ఆ ఎంట్రీ ఒక మెరుపు, కొత్త మలుపు!

krishnudu

 

ట్టమైన పొగమంచు. చలి చర్మాన్ని పదునుగా పలకరిస్తోంది. కాళ్ల క్రింద రహదారిని పోల్చుకోవడం కష్టంగా ఉంది. వాహనాల లైట్లే వాహనాలకు దారి చూపుతున్నాయి. ప్రయాణం చాలా దుర్భరంగా ఉంది. కనపడేవన్నీ నిజాలు కావు కాని కనపడాల్సినవన్నీ కనపడకపోతే.. మనిషిని మనిషి పోల్చుకోవడం కష్టం. కాని మనిషే సమీపించకపోతే.. బతుకు పొగమంచులో ప్రయాణం కన్నా నిస్సహంగా ఉంది. బతుకులోకి ఒక చలి ప్రవేశించింది. జీవితాన్నీ, శరీరాన్ని కొంకర్లు చుట్టేస్తున్నది. అప్రయత్నంగా మనిషి తనకు తాను కుంచించుకుపోతున్నాడు.

ఎదుటి మనిషిని కరచాలనం చేయకుండా పలకరించలేమా? కరచాలనం ద్వారా రక్తస్పర్శ పరిచయం చేయని వాడు దూరం నుంచి మన రక్తాన్ని ఎలా వేడెక్కించగలడు? మనిషిని మనిషి, మనిషిని నినాదాలు, మనిషిని దుర్మార్గాలు, దారుణాలు, మనిషిని హత్యలు, ఊచకోతలు వేడెక్కించడం మానేసి చాల రోజులైంది. ఊపిరి పీల్చి విడుస్తుంటేనే మన  వేడి మనకు తగలడం లేదు. ఇక రోడ్లపై, అడవుల్లో, గుట్టల్లో గుట్టలుగుట్టలుగా పడిఉన్న శవాలు ఎలా వేడెక్కిస్తాయి? కన్ను వేడెక్కితేనే చెలమ ఊరుతుంది.

ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. తెలుగు సాహిత్యానికి తిరుగుబాటు కొత్తది కాదు. ప్రశ్నలు కొత్తవి కావు. సామాజిక సంస్కరణల కవిత్వం, స్వాతంత్రోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, ప్రగతి శీల కవిత్వం, దిగంబర కవిత్వం,  విప్లవ కవిత్వం, ఫెమినిస్టు కవిత్వం, దళిత అస్తిత్వ వాద కవిత్వం. ఒక కవిత్వానికి ఎన్ని శాఖలు? కవిత్వం చెట్టు కాదు శాఖలుగా విస్తరించడానికి?  కవిత్వం కాలం కత్తిపై నుంచి కారుతున్న రుధిరధార. రక్తానికి శాఖలు లేవు.

అందుకే ఒకానొక రాజు దాదాపు ముప్పైఏళ్ల క్రితం నేను పనిచేస్తున్న పత్రికా కార్యాలయానికి  పుంఖానుపుంఖాలుగా వస్తున్న కవిత్వ సంపుటాల్లో ఒక పుస్తకం తడమగానే నా రక్తాన్ని స్పృశించినట్లయింది.   దాని పేరే ‘రక్తస్పర్శ’.

raktasparsa

పేరును చూస్తే ఏ అడవుల్లోంచో  పసిరిక వాసన వచ్చినట్లు లేదు. విరసం ప్రచురణ కానే కాదు. రవళి ప్రచురణ అని పెట్టుకున్నా దాన్ని అచ్చువేయించింది ఒక పప్పుమిల్లు యజమాని. పడేద్దామా అనిపించింది ఒక్కక్షణం.  కాని ఆ పుస్తకంలోని అక్షరాలు నా కళ్లనూ, శరీరాన్నీ ఎంతవేగంగా లాగాయంటే నేను పుటల మధ్య బందీ అయ్యానన్న విషయం నాకే తెలియలేదు.  మొదటి కవితే నన్ను జీవితపు దుర్బర నరకం నుంచి మృత్యుసౌందర్యంలోకి లాక్కుపోయింది. అది అఫ్సర్ రాసిన ‘అంతిమ స్పర్శ’.

‘మెత్తటి గోధుమరంగు నేలపై పవళించి, నీ తలపై పచ్చిక ఎగురుతుండగా నిశ్శబ్దాన్ని ఆలకించే నీకు నిన్నా లేదు, రేపూ లేదు. కాలాన్ని మరిచి, జీవితాన్నిక్షమించి, శాంతిలో విలీనమయ్యే మృత్యువు అందంగానే ఉండి ఉంటుంది.. అని రాశాడు అస్కార్ వైల్డ్.

afsar3

‘మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది- విశాలాకాశంగా వికసిస్తావో అశ్రుపూరిత మేఘంగా విహరిస్తావో, కాలంకురులపై మీటుకుంటూ వెళ్తావో  నీ ఇష్టం.. ‘అన్నాడు అఫ్సర్. ‘అశాంత నేత్ర జలపాతాల్లోంచి, ఇరుక్కుంటూ, ఇరుక్కుంటూ అనంతానంత మౌన ప్రవాహంలోకి మృత్యువు చిటికెన వేలు పట్టుకుని మెల్లిగా నిశ్శబ్దాలు రాలుస్తూ వెళ్లిపోయిన నీకు చదువుతూ చదువుతూ నువ్వు సగంలోనే వదిలిపెట్టి వెళ్లిన పుస్తకం ఒంటరితనం రెక్కలు రెపరెపలాడిస్తూ మళ్లీ వస్తావని అమాయకంగా నిరీక్షిస్తుందని ఎవరు గుర్తు చేస్తారు?’

ఎవరీ కవి? అన్ని పాతదనాల్నీ ఊడ్చేసి పాత కోట బురుజుల సందుల గుండా వెచ్చటి స్వచ్చమైన కిరణంలా ప్రవేశించిన ఈ కవి ఎవరు? చదవగానే అనిపించింది తెలుగు కవిత్వంలో మరో కొత్త గొంతుక ప్రవేశించిందని. ఇది యాంత్రికతను చేధించడం కాదు. ఇది స్తబ్దతను భగ్నం చేయడం కాదు.  నాటి రోజులు పిడికిలి బిగిస్తున్న చేతులే జోహార్లు అర్పిస్తున్న రోజులు, నినాదాలు చేసిన గొంతులే విషాద గీతికలు ఆలపిస్తున్న  కాలమది.  ఒక ప్రజాకళాకారుడి నెత్తుటి జోలె విస్తరిస్తున్నసమయం అది, గజ్జెల కాళ్లు గుండెలపై నర్తిస్తున్న ఘట్టం అది. ఆ సమయంలో  ఖమ్మం నుంచి వచ్చిన ఒక స్వచ్చమైన గాలి రెపరెప నన్ను తాకింది.  అవును మనం ప్రశ్శల ఉక్కబోతలో నే చిక్కుకున్నప్పుడు ఇటువంటి రెపరెపలు అవసరం.

రక్తస్పర్శ రాసిన ముగ్గురు కవులు అఫ్సర్, ప్రసేన్, సీతారామ్. ఇందులోని 59 కవితల్లో 27 అఫ్సరే రాశాడు. 22 ప్రసేన్ రాస్తే సీతారాం రాసింది పది కవితలు మాత్రమే. ముగ్గురూ ఒకే రకం కవులు కాదు. ప్రసేన్, సీతారాంలపై మినీకవితలు, దిగంబర కవితల ప్రభావం ఉన్నది. అఫ్సర్ అప్రభావితంగా  రాయడం మొదలుపెట్టిన కవి. అప్రభావితంగా ఎవడూ రాయడు అంటాడు ఒక మేధావి. చదివిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ లూ, ప్రతి ఘటనా స్వరాలు ఎక్కడకు పోతాయి? కాని చుట్టూ ఉన్న నిబిడ నిశ్చల నీరవ నిర్విరాణ నీలాకాశం మధ్య కొండకొనపై కూర్చుని ఉన్నట్లుండి గొంతులోంచి అప్రయత్నంగా ప్రకృతిని మైమరిపించే గొల్లవాడి గొంతులోంచి వెలువడిన కొత్త రాగమే అఫ్సర్ కవిత్వం. ఆ రాగం మూలాల్ని వెతకడం అతడి పని కాదు. అతడే ఒక దృశ్యమై, దృశ్యమే అతడై కేన్వాస్ నిండా పరుచుకున్న కవిత్వమది.

అవును శూన్యానికీ శూన్యానికీ మధ్య ప్రపంచాన్ని పరుచుకుని అంతర్వలయాల్లో విహరించే పక్షి అతడు.   నేలరాలిన వీరుడి పరాజయ హస్తాలు, ఆ ఒట్టి చేతులు తెగిపడ్డ ద్వారాల్లా అఫ్సర్ ని నిలదీస్తాయి. అంతర్ధానమైన చివరి చిర్నవ్వు అతడిని పలకరిస్తుంది. నిజం నీడలా వెంటాడుతుంది, నేలకొరిగిన ఏ సూర్యుడిలోంచి స్రవించిందో ఈ రక్తం అని వెతుకుంటాడు. రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా సైగల్ విషాదగీతం సజీవ వేదనాస్రవంతిగా ప్రవహిస్తుంది. వేయి వసంతాలను అరచేతుల్లో పట్టి బంధించేందుకు ఒక్క జ్ఞాపకం తన్లాడుతుంటాడు. అరణ్యాలు కాలుతున్న గుండెల్లో సజీవంగా సమాధి అవుతున్న స్వప్నాల్ని తలుచుకుంటాడు. రాత్రిలోంచి చీకటిలా, చీకటిలోంచి కలలా, కలలోంచి జ్ఞాపకంలా నడిచిపోతుంటే అతడి నీత అతడిని తృణీకరిస్తుంది. భావానికీ, అక్షరానికీ దూరం అపారమా?

సందేహాల మధ్య చుట్టుకుపోయి అతడి అంతరంగం తెరలు దింపుకుంటుంది. రాత్రి అంచుమీద కన్నీటి ఖడ్గం కోస్తూ పోతుంది. చీకటి గుండెల్ని కెలుకుతుంది. చెట్టు గుండెల్లోంచి గొంతువిప్పే పక్షిలా అతడిలో ఏదో అలజడి.

prasen

ప్రసేనైతే పూర్తిగా బహిర్ముఖుడు. రోడ్డుపై  రౌడీ చేతుల్లోంకి ఖాకీ జేబుల్లోకి మారిన రూపాయిని, బండివాడు విసిరేసిన ఇడ్లీముక్కను పసికడతాడు. అంతే కాదు ఉన్నట్లుండి అతడికి రోడ్డు మరోలా కనపడుతుంది.  నగర కన్యనాభిని ముద్దాడి నితంబమునల్లుకుని వలీ అవళిని నిమిరి పయోధరాలను బంధించి నయగారాలు గారాలు పోయే ఓణీ – ఈ రోడ్డు అంటాడు. ప్రసేన్ పరిచయమూ, అపరిచయమూ అతడి కవిత్వంలో దాక్కోవు. అతడి మెదడు వ్యబిఛారిలా మనసుతోనే లేచిపోతుంది. పల్లెలన్నీ ఇథియోపియాలే అనే ప్రసేన్ నిశ్భబ్దంలో జీవించాలనుకుంటాడు. కాని భయంకరంగా వినిపిస్తున్న గుండెస్పందనను తప్పించుకోలేడు.

ఇక సీతారాం ఒక నిరీక్షకుడు.  తెగిన జ్ఞాపకాల మధ్య ఎవరికోసమో నిరీక్షిస్తాడు. రాత్రిపూట ఒంటరిగా ఉండే గోడనూ, ఎప్పుడూ మేల్కొనే ఉండే అడవినీ, క్షణం ముందు వెళ్లిపోయిన అజ్ఞాత పథికుడినీ, చిట్లిన గేయాల్నీ, తెగిన గొంతుకల్నీ, తెగిన అక్షరాల్నీ ఆగిన పద్యాల్నీ స్మరిస్తుంటాడు.స్వర్ణ దేవాలయంపై  రాబందుగా ఎగురుతున్న పావురాల్నీ, దండకారణ్యాన్ని తూర్పార బట్టే తూటాల్నీ, కార్బైడ్ రాత్రుల గాలికేకల్నీ తలచుకుని గుండెకు గర్భస్రావం చేసుకుంటాడు. చిత్రాలకు కన్నీటి రంగులు అద్దుతుంటాడు.  అకస్మాత్తుగా  అన్నిటినీ వదిలి ఆకాశాన్నంటిన స్వప్న పర్వతాలవైపు ఆగకుండా పోవాలనుకుంటాడు.

రక్త స్పర్శలో కొత్త భావాల్నీ, కొత్త ప్రతీకల్నీ ముగ్గురు కవులు పలికించినప్పటికీ ముగ్గురిదీ ఒకే దారి కాదు. కాలం ముగ్గుర్నీ వేర్వేరు దారుల్లోకి, వేర్వేరు స్థాయిల్లోకి తీసుకువెళ్లింది. కాని తెలుగు కవిత్వం తిరిగిన రకరకాల మలుపుల్లో ఒక ముఖ్యమైన మలుపు రక్తస్పర్శ. దిగంబర కవిత్వం తర్వాత ప్రస్ఫుటంగా కనిపించిన మలుపు ఇది. రాను రానూ, ఈ మలుపు విస్తృతమై రహదారిగా మారిందనడం, కవిత్వం ఈ రహదారిలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందనడం అతిశయోక్తి కాదు. అది నీ నెత్తురును ఎప్పుడూ స్పృశిస్తుంటుంది.

 

*

 

ఏమైనా మారిందా?

 krishnudu

ఒక రాత్రి పుచ్చిపోయిన వేళ, ఒక దినం చచ్చిపోయిన రోజు, సూర్యుడు చిరాకు కలిగించిన వేళ, వెన్నెల కిటికీలోంచి రక్తం క్రక్కుకుంటున్న పూట నీపై నీకు అసహ్యం కలిగినప్పుడు నీ వ్రేళ్లు అప్రయత్నంగా వెలిగ్రక్కే ద్వేషమా కవిత్వం?

