చీకటీగలు-3

 

 

‘‘ఈ లమ్డ్మీ చీకటీగల్కి మనుషులకీ దగ్గర సంబంధం… ఇంకోళ్ళని ప్రశాంతంగా వుండి చావనీవివి… ఎక్కడా లేనట్టు సరిగ్గా కళ్ళముందూ పుళ్ళమీదా వాలి… చీకాకు… చీకాకు’’ అన్నాడు శ్రీమన్నారాయణ..

‘‘ఇవి ఈగలా దోమలా ఏంటివి సారివీ… వీనెమ్మ… ఛీత్‌’’ విసురుకుంటూ రంగరాజడిగాడు..

‘‘ఈగజాతే, అయిన్యాట్స్‌’’ అంటారు వీట్ని మనల్నే కాదు పశువుల్ని చంపుకుతింటాయివి… సైంటిఫిక్నేమ్‌ హిపల్యాటస్‌ పుసిలానో ఇంకోటోమరోటో అంటారు.

లంజపదోత్పత్తి దగ్గర్నించి చీకటీగల శాస్త్రీయనామానికెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణ… అసలు మృచ్ఛకటికం దగ్గర మొదలుపెడతానన్న మనిషి… ఎటిమాలజీ నుంచీ ఎంటమాలజీకి ఛలాంగుమని గెంతగ బుద్ధి… కాస్త అబ్బురంగానే చూశాను శ్రీమన్నారాయణ వైపు… ఇంత బుద్ధికలిగీ జీవితాన్ని సుఖవంతం ఎందుకు చేసుకోలేకపోయాడితను? అసలు సుఖం అంటే ఏమిటి? పెళ్ళాం బిడ్డల్తో గొడవల్లేకుండా రోజూ మూడుపూట్లా కోరిందో, దొరికిందో తృప్తిగా తింటూ చీకూ చింతా లేకుండా నిద్రపోగలగడమేనా? ఎవరిస్తారు అసలు సిసలైన సుఖానికీ ఆనందానికీ సరైన నిర్వచనం… అంతా సాపేక్షమే కదా? నీకు సుఖవంతమైంది అతనికి అస్సలు కాకపోవచ్చు. రంగరాజులూ, కంఠం వేరువేరు నిర్వచనాలివ్వొచ్చు… కోట్లాదిమంది కలిగున్న ప్రమాణాలు అత్యంత సాధారణమైనవి… సహజాతాలకు సంబంధించినవి. వాటికతీతంగా వుంటే గింటే దేవుడుండొచ్చు. ఎటు తిరిగీ జీవితాన్ని వీటి చుట్టుతా చేర్చి కుట్టేసుకుంటారు. నిజానికి వీటికతీతంగా జీవితం అస్తిత్వం కలిగుందా? వుండగలదా? అడగాలి శ్రీమన్నారాయణ్ణి… అతను దేవుడిన్నమ్మడు… ‘‘అసలు సిసలు జీవితమంటే తనకిచ్చ వచ్చిన రీతిలో మనగలగడం. సమాజపు కొలతకావల స్వచ్ఛంగా స్వేచ్ఛగా వుండగలగడం’’ అన్నాడో మాటు.

రంగరాజునీ, కంఠాన్నీ చూసా… అసలు రంగరాజు బడి నడుపుతాడంటే ఆశ్చర్యం. ఏదో వ్యాపకం కావాలి కాబట్టి స్వంతస్థంలో షెడ్లేసి స్కూలు నడుపుతున్నాడు శతకోటి కుక్కగొడుగుల్లో అదోటి. ఓ డొక్కు కారుంది కూడా… ఎప్పుడూ నిశ్చింతగా గడుపుతాడు. పద్యాలూ, పాత సాహిత్యమంటే చాలా ఇష్టపడతాడు. వాడి బండముక్కు పక్కనున్న కళ్ళల్లో ఒక నిరంతర చైతన్యముంటుంది. ఊళ్ళో గ్యాసు కనెక్షన్నించీ ఏకనెక్షనుకైనా దారి చూపించగల్డు ‘‘నువ్వా లెక్చరుద్యోగానికి రిసైన్నూకు సార్‌.. జూనియర్కాలేజి పెడ్దాం… రెండేండ్లలో ఎట్టుంటాదో చూడు’’ అని నాతోటెన్నిమాట్లో అన్నాడు. వీళ్లందరి జీవితపు పరిధులు కొలిచేముందు నా జీవితమేమిటో నాకు తెలుసా? నిజ్జెంనిజంగా నే సుఖంగా వున్నానా? బ్రతుకుతూనా? జీవిస్తూనా? ఆకలి లోపల యుద్ధం చేస్తోంది…

‘‘రాజా, రా మనిద్దరం వెళ్దాం మందుకి, నేనట్నుంచటే కొంప చేరుతా…. బండికూడా లేదు.. పద…’’ అని రంగరాజు భుజమ్మీద చెయ్యేసి శ్రీమన్నారాయణవైపు చూసి ‘వెళ్తా’ అన్నా…

చివర్రౌండేస్తూ ‘‘ఆగండి…’’ అంటూ కంఠం అడుగుబొడుగు వేసేసాడు.

‘‘ఉదయాన్నే ఆ గాడ్దికొడుకొచ్చి గొడవ చేస్తే కబుర్జేస్తా వచ్చేయ్యి’’ అన్నాడు శ్రీమన్నారాయణ.

రంగరాజులూ నేనూ సందులోంచీ మెయిన్రోడ్డు మెగుల్లోకొచ్చేసాం…

‘‘ఒరేయ్‌ రాజా ఉదయాన్నే శ్రీమన్నారాయణ్ణి పలకరించెళ్ళు వీలైతే నీతో పాటు స్కూలుకు తీసుకుపో… యీ మనిషి మొండీ… వాడు మూర్ఖుడూ’’ అన్నాడు.

‘‘ఏం గాదులే నేన్లేనా… నువ్‌ మల్లా చెప్పాల్నా సార్‌’’ నిర్లక్ష్యంగా రంగరాజు గొణిగాడు…

చీకటే ఎక్కువగా వున్న గతుకురోడ్డుమీద… మెదళ్ళమీదావరించిన మత్తుపొరతో… కొద్దేళ్ళుగా పరిచయస్తుమయిన, నేనూ రంగరాజునబడే యీ వ్యక్తీ అత్యంత సన్నిహితుమైనట్టు నేను వాడి భుజం చుట్టూతా చెయివేసి… వాడినించీ యోజనాల దూరంలో అస్తిత్వం కలిగి… ఓ తాత్కాలికమయిన మజిలీ కలిగిన అతి చిన్న ప్రయాణం చేస్తూ…

‘‘సార్‌, కాలే సార్ని చూసొస్తాసార్‌…. మార్నింగే… పాట పోయింతర్వాత యింకేం కాలేసార్‌… ఆర్మోనియం బెలోస్కి బొక్కపన్నట్టు కదసార్‌. ఆదివిశ్ను సార్‌కి క్లోజ్‌సార్‌… మంచిదోస్తు సార్‌’’ రంగరాజులు యింకా ఏదేదో మాట్లాడుతోన్నాడు.

ఎవరు కాలే? ఎవరీ రంగరాజు? సంగీతకారుడు కాలే చావకుండా ఎందుకు బతికాడూ? కాలూచెయ్యీ మాటా పడిపోయి… కోలుకుంటాడో లేదో తెలీని మృతసదృశమయిన అస్తిత్వంతో. అందరూ విసుక్కొంటూంటే… మలమూత్రాలకూ, ముద్దకూటికీ యింకొకళ్ళను విసిగిస్తూ…. బతుకా అదీ? నేనెట్లా చస్తా? వీడు యీ రంగరాజుల్గాడెట్లా చస్తాడూ… మేమంతా బతికేవున్నామా? అసలు చావంటే ఏమిటీ? సెన్సేషన్స్‌… టర్మినేషనాఫ్‌ ఆల్‌ బయలాజికల్‌ ఫంక్షన్స్‌… అమ్మో! భయం మృత్యుభీతి… నెక్రోఫోబియా… రంగరాజులేదో సణుగుతునే వున్నాడు. నడుస్తున్నా కూడా…. కళ్ళముందు చీకటీగలు మూలుగుతునే వున్నాయి… కాలేను హస్పిటల్లో చూట్టానికి మనసంగీకరించట్లే… వెళ్ళనని తీర్మానించేసుకున్నా…

ఆటోలో ఎట్లా కూచున్నానో తెలీదు… ఆటోవాడు ‘‘దిగు… దిగూ’’ అన్డంతో, దిగి వాడికో పది కాయితమిచ్చి… ఇంటికి చేరుకున్నా… తలుపు తెరిచేవుంది. టీవీ ఆన్లోవుంది…. టీవీ ఎదురుగా…. ఓ ఘనీభవించిన భావరాహిత్యం…

చైతన్యరాహిత్య ప్రతిరూపం…

ఓ కామనాలేమి…

ఓ ఎండిపోయిన చెరువులోకి దూకేసిన ఆకాశం…

నాతోపాటు రెండు దశాబ్దాలు ఉంటూ లేకుండా వున్న ఓ పరిచిత భౌతిక రూపం…. అపరిచిత వ్యక్తిత్వం…

సుభద్ర… సోఫాలో…

శ్రీమన్నారాయణ షెడ్డులో రేగిన ఆకలి, ఆవిరైపోయింది… క్యాంటిన్‌ కుర్రాడు ప్లాస్టిక్‌ సంచిలో బంధించి తెచ్చిన పరిమళాలు లీగా గుర్తున్నాయి. చాపమీద నూనె పీల్చుకున్న న్యూస్పేపర్‌ పొట్లాంలో మిరబ్బజ్జీలూ… ఎగిరిపోతున్న ఆకలి చిత్రానికి గాలమేసి లాగి పట్టి కళ్ళముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేసా… ‘‘తింటావా? తిన్నావా?’’ జవాబాసించని ప్రశ్న… అసలక్కర్లేని ప్రశ్న…

‘‘నేన్తింటాలే… సిన్మాచూడు’’

