సామూహిక జ్ఞాపకంలోంచి ….ఒక అన్వేషణ!

 

 

-ఎన్ వేణుగోపాల్

~

(అఫ్సర్ ఆక్స్ ఫర్డ్  ప్రచురణ  “‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్” గురించి యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ లో  మార్చి తొమ్మిదిన జరగబోతున్న ప్రత్యేక చర్చా గోష్టి సందర్భంగా..)

venuప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన, కవిమిత్రుడు అఫ్సర్ గ్రంథం ‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’  మన గతం గురించీ వర్తమానం గురించీ అద్భుతమైన పరిశోధన. గూగూడు పీరు స్వామి గురించి వివరిస్తూ, సామాన్యుల మతవిశ్వాసాలనూ ఆచారాలనూ వాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలను విశ్లేషిస్తూ మతం గురించి కొత్త ఆలోచనలను ప్రేరేపించే పుస్తకం అది. వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ, విశ్లేషిస్తూ మరొక పుస్తకమే రాయగలిగినంత, రాయవలసినంత విలువైన, విశాలమైన, లోతైన పుస్తకం అది. అఫ్సర్ ను ఇంతకాలం కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా చూసినవాళ్లకు ఈ పుస్తకం అఫ్సర్ గురించి ఒక కొత్త తెలివిడిని ఇస్తుంది. అఫ్సర్ లోని నిశితమైన పరిశీలకుడినీ, నిష్ణాతుడైన విశ్లేషకుడినీ, అద్భుతమైన సామాజిక చరిత్రకారుడినీ పరిచయం చేస్తుంది. కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా తాను ఇదివరకే సాధించిన వివరణాత్మక, వర్ణనాత్మక శైలినీ, విభిన్న పొరల ఆలోచనలు ప్రేరేపించగల శక్తినీ అన్వేషణకూ, ఆ అన్వేషణాసారాన్ని వ్యక్తీకరించడానికీ ఎలా వాడుకున్నాడో ఈ పుస్తకం చూపుతుంది.

‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’ ఏకకాలంలో నన్ను ఎంతో రాయడానికీ పురికొల్పుతున్నది, అసలేమైనా రాయగలనా, ఎంత రాస్తే ఆ పుస్తకానికి తగిన న్యాయం చేయగలను అని భయపెడుతున్నది. ముఖ్యంగా కరడుగట్టిన మతోన్మాదం జడలు విప్పుతున్న నేపథ్యంలో, ఇతర భావాల పట్ల హంతక అసహనాన్ని ప్రదర్శిస్తున్న మత భావజాలాల, మతోన్మాదాల వాతావరణంలో ఈ పుస్తకం అవసరం గురించి చెప్పవలసినది చాల ఉంది. రాయలసీమలో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా సాగుతున్న హిందూ ముస్లిం మత సామరస్యం (బహుశా మత సామరస్యం కూడ కాదేమో, మత అభేదం, మత సమ్మేళనం అనాలేమో) పునాదిగా మన బహుళత్వ సమాజానికి ఎత్తిపట్టిన దర్పణంగా ఈ పుస్తకానికి ఇవాళ చాల ప్రాసంగికత ఉంది. ఈ పుస్తకంలో ప్రతి వాక్యమూ, ప్రతి వాదనా, ప్రతి పుటా, ప్రతి అధ్యాయమూ నన్ను గత వర్తమానాల ఆశ్చర్య విషాదాల మధ్య ఊగిసలాడేలా చేశాయి.

పీర్ల పండుగ అనే ఒకానొక గ్రామీణ విశేషాన్ని ఆధారం చేసుకుని అనేక సంక్లిష్ట, సంకీర్ణ, బహుళత్వ ఆలోచనలనూ వాద ప్రతివాదాలనూ ముందుకు తెస్తూ, అంతకన్న లోతైన ఆలోచనలు సంఘర్షించేలా చేస్తూ సాగిన ఈ పుస్తకం గురించి రాసేముందు అసలు ఈ పీర్ల పండుగ గురించి నా అనుభవంతో ప్రారంభిస్తాను. తెలంగాణ అంతటా పీర్ల పండుగ వ్యాపించి ఉంది. నేను మా రాజారంలో ఉన్న నా పన్నెండో ఏటివరకూ ప్రతి ఏటా పీర్ల పండుగ చూశాను. ఇరవయో ఏట ఆ ఊరితో సంబంధం పూర్తిగా తెగిపోయింది గనుక ఆ తర్వాత పీర్లపండుగను పట్టణాల్లో, నగరాల్లో చూశాను గాని ఆ అనుభవాలు కాస్త భిన్నమైనవి. ఇక్కడ పూర్తిగా బాల్యానికి సంబంధించిన అనుభవాన్ని మాత్రమే పంచుకుంటాను. మా ఊళ్లో పీర్ల పండుగ ఊరందరి పండుగలాగే జరిగేది. ఊళ్లో ఉన్న పీర్ల కొట్టం నుంచి పీరీలను తీసి అలంకరించి, పది రోజులు గద్దె మీద ఉంచేవారు. పదోరోజున ఆ పీరీలను ఎత్తుకుని ఊరివాళ్లందరూ, ప్రధానంగా శూద్రకులాలు, దళితులు కూడ ఊరేగింపు చేసేవారు. ముందర మాదిగడప్పులు మోగుతుండేవి. ఆ పీరీల ఊరేగింపు ఊరంతా తిరిగేది. బ్రాహ్మల, కరణాల, రెడ్ల ఇళ్లు పెద్దవి గనుక వాళ్ల ఇళ్లముందూ, వాడల్లో అక్కడక్కడా ఆగేవి. ప్రతిచోటా ఇళ్లలోంచి ఇంటి పెద్దలు స్వయంగా కుండలతో, బిందెలతో నీళ్లు తెచ్చి పీరీలు ఎత్తుకున్నవాళ్ల కాళ్లమీద గుమ్మరించేవాళ్లు. ఆ పీరీల వెంటనడిచే వాళ్లు ఇచ్చే “విభూతి”ని తీసుకునేవాళ్లు. ఫతేహాలు చదువుతుంటే వినేవాళ్లు. అది “తురక దేవుడి” ఆరాధన అనీ, పీరీలు ముస్లింల ఆచారమనీ, అది ముహర్రం అనే ముస్లిం సంస్మరణ సందర్భమనీ, అందులో ముస్లిమేతరుల పాత్ర ఏమిటనీ ఆలోచనలు ఆ నైసర్గిక గ్రామీణ అవగాహనల్లో ఎంతమాత్రం ఉండేవి కావు. నిజానికి అప్పటికి మా ఊళ్లో ముస్లిం కుటుంబాలు మూడు నాలుగు కూడ లేవు. నాకు తెలిసినవి పోస్ట్ మాన్ లాల్ మియా, చిన్న చిల్లర దుకాణం నడుపుతుండిన అబ్బాస్ అలీ రెండు కుటుంబాలు మాత్రమే. అప్పటికి ఐదారువందల గడప ఉన్న ఊళ్లో నాలుగు కుటుంబాలంటే ఊరి జనాభాలో ఒక్క శాతం కూడ కాదు. కాని ఆ ఒక్కశాతం ప్రజల సంస్మరణ ఆచారం ఊరందరి ఆచారంగా జరిగేది. అదంతా నాలుగున్నర దశాబ్దాల వెనుకటి కథ. ఇప్పుడు మా ఊళ్లో కూడ పీర్ల పండుగ అంత బహుళత్వంతో అంత సామూహికంగా జరుగుతున్నదో లేదో తెలియదు.

కాని అనంతపురం జిల్లాలో గూగూడు అనే చిన్న గ్రామంలో ప్రతి ఏటా పీర్ల పండుగ మహోజ్వలంగా జరుగుతున్నది. ఆ ఊళ్లో ముస్లిం జనాభా స్వల్పమే. మొత్తం జనాభా దాదాపు మూడు వేలు కాగా, ముస్లింలు (దూదేకులు) రెండువందల లోపు. కాని ఆ ఊరు ఊరంతా ఆ పండుగను సొంతం చేసుకుంటున్నది. కనీసం మూడు లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవం మత విభజనలను అధిగమించింది. ఒకానొక మత విశ్వాసపు మౌలిక అంశాల మీద నిర్మాణమైనప్పటికీ ఇతర మత విశ్వాసాలు కూడ కలగలిసినది. ఒక సామూహిక నైసర్గిక సంస్మరణ ఉత్సవం అది. ఆ ఉత్సవం నేపథ్యంగా ‘దక్షిణ భారతదేశంలో జనప్రియ ఇస్లాం – సాముదాయక భక్తి’ అనే విశాలమైన పరిశోధన, అన్వేషణ, వివరణ, విశ్లేషణ సాగించడానికి పూనుకున్న అఫ్సర్ తొమ్మిది నెలల పాటు ఆ గ్రామంలోనూ, సంబంధిత స్థలాల్లోనూ పరిశోధించి ఈ పుస్తకం రాశాడు.

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, ముగింపు కాక ఐదు అధ్యాయాలున్నాయి. ‘గూగూడు: సాముదాయక భక్తి స్థలం ఆవిర్భావం’ అనే మొదటి అధ్యాయం గూగూడు ప్రాధాన్యత గురించీ, దాని ఆవిర్భావ వికాసాల గురించీ వివరిస్తుంది. ‘టోపీ పెట్టుకున్న పీర్: కుళ్లాయప్ప కథనం’ అనే రెండో అధ్యాయం గూగూడు ప్రాముఖ్యతలోకి రావడానికి మాలమైన కుళ్లాయప్ప అనే పీర్ గురించి ఉన్న కథనాలను వివరిస్తుంది. ‘కుళ్లాయప్ప – ముహర్రం బహిరంగ ఆచారాలు’ అనే నాలుగో అధ్యాయం పదమూడు పరిశుద్ధ దినాలలో రోజువారీ జరిగే కార్యక్రమాలను, ప్రత్యేకంగా ఏడో రోజు, పదో రోజు జరిగే ఆచారాలను వివరిస్తుంది. ‘ఫకీరి: తాత్కాలిక సన్యాస ఆచరణ’ అనే నాలుగో అధ్యాయం కుళ్లాయప్ప భక్తిలో భాగంగా ప్రజలు ఆచరించే ఫకీరి ఉపవాసదీక్ష గురించి వివరిస్తుంది. ‘ఆచారాల చర్చ: ‘శుద్ధ’ ఇస్లాం రాజకీయాలు’ అనే ఐదో అధ్యాయం సమకాలీన మతతత్వ విస్తరణ నేపథ్యంలో గూగూడు ముహర్రంను పోల్చి చూసి విశ్లేషిస్తుంది. దాదాపు ఇరవై పేజీల పాదసూచికలు, నాలుగు పేజీల అర్థ వివరణలు, ఏడెనిమిది పేజీల ఉపయుక్త గ్రంథ సూచి రచన ఎంత పకడ్బందీగా సాగిందో చూపుతాయి. అఫ్సర్ తన కవితల, కథల, సాహిత్య విమర్శ వ్యాసాల నిర్మాణంలో ఎటువంటి శ్రద్ధ చూపుతాడో ఈ రెండు వందల పేజీల రచనలో అంతకు మించిన శ్రద్ధ కనబరచాడు.

ఈ పుస్తకం గురించి చెప్పుకోవలసిన అనేక అంశాలలో ఒకటి, మన గ్రామసీమల్లో హిందూ ముస్లిం సంప్రదాయాలు, బహుశా అవి వేరువేరని కూడ తెలియనంతగా ఎంత గాఢంగా కలిసిపోయాయనేది. ఇవాళ మతోన్మాద రాజకీయాలు చూపుతున్నట్టుగా హిందూ, ముస్లిం అస్తిత్వాలు విభిన్నమైన, ఎదురుబొదురుగా నిలబడిన, నిత్య సంఘర్షణాయుతమైన, వైరి అస్తిత్వాలు అనే ఆలోచన దాదాపుగా లేని సమాజపు ఆచారవ్యవహారాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. బహుశా భిన్న భావాల పట్ల సహజంగా ప్రజాస్వామిక సహనం పాటించే, ఆదాన ప్రదానాలతో సాగే, బహుళత్వ చిహ్నాలను ఆమోదించే గ్రామీణ సమాజ వివేకపు చిత్రణ ఇది. ఈ వివేకం భాషలో, భావనల్లో, ఆచారాల్లో అన్ని చోట్లా కనబడుతుంది.

అసలు కర్బలా యుద్ధంలో చనిపోయిన మహమ్మద్ ప్రవక్త మనుమల సంస్మరణలో రూపొందిన విషాద సంస్మరణ ఆచరణ ముహర్రం. దానికి షియా ముస్లింల వ్యాఖ్యానం, అది దక్షిణ భారతదేశంలోకి సూఫీల ద్వారా వచ్చిన తీరు, అది చివరికి ప్రధానంగా ముస్లిమేతర (హిందూ కాదు, హిందువులు అనడానికి కూడ వీలులేని అనేక సమూహాలు మన గ్రామసీమల్లో ఉన్నాయి) భాగస్వామ్యంతో, వారి కథలతో, వారి ఆచారవ్యవహారాలతో, వారి ఆదానప్రదానాలతో కలగలిసి ఒక అమాయక సామూహిక మత ఉత్సవంగా మారిందో అఫ్సర్ చాల వివరంగా, విశ్లేషణతో చూపుతాడు.

గూగూడులో ఉన్నది ప్రధానంగా ముస్లిం పీర్ ప్రార్థనాస్థలం. ఆ పీరు పేరు కుళ్లాయప్ప. కుళ్లాయి (తల మీది వస్త్రం – టోపీ) అనే పర్షియన్ మాటకూ అప్ప అనే రాయలసీమ మాటకూ మైత్రి కుదిరి కుళ్లాయి పెట్టుకున్న అప్పగా రూపాంతరం పొందింది. అలా ఆయన పీరు స్వామి అయ్యాడు. ఆయన స్థలం, ఆరాధనా స్థలం, ఆశ్రయం – పీర్, మకాన్ (ఇల్లు) అనే రెండు మాటలు కలిసి, మొదటి మాట అజంతంగా తెలుగీకరణ పొంది, మకానం అనే కొత్త మాట పుట్టుకొచ్చి పీరు మకానం అయింది. నిజంగా ప్రజల సృజనాత్మకత ఎంత విశిష్టమైనది! అలాగే ముస్లిం సంప్రదాయంలోంచి ఒక మాట ముస్లిమేతర, హిందూ సంప్రదాయంలోంచి మరొక మాట కలిసి గూగూడు పదజాలం చాల తయారయింది. జియారతు దర్శనం, ఫతేహా ప్రసాదం, ముజావరు పూజారి, దీన్ గోవిందా, షహర్ గస్తీ – సెరిగట్టి, ఎర్రదారం కట్టుకుని ఫకీరు దీక్షకు పూనుకోవడం, ఫకీరి ఉపవాసాలు, ముహర్రం జాతర, కందూరి సామూహిక భోజనాలు లాంటి ఎన్నో పదాలు పుట్టుకొచ్చాయి. చదివింపులు, ప్రదక్షిణలు, నిప్పుల గుండం నుంచి బూడిద తీసి నుదుటికి, వంటికి రాసుకోవడం, పీరు మకానంలో ఒక పక్కన ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టడం, కుంకుమ తీసుకోవడం, పొర్లు దండాలు, విశ్వరూపం, పీర్ ను అవతారం (రాముడి అవతారం)గా, విష్ణువు పదకొండో అవతారంగా భావించడం వంటి ఎన్నో ప్రధానంగా హిందూ లేదా అంతకు ముందరి ఆచారాలు ఈ పీరు ఆరాధనలో కలిసి పోయాయి. బలి ఇవ్వడానికి ముస్లిమేతరులు తెచ్చిన జంతువులను కూడ ముస్లింలు ఫతేహా చదివి బలి ఇచ్చినతర్వాతనే వండుకోవడం జరుగుతుంది. అనేక సందర్భాలలో అది ఇస్లాం ఆచారమా, హిందూ ఆచారమా, హిందుత్వతో సంబంధంలేని శూద్ర కులాల ఆచారమా చెప్పలేని స్థితి ఉంటుంది. నియ్యా అనే అరబిక్ మాట నియ్యతు (పరిశుద్ధ సంకల్పం) గా మారడం, బర్కత్  (దైవ ప్రసాదం) అనే మాట బర్కతుగా మారడం సరే సరి. ప్రతి ఏటా గూగూడు ముహర్రం ఉత్సవాలు (వాటిని బ్రహ్మోత్సవాలు అనడం కూడ మొదలైంది!) చూడడానికి రావడం తీర్థయాత్రలాగ భావించేవాళ్లూ, పేదవారి హజ్ యాత్రగా భావించేవాళ్లూ కూడ ఉన్నారు. ఇతర చోట్ల ముహర్రం గాథలనుంచి గ్రహించి మార్చుకున్నవీ, సొంతంగా తయారు చేసుకున్నవీ ఎన్నో గూగూడు కథలు, గాథలు, సంగీతం, పాటలు, నమ్మకాలు పుట్టుకొచ్చాయి.

గూగూడుకు దానిదైన ఒక ప్రత్యేక స్థల పురాణం కూడ ఉంది. అది దండకారణ్యలో భాగమైన ప్రాంతమని, అది సీతారామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చిన గుహుడి గూడు అని ఒక కథనం. కాలక్రమంలో అది చంద్రాయణపేట అయింది. ఆ గ్రామం ఏ కారణం వల్లనో దగ్ధమైపోయింది. ఆ గ్రామదహనం, కొత్త గ్రామ పునర్నిర్మాణం బహుశా మారుతున్న నాగరికతలకు, పాత గ్రామాలు విధ్వంసమై కొత్త గ్రామాలు రూపొందడానికి ప్రతీకలు కావచ్చు. పాత గ్రామంలో పోషణ లేని చెన్నకేశవస్వామి ఆలయం ఇంకా ఉంది. ఆ దగ్ధమవుతున్న గ్రామం నుంచి బైటపడడానికి చేసిన ప్రయత్నమే తరతరాల సంచిత జ్ఞాపకంలో నిప్పుల గుండం మీద నడకగా మారి ఉండవచ్చు. అక్కడి నుంచి జనాన్ని కుళ్లాయప్పే ఇక్కడికి తీసుకువచ్చి తన మకానం చుట్టూ కొత్త ఊరు ఏర్పరచాడు. కుళ్లాయప్ప వాస్తవానికి ముస్లింల పవిత్ర ప్రతీక అయిన పంజా. పాత గ్రామం తగులబడిపోయినప్పుడు కంసాలులు బావిలో పడేసిన ఆ ప్రతీకను కొండన్న అనే వ్యక్తి తీసుకువచ్చి పీరు మకానంలో స్థాపించాడు. ఇప్పటికీ కొండన్న వారసులే ఈ ఉత్సవంలో ప్రధానభాగం వహిస్తారు. ఇది చదువుతున్నప్పుడు నాకు బుద్ధుడు మొట్టమొదట తన బోధనలను వినిపించిన ఐదుగురు శిష్యులలోని కొండన్న గుర్తుకు వచ్చాడు. ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసానికి మారడానికి, లేదా రెండు విశ్వాసాల సమ్మేళనానికి కొండన్న ప్రతీక కావచ్చునా?

ఈ క్రమంలో గూగూడు ప్రాదేశిక సరిహద్దులు, గూగూడు భూగోళం కూడ కొత్త అర్థాలు సంతరించుకున్నాయి. కొత్త వ్యాఖ్యానాలు పొందాయి. “పీరు రాకముందు ఇదంతా దట్టమైన అరణ్యం. పీరు రాకతోనే ఇది సంపన్నమైంది” అంటాడు హుస్సేనప్ప. కర్బలా యుద్ధం వాస్తవంగా ఇవాళ్టి ఇరాన్ లో జరగలేదని, గూగూడు సరిహద్దులలోనే జరిగిందని, అందులో ప్రవక్త మనుమలతో పాటు కుళ్లాయప్ప కూడ పోరాడి అమరుడయ్యాడని, కర్బలా అమరులు హసన్, హుసేన్ లు కుళ్లాయప్ప తమ్ములని ప్రజల విశ్వాసం. అలాగే వాస్తవ కర్బలా గాథలో హసన్, హుస్సేన్ లను చంపిన యాజిద్, గూగూడు గాథలో మొఘల్ చక్రవర్తికి సామంతుడైన స్థానికుడిగా మారిపోతాడు. మొఘల్ చక్రవర్తి కుళ్లాయప్పతో సహా తొమ్మిదిమంది పీర్లను నిర్బంధించడానికి ప్రయత్నించినప్పుడు వారందరూ ఆ పోరాటంలో చనిపోయారని స్థానిక కథనం చెపుతుంది. నిజానికి కథనం అని ఏకవచనంలో చెప్పడం కూడ సరికాదు. పునాదిగా ఒక మౌలికాంశం ఉండవచ్చు గాని దాని మీద లేచి నిలిచిన అనేక కథనాలున్నాయి. కులం, లింగం, ప్రాంతం, సాన్నిహిత్యం, ఆరాధనాపద్ధతి, సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలు ఆ కథనాలకు కొత్త కోణాలను కలుపుతున్నాయి. ఏకీకృత, శిలాసదృశ, సార్వజనిక మత విశ్వాసం గురించి ఇవాళ మాట్లాడుతున్నవాళ్లు గూగూడు సూక్ష్మ ఉదాహరణ నుంచి పరిశీలిస్తే భారత సమాజంలో మతవిశ్వాసాల బహుళత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది.

pirsఅసలు కుళ్లాయప్ప “ఆరాధన”లో కొంత అధిభౌతిక శక్తి ఆరాధన, కొంత హేతురహితమైన విశ్వాసం కూడ ఉండవచ్చుగాని అంతకన్న ముఖ్యంగా అది ఒక గ్రామీణ సమాజ సామూహికతా చిహ్నం. అది వ్యవస్థీకృతం కానంతవరకు అమాయకంగా, బహుళత్వంతో, ప్రజాస్వామికంగా కూడ ఉన్నది. మత విశ్వాసం వల్ల గూగూడు జన్నత్ కా దర్వాజా (స్వర్గ ద్వారం) అని ముస్లింలు భావించవచ్చు, వైకుంఠం అని ముస్లిమేతరులు భావించవచ్చు. కాని గూగూడు నుంచి నలబై ఐదు సంవత్సరాల కింద కర్నాటకకు వలస వెళ్లిపోయి, ప్రతి సంవత్సరం ముహర్రంకు మళ్లీ గూగూడుకు వచ్చే మదార్ సాహెబ్ మాటల్లో, “కుళ్లాయప్ప గాని, ముహర్రం గాని లేకపోతే మేం ఒకరిని ఒకరం కలుసుకోవడానికి, సంబంధంలో ఉండడానికి అవకాశమే దొరకదు” అన్నట్టు ఇది సామూహిక కలయిక వేడుక.  ఈ సామూహికతలో హిందూ బ్రాహ్మణీయ మత కార్యక్రమాలకు భిన్నంగా శూద్ర, దళిత, మహిళా భాగస్వామ్యానికి అవకాశం ఉంది. విభిన్న కులాల వ్యక్తులు, ముస్లింలు, మహిళలు, ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు, చిరు వ్యాపారస్తులు, ఇతర ప్రాంతాలలో ఉన్న కుళ్లాయప్ప భక్తులు వంటి ఎంతో మంది అభిప్రాయాలు ఈ సంకీర్ణతను వివరిస్తాయి.

అట్లని ఇది మత రహితమైన, అంధవిశ్వాస రహితమైన సామాజిక ఉత్సవం మాత్రమే అనడానికీ వీలులేదు. ఇక్కడ మహత్యాలున్నాయి. నాదస్వర వాద్యాలున్నాయి. స్వర్గపు ఆలోచనలు, పునర్జన్మ ఆలోచనలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే, అసలు పీరు మకానంలోనే ఆంజనేయ విగ్రహం ఉంది. పక్కనే పెద్దమ్మ ఆరాధన ఉంది. పొరుగున పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం బోధించిన కొండ ఉంది. హిందూ బ్రాహ్మణీయ మడి – వెలికి సమానమైన నిరంకుశత్వంతో కాకపోయినా పవిత్రత – అపవిత్రత ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలకు సమాంతరంగానే శూద్రకులాల సమైక్యత ఉంది.  అందువల్ల, ఈ ముహర్రంలో ప్రవక్త, అమరులైన ప్రవక్త కుటుంబసభ్యులు, ఖురాన్ ఫతేహా, జియారత్, నియ్యత్, బర్కత్ వంటి భావనలు ఉన్నప్పటికీ దీన్ని పూర్తిగా ముస్లిం ఉత్సవంగా చెప్పడానికీ వీలులేదు.

అసలు పీర్ల పండుగ అనడమే ముస్లిం మౌలిక ఆచారానికి భిన్నమైనది. పీర్లు కర్బలా యుద్ధంలో మరణించిన హసన్, హుసేన్ ల ప్రతిరూపాలు. విగ్రహారాధనను వ్యతిరేకించే ఇస్లాంలో ఆ మృతవీరుల చిహ్నాలను స్మరించడం, ఆరాధించడం కూడ “అనాచారాలే”. అలాగే మరణాన్ని సూచించే రోజును పండగగా జరపడం మరొక “అనాచారం.” కాని వాటిని అనాచారాలు అనడం కూడ ప్రామాణికత వైపు నుంచి, ఛాందస ఆచారాల వైపు నుంచి, ఆచారాలలో మార్పులేనితనం వైపు నుంచి చూసినప్పుడే గాని, మత విశ్వాసాలూ, ఆలోచనలూ, ఆచారాలూ ప్రజల నిత్యజీవిత వ్యవహారంలో, సంబంధాలలో, ఆచరణలో రూపొంది తలెత్తి లేచి నిలుస్తాయని, నిత్యం మార్పులకు లోనవుతాయని కూడ గుర్తించవలసి ఉంది.

“హిందువులు లేరు, ముస్లింలు లేరు. అందరిదీ ఒకటే మతం. దానిపేరు కుళ్లాయప్ప భక్తి” అని సత్తార్ సాహెబ్ అన్నమాట ఇవాళ్టి వివాదాల నేపథ్యంలో మతాన్ని కొత్తగా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని సూచిస్తున్నది. అలాగే గూగూడులో ఈ పీర్ల పండుగ, ముహర్రం జరిపే పద్ధతి కూడ ఇతర ప్రాంతాలకూ, హైదరాబాద్ కూ భిన్నంగా ఉన్నదని సత్తార్ సాహెబ్ ఎత్తి చూపుతాడు. హైదరాబాద్ లో మాతం పేరుతో కొరడాలతో, ముళ్ల గొలుసులతో శరీరాల మీద కొట్టుకుంటూ నెత్తురు కార్చే ఆధారం ఉంది. గూగూడు నిప్పుల గుండంలో నడక దాని స్థానంలోనే వచ్చి ఉండవచ్చు.

ఈ మొత్తంలో కనబడేది స్థానిక ఆరాధనా పద్ధతులు, ఆచారాలు పెద్ద ఎత్తున సంలీనం కావడం, ప్రతి ఆచారమూ పునర్నిర్వచనానికి, భిన్నమైన ఆచరణకు గురికావడం. మొత్తం మీద కుళ్లాయప్పకు ఉన్న అనేక వ్యాఖ్యానాలలో, అర్థాలలో గ్రామదేవత, ముస్లిం ఆరాధనా చిహ్నం, కుల దైవం, అమరుడైన మహాత్ముడు అనే నాలుగు ప్రధాన అర్థాలున్నాయి. ఈ నాలుగు భిన్న నిర్వచనాలకు భిన్నమైన సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలున్నాయి.

ఇవాళ్టి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణంలో హిందూత్వవాదులు చెపుతున్నట్టు ఇస్లాం అనేది పరాయి నేల నుంచి వచ్చిన దురాక్రమణ మత విశ్వాసమే అయితే అది ఒక స్థానిక బహిరంగా ప్రజాస్థలంలో ఎటువంటి పరివర్తన పొందిందో, ఎంతగా స్థానికతతో మమేకమైందో, ఎంతగా స్థానికమైందో అనే ఆసక్తిదాయకమైన చర్చకు గూగూడు పరిశీలన వీలు కల్పిస్తుంది. అయితే సమస్య కేవలం హిందూత్వ వాదుల ‘వాతాపిజీర్ణం’ వాదానిదో, గుత్తాధిపత్యానిదో మాత్రమే కాదు. గూగూడు మార్పు చేర్పులను ఇస్లాం కూడ సమాదరించడం లేదు. అసలు వ్యవస్థీకృత మతాలకు ప్రజల అవ్యవస్థీకృత, ప్రజాస్వామిక, నైసర్గిక ఉమ్మడి మత జీవనం గిట్టదు.

ఈసందర్భంగానే కుల విభజనలు లేని, సార్వజనిక సోదరత్వాన్ని ప్రతిపాదించే ఇస్లాం, కుల విభజనల, అంతరాల హిందూ సమాజంలో ప్రవేశించినప్పుడు ఎలా మారుతుంది, దేన్ని మారుస్తుంది, ఏ కొత్త రూపాలను సంతరించుకుంటుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు అఫ్సర్ విశ్లేషణలు దారితీస్తాయి. తాత్విక పరిభాషలో చెప్పాలంటే సాధారణత్వానికీ ప్రత్యేకతకూ, సార్వజనీనతకూ నిర్దిష్టతకూ మధ్య ఐక్యత, ఘర్షణలు ఎలా ఉంటాయో విస్తృత చర్చ చేయడానికి నమూనాగా నిలుస్తుంది గూగూడు గాథ.

ఇక్కడ అఫ్సర్ స్థానిక ఇస్లాం, స్థానికీకృత ఇస్లాం అనే విశ్లేషణా పరికరాలతో ఈ సమస్యను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. ‘స్థానిక ఇస్లాం’ గురించి గతంలోనే కొందరు పరిశోధకులు చర్చించి ఉన్నప్పటికీ గూగూడు దృశ్యం మరింత సంక్లిష్టమైనదనీ, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో సూక్ష్మాంశాలను, మరెన్నో పొరలను విప్పిచూసే పరిశోధనాపద్ధతి అనుసరించాలని అఫ్సర్ అంటాడు. స్థానిక ఇస్లాం అనేది గూగూడు లాగ అనేక మత విశ్వాసాల సమ్మేళనం కాగా, ‘స్థానికీకృత ఇస్లాం’ విశ్వవ్యాప్త, ఏకశిలా సదృశ మత విశ్వాసాన్ని మాత్రమే అస్లీ ఇస్లాంగా అభివర్ణిస్తుంది. దాన్నే గీటురాయిగా పెట్టుకుని స్థానిక ఆచారాలను పరిశీలిస్తుంది. అందువల్ల సహజంగానే గూగూడు ‘స్థానికీకృత ఇస్లాం’కు విమర్శనీయ ఉదాహరణగా కనబడుతుంది. గూగూడు ముహర్రం విశ్వాసాలను సంస్కరించవలసి ఉందని అన్నవారిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. దేవుడు ఒక్కడే, మరెవరినీ దేవుడితో సమానం చేయగూడదు అని భావించే ఇస్లాం కుళ్లాయప్ప స్థానాన్ని ప్రశ్నిస్తున్నదని అఫ్సర్ చూపాడు. చివరికి కుళ్లాయప్ప పేరు మీద ప్రచారంలో ఉన్న మహిమలను విమర్శిస్తూ, ఆ విమర్శకు హేతుబద్ధతను తోడు తెచ్చుకున్న ఒక మతాధిపతిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. ఈ అస్లీ ఇస్లాం ప్రభావం యువతరం మీద ఎక్కువగానే ఉన్నదని, అందుకు ఇస్లామిక్ గ్రంథాలు స్థానిక భాషల్లో విరివిగా వెలువడడం కూడ దోహదం చేస్తున్నదనీ వివరంగా చర్చించి, ఈ ఆలోచనలు ముందుకుసాగితే, గూగూడు ముహర్రం ఉత్సవాలలో ముస్లింల పాత్రకు ఏమవుతుంది అని కూడ ఆలోచనలు చేస్తాడు.

చిట్టచివరిగా, ముగింపులో భారత సమాజం వంటి మత బాహుళ్య సమాజాలలో ఎటువంటి సమన్వయ, సర్వాంగీణ, సమ్యగ్ దృక్పథం ఉండాలో చర్చించే ప్రాతిపదికను సూచించడానికా అన్నట్టు గురజాడ వంద సంవత్సరాల వెనుక రాసిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ లో పీర్ల ప్రస్తావనతో వచ్చిన చర్చను ప్రస్తావిస్తాడు. వంద సంవత్సరాల తర్వాత నిసార్ రాసిన ‘ముల్కీ’ కథను ప్రస్తావించి సమకాలీన సమస్యలనూ సూచిస్తాడు.

మొత్తానికి ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. తరతరాల సామూహిక జ్ఞాపకం ఒక సమకాలీన బహుళత్వ ఉత్సవంగా మారి ఏకీకరణ, గుత్తాధిపత్య ఆలోచనలకు ఎదురుగా ఎలా నిలుస్తున్నదో ఒక సజీవ ఉదాహరణనుంచి చూపడమే ఈ పుస్తకపు విశిష్టత.

*

available at: http://www.amazon.in/Festival-Pirs-Popular-Shared-Devotion/dp/0199997594/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1457107819&sr=1-1&keywords=afsar%20mohammad

http://www.flipkart.com/festival-pirs-english/p/itmdhsyu8e4cknhg?pid=9780199997596&ref=L%3A2859794214406078613&srno=p_1&query=afsar%20mohammad&otracker=from-search

దిగంబర కవులను మరిచిపోయేంత మారామా?

 

గతాన్ని చదువుకుని, దానితో వర్తమానాన్ని పోల్చుకుంటూ గతానికీ వర్తమానానికీ మధ్య ఉండే అవినాభావ సంబంధం గురించి సిద్ధాంతరీత్యా తెలిసిఉండడం ఒక ఎత్తు. ఆ సంబంధాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్న ఘటనలనూ దృశ్యాలనూ పరిణామాలనూ ప్రతిక్షణమూ అనుభవిస్తూ గతవర్తమానాల అవిభాజ్యతను గుర్తించడం మరొక ఎత్తు. వర్తమానం ఒక సూచన చేస్తుంటే, గతంలో అటువంటి సూచనే ఉండిందని గుర్తింపు కూడ రాకపోవడం మరొక ఎత్తు. తెలుగు సమాజం నిరంతర గతంలో జీవిస్తున్నదనీ, మార్పు అనుకుంటున్నదేదీ రూపంలో మార్పే తప్ప సారంలో మార్పు కాదనీ చూపడానికి ఎన్నో ఆధారాలుండగా, పాత అవ్యవస్థే రంగు మార్చుకుని కొనసాగుతుండగా, కనీసం ఆ అవ్యవస్థ మీద గతం ప్రకటించిన ఆగ్రహాన్ని ఇవాళ గుర్తు చేసుకోవడానికి కూడ శక్తి లేకుండా ఉన్నదనీ చూడడం ఆసక్తికరం కన్న ఎక్కువగా విచారకరం.

సమాజం నిలువనీటి గుంట అయిందనీ, దీన్ని ధిక్కరించాలనీ, ఛీత్కరించాలనీ తెలుగునాట కోపోద్రిక్త యువతరపు అసంతృప్తికీ, ఆగ్రహానికీ ప్రతిఫలనంగా దిగంబరకవులు (నగ్నముని – మానేపల్లి హృషీ కేశవరావు, నిఖిలేశ్వర్ – కె యాదవరెడ్డి, జ్వాలాముఖి – ఆకారం వీరవెల్లి రాఘవాచార్యులు, చెరబండరాజు – బద్దం భాస్కర రెడ్డి, భైరవయ్య – మన్మోహన్ సహాయ్, మహాస్వప్న – కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు) పొలికేక వేసి ఈ మే 6 కు సరిగ్గా యాబై సంవత్సరాలు నిండాయి. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (1944-1982), జ్వాలాముఖి (1938-2008) మరణించారు. నగ్నముని (1939), నిఖిలేశ్వర్ (?), భైరవయ్య (1942), మహాస్వప్న (1940?) ఇంకా మనమధ్యనే ఉన్నారు. తెలుగు సమాజ సాహిత్యాల్లో దిగంబర కవుల ప్రాధాన్యత గురించి ఆలోచనాపరుల్లో తగినంత స్పృహ ఉంది. అయినా అర్ధ శతాబ్ది నిండిన సందర్భంగా ఉత్సవమో, జ్ఞాపకమో, గుర్తింపో ఎక్కడా జరిగినట్టు లేదు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ రచనలు కూడ పెద్దగా వచ్చినట్టు లేదు.

