విప్లవంలో స్వేచ్ఛా సమానత్వాల సాహచర్యం

karuna

 

‘విప్లవ రాజకీయాలు చదువుకున్నవారికి చేరాలంటే మార్గం సాహిత్యమే’ అని నమ్మి ఆచరించిన  ఆమె అసలు పేరు పద్మ. పదిహేనేళ్ళ వుద్యమ జీవితంలో అన్నీ వొదులుకొన్నట్టే సొంత పేరును కూడా వదిలేసింది. 1994లో తాయమ్మ కథ రాసి కరుణగా సాహిత్య లోకానికి పరిచయమైంది. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి పదేళ్ళు కావొస్తున్నా , అటు తర్వాత మరో ముప్ఫైకి పైగా కథలు రాసినా ఆ తొలి  కథే  కరుణకు చిరునామా అయ్యింది. ‘తాయమ్మ’ ఆమె యింటి పేరయ్యింది. ఆ కథ పొడవునా వున్న కఠోర జీవన వాస్తవికత పాఠకుల బుద్ధిని రాపాడితే , ముగింపులోని తాయమ్మ దు:ఖం మాత్రం  గుండెను మెలిపెడుతుంది.  కరుణ చిత్రించిన తాయమ్మ , కవులమ్మ , లచ్చుమమ్మ మొదలైన గ్రామీణ స్త్రీ  పాత్రలు మన కళ్ళముందు కదలాడే  నిజ జీవితంలోని వ్యక్తులే  కావడం వల్ల వాటికి యెంతో  సహజత్వం అబ్బి  పది కాలాలపాటు నిలచిపోయేలా రూపొందాయి. ఒక రచయిత పేరు చెప్పగానే వాళ్ళ రచనల్లోని పాత్రలు వెంటనే స్ఫురించడం ఆ రచయిత సాధించిన విజయంగానే భావించాలి.

విప్లవాచారణలో తలమునకలై  సాహిత్యం  గురించి తీరిగ్గా ఆలోచించటానికీ, నగిషీలు చెక్కటానికీ వీలులేని జీవితంలో – నిత్య నిర్బంధాల మధ్య అణచివేతల మధ్య  కథా శిల్పానికి  మెరుగులు దిద్దడానికి సరైన వనరులు అందుబాటు లేని పరిస్థితుల్లో , యెవరికైనా చదివి వినిపించి దిద్దుకోడానికి సైతం వెసులుబాటు దొరకని సందర్భం లో కథ పట్ల అందులో తాను చెప్పదల్చుకొన్న విషయం పట్ల వొక ప్రత్యేక శ్రద్ధ, దాని రూపం పట్ల కూడా అంతర్గతంగా వొక అదృశ్య స్పృహ వుండటం వల్ల కరుణ కథలు విప్లవ సాహిత్యంలో సైతం ప్రత్యేకగా నిలుస్తున్నాయి. సరళమైన నిరాడంబర శైలి ,   కథనంలో సూటిదనం స్వీకరించిన వస్తువునే కాదు;  రచయిత దృక్పథాన్ని సైతం దీప్తిమంతం చేస్తాయి అనడానికి కరుణ యిటీవల రాసిన ‘సహచరులు’ కథ చక్కటి వుదాహరణ(అరుణతార, మే 2016).

[కథ లింక్ : http://virasam.org/article.php?page=57  ; పే.20 – 26]

విప్లవోద్యమాల్లో స్త్రీపురుష సంబంధాల గురించి లోపలా బయటా యెన్నో సందేహాలు , అపోహలు. వాటిలో  పాలక వర్గాలు పనిగట్టుకొని చేసే దుష్ప్రచారం వొక యెత్తయితే , వుద్యమ భావజాలాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక వుద్యమకారుల నైతిక వర్తనపై బురద జల్లడానికి మరీ ముఖ్యంగా  పితృస్వామ్య విలువలతో స్త్రీల శీల హననానికి చేసే కువిమర్శలు మరో యెత్తు. ఇవి గాక కొన్నాళ్ళు వుద్యమ జీవితం గడిపి బయటకు వచ్చిన స్త్రీలు జెండర్ పరంగా విధాన నిర్ణయాల్లో , యితరత్రా తామెదుర్కొన్న వివక్షతల గురించి లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన అంశాలు కూడా సాహిత్యంలో విస్తృతమైన చర్చలకి కారణమయ్యాయి.

ఆ నేపథ్యంలో వుద్యమాల్లో నూతన మానవ ఆవిష్కరణ లక్ష్యంగా  వొకే మార్గంలో పయనించే క్రమంలో యిద్దరు స్త్రీ పురుషుల మధ్య యేర్పడే సాన్నిహిత్యం సాహచర్యంగా మారినప్పుడు ఆ బంధం యెంత బలంగా వుంటుందో స్వేచ్ఛా సమానత్వ భావనలతో యెంత ప్రజాస్వామికంగా వుంటుందో అతి సున్నితంగా ఆవిష్కరించిన కథ ‘సహచరులు’.

విప్లవోద్యమ జీవితంలో సహచరులకి కష్టాలే గానీ సుఖాలుండవు. సొంత సుఖాలపైకి వారి ఆలోచనలు పోవు. అడవిలో కేంప్ లో డెన్ లో యెక్కడ యెన్నాళ్ళుంటారో తెలీదు. ఎప్పుడు కలిసుంటారో యెప్పుడు విడిపోతారో తెలీదు. ఒకే దళంలో వున్నా ప్రశాంతంగా మాట్టాడుకొనే అవకాశమే చిక్కకపోవచ్చు. శత్రునిర్బంధంలో అసలుంటారో పోతారో తెలీని అభద్ర జీవితం. కార్యాచరణకి అనుగుణంగా  సహచరుల మధ్య ప్రేమనీ యెడబాటునీ పార్టీయే ఆదేశిస్తుంది. వారి వుద్వేగాల్ని ఆలోచనల్నీ జీవన గమనాన్నీ  వుద్యమావసరాలే నిర్దేశిస్తాయి. అనుక్షణం ప్రమాదాల  కత్తి అంచున నిలబడి కూడా సాహచర్యంలోని సాధకబాధకాల్ని అర్థంచేసుకున్న దీప అనిల్ అనే యిద్దరు వుద్యమకారుల జీవిత శకలాల ద్వారా విప్లవోద్యమాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుద్వేగభరితంగా యెంత మానవీయంగా వుంటాయో యీ కథలో  కరుణ చాలా ‘ఆత్మీయం’గా పాఠకుల ముందుంచింది.

దీప, అనిల్ ఉద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తలుగా వచ్చాకనే సహచరులయ్యారు. దీప గ్రాడ్యుయేట్, అనిల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. పార్టీలోకి దీపకన్నా ఎనిమిదేండ్లు ముందు అనిల్ వచ్చాడు. అతను సెక్రటేరియట్ మెంబర్. ఆమె జిల్లా కమిటీ సభ్యురాలు. ఎవరి ఏరియాల్లో వాళ్ళు పని చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం, ప్రేమ. ముఖ్యంగా దీపకు అనిల్ మీద గౌరవం.’ అతను ఆమెకి జీవితంలోనూ , వుద్యమంలోనూ వొక విధంగా మెంటర్ , మార్గదర్శకుడూ.  ‘అనిల్ దగ్గర ఉంటే దీప తల్లికోడి చుట్టూ తిరిగే పిల్లకోడే.’ రవికిరణం తాకిన పద్మమే. వారి మధ్య ఆధిపత్యాలకి తావులేదు.  అభిప్రాయాల్ని  పంచుకుంటారు. వాటిని పరస్పరం మన్నించుకుంటారు. డెన్ లో వుంటే యింటి పనులన్నీ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. ఒకరి క్షేమం పట్ల మరొకరికి  లోలోపల వొక ఆతురత , కన్సర్న్.

అలా అన్జెప్పి వారి మధ్య వైరుధ్యాలు లేవని కాదు. ‘ఒకరికొకరు ఎంత అర్థమైనా కొన్నిసార్లు కొన్నిమాటలు ఇబ్బందిగానే ఉంటాయి. కాకపొతే ఆ ఇబ్బంది దీప అనిల్ ల మధ్య కొద్దిసేపే. పొరపాటును గుర్తించడం , క్షమాపణలు చెప్పుకోవడం .. లేదా క్షమాపణలు చెప్పుకోకున్నా లోపల బాధపడుతున్న విషయం ఇద్దరికీ అర్థమవడం …’  ఆ క్రమంలో వైరుధ్యాల్ని యే విధంగా పరిష్కరించుకుంటారన్నదే కథలో ప్రధానాంశం.

నిజానికి కథ వొక  వైరుధ్యంతోనే మొదలవుతుంది. అలా మొదలు పెట్టడంలోనే కథా నిర్మితిలో రచయిత పరిణతి తెలుస్తుంది. దళం నుంచి ‘సైడ్’ కి వెళ్ళినప్పుడు (అలా సైడ్ కి వెళ్ళాడానికి వుండే యిబ్బందుల్నీ దళ కమాండర్ కి తెలియజేయకుండా వెళ్తే  యెదురయ్యే ప్రమాదాల్నికూడా రచయిత కథలో ప్రస్తావించింది) వర్షంలో టెంట్ సరిగ్గా కట్టడం చేతకాలేదని  దీప అనిల్ పై విసుక్కుంటుంది. అక్కడనుంచి కథ గతంలోకి ప్రయాణం చేస్తుంది. రహస్య జీవితంలో వాళ్ళిద్దరూ నడిచిన తొవ్వలోకి రచయిత స్వయంగా మన చెయ్యిపట్టి యెటువంటి కుదుపూ లేకుండా నెమ్మదిగా  తీసుకెళ్తుంది.

అనిల్ మృదు స్వభావి. శారీరికంగా కూడా సున్నితంగా వుంటాడు. అంతర్ముఖుడు. పనిలో యెటువంటి వూగిసలాటా వుండదు. కేడర్ కు అతనంటే ప్రాణం. కేడర్ కి గానీ తన గార్డుకి గానీ పనులు చెప్పడు. నాయకత్వ స్థానంలో వుంటూ యెప్పటి కప్పుడు స్వయం విమర్శకి సిద్ధంగా వుండేవాడు.

దీపది బడాబడా మాట్లాడే స్వభావం. మాటల పోగు. మనసులో ఏదీ దాచుకోదు. కొద్దిపాటి అసహనాన్నైనా వెంటనే వ్యక్తం చేసేస్తుంది.  ఒక్కోసారి ‘పుసుక్కున మాట జారుతుంది.’ అసలు ‘లౌక్యం’ తెలీదు. ఆమెకు తన సహచరుడితో వీలైనంత యెక్కువసేపు గడపాలనీ మనసారా మాట్లాడాలనీ వుంటుంది.

కానీ అనిల్ కి ప్రేమని ప్రదర్శించడం రాదు. ఇంట్లో యిద్దరే వున్నా మాట్టాడేది తక్కువే. ఇక నలుగురిలోనో మూడో వ్యక్తి సమక్షంలోనో  భార్యాభర్తలుగా మెసలడానికి అతనికి యిష్టం వుండదు. మరీ ముడుచుకు పోతాడు. దీపతో కాసిన్ని మాటలు కూడా బందై పోతాయి. దాంతో చాలాసార్లు ఆమె నొచ్చుకుంటుంది. అవమానంగా భావిస్తుంది.  అతని యీ తత్త్వాన్ని యితరుల ముందు తనని లెక్కజేయనట్టు ప్రవర్తించే ‘మొగుడి అహంకారం’గా భావించి తప్పు పడుతుంది. ఒకసారి ఆ కారణంగా అనిల్ ఆమెని ‘బుద్ధిలేద’ని తిడడతాడు. బయట కుటుంబాల్లో స్త్రీ పురుషుల మధ్య వుండే  వుండే అసమ సంబంధాలని చూసి విసిగి  ‘వాటిని ఎదిరించి , మార్పును ఆశించి పార్టీలోకి వస్తే అక్కడా అదే పరిస్థితా’  అని ఆమె కోపించింది, బాధపడింది, దు:ఖించింది. ఆత్మాభిమానతో నిరసన ప్రకటించింది.  తన ప్రవర్తనకి అనిల్ సంజాయిషీ యిచ్చుకొంటే గానీ దీప శాంతించలేదు.

ఇటువంటి సంఘటనల్ని కేవలం మనస్పర్థగా భావించకుండా ఆత్మ విమర్శతో కుటుంబ సంబంధాల్లోని వైరుధ్యాల్ని అర్థంచేసుకొనే తమని తాము సవరించుకొనే ప్రయత్నం చేస్తారిద్దరూ. తమ ప్రవర్తనకి తాము పుట్టి పెరిగిన నేపథ్యాలెంత వరకు కారణమో విశ్లేషించుకుంటారు. అభివృద్ధి నిరోధకమైన భావజాలాన్ని వదిలించుకోడానికి సిద్ధంగా వుంటారు.  నిజానికి సహచరులు యిద్దరూ నిరంతరం యెంతో చైతన్యవంతంగా వుంటేనే గానీ వారి మధ్య అడపా తడపా చోటు చేసుకొనే వైరుధ్యాల్ని పరిష్కరించుకోలేరు.  అందుకు అవసరమైన పరిణతి కూడా వారికి వుద్యమభావజాలం నుంచే లభించిందని కథలో సూచ్యంగా పాఠకులకి తెలుస్తూ వుంటుంది. పురుషాధిపత్య భావజాలంతో నడిచే బయటి సమాజంలోని పరిస్థితికి భిన్నంగా ప్రగతిశీల శిబిరాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుదాత్తంగా ఆదర్శవంతంగా వుంటాయనీ – వుండాలనీ రచయితకున్న బలమైన ఆకాంక్ష వొకటి కథ పొడవునా అంతస్సూత్రంగా కనిపిస్తుంది.

భార్య మెత్తగా ఉంటే భర్త ఆడించడం, భర్త మెత్తగా ఉంటే భార్య పెత్తనం చెలాయించడం … ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలనుకోవడం … ఒకరిని మరొకరు అణచాలని చూడటం. భార్యాభర్తల సంబంధం ఇల్లనే చిన్న రాజ్యంలో అధికారపీఠం కోసం జరిగే యుద్ధంలా’  పరిణమించడానికి గల కారణాల్ని తాత్త్వికంగా అన్వేషించే ప్రయత్నం కూడా కథలో చోటుచేసుకొంది.

భార్యా భర్తలు కూడా యెవరి స్వేచ్ఛా పరిధుల్లో వాళ్లుండాలనీ , భార్య అయినా భర్త అయినా ఎవరైనా కావచ్చు కొన్ని ‘గిరులు’ ఉండాల్సిందేననీ ,  ఆ గీతలు దాటితే ‘నేను చెప్పినట్టల్లా అవతలి వ్యక్తి వినాలి’ అనే వరకు వెళ్లి ఒకరిపై మరొకరి ఆక్రమణ ఆధిపత్యాలు చోటు చేసుకోవచ్చనీ , అది మొదలయ్యేది ప్రేమ పేరుతోనే  అనీ అనిల్ ముఖత: రచయిత చేసిన సూత్రీకరణలు వుద్యమ జీవితంలోనే కాదు స్త్రీ పురుష సమభావనలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని  యే కుటుంబానికైనా అన్వయించుకోవచ్చు. possessiveness లోనే వొకరిపై మరొకరు అధికారాన్ని ప్రకటించే వైఖరి దాగి వుంటుందని మరోకోణాన్ని చూడగలం.

‘విప్లవకారుల్లో పరిమితులు దాటిన ప్రేమ ఏవిధంగా చూసినా అనర్థమే. ‘తామిద్దరే’ అనే స్పృహ వస్తే విప్లవోద్యమాన్ని వీడటానికి కూడా వెనుకాడక పోవచ్చు. లేదా సహచరున్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళలేని  స్థితి రావచ్చు. పార్టీలో భార్యా భర్తలిద్దరూ ఒకే దగ్గర ఉండటం అనేది అసాధ్యం.’

అనిల్ మాటల్లో భార్యా భర్తల సంబంధం కన్నా వుద్యమావసరాలూ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బలమైన ధ్వని వుంది. లొంగుబాటుల కారణాల విశ్లేషణ వుంది. ఉద్యమకారులకి వుండాల్సిన  కర్తవ్య నిష్ఠ త్యాగ నిరతి కూడా అతని మాటల్లో వ్యక్తమవుతాయి. అదీగాక యెప్పుడు యెవరికి యేమౌతుందో తెలీని వుద్యమ జీవితంలో హద్దుల్లేని  ప్రేమ మంచిది కాదని అనిల్ ఆలోచన. సాన్నిహిత్యం పెరిగితే వుద్యమ కార్యాచరణలో అది ఆటంకంగా పరిణమిస్తుందేమోనని అతని భయం. అనిల్ ఆలోచనతో భయంతో  ఏకీభావం వున్నప్పటికీ   ‘ఎప్పుడో ఏమో అవుతదని ఉన్నంతకాలమూ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటామా ?’ అని దీప వాదన.

జీవితం పట్ల ప్రేమాభిమానాల పట్ల స్త్రీ పురుషుల ఆలోచనల్లో సహజంగా వుండే తేడాని ఆవిష్కరించడానికి కరుణ కథలో యెంతో సున్నితమైన సన్నివేశాల్ని కల్పించింది.అనిల్ దీపల మధ్య యేకాంత సందర్భాల్ని చక్కగా వుపయోగించుకొంది. భావ వినిమయానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించింది. అందుకు యే మాత్రం కాఠిన్యానికి తావులేని మృదువైన  సంభాషణాత్మకమైన నిరాడంబరమైన శైలిని ఆశ్రయించింది.  కథాంశంలోని సంక్లిష్టతని కథచెప్పే పద్ధతిలోకి రానీయకుండా జాగ్రత్తపడింది.

సర్వసాక్షి కథనంలో రచయితే కథ చెప్పడంవల్ల అనిల్ దీపాల ప్రవృత్తిలోని మంచిచెడ్డల్ని, మనోభావాల్ని, బలాల్నీ బలహీనతల్నీ నిశితంగా విశ్లేషించగలిగింది. వారి అంతరంగాల లోతుల్ని తడమగలిగింది. సందర్భానుసారంగా వారి మాటల ద్వారా రాజకీయ సిద్ధాంత చర్చల్ని సైతం నడపగలిగింది. వారిద్దరి మధ్య సంభాషణలు సంవాదాలుగానో వివాదాలుగానో  పరిణమించకుండా వుద్వేగ ప్రధానంగా నడపడంలో గొప్ప సంయమనాన్ని ప్రదర్శించింది. కరుణ కంఠం దీపలో విన్పించకుండా తాటస్థ్యాన్ని పాటించింది. కానీ యిదంతా ఆమె అనుభూతిలోకి వచ్చిన విషయమేనని కథ చదువుతోన్నంతసేపూ  అనిపిస్తుంది.  జీవితాన్ని సిద్ధాంతాలతో గాక అనుభవాలతో వ్యాఖ్యానించడం వల్ల విప్లవోద్యమానికి చెందిన కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తూ కథ ఫ్రెష్ గా వుంది.

కరుణ స్వీయ వుద్యమ జీవితానుభవం నుంచే వచ్చిన కథ కావడం వల్ల ‘సహచరులు’ లో పార్టీ నిర్మాణంలో వుండే క్రమశిక్షణ గురించి దాన్ని పాటించడంలో వ్యక్తుల బలాబలాల గురించి లోటుపాట్ల గురించి , అడవిలోపల  దళాల కదలికల గురించి , బయట  డెన్  లో రహస్య పరిరక్షణ కోసం తీసుకొనే టెక్ జాగ్రత్తల గురించి పాటించాల్సిన  గోప్యత గురించి  ఆమె నిర్దిష్టంగా ప్రస్తావించిన అంశాలకు ప్రామాణికత లభించింది.    

ఆ క్రమంలో తాను నడిచి వచ్చిన వుద్యమాల బాటలో యెదురైన సవాళ్ళని చర్చకి పెట్టడానికి కూడా రచయిత్రి యెక్కడా వెనుకాడలేదు. పార్టీలో అమలయ్యే కేంద్రీ కృత ప్రజాస్వామ్య విలువల గురించి , పాత కొత్త ఆలోచనల మధ్య రేగే వైరుధ్యాల గురించి , దీర్ఘకాలిక ప్రజా యుద్ధం పట్ల నాయకత్వ స్థానంలో వున్న వారి తప్పుడు అవగాహన గురించి , క్రమశిక్షణ విషయంలో వైయక్తికంగా నాయకులు ప్రదర్శించే వుదార వైఖరి వల్ల కలిగే అనర్థాల గురించి , గ్రామాల నుంచి పట్టణాలకి వుద్యమ స్ఫూర్తి వ్యాపించాల్సిన అవసరాల గురించి దీపా అనిల్ ల మధ్య నడిచిన మాటలు సైద్ధాంతికంగా లోతుగా ఆలోచింపదగినవి. ఆ సందర్భంలో  ‘ఒక మనిషి జీవిత కాలంలో విప్లవ విజయాన్ని చూడాలి’   వంటి వ్యాఖ్యలు ప్రత్యేకంగా పరిశీలించాల్సినవి.

నిజమే అటువంటి బలీయమైన ఆశ వుంటేనే విప్లవాచారణలో స్థిరంగా నిలబడగల్గుతాం. కానీ రాజ్యాధికారమే అంతిమ విజయమైతే అది వొక మనిషి జీవిత కాలంలో సాధ్యం కావచ్చు – కాకపోవచ్చు. విప్లవ విజయాన్ని తమ జీవితంలో చూడలేక ఆచరణనే తప్పుబట్టే ప్రమాదం వుంది. అందుకే విప్లవాచారణలో స్వల్పకాలిక లక్ష్యాలనూ దీర్ఘకాలిక లక్ష్యాలనూ యెప్పటికప్పుడు నిర్వచించుకుంటూ ఫలితాల్ని మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది.

రహస్యోద్యమాల్లో పనిచేసే ఆడ మగా మధ్య లైంగిక విశృంఖలత్వం గురించి జరిగే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కథలో వొక సందర్భాన్ని రచయిత ప్రత్యేకంగా సృష్టించుకొంది. వస్త్వైక్యత చెడకుండా అది కథలో వొదిగి పోయింది. కథకి లోతుతో పాటు విస్తృతిని కల్గించింది. నిండుదనాన్నిచ్చింది.

స్త్రీ పురుషులు విచ్చలవిడి సంబంధాలకోసం  చావుకు సిద్ధపడి విప్లవం బాట పట్టాల్సిన అవసరం లేదనీ , నిజంగా అటువంటి సంబంధాలు పార్టీలో ఉంటే అందులో పడి కొట్టుకుపోతారు తప్ప విలువలకోసం  ప్రజల తరపున నిలబడి పోరాడలేరు – నిర్బంధాన్ని తట్టుకోలేరనీ చెబుతూ దీప అటువంటి ‘సంబంధాల కోసమైతే బయటే ఉండొచ్చుగా’  అని మరో మాట అదనంగా అంటుంది.

‘ఉద్యమంలో దోపిడీ పీడనల అంతం ఒక్కటే కాదు. పురుషుడికి మల్లే స్త్రీకి స్వేచ్ఛా సమానత్వం ఉండాలని కోరుతున్నామంటే అర్థం  …  అనైతిక సంబంధాల విషయంలో కాదు. దంపతీ వివాహం ఉన్నతమైందని పార్టీ నమ్ముతుంది. అమలు చేస్తుంది.  ఊహల్లో ప్రేమతో కాదు , నిజమైన ప్రేమతో సహచరులు కలిసి ఉంటారు.’ అని ఆమె ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగింది.

పార్టీలో యెట్టి పరిస్థితుల్లోనూ అనైతిక సంబంధాల్ని అంగీకరించరని బలంగా చెప్పడమే  ఆమె వుద్దేశం. నిజానికి యే యిద్దరు స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడినా వెంటనే వాళ్లకి పెళ్లి చేసేయడం కమ్యూనిష్టు వుద్యమాల్లో మొదటి నుంచీ వుంది. దీన్ని నైతికత విషయంలో భూస్వామ్య విలువల నుంచీ బయటపడక పోవడంగానే భావించే వీలున్నప్పటికీ బయటి వాళ్లకి వేలెత్తి చూపే అవకాశం యివ్వడం పార్టీకి కీడు చేస్తుందని వాళ్ళ నమ్మకం.

 విప్లవ పార్టీల రాజకీయ ఎజెండాలో స్త్రీల నిర్దిష్ట సమస్యలకి చోటులేకుండా పోతుందనే విమర్శకి కూడా రచయిత దీప ఆలోచనల ద్వారా సమాధానం చెప్పించి వుంటే బాగుండేది కానీ కథలో ఫోకస్ పాయింట్ పక్కకి పోయే ప్రమాదం వుంది. అది మరో కథకి వస్తువౌతుంది. కథ మాత్రమే చెప్పాలన్న స్పృహ కథా రచయితకి వుండటం వల్ల ప్రయోజనమిది.

 

దీప అనిల్ మధ్య మాటల్లో సాహిత్య విషయాలెన్నో చోటు చేసుకునేవి. నిజానికి మాటల్లో యెంతో పొదుపరి అయిన అనిల్ సాహిత్యం గురించి , సిద్ధాంతం గురించి మాట్టాడాల్సి వస్తే మాత్రం గొప్ప ప్రవాహ శీలి అయిపోతాడు. కథ గురించి అతనికి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘ఎవరూ ఎన్నుకోని వస్తువుని ఎన్నుకున్నప్పుడే కథ నిలుస్తుందనేవాడు. వస్తువు పాతదాన్నే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త ముగింపునో , కొత్త శైలినో ఎన్నుకోవాలి అనేవాడు. శిల్పం గురించి అవసరం లేదంటారు కానీ చెప్పే పధ్ధతి బాగుండాలి…’ కథలో వస్తు శిల్పాల ప్రాధాన్యాల గురించిన అనిల్ ఆలోచనలు రచయిత్రివే  ( వాటి వెలుగులో కరుణ కథల్ని ప్రత్యేకంగా  అధ్యయనం చెయ్యొచ్చు ).

అందుకే కథ ముగింపు విషయంలో కూడా కరుణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చివరికి సామరస్య వాతావరణంలో  ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ’ అని అనిల్ నవ్వుతూ అంటే  , ‘పితృస్వామ్యం నశించాలి’ అని దీప రిటార్ట్ యివ్వడంతో కథ ముగుస్తుంది. ఐక్యత – ఘర్షణ – ఐక్యత అన్న గతితార్కిక అవగాహనని అతి సున్నితంగా ఆవిష్కరించిన ముగింపు పెదాలపై నవ్వు పూయిస్తుంది. ఉద్యమాల్లోనే కాదు ; యెక్కడైనా స్త్రీ పురుష సంబంధాలు అసమానతలకీ ఆధిపత్యాలకీ తావులేకుండా సంతోషమయంగా వుంటే బావుంటుంది గదా అని అనుకోకుండా వుండలేం.

ఇప్పుడిహ  యిది యే అస్తిత్వ వాదానికి చెందిన కథో అని విమర్శకులు విద్యాత్మక పరిశోధనలు మొదలెట్టొచ్చు. ఇదంతా శత్రు వైరుధ్యమా మిత్ర వైరుధ్యమా అని తలలు బద్దలుకొట్టుకొనే వాళ్ళని వాళ్ళ  మానానికి  వొదిలేసి కరుణ తన యెరుకలోకి వచ్చిన  జీవితాన్ని కథలుగా మలిచే కృషిని యిలాగే నిరంతరం కొనసాగించాలని  కోరుకుంటున్నాను. విప్లవోద్యమ సాహిత్యానికి కరుణ లాంటి రచయితల అవసరం యెంతైనా వుంది.

 

 

 

అసలు  ‘హక్కుదార్లు’ యెవరు ?

painting: Rafi Haque

painting: Rafi Haque

 

“అమ్మా నాకు చలి వేస్తుందే , మంట వేయవూ?”

“నాయనా బొగ్గులు లేవురా”

“అమ్మా బొగ్గులెందుకు లేవే?”

“మీ నాన్నకు పని పోయింది, బొగ్గులు కొనడానికి డబ్బు లేదు బాబూ!”

“నాన్నకు పనెందుకు పోయిందమ్మా?”

“బొగ్గు ఎక్కువగా ఉందిటరా బాబూ!”

_ రాషెస్డల్

యెంతో వింతగానూ వైరుధ్యభరితం గానూ మినీ కథలానూ వున్న యీ ఆర్ధిక విశ్లేషణ మన సింగరేణికి అతికినట్టుగా సరిపోతుంది. అందుకే గత మూడున్నర దశాబ్దాలుగా సింగరేణి సామాజిక ఆర్ధిక శాస్త్ర వేత్తలకి  అధ్యయన వేదిక అయ్యింది. అక్కడి సమాజం రచయితలకి సాహిత్య పాఠశాల అయ్యింది. 1981 లో బొగ్గు గనుల్లో యాభై ఆరు రోజుల పాటు జరిగిన చారిత్రిక సమ్మె దరిమిలా  సింగరేణి కార్మికుల ‘బండ కింది బతుకులు’ సాహిత్యంలో వస్తువు లయ్యాయి. ‘బొగ్గు పొరల్లో …’ మొట్టమొదటిసారిగా ‘నల్లకలువ’ లెన్నో వికసించాయి. రాజయ్య  , రఘోత్తం రెడ్డి, పి చంద్ వంటి రచయితల సామూహిక కర్తృత్వంలో (కార్మిక పేరుతో ) , సొంత పేర్లతో  కార్మికోద్యమ కథలెన్నో వెలువడ్డాయి. హక్కుల కోసం , మెరుగైన జీవితం కోసం సెమ్మాసులు పట్టిన కార్మికుల చైతన్యం ‘నల్లవజ్ర’ మై  మెరిసింది. క్రూర నిర్బంధాల నేపథ్యంలో కార్మికుల్లో పోరాట స్ఫూర్తి నింపిన  ఆ నాటి సాహిత్యం అపూర్వమైనది.

తర్వాతి కాలంలో ’90ల్లో మొదలైన నూతన ఆర్ధిక సంస్కరణలు గనుల్లో ప్రైవేటీ కరణకి దారులు వేశాయి. ప్రభుత్వాల బొగ్గు పాలసీలు కాలరీల్లో పెను మార్పులు తెచ్చాయి. కార్మికుల మెడ చుట్టూ కనిపించని వురితాళ్ళు పేనాయి. అణచివేత – అభివృద్ధి అనే ద్విముఖ వ్యూహాన్ని కంపెనీ అమలుపరచింది. ప్రైవేటు కాంట్రాక్టర్లకి రెడ్ కార్పెట్ పరిచింది. ఔట్ సోర్సింగ్ కంపారటీవ్ అడ్వాంటేజ్ అని నమ్మి- నమ్మించి ఆచరణలో పెట్టింది. అవుట్ సోర్సింగ్ ని ‘ఒక కిల్లర్ అప్లికేషన్ గా – ఒక పనసియా (సర్వరోగనివారిణి) గా ప్రచారం చేసింది. డిపెండెంట్ వుద్యోగాల్ని కూడా రద్దు చేసింది. కార్మికులు రిటైర్ అయితే వాళ్ళ స్థానంలో కొత్తవాళ్ళని తీసుకోవడం మానేసింది. ఓపెన్ కాస్ట్ ల సంఖ్యని పెంచి  వాటిలో భారీ యంత్రాలని దించింది.  కార్మికులకు పని యివ్వకుండా నిర్వ్యాపారులుగా కూర్చోబెట్టి కృత్రిమమైన సర్ప్లస్ మేన్ పవర్ ని సృష్టించింది. వాళ్ళ శక్తిని మరో చోట ఉపయోగించుకొనే అవకాశం వున్నప్పటికీ వోవర్ బర్డెన్ రిమూవల్ తో పాటు నెమ్మదిగా వొక్కో రంగాన్నీ ప్రైవేటైజ్ చేస్తూ పనులు కాంట్రాక్టర్లకి అప్పజెప్పింది. సంస్కరణల హేతుబద్ధతని ప్రశ్నించే వాళ్ళపై  తీవ్రవాద ముద్ర వేసి అణచివేతకి పూనుకొంది. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల మద్దతు కూడగట్టుకొని వారితోనే వొప్పందాలు  చేసుకొంటూ మిలిటెంట్ స్వభావంతో పనిచేసే  సికాస లాంటి సంఘాలని నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు రచించింది.

1 లక్షా 20 వేలు వుండే కార్మికుల సంఖ్యని  సగానికి పైగా కుదించివేసి లాభాల బాటలోకి నడిపిన గత పదిహేనేళ్ళ చరిత్ర రక్త సిక్తమై  యెంత అమానవీయంగా వుందో తెలియజేస్తూ  పి చంద్ లాంటి రచయితలు కథలు  (జులుం) , యండి మునీర్ లాంటి వాళ్ళు వ్యాసాలు  రాశారు. అయితే యీ క్రమాన్ని మరో దృష్టికోణం నుంచి పరిశీలించిన కథ  ఎం. రఘువంశీ రాసిన ‘హక్కుదార్లు’. ( అరుణతార : ఆగస్ట్ 2016)

[ కథ లింక్ : http://www.virasam.in/article.php?page=223  పే.11-20 ]

“వచ్చిన లాభాల పంపకం వాటికి కారణమైన వాళ్ళ మధ్య సజావుగా ఉందా ? అసలు వాటాదార్లు ఎవరు?” అని ప్రశ్నిస్తుంది యీ కథ. అసలు నష్టాల్లో నడిచే కంపెనీ లాభాల్లోకి యెలా ప్రవేశించింది? ఆ క్రమంలో యెవరి పాత్ర యెంత? శ్రమ యెవరిది ? సిరి యెవరిది? వాటాలు పంచుకొనే దారిలో కార్మికుల్లో యెటువంటి  మార్పులు వచ్చాయి? కార్మిక సంఘాల ధోరణి ఏమిటి? కంపెనీ క్షేమం – కార్మిక సంక్షేమం మాటల నిర్వచనాలు యెలా మారిపోయాయి? సంస్కరణల అమల్లో యాజమాన్యాల కాంట్రాక్టర్ల విధానాలేంటి? మిడిల్ మేనేజ్ మెంట్ లో అధికారుల రోల్ ఏంటి? ఈ అంతటిలో పాలకుల వైఖరి ఏంటి?పబ్లిక్ రంగ సంస్థ ప్రాథమిక లక్ష్యం లాభార్జనేనా? దాని సామాజిక బాధ్యతలేంటి? కంపెనీ అభివృద్ధి ప్రాంతీయ అభివృద్ధికి యే మేరకి దోహదం చేసింది? ఈ క్రీ నీడలో మగ్గి పోయిందెవరు ? అందరూ పల్లకిల్లో వూరేగుతున్న పంచరంగుల స్వప్నావిష్కారంలో అసలు బరువు మోసిందెవరు? మేక్రో లెవల్లో ప్రపంచీకరణకు మైక్రో లెవల్లో సింగరేణి యెలా అద్దంగా నిలబడింది? … యిలా సవాలక్ష ప్రశ్నలకు వొక సాహిత్య రూపం యివ్వడం అందునా వాటికి సమాధానాలు వెతికే బృహత్ కార్యాన్ని వొక  కథలోకి కుదించే ప్రయత్నం సాహసమే. ఆ సాహసాన్ని యిష్ట పూర్వకంగా యెత్తుకొన్న రచయిత రఘువంశీ. ఈ పేరు యింతకు ముందు విన్నది కాదు. కథా వస్తువు , కథా రచన అతనికి కొత్త కాదు అనిపిస్తుంది. కథ రాసింది చేయి తిరిగిన యిన్ సైడ్ రచయితేనేమో అని  అనుమానం కలుగుతుంది. కథ నడిపిన తీరు కూడా దాన్నిబలపరుస్తుంది.

కథని కార్మికులవైపు నుంచీ గాక మిడిల్ మేనేజ్ మెంట్ లో పనిచేసే ఉద్యోగుల దృష్టి కోణం నుంచీ నడిపి పై ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నం మరీ కత్తి మీద సాము లాంటిదే. ఆ సాములో  రచయిత యే మేరకు సఫలమయ్యాడో చూద్దాం.

లాభాల్లో కార్మికుల వాటా నిర్ధారించడానికి మెయిన్ ఆఫీసులో మేనేజిమెంట్ గుర్తింపు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపడానికి మీటింగ్ పెట్టుకొనే సమయానికి (సంస్థ లాభాలు గడించడం మొదలైన తొలి నాళ్లలో లాభాల్లో కార్మికుల వాటా పది శాతం వుండగా రాను రానూ అది  యిరవై శాతం వరకూ పెరిగింది. ఈ సంవత్సరం అది 23 శాతం) ఆఫీసు ముందు ఔట్ సోర్స్డ్ కార్మికులు ధర్నాకి దిగడం దగ్గర కథ మొదలైంది. ధర్నా కారణంగా ఆఫీసులోకి పోలేని ఆఫీసర్లు , ఉద్యోగులు, రెగ్యులర్ కార్మికులు చిన్న చిన్న గుంపులుగా బయట యే చెట్టు నీడనో కూర్చొని ధర్నా పూర్తి కాగానే లోపలోకి పోదామని యెదురు చూస్తుంటారు.

వాళ్ళలో అన్ని స్థాయీలకి చెందిన వాళ్ళున్నారు.  మే డే  ఫ్లెక్సీ మీద కూర్చొని స్మార్ట్ ఫోన్లలో విమన్స్ డే ఫోటోలు చూసుకొంటూ ముచ్చట్లు పెట్టుకొనే ఉద్యోగినులున్నారు. రావాల్సిన ప్రమోషనో కోరుకొన్న పోస్టింగో  రాక మేనేజిమెంట్ మీద అలిగిన ఆఫీసర్లున్నారు. మీడియా కెమెరా ముందు స్లోగన్లు యిచ్చి  కవరేజి అయిపోయాకా ధర్నా చేసే వాళ్ళు సర్దుకుపోతారని భావించే అత్యాధునికులున్నారు.  అమెరికాలో వున్న  కూతురు దగ్గరికో కొడుకు దగ్గరికో పోయొచ్చి అక్కడి నుంచీ తెచ్చుకొన్న వస్తువుల్ని ప్రదర్శించుకొనే క్లర్క్ లున్నారు.

యెవరి సామాజిక నేపథ్యాలు వాళ్ళకున్నా కళ్ళ ముందు జరిగే ధర్నా పట్ల వాళ్ళ వైఖరి మాత్రం వొక్కటే. నిర్లిప్తత. దాన్ని ఎష్టాబ్లిష్ చేయడానికి రచయిత చక్కటి వాతావరణం సృష్టించాడు.  మే డే వుమెన్స్ డే వేడుకలుగా కేవలం వుత్సవాలగానో మొక్కుబడి కార్యక్రమాలగానో  పరిణమించిన వైనం వంటి కథాంశానికి పనికి వచ్చే యెన్నో విషయాలు వాతావరణ వర్ణన ద్వారా ప్రతీకాత్మకంగా వ్యక్తమయ్యాయి.

అయితే ఔట్ సోర్స్డ్ కార్మికుల పట్ల వాళ్ళ సమస్యల పట్ల సానుభూతి , వాళ్ళ  డిమాండ్ లో న్యాయ బద్ధత పట్ల సహానుభూతి వున్న సీనియర్ ఆఫీసర్లు కూడా అక్కడ వున్నారు. వాళ్ళ మాటల్లో  సంస్థ పని తీరు గురించి యెన్నో విషయాలు చర్చకు వస్తాయి. ఔట్ సోర్సింగ్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతుందన్న స్పృహ కూడా వాళ్లకు వుంది. దాన్ని అర్హులందరికీ  పంచకుండా స్వార్థంతో తామే  అనుభవిస్తున్నామన్న అపరాధ భావనకూడా వుంది (ఒక విధంగా అటువంటి అపరాధ భావనే నాతో యీ వ్యాసం రాయిస్తోంది). హెచ్ ఆర్డీ లో పని చేస్తున్న సుదర్శన్ ఆలోచనల కేంద్రంగా చర్చ నడుస్తుంది. అదే డిపార్ట్ మెంట్ లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్ చర్చల్లో వ్యక్తమైన  ఆలోచనల్ని తార్కికంగా విశ్లేషిస్తూ పబ్లిక్ రంగ సంస్థల లక్ష్యాల్ని నిర్వచిస్తూ ప్రగతిశీల భావజాలంతో వచ్చిన మార్పుల పట్ల సమగ్ర దృష్టి  ప్రదర్శిస్తాడు.  ఫైనాన్స్ అధికారి చక్రపాణి సమస్యలోని ఆర్ధిక కోణాల గురించి సందేహాలు లేవనెత్తుతూ వుంటాడు. వయస్సులో అనుభవంలో జూనియర్ అయిన ఎకనామెట్రిషియన్ ప్రతిభ మధ్యలో ప్రశ్నలు సంధిస్తూ వుంటుంది. సుబ్రహ్మణ్యం మోహన్ రావు లాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచీ మాటలు అందిస్తూ వుంటారు. వీళ్ళందరి మాటల్లో కార్మికోద్యమాల నేపథ్యంగా సంస్థ గత చరిత్ర  వర్తమాన పరిస్థితుల  మధ్య సేతు నిర్మాణం జరుగుతూ వుంటుంది.

ధర్నాలతో సమ్మెలతో పని స్తంభింప జేయలేమని ధర్నా చేస్తున్న వాళ్ళకి తెలుసు. బయట చెట్ల కింద కూర్చున్న ఆఫీసర్లు కొందరు  లాప్ టాప్ ల ద్వారా ఆన్ లైన్లో ఆఫీసు పని చేస్తూంటారు. వెన్యూ మార్చుకొన్న మీటింగ్ తో సహా  యేదీ ఆగలేదు.

లాప్ టాప్ లు వర్చ్యువల్ ఆఫీసులు నడపొచ్చేమో గానీ బొగ్గు తవ్వలేవని కూడా ధర్నా కార్మికులకు తెలుసు. ‘తుపాకులు బొగ్గు తొవ్వలేవని నల్లటి బొగ్గుతో రాసిన గోడమీది నినాదం మసకబారిందేమో గానీ వాళ్ళ మనసుల్లో నుంచీ మాత్రం చెరిగిపోలేదు. ‘టోపీల వర్తకుడు – కోతుల కథ లో లాగా వర్తకుడికే కాదు ; కోతులకూ వాళ్ళ తాత తమ అనుభవాలు , జరిగిన చరిత్ర చెబుతాడుగా !’ అని ఆ సందర్భంలో  రవిప్రసాద్ చేసిన  వ్యాఖ్యానం అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ రాబోయే చర్చలో అతని మాటల విలువని అంచనా కట్టడానికి తోడ్పడుతుంది.

కంపారటీవ్ అడ్వాంటేజ్ ప్రిన్సిపుల్ పేర్న అమల్లోకి వచ్చిన ఔట్ సోర్సింగ్ కొందరికే అడ్వాంటేజ్ గా పరిణమించడం గురించి , కార్మికులకీ మేనేజిమెంట్ కీ మధ్య వొకప్పటి ఘర్షణాత్మక వైఖరి పోయి  లాభాల పంపకాలు మొదలయ్యాకా  నెలకొన్న సామరస్య విధానాల  గురించి ,  ట్రేడ్ యూనియన్ల మారిన  ప్రాధమ్యాల గురించి,  ప్రైవేట్ కాంట్రాక్టర్ల యాజమాన్యపు పని తీరు  గురించి , లాభార్జనలో భాగంగా కార్మికుల సంఖ్యని తగ్గించడంలో చేపట్టిన చర్యల గురించి , ఉపరితల గనుల గురించి , మెకనైజేషన్ గురించి , ఉత్పత్తి పెంపు గురించి , పర్యావరణ పరిస్థితుల గురించి అనేక విషయాలు వారి మాటల్లో చర్చకు వస్తాయి.

ఇవ్వాళ మేనేజిమెంట్ కీ  కార్మికులకీ మధ్య వైరుధ్యాలు తొలగిపోయి సయోధ్య సామరస్యాలు ఏర్పడడంతో యిద్దరికీ  విన్ విన్ సిట్యుయేషన్ లా కనిపిస్తుంది అని వొకరంటే అది  ‘దొంగలూ దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్టుంది’ అని గనుల్లో పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన  సుబ్రహ్మణ్యం తన భాషలో బదులిస్తాడు .

తన పాతికేళ్ళ వుద్యోజీవితాన్ని వొక్క సారి వెనక్కి తిరిగి చూసుకొన్న సుదర్శన్ కి సంస్థ గమనమంతా కళ్ళముందు కదలాడింది. జరిగిన సంఘటనల సారాంశం చూస్తే అతనికి యేదీ యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపించలేదు. అతనిలో యెన్నో సమాధానాలు తెలిసిన ప్రశ్నలే పునరావృతమౌతూ వుంటాయి.

సంస్కరణల అంతరార్థం అతనికి తెలుసు.  స్వచ్ఛంద పదవీ విరమణ(వి ఆర్ ఎస్) స్వర్ణ కరచాలనాలు (గోల్డెన్ షేక్ హాండ్స్) వంటి పథకాల అమలు ద్వారా ‘మిగిలిన ఉద్యోగ కాలంలో వచ్చే జీతాల కన్నా ఇవ్వజూపే పరిహారం ఎక్కువయ్యింది’. అయినా కంపెనీ వాటిని అమలు చేసింది. ఆ కార్మికుల ఉద్యోగుల స్థానంలో ఔట్ సోర్స్ కార్మికుల్ని తీసుకొంది. ఆ రోజోల్లో ఉత్పత్తి ఉద్పాదకత యంత్రీకరణ లాభాలు అన్న మాటలు తప్ప యాజమాన్యం కార్మికుల దృష్టి యితర విషయాల మీదికి పోకుండా వూదరగొట్టింది. అయితే ‘గనుల్లో కార్మికులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న మాన్ రైడింగ్ సదుపాయాలూ . షాఫ్ట్ లు ఏర్పాటు అవుతూ వచ్చాయి. సెమి మెకనైజేషన్ లో భాగంగా భూగర్భ గనుల్లో చిన్న స్థాయి యంత్రాలు వచ్చాయి. గని కార్మికులకు పీడకల లాంటి భుజాలపైనో తలపైనో తట్టలో ఖనిజం మోసే పని దగ్గర దగ్గర అంతర్ధానమైపోయింది.’ 80 ల్లో సింగరేణి కార్మిక కథల్లో రచయితలు వర్ణించిన దుర్భర పరిస్థితులు యిప్పుడు లేవు.

ఇదంతా – సంస్కరణల వల్లే జరిగిందని మేనేజిమెంట్ గొప్పగా చెప్పుకోవచ్చేమో గానీ – దశాబ్దాల పాటు కార్మికుల పోరాటాల ఫలితమే. ఉద్యమాల ద్వారా సాధించిన విజయమే.

ఈ విషయాన్ని కూడా రచయిత స్పష్టంగానే చెప్పాడు. ‘ ఇప్పుడున్న చట్టాలు … అందులోనూ కార్మిక చట్టాలు గమనిస్తే అనేక డిమాండ్ల ద్వారా … పోరాటాల ద్వారా ఇప్పుడున్న స్థితికి వచ్చాయి.’ అని పేర్కొంటాడు. అదేవిధంగా  సంస్థను అభివృద్ధిబాటలో నడిపించడానికి కార్మికుల హాజరు శాతం పెంచడం , ఉత్పత్తి ఉత్పాదకత పెంచడం , ఉత్పత్తి వ్యయం తగ్గించడం , యంత్రాల సామర్థ్యం పూర్తిగా వినియోగించడం వంటి సంస్కరణలు ఉడత సాయం లాంటివేననీ , ‘కృష్ణుడు చేసిన సాయం లాంటిది మాత్రం అవుట్ సోర్సింగేనని’ సుదర్శన్  నిర్మోమాటంగా  ప్రకటించాడు. ఆ గొంతు రచయితదే. సుదర్శన్  అవగాహనే రచయిత దృక్పథం.

అయితే కార్మికుల సంఖ్య కుదించడంతో మిగిలివున్న వారికి  వసతులు సౌకర్యాలు పెరిగాయి. ఒకప్పుడు నీటికోసం నీడకోసం గనుల్లో రక్షణ కోసం  కూడా సమ్మె చేయాల్సిన పరిస్థితులుండేవి. పర్మినెంట్ కార్మికుల జీతాలతో గానీ సదుపాయాలతో  గానీ పోల్చి నప్పుడు  ఔట్ సోర్స్డ్ కార్మికులు యెంత దోపిడీకి గురవుతున్నారో తెలుస్తుంది (ఔట్ సోర్స్డ్ కార్మికుల జీతం కంటే కంపెనీ కార్మికుల జీతం యెనిమిది రెట్లు యెక్కువ) .

ఈ క్రమంలో అన్ని విధాల  బాగుపడి బలిసిపోయింది  మాత్రం కాంట్రాక్టర్లే అన్నది జగమెరిగిన సత్యమే కానీ సంస్థ సాధించలేని దాన్ని వాళ్ళెలా సాధిస్తున్నారన్నదే తేలని నిగ్గు.

ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ , యెంతో పెద్ద సెటప్ , దశాబ్దాల అనుభవం , ప్రొఫెషనల్ మానేజిమెంట్ , డెవలప్ మెంట్ ప్రోగ్రాములు , ట్రైనింగులు , విదేశీ స్టడీ టూర్లూ చేయలేని చేయించుకోలేని పనిని యే మాత్రం అనుభవం లేని కాలేజి డ్రాపవుట్ కాంట్రాక్టర్ – కెపాసిటీ తక్కువ మెషీన్లతో తక్కువ ఖర్చుతో  క్వాలిఫైడ్ కాని వాళ్ళతో సాంకేతిక నైపుణ్యం లేనివాళ్ళతో  చిన్న సైన్యంతో చాలెంజి చేసి యెలా సాధించగలుగుతున్నాడన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మిడిల్ మేనేజ్ మెంట్ ని సైతం తొలుస్తూనే వుంటుంది. కాంట్రాక్టర్ అనుసరించే పద్ధతుల్నే కంపెనీ కూడా ఫాలో అవ్వొచ్చుగా అంటే సమాధానం లేదు. లోపం ఎక్కడ వుంది? చేసే వాళ్ళలోనా – చేయించుకొనే వాళ్లలోనా ? కార్మిక వర్గ ప్రతినిధి అడిగే ప్రశ్నకి సమాధానం యిచ్చే నాథుడు లేదు.

అనేకమంది సృష్టించింది అందరూ అనుభవించాలి కానీ సంపద సృష్టించినవాడికి దక్కకుండా వొకరే అనుభవించడం  – యాజమాన్యం వొకప్పుడు – ఆ స్థానంలో మరికొంత మంది కార్మిక వర్గానికి చెందినవారు కూడా తోడవ్వడంతో  కార్మిక సమైక్యతకి పెద్ద విఘాతం ఏర్పడింది. కార్మికుడు మధ్యతరగతిగా యెదిగి తన మూలాలు మర్చిపోయి  పెటీ బూర్జువాగా తయారయ్యాడని కూడా రచయిత కథలో గుర్తించాడు.

కార్మికులు , చిన్న స్థాయి ఉద్యోగులు ‘నీడ్స్ హైరార్కీలో ఒక స్టెప్ పైకెళ్ళారు. ఇదివరకు ఆఫీసర్ల మానసిక స్థితికి ఇప్పుడు వాళ్ళు వచ్చారు…  టేబుల్ కి ఆపోజిట్ సైడులో ఉండవలసిన వాళ్ళు రెండో వైపుకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు మానేజిమెంటు పనిచేయించేది అనుకుంటే కార్మికులు పనిచేసేవారు. కొద్ది మినహాయింపులతో ఇప్పుడు సంస్థ ఉద్యోగులంతా పనిచేయించే వాళ్ళయ్యారు. అవుట్ సోర్సుడు కార్మికులు పనిచేసున్నారు.’ కార్మికులూ కార్మిక నాయకులూ వర్గస్పృహ కోల్పోయారనీ వాళ్ళ వర్గస్వభావమే మారిపోయిందనీ రచయిత రవిప్రసాద్ ముఖత: చెప్పిన మాటల్లో  నిజం బాధించినప్పటికీ  అతని  విమర్శనాత్మక దృష్టిని కాదనలేం.

‘ప్రపంచాకార్మికులారా ఏకం కండు’ అని నినదించే ట్రేడ్ యూనియన్లు తోటి కార్మికుల కష్టాలకు స్పందించని స్థితికి చేరుకొన్నాయి. దేశంలో ట్రేడ్ యూనియనిజం వూబిలోకి స్వచ్ఛందంగా దిగిన   కార్మికులు  వేతనశర్మలుగా మారారు. సింగరేణి అందుకు మినహాయింపు కాదు.

 ‘ఎలెక్టయిన యూనియన్ నాయకులు ఆల్ మోస్ట్ ఒక డైరెక్టరు హోదా అనుభవిస్తున్నారు. ఎస్ యూ వీ ల్లో తిరుగుతూ,  ఒక ప్రజా ప్రతినిధికో , పెద్ద కాంట్రాక్టరుకో తీసిపోనట్టు ఆకారం , డ్రెస్సింగు , బాడీ లాంగ్వేజ్ తో అనుచచరగణంతో కనిపిస్తున్నారు’ .

రఘువంశీ పేర్కొన్న యూనియన్ నాయకుల యీ ధోరణిని ’80 ల్లో వచ్చిన కార్మిక కథల్లోనే రచయితలు తీవ్రంగా  అసహ్యించుకొన్నారు. చైతన్య వంతులైన కార్మికులు వారికి బుద్ధి చెప్పడం కూడా ఆ కథల్లో కనిపిస్తుంది.

యమ్మెన్సీ ల్లో గానీ కార్పోరేట్ సంస్థల్లో గానీ ట్రేడ్ యూనియన్ల వునికినే లేకుండా చేసిన పరిస్థితే కనపడుతుంది. అక్కడ కలెక్టీవ్ బార్గెయినింగ్ వుండదు. ఉద్యోగి యిండివిడ్యువల్ గా సంస్థతో డీల్ చేసుకుంటాడు. అక్కడ ఎంప్లాయీ మొబిలిటీ కూడా ఎక్కువే. కానీ పబ్లిక్ సెక్టార్లలో పరిస్థితి అలా కాదు. సంస్థతో ఉద్యోగులకు పర్మినెంట్ రిలేషన్ వుంటుంది. వేతన వొప్పందాల్లాంటివి యూనియన్ల ద్వారా జరగాల్సిందే.  కానీ సింగరేణిలాంటి సంస్థల్లో కూడా  ట్రేడ్ యూనియన్లు కార్మికుల బదిలీలు   క్వార్టర్ ఎలాట్ మెంట్లు లాంటి వాటికే పరిమితమయ్యాయి.

తొలి రోజుల్లో ఔట్ సోర్సింగ్ కీ మెకనైజేషన్ కీ ప్రైవేటీకరణకీ  వ్యతిరేకంగా పోరాడుతూ వాటిలోని అవినీతిని యెండ గడుతూ స్ట్రైక్ లూ  నిరసనోద్యమాలూ నడిపిన కార్మికుల్లో  తర్వాతి కాలంలో మార్పు వచ్చింది. ఉపరితల గనుల్లో లాగానే భూగర్భ గనుల్లో సైతం పనులు అవుట్ సోర్సింగు చేసి ఉత్పత్తి పెంచి ఇంటెన్సీవ్ ఇస్తే బాగుండునని భావించే దిశగా వాళ్ళు నడుస్తున్నారు.

ఒకప్పుడు నష్టాల వల్ల బి ఐ ఎఫ్ ఆర్ కి వెళ్ళి పునర్నిర్మాణ పేకేజీ కొన్ని మాఫీలు కొన్ని రాయితీలు కొన్ని ఆంక్షలతో కంపెనీ లాభాల బాట పట్టాకా  రెగ్యులర్ ఉద్యోగులకూ కార్మికులకూ బోనస్ రూపంలోగానీ ప్రత్యేక ఇన్సెంటీవ్ రూపంలో గానీ అందుతున్న లాభాల్లో  ప్రైవేట్ /కాంట్రాక్ట్ / ఔట్ సోర్స్డ్ కార్మికుల పాత్ర బుద్ధిపూర్వకంగానే విస్మరణకి గురైంది.  ఒకరి లాభం మరొకరి నష్టం అన్న సూత్రం ప్రకారం ఆలోచిస్తే విషయం స్పష్టమౌతుంది. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతున్న విషయం తెలిసీ రెగ్యులర్ కార్మికులతో పాటు వారిక్కూడా వాటా పంచడానికి కంపెనీ సిద్ధంగా వుందా అన్నది ప్రధానమైన ప్రశ్న. అయితే ‘కింద పడ్డ చిక్కుడు గింజను సైతం నలుగురూ పంచుకావాల’న్న స్ఫూర్తితో  తోటి కార్మికులకి భాగం యివ్వడానికి కంపెనీ కార్మికులు అంగీకరిస్తారా అన్నది దాని అనుబంధ ప్రశ్న.

ధర్నాకి నాయకత్వం వహిస్తున్న ‘లక్ష్మణ్’ సరిగ్గా యిదే అడుగుతున్నాడు. శ్రమ ఫలాలు అందరికీ దక్కకపోవడం గురించే అతనికి పేచీ.

‘గత దశాబ్ద కాలంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య ఎంత? అప్పటి ఉత్పత్తి ఎంత? ఇప్పటి ఉత్పత్తి ఎంత? పెరిగిన ఉత్పత్తి తగ్గిన మానవ వనరులతో ఎలా సాధ్యపడింది?? ఉత్పత్తిలోనూ లాభాలలోనూ పెరుగుదలకు ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత , అందులో కాంట్రాక్టరు ద్వారా పనిచేసే మా పాత్రేమీ లేదా?’ అని అతను నిలదీస్తున్నాడు. అందుకే కంపెనీ ఉద్యోగులతో పాటు లాభాలలో న్యాయబద్ధమైన  వాటాని డిమాండ్ చేస్తున్నాడు.

సాంకేతికంగా కంపెనీ యాజమాన్యానికి ప్రైవేటు కార్మికులతో సంబంధం లేదని కంపెనీ వాదన. నిజానికి కార్మిక కుటుంబాలకు విద్య – వైద్యం , వసతి సౌకర్యాలు , పి ఎఫ్ , గ్రాటిట్యుటి , ప్రమాదాల్లో నష్ట పరిహారాలు వంటి  కార్మిక  సంక్షేమాల  బాధ్యత నుంచి  తప్పించుకోడానికే ఔట్ సోర్సింగ్ వంటి నూతన విధానాల్ని కంపెనీలు అమల్లోకి తెచ్చాయి.

ఒకప్పుడు బర్మా క్యాంప్ , పంజాబ్ గడ్డ, ధనబాద్ కాలనీ లాంటి నరక కూపాల్లో నిత్య పీడననీ దోపిడీనీ యెదుర్కొన్న వలస కార్మికుల కంటే  ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితి మెరుగేనని రచయిత పేర్కొన్నప్పటికీ కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేయండంలో కాంట్రాక్టర్లు ఆరితేరి పోయారు.  ఔట్ సోర్సింగ్ కార్మికులకు అన్ని విధాలా  కాంట్రాక్టరే యజమాని. కంట్రాక్టర్ కనీస వేతనాలు చెల్లించాలనీ పి ఎఫ్ వంటి కార్మిక చట్టాలని వర్తింపజేయాలనీ కంపెనీతో వొప్పందాలు వుంటాయి. కానీ అవి సరిగ్గా అమలవుతున్నాయా అన్న పర్యవేక్షణ నామమాత్రమే. ఔట్ సోర్స్డ్ కార్మికులకి కంపెనీ  మేనేజ్ మెంట్  అదృశ్య శత్రువు. దాంతో చేసే పోరాటం మేఘనాథుడితో యుద్ధం చేసినట్టే. అందుకే  కాంట్రాక్ట్ కార్మిక నాయకుడికి రచయిత ‘లక్ష్మణ్’ అని పేరు పెట్టాడు.

కంపెనీ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల మధ్య చీలిక తెచ్చి  శత్రు వైరుధ్యం సృష్టించడంలో యాజమాన్యం యేదో వొక మేరకి సఫలమైంది. అందుకే ధర్నా పట్ల కార్మికులకీ వుద్యోగుగులకీ వొక రకమైన అనాసక్తి. నిర్లిప్తత. ఒకప్పుడు ఆ ధర్నా స్థలంలోనే తాము కూర్చుని యెన్నో డిమాండ్లు సాధించుకొన్నా మని కూడా వాళ్ళు మర్చిపొయారేమో! లేదా న్యాయబద్ధమైన ఔట్ సోర్సింగ్ కార్మికుల పోరాటానికి మద్దతిస్తే తమ వాటాలో కోత పడుతుందని స్వార్థంతో కూడిన  భయంకూడా కావొచ్చు.  యాజమాన్యానికి వ్యతిరేకంగా  కార్మికులందరి పోలరైజేషన్ జరిగితే సంస్థ ఉద్యోగులూ కార్మికులూ యెటు నిలబడతారన్న విషయంలో కొత్త సందర్భంలో సందేహానికి తావు లేదు.

కథ నిర్మాణం విషయానికొస్తే కథలో సంఘటనల్లేవు. కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాతో కథ ప్రారంభమైనప్పటికీ తోటి వుద్యోగుగులకూ కార్మికులక్కూడా అదొక సంఘటనలా అనిపించలేదు. ఏదో రొటీన్ గా  అలవాటైన కార్యక్రమంలా ‘పెద్ద ఉత్సుకత కలిగించలేదు’. కథ మొత్తం  ధర్నాకి కారణమైన పరిస్థితుల్నే చర్చించింది కానీ సారంలో కథాంశాన్ని పాఠకులకు చేరవేయడంలో వొక  వ్యాసంలా నడిచింది. రఘు వంశీకి యిదే మొదటి కథ కాకపోవచ్చని కథ చదువుతుంటే బలంగా అనిపిస్తుంది. వ్యాసంలో చెప్పాల్సిన విషయాల్ని కథలోకి తీసుకురావడంలో యిబ్బందుల్ని అధిగమించడానికి రచయిత పడిన స్ట్రగుల్ అడుగడుగునా కనిపిస్తుంది. కార్మికుల వైపు నుంచీ కాకుండా ఆఫీసర్ల చర్చలు సంభాషణలు వాదోపవాదాల ద్వారా నడిపిన టెక్నిక్ కొత్తది కాదు ;కానీ యీ జెనర్ లో కథా నిర్వహణ చాలా కష్టం. తుమ్మేటి రఘోత్తం రెడ్డి ‘చావు విందు’ గుర్తుకు వచ్చినప్పటికీ ముళ్ళపూడి సుబ్బారావు ‘రెండు నదుల మధ్య’ లో వాడిన  టెక్నిక్ కి యిది దగ్గరగా వుంది (శిల్ప పరంగా ఇంగ్లీష్  సినిమా ‘Bridge on the River Kwai’ , రావిశాస్త్రి కథ ‘ఆఖరి దశ’ లీలగా తన మనస్సులో మెదిలాయని రచయిత నాతో మాటల్లో ప్రస్తావించారు).

కథ చివరికొచ్చేసరికి జరిగిన సంఘటన – రైతు ఆత్మహత్య. దాంతో కథలోకి నూత్న కోణాలు వచ్చి చేరాయి. కథలో రచయిత తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి ఆ యా సందర్భాలకు అనుగుణంగా అవసరమైన కంఠ స్వరాల్ని యెన్నుకొన్నప్పటికీ రైతు ఆత్మహత్య ద్వారా దాన్ని బలంగా ఆవిష్కరించగలిగాడు. అంతవరకూ కేవలం తర్కబద్ధ వాదనలకీ సంభాషణలకీ పరిమితమై ఇమోషనల్ కోషేంట్ కి అవకాశంలేక డ్రైగా వున్న కథలోకి వొక బలమైన  వుద్వేగపు అల చొచ్చుకువచ్చి పాఠకుణ్ని తాకుతుంది.

ఉపరితల గనుల  పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు  దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో యెక్కడికక్కడ వ్యవసాయ భూములు సాగు యోగ్యతను కోల్పోయాయి. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలు వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం, చమురు కాలుష్యం పర్యావరణాన్ని ఎక్కువగా దెబ్బతీశాయి. జంతు జీవాలకూ ముప్పు యేర్పడింది. పంటపొలాల్లో భూసారం తగ్గిపోయి, ఎరువుల వినియోగం పెరిగిపోయింది. దీంతో రైతులకు సాగు ఖర్చులు పెరగడంతో పాటు , పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నట్లు , పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ రైతు మరణానికి అదృశ్య కారణాలే.

ఉత్పత్తి ప్రక్రియలో జరిగే పర్యావరణ విధ్వంసం గురించి , ఆ ప్రాంత ప్రజలు కోల్పోయిన మానసిక ప్రశాంతత గురించి , బొగ్గు రవాణా సందర్భంలో  చోటుచేసుకొనే యాక్సిడెంట్లు గురించి, ‘సోషల్ కాస్ట్’ గురించి , దాన్ని భరిస్తున్న పౌర సమాజం గురించి  లోతుగా ఆలోచించి  కంపెనీ లాభాల్లో న్యాయబద్ధమైన  యితర వాటాదార్లు గురించి ప్రస్తావించిన రచయిత దృష్టి యెందుకో రైతు చావుకి కారణాల పైకి , ఓపెన్ కాస్ట్ యజ్ఞంలో సమిధలైన  భూనిర్వాసితుల స్థితి గతులపైకి పోలేదు. అవన్నీ చెప్పాలంటే పెద్ద నవలే అవుతుందేమో! ఇప్పటికే కథ నిడివి పెరిగింది. కానీ సింగరేణి నిర్దిష్టత నుంచి మొత్తం దేశంలో కార్పోరేట్ కి అనుకూలంగా అమలయ్యే పారిశ్రామిక విధానంలోని అపసవ్యతని – పేద్ద భూతాన్ని చిన్న సీసాలో బంధించి చూపినట్టు – కథలోకి యిమిడ్చిన నేర్పు అభినందనీయం.

పాప పరిహారం లాంటి సి యస్ ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) లోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి రచయిత వెనకాడ లేదు. దాన్ని చాటల కొద్దీ స్వయంపాకం తీసుకొని అందులో వొక గుప్పెడు గింజలు వొక కూరగాయ తిరిగి యిచ్చి రుణ విముక్తుడయ్యే యాయావార బ్రాహ్మణుడి వ్యవహారంతో పోల్చాడు. అది  కార్పోరేట్ సంస్థలు అపరాధ భావన నుంచి తప్పించుకొనే మొక్కుబడి  మాత్రమే. మళ్ళీ పాప పంకిలం లో దొర్లడానికి సిద్ధమయ్యే  గంగా స్నానం వంటి కంటి తుడుపు వ్యవహారం అది. అదొక పర – ఆత్మ వంచనల అందమైన మేళవింపు.

రైతు ఆత్మహత్య వుదంతాన్ని మరీ కథ చివర్లో కాకుండా కథ మధ్యలోనే చెప్పి దానికి కారణమైన పరిస్థితుల్నీ అందుకు వుపరితల గనుల్లో చోటుచేసుకొన్న రిగరస్ మైనింగ్ ప్రమేయాన్నీ ప్రస్తావించి కార్మికుల ధర్నానీ రైతుల వూరేగింపునీ సమాంతరంగా నడిపి వుంటే కథలో చిక్కదనం వచ్చేది. ‘ఒక వేళ కాంట్రాక్ట్ కార్మికులు పొందాల్సింది పొందితే తర్వాత మిగులులో వాటా కోసం రైతులే ధర్నాకి కూర్చుంటారేమో’ అని రచయిత ( సుదర్శన్ ద్వారా ) లేవనెత్తిన సందేహం మరింతగా జస్టిఫై అయ్యేది. కేవలం వాదోపవాదాలకే కాక ఉద్వేగ భరిత కథనానికి  కూడా కథలో చోటు దొరికేది. కథ పొడవునా వొక మూడ్ క్యారీ అయ్యేది. అల్లం రాజయ్య ‘అతడు’ కథలో యీ టెక్నిక్ ని గమనించవచ్చు.

యేది యేమైనా శ్రమజీవుల స్వేద ఫలం దాని నిజమైన ‘హక్కుదార్ల’కు  దక్కేవరకూ  మహాశ్వేతాదేవి బషాయి టుడు లాగా ‘అతడు’ -రమాకాంత్ కావచ్చు,  కథలోని లక్ష్మణ్ కావచ్చు, భూనిర్వాసితుడు కావొచ్చు , పర్యావరణ ప్రేమి కావొచ్చు  – మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాడు. ధర్నా చౌక్ రణస్థలి గానే వుంటుంది. పాత్రలు పాత్రధారులు మారినా అన్యాయానికి విరుద్ధంగా పోరాటాలు ఆగవు , పోరాడే శక్తులు యేదో వొక రూపంలో నిత్యం చలన శీలంగానే వుంటాయి-  అనే యెరుకని అంతిమంగా కల్గించినందుకు రచయితకి థేంక్స్.

 

 •                         

 

ఎందరో అమ్మలు…అందరి కథలివి!

మాతృత్వం స్త్రీ వ్యక్తిత్వానికి, జీవితానికి పరిపూర్ణతని ఇస్తుందని అందువల్ల ప్రతి స్త్రీ తల్లి అయ్యి తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని భావించే సమాజానికి సవాళ్ళు ఎదురవుతున్న కాలం ఇది.తమ పిల్లల పెంపకంలో తాము చూపగలిగే నైపుణ్యంతో కానీ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దగలిగే నైపుణ్యంతో గానీ సంబంధమే లేకుండా తల్లి కావడం ఒకటే తము సాధించిన గొప్ప విషయంగా భావిస్తూ, ఏ కారణంగా అయినా తల్లి కావడం ఆలస్యం అయిన, అసలు కాలేకపోయిన ఒక స్త్రీని ఇంకా గొడ్రాలు అన్నట్లు చూసే స్త్రీలకు కొదవలేని సమాజం మనది. పెళ్ళి చేసుకోకపోయినా తల్లి కావాలునునే స్త్రీలు, పెళ్ళి చేసుకున్నా తల్లవకూడదని గట్టిగా నిర్ణయించుకున్న స్త్రీలు, తల్లి కావడానికి గర్భాన్ని అద్దెకి తీసుకునే స్త్రీలు సమాజంలో ఇలా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మార్పులన్నిటినీ ఈనాటి పరిస్తితులకీ, అవసరాలకీ స్త్రీలు కోరుకునే స్వేఛ్చకీ సమన్వయ పరుచుకుంటూ మార్పులనీ, స్త్రీల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించే దశలో పూర్తిగా ఇప్పుడు సమాజం లేకున్నా ఎదగక తప్పని పరిస్తితి. ఎన్నో వైరుధ్యాలున్న వ్యక్తుల సహజీవనమే సమాజంలో కొత్త పోకడలనీ మార్పులు వచ్చే వేగాన్నీ నిర్దేశిస్తుంది.
ఇలాంటి నేపధ్యంలో సమ్మెట ఉమాదేవి గారు అమ్మ సెంటిమెంటుని పండిస్తూ రాసిన అమ్మ కధలుకూ చక్కని ఆదరణ ఉందని చెప్పాలి. అమ్మ ప్రేమని పొందటమే కాదు, మాతృత్వం కూడా ఎంత పొందినా తనివితీరని ఒక అనుభవం ఎవరి జీవితంలోనైనా . అందుకే అమ్మ ఇతివృత్తంగా వచ్చే కధలకి లింగ బేధం లేకుండా పాఠకుల ఆదరణ ఉంటుంది. ప్రతి పాఠకుడూ/రాలూ ఈ అమ్మ సెంటిమెంటు తొ రిలేట్ చేసుకోగల్గడమే దీనికి కారణం. ఇక రచయిత్రి కధను నడపడంలో నేర్పరి అయితే వేరే చెప్పేదేముంది? ఆణిముత్యాల్లాంటి కధలున్న ఈ సంకలనం ఆమె తొలి సంకలనం అంటే అభినందించాల్సిన విషయం.
ఇక అమ్మ కధల కొస్తే చక్కని శైలి , తను ఎవరి కధ చెప్తున్నారో, వారి వేష భాషల్ని వారి జీవన విధానాన్నీ, వారి జీవితాల్లోని సంఘటనలని చిత్రించిన తీరు ఎంత సహజంగా వాస్తవికతకి దగ్గరగా ఉంటాయంటే, మనకూ ఆ పాత్రల్లోని కొందరు వ్యక్తులు తారసపడటం గుర్తుకు వస్తుంది. ఎందరో అమ్మలు, ఎన్నో కష్టాల నేపధ్యాలు. అయితే అన్నిటిలోంచీ బురదలోంచి విరిసిన కమలంలా తమ సమస్యల్ని తామే ఒంటరిగా పోరాడి పరిష్కరించుకున్న మహిళలే. ఒక రకంగా ఈ కధలు సమస్యల్లోంచి ఎలా బయటపడచ్చో తెలిపే ప్రేరణాత్మక సందేశాలు. మామూలుగా మనకు తెలిసిన కష్టాలే ఆడవారివి, కానీ అందులో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కరిస్తారు రచయిత్రి. ఆమె ముఖ్య పాత్రలన్నిటి ఆర్ధిక సామాజిక నేపధ్యం ఏమైనా, ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తిస్తాయి.సానుభూతే కాదు సహానుభూతీ చూపిస్తాయి.
అమ్మంటే!’ అనే కధలొ కొన్ని వాక్యాలు హృదయాన్ని తాకేలా ఉంటాయి. ఉదాహరణకి ఇది చూడండి. “వెన్నెల్లో నల్ల మారెమ్మ విగ్రహంలా మెరిసిపోతున్న తల్లి వంక అపురూపంగా చూసుకున్నాడు కొమరెల్లి.” మామూలుగా ఇలాంటి ప్రేమ తల్లి మాత్రమే వ్యక్తం చెయ్యగలదు. కానీ యూ ఎస్ లో ఉన్నా తల్లిని చూడటంకోసం తపించిపోయే ఓ కొడుకు, చదువుకుని తనూ తన పిల్లలూ ఎంత నాగరికంగా తయారైనా, పిల్లలు ఎంత నాజూకుగా పెరిగినా కాయ కష్టం చేసి తనకున్న చిన్న భూమి చెక్కలో వ్యవసాయం చేస్తూ ఊరిని వదిలి రాని రైతు స్త్రీ అయిన అమ్మని ఆమె త్యాగాన్నీ మరువలేని కొడుకు కధ.
అమ్మపై ప్రేమకి ఆమె రూపం భాష, అనాగరికత చీర కట్టు ఏదీ అడ్డురాదంటూ ఒక చోట చెప్తారు అమ్మంటే పాలరాతి విగ్రహంలా అపురూపమైన అందం కాదు, ఆదమరుపు ఎరుగని ప్రేమ గని.చాలా మంది దృష్టిలో అమ్మంటే అందమైన రూపంతో, చల్లని చిరునవ్వుతో, అసలు కోపమంటే తెలియకుండా, బిడ్డల కోసం ప్రతీ నిమిషం పరితపించే అనురాగమయి. అమ్మను చూడగానే ఆహ్లాదానికి మారుపేరుగా అనిపిస్తుంటుంది, అనుకుంటారు గాని, నా తల్లి చర్మం వెన్నుకంటుకుపోయిన పొట్టతో, కాయకష్టంతో మొరటు తేలిన శరీరంతో, కాలం పోకడలు తెలియని ఆహార్యంతో, నాగరీకం అంటని నిర్మలత్వంతో, ఈ పల్లెలో మూలన నిలబెట్టిన నిచ్చెనలా నిలిచి పోయింది అనుకున్నాడు చెమరించిన కన్నులతో“.
మనస్విని అనే కధ భర్త పోయిన స్త్రీ గురించి. భర్త పోయాకా స్త్రీ జీవితంలో ఎన్ని మార్పులొస్తాయో,తన సమీప బంధువుల, సమాజం వైఖరి ఆమె పట్ల ఎలా మారతాయో మనకి తెలుసు. ఇవన్నీ ముందే ఊహించిన మృణాలిని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. చనిపోతాడని తెలిసిన తన భర్త నుంచి విడాకులు కోరి అందరికీ దూరమవుతుంది. ఆఖరికి తన పిల్లలకి కూడా.ఆమె కున్న కారణాలు, మన సమాజంలో పెళ్ళిళ్ళు పండగలూ పబ్బాల్లో స్త్రీలు భర్త బ్రతికున్నాడన్న ఒకే కారణం వల్ల పొందే గౌరవాలతో పోలిస్తే, భర్త మరణించాడన్న కారణంగా ఎదురయ్యే అవమానాలూ, తన పిల్లల పెళ్ళిళ్ళలో కూడా తను కేవలం ఏపనికీ పనికి రాకుండా చూడటానికి మాత్రమే పరిమితం కావడం ఆమెనెంత బాధకి ఆత్మ క్షోభకీ గురిచేస్తాయో తెలుపుతాయి. ఆమె చెప్పుకునే వరకూ ఆమె పిల్లలు కూడా ఆమెనర్ధం చేసుకోలేకపోవడం ఒక బాధించే విషయం.
తల్లి ప్రేమకి దారిద్ర్యం అడ్డురాదు. రెండోసారీ ఆడపిల్లనే కన్న కమిలిని అత్త నానారకాలుగా హింసిస్తుంటుంది. తననెంతో ప్రేమించే భర్త సూర్యా ఉన్నా ఆమెకు బాధలు తప్పవు. తన పిల్లను ఎక్కడ అత్త ఎవరికైనా అమ్మేస్తుందో, లేక చంపేస్తుందోనని అనుక్షణం భయపడుతూ, ఆ విషయాలన్ని తన భర్తకి చెప్పుకోలేక అవస్థ పడుతుంటుంది. పొలంలో చల్లే మందువల్ల స్పృహ కోల్పోయిన కమిలిని చూసి భర్త ఏడుస్తుంటే, అత్త ఇంకో పెళ్ళి గురించి ఆలోచిస్తుంటుంది. రెండో పెళ్ళయినా, పిల్లల తండ్రయినా పిల్లనిచ్చేందుకో తండ్రి కూడా రెడీ అయిపోతాడు. కమిలిని ఆస్పత్రికి తీస్కెళ్ళే ప్రయత్నం చెయ్యాలంటే డబ్బులు లేని పరిస్తితి. ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళాల్సిన పరిస్తితి, మంచం మీద మోసుకెళ్ళడానికి పొలం పనులు వదిలి ఇరుగు పొరుగు రాలేని పరిస్తితి. ఎంత దుర్భరమైన జీవితాలు గిరిజనులవి, కళ్ళముందు పాత్రలు, వారున్న ప్రదేశాలు కదలాడుతుంటాయి. రెండు మూడు రోజుల తరవాత పాకుతూ వచ్చిన పసిపాప తల్లి మొహాన్ని తడుముతుంటే స్పృహలోకి రావడంతో కమిలి కధ సుఖాంతం అవుతుంది. అద్భుతమైన కధ,కధనం.
సహన అనే కధలో ఉద్యోగస్తులైన తల్లితండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలు, .పసిపిల్లగా ఉన్నపుడు ఆడపిల్ల బయటికెళ్ళి వీధికుక్కలు వెంటబడి తరుముతున్నాయని భయపడితే, నిజంగానే పెరిగిపోయిన వీధికుక్కల బాధనుంచి తప్పించుకోవడానికి కాలనీ వాసులు మున్సిపాలిటీనాశ్రయించి ఆ బాధనుంచి గట్టెక్కుతారు. కాని కొద్దిగా పెరిగిన ఆడపిల్ల అందంగా కనపడగానే ప్రేమించకపోతే చంపేస్తామని, ఆసిడ్ పోస్తామని బెదిరించే, వేధించే కుర్రాళ్ళకి వెకిలిచేష్టలు చేసే చుట్టుపక్కల అంకుల్స్ తోడయితే ఈ వీధికుక్కల్ని ఎలా కాలనీ నుంచి తరమడం, తమ ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవడం. ఈ మృగాలకన్నా వీధికుక్కలే నయమనిపిస్తుంది. ఈవిషయం తెలిసిన తల్లికి ఎంత సామాజిక స్పృహ, బాధ్యత ఉండకపోతే ఆమె మొదట తన కొడుకును దారిలో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది?
మాన్వి, అమ్మతల్లిఅమ్మ సెంటిమెంటుని అద్భుతంగా పండించిన కధలు. మిస్ కాకుండా చదవాల్సిన కధలు. క్షణికానందం వల్లనో, వికటించిన ప్రేమల వల్లనో కలిగిన సంతానాన్ని సంపన్నురాలైన తల్లి వదిలించుకుంటే, రెక్కాడితే గాని డొక్కాడని ఇద్దరాడపిల్లల తల్లి భర్త వారిస్తున్నా ఇంకో ఆడపిల్లని అక్కున చేర్చుకోవడం ద్వారా అమ్మతనాన్ని బతికిస్తుంది బతుకమ్మ కధలోని లచ్చిమి. పిల్లల్ని కన్నాకా తల్లియినా తండ్రయినా ఆత్మహత్య గురించి ఎందుకు ఆలోచించకూడదో చెప్పే కధ వెన్నెలమ్మ. పసిపిల్లగానే తండ్రిని పోగొట్టుకున్న చిలుకమ్మని ఎన్నో కష్టాలకోర్చి పెంచితే ఆ పిల్లని పెళ్ళికాకుండానే తల్లి చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లకు సమయం చూసి వడిసెలతో బుద్ధి చెప్పిన చిలుకమ్మ, కధలో చిలుకమ్మపై మనకేర్పడిన సానుభూతి వల్ల పాఠకుడి కచ్చ తీరుస్తుంది. గూడు కధలో అత్తని కాపాడుకోవడం కోసం భర్త చనిపోయాకా కూడా ఇద్దరు పిల్లల తల్లయ్యుండి, తన గర్భాన్ని అద్దెకిచ్చి ఆ విషయం చెప్పలేక చెప్పినా ఒప్పుకోరనిపించి ఎన్నో అవమానాలను ఆఖరికి ఎంతో ప్రేమించే అత్త దగ్గరనుంచి కూడా సహించి ఓర్చుకున్న సంతోషి కధ. ఎంతో ఉదాత్తంగా చిత్రిస్తారు ఈ రెండు పాత్రల్ని రచయిత్రి.
ఇవే కాదు ఇంకా ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో చక్కని కధలున్నాయి. ఒక్కొక్క కధా ముగించిన ప్రతిసారి మీ గుండె గొంతులోకొచ్చినట్టనిపిస్తే నేను మరీ ఎక్కువగా ఏమీ పొగడలేదని తెలుసుకోవడం మీ వంతు. ఏమైనా చదివాకా ఒక మంచి పుస్తకం, ఎన్నో మంచి కధలు చదివామన్న తృప్తి మిగలడం మాత్రం ఖాయం.

xxxx

కొత్త మలుపులో మన కథ!