ఉదయం పూట పేపర్‌ను చూసి ఉండచుట్టి విసిరివేయాలనుకుంటున్నప్పుడు, పదే పదే వినపడే వాడి ఉపన్యాసం శూలంగా గుండెలో గ్రుచ్చుకుంటున్నప్పుడు, మనుషుల్లో శవాలనూ, శవాల్లో మనుషులనూ చూడడం అలవాటై, క్రుళ్లిపోయిన వెలుతురును చూడలేక కళ్లు మూసుకున్నప్పుడు బలవంతంగా బయటకు వచ్చిన కన్నీటి చుక్కా కవిత్వం?

నీవు బతికున్నప్పుడు చస్తావు. చచ్చిపోయినప్పుడు జీవిస్తావు. అదేనా కవిత్వం?

నీవు మారతావు. కవిత్వం మారదు.

నేను ఆకులో ఆకును కాను. ఆకుపై రాలిన కన్నీటి బిందువు స్పృశిస్తున్న మృతదేహాల్ని చూసి ఆక్రోశిస్తాను. నేను పూవులో పూవును కాను. బూట్ల క్రింద నలిగిపోయిన పూలను చూసి విలపిస్తాను. నేను కొమ్మలో కొమ్మను కాను. విరిగిపోయిన కొమ్మల వాడిపోయిన నునులేత రెమ్మల శిథిలాలను చూసి బిక్కుబిక్కుమని ఎగిరిపోయిన పక్షుల్ని చూసి విషాదగీతం రాస్తాను. అదేనా కవిత్వం..

మనిషి పాతబడతాడు. కాని నేను పాతపడని కవిత్వాన్ని చూశాను. సమాజం తిరగబడడాన్ని చూడలేదు. కవిత్వం తిరగబడడాన్ని చూశాను.

ఆకాశం బ్రద్దలై విగతజీవిగా మారడం చూశాను. మేఘాలు తుత్తునియలై నేలరాలడం చూశాను. గాలి కకావికలై ప్రాణాలు కోల్పోయి కనురెప్పల మధ్య చేరడం చూశాను. వాన చినుకు ఛిన్నాభిన్నమై రక్తాశ్రువులతో పాటు ఎండిపోవడం చూశాను. నేల బీటలు వారి తనపై నడుస్తున్న చచ్చిన పాదాలను దిగులుగా చూడడం గమనించాను.

కల ఒక మోసమై ప్రతి రోజూ ఒక పసిగొంతును నులుముతోందా?కవిత్వం మాత్రం నిన్ను మోసం చేయదు.

ఎందుకో నాకిప్పుడు దిగంబర కవిత్వం అధునాతనమనిపిస్తోంది. ‘మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. జీవితంలో జంతువుల్లా బతికే అధికారం ఎవరికీ లేదు. జీవితం తాటస్య్థాన్ని వరించకూదు. నిరర్థక జీవన విధానంలో మనిషి జీవించలేడు.. నిన్ను నీవు ఒక్కసారి దిగంబరం చేసుకో. దేన్నీ నమ్మకు..’ అని స్పష్టం చేసిన దిగంబర కవిత్వం తొలి తెలుగు అధునాతన రాజకీయ కవిత్వం. ఒక అధ్యాయం అప్పుడే ప్రారంభమైంది.

మహా స్వప్నా ఎక్కడున్నావు? మానవత రెండు కళ్లూ మూసుకుపోయినప్పడు, విప్పుకుంటున్న మూడో కన్నునై, కాలం వాయులీనం మీద కమానువై, చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానువై వస్తానన్నావు కదా.. కడుపు రగిలి, పుడమి పగిలి పుడతానన్నావుకదా.. దిక్కుమాలిన శవం మీద ఆకాశాన్ని కప్పావా?

మనిషీ,ఇంకా నువ్వింకా బానిసవే అని చెప్పిన చెరబండరాజూ.. ఏమైంది? బానిసత్వం తొలగిపోయిందా? చెర వీడిపోయిందా? అడుగు అడుగులో సహారా ఎడారి అదృశ్యమైందా? ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం కరిగిపోయిందా? ఆకాశం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నదెందుకు? అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం ఇప్పుడు మరింత నవనవోన్మేషంగా మారిందా? కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలన్నావు కదా?

సూర్యుడికడ్డంగా నించున్న ఆ మబ్బుతునక పేరేమిటి? అని ప్రశ్నించిన నగ్నమునీ, ఆ పేరు తెలిసిందా? అర్థం కాని అనంతశూన్యం అంచుమీదికి ఆకారం లేని కుర్చీనొకటి లాక్కొనిస అర్థవంతమైన బతుకు వెన్నెల చుక్కల్ని కప్పులో ఒంపి ఒక్కొక్క క్షణం పెదవులకు ఆనించి విషాదాన్ని ఇంకా ఆరాధిస్తూ ఉన్నావా? నీ రక్తం నిండా విశ్వరహస్సముద్రాల జంత్రవాద్యాలు ఇంకా ఉన్నాయా? భూగోళం మరణం విని, రోదసిలో తలవంచిన పతాకంలో నీ శవాన్ని దహనం చేశావా? అందాకా నీవు రాసిన గీతాల్ని నీవే భక్షించావా? భూమి ఇప్పుడు ఎట్లున్నది? ఇంకా అమెరికన్ ప్రసిడెంట్ మెదడులా అమానుషంగా ఉన్నదా? డాలర్‌లోని పురుగు ప్రసరిస్తున్న పుర్రెల వెన్నెలతో వెలిగిపోతున్న శ్మశానంలోకి వెళ్లావు కదా.. పురుగును బట్టి నేలరాచావా? కంపుగొడుతున్న జాతి పిరికితనం కాక మరేమైనా కంటుందా?

నా దేశంలో నేను ఏకాకిని అని ప్రకటించిన నిఖిలేశ్వర్, ఇప్పుడు సామూహికమైనావా? మరుభూములపై నిలుచున్న సాయంత్రాల చెట్లను ఇంకా చూస్తూనే ఉన్నావా? బుద్దుడు ఇంకా అనాథుడే కదా? చీకటి చుంబించకుండా శ్మశానం నృత్యం చేస్తుందా?గడ్డకట్టిన సౌందర్యంలో రమిస్తున్న శవభోగులు కనపడడం మానివేశారా? కత్తిమొనపై హఠాత్తుగా మెత్తగా తెగిన వేలులా మృత్యువు భౌతిక సత్యాన్ని ఇంకా మోసుకువెళుతుందా?

జ్వాలా ముఖీ, పునర్ యోనీ ప్రవేశం చేశావా? సత్య సౌందర్యావరణలో శివమై తాదాత్మ్యం చెందావా? దిక్కులేని కుష్టున్యాయం దిక్కుల్ని తడిమి తడిమి గాయపడ్డావా? తూర్పు పేలి పగులుతున్న చప్పుడు దగ్గరలో వినబడుతున్నదన్నావు కదా.. ఇప్పుడు సమీపించిందా? హింస విప్లవానికి మంత్ర సాని అన్నావు కదా.ఎంత మంది మంత్రసానులుమరణించారు?

భైరవయ్యా,. కొండచిలువ మరోసారి ఆవులించడం ఆగిపోయిందా?ఏమైతేనేం, లోకం ఎట్లా ఉంటేనేం, కొత్త నెత్తురుతో గానుగెద్దుని పునరుద్దరించడం ఆగిపోతుందా?కొడిగట్టిన చుట్టనుసిలా, ముసుగేసుకున్న విధవలా వెన్నెల అలుముకోవడం మానిపోతుందా? మనం సాకిన విష నాగుల విషకీలలు మన తలకే కొరివిపెట్టయా?

అవును ఆరుగురు కవుల కవిత్వం ఇంకా  అధునాతనమే. వారి కసి అధునాతనమే. ఏ ఆచ్చాదనకూ తల ఒగ్గని, ఏ భయాలకూ లొంగని నిరంతర సజీవ మానవుడికోసం వారిచ్చిన పిలుపూ అధునాతనమే.

ఏం మారిందని? ప్రజల అవసరాలు పట్టించుకోని రాజకీయాశుద్దంలో పొర్లుతున్న అడ్డగాడిదలు మారారా? ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న పీఠాధిపతులు మారారా? ప్రజలచెమట సొమ్ముతో కళ పేరుతో తోలు వ్యాపారం సాగిస్తున్న వారు మారారా? రాజకీయ పురుగులకీ, సినీ మడత కొజ్జాలకీ ఆంధ్రదేశాన్ని తారుస్తున్న ఈ పత్రికాధిపతులు, సంపాదకులు మారారా? కుష్టువ్యవస్థని, దుర్గంధసంస్కృ­తిని తరతరాలకీ అంటించి ఒదులుతున్న విశ్వవిద్యాలయాలు మారాయా?

నిజాలు చెప్పనివ్వకుండా గొంతులు నొక్కేసే పరిస్థితుల్ని ప్రోత్సహించే, విషవలయాన్ని సృష్టిస్తున్న వీళ్లందర్నీ, వీళ్ల కోసం భారత దేశమంతటా విస్తరిస్తున్న కుష్టువ్యవస్థ ను పోషిస్తున్న వాళ్లనీ, వ్యవస్థనీ సర్వనాశనం చేయడానికి దిగంబర కవులు పూనుకున్న నాటి రోజులు మారాయా?

అమ్మా, భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ? అన్నాడొక దిగంబర కవి,.

ఈ ప్రశ్న ఇంకా విలువైనది. కవిత్వం ఇంకా ఇంకా. ఇంకా అనాచ్ఛాదితం కావాలి.


ఒక పరిమళం, ఒక ఊపిరి వెచ్చదనం!

swamyనేల మీద పాదాలు ప్రతిరోజూ నడవనక్కర్లేదు. ఆ నేల నీదైతే చాలు. ఆ నేల నీ పాదాలకోసం ఎదురు చూస్తుంటుంది. నేలకూ పాదాలకూ ఒక విడదీయరాని అనుబంధం ఉన్నది. నీవెక్కడుంటేనేం? అది నీ గుండెలో ఉంటుంది. ఆ నేల తడి కోసం ఎదురు చూస్తుంటుంది. వాన చినుకుకోసం తపించుకుపోతుంది.

నారాయణ స్వామి మనసులో ఒక బీటలు వారిన నేల ఉన్నది. ఆ పగుళ్ల గాయాల మధ్య అతడు నిత్యం ఆక్రందిస్తున్నాడు. ఆ నేలలో నెత్తురు ఇంకిపోయిఉంది. ఆ నేలలో చెట్లు మ్రోడులయ్యాయి. పండుటాకులు ఎన్నడో రాలిపోయాయి. ఆ నేల వైపు మేఘాలు లేని ఆకాశం దీనంగా చూస్తుంటుంది. పక్షులు రెపరెపా కొట్టుకుంటూ ఎక్కడికో పయనమైపోతుంటాయి.

నేలపై పచ్చికబయళ్లు ఏర్పడేటప్పుడు? ఆ పచ్చిక బయళ్లను మంచు బిందువులు ఆలింగనం చేసుకునేది ఎప్పుడు? ఆ మంచుబిందువులను నీ పాదాలు స్ప­ృశించేటప్పుడు? ఆకాశంలో మేఘాలు దట్టమయ్యేదెప్పుడు? అవి దట్టంగా క్ర మ్మి, వాటి గుండెలు బ్రద్దలై అహోరాత్రాలు వర్షించినప్పుడే నేల గుండె శాంతిస్తుంది. నేల పరిమళం నిన్ను ఆవహిస్తుంది.

‘వానొస్తద?’  ఒక అద్భుతమైన ప్రతీకాత్మకమైన కవిత్వం. వాన రావాలన్న కోరిక అందులో ప్రగాఢంగా ఉంది. కాని వాన రావడం లేదన్న బాధ అంతకంటే లోతుగా ఉన్నది. వాన రావడం సహజమైన ప్రక్రియ. అది ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. కనుక ఎప్పుడో ఒకప్పుడు వాన వచ్చి తీరుతుందన్న ఆశాభావం కూడా ఈ కవిత్వంలో ఉన్నది. మన దూప తీర్చేందుకు మనమే జడివాన కావాలన్న ఆశాభావం ఇది.

‘వానొస్తద?’  అన్నది ఒక విమర్శనాత్మకమైన కవిత్వం. వాన యాంత్రికంగా రాదు. వానకోసం ప్రయత్నించే వాళ్లంతా ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. వానొస్తందని నమ్మిన వాళ్లు, వానకోసం సంఘర్షించిన వాళ్లు నేల పగుళ్ల మధ్య సమాధి అయ్యారు. ఎందరి నెత్తురో నేలను తడిపింది కాని వాన నీరు రాలేదు. వాన కోసం ఎదురు చూసే కళ్లు లోతుకుపోయాయి కాని బావుల లోతుల్లో ఊటైనా రాలేదు. కాగితపు పడవలు సిద్దంగా ఉన్నాయి. చిన్న నీటి ప్రవాహం వస్తుందోమో తేలుతూ పసిపిల్లల కళ్లలో ఆనందం చూసేందుకు..

‘వానొస్తద?’  అన్నది ఒక విషాద కవిత్వం. ఒక ఆత్మహత్యకూ, ఒక హత్యకూ అంకితమైన కవిత్వం. కన్నీళ్లతో నేలను తడపాలనే ప్రయత్నించిన కవిత్వం. హత్యలూ, ఆత్మహత్యల మ«ధ్య కాలాన్ని బంధించిన కవిత్వం. అది ఉదయం, సాయంత్రాల మధ్య రెపరెపలాడిన కాలం. విగ్రహాలు పడగొట్టిన వాడు లేడు. వాడు లేడన్న వార్తను జీర్ణించుకోలేని కవిత్వం. ఉరి తాడుకు కలలు ఊగుతూనే ఉంటాయి. ఒకరొక్కరే వెళ్లిపోతున్నారు నిశ్శబ్దంగా బయటకు రాన్ని శోకాన్ని, పుట్టెడు దుఃఖాన్నీ మన గొంతుల్లో మిగిలించి.. ఎంతమందిని ఊరుపేరు లేక మంట్ల గలిపిండ్రు? బిడ్డలారా, మిమ్మల్ని మీరు చంపుకోకుండ్రి.. ఎందర్ని పోగొట్టుకున్నం, ఎన్ని సార్లు కాటగలిసినం.. ఎన్ని కన్నీళ్లు మూటగట్టుకున్నం..

krishnudu

‘వానొస్తద?’  ఒక ఏకాకి వాస్తవ కవిత్వం. కవి ఎప్పటినుంచో ఒంటరి. నిద్రకు వెలిఅయ్యాడు ఒకడు. దినాల్లో కాళ్లీడ్చాడు మరొకడు. గ దిలోపలి చీకటిలో ఒకడు, చీకటిక్షణాల అగాధాల్లో, ఎండిన ఆకుల్లాంటి నదీ తీరాల్లో మరొకడు. వీడిది దొరికినదాన్నే ప్రతిసారీ పోగొట్టుకుంటున్న ప్రయాణం. ఇంతమందీ ఉండి నిర్జనమైన కూడళ్లలో ఒంటరిగా ఆరిపోయిన కొవ్వొత్తుల మధ్య వాడే. సమూహమే ఒంటరైనప్పుడు ఒంటరే సమూహమైన కల ఎక్కడ? జవాబివ్వండి నిరంతర నినాద, అనంత సుదీర్ఘ విప్లవ ఆకాంక్షావాదులారా? స్వాప్నికులారా?

