్ లో అందరి ఇళ్ళలోనూ పెరుగుతున్న దొండ పాదు, తమల పాకు తీగెలూ ఆ విధంగా స్మగ్లింగ్ అయి వచ్చిన నాలుగో తరం పాదులని చెప్పుకోడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటిదే మనకి ఆత్మీయమైన మల్లె మొక్క. ఆ కొన్ని నర్సరీల లో సాండ్బాగ్ జాస్మిన్ అనే పేరుతో  ఇప్పుడు మల్లె మొక్కలు, కనకాంబరాలు  దొరుకుతున్నాయి. ఇక  వసంత ఎక్కడెక్కడి చైనా వాళ్ళ నర్సరీ లకి వెళ్లి అకడ నుంచి మామిడి, జామ, నంది వర్ధనం, సన్న జాజి, సంపెంగ, రక రకాల మందారాలు మొదలైనవి తెచ్చి తన తోటలో వేసి, రోజూ సాయంత్రం ఇంటికి రాగానే చీకటి పడే దాకా అక్కడే గడ్డి పీకుతూనో, నీళ్ళు పోస్తూనో అన్ని మొక్కలనీ పలకరిస్తూ మూడు, నాలుగు గంటలు గడిపాకే ఇంట్లో అడుగుపెట్టేది. అలాగే అన్ని రకాల కూరగాయలూ, దబ్బ, నిమ్మ, నారింజ, దానిమ్మ, జామ..ఆఖరికి నేరేడు మొక్క కూడా వసంత తోటలో ఉంటాయి.

ఆ నాటి ఇతర స్నేహితుల ఆర్ధిక స్థాయి పెరుగుతున్న కొద్దీ అంతరాలు కూడా పెరిగినా కేవలం వసంత తో అనుబంధం నలభై ఏళ్ల గా ఒకే స్థాయిలో మా కుటుంబానికి కారణం ఆమెకి ఉన్న ఎంతో సహజమైన ఆడంబరం… అదే కల్మషం లేని ఆత్మీయత. అనదల్చుకున్న మాట అనేయడం ఆ ఆత్మీయత వ్యక్తీకరణ లో ఒక భాగం. 1981 లో తనకి పుట్టబోయే అమ్మాయికి ఏం పేరు పెట్టాలా అనే సంప్రదింపులలో వసంత రమ్యశ్రీ అనే పేరు ఎంచుకుంది. నేను రమ్య అంటే చాలు, మళ్ళీ అదేదో కవి గారి కలం పేరులా రమ్యశ్రీ ఎందుకూ అంటే భలే కోప్పడింది. రమ్య పుట్టిన రోజు మల్లిక్ అందరికీ హవానా చుట్టలు పంపిపెట్టి ఆడపిల్ల పుట్టినందుకు మహానందపడిపోతే, ఆ క్షణం నుంచీ వసంత జీవితం రమ్య కేంద్రబిందువుగానే సాగింది అని చెప్పవచ్చును.

వసంత ఆత్మీయతకి చొరవకి అతి మంచి ఉదాహరణ 1988 లో జరిగిన రెండు విశేషాలు. ఆ ఏడు మా అమ్మ అమెరికా వచ్చి మా తమ్ముడి దగ్గర కాలిఫోర్నియాలో ఆరు నెలలు, హ్యూస్టన్ లో మా ఇంట్లో ఆరునెలలూ ఉండి ఇక వెనక్కి మళ్ళీ కాకినాడ వెళ్ళే ప్రయత్నంలో ఉంది. ఒక్కర్తినీ పంపించడం కుదరదు కాబట్టి మాలో ఎవరో ఒకరు తీసుకెళ్ళి దిగబెడదాం అనుకుంటూ ఉంటే వసంత “ఎందుకూ. మేము ఎలాగా గిరీష్ ఒడుగు చెయ్యడానికి ఇండియా వెళ్తున్నాం. మీ అమ్మ మా అమ్మ కాదా ఏమిటీ? నేను కూడా జాగ్రత్తగా తీసుకెళ్తాను” అని ఎంతో ఆత్మీయంగా, దారిలో విమానం ఎనిమిది గంటలు ప్రాంక్ఫర్ట్ లో ఆగిపోవలసి వచ్చినా మా 75 ఏళ్ల మా అమ్మకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇండియా తీసుకెళ్లింది. అదే వసంత కాక పొతే మేము మా అమ్మని అలా పంపించే వాళ్ళం కాదు. ఆ తరువాత మరో పదేళ్ళు ఎప్పుడు మా అమ్మతో మాట్లాడినా “వసంత ఎలా ఉందిరా?” అనేదే మొదటి ప్రశ్న. ఇది వ్యక్తిగతం అయితే గిరీష్ ఉపనయనం వసంత వ్యక్తిత్వానికీ, చొరవకీ మరో ఉదాహరణ. అప్పటికి రెండేళ్ళ ముందు ఎన్టీ రామా రావు హ్యూస్టన్ వచ్చినప్పుడు మేం అందరం ఆయన్ని కలుసుకున్నాం కాబట్టి వసంతకి అది గుర్తుకి వచ్చి, హైదరాబాదులో తిన్నగా ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లి గిరీష్ ఉపనయనం ఆహ్వానం ఎన్టీ రామారావు గారికి అందజెయ్యమని ఆయన సెక్రటరీకి ఇచ్చింది.  ఎవరూ ఊహించని విధంగా రామారావు గారు ఆ ఉపనయనానికి వెళ్లి ఆశీర్వదించి అందరికీ ఆశ్చర్యం, ఆనందం కలిగించారు. ఆ ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అదీ మా వసంత అంటే !

With NTR

నందమూరిని కలిసిన క్షణాలు…

ఇక మాకు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి పుట్టినప్పుడూ పేర్లు  ఎంపిక చెయ్యడంలో వసంత ప్రధాన సలహాదారు. వాళ్ళు పుట్టిన దగ్గరనుంచీ పెద్ద వాళ్ళు అయ్యాక కూడా పుట్టిన రోజులు, హై స్కూల్ గ్రాడ్యుయేషన్, మా అమ్మాయిలు రత్న పాప దగ్గర కూచిపూడి నృత్యానికి సలహాలు, 1998 లో వాళ్ళ రంగ ప్రవేశానికి మేకప్ తో సహా అన్ని ఏర్పాట్లు, మా రెండో అమ్మాయి పెళ్ళి దగ్గర ఉండి జరిపించడం ..ఒకటేమిటి ….మా కుటుంబంలో అంతర్భాగంగా ఉన్న వసంత ఇప్పుడు కనుమరుగు అయినా మా అందరి మనోఫలకం లో కలకాలం ఉంటుంది. నా కంటే, మా కుటుంబం కంటే ఎక్కువ సన్నిహితులు వసంతకి ఉన్నారు. అందులో ఆశ్చర్యం లేదు. వారు ఇంత కంటే మంచి స్మృతులతో సమగ్రమైన వ్యాసం వసంత గురించి వ్రాయగలరు. నేను కూడా ఇంకా చాలా విశేషాలు వ్రాయగలను. కానీ కొన్ని లోపల దాచుకుంటేనే వాటికి ఎక్కువ విలువ. ఈ వ్యాసం లో వసంత గురించి కొంత అయినా అందరితో పంచుకోవాలని పించి, నా జీవన ప్రస్థానంలో ఒక ఆత్మీయ స్నేహితురాలిగా ఆమెకి ఉన్న స్థానాన్ని అక్షర రూపంలో ఈ ఆత్మకథలో పదిలపరుచుకునే ప్రయత్నం చేశాను.

2015 ఓ విధంగా మాకు చాలా బాధనే ఇచ్చింది. నా అమెరికా జీవితంలో తొలి రోజుల నుంచీ అత్యంత ఆత్మీయులైన స్నేహితులు అనిల్ కుమార్ గత ఫిబ్రవరిలోనూ, సెప్టెంబర్ మొదటి వారంలో సుసర్ల శర్మ, ఆఖరి వారంలో వసంత ఏ మాత్రం ఊహించలేని విధంగా పరమపదించారు. ఇక డిశంబర్ లో మా ఆస్థాన పురోహితుడు గుళ్ళపల్లి ఉదయ కుమార్ కేవలం 40 వ ఏట గుండె పోటు తో మరణించారు. వీరందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ 2016 అందరికీ శాంతి సౌభాగ్యాలని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

“మేం ఎవరనుకున్నావ్? కాకినాడ స్టుడెంట్స్…”

 

-వంగూరి చిట్టెన్ రాజు 

~

chitten rajuఒక ఏడాది విశాఖపట్నం లో ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పూర్తిచేసి 1962 లో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి, అంటే మళ్ళీ ఇంట్లోనే ఉండి చదువుకోడానికి వెనక్కి వచ్చేశాను. నా లాగా వైజాగ్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్న మరొక స్టూడెంట్ యనమండ్ర సూర్య నారాయణ మూర్తి. అప్పటినుంచీ ఇప్పటి దాకా మేము ఇద్దరం ఆప్త మిత్రులమే!. ఇక్కడ చేరగానే నేను మొట్టమొదట గమనించిన విశేషం ఏమిటంటే వైజాగ్ లాగా కాకుండా ఈ కాలేజీ చాలా “స్త్ర్తిక్ట్” గా ఉండేది. ఎందుకో తెలియదు కానీ లెక్చరర్లు స్ట్యూడెంట్స్ ని “దూరంగా” పెట్టి హడలగొట్టే వారు. అంచేత వాళ్ళంటే  స్ట్యూడెంట్స్ కి గౌరవం కంటే భయం ఎక్కువగా ఉండేది. అసలు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ పుట్టుక విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. 1930 ల దాకా అటు కలకత్తా, ఇటు మద్రాసు లలో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజ్ లు రెండే రెండు ఉండేవి.

అంచేత మొత్తం భారత దేశం తూర్పు కోస్తా తీరం మధ్యలో విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడదాం అనుకుని 1933 లోనే షుగర్ టెక్నాలజీ అనే పేరిట మొదటి ఇంజనీరింగ్ కోర్సులు ఆంధ్రా యూనివర్సిటీలో మొదలు పెట్టి   1946 లో అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పూర్తి స్థాయి ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడే నెలకొల్పడానికి అనుమతి ఇచ్చింది. కానీ వైజాగ్ విశ్వ విద్యాలయ ప్రాంగణంలో తగినన్ని భవనాలు లేకపోతే, కాకినాడ కి చెందిన అప్పటి యూనివర్శిటీ సెనేట్ మెంబరు, సుప్రసిద్ధ లాయరు, లక్కరాజు సుబ్బారావు గారు (మా తాత గారి  స్నేహితులు, దూరపు బంధువులు, దేవాలయం వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండే వారు) కాకినాడలో ఖాళీగా ఉన్న మిలిటరీ బేరక్స్ ఉన్న వందల ఎకరాల స్థలంలో తాత్కాలికంగా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చెయ్యడానికి ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదన ఒప్పుకోక పొతే ఆంధ్ర ప్రాంతంలో అసలు కాలేజ్ లేకుండా పోయే ప్రమాదం ఉంది అని ఆయన తీవ్రంగా వాదించారు. కాబట్టి వైజాగ్ లో బిల్డింగులు కట్టేంత వరకూ ఇంజనీరింగ్ కాలేజ్ కొన్నాళ్ళు కాకినాడలో నడిపేందుకు అందరూ అంగీకరించారు. దాంతో దక్షిణ భారత దేశం మొత్తానికి మద్రాసు గిండీ ఇంజనీరింగ్ కాలేజ్ తరువాత రెండోదిగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వైజాగ్ (Temporarily located at Kakinada) అనే పేరిట మొదలుపెట్టారు. ఉండేది.  మెల్ల, మెల్లగా విశాఖపట్నంలో ఉత్తరం వేపు ఉన్న యూనివర్శిటీ కొండలన్నీ చదును చేసి 1961 లో ఒక పెద్ద భవనం కట్టి షుగర్ టెక్నాలజీ పేరుని కెమికల్ టెక్నాలజీ గా మార్చి, ఇతర భవనాల నిర్మాణం మొదలు పెట్టినా, అప్పటికీ కాకినాడ కాలేజ్ బాగా నిలదొక్కుకుంది కాబట్టి దాన్ని తాత్కాలిక స్థాయి నుంచి శాశ్వత స్థాయికి మార్చడానికీ, అక్కడ వైజాగ్ లో మరొక ఇంజనీరింగ్ కాలేజ్ మొదలుపెట్టడానికీ  ఎక్కువ ఇబ్బందులు రాలేదు. అలా కాకినాడ లో ఇంజనీరింగ్ కాలేజ్ నెలకొల్పడానికి కారకులైన కీర్తి శేషులు లక్కరాజు సుబ్బా రావు గారి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

Lakkaraaju Subba Rao garu

నేను 1962 లో అక్కడ చేరినప్పుడు మా ప్రిన్సిపాల్ గారి పేరు దామోదరం గారు. ఆయన అరవ తెలుగులో తమాషాగా మాట్లాడే వారు. ఇంజనీరింగ్ మొదటి రెండేళ్ళు కామన్ క్లాసులే అయినా మూడో సంవత్సరంలో మార్కులని బట్టి, మా ఆసక్తికి బట్టీ బ్రాంచ్ సెలెక్షన్ ఇచ్చే వారు. అప్పట్లో మెకానికల్ ఇంజనీరింగ్, తరువాత అప్పుడే మొదలు పెట్టిన ఎలక్ట్రానిక్స్ , ఎలెక్ట్రికల్, ఆఖర్న సివిల్ స్టుడెంట్స్ కోరుకునే వారు. ఆ అనౌన్స్ మెంట్ చేసే పెద్ద మీటింగ్ లో మేం అందరం చచ్చేటంత సస్పెన్స్ లో ఉండగా దామోదరం గారు వచ్చి వరసగా పేర్లూ, వాళ్లకి ఇచ్చిన బ్రాంచ్ ప్రకటిస్తూ…నా పేరు దగ్గరకి రాగానే ఓ క్షణం ఆగి పోయారు…”హూ ఈజ్ దిస్ చిట్టయ్య …గెట్ అప్” అని క్లాసు చుట్టూ చూశారు. ఎవరూ లేచి నుంచోక పోవడంతో మళ్ళీ ఆ కాగితం చూసి “చిట్టాయ్ రాజు, నెంబర్ 441” అనగానే అది నేనే అని తెలిసి పోయి ఠపీమని లేచి నుంచున్నాను. ఆయన నన్ను ఎగా, దిగా చూసి….”ఏం పేరు, తమాషా గా ఉండాదే…తెలుంగా, కన్నడా’..అనేసి “మెకానికల్ తీసుకో” అన్నారు. ఆ విధంగా నేను నా జన్మంతా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది కానీ మా ఇంజనీరింగ్ కాలేజ్ చరిత్రలో లో మొట్ట మొదటి అమ్మాయి నాకంటే పదేళ్ళు సీనియర్ అయిన లక్ష్మీ మణి అనే ఆవిడ. ఆ తరువాత నాకు సీనియర్ క్లాసు లో భానుమతి అనే ఒకమ్మాయి నాకు మూడేళ్ళ జూనియర్ క్లాసులో మా తమ్ముడి క్లాస్ మేట్స్ ముగ్గురు అమ్మాయిలూ ..అంతే! అందుకే కేంపస్ మొత్తం మీద ఒక్క ఆడ పిల్ల కూడా లేక హాస్టళ్ళ లో ఉండే  కుర్రాళ్ళు అందరూ సాయంత్రం అయ్యే సరికి సినిమా రోడ్ కో మైన్ రోడ్డుకో వెళ్ళిపోయే వారు సిటీ బస్సులో.  ఆ బస్సులు రామదాసు మోటార్ కంపెనీ  వాళ్ళు నడిపే వారు. మొత్తం నాలుగు బస్సుల్లో రెండో నెంబర్ బస్ మా ఇంటి మీదుగా వెళ్ళేది.

నేను హాస్టల్ ఉండకుండా ఇంట్లో ఉండి చదువుకుంటున్న “డేస్కాలర్” ని కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ లో నా అనుభవాలు కేవలం క్లాసులకీ, పరీక్షలకే పరిమితం అయిపోయి, కాలేజ్ కార్యకలాపాలల్లో చాలా తక్కువ గా పాల్గొనే వాడిని. పైగా నాకు ఎప్పుడూ సాయంత్రం క్రికెట్ వ్యాపకం ఉండేది. అది కాస్త తగ్గాక నా స్నేహితులందరూ కూడా డే స్కాలర్లే కాబట్టి అందరం  సాయంత్రాలు కలిసి గడిపే వాళ్ళం. అందులో ఇళ్ళలో ఉండే వారు కొందరు అయితే, హాస్టల్ బదులు ఇద్దరు, ముగ్గురు కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండే వారు మరికొందరు. మా స్నేహ బృందంలో అతి ముఖ్యులు డి. గణపతి రావు (నేనూ, ఇతనూ పి.యు.సి. లో కూడా క్లాస్ మేట్స్), జి. వేంకటేశ్వర రావు, కె.వి.వి. గోపాల కృష్ణ, ఎన్. గోవింద రాజులు, జె.బి. వెంకట రత్నం, రాంబయ్యేశ్వర రావు, వి. సుందర రావు, ఎన్. సత్యానంద, త్రినాధం, కె. గంగాధరం, డి.వి. మోహన్, వై.ఎస్.ఎన్. మూర్తి  మొదలైన వారు.  వీళ్ళలో ఒకరిద్దరు తప్ప  ఇంచు మించు అందరితోటీ ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నాను. ఇందులో సత్యానంద కాలిఫోర్నియా లో ఉంటాడు…ఆ రోజుల్లోనూ ఇప్పుడూ అతని పేరు ఎన్.ఎస్. నందా యే. డి.వి మోహన్ అంటే ఇండియానా పోలిస్ లో ఉండే మోహన్ దేవరాజు. మిగిలిన వాళ్లందరూ ఇండియాలోనే ఉన్నారు.

వాళ్ళలో వై.ఎస్.ఎన్. మూర్తి తో వారం, పది రోజుల కొకసారి మాట్లాడుకుంటూ, చిన్నా, చితకా సమాజ సేవా కార్యక్రమాలు కలిసి చేస్తున్నాం. ఒక సారి మాలో కొందరం కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్ కి పిక్నిక్ వెళ్ళినప్పటి ఫోటోలు ఇక్కడ జతపరుస్తున్నాను. మా ఒకటి, రెండేళ్ళ సీనియర్స్ లో మాకు బంధుత్వం ఉన్న చింతలూరి సుందర వెంకట్రావు తో కుటుంబ స్నేహం ఉండేది. అతను చదువులోనూ, అన్ని ఆటలలోనూ పై స్థాయిలోనే ఉండి జోక్స్ చెప్తూ సరదాగా ఉండే వాడు. చదువుకునే రోజుల్లోనే మా చుట్టాలయిన జార్జ్ ప్రెస్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని దగ్గర నేను మిమిక్రీ చెయ్యడం నేర్చుకున్నాను. ఇప్పుడు వాషింగ్టన్ డి.సి లో వాళ్ళ అమ్మాయి దగ్గర ఉన్నాడు. ఇంకా బి.ఎస్.జి.కె, శాస్త్రి, పెంటా రామచంద్ర రావు,  దురిశేటి శేషగిరి రావు మొదలైన వాళ్ళందరితోటీ క్రికెట్ టీమ్ లో ఆడేవాడిని. ఇందులో శేషగిరి కాకినాడలో మా ఇంటి పక్కనే ఉండే సర్వలక్ష్మి ని పెళ్లి చేసుకుని లాస్ ఏంజెలెస్ లో ఉంటాడు. ఆ అమ్మాయి చాలా పేరున్న డాక్టర్. వాళ్ళింటికి నేను చాలా సార్లే వెళ్లాను. ఆ అమ్మాయి అన్నయ్య సోమయాజులు నాకు చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్. వాడూ కాలిఫోర్నియా లోనే ఉన్నాడు.

నా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువులో చదువుకన్నా ఎక్కువ నచ్చింది మా ఆఖరి రెండు సంవత్సరాలలోనూ స్టుడెంట్స్ అందరం వెళ్ళిన ఎడ్యుకేషనల్ టూర్స్. ఒక లెక్చరర్ గారి హయాంలో          ప్రత్యేకంగా ఒక రైలు కంపార్ట్ మెంట్ అద్దెకి తీసుకుని  నాలుగో ఏడు దక్షిణ భారత దేశం, ఐదో ఏడు ఉత్తర భారత దేశం లోనూ ఉన్న అనేక ఫేక్టరీలు, కొన్ని చూడ వలసిన ప్రదేశాలు చూసి రావడం నిజంగా ఇప్పటికీ చాలా మంచి అనుభవమే. నిక్కర్లూ, కావాలని కన్నాలు పెట్టుకున్న జీన్స్ పంట్లాలు వేసుకునే ఈ నాటి యువతీ యువకులతో పోల్చి చూసుకుంటే నాకు ఇప్పుడు నవ్వు వచ్చే విషయం ఏమిటంటే ఆ విజ్ఞాన యాత్రలకే కాదు, అందులో విహార యాత్రలకి వెళ్ళినప్పుడు కూడా మేం అందరం సూటూ, బూటూ ఖచ్చితంగా వేసుకునే వాళ్ళం. ఆ నాటి అలాంటి ఫోటోలు కొన్ని ఇక్కడ జతపరుస్తున్నాను.

KKD Eng.College friends 1

ఆ టూర్ లో భాగంగా మేము మద్రాసు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో దక్షిణ భారత దేశానికంతటికీ అత్యంత ఎత్తు అయిన మౌంట్ రోడ్ లో ఉన్న 14 అంతస్తుల ఎల్. ఐ.సి భవనం చూడడం ఒక ముఖ్యాంశం. మన ప్రగతికి చిహ్నంగా ఇప్పుడు ఆ బిల్డింగ్ కంటే ఎత్తు అయినవి ప్రతీ పల్లెటూరి లోనూ కూడా ఉన్నాయి. అప్పడు మద్రాసులో జరిగిన రెండు చిన్న తమాషాలు నాకు బాగా గుర్తున్నాయి. కొంత మంది మిత్రులం “ఎలాగా ఇక్కడి దాకా వచ్చాం కదా. ఏదో ఒక సినిమా షూటింగ్ చూసి తీరాలి” అని మా మేష్టారి పెర్మిషన్ తీసుకుని విజయా స్టూడియోస్ కి వెళ్లాం. అక్కడ గూర్ఖా వాడు ఆప గానే “మేం ఎవరనుకున్నావ్? కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టుడెంట్స్…” అని ఎంత దబాయించినా వాడు మమల్ని లోపలకి వెళ్ళనివ్వకుండా పెర్మిషన్ లెటర్ కావాలన్నాడు. కాస్త బతిమాల్తే “చక్రపాణి సారు ఫలానా చోట ఈ టైముకి ఇంట్లోనే ఉంటారు. వెళ్లి అడగండి” అని సలహా ఇచ్చాడు. సరే అని నలుగురం ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి భయం, భయంగా షూటింగ్ చూడ్దానికి పెర్మిషన్ అడిగాం. అయన నవ్వేసి “ఏంది…వంట పూర్తి ఐనాక రుచి చూడాల…కానీ వంట చేస్తా ఉండగా చూస్తే ఏం బావుంటాదీ..” అని నవ్వుతూ ఉత్తరం ఇచ్చారు.

కానీ బహుశా ఆ రోజున ఏ షూటింగూ లేనే లేక ఏదీ చూసిన గుర్తు నాకు లేదు. ఇక మరో చిన్న భాషా దోషం చమత్కారం ఏమిటంటే అరవం బొత్తిగా రాని నేనూ, మరో మిత్రుడూ ..ఎవరో గుర్తు లేదు….మద్రాసు లో సఫారి అనే సినిమా హాలు లో ఇంగ్లీషు సినిమా చూద్దాం అని బస్సు ఎక్కాం. యధాప్రకారం దిగాల్సిన చోటు దాటిపోయాక కండక్టర్ మమ్మల్ని కనిపెట్టి, రిక్షా మీద పొండి అని దింపేశాడు. సరే అని ఓ రిక్షా వాణ్ణి “సఫారి థియేటర్ కి వస్తావా?” అని అడిగాం. వాడు మమ్మల్ని ఎగా, దిగా చూసి “ఒండ్రుబా సార్” అన్నాడు. “వెధవ ఎక్కువ అడుగుతున్నట్టున్నాడ్రా” అని నా మిత్రుడు” నో. దటీజ్ టూ మచ్. రెండు రూపాయలిస్తాం. వస్తే రా. లేక పోతే లేదు” అన్నాడు. వాడు తలూపి, మమ్మల్ని ఎక్కించుకుని, సరిగ్గా పక్క సందులోంచి తిప్పి థియేటర్ దగ్గర దింపాడు. ఆ తరువాత తెలిసింది వాడు ఒక రూపాయి అడిగితే మేము  అతి తెలివికి పోయి రెండు రూపాయిలు ఇచ్చాం అని. అలాంటిదే మరో చేదు అనుభవం ఏమిటంటే ఓ నలుగురం కలిసి మెరీనా బీచ్ లో ఒక చిన్న టెంట్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లాం. తీరా చూస్తే అక్కడ అన్నీ ఫేషనబుల్ పదార్థాలే ..అంటే ఇడ్లీ, వడా లాంటివి కాకుండా కట్లెట్, సేండ్ విచ్ లాంటివి. అలాంటివి అలవాటు లేని మాకు మాలో ఇంగ్లీష్ మాంచి ఎక్సెంట్ తో దొరల్లాగా మాట్లాడుతూ అలాగే ఫీలై పోయే సుందర్రావుని సలహా అడిగాం. వాడు “ఓస్ ఇంతేనా” అని తల ఎగరేసి అందరికీ క్యుకుంబర్ సేండ్ విచెస్..ఒక్కోటి ఏకంగా నాలుగేసి రూపాయలు చొప్పున ఆర్డర్ చేశాడు. అవి ఏ నక్క దోస కాయ ముక్కలతో కూరినవో తెలియదు కానీ అంతా విపరీతమైన చేదు. తిన లేక, కక్క లేక అందరం నానా అవస్థా పడ్డాం. ఇప్పుడు అమెరికాలో నేను ఎప్పుడు సబ్ వే లో కానీ మరెక్కడైనా సేండ్ విచ్ లో క్యుకుంబర్ ముక్కలు వేసుకుంటే ఆ నాటి మెరీనా దోస కాయ రుచే గుర్తుకి వస్తుంది.

Main Building

ఆ నాటి పద్ధతి ప్రకారం ఏ డిపార్ట్ మెంట్ కి అయినా ఒకే ఒక హెడ్, ఆయన ఒక్కరిదే ప్రొఫెసర్ స్థాయి. మిగలిన వారు రీడర్, లెక్చరర్ అంతే. అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి ఉండేది కాదు. అలా మా మెకానికల్ ప్రొఫెసర్ గారు ఎస్.ఎల్. బాల సుబ్రమణ్యం గారు. ఆయన మా ఆఖరి సంవత్సరంలో (1965-66) లో ప్రిన్సిపాల్ అయ్యారు. ఎప్పుడూ ఏదో తన లోకంలోనే విహరిస్తూ ఉండే వారు. ఇతర లెక్చరర్లలో నాకు గుర్తున్న పేర్లు వేంకటేశ్వర రావు, ముత్తా సర్వా రాయుడు గారు (రాజకీయ నాయకులు, మా కుటుంబ సన్నిహితులు ముత్తా గోపాల కృష్ణ గారి అన్న గారు), సర్వే క్లాసులు చెప్పిన వేణుగోపాలాచారి గారు, ఫిజిక్స్ మేష్టారు మురళీ ధర రావు గారు, కెమిస్ట్రీ మేష్టారు దక్షణా మూర్తి గారు, ఎలక్రానిక్స్ ప్రొఫెసర్ గంటి గారు, ఎలెక్ట్రికల్ ప్రొఫెసర్ ముద్దు కృష్ణన్ గారు, ఎప్పుడూ నీరసంగా ఉండి అప్పటికి యాభై ఏళ్ల క్రితం రాసుకున్న కాయితాలు చూసి పాఠం చెప్పే తరుణయ్య గారు మొదలైన వారు.

ఇక్కడ మాకు సివిల్ సర్వే చెప్పిన వేణు గోపాలాచారి గారి రెండు జ్ఞాపకాలు ప్రస్తావించాలి. ఒకటేమో ..మేము సర్వే సామాగ్రి అంతా పట్టుకుని అయన ఇచ్చిన రోడ్డు సర్వే ఎసైన్ మెంట్ కోసం ఎక్కడా అమ్మాయిలూ లేని ఇంజనీరింగ్ కేంపస్ నుంచి బిల బిల లాడుతూ అమ్మాయిలూ తిరిగే పది మైళ్ళ దూరం లో ఉన్న పి.ఆర్. కాలేజ్ వేపు వెళ్ళిపోయే వాళ్ళం అప్పుడప్పుడు. ఆయన సైకిల్ మీద అక్కడికి వచ్చి, సర్వే దుర్భిణీ పి.ఆర్. కాలేజ్ గోడ మీద నుంచి లోపలి వేపు కేసి తిప్పేసి గాలిస్తున్న స్టూడెంట్ ని వెనకాల నుంచి ఠకీ మని మెడ పట్టి రోడ్డు కేసి తిప్పేసి…”అటు కాదు రాస్కెల్..ఇటు ఉంది రోడ్డు” అని చెడా, మడా తిట్టి మొత్తం బేచ్ అంతటికీ సున్నా మార్కులు వేసే వాడు. అయితే ఈయనకి ఒక ట్రాన్సిస్టర్ రేడియో ఉండేది. ఆ రోజుల్లో కాకినాడ నగరం మొత్తానికి అలాంటి పోర్టబుల్ ట్రాన్సిస్టర్ రేడియోలు ఉన్న వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును. అంచేత అది ప్రెస్టేజ్ సింబల్. అది చూపించుకోడానికి ఈయన రోజూ సాయంత్రం అటు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మైన్ రోడ్డు మీదుగా జగన్నాధ పురం బ్రిడ్జ్ దాకా ..అంటే మొత్తం కాకినాడ అంతా పది మైళ్ళ దూరం ఆ రేడియో భుజం మీద పెట్టుకుని  అటూ, ఇటూ సైకిల్ మీద తిరిగే వాడు. అవన్నీ తలచుకుంటే ఇప్పుడు ఎంతైనా నవ్వు వస్తుంది.

మొత్తానికి నా వైజాగ్, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువు ఐదు సంవత్సరాలలోనూ చెప్పుకోదగ్గ సంఘటనలు ఎక్కువ లేవనే చెప్పాలి. ఆ ఐదు సంవత్సరాలలోనూ ఓ వేపు పంటలు సరిగ్గా పండకా, మరో వేపు పెళ్ళిళ్ళ ఖర్చులూ, మా సుబ్బన్నయ్య మణిపాల్ (కర్నాటక) లో మెడికల్ కాలేజ్ చదువూ వగైరా కారణాలకి మా నాన్న గారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. నా చదువు కి ఎక్కువ ఖర్చు కాక పోయినా ఈ కుటుంబ వాతావరణాన్ని ప్రతీ రోజూ గమనిస్తూ ఏమీ చెయ్య లేని పరిస్థితుల లోనే నా ఇంజనీరింగ్ పూర్తి చేశాను.  అలాగే మా తమ్ముడు కూడా మూడేళ్ళ తరువాత ఎలక్త్రానిక్స్ లో గ్రాడ్యుయేట్ అయ్యాడు.

కాలక్రమేణా సుమారు నాలుగు దశాబ్దాలు మా ఇంజనీరింగ్ కాలేజ్ తో ఎక్కడా సంబంధం లేక పోయినా, ఆ కాలేజ్ ని JNTU …Jawaharlal Nehru Technological University గా పెద్ద స్థాయి కి పెంపొందించనట్టు, బాగా పురోగమనం చెందుతున్నట్టు వింటూనే ఉన్నాను. అనుకోకుండా మిత్రులు తురగా చంద్ర శేఖర్, ముత్యాల భాస్కర రావుల ప్రోద్బలంతో మా కాలేజ్ 60th వార్శికోత్సవాలలో ప్రముఖంగా పాల్గొనడం జరిగింది. ఆ వివరాలు మరోసారి……..

*

 

 

 

 

ఆంధ్రా యూనివర్సిటీలో చదువులూ-సమ్మెలూ

వంగూరి చిట్టెన్ రాజు 

 

chitten rajuనేను పరాయి ఊరైన విశాఖ పట్నం లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు నా సరికొత్త అనుభవం విద్యార్థుల సమ్మెలలో ప్రత్యక్షంగా పాల్గొనడం ఒకటి, యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో పాల్గొనడం మరొకటి. ఈ రెండూ నాకు అంతకు ముందు ఎన్నడూ అనుభవం లేని విషయాలే.

మొదటి సమ్మెకి కారణం ఒక సినిమా హాలులో జరిగిన సంఘటన. వైజాగ్ లో వీరభద్ర రావు అనే కాంట్రాక్టర్ తన భార్యతో అప్పటి పూర్ణా టాకీసు లో సినిమాకి వెళ్లాడు. వాళ్ళ సీటు వెనకాలే కూచున్న ఆంధ్రా యూనివర్సిటీ కుర్రాళ్ళు ఎప్పటి లాగానే ఏవేవో చిన్న చిన్న డైలాగులతో ఆవిడని ఏడిపించడంతో సరిపెట్టుకోకుండా ఓ కుర్రాడు చీకట్లో వెనకాల నుంచి ఆవిడ భుజం మీద చెయ్యి కూడా వేశాడు.  దాంతో అంత వరకూ ఓపికగా భరించిన డబ్బున్న ఆ మధ్య వయస్సు కాంట్రాక్టర్ కి బాగా కోపం వచ్చి, ఆ విద్యార్థిని బయటకి లాక్కొచ్చి చితక్కొట్టాడు. తీరా చూస్తే ఆ కుర్రాడు యూనివర్సిటీలో ఓ విద్యార్థి నాయకుడు. ఇంకే ముందీ. ఆ రాత్రికి రాత్రే అందరినీ పోగేసి ఆ మర్నాడు కాంట్రాక్టర్ దౌర్జన్యానికి నిరసనగా విద్యార్థులు సమ్మె ప్రకటించి, పెద్ద ఊరేగింపుతో ఆ కాంట్రాక్టర్ ఇంటి ముందు తిష్ట వేశారు. ఆయన చేత క్షమాపణ చెప్పించుకున్నారో లేదో తెలియదు కానీ అసలు ఏమిటో , ఎందుకో మాకు తెలియక పోయినా నా బోటి గాళ్ళని హాస్టల్ లో ఉండనివ్వ కుండా సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఆ విధంగా నేను నా ప్రమేయమూ, ప్రయత్నమూ లేకుండానే విద్యార్థి సమ్మె లో ఒక సమిధని అయ్యాను.  అసలు సినిమా హాలులో జరిగిన విషయం తరువాత తెలిసింది.

ఇక రెండోది కేంపస్ లోనే దీపావళి సమయంలో జరిగిన ఉదంతం. కొంత మంది విద్యార్థులు ఎప్పటి లాగానే తారా జువ్వలకి నిప్పు అంటించి సద్ధర్మ సదనో మరోటో హాస్టల్ ఎదురుగుండా రోడ్డు మీద పోటీలు పడ్డారు. అందులో ఒక తారా జువ్వ ఎక్కడో పైన రెండో అంతస్తు నుండి తమాషా చూస్తున్న ఓ విద్యార్థి కేసి దూసుకు పోయి కంటి లో గుచ్చుకుంది. ఆ దారుణానికి భయ పడి పోయి అర్జంటుగా అతన్ని ఔట్ గేట్ దగ్గర ఉన్న క్లినిక్ కి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ మార్తాండ శాస్త్రి   అనే యూనివర్సిటీ డాక్టరు వెంటనే కన్ను ట్రీట్ చెయ్యడం మానేసి ఆ తారా జువ్వల పోటీ వాళ్ళని, ఆ చోద్యం ఎందుకు చూస్తున్నావు, బుద్ది లేదా, అనుభవించు అనీ అందరినీ తిట్టడం మొదలెట్టాడు.

ఇలాంటి ప్రవర్తన ఆయని కొత్త కాదుట. ఎవరైనా  విద్యార్థి ఏ కడుపు నొప్పి కో మందు కోసం వెడితే “నువ్వు వెధవ హోటల్లో దోశలు ఎందుకు తిన్నావూ?” “వెధవ అర్థ రాత్రి దాకా సినిమాలు ఎందుకు చూస్తావూ?” అనుకుంటూ రోగానికి మందు ఇవ్వకుండా  తిట్ల దండకం అందుకుంటాడు కాబట్టి ఆయన మీద అప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సారి ఈ సీరియస్ కేసు కూడా పట్టించుకోక పోవడంతో సహా విద్యార్థులు అతన్ని వెంటనే కెజిహెచ్ హాస్పిటల్ కి హుటాహుటిన తీసుకెళ్ళారు. అతను హాస్పిటల్ లో ఉండగా ఇంచు మించు అప్పటికప్పుడే ఈ వార్త దావానలం లా పాకి పోయి తెల్లారే సరికల్లా మొత్తం యూనివర్సిటీ ఆ డాక్టర్ ని డిస్మిస్ చెయ్యాలని పెద్ద సమ్మె మొదలు పెట్టారు. అందులో నేను కూడా ఊరంతా తిరిగాను. అధికారులు విధి లేక ఆ డాక్టర్ ని డిస్మిస్ చేశారు. పాపం ఆ విద్యార్థికి ఒక కన్ను తీసేసి గాజు కన్ను పెట్టవలసి వచ్చింది.

ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ విద్యార్థి ఎవరో అప్పుడు నాకు తెలియదు కానీ 1975 లో హ్యూస్టన్ లో ఉన్న పది మంది తెలుగు వాళ్ళం “రావు” గారు అనే ఒకాయన ఇంట్లో కలుసుకుని కబుర్లు  చెప్పుకుంటూ ఉంటే ఎందుకో మాటల సందర్భంలో అంధ్రా యునివర్సిటీ ప్రసక్తి వచ్చింది. ఆ నాటి డాక్టర్ మార్తాండ శాస్త్రి గారి దగ్గర బంధువు ఒకాయన ఆ పార్టీ లో ఉన్నారు. అప్పుడు దీపావళి నాటి ఆ సంఘటనా, మా సమ్మె విషయాలూ నేను పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఎంతో మిత భాషి అయిన రావు గారు మెల్లగా ఆ నాడు తారాజువ్వ ధాటికి కంట్లో దెబ్బ తిని ఆ సమ్మెకి కారకుడైన విద్యార్థి తనే అని  వెల్లడించిన జ్ఞాపకం. కానీ వివరాలు అడగడానికి భయం వేసి, నేను మళ్ళీ ఆ టాపిక్ ఎప్పుడూ మాట్లాడ లేదు. అందు చేత అది ఏమాత వరకూ నిజమో నిజంగా నాకు ఇప్పటికీ తెలియదు.

ఈ రావు గారు మటుకు ఆంధ్రా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని, అమెరికా వచ్చినట్టు ఖచ్చితంగా తెలుసు. ఆయన అప్పుడు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద కంప్యూటర్ కంపెనీ అయిన ఒక మామూలు సైంటిస్ట్ గా చేరి, తొలి కంప్యూటర్ మెమొరీ చిప్స్ (8 K సైజు నుంచి 18 K సైజుకి) ఎక్కువ సైజు తయారు చేసే పద్ధతి కనిపెట్టి,  వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆ సందర్భంగా అప్పుడే మొదలు పెట్టిన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి తరఫున ఆయనకి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాం. ఈ రోజుల్లో ఏదో రాజకీయ కారణం ఉంటే తప్ప అటువంటి నిజమైన గుర్తింపులు అసాధ్యం. ఆ దంపతులు హ్యూస్టన్ లో ఉండే రోజులలో వారి కుటుంబం చాలా ఆత్మీయమైన మిత్రులు.

Slide Rule

ఇంజనీరింగ్ కాలేజీలో చేరగానే నా జీవితంలో అంతర్భాగం అయిపోయినవి స్లైడ్ రూల్ & టీ స్క్వేర్.  డాక్టర్లకి మెడలో స్టెత స్కోప్ లా ఈ రెండూ ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థి భుజాల మీద వేళ్ళాడుతూ ఉండవలసినదే! ఈ రోజుల్లో వాళ్ళు చూసి ఉండని ఆ రెండిటి బొమ్మలూ ఇక్కడ జత పరుస్తున్నాను. ఇందులో స్లైడ్ రూల్ అనేది ప్రపంచవ్యాప్తంగానే అందరూ వాడే అత్యద్భుతమైన, అత్యవసరమైన “లెక్కలు చేసే పరికరం”. లెక్కలు అంటే మామూలు కూడికలూ, తీసివేతలే కాదు, ఎంతో క్లిష్టమైన ఈక్వేషన్స్, కేలుక్యులస్, లాగరిథమ్స్, అల్గారిథమ్స్, ఆల్జీబ్రా, ట్రిగానామెట్రీ, స్క్వేర్ రూట్స్, ఎక్ష్పోనెన్శియల్స్, ఒకటేమిటి, అన్నీనూ. 1620 ప్రాంతాలలో జాన్ లేపియర్ అనే ఆయన కనిపెట్టిన “లాగరిథమ్స్” అనే లెక్కల ప్రక్రియ ఆధారంగా కనిపెట్టబడిన ఈ స్లైడ్ రూల్ అంచెలంచెలుగా ఎదుగుతూ, అన్ని శతాబ్దాలగా శాస్తీయ పురోగతికి మూల కారణంగా నిలబడింది. అంతెందుకు 1969 లో ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లు చంద్రుడి మీద కాలు పెట్టడానికి క్షణాల ముందు కంప్యూటర్ ని నమ్మడం ఇష్టం లేక ఆఖరి క్షణాలలో చెయ్య వలసిన లెక్కలు ఈ స్లైడ్ రూల్ మీదే చేశారు.

కానీ క్రమక్రమంగా ఎలెక్ట్రానిక్ కేలుక్యులేటర్లు తయారు అయి, 1965 లో HP-9100 తో మొదలు పెట్టి, హ్యూస్టన్ లోని  Texas Instruments  అనే కంపెనీ వారు 1976 లో తక్కువ ఖర్చుకి TI-30 అనే పాకెట్ సైజ్ సైంటిఫిక్ కేలుక్యులేటర్ ప్రవేశపెట్ట గానే ఈ స్లైడ్ రూల్ శకం అంతరించి పోయింది. అప్పటికి రెండేళ్ళ క్రితం నేను ఆప్యాయంగా అమెరికా తెచ్చుకున్న ఆ స్లైడ్ రూల్ ఎక్కడో మా అటక మీదో, మా తమ్ముడి దగ్గరో దాక్కుని ఉంటుంది.  అన్నట్టు  పైన చెప్పిన రావు గారు ఘన విజయాలు సాధించినది ఈ Texas Instruments కంపెనీ లోనే. అలాగే నా ఆప్త మిత్రుడు స్వర్గీయ అనిల్ కుమార్ కూడా ఆ కంపెనీ లోనే సుమారు పదేళ్ళు పని చేశాడు. కాలక్రమేణా కంప్యూటర్ టెక్నాలజీ అత్యంత వేగవంతమైన అభివృద్ది కారణం గా ఆ కంపెనీ వెనకబడి పోయి ఇప్పుడు అది నామ మాత్రం గానే మిగిలింది. ఇక ఆ టీ స్క్వేర్ ప్రధాన “ఆయుధంగా”, రక రకాల ఇతర ప్లాస్టిక్ పరికరాల తో బిల్డింగ్ డ్రాయింగ్, మెషీన్ డ్రాయింగ్ మొదలైన సబ్జెక్టుల లో బొమ్మలు గీసే వాళ్ళం. అది మటుకు నేను అమెరికా తీసుకు రాలేదు.

ఇక చదువు విషయానికి వస్తే చెప్పుకో దగ్గ విశేషాలు అంతగా లేవు కానీ ఒక్క సంగతి బాగా గుర్తుంది. ఓ సారి ఇంటెగ్రల్ కేలుక్యులస్ అనే చాలా కష్టమైన లెక్కల సబ్జెక్ట్ పరీక్షకి బాగానే చదివాను కానీ, మా 5వ బ్లాక్ హాస్టల్ నుంచి పరీక్ష హాల్ కి నడుస్తూ వెళ్ళే అర గంట లోనూ అంత వరకూ చదవడానికి టైము లేని వన్నీ నడుస్తూనే బట్టీ పట్టేశాను. తీరా పరీక్షలో నేను అంతకు ముందు పది రోజులు చదివినవేవీ లేవు సరి కదా, ఆ ఆఖరి అర గంటలో చదివి బట్టీ పట్టేసినవన్నీ ఉన్నాయి. ఇకనేం. టక టకా రాసేసి గట్టెక్క గలిగాను. లేక పొతే ఖచ్చితంగా ఆ రోజు సున్నా మార్కులు వచ్చేవి.

ఇక ఆ ఏడాదీ సినిమాలు బాగానే చూసే వాళ్ళం. సమస్య అల్లా సాయంత్రం ఎనిమిది దాటాక నెంబర్ టెన్ బస్సు ఉండేది కాదు. యూనివర్సిటీ కి వెళ్ళడానికి అదొక్కటే బస్సు.  ఆటోలు ఇంకా ఇండియాలో మార్కెట్ లో లేవు. రిక్షా వాళ్ళు “అప్పు నాగ నేం బాబూ” అని యూనివర్సిటీకి రిక్షా కట్టే వారు కాదు. అంచేత మేము హాయిగా సినిమా చూసి, ఏ “చడగాస్” లోనో, ఎల్లమ్మ తోట దగ్గర వసంత విహార్ లోనో భోజనం చేసేసి, గవర్నర్ బంగాళా మీదుగా రెండు గంటలు కొండెక్కి యూనివర్సిటీకి నడిచి వెళ్ళిపోయే వాళ్ళం.  నేను వైజాగ్ లో ఉన్నన్నాళ్ళూ  అక్కడికి దగ్గర అనకాపల్లి శివారు లో ఉన్న కశింకోట లో ఉండే మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన, శంకరం బాబయ్య లని రెండు , మూడు నెలలకోసారో,  పండగలకో వెళ్తూ ఉండే వాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో వైజాగ్ నుంచి కాకినాడ చాలా దూర ప్రయాణం బాబూ అనుకునే వాళ్ళం. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. అలాగే మా బాబయ్య కూడా ఒకటి రెండు సార్లు మా హాస్టల్ కి వచ్చి నా బాగోగులు  చూసి మా నాన్న గారికి ఉత్తరం రాసే వాడు.

ఆంధ్రా యూనివర్సిటీ లో నా మొదటి సంవత్సరం ప్రిన్సిపాల్ దేవగుప్తాపు సీతాపతి రావు గారు.   ఆయన టంగుటూరి సూర్య కుమారికి దగ్గర బంధువు, మద్రాసు లో మా చిన్నన్నయ్యకి బాగా తెలిసిన వారే అవడంతో  ఎక్కువ ఇబ్బంది లేకుండానే విశాఖపట్నం నుంచి కాకినాడ కాలేజ్ కి టాన్స్ ఫర్ చేయించుకున్నాను. దాంతో ఆంద్రా యూనివర్సిటీ కేంపస్ లో నా చదువు పూర్తి అయింది. ఓ ఏడాది హాస్టల్ చదువు తరువాత మళ్ళీ ఇంట్లో అమ్మా, నాన్న ల దగ్గరే ఉండి చదువు కొనసాగించే అవకాశం వచ్చింది. ఒక సారి స్వతంత్రంగా బతకడానికి అలవాటుపడ్డాక, మళ్ళీ ఇంటికెళ్ళి చదువుకోడానికి నేను అభ్యంతరం చెప్పకపోవడం  చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది…ఇప్పుడు తలుచుకుంటే..నాక్కూడా ఆశ్చర్యం గానే ఉంది!

కాకినాడ లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసే నాలుగేళ్ల ప్రహసనం…మరో సారి.

*

 

 

ఆంధ్రా యూనివర్సిటీలో అద్భుతమైన ఒకే ఒక వత్సరం

వంగూరి చిట్టెన్ రాజు 

 

chitten rajuనేను ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో చదివిన ఒకే ఒక సంవత్సరం (1961-62) నా ఇంజనీరింగ్ డిగ్రీ చదువులో మొదటి సంవత్సరం మాత్రమే. కానీ ఆ ఒక్క సంవత్సరమూ నాకు అనేక అపురూపమైన అనుభవాలనీ, ఇప్పటికీ గుర్తుండే జ్ఞాపకాలనీ మిగిల్చింది.

అందులో మొదటిది అంత వరకూ ఇంట్లో అమ్మా, బాబయ్య గారూ, అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళ మధ్య పెరిగిన నేను ఒక్క సారిగా నా వయసు కుర్రాళ్ళతో హాస్టల్ నివాసం, ఒక విధంగా ఆ స్వాతంత్ర్య వతావరణం, హాస్టల్ లో పెట్టే “మాస్ భోజనం”, చదువు బాధ్యత, కొంచెం వ్యక్తిగతా రాహిత్యంగా …అంటే నాకు నేనుగా కానీ, “ప్లీడరు గారి అబ్బాయి” లా కానీ ఏ విధమైన ప్రత్యేక గుర్తింపూ లేకుండా  “నలభై మంది విద్యార్ధులలోను ఒక్కడిగా”, “నలుగురితో పాటు  నారాయణ” లాగా మాత్రమే చెలామణీ అవడం అన్నీ కొత్తే. అప్పటి దాకా అలవాటు లేని మరో సమస్య డబ్బు వాడకం. కాకినాడ లో ఇంట్లో ఉన్నంత కాలం జేబులో డబ్బు అయిపోగానే, తిన్నగా ఆయన్ని అడిగే దమ్ముల్లేక రహస్యంగా మా బాబయ్య గారు తోట లో ఉన్నప్పుడో, భోజనం చేస్తున్నప్పుడో  ఆయన గదిలోకి దూరి పోయి, ఆయన డబ్బు దాచుకునే పెట్టె లోంచి రెండు, మూడు రూపాయలు కొట్టెయ్యడం, ఆ రాత్రి లెక్కలు చూసుకున్నప్పుడు “ఏ వెధవ రా డబ్బులు కొట్టేశాడు?” అని కోప్పడినప్పుడు ఒప్పేసుకోవడం జరిగేది. వైజాగ్ లో హాస్టల్ కి వచ్చాక ప్రతీ రోజూ అలా డబ్బులు లెక్కెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిన పని నేనే చేసుకోవడం సరి కొత్త అలవాటు అయింది.

అప్పుడు నెల మా 5th బ్లాక్ హాస్టల్ మెస్ బిల్లు నెలకి 40 రూపాయలు ఉండేది. “అంత తిండి ఏం పెడతార్రా హాస్టల్ లో, వెధవ బంగాళా దుంపల వేపుడికీ, చారుకీ అంత డబ్బే “ అనేది మా అమ్మ. ఇక పై ఖర్చులకి 10 రూపాయలు అయ్యేవి. నేనూ, పేరి శాస్త్రీ, ఇతర మిత్రులూ కలిసే తిరిగే వాళ్ళం కాబట్టి ఖర్చులు పంచుకునే వాళ్ళం.

విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ అనగానే నాకు ఠక్కున జ్ఞాపకం వచ్చేది అక్కడి ఓపెన్ ఎయిర్ ధియేటర్, అందులో నేను చూసిన నాటకాలు, పాల్గొన్న సమావేశాలు మొదలైనవి. ఆ హాలు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు కానీ అప్పుడు అది Erskin College of Natural Sciences బిల్డింగ్ లో ఉండేది. గూగుల్ లో వెతికితే కనపడిన ఆ బహిరంగ వేదిక ప్రాంగణం ఫోటో ఒకటి జతపరుస్తున్నాను. ఈ వేదిక 1957 లో కట్టినప్పుడు అంత పేరు రాలేదు కానీ బళ్ళారి రాఘవ గారి కోరిక మీద తోలేటి కనక రాజు, సంబందన మొదలియార్ కమిటీ వారి సిఫార్సు ని పాటిస్తూ నాలుగేళ్ల తరువాత ..అంటే 1961 లో ఆంధ్రా యూనివర్సిటీలో Department of Theater Arts ప్రారంభించి నాటక, దర్సకత్వం, నటన మొదలైనవి ఒక పాఠ్యాంశం గా మొదలు పెట్టారు.  ఒక విశ్వవిద్యాలయంలో నటన లో శిక్షణ ఒక సబ్జెక్ట్ గా బోధించడం యావత్ భారత దేశం లోనే అది మొట్టమొదటి సారి. ఆ డిపార్ట్ మెంట్ హెడ్ గా కె.వి. గోపాల స్వామి నాయుడు గారిని నియమించారు…Rest is History అనే ఇక చెప్పుకోవాలి. ఎందుకంటే అ తరువాత ఆయన యూనివర్సిటీ రిజిస్త్రార్ గా ఎన్నో ఏళ్ళు పనిచేసినా ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం ద్వారా ఆయన రంగ స్థలానికి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు.

నాటక, సినీ రంగాలలో ఎంతో లబ్ధ ప్రతిష్టులైన చాట్ల శ్రీ రాములు, కె. వేంకటేశ్వర రావు, సాక్షి రంగా రావు, గొల్లపూడి మారుతీ రావు, అమెరికాలో మా గురువు గారు పెమ్మరాజు వేణుగోపాల రావు గారు, దేవదాస్ కనకాల, అబ్బూరి, ఇలా కొన్ని తరాల వారు ఆయన శిష్య పరంపరలో తరించిన వారే!

ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ విశ్వ విఖ్యాత నాటక విభాగం ప్రారంభించిన 1961 లోనే నేను ఆంధ్రా యూనివర్సిటీలో చేరాను కానీ ఈ విషయాలు నాకు తెలీదు. నాకు తెలినదల్లా కే.వి. గోపాల స్వామి నాయుడి గారి అధ్బుతమైన ప్రసంగాలు, ఆయన నిర్వహించిన అఖిల కళాశాల నాటక పోటీలు, నా అనుభూతులూ మాత్రమే. ఆయన గురించి నాకు ఒక విషయం బాగా జ్ఞాపకం. ఆయన ప్రసంగించడానికి వేదిక మీదకి రాగానే ఆ మొత్తం ఓపెన్ ఎయిర్ థియేటర్ చప్పట్లతో మారుమోగి పోయేది. పైగా ఆయనకి ఒక సరదా అలవాటు ఉండేది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ కోతి కుర్రాడైనా ప్రేక్షకులలోంచి గట్టిగా అరిస్తే, ఆయన కూడా స్టేజ్ మీద నుంచి వాడి అరుపుని అనుకరిస్తూ అరిచే వారు. దాంతో కుర్రాళ్ళు ఇంకా రెచ్చిపోయే వారు. ఉదాహరణకి ఎవడైనా “కొయ్, కొయ్”  అని అరిచాడనుకోండి, రిజిస్త్రార్ అంతటి పదవిలో ఉన్న అయిన నాయుడు గారు అటు తిరిగి “నువ్వు కొయ్, నీ బాబు కొయ్. ఒరేయ్ నీ కంటే రౌడీ ని రా” అని అరిచే వారు.

ఆ రోజుల్లోనే ఆ ఓపెన్ ఎయిర్ ధియేటర్ స్టేజ్ వెనకాల అద్భుతమైన తెరలు కట్టడానికీ, back projection లాంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాట్లు ఉండేవేమో అని నా అనుమానం. ఎందుకంటే ఒక సారి గుంటూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు వేసిన ఒక డ్రామాలో back drop  అంతా ముందు సాయంత్రం ఆకాశం, మెల్లిగా సూర్యుడు అస్తమించి చంద్రుడు పైకి  రావడం, ఒక దాని తరవాత ఒకటిగా నక్షత్రాలు పొడుచుకుంటూ మొత్తం ఆకాశం చంద్రుడూ, నక్షత్రాలతో అద్భుతమైన ఆవిష్కరణ జరగడం చూసి మా అందరికీ మతిపోయింది. “ఇంటర్ కాలేజియేట్ డ్రామా పోటీలు” ఏడాది కోసారి జరిగినప్పుడు ఇలాంటి డ్రామాలు అనేకం చూసే అదృష్టం నాకు కలిగింది. అన్నింటికీ పరాకాష్ట “చింతామణి” నాటకం. సుమారు మూడు గంటలు సాగిన ఈ పాప్యుల నాటకంలో రేలంగి సుబ్బిశెట్టి గా  ప్రధాన పాత్ర వేశాడు. చింతామణి గా వేసిన ఆ సినిమా నటి పేరు మర్చిపోయాను కానీ ఆమె తల్లిగా నల్ల రామమూర్తి వేశాడు. వీళ్ళిద్దరూ మా కాకినాడ వాళ్ళే.  ఇతర పాత్రధారులు “ఈలపాట” కొత్త రఘు రామయ్య, మాధవపెద్ది సత్యం మొదలైన హేమా హేమీలు.

AU Open Air Theater photo

ఆ రోజుల్లో ఇలాంటి డ్రామాలు ఎప్పుడూ లైవ్ మ్యూజిక్ తోటే ఉండేవి. అలాంటిదే మరో నాటకం నాగభూషణం “రక్త కన్నీరు”.  అంతకు ముందు కాకినాడలో కూడా నాటకాలు అడపా దడపా చూసినా నాలో నాటకాభిలాషకి బీజాలు ఇక్కడే పడ్డాయి అనడానికి ఏమీ సందేహం లేదు.  అంత పెద్ద ఆడిటోరియం లో నటీనటుల అందరి మాటలూ స్పష్టంగా వినపడే విధంగా మైకులు ఎలా ఏర్పాటు చెయ్యగాలిగారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే! ఇక మాధవ పెద్ది, రఘురామయ్య నాటకానికి అవసరం ఉన్నా లేక పోయినా ఏదో వంక పెట్టి అద్భుతంగా పద్యాలు చదివి మా విద్యార్థుల చేత పదే, పదే చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక రేలంగి సరే, అప్పటికే కొంచెం భారీగా ఉన్నా తనదే అయిన డైలాగ్ డెలివరీ తో హాస్యం బాగానే పండించాడు. అందులో ఒక డైలాగ్ నాకు ఇంకా గుర్తే…. సుబ్బిశెట్టి చింతామణి తో “ఇదిగో, నువ్వు లోపలికెళ్ళి ఆ ఆయింట్ మెంటు మందు అర్జంటుగా పట్రా..నీ సరదా తీరుతుంది, నా దురదా తీరుతుంది”….కొంచెం అదోలా ఉన్న ఈ డైలాగ్ ఎవరికీ అర్థం కాక పోయినా రేలంగి చెప్పాడు కాబట్టి అందరూ పోలో మని నవ్వారు.

మా ఇంజనీరింగ్ కేంపస్ లో అస్సలు బిల్డింగులే లేవు కాబట్టి ఎప్పుడైనా స్టేజ్ కావాల్సిన ప్రోగ్రామ్స్ ..అంటే ఏన్యువల్ డే లాంటివి ఆ ఓపెన్ ఎయిర్ ధియేటర్ లోనే ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్వహించుకునే వారు. అప్పుడు ఇచ్చే విందు గురించి చాలా గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది కానీ, ఆ విందు అంత గొప్పగా ఉండడానికి కారణం ఆ రోజు మనిషికి ఒకటే ఇచ్చే ఎంతో అపురూపమైన చిన్న సైజ్ ఏపిల్ పండు, ఎక్కడో హైదరాబాద్ నుంచి తెప్పించిన అనాబ్ షాహీ ద్రాక్ష పళ్ళు మనిషికి పది, చిన్న ఐస్ క్రీం లేదా ఫ్రూట్ సాలడ్, బాస్మతీ రైస్ తో చేసిన బిరియానీ, నమ్మండి, నమ్మక పొండి…కాల్చిన బ్రెడ్ టోస్ట్, దాని మీద అక్షరాలా అర చెంచాడు బట్టర్ మరియు ఫ్రూట్ జామ్….ఇవన్నీ తింటూ లండన్ లోనో అమెరికాలోనో ఉంటున్న ఫీలింగ్ చాలా మంది కుర్రాళ్ళకి ఉండేది అ రోజుల్లో. పైగా నాకు తెలిసీ ఒక్క 4th బ్లాక్ లోనే నాన్-వెజిటేరియన్ భోజనం ఉండేది. ఏ పార్టీ లోనూ అస్సలు మాంసాహారం ఉండేది కాదు.  బహుశా ఎక్కువ ఖరీదు కూడా ఒక కారణం కావచ్చును.