దిగంబర కవుల ఆవిర్భావం జరిగి యాబై ఏళ్లయిందని మనం ఇవాళ గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా, మొత్తంగా దిగంబర కవులు తెలుగు సమాజం మీదా, సాహిత్యం మీద వేసిన ప్రభావం అపారమైనది. దాన్ని చారిత్రక సందర్భంగానైనా మననం చేసుకోకతప్పదు. వాళ్లు వేసిన ప్రశ్నలూ, వాళ్ల విశ్లేషణలూ కొన్ని ఇవాళ్టికీ సంబద్ధతను కోల్పోలేదు సరిగదా బహుశా మరింత ఎక్కువ సంబద్ధంగా ఉన్నాయెమోననిపిస్తున్నది.

‘ఇతి శాసనమ్’ అనే శీర్షికతో “దిగంబర శకం నగ్ననామ సంవత్సరం ఆశ రుతువు (సరిగ్గా క్రీ.శ. 1965 మే) న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్ లో ప్రప్రథమంగా తాము దిగంబరకవులమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్తరక్తాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికొస్తున్న నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని ఈ పేజీల్లో పట్టుకోడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ” అనే ప్రకటనతో దిగంబర కవులు తమ మొదటి సంపుటాన్ని వెలువరించారు. ఆ సంపుటాన్ని మే 6 అర్ధరాత్రి (దిగంబర కవులు జీరో అవర్ అన్నారు) హైదరాబాద్ ఆబిడ్స్ చౌరస్తాలో నాంపల్లి పాండు అనే రిక్షావాలా ఆవిష్కరించారు.

మంటలు మాట్లాడినట్టు రాసిన ‘దిగంబరశకంలోకి’ అనే ముందుమాట అర్ధశతాబ్ది తర్వాత చదువుతుంటే ఒకటి రెండు చోట్ల మినహా ఇవాళ్టి గురించి రాసినట్టే ఉంటుంది.

“కీర్తి, డబ్బు, యినప బూట్ల క్రిందపడి నలిగి కొనవూపిరితో గిలగిలా కొట్టుకుంటున్న మీ అసలు స్వరూపాన్ని ఎన్నడైనా, ఒక్కనాడైనా చూసుకున్నారా?

మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. మీ ముసుగు – నటన జీవితం. అధికార జీవితం. డబ్బు జీవితం, గౌరవ జీవితం. వాటికోసం పడిచచ్చి వాటికోసం ఏదయినా సరే, చివరికి మిమ్మల్ని సైతం చంపుకునే దిక్కుమాలిన జీవితం.

ఏం, ఈ ముసుగు లేకపొతేనేం? స్వేచ్ఛగా అసలు స్వరూపంతో బతకడానికి యత్నిస్తేనేం?” అని యాబై ఏళ్ల కింద వాళ్లు చేసిన నిర్ధారణలు, వేసిన ప్రశ్నలు ఇవాళ్టికీ ప్రతిధ్వనిస్తున్నాయి.

మొదటి సంపుటం తర్వాత ఏడాదిన్నరకు దిగంబర కవుల రెండో సంపుటం వెలువడింది. మొదటి సంపుటం లోనే తాము రాసే ప్రక్రియను వచన కవిత అనే పేరుతో పిలవడం తమకు ఇష్టం లేదని, దానికి దిక్ అనే కొత్త పేరు పెడుతున్నామనీ ప్రకటించిన దిగంబర కవులు రెండో సంపుటానికి ‘దిక్ లు 30’ అనే శీర్షిక పెట్టారు. “దిగంబర శకం నిఖిలేశ్వర నామ సంవత్సరం మదిర రుతువు (సరిగ్గా క్రీ.శ. 1966 డిసెంబర్) లో ఇంకా భయం భయంగా బానిసత్వంగా దుర్భరంగా హేయంగా ఛండాలంగా ఉన్న ఆంధ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితా ప్రచురణ సమర్పిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటాన్ని విజయవాడ గవర్నర్ పేట సెంటర్ లో డిసెంబర్ 18 జీరో అవర్ లో జంగాల చిట్టి అనే హోటల్ క్లీనర్ ఆవిష్కరించారు.

ఆ తర్వాత ఇరవై నెలలకు, “నేటి ‘కుష్ఠు వ్యవస్థ’ పై దిగంబర కవులు సంపుటి 3” వెలువడింది. “ప్రజల అవిద్యని అజ్ఞానాన్ని అశక్తతని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాల వాళ్లు నేడు ప్రజలపై రుద్దుతున్న ‘కుష్ఠు వ్యవస్థ’ ని ఎదుర్కొంటూ దిగంబర కవులు పలికిన దిక్ లను జ్వాలా నామ సంవత్సరం అశ్రు రుతువు (సరిగ్గా క్రీ.శ. 1968 సెప్టెంబర్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటిని “ఈ ‘కుష్ఠు వ్యవస్థ’ ఫలితంగా బిచ్చగత్తెగా మారి దుర్భరంగా బతుకుతున్న ఎడమనూరి యశోద (వయస్సు 20 సం.) విశాఖపట్నం, లక్ష్మీ టాకీస్ సెంటర్ లో 14.9.68 రాత్రి 12 గంటలకి” ఆవిష్కరించింది అని దిగంబర కవుల మూడో సంపుటిలో అతికించిన చిన్న వివరణ చెపుతుండగా, సాహిత్య చరిత్రకారులు కొందరు ఆమెను “వేశ్య” అని ప్రస్తావించారు.

digambara kavulu-3a

దిగంబర కవులు తమ కవిత్వం ద్వారా మాత్రమే కాక, పేర్లు, ప్రకటనలు, ఆవిష్కరణలు, ఆవిష్కరణ సమయాల ద్వారా కూడ సంచలనం సృష్టించారు. సమాజంలో, సాహిత్యలోకంలో దిగ్భ్రాంతిని కలిగించారు. సమకాలీన యువతరంలోని అశాంతినీ, అసంతృప్తినీ తమ కోపోద్రిక్త, ధర్మాగ్రహ అభివ్యక్తిలో ప్రతిఫలించి, యువతరం నుంచి అశేష ఆదరాభిమానాన్ని చూరగొన్నారు. వలస పాలన ముగిసి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిందని రాజకీయ నాయకత్వం ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఒక తరం జీవితకాలం గడుస్తున్నప్పటికీ వలసవ్యతిరేక ప్రజా ఉద్యమ ఆకాంక్షలలో ఏ ఒక్కటీ ఫలించకపోవడం ఒకవైపు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ (1951), ఆంధ్ర రాష్ట్ర ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల పరాజయం (1955), సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ఇరవయో కాంగ్రెస్ లో నికిటా కృశ్చెవ్ శాంతియుత పరివర్తనా సిద్ధాంతంతో వర్గపోరాటానికి ప్రకటించిన సెలవు (1956), ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన ఇరవై ఏడు నెలల ముచ్చట అయి రద్దయిపోవడం (1957-59) వంటి పరిణామాలు మరొకవైపు సమాజాన్ని నిర్లిప్తతలోకీ, స్తబ్దతలోకీ నెట్టాయి. అలా నిరాశలో నిరుత్సాహంలో కూరుకుపోతున్న యువతరంలో, ప్రగతిశీల శక్తులలో, పోరాట స్ఫూర్తిని కొనసాగించాలనుకున్న శక్తులలో దిగంబరకవుల పెనుకేకలు ఆనందాన్ని నింపాయి. అటువంటి శక్తులన్నీ నిరభ్యంతరంగానో, కొన్ని అభ్యంతరాలతోనో దిగంబరకవులను ఆహ్వానించాయి. మరొకవైపు దిగంబరకవుల కవిత్వం, ప్రకటనలు వ్యవస్థా సమర్థకులకూ సాహిత్య పీఠాధిపతులకూ మర్యాదస్తులైన సాహిత్యకారులకూ సమానంగా ఆగ్రహం కూడ కలిగించాయి.

దిగంబరకవులు తన ప్రశంస, సిఫారసు, విమర్శ, నింద అవసరమైన స్థితిలో లేరనీ, వాళ్ల కవిత్వాన్ని తాను ఇంగ్లిషులోకి అనువదించి ధైర్యం ఉన్న ప్రచురణకర్త ఉంటే ప్రచురించదలచానని శ్రీశ్రీ రాశారు. పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యాక దిగంబర కవులను విమర్శించేవారికి శ్రీశ్రీయే చాల చోట్ల జవాబు చెప్పారు. “అభ్యుదయ కవిత్వం ఆంధ్రదేశంలో తన పాత్ర నిర్వహించి తెరవెనక్కి తప్పుకుంది. ఇప్పుడు కొత్త శక్తులు పెరుగుతున్నాయి. కొత్త మంటలు రగులుతున్నాయి. అభ్యుదయ కవిత్వం ఇప్పుడు వెస్టెడ్ ఇంటరెస్ట్ కాకూడదు. ఇవాళ రాస్తున్నవాళ్లు దిగంబరకవులు, తిరుగబడు కవులు, సంఘర్షణ కవులు. చేతనైతే వాళ్లకి చేయూతనివ్వండి, లేకపోతే నోరు ముయ్యండి” అని శ్రీశ్రీ రాశారు. “దిగంబర కవులు ఈ ద్వేషాన్ని ప్రజలలో పుట్టించడం అవసరం” అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు. “నెగెటివ్ గానే సంఘాన్ని విమర్శిస్తూ ఉండిన దిగంబర కవులు పాఠకలోకానికి విద్యుచ్ఛికిత్స చేయడంలో కృతార్థులయ్యారు. గండ్రగొడ్డళ్లలా అవినీతిమీద విరుచుకుపడ్డారు. వాళ్ల కోపం ఉన్మాదానికి గల తీవ్రతను సంతరించుకొంది” అని కె వి రమణారెడ్డి అన్నారు. “కూచిమంచి జగ్గకవి తిట్టు కవిత్వం చదివినప్పుడు కవికి కోపం వచ్చిందని పాఠకుడికి తెలుస్తుంది. దిగంబర కవిత్వం చదివినప్పుడు పాఠకుడికి కోపం వస్తుంది” అని వెల్చేరు నారాయణ రావు అన్నారు. “సాహిత్య రంగంలో ఏర్పడిన స్తబ్దత, సమకాలీన జీవితంలో కొట్టవచ్చినట్టు కనిపించే అక్రమాలు, అన్యాయాలు, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, వీటన్నిటిలో నుండి పుట్టిన విపరీత ధోరణిగల ఉద్యమం దిగంబర కవితోద్యమం” అని పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.

మరొకవైపు, “దిగంబర కవితోద్యమం తాటాకు మంట. ఎలా వచ్చిందో అలా పోతుంది” అని విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. దిగంబర కవులను చాల తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమసుందర్ వారి మొదటి సంపుటం ఆవిష్కరణ రోజే పిఠాపురం నుంచి ఉత్తరం రాస్తూ “…ఆవిష్కరణోత్సవం కవితా బహిష్కరణోత్సవంగా శ్రాద్ధయోగంగా జరుగుతుందని ఆశిస్తాను. ఈ ఆరుగురు కవులూ ఈ రాత్రి జీరో అవర్సు నుంచి ప్రారంభించి దిగంబరులుగానే సమాజంలో మసులుతారని కూడా నేనూహిస్తున్నాను… మీకు నా బట్ట విప్పిన అభినందనలు” అని రాశారు.  “మంత్రిని పిలవడం స్నాబరీ లేక స్లేవరీ. రిక్షావాణ్ని పిలవడం ఒక పోజు లేకపోతే ఓ రకమైన ఆత్మవంచన” అని తిలక్ అన్నారు. “దిగంబరకవులకు ఏ కోశానా భావుకత్వం లేదు. కవిత్వం రాయడం బొత్తిగా చేతకాదు. వచనం రాయడం, గేయం రాయడం చేతకాని వాళ్లందరూ వచనగేయం రాసినట్టే వీళ్లు వచనగేయం రాసినారు. కాని లిటరరీ లంపెన్ ప్రొలిటేరియట్ గనక వాళ్లు వచనగేయం అనకుండా ‘దిక్ లు’ అన్నారు. ఈ లిటరరీ అండర్ వరల్డ్ సాహిత్య రౌడీలు కనిపించినవాళ్లనందరినీ బూతులు తిట్టినారు. సమాజంలో పీడకులను వంచకులను మాత్రమే కాదు వాళ్లు తిట్టింది. సకల రాజకీయ పార్టీలను తిట్టి పీడిత జన కార్మిక జన పక్షపాతం వహించే పార్టీలను కూడా తిట్టినారు. గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత నీచమైన కుసంస్కారపు రచన మనకెప్పుడూ రాలేదు” అని రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నారు. “సమాజం ఎంత చెడిపోయినా దిగంబరకవులది కవిత్వం అనుకునేంత చెడిపోయిందా” అని కూడ రారా ప్రశ్నించారు.

అటు పూర్తిగా ప్రశంసో, ఇటు పూర్తిగా తృణీకారమో కాక మధ్యే మార్గంగా గుణాన్నీ దోషాన్నీ చూసినవాళ్లు కూడ ఉన్నారు.

digambara kavulu-3

ఈ చర్చోపచర్చలన్నీ ఎలా ఉన్నప్పటికీ దిగంబర కవులు తెలుగు సమాజానికీ, సాహిత్యనికీ ఇవ్వదలచిన షాక్ ట్రీట్ మెంట్ పని చేసింది. లేదా, తెలుగు సమాజ సాహిత్యాలు అప్పటికి ఒక షాక్ ట్రీట్ మెంట్ అవసరమైన దుర్భర అనారోగ్యంతో ఉండి దిగంబరకవుల ఆవిర్భావానికి కారణమయ్యాయి.

దిగంబర కవుల సంచలనాన్నీ, కవిత్వాన్నీ అర్ధశతాబ్ది తర్వాత నిర్మమంగా పరిశీలిస్తే వాటిలో వస్తుగతంగానూ, వాటి ఫలితాల రీత్యానూ గణనీయమైన సానుకూలాంశాలు కనబడతాయి. సాహిత్య సంప్రదాయం నుంచి చూసినప్పుడు భాషా ప్రయోగం, తీవ్రత వంటి అంశాలు, స్త్రీలను అవమానించే సాంప్రదాయిక పురుషాహంకార పదప్రయోగాలు ప్రతికూలాంశాలుగా కనబడినా అవి సాధించదలచిన, సాధించిన ప్రయోజనం దృష్ట్యా, ఆ కాలపు అవగాహన పరిమితుల దృష్ట్యా అభ్యంతరకరమైనవి కావనీ, అర్థం చేసుకోవలసినవనీ అనిపిస్తుంది.

కొనసాగుతున్న అన్ని విలువలనూ ప్రశ్నించడం అనేది దిగంబర కవుల ప్రధానాంశం. నిజంగా వలస పాలన అనంతరం ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశంలోనూ మార్పు లేకపోవడం, వలస పాలనా కాలపు దుస్థితి మరింత పెరుగుతూ ఉండడం అన్ని విలువల్నీ ప్రశ్నించే ఆగ్రహావేశాల్ని ప్రేరేపించకపోతే ఆశ్చర్యపోవాలి గాని ప్రేరేపించినందుకు కాదు. ఆ ఆగ్రహం నుంచే దిగంబర కవులు ఆచ్ఛాదనలన్నిటినీ తొలగించాలనుకున్నారు. తమ పేర్లు మార్చుకున్నారు. ఆశ్చర్యం కలిగించే, కొట్టవచ్చినట్టు కనిపించే పేర్లు పెట్టుకున్నారు. కాలమానాన్ని, కాలానికి అప్పటిదాకా సమాజం ఇచ్చిన పేర్లను మార్చదలచారు. తమ పేర్ల మీదనే సంవత్సరాలను, ఆశ, తపన, అశ్రు, మదిర, విరహ, విషాద రుతువులను, స్నేహ, విశృంఖల, క్రాంతి, సృజన, వికాస, అనంత వారాలను సృష్టించారు. ఏ వస్తువు చెపుతున్నారనేదానితో సంబంధం లేకుండా వచన కవిత ఒక ఉద్యమంగా మారి, వచన కవితను ప్రచారం చేయడానికి ఒక సంస్థ ఏర్పడిన వాతావరణంలో తమ రచనాప్రక్రియను వచనకవిత అనే పేరుతో పిలవడానికి నిరాకరించారు. దిక్ అనే కొత్త పేరు పెట్టారు. అప్పటిదాకా సాగుతున్న పూలదండల, శాలువాల, సన్మానాల, పరస్పర ప్రశంసల, వందిమాగధ భజనల పుస్తకావిష్కరణల సంప్రదాయాన్ని తిరస్కరించదలచారు. ఆవిష్కరించిన మూడు సంపుటాలనూ మూడు ప్రధాన పట్టణాలలో జీరో అవర్ లో, రిక్షావాలాతో, హోటల్ క్లీనర్ తో, బిచ్చగత్తె (వేశ్య) తో ఆవిష్కరింపజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవస్థ మీద తమ తిరస్కారాన్ని, కసిని, ధిక్కారాన్ని అనేక రూపాలలో, అనేక వ్యక్తీకరణలలో ప్రకటించదలచారు. బుద్ధిజీవులను తనలోకి లాగేసుకుంటున్న, కొనేస్తున్న, మౌనంలోకి నెడుతున్న వ్యవస్థను చీల్చి చెండాడదలచారు. కొనసాగుతున్న విలువలను, యథాస్థితిని ధిక్కరించదలచారు. ఆ పనులను మూడు సంపుటాల కవిత్వంతోనూ, రాష్టవ్యాప్తంగా కవితా పఠనం తోనూ, ఉపన్యాసం తోనూ విజయవంతంగా నిర్వహించారు.

నిజానికి దిగంబరకవుల ఆవిర్భావానికి దారి తీసిన సామాజిక రాజకీయ సాంస్కృతిక నేపథ్యాన్నీ, వాళ్ల కృషినీ, దాని పర్యవసానాలనూ తెలుగు సమాజం ఇంకా పూర్తిగా విశ్లేషించలేదనీ, విశ్లేషించినంత మేరకైనా సంలీనం చేసుకోలేదనీ అనిపిస్తుంది. ఒకరకంగా యథాస్థితిమీద తీవ్ర విమర్శతో, కోపావేశాలతో సర్వ విధ్వంసకవాదులుగా, నిహిలిస్టులుగా మొదలైన దిగంబరకవులు రెండో సంపుటం నాటికి విధ్వంసం ఒక్కటే సరిపోదనీ, ప్రత్యామ్నాయ నిర్మాణ ఆలోచనలు కావాలనీ అవగాహనకు వచ్చారు. మూడో సంపుటం నాటికి ఆ అవగాహన ఇంకా స్పష్టతను సంతరించుకుంది. మూడు సంపుటాలనూ కలిపి మార్చ్ 1971లో ఎమెస్కో ప్రచురించిన సమగ్ర సంకలనంలోని కవితలను వరుసగా చదివితే వాళ్ల అవగాహనలలో క్రమానుగత పరిణామం, కొందరి కవితలలో గుణాత్మక పరిణామం కూడ కనబడుతుంది. బహుశా ఏ చరిత్ర వాళ్ల ఆవిర్భావానికీ, కవిత్వానికీ, సంచలనానికీ కారణమయిందో, ఆ చరిత్ర గమనమే వాళ్ల గురించి చర్చను కూడ పక్కన పెట్టే స్థితి కల్పించినట్టుంది.

దిగంబర కవులు విశాఖపట్నంలో 1968 సెప్టెంబర్ లో తమ మూడో సంపుటం ఆవిష్కరించారు. అప్పటికే శ్రీకాకుళ విప్లవోద్యమం నక్సల్బరీ పంథాలోకి మళ్లింది. విశాఖపట్నానికి ఆ వేడి తగులుతున్నది. ఆ సంపుటంలోని చెరబండరాజు ‘వందేమాతరం’ గాని, ‘యాభై కోట్ల మంటలు’ కవితలో “యాబై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి” అనే పాదాలు గాని ఆ పోరాట వాతావరణానికి స్పష్టాస్పష్ట ప్రతిఫలనాలే. ఆ విశాఖపట్నంలోనే మరొక ఏడాది తర్వాత, 1970 ఫిబ్రవరి 1న శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు జరిగింది. మామూలుగా సన్మానాలను వ్యతిరేకించేవాళ్లు గనుక దిగంబరకవులు దానికి వెళతామని అనలేదు. కాని అంతకుముందు కటక్ లో జరిగిన సభకు వెళ్లి వెనక్కి తిరిగి వస్తూ జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లు విశాఖపట్నంలో ఆగి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలో ‘రచయితలారా మీరెటువైపు’ అని ఎలుగెత్తిన సవాల్ కు ఆ ఇద్దరూ సానుకూలమైన జవాబు ఇచ్చారు. అప్పటికే భైరవయ్య, మహాస్వప్నలు మిగిలిన నలుగురితో విభేదిస్తున్నారు గనుక వాళ్లిద్దరూ విడిగా ఉండిపోయినా నలుగురు దిగంబరకవులూ 1970 జూలై 4 ఉదయాన ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో భాగమయ్యారు. నాలుగు సంవత్సరాల తర్వాత జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ విరసం నుంచి బైటికి వచ్చి జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య స్థాపించారు. నగ్నముని 1979లో విరసం నుంచి వైదొలిగారు. చెరబండరాజు 1982 జూలై 2న బ్రెయిన్ ట్యూమర్ తో మరణించేదాకా విరసంలో కొనసాగారు. భైరవయ్య, మహాస్వప్న కూడ దిగంబర కవిత్వ సంప్రదాయాన్ని కొనసాగించలేదు. వ్యవస్థ మీద అంత ధిక్కారాన్ని, ఆగ్రహాన్ని ప్రకటించిన దిగంబర కవులలో కొందరు తాము విమర్శించిన, ఈసడించుకున్న సన్మానాల, రాజీల, శాలువాల, పరస్పర ప్రశంసల, మొహమాటాల సంస్కృతికి కూడ లొంగిపోయారు.

కాని వ్యక్తులుగా వాళ్లు ఏమైనప్పటికీ, వాళ్లు ప్రారంభించిన, వాళ్లు స్థిరపరచిన వ్యవస్థా ధిక్కార ధోరణులకు, న్యాయమైన ఆగ్రహానికి, కోపోద్రిక్త అభివ్యక్తికి ఎప్పటికీ కాలం చెల్లదు. ఆ గతం ఎప్పటికీ వర్తమానమే. ఆగతానికి కూడ మార్గదర్శకమే. మరీ ముఖ్యంగా దిగంబర కవులు అసహ్యించుకున్న, తిరస్కరించిన సామాజిక, సాహిత్య ధోరణులు మళ్లీ ఒకసారి మనమధ్య కోరలు చాస్తున్నప్పుడు, మళ్లీ ఒకసారి సాహిత్యలోకంలోకి సాహిత్యేతర కృతిభర్తలు ప్రవేశిస్తున్నప్పుడు దిగంబరకవులను తలచుకోవడం అత్యవసరం. మనమింకా వాళ్లను మరిచిపోయేంతగా మారలేదు.

  • ఎన్ వేణుగోపాల్

“కాస్త సాహిత్యం ఇప్పించండి”

 

గౌరవనీయ మిత్రులు కాళిదాసు పురుషోత్తం దాదాపు నాలుగు దశాబ్దాల వెనుక పి ఎచ్ డి కోసం చేసిన విస్తారమైన పరిశోధన ఫలితమైన సిద్ధాంతవ్యాసాన్ని ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం’ పేరుతో ఇప్పుడు ప్రచురించారు. అలా పరిశోధనకూ ప్రచురణకూ మధ్య సుదీర్ఘకాలం గడిచి ఈ పుస్తకమే గత వర్తమానాల వారధిగా నిలుస్తుందంటే, అందులోని వస్తువు వెంకటగిరి ఆస్థానంలో సాహిత్యం గురించి మాట్లాడుతూ ఇంకా వెనక్కి గతంలోకి వెళ్తుంది. గతం గురించి అద్భుతమైన, ఆలోచనాస్ఫోరకమైన, విస్తృత సమాచారం నింపుకున్న ఈ సిద్ధాంత వ్యాసం చదువుతున్న సమయాన్నే వర్తమానం కూడ అటువంటి సూచనలిస్తున్నదని అనిపిస్తున్నది. వర్తమానంలో కూడ కొత్త సంస్థానాలు తలెత్తుతున్నాయనీ, సాధారణంగా నిర్బంధాన్ని సహించబోమని చెప్పే, తమను తాము స్వేచ్ఛాజీవులుగా భావించుకునే, నిత్య ప్రతిపక్షమని చెప్పుకునే సాహిత్యకారులు, కళాకారులు కొత్త సంస్థానాల కడగంటి చూపుకైనా సరేనని పరుగెత్తుతున్నారనీ కనబడుతున్నది. గతవర్తమానాల మధ్య సారూప్యమూ విభేదమూ మరింత కొట్టవచ్చినట్టు కనబడి, తెలుగు సమాజపు ప్రతిష్టంభన మరొకసారి కళ్లకు కడుతున్నది.

వెయ్యి సంవత్సరాల అధికారిక తెలుగు సాహిత్య చరిత్రలో అత్యధికభాగం, బహుశా ఎనిమిది వందల సంవత్సరాల పైన, ఆస్థాన సాహిత్యమే రాజ్యమేలింది. ఆ రాజాస్థానాలు కాకతీయ, విజయనగర రాజ్యాల వంటి సువిశాలమైనవా, రాజమహేంద్రవరం, కొండవీడు, నెల్లూరు, రాచకొండల నుంచి జటప్రోలు, గద్వాల, వెంకటగిరి, దోమకొండ వంటి చిన్న రాజ్యాలవా అనేది కేవలం వివరణ కోసం తెలుసుకోవలసిందే తప్ప, అధికారిక తెలుగు సాహిత్య చరిత్రలో రాజాస్థానాలలో వెలువడిన సాహిత్యానికే ఎక్కువ ప్రాధాన్యత దొరికింది. ఆస్థానాలకు బైటనే ఎంతో సాహిత్యం వచ్చినప్పటికీ దానికి సాహిత్యంగా గుర్తింపు దొరకలేదు. అటువంటి గుర్తింపు దొరికి ప్రధానస్రవంతి సాహిత్యచరిత్రలో నమోదైన సాహిత్యకారులు అతి తక్కువమంది.

ప్రతి మానవమేధకూ సహజంగా సృజనశక్తి ఉంటుంది. సామాజిక సంపర్కంతో అది వికసించే అవకాశం ఉంటుంది. అన్ని రూపాల సృజనాత్మక కార్యకలాపాలూ శ్రమతోనే వికసిస్తాయి. అందువల్ల బహుశా శ్రమజీవుల మౌఖిక సృజన కార్యకలాపాలే ఏ సమాజంలోనైనా రాశిలో అధికంగా ఉంటాయి. జీవితానుభవం వల్ల వాటి వాసి కూడ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాని రాజాస్థాన సాహిత్య చరిత్ర రచనా సంప్రదాయం మౌఖిక సాహిత్యాన్నంతా విస్మరించి, లిఖిత సాహిత్యాన్ని మాత్రమే సాహిత్యంగా గుర్తించడం ప్రారంభించింది. ఆ లిఖిత సాహిత్యంలో కూడ రాజాస్థానానికి బైట స్వతంత్రంగా ఉండిన సాహిత్యకారులను చిన్నచూపు చూసింది.

Venkatagiri

స్వభావసిద్ధంగానే లిఖిత సాహిత్య సృష్టికి అదనపు వనరులు అవసరమవుతాయి. లేఖన సంప్రదాయం ఏర్పడి ఉండాలి. లేఖన పరికరాలు అభివృద్ధి అయి ఉండాలి. ఉత్పత్తిలో మిగులు ఏర్పడి, కొన్ని వర్గాలు తమ ఉత్పత్తి తాము చేసుకోనక్కరలేని విశ్రాంతివర్గంగా మారిన తర్వాతనే లిఖిత సాహిత్య వికాసం జరిగే అవకాశం ఉంది. ఈ విశ్రాంతి వర్గం తమ విశ్రాంతికీ విలాసాలకూ సమర్థన కల్పించుకోవడానికి విశ్రాంతి వర్గ సాహిత్య రచనా, ఆస్వాదనా, శ్రవణ వాతావరణాన్ని, అందుకు తగిన సాహిత్య సిద్ధాంతాన్ని తయారు చేసింది. ఆ వాతావరణాన్ని, సిద్ధాంతాన్ని కల్పించడంలో మతమూ, రాజ్యమూ సహకరించాయి. అందువల్లనే లిఖిత సాహిత్య సంప్రదాయం తప్పనిసరిగా శ్రామికవర్గాల, ప్రజల పునాదిపై కాకుండా మతం పునాదిపై, రాజ్యం పునాదిపై బలపడింది.

లిఖిత సాహిత్యమంతా విశ్రాంతివర్గ సాహిత్యమే, రాజాస్థాన సాహిత్యమే అనే అతివాద సూత్రీకరణ చేయనక్కరలేదు గాని, విశ్రాంతివర్గం ఏర్పడడమే లిఖిత సాహిత్య విస్తరణకు అవకాశాలు పెంచింది. విశ్రాంతి వర్గం ఏర్పడడమంటే శ్రామికవర్గం తమ అవసరాల కొరకు మాత్రమే కాక మరొకవర్గం అవసరాలకు కావలసిన అదనపు ఉత్పత్తి కూడ చేయవలసి వచ్చిందన్నమాట. అలా తాము శ్రమించకుండానే, ఉత్పత్తిని అనుభవించే హక్కు తమకు ఉందని చూపుకోవడానికి విశ్రాంతివర్గం పాలన సాగిస్తున్నట్టుగా, పౌరోహిత్యం చేస్తున్నట్టుగా, రక్షణ కల్పిస్తున్నట్టుగా, సమాజపు విజ్ఞాన, వినోద అవసరాలు తీరుస్తున్నట్టుగా నటించడం మొదలయింది. ఈ విశ్రాంతివర్గపు ఒకానొక కార్యకలాపమే ఆస్థాన సాహిత్యం.

ఈ ఆస్థాన సాహిత్యంలో ఎక్కడైనా ఒకచోట వాస్తవికత, మానవీయత, గొప్ప భావాలు ఉన్నట్టు కనిపించినప్పటికీ దాని పునాది మాత్రం శ్రామికవర్గాల అదనపు ఉత్పత్తిని సంగ్రహించడంలోనే ఉంది. ఆ సంగ్రహం ఎంత పెద్ద ఎత్తున జరిగితే ఆస్థానాల వైభవం అంతగా విలసిల్లింది. ఆస్థానంలో విలాసాలు పెరిగినకొద్దీ ఆస్థాన సాహిత్యపు మైమరపూ పెరిగింది. ఆ విలాసభరిత, వైభవోపేత ఆస్థానాలలో సాహిత్య పోషణ భువనవిజయంగా సాగింది.

Upstairs_at_the_palace,_Kondapalli,_Kistna_District

అయితే వందల ఏళ్ల పాటు సాగిన ఈ ఆస్థానాల సాహిత్యసేవ అంతా వ్యర్థమే అనుకోనక్కరలేదు. సామాజిక శ్రమవిభజనలో భాగంగా బహుశా భౌతిక ఉత్పత్తి కార్యక్రమంతో పాటుగా ఈ మానసిక ఉత్పత్తుల కార్యక్రమం కూడ జరగవలసిందే. కాని అది సామాజిక అవసరాలకు, ప్రాధాన్యతలకు, ఉపయోగానికి లోబడి జరగాలి. సమాజానికి అవసరమైన మేరకే జరగాలి. సమాజానికి అధినాథులమని తమను తాము భావించుకునే కొందరి వీర, శృంగార, బీభత్స, ఔదార్య చర్యల వర్ణన మాత్రమే కాదు, సమాజాన్ని చిత్రంచే బాధ్యత చేపట్టాలి. కాని ఆస్థాన సాహిత్యం, ప్రత్యేకించి తెలుగులో ఆస్థాన కవిత్వం ఆ పని చేయలేదు. కవులు సమాజపు సమస్యలు కనబడని, అర్థం కాని ఏకాంత దంత ప్రాకారాలలో నివసించారనడానికి ఆధారాలేమీ లేవు. వారు కొంతవరకైనా సామాన్య ప్రజల జీవితం చూసే ఉంటారు. కాని అటు ఆస్థాన అవసరాలూ, ఇటు లక్షణ శాస్త్రాలూ వస్తువు మీద, శిల్పం మీద నిర్దేశించిన కఠిన నియమాలు, వ్యాకరణాల సంకెళ్లు, ఛందస్సుల సర్పపరిష్వంగం, కవులను సామాజిక వస్తువులవైపు చూడకుండా చేశాయి. సృజనకర్తకు సహజమైన ప్రయోగపరత్వం, అన్వేషణ, నవత అనే కార్యకలాపాలు చివరికి చిత్ర, బంధ, ద్వంద్వార్థ, నిరోష్ట్య వంటి సాముగరిడీలకు పరిమితమైపోయాయి.

ఈ స్థితి కొన్ని వందల ఏళ్లు గడిచి, శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యంలో సాహిత్య పోషణ ప్రచారార్భాటం మితిమీరి ఆస్థాన కవిత్వమే ఏకైకం అన్నట్టు తయారయింది. “మూడు వందల యేళ్లపాటు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, కుట్రలు, దోపిడులతో లక్షల, కోట్ల సామాన్య ప్రజల్ని పీడనకూ హింసలకూ గురిచేసిన విజయనగర సామ్రాజ్యం” అని కంభంపాటి సత్యనారాయణ ‘ఆంధ్రుల సంస్కృతి – చరిత్ర’ లో రాసిన వాస్తవం ఆంధ్రభోజుడి ఆస్థానంలో వెల్లువెత్తిన సాహిత్యంలో ప్రస్తావనకే రాలేదు. కృష్ణరాయల కీర్తి ఘల్లుమని మారుమోగుతుంటే మరుగున పడిపోయిన డజన్ల కొద్దీ దుర్భరమైన పన్నుల వివరాలను, ప్రజల మీద పన్నుల పీడనను కంభంపాటి సత్యనారాయణ సమకాలిక యూరపియన్ ఆధారాలనుంచి సేకరించగలిగారు గాని ప్రజల కష్టాల గురించి ఒక్కటంటే ఒక్కటైనా ఆస్థాన సాహిత్య రచన మాట్లాడలేదు.

మరొక మాటల్లో చెప్పాలంటే “ఆ రాజు పారేసిన ఎంగిలి పెరుగన్నం మెక్కి/ ఆస్థానకవి నాటకం రాసాడు” అని ఆ తర్వాతెప్పుడో సరోజ్ దత్తా ‘శకుంతల’ కవితలో రాసినట్టు రాజ్య దుర్మార్గానికి మేలి ముసుగు కప్పడానికే అత్యధిక భాగం ఆస్థాన కవిత్వం ప్రయత్నించింది. ఆస్థాన సాహిత్యకారులు తమకు ఉప్పుపెట్టిన రాజును సంతోషపెట్టడమే తమ సాహిత్య బాధ్యత అనుకున్నారు. నిజానికి ఆ ఉప్పు రాజుది కాదని, అసంఖ్యాక శ్రమజీవులనుంచి సంగ్రహించినదని గుర్తించలేదో, గుర్తించీ విస్మరించారో తెలియదు. మొత్తానికి బుద్ధిజీవులు ప్రభువులవైపా ప్రజలవైపా అనే ప్రశ్న వేసుకోకుండానే ప్రభువుల కొమ్ము కాశారు.

తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు విజయనగర (హంపి) సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఏర్పడిన విశాలమైన కుతుబ్ షాహి రాజ్యమైనా, ఆ తర్వాతి కాలంలో ఎక్కడికక్కడ ఏర్పడిన చిన్న చిన్న సంస్థానాలైనా, చివరికి ఆర్థిక వనరులు మరీ అంత ఎక్కువ లేని సంస్థానాలు కూడ సాహిత్యపోషకులుగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాయి. తమ శక్తికి మించి కూడ సాహిత్య పోషణ చేశాయి. అటువంటి సాహిత్య పోషక సంస్థానాలలో ఒకటి వెంకటగిరి. విజయనగరం (ఉత్తరాంధ్ర) తర్వాత అతి పెద్ద జమీందారీగా వెంకటగిరి 730 గ్రామాలతో, 617 శివారు పల్లెలతో, 2,171 చదరపు మైళ్ల విస్తీర్ణంతో, 1900 నాటికే సాలీనా రు. 14,46,222 ఆదాయంతో ఉండేది. ఆ సంస్థాన ప్రభువులలో ఒకరైన సర్వజ్ఞ కుమారయాచమనాయకుడు కవిపండిత పోషకుడు. స్వయంగా కవి అయి విద్వత్ కుమార యాచమనాయకుడని పేరు పొందాడు. వెంకటగిరి సంస్థానాన్నే విద్వత్సంస్థానం అని పిలిచేవారు.

ఈ సంస్థాన చరిత్రను, సామాజికాంశాలను కాళిదాసు పురుషోత్తం ఈ సిద్ధాంత గ్రంథంలో రెండు అధ్యాయాలలో చాల ఆసక్తిదాయకంగా వివరించిన తర్వాత ఆ సంస్థానంలో జరిగిన సాహిత్య సృజనను మూడు అధ్యాయాలలో వివరంగా చర్చించారు. వీటిలో మొదటి అధ్యాయంలో సాహిత్యాన్ని మూడు ఉప అధ్యాయాలలో (1600-1850, 1850-1950 – గోపీనాథుని  వెంకయ్యశాస్త్రి, 1850-1950) చర్చించి, ఆ తర్వాత పదకవిత (1700-1950), సంస్కృత సాహిత్యం (1600-1950) కూడ చర్చించారు. ఆయాకాలాలలో ఒక్కొక్క కవినీ, ఆ కవి రచనలనూ తీసుకుని, ప్రాతినిధ్య, ఆసక్తికర పద్యాలను, సందర్భాలనూ ఉదహరిస్తూ సాధారణ పి ఎచ్ డి సిద్ధాంత గ్రంథాల కన్న విశిష్టంగా సాగిన గ్రంథం ఇది. ఉదహరించిన రచనల ఆధారంగానే ఇంతకన్న లోతైన సామాజిక, ఆర్థిక విశ్లేషణకు అవకాశం ఉంది గాని ఒక తెలుగు పి ఎచ్ డి పరిశీలన నుంచి అంతకన్న ఎక్కువ ఆశించలేం.

ఈ పుస్తకం చదవడం గత కాలపు సాహిత్య తీరుతెన్నుల గురించి, సాహిత్య సృజన గురించీ, సాహిత్య అనుభవం గురించీ, సాహిత్య వస్తురూపాల గురించీ చాల ఆలోచనలను ప్రేరేపిస్తుంది.

సంస్థాన సాహిత్యం ఎంతగా పాలకవర్గ, విశ్రాంతివర్గ సాహిత్యం అయినప్పటికీ, అది ఆ వ్యవస్థ దుర్మార్గాలకు మేలి ముసుగుగా పనిచేసినప్పటికీ అందులో ఒకటి రెండు సానుకూల అంశాలున్నాయనిపిస్తుంది. ఒకటి, సమాజ సంపదలో నుంచి కొంత మిగులును సాహిత్య, కళా రంగాల మీద తప్పనిసరిగా ఖర్చు పెట్టాలనే నియమం. అప్పటికి సాహిత్యానికి మార్కెట్ ఏర్పడలేదు గనుక సాహిత్య సృజన పూర్తికాలపు వృత్తిగా మారే అవకాశం లేదు. సాహిత్యం ఎవరో ఒకరి పోషణలో ఉండవలసిందే. (సాహిత్యం – పోషణ అనే మాటలు రాస్తున్నప్పుడు ఒక బాల్యపు జ్ఞాపకం గుర్తుకొస్తున్నది: మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే యాయవారపు బ్రాహ్మణుడు ‘సాహిత్యం ఇప్పించండి’ అని పంచె పరిచేవారు. మా అమ్మ సోలెడు బియ్యమూ, దోసెడు కందిపప్పూ, కొన్ని కూరగాయలూ, చింతపండూ, మిరపకాయలూ ఆ పంచెలో వేస్తుండేది. సాహిత్యానికే స్వయంగా పోషణ అనే అర్థం ఉండిందన్నమాట!!) అందువల్ల ఆ నాటి స్థితినిబట్టి సామాజిక మిగులులో సాహిత్యానికి ఒక నియమబద్ధమైన వాటా కేటాయింపు మార్గంగా ఆస్థాన సాహిత్యం, కళాపోషణ పనిచేశాయా ఆలోచించాలనిపిస్తుంది.

Kalidau Purushotham

రెండో అనుకూలాంశం, ఎంత దుర్మార్గ పాలకులైనా, ప్రజల పట్ల ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, వారిలో కూడ కళాకారుల పట్ల, సాహిత్యకారుల పట్ల కొంత ఔదార్య, దాతృత్వ లక్షణాలుండేవని ఆస్థాన సాహిత్యం చూపుతుంది. కవిత్వం పట్ల, కళల పట్ల అభిమానం ఉండడమంటేనే మానవీయ లక్షణం ఎంతో కొంత ఉన్నట్టు లెక్క. కనుక ఆ రాజులు, ఆ పాలన రాజకీయార్థిక అర్థంలో ఎంత దుర్మార్గమైనవైనా సాహిత్య, కళా అర్థాలలో కొంత సున్నితత్వాన్ని మిగుల్చుకున్నాయనుకోవాలి.

అది విశ్రాంతి వర్గాల సాహిత్యం కావడం వల్ల, ఒత్తిడి లేకపోవడం, విలాసాలు, ప్రశంసలు, కానుకలు వంటి ప్రోత్సాహకాలు ఉండడం వల్ల కవితాశిల్పానికి కొంత మేలు జరిగిందనిపిస్తుంది. కొండొకచో అది వేలంవెర్రిగా మారి పాండిత్య ప్రదర్శనకూ, భేషజాలకూ, తప్పుడు, సాగదీత మార్గాలకూ దార్ తీసి ఉండవచ్చు గాని, సాధనకు, మెరుగు పెట్టడానికి అవకాశం దొరికినందువల్ల కవితాశిల్పం ప్రశంసార్హంగా, ‘పూత మెరుంగులు’ తీర్చిదిద్దినట్టు తయారయిందని ఒప్పుకోక తప్పదు.

“…ఆ వ్యవస్థ దోపిడిని, హేయత్వాన్ని కొంతవరకు కప్పి పుచ్చేవి ఈ సాహిత్య కళాపోషణలే! సామాజిక శాస్త్రవేత్తలూ, కళాదార్శనికులూ భూస్వామ్య వ్యవస్థ నాణేనికున్న రెండో పార్శ్వాన్ని అధ్యయనం చేసి, అప్పటి సాహిత్య కృషికి దోహదం చేసిన సామాజిక స్థితుగతులను అంచనా వేయాలి. మధ్యయుగాల్లోని సాహిత్యకృషిని, ఒక్కమాటలో, భూస్వామ్య వ్యవస్థకు పుట్టిన వికృతశిశువుగా అభివర్ణించడం సమంజసమా? సాహిత్య వస్తువును అటుంచుదాం. సాహిత్యాభివ్యక్తిలోని సొగసులను, మెలకువలను పట్టించుకోనవసరం లేదా? ఆ యుగపు సాహిత్య కృషిలో అంతర్భాగమైన శతక వాంగ్మయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సామాజికదృష్టితో చూసినప్పుడు, నీతి వైరాగ్య శతకాలతో పాటు, స్థానిక పాలకులను ధిక్కరిస్తూ నిరసనను తెలియజేసిన రచనలు (ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన శార్దూల శతకం వంటివి) నారసింహ శతకం, వేమన పద్యాలు అప్పటి సాహిత్య సృష్టిలో భాగం కావా? సంస్థానాలు సాహిత్య పోషణకేగాక, భాషోద్ధరణకు, సంఘ సంస్కరణకు, కళాభివృద్ధికి దోహదం చేశాయి. గురజాడ, వీరేశలింగం, రఘుపతిగార్ల కృషికి తోడ్పాటునందించినవి సంస్థానాలే” అని ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో వకుళాభరణం రామకృష్ణ అన్న మాటలు చర్చనీయాలు.

అయితే, ఆస్థాన సాహిత్యం మన సాహిత్యంలో ప్రవేశపెట్టిన అపసవ్యతలను గురించి తక్కువ చేయడానికి వీలులేదు. ప్రతి రచననూ ఒక కన్యగానూ, కృతి కర్తను దాని తండ్రి గానూ భావించి ఒక కృతి భర్తకు, సాధారణంగా పోషణ బాధ్యత తీసుకున్న రాజుకు, అంకితం ఇవ్వడం అనే దుష్ట సంప్రదాయాన్ని ఆస్థాన సాహిత్యమే ప్రవేశపెట్టింది. సాధారణంగా ఈ సాహిత్యం రాజుల కోరికల మేరకు, రాజుల మెప్పు కొరకు సృష్టి అయింది గనుక కొంత, అత్యధిక ఆస్థాన రచయితలు బ్రాహ్మణులు కావడం వల్ల కొంత ఆస్థాన సాహిత్యంలో ఎక్కువ భాగం వర్ణాశ్రమ ధర్మాన్ని, మత ప్రాధాన్యతను, కుల అంతరాలను ప్రచారం చేశాయి.

అలాగే, ఆస్థాన సాహిత్యం తనను తాను పీఠం మీద స్థిరపరచుకోవడానికి ఆస్థానాల బైటి సాహిత్య సంప్రదాయాల మీద చిన్నచూపును ప్రదర్శించింది. అసలు అది సాహిత్యమే కాదన్నట్టు ప్రవర్తించింది. నిజానికి మన ప్రజా సాహిత్యంలో, మౌఖిక సాహిత్యంలో, కొంతవరకు లిఖిత సాహిత్యంలో కూడ ఆస్థానాల బైట వెలువడిన ఆణిముత్యాలెన్నో ఇలా విస్మరణకు గురయ్యాయి. ఆ రచనల్లో ఆస్థానేతర వస్తువు ఉందని మాత్రమే కాదు, అవి ఆస్థానాలకు బైట వెలువడడమే, ఆస్థాన పీఠాధిపతులకు కంటగింపయింది.

అలాగే ఆస్థాన సాహిత్యం తనకు బైటి ప్రజాజీవితంలో ఏమి జరుగుతున్నదో పట్టించుకోని బధిరాంధకతను ప్రదర్శించింది. సమాజ సాహిత్య సంబంధాలను వక్రీకరించింది. సాహిత్యాన్ని సమాజానికి దూరం చేసింది.

సరిగ్గా ఈ అవలక్షణాలకు వ్యతిరేకంగానే సాహిత్యంలో ప్రజాస్వామికత కోసం సామాజిక, సాహిత్య ఉద్యమాలు చెలరేగాయి. ఒకవైపు నుంచి సమాజం తన ఉత్పత్తి అయిన సాహిత్యం తన నుంచి దూరం కావడాన్ని నిరసించగా, స్పందనాశీలురైన సాహిత్యకారులు సామాజిక పరిణామాలకు స్పందించడం ప్రారంభించారు. తొలినాటి ఈ పరిణామాలలో కూడ సంస్థానాల పాత్ర కొంత ఉండడం సామాజిక చలనశీలతకు ఒక నిదర్శనం. సాహిత్యంలో ప్రజాస్వామిక భావాలు, ఆస్థాన వ్యతిరేక భావాలు, భూస్వామ్య వ్యతిరేక భావాలు క్రమక్రమంగా విస్తరించి తెలుగు సాహిత్యం ఎన్నో ఉద్యమాలకు, ధోరణులకు, కొత్త గాలులకు వేదిక అయింది.

అదంతా గడిచిపోయి ఎన్నో దశాబ్దాలు దాటింది. కాని క్రమక్రమంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలనేవి కూడ రాజాస్థానాలుగా మారిపోవడం, సంపన్నులు, నయాసంపన్నులు సాహిత్య, కళాపోషణలోకి రావడానికి ప్రయత్నించడం జరిగాయి గాని, మొత్తంగా తెలుగు సమాజంలో ఈ వ్యవస్థానుకూల ధోరణులపట్ల వ్యతిరేకతదే పైచేయిగా ఉంటూ వచ్చింది. తనను తాను ప్రజాస్వామికమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆస్థానకవి పదవిని కొనసాగించడం పట్ల తీవ్రమైన విమర్శలే వచ్చాయి. దిగంబర కవితోద్యమానికి వచ్చిన విస్తృత ప్రజాదరణలో ప్రధానభాగం ఈ అధికారిక ప్రాపకాన్ని నిరసించడం వల్ల వచ్చిందే. శ్రీకాకుళ గిరిజనోద్యమ నేపథ్యంలో నక్షత్ర సప్తకం అనే సాహిత్య సంస్థను ముందు పెట్టి శ్రీశ్రీని కొనివేసి ఆస్థాన సాహిత్యంలో భాగం చేయడానికి ప్రభుత్వమూ, పాలకవర్గాలూ, వ్యవస్థతో సామరస్యం కుదుర్చుకున్న రాజకీయపక్షాలూ ప్రయత్నించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎంతటి తీవ్రపరిణామాలు జరిగాయో సాహిత్య చరిత్రకు తెలిసిందే.

అదంతా కూడ గడిచిపోయి నాలుగు దశాబ్దాలు కావస్తున్నది. ఈ మధ్య కాలంలో వ్యవస్థానుకూల ఆస్థానాలను పునరుద్ధరించే ప్రయత్నాలు అడపాదడపా జరిగాయి గాని అవి చెప్పుకోదగిన విజయం సాధించలేదు. కాని గత కొద్ది సంవత్సరాలుగా మళ్లీ వ్యవస్థా సమర్థకులకు సాహిత్య పోషణ చేయాలనే వెంపరలాట పెరుగుతున్నట్టు కనబడుతున్నది. సాహిత్యకారులలో కొందరిలోనైనా మళ్లీ ఆస్థానాల వైపు , పీఠాలవైపు ఆసక్తి పెరుగుతున్నట్టు కూడ కనబడుతున్నది.

శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని రక్తపుటేర్లలో ముంచిన పోలీసు అధికారులు ఆ తర్వాతి కాలంలో సాహిత్య కళాసంస్థల నిర్వాహకులుగా, సాహిత్య పోషకులుగా అవతారమెత్తారు. జరపవలసిన హింసాకాండ అంతా జరిపి, రెండున్నర లక్షల మంది సైనికులను చంపి, కళింగ రాజ్యపు దయానదిలో నెత్తురు ప్రవహింపజేసి, ఆ తర్వాత బౌద్ధ మతాన్ని అవలంబించిన అశోక చక్రవర్తి లాగ ఈ అధికారుల్లో కొందరు సాహిత్య పోషణతో పాటు బౌద్ధధర్మ నిర్వాహకులు కూడ అయ్యారు. ఇక ఆ తర్వాతి తరంలో అత్యంత క్రూరులుగా, మనుషులను పట్టుకుని చంపిన కర్కోటకులుగా పేరుపొందిన పోలీసు అధికారులు ఇవాళ ప్రచురణ సంస్థల నిర్వాహకులు, సలహాదారులు, పుస్తక ఆవిష్కర్తలు, రచయితలు కూడ అయిపోతున్నారు. అధికారులు, రాజకీయనాయకులు, వ్యాపారులు ఏర్పరుస్తున్న సాహిత్యేతర అధికార పీఠాల సాహిత్య పోషణ సజావుగా సాగిపోతున్నది. కొత్త కృతిభర్తలు తయారవుతున్నారు. సాహిత్యకారులు ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా ఉండాలనే మాట వెనుకపట్టు పట్టి ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమనీ, అందువల్ల ప్రభుత్వ పక్షం ఉండడమే సాహిత్యకారుల బాధ్యత అనీ కొత్త ప్రవచనాలు వస్తున్నాయి. ప్రజాధనంతో నిర్వహించబడే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం ఉండడమంటే ప్రజాధనంలో సాహిత్యకారులకు న్యాయంగా రావలసిన వాటాను నిరాకరించడమనే వాదన వస్తున్నది. ప్రజాధనాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల ప్రచారం కోసం, భజన కోసం వాడుతున్నప్పుడు కూడ అది ప్రజా కార్యక్రమం ఎలా అవుతుందన్న ప్రశ్న రావడం లేదు. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పేర కార్పొరేట్ సంస్థల సాహిత్య కళాపోషణలు, సాహిత్య ఉత్సవాలు పెద్ద ఎత్తున ఎటువంటి ప్రశ్నలూ లేకుండా జరుగుతున్నాయి. ప్రశ్నించేవాళ్లు చాదస్తులుగా కనబడుతున్నారు. భూముల్ని గుంజుకుని ఉపాధి పోగొట్టి ప్రజలను నిర్వాసితుల్ని చేస్తున్న, విషపదార్థాలు గాలిలో, నీటిలో, నేలలో కలిపి సమాజాన్ని కలుషితం చేస్తున్న, నామమాత్రపు ప్రజా సంక్షేమ చట్టాలకు కూడ తూట్లు పొడుస్తున్న కార్పొరేట్ సంస్థలు ప్రజా సాహిత్యాన్ని ఆదరిస్తున్నట్టు నటిస్తున్నాయి.

తెలిసో తెలియకో, అమాయకత్వంతోనో తమ రచనలకు గుర్తింపు వస్తుందనో ఆశతోనో, తమ రచనలు అచ్చవుతాయనో ప్రలోభంతోనో సాహిత్యకారులు, కళాకారులు ఈ ఆకర్షణలకు లోబడుతున్నారు. అటునుంచి ఉద్దేశపూర్వకమైన బలమైన పుల్ ఫాక్టర్, ఇటునుంచి తెలిసీతెలియని కొంత పుష్ ఫాక్టర్ కలిసి సాహిత్యలోకంలో మళ్లీ ఆస్థానాలవైపు చూపు పెరుగుతున్నది. ఇటీవలికాలంలో రాజకీయ, అధికార, వ్యాపార రంగాలలో వ్యక్తులతో సాహిత్యకారులకు గతంలోకన్న ఎక్కువ పరిచయాలు పెరగడం వల్ల, మొత్తంగానే సమాజంలో 1960ల్లో, 70ల్లో కంటె మధ్యతరగతి మొహమాటాలు పెరగడం వల్ల కూడ ఈ కొత్త ఆస్థానాలు బలపడుతున్నాయి.

ఆస్థానంలో ఉండి కూడ ‘రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు’, ‘రాజశబ్దంబు ఛీ జన్మాంతరమందునొల్లను’ అన్న ధూర్జటి, ‘హాలికుడైననేమి నిజదార సుతోదర పోషణార్థమై’ అని సంతృప్తి చెంది ‘నినునాకటికైగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ’ అనీ, రాజులను “ఇమ్మనుజేశ్వరాధములు” అనీ అన్న పోతన, ‘కులము గలవాడు గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగువాడు పసిడి గలుగువాని బానిసకొడుకులు’ అన్న వేమన వంటి ఉజ్వల సంప్రదాయం ఏమైపోతున్నది? దిగంబరకవుల ధర్మాగ్రహ వారసత్వం ఏమైపోతున్నది? విప్లవ సాహిత్యోద్యమ ధిక్కారం ఏమైపోతున్నది? అస్తిత్వ ఉద్యమాల ప్రతిఘటనా స్వరాలు ఏమైపోతున్నాయి? “…కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?” అని కొడవటిగంటి కుటుంబరావు గారు 1970లో వేసిన ప్రశ్న వినిపించడం ఆగిపోయిందా?

 

  • -ఎన్ వేణుగోపాల్
  • venu

ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!

గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన పాచి అన్నానికి మళ్లీ ఒకసారి మసాలా దట్టించి తిరగమోత పెట్టి వడ్డించజూస్తుంటే ఎలా ఉంటుంది? ఇంతకన్న అర్థరహితమైన, ప్రమాదకరమైన, హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని రాజకీయ సామాజిక నిర్వాహకులు నిస్సిగ్గుగా సాగిస్తుంటే సమాజమంతా మౌనంగా నిర్లిప్తంగా చూస్తున్నది. కాలం మారుతున్నదా లేదా, మనం మారుతున్నామా లేదా అని సందేహం కలుగుతున్నది. సంఘపరివార్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఘర్ వాపసీ కార్యక్రమం చూసి, దాని పట్ల సమాజం స్పందించవలసినంతగా స్పందించకపోవడం చూసి నిస్సహాయ ఆగ్రహం నన్ను రెండు మూడు నెలలుగా కలవరపెడుతున్నది.

ఘర్ వాపసీ గురించి వినగానే నాకు ‘ప్రజలమనిషి’లో వట్టికోట ఆళ్వారుస్వామి మతాంతరీకరణ గురించి సృష్టించిన అద్భుతమైన సన్నివేశాలు గుర్తొచ్చాయి. ‘దేశభక్తి’ తొలిపాఠంలో ‘నిన్న వచ్చారింగిలీషులు/ మొన్న వచ్చిరి ముసలమనులటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి వేరులు పెట్టకోయ్’ అని రాసిన, ఆ తర్వాత ‘పెద్ద మసీదు’ కథ రాసిన గురజాడ అప్పారావు గుర్తొచ్చారు. ‘మనకా మతాభిమానం’ అంటూ ‘హిందూ’ మతస్థులమనుకునేవాళ్ల కుహనా ఆభిజాత్యాన్ని తుత్తునియలు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గుర్తుకు వచ్చారు. గత శతాబ్ది తొలి పాదంలో, మధ్య భాగంలో కనబడిన ఆ స్పందన, చైతన్యం, ప్రశ్నించే స్ఫూర్తి ఇప్పుడు కరవైపోతున్నదా అని తీవ్ర విచారం కలిగింది. మతోన్మాదుల ఘర్ వాపసీ ప్రేలాపనలకు గతానికీ వర్తమానానికీ ఎడతెగకుండా జరుగుతున్న సంభాషణ నుంచి ఎన్ని జవాబులు చెప్పవచ్చు గదా అనిపించింది.

ఘర్ వాపసీ నినాదం నిజానికి మతవిద్వేషానికి ముసుగు. ‘ఇంటికి తిరిగిరండి’ అని పిలుస్తున్నవారు చూపుతున్నది ఇల్లూ కాదు, తిరిగివస్తే ఏ ఇంట్లో ఉంచుతారో, అసలు ప్రాణాలతో ఉంచుతారో లేదో తెలియదు. ఇంతకూ అది పిలుపు కూడ కాదు. అది ఒక బెదిరింపు. నేరారోపణ. వేధింపు. భీతావహ వాతావరణం సృష్టించడానికి హంతకశక్తులను ప్రేరేపించే ఉచ్ఛాటన. అది సరిగ్గా అడాల్ఫ్ హిట్లర్ ఇతర మతస్తుల పట్ల, ముఖ్యంగా యూదుల పట్ల ప్రదర్శించిన వ్యతిరేకత లాంటిది. కాకపోతే ఈసారి అది తోసేసే, చిత్రహింసలు పెట్టే. చంపేసే రూపాన్ని కాసేపటికోసం దాచుకుని పిలిచే ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. ‘ఈ పిలుపుకు రాకపోయావో, చూసుకో ఏం చేస్తానో’ అనే బెదిరింపు అది. పిడికెడు మందిని ఆకర్షించగలిగినా లేకపోయినా, కోట్లాది మందిని బెదురుకు, అభద్రతకు గురిచేసి, తమ నేల మీద తాము బెరుకుబెరుకుగా జీవించేలా చేసే యుద్ధారావం అది. అనేక సంస్కృతుల, భాషల, మతాల, కులాల బహుళత్వపు భారతీయతను ఏకత్వంలోకి, అది కూడ సంఘపరివార్ నిర్వచించే బ్రాహ్మణీయ సంకుచిత హిందుత్వలోకి కుదించదలచిన మతరాజకీయాల ఎత్తుగడ అది. ఘర్ వాపసీ అనే మాటకు ఇంటికి తిరిగిరావడం అనే తటస్థమైన అర్థమే కనబడుతుంది. అది ఆత్మీయ పునరాగమనం లాగే, పునర్మిలనం లాగే అనిపిస్తుంది. కాని అసలు లక్ష్యం ఇతర మతాల పట్ల ద్వేషం. ఇతర మతస్తుల పట్ల ద్వేషం. మతాల మధ్య, మనుషుల మధ్య భేదాన్ని, అసహనాన్ని, అనుమానాన్ని, విద్వేషాన్ని, రక్తపిపాసను, హంతక దాడులను ప్రోత్సహించి, మతం పెట్టుబడిపై రాజకీయ లాభాలను సంపాదించదలచిన క్షుద్రక్రీడ అది.

‘భారతదేశంలో ఉండాలంటే హిందువులు కావలసిందే’ అనే సంఘ పరివార్ శక్తుల బెదిరింపులకు కొనసాగింపే ఘర్ వాపసీ. ప్రస్తుతం ఇతర మతాలను అవలంబిస్తున్న భారతీయుల పూర్వీకులందరూ హిందువులేననీ, వారు పాలకుల బలప్రయోగం వల్లనో, మతబోధకుల ప్రలోభాల వల్లనో మతాంతరీకరణ చెందారనీ, అందువల్ల ప్రస్తుత హైందవేతరులందరూ తిరిగి ఇంటికి రావాలనీ ఒక అచారిత్రక కుతర్కాన్ని సంఘపరివార్ శక్తులు తయారు చేశాయి. ఈ తర్కానికి పరాకాష్టగా ఒక కేంద్ర మంత్రి ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను రామ్ జాదే (రాముడి సంతానం) అవుతారా, హరామ్ జాదే (అక్రమ సంతానం) అవుతారా తేల్చుకొమ్మని సవాల్ విసిరింది. ముస్లిం యువకులు హిందూ యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని, హిందూ మతస్తుల సంఖ్య తగ్గించడానికీ, ముస్లింల సంఖ్య పెంచడానికీ కుట్ర పన్నుతున్నారనీ, ఈ లవ్ జిహాద్ ను అడ్డుకోవాలనీ సంఘ పరివార్ పిలుపునిస్తోంది. దీనికి ప్రతిగా ‘బహు లావో – బేటీ బచావో’ అని నినాదం ఇస్తోంది.

rss-muslims-conversions-pti

ఈ ప్రమాదకర మత రాజకీయాల నేపథ్యంలోనే ఘర్ వాపసీ నినాద స్థాయి నుంచి ఆచరణ స్థాయికి మారింది. సంఘపరివార్ లో బలప్రయోగశక్తిగా పేరుపొందిన బజరంగ్ దళ్ తో పాటు, కొత్తగా ఇందుకోసమే పుట్టిన ధర్మ్ జాగరణ్ సమితి ఆగ్రాలో దాదాపు 350 మంది వీథి బాలలను, ఫుట్ పాత్ నివాసులను, అనాథలను పోగుచేసి, వారిని “శుద్ధి” చేసి, హిందూ మతంలోకి తిరిగి చేర్చుకున్నాయి. ఈ ఘర్ వాపసీలను విస్తృతంగా సాగించి 2021 కల్లా క్రైస్తవులు, ముస్లింలు లేని, హిందువులు మాత్రమే ఉండే భారతదేశాన్ని తయారుచేస్తామని ధర్మ్ జాగరణ్ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ అన్నాడు. ఇటువంటి ప్రకటనలనే దేశవ్యాప్తంగా సంఘ పరివార్ నాయకులు పునరుక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు, బెదిరింపులు మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని ఎందరో హెచ్చరించిన తర్వాత స్వయంగా ప్రభుత్వాధినేతలు కాస్త స్వరం తగ్గించి, మార్చి ఈ పామును ఇప్పటికి బుట్టలో పెట్టారు గాని, మళ్లీ ఎప్పుడు ఆ బుట్ట మూత తీసి ప్రజలను పాముకాటుకు ఎరచేస్తారో తెలియదు.

ఈ ప్రకటనలకు, వ్యాఖ్యలకు, బెదిరింపులకు ఉపయోగిస్తున్న తర్కం అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మతస్వేచ్ఛ మీద, ఆదేశిక సూత్రాలలో ప్రకటించుకున్న శాస్త్రీయ దృక్పథ ప్రాధాన్యత మీద దాడి ఇది. ఈ తర్కం అచారిత్రకమైనదీ, అసంబద్ధమైనదీ, అర్థరహితమైనదీ కూడ. ఎందుకంటే, హిందూ మతం అనే మతం ఒకటి ఉందా అనే ప్రశ్నను అలా ఉంచినప్పటికీ, హిందూ మతానికి ప్రాతిపదిక వర్ణాశ్రమ ధర్మం. కుల అంతరాలు. మరి ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా, వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు. పూర్వీకుల కులంలోకే వెళతారని కొందరు, కోరుకున్న కులంలోకి వెళ్లవచ్చునని కొందరు అంటున్నారు. పూర్వీకుల కులంలోకే వెళ్లవలసి ఉంటే ఘర్ వాపసీ కి అర్థం లేదు. కోరుకున్న కులంలోకి వెళ్లే అవకాశం ఉంటే హిందూ మతమే మిగలదు. అసలు ‘హిందూ మతం’ అనేదేదైనా ఉంటే, ఒకప్పుడు మతాంతరీకరణకు గురయ్యారనుకునేవాళ్లందరూ ఎప్పుడైనా ఆ మతం పరిధిలోనే ఉన్నారా, ఆ మతం వారిని తనలోపలికి తీసుకుందా అనేవి అనుమానాస్పదమైన, ఆధారాలు లేని అంశాలని చరిత్ర చెపుతున్నది.

అలాగే గతంలో పాలకులు బలప్రయోగంతో, మతబోధకులు ప్రలోభాలతో మతాంతరీకరణ జరిపారనే వాదన కూడ పూర్తి సత్యం కాదు. సాధారణంగా హిందుత్వవాదులు బలప్రయోగం అన్నప్పుడు ముస్లిం పాలకుల కాలాన్ని, ప్రలోభాలు అన్నప్పుడు క్రైస్తవ మతబోధకుల కాలాన్ని సూచిస్తారు. కాని నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు. అసలు మతాంతరీకరణకు ఇలా ఆకర్షించడమే (పుల్ ఫాక్టర్) ఏకైక కారణం అనడం సరికాదు. భారత సమాజంలో మతాంతరీకరణకు అనేక సంక్లిష్ట కారణాలు ఉండే అవకాశం ఉంది. కాని ప్రధాన కారణం మాత్రం హిందూ వర్ణాశ్రమధర్మ, కుల అసమానతల సమాజం బైటికి తోయడం, వికర్షించడం (పుష్ ఫాక్టర్) కావచ్చు. ఈ సమాజంలో వివక్షకు, అసమానతకు, పీడనకు, అంటరానితనానికి గురైన వర్గాలలో అత్యధికులు అవకాశం వచ్చినప్పుడు మరొక మతం వైపు చూశారు. అందులోనూ అసమానత సహజమైనదని, భగవంతుడే సృష్టించాడని “హిందూ” మతం అంతరాలకు దైవిక సమర్థన ఇస్తుండగా, ఆ అంతరాల పీడనకు గురవుతున్నవారిని చేరవచ్చిన మతాలు కనీసం సైద్ధాంతికంగానైనా ప్రేమను, కరుణను, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాయి.

సరే, ఈ చర్చంతా ఎలా ఉన్నా ఇంత ప్రధానమైన అంశం మీద బుద్ధిజీవులు స్పందించవలసి ఉంది. కాని తెలుగు బుద్ధిజీవులలో అతి తక్కువ మంది మాత్రమే ఘర్ వాపసీ గురించి ఆలోచించడం, స్పందించడం, మరింత తక్కువ మంది ఆ స్పందనను రచనల్లో చూపడం చూస్తే విచారం కలుగుతున్నది. కనీసం వంద సంవత్సరాల కింద గురజాడ అప్పారావు, డెబ్బై సంవత్సరాల కింద శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అరవై సంవత్సరాల కింద వట్టికోట ఆళ్వారుస్వామి ఈ విషయంలో చూపినంత స్పందననైనా మనం ఇవాళ చూపలేకపోవడం ఎందుకో ఆలోచించాలనిపిస్తున్నది.

ఈ దేశం మాదే అని ప్రకటించే అధికారం “హిందువుల”మని చెప్పుకునేవారికి లేదని గురజాడ, శ్రీపాద ఇద్దరూ చాల స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిష్ వారు నిన్న వచ్చారని, ముస్లిములు మొన్న వచ్చారని అనుకుంటే అటు మొన్న నువ్వు వచ్చావని మరచిపోయి, విభేదాలు పెట్టగూడదని గురజాడ ప్రబోధించారు. ఆ మాటలో కూడ ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తే, బ్రిటిష్ వారిని భాషతోనూ, ముస్లింలను మతంతోనూ గుర్తించడం వంటి బ్రిటిష్ చరిత్రకారులు మనకు అంటించిన లోపం ఉన్నప్పటికీ, ఈ మతవైవిధ్యం విభేదాలకు, విద్వేషాలకు కారణం కాగూడదని సూచించడం ఇవాళ్టికీ అవసరమైన ప్రజాస్వామిక అవగాహన.

అలాగే ‘పెద్దమసీదు’ కథలో “కాకుళేశ్వరుడి గుడి పగలగొట్టి మ్లేచ్ఛుడు మసీదు కట్టాడు” అని ఒక పాత్రతో అనిపిస్తూనే “దేవుడెందుకూరకున్నాడు స్వామీ” అని ప్రశ్నవేయించి, “ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా…” అని వ్యంగ్యంగా మనిషి చేసిన దేవుడి నిస్సహాయతను చూపించారు. అట్లాగే ‘మీ పేరేమిటి?’ కథలో హిందూ మతంలో భాగమనుకునే శైవ వైష్ణవ శాఖల మధ్య ఘర్షణలను చిత్రించారు. ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని ఒక అమాయకమైన, కాని అవసరమైన ఆశను ప్రకటించారు.

ఆ తర్వాత రెండు మూడు దశాబ్దాలకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మత మౌఢ్యాన్ని విమర్శిస్తూ, వెటకరిస్తూ రాసిన అనేక రచనల్లో ‘మనకా మతాభిమానం’ అనే అద్భుతమైన వ్యాసం ఇక్కడ గుర్తు తెచ్చుకోదగినది.

“…మన మతం యేది?

దీనికి సమాధానం రావాలంటే, ముందు, మనం యెవరమో తేల్చుకోవాలి.

మనం అంటే హిందువులం అనుకుందామా, మన సనాతనత్వం పోతుంది.

ఏమంటే?

ఈ పేరు మనకి దరిమిలా వచ్చింది.

పైగా, యిది జాతివాచకం గాని మతవాచకం కాదు.

నిజం గుర్తిస్తే, అసలు, మనం హిందువులమే కాము.

హిందూ శబ్దం మనం సృష్టించుకున్నది కాదు.

ఆ శబ్దానికి సాఫీ అయిన అర్థమూ లేదు…”

అంటూ ప్రారంభించి పాండిత్యమూ తర్కమూ వ్యంగ్యమూ కలగలిసిన, ఆయనకు సహజమైన వాదనాశక్తితో అపురూపమైన చర్చ చేసి చివరికి,

”ఈ మతాల ఉల్బణం పాతవాటితో నిలిచిపోయినా వొక దారే; కాని, యిప్పటికీ కొత్త మతాలు పుడుతూనే వున్నాయి.

బ్రహ్మ సమాజం,

ఆర్యసమాజం,

రాధాస్వామి మతం,

హరనాథ మతం,

సాయిబాబా మతం,

దివ్యజ్ఞాన మతం,

పులిమీద పుట్ర అన్నట్టు, అన్నిటికీ పైన రాజకీయమతాలు.