‘వానొస్తద?’  ఒక తప్త హృదయ కవిత్వం. ఎన్ని శతాబ్దాలైంది మనిషిని కౌగలించుకోక? ఎంతకూ కనబడని మొగులు. ఎవరైనా ఇంత మట్టి వాసన చూపిస్తారా? గడ్డకట్టిన సుదీర్ఘ అపరిచయం. కందరీగలా కుట్టే కనికరంలేని ఒంటరి చిన్నతనం. ఒక నిశ్శబ్దాన్ని గుసగుసగా నైనా వినాలన్న తాపత్రయం.

‘వానొస్తద?’ ఒక స్వాప్నిక కవిత్వం. తొలి పొద్దు కర స్పర్శకు రెక్కల్ని విచ్చుకున్న కొత్త రాగాల పాటల్ని ఆలపిస్తుంది.

‘వానొస్తద?’  పుస్తకం పేరులోనే కాదు. పుస్తకం నిండా ప్రశ్నల కవిత్వం. ఎన్ని ప్రశ్నలో.. ఎక్కడైనా ఉన్నామా? అంతా ఆన్‌లైన్ పద్మవ్యూహాల్లో చిక్కుకుపోయామా?. ఎట్ల వొస్తవో? ఏ వెలివాడల్లో వెతకాలి నిన్ను? దారేది అవుతలికి? దొరుకుతద? దొరకని దానికోసమా వెదుకులాట? మళ్ల వస్తవ? బాపూ.. నీ యాది..తొవ్వ తెలుసా? ఎట్టపోతవు ఒక్కనివే. ఈ పట్టపగటి చీకటి పూట? ఆడుకున్న బస్తీ.. చెయ్యి పట్టుకున్న తంగెడుపూలు ఏవీ? వాళ్లెవరో? కాలం కళేబరం ఊరేగింపులో పూలయి గీసుకపోతరు..

వాన బయట కురవడం లేదు. నారాయణ స్వామి మనసులో కురుస్తున్నది. చప్పడు బయటకు వినిపిస్తున్నా, వాన మాత్రం లోపల కురుస్తున్నదని నారాయణ స్వామికి తెలిసిపోయిందని కెఎస్ ఒక్క మాటలో చెప్పాడు.

‘వానొస్తద?’ ఒక పసివాడి కవిత్వం. చిన్నప్పుడు తాగిన పాల తీపినీ, ఆడుకున్న బొమ్మల్నీ, పాత అర్ర వెనుక ఒంటరితనపు దోస్తుల్నీ అన్వేషించే కవిత్వం. ప్రేమ రాహిత్యాన్ని సహించలేని మనస్తత్వం. ప్రేమకాకపోయినా కనీసం ద్వేషాన్నైనా తడి వెచ్చగా తొలకరించమని తపించే కవిత్వం. గమ్యం కనపడని ప్రతిసారీ పుస్తకాల్లో దాచుకున్న బంతిపూల రెక్కల్ని తడిమి చూసుకున్న కవిత్వం.

ఈ పసివాడిని మనం హత్తుకుందాం.. అతడు అనుభవిస్తున్న ప్రేమరాహిత్యాన్ని దూరం చేద్దాం.ఎందుకంటే ఆతడు మనకు దూరంలో లేడు. దూరంగా ఉన్నాననుకుంటున్నాడు. కాని అతడిదీ మనదీ ఒకటే బాధ.. ఇది సామూహిక బాధ. ఇది సామూహిక కవిత్వం.  ‘వానొస్తద?’ మన సంభాషణ, మన సందర్భం. మన కాలం. మన రోదన. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పడనీ..

నారాయణ స్వామి వచ్చాడు.. ‘వానొస్తద?’ మనకు ఇచ్చాడు. నీ రాకని నీ పరిమళం చెప్పనీ.. నీ సమక్షాన్ని నీ ఊపిరి వెచ్చదనం తెలుపనీ. నువ్వులేని తనాన్ని నీ మౌనం పలకనీ.. ‘వానొస్తద?’ ఒక పరిమళం. ఒక ఊపిరి వెచ్చదనం. ఒక మౌనం.

(నారాయణ స్వామి కవిత్వం ‘వానొస్తద?’ సమక్షంలో ) 

రాలిన ఆకులకు లెక్కలేవీ?

krishnudu

మధ్యలో ఆగిపోయింది కాలమ్ అని చాలా మంది అనుకుంటారు కాని నాకు అనిపిస్తుంది అది కాలమేనని. ఎందుకు ఉన్నట్లుండి కాలం ఆగిపోతుందో, సమయం స్తంభించిపోయినట్లు అనిపిస్తుందో కాని అది ఆగిపోవడమా? లేక నండూరి రాసినట్లు గుండె గొంతుకలో కొట్లాడడమా?

పరిణామక్రమంలో ఏదీ ఆగిపోదేమో, ఏదీ స్తంభించిపోదేమో కాని ఎందుకు ఏదీ మారిపోలేదేమోఅని అనిపిస్తుంది? అవే ప్రశ్నలు, అవే జవాబులు. అవే భావోద్వేగాలు.

తరుచూ నేను మట్టిపై కూర్చుంటాను. ఎందుకంటే నా తాహతు నాకు బాగా అనిపిస్తుంది.. నా శైలి నా ప్రత్యర్థులకు నచ్చదు ఎందుకంటే ఎప్పటినుంచో నేను ప్రేమించడాన్ని మార్చుకోలేదు. స్నేహాన్నీ మార్చుకోలేదు.. అని హరివంశరాయ్ బచ్చన్ ఏనాడు రాశాడో కాని కవిత్వం రాయడానికీ, కవిత్వం గురించి రాయడానికీ పూనుకున్నప్పుడల్లా నిన్ను గురించి నీవు తెలుసుకోవడమే అవుతుంది. మట్టి పరిమళం వీడనట్లనిపిస్తోంది.

ఈ రకంగా నీవు నా జీవితంలో చేరిపోయావు.. ఎక్కడికెళ్లినా నీవు పరివ్యాప్తమయ్యావు. అని నిదాఫాజిలీ రాసిందీ కవిత్వం గురించే అనిపిస్తుంది.

జీవితం సగ కాలం గడిపోయింది అనుకుంటాం. సగం రాత్రి గడిచిపోయింది. సగం పగలూ వెళ్లిపోయింది. కాని నిజంగా అది సగం జీవితమా? రెప్పలు తెరుచుకున్నంత సేపూ మూసుకుంటున్నాయి. దోసిలి లోంచి ఇసుకు జారిపోతోంది. దాహం తీరకముందే నీరు ఇంకిపోతోంది..

ఎప్పుడో కందీళ్ల ముందు తడిమిన అక్షరాలేవీ ఇప్పుడు? చెప్పుల్లేని కాళ్లతో ముళ్లడొంకల్లో సాగిన బుడిబుడి నడకలేవీ? గుడి ముందు లైనులో నిలబడింది భక్తికోసమా? ప్రసాదం కోసమా?

కడుపులో రేగిన బడబానలానికి ఎవరు అర్థం చెప్పారు? రాలిన ఆకులకు లెక్కలేవీ? ఏం చేయాలనుకున్నావు? ఏం చేశావన్నది ప్రశ్న కాదు.

ఏం చేశావు ఇంతకాలం? కలతలు రేపిన కళ్లలోకి చూశావా? పులకింపచేసిన నవ్వుల్లో ఉండిపోయావా? పూలవానసల్లోకి తొంగిచూసే తీరికెక్కడిది? స్పర్శకు ముందే ఆవిరైన ప్రేమ ఏదీ?

నినాదం నిరంతరం ప్రతిధ్వనిస్తుండడమేనా? విముక్తి ఎండమావి కోసం పయనమేనా? వెలుగు చూపాలనుకున్న కాగడాలెక్కడ? రెండడుగుల మధ్య దూరమే జీవితమా?

అవే కౌగిలింతలు. అవే కలహాలు, సంఘర్షణలు.. జేబుల్లో కాగితాలే జీవన సంగీతాలా?

ఈ ప్రయాణానికి ఎక్కడుంది మలుపు? మరిచిపోయిన అధ్యాయాల్ని తెరిచి చూసి చదువుకుంటే జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ అదే కదా..

ఎక్కడున్నాయి సగం వసంతాలు? పక్షులై ఎగిరిపోయాయేమో..

చేతివ్రేళ్లు తగలని పుస్తకంలా కొట్టుకుంటోంది జీవితం. ఇన్నేళ్లు గడిచినా ఒక చిరునవ్వుకోసం, ఒక పలకరింపుకోసం మనసు తన్లాడుతోంది. కాని కరచాలనానికి చేయిజాపే లోపు మనిషే మాయం? ఎక్కడ వాడు?

సమీపంలో ఉన్నదేదీ సన్నిహితం కాదా? ఎదురుగా ఉన్నవాడిని పోల్చుకోవడం ఎంత కష్టం? పక్షులు ఆకాశం కోల్పోయాయా? ఆకాశం పక్షుల్ని కోల్పోయిందా?

అయినా వద్దకున్నా వ్రేళ్లు ఆగవు. అవి నాకు తెలీకుండా చలిస్తూనే ఉంటాయి. రాస్తాను.. అఫ్సర్ కోసమైనా రాస్తాను.. రాయకుండా ఉండలేను.

ఇప్పుడు..

అర్థనిమీలిత నేత్రాల మధ్య ఆకాశం దాచుకున్న రహస్యాల వెనుక తెగిపడుతున్న పక్షుల చప్పుడు వినిపిస్తాను.

కనుగ్రుడ్ల భూగోళాల మధ్య, నేల పొరల్లో దాగిన చరిత్ర పుటల వెనుక నిక్షిప్తమైన అస్తిపంజరాల సంభాషణ వినిపిస్తాను.

కనురెప్పల దొంతరల మధ్య ఎగిసిపడుతున్న కెరటాలు చెప్పలేని అల్లకల్లోల దృశ్యాల పదధ్వనులను వినిపిస్తాను.

కనుబొమల అర్థ చంద్రాకారాల మధ్య భ్రుకుటిలో దాగిన ఆత్మ కన్ను వెనుక రగిలిపడుతున్న జ్వాలామాలికల చిటపటలు వినిపిస్తాను.

నిశ్చలమైన దృక్కుల వెనుక ఆలోచనల్లో దాగిన సాంద్ర నీహారికల్లో తొణికిసలాడుతున్న అశ్రుగీతికలు ఆలపిస్తాను.

ఎందుకంటే అకాల మరణం చెందిన ప్రతి శవమూ నాదే. ఆ రోదనా నాదే. ఆ చితి మంటలూ నావే. ఆ చితా భస్మమూ నాదే. ప్రతి హంతక శరీరం వెనుక నడుస్తున్న నీడా నాదే.

*

‘కోయీ అకేలా హై కహా..’

Krish.psd

గదిలో కూర్చుంటే చలి. కాని రోడ్డుపై నడుస్తుంటే చలి ఎక్కడిది? నేలపై పాకుతున్న పొగమేఘాలు. సాయంత్రం అయిదింటికే గూళ్లకు చేరాలని తపిస్తున్న పక్షుల చప్పుళ్లు. ఒక వృద్ద చిరు వ్యాపారి ముందు నిప్పుల మధ్య కాలుతున్న పల్లీల వాసన. చెట్టుక్రింద నిలబడి వేటి వేడి టీ తాగుతూ కబుర్ల వేడిలో మునిగిపోయిన ఉద్యోగులు. బస్‌స్టాప్ వద్ద గుంపులు గుంపులుగా ఆతురతతో ఎదురు చూస్తున్న జనం. రోడ్డు దాటడానికి అవస్థ పడుతున్న గృహిణి. దృశ్యాలు మనసు తెరలపై ఇంకిపోతుంటే ఏదో ఒక పాట నిన్ను నిలిపేస్తుంది. పాదాలకు నడుస్తున్న విషయం కూడా తెలియదు.. 

‘ఆభిజా.. ఆభిజా.. ఏ సుబా ఆభిజా.. రాత్‌కో కర్ విదా.. దిల్‌రుబా ఆభిజా..’ ఎక్కడ విన్నాం ఈ పాట. అనువదించగలమా? ‘రావెరా.. రావెరా.. ఉదయమా రావెరా రాత్రినీ సాగనంపీ.. ప్రియతమా.. రావెరా..’ ఈపాట రాసిందెవరు? నిదా ఫాజిలీ కదా? ఎవరీ నిదా ఫాజిలీ? ఏదైనా పాటో, కవిత్వమో నచ్చిందంటే దాని పాదముద్రల వెంట పయనించడం మానవా? 

‘దునియా  జిసే కహతే హై జాదూకా ఖిలోనా హై.. మిల్ జాయెతో మిట్టీ హై, ఖో జాయెతో సోనా హై.’. ( ఈ ప్రపంచమొక అద్భుత ఆటబొమ్మ.. దొరికితే మట్టే.. పోగొట్టుకుంటే బంగారం) అన్న ప్రసిద్ది చెందిన వాక్యాలు రాసిన నిదా ఫాజిలీ గ్వాలియర్ వీధుల్లో సంచరిస్తూ కవిత్వాన్ని మనసులో ఒంపుకున్నాడు. ఒకరోజు వీధుల్లో నడుస్తూ గుడిలోంచి వినిపిస్తున్న సూర్‌దాస్ భజన విన్నాడు. కృష్ణుడికోసం తపిస్తూ రాధ తన చెలికత్తెల వద్ద విషాదంగా ఆలపిస్తున్న మధుర గీతిక అది. గురుదత్ ‘ప్యాసా’ కోసం సాహిర్ లూధియాన్వీ రాసిన ‘ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలో.. జనమ్ సఫల్ హోజాయే..’ అని గీతాదత్ గొంతుకతో వహిదా రహమాన్ తపించిన గీతిక లాంటి పాట అది. అంతే. నిదా ఫాజిలీ కవి అయ్యారు. . 