ఆ రోజుల్లోనే నేను అక్కినేని నాగేశ్వర రావుని మొదటి సారి కలుసుకున్నాను. అడపా దడపా ఆయనతో నా యాభై ఏళ్ల చిరు అనుబంధం గురించి ఇది వరలో నేను వివరంగా వ్రాశాను కానీ ఆ నాడు ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన తొలి పరిచయం వివరాలు మటుకు ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. సినిమాలలో  ఔట్ డోర్ షూటింగ్ దృశ్యాలు ఒక వేళ ఉన్నా అన్నీ మద్రాసులోనే తీయబడే ఆ రోజుల్లో, బహుశా మొట్ట మొదటి సారిగా ఒక తెలుగు సినిమా విశాఖపట్నం రామకృష్ణా బీచ్ లో షూటింగ్ జరుపుకోవడం ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ సినిమా పేరు అందరికీ తెలిన “కులగోత్రాలు.”

సినిమా కథా పరంగా హీరో నాగేశ్వర రావు పైలా పచ్చీసుగా తిరిగే  ఒక కాలేజీ విద్యార్థి అయితే అప్పుడు నేను ఆంధ్రా యూనివర్సిటీలో నార్త్ కేంపస్ లో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న “బుద్దిమంతుడైన” కుర్రాణ్ణి.  అప్పటికే ఆయన “నట సామ్రాట్” బిరుదు పొంది నాలుగేళ్ళు అయిన 38 సంవత్సరాల యువ అగ్రతార అయితే నేను కేవలం నూనుగు మీసాల పదిహేడు సంవత్సరాల వయసులో “నాగ్గాడి” సినిమాలు రొమాంటిక్ గా ఉంటాయి అనుకునే అభిమానిని.  సినిమా నిర్మాతలు ఎంత రహస్యంగా ఉంచినా, నాగేశ్వరరావు మధ్యాహ్నం భోజనం విరామం కోసం, యూనివర్సిటీ లేడీస్ వైటింగ్ రూము కి వస్తాడనే వార్త మొత్తం విశ్వవిద్యాలయం కేంపస్ అంతా గుప్పు మనే లోపుగానే ఎక్కడో నార్త్ కేంపస్ లో ఉన్నప్పటికీ చప్పున అందుకున్న వాళ్ళలో నేనొక్కడిని కావడం నా అదృష్టమే! నాకు ఏ మాత్రమూ ఇష్టం లేని, క్లిష్టమైన “ఇంటెగ్రల్ కాలుక్యులస్” క్లాస్ లో ఉండగా ఎవడో నాకు ఒక చిన్న చీటీలో ఈ వార్త అందించాడు. అప్పటి యూనివర్సిటీ కేంపస్ లో మెయిన్  గేట్ నుంచి వైస్ చాన్సెలర్ గారి ఇంటి మీదుగా బహుశా అర మైలు కొండెక్కి కేఫటేరియాకి ఎదురుగుండా, ఓపెన్ ఎయిర్ ధియేటర్ పక్కన ఆ లేడీస్ వైటింగ్ హాలు అని చూచాయగా తెలుసు. అంతే. వెంటనే లఘు శంక వంక తో క్లాసు ఎగ్గొట్టి, ఒకరిద్దరు స్నేహితులతో అప్పటి ఎర్ర మట్టి గుట్టలలో అ లేడీస్  రూము కేసి పరిగెట్టడం మొదలు పెట్టాను.

ఆ రోజుల్లో “ఫేషన్” అయిన హవాయి చెప్పులు ఎర్ర మట్టితో కొట్టుకు పోయి, వేసుకున్న పంట్లాం వెనక వేపు కూడా ఎర్రగా మచ్చలతో ఉన్న నన్ను గుమ్మం దగ్గరే “సైంధవులు” అడ్డుకున్నారు.  అప్పటి కింకా ఎక్కువ మంది విద్యార్ధులకి తెలియక యువజన సందోహం లేదు తెలియదు కాబట్టి  లోపల్నించి చూసి “పరవా లేదు. అతన్ని రానియ్యండి.” అని అక్కినేని గారు అనబట్టి నన్ను లోపలికి వెళ్ళనిచ్చారు. ఎదురుగుండా కుర్చీలో కూచుని స్వచ్చమైన, తెలుగు తేజస్సుతో మహా ఠీవి గా ఉన్న ఆయన నన్ను పలకరించి “ఏం చదువుతున్నారు? క్లాసులు లేవా?” అనేసి నోట మాట పెగలక నేను గుర్, గుర్ అని అవస్త పడుతుంటే నవ్వేసి నాతో వచ్చిన ”ఇద్దరు మిత్రుల” నీ అదే ఆప్యాయతో పలకరించారు. పక్కనే ఉన్న అందాల నటి కృష్ణ కుమారి గారితో కూడా నాది అదే పరిస్తితి. అటు “నట సమ్రాట్” ని చూసి తరించాలా, పక్కనే   నాగేశ్వర రావు తో సహా… ఎంతో  పొడుగ్గా, తెల్లగా పొందికగా ఉన్న అద్భుతమైన అందాల రాశి  కృష్ణ కుమారిని చూడగానే పెరిగిపోయిన లబ్ డబ్ అనే గుండె చప్పుడు ఎలా తగ్గించుకోవాలా అనే దుస్థితి నా జీవితంలో ఆ ఒక్క సారే కలిగింది. ఆయనతో అరగంట పైగా, భయం, భయంగా మాట్లాడాక, ఇక టైమ్ అయిపోయింది అని తెలియగానే మేము నమస్కారం పెట్టేసి బయటకి వస్తుంటే అక్కినేని గారు “ఇదిగో అబ్బాయ్, అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు శ్రద్ధ గా చదువుకో . లేక పొతే నా లాగా వేషాలు వేసుకుంటూ బతక వలసి వస్తుంది, జాగ్రత్త” అన్నారు నవ్వుతూ!

మరి కొన్ని ఆంధ్రా యూనివర్సిటీ విశేషాలు …తరువాతి సంచికలో …

 

 

 

నా మొదటి “సంఘ ప్రవేశం”

chitten raju

 

1961 సంవత్సరం..అంటే నేను ప్రీ యూనివర్సిటీ పరీక్ష పాస్ అయ్యాక మా అన్నయ్యలు ముగ్గురూ వ్యవసాయం, లాయరు, డాక్టరు వృత్తులు పంచుకున్నారు కాబట్టి నేను సహజంగానే ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయం అయిపోయింది. అప్పుడే నా జీవితంలో మొదటి సారి “కులం దెబ్బ” కొట్టింది.  అంటే కేవలం అగ్ర కులం వాణ్ణి కాబట్టి తిన్న ఏకైక దెబ్బ. కానీ తంతే బూరెల గంపలో పడ్డట్టు దాని వలన నా మొట్టమొదటి  “సంఘ ప్రవేశం” కూడా జరిగింది. అంటే, అమ్మా, నాన్న గారూ, అన్నదమ్ములూ, అప్ప చెల్లెళ్ళల్ల పెరుగుతున్న ఆత్మీయ వాతావరణం నుంచి ఎవరూ తెలియని, సంబంధం లేని వ్యక్తుల మధ్య సంఘంలో ఒక్కడిగా జీవించడం, మన సమస్యలూ, ఆనందాలూ మనమే కొనితెచ్చుకోవడం, ఢక్కా మొక్కీలు తినడం, గాలి లో మేడలు కట్టుకోవడం వగైరా మొదలయిందన్న మాట.  

ఆ రోజుల్లో మన ప్రాంతాలలో విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం లో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. అప్పటికే పరిపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా స్థానిక ముల్కీ నిబంధనలు వగైరాలపై అవగాహన లేకా, ఇంకా మద్రాసుతోటే మానసికంగా ముడిపడి ఉండబట్టీ మహా అయితే అక్కడి గిండీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన ప్రాంతపు కాలేజ్ క్రిందనే లెక్క లోకి వచ్చేది. ఇక మద్రాసు, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. లు, బెంగళూరు ఐ.ఐ.ఎస్.సి. పేర్లు తల్చుకుని “అయ్యా బాబోయ్” అని భయపడడమే కానీ ఎంట్రెన్స్ పరీక్షల తతంగం మీద బొత్తిగా అవగాహన లేదు. అన్నింటికన్నా ముఖ్యం అయినది “మన కాకినాడలోనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండగా, అవన్నీ మనకెందుకూ, డబ్బు దండగ” అనేదే అందరి ఆలోచన..నాతో సహా. ఈ రోజుల్లోనూ, ఆ రోజుల్లోనూ కొందరి లాగా “ఇంట్లోంచి ఎప్పుడు బైట పడిపోదామా” అని ఎప్పుడూ అనుకో లేదు.  పైగా నేను పియుసి లో మా క్లాస్ ఫస్ట్, కాలేజ్ సెకండ్ రేంకు కాబట్టి సీటు రావడం గేరంటీ. ఆ రోజుల్లో ఆ రెండూ గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి కాకినాడకీ, అనంత పురానికీ ఒకటే అప్లికేషన్ ఉన్నా, ఇక్కడి వారికి అక్కడ సీటు ఇచ్చే వారు కాదు. అయితే వైజాగ్ లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి వేరే అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను కాకినాడ కాలేజ్ కి అప్లికేషన్ పెట్టాక, కేవలం ఎందుకైనా మంచిదని విశాఖపట్నం లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి కూడా దరఖాస్తు పంపించాను ఆఖరి క్షణంలో. “ఎందుకు రా, వెధవ అప్లికేషన్ ఫీజు పది రూపాయలు దండగా. చేరేది ఎలాగా కాకినాడ లోనేగా” అన్నారు మా నాన్న గారు.

AU Logo

అదిగో, అక్కడే నన్ను “అగ్ర కులం దెబ్బ” కొట్టింది. కాకినాడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో  కులాల వారీ రిజర్వేషన్ పద్దతిలో నాకంటే అతి తక్కువ మార్కుల వచ్చిన వారికి సీటు వచ్చింది కానీ , మా అగ్ర కులం వారి అతి తక్కువ కోటా అర్జంటుగా దాటి పోయి నాకు కాకినాడలో సీటు రాలేదు.  కాకినాడ వాడిని కాబట్టి ఏదో వల్లకాడు రూలు ప్రకారం అనంతపురంలో నాకు సీటు ఇవ్వకూడదుట. నా అగ్ర కుల “ప్రభావం” నా జన్మలో మొదటి సారిగా, ఆ మాటకొస్తే ఆఖరి సారిగా నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. దానికీ, దేనికీ నిజమైన పోలిక ఎక్కడా లేదు కానీ ఆ తరువాత మళ్ళీ పదిహేనేళ్ళకి అమెరికాలో అడుగుపెట్టాక మాత్రమే అధికారికంగా ఏ విధమైన “రిజర్వేషన్లూ” లేకపోయినా అనధికారికంగా అమెరికా తెలుగు “సాంస్కృతిక” సంఘాలు ఏకకుల ప్రాధాన్యతని పాటిస్తూ కుల వ్యవస్థని నిరాటంకంగా అమలు పరిచే స్థాయికి “ఎదగడం” నేను గమనించాను. కానీ ఇక్కడ అనేక రాజకీయ, వ్యాపార తదితర కారణాలకి స్వకుల పక్షపాతం పాలు ఎక్కువే కానీ అన్య కుల వివక్ష దానికి కారణం అనుకోను. 

కాకినాడ పి.ఆర్. కాలేజ్ మొదటి రేంక్ విద్యార్థి అయిన నాకు అక్కడే ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు రాకపోవడంతో మా కుటుంబం షాక్ కి గురి అయ్యారు. ఇక మిగిలినదల్లా నేను యాదాలాపంగా పెట్టిన ఆంధ్రా యూనివర్సిటీ అప్లికేషన్. అదృష్టవశాత్తూ అక్కడ నుంచి ఇంటర్ వ్యూకి పిలుపు రాగానే ఊపిరి పీల్చుకుని వెంటనే అక్కడికి అన్నీ సద్దుకుని పరిగెట్టాను. నిజానికి అది ఇంటర్ వ్యూ కాదు, ఏకంగా ఎడ్మిషనే అని అక్కడికి వెళ్ళాక కానీ తెలియ లేదు. కాకినాడ లో సీటు రాక పోడానికీ, వైజాగ్ రావడానికీ కారణం నాకు ఇంగ్లీషులో మంచి మార్కులు రావడమే అని ఆ ఇంటర్ వ్యూలో అప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసినది కృష్ణమాచార్యులు అనే ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారు. నా పూర్తి పేరు చూడగానే “నియాగప్పిండానివా? మరి మార్కులు బాగానే ఉన్నాయి కదా, కాకినాడలో సీటు ఎందుకు రాలేదూ?” అని అడిగారు. నేను ఆ మూడు ప్రశ్నలకీ ఏం చెప్పాలో తెలియక వెర్రి మొహం పెడితే ఆయన పక్కన ఉన్న మరో ప్రొఫెసర్ గారు “కాకినాడ లో మేథమేటిక్స్,  ఫిజిక్స్, లాజిక్ మార్కులు కలిపి చూస్తే మనం ఎందుకైనా మంచిది అని ఇంగ్లీషు కూడా కలిపి చూస్తాం. పైగా అక్కడ కోటా సిస్టం కదా. మనదేమో మెరిట్ సిస్టం” అని సగర్వంగా చెప్పి నా బదులు ఆయనే సమాధానాలు చెప్పాడు. “సరే అయితే వీడికి 5 th బ్లాక్ లో రూమ్ ఇద్దాం.” అని “ ఏరా, డబ్బు తెచ్చావా? ఆ ఆఫీసులో కట్టేసి, చలానా తీసుకుని హాస్టల్ లో చేరిపో” అని ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ లో 5th బ్లాక్ లో గది ఇచ్చారు. మొదట్లో గదులు లేక ఐదో అంతస్తులో కామన్ హాల్ లో పది మంది తో కొన్నాళ్ళు ఉన్నా ఆ తరువాత 84 నెంబరు గది కేటాయించారు. ఆ కామన్ హాల్ లో నా రూమ్ మేట్ గుంటూరు శర్మ అనే ఆయన ఇప్పుడు డాలస్ లో ఉంటారు అని తెలుసు కానీ ఎప్పుడూ కలుసుకునే అవకాశం రాలేదు. ఈ మధ్య నేను పని కట్టుకుని నా గది చూసుకుందామని ఆ 5th బ్లాక్ కి వెళ్లితే గుమ్మం దగ్గర జవాను నన్ను లోపలికి వెళ్ళనియ్య లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఆడపిల్లల హాస్టల్  గా మార్చేశారుట. ఈ నాటి ఆ 5th బ్లాక్ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను..ఇప్పటి ఆడ పిల్లలతో సహా!

AU Eng Block 5

అన్నట్టు ఆడ పిల్లలు అంటే నాకు ఖచ్చితంగా గుర్తుకు వచ్చేది ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కేంపస్ మొత్తంలో భూతద్దంతో వెతికి చూసినా ఆడ “వాసన” వేసేది కాదు…అప్పుడప్పుడు అప్పటికింకా బిల్డింగులు కడుతున్న ఆడ కూలీలు తప్ప. అందులో కాస్త పడుచు వాళ్ళని “కంచు లా ఉంది గురూ” అని విద్యార్థులు వ్యవహరించే వారు. కానీ, ఏమన్నా పిచ్చి , పిచ్చి వేషాలు వేస్తే ఆ కడుతున్న బిల్డింగ్ సిమెంట్ లో కలిపి పాతరేసేస్తారేమో అని హడిలి చచ్చిపోతూనే ఉండే వారు స్ట్యూడెంట్స్ అంతా. పగలు క్లాసులు అయిపోయాక పొలో మని ఎక్కడో సౌత్ కేంపస్ లో ఉన్న ఔట్ గేట్ దగ్గర “విద్యారమా” హోటల్ కో, లైబ్రరీ వేపుకో,  ఖచ్చితంగా “లవర్స్ కార్నర్” దగ్గర బస్సులు ఎక్కే అమ్మాయిలని చూడడానికో పరిగెత్తే వారు. అంత అవస్త పడినా ఆ రోజుల్లో మొత్తం యూనివర్సిటీ లో అమ్మాయిల సంఖ్య తక్కువే. నాకు ఇంకా జ్జాపకం ఉన్న బ్యూటీ క్వీన్స్ శైలజ, ఛాయా జానకి,  ప్రొఫెసర్ ముత్తురామన్ గారి అమ్మాయి (పేరు గుర్తు లేదు). అప్పుడు నాకు తెలియదు కానీ, వీళ్ళలో ఛాయా జానకి  సుప్రసిద్ద సాహిత్య వేత్త అబ్బూరి రామకృష్ణా రావు గారి అమ్మాయి, అంటే అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి చెల్లెలు. గత ముఫై ఏళ్లగా మా హ్యూస్టన్ లోనే భర్త తిమ్మరాజు శివరాం తో నివసిస్తోంది. నాకు వాళ్లిద్దరూ, అమ్మాయి రుక్మిణి ఎంతో ఆత్మీయులు.

నాతో పాటు కాకినాడ నుంచి నా క్లాస్ మేట్స్ పేరి శాస్త్రి, లక్ష్మీ నారాయణ కూడా వైజాగ్ లోనే చేరారు. అక్కడ స్నేహితులైన వారిలో నాకు బాగా దగ్గర అయిన వారు నారాయణ మూర్తి, పోతయ్య మాత్రమే గుర్తున్నారు. అందులో నారాయణ మూర్తి అక్కడే లెక్చరర్ గా చేరి అకాల మరణం పొందాడని విన్నాను. మరొక క్లాస్ మేట్ డి. సీతారామయ్య 55 సంవత్సరాల తరువాత ఈ మధ్యనే మళ్ళీ ఇంటర్ నెట్ లో నన్ను గుర్తు పట్టి, పలకరించి మా పి.ఆర్. జూనియర్ కాలేజ్ భవన పునర్నిర్మాణానికి మూడు లక్షల రూపాయల విరాళం ఇచ్చాడు.  ఎంత సంతోషం వేస్తుందో ఆ సహృదయత తల్చుకున్నప్పుడల్లా.

సధర్మ సదన

ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కాకినాడ లాంటి “చదును” నేల నుంచి వచ్చిన నన్ను ప్రధానంగా ఆకర్షించినది ఎర్ర మట్టి కొండల మధ్య భవనాలు, “సధర్మ సదన”, “వివేక వర్ధని” లాంటి అధ్బుతమైన ఆ భవనాల పేర్లు. అప్పుడు వైస్ చాన్సెలర్ గారు ఎ.ఎల్. నారాయణ గారు. ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి ప్రిన్సిపాల్ గారు దేవగుప్తాపు సీతాపతి రావు గారు. ఈయన టంగుటూరి సూర్య కుమారి కి దగ్గర బంధువులు. మా చిన్నన్నయ్యకి ఆ కుటుంబంతో మద్రాసులో చాలా  సాన్నిహిత్యం. అందు చేత నేను ముందు వైజాగ్ లో చేరినా సిలబస్, డిగ్రీ ఇచ్చేదీ ఆంధ్రా యూనివర్సిటీయే కాబట్టి  నన్ను కాకినాడ కి ట్రాన్స్ఫర్ చెయ్య మని మా చిన్నన్నయ్య వైజాగ్ వచ్చి ఆయన్ని అడిగాడు. ఆ రోజు నాకు ఇంకా జ్జాపకం. అసలే నూనూగు మీసాల వాడిని. జీవితంలో మొదటి సారిగా స్వంత ఊరు వదలి పెట్టి హాస్టల్ లో చేరి గట్టిగా వారం దాట లేదు. క్లాసులింకా మొదలెట్ట లేదు. అందులోనూ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే భయం. ఒక పక్క సీనియర్స్ రాగింగ్. మరొక పక్క ప్రిన్సిపాల్ గారు అంటే దడ దడ. మద్రాసు రోజుల్లో బాగా తెలుసు కాబట్టి మా చిన్నన్నయ్యని ఆయన రాత్రి డిన్నర్ కి పిలిచారు.  నన్ను కూడా తీసుకెళ్ళి మా అన్నయ్య “మా రాజా మీ కాలేజ్ లో చేరాడు. వాణ్ణి కాకినాడ కి ట్రాన్స్ ఫర్ చెయ్య డానికి ఏం చెయ్యాలి?” అని అడిగాడు. దానికి ఆయన “కనీసం ఒక ఏడాది అయినా ఇక్కడ చదివితే కానీ కుదరదు. అది రూలు. వచ్చే ఏడు చూద్దాం. “ అనగానే వాళ్ళిద్దరూ నన్ను మర్చి పోయి వాళ్ళ కబుర్లలో పడిపోయారు. నేను చెమట్లు కక్కుకుంటూ కాలం గడిపేసి ఏడాది ఉండడానికి మానసికంగా తయారు అయిపోయాను.

సరిగ్గా నాలాటి కేసే మా వై.ఎస్.ఎన్. మూర్తి అనే కాకినాడ కుర్రాడిది. అయితే అతను బి.ఎస్.సి.కూడా పి.ఆర్. కాలేజ్ లోనే చదివాడు. కాకినాడ లో అప్పటికి అతను నాకు పరిచయం లేక పోయినా ఆ నాడు ఇద్దరం వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాస్ మేట్స్ గా పరిచయం అయి, ఏడాది తరువాత ఒకే సారి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి మరి పోయి, ఆ స్నేహం అంచెలంచెలు గా పెంచుకుంటూ, ఇప్పటికీ చాలా పనులు కలిసి చేస్తూ జీవిత కాల స్నేహం కొనసాగిస్తున్నాం. ఆతని స్నేహానికి, సహృదయానికీ, భార్య విజయ ఆత్మీయతకి విలువ కట్టడం నా వల్ల కాదు. కొడుకు లిద్దరూ అమెరికాలోనే ఉండడంతో దంపతులిద్దరూ అమెరికా వస్తూ, పోతూ ఉంటారు.

నేను ఆంద్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరినప్పుడు అది ఒక విధంగా సంధి కాలంలోనే ఉంది అని చెప్పాలి. అప్పటికి ఒక్క కెమికల్ టెక్నాలజీ బిల్డింగ్ ఒక్కటే పూర్తి అయింది. మిగిలిన వన్నీ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. హాస్టల్స్ అన్నీ మటుకు ముందే కట్టారు. యూనివర్సిటీ బస్సులు కాక వైజాగ్ ఊళ్ళో కి వెళ్ళడానికీ, అక్కడి నుంచి రాడానికీ ఒకే ఒక్క బస్…..అదే ప్రపంచ ప్రసిద్ది చెందిన నెంబర్ 10. ఈ బస్సులో ప్రేమాయణాల మీద చాలా కథలే వచ్చాయి. ఈ బస్సు మైన్ కేంపస్ ..అంటే సౌత్ కేంపస్ మీద నుంచి పెద వాల్తేరు లార్సన్ బే వేపు వెళ్ళేది.  ఇంజనీరింగ్ కేంపస్ వాళ్ళంతా ఊళ్ళో కి వెళ్ళాలంటే చచ్చినట్టు ఎర్ర మట్టి లో గంట సేపు నడుచుకుంటూ అక్కడ బస్సు ఎక్కాల్సిందే. నార్త్ కేంపస్ వేపు డైరీ ఫార్మ్ రోడ్ మీద ఒకే ఒక బస్సు ఉండేది. ఇక రెండు కేంపస్ ల కీ మధ్య రోడ్ దిగువ పిచ్చాసు పత్రి ఉండేది. అక్కడికి బస్సులు లేవు. ఉన్న ఏ బస్సూ కూడా రాత్రి 9 దాకానే.  ఎప్పుడైనా ఎల్లమ్మ తోట దగ్గర సినిమాకి వెళ్తే రాత్రి గవర్నర్ బంగాళా మీదుగా నడిచి వెనక్కి రావలసినదే….అవును…ఆ రోజుల్లో జగదాంబా సెంటర్ లేదు. ఈ రోజుల్లో ఎల్లమ్మ తోట లేదు. దేశం పురోగమించింది.

వైజాగ్ లో నా కేవలం ఏడాది చదువు ప్రహసనంలో ప్రధాన ఘట్టాలు  చాలానే ఉన్నాయి. విశేషం ఏమిటంటే అవన్నీ నా “సంఘ ప్రవేశానికి” సంబంధించినవే కానీ అసలు చదువు కి సంబంధించినవి కాదు. ఆ మాటకొస్తే సాహిత్య ప్రవేశానికి కూడా సంబంధించినవి కూడా కాకపోయినా ఖచ్చితంగా నాటకాలు, తెలుగు సంస్కృతి పట్ల నాకు మరింత అవగాహన కలిగించినవే. విద్యార్థి సంఘాల లో చేరకపోయినా పెద్ద సమ్మెలలో చురుగ్గా పాల్గొనడం కూడా నా జీవితంలో అదే మొదలు. అదే ఆఖరు.

ఈ వివరాలు వచ్చే సంచికలో…..

 

మా అక్క పెళ్లి – అందరికీ మరపు రాని అనుభూతులే!

వంగూరి చిట్టెన్ రాజు 

chitten raju1961 సంవత్సరంలో.. ఆ రోజు పిబ్రవరి 5 వ తారీకు. ఆ రోజు మా ఇంట్లో పెద్దాడబడుచు అయిన మా అక్క పెళ్లి అయి యాభై ఏళ్ళు దాటినా ఆ ఐదు రోజుల పెళ్లి  హడావుడిలో ప్రతీ అంశమూ ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అప్పటికి నేను పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్శిటీ లో చేరి ఆరేడు, నెలలు అయిందేమో. అంటే నిక్కర్లు పూర్తిగా మానేసి పగలు పంట్లాలు, రాత్రుళ్ళు పైజామాలూ వేసుకునే వయస్సు అనమాట. నా కంటే మా అక్క ఐదేళ్ళు పెద్దది. మా ఇద్దరికీ మధ్యన మా మూడో అన్నయ్య డా. సుబ్రహ్మణ్యం. నేనేమో మా అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళలో సరిగా మధ్యముణ్ణి. మా అక్క సూర్యారావు పేట లో గర్ల్స్ హైస్కూల్ లో ఎస్.ఎస్. ఎల్.సి. పాస్ అయిన దగ్గర నుంచీ సంబంధాలు రావడం మొదలు పెట్టాయి. ఆదిలక్ష్మీ మాణిక్యాంబ అని మా బామ్మ గారి పేరు పెట్టుకుని ఇంటికి మొదటి ఆడ పిల్ల కాబట్టి అందరూ ఎంతో అపురూపంగా చూసుకునే మా అక్కకి వచ్చే సంబంధాలలో సహజంగానే ఎంతో మంచి స్థాయిలో ఉండే వాటినే మా అమ్మా, నాన్న గారూ పట్టించుకునే వారు. నాకు తెలిసీ మూడు, నాలుగు  సంబంధాల తాలూకు  పెళ్లి చూపుల తరువాత అందులో ఒక సంబంధం కొంచెం చిన్న సైజు డ్రామా తరువాత నిశ్చయం అయింది.  

మా అక్క మొదటి పెళ్లి చూపులు 1959 ఏప్రిల్ లో అని జ్ఞాపకం. కొండేపూడి లక్ష్మీ నారాయణ గారి ద్వారా మంత్రిప్రగడ భుజంగ రావు గారి అబ్బాయిని మా అక్కకి అడిగితే వాళ్ళు వచ్చి చూసుకున్నారు అని మాత్రమే నాకు చూచాయగా గుర్తు. ఇక  మా పెద్దన్నయ్య పెళ్ళికి కొన్ని నెలల ముందు 1960 తొలి రోజులలో ఓ సారి మాకు ఎవరో ఎక్కడో గంగల కుర్రు అనే గ్రామం లో ఉండే మా దూరపు బంధువులు వారి అమ్మాయికి మీ వంగూరి వారింట్లో ఇంట్లో పెళ్లి చేసుకుంటాం అని అడిగితే మా అమ్మా, నాన్న గారూ ఒప్పుకుని మా రేడియో సావిడి అంతా ఖాళీ చేసి, వెళ్ళు వేయించి వాళ్లకి రెండు రోజుల పాటు ఇచ్చారు. శర భూపాల పట్నం నుంచి మగ పెళ్లి వారు కూడా దిగ గానే అదే రోజు అనుకోకుండా అప్పటికప్పుడు కబురు పెట్టి గురజాడ జగన్నాధం గారు అనే ఆయన కొడుకు, కుటుంబం తో సహా వచ్చి మా అక్కని పెళ్లి చూపులు చూసుకున్నారు. ఒక పక్కన మా ఇల్లంతా ఎవరిదో పెళ్లి హడావుడి, ఇంకో పక్క అనుకోకుండా మా అక్కకి పెళ్లి చూపులూ…ఇప్పుడు తలచుకుంటే భలే తమాషాగా ఉంటుంది. ఆ సంబంధం మా అక్కకి కుదర లేదు. ఈ రెండు ఉదంతాల గురించీ నాకు ఇంకేమీ గుర్తు లేదు. ఎవరి పేర్లూ గుర్తు లేవు.

 

అదే రోజులలో హైదరాబాద్ లో సుప్రసిద్ద హై కోర్ట్  అడ్వొకేట్ అయిన నండూరి బాపిరాజు గారి పెద్ద కొడుకు, ఆయన దగ్గరే జూనియర్ అడ్వొకేట్ గా ఉండి బాగా పేరు తెచ్చుకుంటున్న “సూరి” అనబడే  వెంకట సూర్య నారాయణ మూర్తి సంబంధం మా అక్కకి వచ్చింది. బాపిరాజు గారికి అన్నీ నచ్చి, ఎవరో ఒక అనామక జ్యోతిష్కుడికి జాతకాలు చూపించగానే ఆయన వీరిద్దరి జాతకాలు అస్సలు పడవు అని తేల్చి చెప్పడంతో మా సంబంధం వాళ్ళు మానుకున్నారు. ఈ సంగతి మా నాన్న గారికీ బహుశా తెలియదు. ఆ తరువాత నాకు తెలిసీ మా అక్కకి జరిగిన మరో  పెళ్లి  చూపులు మాకు రెండు, మూడు తరాలగా కుటుంబ స్నేహితులైన లక్కరాజు శరభయ్యతో. ఆయన అప్పటికే ఎయిర్ లైన్ ఫైలట్. మా చిన్నన్నయ్య కూడా పైలట్ గా ట్రైనింగ్ పొందిన వాడే కానీ బహుశా అంత ప్రమాదకరమైన ఉద్యోగంలో ఉన్న సంబంధం మనకెందుకులే అనుకున్నారు మా వాళ్ళు. అదే రోజుల్లో రాజమండ్రి నుంచి నండూరి రామచంద్ర మూర్తి గారు అనే అడ్వొకేట్ గారి బంధువు నారాయణ రావు సంబంధం వచ్చి, వాళ్ళు వచ్చి పెళ్లి చూపులు కూడా చూసుకున్నారు మా అక్కని. తమాషా ఏమిటంటే ఈ రామచంద్ర మూర్తి గారు మా అక్కని చూసి “ ఈ అమ్మాయి మా తమ్ముడు సూరి కి సరిగ్గా ఉంటుంది. మా చిన్నాన్న బాపిరాజు గారితో మాట్లాడదాం” అని మా నాన్న గారికి చెప్పగానే “జాతకాలు పడలేదుట” అన్నారు మా నాన్న గారు. “అదేదో తప్పు చూసి ఉంటారు” అని అయన, బాపిరాజు గారిని సంప్రదించి ఈ సారి మా అక్కదీ, పెళ్లి కొడుకుదీ జాతకాలు రాజమండ్రి లో మాకూ, వాళ్ళకీ కూడా ఆస్థాన జ్యోతిష్కులైన  కె. వి. సోమయాజుల గారికి మళ్ళీ చూపించారు.  ఆయన ఆ జాతకాలు చూసి “ఈ జాతకాలు అద్భుతంగా కుదిరాయి. ఇంకేమీ ఆలోచించకండి” అని చెప్పగానే బాపిరాజు గారు “మీ అమ్మాయిని చూసుకోడానికి వస్తాం” అని కబురు చేశారు. ఆ రోజుల్లో మగ పెళ్లి వారు పెళ్లి కూతురి తల్లిదండ్రులకి ఇలా కబురు పెట్టడం కనీ , వినీ ఎరగనిది.

మొత్తానికి 1960 ఆగస్ట్ లో రెండు టాక్సీలలో పెళ్లి కొడుకు “సూరి” గారి పెద్ద నాన్న గారు (నండూరి సూర్య నారాయణ మూర్తి గారు, పెద్దాపురం అడ్వొకేట్), తండ్రి బాపి రాజు గారు, తల్లి రాజేశ్వరి గారు, వరసకి అన్నయ్య అయిన రామ చంద్ర మూర్తి గారు (రాజమండ్రి అడ్వొకేట్) & ఆయన భార్య అమ్మడు గారు, మరి కొందరూ మగ పెళ్లి వారి కుటుంబం నుంచి తరలి వచ్చి మా అక్కని పెళ్లి చూపులు చూసుకున్నారు. ఈ సంబంధం ఇంచు మించు కుదిరిపోయినట్టే కాబట్టి మా కుటుంబం నుంచి సుబ్బారావు తాతయ్య గారు (పాలతోడు), జేగురు పాడు నుంచి పెద వెంకట్రావు నాన్న, రాజమండ్రి నుంచి సూరీడు బాబయ్య గారూ, కరప నుంచి మా పెద్దన్నయ్య మామ గారు చాగంటి సుబ్బారావు మామయ్య గారూ, కొండేపూడి సూర్యనారాయణ గారూ వచ్చారు. మా ఇల్లంతా పెళ్లి చూపుల హడావుడి తో నిండి పోయింది. ఆ మర్నాడు మా నాన్న గారూ, మా అందరు బంధువులూ రాజమండ్రి రామచంద్ర మూర్తి గారి ఇంటికి వెళ్ళగానే అమ్మాయి నచ్చిందని చెప్పారు. ఆ మర్నాడు చింతలూరి సాంబశివరావు గారు, మా అద్దంకి సుబ్బారావు నాన్న కూడా కలిసి రాగా ఇరు కుటుంబాల పెద్దలూ మొత్తం యాభై మంది మధ్యలో మా అక్కకీ, బావ గారికీ నిశ్చితార్థం జరిగి, తాంబూలాలు పుచ్చుకున్నారు. వెంటనే సోమయాజుల గారి దగ్గరికే మరో ఆరు నెలలకి వెళ్లి ఉత్తరాయణం వచ్చాక ఫిబ్రవరి 5, 1961 ఉదయం  పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. నాకు తెలిసీ ఎక్కడా అసలు కట్నం ప్రసక్తే రా లేదు. వచ్చినా “కట్నం, గిట్నం అక్కర లేదు కానీ పెళ్లి మటుకు ఘనంగా చెయ్యండి” అన్నారు మగ పెళ్లి వారు. కట్నం గురించి పట్టించుకోక పోవడం  ఆ రోజుల్లో అపురూపమే! ఎంతో నాజూగ్గా ఉండే ఆ రోజుల నాటి మా అక్క ఫోటో, మా అక్కా, బావ గార్ల పెళ్లి శుభ లేఖ ఇక్కడ జతపరుస్తున్నాను.

Mani NVS Telugu1

అప్పటి నుంచీ మా ఇంట్లో ఆరు నెలల పాటు ప్రతీ రోజూ పెళ్లి హడావుడే! పైగా మగ పెళ్లి వారు కోనసీమ వారు అవడంతో, అందునా నిష్టా గరిష్టులు అవడంతో చాలా విషయాలు పకడ్బందీగా వారి ఆచార వ్యవహారాలకీ, మడి నియమాలకీ అనుగుణంగా ఏర్పాటు చెయ్యడానికి మా నాన్న గారు, మా మొత్తం కుటుంబం చాలా శ్రమ పడ్డారు. ఇక్కడ మేము చేసిన ఒక “దొంగ పని” ఒప్పుకుని తీరాలి.   ఎప్పుడూ మా వంటింట్లో అడుగు పెట్టక పోయినా మాకు స్వామి నాయుడు అనే స్నేహితుడు మా కుటుంబానికి ప్రాణ వాయువు లాటి వాడు. అలాగే మా పక్కింటి భాస్కర రావు గాడు. ఈ బాచి గాడు సుప్రసిద్ధ కవీశ్వరులు వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరయిన ఓలేటి పార్వతీశం గారి మనవాడే కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఈ స్వామి నాయుడు మటుకు మా కాకినాడ క్రౌన్ టాకీస్ యజమాని గొలగాబత్తుల వీర రాఘవుల గారి రెండో కొడుకు. ఆయనే కాకినాడలో తొలి సినిమా హాలు పేలస్ టాకీస్ కట్టి ఆ ప్రాంతాలలో మొట్టమొదటి సినిమా ప్రదర్శనలు వేసినాయన. పైగా ఉల్లిపాయల వ్యాపారం కూడా ఉండేది. ఈ నాయుడు గాడు బజారు కెళ్ళి కూరగాయలు, ఉల్లి పాయలూ పట్టుకొచ్చే వాడు. అది పరవా లేదు కానీ గాడి పొయ్యిలు వేసి బ్రాహ్మలు వంట వండుచున్న చోటికి కానీ, మగ పెళ్లి వారు భోజనాల సమయంలో కానీ మా పెద్ద వాళ్ళ మడీ, ఆచారాల ప్రకారం మాంసాహారం చేసే కులాల వాళ్ళు వాడు కనపడ కూడదు. అంచేత  ఈ నాయుడు గాడు ఎప్పుడైనా పొరపాటున భోజనాల సమయంలో కనపడతాడేమో, ఈ కోనసీమ పెళ్లి వారు లేచి వెళ్లి పోతారేమో అని భయం వేసి ఆ పెళ్లి వారం రోజులూ వాణ్ని “శర్మ” అని పిలిచే వాళ్ళం. ఇప్పటికీ అది తలచుకుంటే ఎంత నవ్వొస్తుందో!

ఇక్కడ మా అక్క మామ గారైన బాపిరాజు గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. ఆయన మొదట్లో గాంధేయ వాది. ఎంత తీవ్ర గాంధేయ వాది అంటే, కావాలని హరిజనులని వంటింట్లోకి తీసుకొచ్చి ఎంతో శ్రోత్రియురాలైన భార్య ని వాళ్ళ కి భోజనం వడ్డించమని పక్కన కూచోబెట్టుకునే వారు అని బంధువులు చెప్పుకోగా విన్నాను. ఆయన స్వాతంత్య పోరాటంలో పోలీసుల చేత ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని జైలు కి వెళ్ళారు.ఆ కొరడా, లాఠీ దెబ్బల తాలూకు చారలు వీపు నిండా కనపడేవి. రాష్ట్రానికి తొలి ఆర్ధిక మంత్రి కళా వెంకట్రావు గారికి దగ్గర స్నేహితులు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక పూర్తిగా మారిపోయిన రాజకీయ వాదులనీ, పతనమై పోయిన నైతిక, సామాజిక, మత పరమైన విలువలనీ చూసి మళ్ళీ ఆధ్యాత్మక తత్త్వం,  ఆచారాలు పాటించడం  వేపూ మళ్ళారు. ఆయనే నాకు “కోట వెంకటాచలం” గారి పుస్తకాలు ఇచ్చి “ఇవి చదవ్వోయ్ రాజా, హిందువులు ఎంత గొప్పవాళ్ళో తెలుస్తుంది” అని నేను ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయతతో నేనంటే చాలా ఇష్టంగా ఉండే వారు.  ఆయన భోజన ప్రియులు. వారింట్లో వంటిల్లు ఒక దేవాలయం గానూ, వంట చెయ్యడం, భోజనం చెయ్యడం ఒక మహా యజ్ఞం గానూ ఉండి ఎప్పుడు వాళ్ళింటికి వెడదామా అని మా బంధుకోటి ఎదురు చూస్తూ ఉండే వాళ్ళం. ఇప్పటికీ మా బావ గారితో సహా ఆయన ఆరుగురు కొడుకులూ, ఒక అమ్మాయల అందరి ఇళ్ళల్లో కూడా అదే ఆచారం కొనసాగుతోంది.

ఇక మా అక్కా, బావ గార్ల పెళ్లి విషయానికి తిరిగి వస్తే ఆ ఐదు రోజుల పెళ్ళికీ అసలు హడావుడి అంతా జనవరి లోనే మొదలయింది. కరప నుంచి మా సుబ్బారావు మామయ్య గారు  (మా పెద్దన్నయ్య మామ గారు) మా ఇంట్లో సుమారు అర ఎకరం పందిరికి సరిపడా తాటాకులు, వాసాలు, సరుగుడు రాటలు పంపించారు. ప్రత్తిపాడు నుంచి మా రైతు గొల్లకోట రామారావు 12 వీశలు స్వచ్చమైన నెయ్యి, కందులు, పెసలు, గొల్లపోలు మిరప కాయలు వగైరా సరుకులు పంపించాడు. మా పొలం నుంచీ, ఇతర చోట్ల నుంచీ భోజనాల ధాన్యం, ఇతర దినుసులూ ఎద్దు బండ్ల మీద ప్రతీ రోజూ వచ్చేవి. ఎందు కంటే మొత్తం ఐదు రోజుల పెళ్ళికీ రోజుకి వెయ్యి విస్తరాకులు లేస్తాయని మా నాన్న గారి అంచనా. అది కాక మా ఆనవాయితీ ప్రకారం మూడు విందులు….పెళ్లి వారికి, బంధువులకీ, స్నేహితులకీ కలిపి ఒకటి, కాకినాడ లాయర్లకి ఒకటి, మా పొలం రైతులకి ఒకటి. ఇక్కడ తమాషా ఏమిటంటే ఆ రోజుల్లో వారి ఇళ్ళల్లో నెల మీద విస్తరి వేసుకుని భోజనం చేసే   మొదటి రెండు విందుల వారూ “వంగూరి వారింట్లో పెళ్లి విందుకి టేబుల్ మీల్స్ పెడతారు” అని గొప్పగా చెప్పుకునే వారు. కానీ రైతులు మటుకు టేబుల్ మీద కూచోడానికి సిగ్గు పడిపోయి నెల మీదే కూచునే వారు. ఈ రోజుల్లో నేల మీద కూచుని అసలు ఎవరైనా భోజనం చేస్తున్నారా అనేది ఒక యక్ష ప్రశ్నే!

Akka2

 

మా అక్క పెళ్లికి రాని బంధువులు లేరు. మా ఆడ పెళ్లి వారి తరఫున పెళ్లి నిర్వాహకులు ఎప్పటి లాగానే మా చిట్టెన్ రాజు బాబయ్య, జయ వదిన. ఇక బంధువులలో పెద్దాపురం నుంచి బాసు పిన్ని& సుబ్బారావు మామయ్య గారు, వాళ్ళ పిల్లలు రత్నం, పద్మ  పెద్దమ్మరుసు & వెంకటేశ్వర రావు అన్నయ్య గారు, తణుకు నుంచి లక్ష్మీపతి రావు తాత గారూ, సుదర్శనం పిన్ని & సాంబశివరావు గారు, సువర్చల, రామలక్ష్మి బామ్మ గారు, రాజ మండ్రి నుంచి సూరీడు బాబయ్య గారు & మాణిక్యం పిన్ని, చెల్లం బామ్మ గారూ, పేద బేబీ, దొంతమ్మూరు నుంచి బాసక్క, చిన్న బేబీ, అమలాపురం నుంచి పెద్ద బావ, సుందరక్క, భానుడు దొడ్డమ్మ గారు సుందర శివ రావు గారు, మా మేనగోడళ్ళు ఐదుగురు, విజయ వాడ నుంచి కాంతం బామ్మ గారు, మంగ మామయ్య, వైజాగ్ నుంచి శంకరం బాబయ్య, కాంతం అత్తయ్య, కామేశ్వరి అత్తయ్య,   సత్యవతి అత్తయ్య, హైదరాబాద్ నుంచి రామం బాబయ్య ..ఇలా అందరి పేర్లూ రాసుకుంటూ పోతే చోటు చాలదు…ఇక మా వయసు గేంగ్ లో సుబ్బన్నయ్య, అబ్బులు బావ, కరప వెంకట్రావు, నేను, మా తమ్ముడు, కరప కంచి రాజు, స్నేహితుల ముఠా డజను మంది అన్ని పనులూ పైన వేసుకుని నానా హడావుడీ చేశాం.

ఇక పెళ్లి పందిరి అలంకరణ డ్యూటీ అంతా ఎప్పటి లాగానే మా పెద్దన్నయ్యదే! సుమారు అర ఎకరం తాటాకు పందిరి కి వంద సరుగుడు రాట్లకీ చుట్టూ రంగు, రంగుల ఉలిపిరి కాగితాలూ, చెమ్కీ  రిబ్బన్లూ, నక్షత్రాలు, ప్రతీ రాటకీ ఒక్కొక్క ట్యూబ్ లైటు, మళ్ళీ వాటిల్లో కొన్నింటికి పంచ రంగుల కాగితాలు….ఇలా ఒకటేమిటీ వారం రోజులు మా పెద్దన్నయ్య పర్యవేక్షణ లో అహర్నిశలూ కష్టపడి , ఒళ్లంతా తుమ్మ జిగురు, లేదా ఉడికించిన అన్నం అంటించుకుని మహానంద పడిపోయాం. 500 బుడగలు గాలి ఊది పందిరి అంతా వేలాడదీదీశాం. నేలంతా తడిపేసి, కల్లాపి జల్లి, టార్పాలిన్ లు పరిచేశాం. మా అమ్మ వేపు చుట్టాలయిన జనార్దనం బావ 200 కుర్చీలు సప్లై చేశాడు. ఇక రాటల చుట్టూ నలు చదరపు దిమ్మలు చేసి వాటి మీద రంగు, రంగుల ముగ్గులు వేసేశాం. మగ పెళ్లి వారి మడీ, ఆచారాల కి అనుగుణంగా పందిరి చుట్టూ దుప్పట్ల తో తెరలు కట్టేసి జాగ్రత్త పడ్డాం. అన్ని రాటలకీ కొత్త కొబ్బరాకులు కడితే పందిరికి మధ్యలో ఎత్తుగా కట్టిన మందిరానికి చుట్టూ అరటి చెట్లు కట్టి, మామిడాకుల తోరణాలతో అత్యంత శోభాయమానంగా మా పెద్దన్నయ్య తీర్చి దిద్దాడు. ఆ కొత్త ఆకుల పరిమళం నాకు ఇంకా గుర్తు.

ఇక 1961 ఫిబ్రవరి ఒకటో తారీకున మా ఇంట్లో అక్కని పెళ్లి కూతుర్ని చేసిన సమయానికే అక్కడ రాజమండ్రి లో మా బావ గారిని పెళ్లి కొడుకుని చేశారు. దానికి మా చిన్నన్నయ్య వెళ్ళాడు.  పెళ్లి ముందు రోజు సాయంత్రం మగ పెళ్లి వారు రెండు టాక్సీలు, మూడు పెద్ద బస్సుల్లోనూ, ఇతర విధాలు గానూ సుమారు 200 మంది తరలి వచ్చారు. వారి విడిది కోసం మా గాంధీ నగరం లో కపిలేశ్వరపురం జమీందార్ల మేడ, రాళ్ళపల్లి వారు, కాళ్ళకూరి వారు, ఎదురింటి విఠాల వారు, పక్కింటి కీర్తి వారు, చీమలకొండ వారు, పుల్లెల వారు, దుగ్గిరాల వారు ఇలా ఇంచు మించు పదిహేను ఇళ్ళు మా అధీనం లోకి వచ్చేశాయి. ఇంటికొక ఐదుగురు టీం…పని వాళ్ళు, పనమ్మాయిలు, టిఫిన్ల సప్లయ్ కి, పేకాట సామగ్రి వగైరా అన్ని సౌకర్యాలకీ ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి నాడు పొద్దుట స్నాతకం లో మా పెద్దన్నయ్య హడావుడి అంతా, ఇంతా కాదు. పెళ్లి కొడుకు కాశీ వెళ్తున్నప్పుడు గడ్డం క్రింద మామూలు గా చిన్న ముక్క కాకుండా ఏకంగా వీశెడు బరువున్న పెద్ద బెల్లం ముక్కతో గట్టిగా కొట్టి అందరినీ భలే నవ్వించాడు. మా చిన్నన్నయ్య మాకు కుటుంబ స్నేహితులైన గిరి గారి రెండో కొడుకు స్మైల్స్ స్టూడియో ఓలేటి వెంకటేశ్వరావు చేత ఆ రోజుల్లో ఎంతో అపురూపమైన కలర్ ఫోటోలు తీయించాడు. అవన్నీ డెవెలప్ చెయ్యడానికి మొత్తం దక్షిణాది అంతటికీ మద్రాసు లో మాత్రమే ఉండే వేల్స్ స్టూడియో కి పంపించారు.

కోన సీమ మగ పెళ్లి వారు ఎక్కడ వంకలు పెడతారో అని మేం అందరం ఎంత భయపడుతూనే ఉన్నా, మా ఏర్పాట్లు బావుండండంతో అన్ని రోజులూ సంతోషంగానే ఉన్నారు. ..ఆఖరి రోజున తప్ప… ఆ రోజున మగ పెళ్లి వారందరూ క్రింద టార్పాలిన్ల మీద కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా పెద్దన్నయ్య మా నాన్న గారి పక్కనే కుర్చీలో కూచుని మాట్లాడుతున్నాడు. అది చూసి మగ పెళ్లి వాళ్ళలో ఒక పెద్దాయనకి కోపం వచ్చి “మేం అందరం క్రింద కూచుంటే మీ పెద్దబ్బాయి సిల్క్ లాల్చీ, సిల్కు పైజామా , చేతికి రిస్ట్ వాచీ పెట్టుకుని, సెంటు పూసుకుని ట్రిమ్ గా సినిమా హీరో లా షోకు చేస్తున్నాడు. ఆడ పెళ్లి వారం అని అప్పుడే మర్చి పోయాడా?” అని మా నాన్న గారిని హేళన గా మాట్లాడారు. మా నాన్న గారికి కోపం వచ్చి, మా పెద్దన్నయ్య దగ్గరకి వెళ్లి, జట్టు చెరిపేసి పరువు తీసేశావు అని కోప్పడ్డారు. వెంటనే మా అన్నయ్య లోపలి వెళ్లి పోయి బట్టలన్నీ విప్పేసి, మాసిన బట్టలు తొడుక్కుని, ఉంగరాలు, వాచీ విసిరేసి చింపిరి జుట్టు తో బయటకు వచ్చాడు. ఆ రాత్రి వధూవరులని పూర్తి బేండ్ మేళంతో, వెనకాల జెనరేటర్ తో రక రకాల లైట్లతో అలకరించిన కారులో, ఎందుకైనా మంచిదని పెట్రోమేక్స్ లైట్లతోటీ మొత్తం గాంధీ నగరం, రామారావు పేట ఊరేగించినప్పుడు మా పెద్దన్నయ్య రాలేదు. ఆ ఊరేగింపు తరువాత తాడేపల్లి గూడెం నుంచి పోణంగి సిస్టర్స్ బుర్ర కథ పెట్టించారు. సాయంత్రం అలక పాన్పు మీద మా బావ గారికి మద్రాసు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఒమేగా రిస్ట్ వాచీ ని మా చిన్నన్నయ్య బహుకరించాడు. ఆ రోజుల్లో అది ఏకంగా 300 రూపాయల అత్యంత ఖరీదైన ప్రతిష్టాత్మకమైన రిస్ట్ వాచీ. అప్పగింతల సమయంలో మళ్ళీ మా పెద్దన్నయ్య గట్టిగా పోలోమని పెద్ద ఏడుపు నటించి వాతావరణాన్ని తేలిక చేశాడు.

పెళ్లి తంతులు పూర్తి అయ్యాక జరిగిన రెండు డిన్నర్లకీ..అంటే పెళ్లి వారు, స్నేహితులు, బంధువర్గానికి ఒక రాత్రి, లాయర్లందరికీ మరో రాత్రీ….గుమ్మ దగ్గర నుంచుని అతిధులని సాదరంగా ఆహ్వానించడం డ్యూటీ నాదీ, మా తమ్ముడిదీనూ. అందులో మొదటి రోజు అతిధులు ఏడింటికల్లా రావడం మొదలుపెడతారు కాబట్టి నేను ఆరూ నలభై ఐదుకి నా జన్మలో మొదటి సారిగా మా అక్క పెళ్లి కోసం ప్రత్యేకంగా కుట్టించిన సిల్క్ పజామా, లాల్చీ వేసుకుని అద్దం ముందు నుంచుని షోకు చూసుకుంటూ ఉంటే మా చిన్నన్నయ్య దూసుకుంటూ వచ్చి “ఏరా, వెధవా..ఇంకా ఇక్కడే ఉన్నావా. వెధవ షోకు చాలు కానీ గుమ్మ దగ్గరకి తగలడు. అందరూ వచ్చే వేళయింది” అని కొట్టేటంత పని చేశాడు. నిజంగా కొట్టాడేమో మటుకు అంతగా గుర్తు లేదు. కానీ ఆ సంఘటన మటుకు ఇప్పటికీ మర్చి పోలేదు.

AKKA BAAVA

ఇక మా బావ గారి విషయానికి వస్తే,  అప్పుడు   హైకోర్ట్ మద్రాసులో ఉండేది కాబట్టి చిన్నప్పుడు ఆయన మద్రాసులో కేసరి హై స్కూల్ లో చదువుకున్నారు. అప్పుడు బాపు –రమణ ఆయన సహాద్యాయులు. అక్కడే లా డిగ్రీ చదువుతున్నప్పుడు, మా చిన్నన్నయ్య కూడా అదే మద్రాసు లా కాలేజీ లోనే చదివే వాడు. ఆ విధంగా కాస్తో, కూస్తో వారిద్దరికీ ప్రత్యక్ష పరిచయం అప్పుడే ఉంది.  హైదరాబాద్ లో హై కోర్ట్ లాయర్ గా దుర్గాబాయ్ దేశ్ ముఖ్  గారి మహిళా కళాశాల లాయర్ గా తొలి రోజులలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ముళ్ళపూడి రమణ గారు ఒక ప్రముఖ నటుడి చేతిలో మోస పోయి ఒక మార్వాడీకి అప్పు తీర్చడం కోసం  ఇల్లూ, వాకిలీ అమ్మేసుకున్నప్పుడు మా బావ గారినే కన్సల్ట్ చేశారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అలాగే జలగం వెంగళ రావు కమిషన్ లోనూ, అప్పటి పెట్రోలియం మంత్రి  శివ శంకర్ గారితోటీ,  ఎన్టీ ఆర్ హయాంలో నూ ప్రతిష్టాత్మకమైన లాయర్ గా పని చేసి ఇప్పుడు సీనియర్ ఎడ్వోకేట్ గా విశ్రాంతి తీసుకుంటున్నారు. మా బావ గారి తమ్ముళ్ళు అచ్యుత రాం, బాపన్న, రాం చంద్, కామరాజు (మరో తమ్ముడు, నా వయసు వాడైన రత్నం కొన్నేళ్ళ క్రితం పోయాడు), చెల్లెలు కల్పకం అందరూ ఎంతో సన్నిహితులం, స్నేహితుల్లగా ఉంటాం. మా కుటుంబానికి  మా అక్కా, బావ గార్లే  పెద్దలు. వారికి చెప్పనిదే, వాళ్ళ ఆశీర్వచనాలు ముందు తీసుకోనిదే ఏ పనీ చెయ్యం.

ఇప్పుడు అలాంటి తాటాకుల పెళ్లి పందిరి సినిమాలలో కూడా చూడలేం. మొన్నే మధ్య ఆత్మీయుడు కూచిభొట్ల ఆనంద్ బందరు లో వాళ్ళమ్మాయి పెళ్లికి తాటాకుల పందిరి వేయించాడని చెప్తే భలే సంతోషం వేసింది. నేను ఈ మధ్య ఇండియా వెళ్లి నప్పుడు ఎవరింట్లోనో పెళ్లి కి వెళ్లి, ఆ ప్లాస్టిక్ పువ్వుల మధ్య, షామియానా లోనూ “నీరజ్ వెడ్స్ నీరజా” అని వెలిగీ , ఆరిపోయే లైట్లతో బోర్డు వెనకాలా ఎక్కడ వెతికినా మామిడాకుల తోరణమే కనపడ లేదు. ఆఖరికి పురోహితుడి దగ్గర పంచ పాత్ర అనే చెంబులో ఒకే ఒక్క మామిడాకు కన పడి గ్లోబలైజేషన్ అనే అమెరికనైజేషన్ కి చెయ్యెత్తి నమస్కారం చేసుకున్నాను. ఎవరి సంగతో ఎందుకూ, రెండేళ్ళ క్రితం మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు ఏకంగా ఆరు ఆకులున్న మామిడి తోరణాన్ని మద్రాసు నుంచి డాలర్ పెట్టి కొనుక్కుని యాభై డాలర్లు రవాణా ఖర్చు పెట్టి తెప్పించుకున్నాను. ఆ మాట కొస్తే గత అరవై ఏళ్ళగా నేను ఎవరి పెళ్ళికి వెళ్ళినా…ఆఖరికి నా పెళ్లి తో సహా….మా అక్క పెళ్ళే మనసులో మెదులుతూ ఉంటుంది. అందుకే అలనాటి ఆ ముచ్చట గురించి ఇంత విపులంగా వ్రాసుకుని అక్షరబద్ధం చేసుకుంటున్నాను. అలనాటి వారి పెళ్లి ఫోటో, ఈ నాడు హుందాగా ఉన్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

 *

“భూల్ గయే అనిల్ బుధ్ధూ”

 

నా “జీవిత కాలమ్” లో ఇప్పటి దాకా నా చిన్నప్పటి సంగతులే వ్రాసుకొస్తున్న నేను ఇప్పుడు యాభై ఏళ్ళు లాంగ్ జంప్ చేసి అతి మంచి జనమంచి అనిల్ కుమార్ తో గడిపిన అసంఖ్యాకమైన మధుర ఘడియలని స్మరించుకోకుండా ఉండలేక పోతున్నాను.

అది 1964 అనుకుంటాను. కాకినాడలో మా ఇంజనీరింగ్ కాలేజ్ “డే”…అంటే ఏడాది ఆఖరున విద్యార్ధులందరం చేసుకునే అల్లరి, చిల్లరి సాంస్కృతిక కార్యక్రమం. అందులో ఆ రోజు నాకు సీనియర్లు అయిన నీహార్ అనే కాశ్మీర్ కుర్రాడు ఎకార్డియన్ అనే వాయిద్యం మీద ఏదో హిందీ పాట వాయిస్తూ ఉంటే దానికి “బొంగో” అనే చిన్న డప్పులు అనిల్ కుమార్ అనే కుర్రాడు వాయించాడు. యథా ప్రకారం వాళ్ళు బాగానే వాయించినా మా “కర్తవ్యం” ప్రకారం కొందరు కోడి గుడ్లూ, టొమేటోలూ విసురూ ఉంటే నేను సరదాకి నా చెప్పులు తీసి విసిరేశాను. అవి చూసి “మీ నాన్న ఇంత కంటే మంచి చెప్పులు కొనలేడా? పూర్ ఫెలో” అన్నాడు అనిల్ కుమార్ తిరిగి అవి నా మీదకి విసిరేసి.  అదే అతనితో నా మొదటి పరిచయం. డిగ్రీ పూర్తి అయ్యాక అతను లండన్ వెళ్ళాడని తెలిసింది. అంతే!. పదేళ్ళ తరువాత నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టినప్పుడు నేను మొట్టమొదట చూసిన తెలుగు వ్యక్తి కూడా అనిల్ కుమారే.  ఆ రోజు నుంచీ మొన్న ఫిబ్రవరి 13, 2015 నాడు అతను స్వర్గానికి వెళ్ళిపోయే దాకా నాకు ఒక్క హ్యూస్టనే కాదు , మొత్తం అమెరికాలోనే అతను నాకు  అత్యంత దగ్గర స్నేహితుడు.