Katha-15 Cover

 

గత పాతికేళ్లుగా ఉత్తమ తెలుగు కథలకు చిరునామాగా నిలిచాయి కథా సాహితీ వెలువరిస్తున్న వార్షిక సంకలనాలు.  వాసిరెడ్డి నవీన్,  పాపినేని శివశంకర్ ల ఆధ్వర్యంలో నిరాటంకంగా సాగుతున్న ఆ కథా యజ్ఞం ఈ ఏడాదితో ఇరవయ్యారో వార్షిక సంకలనానికి చేరుకుంది.  ఆ క్రమంలో కథ- 2015 ఆవిష్కరణ ఇవాళ ( సెప్టెంబర్ 4- 2016 ) కాకినాడలో జరగబోతోంది.

ఆ సందర్బంగా ఆ కథా సంకలనానికి ఎంపికైన రచయితలతో  ముచ్చటించింది సారంగ. ఇవాళ్టి కథా రచయితలు కథా ప్రక్రియను ఎలా చూస్తున్నారు? కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ?? అసలు కథలు ఎందుకు రాస్తున్నారు??? అని అడిగితే ఇలా స్పందించారు. 

 

 

జాన్సన్  చోరగుడి


johnson
కథ నాకు వ్యాసాల రొటీన్ నుంచి అవుటింగ్ లాంటిది. కథలు రాయడం కథలు చదవడంతో మొదలవుతుంది. చదివిన కథ మనలో కొత్త గవాక్షాన్ని తెరుస్తుంది. ఫలితంగా మన మనోఫలకం మీద నూతన ఆవిష్కరణ జరుగుతుంది. అన్నీ సరిగ్గా కుదిరితే మనం రాసింది గొప్ప కథ కూడా కావచ్చు.  నేను చాన్నాళ్లు మంచి కథలు చదివాక, కథలు రాయాలనుకున్నాను.  అది కూడా ఆలస్యంగా కథలు రాయడం మొదలు పెట్టాను. ఇప్పటి దాకా పదిహేను కథలు రాశాను. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ నేను రాయాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయనిపిస్తుంది.
వ్యాస రచన నా ప్రధాన వ్యాపకం. ఆ రొటీన్ నుంచి బయటపడేందుకు కథలు రాస్తుంటాను. ఈ కథా సంకలనానికి ఎంపికైన …చివరి చర్మకారుడూ లేడు నాకోసం రాసుకున్న కథ. నా వ్యాసాలు అందరికోసం రాస్తే…. ఈ కథ మాత్రం నాకోసం రాసుకున్నాను. కానీ ఈ కథను చాలామంది తమదిగా  చేసుకున్నారు.  ఫోన్లు చేసి స్పందించారు.  అప్పటివరకూ అంతర్లీనంగా వున్న కల్చరల్ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి వాళ్లు వెంటిలేట్ కావడాన్ని నేను గమనించాను. అస్తిత్వ ఉద్యమ ఫిలాసఫీ గొప్పతనమది. ఇందులో నేను కేవలం కేటలిస్టును మాత్రమే. తెలిసిన జీవితం కనుక తేలిగ్గా రికార్డు చేయగలిగాను. ఇప్పటిదాకా నాకు కనిపించిన దాని గురించి రాశాను. భవిష్యత్ లో కూడా రాస్తాను.

కే.ఎన్. మల్లీశ్వరి
malliswariఏ కథ ఎందుకు రాశావు అంటే చెప్పడానికి ప్రయత్నించగలనేమో కానీ కథలెందుకు రాస్తారు అంటే మాత్రం తత్తరపాటుగా వుంటుంది. రెడీమేడ్ సమాధానం నా వద్ద లేదు కనుక ఆలోచనలను గాలిపటం వలె ఆకాశంలోకి ఎగరేసి దారపు కొసను పదిలంగా పట్టుకోవడం కథకులకి తెలియాలి అనుకుంటాను. దానిని …శతపత్ర సుందరి కథలో కొంత ప్రాక్టీస్ చేశాను. స్వీయ నియంత్రణ వల్లనే చాలామంది గుర్తించిన
క్లుపత్తని ఆ కథలో సాధించగలిగాను.

అప్పటికి నాలుగేళ్లుగా నేను రాస్తున్న నవలలోని వందలాది ఘటనల్లోంచి రెండింటిని తీసుకుని కథగా మలిచాను. కనుక దాని నేపథ్యం విడిగా చెప్పడం సాధ్యపడదు. వందరేకలుగా వికసించే నవీన మహిళ జీవితంలోనుంచి వొక శకలాన్ని చిత్రించే ప్రయత్నం చేశాను. కథ వచ్చాక జరిగిన చర్చలోంచి గ్రహించగలిచే వొకటి రెండు అంశాలను మౌనంగా స్వీకరించాను. ముగింపు గురించిన ప్రశ్నలనూ అసంతృప్తులనూ గ్రహించాను. ఈ కథ గురించే కాకుండా సాధారణంగా నిశ్చయం, నిర్ణయాలతో కూడిన ముగింపులకి బాగా అలవాటు పడిపోయాం. కానీ జీవితపు నడకలో సందిగ్థస్థితి  ప్రభావమే ఎక్కువ. ఆస్థితిని చెప్పడం కోసమే కథని అట్లా ముగించాను.


విమల

 

విమల

నేను మొదట్లో కవిత్వం రాసేదాన్న.  తర్వాత వొకటి రెండు కథలు రాసిన తర్వాత కొంత విరామం తీసుకున్నాను. కవిత్వంలో చెప్పలేనిది కథ ద్వారా విస్తృతంగా ,  విభిన్నంగా చెప్పగలం. నాలోపల జరిగే ఘర్షణ, నేను నడిచొచ్చిన దారి, నేను చూసిన సమాజం…..నాలో ఆలోచనలను తట్టి లేపాయి. వాటిని సమాజంతో  వివరంగా పంచుకోవాలనిపించింది. ప్రతీ జీవితంలోని రకరకాల ఎత్తు పల్లాలుంటాయి.
వైరుధ్యాలుంటాయి.  నాకు నచ్చేవి, రాయాలనిపించేవి జీవితంలోని అనేక పార్వ్శాలను, మనిషిలోని పొరలను చెప్పగలగిన కథలు. అదే సమయంలో  కథలోపల సున్నితత్వం వుండాలి. జీవితం ఎంత విషాదంగా, దుర్మార్గంగా వున్నా కూడా….. దాంట్లో సౌందర్యం వుటుంది.  చీకట్లోంచి వెలుతురు చూసినట్లు ఆ సౌందర్యాన్ని కథలు చూపగలగాలి. వొక  ఉద్యమకారిణిగా సమాజంలో అనేక పరిణామాల్ని దగ్గర చూస్తుండడం వల్ల…రకరకాల జీవితాల్ని చూశాను. వాటిని కథ ద్వారా చెప్పాలనుకుంటాను.
అదే సమయంలో మన కథల్లో నిజాయతీ వుండాలి. మనం నమ్మని వాటిని రాయకూడదు.  అంటే రాసేదానికి,  జీవించేదానికి మధ్య పెద్ద అంతరం వుండకూడదు అని నేను నమ్ముతాను.   రచయితలుగా మనకు అనేక ప్రతిబంధకాలు వుంటాయి. వాటిని తెంచుకోగలగాలి. అనేక నియంత్రణలుంటాయి. మనం నమ్మింది చెప్పినపుడు సమాజం నుంచి కొంత వ్యతిరేకత రావచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి రచయితలు సదా సిద్ధంగా వుండాలి. అలాగే రాసే విషయం పట్ల చిత్తశుద్ధి వుండాలి. ముఖ్యంగా  చెప్పాల్సింది….ప్రపంచీకరణలో భాగంగా ఇవాళ తెలుగు కథ కూడా మార్కెట్ వస్తువుగా మారుతోంది. సంచలనం కోసం, ప్రచారం కోసం రచయితలు ఆరాటపడుతున్నారు. సేలబిలిటీ…కోసం వెతుకుతున్నారు. ఇదో విషాదకరమైన పరిస్థితి. ఇన్ని ప్రతిబంధకాల మధ్య వీటన్నిటికీ లొంగకుండా నిజాయతీగా కథ
రాయాల్సిన బాధ్యత కథకుల మీద ఉంది.

ఉణుదుర్తి సుధాకర్
Sudhakar_Marine Linkకథా సాహితికి నా కథ ఎంపిక కావడం సంతోషకరం. కథలు చెప్పడం చాలా కష్టం. కవిత్వం రాయడం అందరివల్ల సాధ్యం కాదు. నాకు కథలు రాయడం సాధ్యమనిపించింది. నాకు కొన్ని విషయాల పట్ల..ప్రధానంగా చరిత్ర పట్ల ఆసక్తి వుంది. చరిత్ర లోతుల గురించి ఎక్కువగా తెలుసుకుంటాను. ఆ వెతుకులాటలోనే ఆనందాన్ని వెతుకుుంటాను. ఆ ఆనందాన్ని, నేను తెలుసుకున్న సంగతులను కథ ద్వారా చెప్పాలనుకుంటాను. రచయిత కథ ద్వారా అనేక విషయాలు చెప్పొచ్చు.  కథ చిన్నదైనా దాని ద్వారా చాలా సంగతులు ప్రతిభావంతంగా చెప్పవచ్చు.  ప్రముఖ చరిత్రకారుడు ఇ.ఎచ్.కార్ అన్నట్లు ఎవరి చరిత్రలు వారికుంటాయి. చరిత్ర అంటే ఏక శిలా సదృశ్యంగా వొకటే వుండదు. స్త్రీలకు, దళితులకు, గిరిజనులకు….ఇలా రకరకాలుగా ఎవరి చరిత్ర వారికి వేరుగా వుంటుంది. ఇటువంటి విషయాలన్నీ చర్చించేందుకు నేను కథను రాస్తుంటాను.

చిన్నయ్య
కవిత్వం చెప్పలేని విషయాలు కథలో చెప్పగలం. కథలో జీవితాన్ని, జీవితంలో వస్తున్న మార్పులను వివరించవచ్చు. తద్వారా  సమాజాన్ని చూపే ప్రయత్నం చేస్తాము…ఈ చూపే క్రమంలో ఎవరి దృక్పథాలు వారికి వుండవచ్చు. మన దృక్పథం,  నిజాయతీ, ఆచరణను మన కథలు ప్రతిబింబిస్తాయి. కథ రాయడమంటే నా దృష్టిలో వ్యవసాయం చేసినంత కష్టమైన పని. ప్రతీ కథా ఆరుగాలం సేద్యం లాంటిది. పంట చేతికొచ్చేదాకా….రైతు కంటిమీద కునుకులేనట్లు కథ పూర్తయ్యే దాకా నేను ప్రతీక్షణం ఆరాటపడతాను. ఈ క్రమంలో రకరకాలుగా ఆవేదన చెందుతాను.

కొట్టం రామకృష్ణారెడ్డి
kottamకథ గురించి అనేక ఆలోచనలు , అంతర్మథనం జరిగాక ఇక రాయలేనప్పుడే కాగితం మీద కలం కదులుతుంది. ప్రసవానంతరం బిడ్డని చూసుకున్న తల్లికి  పురిటినొప్పుల బాధ మరిచిపోయేంత అలౌకికానందం కలుగుతుంది. కథ పూర్తి చేశాక రచయితకు కూడా అంతే.   కథ పుట్టాక మాతృత్వపు మాధుర్యం అనుభవంలోకి వస్తుంది. దాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు…?

 

ఎం.ఎస్.కే. కృష్ణజ్యోతి

jyothi

విషయ వ్యక్తీకరణలో కవిత్వం భావకుల సాధనం. వ్యాసం వొకింత మేధావుల ఆయుధం. ఐతే కథ ఈ రెండిటింకి భిన్నంగా వొక అంశాన్ని జన సామాన్యానికి సులువుగా చేరువ చేసే చక్కని మాధ్యమం. అప్పుడప్పుడే ఊహ తెలిసి వస్తున్న పసివానకి అనుభవాలతో తలపండిపోయిన వృద్ధునికి కూడా ఆసక్తి కలిగించేది కథ. ఇతర సారస్వత మాధ్యమాలకి భిన్నంగా కథలో నిజ జీవితంలో లాగానే ఓ సంఘర్షణ వుంటుంది. ఆ సంఘర్షణ కథకుని ఊహలోంచి లేదా అనుభవం లోంచి వస్తుంది. ఆ ఘర్షణ నుండే పాఠకుడు తనను తాను కథతో తాదాత్మ్యం అవుతాడు. ఇలా కథకునికి, ఇతర ప్రపంచానికి వొక లంకె ఏర్పడుతుంది. నేను నివసించే అతి చిన్న ప్రపంచం నుంచి విస్తృత ప్రపంచంతో సంభాషించడానికి నన్ను నేను అనంతంగా వ్యాప్తి చెందిచడానికి నేను కథను ఎంచుకున్నాను.

గుడిపల్లి నిరంజన్
niranjanనేను చూసిన దళిత, అణగారిన వర్గాల, స్త్రీల జీవితాల్ని చెప్పడానికి కథల్ని రాస్తున్నాను. దళితుల చుట్టూ , వాళ్ల జీవితాల చుట్టూ అనేక సమస్యలున్నాయి. వాటిని సమాజానికి తెలియజేయడం నా బాధ్యతగా నేను భావిస్తాను. దాని ద్వారా సమస్య పరిష్కారం కావచ్చు, కాకపోవచ్చు.

కానీ  సమాజానికి చూపడం మాత్రం అవసరం. వ్యక్తులు, కుటుంబాలతో పాటూ పల్లెలు, ప్రకృతి వనరుల విధ్వంసం యధేచ్చగా జరుగుతోంది. ఆ విధ్వంసాన్ని చూపే క్రమంలోనే నేను నా  నీరెటుకాడి కల… కథను రాశాను.

చందు-తులసి
chandu

కథ రాయడానికి ఫలానా కారణమంటూ ఉంటుందా….అని ఆలోచిస్తే, వెంటనే చెప్పలేము.  కానీ బహుశా బయటకి చెప్పలేని అంతర్మథనం, ఆవేదన, ఆర్తి తప్పకుండా వుంటుంది. సమాజంలోని సంఘటనలకు మనుషులు రకరకాలుగా స్పందించవచ్చు.  బహుశా రచయిత  స్పందన కథ రూపం తీసుకుంటుందేమో. ఆ స్పందన వెంటనే బయటకు రాకపోవచ్చు. కానీ ఏదో వొక రోజు తప్పక బయటకు వస్తుంది.  మొత్తంగా గుండె లోతుల్లోని చెప్పుకోలేని బాధ, వలపోత, దుఖ్ఖ సముద్రం… మనకు నచ్చిన వ్యక్తితోనో, సమాజంతోనో పంచుకోవాలి అన్న ఆరాటమే కథ రూపంలో వస్తుంది.  నా మొదటి కథ… ఊడలమర్రి అలా బయటకు వచ్చిందే.

* * *

 

సర్కస్ కాదు, యుద్ధం చేయాలి!

 

  

చిత్వాన్ – అతనొక కథలోని పాత్రే గానీ యిటీవల నన్ను చెప్పలేని కల్లోలానికీ వ్యాకులతకీ గురిచేసిన అత్యాధునిక యువకుడు. దాదాపు వొక సంవత్సర కాలంగా చాలా సార్లు అతను నన్ను నిద్రపోనివ్వ లేదు. ఏ పని చేస్తోన్నా అతను నా ఆలోచనల్లో తారాడుతూనే వున్నాడు. అతని జ్ఞాపకాలు తరచు నన్ను వెంటాడుతున్నాయి . బతుకు పట్ల చావు పట్ల అతని ఫిలాసఫీ నన్ను యేదో తెలీని యిబ్బందికి గురిచేస్తోంది. అతని అకాల మరణం నన్ను పదే పదే  వెంటాడుతోంది. ఇక తప్పించుకొని  పారిపోవడం నా వల్ల కావడం లేదు. ముఖాముఖి యెదుర్కోవడమే యిప్పుడు చేయాల్సింది.

‘యెందుకు జీవితాన్ని చేజేతులా అర్ధాంతరంగా ముగించుకొని చచ్చిపోయావు ?’ యెటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగా.

నా ప్రశ్నకి అతనేం తత్తరపడలేదు. నా వైపు నిశితంగా వొక క్షణకాలం చూసి – ‘నువ్వు మాత్రం చావక బతికున్నావా ?’ అని యెదురు ప్రశ్నించాడు. నేను నిరుత్తరుణ్ణయ్యా.

 ‘నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులుల తో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పువ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను. జీవితమంటే నాకిష్టమే. కానీ జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది. అందుకే నా ప్రాణాన్ని పట్టుకుని వేళ్లాడ్డం అంత ఇష్టం ఉండదు. ఇక చాలనుకున్నప్పుడు ఇక్కడ్నుంచి జంప్ అయిపోవడమే! పవర్ ఆఫ్ బటన్ నొక్కెయ్యడమే! అప్పటివరకూ అంతా నా ఇష్టానుసారమే!’

మనం మనకు నచ్చినట్టు బతకడం లేదని చిత్వాన్ ఆరోపణ. ప్రతిక్షణం అనేక విధాల పరాయీకరణకి లోనై బతికే బతుకు చావుతో సమానమని అతని నిర్ధారణ. అసంబద్ధ బంధాల్లో చిక్కుకొని మనల్ని మనం కోల్పోయి బతికే బతుకూ వొక బతుకేనా అని అతని ప్రశ్న. నిజమే. కానీ ‘జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది.’ అన్న అతని మాటల్ని అర్థం చేసుకోవాలనే తద్వారా అతణ్ణి అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం.

కానీ ‘అన్నింటికీ అర్థాలు వెతకడంలోనే మనిషి తనలోని మ్యాజిక్ ని కోల్పోయాడ’ నే చిత్వాన్ మాటలే మళ్ళీ అతణ్ణి అర్థం చేసుకోడానికి అడ్డుపడుతున్నాయి. అయినా అన్నిటికీ అర్థాలు వెతికే క్రమంలోనే మ్యాజిక్కో  థ్రిల్లో మరేదో వుందని నేను నమ్ముతాను కాబట్టి చిత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నాన్ని నేను మానుకోలేను. చిత్వాన్ ని అర్థం చేసుకోవడమంటే సంక్లిష్టమైన సంక్షుభితమైన సమాజాన్నీ సమాజ చలనాన్నీ అర్థం చేసుకోవడమే. ఇవాళ్టి అత్యాధునిక సందర్భంలో నిర్దిష్ట సామూహిక ధ్యేయాల్లేని యువత  అంతరంగ సంచలనాన్ని  కొలిచే ప్రయత్నం చేయడమే.

ఇంతకీ యెవరీ చిత్వాన్ –  అంటే వెంకట్ సిద్ధారెడ్డి ‘సోల్ సర్కస్’ లోని (సారంగ – జూన్ 11, 2015 ; కథ లింక్ : ) పాత్ర అని వొక్క ముక్కలో చెప్పొచ్చు. కానీ అతణ్ణి అర్థం చేసుకోడానికి యెందుకంత తపన  అంటే మాత్రం అంత తేలిగ్గా చెప్పలేం. కారణం అతను కేవలం కథలో పాత్ర మాత్రమే కాదు అనిపించడం వల్ల కావొచ్చు. రక్త మాంసాలతో వెచ్చని వూపిరితో మన మధ్య జాజ్వల్యమానంగా వెలిగి ఆరిపోయిన మనలోని వ్యక్తే కథలోకి నడిచి వచ్చినట్లు అనిపించడం వల్ల కావొచ్చు. డబల్ పిహెచ్ డి తో తన తెలివి తేటలతో కొత్తతరానికి దారి చూపించగల మేధావికి  తన దారి తానే మూసుకొనే ఆలోచన కలగడంలోని అసంబద్ధత పట్ల అసహనం వల్ల కావొచ్చు. అతణ్ణి బతికించుకోలేని దుస్థితి పట్ల క్రోధంతో కావొచ్చు. మరొకర్ని అతని దారిలో నడవకుండా చేయాలంటే తోటి వ్యక్తులుగా మనమేం చేయాలి అన్న ప్రశ్న తొలవడం వల్ల కావొచ్చు…  యిలా  యెన్నో కారణాలు.

soul

గోపీచంద్ సీతారామారావో రావిశాస్త్రి సుబ్బయ్యో బుచ్చిబాబు దయానిధో కేశవరెడ్డి బక్కిరెడ్డో – యిలా  నవలల్లో పాత్రలు పాఠకుడి మనసు మీద బలంగా ముద్ర వేయడం సాహిత్య ప్రపంచంలో పదికాలాలు నిలబడటం సాధారణంగా జరుగుతుంది కానీ వొక యువ రచయిత రాసిన పది పేజీల కథలోని పాత్ర యింతలా గుర్తుంది అంటే యింతగా వెంటాడుతోంది అంటే కారణం ఆ పాత్రని నిర్మించడంలో లేదా ఆవిష్కరించడంలో అతను చూపిన నేర్పు వొకటే కాదు ;  చిత్వాన్ అతని జీవితంలో భాగం . అందుకే చిత్వాన్ చనిపోతే తన లోపల్లోపల ఏదో ఒక భాగం హఠాత్తుగా  తెలియని లోతుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిట్టు , అంత్యక్రియలు జరగాల్సింది ఒక్క చిత్వాన్ కే కాదు. తన లోపల్లోపల చనిపోయిన ఆ భాగానికి కూడా అని అతనికి అనిపించింది.

నిజానికి చిత్వాన్ రచయితకే కాదు మనకి కూడా లోపల్లోపల వొక భాగమే. అతనిలా మనమూ యే బంధనాల్లేని జీవితాన్నే ఆశిస్తాం . అతనిలా కట్టుబాట్లు లేని స్వేచ్ఛే  కోరుకుంటాం. ఇళ్ళూ వాకిళ్ళూ అర్థంలేని మమకారాలూ అన్నీ తెంచుకొని పోవడం బాగానే వుంటుంది కానీ చిత్వాన్ బుద్ధుడిలా క్షణిక వాది అయ్యాడు గానీ అన్వేషకుడు కాలేకపోయాడు. మానవకోటి దు:ఖానికి కారణం తెలుసుకోవాలనే ప్రయత్నంలో సిద్ధార్థుడు బుద్ధుడైన క్రమాన్ని అతను మర్చిపోయాడు. తనను తాను అన్వేషించుకొనే దారుల్ని వదులుకొన్నాడు. గుర్తు చేసుకొని సంతోషించే మధురమైన గతమూ ఆశావహమైన భవిష్యత్తూ లేకపోవడం వల్ల తానే క్షణికమని నమ్మిన వర్తమానాన్నీ అందు దాగిన దు:ఖాన్నీ యెదుర్కోలేక  మృత్యుద్వారాన్ని తట్టాడు. హంసలా ఆర్నెల్లు బతికితే చాలనుకొన్నాడు. కానీ మనుషులతో జీవించడానికి కావలసిన వనరుల్ని వెతకలేకపోయాడు , పంచలేకపోయాడు. జీవితాన్నే కాదు  ఆఖరికి ప్రేమనీ ప్రేమించినవాళ్ళనీ బంధనంగానే భావించాడు.

ప్రేమంటే ఏంటనుకున్నావు? ప్రేమే మరణం; ప్రేమించడమంటే అత్మహత్య చేసుకోవడం. ప్రేమలో అహం, అవాస్తవాలు మరణిస్తాయి. అని సిద్ధాంతీకరించాడు. ప్రేమలోనూ అతని ఆలోచనలు అసాధారణంగానే వుంటాయి. అతని ప్రేమలో గాఢత వుంది. నిజాయితీ వుంది. ప్రేమించినంతసేపూ తనను తాను మర్చిపోయాడు. బయటి ప్రపంచాన్ని వదిలేశాడు (బయటి ప్రపంచం గురించి అతనికెప్పుడూ పట్టలేదు – అది వేరే విషయం). అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మనసులోని ఫీలింగ్సన్నింటినీ సాధారణీకరించడం అతనికి  నచ్చదు. ఇన్నేళ్ల  జీవితాన్ని ఒక్క క్షణంలో కలిగిన  ఫీలింగ్ కి అంకితం చేయడంలో యేదో తేడా వున్నట్టు భావిస్తాడు. ప్రేమించడమంటే కోల్పోవడం అని అతని నమ్మకం.

నిన్ను నువ్వు కోల్పోకుండా కూడా యెదుటివారిని ప్రేమించవచ్చనీ  లేదా యెదుటివారిని ప్రేమించడంలో నిన్ను నువ్వు కోల్పోడంలో కూడా మాధుర్యం వుంటుందనీ భరోసానిచ్చే వొక వోదార్పు వాక్యం అతనికెవరూ యివ్వలేకపోయారు.

యే బంధనాల్నీ ఇష్టపడని అతని వ్యక్తిత్వమే ప్రేమకీ జీవితానికి కూడా కట్టిపడేయలేకపోయింది. అతని బాల్యం అతణ్ణి ప్రేమ పట్ల కూడా అవిశ్వాసిగా మార్చింది.

చిత్వాన్ అసలు పేరు కృష్ణమూర్తి. అతని మాటల్లోనే చెప్పాలంటే తండ్రి నెల్లూరికి చెందిన వొక డబ్బులబస్తా , వొక ‘రిచ్ బాస్టర్డ్’. వాడు వుద్యోగరీత్యా నేపాల్ వెళ్ళినపుడు అక్కడ ‘ఉంచుకున్న దాని కొడుకు’ చిత్వాన్. అందుకే అతణ్ణి బాబు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. కానీ  ‘నేపాలీ వాడినైతే మాత్రం మీ బిల్డింగ్ లకు సెక్యూరిటీ గార్డ్ గా మిగిలిపోవాలనుకోలేదు’ అని కొంచెం వయసు రాగానే అమ్మ తరుపున పోరాడాడు. నాన్న అతణ్ణి డబ్బుల్తో కొనేద్దామనుకున్నాడు. కానీ చిత్వాన్ సమురాయ్. పోరాడాడు. నాన్న ఏ ఊరెళ్తే ఆ ఊర్లో.  చివరికి తండ్రి కాళ్ల బేరానికొచ్చాడు. తండ్రినొక  ఏటియం గా మలచుకొన్నాడు.

ఇది ఇలా చెయ్యకూడదంటే అదే చేస్తూ పోయాడు. పోరాడి తన జీవితాన్ని క్లైమ్ చేసుకున్నాడు.

బాబు పోవడంతో ఏటియం పర్మనెంట్ గా ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది.

డబుల్ పిహెచ్ డి తో వుద్యోగం సంపాదించాడు. కానీ అంతా కొత్త. ఒక రోజు దుకాణం మూసేశాడు.  జీతాల జీవితం వొద్దు అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగాడు.

రాబందులా జీవితాన్ని వెంటాడే పేదరికంలోనే పుట్టి పెరిగుంటే అన్నీ సాధారణంగానే అనిపించుండేవేమో! పేదరికం అంటే ఇలా ఉంటుందని తెలిసుంటే పస్తులుండి, రోజూ చస్తూనో, చస్తూ బతుకుతూనో, ఎలాగో బతికుండేవాడేమో.  కానీ ఈ పేదరికం అతనికి చాలా కొత్త.  ‘జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ ఏమో అనుకుని ఎప్పట్లానే రైడ్ ఇట్ ఆర్ డై’  అని ప్రయత్నించాడు.  కానీ వల్ల కాలేదు.

ఎటియం లు వున్నంత కాలం జీవితం గురించి యెన్నో కబుర్లు చెప్పగలిగిన చిత్వాన్ , జీవితాన్ని యిష్టమొచ్చినట్టు గడపాలంటే ఎటియం ల అవసరం తప్పదని గ్రహించాడు.  ‘యెన్ని అవాస్తవాలు మరణించినా ఆకలి అనే వాస్తవం మాత్రం నాకు దూరం కాలేదు’ అని గుర్తించాడు గానీ దాన్ని జయించలేకపోయాడు. అందుకు మనసు చంపుకోలేక ఆత్మని అమ్ముకోలేక చావుని ఆశ్రయించాడు.

అంతా చూస్తే లోపలి మనిషి అస్తిత్వ అన్వేషణ – స్వేచ్ఛ ముసుగులు తగిలించుకొన్న వొక వ్యక్తివాదే చిత్వాన్ లో కనిపిస్తాడు. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవడం , భవిష్యత్తు అగమ్య గోచరం కావడం ,  వ్యవస్థాగత నిర్మాణాలు దాని పట్ల భరోసా ఇవ్వలేని పరిస్థితి , సమూహంలో సైతం వొంటరి ద్వీపాలుగా మిగిలి పోయే భద్రతా రాహిత్యం, వొక చట్రంలో యిమడలేని వ్యక్తిత్వం , వ్యక్తిగతమైనదో సామాజికమైనదో వొక గమ్యం లేకపోవడం , జీవితంలో అస్థిరత్వం , అరాచకత్వం  … యివన్నీ చిత్వాన్ చావుకి కారణమేమో అని తోస్తుంది.

మనుషుల్లోని హిపోక్రసీని ద్వేషించి సమాజానికి అతను దూరమయ్యాడు సరే ; సమాజం కూడా అతణ్ణి తనలో యిముడ్చుకోలేకపోయింది. కెరీరజం వూబిలోకి నెట్టి వైయక్తిక ప్రతిభని పై మెట్టు మీద నిలిపే  విశ్వవిద్యాలయాల డొల్ల చదువులు , మనుషులు సామాజిక జీవులుగా గాక వ్యక్తులుగా విడిపోవడమే స్వేచ్ఛకి పరమార్థంగా నిర్వచించే ఆధునికోత్తర ధోరణులు యువతరాన్ని గందరగోళపరుస్తున్నాయి. చిత్వాన్ లోని వైరుధ్యాలకూ ఇంటలెక్చువల్ యారోగెన్స్ కీ పలాయన తత్త్వానికీ వ్యక్తివాదానికీ కారణం యీ వాతావరణమే.

ఈ ఖాళీలని పూరించుకోడానికి  గానీ యీ గందరగోళాన్నుంచి బయటపడటానికి  గానీ  చిత్వాన్ ప్రయత్నం చేయలేదా అంటే – చేశాడు. కానీ అవి బలహీనమైనప్రయత్నాలు. నిలువుటద్దం లాంటి వొక మంచి స్నేహితుడి కోసం వెతుక్కొన్నాడు.

‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన ఒక స్నేహితుడి అవసరం ఉంది. వాళ్లతో నీ రహస్యాలు, నీ తలవంపులు, నీ ఉక్రోషాలుఅన్నీ పంచుకోవాలి.  మాస్కులన్నీ తీసేసి, హృదయాంతరాలను మథించి నీలోపలున్న నిన్నులందరినీ వారికి పరిచయం చేయాలి. అటువంటి నమ్మకమైన నిలువుటద్దంలాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ.’

చిత్వాన్ రచయితలో అటువంటి స్నేహాన్ని చూశాడు. అనుభవించాడు.ఇతరులకు మంచి చేయడం కర్తవ్యం కాదు. అదొక ఆనందం. అది మన సంతోషాన్నీ ఆరోగ్యాన్నీ పెంచుతుంది’ – అంటూ నెమళ్ళ కొలను (పీకాక్ లేక్ కి చిత్వాన్ పెట్టిన పేరు) దగ్గర చేసుకొన్న తొలి పరిచయం తోభయాలు, బిడియాలు, కాంప్లెక్స్ లు, అలవాట్లు, పొరపాట్లు వీటన్నింటిని ఇనుప చొక్కాలా తొడుక్కుని’  వున్న రచయితని వాటి నుంచీ బయట పడేశాడు.

‘యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కృత్వా ఘృతం పీబేత్. భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుత:’ అంటూ చార్వాకుడై కాసేపు , పీత్వా పీత్వా పున: పీత్వా అంటూ ఒమర్ ఖయ్యాంగా కాసేపూ , జరాతుష్ట్రగా కాసేపూ , అదేదో సినిమాలో కళాపోషకుడిగా కాసేపూ … గంటకో కొత్త వేషం వేస్తూ వింత  అనుభవాలు  పరిచయం చేసాడు.  వాదాలూ సిద్ధాంతాలూ ప్రవచించాడు ( ఇవ్వాళ చిత్వాన్ బతికుంటే ‘హాయ్ అయామ్ కన్హయ్య కుమార్ ఫ్రం జెయెన్టీయూ’ అనో ‘రోహిత్ వేముల ఫ్రం నక్షత్ర ధూళి అనో’ తనను తాను  పరిచయం చేసుకొనే వాడేమో!)

భీముని కొలను , శ్రీశైలం టైగర్ రిజర్వ్  ఫారెస్ట్ ,   జమ్ము తావిలో వైష్ణోదేవి గుడి , నాసిక్ త్రయంబకేశ్వరం  , ఎల్లోరా కైలాష గుడి , హంపీ, విరూపాపూర్ గద్దె, మౌళారూజ్ కెఫె … దేశమంతా తిరిగాడు , తిప్పాడు. జీవితమనే ప్రశ్నకు సమాధానాలు వెతకొద్దు. సమాధానం దొరికిందనుకున్న ప్రతి సారీ జీవితం మరో కొత్త ప్రశ్నలా ఉదయిస్తుందని – జీవితంలో అసలు మనమేం చెయ్యాలో కనుక్కునేందుకు, మనల్నేం చెయ్యద్దొంటారో అది చేస్తే మార్గం తెలుస్తుందని చెప్పాడు.

రగిలించి, ఆజ్యం పోసి, అన్వేషించమని అగ్నిగుండంలోకి నడిపించినప్పటికీ , గంటల లెక్కన నిన్ను నువ్వు అమ్ముకోవద్దని వారించి నప్పటికీ – రచయిత పేదరికాన్ని జయించడానికి విదేశానికి యెగిరిపోయినప్పుడు మాత్రం డీలాపడ్డాడు అనిపిస్తుంది.

‘ప్రతి రోజూ, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్లీ కొత్తగా పుడ్తావు. నువ్వు వుంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడూ ఉంటాడు. కొన్ని సార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్లాలి’ – అని తెలిసినప్పటికీ వొంటరివాడయ్యాడు.

హంపిలో  శిధిలాల్లో   జీవితం  అశాశ్వతమన్న ప్రతీకల్ని చూశాడు. ఆ  శిధిలాల్నుంచి  జీవితం  నశ్వరమని నేర్చుకున్నాడు. అక్కడి రాళ్ళతో అతను మాట్లాడాడు. సగం విరిగిపోయిన కోట గోడలు, ఆ గుడి ముందు శిధిల శిల్పం ‘ ఏ దారిలో వెళ్లినా చివరికి శిధిల్లాలోకే దారి తీస్తుందని అతనికి బోధించాయి. వాటి భాష అర్థం చేసుకొన్నాడు.

కానీ పేరడాక్స్ యేమంటే ఆ శిధిలాల్లోనే ప్రేమలో పడ్డాడు. ప్రేమలోని మాధుర్యం అనుభవించాడు. ఆమెను చూస్తున్నంత సేపూ తన  గురించి, ఈ ప్రపంచం గురించి ఏ కంప్లైంట్స్ లేకుండా పోయాయి. ఆమె మాత్రమే కావాలనుకునే వొకే వొక్క ధ్యేయంతో బతికాడు.ఇంకే కోరికలూ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు లేవు. ఆమెను చూస్తున్నకొద్దీ, ఆమెను ప్రేమిస్తున్నకొద్దీ  రోజు రోజుకీ కొంచెం కొంచెంగా మరణిస్తున్నట్టనిపించింది అతనికి.

అంతే –  సడెన్ గా పెరుగన్నంలో ఆవకాయ వేసుకు తినాలనిపించి కాళ్ళా వేళ్ళా బడి ఆమె యెంత బతిమాలినా వినిపించుకోకుండా ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యీ లోకం నుంచే వెళ్ళిపోయాడు.

బతికుండడం ముఖ్యం కాదు; బతకడమూ అంత ముఖ్యం కాదు. అసలీ జీవితంలో ఏదీ ముఖ్యం కాదు – అని  చిత్వాన్ భావించడానికి కారణాలేంటి అని కథ చదువుతున్నంతసేపూ వొక ప్రశ్న మనల్ని బాధిస్తుంది.

సమూహం నుంచి దూరమైన వ్యక్తివాదమే చిత్వాన్ ఆత్మ హననానికి కారణమని నాకు బలంగా అనిపిస్తుంది. మార్గదర్శనం చేయించే  సామూహిక సామాజికోద్యమాలు బలహీనం అయిన నేపథ్యంలో యిటువంటి ఫిలాసఫీ ముందుకు వస్తుందేమో అని తోస్తుంది. రోల్ మోడల్స్ లేనితనం నుంచి వొక నిస్పృహ నుంచి యిటువంటి విపరీత మనస్తత్త్వం రూపొందుతుందేమోనని భయమేస్తుంది. ఆదర్శవంతంగా వుండాల్సిన వుద్యమ జీవితాల్లోకి సైతం స్వార్థపు నీడలు వ్యాపించడం , ఆచరణలో బోలుతనం చోటుచేసుకుంటున్న అవిశ్వాస వాతావరణంలో వొక సామూహిక స్వప్నాన్ని అతనికి అందించలేకపోయాం అని కూడా వ్యథ కల్గుతుంది.

రొటీన్ లో కూడా మరణించనీకుండా కాపాడే మ్యాజిక్ యేదో మన జీవితాల్లోనూ మనం జీవిస్తున్న యీ సమాజంలోనూ వుందనీ ఆ యేదోని తెలుసుకోలేకపోవడం వల్లే నువ్వు మరణించావు చిత్వాన్ అని అతనికి చెప్పాలని వుంది.

జీవితం అనశ్వరం కాదు ; అశాశ్వతమే …  కానీ స్వయంగా దాన్ని స్వయంగా అకారణంగా నాశనం చేసుకోవాల్సిన అవసరం సైతం లేదు. చావడానికి ధైర్యం అక్కరలేదు – బతకడానికి కావాలి. నిజానికి ప్రేమించడం చావు గాదు ;  ప్రేమరాహిత్యమే మరణం అని గొంతు చించుకు అరవాలని వుంది. వ్యక్తల్నే కాదు మందిని ప్రేమించు , నూతన మానవావిష్కరణ కోసం సమాజంలో యేదో వొక మూల సమూహాలు చేసే ప్రయత్నాల్ని ప్రేమించు , చీకటిని కాదు వెలుగుని ప్రేమించు అని బుజ్జగించాలని వుంది. కానీ కాంక్రీట్ అడవుల్లోనో , భద్ర లోకాల మూలల్లోనో , మల్టినేషనల్ కంపెనీల అద్దాల మేడల జిలుగు వెలుగులకాంతిలోనో , ఏసి గదుల్లో కుషన్డ్ సీట్లకు వేడి పుట్టించడంలోనో మైమరచిపోయి ప్రియ పచ్చళ్లు, కరాచీ బిస్కెట్లు, తెలుగు సినిమా డివిడిలు దేశం నుంచి దేశానికి మోసుకుంటూ సంసార రంగుల రాట్నంలో   బిజీగా తిరుగుతూ  వున్న రచయితకు లాగానే నాక్కూడా యేదో తెలీని వ్యక్తం చేయలేని గిల్టీ ఫీలింగ్.

దాన్నుంచీ బయట పడటానికే – అపరాధ భావనని కడిగేసుకోడానికే – పేదరికం నుంచి దూరంగా అడుగులు వేస్తున్నాననుకుంటూ  జీవితం నుంచే చాలా దూరంగా వెళ్లిపోయానని తెలియని తనం నుంచీ తనను కాపాడుకోడానికే కథలో తననో పాత్ర చేసుకొని తన కథనీ చిత్వాన్ కథనీ రాయడానికి  పూనుకొన్నాడు రచయిత. రాయడం గురించి చిత్వాన్ చెప్పిన మాటలే అతడికి భయం కల్గించాయి  దారిచూపాయి కూడా.

‘రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.

 ‘లోపల. నీలోపలే అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోలు తిత్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్; ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనె అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకూ వచ్చిన కథలే మళ్లీ వస్తాయి. ఇప్పటివరకూ చెప్పిన నీతే మళ్లీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టదు. గో డూ సమ్ సోల్ సర్కస్ అనేవాడు చిత్వాన్.’

 ఈ మాటలు కథకుడి మీద బలంగా ముద్ర వేశాయి. ‘నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకోవడమంటే నాకు సన్నిహితమైన నా ఆత్మీయ స్నేహితుడైన చిత్వాన్ ని నిలబెట్టడమే’ అని నిర్ధారించుకొన్న రచయిత రాయడానికే పూనుకొన్నాడు.

నిజానికి కథలోని పాత్రతో రచయితకు అభేదం పాటించి విశ్లేషించడం ఎంతవరకు సమంజసమో తెలీదు గానీ , సిద్ధారెడ్డి కథ పొడవునా రచయిత పాత్రతో ఐడెంటిఫై అవడం కనిపిస్తుంది. ఆత్మ కథాత్మక కథనంతో విశ్వసనీయత సాధించాడు. అందువల్ల రచయితే కాదు పాఠకులుగా మనం కూడా కథతో కనెక్ట్ అవుతాం. జీవితం పట్ల రచన పట్ల చిత్వాన్ తో యేకీభవిస్తూ విభేదిస్తూ కొట్లాడుతూ రాజీపడుతూ కథలో లీనమవుతాం. ఈ కథ యెందరినో కదిలించిందంటే , దు:ఖ పెట్టిందంటే , చిత్వాన్ పట్ల క్రోధాన్నీ ప్రేమనీ కల్గించిందంటే ,  యేకకాలంలో నచ్చిందీ నచ్చలేదు అన్న ద్వంద్వానికి గురి చేసిందంటే , చదువుతూన్నంత సేపూ తమ లోపలికీ చుట్టూ వున్న యితరుల్లోకీ చూసేలా చేసిందంటే ,   కథా రచనకు  సిద్ధారెడ్డి ఎంచుకొన్న టెక్నిక్కే అందుకు ప్రధాన కారణం.

sidha

అందుకే కథ ఆవు వ్యాసం కాలేదు. మంచి కథ కొత్త కథ చదివామని చాలా మండి పాఠకులు స్పందించారు. కథ యిలా చెప్పడానికి ( రచయిత ఐచ్ఛికంగా యెన్నుకొన్న మౌఖిక శైలి కథకి గొప్ప అందాన్నిచ్చింది) రచయిత దశాబ్దం పైగా స్ట్రగులయ్యాడు. సిద్ధారెడ్డి అంతకు ముందు కథా రచనలో చిన్నా చితకా ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమా రంగంలోకి డీవియేట్ అయిన తర్వాత కథా రచయితగా తనను తాను రీడిస్కవర్ చేసుకొనే క్రమంలో రాసిన తొలికథ సోల్ సర్కస్.

రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే అన్న చిత్వాన్ మాటలతోనే కథ ప్రారంభమవుతుంది. ఆ చాలెంజ్ ని రచయిత యెలా  నిర్వహించాడో చూద్దామనే వుత్సుకతతోనే కథ చదవడం మొదలెడతాం. అక్కడ నుంచీ రచయిత పంచుకొనే చిత్వాన్ జ్ఞాపకాలు వూపిరి తీసికోనివ్వవు. జీవితం గురించి చిత్వాన్  ఆలోచనలు మన గుండె లోతుల్ని తడుముతూ వుంటై. అతని మరణానికి కారణం తెలుసుకోడానికి రచయిత వెంట అన్వేషిస్తూ పోతాం.

కథ రచయిత దృష్టి కోణం నుంచీ నడుస్తుంది. కథకుడి దృక్పథం తన సొంత జీవితంపై చిత్వాన్ చూపిన ప్రభావాల గురించి ప్రస్తావించిన సందర్భాల్లో వ్యక్తమౌతుంది. నిజానికి యిద్దరి కథా పక్క పక్కనే కాకుండా జమిలిగా పెనవేసుకొని నడుస్తుంది. అలా నడపడంలోనే వెంకట్ సిద్ధారెడ్డి నేర్పు కనపడుతుంది. నిజానికి కథ అంతా గతమే. కానీ గత వర్తమానాల్లోకి ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. కథ భిన్న స్థల కాలాల్లో జరిగినప్పటికీ అనుభూతి ఐక్యత దెబ్బతినకుండా వుండటమే కథలో బలం. ఆ అనుభూతి పాఠకుల అంతరంగాల్లో విషాదం మిగుల్చుతుంది. ‘నీకు జరిగింది కథ కాదు. నీలో జరిగిందే కథ.’ అని కథకుడి స్థానం నుంచి  రచయిత చేసిన ప్రకటనతో యేకీభవిస్తాం. అందుకే రచయిత లోపలి సంఘర్షణకి కూడా  కథలో సమ ప్రాధాన్యం లభించింది. రచయిత పాత్ర ద్వారా జీవితాన్ని గెలవాలనే ఆరాటంలో మనం కోల్పోతున్నవాటిని గుర్తుచేయడం కూడా వొక కథాంశంగా తయారైంది. రాయడం గురించి రచయిత తనదైన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కూడా వొక సందర్భాన్ని సృష్టించుకొన్నాడు.  అది చిత్వాన్ అభిప్రాయానికి విరుద్ధం కాదు గానీ మరో చూపు.

రచయిత శిల్ప నైపుణ్యం వల్ల దృక్పథా బలం వల్ల కథ వ్యక్తి తలం నుంచీ సామాజిక తలానికి యెదుగుతుంది.

‘రాయడమంటే నడి రోడ్డు లో నగ్నంగా నిలబడ్డం కాదు, నడిరోడ్డులో నగ్నం గా వర్షంలో తడవడమని, నోస్టాల్జియా ఒక జబ్బు కాదు, అదొక గొప్ప మందనీ, రాయడమంటే అగ్ని పర్వతం బద్దలు కావడం కాదు, నిత్యం రగిలే గుండె మంటలను చల్లార్చుకోవడం అనీ, ది జంగిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్; ఇట్ ఈజ్ ఇన్ ది హెడ్ అనీఏదో ఒకటి. అది అబద్ధమో, నిజమో, నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమోఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపుండే వాడిని కదరా?అంటూ వర్షంలో విరూపాక్షాలయం ముందు నించుని గుండె పగిలేలా రచయిత రోదించినట్టే మనం కూడా వుద్విగ్నులమౌతాం. చిత్వాన్ లను కాపాడుకొనే దారులు వెతుకుతాం. చిత్వాన్ కథ చెప్పడం ద్వారా రచయిత ఆశించిన ప్రయోజనం అదే అయితే అందులో అతను నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు.

మరో చిత్వాన్ అకాలంగా  అకారణంగా మన మధ్య నుంచి వెళ్ళిపోకూడదు.

మన మధ్య తిరుగాడే చిత్వాన్ లకీ మన లోపల కదలాడే చిత్వాన్ కీ వొక సామూహిక స్వప్నాన్నిద్దాం ; బతికించుకొందాం. అయితే వొక బృంద గానం ఆలపించిన సామూహిక నినాదమై మోగిన మంది కల గన్న రోహిత్ వేముల కూడా మననుంచి నిష్క్రమించిన విషయాన్ని సైతం మనం మర్చిపోకూడదు. మన స్వప్నాల్ని ధ్వంసం చేసే కుట్రలపట్ల  అప్రమత్తంగా వుండాలి. వాటిని యెదుర్కోడానికి సమాయత్తం కావాలి. అందుకు అవసరమైన శక్తులన్నిటి సమీకరణం యివాళ్టి అవసరం. రోహిత్ ని అయినా చిత్వాన్ ని అయినా మిగుల్చుకోడానికి – అదే యిప్పుడు మనం చేయాల్సిన  సర్కస్ ; కాదు యుద్ధం.

*

అసమ దాంపత్య బంధంలో ఎక్స్ ట్రా నాట్!

 

 

-ఎ . కె . ప్రభాకర్

~

 

స్త్రీవాద రచయితల్లో గీతాంజలి (డా. భారతి)ది విలక్షణమైన గొంతు. ప్రగతిశీలమహిళా వుద్యమాల్లో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తగా స్వీయ జీవిత అనుభవ నేపథ్యం నుంచి ఆమె రచించిన ‘ఆమె అడవిని జయించింది’ నవల నూత్నవస్తు – శిల్పాల స్వీకృతి కారణంగా గొప్ప సంచలనం సృష్టించింది. కుటుంబంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాల నిరసన   – స్త్రీల సమస్త శక్తి యుక్తుల్ని హరించి వాళ్ళను బోన్సాయ్ మొక్కలుగా మార్చే ఇంటి చాకిరీలోని అమానవీయ కోణాలు –  కనపడని గృహహింసకు బలయ్యే స్త్రీల ఆవేదన – పసిపిల్లలమీద జరిగే అత్యాచారాలు – ఆడదాని గర్భసంచి చుట్టూ అల్లుకొన్న రాజకీయాలు  గీతాంజలి తొలినాళ్ళలో రచించిన కథలకి (బచ్చేదానీ – 2004 ) ముఖ్య వస్తువు. ఓల్గా లాగానే స్త్రీ శరీరాన్ని కేంద్రం చేసుకొని అమలయ్యే పురుషాధిపత్య రాజకీయాలను బలంగా యెండగట్టడంతో గీతాంజలి ఆగిపోలేదు. ఒక డాక్టర్ గా , సెక్సాలజిస్టుగా ఫేమిలీ కౌన్సిలింగ్ కోసం తన దగ్గరకొచ్చే స్త్రీల హృదయవిదారకమైన జీవితాలను గొప్ప ఆర్తితో వర్ణించింది. ఆ కథల్లో ( పహెచాన్ – 2007) యెక్కువ భాగం ముస్లిం స్త్రీలకు చెందినవే కావడం విశేషం. దుర్భర దారిద్ర్యంలో నలిగిపోతూ కమ్యూనిటీ లోపలా బయటా పురుషాధిపత్య – మత భావజాలంతో పెనుగులాడే ముస్లిం మహిళల  దు:ఖ మూలాల్ని వెతికే క్రమంలో తనది కాని జీవితాలతో మమేకమౌతూ సాటిలేని సహానుభూతితో డా. గీతాంజలి కలం నుంచి వెలువడ్డ కథలు అనితర సాధ్యాలు. షాజహానా వంటి ఇన్ సైడ్ రచయితలు మాత్రమే రాయగలిగినవి.

ఇవన్నీ వొక యెత్తయితే  రైతుని నమ్ముకొన్న నేలకి దూరం చేసే సెజ్ లకు వ్యతిరేకంగా ఆమె కలం పదునెక్కింది. కరువు కోరల్లో చిక్కుకొని బతుకు తెరువు వెతుక్కుంటూ దేశాలు పట్టిపోయే పాలమూరు వలస కూలీల వెతల్ని జీవన్మరణ పోరాటాన్ని వాళ్ళ భాషలోనే (పాలమూరు వలస బతుకు చిత్రాలు – 2015) చిత్రించింది.

రచయితగా సామాజిక కార్యకర్తగా  సమాజంలో పాతుకుపోయిన సకల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే ‘మూసి ఉన్న తలుపులు వెనకాల పెళ్లి , దంపత్య జీవితం , రొమాన్స్ పేర్లతో … పెళ్లి , భర్త అనే చట్టబద్ధమైన లైసెన్సులతో  … స్త్రీల మనో దేహాల మీద జరిగే దాడి … సెక్సువల్ వయోలెన్స్’ ఎంత భయానకంగా ఉంటుందో తెలియ జేస్తూ ‘మగవాళ్ళను సెన్సిటైజ్ చేయాలనే’ వొక బలమైన ఆశతో స్త్రీల లైంగిక రాజకీయాల గురించి నిర్దిష్టమైన అవగాహనతో   గీతాంజలి రాస్తోన్న కథల పరంపరలో – శిలగాని శీల , ఫ్రిజిడ్ , నింఫోమేనియా మొదలైన  కథలు సాహిత్య ప్రపంచంలో తీవ్రప్రకంపనాలు సృష్టించాయి. ఆ క్రమంలో యింతకు మునుపు యే రచయితా స్పృశించని విలక్షణమైన వస్తువుతో వచ్చిన కథ ‘ హస్బెండ్ స్టిచ్’ ( విహంగ , మహిళా సాహిత్య మాస పత్రిక – జనవరి 2014) .

  కథ  లింక్   :  http://vihanga.com/?p=10972#sthash.25kbCw4h.dpbs

 

 

పాపినేని శివశంకర్ ‘మనుషులు వదులవుతారు’ (కథ – 1999) కథలో వొక  భర్త వయసు పెరిగిన భార్య వొదులై పోయిందని వేరే స్త్రీతో సంబంధం కోసం ప్రయత్నిస్తుంటాడు . అతనలా వెంపర్లాడుతున్నాడని తెలుసుకొని ‘నేనంటే నా ఒళ్ళు మాత్రమేనా’ అని ప్రశ్నించుకొని ఆమె వాపోతుంది. ‘మాయదారి సంసారాల్లో ఎక్కడో పెద్ద మోసం దాగుంది’ అని గ్రహిస్తుంది.

శివశంకర్ కథలో ‘సతీ సావిత్రి’ కి తన శరీరమ్మీద కనీసం గౌరవమైనా మిగిలి వుంది. సంసార సంబంధంలో యేదో మోసం వుందన్న యెరుక వుంది.  గీతాంజలి కథలో పాపం సుశీలకి ఆ రెండూ లేవు. ఆమె తనను నిర్లక్ష్యం చేసిన భర్త శంకర్రావుని మళ్ళీ తన దగ్గరకు రప్పించుకోడానికి పడరాని పాట్లు పడింది.

‘సంవత్సరం నుంచి మా మధ్య శారీరక సంబంధం లేదు’ … ‘నాతో సెక్స్ బాగోలేదట – నీది ఒదులైపోయింది అందుకే రావాలన్పించడం లేదంటాడు … ‘ఆయన మళ్ళీ నా దగ్గర్కి రావాలి. రావాలంటే నేను ఆపరేషన్‌ చేయించుకుని పెళ్ళికి ముందులా తయారవ్వాలి’ అని సుశీల తన  స్నేహితురాలు మంజులకి సిగ్గు విడిచి చెప్పుకొంది.

మాయదారి సంసారాల్లో దాగున్న మోసాన్ని గ్రహించలేక తన అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టక ఎక్స్ ట్రా నాట్ కి సిద్ధపడింది. అందుకు తాహతుకి మించిన అప్పుచేయడానికి సైతం వెనకాడలేదు. డాక్టర్ హెచ్చరించినా వినక ప్రాణం మీదకి తెచ్చుకొంటుంది. ఇదీ ‘ హస్బెండ్ స్టిచ్’ లో స్థూలంగా కథ .

సుశీల అభద్రతకీ భయానికీ దు:ఖానికీ  కారణాలని రచయిత కథ నుంచీ పక్కకు వెళ్లి యెక్కడా ప్రత్యక్షంగా పేర్కొనక పోవడంలో గొప్ప సంయమనం ప్రదర్శించింది. దాంపత్య జీవితంలోని లైంగికత గురించి –  నియంత్రణల గురించి – పురుషానుకూలగా యేక పక్షంగా పాతుకుపోయిన  సామాజిక చట్రాల గురించి – భావజాలం గురించి పాఠకుల్లో సవాలక్ష ఆలోచనలు , ప్రశ్నలు పుట్టాడానికి అవకాశం యిచ్చే విధంగా కథాగమనంలో  అనేక పొరలు నిర్మించింది. గీతాంజలి రచించిన యితర కథలనుంచి ఈ కథ ప్రత్యేకంగా రూపొందడానికి అందులో వాడిన విశిష్టమైన శిల్పమే కారణమైంది ( గీతాంజలి కథల్లో కథ పొడవునా వొక వొడవని దు:ఖం చెవులు హోరెత్తేలా గుండెలు అవిసేలా వినిపిస్తూ వుంటుంది. కానీ ఈ కథలో మాత్రం దు:ఖ కారణాలే అక్షరాల మాటున దాగి రహస్యంగా ధ్వనిస్తాయి) .

వస్తు స్వీకరణ దగ్గర్నుంచీ యెత్తుగడ , యితివృత్త నిర్వహణ,  పాత్రల యెంపిక , ముగింపు అన్నీ చక్కగా అమరిన కథ యిది. దాంపత్య సంబంధంలో లైంగిక ప్రక్రియలో మాధుర్యం గురించి పురుష దృష్టికోణం నుంచే నిర్వచించే భావజాలాన్ని నిరసిస్తూ పడక గదుల్లో అమలయ్యే పురుషాధిపత్య లైంగిక రాజకీయాల మూలాల్ని  స్త్రీవాద సాహిత్యం చాల చోట్ల చర్చకి పెట్టినప్పటికీ ‘‘ హస్బెండ్ స్టిచ్’’ లాంటి వస్తువుని యెవరూ యెక్కడా స్వీకరించిన దాఖలాల్లేవు. అందువల్ల గీతాంజలి కథల్లోనే కాదు ; స్త్రీ వాద సాహిత్యంలో సైతం యీ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది.

బిడ్డ సైజ్ పెద్దగా వున్న కారణంగానో , సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేని కారణంగానో , బిడ్డకో తల్లికో ప్రాణాపాయం యెదురైన హడావిడిలో కాన్పు చేసే  కారణంగానో … ప్రసవ సమయంలో స్త్రీ జననాంగం చిరగడం వల్ల కావొచ్చు లేదా ప్రసవం తేలికగా కావడానికి కట్ (episiotomy ) చేయడం వల్ల కావొచ్చు ;  ప్రసవానంతరం మళ్ళీ పూర్వ స్థితి కోసం కుట్లు వేయాల్సిన అవసరం యేర్పడుతుంది.  అలా కుడుతూ – దాంపత్యంలో భర్తకి తృప్తి కలగడానికి వొకటి రెండు కుట్లు అదనంగా వేస్తారు. చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియలో ఆ స్త్రీ ప్రమేయం వుండదు. కోసినట్టుగానీ అదనపు కుట్లు వేసినట్టుగానీ ఆమెకు తెలియజేయడం జరగదు. ఒక్కోసారి యిది భర్త కోరిక మేరకు చేస్తారు. లేదా డాక్టరే స్వయంగా నిర్ణయం తీసుకొని చేస్తారు. భర్త కోసం వేసే అదనపు కుట్టు కాబట్టి దీన్ని హస్బెండ్ స్టిచ్ అనీ ఎక్స్ ట్రా నాట్ అనీ అంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి ,మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని నమ్మే స్త్రీలు కూడా ఉంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం వుండదనీ తర్వాతి కలయికల్లో స్త్రీలు నరకాన్ని అనుభవిస్తారనీ , భర్తలు కూడా సుఖపడరనీ సర్వేల ద్వారా పరిశోధనలద్వారా తెలుస్తోంది (వివ . Mama Birth – July 28 , 2013). వ్యాపార దృష్టి లేని మంచి  డాక్టర్లు ఈ ప్రొసీజర్ ని ప్రోత్సహించరు.

‘కాన్పులనీ , కుట్లనీ , సిజేరియన్లు , హిస్టెరెక్టమీలు – ట్యూబెక్టమీలు రీకేనలైజేషన్లనీ అన్ని గాట్లు, కాట్లు ఆడవాళ్ళకు అవుతూనే ఉంటాయనీ’ అలా స్త్రీ శరీరమ్మీద పెద్ద వైద్య వ్యాపారం జరుగుతోందని చెప్తూ  , అందాల అంగడిలోనూ –   ఆరోగ్య విపణిలోనూ స్త్రీ శరీరం సరుకైన వైనం చుట్టూ అల్లిన సాహిత్యం చదువుకొన్నాం. ఆ క్రమంలో వచ్చిన డా. గీతాంజలి ‘హస్బెండ్ స్టిచ్’  బలమైన కథగా రూపొందడానికి కారణం – వస్తు శిల్పాల చక్కటి సమన్వయమే. కథలో కథని మాత్రమే చెప్పాలన్న సూత్రాన్ని రచయిత నిక్కచ్చిగా పాటించింది.

కథకి అవసరమైన సాంకేతికమైన  వైద్య పరమైన విషయాల్ని  కథలో రచయిత్రి  నేరుగా ప్రస్తావించకుండా డాక్టర్ ముఖత: చెప్పించడంతో ప్రతిపాదితాంశాలకి   ప్రామాణికత విశ్వసనీయత లభించాయి. సుశీల దాంపత్య జీవితంలో యెదుర్కొనే సమస్యనీ , అందుకు ఆమె యెంచుకొన్న పరిష్కారాన్నీ , అందులోని సాధక బాధకాల్ని విప్పి చెప్పడానికి  గీతాంజలి కథని నెరేటివ్ స్టైల్లోగాక సంభాషణ శైలిలో నడిపింది. అందువల్ల కథలో రచయిత ప్రమేయం దాదాపు శూన్యమే. సుశీల తన బాల్య స్నేహితురాలు మంజులతో , పక్కింటి సుమతితో , డాక్టరమ్మతో చేసిన మూడు సంభాషణల్లో రచయిత్రి కంఠస్వరం డాక్టర్ పాత్రలో స్పష్టంగా వినిపిస్తుంది. రచయిత్రి నిజ జీవితంలో  తన దగ్గరకి కౌన్సిలింగ్ కోసం వచ్చే సుశీల లాంటి పేషంట్ల పట్ల చూపే సహానుభూతే డాక్టర్ మాటల్లో ప్రతిధ్వనించింది.

‘కాన్పు తర్వాత యోని కండరాలు మళ్ళీ సంకోచించి పోతాయి. వాటికి సాగే గుణంతో పాటు ముడుచుకునే గుణం కూడా ఉంటుంది. చాలా తక్కువ కేసుల్లో 10,12 మంది పిల్లల్ని కన్న వాళ్ళల్లో, నీలా పల్లెల్లో మంత్రసానులతో కాన్పులయిన వాళ్ళలో ఈ సమస్య వస్తుంది

‘నీ భర్తను ఒకసారి కౌన్సిలింగ్‌కి నా దగ్గర్కి తీసుకురా అతనికి అంతా వివరంగా చెప్పి నిన్నిలా వేధించద్దని చెప్తాను. నీకు కొన్ని ఎక్సర్‌ సైజులు చెప్తాను , అవి చేస్తే ఇంకా బిగుతయ్యే అవకాశం ఉంటుంది.

‘ఈ ఆపరేషన్‌ అయ్యాక అంతా బాగవుతుందనుకోవద్దు. నీ భర్తకు బాగుండచ్చు కానీ కుట్లు మరీ బిగుతై పోయి కలయిక భరించలేనంత నొప్పిగా ఉండి దాంపత్య జీవితం పట్ల భయం కలుగవచ్చు. మధ్య మధ్యలో యోని నించి రక్తప్రావం అవుతూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి.’

డాక్టర్ చెప్పే మాటల్లోని సారాంశం భరోసా హెచ్చరిక  సుశీలకి యెక్కలేదు. జీవితంలోని అభద్రతే ఆమెని భయపెట్టింది. అందుకున్న యితరేతర కారణాలని కూడా రచయిత సుశీల అంతర్మథనం ద్వారా స్పష్టం చేస్తుంది. నిజానికి సుశీల ‘పెళ్ళైన వాడని తెల్సీ’ ఎందుకో శంకర్రావంటే  ‘పిచ్చి ఆకర్షణ కలిగి అతనితో పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసేస్కుంది. అమ్మ, నాన్న వెళ్ళగొట్టారు. అతని మొదటి భార్య విజయ ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికింది . ఆమెకిద్దరు మగ పిల్లలు. తనకు కవల ఆడపిల్లలు పుట్టారు.’

సుశీలకి పెళ్లై నాలుగేళ్లే. కానీ దాంపత్య జీవితంలో ఎన్ని రకాల దు:ఖాల్ని మోసుకు తిరుగుతుంది? అందుకు కారణం తాను వొదులై పోవడమా? ఆడపిల్లల్ని కనడమా? రెండో భార్య కావడమా ?ఆమెకు అర్థం కాదు. అసలు కారణం శంకర్రావులోని చావనిస్ట్ మగాడు. కన్న బిడ్డలు తండ్రి ప్రేమకి దూరం కాకుండా వుండడానికి ఆమె తోటి స్త్రీతో పోటీకి దిగింది. భర్త తన కొంగు వదలకుండా వుండేలా చేసుకోడానికి దేనికైనా సిద్ధపడింది. తన శరీరాన్ని పణ్య వస్తువు చేసుకొని మొగుడిని ఆకర్షించే ఆలోచనలు చేసింది. ఆకట్టుకొనే దారులు వెతికింది. అటువంటి పరిస్థితుల్లో పక్కింటి సుమతి   [పేర్ల ఎంపికలో కూడా రచయిత్రి  దృక్పథం వ్యక్తమౌతుంది ; స్త్రీని కేవలం శరీరంగా , సెక్స్ అవసరాలు తీర్చే యంత్రంగా భావించే శంకర్రవులాంటి శృంగార పురుషుల్ని అన్నివిధాలా సుఖపెట్టడానికే అంకితమైన – పాతివ్రత్య ధర్మాలు జీర్ణించుకొన్న పురాణ పాత్రలు ]  మాటలు సుశీలకి అమృతోపమమయ్యాయి.

కాన్పు అయ్యాక మానం వెడల్పుగా సాగుతుంది కదా భర్తకు తర్వాత కలయిక బాగుండాలని, అక్కడ బిగుతుగా ఉండాలని ఒక కుట్టు ఎక్స్‌ట్రా వేస్తార్లే. నేను నా రెండు కాన్పులకీ వేస్కున్నానాకు ముందే తెల్సు. డాక్టరమ్మని ముందే అడిగా. ఎక్స్‌ట్రా మనీ అడిగిందనుకో, కాపురం కంటే ఎక్కువా చెప్పు? మా ఆయనా పోరు బెట్టాడనుకో డాక్టరమ్మ ఎంత డబ్బడిగితే అంతిచ్చాడు తెల్సా ? నువ్వూ అట్లా చేయించుకోవాల్సింది’

సుమతి సుశీలతో అన్న మాటల్లో కాపురాలు కాపాడుకోటానికి దాంపత్య సంబంధాల్ని సడలకుండా చూసుకోడానికి స్త్రీలు పడుతున్న అవస్తలే కాదు ; ఎక్స్ ట్రా నాట్ లు డాక్టర్లకి ఎక్స్ ట్రా మనీ మూటలు కట్టడానికి యెంతగా తోడ్పడుతున్నాయో తెలుస్తుంది. అందుకు భర్తలు యెంత వుదారంగా వుంటారో దూరదృష్టితో ప్రవర్తిస్తారో అర్థమౌతుంది.

నా దగ్గర్కి ఆయన రావాలి మేడమ్‌. పిచ్చెక్కుతోంది ఆయన రాకపోతే. సెక్స్‌ కోసం కాదు మేడమ్‌ నాకు ఆయనంటే ప్రేమ. పిల్లలు నాన్న కావాలంటారు. నా దగ్గర ఆకర్షణ లేకపోతే ఎందుకొస్తారు మేడమ్‌? నాకు ఎక్స్ ట్రా నాట్‌ కావాలి . పల్లెటూల్లో కాన్పు కావడం వల్ల అక్కడ మీ లాంటి డాక్టరమ్మ కాకుండా మంత్రసాని తో కాన్పు చేయించుకున్నా . అందుకే వదులై పోయింది మేడమ్‌. నేను టైట్‌ చేయించుకోవాలనుకుంటున్నా.

అని సుశీల డాక్టరమ్మని ప్రాధేయపడింది. సుశీల యెదుర్కొన్న హైన్యం మనస్సుని కలచివేస్తుంది. స్త్రీని యింతగా బలహీనురాల్ని చేసున్న సామాజిక – సాంస్కృతిక నిర్మాణాల పట్ల క్రోధం కల్గుతుంది.

డాక్టరమ్మ వద్దని యెంత కౌన్సిలింగ్ చేసినా వినకుండా  సుశీల చేయించుకొన్న ఆపరేషన్ సఫలం కాలేదు. సంసారాన్ని నిలబెట్టుకోడానికి వేయించుకొన్న ఎక్స్ ట్రా నాట్ తో ఆమె భర్తని కట్టివేయలేకపోయింది. భర్త మీద అలవికాని ప్రేమను చూపుతున్నాను  అనుకొని అసమ దాంపత్యంలో హింసని అనుభవించింది.

‘కలయికలో నొప్పి భరించలేక గావు కేకలు పెట్టలేక పళ్ళు బిగువన కన్నీళ్ళు కారుతుంటే భరించింది సుశీల. తర్వాత కలయిక అంటే చచ్చేంత భయం ఏర్పడినా భర్త కోసం ఆ భయంకరమైన నొప్పిని భరించసాగింది. భర్త కళ్ళ ముందుంటే చాలు అనుకుంది.’

పంచ కన్యల పురాణ గాథలు – వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు , సిలికాన్ యింప్లాంటేషన్ లు వెజైనోప్లాస్టీ – ఎక్స్ ట్రా నాట్ ల వరకూ   అన్నీ లైంగిక తృప్తిని  పురుష కేంద్రంగానే నిర్వచించి డిజైన్ చేయడంలో భాగంగానే పడగ్గదుల్లోకి ప్రవేశిస్తున్నాయనే స్పృహ కథ చదువుతున్నంతసేపూ మనకు కలుగుతూనే వుంటుంది. దాంపత్యంలో సమ భావన , సమ భాగస్వామ్యం లేకుండా చేసిన పురుషస్వామ్య భావజాలంలోని హింస యెరుకవుతూనే వుంటుంది. ఒకరికి యిద్దరిని కట్టుకొని విలాసంగా రొమ్ము విరుచుకొని తిరిగే శంకర్రావుల కాళ్ళ దగ్గరే పడివుండాల్సిన అగత్యాన్ని , దుస్థితిని  స్త్రీలకు  కల్పిస్తున్న సమస్త  కారణాల పట్ల – భావజాలం పట్ల అసహనం కలుగుతుంది. కథ పొడవునా రచయిత వుద్దేశ్యం స్పష్టమౌతూనే వున్నప్పటికీ ముగింపు దగ్గరకొచ్చేసరికి  కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.

నొప్పి భరించైనా భర్తతో బంధాన్ని కాపాడుకోవాలని సుశీల అనుకొన్నప్పటికీ ‘ఎక్స్ ట్రా నాట్ మహిమ’ తో లభించిన భోగం మూడు నెలల ముచ్చటే అయ్యింది. సమస్య మళ్ళీ మొదటికి రావడంతో భర్త తిరస్కారంతో సుశీల బీపీ పెరిగి పక్షవాతానికి గురై ఆసుపత్రి పాలయ్యింది.

కథని నిర్మాణ పరంగా కొంత ఎడిట్ చేసుకొంటే బాగుండేది అనిపించినా రచయిత తాను చర్చించదలచుకొన్న సమస్యకి (కథా వస్తువుకి) – సుశీలనీ , పాఠకులకి – సుశీల పట్ల సానుభూతి చూపే మంజులనీ , సమస్య చుట్టూ నిర్మితమైన సామాజిక విలువలకీ భావజాలానికీ – సుమతినీ , రచయిత్రి గొంతుకి – డాక్టరమ్మనీ ప్రతినిధులుగా యెంచుకొని కథ నడిపినట్టు తోస్తుంది. ఇది కథలో దాగి వున్న అంతర్గత నిర్మాణం.

సుశీల వైవాహిక జీవితాన్ని మొదట్నుంచీ యెరిగిన ఆమె స్నేహితురాలు మంజుల దయనీయమైన ఆ పరిస్థితిని చూసి చలించిపోయింది. పాఠకులకి కలిగే ప్రశ్నలే కథ ప్రారంభం నుంచీ మంజులకి కూడా కలుగుతాయి. టీచర్ గా పనిచేస్తున్న మంజులకి జీవితంలో కొత్త పజిల్  యెదురైంది.

ముఫ్పై నిండిన మంజుల మొన్నొచ్చిన సంబంధానికి అవునని చెప్పాలో, కాదని చెప్పాలో తేల్చుకోలేకుండా ఉంది.

 

ఇదీ రచయిత్రి కథకిచ్చిన ముగింపు. పాఠక దృష్టికోణం నుంచి యిచ్చిన యీ  యేక వాక్యపు ముగింపు   కథలో రచయిత్రి చెప్పిన విషయాల గురించే గాక చెప్పని విషయాల గురించి , మంజుల అంతరంగంలో మెదిలిన అనేక ప్రకల్పనల గురించి యెంతగానో ఆలోచించేలా చేస్తుంది. రేపు తన భర్త కూడా శంకరరావు లాంటి వాడే అయితే అన్న సందేహం ఆమెకు కల్గిందని వొక్క మాటలో తెల్చివేయలేం. అటువంటి  సందేహ ప్రస్తావన కథ మధ్యలో కూడా వచ్చింది. మంజుల మనస్సులో కల్గిన వూగిసలాటకి కారణాలు కేవలం వైయక్తికమైనవి కావు. సుశీల – సుమతి – తనూ వ్యవస్థీకృత విలువలకి బానిసలవుతున్న పరిస్థితులన్నిటి గురించీ  విమర్శనాత్మక దృష్టితో విశ్లేషిస్తూ క్రాస్ రోడ్ల కూడలిలో ఆమె నిలబడింది.

 

స్త్రీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే హింస పట్ల భయం ,  పెళ్లి అనే వ్యవస్థ పట్ల అనుమానమూ  , స్త్రీపురుష సంబంధంలో  అసమానతలని వైరుధ్యాలని  సృష్టించిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలం వల్ల కాపురాల్లో సంభవించే  కల్లోలాల గురించిన  లోచూపూ ,  ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన అన్నీ వొక్కసారిగా ఆమెను చుట్టుముట్టి   వుంటాయి. పెళ్లి పేరున మొత్తం స్త్రీ జాతి అనుభవిస్తున్న బంధనాలు ఆమెను పెళ్లి గురించి పునరాలోచించేలా  చేశాయి.