1938లో జన్మించిన నిదా ఫాజిలీ తన తండ్రి దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్లినప్పటికీ భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సూర్‌దాస్, కబీర్ , మీరా ఆయనను భారత్‌లోనే పట్టి ఉంచారు. ఢిల్లీలో జన్మించి, మన హైదరాబాద్‌లో మరణించిన డాగ్ దెహ్లివీ (నవాబ్ మీర్జాఖాన్) ప్రాచుర్యం పొందిన కవితా శైలిని కాదని తనదంటూ కొత్త శైలిని ప్రవేశపెట్టిన కవి నిదా ఫాజిలీ. నాటి ఉర్దూ కవులు కైఫీ ఆజ్మీ, సాహిర్ లూధియాన్వీ, అలీ సర్దార్ జాఫ్రీ కవితా శైలిని విమర్శిస్తూ సంచలనాత్మక వ్యాసాలు రాశారు. అప్పటివరకూ ఉర్దూ కవిత్వంలో తచ్చాడుతున్న పర్షియన్ ప్రతీకల్ని, పదాల్నీ వదిలిపెట్టి కొత్త ప్రతీకల్ని చిత్రించిన కవి ఫాజిలీ. ‘నా మనసులో ఏముందో నా పెదాలెప్పుడూ చెప్పలేవు… నా మౌనం ఏమంటుందో ఆమె అర్థం చేసుకోలేదు.’. అని ఆయన తప్ప ఎవరు రాయగలరు? 

untitled

ముంబయిలో ఉద్యోగం కోసం వీధుల్లో తిరుగుతూ పత్రికల్లో కవితలు రాస్తున్న ఫాజిలీని కమల్ అమ్రోహి గుర్తించకపోతే ఆయన దశ తిరిగేది కాదు. ‘నీ వియోగమే నా తలరాత… నీ విషాదమే నా జీవితం’ (తేరా హిజ్ర్ మేరా నసీబ్ హై.. తేరా గమ్ హీ మేరా  హయాత్ హై) అని ‘రజీయాసుల్తాన్’ కోసం ఆయన  రాసిన పాట   హిందీ సినీ ప్రపంచంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ‘తూ ఇస్ తరా మేరీ జిందగీమే షామిల్ హై’ ( ఈ రకంగా నీవు నా జీవితంలో చేరావు), ‘హోష్‌వాలోంకో ఖబర్ క్యా బేఖుదీ క్యా ఛీజ్ హై- ఇష్క్ కీజే ఫిర్ సమఝియే జిందగీ క్యా చీజ్ హై’ (స్పృహలో ఉన్నవాడికి ఏం తెలుసు మైమరిచిపోవడం, ప్రేమలో పడు అర్థమవుతుంది.. జీవితం అంటే ఏమిటో).. అని ఎన్నో గీతాలు రాశారు. ‘సఫర్ మే దూప్‌తో హోగీ, జో చల్ సకోతే చలో, సభీ హై బీడ్ మే తుమ్ భీ, నికల్ సకోతో చలో- యహా కిసీకో కోయి రాస్తా నహీ దేతా, ముఝే గిరాకే అగర్ తుమ్ సంబల్‌సకోతో చలో..’ ( ప్రయాణంలో ఎండ ఎలాగూ ఉంటుంది, సాగిపోగలితే సాగిపో.. అంతా జనసమ్మర్థంలోనే.. బయటకు రాగలితే సాగిపో, ఇక్కడ ఎవరూ ఎవరికి దారి ఇవ్వరు, నన్ను పడేసి నీవు నిలదొక్కుకోగలిగితే సాగిపో) అన్న అద్భుతమైన గీతాలు రాశారు. ‘గోడలంటే భయపడి దిగిపోయిన నీడలు మాట్లాడుతాయి.’. అన్న వాక్యాలు ఫాజిలీ కవితల్లో వెంటాడుతాయి. జగ్జీత్ సింగ్, చిత్రాసింగ్,కవితా కృష్ణమూర్తి లాంటి వారి గొంతుల్లో ఆయన గీతాలు  నీటిబిందువులను అలంకరించుకున్న గులాబీ పూల లాంటి అసాధారణ అందాన్ని సంతరించుకున్నాయి.

ఫాజిలీ వెంటాడడానికి మరో బలమైన కారణం ఉంది. చాలా మంది కవుల్లాగా ఆయన యదాతథ స్థితిని, యాంత్రిక జీవితాన్నీ ఇష్టపడలేదు. సినిమాల్లో పాటలు రాయడాన్ని తనంతట తాను మానుకొన్నారు. మరింత సీరియస్ కవితల్ని రాయడం మొదలు పెట్టారు. ఆయన భావాలు మరింత దట్టమయ్యాయి. ఆయన ఆలోచనల్లో మరింత గాఢత అలుముకొంది. మతతత్వంపై, ముఖ్యంగా రాజ్యాంగ యంత్రంలో ఉన్న మతతత్వంపై ఆయన కలం ఎక్కుపెట్టారు. మతఘర్షణల్ని, వాటి వెనుక ఉన్న రాజకీయ శక్తుల కుతంత్రాలను ద్వేషించారు. 1992లో ముంబైలో అల్లర్లు జరిగినప్పుడు ఆయన స్వయంగా ఒక స్నేహితుడి ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత జీవితంలోని వైరుధ్యాలను, పట్టణ జీవితంలోని కృత్తిమత్వాన్ని ఎండగడుతూ కవిత్వీకరించారు. గుజరాత్ అల్లర్లైనా, సద్దాం హుస్సేన్‌ను ఉరితీసినా ఆయన ఊరుకోలేకపోయారు. 

‘ఖుదా ఖామోష్ హై’ (దేవుడు మౌనంగా ఉన్నాడు) అన్న కవితలో ఆయన ‘నేను ఒంటరిగా అంతా చేయలేను. నీవు నాతో చేరితే కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం..’ అని ఆయన జనాన్ని సమీకరించే ప్రయత్నం చేశారు. ‘మసీదోం మందిరోంకో దునియా మే, ముఝే పహచాన్‌తే కహా హై లోగ్’ ( మసీదులు, మందిరాల ప్రపంచంలో నన్ను జనం ఎక్కడ గుర్తు పడతారు?) అని ప్రశ్నించిన ఫాజిలీ  ‘ప్రపంచాన్ని చీకట్లో ముంచి ఆకాశంలోకి వెళ్లి దేవుడిగా మారి అంతా దగ్ధం చేస్తాను’ అని ‘ఐలాన్’ అన్న కవితలో రాశారు.. ఈ కవితలు ఇప్పుడు చదువుతున్నప్పుడు మనకు ‘పీకే’ సినిమా గుర్తు రాక మానదు. ‘కరాచీ తల్లిఅయితే ముంబాయి ఆమెనుంచి వేరుపడిన కొడుకు. ఆ పవిత్ర బంధాన్ని ఎవరూ ఈనాటికీ తెంచలేకపోయారు. తెంచలేరు కూడా.. నా తల్లి నాపై కత్తి ఎత్తలేదు.. నేను ఆమె పై తుపాకీ ఎక్కుపెట్టలేదు. ఎవరు ఎవరికోసం మరి యుద్దం చేస్తున్నారు? ఎందుకోసం ఈ ఘర్షణ?’ అని ఆయన రాశారు. ‘మసీదు గుమ్మటాలు మౌనంగా ఉన్నాయి, మందిరం గంటలు మౌనంగా ఉన్నాయి..’ అన్నారు. ‘బృందావన్ కీ కృష్ణ కన్హయ్యా అల్లాహూ.. బంసీ రాధా గీతా గయ్యా అల్లాహూ’ అన్న గీతం. ‘మౌల్వీయోంకా సాజ్దా పండిత్ పూజా, మజ్జూరోంకి హైయ్యా హైయ్యా అల్లాహూ.’. అన్న వాక్యాలతో అంతమై శ్రమైకజీవన సౌందర్యంలో దైవత్వాన్ని చూపిస్తుంది. 

‘ఆద్మీ మరా నహీ, జిందా హై ఆద్మీ షాయద్, బదన్ కి అంధీ గుఫా మే ఛుపా హోగా’ ( మనిషి మరణించలేదు.. బహుశా జీవించే ఉన్నాడు, శరీరపు చీకటి గుహలో దాక్కున్నాడు), , ‘కోయీ  అకేలా హై కహా, సాత్ హై సారా జహా ‘( ఎవ రైనా ఒంటరిగా ఎక్కడున్నారు? మొత్తం ప్రపంచం వెంట ఉంది) అన్న ఆయన కవితా వాక్యాలు విన్నప్పుడు ప్రతిఘటనా ప్రపంచంలో ధిక్కార స్వరాలు వినిపించే వారిలో నేను ఒంటరివాడిని కాదనిపిస్తుంది.


-కృష్ణుడు

ఎర్రటి ఎన్నియల్లో ఎన్‌కే

10410372_10152573024851700_6156636491804091071_n‘ఎన్‌కే మరణించారు..’ అని ఒక స్నేహితురాలు ఎస్ఎంఎస్ పెడితే ఆఫీసునుంచి వణికించే చలిలో తిరిగి వస్తున్న నా శరీరంలో వెచ్చని నెత్తురు ఎందుకు ప్రవహించింది? దేహాన్ని కోస్తున్న చలిగాలుల మధ్య ఒక వేడిగాలి ఎందుకు నన్ను చుట్టుముట్టింది? గుండెలో ఏదో కలుక్కుమన్న భావన ఎందుకు కలిగింది? అసలు నేనెవరు? ఆయనెవరు?

రోజూ చాలా మంది మరణిస్తుంటారు. పత్రిక పేజీలు తిప్పితే ఎక్కడో ఒక మూల మనకు పరిచయమైన వారి మరణాలు కనిపిస్తుంటూనే ఉంటాయి. శీతాకాలంలో పచ్చటి చెట్లపై మంచు పేరుకుపోయినట్లు, శిశిరంలో ఆకులు రాలినట్లు మనుషులు మరణిస్తుంటారు. కాలం సాగుతూనే ఉంటుంది.

‘ఎన్‌కే’ అనే నెల్లుట్ల కోదండ రామారావు మరణం సహజ మరణమే కావచ్చు. ఏడుపదుల వయస్సు దాటి, అనారోగ్య సమస్యలకు గురై, మంచం పట్టి అనేకమంది లాగా ఒకరోజు శ్వాసవదిలి పొందిన మరణంకావచ్చు. ‘మరణం చిరస్మరణీయమైనదే.. కాని బూడిదను పులుముకోవడం నాకిష్టం లేదు.’. అని మరణం గురించి ఒక కవితలో రాశాను. ఎన్‌కే మరణం చిరస్మరణీయమైనదే. కాని ఆయన చితాభస్మంలో కూడా రగులుతున్న నిప్పుకణాల్లో రేపటి జ్వాలలు కనిపిస్తాయి. ఎగరేసిన ఎర్రజెండ రెపరెపల ధ్వనులు వినిపిస్తాయి. 

కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకరోజు వరవరరావు నివాసంలో సాహితీ మిత్రుల సమావేశంలో ఎన్‌కేను చూశాను. ఆ గాంభీర్యం చూస్తే భయమేసింది. ఆ కరచాలనం గగుర్పాటు కలిగించింది. ఆయనది పూర్తిగా వికసించిన నవ్వు కాదు. అరవిరిసిన ఆ నవ్వులో కూడా ఒక సీరియస్‌నెస్ కనిపించింది. ఇక ఆయన గొంతెత్తి కవిత చదివినా, పాటపాడినా తనను తాను జ్వలింపచేసుకుంటున్నట్లే కనపడేవాడు. ఆయన అభిమానంగానే పలకరించేవాడు. కాని ఆ ఆభిమానంలో కూడా హత్తుకోలేనంత దూరం ఉండేది. 

ఆ రోజుల్లో చాలా మంది విప్లవాభిమానులు, విప్లవ రచయితలు అలాగే ఉండేవారు. వారితో మాట్లాడితే మనలో ఉడుకు నెత్తురు తనంతట తాను ప్రవహించేది. కరచాలనం చేస్తే విద్యుత్ తగిలి నరాలు ప్రకంపించేవి. వారి ఉపన్యాసాలు, కవితలు, పాటలు మైదానాల్ని, జనారణ్యాల్ని రగిలించేవి. రేపే విప్లవం వస్తుందని, మరి కొద్ది రోజుల్లో సమసమాజం ఏర్పడుతుందన్న వీరోత్సాహం కలిగేది. 

ఈ నేపథ్యంలోనే నాటి కవుల కవిత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ వాటిని చదివితే నినాద ప్రాయంగా అనిపించవచ్చు. కాని వారు ఒక కవిత రాసిన వెంటనే అందులో వాక్యాలు గోడలపై నినాదాలుగా మారి, ప్రజల గొంతుల్లో ప్రతిధ్వనించేవని మనం ఈనాడు అర్థం చేసుకోగలమా? నగ్నంగా మండే ఆచ్చాదన లేని అగ్నిజ్నాలలు నాటి కవితలు. అది ఆనాటి సామాజిక అవసరం కావచ్చు. 

జననాట్యమండలి ఉనికిలో లేని రోజుల్లో ఎన్‌కె విప్లవగీతాలు రాసే వారు. తానే పాడేవారు. శివసాగర్ రాసిన అనేక పాటలను స్వరపరిచింది ఆయనే. ఆయన చెల్లీ చెంద్రమ్మ పాడితే విన్న ప్రతివాడికీ నెత్తురు మండేది. ‘కత్తి ఎత్తి ఒత్తి. పొత్తి కడుపులో గుచ్చి.’. అని ఆయన కసిగా అంటే మనమే ఆ భ్వూసామి గుండెలో కత్తి దించినట్లు భావించే వారం. మనమే ‘తోటరాములమై’ మన తొడకు తూటా తగిలిందని బాధపడేవారం. 

