అలరుల నడుగగ …

untitled

అనువాద కవిత, మూలము – వైరముత్తు

 

కొన్ని రోజులకు ముందు యూట్యూబ్‌లో పాటలను వింటున్నప్పుడు ఈ పాటను వినడము తటస్థించింది.  పాట నడక, అందులోని కవితకు నేను పరవశుడిని అయ్యాను. ఈ పాటను “ఓ కాదల్ కణ్మణి” (OK కణ్మణి లేక ఓ ప్రేమ కంటిపాప) అనే తమిళ చిత్రములో  ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకత్వములో గాయని చిత్రా పాడినారు.  కొన్ని అన్య స్వరములతో కూడిన బేహాగ్ రాగములోని యీ పాట చివర రహ్మాన్ గొంతుక కూడ వినబడుతుంది. గీత రచయిత వైరముత్తు. పాటను వినిన తత్క్షణమే తెలుగులో అదే మెట్టులో దానిని అనువాదము చేయాలని నాకనిపించింది. ఈ పాటకు, తమిళ మూలము, ఆంగ్లములో, తెలుగులో (అదే మెట్టులో పాటగా, పద్యరూపముగా) నా అనువాదములను మీ ఆనందముకోసము అందిస్తున్నాను. పాటను క్రింది లంకెలో వినగలరు –

மலர்கள் கேட்டேன் வனமே தந்தனை

தண்ணீர் கேட்டேன் அமிர்த்தம் தந்தனை

எதை நான் கேட்பின் உனையே தருவாய்

 

మలర్‌గళ్ కేట్టేన్ వనమే తందనై

తణ్ణీర్ కేట్టేన్ అమిర్దమ్ తందనై

ఎదై నాన్ కేట్పిన్ ఉనైయే తరువాయ్

 

అలరుల నడుగఁగ వని నొసఁగితివే

జలముల నడుగఁగ సుధ నొసగితివే

ఏమడిగినచో నిన్నొసఁగెదవో

 

When I wished for flowers,

I received from you the whole garden

When I wished for water,

I received from you the drink of immortality

What should I wish for,

so that you  give yourself to me?

 

காட்டில் தொலைந்தேன் வழியாய் வந்தனை

இருளில் தொலைந்தேன் ஒளியாய் வந்தனை

எதனில் தொலைந்தால் நீயே வருவாய்

 

కాట్టిల్ తొలైందేన్ వళియాయ్ వందనై

ఇరుళిల్ తొలైందేన్ ఒళియాయ్ వందనై

ఎదనిల్ తొలైందాల్ నీయే వరువాయ్

 

కానను దప్పితి బాటగ వచ్చితి

విరులున దప్పితి వెలుగుగ వచ్చితి

వెటు దప్పినచో నీవిట వత్తువొ

While I was lost in the woods,

I saw you as the path forward

While I was lost in the darkness,

I saw you as the illuminating light

Where should I get lost,

so that you reveal yourself before me?

 

பள்ளம் வீழ்ந்தேன் சிகரம் சேர்த்தனை

வெள்ளம் வீழ்ந்தேன் கரையில் சேர்த்தனை

எதநில் வீழ்ந்தால் உந்நிடம் சேர்பாய்

 

పళ్ళమ్ వీళ్‌న్దేన్ శిగరమ్ శేర్తనై

వెళ్ళమ్ వీళ్‌న్దేన్ కరైయిల్ శేర్తనై

ఎదనిల్ వీళ్న్దాల్ ఉన్నిడమ్ శేర్పాయ్

 

పల్లములోఁ బడ నగ మెక్కింతువు

వెల్లువలోఁ బడ దరిఁ జేర్పింతువు

ఎందుఁ బడినచో నిను జేరుటయో

 

When I fell into the pits,

you carried me to the summit

When I fell into the whirlpool,

you rescued me to the safety of the shore

Where should I fall,

so that you become one with me?

(తందనై, కరై మొదలైన పదాలను పలికేటప్పుడు తమిళములో ఐ-కారమును ఊది పలుకరు, అది అ-కారములా ధ్వనిస్తుంది. ఛందస్సులో కూడ వాటిని లఘువులుగా పరిగణిస్తారు.)

పద్యములుగా మూడు పంచమాత్రల సంగమవతీ వృత్తములో  స్వేచ్ఛానువాదము –

సంగమవతీ – భ/జ/న/స UIII UIII – IIIU
12 జగతి 2031

సూనమును నేనడుగ – సొబగుగాఁ
గాననము సూపితివి – కనులకున్
పానమున కంభువును – బసవఁగా
సోనలుగ నిచ్చితివి – సుధలనే

ఆవిపినమం దెఱుఁగ – కలయఁగాఁ
ద్రోవగను వచ్చితివి – తురితమై
పోవఁగను జీఁకటులఁ – బొగులుచున్
నీవు వెలుఁ గిచ్చితివి – నెనరుతో

పల్లమున నేనెటులొ – పడఁగ రం-
జిల్లగను జేర్చితివి – శిఖరమున్
వెల్లువల నేనెటులొ – ప్రిదిలి కం-
పిల్ల దరి చేర్చితివి – వెఱువకన్

ఇచ్చుటకు నేమడుగు – టికపయిన్
వచ్చుటకు నేమగుట – వసుధపై
ఇచ్చ నిను జేరఁ బడు – టెచటనో
ముచ్చటగ రమ్ము మది – ముదమిడన్

*

 

సిరివెన్నెల శివదర్పణ గీతం!

 siva

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప గీతరచయితలే కాక గొప్ప శివభక్తులు కూడా. తమ గురువు గారైన సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో శివునిపై వేయి గీతాలు రాయాలని సంకల్పించారు. ఈ గీతాలలో కొన్ని “శివదర్పణం అనే పుస్తకంగా వచ్చాయి. ఈ పుస్తకంలోని పాటలు కొన్ని  రెండు ఆడియో క్యాసెట్లుగానూ వచ్చాయి. ఈ గీతరచనా సంకల్పం గురించి “శివదర్పణం”లో సిరివెన్నెల ఇలా చెప్పారు –

“అడగకుండానే, శ్రమించి సాధించకుండానే, మాటల్ని పాటల పేటలుగా కూర్చే చిన్ని విద్దెను పుట్టుకతోనే ఇచ్చిన పరాత్పరుడి కరుణాకటాక్ష వరానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బతుకుని అర్థవంతం చేసుకుని తరించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అనిపించడమే శ్రీకారంగా, ఈ గీతాయజ్ఞం 1990లో ప్రారంభించాను. వెయ్యి పాటల్నీ వెయ్యి యజ్ఞాలుగా చేసి, సహస్రమఖ పూర్తి సిద్ధి పొంది, తద్వారా లభించే దేవేంద్రత్వాన్ని, దేవదేవుని సేవేంద్రత్వంగా మలచుకోవచ్చని అత్యాశ కలిగింది!”

ఆయన అత్యాశ మన పాలిటి వరమై, అద్భుత సాహితీ యజ్ఞమై నిలిచింది! ఈ పుస్తకంలో ఉన్న ప్రతిపాటా ఆణిముత్యం. భక్తిగా సిరివెన్నెల తనని తాను శివునికి అర్పించుకున్న విధానం మనసుని స్పందింపజేస్తుంది. ఈ పాటల్లో ఆయన వాడిన భాషని చూస్తే సిరివెన్నెల ఎంత పదసంపద కలవారో తెలుస్తుంది. సినిమా పాటల కోసం తనని తాను భోళాశంకరునిగా మలచుకున్నారే తప్ప ఆయనో మహోన్నత కైలాస శిఖరమని అర్థమవుతుంది!

“శివదర్పణం” అంటే శివుణ్ణి చూపించే అద్దం. అయితే సిరివెన్నెలకి శివుడంటే క్యాలెండర్ లో కనిపించే దేవుడు కాదు. శివుడంటే మనం, శివుడంటే సమస్తం! ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“జగత్తు మొత్తాన్నీ త్రికాలసమేతంగా సాకల్యంగా సజీవంగా సంక్షిప్తంగా ప్రతిబింబించే అద్దం మనం! అలాగే మనకీ ప్రపంచం అద్దమవుతుంది. అయితే మనలా సూక్షంగా లేదే? మన భౌతిక తత్త్వాన్ని సరిగ్గా మన పరిమాణంలోనే ప్రతిబింబించేలా ప్రపంచాన్ని కుదించగలమా? అలా కుదిస్తే ఆ అద్దం శివుడు అవుతుంది. శివుడంటే ప్రపంచమే! శివుడంటే మనమే! శివుణ్ణి సరిగ్గా చూడగలిగితే మనని మనం సరిగ్గా, సజీవంగా, సంపూర్ణంగా, చూడగలం. అలాంటి శివదర్పణాన్ని చూపించడమే నా ఉద్దేశ్యం!”

ఆయనిలా చక్కగా చూపించినా, అర్థమయ్యేలా వివరించినా, శివతత్త్వాన్ని గ్రహించడానికి చాలా సంస్కారం, జ్ఞానం ఉండాలి అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సిరివెన్నెల గీతధారలో తడిసే ఆనందం దక్కాలంటే మాత్రం హృదయం ఉంటే చాలు. అందుకే ఈ పుస్తకంలోని ఒక పాటని పరికించి పులకిద్దాం!

sirivennela

“తొలిజోత” అనే పేరుతో రాసిన ఈ గీతం పుస్తకంలో మొదటిది. శివదర్పణ యజ్ఞాన్ని మొదలుపెడుతూ వినాయకునికి ప్రార్థనగా రాసిన గీతం.

పల్లవి:

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

చరణం 1:

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

చరణం 2:

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

చరణం 3:

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

విఘ్నేశ్వర స్తుతిలోనూ తెలివిగా శివుణ్ణి ప్రస్తుతించారిక్కడ సిరివెన్నెల! “అగజాసూనుడు” అంటే పార్వతీ (అగజా) తనయుడైన (సూనుడు) వినాయకుడు! అఖిల జగాలూ ఏ పని చేసినా ముందుగా దణ్ణం పెట్టుకునేది వినాయకునికి! మరి ఆ వినాయకుడు భక్తిగా తొలిపూజ చేసేది ఎవరికి అంటే శివుడికి! ఆ శివుడికి సిరివెన్నెల తన గీతాలను అంకితం ఇస్తున్నారు. ఈ శివదర్పణ కృతి సిరివెన్నెల మేధలోంచి జాలువారిన  కవితామృతధార! ఆ తలపోత, కైతలసేత పొందే ధన్యత మనది!

 

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

వినాయకుడికి (హేరంబుడు) తొలి వందనాలు చేసి మొదలుపెట్టిన ఏ పనైనా ఆయన ప్రాపు (ఆలంబన) వల్ల విఘ్నాలు లేకుండా వేగంగా (అవిలంబితము) సాగుతుంది. ఇక్కడ సిరివెన్నెలకి అవ్వాల్సిన పని వేయి గీతాలు పూర్తిచెయ్యడం కాదు. ఆ గీతాల ద్వారా తాను చేసిన శత వందనాల చేష్టని (శత వందనముల చేత) ఆ శివుని చెంతన చేర్చడం!  ఇది తన వల్ల అయ్యేది కాదు కనుక చంద్రజేత అయిన వినాయకుని శరణుకోరుతున్నాను అంటున్నారు! ఆ వినాయకుడు శివుడికి రోజూ అర్పించే వందనాల (అంజలి) వెంట సిరివెన్నెల యొక్క  హృదయభారాన్నీ తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుని పాదాల చెంత అర్పించాలట! ఎంత చక్కని భావం!  చేత/జేత వంటి పదాలతో శబ్దాలంకారాలు చేస్తూనే గొప్ప అర్థాన్నీ సాధించారిక్కడ సిరివెన్నెల!

 

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

అల్పత్వ భావన లేనిదే భక్తి లేదు. ఆ భగవంతుని ముందు నేనెంత, ఆయన్ని స్తుతించడానికి నా అర్హతెంత అనుకున్నప్పుడే  ఆయన కటాక్షం వలన గొప్ప కృతులు పుడతాయి! ఇదే ఇక్కడ సిరివెన్నెలలో కనిపిస్తోంది.  “నా అర్హత ఏమిటో కొంచెం కూడా తెలుసుకోకుండానే (గణుతించక) ఆ శివుణ్ణి స్తుతించాలనుకున్నాను! అందుకే స్కందపూర్వజుడైన ఆ వినాయకుడిని శరణు వేడుకుంటున్నాను! ఆయనే దయతో నాకు చేయూత నివ్వాలి! పుట్టుకలేనివాడూ (అజాతుడు), ఆలోచనకి అందనివాడూ (అచింత్యుడు), అంతము లేనివాడూ (అనంతుడు), పరిమితులు లేనివాడూ (అమేయుడు) అయిన ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఈ శివకీర్తనల ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది నా అల్పత్వం. ఈ అల్పత్వం శర్వుడైన ఆ శివుణ్ణి సర్వమంగళంగా ప్రస్తుతించే అర్హతగా మారాలి అన్నది నా ఆశ.  ఈ నా ఆశని ఆ వినాయకుడే తన అపారమైన దయతో  తీర్చాలి!” అని వేడుకుంటున్నారు సిరివెన్నెల! ఇంత భక్తితో వేడుకుంటే వినాయకుడు తీర్చకుండా ఉంటాడా?