 

సాధారణంగా ముగింపు వాక్యం రచయిత దృక్పథాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగ పడుతుంది. గీతాంజలి యీ కథని కేవలం ఎక్స్ ట్రా నాట్ గురించి మాత్రమే వుద్దేశించి రాయలేదనీ ముడివడని అసమ దాంపత్య సంబంధాలన్నిటినీ చర్చకు పెట్టడమే ఆమె లక్ష్యమనీ , పురుష ఆధిపత్య వ్యవస్థీ కృత విలువల్ని ప్రశ్నించడానికి ప్రేరేపించడమే ప్రధానమైన ఆశయమనీ  ముగింపు ద్వారా నిరూపించింది. ఆ ప్రయత్నంలో ఆమె అన్ని విధాల సఫలమయ్యింది.

మగవాళ్ళనందరినీ శంకరర్రావు పక్కన నిలబెట్టి ప్రకృతి సహజమైన స్త్రీ పురుష సంబంధాన్నే తిరస్కరించే దిశగా గాక మనస్సుతో నిమిత్తం లేకుండా దేహభాషకే పరిమితమైన  శృంగారంలో  తృప్తి – భావప్రాప్తి వంటి పదాల చుట్టూ అల్లుకొని వున్న పురుష  లైంగిక రాజకీయాల గురించి పాఠకులు ఆలోచించడానికి ఆస్కారం కల్గించడానికే రచయిత యిటువంటి open ముగింపుని యిచ్చినట్లు  తోస్తుంది.

మగవాళ్ళని సెన్సిటైజ్ చేయడం కూడా తన యీ కథల రచనోద్దేశాల్లో వుందని రచయిత్రి చెప్పినప్పటికీ  స్త్రీలను అనేక రూపాల్లో కట్టిపడేస్తున్న “బంధాల” గురించి సరైన అవగాహన కల్గించడానికి యీ కథ బలంగా దోహదం చేస్తుంది. ప్రధాన స్రవంతిలో యిటువంటి కథలు మరెన్నో  రావాల్సి వుంది. ఆ దిశలో డా. గీతాంజలి చేస్తున్న కథా వ్యాసంగాన్ని మనసారా స్వాగతిస్తున్నాను.

 

తక్షణ క్రియాశీలత కోరే ‘అసందిగ్ధ కర్తవ్యం’

 

  

-ఏ.కె. ప్రభాకర్

~

 

 “మనది దేశంలో అతి పెద్ద రసాయనిక కర్మాగారం. మనవి అత్యంత కీలకమైన ఉత్పత్తులు … కికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలిస్తే ఆనందంతో కేరింతలు కొట్టి మిఠాయిలు పంచుకొనే ‘వాళ్ళ’ ను కీలక స్థానాల్లో కూర్చుండబెట్టి నిశ్చింతగా కునుకు తీయగలమా? … పై పదవుల్లో ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అనధికారికంగా , దేశభక్తి అనే అంశాన్ని కూడా గుర్తించాలి”

 • -అసందిగ్ధ కర్తవ్యం (ఆడెపు లక్ష్మీపతి)

రాజ్యాంగంలో పొందుపరచిన సమాన హోదా , సమాన అవకాశాలు (Equality of status and opportunity) అన్న  ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే పై విధమైన ఆలోచన మన సమాజంలో యెప్పుడు మొదలైందో తారీఖులు దస్తావేజుల్తో చెప్పలేక పోవచ్చుగానీ , అది యివ్వాళ వ్యవస్థాగతంగా ఆధికారికంగానే అమలౌతుంది. మనువాద పాలకులకి సెక్యులరిజం బూతుమాటయి ‘అసహనం’ కలగజేస్తుంది.

మతతత్త్వం దేశభక్తి ముసుగేసుకొని చట్టసభల నేలమీద వికృతంగా నాట్యం చేస్తున్న ప్రత్యక్ష రాజకీయ సందర్భంలో మనం జీవిస్తున్నాం. ఫాసిస్టు శక్తులు హిందూ రాజ్య స్థాపన నినాదంతో  జాతీయవాదాన్ని భుజానికెత్తుకొని లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనల్ని రూపుమాపడానికి ప్రణాళికా బద్ధంగా  ప్రయత్నిస్తున్నాయి. దేశాధ్యక్ష యెంపికల్లో  రాజకీయ కుట్రలు జరగడం , మతం అందుకు సాధనంగా మారడం మనకు కొత్త కాదు కానీ ప్రభుత్వ యంత్రాంగంలో పాలనా వ్యవహారాల ప్రధాన శాఖల్లో విశ్వవిద్యాలయాల్లో కీలక పదవుల్లో ‘సొంత మనుషుల్ని’ నియమించుకొని  ‘దేశద్రోహుల్ని’ యేరిపారేసే ‘ప్రక్షాళన’ కార్యక్రమం యిటీవల వూపందుకొంది. ఈ వ్యూహం మతవాద హంతకుల చేతికి బాహాటంగానే ఆయుధాలు అందిస్తుంది.

గుజరాత్ ప్రయోగాన్ని దేశమంతటా అమలు చేసే యీ తతంగానికి వొక నిర్దిష్టమైన  ఆధిపత్య ఫిలాసఫీ వుందని ప్రగతిశీలవాదులు గ్రహించి అప్రమత్తమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరుగుతూనే వుంది. కేవలం సంఘటన జరిగినప్పుడే కాకుండా వ్యక్తులూ సమూహాలూ  నిరంతర స్వీయ చైతన్యంతో వున్నప్పుడు మాత్రమే లౌకిక ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోగలం. సామాజిక దైనందిన జీవితాల్లోకి చాపకింద నీరులా చొచ్చుకొచ్చిన మతవాదుల ప్రమేయాల గురించి హెచ్చరిస్తూ నిర్దిష్టంగా  స్పష్టమైన అవగాహనతో ఆడెపు లక్ష్మీపతి రాసిన విశిష్టమైన కథ

’( ఈ వారం జనవార్త , 24 ఫిబ్రవరి , 2 మార్చి 2008 – కథాసాహితి ,కథ 2008 లో పునర్ముద్రితం ).

తెలంగాణా కథా రచయితల్లో విలక్షణమైన శైలి లక్ష్మీపతిది. డెబ్భై యెనభైల్లో అల్లం రాజయ్య , బి యస్ రాములు , తుమ్మేటి రఘోత్తం రెడ్డి , పి చంద్ మొదలైన రచయితలు నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాటాన్నీ అడవిలో వెన్నెలలా విరగ పూసిన గిరిజన గూడేల చైతన్యాన్నీ బొగ్గుగుట్టల్లో కార్మిక వాడల్లో రగిలిన అగ్గికణాల్నీ కథలుగా మలిచిన రోజుల్లోనే  కరీంనగర్ కల్లోల పొత్తిళ్ళలోనే కలం తెరచిన రచయిత ఆడెపు లక్ష్మీపతి. అయితే రాకాసి బొగ్గుగనుల నేపథ్యం నుంచీ , గల్లీదాదాగిరీ స్వైరవిహారం చేసే పారిశ్రామిక వీథుల్లోంచీ , సెమీ అర్బన్ సంస్కృతిలో నెలకొన్న అరాచక స్నేహాలనుంచీ , జేమ్స్ జాయిస్ , వర్జీనియా వుల్ఫ్ , టాల్ స్టాయ్ , మామ్ , కుష్వంత్ సింగ్ , అబ్బాస్ , ముల్కరాజ్ ఆనంద్ మొ. విదేశీ – స్వదేశీ కలాల మీదుగా నడిచి రావడం మూలాన లక్ష్మీపతి కథారచనలో తనదైన ప్రత్యేకతని సాధించుకోగలిగాడు. జీవన్మృతుడు , తిర్యగ్రేఖ , ముసల్దాని ముల్లె , వ్యభిచారం , నాలుగు దృశ్యాలు, విధ్వంస దృశ్యం , త్రిభుజానికి నాలుగో కోణం , అసందిగ్ధ కర్తవ్యం వంటి కథలు వస్తు స్వీకరణలో – శిల్ప నిర్మాణంలో –  కథన సంవిధాన రీతిలో లక్ష్మీపతి చూపించిన వైవిధ్యం తక్కిన సమకాలీన రచయితల నుంచీ అతణ్ణి వేరుచేసి చూడడానికి కారణమౌతుంది.

తెలంగాణాలో  అప్పుడప్పుడే రూపొందుతోన్న ఆధునికానంతర సమాజంలో చోటుచేసుకొంటున్న సంక్లిష్టతల్ని లక్ష్మీపతి పట్టుకొన్నంత వొడుపుగా అతని సమకాలికులెవరూ పట్టుకోలేదంటే తప్పు కాదేమో! ఆ సంక్లిష్టతల్ని ఆవిష్కరించడానికే అతను కావాలనే విభిన్న శిల్పరీతుల్ని వుపయోగించి కథలు అల్లాడు. వస్తురూపాల్లో కొత్తదనం కోసం నిరంతరం తపించాడు. ఇమాన్యుయేల్ కాంట్ ఖలీల్ జిబ్రాన్ సీల్ గ్రాంట్ వంటి రచయితల కథనరీతుల్ని అధ్యయనం చేసిన నేపథ్యం నుంచీ రూపొందినదని విమర్శకుల మెప్పు పొందిన అరుదైన కథ  ‘అసందిగ్ధ కర్తవ్యం’ .

లక్ష్మీపతి యీ కథ రాసింది 2008 లో .  కానీ అప్పటికంటే యిప్పుడు  – సమాజపు ప్రధాన స్రవంతి ఆలోచనల్లో సైతం హిందూ – ముస్లిం అనే ద్విజాతి సిద్ధాంతాన్ని వేళ్ళూనికునేలా , పాలకుకులే ప్రధాన రాజకీయ యెజెండాగా పెట్టుకొని వొక పూనికతో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న సందర్భంలో – ఆ కథ  అవసరం యెక్కువగా వుంది. దాని ప్రాసంగికతను తెలుసుకోడానికి ముందు కథలోని వస్తువు క్లుప్తంగా :

కథ యెంత సరళమైందో అంతక్లిష్టమైంది. పబ్లిక్ రంగానికి చెందిన రసాయన కర్మాగారంలో ఇంజనీర్ గా అంకిత భావంతో పనిచేసే  మౌళి అనే ప్రధాన పాత్ర  అంతరంగ సంక్షోభంగా వుత్తమపురుష దృక్కోణంలో కథ నడుస్తుంది. అతని మానసిక క్షోభకి కారణం వొక వుద్యోగి ప్రమోషన్ విషయమై  పై అధికారులతో యేర్పడ్డ వివాదం.

‘సమయపాలన , విధేయత , విషయపరిజ్ఞానం , విశ్లేషణాపటిమ , రిస్క్ తీసుకొనే చొరవ , నాయకత్వ లక్షణాలు … వగైరా అంశాల్లో మామూలు ‘సంతృప్తికరం’ కన్నా మరింత ఉన్నతమైన రిమార్కులు పొంది వెరసి ‘చాలా మెరుగైన’ అభ్యర్థిని’ ఫోర్ మెన్ స్థానం నుంచి మెరిట్ కేటగరీలో యింజనీర్ గా ప్రమోట్ చేయాలని మౌళి చేసిన సిఫారసు అతని పై అధికారులు చీఫ్ డిప్యూటీ చీఫ్ ఇండస్ట్రియల్ యింజినీర్లకి , పర్సనల్ మేనేజర్ కి నచ్చలేదు. కారణం ఆ అభ్యర్థి అబ్బాసలీ అనే ముస్లిం.

అబ్బాసలీ ముస్లిం అయిన వొకే వొక్క కారణంగా  ప్రమోషన్ కి అనర్హుడై పోయాడు. మతం  ‘పుట్టుమచ్చ’తో దేశద్రోహి అయిపోయాడు. తమకి అనుకూలమైన ‘టెంపుల్ కమిటీ మెంబర్’ని ‘నమ్మకస్తుడిగా’ అందలమెక్కించాలంటే , అబ్బాసలీని చీడపురుగులా చూపాలంటే – చూపి యేరిపారేయాలంటే యేదో వొక కేసు అతని మీద బనాయించాలి. ఉద్యోగ విధుల్ని సరిగా నిర్వర్తించడం లేదని నిరూపించి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. లేదా దేశద్రోహి ముద్ర వేయాలి. వృత్తి పట్ల అతని నిబద్ధతని బద్నాం చేయాలి   ( జె యెన్ యూ లోనూ హెచ్ సి యూ లోనూ  యిటీవలి వ్యవహారాలు గుర్తు రావడం లేదూ!). నిఘా షురూ. వేట మొదలు. అబ్బాసలీ డ్యూటీలో వుండగా లెబనీస్ ఫిలాసఫర్ రాసిన పుస్తకం అతని టేబిల్ మీద కనిపించిందని  (చదువుతున్నాడని కాదు) వింత ఆరోపణ. అందులో యే ఫండమెంటల్ సిద్ధాంతాలున్నాయోనని  విచిత్రమైన అనుమానం. అతనికి వ్యతిరేకంగా డిపార్ట్ మెంటల్ స్థాయిలో డిసిప్లీనరీ యాక్షన్ మౌళియే తీసుకోవాలి. కాదంటే మౌళిని యిరుకున పెట్టడానికి ఫ్యాక్టరీ వ్యర్థాలని వూరి చెరువులోకి వదిలిన కారణంగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత కేసును వెలికి తీస్తారు. అందుకు అతణ్ణి బాధ్యుణ్ణి చేసే వ్యూహాన్ని రచిస్తారు. దీన్నుంచీ బయట పడాలంటే అతను తన సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలి. అబ్బాసలీ కెరీర్ ని నాశనం చేయాలి.

ఈ సందర్భంలో సెక్యులరిజం గురించి దేశభద్రత గురించి అంతర్జాతీయ ‘ఉగ్రవాదం’ గురించి ప్రతిభ గురించి ప్రమాణాల గురించి ముస్లింల ప్రొఫైలింగ్ విషయమై దేశంలో ‘చాప కింద నీరులా అమలవుతున్న విధానాల’ గురించి గ్లోబల్ సందర్భం గురించి పై అధికారుల ముఖత: రచయిత పలికించిన మాటలు రాజ్యాంగం దేశ పౌరులకిచ్చిన హక్కుల్ని పాలక వర్గాలు యెంత బేఖాతర్ చేస్తున్నాయో స్ఫుటంగా తెలియజేస్తాయి.

ఆబాల్యం నమ్మిన – అమ్మ శిక్షణలో నేర్చుకొన్న విలువలకీ వుద్యోగంలో యెదురైన ధర్మసంకట పరిస్థితికీ మధ్య నలిగే మౌళి ‘పంటి నొప్పి’ కారణంగా మెడికల్ లీవ్ పెడతాడు. దాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకోడానికి అధికారులు శాంక్షన్ చేస్తారు. కానీ చివరికి మౌళి అబ్బాసలీకి న్యాయం చేయడానికే నిశ్చయించుకొని యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. అయితే అతనా నిర్ణయానికి రావడానికి కారణమైన చిన్ననాటి సంఘటనే కథకి ఆయువుపట్టు. ఆ సంఘటనకీ పంటి నొప్పికీ వున్న సంబంధాన్ని విప్పి చెప్పడానికీ , ఆ సంఘటనని కథలోకి అన్ ఫోల్డ్ చేయడానికీ లక్ష్మీపతి యెన్నుకొన్న టెక్నిక్కే కథని వుత్తమ కళాఖండంగా రూపొందడానికి దోహదం చేసింది.

సెలవులో వున్న మౌళి టౌన్ షిప్ సంక్షేమ సమితి నిర్వహించే ఉగాది వారోత్సవాల్లో అతని కూతురు నటిస్తున్న ‘చిట్టచివరి యుద్ధం’ నాటికని చూడ్డానికి వెళ్తాడు. ‘ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం గనుక సంభవించి పరస్పర మత, జాతి విద్వేషాలతో వివిధ దేశాలు ఒకదానిపై మరొకటి వినాశకర అణ్వస్త్రాలు , జీవ రసాయనిక ఆయుధాలు ప్రయోగించుకున్నట్లయితే …’ అన్నది నాటిక వస్తువు. స్టేజి మీద యుద్ధరంగాన్ని మౌళి మనసులో ఆశలకూ ఆశయాలకూ నడుమ , అంతరాత్మ ప్రబోధానికీ కెరీరిస్టు ప్రలోభానికీ మధ్య జరిగే సంకుల సమరాన్ని , పంటి నొప్పిని కొల్లేజ్ చేస్తూ గత వర్తమానాల మధ్య కథని ముందుకీ వెనక్కీ స్వింగ్ చేస్తూ చెప్పిన తీరు అమోఘం.

స్టేజి మీద ప్రదర్శన జరుగుతూండగా మౌళికి ‘ఎవరైనా బలంగా కొట్టారా మిమ్మల్ని?’ అని డెంటిస్ట్ అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. కంపినీలో ప్రమాదం సంభవించినప్పుడు అబ్బాసలి ప్రాణాలకి తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సంఘటన కళ్ళ ముందు కనిపిస్తుంది. అతని ప్రమోషన్ని అడ్డుకొనేందుకు పై అధికార్లు పన్నుతోన్న కుట్రలు , వాళ్ళతో తన ఆర్గ్యుమెంట్లూ జ్ఞప్తికొస్తాయి. ప్రదర్శనలో కోతి పాత్రలో యెంతో చురుగ్గా అద్భుతంగా నటిస్తున్నబాలనటుణ్ని చూస్తే చదువులో ఆట పాటల్లో అందరికన్నా ముందుండే తన బాల్యమిత్రుడు సలీం గుర్తొచ్చాడు. ఈర్ష్యతో తను అతనికి చేసిన ద్రోహం , అందుకు అమ్మ తనని బలంగా మూతి మీద కొట్టిన దెబ్బ ‘మస్తిష్కంలో తుఫానులా’ అలజడి చేశాయి. అలాంటి ‘తప్పు ఇంకెప్పుడూ చేయకు’ అన్న అమ్మ హెచ్చరిక తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశించింది. నాటికలో థియేటర్లో ముందువరసలో కూర్చొన్న చీఫ్ యింజినీర్ కళ్ళలోకి నిర్భయంగా చూపులు కలిపి  సెలవు కేన్సిల్ చేసుకొన్నట్టు భార్యకి చెబుతాడు.

స్టేజి పై పిల్లల నాటక ప్రదర్శన  , ప్రేక్షక స్థానంలో కూర్చొన్న మౌళి అంతరంగ శోధన , బాల్యంలో  ముస్లిం స్నేహితుడు సలీం జ్ఞాపకాలు , అతని పట్ల తన ప్రవర్తన , అమ్మ బోధించిన జీవితపు విలువలు వాటిని పాటించలేకపోతున్న అపరాధ భావన , చేసిన తప్పుని దిద్దుకోవాలనే తపన … కథకి అవసరమైన వాతావరణాన్ని, మౌళి  అంతరంగ సంక్షోభ చిత్రణకి కావాల్సిన సంఘర్షణని , యేకకాలంలో మనశ్శరీరాలనుభవించే వేదననీ  కథలోకి తీసుకురావడంలో , వొకేసారి నాలుగు స్థల కాలాల్లో గత వర్తమానాల మధ్య వూయలూగే కథన నిర్మాణంలో లక్ష్మీపతి చూపిన నేర్పు అబ్బురపరుస్తుంది.

వస్తువు రచయిత స్వీయ వుద్యోగ జీవితానుభవం నుంచీ తీసుకున్నందువల్ల , యిన్ సైడర్ కథనం కావడం వల్ల  కథకుడి విషయ పరిజ్ఞానం పట్ల పాఠకుల్లో విశ్వసనీయత కలుగుతుంది. ఫ్యాక్టరీ పాలనా వ్యవహారాలన్నీ ఆధిపత్య మత కుల శక్తుల అధీనంలో వున్నాయని చెప్పడానికి ప్రతి సూక్ష్మాంశాన్నీ రచయిత పరిగణనలోకి తీసుకొన్నాడు( అధికార్లకి పెట్టిన భార్గవ కాశ్యప్ వర్మ వామనరావు వంటి పేర్ల దగ్గర్నుంచీ ).

స్టేజిపై జరిగే ప్రదర్శనని  సమాంతరంగా నడపడం వల్ల అందులోని సన్నివేశాల్ని పాత్రల్ని మౌళి అంతరంగ సంక్షోభానికి కారణమైన సంఘటల్ని వ్యక్తుల్నీ పోల్చి చూసుకొనే అవకాశం రచయితే కల్పించాడు. స్టేజి మీద యుద్ధం మౌళి లోపల యుద్ధం అన్నంత వరకూ , ఏంజిల్ పాత్రలో అనుపమని (మౌళి కూతురు) చూసినపుడు అమ్మ గుర్తుకురావడం , నాటిక పోటీలో ప్రతిభకి గుర్తింపుని అబ్బాసలీ ప్రమోషన్ తో ముడిపెట్టడం వరకూ   బాగానే వుంది కానీ …. నాటికలో  సూక్ష్మ క్రిమి గుర్రం పాము సింహం చివరి మనిషి  వంటి పాత్రలు యేవి యెవరికి ప్రతీకలుగా వున్నాయో తెలుసుకోవడంలో కొంత గందరగోళం యేర్పడి పాఠకుడికి మానసిక శ్రమ కలుగుతుంది. అయితే మౌళి ఆలోచనల్లో సుదూర – సమీప గత వర్తమానాల మధ్య వారధిలా , మరీ ముఖ్యంగా సలీం జ్ఞాపకాలని తవ్వడానికి , ప్రదర్శన చక్కగా వుపయోగపడింది. అంతిమంగా మనిషి మానవీయ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని బోధించింది. కథలోనూ కథ లోపలి కథలోనూ అంతస్సూత్రంగా వున్న యీ సారాన్ని ముడివేయడానికి లక్ష్మీపతి అడుగడుగునా మెలకువతో వర్తించాడు.

సలీం మౌళిల మధ్య చోటుచేసుకొన్న వైరుధ్యంలోని సామాజిక కోణాన్ని ఆవిష్కరించడంలో సైతం రచయిత గొప్ప కౌశలం చూపాడు. సలీం ‘చదువులోనూ ఫస్టు. ఆటల్లోనూ ఫస్టు’. వాడికన్ని శక్తి సామర్థ్యాలు యెక్కడివంటే – వాడి ‘ఇంట్లో ఎద్దు మాంసం తింటార’ ని మౌళి మిత్రులకి  చెబుతాడు. అదే విధంగా మౌళి  మిత్రులంతా కోతికొమ్మచ్చి ఆడడానికి ‘తెల్లగున్నోడు దొరా , నల్లగున్నోడు దొంగ’ అని చప్పట్లు వేసినప్పుడు ‘సలీంది తెల్లనిదీ మిగతా ముగ్గురివీ నల్లనివీ’ వస్తాయి. ఆట నీతి ప్రకారం సలీం దొంగ కాకూడదు. కానీ ఆటలోని సహజ న్యాయాన్ని ‘మెజార్టీ’ బలంతో రద్దుచేసి మౌళి సలీంని దొంగగా తీర్మానిస్తాడు. పాపం సలీం మౌనంగా అంగీకరిస్తాడు. అలా సమకాలీన సమస్యలుగా పరిణమించిన బీఫ్ తినడం , మెజార్టీ ఆధిపత్యం వంటి విషయాలు కథలోకి అలవోకగా వచ్చి చేరాయి.

ఈ కథ యిప్పుడు రాసి వుంటే యీ విషయాల్ని రచయిత కథలో పనిగట్టుకు చొప్పించినట్టు భావించడానికి అవకాశముండేది. కానీ 2008 లోనే యింత లోతైన అంశాల్ని కథలో ప్రస్తావించిన లక్ష్మీపతి క్రాంతదర్శిత్వాన్ని మెచ్చుకోకుండా వుండలేం. అడ్డగోలు పారిశ్రామికీకరణ కారణంగా జీవితాలు విచ్ఛిన్నమైన తన ప్రాంత  ప్రజల  తీరని వెతల్ని స్టోరీగా రిపోర్ట్ చేసిన కడప గ్రామీణ విలేకరి ముస్లిం అయిన కారణంగా (ఇస్మాయిల్) వార్తా పత్రిక ఎడిటర్ అతణ్ణి ‘హిందూ సంపద’కి వ్యతిరేకిగా ముద్రవేసి పత్రికలో న్యూస్ స్టోరీని తిరస్కరించడాన్ని అద్భుతంగా చిత్రించిన కేతు విశ్వనాథ రెడ్డి ‘విరూపం’ కథ (2002) కూడా నాకీ సందర్భంలో  గుర్తుకొస్తుంది. పాఠకులు పాఠ్యం లోతుల్ని అర్థం చేసుకొని రచయిత దృక్పథాన్ని అందుకోడానికి  అవసరమైన పరికరాలు కథ బయటకన్నా కథలోనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిళితమై వుంటాయని  చెప్పడానికి ఆడెపు లక్ష్మీపతి ‘అసందిగ్ధ కర్తవ్యం’ గొప్ప వుదాహరణ. శిల్పం వస్తువుని వున్నతీకరించడానికి యెలా దోహదం చేయగలదో  తెలుసుకోడానికి లక్ష్మీపతి కథలు పాఠ్య గ్రంథాల్లా వుపయోగపడతాయని చెప్పడం యే మాత్రం అతిశయోక్తి కాదు.

తిండిని సంస్కృతిలో భాగంగా భావించిన బుద్ధిజీవులు బీఫ్ ని నిషేధించడం దళితుల మైనార్టీల సాంస్కృతిక అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా , భారతీయ సమాజంలోని బహుళత్వాన్ని నాశనం చేసే యెత్తుగడగా  అభివర్ణిస్తూ వ్యాఖ్యానించడం తరచుగా వింటున్న కోణమే. అయితే నా మట్టుకు నాకు లక్ష్మీపతి రాసిన  ‘అసందిగ్ధ కర్తవ్యం’  చదివాకా యిటువంటి నిషేధం ప్రత్యేకంగా కొన్ని సెక్షన్ల పౌరుల్ని శారీరికంగా బౌద్ధికంగా బలహీనులుగా మార్చడానికి రహస్యంగా నిర్మించుకొన్న అజెండానేమో అన్న అనుమానం సైతం కలుగుతుంది. అంతే కాదు కథలో ఆటలో సలీంని ‘సీసాపెంకుల్లోకి తోసేయాలన్న పాడు ఆలోచన’ మౌళికి కలిగినందుకు అతని అమ్మ యెంతో నొచ్చుకొంటుంది. సలీం తల్లిదండ్రుల్ని ‘రసూల్ మామ బీబీ అత్త’ అని పేర్కొని వాళ్ళ పట్ల సహానుభూతినీ ప్రకటిస్తుంది. తెలిసో తెలీకో కొడుకు చేసిన తప్పుని భవిష్యత్తులో తిరిగి చెయ్యొద్దని శాసించింది.

మౌళి చిన్నతనంలో మన సమాజంలో వుండిన యీ స్నేహ బాంధవ్యాల్ని మాయం చేసి విభజన రేఖలు సృష్టిస్తున్న ‘అసాంఘిక’ శక్తులు యివాళ రెచ్చిపోతున్నాయి. వాటిని  అణచివేయాల్సింది పోయి  వాటికి పాలకులే వత్తాసు పల్కుతున్న సందర్భంలో అబ్బాసలీకి అండగా నిలవడానికి మౌళి నిశ్చయించుకొన్నాడన్న ముగింపు గొప్ప భరోసానిస్తుంది. ‘ద్వేషంతో ఏకపక్ష కోణంలోంచి ఆలోచించకండి’ అని నాటక ప్రదర్శనలో హితవు పల్కిన ఏంజిల్ వేషం కట్టిన కన్నకూతురిలో కన్నతల్లిని చూసుకొని తప్పు దిద్దుకొని ‘మనిషిని కాపాడడానికి’  సిన్సియర్ వుద్యోగిగా తనకున్న సమస్త శక్తులూ –  అస్త్ర శస్త్రాలు -వుపయోగించడానికి వెనుకంజ వేయని మౌళిలోని క్రియా శీలతని అందిపుచ్చుకోవడమే యివ్వాళ మనముందున్న అసందిగ్ధ కర్తవ్యం.

 

*

 

 

 

నేను..!

 shajahana cover
– షాజహానా
~
”నీతో మాట్లాడ్డానికేం లేదు. ఒక్క దేహభాషతో మాత్రమే నీతో మాట్లాడగలను. నీ దేహం అంతిష్టం నాకు. దేహమే మొదలు దేహమే అంతిమం. ఒబామా గురించి మాట్లాడ్డానికి నాకు చాలా మంది మిత్రులున్నారు. నాకు త్వరగా సమాధానం కావాలి. నేను నువ్వనుకున్నట్లు నిన్ను ప్రేమించడం లేదు. నాకు ప్రేమంటే శరీరంలో ఒక భాగం మాత్రమే. శరీరమే ముఖ్యం. నీ మాట కోసం చూస్తుంటాను.”
***
”ఎందుకు వేరే మాట్లాడకూడదు? నేను శరీరం తప్ప ఏమి లేనిదాన్నా? అవయవ సౌష్ఠవం ఉన్నంత మాత్రాన, ముఖవర్చస్సు ఉన్నంత మాత్రాన నేనేమి మాట్లాడ కూడదా? నాకు నీతో ఈ ప్రపంచంలోని విషయాలన్ని మాట్లాడాలని కదా ఉంటుంది? నిన్ను నేను మనసా వాచా కర్మణా ఒక మనిషిని ఎంత ప్రేమించాలో అంతా ప్రేమించాను కదా; నాలో రేగే భావాలన్నింటిని శరీరం మాటున దాచి నీతో నేను… ఎలా?”
***
”అవును.. నువ్వు నాతో పడుకోవడాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మన మధ్య ఏ బంధాలు అనుబంధాలు ఉండవు. నాకు నువ్వు నచ్చావు. అలా అని దాన్ని ప్రేమనుకోకు. ప్రపంచం అందమైంది. నువ్వు దాన్ని కోల్పోతున్నావు. నేను దగ్గరుండి చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడు నన్ను రమ్మంటావు?”
***
”ఇలాంటి స్నేహితుడు నాకు దొరుకుతాడని కలలో కూడా ఊహించ లేదు. శరీరమే ముఖ్యమైతే ప్రపంచంలో ఏదో ఒక శరీరంతో సంతృప్తి చెందొచ్చు కదా! అయినా ఒక్కసారికే దేహదాహం తీరుతుందా? ఇలాంటి విషయాల్లో నేను ఎలా రియాక్ట్‌ అవుతానో కూడా అవసరం లేదా? నువ్వు బంధాలు కోరుకోవు, ప్రపంచం అందమైందని నాకు ఎలా చూపిస్తావు?”
***
”నీలాంటమ్మాయిలకు జీవితం గురించి తెలీదు. ఎలా లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యాలో తెలీదు. ప్రంపంచంలో నేనొక్కడినే మగాడిని కాదు, నాకు నువ్వొక్కదానివే ఆడదానివి కాదు. అందుకే అన్నాను ప్రపంచం అందమైందని. ఇంకా విడమరచి చెప్పాలంటే నీకు చాలా మంది మగ స్నేహితులు ఉండాలి అని నా ఉద్దేశం. కొన్ని రోజుల తర్వాత ఏం చెయ్యాలన్నా ఈ దేహం సహకరించదు. నాకు నువ్వు నీకు నేను నచ్చాక చర్చ లనవసరం, నన్నెపుడు రమ్మంటావ్‌? లేదా ఈ విశాల ప్రపంచంలోకి నువ్వు రా!”
***
”నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ, తాతయ్య, అన్నయ్య, ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధివాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే. ఇక్కడా నువ్వెదురై మనశ్శాంతి లేకుండా చేస్తున్నావ్‌? నువ్వలా అడిగిన దగ్గర్నించి నాకు నిద్ర దూరమైంది.. అన్నం సహించడం లేదు.. ఎప్పుడూ ఎదురుగా నువ్వొచ్చి పదేపదే అడుగుతుంటావ్‌. నేన్నీతో కలిసి నడుస్తాను, మాట్లాడతాను, నవ్వుతాను, బోలెడంత ప్రేమిస్తాను… అంతే, తప్ప నువ్వడిగింది నేనివ్వలేను. ఈ విశాల ప్రపంచం నాది కాదు… నేను ధైర్యంగా బయటికి రావడానికి. ఇక్కడ నేల మీద నా పేరున్నా నా అధికారం ఉండదు. నేను కన్న ప్రపంచం మీద నాకే హక్కు ఉండదు. స్కూళ్ళల్లో బస్సుల్లో ఇంట్లో ఆఫీసుల్లో కాలేజిల్లో  ఎక్కడన్నా నేను ధైర్యంగా ఉండగలిగానా? పుస్తకాల్లో తప్ప. నేను నీకోసం ప్రపంచంలో కొచ్చిన మరుక్షణం నాకిచ్చే ఇరుకుపదం ఏంటో కూడా నాకు తెలుసు? ఏది విశాల ప్రపంచం? ఏది అందమైన ప్రపంచం? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నీలో నామీద కోరికుంది, దానికి సంబంధించి దాపరికం లేదు ఒప్పుకుంటాను, కాని ప్రేమిస్తే అది బాధ్యతవుతుందనే కదా ప్రేమించడం లేదని అంటున్నావు. ప్రేమ లేని దేన్నీ నేనంగీకరించను.”
***
”నేన్నీకు ముందునుంచి చెప్తూనే వస్తున్నాను. ప్రేమించట్లేదని, అలా అని మోసం చేస్తున్నానని అనుకోకు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీమీద కలిగిన ఫీలింగ్స్‌ని ఉన్నదున్నట్లు నీకు చెప్పాను. నేన్నీ మేధస్సునో, ఓదార్పునో కోరుకోవడంలేదు. ఈ శరీరాన్ని నీ శరీరంలోకి ఒంపుకోవాలనుకుంటున్నాను. దానికి నువ్వింత మధనపడాల్సిన అవసరం లేదు. నీకు బాధ కలిగించే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకెప్పుడు నీకు ఎదురుపడను. మాట్లాడను, డిస్ట్రబ్‌ చేయను. ఎప్పుడయినా ఎవరిపైనైనా ఇలాంటి ఫీలింగ్స్‌ కలిగితే దాచుకోకు. నా గురించి ఆలోచించకు. నన్ను అనవసరంగా ప్రేమించకు.”
***
”నీకు ప్రేమంటే తెలీదు. మనుషుల విలువ మనసుల విలువ అంతకంటే తెలీదు. నువ్వు సమాజంలోనే పెరిగావా? అర్ధం కావట్లేదు. నీ నిజాయితీ చూస్తే అపురూపం అనిపిస్తుంది, కాని ప్రేమ లేకుండా కామం ఉంటుందంటే నేనంగీకరించను.. నేను ప్రేమించకుండా ఉండలేను, కాని మరచి పోకుండా కూడా ఉండలేను. మరపు నాకు నన్ను పెంచిన సమాజం నేర్పించింది. నేను పెంచి పెద్ద చేసిన పూలతీగలు, మేకపిల్లలు.. పిల్లి పిల్లలు, నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న, మా ఇల్లు ఇదే అని పరిచయం చేసిన ఇల్లు… ఎందుకూ పనికి రాని చదివిన చదువు అన్నింటిని మరచి పోయేలా చేసిన సౌకర్యవంతమైన సమాజం మనది.. ఇన్నింటిని మరచిపోయిన నేను నిన్ను మరచిపోలేనా? ఇంకెప్పుడూ ఏ అమ్మాయిని ఇలా మాత్రం అడక్కు. ఇంకెప్పుడు నాకు కనిపించకపోవడం నాకు మేలే? నీ లాంటి స్నేహితుడున్నాడని కొంత ఉపశమనాన్ని ఆనందాన్ని పొందేదాన్ని.. ఎప్పుడు తప్పిపోతాడో,  దూరమవుతాడో, ఎవరివల్ల దూరమవుతాడో అన్న బాధ నుంచి విముక్తం అవుతాను.”
***
-ఏం మనిషి? మగవాడిగా ఆలోచిస్తాడే తప్ప నా గురించి ఎందుకాలోచించడు? నాన్న అన్నాడు డిగ్రీ దాకా చాలమ్మ, పిజి చదివితే మళ్ళీ ఎక్కువ చదివిన వాడిని తేవాలి కదా; ఆలోచించు; కాబట్టి ఇక్కడికి చదువునాపెయ్యి. ఇంక నేను ఫీజులు కట్టలేను. కట్నం ఇవ్వాలి కదా? నాన్న మాటలకి తలొంచాలి ఎన్ని ఆలోచనలున్నా బుర్రలో. నేను కాసేపు నాన్నలా మారి నిజమే నిజమేననుకుని ఒప్పేసుకున్నాను కదా పెళ్ళికి, ఇక నాలో నేనెక్కడున్నాను? అమ్మకి ఎప్పుడయినా స్వేచ్ఛ ఉంటే కదా నా గురించి పట్టించుకోవడానికి; నాన్న చెప్పిందే వేదం. కొన్నాళ్ళు కలిసున్నందుకు అమ్మ కూడా మరో నాన్నే !
జీవితమంటే ఏం లేదు ఎదుటివాళ్ళని ఆక్రమించడమేనని అర్ధమై, మౌనమే భాషగా బతుకుతున్న మూగజీవితానికి పరిచయమైన లైబ్రరీ దోస్తు అతడు. ప్రపంచం మొత్తం అతడి మెదడులో నిక్షిపమై ఉందా అని అనుమానం వచ్చేది ఒకోసారి. అతడితో మాట్లాడితే కోల్పోయిందేదో దొరికినట్టనిపించేది, తడారిన మనసుకు జీవం వచ్చేది. అతడే నా కోల్పోయిన జీవన మాధుర్యాల చిరునామా అనుకున్నాను. మంచి స్నేహితుడనుకున్నాను. నాలో ఉన్న నాన్న మీంచి,  భర్త మీంచి, కొడుకు మీంచి తొంగి చూస్తుంటాడు, ఎంత ధైర్యం? క్రమంగా అతడి రూపం కూడా నాలో ఎవరూ తుడిపేయలేనంతగా తీర్చిదిద్దుకుంది. ఎంతమందిని మోయాలి నేను? వీళ్ళల్లో ఒక్కరిలో నైనా నేనున్నానా? ఎంత పరిమితితో ఉండి ఉంటాను?
అతడికి అంతే నేను అఖ్ఖర్లేదు. కావలసింది మనసు కాదు దేహం. కాకపోతే కక్కుర్తి లేదు, మోసం లేదు. అదొక్కటే కాదు కదా నన్ను నేను అర్పించుకోవటానికి, నన్ను నన్నుగా చూడలేకపోవటానికి అతడికి సవాలక్ష కారణాలు ఉండనీ. నా మనసుకు, కన్నీళ్ళకు, చిరునవ్వులకు నా ఆలోచనలకు దేనికీ ప్రాధాన్యం ఇవ్వని అహంకారి. నేను ఎలా అంగీకరించగలను? నేను అతడిని పూర్తిగా కొద్దిగా కొద్దిగా మర్చిపోతున్నాను… ఇప్పుడు నాకు లైబ్రరీ కూడా లేదు.. అతడు కూడా లేడు… ఇప్పుడు నేను ఖాళీగా కనపడుతున్నాను.
నన్ను పూరించుకోడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. పూరించుకోగలనో లేదో కూడా చెప్పలేను. కాని నన్ను నేను గుర్తించుకున్నందుకు ఆనందంగా ఉంది, నన్ను నేను పూర్తిగా ఖాళి చేసుకున్న ఆనందం అది!
shajahana invitation

గురి తప్పిన కథన బాణాలు!

 

-టి.చంద్ర శేఖర రెడ్డి 

~

అనిల్ ఎస్. రాయల్  రాసిన కథాయణం-వ్యాససంకలనంలో దృక్కోణం-1, దృక్కోణం-2 అని రెండు అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాల్లో,  రాసే కథని ఎవరి పరంగా చెప్పాలి అనే దానిమీద ఒక వర్గీకరణ ఉంది.

అందులో మొదటిది ‘ఉత్తమ పురుష’.

ఉత్తమపురుష కథనంలో కథకుడే స్వయంగా ఒక పాత్ర ధరించి కథ చెబుతాడు. అది ఒకటే పాత్రయితే ‘నేను’ కథ చెబుతాడు/చెబుతుంది. పాత్రలు అంతకన్నా ఎక్కువైతే ‘మేము’ కథ చెబుతారు.

దృక్కోణం-1 అనే అధ్యాయంలో ‘ఉత్తమపురుష’ కథనం ఎలా సాగాలి అన్న విషయం మీద కొన్ని సూచనలున్నాయి. ఈ సూచనలు ఇతర రచయితలు/రచయిత్రులు రాసిన కొన్ని తెలుగు కథల్లో ఎలా అమలయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి అన్నది తెలుసుకోవటానికి నేను-కథ 2014 అనే కథల సంపుటిని పరిశీలనకు ఎన్నుకున్నాను.

ఈ కథల సంపుటిలో మొత్తం 14 కథలు ఉన్నాయి. వీటిలో ఉత్తమపురుషలో చెప్పబడ్డ కథలు ఆరు.  అవి చావుదేవర-రచయిత్రి బత్తుల రమాసుందరి, గోధుమరంగు ఆట- రచయిత భగవంతం, నూనె సుక్క-రచయిత కొట్టం రామకృష్ణా రెడ్డి, భీష్మా…నాతో పోరాడు-రచయిత్రి రాధిక, ఐ హేట్ మై లైఫ్-రచయిత సాయి బ్రహ్మానందం గొర్తి.

నూనె సుక్క కథలో కొంత భాగం, అమ్మ చెపుతుంది. కాని, అమ్మ చెప్పిన కథాభాగం, కొడుక్కి  సంభాషణ రూపంలో చెప్పినట్లు ఉంటుంది. అంతే కాని ఆమె తనంతట తాను ‘నేను’ అని కథని చెప్పదు. మిగిలిన కథంతా, కొడుకు ‘నేను’ అని చెపుతాడు. కథలో సింహభాగం ఈ కథనమే ఆక్రమించింది.  అందుకని, అమ్మ మాటల తాలూకు భాగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఈ కథలో కథనాన్ని ఉత్తమపురుష కథనంగానే  స్వీకరించటం జరిగింది.

‘థూ’ కథని రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్- ‘నేను’ అంటూ చెప్పాయి.   అందుకని దీన్ని ఉత్తమపురుష లోనే బహుళ దృక్కోణ (Multiple Point of View) కథనంగా తీసుకోవడం జరిగింది. ఉత్తమపురుషలోఇది కథాయణంలో ప్రస్తావించబడని ఇంకో రకమైన ధోరణి.

పైన ఉదహరించిన ఆరు కథల్లో ఏ కథ కూడా, ‘మేం’ పరంగా చెప్పబడలేదు.

ఈ ఆరు కథల్లో-కథాయణంలో చెప్పబడ్డ సూచనలు ఎలా పాటించబడ్డాయో చూస్తే ఇదీ ఫలితం.

సూచన 1:

ఉత్తమపురుషలో కథ చెప్పేప్పుడు ‘నేను’ అనబడే కథకుడు, తన గురించి తాను వర్ణించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ఆకార విశేషాల, వేషభాషల వివరణ కథనానికి అత్యంత అవసరమైతే తప్ప చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పరోక్షవర్ణనకి దిగటం మెరుగు (వేరే పాత్ర ద్వారా సంభాషణలో చెప్పించటం, అద్దంలో పరికించి చూసుకోవటం, వగైరా).

ఎలా పాటించబడింది:

ఈ ఆరు కథల్లో, ఏ కథలో కూడా ‘నేను’ తనని తాను వర్ణించుకోలేదు.

సూచన 2:

ప్రధానపాత్రకి తెలిసిన విషయాలు, కథకి కీలకమైనవి, సస్పెన్స్ పోషించటానికో లేక ముగింపు దాకా పాఠకుల్ని మభ్యపెట్టటానికో ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టకూడదు.

ఎలా పాటించబడింది:

అలా తొక్కిపెట్టటం, ఏ కథలోనూ జరగలేదు.

సూచన 3:

కథ చెబుతున్న ‘నేను’ అనబడే వ్యక్తి పురుషుడా, మహిళా, చిన్నపిల్లవాడా, ముదుసలా… ఇటువంటి వివరాలు వీలైనంత త్వరగా పాఠకులకి చేరవేయాలి(ఆ వివరం దాచటం కథకి కీలకమైతే తప్ప).

ఎలా పాటించబడింది:

చావుదేవర,  ఐ హేట్ మై లైఫ్ కథల్లో; ‘నేను’ స్త్రీ అనే విషయం తో పాటు చిన్న పిల్లలనే విషయం కూడా  “పిల్ల భయపడింది’ అనే వాక్యం ద్వారా, “పరువు తీస్తున్నావు కదే?” అనే పదాల ద్వారా తెలుస్తుంది.

గోధుమరంగు ఆట, నూనె సుక్క కథల్లో; ‘నేను’ పురుషుడు అనే విషయం “ఈ ఎదురుగా ఉన్నవాడు తొందరగా వెళ్లిపోతే బాగుండును.” అనే వాక్యం ద్వారా,  “అమ్మ తాన కూకున్నోడ్ని”అనే పదాల ద్వారా  తెలుస్తుంది. ఇవే పదాలు, నూనె సుక్క కథలో ‘నేను’ చిన్నపిల్లాడు అనే విషయం కూడా చెపుతాయి.

భీష్మా…నాతో పోరాడు కథలో ‘నేను’ పేడి అనే విషయం 117 వ పేజీలో ఉన్న “మగ పిల్లవాడు పుట్టటం” అనే పదాలూ, అది ‘పాక్షికంగా నిజం’ అన్న విషయాన్ని 118 వ పేజీలో ఆ పాత్ర ప్రవర్తనా తెలుపుతాయి. ఆ తర్వాతి కథనం, ‘నేను’ పెరిగి పెద్దవాడయ్యాడనే విషయం చెపుతుంది.

ఈ వివరం చెప్పటానికి ‘గోధుమరంగు ఆట’ కథారచయిత అవసరమైనదానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నట్లు కనపడ్తోంది. అయితే, అది, పాఠకుడు కథను అనుసరించడానికి ఆటంకంగా పరిణమించలేదు.

థూ- కథని చెప్పిన రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్ గురించిన వివరాలని ఆ పేర్లే చెప్పాయి.

 

 

సూచన 4:

కథ చెపుతున్న పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు (ఇతరుల ఆలోచనలు, తాను లేని సన్నివేశాల్లో సంఘటనలు, వగైరా) ప్రస్తావించకూడదు.

ఎలా పాటించబడింది:

చావుదేవర, గోధుమ రంగు ఆట, ఐ హేట్ మై లైఫ్ కథల్లో ఈ సూచన ఖచ్చితంగా అమలైంది. నూనె సుక్క కథ ముందుకు నడవాలంటే, ‘నేను’ కి తాను లేని కొన్ని విషయాలు గతంలోవి తెలియాలి. కాని, అలా తెలియడం కథనానికి ఎన్నుకున్న ధోరణికి సరిపడదు. అందుకనే, కథకుడు అమ్మ మాటల ద్వారా ‘నేను’ కి ఆ విషయాలు తెలిసేలా చేశాడు. ఉత్తమ పురుష కథనానికి ఈ వెసులుబాటు లేదు. అయినా, కథలో సింహభాగం ఉత్తమపురుష కథన ధోరణికి లోబడి ఉంది కనక ఈ వైరుధ్యం ప్రశ్నార్థకంగా అనిపించలేదు.

భీష్మా…నాతో పోరాడు కథలో మాత్రం; ఒక్క చోట, 121 పేజీలో కుంతి తన కుమారులను సంస్కారవంతులుగా పెంచింది…దగ్గరనుంచి, ద్రౌపదిని అయిదుగురికి భార్యగా చేసింది-అనే పదాల వరకు; కథలో ’నేను’ తాను లేని చోట ఏం జరిగిందో తెలియపరుస్తుంది. ఈ భాగం ఒక్కటే, ఈ కథలో ఉత్తమపురుష కథనధోరణికి వ్యతిరేకంగా నడిచింది.

దృక్కోణం-2 అధ్యాయం మిగిలిన రెండు రకాల కథనం గురించి వివరిస్తుంది.

దాంట్లో ఒకటి  మధ్యమపురుష.

మధ్యమపురుష

ఉత్తమపురుష కథనంలో కథ ‘నా’ కోణం నుండి నడిస్తే, మధ్యమ పురుషంలో అది ‘నీ’ కోణంలో నడుస్తుంది. అలాంటి కథలు అరుదుగా కాని కనిపించవు. తెలుగు కథల్లో ఆ పద్ధతిలో చెప్పబడ్డ కథ వి. ప్రతిమ గారు రాసిన ‘విత్తనం’ కథ. ప్రాతినిధ్య- కథ-2014 సంకలనంలో ఉంది. సంకలనంలో చేరటానికి ముందు ఈ కథ చినుకు మార్చి 2014 సంచికలో, ‘మనిషి విత్తనం’ పేరుతో ప్రచురితమైంది. కథనంలో; నీ, నువ్వు, నిన్ను, నీకు-అనే పదాలే కాకుండా, ప్రధాన పాత్ర భర్తని మీరెడ్డి-మీ ఆయన, మీ అత్తగారు, మీ మామగారు, మీ అత్తగారి తల్లి, మీ అత్తమామలు అనటం కథ పఠనీయతని కొంచెం దెబ్బతీసింది. ఈ సందర్భాల్లో కూడా ‘నీ’ అని రచయిత్రి రాసి ఉండొచ్చును. కాని, అలా జరగలేదు.

మధ్యమ పురుష ధోరణిలో కథ చెప్పినపుడు; కథని చెపుతున్న వ్యక్తి తప్పనిసరిగా కథలో సంఘటనలకి సాక్షి అయి ఉండాలి. అది రచయిత/రచయిత్రి లేదా మరే ఇతర వ్యక్తి అయి ఉండాలి.  కాని, ఈ కథ ఇతివృత్తం దృష్ట్యా ఈ కథలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేనివి. అందువల్ల ఈ కథనధోరణి ఈ కథకి పూర్తిగా నప్పిందని అనిపించలేదు.

 

ప్రథమపురుష

మిగిలిన మూడో పద్ధతి కథనం-ప్రథమ పురుష. నా వర్గీకరణ ప్రకారం కథ 2014 కథాసంకలనంలో ఉన్న-ఆకులు రాల్చిన కాలం-రచయిత పాలగిరి విశ్వప్రసాద్, రోహిణి-తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, ఇస్సాకు చిలక-అద్దేపల్లి ప్రభు, నిశ్శబ్దపు చప్పుడు-మధురాంతకం నరేంద్ర, ప్రవల్లిక నిర్ణయం-యాజి, పాంచాలమ్మ పాట-స.వెం. రమేశ్, ది కప్లెట్-కల్పనా రెంటాల, వాళ్లు ముగ్గురేనా?-విమల; ఈ ఎనిమిది కథలూ ఈ పద్ధతి కథనంలో చెప్పినవి.

ఈ కథలు, ‘ప్రథమ పురుష’ కథనానికి ఎలా, ఎంతవరకు లోబడి ఉన్నాయి- అన్న విషయం మీద పరిశీలన మరో సారి.

-o)O(o-

 

కథలో మాండలికం ఎంత వరకూ?!

 

-టి. చంద్రశేఖర రెడ్డి

~

ఈ వ్యాసం-విభిన్న మాండలికాల్లో తెలుగు కథలు రాయటం గురించి.

ఒకప్పుడు కథలు గ్రాంథిక వచనంలో రాయబడేవి. తర్వాత అవి వ్యావహారిక భాషలో రావటం మొదలైంది. అడపాదడపా ఆ దశలోనే కథలు మాండలికంలో రావటం కూడా ఆరంభమైంది. ఈ ధోరణి ఊపందుకని ఇప్పుడు చాలా కథలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భిన్నప్రాంతాల మాండలికాల్లో వస్తున్నాయి. తెలంగాణా, రాయలసీమ, కోస్తా జిల్లాల మాండలికంలో; దాంతో పాటు ఇంతకు ముందు ఉపయోగించిన వ్యావహారిక భాషలో; ఆయా ప్రాంతపు రచయితల కలాలనుంచి కథలు జాలువారుతున్నాయి. ఈ ధోరణిలో స్పష్టంగా కనపడే విషయం-ఒక ప్రాంతపు రచయితలు, వాళ్ల కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలోనే రాయకుండా, ఒకప్పుడు విస్తృతంగా ఉపయోగంలో ఉన్న వ్యావహారికభాషలో సైతం రాయటం.

కథ రెండు భాగాలుగా చెప్పబడుతుంది. కథకి సంబంధించిన నేపథ్యం, ప్రస్తుత పరిస్థితులూ, పరిసరాలూ మొదలైనవి ఒక భాగం. రెండో భాగం పాత్రల మధ్య సంభాషణ.

కొంతమంది రచయితలు, కథలో రెండు భాగాలనీ అంటే మొత్తం కథని; వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాస్తున్నారు. ఉదాహరణకు కె. ఎన్. మల్లీశ్వరి గారి కథ “టెంకిజెల్ల”(ఆదివారం వార్త, 2 అక్టోబర్ 2011; కథ 2011 కథా సంకలనం), కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె  సుక్క’ (బతుకమ్మ,3 ఆగస్ట్ 2014, ప్రాతినిధ్య 2014 కథా సంకలనం), స. వెం. రమేశ్ గారి కథ ‘పాంచాలమ్మ పాట’ (విశాలాక్షి అక్టోబర్ 2014-ప్రాతినిధ్య 2014 కథా సంకలనం).

కొంతమంది రచయితలు పాత్రల సంభాషణని మాత్రమే వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాసి, మిగిలిన కథని; పైన చెప్పిన వ్యావహారికభాషలో రాస్తున్నారు. ఉదాహరణ-బెజ్జారపు రవీందర్ గారు రాసిన ‘మూడు తొవ్వలు’ కథ (ఆదివారం ఆంధ్ర జ్యోతి 23 అక్టోబర్ 2011, కథ 2011 కథా సంకలనం).

కొన్ని మాండలికాల్లో,  ఒక ప్రాంతపు వాళ్లకి తెలిసిన పదాలు, కొంచెం మార్పుతో మిగిలిన ప్రాంతాల్లో సైతం వాడబడతాయి. అలాంటి పదాల్ని ఏ మాండలికంలో రాసినా, ఆ మాండలికంతో పరిచయం లేని  పాఠకులు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. దీనికి కారణం, ప్రాథమికంగా వాళ్లకు పరిచయమున్న పదమే, ఉచ్ఛారణ పరంగా కొంత మార్పుకు లోనయి కథలో కనబడటం.

ఉదాహరణకు-చెప్పాడు అనే పదం. ఇది- చెప్పిండు, చెప్పినాడు గా మిగిలిన ప్రాంతాల్లో వాడబడుతోంది. దీని వలన చెప్పాడు అనే పదంతో పరిచయం ఉన్న  పాఠకుడు; చెప్పిండు, చెప్పినాడు పదాల విషయంలో చదవటానికి కానీ, అర్థం చేసుకోవటానికి కానీ ఎలాంటి అసౌకర్యానికీ గురి కాడు.   కాని, కొన్ని పదాలు పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితం. పాంచాలమ్మ పాట కథలో ఉపయోగించబడ్డ- బడిమి, ఇడవలి, అడిమ లాంటివి.

ఏ కథలో అయినా తెలిసిన పదాలని చదవడం, అవి చదవగానే అర్థం అవుతుంటే ముందుకు సాగడం సులభం. కారణం, ఉచ్ఛారణపరంగానైనా, అవగాహనపరంగా అయినా ఆ పదాలు తెలిసిన వాళ్లకి కథని అవగాహన చేసుకోవడంలో అవరోధాలు అనిపించవు కనక. నిజం చెప్పాలంటే ‘టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’,  ‘పాంచాలమ్మ పాట’ కథలతో పోల్చుకుంటే ‘మూడు తొవ్వలు’ కథ నేను నాకున్న పరిమిత తెలుగు భాషా జ్ఞానంతో ఎక్కువ సౌకర్యవంతంగా చదవగలిగాను. కారణం-అందులో కథనం నాకు తెలిసిన భాషలో ఉండి, సంభాషణల వరకు మాత్రమే, సంబంధించిన పాత్రలు వాటి మాండలికంలో మాట్లాడుకున్నట్లు రచయిత రాయటం.

కథ చదవటం వేరు, కథని అర్థం చేసుకోవటం వేరు, కథని అనుభవించటం వేరు. టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’, ‘పాంచాలమ్మ పాట’ కథలు, పూర్తిగా ఆయా ప్రాంతపు మాండలికాల్లో రాయటం వల్ల, వాటిల్లో ఎంత చదివించే గుణం ఉన్నా; చాలా పదాలకి అర్థం తెలియక పోవటం వలన నేను పట్టిపట్టి చదవాల్సి వచ్చింది. దీని వల్ల నేను ఆ కథలని చదవటం వరకే పరిమితమయ్యానని అనిపించింది. అర్థం చేసుకోవటం, అనుభూతిని పొందటం విషయంలో నన్ను నేను పూర్తిగా సంతృప్తి పరుచుకోలేక పోయినట్లుగా కనిపించింది.

బహుశా ఈ అనివార్య పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను-కొన్ని కథల చివర, ఆ కథలో ఉపయోగించబడ్డ ఏ పదాలైతే మిగిలిన ప్రాంతాల పాఠకులకి తెలియటానికి అవకాశం లేనివని అనిపిస్తున్నాయో వాటి పట్టిక, అర్థాలతో  ఇస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ పట్టిక, కొన్ని కారణాల వల్ల ఇవ్వబడిన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలమవుతోంది. ఎలాగంటే-

పాంచాలమ్మ పాట కథలో నాకు తెలియని పదాలు 97.   ప్రాతినిధ్య 2014 కథా సంకలనంలో ఈ కథ క్రింద, ఆ కథలో వాడబడిన మాండలిక పదాల పట్టిక వాటి అర్థాలతో ఇవ్వలేదు. అప్పటికీ ‘శబ్దార్థ చంద్రిక’ ని సంప్రదించి దడము, అలమట, కయ్య అనే పదాల అర్థం తెలుసుకుని ఆ పదాలను వాడిన సందర్భాలను అవగాహన చేసుకోగలిగాను. కాని. నిఘంటువులొ సైతం లేని అడిమ లాంటి పదాల విషయంలో ఏమీ చెయ్యలేకపోయాను. ఆ పదం నిఘంటువులో  చేర్చబడక పోవటానికి కారణం-నిఘంటువులో ఉన్న విధంగా రచయిత ఆ పదాన్ని రాయకపోవటమా? రాసినా అది ముద్రారాక్షసచర్యలకి గురి కావటమా? తెలుసుకోలేక పోయాను. వెలుతురు ప్రసరించాల్సిన సందర్భంలో ఇలా కొన్ని పదాలు, వాటి పెదాలు విప్పకపోవటం వలన అవగాహనారాహిత్యపు అంధకారంలో  చిక్కుకుపోయాను.

టెంకి జెల్ల కథలో నాకు తెలియని పదాలు 41 ఉన్నాయి.  అందులో 20 పదాలకు మాత్రమే, కథ 2011 సంకలనంలో కథ చివర అర్థం ఇవ్వబడింది. అందులో ఒకే అర్థం వచ్చే పదాలు 12 ఉన్నాయి.  మిగిలిన తొమ్మిది పదాల అర్థం తెలుసుకోవటానికి శ్రమించాల్సి వచ్చింది.  ఇది కాక, ఈ కథ విషయంలో నాకు ఇంకొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కథకి పేరుగా పెట్టబడిన ‘టెంకి జెల్ల’ పదానికే అర్థం తెలియలేదు. జెల్లకాయ అంటే చెంప దెబ్బ అని, నిఘంటువు చెపుతోంది. టెంకిజెల్లకి అర్థం కనపడలేదు. కథ చివర అర్థం ఇవ్వబడిన మాండలికాల్లో; జాకర్లు, కమ్మగట్టడం అనే పదాలు ఉన్నాయి. కానీ, ఆ పదాలు కథలో ఎక్కడా కనపడలేదు. నబవరులు అనే పదం కూడా ఇచ్చారు. కానీ కథలో సబవరులు అనే పదం మాత్రమే ఉంది. రెండిట్లో ఏది ముద్రణా దోషమో తెలియ లేదు.  గత్తర-అంటే ‘చెత్త’ అని అర్థం ఇచ్చారు. నాకు తెలిసి ఆ పదం అర్థం ‘ఉపద్రవం’. తెలుగు నిఘంటువు కూడా అర్థం అదే చెపుతోంది. పట్టికలో ఇచ్చిన ‘చెత్త’ అనే అర్థం, కథలో ఆ పదం వాడబడిన సందర్భంలో సరిగా ఇమడలేదు.

దీన్ని బట్టి అనిపించిందేమిటంటే- ఆ కథలో మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియనివనుకుని  పదాల పట్టిక తయారు చేసినవాళ్లు, అన్ని ప్రాంతాల పాఠకుల భాషాజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ పట్టికని తయారించలేదని.

నేను ఆ కథ చదివిన సంకలనంలో కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె సుక్క’ చివర కూడా; పాఠకుడికి తెలియని పదాలూ, వాటి అర్థాలూ ఇవ్వబడలేదు. అయినా, కథలో వాడిన భాష; ఉద్యోగరీత్యా నేను కొన్ని సంవత్సరాలు నివసించిన ‘మహబూబ్ నగర్’ జిల్లాది కావటం వలన కథలో నాకు తెలియని పదాలు తక్కువగా ఉన్నాయి.  మిగిలిన తెలియని పదాల అర్థాలు కూడా, రచయితకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. కాని, ఒక ప్రాంతపు మాండలికాన్ని అర్థం చేసుకోవటానికి, అలా ఆ ప్రాంతంలో నివసించి ఉండటం అనే అవకాశం అందరికీ దొరకనిది.

నేననుకోవటం-‘పాఠకుడికి తెలియని పదాలు’ అన్నది ఒక అయోమయానికి గురి చేసే పదసమూహమని.   ఎందుకంటే, ఆ పదాలని, కథ రాసిన రచయిత గుర్తిస్తే, ఆ పట్టిక అసంపూర్ణంగా ఉండే అవకాశం ఎక్కువ.  టెంకి జెల్ల-కథ చివర్లో ఇచ్చిన పట్టిక, దీనికి దృష్టాంతం. వాస్తవానికి, ఒక ప్రాంతంలో వాడే పదాల్లో, మిగిలిన ప్రాంతానికి తెలియని పదాలు; ఆ మిగిలిన ప్రాంతాల వాళ్లే నూటికి నూరు శాతం గుర్తించగలరు. అలా గుర్తించబడిన పదాలకు, అసలు కథా రచయిత ద్వారా అర్థాలు చెప్పిస్తే ఆ పట్టిక తనకు నిర్దేశించిన పనిని నిర్దిష్టంగా చేయగలదు. అలా కాకుండా, ఏ కథ చివర ఏ కథారచయితయినా తానే తయారు చేసి ఒక పట్టిక ఇస్తే, అది ‘కంటి తుడుపే’ కాగలదు.

కథని చదవడం పాఠకుడిగా నాకు నేనై నా భుజాల మీద ఎత్తుకున్న బాధ్యత కనక, అది ఏ రూపంలో ఉన్నా చదవడం నాకు అవసరం. ఏ  కథలో పాత్రలు ఐనా ఒక ప్రాంతపు జీవితాల్లోంచి తీసుకోబడినపుడు, ఆ పాత్రలు ఆ ప్రాంతపు భాషలో మాట్లాడటం సహజం. కథకుడు, ఆ పాత్రల సంభాషణని ఆ ప్రాంతపు భాషలో వ్రాయటం కూడా సముచితం. కాని, సంభాషణలు కాక మిగిలిన కథంతా అదే భాషలో ఉండటం అవసరమా?

అవసరమే అని అలాంటి కథా రచయితలు విశ్వసిస్తే, ఒక ప్రాంతపు జీవితాల్ని  మిగిలిన ప్రాంతాల వాళ్లకి ఆ రచయితలు సంపూర్తిగా పరిచయం చేయాలనుకుంటే, ఆ ప్రాంతపు భాషలో మిగిలిన ప్రాంతాల వాళ్లకి తెలియటానికి అవకాశం లేని పదాలన్నిటినీ ఆ కథతో పాటు విధిగా పరిచయం చెయ్యాలి. అప్పుడే రకరకాల ప్రాంతాల మాండలికాల్లో రాసిన కథలని; తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల పాఠకులు అర్థం చేసుకోగలరు. సరైన అనుభూతి పొందగలరు. అది సమగ్రంగా జరగనంతవరకూ, కొన్ని కథలు నాలాంటివాళ్లకి అసమగ్రంగానే అర్థమవుతాయి. అసంతృప్తిని మిగులుస్తాయి.

నా దృష్టిలో ఈ సమస్యకి పరిష్కారం: కథ అర్థం కాని, చేసుకోలేని పాఠకుల చేతుల్లో లేదు. కొంత కథారచయితల చేతుల్లో, మిగిలింది ఆ కథలు ప్రచురిస్తున్న మాధ్యమాల చేతుల్లో ఉంది.

ఈ పరిశీలన చేస్తున్న సమయంలో నేను చదవడం తటస్థించిన ఓ ప్రాంతపు మాండలికంలో రాయబడ్డ-ఒక కథ విషయంలో, కొంత స్వేచ్ఛ తీసుకుని నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకున్నాను. ఆ కథ చదివిన అనుభూతి నాలో ఇంకా పచ్చిగానే ఉండగనే, ఆ కథని మొత్తం నాకు తెలిసిన వ్యావహారిక భాషలో రాసుకున్నాను. అసలు కథ పేరుకి సమానార్థం ఉన్న, నేను మాట్లాడే మాండలికంలో ఉన్న పదాన్ని, కథకి పేరుగా పెట్టుకున్నాను. అసలు కథ చదివిన అనుభూతిలోనుంచి పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత, ఆ కథ నా స్మృతిపథంలోంచి చాలా వరకూ మరుగయేదాకా, మానసిక విరామం ఇచ్చి; నేను తిరగ రాసుకున్న కథని మరోసారి చదివాను. కథ ముగింపు ముందే తెలిసి ఉండటంవలన నాలోంచి తొలిగిపోయిన ఉత్కంఠతని మినహాయించి; అసలు కథ అందించిన అనుభూతికీ, నేను రాసుకున్న  కథ చదివి పొందిన అనుభూతికీ చెప్పుకోదగినంత తేడా చవిచూడలేక పోయాను.

ఈ అధ్యయనం వల్ల, మానవజీవితాలకు సంబంధించిన కొన్ని అనుభూతులకు, ప్రాంతాల ప్రమేయం ఉండదని నా వరకు నాకు తోచింది. ఇక పోతే, భాష అవరోధమా కాదా అనేది ఒక కథలో వాడిన మాండలికంతో అసలు పరిచయం లేని ఇంకో పాఠకుడెవరైనా ఆ కథని చదివి చెప్పవలసిన విషయం అని అనిపించింది.

అయితే, కథనం మాత్రం ఒక ప్రాంతపు మాండలికంలో ఉండి; సంభాషణలు అందరికీ పరిచయం ఉండటానికి అవకాశం ఉన్న భాషలో రాయబడ్డ కథలు ఇంతవరకూ నేను చదవటం తటస్థించలేదు. రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయేమో?

ఈ లోపులో కోరుకోవాల్సిన విషయం మరోటుంది. ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి; ఆ ప్రాంతపు భాషతో విస్తృత పరిచయం ఉన్న రచయితలు; తమకు పరిచయం లేని మాండలికంలో కథలు పూర్తిగానో, సంభాషణల వరకో రాసి ఆ కథలని బలహీనపర్చే ప్రయత్నం చేయకుండా ఉంటే చాలని. ఈ ధోరణి ఈ మధ్య ఒక కథలో కనపడింది. అందుకనే ఈ మాట కూడా చెప్పాల్సి వచ్చింది.

***

అనిల్ ‘కథాయణం’ నుంచి ‘నాగరికథ’ దాకా!

kathayanam

-టి. చంద్రశేఖర రెడ్డి 

~

 

సారంగ-లో కథారచయిత అనిల్ ఎస్. రాయల్ తో వేంపల్లి షరీఫ్ గారి ముఖాముఖీలో ‘కథాయణం’ వ్యాససంపుటి, ‘నాగరికథ’ కథల సంపుటి గురించి ప్రస్తావన ఉంది. కథాయణం చదివింతర్వాత, నేను చదివిన ఇతర కథలను, కథాయణంలో  ఉన్న సూచనల్తో పోల్చి చూస్తే ఆ కథలకూ,  ఈ సూచనలకూ పొంతన లేదనిపించింది. అంతే కాదు. కథాయణంకు అనుబంధంగా కథనకుతూహలం-లో చెప్పిన క్లుప్తత ఆ కథల్లో లేనట్లు కనిపించింది.

కథాయణంలోనూ-కథనకుతూహలంలోనూ ఉన్న సూచనలు మిగిలిన రచయితల కథల్లో ఎందుకు అమలు కాలేదు? అవి అమలు చేయకూడనివా? అమలు చేయలేనంత కష్టమైనవా? అన్న అనుమానం వచ్చింది. నివృత్తి కోసం; ఆ సూచనలిచ్చిన రచయిత వాటిని తన కథల్లో ఎంతవరకు, ఎలా పాటించారో తెలుసుకోవాలని ప్రయత్నించాను. దాని ఫలితమే ఇది.

శీర్షిక గురించి సూచనలు: అవి ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

 1. కథల విషయంలో శీర్షిక వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది.

నాగరికథ-కథ ఒక నాగరికత ఎలా అంతమైందో శాస్త్రీయంగా తెల్సుకోటానికి చేసిన ఒక ఊహ. అందువల్ల కథకి నాగరికత అని కానీ, ఆ పదాన్ని నాగరి’కత’ గా మార్చి ‘కత’ నాగరికత కి సంబంధించిన కథ అనిపించేలా  శీర్షికగా పెట్టుకోవచ్చు. కానీ నాగరి’కత’ లో ఇమిడి ఉన్న ‘కత’ అనే పదం ఎక్కువమంది దృష్టిని  ఆకట్టుకోపోవచ్చు. అందుకనే, కత, కథగా మారి ‘నాగరికథ’ అయింది. కథాంశాన్ని క్లుప్తంగా, గుప్తంగా సూచించింది. విభిన్నంగా ఉంది.

 1. శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది.

రెండు విరుద్ధ విషయాలని సూచించే పదబంధం వెంటనే ఆకట్టుకుంటుంది. ప్రియశత్రువు అలాంటి రెండు  విభిన్న పదాల మేళవింపు. అందుకే ఆ కథ పేరులో నూతనత్వం, వైవిధ్యం ధ్వనించింది. కథలో ప్రధాన పాత్ర పేరు ‘ప్రియ’ అవటం వలన కథాంశం అంతర్లీనంగా పాఠకుడికి అందింది.

 1. శీర్షిక చూడగానే, అర్థమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి.

కుంతీకుమారి కథ, మహాభారతంలో కుంతీదేవిలానే కుమారిగానే తల్లిగా మారిన స్త్రీ కథ.  కనుక ఈ కథకి  ‘కుంతీదేవి’ అని పేరు పెట్టొచ్చు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఈ కథ కూడా పెళ్లికి ముందే తల్లి అయిన ఒక స్త్రీ కథ అని పాఠకులు  ప్రక్కన పడేయొచ్చు. అలా కాక, కుంతీకుమారి అని కథకి పేరు పెడితే, మహాభారతంలో కుంతికి పుట్టింది కర్ణుడు. కుంతికి కొడుకు కాకుండా కూతురు పుట్టటమేమిటి? అనుకుని కథలోకి పాఠకుడు ఆకర్షించబడొచ్చు. మహాభారతంలో కుంతీదేవి ముందు తల్లి, తర్వాత శ్రీమతి అయింది. కుంతీకుమారి కథలో,  ప్రధానపాత్ర కుమారిగానే మిగిలిపోయింది. కథకి పెట్టిన పేరు పరోక్షంగా కథాంశాన్ని కూడా సూచించింది.

 1. కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే మంచిది.

మరో ప్రపంచం కథ,  పారలల్ యూనివర్సెస్ గురించి. తెలుగులో ఆ కథకి పెట్టిన పేరు ఆ కథాంశానికి నిగూఢ సూచన ఇచ్చింది. అలానే మిగిలిన రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, మరపురాని కథ-కథల  పేర్లు కూడా.

 1. కథలకి పేర్లు పెట్టే క్రమంలో చాలా మంది ఔత్సాహిక రచయితలు/రచయిత్రులు చేసే పొరపాటు: కథలో ప్రధాన పాత్ర పేరునే కథ పేరుగా ఎంచుకోవటం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, తొమ్మిదింటికి పాత్రల పేర్లు కథ పేరుగా లేవు. ఒక్క మినహాయింపు ‘కల్కి’ ప్రధాన పాత్ర  అయిన ‘కల్కి’ కథ. ఆ కథకి ‘కల్కి’ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అన్న దాని గురించి కథాయణంలో వివరణ ఉంది.

 1. చప్పగా, సర్వ సాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఏ కథకీ సామెతలు పేర్లుగా లేవు.

 1. ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంత వరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు.

నాకు తెలిసి కథలకి పెట్టిన పేర్లు  ప్రసిధ్ధకథల పేర్లు, ఇతర ప్రసిద్ధ సాహితీ ప్రక్రియల పేర్లు కూడా కావు.

 1. కథ పేరు ఎంత పెద్దదిగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం.

నాగరికథ-లో ఉన్న కథల్లో; అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలు, రెండే పదాలు ఉన్న పేరు-‘మరపురాని కథ’.  మిగిలిన తొమ్మిది కథల్లో, ఆరు కథలకు ఒక పదమే పేరు. మిగిలిన మూడిటికీ ఒక పదబంధం శీర్షిక.

 1. శీర్షికలో ఓ రకమైన అర్థాన్ని సూచిస్తూ, కథ పూర్తిగా చదివాక అందులో మరో అర్థం గోచరించేలా పేరు పెట్టటానికి నేను ప్రాధాన్యతనిస్తాను.

కథల పేరుకి వాడిన పదాలు వాటి అసలు అర్థమే సూచించటం; నాగరికథ, ప్రియశత్రువు, కుంతీకుమారి భిన్నమైన పదప్రయోగాలు కావడం; వాటివల్ల అందిన సూచన ప్రకారం కథ ఉండకపోవటం-ఈ కథల కథాంశం, శీర్షికల ద్వారా వేసుకున్న అంచనాకి భిన్నంగా ఉండటం సంబంధిత సూచన అమలుకు నిదర్శనం.

కొసమెరుపు:

 1. నాగరికథ కథాసంకలనంలో ఉన్న పది కథల్లో అయిదు కథల పేర్లు; రహస్యం (1967), మరపురాని కథ (1967)), మరో ప్రపంచం (1970), శిక్ష (1985), కల్కి (1997) కథలు ప్రచురించబడటానికి ముందే విడుదలైన తెలుగు చలనచిత్రాల పేర్లు. ఇది యాదృచ్ఛికం కావచ్చు-కాని గమనార్హం. కుంతీకుమారి లాగే ధ్వనించే కుంతీపుత్రుడు 1993 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రళయం కథ ముద్రితమైన తర్వాత 2015 లో అదే పేరుతో ఒక తెలుగు సినిమా విడుదలైంది. రీబూట్ కంప్యూటర్ కే కాదు చలనచిత్రరంగానికి కూడా చెందిన ప్రక్రియ.

ఎత్తుగడ పై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

 1. అత్యవసరమైతే తప్ప కథని వర్ణనలతో మొదలు పెట్టను. అత్యవసరమైనా కూడా కథని సర్వసాధారణమైన సన్నివేశంతో మొదలు పెట్టను.

నాగరికథ, మరో ప్రపంచం, కల్కి,  ప్రియశత్రువు కథలు ఒక సంభాషణతోనే మొదలవుతాయి. శిక్ష కథ  కథాయణంలో ఒప్పుకున్నట్లు ఒక వర్ణనతో, వైవిధ్యం కోసం  ప్రాస ఉన్న పదాల్తో మొదలైంది. ప్రళయం కథ సంభాషణతో కాకుండా ఒక గమనికతో మొదలవుతుంది.  రీబూట్, రహస్యం, మరపురాని కథలు భిన్నంగా మొదలయ్యాయి. మరపురాని కథ ఒకటే ఒక సాధారణమైన సన్నివేశంతో మొదలయినట్లనిపిస్తుంది.  కుంతీకుమారి అనువాదకథ. దాని ఎత్తుగడ మీద అనువాదకుడికి స్వేచ్ఛ లేదు.

 1. మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వీలైతే మూడు నాలుగు లైన్లకు మించకుండా. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది.

నాగరికథ కథలో ఈ సూచన ఏడు లైన్లతో కొంచెం దారి తప్పింది. మరో ప్రపంచం, రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, కుంతీ కుమారి; రెండు లైన్లతో; కల్కి, ప్రియశత్రువు, మరపురాని కథ ఒక లైనుతో మొదలయ్యాయి.

 1. మొత్తమ్మీద, ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి చదవబోయే కథపై ఉత్సుకత కలిగించాలి.

ఎత్తుగడతో ఉత్సుకత ఎలా కలిగించవచ్చో అన్నదానికి, నాగరికథ కథ మొదలే ఒక ఉదాహరణ. అది  కథాయణంలో ప్రస్తావించబడింది. కల్కి కథ అయితే మరీ క్లుప్తంగా రెండు పదాల్తోనే పాఠకుడ్ని కథలోకి లాక్కు వెళుతుంది. ఆ రెండు పదాలూ “ఇద్దర్ని చంపాలి.”