విద్యార్థులనుప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రచయితలను దిగంబర, విప్లవ కవిత్వాలు ప్రభావితం చేయకుండా ఉండలేని రోజుల్లో ఎన్‌కే సంచలించారు. వరంగల్‌లో వరవరరావు కరచాలనం చేసి ప్రకంపనలు పొంద కుండా ఉండలేని వారిలో ఒకరయ్యారు. విరసం సభ్యుడయ్యారు. సృజన సాహితీ మిత్రుడయ్యారు. అంతే. ఒక సాధారణ ప్రభుత్వోద్యోగిని విప్లవం ఆవహించింది. అయితే తిరుపతి వేంకటకవులను ఢీకొన్న తండ్రి నెల్లుట్ల రామకృష్ణ కవి, నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాన్ని సాయుధం చేసిన దేవులపల్లి రామానుజరావు సోదరి అయిన తల్లి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల నాయకుడైన సోదరుడు జగన్మోహన్ రావు రక్తం ప్రవహించనిదే ఎన్‌కే కలం ఎలా చేపట్టగలరు?


‘తెగిపారిన నెత్తురులో ఎగరేసిన ఎర్రజెండ’ అని ఆయన మేడే పై రాసిన కవిత 1970లలోనే సృజన సంచిక కవర్ పేజీ కవితగా మారింది. అది మేడే నాడు గోడలపై ఎర్రగా మెరిసేది. ‘ఈ వ్యవస్థే ఒకజైలు.. నిర్బంధంలో ఉన్న నీకూ నాకూ తేడా లేదు.. కటకటాలను విరగదన్నుకురా.’.ఈ వ్యవస్థశిరస్సుపై ప్రజాశక్తి పాదాలతో బలంగా అడుగేయి. అని 71లో ఆయన రాసిన కవితా వాక్యాలు నాడు జనంలో శక్తిని నింపేవి. ‘నెత్తుటిలో తడిసిన చెయ్యి పైకెత్తు’ (1973) అని చెప్పినా అదొక ఉత్తేజం కలిగించేది. అలా అని ఎన్‌కే లాంటి కవులకు కవిత్వ ఒడుపు తెలియదని కాదు. కాని జనంలో ప్రవేశించడం కోసం వారు ఒడుపులకోసం పట్టువిడుపుల్ని ప్రదర్శించారు. 

‘అతడు మూసిన పిడి కిలి
శ్రామిక జన నియంతృత్వ స్థాపనకు ముఖద్వారం, 
అతని కదలిక, కదలికలో పొర్లుతున్న అలల కడలి, 
కదులుతున్న శ్వాస, 
పోరాటం బాటలమీదకు ఆహ్వానం రాస్తున్నవాడు, 
నీరు నింగి నేల గాలి తన ఊపిరి పోస్తున్నవాడు.
నాల్గు చెరగులా అంటుకున్న నిప్పు,
నాల్గు దిక్కులా వీస్తున్న తూర్పుగాలి’

అని ఉస్మానియాలో విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి మరణంపై 1974లో ఎన్‌కే రాసిన కవిత ప్రతి విప్లవకారుడికీ ఎనలేని ఉత్సాహాన్ని కలిగించేది. 

ఇవాళ ఒక్కో మరణం మనలో విషాదాన్ని, నిరుత్సాహాన్ని, నిర్వేదనను కలిగించవచ్చు. కాని ఆనాడు ప్రతి మరణంతో విప్లవకవి రగిలిపోయేవాడు. నెత్తుటి రుణాన్ని తీర్చుకుంటానని ప్రతిన చేసేవాడు. వరంగల్‌లో గణేశ్ అనే యువ ఉద్యమకారుడు మరణించినప్పుడు ఎన్‌కే ఈ కవిత రాశారు. 

‘కామ్రేడ్, ఏదో ఒక కొరత, 
ఏదో వెలితి, ఏదోకోత,
అయినా ఈ కళ్లమీద దుఃఖపు తెర దించుకోను, 
ఈ కోతను కత్తిలా వాడుకుంటాను,
ఈ కోతను కవచంలా తొడుక్కుంటాను, 
గుండె మీద కన్నీటి అంచు పెడుతున్న కసి పదును.’.

మరణిస్తామని అందరికీ తెలుసు. కాని పోరాడి మరణించడం అనేది ఒక ఆశయం, ఆకాంక్ష గా మారిన రోజులవి. ప్రతిపాటలోనూ, కవితలోనూ, పోరాడి మరణిద్దాం. మరణించినా అంతిమ విజయం మనదే.. అన్న ఆత్మ విశ్వాసం కనిపించేది. 

‘పోదాం కలిసి పోరాటానికి, వస్తావా నా వెంట
ప్రజలకోసమై ప్రాణం ఇద్దాం
ఉంటావా నా జంట.. 
కళ్లు కళ్లు కలుసుకుని చేసే బాసలు ఏముంటయి, 
మనసు మనసు పరుచుకుని చెప్పే ఊసులు ఏముంటయి
ఉంటే ప్రాణం, పోతే ప్రాణం
కమ్యూనిస్టులకు ప్రజలే ప్రాణం'( పోదాం కలిసి 75 ఫిబ్రవరి)

అని ఎన్‌కే రాశారు. ఇదే పాటలో చరణాలు 
‘అడుగడుగూ రక్తం మడుగు, కమ్యూనిస్టులదే ముందడుగు.’. 
‘అలసిన కన్నుల అలజడి గుండెల జలగా పుట్టిన దే మంట.. 
కలసిన చేతుల కసిగా ముడిచిన పిడికిలి బిగింపులేమంట’

అన్న వాక్యాలు గోడలపై ధ్వనించి రాడికల్ విద్యార్థులకు ప్రేరణ కలిగించేవి. 


‘నీ దారిలో నడుస్తున్నందుకు గర్వంగా ఉంది. 
నీదారి రహదారి కాదు 
రహదారి కోసం దారి కాస్తున్న వాడివి నీవు'(రహదారి 78)

అని రాసిన ఎన్‌కే 

‘ఎర్రజెండా ఎత్తి,కూలిదండు గట్టి కదలి రారో.. ఎర్రాటెన్నెలదేరో'(79),
‘ఎర్రజెండేరోరన్నా, ఎర్రజెండేరో మన బతుకు బాటకు వెలుగుదారి ఎర్రజెండేరో'(74)
అన్న శక్తివంతమైన పాటలు రచించారు  వెన్నెల కూడా ఎర్రగా ఉండాలని కవి భావించిన రోజులవి. 

‘వెచ్చని జనం గుండెల్లోనే అచ్చమైన భద్రత ఉన్నది’. అని ఆయన 1980లో ‘భద్రత’ అనే కవితలో రాశారు. ‘బిగిసిన పిడికిట్లో తుపాకి ప్రతిహింసాధ్వానాల ప్రతిజ్ఞలు తీసుకుంటుంది.’. అని ఈ కవితలో రచించారంటే  నాటి మూడ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. 

ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత తర్వాత ఎన్‌కే 1981లో రగల్‌జెండా పేరిట మరో కవిత రాశారు. 

‘తడిసి తడిసి నెత్తురైన జెండా ఒకటి 
నీ సేద దీర్చి నీకు నీడపడుతుంది, 
ఆ జెండాదే అయిన సుదీర్ఘ పోరాట చరిత్ర 
ప్రేమతో నీ శిరస్సునెప్పుడూ ముద్దాడుతుంది’


కసి, కోపం, దుః«ఖం, ఆనందం, ప్రతిఘటన సహజలక్షణాలు. వాటిని కవిగా కాళోజీ కాపాడుకున్నారు. కాని ఆయనలో వర్గపోరాట చైతన్యం లేదు అని ఎన్‌కే నాడు విమర్శించారు. కాళోజీనే కాదు, సోమసుందరం, ఆరుద్ర, గంగినేని, దాశరథి లాంటి తెలంగాణ పోరాట కవుల్నీ తన సాహితీ విమర్శలో దుయ్యబట్టారు. నాడు కవిత్వమే కాదు, సాహితీ విమర్శ కూడా ఇదే ధోరణిలో సాగింది. 

ఎన్‌కే రాసిన అత్యంత శక్తివంతమైన, రాజకీయ సైద్దాంతిక ప్రేరణ కలిగిన కవిత ‘లాల్‌బనో గులామీ ఛోడో.’. 1982లో ఆయన రాసిన ఈ కవితకొక చారిత్రక సందర్భం కూడా ఉన్నది. 1980లో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. జనతా పార్టీ నుంచి విడివడి తనకంటూ ఒక రాజకీయ సైద్దాంతిక ఉనికికోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నించింది. ఎమర్జెన్సీ తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకత ప్రారంభమైన రోజులవి. ప్రత్యామ్నాయ పార్టీగా జనతా వైఫల్యం చెందడంతో బిజెపి ఒక రాజకీయ వేదికగా ముందుకు వచ్చింది. అప్పటికే ఆర్ఎస్ఎస్ శాఖలు విస్తరించడం ప్రారంభించాయి. నక్సల్స్ విజృంభణతో అట్టుడికిపోయిన కొన్ని ప్రాబల్యం గల వర్గాలు రాడికల్ విద్యార్థి సంఘానికి ప్రత్యామ్నాయంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను రంగంలోకి దించాయి. ఒక సైద్దాంతిక పోరు దేశవ్యాప్తంగా కళాశాలలు. యూనివర్సిటీల్లో ప్రారంభమైంది. జ్ఞానం శీలం ఏకత, పరిషత్‌కీ విశేషత.. అని గోడలపై నినాదాలు కనపడేవి. యూనివర్సిటీల్లో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులూ చీలిపోయి కనపడేవారు. నాడు ఆ భావజాలాన్ని ఎన్‌కె ప్రతిభావంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. ఎబివిపి వారు ఉచ్చరించే పదాలనే వాడుకుని వారిని సైద్దాంతికంగా ఢీకొనేందుకు ప్రయత్నించారు. ఆరోజు ఎన్‌కే వేసిన ప్రశ్నలు ఈనాడూ విలువైనవే. నిజానికి ఆ రోజు సంస్కరణలు ప్రారంభం కాలేదు. సంస్కరణల తర్వాత కార్పొరైటీకరణ మరింత విస్తృతం అయింది. అందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు బలగాలు దోహదం చేశాయి. 

‘నేను నా మాతృభూమి గురించి మాట్లాడుతున్నాను 
నా దేశం రత్నగర్భ.. రత్నాలకోసం గర్భాన్ని చీల్చిందెవ్వరు?
అడవులు ఎవరి ఆస్తి, నదులు ఎవరి ఆస్తి.. 
అదిమ సమాజంపై అడవి రంకె ప్రకటించిందెవ్వడు?
ప్రశ్నించిందెవ్వడు?’


అని ఆయన ప్రశ్నించారు. 

‘వందేమాతరం మృతప్రాయమైన నినాదం కాదు, 
మత వాదంకాదు. జపించే భజన మంత్రం కాదు, 
అమ్మ ఒళ్లోనూ, అమెరికాను కలవరించే 
సామ్రాజ్యవాద దాసులు మీరు.’.

అని ఎన్‌కే రాసిన కవితా వాక్యాలు కాంగ్రెస్, బిజెపితో సహా ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న పలు పార్టీలకు వర్తిస్తాయి. 

‘నాకు స్వాతంత్య్రం రాలేదు.
నా దేశశృంఖలాలు ఈనాటికీ తెగిపోలేదు’.. 

అని ఎన్‌కే రాసిన వాక్యాలు ఇవాళ ప్రతి సామాన్యుడూ వేసుకునే పరిస్థితి ఏర్పడింది. నయా సామ్రాజ్యవాదాన్ని అధికారంలో ఉన్న వారే ప్రోత్సహిస్తున్నారని వేరే చెప్పనక్కర్లేదు. 

మరి వీటికి జవాబేమిటి? మైదానాల్లో పోరాటాలు రక్తసిక్తమైనప్పుడు అడవి బిడ్డలే ప్రేరణ కలిగించారు. అందుకే ఎన్‌కే 

తేనె బతుకులో ఉప్పును, 
ఇప్పపూవులో నిప్పును చూడు
ఇవాళ ఆవులించి ఒళ్లు విరిచిన
ఆకాశంలో ఇంద్రవెల్లి పాలవెల్లి
అదిలాబాద్ నా కన్నతల్లి’

అని రాశారు. కాని ఇవాళ అడవుల్లో కూడా పోరాటం ఉధృతమైంది. జనం పిట్టల్లా కాలిపోతున్నారు. మైదానాలు మాత్రం ఆధునీకరణ వెలుగులతో జిగేల్ మంటున్నాయి. స్మార్ట్ సిటీలకోసం పరవశమవుతున్నాయి. ఎన్‌కే పిల్లలతో సహా మధ్యతరగతి జీవులంతా విదేశాలకోసం పరుగులు పెడుతున్నారు. సంస్కరణల విశ్వరూపం పారిన నెత్తురుపై ఆందమైన తివాచీని కప్పింది. 

ఎన్‌కే కవితలు, పాటలు ఒకానొక చారిత్రక సందర్భంలో రాసి ఉండవచ్చు. కాని అవి వృధా అయ్యాయా? చరిత్రలో మార్పు అనేది సుడులు, సుడులుగా తిరుగుతున్న వర్తులాకార చట్రం(స్పైరల్). వెనక్కు వెళ్లేది ఏదీ విస్తరించనిది కాదు. సామాజిక మార్పూ అలాంటిదే. ఈ మార్పుకు ఎన్‌కే లాంటి వాళ్లు ఎప్పుడూ దోహదం చేస్తూ ఉంటారు.  ఎన్ కే    రాసిన ‘రిహార్సల్’ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. 

-కృష్ణుడు   

అనంతమూర్తి అనిర్దిష్ట యాత్ర

Krish.psd

‘ముందు నిరాకారం, తర్వాత నిరాకారం. అపూర్వమైన అనుభవాన్ని అనుగ్రహం చేసి అదృశ్యమైందా పవిత్ర ముహూర్తం. ఆ క్షణం అనుభవానికి వస్తే ఆ అనుభవం మళ్లీ కావాలనిపిస్తుంది..’ అనుకుంటాడు వేదాంత శిరోమణి, పండితుడు ప్రాణేశాచార్యులు. ఆ అనుభవం ఏమిటి? ఆ అనుభవం ముందు సమస్త ఆచారాలు, సాంప్రదాయాలూ, మడులూ, నిష్టలూ, పూజలూ, పునస్కారాలు గాలిలో కొట్టుకుపోతాయి. మనిషిని మనిషిగా గుర్తింపచేసే అనుభవం అది. ఆ అనుభవం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?