 

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

శివకవిత రాయాలంటే భక్తీ ప్రతిభతో పాటూ సుకృతమూ ఉండాలి! పరమాత్ముని కీర్తనం పుణ్యులకే సాధ్యపడుతుంది. అందుకే సిరివెన్నెల – “మంచి సంకల్పాలతో కూర్చబడిన (సంకలిత) ఈ శివకవిత, కూడబెట్టబడిన (సంచిత) నా సుకృతాల వలనే పుట్టింది (సంభూతము)” అంటున్నారు. పుణ్యాత్ములకే గొప్ప సంకల్పాలు కలుగుతాయి మరి!

ఈ సంకలనం “కవులలో కవి” అని ప్రస్తుతించబడిన సిద్ధివినాయకుని స్తోత్రం (గణన) వలన పవిత్రతను పొందింది (పరిపూత). అంటే తన గీతాలలో గొప్పతనమేదైనా ఉంటే అది కేవలం తన సుకృతం వల్ల, వినాయకుని దయ వల్ల, శివుని విభూతి వల్ల సాధ్యపడిందే తప్ప నాదంటూ ఘనత ఏమీ లేదని వినమ్రంగా సిరివెన్నెల చెప్పుకుంటున్నారు! “కవిం కవీనాం” అన్న వినాయక స్తుతిలో కవి అంటే కవిత్వం రాసేవాడు అని కాక జ్ఞాని, మేధావి అన్న అర్థం చెప్తారు. గొప్ప కవిత్వాన్ని కలిగిన ఈ శివదర్పణ సంకలనపు తొలిగీతంలో  “కవులలో కవి” అంటూ వినాయకుణ్ణి స్తుతించడం ఎంతైనా సముచితం!

ఆ శివుని ఆజ్ఞని ఎరుగని తన తిరస్కార (అవజ్ఞ) ధోరణిని ఆ విద్యాదినాధుడైన వినాయకుడే వంచుతాడు అంటున్నారు!  అంత భక్తితో, వినమ్రతతో ఉన్న సిరివెన్నెలకి తిరస్కారం ఎక్కడ నుంచి వచ్చింది? శివుని గురించి ఏమీ తెలియని అజ్ఞానం నాదని ముందు చరణంలో చెప్పుకున్నారు కదా, అలాంటి అల్పత్వం ఉన్నా లెక్కపెట్టక శివుణ్ణి స్తుతించే సాహసం చెయ్యడమే ఈ తిరస్కార ధోరణి! ఇలాంటి తిరస్కారం చూస్తే శివుడు కోప్పడడు సరికదా, కరిగిపోతాడు!

ఇలా ఆ వినాయకుని అండ వలన సింధురాస్యుడైన ఆ శివునికి అర్పితమైన ఈ శివకీర్తనలు పావనమై సిద్ధిని సాధిస్తాయి! “సర్వపాపాలూ నశింపజేసే మంత్ర” (అఘమర్షణము) సంహితలై అలరారుతాయి!

భక్తితో సిరివెన్నెల అర్పించిన పుష్పాలీ గీతాలు. పూజ ఆయనది, పుణ్యం మనందరిదీ! భక్తి ఆయనది, ఆ భక్తికి పులకించే హృదయం మనది. ఇన్ని గొప్ప గీతాలు రాసిన సిరివెన్నెలా ధన్యులే, ఈ గీతాలను విని ఆనందించే భాగ్యం కలిగినందుకు మనమూ ధన్యులమే! సిరివెన్నెల గారికి సహస్ర వందనాలు.

శశిప్రీతం సంగీతంలో బాలు ఆర్తిగా ఆలపించిన ఈ గీతాన్ని

 వినొచ్చు!

 

దైవాన్ని దర్శించే కారుణ్యం!

 

 

-ఫణీంద్ర 

~

 

దేవుడే మనిషిగా అవతరించి మానవులని దగ్గరగా చూస్తే ఏమనుకుంటాడు? ఆశ్చర్యపోతాడా? జాలి పడతాడా? బాధ పడతాడా? బహుశా ఈ భావాలన్నీ కలగలిపిన ఒక మౌనస్థితికి చేరుకుంటాడేమో! అప్పుడు దేవుడి అంతరంగం మనిషికి ఏమని చెప్పాలనుకుంటుంది? “గోపాలా గోపాలా” చిత్రంలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు గేయ రచయిత సిరివెన్నెల తానే గీతాచార్యుడై మనందరికీ ఓ అద్భుతమైన గీతాన్ని అందించారు. మే 20 సిరివెన్నెల పుట్టినరోజు సందర్భంగా ఈ పాటని చర్చించుకుని, ఆకళింపు చేసుకుని, అంతో ఇంతో ఆచరణలో పెట్టడమే ఆయనకి అభిమానులు ఇవ్వగలిగే కానుక.

చిత్ర కథాపరంగా దేవుడైన కృష్ణుడు ఓ మామూలు మనిషై మూఢనమ్మకాలనీ, దేవుడి పేరు మీద లోకంలో చలామణీ అవుతున్న కొన్ని ఆచారాలనీ ప్రశ్నించిన ఓ వ్యాపారికి తోడ్పాటునందిస్తాడు. నిజానికి ఆ వ్యాపారి తన “భక్తుడు” కాకపోయినా, తన “భక్తులుగా” చెప్పుకుంటున్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నా కృషుడు అతని పక్షమే వహిస్తాడు! అతనికీ, అతనితో పాటూ మనుషులందరికీ దైవత్వపు అసలు లక్షణాలని వివరిస్తున్నట్టుగా సాగుతుంది ఈ పాట.

బ్రహ్మలా నేనే నిన్ను సృష్టించాననుకోనా?

బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా?

నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో

ఏమి అంటుందో నీ భావన!

 

నీదే నీదే ప్రశ్నా నీదే!

నీదే నీదే బదులూ నీదే!!

 

మనిషి సాక్షాత్తూ భూలోక బ్రహ్మే! మనసులో మెదిలిన ఊహలని తన మేధస్సుతో శక్తి సామర్ధ్యాలతో సాకారం చేసుకుంటాడు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. భూమండలాన్ని ఏలుతున్నాడు, మిగతా గ్రహాలపైనా కన్నేశాడు! ఇంత గొప్ప మనిషి దేవుడి గురించి చేసిన భావన ఏమిటి? దేవుడు కేవలం కోరిన వరాలిచ్చే గుడిలో ప్రతిమా? “నమ్ముకుంటే” చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు అని కొందరు, రాతిబొమ్మనో, రూపం లేని శక్తిస్వరూపాన్నో నమ్ముకోవడం ఎంత అజ్ఞానం అని నవ్వుకునే వాళ్ళు ఇంకొందరు! మరి దేవుడెవరనే నిజాన్ని ఎలా తెలుసుకోవడం? ప్రశ్నించడం వల్ల. ఇక్కడ “ప్రశ్న” అంటే కేవలం కుతూహలం కాదు, తెలివితేటల ప్రదర్శన కాదు, ఏర్పరుచున్న అభిప్రాయాల వ్యక్తీకరణ కాదు, ఎవరినో/దేనినో వ్యతిరేకిస్తూ అడిగేది కాదు. ఎంతో నిజాయితీగా చేసే ఒక తీవ్రమైన అన్వేషణ, అంతఃశోధన. అలాంటి “ప్రశ్న” నీదైనప్పుడు, బదులూ నీలోంచే వస్తుంది. బయటనుంచి కాదు. దేవుడంటే ఎవరన్నది ఎవరో చెప్పేది కాదు, మతగ్రంధాలు చదివితే తెలిసేది కాదు, నీకు నువ్వు అనుభవించాల్సింది.

 

నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని

నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని

తెలుసుకోగలిగే తెలివి నీకుందే

తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే!

 

నీదే నీదే స్వప్నం నీదే!

నీదే నీదే సత్యం నీదే!

 

దేవుడు కేవలం ఒక భావనే అయితే ఆ భావన ఎంత గొప్పదైనా దాని వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పైగా ఆ భావజాలాల్లో ఫిలాసఫీల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కూడా. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటూ మనని పర్యవేక్షిస్తున్నాడంటే ఆయన మననుంచీ మన జీవితాలనుండీ విడివడి ఉన్నాడని అనుకోవాల్సి వస్తుంది. దేవుడంటే ఇంతేనా? వివేకానందుడు రామకృష్ణ పరమహంసని మొదటిసారి కలిసినప్పుడు, “మీరు దేవుణ్ణి చూశారా?” అని అడిగితే, ఆయన “అవును! నేను ఉపనిషత్తులు క్షుణ్ణంగా చదివి దేవుణ్ణి దర్శించాను. దేవుడంటే ఎవరో తెలుసా?” అంటూ గొప్పగా ధ్వనించే విశేషణాలతో దేవుణ్ణి వర్ణించలేదు. “అవును! నేను చూశాను. నా ఎదురుగా ఉన్న నిన్ను చూసినట్టే, కానీ ఇంకా స్పష్టంగా! దేవుణ్ణి చూడొచ్చు, దేవుడితో మాట్లాడొచ్చు. కానీ ఆయన ఎవరికి కావాలి? భార్యపిల్లల కోసం, ఆస్తిపాస్తుల కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు కోసం కనీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎక్కడున్నారు? ఆర్తిగా వేడుకుంటే ఆయన తప్పక దర్శనమిస్తాడు!” అని చెప్పారు. ఇదీ నిజమైన భక్తంటే, ఇదీ దేవుణ్ణి దర్శించే తీరంటే!

“నీలో నిజాయితీ ఉంటే, ప్రశ్నించే తపనుంటే, నీ ప్రాణజ్యోతి ఆ దేవుడి నవ్వుగా గ్రహిస్తావు. నీ గుండెల్లో నాదం సాక్షాత్తూ ఆ కృష్ణుడి మురళీగానం అవుతుంది. నీకు దేవుడి నిజస్వరూపాన్ని తెలుసుకునే తెలివుంది. నీకు నువ్వే ఏర్పరుచుకున్న స్వప్నాల తెరలను తొలగించు, సత్యం సూర్యప్రకాశంతో కనిపిస్తుంది” అని సిరివెన్నెల మనకి  ప్రబోధిస్తున్నది ఇదే!

 

ఎక్కడెక్కడని  దిక్కులన్ని తిరిగితే  నిన్ను నువ్వు  చూడగలవా?

కరుణతో కరిగిన మది మందిరమున  కొలువై  నువ్వు  లేవా?

అక్కడక్కడని  నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా?

చెలిమిని పంచగా చాచిన చేయివైతే  దైవం నువ్వు కావా?

 

నీదే నీదే ధర్మం  నీదే!

నీదే నీదే మర్మం నీదే!

 

లోకంలో భౌతికవాదులు (materialists), ఆధ్యాత్మికవాదులు (spiritualists) అనే తేడా కనిపిస్తూ ఉంటుంది. స్థూలంగా చూస్తే ఈ ఇద్దరూ వేర్వేరుగా కనిపిస్తున్నా సూక్ష్మంగా చూస్తే ఇద్దరూ ఒకే “ఆనందాన్ని” వెతుకుతున్నారని జ్ఞానులు చెబుతూ ఉంటారు. మన ప్రస్తుతపు ఉనికిలో ఉన్న ఒక లోటుని అధిగమించడానికే కదా మన తపనంతా! ఆ లోటు సామజికమైనది అనిపిస్తే సమాజసేవో, సమాజోద్ధరణో, లేదో సామజికవిప్లవమో మన లక్ష్యమౌతుంది. వ్యక్తిగతమైనదైతే జీవితాన్ని గెలవడమో, డబ్బు సంపాదించడమో, సంఘంలో గౌరవమో మన లక్ష్యమౌతుంది. ఆత్మికమైనదైతే భక్తో, యోగమో, వేదాంతమో సాధనామార్గమౌతుంది. అంతే తేడా! కానీ లోటున్నది నీలో, నీ వెతుకులాటంతా బయట! ఎంత సాధించినా సంతృప్తిలేక తిరిగితిరిగి అలసిసొలసి చివరికి నీలోకి నువ్వే చూసుకున్నప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నాన్ని చేసినప్పుడు, నువ్వు దైవానికి చేరువవుతావు!