మనిషి ఏం కోరుతూ జీవితాన్ని సాగదీసుకొంటాడు? అసలు నాలాంటి వాళ్ళకి ‘రేపు’ ఎందుకు? ఈ సుభద్రకు రేపటి మీద కామనుంటుందా? ఇన్ని కోట్లాదిగా కామనారహిత అస్తిత్వాలెట్లా వుంటాయి? నేనొకణ్ణే యిట్లా ఊహిస్తున్నానేమో! కోటి కోర్కెల్తో ఆశల్తో…. కొత్త ప్రభవా మీది నమ్మకంతో… నేనూ నాలాంటి వాళ్ళం తప్ప అందరూ మరుసటి ఉదయం తలుపు తెరుస్తారేమో! లేపోతే ఇన్నిన్ని వేల ఏళ్ళుగా మానవుల మనుగడెలా సాధ్యపడుతుందీ? ఇట్లా ఈ బొమ్మజెముడాలోచన్లతో చీకాకు పడే బదులు… కోట్లజనాల్లా భగవదస్తిత్వ భరోసాతో బ్రతకడం మేలేమో! ఉంటే గింటే వుండి ఛస్తే అంతా వాడే చూసుకుంటాడు… మంచికీ వాడే, రోజువారీ రొచ్చుకూ వాడే కారణం… అనుకుంటూ… కళ్ళుమూసుకుని, మనకై మనం నిర్మించుకున్న ఓ రూపాన్ని తల్చుకుని… ‘ఒరేయ్‌ దేముడా! నన్ను బాగా చూడూ, నా పెళ్ళాం బిడ్డల్ని బాగా చూడూ, దండిగా డబ్బులియ్యీ, నా కూతురికి పెళ్ళీ, నాకొడుక్కుజ్జోగం, నీ గుడికో మెట్టు కట్టిస్తా… నేన్చేసుకున్న దానికంటే ఘనంగా నీకూ పెళ్ళిచేస్తా….’ మళ్ళీ వాడికో అందమయిన ఆడదేవతను తయారుచేసీ… మనకు గలీజులైన మలమూత్రాల రొచ్చు వాడికి పెట్టకుండా… భలే మనిషండీ దొంగగాడ్దికొడుకు…. నిజమే కదా…. వాడికి గోపురాలు కడతాడు, కల్యాణమండపాలు కడతాడు, అన్నీ పకడ్బందీగా కట్టేస్తాడు… దేముడికో కక్కసు మాత్రం చరిత్రలో కట్టిందాఖలాలు లేవు… వున్నాయా? వాడేం మానవమాత్రుడా? దేముడండీ… వాడికి పెళ్ళాం కావాలి… బిడ్డలు కావాలి… యుధ్ధాలు కావాలి… వాహనాలు కావాలి… నగరాలు కావాలి… కానీ మనిషికున్న రొచ్చు మాత్రముండకూడదు… వాడికాకలుండదు… నిద్రుండదూ… ఛావస్సలుండదు… పడిశెం లాంటివి పట్టవు… ముక్కుంటుందిగానీ చీదడు… కొండకచో వాడే మర్మావయపురూపం తీసుకుని… నిటారుగా ఆరేడడుగులెత్తు లేచుంటాడు… కానీ మనం ఆ రూపానికి బూతుపదం వాడకూడదు. సిల్లీ…. క్వైట్‌ సిల్లీ…. బట్‌ ఫాసినేటింగ్‌…. దేముడ్ని సృష్టించినప్పుడే మనిషి క్రియేటివిటీ గొప్పదనం తెలుస్తుంది… ఎన్ని ఊహలూ… ఎంతచిత్రణో… గొప్ప గొప్ప కవితాత్మకమై పురాణేతిహాసాలూ, నృత్యాలూ… చిత్రలేఖనం… శిల్పం… ఆ దేముడనబడే ఒకే ఒక కల్పన్చుట్టూ ఎంత ప్రతిభావంతంగా నిర్మించాడు మనిషీ… గొప్పోడివిరా మనిషీ…

పాచిరంగు చిన్నపూల లుంగీలోకి దూరా… ఒంటికాలినృత్యం చేస్తూ ప్యాంటూడదీసుకున్నా… ఇంకో రౌండేసుంటే బావుండేదేమో… బాత్రూంలో ఒంటేలుకి పోతే ఆల్కహాల్‌ వాసన గుప్పుమంది…. ఇట్లాంటి చిత్రణలు మన్తెలుగుసాహిత్యంలో కనబడవెందుకో అశ్లీలానిపేరు. ఏ ఫిలిప్‌రాతో… మిన్‌కుందేరాలో రాస్తే… అహ్హహ్హ ఎంత రియలిస్టిక్‌గా రాసారండీ అనేయగలరు…. కుందేరా మరీనూ కథలో ఓ అధ్యాయానికి ‘యూరినేషన్‌’ అని పేరే పెట్టేశాడు. రాత్‌ మరీనూ తండ్రీ కొడుకు కలిసి ఒంటేలు పోస్తున్న చిత్రాన్ని వివరిస్తూ ‘‘నాన్న ధార పేనిన తాడులా వస్తోంది…. నాది పీలగా దారప్పోగులా వుంది’’ అని కథానాయకుడి చేతనిపిస్తాడు.. రాత్‌ ఇక కాల్పనిక సాహిత్యం రాయననేసాడు. చూడాలి… చూడాలి… నాలిక్కి శతకోటి క్షమాపణల్చేప్పి… చల్లన్నం బొక్కి ప్లేట్‌ని సింక్‌లో పారేసి…. గుమ్మంబైటికొచ్చి సిగరెట్‌ వెలిగించుకున్నా…

నేను దింపినా దింపకపోయినా ఈ రోజనబడే కాలభాగానికి తెరపడినట్టే…. ఏమిటీ కాలం? ఎప్పటిదీ కాలం?

ఉదయ సాయంత్రాలూ..

గంటలూ… నిమిషాలూ…

నిన్నలూ… రేపులూ…

ఏడాదులూ… శతాబ్దాలూ…

యుగాలు యుగాలు గడుస్తూ కాలశరం దూసుకుపోతూ…

ఎడిరగ్‌టన్‌… ఎంట్రపీ… ధర్మోడైనమిక్స్‌… కాలేజీపాఠాలు కాకుండా నానా చెత్తా చదివితే యింతే… నాకెందుకీ రొచ్చూ…? జ్ఞానానికంతేమిటీ? శ్రీమన్నారాయణేం చదివుంటాడూ, దాదాపు ప్రతి విషయం గురించీ కొద్దోగొప్పో మాట్లాడ్తాడు… ఆయనకి ఆ పిల్ల మైత్రికి ఏం సంబంధం… అతనింట్లో పెళ్ళాం కొడుకుల్తోటెందుకు దెబ్బలాడాడు. లమ్డీ మనుషుంటాడు. చీకటీగల్తో పోలుస్తూ… నేనూ చీకటీగనేనా? ఎవర్కో… సుభద్రకా? బయటి జనాలకా? సుభద్ర, బయటి జనాలు నాకు చీకటీగలేనా? ఏమిటో ల్యాటిన్‌ పదం చెప్పాడు గుర్తురావట్లే…. లోపలికి తొంగి చూసా… సుభద్ర లేదు…. గవర్నమెంటుద్యోగం చేస్తుంది… తను బాగానే సంపాదిస్తుంది. ఎప్పుడో ఇరవైయేళ్ళక్రితం… యాదృచ్ఛికంగా నా జీవితంలోకి ప్రవేశించింది. ఉండిపోయింది. ఒక్క ఏడాదీ ఏడాదిన్నర పాటు శారీరక వ్యామోహల్తో బానే గడిచింది. తర్వాత్తర్వాత మా మా అస్తిత్వాల గురించిన పోరాటం ప్రారంభమయి.. ఎవరిది వాళ్ళం గెల్చుకున్నాం. పెళ్ళయిన మూడేళ్ళకు సర్వీస్‌ కమిషన్‌ రాసి ఉగ్యోగం తెచ్చుకుంది. నైమిత్తికావసరాలకు తప్ప మా మధ్య సాధారణ సంభాషణలు నడవ్వు… ఈ చిన్న కొంప కూడా తన్దే…. లోనింకా కడుతోంది బ్యాంకుకి ఈయంఐ ద్వారా… ఇప్పుడు దాదాపు ఒకర్నొకరు తాకడానిక్కూడా సందేహించే పరిస్థితి. తన బాగుకో నా బాగుకోసమో పిల్లలు కగలేదు. ఇద్దరికి కామన్‌గా ఉన్న గుణం చదవడం. తనూ పుస్తకాలు కొంటుంది. ఎప్పుడైనా నాకు చెబుతుంది. ఫలాని ఫలాని పుస్తకం బావుంది చూడూ… అనో… లేదూ ఫలాని పుస్తకం దొరకలేదు తెచ్చిపెట్టమనో…. ఇంతకీ ఇరవైయేళ్ళ పరిచయిస్తులమ్మేం. ఆమెకో యిద్దరు స్నేహితులున్నారు. ఇద్దరూ ఆమెకంటే చిన్నవాళ్ళు. అక్కా, అక్కా అంటూ యీమె చుట్టూ తిరుగుతుంటారు. ఒకట్రెండు సార్లు వాళ్ళిళ్ళలో ఫంక్షన్కూడా కలిసెళ్ళాం. బండి వెనక్కూచున్నా… తగలకుండా జాగ్రత్తగా కూచుంటుంది. ఇద్దర్లో ఒకరం. హఠాత్తుగా తప్పుకున్నా ఏ విధమైన కదలికా యిద్దరి జీవితాల్లో వుండదనద్నది ఖాయం. వుంటుదేమో… తాత్కాలికంగానయినా వుండాలి. ఎన్నో ఏళ్ళుగా దార్లో రోజూ కనిపించే ఓ పెద్ద బండరాయినెవరో హఠాత్తుగా పగలగొట్టి తీసేస్తే కలిగే శూన్యంలాంటిది. తర్వాత దాని రాహిత్యానికలవాటు పడిపోతామంతే ఏమో ఆమె అంతరంగంలోకి తొంగి చూసే ప్రయత్నం నేనెన్నడూ చేయలేదు. ఆమే అంతే… ఈ మాత్రం దానికి కలిసుండడం దేనికీ అంటే అలవాటు పడిపోయాం… నాకూ శుభ్రమయిన కూడూ గూడూ లభ్యమవుతున్నాయి. ఆమెకీ ఓ సాంఘికపరమైన గుర్తింపు…. ఓ సోషల్‌ ఐడెంటిటీ… మరట్లాంటప్పుడు శ్రీమన్నారాయణన్నట్టు తను నాకో, నేను తనకో చీకటీగలెట్లా అవుతాం…

ఆలోచించి ఆలోచించి అలుపొచ్చేసింది… చిన్నగా మగత కమ్ము కుంటోంది… తలుపేసి గదిలోకొచ్చి నా బెడ్‌మీద వాలిపోయా…

(సశేషం)

కాశీభట్ల వేణుగోపాల్ @9550079473

‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

egire-pavuramaa-19

(గూడు చేరిన పావురం..)

 

శ్రావణ శుక్రవారం తొమ్మిదికి ముందే నేను, ఉమమ్మ ఒకేసారి కోవెలకి వచ్చాము. అల్లంత దూరాన్నుంచే, నన్ను చూసి చేయి ఊపి గుడిలోకి వెళ్ళిందామె.

పుస్తకాలయంలో గల్లాపెట్టె సర్డుతున్న నేను, “గాయత్రీ,” అన్న ఉమమ్మ పిలుపుకి తలెత్తి చూశాను. “సోమవారం ఇక్కడ శెలవు చెప్పు. నీకు జరగవలసిన వైద్య పరీక్షలకి మల్లిక్ గారు వాళ్ళ ఆసుపత్రిలో సమయం కేటాయించారు,” అంది ఉమమ్మ.

 

అలాగేనని తలాడించాను. ‘ఇప్పటికీ నామీద అదే శ్రద్ధ, అదే ఆపేక్ష ఆమెకి. కాలం గడిచినా, చెక్కు చెదరని ఆమె అంకితభావం నమ్మలేకపోయాను. ఆమె నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది’ అనుకున్నాను.

 

‘ఎప్పుడు వచ్చినా ఓ మంచి వార్తో, మంచి తలంపో వెంట తెస్తుంది ఉమమ్మ. ఆమె కలిసిన ప్రతిసారి నా మెరుగు కోసమే తాపత్రయ పడుతుంది. ఆమె ఋణం తీర్చుకోలేనిదే’ అనుకుంటూ పని మొదలెట్టాను.

**

గుంటూరులోని మల్లిక్ గారి కొత్త హాస్పిటల్లోనే నా వైద్య పరీక్షలు జరిగాయి. నాలుగేళ్ళ క్రితం వంశీ సంస్థ వారు జరిపిన పరీక్షల ఆధారంగా – మరిన్ని పరిశోధాత్మక విధానాలు జరిపించారు అక్కడి నిపుణులు.

 

కాళ్ళల్లో కదలిక విషయంగా – మరింత వైజ్ఞానిక పరిశీలన జరిపించారు.