‘మత్స్యగంధిని గర్భవతి చేసి వ్యాసమహర్షికి జననమిచ్చిన ఆ పరాశరుడు నాకు మాదిరిగానే ఇలా వ్యాకులపడ్డాడా? లేక వాళ్లంతా ఈ జీవితమే ఒక మోక్ష సన్యాస మార్గమనీ, భగవన్నిర్దిష్టమనీ సమన్వయించుకుని, అన్యోన్య విరుద్దసంఘర్షణలకు అతీతమై, ప్రకృతి కాంత సృష్టించి సమర్పించిన వివిధ సంవిధాలకూ తలయొగ్గి నివసించి, చివరకు నిరాకారమైన ఈ అనంత విశ్వంలోకి లీనమై పోయారా? నదులు సముద్రంలో విలీనమైనట్లు?’ అని తనను తాను ప్రశ్నించుకుంటాడు ప్రాణేశాచార్యులు చంద్రితో అనుభవం తర్వాత.

ఆ అనుభవం ఏమిటి? తడి నేలనుంచి నీలంగా విష్ణుక్రాంత పుష్పాలలో నుంచి సుగంధాలు విరజిమ్ముతున్నై. వాటితో పాటు స్త్రీ వంటి నుంచి పడుతున్న చెమట బిందువుల పరిమళమూ కలిసిపోతున్నది. ఆశీర్వాదానికి సాచిన చేయి విరబోసిన ఆమె జుట్టును నిమరసాగింది. ఆశీర్వాద మంత్రం ఆయన కుత్తుకలోనే ఇమిడిపోయింది. ..

అనంతమూర్తి సంస్కార నవలలో వివరించిన అనుభవం ఇది.అనుకోకుండా జరిగిన ఒక స్పర్శ అతడిలో సంస్కారాన్ని తట్టిలేపింది. అతడిని మార్చివేసింది. ఒక్క స్పర్శ అతడి ఆధిపత్యాన్ని విధ్వంసం చేసింది. ఒక్క కలయిక అతడిని బయటిప్రపంచం మట్టిమనుషులతో మమేకం చేస్తుంది. ఒక్క అనుభవం అతడిని తక్కువజాతి వారిని కలిసి కాఫీ తాగేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ అనుభవం శాస్త్రాలకు అతీతమా? లేక శాస్త్రాలు వాటిని నిషేధించాయా? లేదు.. లేదు.. బ్రాహ్మణత్వం నిలుపుకోవడానికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదవాలి కంఠోపాఠంగా.. వాటిని అర్థం చేసుకోకుండా.. అందులో ఇంగితమై ఉన్న ప్రేమోద్రేకాల స్వభావం తెలుసుకోకుండా. దాని సంకేతాలకు అనుగుణంగా వ్యవహరించకుండా.. తన జ్ఞానంలోనే దాగి ఉన్నదొక నిప్పురవ్వ..

ఆ అనుభవం తర్వాత ప్రాణేశాచార్యులకు మళ్లీ బాల్యంలోకి ప్రవేశించినట్లనిపించింది. అగ్రహారంలో శవం కుళ్లిన వాసనతో మురుగుపడ్డ ఆయన ముక్కుకు పచ్చగడ్డి వాసన ఎంతో సుఖం కలిగించింది. మట్టి కప్పుకున్న గరిక వ్రేళ్లు ఆయనను ఆనందాబుధిలో ముంచివేశాయి.

ananthamurthy-630

అనంతమూర్తి రచనలు చదివినప్పుడల్లా మన చుట్టూ ఉన్న సమాజం, మనం నిర్మించుకున్న నియమనిబంధనలు, మన పిచ్చుక గూళ్లూ, మన కృత్తిమ మందహాసాలు, రక్తం ప్రసరించని మన కరచాలనాలు, మన ఇంట్లో వ్రేళ్లాడుతున్న పటాలు అన్నీ గాలిలో తేలిపోతున్నట్లు కనిపిస్తాయి. అవన్నీ నీవైపు చూస్తూ పరిహాసం చేస్తాయి. మర్యాదలు విధ్వంసమవుతాయి. మనకు తెలియకుండానే మన పాదాలు వెనుతిరుగుతాయి. మూసుకున్న మన మెదడు కిటికీలు తెరుచుకుంటాయి. మనకు తెలియకుండానే మనం ప్రశ్నించడం మొదలుపెడతాం.

‘సంస్కార’ నవలలో నారాయణప్ప అనే ఒక బ్రాహ్మణుడి ఒక శవం తగలబడడానికి ఎదురు చూస్తుంది. ఎందుకంటే అది బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టినా, బ్రాహ్మణత్వాన్ని వదలని శవం. బ్రాహ్మణత్వం  వదిలి, సుఖలోలుడై, సుఖంలోనే విముక్తిని కోరుకున్న వాడికి బ్రాహ్మణ్యం ఏమిటి? అయినప్పటికీ అతడు బ్రాహ్మణుడుగానే మరణించాడు. కనుక అతడి శవాన్ని ఇంకో బ్రాహ్మణుడే ముట్టుకోగలుగుతాడు. ముట్టుకుంటే దోషపరిహారానికి ప్రాయశ్చిత్తమేమేమిటి?

ananta3

ఆ బ్రాహ్మణ శవం చేసిన పాపమేమిటి? అందరూ పూజచేసుకునే సాలిగ్రామాన్ని ఎత్తి ఏట్లో పారేశాడు. తురక వాళ్లతో తాగితందనాలాడాడు. కుందాపురం నుంచి కుందనపు బొమ్మలాంటి ఒక తక్కువకులం స్త్రీని తెచ్చిపెట్టుకున్నాడు. ఆమె చంద్రి. ఆమెను చూస్తే ఒక బ్రాహ్మణుడికి రవివర్మ చిత్రంలో ఉన్న మత్స్యగంధి సిగ్గుతో వక్షోజాలను కప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఈ బంగారపుతునకను ఎవరు తీసుకురారు? వాత్సాయన కామసూత్రాల్లో వర్ణించినట్లుగా సున్నితమై, సునిశితమైన వర్చస్సు. భీత హరిణేక్షణల నయనాల వంటి కళ్లు. సంభోగ క్రీడలో మనిషిని సంపూర్ణంగా ముంచి తేల్చగల ప్రభావం ఉన్నది ఆమె శరీరంలో. నారాయణప్ప ఆమెకోసం సాలగ్రామాన్ని ఏట్లో విసిరిపారేశారంటే, మద్యమాంసాలు భుజించాడంటే ఆశర్యం ఏమున్నది? తురకరాజు కూతురు లవంగిని పెళ్లి చేసుకుని జగన్నాథపండితుడు ఆ మ్లేచ్ఛ కన్య వక్షోవైభవాన్ని వర్ణించలేదా?

అనంతమూర్తి బ్రాహ్మణ్యంతో క్రీడిస్తాడు. బ్రాహ్మణ్యాన్ని ప్రశ్నిస్తాడు. నారాయణప్ప శవానికి కర్మకాండలు జరిపేందుకు వెనుకాడిన బ్రాహ్మణులు, వారి గృహిణులు అతడు ఉంచుకున్న చంద్రి నగలకోసం తహతహలాడిన వైనాన్నివర్ణిస్తాడు.బ్రాహ్మణ్యానికి అవతల సాధారణ మనుషుల జీవితాల్లో జీవన సౌందర్యాన్ని చిత్రిస్తాడు. చివరకు బ్రాహ్మణ్యాన్నే అస్తిత్వ పరీక్షలో పడవేస్తాడు. మానవ విలువలు ముఖ్యమా? ఆచార వ్యవహారాలు ముఖ్యమా అన్న చర్చ అనంతమూర్తి సంస్కార లో లేవనెత్తుతాడు. చంద్రి, పద్మావతి, పుట్టప్పలో ఉన్న సంస్కారం తోటి బ్రాహ్మణుల్లో లేదని నిరూపిస్తాడు.

ఇదంతా ప్రశ్నించడం వల్లే వచ్చింది. సంశయాత్మా వినశ్యతి.. (సంశయించేవాడు నశిస్తాడు)అని, శ్రద్దావన్ లభతే జ్ఞానం (విశ్వాసం వల్లే విజ్ఞానం లభిస్తుంది) మన శాస్త్రాలు చెబుతాయి. కాని సంశయించకపోతే నిష్కృతి లేదని, గుడ్డి విశ్వాసం వల్ల ఉన్న విజ్ఞానం నశిస్తుందని అనంతమూర్తి చెబుతారు. అంధ విశ్వాసంతో కొనసాగించే సంస్కృతి మనుగడ సాధించగలదా ? అని ఆయన ప్రశ్నించారు. తన రచనల్లో సాంప్రదాయ హిందూ సమాజంపై సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను ఆయన నిశితంగా గమనించారు. వాటి వల్ల కుటుంబాల్లో వచ్చిన అంతస్సంఘర్షణను చిత్రించారు. సంప్రదాయాన్ని వ్యతిరేకించిన బుద్దుడు, బసవన్న, అల్లమప్రభులను అనంత మూర్తి ఆరాధించారు. తన నవ్యవాదం అన్ని ఆధునిక వాదాల మాదిరి కాదని, నెహ్రూ కాలపు ఆదర్శ సిద్దాంతాలు పటాపంచలై ఉద్భవించిన వాదమని ఆయన ఒక చోట చెప్పారు.

ఆయన ‘భారతీపుర’ నవల కూడా ఆధునిక భావాలు ఉన్న జగన్నాథుడనే ఒక బ్రాహ్మణుడు ఇంగ్లండ్‌లో చదువుకుని తన సమాజంలో కి వచ్చి అక్కడ భావాలపై ఆధిపత్యం వహిస్తున్న ఆలయవ్యవస్థను గమనిస్తాడు. సమాజంలో నిమ్మజాతీయులైన హోలెయారులు ఆలయంలో ప్రవేశిస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న ప్రచారాన్ని ఆయన ఢీకొంటారు.’సమాజంలో మీరు అధికంగా ఉన్నారు. మీరు తిరగబడాలి..’ అని వారిని ప్రేరేపిస్తాడు. ‘నేను హోలెయారును ఆలయంలోకి తీసుకువెళ్లాలి. శతాబ్ధాలుగా సాగుతున్న సాంప్రదాయాల్ని ఒక్క అడుగుతో మార్చేయాలి. మంజునాథను బ్రద్దలు చేయాలి. హోలెయారు ఒక్క కొత్త అడుగు వేస్తే మనమందరం చచ్చిపోయి కొత్తగా జన్మిస్తాం.. ‘అని జగన్నాథుడు పిలుపునిస్తారు. హోలెయారును మందిరంలోకి ప్రవేశించేలా చేయనంతవరకూ తాను మనిషిని కానని గుర్తిస్తాడు. అనంతమూర్తి ‘ఘట శ్రాద్ద,’ ‘సూర్యన కుదురే’, ‘అక్కయ్య’, ‘మౌని’ తో పాటు అనేక క థలు వ్యవస్థలోని మూర్ఖత్వాలను ప్రశ్నిస్తాయి. దళితులనే కాదు, స్త్రీలను కూడా ఆయన అణగారిన వర్గంగా భావించారు. వార్ని ప్రశ్నించమని ఆయన ప్రేరేపిస్తారు. విలియం బ్లేక్, కీట్స్ కవితలంటే ఆయన కెంతో ఇష్టం. ఆయన కవితలు వాన వెలిసిన తర్వాత నేల పరిమళాన్ని గుర్తు చేస్తాయి.

ananta2

అనంతమూర్తి వ్యక్తిత్వంలోనే తిరుగుబాటు ఉన్నది. ఆయన దేన్నీ ప్రశ్నించకుండా అంగీకరించలేరు. అందుకే ఆయన సాంప్రదాయాన్ని ప్రశ్నించారు. ఆచారాల్ని ప్రశ్నించారు. సమాజంలో రుగ్మతల్ని ప్రశ్నించారు. పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి తనను తాను ప్రశ్నించుకున్నందువల్లే ఆయన హిందూత్వను ఒక రాజకీయ తాత్విక దృక్పథంగా అంగీకరించలేకపోయారు. ఆక్రమంలో ఆయన బిజెపిని కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ను అభిమానించారు. నరేంద్రమోదీ ప్రధాని అయితే ఈ దేశం నుంచి వెళ్లిపోతానని సంచలనాత్మక ప్రకటన కూడా చేశారు. ఆయన ఈ దేశం పయనిస్తున్న దారిని వ్యతిరేకించారు కాని పలాయనవాదం చిత్తగించే ఉద్దేశం ఆయనకు లేదు.

అనంతమూర్తి పారిపోయే వ్యక్తి కాదు. ప్రశ్నించే వ్యక్తి. ప్రశ్నించే క్రమంలో ప్రతిఘటించే వ్యక్తి. జీవితాంతం ఆయన ప్రతిఘటిస్తూనే రచనలు చేశారు. కొత్త విలువల్ని సృష్టించారు. మానవ సంబంధాల్ని ప్రేమించారు. సామాజిక కార్యకర్తగా మారారు. ఆయనొక ప్రజ్వలిస్తున్న ప్రవాహం.సాహిత్యం రాజకీయాలకు అతీతమైనదా? కానే కాదంటారు. అనంతమూర్తి. ‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు..’ అని చేసే ప్రకటనకూడా రాజకీయమైనదేనని ఆయన అభిప్రాయం. ‘నీలో నీవు తరచి చూసుకోకపోతే మంచి రచయితవు కాలేవు’.. అని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.

అనంతమూర్తి ఒక సామాజిక జీవితానుభవం. వేల వేల చెట్లు కూలిపోతున్న చప్పుడు ఆయన రచనల్లో ప్రతిధ్వనిస్తుంది. చంద్రి కౌగిలిలో ప్రాణేశాచార్యుడు పునీతుడైనట్లే, అనంతమూర్తి రచనలు చదివితే మనం వేనవేల వ్యవస్థల దుర్మార్గాల చితిమంటల్ని విన్నట్లవుతుంది. అనంతమూర్తి నిర్దిష్ట యాత్ర చేశాడని చెప్పలేం. బ్రాహ్మణత్వం చనిపోయినా బ్రాహ్మణుడు చనిపోలేడు కదా.. అనంతమూర్తి అంత్యక్రియలను ఆయన బంధువులు స్మార్త బ్రాహ్మణ ఆచారాల ప్రకారమే చేశారు.