ముగింపుపై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

1.A.      ఎత్తుగడ భాగంలో, ‘కథని ఎలా మొదలెట్టినా ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అని ఉంది. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి అని చెప్పబడింది.

1.B.      అవి అరటిపండు వొలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెతుక్కోవటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి.

ఉదాహరణకు-నాగరికథ కథ తీసుకుందాం. దీనిలో ‘ఎత్తుగడ’ టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణం చేయడం గురించి. హైస్కూలు విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇస్తున్న ఓ అణుశాస్త్రవేత్త వివరణతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత తాత గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కాలంలో వెనక్కెళ్లి ఆయన్ను చంపెయ్యడం గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. కాలయంత్రం ద్వారా కాలప్రయాణం  గురించి  పాఠం చెపుతున్నపుడు అణుశాస్త్రవేత్తకి వాళ్ల తాతగారి గురించి సెల్ ఫోన్ ద్వారా ఒక వార్త వస్తుంది. క్లాసు అర్ధంతరంగా ఆగిపోతుంది. తాతయ్య దగ్గరకి హడావిడిగా మనవడి ప్రయాణం మొదలవుతుంది. దీంతో పాఠకుడి మెదడులో టైమ్ మెషీన్ గురించీ, అందులో వెనక్కి వెళ్లడం గురించీ, తాతయ్య గురించి వచ్చిన వార్త ఏమిటనే దాని గురించీ ప్రశ్నలు మొదలవుతాయి.

ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకుడు తప్పనిసరిగా మిగిలిన కథలోకి వెళతాడు. కథనంలో టైమ్ మెషీన్ ఉందా? లేదా? ఉంటే ఎలా తయారయింది? దాన్ని ఎవరు తయారు చేశారు? అందులో కాలంలో ఎవరైనా వెనక్కి ప్రయాణం చేశారా? వెళ్లింది ఎలా? వెళ్లింది ఎవరు? ఆ ప్రయాణఫలితం ఏంటి? అనే దాని మీద తగినంత సమాచారం ఒక దాని తర్వాత ఒకటి కథకుడు అందిస్తాడు.

ఈ ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు కథలో నేరుగా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి అవసరమైన ఆధారాలు కథలో ఉంటాయి. ప్రధాన పాత్ర ప్రత్యక్షపద్ధతిలో తెలిసిన వాటిని మొదట నమ్మదు. కాని నమ్మక తప్పదు. పరోక్షంగా తెలిసిన వాటిని మనవడు నమ్ముతాడో లేదో రచయిత స్పష్టంగా చెప్పడు.  నమ్మాలో వద్దో విశ్లేషించి తెలుసుకోవాల్సింది మనవడూ, అతడితో పాటు మనమూ.

 1. A. కథలకి రెండు రకాల ముగింపులుంటాయి-ప్రధానపాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ కథలకి వర్తిస్తుంది.

2.B. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధానపాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనావిధానంలో కలిగే పరిణతి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం…ఇలాంటి విషయంతో ముగుస్తాయి.

నాగరికథ కథ పై రెండు వర్గాల్లో ఏ విభాగానికి చెందినది అనేది అప్రస్తుతం అనుకుంటే; ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో; లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం ఏమిటో; కథ ముగింపు చెప్పాలి.

ఈ కథలో ప్రధాన పాత్ర అణుశాస్త్రవేత్త. అతడిని వేధించే సమస్యా, పాఠకుడిని వేధించే ప్రశ్నల సారాంశం ఒకటే. సూచన 2-A ప్రకారం, ఆ పాత్ర తన సమస్యని పరిష్కరించుకోవాల్సింది, సూచన 2-B ప్రకారం ఇవ్వాల్సిన  సమాచారం. దాన్ని కథకుడు తాత ద్వారా, మనవడికి అందిస్తాడు. దాన్ని విశ్లేషించి మనవడు ఒక నిర్ధారణకి వస్తాడు. కాని, అదేంటో రచయిత పాఠకులకి చెప్పడు. దాన్ని కథ ముగింపిడికిట్లో పెట్టి, తెరిచి ఏముందో చూసే బాధ్యత పాఠకులకే వదిలేస్తాడు. అది సవ్యమా, సంభావ్యమా అన్నది వదిలేస్తే, అదిక్కడ చెప్పటం భావ్యం కాదు.

 1. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలో వదిలేస్తే కుదరదు.

నాగరికథ కథలో రచయిత కాడిని పాఠకులతో పాటు తాను కూడా మోసి కంచికి కూతవేటు దూరం దాకా  వచ్చాడు. ఊరు బయట తాను కాడిని వదిలేసి పాఠకులకి మిగిలిన ప్రయాణం ఎలా చెయ్యాలో, గమ్యస్థానం ఎలా చేరాలో చెప్పాడు. తమంతట తాము గమ్యం చేరిన తృప్తి కలగాలంటే ఆ కాస్త దూరం ప్రయాణించాల్సింది పాఠకులే.

 1. కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి.

ఈ సూచన కథలో ఎలా పాటించబడిందో చెపితే, కథ ఇంకా చదవని పాఠకులకి కథ చదువుతున్నపుడు కలిగే ఉత్సుకత మిగలదు.

 1. మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు.

నాగరికథ కథ లో అలాంటి మార్పేదీ లేదు.

 1. ముగింపు ఎలా ఉండబోతోందో కథనిండా క్లూస్ వదులుతూనే, మరో వైపు పాఠకుడిని మాయచేసి పెడదారి పట్టిస్తూ, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే అసలు ఊహాతీతమైన ముగింపు.

నాగరికథ కథలో మనవడికి కలిగిన అనుమానాల ద్వారా పాఠకులు పొందింది, వాళ్లకు అందిందీ అదే.

తుది మాట:

మిగిలిన తొమ్మిది కథల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడాల్సింది పాఠకులే.

*

 

ఇది ఆకలి కత కాదు – అవమానాల వెత

 

 -ఎ . కె . ప్రభాకర్

~

 

ఒక్కో కథ చదివాకా ఆ  కథ లో పాత్రలు చాలా కాలం గుర్తుండిపోతాయి.  కొన్ని పాత్రలైతే వెంటాడతాయి. పాత్ర పేరు చెప్పగానే కథంతా స్ఫురణకి వస్తుంది. కొన్ని కథల్లో సంఘటనలు కథని మరచిపోనివ్వవు. ఏక వాక్య కథలుగా కొన్ని మనసులో పాతుకుపోతాయి ; సారం చెప్పగానే కథ యాదికొస్తుంది. కొన్ని కథలు రచయిత శిల్ప కౌశలం కారణంగా కేవలం విలక్షణమైన టెక్నిక్ ద్వారా  మెదడు పొరల్లో జ్ఞాపకాలుగా కదులుతూ వుంటాయి. చాలా తక్కువ కథలు మాత్రమే శీర్షిక పేరు చెప్పగానే కథలోని పాత్రలూ వాటి ప్రవర్తన సంఘటనలూ సన్నివేశాలూ సంభాషణలూ యితివృత్తం దాని నిర్వహణా కథనపద్ధతీ భాషా వాటిని వాహికలుగా మలచుకొన్న రచయిత దృక్పథం అన్నీ వొక దాని వెంట మరొకటి కళ్ళముందు దృశ్యమానం అవుతాయి. అటువంటి అరుదైన కథల్లో వొకటి ఎమ్ ఎమ్ వినోదిని రాసిన

(తొలి ముద్రణ : అరుణతార  – జనవరి, 2015 ,  ‘బ్లాక్ ఇంక్’ సంపుటిలో పునర్ముద్రితం). ఆ కథ అరుదైనది కావడానికి మొదటి  కారణం స్వీకరించిన వస్తువు. రెండోది చెప్పిన వైనం.

***

చానాళ్ళ కిందట వూరినుంచి పనిమీద నగరానికి వచ్చి అక్కడ అభివృద్ధి చెందిన రాజపథాల్లో వుచ్చ పోసుకోడానికి మరుగు దొరకక విలవిల్లాడిన మహిళ  క్షోభని కథగా చదివి క్రోధంతో రగిలిపోయిన జ్ఞాపకం వుంది. దశాబ్దాలు నడిచి వచ్చాకా  యిప్పుడు వినోదిని కట్ట చదివినప్పుడూ అదే అనుభూతి. జపాన్ సింగపూర్ నమూనాల వర్తమాన చరిత్ర కూడా అంతే సంబడంగా వుందని గుండె జలదరించేలా ‘కట్ట’ మరోసారి నిరూపిస్తుంది.

దళితవాడ నుంచి పై చదువుకోసం హాస్టల్లో చేరి అక్కడ లెట్రిన్ సౌఖ్యం అనుభవించే పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి ‘సొరూప’ సెలవలకి యింటికి వచ్చినప్పుడు మరుగుదొడ్డి సదుపాయం లేక రైలు పట్టాల మీదకి ‘దొడ్డికి’ పోవాల్సినప్పుడు అనుభవించిన బాధల పరంపర కట్ట.

ఆస్టల్లో వుప్పూకారం లేని కూరలు తినటం మూలాన నాలికంతా చప్పబడిపోయిన సొరూప అమ్మ చేసిన ‘గోంగోర పచ్చిమిరగాయాలు వుడకబెట్టి నూరిన పచ్చడి’ వేసుకొని యిష్టంగా రెండు ముద్దలు అన్నం యెక్కువే తింది. ఫలితంగా తెల్లారక ముందే ‘దొడ్డి నెప్పి’. కూర్చుంటే రెండు మడాలూ తడిసి పోయేంత పెద్ద యిరోచనం. ఇక తెల్లారుతూనే మొదలైంది నరకం.

కరుణామయుడు సినిమాలో ‘యేసయ్య సిలవ మీద చచ్చిపోయినపుడు – కొండరాళ్ళు దొర్లుతయ్ , సముద్రాలు వుప్పొంగుతయ్ , అగ్నిపర్వతాల కుండ మీద మూత పేలిపోయి , మంట యెక్కువైతే పప్పుచారు పొంగినట్టు లావా పొంగిపోద్ది . అట్టా వుంది నా కడుపులో.’  స్వరూప తన  శారీరిక బాధని తనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేయడానికి పడడిన అవస్థ యిది.

తలమీద ముళ్ళకిరీటం బెట్టి లోపలికేవరో గట్టిగా వొత్తుతున్నట్టున్న సొరూప పడ్డ బాధని ఆమెతో పాటు కథ చదివే వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ అసలు సమస్య – పగటి పూట పదే పదే కట్ట మీదకి పోవాల్సి రావడమే.

‘చెంబు తీసుకొని యిళ్ళ మజ్జ నడుచుకుంటా బోవాల. ‘యెప్పుడొచ్చావమ్మాయ్?’– అని అందరూ పలకరిస్తావుంటారు. దానికి తోడు కట్టకి పొయ్యొచ్చే మా గేరి మొగోళ్ళు యెదురవుతావుంటారు. అన్నయ్యలూ , అంకుళ్ళు. నాతోపాటు మా లూథరన్ హైస్కూల్లో చదువుకున్న సీనియర్లు , జూనియర్లు కూడా వుంటారు. వీటన్నిటికీ మించి పగలు ఆడోళ్ళు కట్టమీద కూర్చోడానికి లేదు! కట్ట పక్కన డవున్లో వున్న ముళ్ళ కంచెల్లోపలికి వొంగొంగి నడుచుకుంటాబోయి కూర్చోవాల. అసలే పెంటలరొచ్చు. రోతగా వుంటది. దానికి తోడు రాత్రంతా వానబడివుంది. కుప్పలన్నీ చింది, చుట్టూ చెల్లాచెదరుగా యెగిరిపడి వుంటాయ్. యెంత కష్టమో నడవడం. తావు వెతుక్కోవడం.’

అందుకే సెలవలు వస్తే లేటుగా లేస్తామని చెప్పుకొనే వాళ్ళని చూస్తే స్వరూపకి అసూయ.  ‘తెల్లగా తెల్లవారడం’ గురించి పంచుకోలేని  భయం , చెప్పుకోలేని ఆందోళన.

‘స్వచ్ఛ భారత్’ ప్రాంగణాల్లో కెమెరాల ముందు చీపుర్లతో దర్శనమిచ్చి  ‘నమో’ వాక్యాల భజన చేసే రాజకీయ దుర్గంధ నాయుళ్ళందరూ కట్ట మీదినుంచి వీచే యీ గవులును వొక్కసారి పీల్చి సిగ్గుపడాల్సిన అవసరాన్ని గుర్తుచేసే యీ కథలోని  వస్తువుతో కొందరికి పేచీ అయితే రచయిత సొరూప ముఖత: వర్ణించిన చీదర కొంతమందికి కడుపులో కెలికినట్టు చేసింది.

‘నా యెడం పాదం ముందు నుంచి – నలుపు మీద నాలుగు యర్ర మచ్చలున్న పురుగు పోతావుంది. అది ముందుకాళ్ళతో కుంకుడు గింజంత పియ్యి వుండని దొర్లించుకుంటా పోతావుంది. దొర్లించుకుంటా పోటం వలనేమో , వుండ బో గుండ్రంగా , చూట్టానికి చిన్నసైజు లడ్డులాగా వుంది.

‘ … పాదాల్నిండా పియ్యి. కజాబిజి తొక్కానేమొ , అతుక్కుపోయింది. యేళ్ళ మజ్జ నుంచి పొడుచుకొచ్చి , అంచుల్లోకెల్లకొచ్చి …! చెప్పుల్లేకుండా నల్లమట్టి పొలంలో నడిస్తే మట్టి బూట్లొస్తాయే , అట్లొచ్చినయ్ పియ్యబూట్లు!’

యిటువంటి వర్ణనలు చాలా మంది కథా శిల్ప ప్రేమికులకి , సమీక్షకులకి మింగుడు పడలేదు. ఇది కథ కాదు అని కంగారు పడ్డారు. ఇన్నాళ్ళూ కథలకి గీసుకొన్న కొలతల్లో యిమడని  రచనా శైలి యిది. ఈ శైలే  ప్రధాన స్రవంతి పత్రికలకు ఈ కథ పట్ల అసహ్యం కలిగి ప్రచురించకపోటానికి కారణమయింది. మన యీ సభ్య నాగరిక సమాజం లోపలి – బయటి  కల్మషాన్నంతా పై నుంచీ కిందకి ‘చేపని కడిగినట్టు సుబ్బరంగా రుద్ది’ కడిగి పారేయడానికే రచయిత కావాలనే యీ ముళ్ళ దారిలో నడిచిందని  గ్రహించాలి. నిజానికి మనం యింకా  యిటువంటి సమాజంలో బతుకుతున్నందుకు దిగులుతో  సిగ్గుతో బెంగతో  ‘సిరిసెవట్లు’ పుట్టాలి గానీ పీతుర్ల వర్ణనల పట్ల అసహ్యం కలగనేల?

నాకైతే కథ చదివాకా చదివిన ప్రతిసారీ రోజుల తరబడి నిద్ర పట్టలేదు. కారణం యిదంతా – యీ చీదరంతా – చెరువు గట్టున పందుల కుమ్ములాటలోనో , కాలవ వొడ్డున రెల్లు దుబ్బుల చాటునో , రోడ్డు వార కంచె తుమ్మ కంపల మధ్యనో   కాలేజీ చదువు పూర్తయ్యేదాకా నేనూ అనుభవించా. అది కేవలం  స్వీయానుభవం మాత్రమే కాదు; నా చెల్లీ తల్లీ అక్క అవ్వ కుటుంబ స్త్రీలు మా వాడకట్టులోని ఆడవాళ్ళందరూ అనుభవించారు. వాళ్ళందరికీ చెంబట్టికొని వెళ్ళే ఆ చీకటి కార్యక్రమం యెంత అవమానాస్పదమైనదో యెంత లజ్జాభరితమైనదో యెన్ని యిబ్బందులకు హేళనలకు నెలవో యెంత హింసకు పాదో  ఆ వయసులో నాకు తెలీదు. ఆ తర్వాత తెలిసొచ్చింది. కానీ  వినోదిని కట్ట చదువుతుంటే ఆ అవమాన గాయాల్ని మళ్ళీ మళ్ళీ కెలికినట్టయింది. చాలా డిస్టర్బ్ అయ్యా.  అయాం అగైన్ యిన్  డీప్ షిట్ !

ఈ బహిర్భూమి కార్యక్రమం స్త్రీలకు అనునిత్యం చిత్రహింసే. కూర్చొని వుండగా అంతదూరంలో రైలు బండి వస్తుందంటే , యెవరైనా ‘మొగమనిషి కనబడ్డాడంటే లేచి నిలబడాల్సిందే!’. ఆడవాళ్ళకి మాత్రమే యీ  హింస. ‘యిట్లా మజ్జలో లేచి  నిలబడే అవసరముండ’ని మగపుటకకి ఆడజన్మలో లేని గొప్ప వెసులుబాటు వుందని అనుకొన్న స్వరూప పాయింట్ లోని చేదు ‘అనుభవించినోళ్లకే తెలుస్తది’.

అంతేకాదు అక్కడ పియ్యి తినడానికొచ్చే పందులతో కుక్కలతో యుద్ధమే చెయ్యాలి. అన్నిటికీ మించి తమ లేకి చూపులతో గాలి మాటలతో వెకిలి చేష్టలతో అత్యాచారానికి పూనుకొనే మగకుక్కల బారిన పడకుండా కాపాడుకోడానికి అనుక్షణం అప్రమత్తంగా వుండాలి.  ఒక విధంగా యిన్ని అవమానాల మధ్య ఆడదానికి  కాలకృత్యం తీర్చుకోవడం దినదిన గండమే , జీవన్మరణ సమరమే.

పగటి పూట కట్ట పక్కన ముళ్ళ కంచెల్లో సిగ్గుతో నొప్పితో సతమతమవుతున్న స్వరూప వొక పోకిరీ వేధింపుకి భయపడి ముళ్ళ కంచెల్లో పరుగెత్తినపుడు ఆమె అనుభవించిన శారీరిక – మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిది. పాపం అరికాళ్ళలో గుచ్చుకొన్న ముళ్ళని తీయగలిగినన్ని తీసి (యిరిగి లోపలే వుండిపోయినవి కాక యిరవైమూడు) పొట్లం కట్టి అమ్మకి చూపించిన సందర్భంలో స్వరూప యేడుపుకి కరగని పాఠకులుండరేమో! ఇక  ‘సెవిటి కరుణమ్మదొడ్డికెల్లి రైలు కిందబడి’ చనిపోయే ముగింపు అయితే హృదయవిదారకం.

***

జీవితాన్ని వున్నది వున్నట్టుగా యథాతథంగా చిత్రిస్తే అది కళ కాదు ; కేవల వాస్తవానికీ కళకీ మధ్య వున్న రేఖని స్పష్టంగా గుర్తించడంలోనే రచయిత మెళకువ చూపాలి – అని చెప్పే రొట్టకొట్టుడు విమర్శ సూత్రాలకి అందని కథ యిది. జీవిత సత్యావిష్కరణ కంటే మించిన కళ వుండదన్న స్పృహతో చెక్కిన మొరటు శిల్పం యిది. ఎటువంటి మేలి ముసుగులు అలంకారాల తొడుగులు లేకుండా వొక దు:ఖ భాజనమైన – అవమాన భరితమైన పేద దళిత జీవన పార్శ్వాన్ని సామాజిక బీభత్సంతో అన్వయించిన కథనం యిది. నోట్లో వెండి చెంచాల్తోనూ యింట్లో అటాచ్డ్ ప్రాచ్య – పాశ్చాత్య స్నానాగారాల ఫ్లషవుట్లతోనూ పుట్టి బతికే నాగరికులకు అర్థంకాని దుర్భరమైన వేదన యిది.

జుగుప్స కలిగించే పియ్యి పీతుర్ల వర్ణనల్లేకుండా యీ కథ రాయడం యిదే కథలో తెనాలి రామలింగడు వొకానొక విద్వాంసుడితో చాలెంజ్ చేసినట్టు పాస్ పొయ్యకుండా దొడ్డిక్కి కూర్చోవడమంత కష్టం అని రసజ్ఞులైన భావుక విమర్శకులు తెలుసుకోవాలి (ఈ చీదరని భరించలేని తనం నుంచి బయట పడటానికే జీవితంలో , కథలో దొడ్డికి చుట్టూ జోకులూ పిట్టకథలూ చోటుచేసుకొన్నాయేమో!).

అయితే రైలు కట్ట పట్టాల పక్కన పెంటలు ‘చూడ్డానికి ఇరగబూసిన బంతిపూల్లగా, చేమంతి పూల చెండుల్లాగా కనపడతయ్’ అని రచయిత వొకచోట చేసిన  ఆలంకారిక వర్ణన శుద్ధ కళా వాదుల ముఖమ్మీద రచయిత ఐచ్ఛికంగా విసిరి కొట్టిన అశుద్ధమే. సాహిత్య భావుకులకీ  సౌందర్య పిపాసువులకీ కళారాధకులకీ  చెంప పెట్టులా గబ్బిల దౌత్యం నెరపిన మహాకవి గుర్రం  జాషువా వారసత్వమిది. పదాల మాటునో అంతరార్థాల వెనకో దాక్కోకుండా ముక్కుసూటిగా మాట్లాడే దళిత తత్త్వమిది. కళ్ళముందు కనపడే వాస్తవాలతో  యెటువంటి దాపరికాలకీ తావులేని యింత సాదాసీదా కథని నేనిటీవల చదవలేదు.

కేవల యథార్థ జీవిత చిత్రణకి ప్రలోభపడి  వినోదిని కథానిర్మితి విషయంలో యెక్కడా యే మాత్రం అశ్రద్ధ చూపలేదు. కథ చెప్పేది యింటర్మీడియట్ చదివే అమ్మాయి. ఆమె సామాజిక నేపథ్యం పేద దళిత క్రైస్తవ జీవితం.  పదహారేళ్ళ ఆ  పిల్ల మౌఖిక కథనంలో అనేక  ఆర్ధిక – సాంస్కృతికాంశలనీ , వాటితో ముడివడి వున్న భాషనీ  అతి సహజంగా తీసుకువచ్చే విషయంలో  రచయితగా వినోదిని చూపిన నేర్పు ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.  కథా గమనంలో అనేక సామాజికాంశాలు ప్రస్తావనకొస్తాయి. ఆ యా సందర్భాల్లో రచయిత  దృక్పథం కూడా స్పష్టంగానే తెలుస్తుంది. కథ ప్రారంభమే అందుకు మంచి వుదాహరణ.

కాలేజికి సెలవలని వినగానే  స్వరూపకి అందరిలా సంతోషం కలగలేదు. ‘గుండెల్లో రాయి పడింది. ఆస్టల్ అన్నంలో దొరికేంత చిన్నసైజు కాదు. రైలుకట్ట మీదుంటదే , చేతిలో సరిపోయేంతది, అంతది.!’

మొదటి పంక్తుల్లోనే కథాంశం , కథా సారం రెండూ వొకేసారి  వ్యక్తమయ్యాయి. రచయిత ప్రతిపాదించదల్చుకొన్న విషయం హాస్టల్ అన్నం , అన్నంలో రాళ్ళ సమస్య కాదు – వాటిని మించిన భీతావహమైన సమస్య యింట్లోనో బయటో మరుగుదొడ్డి లేకపోవడం అని తెలుస్తుంది.  అందువల్ల యిది ఆకలి కత కాదు – అవమానాల వెత . ఆకలికే కాదు అవమానాలకి కూడా పాదు పేదరికమేనన్న స్పృహ  రచయిత  యే సందర్భంలోనూ మర్చిపోలేదు.

యూరియా సంచులు కలిపి కుట్టి నాలుగు మూలలా పాతిన బొంగుల ఆసరాతో మూడు గోడల్లా చుట్టి , తలుపు బదులు పాత చీర అడ్డంగా కట్టిన బాత్రూం , నున్నగా అలికిన నేలమీద బొంతేసుకొని పొణుకోవడం ,  ఇంటి తాటాకు కప్పులోంచి కురిసే వానకి కప్పుకున్న దుప్పటి తడవడం , నీళ్ళు కారిపోయే చిల్లు రబ్బరు చెంబు , కిరసనాయిలు దీపం బుడ్డీ , చిన్న చిన్న బట్టల సబ్బు ముక్కల్తో వొళ్ళు రుద్దుకోవడం , బయటుండి చదువుకొనే గేరి పిల్లలు సెలవలకి యిళ్ళకొచ్చినపుడు కూలి పనులకి పోయి పుస్తకాలకీ బట్టలకీ నాలుగు డబ్బులు సంపాదించడం … యిలా   కథావరణానికి అవసరమైన సామగ్రి యేదీ  ఆమె దృష్టి నుంచి తప్పించుకుపోలేదు.

నిజానికి వాస్తవ జీవిత చిత్రణ దానికదే కథ అయిపోదు. యథార్థతని గ్రహించడానికి , గ్రహించినదాన్ని సరైన మాధ్యమంలో ఆవిష్కరించడానికీ సమ్యగ్ దృక్పథంతో కూడిన సునిశితమైన పరిశీలన అవసరం. అది వినోదినిలో నిండుగా వుందని కట్ట నిరూపిస్తుంది. ఆమె కన్ను కెమెరా కన్ను. చూపు మైక్రోస్కోపిక్ చూపు. చిత్రణ మల్టీ డైమన్షనల్. వాడిన రంగులు సహజ సిద్ధమైనవి. కాన్వాస్ జీవితమంత విశాలమైనది.

అందుకే – బొట్టు బొట్టుగా యింట్లోకి కారే వాన నీళ్ళు గిన్నెలోకి పడుతున్నప్పుడు చేసే శబ్దానికి నిద్ర చెడకుండా వుండడానికి గిన్నెలో బన్నీ (బనియన్) వేయడం , కట్ట మీదకెళ్ళినపుడు చిల్లు చెంబులో నీళ్ళు కారిపోతే పక్కవాళ్ళనుంచి పంచుకోవడం , పీతుర్ల మధ్య చెంబు పెట్టడానికి బెత్తెడు చోటులేక పాదమ్మీదే పెట్టుకోవడం , దొడ్డిక్కూడా వొక్కచెంబులోనే నీళ్ళు తీసకపోయే సావాసాలు , పక్కపక్కనే కూర్చుని చెప్పుకొనే కతలు – కబుర్లు , దసరా సంక్రాంతి పండగలప్పుడు స్కూల్లకీ కాలేజీలకీ అన్నేసి రోజులు సెలవలిచ్చి క్రిస్టమస్ కి వొక రోజు సెలవివ్వడంలో కనిపించే ఆధిపత్య మత భావన గురించిన ప్రస్తావన , కూర్చుంటంటేనే తినడంకోసం కాసుకున్న పందుల ఆరాటం , కట్ట మీద నుంచి తిరిగొచ్చేటప్పుడు చెంబు కుడి చేత్తోనే పట్టుకురావాలని గుర్తుచేసుకోవడం , చెంబు మళ్ళీ గాబులో ముంచేముందు అడుగు కడగడం , యిరోచనాలు కట్టుకోడానికి మాత్తర్లేసుకొనే సొంత వైద్యాలు – సగ్గుబియ్యం గంజి తాగడం – పంచాదారేసుకొని యిడ్లీ తినడం , కాకెత్తక పోద్దని వొంటి సబ్బు యింట్లో దాచిపెట్టుకోవడం  … వంటి నిర్దిష్ట జీవితానికి సంబంధించిన అనేక సూక్ష్మాంశాలు కథలోకి అలవోకగా వొచ్చి చేరాయి. వాటితోబాటు యింటా బయటా గేరీ మనుషుల్లో మాటల్లో కనిపించే వినిపించే క్రైస్తవ సంస్కృతి కథకి మరింత సహజ పరిమళాన్ని అందించింది.

అయితే వీటిలో యేవీ రచయిత దృష్టికోణం నుంచి చూపినవి కావు. ఇంటర్ చదివే టీనేజి అమ్మాయి చూపు ద్వారా కథలోకి యెక్కినవే ( ఇస్లాం పేట మసీదు నుంచీ విన్పించే అజా తప్ప). ఆ వయసు పిల్లల ఆలోచనలు , భయం ఆందోళన సంతోషం దు:ఖం వంటి మానసిక వుద్వేగాలు , వాటి వ్యక్తీకరణ రీతులు , అందుకు వుపయోగించిన భాష – పదజాలం , వుచ్చారణా పద్ధతులు – అన్నిటినీ అపూర్వమైన నైపుణ్యంతో రచయిత ఆవిష్కరించి ఆత్మకథాత్మక  కథనానికి విశ్వసనీయతని సాధించింది. అదే యీ కథలో అంతర్గతంగా కనపడని శిల్పం. అదే ఈ కథలోని బలం కూడా. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతపు గేరీల భాషని వినోదినిలా యింత అద్భుతంగా సాహిత్యంలోకి యింతకుముందు యెవరూ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అందుకే అపూర్వమనడం.

***

నీళ్ళులేని కమ్యూనిటీ టాయిలెట్లకి సంబంధించిన విషయాన్ని యితివృత్తం చేసుకొని తీవ్ర క్రోధంతో  శాంతి నారాయణ రచించిన  ‘అసలవి లేనప్పుడు …’ కథ  దీని తర్వాతి  కాలంలోనే ( ప్రజాసాహితి , జూలై – 2015) వచ్చింది. మధ్యాహ్నం పూట చెంబు పట్టుకొని జొన్నతోట్లోకి వెళ్లి ఎలుగుబంటి కి చిక్కి చచ్చిపోయిన  మండల ప్రెసిడెంటు మాదిగ మారెక్క వుదంతాన్ని పేర్కొంటూ  ‘ఒక ఆడడానికి ఈ దేశంలో స్వేచ్ఛ కంటే మరుగుదొడ్డి చాలా ముఖ్యమని’ ఆత్మ గౌరవ ప్రకటన చేసిన పద్మావతి , ‘సాగునీల్ల కత దేవుడెరుగు , కడాకు తాగడానికి గుటికెడు మంచినీల్లూ ముడ్డి కడుక్కోడానికి చెంబెడు నీల్లూ ఈలేనప్పుడు ఈ రాట్రం బంగారుదైతే మాకేమొత్తది , యెండిదైతే మాకేమొత్తది?’ అని రాష్ట్రాన్ని సింగపూరో జపానో చైనానో చేస్తామని వూదరగొట్టే నాయకుల్ని ప్రశ్నించి రాజకీయ చైతన్యం చూపిన రామన్న , ‘నీల్లు ఎటూ దొరకవు , దినామూ బయటికి ‘దొడ్డికి’ పోయినంక ముడ్డి తుడుసుకుందేకి’ గులకరాళ్ళు పంపించమని కలెక్టర్ ని నిలదీసి అధిక్షేపించి హేళన చేసిన సుబ్బమ్మ యీ కథలో గొప్ప పోరాట యోధులుగా దర్శనమిస్తారు.

‘కట్ట’ కథలో యిటువంటి పాత్రలు లేవు. రాత్రిపూటే కావొచ్చు రోడ్డు పక్కనే కూర్చోవాల్సి వచ్చినప్పుడు యెల్తుర్లో ఆ యిబ్బంది నుంచి అవమానాల నుంచి తప్పించుకోడానికి ‘కరెంటు స్తంబం మీద లైటు పగల్నూకిన’  అంజమ్మత్త చేతిలోని రాయి కేవలం గౌరవం కాపాడుకొనే సాధనంగానే కాకుండా తమ దురవస్థకి కారణమైన వ్యవస్థపై ఆయుధంగా మార్చుకొంటే బాగుండుననిపిస్తుంది.

కథ మధ్యలోనో చివరనో  ఒక చూపుడు వేలి కోసం వెతుక్కోవడం తప్పుకాదేమో! సూచ్యంగానో వాచ్యంగానో అటువంటి భరోసానివ్వని కథ కంప్లైంట్ కథగా మిగిలిపోయే ప్రమాదముంది. దాన్నుంచి తప్పించడానికే రచయిత కరుణమ్మ మరణాన్ని కథకి ముగింపుగా మలచినట్టు అనిపిస్తుంది. చీకట్లో మొదలై చీకట్లోనే ముగిసే రోజువారీ బతుకు వెతలపై నిరసనే ఆగ్రహ ప్రకటనే ఆ అవ్వ మరణం. ఈ దేశంలో దొడ్డికెళ్ళడం కూడా చచ్చేచావు అన్న పచ్చినిజం కోపానికి కారణమవుతుంది. కట్ట మీద దొడ్డిక్కూర్చోడానికెళ్ళిన సెవిటి కరుణమ్మవ్వ రైలు కింద పడి చనిపోవడం పాఠకుల్లో ‘పెద్ద రైలుకూతలా  గుండెల్లో దుఖ్ఖాన్ని’ మాత్రమే కలిగించదు ;  ఆగ్రహాన్నీ ఆవేశాన్నీ సైతం  రగిలిస్తుంది.

ఫిర్యాదు కథల ముద్రకి గురికాకుండా వినోదిని తీసుకొన్న యిటువంటి జాగ్రత్తల గురించి పి. సత్యవతి స్పష్టంగానే గుర్తించారు. అందుకే  ‘కన్నీళ్లు  తెప్పించడం ఈ  కథల ప్రయోజనము లక్ష్యము ఏ మాత్రం కాదు … నిలవ నీటిలో ఆనందం పొందే మొద్దు చర్మాలని అంకుశంతో పొడవాల్సిందే – ఆ అంకుశాన్ని తన కలం చేసుకుంది వినోదిని’ ( ‘బ్లాక్ ఇంక్’ పుస్తకానికి ముందు మాటలో) అంటారామె. నిజానికి కథ పొడవునా రచయిత ప్రాపంచిక దృక్పథం పరచుకొని వుండడం వల్ల కూడా వినోదిని కథలు కేవలం ఫిర్యాదు కథల్లా మిగిలిపోవు. దళిత సామాజిక వాస్తవికత వినోదిని కథలకి ఆయువుపట్టు. దానికి క్రైస్తవ సంస్కృతీ , స్త్రీ చైతన్యం జోడించడంతో ఆమె కథలు విశిష్టతనీ  ప్రత్యేకతనీ అనితరతనీ సాధించుకొన్నాయి.

ఇళ్ళలో సరైన టాయిలెట్ల సదుపాయం లేని ‘గరీబు ముస్లిం ఆడోల్ల బతుకు’ దైన్యంలోని భిన్న కోణాన్ని పదేళ్ళ కిందే షాజహానా కథగా రాసింది( వతన్ – 2004). అప్పుడు అదేదో ఘోషాలోని మైనార్టీల కడుపు నొప్పి అని యే కొందరో వుపేక్షించారేమో గానీ   ‘ఊర్ల ముస్లింలు కానోల్లంతా ఊరి బైటికెల్తరు గదా .. వీళ్లు గూడ ఎల్తేంది ??’ అని సోచాయించే కొత్త దుల్హన్ , నయీ బహూ షమీమ్ బాధకి కారణమైన సామాజిక – ఆర్థిక నేపథ్యం చాలామందిని ఆలోచింపజేసింది.  సండాస్ లో షమీమ్ అనుభవించిన వేదన , కట్ట మీద స్వరూప పడిన యాతన వొకటే. రెండుచోట్లా అందుకు కారణం పేదరికమే.

ఇటువంటి  నిజాల్ని దాచిపెట్టి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేసినందుకు హేళనగా చప్పట్లు కొట్టే అడ్వర్టైజ్మెంట్ వొకటి యీ మధ్య టీవీ లో వస్తుంది. యెంత శాడిజం! మరుగుదొడ్డి లేని యింట్లో పిల్లనివ్వవద్దని చెప్పే విద్యాబాలన్ మరుగుదొడ్లు కట్టివ్వని పాలకులకు వోటెయ్యొద్దని ప్రచారం చేస్తే బావుణ్ణనిపిస్తుంది. కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ దళారులు లక్షలు స్వాహా చేసి కట్టిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ యెంత గొప్పగా వుంటుందో చూస్తే మొత్తం వ్యవస్థ మీదే రోతపుడుతుంది. పెయిడ్ పబ్లిక్ టాయిలెట్ల బాగోతం మళ్ళీ వేరే.

అంతర్జాతీయ మార్కెట్లో మెకిన్ యిండియా నినాదంతో  వూదరకొడుతోన్న పాలకులకి కట్ట , సండాస్ , అసలవి లేనప్పుడు … వంటి కథలు గొంతులో పచ్చి వెలక్కాయల్లా మింగుడు పడక పోవచ్చు. కంట్లో నలుసుల్లా మెరమెరలాడవచ్చు. దేశమంతటా వీస్తోన్న యీ గవులు వారికి పెద్ద విషయం కాకపోనూవచ్చు. కానీ సామాన్యుడికివ్వాళ కావాల్సింది – డిజిటల్ ఇండియా కాదు  టాయిలెట్స్ ఇండియా అని యీ కథలు ముక్కు మీద గుద్ది మరీ చెబుతున్నాయి. దేశభక్తుల పన్నులతో నడిచే వొక విశ్వ విద్యాలయంలో పనిచేస్తూ దేశ గౌరవాన్ని మంటగలిపే యిటువంటి కథ రాసినందుకు వినోదినిని  దేశద్రోహనేరం కింద విచారణ లేకుండానే అసహనంతో శిక్షిస్తారేమోనని అనుమానంగా వుంది. సృజనాత్మకతనే ఆచరణగా మార్చుకొన్న వినోదిని నిబద్ధతకు (దీన్నేFawzia Afsal-Khan ‘artivism’  అంటారు) సంఘీభావం ప్రకటించాల్సిన సందర్భమే యిది.

తాజా కలం : స్మార్ట్ సిటీల విశ్వ నగరాల అంచుల్లో కొత్తగా వెలిసే వెలివాడల్లో సిగ్గులేకుండా దొడ్డికి కూర్చోడానికి యెక్కడెక్కడ సదవకాశాలున్నాయో స్మార్ట్ ఫోనుల్లో క్షణాల్లో తెలుసుకొనేందుకు వీలుగా ‘మహిళా బహిర్భూమి యాప్’ తయారీకోసం  స్టార్టప్ మేధావులకి ప్రభుత్వాలు లోన్స్ సాంక్షన్ చేస్తాయనీ , అందులో భాగంగా పల్లె పల్లెకీ వాడవాడకీ వై ఫై సదుపాయం కలగజేస్తారనీ   మన్ కీ బాత్ లో ప్రధాని వరమివ్వబోతున్నట్టు యిప్పుడే  వార్త అందింది. ఇక  కూర్చున్నప్పుడు ‘పిర్రలమీద దోమలు కుట్టి దద్దుర్లు కట్టడానికి’ ఆస్కారం యివ్వని ఎ సి వాష్ రూమ్ ల కోసం గూగుల్ మేప్ లో వెతుక్కొని  చూడ్డమే యిప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యమ్. అంత వరకూ కట్టల మీద సెవిటి కరుణమ్మవ్వల సహజ / అసహజ  మరణాలు తప్పవు. ఆధునికీకరణ లో రూపాంతరం చెంది రైలు కట్టలన్నీ  బుల్లెట్ ట్రైన్ ట్రాక్ లుగా మారిపోబోతున్నాయి కాబట్టి  అటువంటి బహిరంగ ప్రదేశాల్లో మల/మూత్ర విసర్జనలు చేసినందుకు లోకల్ బాడీ అధికారులు విధించే జరిమానాలు కట్టుకోడానికి సిద్ధంగా వుండక తప్పదు. ఇతి శమ్ … బే షరమ్.

*

 

 

 

రేపటి మీదే ఆశ!

 

చందు తులసి

~

chanduకథంటే…
కథంటే సమస్యలు కాకపోవచ్చు….
కథంటే పరిష్కారాలు కూడా కాకపోవచ్చు, కానీ…, కథంటే జీవితం. కథలో జీవితం వుండాలి. ఇదైనా ఒప్పుకుంటారా…? ఇది ఇటీవలే జరిగిన కథసాహితీ పాతికేళ్ల సభలో ప్రముఖ రచయిత, విమర్శకులు ఎన్. వేణుగోపాల్ అడిగిన ప్రశ్న .

కథలెలా పుడతాయి. జీవితంనుంచా..? సమాజం నుంచా..? లేక కేవలం సృజనకారుల ఆలోచనల్లోంచేనా..? సృజన అంటే కల్పనే. కానీ ఏ తరహా కల్పన. జీవితాన్ని మరిపించే కల్పనా…? జీవితాన్ని నడిపించే కల్పనా..?
***
గత ఏడాది సారంగ కథల్లో సమకాలీన సమాజానికి దూరంగా వున్న కథలు కొన్నైతే… సమాజాన్ని, జీవితాలను చిత్రించిన కథలు కొన్ని వున్నాయి. అన్నదాత ఆత్మహత్యలాంటి సీరియస్ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని కలాన్ని ఛర్నాకోలలా ఝళిపించిన కథ ప్రసాద మూర్తి – ఓ రైతు ప్రార్థన. తెలుగులో అరుదైపోతున్న…వ్యంగ్య రచనా శైలిలో వచ్చిన కథ. రాజకీయ చదరంగంలో రైతుల జీవితాలు ఎలా పావులుగా మారుతున్నాయో ప్రభావవంతంగా చెప్పిన కథ.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని భూ సేకరణ నేపథ్యంలో….అమరావతి, దాని చుట్టుపట్టు పల్లెల్లో వచ్చిన సామాజిక పరిణామాలను చర్చించిన కథ ఎమ్వీ రామిరెడ్డి త్రిశంకు స్వప్నం . కలలో కూడా ఊహించని విధంగా అమాంతంగా పెరిగిపోయిన భూముల ధరలు….ఆ ప్రాంతంలోని మానవ సంబంధాల్ని ఎలాంటి మార్పులకు దారితీస్తున్నాయో ఆసక్తికరంగా వివరించిన కథ.  ఇంచు మించు అదే ఇతివృత్తంతో ఆ ప్రాంతంలోనే జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను వివరిస్తూ వచ్చిన కథ బుద్ధి యజ్ఞమూర్తి మాయ.
అలాగే తెలుగులో దాదాపూ అంతరించి పోతోందేమో అని ఆందోళన కలిగించే ప్రక్రియ ఆరోగ్యకరమైన హాస్యకథ.  ఆ లోటునూ తీర్చిన కథ డా.కోగంటి విజయ్ బాబు రాసిన ఎవరు కవి. నిజాయతీ, చిత్తశుద్ధి లేని కవులు, వారి కవిత్వం దండగ అని తేల్చిచెప్పి, ఆత్మీయంగా స్పందించే చిన్న మాట గొప్ప కవితకు ఏ మాత్రం తీసిపోదు అని విలువైన సందేశం ఇచ్చిన కథ. వెర్రితలలు వేస్తున్న మతమౌఢ్యం, భక్తి పేరిట జరుగుతున్న మోసాల గుట్టు విప్పిన కథలు కే.సుభాషిణి- నీలకంఠం పి.హెచ్.డీ, శివ్-అపరిచితులు కథలు. మూఢాచారాలను ప్రశ్నించిన ఇంద్రగంటి మాధవి- భోక్త కూడా అలాంటిదే. ఈ కథలు చదివిన తర్వాత…మొత్తానికి తెలుగు కథకులు అప్రమత్తంగానే వున్నారన్న సంతోషం తప్పక కలుగుతుంది.
బలవంతులు తమ అధికారం, బలం ఉపయోగించి ప్రకృతి వనరులు కొల్లగొట్టడం….ప్రత్యక్షంగా కనిపించని దోపిడి. ఈ నేరం ఎవరిదైనా శిక్ష మాత్రం అందరూ అనుభవించాల్సిన దుస్థితి. అందుకే ఈ దిశగా పాఠకులని మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత సాహిత్య కారులపైన ఉంటుంది. ఈ బాధ్యతనే స్వీకరిస్తూ… పర్యావరణ మార్పులు, పర్యవసానాలు… సైంటిఫిక్ ఫిక్షన్ తరహాలో ఆసక్తి కరంగా చెప్పిన కథ కొట్టం రామకృష్ణారెడ్డి 3456జీబీ. భవిష్యత్ లో తెలుగు కథలు విరివిగా రావడానికి అవకాశం ఉన్న విభాగం పర్యావరణ పరిరక్షణ. ఐతే ఈ దిశగా మరింత పరిశోధన, అధ్యయనం చేయాల్సి వుంటుంది.

ఇక ఈ కథల్లో అస్తిత్వవాద కథలూ ఒకటి, రెండు వచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కథ కృష్ణజ్యోతి  నేను తోలు మల్లయ్య కొడుకుని. వర్ణం, కులం, లింగం అన్ని వర్గాల వేదనల్ని సున్నితంగా చర్చిస్తూనే…పరిష్కారాన్ని కూడా చూపించిన కథ. ఇతివృత్తంతో పాటూ…రాసిన తీరు కూడా కొత్తగా ఉన్నకథ.  అలాగే కత్తి మహేశ్ నా హీరోకోసం కూడా మరో మంచి కథ. హాలీవుడ్ స్థాయికి ఎదిగాం అని సంబరపడిపోతోంది తెలుగు సినిమా.  ఓ వైపు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయడానికి ఆరాటపడుతూ…మరోవైపు ఇక్కడే వున్న దళిత, అణగారిన వర్గాల కళాకారులని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమపై సంధించిన ప్రశ్న కత్తి మహేశ్ కథ.  దగ్గర దగ్గర వందేళ్ల చరిత్రకు చేరువవుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ..ఒక్క దళితుడు హీరోగా లేకపోవడాన్ని, కనీసం ఓ గుర్తింపు పొందిన కళాకారుడు లేకపోవడాన్ని ఏమనాలి. ?  తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన…ముఖ్యంగా అద్భుతమైన పాటను సృష్టించిన దళిత సృజనకారులు సినిమారంగంలో కనీసం ప్రవేశాన్నికూడా ఎందుకు పొందలేకపోయారు…? పోయే కొద్దీ లోతైన చర్చకు దారితీసే అంశమిది. మొత్తానికి ఆ దిశగా ఓ చర్చను
లేవనెత్తిన కథ నా హీరోకోసం.

ఇక ఫెమినిస్టు కథలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే చాలా కథలు మహిళలే రాయడం “సారంగ” కథల్లో కనిపించిన ఒక ప్రత్యేకత.  గ్లోబలైజేషన్ తదంతర పరిణామాలు మహిళల్ని కూడా వేగంగా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములని చేశాయి.  పర్యవసానంగా….కొత్త ప్రపంచాన్ని, కొత్త మనుషుల్ని, మనస్తత్వాల్ని మగువలు ఎదుర్కొంటున్నారు. సహజంగానే కొంత సున్నితత్వం, స్పందించే తత్వం ఉన్న స్త్రీ ఈ ఇతివృత్తాల్ని సాహిత్య రూపంలోకి అనువదించేందుకు ఆరాటపడుతోంది. ముఖ్యంగా వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత…ప్రచురించే అవకాశాలు బాగా పెరిగాయి. ఫలితంగా అటు కవిత్వంలోనూ, కథా ప్రక్రియలోనూ మహిళలు అధికంగా రావడం మొదలైంది. తరతరాలుగా తమలోనే ఇంకిపోయిన భావాలను…బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చేందుకు…చర్చించేందుకు మహిళలకు అవకాశం లభిస్తోంది. ఐతే రకరకాల కారణాల వల్ల అంతర్జాల పత్రికల్లో సంపాదకీయం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం తక్కువ.  అక్షర దోషాలు, అన్వయ దోషాలు కూడా సవరించకుండానే పాఠకుల ముందుకు రావడం దీన్నే రుజువు చేస్తోంది.  పెరుగుతున్న వెబ్ పత్రికల అవసరాల్ని తీర్చే సంఖ్యలో రచనలు రాకపోవడం వల్ల…సంపాదకులు ప్రమాణాల విషయంలో ఓ మేర రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.  ఫలితంగా వెబ్ పత్రికల వల్ల ప్రమాణాలు తగ్గుతున్నాయనే విమర్శా వినిపిస్తోంది. ఈ విమర్శలో వాస్తవం ఉన్నా, క్రమక్రమంగా రచయితల సంఖ్య పెరుగుతున్నందున… వాటంతటవే ప్రమాణాలు కూడా పెరిగే రోజు రాక తప్పదు.
ఏదైమైనా వెబ్ పత్రికల పుణ్యమాని…మున్ముందు సరికొత్త ఇతివృత్తాలను, భిన్న కోణాలు తెలుగు కథల్లో చూసేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఆ పరిణామానికి సూచనలుగా కనిపించే కథలు…రాధిక-ఆలోక.  ఆర్. దమయంతి-అమ్ములు,  రాజ్యలక్ష్మి కథ-మహాలక్ష్మి , పాలపర్తి జ్యోతిష్మతి- వారిజాక్షులందు. . అన్నీ ఉదాత్త పాత్రలున్న ఆలోక కథ ఓ మంచి అనుభూతినిచ్చే కథ. రేపటి తరం గురించిన ఆవేదన వ్యక్తం చేస్తూ….వారిని నిర్లక్ష్యం చేస్తే
వచ్చే పరిణామాలను చూపిస్తూ హెచ్చరించే కథలు… శాంతి ప్రభోద-బాల్యం మోస్తున్న విషాదం,  అన్వీక్ష-తొలి కలుపు,  మమత కొడిదెల-బరువు. ఈ కథలు బహుశా మహిళలు మాత్రమే రాయగలిగినవి. అలాగే సారంగలో వచ్చిన చిన్న కథలు నిడివిలో చిన్నవైనా…. పెద్ద కథలకు ఏ మాత్రం తీసిపోనివి. మా రోజుల్లో అంతా బాగుండేది….అంటూ పెదవి విరచడం కన్నా… కాలంతో పాటూ మనం మారాలని చెప్పే కథ లక్ష్మీ రాఘవ –అనుబంధాల టెక్నాలజీ.  కణ్ణగి-
పిచ్చుకలు, వినోద్ అనంతోజు- చింటూ అమ్మెక్కడ..? లాంటి కథలు.., సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా…తక్కువ పరిధిలోనే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించిన కథలు.
చిన్న కథల్లో ఎక్కువగా….కొత్తగా రాస్తున్నవారు, యువత వుండడం గమనార్హం. బహుశా కొత్త తరం రాస్తున్న కథల ద్వారా… తాము ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారో….చెప్పకనే చెపుతున్నారని అనుకోవచ్చు.

ముఖ్యంగా మేడి చైతన్య, ఎండ్లూరి మానస, ప్రజ్ఞ వడ్లమాని చిన్న కథలు విరివిగా రాస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలుగు కథల్లో ఇటీవల తాత్విక చింతన, అంతరంగ అన్వేషణ కథలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరలో వచ్చిన కోడూరి విజయ్ కుమార్-చివరాఖరు ప్రశ్న,  బి.హరిత-అన్వీక్షణ కథలు ఆ కోవకు చెందినవే. మానసిక ప్రపంచంలోని అలజడిని, అంతస్సంఘర్షణను కవితాత్మకంగా చిత్రించిన కథ చివరాఖరు ప్రశ్న. అన్వీక్షణ కథ ఆంగ్ల కథా రచయిత ఎండీ వెయిర్ రాసిన ది ఎగ్ స్ఫూర్తితో రాసిన కథ అని స్పష్టంగానే తెలుస్తోంది.( మూల కథను అనిల్.ఎస్.రాయల్ బ్రహ్మాండం పేరుతో సారంగలోనే అనువదించారు.) ఐనా తొలి కథలోనే రచయిత్రి చూపిన పరిణతి,  చేసిన ప్రయోగం అభినందించేలా చేస్తుంది.

ఇక ప్రాంతీయ అస్తిత్వ వాద కథలు ఒక్కటి కూడా లేకపోవడం లోతుగా తరచి చూడాల్సిన అంశం. ఇతర ప్రాంతాల సంగతి ఎలావున్నా….తెలుగు సాహిత్యంలో  ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్న…తెలంగాణ ప్రాంతీయ ఇతివృత్తంతో ఒక్క కథ కూడా లేకపోవడం గమనార్హం.  అల్లం వంశీ (రెండు పట్టాలు...) కథ,  స్కైబాబా-అన్ మోల్ రిష్తే...కథ కనిపించినా అవీ కూడా పూర్తిస్థాయి ప్రాంతీయ కథలుగా చెప్పుకోలేం. తెలంగాణ జీవితాల్ని కానీ, సమస్యలను కానీ పట్టించిన కథలు కానీ లేకపోవడం… ఈ ప్రాంత రచయితల్లో నెలకొన్న ఒక స్తబ్ధతను (ఆన్ లైన్ పత్రికలకు సంబంధించినంత వరకైనా) తెలియజేస్తుంది.  అసలు కథలు రావడం లేదా..వచ్చినా వెలుగులోకి రావడం లేదా…? అని తరచి చూసుకుని ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ఆ ప్రాంత సాహితీకారులపై వుందన్నది స్పష్టం.

స్థూలంగా చూస్తే రాసిన కథలు బాగానే వున్నా రాయాల్సిన కథలు ఇంకా చాలా  వున్నాయనిపిస్తుంది.  సమాజంలో అనునిత్యం చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించకుండానో, నిర్లక్ష్యం చేస్తూనో, లేదా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తూనే రావడం కొంత మింగుడు పడని అంశం. ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యం లేదా సాహిత్య ప్రక్రియలో అయినా ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్యం ద్వారా ఆనాటి ప్రజల జీవితాల్ని, జీవన విధానాల్ని, సమాజాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించడం సహజం. ఆ రకంగా సాహిత్యం సమకాలీన జీవితాల్ని ఎంతో కొంత తప్పక ప్రతిబింబించాలి.
గత ఏడాది సారంగలో వచ్చిన కథలు సామాజిక కోణంలోంచి చూసినపుడు కొంత నిరాశ కలిగిస్తాయి.  ఇతివృత్తాల ఎంపికలో, కథలను నడిపించిన తీరులో, ముగింపులో ఇలా అడుగడుగునా ఒక కొత్త ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నవారు….సమకాలీన సామాజిక అంశాలను  ఇతివృత్తాలుగా స్వీకరించేందుకు  వెనుకంజవేయడం బాధాకరం.
రచయిత ఏ కథ రాయాలనేది అతని స్వేచ్ఛ. అందులో సందేహం లేదు.  ఆ విషయం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ సామూహికంగా చూసినపుడు ఆ (రచయితలు, సృజనకారుల ) సమాజం మొత్తం దూరంగా ఉండడం వెనక కోణాల్ని, కారణాల్ని మాత్రం తప్పక చర్చించాల్సి ఉంటుంది.  సమాజాన్ని విస్మరించి వచ్చే సాహిత్యం…పెయిన్
కిల్లర్ లాగా తక్షణ సంతృప్తినివ్వవచ్చునేమో కానీ ….దీర్ఘకాలంలో నష్టాన్ని చేస్తుంది. తాత్కాలిక ఆనందాన్నిచ్చే సాహిత్యం….దాని అసలు ప్రయోజనాన్ని, సమాజపు అవసరాల్ని తీర్చలేదు. మొత్తంగా ఇటు వెలుగు, అటు చీకటి అన్నట్లుగా….సారంగ కథలన్నింటిని సింహావలోకనం చేసుకుంటే ఒకింత ఆశ, మరింత నిరాశ కలుగుతుంది. సీనియర్ల స్తబ్ధతను చీల్చుకుంటూ…ఎప్పటికప్పుడు కొత్త కలాలు వెలుగుచూడడం ఆశాభావాన్ని కలిగిస్తుండగా, ఆ రచనల్లో సామాజిక జీవితాన్ని ప్రతిబింబించకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది.

సాహిత్యం సమకాలీన జీవితంతో ఎంతోకొంత ప్రభావితం కావాలి. అలాగే తానూ సమాజాన్ని ప్రభావితం చేయాలి.

మొదటి వ్యాసంలో చెప్పినట్లు ….చాలా మంది  కాలమే  మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం. ఈ మార్పు కొత్త సంవత్సరం కథల్లోనైనా కనిపిస్తుందని ఆశిద్దాం.

***

వారిదే కథాకాశం..!

 

-చందు తులసి

~

 

చందు“రాయడమంటే ……నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం..!

రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.”

ఈ వాక్యాలు  గత ఏడాది సారంగలోనే వచ్చిన వెంకట్ సిద్ధారెడ్డి-సోల్ సర్కస్ కథలోనివి.

***
నిజమే. రాయడమంటే మన లోపల మనం చేసే అన్వేషణ. ప్రస్తుత మన స్వరూపమేమిటో తరచి చూసుకొనే పరీక్ష. ఆదర్శాలు, విలువల రాళ్లతో ఘర్షణ పడి కుబుసం వదిలించుకొని…సరికొత్త రూపం పొందటానికి పడే ఘర్షణ.  ఈ ప్రయాస ఎదుర్కొనేందుకు చాలా కష్టపడాలి. బహుశా అందుకేనేమో ఒక దశ దాటిన కథకుల వేగం తగ్గిపోతుంది.  ఒక్క అక్షరం రాయడానికి వేయి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే తెలుగులో ఇప్పుడు సీనియర్ కథకులు చాలామంది అస్త్ర సన్యాసం చేశారు. ఒకరిద్దరు మాత్రం అప్పుడప్పుడూ చాలా తక్కువగా రాస్తున్నారు.  ఓ వైపు  సీనియర్ కథకులు క్రమంగా తెరమరుగవుతుంటే ఏడాదికేడాది కొత్త కథకులు వేదికపైకి వస్తున్నారు.

గత ఏడాది నామిని రాసిన కథ కోరిన కొండ మీద వాన. తిరుపతి నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరిగే కథ.  భూములకు పెరుగుతూ , మనుషులకు తగ్గిపోతున్న ”విలువ” గురించి జమునమ్మ  అనే పాత్ర నేపథ్యంలో చర్చిస్తుంది. అలాగే మరో సీనియర్ కథకుడు రామా చంద్ర మౌళి రాసిన కథ దిగడానికి కూడా మెట్లు కావాలి. చక్కని శిల్పంతో పాటూ…చిక్కని కథనంతో సాగిపోయే కథ. జీవితంలో ఎదుగుదల కోసం ఉష అనే గాయని సాగించిన గాథ… కథలా కాకుండా ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాగా అనిపిస్తుంది. ఎదుగుతున్నామనుకుంటూ…ఎటు దిగజారుతున్నామో లోతుగా చర్చిస్తుంది.

పురుషాధిక్య భావజాలం, పేద ముస్లింల జీవితాలు, పేదరికంలోని అనుబంధాలను సున్నితంగా వివరించిన కథ  స్కైబాబా రాసిన అన్ మోల్ రిష్తే. టీవీ ప్రోగ్రాములు, ప్రకటనల ద్వారా మనం ఏం కోల్పోతున్నామో, దానికి పరిష్కారమేంటో కొత్తగా చెప్పిన కథ అరిపిరాల సత్యప్రసాద్ రాసిన  అబ్సలీట్ రియాలిటీ.  మహలక్ష్మమ్మ అనే చారిత్రక పాత్ర చుట్టూ అల్లిన ప్రయోగం దాట్ల దేవదానం రాజు కథ మన్యం వోరి మేడ. ఇలా సీనియర్ కథకులు తమదైన ముద్రతో సాగిపోతుంటే….కొత్త రచయితలు కూడా విభిన్న రకాల ప్రయోగాలతో ఆకట్టుకున్నారు.

గత ఏడాది వచ్చిన కొత్త తరం కథకుల్లో ప్రత్యేకించి చెప్పాల్సిన వాళ్లు కొంతమంది ఉన్నారు. రకరకాల కారణాలతో…రంగురంగుల ముసుగులు కప్పుకొని…పైకి ఆనందపు భ్రమల్లో జీవిస్తూ, అంతర్లీనంగా మౌనంగా కుమిలి కుమిలి రోదించే అంతరాత్మలకు, పరదాలను తొలగించి… అసలు జీవించడం అంటే ఏమిటో చూపించిన కథ వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్.  కథ  పేరు దగ్గర నుంచి… కథను నడిపించిన తీరు, కొటేషన్లలా దాచిపెట్టుకోదగిన వాక్యాలు, కథ ముగింపు…ఇలా అన్ని రకాలుగా ప్రత్యేకత సంతరించుకున్న కథ.  సారంగలో మాత్రమే కాకుండా గత ఏడాది వచ్చిన తెలుగు కథల్లోనే ఉత్తమ కథగా సోల్ సర్కస్ ను చెప్పుకోవచ్చు.  అలాగే ఈ కథలోని చిత్వాన్ పాత్ర కూడా పాఠకులను చాలా కాలం వెన్నాడుతుంది.  వెంకట్ సిద్దారెడ్డి రాసిన కాక్ అండ్ బుల్ స్టోరీ, టైం ఇన్ టూ స్పీడ్ కథలు కూడా పాఠకులను ఆకట్టుకున్నాయి. ఐతే కాక్ అండ్ బుల్ స్టోరీ మాత్రం..కథను నడిపించడంలో కొంత సమన్వయం తప్పినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఇతివృత్తం ఎలాంటిదైనా శిల్పంతో ఆకట్టుకోవడం వెంకట్ సిద్దారెడ్డి కలం బలం.

“జీవితమంటే ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు.  జీవితం…ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు చేయాల్సిన సాధన”  అంటూ చిన్నచిన్న పదాలతోనే జీవితానికి సరికొత్త భాష్యం చెప్పిన కథ పింగళి చైతన్య తనదే ఆ  ఆకాశం.  సహజంగా,  సరళంగా…ఒక ప్రవాహంలా సాగిపోయే కథ.  ఒక ఒంటరి మహిళపట్ల సమాజానికుండే అభిప్రాయాలు, సందేహాలకు …తనదైన సొంత వ్యక్తిత్వంతో సమాధానం ఇచ్చిన లక్ష్మి కథ. సాధారణ ఫెమినిస్టు కథలకు భిన్నంగా ఉండడంతో పాటూ లక్ష్మి పాత్రను నడిపించిన తీరు, రచయిత్రి శైలి కూడా పాఠకులను ఆకట్టుకుంటుంది. అలాగే కులాంతరం వివాహం చేసుకున్న మహిళ సమస్య…నామాలు కథ కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Untitled-2

అల్లం కృష్ణ చైతన్య రాసిన …చుక్కలు తాకిన చేతులు కథ కూడా శైలి పరంగా భిన్నమైన కథ. రెండు వేరు వేరు కథలను…రషోమాన్ తరహా టెక్నిక్ తో చెప్పిన ఈ కథలోని మార్మికత పాఠకులను మెప్పిస్తుంది. ఇక భిన్న నేపథ్యంతో పాటూ, తనదైన భాషను, తనదైన ముద్రతో దూసుకొస్తున్న మరో కలం అల్లం వంశీ. ఒక సమస్యను కేవలం ఏకరవు పెట్టడం  కాకుండా…సున్నితంగా చర్చించడం,  మానవ సంబంధాలను బలంగా చెప్పడం వంశీ బలాలు. రిజర్వేషన్ అంశాన్ని మిరకిల్ కథలోనూ, తెలంగాణ-ఆంధ్ర జీవితాల్లో వైవిధ్యాన్ని రెండు పట్టాలు-ఒక రైలు కథలో చర్చించిన తీరు….సహచరి కథ నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి.

వైవిధ్యమైన ఇతివృత్తాలను, కవితాత్మకంగా చెపుతున్న మరో రచయిత్రి వనజ తాతినేని.  ఫేస్ బుక్ అనుబంధాలకు మతం, లింగ బేధం లేదని చెప్పే స్నేహితుడా! రహస్య స్నేహితుడా.., మీడియా రంగంలో మహిళలపై వేధింపులను చర్చిస్తూ కుక్కకాటుకు-చెప్పుదెబ్బ లాంటి పరిష్కారాన్ని చూపిన కథ పిడికిట్లో పూలు. ఇతివృత్తాన్ని అందంగా చెప్పే వనజ తాతినేని కథలు ఆసాంతం చదివిస్తాయి. శైలి పరంగా షాజహానా-మనిషి పగిలిన రాత్రి ప్రత్యేకమైన కథ. అద్భుతమైన చైతన్య స్రవంతి పద్ధతిలో,  ఒక మహిళ భావాలకు అద్దం పట్టిన కవిత్వం లాంటి కథ.
బొట్టు, అదే ప్రేమ లాంటి కొత్త తరహా ఇతివృత్తాలతో ఆకట్టుకున్న మరో యువ రచయిత్రి ఎండ్లూరి మానస. ముఖ్యంగా అదే ప్రేమ కథలో ఒక సున్నితమైన అంశాన్ని చర్చకు పెట్టారు. స్వేచ్ఛ, లెటర్స్ , కీమాయ కథలతో ప్రజ్ఞ వడ్లమాని కూడా మెప్పించారు.  మైడి చైతన్య రాసిన నెర్లిచ్చిన అద్దం, అసంపూర్ణం కథలు శిల్పం, శైలి పరంగా ఆలోచింపజేస్తాయి. ది ప్రొఫెషనల్ కథతో గమన,  కృష్ణజ్యోతి కథ- పతి పత్నీ ఔర్ జస్ట్ నథింగ్, స్నాప్ ఔట్ కథతో మమత కొడిదెల, మయూఖ కథతో సెలవు లాంటి రచయితలు కొత్త తరం….భవిష్యత్ కథపై ఆశాభావాన్ని, భరోసాని కలిగిస్తారు. మొత్తంగా కొత్త తరం రాస్తున్న కథలని పరిశీలిస్తే  ఇతివృత్తం కన్నా శైలికి, శిల్పానికి ప్రాధాన్యం పెరగడాన్ని మనం గమనించవచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు, భిన్న పోకడలతో  ప్రత్యేక గుర్తింపు కోసం,  తెలుగు కథని ఇంకో మెట్టు ఎక్కించడానికి కొత్త తరం కలిసి కట్టుగా చేస్తున్న ప్రయత్నించడం నిజంగా సంతోషకరం.

శైలి, శిల్పం పరంగా కె.ఎన్. మల్లీశ్వరి రాసిన రూబా, శైలజా చందు-వాన కథ, మైథిలి అబ్బరాజు- రాజహంస,  జి. వెంకట కృష్ణ-స్మృతి, ఉత్తమ కథలు. ఇంకొన్ని కథల్లో అసలు తీసుకున్న ఇతివృత్తాలే చర్చకు దారి తీసిన కథలూ ఉన్నాయి. వాటిల్లో పి. వసంత లక్ష్మి రాసిన వారిజ కథ ప్రధానంగా చెప్పుకోవచ్చు. తల్లి కావడానికి పెళ్లి చేసుకోకుండా…జీవితంతో కొత్త ప్రయోగం చేసిన మహిళ కథ వారిజ.  సహజీవనాన్ని కేవలం మాతృత్వానికి మాత్రమే పరిమితం చేసిన వారిజ నిర్ణయం కొత్తగా ఉన్నా …ఆచరణ సాధ్యమా అనే సందేహాన్ని, ఆ తర్వాత పర్యావసానాల గురించి ఆలోచింపచేస్తుంది. తాత్కాలిక ఆకర్షణలకు లోనై వివాహ బంధాన్ని చిన్నాభిన్నం చేసుకున్న మహిళ కథ బుద్ధి యజ్ఞమూర్తి రాసిన తెగని గాలి పటం. ఈ కథలో కమలిని పాత్ర ప్రవర్తన, అందుకు ఆమె భర్త శేఖర్ ప్రతిస్పందన విచిత్రంగా ఉంటాయి.

ఇదే తరహా అంశంతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ గురించి చర్చించిన మరో కథ కృష్ణవేణి రాసిన తెగిన గాలిపటం. ఈ తరహా కథలన్నీ ఆధునిక మహిళల ఆలోచనలకు అద్దం పడుతూ… వివాహ వ్యవస్థలో ఇమిడిపోలేక ఎదుర్కొంటున్న సంఘర్షణను చూపిస్తాయి. కానీ వాటికి రచయితలు చూపిన పరిష్కారం సమంజసమా ( ముఖ్యంగా వారిజ కథలో ) అనే సందేహం కలుగుతుంది.
ఇక్కడో ఆసక్తి కరమైన విషయమేమిటంటే…మిగతా సాహిత్య ప్రక్రియల సంగతి ఏమోకానీ ఇటీవలి కాలంలో కథా ప్రక్రియలో పురుషుల కన్నా మహిళా రచయితలే అధికంగా రాస్తున్నారు. ఒకప్పుడు నవలా ప్రక్రియను మహారాణుల్లా ఏలిన మహిళలే…సమీప భవిష్యత్తులో తెలుగు కథను కూడా తమ చేతుల్లోకి తీసుకొనే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐతే ఇందుకు దారితీస్తున్న పరిస్థితులేమిటి..?  ఏ కారణాల చేత మహిళా రచయితలు అధికంగా రాస్తున్నారు.?  ఏ అంతర్గత సామాజిక పరిస్థితులు వారిని ఈ దిశగా నడిపిస్తున్నాయన్నదీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

( ముగింపు వచ్చేవారం )

2015: కొత్త కలాల కథాకళి

      

( కథా సారంగ-2015 సమీక్ష )

~

chanduఅనంత గమ్యం వైపు సాగిపోతున్న మహా ప్రవాహం కాలం.  చాలా మంది  కాలం మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం.
***

గడిచిన ఏడాది 2015 మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపింది.  మన చుట్టూ తనదైన ముద్రలను ఎన్నో వదిలి వెళ్లింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాల వల్లనే కాక సాహిత్య పరంగా కూడా గత సంవత్సరానికి ఓ విశిష్టత ఉంది. సాధారణంగా సాహిత్యం, సాహిత్య కారులు…రాజకీయ పాలనా అంశాలను ప్రభావితం చేసే సందర్భాలు చాలా తక్కువ. ఏ అవార్డులో, పురస్కారాల సందర్భంలో తప్ప… సాహిత్యం,  రచయితలు ప్రధాన వార్తా స్రవంతిలో ఉండడం చాలా అరుదు. అలాంటిది… గడచిన ఏడాదిని సృజనకారులే నడిపించారని చెప్పుకోవచ్చు. వివిధ రకాల అంశాలపై వారి స్పందన పట్ల…. విభిన్న రకాల అభిప్రాయాలున్నా కూడా, మొత్తానికి సృజన కారులు అప్రమత్తంగానే ఉన్నారన్న భావన ఎవరికైనా సంతోషాన్ని కలిగించేదే.  మన తెలుగు నాట కూడా ఇదే సందడి కొనసాగింది.  రకరకాల వాదనలు, చర్చలు, అభిప్రాయాలు, నిరసనలు…ఇలా 2015  వేగంగా గడిచిపోయింది.

వీటన్నింటిని నేపథ్యంగా తీసుకుంటూ సారంగ పత్రికలో గత ఏడాది కాలంలో వచ్చిన కథలను పరిశీలిస్తే… మనకు చాలా విషయాలు అవగతమవుతాయి.  గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ సంవత్సర కాలంలో యాభై మూడు పెద్ద కథలు, పందొమ్మిది చిన్న కథలు వచ్చాయి.  ఇవి కాకుండా  అనిల్-ఎస్-రాయల్  అనువాద కథ బ్రహ్మాండం,  అనురాధ నాదెళ్ల రాసిన గూడెం చెప్పిన కథలు లాంటి ఇతర కథలు కూడా వచ్చాయి. నామిని,  రామాచంద్రమౌళి లాంటి సీనియర్ కథకులు ఎప్పటిలాగే తమ కథాయజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.  అలాగే వెంకట్ సిద్ధారెడ్డి,  పింగళి చైతన్య, అల్లం ‌వంశీ, రేఖా జ్యోతి వంటి….చాలామంది  కొత్త రచయితలు వెలుగు చూడడం సంతోషకరం. పేరుకే కొత్త రచయితలైనా…వస్తువు ఎంపిక, శైలి, శిల్పం పరంగా మంచి పరిణతిని చూపిస్తున్నారు.

Artwork: Bhavani Phani

Artwork: Bhavani Phani

ఈ ఏడాది కథలన్నీ చదివిన తర్వాత…ముందుగా ఒకటి చెప్పాలి. “తెలుగు భాష త్వరలోనే అంతరించిపోతుందని” ప్రచారం చేసే వారికీ, “అవునా..?” అని భయపడేవారికి.  మరేం ఫర్వాలేదు,  తెలుగు భాషకే కాదు… తెలుగు కథకు కూడా ఇప్పట్లో ఏ ప్రమాదమూ లేదని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.

ముద్రణా పత్రికల కథలతో పోలిస్తే…, సారంగలాంటి అంతర్జాల పత్రికల కథలకు కొన్ని తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. రకరకాల కారణాలతో దినపత్రికలు లేదా ఇతర వార పత్రికలు  కొన్ని రకాల ఇతివృత్తాలను అంగీకరించలేని పరిస్థితి. పైగా ఎంత కాదన్నా అక్కడ సీనియర్ కథకులు, పేరు మోసిన వారి కథలకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటోంది. ఎప్పడో తప్ప కొత్త రచయితల కథలు రావు. ఇందుకు ఇతర కారణాలూ ఉండొచ్చు.  ఆ రకంగా ఆన్ లైన్ పత్రికల కథల్లో కొత్త రక్తం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటోంది.  దాంతోపాటూ ఏ తరహా ఇతివృత్తానికైనా ఆన్ లైన్ పత్రికలు కొంత వెసులు బాటు ఇవ్వడం కూడా కొత్త దనం కనిపించడానికి కారణమవుతోంది. అలా కథా సారంగ ద్వారా పాఠకులకు చాలా కొత్త కలాలు పరిచయమయ్యాయి.

ఆ రకంగా వస్తున్న కొత్త తరంలో విభిన్న ఇతివృత్తాల ఎంపిక,  శైలి శిల్ప పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ కొందరు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అప్పటికే చాలామంది రాసిన ఇతివృత్తాలని కూడా…. మూలాల్లోకి వెళ్ళి అన్వేషించి కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. కొన్ని కథలైతే..అనుభవజ్ఞులైన రచయితలకూ తీసిపోని విధంగా ఉన్నాయి.

ఐతే ఇదంతా ఒకవైపే. మరో వైపు ఊహాజనిత సమస్యలు,  కృత్రిమ ఇతివృత్తాలు సృష్టించిన వాళ్లూ ఉన్నారు.  తమ సొంత గొడవలనే కథల పేరుతో దేశం మీదికి ప్రయోగించిన వాళ్లూ లేకపోలేదు.  కొన్ని కథలైతే డైరీలో దినచర్యను తలపించినవి కూడా లేకపోలేదు.  అయినా కూడా  కథలు రాయాలన్న తపనతో… ఓ అడుగు ముందుకు వేసినందుకు వీరినీ భుజం తట్టాల్సిందే. చిన్న చిన్న లోపాలున్నా… కొత్త కథకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారినీ పరిగణనలోకి తీసుకుంటున్న సారంగ సంపాదకులనూ అభినందించాల్సిందే.

చాలా మంది కొత్త రచయితలు  తమకు ఎదురైన సాధారాణ సంఘటనలనే కథలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. కథలు రాసే కొత్తల్లో ఏ రచయితలకుండే ఆవేశం, అత్యుత్సాహం వల్ల… కనిపించే ప్రతీ ఘటననూ కథలుగా రాయాలనుకుంటారు. పొద్దున సిటీ బస్సులో సీటు దొరక్క పోవడం నుంచీ…రాత్రికి సీరియల్ లో లేడీ విలన్ ప్రవర్తన  దాకా…కనిపించే ప్రతీ ఘటనను కథలుగా సంధించాలనుకుంటారు. అది మంచిదే. కథలు రాయాలన్న తపన అభినందనీయమే కానీ ప్రతీ అనుభవమూ కథ కాదని తెలుసుకోవాలి.  కథకు సంబంధించిన కొన్ని మౌలిక లక్షణాలపై  కొత్త రచయితలు మరింతగా అధ్యయనం చేయాలి. కవితకు సరిపోయే తక్షణ భావావేశం… కథగా మారినపుడు మాత్రం సంతృప్తి పరచదు.

అలాగే  కొత్త రచయితలే కాక…సీనియర్లు కూడా దృష్టి కోణంలో వ్యక్తిగత జీవిత పరిధిని దాటలేక పోతున్నారు. తమకు తెలిసిందే రాయాలన్నదే మంచి నిర్ణయమే ఐనా కేవలం తమ కతలే….కథలు కాబోవని కూడా గుర్తించాల్సి ఉంది.   సృజనకారులకు వ్యక్తి గత జీవితం, వ్యక్తిగత బాధ్యతలే కాదు… సాంఘిక జీవితం, సామూహిక బాధ్యతా ఉంటాయి.  తమ వ్యక్తిగత దృక్కోణంలోంచే కాకుండా….సమాజ కోణంలోంచి కూడా  అంశాలను తప్పక పరిశీలించాలి.

artwork: Srujan

artwork: Srujan

ఇక ఇక్కడ లోతుగా చర్చించాల్సిన విషయమూ ఇంకొకటి ఉంది. మాండలికం కథల గురించి.  ఏదీ మాండలికం..? ఏదీ యాస…? ఏదీ గ్రామ్యం…ఏది వ్యవహారం…? అంటూ ప్రశ్నించాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే కొందరు మాండలికం పేరుతో….కేవలం గ్రామ్యం రాస్తున్నారు.  నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొన్ని పదాల ఉచ్ఛారణను తమకు అనుగుణంగా మార్చుకున్న వాటినే మాండలికం అనుకుంటున్నారు. కథకు తగిన విధంగా, పాత్రకు అనుగుణంగా  ఏభాష వాడినా అభ్యంతరం ఉండదు. కానీ ఓ పక్క గ్రామ్యం రాస్తూ….మళ్లీ మధ్య మధ్యలో  సంస్కృత భూయిష్ట సమాసాలు, ఆంగ్ల భాష పదాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?

కొంచెం ఇష్టం కొంచె కష్టం అన్నట్లుగా….కొంచెం కథ రాసి, ఇంకొంచెం కవిత్వం కలిపి రాసిన వాళ్లూ ఉన్నారు.  తెలుగు కథల్లో వస్తున్న ఓ ఆధునిక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది.     అలాగే  ఒక సున్నిత సమస్యను తీసుకొని …దాన్ని వ్యతిరేకించేవారు కూడా అద్భుతం అని మెచ్చుకునేలా రాసిన కథలూ ఉన్నాయి.  వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్ కథ, పింగళి చైతన్య -తనదే ఆకాశం, అల్లం వంశీ మిరకిల్…ఎండ్లూరి మానస అదే ప్రేమ..కథలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంచుకున్న ఇతివృత్తాలు వివాదాస్పద అంశాలైనా…చెప్పిన కోణం, ఒప్పించిన తీరుతో పాఠకుల్ని ఆకట్టుకున్నాయి.