మాట విషయంగా – నాదతంత్రులుండే స్వరపేటిక పరీక్ష’ నిర్వహించారు.

‘ఇంద్రియ సమన్వయ పరిశీలనా పరీక్షలు’ కూడా జరిపారు.

**

మళ్ళీ వారం, నాకు జరిపిన ఆ సూక్ష్మమైన పరీక్షల వివరణ పత్రం ఇచ్చారు…

 

పసితనంలో కలిగిన తీవ్ర అఘాతము వల్లనే నాకీ అంగవైకల్యం ఏర్పడి ఉండవచ్చని భావించారు.

నడక, మాట కూడా చికిత్సతో తిరిగి వచ్చే అవకాశముందని చెప్పారు ఆ నిపుణులు.

కదలిక విషయంగా – కాళ్ళకి కనీసం నాలుగు ఆపరేషన్లు తప్పవన్నారు. ఆ తరువాత వ్యాయామం, కాయకల్ప చికిత్స కూడా కొంతకాలం జరిపిస్తే క్రమేపీ నడక వస్తుందన్నారు. కమలమ్మ పెట్టించిన కుత్రిమ కుడి కాలు మాత్రం అలాగే ఉంటుందన్నారు.

వాక్చిత్సలో భాగంగా వాక్‌ శిక్షణ, వాక్ పునరుద్ధరణతో పాటు ఆధార-సలహా సమావేశాలు నిర్వహిస్తే మాట సమర్థత ఏర్పడే అవకాశం ఉందని, తద్వారా తప్పక నా అవిటితనాన్ని అధిగమించగల అవకాశం మెండుగా ఉందని అభిప్రాయ పడ్డారు.

 

ఆ వివరణ విని, తాత అనుకున్నట్టుగానే నేను అందరిలా నడిచి మాట్లాడగలిగే అవకాశం ఉందన్నారు అందరూ.

నాకు వైద్యం త్వరలో మొదలవ్వాలని పట్టుదలగా ఉంది ఉమమ్మ.

**

శ్రీ గాయత్రి పుస్తకాలయం’ జమాఖర్చులుతో పాటు కోవెల జమా-ఖర్చులు కూడా నా బాధ్యతగా చూసుకొమ్మన్నారు పూజారయ్య. పుస్తకాలయంలో, అప్పుడే ఆరునెల్లగా నా విధులని సవ్యంగా, శ్రద్దగా నిర్వహిస్తున్నాను.

అప్పుడప్పుడు ఓ క్షణం కమలమ్మ గుర్తొచ్చి వెన్నులోంచి దడ పుడుతుంది.   ఎప్పుడూ తటస్థంగా ఉండే గోవిందు, ఊహించని విధంగా, సమయానికి   నాకు సాయం చేయబట్టే, నా జీవనం నేనాశించిన గమ్యం చేరింది.

మా జీవితాలని మూడేళ్ళ పాటు తన గుప్పిట్లో పెట్టుకున్న జేమ్స్ కూడా గుర్తొస్తాడు.

తండ్రి వయస్సున్న జేమ్స్, నా సంగతంతా తెలుసుకున్నాకయినా, నా పట్ల ఒకింత సానుభూతితో, మానవతతో, నేను తాత వద్దకు చేరడానికి   సహాయ పడుంటే, మరోలా ఉండేది కదా అనిపిస్తది.

**

మరో వారం రోజుల్లో, ఆదివారం నాడు ఉమ్మమ్మ వాళ్ళ ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ వారి కార్యక్రమం జరగబోతుందని ఊళ్ళో సందడి మొదలయ్యింది. ఉచిత వైద్యశిబిరం గురించి అందరికీ తెలియజేసి, ఊరంతా నమోదు పత్రాలు పంచారు.

**

“నీతో ఓ ముఖ్యమైన పనే ఉంది,” అంటూ ఉమమ్మ పుస్తకాలయంకి   వచ్చి, నా ఎదురుగా చెక్క కుర్చీ మీద కూచుంది. వెంట రాములు కూడా ఉంది.

జరగబోయే సమావేశం గురించి మాకు అర్ధమయ్యేలా చెప్పింది ఉమమ్మ.

“స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించి ఈ సమావేశం జరుగుతుంది.

భ్రూణ హత్యలు, శిశు హత్యలు, ఆడపిల్లల్ని నిర్దాక్షణ్యంగా త్యజించడాలు – మానవజాతికి ముప్పుగా మారుతున్నాయన్న విషయం ప్రస్తావిస్తారు. ప్రసంగించేవారిలో రాజకీయ నాయకుడు, టివి నటి, సంఘకర్తలు ఉండవచ్చు,” అంటూ నా వంక చూసింది ఉమమ్మ.

 

“గాయత్రీ, ఈ సందర్భంగా – నీ సంగతి – అంటే – పసిగుడ్డువైన నిన్ను నీ కన్నతల్లి త్యజించిన వైనం, దాని పర్యవసానం, తాత నిన్నాదుకున్నప్పటి నీ పరిస్థితి గురించి మీటింగులో నేను మాట్లాడవచ్చా?” అని అడిగింది.

 

తదేకంగా ఆమెనే చూస్తూ ఆమె చెప్పేది వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. నన్నే గమనిస్తున్న ఉమమ్మ వైపు తలెత్తి చూశాను.

కూర్చున్న స్థానం నుంచి లేచి ఆమె చేయందుకున్నాను.   నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టు తల ఊపి హామీ ఇచ్చాను. పక్కనే ఉన్న నోటుపుస్తకం అందుకొని,

‘నేను మీ మనిషిని ఉమమ్మా, మీరు నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. మీకు ఈ కార్యంలో నేను ఏ విధంగా పనికి రాగలిగినా నాకు సంతోషమే’.

అని రాసి అమెకందించాను.

 

“అంతేకాదు గాయత్రీ. నీకు చెప్పాల్సింది మరో విషయం ఉంది,” అంటూ లేచి దగ్గరగా వచ్చి, నన్ను నా స్టూలు మీద కూచోబెట్టింది. నా చేయి తన చేతిలోకి తీసుకుంది.

 

“మన సంక్షేమ సంస్థ సహకారంతో, నీ గతం గురించిన కొని వివరాలు కూడా సేకరించగలిగాము,” అన్న ఉమమ్మ మాటకి మళ్ళీ ఉలిక్కిపడి ఆమె వంక చూసాను.

 

“పందొమ్మిదేళ్ళ క్రితం, జూన్ లో ఓ మూడురోజుల పాటు ఇక్కడ ఉధృతమైన వాతావరణం నెలకొన్నుందంట. ఆ సమయంలో మన ఊళ్ళో జన్మించిన ఆరుగురు పసివాళ్ళలో,   ఐదుగురి ఆచూకి ఉంది.   ఒరిస్సా నుండి పక్క ఊరికి వచ్చున్న మరో స్త్రీ కూడా, ఇక్కడ ఆడపిల్లని కన్నట్టు నమోదైన సమాచారం తప్ప, ఆచూకి లేదు.

కన్న మూడోరోజున పసిబిడ్డని తీసుకొని, ఆ ఉద్రిక్త వాతావరణంలోనే ఆ బాలింత వెళ్ళిపోయిందని మన చిన్నాసుపత్రి సమాచారం. ఆమే పసిబిడ్డని త్యజించి ఊరెళ్ళిపోయుంటుందని అంచనా,” ఆగింది ఉమమ్మ.

 

“ఆ బిడ్డవి నువ్వేనని ఆధారాలున్నాయని తెలిసింది. నీ ఇష్టం. నీకు కావాలంటే   ఆ వివరాలు, ఆధారాలు అడిగి తీసుకోవచ్చు,” అందామె భుజం మీద చేయి వేస్తూ.

మౌనంగా ఉండిపోయాను…

“బాధ పడకు… అలోచించు.. వివరాల వల్ల మనకి ఉపయోగమే లేదు… పైగా అసలావిడ ఈ చుట్టుపక్కల్లో   ఉండే మనిషి కాదు కూడా.     ఆమెకి పక్క ఊళ్ళో ఉన్న బంధువు ఆమె అమ్మమ్మట. ఆ అమ్మమ్మ చనిపోయి కూడా చాలా కాలం అయిందట. …

నీకెందుకు మళ్ళీ జీవితంలో ఓ అయోమయం, అన్వేషణ? సమయం వృధా చేయకుండా, చదువుకొని నీవు ఎదగాలి గాయత్రీ,” అంటూ సముదాయించింది…

**

అలజడి, ఆవేశం, దుఃఖం, అసహనం నన్ను చుట్టేసాయి.

రాత్రంతా కంటి మీద కునుకులేకుండా గడిపాను.

తెల్లారే సమయానికి మనసు కుదుటపడింది.   ‘అయితే ఏమిటి? అది గతం. ఎన్నడూ నాకు అమ్మగా నిలవని ఆమె కోసం పాకులాడే ప్రశక్తే లేదు. అలాగని ద్వేషించి సాధించేదేమీ లేదు’. ‘నాకు తెలియని ‘అమ్మ’ – ఆ స్త్రీ గురించి, నిన్న నేను విన్నది, తెలుసుకున్నదీ నాకు అనవసరం. అదంతా మరిచిపోవడమే నాకు శ్రేయస్కరం,’ అనుకొని పక్క మీద నుండి లేచాను…

**

egire-pavuramaa18-banner

ఆదివారం సమావేశానికి అనుకున్న దానికంటే ఎక్కువమందే హాజరయ్యారు. మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, పత్రికా విలేఖరులు వచ్చారు. నటి మంజరి వచ్చింది. వారందరి ఉపన్యాసాల వల్ల కొన్ని విషయాలు తెలిశాయి.

వారిలో ఓ సంఘకర్త మాట్లాడుతూ, ఓ పత్రిక నుండి సమాచారం చదివి వినిపించారు…..

‘ఆడశిశువు పుడితే పీక పిసికి చెత్తకుండిలోనో, పొదల్లోనో, డ్రైనేజీలోనో పడేయడం పరిపాటైపోయింది. ఈ క్రియ చదువుకున్నవాళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ చేస్తున్నారు. తల్లిదండ్రులకు కొడుకే తలకొరివి పెట్టాలన్న మూఢాచారంతో మగ పిల్లాడిని వారసునిగా ఎంపిక చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో స్త్రీ గర్భం దాల్చాక స్కానింగ్ ఇతరత్రా పరీక్షలద్వారా లింగ నిర్ధారణ చేసుకుని ‘ఆడపిల్ల’ అని తేలితే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన అమానవీయత, మూఢాచారాలవల్ల ‘స్త్రీ’ భ్రూణహత్యల పరంపర కేవలం తెలుగు నాట 2005 నుండి 2013 కి ఎనభై లక్షలని కొత్తగా వెలువడిన ప్రభుత్వ సర్వే తెలియజేసింది.

అంటూ ఆమె ప్రసంగం ద్వారా తెలిపారు.

మరో యువ రాజకీయ నాయకుడు, దానికి కొనసాగింపుగా ..

“ఈ మధ్యన తేలిన విషయం – తల్లిగా స్త్రీని గౌరవించుకునే విషయంలో – భారత దేశం 39 వ స్థానంలో, అదీ పాకిస్తాన్ కంటే ఐదు స్థానాలు దిగువలోనే ఉందని తేలడం విచారకరం. ఏదైనా ‘స్త్రీ-శిశు సంక్షేమం’ అనేది ఓ నిర్విరామ బృహత్తర కార్యక్రమం. ఉమాదేవి చుట్టుప్రక్కల ఎన్నో తాలూకాల్లో ఈ విషయంగా ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రభుత్వం వారు ఆమెకి మరింత సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాము,”

అని ముగించాడు ఆయన.