 ~~

జీవించడం కోసం పరిమళించు!

Krish.psd

అశోకారోడ్ నుంచి ఫెరోజ్‌షా రోడ్‌లోకి ప్రవేశించి, మండీహౌజ్ వద్ద సాహిత్య అకాడమీ భవనం వద్ద దుమ్ముపట్టిన పుష్కిన్ విగ్రహం చూస్తూ సర్కిల్ తిరుగుతున్నప్పుడు గుర్తుకు వచ్చింది.. కేదార్ నాథ్ సింగ్‌కు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించారని. ఒక కవికి ఏదో ఒక అవార్డు లభిస్తే కవిత్వం అంటే ప్రేమించే నాకెందుకు మనసులో ఏదో ఒక మూల కదలిక రావాలి? జర్నలిస్టుగా ఎన్నికల ముందంటే ఏదో ఒక బిజీ. ఎన్నికలై, కొత్త సర్కార్లు ఏర్పడ్డ తర్వాత కూడా పని ఒత్తిడి తగ్గిన తర్వాత కూడా మనసు విప్పి రాయాలంటే ఎందుకు మనస్కరించడం లేదు? ప్రపంచం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. మనం అనుకున్నట్లు ఉండేందుకు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా లేవు. ప్రయత్నాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారే ఏమీ సాధించినట్లు కనపడడం లేదు. అంతా మళ్లీ మొదలైనట్లు, ఏదీ ప్రారంభం కానట్లు అనిపిస్తోంది. మరి ఎందుకింత అసంతోషం? ఎందుకింత నిర్లిప్తత? ఏదో రాయాలనుకుని ఏదీ రాయలేని నిస్సహాయత ఎందుకు? ఎవరిమీద ఈ కోపం? ఎవరిమీద ఈ అసహనం? నీ స్తబ్ధతకు కారణమేమిటో ఎవరికీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఎందుకు కన్నీళ్లు ఘనీభవిస్తున్నాయి? ఎందుకు రక్తం నరనరాల్లో నిదానంగా చల్లగా ప్రవహిస్తోంది? పాదాలు ఎందుకు ప్రయాణించడానికి మొరాయిస్తున్నాయి? నేనే ఇలా ఉంటే ఉన్నచోటే ఉంటూ స్తంభించిపోయి, ఆకులు రాలుస్తూ, చిగురుస్తూ వసంతాలు, గ్రీష్మాలు అనుభవిస్తూ జనాల్ని నిర్లిప్తంగా చూసే ఈ చెట్లు ఏమి ఆలోచిస్తున్నాయో?

ఐటీఓ క్రాస్ రోడ్‌లో రెడ్‌లైట్ వద్ద మల్లెపూల వాసన గుప్పున చుట్టుముట్టింది. ఇద్దరో ముగ్గులో తమిళ మహిళలు కార్ల కిటీకీల వద్దకు పరుగిడితూ మల్లెపూల దండలు కొనమని బతిమిలాడుతున్నారు. ఫుట్‌పాత్‌పై మరికొందరు మాలలు కడుతున్నారు. ప్రక్కనే నేలపై కాళ్లూ చేతులూ ఊపుతున్న పాప నోట్లో పాలపీక. అప్పుడు మళ్లీ గుర్తొచ్చాడు కేదార్ నాథ్ సింగ్. ఒకటా, రెండా.. దాదాపు ఆరు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారాయన. ఎలా రాయగలుగుతున్నారాయన? ఎప్పుడూ ఆయన నాలా నిరాశలో , నిస్సహాయతలో కూరుకుపోలేదా? కవిత్వం రాసేందుకు ఆయన చేయి ఎప్పుడూ మొరాయించలేదా? ‘ఒక్క మల్లె దండ కొనండి సార్..’  అని చిన్న పిల్ల పదోసారి నన్ను బతిమిలాడింది. నాలాంటి దుర్భర జీవికి మల్లెపూలెందుకు? ఏం చేసుకుంటాను? అయినా.. ఆలోచనల్ని ప్రక్కన పెట్టి తల ఊపి జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చి ఒక మల్లెపూదండ కొని కారులో ఒక మూల పడేశాను.కారంతా పరిమళం అలుముకుంది. ఆ పిల్ల ముఖంలో ఏదో సాధించినట్లు పరిమళం లాంటి ద రహాసం. అప్పుడర్థమైంది కేదార్ నాథ్ ఇన్నేళ్లుగా కవిత్వం ఎలా రాస్తున్నారో.. అవును. జీవితం ఆయనతో కవిత్వం రాయిస్తోంది. 


1934లో ఉత్తరప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన కేదార్ నాథ్ సింగ్ వారణాసి,గోరఖ్‌పూర్, దేవరియా, పాడ్రానా లాంటి పలు ప్రాంతాల్లో అధ్యాపకుడుగా పనిచేస్తూ చివరకు ఢిల్లీలోని జెఎన్‌యులో ప్రొఫెసర్‌గా చేరి 23 ఏళ్ల బోధన తర్వాత 99లో పదవీవిరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల వయస్సులో ఆయన తొలి కవిత రాశారు. కాని 1954లో ఫ్రెంచ్ కవి పాల్ ఎలార్డ్ కవితను అనువదించడం కేదార్ జీవితంలో కేదారం సస్యశ్యామలమైనట్లనిపించింది. ఎలార్డ్ ఆయనకు కవిత్వంలోని జీవన్మరణ రహస్యాలను విప్పిచెప్పారు. అంతే కేదార్ కవిగా అవతరించారు. ప్రముఖ కవి ఆజ్ఞేయ తన సాహిత్య పత్రికలో కేదార్ కవితలనెన్నిటినో ప్రచురించారు. 1960లో కేదార్ తన తొలి కవితా సంకలనం ‘అభీ బిల్కుల్ అభీ’ ప్రచురించారు. 

విచిత్రమేమంటే ఆ తర్వాత 1980లో కాని కేదార్ రెండో సంకలనం ‘జమీన్ పఖ్ రహీహై’  రాలేదు. ఈ సుదీర్ఘ విరామానికి ఆయనే జవాబు చెప్పారు. ‘ఇది నన్ను నేను లోతుగా ఆత్మపరిశీలన చేసుకుంటున్న కాలం. పెద్దగా ధ్వనించకుండా నా ప్రతిఘటనను ఎలా చిత్రించాలో అన్వేషిస్తున్న సమయం అది..’ అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. వందలాది కవితలను పుంఖానుపుంఖాలుగా రాస్తూ పోయారు. ఏ అవార్డూ ఆయన దాహార్తిని తీర్చలేకపోయింది. 

కేదార్ నాథ్ కవితల్ని మనం బయటినుంచి అలవోకగా పేజీలు తిప్పుతూ అర్థం చేసుకోలేం. కవితల్లోకి మనం ప్రవేశించాలి. మనల్ని మనం ఆయన కవితల్లోకి ఒంపుకోవాలి. ఆయన నడిపించిన దారుల్లో నడవాలి. అదొక అద్భుత ప్రపంచం. పాడుపడిన కోట గోడల మధ్య, గంగానదీ ప్రవాహాల మధ్య, దట్టమైన అరణ్యాల మధ్య, నిశ్శబ్దనదిపై ప్రతిఫలిస్తున్న వెన్నెల కాంతి మధ్య, కడుపులో దహించుకుపోయే ఆకలి మధ్య, చితిమంటల మధ్య ఆయన మనను మెల్లగా నడిపించుకుని తీసుకువెళతారు. 

‘ఈ నగరంలో వసంతం ఉన్నట్లుండి వస్తుంది.’అని ఆయన వారణాసి గురించి రాసిన కవిత మనం ఆ నగరంలో నడిచినట్లే అనిపిస్తుంది. ‘సంతం ఖాళీ పాత్రల్లో దిగి రావడం నీవెప్పుడైనా గమనించావా? ఈ నగరంలో దుమ్ము మెల్లగా ఎగురుతుంది, జనం మెల్లగా నడుస్తారు, గుడిగంటలు మెల్లగా మోగుతాయి. పొద్దు వాలుతుంది మెల్లగా.. ఇదొక సామూహిక లయ. ఈ నగరంలో ఉదయమో, సాయంత్రమో ప్రవేశించు ప్రకటించకుండా.. హారతి వెలుగుల్లో అద్భుత నగరాన్ని చూడు. అది సగం నీళ్లల్లో, సగం మంత్రాల్లో, సగం పూలల్లో, సగం శవంలో, సగం నిద్రలో, సగం శ ంఖంలో.. జాగ్రత్తగా చూడు.. సగమే కనబడుతుంది. మిగతా సగం ఉండదు. కనపడిన సగానికే ఊతం అవసరం. మిగతా సగానికి అండ బూడిద, కాంతి, అగ్ని, నీరు, పొగ, పరిమళం, ఎత్తిన మాన హస్తాల స్తంభాలు..’ అంటారు కేదార్ నాథ్. 

‘నేను ఆమె చేయిని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రపంచం ఆమె చేయిలా వెచ్చగా, అందంగా ఉండాల్సిందేననుకున్నా.’ అన్న ఒక చిన్న కవిత్వంలో ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని వర్ణించగల కేదార్ ‘అక్షరాలు చలితో మరణించవు.. అవి ధైర్యం లేక మరణిస్తాయి.. ఉక్కబోసే వాతావరణంలోనే అక్షరాలు తరుచూ నశిస్తాయి… అని రాయగలరు. ‘నెత్తుటితో తడిసిన చిన్నారి అక్షరం తనను ఇంటికి తీసుకువెళతానని పిలుస్తోంది..’ అని రాస్తారాయన. 

‘ఖాళీ కాగితంపై ఉదయమూ ఉండదు, అస్తమయమూ ఉండదు.. అక్షరాలు మనకెప్పుడూ ఖాళీ కాగితాన్ని వదిలిపెడతాయి..’ అనే కేదార్ నాథ్ అక్షరాలతో అలవోకగా ఆడుకోగలరు. ‘సూ ర్యకాంతి, ఆకుల సంభాషణ మధ్య ఒక కవితా వాక్యం అణిచివేతకు గురైంది.. ఈ రోజుల్లో వీధుల్లో ఎవరూ మరొకరి సమకాలీనులు కాలేరు..’ అని ఆయన తప్ప ఎవరనగలరు? 

కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు కేదార్ నాథ్ చాలా సులభంగా సమాధానం చెబుతారు. ‘కవిత్వం అంటే ఏమిటి? ఒక చేయి మరో చేయిని అందుకోవడం. ఒక ఆత్మ దేహంవైపు మొగ్గడం. కళ్లు మృత్యు దిశగా చూడడం, కవిత్వం అంటే ఏమిటి? అదొక దాడి. దాడి తర్వాత నెత్తుటితో తడిసిన పాదరక్షలు తమను ధరించేందుకు పాదాలకోసం అన్వేషించడం. ఒక వీరుడి మౌనం.. ఒక విదూషకుడి ఆర్తనాదం..’

290025541_640
ఈ కవిత్వం చూడండి.. ‘కేదార్ నాథ్ సింగ్, నీకు నూర్ మియా గుర్తుండా? గోధుమ ముఖం నూర్ మియా, చిన్న నూర్ మియా.. రామ్‌ఘర్ బజార్ నుంచి సుర్మా అమ్మినవాడు..చివరగా తిరిగొచ్చిన వాడు,ఆ నూర్‌మియా గురించి ఏమైనా గుర్తుందా కేదార్ నాథ్‌సింగ్..ఆ స్కూలు గుర్తుందా..చింత చెట్టు, ఇమాంబరా,19వ ఎక్కంవరకూ మొదట్నుంచీ చెప్పగలవా,నీ మరిచిపోయిన పలకపై కూడికలు, లెక్కలు 
చేయగలవా..ఒకరోజు ఉన్నట్లుండి నూర్‌మియా మీ గల్లీని వదిలి వెళ్లిపోయాడో చెప్పగలవా, అతడెక్కడున్నాడు? ఢాకాలోనా, ముల్తాన్ లోనా.. పాకిస్తాన్‌లో ప్రతి ఏడాది ఎన్ని ఆకులు రాలుతాయో చెప్పగలవా..ఎందుకు మౌనంగా ఉన్నావ్?కేదార్ నాథ్ సింగ్, నీకు లెక్కలతో సమస్యేమైనా ఉందా చెప్పు? ‘ – ఈ కవిత శీర్షిక ‘1947ను గుర్తు చేసుకుంటూ..’

మరో కవిత- ‘హిమాలయం  ఎక్కడుంది? స్కూలు బయట గాలిపటం ఎగురవేస్తున్న ఆ బాలుడిని అడిగా. అదిగో.. అదిగో అక్కడుంది.. అని వాడు ఆ గాలిపటం ఎగురుతున్న వైపు చూపించాడు. ఒప్పుకున్నా. నాకు మొదటి సారి తెలిసింది. .హిమాలయం ఎక్కడుందో.. ‘


నల్ల నేల. అన్న కవితలో ఆయన నల్లదనం ఈ యుగం దృశ్యం అయిందని వాపోతారు. ‘నల్ల న్యాయం, నల్ల చర్చలు.. నల్ల అక్షరాలు. నల్ల రాత్రి.. నల్ల జనం.. నల్ల ఆగ్రహం..’అని రాస్తారు. 

కేదార్‌నాథ్ గురించి, ఆయన అక్షరాల గురించీ. ఆయన సాహిత్య విమర్శ గురించీ చెప్పాలంటే సుదీర్ఘం అవుతుంది. ‘మేరే సమయ్, మేరే శబ్ద్’ అన్న వ్యాస సంకలనంలో ఎజ్రాపౌండ్, రిల్కే, రెనె చార్ లాంటి కవుల గురించే కాక, భారతీయ కవులు, కవితోద్యమాల గురించి రాశారు. ఆయన ప్రజాస్వామిక ఆకాంక్షలను, సృజనాత్మకతను అర్థం చేసుకోవాలంటే ‘ఖబరిస్తాన్ మే పంచాయత్’అన్న సంకలనాన్ని చదవాల్సిందే. 