ఎందరో మహాగురువులు పదే పదే చెప్పిన ఈ విషయాన్నే సిరివెన్నెల ఎంతో సులభంగా వివరిస్తూ కొన్ని “ప్రాక్టికల్ టిప్స్” కూడా చెప్పారు. “నిన్ను నువ్వు వెతుకుతూ అలజడితో దిక్కులన్నీ తిరగకు, నీ మనసు కరుణకి కొలువైతే నీలోనే నిన్ను కనుగొనలేవా?” అన్నారు. “కరుణ” ప్రేమకి పరాకాష్ట. ప్రేమలో ఇంకా కొంత కోరుకోవడం ఉంటుంది, కరుణ సంపూర్ణమైన నిండుదనమై ఏమీ కోరుకోక ఇవ్వడంలోనే ఆనందపడుతుంది. కరుణతో నిండిన హృదయం దైవనిలయం కాదూ? “నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఆకాశానికి నిచ్చెన వెయ్యకు, ప్రేమతో సాటి మనిషి హృదయానికి వంతెన వెయ్యి” అన్నారు. ఆధ్యాత్మికత అంటే సాటి మనిషినీ, సమాజాన్ని విస్మరించే స్వార్థం కాకూడదు. సమస్తాన్ని తనలో ఇముడ్చుకునే ఔదార్యం కావాలి. అప్పుడు దైవభక్తి లోకకళ్యాణ కారకమౌతుంది. “ధర్మ”మంటే ఇలాంటి ప్రవర్తనమే. ఇదే దేవుణ్ణి చేరుకోవడానికి సులభమైన రహస్యం! ఈ మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు!

సిరివెన్నెల గారికి ముమ్మారు మొక్కుతూ, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను!

 

(ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వీక్షించొచ్చు)

 

 

 

 

 

వద్దు వద్దు కోపము

 

అవినేని భాస్కర్ 

 

Avineni Bhaskarఅన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

 

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.

annamayya

AUDIO : వద్దు వద్దు కోపము (ఇక్కడ వినండి)

పల్లవి
వద్దు వద్దు కోపము వదినె నింతే నీకు
సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నునుచరణం 1
మారుకొన్న దానఁగాను మాటాడినదానఁగాను
యేరా నాతోనేల యెగ్గు పట్టేవు
గీరితి నింతే గోరకెలని పరాకు రాఁగా
కూరిమి నిట్టే వేఁడుకొనేను నిన్నుచరణం 2
గుంపించినదానఁ గాను గొణఁగిన దానఁగాను
తెంపున నేరా నన్ను దీకొనేవు
చెంపల చెమట జార చేఁతఁదుడిచితి నింతే
అంపలేను ఆయమంటి ఆదరించే నిన్నును

చరణం 3
పాసివున్నదానఁ గాను పదరినదానఁగాను
వేసరక నన్నునేల వెడ్డువెట్టేవు
ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
మోసలేదు నీకునాకు మొక్కుమెచ్చే నిన్నును

 

తాత్పర్యం (Explanation) :
అన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.


కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

సుద్దులు = మాటలు
సొలసితి = విసిగిపోతిని

 

మారుకొను = అడ్డగించు, ఎదిరించు, ఆపివేయు
ఎగ్గుపట్టు = తప్పుగా భావించు
గీరితిని = మూర్చపోతిని, సొమ్మసిల్లితిని
గోరకెలన = దరిదాపుల్లో, దగ్గర, సమీపాన
పరాకు = ఉదాసీనత, indifference

 

గుంపించు = అతిక్రమించు
గొణగు = సణుగుడు/సనుగుడు, మారుపలుకు
తెంపున = విసురుగా, rudeness
దీకొను = ఎదిరించు
అంపలేను = పంపలేను
ఆయమంటి = మనసులోచేరి
ఆదరించు = పోషించు, సాకు

పాసి = ఎడబాసి, దూరంగా, విడిచిపెట్టి
పదరు = ఆత్రపడు
వేసరక = నొచ్చుకోక
వెడ్డువెట్టేవు = వంచించేవు
మోసలేదు = కపటంలేదు
మొక్కుమెచ్చు = ప్రార్ధించి మెచ్చుకొను

 

రావే కోడల రట్టడి కోడల…

Avineni Bhaskar

   అవినేని భాస్కర్ 

మనిషి జీవితంలోని అన్ని సన్నివేశాలకీ సంకీర్తనలు రాశాడు అన్నమయ్య. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ పరమాత్మ అవతారాన్నే చూశాడు. మేమేనా ఆ సంసారంలో కొట్టుమిట్టాడాల్సినది? మీరూ రండి అని దేవుళ్ళని చేయిపట్టి లౌకిక జీవితంలోకి లాక్కొచ్చి మానవ జీవితంలోని కష్టనష్టాలను దేవుళ్ళకి ఆపాదించాడు. అలా చెయ్యడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, “మనకే కాదు దేవుళ్ళకైనా సంసార జీవితం సులువుగా సాగట్లేదు” అని చెప్పి విరక్తి కలగనియ్యకుండ ధైర్యాన్ని కలిగించడమే.

అన్నమయ్య ఎన్నో యుగళగీతాలు (డ్యూయట్లు) రాశాడు. కొన్ని బావా-మరదళ్ళు పాడుకునేవి, కొన్ని నాయికా-నాయకులు పాడుకునేవి, కొన్ని గొల్లెత-గొల్లడు పాడుకునేవి, కొన్ని నాయిక-దూతికలు పాడుకునేవి. ఈ కీర్తన అత్తా-కోడలు పడుకునే డ్యూయట్.
అత్తా-కోడళ్ళ గొడవలు నేటి మెగా సీరియల్ల బిజినెస్ కోసం పుట్టినవి కావు. ఆదిలక్ష్మి అత్తయిన రోజునుండే ఉందని సాటి చెప్పడానికే ఈ కీర్తన రాశాడేమో. బ్రహ్మదేవుడు మహావిష్ణువు బొడ్డులోనుండి పుట్టాడు. కావున బ్రహ్మ మహాలక్ష్మి-విష్ణువుల కొడుకు. బ్రహ్మ భార్య సరస్వతి, మహాలక్ష్మికి కోడలు. మహాలక్ష్మి సిరి(డబ్బు)కి ప్రతిరూపం. సరస్వతి చదువులతల్లి, కళలకు ప్రతిరూపం.
ఈ భాషేంటి ఇలా ఉంది? సరస్వతీ, మహాలక్ష్మీ ఇలా దెప్పుకుంటారా అని ప్రశ్నించేవారికి – అన్నమయ్య సరస్వతినీ, మహాలక్ష్మినీ ఒక సామాన్య కుటుంబంలోని ఆడవాళ్ళుగా చిత్రీకరించాడు. అంటే దేవుళ్ళను సామాన్య ప్రజలకు దగ్గర చేయడం అన్నమయ్య ఉద్దేశం. దేవుళ్ళంటే ఎక్కడో సామాన్యులకందనంత ఎత్తులో ఉంటారన్న భ్రమని పోగొట్టి పామరులకు దగ్గర చేసేరీతిలో పలు జానపద కీర్తనలు రచించాడు. ఈ కీర్తన కూడా అలాంటొక జానపద శైలిలో రాయబడినదే. కావున భాష, భావం ప్రజల జీవితాల్లోనుండే తీసుకున్నాడు.
ఎంతటి వాళ్లైనా అత్తాకోడళ్ళుగా ఉన్నప్పుడు చిన్నచిన్న కోపతాపాలు, పోటీలు తప్పవనడానికి ఈ కీర్తన నిదర్శనం. పైకి ఎంత సఖ్యతగా కనిపించే అత్తా-కోడళ్ళకైనా లోలోపల పోటీ, భయం ఉంటుంది. కొడుకుని తననుండి దూరం చేసేస్తుందేమో అన్న భయంతో అత్త, మొగుడు అమ్మచాడు అబ్బాయిలాగే (momma’s boy లా)  ఉంటే నన్ను ప్రేమించడేమో అన్న అనుమానంతో కోడలు మెలుగుతుంటారు. ఎవరిఅభద్రత(insecurities) వాళ్ళవి! ఎవరికి వారు ఆధిపత్యం(domination)  ప్రదర్శిస్తారు. నేను నీ మొగుడికి తల్లిని అని అత్త హెచ్చులుపోతే, నీ కొడుక్కి పెళ్ళాన్ని అని కోడలు గర్వం ప్రదర్శిస్తూ ఉంటుంది.
annamayya
ఆ అత్తాకోడళ్ళకి గొడవలొస్తే ఎలా దెప్పుకుంటారో వినండి.
|| అత్త: సుశీల || కోడలు: వాణి జయరాం || స్వరకల్పన : గుంటి నాగేశ్వర నాయుడు||
పల్లవి
రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులు నీతోఁజాలును
 
చరణాలు
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా 
 
ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా
 
బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని –
నడ్డగించుకొంటివత్తయ్యా
 
మూలం : తాళ్ళపాక సాహిత్యం వాల్యూం 5, పుట : 286
తాత్పర్యం ( Explanation ) :
రావే పరువుమాలిన కోడలా అని అత్తయ్య చురకేస్తే, పోవే అత్తయ్యా! నీతో సఖ్యత నాకొద్దు అని కోడలంటుంది. [ కోడలు ఎవరీ కంటా, నోటా పడకుండ గుట్టుగా ఉంటే ఆ ఇంటికి గౌరవం! అదేం విపరీతమో అందరు నీ గురించే పలవరిస్తున్నారు. ఇంటిపరువు రచ్చకెక్కింది అని కోడలు సరస్వతిని దెప్పుతుంది అత్త మహాలక్ష్మి. ఆరాధన భావానికీ, అడ్డగోలు మాటలకీ తేడా తెలియని నీతో నాకేంటి మాటలు పోవే అత్తయ్యా అని మహాలక్ష్మిని తిప్పికొడుతుంది కోడలు ]
పండితులు, కవుల రూపంలో రాజుల ముందర సంకోచించకుండ ప్రసంగాలూ, ప్రదర్శనలూ చేస్తూ ఉంటావు ఏం మనిషివి నువ్వు అని అత్త అడిగితే… అవును మరి! నన్ననే ముందు నీ కథేంటో చూసుకో అత్తయ్యా! అంకెలరూపంలో ధనవంతుల ఇళ్ళలో తిరుగుతావుగా? బురదలో పుట్టిన తామర పువ్వులాంటి ముఖమూ నువ్వూ అని కోడలు ఎదురు ప్రశ్నేస్తుంది. [కవులు పండితులకి ప్రభలిచ్చేది సరస్వతి. వారు ఎప్పుడూ రాజులదగ్గరా, కలిగినవారిదగ్గరా చేరి తమ పాండిత్యాన్ని గర్వంగా, ఠీవిగా ప్రదర్శిస్తు ఉంటారు. సిరికి దేవత మహాలక్ష్మి. డబ్బు అందరిదగ్గరా చేరదు. కొందరు దొడ్డవారిళ్ళల్లో అంకెలతో కొలవబడుతూ ఉంటుంది. ఇక్కడ “పంకజముఖి” అని సంభోదించడంలో చమత్కారమైన తిట్టు దాగుంది. పంకజం బురదలో పుడుతుంది కదా?]

ఇక్కడా అక్కడ అని సిగ్గుశరములేకుండ నలుగురైదుమంది మగవాళ్ళ సాంగత్యంలో ఉంటావు అని అత్త దెప్పితే, వాడకు పదిమంది దగ్గర చేరి వాళ్ళ మధ్యనే ఉంటావు నువ్వేం తక్కువా? అంటోంది కోడలు. [ ఏగురు అంటే ఐదుగురు అని అర్థం. వాడకు నలుగురు, ఐదుగురు పండితులు ఉంటారు. సరస్వతి వాళ్ళనే కటాక్షించి ఆదుకుంటుంది అని భావం. సిరి అయినా అంతే అందరిదగ్గరా చేరదు. ఏ కొందరిచెంతో మాత్రమే ఉంటుంది].

ఏం చూసుకుని నీకంత టెక్కు? మా ఆయన బొడ్డున పుట్టిన పిల్లాడు బ్రహ్మకి ఒక పిల్లని తెచ్చి పెళ్ళి చేసిపెడదాం అని ఏమీలేని నిన్ను పోనీలే అని కోడలిగా తెచ్చుకున్నాను అని మహాలక్ష్మి సరస్వతిని చిన్నబుచ్చింది. నన్నంత మాటంటావా? నువ్వేమో పెద్ద గొప్పా? కొండపైన మహరాజులా ఆనందంగా జీవిస్తున్న అమాయక చక్రవర్తిని మాయచేసి నీ వలలో వేసుకున్నావు అని కోడలు అత్తని నిలదీస్తుంది.
కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :
రట్టడి = అపకీర్తి, పరువుమాలిన
పొందులు = సఖ్యత, స్నేహము
రంకెలువేయుచు = ప్రగల్భాలు పలుకుతు, హెచ్చులుపోతూ, గర్జనలు చేస్తూ
కొంకుకొసరు = సంకోచము, సిగ్గుశరము
పంకజముఖి = (బురదలోపుట్టిన) తామర పువ్వులాంటి ముఖము
దొడ్డవారిండ్ల = కలవారిళ్ళలో, ధనికులైనవారి ఇళ్ళలో

అంకెల = అంకెల రూపంలో

ఈడాడ = ఇక్కడా అక్కడా, ఇటు అటు
ఏగురు = ఐదుగురు, అయిదుమంది,
మొగలతో = మగవారితో
ఆడాడ = అక్కడక్కడ
బొడ్డున = నాభిలో, బొడ్డులో
పూప = శిశువు, పిల్లవాడు (ఇక్కడ బ్రహ్మ అని అర్థం)
గొడ్డేరు = గుత్తకు, వేలం
గుడ్డము = కొండ, క్షేత్రము

అడ్డగించు = బలవంతంగా సొంతంచేసుకోవడం

ఒకటిపై ఒకటి నీ ఉపాయాలు…

 అవినేని భాస్కర్ 

Avineni Bhaskarవెంకన్నకి మంగమ్మంటే వల్లమాలిన ప్రేమ, మోహం. ఆమెతో మాట్లాడటానికి, తీయ తీయగా ఆమె చెప్పే కబుర్లు వినడానికీ, ఏకాంతంగా ఆమెతో సమయం గడపడానికి, అతిమెత్తని ఆమె మేను తాకడానికీ, సరసాలాడటానికీ అతనెన్నెన్ని ఉపాయలు చేస్తాడో! “మహానుభావా, నీ ఎత్తుగడలన్నీ ఎందుకో నాకు బాగా తెలుసు” అని ప్రేమగా విసుక్కుంటుంది మంగమ్మ.