 

ఉమమ్మ వంతు వచ్చింది. ఆమెదే ముగింపు ఉపన్యాసం. నేనూ అందరితో పాటు శ్రద్ధగా వింటున్నాను.

 

“తన జీవితానికి అడ్డమ్మొచ్చిందనో, తన కష్టం తీరుతుందనో, కన్నబిడ్డని త్యజించే ముందు – ఆ చర్య వల్ల బిడ్డ భవిష్యత్తు శాపగ్రస్తమౌనేమోనని ఆలోచించవలసిన బాధ్యత ఆ ‘అమ్మ’ కే ఉంది.

ఒక్కోసారి ఆడశిశువు పట్ల వివక్షతో కన్నతల్లే కసాయిలా మారి, ఆ బిడ్డని త్యజించో, విక్రయించో, గొంతు నులిమో వదిలించుకుంటే?

రంగుల హరివిల్లులా అనిపించే ఊసరవెల్లి సమాజంలో, అమ్మ ఆదరణ లేని అడశిశివు యొక్క మనుగడ ఏ రంగు పులుముకుంటుందో? అన్న ఆలోచన చేయవలసిన బాధ్యత ఆ తల్లిదే కాదా?.

మీ అందరిని ఆశ్చర్యపరిచే ఓ సంఘటన చెబుతాను.

‘గాయత్రి’ అని ఓ ఆడబిడ్డ మా కోవెల్లోనే పెరిగింది. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ పడతి. ఆమె తల్లి ఆమెని రోజుల పిల్లప్పుడే నిర్దయగా వదిలేసింది. కేవలం ఆ తల్లి నిర్లక్ష్య, అనాలోచిత చర్య వల్ల ఆ పసిదానికి అవిటితనం ఏర్పడింది. ఓ దయగల పెద్దాయన, ఆ బిడ్డని తెచ్చుకుని, పెంచి పెద్ద చేసాడు. అయినా తల్లి చర్య వల్ల, తల్లి ఆదరణ లేని లోటు వల్ల ఆమె ఇంత చిన్న వయసులోనే జీవితకాలం పాటి కష్టనష్టాలని అనుభవించింది.

మా ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ ప్రయత్నం వల్ల గాయత్రి కన్నతల్లి విషయంగా కొంత సమాచారం సేకరించాం. మొగపిల్లవాడు – వారసుడు కావాలనుకునే ఆమె భర్త, అతని పరివారం నుండి తిరస్కారానికి భయపడి, ఆమె బిడ్డని వదిలివేసుంటుందని అంచనా. అప్పటికే   ఇద్దరాడపిల్లల తల్లి అయిన ఆమె, బరంపురం తిరిగివెళ్ళి బిడ్డ పురిట్లోనే పోయిందని చెప్పినట్టు సమాచారం.

ఎంతో వొత్తిడికి లోనయి ఆ తల్లి అలా చేసుండవచ్చని అనుకున్నా, బాధ్యతా రహితమైన చర్య అని భావించక తప్పదు. ఏమయినా, త్యజించబడిన ఆ నాటి ఆడశిశువే మన ఈ గాయత్రి అని నిర్ధారణకొచ్చాము.  

ఈమెకి మాత్రం – ప్రేమ గల పెద్దాయన ప్రాపకం, శ్రేయోభిలాషుల ఆశ్రయం దొరకడం గొప్ప అదృష్టం.  

అయితే ఇటువంటి అదృష్ట, అవకాశాలు త్యజించబడ్డ మరో బిడ్డకి దొరక్కపోవచ్చు. మరి ఆ బిడ్డల జీవితాలు ఎలా ఉండగలవో ఆలోచించండి,” అని క్షణమాగింది ఉమమ్మ.

అమ్మతనం అద్భుత వరమే! బాధ్యతల వలయం కూడా. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, కన్న బిడ్డకి కనీసం రక్షణ కల్పించవలసిన బాధ్యత మాత్రం ఆ తల్లికే ఉంది. బిడ్డ బాధ్యత చేపట్టలేని ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఎదురైతే, బిడ్డ క్షేమం కోరి కనీసం సమాజంలో ఉన్న సహాయ, అవకాశాలని ఆమె అంది పుచ్చుకోవాలి.

నేటి పురోగామిక సమాజంలో ఆ అవకాశం మెండుగా ఉంటుందామ్మకు…

ప్రభుత్వ సంస్థల చేయూత సైతం సులువుగా లభ్యమవుతుంది కూడా,” అంటూ,…..

 

”పోతే గాయత్రి ఎవరో కాదు, వాకిట్లో మిమ్మల్ని సాదరంగా నవ్వుతూ లోనికి ఆహ్వానించి, మీ నుండి సంతకం తీసుకుని, మీకు కార్యక్రమ పత్రాలు అందజేసిన ఆ చురుకైన అమ్మాయే,”

అంటూ ఉపన్యాసం ముగించింది ఉమమ్మ.

ఆమె కొత్తగా నా గురించి, నాకు జన్మనిచ్చి వదిలేసిన ఆ తల్లి గురించి చెప్పిన విషయం విన్నాను. నాలో పెద్దగా ఎటువంటి స్పందనా కలగలేదు. ఉదాసీనతే తోచింది.

జరుగుతున్న మిగతా కార్యక్రమం చూడసాగాను.

 

….సంఘం లోని కుళ్ళుని కడిగేయాలంటే ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యవచ్చు? అన్న విషయం మొదలుకొని, ప్రభుత్వం నుండి సహాయం ఎలా పొందాలో తెలియజేసే మిగతా వారి ప్రసంగాలతో విజయవంతంగా ముగిసింది ఆ నాటి కార్యక్రమం……

ఆఖరున ప్రభుత్వ సహాయకారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

**

నా జీవితం, గురించి ప్రస్తావన ఈ విధంగా ఉమమ్మ చేస్తున్న మంచి పనికి సహాయ పడితే నా జన్మ ధన్యమైనట్టేనని భావించాను. నాకు నిజంగా మాట్లాడగల స్థితి వస్తే ఉమమ్మకి నావంతు సహకారాన్ని మాటల ద్వారా కూడా అందించాలని నిర్ణయించుకున్నాను.

అవకాశం అంది పుచ్చుకొని ఉమమ్మలా ‘ప్రత్యేక విద్యా విధానం’ లో పై చదువులు సాగించాలని కూడా ఆశ కలిగింది నా మనస్సులో.

**

కోవెల పైమెట్టు మీదనే నాకలవాటైన నా స్థలం, పురాతన రావిచెట్టు నీడన నేను కూర్చునే నాకిష్టమైన నా స్థానం. శ్రీ గాయత్రి పుస్తకాలయంలోని కొలువునే గౌరవంగా నిలుపుకుంటాను.

తాత ఏర్పరిచిన నా జీవితం నాకు ఒక స్వర్గమే అని భావిస్తాను.

    సమాప్తం

   ***************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘ఎగిరే పావురమా!’ – 17

egire-pavuramaa17-banner

 

తాత కన్ను మూసి రెండు నెల్లవుతున్నా, బాధ నుండి తేరుకోలేక పోతున్నాను.

పిన్ని, బాబాయి, రాములు బేషరుతుగా నన్ను ఆదరించారు. ఎవ్వరూ నా మీద కోపతాపాలు చూపించలేదు. చంద్రం పిన్ని, బాబాయి నా విషయాలన్నింటా సాయం చేస్తున్నారు. రోజుకోసారన్న కొట్టాంకి వచ్చి నా బాగోగులు చూస్తుంటుంది పిన్ని.

 

నాకు తోడుగా నాకోసం కొట్టాంలోనే ఉంటున్న రాములు కళ్ళల్లో, చేష్టల్లో నాకు కాస్త ఓదార్పు దొరికింది. నా పట్ల అదే మునపటి చనువుతో ప్రేమగా మసులుతుంది ఆమె.

**

‘పాలెం వచ్చిన కాడినుండి, నా మనస్తాపాల్లోనే సమయం గడిచింది.   ఏనాడూ రాములు మంచిచెడ్డలు కనుక్కోలేదు’ అనిపించింది.

తాత ఆఖరి శ్వాసవరకు అన్ని విషయాల్లో – తాతకి తోడుగా ఉంది రాములే నని చెప్పింది పిన్ని. ఇప్పుడు గుళ్ళో కూడా ఎన్నో పనులు చక్కబెడుతూ, అజమాయిషీ చేసేది కూడా రాములేనట.

నిద్రబోయే ముందు, కొట్టాం తలుపు వేసొస్తున్న రాముల్ని పిలిచి పక్కన కూచోమన్నాను.

కృతజ్ఞతా భావంతో నా కళ్ళు చమర్చాయి. ఆమె రెండు చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను.

‘తాతకి నీవు దగ్గిరుండి సేవ చేసినందుకే కాదు, ఇప్పుడు నాకు తోడుగా ఉంటున్నందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని సైగలతో తెలియజెప్పాను రాములుకి.

 

“పిచ్చిపిల్లా, నువ్వింకా చిన్నదానివే గాయత్రీ. పెద్ద మాటలు ఎందుకులేరా?

అయినా అట్టాగంటే, మరి సత్యమన్న నాకు చేసిన మేలుకి నేనేమనాలి? ఎన్నో తడవలు నన్నాదుకున్నాడు. ఆ రుణమే నేను తీర్చుకుంటున్నా అనుకో,” అంది రాములు.

‘ఇంతకీ నీ జీవనం ఎలా సాగింది? కోవెల్లో మళ్ళీ కొలువు ఎప్పటినుండి చేస్తున్నావు?’ అడిగాను రాములుని.

 

ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది రాములు.

“ఏమనాలిరా గాయత్రీ, అంతా నా తల రాత. నా మామకి ఆరోగ్యం బాగోక నేను అప్పట్లో ఊరెళ్ళిన ఇషయం నీక్కూడా తెలుసుగా.

రెండున్నరేళ్ళకి పైగానే దగ్గరుండి పసిపిల్లాడికిమల్లే సేవ చేసినా, మామని కాపాడుకోలేక పోయాను. రోగం ముదిరి నా చేతుల్లోనే చనిపోయాడు మామ.

ఆ బాధ ఓ ఎత్తైతే, భరణం ఇవ్వలేదన్న కోపంతో వాడిని నేనే చంపానని నింద మోపి పోలీసు కేసు పెట్టింది నా సవితి,” ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది.

“సత్యమయ్య, పూజారయ్య తంటాలు పడి వకీలు సాయంతో నా సమస్యని ఓ కొలిక్కి తెచ్చారు. ఈడ కొలువులో పెట్టారు. నాకు డబ్బు సాయం కూడా చేసి నిలబెట్టారనుకో,” అని వివరించింది.

రాములు కూడా తన జీవితంలో ఎంతగానో నష్టపోయిందని, ఆమె మాటల్లోనే తెలిసింది.

విని బాధపడ్డాను.

కాని మనిషి మాటతీరులో, నడవడిలో, వేషభాషల్లో మార్పు తెలుస్తుంది.   మునుపు లేని పెద్దరికం వచ్చేసింది….

**

పొలం కౌలుకిప్పించాడు రాంబాబాయి. తాత పింఛను రాడం మొదలైంది. కొట్టాంలో చాలా మటుకు అన్ని పనులు నేనే చేసుకుంటున్నా, మనిషి సాయం ఉండాలంటూ రాగిణి అనే ఆయాని పనిలో పెట్టింది పిన్ని.

నా మటుకు నాకు ఏదైనా చదువో, కొలువో ఉండాలనిపిస్తుంది.