కేదార్‌నాథ్ ఎక్కడా వాస్తవిక రేఖల్ని దాటిపోలేదు. ‘ముక్తీకా జబ్ కోయా రాస్తా నహీ మిలా.. మై లిఖ్‌నా చాహుతాహు.. యహ్ జాన్‌తా హు కీ లిఖ్‌నే సే కుచ్ నహీ హోతా. మై లిఖ్‌నా చాహ్‌తా హూ.. (ముక్తి మార్గం ఎక్కడా దొరకకపోతే నేను రాయాలనుకుంటాను… రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసి కూడా నేను రాయాలనుకుంటాను)..’ అని ఆయన ఒక కవితలో రాశారు. 

అవును. రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసినా రాస్తూనే ఉండాలి. ఏదైనా జరిగేంతవరకూ రాయాలి.. జ్ఞానపీఠ్ అవార్డు నాకు కేదార్‌నాథ్, శివారెడ్డి లాంటి అక్షరాల్నే జీవితంగా మార్చుకున్న వారిని గుర్తుకు తెచ్చింది. క్రాస్ రోడ్ వద్ద మల్లెపూలు అమ్మిన తమిళ బాలిక నాకు జీవిత పరిమళాన్ని ఆఘ్రాణింపచేసింది. ఏది జరిగినా, ఏది జరగ కపోయినా శవం మాత్రం కాకూడదు. ఇదే తాజాగా నేను నేర్చుకున్న గుణపాఠం. 


కృష్ణుడు

పాదాల క్రింద నలగని ఆకు – కుష్వంత్ సింగ్

Krish.psd
నేలమీద అడుగులు వేస్తుంటే దారి పొడువునా పచ్చ టి ఆకులు పరుచుకుని తమ పై నుంచి నడిచివెళతారా అని దీనంగా చూస్తున్నాయి. తెల్లవారు జాము చల్లటి గాలి తగులుతుంటే పై నుంచి పచ్చటి ఆకులు దీవిస్తున్నట్లు రాలిపడుతున్నాయి. తలపై, భుజంపై ఒక్కో ఆకు కన్నీటి చుక్కల్లా పడుతూ పలకరిస్తున్నాయి. తడి పచ్చికపై కూడా అవే ఆకులు.పూలు ఆకుల వర్షాన్ని ఆనందిస్తున్నట్లు తలలూపుతున్నాయి. నేలపై కాగితపుపూలు, పచ్చటి ఆకులు కలిసి మట్టిని ముగ్గుల్లా అలంకరిస్తున్నాయి. స్కూలుకు వెళుతున్న పిల్లల్నీ అవే ఆకులు పలకరిస్తున్నాయి.

అవును ఇది శిశిరం. ఆకులు రాలే కాలం. ఢిల్లీలో చిరుచలిని ఎండ వేడిమి పారదోలుతున్న సమయంలో కాలం మారుతున్నదన్న స్ప­ృహ వెంటాడుతోంది. మృత్యువు అందమైనదా? లేకపోతే ఈ ఆకులు, పూలు రాలిపోతూ విషాదానికి బదులు ఆనందాన్ని ఎందుకు కలుగచేస్తున్నాయి? బస్‌స్టాప్ వద్ద పడిపోయిన ఒక పెద్ద రావి ఆకును ఏరి ఒక స్కూలు పిల్ల పుస్తకంలో దాచుకుంది. కాళ్ల క్రింద, వాహనాల క్రింద ముక్కలయ్యే బదులు లేత అక్షరాల మధ్య తల దాచుకునే అదృష్టం ఆ ఆకుకు కలిగింది.

పాదాల క్రింద ఆకుల ధ్వనిని వింటూ, ఆలోచిస్తూ వెళుతుంటే మొబైల్‌లో అందిన సమాచారం మరో పండుటాకు రాలిపోయిందని. 99 ఏళ్ల వయస్సులో కుష్వంత్ సింగ్ మరణించడం ఒక అసహజమైన సంఘటన ఏమీ కాకపోవచ్చు. కాని ఆయన మరణంతో ఒక చరిత్రతో సంబంధం ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తి గతించినట్లయింది. లాల్‌కృష్ణ అద్వానీ, కుల్దీప్ న య్యర్, మన్మోహన్ సింగ్, కుష్వంత్ సింగ్ వీరందర్నీ ఒక చరిత్ర కలుపుతుంది. అది దేశ విభజనకు చెందిన చరిత్ర. వీరందరూ దేశ విభజనకు పూర్వం జన్మించారు. ఆ తరం పండుటాకులన్నీ ఒక్కొక్కటీ రాలిపోతున్నాయి. వీరందరిలో కుల్దీప్ నయ్యర్, కుష్వంత్ సింగ్ ప్రత్యేక తరగతికి చెందిన వారు. వారు విభజన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు, వాటి గురించి రాసిన వారు. అందరికంటే 99 ఏళ్ల కుష్వంత్ సింగ్ సీనియర్. ఆయన కుల్దీప్‌లా కేవలం జర్నలిస్టు మాత్రమే కాదు, రచయిత, కవి హృదయం ఉన్న వ్యక్తి.

కుష్వంత్ సింగ్ లాహోర్‌లో ఏడేళ్లు లా ప్రాక్టీసు చేశారు. విభజన తర్వాత కూడా అదే కొనసాగించి ఉంటే దేశంలో ప్రముఖ న్యాయవాదిగానో, న్యాయమూర్తిగానో కొనసాగేవారు. లండన్, పారిస్ తదితర నగరాల్లో రాయబార కార్యాలయాల్లో, యునెస్కోలో పనిచేసే అవకాశం కూడా ఆయనకు వచ్చింది. అదే కొనసాగించి ఉంటే ఆయనొక ప్రముఖ దౌత్యవేత్తగా మారి ఉండేవారు. ఆయన తండ్రి ఢిల్లీప్రభుత్వంలో ఉన్నతాధికారి. అనేక వ్యాపారాలున్నవారు. అందులో ప్రవేశించినా ఆయనొక ప్రముఖ వ్యాపారి అయ్యేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఇవన్నీ తృణీకరించి,రచయితగా, జర్నలిస్టుగా జీవితం కొనసాగించాలనుకున్నారు. జీవితాంతం తన రచనలపైనే బ్రతికారు. కవులు, కళాకారులు, రచయితల మధ్య జీవితాన్ని గడిపారు.

కుష్వంత్ సింగ్ రచనలు చాలా ఆలస్యంగా మొదలు పెట్టారు. లండన్‌లోని భారతీయ రాయబార కారాలయంలో పబ్లిక్ రిలేషన్ అధికారిగా ఉన్నప్పుడు ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావు, ఆర్.కె.నారాయణ్‌లను చదివిన తర్వాత తానెందుకు రాయకూడదని అనుకున్నాడు. మొదట రాసిన మార్క్ ఆఫ్ విష్ణు అనే చిన్న కథల సంకలనంతో ఆయన రచయితగా రంగప్రవేశం రాశారు. ఆ తర్వాత సిక్కుల చరిత్ర రాశారు. తర్వాత దాదాపు 40 ఏళ్ల వయస్సులో దేశ విభజనపై మొట్టమొదటి సంచ లన నవల ట్రైన్‌టు పాకిస్తాన్ రాశారు. అంతే, రచయితగా ఆయన స్థానం సాహిత్య ప్రపంచంలో స్థిరపడిపోయిది. ఆకాశవాణిలో విదేశీ సర్వీసెస్‌లో ఉన్న్పపుడు నిరాద్ సి చౌదరి, రుత్ జాబాల, మనోహర్ మల్గోంకర్ మొదలైన రచయితలతో పరిచయం ఆయనకు రచనపై ఆసక్తి కలిగించింది. అంతమాత్రాన కుష్వంత్ సింగ్‌కు అంతకుముందుసాహిత్యంపట్ల అభిరుచి లేదని కాదు. ప్రముఖ ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆయనకు లాహోర్ కాలేజీలో రెండేళ్ల సీనియర్. గాలిబ్ ఆయన అభిమాన కవి. మాటిమాటికీ ప్రముఖ ఉర్దూకవి ఇక్బాల్ కవిత్వాన్ని ఉటంకించకుండా కుశ్వంత్ సింగ్ ఉండలేరు.

1970567_10152240904637088_1438515080_n
దాదాపు 20 ఏళ్ల క్రిందట ఎపి టైమ్స్ కోసం ఆయనతో కాలమ్ రాయించేందుకు వెళ్లినప్పుడు ఆయనతో వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ కొంతమంది సాహితీ మిత్రులను కూడా తీసుకువెళ్లేవాడిని. స్నేహపూర్వకంగా మాట్లాడినప్పటికీ డబ్బుల విషయంలో మాత్రం చాలా కరుకుగా ఉండేవారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఆయన తిట్లను భరించాల్సిందే. అప్పటికే ఆయన జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడుగా ఆయన తనదైన ముద్ర వేశారు. బంగ్లాదేశ్‌లో నరహంతకుడు టిక్కాఖాన్, పాక్ నియంత జియాఉల్‌హక్ మొద లైన వారి ఇంటర్వ్యూలు, కొన్ని పరిశోధనాత్మకమైన వ్యాసాల ద్వారా వీక్లీలో జర్నలిజంస్థాయిని ఆయన పెంచారు. వీక్లీ సర్క్యులేషన్ 80 వేలనుంచి 4 లక్షలు దాటేలా చూశారు. ఆ తర్వాత ఏ వీక్లీ అంత సంచలనం సృష్టించలేదు. అయితేనేం, వీక్లీసంపాదకుడుగా ఎమర్జెన్సీని నెత్తికెక్కించుకుని, సంజయ్ మారుతి కార్లఫ్యాక్టరీ గురించి సానుకూల వార్తలు రాసి తాను సర్కార్ పాదాల క్రింద తివాచీగా మారారు. దాని వల్ల ఇందిర రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు తొలుత నేషనల్ హెరాల్డ్ సంపాదక పదవి, ఆతర్వాత రాజ్యసభ సీటు, హిందూస్తాన్ టైమ్స్ సంపాదకుడి పదవీ దక్కాయి. మేనకాగాంధీ ఆధ్వర్యంలోని సూర్య పత్రికకు కూడా సంపాదకుడుగా కొన్నాళ్లు వ్యవహరించారు. పద్మభూషణ్  దక్కించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌ను విమర్శించి ఆయన తన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇవ్వకపోతే, రాజ్యసభలో తనకు సీటు ఇచ్చిన కాంగ్రెస్‌నే తీవ్రంగా విమర్శించకపోతే కుష్వంత్ సింగ్‌ను ఏ పంజాబీ క్షమించి ఉండేవారు కాదు.

ఎన్ని కక్కుర్తి పనులకు పాల్పడితేనేం, కుష్వంత్ సింగ్‌లో అంతర్గతంగా రచయిత, కవి ఉన్నారని చాలా సార్లు రుజువైంది. దాని వల్లే ధిక్కార స్వరం ఆయనకు సహజసిద్ద లక్షణమైంది. తొలుత ఉన్నతపదవులను వదులుకుని కేవలంరచయితగా స్థిరపడాలనుకున్న కుష్వంత్ తర్వాత రాజీపడితేనేం, ఆ రాజీ గురించి ధైర్యంగా చెప్పుకున్న వ్యక్తి. హిందూమతతత్వాన్ని, గుజరాత్ అల్లర్లను, అద్వానీ రథయాత్రను తీవ్రంగా విమర్శించిన కుష్వంత్ జీవితపు విలువలను ప్రేమించారు. యదాలాపంగానైనా ధిక్కార స్వరాన్ని వినిపించకుండా ఉండలేకపోయారు. దేవుడి ఉనికిని, ఆత్మలను ప్రశ్నించకుండా ఉండలేకపోఆరు. గత ఆరుదశాబ్దాలుగా ఆయన ధారావాహికంగా ఏదో రాస్తూనే ఉన్నారు. వ్యంగ్యం, హాస్యం మేళవించినప్పటికీ ఆయన రచనల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. ఆయన వ్యాసాల్లో స్వేచ్చా ప్రియత్వం స్పష్టంగా కనపడుతోంది. అందుకే ఫైజ్ లాంటి కవులు ఆయనకు ఆప్తబంధువులయ్యారు.

నా జైలు గదిలో కాంతి పేలవమై
రాత్రి ప్రవేశించినపుడు 
నీ నల్లటి కేశాల్లో నక్షత్రాలు
మెరుస్తున్నట్లనిపించింది. 
నన్ను కట్టేసిన గొలుసులు
కాంతిలో మెరిసినప్పుడు 
ఉదయపు కాంతిలో
నీ ముఖం వెలిగిపోవడాన్ని చూశాను..

అన్న ఫైజ్ అహ్మద్ కవితను కుశ్వంత్ ఆయన మరణానంతరం రాసిన వ్యాసంలో ఉటంకించారు. జైలు జీవితం తనను మళ్లీ ప్రేమలో పడేసింది.. అని ఫైజ్ అన్నట్లుఆయన పేర్కొన్నారు.

భింద్రన్ వాలే బృందం వెంటాడినా, 1984 లో జరిగిన సిక్కుల ఊచకోతలో రాజ్యసభ సభ్యుడుగా ఒక దౌత్యవేత్త ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చినా, మృత్యువుకు ఆయన ఎప్పుడూ భయపడలేదు. తన మృత్యువుపై తానే కథ రాసుకున్న వ్యక్తి కుశ్వంత్. మనిషి విశ్వాసానికి సంకేతాలు కావాలా? మృత్యువు సమీపించినప్పుడు అతడి పెదాలపై చిరునవ్వు చూడు.. అని ఇక్బాల్ రాసిన కవితను ఆయన అనేక సందర్భాల్లో ఉటంకించారు.

అవును.. కుశ్వంత్ రాలిపోయాడు. పండుటాకులా రాలిపోయాడు. ఉన్నట్లుండి ఒక సుడిగాలి ప్రవేశించింది. ఆ ఆకు నేలమీద పడీ పడగానే మట్టిని స్ప­ృశించి, గాలిలో తిరుగుతూ, తిరుగుతూ ఎక్కడికో అంతర్ధానమైంది. రాలిపోయాక కూడా పాదాలక్రింద నలిగి వ్రక్కలు కావాల్సిన ఆకు కాదది.

-కృష్ణుడు

రేఖాచిత్రం: శంకర్