ఇలాగ ఆర్యుల దగ్గరినుంచీ – అంటే, ఆర్యులలోనూ ఉత్తమోత్తములైన బ్రాహ్మల దగ్గిరనుంచీ – ఆ బ్రాహ్మలలోనూ, భిన్నమతాల – భిన్న శాఖల – భిన్ననాడుల దగ్గిరనుంచీ, వేద బాహ్యుల దాకా, వేదబాహ్యులలోనూ, అస్పృశ్యులదాకా, అస్పృశ్యులలోనూ మళ్లీ అస్పృశ్యులదాకా వున్న నానావర్ణ, నానాకుల, నానావర్గ, నానాదృక్పథాల వారూ, నానా ప్రాప్యాలవారూ హిందువులు.

ఆ హిందువులం మనం.

ఈ ‘మన’కా మతాభిమానం?

థిక్!” అని ఛీత్కరించారు.

అలా గురజాడ, శ్రీపాదలలో మతం గురించి కొంత హేతువాద దృష్టితో, కొంత ప్రజాస్వామిక దృష్టితో, కొంత పాశ్చాత్య ప్రభావపు ఉదారవాద దృష్టితో కనబడిన వైఖరిని, వట్టికోట ఆళ్వారుస్వామి తన అపారమైన ప్రజాజీవితానుభవం నుంచి, మార్క్సిస్టు అవగాహన నుంచి మరింత విస్తరించారు.

హైదరాబాదు రాజ్యంలో 1938కి ముందు పరిస్థితులు ఇతివృత్తంగా రాసిన ‘ప్రజలమనిషి’ నవల సహజంగానే మతం గురించి రాయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. నవలా కాలపు హైదరాబాద్ రాజ్యం మతరాజ్యం కాదు గాని, పాలకుల వ్యక్తిగత మతం ఇస్లాం. పాలితులలో అత్యధికులు హిందువులు అనడం కూడ నిశితంగా చూస్తే సరికాదు గాని, అటూ ఇటూ కూడ మతం పునాది మీద ప్రజాసమీకరణలు మొదలయినది ఆ కాలంలోనే. ప్రత్యక్షంగా రాజకీయ సంస్థలు ఏర్పడడానికి అవకాశం లేని స్థితిలో హిందువుల లోనూ, ముస్లింల లోనూ ఆర్యసమాజ్, హిందూ మహాసభ, ఆర్యరక్షణ సమితి, శుద్ధి ప్రచార్, హిందూ సబ్జెక్ట్స్ కమిటీ, సేవాదళ్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్-ఇ-ఇస్లాం, అంజుమన్-ఇ-ఖాక్సరన్ వంటి మతసంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. వీటిలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్ హిందువులను మతాంతరీకరించడానికి, అనల్ మాలిక్ (ముస్లిం అయిన ప్రతి ఒక్కరూ రాజే) అనే కుహనా ఆభిజాత్యం ప్రచారం చేయడానికి ప్రయత్నించగా, అలా మారిన వారిని “శుద్ధి” చేసి తిరిగి హిందువులుగా మార్చడానికి ఆర్యసమాజ్, ఆర్య రక్షణ సమితి, శుద్ధి ప్రచార్ వంటి సంస్థలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు భౌతిక ఘర్షణలుగా పరిణమించిన తర్వాత నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ లో నాలుగు హిందూ సంస్థలను, మూడు ముస్లిం సంస్థలను నిషేధించింది.

ఆ చరిత్ర వివరాలు ఇక్కడ అవసరం లేదు గాని, తబ్లీగ్ (మత పరివర్తన), శుద్ధి అనే పేర్లతో అప్పుడు సాగిన వ్యవహారమే ఇప్పుడు మతాంతరీకరణ, ఘర్ వాపసీ పేర్లతో పునరావృతమవుతున్నది. ఈ తబ్లీగ్, శుద్ధి కార్యక్రమాల మత రాజకీయాలను ఆళ్వారుస్వామి ‘ప్రజలమనిషి’ లో రెండు అధ్యాయాలలో వివరంగా చిత్రించారు.

అప్పటిదాకా దొర రామభూపాల్ రావు అనుయాయిగా ఉండిన హైదరలీ “…దిమ్మెగూడెంలో హరిజనులను మహమ్మదీయులుగా చేసే సన్నాహాలు” ప్రారంభిస్తాడు. “హైదరలీ ప్రతిరోజు చావడి ముందర కూర్చొని హరిజనులతో సానుభూతిగా మాట్లాడేవాడు. వాండ్ల కష్టాలు పోయే రోజులు వచ్చాయని, ఇన్నాళ్లకు భగవంతుడు హరిజనులకు మేలు చేయబోతున్నాడని, హరిజనుల కష్టాలకు ఆలా హజ్రత్ హృదయం నీరైపోతున్నదని హరిజనులతో అంటుండేవాడు. భూములు, చదివించిన తర్వాత ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుందని, మొత్తంపై హరిజనుల గూడెంలో సుముఖ వాతావరణం కల్పించాడు.”

ఇంతకాలమూ తమను దూరం చేసి ఉంచిన మొత్తం గ్రామంపై ఇది ఒక ప్రతీకారంగా దళితులు భావించారు. చివరికి అంజుమన్ నాయకుడు వచ్చి మతపరివర్తన జరిపే రోజున “వచ్చినప్పుడల్లా హరిజనులతో వెట్టి పనులు చేయించుకునే పోలీసు వాండ్లు ఆ రోజు చాకలి, మంగలి, కుమ్మరి వాండ్లతో చేయించుకున్నారు. హరిజనుల స్థాయి పెరిగినట్టు తోచి పోలీసువాండ్లకు ఈర్ష్య కలిగింది.” అంజుమన్ నాయకుడు తన ఉపన్యాసంలో “ఈ గ్రామంలో అందరివలె పుట్టిపెరిగినా మీరు ఊరికి దూరంగా మురికికొంపల్లో ఉంటున్నారు. మీరు పందుల్లాగ బ్రతుకుతున్నారు. వేరేవాండ్లవద్ద మీకు కుక్కలకున్న గౌరవం లేదు. మీతో పొద్దస్తమానం పని చేయించుకొని కడుపుకు నిండని కూలి, జీతాలు ఇస్తున్నారు…” అని వాస్తవ స్థితి చెపుతాడు. ప్రచారకుడు “మీరు మహమ్మదీయుల్లో కలిస్తే మీ కష్టాలు పోతాయి. మీరంతా మహమ్మదీయులతో సరిసమానముగా విద్య, ఉద్యోగాలు పొందవచ్చును. హిందువుల దేవాలయాల్లోనికి వెళ్లలేనివారు, ఊరి చేదబావులవద్దకి పోజాలనివారు స్వేచ్ఛగా మస్జిద్ లోకి వెళ్లవచ్చును. చేదబావుల్లోకి వెళ్లవచ్చును…” అంటాడు.

ఒక మతంలోని అసమానత, వివక్ష, అన్యాయం ఎట్లా మరొక మతంవైపు చూడడానికి పునాది కల్పిస్తున్నాయో వాస్తవికమైన చిత్రణ ఇది. ఆళ్వారుస్వామి అక్కడితో కూడ ఆగిపోలేదు. ఆ వికర్షణ కావలసిన ఫలితం సాధించబోదనే విమర్శ కూడ అందులోనే భాగం చేశారు. ఆ ఉపన్యాసాలు సాగుతుండగానే “యిగ హైదరలీ ఎంత జీతం యిస్తడో చూస్తం గద” అనీ, “దొర గుంజుకున్న భూములు, తీసుకున్న లంచాలు ఇప్పిస్తరా” అనీ మౌలిక సమస్యల వైపు కూడ దృష్టి మళ్లించారు.

“మహమ్మదీయులుగా మారిన హరిజనులు జీతగాండ్లుగా పనిచేయడానికి వెనుక ముందాడారు. అయితే ఏమీ పని చేయకుండా ఎన్నాళ్లు ఏ విధంగా బ్రతకడం? వెంటనే చదువులు, ఉద్యోగాలు, భూములు పొందడం సంభవమా? భూములు ఏవిధంగా లభిస్తాయి? ఎవరివల్ల, ఎవరివి, ఎప్పుడు, ఏ విధంగా భూములు హరించబడ్డాయి?…” అని మతాన్ని, మత పరివర్తనను మించిన ప్రాథమిక మానవావసరాల గురించి, రాజకీయార్థిక కారణాల గురించి మాట్లాడించారు.

ఈ మతాంతరీకరణ వెనుక రాజ్యం ఉన్నదనే అవగాహనతో కంఠీరవం దాన్ని వ్యతిరేకించినప్పుడు, “చెప్పుదెబ్బలు తింటూ, గులాములై పడివున్న మాదిగోండ్లు ఆత్మగౌరవం, సంఘమర్యాద పొంది ఉండటం ఈ బాపనోడికి సహింపరాకుండా ఉంది” అని అంజుమన్ నాయకుడితో అనిపించి, బహుశా ఆరు దశాబ్దాల తర్వాతి అస్తిత్వవాదం చేపట్టబోయే అతివాద వ్యాఖ్యలను కూడ ఆళ్వారుస్వామి ఊహించారు. “…ఇతరులు హరిజనులను అణగదొక్కుటే మీ కార్యక్రమానికి మూలకారణమైతే, ఆ హరిజనులకు మీరు ఒరగపెట్టేది కూడా ఏమీ లేదు. వాండ్లగతి ఇట్లాచేస్తే అసలే మారదు” అని కంఠీరవంతో జవాబు కూడ చెప్పించారు.

హైదరలీ గురించి “హరిజనులను మహమ్మదీయులను చేసి ఉద్ధరించ బయలుదేరిన ఈ పెద్దమనిషి అన్యాయంగా తోటి మతం వాండ్లయిన దూదేకులవారి భూమిని హిందువైన ఒక దొర ఆసరాతో హరించాడని మీరు తెలిసికోవాలె” అని న్యాయస్థానంలో కంఠీరవం చేత మళ్లీ ఒకసారి మౌలికమైన భూమి సమస్య లేవనెత్తించారు. గ్రామంలో కొమరయ్య భూమి తగాదాతో దొరకు వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణం ఈ మత పరివర్తనతో మారిపోయి, మహమ్మదీయులైన వాండ్లను శత్రువులుగా చూసే స్థితికి ఎలా దారితీసిందో చిత్రించి ఈ వ్యవహారాలు అసలు సమస్యలను ఎలా పక్కదారి పట్టిస్తాయో చెప్పారు.

తబ్లీగ్ గురించి ఎంత తీవ్రంగా రాశారో, శుద్ధి గురించి కూడ అంత తీవ్రంగానే రాశారు. మరీ ముఖ్యంగా శుద్ధి కార్యక్రమాన్ని ఊళ్లోకి దొర తెచ్చాడు గనుక దాని వెనుక ఉన్న స్వార్థప్రయోజనాలను ఎత్తి చూపారు.

శుద్ధి కార్యక్రమాన్ని విమర్శిస్తూ “తురకలైతే ఒరిగింది లేదు. హరిజనులైతే అనుభవిస్తున్నది లేదు. అన్ని ఎప్పటోల్నే ఉన్నయి” అనీ, “ప్రధానిగారు తురక, హిందువు అని అంటున్నరు. మరి ఇప్పుడు కష్టాలు చెప్పుకున్నోళ్లంతా హిందువులేనయిరి. దొర హిందువేనాయె. మానుకుంటె ఎవడన్న కొట్టొచ్చిండా” అనీ పరంధామయ్యతో అనిపించారు.

“సర్కారు మన్సులు తురకలైనా మనోడైనా చేసే గోల, ఆరాటం, తిట్లు, కొట్లు, అది కావలె, ఇది కావలె అని అల్లుండ్లోలె అన్ని సాగించుకొని పొట్టపగుల మెక్కి, మిగిలింది మూటలు కట్టుకొని పోటం లేదే” అని చాకలి సర్వయ్య, “ఆ యిందువేందో, తుర్కేందో, హైదరలీ బీట్లకు పోయినా, దొరగారి ఏనెకు పోయినా, రైతుల గెట్ల పొంటి పోయినా జీవాలను అడుగు పెట్టనియ్యరు….” అని గొల్ల వీరయ్య తమ నిత్య జీవిత అనుభవం నుంచి అసలు విషయాలు చెపుతారు.

ప్రధానంగా ఆ రెండు అధ్యాయాలు, మొత్తంగా నవల మౌలికమైన దోపిడీ, పీడనలకు మతం లేదని, అందువల్ల తబ్లీగ్, శుద్ధి అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించే అర్థరహితమైన వివాదాలని పాఠకులకు అవగాహన కలిగిస్తాయి.

ఇవాళ మళ్లీ ఒకసారి ప్రపంచీకరణ, కార్పొరేట్ దౌర్జన్యం, పెరిగిపోతున్న సామాజిక అసమానతల నేపథ్యంలో పాలకవర్గాలకు అందివస్తున్న నినాదం ఘర్ వాపసీ. హిందుత్వవాదుల గతకాలపు శుద్ధి ఇవాళ ఘర్ వాపసీ ముసుగు తగిలించుకుని బుసలు కొడుతున్న ఈ సందర్భంలో, హిందుత్వ మతోన్మాద, మతవిద్వేష రాజకీయాల గురించీ, మొత్తంగా మతవాదం గురించీ బుద్ధిజీవులు ఇంకా ఎక్కువగా మాట్లాడవలసి ఉన్నది. ఈ అనవసర వివాదాలు అసలు సమస్యల మీద ప్రజల ఆరాట పోరాటాలను పక్కదారి పట్టించడానికేనని చెప్పవలసి ఉన్నది. కనీసం గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వట్టికోట ఆళ్వారుస్వామి సాధించిన కృషిని విస్తరించి బలోపేతం చేయవలసి ఉన్నది.

గతకాలానికి చెందిన ఆ అవగాహనలో సగమో పావో అయినా ఈ అత్యాధునిక వర్తమానంలో ఉంటే ఎంత బాగుండును!

                                                                                                                                                     -ఎన్ వేణుగోపాల్

venu

మనిషే కవిత్వం – ఒక చేత కన్నీరు, మరొక చేత ఎర్రజెండా

కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో...

కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో…

హృదయానికి అత్యంత సన్నిహితమైన వాళ్ల గురించి రాయడం కష్టం. మన గురించి మనం రాసుకున్నట్టు. ఏ ఒకటి రెండు సంవత్సరాలు ఆయనను కోదండరాములన్నయ్య అని పూర్తి పేరుతో పిలిచానో గాని, ఆ తర్వాత సొంత అన్నయ్య ఉన్నప్పటికీ, అన్నయ్య అంటే ఆయనే అన్నంతగా మా ఇంట్లో మనిషి, నా హృదయంలో మనిషి, నా విశ్వాసాల మీదా విలువల మీదా ప్రభావం వేసిన మనిషి ఎన్ కె. ఆయన గురించి రాయడం, ఆయనను ఒకింత దూరంగా చూసి, పెట్టి, ఊహించి రాయడం కష్టం. కాని ముప్పై సంవత్సరాల కింద సాహిత్య సాంస్కృతిక రంగాలలో అత్యంత ప్రభావశీలంగా, సమ్మోహకంగా ఉండి, ఎందరినో ఉత్తేజపరచి, కాలక్రమంలో మరుసటి తరానికి దాదాపు తెలియకుండా పోయి, ఆయన ఎవరు అని అడిగే స్థితి వచ్చినందువల్ల ఆయన గురించి చెప్పాలి. ఆయన లేని, ఆయన పాట పాడని, ఆయన మాట్లాడని సభా సమావేశమూ లేని స్థితి నుంచి ఆయన పేరయినా విననివాళ్లు నిండుతున్న సభల రోజుల్లో ఆయన గురించి చెప్పాలి.

చాల శక్తిమంతుడైన కవి, శ్రోతల కంట తడి పెట్టించగల, ఆ కన్నీటిని నిప్పులుగా మార్చగల, నవరసాలనూ తన స్వరపేటికలోంచి పలికించడం మాత్రమే కాదు, శ్రోతల హృదయాల్లో మీటగల గాయకుడు, కార్యకర్త, స్నేహశీలి, ప్రేమాస్పదుడు, మనుషులను ప్రగాఢంగా, బహుశా ఆయన ప్రేమకు లక్ష్యమైనవాళ్లు ఇబ్బంది పడేటంతగా ప్రేమించినవాడు, కనీసం ఇరవై సంవత్సరాలు ఎందరినో ఆకర్షించిన ఉత్తేజకరమైన ప్రజాజీవితం గడిపి, అనేక వ్యక్తిగత, కౌటుంబిక, మానసిక, రాజకీయ కారణాలవల్ల మౌనంలోకి వెళ్లిపోయినవాడు, అక్కడినుంచి అనారోగ్యంలోకీ, చివరికి అకాలంగా మృత్యువులోకీ జారిపోయినవాడూ నెల్లుట్ల కోదండరామారావు (మార్చ్ 6, 1948 – డిసెంబర్ 27, 2014). ఎన్ కె గా సుప్రసిద్ధుడు.

NK Telangana song

ఆయన తండ్రి నెల్లుట్ల రామకృష్ణారావు వరంగల్ జిల్లా కూనూరులో భూస్వామ్య కుటుంబంలో పుట్టి, రామకృష్ణామాత్య పేరుతో 1940ల్లో మెత్తని కవిత్వం రాసినవాడు. తిరుపతి వెంకటకవులను ఎదిరించి కవిత్వం చెప్పినవాడు. “రొమ్ము విరిచి వచింతు విశ్వమ్మునందు ఆంధ్రభారతి మా ఇంటి ఆడపడుచు, ఎవడురా మా యమాత్యుల నీసడించి కలము నడిపెడి మొనగాడు తెలుగునేల” అని సవాలు చేసినవాడు. జాషువాను ఆహ్వానించి, స్వయంగా కాలికి గండపెండేరం తొడిగి, కుల సమాజం నుంచి ‘వెలి’కి గురయినవాడు. ఏ బలవత్తర కారణాలు తోసుకువచ్చాయో తెలియదు గాని, భార్య కేసమ్మనూ, పది పన్నెండు సంవత్సరాల పెద్ద కొడుకు జగన్మోహన రావునూ, రెండు సంవత్సరాలయినా నిండని చిన్న కొడుకు కోదండ రామారావునూ వదిలి ఎటో వెళ్లిపోయాడు. తండ్రి అట్లా ఎప్పటికీ కనిపించని శూన్యంలోకి మాయమయ్యాడనే దుఃఖం బహుశా ఎన్ కె జీవితమంతా వెంటాడింది. ఒకవేళ ఆ తండ్రి ఎక్కడన్నా ఎదురుపడినా ఎట్లా గుర్తుపడతాడు, ఊహతెలియని వయసులో తననుంచి దూరమైన కన్నతండ్రిని? అందుకే యవ్వనంలో రాసిన ఒక పద్యంలో “ఎప్పుడో నీవు అనుకోక ఎదురుపడిన నీటితెర నాకు అడ్డమ్ము నిలుచుననుచు కనుల కొలకుల కన్నీరు కదలనీను కోతపడకుండునా అంత గుండెతీపి కదలి రావయ్య రావయ్య కన్నతండ్రి” అని పద్యాలు రాసుకున్నాడు.

Amma Sparsha

అలా తండ్రి వెళిపోతే తల్లినీ అన్ననూ తననూ చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించినవారు పెద్దమేనమామ దేవులపల్లి రామానుజరావు. ఆయన తెలంగాణ సాహిత్య వైతాళికులలో ఒకరు. ఆయన మాత్రమే కాదు, ఎన్ కె మేనమామలు అయిదుగురూ సాహిత్య జీవులే. అన్న జగన్ ప్రభుత్వోద్యోగి అయి, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులలో ఒకరయి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథులలో ఒకరుగా నిలిచారు. ఆయన పదునైన కలానికి పెట్టింది పేరు. 1969 ఉద్యమ కాలంలో వరంగల్ నుంచి వెలువడిన కరపత్రాలలో అత్యధిక భాగం ఆయన రాసినవే. ఆయన ప్రభావంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రెండు వారాలు జైలు జీవితం కూడ గడిపిన ఎన్ కె ఆయన ప్రోద్బలంతోనే తెలంగాణ పతాక గీతం రాశాడు. ఎన్నో చోట్ల పాడాడు.

ఇలా తండ్రి, మేనమామలు, అన్న అందరికందరూ సామాజిక, సాహిత్య ప్రపంచంలోనే ఉన్నప్పుడు, ఒక పద్య శకలంలో తానే చెప్పుకున్నట్టు “తరతరాలుగ మా యింట నరనరాన కవిత ప్రవహించుచుండె రక్తమ్ము బోలి”.

ఈ సాధనకు, ప్రతిభకు తోడైనది 1969-70 వరంగల్ వాతావరణం. నక్సల్బరీ ప్రభావం శ్రీకాకుళ గిరిజనోద్యమం మీదుగా వరంగల్ గోదావరీతీర అరణ్యాలలోకి ప్రవేశించింది. కాకతీయ మెడికల్ కాలేజి, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజిలు విప్లవ రాజకీయాలకూ, విద్యార్థి ఉద్యమాలకూ కేంద్రాలవుతున్నాయి. కాజీపేట క్రైస్తవ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి నుంచి వరంగల్ లో హోటల్ సర్వర్ గా ఉన్న జగదీశ్ వరకు విప్లవోద్యమ నిర్మాణానికి అజ్ఞాతవాసంలోకి వెళుతున్నారు. ఆజంజాహి మిల్స్, ఆర్టీసీ, రైల్వేలలో కార్మికోద్యమ సంచలనం మొదలవుతున్నది. అప్పుడు ఏర్పడిన చందా కాంతయ్య స్మారక కళాశాలలో అధ్యాపకుడిగా వరవరరావు వరంగల్ తిరిగివచ్చారు. ఆయనతో పాటు అధునిక సాహిత్యవేదిక సృజన వరంగల్ కు వచ్చింది.

Lal Bano cover

బంధుత్వం ఉండినప్పటికీ పరిచయంలేని వరవరరావును, ‘భళ్లున తెల్లవారునింక భయము లేదు’ అనే కవిత చదివినప్పటినుంచీ ఐదారేళ్లుగా అభిమానిస్తున్న వరవరరావును కలుసుకోవడానికి ఆయన ఇంటి ముందు నెలరోజులు పడిగాపులు పడ్డానని ఎన్ కె స్వయంగా రాసుకున్నాడు. మొత్తానికి అలా వరవరరావు సాన్నిహిత్యంలోకీ, సృజన లోకీ, విప్లవ రచయితల సంఘంలోకీ ప్రవేశించి రెండు దశాబ్దాల పాటు “చినబాపు చేతి చిటికెనవేలు పట్టుకుని ఎక్కడికంటే అక్కడికి నడిచినవాడి”గా మిత్రులు హాస్యాలాడేంత అవినాభావ మైత్రి ఆ ఇద్దరి మధ్య సాగింది. ఎన్ కె నే ఒకచోట చెప్పుకున్నట్టు “నాకు మా అమ్మ జన్మనిచ్చింది. మా పెద్దమామయ్య రామానుజరావు ఉద్యోగం యిప్పించి ఉపాధి కల్పించాడు. వరవరరావు సారు నాకు జ్ఞానం యిచ్చాడు. ఆయన నా సారథి, నా సఖుడు, నా బంధువు, నా బాంధవుడు, నా గురువు. ఆయనిచ్చిన జ్ఞానమే లేకుంటే నేను ఏనాడో భ్రష్టుపట్టి పోయేవాడ్ని”.

ఎన్ కె వరవరరావును కలిసేటప్పటికే ‘తిరుగబడు’ కవితాసంకలనం ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, అప్పటికింకా పద్య రచనలో, కృష్ణశాస్త్రి, చలం వంటి ప్రభావాలలో ఉండడం వల్ల కావచ్చు, ఎన్ కె ‘తిరుగబడు’లో భాగం కాలేదు. కాని ఆ కాలం ఎంత వేగంగా చలనశీలంగా ఉండిందంటే, 1970 ఫిబ్రవరి శ్రీశ్రీ షష్టిపూర్తి నాటికి ‘తిరుగబడు’ కవుల్లో చేరని ఎన్ కె, ఆ తర్వాత మూడు నెలలకే సృజన మే 1970 ముఖపత్రం మీద అచ్చయిన ‘మేడే’ కవితతో ‘తిరుగబడు’ కవులకన్న తీవ్రతతో కవితాలోకంలోకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత జూలై 3 న ‘అభ్యుదయ సాహిత్య సదస్సును బహిష్కరించండి’ అని కరపత్రాలు పంచి, పోలీసు లాఠీ దెబ్బలు తిన్న యువకులలో ఉన్నాడు. విప్లవ రచయితల సంఘ స్థాపనలో భాగమయ్యాడు. ఆ చరిత్రాత్మక జూలై 4కు విడుదలైన ‘మార్చ్’ కవితాసంకలనంలో తన కవితలు మూడు ఉన్నాయి.

ఖమ్మంలో 1970 అక్టోబర్ లో జరిగిన విరసం మొదటి మహాసభల్లో ‘తూర్పు పవనం వీచెనోయ్’ పాడానని తానే రాసుకున్నాడు. అప్పటినుంచీ వేరు వేరు పేర్లతో శివసాగర్ రాస్తున్న పాటలన్నిటికీ ఏదో ఒక ట్యూన్ కట్టడం, పాడడం ఎన్ కె పనిగా మారిపోయింది. చెల్లీ చంద్రమ్మా, విప్పపూల చెట్ల సిగను, శత్రు చేజిక్కితినని, తోటారాముని తొడకు, మేరిమి కొండల్లో మెరిసింది మేఘమూ వంటి శివసాగర్ పాటలన్నీ లోకానికి తెలిసినది ఎన్ కె ట్యూన్లతోనే, చాలవరకు ఎన్ కె స్వరంలోనే. 1972 కు ముందు జననాట్యమండలి ఏర్పడకపోవడం, పూర్తి స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండకపోవడం, ఈ పాటలన్నీ సత్యమూర్తి రాసినవనే గౌరవం ఉండడం ఎంత కీలకమైనవో ఎన్ కె స్వరం, గాన శైలి, గానంలో నిమగ్నత అంత కీలకమైనవి. ముఖ్యంగా ఆయా పాటల ద్వారా శివసాగర్ ప్రకటించదలచిన, ప్రసారం చేయదలచిన భావోద్వేగాలను ఎన్ కె చాల శక్తిమంతంగా ప్రసారం చేసేవాడు. కరుణ, వీర రసాలు రెండూ ఎన్ కె గొంతులో అద్భుతంగా పలికేవి.

విరసం ఏర్పాటుకు ముందు నుంచే విప్లవకవిత్వం రాస్తున్న ఎన్ కె కవిత్వం ఆ తర్వాత మరింత పదునెక్కింది. మార్చ్, ఝంఝలను ప్రభుత్వం నిషేధించినప్పుడు “సత్యాన్ని చాటే పుస్తకాల్ని నిషేధించగలరు గాని సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేస్తారు” అనే నాలుగు పాదాల కవితా ఖండికతో తన కవిత్వ శక్తిని ప్రకటించుకున్నాడు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో స్వేచ్ఛ కోరుకుంటున్న బంగ్లాదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, యాహ్యాఖాన్ సైనిక దుర్మార్గాలనూ, ఇందిరాగాంధీ విస్తరణ వాదాన్నీ విమర్శిస్తూ వెలువడిన ‘బంగ్లాదేశ్’ తెలుగు కవితా సంకలనానికి సంకనకర్త ఎన్ కె నే.

lal bano engఆ రోజుల్లోనే సొంత పాటలు కూడ రాయడం ప్రారంభించాడు. ‘కలలు మోసే అయ్య కదలి రావాల’ అంటూ అక్టోబర్ 1971లో రాసిన మొదటి పాటలో “ఏయె ఏయె సెల్లె వలయేయె సెల్లె వలయేయె సెల్లె/ వలలొ సేపల మాట వదిలేయె సెల్లె వదిలేయె సెల్లె/ బతుకు సుట్టూరుత బారి సంద్రమ్ము/ సల్లనీ నీళ్లతో సాగు సంద్రమ్ము/ నీటి కడుపులోన నీలాల నిప్పు/ నిప్పుతో మన కళ్లు యిప్పుకుందాము…” అని రాశాడు. విప్లవంలో స్త్రీల పాత్ర గురించి శివసాగర్ రాసిన ‘ఆకాశంలో సగం’ సృజన జనవరి 1975 సంచికలో వస్తే, ఆ ప్రభావంతో ఎన్ కె రాసిన ‘పోదాం కలిసీ’ పాట ఫిబ్రవరి సంచికలో వచ్చింది. “కళ్లు కళ్లు కలుసుకొని / చేసే బాసలు ఏముంటయి/ మనసూ మనసూ పరచుకొని/ చెప్పే ఊసులు ఏముంటయి/ ఉంటే ప్రాణం పోతే ప్రాణం/ కమ్యూనిస్టులకు ప్రజలే ప్రాణం” అని రాశాడు. ఈలోగా, సికిందరాబాదు కుట్రకేసులో నిందితుడిగా వరవరరావు 1974 మేలో అరెస్టయినప్పటి నుంచి ఎమర్జెన్సీ మొదలై సృజన ప్రచురణ ఆగిపోయేదాకా సమష్టిగా సంపాదక బాధ్యత నిర్వహించిన సాహితీమిత్రులు లో ప్రధాన బాధ్యత ఎన్ కె దే. అలా దాదాపు ఐదు సంవత్సరాలు వరంగల్ విప్లవోద్యమంలో, విప్లవ సాహిత్యోద్యమంలో ప్రధానంగా కనబడ్డాడు గనుకనే ఎమర్జెన్సీ విధించగానే అరెస్టు చేసిన మొదటి బృందంలో ఉన్నాడు.

ఎమర్జెన్సీలో జైలులో ఉండగా రాసిన ‘కామ్రేడ్ నాగరాజుకు’ అటు ఎన్ కె, ఇటు మరెందరో ఔత్సాహిక గాయకులు వేలాది సార్లు పాడి ఉంటారు. ఎమర్జెన్సీ ఎత్తివేసి, ప్రజాస్వామ్య వెల్లువ ప్రారంభమైన 1977 ఏప్రిల్ నుంచి 1985లో ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆట, పాట, మాట బంద్ అని అప్రకటిత నిషేధం విధించేదాకా ఆ పాట ప్రతి సభలోనూ మార్మోగేది. ”ఒకచేత్తో కన్నీరు తుడుచుకొనీ/ వేరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొనీ/ అంటాము మేము నాగరాజు/ గుండెలో మండేవు రాజుకొని రోజురోజు” అనే చరణంతో ప్రారంభమయ్యే ఈ పాట, “నిప్పురవ్వె దావానలమగును/ పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టి తీరును/ విజయానికి మైలురాయి త్యాగం/ చిందిన మన నెత్తురులో చివురు తొడుగు జనరాజ్యం”, “దూరాన తెరచాప అంచు/ క్రమించి నావతీరమాక్రమించు/ ఉదయించే తొలివెలుగుల తూర్పు/ ఆర్పలేదు విప్లవాన్ని ఏ పడమటి గాడ్పు” అనే చిరస్మరణీయ చరణాలతో చివరికి “తెరచాపలు గాలిలోన ఆడుదాక/ ఆకాశం ఎర్రకాంతులీనుదాక/ ఉంటావు నువ్వు నాగరాజు/ నువు అమరుడివి అమరుడివి ఈ రోజు ఏ రోజూ” అని ముగుస్తుంది.

Lal Bano Kannada cover

‘పరిటాలా రాములూ’, ‘కంఠమ్ము ఎత్తవే’, ‘సరిదారి నీదైతే’, ఎర్రాటెన్నెల దేరో’, ‘ఎర్రజండాకె అయితివా’ వంటి పాటలు కూడ అంతగా జనాదరణ పొందినవే. వీటిలో ప్రత్యేకంగా ‘ఎర్రజెండాకె అయితివా’ గురించి చెప్పుకోవాలి. జన్ను చిన్నాలు వరంగల్ అంచులలోని పైడిపల్లి గ్రామానికి చెందిన పేద దళితుడు. కాకతీయ మెడికల్ కాలేజి లో మెస్ బాయ్ గా జీవితం ప్రారంభించి, విప్లవోద్యమ ప్రభావంలోకి వచ్చి, వరంగల్ జిల్లా విప్లవోద్యమ నాయకుడిగా ఎదిగి 1979 నవంబర్ లో గూండాల చేత హత్యకు గురయ్యాడు. చిన్నాలుకు నాగరాజు పాట, అందులో “పడగ విప్పి ఉన్నాము పగను తీర్చుకుంటాము/ నీ నెత్తుటి అప్పును ఇక మానెత్తుట చెల్లిస్తం” అనే పాదాలు చాల ఇష్టం. ఎన్ కె కలిసినప్పుడల్లా పాడమని అడుగుతుండేవాడు. కొన్ని సార్లు ఏదో ఒక కారణంతో ఎన్ కె పాడేవాడు కాదు. చిన్నాలు హత్య తర్వాత రాసిన పాటలో ఎన్ కె “కండ్లల్లొ కండ్లను పెట్టి ఓ చిన్నాలన్నా/ కడుపుతీర సల్లగ నవ్వి/ చేతిలోకి చెయ్యి తీసుక/ చేతివేళ్లు ప్రేమగ దువ్వి/ పదము నువ్వు పాడమంటెను/ ఏదో ఓ వంకను జెప్పి/ అపుడు గాదు యిపుడంటెను/ ఇపుడు గాదు అపుడంటెను/అలిగలిగి నువ్వు పోతెను/ ఆపై నువ్వె వస్తవంటిని/ అయ్యో యిపుడెక్కడుంటివి/ నాగరాజు పాట పాడుతా/ పరిటాలా పదము పాడుతా/ ఏటికి ఎదురీత పాడుతా/ విలుకాని విల్లు ఎత్తుతా/ చెంద్రక్కా కథను సెప్పుతా/ అ అంటే అడవి గీతము/ ఆ అంటే ఆయుధమంటూ/ చారుబాబు సంగతి చెబుతా/ ఎత్తలేక గొంతు చచ్చినా/ నోటిపూత నెత్తురొచ్చినా/ పేగులన్ని పొర్లుకొచ్చినా/ ఏదడిగితే అదే పాడుతా/ ఒక్కసారి వచ్చి యినుమురా/ గద్దరన్న పాట పాడనా/ సికాకులం సీమ కొండనీ/ ప్రసాదన్న పాట పాడనా/ పదం గట్టి పాడాలంటూ/ నువ్వే ఓ పదమైతివా/ నువ్వే నా పాటైతివా/ నువ్వే నా బాటైతివా/ పోరాటం దరువైతివా/ ఇంకిపోని ఎరుపైతివా/ ఎర్ర్రజెండాకె అయితివా/ ఎర్రెర్రని జెండైతివా…” అని రాశాడు.

ఆ సమయంలో సృజన సాహితీమిత్రులు వారానికి ఒకసారి రెండుసార్లు కూడ సమావేశమై రచనల మీద చర్చించేవారు. కవిత్వం విషయంలోనూ, ఇతర రచనల విషయంలోనూ ప్రమాణాల మెరుగుదలకు ఎన్ కె చేసే దోహదం చాల ఉండేది.

వచనకవిత, పాట, వ్యాసం వంటి ప్రక్రియలన్నిటిలోనూ ప్రవేశించినా ఎన్ కె రచనలన్నిటిలోకీ శిఖరాయమానమైనది ‘లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం’. ఆ దీర్ఘ కవిత గురించి ఇప్పటికే చాల చర్చ జరిగింది గనుక మళ్లీ ఇక్కడ అవసరం లేదు గాని, తెలుగులో అంత లోతైన, అంత విశాలమైన చారిత్రక, సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని అంత గొప్పగా కవితాత్మకంగా ఆవిష్కరించిన కవితలు అతి తక్కువ అని మాత్రం చెప్పాలి. అది సుదీర్ఘమైనదైనా, వచన కవిత అయినా, ఇద్దరు ముగ్గురు కూచుని చదువుకున్నప్పుడైనా, పది, ఇరవై వేల మంది ఉన్న సభలోనైనా ఎక్కడ చదివినా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నది. సంఘపరివార వాదనలకు తిరుగులేని జవాబులు చెప్పింది. ఒకసారి సృజనలో అచ్చు కావడం, రెండు సార్లు పుస్తకంగా పునర్ముద్రణ పొందడంతో పాటు, కవితా ఓ కవితా సంకలనంలో కూడ చేరింది. ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషానువాదాలు పుస్తకాలుగా వచ్చాయి. మోడీ పాలనలో పెరిగిపోతున్న సంఘపరివార్ దుర్మార్గాల నేపథ్యంలో ఇవాళ చదువుకుంటే తాజాగా, వర్తమానానికి అన్వయించేలా, అత్యవసరమైనదిగా ఉంటుంది.