ఉమమ్మని, పూజారయ్యని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళని చూడాలని ఉన్నా, నా అంతట నేను వెళ్ళడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు.

‘ఉమమ్మ నన్ను రమ్మని పిలిస్తే బాగుణ్ణు’ అనుకున్నాను మనస్సులో. కబురంపినా చాలు, ధైర్యం వస్తుంది. నా పావురాళ్ళని చూడాలనుంది.

‘నా చదువు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది’ అనుకున్నాను.

**

కోవెల నుండి తెచ్చిన ప్రసాదాలు కంచంలో పెట్టి నా పక్కనొచ్చి కూచుంది రాములు.

కోవెల ఊసులు చెప్పసాగింది…..

 

ఇంతలో, “గాయత్రీ,” అంటూ కొట్టాం తలుపు తీసుకొని పిన్ని లోనికొచ్చింది.

ఆమె కూచోడానికి తన పక్కనే పీట వేసి, తెచ్చిన ప్రసాదం కాస్త పిన్నికి కూడా పెట్టింది రాములు.

 

ప్రసాదం తింటూ, “నీకోసమే వచ్చా రాములు. పొద్దున్న నీ స్నేహితురాళ్ళు కలిశారు. వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం సంగతి ఆలోచించావా? అడిగింది పిన్ని.

“అతన్ని, నేనూ చూసాను. అన్ని విధాల మంచి సంబంధం అంటున్నారు.

నువ్వు కలుస్తానంటే మనింటికైనా వస్తాన్నాడంట పెళ్ళికొడుకు. కలిసి మాట్లాడు. నచ్చితే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయచ్చు కదా. మరి ఏమంటావ్?” అడిగింది పిన్ని రాముల్ని.

 

“చూద్దాములే చంద్రమ్మా, నాక్కాస్త సమయం కావాలి,” అంది రాములు తలొంచుకుని.

“దేనికి సమయం? మరీ ఆలస్యం చేయకు. త్వరగా ఆలోచన కానీయ్. నీకు నెల రోజులు సమయం ఇస్తున్నాం,” నవ్వింది పిన్ని.

 

వాళ్ళ మధ్య స్నేహభావం మెండుగా ఉందని అర్ధమయ్యి బాగనిపించింది. ఎంత కాలంగానో ఒకరికొకరు తెలిసినా, ఈ మధ్య తాత అనారోగ్య విషయంగానే వీళ్ళిద్దరూ దగ్గరయ్యారనిపించింది.

సుబ్బీ, మాణిక్యం, చంద్రం పిన్ని కూడా రాములు పెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నారని అర్ధమయ్యింది.

‘అయితే, రాములు పునర్వివాహం కూడా మంచి పరిణామమే’ అనిపించింది…..

egire-pavurama-18

**

రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి.

వెంట తెచ్చిన పుస్తకాలు దులిపి తిరగేస్తున్నాను.

 

గోవిందు అప్పట్లో నాకు తెచ్చిచ్చిన తెలుగు నవల చదువుతూ, వాకిట్లో కూచున్నాను.

 

సాయంత్రం ఎనిమిదింటికి ఇల్లు చేరుతూనే నాకు కమ్మని కబురందించింది రాములు.

పూజారయ్య, ఉమమ్మ నా గురించి అడిగారని. నన్ను వచ్చి కలవమన్నారని చెప్పింది.

తాత పోయిన ఆరు నెలలకి, నేను ఎదురు చూసిన ఆ పిలుపు ఆఖరికి రానే వచ్చింది.

అంటే సరిగ్గా నేను తిరిగి తాత గూడు చేరిన ఆరు నెలలకి నన్ను కోవెలకి రమ్మన్నారు పూజారయ్య, ఉమమ్మ. చాల సంతోషమైంది.

 

“మన కోవెల ఎంతలా అభివృద్ధి పొందిందో చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు వచ్చినప్పుడు చుస్తావుగా! రేపే బయలుదేరు. మనం పొద్దున్నే వెళితే నీ వెంటే ఉండడానికి నాకు సమయముంటుంది,” అంది రాములు ఉషారుగా…

 

పరితప్త హృదయంతో, తల్లివొడి చేరబోయే బిడ్డలా ‘శ్రీ గాయత్రీ కోవెల’ లో అడుగు పెట్టబోతున్న ఆనందంతో నిద్రే పట్టలేదు ఆ రాత్రి…

**

మరునాడు పెందరాళే, చిన్నప్పటిలా తలార స్నానం చేసి, తడి జుట్టు ముడేసి కోవెలకి తయారయ్యాను.

తాత పటానికి దణ్ణం పెట్టుకున్నాను.

చంద్రం పిన్నికి చెప్పి రాములుతో బయలుదేరాను.

**

మేము వెళ్ళేప్పటికి, అమ్మవారి అభిషేకం ముగించుకొని గుడి మెట్ల మీద కూచునున్నారు పూజారయ్య, ఉమమ్మ. దగ్గరగా వెళ్ళి పూజారయ్య పాదాలంటి నమస్కరించాను. వారికాడ నా దుఃఖం ఆగలేదు. ఉమమ్మ నన్ను దగ్గరికి తీసుకుని సముదాయించింది.

 

“బాధపడకమ్మా గాయత్రీ, మీ తాత ఆపరేషనదీ అయిన కొంత కాలానికి కోలుకొని బాగానే ఉన్నాడు. రోజంతా గుళ్ళోనే గడిపేవాడు. వద్దని వారించినా ఎంతో పని చేసేవాడు. నీ గురించే ఆలోచించి, ఆవేదన చెందేవాడు. వాడి మనస్సుని కాస్త వేదాంతం వైపుగా మళ్ళించాలని ప్రయత్నించాను,” అని పూజారయ్య ఓదార్పుగా మాట్లాడారు.

 

నా భుజం మీద చేయి వేసింది ఉమమ్మ. “ఏయ్ గాయత్రి, బాధపడకు.

నువ్వు మాకు ఎప్పటికీ మా చిన్న గాయత్రివే. మూడేళ్లలో ఎంతో జీవితాన్ని చూశావు. కాస్త ఎదిగావు. ‘చక్కనమ్మ చిక్కినా’ అన్న సామెతగా కొండపల్లి బొమ్మలా ఉన్నావు,” అంది ప్రేమగా.

ఆమె ఆప్యాయతకి నా కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

 

“ఇక్కడ నీ కోసం అదే స్థానం, అదే అరుగు, అదే కొలువు అలాగే ఉన్నాయి. కోవెల్లో అన్ని సదుపాయాలు ఇంకా మెరుగయ్యాయి. కాకపోతే అప్పట్లో ఇక్కడ నువ్వు చేసింది స్వచ్చంద సేవే.

ఇకముందు కోవెల సిబ్బందితో పాటుగా జీతం పుచ్చుకునే ఓ కార్మికురాలువి,” అంటూ నన్నాట పట్టించింది ఉమమ్మ.

నా మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది.

“అసలు మన కోవెల ఎంతగా మారిందో అంతటా తిరిగి చూడు,” అంది ఆమె మళ్ళీ..

 

“రేపు మంచి రోజే, పదింటి వరకు శుభఘడియలున్నాయి. పొద్దున్నే మన కోవెల పుస్తకాలయానికి పనికి వచ్చేయమ్మా, గాయత్రి,” అన్నారు పూజారయ్య.

 

“కోవెలకి కలిసొచ్చిన కొత్త భూములు, తోటల నుండి మొదలెట్టి చుట్టూ చూపిస్తాను ఉమమ్మా,” అని నా చేయందుకుంది రాములు.

**

అమ్మవారి కోవెల్లో నుండి ఆవరణలోకి అడుగు పెట్టిన నాకు రాములు అన్నట్టుగానే ఎన్నో మార్పులు – చేర్పులు తోచాయి.

 

రావి చెట్టు కింద పూజసామాను, పుస్తకాల అమ్మకాలకి చక్కగా అలమారాలు అమర్చారు. అరుగుని మరింత విస్తరించి…విశాలమైన అరుగు ఎత్తుమీద, రావిచెట్టు చుట్టూరా ఓ అద్దాల స్టాల్లా తయారు చేసారు. ఇప్పుడు దాన్ని ‘శ్రీ గాయత్రి పుస్తకాలయం’ అంటారు. లోపల కూడా దీపాలతో వెలిగిపోతుంది.

పొద్దున్న తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటలవరకు వస్తువుల అమ్మకాలు జరుగుతాయి. రాములు అజమాయిషీలోనే ఉంది అక్కడి వ్యవహారం. ఓ పెద్దాయన మాత్రం పుస్తకాలయం అమ్మకాలు, లెక్కల విషయాల్లో సాయంగా ఉన్నాడు.   పొద్దున్నే స్టాల్, గుడి ఆఫీస్ తలుపులు తెరిచి, ఆఫీసు పని, మళ్ళీ రాత్రి క్లోజింగ్ వరకు ఆయనే చేస్తాడట..

అరుగులకి పక్కగా పావురాళ్ళకి ప్రత్యేకంగా స్థలం కేటాయించి చుట్టూ జల్లి అమర్చారు. అందులో ఓ పక్కగా గింజలకి, నీళ్ళకి కూడా ఏర్పాటు చేశారు.

ఎప్పటిలా రెండు సార్లు వచ్చి గింజలు తిని, కాసేపు తచ్చట్లాడి దూసుకొని పోతాయట పావురాళ్ళు. కోవెల్లోకి వాటి రాక, వాటి ఉనికే ఆలయానికి గొప్ప మేలు చేసిందని జనం అంటున్నారంట.

తోటలో ఇప్పుడు మరెన్నో రకరకాల పువ్వులు పూయిస్తున్నారు. పూల దిగుబడి కూడా రెట్టింపయ్యిందంట. పూల విషయంలో సాయం చేయడానికి రమణమ్మ ఉందంట. దండలు అందంగా కడుతుందంట.

గుడిలోని దేవుని మూర్తులకి ఇవ్వంగా మిగిలిన వాటిని కర్వేపాకు, కొబ్బరిచెక్కలతో పాటు కోవెల బడ్డీలో, అమ్మకాలకి పెడుతుందంట….

 

నాయుడన్న కూడా కనపడ్డాడు. ఎంతో ఆప్యాయంగా నా కాడికి వచ్చి పలకరించాడు. యోగక్షేమాలు అడిగి కనుక్కున్నాడు.

పంతులుగారికి పని సాయం చేసే కృష్ణ కనబడ్డాడు. కాస్త పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పదవ తరగతి చదువుతూ, పంతులుగారి కాడ పౌరోహిత్యం చేస్తున్నాడంట.

**

పోతే, కోవెల పరిధిలోకి ఓ ముఖ్యమైన చేరిక ‘సమాజ సంక్షేమ సేవ’ అని అర్ధమయ్యింది. అందుకోసం ఆవరణలో ప్రభత్వం వారి సహకారంతో ‘స్త్రీ సంక్షేమ సంస్థ’కి గాను ఓ కట్టడం, దానికి ఆనుకొని మరో చిన్న ‘ఫలహార శాల’ నిర్మించబడ్డాయి. సంస్థ హాల్లో కనీసం వంద మంది జనం పడతారు. గుడికి సంబంధం లేకుండా దాని ద్వారం రోడ్డు వైపుకే ఉంది.

ఉమమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆ సంస్థ కార్యక్రమాల బాధ్యతలు రాములు, కృష్ణ కూడా పంచుకుంటారంట.

ఏడాదికి రెండు సార్లు అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, బీదవారికి ఉచిత వైద్యచికిత్స చేస్తుందట ఆ సంస్థ.