రైతు ఆత్మహత్యలు, కొత్త రాజధాని కోసం భూ-సేకరణ, కరువు, వివేక్, శృతి ఎన్ కౌంటర్… లాంటి అంశాలు గత ఏడాది తెలుగునాట తీవ్రంగా చర్చకు వచ్చాయి. కానీ ఈ కథల్లో అలాంటివేమీ కనపడవు. రైతు ఆత్మహత్యలు, భూ సేకరణ మీద మాత్రం ఒక్కో కథ వచ్చాయి.  అంటే సామాజిక సమస్యలు రచయితలను స్పందింప జేయలేకపోయాయా..? లేదా రచయితలు స్పందించలేకపోయారా..?

వివాహేతర సంబంధాల పట్ల ఆసక్తి, స్వలింగ సంపర్కుల  సమస్యలు వంటి సున్నిత అంశాలపైన కూడా స్పందిస్తున్న మన కథకులు … సామాజిక సంక్షోభాల్ని, సమాజాన్ని కుదిపేస్తున్న తీవ్ర పరిణామాలను మాత్రం ఎలా పక్కకు పెట్టగలుగుతున్నారు…?  ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నారా అన్న సందేహమూ కలుగుతుంది…?
ఇలా రకరకాల అభిప్రాయాలకు తావిస్తున్న కథా సారంగ కథలను వివరంగా చర్చిద్దాం.

                                      (మిగతా వచ్చే వారం)

“విముక్త” పోరాటం ఎంత వరకు?!

 

(ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా  సాహిత్య అకాడెమి అవార్డు అందుకుంటున్న సందర్భంగా…)

-కల్పనా రెంటాల

~

 

అప్పటికే ప్రాచుర్యంలో వున్న కావ్యాలనూ, అందులో పాత్రలనూ, సన్నివేశాలను తిరగ రాయడం తెలుగు సాహిత్యంలో కొత్త కాకపోవచ్చు. అదే పనిని అనేక మంది రచయితలు వేర్వేరు కోణాల నుంచి చేశారు. మధ్య యుగాల కావ్య సాంప్రదాయంలో అచ్చ తెలుగు కావ్యాలు చాలా వరకు రామాయణ, మహాభారతాల పునర్లేఖనమే! ఆధునిక యుగంలో విశ్వనాథ, త్రిపురనేని రామస్వామి, పఠాభి, చలం, రంగనాయకమ్మ లాంటి రచయితలు వివిధ కోణాల నించి రామాయణాన్ని తిరగ రాశారు. అలా రాసేటప్పుడు ఆయా రచయితలు కేవలం తిరగ రాయడానికే పరిమితం కాలేదని వాటిని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఆయా కావ్యాలను కొత్త దృష్టితో చదవాల్సి వుంటుందన్న అవసరాన్ని  కూడా ఈ పునర్లిఖిత కావ్య ప్రయోగం నొక్కి చెబుతుంది.

రామాయణాల్ని ప్రశ్నించే అదే ప్రయోగ ధోరణిని ఇంకా ముందుకు తీసుకువెళ్లి, అందులోని పాత్రలను ఈ కాలపు సందర్భంలోకీ సంభాషణలోకీ పునప్రవేశ పెట్టి, ఇంకో ప్రయోగం చేశారు ఓల్గా. “విముక్త” కథలు దీనికి బలమయిన ఉదాహరణ అయితే, ఆ ‘విముక్త” చుట్టూ ఓల్గా నిర్మించిన పురాణ విముక్త భిన్న సందర్భానికి సాధనాలుగా అమరిన కొన్ని విషయాల్ని చర్చించడం ఇవాళ అవసరం. ‘ విముక్త ‘ లో కొత్తగా ఓల్గా చేసిన దేమిటి? ప్రతిపాదించినదేమిటి? పఠాభి, చలం, కొ.కు.లాంటి వారు పురాణ పాత్రలని తిరగ రాసే పని ఎప్పుడో చేశారు. అయితే ఓల్గా వారి కంటే కొత్తగా, భిన్నంగా చేసినదేమిటి? ఎందుకలా చేసింది? అని ఆలోచించినప్పుడు , విముక్త లోని కథలన్నీ ఒకే సారి మళ్ళీ ఒక చోట ఓ సమాహారం గా చదివినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఓల్గా ముందు తరం రచయితల కంటే ఒక స్త్రీ వాద రచయిత్రి గా ఎంత భిన్నమైందో అర్థమవుతుంది.

పాత్రలు కావు, భావనలు!

ఇంతకు ముందు పురాణ పాత్రల మీద వ్యాఖ్యాన రచనల చేసిన వారు ఆ పాత్రలను కేవలం పురాణ పాత్రలుగా నే చూశారు. పాత్రల వరకే పరిమితమై చూశారు . ఓల్గా చేసిన విభిన్నమైన, విశిష్టమైన పని ఏమిటంటే సీతనో, శూర్పణఖ నో, అహల్యానో, ఊర్మిళ నో, రేణుకనో, చివరికి రాముడి ని కూడా కేవలం ఒక పాత్రలు గా కాకుండా కొన్ని భావనలుగా చూసింది. ఒక భావనగా చూపించేటప్పుడు పురాణ పాత్రల మౌలిక స్వభావాలను మార్చటం అనివార్యమవుతుంది. అలా ఆ భావనలను ఎందుకు మార్చటం అంటే కొత్త భావనల రూపకల్పన కోసం అని చెప్పవచ్చు.  రామాయణం లో శూర్పణఖ అసురీ స్వభావం కల వనిత. అయితే సమాగమం లోని శూర్పణఖ అసూయపరురాలు, రాక్షసి కాదు. అంతఃసౌందర్యంతో విలసిల్లే ధీరోధాత్త.

సీత  ఈ కథలన్నింటి లోనూ కనిపించే ఒక ప్రధాన భావన. ఈ మూల భావన తో ఇతర పాత్రలు ఇంకొన్ని భావనలుగా కలుస్తాయి. అలాంటి కొత్త భావనల సమాగమ సమాహారం విముక్త. సమాగమం లోనో, ఇతర కథల్లోనో కేవలం సీత  శూర్పణఖ నో, అహల్య నో కలవటమే కథ కాదు. పాత్రలుగా కలవటం కాదు అది. వాళ్ళను కలుపుతోంది ఒక భావన. ఒక ఐడియా. ఒక కోణం. రచయిత్రీ ఈ పాత్రలను ఏ భావనాలకు సంకేతంగా తీసుకుంది, వాటిని ఏ భావనలతో కలుపుతోంది, వాటి కలయిక ద్వారా రచయిత్రి చెప్తున్న కొత్త భావనలు ఏమిటి? అన్నది చూస్తే ‘ విముక్త’ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో అర్థమవుతుంది.

రామాయణం లో సీత ప్రధాన పాత్ర కాకపోయినా రెండో ప్రధాన పాత్ర. కానీ  విముక్త  కథలన్నింటిలో సీత ప్రధాన పాత్ర గా కనిపిస్తుంది కానీ,  పక్క పాత్రలుగా కనిపించే శూర్పణఖ, అహల్య, రేణుకా, ఊర్మిళ ప్రధాన పాత్రలుగా నిలుస్తారు. ఆ రకంగా పక్క పాత్రలను ప్రధాన పాత్రలుగా చూపిస్తూ, వారి నుంచి సత్యాలను, జ్నానాన్ని సీత పొందటం ద్వారా చివరికి సీత, అహల్య, ఊర్మిళ, రేణుకా అందరూ కలిసి ఒకే భావన గా మారిపోతారు. అయిదు కథలు చదవటం పూర్తి అయ్యాక మనకు అన్నీ పాత్రలు కలిసి ఒక సీత గా , ఒకే ఒక్క భావనగా మిగులుతుంది. ఆ సీత లో శూర్పణఖ ఉంది, ఆ సీత లో అహల్య ఉంది. ఆ సీత లో రేణుకా ఉంది. ఆ సీత లో ఊర్మిళా ఉంది.  ఆ సీత లో రాముడు కూడా వున్నాడు. ఈ కథలన్నింటి లో రాముడి కథ మిగతా వాటి కంటే విభిన్నమైనది.    స్త్రీ పాత్రల వైపు నుంచి మిగతా కథలు నడవగా,  ‘బంధితుడు’ కథ ఒక్కటి  రాముడి వైపు నుంచి సాగుతుంది. ఆ కథ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో  అర్థమయితే  ఒకింత ఆశ్చర్యం తో పాటు ఆనందం కూడా కలుగుతుంది.

సీత కాలం నాటి సమస్యలే ఆధునిక వేషం ధరించి ఇప్పుడు కూడా వీర విహారం చేస్తున్నాయి. కొత్త సమస్యలను పురాణ పాత్రల ద్వారా కొత్త చూపుతో విశ్లేషిస్తోంది. అందుకు స్త్రీ వాదాన్ని ఒక సాధనంగా వాడుతోంది.  ఓల్గా కేవలం సాహిత్య సృజన మాత్రమే చేయదల్చుకుంటే, స్టీవాదాన్ని కేవలం సాహిత్య పరిధి లో మాత్రమే వుంచి చూడాలనుకుంటే ఒక ” సమాగమం’ కథ సరిపోయేది. మిగతా కథలు రాయాల్సిన పని లేదు. అయితే యాక్టివిస్ట్ గా ఓల్గా ఒక పరిమితి లో , ఒక పరిధి లో ఆగిపోదల్చుకోలేదు.  సాహిత్యపరిధి నుంచి, సృజనాత్మక పరిధి నుంచి స్త్రీవాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఆ  ప్రణాళిక లో భాగంగానే ఇన్ని కథలు రాయటం అవసరమయింది.

పాతివ్రత్యం అనే పురాణ భావన ని  బద్దలు చేసిన కథ “సైకత కుంభం”. ఇందుకు ఓల్గా ఎంచుకున్న పాత్ర రేణుకాదేవి. జమదగ్ని మహర్షి భార్య గా, పరశురాముడి తల్లి గా లోకానికి తెలిసిన రేణుకా దేవి  ఓ అపురూప శిల్పకారిణిగా ,  విశిష్టమైన సైకత కుంభాలను తయారు చేయగలిగే కళాకారిణిగా  ఈ కథ ద్వారా అర్థమవుతుంది.  ఆర్య ధర్మం లో ప్రధానమైన పితృ వాక్య పరిపాలనకు రాముడు ఒక కోణం అయితే, పరశురాముడు రెండో కోణం.   ఈ రెండు కోణాలు ఇద్దరు స్త్రీలకు ఏం మిగిల్చాయో చెప్పే కథ ఇది.

పాత్రివ్రత్యం , మాతృత్వ భావనల  చుట్టూ స్త్రీల జీవితాలను ఓ ఉచ్చులో బిగించిన పురుషస్వామ్య సంస్కృతి లోని కుట్ర ను, డొల్ల తనాన్ని బయటపెడుతుంది రేణుక. భర్త గురించి,కుమారుల గురించి తనకు తెలిసినంత గా మరెవ్వరికీ తెలియదని రేణుక చెప్పినప్పుడు  మీకు అలా జరిగింది కాబట్టి ప్రపంచం లో భర్తలు, కుమారులు అందరూ ఆలాగే వుంటారని అనుకోవడం న్యాయం కాదని అంటుంది సీత. కానీ రేణుక హెచ్చరించిన సందర్భాలు రెండూ సీత జీవితం లో కూడా ఎదురయ్యాయి.

” భర్త తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటారు స్త్రీలు. నిజమే. కానీ ఏదో ఒక రోజు భర్త తన ప్రపంచం లో నీకు చోటు లేదంటాడు. అపుడు మనకు ఏ ఆధారం  ఉంది? పుత్రులకు జన్మనివ్వటమే జీవిత గమ్యమనుకుంటాము. ఆ పుత్రులు పురుషుల వంశాకురాలై మనం గ్రహించే లోపే మన చేయి వదిలి తండ్రి ఆధీనం లోకి వెళ్తారు. వారి అజ్నాబద్ధులవుతారు. లేదా వారే మన జీవితాలకు శాసనకర్తలవుతారు. ఎందుకు ఆ పిల్లలను కనటం- ఇది నాకు అనుభవమైనంత కఠోరంగా మరింకెవరికీ అవదు. కఠోర సత్యం తెలిశాక చెప్పటం నా విధి కదా-”

రేణుక చెప్పిన మాటలు సహజంగానే సీత కు రుచించలేదు.  ఎందుకంటే రేణుక చెప్తున్నలాంటి సందర్భాలు అప్పటికి ఇంకా సీత జీవితం లో ఎదురవలేదు. కళ్లెదుట కనిపిస్తున్నా, తన భర్త, రేపెప్పుడో తనకు పుట్టబోయే బిడ్డలు అలాంటి వారు కారనే ప్రతి స్త్రీ నమ్ముతుంది. ఆ నమ్మకం లోనే, ఆ భ్రమ లోనే బతకాలనుకుంటుంది తప్ప వాస్తవాన్ని గుర్తించాలనిపించదు.  జీవితమనే ప్రయాగశాల లో  రేణుక లాంటి కొందరు స్త్రీలు నేర్చుకున్న అనుభవ పాఠాలు ఎవరైనా చెప్పినా మనకు వాటిని స్వీకరించా లనిపించదు.  దాన్ని సత్యం గా అంగీకరించాలనిపించదు. అందుకే సీత కూడా ” మీ మాటలు నా కర్థం కావటం లేదు. అవి స్త్రీలకు హాని చేస్తాయనిపిస్తోంది” అంటుంది.

తాను తెలుసుకున్న సత్యాన్ని  ఇతర స్త్రీలకు చెప్పటం, తన అనుభవాలను వారితో పంచుకోవటం వల్ల స్త్రీలుగా, బాధితులుగా , అవమానితులు గా   తామంతా ఒక్కరమేనని , ఒకే సమూహానికి చెందిన వారమన్న అనుభూతినిస్తుంది.  ఈ స్త్రీవాద భావన లోంచి చూసినప్పుడు ఓల్గా ఈ కథలను ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం రాసినట్టు స్పష్టం గా తెలుస్తుంది.

స్త్రీలకు తమ మనసు ల మీద, తమ శరీరాల మీద కూడా ఎలాంటి హక్కు లేదని చెప్పే ఆర్య సంస్కృతి పై రేణుక ద్వారా  సైకత కుంభాల సాక్షిగా ఓల్గా తన తిరుగుబాటు ను ప్రకటిస్తోంది.  ఆర్య సంస్కృతి పరిరక్షణ లో భాగంగా పితృస్వామ్యం పెంచి పోషించిన పాతివ్రత్యం, మాతృత్వమే స్త్రీల పరమార్థం లాంటి స్థిర భావనలను సమూలంగా ఈ కథల ద్వారా వోల్గా చర్చకు పెట్టి వాటిని కూకటి వ్రేళ్లతో పెకిలించి వేసి కొత్త భావనలను స్తిరపరుస్తోంది.

vimukta

ఓల్గా రాసిన ‘ విముక్త ‘ కథ లో పద్నాలుగేళ్ళు వనవాసం చేసి వచ్చిన సీత ఊర్మిళ ను చూడటానికి వెళ్లినప్పుడు చెప్పిన మాట ఇది. తనను ఒక మనిషి గానైనా గుర్తించకుండా, కనీసం తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అన్నా వదినల వెంట లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఊర్మిళ మొదట కోపంతో రగిలిపోయింది.  ఆరని నిప్పుగా మారింది.  తన నిస్సహాయ ఆగ్రహాన్ని ఊర్మిళ సత్యాగ్రహం గా మార్చుకుంది.   నెమ్మదిగా ఆ కోపం తగ్గాక, ఆ ఆవేశం చల్లారాక ఆమె తన దుఃఖానికి, కోపానికి కారణాలు వెతకటం మొదలుపెట్టింది.  తనను నిలువునా దహించి వేస్తున్న ఆ కోపానికి మూల కారణం కనిపెట్టాలని తన అన్వేషణ మొదలుపెట్టింది. కోపం, దుఃఖం, ఆనందం లాంటి ఉద్వేగాలకు , కోపానికి వున్న మూలసంబంధాన్ని విశ్లేషించటం మొదలుపెట్టింది. అందుకు ఆమెకు ఏకాంతం అవసరమయింది. ఊర్మిళ  ఒంటరి తనం లో కూరుకుపోలేదు. ఏకాంతాన్ని కౌగిలించుకొని తన లోపల తాను గా, తనలో తాను గా  ఆ పద్నాలుగేళ్ళు గడిపింది.  తనకు ఇతరులతో వున్న సంబంధాన్ని పొరలు పొరలుగా తీసి లోతుకి వెళ్ళి చూసింది. ఈ అనుబంధాల మూలాలను కనుగోనె క్రమం లో ఊర్మిళ తనతో తాను పెద్ద యుద్ధమే చేసింది. రక్తపాతం, హింస లేని ఆ ఆత్మ యుద్ధం తో ఆమెకు గొప్ప శాంతి, ఆనందం లభించాయి.

స్త్రీ పురుష సంబంధాల్లో ప్రధాన సమస్య అధికారం. ఎవరికి ఎవరి మీద అధికారం ఉంది? ఎంత వరకూ ఉంది? ఎవరి చేయి పైన, ఎవరి చేయి కింద అన్నదే వారి మధ్య అన్నీ పోట్లాటలకు మూల కారణం. ఆ సమస్య ను ఊర్మిళ తన అన్వేషణతో జయించింది.   అధికార చట్రాలలో పడి నలిగిపోతూ విముక్తమయ్యే దారి, తెన్నూ తెలియక అశాంతి తో, ద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళకు ఊర్మిళ తన శాంతి రహస్యాన్ని, తన ఏకాంతం లోని గుట్టు ని విప్పి చెప్దామనే అనుకుంది.  ఊర్మిళ జీవన సత్యాన్వేషణ లో తనతో తాను యుద్ధం చేస్తోందని తెలుసుకోలేని వారు ఆమె దీర్ఘ నిద్ర లో మునిగి ఉందని బాధపడ్డారు.

తాను చెప్పినది సీత కు అర్థమయిందని తెలిసాక  ఊర్మిళ మరో ముందస్తు హెచ్చరిక చేసింది.

” నీ జీవితం లో నా కొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలు తనం లోకి,మురికి లోకి నెట్టకుండా, ద్వేషంతో , ఆగ్రహం తో నిన్ను దహించకుండా, నిన్ను నువ్వు కాపాడుకో. నీ మీధ అధికారాన్ని నువ్వే తీసుకో. ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు.మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా “.

ఊర్మిళా చెప్పిన ఆ మాటల్లోని అంతరార్థం ఆ తర్వాత ఆమెకు రాముడు అరణ్యాల్లో ఒంటరిగా వదిలి వేయించినప్పుడు గుర్తొచ్చాయి. రాముడి మీద ప్రేమ ను, అనురాగాన్ని వదులుకొని ఎలా విముక్తం కావాలో , అందుకు మార్గమేమిటో ఊర్మిళా చెప్పిన మాటల నుంచి గ్రహించింది.  ఊర్మిళ చేసినట్లే ఇప్పుడు తాను కూడా తనతో తాను యుద్ధం చేసుకొని ఆ అధికారాన్ని వదులుకునే ప్రయత్నం మొదలుపెట్టాలని, అదే తన కర్తవ్యమని బోధపడింది.

రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడన్న వార్తా సీత కు చేరగానే ఆమె ను కలవటానికి ఊర్మిళ వాల్మీకీ ఆశ్రమానికి వచ్చింది.

సహధర్మచారిణి గా తాను పక్కన లేకుండా రాముడు అశ్వమేధ యాగం ఎలా చేస్తాడని సీత సందేహపడినప్పుడు ” ఈ ప్రశ్న నీకెందుకు రావాలి? వస్తే రామునికి రావాలి? ” అన్నది ఊర్మిళ. ఆ సమస్య సీత ది కాదు, రాముడి ది.  రాముడి సమస్య ను సీత పరిష్కరించలేదు. పరిష్కరించనక్కరలేదు కూడా.

అనవసరమైన ప్రశ్నలతో అశాంతి పడటం అవివేకమని, అలా నిన్ను నువ్వు హింసించుకోవద్దని  సున్నితంగా హెచ్చరించింది. ” నువ్వు రాముడి నుంచి విముక్తం కావాలి” అని ఆమెకు కర్తవ్య బోధ చేసింది ఊర్మిళ.

” ప్రతి పరీక్ష నిన్ను రాముడి నుంచి విముక్తం చెయ్యటానికే. నిన్ను నీకు దక్కించటానికే. యుద్ధం చేయి. తపస్సు చేయి. లోపలికి చూడు. నీవనే యథార్థం కనపడేదాకా చూడు” .

రాముడి నుంచి సీత విముక్తం కావాలంటే ఆ యుద్ధమేదో సీత చేయాలి.ఊర్మిళ యుద్ధం చేయాల్సిన అవసరాన్ని, ఆ మార్గాన్ని మాత్రమే సూచించగలదు. ఊర్మిళ అదే పని చేసింది. ఆ యుద్ధం తో పోలిస్తే అగ్ని పరీక్ష చాలా చిన్నది.  ఆ యుద్ధం చేశాక , తనను తాను రాముడి నుంచి సీత విముక్తం చేసుకున్నాక  మళ్ళీ వెళ్ళి సభలో తన నిర్దోషిత్వమ్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సీత కు తెలుసు. అందుకే రాముడు పంపిన ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించి తన గమ్యం వైపు కి సాగిపోయింది.

ఊర్మిళా, సీత  తమతో తాము సంఘర్షించుకొని చేసిన యుద్ధం ద్వారా తెలుసుకున్న సత్యం ఒక్కటే. ” అధికారాన్ని పొందాలి. వదులుకోవాలి కూడా”. ఆ సత్యమే వారిని  పితృస్వామ్య సంకెళ్ళ నుండి విముక్తం చేసింది. ఆధునిక స్త్రీ ది కూడా అదే మార్గం.  అధికారం అనేది ఎలా వదులుకోవాలో? ఎందుకు వదులుకోవాలో తెలిస్తేనే స్త్రీలకు విముక్తి లభిస్తుంది. నిజమైన శాంతి, ఆనందం దక్కుతాయి. స్త్రీ జాతి విముక్తి ని మనసారా కాంక్షిస్తూ  అందుకు అవసరమైన సత్యాలను, అవి గ్రహించే మార్గాలను కూడా మనకు ఈ కథల ద్వారా అందించింది. మార్గం తెలిసింది. యుద్ధం ఎందుకు చేయాలో, ఎలా చేయాలో కూడా తెలిసింది. ఇప్పుడు ఆ యుద్ధం చేయాల్సిన బాధ్యత, విముక్తం కావల్సిన అవసరం ఆధునిక స్త్రీ దే.

*

 

ఓల్గా తో సారంగ ముఖాముఖి ఇక్కడ: 

కథ జీవితమంత విశాలం కావాలి!

 

-ఆరి సీతారామయ్య

~

సమాజానికి ఏది మంచిదో ఆలోచించడం, దాన్ని ప్రోత్సహించడం, తదనుగుణంగా ప్రవర్తించడం సామాజిక స్పృహ. సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించే శక్తులనూ భావజాలాన్నీ వ్యతిరేకించడం కూడా సామాజిక స్పృహే.

తన వర్గానికి ఏది మంచిదో, లేక తనకు ఇష్టమైన వర్గానికి ఏది మంచిదో  దాన్ని ప్రోత్సహించడం,  ఆ వర్గ పురోగమనాన్ని నిరోధించే శక్తులను  వ్యతిరేకించడం వర్గ చైతన్యం. అస్తిత్వ ఉద్యమాల పేరుతో జరుగుతున్న ప్రాంతీయ, వర్గ, కుల, మత పోరాటాలలో పాల్గొనడం, లేక వాటితో  సహకరించడం వర్గ చైతన్యం.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గురించి అభిప్రాయాలు ఏర్పరచు కోవటం, ఆ పరిణామాల వెనుక ఉన్న చోదక శక్తుల గురించి అవగాహన ఏర్పరచు కోవడం ప్రాపంచిక దృక్పథం.

సామాజిక స్పృహా, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం ఎంతో కొంత ప్రతి మనిషిలో ఉంటాయి. చైతన్యవంతుల్లో ఎక్కువే ఉంటాయి.

కథలు రాయదల్చుకున్న వారికి ఇవన్నీ ఉండటం మంచిదే. కాని తన సామాజిక స్పృహనీ, వర్గ చైతన్యాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్నీ కథలో జొప్పించకుండా, పాత్రల స్వభావాలను  తన వైపు తిప్పుకోకుండా, కథలో పాత్రలను వారివారి స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తించే వారిగా సృష్టించ గలిగితే మంచి కథలు వస్తాయి. అదంతా అవసరం లేదు, కథ మన వర్గపోరాటానికి ఒక సాధనం మాత్రమే అనే వారున్నారు. అలాంటి అభిప్రాయం  ఉన్నవారుకూడా నేర్పూ ఓర్పూ ఉంటే సజీవమైన పాత్రలను సృష్టించగలరు, మంచి కథలు రాయగలరు. నేర్పూ ఓర్పూ లేని వారు వస్తువు బలంగా ఉంటే చాలు, రూపం అంత ముఖ్యం కాదు అని ప్రచారం చే స్తూ కథల్లో తమ సామాజిక స్పృహా, తమ వర్గ చైతన్యం, తమ ప్రాపంచిక దృక్పథాన్నే మళ్ళీ మళ్ళీ  పాత్రలకు అంటిస్తూ నిస్సారమైన పాత్రలతో ఉపన్యాసాలతో పాఠాలతో విసుగు  పుట్టిస్తుంటారు.

సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం గురించి ఆలోచించని  వారు మంచి కథలు రాయగలరా? రాయగలరు అని నా అభిప్రాయం. మంచి కథ అంటే ఏంటో ముందు చెప్పుకుందాం. ఒక భావోద్రేకానికి లోనయిన రచయిత, దాన్ని కథ ద్వారా పాఠకులకి అందించగలిగితే అది మంచి కథ. భావోద్రేకానికి కారణం కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. పాఠకులు ఆ భావోద్రేకాన్ని అనుభవించాలంటే రచయిత సజీవమైన పాత్రలను సృష్టించాలి. కథలో సన్నివేశాలూ సంఘటనలూ రోజువారీ జీవితంలో అందరికీ ఎదురయ్యేవిగా ఉండాలి. అప్పుడు కథ పండుతుంది.

తమచుట్టూ  సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం అని  గిరులు  గీసుకుని,  వీటి  పరిథిలోనే  కథలు  రాయాలి  అనుకునే  వారికి  ఇవి గుదిబండల్లాగా తయారవుతాయని నా అభిప్రాయం. సగటు  తెలుగు సినిమా ఎప్పుడూ పనికి మాలిన వారి ప్రేమకలాపాల చుట్టూ తిరుగుతున్నట్లు, తెలుగు  కథ ఎప్పుడూ సమస్యలూ, వాటి పరిష్కారాల చుట్టూ తిరుగుతుంటుంది. అందువల్ల కథలు ఎప్పుడూ ఒక చిన్న వలయంలో ఉన్న వస్తువుల గురించే వస్తుంటాయి. జీవితంలో ఉన్నంత వస్తువిస్తృతి, భావవిస్తృతి కథల్లో ఉండదు.

తెలుగు కథ సమస్యలకూ పరిష్కారాలకూ పరిమితం కావటానికి కారణం ఎవరు? వామపక్షం వారని చాలా మంది అభిప్రాయం. సాహిత్యంలో వామపక్షం వారి ప్రభావం ఎక్కువగా ఉండటం, సమాజాన్ని తమకు ఇష్టమైన దిశగా మార్చటానికి సాహిత్యం ఒక పనిముట్టు అని వారు  భావించటం, ఇప్పుడు ఆ  భావజాలాన్ని  అన్ని ‘అస్తిత్వ ఉద్యమాల’ వారూ పాటించటం, తెలుగు  కథ ప్రస్తుత పరిస్థితికి చేరటానికి కారణం అని  నా అభిప్రాయం.

కానీ ఇది వామపక్షం సృష్టించిన పరిస్థితికాదు. ఆధునిక కథాప్రక్రియకు ముందే మన దేశంలో నీతికథలు ఉండేవి. కథకు ముఖ్యోద్దేశం ఒక నీతిని పాఠకులకు చేర్చడం. ఈ ప్రభావం వల్లనే మనం కథ దేని గురించి? అసలు ఈ రచయిత ఈ కథ ద్వారా ఏం చెప్పదల్చుకున్నాడూ? అని చాలా అనాలోచితంగా అడుగుతూ ఉంటాం. అంటే కథ ఏదో ఒక సమస్య గురించి  ఏదో ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అన్న మాట. మనకు చాలా కాలంగా ఉన్న ఈ  ఆచారాన్నే వామపక్షం వారు  బలోపేతం చేశారు. ఆ గోతిని ఇంకా లోతుగా తవ్వారు.

జీవితం సమస్యలకంటే, భావజాలాలకంటే, అస్తిత్వ ఉద్యమాలకంటే, రాజకీయాలకంటే విస్తృతమైంది. కథని ఒక పనిముట్టుగా వాడుకోవటం మానేసి, జీవితంలో ఉండే అన్ని కోణాల్నీ ప్రతిఫలించనివ్వాలి. అప్పుడు తెలుగు కథకు మంచి రోజులు వస్తాయని నా నమ్మకం.

*

 

కథ కళారూపమే, కానీ…!

 

artwork: Srujan

artwork: Srujan

దగ్గుమాటి పద్మాకర్
~

daggumatiతెలుగు రచయితలు పాఠకుల స్థాయిని తక్కువచేసి చూడడం ద్వారా తక్కువస్థాయిరచనలు వస్తున్నాయని ఒక ఆరోపణా; సమాజాన్నో, వ్యక్తులనొ మార్చాలన్న తపన వల్ల  కథ కళారూపమన్న విషయం మరుగున పడిపోతున్నదన్న ఆరోపణ మరొకటి గతవారం అమెరికానుంచి వచ్చిన కన్నెగంటి చంద్రగారు చేశారు. ఈరెండు ఆరోపణలు చేసిన కన్నెగంటి చంద్ర గారు కానీ, ఇతర అమెరికా నుంచి సాహితీవ్యాసంగం నిర్వహించే మిత్రులు గానీ ఒక విషయం అర్ధం చేసుకోవాలి.

వారు ఏదైనా ఒక కథను లేదా పదికథలను విమర్శకు స్వీకరించి ఎంత తీవ్రంగా అయినా విమర్శించ వచ్చు! అలాకాకుండా ఈతెలుగు సమాజానికి దూరంగా వుంటూ కళ పేరుతోనో, ఉత్తమ కథలపై మమకారంతమకే ఉన్న భావనతోనో ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం.సాహిత్య కళారంగాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్యంగా ఉన్నప్పుడేతమజీవనం, సంస్కృతి, సాహిత్యం, భాష వంటి అంశాల మీద  ఆంధ్రుల దృక్పథాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నించి నిలదీశారు అన్నది గమనించాలి. అందుకని ఇక్కడి తెలుగుసమాజం, రచయితలు, సామాజిక నేపథ్యం గురించి అమెరికా మిత్రులకు రెండు మాటలు చెప్పాలనిపిస్తుంది.

సాధారణంగా ఒక రచయిత దాదాపు నాలుగైదు కథలు రాస్తేగాని కొన్ని కథాంగాలు,నైపుణ్యాలపై స్పష్టత రాదు. కొందరికి ఈసంఖ్య పది కథలుబ్కూడా కావచ్చు.సమాజంలో రచయితల సంఖ్య పెరిగే కొద్దీ ఈ కొత్తవారి కథలు అనేకం వస్తూఉంటాయి. అనేక పత్రికలు, అనేక కారణాలవల్ల ఈతరహా కథలని ప్రచురిస్తాయి. అలాంటి కథలు సమాజంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సమాజంలోని పేదరికమో,అన్యాయాలో, అస్తవ్యస్త పరిస్తితులో, ఇతర అపసవ్యతలో…. తనని కలిచి వేయడంవల్ల సాధారణంగా ఎవరైనా రచనలు ప్రారంభిస్తారు. అది యవ్వనప్రాయంలోనిసామాజిక సంక్షోభానికి ప్రతీక. అంతెందుకు…. ఎంతగొప్ప రచయితలు అయినా తనమొదటి రచనలు చూసి అప్పటి అవగాహనా రాహిత్యంపై కాస్త సిగ్గుపడతారు. తమలోపాలు తాము గమనించుకునే మెచ్యూరిటీ రానంతవరకు వారి రచన వారికి ముద్దే! అదొక పరిణామ క్రమానికి సంబంధించిన విషయం.

ఎక్కువగా అలాంటి కథలుకనిపిస్తున్నాయంటే దాని అర్ధం కొత్త రచయితల సంఖ్య పెరుగుతుందని కూడాఅర్ధం చేసుకోవచ్చు. ఏరచయిత అయినా ప్రారంభంలో తాను  పనిగట్టుకుని ఈ సమాజానికి ఏదైనా చెప్పాలనే ఆకాంక్షతోనే రాయడం ప్రారంభిస్తాడనేది వాస్తవం. ఇది రచయితల వ్యక్తిగత కోణం.

ఇకపోతే సామాజిక కోణంలో కథల్లోని నీతి, లేదా సందేశం అనే వాటిని చూద్దాం. ఈ సమస్యపై కంప్లయింట్స్ ఎక్కువగా అమెరికా మిత్రుల నుండే వస్తున్నాయి. ( ఈతరహా విమర్శ మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాం అనే ఆత్మ విమర్శ కూడా చేసుకోలేనంతగా వారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.) అమెరికా జీవన విధానం క్రమబద్దంగా, సాఫీగా జరిగిపోయే విధంగా ఏర్పాటు చేసుకోబడిన ఒక ఆధునికదేశం. అక్కడి జీవన విధానానికి అలవాటైనా కారణంగానో, అక్కడ అందుబాటులోవున్న వివిధ భాషల సాహిత్యాన్ని చదువుతున్న కారణంగా అక్కడి మిత్రులుతెలుగు సాహిత్య సమాజంలోని కథలని చూసి పెదవి విరుస్తున్నారు!

ఇదెలావుంటుందంటే, తండ్రిని షేవింగ్ చేసుకోవడం చూసిన పిల్లవాడు తానుకూడాఅనుకరిస్తూ గడ్డం చేసుకోవాలని ఉబలాట పడడంలా ఉంటుంది! కానీ గడ్డం రావాలి కదా! వర్ధమాన దేశాలకీ, భారత దేశానికీ మధ్యన టెక్నాలజీ కారణంగా సాధారణ సమాచారమార్పిడి క్షణాల్లో జరుగుతుంది.  కానీ అందులో లక్షవంతు భాగం కూడా ఇక్కడ సామాజిక మార్పులు ముందుకు పోవడం లేదు. ఇక్కడ సామాజిక పరిపాలన అంతా మోసాలతో కుట్రలతో జరుగుతుంది. (అక్కడ జరుగుతాయా లేదా అన్నది అసందర్భం) అస్సలు జవాబుతారీ తనం లేని పరిపాలన ఈనేలపై సాగుతుంది. ఈ కారణంగా రచయితల  కళ్ళముందు సగటు జనాభా అట్టడుగు జీవితాలు తప్ప మరొక వస్తువు కనపడనిస్తితి.

మరో పక్కన వేల కోట్ల దోపిడీని పథకాల పేరుతో, ప్రజా ప్రయోజనాల పేరుతోవరల్డ్ బ్యాంక్ మేధావుల సూచనలు ఎత్తుగడలతో ‘కడుపునెప్పితో ఆసుపత్రికిపోతే  దొంగతనంగా కిడ్నీ తొలగించినట్టు’ దేశ వనరులని అమ్మేస్తున్నారు. మహాశయులారా! ఇక్కడి సమస్యలకి స్పందించే తెలుగు ప్రాంతంలోని రచయితలు తమకుతోచిన వస్తువులతో తమ స్థాయిలో రచనలు చేస్తు ప్రజా సమస్యలని, ఆకాంక్షలనీ వెలుగులోకి తేవడం వారి బాధ్యతగా గుర్తిస్తున్నారు.

మీడియాని సైతం పాలకులు కొనేసిన నేపథ్యంలో వారి అక్రమాలకు బలవుతున్న ప్రజల సమస్యలవైపుకనీస ప్రత్యామ్నాయంగా ఉండడం రచయితలు తమ బాధ్యతగా గుర్తిస్తున్నారు. ఇంతగాటెక్నాలజీ డెవలప్ అయినా కనీసం చెక్పోస్టుల అవినీతిని దశాబ్దాలుగాప్రభుత్వాలు ఆపడం లేదు! అంతా కుమ్మక్కు! పదిమంది గొంతెత్తబట్టే బాక్సైట్గనుల జీవోపై ప్రభుత్వం వెన్నక్కి తగ్గింది. ఎవరు ఎలా గొంతెత్తారు అనేది అనవసరం.

రాగయుక్తంగా పాడలేనంత మాత్రాన తల్లి పాడేది లాలిపాట కాకుండా పోదు! బిడ్డ ఏడుపుకు ఎలాగోలా పాడడం తల్లికి ఒక అనివార్యత అని గుర్తించమని మనవి! పైన చెప్పినదంతా తెలుగు ప్రాంతపు సామాజిక నేపథ్యం. ఇకపోతే;వస్తువులోగానీ, శైలిలో గానీ, రచనా నైపుణ్యం గానీ సాహిత్యంపై సమాజంపై వారివారి దృక్పథాన్ని అభిరుచినీ బట్టి రచయితలు తమని తాము మెరుగు పరుచుకునేప్రయత్నం చేస్తారు.  ఆక్రమంలోనే  కొందరినుంచి మనం  అప్పుడప్పుడు గర్వంగాచెప్పుకోగలిగే మంచి కథలూ కొన్ని వస్తున్నాయి. అక్కడ నుండి రాస్తున్నకథకులు అక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకున్నట్టే; ఇక్కడి కథకులుఇక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకుంటారు! పేదరికం వస్తువైనప్పుడు ఆ కథలు త్రీస్టార్ హోటల్ కస్టమర్లకు బిచ్చగాళ్ళలా కనిపించి చిరాకుపరుస్తున్నాయేమో గమనించాలి!   అది త్రీస్టార్ హోటల్ కావడం వల్ల చిరాకుమాత్రమే! అదే గుడిముందు అయితే అంత చిరాకు ఉండక పోవచ్చు!

ఇలాంటి రచనలవల్ల  కళకి ఏదో అన్యాయం జరుగుతుందన్న పేరుతో విమర్శించే అమెరికా మిత్రులు ఇందుకు అవసరమైన అన్నిరకాల నైపుణ్యాలనీ ఇక్కడ అవసరమైన రచయితలకు అందించేరీతిలో సాహిత్య పాఠశాలలు నిరంతరం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తే తెలుగుసమాజానికి మేలుచేసిన వారు అవుతారు.

*

చమ్కీ పూల కథ

 

-పి. విక్టర్ విజయ్ కుమార్

~

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక  సమావేశానికి హాజరై, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన  delibartions    గురించి ఆలోచిస్తూ వస్తున్నా. ఎంతో మంది రచయిత్రులు అక్కడ వేదిక మీద ప్రసంగించారు. ఆలోచిస్తున్నా – ప్రతి ఒక్కరిలోను ఏదో తెలీని ఆవేశం ! ఆవేదన ! ‘ ఎన్నో సంవత్సరాల నుండి వీళ్ళందరూ ఇన్ని  రచనలు చేస్తున్నారు. వీళ్ళ కథల్లో ఎన్ని ముస్లిం పాత్రలు, ఎన్ని క్రిస్టియన్ పాత్రలున్నాయి ?  వీళ్ళందరూ సృష్టించిన పాత్రల సంఖ్య లో, మత సహనం అనే ప్రత్యేక ఇతివృత్తం తో రాయకపోయినా, కనీసం పదహైదు  శాతం అన్నా మైనారిటీ లకు సంబంధించిన పాత్రలుంటే , అది  secular world of progressive writers    అయినట్టే కదా ? ముస్లిములు ఘాతుకంగా చంపబడిన 2002 సంవత్సరం తర్వాతైనా లేదా 2013 ముజఫర్ నగర్ ఊచకోత జరిగిన తర్వాతైనా సరే – మన తెలుగు రచనల్లో – ఎన్ని ముస్లిం పాత్రలొచ్చాయి ? ఎన్ని సన్నివేశాల్లో ముస్లిములు కనిపిస్తారు ? 2000 మొదట్నుండీ సామాజిక చిత్ర పటం లో ఇన్ని మార్పులు జరుగుతుంటే, గమనించని రచయితలు, రచయిత్రులు – చేస్తున్న ఈ ఆక్రందనల్లో శూన్యత లేదా ? ‘ ఆలోచనల స్రవంతి తెగదు ఇలా ఆలోచిస్తూ పోతే. నాకు ఎవరినీ నిందించాలనో, ఎవరి మీదో ఒక అసహనం ప్రదర్శించాలనో లేదు  గాని – కథ రాసి ఇంటికొచ్చి పిల్లలకు హోం వర్క్ చేయిస్తూ , మన పిల్లోడు కూడా మిగతా పిల్లల మాదిరిగానో, అంత కంటే ఎక్కువ గానో చదవాలి అనే ప్రెషర్ ను మనం తీసుకోవడమో, పిల్లల మీదకు రుద్దడమో ఎలా చేస్తామో – సింపుల్  గా చెప్పాలంటే అదే రకమైన ప్రెషర్ ఇది !!

మొహరం నెల. సూఫీ తత్వ వాదులు పవిత్రంగా పరిగణించే  రోజులు ఇవి.   మన దేశం లో సంస్కృతి ‘ భారత దేశ సంస్కృతి ‘ అని మత ఛాందస వాదులు, ఒక   hypothetical culture   ను జాతీయ వాదం లో భాగంగా ముందుకు తీసుకువచ్చి, ఇక ఏ ఇతర సంస్కృతి అయినా    subservient   అని గర్భితంగా ప్రజల సంస్కృతిని ప్రభావితం చేయదల్చుకుంటున్నప్పుడు –   composite culture  మానవ సంబంధాల్లో ఎలాంటి ఆర్ధ్రత నింపుతుందో తెలియ జేయడానికి , నాకు తెలిసి ఈ మధ్య కాలం లో జరగని ఒక ప్రయత్నం ఒక ముస్లిం చేసాడు. తన అస్తిత్వాన్ని, తను కోరుకునే సామాజిక సఖ్యతకు చమ్కీలద్ది మనకు ‘ చమ్కీ పూల గుర్రం’ ను అందించాడు.       అఫ్సర్ రాసిన ‘ చమ్కీ పూల గుర్రం ‘ మత తత్వానికి వ్యతిరేకంగా నినదించే సమయం లో – వచ్చిన   most well timed story .

కథ ఇతివృత్తం చూస్తే – ఇద్దరు చిన్న పిల్లల స్నేహానికి మత విశ్వాసాలు, పర మత విశ్వాస అసహనం ఎలా దీనావస్థను కలుగ జేస్తుందో తెలియ జేసే కథనం ఇది. మున్నీ పీర్ల ఆరాధన సంస్కృతికి   symbolic  గా ఉన్న చమ్కీ పూల గుఱ్ఱాన్ని బహుమతిగా ఆపూ కు ఇవ్వడం, ఆపూ –  మున్నీ స్నేహం లో ఉన్న అందాన్ని చమ్కీల  అందం లో చూసి ఆనందపడ్డం, హిందూ మత విశ్వాస విషం లో మునిగిన తండ్రి ఆపూ ను కొట్టి కలవకుండా ఇంట్లోనే ఉండమని హుకుం వేయడం, ఆపూకు విన్న పీర్ల కథలు నెమరేసుకోవడం,  ఆపూ తల్లి ఆపూ లొ ఉన్న విషాద అనుభూతిని చూసి నిస్సహాయంగా బాధ పడ్డం, ఆపూ మున్నీ స్నేహాన్ని కలవరిస్తూ చమ్కీ పూల గుఱ్ఱాన్ని  కలలో కలవరింపుల్లో దగ్గరగా హత్తుకుంటూ నిద్రలో ఒద్దిగలడంతో ఆర్ధ్రంగా ముగుస్తుంది కథ.

మొదటగా  కథా ఇతివృత్తం చూస్తే ప్రధానంగా గోచరించేది  “ culture of love and culture of acceptance “ .  మనమిప్పుడు చూస్తున్నది   “ Politics of hate “ ఇదే “ culture of hatred  “ ను పోషిస్తుంది . దీనికి కౌంటర్ గా  మనం ప్రజలకు రుచి చూపించాల్సింది  “ culture of love and affection “ . ప్రేమించే సంస్కృతి – పర విశ్వాస సహనం తొ ఒక స్థాయి వరకు కలిసి ఎదిగినా అల్టిమేట్ గా  ‘ సమ్మతి ‘ అన్నది ‘ సహనం ‘ కన్నా గొప్ప భావన. ఆ సమ్మతితోనే – ప్రేమలో ఒక ఆర్ధ్రత వస్తుంది. ప్రేమ ప్రజాస్వామికంగా ఉండడం వేరు. ప్రేమ ఆర్ధ్రంగా ఉండదం వేరు. మన దేశం లో సెక్యులరిజం ‘ పరమత సహనం ‘ దగ్గరే ఆగిపోయింది. ఈ కథ ఒకడుగు ముందుకేసి ‘ సహనం ‘ ను ‘ సమ్మతి ‘ అనే ఉన్నత స్థాయి దగ్గరకు తీసుకెళ్ళి , మనుష్యుల మధ్య ఉన్న అనుబంధాల్లో  essence  ను మనకు రుచి చూపిస్తుంది.

కథ చెప్పడం లో ఎన్నుకున్న పద్ధతి

పర విశ్వాస సమ్మతికి ప్రధాన అడ్డు గోడ   judgemental analysis of beliefs   .  రాన్ వైల్డ్ అనే ఒక ప్రఖ్యాత ప్రఖ్యాత కళాకారుడి  మాటలు గుర్తొస్తాయి  ”  Seek the wisdom of the ages, but , look at the world through the eyes of a child ”   . ప్రతి మతం గురించి , ప్రతి విశ్వాసం గురించి   dispassionate   గా తెలుసుకోవడం మేధావులుగా ఒక ఎత్తైతే , చిన్న పిల్లల దృష్టిలో చూస్తే మన ప్రపంచాన్ని మనమే ఎంత జఠిలం చేసుకున్నామో అర్థమౌతుంది.  ఇదే మాట ఆపూ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది ” అది చిన్న పిల్ల. దానికి ఈ వయసులో ఏం తెలుస్తుంది ? ఆ దేవుడి బొమ్మ కూడా ఆట బొమ్మ తప్ప ఇంకేమీ కాదు దానికి. కాసేపు ఆడుకుంటుంది. అంతే ! పిల్లల ఆటలో దేవుళ్ళ గొడవ తెచ్చి పెడితే ఎట్ల ? అక్కడ దానికి భక్తి గురించి , దానికి ఇంకా అర్థం కాని ధర్మం గురించి చెప్తే ఎట్ల ? ” నిజమే కదా ?! మనిషికి మత విశ్వాసాలెందుకు ? తన మీద తనకు భరోసా కలిపించడానికి. దాన్ని ధర్మం పేరుతో ఎంత  complicate  చేసుకున్నాం మనమందరం ? దీనికో తత్వాన్ని అద్ది ఛాందస వాదులు ప్రజా జీవితాన్ని ఎంత దుర్భరం చేసారు ? ఆపూ తన కలలో పీర్ల సాయిబు , పీరు బరువు ఎత్తడానికి ఇబ్బంది పడ్డప్పుడు ‘ జై ఆంజనేయ ‘ అంటుంది. దీన్ని ‘ మన ధర్మం గంగ నీరు, పర ధర్మం ఎండ మావి ‘ లాంటి అసంబద్ధ మైన సిద్ధాంతాలు చెప్పి కల్మషం చేయాలని చూస్తుంది ఒక కేరక్టర్ ఇందులో.

కథ మొత్తం చాలా నిర్దుష్టంగా,  situation specific   గా నడుస్తుంది. మన సెక్యులర్ సాహిత్యం  బ్రాహ్మినిజం తో కాంప్రమైజ్ అయ్యి వచ్చిన అర కొరా సాహిత్యం కూడా   abstractise   అయ్యింది.   Abstractisation is actually the biggest threat to secular writing, which actually needs a specific exemplification, reasoned out writing and usage of empathised forms    అబ్స్ట్రాక్టైజ్ చేయడం వలన, సెక్యులరిజం   గురించి     general sense   లో మాట్లాడి బ్రాహ్మినిజం ను వెనక్కు తోసేస్తుంది. దీనితో పాటు, సమస్యల తీవ్రత తగ్గించి కొంత గందరగోళానికి గురి చేసే ప్రమాదానికి కూడా ఇది తోడ్పడుతుంది. మానవులందరూ సమానులే అని కథ రాస్తే, సెక్యులర్ రచన అయిపోదు. విశ్వాసాల మధ్య ఘర్షణ, మెజారిటి వాదం యొక్క నిరంకుశత్వం గురించి నిర్దుష్టంగా మాట్లాడాకపోతే కథ, కవిత, ఇంకేదైనా సెక్యులర్ రచన కానేరదు. కవితాత్మకంగా చెప్పాలని , ఏవో   abstract expressions  ను మధ్యలో దూర్చడం సెక్యులర్ దృక్పథాన్ని తీవ్రంగా  dilute  చేస్తుంది.  ఈ విషయం మన కథకుడికి బాగా అవగాహన కావడం వలననే ఈ కథ అందంగా రాగలిగింది.

చిన్న పిల్ల ద్వారా మత విశ్వాసాలను వివరించడం ఈ కథ లో ఉన్న గొప్ప ఎత్తుగడ.  మనలో ఈ  complexity   కి దూరంగా బతకాలనుకునే ఒక నిర్మల తత్వం చిన్న పిల్లల హృదయం నుండి వివరించడం వలన మనం కోల్పోయిన దేమిటొ తెలియడానికి – ‘ ఆర్ధ్రత ‘ ఒక ఫాం గా నిలబడగలిగింది ఈ కథలో.   ఆపూ బాధ ఈ కథలో ఉన్న ప్రతి స్త్రీ కేరక్టర్  empathise  చేస్తుంది.  పురుష పాత్రలన్నీ వ్యతిరేకమే ! ఎందుకంటే ఇది ఉత్తి పురుష్స్వామ్యం కాదు – బ్రాహ్మణీక పురుష స్వామ్యం కూడా !

ఇంకా చిన్న చిన్న వివరణలు ( నేను వీటిని కథలో ఎత్తుగడలే అనే అనుకుంటున్నా ) –  మున్నీ , ఆపూ తో మాట్లాడక ఐదు రోజులయ్యింది అని ఉంటుంది . మూడు రోజులు ఎందుకు కారాదు ? ఏడు రోజులు ఎందుకు కారాదు ? మనలో కొన్ని  schemas  ఉంటాయి. ఏది దూరం, ఏది దగ్గిర అనడానికి కొన్ని  schematic feelings   ఉంటాయి. ఇది చాలా చిన్న విషయమే కాని, పాఠకుడికి తెలీకుండా పాఠకుడి మనస్సు మీద కొని   schemas  ను తట్టి లేపుతుంది.  ఫాతమ్మ చేసిన పాల కోవా అంటే ఆపూ కు ఇష్టం. అది మున్నీ ఒక్కతే తింటుందా ? తాను కలిసినప్పుడు ఇస్తుందా – అని ఆపూ ఆలోచిస్తుంది. ఇదొక  affectionate jealousy  కి సంబంధించిన   schema . ఇలా ఇంకా ఎన్నో   schemas   ను , తను చెప్పదల్చుకున్న మెసేజ్ కు అనుకూలంగా వాడుకుంటూ వస్తాడు. పాఠకులకు   cognitive complexities  ఉంటాయి. అందుకు   narrative   గా చెప్పడం ఒక పద్ధతి, సిచ్యుయేషన్ మీదా వ్యాఖ్యానిస్తూ   చెప్పడం ఒక పద్ధతి, వాదన చేస్తూ వివరించడం ఒక పద్ధతి. ఆర్ధ్రత,    empathy  ని వివరించాలంటే కథకుడు   schemas   ను తీసుకుని వాటి ద్వారానే, పాఠకున్ని కన్విన్స్ చేయాలనే పద్ధతి ఎన్నుకున్నాడు. అది సరి అయినదే అని కథ చదివాక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోక తప్పదు.  అసలు ‘ చమ్కీ ‘ అన్నదే గొప్ప  schema . అది ఆనందాన్ని, అమాయకత్వాని   symbolise   చేస్తుంది.

మన దేశం లో దర్గాలు , పీర్ల సాయిబులు – అతి శూద్ర హిందువులలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఇది హైందవత్వం , వీళ్ళ జీవితాల్లోకి తగినంత  చొచ్చుకుపోక పోవడం వలన కలిగిన ఒక    modification of belief  . దర్గాలలో దేవుళ్ళు ఉండరు. ఆరాధ్యనీయమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల ( ఆ వ్యక్తిత్వం మత తత్వమైనా సరే – అది వేరే విషయం )  సమాధులుంటాయి. పీర్ల చావిడిలో ఆర్భాటాలు ఉండవు. సింప్లిసిటీ ఉంటుంది. అక్కడ  Priests  కు తెచ్చిపెట్టుకున్న గొప్ప తనం ఉండదు. ఏ గొప్ప దర్గా సందర్శించినా   composite culture   మాత్రమే కనిపిస్తుంది. ఎవరన్నా సమానులే అక్కడ. ఎవరికీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదు.

ఈ కథను  నాస్తికులు, గానీ    conservative marxists   గానీ దేవుడికి సంబంధించిన విశ్వాసాన్ని ఇంకోలా  glorify   చేసారు అనొచ్చు. మన దేశం లో హిందూ మెజారిటీ వాదాన్ని ఎదుర్కోవాలంటే – మనం అర్థం చేసుకోవాల్సింది , బ్రాహ్మినిజం సృష్టించిన ప్రతి  sentiment  కు మనం   counter-sentiment   ను సృష్టించాలి.  అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించాడంటే – అసలు మతం లేకపోతే మనిషి మనుగడే లేదు అనే నమ్మకం తో కాదు. దేవుడు – సమూలంగా మన జీవితాల్లో నుండి వెళ్ళిపోవాలంటే ఇంకో 500 సంవత్స్రాల పైనే పట్టొచ్చు. అంత వరకు ప్రజలకు  alternate  ఏం చూపించాలి ?  alternate belief system  డెవలప్ చేయకుండా , మనుష్యులను మనం కూడా గట్టుకోలేము. అలా కాక, ‘ అసలు ఏ దేవుడి గురించీ రాయొద్దు, దేవుడే లేదు అందుకోసం ఎవరూ కొట్టుకోవద్దు ‘  అని రాయండి అనడం  dogmatic argument  తప్ప ఏమీ కాదు.

ప్రతి ప్రజాస్వామిక రచయిత, రచయిత్రి – ఇలాంటి కథ ఏదో ఒకటి, ఇలాంటి పాత్రలతో ఏదో ఒకటి రాయండి చాలు. ఆంధ్ర జ్యోతి వేసుకోకపోవచ్చు, ఆంధ్ర భూమి వేసుకోకపోవచ్చు. నష్టం లేదు. ప్రగతి వాదం ఎప్పుడూ మైనారిటీ వాదమే. అదో దీర్ఘ కాలిక తిరుగుబాటులో భాగంగానే ఉంటుంది. అందుకు రచయిత/త్రి గా ఓపిక కావాలి.  అసలు ఇలాంటి కథ ఒకటి రాసి ఎవరూ  వేసుకోకపోతే, మీ దగ్గరే పెట్టుకోండి. మీ ఫేస్ బుక్ వాల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే – మీరు రాస్తున్న దృక్పథం మహోన్నతమైంది కాబట్టి. అది ఏదోలా ఎక్కడో చోట వినబడాలి కాబట్టి.

నాకు మాత్రం ఈ కథ చదివినప్పుడు – కలిగిన ఫస్ట్ హేండ్ ఫీలింగ్ – ఈ కథ ఒక ముస్లిం మాత్రమే రాయగలడు. అది అఫ్సర్ కావడం  incidental  !!  ఆయనకు ఈ సాహితీ కళ ఉండడం సామాజికంగా యాదృచ్చికం.  ఇది ఆయన అస్తిత్వ ఫలం!

*

 

 

 

ముగింపు లేని వ్యధ-రైతు కథ

 

-వై. కరుణాకర్

~

ఇటీవల ఓ రెండు కథలొచ్చాయి. ఒకటి పింగళీ చైతన్య రాసిన ’గౌరవం’, రెండు చందుతులసి రాసిన ’ఊరవతల ఊడలమర్రి’.  రాసిన వాళ్ళిద్దరూ కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు. ఒకరికైతే ఇదే తొలి కథ. రెండింటికీ రైతు ఆత్మహత్యలే నేపధ్యం. ఈ నేపధ్యంలో ఎన్నో కథలొచ్చినా ఈ రెండు కధలు తీసుకున్న ముగింపు వల్ల  ప్రత్యేకత సంతరించుకున్నాయి. చైతన్య ’గౌరవం’ కథలో ఆత్మహత్య చేసుకున్న రైతుభార్య పార్వతమ్మ వ్యవసాయాన్ని వదిలి, పొలం అమ్మి, రాగల అగౌరవ భయాన్ని అధిగమించి .. బ్రతకటానికి మద్యం లైసెన్సు కోసం టెండర్ వేసి దక్కించుకుంటుంది. చందుతులసి ’ఊరవతల ఊడలమర్రి’ కథలో రైతు ’నారయ్య’ అప్పులవాళ్ళ ముందు అవమానం పొంది ఆత్మహత్య తలపును జయించడానికి ఎంతో మంది ఉరిపోసుకున్న ఊడలమర్రిని నరికేస్తాడు. రెండు కథలలో ప్రధాన పాత్రలు వ్యవసాయాన్ని వదిలి వేస్తాయి. అందులో బ్రతకలేక చావడం కంటే ఏ పని చేసికొనయినా బ్రతకడం ముఖ్యమనీ, అది అగౌరవం కాదనీ చెప్తారు. నిజానికి ఈ ముగింపుల గురించి మాట్లాడుకునే ముందు వాటి ప్రారంభం దగ్గరకు వెళ్ళాలి.

ఇప్పటి రైతు ఉసురు తీస్తున్న సంక్షోభ మూలాలు వలస పాలనలోనే ఉన్నాయి. సహజ వినియోగం నుండి మార్కెట్ అవసరాలకోసం భూమిని వినియోగించడం కొంత తెల్లవాడి బలవంతగానే మొదలైనా ఆ తరువాత దేశీయ పాలకుల హరిత విప్లవ నినాదం కలిగించిన మైమరపులో రైతాంగం ఆమోదంతోనే ఈ బదలాయింపు పూర్తయింది. ఫలితంగా ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. దానికంటే పురుగుమందులు, ఎరువులు, యంత్ర పరికరాల వినిమయం పెరిగింది. ఇవి ఎంతగా పెరిగాయో అంతగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఎనభైలలో వందలాదిగా సాగిన పత్తిరైతుల ఆత్మహత్యలతో ఈ వైరుధ్యం బట్టబయలైంది.

chaitanya

చైతన్య పింగళి

ఈ పరిణామాల సాహిత్య ప్రతిఫలనాలను అటు ఉత్తరాంధ్రలో కారా ‘యజ్ఞం’ కథలో  సీతారాముడు కన్నబిడ్డను చంపుకోవడంగానూ, ఇటు రాయలసీమలో సింగమనేని నారాయణ ‘అడుసు’ కథలో రైతు నారాయణప్ప  రెక్కలుముక్కలు చేసి పెంచిన తోటను నరికివేయడంతోనూ ముగిసాయి. యజ్ఞం కథ ముగింపు ఆప్పుడే మొదలవుతున్న ప్రతిఘటన పోరాటాలకు సూచనప్రాయం చేస్తే, అడుసు కథ రాయలసీమలో ప్రతిఘటన రాజకీయాలు లోపించడం వల్ల వట్టి నైరాశ్యాన్ని ధ్వనించింది. ఈ రెంటికీ మధ్య కాస్త ఎడంగా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున లేచిన రైతుకూలీ పోరాటాల స్ఫూర్తి అటు కార్మికుల్నే కాదు ఇటు రైతాంగాన్ని కూడా కొంతవరకు సంఘటితం చేయగలిగింది. రఘోత్తమరెడ్డి ’పగలు రేయి శ్రమ పడుతున్నా..’ కథలో రైతుకూలీ మల్లేశం రైతు రాంరెడ్డికి ‘మీ కాపుదనపోళ్ళంతా తగిన ధరల్రావాల్నాని బయటకి రాండ్రి. … ఒక్కనెల రోజులు దినుసు మార్కెటుకు కొట్టకుంట ఆపుండ్రి. – మీతోని మేం రాకపోతే అప్పుడనుండ్రి.  సర్కారోన్తోని కొట్లాడితే మీరు మీరు మేం కలిసే కొట్లాడదాం’ అంటూ ధైర్యమిస్తాడు. ’ఒక్కటైతే’ కథలో హమాలీల పొరాటం రామిరెడ్డిలాంటి రైతుకు ఒక్కటవ్వాలన్న ఆలోచన కలిస్తుంది. ఈ ఆలోచనల వల్లనే టంగుటూరులో, కాల్దారిలో రైతులు తూటాలకెదురు నడిచారు. ఉద్యమాలు ఉధృతంగా నడచిన కాలంలో ఆయా  ఉద్యమ ప్రభావిత ప్రాంతాలనుండి రైతుల ఆత్మహత్యల వార్తలు అరుదుగానే వినిపించాయి.

సమాజంలోని అన్నివర్గాలకు ప్రేరణ నిచ్చిన మౌలిక పోరాటాలు ఒకవైపు నెమ్మదించగా మరోవైపు తొంభైలనాటికి ప్రంపంచ మార్కెట్లకు తలుపులు బార్లా తెరవడంతో ఉధృతమైన వ్యవసాయిక  సంక్షోభం నేడు పరంపరగా సాగుతున్న రైతు బలిదానాలతో పరాకాష్టకు చేరింది. రైతుకు భూమితో అనుబంధాన్ని ముగింపుకు తెచ్చింది. ఎనభైలలో, తొంభైలలోనే వ్యవసాయాన్ని వీడి వ్యాపారాలలోకి అటునుంచి రాజకీయాలలోకి వెళ్ళిన వాళ్ళు ఆర్ధిక సంస్కరణల తొలి ప్రయోజనాన్ని పొందగలిగారు. ‘గౌరవం’ కధలో పార్వతమ్మతో పాటు టెండరు వేయడానికి వచ్చిన తెల్లబట్టలవాళ్ళలో వీళ్ళని పోల్చుకోవచ్చు. మరి కొంతమంది పెద్ద పెట్టుబడులతో తిరిగి వ్యవసాయంలోకి ప్రవేశించారు. ట్రాక్టర్లు, పెద్దపెద్ద యంత్రాలు, నెలల తరబడి కోల్డ్ స్టోరేజీలలో పంటని నిలవ ఉంచుకోగల పెట్టుబడి సామర్ధ్యంతో గట్టు మీద నుండి దిగనవసరంలేని కొత్త తరం రైతులు తయారయ్యారు. వీళ్ళు ఒకవైపు ఆశపెట్టగా మరోవైపు పెరిగిన ఖర్చులు, పిల్లల చదువులూ, మారిన అవసరాలూ పెద్దసంఖ్యలో రైతులు ఆ భూమిలోనే పెనుగులాడేట్టు చేశాయి. ‘ఊరవతల ఊడల మర్రి’  కథలో నారాయణలాంటి ఎకరం రెండెకరాల రైతులు మరింత భూమిని కౌలు చేసేలా చేసాయి. బీటీ పత్తి తప్ప మరో పంట వైపు కన్నెత్తి చూడకుండా చేసాయి. ఫలితంగా భూమికి డిమాండ్ పెరిగింది. కౌళ్ళు పెరిగాయి. విత్తనంలోనే చేరిన విదేశీ పెట్టుబడి, ఆపైన పురుగుమందులూ, ఎరువులూ ఆపైన మార్కెట్ ధరల జూదంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తీర్చలేని అప్పులతో నష్టదాయకమైన వ్యవసాయాన్ని వదిలేయాల్సిన ఆర్ధిక అవసరాలకూ, దానిని వదిలి మరో వృత్తిలోకి వెళ్ళలేని సామాజిక అవరోధాలకూ మధ్య రైతు ఉరితాడుకు వేళ్ళాడుతున్నాడు.

IMG_20150628_105027_1447180109835

చందు తులసి

ఇది సాహిత్యంలోకి ఎట్లా ప్రతిఫలిస్తోంది? బుధ్ధిజీవులైన రచయితలు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? ఈ ఆత్మహత్యల పరంపరకు ఏ ముగింపు పలుకుతున్నారు? చైతన్య, చందుతులసిల కథలు జవాబు చెప్ప ప్రయత్నించాయి. రెండు కథలూ ఆరుగాలం కష్టపడే రైతు ఆత్మహత్యల నేపధ్యాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రించాయి. ఒక పరిష్కారాన్నీ చెప్ప ప్రయత్నించాయి. జీవితం విలువైనది కనుక ఆత్మహత్యం పరిష్కారం కాదు. ఇక మిగిలింది వ్యవసాయాన్ని వదిలివేయడమే. రెండు కథలూ దాన్నే సూచించాయి. రైతు భూమిని వదిలి ఏ పని చేసినా తప్పుపట్టే నైతికార్హత  సమాజానికి లేదని  ‘గౌరవం’ కథ కాస్త ఆగ్రహంగా చెబితే, ‘ఊరవతల ఊడల మర్రి’ కథ ఇదే విషయాన్ని రైతుకు సానునయంగా నచ్చజెప్పింది. ఆ విధంగా అవి అనవసర ప్రాణనష్టాన్ని నివారించ ప్రయత్నించాయి. అందుకే ఇవి మంచి కథలయ్యాయి.

అదే సమయంలో భూమినుండి రైతును బయటికి తరమివేసే రాజకీయార్ధిక క్రమానికి లోబడే ఈ రెండు కథలూ వాటి  ముగింపులూ ఉన్నాయి. కాకపోతే ఆ క్రమం వీలైనంత సులువుగా సాగేందుకు వీలుగా – అయిష్టంగానే, వేరే దారిలేకే – రైతునూ, సమాజాన్ని  సిధ్ధం చేశాయి. దీనికి ఆయా రచయితలను కూడా తప్పు పట్టలేం. మొత్తం సమాజం యొక్క చైతన్య స్థాయిని, సామూహిక కార్యాచరణనూ పెంచే .. స్థిరమైన, బలమైన పోరాట కేంద్రాలు లేని సామాజిక వాస్తవికత -పరిష్కారాలు సూచించడలో వాళ్ళ సృజనకు పరిమితులు విధించి వుండొచ్చు.

అయితే సమాజం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. రైతులే కాదు కష్టజీవులందరూ వారివారి వనరులనుండి దూరంచేసే ప్రయత్నాలను తప్పక ప్రతిఘటిస్తారు. ఆలోచనపరులుగా రచయితల బాధ్యతేమంటే – ఆ ప్రతిఘటన ఎంత సూక్ష్మరూపంలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నాగుర్తించడం. తమ తమ సృజనతో దానిని బలపరచి స్పష్టమైన రూపమిచ్చి తిరిగి ఆయా వర్గాలకు ఆయుధంగా అందించడం.  చైతన్య, చందు తులసి కథల వెనుక వారి సంవేదన, నిజాయితీలను చూస్తే భవిష్యత్తులో ఆ బాధ్యత నెరవేరుస్తారనే ఆశ కలుగుతున్నది.

కథలు కావివి…..పంచదార గుళికలు

-మనోజ్ఞ ఆలమూరు

~

manognaమధురాంతకం రాజారాం అబ్బ ఈ పేరు అంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎందుకో తెలియదు మొదటిసారి ఈ పేరు వినగానే అర్రె భలే ఉందే అనుకున్నాను. నేను చదివిన పుస్తకాల తాలూకా రచయితలను వారి వారి రచనలను బట్టి గుర్తుంచుకున్నాను. కానీ ఒక్క మధురాంతకం వారిని మాత్రం పేరు నచ్చి గుర్తు పెట్టుకున్నాను. దాదాపుగా నేను ఎమ్మేలో ఉన్నప్పుడు అనుకుంటాను నాకు ఈయన పేరుతో పరిచయం కలిగింది. అయితే ఆయన కథలు చదవడం మాత్రం ఇప్పటికి కుదిరింది. చదివిన వెంటనే రాయకుండా మాత్రం వుండలేకపోయాను. రాజారాం గూర్చి కొత్తగా చెప్పేదేముంది అని అనిపించవచ్చును. కానీ కొంత మంది పుస్తకాలు చదివినా, వారి గురించి చెప్పకున్నా నిత్య నూతనంగానే అనిపిస్తాయి. పైగా ఈ కథలు నాకు కొత్త అద్భుతమైన అనుభవం, నవ్యనూతనమూనూ… అందుకే చెప్పకుండా ఉంలేకపోతున్నాను.

మధురాంతకం రాజారాం కథలు 3వ సంపుటం అట్టమీద ఒక స్త్రీ కూర్చుని ఏదో వడ్డిస్తున్నట్టు ఉంటుంది. ఎవరు గీసారో కానీ ఆ బోమ్మను ఎంతబాగా గీసారో. పుస్తకంలోని కథలకు ఆ బొమ్మకు ఎంత బాగా జోడీ కుదిరిందో. రాజారాం గారి కథలు సాహిత్యాభిమానులకు అమృతాన్ని పంచుతాయి. దాన్నే సింబాలిక్ గా స్త్రీ రూపంలో సరస్వతీ దేవి అమృతాన్ని పంచినట్టు చిత్రీకరించారేమో అని అనిపిస్తుంది. ఇంక కథల విషయానికి వస్తే రాయలసీమ రచయితల కథలు, రచనలు ఇంతకు ముందు చాలానే చదివినా…రాజారాం కథలు ఒక ప్రత్యేక అనుభవమనే చెప్పాలి. రాయలసీమ యాసలో ఒక వింత అందం ఉంటుంది నాకైతే. నామిని గాని, ఖదీర్ బాబువి కానీ మంచి చిక్కని సీమ యాసలో ఉంటాయి. మిగతావారివి కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. కానీ రాజారాం గారి యాస మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. అది పూర్తిగా రాయలసీయ యాస కాదు….కానీ పదాల వారీగా చూసుకుంటే మాత్రం చాలా వరకు సీమ పదాలే. రాజారాం గారి కథల్లో తెలుగు బహుమధురంగా అనిపించింది నాకు. చదవడానికి అత్యంత అందంగా…సరళలంగా ఉండడమే కాక మంచి తియ్యగా కూడా అనిపించింది. అందులోనూ వారు రాసిన విధానం దానికి మరింత అందాన్ని చేకూర్చింది. మధ్యమధ్యలో సామెతలు, జాతీయాలు కలగలిసి రాజారాం గారి కథలకు వింత సొబగును అద్దింది ఆయన భాష. తెలుగు సామెతలను అత్యంత సమర్ధవంతంగా వాడుకున్న వారిలో మధురాంతకం రాజారాం గారు ఒకరు. సందర్భానుసారంగా సామెతలను వాడుతూ తన కథలకు మరింత వన్నెలను అద్దారు రాజారాంగారు. ఒక్కోసారి సామెతలను ముందు చెబుతూ తర్వాత కథలను మొదలుపెట్టడం, సామెతల ద్వారా పాత్రలను పరిచయం చేయడం వంటివి రాజారాం గారి ప్రత్యేక శైలి. అందుకే కీ.శే. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారు రాజారాం కథలు చదివి ఇలా అన్నారుట.” రాజారాం గారి కథల్లో అతి సుందరపదాలను, నుడికారాలను, ఇదివరలో వెలుగు చూడని సామెతలను – పరిశోధకులు ప్రోది చేసి భద్రపరచవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని.”

రాజారాం గారి కథలు చక్కగా కూర్చోబెట్టి, ప్రేమగా పాఠం చెబుతున్నట్టు ఉంటాయి. అన్నట్టు అసలు విషయం మర్చేపోయాను. రాజారాం గారు వృత్తిరిత్యా ఉదాపాధ్యాయులు కదూ. అదీ సంగతి ఆయన ప్రవృత్తిలోకి వృత్తి చొచ్చుకొని వచ్చేసిందన్నమాట. అందుకే ఆయన కథలు పాఠకులకు పాఠం చెబుతున్నట్టు ఉంటాయి. మొదటసారి ఈయన కథలు చదువుతున్నప్పుడు ఒక కొత్తదనం పలుకరించింది. అరే ఇదేమిటీ గమ్మత్తుగా ఉందే అనుకున్నాను. తర్వాత్తర్వాత చదవగా చదవగా ఆ గమ్మత్తు ఆయన కథనరీతి అని అర్ధం అయింది. రాజారాం గారు ఎంచుకునే కథాంశాలు కూడా అలానే ఉంటాయి. ఒక రకమైన స్థిరత్వం కలిగి ఉండి, విశ్వాసం కలిగిస్తున్నట్టు ఉంటాయి. మానవుడిలో ఉన్న అభద్రతాభావాన్ని పక్కకు నెట్టేసి భరోసాను కలిగిస్తాయి. ఉపాద్యావృత్తిలో ఆయన తిరిగిన ప్రదేశాలు, తరచిన అనుభాలూ, కలిసిన మనుషులు, వారి భిన్న మనస్తత్వాలు వారి రచనలకు ఎంతగానో ఉపకరించాయి. ఊహూ…ఉపకరించడం కాదు వాటినే ఆయన తన కథా వస్తువులుగా తీసుకున్నారు అంటే ఇంకా బావుంటుంది.

రాజారాంగారు వృత్తి రిత్యా ఎక్కువగా పల్లెల్లోనే తిరిగారు. అందుకే వారి కథలు 80% పల్లెల చుట్టూరానే తిగుతాయి. గ్రామీణ జీవితంలో మధ్యతరగతి మనుషులు వారి మనో వికారాలు, ప్రవృత్తులు, సమస్యలు ఆయన కథల్లో మనకు దర్శనమిస్తాయి. రాజారాం కథలకు మునిపల్లెరాజుగారు ముందుమాట రాస్తూ…..సామాజికి ఆర్ధ్రత లేని చోట సామాజిక స్పృహ అన్న పదానికి అర్థం ఉండదని ఈయన కథలు చదివిన పాఠకులందరూ గ్రహిస్తారు అని చెబుతారు. ఇది అక్షరసత్యం. రాజారాం గారి కథల్లో ఎక్కడా పలాయనవాదం కనిపించదు. సామాన్య మానవులు వారి చిత్తప్రవృత్తులు, వారి సమస్యలు, వాటి పర్యవసానం అన్నింటినీ కళ్ళకు కట్టినట్టు చెబుతూ వాటికి పరిష్కారాను చూపిస్తూ జీవితం అంటే ఇదే అంటూ భుజం తట్టినుంటాయి వీరి కథలు.వ్యక్తుల్ని,సన్నివేశాల్ని,రాగద్వేషాల్ని,ఈతిబాధల్ని,జీవనదృక్పథాన్ని ఇంత అద్బుతంగా,ఇంత కూలంకషంగా విశదపరిచిన తెలుగు రచయితల్లో రాజారాం గారు ఒకరని ఢంకా బజాయించి మీరీ చెప్పవచ్చును.

పెద్దబాలశిక్ష లా ప్రపంచ జ్ఞానాన్ని బోధిస్తూ,పంచతంత్రం లా చిన్న చిన్న కథలలో జీవితసారాన్ని వడ్డిస్తాయి ఈయన కథలు. ఆ అనుభవాలనే సాకల్యంగా ప్రతి ఒక్క విషయమూ క్షుణ్ణంగా పరిశీలించి, అనేక కోణాలను చక్కగా పరిశీలించి ఆవిష్కరిస్తున్నట్టుంటాయి రాజారాంగారి కథలు. ఆధునికయుగంలో కులాంతర, మతాంతర, విజాతివివాహాలు, కుటుంబనియంత్రణలు అన్నీ ఆయనకి కథావస్తువులే. తమకి ఇబ్బంది కలిగించే అంశాలు –అసభ్యసాహిత్యంవంటివి- తీసుకోక మానరు కానీ అది తమకి అప్రియమని తెలియజేయడానికి వ్యంగంగా వాటిని తన కథల్లో ఉటంకిస్తారు. ఉప కథల్తో పిట్ట కథల్తో, మధ్య మధ్య వర్ణనలతో సావధానంగా కబుర్లు చెబుతున్నట్లుండి, కథల్లో కథ ‘చెప్పే’ పద్ధతిలో ఉంటాయి రాజారాం గారి కథలు.

చాలా కథలలో రచయితే సూత్రధారై కథను నడిపిస్తాడు. ఆగని వేగం అనే కథలో జీవితాంతం నడుస్తూ శ్రమించిన వ్యక్తితో రచయిత చెప్పించే జీవనగీతోపదేశం అద్బఉతంగా ఉంటుంది. ఆ కథ చదువుతుంటే బతుకు మీద విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. జీవించిన చివరి క్షణం వరకు బతకాలి….బతికుండగానే చనిపోకూడదు అని అనిపిస్తుంది. అలాగే యుగారంభం అనే కథలో పద్యరచన, వచన రచన గురించి చెబుతూ రెండూ కాలగమనంలో నుంచి వచ్చినవే కదా అంటారు. రెండింటినీ స్వీకరించి వాటిని గమనాన్ని బట్టి నడుచుకోవాలని హితబోధ చేస్తారు. అలాగే పంచవర్ష ప్రణాలికలన్నవి కుగ్రామాల నుంచే మొదలు కావాలని, గ్రామాభివృద్ధే అసలైన అభివఋద్ధి అని ధర్మయ్య కల ద్వారా శక్తివంతంగా చెప్పిస్తారు. ఒక సామెతని యదాలాపంగా కథలో చొప్పించడం ఒక ఎత్తు. దాన్ని కథలో ఒక ప్రధానాంశంగా మార్చుకోడం మరొక ఎత్తు.