నేను 1975, మార్చ్ నెలలో అని గుర్తు…చికాగో నుంచి ముగ్గురు మిత్రులతో ఉద్యోగాల వేట కోసం హ్యూస్టన్ లో  అడుగుపెట్టినప్పుడు ఆ మహా నగరంలో ఒక్క మానవుడు కూడా నాకు తెలియదు. రెండు, మూడు రోజుల తరువాత రైస్ యూనివర్సిటీ లో ఒక ఇండియన్ విద్యార్ధి పరిచయం అయ్యాడు. అతను మాకు దూరపు బంధువే. మాటల సందర్బంలో “ఇక్కడే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. వెళ్లి కాఫీ తాగుదాం” అనగానే  ఎగిరిగెంతులేసుకుంటూ “మహారాజా” అనే ఆ రెస్టారెంట్ కి వెళ్లాం. లోపలకి అడుగుపెట్టగానే “వెల్ కమ్ టు మహారాజా” అంటూ అనిల్ కుమార్ నన్ను చూసి, నేను అతన్ని చూసి ఆశ్చర్య పోయి, కావిలించేసుకుని ఆనందపడిపోయాం. అప్పుడు తెలిసింది ఆ మహారాజా రెస్టారెంట్ అమెరికాలో యావత్ దక్షిణ రాష్ట్రాలలో కల్లా మొట్ట మొదటి ఇండియన్ రెస్టారెంట్ అని. ఐదు  నిముషాలలోనే నేను “గురూ, నాకు ఇక్కడ డిష్ వాషింగ్ ఉద్యోగం కావాలి అర్జంటుగా” అని అడిగాను. అనిల్ గుంభనగా “కుదరదు” అన్నాడు. “అదేమిటి గురూ..” అని నేను బతిమాలుతూ ఉంటే “అది నా ఉద్యోగం” అని రహస్యం బయట పెట్టాడు. అంటే ఆ రెస్టారెంట్ కి ప్రొప్రైటరూ, వంటవాడూ, సర్వరూ, క్లీనరూ అన్నీ అనిల్ కుమారే. ఆ రెస్టారెంట్ వంటకాలలో కూడా అతను తన సృజనాత్మకతని పోగొట్టుకో లేదు.  బీఫ్ దోశలు, చికెన్ పకోడీలు లాంటి ప్రయోగాలు చేసేవాడు. ఇక మిక్స్ డ్రింక్స్ మాట కొస్తే మామూలు స్కాచ్ విస్కీ, వోడ్కా లాంటి వాటికి కూడా “కోబ్రా కిస్”, “ఫ్రాగ్ బైట్”, “డెవిల్స్ నెక్టార్” లాంటి తమాషా పేర్లు పెట్టేవాడు. ఆ రెస్టారెంట్ కి దువ్వూరి సూరి, శేష్ బాలా పార్టనర్స్ అని తరువాత తెలిసింది.

ఆ నాటి నుంచీ ఎప్పుడో ఇండియాలో మొదలైన మా స్నేహం మళ్ళీ అమెరికాలో పుంజుకుంది. మరో రెండు, మూడు నెలలకి మే నెల, 1975 లో అనిల్ కి రత్న పాపతో మద్రాసు లో పెళ్లి అయింది. అప్పటికే రత్న పాప వెంపటి చిన సత్యం గారి అభిమాన నర్తకి గా అధ్బుతమైన కూచిపూడి నాట్య కళాకారిణిగా చాలా పేరు తెచ్చుకుంది. పైగా సుప్రసిద్ద జానపద గాయనీ మణులు సీత – అనసూయ లలో అక్క గారైన అనసూయ గారి పెద్ద కూతురు..అంటే పాప  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మనవరాలు.

Anil & Ratna in Samsaaram

అనిలూ, పాపా అతి చిన్న తనం నుంచీ స్నేహితులే. అనిల్ కి ఆరేళ్ళ వయసులో, 1950 లో మూడు భాషలలో తీసిన “సంసారం” సినిమాలో అతనూ, నాలుగేళ్ల రత్న పాపా కలిసి నటించారు. అందులో హిందీ వెర్షన్ లో పాప అనిల్ ని “భూల్ గయే బుధ్ధూ” అంటుంది. వాళ్ళ పెళ్ళయి ఎన్నేళ్ళయినా “ఇంకా అదే సీను గురూ, పాప ఆ డైలాగు వదిలి పెట్ట లేదు.” అనే వాడు ఎప్పుడూ అనిల్ సరదాగా. ఆ సినిమాలో వాళ్ళిద్దరూ “అమ్మా ఆకలీ, బాబూ ఆకలీ “ అని రోడ్లమ్మట అడుక్కుంటూ పాడిన పాట ఆ రోజుల్లో చాలా పాప్యులర్. అప్పుడు పాప అనిల్ కి “బువ్వ” పెడుతున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

పాప ఆగస్ట్ , 1975 లో హ్యూస్టన్ వచ్చినప్పుడు దువ్వూరి సూరి & హీరా వాళ్ళింట్లో రిసెప్షన్ పార్టీ ఇచ్చారు.  ఎడ్వోకేట్ జనరల్ నరస రాజు గారి అబ్బాయి సూరి గురించి ఇండియాలోనే నాకు తెలుసు కానీ అతన్నీ, చింతపల్లి అశోక్ కుమార్ నీ, వసంత & మల్లిక్ పుచ్చా, ఇతరులనీ హ్యూస్టన్ లో నాకు పరిచయం చేసింది అనిల్ కుమారే! ఆ తరువాత అందరం కలిసి 1976 లో తెలుగు సాంస్కృతిక సమితి మొదలుపెట్టడం చక చకా జరిగిపోయింది.  1975 లోనే రత్న పాప వచ్చిన అతి కొద్ది రోజులలోనే, అదే “మహారాజా” రెస్టారెంట్ లో “అంజలి సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్” మొదలు పెట్టి (పనేమీ చెయ్య లేదు కానీ  ఆ సంస్థకి నేను మొదటి డైరెక్టర్ ని) గత నలభై ఏళ్లగా పాప నాట్య కౌశలంతో వేలాది కూచిపూడి నర్తకీ నర్తకులను తయారు చెయ్యగా, ఆ సంస్థకీ, 1994 లో వారిద్దరూ నెలకొల్పిన లాభాపేక్ష లేని “సంస్కృతి” సంస్థ కీ అనిల్ కుమారే వెన్నెముక. తెర వెనుక కావలిసిన గుండు సూది నుంచి అద్భుతమైన ఆడియో, వీడియో, లైటింగ్, వేదిక అలంకరణలు అన్నీ అతనివే. అతని స్టేజ్ మేనేజ్ మెంట్ ప్రతిభని తానా, ఆటా లాంటి సంఘాలు చాలా సార్లే తమ జాతీయ స్థాయి మెగా కార్యక్రమాలకి అనేక నగరాలలో ఉపయోగించుకున్నాయి. మన సంప్రదాయానికి ఒక అద్దం పడుతూ, అటు అమెరికన్ ఆడియో & వీడియో కంపెనీల పని తీరుకు అనుసంధానం చేస్తూ అనిల్ చేసిన సహాయానికి ఆయా సంఘాలు ఎప్పుడూ తగిన విధంగా గుర్తించడం కానీ, గౌరవించడం కానీ చెయ్య లేదు. “పోనీలే గురూ, అంతా మన వాళ్ళేగా” అని సద్దుకుపోయే పెద్ద మనసు అనిల్ కుమార్ ది.

1977 మార్చ్ నెలలో మొట్టమొదటి ఉగాది కార్యక్రమానికి ఏదైనా నాటకం వేద్దాం అనుకున్నప్పుడు నేను బొంబాయి లో ఉండగా వ్రాసి ప్రదర్శించిన “బామ్మాయణం అను సీతా కల్యాణం “ నాటకాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో నేను బామ్మ వేషం, అనిల్ కుమార్ & మోహన రావు  బ్రహ్మచారులు, డి. ఎ. ఎ. ఎస్. నారారాయణ రావు గారు తాతయ్య వేషం వేశాం. అనిల్ కుమార్ దానికి దర్శకుడు. నాకు తెలిసీ అమెరికాలో స్వంతంగా రాసుకుని ప్రదర్శించబడిన మొట్ట మొదటి తెలుగు నాటకం అదే. ఆ తరువాత అది అమెరికాలో సుమారు ముఫై నగరాలలో ప్రదర్శించారు. మేం ముగ్గురమూ ఉన్న ఆ నాటి ఆ నాటిక ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

బామ్మాయణం 1

బామ్మాయణం

ఇంచుమించు అదే రోజులలో గుత్తికొండ రవీంద్రనాథ్ గారు న్యూయార్క్ నుంచి పిలిచి 1977 మే నెలాఖరున ఆయనా, కాకర్ల సుబ్బారావు గారూ తలపెట్టిన తొలి అమెరికా తెలుగు సాంస్కృతిక సభల విషయం గురించి సంప్రదించారు. ఎగిరి గెంతులేసి హ్యూస్టన్ నుంచి నేనూ, అనిల్, పాప, సూరి, నారాయణ రావు గారు వెళ్ళడానికి తయారయిపోయాం. రత్న పాప ఎలాగా కూచిపూడి నాట్యం చేస్తుంది కాబట్టి మేము ఏదైనా బుర్ర కథ లాంటి స్పెషల్ అంశం చేస్తే బావుంటుంది కదా అనుకున్నాం. వెంటనే నేను వారం రోజులు కుస్తీ పడి “బెబ్బులి పాపారాయుడు” బుర్ర కథ రాశాను. అందులో సూరి ప్రధాన గాయకుడు, నేను హాస్య గాడిని , అనిల్ కుమార్ వంత పాటగాడు. ఆ బుర్ర కథ అద్భుతంగా వచ్చింది. ఉత్తర అమెరికాలో చెప్పబడిన మొట్టమొదటి బుర్ర కథ అదే!. దానికి దర్శకుడు అనిల్ కుమారే. అప్పటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. నూయార్క్ సభలకి ఇండియా నుంచి అనసూయ-సీత గారూ కూడా వచ్చి, వాళ్ళు పాడుతూ ఉండగా రత్న పాప “మొక్క జొన్న తోటలో” పాటకి నృత్యం చెయ్యడం నేను ఈ జన్మలో మర్చిపోలేని అనుభవం. ఆ తరువాత వాళ్ళిద్దరూ హ్యూస్టన్ వచ్చినప్పుడు నేనూ, అనిల్ కుమారూ ప్రొడ్యూసర్లు గా “మన పల్లె పదాలు” అని అనసూయ-సీత గార్ల చేత స్టుడియోలో పాడించి ఒక 78 RPM  గ్రామఫోన్ రికార్డు 1977 ఏడాది ఆఖరున అనుకుంటాను, విడుదల చేశాం. అమెరికాలో విడుదల అయిన తొలి తెలుగు గ్రామఫోన్ రికార్డు అదే! దానికి అనిల్ & డేవిడ్ కోర్న్టీ డప్పు వాయించగా, నాతో సహా మా స్థానిక గాయనీ గాయకులు వంత పాట పాడారు.

ఆ తరువాత సుమారు ముఫై ఏళ్ళు మేము అనేక మంది సహకారంతో హ్యూస్టన్ మహా నగరంలో చెలరేగిపోయాం అనే చెప్పుకోవాలి. తెలుగు, తమిళం, హిందీలలో ఒకటా, రెండా, కొన్ని వందల సాంస్కృతిక కార్యక్రమాలూ, నాటకాలూ, స్థానిక అమెరికన్లకి మన సంస్కృతిని తెలియజేసే అనేక ప్రదర్శనలూ, రేడియో ప్రోగ్రాములూ, టీవీ కార్యక్రమాలు చేశాం. అన్నింటికీ అనిల్ కుమారే వెన్నెముక. ఉదాహరణకి అమెరికా టీవీలో ఎంతో ప్రసిద్ది పొందిన “Saturday Night Live”  తరహాలో “పొటేటో చిప్స్ ఆర్ కాల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ హియర్” అనే వెరైటీ హాస్య కార్యక్రమం, మూడు సార్లు వేసిన “హీరాలాల్ కీ చాచీ” అనే  డ్రామా (అందులో నేను చాచీ..అంటే ఆడ వేషం పాత్ర వేశాను), లవర్స్ త్రూ ఏజెస్ అనే డాన్స్ డ్రామా, నేను వ్రాసిన యమ సభ,  ఆఠీన్ రాణి, మొదలైన డజను పైగా తెలుగు నాటకాలు వేశాం. అన్నింటికీ అనిల్ కుమారే దర్శకుడు.

అనిల్ కుమార్ గురించి మరొక ప్రత్యేక  విశేషం ఏమిటంటే అతని గొంతుకకి అధ్బుతమైన “deep & resonating tone”  ఉంది. రేడియోలోనూ, మైక్ లోనూ వింటే మైమరచిపోవలసినదే. అందుకే మేము ఏ కార్యక్రమం చేసినా..ఆఖరికి న్యూయార్క్ లో చెప్పిన బుర్ర కథలో కూడా అందులో “కమర్షియల్ బ్రేక్స్ “ అని పెట్టి హాస్యంగా అతని చేత వాణిజ్య ప్రకటనలు చేయించే వాళ్ళం. ఉదాహరణకి, అలనాటి రేడియో, సినిమా ప్రకటనల్ని అనుకరిస్తూ “అందాల నర్తకి రత్నపాపకి రొంపా…అయితే ఆ రొంప అనే జబ్బుకి బ్రహాండమైన దెబ్బ విక్స్ వేపొరబ్బ” అని అనిల్ చెప్తూ ఉంటే నేను దానికి జలుబుతో బాధపడుతున్న అమ్మాయిలా అభినయం చేసేవాడిని. ఇక నవ్వులే నవ్వులు.

బుర్ర కథ

బుర్ర కథ

అనిల్ కుమార్ కి ఉన్న హాస్య ప్రియత్వానికి హద్దులే లేవు.  గత అనేక సంవత్సరాలగా వారానికి పలు మార్లు ఈ-మెయిల్ లో ఏదో జోక్ పంపిస్తూనే ఉండేవాడు. అతని ఒరిజినల్ జోక్స్ చెప్పలేనన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఒక సారి నాకు ఏదో వీడియో కేమేరాలో సమస్య వస్తే అతని దగ్గరకి తీసుకెళ్ళాను. నా సమస్య వినగానే నా వీడియో సిస్టమ్ ని ఓ గంట సేపు పరీక్ష చేసి  “లాభం లేదు గురూ, ఎక్కడో ఫింకి పోయింది. రేపు చూద్దాం” అని మా ఇద్దరికీ ధర అందుబాటులో ఉండే “బక్ హార్న్” అనే బీరు అందుకున్నాడు.ఆ బీరు ఒక సిక్స్ పేక్ కి కేవలం 99 సెంట్లు. ఇద్దరం బీద వాళ్ళమే కాబట్టి దాంతో సరిపెట్టుకునే వాళ్ళం. ఆ తరువాత ఈ వీడియో సిస్టమ్ లో అసలు ఈ “ఫింక్” అనే పార్ట్ ఎక్కడ ఉంటుందా అని నాలుగు రోజులు అన్ని పుస్తకాలూ వెతికి, ఎక్కడా దొరక్క మళ్ళీ అనిల్ ని పిలిచి “గురూ, ఈ ఫింక్ అనేది ఒక నట్టూ, బోల్టూ లాంటిదా…దాని గురించి ఈ రిపేరు పుస్తకంలో ఎక్కడా లేదు. కొనుక్కోవాలంటే ఏం అడగాలి? ఇప్పుడెలాగా?” అని అడగగానే అనిల్ పక పకా నవ్వి, “నీ మొహం. అదేదో ఉత్త ఊత పదం లా అన్నాను కానీ అలాంటి పార్టు ఏమీ లేదు” అన్నాడు. పదేళ్ళ తరువాత “ఫింక్ పోయింది” అని ఒక కథ రాసి నేను మంచి పేరు తెచ్చుకున్నాను.

వీడియో కెమెరాలు వచ్చిన కొత్తలో ఎంతో బరువైన ఆ కెమెరా, రెండు పెద్ద బాక్సులూ ఎక్కడికైనా సరే మోసుకెళ్ళి వీడియోలు తీసే వాడు అనిల్. మా  పెళ్ళయిన కొత్తలో మా ఆవిడకి తెగ వీడియోలు తీసి “ఎంత బావుందో అమ్మలు. పాపం ఏం చెప్పి మోసం చేశావు గురూ?” అని కొస మెరుపుగా “నువ్వు ఎప్పుడైనా డైవోర్స్ చేస్తానంటే చెప్పు” అని కన్ను గీటాడు. అంత దగ్గరి స్నేహం మాకు ఉండేది. అందుకే అతన్ని మా ఆవిడా, పుచ్చా వసంత లక్ష్మి, మరి కొందరూ అతన్ని “అనిల్ బావ” అనే పిలిచే వారు.  ఈ విడియోలో తీసే అలవాటుని ముందు సరదాకి మొదలు పెట్టి తరువాత దాన్నే వ్యాపారంగా మల్చుకుని “వీడియో కుమార్” గా పేరు తెచ్చుకున్నాడు అనిల్. హ్యూస్టన్ నగరంలో ప్రొషెషనల్ స్థాయిలో పెళ్ళిళ్ళకీ, పుట్టిన రోజులకీ, అన్ని సాంస్కృతిక సంఘాల కార్యక్రమాలకీ వీడియోలో తీసి, ఎడిట్ చేసి, వాటికి తగిన మ్యూజిక్ పెట్టి, వేల మందికి తీపి గుర్తులని మిగిల్చిన తొలి వ్యక్తి అనిల్ కుమారే. మా సాంస్కృతిక సమితి వెబ్ సైట్ లో హ్యూస్టన్ వచ్చిన శ్రీశ్రీ, బాపు, ఆరుద్ర మొదలైన ఎందరెందరో ప్రముఖుల వీడియోలో అన్నీ అనిల్ తీసినవే. వాళ్ళ పక్కన తెర మీద కనపడ్డాను కాబట్టి నేను పేరు తెచ్చుకున్నాను అనిల్ ధర్మమా అని.

ఇక తనూ, రత్న పాపా సంస్థాపించిన “సంస్కృతి” కళా సంస్థ (Two Worlds, One Stage) లో అనిల్ సృజనాత్మకత పరాకాష్ట  అందుకుంది అనే చెప్పాలి. రత్న పాప కొరియాగ్రఫీ చేసిన వందలాది నృత్య నాటికల ప్రదర్శన అంశాలు ఒక ఎత్తైతే అతను రూప కల్పన చేసి అఖండ విజయం సాధించిన “బాలీవుడ్ బ్లాస్ట్”, “ఇన్ క్రెడిబుల్ ఇండియా” లాంటి కార్యక్రమాలు వేల కొద్దీ అమెరికన్ ప్రేక్షకులని ఏళ్ల తరబడి ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అనిల్ కి ఇంతటి కళా తపన అతని తండ్రి జనమంచి రామకృష్ణ గారి దగ్గర నుంచే వచ్చింది. ఆయన ఆల్ ఇండియా రేడియో , మద్రాసు కేంద్రానికి తొలి డైరెక్టర్లలో ప్రముఖులు. అలనాడు ఘంటసాల, సుశీల, బాల మురళి, రజని మొదలైన వారికి రేడియోలో పాడే అవకాశాలు కలిపించిన ఆయన స్వతహాగా మంచి రచయిత. మద్రాసు లో పుట్టి ఆ సాంస్కృతిక వాతావరణం లోనూ, సినిమా రచయితలతోనూ, కళాకారుల మధ్య పెరిగిన అనిల్ కి కళారాధన, అభినివేశం కలగడం పెద్ద ఆశ్చర్యం కాదు. మా చిన్నప్పుడు రేడియో అన్నయ్య – అక్కయ్య వారి బాలానందం కార్యక్రమంలో అనిల్ కుమార్, కందా మోహన్, దువ్వూరి సూరి మొదలైన వాళ్ళు ప్రధాన పాత్రధారులు. బాపు గారితో నేను ఎప్పుడు మాట్లాడినా “రామకృష్ణ గారి అబ్బాయి ఎలా ఉన్నాడండీ?” అనే అడిగే వారు. అలాగే ఎస్.పి. బాలూ కి అనిల్ కుమార్ అత్యంత ఆప్త మిత్రుడు.

అనిల్ కుమార్ 1

అనిల్ గురించిన అనేక విషయాల కంటే అతి ముఖ్యమైనది, అతని మనస్తత్వానికీ, మానవీయతకీ అడ్డం పట్టేది అతను తన పిన్నత్త గారైన “అమ్మా- పిన్ని” గారి కి చేసిన సేవ. సుప్రసిద్ధ జానపద గాయనీ మణులైన సీతా – అనసూయలలో చెల్లెలైన వింజమూరి సీత గారు అనిల్ కుమార్ కి పిన్నత్త గారు. ఆమె అవివాహిత. ఎనభై ఐదేళ్ళ వయసులో ఆవిడ అమెరికాలో పాప -అనిల్ దగ్గరే చాలా ఏళ్ళగా ఉంటూ, గత మూడేళ్ళ నుండీ అల్జైమర్స్ వ్యాధితో మంచానికే పరిమితమై ఉన్నారు. ఆమెని రోజు కి ఇరవై నాలుగు గంటలూ దగ్గర ఉండి చూసుకోడానికి అనిల్ తన వీడియో వ్యాపారాన్ని తగ్గించుకుని, ఇంట్లోనే పనులు చేసుకుంటూ అహర్నిశలూ ఆవిడకి సేవ చేస్తున్నాడు. “మా అమ్మ నా చిన్నప్పుడే తన 42 వ ఏట పోయింది. మా అమ్మకి చెయ్య లేని సేవ ఈ విధంగా అమ్మా పిన్నికి చేసుకుంటున్నాను” అనే వాడు అనిల్ కుమార్.

అలాంటిది గత ఆగస్ట్ లో రొటీన్ “ఏంజియోప్లాస్టీ” అనే మెడికల్ ప్రొసీజర్ కి హాస్పిటల్ లో చేరిన అనిల్ కి డాక్టర్లు అన్యాయం చేశారు. వారి అవక తవకల కారణంగా అనిల్ కోమా లోకి వెళ్లి పోయి, కొన్ని నెలలు తీవ్రంగా పోరాడి ఫిబ్రవరి 13, 2015 న నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. అక్కడ రంభా, ఊర్వశి, తిలోత్తమలలో ఎవరైనా రత్న పాప అంత గొప్పగా నృత్యం చెయ్యగలరా అని చూడడానికే అయి ఉంటుంది. ఇంద్రాది దేవుళ్ళకి ఈ పాటికి పాప బయో డేటా చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే, అతను జీవితాంతం ఆరాధించిన భారతీయ కళారూపం పేరే రత్న పాప. ఆమె భారత ప్రభుత్వం వారి కేంద్ర సంగీత నాటక ఎకాడెమీ వారి “ఎక్స్ లేన్సీ ఇన్ డాన్స్ “ పురస్కారానికి ఏకైక ఎన్నారై నర్తకి గా ఎంపిక అయినప్పుడు కానీ, తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆమెకి గౌరవ డాక్టరేట్ ఇచ్చినప్పుడు కానీ, ఇంకెన్నో అత్యున్నత స్థాయి అమెరికా పురస్కారాలు ఆమెని వరించినప్పుడు కానీ, అనిల్ కుమార్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. తన జీవితమే ధన్యమైనట్టు భావించే వాడు. తెర ముందు ఒక గొప్ప కళాకారుడిగా నిలబడడానికి అన్ని అర్హతలూ, ప్రతిభా ఉన్నా, ఇతరులకి ఆ అవకాశం కలిగించి తెర వెనుక నుంచి కళాకారులకి బ్రహ్మరథం పట్టిన అపురూపమైన వ్యక్తి జనమంచి అనిల్ కుమార్. వార్ధక్యం లో ఉన్న అమ్మా పిన్ని గారిని నిరంతరం కను పాప లాగా కాపాడుకున్న అనిల్ కుమార్ లాంటి వ్యక్తి నా “జీవిత కాలమ్” లో అత్యంత ఆప్త మిత్రుడు అవడం నా అదృష్టంగా భావిస్తూ, ఈ కొన్ని మధుర స్మృతులతో ఈ నివాళులు అర్పిస్తున్నాను.

 -వంగూరి చిట్టెన్ రాజు

chitten raju 

పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్సిటీ చదువు

జూన్, 1960 లో నేను ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో పాస్ అవగానే మరింకే విధమైన ఆలోచనా లేకుండా మా కాకినాడ పి.ఆర్. కాలేజీ లో చేర్పించడానికి నిర్ణయం జరిగిపోయింది. అప్పటికే మా చిన్నన్నయ్య లాయరు, మా సుబ్బన్నయ్య బి.ఎస్.సిలో అక్కడే చేరి, ఎం.బి.బి.యస్ చదివి డాక్టర్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు కాబట్టీ, పైగా నాకు లెక్కల సబ్జెక్ట్ లో మార్కులు బాగానే వస్తాయి కాబట్టీ నేను సహజంగానే ఇంజనీరు అవాలని కూడా నిర్ణయం జరిగిపోయింది.

నాకు గుర్తు ఉన్నంత వరకూ అప్పుడు ఒక ఏడాది పాటు చదవ వలసిన ప్రీ-యునివర్సిటీ కోర్స్ లో మేథమేటిక్స్ ప్రధాన పాఠ్యాంశం గా ఉన్న వాటిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఒక గ్రూప్, ఫిజిక్స్, లాజిక్ కలిపి మరొక గ్రూప్, బహుశా ఫిజిక్స్ , అకౌంటింగ్ కలిపి మరొకటీ ఉండేవి. అప్పటి లాజిక్ నాకు తెలియదు కానీ నేను లాజిక్ ఉన్న ఎం.పి.ఎల్. గ్రూప్ తీసుకున్నాను. అప్పటి పి.ఆర్. కాలేజీ ప్రిన్సిపాల్ పిరాట్ల శ్రీ రామం గారు మా నాన్న గారి క్లాస్ మేట్. ఆయనే ఆ సలహా ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు అని నా అనుమానం. ఇది నిజంగానే పుణ్యం ..ఎందుకంటే…ఆ తరువాత జన్మంతా చదువుల్లో నేను ఎప్పుడు కెమిస్ట్రీ చదవవలసి వచ్చినా బొటాబొటీ మార్కులతోటే గట్టెక్కే వాడిని. ఈ ప్రీ – యూనివర్సిటీ అనేది బహుశా ఆ ఏడు నాలుగో బేచ్ అనుకుంటాను. అంతకు ముందు వరకూ ఎస్ఎస్ఎల్సీ తరువాత రెండేళ్ళు ఇంటర్ మీడియేట్ అనీ, ఆ తరువాత రెండేళ్ళు డిగ్ర్రీ కోర్స్ ఉండేవి.

నేను అక్కడ చదివినది కేవలం ఒక్క ప్రీ-యూనివర్సిటీ సంవత్సరమే అయినా, అది కూడా 55 ఏళ్ళు దాటినా , కాకినాడ పి.ఆర్. కాలేజీ పేరు వినగానే ఇప్పటికీ నా ఒళ్ళు పులకరించి పోతుంది. ఎందుకంటే మొత్తం భారత దేశం లోనే ఆ కాలేజీ అత్యంత పురాతనమైన ఆధునిక కళాశాల. 1853  లో ముందు ఒక హై స్కూల్ గా ప్రారంభించబడి, 1884 లో డిగ్రీ కాలేజ్ గా రూపొందిన ఆ కళాశాల పిఠాపురం మహారాజా శ్రీ రాజా రావు వెంకట మహీపతి గంగాధర రామారావు రావు బహద్దర్ వారు. ఆయన పేరిట వెలసిన రామారావు పేట లో 63 ఎకరాలు, కాకినాడ మైన్ రోడ్ లో బాలాజీ చెరువు దగ్గర 28 ఎకరాలు దానం చేసి, తొలి భవన నిర్మాణాలు చేసి, ఆడ పిల్లలకి ట్యూషన్ ఫీజులు రద్దు చేసి, మహత్తరమైన మానవతా వాదంతో, సాంస్కృతిక సేవకి కూడా పెద్ద పేట వేసిన ఆ మహానుభావుడూ, ఆయన కుమారుడు రాజా మహీపతి సూర్యా రావు బహద్దర్ వారూ కాకినాడ పట్టణాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. 1952 లో ఆ కాలేజీని ప్రభుత్వం వారు తీసుకుని, 2000 నుంచీ ఒక ఆటానమస్ కాలేజ్ గా నిర్వహించబడుతోంది. అంటే ప్రస్తుతం ఆ కాలేజ్ అనాధ కాని అనాధ. అలా ఎందుకు అనిపిస్తొందో తరువాత వివరిస్తాను.

నేను పి.ఆర్. కాలేజీ లో చేరగానే నా జీవితంలో జరిగిన ప్రధానమైన మార్పు పగలు పొట్టి లాగులు మానేసి పంట్లాలు వేసుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు పైజామాలు వేసుకోవడం. ఆ రోజుల్లో ఇదేమంత చెప్పుకోదగ్గ విషయం కాక పోయినా, అందరూ చేసే పని అయినా ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానూ అంటే ఒక కుర్రాడు బాల్యావస్థ నుంచి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టాడు అనడానికి ఈ చిన్న విషయమే ఆ రోజుల్లో ఒక “సింబాలిక్” గుర్తు. గెడ్డాలూ, నూనూగు మీసాలూ మొలవడం మరొక గుర్తు. ఈ రోజుల్లో ఐదో ఏటికే అందరూ యవ్వనం లోకి వచ్చేసి వ్యక్తిత్వ వికాసం ప్రదర్శిస్తున్నారు. బాల్యం అనే అపురూపమైన అమాయకత్వపు అనుభవం దాట వేసి అర్జంటుగా ఎదిగిపోయే తరం ఈ నాటిది.

పి.ఆర్. కళాశాల ప్రధాన భవనం

పి.ఆర్. కళాశాల ప్రధాన భవనం

మా ఇంటి నుంచి పి.ఆర్. కాలేజీకి వెళ్ళడానికి “ఏ బస్సు కిందో పడి చస్తావు” అని మా నాన్న గారు సైకిల్ కొనడానికి ఒప్పు కోలేదు. అంచేత మా గాంధీ బొమ్మ నుంచి రామారావు పేటలో మూడు లైట్ల జంక్షన్ దాకా రోడ్డు మీద అరగంటా, అక్కడ కుడి పక్కకి తిరిగి మరో పావు గంటా నడిస్తే కాలేజీ రౌండ్ గేటు దాకా నడిచే కాలేజ్ కి వెళ్ళే వాడిని. ఇది కేవలం ఒక మనిషి పట్టే గుండ్రంగా తిరిగే గేటు.  పొద్దున్నే మా అమ్మ పెట్టిన ఆవకాయ నల్చుకుని తరవాణీయో,  మరేమన్నానో తినేసి ఆదరా బాదరాగా నడక లాంటి పరుగు తో కాలేజీకి వెళ్ళేవాడిని అని గుర్తే కానీ కూడా మిత్ర బృందం ఎవరైనా ఉండే వారా, ఉంటే వాళ్ళ పేర్లు ఏమిటీ అన్న విషయాలు ఇప్పుడు బొత్తిగా గుర్తు లేవు. మూడు లైట్ల జంక్షన్ దగ్గర పుత్రయ్య కొట్టు అనే చిన్న బడ్డీ కొట్టు ఉండేది. ఎదురుగుండా రామకోటి హోటెల్ ఉండేది. నేను ఎప్పుడూ పుత్రయ్య కొట్టులో రస్కులు, బిళ్ళలు, జీళ్ళు వగైరాలు కానీ, అటు రామకోటి లో దోశలు, పెసరెట్లు  తినడం గానీ చెయ్య లేదు. అలా చిరు తిళ్ళు తినడం, అల్లరి చిల్లరి పనులు చెయ్యడం, అమ్మాయిలని ఏడిపించడం లాంటివి ఎవరైనా చేస్తుంటే చూశాను కానీ వాటి జోలికి ఎన్నడు వెళ్ళని “రాము మంచి బాలుడు” లాగానే హాయిగా ఉండే వాడిని.

ఆ మూడు లైట్ల జంక్షన్ నుంచి కాలేజ్ రౌండ్ గేటు దాకా నడవడానికి మటుకు చాలా భయం వేసేది. ఎందుకంటే  ఆ రోడ్డు మీద ఎప్పుడూ “పిచ్చి వరహాలు” అనే ఆవిడ ఒంటి నిండా గిల్టు నగలు వేసుకుని, అందరినీ తిడుతూ పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా తిరుగుతూ ఉండేది. కొందరు కుర్రాళ్ళు ఆట పట్టించినప్పుడల్లా ఇంకా రెచ్చి పోయేది కానీ ఎవరికీ ఎప్పుడూ హాని కలిగించేది కాదు. నాకు పూర్తి కథ తెలియదు కానీ ఆవిడ భర్త స్వాతంత్ర్య ఉద్యమానికి ఉన్న ఆస్తి అంతా ధార పోసి, సత్యాగ్రహాలు చేసి జైలు కెళ్ళి మరణించాడనీ, అందుకే ఆవిడకి మతి భ్రమించింది అనీ చెప్పుకునే వారు. అలాగే మరొకాయన రోజు కొక జంక్షన్ లో నుంచుని, ఎవరు విన్నా, వినక పోయినా,  మన దేశం గురించీ, గాంధీ గారి గురించీ లెక్చర్ ఇస్తూ ఉండే వాడు.

ఆ రోజుల్లో కాకినాడ గాంధీ నగరం, రామారావు పేటలలో ఇంచుమించు అన్నీ బ్రాహ్మణ కుటుంబాలే. అందరి ఇళ్ళ నుంచీ..మా నాన్న గారితో సహా….దేశ స్వాతంత్ర్యం  కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్ళే. ఏదో స్థాయి లో త్యాగాలు చేసిన వాళ్ళే. తీరా ఆ స్వాతంత్ర్యం వచ్చాక పూర్తిగా విస్మరించబడి రోడ్డున పడిన వాళ్ళే. అయినా మన సాంస్కృతిక మూలాలని కాపాడుకుంటూ వచ్చినది కూడా వాళ్ళే!

పి.ఆర్. కాలేజ్ లో ఆర్ట్స్ క్లాసులన్నీ …అంటే మేథమేటిక్స్, లాజిక్, అకౌంటింగ్, ఇంగ్లీషు, తెలుగు వగైరాలు అన్నీ రామారావు పేట మెయిన్ కేంపస్ లో ఉంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి సైన్స్ క్లాసులు, లేబరేటరీలు బాలాజీ చెరువు దగ్గర ఉన్న చిన్న కేంపస్ లో జరిగేవి. రెండింటి మధ్యా నడక గంట పైగా ఉంటుంది. ఏ ప్రాంగణం అనుభూతి దానిదే. మా లెక్చరర్స్ లో నాకు ఇప్పటికీ గుర్తున్న వారు కెమిస్ట్రీ చెప్పిన బి.ఎన్నార్. గారు, ఆల్జీబ్రా చెప్పిన ఎ.ఎస్. రామారావు గారు, ట్రిగానామెట్రీ చెప్పిన డి.ఎస్. ఆర్ గారు, ఇంగ్లీష్ మేష్టారు వీరాస్వామి గారు మాత్రమే. తెలుగు, లాజిక్, ఫిజిక్స్ మేడం ఇలా ఎవరి పేర్లూ గుర్తు లేవు కానీ వారు పాఠాలు చెప్పిన పద్ధతి, ఆత్మీయత ఇంకా గుర్తున్నాయి.

నా క్లాస్ మేట్స్ లో నా హైస్కూల్ నుంచి భమిడిపాటి ప్రసాద రావు, పుల్లెల సత్య కామేశ్వర సోమయాజులు మాత్రమే నాతో పియుసి కూడా చదివారు అని జ్జాపకం.  ఇందులో ప్రసాద రావు ది కాకినాడ పక్కనే గోనేడ దగ్గర పాలెం అనే గ్రామం. నేను కాకినాడ వదిలి బొంబాయి వెళ్ళే దాకా  చిన్నప్పటి నుంచీ మా కుటుంబంలో ఒకడుగా ఉండేవాడు. పియుసి తరవాత వాడు పాలిటెక్నిక్ చదివాడు కానీ వ్యవసాయం లోనే స్థిరపడ్డాడు. వాణ్ని చూసి పదేళ్లయింది. ఇక సోమయాజులు గాడు మా ఇంటి పక్కనే. చాలా తెలివైన వాడు కానీ తిక్క శంకరయ్య. జీవితంలో రకరకాల పనులు చేసి, కేలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. వాణ్ని గత నలభ ఏళ్ల లోనూ ఒక సారి చూశాను.

నా పియుసి క్లాసులో నాకు ఎంతో దగ్గర మిత్రులు అయిన వాళ్ళలో డి. గణపతి రావు. ఎం.వి.ఎస్. పేరి శాస్త్రి, చెల్లూరి శివరాం అతి ముఖ్యులు. ఇందులో గణపతి రావు తరువాత ఇంజనీరింగ్ లో కూడా నాకు సహాధ్యాయి. విశాఖ పట్నం లో ని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఎదిగాడు. పేరి శాస్త్రిది పశ్చిమ గోదావరి జిల్లలో మొగల్తుర్రు గ్రామం…అంటే బారిస్టర్ పార్వతీశం ఊరు…అన్న మాట. అతను ఇప్పుడు  బెంగుళూరు లో ఒక ఐటి కంపెనీ వ్యవస్థాపకుడు. ఈ విషయం ఇప్పుడు అతనికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ మేము పియుసి లో ఉండగానే పేరి శాస్త్రి “నాకో చెల్లెలు కావాలి” అనే కథ వ్రాసి ఏదో పత్రికలో ప్రచురించాడు. అతనికి నిజంగానే చెల్లెలు లేదు అప్పుడు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది…..బహుశా నా తోటి వయసు వాళ్ళలో నాకు తెలిసిన తొలి రచయిత బహుశా పేరి శాస్త్రే!

ఆ వయసులో నాకు ఏదో పత్రికలూ చదవడం, మంచి సినిమాలు చూడడం, క్రికెట్ ఆడుకోడం, చదువుకోవడం లాంటి మామూలు అలవాట్లే కానీ కథలూ, కమామీషులూ రాద్దామనే బుద్ది వికాసం లేనే లేదు. సుమారు పదేళ్ళ క్రితం నేను ఒక సారి బెంగుళూరు వెళ్ళినప్పుడు ఒక సాహితీ సమావేశానికి పేరి శాస్త్రి వచ్చాడు…అంటే ఇంచుమించు నలభై ఏళ్ల తరువాత అతన్ని కలుసుకోవడం జరిగింది. నిడమర్తి రాజేశ్వర రావు గారి ఇంట్లో నా గౌరవార్థం జరిగిన ఆ సాహితీ సమావేశాన్ని సుప్రసిద్ద రచయిత దాసరి అమరేంద్ర గారు ఏర్పాటు చేశారు. ఆ రోజు విపరీతమైన వర్షంలో కూడా అంబికా అనంత్, తదితర బెంగుళూరు నగర సాహితీవేత్తలు వచ్చి నన్ను ఎంతో ఆదరించారు. ఇక శివరాం తో నా స్నేహం కాకినాడ నుంచి మొదలై, బొంబాయి ఐ.ఐ.టిలో బలపడి అమెరికా లో కూడా కొనసాగింది.

పీయూసీ మార్కుల షీట్

పీయూసీ మార్కుల షీట్

యధాప్రకారం నేను ప్రి-యూనివర్సిటీ లో మా సెక్షన్ కి మొదటి మార్కులతో ప్రధముడి గానూ, మొత్తం కాలేజ్ కి నాలుగు మార్కులు తేడాతో రెండో వాడిగానూ ఏప్రిల్ 29, 1961 నాడు పరీక్ష పాస్ అయ్యాను. ఆ రోజే నా పుట్టిన రోజు కూడాను. ఆ మార్కుల షీట్ ఇందుతో జతపరుస్తున్నాను. ఆ రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కీ 200 చొప్పున ఐదు సబ్జెక్ట్స్ కీ కలిపి 1000 మార్కులకీ 700 వస్తే చాలా గొప్ప. నాకు 692 మాత్రమే వచ్చాయి కాబట్టి అది కొంచెమే గొప్ప. కానీ నాకు తెలిసీ ఇంగ్లీషులో కాలేజ్ ఫస్ట్ గానూ, లాజిక్ లో …అవును…మొత్తం ఆంధ్ర విశ్వ విద్యాలయానికే మొదటి వాడు నిలిచినా వాటి ఉపయోగం అప్పుడు తెలియ లేదు. ఆ పతకాలు మాత్రం మా అమ్మ జాగ్రత్తగా దాచుకుని, నేను అమెరికా వలస వచ్చినప్పుడు నా చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆ పతకాలూ, మా అమ్మా కాలగర్భంలో కలిసిపోయినా, నా స్మృతులలో మిగిలిపోయారు.

పి.ఆర్. కాలేజీ అనగానే నాకు వ్యక్తిగతంగా మొదట గుర్తుకు వచ్చేది క్రికెట్. ఇంచు మించు ఐదో క్లాసు లో క్రికెట్ ఆడడం మొదలు పెట్టిన దగ్గర నుంచీ, ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళే దాకా మా క్రికెట్ రోజు వారీ ప్రాక్టీసు, వారాంతంలో మా మేచ్ లూ, పెద్ద వాళ్ళ  పెద్ద మేచ్ లు అన్నీ ఆ కాలేజ్ ప్రాంగణం లోనే. రోజూ సాయంత్రం అయ్యే సరికి అక్కడ కనీసం యాభై టీములు ఆడుతూ ఉండేవి. ఆట అవగానే, కొంచెం చీకటి పడుతూఉండగా సత్తి రాజు పట్టుకొచ్చిన ఐస్ క్రీములు తినేసి రామారావు పేటలోనే ఉన్న శివాలయానికి వెళ్లి పోయి అక్కడ సాతాళించిన శనగలు తినేసి ఇంటికెళ్ళి పోయే వాళ్ళం.  ఇక సాంస్కృతిక పరంగా గుర్తుకు వచ్చేది పి.ఆర్. కాలేజీ వారోత్సవాలు.

1940 దశకంలో ఈ ఉత్సవాలని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ప్రారంభించారు. ఒక వారం రోజుల పాటు పెద్ద స్టేజ్ కట్టించి, దేశం నలుమూలలనుంచీ మహానుభావులనీ, గొప్ప వక్తలనీ, పండితులనీ పిలిపించి మాట్లాడించడం, హరి కథ, బుర్ర కథ, సాంఘిక నాటకం, పౌరాణిక నాటకాలు వేయించడం, గొప్ప గాయనీమణులు, గాయకులచేత కచేరీలు చేయించడం ఒక్క కాకినాడ పట్టణమే కాక తూర్పు గోదావరి జిల్లా అంతా ఈ సాంస్కృతిక వాతావరణంలో వారం రోజుల పాటు తరించడం …అదీ ఈ వారోత్సవాల ప్రభావం.

ఈ వారోత్సవాల కోసమే కృష్ణశాస్త్రి గారు  “జయ జయ ప్రియ భారత “ వంటి అద్భుతమైన గేయాలు వ్రాసి, సీత-అనసూయల చేత పాడించే వారు. ఈ వారోత్సవాల లోనే మహా కవి శ్రీశ్రీ గారి “మహా ప్రస్థానం” కూడా అనసూయ గారు తొలి సారి ఆయన సమక్షంలోనే వరస కట్టి పాడారు. ఇవన్నీ ఆ తరువాత రికార్డు గా కూడా వచ్చాయి. నేను దేవులపల్లి వారిని గారిని చూడ లేదు కానీ, బాగా చిన్నప్పుడు ఈ వారోత్సవాలలో పాడడానికి ఒక సారి సీత-అనసూయ లు మద్రాసు నుంచి వచ్చి “జయ జయ ప్రియ భారత” పాడడం బాగా గుర్తు. ఆ తరువాత 1980 లో వారిద్దరితోటీ మా తమ్ముడి పెళ్ళిలో పాడించుకునేటంత అవినాభావ సంబంధమూ, చనువూ నాకు కలిగాయి.

నా ప్రి-యూనివర్సిటీ చదువు కి కొన్నేళ్ళు అటు, ఇటూ కూడా కాకినాడ పి.ఆర్. కాలేజ్ రెండి ప్రాంగణాలలోనూ నేను అత్యున్నతమైన సాంస్కృతిక కార్యక్రమాలని చూశాను. బాలాజీ చెరువు దగ్గర సైన్స్ కేంపస్ & హైస్కూల్ ప్రాంగణం లో ఉన్న క్వాడ్రాంగిల్ హాల్ లో నేను విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, జటావల్లభుల పురుషోత్తం, కాటూరి వేంకటేశ్వర రావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, జాషువా, భమిడిపాటి రాధాకృష్ణ, రావి కొండల రావు, బివి. నరసింహా రావు, ఎస్. రాధాకృష్ణన్ గారు, బాలాంత్రపు రజనీకాంత రావు గారు, నేరెళ్ళ వేణు మాధవ్…ఇలా ఒకరేమిటి….ఆ నాడు తెలుగు నాట పేరున్న సాహితీ నిష్ణాతులందరినీ….విన్నాను. కళాకారుల ప్రదర్శనలని చూశాను. భువన విజయం, పాండవోద్యోగ విజయాలు, పేరయ్య రాజంట, గయోపాఖ్యానం లాంటి భారీ నాటకాలు, కుక్క పిల్ల దొరికింది, దంత వేదాంతం, కీర్తి శేషులు లాంటి  సాంఘిక నాటకాలు చూసి తరించాను. వాటిల్లో నటించిన రావి కొండల రావు, హరనాథ రాజు, ఏడిద నాగేశ్వర రావు (శంకరా భరణం సినిమా నిర్మాత), నల్ల రామ్మూర్తి…లాంటి చాలా మంది ఆ తరువాత సినీ రంగంలో రాణించారు.

ప్రస్తుత్త పరిస్థితికి వస్తే…..

నేను రెండేళ్ళ క్రితం ఒక సారి కాకినాడ వెళ్ళినప్పుడు ఆప్త మిత్రుడు యనమండ్ర సూర్యనారాయణ మూర్తి తో మా పి.ఆర్. కాలేజ్ ప్రాంగణాన్ని చూడడానికి వెళ్ళగానే అక్కడ  ఆర్ధిక వనరుల కొరత కొట్టొచ్చినట్టు కనపడింది. ముందుగా ఆకట్టుకున్నది చిందర వందరగా పెరిగిపోయిన గడ్డి, అడ్డదిడ్డంగా ఎదిగిపోయిన చెట్లూ, భవనాల లోనూ ఎటు చూసినా maintenance లేని వాతావరణమే!

రాజు, వై. యస్సెన్...తదితరులు

రాజు, వై. యస్సెన్…తదితరులు

తక్షణం మరొక ఆప్తుడూ, హ్యూస్టన్ నివాసి కూడా అయిన డా. ముత్యాల మూర్తి కలిసి వై. యస్. ఎన్. మూర్తి, కాంట్రాక్టర్ స్నేహితుడు వినోద్ ల సహకారంతో లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి, సుమారు పాతిక ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని కొంత వరకూ బాగు చేయించాం. కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఎం. సత్యనారాయణ గారినీ, పూర్వ విద్యార్ధుల సంఘం  సభ్యులనీ కలుసుకుని అనేక అంశాలు, ముఖ్యంగా వారు తలపెట్టిన “విద్యార్ధుల మధ్యాహ్న భోజన పధకం” పుట్టు పూర్వోత్తరాలు, నిర్వహణలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం.

నేను వెనక్కి అమెరికా రాగానే అందరినీ బతిమాలుకుని, అందరిలో కొందరి దాతృత్వం ప్రధాన కారణంగా ఈ “విద్యార్ధుల మధ్యాహ్న భోజన పధకం” కింద 125 మందికి కిందటేడు ఆరు నెలలు ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాం. కాలేజ్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ గారూ, స్టాఫ్ మెంబర్  శ్రీనివాస రావు గారు, పూర్వ విద్యార్థుల సంఘం నుండి మా వై.ఎస్.ఎన్. మూర్తి, ఉషా రాణి గారు మొదలైన వారెందరో దీనికి సహకరించారు. ఆ సమయంలో నేను మళ్ళీ కాకినాడ వెళ్లి ఒక రోజు లాంఛన ప్రాయంగా విద్యార్థులకి అన్న దానం చేస్తూ, దానికి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఉన్న బోర్డు దగ్గర తీయించుకున్న ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

రేకుల షెడ్డులో క్లాస్ దగ్గర నేను, తురగా చంద్ర శేఖర్

రేకుల షెడ్డులో క్లాస్ దగ్గర నేను, తురగా చంద్ర శేఖర్

ఇలాంటి ఫోటోలు, గొప్పలు చెప్పుకోవడాలు రాజకీయ వాదుల సొత్తే అని తెలుసు కానీ..నా ఉద్దేశ్యం అది కానే కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడు పి.ఆర్. జి. జూనియర్ కాలేజ్ కి విస్తరించడమే కాకుండా, అక్కడి భవనాలు , ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆ క్వాడ్రాంగిల్ పునరుద్ధరణ కూడా మా బృందం చేపట్టింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఎస్. వీ. రంగారావు, రేలంగి, మహర్షి బులుసు సాంబమూర్తి, దుర్గాబాయమ్మ గారు, రఘుపతి వెంకట రత్నం నాయుడు గారు మొదలైన వేలాది లబ్ధప్రతిష్టులు నడయాడిన ఆ  కళాశాల, ఆ క్వాడ్రాంగిల్ హాల్ ఇప్పుడు ఎలా ఉందో ఆరు నెలల క్రితం నేను వెళ్ళినప్పుడు తీసిన ఫోటో, ఆరు బయట రేకు షెడ్డు క్రింద క్లాసు ముందు చంద్ర తురగాతో ఉన్న ఫోటో  ఇక్కడ జతపరుస్తున్నాను. ఆ రోజు నా మానసిక పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. దేవుడి దయ, దాతల విరాళాల వలన గత ఆరు నెలలలో కొన్ని భవనాలు బాగు చేశాం. మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీ కి కూడా విస్తరించాం. మరో మూడు నెలల్లో ఈ క్వాడ్రాంగిల్ హాల్ ని పునర్నిర్మాణం పూర్తి చేస్తాం.  మా బృందానికి కాకినాడలో వెన్నెముక గా నిలుస్తున్న వారు తురగా చంద్ర శేఖర్ & యనమండ్ర సూర్యనారాయణ మూర్తి.  అమెరికాలో ముత్యాల మూర్తి. కేవలం దాతల సహకారంతోటే ఈ మాత్రం సహాయం చెయ్యగలుగుతున్నాం.

అంతెందుకూ, ఇప్పుడు మా పి.ఆర్. కాలేజ్ వారి అధికారిక వెబ్ సైట్ లో కానీ, పూర్వ విద్యార్థుల సంఘం వారి వెబ్ సైట్ లో కానీ ఆ కళాశాలతో ఎంతో అనుబంధం ఉన్న దేవులపల్లి వారు, వెంకట రత్నం నాయుడు గారు, దుర్గాబాయమ్మ గారు, బులుసు సాంబమూర్తి గారు, పాలగుమ్మి పద్మరాజు, సి. పుల్లయ్య, వీణ చిట్టి బాబు, బులుసు వెంకటేశ్వర్లు, సినీ నటులు హరనాథ్, రావు గోపాల రావు మొదలైన వారి ఎవరి పేర్లూ కనపడవు.

భారత దేశం మొత్తం లోనే తొలి కళాశాలలలో ఒకటైన 162 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇటువంటి అనేక విద్యాలయాలని గాలికొదిలేసి, అవి నేర్పే తెలుగు భాషని పక్కనే ఉన్న బంగాళా ఖాతంలో ముంచేసి, సింగపూర్ లో ఎత్తయిన భవనాలు, జపాన్, అమెరికా వారి స్మార్ట్ నగరాల ఊహా సౌధాలలో విహరించే మన రాజకీయ వ్యవస్థని, పరిపాలనా యంత్రాంగాలనీ, వాటిల్లో వెతకక్కర లేకుండానే సర్వత్రా కనపడుతున్న “మానసిక” దారిద్ర్యం గురించీ ఏమనాలి? ఏం చెయ్యాలి? ఎవరో, ఏదో చేస్తారు అని అనుకునే బదులు, ఆక్రోశించే బదులు మనకి చేతనైన మంచి పనులు మనం చేద్దాం. ఏమంటారు ?  నా జీవితంలో నేను నేర్చుకున్న, ఆచరించే ప్రయత్నం చేస్తున్న ఒక చిన్న పాఠం. ఆ పాఠానికి అక్షరాభ్యాసం జరిగింది కాకినాడ పి.ఆర్. కాలేజీ లో.

 –వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

 

మా పెద్దన్నయ్య పెళ్ళి కబుర్లు

మా పెద్దన్నయ్య, వదిన పెళ్లి, మే 16, 1960

1960 దశకంలో మా కుటుంబంలో మూడు పెళ్ళిళ్ళు జరిగాయి…మా కుటుంబం అంటే నా స్వంత అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళలో అన్న మాట.

వాటిల్లో మొట్టమొదట జరిగిన శుభకార్యం మా పెద్దన్నయ్య పెళ్లి. తను ఎస్.ఎస్.ఎల్.సి తో చదువు ఆపేసి వ్యవసాయం లోకి దిగిపోయాడు కాబట్టి మా పెద్దన్నయ్య కి చదువుకోని అమ్మాయిల సంబంధాలే వచ్చేవి. నేను ఎస్.ఎస్.ఎల్.సి లో అడుగు పెట్టాక 1959 నవంబర్ లో మా పెద్దన్నయ్య మా ఇంట్లో మొదటి సారిగా పెళ్లి కాకినాడ దగ్గర ఒక పల్లె టూరికి మా అమ్మ, బాబయ్య గారు, జయ వదిన, అక్క, సుబ్బు, మా తమ్ముడు ఆంజిలతో తన మొదటి పెళ్ళి చూపులకి వెళ్ళాడు. టాక్సీ లో చోటు సరిపోక నన్ను తీసుకెళ్ల లేదు అని చూచాయగా నాకు గుర్తు ఉంది కానీ పెళ్లి చూపులు అయ్యాక కాకినాడ వచ్చేసి మా పెద్దన్నయ్య చెప్పిన ఆ తతంగం ఎంత సరదాగా ఉందీ అంటే …నాకు ఇంకా భలే జ్ఞాపకం. ఇందుతో జతపరిచిన అప్పటి ఫోటో లా ఆ రోజుల్లో సినిమా హీరోలా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని షోగ్గా ఉండే మా పెద్దన్నయ్య “అది కాదు రా… మేము వెళ్లి కుర్చీలలో కూచున్నామా…అంతే. ఆ అమ్మాయి బుల్ డోజర్ లాగానూ, ఆ అమ్మాయి తల్లి ఒక రోడ్డు రోలర్ లాగానూ, అన్నదమ్ములు డీలక్స్ బస్సుల లాగానూ, అప్పగార్లు ఎస్.ఆర్.ఎం.టి (అప్పుడు కాకినాడలో తిరిగే టౌన్ బస్సులు) లాగానూ ఉంటే ఉన్నారు కానీ, ఆ అమ్మాయి చెల్లెలు మాత్రం అంబాసిడర్ కారు లాగా నాజుగ్గా ఉంది. నేను ఆ ఎంబాసిడర్ కేసి చూస్తూ ఉంటే వాళ్ళు ఏవో గుండ్రటి పదార్ధాలు టిఫిన్ లా పెట్టారు.

“ఒరేయ్, కొత్త రకం స్వీట్లు” అని జయ వదిన సంబరపడిపోయింది. తీరా తిని చూస్తే అవి తొక్కలు తీసేసిన సపోటా పళ్ళు. టేక్సీ డబ్బులు వేస్ట్ అయిపోయాయి” అని మా పెద్దన్నయ్య చెప్పిన కథకి అందరం ఒకటే నవ్వుకున్నాం. ఆ తరువాత ఆ ‘ఎంబాసిడర్’ కి అప్పుడే పెళ్లి కుదిరిపోయింది అని తెలిసింది. నన్ను తీసుకెళ్ల లేదు అనే నా ఉక్రోషం పోగొట్టడానికి మా పెద్దన్నయ్య నన్ను “బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్” సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ ఇంగ్లీషు సినిమా అర్థం అయింది తక్కువే అయినా అంతా కళ్ళకి కట్టినట్టుగా అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఆ సినిమాకి కోకా కృష్ణా రావు, పక్కింటి కీర్తి వారి నారాయణ (జంట కవులు వేంకట పార్వతీశ్వర కవులలో ఓలేటి పార్వతీశం గారి పెద్ద మనవడు) కూడా వచ్చినట్లు గుర్తు.

VSPR Subbalakshmi శుభ లేఖ

కోకా వారు..రమణా రావు, మాధవ్ కాకినాడలో పేరున్న కుటుంబీకులు. మా ఇంటి పక్కనే ఉండే వారు. కోకా సుబ్బా రావు గారు సుప్రీం కోర్ట్ జడ్జీగా చేసి తరువాత ఇండియా ప్రెసిడెంట్ కి పోటీ చేశారు కానీ వారికున్న బంధుత్వం నాకు తెలియదు. ఆ సినిమా చూశాక నేను క్లాసు పుస్తకం కాని నా మొట్టమొదటి ఇంగ్లీషు నవల చదివాను. పెర్రీ మేసన్ నవల అని గుర్తు ఉంది కానీ పేరు గుర్తు లేదు. ఆ వెనువెంటనే చదివిన పుస్తకం ..ఇంకెవరూ…సుప్రసిద్ధ హాస్య రచయిత పి.జి. వుడ్ హౌస్…..కొన్నేళ్లలో నా చేతికందిన వుడ్ హౌస్ నవలలు అన్నీ చదివేశాను. అలాగే అనేక మంది రచయితల ఇంగ్లీషు పుస్తకాలు అన్ని సబ్జెక్ట్ ల మీదా చదివే అలవాటు అయింది. అమెరికా ధర్మమా అని ఇక్కడికి రాగానే ఆ అలవాటు పోవడం నా దౌర్భాగ్యం.

ఇక 1960, ఫిబ్రవరిలో మా చిన్నన్నయ్య, సుబ్బు తప్ప మిగిలిన అందరం కాకినాడ దగ్గర కరప కారణం గారు చాగంటి సుబ్బారావు గారి రెండో అమ్మాయి సూర్య సుబ్బలక్ష్మి ని మా పెద్దన్నయ్య పెళ్లి చూపుల కోసం చూడడానికి వెళ్లాం. అమ్మాయి బావుంది, ఆ కుటుంబం వారి మర్యాదలూ, ప్రతిష్టా అన్నే బాగానే ఉన్నాయి కానీ వెనక్కి తిరిగి కాకినాడ వచ్చాక “ఇంత పొడుగ్గా నా కంటే రెండు అంగుళాలు ఎత్తు ఉండే అమ్మాయిని నేను ఎప్పుడూ చూడ లేదు. పైగా నేను చూసిన వేపు నుంచి బాగానే ఉంది కానీ, రెండో వేపు నుంచి ఎలా ఉంటుందో ?” అని మా పెద్దన్నయ్య అనుమానాలు వ్యక్తం చేస్తే మా అక్కా వాళ్ళు “పోనీ మరో సారి వెళ్లి రెండో వేపు నుంచి చూసి వద్దాం “ అని ఏప్రిల్ నెలలో మా చిన్నన్నయ్య మద్రాసు నుంచి వచ్చాక మొత్తం గేంగ్ అంతా మళ్ళీ కరప వెళ్లాం.

అప్పుడు ఎనభై ఏళ్ళ వయస్సులో ఉన్న పెళ్లి కూతురు తాత గారు వెంకట్రావు గారు, ఆయన పొడుగు ఆరడుగుల పై మాటే…మా అన్నయ్యనీ, ఆవిడనీ పక్క, పక్కనే నుంచోబెట్టి, రెండో పక్క నుంచి కూడా అమ్మాయిని చూపించి అన్ని సందేహాలూ తీర్చారు. ఆయన కూతుళ్ళకి వచ్చాయి. సుబ్బారావు మామయ్యా గారు కూడా ఆరున్నర అడుగుల పొడుగే. ఆయన పోలికలే కూతుళ్ళకి వచ్చాయి.

అన్ని విషయాలూ సరిగ్గా సరితూగేటట్టు ఉన్నా మా పెద్దన్నయ్య కొంచెం తటపటాయిస్తూ ఉంటే “వాళ్లకి మన లాగే వందెకరాల పొలం, పాతిక మంది పాలికాపులు, పశు సంపదా ఉన్నాయి. అన్ని విధాలా నీకు సరిగ్గా సరిపోతారు” అని “ఈ సంబంధం తప్పిపోతే నీకు ఈ జన్మలో పెళ్లవదు” అని మా చిన్నన్నయ్య మా పెద్దన్నయ్యని బెదిరించాడు. మొత్తానికి ఆ కరప వారి సంబంధం కుదిరాక మా మామయ్య గారు పెళ్లి ఏర్పాట్లు మాట్లాడడానికి కాకినాడ రాగానే మా చిన్నన్నయ్య “మా స్టేటస్ కి తగ్గట్టు మీరు మా అన్నయ్య పెళ్ళికి అన్నీ టేబుల్ మీల్స్ పెట్టాలి. చేత్తో వడ్డించకూడదు. గరిటలతోటే వడ్డన జరగాలి” అని ఆంక్షలు పెట్టగానే మా మామయ్య గారు హడిలి పోయి “ఈ సంబంధం మానుకుందామా” అనుకున్నారట.