**

అంతటా తిరిగి చూసాక, మేము అరుగుల మీద పుస్తకాలయం కాడ కూచున్నాము.

“ఇక నీ పావురాలని చూసి, పంతులుగారిని కలిస్తే పనయినట్టే. రేపటినుంచి ఎలాగూ ఇక్కడే ఉంటావుగా,” అని రాములు అంటుండగానే, బారులు తీరిన పావురాలు దూసుకొచ్చి మమ్మల్ని దాటుకొని వెళ్లాయి. మేము వాటిని అనుసరించాము.

తిన్నగా వాటికని కేటాయించిన స్థలంలో కాసేపు విహరించి, గింజలు తినేసి, వాటినే గమనిస్తున్న మా మీదగా ఆకాశంలోకి ఎగిసిపోయాయి.

 

నా చిన్నతనంలో ఆ పావురాల రాకపోకలు నాకెంత ఆనందాన్నిచ్చేవో గుర్తొచ్చింది.

నాకు పక్కగా వచ్చి నా భుజం మీద తట్టింది రాములు.

“నా ప్రకారంగా నువ్వూ ఓ పావురానివే గాయత్రీ. అమాయకురాలివి. ఏదో బాధతో గూడు వీడినా, నీ తాత ఆశీర్వాదం, దేవుని దయ వల్ల ఓ శాంతి పావురంలా తిరిగి నీ గూడు చేరడం నాకు సంతోషంగా ఉందిరా,” అంటూ కళ్ళు తుడుచుకొంది, రాములు.

నిజమే అన్నట్టు తలూపాను.

**

“ఏమ్మా గాయత్రి,” అన్న పంతులుగారి పిలుపుకి ఇద్దరం వెను తిరిగాము. “పూజ ముగించి, నువ్వు వచ్చావని తెలిసి ఇటుగా వచ్చాను. ఏమంటున్నాయి నీ పావురాలు? అడిగాడాయన నవ్వుతూ.

చేతులు జోడించి నమస్కరించాను.

 

“బాగున్నావా తల్లీ?” అని అడిగాడాయన ఆప్యాయంగా.

“ఇప్పటికీ తాత పోయిన దుఃఖంలో ఉన్నావు. మనస్సుని కుదుట పరుచుకో తల్లీ. అంతా దైవేచ్ఛ,” , “నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి,” అన్నాడు పంతులుగారు.

 

తాత మాట వింటూనే నా కళ్ళల్లో నీళ్ళు నిండడం గమనించి, మాట మార్చాడాయన. మాతో పాటు పుస్తకాలయం దిశగా నడిచాడు.

“నీవు ఇక్కడ కొలువు చేయబోతావని విన్నాను. చాలా సంతోషం గాయత్రి,” అన్నాడాయన. “చూశావా? ఉమమ్మ అదృష్టరేఖే మన కోవెల వృద్ధికి ఎలా కారణమయిందో. ఆమె ఎంచుకున్న చదువులు, సరోజినీ గారి చేయూత, వారి ప్రోత్సాహం అన్నీ కలిసొచ్చాయనుకో.

ప్రభుత్వ దేవాదాయ పరిషత్తు వారు, అభివృద్ధికి మన కోవెలని కూడా ఎన్నుకోబట్టి, ఇదంతా సాధ్యమయింది. లేదంటే, మన కోవెల్లో ఇంత మందికి ఉపాధి కల్పించగలగడం మాటలు కాదుగా! ఇదంతా మనందరి పూర్వజన్మ సుకృతం తల్లీ,” అన్నాడాయన.

 

నిజమేగా!, ఔనని తలూపాను.

ఆయన కాడ సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.

**

పనిలో జేరడానికి పోద్దున్నే కోవెలకి బయలుదేరాను.

శ్రీ గాయత్రి పుస్తకాలయం లో అడుగుపెట్టగానే ‘నాలుగేళ్ల తరువాత మళ్ళీ ఈ కోవెల్లో నేను’ అని అనుకుంటూ తాతని తలుచుకున్నాను.

 

తాత ఆత్మకి శాంతి కలిగించే కార్యాలు చేసి, ఆయన ఋణం తీర్చుకోవాలని ఆలోచిస్తూ, కొత్తగా వచ్చిన పూజావస్తువుల డబ్బా విప్పి సర్దడం మొదలెట్టాను.

కాస్త దూరంలోనే వెనుక నుండి ఉమమ్మ మాట వినబడింది. వెను తిరిగి చూసాను. పాలనురుగు లాంటి తెల్లని జరీ అంచు చీర కట్టుకొని ఓ అప్సరలా ఉంది ఉమమ్మ.

 

కాసేపటికి నా ఎదురుగా వచ్చి, చేతిలోని మల్లెచెండు నాకందిస్తూ, “గాయత్రీ, ఆరువారాల్లోనే నీ ఎనిమిదో తరగతి పరీక్షలు. శ్రద్ధగా చదవాలి మరి,” అని గుర్తు చేసింది.

“ఈ పరీక్షలు పాస్ అయిపోతే, సమయం తీసుకొని పదో తరగతి పబ్లిక్ పరీక్షలకి సిద్ధమవ్వచ్చు,” అంటూ నేను సర్దుతున్న పూజా పుస్తకాల నుండి రెండింటిని చేతిలోకి తీసుకుని బయటకి నడిచింది…

 

సమయానికి ఉమమ్మ నాకు చదువు విషయం గుర్తు చేసింది. ‘తాతకి నేను చదువుకోడం చాలా ముఖ్యం అని చటక్కున తోచింది. అదే చేస్తా.’ తాత కోసం ఏమి చేయాలా అని అనుకుంటున్న నాకు నా నిర్ణయం సంతోషమనిపించింది.

ఉమమ్మ వెళ్ళిన దిశగా చూస్తే, చేతిలోని పుస్తకం తిరగేస్తూ రాములుతో మాట్లాడుతుంది ఆమె.

నా వంక చూసి, రమ్మని పిలిచింది.

అప్పుడే వచ్చిన గుమస్తా గారికి చెప్పి, రద్దీ ఏమీ లేకపోవడంతో, వెళ్ళి వాళ్ళకి కొద్ది దూరంలో కూచున్నాను.

 

ఉమమ్మని “పెళ్ళి పనులన్నీ అవుతున్నాయా?” అని సైగలతో అడిగాను.

 

“ఈ సైగలు కొద్దికాలానికి మాటల్లోకి మారుతాయేమోలే గాయత్రి. ఆ ప్రయత్నంగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నానని చెప్పడానికే పిలిచాను. జరపవలసిన వైద్య పరీక్షలన్నీ త్వరలో చేయించుదాము. నీ అవిటితనం పోయి, నీ నోటివెంట వచ్చే మాట వినాలని మీ తాత ఎంత అల్లాడిపోయాడో కదా! అసలు సత్యమయ్య కోసమే ఈ విషయంగా నా గట్టి ప్రయత్నమనుకో, ” అంటూ క్షణం సేపు మౌనంగా ఉండిపోయింది ఉమమ్మ.

 

“ఓహ్, మర్చిపోయాను,” అంటూ తన పర్సు నుండి వెండి కాలి పట్టాలు తీసి, రిపైర్ చేసిమ్మంటూ రాములుకందించి, నా వంక చూసిందామె.

”నా పెళ్ళి పనుల గురించి అడిగావా? అన్నీ బాగానే జరుగుతున్నాయి. మన గుడిలోనేగా పెళ్ళి. అన్ని పనులు నాన్నగారు, మల్లిక్ చూస్తున్నారులే,” అంటూ నవ్వేసింది ఉమమ్మ.

 

మా మాటలు వింటున్న రాములు గబుక్కున అందుకుంది.

“అయినా అంతా ఉమమ్మ కనుసైగల్లోనే నడుస్తారు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటరా గయిత్రీ. మల్లిక్ బాబు మొన్ననే అమెరికా నుండి తిరిగొచ్చాడు.

అంత దూరాన ఉండగానే మన ఉమమ్మంటే నిండా ప్రేమలో పడిపోయాడు. అక్కడినుంచే అన్నీ కుదేర్చేసుకొని ముహూర్తాలు కూడా పెట్టించేశాడనుకో,” అంది నవ్వుతూ రాములు.

 

ఉమమ్మ ముఖం సిగ్గులతో నిండిపోయింది.

“సరేలే, అతిగా నీ కబుర్లు,” అంటూ కసిరిందామె.

ఇంతలో, మా పావురాలు అందంగా దూసుకొచ్చాయి. పూజాసామాగ్రి కోసం భక్తులు రావడంతో, నేను అటుగా నడిస్తే, దానా డబ్బాతో రాములు, ఉమమ్మ పావురాలని అనుసరించారు…

**

పుస్తకాలయం సర్దుతూ దూరాన్నించే రాములు, ఉమమ్మల్ని గమనించాను కాసేపు.

ఉమమ్మ, తాననుకున్నది సాధించుకొంది. హైదరాబాదుకి కూడా వెళ్లి రెండేళ్లు ‘ప్రత్యేక విద్యావిధానం’ లో ఉత్తీర్ణురాలై ఉపాధ్యాయ పట్టా పొందిందంట. సరోజినీ గారి ప్రోత్సాహంతో, ప్రభుత్వం వారి సహకారంతో, గుడి ఆవరణలోనే   ‘మహిళా సంక్షేమ సంస్థ’ ప్రారంభించి, సమాజసేవ చేస్తున్న ఆమెని చుట్టూ గ్రామాల్లోని వారు ఎంతో గౌరవిస్తున్నారట.

 

ఉమమ్మ పెళ్ళి చూడ్డానికి, ఇప్పుడు ఊరంతా ఎదురు చూస్తుంది. పెళ్లయ్యాక ఉపాధ్యాయినిగా పనిచేస్తూనే ఇక్కడ పాలెంలోని ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ కూడా నిర్వహిస్తుందంట.

ఇకపోతే, ఉమమ్మకి కాబోయే భర్త కూడా, మాకు ఆప్తుడైన డాక్టర్. మల్లిక్ గారే. గుంటూరులో ‘శారద సత్య స్పెషాల్టీ హాస్పిటల్ ’ ద్వారా పేదలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారంట.

 

‘ఉమమ్మ నాకు తెలిసినప్పటి నుండి ఇతరులకి సేవ చేయాలన్న తపనతో మసలడం, నా లాంటి వారి అదృష్టమే అనుకుంటాను. ఆమెకి తగిన భర్తని, చక్కటి జీవితాన్ని ప్రసాదించింది ఆ తల్లి గాయత్రి అమ్మవారు.

 

“మళ్ళీ వస్తాను గాయత్రి. మొదలెట్టి పరీక్షలకి చదువు, మళ్ళీ మళ్ళీ పునరీక్షించు, వింటున్నావా?” అంటూన్న ఉమమ్మ మాటలకి ఆమె వంక చూశాను. ‘అలాగే’ అన్నట్టు తలాడించాను.                                                            (ఇంకా ఉంది)

 

‘ఎగిరే పావురమా!’ – 16

egire-pavuramaa16-banner

నేను కళ్ళు తుడుచుకొని బాబాయి వంక సూటిగా చూసాను…

‘చూడు రాంబాబాయి’ అన్నట్టు అతని చేతిని వేళ్ళతో తట్టాను..

కమలమ్మని, గోవిందుని చూపిస్తూ – ‘మూడేళ్లగా వీళ్ళతో కలిసున్నానని, బాగానే ఉన్నానని’ సైగ చేసాను….