 
శ్రీవారి ఉపాయాలేవిటో శ్రీదేవి మాటల్లోనే పాటగా రాశాడు అన్నమయ్య!

పల్లవి
ఒకటిపై నొకటి నీవుపాయాలు
వెకలి నీ విద్యలెల్ల వెల్లవిరి గావా

చరణం 1
సందడి నాచేయి* ముట్టి సరసాలాడేకొరకే
పందెమాడవచ్చేవు పలుమారును
మందలించి నాచేత మాటలాడించవలసి
అందపుఁగత లడిగే వది నే నెఱఁగనా

చరణం 2
యేరా నాకుచగిరు లిటు ముట్టేయందుకుఁగా
హారములు చిక్కుదీసే వది మేలురా
గోరికొన దాఁకించేకొరకుఁగా చెక్కుముట్టి
యీరీతి వేఁడుకొనే విన్నియుఁ దెలిసెరా

చరణం 3
యీకడ నన్నుఁగూడే ఇందుకుఁగా నింతసేసి
యేకతమాడేనంటా నెనసితివి
పైకొని శ్రీవేంకటేశ బడివాయకుండా న-
న్నాకుమడిచిమ్మనేవు అవురా నీవు
 
               * మూలంలో “చేఇ” అని ఉంది.

తాత్పర్యం (Meaning) :

స్వామీ! నా పొందుకోసం నువ్వు పడే తపన, చేసే ప్రతిచర్య నాకు తెలుసు. వెకిలిగా నువ్వు వేసే ఎత్తుగడలకి భావాలేంటో నాకిట్టే తెలిసిపోతాయి.

దగ్గరచేరి పదేపదే నా చేతులు పట్టుకుని ఒట్లు పెట్టేది? నాతో సరసాలాడటానికే అని నాకు తెలుసు. నా మాటలు వినడం నీకు ఆనందం. నా చేత కబుర్లు చెప్పించుకోవడం, నన్ను అజ్ఞాపించి కథలు చెప్పించుకోవడం నా గొంతులో పలికే మాటలు వినడానికేనని నాకు తెలియదా?

నా మెడలో ఉన్న హారాలు, గొలుసులు సరిగ్గానే ఉన్నాయి. అయినా నువ్వు నా దగ్గరకొచ్చి హారాలు సవరించేది నా చన్నులను తాకాలన్న ఆశతోనే అని నాకు తెలుసు. మాటిమాటికీ నా ముఖాన్ని నీ చేతుల్లోకి తీసుకుని బతిమలాడేది మునివేళ్ళతో నా బుగ్గలు గిల్లుకోవడానికే అని నాకు తెలియదా?

నన్ను కలుసుకోవాలని ఏవో వింతలు, వుపాయాలు చేసి ఇలా దగ్గరయ్యావని నాకు తెలుసు. శ్రీవేంకటేశా,  తాంబూలం చిలకలు చుట్టివ్వమని అడిగేది నన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వకుండా ఇంకాస్త సమయం నీ పక్కనే ఉంచుకోడానికే అని నాకు తెలియదా?
కొన్ని పదాలకు అర్థాలు :
ఉపాయాలు = Tricks, ఎత్తుగడలు, పన్నుగడలు, పొందులు
వెకలి = వెకిలి, పిచ్చి, అవివేకం
వెల్లవిరి = వెల్లడి, తెలిసిపోవడం, ప్రకటిమైపోవడం
సందడి = చుట్టుముట్టి, సమీపించి
పందెమాడు = ఒట్టుపెట్టు, ప్రతిజ్ఞచేయు
మందలించి = ఆజ్ఞాపించి
కుచగిరులు = చన్నులు
చెక్కు = చెంపలు, బుగ్గలు
ఏకతమాడు = పన్నాగంపన్నుట, ఉపాయం ఆలోచించుట
ఎనసితివి = దగ్గరచేరితివి, పొందుగూడితివవి
పైకొని = అక్కునచేరి
బడివాయక = వదిలిపెట్టకుండ

వేటూరి కిలికించితాలు!

Veturi-Best-useful-song-pic-1(జనవరి 29: వేటూరి పుట్టిన రోజు )

సినిమాల్లో, నాటకాల్లో దృశ్యరూపంలోనో, సంభాషణల్లోనో చెప్పలేని గాఢమైన భావాలను పాటల రూపంలో చెప్పేవారు. కాబట్టి పాటలో కథ సందర్భమూ, పాత్రలూ, కథ పోకడని బట్టి సాహిత్యం రాసిచ్చేవారు. కాలక్రమేణా కథల్లో సారం తగ్గిపోయి పాటలయొక్క అవసరంలేకపోయినా పూర్వం ఉన్న ఆచారాన్ని ఉల్లంఘించే సాహసం చెయ్యలేక కొనసాగించారు. పాటలకోసం ఐదారు సందర్భాలు సృష్టించడం మొదలైంది. సహజమైన సన్నివేశాలకు రాసేరోజుల్లో కవికి కథే ప్రేరణనిచ్చేది. కథలోని బలాన్ని బట్టి సన్నివేశానికి అమరేలా కవి తన ప్రతిభను చూపిస్తూ సాహిత్యం అందించేవాడు. కవి రాసిన సాహిత్యానికి సంగీత దర్శకులు బాణీకట్టేవారు.

సృష్టించిన సన్నివేశాలు కవినెలా ప్రేరేపిస్తాయి? మెల్లమెల్లగా సంగీత దర్శకుల ఆధిక్యత మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ లు ట్యూన్ లు (బాణీలు) ఇచ్చేవారు కవులు దానికి తగినట్టు పదాలు కూర్చేవారు. ఛందోబద్దంగా పద్యాలల్లే ప్రతిభ ఉన్నా సంగీత దర్శకులిచ్చే గజిబిజి ట్యూన్స్-లో పదాల్ని అమర్చడం అందరికీ సాధ్యంకాలేదు. చతురత ఉన్న కొందరు కవులు తమ సొంత ప్రతిభనూ, చెయ్యదలచిన ప్రయోగాలనూ, చమత్కారాల్నూ ఆ ట్యూన్-లో ఇమిడ్చేవాళ్ళు. బలమైన కథలున్న రోజుల్లో సినిమాలకి పాటలు రాసిన కొందరు భాషా ప్రవీణులు కథలు నీరసపడిపోయే రోజులకల్లా నీరుగారిపోయి పాటలు రాయడం మానుకున్నారు.

వేటూరి సుందరరామమూర్తి సినిమాల్లోకి ప్రవేశించినది ఆ సంధి కాలంలో. సరైన సన్నివేశం వస్తే ఒకపక్క సారవంతంగా రాసిస్తూనే మరో పక్క అర్థంపర్థంలేని సన్నివేశాలకు తన చమత్కారాన్నీ, భాషా ప్రావీణ్యాన్ని పాటల్లో నింపుతూ సినిమా పాటల్ని కొత్త మార్గంలోకి నడిపాడు. ఆ కాలంలో ఈ మార్పు ఒక్క తెలుగు సినిమా పాటలకే కాదు, మిగిలిన భాషల సినీ సాహిత్యానికీ వర్తించింది.

ఎలాంటి ట్యూన్ ఇచ్చినా ఆశువుగా, అతివేగంగా, కొత్తగా, చమత్కారంగా, చిలిపిగా రాయగలిగినందువలనేమో వేటూరికి 1970లలో ఇబ్బడిముబ్బడిగా అవకాశాలొచ్చాయి. వేటూరి ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు!

అట్లాంటి రోజుల్లో, లోతైన కవిత్వాన్నీ, భాషా ప్రతిభనీ ప్రదర్శించే అవకాశం కల్గిన ఓ అరుదైన సన్నివేశం ఇది. ఆదిత్యా 369 సినిమాలోని ఆ సందర్భం ఏమంటే, “హీరో, హీరోయిన్ లు టైమ్ మెషిన్ ఎక్కి వెనక్కి ప్రయాణిస్తారు. వాళ్ళు కృష్ణదేవరాయలు పరిపాలించిన పదహారో శతాబ్దానికి చేరుకుంటారు. విజయనగర సామ్రాజ్యపు ఆస్థాన నర్తకి నాయకుడి మీద మనసుపడుతుంది. వశపరుచుకుని మోజు తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని చూసిన హీరోయిన్ అపార్థం చేసుకుని ఉడికిపోతుంది. నర్తకిని వదిలించుకుని జరిగింది చెప్పి హీరోయిన్ కోపాన్ని తీర్చాలి”. ఈ సన్నివేశానికి పాట రాయడంలో రచయితకు ఏం సవాలు ఉంటుంది అనుకోవచ్చు! కథ నడుస్తున్నది పదహారవ శతాబ్దం.

ఇచ్చిన ట్యూన్ కి ఆ నాటి భాషలోనూ నేటి భాషలోనూ పాట రాయాలి. ఒక పల్లవి, రెండు చరణాలు. పల్లవి మూడుసార్లొస్తుంది. మొదటిసారి ఆస్థాన నర్తకి పాడుతుంది, రెండోసారి హీరో పాడుతాడు, మూడోసారి హీరోయిన్ ఒకలైను, హీరో ఒకలైను పాడుతారు. ఒకే పల్లవి లింగభేదంలేకుండ, ముగ్గురికీ సరిపోవాలి. భావపరంగానూ, భాషాపరంగానూ పల్లవికి న్యాయం చెయ్యాలి. మొదటి చరణం పదహారవ శతాబ్దానికి తగినట్టుగానూ, రెండో చరణం ఇరవయ్యో శతాబ్దానికి చెందిన నాయకుడి భాషలోనూ ఉండాలి.

పల్లవి
నెర జాణవులే వరవీణవులే కిలికించితాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

చరణం 1
మోమటు దాచి, మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి వంపులలో హంపికళా ఊగే ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమిరా

చరణం 2
చీకటి కోపం చెలిమికి లాభం, కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం, ఈ చలిలో!
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి, పగవానికి ఒక న్యాయమింక సాగునా

కొన్నిపదాలకు అర్థాలు :
జాణ = నేర్పెరిగిన వ్యక్తి, నేర్పరి
వరవీణ = వరములు పొందిన వీణ
కిలికించితం = తెప్పరిల్లిన స్థితి; ఎదురుచూడనివేళ ప్రియుడు కౌగిలించుకుంటే ప్రియురాలు నిశ్చేష్టురాలయ్యే స్థితి
మృదుపాణి – మృదువైనచేతులుగల వ్యక్తి
సన్న = (కను) సైగలు; జాడ; సంజ్ఞ; సిగ్నల్ – (అన్నమయ్య కీర్తనల్లో విరివిగా వాడబడిన మాట ఇది)
మోవి = పెదవి
తుంగ – హంపీనగరంలో ప్రవహించే నది – మరో అర్థం : ఒకరకమైన (దుంప) గడ్డి
విరిపానుపు – పువ్వుల పడక/మంచం

జాణ అంటేనే నేర్పరి, “నెర” అని విశ్లేషణం కూడా జతచేసి చెప్తున్నాడంటే “అన్నిటా నేర్పరి” – జాణతనం తొణికిసలాడే వ్యక్తి అని. చాలా మందికి కలిగే అనుమానం “జాణ” అని మగవారిని అంటారా అని? జాణ రెండులింగాలకూ సరిపడే పదం కాబట్టి ఈ పదాన్ని చక్కగా వాడుకున్నాడు వేటూరి! పూర్వం “నరవరా కురువరా” పాటలో ఇలాంటొక సన్నివేశంలో సుముద్రాల గారు కూడా “జాణ” అన్న పదం వాడారు.