“ఒక ఆడబిడ్డకు వివాహ సంబంధం కుదర్చాలంటే మునుపు ఏడు జతలజోళ్ళు అరిగిపోయేవిట.” అంటూ అనామకుడు కథలో రచయిత కథను ఎత్తుకుంటారు. అయితే దాన్ని అక్కడతో వదిలేయకుండా ఆ సామెతను కథకి ఆయువు పట్టుగా మలుచుకుంటారు. సామెతకు అనుగుణంగా ఆధునీకరిస్తారు. “కాలేజీలెక్కువై అబ్బాయిలు అమ్మాయిలు పరస్పరం ప్రేమించుకోడమంటూ ఒకటి ప్రారంభమైన తరవాత ఇప్పుడా బెడద చాలావరకు తగ్గిపోయినట్టే ఉంది…” అంటారు. ఇది కథలో ఒక కీలకమయిన అంశమని మనకి చివరికి గానీ స్పష్టం కాదు. మొత్తం కథంతా ఈ అంశంమీద కేంద్రీకృతమై, పాఠకుడిని ఆందోళనకు గురిచేస్తుంది. అంటే రాజారాంగారు ప్రేమకథలకి వ్యతిరేకి అని కాదుకానీ మానవసంబంధాలు ఆధునికయుగంలో ఎలా మార్పులకు లోనయ్యాయో, వాటి ఫలితాలేమిటో చిత్రించి చూపించారు ఈ కథలో. ఇక రుద్రభూమి అన్న కథలో….కథకులకు సున్నితంగా, సూక్ష్మంగా సలహాలిస్తారు.

“మీరెలా రాస్తారండీ” అని అడిగితే, ఆయనజవాబు, “అదెంత పని లేవోయ్ కన్నారావ్! వ్రాయగలిగిన పేనా ఒకటి చేతిలో ఉండాలి. అందులో సిరా ఉండాలి. ఎవరైనా రాసి పారెయ్యొచ్చు.” ఆ తరవాత మాత్రం ఆయనకి చిన్న బెదురు కలుగుతుంది. “ఈ కన్నారావు కరపత్రాలు, ఆకాశరామన్న ఉత్తరాలు మొదలైనవి రాసేవాళ్ళకున్నూ, కథలు, నవలలు మొదలైనవి వ్రాసేవాళ్ళకున్నూ స్వభావంలో తేడా ఏమాత్రముండదన్నట్టు భావిస్తున్నాడు!” అంచేత వెంటనే, “ఏదైనా వ్రాయాలంటే దండిగా చదవాలోయ్, కన్నారావ్.” అని హెచ్చరిస్తారు. ఎంత బాగా చెప్పారో కదా….ఎంత చదివితే అంత బాగా రాయొచ్చు అని అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివాక.

ఇక రాజారాం గారి కథల్లో మరో ముఖ్యమైన అంశం స్త్రీ పాత్ర చిత్రణ. రాజారాం కథల్లో కనిపించే ప్రధాన స్త్రీ పాత్రలన్నీ ఏదో స్ఫూర్తి నిచ్చేవిగానే వుంటాయి. కక్షలు, కార్ఫణ్యాలు మానవ జీవితాలకు ఆంటకాలే కానీ….అభివృద్ధి కావంటూ కొండారెడ్డి కూతురు కథలో నాగతులసి, గాలివీడు నుంచి న్యూయార్క్ దాకాలో సీరజ పాత్రల చేత చాలా చ్క్గా చెప్పిస్తారు రాజారాం గారు. మంచి మాటలు, మంచి మనసులతో ఎటువంటి కరడుగట్టిన వారినైనా మార్చవచ్చిన నిరూపిస్తాయి నాగతులసి, నీరజ పాత్రలు. తనను చంపడానికి వచ్చిన ఇద్దరికి బుద్ధి చెప్పి మంచి వారిగా చేసి…వారికో నూతన జీవితాన్నిస్తుంది నాగ తులసి. అలాగే ఒక ఊరిలో ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఉన్న అగాధాలను తన మాటకారితనంతో మూసుకుపోయేలా చేస్తుంది నీరజ.

ఇద్దరు వ్యక్తులు కొట్టకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటో అతి తెలివిగా, సున్నితంగా చెప్పి…వారు తప్పు తెలుసుకునేలా చేస్తుంది. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఆటుపోటులెదురైనా తను అనుకున్నది సాధించి పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోనే తెలివైన పాత్ర సబల లోని విశాల పాత్ర. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తను కోరుకున్న వాడినే ఏరికోరి పెళ్ళి చేసుకుంటుంది. అలాగే మిస్ ఎమరాల్డా కథలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమై, అనాథలా బతికినా….ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా, విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలకునే విదేశీ యువతి ఎమరాల్డా అంతరంగాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తారు. ఇంకా ఇలాంటి మంచి పాత్రలు ఎన్నో ఆయన కథల్లో ఉన్నాయి. రాజారాం కథల్లో ఎన్నో స్త్రీ పాత్రలు మనల్ని పలకరించినట్లు వుంటాయి. మనతో కలిసి జీవించినట్లు వుంటాయి. మనల్ని సుతిమెత్తగా మందలించి , ప్రేమానురాగాల్ని పంచిపెట్టి అనుబంధాలతో అల్లుకుపోయినట్లు అనిపిస్తాయి. ఎందుకంటే అవి సమాజంలో నుంచీ తీసుకోబడిన పాత్రలే కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ వున్న స్త్రీ రాజారాం కథల్లో విభిన్న రూపాల్లోకి , పేర్లలోకి పరకాయప్రవేశం చేసాయా అనిపిస్తాయి.
మొత్తానికి ప్రతి ఒక్క విషయమూ క్షుణ్ణంగా పరిశీలించి, అనేక కోణాలను చక్కగా పరిశీలించి ఆవిష్కరిస్తున్నట్టుంటాయి రాజారాం గారి కథలు. ఎత్తుగడలో, పాత్రచిత్రణలో, సన్నివేశాలు ఆవిష్కరించడంలో, ముగింపులో – ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ రాజారాంగారి ముద్ర కనిపిస్తుంది. ఇతరులకు సాధ్యం కానిది, తనకు మాత్రమే సొంతమైన…అద్భుతమైన ముధ్ర అది. ఇతివృత్తాల్లో వైవిధ్యం, పాత్రచిత్రణలో పరిపూర్ణత, కథనరీతిలో అసదృశమైన పోకడలు రాజారాంగారి కథలని తెలుగు కథాసాహిత్యంలో ప్రత్యేకంగా, విడిగా నిలబెడతాయి. ఆధునికతకు పట్టం కడుతూనే… స్నేహ ధర్మాన్నీ , మానవధర్మాన్ని మర్చిపోవద్దు అంటూ తన కథల ద్వారా మధురంగా చాటి చెప్పారు మధురాంతకం రాజారాం గారు.

*

ఎడతెగని జీవిత సంఘర్షణలు పెద్దింటి కథలు

IMG

-వెల్దండి శ్రీధర్

~

 

sridharకథ అనగానే అమ్మమ్మ ఆవహిస్తుంది. ఆమె చూపించే రంగుల ప్రపంచం మన ముందు పరుచుకుంటుంది. గుండె గదులకు అద్భుతాలు కొత్త పరిమళాన్ని అద్దుతాయి. ఒక్కో కథ ఒక్కో నూతన జగత్తును  చూపించి అంబరమంత సంబరాన్ని హృదయానికి పంచి వెళ్తుంది. రాజులు, రాణులు, మంత్రులు, భూతాలు, దయ్యాలు, మంత్రగాళ్లు, సామాన్యులు…ఇలా ఎందరెందరో గుర్తుకు వచ్చి ఆయా వ్యక్తిత్వాలకు మనల్ని మనం ఆకురాయిలా రాసుకుంటాము. లౌకిక కథలకి వచ్చినపుడు జీవితం మీద నిలబడి మనిషి చుట్టూ పరుచుకున్న నెలవంకల్నీ, బతుకు వంకల్నీ చూపెట్టిన వారు ఎంతో మంది. ఆ వరుసలో పెద్దింటి అశోక్ కుమార్ కథ చదవడమంటే ఒక చేత కన్నీటి కుండను, మరో చేత గాయాలకు పూసే ‘నల్లాలం’ పసరును పట్టుకోవడమే. తెలుగు కథా సాహిత్యంలో 1990ల నుండి తెలంగాణ జీవితాన్ని రికార్డు చేస్తూ చాలా ఆర్ద్రమైన కథల్ని రాస్తూ అనేక అవార్డుల్ని పొందుతున్న కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఈయన కలం నుండి వెలువడిన సరికొత్త కథల సంపుటి ‘జుమ్మేకి రాత్ మే’.

సాధారణంగా పెద్దింటి అశోక్ కుమార్ కథంటే ప్రపంచీకరణ విధ్వంసం, కూలిపోయిన కులవృత్తులు, వలస, ఎడారి మంటలు, విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు, కుదేలయిపోయిన వ్యవసాయం.. ఇవే కనిపిస్తాయి.  ఈ కథా సంపుటి కూడా అందుకు మినహాయింపు కాదు. దీన్నిండా కూడా పాఠకుడిని ఆపాదమస్తకం కదిలించి, రగిలించి, ఊగించే కథలే వున్నాయి. ఒక్కో  కథ ఒక్కో జీవిత శకలం. ఒక్కో శిథిల మానవ ప్రపంచం. శిల్ప రీత్యీ కూడా ఒక్కోటి ఒక్కో కొత్త శిల్పంలో నడిచిన కథలు. కథలన్నీ చదివి పుస్తకం మూసేసిన తరువాత ఈ కథలు నిజంగా మనకు అర్థం కావడం ప్రారంభమవుతాయి. సారాంశం మనసుకెక్కుతుంది, వెంటాడి వేదిస్తుంది. అంతః చేతనలోకి వెళ్లి అలజడి చేస్తుంది.  ప్రతి కథ ఒక విప్లవాన్ని, ఒక తిరుగుబాటును నూరిపోస్తాయి. ఇందులోని 18 కథల్లో మూడు కథలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా నడిచిన  కథలు, రెండు ఎడారి దేశాల కథా వస్తువుతో రాసినవి, మరో రెండు విద్యా వ్యవస్థను ప్రశ్నించే కథలు  కనిపిస్తాయి. మిగతావి విభిన్న కథాంశాలతో కూడుకున్నవి.

పంచతంత్రంలోని కథలన్నీ పక్షుల, జంతువుల చుట్టూ తిరిగే కథలే అయినా అవి వాటికి సంబంధించిన కథలు కాదనేది స్పష్టం. మానవ ప్రవృత్తుల్ని, మానసిక చాంచల్యాన్ని చిత్రించిన కథలవి. అలాగే ఈ కథా సంపుటిలోని మొదటి కథ ‘అనగనగా ఓ కోడిపెట్ట’ కథంతా కోడిపెట్ట దృష్టికోణం నుంచి నడిచినా సారాంశంలో మనిషిని ఉద్దేశించిన కథ. జీవితం ఎంత సంక్లిష్టమో, ఎంత దుర్భరమో, మరెంత భయానకమో ధ్వన్యాత్మకంగా చెప్పే కథ. నిజానికి పైపైన చూస్తే కోడిపెట్ట పిల్లల్ని పెట్టడం, వాటిని కంటికి రెప్పలా కాపాడడం, వాటికి జీవితాన్నెలా ఎదుర్కోవాలో నేర్పించటం, యౌవనం వచ్చిన తరువాత తల్లికోడి నుండి ఎడబాసి స్వతంత్రంగా జీవించటం… ఈ జీవన వరుస క్రమం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ మనిషికి బోధించిన జీవన సూత్రాలు. నైపుణ్యాలు. సంఘంలో మనిషిగా నిలదొక్కుకొని జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే కథ. ఈ కోవలోదే మరో కథ ‘ఏడిండ్ల పిల్లి కూన’ కథ. తల్లి తన బిడ్డలను కాపాడుకోవడానికి ఎంతగానో తపిస్తుంది. ఎంత సాహసానికైనా ఒడిగడ్తుంది. ఎవరినైనా ఎదిరిస్తుంది. చివరికి తనను కట్టుకున్న భర్తను కూడా. అలాంటి మాతృప్రేమ, ధైర్య సాహసాలు, ప్రసూతి వైరాగ్యం, గర్భంతో ఉన్నప్పుడు తన నొప్పిని ఎవరూ పంచుకోకపోయినా పరవాలేదు కానీ కనీసం తనకు సహాయం చేసే చేతికోసం ఎదురుచూసే ఒక తల్లి ఆవేదన ఇవన్నింటి మేళవింపు ఈ కథ.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ మలి దశను చిత్రించిన కథలు అత్యధికంగా రాసింది పెద్దింటి అశోక్ కుమారే. ఈయన రాసిన మూడు కథలు మూడు భిన్న శిల్పాలతో అలరారుతాయి. ‘యుద్ధనాదం’ కథ ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సమగ్రంగా చిత్రించిన కథగా చెప్పుకోవాలి. ఉద్యమ క్రమమంతా చాలా నేర్పుతో అక్షరీకరించారు రచయిత. ఉద్యమం చుట్టూ పాఠకుడిని చేయి పట్టుకొని తిప్పుకొస్తుందీ కథ. ఆత్మ బలిదానం వద్దు చేయి చేయి కలిపి పోరాడుదాం అనే స్ఫూర్తిని నింపుతూనే ఉద్యమ సెగలతో మన మనసులు రాజుకునేలా చేస్తుంది. మరో కథ ‘రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ’. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెలా వారి వారి స్వార్థ ప్రయోజనాలకు, తమ పదవులు నిలుపుకొనుటకు వుపయోగించుకుంటున్నారో ధ్వన్యాత్మకంగా విప్పి చెప్పే కథ. టీవీలో కొనసాగే రోజువారి సీరియల్ లాంటి నడకతో మొదలైన ఈ కథ చివరిదాకా ఏదో సీరియల్ కథనేమోనని భ్రమిస్తుంది. కానీ చివరికి ఇది తెలంగాణ ఉద్యమ కథ అని దాని మలుపులు, రాజకీయ నాయకుల బొంకులు, పెద్దమనుషుల ఒప్పందం అన్నీ కళ్లకు కడుతాయి. ఉద్యమ తొలి దశ నుండి ప్రతి మలుపుని ఒక ఎపిసోడుగా చెప్తూ కథకుడు చాలా ఉత్కంఠను పాటిస్తాడు. మంచి శిల్పంతో కొనసాగే కథ. మరో ఉద్యమ కథ.  ‘రేపు మాపు అను ఓ విడాకుల కథ’ ప్రత్యేక తెలంగాణ విషయాన్ని ఏండ్లుగా నానబెడుతున్న కాంగ్రెస్ పార్టీని న్యాయవాది స్థానంలో, తెలంగాణ ప్రాంతాన్ని దగా పడ్డ భార్యగా, అవశిష్ట ఆంధ్రప్రదేశ్ ను భర్త స్థానంలో నిలబెట్టి కథ నడుపుతాడు. విడాకులు ఎందుకు కావాల్నో చాలా హేతుబద్దంగా వాదిస్తుంది భార్య (తెలంగాణ). ‘‘నా భర్త (సీమాంధ్ర) చదువుకున్నోడు…చాల్ బాజిగాడు. నన్ను ఎక్కిరిచ్చుడేగాదు బానిసలెక్క చూస్తుండు అన్నది. హక్కులు, బానిసపోరాటాలు అనే పదాలే  నాకు (కాంగ్రెస్) గిట్టయి. సంసారమన్నంక సర్దుకపోవుడు తప్పదు కదా అనుకున్న. భార్యా, భర్తల మధ్య బానిస ఏంది అనుకుంటాడు న్యాయవాది.

‘సార్… ఎంత ఖర్చయిన సరే! నాకు విడాకులు కావాలె’ అన్నది.

‘ఇంత చిన్నదానికేనా…సర్దుకుపోవాలమ్మా..’ అన్న.

‘ఆత్మగౌరవం చిన్న ముచ్చటనా సార్.. పెండ్లయ్యేనాటికే ఇద్దరికి ఇద్దరేసి పిల్లలు. వాళ్లు ఎప్పుడూ కలువలేదు. వాళ్ల ఇష్టాయిష్టాలు గూడా కలువలేదు. ఎప్పుడు కొట్లాటనే’ అన్నది.

‘ఆత్మగౌరమంటే నాకు మంట. అది సోమరిపోతులు అనే మాటలని నా అభిప్రాయం’

నమ్మిన న్యాయవాది పూర్తిగా మోసం చేసినా గుండెలో గాయాల్ని దాచిపెట్టుకొని ఆమె లాయర్ దగ్గరికి వస్తూనే ఉంటుంది. చివరాఖరికి ఆ లాయర్ ‘చూడమ్మా… ఇన్నేండ్లు తండ్లాడుతున్నవ్. కోర్టుల వెంట తిరుగుతున్నవు యాష్టకు రావడం లేదా? అని ప్రశ్నిస్తాడు.

దానికి ఆమె ‘సార్.. నేను కొట్లాడుతలేను. యుద్ధం చేస్తలేను. యుద్ధం చేస్తే గెలుపోటములుంటయి. నేను విముక్తి కోసం పోరాటం చేస్తున్న. ఇందులో గెలుపే తప్ప ఓటమి ఉండది’ అంటుంది. దాని ఫలితాన్ని మనం ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల రూపంలో చూస్తున్నాం.

భారతీయ విద్యా వ్యవస్థను ప్రశ్నించి బోనులో నిలబెట్టే కథలు ‘ములాఖత్’, ‘ప్రొగ్రెస్’. నేత కార్మికుల జీవిత విధ్వంసాన్ని చాలా బలంగా చెప్పిన కథ ‘ఎదురు చేప’. పవిత్రమైన వైద్య వృత్తిలో ప్రవేశించిన వారు సామాన్య ప్రజలను ఎంతగా పీల్చి పిప్పి చేస్తున్నారో చేప్పే కథ ‘భయంగా ఉంది’. సాఫ్ట్ వేర్ రంగంలోని భార్యా, భర్తల మధ్య చోటు చేసుకున్న కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని, వారి మానసిక సంఘర్షణను చెప్పిన కథ ‘రెండు నదులు’. నదుల్లా కలిసిపోవాల్పిన దంపతులు, రెండు వేర్వేరు నదుల్లా ఎందుకు విడిపోతున్నారు. దగ్గరగా కంటే దూరంగా ఉన్నప్పుడే ఎందుకు సంతోషంగా ఉంటున్నారు? ఇత్యాది అనేక ప్రశ్నలను రేకెత్తించే కథ ఇది. అందరికి చెందాల్సిన భూమి, నీరు, డబ్బు ఎలా ఉన్నోని పంచన చేరుతున్నాయి?. ఎవని చేతిలో బందీలుగా మారుతున్నాయని మంచి శిల్పంతో చెప్పిన కథ ‘బంధీలు’ కథ. ఒకప్పడు ఊరునంతా చైతన్యంతో నింపిన ఎడ్లకొట్టం ఇప్పుడు ఎంత దిగజారిందో, తద్వారా ఊరెంత దిగజారిపోయిందో ఎడ్లకొట్టం కేంద్రంగా మనసును రగిలించేలా చెప్పిన గొప్ప కథ ‘మా ఎడ్లకొట్టం @ 2010’. ఒకప్పుడు ఊరులోని ఎడ్లకొట్టం అన్ని కులాలకు, ఉద్యమాలకు ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమానికి కేంద్రం. ఎన్నో దళాలు అందులో మీటింగ్ పెట్టుకొని పోరుబాటకు ఉద్యుక్తమయ్యేవి. పోలీసులు దాని మీద నిగా పెట్టేవారు.  ఈ పరిస్థితిలో అమ్మేయమని ఎవరు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా అందులో బడి నడుపుతాడు కథకుడు. కాలక్రమంలో ప్రభుత్వం మద్యాన్ని ఏరులా పారించి గ్రామాలను మత్తులో ముంచివేస్తోంది. ‘మత్తు ఏదైనా సరే! ఏ రూపంలో ఉన్నా.. మత్తులో ఉన్నప్పుడు మనిషి ఆలోచించలేడు. ఆలోచించనప్పుడు ప్రశ్నించలేడు. ప్రశ్నించనప్పుడు ధిక్కరించలేడు. ధిక్కరించనంత వరకు రాజ్యానికి డోకా లేదు. అందుకే మత్తులో ఉంచడానికి మందును అందుబాటులోనికి తెచ్చింది. అది చెరకు గడ్డకు గండమాల పట్టినట్టు ఊర్లను పట్టుకొని తింటుంది’ ఇప్పుడా ఎడ్లకొట్టం  మద్యం విక్రయానికి కేంద్రంగా మారి మంచి ఆదాయానికి వనరుగా మారుతుంది. కథకుని మనస్సు చివుక్కుమంటుంది. వెంటనే దాన్ని నేలమట్టం చేసి ఇప్పడు దాని అడుగున కొత్త విప్లవాలేవో పూయాలని కలలుగంటాడు. సారా వ్యాపారం వెనకగల పెద్ద వలయాన్ని మన కళ్ల ముందు నిలబెట్టే కథ ‘వలయం’. ఈ వలయంలో సారా ఉత్పత్తి దారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు అందరూ పావులేనని ఈ వలయం నుండి ఎవరూ తప్పించుకోలేరని చెప్తుందీ కథ. వ్యవసాయం గ్రామీణులకు ఎలా బలహీనతగా మారిందో చెప్పే కథలు ‘ఇగ వీడు తొవ్వకు రాడు’, ‘గ్లాసియర్’. ఇగ వీడు తొవ్వకు రాడు కథ విప్లవాన్ని నూరిపోసే కథ. వానసత్వంగా వచ్చిన వ్యవసాయం లాభసాటి కాదని కథకుడు ఎంత చెప్పినా వినకుండా ఈ వ్యవస్థ మెడలు వంచి రైతే రాజని నిరూపిస్తానని హామీ ఇచ్చే కథ. వ్యవసాయానికి దూరంగా ఉండలేని ఒక యువతి కాల క్రమంలో ఎలా మానసిక రోగిగా మారిందో విప్పి చెప్పే కథ ‘గ్లాసియర్’. చివరికి ఆ రోగికి మందేంటంటే మళ్లీ వ్యవసాయాన్ని మొదలు పెట్టడమేనని చెప్పడం పాఠకుడిని కదిలించి వేస్తుంది.

మొత్తం కథా సంపుటిలో మనిషి లోపలి ‘కార్జాలు’ కదిలే కథలు ‘పామును తరిమిన చీమలు’, ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’, ‘జుమ్మేకి రాత్ మే’. తమ ఊరు చుట్టూ రోజు రోజుకు మాయమవుతున్న గుట్టలను, చెట్లను, పుట్టలను  ప్రజలే చైతన్యవంతులై రక్షించుకోవాలని నాటకీయంగా చెప్పే కథ ‘పామును తరిమిన చీమలు’. ఎడారి దేశాల్లో జీవితం ఎంత దుర్భరమో, ఇక్కడ పనులు లేక, కాలం లేక వలస బాట పట్టిన యువకులు అరబ్ దేశాలకు వెళ్లి ఎలా అర్ధాంతరంగా జీవితాన్ని చాలిస్తున్నారో! గుండెను మెలితిప్పే కథ ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’. కథ పూర్తయ్యాక పాఠకుడు తనకు తెలియకుండానే కన్నీటి పొరల్లో మునిగిపోతాడు. మస్కట్ నుండి దుబాయికి, దుబాయి నుండి మస్కట్ కు దొంగతనంగా బోర్డర్ దాటడానికి భారతీయులు ఎలా చావు అంచుల దాకా వెళ్లి వస్తారో ఒళ్లు గగుర్పొడిచేలా కళ్లకు కట్టించిన కథ ‘జుమ్మేకి రాత్ మే’. కంకర క్రషర్ లో దాక్కొని బోర్డర్ దాటుదామని ప్రయత్నించిన వారు బోర్డర్ వద్ద గస్తీ పోలీసలు క్రషర్ మిషన్ లో ఎవరూ లేరని చెప్పినా నమ్మకుండా ఒక్కసారే క్రషర్ ను  ఆన్ చేస్తే అందులో దాక్కున్న వాడు నుజ్జు నుజ్జు అయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలకు మన దేహమంతా ఒక విద్యుత్ షాక్ కు గురవుతుంది.   మరణాన్ని రుచి చూపించే  కథ.

కొన్ని కథలు పెద్దింటి అశోక్ కుమార్ మాత్రమే రాయగల కథలున్నాయి. ఉబుసుపోకకు రాసిన కథ ఒక్కటి కూడా లేదు. ప్రతి కథ పిడికెడు కన్నీళ్లను గుప్పిట్లో పట్టుకుని రాసిందే. జోకొట్టే కథ ఒక్కటీ లేదు. అన్నీ చైతన్య భాస్వరాన్ని గుండెలకు అందించి మనిషిని నిలువెత్తు నిప్పుకణికల్లో ముంచి తీసి పుటం పెట్టే కథలు. నిత్యం తన కళ్లముందు కదలాడే మనుషులే తన కథల్లో పాత్రలుగా ఒదిగిపొయ్యారు. మొరందేలిన వాకిళ్లు, మూతపడ్డ ఇండ్లు, దగా పడిన జీవితాలు అనివార్యంగా ఆయనకు కథా వస్తువులయ్యాయి. పల్లె మధ్య, సంక్షోభం నడుమ నిలబడి వాటి చుట్టూ ఏం జరుగుతుందో వాటి పర్యవసానాలేమిటో ఒక్కో కథ చాలా బలంగా వ్యక్తీకరిస్తుంది. ఆయన కథలన్నింటికీ ఆయన ఊరే ఊటబాయి. అక్కడి  మట్టిని కెలుకుతూ అనేక కథలకు జీవం పోస్తున్నాడు. మాయమైన చెరువు దిక్కూ, ఎండిన వాగు దిక్కూ, కరిగిపోతున్న గుట్టల వైపు దిగులుగా చూసే పెద్దింటి మరిన్ని కథల్ని హామీ ఇస్తున్నాడు ఈ కథా సంపుటి ద్వారా.

 

*

 

 

 

                                                                                              

              

 

 

పిలక తిరుగుడు పువ్వు: రాజ్యంపై పతంజలి లోచూపు

– ఎ . కె . ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎన్ కౌంటర్లు వుండవని కొండంత ఆశతో ఆలోచనలు చేసిన ప్రజాసంఘాల్లోని మేధావుల కన్నా తెల్లదొరలు పోయి దేశానికి స్వాతంత్ర్యం వస్తే కానిస్టేబుల్ తమ వూరినుంచీ బదిలీ అవుతాడా అని పిసరంత అనుమానంతో అమాయాకంగా ప్రశ్నించిన కన్యాశుల్కం నాటకంలోని జట్కా అబ్బీయే తెలివిమంతుడని యిటీవల నాకు చాలా బలంగా అనిపిస్తుంది. బూర్జువా ప్రజాస్వామ్యంలో పాలకులు మారినంత మాత్రాన ‘రాజదండం’ మారదు; రాజ్యానికి వుండే సహజ సిద్ధమైన కవచకుండలాలు కత్తి కటారులూ మారవుకదా! కాకుంటే వొకప్పటి లాఠీ సంస్కృతి స్థానే యివ్వాళ గన్ కల్చర్ విశృంఖలంగా స్వైరవిహారం చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడాలంటే ఆ మాత్రం ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోక తప్పదు.

నాలుగు స్తంభాల దొంగాటలో ప్రజాస్వామ్యం ముసుగు చీల్చి రాజ్యం క్రూర స్వభావాన్నీ కర్కశ స్వరూపాన్నీ వాస్తవికత పరిధిని దాటి చిత్రించిన సాహిత్యం మనకు చాలా తక్కువ. వాస్తవికత కూడా భౌతిక సంఘర్షణ చిత్రణ వరకే పరిమితమైంది. ఉపరి తలాన్ని దాటి రావిశాస్త్రి లాంటి వాళ్ళు అరుదుగా పునాదుల్ని స్పృశించారుగానీ దాని లోతుల్లోకి వెళ్లి విమర్శనాత్మకంగా విశ్లేషించి మూలాల్ని తాత్వికంగా ఆవిష్కరించిన రచయిత పతంజలి వొక్కడేనేమో! అందుకు అతను యెన్నుకొన్న మాధ్యమం వ్యంగ్యం. ఆ వ్యంగ్యం డొక్కలో చక్కలిగింతలు పెట్టదు; గుండెలో ములుకై గుచ్చుకుంటుంది. వ్యవస్థ మొత్తం సిగ్గుతో తలదించుకొనేలా చేస్తుంది. అప్పటికే అపరాధ భావనతో వున్న వాళ్ళలో అగ్గి రగులుకొల్పుతుంది.

రాజ్యానికి వున్న నానార్థాల్లో పోలీసు వొకటని చానాళ్లు నాకొక అపోహ వుండేది. ‘ఇదేమి రాజ్యం – పోలీసు రాజ్యం’ అని గోడమీది నినాదం చూసాకా కూడా రాజ్యానికి పోలీసు వొక అంగమనే భ్రమలోనే వుండిపోయా. ఆ రెండిటిదీ కుక్క తోకల లాంటి అంగాంగి సంబంధం కాదనీ, అవి రెండూ పర్యాయ పదాలనీ, పోలీసూ రాజ్యం వ్యస్త పదాలు కాదనీ సమస్త పదమనీ, ఆ సమాసం అభేదరూపకమనీ యిరవై ఏళ్ళ క్రితం (ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచిక 1995లో) కాకర్లపూడి నరసింహ యోగి పతంజలి రాసిన ‘పిలక తిరుగుడు పువ్వు’ కథ చదివాగ్గానీ అర్థం కాలేదు.
పతంజలి అవసరం లేకుండానే మన సినిమా వాళ్ళకి యీ విషయం యెప్పట్నుంచో బాగా తెల్సు. పోలీసు పాత్రలోని ఠీవీ గాంభీర్యం ఆధిపత్యం అధికార దర్పం శాసించే తత్త్వం వంటి అనేకానేక ‘ఉదాత్త’ లక్షణాలు నచ్చబట్టే నటులంతా జీవితకాలంలో యెప్పుడో వొకప్పుడు పోలీసుగా నటించి జన్మ సఫలం చేసుకొంటారు. వీళ్ళందరికీ మన జాతీయ చిహ్నంలో కనిపించే మూడు సింహాలేవి అన్నవిషయంలో అభిప్రాయ భేదాలుండొచ్చేమో గానీ కనిపించని నాలుగో సింహం మాత్రం పోలీసే. నిజానికి నాలుగు సింహాలూ పోలీసులే. పోలీసు న్యాయమే అంతిమ న్యాయం. కాదని అనుమానం వుంటే నాలాగే పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’ మరోసారి చదవండి.

న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదనీ న్యాయస్థానాల తీర్పుల్ని చట్టసభల్లో కూర్చొని శాసనాలు చేసేవాళ్ళు సైతం శిరసావహించాలనీ వెర్రి నమ్మకం మనబోటి సామాన్యులకి వుంటుంది. కానీ వాస్తవానికి ప్రజాస్వామ్య సౌధానికి నాలుగు స్తంభాలన్న మాటే అబద్ధమనీ రాజ్యం వొంటి స్తంభపు మేడ అనీ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్య నిర్వాహక వ్యవస్థ మీడియా మొత్తంగా ఆ మేడలో సుఖాసీనుడైన పసిడిగలవాడి కాళ్ళ దగ్గర పడివుండే బానిసవ్యవస్థలనీ, ధనికస్వామికి కాపలా కుక్కలకన్నా లేదా పెరట్లో కట్టేసిన పెంపుడు జంతువులకన్నా హీనమనీ పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’కి ముందు నుంచే చెప్పినప్పటికీ యీ కథలో మాత్రం దాని విశ్వరూప దర్శనం చేయించాడు.

‘పిలక తిరుగుడు పువ్వు’ కథని విశ్లేషించడానికి నా దగ్గర పనిముట్లు లేవు. నిజానికి కథ దానికదే self explanatory – పరిపూర్ణం. వ్యాఖ్యలూ టీకా టిప్పణులూ అవసరం లేదు. కానీ ఆ కథ నాకిచ్చిన యెరుకని పదుగురితో పంచుకోవాలనే చాపల్యంతోనే యీ నాల్గు మాటలూ…

జ్ఞానం రాజద్రోహమనీ కుట్ర కేసుకి కారణం కావొచ్చనే హెచ్చరిక ఆ కథలోనే వున్నప్పటికీ పిలక తిరుగుడు పువ్వు వివిధ సందర్భాల్లో ప్రాసంగికంగా గుర్తొస్తూనే వుంటుంది. కారణం – రచయిత కథనంలో వాడిన అనుపమానమైన వ్యంగ్యం. సీరియస్ కథాంశాన్ని నాన్ సీరియస్ గా చెప్పడం అంత తేలికైన పని కాదు. నిజానికి వొక విధంగా చూస్తే యీ కథలో కథ లేదు. గోపాత్రుడు నవలకి పిలక తిరుగుడు పువ్వు కొనసాగింపు మాత్రమే. ఈ సీక్వెల్ శిల్పం కూడా తెలుగులో అరుదు. ఒక పాత కథనుంచీ దానికి కొనసాగింపుగా మరో కొత్త కథని సృష్టించడం మృత శిశువుకి జన్మనివ్వడం లాంటిదని విలియం గోల్డింగ్ మాట కేవలం ప్రయోగం కోసం రచనలు చేసే రచయితల విషయంలో నిజం కావొచ్చుగానీ కథా కళ మర్మం తెలిసిన పతంజలి విషయంలో మాత్రం కాదు.

భూమి గుండ్రంగా వుందా బల్లపరుపుగా వుందా అన్న వాదనతో మొదలైన ఆలమండ గ్రామస్తుల కథ కులాల విశ్వాసాల బోయినాల సంఘర్షణలో రాటుతేలి యుద్ధాన్ని తలపించే దొమ్మీగా పరిణమించి పోలీసు ప్రవేశంతో మున్సిఫ్ కోర్టుకొస్తుంది. మేజిస్ట్రేట్ గంగాధరం భూమి బల్లపరుపుగా వుందని తీర్పు చెప్తూ దానికి జీవితాన్ని అన్వయించి వుపపత్తి పూర్వకంగా వొక తర్క బద్ధమైన తత్త్వాన్ని ఆవిష్కరించి కేసు తేల్చేసాడు.

‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదు. మన విలువల మీద మనకు గౌరవం లేదు. మన దేవుడి మీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మన తోటివాళ్ళ మీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్ళబడుతుంది.’

మేజిస్ట్రేట్ చేసిన వ్యంగ్యంతో కూడిన వ్యధాభరితమైన సత్యావిష్కరణే గోపాత్రుడు నవలకి ముగింపు. అక్కడితో ఆ కథ అయిపోయింది.

patanjali

గంగాధరం తీర్పు సమాజంలో జీవితాలు అస్తవ్యస్తంగా అబద్ధాలమయంగా తయారయ్యాయి – ప్రజలు ‘ఇష్టారాజ్యం’ గా వ్యవరిస్తున్నారన్న అర్థం వచ్చేలా వుంది. మరిక దండధారి అయిన పోలీసు అస్తిత్వానికి అర్థం యేమిటి – పోలీసు రాజ్యం యేమైపోవాలి అన్న సిఐ అంతర్మథనంతో కొత్త కథ మొదలైంది. ‘చూపున్న పాట’లోని పోలీసే గోముఖం తొడుక్కొని యిక్కడ దర్శనమిస్తాడు.
పోలీసువారి ‘నమ్మకానికీ – ఆచరణకీ తేడా లేదే. విశ్వాసానికీ జీవితానికీ వ్యత్యాసం లేదే.’ చెప్పిందే చేస్తున్నారు. దండం దశగుణం భవేత్ అని నమ్మి తంతానొరే అని చెప్పి తంతున్నారు. కేసుకింత అని చెప్పి అబద్ధానికి తావులేకుండా అంతే తీసుకుంటున్నారు. అంతా ఖుల్లం ఖుల్లా. సర్వ సామాన్య వ్యవహారమే. బహిరంగ వ్యాపారమే. నిత్య కృత్యమే. మరిక ‘భూమే కాకుండా జీవితం కూడా బల్లపరుపుగా ఉన్నాదని చెప్పడానికి’ ఆస్కారం లేదే! భూమి గుండ్రంగానో బల్లపరుపుగానో లేదు పోలీసు లాఠీ లాగా లేదంటే టోపీ లాగా వుందని యింకా కాదంటే తుపాకీ తూటాలానో బాయ్ నెట్ లానో వుందని పోలీసు నమ్మకం. ‘నల్ల గౌనేసుకున్నోడి నమ్మకం తీర్పయిపోయి’ మిగిల్నోళ్ళ నమ్మకాలు అందునా పోలీస్ నమ్మకానికి విలువ లేకుండా పోవడంలో, ఆ తీర్పుని పోలీస్ కూడా అంగీకరించవలసి రావడంలో మిక్కిలి ‘డేంజరున్నాది’- అనుకొన్నాడు జామీ స్టేషన్ సిఐ.

తమ యేలుబడిలోని వొక చిన్న రాజ్యంలో ప్రజా జీవితం సవ్యంగా లేనందువల్లే యిటువంటి అపసవ్యమైన పిలక తిరుగుడు తీర్పుని ఎస్. కోట మాజిస్ట్రేట్ యిచ్చాడనీ అందుకు ఆ యిలాకా సిఐ బాధ్యత వహించి జీవితంలోకి తొంగి చూసినందుకు అతనికి బుద్ధి చెప్పాలనీ డి యస్పీ దొరగారు భావించడంతో ధర్మ కర్మాచరణ దీక్షా బద్ధులైన వారి పరోక్ష నేతృత్వంలో కనుసన్నల్లో పోలీస్ యాక్షన్ మొదలైంది. పోలీస్ పవరేంటో పిలక తిరుగుడు మున్సఫ్ మాజిస్ట్రేట్ కి ఘరానా పోలీస్ సిఐ తెలియ జెప్పడమే యీ కథ.

గోపాత్రుడు (1992) నవల చదవకపోయినా ‘పిలక తిరుగుడు పువ్వు’ దానికదే నిండైన కథగా రూపొందడానికి పతంజలి కథని యెత్తుకొన్న విధానమే గొప్పగా దోహదం చేసింది. పాత కథలోని ముగింపు – గంగాధరం తీర్పు. దాన్ని సమీక్షించడం, కొత్త కథకి ప్రస్తావనగా వుపయోగపడగల పోలీసు అధికారాన్ని బేరీజు వేసుకోవడం – యీ రెండు పనుల్నీ కథ యెత్తుగడ నెరవేర్చింది. న్యాయవ్యవస్థ పోలీసుపై ఆధిపత్యం నెరపి శాసించడమనేది గొప్ప ప్రమాదం – ఆ ప్రమాదం కొనసాగనివ్వడానికి వీల్లేదు అన్న సూచనకి ప్రస్తావనలోనే బీజాలు పడ్డాయి. దాన్నెలా సాధిస్తాడన్నదే మిగతా కథ అంతా.

రాజు తల్చుకొంటే దెబ్బలకి కొదవేముంది? పోలీసు తల్చుకొంటే చేయలేనిది ఏముంది? సవాలక్ష అభియోగాలూ బైండోవర్లూ మిస్సింగ్ లూ చిత్రహింసలూ లాకప్ డెత్ లూ ఎన్ కౌంటర్లూ రాజద్రోహం కుట్ర కేసులూ … యేదైనా సాధ్యమే. ఆలమండ దొమ్మీలో మేజిస్ట్రేటు యెవరికీ శిక్ష వెయ్య లేదు. ‘అందర్నీ వొగ్గీసినాడు’. సి ఐ వాళ్ళందరి మీదా వైనవైనాలుగా రికార్డు స్థాయిలో కుట్ర కేసులు బనాయించి కోర్టుకి హాజరు పరుస్తాడు. భూమి బల్లపరుపుగా వుందని తీర్పునిచ్చి – దాన్నిధిక్కరించి నందుకు కొందరికి శిక్ష కూడా విధించిన గంగాధారమే అన్ని కుట్రకేసుల్లోనూ ప్రథమ సాక్షి.

ఇప్పటి దాకా మంచుతెర చాటున దాగిన సూర్యబింబంలా దోబూచులాడిన రచయిత దృక్పథం ఇక్కడ నుంచీ బాహాటమైంది. ఎండ చురుకు చర్మం లోపలి పొరల్ని సైతం తాకుతుంది. పాలకుల చేతిలో ప్రజల్ని అదుపులో వుంచడానికి ప్రజాస్వామ్యంలో యిన్ని ఆయుధాలున్నాయా అని ఆశ్చర్యపోతాం. ఏలినవారు కుట్రకేసులు ఆడా మగా తేడా చూపకుండా మనుషుల మీదే కాదు వీరబొబ్బిలి లాంటి కుక్క మీద కూడా పెట్టినట్టు చెప్పడం హాస్యానికి కాదు; అధిక్షేపానికే అని పాఠకులకి అర్థం కావడానికి ఆట్టే సేపు పట్టదు.

గంగాధరానికే విషయంలోని గాంభీర్యం కాస్త ఆలస్యంగా బోధపడింది. కుట్ర కేసుల అంతరార్థం ఏఏపి చెప్తే గానీ తెలుసుకోలేడు. ‘ఏటిదంతా’ అని యుద్ధం చేయలేని అర్జునుడిలా అడుగుతాడు.
ఏఏపి వువాచ:
“విది పోలీసు మాయ … గవర్నమెంటోడి లీల …”
పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పాల్సిన సారం అంతా వొక్కముక్కలో తేల్చేశాడు. రచయిత ఏఏపిని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని గాక అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటర్ అనడంలో చమత్కారం, పోలీస్ కీ గవర్నమెంట్ కీ అభేదాన్ని పాటించడంలో చాతుర్యం గమనించాలి.
‘కేసులు దాఖలు చేసినవారు: భారత ప్రభుత్వము తరపున వారి ఘనత వహించిన ప్రతినిధులు … సర్కిల్ ఇన్స్ పెక్టర్ వారు.’ ప్రభుత్వం అమూర్తం. దానికి నిండైన రూపం పోలీసు. ఈ విషయంలో సందేహానికి యిక తావు లేదు.
“ఒక్క కుట్ర కేసైనా నిలబడదు …” కక్షగా అన్నాడు గంగాధరం. మాయా వినోదం లీలా క్రీడల పరమార్థం అర్థం కావాలంటే ప్రభువులు విశ్వరూపం చూపించాల్సిందే! [జాక్ లండన్ ‘ఐరన్ హీల్’ (తెలుగు అను: ఉక్కు పాదం) నవల్లో తన పరిధిని మర్చిపోయి పేదల కష్టాలకి కారణాలు తెలుసుకొనే ప్రయత్నం చేసిన మతాధికారిని చర్చి పిచ్చివాడని ముద్ర వేసి బహిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో పౌరులకి మంచి జీవితాన్ని కోరుకొన్న న్యాయాధికారి గంగాధరంది కూడా దాదాపు అదే పరిస్థితి.] కుట్రకేసులు నిలబడతాయని పోలీసులు వాట్ని పెట్టరు. అల్లరిపెట్టడానికి పెడతారు. ఆ మనుషులు పెట్రేగిపోకుండా కొంతకాలమైనా కంట్రోల్ లో ఉండటానికి పెడతారు. పిరికివాళ్ళని జడిపించడానికి పెడతారు – అన్న ఏఏపి సోయి తెలివి కూడా అతనికి లేవు.

రాంనగర్, సికింద్రాబాద్, పార్వతీపురం … యెన్ని చూడలేదు మనం. కతలూ కవితలూ రాసుకొనేవాళ్ళూ పత్రికలూ పుస్తకాలూ అచ్చేసేవాళ్ళూ ‘చట్ట బద్ధముగా ఏర్పడిన భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను కుట్ర పూరితముగా కుత్సిత బుద్ధితో సాయుధముగా కూల్చివేస్తార’నా కేసులు పెట్టేది? దశాబ్దాలపాటు కేసులు నడుస్తాయి. కేసు కొట్టేసే లోపు కొందరు సైద్ధాంతికంగా దూరమౌతారు. కొందరు దాటుకుంటారు. కొందరు దాటిపోతారు. కొందరు జారిపోతారు. కొందరు లొంగిపోతారు. కాదంటే కొంతమందిని లేపేయొచ్చు. కొందరు వాళ్ళే లేచిపోతారు.
పాపం ఎస్ కోట మేజిస్ట్రేట్ లాంటి వారికి జీవితం గందరగోళంగా వుందన్న భోగట్టా తెలుసు, అందుకు కారణాలూ తెలుసు. కానీ దాన్ని చక్కదిద్దే దారులే తెలీవు. తెలిసినా వ్యవస్థ ఫ్రేములో బిగుసుకొని మాత్రమే బతకాల్సిన – బతగ్గల గంగాధరాలు ఏం చేయలేరు. చేయడానికి ప్రయత్నించినట్టు యే మాత్రం వాసన వచ్చినా పిలక కత్తిరించే యంత్రాంగం వుండనే వుంది.
ఆ యంత్రాంగానికొక రీతి వుంటుంది. రివాజు వుంటుంది. సంప్రదాయం వుంటుంది. ఆచారముంటుంది. హైరార్కీ వుంటుంది. క్రమశిక్షణ వుంటుంది. విశ్వాసం వుంటుంది. విధేయత వుంటుంది (పై పెచ్చు దానికి శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ నూకాంబికాదేవి అనుగ్రహం కూడా తోడుంటుంది.) అంతిమంగా దానికొక పిలాసఫీ వుంటుంది. వాటన్నిటినీ ‘ఎక్సీడ్’ చేసి జీవితం గురించి ఆలోచించడం గంగాధరం చేసిన నేరం.
జీతాలు తీసుకొని పోలీసు వారి అభియోగాల్ని అనుసరించి వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాల ప్రకారం కేసులు విచారించి ముందుగానే రచించి యిచ్చిన స్క్రీన్ ప్లే ప్రకారం పరిష్కారాలు చెబుతూ వొక వుద్యోగిగా తన పరిమితులు గుర్తెరిగి న్యాయాధికారిగా పాలకులు నిర్దేశించిన విద్యుక్తధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ సుఖంగా వుండక పరిధులు దాటి ప్రమేయాలు మీరి జీవితంలోకి తొంగి చూసినందుకు వొక వేళ కుట్ర కేసంటూ పెడితే మున్సఫ్ మాజిస్ట్రేట్ గంగాధరం మీద పెట్టాలని సెషన్స్ జడ్జి అభిప్రాయం.

‘ప్రజాజీవితం పోలీసువారి చేతుల్లో సుఖంగా, శాంతంగా, చల్లగా ఉందని, భూమి ఒకవేళ బల్లపరుపుగా ఉన్నా కూడా పోలీసువారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పిండిలా నలిపి, గుండ్రంగా చేయగలరనీ …’ సెషన్స్ జడ్జి అనుభవ పూర్వకంగా యేర్పరచుకొన్న నమ్మకం కూడా.

ఆ నమ్మకం చాలా బలమైందనీ తిరుగులేనిదనీ అండర్ కవర్ కాప్ ల్ని సూపర్ కాప్ ల్ని సృష్టిస్తోన్న పూరీ జగన్నాథ్ లు శీనూ వైట్లాలు త్రివిక్రం శ్రీనివాస్ లూ … నిర్ధారిస్తున్నారు. దొరతనం వారు ఆచరించి చూపిస్తున్నారు. పోలీసుల శక్తి సామర్ధ్యాల ముందు న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం పౌర హక్కులూ అన్నీ బలాదూరేనని తొడగొట్టి మరీ హెచ్చరిస్తున్నారు. కథలో ఆ హెచ్చరికని న్యాయాధిపతి నోట పలికించడమే గొప్ప ఐరనీ. మాట వుచ్చరించే వారి స్థాయిని బట్టీ విలువల్ని తొడుక్కొంటుంది.
కేసుల్ని దాఖలు చేయడానికి పోలీసువారు ఉపయోగించిన భాష న్యాయ పరిభాషా పాలక వర్గానికే ప్రత్యేకమైనవి. భాషకి వర్గ స్వభావం వుంటుంది. ఆయా వర్గాలకే పరిమితమైన విలక్షణమైన జార్గాన్ వుంటుంది. అత్యాధునిక యుగంలో సమస్త అవలక్షణాలతో రాచరిక వ్యవస్థ యింకా అమలౌతున్న రీతిని తెలియజెప్పడానికి పతంజలి ఆయా సందర్భాల్లో భాషని కూడా గొప్ప సాధనంగా స్వీకరించాడు.

పోలీసురాజ్యంలో న్యాయవ్యవస్థలోని వైకల్యాన్నీ బలహీనతనీ డొల్లతనాన్నీ బహిరంగ పరచడమే కథలో ప్రధానాంశమైనప్పటికీ మానవ ప్రవృత్తిలోని నైచ్యాన్ని ఆనుషంగికంగా విమర్శించే పని కూడా రచయిత వొక పూనికతో చేయడం గమనించాల్సిన విషయం.

పెట్టుబడుల విష పుత్రికలూ పాలకుల పెంపుడు జంతువులూ అయిన సువార్త దుర్వార్త కల్పన కంగాళీ లాంటి గబ్బు పట్టి పోయిన నేలబారు పత్రికల చౌకబారు జర్నలిస్టుల అనైతిక వర్తన గురించీ, స్ట్రింగర్లకీ కాంట్రిబ్యూటర్లకీ జీతాలైనా సరిగ్గా యివ్వని దగాకోరు పత్రికల యాజమాన్యాల దోపిడీ గురించీ, జలగల్లా డబ్బులు పీల్చి పార్టీలని దమ్ములగొండుల్లా పీక్కుతినే ప్లీడర్ల దందాల గురించీ, కండ బలంతోనో మంద బలంతోనో తమ మనోభావాల్ని మందిమీద రుద్దే అరాచక మూక క్షుద్ర రాజకీయాల గురించి కథలో పతంజలి చేసిన పరిశీలనలు ఆ వ్యవస్థల మీద అసహ్యం కలిగేలా చేస్తాయి. అయితే వస్త్వైక్యత దెబ్బ తినకుండా వాటిని కథలో యిమడ్చడంలో రచయిత ప్రతిభ కనపడుతుంది.

రాజుగారి బుల్లి గడ్డమ్మీదో పొడవాటి ముక్కు మీదో పజ్యాలు చెప్పుకొని అవార్డులూ సత్కారాలూ పొందకుండా గడ్డం కింద బొల్లి గురించో ముక్కుమీది మచ్చ గురించో యిలా కతలు రాసినందుకు పిలక పుచ్చుకొని కోర్టుకీడ్చి కుట్రకేసంటూ పెడితే రచయిత మీద పెట్టాలి. రచయితలు వీలయితే రెండు రెళ్ళు నాలుగు అంటూ యెక్కాల పుస్తకం రాసుకోవచ్చు. మహా అయితే అదొక గుణకారం అని నిర్వచించవచ్చు. కానీ అది కూడిక కూడా అని విప్పి చెప్పడం కన్నా మించిన రాజద్రోహం లేదు. జీవితంలోకి రాజకీయ విశ్వాసాల్లోకీ తొంగిచూసే తనది కాని బాధ్యత నెత్తికేసుకోవడమే రచయిత చేసిన నేరం అని పాఠకుడిగా నా నమ్మకం. రచయిత బోనులోనూ పాఠకుడు తీర్పరి స్థానంలోనూ వున్నప్పుడు పాఠకుడి జ్ఞానానికీ విశ్వాసానికీ యెక్కువ విలువుంటుంది గదా!
కమ్యూనిస్టు ప్రపంచంలో దేశాలకు సరిహద్దులుండవు; యుద్ధాలుండవు అదే కమ్యూనిజం అంతిమ ఫలితం అని చెప్పుకుంటాం. మరి రాజ్యం యేమౌతుంది – ఎటువంటి ఆధిపత్యాలు లేని రాజ్యాధికారం యెలా వుంటుంది – రాజ్యం అభావమయ్యే స్థితి సంభవిస్తుందా – సంభవిస్తే అది యెలా వుంటుంది?? పిలక తిరుగుడు కథ వొకటికి పదిసార్లు చదివినప్పుడల్లా యీ ప్రశ్నలు పదే పదే తొలుస్తుంటాయి. మానవీయ గుణాలు దయ, కరుణ, ప్రేమ, సమత్వ భావన లోపించిన రాజ్యమూ రాజ్యాధికారాలూ అవసరం లేదనీ మన తోటి వాళ్ళమీద మనకు మమకారం లేనప్పుడు భూమి బల్లపరుపుగానే వుంటుందనే గంగాధరం ముఖత: రచయిత బెంగటిల్లాడు. పరస్పర వైరుధ్యాలు లేకుండా మన సిద్ధాంతాలూ ఆచరణా వాదాలూ విలువలూ జ్ఞానం సత్యం సజావుగా సూటిగా యేకాత్మకంగా సాగినప్పుడు భూమి గుండ్రంగానే వుంటుంది. సమస్త ప్రజానీకానికీ సుఖంగా నివాసయోగ్యంగా వుంటుంది. ఆనంద ధామంగా వుంటుంది. జీవితం సవ్యంగా వుంటుంది. వికాసోన్ముఖంగానూ వుంటుంది. కథ ద్వారా పతంజలి పాఠకులతో పంచుకోదలచిన చూపు అదే – ఆశించిన ప్రయోజనం అదే.

*

మంచి అభిరుచిని మనమే సృష్టించాలి!

 

-మోహన కృష్ణ  ఇంద్రగంటి 

~

mohanakrishnaకథ-2014ని ఆవిష్కరించుకుంటున్న ఈ సభలో  ఇప్పటివరకూ రకరకాల నేపధ్యాలు, ఆ నేపధ్యాలకీ సాహిత్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించి చాలా మంది మాట్లాడారు. ఉధ్యమ నేపధ్యం గురించి సంధ్య గారు మాట్లాడారు. తర్వాత నాటకాలు, థియేటర్ గురించి బిక్షు గారు, పబ్లిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనుంచి మన రాయుడుగారు మాట్లాడారు. అయితే ఈ నేపధ్యాలన్నింటికంటే కంటే కూడా నా దృష్టిలో అతి తక్కువ సాహిత్యంతో సంబంధం వున్న రంగం గురించి నేను మాట్లాడబోతున్నాను, అది సినిమా రంగం.

ఇప్పుడు నా దృష్టిలో సినిమాకీ సాహిత్యానికీ అతి తక్కువ లింక్ ఉంది అంటే సంబంధం వుంది, అది ఎప్పుడో తెగిపోయింది, అది ఎందుకు తెగింది అనేది చాలా ఆసక్తికరమైన విషయం, ఎందుకలా జరిగింది అనేది మనం కాస్త ఆలోచించాల్సిన విషయం, చర్చించాల్సిన విషయం అంటే అలా చర్చించాలని మనకు ఆసక్తి ఉంటే! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేను కొత్తలో టొరంటో లో చదువుకొని ఫిల్మ్ స్కూల్ లో చదువుకొని, రకరకాల ఉత్సాహాలూ, ఆదర్శాలూ, మంచి మంచి సినిమాలు తియ్యాలని, కొత్త రకమైన సినిమాలు తియ్యాలని మంచి మంచి కధలని ఆడాప్ట్ చెయ్యాలి సాహిత్యం నుంచి అనే ఆశలతో వచ్చిన నాకు విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యేవి, ఇలా నేను ఎం.ఏ లిటరేచర్ చేశానండీ, ఎం.ఫిల్ చదివానండీ , ఎం.ఎఫ్.ఏ ఫిల్మ్ మేకింగ్ లో చేశానండీ అని చెప్తే, చాలా మంది నాతో ‘అదేంటండీ ఇంత చదువుకొని మీరు సినిమాల్లోకి ఎందుకొచ్చారు?’ అని అడిగేవారు. ఆ ప్రశ్నకు నాకు చాలా నవ్వు వచ్చేది.

ఏ ఎం.బి.ఏ చదువుకుంటేనో, ఐ.ఐ.టి చదువుకుంటేనో లేకపోతే ఐ.ఐ.టి చదువుకున్నవాళ్లు ఇంత చదువుకొని ఇంజనీర్లు ఎందుకవుతున్నారండీ, సైంటిస్ట్ ఎందుకవుతున్నారండీ అని బహుశా వారు అడగరేమో ! కానీ ‘చదువుకొని సినిమాల్లోకి ఎందుకొచ్చారు?’ అని చాలాకాలంగా ఒక ప్రశ్న ఉండేది, చాలా కాలం నుంచి వస్తున్న ప్రశ్న అది. నేను కూడా ఆ ప్రశ్న ను ఎదుర్కొన్నాను కొంతకాలం పాటు. ఇంకోటి ఏమిటంటే ‘ మా అబ్బాయి ఎందులోనూ పనికి రావట్లేదండీ, కొంచం మీ దగ్గర పెట్టుకోండి అసిస్టెంట్ డైరెక్టర్ కింద’ అంటే సినిమాల పట్ల జనరల్ ఇంప్రెషన్ ఏం ఏర్పడిందంటే ‘జనరల్ గా ఎందుకూ పనిరాని వాళ్ళు సినిమాల్లోకి రావచ్చు, చదువక్కర్లేదు సినిమాలకి’ అని ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయింది.

ఈ సినిమా తాలూకు సృజనాత్మకత ఏదైతే ఉందో, సినిమాల్లో ఏదైతే క్రియేటివిటీ ఉందో దానికి చదువు అక్కర్లేదు, ఒకరకమైన ఆర్టిస్టిక్ మైండ్ ఉంటే సరిపోతుంది’ ఇలాంటి ఒక దురభిప్రాయంతో మనం చాలా కాలంగా సినిమా రంగంలో చాలామంది అంటే, పాపం ఇక్కడికి వచ్చినవాళ్లు, చదువుకున్నవాళ్లు వెనక్కి వెళ్ళి పోవడం, చదువురాని వాళ్ళు ఏమీ కుదరకపోతే ఈ రంగంలోకి రావచ్చు అనే ఒక దురభిప్రాయం రావడం కూడా జరిగింది నా దృష్టిలో. అయితే ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే డిగ్రీలకీ సృజనాత్మకతకీ, అంతర్గత సంస్కారానికీ సంబంధం లేదు. మీకొక ఎం.బి.ఏ ఉండడం వల్ల ఎం.ఏ ఉండడం వల్ల లేదా ఐ.ఐ.టి లో ఏదో డిగ్రీ ఉండడం వల్ల అద్భుతమైన సినిమాలు మీరు తీస్తారని గ్యారంటీ లేదు, అలా అని చెప్పి ఏమీ చదువుకోని వాళ్ళు బాగా తీయలేరు అని కూడా లేదు. ఈ పోజిబిలిటీలో నుంచి ‘చదువు అక్కర్లేదు’  అనే ఒక దురభిప్రాయం పుట్టింది. అక్కడ చదువు అంటే ఏమీ చదువు లేకుండా, డిగ్రీల్లేకుండా సాంస్కృతిక విద్య ఉంటే మీరు మంచి సినిమాలు తీయొచ్చు.

అన్నీ చదువుకొని పెద్ద పెద్ద విదేశాలకి వెళ్ళి చదువుకున్న వాళ్ళకి కూడా సాంస్కృతిక విద్య లేకపోవచ్చు, సాహిత్యం గురించి కానీ ఇతర కళల గురించి కానీ ఒక అవగాహన లేకపోవడం, ఆ కళలన్నింటినీ ఎలాగ రంగరిస్తే వాటిలో నుంచి సినిమా అనేది పుడుతుంది అనే వాటిపట్ల ఒక సాంస్కృతికమైన, సామాజికమైన దృష్టిలో నుంచి అర్ధం చేసుకొనే సామర్ధ్యం లేనప్పుడు మంచి సినిమా పుట్టదు. దానికీ పెద్ద పెద్ద డిగ్రీలు చదవడానికీ సంబంధం లేదు. కావున సమస్య ప్రాధమికంగా ఏమిటంటే, వృత్తి విద్యలు చదవడం ఆ రకమైన విద్యలు చదవడం కాదు సాంస్కృతిక విద్య కొరవడడం సమాజంలో.

9cf0d62d1f_rounded

ముఖ్యంగా నా దృష్టిలో గత ఇరవై ముప్పై యేళ్ళగా సాహిత్యానికీ సినిమాకీ వున్న లింక్ కట్ అయిపోవడం వలన మనకి ఈ విధమైన ఒక భావ దారిద్ర్యం బాగా పెరిగిందని చెప్పొచ్చు. కేవలం సాహిత్యానికీ సినిమాకే కాదు అసలు జీవితానికీ సాహిత్యానికీ కూడా లింక్ కూడా తగ్గుతూ వచ్చింది. దానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయ్, నా దృష్టిలో ఏ సమాజంలో అయితే కళల స్థాయిని బట్టి ఆ సమాజం యొక్క సంస్కృతీ స్థాయిని మనం గుర్తించవచ్చు, కొలమానం అని చెప్పొచ్చు . ఒక సాహితీ వాతావరణం తో పాటూ ఇతర కళలు సంగీతం, చిత్రకళ, నృత్యం, జానపద కళలు వీటన్నిటికీ ఒక ఆర్ధిక రాజకీయ సామాజిక పరిస్థితులకీ మధ్య ఉండే ఇంటరాక్షన్ ని ఎదైతే అంటామో, ఈ మధనం లో నుంచి ఒక సాంస్కృతిక వాతావరణం పుడుతుంది. ఆ వాతావరణం లోని చైతన్యమూ, ఆ వాతావరణం సృష్టించే శక్తి నుంచి కళలు తిరిగి తమని తాము పరిపుష్టం చేసుకోగలుగుతాయి. ఇదొక సైకిల్ లాగా ఉంటుంది.

అయితే ఎప్పుడైతే మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రస్తుతం రెండు రాష్ట్రాలున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో , నా దృష్టిలో ఏమైందంటే దాదాపు ఎనభైల్లో నుంచి హ్యూమానిటీస్  ని సోషల్ సైన్సెస్ ని మనం స్కూల్స్ లోనూ కాలేజెస్ లోనూ చంపేశాం, అంటే సాహిత్యం అనవసరం, కళలు అనవసరం, చరిత్ర అనవసరం, రాజనీతి శాస్త్రం అనవసరం, తర్వాత సోషియాలజీ , సామాజిక శాస్త్రం మనం చదవక్కర్లేదు. యాంత్రోపాలజీ అనవసరం, ఇవన్నీ అనవసరం, ఎందుకూ పనికిరానివాళ్లు చేసే సబ్జెక్ట్స్ ఇవి. ఏవైతే పాశ్చాత్య దేశాల్లోని యూనివెర్శిటీల్లో చాలా బాగా ఆదరిస్తారో, వాటిని మన ప్రభుత్వాలు అవి అనవసరం అని భావించి అవతలపడేసి, కేవలము ఉద్యోగాలేవొస్తాయ్, కంప్యూటర్ సైన్సెస్ కానీ లేకపోతే  ఎం.బి.ఏ లు కానీ లేకపోతే సి.ఏ కానీ చార్టెడ్ అకౌంటెన్సీ అని ఉండేది మా చిన్నప్పుడు, వృత్తి – మీకు ఇమ్మీడియెట్ గా ఉద్యోగం వచ్చేదే ముఖ్యం, మిగతావన్నీ అనవసరం, మిగతావన్నీ టైమ్ పాస్ కాలక్షేపం. కాబట్టి మీరు ఏం చేసినా కూడా నేర్చుకోవచ్చండీ, కధలు రాయాలంటే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, పెయింటింగ్ కావాలంటే మీరు టైమ్ పాస్ కి వేసుకోండి, కావాలంటే నాటకాలు ఆడుకోండి, ఈ విధమైన ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేటస్, (సెకండరీ స్టేజ్ అని కూడా అనకూడదు) ఇవ్వడం వలన ఏమైందంటే ఒకరకమైన సామాజిక అవగాహన, ఇప్పుడు సాహిత్యమనేది నా దృష్టిలో వ్యక్తులకీ సమాజానికీ మధ్య వారధి. సాహిత్యమే కాదు, అన్నీ కళాలూ!

మన ప్రపంచాన్ని మనం అర్ధం చేసుకోవడానికి ఈ కళాలన్నీ ఉపయోగపడతాయ్. ఎప్పుడైతే ఆ లింక్ తెగిపోయిందో, ఎప్పుడైతే ఆ విలువలు మెటీరియలిజం, ఇండివిడ్యువలిజం ద్వారా కబళించబడ్డాయో, అప్పుడు జీవితానికీ సాహిత్యానికీ మధ్య ఒక రప్చర్ వచ్చేసింది. అది సినిమా రంగానికి కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. విపరీతంగా అయింది. ఇలా అవడంవలన ఏంటంటే, మన సినిమా రంగం పూర్తిగా వ్యాపారాత్మకమైన సినిమా వైపు వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే సినిమా అంటే కేవలం ఒక పక్కా వ్యాపారం, ‘ఏది అతి త్వరగా, అతి ఎక్కువగా, అతి తక్కువ శ్రమతో,  అత్యంత ఎక్కువ డబ్బులు సంపాదించగలదో అది సినిమా’  అని ఒక అభిప్రాయం ఏర్పడింది. ‘ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నామండీ’ అని ఒక ఆర్గ్యుమెంట్ ఉందండీ అది తప్పు నా దృష్టిలో. ఎందుకంటే ప్రేక్షకుడికి ఒక అజెండా ఉండదు, వాళ్ళు చూపించిందే చూస్తారు. పదే పదే చూపించిందే వాళ్ళ అభిరుచి కింద మారుతుంది. కాబట్టి ఈ అభిరుచిని సృష్టించేది కళాకారులు. ఆ అభిరుచిని సృష్టించే కళాకారుల అంతర్గత సంస్కారం మళ్ళీ ఈ సమాజం యొక్క  సాంస్కృతిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇట్స్ లైక్ ఎ సైకిల్ ! కొంతమంది అనుకుంటారు, సామాజిక స్పృహతో సినిమా తీయడమంటే , ఉపన్యాసాలండీ ! లేకపోతే ఆర్ట్ సినిమా అని మనకొక దురభిప్రాయం. అది కూడా కాదు.

సామాజిక స్పృహ అంటే ప్రతి సినిమాలోనూ  మీరు ఏదో సోషల్ ఇష్యూస్ తీసుకొని దాని గురించి ఉపన్యాసాలు ఊగదప్పడ ఉపన్యాసాలు దంచమని కాదు. ఎందుకంటే ఉపన్యాసాలకి సినిమా వేదిక కాదు, అది అందరికీ తెలుసు. సినిమా అనేది ఒక కళా రూపం. నవలకీ వ్యాసానికీ ఎంత తేడా ఉందో అలాంటి తేడానే సినిమాకీనూ pamphleteer కీ!

అయితే ఏంటంటే సినిమాలు తీసే వ్యక్తి తన  యొక్క చుట్టూ పక్కల ఉన్న సాంస్కృతిక రాజకీయ ఆర్ధిక వాతావరణాన్ని జీర్ణించుకొని తన సృజనాత్మకతలోనుంచి డిస్టిల్ చేసి తన కళా రూపం ద్వారా వ్యక్తపరచడం అనేది కళాకారులు చేసే పని. అది పెయింటింగ్ ద్వారా అవొచ్చు. మరి సినిమా అవొచ్చు, అది నాటకం కావొచ్చు, పాట రాయడం కావొచ్చు, కవిత రాయడం కావొచ్చు!

ఈ విధమైన ప్రక్రియ, తను ఆకళింపు చేసుకున్నదంతా తను ఎంచుకున్న కళారూపం ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తాడు కళాకారుడు. దానికి సాంస్కృతిక వాతావరణం వైబ్రంట్ గా ఉండాలి. అలా వైబ్రంట్ గా లేనప్పుడు, ఈ అన్నీ రంగాల మధ్యలో ఒక విధమైన  వైబ్రంట్ ఇంటరాక్షన్ లేనప్పుడు ఆరోగ్యకరమైన అర్ధవంతమైన కళ పుట్టే అవకాశం చాలా తక్కువుంటుంది నా దృష్టిలో. సినిమాకీ సాహిత్యానికీ మధ్యలో అదీ జరిగింది. ఆ రప్చర్ రావడం వలన వైబ్రంట్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ లో నుంచి సినిమాలు పుట్టే అవకాశం లేకుండా పోయింది.

బి. ఎన్. రెడ్డి గారు

బి. ఎన్. రెడ్డి గారు

సాహిత్యానికీ జీవితానికీ ఎప్పుడైతే సంబంధం తెగిపోయిందో, ఎప్పుడైతే తెలివిజన్ వచ్చి చదవడాన్ని చంపేసిందో, ఎప్పుడైతే కమర్షియలైజ్డ్ తెలివిజన్ కానీ ఎప్పుడైతే కమర్షియలైజ్డ్ ఫిల్మ్ మేకింగ్ వచ్చిందో ఆ లింక్ తెగిపోయింది. ఒకప్పుడు బి.ఎన్ రెడ్డిగారు, కె.వి. రెడ్డిగారు కాలంలో గొప్ప గొప్ప రచయితలు సినిమా రంగం లో పని చేయడం జరిగింది. పద్మరాజుగారు గానీ కృష్ణ శాస్త్రిగారు గానీ శ్రీశ్రీ  గారు గానీ లేకపోతే డి.వి. నరసరాజు గారు గానీ సినిమా రంగం లో పనిచేయడం జరిగింది. వాళ్ళు సాహిత్యాన్ని చదువుకున్నారు, సాహిత్యం నుంచి కధల్ని ఆడాప్ట్ చేశారు.

చాలా మందికి తెలీదు, కె.వి.రెడ్డి గారి ‘పెద్దమనుషులు’ హెన్రీ హుడ్సన్ రాసిన ‘పిల్లర్స్ ఆఫ్ సొసైటి ‘ అనే నాటకం నుంచి స్పూర్తి  పొంది రాసిన స్క్రిప్ట్ అది అని. అలాగే ‘ మల్లీశ్వరి’ బుచ్చిబాబు గారి ‘ రాయలవారి కరుణకృత్యం’  స్పూర్తి తో తీశారని చెప్తారు. ‘ బంగారుపాప ‘ అని బి.ఎన్ రెడ్డిగారిది ‘శైలస్ మార్నర్’ అని ఒక ఆంగ్ల నవల జార్జ్ ఎలియట్ రాసినది. ఆఫ్ కోర్స్ ‘కన్యాశుల్కం’ సినిమాగా తీశారు. ఎంతోమంది గొప్ప రచయితలు, రచయిత్రులు ఉన్న మన తెలుగు సాహిత్యం నుంచి ఎప్పుడూ ఎందుకు మనం అడాప్ట్ చేయట్లేదు అనేది నాకు ఎప్పుడూ  చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.

నా దృష్టిలో బెంగాల్ లో ఠాగోర్ ఎంత పెద్ద రచయితో తెలుగులో చలం కూడా అంత పెద్ద రచయిత. అలాంటి రచయిత కధల్లో నుంచి ఒక్క కధని కూడా మనం అడాప్ట్ చేయలేదు ఇప్పటి వరకూ. ‘గ్రహణం’ నవలని 2004 లో ఫస్ట్ టైమ్ నేను రైట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చలం గారి కూతురు సౌరీస్ గారు ఆశ్చర్యపోయారు, ‘ ఎందుకు మీరు ‘ అని! అంటే ఎప్పుడూ ఎవరూ అసలు ఆ ఇంటరెస్ట్ కూడా చూపించట్లేదు. పోనీ అలా అని అవి ఏమైనా ఆర్టీ స్టోరీసా ! అంటే కాదు. చాలా డ్రమాటిక్ గా వుంటాయి కధలు. కధలో చాలా నాటకీయత ఉంటుంది. సినిమాలో చాలా ఒదిగిపోయే కధలు.

చలం గారే కాదు మీరు ఏ రచయితనైనా తీసుకోండి, కొడవటిగంటి కుటుంబరావుగారు తీసుకోండి, బుచ్చిబాబు గారి కధలు తీసుకోండి, తిలక్ గారి కధలు తీసుకోండి, రావిశాస్త్రిగారి కధలు తీసుకోండి, లేకపోతే కాళీపట్నం రామారావుగారి కధలు తీసుకోండి, శ్రీపాద  సుబ్రహ్మణ్యశాస్త్రి గారివి తీసుకోండి. సమకాలీన రచయితల్లో గోపిని కరుణాకర్, మహమ్మద్ ఖాదిర్ బాబు, గోగు శ్యామల గారు ఇలా చాలా మంది, అన్నీ పేర్లు నేను చెప్పలేను కానీ రకరకాల రచయితల యొక్క కధలని మనం అడాప్ట్ చేసుకొని వాటిని సినిమా కింద తీయగలిగే అవకాశం ఉంది. లేకపోతే ఆ రచయితలకి సినిమా రంగంతో ఒక విధమైన లింక్ ఏర్పడితే అసలు ఆలోచనా ధోరణి మారే అవకాశం ఎక్కువ ఉంది. డెబ్భైల్లో ఎనభైల్లో పాపులర్ సాహిత్యం నుంచే మన సినిమాలు వచ్చాయి యద్దనపూడి సులోచనా రాణిగారు, మాదిరెడ్డి సులోచన గారు, కోడూరు కౌసల్యాదేవి గారు, ఆర్.సంధ్యాదేవి గారు , యండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు ఇలా వీళ్ళందరి నవలలు సినిమా కింద తీసినప్పుడు పెద్ద సక్సెస్ ఫుల్ అయ్యాయి కమర్షియల్ గా.

యండమూరి

యండమూరి

ఆ తర్వాత ఎనభైల్లో స్కూళ్ళలో, నేను చదువుకున్న టైమ్ లో తెలుగు చచ్చిపోయింది ఫస్ట్. స్కూళ్ళలో తెలుగు చదవడం పొయ్యి ఇంగ్లీష్ మీడియం పిచ్చి పట్టుకుంది. తర్వాత గ్రాడ్యువల్ గా తెలివిజన్ వచ్చింది. ఎప్పుడైతే తెలివిజన్ వచ్చి సీరియళ్ళు ఇవీ పెరిగాయో చదవడం అనే అలవాటు పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ డిజిటల్ రెవొల్యూషన్ అనండీ, ఐ.టీ. అనండీ, తర్వాత వీటి వలన వీడియో గేములు, ఫేసుబుక్కులూ, ట్విట్టర్లూ ఎక్కువైపోయి మనకి ఏకాంతం లో పుస్తకం చదవడం, ఒక పెయింటింగ్ ని ఆస్వాదించడం లేదా ఒక నాటకాన్ని వెళ్ళి చూడడమో, నృత్య ప్రదర్శనని చూడడమూ, ఇలాంటి అవకాశాలన్నీ పోయాయి, అసలు తగ్గిపోయాయి సమాజంలో ! తగ్గిపోయి సినిమా తెలివిజనూ పూర్తిగా ఆక్యుపై చేసేశాయ్. అయితే ఆ ఆక్యుపై చేసినప్పుడు పోనీ సాహిత్యం నుంచి ఏమైనా సినిమాలు తీస్తున్నారా, సాహిత్యం నుంచి కధలు తీసుకుంటున్నారా, లేకపోతే సాహితీ విలువలున్న రచన మనకేమన్నా కనబడుతూ ఉందా సినిమాల్లో అనేది చూస్తే మనకేం లేదు.

ఒక విచిత్రం ఏమిటంటే  సాహిత్యం అనేది ఎంత కనబడకుండా ఉంటే సినిమాకి అంత మంచిది అన్న అభిప్రాయం కూడా ఏర్పడిన వాళ్ళు, చెప్పిన వాళ్ళూ కొంతమంది ఉన్నారు. ‘సాహితీ విలువలు అనవసరమండీ సినిమా కధకి’, ‘సినిమా కధ వేరు. అది వేరే జంతువు దాన్ని నిర్మించే విధానం వేరు’ ఇలాంటి కొన్ని చాలా అభిప్రాయాలు ఉన్నాయ్. సినిమా కధని నిర్మించే విధానం వేరన్నదానిలో కొంత వరకూ నిజముంది కానీ దానిని సాహిత్యం నుంచి దూరంగా నెట్టేయాల్సిన అవసరం ఉందనేది మాత్రం చాలా చాలా తప్పు అభిప్రాయం. దానివల్ల ఏమవుతోందంటే సాహితీ విలువలుండి కొంచం మంచిగా అందంగా ఒక వాక్యాన్ని రాయడానికి గానీ లేకపోతే ఒక పాటను రాయడానికి గానీ ఒక మంచి మెలోడియస్ పాటను కట్టడానికి గానీ ఇవన్నీ పెద్ద సమస్యలైపోయాయి ఇప్పుడు మనకు.

ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ గా వైబుల్ కాదు అనే ఒక అభిప్రాయం కూడా ప్రబలంగా ఉంది. దాని వలన మనకి ఆ విధమైన లింక్ తెగిపోవడం వలన, సాహితీ విలువలు అనేది ఒక నెగెటివ్ క్వాలిటీ అయిపోవడం వలన కూడా మనకి ఉన్నతమైన స్థాయిలో ఉండే సినిమాలు రావట్లేదు. ఉన్నతమైన స్థాయి అంటే చాలా మందికి ఇంకొక దురభిప్రాయం కూడా ఉంది, మనం ఏ జోనర్ తీస్తున్నాము అనేదానితో సంబంధం లేదు మనం హారర్ తీయొచ్చు, పోలిటికల్ థ్రిల్లర్స్, రొమాంటిక్ థ్రిల్లర్స్ తీయొచ్చు, పక్కా ఫార్శికల్ కామెడీ చేయొచ్చు, లేకపోతే మర్డర్ మిస్టెరీస్ . ఏదైనా మీరు తీసే సినిమా ఏ రకం అనేదానికి సంబంధం లేదు. ప్రతీదానిలోనూ, ఆగతా క్రిష్టీ మర్డర్ మిస్టేరీస్ రాసింది కానీ గొప్ప సాహితీ విలువలు దానిలో ఉంటాయి. షెర్లాక్ హోమ్స్ రాసిన ‘ఆర్థర్ కొనన్ డోయ్లే’ లో గొప్ప రచన ఉంటుంది. అలాగే పి.జి.ఉడ్ హౌస్ రాసిన హాస్యం లో గొప్ప రచన ఉంటుంది. సో, సాహిత్యానికీ జోనర్ కీ సంబంధం లేదు. అలాగే సినిమా ఏ జోనర్ లో మీరు తీసినా దాన్లో గొప్ప సాహితీ విలువలు చూపించగలిగే ఎబిలిటీ మనకుండాలి.