VSPR హీరో

మా ఇంట్లో మేము నేల మీదే కూచుని తింటాం. అది వేరే సంగతి. కానీ అనుకోకుండా మా చిన్నన్నయ్య కి మద్రాసులో పైలట్ ఇంటర్వ్యూ వచ్చి వెళ్ళిపోయాడు. మద్రాసులో చదువుకునే రోజుల్లో అతను ఎయిర్ లైన్ పైలట్ ట్రైనింగ్ అయ్యే వాడు. మా చిన్నన్నయ్య మద్రాస్ మెయిల్ ఎక్కగానే మా నాన్న గారు వెంటనే కరప కబురు పెట్టి మా మామయ్య గారి భయం పోగొట్టి, మా పెద్దన్నయ్య పెళ్ళికి 1960 మే నెల, 16 వ తారీకు తెల్లారగట్ట ముహూర్తం పెట్టారు. ఆ పెళ్లి శుభ లేఖ ఇందుతో జతపరుస్తున్నాను. నాకు గుర్తు లేదు కానీ, మా పెద్దన్నయ్యకీ, వదిన కీ కామన్ ఫేక్టర్ “సూరీడు”…ఓచ్ ..అంటే పేరులో “సూర్య” అనే మాట అన్నమాట…అని నేను మా స్నేహితులతో చెప్పుకుని మురిసిపోయేవాడినిట. అది విని అందరూ నవ్వుకునే వారుట. ఈ సంగతి మా అన్నయ్య డైరీలో ఉంది.

ఇక పెళ్లి ముందు రోజు నాలుగు బస్సులలో కాకినాడ మా ఇంటికి వచ్చిన బంధువులు, మా పొలం చుట్టూ పక్కల దొంతమ్మూరు, వెల్దుర్తి, సింహాద్రిపురం, రాయవరం, చిన జగ్గం పేట, తాటిపర్తి గ్రామాల నుంచి పెళ్ళికి తరలి వచ్చిన మా రైతులు, ఊరి పెద్దలు సుమారు వెయ్యి మంది … ..అవును…వెయ్యి మంది అన్ని కులాల వారూ కరప తరలి వెళ్లాం. ఇంత మంది మా దివాణం మందీ మార్బలాన్నీ చూసి ఆడ పెళ్లి వారు ఆశ్చర్య పోయారు. అప్పుడు వేసవి శలవులు కనక వాళ్ళందరికీ కరప స్కూల్ లో మకాం ఏర్పాటు చేసి , మా బంధువులందరికీ ఐదారు ఇళ్ళలో విడిది ఏర్పాటు చేశారు. యదావిధిగా పెద్ద బేండ్ మేళం, పెట్రోమేక్స్ లైట్లతో పల్లకీ ఊరేగింపు, అంత మందికీ సకాలంలో టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేశారు.

వంటకాలు ఒకటే అయినా రైతులలో కూడా కులాల వారీగానే భోజనాలు పెట్టడడం ఆనవాయితీ. మా మామయ్య గారు చుట్టలు కాల్చే వారు కాబట్టి పంచె కట్టులో ఉన్న రైతులకి లంక పొగాకు చుట్టలు, బంధువులకీ , లాగులు, చొక్కాలు వేసుకునే షోగ్గాళ్ళకి ఎంతో ఖరీదైన లండన్ ఇంపోర్టెడ్ స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్లు ఇచ్చారు. అప్పటికి అమెరికా పేరు చాలా మందికి తెలియదు. ఎప్పుడూ ఇంగ్లండ్, మహా అయితే జపాను, జర్మనీ, రష్యా ..అంతే! ఎందుకనో భోగం మేళం మటుకు పెట్ట లేదు. మా పెద్దన్నయ్య పెళ్ళికి మద్రాసులో ఉండి పోయిన మా చిన్నన్నయ్య ఒక్కడే రాలేక పోయాడు.

వెంకట్రావ్, కంచి రాజు, పెద్దన్నయ్య, అబ్బులు బావ

వెంకట్రావ్, కంచి రాజు, పెద్దన్నయ్య, అబ్బులు బావ

పెళ్లి అయిన మర్నాడో, రెండో నాడో అందరూ కాకినాడ వచ్చేసి, కొత్త కోడలి గృహ ప్రవేశం చేసి, విఘ్నేశ్వర పూజ, సత్యనారాయణ వ్రతం అయ్యాక అప్పటి మా ఆనవాయితీ ప్రకారం ఏ శుభకార్యం ఆయినా మూడు, నాలుగు రకాల విందులు ఏర్పాటు చేశారు మా నాన్న గారు. ముందు ఇరు పక్కల పెళ్లి వారికీ, బంధువులకీ, స్నేహితులకీ ఒకటి. ఈ రోజుల్లో దీన్ని “రిసెప్షన్” అంటారు. మా పొలంలో రైతులకీ, చుట్టుపక్కల ఊరి పెద్దలకీ ఒకటీ, నాలుగు రోజుల తరువాత మా చిన్నన్నయ్య బెంగుళూరు నుంచి తిరిగి రాగానే ఆ రాత్రి కాకినాడ లో ఉన్న ప్లీడర్లకీ, గుమాస్తాలకీ, జడ్జీలకీ మరొకటీ…ఒక్కొక్క విందుకీ రెండు వందల మంది పైగానే వచ్చారు. మను గుడుపులకి పెద్దన్నయ్య తో పాటు అమ్మ, అక్క, జయ వదిన, అంజి వెళ్ళగా ఆ తరువాత పదహారు రోజుల పండగకి నేను అన్నయ్య తో వెళ్లాను. అప్పుడు అందరం వరసగా “మగ వారి మాయలు”, “మంజిల్”, “అన్నపూర్ణ”, “అన్నా చెల్లెలు” “పైగాం” సినిమాలు చూసేశాం…అంతా మా పెద్దన్నయ్య పెళ్లి సంబడమే !

వీటికి కొస మెరుపు …జూన్ 6, 1960 నాడు వెలువడిన గజెట్ లో చూసి నేను ఎస్.ఎల్.సి.పాస్. అయ్యాను అని తెలిసి అందరూ తెగ సంతోష పడ్డారు. ఎలాగా పాస్ అవుతాను అందరూ అనుకునేదే కానీ..ఆ రోజుల్లో “ప్రతిభ” కి బెంచ్ మార్క్ అయిన 400 మార్కులు వచ్చాయా లేదా అనేది ఆ తరువాత కానీ తెలియ లేదు. నాకు 380 మాత్రమే వచ్చాయి అని నేను భోరుమన్నా ఆ ఏడు కాకినాడ మొత్తానికి ఎవరికీ 400 రాలేదు అని తెలిసి కాస్త తెరిపిని పడ్డాను.

భాను, సీత, పూర్ణ, ఉష

ఎందుకో తెలియదు కానీ, మా పెద్దన్నయ్య పెళ్లి ఫోటోలలో నేను ఎక్కడా లేను. బహుశా ఉండే ఉంటాను కానీ, అవి ఎక్కడా దొరకడం లేదు. మా పెద్దన్నయ్య పెళ్ళికి, పల్లకీలో ఊరేగింపుకీ పెళ్లి కూతురు వళ్ళో మా ఆఖరి చెల్లెలు ఉష కూర్చుంది. అప్పుడు దాని వయసు 5 ఏళ్ళు. ఆ రోజుల్లో తనకి తీసిన ఫోటో అంటే మా కుటుంబం అందరికీ ఇప్పటికీ చాలా ఇష్టం. అది ఇక్కడ జతపరిచాను. పెళ్ళవగానే మా గడ్డి మేటు దగ్గర మా చెల్లెళ్ళు ముగ్గురు, మా వదిన గారి పేద చెల్లెలు సీత తో తీసిన ఫోటో కూడా ఇక్కడ జత పరిచాను. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. నేను, మా తమ్ముడు నిక్కర్లు వేసుకుని, చొక్కాలు టక్ చేసుకుని టక, టకా మూడున్నర అడుగుల పొడుగ్గా తిరుగుతూ ఉంటే ఆయన ఎత్తులో మూడో వంతు కూడా లేని మమ్మల్ని చూసి మా కరప మామయ్య గారు “అచ్చు దొరల పిల్లల్లా ఉన్నారు” అని మురిసి పోయేవారు. మమ్మల్ని ఆయనా, అత్తయ్య గారూ జీవితాంతం అలాగే, నేను అమెరికా వచ్చేసి పెళ్ళాం, పిల్లల్లతో చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా అంత అభిమానంగానూ ఉండే వారు. మా పెద్దన్నయ్య పెళ్ళితో మా అమ్మ ఆప్యాయత తో సరితూగగలిగే మరొక అమ్మ లాంటి పెద్ద వదిన మా ఇంట్లో అడుగు పెట్టడం ఎంత ముఖ్యమో, ఆవిడ తమ్ముళ్ళు వెంకట్రావు, కంచి రాజు మాకు బంధుత్వం కన్నా స్నేహితులుగా ఆ తరువాత దశాబ్దాల పాటు నిలబడడం అంతే ముఖ్యం.

మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి 5 ఏళ్లప్పుడు

మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి 5 ఏళ్లప్పుడు

నా కంటే చిన్నవాడైన కంచి రాజు కరప సర్పంచ్ గా ఆ గ్రామానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేసి, హై స్కూల్ కట్టించి, రాజకీయంగా పైకి వస్తూ, విధివశాత్తు ఎవరికీ అంతుపట్టని ఊపిరి తిత్తుల వ్యాధితో మూడేళ్ళ క్రితం హఠాత్తుగా మరణించి దేవుడు చేసే అన్యాయాలకి ప్రతీకగా నిలిచాడు. దివంగతులైన కంచి రాజు, పెద్దన్నయ్య, మా అబ్బులు బావలతో వెంకట్రావు ఉన్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఇప్పటికీ నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా నా వయసు వాడే అయిన వెంకట్రావు తోటే ఎక్కువ సమయం గడుపుతాను. ఆస్తిపాస్తుల విషయాలలో మా అందరికీ అతనే, ముఖ్యంగా నాకు, ముఖ్య సలహాదారుడు. మామయ్య గారి తరువాత అతనే కరప గ్రామ కరిణీకం చేసి, రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతని కొడుకు విలేజ్ ఆఫీసర్ గా ఉన్నాడు.

ఈ ఫోటోల విషయంలో ఒక చిన్న పిట్ట కథ చెప్పాలి. ఆ రోజుల్లో ఇంట్లో ఫోటోలు తియ్యాలంటే అయ్యగారి సూర్యనారాయణ అనే ఆయన్ని పిలిచే వారు. ఆయనకీ మెయిన్ రోడ్ మీద స్టూడియో ఉన్నా ఇంటిల్లి పాదీ అక్కడికి వెళ్ళే అవకాశమూ లేదు. వెళ్ళినా ఆ చిన్న గదిలో ఇద్దరు, ముగ్గురు కంటే పట్టరు. అంచేత ఫోటో గ్రాఫర్ ఫలానా రోజున ఇంటికి వస్తున్నాడు అనగానే నాలుగైదు రోజుల ముందు అందరూ శుభ్రంగా క్షవరం చేయించుకుని, బట్టలు ఉతికించి, ఇస్త్రీ చేయించి రెడీగా ఉండే వాళ్ళం.

రంగు ఫోటోలు అంటేనే తెలియని ఆ రోజుల్లో ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆ బ్లాక్ & వైట్ ఫోటోలలో బాగా పడతారు అనీ, ఆడా, మగా ఫొటోలకి తేడా ఉంటుందా అనీ, వెనకాల బేక్ గ్రౌండ్ తెల్ల గోడా, లేక పువ్వుల డిజైన్లు ఉన్న దుప్పటీలు కట్టాలా అని రక రకాల చర్చలు జరిగేవి. ఇప్పుడు తలచుకుంటే నాకు భలే నవ్వు వచ్చే డైలాగు మా అమ్ముమ్మదే…”అమ్ముమ్మా, రేపు ఫోటోలాయన వస్తున్నాడు” అనగానే మా అమ్ముమ్మ సంతోషపడి పోయి “పోనీ, గారెలు, అరిసెలు చెయ్యమంటారేమిటర్రా?” అంది.

పెళ్ళయి , యాభై ఏళ్ళకి పైగా కాపురం చేసిన మా పెద్దన్నయ్య, పెద్ద వదినల మూడు, నాలుగేళ్ల క్రితం నాటి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. వారికి పిల్లలు లేరు కానీ, మేం అందరం అలాగే పెరిగాం. “దివాణం” అని పిలవబడే వంగూరి సూర్య ప్రకాశ రావు అనే మా పెద్దన్నయ్య రెండేళ్ళ క్రితం పోయాడు.

 

చిన్నప్పటి బంధువులూ, ఇంట్లో కొన్ని విశేషాలూ

 

అక్కా, వదినా, కన్నా

అక్కా, వదినా, కన్నా

చిన్నప్పుడు అంటే నేను ఐదో ఏట ఒకటో క్లాసుతో మొదలు పెట్టి, ఎప్పుడూ పరీక్షలు తప్పకుండా “రాముడు బుద్ధిమంతుడు” లాగా పదహారో ఏట ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి అయ్యే దాకా జరిగిన పది, పదకొండేళ్ళు అన్న మాట. ఒక విధంగా ఈ దశాబ్దం నా వ్యక్తిగత జీవితంలో ఏవిధమైన బాదర బందీ లేకుండా “తెలుగు సినిమా స్వర్ణయుగం తొలి దశాబ్దం” లాంటిది అని చెప్పుకో వచ్చును. అప్పటి కింకా టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్ నెట్ లు, జేబులో కూడా టెలిఫోన్లు లేక అందరి ప్రాణాలూ హాయిగా ఉండేవి.

అందరూ మంచి ప్రమాణాలతో ఉన్న సినిమాలు, రేడియో కార్యక్రమాలు, దసరా నవరాత్రులలాంటి పండగలలో వీధి నాటకాలు, హరి కథలు, బుర్ర కథలు, నెహ్రూ లాంటి దేశ నాయకులు, ఎప్పుడూ నెగ్గే హాకీ టీమూ, ఎప్పుడూ చిత్తుగా ఓడిపోయే ఇండియా క్రికెట్ టీమూ, అతి తక్కువ మోతాదులో లంచాలు, ఉద్యోగం అంటే కేవలం సిఫార్స్ తోటే వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు, బొంబాయి, మద్రాసు లాంటి పెద్ద నగరాలలో తప్ప ఆ రోజుల్లోనే ఏర్పడ్డ ఆంధ్రా మొత్తం మీద కూడా ఎక్కడా లేని ప్రైవేటు ఉద్యోగాలు, అన్నింటికన్నా ఎక్కువగా నేను అనుభవించి ఆనందించిన బందు ప్రేమ, వారి రాక పోకలు ఇవన్నీ వెరసి నా చిన్నప్పటి జీవితాన్ని స్వర్గధామం చేశాయి. ఈ క్షణాన్న నన్ను మళ్ళీ ఎవరైనా ఆ రోజులకి తీసుకెళ్లగలిగితే ఎంత బావుండునో!

మా చిన్నప్పుడు జరిగిన కొన్ని కుటుంబ విశేషాలు నాకు లీలగా గుర్తు ఉన్నా, ఐదారేళ్ళ క్రితం మా పెద్దన్నయ్య “ఒరేయ్, ఇందులో నేను కొన్ని కొన్ని నోట్ చేసుకున్న పాయింట్లు సరదాగా చదువుకో…అంతా మన చిన్నప్పటి సంగతులేలే..రహస్యాలు లేవు.” అని నాకు తన “సంక్షిప్త డైరీ” ని కాపీ తీయించి ఇచ్చాడు. అందుకే ఈ కుటుంబ విషయాలు,తారీకులతో సహా వ్రాయగలుగుతున్నాను.

నాకు కూడా చాలా లీలగా గుర్తున్నది నా పదేళ్ళప్పుడు …ఫిబ్రవరి 2, 1955 నాడు వంద ఎద్దు బళ్ళు కట్టించి దొంతమ్మూరు, వెల్దుర్తి, సింహాద్రిపురం, తిమ్మాపురం, రాయవరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, చిన జగ్గం పేట లో స్వంతంత్ర్య పార్టీ తరఫున మా పెద్దన్నయ్య, హనుమంత రావు బావ కేన్వాసు చేస్తూ తెల్లగా గట్ట నుంచి రాత్రి దాకా జరిగిన ఊరేగింపు. ఆ రాత్రి ఊరేగింపు అయ్యాక దొంతమ్మూరు మేడ ముందు పందిరి వేయించి శశిరేఖా పరిణయం బుర్ర కథ చెప్పించాడు మా పెద్దన్నయ్య. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఒకే ఒక్క ఉదంతం తప్ప , రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం మా ఇంటా, వంటా లేదు. మా నాన్న గారుచిన్నపుడు గాంధీ గారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో తన   మిల్లు బట్టలు మంటల్లో వేసేసి , జీవితాంతం ఖద్దరు బట్టలే వేసుకున్నారు.

మా చిన్న అన్నయ్య కపిలేశ్వర పురం జమీందారులైన ఎస్. పి. బి. పట్టాభి రామారావు & సత్యనారాయణ రావు గార్లకి ఎలెక్షన్ ఏజెంట్ గా వోట్ల లెక్కింపు లో పాల్గొన్నాడు కానీ ఇవి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావు. 1955 జూలై లో మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి పుట్టింది. దాని బారసాల ఆగస్టు ఆరో తారీకున జరిగింది. అ రాత్రి అందరం “రోజులు మారాయి” సినిమాకు వెళ్లాం. ఆ రోజు రిక్షాలో మా నాన్న గారు, ఇంకెవరో సీటులో కూచుంటే, నేనూ, మా తమ్ముడూ ముందు కడ్డీ పట్టుకుని నిలబడి పెద్ద రాజకీయ నాయకులలాగా ఫీలయిపోయాం. ఒక నెల తరువాతే నేను ఇది వరలో ప్రస్తావించిన “అంజలీ దేవి” దర్శనం జరిగింది. అప్పుడు పొలం నుంచి వచ్చిన సవారీ బండిలో నేను, ఆంజీ, జయ వదిన & చెల్లెలు పద్మ, పెద్దన్నయ్య, రంగక్క, అక్క, నారాయణ తాతయ్య గారి కూతురు సత్యవతి అత్తయ్య, దొడ్డమ్మ అనే మా రెండో మేనత్త అందరం కిక్కిరిసి పోయి కూచున్నాం….అంతా అంజలీ దేవిని చూడడానికే!

ఏప్రిల్ 1957 లో మా రాత్తాతయ్య గారు హంసవరంలో పోయారు. ఆయన అసలు పేరు సర్వేశం గారు. మా తాత గారికి స్వయానా సవితి తమ్ముడు గారు. ఆయన భార్య కాంతం బామ్మ గారు లేనిదే మా ఇంట్లో కానీ, మా యావత్ బంధు వర్గం ఇళ్ళలో కానీ ఎటువంటి శుభకార్యమూ జరిగేవి కాదు. వాళ్ళ అల్లుడు మంగా బావ రైల్లో టికెట్ కలెక్టర్ గా పని చేసే వాడు. మహా సరదాగా పేకాట ఆడే వాడు. ఆ ఏడే అక్టోబర్ లో జరిగిన ఘోరం మా అమలాపురం బావ ఏకైక కుమారుడు పెద్ద బుజ్జి గాడు హఠాత్తుగా పోయాడు. వాడు సరిగ్గా నా వయసు వాడే..పన్నెండేళ్ళు. చాలా ఏళ్ల పాటు మేం ఎవరం ఇది తట్టుకోలేక పోయాం.

మే, 28, 1957 న క్రౌన్ టాకీస్ లో నన్నూ, మా తమ్ముడు ఆంజినీ మా పెద్దన్నయ్య “మాయా బజార్” సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ సమ్మర్ లోనే కుళాయి చెరువు ఆవరణలో జరిగిన “4వ రాష్ట్ర ఫల, పుష్ప ప్రదర్శన” లో మా తణుకు తాత గారు తాళ్లూరి లక్ష్మీపతి రావు గారు మా అక్క చేత 28 రకాల ఆవకాయలు పెట్టించారు. అందుకు మా అక్కకి ఒక పెద్ద వెండి కప్పు ఆ నాటి వ్యవసాయ శాఖా మంత్రి తిమ్మా రెడ్డి గారు బహూకరించారు. అప్పటి దాకా ఏదో స్కూల్లో బాగా చదువుకుంటే పతకాలు, క్రికెట్ లో నెగ్గితే ట్రోఫీలు ఇస్తారు అని వినడమే కానీ ఆవకాయలు పెట్టి కూడా వెండి కప్పు, రోలింగ్ ట్రోఫీ లి గెల్చుకోవచ్చును అని తెలిసి మేము ఎగిరి గెంతులేస్తుంటే “వెధవల్లారా, చదువు మానేసి ఆవకాయలు, గోంగూరలు మొదలెట్టారంటే చంపేస్తాను” అని మా నాన్న గారు కోప్పడ్డారు.

ఆ రోజుల్లోనే భూ సంస్కరణలు, భూదానం, దున్నే వాడిదే భూమి, ఎవరికీ ఐదు ఎకరాలు దాటి పంట పొలాలు ఉండ కూడదు. ముఖ్యంగా లాండ్ సీలింగ్ ఏక్ట్ అనే అనేక రైతు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు, ప్రభుత్వ చట్టాలు రావడమో, వచ్చే సూచనలు కనపడడమో ఉండి, అంత వరకూ మా తాత గారి స్వార్జితమైన మా 200 ఎకరాల పై చిలుకు శేరీ పొలానికి మా నాన్న గారు ఏకైక వారసుడే అయినా…ఎందుకైనా మంచిది అని ఆ భూమి అంతా ఆరు వాటాల క్రింద …అంటే మా అన్నదమ్ములం ఐదుగురికీ ఒక్కొక్క వాటా, మా నాన్న గారికి ఒక వాటా చొప్పున చూచాయగా విభజించి ఆ పంపకాల దస్తావేజులని డిశంబర్ 19, 1957 నాడు రిజిస్టర్ చేయించారు మా నాన్న గారు. అప్పటికింకా ఆడ పిల్లలకి కూడా స్థిరాస్థిలో సమాన వాటాలు ఉండాలనే ఆలోచనలు కానీ, చట్టాలు కానే లేవు. సంప్రదాయబద్ధంగా ఆడబడుచులకి కట్న కానుకలు, సారె, నగల రూపంలోనే ఆస్తిలో వాటా ఇచ్చే వారు.

అక్క రంగక్క జయ వదిన

అక్క రంగక్క జయ వదిన

1957 ఆఖరి నెలలలో జరిగిన ముఖమైన విషయం మా చిన్నన్నయ్య ప్రేమలో పడడం. ఆ రోజుల్లో ప్రభుత్వం తరఫున బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ డిమానిస్త్రేటర్ ధవేజీ గారు, పశువుల డాక్టరు, మరికొందరూ దొంతమ్మూరు వచ్చి మా బావ మేడ లో దిగారు. మా పెద్దన్నయ్యకి, బావలతో సహా ఊళ్ళో ఉన్న యువ రైతులకి వ్యవసాయం ఎలా చెయ్యాలో శిక్షణ ఇచ్చారు. నేను చందమామలు చదువుకుంటూ ఈ తమాషా చూడడం కొంచెం గుర్తు. ఆ తరవాత ఆ ఊళ్ళో మహిళా సంఘానికి ప్రెసిడెంటు అయిన మా రంగక్కే వంద మందకి రైతులకి..అంటే పెద్ద, పెద్ద గుండిగెల కొద్దీ అన్నం, పులుసు, కూరలు, పచ్చళ్ళు వండిపెడుతున్నప్పుడు ఆ ఉళ్లోనే ఉన్న మరో కుంటముక్కుల నరసింహం …పెద్దబ్బాయి గారు అని పిలిచే వారు…ఆయన కూతుళ్ళు కనకం, రాజా లు చాలా సహాయం చేశారు. వారిది 500 ఎకరాలకు పైగా మాగాణీ ఉన్న పెద్ద కుటుంబం. పెద్దబ్బాయి & రామాయమ్మ గారి రెండో కొడుకు పేర్రాజు మా చిన్నయ్య సహాధ్యాయి. ఆయన కూతురు అరుణ, అల్లుడు కవి ప్రభాకర్ మా హ్యూస్టన్ లోనే ఉంటారు. నాకు ఎంతో ఆత్మీయులు.

ఇంతకీ 1957 లో ఆ మూడు రోజులూ మా చిన్నన్నయ్య, రాజా ఆ మీటింగులలో కలిసి తిరుగుతూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ రోజుల్లో దాన్నే ప్రేమించుకోవడం అంటారు. ఆ తరువాత ఎనిమిదేళ్ళకి వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది. ఇంకా పెళ్లి కాని ఆ రోజుల్లో మధ్యలో మా అక్క, తన ఎడం పక్క రాజా వదిన, కుడి పక్కన కనకం వదిన ల ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అలాగే మధ్యలో మా మేనత్త రంగక్కకి ఉన్న ఒకటో, రెండో ఫోటోలలో మా అక్క, జయ వదినలతో ఉన్న ఫోటో కూడా ఇక్కడ జత పరుస్తున్నాను.

ఆ రోజుల్లోనే మా అక్కని మా హనుమంత రావు కి చేసుకుందామని మా రంగక్క అనుకున్నా మా అమ్మకి మేనరికాలు ఇష్టం లేక ఒప్పుకో లేదు. దాంతో మాకు దొంతమ్మూరు తో అనుబంధాలు తగ్గడం మొదలు పెట్టాయి. ఆ రోజుల్లో మా అక్కని చూసుకోడానికి లక్కరాజు సుబ్బా రావు గారి కొడుకు శరభయ్య రావడం నాకు తెలిసీ మా ఇంట్లో జరిగిన మొట్టమొదటి పెళ్లి చూపులు. అతను విమానం పైలట్. ఆ సంబంధం కుదర లేదు కానీ మా కుటుంబాల స్నేహం కొనసాగుతూనే ఉంది. ఆ రోజుల్లోనే మాబ్బులు బావకి 240 రూపాయలు పెట్టి మా నాన్న గారు హెర్క్యులెస్ సైకిల్ కొనిపెట్టారు…రోజూ గాంధీ నగరం లో మా ఇంటి నుంచి జగన్నాథ పురంలో పాలిటెక్నిక్ వెళ్ళడానికి.

మా హనుమంత రావు బావ పెళ్లి జగదీశ్వరి అక్కతో జూన్ 16, 1959 నాడు, మూడు రోజుల పెళ్లి దొంతమ్మూరు లో అయింది. మా పెద్దాపురం మామయ్య గారు, బాసు పిన్ని (మా ఆఖరి మేనత్త) స్నాతకం పీటల మీద కూచున్నారు. మా బంధువర్గం సుమారు వంద మందీ వచ్చారు.

ఆ తరువాత మా కుటుంబంలో మొదటి పెద్ద శుభాకార్యం……అంటే మా పెద్దన్నయ్య పెళ్లి , ఆ పెళ్లి చూపులు వివరాలు మరొక అధ్యాయం…..

– వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

 

మా పురపాలకోన్నత పాఠశాల – భలే రోజులూ – జ్జాపకాలూ

chitten raju

రామారావు పేట శివాలయం దగ్గర మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో మూడో ఫారం పూర్తి అయ్యాక పాక లో నించి పక్కా సిమెంట్ బిల్దింగ్ లో జరిగే నాలుగో ఫారం లో ప్రవేశించగానే నాకు హిమాలయా పర్వతాలు ఎక్కిన ఫీలింగు వచ్చేసింది. ఎందుకంటే అంత వరకూ నేను “బెంచీ ఎక్కిన” పాపాన పోలేదు. ఒకటో క్లాసు నుంచీ మూడో ఫార్మ్ దాకా నెల మీదే కూచుని చదువుకున్నాను కానీ నాలుగో ఫారం లో స్కూలు బెంచీలు ఉండే క్లాసులో ప్రవేశించాను అన్నమాట. అందులోనూ మొదటి బెంచీలో మధ్య సీటులో మేష్టారికి సరిగ్గా ఎదురుగా కూచునే వాడినేమో, ఇంకా గర్వంగా ఉండేది. అది 1956-57 వ సంవత్సరం. నాకు ఆ సంవత్సరమే పురరపాలక సంఘం వారు మా గాంధీ నగరంలో హైస్కూల్ మొదలుపెట్టడానికి నిర్ణయించారు. అప్పుడు ముందు పార్కుకి ఉత్తరం వేపు ఉన్న ఖాళీ స్థలం లో ఒక పెద్ద పాక వేయించి అందులో ఎస్.ఎస్.ఎల్.సి క్లాసులు, తాత్కాలికంగా నాలుగో ఫార్మ్, ఐదో ఫార్మ్ క్లాసులు రామారావు పేట మిడిల్ స్కూల్ లోనూ నిర్వహించడం మొదలుపెట్టారు.

1958 లో ఇప్పుడున్న పెద్ద సిమెంటు భవనం కట్టి మొత్తం అన్ని క్లాసులూ గాంధీ నగరం ప్రాంగణానికి తరలించారు. నా హైస్కూల్ ప్రహసనంలో నాలుగో ఫార్మ్ మటుకు రామారావు పేట, మిడిల్ స్కూల్ ప్రాంగణం లోను తరువాత ఐదో ఫార్మ్, ఎస్.ఎస్.ఎల్.సి పార్కు వెనకాల గాంధీ నగరం ప్రాంగణం లోనూ మహదానందంగా చదువుకున్నాను. అవి భలే రోజులు. అంత కంటే భలే జ్జాపకాలు. 1959-60 లో ఆ స్కూల్ నుంచి S.S.L.C. పాస్ అయిన సుమారు ముఫై మంది మూడో బేచ్ లో నేను ఒకణ్ణి. నేను మా సెక్షన్ కి ఫస్ట్..కానీ మూడు మార్కుల తేడా తో స్కూల్ మొత్తానికి సెకండ్.
ఇక వివరాల్లోకి వెళ్తే, నా ఫోర్త్ ఫారం టీచర్లలో నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉన్న టీచర్లలో లంక వెంకటేశ్వర్లు గారు ఒకరు. ఆయన అప్పుడే టీచర్ గా చేరి, మాకు లెక్కలు చెప్పేవారు. ఆయనతో తమాషా ఏమిటంటే, ఒక లెక్కల సిధ్ధాంతం ప్రతిపాదించి, దానికి విలోమ సిధ్ధాంతం, ఉప పత్తి మొదలైన అంశాలు చెప్పి, మాకు ఒక లెక్క చెయ్యమని ఇచ్చేవారు. దానికి మేము పధ్ధతి ప్రకారం లెక్క పూర్తి చేసి ఆన్సరు రాసిన తరువాత, మా పేపర్లు దిద్దే వారు. పొరపాటున ఆ ఆన్సర్ కి మేము యూనిట్స్ రాయక పోయామో. అంతే సంగతులు. మార్క్లులు సున్నా. పైగా….”ఏరా, ఈ ఆన్సరు గాడిదలా, గుర్రాలా, నీలాగా కోతులా?…ఆ ఆన్సరు పాతిక 24.55 అంగుళాలు అనో, పౌనులు అనో, రాయక్కర్లేదూ, రాత్రి నేను ఇంటికె వెళ్ళాక కలగన మంటావా?” అని చెడామడా తిట్టే వారు. అయన లెక్కల పాఠాలు అద్భుతంగా చెప్పే వారు. అలాగే దీక్షితులు గారు సైన్స్ చెప్పేవారు. ఆయన పాపం చాలా దూరం నుంచి వచ్చేవారు.

ఆ రోజుల్లో మా ఇంట్లో అలవాటు ప్రకారం, మా తోటలో పండిన కూరగాయలన్నీ మా టీచర్లందరికీ మా అమ్మ ఒక్కొక్కరికీ ఒక్కొక్క సంచీ చొప్పున మా చేత పంపించేది. ప్రతీ వారం వంకాయలో, బెండ కాయలో, మొక్క జొన్నలో….అన్నీ మా నాన్న గారు స్వయంగా పండించినవే..లేక పోతే మా పొలం నుంచి మా పెద్దన్నయ్య పంపించినవో…అందరికీ ఇచ్చేవారు. ఒక వారం తాతబ్బాయి గారికి వంకాయలు ఇస్తే, దీక్షితులు గారికి బెండకాయలు ఇచ్చేది మా అమ్మ. ఒక సారి దీక్షితులు గారు “విత్తనాలు నాటడం ఎలా, వాటికి మొట్ట మొదటి ఆకు ఎలా వస్తుందీ, మూడో ఆకు కూడా వచ్చే దాకా దానికి పురుగు పట్టకుండా ఎలా జాగ్రత్త పడడం” అనే విషయాల మీద మాకు సైన్స్ పాఠం చెప్పి, దానికి ప్రాక్టికల్ మా తోటలో చేయించారు. అంటే, ఆయనే మా ఇంటికి వచ్చి, మా అమ్మతోటీ, నాన్నగారితోటీ మాట్లాడి, మా తోటలో ఒక పది చదరపు అడుగుల స్థలం అడిగి తీసుకున్నారు. మా చేత అది దున్నించి, కలుపు తీయించి, జపాను పధ్ధ్దతిలో బెండ విత్తనాలు నాటించి, వాటికి కాయలు కాసే దాకా సుమారు ఆర్నెల్లు మమ్మల్ని తోటపనిలో ఆసక్తి కలిగేలా చేశారు.

 

ఇవాళ, అమెరికాలో మా ఇంటి వెనకాల తోటలో బెండ కాయలు, దొండ కాయలు, అరటి కాయలు, కరివేపాకు, టొమేటోలు, కేబేజీ, కాలీ ఫ్లవరు, బచ్చలి, గోంగూర ..ఇలా ఏ కూర గాయలు నేను కష్టపడి పండించగా మా క్వీన్ విక్టోరియా మనసారా ఆరగించినా, మా స్నేహితులకి పంచి పెట్టినా ..అదంతా మా నాన్న గారు, అమ్మా, దీక్షితులి మేస్టారి చలవే. ఆయన్ని నేను 1958 తరువాత చూడ లేదు, కానీ ఆయన డొప్ప చెవులు నాకు ఇంకా గుర్తే!

School Entrance OK

ఇక నా నాలుగో ఫారం లో ఉండగానే తులసీ దేవి గారు, ఇ.వి. రామ్మోహన్ రావు గారు టీచర్లు గా చేరారు అని నాకు గుర్తు. నా ఐదో ఫారం లో తులసీ దేవి గారు మాకు సైన్స్ చెప్పగా, రామ్మోహన్ రావు గారు చరిత్ర చెప్పేవారు. రామారావు పేట స్కూల్ లో చిన్న సైన్స్ లాబ్ కూడా ఉండేది. అది దొర గారి హయాం లో ఉండేది. నాకు తెలిసీ తులసీ దేవి గారు చేరే దాకా ఆయనే స్కూల్ అంతటికీ పెద్ద సైన్స్ మేష్టారు. దొర గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండే వారు కాబట్టి ఆయనంటే అందరికీ భయమే! తులసీ దేవి గారికి ఎందుకో తెలియదు కానీ, నేనంటే చాలా ఆప్యాయంగా ఉండే వారు.

నేను అమెరికా వచ్చాక ఒక సారి కాకినాడ వెళ్ళినప్పుడు….మా చెల్లెళ్ళు భానూ, పూర్ణా, ఉషారేవతీ ల తో తులసీ దేవి గారిని చూడ్డానికి వెళ్ళాను. అంటే, నాకు ఆవిడ సైన్స్ పాఠాలు చెప్పిన తరవాత సుమారు నలభై ఏళ్ళు దాటాక అనమాట. అప్పటికి ఆవిడ రిటైర్ అయిపోయారు. మమ్మల్ని చూడగానే ఆవిడ చాలా సంతోషించి, మా చెల్లెళ్ళతో “ఒక సారి ఏమయిందో తెలుసా. నేను మీ అన్నయ్య క్లాస్ కి మనం లోతైన నూతిలోంచి నీళ్ళు తోడుకోడానికి వాడే చేతి పంపు శాస్త్ర ప్రకారం ఎలా పని చేస్తుందో చెప్పాను. వారం తరువాత క్లాసులో తిరిగి చెప్పమని అందరినీ అడిగితే, మీ అన్నయ్య ఒక్కడే ఆ పంపులో ముషలకము, చిన్న గొట్టాంలో దాన్ని మనం పైకి లాగినప్పుడు కిందనున్న అక్కడి గాలి ఎలా శూన్యంగా మారి, ఆ శూన్యంలోకి నూతి నీళ్ళూ ఎలా చొచ్చుకుని వస్తాయో, మనం పంపు కొట్టిన కొద్దీ అదే పదే పదే మళ్ళీ ఎలా పునరావృతం అవుతుందో ఎక్కడా ఒక్క ఇంగ్లీషు మాట లేకుండా చెప్పాడు” అని అప్పటికి నలభై ఏళ్ళ క్రితం నాటి సంగతులు గుర్తు చేసుకుని, తన పాత విద్యార్ధిని కలుసుకున్నందుకు మహదానంద పడ్డారు.

ఈ నాటి విద్యార్ధులు ఎవరికైనా ఆ ముషలకము (పిస్టన్), శూన్య ప్రదేశమూ (వేక్యూమ్) లాంటి పదాలు తెలుసునో, తెలియదో నాకు అనుమానమే. కానీ అప్పటికీ, ఇప్పటికీ పంప్ అనే ఆంగ్ల పదానికి తెలుగు మాట లేదు అనే నేను అనుకుంటున్నాను. కానీ అప్పటి గొట్టాం ..అనగా సిలిండర్ ..అనే మాటని మటుకు “గొట్టాం గాడు” అని నా మీద ప్రయోగిస్తూ ఉంటారు నా గాఢ మిత్రులూ-గుఢ శత్రువులూ కొంతమంది. అన్నట్టు తులసీ దేవి గారి తమ్ముడు తులసీ దాసూ, నేనూ కాకినాడ ఇంజనీరింగ్ క్లాస్ మేట్స్. నాకు తెలిసీ, తులసీ దేవి గారు పెళ్ళి చేసుకో లేదు.
ఇక ఇ.వి.ఆర్ రామ్ మోహన రావు గారు చాలా విశిష్టమైన, విలక్షణమైన టీచరు. ఎందుకంటే, ఆయన పాఠాలు చెప్పే పధ్దతి తాతబ్బాయి గారిలాగా నీరసంగా ఇదెక్కడి గోలరా బాబూ, హాయిగా ఇంటికెళ్ళి పడుకోకుండా?” అనే పధ్ధతిలో కాకుండా యువ రక్తంతో ధాటీగా, హావభావాలతో. నవరసభరితంగా ఉండేది. అంతకంటే ముఖ్యంగా ఆయన షేక్స్ పియర్ ఇంగ్లీషు నాటకాలు వేసే వారు. నా ఐదో ఫారంలో స్కూలు వార్షికోత్సవాలలో జూలియస్ సీజర్ ని బ్రూటస్ మొదలైన రోమ్ సెనేట్ సభ్యులందరూ హత్య చేసినప్పుడు సీజర్ శవం ముందు ఆయన మార్క్ ఏంటొనీ ప్రసంగం అత్యద్భుతంగా నటించే వారు. అదే నాటకం నేను ఒక సారి న్యూయార్క్ బ్రాడ్వే లో చూసినా నాకు ఇప్పటికీ, అంటే సుమారు యాభై ఐదు సంవత్సరాల తరువాత మన ఇ.వి.ఆర్ గారి ఆ సీను మటుకు ఇంకా నా కళ్ళలో మెలుగుతూ ఉంటుంది. అప్పటికి ఆయనకి పెళ్ళి కాలేదు కానీ, మా క్లాస్ లోనే ఉన్న ఒక అమ్మాయి తో పెళ్ళి కుదిరింది అని చెప్పుకునే వారు. అంటే, తన శిష్యురాలినే ఆయన వివాహం చేసుకున్నారన మాట.
నా ఫోర్త్ ఫారం లో మాకు కృష్ణమాచార్యులు గారు తెలుగు చెప్పేవారు. ఆయన సాధారణంగా తెలుగు మేష్టారు అనగానే అందరికీ స్ఫురించే లాగానే… అనగా పంచె కట్టూ, కండువా, తిలకం బొట్టూ పెట్టుకుని ఉన్నప్పటికీ, అస్సలు చిరు బొజ్జ అయినా లేకుండా బాగా కసరత్తు చేసిన శరీరంతో బలంగా ఉండేవారు. బహుశా అందుకే నేమో ఆయన నిక్ నేమ్ “గునపం” గారు. చాలా శ్రావ్యంగా తెలుగు పద్యాలు చదివే వారు. ఐదో ఫార్మ్ లోకి రాగానే యజ్ఞేశ్వర శాస్త్రి గారు ఒక తెలుగు సెక్షనూ, కృష్ణమాచార్యులు గారు మరొక సెక్షనే కాక, ఒకరు డిటైల్డూ, మరొకరు నాన్-డిటైల్డు చెప్పేవారు. వారిద్దరూ, వేదుల సత్యనారాయణ గారూ, వర్మ గారూ నా బోటి వాళ్లకి ఇప్పటికీ తెలుగు భాష మీద అభిమానం, ప్రేమ ఉండడానికి ప్రధాన కారకులు. వారి ఆప్యాయతకీ, నేర్పిన తెలుగు పాఠాలకీ మా జన్మ అంతా ఋణపడే ఉంటాం.

వర్మ గారి వాక్కు, వర్చస్సు, పాఠాలూ చెప్పే విధానం మనస్సుకి హత్తుకిపోయేవి. ఉదాహరణకి ఆయన లెక్కలు చెప్తూ, పైథాగరస్ సిధ్ధాంతం చెప్తూ ఉంటే, ఆ పైథాగరస్ వచ్చి మా ముందు నుంచుని వివరిస్తున్నాడు అనే మాకు అనిపించేది. పైగా ఆయన ఖద్దరు పంచె కట్టుకునే వారు. లెక్కలే కాకుండా ఆయన ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలిగే వారు. గాంధీ నగరంలోనే, అచ్యుతాపురం గేట్ దగ్గర ఉండేవారు అని జ్ఞాపకం. ఇక నాలుగో ఫారం నుండి అన్ని తరగతులలోనూ హిందీ కంపల్ సరీగా ఉండేది. ఆ మూడేళ్ళూ మాకు సునందినీ దేవి గారు హిందీ చెప్పేవారు. ఆవిడ సన్నగా. పొడుగ్గా హుందాగా ఉండే వారు. హిందీలో హై అనే మాటని పొడిగా కాకుండా కొంచెం ముక్కుతో పలకాలి అని ఆవిడ మమ్మల్ని సరిదిద్దినప్పుడల్లా, అందరం ముక్కుతో “హై, హై” అనేసి నవ్వుకునే వాళ్ళం. ఆవిడ నిక్ నేమ్ “బలాక్”. హిందీలో బలాక్ అంటే అంటే కొంగ అని అర్థం ట. మరి ఆవిడ సన్నగా, పొడుగ్గా ఉంటారుగా, బహుశా అందుకే! నిజానికి హిందీ కంపల్ సరీ యే కానీ ఆరోజుల్లో చాలా మంది పిల్లలు హిందీ లో ప్రశ్నాపత్రాన్ని కొంత తిరిగి రాసేస్తే చాలు, పేస్ మార్కులు ఇచ్చేసే వారు. సమాధానాలు రాయక్కర లేదు. అది ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు కి ఆ ఖర్మ పట్టింది…అసలంటూ తెలుగు అనే పాఠ్యాంశం ఏ స్కూల్ లో ఇంకా ఉంటే, గింటే!
మా నాలుగో ఫారం పూర్తి అయ్యేదాకా రామారావు పేటలో సెకండరీ స్కూలు లేనే మేము చదువుకున్నాం. రోజూ పొద్దున్నే చద్దన్నం, కొత్తావకాయ తినేసి, పార్కు మీదుగా ఆచారి గారి ఆయుర్వేదం ఆసుపత్రి దాటుకుని, అక్కడ బట్టలు ఉతుక్కుంటూ అరుచుకుంటూ దెబ్బలాడుకుంటున్న చాకలి వాళ్ళ మధ్య నుంచీ, శివాలయం దగ్గర రోడ్డు మీద నుంఛే అరక్షణం దణ్ణం పెట్టేసుకుని స్కూలికి వెళ్ళిపోయే వాళ్ళం. 1957 లో అనుకుంటాను, ఒక రోజు మేము క్లాసు లో మా డవాలీ బంట్రోతు హెడ్మాస్టర్ గారి సర్క్యులర్ పట్టుకొచ్చాడు. సాధారణంగా ఏదైనా పరీక్షల ప్రకటనలో, లేక పోతే ఎవరో పెద్దాయన పోతే ఆ మర్నాడు శలవు అని చెప్పడానికో అలాంటి సర్క్యులర్ లు వచ్చేవి.

ఈ సారి ఎవరు పోయారో అనుకుని మేము పుస్తకాలు సద్దేసుకుంటూంటే “ఇక వచ్చే యేటి నుంచి ఐదో ఫారం క్లాసులు, ఆ తరువాత క్లాసులూ అన్నీ కొత్తగా పార్కు వెనకాల కడుతున్న హైస్కూల్ బిల్డింగులో జరుగుతాయి అనీ, ఆ విషయం మా తల్లి దండ్రులకి ముందే తెలియ జెయ్యవలసినదిగా హెడ్మాస్టర్ గారి హెచ్చరిక”…అని ఇంచుమించు ఆ హెచ్చరిక సారాంశం. “హమ్మయ్య, ఇక రోజూ పొద్దున్నే ఇంత దూరం నడవక్కర లేదు. ఇంకో పది నిముషాలు పడుకుని, పార్కు దాటేస్తే, స్కూల్ కి వచ్చేస్తాం” అని మాత్రమే నాకు అప్పుడు అర్థమైన విషయం.

సారాంశం ఏమిటంటే, ఇప్పటి హైస్కూల్ భవనంలో ఐదో, ఫారమూ, ఎస్సెస్సెల్సీ చదువుకున్న మొట్ట మొదటి విద్యార్ధులు సుమారు ముఫై మంది ఉండేవాళ్ళం. ముమ్మిడి సూర్యనారాయణ (అచ్యుతా పురం గేటు), నండూరి వెంకటేశ్వర్లు (దేవాలయం వీధి), రాట్నాల హరనాథ్ (స్టేషన్ రోడ్), ఏడిద ముని సామ్రాట్ (శంకరాభరణం సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు తమ్ముడు, అచ్యుతాపురం గేటు), పి.యస్.కె. సోమయాజులు ( మా ఇంటి పక్కనే పార్కు దగ్గర ఇల్లు), విన్నకోట గాడు (రెడ్ క్రాస్ రోడ్), ఆచారి (గాంధీ నగరం మార్క్టెట్ దగ్గర), రాయవరపు సత్యనారాయణ, అతని తమ్ముడు ఆదినారాయణ రావు (రామారావు పేట మూడు లైట్ల జంక్షన్) అప్పటి నా క్లాస్ మేట్స్ లో ఈ క్షణంలో నాకు జ్ఞాపకం వస్తున్న కొన్ని పేర్లు. వీళ్ళల్లో అందరికంటే పొడుగ్గా ఉంటాడు కాబట్టి నండూరి గాడు మా క్లాస్ మానిటర్ అయితే, పొట్టిగా ఉన్నా ఫస్ట్ మార్కులు వస్తాయి కాబట్టి నేను అసిస్టెంట్ మానిటర్ ని.

S.S.L.C. Certificate
ఇక ఎవరైనా నవ్వుతారేమో నాకు తెలియదు కానీ అప్పుడు మా క్లాస్ లో ఉన్న ఆరుగురి ఆడపిల్లల పేర్లూ ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకమే…ముఖ్యంగా అనంత లక్ష్మి (నిక్ నేమ్ పేపర్ షాట్..ఎల్విన్ పేట.), సుశీల, శ్రీ లక్ష్మి (అప్ప చెల్లెళ్ళు, నూకాలమ్మ గుడి) చాగంటి లక్ష్మి (గాంధీ నగరం), మరుద్వతి (శివాలయం దగ్గర), రమా గున్నేశ్వరి (శివాలయం వీధి), ర్యాలి సరళ. నేనూ, ఈ ఆడపిల్ల్లలూ రామారావు పేటలో చదువుకున్న మాధ్యమిక పాఠశాలలో మూడేళ్ళూ, ఆ తరువాత 1960 లో గాంధీ నగరం పురపాలకోన్నత పాఠశాల మొట్ట మొదటి బేచ్ లో ఎస్సెస్సెల్సీ పాస్ అయిన దగ్గరనుంచీ, ఇప్పటి దాకా..అంటే యాభై ఏళ్ళలో నేను వాళ్ళలో ఎవరినీ చూడ లేదు….ఒక్క సరళని తప్ప. అదైనా ఆ అమ్మాయి ఎక్కడో మా హాయ్ స్కూల్ మీద నేను వ్రాసున ఇదే మోస్తరు వ్యాసం చదివి, అమెరికా తన కొడుకు ని చూడ్డానికి వచ్చినప్పుడు నేను తనని గుర్తు పడతానో, లేదో అని అనుమానంగానే ఫోన్ లో పిలిచింది.

నా చిన్నప్పటి స్నేహితురాలు పిలవగానే నేను సహజంగానే ఎగిరి గంతులు వేశాను. ఆ తరువాత నేను హైదరాబాదులో 2013 అక్టోబర్ లో యువ సాహితీ సమ్మేళనం నిర్వహించినప్పుడు తనూ, వాళ్లాయనా వచ్చి, నాకు ఒక విలువైన బహుమతి ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు తన ఇంటి పేరు అడవి వారు. మిగిలిన వారు నన్ను ఎప్పుడైనా టీవీ లోనూ, పత్రికా వార్తలలోనూ చూసి ఉంటే, నా మొహం గుర్తుపట్టకపోయినా, నా పేరు మర్చిపోరు అనే అనుకుంటాను. పైగా మా ఎస్సెస్సెల్సీ అయిన తరువాత స్కూల్ పార్టీలో అందరం వీడ్కోలు పుచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకున్న ఆటోగ్రాఫ్ పుస్తకంలో వాళ్ళందరూ కూడ బలుక్కుని “మేము నిన్నెన్నడూ మరువము. మమ్ము నువ్వు కూడా మరువకుము” అని ఒకే వాక్యం వ్రాశారు. నేను స్కూల్ లో ఉండగా ఆరేళ్ళలో వాళ్ళతో కేవలం ఐదారు సార్లే మాట్లాడినా, మా అమ్మా, చెల్లెళ్ళూ వాళ్ళని మా ఇంట్లో పేరంటాలకీ పిలిచే వారు. ఆ రోజులే వేరు. స్పష్టంగా ఎందుకో తెలియకపోయినా అవి తెర చాటునుంచే వెయ్యి సార్లు ఆడపిల్లలని చూసే రోజులు.

ఇక మా రోజుల్లో అతి ముఖ్యమైన, చాలా మంది ఉపాధ్యాయుల కన్నా విభిన్నమైన వారు చక్రపాణి గారు. ఈయన నాకు అదో ఫారంలోనూ, ఎస్సెల్సీలోనూ చరిత్ర, ఇంగ్లీషు చెప్పారు. ఆయన చెప్పలేని సబ్జెక్టు లేదు. ఏదో మొక్కుబడికి క్లాస్ లో పాఠం చెప్పేసి, విద్యార్ధులని ఎవరిమానాన్న వాళ్ళని వదిలెయ్యకుండా, వాళ్ళు పరీక్షలకి ఎలా చదవాలీ అనే విషయంలో ప్రత్యేక శ్రధ్ధ పెట్టడం చక్రపాణి గారి ప్రత్యేకత. అందుకని ఆయన ప్రతీ రోజూ, మామూలు క్లాసు అయిపోయాక, అందరినీ తన ఇంటికి పిలిచి, సాంపుల్ ప్రశ్నా పత్రాలు ఇచ్చి శిక్షణ ఇచ్చే వారు. ముఖ్యంగా రాష్ట్రమంతటా ఒకే సారి అందరు విద్యార్ధులకీ జరిగే S.S.L.C పరీక్షలో మన స్కూల్ వాళ్ళు అందరూ నెగ్గాలనే పంతంతో ఉండేవారు. అంటే, కాకినాడ ప్రాంతంలో కాంపిటీషన్ పరీక్షలకి క్లాసుల్లోనే కాకుండా ప్రైవేటుగా శిక్షణ ఇచ్చే తొలి ఉపాధ్యాయులు గా ఆయన పేరు పొందారు.

Conduct Certificate

ఆ రోజుల్లో చాలా మంది టీచర్లు మామూలుగా వచ్చే జీతాలు సరిపోక పాపం ప్రెవేట్లు చెప్పినా, చక్రపాణి గారు ఆ పధ్ధ్దతిని మరొక స్థాయికి పెంచారు. అందుకే కాకినాడ లో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్ధులూ ఆయన దగ్గరకి ట్యూషన్ కి వెళ్ళేవారు. అలాంటిదే మరొక ప్రవేటు స్కూల్ శివాలయం పక్కనే ఉండే “కుంటి మేష్టారి స్కూలు”. ఒక సారి మా నాన్న గారు చక్రపాణి గారిని “ఏమండీ మేష్టారూ, మా రాజా ని కూడా మీ దగ్గర ప్రెవేట్ కి చేర్చుకుంటారా?” అని అడిగితే ఆయన నవ్వేసి “ఆ వెధవే అందరికీ ప్రెవేటు చెప్పగలడు. వాడికి అక్కర లేదు. నాదంతా 40 శాతం లోపు వాళ్ళకి సహాయం చేద్దామనే” అని తిరస్కరించారు. అది చక్రపాణి గారి ఉన్నత సంస్కారం. అదే మరొకరైతే, ట్యూషన్ డబ్బు కోసం ఠకీమని ఒప్పేసుకునే వారు. అఫ్ కోర్స్, ఎందుకైనా మంచిదని మా నాన్న గారు అయోధ్యారామం అనే ప్రెవేటు మేష్టారి దగ్గర నన్నూ, మా తమ్ముణ్ణీ, చెల్లెళ్ళనీ ట్యూషన్ కి పెట్టారనుకొండి. అది వేరే విషయం. ఆయన ప్రెవేటు కన్నా శొంఠి పిక్కలకి ప్రఖ్యాతి.

గాంధీ నగరం స్కూల్ కి వచ్చిన తరువాత మాకు చాలా నచ్చిన మరొక టీచర్ నరసాయమ్మ గారు. ఆవిడ చరిత్ర, ఇంగ్లీషు చెప్పేవారు అని జ్ఞాపకం. అంతకంటే ముఖ్యంగా మంచి కథలు చెప్పేవారు. పైగా ఆవిడ భర్త గారు మా నాన్న గారి లాగానే లాయర్ గారు. పి,ఆర్. కాలేజ్ గోడలో గుండ్రంగా తిరిగే చిన్న గేటు దగ్గర రామారావు పేటలో మూడు లైట్ల జంక్షన్ రోడ్డు చివర ఉండేవారు. ఇప్పుడు ఆ గేటు లేదు. మా టీచర్లందరిలోకీ కొంచెం తమాషాగా ఉండేది మా డ్రిల్ మేస్టారు. ఆయన పేరు వెంకటేశ్వర రావు గారు అని జ్ఞాపకం. బహుశా ఈండ్రపాలెం..ఇప్పుడు ఇంద్రపాలెం అని షోగ్గా పిలవడం విన్నాను… నుంచి రోజూ సైకిల్ మీద మా ఇంటి మీద నుంచే స్కూల్ కి వెళ్ళేవారు. “ఒరేయ్, నువ్వు బ్రేమ్మల పిల్లాడివి. నాజూకు వెధవ్వి. నీకు ఇలాంటి ఆటలు పనికి రావు. ఆడితే చస్తావ్. కావాలంటే చదరంగంలో కూచో” అని నన్ను కబాడీ, కోకో లాంటి ఆటలు ఎక్కువ ఆడనిచ్చేవారు కాదు. ఉట్టి డ్రిల్ మాత్రం చేయింఛే వారు. అప్పుడు ముమ్ముడి సూర్యనారాయణ గాడు “పరవా లేదు సార్, నేనే వాడి తరఫున ఆడతాను..వాడు ఉట్టినే ఆటలో అరటి పండే” అని నన్ను కబాడీ టీములో వేయించే వాడు. వాడు పరిగెడుతుంటే నేను కూత కూసే వాణ్ణి. అలాంటి కూతలు ఇంకా కూస్తూనే ఉన్నానని మా క్వీన్ విక్టోరియా అప్పుడప్పుడు వాపోతూ ఉంటుంది.

గాంధీ నగరం స్కూల్లో హెడ్మాస్టారి రూము పక్కనే దొర గారి రూమూ, సైన్స్ పరిశోధన శాలా ఉండేవి. మా ఎస్.ఎస్.ఎల్.సీ లో దొర గారే మా సైన్స్ టీచరు. నా జీవితంలో ఆయన చెప్పినంత ఆసక్తి కరంగా అటు భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం, బోటనీ, బయాలజీలు కానీ బోధించగలిగే మరొక ఉపాద్యాయులు ఉంటారని అనుకోను. పైగా ఆయన చండశాశనుడు. అర క్షణం ఆలస్యంగా వచ్చినా, క్లాస్ జరుగుతుండగా కిటికీలోంచి రోడ్డు మీద వెళ్తున్న బస్సు ని చూసినా, ప్రశ్నలకి తడబడుతూ సమాధానం చెప్పినా, హోమ్ వర్క్ చెయ్యకపోయినా, చేసిన హోమ్ వర్క్ లో నిర్లక్ష్యం కనిపించినా, అమ్మాయిల బెంచీకేసి అరక్షణం తలతిప్పినా, ..ఇలా ఒకటేమిటి….ఎప్పుడు, ఎక్కడ ఎలా క్రమ శిక్షణ కి లోపం వచ్చినా అయిందే మన పని. అలా అని, అయన ఎవరినీ కొట్టడం, ఘట్టిగా తిట్టడం ఉండేది కాదు.

ఏ విద్యార్ధి అయినా చిన్న తప్పు చేసినా దొరగారు చూశారేమో అనే భయం వెంటాడేది. అయినా, ఆయనంటే ఎంతో గౌరవంగా ఉండే వాళ్ళం. ఆయన పాఠాలంటే ప్రపంచం మర్చిపోయి వినేవాళ్ళం. నేను రెండేళ్ళ క్రితం మా స్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల తొలి సమావేశానికి హాజరయ్యాను. ఎవరో ఒకరిద్దరు నిర్వాహకులకి నేను తెలిసినప్పటికీ నా హోదా ఆటలో అరటిపండే. అప్పుడు నేను వేదిక మీద ఉన్న దొర గారికి భయం, భయంగా పాదాభివందనం చెయ్యగానే ఆయన నన్ను చూసి “ఏరా. రాజా ఎలా ఉన్నాడు రా?” అని అడిగారు. అది నాకు మహదానందాన్ని కలిగించింది ఎందుకంటే…నన్ను చూసి మా తమ్ముడు అనుకుని, యాభై ఏళ్ళ తరవాత కూడా వాణ్ణి గుర్తుపట్టి, వెను వెంటనే నా యోగక్షేమాలు దొర గారు అడిగారూ అంటే….నేనూ, మా తమ్ముడూ ఎంత అదృష్టవంతులమో కదా అనిపించింది. అదే సభలో ఇ,వి.ఆర్. రామ్ మోహన్ రావు గారూ, అలనాడు నా ఫోర్త్ ఫారం లో నా క్లాస్ మేట్ అయిన ఆయన అర్ధాంగినీ కూడా కలుసుకున్నాను. ఎక్కువ మాట్లాడే అవకాశం కలగ లేదు.

ఆ రోజుల్లో ప్రతీ క్లాస్ కీ విధిగా దొర గారూ, ఇ.వి.ఆర్ రామ్మోహన్ రావు గారూ, చక్రపాణి గారూ, ఇతర ఉపాధ్యాయుల నిర్వహణలో జరిగే వక్తృత్వ పోటీలూ, వ్యాస రచన పోటీలూ మొదలైనవి తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇవి ఏడాదికి కనీసం రెండు, మూడు సార్లు జరిగేవి. ప్రతీ పోటీకీ ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి, దాని మీద వాద. ప్రతివాద పోటీలు పెట్టే వారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో విడి విడిగా ఉండేవి. ఇక “కత్తి గొప్పదా, కలము గొప్పదా?”, లేక ’స్త్రీలకు విద్య అవసరమా, అనవసరమా?” లాంటి సాధారణమైన అంశాల నుండి, “సూయెజ్ కెనాల్ ఎవరి ఆధ్వర్యంలో ఉండాలీ?” లాంటి అలనాడు అంతర్జాతీయంగా అత్యంత కలకలం సృష్టిస్తున్న సమస్యల మీద చర్చావేదికలు మా ఉపాధ్యాయులు నిర్వహించే వారు. ఇలాంటి చర్చలు ఐక్యరాజ్య సమితి వేదికలు గా తీర్చి దిద్ది, ఒక్కొక్క విద్యార్ధీ ఒక్కొక్క దేశం తరఫున తమ వాదనలు వినిపించే వారు. అందులో నాది ఎప్పుడూ భారత దేశం తరఫున నెహ్రూ గారి పాత్రే!. అందు చేత నేను రోజూ పేపర్లు చదువుతూ, నెహ్రూ గారి ఉపన్యాసాలన్నీ కత్తిరించుకుని దాచుకుంటూ, రేడియోలో వార్తలు ఖచ్చితంగా వింటూ ఉండేవాణ్ణి. ఆ వార్తలు కూడా పార్కులో ప్రతీ సాయంత్రం ఆరు గంటలకి వచ్చినప్పుడు మొత్తం గాంధీ నగరం జనాభా అంతా అక్కడే ఉండే వారు.