పాటలోని భావం (క్లుప్తంగా):
శృంగార చేష్టలు చేసి, వరవీణపలికే స్వరాలులాంటి తీయని మాటలు చెప్పి పులకింపజేసే నేర్పరివి. మెత్తటి చేతులుగలవాడివి / (దానవి). కన్నుల్లో సరసపు వెన్నెల కాస్తుందా అనిపించేలాంటి చూపులు, కనుసైగలలో గుసగుస సందేశాల తెమ్మెరలు! — ఈ భావం కవ్వించే నర్తకి పాడినా సరిపోతుంది, అలిగిన ప్రేయసీ, ప్రియులు పాడుకున్నా సరిపోతుంది.
నర్తకి కవ్విస్తూ పాడే చరణంలో రెండు లైన్లలో హీరో తనని ఎందుకాకర్షించాడో చెప్తుంది. తర్వాత తన అందం గురించి, తన స్థితి గురించీ చెప్తుంది. నాటి కళాసంపదకి నిలయమైన హంపికళంతా తన సొగసుల్లోనే ఉందనీ, వారి రాజ్యంలో సాగే తుంగా నది పొంగులే తన పయ్యెదలో పొంగులనీ పాడుతుంది! (ఎండు బీడునేలపైన ఒక వర్షం పడగానే మరసటి రోజుకల్లా తుంగ దుంపలు మట్టిని చీల్చుకుని పైకి మొలకెత్తుతాయి, అవి గోపురాల్లా కనిపిస్తుంటాయి). ఆడది కోరి వస్తుంటే చిరాకుపడి వెళ్ళడం మర్యాదకాదు. కనీసం ఈ పూలపానుపైనా సవరించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళరాదా అని గారాలు పోతోంది. గమనిస్తే, ఇక్కడ వేటూరి వాడిన ఉపమానాలు రెండూ (హంపి కళ, తుంగ నది) విజయనగర సామ్రాజ్యానికి చెందినవే. చక్కగా సాహిత్యంలో ఒదిగేవే!.
ఇక రెండో చరణంలో అలిగిన తన ప్రేయసిని ముద్దుచేసుకుంటున్నాడు హీరో. “ఏంటి ప్రియా అలిగావా? నీకు తెలియదేమో చీకట్లో అలిగిన ప్రేయసిని బతిమాలుతూ, ప్రాధేయపడుతూ ఉంటే వలపు ఇంకాస్త రసవత్తరం అవుతుంది. వెన్నెల సొగసూ, చలి రాత్రీ కలిసి తాపాన్ని పెంచేస్తూ వయసుకు మరికాస్త ఉద్వేగాన్నిస్తుంది. ఉడుక్కోవడం ఆపి నా మన్మథ సామ్రాజ్యపు రతీదేవిలా, నా వలపు కోవెలలో హారతిలా నవ్వమని అడుగుతున్నాడు. కోపాన్ని పగవాళ్ళతో ప్రదర్శించాలిగానీ పరువంలో ఉన్న చెలికాడితో కాదు” అని అంటున్నాడు.
ఈ పదాలన్నీ ఎక్కడికక్కడ ఎంత చక్కగా నప్పాయో గమనిస్తే, వేటూరి తనకు తాను ఒక ముద్ర ఎలా ఏర్పరచుకున్నాడో తెలిసిపోతుంది.

-అవినేని భాస్కర్ 

Avineni Bhaskar

ప్రతి గజల్ ఒక ఆత్మ కథే!

jag1

గజల్ రారాజు జగ్జిత్ సింగ్ గురించి నేను ఎపుడూ ఒకటి అనుకుంటా.. “గంధర్వులు అప్పుడప్పుడు శాపగ్రస్థులయి భూమి పై జన్మిస్తారని” ఒక ప్రతీతి. అలాంటి వారే జగ్జిత్ అనిపిస్తుంటుంది. మన అదృష్ట వశాత్తు తన సంగీతం తో, గానం తో మనల్ని అలరించటానికే తను ఈ జన్మ తీస్కున్నరేమో..!

స్కూల్ లో ఉన్నప్పుడు మా నాన్న గారి వల్ల జగ్జిత్ గజల్స్ తో పరిచయం ఏర్పడింది. మొదట్లో పాటల్లోని సాహిత్యం అర్థం అవకున్నా, గానం లోని మాధుర్యం కట్టిపడేసేది. తరువాత తరువాత సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ వింటూంటే జగ్జిత్ కి, తన గజల్స్ కి బానిసని అయిపోయా.

దాదాపు 10 సంవత్సరాల క్రితం 2004 లో మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) లో  జగ్జిత్ సింగ్ సంగీత కచేరి కి వెళ్ళే మహద్భాగ్యం కలిగింది. దాదాపు 3 గంటల పాటు సాగింది ఆ సంగీత కచేరి. ప్రేక్షకుల కోరిక మేరకు 2-3 పాటల్ని మళ్ళీ మళ్ళీ పాడారు. ఆ కచేరీ లో ఉన్నంతసేపు ఇది నిజమేనా? అనిపించింది. ఏదో తెలియని లోకాలకు ప్రయాణం చేసినట్టు గా అనిపించింది. ఆ ట్రాన్స్ లోంచి బయటకు రావడానికి చాల సమయం పట్టింది..!

జగ్జిత్ పాటల్లో “ఆత్మకథలు” ఉంటాయి. ఎలాంటి భేషజాలు లేని స్వచ్చమయిన ఆత్మ కథలు. అవి మన అందరి కథలు . అందుకే అవి మన ఆత్మ లోతుల్ని తడతాయి. గతం తాలుకా అనుభవాల్ని, అనుభూతుల్ని, మదిలోని గాయాల్ని మెల్లిగా తడుతుంది తన పాట..తన శ్రోతలకి తన పాటలనే “ఆత్మ బంధువుల్లా” పంపిస్తారు జగ్జిత్, అవి మనతో జీవితాంతం ప్రయాణిస్తాయి.

జగ్జిత్ తన స్వస్థలం లో పండిట్ చగన్ లాల్ శర్మ దగ్గర రెండు సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నారు. తరువాత “సైనియా ఘరానా” కి చెందిన ఉస్తాద్ జమాల్ ఖాన్ వద్ద ఆరు సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు.పంజాబ్ మరియు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, లేట్ ప్రొఫెసర్ సూరజ్ భాన్ సంగీతంలో అతనిని ఎంతగానో ప్రోత్సహించాడు. 1965 లో ముంబై వచ్చినేపథ్య గాయకుడు గా మారాడు జగ్జిత్ . మొదట్లో పెళ్ళిళ్ళలో, వేడుకల్లో, ప్రకటనలకి  పాడుతూ తన సంగీత ప్రస్థానం మొదలు పెట్టాడు. ఇదే సమయం లో తన జీవిత భాగస్వామి చిత్ర ని కలిసాడు , ఆ తరువాత రెండు సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు.

1976 లో వచ్చిన ఆల్బం “ది అన్ ఫర్గేటబుల్స్” తో తన దశ తిరిగింది. అతి పెద్ద హిట్ ఆల్బం గా రికార్డులు సొంతం చేసుకుంది. ఆ ఆల్బం గజల్ సంగీతాన్ని సమూలంగా మార్చేసింది. అందులోని “బాత్  నిక్లేగి  తో  ఫిర్  దూర్  తలక్  జాయేగీ” తను పాడిన మొదటి పాట.

జగ్జిత్ సినిమాలలో పాడిన పాటలు తక్కువే కానీ, పాడిన పాటలన్నీ అధ్బుతాలే.

మహేష్ భట్ కి జగ్జిత్ తో తన సినిమా కి సంగీత దర్శకత్వం చేయించాలన్న  ఆలోచన రావటం దాన్ని అమలు పరచటం  “అర్థ్” సినిమా కోసం జరిగింది. “అర్థ్” సినిమా కి “ఆత్మ” కథ అయితే “అంతరాత్మ” జగ్జిత్ పాట. పాటలకి “ప్రాణ ప్రతిష్ట” చేసాడు జగ్జిత్. ఆ సినిమా లోని పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “అర్థ్” సినిమా మహేష్ భట్ “ఆత్మకథ” (సెమి ఆటో బయోగ్రఫీ). (సినిమా కోసం కొన్ని సంఘటనలని మార్చటం జరిగింది). అంతలా తను ఇష్టపడి ప్రాణం పెట్టిన కథ కి జగ్జిత్ ని సంగీత దర్శకుడిగా, గాయకుడిగా నిర్ణయించుకోవటం తోనే మహేష్ భట్ సగం విజయం సాదించాడు . రాజ్ కిరణ్ (హీరో) పాడుతుంటే, ఆ పాటలోని “సాహిత్యాన్ని”, ఆ పాత్రలోని “మానసిక సంఘర్షణ” ని జగ్జిత్ ఎంతగా అనుభవించి పాడారో తెలుస్తుంది.

“తుమ్ ఇత్నా జో ముస్కురారహేహో క్యా గమ్ హై జిస్కో చుపా రహేహో “…”ఇంతలా ఎందుకు నవ్వుతున్నావు? ఏ విషాదాన్ని దాస్తున్నావు?” అంటాడు.

జగ్జిత్ గురించి మహేష్ భట్ అంటాడు ..”బొంబాయి మెట్రో సినిమా లో “అర్థ్” సినిమా రిలీజ్ ఆయినరోజు, “ఝుకీ ఝుకీ సీ నజర్” పాట మొదలయింది.పాట అయిపోగానే హాల్ మొత్తం “వన్స్ మోర్” అన్నారు. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. ఒక సినిమా పాట ని హాల్ మొత్తం, ప్రేక్షకులంతా  ఏక కంఠం తో “వన్స్ మోర్ ” అనటం నా జీవితం లో ఎప్పుడూ చూడలేదు” .
కైఫీ ఆజ్మి సాహిత్యాన్నిజగ్జిత్  “ఉచ్చాస” లా లోపలి స్వీకరించి, తన “నిశ్వాస”లో సంగీతాన్ని ఇచ్చాడు అంటాడు మహేష్ భట్  “అర్థ్” సినిమా సంగీతం గురించి చెబుతూ..

కొందరికి జగ్జిత్ పాటల్లోని విషాదం , నకారత్మకం గా అనిపించవచ్చు. కాని అవి గాయపడిన మనసుకి సాంత్వన ని ఇచ్చే మందు గుళికలు.అలా అని అన్నీ విషాద గీతాలే పాడలేదు. చిత్ర తో కలిసి ఎన్నో ప్రణయ గీతాలూ పాడాడు. మరెన్నో హుషారు గా ఉండే గీతాలు, భక్తి గీతాలు, ఇలా  అన్ని రకాలయన పాటలూ పాడాడు.

ప్రతీ వ్యక్తి  తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన వేదనే జగ్జిత్ తన పాటలతో స్పృశిస్తాడు.

“చిట్టీ న కోయి సందేశ్ జానే వొహ్ కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే…ఇస్ దిల్పే లగాకే టేస్ జానే వో కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే”

ఈ పాట మరణించిన తన సోదరి కోసం కాజల్ ఏడుస్తున్న సందర్భం లో వస్తుంది. (“దుష్మన్” సినిమా నుండి). కాని ఈ పాట ని ఇంకో కోణం లో కూడా చూడొచ్చు. మనకి బాగా ఆత్మీయులయిన వ్యక్తులు- స్నేహితులో, బంధువులో, ప్రేమికులో, మన నుండి దూరమై తిరిగి మళ్ళీ కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ పాటలోని “పల్లవి” ఆ వ్యక్తి పడే వేదనని ప్రతిబింబిస్తుంది.

“ఒక లేఖయినా,  ఒక సందేశం”  అయినా ఇవ్వకుండా నా హృదయాన్ని గాయపరిచి తెలియని దేశాలకి వెళ్ళిపోయావు ” అంటాడు.

జగ్జిత్ తో పని చేసిన పాటల రచయితలు అందరూ చాలా గొప్ప సాహిత్యాన్ని అందించారు . జగ్జిత్ వారి సాహిత్యాన్ని తన గానం తో చాలా ఉన్నత స్థాయి కి తీసుకెళ్ళాడు.

“గుల్జార్-జగ్జిత్” కాంబినేషన్ లో వచ్చిన “మరాసిం” ఆల్బం లో ప్రతీ పాట గజల్ ప్రపంచం లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్ని సార్లు విన్నా, వింటున్న ప్రతి సారి ఏదో కొత్త అర్థం స్పురిస్తుంది,కొత్త అనుభూతి విని(కని)పిస్తుంది.

“శామ్ సే ఆంఖ్ మే నమీ సీ హై ..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై..”