Rehearsal coverరిహార్సల్, లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం తర్వాత సృజనలోనూ, అరుణతారలోనూ మరిన్ని కవితలు రాశాడు గాని అవి ఇంకా పుస్తక రూపం ధరించకముందే, ముందు చెప్పినట్టుగా వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఎన్ కె ను ఈ ప్రవాహం నుంచి తప్పించాయి. ఒడ్డు పట్టించాయి. అయినా ఆ మనిషిలో తడి ఆరలేదు. దేవులపల్లి అమర్, అజయ్ లు ప్రజాతంత్ర వారపత్రిక ప్రారంభించినప్పుడు కొన్నాళ్లు కవితావ్యాఖ్యలు రాశాడు. తన జీవిత కథను కొంత విమర్శనాత్మకంగా, కొంత స్వీయ సానుభూతితో చూసుకుంటూ, అప్పటికీ తనకు వచన రచన రాదని చెప్పుకుంటూనే ‘అమ్మస్పర్శ’ అనే ఆత్మకథాత్మకమైన అనుభవాల గుచ్ఛం 2009లో ప్రచురించాడు.

దాదాపు మూడు సంవత్సరాలుగా పార్కిన్సన్ వంటి భౌతిక అనారోగ్యంతోనూ, సంచలనశీల క్రియాత్మక ప్రజా జీవితాన్ని గడిపి ఒంటరి అయిపోయిన మానసిక వేదనతోనూ తనలో తనే కుంగిపోయాడు. అది గుండెజబ్బుకు కూడ దారితీసింది. అయినా తేరుకుంటున్నాడు, మళ్లీ మనుషుల్లో పడతాడు అనుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరి డిసెంబర్ 27 రాత్రి ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచాడు.

డిసెంబర్ 29 మధ్యాహ్నం మా అందరికీ ప్రాణసమానమైన ఆ కుమార్ పల్లి వీథిలో నేలమీద ఏడుకట్ల సవారీ మీద చివరినిద్రకు పడుకున్న అన్నయ్య శీతలదేహం తలమీద చివరిసారి నిమురుతున్నప్పుడు నాలుగు దశాబ్దాల అనుబంధం లోని వేలాది దృశ్యాలతో పాటు, ఆయన తండ్రి రామకృష్ణామాత్య రాసిన పద్యం గుర్తుకొచ్చింది.

“ఏ పొలాల్ వరి పోచలీనుచునున్నవో/పుడమియందలి నాదు పడక గాగ/ ఎవ్వారి బాహువుల్ ఎగయుచు నున్నవో/ నా యొడల్ కాటికి మోయు కొరకు/ ఏ వృక్షమున శాఖ లెదుగుచు నున్నవో/ క్షణమున నన్ను భస్మమ్ము జేయ/ ఏ స్థలం బీ భూమి యీక్షించుచున్నదో/ తనలోన నా బూది దాచుకొనగ/ ఎందరెందరు నా ముందు ఏగినారొ/ ఇంక ఎందరు నా వెన్క ఏగుదెంత్రొ/ ఎందుకో యింతకీ సృష్టి ఎంతవరకొ/ ఎరుక తెలియగా సాధ్యమె యేరికేని?”

 -ఎన్ వేణుగోపాల్   

కొమురం భీం – గతమూ వర్తమానమూ

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

 

ఆదివాసుల వర్తమానంలో “నాగరికుల” గతం అక్షరాలా కళ్లకు కడుతుందని సామాజికశాస్త్రాల పరిశోధకులు, ముఖ్యంగా చరిత్రకారులు, మానుష శాస్త్రవేత్తలు ఎందరో అన్నారు. క్షేత్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆదివాసేతర సమూహాలను “నాగరికులు” అనడం సరైనదా కాదా అనే చర్చలోకి ఇక్కడ పోవడంలేదు గాని అసలు ఆదివాసులకు ఒక వర్తమానం ఉందా, వారింకా ఎడతెగని గతంలోనే ఉన్నారా అని చర్చించవలసి ఉంది. కొమురం భీం చరిత్ర ద్వారా ఆదివాసుల వర్తమానాన్నీ, గతాన్నీ చూస్తే వాటి మధ్య అభేదం కనిపిస్తున్నది.

ఆదివాసుల వర్తమానమూ గతమూ ఒక్కటిలాగే ఉండడం, దశాబ్దాలూ శతాబ్దాలూ గడిచినా ఆదివాసి జీవితాలలో, సమస్యలలో, వ్యక్తీకరణలలో, పోరాటాలలో, ఆదివాసులపట్ల మైదానవాసుల, రాజ్యాంగయంత్రాల వైఖరిలో ఏకసూత్రత ఉండడం ఆశ్చర్యాన్నీ విచారాన్నీ కలిగిస్తున్నది. ఆదివాసుల పట్ల మన వైఖరిలో ఒక అంశం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్లనే ఆదివాసుల చరిత్ర చాలవరకు విస్మరణకూ, నమోదైన చోట్ల కూడ అస్పష్టతలకూ పొరపాట్లకూ గురయింది. మామూలుగానే మనకు చరిత్ర స్పృహ, చరిత్రను నమోదు చేయాలనే ఆలోచన చాల తక్కువ. అది అసలు మనకు చరిత్రే లేదని వలసవాదులు అనేందుకు, ఇతరులు నమ్మేందుకు దారితీసిందని మనకు తెలుసు. మన ఆలోచనాపరిధిలోనే లేని ఆదివాసుల చరిత్ర గురించి పట్టించుకోవడానికి మనకు తీరిక, ఓపిక ఉంటాయా?

చరిత్ర అధ్యాపకులు వకుళాభరణం రామకృష్ణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర అని బహు సంపుటాల బృహత్తర గ్రంథం ఒకటి కొన్ని సంవత్సరాలుగా తయారవుతున్నది. ఆ గ్రంథం కోసం ఇరవయో శతాబ్ది చరిత్ర మీద గతంలో కొన్ని అధ్యాయాలు రాసి ఉన్నాను. ఆ నమ్మకంతోనే ఆయన ఇప్పుడు తయారీలో ఉన్న సంపుటానికి ‘హైదరాబాద్ సంస్థానంలో ఆదివాసి తిరుగుబాట్లు’ అనే అంశం మీద ఒక అధ్యాయం రాసి ఇమ్మని అడిగారు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మల నుంచి రాంజీ గోండు మీదుగా కొమురం భీం దాకా తెలంగాణలో ఆదివాసుల తిరుగుబాట్ల గురించి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాను గనుక ఇదెంత పని అనుకుని ఒప్పుకున్నాను. కాని దిగినాక గాని తెలుసుకోవలసినది చాల ఉందని తెలియలేదు. ‘జ్ఞానం అంటే మన అజ్ఞానం గురించి మనకు క్రమానుగతంగా తెలిసిరావడమే’ అని విల్ డ్యురాంట్ అన్నమాట ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద చదువుకుని ఎన్నోసార్లు వాడాను గాని తెలుగు సమాజంలోని ఆదివాసుల చరిత్ర గురించి తెలుగు సమాజ జ్ఞానం ఇంత అజ్ఞానంతో నిండి ఉన్నదని ఈ వ్యాసం రాసే క్రమంలోనే అర్థమయింది. పగిడిద్దరాజు తిరుగుబాటు నుంచి కొమురం భీం తిరుగుబాటు దాకా (అంతకు ముందూ ఆ తర్వాతా జరిగిన తిరుగుబాట్లను పక్కన పెట్టినప్పటికీ) ఏడు శతాబ్దాలలో తప్పకుండా ఎన్నెన్నో తిరుగుబాట్లు జరిగి ఉంటాయి. కాని పద్దెనిమిదో శతాబ్దం దాకా నమోదైనవే లేవు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ లోని ఏజెన్సీ ప్రాంతాలలో రంప తిరుగుబాట్లు, ద్వారబంధాల చంద్రయ్య, అల్లూరి సీతారామరాజు, వీర గున్నమ్మ వంటి నాలుగైదు, హైదరాబాద్ రాజ్యంలో రాంజీ గోండు, కొమురం భీం మినహా చరిత్రకెక్కినవి లేవు. వాటిలోనూ కొన్ని పరిణామాల గురించీ, ఘటనల గురించీ నాలుగైదు వాక్యాలలో తేల్చివేయడమో, పాదసూచికలో చెప్పడమో జరిగింది గాని సవివరమైన నివేదికలు లేవు. కాస్త వివరమైన నివేదికలు ఉండి, విస్తృతమైన ప్రచారం జరిగిన సందర్భాలలో కూడ అస్పష్టతలు, అన్వయం కుదరని సంగతులు, పొరపాట్లు ఎన్నో ఉన్నాయి. కొమురం భీం ఉదంతమే పెద్ద ఉదాహరణ.

**

కొమురం భీం నాయకత్వం వహించిన, వేలాది మంది గోండులూ, కోలాములూ, ఇతర తెగలూ పాల్గొన్న, కనీసం మూడు సంవత్సరాలు నడిచిన పోరాటం 1940లో అణచివేతకు గురైంది. అది అంత ప్రభావశీలమైన తిరుగుబాటు అయినప్పటికీ ఆదివాసుల సామూహిక జ్ఞాపకంలో తప్ప భీం మరెక్కడా లేకుండాపోయాడు. ఈ ప్రాంత సామాజిక చరిత్రలో భాగం కాకుండా పోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భీం విస్మృత గతంగా మారిపోయాడు. ఆ గతాన్ని తవ్వితీసినదీ, వర్తమానంతో సంభాషింప జేసినదీ, భీంను పునరుజ్జీవింపజేసినదీ విప్లవోద్యమం.

జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాలు కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలుగా విస్తరించిన కాలంలో, 1978-79ల్లో విప్లవోద్యమం ఆదిలాబాద్ జిల్లా అడవులలోకి ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం నిర్మాణమై అది 1981 ఏప్రిల్ 20న ఉట్నూరు సమీపంలోని ఇంద్రవెల్లి గ్రామంలో మహాసభ జరపాలని తలపెట్టింది. ఆ సభకోసం చుట్టూ 60 గ్రామాల నుంచి వస్తున్న ఆదివాసులను అడ్డగించి, లాఠీచార్జిలు, అరెస్టులు చేసి, చివరికి తుపాకి కాల్పులు జరిపి ఆదివాసుల చైతన్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇంద్రవెల్లి కాల్పుల్లో కనీసం 60 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షుల, సమకాలిక ఆధారాలు చెపుతుండగా, 13 మంది మాత్రమే చనిపోయారనే అధికారిక “చరిత్ర” ఇప్పటికీ రాజ్యం చేస్తున్నది. ఆ సందర్భంలో అప్పటికే గిరిజన రైతుకూలీ సంఘంలో సమీకృతమవుతున్న ఆదివాసులు కొమురం భీంను తలచుకున్నారు. ఆ తలపోత కాల్పుల తర్వాత మరింత పెరిగింది. ఆదివాసులు వర్తమాన పోరాటాన్ని గత పోరాటంతో కలిపి చూసుకున్నారు. వర్తమాన దమనకాండను గత దమనకాండతో సమానమైనదిగా పోల్చి చూసుకున్నారు. ఈ వర్తమానం వల్ల గతం మళ్లీ ఒకసారి నవనవోన్మేష జ్ఞాపకమయింది.

ఆ సమయానికి ఆ ప్రాంతంలో విప్లవోద్యమ కార్యకర్తగా పనిచేస్తుండిన సాహు, అప్పటి విప్లవోద్యమ నాయకత్వం ఆ మౌఖిక చరిత్ర శకలాలను జాగ్రత్తగా సేకరించి, అల్లం రాజయ్యతో పంచుకున్నారు. ఇద్దరు రచయితలూ ఆ విషయం మీద అభినివేశం ఉన్న అనేకమంది మిత్రులతో కలిసి లోతైన పరిశోధన సాగించారు. కొమురం భీంను చంపి, ఆ పోరాటాన్ని అణచివేసిన తర్వాత నిజాం ప్రభుత్వం ప్రఖ్యాత మానుషశాస్త్రవేత్త క్రిస్టొఫ్ వాన్ ఫ్యూరర్ హేమెండార్ఫ్ తో చేయించిన పరిశోధనా నివేదికతో సహా లభ్యమవుతున్న లిఖిత ఆధారాలను సేకరించుకున్నారు. అలా ఎంతో కాలం శ్రమించి 1983లో కొమురం భీం అనే అద్భుతమైన చారిత్రక నవల రాశారు. ఆ నవలే కొమురం భీంను తెలుగు సమాజంలోకి మళ్లీ సజీవంగా తీసుకొచ్చింది.

ఇవాళ్టికీ అరకొర వనరులే దొరుకుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే, ముప్పై మూడు సంవత్సరాల కింద దొరికిన వనరుల మీద ఆధారపడి, కొంత విశ్వసనీయ కాల్పనికతకు కూడ అవకాశం ఇచ్చి సాహు, అల్లం రాజయ్య చేసిన ఆ కృషి మహాద్భుత ప్రయత్నమనే చెప్పాలి. వారు అప్పటికి సంప్రదించిన పదకొండు అధికారిక పత్రాల జాబితా కూడ ముందుమాటలో ఇచ్చారు. అప్పటికి ఇంకా భీంతో పాటు కలిసి పనిచేసినవారు, పోరాటంలో పాల్గొన్నవారు, భీంను చూసినవారు, భీం కుటుంబసభ్యులు కొందరైనా సజీవంగా ఉన్నారు గనుక రచయితలు వారందరినీ కలిసి మౌఖిక చరిత్ర వివరాలు సేకరించారు. అందువల్ల భీం రూపం గురించి, భావోద్వేగాల గురించి, పరిశీలనా శక్తి గురించి, నాయకత్వ లక్షణాల గురించి, వేలాది గోండులను ఆకర్షించిన సమ్మోహక శక్తి గురించి నవలలో చిత్రించిన విషయాలు చాలవరకు నిజమే అయి ఉండాలి.

అయితే భీం చివరి పోరాటం ఎప్పుడు జరిగిందనే దాని మీద, భీంను నిజాం పోలీసులు కాల్చి చంపిన తేదీ మీద వాళ్లు కొంత పొరపాటు పడ్డట్టున్నారు. “డర్ నా మత్ సత్తార్ సాబ్…. తారీఖ్ భూల్ గయా! ఆజ్ పెహలీ హై… సెప్టెంబర్…. బుధవారం … సంవత్సరం కూడా చెప్పనా 1940” అన్నాడు కెప్టెన్ – అనే సంభాషణ ద్వారా భీంను కాల్చి చంపిన తేదీ 1940 సెప్టెంబర్ 1 అని వాళ్లు రాశారు. భీం ఒరిగిపోయిన చోట స్మారకచిహ్నంగా అప్పుడే గోండులు పాతుకున్న ఒక రాయి మీద 1.9.1940 అని చెక్కి ఉండడం దీనికి కారణం కావచ్చు. అయితే కొమురం భీం నవల మీద సృజనలో వివరమైన సమీక్షా వ్యాసం రాసిన సి వి సుబ్బారావు, 1940 సెప్టెంబర్ 1 నవలలో రాసినట్టుగా బుధవారం కాదనీ, ఆదివారం అనీ సవరించారు. (1983లో వచ్చిన పిబిసి ప్రచురణ, ఆ తర్వాత వచ్చిన విరసం ప్రచురణ – 1993, ఆదివాసి ప్రచురణలు – 2004, 2010 కూడ ఈ బుధవారం అనే మాటను అలాగే కొనసాగించాయి. పర్ స్పెక్టివ్స్ ప్రచురణ 2013లో సంభాషణలోనే బుధవారం బదులు ఆదివారం అని మార్చారు).

సాహు, అల్లం రాజయ్యల నవల తర్వాత కొమురం భీం మీద, గోడుల జీవన పోరాటాల మీద రెండు మూడు నవలలు, కొన్ని కథలు, ఒక సినిమా, అసంఖ్యాక వ్యాసాలు వెలువడి కొమురం భీం గురించి, ఆయన నడిపిన పోరాటం గురించి ఎన్నో వివరాలను ప్రజల దృష్టికి తెచ్చాయి. కొమురం భీం మరణానంతరం నాలుగు దశాబ్దాల తర్వాత ఉజ్వల స్మృతిగా జీవించడం ప్రారంభించాడు.

**

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమక్రమంలోనూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతా కొమురం భీం ఒక విగ్రహంగా, ప్రతీకగా కూడ మారిపోయాడు. ఆయన పేరు తలవని వాళ్లు దాదాపు లేరు. ఆయన భావాలతో, ఆయన పోరాటంతో ఎంతమాత్రమూ సంబంధం లేనివారి నుంచి, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్ల దాకా అందరూ ఆయనను ఏదో ఒక సందర్భంలో తలచుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ వీర యోధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందనే వాదనకు చిహ్నంగా కొమురం భీం ముందుకొచ్చాడు. పాఠ్యపుస్తకాలలో, హుసేన్ సాగర్ టాంక్ బండ్ మీద విగ్రహాలలో కొమురం భీం ఎందుకు లేడనే ప్రశ్న వచ్చింది. పాఠ్యపుస్తకాలలో ఏదో ఒకస్థాయిలో భీం పాఠంగా కూడ మారాడు. విశాలమైన ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలనే ఆకాంక్షకు, తూర్పు జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలనే కోరిక తోడయింది. చివరికి అక్టోబర్ 8న కొమురం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరిపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోడెన్ ఘాట్ వెళ్లి అక్కడ కొమురం భీం స్మారక ఉద్యానవనానికి శంకుస్థాపన చేసివచ్చారు.

కొమురం భీం నవల తవ్వితీసిన సెప్టెంబర్ 1 స్థానంలో ఈ అక్టోబర్ 8 ఎక్కడినుంచి వచ్చినట్టు? వాస్తవంగా కొమురం భీం వర్ధంతి అక్టోబర్ 8 కాదు. బాబేఝరీలో స్మారక శిల మీద 1.9.1940 అని రాసి ఉందని ఇదివరకే చూశాం. ఆ రోజు ఆశ్వయుజ పౌర్ణమి అని భీం సమకాలికుల జ్ఞాపకం ఆధారంగా, జానపద గాథల ఆధారంగా ఆదివాసులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజున భీం వర్ధంతి జరుపుకునేవారు. ఈ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబర్ 8న వచ్చింది గనుక రాష్ట్ర ప్రభుత్వం ఆరోజునే వర్ధంతి జరిపింది.

కాని ఇక్కడ మరొక చిక్కు ఉంది. 1940లో, విక్రమ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి సెప్టెంబర్ 1న కాదు, అక్టోబర్ 16న వచ్చింది. పోనీ ముందరి నెలలో, భాద్రపద పౌర్ణమి అనుకుందామా అంటే అది సెప్టెంబర్ 16న వచ్చింది. అలా ఇప్పటికి ఉన్న రెండు తేదీలు – స్మారకశిల మీద ఉన్న సెప్టెంబర్ 1 అనే ఇంగ్లిష్ తేదీ, గోండుల జ్ఞాపకంలో ఉన్న ఆశ్వయుజ పౌర్ణమి అనే తెలుగు తిథి – ఒకదానికొకటి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో నిజాం పోలీసులతో పోరులో కొమురం భీం ఒరిగిపోయిన తేదీ గురించి సమకాలీన ఆధారాలు దొరుకుతాయా అని గోలకొండ పత్రిక, ఆంధ్రపత్రిక పాత సంచికల అన్వేషణ ప్రారంభించాను. ఆ అన్వేషణలో కొమురం భీంను కాల్చిచంపిన తేదీ సెప్టెంబర్ 10 అని కచ్చితంగా తెలియడంతో పాటు, మరికొన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు కూడ బైటపడ్డాయి.

ఆంధ్రపత్రిక 1940 సెప్టెంబర్ 16 న ‘పోలీసులనెదిరించిన 500 గోడుల మూకపై తుపాకి కాల్పులు’ అనే శీర్షికతో, ‘హైదరాబాదులో 10 చంపబడిరి 13 గాయపడిరి’, ‘నేరస్థుల అరెస్టును నిరోధించినందుకు పర్యవసానము” అనే ఉపశీర్షికలతో ఒక వార్త వచ్చింది. “హైదరాబాదు (దక్కను), సెప్టెంబర్ 15” అనే డేట్ లైన్ తో వచ్చిన ఈ వార్తలో, “ఆసిఫాబాద్ సమీపమున సెప్టెంబర్ 10వ తేదీన బాభ్జారి ప్రాంతమున 500 మంది గోండులమూక తుపాకులు యితర ఆయుధములతో పోలీసులను ఎదిరించినందుకు పోలీసువారా మూకపై తుపాకులు ప్రేల్చవలసి వచ్చెననియు కాల్పులవల్ల 10 మంది గోండులు చంపబడి మరి 13గురు గాయపడిరనియు యిక్కడ అందిన వార్తలు దెలుపుచున్నవి….” అనే మొదటి పేరాతో నాలుగు పేరాల వార్త ప్రకటించింది. “(అ.ప్రె.)” (బహుశా అసోసియేటెడ్ ప్రెస్) అని చివరన ఉన్న ఈ వార్త మూడో పేరాలో కూడ పోలీసులు అడవిలోకి వెళ్లిన తేదీ సెప్టెంబర్ 10 అని మరొకసారి రాశారు.

ఇక గోలకొండ పత్రిక 1940 సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు వరుసగా ప్రతి సంచికలోనూ ప్రచురించిన వార్తలు, వ్యాఖ్యలు చాల ఆసక్తికరమైనవి, వివరంగా చదవవలసినవి. మొదట సెప్టెంబర్ 16న అచ్చువేసిన వార్త శీర్షిక “200 గోండులు అధికారులను ఎదిరించుట”. దాని ప్రకారం “ఆసిఫాబాదులోని బాబ్ ఝరీ అనే గ్రామంలో గుట్టలు కలవు. అచ్చట 200 గోండులు ఆయుధపాణులై 4 ఆబాన్ నాడు పోలీసు మొహతమీమును, తాలూక్దారును, 100 పోలీసు దళాన్ని ఎదిరించినారని జనులు అనుకొనుచున్నారు. కొన్ని దినాలకు ముందు ఈ గ్రామంలో గోండులు అడవిశాఖ నౌకర్లపై పడి కొట్టియుండిరి. పోలీసులు ఆ సందర్భములో కొందరిని పట్టుకొనిరి. కొందరిని జమానతుపై వదలిరి. కాని మరల వారిని పిలిపించగా వచ్చుటలేదని తిరుగబడిరి. 200 గోండులు గుట్టపైకెక్కి పోలీసులనెదిరించిరి. 4 ఆబాన్ నాడు పోలీసు మొహతెమీమున్ను తాలూక్దారున్ను 100 మంది పోలీసు జవానులతో ఆ గ్రామం వెళ్లిరి. వారిని కూడా గోండులు బెదిరించిరి (అ.న్యూ.)”

ఆ తర్వాతి సంచిక (సెప్టెంబర్ 19)లో ‘గోండులపై పోలీసులు కాల్చుట’ అనే శీర్షికతో, ’10 మంది చచ్చిరి, 13 మందికి గాయాలు’ అనే ఉపశీర్షికతో “ఆసిఫాబాదు, ఆబాన్ 11” డేట్ లైన్ తో కాల్పుల వార్త వచ్చింది. దాంట్లో కూడ స్పష్టంగానే “10 సెప్టెంబరు నాడు అవ్వల్ తాలూక్దారు కొందరి పోలీసులను వెంటబెట్టుకొని వారిని (గోండులను) పట్టుకొనబోయెను. కాని 300 గోండులవరకు వారినెదిరించిరి. తాలూక్దారు వారికి చాలావరకు బుద్ధిచెప్పినా వారు వినలేదు. పైగా అందొకడు తుపాకితో కాల్చెనట. అదృష్టవశాత్తు అదెవ్వరికిని తగులలేదట. మరల రెండవమారు గోండులు తుపాకీ కాల్చిరి. దానిమూలాన ఒక పోలీసు జవానుకు దెబ్బతగిలెను. అటుపై పోలీసువారు తమ తుపాకీలను గోండులపై కాల్చిరి. ఆ దెబ్బలతో 10 మంది గోండులు చచ్చిరి. 13 మందికి గాయములు తగిలెను. 31 మంది పట్టుకొనబడిరి. తక్కినవారు పారిపోయిరి” అని ఉంది.

నేను ఈ అన్వేషణ సాగించి నా వ్యాసం పూర్తి చేసిన వారం తర్వాత చరిత్ర పరిశోధకుడు భంగ్యా భూక్యా కూడ అప్పటి అత్యున్నత పోలీసు అధికారి ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రతి సంపాదించి దాని ప్రకారం కాల్పులు జరిగిన తేదీ సెప్టెంబర్ 10 అని తేల్చారని, అది భాద్రపద శుద్ధ నవమి అని కనుక పౌర్ణమిని వర్ధంతిగా గుర్తించడం మానేయాలని అన్నారని పత్రికలలో వచ్చింది.

ఈ కాల్పుల వార్త తెలిసిన వెంటనే ఆంధ్ర మహాసభ, హైదరాబాదు సంస్థాన హిందూ ప్రజామండలి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ల పక్షాన కనీసం మూడు నిజనిర్ధారణ కమిటీలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. బహుశా ఆంధ్ర మహాసభ పక్షాన వెళ్లిన బద్దం ఎల్లారెడ్డి గోలకొండపత్రిక 23.9.1940 సంచికలో ‘బాబెఝరీ గోండులపై కాల్పులు’ అనే పెద్ద వ్యాసం రాశారు (దురదృష్టవశాత్తూ ఇప్పుడు ప్రెస్ అకాడమీ అర్కైవ్ లో లభ్యమవుతున్న గోలకొండ పత్రిక డిజిటైజ్డ్ ప్రతిలో ఈ వ్యాసం అచ్చయిన పేజీ సగానికి చిరిగిపోయి ఉంది). “సర్కారి లెక్క ప్రకారము 10 మంది ఆ స్థలములోనే మరణించినారు. గాయపడ్డ పదముగ్గురు ఆసిఫాబాద దవాఖానాకు కొనితేబడగా వారిలో 4గురు ఇటీవల మరణించినారు. ఝండాగూడ గ్రామములో మరి ఇద్దరు గాయపడినవారు చచ్చినారని 11 ఆబాన్ నాడు పంచునామా చేయబడినది. ఇట్లు మొత్తం 16గురు చచ్చినారని సర్కారువారి లెక్క. ఇక ఇక్కడి ప్రజల అంచనా 100 మందికిపైగా ఆచోటనే చచ్చినారని” అని, ఈ ఘర్షణ పూర్వాపరాలతో సహా ఎల్లారెడ్డి గారు రాశారు. అదే సంచికలో గోలకొండ పత్రిక సంపాదకీయమూ రాసింది, ప్రభుత్వ ప్రకటన పూర్తి పాఠమూ అచ్చువేసింది.

ఆసిఫాబాద్ లో శ్రీనివాసాచారి, లక్ష్మణ్ అనే వకీళ్లుఈ ఘటనను విచారించడానికి కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన వార్త గోలకొండ పత్రిక 26 సెప్టెంబర్ సంచికలో వచ్చింది.

సెప్టెంబర్ 30 సంచికలో ‘గోండుల గోడు – బాబెఝరీ కాల్పుల గురించి కొన్ని సవరణలు’ అంటూ మళ్లీ ఎల్లారెడ్డి గారు అదనపు వివరాలు రాశారు. “ఆ రోజే కాల్పులు జరిగినప్పుడు బాబెఝరీలో 127 మంది చచ్చినారని రూఢిగా ఒక పోలీసు పటేలు వల్ల తెలియుచున్నది. వీరందరిని పోలీసు అక్కడనే దహనం చేసి గురుతు లేకుండా చేసిరని కూడ తెలియుచున్నది. ఆస్పత్రిలో 4గురు మరణించినారు. మండ్రుమాడలో నొక గాయపడినవాడు మరణించినాడు. గోండు ఝండా గూడలో నిద్దరు గాయపడినవారు మరణించినారు. వీరిద్దరి పంచునామా కూడ అయినదని తెలియుచున్నది. గడలపల్లిలో ఇద్దరు గాయపడ్డవారు మరణించినారని పోలీసు పటేలు రిపోర్టు. చిద్రకుంటలో ఇద్దరు మరణించినారని పోలీసుపటేలు రిపోర్టు. మొత్తం ఇప్పటికి 138 మంది చచ్చినారని తెలియుచున్నది” అని రాశారు. (బద్దం ఎల్లారెడ్డి గారి పర్యటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని ‘శతజయంతి సంస్మరణ సంచిక’ లో ప్రచురించిన పోలీసు రికార్డ్స్ తెలియజేస్తాయి.)

అక్టోబర్ 7 సంచిక రెండు నిజనిర్ధారణ సంఘాల గురించి వార్త ప్రకటించింది. అక్టోబర్ 14 సంచిక న్యాయవిచారణ జరిపించమని కోరుతూ ఆంధ్రమహాసభ చేసిన తీర్మానాన్ని ప్రకటించింది.

అక్టోబర్ 17 సంచికలో ‘గోండుల గోడు – క్రొత్తగా తెలిసిన సంగతులు’ శీర్షికతోనూ, అక్టోబర్ 21 సంచికలో ‘గోండుల గోడు’ శీర్షికతోనూ జి ఎస్ గుప్త చాల వివరమైన నివేదికలు రాశారు. ఎన్నో గ్రామాలు, గోండు గూడాలు తిరిగి సేకరించిన సమాచారంతో ఆయన రాసిన ఈ నివేదికలు చాల విలువైనవి, తప్పనిసరిగా చదవవలసినవి.

**

“ఆసిఫాబాదు జిల్లాలో గోండులపై పోలీసువారు తుపాకులను కాల్చినందుకు 10 మంది చచ్చిరని తెలుపబడి యుండెను. అటుపై ప్రభుత్వము వారీ కింది విధముగా ప్రకటించుచున్నారు:

పోలీసు మంత్రియున్ను, పోలీసు నాజమున్ను ఆసిఫాబాదుకు పోయి విచారం చేసి వచ్చుటచే తెలిసినదేమనగా ఇంతవరకు 10గురు గోండులు చనిపోయినారు.

5 ఏండ్ల క్రిందట ఒక గోండు ఈ రాష్ట్రములోనికి వచ్చి ఆసిఫాబాదుకు 12 మైళ్ల దూరములో ఒక అడవిలో పీఠము వేసినాడు. అచ్చట వాడు దొంగతనంగా వ్యవసాయం సాగించినాడు. క్రమంగా 300 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు. కొందరు శిష్యులు కూడ జతకూడినారు. అడవిశాఖవారు ఆ వ్యవసాయాన్ని ఆపివేయ ప్రయత్నించినారు. కాని వాడు వినలేదు. 2 నెలల క్రిందట కొందరు అడవిశాఖవారు వానిని నిరోధించుటకు వెళ్లగా అందులో ఇద్దరికి దెబ్బలు తగిలెను. ఈ మనిషిని పట్టేది కష్టమని మొహతమీమ్ స్వయంగా వెళ్లి వానినిన్నీ మరివాని వద్దనుండే ఆరు మందిని పట్టుకుని వారు పట్టుకున్న ఆయుధాలను క్రింద పెట్టించి జమానతుపై అచటనే విడిచివేసెను. ఇక్కడికంతా తృప్తికరముగా పరిష్కారమయినదని జిల్లా అధికారులు నివేదించుకొనిరి. విచారణ దినమునాడు కోర్టుకు గోండులు రాకపోయిరి. అందుపై వారంటు పంపబడెను. దానిని వారిపై ప్రయోగించుట కష్టసాధ్యమయ్యెను. ప్రయోగింపుచో జవానులను చంపుదుమన్నారు. ఈ గోండు మరీ బిర్రబిగిసి తాను గోండు రాజాననిన్నీ తనకు 5 జాగీరులిచ్చి అడవి సుంకాలన్నీ వదులుకోవలెననిన్నీ తాలూక్దారుకు పోలీసు అధికారికి చిట్టీలు వ్రాసినాడు. తనవారిపై ప్రభావంజేసినాడు. తనకు మంత్రశక్తి కలదన్నాడు. తుపాకి గుండ్లు తమపై పారవన్నాడు. ఆ మార్గంగా పోవు విమానాన్ని చేయి విసిరి క్రింద పడగొడ్తాను చూడుమన్నాడు. ఇట్టి ముచ్చట్ల చేత వాని అనుయాయి వర్గం 1000 మంది వరకు పెరిగిందని వదంతి. ఇక శ్రుతి మించనీయగూడదని తాలూక్దారు 100 పోలీసులను తుపాకులతో లాఠీలతో తీసుకుని వెళ్లినాడు. జిల్లా పోలీసు అధికారిని, జిల్లా అటవీశాఖ అధికారిని జిల్లా డాక్టరును వెంటబెట్టుకున్నాడు. గాయాలకు చికిత్స చేసే మందు డబ్బాలను కూడ పట్టించుకున్నాడు. ఇంకా ఇద్దరు రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకున్నాడు. గోండులుండే గుట్ట వద్దకు 4 ఆబాన్ నాడు వెళ్లి డేరా వేసినాడు. ఆ గ్రామం పటేలుద్వారా గోండులకు రాయబారాలంపినారు. కాని గోండులు పటేలును మళ్లీ వస్తే చంపివేస్తామని చెప్పంపినారు. మరునాడు గోండులు నగారాలు మోగించినారు. 6 ఆబాన్ నాడు పోలీసువారు 800 అడుగులయెత్తు గుట్టను భద్రముగా ఎక్కినారు. అచట 500 గోండులు ఆయుధాలతోనుండినారు. 4 గంటల కాలం తాలూక్దారు వారికి బుద్ధిరావలెనని చాలా ప్రయత్నం చేసినాడు. కాని లాభము లేకపోయింది. వారు ఆయుధాలను విసర్జించమన్నారు. పైగా మీరు వెళ్లుతారా లేక అందరినీ నరికి వేస్తుమా అని బెదిరించినారు. తుదకు మాటల కాలము పోయినది, వారు కూతలు పెట్టుచూ 80 గజాలు వెనుకకు తగ్గినారు. అనేక గోండులు ఆవేశముతో ఊగుటకు మొదలుపెట్టినారు. ఇక ప్రమాదమే అని తాలూక్దారు గాలిలో రెండుమారులు బెదిరించేదానికి కాల్పించినాడు. దానివల్ల లాభం లేకపోయినప్పుడు గుండ్లను కాల్పించినాడు. గోండు నాయకుడు పోలీసు వారికి 10 గజాల దూరంలో చచ్చి కిందపడినాడు. వాని పక్కనే వాని చుట్టమొకడు చచ్చిపడినాడు. మరి 8 మంది అప్పుడే చచ్చిపడినారు. 13 మందికి గుండుదెబ్బలు తగిలెను. మిగతావారు అడవులలోనికి పారిపోయినారు. గ్రామములోని కొందరు గోండులు తుపాకులతోనుండగా అరెస్టు చేయబడినారు. డాక్టరు గాయాలు పొందినవారికి వెంటనే కట్లు కట్టినాడు. మరునాడు తాలూక్దారుగారున్నూ వారి సిబ్బందియున్నూ పరివారమునూ ఆసిఫాబాదుకు గాయాలు పొందినవారిని, పట్టుకున్న గోండువారిని తీసుకొనివెళ్లిరి. విచారణలు జరుగుచున్నవి.”

ఇది బాబేఝరీ కాల్పుల తర్వాత నిజాం ప్రభుత్వ పోలీసు శాఖ విడుదల చేసిన పత్రికాప్రకటన పూర్తిపాఠం. ప్రజా ఆకాంక్షల గురించి, ఉద్యమాల గురించి, ప్రజానాయకుల గురించి, పోలీసులకూ ప్రజలకూ మధ్య ఘర్షణల గురించి ఏడు దశాబ్దాల తర్వాత కూడ ఇదే పద్ధతి, ఇదే రకమైన వివరణ ఉంటాయి. ఈ ప్రకటన చదివితే అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదని తేలుతుంది. రాజ్యం, రాజ్యపు అంగాలు, ముఖ్యంగా పోలీసులు మాట్లాడే భాష ఒకటే అని తేలుతుంది. గతవర్తమానాల కలనేత మరీ ఇంత చిక్కగా, గాఢంగా ఉండడం, వర్తమానం మీద గతం నీడ వదలకపోవడం, గతమేదో వర్తమానమేదో పోల్చుకోలేని స్థితి ఉండడం మన సామాజిక అవ్యవస్థకు, స్తబ్దతకు, ప్రతిష్టంభనకు, నిశ్చలతకు చిహ్నం కాదా?