జేమ్స్ ని చూపించాను…’అతని వద్ద క్యాంటీన్ లో ‘వంటా-వార్పు’ చేస్తున్నానని’ చెప్పాను…

‘ఆ కొలువు చేయబట్టే, నా కాలి చికిత్స జరిగిందని, ఇంకా నాలుగే వారాల్లో చికిత్స కూడా పూర్తవుతుందని’ తెలియజెప్పాను.

నేనిప్పుడు చాలా మెరుగ్గా కదలగలుగుతున్నానని చెప్పాను…

 

తాత ఉత్తరం తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. తాత మీద ప్రేమ, బెంగా ఉన్నాయని తెలియజేశాను….

ఆయన రాసిందంతా నేను అర్ధం చేసుకున్నానని తాతకి చెప్పమన్నాను.

నా చదువు కూడా కొనసాగిస్తున్నానని,   నేను అన్నీ ఆలోచించి   మళ్ళీ ఉత్తరం రాస్తానని తెలియజేయమన్నాను. తాతని, పిన్నిని అడిగానని చెప్పమన్నాను.

 

ఆఖరికి, చేతులు జోడించి, ఇక బయలుదేరమన్నాను…

రాంబాబాయి కూడా నాతోపాటే ఏడ్చేశాడు…

నాచేతులు తన చేతుల్లో పట్టుకుని, “సుఖంగా ఉండు గాయత్రి. నీవన్నవన్నీ తాతకి చెబుతాలే,” అని వెనుతిరిగాడు..

బాబాయిని సాగనంపడానికి, గోవిందు వెంట నడిచాడు.

కన్నీళ్ళతో   మసకబారిన   చూపుతో వెళ్లిపోతున్న ఆయన్ని చూస్తుండిపోయాను……..

**

కిచెన్లో – పొయ్యిల మీద గుండిగలో కుర్మాకూర కలుపుతున్నాను. వెనుక నుండి జేమ్స్ గొంతు వినవచ్చింది….

కాసేపటికి నా పక్కకొచ్చాడు.

“నీలో మునుపు లేని ఉషారు, ముఖంలో ఓ వెలుగు కనబడుతున్నాయి గాయత్రీ. పోయిన వారం నీ కాలు వైద్యం ముగిసిందని, డాక్టరమ్మ మన జలజ మేడంకి సమాచారం ఇచ్చారు… ఇకపోతే, రేపటిరోజున మళ్ళీ ఒక్కసారి వెళతావంటగా! చికిత్స కొనసాగింపు కాగితాలమీద నీ సంతకాలు కావాలన్నారంట,”… అన్నాడు.

 

తల వంచుకొని పనిచేసుకుంటూ వింటున్నాను….

మరో నిముషానికి నా ముందుకి వచ్చి నిలుచున్నాడు.

 

“గోవిందుతో నీ పెళ్ళికి సరిగ్గా పది రోజుల టైం ఉంది. చాపెల్ బుక్ చేయించింది కమలమ్మ. మిగతా ఏర్పాట్లు నేనే చెయ్యాలి. నీ వాలకం నాకు అర్ధం అవడంలేదు,” క్షణమాగాడు.

“నేను రెండురోజులు మా ఊరికి పోయొస్తా. వచ్చాక మళ్ళీ కనబడతా. ఈ రెండు రోజుల్లో సరయిన నిర్ణయం చేసుకొని నాకు మంచి వార్త చెప్పాలి నువ్వు. లేదంటే నువ్వు, గోవిందు కష్టపడాల్సి వస్తది,” అంటూ నా భుజాన చేత్తో నొక్కాడు.

వాడి చేయి విదిలించి వెనక్కి తిరిగేప్పటికి పక్క వాకిట్లోంచి గోవిందు లోనికొచ్చాడు.

 

అదాట్టుగా అతను ఎదురుపడ్డంతో, ఒక్కక్షణం జేమ్స్ తత్తరపడ్డాడు.

వెంటనే తేరుకొని, “ఏమిరా గోవిందు, నేను రెండు రోజులు ఊరికి పొతున్నా. రేపు కమలమ్మని తోడిచ్చి గాయత్రిని ఆసుపత్రికి పంపించు.   చిన్న పనే అక్కడ. ఏవో సంతకాలు చేయాలంట.. ఈడ నేను లేనప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకో,” అని ఆర్డర్ వేసి వెళ్లాడు తలతిక్క జేమ్స్.

**

“అక్కా, ఇయ్యాల మార్కెట్ నుండి సామాను దింపాక, గాయత్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడు జేమ్స్. వాడు ఊళ్ళో లేడుగా! ఏవో కొన్ని ఎగస్ట్రా పనులు సెప్పాడులే.   ఆసుపత్రికి పోడం చికిత్సకి కాదంట! ఆడేదో కాగితాల పైన సంతకాల పనుందంట. మేమెళ్ళి తొరగానే వస్తాములే,” అని కమలమ్మతో అంటూ, పొద్దున్నే   రోజూ కంటే ముందే ఇంటినుండి బయలుదేరాడు గోవిందు.

**

డాక్టరమ్మని కలిసి, కాగితాలు సంతకాలు చేసిచ్చాను. ఓ కట్ట కాగితాలు ‘మదర్ తెరెసా’ జలజ గారికిమ్మని నాకందించిందామె.

ఇప్పుడు నా కదలిక మునుపెన్నడూ లేనంత సులువుగానే ఉందని చెప్పాను….

క్రచస్ వాడుతునే ఉండమంది.

ఆమె కాడ శలవు తీసుకొని బయటికి వస్తున్న నాకు ఎదురొచ్చాడు గోవిందు.

“కాసేపు గుడికెళ్ళి కూకుందాము రా,” అంటూ అటుగా తీసుకెళ్ళాడు.

**

గుడిలోకి వెళ్ళగానే, “ముందు మొహాన బొట్టెట్టుకో. ఇయ్యాల నుండి నువ్వు బొట్టు తీసే పనే లేదు,” అన్నాడు గోవిందు.

తలెత్తి నవ్వి ఊర్కున్నాను.

దేవుడి కాడ దణ్ణమెట్టుకుని,  దేవుని కుంకుమెట్టుకొని, ఎదురుగా కాస్త ఎడంగా ఉన్న మెట్ల మీద కూచున్నాము.

గోవిందు వెళ్ళి, తినడానికి పులిహోర ప్రసాదం తెచ్చాడు.

 

“గాయత్రీ, ఈడ ఇయ్యాల బెల్లం పాయసం కూడా ఉంది తెలుసా,” అంటూ మళ్ళీ వెళ్ళి రెండు దొన్నెల్లో పాయసం కూడా తెచ్చాడు.

తిని నీళ్ళు తాగాము.

ఎడంగా కూచున్న గోవిందు, లేచి వచ్చి పక్కన కూచున్నాడు.

“నీతో మాట్లాడాలి గాయత్రీ,” అన్నాడు….

 

‘ఏంటో చెప్పమన్నాను’ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి…

నాకు ఈ పెళ్ళీ వద్దు, ఇక్కడి జీవనం వద్దు, నా తాత కాడికి వెళ్లిపోతానని నా మనస్సు పడుతున్న ఆవేదన కన్నీళ్ళగా మారింది……..

 

“ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి కావాలో నాకు తెలుసు… కళ్ళు తుడుచుకో,” అని ఆగాడు.

“…చూడు… నీకు ఎంతో అన్యాయం జరిగిపోయింది గాయత్రి… పాపం మీ తాత, పిన్ని, బాబాయి ఎంత కష్టపడ్డారో!… ఏమైనా కమలమ్మ సేసింది పెద్ద తప్పు.. నేను కూడా ఏం సేయలేను. నాదీ తప్పే… ఇక ఆ గుంటనక్క జేమ్స్ ఇషయం కూడా నాకెరకే…

నీ కష్టం, ఇబ్బంది అన్నీ తెలుసు…నాక్కూడా ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ వద్దు… ఈడనే ఉంటే, ఆ జేమ్స్ గాడు నిన్ను బతకనివ్వడు,” క్షణమాగి సూటిగా నా వంక చూసాడు.

“ఇప్పుడైతే ఊళ్లోనే లేడు. అందుకని,” చెప్పడం ఆపాడు నేనేమంటానోనని..

 

నా కళ్ళకి గోవిందు దేవుడిలా కనబడ్డాడు. ఆగని కన్నీళ్ళే గోవిందుకి   నేను చెప్పగల కృతజ్ఞతలు.

 

“నీ పుస్తకాలు, బట్టలు కూరల సంచీలో పెట్టి తెచ్చాను…

ఆసుపత్రి కాంపౌండులో వాన్ పెట్టి, ఆటోలో రైల్వే స్టేషన్ కెళదాము. గంటలో పాలెంకి రైలుంది. నేను టికెట్లు తీసే పెట్టాను. మీ ఊళ్ళో దిగాక నిన్ను మీ కొట్టాం దారి పట్టించే వరకు నేను తోడుంటాను,” అన్నాడు గోవిందు….

egire-pavurama14

**

అరపూట ప్రయాణమయ్యాక పాలెం చేరాము…..

“మీ తాత కొట్టాంలో ఉంటాడా? లేక గుడిలోనా ?” అంటూ కొట్టాం వైపే మళ్ళించాడు ఆటోరిక్షాని గోవిందు.

పది నిముషాల్లో కొట్టాంకి కాస్త పక్కగా ఆగింది ఆటో.   దిగి గోవిందు వైపు చూసాను. ఏమనాలో తోచలేదు. “ఇక లోనికెళ్ళు,” అంటూ నా బ్యాగు ఆటో డ్రైవర్ భుజాన వేసాడు.

 

కదిలి వెళ్ళి కొట్టాం వాకిట్లో ఆగాను. లోన అలికిడిగానే ఉంది…బ్యాగు లోపల పెట్టి ఆటోడ్రైవర్ వెళ్ళిపోయాడు.

కొద్ది క్షణాలాగి కొట్టాంలో అడుగు పెట్టాను.

**

లోన పదిమంది వరకు జనం ఉన్నారు. చుట్టూ చూస్తే ఎక్కడా తాత జాడ లేదు. ఓ వైపుగా పిన్ని, బాబాయి అటుగా తిరిగి చాప మీద కూచుని, కళ్ళు మూసి చేతులు జోడించి ఉన్నారు. వారికి కాస్త వెనుకగా రాములు కూడా కూచునుంది. సాతానయ్య మంత్రాలు చదువుతున్నాడు. నాకు గుండె జారినట్టయింది. నా కట్టెకాలు సాయంతో మరో నాలుగడుగులు ముందుకేశాను.

అప్పుడు కనబడింది. నేల మీద ముగ్గు మధ్యగా పరచిన బియ్యం మీద తాత పటం పెట్టుంది. పటానికి పూల మాల వేసుంది. పటం ముందు దీపం వెలిగించుంది.

పిన్ని, బాబాయి చేతులు జోడించింది తాత చిత్రపటం ముందని అర్ధమయింది.

గుండెలు పగిలేలా ఆక్రోశించింది నా ప్రాణం. “తాతా ! నీ కోసమే నేనొచ్చాను,

నువ్వు రమ్మన్నావని నేనొచ్చాను,” అని గుండెల్లోంచి బిగ్గరగా కేకపెట్టాను.

నా కేకకి నా గుండెలవిసిపోయాయి. నేలమీద కుప్పలా కూలిపోయాను.

నా ఆసరా కర్రలు కూడా నన్నాదుకోలేక పోయాయి.

కింద పడ్డ నా కర్రల చప్పుడుకి పిన్ని, బాబాయి వెనుతిరిగి చూశారు.