“సాయంకాలం నుండి కళ్ళలో చెమ్మగా ఉంది..ఈ రోజు మళ్ళీ నువ్వు లేని లోటు తెలుస్తూ ఉంది”

“మరాసిం” గురించి గుల్జార్ అంటాడు ” నాకు జగ్జిత్ తో అనుబంధం నా సీరియల్ “మిర్జాఘలిబ్” నాటిది. ఆ సీరియల్ కి జగ్జిత్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో ఛాలా సులువుగా, అలవోకగా ట్యూన్స్ అందించేవాడు. అది చూసి నేను ఆశ్చర్య పోయేవాడ్ని. “గజల్స్ ” కి ఒక ప్రత్యేకమయిన “ఆలాపనా” , “ఉర్దూ” సాహిత్యాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రతిభా అవసరం. ఆ రెండూ జగ్జిత్ లో పుష్కలంగా ఉన్నాయి. అదే సమయం లో “మరాసిం” ఆల్బం సాహిత్యాన్ని తనకి చూపించా. కొన్ని సులువుగా అనిపిస్తాయి కాని ఛాలా సమయం తీసుకుంటాయి. “మరాసిం” ఆల్బం ని పూర్తి చేయడానికి మాకు 6 సంవత్సరాలు పట్టింది”. పరిపూర్ణత కోసం వారు పడ్డ తాపత్రయం చెప్పకనే చెబుతుంది ఈ మాట.

“మీర్జాఘాలిబ్” సీరియల్ ద్వారా ఘాలిబ్ ని ప్రాచుర్యం లోకి తీసుకువచ్చినందుకు గానూ 1998 లో భారత ప్రభుత్వం “సాహిత్య అకాడెమి అవార్డు” ద్వారా జగ్జిత్ ని సత్కరించారు.

మాజీ ప్రధాని వాజ్ పాయి కవితలతో, జగ్జిత్ గానం తో వెలువడ్డ ఆల్బం “సంవేదన”. వాజ్ పాయి గారి కవితలకి జగ్జిత్ ప్రాణం పోసాడు. జీవితం లోని తాత్వికత ఆ పాటల్లో ఉంటుంది.

“క్యా ఖోయా క్యా పాయా జగ్ మే ..మిల్తే ఔర్ భిగడ్ తే పగ్ మే”

“జీవితం లో సాధించింది ఏంటి? కోల్పోయేది ఏంటి? కూడళ్ళలో కలుస్తూ విడిపోతుంటాము..ప్రతీ అడుగులో ద్రోహం ఉన్నా, నాకు ఎవరిపయినా ఫిర్యాదు లేదు.గడిచిపోయిన కాలం పైన దృష్టి సారిస్తే మాత్రం జ్ఞాపకాల భాండాగారం కదులుతుంది ”

జగ్జిత్ గానం “బోల్ ప్రధాన్” పద్దతిలో సాగుతుంది. దీని విశిష్టత ఏంటంటే “మాటలని” ఉచ్చరించే పద్ధతి పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది.

“జగ్జిత్ కి ముందూ గజల్ గాయకులు, చాలా గొప్ప హేమా హేమీలు ఎంతోమంది ఉన్నారు. “బేగం అఖ్తర్, మేహది హసన్ ” లాంటి వారూ ఉన్నారు. కానీ వారి గజల్స్ సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేట్టు ఉండేవి కాదు. ఎందుకంటె అవి “శాస్త్రీయ సంగీత” ప్రధానంగా ఉంటాయి.  జగ్జిత్ గజల్స్ “సాహిత్యాన్ని , సంగీతాన్ని” ఎంతగా సరలీకరించారంటే అవి సినిమా పాటల్లా సామాన్య ప్రజానీకానికి చేరువయ్యాయి. జగ్జిత్ గజల్స్ కవితాత్మకంగా ఉంటూనే, సరళంగా మార్చబడి  శ్రోతలని రంజింపజేసాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా జగ్జిత్ కి అభిమానుల్ని సంపాదించి పెట్టింది.  హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కడున్నా జగ్జిత్ గజల్స్ కి వీరాభిమానులుగా మారిపోయారు”, అంటారు పాటల రచయిత “జావేద్ అఖ్తర్”

“వొహ్ కౌన్ హాయ్ దునియామె జిసే గమ్ నహి హోతా? ..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాథం నహి హోతా?”

–“ప్రపంచం లో బాధలు లేనిది ఎవరికీ? ఎవరి ఇంట్లో కేవలం సంతోషాలు మాత్రమే ఉంటాయి? మరణం (ఎవరైనా మరణించినప్పుడు కలిగే శోకం) లేకుండా?”

మరణించిన తన  కొడుకు ని తిరిగి బ్రతికించాలని ఒక మహిళ “బుద్ధుడి” వద్దకు వెళుతుంది. అపుడు బుద్ధుడు బ్రతికిస్తాను కానీ, అంటూ ఒక షరతు విధిస్తాడు ” ఇంతవరకూ ఎవరూ మరణించని ఒక ఇంటి నుండి పిడికెడు “ఆవాలు” తీసుకురమ్మని చెపుతాడు.

పరుగు పరుగున ఆ గ్రామం లోని ప్రతి ఇంటికి తిరుగుతుంది ఆ మహిళ, సాయంకాలం వరకూ అలా తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు మరణించే ఉంటారు. చివరికి తనకి అర్థం అవుతుంది, మరణాన్ని ఎవరూ ఆపలేరు అని. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికే బుద్ధుడు తనకి ఈ షరతు పెట్టాడని. చివరికి బుద్ధుడి వద్దకు వెళ్లి తనకి సత్యం అవగతమైంది అని కృతజ్ఞతతో, ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

ఈ గజల్ లో సూక్ష్మంగా ఇదే విషయాన్ని చెప్పారనిపిస్తుంది. “జననం-మరణం” ఇవి రెండే జీవితం లో సత్యాలు, మిగతావన్నీ “మిథ్యే ” అంటారు దార్శనికులు. “సంతోషం-దుఃఖం” , “జననం-మరణం” ద్వందాలు కావు, అవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు.

సెప్టెంబర్ 23,2011  న ముంబాయి లో జగ్జిత్ , గులాం అలీ తో సంగీత కచేరి లో పాల్గోవాల్సిన సమయం లో తీవ్ర అస్వస్థత కి గురయ్యారు. “సెరిబ్రల్ హమోరేజ్ “అని తెలిసింది. రెండు వారాలు కోమాలో ఉన్న తరువాత , అక్టోబర్ 11 , 2011 న లీలావతి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

జగ్జిత్ విషయం లో “తుది శ్వాస” విడిచారు అనటం సరైంది కాదేమో..ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తనని అభిమానించే కోట్లాది అభిమానుల గుండెల్లో నిండి , వారి “ఉచ్చ్వాస , నిశ్వాస” ల్లో సంగీతం ఉన్నంతకాలం అమరుడయి, చిరంజీవిలా ఉంటాడు.

జగ్జిత్ సింగ్ కి ఎన్నో పురస్కారాలు లభించాయి. అందులో ముఖ్యమైనవి –

-2012 లో రాజస్థాన్ ప్రభుత్వం “రాజస్థాన్ రత్న” అవార్డు తో సత్కారం (మరణించిన తదుపరి)

-2003 లో భారత ప్రభుత్వం “పద్మ భూషణ్” తో సత్కరించింది.

-1998 లో “మీర్జా గాలిబ్” కి సాహిత్య అకాడమీ అవార్డు (“గాలిబ్ గీతాల్ని” ప్రాచుర్యం లోనికి తీసుకు వచ్చినందుకు)

ఇలా ఎన్నో పురస్కారాలు…మరెన్నో రికార్డులు..!

-“అర్థ్&సాత్ సాత్” కాంబినేషన్ ఆల్బం HMV సంస్థ లో లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు ను సొంతం చేసుకుంది.

-“సజ్దా” ఆల్బం కూడా ఇలాంటి రికార్డు నే సొంతం చేసుకుంది. 1991 లో లతా  మంగేష్కర్ తో చేసిన ఈ ఆల్బం “నాన్-ఫిలిం” కాటగిరి లో  లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు  సాధించింది.

జగ్జిత్ ని తన కొడుకు మరణం బాగా కుంగదీసింది. “విషాదాన్నే” తన “సంతకంగా” మార్చి అభిమానుల హృదయాల్లో ఎన్నటికీ చెరగని ముద్ర వేసాడు. తన భార్య చిత్ర తో కలిసి పాడటం తన కొడుకు మరణం తోనే ఆగిపోయింది. తన ఊపిరి ఆగే వరకు తను ఎక్కువగా విషాదం తో నిండి, హృదయాన్ని ద్రవింపజేసే పాటలే పాడాడు.

జగ్జిత్ అభిమానులకి మాత్రం తను లేరన్న విషయం గుర్తొచ్చినప్పుడు, తన పాటే గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తాయి, గుండె బరువెక్కుతుంది.. “శామ్ సే ఆంఖ్ మే నామీ సీ హై..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై” అని…

jsg2

 

కల తెగిపోతే…అల ఆగిపోతే..అది సాహిర్ పాట!

sahir11

“కహా హైన్? కహా హైన్? ముహాఫిజ్ ఖుదీకే….జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హైన్?”

“తూ హిందు బనేగా న ముస్సల్మాన్ బనేగా..ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!”

“దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హోగయా ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!”

ఇవి సాహిర్ లుధియాన్వి కలంలోంచి ఆవేదన తో మిళితమైన ఆవేశంతో తన్నుకు వచ్చిన కొన్ని కవిత్వపు తునకలు. మనలో నిస్తేజంగా పడిఉన్న అంతరంగాన్ని కొట్టి లేపే కొన్ని పదునైన పదశరాలు. తెలుగు వారికి పెద్దగా పరిచితమైన పేరు కాదు కనక సాహిర్ గారి గురించి క్లుప్తంగా చెప్పుకొని ముందుకు సాగుదాం. అబ్దుల్ హాయి గా లుధియానా (పంజాబ్) లో 1921 లో ఒక జమీందారి వంశంలో జన్మించిన సాహిర్, తన చిన్నతనంలోనే తల్లి తండ్రులు విడిపోయి, తన తల్లితో పెరగడం వల్ల, కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. లాహోర్ లో కొద్ది కాలం ఒక పత్రిక నడిపి, అతని రాతల కారణంగా అరెస్టు వారెంట్ జారీ అవ్వటంతో, బొంబాయి చేరుకొన్నాడు. తరవాత ముఫ్ఫై సంవత్సరాల పాటు, ఏడు వందల పై చిలుకు సినిమా పాటలు, ఉర్దూ కవితా సంపుటాలు వ్రాసుకుంటూ, హిందీ సినిమా పాటలకి ఉచ్ఛస్థాయి కవిత్వస్థానం కలగజేస్తూ, సాటి లేని కవిగా తన పేరుని ఎవ్వరూ చెరపలేని విధంగా ముద్రించుకొని  1980లో మనలోకం వదిలేశారు.

నిజానికి సాహిర్ లుధియాన్వి వ్రాసిన పాటలు చిన్నపడినుంచి వింటూ పెరిగినా, ఒక కవిగా ఆయన పట్ల ఆసక్తి,  ఆయన శైలి పట్ల అభిమానం పెరగటం మాత్రం కొద్ది కాలం క్రితం జరిగిన విశేషమే!  షుమారు ఒక పదిహేనేళ్ళ క్రితం నేనూ, మా ఆవిడ కలిసి చికాగో నుంచి కాలిఫోర్నియాకి వెకేషన్ మీద వెళ్ళినప్పుడు రూట్ 1 లో  శాన్ఫ్రాన్సిస్కో  నుంచి లాస్ ఏంజిలీస్ వరకూ డ్రైవ్ చేసుకెల్దామని డిసైడ్ అయ్యాం. ఈ రోడ్డు పసిఫిక్ కోస్టంబడి ఒక వైపు ఎత్తైన కొండలతో, మరొక వైపు అందమైన సముద్రపు అలల మధ్యన సాగుతూ, అమెరికా లోని టాప్ త్రీ సీనిక్ డ్రైవుల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. నా మిత్రుడు దారిలో వినటానికని “The Genius of Sahir Ludhianvi” అని ఒక సి.డి ఇచ్చాడు.

“జాయే తో జాయే కహా..”, “వో సుబహ కభీ తో ఆయేగీ”, “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హైన్?”, “ప్యార్ పర్ బస్ తో నహీ హై మేరా లేకిన్ ఫిర్ భీ”, “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో…ఔర్ మర్దోంనె ఉసె బాజార్ దియా!” అంటూ ఒకదాని తరువాత మరొక “ఏడుపుగొట్టు పాటలు” కారంతా వ్యాపించాయి. ఒక పక్కనేమో కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, అటూ ఇటూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నందుకు నాకు సన్నగా మందలింపు, మధ్యలో ఈ పాటలు! వాల్యూం తక్కువ చేసి, మా ఫ్రెండుని తిట్టుకుంటూ కొంత దూరం ప్రయాణం చేశాం.  ఇంతకు ముందు ఎప్పుడూ వినని గొంతుతో ఒక పాట మొదలయ్యింది.