  • ఎన్ వేణుగోపాల్
  • venugopalraon@yahoo.com

పుస్తకాలు గతమా, వర్తమానమా, భవిష్యత్తా?

venu

అనేకానేక వ్యక్తిగత, సామాజిక కారణాలవల్ల రెండు మూడు నెలలు నా ఈ శీర్షికకు అంతరాయం ఏర్పడింది గాని ఇటు ‘సారంగ’ ఒత్తిడి వల్లా, ఈ శీర్షికలో రాయదలచిన విషయం పట్ల అభినివేశం వల్లా ఇది రాయవలసి ఉందని ఏ ఒక్కరోజూ మరచిపోలేదు. ఈ శీర్షికలో రాయదగినవీ, ఆలోచించదగినవీ ఎన్నెన్నో తట్టాయి, కనిపించాయి. అలా తోసుకొస్తున్నవాటిలో మిగిలినవాటిని పక్కనపెట్టి ఈసారి పుస్తకాల గురించి రాయదలిచాను. ఒక పుస్తకం అంటే గతంలో రాసినదో, గతం గురించి రాసినదో, గతంలో అచ్చయినదో, గతంలో ఈ కళ్లమీద ప్రవహించి, ఈ మునివేళ్లను ముద్దాడి, ఈ మనసులో స్థిరపడినదో గాని అది గతమేనా? గతమైనా వర్తమానమా? అసలు ఎన్నటికీ తుడిచివెయ్యలేని నిగూఢ భవిష్యత్తా?

‘ఇంతకాలమూ కాయితాల్తోనే గడిచిపోయింది, కన్నీటి కాయితాల్తోనే గడిచిపోయింది’ అని మో అన్నట్టు ఒకసారి పట్టుకున్నదంటే పుస్తకం మనిషిని జీవితపర్యంతం శాసిస్తుంది, ఆ మనిషి తననే శ్వాసించేలా చేస్తుంది. మనిషిని నడిపిస్తుంది, మనిషి వెంట నడుస్తుంది. అటువంటి పుస్తకానుభవాల గురించి ఎన్నోసార్లు రాశాను గాని అనిల్ బత్తుల అనే ఒక కొత్త పుస్తక ప్రేమికుడు వచ్చి నా పుస్తకాల జ్ఞాపకాల కందిరీగల తుట్టెను భూకంప సదృశంగా కదిలించాడు. మూడు వారాల కింద తాను ఏర్పాటు చేసిన పుస్తక జ్ఞాపకాల సభలో మాట్లాడమని నాలుగైదు వారాల కింద అడిగినప్పుడు, ఆ నిప్పురవ్వ నా మనసులో ఇంత దావానలమవుతుందని నేను ఊహించలేదు.

ఇంతకూ అసలు పుస్తక జ్ఞాపకాల సభ ఏర్పాటు చేయడమే ఒక విశిష్ట ఆలోచన. అది సోవియట్ యూనియన్ లో ప్రచురితమైన తెలుగు పుస్తకాల గురించి తలచుకునే సభ. సోవియట్ యూనియన్ అనేది భూగోళం మీది నుంచి చెరిగిపోయి నిండా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది. అంటే ఒక కొత్త తరం పుట్టుకొచ్చింది. బహుశా ఆ తరంలో కూడ పుట్టుకొస్తున్న పుస్తక పాఠకులు ఎప్పుడూ ఎక్కడా ఏ దుకాణంలోనూ ఈ పుస్తకాలు చూసి ఉండరు. అనిల్ బత్తుల కొద్ది ముందుగా పుట్టాడేమో గాని ప్రధానంగా ఆ తరానికి చెందినవాడే. సహజంగానే ఆయన మిత్ర బృందమూ అలా ఈ పుస్తకాలు దుకాణాలలో చూసి ఉండినవాళ్లు కారు.

అక్కడ మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉంటే సోవియట్ పుస్తకాలు నా పఠనం లోకీ, అధ్యయనం లోకీ, అవగాహనల లోకీ, జీవితం లోకీ వచ్చిన నాలుగున్నర దశాబ్దాల కిందటి పురాస్మృతుల సుప్తాస్ఠికలు ‘బతికిన దినాల తలపోత బరువుచేత’ కదిలాయి. నేను సోవియట్ పుస్తకం మొదటిసారి ఎప్పుడు చూశాను, ఎప్పుడు ముట్టుకున్నాను, ఎప్పుడు చదివాను, ఆ పుస్తకాలు ఎట్లా పోగేసుకున్నాను, ఆ పుస్తకాలు మాత్రమే కాదు, ఆ పుస్తకాలకు జన్మనిచ్చిన ఒక అద్భుతమైన సామాజిక ప్రయోగం ఎట్లా కుప్పకూలి పోయింది, ఒక పావుశతాబ్ది గడిచాక ఇప్పుడు ఆ చితాభస్మం లోంచి ఏమి ఏరుకుంటాము, అటువంటి లాభాపేక్ష లేని, చైతన్య విస్తరణ కాంక్షతో మాత్రమే పుస్తక ప్రచురణ అంత పెద్ద ఎత్తున సాగే మరో ప్రపంచం మళ్లీ వస్తుందా…. ఎన్నెన్నో ప్రశ్నలు, ఆలోచనలు.

పుస్తకం గురించి తలచుకోవడమంటే, పుస్తకం రూపురేఖల గురించీ, రచయిత గురించీ, పుస్తకంలోని విషయం గురించీ తలచుకోవడం మాత్రమే కాదు. ఆ పుస్తకం ఉండిన చెక్కబీరువానూ, ఇనుపబీరువానూ, అటువంటి మరెన్నో బీరువాలు నిండిన గదినీ, ఆ గదిలో తలుపు పక్కన నిరామయంగా కూచుని కునికిపాట్లు పడుతూనో, ప్రేమపూర్వకంగా పుస్తకాలను పరిచయం చేస్తూ చెవిలా జోరీగలా వెంట తిరుగుతూనో ఉండే దుకాణదారు గుమస్తానూ, ఆ పుస్తకాలు పట్టుకుని తెరిచి లోపల వాసన చూసి, ఆ తర్వాత దాని విషయ సూచికా, అట్ట మీద వ్యాఖ్యలూ, ధరా చూసినప్పటి సంభ్రమాన్నీ, అంత తక్కువ ఖరీదైనా కొనుక్కోలేని నిస్సహాయ దైన్యాన్నీ, ఎలాగో ఒకలాగ కొనుక్కున్న సంతోషాన్నీ, ఆ పుస్తకాల దుకాణంలోకి మీతోపాటు నడిచి వచ్చిన మిత్రులనూ, ఆ పుస్తకం చదివినప్పటి అనుభూతులనూ, ఆ పుస్తకం గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు పొందిన ఉత్సాహాన్నీ… ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పుస్తకాన్ని గురించి తలచుకోవడమంటే ఒక జీవిత శకలాన్ని మళ్లీ అరచేతుల్లోకి తీసుకుని నాలుగువేపుల నుంచీ దర్శించడం.

అలా సోవియట్ పుస్తకాల గురించి తలచుకోవడమంటే బహుశా నా తరానికీ, నా ముందరి తరానికీ ఆత్మకథాత్మక సామాజిక చరిత్ర మననం చేసుకోవడమే.

IMG_20141002_174238

ఊహ తెలిసినప్పటి నుంచీ పుస్తకాలు చూస్తూ వచ్చాను. మా బాపు కొనుక్కున్న ఆధ్యాత్మిక పుస్తకాలు, పురాణాలు, కావ్యాలు మాత్రమే కాదు, సృజనకు సమీక్షకు వచ్చిన పుస్తకాలు, వరవరరావు గారి పుస్తకాలు కొన్నయినా మా రాజారం ఇంటికి చేరుతుండేవి. అలా హనుమకొండ చదువుకు రాకముందే సోవియట్ పుస్తకాలు చూసి ఉంటాను గాని మొట్టమొదట చూసిన సోవియట్ పుస్తకం ఇమాన్యువల్ కజకేవిచ్ ‘మిత్రుని హృదయం’ అని గుర్తు. వరవరరావు గారికీ, మా అక్కయ్య హేమలతకూ పెళ్లి జరిగిన సందర్భంగా 1964లో అది ఎవరో మిత్రులు కానుకగా ఇచ్చినట్టు గుర్తు. దాదాపు మూడు వందల పేజీల నీలి రంగు క్యాలికో బౌండు పుస్తకం. దాని మీద బంగారు రంగులో ఉబ్బెత్తుగా పుస్తకం పేరు, రచయిత పేరు. నలభై సంవత్సరాలు గడిచిపోయాక కూడ ఇప్పటికీ కళ్ల ముందు ఆడుతున్నాయి.

1973లో చదువుకు హనుమకొండ వచ్చాను, ఆ సంవత్సరమే విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. ఆనాటికి కొన్ని పుస్తకాలు ప్రచురించడం కోసం డా. రామనాథం గారి ప్రోత్సాహంతో శ్రామికవర్గ ప్రచురణలు అనే చిన్న ప్రచురణ సంస్థ ప్రారంభమయింది. రామనాథం గారి ప్రోత్సాహంతోనే శ్రామికవర్గ ప్రచురణలు పేరుతో ఒక ప్రత్యామ్నాయ పుస్తకాల దుకాణం వరంగల్ లో ప్రారంభమయింది. ఆ దుకాణం నిర్వహణ బాధ్యత మా అన్నయ్య రాంగోపాల్ ది. నేనూ సాయంకాలం వేళల్లో ఆ దుకాణంలో ఎక్కువ రోజులే కూచోవలసి వచ్చేది. వరంగల్ లో సోవియట్ పుస్తకాలు అమ్మిన మొదటి దుకాణం అదేననుకుంటాను. అక్కడ ఆ పుస్తకాలు చెక్క బీరువాల్లో పేర్చి పెట్టడం నుంచి, తిరగేయడం, చదవడం దాకా సోవియట్ పుస్తకాలతో నా దోస్తీ మొదలయింది. ఎమర్జెన్సీతో ఆ దుకాణం మూతబడిపోయింది.

ఎమర్జెన్సీలోనో, ఎమర్జెన్సీ తర్వాతనో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ దుకాణం వరంగల్ మండీబజార్ లో మొదలయింది. సృజన ప్రూఫులు దిద్దడానికి ప్రెస్ కు వెళ్లి, ఆ పని అయిపోయినతర్వాత మండీబజార్ దాకా నడిచి విశాలాంధ్రలో కాసేపు పుస్తకాలు చూసి, తిరగేసి, కళ్లనిండా మనసు నిండా నింపుకుని ఇంటికి రావడం అలవాటుగా మారింది. ఆ మండీ బజార్ విశాలాంధ్ర దుకాణం రెండు మడిగెల ఇల్లు. లోపల ఎన్నెన్నో సోవియట్ పుస్తకాలు. కొన్ని పాత ఫారిన్ లాంగ్వేజెస్ పబ్లిషింగ్ హౌజ్ పుస్తకాలతో పాటు గుట్టలుగా ప్రొగ్రెస్ పబ్లిషర్స్. ప్రగతి ప్రచురణాలయం, మిర్ పబ్లిషర్స్ పుస్తకాలు. అప్పటికింకా రాదుగ ప్రచురణలు ప్రారంభం కాలేదు. దాదాపు అన్నీ క్యాలికో బౌండ్ పుస్తకాలే. మార్క్స్ ఎంగెల్స్ రచనలు, ముఖ్యంగా లెనిన్ రచనలు పేపర్ బ్యాక్ లు ఉండేవి. లోపల దళసరి తెల్లని తెలుపు కాగితం. సన్నని అక్షరాలు. పిల్లల పుస్తకాలైతే చెప్పనక్కరలేదు. రంగురంగుల బొమ్మలు. పెద్ద పెద్ద అక్షరాలు. చదువుతుంటే భాష కొంచెం చిత్రంగా ఉన్నట్టుండేది గాని దానిలోనూ ఒక సొగసు, ఒక ఆకర్షణ ఉండేవి.

ఆ తర్వాత విశాలాంధ్ర వరంగల్ మండీబజార్ నుంచి హనుమకొండ అశోకా కాంప్లెక్స్ లోకి వచ్చింది. అప్పటికి ఇంటర్మీడియట్ ఒకసారి తప్పి పూర్తి రికామీగా పుస్తకాలే ప్రపంచంగా ఉన్నాను. ఆ తర్వాత బిఎ లో చేరినా, సృజన, రాడికల్ విద్యార్థి సంఘం, సభల దగ్గర పుస్తకాల దుకాణం పెట్టడం లాంటి పనులెన్ని ఉన్నా సోవియట్ పుస్తకాల మైకం ఒకటి ఎప్పుడూ కమ్మి ఉండేది. సోషల్ సామ్రాజ్యవాదం అని విమర్శిస్తూనే, వాళ్లు పుస్తక ప్రచురణ ద్వారా ప్రపంచానికి చేస్తున్న మేలును అంగీకరిస్తుండేవాణ్ని. అక్కా అని పిలిచే ఒక కుటుంబ మిత్రురాలి దగ్గర నెలకు వంద రూపాయల దానాన్ని వరంగా పొంది అదంతా విశాలాంధ్రలో ఖర్చు పెడుతుండేవాణ్ని. (ఆరోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో, సోవియట్ పుస్తకాల ధరలతో పోలిస్తే అది మరెంత పెద్దమొత్తమో!)

Aelita_Puppala Lakshmanarao(ed)_001

పేదజనం – శ్వేత రాత్రులు, అజేయ సైనికుడు – ప్రశాంత ప్రత్యూషాలు, అమ్మ, జమీల్యా, అయిలీత, అన్నా కెరెనీనా, తండ్రులూ కొడుకులూ…. మొదటిసారి రాక్ లోంచి తీసి, అటూ ఇటూ ప్రేమగా తడిమి, తెరిచి వాసన చూసి, అతి భద్రంగా అప్పటి మేనేజర్ విజయప్రసాద్ బల్ల మీద పెట్టి…. ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ప్రతి క్షణమూ ఇప్పుడే అనుభవిస్తున్నట్టుగా ఉంది. పుష్కిన్ కవిత్వం, మరీ ముఖ్యంగా వాట్ మీన్స్ మై నేమ్ టు యు, ఇట్ విల్ డై ఆజ్ డజ్ ది మెలాంకలీ మర్మర్ ఆఫ్ డిస్టాంట్ వేవ్స్ అని గొంతిత్తి చదువుకుంటూ, ఆ పద్దెనిమిదో, పందొమ్మిదో ఏట, అది పుష్కిన్ నాకోసమే రాశాడనుకున్న గుండె సవ్వడి ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. బాలసాహిత్యమో, కవిత్వమో, కథో, నవలో, జానపద గాథలో, సాహిత్య విమర్శో, తాత్విక, రాజకీయార్థిక విషయాలో మాత్రమే కాదు, ఏదైనా సరే అసలు అది ప్రపంచానికి తెరిచిపెట్టిన ఒక కిటికీ. హృదయాన్ని వెలిగించిన ఒక మెరుపు. మనశ్శరీరాలను ముద్దాడి అలౌకిక అనుభూతిని అందించిన వెన్నెల. ఆ ప్రచురణలే లేకపోతే టాల్ స్టాయ్, డాస్టవిస్కీ, గోగోల్, కుప్రిన్, గోర్కీ, షొలఖోవ్, పుష్కిన్, గమ్జతోవ్, కజకేవిచ్, మయకోవస్కీ, లూనషార్స్కీ, సుఖోమ్లిన్స్కీ, మకరెంకో, క్రుపస్కయా, కొల్లోంటాయ్ లాంటి వందలాది పేర్లు మన కుటుంబ సభ్యుల పేర్లంత సన్నిహితమై ఉండేవేనా?

కేవలం రష్యన్ రచయితలు మాత్రమే కాదు, ఎందరో యూరపియన్ రచయితలు కూడ నాకు మొదట తెలిసింది ప్రొగ్రెస్ పబ్లిషర్స్ పుస్తకాల ద్వారానే. షేక్స్పియర్ మాక్ బెత్, ఆస్కార్ వైల్డ్ కథలు, లూయి కారొల్ ఆలిస్ ఇన్ వండర్ లాండ్ మాస్కో మీదుగానే నా కళ్లకు చేరాయి. యూరీ బోరెవ్ ఈస్ఠటిక్స్, యూరీ ఖారిన్, థియొడర్ ఒయిజర్మన్ ల తత్వశాస్త్రం, చేగువేరాతో సహా ఎందరివో జీవితచరిత్రలు, రాజకీయార్థిక శాస్త్రం, విద్యా ప్రయోగాలు, రెండో ప్రపంచ యుద్ధ అనుభవాలు… ఎన్ని జ్ఞాపకాలు….

ఇక నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం, రసాయన మూలకాల రహస్యాలు, చక్షువు-జగచ్చక్షువు లాంటి విజ్ఞాన శాస్త్రాల పుస్తకాలు, గణిత శాస్త్ర పుస్తకాలు, చివరికి చదరంగం మీద పుస్తకాలూ… ఆ పుస్తకాలే లేకుంటే ఏమయ్యేవాళ్లం? ఇట్లా ఉండేవాళ్లమేనా?

తన చరిత్ర పట్ల ఎంత మాత్రమూ స్పృహ లేని, తన చరిత్రను తాను నమోదు చేసుకోవాలనే స్పృహలేని తెలుగు జాతి స్వభావం గురించి ఇదివరకు రాశాను గాని, అనిల్ ఈ సోవియట్ తెలుగు పుస్తకాల గురించి మాట్లాడమన్న తర్వాత తారీఖులు, దస్తావేజుల కోసం తవ్వకం మొదలుపెడితే యాభై సంవత్సరాలకు మించని చరిత్ర కూడ మనకు ఖాళీలు లేకుండా, గందరగోళం లేకుండా, సవ్యంగా, స్పష్టంగా నమోదై లేదని మరొకసారి తెలిసివచ్చింది.

ప్రగతి ప్రచురణాలయం మాస్కో ప్రచురణలు ఎప్పుడు మొదలయ్యాయి, మొదటి పుస్తకం ఏమిటి, సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రగతి ప్రచురణాలయం వెంటనే మూతపడిందా, చివరి పుస్తకం ఏమిటి, నిలువ ఉండిన పుస్తకాలు ఏమయ్యాయి…. ప్రశ్నలే ప్రశ్నలు, సంతృప్తికరమైన సమాధానాలు లేవు.

ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, కొండేపూడి లక్ష్మీనారాయణ, ఉప్పల లక్ష్మణ రావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, నిడమర్తి ఉమారాజేశ్వరరావు, ఆర్ వెంకటేశ్వర రావు (ఆర్వియార్) పని చేశారు. వీరిలో లక్ష్మణరావు గారు తప్ప మిగిలినవారెవరూ తమ ఆత్మకథలు రాసుకున్నట్టు లేరు. కనీసం సోవియట్ అనుభవాలు రాసుకున్నట్టు నా దృష్టికి రాలేదు. లక్ష్మణరావు గారి బతుకు పుస్తకంలో ప్రగతి ప్రచురణాలయం, మాస్కో తెలుగు ప్రచురణలు ప్రారంభమైన సంవత్సరం 1967 అని ఒకచోట అచ్చయింది. అది కచ్చితంగా అచ్చుతప్పు కావచ్చు. ఎందుకంటే మరికొన్ని పేజీల తర్వాత ఆయనే తాను తెలుగు అనువాదకుడిగా ప్రగతి ప్రచురణాలయంలో 1958లో చేరానని రాశారు. ఇంటర్నెట్ మీద కొంచెం పరిశోధిస్తే ప్రోగ్రెస్ పబ్లిషర్స్ మలయాళ విభాగం 1956లో మొదలయిందని ఒక లీలామాత్ర సమాచారం దొరికింది. మొత్తానికి తెలుగు విభాగం కూడ 1950ల మధ్యలో మొదలై ఉంటుందనుకుని ఆ కాలంలో కమ్యూనిస్టుపార్టీలో క్రియాశీలంగా ఉండినవారిని అడిగితే వారూ కచ్చితంగా చెప్పలేకపోయారు.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ తోనూ, పీపుల్స్ పబ్లిషింగ్ హౌజ్ తోనూ చిరకాలం గడిపిన పిపిసి జోషి గారిని అడిగితే ఆయన కూడ, ‘నేనూ కచ్చితంగా చెప్పలేను గాని, కొన్నేళ్ల కింద నేను స్వెత్లానా వ్యాసం ఒకటి అనువాదం చేశాను. స్వెత్లానా అంటే అప్పటి ప్రగతి ప్రచురణాలయం బాధ్యురాలు. విశాలాంధ్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆమెను వ్యాసం రాయమంటే, ఆమె ఇంగ్లిషులో పంపిన వ్యాసంలో కొన్ని తేదీలు, పేర్లు పొరపాటు ఉన్నాయని, అవి దిద్ది అనువాదం చేయమని నాకిచ్చారు. నేను కాపీ కూడ పెట్టుకోకుండా అనువాదం, అసలు వ్యాసం వారికిచ్చేశాను. ఏ కారణం వల్లనో ఆ వజ్రోత్సవ సావనీర్ వెలువడలేదు. ఆ వ్యాసం ఏటుకూరి ప్రసాద్ దగ్గర ఉండవచ్చు. అడిగి తీసుకో’ అన్నారు.

నిజంగా ఆ వ్యాసం మన సామాజిక చరిత్రకు, సోవియట్ తెలుగు పుస్తకాల చరిత్రకు సంబంధించి ఒక విలువైన దస్తావేజు. దాని ప్రకారం సోవియట్ తెలుగు ప్రచురణలు 1956 డిసెంబర్ లో మొదలయ్యాయి. మొదటి పుస్తకం సుతయేవ్ రాసిన ‘ఎవరు మ్యావ్ అన్నారు’ అనే పిల్లల పుస్తకం.

అప్పటి నుంచి 1989 దాకా మాస్కో నుంచి తెలుగులో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనల అనువాదాలతో సహా కనీసం మూడు వందల పుస్తకాలైనా వెలువడి ఉంటాయని నా అంచనా. అవన్నీ ఎక్కడైనా ఒక్కచోట ఉన్నాయా? అసలు జాబితా అయినా దొరుకుతుందా? ఆ మూడువందల పుస్తకాలు కొన్ని లక్షల ప్రతులు అచ్చయి ఉంటాయి. వాటిని ముట్టుకున్న, చదివిన, పంచుకున్న, వాటితో కదిలిపోయిన లక్షలాది మంది అనుభవాలన్నీ ఏమవుతాయి? అదంతా పతనమైపోయిన సోవియట్ యూనియన్ లాగ భూతకాలంలో కలిసిపోయిందా? అది విషాద వర్తమానమా? ఉజ్వల భవిష్యత్తా? అనిల్ బత్తుల వంటి ఔత్సాహికుల వల్ల, అపార అవకాశాలు ఇస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ మళ్లీ ఈ అంతర్జాలం మీద కనబడతాయా? ఆ మాయాజాలం మళ్లీ వికసిస్తుందా?

సోవియట్ యూనియన్ కూలిపోయి ఉండవచ్చు కాని తన వనరులలో గణనీయమైన భాగాన్ని వెచ్చించి ప్రపంచానికంతా ఇంత జ్ఞానదానం చేసిన స్ఫూర్తి సంగతి ఏమిటి? వందలాది భాషలలో కోట్లాది పుస్తకాలు ప్రచురించి దేశదేశాల పాఠకుల అవసరాలను తీర్చడానికి, వారి కొనుగోలుశక్తిని దృష్టిలో పెట్టుకుని కారుచవకగా అందించడానికి, సోవియట్ ప్రజానీకం తమ శ్రమ ఎంత వెచ్చించి ఉంటారు? ఆ స్వార్థత్యాగం గతమా, వర్తమానమా, భవిష్యత్తా? రెండు కోట్ల మందిని బలిపెట్టి హిట్లర్ దుర్మార్గం నుంచి ప్రపంచాన్ని కాపాడిన ఆ మహాత్యాగ శక్తిని అప్పటి కవి ‘కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి’ అని పిలిచాడు. ఆ పుస్తకప్రచురణ స్ఫూర్తినైనా మళ్లీ కోరి రమ్మనడానికి కోటిగొంతులు పలకవలసిన అవసరం లేదా?

-ఎన్ వేణుగోపాల్

ఇప్పుడైనా ఈ చరిత్ర మారుతుందా?!

venu1గతవర్తమానం 04

 

 

జూన్ 1 అర్ధరాత్రి, జూన్ 2 ఉదయించే వేళ. తన అరవై సంవత్సరాల స్వయంపాలనా ఆకాంక్ష నెరవేరిందని తెలంగాణ సమాజం సంబరాలు చేసుకుంటున్న వేళ, రెండు మూడు రోజుల ముందునుంచీ ఆ వర్తమాన సంతోష సందోహంలో భాగమవుతూనే నా మనసు మాత్రం సంక్లిష్ట సందేహ గతంలో తిరుగాడుతోంది. చరిత్రలో తెలంగాణ ఎన్నోసార్లు సంబురపడింది. తన తండ్లాట తీరిందనీ, తన కోరిక నెరవేరిందనీ అనుకుంది. కాని ఎక్కడి గొంగడి అక్కడ్నే అనే నుడికారం తిరిగితిరిగి నిజమయింది. ఈసారీ అంతేనా, ఏమన్నా మారుతుందా అని ప్రశ్నలే ప్రశ్నలు. చారిత్రక ఘటనల మధ్య సామ్యం ఎంత ఉంటుందో భేదమూ అంతే ఉంటుందన్నది నిజమే గాని తేదీలు దాదాపు కలిశాయి గనుక సరిగ్గా డెబ్బై సంవత్సరాల కిందటి ఇటువంటి సందర్భమే గుర్తుకొచ్చింది.

అది తెలంగాణ చరిత్ర ఒక గుణాత్మకమైన మలుపు తిరిగిన సందర్భం. సుప్రసిద్ధమైన పదకొండో ఆంధ్ర మహాసభ బోనగిరిలో 1944 మే 27, 28 ల్లో జరిగింది. అంతకు మూడు నాలుగు సంవత్సరాల ముందునుంచీ సాగుతున్న అభిప్రాయభేదాలు ఒక దశకు చేరి ఆ రోజున ఆంధ్ర మహాసభ చీలిపోయింది. అప్పటికి కనీసం ఆరు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ సమాజపు తండ్లాట ఆ రోజున ఒక పరిష్కార మార్గాన్ని చేపట్టింది. ఆ మార్గం మరిన్ని మలుపులు తిరిగి ఆ తండ్లాట యథావిధిగా మిగిలిపోవడమో, ఇంకా పెరగడమో వేరే కథ. కాని ఆ రోజునూ, ఆ రోజుకు అటూ ఇటూ సాగిన చరిత్ర పురిటి నొప్పులనూ ఇవాళ గుర్తు తెచ్చుకోవడం చాల అవసరం. తెలంగాణ తండ్లాట పరిష్కారమయిందనే అభిప్రాయం ఇవాళ మరొకసారి వ్యాపిస్తున్నప్పుడు, అప్పటి పరిష్కారాన్ని పునర్దర్శించడం చాల అవసరం. సరిగ్గా అప్పటిలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక శక్తులలో ఒక శక్తిది మాత్రమే పైచేయి అవుతున్నప్పుడు నాటి చరిత్రను మననం చేసుకోవడం అవసరం. గత వర్తమానాల మధ్య సంభాషణ ఇవాళ్టి అవసరం.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర మీద దాదాపు వంద పుస్తకాలు వెలువడినప్పటికీ, అది చరిత్ర, జీవిత చరిత్ర, ఆత్మకథ, వ్యాసం, కథ, నవల, కవిత్వం, నాటకం, విశ్లేషణ వంటి అన్ని ప్రక్రియలలోకీ వ్యాపించినప్పటికీ ఇంకా ఆ పోరాటాన్ని చారిత్రక, సామాజిక, స్థానిక నేపథ్యం నుంచి చూడవలసినంతగా, చూడవలసినట్టుగా చూడలేదనే అనిపిస్తుంది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ నడిపిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం ఎంత సముచితమో, తెలంగాణ సమాజం భారత కమ్యూనిస్టు పార్టీకి నేర్పిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం కూడ అంతే సముచితం. నిజానికి 1938-39ల్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో ప్రవేశించడానికి చాల ముందు నుంచే తెలంగాణ సమాజంలో ధిక్కార స్వభావం ఉన్నది. మెరుగైన, మంచి బతుకు కోసం తండ్లాట ఉన్నది. తెలంగాణ సమాజం సాగించిన ఆ తండ్లాటకు స్వయంనిర్ణయాధికారం, స్వావలంబన, స్వాభిమానం అనే మూడు ఆకాంక్షల ఆధార భూమికలున్నాయి. ఆ ఆకాంక్షలు అర్థవంతంగా, సుస్థిరంగా నెరవేరాలంటే విశాల ప్రజారాశుల భాగస్వామ్యంతో, శాస్త్రీయ దృక్పథంతో, సమగ్ర పోరాటం జరగాలనే అవగాహన బలపడిన సందర్భం బోనగిరి ఆంధ్ర మహాసభ.

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

తెలంగాణలో స్వయంనిర్ణయాధికార ఆకాంక్షను ఢిల్లీని ఎదిరించిన ప్రతాపరుద్రుడి నాటికీ, కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ ల దగ్గరికీ తీసుకుపోవచ్చు గాని, అంత వెనక్కి వెళ్లకుండా ఆధునిక యుగం నుంచే చూడవచ్చు. అది 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వ్యక్తమయింది. ఆనాడు విదేశీ అధికారాన్ని ప్రశ్నిస్తూ దేశంలోని నాలుగు వర్గాల (సైనికులు, రైతాంగం, చేతివృత్తుల వారు, సంస్థానాధీశులు) మహత్తరమైన ఐక్యసంఘటన పోరాటాన్ని ప్రారంభించినప్పుడు, ఆ పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించినప్పుడు, బ్రిటిషిండియాలో భాగం కాని హైదరాబాద్ రాజ్యానికి దానితో సంబంధం ఉండనవసరం లేదు. కాని సర్ సాలార్ జంగ్ (1829-1883) నాయకత్వాన అసఫ్ జాహి పాలకులు బ్రిటిష్ వారికి సహకరించడానికీ, పొరుగు ప్రాంతాల భారత స్వాతంత్ర్య సైనికులను అణచడానికీ కూడ ప్రయత్నించినప్పుడు, హైదరాబాద్ తిరుగబడి, తన స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించింది. మరెక్కడా లేనివిధంగా ఒక స్వతంత్ర సంస్థానంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్ ల నాయకత్వాన బ్రిటిష్ వ్యతిరేక అసాధారణ పోరాటాన్ని నడిపినది తెలంగాణ సమాజం. హైదరాబాద్ నడిబొడ్డున బ్రిటిష్ రెసిడెంట్ బంగళాను దిగ్బంధనం చేసి తుపాకి కాల్పులతో గడగడలాడించినది తెలంగాణ సమాజం. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం దేశవ్యాప్తంగా అణచివేతకు గురైనా రెండు సంవత్సరాల దాకా ఆ జ్వాల ఆరిపోకుండా కాపాడిన మరాఠా వీరులకు ఆశ్రయం ఇచ్చినది తెలంగాణ.

 

అలాగే స్వావలంబన కోసం తపన కూడ మొత్తం భారత ఉపఖండంలోనే మొదటిసారిగా తెలంగాణలో వ్యక్తమయింది. ఆ వ్యక్తీకరణలో శాస్త్రీయ దృష్టి ఉందా, విశాల భాగస్వామ్యం ఉందా అని ఇవాళ ప్రశ్నించవచ్చుగాని, అసలు ఆనాటి సమాజంలో ఆ ప్రశ్న వెలువడడమే గణనీయమైన అంశం. ఒకవైపు బ్రిటిష్, ఫ్రెంచి ఆధునికతా పవనాలు రాజ్యంలో నింపుతున్న సాలార్ జంగ్ సంస్కరణలు అమలు జరుగుతుండగానే, స్థానిక మౌలిక సౌకర్యాల కోసం పరాయి దేశపు కంపెనీకి ఎర్ర తివాచీ పరవగూడదని నినదించింది తెలంగాణ, బహుశా దేశంలో బహుళజాతి సంస్థలకు తొట్టతొలి వ్యతిరేకతను ప్రకటించినది తెలంగాణ. సాలార్ జంగ్ మరణానికి ముందే ఆమోదించిన చాందా రైల్వే స్కీమ్ పట్ల, ముఖ్యంగా ఆ స్కీమ్ ను బ్రిటిష్ పెట్టుబడిదారీ సంస్థల లాభాల కోసం తయారు చేయడం పట్ల 1883లో వ్యతిరేక ఆందోళన ప్రారంభమయింది. వాడి నుంచి హైదరాబాదు దాకా ఉండిన రైల్వే లైనును చాందా దాకా విస్తరించడానికీ, ఆ విస్తరణ పనులను బ్రిటిష్ సంస్థలకు అప్పగించడానికీ, ఆ సంస్థల లాభాలకు హామీ ఇవ్వడానికీ నిర్దేశించినది ఈ స్కీము. అప్పటికే ఉండిన అంజుమన్-ఎ-ఇక్వాన్-ఉస్-సఫా నాయకత్వంలోనూ, కొత్తగా ఏర్పడిన చాందా రైల్వే స్కీం వ్యవహారాల కమిటీ నాయకత్వంలోనూ పోరాటం జరిగింది. ప్రభుత్వ పథకపు పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఈ సంస్థలు కోరాయి. రాచరిక ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజెప్పాలని కోరడమంటే, అందులోనూ విదేశీ సంస్థల ప్రయోజనాన్ని వ్యతిరేకించడమంటే ఎంత ప్రగతిశీల ఆలోచనో చెప్పనక్కర లేదు.

అలాగే స్వాభిమానం కోసం తపన అప్పటి సామాజిక, రాజకీయ స్థితిలో మత, కుల, భాషా రూపాలలో వ్యక్తమై ఉండవచ్చు గాని అట్టడుగున ఉన్నది ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచనే. అందుకు, 1895లో మొదటి మరాఠీ గ్రంథాలయంగా భారత గుణవర్ధక సంస్థ, 1901లో మొదటి తెలుగు గ్రంథాలయంగా శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, 1906 జగన్ మిత్ర మండలి వంటి ఎన్నో వ్యక్తీకరణలను చూడవచ్చు. ఆ వరుసలోనిదే 1921లో ఏర్పడిన ఆంధ్ర జనసంఘం, 1923లో రూపొందిన ఆంధ్ర జన కేంద్ర సంఘం. న్యాయవాదులతో, విద్యావంతులతో ఏర్పడిన ఆ సంస్థే 1931 నాటికి విశాల ప్రజారాశుల ఆంధ్ర మహాసభగా మారింది. తమ భాషలో మాట్లాడి అవహేళనకు గురైన తెలుగువారి సంస్థగా సాంస్కృతిక మూలాల నుంచి ప్రారంభమైన ఆ సంస్థ, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, భూమి-భుక్తి-విముక్తినీ కోరే సామాజిక, రాజకీయ సంస్థగా ఎదిగింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర వంటి అంశాల మీద పోరాటం, అంతిమంగా రాజకీయార్థిక మూలాలను ప్రశ్నించకుండా సార్థకమూ అర్థవంతమూ కాజాలదని గుర్తించింది. నాలుగు శాతం కన్న తక్కువ అక్షరాస్యత ఉన్న సమాజంలో గ్రంథాలయోద్యమం ఏమిటనే వైరుధ్యం నుంచి బుద్ధిజీవుల, విద్యావంతుల సామాజిక బాధ్యతా స్పృహ వెలికివచ్చింది. ఆ పరిణామక్రమంలోనే ఆంధ్ర మహాసభ మహాఘనతవహించిన నిజాము రాజుగారి దివ్యసమ్ముఖమునకు మహజర్లు, విన్నపాలు సమర్పించే స్థితి నుంచి వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న అసంఖ్యాక నిరక్షరాస్య జనానికి చేరువయింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి వేదిక అయింది. అక్షరోపజీవులు తమ సమస్య అనుకుని ప్రారంభించిన ఉద్యమానికి నిరక్షరాస్య బండి యాదగిరి పాట మార్గ నిర్దేశనం చేసింది. ఉపరితల భాషా సమస్య దగ్గర ప్రారంభమైన కదలిక పునాది భూమి సమస్యకు చేరింది. రంగస్థలం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నుంచి కామారెడ్డిగూడానికీ, పాలకుర్తికీ, మొండ్రాయికీ, ధర్మాపురానికీ మారింది.