మా స్కూల్ లో ఐక్యరాజ్య సమితి వేదిక పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ టోపీ పెట్టుకుని, కోటు వేసుకుని, గులాబీ పువ్వు పెట్టుకుని మాట్లాడేవాడిని. ఇక రష్యా ప్రధాని కృశ్చెవ్, అమెరికా తరఫున ఐసెన్ హోవర్, యుగోస్లావియా ప్రెసిడెంట్ టిటో, ఈజిప్ట్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాజర్ లాంటి అత్యంత ప్రతిభావంతుల పాత్రలు మిగిలిన విద్యార్ధులు వేసే వారు. ఆ నాటి ఆ అనుభవాలే ఈ నాడు నన్ను ఈ విధంగా తీర్చిదిద్దాయి అనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు నేను గెలుకున్న వెండి పతకాలు పాతిక పైగా ఇంకా నా దగ్గర అమెరికాలో ఉన్నాయి.

ముక్తాయింపు:

ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతయినా ఉంది కానీ, సుమారు నాలుగేళ్ల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు, నేను చదువుకున్న మ్యునిసిపల్ హైస్కూల్ ఎలా ఉందో అని చూడడానికి వెళ్ళాను. గుమ్మంలో ఉండగానే ఒక దుండగీడులా ఉండే గుండు కుర్రాడు కనపడ్డాడు. పైన ఇంగ్లీషు లో ఉన్న బోర్డ్ చూసి అనుమానం వచ్చి “ఇది గాంధీనగరం పురపాలకోన్నత పాఠశాలే కదా?” అని పలకరించాను. “ఏమో సార్, దిస్ ఈజ్ Mahatma Gandhi Memorial High School, సార్” అన్నాడు. “ఓహో, మరి నువ్వేం చదువుతున్నావ్, అబ్బాయ్?” అని అడిగాను. ఆ కుర్రాడు నా మొహం చూసి “అయామ్ ఇన్ ఫోర్త్ ఫారం. సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్.” అని గర్వంగా గుండు తల ఎగరేశాడు.

నేను కొంచెం జుట్టు పీక్కుని “నేను తెలుగులో అడిగాను కదా. మరి నువ్వు ఇంగ్లీషులో సమాధానం చెప్పావేం?” అని అడిగాను. వాడు చిన్న నవ్వు నవ్వి “మీ మొహం ఎన్నారై మొహం సార్.” అని కిచ కిచలాడాడు. “ఒహో, ఆ రూట్లో వచ్చావా?” అని స్కూల్ లోపలికి అడుగుపెట్టాను. చుట్టూ చూడగానే నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. స్కూల్ గోడలన్నీ వెల, వెలబోతూ, నల్లటి వర్షం నీటి చారకలతో కళావిహీనంగా ఉంది. ఒక గదిలో పిల్లలు నేల మీద కూచుని చదువుకుంటున్నారు. ఎక్కడా స్కూల్ బల్లలు లేవు. మేష్టారి కోసం మాత్రం ఒక పాత కాలం కుర్చీ ఉంది. అదే గదిలో నేను నా ఎస్.ఎస్.ఎల్.సీ చదువుకున్నాను. అప్పుడు బల్లలూ, మంచి బ్లాక్ బోర్డూ, అన్నీ ఉండేవి. వెంటనే హెడ్మాస్టారి గదికి వెళ్ళి పరిచయం చేసుకుని పరిస్థితి తెలుసుకున్నాను. పదవ తరగతి ఎంట్రెన్స్ పరీక్షలకి బల్లలు లేక ఆయన తన స్వంత ఖర్చుతో అద్దెకు తీసుకునే పరిస్థితిలో స్కూల్ ఉంది అనీ, అన్నింటికీ కార్పొరేషన్ వారే బాధ్యత అనీ వివరించారు. వెంటనే కార్పొరేషన్ మేయర్ గారిని కలిశాను.

MGMh 2

“కేవలం ఉపాధ్యాయులకి జీతం ఇవ్వడానికి తప్ప, గోడలకి వెల్లవెయ్యడానికీ, బల్లలు కొనడానికీ, సైకిల్ స్టాండ్ కీ, ఆఖరికి ఆడపిల్లలకి టాయిలెట్ సౌకర్యానికీ కూడా బడ్జెట్ లేదు” అని మేయర్ గారు చేతులెత్తేశారు. అదే స్కూల్ లో చదువుకుని కార్పొరేషన్ లో కౌన్సిల్ మెంబర్లగా ఉన్న వారిదీ అదే డైలాగు. అసంకల్పిత చర్యగా “మేము ఎలాగో అలాగ డబ్బు సంపాదించి, మా పాఠశాలకి కనీస సౌకర్యాలు కలిగించడానికి మీరు సహాయం చెయ్యలేకపోయినా, అడ్డు పడకుండా ఉండండి” అని వారి హామీ పుచ్చుకున్నాను. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఏమీ తోచ లేదు. కేవలం యాదృచ్చికంగా, దైవేఛ్చగా, ఇంచుమించు అదే సమయంలో మా స్కూల్ చూడగానే మరొక పూర్వ విద్యార్ధి, మా పక్కింటి వాడు, మా తమ్ముడి క్లాస్ మేట్ అయిన తురగా చంద్ర శేఖర్ కూడా అవే ఆలోచనలు వచ్చి నాలా బాధ పడి ఆగి పోకుండా వెంటనే కార్యాచరణకి దిగాడు. అతనితో చెయ్యి కలిపి అందరం కలిసి మా పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం స్థాపించాం.

హెడ్మాస్టారినీ, ఉపాధ్యాయులనీ, విద్యార్ధులనీ కలుసుకుని అర్జంటుగా కావలసిన సౌకర్యాల లిస్టు తయారు చేసుకుని, రెండేళ్ళలో, స్కూల్ బెంచీలు కొనడం, గోడలకి రంగులు వేయించడం, మంచి నీళ్ళ సదుపాయం, పిల్లల కాళ్ళకి చెప్పులు సప్లై మొదలైన మొదటి విడత పనులన్నీ పూర్తిచేశాం. నేను ఎక్కడో అమెరికాలో ఉన్న కారణం చేత కేవలం విరాళాలు పోగెయ్యడంలో సహాయం చెయ్యడం తప్ప, ఈ బృహత్కార్యం మా ట్రస్ట్ అధ్యక్షుడు చంద్ర శేఖరూ, సభ్యులు అబ్బూరి విఠల్, నరసింహా రావూ, రామకృష్ణ రాజూ, లక్ష్మణ రావూ (కార్పొరేటర్), బి.వి. రమణ (యెమెన్ దేశం) తదితరులూ హెడ్మాస్టార్ వేణుగోపాల రావు గారి సహకారంతో పూర్తి చేశారు. మేం అందరం డిశంబర్ 2012 లో మా ఉన్నత పాఠశాల డైమండ్ జూబిలీ సగర్వంగా జరుపుకుని, అప్పటి మా ఉపాధ్యాయులని గౌరవించుకున్నాం. అప్పటి కొన్ని ఫోటోలు ఇందుతో జత పరుస్తున్నాను. పూర్తి వివరాలూ, మా స్కూల్ వివరాలూ ఈ క్రింది వెబ్ లంకె లో చూడండి.
http://www.mgmh-alumni-trust.org/index.html
అలాగే నా ఎస్.ఎస్.ఎల్.సి. పట్టా కాపీ, ఆ రోజుల్లో ఇచ్చే కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇందుతో జతపరుస్తున్నాను….ఎందుకంటే ….ఇవి అలనాటి తీపి గుర్తులు. కానీ
, ఈ కాండక్ట్ సర్టిఫికేట్ లో మొదటి మాటలు…అంటే..very fluent in speech, very rapid in speed of work, accurate observer, avove in ability అన్నవి చదవగలిగాను కానీ, ఆఖరి మాట ఇప్పటికీ చదవ లేక పోతున్నాను. బహుశా “బట్, టోటల్లీ యూస్ లెస్ ఫెలో” అని మా హెడ్ మాష్టారు అభిప్రాయపడ్డారేమో అని నా అనుమానం.
(ఈ వ్యాసం లో కొన్ని భాగాలు మా స్కూల్ వజ్రోత్సవ సందర్భంగా ఇది వరలో కౌముది లో వ్రాయడం జరిగింది)

-వంగూరి చిట్టెన్ రాజు,

హ్యూస్టన్, టెక్సస్ (అమెరికా)

మా మాధ్యమిక పాఠశాల – ఈశ్వర పుస్తక భాండాగారం రోజులు …

chitten raju

 

 

 

 

 

కాకినాడ గాంధీ నగరానికి ఎల్విన్ పేటకీ సరిహద్దులో ఉన్న అప్పటి “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు లో ఐదో క్లాసు పూర్తి చెయ్యగానే నన్ను రామారావుపేట లో ఉన్న మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో చేర్పించారు మా నాన్న గారు. అప్పటికే మా సుబ్బన్నయ్య..అంటే నా పై వాడు పి.ఆర్. కాలేజియేట్ హైస్కూల్ లోనూ, మా అక్క మెక్లారిన్ హై స్కూల్ పక్కనే ఉన్న గర్ల్స్ హై స్కూల్ లోను చదువుకునే వారు. వాళ్లిద్దరూ రోజు బస్సులో స్కూల్ కి వెళ్ళే వారు. బహుశా ఆ అవస్త చూడ లేక అరగంటలో నడిచి వెళ్లి పోయే ఈ రామారావు పేట మిడిల్ స్కూల్లో నన్ను వేశారేమో నాకు తెలియదు కానీ మా ఇంట్లోంచి ఆ స్కూల్ కి  వెళ్ళిన వారిలో నేనే మొదటి వాడిని. నా తరువాత మా తమ్ముడు ఆంజీ (హనుమంత రావు), మా ముగ్గురు చెల్లెళ్ళూ (భాను, పూర్ణ, ఉష) అ స్కూల్లోనే , ఆ తరువాత గాంధీ నగరం మ్యునిసిపల్ హైస్కూల్ లోనూ చదువుకున్నారు. అంటే సుమారు ఇరవై ఏళ్ళు మా ఇంట్లోంచి ఎవరో ఒకరు ఈ రెండు పాఠశాలలలోనూ చదువుకున్నారు. నాకు తెలిసీ ఇది ఒక రికార్డే!

మా చిన్నప్పుడుఈ ఎల్కేజీ, పీకేజీ అంటూ “కేజీ” గోల, కేజీల కొద్దీ పుస్తకాల మోతా ఉండేది ఉండేది కాదు. ఐదో ఏట అక్షరాభ్యాసం అవగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ప్రాధమికపాఠశాల అంటే ఎలిమెంటరీ స్కూల్, ఆ తరువాత పదో ఏట ఒకటో ఫార్మ్ లో ప్రవేశించి మూడో ఫార్మ్ దాకా మాధ్యమిక పాఠశాల అంటే మిడిల్ స్కూల్, ఆ తరువాత మూడేళ్ళు ఉన్నతపాఠశాల అంటే హై స్కూల్…నాలుగో ఫార్మ్ , ఐదో ఫార్మ్ & ఎస్.ఎస్.ఎల్.సి..అనగా సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తో స్కూల్ చదువు పూర్తి అయేది.

1954-55 లో నేను రామారావు పేట లో శివాలయం రోడ్డు మీద ఉన్న ఈ మాధ్యమికపాఠశాల లో ఫస్ట్ ఫార్మ్ లో చేరాను. అప్పుడు ఆ స్కూల్లో మూడోఫార్మ్ దాకానే ఉండేది. నేను మూడో ఫారం లోకి వచ్చాక నాలుగో ఫార్మ్ పెట్టారు. ఒక్కొక్క ఫార్మ్ కీ “ఎ” సెక్షన్ అనీ “బీ” సెక్షన్ …విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ గా ఉంటే “సీ” క్లాస్ అనీ సుమారు నలభై మంది ఉండే రెండు, మూడు సెక్షన్స్ ఉండేవి. ఎందుకో తెలియదు కానీ కాస్త తెలివైన వాళ్ళని “ఏ” క్లాస్ లో వేసే వారు. నేను ఎప్పుడూ “ఏ” క్లాస్ లోనే ఉండే వాడిని. అంచేత తెలివైన వాడిని అనే అనుకోవాలి. అదేం విచిత్రమో అందులో కూడా నేను మొదటి వాడిగానే ఉండే వాడిని. ఎందుకంటే ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా అందరి కంటే ఎక్కువ మార్కులు నాకే వచ్చేవి. అలా అని నేను ఎప్పుడూ “రుబ్బుడు” గాడిని..అంటే పుస్తకాల పురుగుని కాదు. ఎప్పుడూ గట్టిగా కష్టపడి చదివిన జ్జాపకం లేదు కానీ మేష్టారు చెప్పిన పాఠం శ్రద్ధగా వినడం, జ్జాపకం పెట్టుకోవడం మటుకు బాగా జ్జాపకం. ఇప్పటికీ నాకు ఎవరైనా”ప్రెవేటు” చెప్తుంటే వినడం ఇష్టం. ఎవరైనా దొరికితే “ప్రెవేటు” చెప్పడం అంతకన్నా ఇష్టం.

నా మూడవ ఫార్మ్ లో

అప్పుడు మా స్కూల్లో రెండు సిమెంటు బిల్డింగులు, వెనకాల ఒక పెద్ద పాక ఉండేవి. ఆ పాకలో ఒకటో ఫార్మ్, రెండో ఫార్మ్ తరగతులు, ఒక సిమెంట్ బిల్డింగులో మూడో ఫార్మ్, ఆ తరువాత నాలుగో ఫార్మ్ క్లాస్ రూములు ఉండేవి. రెండో సిమెంట్ బిల్డింగులో ప్రధానోపాధ్యుడి గారి ఆఫీసు, సైన్స్ లాబ్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ గది ఉండేవి. అప్పుడూ, ఆ తరువాత హైస్కూల్ కి వెళ్ళాకా కూడా ఆరేళ్ళ పాటూ మా హెడ్మాస్టర్ గారు ఒక్కరే.

ఆయన పేరు వి.ఎస్.ఆర్.కే.వి.వి.వి.యస్. సత్యనారాయణ గారు. ఆయన ఏదో మాట వరసకి ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పేవారు కానీ హెడ్మాస్టారు పనులే ఎక్కువగా చేసే వారు. మాధ్యమిక తరగతులలో “పాక’లో పాఠాలు చెప్పిన వారిలో బాగా జ్జాపకం ఉన్న వారు తాతబ్బాయి గారు, జి. సత్యనారాయణ గారు. ఇందులో తాతబ్బాయి గారు చాలా తమాషాగా, కారు నలుపు మనిషి అయినా ఆయన తెల్లటి పంచె, లాల్చీలతో, కుర్చీలో కాళ్ళు రెండూ మడత పెట్టుకుని కూచుని ఒక దాని తరువాత ఒకటి గా నాలుగైదు సబ్జెక్టులు చెప్పే వారు. పొద్దుట ఎనిమిది గంటల నుంచి పన్నెండు దాకా నాలుగు పీరియడ్స్ అవగానే మేము గబా, గబా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పరిగెట్టే వాళ్ళం.

హడావుడిగా తిండి తినేసి మళ్ళీ ఒంటి గంట కల్లా క్లాసుకి చేరగానే ఆయన అప్పటికే సుష్టుగా భోజనం చేసి కుర్చీలో కునుకు తీస్తూ ఉండే వారు. అంచేత మధ్యాహ్నం క్లాసులన్నీ మందకొడి గానే జరిగేవి. ఆయన మాట్లాడేది తక్కువ. నాచేత, మిగిలిన తెలివైన కుర్రాళ్ళ చేత చదివించేసి, లెక్కలు చేయించేసి, తన కునుకు కంటిన్యూ చేసే పద్ధతి ఎక్కువ గా ఉండేది. ఎటొచ్చీ ఆయన చేతిలో ఒక బెత్తం, పక్కనే డ్రాయర్ బయటి లాగి పెట్టి ఉంచిన ఒక బల్ల ఉండేవి. ఆ నిద్రలో కూడా మా కుర్రాళ్ళలో ఎవరైనావెర్రి వేషాలు వేసినట్టు గమనించారా…ఇక అంతే సంగతులు. బెత్తం తో కొట్టడం చిన్న శిక్ష కానీ, కుర్రాళ్ళ చేతి వేళ్ళని కొసన లో పెట్టి ఠకీమని ఆ డ్రాయర్ మూసేస్తే ఆ బాధ నరక యాతనే! అందరమూ నెల మీదే కూచునే వాళ్ళం కాబట్టు బెంచీ ఎక్కే సదుపాయమూ, గోడ కుర్చీ వేసే ఏర్పాట్లూ ఉండేవి కాదు.

 

నా విషయానికి వస్తే ఆ క్లాసుకి నేనే మానిటర్ ని. అందుచేత ఎవడైనా అల్లరి చేస్తే ఆ వివరాలు తాతబ్బాయి గారికి మెలకువ రాగానే చెప్పవలసిన బాధ్యత నాదే. ఆ అల్లరి తీవ్రతని బట్టి ఆయన బెత్తమా, చేతివేళ్ళు చితికిపోవడమా అని నిర్ణయించే వారు. నేను “రాము మంచి బాలుడు” కాబట్టి ఆ రెండిటికీ ఎప్పుడూ నోచుకోక పోయినా, క్లాస్ మానిటర్ గా నా రిపోర్టింగ్ సరిగ్గా లేదు అని ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఆ శిక్షలు నాకు పడే అవకాశం ఉండేది.

దేవుడి దయ వలన ఆ అవకాశాన్ని నేను ఎప్పుడూ ఉపయోగించుకో లేదు. ఇక సత్యనారాయణ గారు చరిత్ర పాఠాలు ఎంతో ఆసక్తికరంగా చెప్పే వారు. ఇప్పుడూ టక్ చేసుకుని దర్జాగా ఉండే వారు. ఒకటో ఫార్మ్ నుంచి మూడో ఫార్మ్ దాకా మాకు తెలుగు పాఠాలు ఎవరు నేర్పారో నాకు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు లేకపోవడం చాలా సిగ్గుగా ఉంది. బహుశా వేదుల సత్యనారాయణ గారే అయిఉండాలి. తెలుగులో నాకు ఇప్పటికీ పాండిత్యం అబ్బ లేదు కానీ మార్కులు బాగానే వచ్చేవి.

ఇక అన్ని క్లాసులూ బాహాటంగా ఉంటే ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ క్లాసు మరొక ఎత్తు. దానికి చుట్టూ స్టీలు తడికలతో ఎవరూ దొంగతనం చెయ్యకుండా తాళం వేసే వీలు ఉండేది. ఆ క్లాస్ రూము లో డ్రాయింగ్ సామానులు ..అంటే కుంచెలూ, రంగు డబ్బాలూ, కుట్టు యంత్రాలు, బొమ్మలు చేసే రబ్బరు మొదలైనవి ఉండేవి. అన్నింటి కన్నా ముఖ్యంగా గాంధీ గారి రాట్నాలతో దూది నుంచి దారం వడికి, దాంతో మా చెడ్డీలు మేమే కుట్టుకోవడం నేర్పించే వారు. ఆ విద్య నాకు అబ్బ లేదు. ఎప్పుడు దారం తీసినా అది చిక్కు పడిపోయి నా మొహం లా ఉండేది. చెడ్డీ కాదు సరికదా, జేబు రుమాలు కూడా కుట్టుకోడానికి పనికొచ్చేది కాదు   అన్ని క్లాసులకీ కలిపి ఇవన్నీ నేర్పే ఒకే ఒక్క బక్క చిక్కిన మేష్టారు ఉండే వారు. ఆయన పేరు గుర్తు లేదు కానీ అందరూ ఆయన్ని “తకిలీ” మేష్టారు అనే పిలిచే వారు.

నేను మూడో ఫార్మ్ దాకా నేల మీదే కూచుని చదువుకున్నాను. క్లాస్ మేట్స్ పేర్లు గుర్తు లేవు కానీ లక్ష్మీ నారాయణ అని ఒక కుర్ర్రాడు, అతని చెల్లెలూ కూడా మా సెక్షన్ లోనే ఉండే వారు. విశేషం ఏమిటంటే అతనికి ఎప్పుడూ నా కంటే నాలుగైదు మార్కులు తక్కువే వచ్చేవి. ఎలాగైనా నన్ను మించిపోవాలని, మా ఇంటికి కంబైండ్ స్టడీస్ కి వచ్చే వాడు. కానీ మనం అసలు అంతగా చదివితేగా?

ఇది కాక మా స్కూల్ లో ఎ.సి.సి అనే విభాగం ఉండేది. అంటే అసోసియేటేడ్ కెడేట్ కోర్ అనమాట. ఇది హైస్కూల్ లో ఉండే ఎన్.సి.సి (నేషనల్ కేడేట్ కోర్) కి అనుబంధ సంస్థ. అందులో నేను కొంచెం హుషారుగా పాల్గొనే వాడిని. అది నిర్బంధమో కాదో నాకు గుర్తు లేదు కానీ నమ్మండి, నమ్మక పొండి, నాకు అలా ఆర్మీ వాళ్ళ లాగా, పెద్ద పోలీసు వాళ్ళ లాగా యునిఫారం వేసుకుని తిరగడం సరదాగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఒకే ఒక్క కాన్వెంట్ స్కూల్లో తప్ప స్కూల్ యునిఫార్మ్స్ ఉండేవి కాదు. ఎవరికీ తోచిన చొక్క్కాలు, చెడ్డీలూ వాళ్ళు వేసేసుకోవడమే! మేము వేసుకునే బట్టలని బట్టి మా సోషల్ స్టేటస్ ..అప్పుడప్పుడు కులం తో సహా తెలిసిపోయేది.

సరిగ్గా అదే కారణానికి నేను కొన్నాళ్ళు ఆర్. ఎస్.ఎస్. లోకూడా చేరాను. ఎ.సి.సి. లో తుపాకీ పట్టుకోవడం నేర్పిస్తే వీళ్ళు కుస్తీలు, పెద్ద తాళ్ళతో పీట ముడి వెయ్యడాలు మొదలైన డిఫెన్స్ విద్యలు నేర్పే వారు. నాకు ఆ రెండూ రాలేదు. మా రోజుల్లోనే రైట్ టర్న్, మార్చ్ లాంటి ఇంగ్లీషు పదాలు పోయి బాయే ముడ్, పీచ్చే ముడ్, ఆగే బడ్ లాంటి హిందీ మాటలు వచ్చి వాటి మీద మా క్లాసు రౌడీలు చెప్పకూడని జోకులు వేసుకునే వారు. నేను బ్రాహ్మల అబ్బాయిని కాబట్టి నన్ను చూడగానే ఠపీమని నోరు నొక్కేసుకునే వారు . బహుశా ఈ రోజుల్లో దానికి ఆపోజిట్ ఏమో !

నేను మిడిల్ స్కూల్ లో ఉండగా ఉన్న ఒకే ఒక్క ఫోటో ఆ ఎ.సి.సి యూనిఫారం లో ఉన్నదే. అది ఇక్కడ జత పరుస్తున్నాను. రూపు రేఖలు మారిపోయిన ఆ స్కూల్ ముందు గుమ్మం ఫోటో కూడా ఒకటి జతపరుస్తున్నాను.

Ramarao peta school 1 ఓకే

మా మిడిల్ స్కూల్ ప్రాంగణం లోనే “ఈశ్వర పుస్తక భాండాగారం” అనే చిన్న అతి విశిష్టమైన బిల్డింగ్ ఉంది. నిజానికి దాని పవిత్రత, చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా దాన్ని “భవనం” అనాలి.  “శ్రీ వేణు గోపాల సంస్కృత ప్రచార సభ” అనే ఆ బిల్డింగ్ 1903 లో కట్టారు. రోజూ సాయంత్రం  అయ్యేటప్పటికల్లా అన్ని పేపర్లూ, పుస్తకాలూ చదవడానికి వచ్చే జనం తో ఆ హాలు నిండి పోయేది.

అక్కడ మా తాత గారి పుస్తకాలతో పాటు కొన్ని వందల అపురూపమైన తెలుగు పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. కానీ చదివే వాళ్ళే కరువై పోయారు. ఆ బిల్డింగ్ వెనకాల ..అంటే మా స్కూల్ గ్రౌండ్స్ వేపు ఒక చిన్న వేదిక ఉండేది. ఇంచుమించు ప్రతీ రోజూ ఆ వేదిక మీద ఏదో ఒక హరి కథో, బుర్ర కథ, పురాణ కాలక్షేపం, సాహిత్య ప్రసంగం మొదలైనవి జరుగుతూ ఉండేవి. పండగల రోజుల్లో రికార్డింగ్ డాన్సులు కేవలం రోడ్ల మధ్యలో వేసిన పందిళ్ళలో జరిగేవి.

నా రోజు వారీ రొటీన్ ఏమిటంటే సాయంత్రం స్కూల్ బెల్లు కొట్టగానే ఇంటికి పరిగెట్టి, క్రికెట్ బేటు, వికెట్లూ వగైరాలు పట్టుకుని పి. ఆర్. కాలేజీ గ్రౌండ్స్ కి వెళ్లి ఆడుకోవడం. ఆట అయి కొంచెం చీకటి పడే సమయానికి “సత్తెయ్య” గాడు అర నిముషం ఆలస్యం చెయ్యకుండా ఠంచనుగా పట్టుకొచ్చే వేరు శనక్కాయలు, ఐస్ క్రీం కడ్డీలు, ఒకటో, రెండో తినెయ్యడం. అక్కడ నుంచి ఈశ్వర పుస్తక భాండాగారం దగ్గర మా స్కూల్ ఇసక గ్రౌండ్స్ లో కూచుని ఈశ్వర పుస్తక భాండాగారం వారు ఏర్పాటు చేసిన పురాణ కాలక్షేపం తన్మయత్వంలో విని, తరించి, అది అయిపోగానే ఆ రోడ్డు మీదే ఉన్న శివాలయానికి వెళ్లి దణ్ణం పెట్టుకుని ఆచారి గారు పెట్టిన సాతాళించిన శనగలు ప్రసాదం తినేసి “ఆటలు, పాటలు, నాటికలూ” చాలించేసి ఇంటికెళ్ళి పోవడం.

మా రోజుల్లో “హోమ్ వర్క్” ఇచ్చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపేసుకునే వారు కాదు. వాళ్ళు ఏం చెప్పినా క్లాసులోనే క్షుణ్ణంగా చెప్పే వారు. మేము ఏం నేర్చుకున్నా క్లాస్ లోనే నేర్చుకునే వాళ్ళం. టీవీలు లేవు. రేడియోల పాత్ర పరిమితమైనదే.   అందుకే ఆట, పాటలకీ, పై పుస్తకాలు చదువుకోడానికీ సమయం ఉండేది. పిల్లలం పిల్లలుగానే జీవించే వాళ్ళం. అది మా తరం చేసుకున్న అదృష్టం.

ఇక గతం నాస్తి అనుకుని ఎంతో విచారంగానే ప్రస్తుతానికి వస్తే, నేను ఇటీవల (ఫిబ్రవరి 2014) కాకినాడ వెళ్ళినప్పుడు రూపు రేఖలు మారిపోయిన మా స్కూలు, ఈ గ్రంధాలయాల లో కొన్ని గంటలు గడిపి, పెద్ద పోజు పెట్టి మా మాధ్యమిక పాఠశాల దగ్గరా ఈశ్వర పుస్తక భాండాగారం లోనూ ఫోటోలు తీయించుకున్నాను కానీ నా కంప్యూటర్ కి ఏదో వైరస్ మాయ రోగం ఆవహించి నేను తాళ పత్రాలు తిరగేస్తున్న ఒక్క ఫోటో తప్ప మిగిలిన ఫోటోలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. అది ఇక్కడ జతపరుస్తున్నాను.

Eswara Pustaka Bhandagaram 2 ఓకే

ఇప్పటి దౌర్భాగ్యం చూడాలంటే అలనాడు మాకు సాంస్కృతిక భిక్ష పెట్టిన మా ఈశ్వర పుస్తక భాండాగారం ఈ నాడు ఎలా ఉందో ఇందుతో జత పరిచిన ఒక ఫోటో చూస్తే తెలుస్తుంది. ఆలనా, పాలనా లేక పోయినా, కార్పొరేషన్ వారు గాలికొదిలేసి, వారి రాజకీయాల గాలి మేడలు కట్టుకుంటున్నా, స్థానిక విద్యావేత్త, సాంస్కృతిక ప్రముఖురాలు అయిన డా. చిరంజీవినీ కుమారి గారి నాయకత్వంలో కొందరు ఆ గ్రంధాలయాన్ని ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. కృష్ణ కుమార్ అనే నాట్యాచార్యులు గారు ఆ హాలు లోనే కూచిపూడి నృత్యం నేర్పిస్తూనే ఉన్నారు.

ఈ ఫోటో చూడగానే విధి ఎంత విపరీతమైనదో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నూట పది సంవత్సరాల క్రితం ఈ స్థలం సమాజానికి విరాళంగా ఇచ్చి అక్కడ గ్రంధాలయం, సాంస్కృతిక వేదిక కట్టిన వారు ఈ నాటి కమ్యూనిస్ట్ రాజకీయ ప్రముఖులైన యేచూరి సీతారాం గారి పై తరం వారు. ఈ నాడు అదే కమ్యూనిస్ట్ పార్టీ వారు ఈ బిల్డింగ్ గోడల మీద రంగుల బొగ్గుతో తమ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు.

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

 

 

నేను తీసుకున్న ఫోటోలు హుష్ కాకీ అయిపోయాయి కాబట్టి ఈ వ్యాసం కోసం అడిగిన వెంటనే ఈ ఫోటోలు తీసి పంపించిన రామారావు పేట నివాసి, ఆత్మీయ మిత్రుడు అయిన యనమండ్ర సూర్యనారాయణ మూర్తికి పత్రికా ముఖంగా నా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. నలుగురి సహకారంతో  ఆ గ్రంధాలయాన్ని కొంతైనా పునరుధ్ధరించే ప్రయత్నంలో ఉన్నాను. చూద్దాం ఎంత వరకూ చెయ్యగలమో?

పెద్దాపురం అమ్మరసు పెళ్లి – మరికొన్ని విశేషాలూ

పెద్దాపురం అమ్మరసు, అక్క, సత్యవతి అత్తయ్య

పెద్దాపురం అమ్మరసు, అక్క, సత్యవతి అత్తయ్య

బాగా చిన్నప్పటి విషయాలలో నాకు బాగా గుర్తున్నది 1953 సెప్టెంబర్ లో జరిగిన మా పెద్దాపురం అమ్మరసు వదిన పెళ్లి. అంటే మా ఆఖరి మేనత్త (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం) రెండో కూతురన మాట. పెద్ద కూతురు జయ వదిన తరువాత అమ్మరసు వదిన, ఆ తరవాత అబ్బులు బావ (నా కంటే రెండేళ్ళు పెద్ద), ఆడపిల్లలు రత్నం, పద్మ….వీళ్ళందరూ కాకినాడ లో మా ఇంట్లో పుట్టిన వాళ్ళే. పెళ్లి కొడుకు పేరు వాడ్రేవు వెంకటేశ్వర రావు గారు…నాకు వరసకి అన్నయ్య. కిందటి సారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు “మా రాజా వచ్చాడు” అని అమ్మరుసు వదినా , అన్నయ్య గారూ నన్ను చూడడానికి మా అక్క ఇంటికి వచ్చారు.

పెద్దాపురం మామయ్య గారు

పెద్దాపురం మామయ్య గారు

ఆ నాటి ఆప్యాయతలు తలచుకుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది. వాళ్లిద్దరి పెళ్ళీ పెద్దాపురం లో కొక పెద్ద సత్రం లో జరిగింది. మా మామయ్య గారు పండ్రవాడ సుబ్బా రావు గారు పెద్దాపురం లో అడ్వకేట్. ఆయన ఎప్పుడూ నవ్వుతూ గల గల లాడుతూ మాట్లాడుతూ ఉండే వారు. మా అబ్బులు బావ కాకినాడ లో పాలిటెక్నిక్ చదువుకుంటున్నప్పుడు ..అంటే 1960 లలో గుండె పోటుతో…చిన్న వయసులోనే .. పోయారు. మా దగ్గర ఉన్న ఆయన ఒకే ఒక్క ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. మా పెద్దమ్మరసు, చిన్నమ్మరసు అనే మా అక్క, సత్యవతి అత్తయ్య ఉన్న ఆ నాటి ఫోటో కూడా ఇక్కడ జతపరుస్తున్నాను. ఇందులో సత్యవతి అత్తయ్య మా తాత గారి (సవితి) తమ్ముడు నారాయణ మూర్తి తాతయ్య గారి కూతురు. మా ఇంటి వెనకాల ఇంట్లో ఉండే వారు.

అంత బాగా జ్జాపకం లేక పోయినా నేను నా చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళలో నా దగ్గర ఉన్న సత్యవతి అత్తయ్య పెళ్లి ఫోటో, సుదర్శనం పిన్ని, భర్త సాంబశివ రావు బాబయ్య గారి ఫోటోలు కూడా ఇక్కడ జతపరుస్తున్నాను. సుదర్శనం పిన్ని మా బామ్మ గారి తమ్ముడు తాళ్లూరి లక్ష్మీపతి రావు తాత గారు, మహాలక్ష్మి బామ్మ (తణుకు) గారి కూతురు. ఆ కుటుంబం అంతా ….సుదర్శనం పిన్ని, సువర్చల, హనుమ…(మిగిలిన పేర్లు మర్చిపోయాను)   మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. ఎంత అభిమానం అంటే ..ఒక సారి కాకినాడ లో గోదావరి జిల్లాల ఫలపుష్ప ప్రదర్శన భారీ ఎత్తున జరిగింది. తణుకు లో ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, కేంద్ర మంత్రి స్వర్గీయ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి కుడి భుజంలా ఉండే మా లక్ష్మీపతి తాతయ్య గారికి ఆవకాయలు పెట్టడం అంటే చాలా ఇష్టం. అందుచేత ఆ ఎక్సిబిషన్ లో ఆయన మా అక్క పేరిట సుమారు వంద రకాల ఆవకాయలు పెట్టి ..మొత్తం గోదావరి జిల్లాలు అంతటికీ మొదటి బహుమతి మా అక్కకి వచ్చేటట్టు చేశారు.

సత్యవతి అత్తయ్య పెళ్లి

సత్యవతి అత్తయ్య పెళ్లి

 

 

 

ఈ వ్యాసంలో జతపరిచిన ఫోటోలు వారి కుటుంబాల దగ్గర కూడా ఉంటాయి అని నేను అనుకోను. అవి కేవలం నా దగ్గర ఉండడం, ఇలా ప్రచురించుకోగలగడం నా అదృష్టం. ఈ గ్లోబల్ ప్రపంచంలో మరుగున పడిపోయి, ములిగిపోయిన ఆయా కుటుంబాల తాలూకు వారెవరికీ బహుశా నేను ఎవరో తెలియదు…

ఇంతకీ నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి నాకు బాగా జ్జాపకం ఉండడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటేమో పెళ్లి ముందు రోజు రాత్రి చిట్టెమ్మ బామ్మ గారు అనే వితంతువు ఒక విడిది గదిలో మూల తెల్ల ముసుగు వేసుకుని ముడుచుకుని పడుకుంది. నేను ఏదో పని మీద ఆ గది లోకి వెళ్లి ఆవిడని చూసి, హడిలి చచ్చి పోయి “బాబోయ్ దెయ్యం” అని అరుచుకుంటూ బయటకి పారిపోయాను. ఎందుకంటే అంతకు ముందు వారం పది రోజుల ముందు ఏ చందమామ లోనో దెయ్యాలు తెల్ల ముసుగులు వేసుకుని, అరికాళ్ళు వెనక్కి తిప్పి ముడుచుకుని మూల దాక్కుంటాయి అని చదివాను. అదీ సంగతి. అసలు సంగతి తెలుసుకుని అందరూ నన్ను చూసి కోప్పడ లేదు కానీ అందరిలోనూ నవ్వుల పాలు కావడం నాకు బాగా గుర్తు. మరొక విశేషం ఏమిటంటే చిన్న అమ్మరసు ..అంటే మా అక్క ….అదే గదిలో రాత్రి పడుకుంటే ఎవరో జడ కొంచెం కత్తిరించి, మా అక్క పెట్టుకున్న బంగారం పాపిడి పిందెలు, చేమంతి పువ్వు దొంగతనం చేశారు. మర్నాడు పొద్దున్న మా అమ్మ మా అక్కకి జడ వేస్తూ చూసి అనుమానం వచ్చి అందరి పెట్టెలూ చూస్తుంటే ఈ చిట్టెమ్మ బామ్మ గారి కూతురి పెట్టె లోపల సగం, పైన వేళ్ళాడుతూ సగం కత్తిరించిన జుట్టు కనిపించింది. అప్పుడు మా చిట్టెన్ రాజు బాబయ్య, మా నాన్న గారు పంచాయితీ పెట్టి, ఆ పెట్టె తాళం తీయిస్తే ఆ దొంగతనం బయట పడింది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళలో అందరూ నగలు పెట్టుకుని వెళ్ళడం, ఇలా దొంగతనాలు జరగడం పరిపాటే !

ఇక …ముఖ్యమైనది అని చెప్పను కానీ ….మూడో కారణం నా జన్మలో నేను చూసిన మొట్ట మొదటి భోగం మేళం పెద్దాపురం అమ్మరసు పెళ్లి లోనే! ఆ రోజుల్లో పెళ్లి అనగానే మొట్ట మొదట చూసేది ఏ ఊరి బేండ్ మేళం, ఏ ఊరి భోగం మేళం, ఏ ఊరి వంటవాళ్లు మొదలైన హంగులే. అందులో కాకినాడ లేదా రాజమండ్రి బేండ్ మేళం, కోనసీమ వంటవాళ్లు పేరున్న వాళ్ళు అయితే మా ప్రాంతాలలో పెద్దాపురం భోగం మేళం చాలా ప్రసిద్ధమైనది. పెళ్లి ముందు రోజు రాత్రి ఊరేగింపు లో పల్లకీ బోయీలు, బేండ్ మేళం లో ఉన్న మంగలి వారు చమ్కీ గుడ్డలు వేసుకుని హుషారైన పాటలు వాయిస్తూ ఉంటే పది, పది హేను మంది అమ్మాయిలు సినిమా పాటలకి డేన్స్ చేస్తూ పెళ్లి వారికి వినోదం కలిగించే వారు. ఇప్పుడు ఇదంతా ఏదో సినిమా సీను లా అనిపించ వచ్చు నేమో అది ఆ రోజుల్లో అక్షరాలా నిజంగా అలాగే జరిగేది.

ఇక పెళ్లి వారిలో వయసు లో ఉన్న యువకులు ఈ మేళం వాళ్ల లో బావున్న యువతుల చేత ప్రెవేటు గా రికార్డింగ్ డేన్సులు ..సినిమాల లో లాగా….చేయించుకునే వారుట…నేను అవేమీ చూడ లేదు కానీ, పెట్రోమేక్స్ లైట్ల వెలుగులో మేళం వాళ్ళ డేన్స్ లు అప్పుడే మొట్టమొదటి సారి చూశాను కానీ అంత కంటే ఎక్కువ విశేషాలేమీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ పెళ్ళికి రెండేళ్ళ ముందు పోయిన మా తాత గారి కోరిక మీద మా పెద్దమ్మరసు పెళ్ళీ, మా మేనత్తల అందరి కూతుళ్ళ పెళ్ళిళ్లూ మా అమ్మా, నాన్న గారి చేతుల మీదుగానే జరిగాయి. పెళ్లి కి కావలసిన దినుసులన్నీ మా పొలంలో పండినవే! అన్నట్టు అప్పుడు ధాన్యం ధర “అక్కుళ్ళు” కుంచం ఒక రూపాయి.. బస్తాకి 16 రూపాయల 2 అణాలు. వెల్లుల్లి పాయలు 2 వేసెలకి 2 రూపాయల 10 అణాలు. తాపీ మేస్త్రీ కూలి రోజుకి 2 రూపాయలు. మా పెద్దన్నయ్య నాకూ, మా తమ్ముడికీ కొనిపెట్టిన 4వ క్లాసు ఎక్సెర్సైజ్ పుస్తకాలు – 100 పేజీలు  – 4 పుస్తకాలు కలిసి 2 రూపాయల 3 అణాలు. 50 తారాజువ్వలు 1 రూపాయి 8 అణాలు. తాటాకులు వందకి 1 రూపాయి 10 అణాలు. అదే పెళ్లి లో గాడి పొయ్యి లోంచి కొన్ని పెద్ద నిప్పు కణికెలు పైకి ఎగరగానే పై కప్పు అంటుకుంది అనీ, వెంటనే బిందెలతో నీళ్ళు జల్లి మంటలు ఆర్పేశారు అనీ కూడా చూచాయగా నాకు జ్జాపకం.

సుదర్శనం పిన్ని, సాంబశివ రావు

సుదర్శనం పిన్ని, సాంబశివ రావు

పెద్దాపురం అనగానే, ఇప్పుడు అప్రస్తుతమే కానీ ఇటీవల మరణించిన అంజలీ దేవి టెంకి జెల్ల విషయం జ్జాపకం వస్తోంది. అంజలీ దేవి ఇల్లు పెద్దాపురం లో మా మేనత్త గారి ఇంటి పక్కనే. నా చిన్నప్పుడు …నా వయసు పదకొండో, పన్నెండో….సువర్ణ సుందరి సినిమా తరువాత….నేను బహుశా వేసవి శలవులకో..మరెందుకో ….పెద్దాపురం మా మేనత్త గారి ఇంటికే వెళ్లాను. ఆ మర్నాడే అంజలీ దేవి తన ఇంటికి పెద్దాపురం వచ్చింది అని తెలిసింది. ఇక చూసుకోండి. నేను ఆ సాయంత్రం ఆ మేనత్త గారి మేడ మీదకి వెళ్లి పోయి, అంజలీ దేవి ఇంటి పెరడు కేసి చూస్తూ , పచార్లు చేస్తూ “పిలువకురా, అలుగకురా..” అనో గొంతెత్తి పాడేస్తూ ఎలాగో అలాగా ఆవిడ కనపడుతుందేమో అనో ఓవర్ ఏక్షన్ చేసేశాను. ఆ మర్నాడు అంజలీ దేవి మా మేనత్త గారి ఇంటికి వచ్చి, “నిన్న సాయంత్రం ఆ గొడవంతా నువ్వేనా?” అని నన్ను దగ్గరకి తీసుకుని ఒక మొట్టి కాయ వేసింది. అంజలీ దేవి చేత మొట్టి కాయ వేయించుకున్న అభిమానిని నేనొక్కణ్ణే అని నాకు భలే గర్వంగా ఉంటుంది…

సినిమాలు అనగానే నేను నా పదేళ్ళ వయస్సులో..అంటే ఏడాది అటూ, ఇటూ చూసిన సినిమాలు “వద్దంటే డబ్బు- భానుమతి, నాగేశ్వర రావు సినిమా”, టేక్సీ డ్రైవర్, “సంఘం (వైజయంతీ మాల), “అగ్గి రాముడు”, పరివర్తన, జాతక ఫలం, దో బీగా జమీన్, విప్రనారాయణ…మొదలైనవి.

ఒక తమాషా జ్జాపకం…..ఆ రోజులల్లో ఒక సారి మా నాన్న గారు కాకినాడ రామారావు పేటలో ఉండే సున్నపు గానుగు వాడి దగ్గర ఒక ఎద్దు కొని పొలం పంపించారు. దాన్ని బండి లాగడానికి కట్టగానే అది అలవాటు ప్రకారం బండి ని గుండ్రం గా తిప్పడం మొదలెట్టింది….ఆ అలవాటు మాన్పించి ఆ ఎద్దుని తిన్నగా నడిపించడానికి మా పాలికాపులు నానా అవస్తా పడుతుంటే మేము నవ్వు ఆపుకోలేక పోయేవాళ్ళం పది రోజుల పాటు…..

ఈ రోజులల్లో మన జీవితాలు కూడా చాలా మటుకు గానుగెద్దు జీవితాలలాంటివే కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు …….మరి మీకో?

-వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

బాగా చిన్నప్పుడు ..భలేగా ఉండేది కాబోలు!

నా చిన్నప్పటి ఫోటో

నా చిన్నప్పటి ఫోటో

వారం, పది రోజుల పాటు ఎంత బుర్ర గోక్కున్నా, గీక్కున్నా నాకు పదేళ్ళ వయస్సు దాకా జరిగిన సంఘటనలు గుర్తుకు రావడం అంత తేలిక కాదు అని తెలిసిపోయింది. ఇక మెదడులో సరుకుని పూర్తిగా నమ్ముకుంటే లాభం లేదు అనుకుని ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని వెతికితే అలనాటి ఫోటోలు మూడంటే మూడే దొరికాయి. ఇందులో నా అత్యంత చిన్నప్పటి ఫోటో ఈ క్రిందన పొందుపరిచాను. ఇది ఖచ్చితంగా మా పెద్దన్నయ్యే తీసి ఉంటాడు. అప్పుడు నాకు రెండు, మూడు ఏళ్ళు ఉంటాయేమో….గుర్తు లేదు. కానీ ఫోటో చూడగానే “భలే క్యూట్ గా “ ఉన్నాను సుమా అని ఇప్పటి వాడుక మాటా”, “చంటి వెధవ ముద్దొస్తున్నాడు సుమా” అని ఆ రోజుల నాటి ప్రశంసా నాకు నేనే చెప్పుకున్నాను.

ఆ రోజుల్లో యావత్ కాకినాడ నగరం మొత్తానికి బహుశా పదో, పదిహేనో “డబ్బా” కెమెరాలు ఉండి ఉంటాయి. కలర్ ఫోటోలు, విడియోలు, టీవీలు, కంప్యూటర్లు వగైరా వస్తువులే కాదు, ఆ పదాలే ఆంద్రులకి, ఆ మాట కొస్తే భారతీయులకే తెలియవు. “అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న కంప్యూటర్ పవర్ అంతా కలిపితే ఈ నాడు ఒక చిన్న పిల్లాడు ఆడుకునే బొమ్మ లో ఉంది” అని నేను పుట్టిన సంవత్సరం గురించి ఎక్కడో చదివి సిగ్గు పడ్డాను. నమ్మండి, నమ్మక పొండి, సరిగ్గా నేను పుట్టిన నాడే జపాన్ వాళ్ళు చేతులెత్తేసి, అమెరికాతో యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు పెట్టేసి రెండవ ప్రపంచ యుద్ధం అంతం చేశారు. బహుశా ఈ “క్యూట్” ఫోటో తీసిన ఏడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఎప్పటికీ నా వయస్సు పదహారే!

ఇది కాక మరొక ఫోటో కూడా ఉంది. అది కూడా ఇక్కడ జత పరుస్తున్నాను. కానీ ఇందులో ఉన్న పిల్లాడు నేనో, మా తమ్ముడో (ఆంజి అనబడే హనుమంత రావు, కేలిఫోర్నియా నివాసి) ఖచ్చితంగా తెలీదు. కవల పిల్లలం కాక పోయినా, అలాగే పెరిగాం కాబట్టి మా ఇద్దరిలో ఎవరైనా పరవా లేదు కానీ ఆ ఫోటో ఉన్నది నేనే అవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రెండు ఫొటోలలోనూ ఆ మెడలో ఉన్న మూడు పేటల చంద్ర హారం. మా అమ్మ ఎప్పుడూ ఆ హారం వెయ్యకుండా నన్ను ఎక్కడికీ పంపించేది కాదుట. మరొక క్లూ ఏమిటంటే ఆ పక్కన నుల్చున్న అమ్మాయి మటుకు మా “దొంతమ్మూరు బేబీ” యే.

దొంతమ్మూరు బేబీతో

దొంతమ్మూరు బేబీతో

నా వయసుదే అయిన ఆ అమ్మాయి అసలు పేరు “వెంకట రత్నం” అని బహుశా తనకి కూడా గుర్తు ఉంది ఉండదు ఎందుకంటే ఇప్పటికీ తనని అందరూ “బేబీ” అనే పిలుస్తారు. ఈ బేబీ మా మూడో మేనత్త కుమార్తె బాసక్క (వరసకి వదిన కానీ బాసక్క అనే పిలిచే వాళ్ళం) పెద్ద కూతురు. పిఠాపురం లో రాయవరపు వారి దౌహిత్రురాలు అయినప్పటికీ బేబీ పుట్టుక, పెంపకం అన్నీ కాకినాడలో మా ఇంట్లోనే జరిగాయి. చిన్నప్పటి నుంచీ కలిసి మెలిసి పెరిగిన మేం ఇద్దరం ఐదో తరగతి దాకా ఒకటే క్లాసు లో చదువుకున్నాం. అందుచేత మా ఇద్దరికీ కలిపి ఒక ఫొటో మా పెద్దన్నయ్య తీసి ఉంటాడు. ఈ ఫోటోలో కూడా ‘చతికిల పడినా క్యూట్” గా ఉన్నాను అనే అనుకుంటున్నాను.

 

నా పుట్టువెంట్రుకలు

నా పుట్టువెంట్రుకలు

ఇక నాకు ఏ మాత్రం గుర్తు లేక పోయినా, నా చిన్నప్పటి ఫోటోలలో చాలా అపురూపమైనది నా పుట్టువెంట్రుకల నాటి ఫోటో. ఆ “పండగ” మా తాత గారు బతికుండగానే జరిగింది. అప్పుడు నా వయసు ఐదారేళ్ళు ఉండ వచ్చును. నా వెనకాల నుంచున్నది మా అక్క మాణిక్యాంబ. మా అక్కకి ఒక పక్కన ఉన్నది మా అమ్మమ్మ బాపనమ్మ, రెండో పక్కన మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. వారిద్దరి తోటీ నాకున్న ఏకైక ఫోటో ఇదే! ఇక నాకు “మొదటి క్షవరం “ చేస్తున్న వాడు మా ఆస్థాన మంగలి రాఘవులు. కాకినాడలో ఎవరికీ క్షవర కల్యాణం కావాసి వచ్చినా, పండగలూ, పబ్బాలకీ రాఘవులు దొంతమ్మూరు గ్రామం నుంచి రావలసినదే! బహుశా 1950-51 నాటి ఆ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. ఇలాంటిదే మరొక ఫోటో కూడా ఉండేది కానీ ఇప్పుడు కనపడడం లేదు. అందులో వెనకాల మా తాత గారు చుట్ట కాల్చుకుంటూ నా పుట్టు వెంట్రుకల పండగ చూస్తూ ఉంటారు.

ముందే మనవి చేసుకున్నట్టు, ఏవేవో పండగలు, పురుళ్ళు, వ్రతాలు, వచ్చే పోయే బంధువులతో ఇల్లంతా ఎప్పుడూ హడావుడిగా ఉండేది అని తప్ప నాకు పదేళ్ళ లోపు జ్జాపకాలు ఎక్కువ లేవు. అలా గుర్తు చేసే ఆధారాలూ ఎక్కువ లేవు. ఆఖరికి నాకు అక్షరాభ్యాసం జరిగిన సంగతి కూడా గుర్తు లేదు కానీ నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ చదువుకున్న “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” వివరాలు బాగానే గుర్తున్నాయి. ఆ స్కూలు గాంధీ నగరం పార్కుకి నైరుతి వేపు ఎల్విన్ పేట లో ఉంది. మా ఇంటి నుంచి రోడ్డు మీద నడిచి వెడితే పదిహేను నిముషాలు పడుతుంది కానీ, మా చిన్నప్పుడు ఎదురుగుండా గిడ్డీ గారి సందు లో, మా భాస్కర నారాయణ మూర్తి తాతయ్య గారి ఖాళీ స్థలం (కపిలేశ్వరపురం జమీందారులు, రాజకీయ ప్రముఖులు ఎస్..పి.బి.పి పట్టాభి రామారావు & సత్యనారాయణ రావు ల ఇంటి వెనకాల) ,     ప్రహరీ గోడ మధ్య కన్నం లోంచి దూరి వెడితే ఐదు నిముషాలు మాత్రమే పట్టేది.

నేనూ, ఆంజీ, బేబీ ప్రతీ రోజూ, బిల బిల లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ హాయిగా స్కూలికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడూ “నేను వెళ్ళను” అని భీష్మించుకుని కూచున్నట్టు అంతగా జ్జాపకం లేక పోయినా, కొన్ని సందర్భాలలో మా “సున్నారాయణ” గాడు బలవంతాన భుజాల మీద మోసుకుని స్కూల్ లో నేల మీద కూచోబెట్టినట్టు లీలగా గుర్తు ఉంది ఇప్పటికీ. నా ఐదో ఏట 1950 లో ఆ “ఆనంద పురం పురపాలక ప్రాధమిక పాఠశాల లో ఒకటో తరగతిలో ప్రవేశించి, ఐదో తరగతి దాకా చదువుకున్నాను.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

అవును…..అప్పుడు ఆ స్కూల్ లో బెంచీలు లేవు. రెండు గదులు. రెండు వరండాలు. అంతే! వెనకాల అంతా ఇసక పర్ర. ఒకటి నుంచి ఐదో తరగతి దాకా అందరూ నేల మీదే కూచుని చదువుకోవల్సినదే! అత్యంత విచారకరం ఏమిటంటే, ఇప్పుడు పరిస్థితి అంత కంటే అన్యాయం గా ఉంది. ఇప్పటికీ అందరూ నేల మీద కూచునే చదువు కుంటున్నారు. అది తప్పు అని కాదు కానీ ఆ చిన్న భవనమూ, మొత్తం వాతావరణం ఇప్పుడు దయనీయంగా ఉంది అని ఇటీవల నేను కాకినాడ వెళ్లినప్పుడు గమనించిన విషయం. ఇటీవల నేను తీసుకున్న రెండు ఫోటోలు ఈ క్రింద పొందుపరిచాను. ఒకటి ఇప్పటి హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారూ, కొందరు పిల్లలతో. ఇంకొకటి నేను స్కూలు గుమ్మం దగ్గర భయం, భయం గా నుంచొని ఉన్న ఫోటో.

ఇప్పటి సంగతి నాకు తెలియదు కానీ, మా చిన్నప్పుడు ఆ ప్రాధమిక పాఠశాల లో టీచర్లు అందరూ క్రిస్టియనులే! దీనికి బహుశా ఎల్విన్ పేట లో ఒక చర్చి ఉండడం , ఆ పేటలో క్రైస్తవ జనాభా ఎక్కువ ఉండడం ప్రధాన కారణం. పైగా అందరూ ఆడవాళ్లే. అందరి పేర్లూ మేరీ, సుగుణ, కరుణ లాంటివే! మేం అందరం “జాని జోకర్ బజా, బజాతా, రీ,రీ, రీ,రీ సితార్ బజాతా”, “జాక్ అండ్ జిల్ వెంటప్ ది హిల్” లాంటి పాటలు ఎంతో హుషారుగా నేర్చుకునే వాళ్ళం. “వందే మాతరం” ఇంచు మించు జాతీయ గీతం స్థాయి పాటలా ప్రతీ రోజూ పాడే వాళ్ళం.

దసరా సమయంలో “పప్పు బెల్లాలకి” లోటుండేది కాదు. రిపబ్లిక్ డే కి, స్వాతంత్ర్య దినోత్సవానికి మ్యునిసిపల్ ఆఫీసు ప్రాంగణంలో జండా వందనం తరువాత బిళ్ళలకీ లోటు ఉండేది కాదు. “ఆ గిడ్డీ వెధవ” ని –అంటే కిరస్తానీ వాడిని అనమాట ….తోటలోకి తప్ప ఇంట్లోకి రానివ్వకండిరా అని ఎప్పుడైనా మా ఇంట్లో ఎవరైనా అరిచినా, ఎవ్వరూ లక్ష్యపెట్టే వారు కాదు. ఎటువంటి మత, కుల తారతమ్యాలూ అంటని ఆ వయసు అటువంటిది. మనిషి ఎదిగిన కొద్దీ కుల, మత కల్మషం పెరుగుతుందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నమ్మండి, నమ్మక పొండి, నా మటుకు నాకు అమెరికా వచ్చే దాకా ఈ కులాల ప్రభావం, ప్రాంతాల ప్రాబల్యం మన వారిలో ఇంత ప్రస్ఫుటంగా జీర్ణించుకు పోయింది అని తెలియ లేదు. ఇప్పుడు తెలిసినా చెయ్యగలిగింది ఏమీ లేదు అని కూడా తెలిసింది.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్  మాస్టర్ తో

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ తో

ఆఖరి అంశంగా ….నాతో సహా, ఆ రోజు చూసిన వాళ్ళందరికీ ఇంకా కళ్ళకి కట్టినట్టు ఉన్నదీ, చూడని వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చూసిన వాళ్ళు వర్ణించి పదే, పదే చెప్పి నవ్వుకునేది నా బాగా చిన్నప్పుడు కేవలం ఐదు నిముషాలలో అయిపోయిన ఒక దీపావళి పండగ. అప్పుటికి మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. నాకు మహా అయితే ఆరేళ్ళు ఉంటాయి కానీ ఆ దీపావళి ఇంకా జ్జాపకమే! యధాప్రకారం మా అన్నయ్యలు, స్నేహితులు ఇంట్లోనే ఒక నెల పాటు చిచ్చుబుడ్లు, మతాబాలు, తారా జువ్వలు తయారు చేసే వారు. అవి తయారు చేసే పద్ధతీ, కావలసిన వస్తువులు అన్నీ మా తాత గారి స్వహస్తాలతో ఉన్న ఒక పెద్ద తెలుగు పుస్తకంలో ఉండేవి.

నేను పెద్దయ్యాక కూడా కొనసాగిన ఆ తయారీలో రసాయనాలు, వస్తువులలో నాకు బాగా గుర్తున్నవి భాస్వరం, పచ్చ గంధకం, బొగ్గు, సూర్యాకారం, అభ్రకం ముక్కలు, గన్ పౌడర్, ఎర్ర పువ్వులు రావడానికి రాగి రవ్వ, ఇనప రవ్వ, జిల్లేడు బొగ్గు, ఆముదం, జిగురులావాడే మెత్తటి అన్నం, చిన్న, చిన్న ముక్కలుగా చింపేసిన చెత్త కాగితాలు, న్యూస్ పేపర్లు మొదలైనవి. ఆ రోజు ఇంట్లో చేసినవి కాకుండా బజారు నుంచి ఇంట్లో చెయ్య లేని, చెయ్యనివ్వని టపాసులు, సిసింద్రీలు, కాకర పువ్వొత్తులు ఇంటి నిండా ఉన్న యాభై మంది చిన్నా, పెద్ద లకీ సరిపడా బాణ సంచా సామగ్రి కొనుక్కొచ్చారు. వీటిల్లో బాంబులు, తారాజువ్వల లాంటి యమా డేంజరస్ సామాగ్రి పిల్లలకి అందకుండా ఎక్కడో దూరంగా పెట్టి, మిగిలిన సరదా మందు గుండు సామాగ్రి అంతా మా తాత గారు కూచునే నవారు మంచం క్రింద జాగ్రత్తగా పేర్చి పెట్టారు. అక్కడికి దగ్గరగా పది, పదిహేను బిందెలలో నీళ్ళు తోడి రెడీగా ఉంచారు ప్రతీ దీపావళి కీ లాగానే!