“తు ముఝే భూల్ భి జావో తో యే హక్ హై తుమకో…మేరీ బాత్ ఔర్ హై మైనే తో ముహౌబ్బత్ కీ హై!” విన్నది నిజమా కాదా అని నిర్ధారించుకోటానికి వాల్యూం పెంచాను. అనుమానం లేదు, విన్నది కరక్టే! ప్రతిపదానువాదంలో (కవితానువాదం చేసే సాహసం చెయ్యలేను) ఇది, “నన్ను మర్చిపోటానికి నీకు హక్కుంది…నా విషయం వేరు, నేను ప్రేమించాను కదా(నిన్ను)!” ఆ లాజిక్ చాలా ఆసక్తి కరంగా అనిపించింది.

http://www.youtube.com/watch?v=dJAIEEwHTqU

“మేరె దిల్ కి మేరె జస్బాత్ కి కీమత్ క్యా హై (నా హృదయానికీ, భావావేశానికీ, విలువేముంది?)
ఉల్ఝి ఉల్ఝి సి ఖయాలత్ కి కీమత్ క్యా హై (నా క్లిష్ఠమైన ఆలోచనలకి విలువేముంది?)
మైనే క్యోం ప్యార్ కియా..తుమ్ నే న క్యోం ప్యార్ కియా (నేనెందుకు ప్రేమించాను..నువ్వెందుకు ప్రేమించలేదు?)
ఇన్ పరేషాన్ సవాలాత్ కి కీమత్ క్యా హైన్? (ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు విలువేముంది?)
….
మై తుమ్హారీ హు..యాహి మేరె లియే క్యా కమ్ హై? (నేను నీదానాను…ఇది చాలదా నాకు?)

తుమ్ మేరే హో కే రహో..యే మేరి కిస్మత్ న సహి” (నువ్వు నావాడుగా ఉండటం…నా తలరాతలో లేనప్పటికీ)

ఈ పాట ప్రేయసీ ప్రియుల మధ్య ఒక సంభాషణ లాగా సాగుతుంది. ఒక రోమాన్స్ డ్యూయెట్ లో ఇంత వింత లాజిక్ కనిపించటం మొదటిసారి అవ్వటం వల్లనేమో, ఆ తరవాత వచ్చే ప్రతి పాట లిరిక్స్ నూ చెవులు రిక్కించి వినటం ప్రారంభించాం. ఆ పైన రూట్ 1 సౌందర్యం కూడా మా ధ్యానాన్ని ఆ పాటల పైనుంచి మరల్చలేకపోయింధి. వెకేషన్ అయిపోయిన తరువాత సాహిర్ పైన రిసెర్చ్ చేసి ఆయన పాటలన్నీ జాగర్తగా పరిశీలించటం ప్రారంభించాను. ఒక సముద్రం లోకి దూకాననిపించింది, అదీ ఈత రాకుండా! ఆయన పాటలలో ఉర్దూ పదాలు చాలా విరివిగా దొర్లుతాయి. ఎదో సందర్భానుసారం అర్థం అయినట్లనిపించినా, ఆ భాషలో పట్టు లేకపోవటం వల్ల, శబ్దసౌందర్యాన్ని ఆస్వాదించటమే ఎక్కువగా ఉండేది. ఆన్లైన్ ఉర్దూ నిఘంటువుల పుణ్యమా అని తరవాత రోజుల్లో ఆ బాధ తొలగిపోయింది. కవి ఎవరో తెలియకపోయినా, ఇంతకు ముందు నాకు నచ్చిన, నా నోట్లో నానుతూ ఉన్న అనేక పాత హిందీ పాటలు కూడా ఆయన కలాన్నే చీల్చుకు పుట్టాయన్నవి కూడా నాకా సమయం లోనే తెలిసింది.

ఆయన పాటలు వింటున్నప్పుడు చాలా సార్లు నాకు, జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీ, ఆయనలోని రొమాంటిక్ ఇంటెన్సిటీ, ఆయన సొంత కథ, భావాలనే, ఆయన పాటలలో ప్రతిబింబించేవాడనిపించేది, అది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసుండకపోయినా.

సాహిర్ స్వయంగా చిన్నతనంలో ఎన్నో కష్టాలని అనుభవించి ఒక గొప్ప కవిగా పేరునేర్పర్చుకున్న నేపథ్యంలో “హమ్ దోనోం” సినిమాలోని పాట ఇది.

“మై జిందగీ కా సాథ్ నిభాతా చలాగయా.. (నేను జీవితానితో వెన్నంటి సాగుతున్నా)

హర్ ఫిక్ర్కో ధువే మే ఉడాతా చాలాగయా.. (అన్ని దిగుళ్ళనూ పొగలాగా ఊదేసుకుంటూ సాగుతున్నా)

బర్బాదియోంకా శోక్ మనానా ఫిజూల్ థా… ( వినాశనాల (ఓటముల) గురించి విచారం వ్యర్థం)

బర్బాదియోంకా జష్న్ మనాతా చాలా గయా.. (వాటినే పండగ చేసుకొని సాగుతున్నా)

గమ్ ఔర్ ఖుషీ మె ఫర్క్ న మెహసూస్ హో జహా.. (దుఖానికీ సుఖానికీ మధ్య వ్యత్యాసం ఎక్కడైతే ఉండదో)
మై దిల్ కో అస్ మకామ్ పె లాతా చాలా గయా..” (ఆ స్థానానికి నా హృదయాన్ని తీసుకెళ్తూ సాగుతున్నాను)

http://www.youtube.com/watch?v=IzC0_XVE3Vk

గురుదత్ సినిమా ప్యాసా గురించి, దానిలోని పాటల గురించి, కొన్ని Ph.D వ్యాసాలు వ్రాయచ్చు. హీరో ఒక గుర్తింపు లేని కవి. అతడు చనిపోయాడనుకున్న తరవాత, అతడి కవితలు వెలుగులోకొచ్చి, గొప్ప కవిగా గుర్తింపబడతాడు. “నేను బ్రతికేఉన్నాను” అని ఎంత మొత్తుకున్నా వినకుండా పిచ్చోడికింద జమకట్టిన సమాజాన్ని, ఆ కవి  వెలివేసి వెళ్ళిపోవటంతో కథ ముగుస్తుంది. ఒక ఫలించని ప్రేమ కథ, మంచి మనసున్న ఒక వేశ్యతో మరో ప్రేమ కథ, సబ్ ప్లాట్స్ గా ఉంటాయి. ఒక కవికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? సాహిర్ ఈ సినిమా పాటల్లో తమ విశ్వరూపాన్ని ఆవిష్కరించారు. ఎంతగా అంటే, ఆ సినిమా పాటలకి చక్కని బాణీలు కట్టిన యస్.డి.బర్మన్ కి కూడా లభించనంత గుర్తింపు సాహిర్ సాహెబ్ కు దక్కేంతలా.

సాహిర్ తన నిజజీవితంలో కూడా రెండు సార్లు విఫలప్రేమాబాధితుడై ఆజన్మ బ్రహ్మచారి గానే మిగిలిపోయాడు. తన భవిష్యత్తుని ముందుగానే గుర్తించి ఈ పాట వ్రాశారా?
“జానే వో కైసే లోగ్ థే జిన్కే ప్యార్ కో ప్యార్ మిలా..” పాట నుంచి.
“బిఛడ్ గయా హర్ సాథీ దేకర్ పల్ దో పల్ కా సాథ్.. (అందరూ దూరమయ్యారు ఒకటి రెండు క్షణాల సాహచర్యం తరవాత)

కిస్కో ఫుర్సత్ హై జొ థామే దీవానోంకా హాథ్.. (ఎవరికి ఓపిక ఒక పిచ్చివాడి చెయ్యి పట్టుకోవటానికి)

హమ్కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా..”(చివరికి నా నీడకు కూడా నేనంటే అలసటొచ్చింది)

http://www.youtube.com/watch?v=cmWZHQAKMEk

 

సాహిర్ షాయారీలో స్త్రీల పట్ల, సమాజంలో వారి అణచివేతపట్ల కూడా తీవ్రమైన ఆవేదన కనపడుతుంది. ఆయన దానిని వ్యక్తపరచటంలో ఎక్కడా “రొమాంటిసైజ్” చెయ్యకుండా సూటిగా శులాల్లాంటి మాటల ప్రయోగంతో శ్రోతలను కలవరపెట్టేవారు. ఆ మాటల తీవ్రత ఒక్కోసారి మనని ఎంత బాధ పెడుతుందంటే, అసలు ఆ పాటే వినటం ఆపేద్దాం అనేంత! 1958 లో విడుదలైన “సాధనా” చిత్రం లోని “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో .. మర్దోంనే ఉసే బాజార్ దియా” అనే పాట లోని కొన్ని వాక్యాలు ఇవి.

“జిన్ హోటోన్ నె ఇన్కో ప్యార్ కియా..ఉన్ హోటోన్ కా వ్యాపార్ కియా (ఏ పెదవులైతే ప్రేమనందించాయో, వాటితోనే వ్యాపారం చేసాడు (మగవాడు))

జిస్ కోఖ్ మె ఉస్కా జిస్మ్ ఢలా..ఉస్ కోఖ్ కా కారోబార్ కియా (ఏ గర్భంలో అయితే జన్మించాడో…దానితోనే వ్యాపారం చేశాడు) ……

యే వో బద్కిస్మత్ మా హైన్ జో…బేటోంకి సేజ్ పే లేటీ హై” (ఈమె ఎంత దురదృష్టవంతురాలు అంటే….తన బిడ్డల పరుపుల మీద పడుకుని ఉంది)

http://www.youtube.com/watch?v=dRnHoAI2Pm4

యాభై, అరవై దశాకాలలోనే, సమాజంలో పేరుకుపోతున్న ధనదాహానికీ, నీతిమాలినతనానికీ, అణచివేతకూ, కులమత వివక్షకూ అద్దం పట్టేలా ఎన్నో పాటలు సాహిర్ కలంనుంచి పెల్లుబికాయి.

ప్యాసా లోని “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?” కవిత (పాట) బహుళ ప్రాచుర్యం పొందింది.

“జలాదో ఇసే ఫూంక్ డాలో యే దునియా..జలాదో జలాదో జలాదో..

మేరే సామ్నేసే హటాలో యే దునియా

తుమ్హారీ హై తుమ్హీ సంభాలో యే దునియా”

“సమాజాన్ని తగల పెట్టెయ్యండి,  నా ముందరి నుంచి తీసెయ్యండి, మీదైన సమాజాన్ని మీరే ఉంచుకోండి” అన్న వీరావేశం ఈ పాటలో చూపిస్తే, అదే సమాజం పై ఆవేదన వ్యక్తపరుస్తూనే, ఒక మంచి ఉదయం మనకు రాబోతోంది అన్న ఆశాభావం “వో సుబహ కభీ తో ఆయేగీ…” అన్న పాటలో మనకి కనబడుతుంది.

“మానా కే అభీ తేరే మేరే అర్మానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (సరే, మన ఆశలకెలాంటి విలువా లేదు)

మిట్టీ క భీ హై కుచ్ మోల్ మగర్, ఇన్సానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (మట్టికైనా  కొంత విలువుంది కానీ, మనుషులకు ఏ మాత్రం లేదు)

ఇన్సానోంకీ ఇజ్జత్ జబ్ ఝూటే సిక్కోం మె న తోలీ జాయేగీ (ఏ రోజైతే మనుషుల ఆత్మగౌరవాన్ని డబ్బులతో తూయరో)

వో సుబహ కభీ తో ఆయేగీ” (ఆ ఉదయం ఎపుడో వస్తుంది)

http://www.youtube.com/watch?v=hQYQUo5X6F0

ముస్లిం కుటుంబంలో పుట్టిన సాహిర్, ఒక నాస్తికుడు. ఆ నాస్తికత్వం ఆయన కొన్ని పాటలలో కనపడుతూనే ఉంటుంది. 1954 లో “నాస్తిక్” అనే సినిమాకి కవి ప్రదీప్ “దేఖ్ తేరే ఇన్సాన్ కి హాలత్ క్యా హోగయి భగవాన్..కిత్నా బదల్ గయా ఇన్సాన్” (దేవుడా, చూడు మానవుడి పరిస్థితి – ఎంత మారిపోయాడో మానవుడు) అనే పాట వ్రాసి తానే పాడారు. దానికి జవాబుగా సాహిర్ 1955 లో “రైల్వే ప్లాట్ఫారం” అనే సినిమాకి పాట రాస్తూ ఇలా జవాబు ఇచ్చారు. “దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హో గయి ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!” (ఓ మనిషీ చూడు దేవుడెలా మారిపోయాడో!) ఈ పాటలో దైవదూషణ కంటే కూడా, సమాజంలో అవినీతిపరుల ఇంటే లక్ష్మీదేవి ఇంకా ఎక్కువ కొలువుంటోందన్న వాపోతే ఎక్కువగా కనపడుతుంది. ఈ రెండు పాటల బాణీ కూడా ఒకటే!

భగవాన్, ఇన్సాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=1_5LLtxAB4I

ఇన్సాన్, భగవాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=geBkwLHtJA8

అలాంటి నాస్తికుడైన సాహిర్ హిందీలో కలకాలం గుర్తుండి పోయే భజన్ కూడా వ్రాసారంటే అది వెంటనే నమ్మబుద్ది కాదు. “హమ్ దోనోం” సినిమాలో, లతాజీ అత్యంత మృదుమధురంగా పాడిన “అల్లా తేరో నామ్..ఈశ్వర్ తేరో నామ్” మరి ఈయన కలంనుండి వచ్చినదే!