ఇప్పుడు మీరు తమిళం లో గానీ మళయాళం లో గానీ కన్నడలో కొంతవరకూ గానీ లేకపోతే హిందీ లో గానీ ఇంకా సాహిత్యం నుంచీ నవలల నుంచీ కధలు తీసుకొని వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. మనకు అది లేదు, ఎందుకు లేదు? ఎందుకంటే సినిమాలు తీసే మెజారిటీ వాళ్ళకి సాహిత్యం అసలు తెలీదు, సంబంధం కూడా లేదు, గొప్ప రచయితలు ఎవరని వాళ్ళని అడగండి వాళ్ళకి తెలీదు, అస్సలు. ఎవరైనా సమకాలీన సాహిత్యం , గొప్ప పుస్తకాలూ గానీ క్లాసికల్ లిటరేచర్ గానీ చదువుతారా అసలు! అస్సలు లేరని మనం అనలేమ్, చాలా కొద్ది మంది లిటరల్ గా నా ఎక్స్పీరియన్స్ లో అయితే చాలా కొద్ది మంది. వేరే సినిమాలు చూసి మనం ఆ ఐడియాలను ఎలా తీసుకోవాలి అని చూస్తున్నామే తప్ప, అసలు సాహిత్యం నుంచి ఏవైనా మంచి కధలు తీసుకోవచ్చా అని చూడట్లేదు. అది ట్రెడిషినల్ లిటరేచర్ అవ్వొచ్చు  లేదా సమకాలీన సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం కావొచ్చు, ఆల్టర్ నేటివ్ సాహిత్యం కావొచ్చు అసలు ఆ పోకడలు లేకపోవడం వల్ల ఇప్పుడు మనకు ఆ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను.

ఒకప్పుడు అసలు ఐజస్టైన్ అనే గొప్ప ఫిల్మ్ డైరెక్టర్ రాశాడు , అసలు సినిమాలోకి వచ్చిన కొన్ని టెక్నిక్స్ సాహిత్యం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, గ్రిఫిక్ అనే అతను పార్లెల్ కటింగ్ అనేది ఇన్వెంట్ చేశాడు, అంటే ఒక సన్నివేశం జరుగుతుండగా వేరే ఒక సన్నివేశాన్ని దానితోపాటూ చూపించడం, మన సినిమాల్లో మనకు ఇది బాగా అలవాటైపోయింది. ఇప్పుడు హీరోయిన్ ని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్లిపోతూ ఉంటారు, అక్కడ హీరో కి ఆ విషయం తెలిసి బయల్దేరుతాడు, ఈ అమ్మాయిని రక్షించడానికి. సో, ఇక్కడ ఇది కొంత అది కొంత చూపించడం ద్వారా కధ లో టెంపో ని ప్రేక్షకుల్లో ఆసక్తిని టెన్షన్ నీ పెంచే టెక్నిక్ పార్లల్ కటింగ్ అంటారు. అది ఒరిజినల్ గా చార్ల్స్ డికెన్స్ నుంచీ బహుశా గ్రిఫిక్ నేర్చుకున్నాడేమో అని ఐజస్టైన్ ప్రతిపాదించాడు ఒక వ్యాసం లో. ఎందుకంటే డికెన్స్ రాసిన శైలిలో అది ఉంది, అతని నవలా రచనా పద్ధతిలో. దానికొక ఉదాహరణ కూడా ఇస్తాడు ఆ వ్యాసంలో , అది ‘ వంటింట్లో కెటిల్ లో నీళ్ళు మరుగుతూ ఉంటాయి, బయట ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. వేరేగదిలో జరిగే సంభాషణకీ అక్కడ కెటిల్ లో నీళ్ళు మరగడానికీ మధ్యలో ఇంటర్ కట్ చేస్తూ ఉంటాడు డికెన్స్. అదే సినిమా రంగంలో సినిమా ఆడాప్ట్ చేసుకుంది అని ఐజస్టైన్ అన్నాడు. సో, ఆ లింక్ ఎప్పటికీ ఉంటుంది.

ముఖ్యంగా సినిమా అన్ని కళల యొక్క సమాగమం. అంటే పెయింటింగ్, లిటరేచర్, ఫోటోగ్రఫీ మ్యూజిక్, డాన్స్, డ్రామా ఇవన్నీ కలిసి సినిమా తయారయ్యింది. అంటే కేవలం సాహిత్యమే కాదు వీటన్నింటిలో దేని నుంచి లింక్ తెగిపోయినా కూడా సినిమా పుష్టిగా ఉండే అవకాశం లేదు. అయితే సినిమాలో కూడా సాహిత్యం ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే  రచనల ద్వారా, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైలాగులు కానివ్వండి పాత్రల పరంగా కానివ్వండి. సాహిత్యంతో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యకరంగా ఉండాలి సినిమాకి. ఎప్పుడైతే అవి లేవో, గత ఇరవై యేళ్లుగా పూర్తిగా రప్చర్ అయిపోయి డామేజ్ అయిపోయిందని నా ఉద్ధేశ్యం.

మళ్ళీ దాన్ని ఫిల్మ్ మేకర్స్ ఏ విధంగా అయితే తమిళం లో గానీ మలయాళంలో గానీ ఫిల్మ్ మేకర్స్ పనిగట్టుకొని ఆ పని చేస్తున్నారో మళ్ళీ అలాంటి ఒక స్పూర్తి తో యువ దర్శకులు రచయితలూ ముందుకొచ్చి తెలుగులో పూనుకుంటే తప్ప ఆ గాప్ ని పూడ్చితే తప్ప మనకి అర్ధవంతమైన ఆరోగ్య వంతమైన సినిమాలు వస్తాయని నేను అనుకోవట్లేదు.

కాబట్టి సాహిత్యానికి ఇప్పుడు ప్రస్తుతం  ‘ఇమ్మీడియట్ నీడ్ ఆఫ్ ద హవర్ ‘ అంటాం కదా, సినిమా రంగంలో ఏమిటంటే సాహితీ విలువలున్న రచనలని మనం వృద్ధి చెందేలా చెయ్యాలి. సాహిత్యానికీ సినిమాకీ ఉన్న లింక్ ఎదైతే ఉందో అది తెగిపోయింది నా దృష్టిలో ఒక ఇరవై యేళ్ళుగా, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం వెంటనే ఉందని నేను భావిస్తున్నాను.

(తెనాలిలో  కథ-2014 ఆవిష్కరణ సభలో ప్రసంగం. ప్రసంగానికి లిఖిత రూపం: రేఖా జ్యోతి)

*

కంచికి వెళ్ళని కథలు…ఎప్పుడొస్తాయి?!

 

 చంద్ర కన్నెగంటి

 

chandraప్రపంచ కథలు చదివేవాళ్లకు తెలుగు కథలు చదివేప్పుడు రెండు విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి –  వస్తువులో కొత్తదనం అరుదనీ, దాదాపు అన్ని కథనరీతులూ కొన్ని మూసలకే పరిమితమనీ. ఇందుకు ఎక్కువ శాతం రచయితలూ, సంపాదకులూ, విమర్శకులూ, పాఠకులూ అలవాటు పడిపోయారు కూడా. పడటమే కాక అదే ధోరణి అవిచ్ఛిన్నంగా సాగడానికి దోహదపడుతున్నారు. అందుకు కారణాలు వెతకడమూ, వాటి వెనక ఆలోచనలు సరయినవేనా అని పరిశీలించడమూ ఇక్కడ నా ముఖ్యోద్దేశాలు.

ప్రాచీనకాలంనుంచీ ధర్మాన్నీ, నీతినీ బోధించే కథల వారసత్వం మనది. మరోవైపు బలమైన మౌఖిక సంప్రదాయం కూడా ఉంది. అందువల్ల ఆ కథలు బిగ్గరగా, స్పష్టంగా ఉంటాయి. సమాధానం వెతుక్కోవలసిన ప్రశ్నలూ తలెత్తనీయవు. సందేహాలకు తావునీయకుండా ఆ కథలోని ధర్మాన్నీ, నీతినీ చివరికి నొక్కి చెప్పేవి. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. కథ చదవగానే పాఠకుడు ‘అయితే ఏమిటి?’, ‘ఇందలి నీతి యేమి?’ అనే వెతుక్కుంటాడు. ‘రాకుమారిని పెళ్ళి చేసుకుని రాజ్యాన్ని అనేక యేళ్ళు సుభిక్షంగా పరిపాలించాడు ‘ వంటి కచ్చితమైన ముగింపులు లేని అస్పష్టతలు అంగీకరించలేడు.

రచయితలూ అదే ఒరవడిలో సాగుతున్నారు. రచయిత కర్తవ్యం సమాజాన్నీ, దేశాన్నీ ఉద్ధరించడమేనని ముందే నిర్ణయించబడింది. అభినందించవలసిన భావనే. అయితే ఆ భారాన్ని ఆనందంగా తలకూ, భుజాలకూ ఎత్తుకోవడంతోటే తన చుట్టుపక్కలవారి కన్నా తాను నైతికంగా, ధార్మికంగా, బౌద్ధికంగా ఒక మెట్టు పైన ఉన్న భావన కూడా రచయితలో బలపడుతుంది. తాను పూనుకోకపోతే లోకం సరయిన బాటలో నడవదన్న నిశ్చయానికి వచ్చేస్తాడు. పాఠకులంతా అయితే అమాయకుల్లానూ – వాళ్లకు దారి చూపించాలి – లేదంటే దుర్మార్గుల్లానూ – వాళ్లకు బుద్ధి చెప్పాలి –  కనిపిస్తారు. దానికోసమై రచయిత పలు అవతారాలు ఎత్తవలసివస్తుంది. ధర్మజ్ఞుడూ, నీతిబోధకుడూ, మతాధికారీ, న్యాయాధికారీ, వేదాంతీ, ఆర్థిక నిపుణుడూ, రాజకీయవేత్తా, సామాజిక శాస్త్రవేత్తా, మనోవైజ్ఞానికుడూ, సాంస్కృతికాధికారీ మొదలయిన వాళ్లు చేసే పనులూ, చూపించే పరిష్కారాలూ చేసేసి ఊరుకుంటాడు. ఆయా రంగాల్లో తన అర్హత ఏమిటన్నది ప్రశ్నించుకోడు. ఎంత నిజాయితీగా, నమ్మకంతో చేసినా తనకు అలివికాని పని నెత్తిన వేసుకున్నప్పుడు అది నిష్ప్రయోజనం.

సమాజాన్ని పీడించే సమస్యలు అనేకం. కథ అనే సుత్తి చేతిలోకి తీసుకున్నాక ఆ మేకుల కోసమే వెదుకులాట.  కొత్తవేమీ దొరకవు. వాటిని వెలుగులోకి తెచ్చి చర్చకు పెట్టడంతో ఆగిపోకుండా పరిష్కారాలూ సూచించాలంటే అందుకు క్షేత్రస్థాయిలో కృషి చేసే వాళ్ళూ, ఆయా శాస్త్రాల్లో నిపుణులూ అయి ఉండాలన్న గమనింపు ఉండదు. ఇవన్నీ తన ఆక్రోశాన్ని వెళ్లబోసుకుని తృప్తి పడడానికి తప్ప ఉపయోగపడవు. ఒక రకంగా తన అపరాధభావన కడిగేసుకుని, మనిషిగా తన బాధ్యత తీరిపోయిందనుకుని మరేదీ చేయవలసిన అవసరం లేదని నచ్చచెప్పుకున్నట్టు ఉంటుంది. ఇద్దరు తోటి ప్రయాణికులు ‘ఎంత దారుణమమ్మా!’ అంటే ‘లోకం పాడయిపోయందమ్మా!’ అని వాపోవడం కంటే ఇందులో పెద్ద తేడా ఏదీ ఉండదు.

పోనీ, ఆ కథలు విలువయిన, నేర్చుకోవలసిన జీవిత పాఠాలే చెపుతున్నాయనుకుందాం. కాల్పనిక సాహిత్యం చదవడం వల్ల మనుషుల్లో సానుభూతీ, ఎదుటివారి స్థితిగతులను అర్థం చేసుకునే స్థాయీ పెరుగుతాయనే పరిశోధనలు తేలుస్తున్నాయి. అయితే అది తాత్కాలికం కాదనీ, ఆ ఆలోచన క్రియారూపం దాలుస్తుందనీ చెప్పడానికి ఆధారాలు లేవు. అసలు ముందే ఎక్కువ మోతాదులో స్పందించేవారే పుస్తకాలు చదివి ఆనందిస్తారనే విషయాన్నీ కొట్టిపారేయలేం. కథలూ, పుస్తకాలూ మనల్ని ఉన్నతులుగా చేస్తాయనీ, ఉదాత్తంగా మారుస్తాయనీ గుడ్డిగా నమ్మడమే కానీ స్పష్టమైన ఆధారాలు చూపలేం.

అటు ధర్మ సంస్థాపనో, ఇటు సమసమాజమో తన రాతల ద్వారా సిద్ధిస్తుందనుకోవడం ఒక భ్రమ. ఎంతగా నమ్మినప్పటికీ, అదెంత సరి అయిన ఆలోచన అయినా, ఎంతగా అభిలషించినా అది నిజం కాదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి – ‘ఈ కథలూ పుస్తకాలూ చదవకపోతే మరోలా ప్రవర్తించి ఉండేవాడిని ‘, ‘నా నిర్ణయం వేరేలా ఉండేది ‘ అనుకున్న సందర్భాలు గుర్తున్నాయా? ‘నాలో ఇంత సహనమూ, సంయమనమూ, పరిణితీ, దయా, జాలీ, క్షమా, త్యాగబుద్ధీ పుస్తకాలు చదవకపోతే ఉండేవి కావు ‘ అని ఎప్పుడయినా అనుకున్నారా? వ్యక్తిగతంగా ఎంత ఎదిగారు అన్నది కాక సమాజం దృష్టిలో మెరుగయిన వ్యక్తిగా మారారనిపించిందా? సమాజ సేవ చేస్తున్న వాళ్లంతా పుస్తకాలు చదివి చేయడం లేదు. హిట్లర్ తెగ చదివేవాడనీ, అతని గ్రంథాలయంలో పదహారు వేల పై చిలుకు పుస్తకాలుండేయనీ తెలుస్తూంది. పాఠకుల సంగతి అటుంచి తమ రాతలు రచయితలనయినా మారుస్తున్నాయనిపించదు. అందుకు ఇంటర్నెట్ సాహితీవేదికలపై చర్చల ధోరణినే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. (కలిసొస్తే కింద కామెంట్లలోనూ ఆ ధోరణి కనిపించకపోదు.)

పోనీ, ఆ కథలు నిజంగానే పాఠకుల్లో మార్పు సాధిస్తాయనే అనుకుందాం. తొమ్మిది కోట్ల తెలుగువారిలో ఇవి చదివే వారి సంఖ్య కొన్ని వేలకు మించదు. ఆ చదివేవారిలో అది చదివేప్పటికే ఆ కథ ఉద్దేశించిన చైతన్యం కలగి ఉండని వారెంతమంది? ఒక్క మనసునో, ఒక్క జీవితాన్నో మార్చినా చాలదా అనుకోవచ్చు కానీ, అప్పుడీ రచనావ్యాసంగమంతా చాలా అసమర్థమైనదనీ, ఇంతకంటే ఫలప్రదమయిన దారులు ఉన్నాయనీ గ్రహించవలసి ఉంటుంది.

ఈ మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగున పడి పనిముట్టుగానే మిగిలిపోయింది. కష్టాన్నీ, బాధనూ ఎత్తిచూపడం మంచి కథకు కొలమానంగా మారింది. అది ముందెన్నడూ ఎరగనిదయితే  మరీ మంచిదిగా భావించబడుతుంది. స్పందించే హృదయాలు సానుభూతి చూపక తప్పదు కానీ కథ అందుకే పరిమితమవుతూంది. కథను కథగా నిలిపే మిగతా అంశాలేవీ గమనించే, ఆస్వాదించే వీలు రచయితలూ, పాఠకులూ కల్పించుకోలేకుండా ఉన్నారు.

పాఠకులంతా ఒకే స్థాయిలో ఉండరు. వారి పఠనావసరాలు ఒకేలా ఉండవు. ఎవరూ ఒకేలాంటి సాహిత్యం పదేపదే చదవరు. వైవిధ్యం కావాలి. రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి. కనీసం ఇంతకుముందుకంటే బలంగా రాయాలి. సమాజానికి దిశానిర్దేశం చేయడమొక్కటే ధ్యేయమనుకోరాదు. తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. మరింతమందిని చదివించాలి.

(హ్యూస్టన్ లో గత ఏడాది అక్టోబర్ లో వంగూరి ఫౌండేషన్ జరిపిన అమెరికా కథ స్వర్ణోత్సవాలు & 9 అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చదివిన ప్రసంగ సారానికి కొన్ని చేర్పులతో)

*

ఆమె ప్రవాస వేదన

 

సాహితి
  

ప్రవాస జీవితంలోని మరో స్త్రీ కోణాన్ని ఆవిష్కరించిన కథ ఇది. కల్పనా రెంటాల నవల “తన్హాయి” చదివినప్పటి నుంచీ ఆమె ప్రతి రచననీ ఆసక్తిగా చదివే చదువరిగా ఈ కథ నాకు భిన్నంగా అనిపించింది. ప్రవాస జీవన దృశ్యాలని కళ్ళ ముందు పెయింటింగ్ మాదిరిగా చూపించే కథలు కల్పన కలం నుంచి ఇంతకుముందే అనేకం వెలువడినా, ఈ కొత్త కథ మనం సాధారణంగా బయటికి చెప్పుకోలేని ఒక వాస్తవాన్ని చిత్రిస్తుంది.

రెండు కారణాల వల్ల ఈ కథ నన్ను ఆకట్టుకుంది: ఒకటి, ఈ కథలో వర్ణించిన లాంటి సంఘటనలు మామూలే అని ఇటీవలి ప్రవాస వార్తలు చదివిన వారెవరికైనా అర్థమవుతుంది, కాని, ఇందులో కథనానికి పనికొచ్చే విషయాన్ని తీసుకోవడం కల్పనకే సాధ్యమైన సాహసం. రెండు, ఇలాంటి విషయాల్ని కథకి ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు వాటిలో ఏ విషయాన్ని ఏ దృక్కోణం నుంచి చూడాలీ అన్న సందిగ్ధం సహజం రచయితల్లోనూ. లేదూ, అలాంటివి పరిశీలనకి వచ్చిన మనలోనూ. కల్పన ఈ కథలో ఒక కౌన్సిలర్ గా అదనపు బాధ్యత తీసుకొని ఈ సమస్యని లోతైన దృష్టిలో విశ్లేషించడం నాకు నచ్చింది. 

ఇక కల్పన కథన నైపుణ్యం గురించి తన్హాయి చదువరులకు వేరే చెప్పకర్లేదు కదా! మరీ ఎక్కువగా మీ కథా సమయాన్ని తీసుకోకుండా మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తాను.

**

It’s Not Okay!

 

Kalpana profile2“నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్సనల్. బార్న్స్ అండ్ నోబుల్ దగ్గర కలవటం కుదురుతుందా?’ ఆఫీస్ నుంచి బయలుదేరబోతుంటే వైదేహి నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజీ చూసి శృతి ఆగిపోయింది . వైదేహి ని  కలిసి దాదాపు నెల రోజులకు పైగా అయింది. ఈ మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు. అలాంటిది హఠాత్తుగా ఒక  టెక్స్ట్ మెసేజీ,  అది కూడా ముఖ్యమైన విషయం అని వచ్చేసరికి శృతి కి కొంచెం కంగారుగా అనిపించింది.

ఒక్క సారి వాచీ వంక, మొబైల్ వంక చూసింది. ఒకటి కాలం కోసం, రెండోది సెల్ ఫోన్ గుప్పెట్లో వున్న భౌతిక, మానసిక ప్రపంచాల కోసం. ఆ మొబైల్ లోనే ఆమె జీవితం మొత్తం గూడు కట్టుకొనుంది.   చేయాల్సిన పనులు,ఇంటా,  బయటా చేయించాల్సిన పనులు, అపాయింట్మెంట్ లు, రిమైండర్లు,నోట్స్, కట్టాల్సిన బిల్లులు మొత్తం గా ఆమె  జీవితపు bucket list అంతా ఆ మొబైల్ లో నిక్షిప్తమై ఉంది, రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు.

స్మార్ట్ ఫోన్ లో  ఒక్క సారి To Do List చూసింది. ఒక గంటో, ఒక రోజో ఆలస్యమైతే టోర్నాడో లో , వరదలో వచ్చే ప్రమాదమేమీ లేదని అర్థమయ్యాక,  ” see you girl,” అని వైదేహి కి  రిప్లై ఇచ్చింది.

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లో డాలస్, హ్యూస్టన్ లతో పోలిస్తే, ఆస్టిన్ కొంచెం చిన్న ఊరు.  ట్రాఫిక్ లేని సమయాల్లో ఊర్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఓ పావుగంట, అరగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. రీసెర్చ్ బులవార్డ్ రోడ్డు మీద నార్త్ లో శృతి ఆఫీస్ ఉంటే, ఒక యూ టర్న్ తీసుకొని రీసెర్చ్ బులవార్డ్ సౌత్ మీదకొస్తే బార్న్స్ అండ్ నోబుల్ బుక్ స్టోర్
వస్తుంది. హైవే ఎక్కితే పది నిముషాలే కానీ ఆ ఫ్రాంటేజీ రోడ్డు మీద వెళ్లటమే శృతి కి  ఇష్టం.

హైవే ఎక్కితే తొందర తొందరగా గమ్యానికి చేరుకుంటాము. కానీ శృతి కి ఆ పరుగు పరుగు ఇష్టం లేదు. రోజూ ఆఫీస్ కి వచ్చి వెళ్లే చిన్నపాటి  కారు ప్రయాణాన్ని కూడా నెమ్మదిగా ఎలాంటి అనవసర పరుగులు లేకుండా ఇష్టమైన పాటలు వింటూ అనుభూతిస్తూ వెళ్లాలనిపిస్తుంది . వైదేహి చెప్పబోయే అంత ముఖ్యమైన , వ్యక్తిగతమైన విషయం ఏమై ఉంటుందా అని శృతి డ్రైవింగ్ చేస్తూ ఆలోచనలో పడింది .

***

వైదేహి , శృతి ల మధ్య స్నేహం విచిత్రంగా జరిగింది. సామాన్యంగా కొత్తగా ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు ఏ షాపింగ్ మాల్ లోనో, గ్రోసరీ స్టోర్ లోనో ఎదురెదురుపడితే చిన్నపాటి చిరునవ్వు నవ్వటానికి కూడా ఇబ్బంది పడుతూ , చూడనట్లు పక్కకు తప్పుకొని వెళ్లిపోతుంటారు. అలాంటిది హఠాత్తుగా గ్రోసరీ షాప్ లో కలిసిన వీళ్ళిద్దరి  స్నేహం ఓ ఏడాది గా  గా   పెరిగి
పెద్దదవుతోంది .

వైదేహి  వాళ్ళు బోస్టన్ నుంచి అప్పుడే  కొత్తగా ఆస్టిన్ కి రీలొకేట్ అయ్యారు. కందిపప్పు, కూరగాయలు కొనటానికి వైదేహి  , ఇండియన్ గ్రోసరీ షాప్ కి వస్తే అక్కడ జామపళ్లు, సీతాఫలం పళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే బోలెడు ఉత్సాహ పడిపోయింది. ఆ ఉత్సాహంతోనే అక్కడే నిలబడి అతి జాగ్రత్త గా జామపళ్ళను,సీతాఫలం పళ్లను ఎంపిక చేసుకుంటున్న శృతి తో  మాటలు కలిపింది.
కొత్తగా  వచ్చిన వైదేహి కి  ఊర్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పింది  శృతి. అలా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం నెలకొకసారైనా  బయట కలిసి ఓ కప్పు కాఫీ తాగే వరకు వచ్చింది. అయితే ఎప్పుడు కలిసినా  పిల్లల చదువులు,కమ్యూనిటీ గాసిప్ లు,  లోకాభిరామం విషయాలు తప్ప ఎవరి వ్యక్తిగత విషయాలు మరీ లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం రాలేదు.

వైదేహి  ముఖ్యమైన విషయం, వ్యక్తిగతం అనేసరికి విషయం ఏదో పెద్దదని   శృతి
కి అర్థమయింది . శృతి అలా ఆలోచనల్లో ఉండగానే బార్న్స్ అండ్ నోబుల్ వచ్చేసింది. కారు పార్క్ చేసి బుక్ స్టోర్ కి వెనుక వైపు ఉన్న పార్క్ లోకి నడిచింది శృతి.

2.

అది పెద్ద పార్క్ కాదు కానీ ముచ్చటగా ఒక పక్క చిన్న సరస్సు , మరో వైపు పిల్లలు ఆడుకోవటానికి చిన్న చిన్న జారుడు బండలు ఉన్నాయి.ఒక పక్క పిల్లల్ని ఆడించే వాళ్ళు ఆడిస్తున్నారు. మరో పక్క పార్క్ లో సాయంత్రం చల్లటి వేళ ప్రకృతి ని ఆస్వాదిస్తూ నడిచే వాళ్ళు నడుస్తున్నారు. ఇంకో వైపు   సిమెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ దగ్గర నెమ్మదిగా కాఫీ  సిప్ చేస్తూ ఏదో దీర్ఘాలోచనలో వైదేహి  కూర్చొని ఉంది. వైదేహి ని  పలకరిస్తూ ఏమిటి విషయం అన్నట్లు  చూసింది శృతి . వైదేహి   మొహం విచారంగా లేదు,సంతోషంగా లేదు. ప్రశాంతంగా లేదు, అశాంతిగానూ లేదు. కేవలం గంభీరంగా ఉంది. అలా వైదేహి ని  ఎప్పుడూ చూడకపోవటం తో శృతి కొంచెం ఆశ్చర్య పడింది .

“Is ever thing alright ?” కొంచెం ఆందోళన గా  అడిగింది.

“యెస్…” తల వూపుతూ శృతి కోసం తీసుకున్న కాఫీ కప్పు ను ఆమె చేతికి
అందించింది వైదేహి. గంభీరంగా ఉన్న వైదేహి వంకే చూస్తోంది శృతి,  ఏం మాట్లాడబోతోందా అన్నట్లు.

” డైవోర్స్ కి ఫైల్ చేశాను.” నేరుగా అసలు విషయం లోకి వచ్చేసింది   వైదేహి .

“వ్వాట్? అసలేమైంది?ఒకటే సారి ఈ  డైవోర్స్ నిర్ణయం ఏమిటి?” శృతి మాటల్లో కనిపిస్తున్న ఆందోళన ను చూసి ఇప్పుడంతా  బాగానే ఉంది,నువ్వేం కంగారు పడకు అన్నట్లు ఆమె చేతి మీద చెయ్యి వేసింది వైదేహి .
అప్పుడే తగిలిన పచ్చి గాయం లాగా , ఎప్పటికీ మర్చిపోలేని ఓ పీడ కల గా మళ్ళీ కొత్త గా కళ్ళకు కట్టినట్లు   కనిపిస్తోంది వైదేహి కి.

***

౩. ఒక శుక్రవారం ఉదయం.

ఫోన్ లో పెట్టుకున్న అలారం బీప్ కన్నా చాలా చాలా ముందే మెలకువ వచ్చేసింది వైదేహి కి.  కనురెప్పలు తెరుచుకున్నాయి కానీ ఒంట్లోని నరాల్లో ఏ మాత్రం కదలిక  లేనట్లు,కండరాలన్నీ ఎక్కడికక్కడ మంచు లో కూరుకుపోయినట్లు మొద్దు బారి పోయి ఉన్నాయి. శరీర కణాల్లో ఏ మాత్రం జీవం లేనట్లు నిశ్చింత గా నిద్ర పోతున్నాయి. ఒక్క క్షణం వైదేహి కి  తానూ బతికున్నదో, చనిపోయిందో కూడా అర్థం కాలేదు. దేహం లోంచి విడివడి పోయి తన ఆత్మ ఒక సాక్షీభూతం గా దూరం గా నిలబడి శరీరాన్ని చూస్తున్న ఫీలింగ్ వైదేహి లో. చేతి ని, కాళ్ళను కదపాలని ప్రయత్నించింది. అసలు అవి ఉన్నాయని కూడా తెలియనట్లు అనిపించింది. మానసికంగా , శారీరకంగా విశ్వ ప్రయత్నం చేసాక ఎక్కడో
చిన్నపాటి కదలిక. మెలకువ  వచ్చాక ఓ పావు గంట పట్టింది మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టడానికి.  అటు పక్కకు తిరిగి పడుకున్న రాఘవ గొంతు లోంచి
వస్తున్న గురక ను బట్టి  అతను గాఢ నిద్ర లో ఉన్నట్లు తెలుసు ఆమె కు. తన శరీరం , తన మనసు ఏం మాట్లాడుతున్నాయో అతన్ని లేపి చెప్పాలని ఉంది. కానీ
దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకాబట్టి ఆ ప్రయత్నం మానుకొని లేచి నెమ్మదిగా వెళ్ళి అక్కడున్న కిచెన్ బార్  స్టూల్ మీద తన శరీరాన్ని కూలదోసింది.

పొద్దుపొద్దుటే ఈ “ ఫైబ్రో  మయాల్జియా “ పెట్టే బాధలు ఇవాళ కొత్త కాదు వైదేహి కి . ఒళ్లంతా కండరాల నొప్పులు. శరీరమంతా ఒక బాధాసప్తసతి లాగా ఉంటుంది.  ఈ రోగానికి ప్రత్యేకంగా ఏం మందులు ఉండవు అంటూనే డాక్టర్లు ఏవో మందులు ఇస్తూ ఉంటారు. పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఇది తగ్గే రోగం కాదు అని ఆమె కు కూడా తెలుసు. కానీ  ఉదయం లేవకుండా, అమూల్య ను స్కూల్ కు పంపకుండా ఉండటం ఎలా సాధ్యం? చాలా ఉద్యోగాలతో పాటు అమెరికా లోని హాయైన జీవితానికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాలి కదా అనుకొని నిట్టూర్చింది.

వయస్సు ముప్పై లలోనే ఉన్నా  ఉదయం పూట  ఏదో ముసలితనం వచ్చినట్లు ప్రవర్తించే శరీరం వంక చూసుకుంది వైదేహి .  అలాగే లేచి అటూ ఇటూ కండరాల పెను నిద్దర ను వదిలించే ఎక్సర్ సైజులను చేయటం మొదలు పెట్టింది. ఉన్నట్లుండి కలుక్కున ఎక్కడో పట్టేసింది. నడుం పై భాగం ఒక ముక్క గా , కింద భాగం మరో ముక్క గా  దేహం రెండు గా విడిపోయినట్లు విపరీతమైన నొప్పి.
అతి కష్టం మీద  నేల మీద కు ఒరిగి పోయింది. ఆ నొప్పి లోంచి అమ్మా అన్న కేక గట్టిగా బయటకు వచ్చింది.  కానీ అమెరికా లో అమ్మ లకు అమ్మలు ఎవరూ పక్కన ఉండరు కదా. అయిదు నిముషాలు ఆ నొప్పి ని భరించింది. నొప్పి క్షణం క్షణం ఎక్కువవుతోంది ఇక భరించలేక “ రాఘవా,రాఘవా” అంటూ గట్టిగా కేకేసింది .

ఓ పదిసార్లు గట్టిగా అరిచాక కానీ రాఘవ కు మెలకువ  రాలేదు. కళ్ళు నులుముకుంటూ కిచెన్ లోకి వచ్చాడు. నిద్రాభంగం అయిందన్న చికాకు ఆ మోహంలో స్పష్టం గా కనిపిస్తోంది.

“ ఎవరు చచ్చారని అంత కేకలేస్తున్నావు?” అంటూ వైదేహి కోసం  అటూ ఇటూ చూసాడు. నిద్ర మత్తు లోంచి కళ్ళు  ఇంకా బయటకు రానంటున్నాయి కాబోలు అంతా మసక మసక గా కనిపించింది. కళ్ళు విదిల్చుకొని సరిగా చూసాడు . అప్పుడు కనిపించింది నేల మీద ఓ మూట లా రెండు కాళ్ళు వెనక్కు మెలికపడి కూర్చొన్న వైదేహి  .

వైదేహి కి  శరీరం లోని నొప్పి ని దాటి మరింత నొప్పి పెట్టింది రాఘవ అన్న మాటలు .

“ ఏమిటీ ఎక్సర్ సైజు లు చేసావా?  ఫిజియో థెరపీ కి డబ్బులు వదిలించటం తప్ప  అవి నీకు రావు. నువ్వు చేయలేవు. “ విసుక్కుంటూ వైదేహి ని  పైకి లేపాడు.

వైదేహి కి  అక్కడే కూలబడిపోయి పైకి లేవకుండా భీష్ముడి లాగా “ స్వచ్చంద మరణం” పొందాలనిపించింది.

రాళ్ళను గుగ్గిళ్ళు గా మార్చగలిగే పతివ్రతలో కోవ లో లేదు  కాబట్టి వైదేహి చావలేక బతికి పోయింది.

వైదేహి ని  పైకి లేపి , లేచి నిలబడుతుండగానే టక్కున ఆ స్పర్శ ను అర క్షణం కూడా భరించ లేనట్లు వదిలేశాడు రాఘవ. ఆమె కళ్ళల్లోంచి ఓ సన్నటి నీటి పొర, ఎందుకీ జన్మ  అనుకుంటూ.

ఇంకా పూర్తిగా నిలదొక్కుకోకుండానే వదిలేయటం తో కాళ్ళు ఇంకా బాలెన్స్ లోకి రాక కాస్త అటూ ఇటూ ఊగిపోయింది.  గబుక్కున కిచెన్ మధ్య లో ఉన్న బార్ అంచును పట్టుకొని స్టూల్ మీద కూలబడింది.

మనసు లోని నొప్పి ముందు శరీరం లోని నొప్పి చాలా చిన్న గా అనిపించింది. అయినా ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు  ఆమె .

కిచెన్ బార్ మీద చార్జింగ్ కి పెట్టిన ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ “ఫకింగ్ ఇడియట్. దీన్ని కట్టుకున్నాక నిద్ర సుఖంలేదు. “ గొణుక్కున్నాడు రాఘవ. చీమలు కూడా తిరగని నిశ్శబ్దపు ఇంట్లో అతని మాటలు స్పీకర్ పెట్టినట్లు గట్టిగా వినిపించాయి.

అతన్ని నిద్ర లేపిన ఘోరమైన అపరాధం తనదే అన్నట్లు “ నువ్వు రాత్రి లేట్ గా పడుకున్నావని తెలుసు కానీ పైకి లేవకపోతే అమూల్య ను నిద్ర లేపి స్కూల్ కి తయారు చేయలేను కదా అని పిలిచాను.”

వైదేహి  మాటలకు,  చేత్తో ఇక చాల్లే అన్నట్లు చూపిస్తూ “ ఒక్క రోజైనా మొగుడి ని సుఖ పెట్టావా? ఆ సుఖం గురించి కాదు నేను మాట్లాడుతోంది . డబ్బు తెచ్చి నీ ముఖాన పోస్తున్నాను. అమెరికా లో ఇంత పెద్ద ఇల్లుంది. ఉద్యోగం చేయక్కర లేదు. నన్ను నా ఉద్యోగం చేసుకోనిస్తే చాలు. ఉన్న ఒక్క పిల్ల ను స్కూలు కు దించేస్తే రోజంతా ఖాళీ. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి తెచ్చుకోవటం. ఇది పెద్ద పనా? ఇంజనీరింగ్ చేసావు. నీ ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్ వేర్ లో ఉన్నారు. నిన్ను ఆ పని కూడా చేయమనటం లేదే. హాయి గా ఇంటి పట్టున ఉండి వంట చేసుకొని మా ఇద్దరినీ చూసుకోవటానికి ఏం పోయేకాలం?ఎప్పుడూ ఏదో ఒక  రోగం?” గురి తప్పని మాటల బాణాలు విసరటం మొదలుపెట్టాడు  రాఘవుడు.

“ ఉద్యోగం చేయొద్దన్నది నువ్వు. ఈ ఫైబ్రో మయాలజియా ఉన్నా కూడా ,మీ పనులు ఏవీ ఆపటం లేదే. అన్నీ చేస్తూనే ఉన్నాను గా. “ ఎదురు సమాధానం చెప్పింది వైదేహి, భర్త మాటలకు ఎదురాడ కూడదని తెలిసినా కూడా.

“ నీకు చేతకాదని తెలుసు కాబట్టే వద్దన్నానే. ఒక్క పని అయినా పర్ఫెక్ గా చేస్తావా? నేను నెల లో సగం రోజులు ప్రయాణం లోనే ఉంటాను. నువ్వు పిల్లను స్కూల్లో దింపటం, స్విమ్మింగ్ కి, ఆర్ట్ క్లాస్ కి, సంగీతం క్లాస్ కి తీసుకెళ్లటమేగా  చేయాల్సింది.  అసలు ఆడదానికి పిల్లల్ని పెంచటం కన్నా వేరే  ముఖ్యమైన పనులేమున్నాయి. అదికూడా కష్టమేనా?”

“ రోజంతా ఇంటి పనులు,అమూల్య పనులతో సరిపోతూనే ఉంది కదా. మధ్యాహ్నం రెండు మూడు గంటలు  ఖాళీ , అంతే కదా ” చెప్పటం అనవసరం అని తెలిసినా నోరు ఊరుకోక ఉన్న విషయం చెప్పింది.

“ మొగుడు బయట నానా గడ్డీ తిని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి తెస్తే చీరలు,మేకప్ లు,నగలు అంటూ దాన్ని ఖర్చు పెట్టడమే కదా మీ ఆడవాళ్ళు చేసే పని. అయినా నువ్వసలు ఆడదానివేనా? నువ్వొక   రోగిష్టి మారివి.  ఉన్న ఒక్క పిల్లను సక్రమం గా పెంచటం చేత కాని ఆడదానివి. ఒక్క ఆడ పని అయినా నువ్వు ఇన్నేళ్ళ లో సక్రమం గా చేసావా? ”

ఒక్కో మాటల తూటా నేరుగా వైదేహి మనసు లో దిగబడి పోతోంది. ఎన్ని సార్లు గుచ్చుకున్నాయో ఈ బాణాలు అయినా చెక్కుచెదరని ధీరత్వం తో కాపురం చేస్తూనే
ఉంది వైదేహి.

రాఘవ మాటలకు వైదేహి సమాధానం చెప్పక్కర లేకుండా ఫోన్ గణ గణ మని మోగింది.

రిసీవర్ తీసి కాలర్ ఐడి లో నెంబర్ చూసి  “ఇండియా నుంచి మీ పుట్టింటి వాళ్ళు. వాళ్ళు కాల్ చేసే ఆ వానేజీ ఫోన్ కి కూడా నేనే డబ్బులు కడుతోంది. కూతురు కి పనులు చేయటం కూడా నేర్పించ కుండా నాకు అంటగట్టి వదిలించుకున్నారు”  కార్డ్ లెస్ ఫోన్ ను  కిచెన్ టేబుల్ కు ఆ వైపున ఉన్న వైదేహి వైపు కు బలంగా విసిరేశాడు రాఘవ.

ఫోన్ ఆన్సర్ చేసి విసిరేసాడేమో, రాఘవ మాటలు అవతల వైపు కు వినిపించాయేమో అని సిగ్గుతో చితికిపోతూ ఫోన్  తీసుకుంది.  రాఘవ మాటల మధ్య కాల్ ఆపేయటాన్ని, రింగ్ ఆగిపోవటాన్ని గుర్తించ లేకపోయింది వైదేహి.
“ ఏం ఆడ పనులు చేయటం లేదు నేనీ ఇంట్లో ?  అయినా అసలు నేను ఆడదాన్ని అని నాతొ సంసారం చేయాలని గుర్తుండాల్సింది నీకు , నాకు కాదు. ”  ఆడ దానివి  కాదు అన్న మాటకు ఒళ్ళు తెలియని కోపంతో మాటకు మాట సమాధానం చెప్పింది వైదేహి.

“ ఏమిటే నీతో సంసారం చేసేది? నీకు మదమెక్కువై ఒళ్ళు కొవ్వొక్కి కొట్టుకుంటున్నావు.  సంసారం చేయాల్సింది పిల్లల్ని కనటానికే. అది జరిగాక ఇక సంసారం చేస్తే అది సంసారం కిందకు రాదు. నేను హిందువు ని. తురకోడి లాగా వందమంది పిల్లల్ని కనక్కరలేదు.” సంసారం విషయం ఎత్తేసరికి రాఘవ లో ఎక్కడ లేని కోపం వచ్చింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. మొహమంతా ఎర్రగా మారిపోయింది.

It's Not Okay story 2

“ నీకు చేత కావటం లేదని చెప్పు.  నీ మగతనం పోయిందని చెప్పు. నీకు ఎరెక్షన్ సమస్య అని చెప్పు. అంతే కానీ  హిందూ ధర్మం, పురాణాల గొడవెందుకు?” వైదేహి సూటి గా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నది ఆ మాట. ఆ చూపు లో,ఆ మాటలో ఒక తెలియని  కచ్చితనం కనిపిస్తోంది. అతని రహస్యాన్ని బట్టబయలు చేయాలన్న కసి కనిపిస్తోంది.

ఆ మాట ను విని తట్టుకోలేకపోయాడు రాఘవ.

“ బజారు ముండ, నీకు సెక్స్ కావాలటే, రా నా మగతనం చూపిస్తాను.అయినా  You know what, you are not worth to f**** “. విసురుగా దగ్గరకొచ్చి జుట్టు పట్టుకొని వైదేహి ని ఒక్క లాగు లాగాడు. అలా విసురు గా లాగటం తో స్టూల్ మీదున్న వైదేహి కిందపడి పోయింది.

కింద పడటం,    చేతిలో ఉన్న కార్డ్ లెస్ ఫోన్ ను  రాఘవ మొహం మీదకు విసిరేయటం రెండూ ఒక దానివెంట ఒకటి  ఒక్క త్రుటి లో జరిగిపోయింది.

ఫోన్  రాఘవ నుదుటిని కొట్టుకుంటూ వెళ్లి పక్కకు పడిపోయింది.

ఇందాక ఒక సారి పడిపోయిన చోటనే మళ్ళీ దెబ్బ తగిలింది. ఈ సారి నొప్పి మరింత తీవ్రంగా అనిపించింది. కానీ రాఘవ అన్న మాటల కంటే ఆ నొప్పి చాలా మాములుగా భరించగలిగేలా అనిపించింది వైదేహి కి.

“ నన్ను కొడతావా? ఏం జాతే నీది? నువ్వొట్టి బజారు ముండ వి. నువ్వు బ్రాహ్మణ పుటక పుట్టావా? ఇదేనా మీ వాళ్ళు నీకు నేర్పించింది? “ మాటలు,బూతులు అన్నీ కలిసిపోయి తిడుతూ ఆ రిసీవర్ ని తీసి మళ్ళీ వైదేహి మొహం మీదకు విసిరేశాడు.

సూటి గా వచ్చి వైదేహి నోటి కి ఫోన్  బలం గా  తగలటం తో పళ్ళు పగిలినట్లు రక్తం జివ్వున బయటకు వచ్చింది.

అప్రయత్నంగానే చెయ్యి పెదాల మీద కు వెళ్ళింది. చేతికి ఎర్రటి రక్తం. పెదాల చివర నుంచి రక్తం కిందకు ధార లా కారుతోంది.

ఎన్ని సార్లో అంతకు ముందు  అతని చేత తన్నులుతిన్నది. అయినా ఆ క్షణం భిన్నమైనది.

చేతికి అందిన రిసీవర్ ని తీసుకొని గబగబా 911 డయల్ చేసింది.  రాఘవ పెడుతున్న  హింస గురించి ఒక ప్రవాహం లా  మాట్లాడేస్తోంది  వైదేహి.

ఒక పక్క ఆవేశం, ఒక పక్క బాధ, తెలుగు, ఇంగ్లీష్ లలో కలగాపులగంగా రోప్పుతూ మాట్లాడుతోంది వైదేహి.

అటు పక్క నుంచి ఆపరేటర్ వైదేహి మాటల్ని ఆపుతూ “ మేమ్ . జస్ట్ టేక్ డీప్ బ్రెత్ . నెమ్మది గా చెప్పండి. మీ ఇంటి అడ్రెస్ ఏమిటి? ఆర్ యు సేఫ్ ? “అడుగుతున్నాడు .

ఒక్క క్షణం వైదేహి ఏం చేస్తోందో, ఎవరితో మాట్లాడుతోందో అర్థం కాలేదు రాఘవ కు.

వైదేహి కాల్ చేసినదెవరికో అర్థం అయ్యాక రాఘవ గగబా వచ్చి వైదేహి చేతిలోని రిసీవర్ ని తీసుకొని కాల్ ని ఆపేసాడు.

“ You bitch. ఇంటి విషయాల్ని బయట పెట్టడానికి సిగ్గు లేదు. నడువు,ఇప్పుడే నా ఇంట్లో నుంచి బయటకు నడు “ అంటూ జుట్టు పట్టుకొని లేపి తలుపు వైపు తోసాడు.

“ ఇది నా ఇల్లు. నేనెందుకు వెళ్ళాలి?” అంటూ ఓ విధమైన పిచ్చి ఆవేశం తో రెండు చేతులతో రాఘవ రొమ్ము మీద పిడి గుద్దులు  గుద్దింది వైదేహి. చేత్తో అతని మొహం మీద రక్కింది. రాఘవ కళ్ళకు రాక్షసి మీద కు వస్తున్నట్లు కనిపించి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసాడు. కానీ వైదేహి బలం ముందు బలహీనుడై పోయాడు. తప్పించుకునే ప్రయత్నమో, కోపమో కానీ అతను ఆమె ను కొట్టే ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నాడు.

అలా ఇద్దరు ఒకరినొకరు మాటలతో చేతలతో హింసించుకొంటూ ఉండగా బోయ్ బోయ్ మంటూ శబ్దం చేసుకుంటూ కాప్స్ ఇంటి ముందుకు వచ్చేసారు.

“ వాళ్ళను వెళ్ళిపొమ్మని చెప్పు. ఏం జరగలేదని చెప్పి పంపేయి. లేదంటే నిన్ను ఇక్కడే నరికి చంపేస్తాను” తలుపు తీయడానికి వెళ్తున్న వైదేహి ని ఆపెస్తున్నాడు రాఘవ.

అప్పటి వరకు లేని బలం ఎలా వచ్చిందో వైదేహి కి అతన్ని తోసేసి వెళ్లి తలుపుతీసింది.

భద్రమైన వారి ఇంట్లో కి భద్రతనిచ్చే రక్షకభటులు వచ్చారు.

చెదిరిన జుట్టు, పళ్ళ నుంచి రక్తం, మొహమంతా రక్కేసిన గాట్ల తో వైదేహి అపర కాళిక లాగా పోలీసుల ముందు నిలబడింది.

“ ఆర్ యు ఓకే మేమ్ “ అంటూ ఒక పోలీసు అడిగిన ప్రశ్న కు తల ఊపింది ఆమె.

వాళ్ళను చూడగానే ఒక విధమైన ధైర్యం తో పాటు ఒక ఎంబరాస్మెంట్ ఫీలింగ్ కూడా కలిగింది. లోపల దాచిపెట్టుకున్న ఏడుపు ఒక్క సారిగా బయటకు వచ్చింది.

“ ఇట్స్ ఓకే “ అంటూ లేడీ పోలీసు ఒకామె నెమ్మదిగా వైదేహి ని నడిపించుకుంటూ తీసుకొని వెళ్లి సోఫా లో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతావా? “ అంటే తల ఊపింది.

రాఘవ కు నోటి మాట రాకుండా స్థాణువై నిలబడి ఉన్నాడు. పోలీసుల వంక చూడలేకపోతున్నాడు. అవమానంగా అనిపించింది. పరువు బజారు పాలు చేసింది ఈ
బజారు ముండ అనుకున్నాడు.

“ సర్, ఆర్ యూ ఆల్ రైట్ ? మీకేమైనా దెబ్బలు తగిలాయా?” రాఘవ మొహం వైపు
చూస్తున్నాడు. మొహం మీద గాట్లు, రిసీవర్ మొహానికి తగిలిన దెబ్బ అన్నీ అద్దం లో కనిపించినట్లు స్పష్టం గా కనిపిస్తున్నాయి ఆ పోలీసు కళ్ళకు .

ఇంతలో వారికి ,  దూరం గా ఒక శిలా విగ్రహం లా నిలబడ్డ అమూల్య కనిపించింది. ఎప్పుడు నిద్ర లేచి వచ్చిందో, ఏం చూసిందో తెలియదు , నోట మాట, శరీరం లో కదలిక లేకుండా శిల లా నిల్చున్న  అమూల్య దగ్గరకు లేడీ పోలీసు వెళ్లి “ స్వీటీ,  ఇట్స్ ఓకే. కెన్ వుయ్ గో ఇన్ టు యువర్ రూమ్? “అమూల్య ని  గది లోకి తీసుకెళ్లింది. ఆమె అమూల్య తో మాట్లాడుతోంది.

ఇంకో ఇద్దరు పోలీసులు వైదేహి తోనూ, రాఘవ తోనూ విడివిడి గా మాట్లాడి నోట్స్ తీసుకున్నారు.

ఒక గంటకు పైగా మాట్లాడి రాఘవ మీద ఎమోషనల్ ఎబ్ యూజ్ కింద కేసు పెట్టారు. కౌంటీ రూల్స్ ప్రకారం గృహ హింస కు జీరో టాలరెన్స్ చట్టం ఉంది కాబట్టి , వైదేహి కంప్లైంట్ ఇస్తే రాఘవ మీద కేసు పెడతామని పోలీసులు చెప్పారు కానీ అతన్ని జైలు కు పంపటం ఇష్టం లేక వద్దని చెప్పింది వైదేహి.

“ ఇక్కడ మీరు సేఫ్ గా ఉండగలరా ? లేక వేరే ఎక్కడైనా ప్రొటెక్షన్ హౌస్ కి వెళ్తారా? “ అన్న పోలీసుల ప్రశ్న కు “ ఇక్కడే ఉంటామని, అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తామని “ చెప్పింది వైదేహి.

ప్రొటెక్షన్ సెల్  విజిటింగ్ కార్డ్స్, సహేలి కార్డ్స్, కౌంటీ పోలీస్ స్టేషన్ నెంబర్స్ అన్నీ ఫ్రిజ్ మీద మాగ్నెటిక్  కార్డ్ తో అతికించి వెళ్ళారు.

పోలీసులు ఇద్దరికీ మరో సారి అన్నీ రూల్స్ వివరించారు.  ఇద్దరిలో ఎవరికైనా అవతలి వాళ్ళ వల్ల  ప్రాణాపాయం అనిపించినా వెంటనే కాల్ చేయమని చెప్పారు.

పోలీసుల్ని పంపుతూ  తలుపు వేయటానికి  మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళిన వైదేహి కి, సందు లో తమ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళంతా స్లో డౌన్ చేసి  ఆ ఇంటి ముందు ఆగిన పోలీసు కార్లను చూసుకుంటూ వెళ్తున్న విషయాన్ని గమనించింది.

సిగ్గు, అవమానం, అసహ్యం , బాధ, ఏడుపు అన్నీ కలగలిసి వచ్చాయి. భారంగా అడుగులు పడుతుంటే లేచి అమూల్య గదిలోకి వెళ్ళింది వైదేహి.

***

“   నా 15 ఏళ్ల వైవాహిక జీవితం చివరకు ఇలా ముగిసింది  శృతీ . అమూల్య కోసమో, నా అనారోగ్యం వల్లనో ,  లేక ఈ కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే తాపత్రయం తోనో  ఏదో ఒక కారణంతో   ఇన్నాళ్ళూ  ఓపిక పట్టాను. ఆ 911 సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక్క సారిగా నా భయాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆ రోజు మమ్మల్ని అమూల్య చూసిన చూపు నేనెప్పటికీ మర్చిపోలేను. నేనున్న స్థితి లోనే రేపు అమూల్య ఉంటే ఏం చేస్తుంది? భర్త చేత తన్నులు తింటూ అయినా సరే ఆ కాపురాన్ని  నిలబెట్టుకోమని ,  ఆత్మ గౌరవం లేకుండా బతకమని చెప్పనా? అదేనా నేను నా కూతురికి నేర్పించాల్సిన జీవితపాఠం? ”
ఆ సాయంత్రపు నీరెండ వెలుగు లో  తనను తాను ప్రశ్నించుకుంటున్న వైదేహి కొత్త గా కనిపించింది శృతి కి. లేచి వెళ్లి వైదేహి ని హగ్ చేసుకుంది .

(నవ్య వీక్లీ లో ( జూలై 1 సంచిక లో) ప్రచురితమైన  కథ)

ఒక హెచ్చరికని జారీ చేసిన కథ…

  ఆర్.దమయంతి

 నిన్ననే చదివాను. ఒక స్త్రీ వైవాహిక విషాద గాధ.

పెళ్ళై, ఐదేళ్ళౌతున్నా, తనకీ, తన భర్తకీ మధ్య ఎలాటి శారీరక సంభంధమూ లేదని చెప్పింది. అంతే కాదు అతనొక గే   (స్వలింగ సంపర్కులు) అని తెలుసుకుని కుమిలిపోయానని, అయినా, ఆశ చంపుకోలేక మార్చుకునే ప్రయత్నం కూడా చేసానని..చివరికి వైఫల్యాన్ని భరించలేక మరణిస్తున్నానని …రాసి వెళ్ళిపోయింది. ఈ లోకం నించి శాశ్వతం గా శలవు తీసుకుని వెళ్ళిపోయింది.

ఆత్మహత్య ఎంత భయంకరమైన నరకమో. అయినా.. వెరవడం లేదు- స్త్రీలు. ఎందుకంటే అంత కన్నా మహానరకం ఇంట్లోనే అనుభవిస్తున్నప్పుడు, … మొగుడు యముడై పీక్కు తింటున్నప్పుడు ..చావొక లెక్కలో పని కాదనుకొనే గట్టి నిర్ణయానికొచ్చేస్తున్నారు.

బ్రతుకొక పీడ గా మారినప్పుడు, క్షణం..క్షణం  అభద్రతా భావాలు ప్రాణాలను నొక్కేస్తున్నప్పుడు ..ఒక్కసారిగా ఊపిరి ఆపేసుకు పోవడమే సరైన చర్య గా డిసైడైపోతున్నారు.

ఒక డాక్టర్..ఒక ఇంజినీర్, ఒక సైంటిస్ట్, ఒక పోలీస్ అధికారి, ఒక అయ్యేఎస్, ఒక లాయర్, ఒక ఫేషన్ డిజైనర్, ఒక టాప్ మోడల్..ఇలా – ఏ స్త్రీ ఆత్మహత్య కథ చూసినా – వెనక దాగిన మూల పురుషుడు ఒక్కడే. వాడు – సహచరుడో, లేదా తాళి కట్టిన సొంత మొగుడో! -అతని మూలం గానే చస్తోంది.

మా ఆడవాళ్ళే అంటారు, అంత చదువుకుని అదేం రోగం?, చావడం? అని గభాల్న అనేస్తారు . అఫ్ కోర్స్! ..ప్రేమ కొద్దీ!

కానీ, చదువు వల్ల మెదడు పెరుగుతుంది కానీ, హృదయాన్ని రాయి చేస్తుందా ఎక్కడైనా!

మోసపోయిన స్త్రీ హృదయ గాయాలకు మందింకా కనిపెట్టలేదు- ఈ ప్రపంచంలో! లేకపోతే ఇన్ని మరణాలెందుకు సంభవిస్తున్నాయీ?

స్త్రీకి ప్రేమించడమొకటే కదూ, తెలిసింది.  మోసగిస్తే, ఆ వంచకుణ్ణి  చంపేయాలని ఆలోచన కూడా రాదు.  తాను మరణించడమే సమంజసమనుకుంటోంది. ఎంత పిచ్చిది?! ఇంత అమాయకత్వమా?

ఎందుకనీ?- ఇంతకంటే మరో మార్గం లేదా? వుంటే, ఎక్కడా?

ఒక సారి పెళ్ళై కాపురానికెళ్ళిన ఆడదాని భవిష్యత్తంతా కట్టుకున్న వాడిచేతిలోకెళ్ళి పడుతోంది. ఒక వేళ ప్రేమ వివాహమే అయినా, పెళ్ళి తర్వాత అతనిలో ఎలాటి మార్పులు చోటు చేసుకుంటాయో, అవి ఎలాటి విపత్కరాలకు దారి తీస్తాయో  ఊహాతీతం. రేపు ఏమౌతుందో అంచనా వేయడం ఎవరి తరమూ కావడం లేదు.

సాయిపద్మ కథ చదివాను. కులాంతర వివాహం చేసుకున్న ఆమె జీవితం అత్తవారింట్లో ఎంత దుర్భర ప్రాయమైందనీ!..  తక్కువ కులపు స్త్రీ అని ఆమెని మాటలతో పొడిచి పొడిచి పెడ్తారు.  ఆమె ఎన్నో సార్లు గర్భస్రావాలు చేయించుకుంటుంది. భర్త శాసనంతో. గృహ హింసలలో ఇదొక విభిన్నమైన పార్శ్వాన్ని చూస్తాం.

Sketch290215932

మొన్ననే కదూ చూసాం టీవిలో. –  ఆడపిల్లను కన్నదనే నెపంతో ఆ ఇల్లాల్ని  ఇంట్లోకి రానీక, గెంటేసాడు ఆ మొగుడు. (అందుకు కారణం తనే అని తెలిసి కూడా..)  ఆమె ఎటుపోవాలో అర్ధం కాక,  అత్తవారింటిముందే  బిడ్డను వొళ్ళో పెట్టుకుని బైఠాయించేసింది.

కట్నం తక్కువైందనో, గర్భం దాల్చడం లేదనో, మగ పిల్లాణ్ణి కన్లేదనో, పక్కింటి వాడితోనో, పాలవాడితోనో మాట్లాడిందనో, సంపాదించడం లేదనో, తనని ‘సుఖపెట్టడం’ రావడం లేదనో..ఏదో ఒక మిష తో- అన్ని యుగాల్లోనూ.. స్త్రీని హిసిస్తునే వున్నాడు మగాడు. ప్రియుడో, సహచరుడో, మొగుడో..ఎవరైనా, స్థాయీ భేదాలే తప్ప, శాడిజం లో  అందరూ సమ ఉజ్జీలే. పెద్ద  తేడా ఏమీ వుండబోవడం లేదు.

హుష్!..రోసి పోతున్నారు స్త్రీలు. సొమ్మసిల్లిపోతున్నారు – ఇలాటి సంఘటనలకు.

చిన్న జీవితం. కోరి కోరి ఇంత పెద్ద నరకం కొని తెచ్చుకోవాలా? అసలు తనకు ఇలాటి పెళ్ళి అవసరమా? మొగుడితో  కలసి కాపురం అనే ముసుగు లో ఇంత తన్నులాట తప్పదా?

ఇలాటి జైలు జీవిత బారిన పడకుండా ఆకాశమే హద్దు గా సంతోషం గా బ్రతకలేదా? ఆంక్షా రహితమైన కాంక్షా పూరిత జీవనాన్ని సాగించడానికి ఎవరికో అభ్యంతరాలుంటే అందుకు తనెందుకు తలొంచాలి?

చలం ప్రశ్నే, మరొకసారి తిరిగి సూటిగా అడిగింది. కాదు నిలదీసింది. ఆమె పేరు – వారిజ.

స్త్రీ  ఎంత విద్యాధికురాలైనా, మరెంత ఆర్ధికంగా ఎదిగినా, హృదయాన్ని పెంచుకోలేని, పెంచుకోనీని ..డామినేషన్ జాతి తో వేగలేక వీగిపోతున్న స్త్రీల కన్నీళ్ళని  చదివిందో, లేక చవి చూసిందో!

అగ్నిలో దగ్ధమౌతున్నప్పటి ఆ అబలల ఆర్తనాదలు విని ఘోషించిందో, శొకించిందో..

వారిజ – తీసుకున్న ఈ నిర్ణయం నన్ను చాలా ఆలోచింపచేసింది .

వివాహ ప్రసక్తి కి సున్నా చుట్టి, ఆమె అమ్మ గా మారేందుకు సిధ్ధమైంది. ఒక పరిపూర్ణ స్త్రీ గా మారే దశ మాతృత్వం. పెళ్లి కి భయపడో, మొగుడికి తలొంచో తన ఉన్నత స్థానాన్ని ఎందుకు వదులుకోవాలనుకుందో ఏమో!… ఆమె పెళ్ళి కాని తల్లి కావాలనుకుంది. అయింది. దట్సాల్. ఆమె లైఫ్. ఆమె చాయిస్.

షాక్ అయ్యే వాళ్ళు  అవుతారు.

వాళ్ళు –

స్త్రీని ఇలా వాడుకుని అలా పారేసే వాళ్ళు, పెళ్ళాన్ని పూచిక పుల్ల లా తీసిపడేసే మగాళ్ళు, కించ పరిచడమే ధ్యేయంగా బ్రతికే భర్తలు, నేను లేకపోతే నీ బ్రతుకు అధ్వాన్నమైపోతుందంటూ ..తమని తాము ఆకాశానికెత్తుకునే ఉత్తుత్తి ధీరులు…’ఆ ఆఫ్ట్రాల్ ఆడది. ఎక్కడికి పోతుందీ? నా వల్ల గర్భం కూడా దాల్చాక అంటూ విర్రవీగే మా రాజులకి మహ చెడ్డ రోజులు వచ్చి పడే రోజులున్నాయంటూ ఒక హెచ్చరిక చేసిన ధీశాలి. కాదు. ఢీశాలి. – వారిజ.

మార్టిన్ అంటాడు. రచయితలు రెండు రకాల వారుంటారట. ఒకరు ఆర్కెటెక్ట్స్. మరొకరు గార్డెనర్స్ అని.

వసంత మొదటి కోవకు చెందిన వారనిపిస్తుంది నాకు.

ఇదే కథాంశంతో కూడిన కథ ఏ ఇతర భాషలోనూ వస్తే …చాలా కలాలు తెలుగులో తర్జుమా చేసి ఇంగ్లీష్ లో రెవ్యూలు రాద్దురేమో!…

సారంగ పత్రిక వారు సాహసించకపోతే, ఈ మెరుపునిక్కడ చూసె అవకాశం వుండేది కాదేమో.

రచయిత్రి  లక్ష్మీ వసంత .పి. రాసిన వారిజ కథ చదవంగానే నాకనిపించింది, ఈమె స్త్రీ ని స్త్రీ హృదయాన్ని విరివిగా చదివి, విస్తృత స్థాయిలో పరిశీలన చేస్తోందని..

నేటి తరం స్త్రీ తీసుకోవాలనుకుంటున్న ఒక కొత్త నిర్ణయానికి నాందిగా వారిజ సృష్టి జరిగిందనీ..ఈ ఆధునిక మహిళ  చేత ఒక ముందడుగు వేయించారనిపిస్తుంది. డైనమిక్ లేడీ!

మీరూ ఆమె బాటలో నడవండంటూ రచయిత్రి ఎవరికీ సందేశాలివ్వలేదు.

మగాళ్లంతా చెడ్డ వాళ్ళంటూ …ముద్ర వేయనూలేదు.

కానీ..ఆడది సాహసిస్తే..ఇంత పనీ చేయగలదు…బ్రతుకంతా మగ పోరు, మగని పీడ లేకుండా హాయిగా గడిపేయగలదూ..అదీ..తన సంతానంతో కలసి కాపురం పెట్టేయగలదు, జాగ్రత్త! అని ఒక హెచ్చరిక అయితే చేసింది.

కొన్ని గుండెలు దడ దడ లాడేలా..!

దటీజ్ వారిజ.

వారిజ 

వారెంట్ లేకుండా  మెదడ్ని అరెస్ట్ చేసిన పాత్ర.

అభినందనలు వసంత! అభినందనలు.

ఒక నూతన కథాంశం తో కూడిన రచనన ను పాఠకులకందించిన సారంగ పత్రికా సంపాదకులకు, సంపాదక వర్గానికి కూడా నా అభినందనలు తెలియచేసుకుంటూ..

damayanthi

*

 

 

 

 

 

 

 

 

 

జుమ్మాదాటి, ఇంకో అడుగు- “తలుగు’

 -జి. వెంకటకృష్ణ

 

తలుగు అనేది రాయలసీమలోని ఒక నుడికారం. దానర్థం పగ్గం, బంధం. ఇదే పదానికి ఒక విశిష్టార్థమూ ఉంది. అనంతపురం జిల్లా కర్నాటకసరిహద్దు ప్రాంతంలో తలుగు అంటే “నైవేద్యం’. పండగపూట దేవుళ్లకు తలుగులు పెడతారు. పూజల తర్వాత విస్తరాకుల్లో పెట్టిన ఆహారపదార్థాలను (తలుగుల్ని) ఇంటిపెద్దలు తింటారు.

అయితే వేంపల్లె షరీఫ్ రాసిన “తలుగు’కున్న అర్థం మాత్రం బంధం. కథలోని దౌలా ఒక దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడేకథకు మూలమైన ఒక మూగ ప్రాణి ఎనుము తలుగు తెంచుకుంటూ ఉంటుంది. కథలోని దౌలా ఒక బోరేవాలా. బోరేవాలాలు ముస్లింసముదాయంలో అట్టడుగుస్థాయి వాళ్లు. ఈతచాపలు అమ్ముకుంటూ, గొడ్డుసీలు తింటూ బతికే ఊరిబయటి ముస్లిములు. వాళ్ల బతుకుల్నిచిత్రిస్తూ, వాళ్లపట్ల తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ షరీఫ్ ఈ కథను ఒక నైవేద్యంగా వాళ్లకు సమర్పిస్తున్నాడు.

ఈ కథలో రెండు ఘర్షణల్ని ఎదుర్కొంటాడు దౌలా. గొడ్డుమాంసం అమ్ముతున్నందుకు గొడ్డుమాంసం తినని (ఎక్కువ స్థాయివాళ్లమనిభావించే) ముస్లింల నుంచి అవహేళన రూపంతో ఎదురయ్యే దౌర్జన్యం ఒకటైతే రెండవది- తనకు కోతగొడ్లను వాడుకగా ఇచ్చే శూద్రకులస్థుడైనవెంకటప్ప నుంచి ఎదుర్కొంటున్న దౌర్జన్యం. ఈ రెండింటిమీద దౌలా ప్రతిక్రియనే ఈ కథ. తన బతుకుదెరువు కోసం ఎదురొడ్డి నిలబడ్డమే దౌలాతత్వం.

అస్తిత్వ వాదాలు ఎదిగి వాటి చుట్టూ ఎంతో వెలుగు పరుచుకున్న గత రెండు దశాబ్దాల కాలంలో వినిపించిన నినాదం ఎస్సీ, ఎస్టీ, బీసీమైనార్టీల ఐక్యత. ఇది బహుజనవాదంగా దేశరాజకీయ ఎజెండాగా మారి అంతో ఇంతో నిజం కూడా అయింది. ఇదేకాలంలో మరోవైపుఎదుగుతూవస్తున్న హిందుత్వ ముందు ఈ బహుజన ఐక్యత కుంచించుకుపోయి మాయం అయిపోతోంది. “తలుగు’ కథలో శూద్రకులపువెంకటప్ప, దౌలా అనబడే బడుగు బోరేవాలా ఎదురెదురుగా నిలబడ్డప్పుడు యిద్దరు కూడా ఈ బహుజన ఐక్యతలోకి రావాల్సిన వాళ్లేమోఅనిపిస్తుంది. ఎందుకంటే రచయిత కులం చెప్పకపోయినా కథలోని పెత్తందారు వెంకటప్ప ఒక బీసీగానే కథలో మనకు కనిపిస్తాడు.

small1jpg

అలా చూసినప్పుడు బహుజన ఐక్యతను ఏదైతే ఆశించామో, దేన్నయితే కలగన్నామో అది కూడా ఒక “యుటోపియా’లాగసకలకార్మికులూ ఎట్లా అయితే ఐక్యం కాలేదో (కాలేరని మనం అనుకున్నామో) అట్లాగే సకలబహుజనులూ ఐక్యం కాలేదనిమనకర్థమవుతుంది.

తన గుడిసెముందున్న ఎనుమునూ, దూడనూ దౌర్జన్యంగా వెంకటప్ప తోలుకుని పోయాక, ఇద్దరు మధ్యవర్తులతో వెంకటప్పఇంటిముందరికొచ్చి దౌలా న్యాయం అడిగినప్పుడు పందిరిగుంజకు ఆనుకుని ఉన్న దౌలాను వెంకటప్ప ఎగిచ్చి గుండెలమీద తన్నుతాడు.అప్పుడు దౌలాకు వెంకటప్ప నిజస్వరూపం ఇలా కనబడుతుంది.

” అతను నల్లగా ఏనుగుమాదిరి బలిసి ఉన్నాడు. పైగా ఒట్టి పయ్యిన ఉన్నాడు. నడుముకు కట్టిన తెల్లపంచెను అలాగే కిందికి వదిలేశాడు.అప్పుడే పూజ పూర్తయిన సూచికగా నుదుటిమీద నిలువునా కుంకుమబొట్టు పెట్టాడు. రెండు చేతుల మణికట్లకు వెండికడియాలున్నాయి.వేళ్లకు రెండ్రెండు ఉంగరాలున్నాయి… మెల్లో పులిగోరు మెరుస్తోంది..”

ఇదీ ఈ ఇరవై ఏండ్లలో లేదా అంతకన్నా ముందునుంచో శూద్రకులాల్లోకి పాకిన హిందూ విశ్వరూపం. కులం ఒక నిష్టూర సత్యమై తనకన్నాకింద కులాన్ని తొక్కి పట్టి ఉంచుతూ తాను మాత్రం పైపైకి ఎగబాగుతున్న దౌర్జన్యం. తన కాళ్లకింద ఉన్నది ఒక ముస్లిం అయితే, అందులోనూఒక దళితముస్లిం అయితే అది ఇంకెంత దౌర్జన్యంగా ఉంటుందో ఈ కథ చెబుతోంది.

sharif t shirtరాయలసీమ గ్రామాల ఆధిపత్యాన్ని చిత్రించిన ఎన్నో కథల్లా, రాయలసీమ నుడికారాన్ని పలికించిన ఎందరో కథకుల్లా షరీఫ్ కూడా తనతలుగును తానే తెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఈ కథలో కనిపిస్తుంది. తన సమూహంలోకి తొంగిచూడ్డం ఒక బాధ్యత అయితే,దాన్నుంచి కింది స్థాయిలో తన కళ్లముందు మెదులుతున్న జీవితాలను నెత్తికెత్తుకోవడం .. జుమ్మా నుంచి అతను వేసిన ఒక ముందడుగ్గాభావించాల్సి ఉంటుంది.  ముస్లిం జీవితం ఎదుర్కొంటున్న నిర్దిష్టతల నుంచి సాగి మెల్లగా తన సమూహపు అంతర్గ స్వరాల్లోకి అతనుపాకుతున్నాడు. మంచి కథకుడిగా, జీవితాన్ని నిశితంగా గమనించి దాని పరిణామశీలతను, తర్కాన్ని పట్టుకుంటున్నాడు. గ్రామాల్లో ఏంజరుగుతోందో, ఏ సంస్కృతీ సామాజిక వివక్షతలు జీవితాన్ని ఎటువైపు తరుముతున్నాయో ఈ కథలో షరీఫ్ చిత్రించాడు. ఎదుగుతున్నకొన్ని సమూహాల ఎదురుగా చితికిపోతున్న అనేక సమూహాలు, వాటిలోని అంతర్గత వైరుధ్యాలూ మనల్ని తప్పక ఆలోచింపచేస్తాయి.

రాయలసీమ కథ – ఆ నేల కథే. రాయలసీమ కథ ఆ ప్రకృతితోనే ముడిపడి ఉంటుందని, అందులో మనిషీ – పశువూ కూడా అంతర్భాగమనిగతంలో ఎన్నో కథల్లో నిరూపించబడింది. ఆ జాడనే షరీఫ్ అనుసరిస్తున్నాడు. రామకృష్ణారెడ్డి గారి మనిషీ-పశువూ ఇంతకాలంలో కొత్తరూపంతీసుకుంటే అది తలుగు -తెంచుకోవడమే అవుతుంది! తనను ప్రేమించిన, తనకు ప్రాణంపోసిన దౌలా పక్షమే పశువుది కూడా అని ఈ కథచెబుతోంది. పశుపక్ష్యాదులతో రాయలసీమ జీవితానికి ఉన్న అనుబంధం “మునెమ్మలో’ చెప్పినా,  “మూలింటామె’లో చెప్పినా షరీఫ్ కూడాఆ వారసత్వం వాడేనని తలుగు రూఢీ చేస్తుంది.

*

ధ్వని

ముందుగా ఒక ప్రతిధ్వని :

గొప్ప ” కథ ” … చదివిన క్షణాల్లో ఉద్విగ్నత నీ.. చదివేసాక ఒక నిశ్శబ్దాన్ని .. తర్వాత తలచుకున్నప్పుడల్లా, కొన్ని క్షణాల పాటు , చదివి అర్ధం చేసుకొనే శక్తి ఉన్నందుకు కించిత్ గర్వాన్నీ కలగచేస్తుంది …” కథల మీద ఎప్పుడో రాసుకున్న ఈ వాక్యం గుర్తొచ్చింది “ధ్వని “ కథ చదవగానే-

ధ్వని గురించి రాయాలన్నా కూడా అదే రకమైన ఉద్విగ్నత, ప్లస్ కొంచం భయం కూడా వేసింది.. రాయగలనా అని !

డిస్క్లైమర్  : నేను రాసినవేవీ , నాకలాంటి భావాన్ని కలిగించలేదు .. ఎంత నేర్చుకోవాలో తెలుసుకున్నప్పుడు భలే హాయిగా ఉంది .. జీవితంలో ఇంకా వొంపుకోవాల్సిన విషయాలు గుర్తొచ్చి..!

ధ్వని  వివిన మూర్తి గారి కథ .. ఒక అంధత్వం ఉన్న ముస్లిం లాయర్ కథ , అతని సహాయకురాలిగా పరిచయం అయి, స్నేహితురాలిగా మారి, సన్నిహితంగా మారటానికి తటపటాయించే ఒకమ్మాయి సత్య కధ ..!

అంధత్వాన్ని, ఇస్లాం నా నేను’ లలో ముఖ్యమైనవి అని కథ మొదలెడతారు ఆయన ..! ధ్వని ఎంత అవసరం ? ఒక మనిషిని అంచనా వేయటానికి, కేవలం ధ్వనే ఆధారంగా బ్రతకటానికి అనే … కథలో మాటల్లో చెప్పాలంటే –“ చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్. “ అనే ఈ Quintessential ప్రశ్న తో, ఈ కథ మొదలవుతుంది. చూపుల, కొలతల బేరసారాల్లో జీవితం కోల్పోయిన అమ్మాయి, ఆమె గొంతులో మెత్తదనాన్ని ఆస్వాదిస్తూనే, అనలైజ్ చేసి, శల్య పరీక్ష చేస్తున్న .. ఒకబ్బాయి ..!! నా కళ్ళ ముందు చాలా జీవితాలు కదిలాయి.

“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”- అనుకొనే తండ్రి ఉన్నప్పటికీ, తండ్రి చెప్పాడని , లాయర్ జీవితంలోకి , వస్తుంది .. సత్య, ఆమె గొంతు అంత మెత్తగా .. కానీ, నిశ్శబ్దంగా , నోరు తెరచి చెప్పనప్పటికీ తనదైన నిశ్చితాభిప్రాయాలతో.. సత్య మాట్లాడక పోవటానికీ, లాయర్ కేవలం ధ్వని మాత్రమే వినటానికీ .. తనలోని లోపాన్ని కప్పి పెట్టేంత మాట్లాడటానికీ, తెలివితేటలు కలిగి ఉండటానికీ .. ఓహ్.. ఎన్ని పొరలు ఒకే మనిషిలో ..!

ఇదే కథలో ఎన్నో కాంప్లెక్సిటీలు కలబోసి పెట్టారు వివిన మూర్తి గారు – ఉదాహరణ కి మంచు లాంటి మౌనం కరిగిన సత్య మాట్లాడుతూ – “మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి.” – తన అభిప్రాయాల్ని ఇంత తెలివిగా పాత్ర ద్వారా చెప్పటం ..నాకొక లెర్నింగ్.

అదే సమయంలో , ఇంత తెలివైన అమ్మాయికి , ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించటం , కష్టం తమకొస్తే, బేలగా తయారవటం.. వేరేవాళ్ళ విషయంలో , అనలైజ్ చేసే , సాధారణ మనస్తత్వాన్ని .. సూచిస్తుంది.

సరిగ్గా అలాగే, వివాహానికి ప్రతిపాదించిన లాయర్ .. ఆమె కాదు అన్నట్టు సూచించగానే – తాను గుడ్డివాడు కాబట్టే ఆమె కాదంటోంది అన్నట్టు తొందర పడటం కూడా – సింపుల్ గా కనిపించే కాంప్లెక్స్ మెంటాలిటీ.