ఇక పిల్లలు అందరూ వత్తులు కట్టిన గోంగూర కట్టలు తీసుకుని, వత్తులు వెలిగించి, “దిబ్బూ, దిబ్బూ, దీపావళీ” అని నేల కేసి మూడు సార్లు కొట్టి వత్తులు ఆర్పేసి మా తాత గారి దగ్గరకి పరిగెట్టగానే ఆయన ఒక మతాబా యో, కాకర పువ్వోత్తో వాళ్ళ సైజు ని బట్టి ఇచ్చే వారు. అందరిలోకీ అగ్ర తాంబూలం అప్పటికీ, ఇప్పటికీ మా అక్కదే. మా అక్కని “అమ్మరసు” అనీ “చిన్న అమ్మరసు” అనీ పిలిచే వారు. పదేళ్ళ మా అక్క వెళ్ళగానే మా తాత గారు ఒక మతాబా ఇచ్చారు. అది వెలిగించి మహోన్నతంగా, అత్యంత మనోహరంగా వెదజల్లుతున్న ఆ పువ్వుల మతాబాని మా అక్క అనుకోకుండా, ఏదో అంటూ మళ్ళీ మా తాత గారి మంచం దగ్గరకి వెళ్లింది…అంతే……ఆ నిప్పు రవ్వలు మంచం కింద పెట్టిన మొత్తం దీపావళి సామాగ్రి మీద పడి అన్నీ ఒకే సారి అంటుకుని మంటలు, పేలుళ్లు, సిసింద్రీలు పరిగెట్టడాలు… ఒకటేమిటి అన్ని రకాల వెలుగులూ, చప్పుళ్ళతో అంతా అరక్షణం పట్ట లేదు…దీపావళి హడావుడికి.

అప్పటికే ఎనభై ఐదేళ్ళ మా తాత గారు మంచంమీద నుంచి చెంగున గంతేసి ఆయన గది లోకి పరిగెట్టారు. మా చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మిగిలిన పెద్ద వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిందె తీసుకుని మంచం క్రిందకి నీళ్ళు విసిరేసి మొత్తానికి మంటలు అదుపు లోకి తెచ్చారు. ఆ ఏడు మొత్తం దీపావళి పండుగ అంతా ఐదు నిముషాల లోపే అయిపోయింది. మా కుటుంబంలో ఎప్పుడైనా అందరం కలుసుకున్నప్పుడు దీపావళి టాపిక్ వస్తే ఈ అంశం అందరం తల్చుకుని నవ్వుకుంటూ ఉంటాం.

అన్నట్టు “అమ్మరసు” అనే ఆ తెలుగు పిలుపు, అందులోని ఆప్యాయత అంటే ఎంత ఇష్టమో. మా అక్క “చిన్న అమ్మరసు” ఎందుకు అయిందంటే .. …మా ఆఖరి మేనత్త రెండో కూతురుని “పెద్దాపురం అమ్మరసు” అనీ పెద్దమ్మరసు” అనీ పిలిచే వారు. అసలు పేరు నాకు తెలియదు కానీ నేను నా చిన్నప్పుడు ….నవంబర్ 19, 1953 నాడు “అమ్మరుసొదిన” పెళ్ళికి పెద్దాపురం వెళ్లాను. నాకు భలేగా గుర్తున్న ఆ పెళ్లి జ్జాపకాలూ, పెళ్లి మేళం (???) గురించీ మరో సారి వివరిస్తాను…..

– వంగూరి చిట్టెన్ రాజు

మా సత్తెమ్మ తల్లీ, గుళ్ళూ, గోపురాలూ

chitten raju

మా చిన్నప్పుడూ, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మేము శేరీ పొలం వెళ్ళినా, మొట్టమొదట చేసే పని, చెరువు గట్టు ఎదురుగా రావి చెట్టు క్రింద ఉన్న మా  సత్తెమ్మ తల్లికి మనసారా దణ్ణం పెట్టడం. ఆ తరవాతే పొలం లోకి అడుగుపెట్టినా, ఏ పనులు చేసినా.

ఈ సత్తెమ్మ తల్లి  ని ఎవరు ఎప్పుడు ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు కానీ మా లోకారెడ్డి వారి చెరువా ఇస్తువా పంపు అనే శేరీ 1920 లలో మా తాత గారు కొన్నప్పటి నుంచీ, గ్రామాలకి గ్రామ దేవతలా ఈ సత్తెమ్మ తల్లే మా పొలాలకి అధిదేవత. రాతి రూపంలో పసుపు కుంకుమల తో ఉన్న ఈ అమ్మ వారికి రోజూ దీపం పెట్టడం, పూజలు చెయ్యడం లాంటి పూజా పునస్కారాలు ఉండవు.  కానీ ఏడాది పొడుగునా జరిగే విత్తనాలు జల్లి నారు పొయ్యడం, నాట్లు వెయ్యడం, కలుపు తీత, ఎరువులు వెయ్యడం, కోతలు, గడ్డి  కుప్పలు వెయ్యడం, కళ్లం తయారు చెయ్యడం, కుప్ప నూర్పులు, ఆరబెట్టడం, కాటా వేసి రైస్ మిల్లర్లకో వర్తకులకో అమ్మకం చేసి డబ్బు రూపేణా ఫలసాయం పొందే దాకా జరిగే ఏ పని మొదలుపెట్టేటప్పుడైనా సత్తెమ్మ తల్లికి పూజ చేసి, కోడిని కోసి ఆశీస్సులు తీసుకోవడం మా తరతరాల ఆచారం.

ఇక పండగల సమయంలో, ముఖ్యంగా పెద్ద పండగ అయినా, మా పాలికాపుల ఇళ్ళలో పెళ్లి లాంటి ఏ శుభకార్యం జరిగినా మేక ని కొయ్యడం కూడా మా పాలికాపుల ఆచారం.  ఇలా కొలిచిన దానికి  ప్రతిఫలంగా సత్తెమ్మ తల్లి మా పొలం లో ఏ విధమైన దొంగ తనాలు, తప్పుడు పనులు జరగకుండా కాపాడుతుంది అని ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలలోనూ, మా కుటుంబానికీ నమ్మకం. నాకు తెలిసీ ఇప్పటి దాకా ఒక్కటంటే ఒక్కసారి కూడా ఏ విధమైన దొంగతనం అనేది జరగ లేదు.  ఇటీవల నేను అక్కడికి వెళ్లినప్పుడు మా సత్తెమ్మ తల్లికి దణ్ణం పెడుతూ తీయించుకున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి..మా పిల్లలతో సహా….ఎవరికైనా చూపిస్తే ..ఆ మాట కొస్తే కొంత మంది పెద్ద వాళ్ళు కూడా నవ్వుతారేమో నాకు తెలియదు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.నా యిచ్చయే గాక నాకేటి ఎరవు?” అన్నాడు కృష్ణశాస్త్రి.

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

మా సత్తెమ్మ తల్లికి సంబంధించి రెండు సంఘటనలు నాకు ఇంకా గుర్తున్నాయి. మా చిన్నప్పుడు వేసవి కాలంలో రాత్రి నూర్పులు అయ్యాక ధాన్యం కుప్పలు గా వేసే వారు. కుప్పకి సుమారు పాతిక బస్తాల చొప్పున చాలా కుప్పలే ఉండేవి. అప్పుడు నాకూ, మా తమ్ముడికీ, తన పెద్ద బావమరిది వెంకట్రావుకీ ఒక ప్రధానమైన డ్యూటీ వేసేవాడు. అదేమిటంటే ఆ కుప్పలన్నింటి మీదా ఆంజనేయ స్వామి ముద్రలు వెయ్యడం. అంటే మా పొలాలకి ఆంజనేయ స్వామిని అందంగా చెక్కిన ఒక రాజ ముద్రిక ఉండేది. ప్రతీ ధాన్యం కుప్ప మీదా మూడు వరసలలో , ఒక్కొక్క వరసకీ ఐదారు చొప్పున  అర చేతి సైజు లో ఉండే మట్టి పిడకలని మా ఉద్దారుడు…అంటే పెద్ద పాలికాపు….జాగ్రత్తగా సరి అయిన పద్ధతిలో  అతికించే వాడు. ఇక్కడ టెక్నాలజీ ఏమిటంటే ఎవరైనా ఆ కుప్పలో పై నుంచి కానీ, కింద నుంచి కానీ ధాన్యం లాగేస్తే ఈ మట్టి పిడక కిందకి పూర్తిగా జారి పోవడమో, కొంచెం చితికి బీటలు పడడమో జరిగి ఎవరు దొంగతనం చేశారో తెలియక పోయినా ఖచ్చితంగా ధాన్యం దొంగతనం జరిగినట్టు తెలిసిపోతుందన్న మాట.

అందు చేత ఈ పిడకల “ప్లేసింగ్” ని మా పెద్దన్నయ్య స్వయంగా పర్యవేక్షించే వాడు.  కొంచెం దైవ భయం కూడా  జోడించడానికి  కొంచెం తడిగా ఉండే ఈ పిడకల మీద ఆంజనేయ స్వామి ముద్ర “అద్దే” వాళ్ళం. ““అద్దే” వాళ్ళం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే,  ఆ ముద్ర గట్టిగా కొడితే మట్టి పిడక చితికిపోతుంది. మరీ సున్నితంగా కొడితే ఆంజనేయ స్వామి కనపడడు.

ఇక ప్రతీ కుప్పా కళ్ళం లో నేల మీద పది, పదిహేను అడుగుల వృత్తులాకారంలో ఉండి ఐదారు అడుగులు ఎత్తు ఉండేవి. ఒక సారి కొత్తగా పని లోకి వచ్చిన ఒక కుర్ర కూలీ అత్యంత లాఘవంగా ప్రతీ కుప్ప నుంచీ ఎక్కడా ఈ “సెక్యూరిటీ” పిడకలు ఏ మాత్రం కదలకుండా కొంచెం ధాన్యం చొప్పున  అన్ని కుప్పల నుంచీ కలిపి అర బస్తాడు ధాన్యం దొంగతనం చేసి మసక చీకట్లో పారిపోతూ మా పొలం సరిహద్దుల దగ్గరకి రాగానే కాలు జారి కాలవ లో పడి లేవలేక పోయాడు. ఐదారు గంటల తరువాత మా పాలికాపులు అతన్ని చూసి బైటకి తీసి దొంగతనం చేస్తున్నాడని తెలుసుకున్నారు. ఇక ఆ చుట్టు పక్కల అన్ని గ్రామాల లోనూ “రామం గారి శేరీ లో దొంగతనం చెయ్యబోతే వాణ్ణి సత్తెమ్మ తల్లి పొలం సరిహద్దులు దాటనియ్యకుండా కట్టి పడేసింది” అని నిస్సంకోచంగా నమ్మారు.

మా ఇంట్లో భోజనం చేస్తున్న కొందరు రైతులు

ఈ ఉదంతం బహుశా “దివాణం” గారి హయాం ..అంటే  మా నాన్న గారి హయాం లోనే జరిగినా, హేతువాద దృష్టిలో ఈ సంఘటన కేవలం కాకతాళీయమే అయినా, గత ఎనభై ఏళ్లగా మా పొలంలో అతి చిన్న దొంగతనం కూడా జరగక పోవడం మా సత్తెమ్మ తల్లి రక్షణే అని అందరి నమ్మకం.  అంతెందుకు,  మా “చిన్న దివాణం” హయాంలో ..అంటే మా పెద్దన్నయ్య హయాంలో ఒక సారి ఒక నక్సలైట్ తుపాకీ తో పొలంలో మా మకాం కి వచ్చి , ఏడాదికి పది వేలు ఇవ్వక పోతే రక రకాల ఇబ్బందులు పెడతానని బెదిరించాడు. అప్పుడు మా రైతులు సత్తెమ్మ తల్లి గురించి వివరంగా చెప్పి, దమ్ముంటే మళ్ళీ శేరీ లో అడుగుపెట్టమని ఛాలెంజ్ చెయ్యగానే దేవుళ్ళనీ , దేవతలనీ నమ్మని ఆ నక్సలైట్ కూడా మళ్ళీ  మా పొలం చుట్టుపక్కలకి రాలేదు.

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

ఇదంతా చదివి మా వంగూరి వారు గ్రామ దేవతల దగ్గర నుంచీ మనకున్న కోటానుకోట్ల  దేవదేవుళ్ళందరినీ ఆరాధించేస్తూ విపరీతమైన దైవ భక్తులు అని అనుకుంటే “తప్పులో కాలేసినట్టే”.  నాకు తెలినంత వరకూ మాకు మా ప్రాంతాలలో సాధారణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే స్థాయి లోనే మా దైవిక పరమైన వ్యాపకాలు ఉండేవి. ఇంచు మించు అన్నీ పండగలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు , పేరంటాల చుట్టూ తిరిగినవే.  మతపరమైన అంశాలలో ఎక్కడా “ఓవర్ ఏక్షనూ” లేదు. అలా అని ఆధిక్షేపణ అంతకంటే  లేదు. ఇంటా, బయటా సరి అయిన మోతాదులోనే ఉంటాం.  మా పూర్వీకుల విషయం నాకు స్పష్టంగా తెలియదు కానీ వారు తణుకు దగ్గర సిద్దాంతం గ్రామ కారణాలుగా ఉండే సమయంలో …అంటే 1690 సంవత్సరం ప్రాంతాల నాటి సూరప రాజు  గారి హయాంలోనే, ఆ తరువాతనో మా ముత్తాతలు ఒక వినాయకుడి గుడి కట్టి ఆలయ అర్చకులకి జీవనోపాధికి ఇచ్చారుట.

నేను సుమారు పదేళ్ళ క్రితం మొట్టమొదటి సారిగా మా పూర్వీకుల అన్వేషణలో అక్కడికి వెళ్లి  ఆ గుడి చూశాను. అప్పుడు చాలా పురాతనంగా ఆ గుడి పై భాగంలో “వంగూరి వారు కట్టించి ఇచ్చిన ఆలయము” అని సంవత్సరం కూడా వ్రాసి ఉంది కానీ చదవడానికి వీలులేని స్థితి లో ఉంది. క్రిందటేడు ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మళ్ళీ సిద్దాంతం వెళ్లాను. ఇప్పుడు పురాతన కట్టడాన్ని నిర్మూలించి ఆ గుడిని ధర్మకర్తలు పున:నిర్మాణం చేసి ఆనాటి ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేశారు. మూడు దశాబ్దాల క్రితం నాటి “వంగూరి వారి వినాయకుడి గుడి”  ఈ నాటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

ఇక మా తరానికి వస్తే, ఐదారేళ్ళ క్రితం మా పొలానికి ఆనుకుని ఉన్న చిన జగ్గం పేట  గ్రామంలో ఆ పెద్దన్నయ్య కృష్ణుడి గుడి కట్టించడం చెప్పుకో దగ్గ విశేషమే!  ఈ గుడి కట్టించడానికి మా పెద్దన్నయ్య దైవ భక్తి చిన్న కారణం కానీ అంత కంటే ముఖ్య కారణాలు వేరే ఉన్నాయి.  ఈ చిన జగ్గం పేట  వెయ్యి గడపల గ్రామంలో ఉప్పర్లు, మాలలు, గొల్లలు సమ సంఖ్యలో ఉంటారు. ఈ మూడు కులాల వారు అనేక తరాల నుంచీ మాతో బాటు మా  పొలాన్నే నమ్ముకున్న వాళ్ళే. గత అరవై, డభై ఏళ్లగా మేము ఎప్పుడైనా ఏ పెళ్ళిళ్ళ కొ, చదువులకో కొంత పొలం అమ్మినా, వీళ్ళలో ఏదో ఒక కులం వారు సమిష్టిగా కొనుక్కుని ఇప్పటికీ మా శేరీ లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.  సుమారు పదిహేనేళ్ళ క్రితం అప్పటి మునసబో, మరెవరో ఆ గ్రామంలో ఒక చిన్న సీతారామస్వామి దేవాలయం కట్టించారు.  ఈ గ్రామం  లో అదే మొట్టమొదటి దేవాలయం.

రామారావు పేటలో శివాలయం

రామారావు పేటలో శివాలయం

పక్కనే ఉన్న తాటిపర్తిలో ఒక ఆలయం ఉంది కానీ, విశేషం ఏమిటంటే ఆ చుట్టూ పక్కల పది గ్రామాలలోనూ దేవుడికి దీపం పెట్టడానికి ఒక్క పూజారి కుటుంబం కూడా లేదు.  ఎందుకంటే, కరిణీకాలు రద్దు చేసెయ్యడం, పంతుళ్ళకి జీతాలు ఇవ్వక పోవడం మొదలైన రాజకీయ కారణాల వలన ప్రస్తుత  గ్రామీణ వాతావరణం  లో పొట్టపోసుకునే అవకాశాలు లేక బ్రాహ్మణ కుటుంబాలు పట్టణాలకో..ఆ మాట కొస్తే అమెరికాకో..వలస పోయారు.  ఇప్పుడు సీతారామస్వామి ఆలయం కొత్తగా చిన జగ్గం పేట లో వెలియగానే, ఎవరో ఒక పూజారి గారిని బతిమాలుకుని ఆయన తాటిపర్తిలో కాపరం ఉండేటట్టూ, రోజూ  అక్కడి గుడికీ, ఇక్కడి గుడికీ సైకిల్ మీద వచ్చి దీపం పెట్టి, ఆరాధన చేసేటట్టూ ఏర్పాటు చేశారు.

అప్పుడు ఈ గ్రామం లో ఉన్న గొల్లలు తమ కుల దైవం అయిన శ్రీ కృష్ణుడి కి కూడా గుడి కట్టిస్తే,  దాని పోషణ అంతా తాము చూసుకుంటాం అనీ, పూజారి గారికి కూడా భుక్తి గడుస్తుంది అనీ మా పెద్దన్నయ్య ని కోరారు. “తరతరాలుగా మన శేరీ నే నమ్ముకున్న  ఈ గ్రామ ప్రజల ఋణం ఇలాగైనా తీర్చుకుందాం” అనుకునీ, తన పేరు అక్కడ కలకాలం నిలబడుతుందనే సంతోషం తోటీ, తన 77 వ ఏట మా పెద్దన్నయ్య , ఆ సేతారామస్వామి గుడిలో కొత్త విగ్రహాలు పున;ప్రష్టాపన చేసి,  పక్క స్థలంలో శ్రీ కృష్ణుడి గుడి కట్టించి పుణ్యం చేసుకున్నాడు. రెండేళ్ళ క్రితం మా పెద్దన్నయ్య పోయినప్పుడు ఆ గ్రామ వాస్తవ్యులు ఆయన విగ్రహం చేయించి, గుడి ప్రాంగణంలో  పెట్టించారు. ఇందుతో ఆ గుడి, మా పెద్దన్నయ విగ్రహం దగ్గర నేనూ, ఆలయ నిర్వాహకుడి ఒకాయనతో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను.  అలాగే కాకినాడలో మా పెద్దన్నయ్య సంవత్సరీకాలకి వచ్చి భోజనం చేస్తున్న మా కొంతమంది రైతుల ఫోటో కూడా జతపరుస్తున్నాను.

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

గుళ్లూ, గోపురాల గురించి మాట్లాడుతున్నప్పుడు , మా కాకినాడ రామారావు పేట లో ఉన్న శివాలయం గురించి ప్రస్తావించకుండా ఉండ లేను.   ఎందుకంటే, నా జీవితంలో సుమారు ఇరవై ఏళ్ళు…అవును..ఇరవై ఏళ్ళు , నేను ఆ శివాలయాని కి వెళ్లి, ఏడడుగుల పొడుగున్న బక్క పలచటి ఆచారి గారు పెట్టే సాతాళించిన శనగలు తినని రోజు లేదంటే అతిశయోక్తి కానే కాదు.  ఆ శివాలయం ఇప్పటి ఫోటో ఒకటి జత పరుస్తున్నాను…ఎందుకంటే, మా చిన్నప్పుడు దేవుడి గుడిలో ఫోటోలు తీయించుకోవడం మాకు తెలియదు.  ఆ శివాలయం లోనే, ఆ వీధిలోనే ఉన్న ఈశ్వర పుస్తక భాండాగారం లోనే నేను కొన్ని వందల హరి కథలు, పురాణాలు, బుర్ర కథలు, ప్రవచనాలు విని తరించాను.

నా దృష్టి లో మానవ మేధస్సు సృష్టించిన రెండు అధ్బుతాల లో ఒకటి దేవుడు అనే సిద్దాంతం. మరొకటి ధనం. దేవుడి మీద నమ్మకమూ, డబ్బు మీద ఆశా, ఈ రెండూ తగిన మోతాదులో ఉంటేనే మన మనుగడ సమపాళ్ళలో ఉంటుంది.  నాకు ఏక్షన్ ఇష్టమే కానీ, ఓవర్ ఏక్షన్ ఇష్టం లేదు కాబట్టి నా ప్రయత్నం ఎక్కువ లేకుండానే  నా  జీవితంలో రెండిటికీ “సమ న్యాయం “ చేశాననే అనుకుంటున్నాను.

ఆ ఎండాకాలాలు రమ్మన్నా రావు కదా మళ్ళీ!

Photo0025

ఇటీవల దొంతమ్మూరులో నేను, మా అన్నయ్య, మేనల్లుళ్ళు భాస్కర్, చినబాబు

నా కంటే 13 ఏళ్ళు పెద్ద అయిన మా పెద్దన్నయ్య, పదేళ్ళు పెద్ద అయిన మా చిన్న అన్నయ్య ఇద్దరూ తెలివైన వాళ్ళే. అందుచేత మా తాత గారూ, బామ్మా గారూ వాళ్ళిద్దరినీ, కలిసి పెరుగుతున్న మా మేనత్తల కొడుకు అయిన  హనుమంత రావు  బావనీ చాలా గారాబం చేసే వారు.  అంచేత ఆ ముగ్గురూ కలిసి నానా అల్లరీ చేసే వారు… ట….అందులో నాకు బాగా జ్జాపకం  ఉన్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఒకటేమో మా చిన్నన్నయ్య ఎప్పుడూ సరిగ్గా మధ్యాహ్నం భోజనం సమయంలో మా నాన్న గారి గది పక్కనే ఉన్న ఒక పెద్ద నేరేడి చెట్టు ఎక్కి కూచునే వాడు. (ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా అస్సలు నేరేడి చెట్టు అనేదే చూడ లేదు. ఔట్ ఆఫ్ ఫేషన్ అనుకుంటాను.) ఎవరు పిలిచినా భోజనానికి వచ్చే వాడు కాదు.

ఇక అందరి భోజనాలు అయిపోయాక, మా బామ్మ గారు ఒక బంగారం తాపడం చేసిన వెండి గిన్నెలో పులుసూ, అన్నం కలిపి “ఒరేయ్ చిన్న బుజ్జీ,  రారా,  నీ కోసం బంగారం పులుసు చేశాను ..అంటే గుమ్మడి కాయ పులుసు అన్న మాట …నాకు ఆకలి వేస్తోంది రారా.” అని బతిమాలే వారు. మా తాత గారు “ఒరేయ్ ఇదిగో రా నీ కోసం సరి కొత్త అర్ధణా కాసు తెచ్చానురా” అని లంచం చూపించే వారు. అప్పుడు మా చిన్నన్నయ్య కిందకి దిగి భోజనం చేసే వాడు.

ఇక వాళ్ళు ముగ్గురుకీ..అంటే మా పెద్దన్నయ్య, చిన్నయ్యా, హనుమంత రావు బావా…  దీపావళి అంటే భలే ఇష్టం. ఇంట్లో తెలిస్తే మా నాన్న గారు తిడతారని మెయిన్ రోడ్డు  లో అప్పటి కాకినాడ లాండ్ మార్క్ అయిన సిటీ ఎంపోరియం ఎదురుగుండా ఉన్న వానపల్లి ప్రకాశ రావు కొట్టులో ఖాతా మీద .. ఐదారు వందలు పెట్టి బాంబులు, టపాసులు, తారాజువ్వలు వగైరాలు తిన్నగా బస్సులో దొంతమ్మూరు పట్టుకెళ్ళి పోయే వారు.  ఒక సారి, బహుశా తన పదిహేనేళ్ళప్పుడు,  ఒక పెద్ద బాంబుని , ఒక పెద్ద ఇత్తడి బిందె లో పెట్టి వైరు బయటకి కనెక్ట్ చేసి చెరువు గట్టు మీద పెట్టి పేల్చగానే ఆ చుట్టు పక్కల పాకల్లో ఉన్న నాలుగైదు ఆవులు, గేదెలు ఠపీమని గుండె ఆగి చచ్చి పోయాయి. మా పెద్దన్నయ్యకి రెండు చెవులూ గళ్ళు పడిపోయాయి. ఆ తరువాత జన్మంతా  వినికిడి లోపంతో ఇబ్బంది పడ్డాడు. నాకూ ఒక చెవి కి వినికిడి లోపం ఉంది కానీ ఎందుకో తెలియదు. అందుకే నేను ఎవరినీ మాట్లాడనియ్యకుండా. నేనే గడ, గడా వాగుతూ ఉంటాను….అని అనుకుంటాను.

మరొక విశేషం ఏమిటంటే, తను తెలివైన వాడే అయినప్పటికీ మా పెద్దన్నయ్య ఎస్.ఎస్.ఎల్.సీ లో ఒక సబ్జెక్ట్ లో పరీక్ష తప్పాడు. ఇక చస్తే మళ్ళీ చదవను అనీ, మళ్ళీ రెండో పరీక్షలకి వెళ్ళమని  బలవంతం చేస్తే గన్నేరు కాయలు తిని ఆత్మహత్య చేసుకుని చస్తాను అనీ అందరినీ బెదిరించాడు. అప్పటి యింకా మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. మా నాన్న గారు ఐదు వందల ఎకరాల వ్యవసాయం చేస్తూ, ప్రతీ వారం కాకినాడ-జేగురు పాడు-దొంతమ్మూరు-చిన జగ్గంపేట తిరగ లేక అలిసి పోతూ ఉన్నారు. అంచేత వారి సలహా మా నాన్న గారు మా పొలాలన్నీ మా పెద్దన్నయ్యకి అప్పగించేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇది సుమారు 1950 ప్రాంతాలలో జరిగింది. ఆ తరువాత 1983 లో ఆయన పోయే వరకూ మా నాన్న గారు మా “లోకారేడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే శేరీ పొలం” వెళ్ళ లేదు.  పొలం యాజమాన్యం అంతా మా పెద్దన్నయ్య చేతిలో పెట్టేశారు.

నేను ఎస్.ఎస్.,ఎల్. సి లో ఉండగా ..అంటే 1960 లో కరప కరణం గారు శ్రీ చాగంటి సుబ్బారావు గారి రెండో కూతురు సుబ్బలక్ష్మి తో  మా పెద్దన్నయ్య పెళ్లి జరిగింది. మా ఇంట్లో జరిగిన, నాకు బాగా గుర్తున్న, అతి సరదా అయిన మా పెద్దన్నయ్య పెళ్లి ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఇప్పుడు (2014) మా పెద్దన్నయ్య పోయి ఏడాది దాటింది. మా పెద్ద వదిన గారు అప్పుడు ఎంత సౌమ్యంగా, అమాయకంగా, ఆప్యాయంగా, పొడుగ్గా ఉండే వారో ఇప్పుడూ అంతే! వారి పెళ్లి అయి కాపురం పెట్టేంత వరకూ మేము వేసవి శలవులకి ఎప్పుడు మా మేనత్త రంగక్కయ్య ఇంటికే దొంతమ్మూరు వెళ్ళే వాళ్ళం. నాకు అస్సలు జ్జాపకం లేదు కానీ బాగా చిన్నప్పుడు దొంతమ్మూరు లో రోజూ పొద్దున్నే నాకు స్నానం చేయించి మా బామ్మ గారి వంద కాసుల బంగారం గొలుసు వేసి గోడ మీద  నుంచి పక్కింటి వెలమ దొరల రాణీ గారికి అప్పజెప్పేవారుట.  ఎందుకంటే తెల్లగా, బొద్దులా ఉండే నేనంటే ఆవిడకి   చాలా ఇష్టంట. పైగా నా పేరే రాజా కదా! వాళ్లకి ఘోషా కాబట్టి ఎప్పుడూ బయటకి వచ్చే వారు కాదు. కానీ సాయంత్రం దాకా నన్ను వాళ్ళింట్లోనే  ఉంచేసుకునే వారుట.  పెద్దబ్బాయి, చిన్నబ్బాయి, బుల్లబ్బాయి,   చంటబ్బాయి, బోడబ్బాయి అని వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండే వారు. వారింటి పేరు పోశిన వారో, పడాల వారో నాకు ఇప్పటికీ తెలియదు.   ఇటీవల కాకినాడ వెళ్ళినప్పుడు పని కట్టుకుని దొంతమ్మూరు వెళ్ళి, కూలిపోయిన మా  మేడ అవశేషాలతో ఉన్న స్థలమూ, చిన్నప్పుడు వెలమ దొరల రాణీ గారి ముచ్చట తీర్చడానికి నన్ను దాటించిన ఆ  గోడ దగ్గర  నేను మా సుబ్బన్నయ్య, ఆ మేడ/స్థలం నలుగురు వారసులలో ఇద్దరు … అనగా..మా హనుమంత రావు  బావ రెండో కొడుకు ప్రకాశు అనే చిన్న బాబు (అవును…మా తాత గారి పేరే!), ఆఖరి వాడు భాస్కర్ ల తో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఆ గోడ వెనకాల కనపడుతున్న ఆధునిక మేడ నన్ను పెంచిన రాణీ గారి ముని మనుమరాలిదిట. ఆ తలుపు తట్టే ధైర్యం నాకు లేక “మళ్ళీ ఇక్కడికి వస్తే గిస్తే అప్పుడు చూద్దాం లే” అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

పాత మకాం

పాత మకాం

నాకు అప్పటికి అక్షరాభ్యాసం జరిగిందో లోదో తెలియదు కానీ, ఒక సంగతి  మటుకు ఇప్పటికీ భలే గుర్తుంది నాకు. అప్పుడు దొంతమ్మూరు లో  నిజమైన పాఠశాల లేదు. కానీ చింతా జగన్నాథం అనే ఆయన అసలు ఉద్యోగం ఏమిటో తెలియదు కానీ ఊళ్ళో నలుగురు పిల్లలనీ ఇప్పుడు కూలి పోయిన అప్పటి రాముల వారి కోవెల ఎదురుగుండా ఉన్న కుంటముక్కల నరసింహం గారి ఇంటి పెద్ద అరుగుల మీద కూచో బెట్టి “దుంపల బడి” నడిపే వారు. ఒక రోజు ఊళ్ళోకి మలేరియా నివారణ వారో, టీబీ కో టీకాలు వేసే వాళ్ళు వచ్చారని తెలియగానే పిల్లలందరూ కకావికలై పారిపోయారు. అలా పారిపోలేక వెర్రి మొహం వేసుకుని దొరికిన వాడిన నేనే.  అందు చేత ఆ రోజు ఊరి మొత్తానికి నాకే టీకాలు పడ్డాయి. మాములుగా ఆ టీకాలు నుదిటి మీద వేస్తారు. జన్మంతా ఆ మచ్చ  మిగిలి పోతుంది. కానీ ఆ టీకాలబ్బాయి  ఎర్రగా, బొద్దుగా ఉన్న నన్ను చూసి పోనీలో పాపం అని టీకాలు నా నుదిటి మెడ కాకుండా భుజాల మీద వేశాడు.  దాని తాలూకు మచ్చ కూడా ఇప్పుడు లేదు. కానీ నా మొహం మీద ఇప్పుడు చూసిన వాళ్ళు  నాకు చిన్నప్పుడు మశూచికం వచ్చిందనుకుంటారు. అవి మశూచికం తాలూకు కాదనీ, యవ్వన దశ ప్రారంభంలో ఎడా, పెడా వచ్చిన మొటిమలకి మందు వాడకుండా గిల్లేసుకోవడం  వలన మిగిలిన అవశేషాలు అనీ  మనవి చేసుకుంటున్నాను. చిన్నపుడు చికెన్ ఫాక్స్ వచ్చే ఉంటుంది కానే, నాకు గుర్తు లేదు. ఈ తరం వారికి తెలియదేమో కానీ టీకాలు అంటే నిజానికి ఒక పెద్ద సూది మందు. ఆ రోజులల్లో కొందరు ఒక కాల్తున్న పెద్ద చుట్టని నుదుటి మీద పెడితే మశూచికం రాదు అని కూడా అనుకునే వారు. దాని తాలూకు మచ్చ జన్మంతా ఉంటుంది మరి.

అన్నట్టు ఆ కుంట ముక్కల వారు (పెద్దబ్బాయి గారు అనే వారు ఆయనని) జమీందారులు. మా మేనత్త కుటుంబం వారూ కుంటముక్కల వారే! ఆ జమీందారుల (నరసింహం గారు & రామాయమ్మ గారు) రెండో కూతురు రాజా ని మా చిన్నన్నయ్య చిన్న వయసులోనే ప్రేమించి పెద్దదయ్యాక పెళ్లి చేసుకున్నాడు.

ఇక వేసవి శలవులలో మా పొలంలో అతి ముఖ్యమైన పనులు వేసిన కోతలయ్యాక వేసిన కుప్పలు  నూర్చడం, నూర్చిన ధాన్యం ఆరబెట్టి బస్తాలలోకి ఎక్కించి కుట్టడం, కాటా తూచి ధాన్యం మిల్లులకీ, వ్యాపారులకీ అక్కడికక్కడే అమ్మడం. ఊళ్ళో  మకాం ఉన్నప్పుడు రాత్రి జరిగే కుప్ప నూర్పులకి మా చిన్న పిల్లలని తెసుకెళ్ళేవాడు కాదు మా పెద్దన్నయ్య. కానీ పొద్దున్నే లేచి చద్దన్నం తిని, పొలం గట్ల మీద నుంచి మూడు కిలో మీటర్లు మా బావా వాళ్ళ మిరాసీ మీదుగా నడిచి  శేరీ చేరుకునే వాళ్ళం. మా ఉద్దార్డుడు నాగులో, మరొక   పాలికాపో కూడా  ఉండే వాడు.  ఇప్పటిలా అప్పుడు ట్రాక్టర్లు ఉండేవి కాదు. కుప్ప నూర్పులంటే పొలం లో ఒక కళ్ళం చేసి , పేడతో అలికి , మధ్య లో ఒక రాట పాతి, అంచెలంచెలుగా పాతిక పశువుల చేత కళ్ళం లో పరిచిన వరి ధాన్యం మొక్కలని తొక్కించే వారు. ఒక యాభై బస్తాల కుప్పకీ సుమారు ఒక రాత్రి అంతా పట్టేది. కుప్ప మీద నుంచి మొక్కలు కళ్ళెం లో వెయ్యడం, కళ్ళం పడిన లో ధాన్యాన్ని బండి మీద ఎక్కి పెద్ద చేటలతో గాలి లోకి ఆరేసి, రాలిన ధాన్యాన్ని  వేరే కుప్పగా వెయ్యడం మొదలైన పనులన్నీ మా పెద్దన్నయ్య అజమాయిషీ లో యాభై మంది  పాలికాపులు పది రోజుల పాటు పని చేసే వారు. ఇప్పుడు పాలికాపుల బదులు వారిని వ్యవసాయ కూలీలు అనడం వింటున్నాను.  ఇక పొద్దున్నే ఏ పది గంటలకో పొలం చేరుకున్న మా కుర్ర కారు సాయంత్రం దాకా చెరువు గట్ల మీదో, కళ్ళం లో ఉన్న ధాన్యం కుప్పల చాటునో ఆడుతూ, పాడుతూ గడిపేసే వాళ్ళం. మాతో సాయం వచ్చిన పాలికాపులు మమ్మల్ని మా అన్నయ్యకి అప్పగించేసి వెనక్కి మళ్ళీ ఊళ్ళోకి వెళ్లి, మా మేనత్త రంగక్కయ్య సద్దిన రెండు కేరియర్ల భోజనం పట్టుకుని తిరిగి వచ్చే వారు.  మధ్యాహ్నం నిప్పులు చెరుగుతున్న వేసవి కాలం ఎండలో చెరువు గట్టు మీద కూచుని అన్నాలు తినే వాళ్ళం.  రాత్రి అంతా కుప్ప నూర్పులు నూర్చిన పాలికాపులు ఇళ్ళకి వెళ్ళిపోతే, మిగిలిన పనులకి కొత్త బేచ్ వచ్చే వారు.  మా పెద్దన్నయ్య పనులు చూసుకుంటూ ఉంటే మేము పొలం గట్లమ్మట తిరుగుతూ, తాటి ముంజెలు జుర్రుకుంటూ, తేగలు కాల్చుకుని తింటూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ, జిగురు కోసం తుమ్మ చెట్లకి గంట్లు పెట్టుకుంటూ, చెరువు గట్టు మీద మామిడి కాయలు కోసుకుని, ముక్కలు చేసి ఉప్పూ, కారం నల్చుకుని తింటూ “శుభ్రంగా పాడై పోయే వాళ్ళం”.  సాయంత్రం చీకటి పడే లోపుగా మళ్ళీ ఇంటికి వెళ్లి పోయేవాళ్ళం.

ఇక నా  జీవితంలో  సాహిత్య పరంగా చెప్పాలంటే నేను వేసవి శలవులకి పదిహేనేళ్ళు వచ్చే దాకా దొంతమ్మూరు వెళ్ళినప్పుడు  అక్కడ చదివిన “చందమామ” పత్రికలనే చెప్పాలి. ఎందుకంటే, అక్కడ మేడ మీద రెండు    పెద్ద గదులు ఉండేవి, ఒక గదిలో రెండు, మూడు భోషాణం నిండా కొన్ని వందల “చందమామ” పత్రికలు ఉండేవి. ఇవి ఖచ్చితంగా మా హనుమంత రావు బావ కలెక్షన్ అయి ఉండాలి. మేము శేరీలో కుప్ప నూర్పులకి వెళ్ళకుండా ఊళ్ళోనే ఉన్నప్పుడు 1950- 1960 లలో వచ్చిన ఈ చందమామలు చదవడమే అద్భుతమైన కాలక్షేపం.  అప్పుడు అది కేవలం కాలక్షేపమే. కానీ నాకు కాస్తైనా  బుద్ది వికసించింది అని ఎవరికైనా అనిపిస్తే దానికి బీజాలు అప్పటివే!

ఆ నాటి కాల భంజకా, కంకాళా, చతుర్నేత్రుడు, మంత్రాల దీవి,  పక్కనే జిల్లేళ్ళ దిబ్బ, చుట్టూ భయంకరమైన మొసళ్ళతో ఉన్న మందాకినీ సరస్సు, దాని ఒడ్డున ఊడల మర్రి, ఏకాక్షి, తోకచుక్క, మకర దేవతా, పొట్టి రాక్షసుడూ, గీక్షసుడూ, దొంగముచ్చూ, పరోపకారి పాపన్నా, బండ రాముడూ, శూరసేన మహరాజూ, జిత్తుల మారి నక్కా, తెనాలి రామలింగడూ, కీలు గుర్రం, పట్టువదలని విక్రమార్కుడూ, అతనికి మౌనభంగం కలగగానే శవంతో సహా మాయమయిన బేతాళుడూ, అమర సింహుడూ మొదలైనవి మహత్తరమైన కాల్పనిక సాహిత్య సృష్టి. మహా భారతమూ, రామాయణమూ, ఇంచుమించు అన్ని ఇతిహాసాలూ నీతి కథలూ నేను చందమామలోనే ఎక్కువగా చదువుకున్నాను. అప్పుడు రచయితల పేర్లు చూసి చదివే వయసు కాదు. కొ.కు. గారు, దాసరి గారు వ్రాసే వారు అని తెలియదు, కానీ వ.పా గారు, చిత్రా గారు బొమ్మలు వేసే వారు అని తెలుసు. ఎందు కంటే ఆ బొమ్మలు చూస్తూ, మేము మేకప్పులు చేసుకుని, కిరీటాలు, కత్తులూ, ఇతర జానపద, పౌరాణిక, కాల్పనిక పాత్రలన్నింటినీ ధరించి ఆటలాడుకునే వాళ్ళం.

పెద్దన్నయ్య పెళ్లి 1960

పెద్దన్నయ్య పెళ్లి 1960

ఈ వయసు దాటాక, మా పెద్దన్నయ్య పెళ్లి అయ్యాక, పొలం పనుల మీద కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా రాత్రుళ్ళు ఉండిపోవలసి వస్తే దొంతమ్మూరు వెళ్ళకుండా పొలంలోనే ఉండడానికి వీలుగా మా అన్నయ్య ఒక మకాం కట్టుకున్నాడు. అంటే ఒక మూడు గదుల పెద్ద పాక అన్నమాట. అందులో ఒక వంట గది, ఒక పడక గది, మధ్య గది. ముందు వరండా, ఆ వరండాకి అటు, ఇటూ సామాను గదులు ఉండేవి. తాత్కాలింగా ఇది కట్టుకుని, తరువాత పెంకుటిల్లు కదదామనుకున్నాడో లేదో తెలియదు కానీ,  అప్పటి నుంచీ ఆ “పాత మకాం”  ప్రతీ వేసవి కాలం లోనూ మాకు విడిది గృహమే! ఆ మకాం ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో లో ఆ మకాం “నీరసం” గా, నిర్మానుష్యంగా ఉంది కానీ నా చిన్నప్పుడు , ముఖ్యంగా వేసవి కాలంలో, కళ, కళ లాడుతూ ఉండేది. ఆ “కళాకారుల” బృందంలో ప్రధాన భాగస్వాములం  నేనూ, మా తమ్ముడూ, నా పైవాడు సుబ్బన్నయ్య, మా ఆఖరి మేనత్త కొడుకు అబ్బులు బావ, మా పెద్ద వదిన పెద్ద తమ్ముడు వెంకట్రావు, రెండో తమ్ముడు కంచి రాజు, అప్పుడప్పుడు మా అందరికంటే పెద్దవాడే అయినా చిన్నవాడిలా మాతో కలిసిపోయే మా అమలాపురం పెద్ద బావ ఇలా చాలా మంది అ పాత మకాం లోనే రెండు, మూడు నెలలు ఉండిపోయే వాళ్ళం.  అక్కడ కరెంటు ఉండేది కాదు. రాత్రి అవగానే కిరసనాయిల్ లాంతర్లు, పెట్రో మేక్స్ లైట్లే !

ఆ పెట్రో మాక్స్ లైట్ల వెలుతురు లో రాత్రుళ్ళు  కుప్పలు నూరుస్తూ మా పాలికాపులు పాడుకున్న పాటలు నాకు యింకా వినపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా “తాచు” అనే వాడు రాగం ఎత్తుకుంటే ఒళ్ళు గగుర్పొడిచేది. వాడు “గోంగూర” పాట పాడితే  పది సార్లు పాడించుకునే వాళ్ళం. సగం మగ కూలీలు, సగం ఆడ కూలీలు పోటాపోటీ గా నిఘం గానే సరసాలాడుకుంటూ,  ఆడుతూ, పాడుతూ పని చేసుకుంటూ కళ్ళారా చూసిన వాణ్ణి నేను.  పక్కనే ఉన్న గడ్డి మెట్ల మీద పై దాకా నిచ్చెన వేసుకుని ఎక్కి, నా దగ్గర ఉన్న ఒక పెద్ద నక్షత్రాల పటం పరిచి, చిన్న బేటరీ లైట్ వేసి, పైన ఆకాశం లో ప్రతీ నక్షత్రాన్నీ, క్రింద ఈ మ్యాప్ లో గుర్తించి అక్కడ ఉన్నన్నాళ్లు కొన్ని గ్రహాలూ, నక్షత్రాల గమనాన్ని కాగితాల రాసుకుని  అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందిన చిన్నవాణ్ణి నేను.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక కొన్ని రోజుల పాటు ఏ ప్రతీ రాత్రీ నేను చూసిన ఒక అతి పెద్ద  తోకచుక్క నీ, మొత్తం ఆకాశంలో బహుశా మైళ్ళ కొద్దీ పొడుగ్గా ఉన్న అద్భుతమైన ఆ దృశ్యాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను.

ఒక్క పేరాలో చెప్పాలంటే …..పైన ఆకాశంలో ప్రస్ఫుటంగా ఒక తోక చుక్క, చుట్టూ దూరంగా నక్షత్రాలు, క్రింద భూమి మీద ప్రేమగా, పల్లెపడుచులు పేడతో అల్లిన కళ్ళం లో తాళ్ళతో కట్టేసిన రాట చుట్టూ తిరుగుతూ, కాళ్ళతో తొక్కుతూ కింద వరి కంకుల నుంచి ధాన్యం గింజల్ని వేరు చేస్తున్న మా పాడి పశువులు, ఆ ధాన్యాన్ని దగ్గరకి చేర్చి కుప్పగా వేస్తూ, కొత్త వరికంకుల్ని వేస్తున్న మా పాలికాపులు, పైన ఎక్కడో గడ్డి మేటు మీద ఆకాశం, నక్షత్రాల పటం చూస్తూ, అందరికీ వివరిస్తూ నేను, ఎక్కడైనా పాటలు వస్తాయేమో అని మా ట్రాన్సిస్టర్ రేడియో తో తంటాలు పడుతున్న వెంకట్రావో, మరొకరో….ఎవరికైనా కాఫీలు కావాలా అని అడుగుతూ మా పెద్ద వదిన గారూ, ధాన్యం కుప్పల మీద సెక్యూ రిటీ కోసం “ఆంజనేయ స్వామి” మట్టి ముద్ర లు వేస్తూ మా తమ్ముడూ, మా సుబ్బన్నయ్యా,  పెట్రోమేక్స్ లైట్ వెలుగులోనే పేక ముక్కలూ పంచుతూ మా అబ్బులు బావా ..ఈ మొత్తం సీనరీ అంతటినీ అజమాయిషీ చేస్తూ “ఆవకాయ ..నా బెస్ట్ ఫ్రెండ్ “ అని ఆ మాత్రం భోజనానికే అఖండంగా ఆనందించే మా పెద్దన్నయ్యా…ఇదే “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే  శేరీ” లో నేను గడిపిన మా చిన్నప్పటి వేసవి శలవుల తీరుతెన్నుల కి నేను ఇవ్వగలిగిన పరిమితమైన అక్షర రూపం.

– వంగూరి చిట్టెన్ రాజు

“ లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ ”

chitten raju

అది మార్చ్ 30, 1922 తారీకు. అంటే 90 ఏళ్ల పై మాటే. ఆ రోజు తను పెరిగిన మేనమామల గ్రామం మీద ఉన్న మమకారాన్ని తీర్చుకుని ఇప్పటికీ చాలా వరకు మా హయాంలోనే ఉన్న “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు” తన స్వార్జితంతో బొబ్బిలి సంస్థానానికి చెందిన చెలికాని రంగరాయణం గారి దగ్గర నుండి మా తాత గారు సూర్యప్రకాశ రావు గారు కొనుగోలు చేసిన రోజు. అది దొంతమ్మూరు గ్రామ శివారులో చిన జగ్గం పేట గ్రామానికి ఆనుకుని ఉన్న 350 ఎకరాల పొలానికి అధికారికంగా ఉన్న పేరు. ఆ ప్రాంతాలలో అంత విస్తీర్ణం ఉన్న పొలాన్ని “శేరీ” అంటారు. అంత కన్నా ఎక్కువ ఎకరాలు ఉన్న వాటిని “మిరాశీ” అనీ పిలుస్తారు. మా తాత గారిని చదివించిన  మేనమామ కుంటముక్కుల హనుమయ్య గారి మిరాశీ  పొలానికి సరిహద్దుల్లోనే ఈ శేరీ అమ్మకానికి రావడంతో మా తాత గారు వెనకాడ లేదు.

కాకినాడలో నేను పుట్టి పెరిగిన 1925 నాటి “వంగూరి హౌస్” ఎలాగో  1922 నాటి ఈ  “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ”  పొలమూ అలాగే నా జీవితంలో ఇప్పటికీ అంతర్భాగమే. సుప్రసిద్ధ గాయకులు పి.బి. శ్రీనివాస్ గారి పొలాలు మా పొలాల సమీపంలోనే. నిజానికి ఈ వ్యాసం ఇప్పుడే మా పొలం వెళ్లి తిరిగి వచ్చి గాంధీ నగరంలో మా “వంగూరి హౌస్” నుంచే వ్రాస్తున్నాను. ప్రతీ దేశానికీ రాష్ట్రాలు, రాష్ట్రానికీ జిల్లాలు, పట్టణాలు, పట్టణాలలో పేటలూ ఎలా ఉంటాయో అలాగే 350 ఎకరాల మా శేరీ లో చాలా  “మళ్ళు”, వాటికి ఆసక్తికరమైన పేర్లూ ఉన్నాయి.  ఉదాహరణకి మా శేరీ లో ఉండే కొన్ని వాటాల పేర్లు వరకట్టు, చవిటి రేవడి, తోటూరి వారి వాటా, దాట్లప్పయ్య రేవడి,  మాలోళ్ళ వాటా, సప్పావోడి వాలు, చిన్న చెరువు మళ్ళు, పర్ర, అమర్కోట మాణిక్యం వాటా, దరువు మొదలైనవి. ఎందుకో తెలియదు కానీ నాకు ఇవి చాలా ఇష్టమైన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు విన్నా చాలా మ్యూజికల్ గా వినిపిస్తాయి. అలాగే ఒక విధంగా శేరీ సరిహద్దులు అనదగ్గ రావి దొడ్డి కాలువ, శుద్ధ గెడ్డ, జగ్గమ్మ చెరువు గట్టు, తాటిపర్తి చెరువు, పుంత మొదలైనవీ, వీటన్నింటికీ మధ్యలో ఉన్న పది ఎకరాల చెరువూ, జగ్గమ్మ చెరువు కి వచ్చే వర్షం నీరులో మూడింత  ఒక వంతు మా చెరువు లోకి తరలించే “జంతి” అనే రెండు కాలువల సంగమం పేర్లలో ఉండే తెలుగు  సహజత్వం నాకు చాలా ఆహ్లాదంగా వినపడుతుంది.  ఈ పేర్ల వెనక ఖచ్చితంగా ఉండే చారిత్రక నేపధ్యం ఎవరికీ తెలియదు కానీ మా నాన్న గారు ముఫై ఏళ్లకి పైబడి గుర్రం మీదా, గుర్రబ్బండి, ఎడ్ల బండి మీదా కాకినాడ నుంచి వెళ్ళి దగ్గర ఉండి వ్యవసాయం చూసుకునే వారు కాబట్టి ఆయనని “దివాణం” గారు అనీ, ఆయన పోయి 30 ఏళ్ళు దాటినా మా పొలాన్ని “శేరీ రామం” గారి పొలాలు” అనీ ఆ ప్రాంతాలలో అంటారు. మా నాన్న గారు ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య ని  “చిన్న దివాణం” అని పిలిచి, ఆ తరువాత మాత్రమే “దివాణం” అని ప్రమోషన్ ఇచ్చారు. ఇక ఆ ప్రాంతాలలో నా చిన్నప్పటి చిరునామా “పెకాస రావు గారి మనవడు”, లేదా  “రామం గారబ్బాయి” ..అంతే…..ఇప్పుడు కూడా నేను  ”దివాణం గారి తమ్ముడు రాజా గారు”, మహా అయితే  ప్రస్తుతం నా పై వాడూ, డాక్టరూ అయిన మా సుబ్బన్నయ్య మా పొలాల యాజమాన్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను “డాక్టర్ గారి తమ్ముడు”  అనేదే నా అక్కడ నా ఉనికి. అలా పిలిపించుకోవడం నాకు భలే ఇష్టం.

మా అమ్మాయిలతో నా పొలంలో

మా పొలాలకి ఎక్కడో ఉన్న ఏలేశ్వరం కొండలలో వర్షం కురిసి, జగ్గమ్మ చెరువు లోకి నీరు వస్తేనే మా చెరువు నిండితే పంటలు పండేవి. లేకపోతే ఎండి పోయేవి.  పైగా ఏ మాత్రం భారీగా వర్షాలు కురిసినా శుద్ధ గెడ్డ నిండి పోయి వరదలు వచ్చి పంటలని ముంచేసేవి. ఈ కారణాల వలన ఒక ఏడూ పండీ, మరొక ఏడు ఎండీ, వ్యవసాయం గిట్టుబాటు కాకా,  పెళ్ళిళ్ళు, చదువులు మొదలైన భారీ ఖర్చులు వచ్చినప్పుడు ,   మా నాన్న గారూ, ఆ తరువాత మా అన్నయ్యలూ దూరంగా ఉన్న వాటాలని అమ్మినప్పుడు మా రైతులే అవి కొనుక్కున్నారు.  ఇప్పటికీ మా పొలంలో పని చేసే వారందరూ మూడు, నాలుగు తరాల నుండీ  మా శేరీనీ నమ్ముకున్న వారే! నమ్ముకుని బాగు పడ్డ వారే. ఉదాహరణకి మా నాన్న గారి దగ్గర “ఉద్దారుడు” …అంటే పాలికాపులకి నాయకుడిగా పని  చేసిన  గుడాల వేంకటేశు ఎప్పుడూ నేల  మీద అణుకువ గానే  “ఆయ, ఆయ్” అనడమే నేను చూశాను.  ‘ఎంకటేశు’ ఎప్పుడో పోయినా మా పొలంలో పని చేసి అతను కూడబెట్టిన సంపద తో ఇప్పుడు అతని కుటుంబం మా అందరి కంటే  ధనవంతులు. అంతెందుకు, నేను మొన్న …అంటే ఫెబ్రవరి 2, 2014 నాడు మా పొలానికి వెళ్ళినప్పుడు, మా మూడో తరం పాలికాపు వీర్రాజు కి తీసిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. “నీకు ఎన్నేళ్ళురా వీర్రాజు?” అని అడిగితే “ ఆ మాత్రం తెల్దేటండీ. ఓ పదేళ్లుంటాయండి” అని, “ఏరా, ఉండవురా?”  అని పక్కనే ఉన్న అతని  60 ఏళ్ళు దాటిన కొడుకు ని అడిగాడు. మా పొలం లోనే పుట్టి, పెరిగిన ఈ  వీర్రాజుకి కనీసం తొంభై ఏళ్ళు  ఉంటాయి. ఎప్పుడో అక్కడే రాలిపోతాడు. శేరీ రామం గారబ్బాయి ..అంటే నేను వాడిని పలకరించగానే  గుర్తు పట్టిన  వీర్రాజు కళ్ళలో మెరిసిన ఆప్యాయతకి కి నేను తగనేమో అనిపించింది.

Veerraju

మా చిన్నపుడు పొలంలో కనీసం యాభై పాడి పశువులు, పాతిక మందికి పైగా పాలికాపులు, ఇద్దరు, ముగ్గురు ఉద్దారులు, స్టేటస్ సింబల్ గా రెండు వేల రూపాయల అత్యధిక విలువ గల మైసూరు ఎడ్ల తో సహా సొగసైన గూడు బండి, వాటికి విలువైన మువ్వలు, ఇతర ఆభరణాలు, ప్రత్యేకంగా ఒక పాలికాపు.. నాగులు…ఉండే వారు. ప్రతీ పశువుకీ, ముఖ్యంగా ఆవులన్నింటికీ తెల్లావు, కర్రావు, గంగ, కామధేను, గుడ్డావు, కుంటావు మొదలైన పేర్లు ఉండేవి. వాటిల్లోంచి కనీసం ఒక ఆవు, గేదె  కాకినాడ లో మా ఇంటి ప్రాంగణంలో ఉండేవి. మా పొలం వెళ్ళాలంటే  బస్సులో ..సుమారు పది మైళ్ళు..అవును అప్పుడు  కిలో మీటర్లు లేవు …. పిఠాపురం మీదుగా గొల్లప్రోలు దాటాక, చేబ్రోలు కి ముందు వచ్చే అడ్డ రోడ్డు దగ్గర దిగాలి. వారం ముందుగానే మా పెద్దన్నయ్యకి కబురు పెడితే ఈ ప్రతిష్టాత్మకమైన మైసూరు ఎడ్ల బండి అన్ని హంగులతోటీ పంపించే వాడు. అక్కడ నుంచి  మా పొలానికి తాడిపర్తి, చిన జగ్గం పేట  మీదుగా రెండు మైళ్ళు ఈ బండిలో మేము మల్లీశ్వరి, రోజులు మారాయి వగైరా సినిమా పాటలు పాడుకుంటూ విపరీతంగా ఫీలయి పోతూ శేరీ “మకాం” …అవును … అది పొలంలో మేము నివశించే పెద్ద తాటాకుల పాక …అక్కడికి చేరుకునే వారం. ఈ రోజుల్లో అలాంటి ఇళ్ళని షోగ్గా “ఫార్మ్ హౌస్” అంటారు.  ఆ నాలుగు గదుల  “ఫార్మ్ హౌస్” ముందు ఈ రోజుల్లో అయితే దాన్ని “పాండ్” అనబడే పెద్ద “గొయ్యి” లో నించి నీళ్ళు తోడుకుని, మరిగించి, చల్లార్చి, “గుడ్డ ఫిల్టర్” లో ఫిల్టర్ చేసి అవి మంచి నీళ్ళగా తాగే వాళ్ళం.  ఈ మొత్తం 15 మైళ్ళ లోపు …. అంటే 30 కి. మీ.  లోపు  ప్రయాణానికి…వారం రోజులు సన్నాహాలూ,  కాకినాడలో బస్ స్టాండ్ దాకా రిక్షా, తరువాత బస్సు, ఆఖర్న ఎద్దు బండి, ఒక వేళ జగ్గమ్మ చెరువు నిండి  పోయి, బండి వెళ్ళ లేక పొతే, మోకాలు నీటి లోంచి నడిచి మరో అర మైలు నడిచి అంతా కలిపి ఇంచు మించు ఒక రోజు ప్రయాణం చేస్తే యావత్ ప్రపంచం తో సంబంధాలు పూర్తిగా తెగిపోయే ఆ ఏకాంత ప్రదేశానికి చేరుకొని మహాదానంద పడేవాణ్ణి.  ఇప్పుడు హాయిగా మినరల్ వాటర్స్ బాటిల్స్ పట్టుకుని, కారు లో వెళ్లి గంట సేపు గడిపేసి అరగంట లో వెనక్కి  తిరిగి వచ్చేసి ఆయాస పడిపోతున్నాను. అప్పుడూ, ఇప్పుడూ వీర్రాజు హాయిగా యింకా మట్టి ముంత లోనే  ఆవకాయ ముక్క నల్చుకుని గంజి అన్నం  తింటున్నాడు.  ఆ  పాక బదులు చిన్న సిమెంటు ఇల్లు,  పశు సంపద బదులు అద్దెకి తెచ్చుకునే ట్రాక్టరు, ఆడుతు పాడుతు పని చేసే పల్లె పడుచుల బదులు సెల్ ఫోన్లలో సినిమా పాటలు వింటూ పని “నటించే” వ్యవసాయ కూలీలు ఒకటేమిటి ఇప్పుడు మొత్తం సీనరీ మారి పోయి అలనాటి సీనరీలు సినిమాలకే పరిమితం అయిపోయాయి. అప్పుడు నేను స్వహస్తాలతో రోజు కూలీ రూపాయి పావలా ఇచ్చిన జ్జాపకం. ఇప్పుడు ప్రభుత్వం వారి “పనికి ఆహార పథకం” లేని  రోజు మాత్రమే కూలి కి వచ్చే వారి కూలి రోజుకి 300 రూపాయలు దాటింది. ఓడలు బళ్ళు అయ్యాయి. రోజులు మారాయి..ఖచ్చితంగా …

గిరిజ,

ఇక్కడ ఒక పిట్ట కథ ఏమిటంటే , ప్రతీ వేసవి కాలం లో లాగా 1964, మే నెలలో నేను కుప్పనూర్పులకి పొలం వెళ్లాను. బాహ్య ప్రపంచంతో మాకు ఏకైక సంబంధం ట్రాన్సిస్టర్ రేడియో మాత్రమే. ఆ రోజు  రేడియో పెట్టగానే “బినాకా గీత మాలా” “బావ గారి కబుర్లు”, “భక్తీ రంజని” లాంటి ఏ ప్రోగ్రామూ లేదు సరి కదా గంటల తరబడి ఏడుపు సంగీతమే. కనీసం మధ్యలో అప్పుడప్పుడైనా ఒక్క మాట కూడా  లేదు. రేడియో పాడై పోయింది కాబోసు అనుకుని ఎం చెయ్యాలో తెలియక భోరుమని ఏడ్చాను. రెండు రోజులయ్యాక తరువాత కాకినాడ వెళ్ళినప్పుడు తెలిసింది  ఆ రోజు (మే 27, 1964) నెహ్రూ గారు చనిపోయారని. గాంధీ గారి కంటే నాకు ఎక్కువ ఇష్టమైన నెహ్రూ గారు  పోతే, ఆలిండియా రేడియో వారు వార్తలు నిరాటంకంగా ప్రసారం విషయాలు ప్రజలకి చెప్పాలి కానీ ఇలా సంతాప సూచకంగా మూడు రోజులు మౌనం పాటించడం లాంటి బుద్ది తక్కువ ఆలోచన ఎవరికి కలిగిందో మరి. చిన్నప్పుడు మా స్కూల్ లో జరిగే  “ఐక్య రాజ్య సమితి” దేబెట్ల లో నేను ఎప్పుడూ తెల్ల టోపీ , లాంగ్ కోటూ వేసుకుని , అందులో గులాబీ పువ్వు పెట్టుకుని  నెహ్రూ గారి పాత్రం ధరించే వాణ్ణి. అప్పటికి రెండు, మూడేళ్ళ క్రితమే నెహ్రూ గారు కాకినాడ వచ్చినప్పుడు ఆ బహిరంగ సభలో మొట్ట మొదటి ఆయనని చూసి ఆ మహానుభావుడి ప్రసంగం విని, ఆయన పట్ల నా ఆరాధాన యింకా పెంచుకున్న నాకు ఆయన మరణ వార్త చాలా బాధించింది. మూడు రోజుల తరువాత మాత్రమే తెలిసినందుకు ఆలిండియా రేడియో మీద విపరీతమైన కోపం వచ్చింది.  నెహ్రూ గారు నేను ఏడ్చిన మాట నిజమే కాని, దానికి కారణం రేడియో పాడాయి పోయింది అనుకోవడమే!  అది తల్చుకున్నప్ప్పుడల్లా ఇప్పటికీ నాకు అదోలా ఉంటుంది.  ఈ రోజుల్లో అయితే  ఎవరైనా ఇంట్లోంచి హాస్పిటల్ కి వెళ్ళే దారిలో ఉండగానే టీవీ చానెల్స్ పసిగట్టేసి, దహన సంస్కారం దాకా  అన్నీ మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. అప్పుడు అది ఒక రకం దౌర్భాగ్యం, ఇప్పుడు మరొక రకం. అనావృష్టీ, అతివృష్టీ..