సాహిర్ మతం మానవత్వం. ప్రేమే అతని దైవం. ఈ భావం స్ఫురించేటట్లు వ్రాసిన పాటలనేకం. కొన్ని పాటలు టైంలెస్. “తూ హిందూ బనేగా న ముసల్మాన్ బనేగా…ఇన్సాన్ కి ఔలాద్ తు ఇన్సాన్ బనేగా!” ఈ పాట ఎన్నో తరాల అంతరాత్మలను తొలుస్తూనే వస్తోంది. ఈ పాటలో ఒక వ్యక్తి ఒక అనాథ బాలుడిని సాకుతూ, నువ్వు హిందువువీ అవ్వవూ లేక ముస్లిమ్ వీ అవ్వవూ, ఒక మనిషికి పుట్టావు కనక, తప్పక ఒక మనిషివే అవుతావు అని ముచ్చట పడుతూ ఉంటాడు. యష్ చోప్రా దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన “ధూల్ కా ఫూల్” సినిమా లోని పాట ఇది.

“అఛ్ఛా హై అభీ తక్ తేరా కుఛ్ నామ్ నహీ హై (మంచిదయ్యింది, నీకు ఇంకా నామకరణం కాలేదు)

తుమ్కో కిసీ మజహబ్ సే కోయీ కామ్ నహీ హై (నీకు ఏ మతంతోను ఇక పని లేదు)

జిస్ ఇల్మ్ నే ఇన్సానోంకో తక్సీమ్ కియా హై (ఏ జ్ఞానము అయితే మనుషులను విభజించిందో)

ఉస్ ఇల్మ్ కా తుమ్ పర్ కోయీ ఇల్జామ్ నహీ హై” (ఆ జ్ఞానము యొక్క అపవాదు నీ మీద లేదు)

http://www.youtube.com/watch?v=jqcyUkUFzrc

 

సాహిర్ లుధియాన్వి కి మరికొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ కంపెనీల నించి రాయల్టీలు రాబట్టిన మొట్టమొదటి గేయరచయిత ఈయన! అలాగే అప్పట్లో చాలా మందికి కొరుకుడు పడని భావాలూ, ప్రవర్తన కూడా ఆయన సొంతం. లతా మంగేష్కర్ ఒక తిరుగులేని గాయనిగా రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఆమెకు సంగీత దర్శకుడి తరువాత, అత్యంత ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు. గేయరచయితకు ఆమెతో పోలిస్తే తక్కువగా ఇచ్చేవారు. అలాంటిది, సాహిర్ మటుకు, లత కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనిదే పాట రాయనని ఘోషణ చెయ్యటంతో, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడింది వారిద్దరి మధ్య. అందుకేనోమో, ఆషా భోంస్లే నే సాహిర్ పాటలు అందరి గాయనీ గాయకుల కంటే ఎక్కువ పాడారు. అయినా సరే ఆయనతోనే ఆయన జీవితాంతం పాటలు వ్రాయించుకున్న దర్శక దిగ్గజాలు ఉన్నారు. దాదాపు ముఫ్ఫై సంవత్సరాల పాటు వీరి సినిమాలన్నిటికీ, సాహిర్ ఒక్కరే గేయరచయిత. వారెవరో కాదు, బి.ఆర్.చోప్రా, యష్ చోప్రా సోదర ద్వయం.

వీరి సినిమాల్లో పాటలన్నీ బహుళ ప్రాచుర్యం పొందినవే. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ సూపర్ హిట్ పాటలు! వీళ్ళు వేర్వేరు సంగీత దర్శకులను, గాయనీ గాయకులను వాడుకున్నారు కానీ, గేయ రచయితను మాత్రం మార్చలేదు. అదీ సాహిర్ గొప్పతనం!

సాహిర్ కవిత్వంలోని ఉర్దూ పదాల వాడుక గురించి ముందర చెప్పుకున్నాం. 1964లో విడుదలైన “చిత్రలేఖ” అనే సినిమా నేపథ్యం చంద్రగుప్త మౌర్య కాలం నాటిది. ఉర్దూ పదాలకు ఆస్కారం లేదు. నిజానికి శైలేంద్ర, ప్రదీప్ లాంటి గేయరచయితలు ఇటువంటి సంస్కృత భాషా ప్రాధాన్యం కావాల్సిన పాటలకి పెట్టింది పేరు. సంగీత దర్శకుడు రోషన్ మటుకు సాహిర్ మాత్రమే రాయాలని పట్టుబట్టారుట. అది ఒక సవాలు గా తీసుకొని, తన ప్రకృతికి విరుద్ధంగా సాహిర్ ఎంతో కష్టపడి వ్రాసిన పాట ఇది. ఈ పాట ఒక మూడేళ్ళ క్రితం ఔట్లుక్ వారు జరిపిన పోల్ లో, అత్యంత ఉత్తమమైన పాటగా గుర్తించబడటం కూడా ఒక విశేషమే. ఈ పాటకు మాత్రం సాహిర్ తో సమానమైన ప్రశంశ పాట పాడిన రఫీకీ, బాణీ కట్టిన రోషన్ కీ చెందాల్సిందే!

“మన్ రే తు కాహే న ధీర్ ధరే? (ఓ మనసా ఎందుకు సంయమం వహించలేకపోతున్నావు?)

వో నిర్మోహీ, మోహ న జానే.. జిన్కా మోహ కరే! (ఎవరినైతే నువ్వు మోహించావో…వారు మోహం తెలియని నిర్మోహి)

ఉత్నాహీ ఉప్కార్ సమఝ్ కోయీ..జిత్నా సాథ్ నిభాయే (అంత వరకూ చేసింది ఉపకారమనుకో..ఎంతవరకైతే నీ తోడు నిలిచారో)

జనమ్ మరణ్ కా మేల్ హై సప్నా, యే సప్నా బిస్రా దే (జనన మరణ చక్రం ఒక స్వప్నం..ఈ స్వప్నాని వదలివేయి)

కోయీ న సంగ్ మరే…” (ఎవ్వరూ చావులో నీ తోడు రారు)

http://www.youtube.com/watch?v=uA2FhgF6VY4

రోహన్, సాహిర్ కాంబినేషన్ లో వచ్చిన తాజ్మహల్ సినిమా లోని పాటలు కుడా అజరామరం. “జో వాదా కియా వో నిభానాపడేగా, రోకే జమానా చాహే, రోకే ఖుదాయీ తుమ్కో ఆనా పడేగా” పాట ఈ సినిమాలోదే.

గుమ్రాహ్ చిత్రం లోని “చలో ఎక్ బార్ ఫిర్ సే..అజ్నబీ బాన్ జాయే హమ్ దోనోం”, సాహిర్ వ్రాసిన టాప్ 10 పాటలలో ఒకటిగా నిలచిపోయే పాట. ముఖ్యంగా దానిలోని ఆఖరి చరణం ఆవేదనకీ మరెంతో ఆలోచనకీ గురిచెయ్యక మానదు. విడిపోయిన ప్రేయసీ ప్రియులు మళ్ళీ ఎదురుపడిన నేపథ్యంలో “పద మళ్ళీ ఒక సారి అపరిచుతులుగా మారిపోదాం  మనిద్దరం” అంటూ సాగే ఈ పాట లోని ఆఖరి చరణం ఇది.

“తార్రుఫ్ రోగ్ హో జాయే..తొ ఉస్కో భూల్నా బెహతర్ (ఎప్పుడైతే ఒక పరిచయం, రుగ్మతగా మారుతుందో, దాన్ని మరువటమే మంచిది)

తాల్లుక్ బోఝ్ బన్ జాయే..తొ ఉస్కో తోడ్నా అఛ్ఛా (ఎప్పుడైతే ఒక సంబంధం, బరువు లాగా అనిపిస్తుందో, దాన్ని తెంచుకోవటమే మంచిది)

వో అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా న హో మున్కిన్ (ఎప్పుడైతే ఒక కథని దాని యొక్కసరైన ముగింపుకి చేర్చలేకపోతామో)

ఉసే ఎక్ ఖూబ్సూరత్ మోడ్ దేకర్ ఛోడనా అఛ్ఛా” (దానికి ఒక అందమైన మలుపునిచ్చి వదిలేసి ముందుకు సాగటమే మంచిది)

http://www.youtube.com/watch?v=y8GnY2eddzM

సాహిర్ అన్నీ ఇలాంటి గంభీరమైన పాటలూ, వేదాంతం లేక ఘాటైన రోమాన్స్ పాటలు మాత్రమే వ్రాశారేమో అనుకునేరు! అనేక సరదా డ్యూయెట్లు, మరెన్నో హాస్య పాటలూ కూడా రచించారు. అన్నిటి గురించీ చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే అయిపోతుంది కనక, నాకు నచ్చిన పాటలన్నీ క్లుప్తంగా ప్రస్తావిస్తా. ఆసక్తి కలవారు వీటిలోని పద, భావ చమత్కారాలను నింపాదిగా తరవాత చదువుకొని సాహిర్ కవిత్వాన్ని మరింత ఆస్వాదించచ్చు.

“మాంగ్ కే సాథ్ తుమ్హారా .. మైనే మాంగ్ లియా సంసార్”  (నయా దౌర్)

“ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ..కువారియోం కా దిల్ ధడ్కే” (నయా దౌర్)

“సర్ జొ తేరా చక్రాయే…యా దిల్ డూబా జాయే” (ప్యాసా)

“తేరా ముజ్హ్సే హై పెహ్లే కా నాతా కోయీ…జానే తూ యా జానే నా” (ఆ గలే లగ్ జా)

“మేరే దిల్ మె ఆజ్ క్యా హై..తు కహే తో మై బతాదూ” (దాగ్)

“గాపుచీ గాపుచీ గమ్ గమ్…కిషీకి కిషీకి కమ్ కమ్” (త్రిశూల్)

“యూ తో హమ్నే లాఖ్ హసీ దేఖే హై..తుమ్సా నహి దేఖా” (తుమ్సా నహి దేఖా)

“ఏ మేరె జోహ్రజబీ తుఝే మాలూమ్ నహీ” (వక్త్)

1976 లో యశ్ చోప్రా నిర్మించిన కభీ కభీ లో ప్యాసా తరవాత మళ్ళీ హీరో ఒక కవి, ఒక భగ్న ప్రేమికుడు. అందులోని హీరో పాత్ర సాహిర్ లుధియాన్వి ప్రేరణతోనే రూపుదిద్దుకున్నదేమో అన్న అనుమానం రాక తప్పదు. హిందీ పాటలతో పరిచయం ఉండి ఈ సినిమా టైటిల్ సాంగ్ తెలియని వారు ఉన్నారంటే నమ్మలేని విషయం; అంత ప్రాచుర్యం పొందింది ఆ పాట! సాధారణంగా తన రచనా శక్తి పట్ల అపరిమితమైన నమ్మకం ఉన్న సాహిర్ ఎదో “ఇంట్రాస్పెక్టివ్ మూడ్” లో జారిపోయి ఈ కవిత వ్రాసినట్లున్నారు. ఈ కవిత నాకు ఎంత నచ్చినా, దీనిలో ఆయన చెప్పిన విషయం, ఆయన పట్ల నాకున్న అవధుల్లేని అభిమానం వల్ల అనుకుంటా,  నా జీవితకాలంలో జరగదేమోనని అనిపిస్తూ ఉంటుంది! నా కాలమ్ ముగింపు కి ఇంత కంటే ఉచితమైన పాట కూడా ఇంకొకటిలేదేమో!

“కల ఔర్ ఆయేంగే నగ్మోంకే ఖిల్తీ కలియా చున్నేవాలే  (రేపు మరిన్ని కవితాపుష్పాలు వస్తాయి, ఏరుకోటానికి)

ముజ్హ్సే బెహ్తార్ కెహ్నే వాలే..తుమ్సే బెహ్తార్ సున్నేవాలే (నా కన్నా బాగా చెప్పకలిగే కవులొస్తారు..మీ కంటే మంచి శ్రోతలోస్తారు)

కల్ కోయీ ముజ్హ్కో యాద్ కరే..క్యోం కోయీ ముజ్హ్కో యాద్ కరే (రేపు నన్ను ఎవరైనా గుర్తుకుతెచ్చుకుంటారు.. అసలు నన్నెందుకు గుర్తుకుతెచ్చుకోవాలి?)

మస్రూఫ్ జమానా మేరె లియే..క్యోం వక్త్ అప్నా బర్బాద్ కరే? (ఈ తీరుబడి లేని ప్రపంచం…నా కోసం ఎందుకు తమ సమయం వ్యర్థం చేసుకోవాలి?)

మై పల్ దో పల్ కా షాయర్ హూ.. పల్ దో పల్ మేరీ కహానీ హై!” (నేను ఒకటి రెండు క్షణాల కవిని..ఒకటి రెండు క్షణాలదే నా కథ!)

http://www.youtube.com/watch?v=bI10wgbeXgc

Siva_3–   యాజి