బోనగిరి ఆంధ్ర మహాసభను ఈ నేపథ్యంలో చూడవలసి ఉంది. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతున్నందువల్ల, వారు గ్రామాలలో అశాంతికి కారకులవుతున్నందువల్ల తాము ఆంధ్రమహాసభ నుంచి తటస్థంగా ఉంటామని ‘జాతీయవాదుల’మని చెప్పుకునేవారు బోనగిరి సభలకు సహాయ నిరాకరణ ప్రారంభించారు. ఏ పక్షానికీ చెందనివారమని ప్రకటించుకున్న అప్పటి అధ్యక్షులు కొండా వెంకటరంగారెడ్డి, కార్యదర్శి మందుముల రామచంద్రరావు సభల్లో ప్రారంభోపన్యాసం చేసి, కవిలెకట్టలు అప్పగించి మిగిలిన సభలో కూడ పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రవేశమో, జోక్యమో, ప్రాబల్యమో ఉన్నాయా లేవా అనేది చర్చనీయాంశమే. కాని అంతకన్న ముఖ్యంగా, ఆనాటి తెలంగాణ సమాజంలో అతి పెద్ద ప్రజాసంస్థలో నిజమైన ప్రజాసమస్యల ప్రస్తావన ప్రారంభం కాగానే ఎవరెవరు తప్పుకోజూశారనేది, ఎవరెవరు నిలబడి పోరాడుతామన్నారనేది ప్రధానం. ప్రజాసమస్యలపై పోరాటానికి, పరిష్కారానికి తాను సిద్ధంగా లేనని ఒక వర్గం నాయకత్వం, ఆ తర్వాత మొత్తంగా కాంగ్రెస్ లో చేరిపోయిన నాయకత్వం ప్రకటించిందనేది వాస్తవం. అప్పుడు కమ్యూనిస్టులు మేమున్నామంటూ ముందుకొచ్చారు.

అప్పటి తెలంగాణ సమాజంలో అధికారాన్ని ధిక్కరించిన ఆర్యసమాజం మతంలో కూరుకుపోయింది. దానికి వ్యతిరేకంగా వచ్చిన ఇత్తెహాదుల్ ముసల్మీన్ అధికారంతో అంటకాగింది. ఈ రెండు సంస్థలతో పాటు మరొక అరడజను ఇటువంటి సంస్థలు 1938 నాటికే నిషేధానికి గురయ్యాయి. కుల సంఘాలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి గాని అవి అప్పటికింకా ప్రజల మౌలిక సమస్యలను ప్రస్తావించడం లేదు. భయ సంకోచాలతో పుట్టిన స్టేట్ కాంగ్రెస్ తాను తెలంగాణ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించనని స్పష్టంగానే చెప్పింది. ఆ నేపథ్యంలో జరిగినది బోనగిరి ఆంధ్ర మహాసభ. అక్కడ తాను ప్రజల పక్షం ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం నిర్మిస్తానని, నిర్మాణమవుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కమ్యూనిస్టు పార్టీ మనసా వాచా కర్మణా ప్రకటించింది గనుకనే తెలంగాణ సమాజం కమ్యూనిస్టు పార్టీని తన గుండెలకు హత్తుకుంది. ఏడు దశాబ్దాల తర్వాత కూడ తెలంగాణ సమాజంలో కమ్యూనిస్టుల పట్ల ప్రేమ అందువల్లనే.

స్టేట్ కాంగ్రెస్ మీద 1938లో విధించిన నిషేధాన్ని 1946 వరకూ కూడ తొలగించనందువల్ల పైకి స్టేట్ కాంగ్రెస్ అని చెప్పుకోకపోయినా ఆ భావాలు గలవాళ్లు ఆంధ్ర మహాసభలో ‘జాతీయవాదులు’ పేరిట కొనసాగారు. 1942లో నిషేధం ఎత్తివేసినందువల్ల కమ్యూనిస్టులు బహిరంగంగా పనిచేసే అవకాశం వచ్చింది గాని వారు కూడ ఆంధ్ర మహాసభలోనే కొనసాగారు. ఈ రెండు ప్రత్యర్థి పక్షాలే కాక ఏ పక్షానికీ చెందని వారు కూడ ఆంధ్ర మహాసభలో పెద్ద సంఖ్య లోనే ఉన్నారు. ఆంధ్ర మహాసభ వివిధ వృత్తులవారితో, వివిధ రాజకీయ విశ్వాసాలు గలవారితో నిజంగా ఒక విశాలమైన ఐక్యసంఘటనగా కొనసాగింది. అప్పటికి పదిహేను సంవత్సరాలుగా ఇలా సాగుతున్న సమన్వయం భూపోరాటాలు ప్రారంభం కాగానే చెదిరిపోయింది. ఆ చీలిక బోనగిరిలో స్థిరపడింది. తర్వాత ఆంధ్ర మహాసభ ఎక్కువరోజులు పనిచేయలేకపోయింది గాని, దొడ్డి కొమరయ్య హత్యతో (1946 జూలై 4) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమయింది. ఐదు సంవత్సరాల పాటు సాగిన ఆ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి అటు భూమి-భుక్తి-విముక్తి ఆకాంక్షలనూ, ఇటు స్వయం నిర్ణయాధికారం – స్వావలంబన – స్వాభిమాన ఆకాంక్షలనూ ఒక మేరకు సాధించింది. ఐదు సంవత్సరాల తర్వాత 1951 అక్టోబర్ 20న ఆ పోరాటం అర్ధాంతరంగా ఉపసంహరణ జరిగి ఉండకపోతే ఆ ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరేవే, సుస్థిరంగా ఉండేవా, తెలంగాణ తండ్లాటకు శాశ్వత పరిష్కారం దొరికి ఉండేదా…. ఇప్పుడన్నీ ఊహాత్మకమైన ప్రశ్నలే. కాని ఆ నాడు తెలంగాణ మట్టి మనిషి సంధించిన ప్రశ్నలూ ఆయుధాలూ ఇవాళ్టికీ ఆరని నిప్పుకణికల్లా రగులుతూనే ఉన్నాయి.

telangana 14

ఈ గతం వెలుగులో వర్తమానాన్ని చూస్తే, తెలంగాణ సమాజపు తండ్లాటకు ఇటీవలి వ్యక్తీకరణ ఆంధ్ర మహాసభ కన్న విస్తృతమైనది. వర్గం, బృందం, కులం, మతం, వయసు, స్త్రీపురుష భేదం వంటి అంతరాలన్నిటినీ పక్కనపెట్టి తెలంగాణ సమాజమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది. రాష్ట్ర సాధనే తన తండ్లాటకు పరిష్కారమని భావించినట్టు అనిపించింది. రాష్ట్రం ఏర్పడింది గాని తండ్లాట పరిష్కారమవుతుందా అని అనుమానాలు అట్లాగే ఉన్నాయి. ఇన్ని శక్తులు ఐక్యంగా ఉద్యమించినప్పుడు విజయ ఫలాలు అన్ని శక్తులకూ వాటి భాగస్వామ్యం ప్రకారమైనా అందుతున్నాయా అని ప్రశ్న మిగిలే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వయంనిర్ణయాధికారం సంపూర్ణంగా అందిందా, పరిమితంగా, పాక్షికంగా అందిందా? ప్రపంచీకరణ రాజకీయాల, కార్పొరేట్ పన్నాగాల యుగంలో స్వావలంబన ఏ మేరకైనా సాధ్యమా? సాధ్యమైన మేరకైనా తెలంగాణ పాలకవర్గాలు అమలుచేస్తాయా? బహుశా స్వాభిమానం, ఆత్మగౌరవం గత అరవై సంవత్సరాలలో అనుభవించినదానికన్న కాస్త ఎక్కువే అనుభవించే అవకాశం వస్తుందేమో.

బోనగిరిలో 1944 మే 27-28ల్లో సాధించిన విజయం, తెలంగాణ వ్యాప్తంగా 1951 అక్టోబర్ 20న చెదిరిపోయింది. ‘నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా’ అనే ఆందోళన నిరాశతో అంతమయింది. 2014 జూన్ 2 ఏమవుతుంది?

 

-ఎన్. వేణుగోపాల్

 

సామూహిక జ్ఞాపకంతో సాహిత్యానికి కొత్త ఊపిరి!

venu

“సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్ఞ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు – ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు” అని సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధాన్ని సురవరం ప్రతాపరెడ్డి ఒక కోణం నుంచి చెప్పారు. ఆయన 1940ల చివర ప్రారంభించిన ఆ కృషి ఆ తర్వాత ఏడు దశాబ్దాలకైనా అవసరమైన స్థాయిలో, సమర్థంగా కొనసాగలేదని, కొనసాగడం లేదని గుర్తించక తప్పదు.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధం గురించి లోతుగా ఆలోచించినకొద్దీ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంగతులెన్నో కనబడతాయి. ప్రతాపరెడ్డి చూసినట్టుగా గత సాంఘిక చరిత్ర గత సాహిత్యంలో ప్రతిఫలించిన తీరును మాత్రమే కాదు, గత సాంఘిక చరిత్ర వర్తమాన సాహిత్యంలోకి ప్రవహించగల అవకాశాన్ని, గతంలోనైనా, వర్తమానంలోనైనా ఇటునుంచి అటుగా సాహిత్యం సాంఘిక చరిత్ర మీద వేయగల ప్రభావాన్ని చూస్తే చరిత్రకూ సాహిత్యానికీ కూడ ఎన్నో కానుకలు దొరుకుతాయి, గతం, వర్తమానం, నిన్నటి సాహిత్యం, ఇవాళ్టి సాహిత్యం అనే ఈ నాలుగు భుజాల చతురస్రం లోపల ఎన్నెన్ని పరస్పర సంబంధాలకూ సమ్మేళనాలకూ వియోగాలకూ మార్పులకూ చిక్కుముడులకూ పరిష్కారాలకూ వికాసానికీ అవకాశం ఉందో ఊహిస్తే నిజంగా దిగ్భ్రాంతి కలుగుతుంది.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ పరస్పర అన్యోన్య సంబంధం ఉందని గుర్తించి దానితో సవ్యంగా వ్యవహరిస్తే అటు చరిత్ర రచనా ఇటు సాహిత్యమూ కూడ విస్తృతినీ లోతునూ సంతరించుకుంటాయి. సాహిత్యం నుంచి సాంఘిక చరిత్రను తవ్వితీయడానికి ప్రతాపరెడ్డి చేసిన ప్రయత్నం గురించీ, దాన్ని కొనసాగించవలసిన అవసరం గురించీ మరోసారి మాట్లాడుకుందాం గాని, ఇప్పుడు చరిత్రనుంచి సాహిత్యం ఏమి తీసుకోవచ్చునో, తీసుకుంటే ఎట్లా సంపన్నమవుతుందో, తీసుకుంటున్నదో లేదో కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సాంఘిక చరిత్ర అంటే అక్షరాస్యులకు, విద్యావంతులకు ఒక ప్రచురిత పుస్తకం అనే పరిమిత అర్థమే స్ఫురించవచ్చు గాని, అక్షరాస్యులకూ, నిరక్షరాస్యులకూ, సమాజం మొత్తానికీ అది సామూహిక జ్ఞాపకంగా, తరతరాల వివేక సంచితంగా ఉంటుంది. నిజానికి సాంఘిక చరిత్రకు ప్రతాపరెడ్డి ప్రస్తావించిన పదిహేను ఆకరాలలో ఆరు మాత్రమే లిఖిత, అక్షర ప్రమాణాలు. మిగిలినవాటికి అక్షరాస్యతతో సంబంధం లేదు. ఆయన చెప్పినవాటికి గ్రామ గాథలు, జానపదగాథలు, వీరగాథలు, చిన్నపిల్లలకు చెప్పే కథలు, మాటలు, ఆచారాలు, ఊహల మీద, ప్రగల్భాల మీద నిర్మాణమై క్రమంగా వాస్తవమేమో అనిపించేలా పెరిగి మిగిలిపోయే భ్రమలు వంటి ఎన్నిటినో కూడ కలుపుకోవలసి ఉంది. అవి వస్తురూపంలో ఉన్నా, శబ్దరూపంలో ఉన్నా, అలవాటు రూపంలో ఉన్నా అటువంటి సాంఘిక చరిత్ర ఆకరాలన్నిటినీ గ్రహించడం, వాటిని విశ్వసనీయ, మానవీయ సన్నివేశాలలో అక్షరీకరించడం సాహిత్యానికి చాల ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవన్నీ మానవ ఆలోచనా ప్రపంచంలో ఆయా సమాజాలలో సామూహిక జ్ఞాపకంగా నిలిచి ఉన్నాయి. ఒక రకంగా చూస్తే సామూహిక జ్ఞాపకం ఏ ఒక్క రచయితకూ ఆపాదించడానికి వీలులేని సామూహిక రచన అనుకోవచ్చు. సరిగ్గా సాహిత్యసృజనలో లాగనే సామూహిక జ్ఞాపకంలో కూడ జరిగినది జరిగినట్టుగా కాక, నివేదికగా కాక, వడకట్టిన, జల్లెడ పట్టిన, కాలక్రమంలో మార్పుచేర్పులకు గురైన జ్ఞాపకాల రాశిగా ఉంటుంది. దానిలో వాస్తవమూ ఉంటుంది, కల్పనా ఉంటుంది. విశ్వసనీయతా ఉంటుంది, ఐంద్రజాలికతా ఉంటుంది.

1891055_10202661894681481_1753979965_n

ప్రపంచంలో సుప్రసిద్ధమైన సాహిత్య రచనలు వేటిని పరిశీలించినా అవి ఈ సామూహిక జ్ఞాపకం మీద ఆధారపడ్డాయని అర్థమవుతుంది. నిజానికి మౌఖిక సాహిత్యం మొత్తానికీ దాదాపుగా సామూహిక జ్ఞాపకమే ఇతివృత్తం. ఆ సామూహిక జ్ఞాపకం మనిషిని ఎప్పుడైనా ఆకర్షిస్తుంది గనుకనే మౌఖిక సాహిత్యానికి ఆకర్షణ ఇప్పటికీ తగ్గలేదు. కాని రాజాస్థానాల సాహిత్యం, లిఖిత సాహిత్యం క్రమక్రమంగా ఈ సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై వ్యక్తి ప్రధానంగా, వ్యక్తి జ్ఞాపకంగా పెరుగుతూ వచ్చాయి. ఇవాళ వ్యక్తి ప్రధానమైన ఆధునిక సమాజపు ప్రతిఫలనంగా ఆధునిక సాహిత్యం ఆ మేరకు సామూహికత నుంచి, ముఖ్యంగా ఇతివృత్తంలో సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై మిగిలింది. సామూహిక జ్ఞాపకం ఇతివృత్తాన్ని స్వీకరించి దాని మీద అభివృద్ధి చేసే అవకాశం స్వాభావికంగానే కొన్ని ప్రక్రియలకు ఎక్కువా, కొన్ని ప్రక్రియలకు తక్కువా ఉన్నదనిపిస్తుంది. సామూహిక జ్ఞాపకాన్ని వినియోగించుకో గలిగిన శక్తి ఆధునిక ప్రక్రియలలో మిగిలిన ప్రక్రియల కన్న నవలకే ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంది.

ఇలా ఆలోచించినప్పుడు తెలుగు నవల ఎదగకపోవడానికి సామూహిక జ్ఞాపకం నుంచి, సాంఘిక చరిత్ర నుంచి దూరం కావడమే, తీసుకోవలసినంత తీసుకోకపోవడమే ఒక కారణం కావచ్చునా అని అనుమానం కలుగుతుంది. నవల మొత్తంగా చారిత్రక నవల కానక్కరలేదు, అప్టన్ సింక్లెయిర్ ను ఉదాహరణగా పెట్టుకుని రాశానని మహీధర రామమోహనరావు స్వయంగా చెప్పుకున్న చారిత్రక నవలల పరంపర లాంటిది కూడ అవసరం లేదు. వ్యక్తి ప్రధానమైన, కొన్ని పాత్రలే ప్రధానమైన ఏ ఇతివృత్తపు నవల అయినా సామూహిక జ్ఞాపకం దానికి జవసత్వాలను ఇవ్వగలుగుతుందని నాకనిపిస్తుంది. పాఠకులకు ఆ సామూహిక జ్ఞాపకంతో సంబంధం ఉంటుంది గనుక నవల వికసించడానికి మాత్రమే కాదు, పాఠకులు దానితో తాదాత్మ్యం చెందడానికి కూడ అది దోహదం చేస్తుంది.

సామూహిక జ్ఞాపకంలో మరొక అంశం కూడ అంతర్గర్భితంగా ఉంటుంది. ఎన్నో ఘటనలు, క్రమాలు జరిగి, ఆ ఘటనలు, క్రమాలు చరిత్రకు ఎక్కకపోయినా, గుర్తు లేకపోయినా, ఎక్కడా మౌఖికంగా గాని, లిఖితంగా గాని నమోదు కాకపోయినా వాటి అంతిమ ఫలితమైన ఒక అవగాహన, ఒక స్వభావం, ఒక అమూర్త భావన ఆ సమూహపు జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది. ఒక సాహిత్య రచన ఆ స్వభావానికి సరిపోయే సన్నివేశాన్ని చరిత్రనుంచి తీసుకుని మెరుగుపెట్టినప్పుడు, లేదా ఊహాశాలితతో సృష్టించగలిగినప్పుడు ఆ సన్నివేశం నిజమైనా కాకపోయినా, పూర్తిగా కల్పనే అయినా పాఠకులు దాన్ని తమ సామూహిక జ్ఞాపకానికి ఒక నిదర్శనంగా, వ్యక్తీకరణగా చూస్తారు. తద్వారా అది పూర్తి కల్పనే అయినా విశ్వసనీయతను సంతరించుకుంటుంది. బి. ట్రావెన్, గాబ్రియెల్ గార్షియా మార్కెజ్, ఎడువార్డో గలియనో, ఇసబెల్ అయెండి, మాన్లియో అర్గెటా, ఎరియెల్ డార్ఫ్ మన్, చినువా అచెబె, గూగీ వా థియోంగో, బుచి ఎమిచిటా వంటి లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ రచయితల శక్తి తమ సమాజాలలోని సామూహిక జ్ఞాపకాలకు కళారూపం ఇవ్వడంలో, లేదా తమ రచనలలో ఆ జ్ఞాపకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో ఉందనుకుంటాను.

చరిత్రనుంచీ, జీవితచరిత్రల నుంచీ కొన్ని ఉదాహరణల ద్వారా తెలంగాణ జీవితంలోని అటువంటి సామూహిక జ్ఞాపకాలు సాహిత్యానికి ఎంత మేలు చేయగలవో చూపడానికి ప్రయత్నిస్తాను. ఆధిపత్యం పట్ల ధిక్కారం, పోరాటం తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో భాగం. కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఈ సామూహిక జ్ఞాపకాన్ని బలపరిచే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, పాల్కురికి సోమన, పోతన, సర్వాయి పాపన్న, రాంజీ గోండు, తుర్రెబాజ్ ఖాన్, బందగీ, కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయెబుల్లా ఖాన్ వంటి అనేక చిహ్నాలు ఈ సామూహిక జ్ఞాపకాన్ని సృష్టించాయి, పునరుత్పత్తి చేశాయి. బలోపేతం చేశాయి. ప్రత్యక్షంగా ఈ ప్రతీకలను గాని, ఈ ప్రతీకల ద్వారా వ్యక్తమైన ధిక్కార భావనను గాని ఇతివృత్తంగా తీసుకునే సాహిత్యానికి తప్పనిసరిగా ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

పైన చెప్పిన సామూహిక జ్ఞాపకపు ప్రతీకలన్నీ సుప్రసిద్ధమైనవే, ఇటీవలి కాలంలో మళ్లీ మళ్లీ స్మరణకు వచ్చినవే. కాని తెలంగాణ చరిత్ర సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇటువంటి మరెన్నో ఘటనలు, పరిణామాలు, ప్రతీకలు ఉన్నాయని స్పష్టమయింది.

ఉదాహరణకు పాలకుర్తి గ్రామాన్ని తీసుకొండి. పాల్కురికి సోమన ఆ గ్రామం నుంచి వచ్చి శివకవిగా, ప్రచారకుడిగా, సామాజిక చింతకుడిగా తన కాలం కన్న చాల ముందుకు చూశాడు. మార్గ సంప్రదాయాన్ని ధిక్కరించి దేశి పద్ధతి చేపట్టాడు. ఉరుతర గద్య పద్యోక్తులను, సంస్కృత సమాస భూయిష్ట రచనను తిరస్కరించి జానుతెనుగులో, ద్విపదలో రచించాడు. అప్పటికి ఉన్న ఆనవాయితీని కాదని బసవపురాణం రాశాడు. జాతిభేదాన్ని, స్త్రీపురుష భేదాన్ని, కులగోత్రాలను, కలిమిలేములను గుర్తించని వీరశైవాన్ని అనుసరించాడు. ఆయన జీవితకాలంలో ఒక చాకలి స్త్రీకి శివదీక్ష ఇచ్చాడని ఆధారాలున్నాయి. అదే గ్రామంలో ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక చాకలి స్త్రీ దొరతనాన్ని ధిక్కరించడం సంబంధం లేనిదనీ, యాదృచ్ఛికమనీ అనిపించవచ్చు గాని నేను దాన్ని సామూహిక జ్ఞాపకపు పునరుత్పత్తి అనుకుంటాను. సోమన ధిక్కారం భాషలో, సాహిత్యంలో, సంస్కృతిలో, మతాచారాలలో జరిగితే, ఐలమ్మ ధిక్కారం భూమి మీద, శ్రమ ఫలితం మీద, అధికారం మీద, చట్టం మీద జరిగింది. ఈ రెండు ధిక్కారాలూ వేరువేరు అనుకునే దృక్పథం కూడ ఉంది గాని, నా ఉద్దేశంలో ఈ రెండూ పరస్పరాశ్రితాలు. సోమన ధిక్కారాన్ని బలోపేతం చేయగలిగిందీ, అర్థవంతం చేయగలిగిందీ, సుస్థిరం చేయగలిగిందీ ఐలమ్మ ధిక్కారమే. ఈ అన్యోన్య సంసర్గం, ఇంత సుదీర్ఘకాలపు కొనసాగింపు తప్పనిసరిగా సాహిత్యానికి అద్భుతమైన ముడిసరుకు అవుతుంది.

అలాగే కడివెండి గ్రామాన్ని చూడండి. విసునూరు రామచంద్రారెడ్డి అధీనంలోని గ్రామంగా, కర్కోటకురాలని పేరు తెచ్చుకున్న ఆయన తల్లి స్వయంగా పాలించిన గ్రామంగా ఆ ఊరు సహజమైన ప్రతిఘటనను ప్రకటించింది. ఆ ప్రతిఘటన క్రమంలో తగినంత మిగులులేని గ్రామ రైతుల దగ్గరినుంచి బలవంతంగా వసూలు చేస్తున్న యుద్ధపు లెవీ, గుమ్ములు పొర్లిపారుతున్న దొర గడీకి ఎందుకు వర్తించదని ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న ఊరేగింపు రూపం ధరించింది. ఆ ఊరేగింపు మీద కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించాడు. ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు అదే గ్రామానికి చెందిన పైళ్ల వెంకటరమణ గాని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి గాని మరొక ఐదారుగురు గాని మరొక ప్రజావిముక్తి సమరంలో అటువంటి ప్రశ్నలే వేసి ప్రాణత్యాగాలు చేశారు. ధిక్కార, త్యాగ చరిత్ర ఆ గ్రామపు సామూహిక జ్ఞాపకంలో మాత్రమే కాదు, మొత్తంగానే ఈ ప్రాంతపు, తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో, సాంఘిక చరిత్రలో భాగమైంది. ఇది సాహిత్యంలోకి అనువాదమైతే ఎంత రోమాంచకారి ప్రభావం కలగజేయగలుగుతుంది!

ఇలా వెతుకుతూ పోవాలే గాని, తెలంగాణ చరిత్ర నిండా, ఆమాటకొస్తే ఎక్కడైనా ప్రజల చరిత్ర నిండా ఎన్నెన్నో అద్భుతమైన ఘటనలు, పరిణామాలు దొరుకుతాయి. ఆ సామూహిక జ్ఞాపకాన్ని, సాంఘిక చరిత్రను తవ్వితీసి సాహిత్యరూపం ఇవ్వడం సాహిత్యకారుల బాధ్యతలలో ఒకటనుకుంటాను. ఈ తవ్వితీయడానికి గనులుగా ప్రతాపరెడ్డి చెప్పిన ఆకరాలు మాత్రమే కాదు, మరెన్నో ఆకరాలున్నాయి.

వరంగల్ లో భాగమైన వడ్డెపల్లి భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాగా ఎదిగిన పింగళి జగన్మోహన రెడ్డి తన ఆత్మకథలో ఒక ఉదంతం రాశారు. అది తన ముత్తాత కాలం నాటిదని, అందువల్ల దానిలో వాస్తవం ఎంతో చెప్పలేమని ఆయనే రాశారు. హనుమకొండలో ఇప్పటికీ రాగన్న దర్వాజ అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఆ రాగన్న జగన్మోహనరెడ్డికి పూర్వీకుడు. ఆ రాగన్నను హత్య చేసిన నేరం మీద ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. ఆ శిక్ష అమలు చేయబోయే సమయానికి ఆ వ్యక్తి తమ్ముడు వచ్చి, ‘మా అన్న భార్యాబిడ్డలు ఉన్నవాడు. మరణశిక్ష అమలుచేస్తే వాళ్లు దిక్కులేనివారైపోతారు. నాకు వెనుకాముందూ ఎవరూ లేరు. అందువల్ల మా అన్నకు వేసిన శిక్షను నాకు బదిలీ చేసి, నన్ను ఉరితీయండి’ అని కోరాడట. నిజంగానే ఆ తమ్ముడికే శిక్ష అమలు చేశారట. వాస్తవం కల్పన కన్న అద్భుతంగా ఉంటుందనడానికి ఇంతకన్న నిదర్శనం ఉంటుందా?

తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇటువంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఘటనల వనరులలో ‘హైదరాబాద్ అఫెయిర్స్’ ఒకటి. అసలు ఆ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ కథే తెలుసుకోవలసిన కథ. హైదరాబాదు రాజ్యంలో పందొమ్మిదో శతాబ్దం చివరిలో జరిగిన విశేషాలగురించిఅప్పటి పత్రికలలో వచ్చిన వార్తలన్నిటినీ నిజాం ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శిగా ఉండిన మౌల్వీ సయ్యద్ మహదీ అలీ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ పేరుతో పన్నెండో, పదమూడో పెద్ద సంపుటాలుగా సంకలనం చేసి 1880లలో ప్రచురించాడు. అవి ఫూల్ స్కేప్ సైజులో ఒక్కొక్కటి మూడు వందల పేజీల నుంచి తొమ్మిది వందల పేజీల దాకా ఉంటాయి. ఆ సంపుటాలు చదువుతుంటే నూట యాభై సంవత్సరాల వెనుకటి హైదరాబాద్ రాజ్యం, సమాజం, పాలన, సంస్కృతి కళ్లముందర కదలాడుతాయి. (అయితే దురదృష్టమేమంటే అన్ని సంపుటాలూ ఒక్కచోట ఇంతవరకూ నేను చూడలేకపోయాను. బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లోనూ, డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ కార్యాలయంలోనూ చాల సంపుటాలు ఉండేవి. ఇప్పుడు మొదటి దాంట్లో అన్నీ లేవు, రెండో కార్యాలయమే లేదు. ఇక్కడ కనబడని సంపుటాలు కొన్ని నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ గ్రంథాలయంలో కనబడ్డాయి గాని అవి ఫొటోకాపీ చేయించుకోవడం కుదరలేదు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర ఒక అద్భుతమైన పాత పుస్తకాల ఫోటోకాపీల అమ్మకందారు దగ్గర ఆరేడు సంపుటాలు సంపాదించాను గాని అన్నీ దొరకలేదనే లోటు అలాగే ఉంది.) ఆ సంపుటాలు తెలంగాణ సాంఘిక చరిత్ర గురించి ఎన్నో అరుదైన, ఆశ్చర్యకరమైన విషయాలను, సాహిత్యంలోకి పరావర్తనం చెందగల, ప్రతిఫలించడానికి అవకాశం ఉన్న విషయాలను ఇస్తాయి. అవన్నీ ఏదో ఒక స్థాయిలో మన సామూహిక జ్ఞాపకంలో భాగమయ్యాయనే అనుకుంటాను. ఇక్కడ మచ్చుకు ఒకటి చెపుతాను:

కలకత్తా నుంచి వెలువడుతుండిన ఇంగ్లిష్ మన్ పత్రికలో 1859లో వచ్చిన వార్త ప్రకారం హనుమకొండకు పన్నెండు కోసుల దూరంలో రూపా అనే ఒక లంబాడీ పెద్ద మరొక తండా పెద్దతో వచ్చిన ఘర్షణలో ఆయననూ, ఆయన కుటుంబ సభ్యులనూ మొత్తం ముప్పైతొమ్మిది మందిని నరికేశాడట. ఆ నేరానికి నిర్బంధించి న్యాయస్థానానికి తీసుకొచ్చినప్పుడు, “నాకూ మా అన్నకూ తగాదా వచ్చి నేను ఆయనను చంపేస్తే విచారించడానికి మధ్యలో ఈ అదాలత్ ఎవరు? శిక్ష విధించడానికి సర్కారు ఎవరు? నేనేమన్నా సర్కారు సొమ్ము తిన్నానా? దోపిడీ చేశానా” అని అడిగాడట.

ఇది చదివినప్పుడు నాకు సరిగ్గా ఇటువంటి జ్ఞాపకాలనే లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యకారులు ఎలా కాల్పనీకరించి, అద్భుతమైన దృశ్యాలుగా, ఆలోచనాస్ఫోరకమైన సన్నివేశాలుగా మలిచారుగదా అనిపించింది.

చిట్టచివరిగా, ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజల స్వాభిమానాన్ని వ్యక్తీకరించే సాహిత్య రూపాలు విరివిగా వెలువడుతున్నాయి. నిజానికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ తెలంగాణ ప్రజల స్వాభిమాన కాంక్షకు ఒకానొక వ్యక్తీకరణ మాత్రమే. సాంఘిక చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే, 1950లో రైతాంగ సాయుధ పోరాట ప్రాంతాలలో పర్యటించిన అమెరికన్ విలేఖరి తాయా జింకిన్ ఒక జీపు డ్రైవర్ మాటల్లో వెలువడిన ఆనాటి ఆకాంక్షను నమోదు చేసింది. నువ్వే ప్రభుత్వమైతే ఏం చేస్తావు అని ఆమె అడిగిన ప్రశ్నకు ఆ డ్రైవర్ “జనానికి బాగా అప్పులిస్తాను. బోలెడన్ని బళ్లూ ఆస్పత్రులూ కట్టిస్తాను. దున్నేవాడికే భూమి పంపిణీ చేస్తాను. ఉర్దూ రద్దు చేస్తాను. తెలుగువాళ్లను అధికారులుగా నియమిస్తాను. గ్రామాల రక్షణకు స్వచ్ఛంద సాయుధ దళాలను ఏర్పాటు చేస్తాను…” అన్నాడట. ఈ కోరికలలో రెండిటిని ఇప్పుడు సవరించుకోవలసిన అవసరం ఉందేమో గాని, మౌలికంగా మిగిలిన కోరికలకు కాలం చెల్లలేదు. ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడ వాటిలో ఏ ఒక్కటీ తీరలేదు.

గతమూ వర్తమానమూ జ్ఞాపకమూ జీవితమూ కలగలిసిన సమాజం ఇది. ఈ చరిత్రనూ, సామూహిక జ్ఞాపకాన్నీ, ఊహనూ అద్భుతమైన సృజనగా రసాయనిక సంయోగం సాధించగల గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ వంటి సృజనకర్త కోసం ఈ నేల ఎదురుచూస్తున్నదనుకుంటాను.

-ఎన్. వేణుగోపాల్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

వందేళ్ల కిందటి తెలుగు మహిళ తిరుగుబాటు

venuరాని ‘సమయం’లో సమ్మె చేసి ఉద్యోగం పోగొట్టుకుని ఆరునెలలు నిరుద్యోగం చేసి, చివరికి బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్ (ఐసెక్) లో రిసర్చ్ అసిస్టెంట్ గా చేరడం నా జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇరవై రెండు సంవత్సరాల కింద జరిగిపోయిన ఆ మార్పు అనేక కారణాల వల్ల ఒక్క క్షణం కింద జరిగినంత బలంగా మనసు మీద ముద్ర వేసుకుంది. ఐసెక్ లైబ్రరీ, అక్కడి మేధో వాతావరణం, స్నేహబృందం గొప్ప వరాలు. ప్రత్యేకించి ఆ లైబ్రరీ మహా ఖజానా. అప్పటికి విని మాత్రమే ఉండి, చూసే అవకాశం కూడ దొరకని ఎన్నో పుస్తకాలు అక్కడ చేతికందాయి. అప్పటికి కొనుక్కోలేని పుస్తకాలెన్నో ఎంతో కొంత సంపాదనవల్ల, ఐసెక్ లో విద్యార్థులకు, ఉద్యోగులకు చౌకగా ఫొటోకాపీయింగ్ సౌకర్యం ఉండడం వల్ల, సొంతానికి సంపాదించుకోగలిగాను. అక్కడ అట్లా దొరికిన విలువైన పుస్తకాలలో ఒకటి ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’.

అప్పటికే రాజకీయాభిప్రాయాలవల్ల పరిచయస్తుడు, ఐసెక్ లో పబ్లికేషన్ అసిస్టెంట్ కె జి వాసుకి నేనక్కడ చేరిన రెండు నెలల లోపలే హఠాత్తుగా “డు యు నో సుందరమ్మ?” అని అడిగాడు. ఎవరా సుందరమ్మ అని ఎదురు ప్రశ్నించాను. అంతటి సుప్రసిద్ధ తెలుగు వ్యక్తి తెలియని నా అజ్ఞానానికి ఆయన చాల ఆశ్చర్యపోయాడు. “దేరీజ్ ఎ రేర్ బుక్ కాల్డ్ రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఇన్ అవర్ లైబ్రరీ. దటీజ్ ఎ సెంచురీ ఓల్డ్ బుక్. యు డోంట్ నో అబౌట్ హర్” అని నా అజ్ఞానానికి జాలిపడుతూ, బైటికి ఇవ్వని, పరిమిత చలామణీకి మాత్రమే అనుమతించే ఆ పుస్తకం నాకిచ్చాడు. ఆ పుస్తకాన్ని రెండు దశాబ్దాల వెనుక చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానో, ఇవాళ చదివినా అట్లాగే ఉంది. ఆ పుస్తకం వంద సంవత్సరాల కిందటి తెలుగు సమాజ శకలం ఒకదాన్ని సజీవంగా చూపుతుంది. మన గతం గురించి చెప్పే ఆ పుస్తకానికి వర్తమానంలో కూడ ఎంతో ప్రాసంగికత ఉంది.