తమకి నచ్చింది తీసుకొని, ఆ ప్రకారం జడ్జ్ చేసే లాయర్ మనస్తత్వానికి శర్మ తో స్నేహం తాలూకా ఉదంతం  వొక ఉదాహరణ .

ఈ కథ నాకు కొంత అసూయని కలగజేసింది ..ఇంత బాగా రాయలేక పోయినందుకు. కానీ అదే సమయంలో , ఒక యార్డ్ స్టిక్ లా కూడా పనికొస్తుంది అనిపించింది. కథ నిండా ఉన్న సూక్తులు , కొంత ఇబ్బందిని కలుగజేసాయి.. అవసరం కానీ, కొన్ని కథలో బ్లెండ్ కాలేదు అనిపించింది.

వోల్గా రచనల ద్వారా వివాహ ప్రతిపాదన నాకు అంతగా అర్ధం కాలేదు .. కానీ, సత్య జవాబు మాత్రం చాలా నచ్చింది – “వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. దానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”

వివాహమే కాదు, ఏ బంధమైనా .. వాచ్యార్ధం కన్నా ధ్వని మీద ఆధారపడితే, బోలుతనమే మిగులుతుంది అన్నదానికి ఇంతకంటే, గొప్ప వాక్యాలు రాయబడలేదు అని నాకు అనిపించింది.

ఇంత రాసి, లాయర్ పాత్రకి వొక పేరు పెట్టకపోవటం నాకు నిరాశని కలిగించింది .. కానీ , వికలాంగులకి అనేకాల్లో .. పేరు లేకపోవటం కూడా సమాజం సహజంగా తీసుకొనే విషయం.. కుంటి, గుడ్డి , మూగోడు .. ఇలా .. హ్మ్మ్ !!

చాలా వొంటరితనాలకి .. కేవలం వోటి గిన్నెల శబ్దం లా ద్వనించటమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు .. చాలా ఇజాలకి కూడా ..!

ధ్వని’ – చాలా తెలుగు కథల బోలుతనాన్ని , మెతకతనాన్ని , సున్నితంగా ప్రశ్నించే కధ ..!

-సాయి పద్మ

 ధ్వని 

vivina murthy

  -వివిన మూర్తి

నేను అనేకం. అందులో రెండు ముఖ్యం. నా అంధత్వం. నా ఇస్లాం.

ఈ రెంటిలో ఏది తెలిస్తే ఆమె నోరు మూత పడుతుంది.. ? ఏదితెలిస్తే మరింత పెద్దదవుతుంది.. ? ఆకాశంలో సగమైన మొగవాళ్లు మిగిలిన సగాన్ని తాకటంలో మలిన వాంఛలు తప్ప మరే అనివార్యతలూ ఉండవన్న ఆమె నమ్మకం వమ్మవుతుంది.. ? నన్ను తిడుతున్నావిడ పూలు నా ముక్కుకి తగిలాయి.. నాలాగే పొడుగు అయుంటుంది. నా పొడుగుని, నా వెడల్పాటి రొమ్ముని చూసి అమ్మీజాన్ లో ఆనందం వినిపించేది.. తతిమ్మా వారిలో ఖుదా కీ మర్జీ వినిపించేది. అసంకల్పితంగా ఆ పూల పరీమళాన్ని నా శ్వాస పీల్చుకుంది. ఆ శ్వాసే కాకుండా నా శరీరంలో ఏదైనా భాగం ఆమెకు తగిలి ఉండవచ్చు. అదీ నా అపరాధం.

ఆలోచనలు వేగంగా ఒకదాని మీద నుంచి ఒకటి దొర్లుతున్నాయి..
నేను ప్రతిస్పందించకముందే ఆమె బస్సులోని జనాన్ని, బహుశా మగ జనాన్ని నా దుశ్చర్యకు వెంటనే ప్రతిస్పందించమని వేడుకుంటోంది. అటునున్న జనానికి నా నల్ల కళ్లజోడు సందేహం కలిగిస్తోందనుకుంటాను. చేతిలో ఓ చప్పుడు కర్ర ఉండి ఉంటే వాళ్లకి ఆ సందేహం లేకుండా పోయేది.
ఆమె తిట్లకూ, జనం సందేహాలకూ, నా ఆలోచనలకూ ముగింపునిస్తూ… ఓ మెత్తని చెయ్యి, అంతకన్న మెత్తని స్వరం, ఆ వ్యక్తిత్వం నిండుకూ నింపిన గులాబి అత్తరులోంచి అప్పుడే బయటపడ్డట్టు… నాకు అల్లా ప్రసాదించిన నాలుగు జ్ఞానేంద్రియాలలో మూడింటిని ఒకేమారు ఉత్తేజితం చేస్తున్నట్లు… ఇక్కడ కూర్చోండి.. అని కూర్చోబెట్టింది.
“మంచిపని చేసావు కన్నా.. కూర్చోండి లాయరు గారూ..”.

2.

ఆ మెత్తదనం పేరు సత్య. ఆ సత్యను లోకంలోకి తీసుకు రావటమే కాకుండా, నా జ్ఞాపకాలలోనే నిక్షిప్తమై పోకుండా నా జీవితంలో కొనసాగే వీలు కల్పించినవాడు సూర్యచంద్రవర్మ.
గుడ్డి లాయరుని. ఎవ్వరైనా గుర్తుంచుకుంటారు. వర్మ నన్ను నా కారుతో సహా గుర్తుంచుకున్నాడు. మీరీ రోజున కారులో రాలేదేం- అదీ తొలి ప్రశ్న. కారులో వస్తుంటాను. రాగలను. రాగలపాటి అతి కొద్దిమంది భారతీయ ముస్లింలలో నేనూ ఉన్నాను. కాని నాకు బస్సు ఇష్టం. ధ్వనులు. చప్పుళ్లు. వాసనలు. స్పర్శలు. నవ్వులు. కబుర్లు. లోకం నాచుట్టూ వెచ్చటి దుప్పటి కప్పుతున్నట్లుంటుంది. అమ్మీజాన్ ఇచ్చిన ఆలోచనల చేతివేళ్లతో లోకాన్ని తాకుతున్నట్టుంటుంది.
కానీ- ఒక్కటే ముల్లులా పొడుస్తుంటుంది. అది లోకం తాలూకు జాలి.
కోర్టుకి వెళ్లి తొలి వకాలతు అందిస్తున్నపుడు జడ్జి –అయ్యో పాపం- అనుకునే ఉంటాడు. ఆ –అయ్యో పాపం- తనపై –అయ్యో పాపం-గా మారుతుందని నాకు కేసు అప్పగించిన వాడు నిశ్చితంగా అనుకున్నాడు. నాకందిన ధ్వని వాస్తవమై పోయింది.
నే దిగవలసిన చోటు వచ్చింది. నా సెల్ లోని జీపియస్ హెచ్చరిస్తోంది.
అందాకా కబుర్లు చెపుతున్న వర్మ నేనూ, సత్యా ఇక్కడే దిగాలి అని ప్రకటించి నా వెనకే దిగాడు. ఆ మెత్తటి చెయ్యి నాకు సాయంగా నా చేతిని పట్టుకుంది. ఆ చేతిని విదిలించెయ్యాలని…. మర్యాద నా చర్యను విదిలించి వెయ్యాలని..
కిందకు దిగాక-
“నేను పట్టుకోటం మీకు నచ్చలేదు.”
“మీరు పొడుగా?”
“ఏం- ఎందుకూ”- మెత్తదనం నశిస్తున్న గొంతు.
అదెందుకు నశిస్తున్నదో ఆ తర్వాత అర్ధమయింది. మన సంభాషణలో మనని మనం చెప్పుకోటానికి వెచ్చించే సమయం ఎదుటివాళ్లని మాటలని గ్రహించటానికి వెచ్చించంట. ఈ మాట నాకు అర్ధమయ్యేటట్టు ఆ తర్వాత కాలంలో సత్యే చెప్పింది.
“తెల్లవాళ్లకి నల్ల వాళ్లని చూస్తే లోకువ. పొడుగు వాళ్లకి పొట్టి వాళ్లని చూస్తే లోకువ. కాకపోతే జాలి.”
పద నాన్నా పోదాం.. ఆమె వెళ్లి పోతున్నట్టుంది మెత్తదనాన్ని వదిలేసినా వెంటబడుతున్న గొంతుతో.
ఉండమ్మా ఉండు.. అంటూ వర్మ కూతురుని వెంబడించాడు.
నాకా క్షణంలో కలిగినది ఆమె అనాగరిక ప్రవర్తనపై కోపం. నేను చెప్పినది కేవలం స్వానుభవం నుంచి ఏర్పరచుకున్న ఓ అభిప్రాయం. నేనలా నా అభిప్రాయాన్ని చెప్పటం నాగరికమేనని ఆ క్షణాన నా నిశ్చితాభిప్రాయం.
అంతటితో ముగిసిపోయే కథని వర్మ ఆరోజు మధ్యాహ్నం నన్ను కలిసి పొడిగించాడు.

3

సత్య జీవితంలో ఆమె ఎత్తు చాలా కష్టాలు తెచ్చిపెట్టింది. కోర్టు గడపను ఎక్కించింది. ఇంటర్నెట్ ద్వారా కుదిరిన సంబంధం. వధువు వివరాల్లో ఐదు అడుగులు అని రాసాడు వర్మ. ఫొటో చూసాడు. నచ్చింది. ఇంటికొచ్చి చూసుకున్నాడు. నచ్చింది. కులం గోత్రం డబ్బూ దస్కం అన్నీ సరిపోయాయి. అందరికీ అన్నీ నచ్చాక అడ్డేముంది.. పెళ్లై పోయింది. మూడు నెలల కాపురం వెలగ బెట్టాక అనుమానం వచ్చింది. కొలిచాడు. నాలుగడుగుల పదంగుళాలే ఉంది. దగా చేసారని కోర్టుకెక్కాడు. వివాహం చెల్లదని రద్దు చెయ్యాలనీ వాదన.
“నిజంగా..”
“ఈరోజు వాయిదా..”
“పిచ్చాడులాగున్నాడే..”
“నేను మాత్రం? ఉన్నదున్నట్టు వెయ్యొచ్చు గదా..”
“విడాకులకి ఆ కారణం చెల్లదు..”
“అతను విడాకులు అడగటం లేదు. 1955 హిందూ వివాహ చట్టం కింద ఫిర్యాదిని ప్రాడ్ చేసి వివాహంకి ఒప్పిస్తే అది చెల్లదని వాళ్ల లాయర్ వాదన.”
“-కోర్టు స్వీకరించిందా..”
“ఆయన గట్టివాడు. మా అల్లుడి దగ్గర మస్తుగా ఉంది డబ్బూ, పట్టుదలా..”
వర్మ చాలా వషయాలు చెప్పాడు.
మీడియా ఈ కేసుకి బాగా ప్రాధాన్యత ఇచ్చింది. చర్చ జరిపింది.
రెండు అంగుళాలు ఎక్కువ అని బొంకటం ఆడపిల్ల తండ్రికి శుక్ర నీతి వంటిదే అన్నారు కొందరు. పెళ్లి కోసం ఆడిన బొంకుకి పాపం ఉండదట. పేద్దపేద్ద అబద్దాల మధ్య బ్రతుకుతున్నాం- సముద్రంలో కాకిరెట్ట ఈ చిన్ని అబద్దం- అన్నారు సాధు నైతిక దృష్టితో కొందరు.
చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అబద్ధమే. తప్పు తప్పే. చట్టపరంగా ఇది నేరంగా తేలినా మానినా తప్పే. కొన్ని తప్పులకు ఇహలోకంలోనే అనుభవిస్తాం. ఇక్కడ తప్పినా అక్కడ తప్పదు- అన్నారు కఠిన నైతిక దృష్టితో కొందరు.
ఎత్తు అతగానికి అంత ముఖ్యమైతే పెళ్లికి ముందు ఎందుకు కొలుచు కోలేదు. ఒక వస్తువును కొనుక్కునే ముందే దాని నాణ్యతనూ కొలతలనూ చూసుకోవటం వినియోగదారుడి బాధ్యత కదా – అని కొందరి ప్రశ్న.
ఒక వస్తువు తయారీ లోపముంటే దానిని వాడిన తర్వాత నిరాకరించటం వినియోగదారుడి హక్కు- అన్నారు కొందరు సమాధానంగా.
ఆడది వస్తువా- వస్తు నాణ్యతా పరిశీలన స్త్రీకి యుగయుగాలుగా అమలు జరుగుతూనే ఉంది – అన్నారు లింగ వివక్షతను లేవనెత్తుతూ కొందరు. అసలు కొనుగోలు అన్నది జరిగితే సొమ్మిచ్చి కొనుక్కునేది ఆడదే- అని కూడా చేర్చారు.
అందుకేగదా ఈనాడు చట్టాలన్నింటికీ స్త్రీ పరమైన వివక్ష, ప్రత్యేక రక్షణ.. ఈ కేసులో కూడా చట్టం మగవానికి న్యాయం చెయ్యదు- అన్నారు కొందరు.
దృశ్య, అక్షర మాధ్యమాలు రెండూ కొంత కాలం చర్చించి పాల్గొన్నవారికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాయి.
వర్మ చెప్పిన దానికి నా వివేచన జోడించి విన్నాను.
“మీరేమంటారు-” అన్నాడు వర్మ.
“నేను ముస్లింని. నాది ఇస్లాం”.- అన్నాను.
ఆయనను కంగు తినిపించాలని నేను అనలేదు. కాని ఆయన గట్టిగా ఆశ్చర్య పోయాడని – అంటే!?- అన్న ప్రశ్న వంటి స్వరం వినగానే గ్రహించాను.
“నాపేరుని బట్టి మీకు నా మతం తెలుసు. ఇస్లాం తెలుసా..”
“చెప్పండి..” అన్నాడు.
“విశ్వంలోని ప్రాణులూ, పదార్ధాలూ ముస్లింలే. అల్లా – ఆ విశ్వ ప్రభువు – ఆజ్ఞాపాలనకి లోబడి ఉంటాయి. ఆ దైవానికి స్వయంసమర్పణే ఇస్లాం… లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అన్న కలిమాను విశ్వసిస్తే ఇదంతా మరోలా అర్ధమవుతుంది..”
“ఇలాంటి విశ్వాసాలు హిందువులకీ ఉంటాయి. అన్ని మతాలకీ ఉంటాయి..” అన్నాడు మధ్యలోనే.
“మీరు హిందువులు కారా..”
“- నేను నాస్తికుడిని. అయినా నావిశ్వాస అవిశ్వాసాలకి దీనితో సంబంధం లేదు. మీరు అనేదానికీ నా కూతురు పరిస్థితి మీద మీ అబిప్రాయానికీ సంబంధం నాకు పూర్తిగా బోధ పడటంలేదు…”
“కొంత బోధ పడిందిగా.. అదేంటి..” అన్నాను
“లాయర్లు వాళ్ల మాటలు ఎదుటి వాళ్ల నోళ్లలో కుక్కి అదే కక్కేట్టు చేస్తారుట.. ఏముంది., అంతా కర్మ అనుకుని అనుభవించాలి.. అంతేగదా ఏ మతమైనా చెప్పేది.” అంటూ నవ్వి లేచాడు. వెళ్లేముందు నా చిరునామా పత్రం ఇచ్చాను. కాని అది అతను ఉంచుకుంటాడనీ ఉపయోగిస్తాడనీ అనుకోలేదు.
నాకు చాలా చికాకు కలిగింది. నేను అందరినీ అర్ధం చేసుకోవాలి. నన్ను అర్ధం చేసుకునీ ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చెయ్యరు. కావాలంటే జాలి పడగలరు.. ముస్లిం షరీఅత్ ఇలాంటి కేసు ఎదుర్కుంటుందా.. వివాహం ఒక ఒప్పందంగా భావించే సమాజానికీ, అది ఒక దైవనిర్ణయంగా భావించే సమాజానికీ – స్త్రీ ఎదుర్కొనే రక్షణ సమస్యలో ఉన్న తేడాపాడాల గురించి మాటలాడాలని నా ఆలోచన. ఒక నాస్తికుడికి హిందూ ఆస్తికుడి మీద ఉండేపాటి సహనం కూడా ముస్లిం ఆస్తికుడి మీద ఉండదు.
కాని ఆ గొంతు మెత్తదనం నన్ను వెన్నాడుతూనే ఉంది.
అమ్మీజాన్ విని ఫొటో లోంచి అంది.. చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్.

4

నా మొబైల్ నాకు వచ్చిన ఈ-మైల్స్ చదివి వినిపిస్తోంది. ఆ సమయంలో వచ్చాడు వర్మ.
సత్య ఆత్మహత్యా ప్రయత్నం చేసింది… వర్మ చెపుతుంటే ఆయన గొంతు వణుకు తెలుస్తోంది.
మరణం ఎవరిదవనీ.. ఆ వార్త బాధ కలిగిస్తుంది. ఆ వ్యక్తులతో మనకున్న దగ్గరతనాన్ని బట్టి ఆ బాధ తీవ్రత ఉంటుంది. నాకు సత్యతో ఉన్నది స్వల్ప పరిచయమే. చెపుతున్నది కన్నతండ్రి కనక మరికొంత కదలిక. కాని నాలో అంతకన్న ఎక్కువ కదలికకి కారణం? ప్రతి ఒక వ్యక్తికీ మనకీ చెందిన బృందం ఒకటుంటుంది. దానికో పేరూ ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతం, రాష్రం, దేశం .. ఇలా ఎన్నో. ఒక్కోమారు ఈ బృందాలన్నింటికీ అతీతంగా కూడా కదులుతాం. అప్పుడు మనని కదిపేది ఏది.. కలిపేది ఏది.. అన్న ప్రశ్న వస్తుంది.
ఈ ప్రశ్నలూ, ఆలోచనలూ ఆ క్షణంలో లేవు ఒక ఉద్విగ్నత తప్ప.
ఆయన వెంట వెళ్లి పోలీసులతో, వైద్యులతో మాట్లాడాను.
ఆత్మహత్య పాపమైతే దానికి తీర్పు దినాన మాత్రమే జవాబు చెప్పుకోవలసి వస్తే సమస్య లేదు. అది నేరం అంటుంది చట్టం. బతికి బయటపడ్డ వారిని నేరస్తులు అంటుంది. బతకటంలో విఫలమై చావబోయి, చావులో విఫలమై నేరగాడు అయిపోతాడు పౌరుడు.
సత్య ఆస్పత్రి నుంచి, చట్టం నుంచీ బయట పడటంలో చెయ్యగలిగినది చేసాను.
ఆ తర్వాత ఒకరోజు వర్మ నాకు మా ఇంటివద్దకి వచ్చి మరో ఆభ్యర్ధన చేసాడు.
“తప్పు నాది.. శిక్ష తనకి..” అన్నాడు ఆరంభంలో.
“నేరం నిర్ధరించటం.. తీర్పు ఇవ్వటం అంతా మీరేనా.. ” నవ్వాను.
నవ్వితే బాగుంటానుట. నా బుగ్గ మీద సొట్ట పడుతుందిట. అదీ పడవలసిన చోట పడుతుందిట. ఆ సమయంలో కళ్లజోడుతో ఉన్నాను. తెల్లటి కుర్తా పైజామాల్లో ఉన్నాను. విశాలమైన గదిలో ఉన్నాను. ఆగది విశాలమైన బంగ్లాలో ఉంది. ఆ బంగ్లా విశాలమైన జాగాలో అందంగా పెంచుతున్న తోటలో ఉంది. అది అలాంటి తోటలు జాగాలూ కలిగిన భవనాల వరసలో ఉంది. కనక నేను బాగా ఉన్నాననిపించే నేపథ్యంలో ఉన్నాను.
“మీరనేది.. ” అంటూ ఆగాడు.
“రెండంగుళాలు ఎక్కువ చెప్పటం అనే నేరం మీరు చేసారు. కోర్టుకేసు.. వివాహ భగ్నం.. ఆత్మహత్య.. ఆమెకు శిక్షలు.. అదీ మీరన్నది.” అన్నాను.
కొంతసేపు మాటలాడలేదు. మళ్లీ అడిగితే అన్నాడు..
“మీరు కళ్లతో చూడలేక పోయినా మీకు అంతర్నేత్రాలు ఉన్నాయి. నా కన్న ఎక్కువ చూడగలరు. ”
“మరీ గాలి కొట్టకండి. పేలిపోగలను. ”
నవ్వులు. నవ్వులు.
“సత్యకి మీ స్నేహం ధృఢత్వం ఇస్తుంది. ”
ఆయన అంటున్నది ఆ క్షణంలో హాయిగా అనిపించింది. ఆమె మెత్తని గొంతు ఆ క్షణంలో మరింత మెత్తగా జ్ఞాపకాలను తాకింది.
అతను వెళ్లిపోయాక అది మరీ అంత మెత్తనా అనిపించింది.
ఆలోచిద్దామంటే నాకు రాని సత్య మెయిల్ చదివి చెప్పే శక్తి నా మొబైల్ కే కాదు నాకూ లేదు.

10951421_10155158252645363_7689865125180948401_n

5

వర్మ తరచు ఫోన్ చేస్తున్నాడు. కలుస్తున్నాడు. ఒకటి రెండు మార్లు సత్యనీ తీసుకు వచ్చాడు. ఒకటి రెండు మాటలు తప్ప సత్య దాదాపు మౌనంగానే ఉంది. ఆ గొంతు మెత్తదనం మనసుని స్పృశిస్తూనే ఉంది. మనసు సత్యలో ఏదో విశేషం ఉందని నమ్మించజూస్తోంది.
దైవం మీదా, విధి మీదా కించిత్తు కూడా విశ్వాసం లేదుట. తన విశ్వాస రాహిత్యంతో భార్యని బాధించాడట. కుటుంబం లేకుండా చేసాడుట. కూతురికి దిక్కు లేకుండా చేసాడుట. లోకవిరుద్ధంగా ఆలోచించే వాళ్లు లోక విరుధ్ధంగా జీవించ గలగాలిట. లోపలి ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, బైట ప్రపంచం ముందు అదృశ్య శృంఖలాలతో జీవించేవాళ్ల కన్న నిస్సహాయులు లేరట. – వర్మ వస్తువు విశ్వాస రాహిత్యం కాదు. దానివల్ల ఏర్పడే పరిస్థితి.
“ ఇప్పుడు విశ్వాసం కలిగించుకోవచ్చు గదా వర్మ గారూ”
“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”
“అవిశ్వాసులు ఎందరో విశ్వాసులు అయినట్టు విన్నాను. ”
“కాదు. నాస్తి అన్న విశ్వాసం నుంచి అస్తి అన్న విశ్వాసానికి మారారు. అది సాధ్యం. ఆలోచనా ప్రవృత్తితో సత్యం ఏదని వెతికేవారికి ఏ విశ్వాసమూ ఉండదు. ”
“నాకు అర్ధం కాలేదు. నేను ఒప్పుకోను. ”
“మీరు ఎలా భావించినా ఫరవాలేదు. నా జీవితం గడిచి పోయింది. సత్యకింకా చాలా బ్రతుకుంది. నా ఆలోచనల ప్రభావం తన మీద ఉండుంటే ఈ పని చేసుండేది కాదు. .. ” ఆయన గొంతు రుద్ధమైంది. “ పైగా నిరాధారం చేసింది. మీరు ఆమెలో విశ్వాసం కలిగించాలి. ” ఆ గొంతులో ఓటమి, ధృఢత్వం, ఆశ మూడూ జమిలిగా వినిపించాయి.
నా మాటలను ఆయన కొనసాగనివ్వలేదు.
ఆ మెత్తని గొంతు స్పర్శను ధ్వనించబోతోందా…

6

సత్య అసత్యపు భ్రాంతిలోంచి నా జీవితంలోకి చాలా నెమ్మదిగా ప్రవేశించింది. నేను మాటలాడేవన్నీ వినేది. ప్రశ్నలు లేవు. వ్యాఖ్యానాలు లేవు. ఆమె ఏమనుకుంటున్నదీ ముఖంచూసి తెలుసుకునీ అవకాశం నాకు లేదు. స్వరం విని తెలుసుకునీ అవకాశం సత్య ఇచ్చేది కాదు. ఒక మార్మికమైన మౌనం ఒకటి రెండు మాటలై గుండెలను తాకి ఏదో బలిష్టమైన ఉచ్చులో నన్ను బంధించేది. ఆమె తండ్రి ప్రోత్సాహం తోనే నన్ను కలుస్తోంది. నా మనసే నన్ను ప్రోత్సహిస్తోంది. చెప్పిన కారణం ఆమెకి జీవించే ఉత్సాహమివ్వటం, దైవంమీద విశ్వాసం కలిగించటం. ధ్వనించే కారణం జీవితమివ్వటం. నాస్తికుడికి మతం అడ్డయే అవకాశం లేదు. మెజారిటీ మతస్తుడికి తన అభ్యుదయ ప్రదర్శనకి ఒక అవకాశం కూడా.
ఒక గుడ్డికీ, ఒక మూగకీ ఏర్పడని సంపర్కం అన్నంత బాధ.. నిరాశ.. కలిగేది అప్పుడప్పుడు..
“మీరు జవాబివ్వటం లేదు. ” అన్నాను నిరాశ కప్పి పుచ్చుకుంటూ కొన్నాళ్లయాక ఒకరోజు.
“ప్రశ్నలుంటే జవాబులుంటాయి సార్.. ” ఆ స్వరం మరింత మెత్తగా.. కొద్దిగా జీవం నింపుకుని.. తొలిసారి.
“నేనన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నానంటారు.. ”
“నోరులేని లాయరు ముందు ఛాన్సు దొరికిందిగదా అని రెచ్చిపోయే పబ్లిక్ ప్రాసిక్యూటర్లా.. ”
నవ్వులతో మంచు కరిగింది..
మరికొన్ని మాటలయాక..
“ముందుగా మీకు నా కృతజ్ఞతలు. ”
“దేనికి?”
“మా నాన్న నా ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం ఫలానా అని చెప్పాడు. మళ్లీ అలా జరక్కుండా ఉంచే విరుగుడు మీ వద్ద ఉందని తను నమ్మాడు. మిమ్మల్ని నమ్మించాడు. మీరు చాలా శ్రద్ధగా మీరు తీసుకున్న బాధ్యత నిర్వహిస్తున్నారు. అవునా? ”
“మీరు చెప్పేది చెప్పండి. ”
“మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి. ఆయన ఇటీవల మాటలనూ, ప్రవర్తననూ గమనించితే నా చర్య ఆయనను ఎంత షాటర్ చేసినదీ నాకు అర్ధమవుతోంది. పోతే.. ”
“చెప్పండి.. ”
“మీతో కలిసిన ఈ నాలుగైదు పరిచయాలలో మీమీద మా నాన్న ఇంప్రెషన్ తప్పు కాదనే అనిపించింది. నిజంగానే మీరు మంచివారు. మనుషులు. నాకు మీరో సాయం చెయ్యగలరా?”
“చెయ్యగలిగినదైతే తప్పక చేస్తాను. ”
“మా నాన్నతో చెప్పండి. నేనిక అలాంటి ప్రయత్నం చెయ్యనని. అవసరమైతే ఆయనకి నమ్మకం కలగటానికి .. అంటూ ఆగి.. నాకు దైవం మీద విశ్వాసం కలిగిందనో – కావాలంటే – కలిగించాననో చెప్పండి. నన్ను కౌన్సిలింగ్ చేసే బరువు మీకూ తగ్గుతుంది. ”
“నన్ను అబద్ధం ఆడమంటారు. ”
“అహఁ .. అబద్ధమని కాదూ.. ”
“మీరు అంటున్నది అదే .. నేను అసత్యం ఆడను. మీరు ఆడండి ప్లీజ్ బడుద్దాయి గారూ .. అని. ”
సత్య మాటలాడలేదు.
“మీ నాన్నగారు నా ఊహ ప్రకారం భిన్నంగా జీవించారు. వివాహం చేసుకున్నారు. మిమ్మలని పెంచారు. మీరు అందరి కన్న భిన్నంగా ఉండాలని బహుశా ఆశించారు. వివాహం విషయంలో మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని అలాంటి మనిషికి అనిపించే ఉంటుంది. చివరికి”..
అంటూ ‘నాబోటి గుడ్డిపోచ మీద ఆధారపడటం కూడా ఆయన భిన్న ప్రవర్తనకి సంకేతం’ అంటూ నోటి చివరి వరకూ వచ్చిన మాటను తుంచేసి కొనసాగించాను.
“ఆ మాట తండ్రిగా ఆయన చెప్పటం సరే ధ్వనించటానికి కూడా సాహసించలేక పోయుంటారు. తనే పెళ్లి ప్రయత్నాలు చేసారు. ఫలితం ఇలా జరిగింది. అవతల వాడు ఏదో వంక పెట్టి మిమ్మలని కాదన్నపుడు మీరు ఈ నీచుడు లేకపోతే నేను బ్రతకలేనా నాన్నా విడాకులు ఇచ్చేద్దాం అనుండాలి. అదీ మీరు చెయ్యలేదు. కోర్టు.. కేసు.. ఎక్కడ ఎందుకు మీ స్థైర్యం దెబ్బతిందో.. చివరకు ఇలాంటి ప్రయత్నం చేసి ఆయన నడుం విరగ్గొట్టారు. నాబోటి అపరిచితుడితో మీరన్నారే ఆ కౌన్సిలింగ్ .. దానికి కూడా మీరు ఒప్పేసుకున్నారు. మీ అంతట మీరు అబద్దం ఆడరు. నిజం.. మీలో అదొకటి ఉంటే.. చెప్పరు. ఆయనా, చివరకి ఏ సంబంధం లేని నేనూ అబద్ధం చెప్పాలి.. ”
నేను చెప్పవలసింది అయిపోయింది.
చాలాసేపు మౌనం.
“నేను వెళ్తాను సార్”
“కోపం వచ్చిందా? ”
“నాకు నేనే తేల్చుకోవలసిన విషయం స్పష్టం చేసారు.. నాకు సమయం కావాలి.. ”
బయలుదేరుతోంది సత్య.
“ ఒక్క నిమషం.. ” అంటూ బిల్లు చెల్లించి కాఫీడే నించి బయటకు వచ్చి కారువైపు నడుస్తున్నాను. ఆగి “నాతో వస్తారా మీకు కావలసిన చోట దింపుతాను.. ” అన్నాను.
“నాకు వేరే పనుంది.” అంది.
“అనుకున్నాను.. ” అన్నాను నవ్వటానికి ప్రయత్నిస్తూ.
సత్య తొలిసారి స్పర్శించింది.
“మీరీ రోజున నాకో విషయం చెప్పి గురువు అయారు. ‘ధ్వనించ కూడదూ చెప్పాలీ’ అన్నారు. నేనీ దేశపు ఆడదాన్నిగదా- ధ్వనించటమే మా బ్రతుకు. మీరూ అది పాటించాలి. నేనేమన్నానో అదే మీరూ తీసుకోవాలి. ”అంది మెత్తటి నవ్వుతో.
ఆ నవ్వూ, గొంతూ, స్పర్శా నన్ను వెన్నాడుతున్నాయి.
నా సారధి నన్నొకడినే తీసుకుని బయలుదేరాడు.

7

నెల పైగా గడిచింది.
ఈ మధ్యలో చాలా జరిగిపోయాయి. సత్య పరస్పర అంగీకారం మీద విడాకులకి ఒప్పుకుంది. ఆమె ఎత్తు మీద మీడియాలో దాని చర్చతో రచ్చకెక్కిన సత్య పరిస్థితిని వాడుకుని వేధించటానికి ప్రయత్నించి ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి కారకుడైన సహోపాధ్యాయుని మీద యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వాళ్లు వెంటనే చర్య తీసుకోకపోతే తోటి ఉపాధ్యాయులను, స్త్రీ సంఘాలనూ కూడగట్టుకుని అతని మీద చర్య తీసుకునేట్టు చేసింది. నిర్భయంగా స్కూలుకి వెళ్లడం మొదలెట్టింది.
నా మాటలు తన కూతురి మీద చాలా ప్రభావం చూపించాయని వర్మ అన్నాడు.
నిజానికి నేను కూడా సత్యలో అంతటి మార్పుని ఊహించలేదు. దానికి కారణం నేనే అని కూడా నాకు అనిపించలేదు. అల్లా దయామయుడు అనుకున్నాను.
నన్ను తాకే ఆ మెత్తదనం కేవలం ఆమె గొంతులోనే కాదు ఆమె నిండుకూ ఉంది.
మీరు తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నారు. అందొకమారు.
“చిన్న సవరణ. చదువుకోలేదు. విన్నాను. మా నాన్నగారు సంస్కృత పండితులు. ఎందరో తెలుగు రచయితలను వినిపించారు. శాస్త్రి నా ప్రాణస్నేహితుడు. నా అమ్మీజాన్ బాబాజాన్ నేనీ స్థితికి రాటానికీ, నేనిలా నించోటానికీ ఎంత కారకులో అంత కారకుడు. వాడు నాకూ సాహిత్యానికీ నా చదువుకీ ఒక ఆధారం. ”
శాస్త్రి గురించి కబుర్లు. అమ్మీజాన్ బాబాజాన్ ఏక్సిడెంటు. పిఠాపురం నుంచి హైదరాబాదు మకాం మార్పు. “నా ఈ అంధత్వానికి కారణం నా తలిదండ్రులు అన్నదమ్ముల బిడ్డలు కావటం – అన్నాడోమారు శాస్త్రి. దానికి అమ్మీజాన్ జవాబివ్వమంది. ఇచ్చాను. మీ తలిదండ్రులు అక్కాతమ్ముళ్ల పిల్లలు కదా నీకెందుకు రాలేదు- వాడా వెంటనే నిజమే గదా- అన్నాడు. అదీ మా శాస్త్రి. ” అన్నాను. నవ్వింది సత్య. వినిపించింది. మనసంతా కంపించింది.
“ఎందుకో అంత నవ్వు-” అని అడిగాను. మళ్లీ నవ్వింది. మరింత సత్యంగా.. స్వచ్ఛంగా..
“ధ్వనించకూడదు. చెప్పాలి. ”. అన్నాను. నా గొంతులో నాకే వశంకాని మాదకత.
“సరే.. చెప్తా. నా నవ్వు మీరు ఎంజాయ్ చేసారు. ఐనా ప్రశ్న వదలలేదు. అదీ రెండో నవ్వు కారకం. మీ తర్కాన్ని ఒప్పేసుకునీ వాళ్లుంటే మీకు దగ్గరవుతారు.. మీ శాస్త్రిగారిలా. ”.
నవ్వులు..
సత్యని కలిసినపుడల్లా రెండు ఉత్తుంగ తరంగాలు నాలో ఎగసి పడేవి. ఆమెతో జీవితం నా బ్రతుకును పూరిస్తుందన్నదొక భావ తరంగం. ఆమె నాకు దక్కదన్నది మరో తరంగం. ఒకదాని వెంట మరొకటి. దక్కినా కారణం నా స్థితీ కావచ్చు, ఆమె స్థితీ కావచ్చు. అప్పుడామె దక్కినట్టా దక్కనట్టా- అమ్మీజాన్ అనేది- నమ్మి మోసపో కాని నమ్మక కోలుపోకు. అమ్మ మాట ఈమాన్. కాని నమ్మకం- అందులోనూ తోటి మానవుల మీద- అందులోనూ నా స్థితిలో మరింత కష్టం. అపనమ్మకాన్ని రక్షణ కవచం చేసుకుంటుంది ఆశ.
శాస్త్రితో ఫోనులో మాటలాడాను. ప్రయత్నించు. తప్పులేదు. అనొచ్చు. నేనొస్తాను. మాటాడతాను. అనొచ్చు. రెండూ అనలేదు. ఆశ పెట్టుకోకు. నువ్వు భగ్నమైతే నేను భరించలేను. అన్నాడు. అంటే వాడుకూడా హిందువులా మాటలాడాడు. అమ్మీజాన్ ఉంటే వాడి మాటలను మరో కోణంలో చూపించగలిగేదేమో..
చివరికి నేను నన్ను పట్టుకోలేక పోయాను.

8

అప్పటికి ఏడాదికి పైగా గడిచి పోయింది.
ఓరోజు కావాలనే ఓల్గా సాహిత్యం మీదకి మరలించాను సంభాషణను. ఆపేరు వింటే సత్యలో ఉత్తేజం అనేకమార్లు గమనించాను. సంభాషణ వివాహం మీదకు తప్పనిసరిగా మరలుతుందని నా ఆశ.
-నవలలో ప్రతిపాదితమైన స్వేచ్ఛ, ఓల్గా ఆశించే స్వేచ్ఛ, స్త్రీలకవసరమైన స్వేచ్ఛ వేరంటారు మా నాన్న. ఆయన నవలగురించీ, రచయిత గురించీ, సమాజం గురించీ విడి విడిగా మాటలాడతారు. ఓల్గా అంటే ఆయనకు ప్రాణం. స్త్రీల సమస్యకి పరిష్కారం కేవలం ఆర్దిక స్వావలంబన మీద లేదన్న భావన ఓల్గాని చదివినపుడు తనకు కలిగిందిట… సత్య ఉత్సాహంగా చెపుతోంది.
నాకు చేదుమాత్ర మింగినట్టుంది.
నాదృష్టిలో ఓల్గా నేటి చదువుకున్నఆడపిల్లల వివాహ ఆశలకు ఒక ప్రేరణ. ఆవిడ ప్రశక్తి వస్తే ఎటువంటి ఆడదైనా వివాహిత అయితే తన జీవితం గురించి, అవివాహిత ఆయితే తన వివాహం గురించి తన అబిప్రాయాలను ఎంతోకొంతైనా బయట పడేస్తుందని నా నమ్మకం. ఆమె సాహిత్యంగురించి తన అభిప్రాయాలను తండ్రి ఆలోచనలను కలగాపులగం చేసేసి మాటలాడేస్తోంది సత్య.
నా సహనం తెగిపోయింది. నేను దానిని తెగ్గొట్టాల్సినంతటి ఉద్రేకం వచ్చేసింది.
“జ్ఞానోదయాన్ని నిర్వచిస్తూ కాంట్ దానికి కావలసిన ప్రధాన అవసరం స్వేచ్ఛ మాత్రమే అంటాడు. అత్యున్నత మానవ సమాజం ప్రజలకు దానిని కల్పించగలదంటాడు. ఓల్గా గారు చెప్పే స్త్రీస్వేచ్చ సరైన సమాజంతోనూ, పురుషుల స్వేచ్ఛతోనూ సంబంధం లేకుండా ఊహించటం సాధ్యంకాదు.”– అన్నాను.
ఆ తర్వాత జరిగిన సంభాషణలో సత్య మాటలాడినవేవీ నాకు అర్ధం కాలేదు. విషయం పట్ల ఉత్సుకతతో నేనందులోకి దిగలేదు గదా. అది కేవలం నెపం. ఇప్పుడు పునరాలోచిస్తే నేను సత్య మధనను అర్ధం చేసుకునీ అవకాశాన్నిమరోమారు పోగొట్టుకున్నాను. ఆమెను ఒక వస్తువుగా పొందటానికి చేసిన ప్రయత్నంలో సహస్రాంశమైనా ఒక వ్యక్తిగా సామీప్యతని సాధించటానికి చెయ్యలేదు.
ఆ విషయం నేను ధ్వనులను విడిచి పెట్టి నేరుగా వివాహం ప్రస్తావించి నపుడు కూడా నాకు అర్ధం కాలేదు.

9

“సత్యా.. నీ జీవితానికి కొత్త వెలుగు నివ్వాలనీ, నా బ్రతుకుకి నువ్వు ఆధారం కావాలని నా కోరిక. ”
నేనెంతకాలమో ఆలోచించి తయారు చేసుకున్న ఈ వాక్యం ఎంత కృతకంగా ఉందో నాకే తెలిసిపోతోంది. వాక్యం ఎంత శక్తిహీనమయిందో ఆ క్షణాన నాకు అర్ధమయింది.
“తప్పకుండా”.. అంది వెంటనే.
ఆ అంగీకారం నాకు చెప్పరాని ఆనందాన్నీ కలిగించింది. అంతులేని అనుమానాన్నీ కలిగించింది. ఆ క్షణంలో ఆ కళ్లను చూడగలిగే కళ్లు నాకుంటే అందులో ఏదో ఒకటి మాత్రమే కలిగేది.
“మీ నాన్నగారితో వెంటనే మాటలాడతాను. ” అన్నాను.
“దేని గురించి.. ”
“పెళ్లి గురించి.. ఎప్పుడూ.. ఎలా.. ”
“ఆగాగు.. దేనిగురించీ.. ” అంది.
“మన పెళ్లిగురించీ .. ” అన్నాను అయోమయంగా.
చాలాసేపు సత్యనుంచి మాటలు లేవు.
నేనూ ఆ మౌనాన్ని కొనసాగించాను. ఆ కాస్త మౌనంలోనూ నేనామెకు ఇచ్చే ఆధారం ఏమీ లేదనిపించింది. ఆ మాట అనటం ద్వారా నేనామెను కోల్పోతానా అనిపించింది. మరుక్షణంలో ఆమె విలువ పెరిగి పోయింది. ఆమె తప్పకుండా అన్నది దేనిగురించి ?
“సత్యా” – అన్నాను చాలా సేపటికి.
“ఊఁ-” అంది. ఆ గొంతులో నే వెదుకుతున్న మృదుత్వం అలాగే ఉంది. అంత అలజడిలోనూ అది నాకు కలిగించే అనుభూతి అలాగే ఉంది.
“నేను పెళ్లాడతానని ఎలా అనుకున్నావు.. నేనెక్కడ ఎప్పుడు నీకు అలాంటి అవకాశమిచ్చానా అని గుర్తు చేసుకుంటున్నాను. ” అంది. ఆమె మాట పూర్తి కాలేదు. నేనేదో అనబోతున్నాను.. కనులున్నాయిగదా.. ఉపయోగించుకుంది.. నాచేయి పట్టుకుంది.. నా చెయ్యి ఆమెతో ఏమందో తెలీదు..
“మనకి వివాహమాడే అర్హత లేదు.. వివాహం మనమున్న పరిస్థితిలో మనకున్న సత్సంబంధాలకి ముగింపు. ప్లీజ్ అర్ధం చేసుకో.. ” అంది.
“అవును.. నిజమే.. ఒక అంధుడితో పెళ్లా.. ఒక ముస్లింతో అందులోనూ. ”. నేను నా వశం తప్పాను..
“ఏంటదీ.. నువ్వు.. ఎలా ఇలా .. మాటలాడగలుగుతున్నావ్.. ” సత్యచేతిలో నా చేయి అలాగే ఉంది. దాన్ని విదిలించుకునే నా ఉద్రేకం సత్యకి అర్దమవుతూనే ఉంది..
“నీ మాటలకి ఇంకే అర్దముంది.. ” అన్నాను.
చెప్పింది.. సమాజం గురించి.. వివాహ వ్యవస్థ గురించి.. తన అనుభవం నుంచి చేసుకున్న నిర్ణయాన్ని గురించి.. వివాహం వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాలను ఛిద్రం చేయటం గురించి.. ఆమె మనసు వివాహాన్ని అంగీకరించటం లేదట. నా మనసు దేనినీ స్వీకరించటం లేదు.. ఆమెది నిరాకరణ అన్న భావన నుంచి బయట పడటం లేదు.. ఆమె ఏ వాక్యాలను ఎంత సరళంగా చెప్పినా అందులో నిరాకరణ తప్ప మరేమీ ధ్వనించటం లేదు..
చెప్పి.. చెప్పి.. నన్ను వినివిని.. చూసి చూసి అంది.. సత్య.
“కళ్లు లేకపోవటం లోపం కాదు. మరేదో ఇంద్రియాన్నో, ఇంకేదో సాంకేతిక పరికరాన్నో ఉపయోగించుకుని దాన్ని అధిగమించవచ్చు. కాని, .. నువ్వు మరింత గాయపడతావేమో.. ”
“చెప్పు.. ఇంతకన్న నన్నేం గాయపరచగలవు.. ”
“కళ్లు మూసుకోటం ఎవరూ సరిచెయ్యలేని లోపం. దయచేసి ఆలోచించు. వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. చానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”
“సత్యా. ”. నా మనసు నాకు తెలియకుండానే నా స్వరంలో నిండింది.
“ఎక్కువ సంఖ్యవాళ్లలో అధిక శాతం తక్కువ సంఖ్యవాళ్లను తక్కువ చేసి చూస్తారనేది తక్కువ సంఖ్యవాళ్లను వెన్నాడుతుంటుంది.. దానిని ఉపయోగించుకునే ప్రపంచంలో అనేక అవాంఛనీయ కృత్యాలు జరిపిస్తున్నారు కొద్దిమంది. వాళ్లు అధికసంఖ్యకీ చెందవచ్చు. అల్పసంఖ్యకీ చెందవచ్చు. వాళ్ల లక్ష్యాలు వేరుగా ప్రకటించుకోవచ్చు. కాని ఆకొద్దిమంది లక్ష్యమూ ఒక్కటే. మనిషిని మనిషితో కలిపే సమస్త మార్గాలనూ మూసివేయటం. నిజమైన ఆ కొద్దిమందీ మొత్తం మానవజాతిని మానసికంగా శాసించగలుగుతున్నారు. దానినుంచి వ్యక్తులుగా ముందు మనం బయటపడాలి.. మనం చర్చను నేర్చుకోవాలి. అభిప్రాయాలను మార్చే ప్రయత్నం ప్రేమతో.. ఓరిమితో చెయ్యాలి. మనలను శాసించే భావాలలో మనవేవో.. మనం కొనితెచ్చుకున్నవేవో.. గింజ ఏదో పొల్లు ఏదో వేరుచేసుకోగలగాలి. అందులో మనం తోడూనీడా కాగలగాలి. స్నేహితుడా ధ్వనిని అలంకారప్రాయం చేసుకుని ఎవరైనా దేనినైనా నేరుగా మాటలాడగలిగే ప్రపంచం కలగందాం రా. నా మనవి ఒక్కటే.. సాధ్యమైనంత వరకూ మనం మాటల మీద వాటి వాచ్యర్ధం మీద ఆధారపడటం ద్వారానే మనం ఏకమయీ అవకాశం ఎంతో కొంత ఏర్పడుతుంది.. ప్లీజ్ నేరుగా అర్ధం చేసుకో.. ”

(2010 ఆగస్టు రచన సంచిక)

కవితాత్విక కథ ‘వాంగ్మూలం’

rm umamaheswararao

ఉమా మహేశ్వరరావు

నా స్నేహితురాలు ఒకరు ఒక సంఘటన గురించి చెప్పిన మాటలు తరచూ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆమె, ఆమె స్నేహితుడూ సముద్రంలో మునుగుతున్నారంట. ఆనందమూ అలలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న వేళ, హఠాత్తుగా విరుచుకుపడ్డ ఒక అల ఆ ఇద్దర్నీ లోపలికి గుంజేసుకుంది. ఇక అంతా ముగిసింది అని అర్ధమయిపోయింది వాళ్ళిద్దరికీ. అప్పుడొక అల ఎదురొచ్చి, ఈడ్చి విసిరేసిందంట ఇద్దర్నీ గట్టు మీదకి. చావుకీ బతుక్కీ మధ్యన ఉండే సున్నితపు రేఖను చూసిన ఆ ఇద్దరూ తడి ఇసుక మీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణాల గురించి ఆమె ఇట్లా చెప్పింది.. ‘ఇంకొన్ని క్షణాలు..కొన్నే..అంతా అయిపోయి ఉండేది కదా, హాయిగా , ప్రశాంతంగా అని ఏడుపు తన్నుకొచ్చింది నాకు. అప్పుడే అతనూ ఏడుస్తున్నాడు, అయ్యో..అన్యాయంగా ముగిసిపోయి ఉండేదే అని.’

– విన్నపుడు విడ్డూరంగానే అనిపించినా, ఈ మాటల లోతు అర్ధమయ్యేకొద్దీ ఇవి మరింతగా నన్ను వెంటాడడం మొదలుపెట్టాయి. ఎన్నో సందర్భాలను కొత్తగా గుర్తు చేస్తునేవున్నాయి.

నాలుగేళ్ళ కిందట.. పడవ అంచున నిలబడి నయాగరా కిందకి ఇంకా ఇంకా దగ్గరవుతూ, ఆ జడిలో, ఆ జలపాతపు హోరులో ముద్ద ముద్దయిపోతూ, ఆ మహా సౌందర్యం ముందు మోకరిల్లి, ‘ఇక చాలు’ అనిపించిన క్షణం గుర్తుకొచ్చింది.

పాతికేళ్ళకి ముందు.. తిరుమల కొండకు తొలి నడకలో, వాన వెలిసిన సాయంత్రం అవ్వాచారి కోన బండ అంచున నిలబడి, దిగజూసినపుడు, ఓహ్..మసక కమ్మిన లోయలోపలి మరో లోకపు వింత శబ్ద సంగీతంలో మైమరచి దూకేద్దామనిపించిన క్షణం గర్తుకొచ్చింది.

ఇంకా ఎంతో ముందు.. పిర్రల మీద చినిగిన నిక్కర్లేసుకుని ఎర్రమట్టి లారీలెక్కి ప్రళయకావేరిని చీల్చుకుంటూ సముద్రం ముందుకు చేరి, మునిగి, తేలి, ఆడి, నురగలెత్తే ఆ గాఢ నీలిమ, అమ్మలా చేతులు సాచి పిలుస్తున్నట్టు బ్రమసిన క్షణం గుర్తుకొచ్చింది.

అసహ్యం, వికృతం, క్రూర బీభత్సంగా కనిపించే మరణం ఒక మోసకారి, మాయావి, ఒక రహస్య ప్రేయసి. ఒక్కోసారి మరణం మీద మనకున్నది ద్వేషమో, మోహమో అర్ధం కాదు. ఇట్లాంటి మరణం మీద కథ రాసింది స్వాతి బండ్లమూడి. కొత్త పేరు. భలే రాసిందే అని ముచ్చటపడి, కథ అచ్చేసిన వసంత(ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రిక ఎడిటర్ )గారికి ఫోన్ చేస్తే కొన్ని వివరాలు చెప్పారు. చిన్న పిల్లే. గట్టి గడుగ్గాయి.  వాక్యంలో, కథనంలో, కథలో ఎంత ఆరిందాతనం!

కథ పేరు వాంగ్మూలం.

ఏభై ఏళ్ల ఒంటరి రచయిత. తాగుబోతు. రాతలో, బతుకులో పండిపోయినవాడు.

ఒక్కటే కథ  అచ్చయిన మరో కుర్ర రచయిత. తెలివి, బిడియం, మొండితనం, పట్టుదలాగల పిల్లవాడు.

ఈ ఇద్దరికీ స్నేహం. ప్రేమ, వాత్సల్యం అతడంటే సీనియర్ రచయితకి. ఆ పిలగాడు ఒక అద్దం అతనికి. తననే చూసుకుంటూ ఉంటాడు పిలగాడిలో. అద్దంలోని తనతో తాను మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు కథంతా. వాంగ్మూలం కథ నడక శైలి ఇది. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? పిలగాడితోనా, పాఠకులతోనా, కథ నడుపుతున్న రచయితతోనా, తనతోనేనా? ఏక కాలంలో అందరినీ కలగలిపి తనలో లీనంచేసుకుని మాట్లాడుతూ ఉంటాడు అతను.

ఏం మాట్లాడుతాడు..

పిలగాడి తెలివికీ, వయసులో ఉండే పట్టుదలకీ, మొండితనానికీ మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. తొలి కలయికలో, తాగుడు బల్ల ముందు కూర్చున్న పిలగాడిని, ‘అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా?’అని అడిగినపుడు అతనికి శివాని గుర్తుకొచ్చింది. శివాని అతని సహచరి. శివాని గురించి పిలగాడికి ఎలా చెబుతున్నాడో చూడండి, ‘సృష్టిలో ఎక్కువైపోయి ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శిమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా శివుడు ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! ఎలాగో నిభాయించాడు. తట్టుకు నిలబడ్డాడు.’ అట్టాంటి శివాని, మూడేళ్ళ కొడుకుపోయాక ఎన్ని నెలలకీ మనిషి కాలేక తనూ వెళ్ళిపోయింది. శివాని పోయిన రెండు పుష్కరాల తర్వాత అతని జీవితంలోకి వచ్చాడు ఈ పిలగాడు. ‘ ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరక కోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్ళు’అతని దగ్గర శివాని వెతుకులాడినట్టుగానే, ఇప్పడు పిలగాడి దగ్గర అతనూ వెతుకులాడుతున్నాడు. ‘పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు’అని తెలిసిన వాడు అతను. కథలు..కబుర్లు..తాగి తూలే మాటలు.. వాటిల్లోనే ఎన్నో తాత్విక సత్యాలు. నిండా పాతికేళ్లు లేని ఆ పిలగాడు అతనితో అంటాడు గదా, ‘ ఐనా పెద్దాయనా! మనమీ కాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ: ఈ స్థలం, కాలం, ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్దం, అసంబద్ధం అయి మరో చోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం’. పాతికేళ్ళ కిందటి ఆవేశమూ, ఇప్పటికీ ఆగని అన్వేషణా గుర్తుచేసాయి అతనికి పిలగాడి మాటలు. తిరిగిన స్థలాలు, బతికిన కాలాలు జ్ఙప్తికొచ్చాయి. అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ఏ రైలో ఎక్కి ఎక్కడో దిగి పల్లెటూరి హోటల్లో టీకప్పులు కడిగి, గోవా బీచ్ లో టాయలెట్ల సఫాయీలో పనిచేసి, అజంతా గుహల్లో గైడుతనం వెలగబెట్టి..ఎన్నెన్నో అనుభవాలు..?! గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు. ‘యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వర ప్రేమ హౌరానదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు’ ఆ  ప్రేమనిచ్చిన బసంతిని గుర్తుచేసుకున్నాడతను. పాతికేళ్ళు నిండని పిలగాడితో, ఆ పిలగాడిలోని తనతో అన్నీ చెప్పేసుకున్నాడతను, ఆర్తిగా, ఆత్రంగా.

ఎందుకు? ఎందుకా పిలగాడి ముందు జీవితాన్ని విప్పి పరిచాడు అతను? ఎందుకంటే, ‘తను ఆగిపోయిన చోటు నుంచి ముందుకు కాకుండా పైపైకి వెళ్ళి, నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డ కట్టిన ఇంకు పెన్నుని గట్టిగా విదిలించికొట్టే దమ్ము’ ఆ పిలగాడికి ఉందనే నమ్మకం కలిగింది కాబట్టి. ఆ నమ్మకం ఆశగా మారుతున్న వేళ పిలగాడు అతనికి రాధ గురించి చెప్పాడు మురిసిపోతూ. కొద్ది నెలలకే పిలగాడి మురిపెపు గొంతులో నిరాశ. వైఫల్యపు ధ్వని. ‘దాని దుంప తెగ, ఎంత దౌర్భాగ్యపు జీవితమండీ’అని ఆ పిలగాడు అన్న మాటతో, అతను, తెగిన పతంగి.. తన దారాన్ని తనే మళ్ళీ ముడేసుకుని, ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన అయినా లేకుండా కొరియర్ కవర్ మీది అడ్రస్ పట్టుకుని పరుగు తీశాడు పిలగాడిని వెతుక్కుంటూ. గది తలుపు తోసుకుని, ‘నేనెవరో చెప్పుకోరా ఇడియట్’ అంటూ అడుగుపెడితే, నేలంతా పరచుకున్న పుస్తకాలు, ఒలికిపోయిన ఇంకు మరకలు, ఒంటిమీద స్పృహ లేకుండా పడివున్న పిలగాడు. డస్ట్ బిన్ లో చింపి పారేసిన డైరీ కాగితాల మధ్యలో రెస్టిల్ షీట్లు.

‘గుండె పగిలిపోతోందిరా చిన్నోడా’ అంటూ అప్పుడంటాడు కదా అతను, ‘నిద్ర మాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, రాసేముందు ఇంటి గోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చి పూల చెట్టునో గుర్తు తెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకథికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలు రాళ్ళ మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధంతరంగా ఆగిపోకూడదనీ, ఇలా చేసిన నీ తలపొగరుకి శిక్షగా ‘లవ్యూ రా బంగారు కొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ’అతను మందలిస్తూ దుఖిస్తూ..

ఇదీ కథ..

తాగుబోతు రచయిత వదరు మాటల్లా మొదలై లెక్కాపక్కా లేనితనంలోంచి  మూడేళ్ళ బిడ్డనీ, శివానినీ పోగొట్టుకున్న పశ్చాత్తాపపు దుఖంలోంచి, మొండితనపు తెలివి తేటల పిలగాడి ప్రేమలో పడి, కొండల్లోంచి దూకే జలపాతం నదిలా పారినంత నిమ్మళంగా మారి, పిలగాడిలోని తనను  తాను చూసుకుంటూ దిద్దుకుంటూ, తుఫానుకి పెకలించుకుని బయటపడిన వేళ్ళను మళ్ళీ మట్టిలోకి పాదుకుంటూ అతను అతనుగా మారి నిలబడ్డమే కథ. కథలో పిలగాడు ఒక ప్రతిబింబం.  బింబ ప్రతిబింబాల మధ్య స్వగతంలా సాగే  సంభాషణ.  గాఢమైన కవితాత్మక వాక్యాలు, తాత్విక మాటల పోగులు. చిక్కటి కవిత్వం రాసే స్వాతి కథ రాసినా కవిత్వమే పొంగుతుంది. ఒక చోట.. ‘ తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహం మొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివిపూలు- ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ది యానిమల్ ఇన్ స్టింక్ట్’

ఇంకో చోట- ‘ నీడ నుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న: నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డు మీద తూలిపడుతున్న ప్రతీదాన్నీ కేర్లెస్ గా చూసుకుంటూ..’

-ఈ చిన్న కథ నిండా ఇట్లాంటివే ఎన్నో.

కథ ముగింపు చదివాక, ఎందుకో వజీర్ రహ్మాన్ ‘చివరికి’ కవిత గుర్తొచ్చింది.

చివరికేం మిగలదు!

చావుని పల్కిన భయానక సర్పం కూడా

నీటిమీద గీతమల్లే చెరిగిపోతుంది

దేహసారాన్ని పీల్చుకుని

సమాధిని చీల్చుకుని

ఏ పిచ్చి మొక్కో మత్తుగా తలెత్తి మాయమౌతుంది

ఏ పుర్రె యెమికో మిగుల్తుంది

ఎండలో దుమ్ములో దొర్లుతో,

నక్కలు కూడా కాదని వొదిలే చిన్న మురికి బొమికె

ఇంతే- చివరికేం మిగలదు!

దేహమోహ సీమని

మైక సంగీత మయం చేసిన

యవ్వన మృదు పుష్పం సైతం మన్నులో మన్నై మలినమై

ఎమికపై నూగారు గర్తు కూడా!’ అంటూ స్మశాన వైరాగ్యపు నిరాశతో మొదలు పెట్టి, చివరికేం మిగలదా? అనే ప్రశ్న వేసి, సౌందర్యభరిత జీవితాన్ని పటంగట్టి ముందుంచి ఆశను నింపుతాడు ఇలా గుండె నిండుక్కీ..

‘చివరికి మళ్ళీ

ఎక్కడో ఏ కొండ పంచనో

గడ్డిపూల గుంపులో నించుని

సృష్టి వైచిత్రికి తలలూపుతో మిగులుతాం-

ఏ చీమల బారులోనో

హడావుడిగ నడిచి వెడుతో

నరజీవుల వికృత చేతలకి నివ్వెరపోతో మిగులుతాం-’

మనసు నిండా తెలియని చీకటి కమ్ముకున్నపుడంతా ‘సాహసి’లోని ఈ కవితను నేను చదువుకుంటూ ఉంటాను. కొండ పంచన గడ్డిపూల గుంపు పరిమళాన్ని గుండెల నిండా నింపుకోవడానికి. నైరాశ్యపు అంచులమీద, మన అడుగులో అడుగు వేసి నడుస్తూ, మాయ చేసి మనల్ని మంచి గడ్డిబాట మీదకు మళ్ళించి, మనలో   జీవితేచ్ఛను రగిలించే కవిత ఇది.   ‘వాంగ్మూలం’ కథలో కూడా నాకు ఈ మాయ లక్షణమే కనిపించింది. రాయలసీమ బైరాగులు పాడే తత్వాలు చెప్పే సత్యాలకు అక్షర రూపాలే కదా వజీర్ రహ్మాన్ ‘చివరికి’, స్వాతి బండ్లమూడి ‘వాంగ్మూలం’ అనిపించింది. ఈమె రాసిన మొదటి కథేనా ఇది? ఇంతకు ముందూ, తర్వాతా ఇంకేమైనా కథలు రాశారా? నాకయితే ఎక్కడా తారసపడలేదు. అయినా, ఈ కథ చదివినపుడు మాత్రం   తెలుగు కథకు కొత్త భరోసా స్వాతి బండ్లమూడి అనే నమ్మకం కలిగింది.

***

వాంగ్మూలం బొమ్మ

వాంగ్మూలంswatikumari

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా..

యాభయ్యేళ్ల ఒంటరోడిని, తాగుబోతు నా కొడుకుని, అర్ధరాత్తుళ్ళు ఫోన్‌ చేసి “లవ్  యూ రా  బంగారుకొండా” అంటే సంస్కారపుజబ్బు ముదిరినోడివి కాబట్టి నా మత్తు సంగతి కనిపెట్టి నీ నిద్రమత్తుని దాచిపెట్టి “ఇవ్వాళ కూడా డోసెక్కువైందా?” అని విసుక్కోకుండా అడిగినప్పుడు ఎంత ముచ్చటేసేదిరా!

సఫరింగ్, సఫరింగ్, సఫ – రింగ్, టేబిల్ మీద ఖాళీగా గ్లాసుల అడుగుజాడల రింగులు. వలయాలు, వేదనా వలయాలు, శోధనా వలయాలు. కళ్ళు తిరిగి వళ్ళు తిరిగి… ర్రేయ్, ఇంతకుముందు ఇక్కడో నయాగరా ఉండాలి, సింకులో నీళ్లాపేసిన బాస్టర్డ్ ఎవడ్రా?  కాగితాలున్నయ్ కాబట్టి సరిపోయింది మాటలు కక్కడానికి.

పత్రికలో పడిన నీ ఒకేఒక్క కథ, ఆపైన నీ ఉత్తరాలు చూసి మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నేను ఊహించినట్టే ఉన్నావ్. ఐనా ఏం ఊహించాను నేను? తెలివి, మొండితనం, వయసులో ఉండే పట్టుదలా, అదే నాకు తెలిసిన నువ్వు, నాకెప్పటికీ దొరకని నాలాంటి నువ్వు, ఆ సాయంత్రం అంతసేపూ తాగుడూ వాగుడూ నాదే అయాక “అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా!” అని నేను దేవుణ్ణీ, నిన్నూ ఒకేసారి అనుమానిస్తే “తాగినవాళ్లని ఇంతదగ్గరగా కూడా ఎప్పుడూ చూళ్ళేదు మాస్టారూ!” అన్చెప్పి “కేవలం మీ కోసమే ఇంతసేపూ…” అన్న ముక్కని చెప్పకుండా అభిమానంగా నవ్వినప్పుడు; అప్పుడు గ్లాసు దించి మరోసారి నీ మొహంలోకి చూస్తే, ఎందుకో…

ఎందుకో! శివాని గుర్తొచ్చింది –

పెళ్లాం, బెటరాఫ్- ఇలా ఎలా రిఫర్ చేసినా చిరాకు పడేది శివాని, ఆ పేరు చూసే ప్రేమించుంటాను. సృష్టిలో ఎక్కువైపోయిన  ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శివమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! నిభాయించాడు, తట్టుకు నిలబడ్డాడు. మరి మాటలా! నాలాంటోడివల్ల కాలేదు. ఇందాకన్నాగా  ‘మా ఆవిడ’ అని తన గురించెవరికైనా చెబ్తే- ‘నేను నువ్వే అవుతాను కానీ, నీకు మరేదో ఎలా అవుతాను?’ అని పెళ్లిలో చదవని మంత్రాల్నేవో కొత్తగా నేర్పలేక మళ్ళీ వెంటనే మూగగా అయిపోయేది.

మూడేళ్ల కొడుకుపోయి ఎన్ని నెల్లకీ మనిషి కాలేదు. శరీరంకోసం తప్ప ఓదార్చడానికి ముట్టుకోడం రాని మగాణ్ణే అప్పటికి. తన ఏడుపు నన్ను అస్తమానమూ డిఫెన్స్ లో ఎందుకు పడేసేదో ఎప్పుడాలోచించినా అర్థం కాదు. సొంతసొత్తులా తప్ప సాటిమనిషిలా చూడలేనని తెలిశాక కూడా, ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరకకోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్లు  నాదగ్గర వెతుకుతూనే ఉండేది. ఇప్పుడు నాకు పగులుతున్నట్టుగానే తనకీ గుండె ఎన్నిసార్లు పగిలి ఉంటుందో! ఒకరోజు నిజంగానే నా శక్తినంతా లాక్కుని జీవితాన్ని, మనుషుల్ని దేబిరించకుండా హుందాగా తనకి నప్పుతుందేమో అన్న ఆశతో మరే లోకానికో వెళ్లిపోయాక, వెళ్ళిపోయి రెండు పుష్కరాలు దాటాకా నువ్వు…

ఇప్పుడిదో కొత్త పిచ్చి – ’పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు’ అని నేనంటే “నెరుడాని మీవాదం కోసం వాడేసుకుంటారు – స్పానిష్ మీ బలహీనత” అని నువ్వు ఎడ్మైరింగ్ గా నవ్వేవాడివి, “నువ్వు గత జన్మలో రష్యా వోడివిరా” అని నేనన్నప్పుడు కృతజ్ఞతతో నవ్వినట్టు…

“కథొకటుంది మాస్టారూ- మూడు ముక్కల్లో చెప్పొచ్చు. పెళ్ళాన్ని దారుణంగా చంపేసి రేప్పొద్దున ఉరికంబం ఎక్కబోతున్న హంతకుడి గురించి ఇద్దరు సెంట్రీలు మాట్లాడుకుని, నైట్ డ్యూటీలని బూతులు తిట్టుకుని ఒక దమ్ములాగి సెల్స్ లో రౌండులకెళ్ళటం మొదటి భాగం. చనిపోయిన భార్య ప్రియుడు, ఈ గొడవల్లో తను ఏ రకంగానూ ఇరుక్కోకుండా ఇన్‌ఫ్లుయెన్స్ తో ఎలా నెట్టుకొచ్చాడో; చిత్తుగా తాగి బార్లో ఫ్రెండ్స్ దగ్గర కోతలు కొయ్యడం రెండోది. ఖైదీ కొడుకు అనాథాశ్రమంలో భయంగా ముడుచుకుపడుకుని తను స్కూలుకెళ్ళి వచ్చేలోపు అమ్మా నాన్నా ఇద్దరూ కనపడకుండా పోవడమేంటో అర్థంకాక ఎక్కిళ్ళు బయటికి వినపడకుండా నోరుమూసుకుని, కాసేపటికి కళ్ళు తుడుచుకోకుండానే నిద్రపోవడం- ముగింపు ; అంతే కథ. మొత్తం కథలో ఆ హంతకుడిని నేరుగా చూపించకుండా పొగమంచు కప్పెయ్యాలన్నమాట, రాయొచ్చంటారా?” అని మొహమాటంగా సలహా అడిగినప్పుడు-

“నా అనుభవంలోంచి చూస్తే అంత గొప్పకథ కాదుకానీ, నీ వయసుకి గ్రాండ్ గానే ఉంటుందిలే, కానియ్”  అని ఉడికిస్తే “ఒక్కసారైనా అన్‌కండీషనల్‍గా మెచ్చుకోరుగా మీరు” అంటూ నువ్వు ఉక్రోషపడితే ’నాకేవఁవుతాడ్రావీడు? నిండా పాతికేళ్ళు లేవు, నాకొడుకే బతికుంటే వీడంతై, ఇలా లోలోపల దావానలంతో దహించుకుంటూ ఉండేవాడా?’ అనొక విపరీతపు ఆలోచన సెంటిమెంట్ తో సతమతం చేస్తుండేది.

“ఐనా పెద్దాయనా! మనమీకాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ; ఈ స్థలం, కాలం, ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్ధం, అసంబద్ధం అయిన మరోచోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం” అని నువ్వూగిపోతుంటే పాతికేళ్ల క్రితపు నా ఆవేశమూ, దాన్లోంచి పుట్టి ఇప్పటికీ ఆగని నా అన్వేషణా గుర్తొచ్చేవి.

“ఏమన్నావు? స్థలం, కాలం – ఎన్ని స్థలాల్లో తిరిగాను, ఏ కాలాల్లో బతికాను. పిచ్చి పట్టినవాడిలా ఏ రైల్లో ఎక్కడ ఎక్కానో, అదెక్కడికెళ్తుందో తెలీకుండానే. నిద్ర లేచినప్పుడే స్టేషనొస్తే అదే నాఊరు. పడమటి కనుమల్లో ఏదో పల్లెటూరి హోటల్లో  టీకప్పులు కడగటంలో మొదటిసారి మెడిటేషన్‌ దొరికినప్పుడు, గోవాబీచ్ లగ్జరీ రిసార్ట్లో టాయిలెట్ల సఫాయీలో నాలుగు డబ్బులు పోగవగానే సింబాలిజం, ఫ్యూచరిజం, ఫిలాసఫీ అని ఇష్టమొచ్చిన పుస్తకాల కోసం ఖర్చు పెట్టేసినప్పుడు; నేనొదిలేసొచ్చిన ఎకౌంట్స్ మేనేజర్ పోస్ట్ లో గోతికాడ నక్కలా దూరి వారానికార్రోజులు సగం టీలు, సగం గాసిపింగూతో గడిపేసే శివప్రసాద్ కి ఫోన్‌చేసి ‘నిజంగానే నేను గొప్పగా బతుకుతున్నాన్రా ఫూల్’ అని పగలబడి నవ్వాలనిపించేది.

అజంతా గుహల్లో గైడుగా వెలగబెట్టినప్పుడు చరిత్రని పొయెటిగ్గా చెబుతుంటే ఆ కాసేపట్లోనే శిల్పి హృదయ రహస్యాల్ని కళ్లతో కొనేసుకోవాలని తపించి, కళలోని అందాన్ని తప్ప ఆత్మని పట్టుకోలేక అల్లాడే యాత్రీకుల అలసటని, ఫోటోల్ని తప్ప   జ్ఞాపకాల్ని దాచుకోలేని యాంత్రికతనీ చూసి జాలిగా ఓదార్చాలనిపించేది.

ఇంకా ఎన్నెన్ని స్థలాలు, ఎలాంటి అనుభవాలు!

దారంతెగి గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు, వివస్త్రంగా ఉబ్బి వరదల్లో కొట్టుకోచ్చే దిక్కులేని శవాలు, ఇసుక తుఫానులు చెరిపేసిన ఎడారిఒంటెల ప్రయాణపు గుర్తులు, అసంతృప్త  ఆగ్రహాలు నిండిన సముద్రపు సుడుల్లో అలవాటుపడ్డ మొండి ధైర్యంతో సాగిపోయే ఓడలు చేరని తీరాలు.

ఏ స్థలాల్లోవి, ఏ కాలానివి ఈ జ్ఞాపకాలన్నీ?

తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహంమొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివి పూలు – ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ది యానిమల్ ఇన్‌స్టింక్ట్స్…

యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వరప్రేమ హౌరా నదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు; బసంతీ! నా చెవిలో ఏదో అన్నావ్? ఆర్ట్ సినిమాలో నటన మర్చిపోయిన హీరోయిన్లాగా. మనసుతో శరీరాన్ని కోరుకోవడం మర్చిపోయిన చాలా ఏళ్లకి, పరిచయం పాతబడి వెళ్ళిపోతుంటే- నేనిచ్చిన డబ్బులు చనువుగా నా జేబులో తిరిగి పెట్టేస్తూ ఏమిటి బసంతీ అన్నావ్ నాకెప్పుడూ అర్థంకాని మరోలోకపు భాషలో!! ఎప్పుడో శివాని కోసం పిచ్చెక్కిపోయిన మొదట్లో భావుకత్వమంతా కళ్లల్లో వెలిగించుకుని నుదుటిమీద ఆర్తితో పెట్టిన ముద్దు, కామంతో కాదు, రిచువల్ గా, అలవాటుగా కాదు.. ‘ఐ కేర్ ఫర్ యూ’ ఆని అంత సున్నితంగా చెప్పడం మళ్ళీ నీదగ్గరే. ఒకసారెళ్ళిన చోటకీ, వదిలేసొచ్చిన మనుషుల దరిదాపుకీ వెళ్ళే అలవాటు లేదు నాకు. ఎక్కడున్నావో, ఎప్పుడైనా తలచుకున్నావో లేదో, అప్పటికి కష్టంగా అనిపించినా తప్పలేదు. నాకు తెలుసు నీతో నేనుండలేను, అసలెవరితోనూ, ఎక్కడా  ఉండిపోలేను శాశ్వతంగా, పదిహేనేళ్లవదూ? ’బై బై బసంతీ’ అనికూడా చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా లేటైపోతున్న ఏ రైలు కోసమో అన్నట్టు త్వరత్వరగా నడుచుకుని వచ్చేసి…”

ఎక్కడి చట్టం, సమాజం, నైతికత, నైతికాతీతత! నిజంగానే నువ్వు రాయగలవురా చిన్నోడా; నేనాగిపోయిన చోటునుంచీ ముందుకు కాకుండా పైపైకి వెళ్ళి,  నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డకట్టిన ఇంక్ పెన్నుని గట్టిగా విదిలించి కొట్టి… నీకా దమ్ముంది.

“ప్రయోగాల మీద అంత తపన ఉన్నవాడివి, ఈ మూడుముక్కల కథలెందుకు నీకు?” అనడిగితే “లేద్సార్, ఈ ఒక్కసారికీ రాధికకి మాటిచ్చాను. తను పనిచేసే వీక్లీలో స్టోరీసెక్షన్‌కి మారింది. మీకెప్పుడూ చెప్పలేదుకదా తను చాలా ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్ గా అనిపిస్తుంది” అని మురిసిపోయినోడివి – ఇన్ని నెల్ల తర్వాత మళ్ళీ మొన్ననగా ఫోన్‌ చేసి “మనకి నచ్చేది లోకంలో నిజంగా ఉందని తెలిసీ, అందుబాటులో ఉండీ, మనది కానప్పుడు, ఎలాగండీ తట్టుకునేది?” అని ఏదో గొప్ప ఆశాభంగాన్ని మగాడివి కాబట్టి ఏడవకుండా మానిప్యులేట్ చేస్తుంటే- ఏంట్రా ఇంత ముదురుగా మాట్లాడావ్! ఒకవేళ తాగి ఉన్నావా అని అనుమానమేసి పట్టరాని కోపమొచ్చింది.

————————

అప్పటిదాకా ఎక్కింది దిగితూ, అప్పుడే లోపలికి దిగింది నరాల్లోకి ఎక్కుతున్న మైకంతో, తడిపిన కొద్దీ ఎండిపోతున్న గొంతుతో- ఎక్కినమెట్లు దిగుతున్నానో, దిగవల్సిన మెట్లు ఎక్కుతున్నానో మెట్లకే తెలియాలి. నీడనుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న; నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డుమీద తూలిపడుతున్న ప్రతీదాన్ని కేర్లెస్ గా చూసుకుంటూ..

అదే మొదటిసారి పనిగట్టుకుని ఫలానా చోటకని అనుకుని ఎవర్నైనా చూడ్డానికి రావడం.

“మీ పుస్తకాన్ని ప్రచురిస్తాం” అని ఎవరైనా అడిగితే “చేసుకోండి, నాకెందుకు చెప్పడం?”

“మరి రాయల్టీలు?”

“ఊళ్ళో నా తమ్ముడున్నాడు, వాడికిచ్చెయ్యండి. నా తాగుడుకి డబ్బులు చాలక ఉత్తరం రాస్తే వాడే పంపుతాడు.”

అంత నిర్లక్ష్యం, అంత పొగరుబోతు దిలాసా! అలాంటిది నిన్న రాత్రి నువ్వు ఫోన్లో “దాందుంపా తెగ, దౌర్భాగ్యపు జీవితమండీ!” అనగానే ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన లేకుండా నువ్వు పుస్తకాలు కొరియర్ పంపిన కవరు వెనక అడ్రెస్ పట్టుకుని, ఇందాకా వస్తే…

గది తలుపు తోసుకుని “నేనెవరో చెప్పుకోరా ఇడియట్?” అని నీ ఆశ్చర్యం చూద్దామనుకుంటే…

నీలాగే నీగది కూడా నేనకున్నట్టే ఉంది. నేలంతా పరుచుకున్న పుస్తకాలు, టేబుల్ మీద ఒలికిపోయిన ఇంకు మరకలు,  కానీ వంటి మీద స్పృహేదీ? పక్కన సూసైడ్ నోటేదీ? డస్ట్ బిన్‌ లో చింపిపారేసిన డైరీ కాయితాల మధ్యలో రెస్టిల్ షీట్లు ఏ వివరాలూ చెప్పవు. అసలెవరైనా ‘నా చావుకెవరూ కారణం కాదు ‘ అని రాశారంటే అ కారణమైన వాళ్లని కాపాడ్దానికే అని అర్థం. మరి అసలేమీ రాయకుండా ఇలాటి పని ఏ చివరి జ్ఞాపకాన్ని కాపాడ్డానికి?

పెద్ద పనిమంతుడిలా కథల్రాయడమే కానీ నిద్రమాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, ఆ రాసేముందు ఇంటిగోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చిపూలచెట్టునో గుర్తుతెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకధికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలురాళ్ల మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధాంతరంగా ఆగిపోకూడదనీ, ఇలాచేసిన నీ తలపొగరుకి శిక్షగా ’లవ్ యూ రా బంగారుకొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ,

ఈమాత్రం ఊహించలేనివాడివా నువ్వు అని తలచుకున్నకొద్దీ…

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా!

————*****————-

-స్వాతికుమారి బండ్లమూడి