శేరీ తో నా చిన్నప్పడు అద్భుతమైన అనుబంధాలు రెండు విధాలుగా ఉండేవి. మొదటిది తుమ్మ జిగురు. ఎందుకంటే, ఆ రోజుల్లో   మా పొలం గట్లు అన్నింటిమీదా తుమ్మ చెట్లు ఉండేవి. వాటి ఖాండానికి  ఒక చిన్న గాటు పెట్టి వదిలేస్తే కొన్ని రోజులకి తుమ్మ జిగురు ఊరేది.  ఆ తుమ్మ జిగురు ప్రతీ రోజూ వాడనిదే నా దిన చర్య పూర్తి అయ్యేది కాదు. మా స్కూల్ లో ఇచ్చే సైన్సు ప్రాజెక్టుల కంటే  ఆ రోజుల్లో వచ్చే అద్భుతమైన “ఇల్లస్త్రేటెడ్ వీక్లీ” అంత కంటే  ముఖ్యంగా “స్పోర్ట్స్ ఇలస్త్రేటేడ్” అనే పత్రిక లో వచ్చిన క్రికెట్ వీరుల బొమ్మలు కత్తిరించి, ఈ తుమ్మ జిగురుతో పేపర్ మీద అంటించి  ఆల్బమ్స్ తయారు చేయడం అప్పుడు నాకున్న అతి ముఖ్యమైన హాబీ. అందు వలన ఈ తుమ్మ జిగురు సప్లై కనక ఆగిపోతే నా ప్రాణం ఉసూరు మనేది. పోనీ బజార్లో కునుక్కుందామా అంటే, ఆ బాటిల్స్ లో ఉండేది  కూడా సరిగ్గా మా పొలం లో ఫ్రీ గా వచ్చే లాంటి సరుకే. అందు చేత నేను వారం, పది రోజులకి ఒక సారి “ పెద్దన్నయ్యా, ఇచ్చట కాకినాడలో మేము క్షేమం. అక్కడ  శేరీ మకాం లో నువ్వు క్షేమం అని తలుస్తాను.  ఇచ్చట  మా స్కూలు  సైన్సు  మాస్టారు అయిన “దొర” గారు ఎక్కువ పని ఇవ్వడం వలన నాకు అర్జంటుగా అతి ఎక్కువ గా తుమ్మ జిగురు కావలెను. ఈ సారి పొలం నుంచి నువ్వు ధాన్యం మొదలైనవి బండి లో పంపించినప్పుడు పొలంలో మొత్తంలో ఉన్న వంద తుమ్మ చెట్ల నుండీ జిగురు సేకరించి, నేను బాగా చదువుకోడానికి సహకరించ వలెను” అని ..అవును… ..పోస్ట్ కార్డులే  వ్రాసే వాణ్ణి.  దానికి సమాధానంగా మా పెద్దన్నయ్య “ఒరేయ్ తుమ్మ జిగురూ” అని సంబోదిస్తూ నాలుగైదు పేజీల సమాధానం వ్రాసి, జిగురుతో అంటించిన కవరూ, కావలినంత జిగురూ పంపించే వాడు.

రెండోది ప్రతీ వేసవి కాలం లోనూ నేనూ, మా తమ్ముడు  ఆంజీ అనబడే హనుమంత రావూ, మా పెద్దన్నయ్య బావ మరిది చాగంటి వెంకట్రావూ, అబ్బులు బావా వగైరా కుర్ర గేంగ్ అంతా సుమారు రెండు నెలలు మా పొలం లోనే మకాం వేసే వాళ్ళం. ఆ వివరాలు ప్రస్తావించే ముందు మా పెళ్ళయిన వారం రోజులలో మా ఆవిడ కి మా పొలం చూపించడానికి వెళ్ళినప్పుడు నా రెండో చెల్లెలు భాస్కర అన్నపూర్ణ తో ఫోటో, అలాగే అమెరికా లో పుట్టి పెరిగిన మా అమ్మాయిలకి కూడా “రామం గారి శేరీ” లో “రాజా గారి వాటా”  చూపించి, మా రైతులతో దిగిననప్పటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. వచ్చే నెల మరి కొన్ని ““ లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ ” విశేషాలతో కలుసుకుందాం.  అన్నట్టు మొన్న మా పొలం వెళ్ళినప్పుడు ఒక్క తుమ్మ చెట్టు  కూడా కనపడ లేదు.  ఎందుకంటే వాటి నీడకి పంట తక్కువ రాలుతోంది అని  పొలం  గట్ల మీద మా చిన్నప్పటిలా తుమ్మ చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మొదలైనవే కాక కంది, మినప, పత్తి లాంటి పొదల మొక్కలు కూడా ఈ రోజుల్లో వెయ్యడం లేదుట.  అంత కంటా దారుణం సెల్ ఫోన్ల్ నుంచి వచ్చే రేడియేషన్ కి పిచ్చుకలు మూకుమ్మడిగా చచ్చి పోయి, ఉన్న వాటికి రాలడానికి ఏ రకమైన చెట్లూ లేకా ఎక్కడా అసలు ఒక్క పిచ్చుకైనా  కూడా కనపడ లేదు.  ఆ అర్భక జాతి మన పురోగతికి ఆహుతి అయిపోయింది అన్న  మాట . హతోస్మి !

   — వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

 

మా వంగూరి హౌస్, రేడియో సావిడి, సమ్మర్ హౌస్!

chitten raju

పుట్టిన ఇంట్లోనే గిట్టే దాకా ఉండడం పల్లెటూళ్ళలో మామూలే. ఉద్యోగాలలో బదిలీల మీద వేరే నగరాలకి పోవడం, ఒకే ఇంట్లో కొన్నేళ్ళు అద్దెకున్నా అనేక కారణాలకి ఇల్లు మారడం, సొంత ఇల్లు ఉన్నా చదువులకి పై ఊళ్ళు వెళ్ళవలసి రావడం వగైరా అనేక కారణాల వలన దశాబ్దాల కొద్దీ ఒకే ఇంట్లో ఉండడం పట్నం వాసులకి అరుదే అని అందరికీ తెలిసినదే. కానీ నా విషయంలో పుట్టిన ఇంట్లోనే పెరిగి, ఇంజనీరింగు డిగ్రీ చదువు పూర్తయే దాకా ..అంటే 21 సంవత్సరాలు కాకినాడలో మా “వంగూరి హౌస్” లోనే గడపడం నా అదృష్టమే!

1925 లో ఆ ఇల్లు ఆ నాటి ఇళ్ళ నమునాని తలపిస్తూ ముందు ఒక వరండా, నాలుగు స్తంభాలు, లోపల వాస్తు ప్రకారం ఆగ్నేయం మూల వంట గది, మరొక పక్కన రోజుకి ఇరవై నాలుగు గంటలూ బొగ్గుల మీద వేడిగా కాగుతున్న యాభై గేలన్ల పాల కుండ,   పక్కనే పూజ గది, ఆనుకుని ఆవకాయలు పెట్టుకునే అటక తో సహా ఊరగాయల గది, ఏడాదికి సరిపడా ధాన్యం నిలవ చేసుకునే కొట్టాం తో సహా పప్పులూ, వంట దినుసులూ అమర్చుకునే ఒక పెద్ద స్టోర్ రూమూ, వెనకాల భోజనాల వరండా, నాలుగు పడక గదులు, ఈ రోజుల్లో లివింగ్ రూమ్ అన దగ్గ మధ్య గది,  నగలు, నట్రా, వెండి కంచాలు  దాచుకునే భోషాణం గదీ, ముందు వరండాకి పక్కన ఒక అతిథి గది , వెరసి పది గదులతో ఆ “చిన్న” పెంకుటిల్లు తాత్కాలికంగా ఒక ఔట్ హౌస్ లా కట్టారు మా తాత గారు. అంత విశాలమైన స్థలంలో పెద్ద ఇంట్లో పుట్టి, పెరిగిన నాకు ఈ రోజుల్లో అందరూ “మేము త్రీ బెడ్ రూమ్ – త్రీ బాత్” ఫ్లాట్  కొనుక్కున్నాం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే “అదోలా” ఉంటుంది. 1980 లలో తీసిన ఆ ఇంటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఎదురుగుండా పెద్ద గుండిగల వెనకాల కిటికీ మా గెస్ట్ బెడ్ రూమ్. ఆ గదిలోనే ఉండి మా బంధువులు (మా సూరీడు బాబయ్య గారు, చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, అబ్బులు బావ..వగైరా) అనేక మంది చదువుకున్నారు. సరిగ్గా ఆ గదికి వరండా అవతలి వేపు ఉన్న గది మొదట్లో మా తాత గారి గది. ఆయన పోయాక అది “పురిటి గది” అయిపోయింది. మా అన్నదమ్ములు, అప్పచెల్లళ్లతో సహా  మా బంధువులలో కనీసం వంద మంది అయినా ఆ గదిలో పుట్టారు. ఈ ఫోటో లో అక్కడ గోడకి ఆనుకుని కూచున్నది మా అమ్మ.  ఇంటి ముందు ఠీవిగా ఉన్నది మా మామిడి చెట్టు అని వేరే చెప్పక్కర లేదు.

Kakinada Home

ఆ ఇల్లు కట్టిన ఏడాదికి మా నాన్న గారికి పెళ్లి అయింది. మరో నాలుగేళ్ళ తరువాత వరసగా పిల్లలు పుట్టుకు రావడంతో 3600 గజాల స్థలంలో ఉన్న ఆ పది గదుల ఇల్లు కూడా  సరిపోక పోవడంతో మా నాన్న గారు అదే ఔట్ హౌస్ పద్ధతి ని కొనసాగించి పురిటి గదికి అవతలి వేపు ఒక పెద్ద గది, దాని మీద పైన పెంకులని ఆనుకుని ఒక చిన్న డాబా వేయించారు. ఆ డాబా చిన్నదే కానీ సుమారు ఇరవై మంది పిల్లలం ఇరవై వేసవి కాలాలు ఆ డాబా మీద రొజాయిలు వేసుకుని, కబుర్లు చెప్పుకుంటూ, నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ గడించిన అనుభూతులు చాలా గొప్పవే! ఆ డాబా మీద పడుకునే నుంచే నేను ఒక నెల పాటు ఒక తోక చుక్క గమనాన్ని చూసాను.  ఇప్పటికీ, ఎప్పటికైనా అదృష్టవశాత్తూ చీకటి రాత్రి పూట ఆకాశం లోకి చూడగలిగితే  నక్షత్ర సమూహాల పేర్లు, కొన్ని గ్రహాలనీ గుర్తు పట్టగలను. ఆ డాబా మీదకి చొచ్చుకు వచ్చిన సీతా ఫలం చెట్ల నుంచి తాజాగా కోసుకున్న పళ్ళ రుచి నాకు యింకా జ్జాపకం వస్తూనే ఉంటుంది.  ఇక ఉన్న ఇంటికీ ఆనుకుని ప్రహరీ గోడ వెంబడి రెండు పడక గదులు, మధ్యలో హాలు కట్టించారు. ఇది ఎలాగా తాత్కాలికమే కదా, పెద్ద మేడ ఎలాగా కడతాం కదా అని పెంకుల బదులు ఈ నాలుగు గదులకీ పైన ఎస్బేస్టస్ రేకుల తో పై కప్పు వేయించారు. ఈ గదుల సమాహారానికి “రేడియో సావిడి” ని పేరు.

రేడియో సావిడిలో అక్క

రేడియో సావిడిలో అక్క

“రేడియో సావిడి” అనే పేరుకి కారణం స్పష్టంగానే తెలుస్తున్నా ఆ పేరు రావడానికి ఒక పిట్ట కథ ఏమిటంటే  నాకు సుమారు పదేళ్ళు వచ్చే దాకా మా జీవితం “అంధకారం” లోనే గడిచింది..అనగా మా పెద్ద చెల్లెలు భానుమతి పుట్టిన ఏడు మా ఇంటికి కరెంటు వచ్చింది. అంత వరకూ చీకటి పడేటప్పటికల్లా పదో, పదిహేనో కిరసనాయిలు లాంతర్లు, ఐదో, ఆరో పెట్రో మాక్స్ లైట్లూ ఆదరాబాదరాగా వెలిగించుకోవడం, వెలుగు ఉండగా చక్కబెట్టుకోవలసిన పనులు చేసేసుకోవడం మొదలైన హడావుడులు చాలానే ఉండేవి.  ఈ పెట్రోమాక్స్ లైట్లు టెక్నాలజీ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం గానే ఉంటుంది.  Max Gratetz అనే జర్మన్ మహానుభావుడు ఒక మేంటిల్ అనే దీపం వత్తిని కొంచెం వేడి చేసి, పెరాఫిన్ అనే పదార్ధాన్ని కొంచెం పెట్రోల్ తో బాగా ప్రెషర్ వచ్చేలా పంపు కొట్టి దాన్ని వాయువు గా చేసి ఆ దీపానికి పంపిస్తే అది భగ్గుమని అంటుకుని దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇందులో ఎంతో స్పీడుగా టక టక టకా ఆ పంపు కొట్టే డ్యూటీ అప్పుడప్పుడు నాకు పడేది. ఎవరింట్లో పెళ్లి అయినా పల్లకీలో ఊరేగింపుకీ, ముఖ్యంగా మేళం ఆడేటప్పుడు డజన్ల కొద్దీ పెట్రోమాక్స్ లైట్లతో పెళ్లి వారు మహానంద పడేవారేవారు.  ఆ చుట్టుపక్కల అటు రాజమండ్రి, సామర్లకోట లాటి  ఊళ్ళలో ఎన్ని మేళాలు ఉన్నా, పెద్దాపురం మేళానిదే అగ్రతాంబూలం. ఆ పెట్రోమాక్స్ లైట్లు లేకపొతే వాళ్ళ అందచందాలు ఆస్వాదించేదెలా?  తెలియని వారికి ఆ పెట్రోమాక్స్ లైట్ ఫోటో ఇక్కడ జతపరిచాను.

petromax1

మా ఇంటికి కరెంటు రాగానే మా నాన్న గారు చేసిన మొదటి పనులలో గిరి & కో కి వెళ్లి ‘నేషనల్ ఎక్కో” వారి రేడియో ఒకటీ, ఆ తరువాత ఒక “కుక్క”  గ్రామఫోనూ కొనుక్కొచ్చారు. మెయిన్ రోడ్ లో ఉండే ఈ గిరి & కొ కాకినాడ నగరానికి ఆ రోజుల్లో ఒక లాండ్ మార్క్ . నాకు తెలిసీ మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో రేడియోలు, గ్రామఫోనులు మొదలైన అత్యాధునిక శ్రవణ పరికరాలు  అక్కడే దొరికేవి. దాని యజమానులు శేషగిరి రావు గారు కూడా మా గాంధీ నగరం లోనే ఉండే వారు. మా కుటుంబానికి సన్నిహితులు. ఆయన కొడుకులు వేంకటేశ్వర రావు (స్మైల్స్ ఫోటో స్టూడియో అధినేత), బాబ్జీ, భగవాన్ మా అన్నదమ్ములూ మేము చాలా మంచి మిత్రులం. అందులో భగవాన్ (ఇప్పుడు హైదరాబాద్ లో ఆడిటర్)  మంచి క్రికెట్ ఆటగాడిగా పేరు తెచ్చుకుని రంజీ ట్రోఫీ లో కూడా ఆడాడు. బాబ్జీ గారిని ఇటీవల మా హైస్కూల్ రజతోత్సవ సందర్భంగా కలుసుకున్నాను.

ఆ రేడియో, గ్రామఫోనూ కొన్న దగ్గర నుంచీ ..అంటే సుమారు 1950 నుంచీ మరో పదిహేనేళ్ళ తరువాత నేను కాకినాడ వదిలి బొంబాయి వెళ్ళేదాకా మా జీవితం అంతా ఆ రేడియో సావిట్లో ఆ రెండు శబ్ద శ్రవణ యంత్రాల చుట్టూనే తిరిగింది. ఆ రోజులలో మా అక్క ఆ రేడియో పెడుతున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను.  అప్పటికి  టెలివిజన్ అనే మాట కూడా మాకు తెలియదు. కేవలం రేడియో లో అనేక రకాల కార్యక్రమాలు విని, గ్రామఫోనులో ఘంటసాల గారిని విని నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను.  అంతెందుకు….అప్పటి దాకా మా ఇంటిల్లి పాదీ పొద్దున్నే మొహం కడుక్కోడానికి కచిక (కాల్చిన బొగ్గు నుసి) , వేప పుల్ల, “కోతి మార్కు” పళ్ళ పొడి, తాటాకు వగైరాలు వాడే వాళ్ళం. రేడియో సిలోన్ లో ప్రతీ అద్దివారం పొద్దున్న అమీన్ సాయాని పరమాద్భుతమైన గొంతుకలో “బినాకా గీత మాలా” అనే హిందీ సినిమా పాటల కార్యక్రమం వినడం మొదలుపెట్టగానే ఆ కచికల లాంటి సామగ్రి అంతా బయట పారేసి బినాకా టూత్ పేస్ట్ వాడడం మొదలుపెట్టి, “నాగరికులు” గా చెలామణీ అవడం మొదలుపెట్టాం.

బినాకా గీత మాలా అనగానే మరొక పిట్ట కథ గుర్తుకొస్తొంది. అదేమిటంటే ..ఆ రోజుల్లో రేడియో లాంటి ఆధునిక యంత్రం మా స్నేహితులు ఎవరి ఇంట్లోనూ ఉండేది కాదు. ఉన్నది  కేవలం మా ఇంట్లోనే.   అందు చేత మా స్నేహితులందరూ..అంటే మా అక్క,  సుబ్బన్నయ్య, న్నేను, మా తమ్ముడు ..ఇలా అందరి స్నేహితులూ ఆది వారం పొద్దున్న ఎనిమిది అయ్యే సరికి మా ఇంటికి వచ్చేసే వారు ఈ బినాకా గీత్ మాలా వినడానికి. అందులో గురు మూర్తి అనే ఒక స్నేహితుడు …మా అక్క ఫ్రెండో, సుబ్బు ఫ్రెండో గుర్తు లేదు ప్రతీ ఆదివారం పొద్దున్న ఎనిమిది నుంచి పన్నెండు గంటలకి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు మా రేడియో సావిట్లోనే ఉండే వాడు. ఆ తరువాత ఆ పాటల గురించి చర్చలు కొనసాగేవి. అలా ఎవరైనా స్నేహితులు వచ్చినప్పుడు అమర్యాదగా ఉంటుంది అని మేము ఎవరమూ మా అమ్మ ఎంత పిలిచినా మధ్యాహ్నం భోజనాలకి వంటింట్లోకి  వెళ్ళే వాళ్ళం కాదు.  ప్రతీ పది నిముషాలకీ మా అమ్మ పాపం “ఎంతకీ భోజనాలకి రారు వీళ్ళు” అని బాధ పడుతూ “వాళ్ళని పిల్చుకు రావే” అని మా మెయిన్ హౌస్ నుంచి రేడియో సావిడికి మా రెండో చెల్లెలు అన్నపూర్ణ ని పంపించేది. ఒక సారి మా నాన్న గారు ఈ తతంగం అంతా గమనించి విసుక్కున్నారు. అది విని మా పూర్ణ రేడియో సావిట్లోకి వచ్చి “ఈ వెధవ ఫ్రెండ్స్ అంతా పొద్దున్నే వచ్చేసి సాయంత్రం దాకా ఇక్కడే తగలడతారు. చచ్చు వెధవలు. వాళ్ళు భోజనం చెయ్యరు. వీళ్ళని చెయ్యనివ్వరు” అని మా నాన్న గారు విసుక్కుంటున్నారు” అని సాక్షాత్తూ ఆ గురుమూర్తి తోటే చెప్పేసింది.  అంతే సంగతులు. అప్పటి నుంచే, ఇప్పటి దాకా ఆనాటి ఆప్త మిత్రుడు గురు మూర్తి ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ తెలియదు.

Summer Savidi

ఇక మా జనాభాకి రేడియో సావిడీ, మరొక మూడు గదులూ కూడా చాలక ఎదురుగుండా ఒక 20’ x 30’ అడుగుల ..అంటే సుమారు 600 చదరపు అడుగుల హాలు కట్టించారు. దీని పేరు “సమ్మర్ హౌస్”. దీని మీద ముందు తాటాకులూ, ఆ తరువాత మా పొలం లో ఉన్న చెరువులో కుప్పలు, తెప్పలుగా పెరిగే రెల్లు గడ్డి తో పై కప్పు వేయించారు.  నా చిన్నప్పటి జీవితం చాలా మటుకు ఈ సమ్మర్ హౌస్ లోనే గడిచింది. అందులో ఒక టేబుల్ టెన్నిస్ టేబులు, కేరమ్స్  టేబుళ్లు, చదరంగం, పేకాట బల్లలు ..ఒకటేమిటి నేను, మా అన్నయ్యలు, మా తమ్ముడు , అన్ని వయసులలో ఉన్న మా స్నేహితులకీ కావలసిన ఆట సామగ్రి అంతా ఆ సమ్మర్ హౌస్ లోనే ఉండేది. అక్కడే మేము గంధకం, బొగ్గు, భాస్వరం లాంటి ముడి సరుకులు కొనుక్కుని, వాటిని నూరి, సరి అయిన పాళ్ళలో కలిపి కూరి టపాకాయలు, చిచ్చు బుడ్లూ, కాకర పువ్వొత్తులూ, తార జువ్వలూ మొదలైన దీపావళి సామాగ్రి అంతా అక్కడే రెండు నెలల ముందు నుంచీ తయారు చేసుకునే వాళ్ళం. అక్కడే మాకు ప్రవేటు మేష్టార్లు పాఠాలు చెప్పే వారు. వేసవి కాలం వస్తే ఆ సావిడికి నాలుగు పక్కలా వట్టి వేళ్ళ తడకలు కట్టి, వాటి మీద గంట కొక సారి  పిచి కారీ తో నీళ్ళు కొట్టి ఆ సమ్మర్ హౌస్ ని చల్లబరిచే వాళ్ళం. మా తమ్ముడు బుజ్జి (రాజమండ్రి సూరీడు బాబయ్య గారి కొడుకు రమణ మూర్తి, ఇప్పుడు సుప్రసిద్ధ న్యాయవాది) కాలు విరిగినప్పుడు ఆ సమ్మర్ హౌస్ లోనే మూడు నెలలు మంచం మీద ఉన్నాడు. మా దొడ్డమ్మ (రెండో మేనత్త హనుమాయమ్మ) అక్కడే పోయింది. ఆశ్చర్యం ఏమిటంటే , మేము అన్నేళ్ళు  అనేక రకాలుగా వాడుకున్న ఆ సమ్మర్ హౌస్ కి ఒక్కటయినా సరి అయిన ఫోటో లేదు. కానీ మా పెద్దన్నయ్య అక్కడ తీయించుకున్న ఒకే ఒక్క ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను.

ఇక మా వంటింటి వెనకాల ఉండే  చిన్న నూతి దగ్గర స్నానాలకి ఇబ్బందిగా ఉంది అని ఈ సమ్మర్ హౌస్ పక్కనే చుట్టూ ఐదు అడుగుల వెడల్పు ఉన్న సిమెంటు చపటాతో ఒక పెద్ద నుయ్యి తవ్వించారు మా నాన్న గారు.  ధాన్యం, నువ్వులు, కంది పప్పు, గొల్లప్రోలు మిరప కాయలు వగైరాలు దంచుకుని ఆరబెట్టుకోవడం, పాలికాపులకి భోజనాలు పెట్టడం, వేసవి కాలంలో మడత మంచాలు వేసుకుని పడుకోవడం మొదలైన రకరకాల ఉపయోగాలకి ఇంటి ముందు పది స్తంభాలతో, మామిడి చెట్టుని ఆనుకుని  ఒక సిమెంటు ప్లాట్ ఫారం కూడా ఉండేది. ఇప్పుడు ఎందుకు మాయం అయిపోయాయో తెలియదు కానీ, మా చిన్నప్పుడు గొల్లప్రోలు మిరప కాయలు, వాటి రంగు, రుచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవే.

నాకు ఊహ తెలిసే నాటికి ఆ ఇల్లు, మిగిలిన స్థలంలో మా తాత గారు కట్టదల్చుకున్న పెద్ద మేడకి ఐదు అడుగుల లోతుగా పెద్ద పెద్ద రాళ్ళతో భూమికి నాలుగు అడుగుల ఎత్తున పునాదులు ఉండేవి.  పైన చెప్పిన రేడియో సావిడి, సమ్మర్ హౌస్  తాత్కాలికంగానే కట్టినా, అవి పెర్మనెంట్ అయిపోయాక తరువాత మా నాన్న గారు ఆ పునాదులు తవ్వించేసి, మొత్తం స్థలం అంతా మొక్కలు, చెట్లతో నందన వనం లా తయారు చేశారు.

నా “జీవిత కాలమ్” లో ఇదంతా ఎందుకు వ్రాసుకుంటున్నాను అంటే…..నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఏదో రకంగా ప్రాధాన్యత  ఉన్న కొన్ని కట్టడాలని కానీ, ఇళ్ళు కానీ చూస్తూ ఉంటాను. ఉదాహరణకి ఇటీవల ఒక సారి విజయ నగరం వెళ్లి “గురజాడ” వారి ఇల్లు చూశాను. మాములుగా చూస్తే అది ఒక పాత కాలం నాటి ఇల్లే కదా! అదే సిమెంటు, అదే ఇటికెలే కదా! మరి అంత ప్రాధాన్యత ఎందుకూ? ఎందుకంటే….ఆ ఇంటి నేల, ఇటికెలు మాత్రమే గురజాడ వారి స్పర్శకి  నోచుకుని, ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అలాంటిదే నెల్లూరు వెళ్లినప్పుడు పెన్నా నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న చూసిన “మహాకవి తిక్కన మహాభారతము రచించిన మందిరము”.  ఇలాంటివి యావత్ తెలుగు జాతి చూసి తరించవలసిన ప్రదేశాలు అయితే నాకు వ్యక్తిగతంగా, కేవలం నాకు మాత్రమే నేను పుట్టిన ఇల్లు ఇప్పుడు లేక పోయినా, మా స్థలం ఉంది కదా…అక్కడ మా అన్నయ్యల ఇళ్ళు, మా తమ్ముడి ఇల్లు ఉన్నాయి కదా.  అందుచేత ఆ ఇంటిని, అప్పటి భౌతిక వాతావరణాన్నీ నెమరు వేసుకుంటున్నాను.  ఈ తరహాలో మిగిలినది “లోకారెడ్డి  వారి చెరువు ఇస్తువా పంపు” దాని గురించి తదుపరి వ్యాసం లో ప్రస్తావిస్తాను.

-వంగూరి చిట్టెన్ రాజు

“ తోటలో నా ‘రాజు” – నిజంగానే, నేనే ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  9

1952, డిశంబర్ చలి కాలంలో ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా జ్జాపకం. ఎందుకంటే నా చిన్నప్పుడు అంత గా గోల పెట్టి ఏడ్చిన రోజు మరొకటి లేదు. ఆ రోజు మద్రాసులో పొట్టి శ్రీ రాములు గారు నిరాహార దీక్ష చేస్తూ  మరణించారు. ఆయన ఎవరో, ఎందుకు నిరాహార దీక్ష చేసారో ఆ వయసులో నాకు తెలియదు. నాకు తెలిసినందల్లా ఆ రోజు కాకినాడ అంతా భగ్గుమంది. మా “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” అర్జంటుగా మూసేసి మమ్మల్ని ఇంటికి పంపించేసారు. అన్ని కాలేజీలూ, దుకాణాలూ మూత పడి మొత్తం నగరం అంతా స్తంభించి పోయింది.  కొన్ని వేల మంది విద్యార్ధులు సైకిళ్ళమీదా, కాలి నడకనా ఊరేగుతూ మా ఇంటి దగ్గర గాంధీ గారి విగ్రహానికి పూల మాల వేసి, పార్కు కేసి నినాదాలు చేస్తూ వెడుతుంటే, అసలు విషయం తెలిసిన మా నాన్న గారూ, మా అన్నయ్యలతో బాటు కుర్ర కుంకలం అందరం కూడా మా గుమ్మం దగ్గర నుంచుని ఆ “ఊరేగింపు” చూస్తున్నాం. ఇంతలో హఠాత్తుగా ఒక కాలేజీ స్టూడెంట్ నాకేసి దూసుకొచ్చి, సరదాగా ఒక టెంకి జెల్ల కొట్టి, చేతిలో ఉన్న పెద్ద బొగ్గు కణికెతో మా గోడ మీద ఒక వేపు  “CR చావాలి” “CR కి ఉరికంబం” అనీ, రెండో వేపు “నెహ్రూ డౌన్, డౌన్” అనీ పెద్ద అక్షరాలతో రాసేసి ఊరేగింపు లో కలిసి పోయాడు. రాబోయే సంక్రాంతి కి మా నాన్న గారికి చాలా ఇష్టమైన గోపీ చందనం రంగుతో అప్పుడే వెల్ల వేసి, ఎంతో అందంగా ఉన్న ఆ గోడ ని మసి పూసి మారేడు కాయ చేసెయ్య గానే వేల సంఖ్యలో ఆవేశంలో ఉన్న ఆ స్ట్యూడెంట్స్ ని ఏమీ అన లేక మా నాన్న గారు, మిగిలిన వారూ నిస్సహాయంగా ఉన్న సమయంలో నేను ఆ గోడ కేసి చూసి భోరు మని ఏడుపు లంకించుకున్నాను. నేను ఎవరు ఎంత చెప్పినా, ఆ గోడ మీద రాతల కేసి చూపిస్తూ ఏడుపు స్థాయి పెంచుతూ ఉండగా ఎవరో “ఎందుకురా అంత ఏడుస్తున్నావు. ఆ మాత్రం చిన్న జెల్ల కాయ కొట్టి నందుకే అనీ” “పరవా లేదు రా మళ్ళీ వెల్ల వేయిస్తాం” అనీ అనగానే “అందుకు కాదు నా ఏడుపు. అసలు నేను ఎందుకు చావాలి? నన్ను ఉరికంబం ఎందుకు ఎక్కించాలి?” అని గగ్గోలు పెట్టాను. అప్పుడు అందరికీ అర్ధం అయింది. “ఓరి వెర్రి వెధవా, అదా సంగతీ. వాళ్ళు ‘చావాలి’ అన్నది CR ..అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి….నిన్ను కాదు. ” అని నాకు చాక్లేట్లు పెట్టి నా ఏడుపు ఆపారు. ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మా మిత్రులు కొంత మంది నన్ను “CR” అని పిలవడంతోటీ, మద్రాసులో ఉండే ఈ CR ఎవరో నాకు తెలియకా నా ఏడుపుకి కారణం. అదంతా తల్చుకుంటే నాకు అప్పటి ఏడుపు గురించి కాదు కానీ, ఇప్పడు నాకు మరో కారణానికి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రం విషయంలో అసలు సమస్యలు పరిష్కరించుకోలేక ఏవేవో , కారాణాలు చెప్పుకుంటూ మళ్ళీ మనం మళ్ళీ వెనక్కి పోతున్నాం.  అన్నట్టు ఆ రాజగోపాలాచారి ప్రసంగం కొన్నేళ్ళ తరువాత కాకినాడలో ఒక పబ్లిక్ మీటింగ్ లో విన్నాను. ఆయనతో మాట్లాడాను కూడా.

ఇక ఆ వీధి గుమ్మం కాక ఆ గోడలోనే మా పొలం నుంచి వచ్చే బళ్ళు లోపలి రావడానికి మరొక పెద్ద రేకుల గుమ్మం, అక్కడే వాయవ్యం మూల మా పాడి పశువులు ఉండే పాక ఉండేది. అక్కడి నుంచీ మా 3600 గజాల స్థలంలో మా చిన్నపుడు ఉండే “తోట విహారం” మొదలు పెడితే వాయవ్యం నుంచి ఈశాన్యం మూల దాకా ఉండే ప్రహారీ గోడని ఆనుకుని నేను ఎప్పుడూ ఎక్కని పెద్ద ములగ చెట్టు, అప్పుడప్పుడు ఎక్కే చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి చెట్లూ, జీడిమామిడి, చిన్న మామిడి పళ్ళ చెట్టు, పొడుగ్గా ఉండే యూకలిప్టస్ చెట్లు, తలగడాలలో కూరుకునే పెద్ద పత్తి కాయలు కాసే వంద అడుగులు ఎత్తు ఉండే చెట్లు ఉండేవి. ఏడాది పొడుగునా కింద రాలిపోయే ఈ పత్తి కాయలని పోగేసి ఒక గుట్టగా పడేసే వాళ్ళం.  ఆరు నెలలకో సారి మా దూదేకుల సాయబు వచ్చి, మా ఇంటి వరండాలో దుకాణం పెట్టి వారం రోజుల పాటు నానా కంగాళీ చేసి, పదో, పదిహేనో తలగడాలూ, రొజాయిలు అనే పరుపులూ చేసే వాడు. అతనున్న వారం రోజులు మా ముక్కుల్లోను, చెవుల్లోనూ, నోట్లోనూ, ఇల్లంతానూ. ఆఖరికి ఎంతో మడిగా ఎక్కడో మూలా ఉన్న వంటింట్లో చేసిన అన్ని వంటకాల్లోనూ సిల్కు లా ఉండే ఈ దూది పింజలే! ఇక యూకలిప్టస్ ఆకులు కొయ్యడానికి కష్టపడినా, నలిపి చూస్తే భలేగా ఖరీదైన సెంటు వాసన వచ్చేది. ఇక ఈ ఈశాన్యం మూల ఉండే  ఆకుపచ్చ సంపెంగ చెట్టు మా గాంధీ నగరం అంతటికీ సువాసనలు వెద జల్లేది. ఆ సంపెంగ పువ్వులు, ఆకుల్లో కలిసిపోయి ఎప్పుడైనా మా అక్కా వాళ్ళూ కోసుకోడానికి కంటికి కనపడేవి కావు.  అ సంపెంగ మొక్క ఉంటే పాములు వస్తాయని మేము ఎప్పుడూ చీకటి పడ్డాక అటు వేపు వెళ్ళడానికి హడిలిపోయే వాళ్ళం.  నిజంగానే అక్కడ ఒకటి, రెండు పాము పుట్టలు ఉండేవి. మా పేటలో నాగుల చవితి హడావుడి అంతా అక్కడే. అందరూ ఆ పుట్టలలోనే పాలు పోసే వారు.

తోటలో మా నాన్న గారు

తోటలో మా నాన్న గారు

ఇక ఈశాన్యం మూల నుంచి ఆగ్నేయం వేపు గోడ వారన నడుస్తూ ఉంటే ఓ ఉసిరి చెట్టు, కరివేపాకు మొక్కలూ, పులా మొక్కలు ఉన్నా, అన్నింటి కన్నా ప్రత్యేకమైన ఒక చిన్న, చిన్న పళ్ళు కాసే ఉసిరి చెట్టు లాంటి పెద్ద మొక్క ఉండేది. దాన్ని “పుల్ల, పుల్ల చెట్టు” అనే వాళ్ళం. అసలు పేరు ఎవరికీ తెలియదు. అది చిన్న ఉసిరి కాయల సైజులో పళ్ళు కాసినప్పుడు అవి తింటే విపరీతమైన పుల్లగా ఉండి అస్సలు తినలేక పోయే వాళ్ళం. కానీ అవి పండాక, వయొలెట్ రంగులో కి వచ్చాక అద్భుతమైన తీపి రుచి ఉండేవి. మా దురదృష్టవశాత్తూ, ఇరవై ఏళ్ల క్రితమో ఎప్పుడో, ఏదో తుఫానుకో , మరెందుకో మాయం అయిపోయింది. ఆ తరువాత ఆ మొక్క కోసం మా సుబ్బన్నయ్య చెయ్యని ప్రయత్నం లేదు. ఆఖరికి మొక్కలకి ప్రసిద్ధమైన కడియం గ్రామం లో ఉన్న అన్ని నర్సరీలో కూడా తను వాకబు చేసినా ఆ మొక్క ఏమిటో, ఎక్కడ దొరుకుతుందో ఎవరూ చెప్పలేక పోయారుట.  నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా ఆ మొక్క ఉండే చోటి దగ్గర నుంచుని ‘నివాళులు’ అర్పిస్తూ ఉంటాను.

ఇక మా స్థలం నైరుతి నుంచి ఆగ్నేయం వేపు ఉండే గోడని ఆనుకుని ఒక పెద్ద నేరేడు చెట్టూ, మా డాబా  మీదకి అందేలా పళ్ళు కాచే సీతా ఫలం చెట్టూ ఉండేవి. నాకు తెలియదు కానీ మా పెద్దన్నయ్య, ముఖ్యంగా చిన్నన్నయ్య కోపం వచ్చినా, ఏదైనా కావాల్సి వచ్చినా ఆ నేరేడు చెట్టు పై దాకా ఎక్కేసి దూకేస్తానని బెదిరించే వాడుట. పాపం మా బామ్మ గారు, తాత గారు వెళ్లి రక రకాల “లంచాలు” ఇచ్చి అతన్ని క్రిందకి దింపే వారుట. అప్పటికి నాకు ఐదేళ్ళు కూడా లేక పోయినా మా బామ్మ గారు మా చిన్నన్నయ్యకి ఇచ్చే లంచం పేరు “బంగారం పులుసు”. “ఒరేయ్, ఇవాళ నీ కోసం బంగారం పుసులు చేశాను రా. ఇంకెవరికీ అది పెట్టను. క్రిందకి దిగిరారా” అని ఆవిడ చేసిన గుమ్మడి కాయ పులుసు కి పెట్టిన స్పెషల్ పేరు ఆ బంగారం పులుసు. మా బామ్మ గారు ఎప్పుడూ వంద కాసుల పేరు పెట్టుకునే ఉండే వారు.  అవైనా ఇప్పటి లాగా చిన్న సైజువి కాదు. పూర్వకాలపు పెద్ద సైజు కాసులే!

ఇక మిగిలిన స్థలంలో అన్ని రకాల కూరగాయలు, పాదులూ ఒక ఎత్తయితే బొడ్డు మల్లి తొ సహా డజన్ల కొద్దీ పెద్ద మల్లె పొదలు, ఇంచు మించు అన్ని రంగుల మందారాలు, కనకాంబరాలు, డిశంబర్ పువ్వులు, దర్జాగా ఉండే ఒక పారిజాతం చెట్టు (ఆ పారిజాతానికి ఎప్పుడూ గొంగళీ పురుగులు అంటిపెట్టుకుని ఉండేవి) , ఐదారు నంది వర్ధనాలు, మొగలి రేకుల పొదలు రెండు,  నైట్ క్వీన్లూ, మెట్ట తామరా, రెండు బాదం చెట్లూ, ఒక పెద్ద సపోటా, ఒక చిన్న సపోటా, డజను పైగా కొబ్బరి చెట్లూ, దబ్బ చెట్టూ, రెండు నారింజలూ, నిమ్మ చెట్లూ,  ఒక దానిమ్మా,  నీరు బాగా పారే పెద్ద నూతి దగ్గరా, స్నానాల గదుల దగ్గరా అరటి చెట్లూ, ఒక పెద్ద జామ చెట్టు, ఒక చిన్న చిన్న తీపి కాయలు కాచే జామ చెట్టూ యింకా ఎన్నెన్నో మొక్కలతో మా తోట ఒక “ఆర్గనైజ్డ్ అరణ్యం” లా ఉండేది.

విశేషం ఏమిటంటే మా స్థలానికి సరిగ్గా మధ్యలో రెండు చాలా పొడుగైన తాటి చెట్లు ఉండేవి. ఇవి సాధారణంగా పొలం గట్ల మీదే ఉంటాయి కానీ ఇళ్ళ స్థలాలలో ఉండవు. ప్రతీ రోజూ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ తాటి చెట్ల మీద వాలి సేద దీర్చుకోడానికి  రెండు రాబందులు వచ్చి వాలేవి. మేము స్కూల్లో “జంతు శాస్త్రం” లో గెద్దలకీ, రాబందులకీ ఉండే తేడాలు చదువుకునే రోజుల్లో వాటిని చూస్తూ మేము చదివిన పుస్తకాలలో ఉండే ముక్కులలా వాటి ముక్కులు సూదిగా, వంకర గా ఉన్నాయా, లేవా అని చూసే వాళ్ళం. ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఒక సారి మా నాన్న  గారూ, మేమూ వరండాలో కూచుని ఆ రాబందుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మా చెల్లెలు హఠాత్తుగా “బాబయ్య గారూ, రాబందులు కూడా కాకి రెట్టలు వేస్తాయా?” అడిగింది అమాయకంగా. “లేదమ్మా, రాబందులు రాబందు రెట్టలు వేస్తాయి. కాకి రెట్టలు అవి వెయ్య లేవు” అని మా నాన్న గారు ఒక నవ్వు నవ్వి సమాధానం చెప్పారు.

అన్నట్టు, మా వీధి గుమ్మం పక్కనే ఉన్న బొగడ చెట్టు గురించి చెప్పడం మర్చిపోయాను. మా చిన్న బొగడ పువ్వులూ, పళ్ళు కాసేది. మా చిన్నప్పుడు ఒక సారి ఏమయిందంటే, ఓ రోజు చీకటి పడ్డాక, ఎవరికీ కనపడకుండా నేనూ, ఇంకో ఇద్దరు, ముగ్గురు స్నేహితులూ కలిసి ఆ బొగడ చెట్టు పై దాకా ..అంటే కనీసం యాభై అడుగులు ఎక్కేసి, పండిన బొగడ పళ్ళు కోసేసుకుని బొక్కుతూ ఉంటే, మా నాన్న గారో, మా దొడ్డమ్మో , మరెవరో “ఎవరా అక్కడా?” అని అరిచారు. నేను హడిలి చచ్చి పోయి ధబీమని కిందకి దూకేయ్యగానే,  మిగిలిన వెధవలు కూడా హర్రీ, బుర్రీగా గా దూకేసి, ఇంకెక్కడా చోటులేనట్టు నా మీదే పడ్డారు. ఇంకే ముంది మొత్తం “బొగడ పళ్ళ దొంగలం” అందరం దొరికిపోయాం. “వెధవల్లారా, ఏవో కాస్తో కూస్తో కోసుకుని తినాలి కానే వందల కొద్దీ బొగడ పళ్ళు తింటే కడుపు నొప్పి తో చస్తారు, మమ్మల్ని చంపుతారు” అని మా పెద్దలు చీవాట్లు వేసి, ఏవేవో ద్రవ్యాలు కలిపి తాగించి, మమ్మల్ని బతికించారు.

ఇక మా ఇంటికి ఆగ్నేయం మూల వంటింటికి వెనకాల మరొక మామిడి చెట్టు కూడా ఏకాకి గా ఉండేది. ఈ చెట్టు మా వెనకాల వీధిని ఆనుకుని వేపు ఉండడంతో, అది కాయలు కాసే వేసవి కాలంలో ఆ వీధిలో కుర్ర కుంకలు రాళ్ళు విసిరి మామిడి కాయలు రాల గొట్టి, గోడ దూకేవారు. ప్రతీ ఏడూ ఎన్ని సార్లు వాళ్లకి వార్నింగ్ ఇచ్చినా ఆ కుర్రాళ్లు యింకా రెచ్చి పోయేవారు. ఒక ఏడు అలా ఒక రాయి మా అమ్మకి తగలబోయింది. అసలే కోపిష్టి మనస్తత్వం ఉన్న మా చిన్నన్నయ్య కి ఆవేశం కట్టలు తెంచుకుని వెనకాల గోడ దూకి దొరికిన ఒక కుర్రాణ్ణి నాలుగు వాయించి  వాడి అమ్మకి అన్వయించదగ్గ తిట్లు కూడా తిట్టాడు. దాంతో ఆ వీధిలో వాళ్ళంతా ఏకమై పోయి మా ఇంటి వీధి గుమ్మం వేపు వచ్చి నానా గొడవా చేశారు. పోలీసులని పిలిచే దాకా వచ్చింది ఆ తగాదా. అప్పుడు బాగా తన్నులు తిన్నది ఆ ఇంటి పని వాడు సూన్నారాయణే పాపం!

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

సుమారు నలభై ఏళ్ళు మా తోట అంతటినీ మానాన్న గారితో సమానంగా ఎంతో ఆప్యాయంగా చూసుకుని, రోజు నీళ్ళు పెట్టి, ఎరువులు వేసి అన్ని విధాలుగానూ మా కుటుంబానికి అన్ని విధాలుగానూ సేవ చేసిన ఆ సూన్నారాయణ ఎనభై ఏళ్ళు దాటినా రెండు నెలల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు నన్ను చూడడానికి వచ్చి మళ్ళీ నన్ను ఎత్తుకోడానికి ముచ్చట పడ్డాడు కానీ పాపం ఒక కన్ను కనపడకా, నేను తీవ్రంగా వారించబట్టీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అతణ్ణి తీసుకుని మిత్రుడు చంద్రశేఖర్ నిర్వహించే సంకురాత్రి ఫౌండేషన్ లో కంటికి ఆపరేషన్ చేయించాను. అంతకు ముందే మొదటి కంటికి మా సుబ్బన్నయ్య (డా. సుబ్రహ్మణ్యం) దగ్గరుండి ఆపరేషన్ చేయించాడు.  ఆ సూన్నారాయణ తో తాజాగా మా “ఇలవేల్పు”  మామిడి చెట్టు నీడలో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

మా నాన్న గారికి కూరగాయలు పండించడం చాలా ఇష్టం.  ఖాళీ స్థలం ఉన్న వారందరూ వేసుకునే వంగా, బెండ, బీర, గుమ్మడి, ఆనప, పొట్ల మొదలైనవే కాక కాలీ ఫ్లవర్, కేబేజీ లాంటి వి కూడా వేసే వారు. మొక్క జొన్న మొక్కలని మా వీధి గుమ్మం నుంచి ఇంటి దాకా..అంటే సుమారు వంద గజాలు దారికి రెండు వేపులా వేసి పొలంలోనో, బొటానికల్ గార్డెన్ లో నడుతున్న భావన ఇంటికొచ్చిన వాళ్లకి కలిగేలా  చేసే వారు. పైగా మా నాన్న గారికి గార్డెనింగ్ తో బాటు తేనెటీగలని పెంచి తేనె తయారు చెయ్యడం మంచి హాబీగా ఉండేది.  సామర్ల కోట లో ఉన్న అగ్రికల్చరల్ ఫారం నుంచి తేనెటీగలు పెరిగే బీ-హైవ్ తెప్పించుకుని, అందులో “రాణీ తేనెటీగ” ని పెట్టగానీ వందల కొద్దీ ఉన్న ఆ తేనెటీగల కుటుంబం అందులో బస చేసేది. మాకున్న తోటలో అన్ని రకాల పువ్వులూ ఉండేవి కాబట్టి ఆ తేనెటీగలకి పుప్పొడి కోసం వేరే తోటల్లోకి వెళ్ళే అవసరం ఉండేది కాదు. ఆశ్చర్యం ఏమిటంటేమ మా కుర్ర వెధవలం అక్కడే ఆడుకుంటున్నా విశ్వాసం గల ఆ తేనెటీగలు  మాలో ఎవరినీ ఎప్పుడూ కుట్టిన జ్జాపకం లేదు నాకు. మానాన్న గారు మా తోట మధ్యలో నుంచుని మా సూన్నారయణకి ఆదేశాలిస్తున్న ఒక అపురూపమైన ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. మా పెద్దన్నయ్య ఇది రహస్యంగా తీశాడు. ఈ ఫోటో తీస్తున్నట్టు అప్పుడు ఆయనకీ తెలియదు. తెలిసాక “వెధవల్లారా, నేను చొక్కా వేసుకోకుండా, కనీసం బనీను అయినా వేసుకోకుండా ఉన్న ఫోటో తీస్తారా, బుద్ది లేదూ” అని మమ్మల్ని చెడా, మడా తిట్టారు. ఆయన పోయి 30 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఆ ఫోటో పబ్లిక్ గా బయట పెడుతున్నాను.  మా తోటలో అన్ని రకాల మొక్కలు వెయ్యడానికీ, వాటిని మా కుర్ర కుంకలం తొక్కేసి తగలెయ్యకుండా ఆడ సింహం లా కాపలా కాసేది మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. మాతో సహా ఆవిడని అందరూ దొడ్డమ్మ అని పిలిచే వారు. ఆవిడకి పెళ్లి అయినా, పిల్లలు లేరు. భర్త తో సత్సంబంధాలు లేక నాకు తెలిసీ యాభై ఏళ్ళు ఆవిడ మా ఇంట్లోనే ఉండి, అక్కడే పోయారు. మంచి సంస్కృత పండితురాలు.  మొక్కల విషయంలో ఆవిడ అంటే మాకు సింహ స్వప్నమే!

హ్యూస్టన్ లో చంద్రకాంతం

హ్యూస్టన్ లో చంద్రకాంతం

ఒక విశేషం ఏమిటంటే అన్ని కూరగాయలలోనూ కాలీ ఫ్లవర్ పువ్వు పూయగానే  మొత్తం తోట అంతా  ఘాటుగా వాసన వేసేది. అదేమిటో తెలియదు కానీ నేను అమెరికాలో మా ఇంటి వెనకాల వేసినప్పుడు చూడడానికి షోకే కానీ కాలీ ఫ్లవరే కాదు, అస్సలు ఏ పువ్వుకీ ఎటువంటి వాసనా ఉండదు. కానీ ఎటువంటి సువాసనా లేకున్నా చాలా అందంగా ఉండే పువ్వు చంద్రకాంతం పువ్వు. పదేళ్ళ క్రితం నేను కాకినాడ  వెళ్ళినప్పుడు మా తోటలో మా చిన్నప్పటి నుంఛీ ఇప్పటి దాకా ఉన్నవి మా మామిడి చెట్టు, బొగడ చెట్టు, చంద్రకాంతం మొక్కలు మాత్రమే.  మా మామిడి చెట్టునీ, బొగడ చెట్టునీ అమెరికా తెచ్చుకోలేను కాబట్టి, ఆ చంద్రకాంతం విత్తనాలని ఆప్యాయంగా కోసుకుని హ్యూస్టన్ లో మా తోటలో వేసుకున్నాను.. ఆ మొక్కలు ఇప్పటికీ ప్రతీ ఏడూ ఎన్నెన్నో పూస్తున్నాయి. ఎప్పుడైనా మా చిన్నతనం గుర్తుకి వస్తే మా తోటలోకి వెళ్లి ఆ చంద్రకాంతాలని పలకరిస్తూ ఉంటాను.  హ్యూస్టన్ లో మా తోటలో ఉన్న ఆ చంద్రకాంతాల ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. వాటి పూర్వీకులు నాలాగే కాకినాడ వారు. ఇప్పుడు మా నాన్న గారి గార్డెనింగ్ వారసత్వాన్ని,  నా పై వాడైన మా సుబ్బన్నయ్య పుణికి పుచ్చుకున్నాడు. అతను ఇటు కాకినాడలోనూ, అటు మా పొలంలోనూ అన్ని రకాల పూల మొక్కలు వేసి, కూరగాయలు పండిస్తున్నాడు. ఇటీవలే మేము కాకినాడ వెళ్ళినప్పుడు మా తమ్ముడు (లాస్ ఏంజెలెస్ నివాసి) మా మామిడి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి, మా స్థలాన్ని నందన వనం లా తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.

..మా చిన్నప్పుడు నేను నిజంగానే “తోటలో నా రాజు” ని.. ఒకటేమిటి, మా తోటలో లేని పూల మొక్కలు కాని, పళ్ళ చెట్లు కాని, కూరగాయలు కానీ లేవన్నా, ఆ సకల సంపదల మధ్యా నా చిన్నతనం గడిచింది సుమా అని నాకు ఇప్పటికీ నమ్మ బుద్ది కావడం లేదు. ప్రపంచంలో అందరికీ ఇలాంటి “బాల్య సంపద” ఉంటుంది. దాన్ని నెమరు వేసుకునే యోగం కొందరికే ఉంటుంది ఆ రోజుల్లో అది గుర్తించే బుద్ది నాకు అప్పుడు లేకపోయినా, ఇప్పుడు గుర్తు చేసుకుని అక్షరబద్ధం చేసుకునే అదృష్టం నాకు కలిగింది.

chitten rajuవంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

“ అప్పుడు చుట్టుపక్కల అంతా ఆత్మీయులే!” –మరిప్పుడో ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  8

Fountain(1)

నాకు తెలిసీ భారత దేశంలో ఉన్న అన్ని నగరాలలోను ఒక గాంధీ నగరం ఉండి తీరుతుంది.  ఇక అన్ని గ్రామాలలోను, నగరాలలోను ఆయన విగ్రహం కనీసం ఒక్కటైనా కూడా ఉండి తీరుతుంది. ఆ మహానుభావుణ్ణి ఎంత మర్చిపోయామో గుర్తు చేసుకోడానికే ఇప్పుడు ఈ విగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజుల్లో ఎవరిదైనా సరే విగ్రహం పెట్టించడం నాయకత్వ లక్షణం గా పరిగణించబడుతోంది కదా! ఇది ఖచ్చితంగా నా అప్రస్తుత ప్రసంగమే కానీ  ఆఖరికి మా హ్యూస్టన్ లో కూడా కొందరు గాంధీ గారి విగ్రహం పెట్టించి “స్వయం ప్రకటిత సంఘ నాయకులు” గా పేరు తెచ్చుకున్నారు.

కానీ మా కాకినాడలో మా ఇంటికి వంద గజాలు అటూ, ఇటూ కూడా ఉన్న గాంధీ గారి విగ్రహాలు ప్రతిష్టాపించడానికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. కాకినాడలో 1923 లో 38వ కాంగ్రెస్ మహా సభలు ముగిశాక సుమారు మూడు ఎకరాల ఆ ప్రధాన వేదిక ప్రాంగణాన్ని అత్యంత సుందరమైన పార్కుగా తీర్చి దిద్దారు. ఆ మహా సభలలో మహాత్మా గాంధీ పాల్గొన్న కారణంగా అక్కడికి వంద గజాల దూరంలో కాకినాడలో ఉన్న ఏకైక “ఐదు రోడ్ల కూడలి” లో గాంధీ గారి విగ్రహం పెట్టారు. మా పేట పేరు కూడా గాంధీ నగరం గా మార్చారు. చుట్టుపక్కల పేటలు రామారావు పేట, సూర్యారావు పేట, ఎల్విన్ పేట మొదలైనవి.  ఇవన్నీ కళా, సాంస్కృతిక రంగాలకి పట్టుగొమ్మలు. అసలు కాకినాడ అంటేనే భాష, సాహిత్యం, సంగీతం, కళ, నృత్యం, విద్యాలయాలు, ఒకే వీధిలో అన్ని సినిమా హాళ్లు వగైరాలతో ఒక తెలుగు సాంస్కృతిక నగరం అనే ఇప్పటికీ పేరు.  మా చిన్నప్పుడు మా పేటలో నివసిస్తున్న సాధారణులైనా అత్యంత అసాధారణ సహృదయులు చాలా మంది నాకు యింకా బాగా జ్జాపకం ఉన్నా,  ఎంతో గొప్పవారైన హేమా హేమీల గురించి ఏదో యాదాలాపంగానే తప్ప ఎక్కువగా తెలియదు.  అంతటి మహానుభావులకి సన్నిహితంగా ఉన్నా, ఆ అమూల్యమైన అవకాశాలని అప్పుడు గుర్తించ లేక పోవడం ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్త్తుంది.

మా ఇల్లు సరిగ్గా పార్కుకీ, గాంధీ బొమ్మకీ మధ్యలో ఉంటుంది. మా చిన్నప్పుడు ఆ పార్కుకి సరిగ్గా మధ్యలో బంగారం చేపలు ఆనందంగా, హడావుడిగా ఈదుతూ ఉండే  ఒక అద్భుతమైన వాటర్ ఫౌంటెన్ (దీనికి తెలుగు మాట నాకు గుర్తుకు రావడం లేదు…నీళ్ళు చిమ్మే యంత్రం?????), దానికి అనుబంధంగా పార్కు నాలుగు మూలలా చిన్న ఫౌంటెన్లూ ఉండేవి. రామారావు పేటలో ఉండి, మా చుట్టు పక్కల కొన్ని వేల ఇళ్ళకి నీటి సదుపాయం చేసే “కుళాయి చెరువు” నుంచి సాయంత్రం ఆరు గంటల సమయం సూచిస్తూ ఫేక్టరీ సైరన్ మోగేది.  వెనువెంటనే వందలాది ఆ పార్కుకి చేరుకునే వారు. ఎందుకంటే, ఆ వాటర్ ఫౌంటెన్ మధ్యలో 50 అడుగుల “ఏక స్తంభం”  మీద నాలుగు స్పీకర్లతో ప్రతీ రోజూ మ్యునిసిపాలిటీ వారు నిర్ణీత సమయాలలో రేడియో కార్యక్రమాలు ప్రసారం చేసే వారు. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఇళ్ళల్లోనే రేడియోలు ఉండేవి. ట్రాన్సిస్టర్ రేడియోలు 1960 ప్రాంతాలలో వచ్చినా, టీవీ అనే మాటే డిక్షనరీ లో లేదు.   ఆ రేడియో ప్రసారాలలో ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకి “ఆకాశ వాణి, వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాథ రావ్ “ అనే ఖంగు మనే గొంతు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చే వారు. గంభీరమైన ఆ గొంతు, చదివే విధానం తల్చుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆఫ్ కోర్స్ , ఈ రోజుల్లోనూ టీవీలో వార్తలు చూస్తుంటే ఇతర కారణాలకి ఒళ్ళు “గిగుర్పొడుస్తుంది”…అంటే చికాకుతో ఒళ్ళు  “గోకేసుకునే” భావన కలుగుతుంది.  అయ్యో అని జాలి కూడా వేస్తుంది ! ఉదాహరణకి ఇటీవల మాలతీ చందూర్ గారు పోయినప్పుడు వార్తలు “చదువుతున్న” ఒక ఏంకరమ్మాయి “మాలతీ చందూర్ గారి ‘ప్రమాద వనం’  చాలా పాప్యులర్ అని ప్రవచించింది. “ప్రమదా వనం” కి వచ్చిన ప్రమాదం అది!

నమ్మండి, నమ్మక పొండి. 1957 లో రష్యా వాళ్ళు మొట్టమొదటి స్పుట్నిక్ ఉపగ్ర్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన వార్త రేడియోలో పన్యాల రంగనాథ రావ్ గారు చదవగా విని కొంత అర్ధం అయీ, కొంత అర్ధం అవకా గంగవెర్రులెత్తిపోయి ఈ స్పుట్నిక్ ఎక్కడ కనపడుతుందా, ఎంత జోరుగా ఆకాశంలో ఇటునుంచి ఘుం ఘుం అను దూసుకు పోతుందా అని ఆ రాత్రి అంతా మా డాబా మీద కళ్ళలో వత్తులు పెట్టుకుని ఎదురు చూశాను. ఆ రోజుల్లో ఆకాశంలో రాత్రి పూట అరుదుగా వెలుగుతూ, ఆరిపోతూ కనపడే విమానం లైటు చూసి, అదే రష్యా వారి స్పుట్నిక్ అనుకుని ఎగిరి గంతులు వేసాను. కేవలం రేడియో వార్తలు విని తలక్రిందులు అయిపోయిన ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పగలను.