2014-04-02-257

ఆ పుస్తకంలో పొదిలి, పెదారికట్ల, రాజుపాలెం అనే మూడు గ్రామాల పేర్లున్నాయి. వీటిలో మొదటి రెండూ ప్రస్తుత ప్రకాశం జిల్లా గ్రామాలు. ఇంటిపేర్లతో సహా దాదాపు పది, పదిహేను మంది మనుషుల వివరాలున్నాయి. హిందూ కుల మత దురాచారాల పీడనలో మగ్గిన ఒక స్త్రీ తిరుగుబాటు గాథ అది. ఇష్టానికి వ్యతిరేకంగా, అసలు ఇష్టాయిష్టాలు తెలియని బాల్యంలో నాలుగు రెట్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిగి, రెండో భార్యగా వెళ్లి, పదమూడేళ్లు నిండకుండానే కూతురికి జన్మనిచ్చి, ఆ కూతురికి కూడ బాల్య వివాహం చేయబోతుంటే తిరగబడిన స్త్రీ గాథ అది. ఆ స్త్రీ క్రైస్తవమతంలో చేరడమే తిరుగుబాటుగా రచయిత్రి చేసిన నిర్ధారణను పాఠకులు అంగీకరించవచ్చు. అంగీకరించకపోవచ్చు. కాని పదహారు అధ్యాయాల పుస్తకంలో క్రైస్తవం గురించి మాట్లాడినవి మూడు నాలుగు అధ్యాయాలు మాత్రమే. మిగిలిన అధ్యాయాలన్నీ హిందూ కుల మతాచారాలు, బ్రాహ్మణులు తమ భుక్తికోసం సృష్టించిన ఆచారవ్యవహారాల విధినిషేధాలు ఒక స్త్రీని ఎట్లా పీడించగలవో, ఎంత వేదనకు గురి చేయగలవో చూపేవే.

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది. అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

2014-04-02-258

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది.

sundaramma-1 sundaramma-2 sundaramma-3 sundaramma-5 sundaramma-6 sundaramma-7 sundaramma-8 sundaramma-9 sundaramma-10 sundaramma-11 sundaramma-12 sundaramma-13 sundaramma-14

అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

నూట అరవై పేజీల ఈ చిన్న పుస్తకంలో ప్రధాన కథ అయిన తెలుగు సామాజిక జీవన చిత్రణలో భాగంగా దాదాపు ఎనభై చిత్రాలు (అవి ఇండియన్ ఇంక్ డ్రాయింగ్ లు గాని, పెన్సిల్ స్కెచ్ లు గాని కావచ్చు) ఉన్నాయి. తెలుగు ప్రజల ఆచారాలు, వృత్తులు, మనుషులు, పెళ్లి, ఇళ్లు, దేవతా విగ్రహాలు, పశువులు, పంటలు, ప్రకృతి, పక్షులు, ఎడ్ల బళ్లు, చెప్పులు, గొడుగులు, చేతికర్రలు, కోకలు, పంచెలు, తినుబండారాలు, రుద్రాక్షమాల, శంఖం, తాయెత్తు, తాళపత్రాలు, సొరకాయ బుర్ర వంటి ఎన్నో సాంస్కృతిక విశేషాలు జీవం ఉట్టిపడుతూ కాగితం మీదికెక్కాయి, ఆ బొమ్మలు వేసింది గెర్ట్రూడ్ ఎచ్ బి హుకర్. ఆ పుస్తకానికి ముందుమాట రాసినది ఇవరయో శతాబ్ది తొలి దశకాలలో అమెరికాలో అత్యంత ప్రముఖ సంఘసేవకురాలు హెలెన్ బారెట్ మాంట్ గోమరీ. అలా ముగ్గురు అమెరికన్ స్త్రీలు పాలు పంచుకున్న, ఒక భారత, అందునా తెలుగు స్త్రీ గురించి రాసిన ఈ పుస్తకాన్ని 1911లో న్యూయార్క్ కు చెందిన ఫ్లెమింగ్ ఎచ్ రెవెల్ కంపెనీ అనే క్రైస్తవ పుస్తక ప్రచురణ సంస్థ వెలువరించింది. అప్పటికి నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ ప్రచురణ సంస్థ షికాగో, టొరాంటో, లండన్, ఎడింబరోలలో కార్యాలయాలతో పాశ్చాత్య ప్రపంచంలో అతి ప్రధానమైన క్రైస్తవ ప్రచురణ సంస్థగా ఉండేది. ఇప్పుడది బేకర్ పబ్లిషింగ్ గ్రూప్ లో ఒక భాగం.

 

ఒక అమెరికన్ రచయిత్రికీ, చిత్రకారిణికీ, సంఘసేవకురాలికీ, ప్రచురణకర్తకూ ఒకానొక తెలుగు స్త్రీ కథ వెలువరించవలసిన అవసరం ఏమి వచ్చింది? ఆ రచయిత్రి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ లో భాగంగా క్రైస్తవ మత ప్రచారానికీ, వైద్య సేవకూ, బహుశా మతాంతరీకరణకూ కూడ ప్రస్తుత ప్రకాశం జిల్లా, అప్పటి గుంటూరు జిల్లా గ్రామాలకు వచ్చింది. ఆమె జీవిత వివరాలు పుస్తకంలో ఎక్కడా లేవు గాని సుప్రసిద్ధ చర్చ్ సంగీతకారుడైన ఆమె కొడుకు రాబర్ట్ హాల్ ఎల్మోర్ జీవితచరిత్ర ప్రకారం, తల్లిదండ్రులు మాడ్ జాన్సన్ ఎల్మోర్, డా. విల్బర్ థియొడర్ ఎల్మోర్ రామపట్నం (రామయపట్నం) లో ఉండగా 1913లో ఆయన పుట్టాడని, 1915లో తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లిపోయారని తెలుస్తున్నది. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ తరఫున ప్రజలతో సంబంధం పెట్టుకున్న మాడ్ ఆ ప్రజల జీవితాలను, హిందూ మతం కింద ఆ ప్రజలు, ప్రత్యేకించి స్త్రీలు అనుభవిస్తున్న వేదనను స్వయంగా చూసింది. ఆ వేదన నుంచి బైటపడిన ఒకానొక యువతి గాథను చాల ఉద్వేగభరితంగా ఈ పుస్తకంలో చిత్రించింది.

ఇది వాస్తవ గాథనా, కల్పిత గాథనా కచ్చితంగా తెలియదు. ఆ గ్రామాలకు వెళ్లి వంద సంవత్సరాల కింద ఇటువంటి ఘటన జరిగిందా అని పరిశీలించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎంత ప్రయత్నించినా, మద్రాసు ప్రెసిడెన్సీలో క్రైస్తవ మతాంతరీకరణల చరిత్ర గురించి సవివరమైన పుస్తకం/కథనం ఒక్కటి కూడ దొరకలేదు. కాకపోతే క్రైస్తవంలోకి మారిన ఈ పుస్తక కథానాయకురాలి పేరు “వల్పుల” సుందరమ్మ కాగా, రామపట్నం థియొలాజికల్ సెమినరీలో రెవరెండ్ గా ఉండిన “వల్పుల” సి జాకబ్ 1909/10ల్లో దక్షిణాఫ్రికా వెళ్లాడని, ఆయన చరిత్ర తెలిసినవాళ్లు తనను సంప్రదించాలని ఇంటర్నెట్ మీద బ్రెండా ఫ్రాంక్నర్ 2013లో ఒక నోటీసు పెట్టారు!

అది నిజజీవిత గాథ అయినా కాకపోయినా, రచయిత్రికి ఆ నాటి తెలుగు సమాజంతోనూ, ఆచారాలతోనూ, హిందూ మత గ్రంథాలతోనూ తగినంత పరిచయం ఉందనడానికి పుస్తకంలో ఎన్నో అంతర్గత సాక్ష్యాలున్నాయి. బహుశా అందువల్లనే ఆ పుస్తకంలోని అనేక విషయాలు వర్తమానంలో కూడ ప్రాసంగికంగా ఉన్నాయి.

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

పుస్తకంలో బ్రాహ్మణ, అస్పృశ్య కులాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నప్పటికీ, ప్రధాన పాత్ర మధ్యంతర కులానికి చెందినదనే సూచన తప్ప స్పష్టత లేదు. అయినా మొత్తంగా సామాజిక, వ్యక్తిగత జీవితాలలో కుల, మతాల పాత్ర, ఆచార వ్యవహారాల పట్టు, ఆ ఆచార వ్యవహారాల పేరుతో సమాజం మీద బ్రాహ్మణుల ఆధిపత్యం గురించి పుస్తకం చాల సూక్ష్మమైన వివరాలు కూడ ఇస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరణతో ఆ ఆచారాలు తగ్గాయని, బ్రాహ్మణుల పట్టు తగ్గిందని చాల మంది అంటారు గాని సామాజిక జీవితంలో కుల మతాల పట్టు ఇప్పటికీ తగ్గలేదు సరిగదా, పెరిగిందేమో కూడ. పాత ఆచారవ్యవహారాలలో కొన్ని అంతరించి పోయాయేమో, కొన్ని మారిపోయాయేమో గాని ఆ స్థలం లోకి కొత్త ఆచార వ్యవహారాలు, కొత్త మూఢనమ్మకాలు వచ్చి చేరాయి. హిందూ మతం, దానిలో అంతర్భాగమైన కులం నిరంతరం పునరుత్పత్తి అవుతున్నాయి. నిజానికి హిందూ మతం, దాని పవిత్ర గ్రంథాలలో చెప్పిన విషయాల ఆధారంగానే హింసనూ, అసమానతనూ సమర్థించే మతం. ఒక వర్గం ఉత్పత్తిలో భాగం పంచుకోకుండా ఉత్పత్తి ఫలితాలను అనుభవించడానికి భగవంతుడి ఆమోదం ఉందని చెప్పే మతం. పూర్వజన్మ దుష్కృతాల పేరుతో, పునర్జన్మ అవకాశాల పేరుతో ఇప్పటి దోపిడీ పీడనలను సమర్థించే మతం, నిర్దాక్షిణ్యమైన మతం. ఏ మాత్రం ఆలోచనాపరులైనా, సున్నిత, మానవీయ భావాలున్నవాళ్లయినా దాన్ని అసహ్యంచుకోకుండా, అవకాశం వస్తే దాని నుంచి బైటికి వెళ్లకుండా ఉండలేరు. ఇక స్వయంగా ఆ మతగ్రంథాలే, భగవానువాచ ప్రకారమే స్త్రీల మీదా, “నిమ్న” కులాల మీద అణచివేతను, నిమ్నత్వాన్ని సమర్థించినప్పుడు, ఆ స్త్రీలు, నిమ్నకులాలు దానిలో కొనసాగడానికి కారణమే లేదు. బైటికి పారిపోవడం ఎంతమాత్రమూ ఆశ్చర్యకరం కాదు.

మతాంతరీకరణ చర్చ నిజానికి ఈ అంశం మీద, హైందవం నుంచి అత్యధిక సంఖ్యాకులను బైటికి తోసే స్థితి మీద జరగాలి. కాని ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మతాంతరీకరణకు ఆ రెండు మతాల బలప్రయోగమో, ప్రలోభమో కారణమని చర్చ జరుగుతున్నది. ఈ పుస్తకం తప్పనిసరిగా ఆ చర్చను మరొక కోణం నుంచి చూసే అవకాశం కలిగిస్తుంది. ముస్లిం పాలకులు హిందువులను బలప్రయోగం ద్వారా తమ మతంలోకి మార్చుకున్నారని, వలసవాద పాలకవర్గాలు హిందువులను ప్రలోభపెట్టి క్రైస్తవంలోకి ఆకర్షించాయని ఒక అభిప్రాయం బలంగానే ఉంది. కాని మతాంతరీకరణకు భయం గాని, ప్రలోభం గాని మాత్రమే కారణాలు కావు, హిందువులు తమ మతం నుంచి బైటికి పోవడానికి బైటి నుంచి ఆకర్షణ ఎంత కారణమో, అందుకు సమానంగానో, ఎక్కువగానో లోపలి నుంచి వికర్షణ కూడ కారణమవుతుందని ఒప్పుకోవాలి. హైందవంలోని దుస్సహమైన పరిస్థితి కల్పించిన భూమిక మీదనే ఇతర మతాల ఆకర్షణ లేదా బలప్రయోగం బలపడ్డాయి. ఈ పుస్తకం హైందవం తనలోంచి స్త్రీలను ఎట్లా నెట్టి వేస్తుందో చూపుతుంది.

ఇక చివరిగా తెలుగు సాహిత్యంలో ప్రచార సాహిత్యం అనే పేరుతో చిన్నచూపుకు గురవుతున్న సాహిత్యధార గురించి కూడ ఈ పుస్తకం కొన్ని ఆలోచనలను ప్రేరేపిస్తుంది. ప్రచార సాహిత్యం అనే మాట ద్వారా, ఆ సాహిత్యంలో సాహిత్యకత ఉండదని, దానిలో విశ్వసనీయ జీవిత చిత్రణ గాని, సాహిత్యానికి మౌలికమైన అనుభూతి సాంద్రత గాని ఉండవని, ప్రచార లక్ష్యంతో జీవితాన్ని, వస్తువును పలచబారుస్తారని, వక్రీకరిస్తారని ఒక అభిప్రాయం తెలుగు సాహిత్యంలో వంద సంవత్సరాలకు పైగా ఉంది. ప్రజా ఉద్యమాలు, ఉద్యమాలకు అనుబంధంగా సాహిత్యం పెరుగుతూ వచ్చిన కొద్దీ ఈ తప్పుడు అంచనా కూడ పెరుగుతూ వచ్చింది. మరొకవైపు ఆధునిక తెలుగు సాహిత్యమంతా స్పష్టమైన భావ ప్రచారం కోసమే జరిగింది. ఆమాటకొస్తే ప్రాచీన సాహిత్యంలో కూడ రాజాశ్రయం పొందినందువల్ల ఇవాళ్టికీ మిగిలిన సాహిత్యమంతా కూడ వర్ణాశ్రమ ధర్మ ప్రచారసాహిత్యమే. అయినా ప్రచార సాహిత్యం అంటే చిన్నచూపు కొనసాగుతున్నది. ఆ నేపథ్యంలో ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ రచయిత అవగాహనను, మతాన్ని ప్రచారం చేయడానికి రాసిన పుస్తకమే అయినా, ఆ అవగాహనను వ్యతిరేకించేవారిని కూడ మెప్పించగల విశ్వసనీయ, ఉద్వేగభరిత జీవితచిత్రణ ఎలా చేయవచ్చునో చూపింది.

ఈ పుస్తకం చదవగానే, ఐసెక్ లైబ్రరీలో 1910ల నాటి దేశదేశాల సోషియాలజీ పత్రికలన్నీ ఉండేవి గనుక ఏమైనా సమీక్షలు వచ్చాయో వెతకడానికి ప్రయత్నించాను. అమెరికన్ జర్నల్ ఆఫ్ సోషియాలజీ తో సహా అక్కడ కనబడిన ఏ పత్రికలోనూ సమీక్షలు దొరకలేదు. కాని ఈ పుస్తకం వెలువడిన వెంటనే న్యూయార్క్ టైమ్స్ లోనూ, న్యూజిలాండ్ హెరాల్డ్ లోనూ వచ్చిన సమీక్షలు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని దొరికాయి. ఆ సమీక్షలు కూడ చాల ఆలోచనాస్ఫోరకంగా ఉన్నాయి.

ఒక జీవిత చిత్రణగా, ఒక పరాయిదేశపు స్త్రీ తెలుగు స్త్రీ జీవితం గురించి చేసిన ప్రకటనగా, హైందవ పీడన నుంచి మహిళా విముక్తికి ఒక మార్గాన్ని సూచించిన ప్రచార రచనగా, ఒక సామాజిక శాస్త్ర వివరణగా ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’ కు ఆనాడు ఎంత విలువ ఉండిందో అంతకన్న ఎక్కువ విలువ ఇవాళ ఉంది.

-ఎన్. వేణుగోపాల్

ఇప్పుడిక జరగాల్సింది కొత్త చరిత్ర రచన!

గతవర్తమానం 1

venu

‘వర్తమాన కాలమూ గత కాలమూ

బహుశా భవిష్యత్కాలంలో మనుగడ సాగిస్తుంటాయి

భవిష్యత్కాలం గత కాలంలో నిండి ఉంటుంది

కాలమంతా శాశ్వతంగా వర్తమానమే అయితే

కాలానికెప్పుడూ విడుదల లేదు’ అన్నాడు కవి టి ఎస్ ఇలియట్.

 

‘చరిత్రంటే గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే’ అన్నాడు చరిత్రకారుడు ఇ ఎచ్ కార్.

 

గతమూ వర్తమానమూ భవిష్యత్తూ ఒక కలనేత. ఒక పిచికగూడు. వినీలాకాశంలో రకరకాల చిత్తరువులు గీసే మేఘమాల. తెలంగాణలోనైతే దసరా పండుగరోజున శమీవృక్షం మీది నుంచి ఆయుధాలు దించే ప్రాచీన గతమూ, ఊరేగింపులో అటూ ఇటూ ఊగుతున్న, అప్పటికప్పుడు కోసిన జొన్న కర్రల వర్తమానం. పీరీ ఎత్తుకుని ఊగుతున్న అబ్బాసలీ కాళ్ల మీద బిందెడు నీళ్లు గుమ్మరించిన పెద్దింటి హిందూ అగ్రవర్ణ ముత్తైదువు కన్నీటి బిందువుగా రాలుతున్న ఆశన్న – ఊశన్నల అమరత్వం, ఇవాళ్టి గునుగు తంగెడు కట్ల బంతి గొట్టం రకరకాల పూల బతుకమ్మల ముందర ఏడేడు తరాల గాథల పాటల చప్పట్లు తవ్విపోస్తున్న సబ్బండవర్ణాల అక్కచెల్లెళ్ల ఆనందహేల. ఏ వర్తమాన దుఃఖానికైనా తాతముత్తాతల శోకాన్ని ప్రవహించే మా ఇంటి ముందరి చాకలి లచ్చవ్వ రోదన… ఎన్నెన్నో దృశ్యాలు అల్లుకుపోతున్న తెలంగాణ వర్తమానంలో, కాదు గతవర్తమానభవిష్యత్తుల మధ్య విభజన లేని లిప్తలో ఇది రాస్తున్నాను.

 

‘సారంగ’కు ఏదైనా శీర్షిక రాయమని అఫ్సర్ అడిగినప్పుడు, నేనేదో రాయగలనని కాదు గాని, తనతో ముప్పై ఏళ్లకు పైబడిన గాఢమైన స్నేహం వల్ల మాట తీసేయలేక ఒప్పుకున్నాను. తెలుగు సాహిత్య ప్రపంచంలో గత వర్తమానాల సంభాషణ గురించి రాయడానికి ఈ శీర్షికలో ప్రయత్నించ వచ్చుననుకున్నాను. గతమూ వర్తమానమూ కేవలం కాలసూచికలు మాత్రమే కాదు, నిరంతర చలనశీలతకు చిహ్నాలు. ఇవాళ వర్తమానమైనది రేపటికి గతమైపోతుంది. గతమూ నిశ్చలం కాదు. ఇవాళ గతం అనుకున్నదాన్ని కొత్తగా చూసే ఆకరాలు, ఆధారాలు ఆవిష్కృతమై గతం మారుతూనే ఉంటుంది. కాగా వర్తమానం అనే మాటకే కాలసూచికగా మాత్రమే కాక, వార్త, సమాచారం, సందేశం, వృత్తాంతం అనే అర్థాలు కూడ ఉన్నాయి. అందువల్ల కాలానికీ, సమాచారానికీ, వృత్తాంతానికీ, విశ్లేషణకూ, మరో చూపుకూ, కొత్త చూపుకూ అవకాశమిచ్చే ‘గతవర్తమానం’ శీర్షిక ఎంచుకున్నాను.

 

ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో ఇరవయో శతాబ్ది తొలిరోజుల్లో జరిగిన ఒక మతాంతరీకరణ మీద అప్పుడే వెలువడిన ఒక పుస్తకాన్ని ఇప్పుడు కొత్తగా చూసి ఏమి ఆలోచించవచ్చునో రాయడంతో ఈ శీర్షిక ప్రారంభిద్దామనుకున్నాను. కాని ఈలోగా నిరంతర గతమూ, నిరంతర వర్తమానమూ, అనంత భవిష్యత్తూ అయిన నా కన్నతల్లి తెలంగాణ లేతమొగ్గలా పువ్వులోకి విచ్చుకుంటున్న సందర్భం, భవిష్యత్తులోకి గెంతుతున్న సంరంభం నా ఈ శీర్షికకు నాందీప్రస్తావనగా మారాయి.

కుటుంబరావు గారి ‘చదువు’లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ ఓడిపోయి జర్మనీ గెలిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నకు “ఏమవుతుందీ? … ఇంగ్లీషు మానేసి జర్మన్ భాష నేర్చుకోమంటారు” అని జవాబు చెప్పించినట్టు, తెలంగాణ ఎన్నడూ ఓడిపోకుండానే తనది కాని మరొక భాషలో, కాకపోతే మరొక మాండలికంలో, మరొక యాసలో పాఠాలు చదువుకోవలసి వచ్చింది. ఇప్పుడిక్కడ నేను రాస్తున్న భాష, కనీసం అతి ఎక్కువ పదాలు, క్రియాంతాలు నేను మాట్లాడే భాషవి కావు. ఈ దేశంలో పాలకవర్గాలు బలప్రయోగం అవసరం లేకుండానే పాలితులను లొంగదీయ గలిగాయని కొశాంబీ అన్నట్టు, బలప్రయోగం అవసరం లేకుండానే, ఏ యుద్దంలోనూ ఓడిపోకుండానే నా భాష నాకు దూరమైపోయింది. కనుమరుగైపోయింది. నా భాష మాత్రమే కాదు, తెలుగు భాషలోని అద్భుతమైన మాండలికాల సొగసులన్నీ అణగిపోయాయి. తన కాలానికీ, సుదూర భవిష్యత్తుకూ కూడ గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని వ్యక్తం చేసిన గురజాడ అప్పారావు కూడ “…ప్రామాణికమైనదిగా గుర్తింపుపొందిన ఒక వ్యవహార భాష ఉందని ప్రసిద్ధ పండితులూ, తెలుగుదేశ ప్రజలూ అంగీకరిస్తున్నారు. అది కృష్ణా, గోదావరి జిల్లాల తెలుగు తప్ప మరొకటి కాదు” (డిసెంట్ పత్రం) అని, ఈ “ప్రామాణిక” భాష పెత్తందారీతనానికి లొంగిపోయారంటే ఈ అంకుశం ఎంత మెత్తనిదో, ఎంత పదునైనదో అర్థం చేసుకోవచ్చు.

 

ఆ మాట అన్నందుకు ఆయనకు ఏదో దురుద్దేశాన్ని, స్వార్థ ప్రయోజనాన్ని అంటగట్టనక్కరలేదు. ఏ దురుద్దేశమూ, స్వార్థ ప్రయోజనమూ లేకుండానే భావజాలపు మత్తు తన పాత్ర నిర్వహిస్తుంది. ఆ భావజాలపు మత్తే తెలంగాణ భాష ప్రామాణికమైనది కాదన్నది. అసలు తెలంగాణకు భాష లేదన్నది. సాహిత్యం లేదన్నది. చరిత్ర లేదన్నది. మర్యాద తెలియదన్నది. తెలంగాణలో పుట్టి పెరిగి సాహిత్య సృజించారని తేలినవారి స్వస్థలాల గురించి కూడ అపనమ్మకం ప్రకటించింది. సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అని కాలువలు వచ్చి, కాలువల కింద వ్యవసాయం వచ్చి, వ్యవసాయంలో మిగులు వచ్చి, ఆ మిగులు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలకు, ముద్రణ, ప్రచురణ, ప్రచార మాధ్యమాల రంగాలకు, సినిమాకు వ్యాపించి తన భాషే ప్రమాణం, తన జీవన విధానమే ప్రమాణం అని స్థిరీకరించింది.

 

ఒక బహుళ సమాజంలో, వైవిధ్య భరిత సమాజంలో మిగిలిన అంశాలన్నిటినీ తోసివేసి, అణచివేసి, ఒకేఒక్క “ప్రమాణాన్ని” నిర్ణయించడం రెండు దుష్పరిణామాలకు – అనుకరణకైనా, న్యూనతకైనా – దారి తీస్తుంది. అణచివేతకు గురైన సమూహాలన్నీ తామూ ఆ “ప్రమాణాన్ని” అందుకోవాలని వెంపరలాడతాయి, అనుకరిస్తాయి. అనుకరణ సంస్కృతి ప్రబలుతుంది. తమ మూలాలను మరచిపోయి, తొక్కివేసి “ప్రమాణాన్ని” అనుకరించాలని ప్రయత్నించేవారు పెరుగుతారు. మరి ఆధిపత్య ప్రమాణం ఇలా చేరవచ్చేవారందరినీ చేర్చుకోజాలదు గనుక ఆ “ప్రధానస్రవంతి” లోకి కొందరికే ప్రవేశం దొరుకుతుంది. కాగా అణచివేతకు గురైన అసంఖ్యాకులు తాము ఆ ప్రమాణాన్ని అందుకోలేమని, తమకు అది అందుకునే అర్హత, యోగ్యత, సామర్థ్యం లేవని ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. అందువల్ల “ప్రమాణపు” బలం మరింత పెరుగుతుంది.

kancharlagopana

తెలంగాణలో పుట్టిన సాహిత్యకారులలో, తెలంగాణ సాహిత్య సంప్రదాయంలో కనీసం ఇరవయో శతాబ్ది తొలిరోజులనుంచీ ఈ అనుకరణనైనా, న్యూనతనైనా గుర్తించవచ్చు. హైదరాబాదులో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తూ (శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1901), స్థానిక ప్రభువైన మల్కిభరాముడినో (ముల్క్ ఇబ్రహీం కుతుబ్ షా), ఆ గోల్కొండ రాజ్యంలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం రాసిన పొన్నగంటి తెలగానార్యనో, ఆ ప్రాంతంలోనే అద్భుతమైన వాగ్గేయకారుడిగా ఎదిగిన కంచర్ల గోపన్ననో కాకుండా ఆ ప్రాంతంతో ఎన్నడూ సంబంధం లేని, ప్రామాణిక తెలుగు సాహిత్య చరిత్ర కీర్తించిన శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టడం ఈ అనుకరణ – ఆత్మ న్యూనతా సంస్కృతికి చిహ్నమే. అలాగే హనుమకొండలో ఏర్పడిన రెండో తెలుగు గ్రంథాలయానికి (రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం, 1904), తెలుగు జాతినంతా ఏకం చేసిన స్థానిక ప్రభువంశం కాకతీయుల పేరు కాకుండా, స్థానిక కవి పోతన పేరు కాకుండా ఒక చిన్న తెలుగు ప్రాంతాన్ని పాలించిన, హనుమకొండతో ఏ సంబంధమూ లేని రాజరాజ నరేంద్రుని పేరు పెట్టడమూ ఈ అనుకరణ-ఆత్మన్యూనతల ఫలితమే. ఈ సంప్రదాయమే ఇవాళ నేను వాడే భాష దాకా, నా భాష వాడడానికి బెరుకు పడేదాకా కొనసాగుతున్నది.

అయితే ఈ సంప్రదాయాన్ని తోసిరాజని తన ప్రత్యేక అస్తిత్వాన్ని, తన సంస్కృతిని, తన భాషా సాహిత్యాలను, తన ఉజ్వల వారసత్వాన్ని ఎత్తిపట్టిన సంప్రదాయం కూడ కనీసం 1930ల నుంచీ ఉంది. తెలంగాణలో తెలుగు కవులు లేరన్న వ్యాఖ్యకు స్పందనగా 1934లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించి ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక 354 మంది తెలంగాణ కవులను చూపింది. అయినా ఇరవై సంవత్సరాల తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి తన తొలి నవల ప్రజల మనిషి వెలువరిస్తూ, అందులో తెలంగాణ జనసామాన్యం వాడే భాష వాడినందుకు “చాలా భయంతో ఈ నవలను బైటికి తెస్తున్నాను” అని ప్రకటించారంటే తెలంగాణ సాహిత్యకారులు అనుభవించిన ప్రత్యక్ష, పరోక్ష ఒత్తిడి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.

విలీనం తర్వాత, సోదరులనీ, ఒకే భాషకు చెందినవారనీ చెప్పిన తర్వాత ఆధిపత్య, ప్రామాణిక భాషతో పోల్చుకుని ఈ “భయం” తగ్గలేదు సరిగదా పెరిగింది. తెలంగాణ భాష, “ప్రామాణిక” భాషకు, “ప్రామాణిక” నిఘంటువులకు తెలియని తెలంగాణ పదాలు ఇంకా అవహేళనకూ, అవమానానికీ గురవుతూనే వచ్చాయి. తెలంగాణ భాష అయితే తౌరక్యాంధ్రమో, కాకపోతే అలగా జనాల మొరటు భాషో అయిపోయింది. దాదాపు సగం ప్రాంతంలో జనవ్యవహారంలో ఉన్న మాటలు కేవలం తమకు తెలియనందువల్ల, తమ నిఘంటువుల్లోకి ఎక్కనందువల్ల అవమానించదగినవని మహాఘనత వహించిన కోస్తాంధ్ర సాహిత్యకారులు అనుకున్నారు. కోస్తాలో కొన్ని కులాల, చిన్న చిన్న ప్రాంతాల భాషను, చిన్న సమూహాల నుడికారాన్ని తెలంగాణ పాఠకులు చదువుతూ, నేర్చుకుంటూ, ఆనందిస్తూ, తమ పదజాలంలో భాగం చేసుకుంటూ ఉన్న సమయంలోనే తెలంగాణ మాండలికం విస్మరణకు, అవహేళనకు  గురయింది.

 

ఇటువంటి అవహేళనలకు లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. తన మొదటి కవితాసంపుటం ‘చలినెగళ్లు’ లో ఒక కవితలో ‘శ్మశానంలో కోర్కెలు తీరని బొక్కల వలె’ అని వరవరరావు రాస్తే, ఒక సుప్రసిద్ధ కోస్తా సాహిత్య విమర్శకుడు తెలంగాణలో ‘బొక్కలు’ అంటే ఎముకలు అని తెలుసుకోకుండా, తనకు తెలిసిన ‘రంధ్రాలు’ అనే అర్థమే సర్వస్వమైనట్టు ఇంత అశ్లీలం రాయడమా అని విమర్శించారు. ఎమర్జెన్సీ తర్వాత పునః ప్రారంభమైన సృజన లో కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగపోరాటాల వెల్లువలో కరీంనగర్ మాండలికంలో అల్లంరాజయ్య కథలు వెలువడుతున్నప్పుడు చాల మంది ప్రగతిశీల రచయితలు కూడ మాండలిక రచన సరైనది కాదంటూ, సృజన అల్లం వాసన వేస్తున్నదంటూ చర్చోపచర్చలు నడిపారు.

D98571616a copy ఆ మాటకొస్తే తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం కాళోజీ చెప్పినట్టు “రెండున్నర జిల్లాల రెండున్నర కులాల దండిబాస” లోనే ఉంది. ఆ భాషను అందరూ ఆదరించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో వచ్చిన రచనలనూ తెలుగు సాహిత్యమంతా సాదరంగా ఆహ్వానించింది. కాని తెలంగాణ మాండలికంలో సాహిత్య సృష్టి మాత్రం అపరాధమైపోయింది. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలకు గొంతు ఇవ్వడానికి ప్రయత్నించి ‘మీ వాయిస్ కల్చర్ సరిగా లేదు’ అని తిరస్కారానికి గురైన తెలంగాణ పాత్రికేయులు, రచయితలు ఎందరో ఉన్నారు. 2002లో వెలువడిన నా కవితా సంపుటానికి పావురం (పక్షి కాదు, తెలంగాణలో ప్రేమ, నెనరు, వాత్సల్యం) అని పెట్టాలనుకున్నప్పుడు ఏ ఒక్క “ప్రామాణిక” నిఘంటువులోనూ ఆ మాట చేరలేదని గుర్తించాను. “ఎన్నో తెలంగాణ మాండలిక పదాలకు ప్రాచీన కావ్యాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఐనా ఇవి ఇంకా నిఘంటువుల్లోకి ఎక్కలేదు” అంటూ శబ్దరత్నాకరంలో స్థానం పొందని శబ్దాల జాబితా 1988లోనే ఒక పుస్తకం రాశారు రవ్వాశ్రీహరి. ఆ కృషినే కొనసాగించి ప్రధానంగా తెలంగాణ పదాలతో ఒక నిఘంటువు తయారుచేశారు. నలిమెల భాస్కర్ కూడ ఆ ప్రయత్నం చేశారు.

ఇది కేవలం భాష విషయంలో, కొన్ని పదాల విషయంలో మాత్రమే జరిగినది కాదు. తెలంగాణ సాహిత్య చరిత్ర, సాహిత్యకారుల ప్రతిపత్తి, తెలంగాణ చరిత్ర వంటి అన్ని విషయాలలోను ఈ చిన్నచూపు, వివక్ష, నిర్లిప్తత, లోతైన పరిశోధన లేకుండానే తీర్పులు చెప్పడం వంటి తప్పులు, పొరపాట్లు జరిగాయి.

ఉదాహరణకు కాకతీయుల మీద చాల సమగ్రమైన పరిశోధన చేసిన పి వి పరబ్రహ్మ శాస్త్రి 1978లో ప్రచురితమైన తన గ్రంథాన్ని ‘తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల శాసన పరిశోధన కష్టమయింది’ అనే అర్ధ సత్యంతో ప్రారంభించారు. కాని అప్పటికి డెబ్బై ఏళ్లుగా కొమర్రాజు లక్షణరావు, లక్ష్మణరాయ పరిశోధనా మండలి, మారేమండ రామారావు, శేషాద్రి రమణకవులు, ఆదిరాజు వీరభద్రరావు, యాజ్దాని వంటి ఎంతో మంది పరిశోధకులు సాగించిన కృషిని ఇలా ఒక్కమాటతో కొట్టివేయడం ఆశ్చర్యమే గాని అసహజం కాదు.

ఇటువంటిదే మరొక ఉదాహరణ చెప్పాలంటే 1944లో హైదరాబాదులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో కీలకశక్తి, ప్రచురణకర్త, స్వయంగా రచయిత, బ్రిటిషాంధ్ర లో నిర్బంధ పరిస్థితులవల్ల హైదరాబాదు నుంచి తెలుగుతల్లి పత్రిక తేదలచినప్పుడు దాన్ని నిర్వహించినవాడు, 1945 మహాసభల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. కాని 1947లో ఆయనను నిజాం ప్రభుత్వం నిర్బంధించినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం ఆ నిర్బంధాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడానికి నిరాకరించింది. ఆయనను రచయితగా అరెస్టు చేశారనడానికి ఆధారం లేదని తీర్మానాన్ని తోసిపుచ్చారు. తెలంగాణ రచయితల సాహిత్య ప్రతిపత్తి గురించి కోస్తా రచయితల వైఖరి అది.

ఇక బమ్మెర పోతన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడని సకల ఆధారాలూ ఉన్నప్పటికీ ఆయనను కడపకు తరలించడానికి ఒక శతాబ్దం పాటు సాహిత్యకారులనుంచి రాజకీయ నాయకులదాకా ఎందరెందరో ఎంత ప్రయత్నించారో చెప్పనక్కరలేదు.

రెండు తెలుగు భాషల మధ్య, రెండు సాహిత్య సంప్రదాయాల మధ్య, “ప్రామాణిక”, ప్రామాణికేతర సాహిత్య ధారల మధ్య కొన్ని దశాబ్దాలుగా సాగిన సంబంధంలో ఒక పార్శ్వం ఇది. దీన్ని ధిక్కరిస్తూ స్వాభిమానాన్ని ప్రకటించిన పార్శ్వం కూడ అంతే బలమైనది. ఒకరకంగా సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన ఆ స్వాభిమాన కాంక్ష, వాస్తవచరిత్ర రచనాకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో బలోపేతమయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో సాహిత్య చరిత్ర పునర్లేఖనం – వాస్తవ లేఖనం – జరగవలసి ఉంది. వర్తమానం గతంతో సంభాషించవలసి ఉంది. వర్తమానం ప్రసరించే కొత్త వెలుగులో గతం భాసిల్లవలసి ఉంది. గతవర్తమానాల మేలుకలయికగా భవిష్యత్తును సంపద్వంతం చేయవలసి ఉంది.