కేవలం వార్తలే కాకుండా ప్రయాగ నరసింహ శాస్త్రి గారి బుర్ర కథలు, “ఏమండోయ్ బావ గారూ” అనే రాజకీయ విశ్లేషణ కార్యక్రమం, సీత-అనసూయ జానపద గేయాలు ఒకటేమిటి అనేక జీవిత కాలాలకి సరిపడా అద్భుతమైన రేడియో కార్యక్రమాలు వినే అదృష్టం నాకు కలిగింది.  నా  బాగా చిన్నప్పుడు..అంటే ఆటస్థలం కావాల్సిన క్రికెట్, ఫుట్ బాల్  వగైరాలు ఆడుకునే వయస్సుకి ఎదగని వయస్సులో ఆ పార్కులో ఆడుకోవడమే మా జీవిత ధ్యేయం. అక్కడ సిమెంటు జారుడు బల్ల మీద పోటీ లు పడి జారి, నెలకి అర డజను చెడ్డీలకి చిరుగులు పెట్టుకుని మా ఇంట్లో తిట్లు తినే వాడిని.  ఇప్పుడు ఎక్కడా చెడ్డీ చించుకుని ఆనందించే ఆటలే లేవు!  ఇటీవల నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా మా పార్కుకి వెళ్లి, అదే జారుడు బల్ల మీద చెడ్డీ చిరక్కుండా ఒక్క సారే పై నుంచి కిందకి జారి, ఆనందించి వచ్చేశాను. ఆ రోజు అక్కడ నేనొక్కణ్ణే కుర్రాణ్ణి. మిగిలిన పిల్లలు బహుశా ఇళ్ళలో కంప్యూటర్లలో తుపాకీ ఆటలు ఆడుకుంటున్నారు.

సుమారు పదిహేనేళ్ళ క్రితం ఆ వాటర్  ఫౌంటెన్, రేడియో స్తంభం తీసి పారేసి యాభై అడుగుల గాంధీ గారి విగ్రహం పెట్టారు. ఇందుతో ఆనాటి ఫౌంటెనూ, ఈ నాటి గాంధీ గారి విగ్రహం ఫోటో జతపరుస్తున్నాను. ఆ పార్కులో ఇప్పటికీ ఉన్న కొన్ని వందల మొక్కలూ చెట్లలోకీ నాకు బాగా నచ్చేదీ, ప్రపంచంలో ఇంకెక్కడా నేను చూడనిదీ బాడ్మింటన్ బంతి చెట్టు. ఇది పార్క్ లో ఒక మూల (ఇప్పుటికీ స్టేట్ బేంక్ కి ఎదురుగుండా ఉంటుంది) వంద అడుగుల ఎత్తున ఉండి అచ్చు పసుపు రంగులో ఉండే బాడ్మింటన్ బంతి సైజు లో పువ్వులు పూస్తుంది. అవి ముట్టుకుంటే ఆ బంతి లాగే చాలా సున్నితంగా పట్టు తివాసీ నిమిరినట్టుగా ఉంటుంది.

554_Voleti  Parvateesam

ముందుగా నాకు జ్జాపకం ఉన్న కొందరి గురించి చెప్పుకోవాలంటే … మా చిన్నపుడు మా ఇంటికి వీధి వేపు కాక. మిగిలిన మూడు పక్కల ఇళ్ళకీ మాకూ మధ్య గోడలు ఉండేవి కాదు.   ఒక పక్కన వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం గారి ఇల్లు. ఆయన పెద్ద కొడుకు అచ్యుత రామ చంద్రమూర్తి గారి భార్య భాస్కరం పిన్నీ , మా అమ్మా ఒకే సారి కాపరానికి వచ్చారు. దాన్ని “కీర్తి” వారి ఇల్లు అనే వాళ్ళం. వారి కుటుంబమూ, మేమూ ఎప్పుడూ కలిసే ఉండే వాళ్ళం. మా మామిడి చెట్టు మీద వాళ్ళ పిల్లలూ (లేట్ నారాయణ, పార్వతీశం, లేట్ భాస్కరరావు ఎట్సేటారా), వాళ్ల నూతి దగ్గర జామచెట్టు మీద మేమూ ఎక్కి ఘంటసాల  పుష్ప విలాపం పాడుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటే “వెధవల్లారా, నూతిలో పడి మమ్మల్ని చపకండి రా” అని మా నలుగురు పక్కింటి వాళ్ళూ అరుస్తూ మమ్మల్ని తిడుతూ ఉంటే “వాళ్ల కోరిక ప్రకారం వాళ్ళని చంపకుండా”, “మేము చావకుండా”  మా చిన్నతనం హాయిగా గడిపాం. విశేషం ఏమిటంటే ఆనాటి  ఓలేటి పార్వతీశం అనే గొప్ప కవి గారి గురించి నాకు అప్పుడు తెలియదు కానీ మా ఇంటి ఎదురుగుండా గిడ్డీ గారి సందులో ఉండే ఆయన రెండో కొడుకు శశాంక చాలా మంచి కవి అని ఖచ్చితంగా తెలుసును. ఎప్పుడూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వేషధారణలో ఉండే ఆయనా, ఆయన భార్యా (కందుకూరి వారి ఆడబడుచు. పన్యాల వారి తరువాత న్యూస్ రీడర్ గా మంచి  పేరు తెచ్చుకున్న కందుకూరి సూర్యనారాయణ గారి సహోదరి. ఆవిడ తమ్ముడు నటరాజ్ నాకు బొంబాయి లో సహాధ్యాయి) చాలా అందమైన జంట. వారి కొడుకే ఈ నాడు హైదరాబాద్ లో దూర్ దర్శన్ లో పెద్ద ఉద్యోగంలో ఉన్న ఓలేటి పార్వతీశం. (ఈయనని రెండేళ్ళ క్రితం మొదటి సారిగా విజయనగరం లో చాసో గారి స్పూర్తి సభలో కలిశాను.) భావ కవిగా ఎంతో పైకి వస్తున్న రోజులలో చిన్న వయసులో హఠాత్తుగా శశాంక పోయిన రోజులు నాకు యింకా బాగా గుర్తు. ఇక పార్కుకి ఒక మూలగా అప్పటి జిల్లా పరిషత్ సెక్రటరీ పుల్లెల రమణయ్య గారు (ఆయన సతీమణి అద్వితీయమైన సంగీత విద్వాంసురాలు.) ఉండేవారు.

Gandhi_Nagar_Park,Kakinada(1)

ఇక మా ఇంటి వెనకాల మా బంధువులైన తాళ్లూరి సుబ్బారావు గారు , అతని బామ్మ గారు, మా నారాయణ తాతయ్య గారు (మా బామ్మ గారి తమ్ముడు), మరొక పక్క రాచకొండ వారు, గిడ్డీ గారి సందులో టేకుమళ్ళ దుర్గా ప్రసాదరావు గారు (షావుకారు జానకి, కృష్ణకుమారికి పిన తండ్రి వరస అని గుర్తు), అప్పలాచార్య గారు, ఎదురు గుండా ఇంట్లో విఠాల సుబ్రమణ్యం గారు, పక్కనే చీమలకొండ వారు ఉండే వారు. ఆ రోజుల్లో మా వీధి కల్లా పెద్ద జోకు విఠాల సుబ్రమణ్యం గారు రాత్రి భోజనం అయ్యాక తేన్చే  తేనుపు తాలూకు శబ్దానికి అక్కడికి వంద గజాల దూరంలో పార్కులో మధ్యలో ఉన్న వాటర్ ఫౌంటెన్ లో బంగారం చేపలు ఉలిక్కిపడి ఈదడం మానేసి బయటకి గెంతేస్తాయిట! ఇక కాస్త దూరం వెడితే, పార్కుకి ఒక పక్క సినీ నటి జమున భర్త రమణారావు కుటుంబం ఉండే వారు. జమున తమ్ముడు గిరిధర్ , అతని పిల్లలు మాకు ఆత్మీయులే.  పార్కుకి వెనకాల వేపు నేను చదువుకున్న ప్రాధమిక పాఠశాల అనే “దుంపల బడి”, పురపాలకోన్నత పాఠశాల, అటుపక్క ఒంటి మామిడి జంక్షన్ దగ్గర ఈ నాటి వైఎస్సార్ పార్టీ నాయకుడు , సినీ నటుడు విజయ చందర్ కుటుంబం ఉండేది. అతను ఎప్పుడూ మా ఇంటికి వచ్చి, మా చెల్లెళ్ళని పార్కుకి తీసుకెళ్ళే వాడు, ఆడించడానికీ, రేడియో వినడానికీ. ఇక  ఆ ప్రాంతాలలోనే  అలనాటి స్వాతంత్య సమరయోధులు, పార్లమెంట్ మెంబర్ మరియు గవర్నర్ గా చేసిన మొసలికంటి తిరుమల రావు గారు ఉండేవారు. ఆ వీధిలో శంకరం గారు, టీకాల ఇన్ స్పెక్టర్ గారు (ఏడిద వారు), కరణం వారూ, దిగుమర్తి గోపాల స్వామి గారూ మొదలైన వారు ఉండే వారు. ఇందులో శంకరం గారు “సకల విద్యా పారంగతులు” ..అనగా ఆయనే మా హోమియోపతీ వైద్యులు, ఇన్సూరెన్స్ ఏజెంటు, మా వార్డు కి మ్యునిసిపాల్ కౌన్సిలరు, జైలు కెళ్ళిన గాంధేయ వాది….నిరంతరం తెల్ల ఖద్దరు వస్త్రదారి. ఇక సుప్రసిద్ద రాజకీయ నాయకులూ, మా కుటుంబానికి బాగా సన్నిహితులూ, కపిలేశ్వరపురం జమీందారులు, అయిన స్వర్గీయులు ఎస్.పి.బీ.కె. సత్యనారాయణ రావు గారు (కేంద్ర మంత్రి), ఎస్. పి. బి. కె. పట్టాభి రామారావు గారు (రాష్ట్ర మంత్రి) వారి నివాసం సరిగ్గా మా ఇంటికి ఎదురుగానే.  అందులో పట్టాభి రామారావు గారి ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికలకి మా చిన్నన్నయ్య ఎలెక్షన్ ఏజెంట్ గా వ్యవహరించి నప్పుడు ఆయన నెగ్గగానే, మా అన్నయ్యని హెలికాప్టర్ లో  తిరుపతి తీసుకెళ్ళి ఎంతో గౌరవం చేశారు. మా నాన్న గారికి ఎంతో సన్నిహితులైన సత్యనారాయణ రావు గారు నా పెళ్లి విందుకి వచ్చి నన్నూ, మా ఆవిడనీ ఆశీర్వదించారు.  ఆ ఇద్దరు జమీందారులూ, మా నాన్న గారూ, మా చిన్నన్నయ్యా కూడా స్వర్గస్తులే అయినా కులాలకతీతంగా ఉన్న ఉన్న ఆ అనుబంధాల గురించి నాకు ఉన్న కొన్ని జ్జాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అలాగే అప్పటి ఎమ్మెల్యే ఎం.వీ. శాస్త్రి గారి కుటుంబం మాకు ఎంతో ఆప్తులు. వీళ్ళలో నేను చెప్పనిది కాకినాడలో మొట్టమొదటి సినిమా హాళ్ళు (పేలస్ టాకీస్, క్రౌన్ టాకీస్) కట్టిన గొలగాబత్తుల రాఘవుల గారి రెండో కొడుకు, మాకు అత్యంత సన్నిహితుడూ అయిన స్వామి నాయుడి గురించి. అతని గురించి ఎప్ప్పుడో చెప్పితీరతాను.  అసలు మా చిన్నప్పడు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే..ఇప్పుడు అక్కడ కాకినాడ లోనూ, ఇక్కడ హ్యూస్టన్ లోనూ మా నైబర్స్ ఎవరో నాకు చూచాయగానే  తెలుసును. ఇప్పుడు ఇక్కడా కూడా అన్ని ఇళ్ళలోనూ ఎప్పుడూ తలుపులు మూసుకునే ఉంటాయి. అంతా గూఢుపుఠాణీయే. ఎక్కడి దొంగలు అక్కడే గుప్ చిప్!

ఇక అవకాశాలు ఉన్నా, అదృష్టానికి నోచుకోక నేను ఎప్పుడూ చూడని దేవులపల్లి కృష్ణశాస్త్రి, నటి సూర్యాకాంతం, పాలగుమ్మి పద్మరాజు, దుర్గాబాయమ్మ గారు, నేను చూసిన వారూ,  పెద్దయ్యాక బాగా పరిచయం ఉన్నవారిలో కొందరైన ఈమని శంకర శాస్త్రి , చిట్టి బాబు, పాలగుమ్మి విశ్వనాథం, బులుసు వేంకటేశ్వర్లు సోదరులు, హాస్య నటుడు నల్ల రామ్మూర్తి, ఎస్. వి. రంగారావు, మొదలైన లబ్ధ ప్రతిష్టులు మా ప్రాంతాలలోనే ఉండే వారు.  అన్నట్టు నటి సూర్యాకాంతానికీ, మా కుటుంబానికీ ఉన్న పెద్ద కనెక్షన్ ఆడారివాడిలా నడిచే తమ్మయ్య లింగం అనే టైలర్. తాను ఎప్పుడు తమ్మయ్య లింగం చేత గౌను కుట్టించుకున్నా  “సరిగ్గా కుట్టాడా, చూసి చెప్పండి” అని రింగు, రింగులుగా తిరుగుతూ సూర్యాకాంతం మా ఇంటికి వచ్చి మా అమ్మని సలహా అడిగేదిట!

ఇక బులుసు సోదరులు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో పండితులు. కానీ వారి వేషదారణని బట్టి  వారిద్దరినీ “దలైలామా- పంచెన్ లామా” అనీ, “పెద్ద బులుసూ-చిన్న బులుసూ” అని కుర్రాళ్ళు పిలిచేవారు.  అందులో పెద్ద  బులుసు గారు రామారావు పేటలో మా సెకండరీ స్కూల్ కి, ఈశ్వర పుస్తక భాండాగారానికీ ఎదురుగుండానూ మేడలో ఉండే వారు. తన “వ్యాస పీఠం” మీద ఆయన నేల మీద కూచుని చదువుకుంటూనో, వ్రాసుకుంటూనో ఉండే ఆయన్ని ప్రతీ రోజూ చూసే వాడిని కానీ తొలికేంద్ర సాహిత్య గ్రహీతలలో ఒకరు అయిన ఆయన గురించి నా చిన్నప్పుడు నాకు తెలిస్తే ప్రతీ రోజూ ఆయనకీ శిరస్సు వంచి పాదాభివందనం చేసే వాణ్ణి.  ఇక ఆ వీధిలో మరొక నాలుగు అడుగులు వేస్తే , వీణ చిట్టి బాబు-ఈమని-పాలగుమ్మి వారి ఇళ్ళు. రోజూ అలాగే వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ ఆగి  నమస్కారం పెట్టుకునే “బుద్ది” నాకు ఆ చిన్నతనంలో లేదు.  అయితే నేను “పెద్దయ్యాక” వీణ చిట్టి బాబు గారు ఇండియాలోనూ,  అమెరికా వచ్చినప్పుడూ బాగా పరిచయం అయ్యారు.

వీరందరిలో ఇప్పటికీ తలచుకుంటే నాకు “భయం” వేసేది మహా నటుడు ఎస్వీ రంగారావే. ఆయన్ని చూసింది కూడా అరగంటే! ఆయన మా ఇంటి దగ్గరే ఉండే కోకా నరసింహా రావు గారు అనే ఎముకల డాక్టర్ గారికి బంధువు. ఒక సారి రంగారావు గారు వారింటికి వచ్చినప్పుడు కాకినాడ దగ్గర చింతపల్లి అడవులలో వేటకి వెళ్లి, ఒక పెద్ద పులిని చంపి, పెద్ద లారీలో దాన్ని తీసుకొచ్చి మా గాంధీ బొమ్మ దగ్గర ప్రదర్సనకి పెట్టి ఆర్భాటం చేసారు. అది చూడడానికి నేను వెళ్లినప్పుడు రంగారావు గారు పెద్ద తుపాకీతో ఆ పులి తలదగ్గర నుంచుని ఫోటో తీయించుకుంటున్నారు. చుట్టూ ముగిన జనం మోకాళ్ళ మధ్య లోంచి ముందుకు వెళ్లి ఆయన్నీ, తుపాకీనీ, చచ్చిపడున్న ఆ పది అడుగుల పెద్ద పులినీ చూసి  హడిలి చచ్చిపోయాను. ఇప్పటికీ ఆ సీను తలచుకుంటే ..వావ్! ఇదంతా “పాతాళ భైరవి” సినిమా తరువాత అని వేరే చెప్పక్కర లేదు.

_2008_Bulusu_Sambamurty

ఆఖరి అంశంగా … నాకు పదమూడు ఏళ్ల వయస్సులో .. ఒక రోజు కాకినాడ నగరం అంతా “విషాదం” లో ములిగి పోయింది. ఆ రోజు “మహర్షి” బులుసు సాంబమూర్తి గారు కేవలం 72 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో, ఏకాకిగా, దరిద్ర నారాయణుడిగా “జీవించ” లేక మరణించారు. ఆ రోజు “ఎవరో పెద్దాయన పోయారు” అని మా స్కూల్ కి శలవు ఇవ్వగానే క్రికెట్ ఆడుకోడానికి వెళ్ళిపోయిన “చిన్నతనానికి” ఇప్పటికీ నాకు ఇప్పటికీ సిగ్గేస్తుంది. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం గారి తో సమాన స్థాయిలో క్రిమినల్ లాయర్ గా ఆ రోజుల్లోనే లక్షాధికారి అయిన సాంబమూర్తి గారు అన్నీ త్యాగం చేసి , గాంధీ గారి కంటే ముందే కొల్లాయి కట్టిన దేశభక్తులు.  1923 లో కాకినాడ లో కాంగ్రెస్ సభలు జరగడానికి ప్రధాన కారకులు, నిర్వాహకులు ఆయనే. నేను చిన్నప్పుడు విన్న విషయం ఏమిటంటే ఆయన ఆ కాంగ్రెస్ సభలో ప్రసంగం మొదలు పెట్టగానే ఎవరో ఒక చిన్న చీటీ ఆయన చేతిలో పెట్టారుట. అది చదివి, మడిచి జేబులో పెట్టుకుని సాంబమూర్తి గారు తన ప్రసంగం పూర్తి చేసి సభాస్థలాన్ని విడిచి మర్నాడు తిరిగి వచ్చారుట. “మీ కొడుకు అరగంట క్రితం మరణించాడు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళాలి” అన్నదే ఆ చీటీలో ఉన్న వాక్యం. ఒక కర్మయోగిగా “మహర్షి” అనే పేరుతో సాంబమూర్తి గారు అప్పటినుంచీ లబ్ధప్రతిష్టులయ్యారు.  ఆ తరువాత  ఆయన 1926 లో దేశం లో తొలి సారిగా “మనకి డొమినియన్ స్టేటస్ కాదు. “పూర్ణ స్వరాజ్యం” కావాలి అని ప్రతిపాదించిన మహానుభావుడు కూడా ఆయనే. మద్రాసులోని సాంబమూర్తి గారి గృహంలోనే మరొక మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం అవతరణకి ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం, స్వరాష్ట్రం కోసం ఆ ఇద్దరూ చేసిన త్యాగాలు ఈ నాడు “దౌర్భాగ్యుల” సంక్షేమం కోసమేనేమో అని నాకు అనిపిస్తోంది.

ఇందులో “నీతి” ఏమిటంటే చిన్నప్పుడు తెలియక నా చుట్టుపక్కల ఉన్న “అదృష్టాలని” గుర్తించలేక పొరపాట్లు చేసినా, “ఇప్పటికైనా మించిపోలేదు సుమా, అసలు జీవితం ఇపుడే కదా మొదలయ్యిందీ: అని నాకు నేనే  అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఉంటాను….నా అదృష్టాలని వెతుక్కుంటూ…ఆనందపడుతూ!

…..వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

మా వంగూరి హౌస్ – మా మామిడి చెట్టూ…

 

chitten rajuమా తాత గారు తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో కాకినాడలో అప్పడు రామారావు పేట అని పిలవబడే ప్రాంతంలో (పిఠాపురం రాజా వారి పేరిట) ఒక్కొక్కటీ 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు. అప్పటి నుంచి, ఇప్పటి దాకా ఆ స్థలం మా అధీనంలోనే ఉంది. కాకినాడ మొత్తం మీద సుమారు తొంభై సంవత్సరాలకి పైగా ఒకే కుటుంబం అధీనంలో ఉన్న అతి కొద్ది గృహాలలో మాది ఒకటి అని నేను అప్పుడప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను.

మా తాత గారు ఆ స్థలం కొన్నాక అక్కడ ఒక పెద్ద మేడ కట్టుకోడానికి ప్రణాళిక వేసుకుంటూ ఉండగా  1923 లో 38 వ కాంగ్రెస్ మహా సభలు జరిగాయి. ఆ మహా సభల ఆహ్వాన సంఘం కార్యదర్శి, స్వాతంత్ర్య సమార యోధుడు, మా తాత గారి తోటి లాయర్ అయిన మహర్షి బులుసు సాంబ మూర్తి (పొట్టి శ్రీ రాములు గారు మద్రాసు లో ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు.—పాపం.) గారి అభ్యర్ధన మీద మా ఇంటి స్థలం అంతా పెద్ద పందిళ్ళు వేసి ఆ కాంగ్రెస్ సభలకి భోజన శాలగా మార్చారు. అక్కడికి వంద గజాల దూరం లోనే ప్రధాన వేదిక. ఆ వేదిక మీద నుంచి మహాత్మా గాంధీ గారు డిశంబర్ 24, 1923 నాడు ప్రసంగించారు.  . ఆ మహా సభల తరవాత ఆ పేట  పేరు గాంధీ నగరం గా మార్చారు. ఇప్పటికీ అది గాంధీ నగరమే! ఆ కాంగ్రెస్ సభలలోనే  జవాహర్లాల్ నెహ్రూ అనే 35 సంవత్సరాల యువకుడు మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యాడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ ఆలీ పేరే ఇప్పటికీ మా రోడ్డు పేరు. మా రోడ్డు పేరు “వంగూరి వారి వీధి” అని మారుస్తామని మ్యునిసిపాలిటీ వారు కొన్ని సార్లు అడిగినా ఒక అలనాటి ముస్లిం నాయకుడి పేరు తీసేసి మా పేరు పెట్టడం సమంజసం అనిపించక మేమే వద్దన్నాం.  అతిశయోక్తి అయినా ఇప్పటి మా ఇంటి ప్రాంగణం అప్పటి భోజన ప్రాంగణం కాబట్టి గాంధీ గారు, నెహ్రూ గారు మా “ఇంటి” కి భోజనానికి వచ్చారు అని నేను చెప్పుకోవడం నాకు సరదా.

ఇక్కడ నేను విన్న ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఆ ప్రధాన ప్రాంగణం లోపలికి వెళ్ళడానికి సరి అయిన బేడ్జ్ పెట్టుకోవాలి. నెహ్రూ గారు అది మర్చి పోయి హడావుడి గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు 13 ఏళ్ల వాలంటీర్ గా ఉన్న దుర్గాబాయమ్మ గారు ఆయన్ని అడ్డగించి ఆయన ఎంత చెప్పినా, ఆఖరికి సాంబ మూర్తి గారు స్వయంగా వచ్చి చెప్పేదాకా లోపలికికి వెళ్ళనియ్యకుండా అడ్డుకున్నారట.  ఆ విధంగా వారిద్దరికీ పరిచయం అయి జీవిత కాలం నిలిచింది.

నెహ్రూ గారి మంత్రివర్గంలో దుర్గాబాయమ్మ గారి భర్త దేశ్ ముఖ్ గారు ఆర్ధిక మంత్రిగా పని చేశారు. వారు జీవించినంత కాలం మా బావ గారు నండూరి వెంకట సూర్య నారాయణ మూర్తి గారు (హై కోర్ట్ సీనియర్ అడ్వోకేట్)  ఎంతో ఆత్మీయులుగా ఉండి,  లీగల్ సలహా దారుగా వ్యవహరించే వారు. అన్నట్టు, మా అక్కా, బావ గారూ ఉండేది హైదరాబాద్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలనీ లోనే!

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

 

ఆ కాంగ్రెస్ మహా సభల హడావుడి అంతా అయ్యాక మా తాత గారు మేడ కట్టడం ఆలస్యం అవుతోంది అనుకుని 1925 లో స్థలానికి ఆగ్నేయం మూల ఐదు గదులతో తాత్కాలింగా ఒక ఔట్ హౌస్ కట్టి, గృహ ప్రవేశం చేసారు. అది ఏ ముహూర్తాన చేసారో కానీ ఆ ఇల్లే మూడు తరాలకీ సొంత ఇల్లు అయిపోయింది.  అంత పెద్ద స్థలంలో పెద్ద మేడ కట్టుకుందామనుకున్న మా తాత గారి ఆశ నెరవేర లేదు. ఆయన పోయిన ఏడాది తరువాత 1952 లో మా పెద్దన్నయ్య ఆ మేడ నమూనా ని అగ్గిపెట్టెలతో తయారు చేసి ప్రతీ బొమ్మల కొలువు లోనూ పెట్టేవాడు. ఆ మేడ నమూనా ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.  నాకు పదిహేనేళ్ళు వచ్చే దాకా కూడా పకడ్బందీగా కొండ రాళ్లతో వేసిన  ఆ మేడ పునాదులు స్థలం మధ్యలో ఉండేవి. మా నాన్న గారు కూడా ఆ మేడ ఇక కట్టలేం అని నిర్ణయించుకుని ఆ పునాదులు తీసేయించి ,  మొత్తం 3600 గజాల స్థలాన్నీ పూల మొక్కలతో, చెట్లతో నందన వనంగా మార్చారు.

1925  లో మా తాత గారూ, బామ్మ గారూ గృహ ప్రవేశం చేసిన కొన్ని రోజులలో ఒక విచిత్రం జరిగింది. ఒక మండు వేసవి నాటి మధ్యాహ్నం ఒక ముసలాయన లోపలి వచ్చి “అమ్మా, దాహంగా ఉంది. కాస్త మంచి నీళ్ళు ఇప్పించండి” అని అడిగాడు. మా బామ్మ గారు ఆయన్ని చూడగానే “అయ్యో పాపం ఈయన భోజం కూడా చెయ్య లేదేమో” అని అడిగి అరిటాకు వేసి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆయన సంతృప్తిగా భోజనం చేసి, కాస్సేపు విశ్రమించి లేచి వెళ్తూ తన చేతి సంచీ లోంచి ఒక్కటంటే ఒక్క మామిడి పండు తీసి “అమ్మా, ఈ పండు తిని, ఆ టెంక ఎక్కడైనా పాతండి. అది చెట్టుగా ఎదిగి, దాని పళ్ళు మీ మనవలు, ముని మనవలూ కూడా తింటారు” అని మనసారా ఆశీర్వదించి, ఆ మామిడ పండు ఆవిడ చేతిలో పెట్టి మాయమై పోయారు. అంటే మళ్ళీ ఎప్పుడూ కనపడ లేదు.

మా తాత గారు, బామ్మ గార్లలో ఆ పండు ఎవరు తిన్నారో లేక అప్పటికి చిన్న పిల్లలయిన మా నాన్న గారు, ముగ్గురు మేనత్తలలో ఎవరు ఆ పండు ముక్కలు ఉప్పు, కారం వేసుకుని తినేసి ఆ టెంక ఇంటి ముందు విసిరేసారో తెలియదు కానీ….అ బంగిన పల్లి మామిడి టెంక వేళ్ళూనుకుని, చెట్టుగా ఎదిగి ఇప్పటికీ గత 88 సంవత్సరాలగా అద్భుతమైన పళ్ళు కాస్తూ, వంద మంది పైగా ఉన్న మా బృహత్ కుటుంబం అస్తిత్వానికి నీడ పడుతూ వయోభారంతో కుంగినా గంభీరంగా, దర్జాగా, నిరంతరం కూసే మూడు తరాల కోయిల వంశానికి పట్టుగొమ్మగా నిలుస్తూ, ఇది వ్రాస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఆ మామిడి చెట్టు కిందే నా ఇరవై ఏళ్ల చిన్న తనం అంతా గడిచింది. నాదే ఏమిటి, మా అన్నదమ్ములు, అప్ప చెల్లెళ్ళు, మా ఇంట్లో ఉండి చదువుకున్న నాలుగు తరాల బంధువులు అందరికీ ఆ మామిడి చెట్టే ఆయువు పట్టు. కేరమ్స్, చెస్,  పేకాట ఏ ఆట, ఆడుకున్నా ఆ చెట్టు నీడనే. రాత్రి టీ తాగుతూ గుడి దీపాల వెలుగులో పరీక్షలకి చదువుకున్నా ఆ చెట్టు కిందే! అది చిన్న చిన్న పిందెలు వేసి ఆ మాత్రం బరువుకే కిందకి వాలగానే కుర్చీ పీట వేసుకుని పెన్నుతో ఆ పిందెల మీద మా పేర్లు రాసేసుకుని , అవి పెద్దయ్యే దాకా రోజూ, కొలుచుకుంటూ అంటే ఆరాధించడమే కాదు, ఎవరి పిందె ఎంత పెరిగిందీ అని సైజు కూడా కొలుచుకుంటూ, మొత్తం వేసవి శలవులకి మరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఉన్నా అదంతా  ఆ చెట్టు మహిమే! ఆ చెట్టు కొమ్మలోంచి తెల్లవారు ఘాము నుంచీ మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా వినపడే కోకిలారావానికి మేము తిరిగి “కోయ్, కుహూ” అని అరవ గానే ఆ కోకిల రెచ్చి పోయి యింకా గట్టిగా సమాధానంగా చెప్పడం, “ఏమిట్రా ఈ వెధవ కాకి గోల”  అని మా పెద్ద వాళ్ళు కోప్పడడం ఎంత హాయిగా ఉండేదో! ఆ చెట్టు కిందే నా మొట్ట మొదటి ఇంగ్లీషు నవల (పెర్రీ మేసన్) చదివాను. చేతికందిన ప్రతీ వార, దిన పత్రికలూ పెద్ద వాళ్ళు కోప్పడుతున్నా డిటెక్టివ్  నవలలూ అక్కడే చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను సాహిత్యంలో సేద తీరింది ఆమామిడి చెట్టు నీడ లోనే!

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

సుమారు ముఫై ఏళ్ల క్రితం కాకినాడ లో వచ్చిన పెను తుఫానులో మా మామిడి చెట్టు మా ఇంటి మీద పడి కూల్చి పారెయ్యకుండా, నిట్ట నులువుగా గంభీరంగా ఉండేదల్లా, సొగసుగా మరొక పక్కకి వాలి మా మీద యింకా ఎంతో దయ, ప్రేమ కురిపిస్తూనే ఉంది. రెండు, మూడేళ్ళ కొకసారి కాయలు కాస్తూనే ఉంది. నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా ఆ మూడో తరం కోకిలారావం రోజుకి ఐదారు గంటలు వింటూనే ఉంటాను. నన్నూ, నా చాదస్తాన్నీ చూసి మా వాళ్ళు అందరూ చాటుగా నవ్వుకుంటూ ఉంటూనే ఉంటారు. అందుకే అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందం అని.

మా చిన్నన్నయ్యకి పెళ్ళయి ఐదుగురు పిల్లలు పుట్టాక, ఇల్లు చాలక అప్పటికి వేరే ఇల్లు కట్టుకున్నాడు. దానికి అమెరికా లో ఉన్న మా తమ్ముడూ, నేనూ ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ చేసిన సహాయం గురించి తెలిసిన మిత్రులు, కాకినాడ బార్ రూమ్ (కోర్ట్ ప్రాంగణంలో లాయర్ల విశ్రాంతి గది) సహాధ్యాయులు దాన్ని డాలర్ హౌస్ అని వేళాకోళం చేసే వారు. ఆ తరవాత నా పై వాడు సుబ్బన్నయ్య మణిపాల్ లో ఎం.. బీ. బీ. యస్ తరువాత  ప్రతిష్టాత్మకమైన పాండిచ్చేరి జిప్మెర్ లో మాస్టర్ ఆఫ్ సర్జరీ చేసి కాకినాడ రంగరాయ  మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేరి, ఇంటి తో బాటు అతని భార్య (మా వదిన ) డా. శేషమాంబ గారి కోసం గైనకాలజీ క్లినిక్ కూడా కట్టుకున్నాడు. సుమారు పదేళ్ళ క్రితం 80 ఏళ్ల ‘వయస్సు” వచ్చి మా పెద్దన్నయ్య ఉంటున్న మా ఇంటికి చిన్నా, పెద్దా రిపేర్లు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మా తమ్ముడు  (వాడు యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లో మాస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చెయ్యడానికి 1970 లో అమెరికా వచ్చాడు) వాడి వాటా స్థలంలో మేడ కట్టుకున్నాడు.

ఆ తరువాత బాగా పాత పడిపోయి అవసాన దశలో ఉన్న మా ఇంటిని మనసు దిటవు చేసుకుని, నిర్దాక్షిణ్యంగా నేల కూల్చి చదును చేసేశాం. మా ఇల్లు పడగొట్టి ‘స్మశానానికి’ తరలించడానికి వారం ముందు తీసిన ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఆ ముందు నుల్చుని ఆ ఇంటికి ‘ఆఖరి చూపులు’ చూడడానికి వచ్చిన వాడు తన పదో ఏట మా ఇంట్లో పని వాడి గా ప్రవేశించి, అరవై ఏళ్ళకి పైగా మాతోనే ఉండి, మమ్మల్ని ఎత్తుకుని మోసిన ‘సూన్నారాయణ’.  వాడి ఎడం పక్కన ఉన్న రెండు కిటికీల గది  మా ఇంట్లో శాశ్వతంగా ఉన్న “పురిటి గది”. ఆ గదిలోనే నేను పుట్టాను. మొక్కై వంగక పోయినా, తుఫాను ధాటికి మానై వంగిపోయిన మా మామిడి చెట్టు ఇంకా ఇంటి ముందు గంభీరంగానే ఉంది.  అదృష్టమో, దురదృష్టమో చెప్ప లేను కానీ నేను ఆ ఇంటి ఆఖరి చూపులకి నోచు కోలేదు. ఆ మాట కొస్తే 1983 లో మా నాన్న గారు పోయినప్పుడు కానీ, 1999 లో మా అమ్మ పోయినప్పుడూ నేను వారి ఆఖరి చూపులకి నోచుకో లేదు. అది నాకు “అమెరికా వలస” ప్రసాదించిన విమోచన లేని శాపం.

మా ఇంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి…

“పోయినోళ్ళు అందరూ…..అవును చాలా, చాలా మంచోళ్ళు….

మా తాత గారి, బామ్మ  గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, మా అమ్మ, మా బాబయ్య గారు (అంటే మా నాన్న గారు) అంతకు రెట్టింపు ఆప్యాయత, బాధ్యతలతో పంచిపెట్టిన “బంధు ప్రేమ” అనే అపురూపమైన అనుబంధాన్ని తనివి తీరా అనుభవించిన తరం మాది. ముఖ్యంగా నా చిన్నప్పుడు ..అంటే 1950-60 దశకాలలో బంధువుల రాకపోకలతో, వాళ్ళు రాగానే సినిమా ప్రోగ్రాములతో, అడ్డాట, ఇస్పేటు మదాం లాంటి అచ్చ తెలుగు పేకాటలతో, కేరమ్స్, చదరంగాలతో, తెల్లారాదేకా అస్సలు ఏం మాట్లాడుకున్నామో ఎవరికీ ఏ మాత్రం జ్జాపకం లేక పోయినా చిన్నా, పెద్ద కలిసీ, ఎవరి వయస్సు  గ్రూప్ వారూ రాత్రి తెల్ల వార్లూ డాబా మీద పడుకుని కబుర్లు చెప్పేసుకుకోవడం మొదలైన వ్యాపకాలతో మా తరం వారి అందరి జీవితాలూ సరదాగా గడిచి పోయేవి. ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే మరీనూ.

“ఆ పోదురూ, మీరు మరీనూ….మీ తరువాత “ఎర్ర త్రికోణం” రోజులు వచ్చేసి, చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోయింది. తరవాత్తరవాత కంప్యూటర్లూ, గ్లోబలైజేషన్లూ వచ్చేసి ఎవరి కుటుంబం చుట్టూ వాళ్ళు  చుట్టూ గీతలు గీసేసుకున్నారు. “ అని చాలా మంది  అంటుంటారు. నా పాయింటు కూడా సరిగ్గా అదే. మా చిన్నతనం గడిచినంత ఆనందంగా ఈ తరం వారి చిన్నతనం లేదు అని మా బోటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. తమాషా ఏమిటంటే ఇప్పటి తరం వాళ్ళు పెద్ద వాళ్ళయి వారి ఆత్మ కథ వ్రాసుకున్నప్పుడు వారు కూడా సరిగా అలాగే అనుకుంటారు!

అన్నట్టు మా బంధువుల గురించి నేను చెప్పుకునేటప్పుడు మా ఇంట్లో ఉండే ఒక తమాషా అలవాటు గురించి ముందే చెప్పుకోవాలి. అదేమిటంటే అసలు బంధుత్వం ఏదైనా ఒక వ్యక్తిని పిల్లలందరరం ఒకే రకం గా పిలిచే వాళ్ళం. ఉదాహరణకి మా నాలుగో మేనత్త కొంత మందికి అక్క, మాకు మేనత్త, మరో కొంత మందికి పిన్నీ అయినా మా బంధువులకీ, స్నేహితులకీ ప్రపంచంలో  అందరికీ ఆవిడ  రంగక్కే.  ఈ వ్యాసం లో కూడా ఆ పద్ధతే పాటించాను. లేక పొతే ఎవరి గురించి వ్రాస్తున్నానో తెలియక గందర గోళం పడిపోతాను. “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు కనక వారి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తాను.

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

నా జీవితం  మీద  సాహిత్య పరంగా కాకపోయినా,  వ్యక్తిత్వ పరంగా చెరగని ముద్ర వేసి ఆత్మీయత విలువని చెప్పకనే చెప్పిన వారిలో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన లని మొట్టమొదటగా చెప్పుకోవాలి. వరసకి మేనరికం అయిన ఆ దంపతులు అన్ని శుభ కార్యాలకీ పది హీను రోజులు ముందే వచ్చి, అవాంతరాలకి తక్షణమే వాలి పోయి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని మూడు-నాలుగు తరాల అన్ని కుటుంబాలకీ “మూల స్తంభం” లా నిలిచారు. వారికి పిల్లలు లేరు కానీ డజన్ల కొద్దీ బంధువుల పిల్లలందరినీ సొంత పిల్లల లాగానే చూసుకునే వారు. మా ఆఖరి మేనత్త సూర్య భాస్కరం (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం), & పండ్రవాడ సుబ్బారావు (పెద్దాపురం మామయ్య గారు)  దంపతుల పెద్ద కూతురు మా జయ వదిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా జయ వదినని చూడకుండా ఉండను. మా చిట్టెన్ రాజు బాబయ్య మా నాన్న గారికి వరసకి పెద్ద తమ్ముడు. అంటే…మా తాత గారి సవితి తమ్ముడి పెద్ద కొడుకు. కాకినాడలోనే పుట్టి, అక్కడే చదువుకుని , చాలా సంవత్సరాలు మిలిటరీ లో పని చేసి కో- ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా రిటైర్ అయాడు.  వైజాగ్ లో చదువుకునప్పుడు (1961-62)  మా బాబయ్య పనిచేసిన కశింకోట, విజయ నగరం, శృంగవరపు కోట మొదలైన అన్ని ఊళ్ళూ వెళ్ళి, అక్కడ కూడా వారు స్థానికంగా అందరికీ తలమానికంగా ఉండడం నేను స్వయంగా చూసాను.  ఒక సారి  తనే స్వయంగా అంధ్ర విశ్వవిద్యాలయం లో మా హాస్టల్ కి వచ్చి, భోజనం చేసి “రాజా గాడి హాస్టల్ భోజనం బాగా ఉంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి” అని కాకినాడ మా అమ్మకి ఒక కార్డు రాసాడు.  ఆత్మీయతకి, అభిమానానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి?

1951 లో మా తాత గారు, బామ్మ గారు ఒకే రోజున పోయినప్పుడు, మా నాన్న గారు, అమ్మా పోయినప్పుడూ వారిద్దరే దగ్గరుండి కర్మకాండలు నిర్వహించడంలో సహాయం చేశారు. మా ఇంట్లో అందరి పెళ్లిళ్ల నిర్వహణ, మా తమ్ముడి పెళ్లి కుదర్చడం మొదలైన శుభ కార్యాలకి వారే సూత్రధారులు. మా బాబయ్య ఆదేశాలతో పది రోజులకి సరిపడా కూర గాయలు కొనడానికి నేను కూడా మా బాబయ్యతో ఎడ్ల బండ్ల మీద కాకినాడ సంత చెరువు దగ్గర పెద్ద మార్కెట్ కి వెళ్ళే వాడిని. రాత్రి పడుకోడానికి మా మామిడి చెట్టు కింద మడత మంచం నేనే వేసే వాడిని. కొంచెం పెద్ద వాడిని అయ్యాక , ఆయనతో పేకాట కూడా ఆడే వాడిని.  నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పడూ కూడా గోళ్ళు కొరుక్కునే అలవాటు ఉంది. అది ఎప్పుడు చూసినా ఠకీమని తన వేళ్ళు నా నోటి దగ్గర పెట్టి “నా గోళ్ళు కొరకరా. యింకా రుచిగా ఉంటాయి రా” అని ఆ అలవాటు మాన్పించడానికి సరదాగా ప్రయత్నాలు చేసే వాడు.  మా చిట్టెన్ రాజు బాబయ్య పోయి పదేళ్ళు దాటింది. ఇందుతో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన ఫోటో జతపరుస్తున్నాను. అలాగే ఆయన తమ్ముళ్లు శంకరం బాబయ్య, రామం బాబయ్య కూడా మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. వారిద్దరూ కూడా దివంగతులే.

నాకు ఐదుగురు మేనత్తలు. ముగ్గురు మేన బావలు- అంటే మా మేనత్తల కొడుకులు. వాళ్ళని అమలాపురం బావ, దొంతమ్మూరు బావ, పెద్దాపురం బావ అనే వాళ్ళం అప్పుడప్పుడు. అందులో అమలాపురం బావ ..పెద్ద బావ..మా పెద్ద మేనత్త (ఆవిడని నేను చూడ లేదు)- పెద్ద మామయ్య గారి (గిడుగు వెంకట రత్నం గారు) కొడుకు. పేరు సూర్య ప్రకాస రావు..అంటే మా తాత గారి పేరే. అతను చామన చాయలో పొడుగ్గా భలే తమాషాగా ఉండే వాడు. ఆయన భార్య సుందరక్క , ఆరుగురు ఆడ పిల్లలు (నా మేనగోడళ్ళు) చాలా అందమైన వారు. వృత్తి రీత్యా అడ్వొకేట్ అయిన మా పెద్ద బావ ఎప్పుడు వచ్చినా మాట్లాడడం తక్కువ కానీ ప్రతీ మాటా, చేతా సరదాగానే ఉండేవి.

ఆ తరువాత రెండో మేనత్త (ఆవిడని కూడా నేను చూడ లేదు)  ని  తనని పెంచి పెద్ద చేసిన మేనమామ గారి కొడుకు కుంటముక్కుల కామేశ్వర రావు గారికి ఇచ్చి పెళ్లి చేసారు మా తాత గారు. మా బాసక్క (వరసకి వదిన), హనుమంత రావు బావ వారి పిల్లలే. ఆ మేనత్త పోయిన తరువాత ఆవిడ చెల్లెలు, మా నాలుగో మేనత్త అయిన రంగనాయకమ్మని (ఆవిడ నే రంగక్క అని పిలిచే వాళ్ళం) ఇచ్చి ద్వితీయ వివాహం చేసారు.  హనుమంత రావు బావ మా పెద్దన్నయ్య కంటే చిన్న, మా చిన్నన్నయ్య కంటే పెద్ద. వీళ్లు ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉండే వారు. కలిసే అల్లరి చేసే వారు. కాకినాడలో మా ఇంట్లోనే చదువుకుని నగరంలో సోషల్ సర్కిల్ లో బాగా తిరిగే వాడు. అలనాటి సినీ నటుడు రామశర్మ కి మంచి మిత్రుడు . అతనితో సినిమా తియ్యడానికి ప్రయత్నం చేసాడు కానీ మా నాన్న గారు ఒప్పుకో లేదు. మా కామేశ్వర రావు మామయ్య గారు  హఠాత్తుగా గుండె పోటు తో పోయినప్పుడు మా బావ చిన్న వాడు కాబట్టి మా నాన్న గారు వారి 400  ఎకరాల మిరాసీ పొలాన్ని ని తనే స్వయంగా వ్యవసాయం చేసి తరువాత మా చిట్టెన్ రాజు బాబయ్య మధ్యవర్తిగా మొత్తం ఆస్తి మా బావకి అప్పజెప్పారు.

ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ…మా గాంధీ నగరం పార్కుకి మా హనుమంత రావు బావ ట్రస్టీ గా ఉండే వాడు. ఒక సారి నేను, కొంత మంది కోతి మూకతో కలిసి రాత్రి చీకటి పడ్డాక మట్టి తవ్వేసి పార్కులో ప్రతీ మూలా కలువ పువ్వులతో కళకళ లాడుతూ ఉండే చెరువు కప్పెట్టేసే ప్రయత్నంలో ఉండగా పెద్దులు అనే తోటమాలికి దొరికి పోయాను. ఆ పెద్దులు గాడు మా ఇంట్లో పాలు పితికే గొల్ల వాడే అయినా, చీకట్లో గుర్తు పట్టక నన్నూ, మిగిలిన కుర్రాళ్ళనీ  తాళ్ళతో కట్టేసి అక్కడే లైబ్రరీ లో ట్రస్టీ మీటింగ్ అవుతుంటే అక్కడికి లాక్కుని పోయి నిలబెట్టి “ఈ రౌడీ కుర్ర నాయాళ్ళు సెరువు కప్పెట్టేసి సింద్ర వందర సేసారండి. తవరు ఊ అంటే సంపేత్తానండి, ఆయ్య..” అనేసి పెర్మిషన్ కోసం చూస్తూ ఆ వెలుగులో నా మొహం చూసాడు. ఆ తరువాత మా బావ మొహం చూశాడు. అంతే సంగతులు. నేను చావు తప్పించుకుని మా బావ ధర్మమా అని బయట పడ్డాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అరవై ఏళ్ళ  పాటు ఏ చెరువూ, ఆఖరికి అతి చిన్న గుంట కూడా కప్పెట్టే ప్రయత్నం చెయ్య లేదు. చేసినా పెద్దులు గాడి మొహము, మా బావ మొహమూ గుర్తుకు వస్తాయి. మా హనుమంత రావు బావ ఏకైక కుమార్తె లక్ష్మి కి పెళ్లి చేసిన  16  రోజుల పండగ నాడు ఊరేగింపులో గుండె పోటుతో మరణించాడు. మేనల్లుడి మరణాన్ని తట్టుకో లేక కాబోలు మరాక రెండు నెలలలో మా నాన్న గారు ఆ కూడా పోయారు. అప్పుడు నేను అమెరికాలో ఇరుక్కుపోయాను. మా హనుమంత రావు బావ ఎప్పుడూ తన సంగతి చూసుకోకుండా అందరికీ ఎంతో మంచి చేసే వాడు. అలా ఆయన దగ్గర సహాయం పొందిన ఒకాయన ఎవరో పిఠాపురం “హనుమంతరాయ కళాశాల” అని ఒక కాలేజ్ కి అతని పేరు పెట్టి ఆ ఋణం తీర్చుకున్నారు.

ఇక మా పెద్దాపురం  అబ్బులు బావ (ఆఖరి మేనత్త కొడుకు, జయ వదిన తమ్ముడు ) నా కంటే రెండేళ్ళు పై వాడయిన మా సుబ్బన్నయ్య వయసు వాడు. అతని పేరు కూడా (సత్య) సూర్య ప్రకాశ రావే. అబ్బు-సుబ్బు అని వాళ్ళిద్దరూ, రాజా-అంజి అని నేను, మా తమ్ముడూ కవల పిల్లల లాగే  పెరిగాం. అతను కూడా కాకినాడలో మా ఇంట్లోనే ఉండి పాలిటెక్నిక్ చదువుకున్నాడు. మా గేంగ్ అందరం పొద్దుట మా పెద్ద నూతి దగ్గర పంపు తో ఆదరా బాదరాగా నీళ్ళు కొట్టుకుని..అవును చన్నీళ్ళే…. స్నానాలు చేసేసి, తరవాణీయో మరోటో తినేసి ఎవరి స్కూళ్ళకో, కాలేజీలకో వెళ్లి పోయి, సాయంత్రం క్రికెట్ ఆడేసుకుని, శివాలయానికి వెళ్లి పురాణాలో, హరికథలో వినేసి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే వాళ్ళం. నేను ఇంజనీరింగ్ లో ప్రవేశించే దాకా మా అబ్బులు బావ టీ=స్క్వేర్ మరియు , స్లైడ్ రూల్ అనే ఇంజనీరింగ్ పరికరాలు భుజాన్న వేసుకుని సైకిల్ మీద వెడుతూ అందరిలోకీ హీరోలా కనపడే వాడు. ఆ పరికరాలు ఇప్పుడు ఎక్కడైనా మ్యూజియంలలో ఉంటాయేమో! అబ్బులు బావ ఎప్పుడూ గలగలా నిష్కల్మషంగా నవ్వే వాడు. పేకాట లో అయినా, కేరమ్స్ లో అయినా ఏ ఆటలో అయినా మా అబ్బులు బావ ఉంటేనే ఆటలు రక్తి కట్టేవి. అతను మా కుటుంబం మీదా, మా నాన్న గారి మీద అభిమానంతో వైజాగ్ లో రామలింగేశ్వర స్వామి దేవాలయం (మా నాన్న గారి పేరు) కట్టించడంలో ఎంతో సహాయం చేసాడు. అమెరికా ఎప్పుడు వచ్చినా హ్యూస్టన్ వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులు ఉండే మా అబ్బులు బావని విధి నిర్దయగా రెండేళ్ళ క్రితం పొట్టన పెట్టుకుంది. ఇందుతో చిన్నప్పుటి (బహుశా 1955) మా అబ్బులు బావ, మా హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య (ముగ్గురూ దివంగతులే) ఏడిద కామేశ్వర రావు, మరొక మిత్రుడితో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికీ ఎంత మంది మేన బావలు ఉన్నా, మా అబ్బులు బావదే అగ్ర తాంబూలం.

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

ఇక మా నాన్న గారి తరంలో అతిముఖ్యమైన, అతి దగ్గర అయిన బంధువులలో మా సూరీడు బాబయ్య గారే  (రాజమండ్రి) మొదటి వారు. ఆయన మా నాన్న గారి పిన తల్లి (చెల్లంబామ్మ గారు) ఏకైక కుమారులు. ఆయనా, మా నాన్న గారూ చిన్నప్పటి నుంచీ  ఇద్దరూ న్యాయవాదులయ్యే దాకా కలిసే చదువుకున్నారు. ఇద్దరూ మద్రాసు లా కాలేజ్ లో చేరినా, మా నాన్న గారు త్రివేడ్రం లో డిగ్రీ పూర్తీ చేస్తే , మా సూరీడు బాబయ్య గారు మొత్తం మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికే  మొదటి వాడి గా నిలిచి మద్రాసు లా కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. నేను యింకా చూడ లేదు కానీ ఆయన పేరు ఇప్పటికీ ఆ కాలేజ్ లాబీ లో చెక్కబడి ఉంటుందిట. ఆయన పూర్తీ పేరు అయినంపూడి సూర్యనారాయణ మూర్తి గారు ఆయన ప్రాక్టీస్ రాజమండ్రిలోనే కానీ దక్షిణ భార దేశం లో ఆయన అతి పెద్ద సివిల్ లాయర్ ఐఎనెన్ మూర్తి గా నాలుగైదు దశాబ్దాలు పేరు పొంది నేను అమెరిక రాక ముందే చనిపోయారు. మా చిన్నన్నయ్య ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నా వయసు వాడే అయిన అయన కొడుకు (రమణ మూర్తి తమ్ముడు)  ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సూరీడు బాబయ్య గారి భార్య (స్వర్హీయ మాణిక్యం అక్కయ్య)  మా  అమలాపురం బావకీ తోబుట్టువే!

ఇక్కడ మరొక పిట్ట కథ…..మా సూరీడు బాబయ్య గారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే నా పదేళ్ళప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన. అప్పుడు వాళ్ళబ్బాయి అంటే ..మా రమణ మూర్తి తమ్ముడు కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. నేనూ, మా నాన్న గారు వాణ్ణి చూడడానికి రాజమండ్రి వెళ్లాం బస్సులో. నాకు తెలిసీ నేనూ, మా నాన్న గారూ మాత్రమే కలిసి చేసిన ఒకే ఒక్క బస్సు ప్రయాణం అదే! అప్పుడు నేను ఒక్కడినీ ఇంట్లో ఉండగా ఎవరో ఒక పెద్దాయన కూడా మా తమ్ముణ్ణి చూడడానికే ఇన్నీసు పేటలో మా సూరీడు బాబయ్య గారి ఇంటికి వచ్చాడు. అందరూ హాస్పిటల్ కి వెళ్ళారు అని నేను చెప్పగానీ “నీకు ఆసుపత్రికి దారి తెలుసా?” అని అడిగారు. “మాది కాకినాడ సార్, రాజమండ్రి నాకు తెలీదు” అని వెర్రి మొహం వేసాను. ఆయన చతికిల పడి పోయి “ఓరి నాయనోయ్ ఇప్పుడు ఎలాగా?” అని బెంగ పడిపోతూ ఉంటే నా బుర్రలో ఒక వెలుగు వెలిగి “రిక్షా వాడిని పిలిచి జనరల్ హాస్పిటల్ కి పోనీ అంటే వాడే తీసుకేడతాడు గదా” అన్నాను ఆయనతో. ఆయన “అవును” సుమా…హాస్పత్రి దారి నాకెందుకూ తెలియడం. రిక్షా వెధవకి తెలిస్తే చాలుగా “ అని ఆశ్చర్య పడిపోయి ఆ నాటి నా “తెలివి తేటలని” ఊరంతా టాం టాం చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. అదిగో అప్పటి నుంచీ మా సూరీడు బాబయ్య గారికీ మా కుటుంబంలో మిగిలిన వారికీ నేను తెలివైన వాడి కింద లెక్క. నాకైతే ఆ మాట మీద అంత నమ్మకం లేదు.

ఇలా మా చిన్నతనంలో నన్ను ప్రభావితంచేసిన బంధు కోటిలో మా అమ్మ వేపు వారైన  మా సుబ్బారావు  రావు నాన్న, లక్ష్ముడక్కయ్య, సీతక్క, జనార్దనం బావ, సీతారమణ మావయ్య,  సుబ్బారావు తాతయ్య గారు,  అటు తణుకు నుంచి తాళ్లూరి లక్ష్మీపతి తాతయ్య గారు మొదలైన వారందరూ దివంగతులే. వీలున్నప్పుడు వారి గురించి ప్రస్తావించి  వారి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను.

ఇప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తున్న బంధువులు చాలా మంది ఉన్నా, ఇప్పుడు “ఉన్నోళ్ళందరూ తీపి గుర్తులే” అయినా  అప్పటికీ, ఇప్పటికీ “బందు ప్రేమ” డిపార్ట్మెంట్ లో చాలా తేడా ఉంది అని నాకు అనిపిస్తుంది. మా చిన్నప్పుడు ముందుగానీ “కాల్చేసి” , ఉత్తరం “తగలేసి” అప్పుడు రావడాలు ఎక్కువ అలవాటు లేదు. ఏకంగా పెట్టె, బేడాతో ఎప్పుడు పడితే అప్పుడు దిగిపోవడమే! ఇప్పుడు నేను తాత, మామయ్య, బాబయ్య, బావ మొదలైన ఏ హోదాలోనైనా సరే  “కాల్” చేసి మా బంధువుల ఇంటికి “ఎప్పాయింట్ మెంట్” తీసుకుని వెడితే ముందు పది నిముషాలు అందరూ చుట్టూ కూచుని పలకరిస్తారు. “ఎప్పుడొచ్చావు?, ఏ హోటల్ లో ఉన్నావు? ” అనే ప్రశ్న లోనే “ఎప్పుడు వెళ్తున్నావు?” అనే ధ్వని వినపడుతుంది. అరగంట తరవాత మెల్ల, మెల్లగా కొందరు ఎవరి గదులలోకి వారో, బయటకో జారుకుంటారు ”సీ యు లేటర్” అనుకుంటూ.  ఇక కూచోక తప్పని వారు వాచీలు చూసుకోవడం, టీవీ ఆన్ చెయ్యడం లాంటి చేష్టలు చేస్తారు. ఇక పెళ్ళిళ్ళు మొదలైన వాటిల్లో మండపాల్లోనే అన్ని మంతనాలూనూ.  అమెరికాలో బంధువులు అయితే ఆరు నెలలకో ఏడాదికో ఫోన్ లోనే మాటా, మంతీనూ. ఏం చేస్తాం. అమెరికా ఫ్రీ కంట్రీ కాబట్టి మనం ఎవరి ఇంటికీ వెళ్ళక్కర లేదు, వాళ్ళు రావక్కర లేదు. ఖర్చు తగ్గింది కదా అని ఆనందిస్తాం అందరూ “అమెరికూపస్థ మండూకాలే”.

chitten raju— వంగూరి చిట్టెన్ రాజు

“చదువుకున్న మూర్ఖుడు” – ఇంకెవరూ? ….

నా సాహిత్య” ప్రస్థానంలో” మా అన్నదమ్ములకీ, అప్పచెల్లెళ్ళకీ ఏ మాత్రం ప్రమేయం లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను కానీ అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే, ముందుగానే చెప్పుకునేది నాది పెద్ద “ప్రస్త్హానం” కానే కాదు. ఏదో మామూలు జనతా క్లాసు ప్రయాణమే అయినా ప్రస్థానం లాంటి పెద్ద, పెద్ద మాటలు వాడితే  నా భుజాలు నేనే తట్టుకోడానికి బావుంటుంది కదా అని తంటాలు పడుతున్నాను. ఇక ఎవరయినా ఒక రచయిత అవడానికి వారసత్వం కారణం కానక్కర లేదు. ఆ మాట కొస్తే నాకు తెలిసీ చాలా మంది సాహితీవేత్తలు తమ పిల్లలని . “మా లాగా కథలు, కవిత్వాలు రాసుకుంటూ అవస్థ పడకుండా హాయిగా చదువుకుని ”పైకి” రమ్మని ప్రోత్సహించిన వారే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ “పైకి” రావడం అంటే డబ్బు సంపాదించుకోవడం అని అర్ధం. అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్తల సంతానం చాలా మంది అమెరికాలో పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకో తెలియదు కానీ  వాళ్ళల్లో చాలా మంది గోప్యంగానే ఉంటారు. నా విషయంలో మా బంధువులకి  “రాజా గాడు చదువుకున్నాడు కానీ కథలూ, కమామీషులలో పడిపోయి  పైకి రాలేక పోయాడు” అనేదే చాలా మందికి ఉన్న బాధ. నాకు తెలిసీ  నా ముగ్గురు అన్నయ్యలకీ, తమ్ముడికీ, అక్కకీ, ముగ్గురు చెల్లెళ్మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ లలో ఎవరికీ రచనావ్యాసంగం లేదు.

కానీ మా పెద్దన్నయ్య అందరి లాగా కాదు. కొంతమంది పెద్దన్నయ్యలు నిజంగానే పెద్దన్నయ్యలాగా ఉంటారు. నాకే కాదు….మా చుట్టాల్లో కూడా వరసకి ఏమైనా కానీ, అందరికీ మా పెద్దన్నయ్య పెద్దన్నయ్యే! అందరూ ఉహించినట్టుగానే  అతని పేరు మా తాత గారి పేరే….సూర్య ప్రకాశ రావు. మా కుటుంబంలో ‘కలాపోసన కీ కళాకౌశల్యానికీ కూడా ఆయనే పెద్దాయన. ఉదాహరణకి, మా చిన్నప్పుడు, ముఖ్యంగా మా అక్క పెళ్లి కాక ముందు, ప్రతీ ఏడూ సంక్రాంతి, దసరా మాకే కాక కాకినాడ మొత్తానికే పెద్ద పండుగలు. అందుకు ప్రధాన కారణం, ఆ పెద్దన్నయ్య వారాల తరబడి అతి జాగ్రత్తగా అధ్బుతమైన ఊహాశక్తితో మా అక్క పేరిట ఒక సినిమా సెట్టింగ్ లా నిర్మింఛే బొమ్మల కొలువులే!