పరుగున నా వద్దకు వచ్చింది పిన్ని…

**

నా కోసం, నా రాక కోసం పరితపించిన తాత, నెల రోజులుగా ఆహారమే తీసుకోలేదంట. ఆరునెల్లగా తాత కంటి చూపుతో పాటు ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందంట. తీవ్ర ఆమ్లత వల్ల కడుపు నొప్పితో బాధపడ్డాడంట. ఆఖరి వారం రోజుల పాటు ఏ మందులకీ ఆగని వాంతులతో చాలా నీరసించి చనిపోయాడంట తాత.­­

 

రాత్రింబగళ్ళు బాధతో, దుఃఖంతో గడిపేస్తున్నాను… రాములు, పిన్ని పక్కనే ఉండి ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

**

తాత చనిపోయి పన్నెండు రోజులయింది. ఇవాళ తాత తద్దినాలు. నిద్రపట్టక, తెల్లారుజామునే లేచి మంచం మీద కూచుండి పోయాను. పదమూడో రోజు కొట్టాంలోనే శాంతిభోజనాలు పెడుతున్నారు పిన్ని, బాబాయి వాళ్ళు.

చంద్రం పిన్ని నా కాడికి వచ్చి, నా మంచానికి ఎదురుగా ఉన్న చెక్క బీరువా నుండి చీర, గాజులు తీసి కట్టుకోమని మంచం మీదెట్టింది.

తలెత్తి పిన్ని వంక చూసాను. పక్కన కూర్చుని నా భుజాల చుట్టూ చేయి వేసింది.

ఇద్దరం దుఃఖాన్ని ఆపుకోలేకపోయాము.

 

పిన్నే ముందు తేరుకుంది.

“తాత నీ పద్దెనిమిదో పుట్టినరోజుకని ఈ చీర కొని ఉంచాడురా, గాయత్రి.

అంతే కాదు. గత మూడేళ్ళగా నీ పుట్టిన రోజుకని చీరలు, గాజులు కొనిపెడుతూనే ఉన్నాడు.

అందుకే తాత ఆత్మశాంతికి ఇయ్యాళ ఇది కట్టుకొని ఈ గాజులేసుకో,” అంది పిన్ని.

 

నాలుగేళ్ళగా నా పుట్టినరోజుకంటూ చీర, సారె కొని ఉంచిన తాత నాపై ఎంత ఆపేక్ష పెంచుకున్నాడో అర్ధమయి కుమిలిపోయాను.

తాత పెద్దదినం అయ్యేంత వరకు, ఓ ప్రాణమున్న శిలలా భారంగా గడిపాను. తాత పట్ల నేను వ్యవహరించిన తీరుకి నాలో గూడుకట్టుకున్న పశ్చాత్తాపం వెల్లువైంది.

**

రాములు నన్ను కనిపెట్టుకొని ఉంటుంది.   వంట చేసి, నాకు చెప్పి పొద్దున్నే గుడికి వెళుతుంది. సాయంత్రం చీకటయ్యాక ప్రసాదాలు తీసుకొనొస్తుంది.

నాకు రోజంతా తోచకుండా అయిపొయింది… బయట కొట్టాం చుట్టూ, రెండు మూడు సార్లు తిరిగొస్తున్నాను…..

 

గత మూడేళ్ళగా, కొట్టాం కూడా మరమత్తులు చేయించి, వీలుగా ఉండేలా కొద్ది మార్పులు చేయుంచాడు, తాతని తెలుస్తూనే ఉంది.

తడికలు తీసి చెక్కలు, పెట్టించాడు.

గదిలో చెక్క బీరువా, పక్కనే నిలువాటి అద్దంతో సహా పెట్టించాడు.

పొయ్యి కాడ స్థలం, ఎనకాతల స్నానాల గది కూడా మెరుగయ్యాయి.

కొట్టాం చుట్టూ రాళ్ళతో అరగోడ కట్టించి చిన్న గేటు, గొళ్ళెం కూడా పెట్టించాడు.

 

అరుగు మీద కూచుని, రాములు తెచ్చిన సనక్కాయలు వోలుస్తుండగా వొచ్చింది చంద్రం పిన్ని.

పొయ్యుకాడ నుండి చాటలో బియ్యం తెచ్చుకుని, ఎదురుగా కూచుంది.

“మెల్లగా నీ దుఃఖాన్ని మరిచిపోవాలి. నీ వెంట బోలెడన్ని పుస్తకాలున్నాయిగా! చదవడం మొదలెట్టు… బాబాయికి చెప్పి ఇంకా పుస్తకాలు తెచ్చుకునే దారి చూద్దాం. సరేనా?” అంది.

అలాగేనని తలూపాను…

 

“అసలు ముఖ్యమైన సంగతి ఒకటుందిరా గాయత్రీ. మీ తాత గురించే. ఈ మూడేళ్ళు, ఆ మాత్రమన్నా ఉన్నాడంటే, ఆ పూజారయ్య చలవేరా. సత్యమన్న పట్ల జాలితో, అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, గుడిలోనే నీడ పట్టున పూజాసామగ్రి అమ్మకాలికి కూర్చోబెట్టి, అందుగ్గాను గుడి నుండి జీతం ఏర్పాటు చేసాడాయన.

పింఛను కూడా కలిపితే మెరుగ్గానే బతికాడు తాత. తన తదనంతరం ఆ పింఛను నీకు అందేలా రాసి ఏర్పాటు చేశాడు. కొట్టాంలో ఈ మరమత్తులు కూడా చేయించాడు,” అంది పిన్ని.

 

“అప్పట్లో రాంబాబాయితో నువ్వు వెనక్కి వచ్చేసి ఈడ సుఖంగా ఉంటావని ఆశపడ్డాడు సత్యమన్న. కానీ, నువ్వు రాకపోయేప్పటికి కృంగిపోయాడు పాపం. తన బాధ పైకి తెలీనివ్వలేదు.

“నా చిట్టితల్లి తప్పక తిరిగి వస్తది. తిరిగొచ్చాక మాత్రం, దాని బాధలు పోగొట్టి, దాని ఆశలు తీర్చాలి.

మీరంతా కూడా దాన్ని ఎప్పటిలా ప్రేమగా చూసుకోవాలి,” అని మాకు మంచి చెప్పాడు కూడా. నిన్నొక్క మాట అననివ్వడుగా నీ తాత,” అంటూ కంటతడి పెట్టింది పిన్ని.

**

(ఇంకా ఉంది)

 

‘ఎగిరే పావురమా!’ – 15

egire-pavuramaa15-banner

ఇప్పుడిప్పుడే నా కొత్త కాలితో నడవగలుగుతున్నాను. రోజూ కాళ్ళకి వ్యాయామం చేస్తూ, ఇదివరకటి కంటే బాగానే కదులుతున్నాను. ఇంకా కనీసం నెలరోజుల వైద్యం మిగిలి ఉంది. కాలు సెప్టిక్ అవకుండా ఇంకా మందులు, వారం వారం ఎక్సరేలు అవుతున్నాయి.

 

మునుపటిలా గోవిందు టెంపోలో కాకుండా, కొత్తకాలి ఆసరాతో, క్రచస్ సహాయంతో, క్యాంటీన్ కి నడిచి వెళ్ళి వస్తున్నాను. నెమ్మదిగా కుంటుతూనే అయినా, కనీసం ఇట్లాగైనా   కదలగలగడం కొత్త శక్తిని, తృప్తిని కలిగించింది.

ఈ రోజుకి ఆపరేషనయ్యి సరీగ్గా ఐదో వారం. కొత్తకాలు వచ్చి మూడో వారం.

మళ్ళీ నెలకి, చర్చ్ లో గోవిందుతో నా పెళ్ళి ఏర్పాట్లు చేసింది కమలమ్మ.

 

రెండు రోజులకోసారి జేమ్స్ వచ్చి నా నిర్ణయం ఏమిటని అడిగి వెళుతున్నాడు. పది రోజుల టైం ఇచ్చాడు వాడు.

వాడు చెప్పిన మూడు దారుల్లో – నాకు మంచిది, శ్రేయస్కరమైనది తాతతో జీవితమే. నేను ఆయనకి చేసిన అన్యాయం, ఆయన మనస్సుని గాయపరిచిన తప్పిదం సరిదిద్దుకునే అవకాశం కావాలి.

కాని, అసలెలా అది సాధ్యమౌనో తెలీడం లేదు.

నాకీ జన్మకి పెళ్ళిగాని, మరొకరి సాంగత్యం గానీ అవసరం లేదు… నాచిన్నప్పటి జీవితం నాకు చాలు…అనిపిస్తుంది…

 

తాతకి నేను రాసిన ఉత్తరానికి జవాబుగా – రాంబాబాయి నాకోసం వచ్చాడని తెలిసిన రోజే, నా మనస్సు పశ్చాత్తాప సందేశంతో, ‘శాంతి పావురంలా’ తాత వద్దకి వెళ్ళిపోయింది.

దానికి మినహా నేనేమి చేయగలను? నా జీవితాన్ని, తప్పుల్ని ఎలా సరిదిద్దుకోగలను? అని నిత్యం మదనపడుతున్నాను. ఏదో ఒక మూల నుండి సహాయం దొరకాలి…

గాయత్రీ అమ్మవారిని నమ్ముకోమని పంతులుగారు అన్నది గుర్తే…..ఆ అమ్మవారినే మననం చేసుకుని ప్రార్ధించుకుంటాను. అలాగే ఆదివారాలు ‘మదర్ తెరెసా’ చర్చికెళ్ళి, ఆ ప్రభువు కాడ నా గోడు చెప్పుకుంటాను…నాకు ధైర్యాన్నిమ్మని ప్రార్దిస్తాను…

 

రాంబాబాయి ఎప్పుడొస్తాడాని ఎదురు చూస్తున్నాను.

రాంబాబాయిని కూడా తిట్టి గోలచేసే కమలమ్మ వైఖరిని ఎలా ఎదుర్కోవాలి? పోనీ ఆమెకి మంచిగా చెప్పి ‘నా దారిన నేను పోతానని నచ్చచెప్పగలనా? ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు.

కాలం నత్త నడకలు నడుస్తుంది…

**

పనయ్యాక సాయంత్రం ఏడు గంటల సమయంలో వాకిట్లో అడుగుపెట్టగానే… ఎదురుగా కనిపించాడు…రాంబాబాయి. వాకిలెదురుగా రేకు కుర్చీలో కూర్చుని ఉన్నాడు…

ఇది ..నిజమా? భ్రమ పడుతున్నానా? అనిపించింది ఓ క్షణం…

లేచి నా వైపు వచ్చాడు బాబాయ్…

ఉద్వేగాన్ని ఆపుకోలేక పోయాను..

ఆయన కూడా కళ్ళు తుడుచుకున్నాడు…

“ఎదిగిపోయావు గాయత్రీ… ఎలా ఉన్నావు? రా కూచో,” అంటూ నాకు దారిస్తూ, పక్కకి జరిగాడు.

 

లోపల, కమలమ్మ, గోవిందు, జేమ్స్ ఉన్నారు. పంచాయతీ పద్దతిలో బాబాయి ఎదురుగా కూర్చుని నాకోసమే చూస్తున్నరులా ఉంది.

 

లోనికొచ్చి, మంచినీళ్ళు తాగిన   కాసేపటికి, వెళ్ళి స్థిమితంగా బాబాయి పక్కన కూచున్నాను.

దాదాపు రెండు నెలల క్రితం నేను తాతకి రాసిన ఉత్తరం గురించి మాట్లాడాడు బాబాయి.

ఆ విషయంగా – కమలమ్మ, జేమ్స్ నుండి, నేను   విన్న విషయాలే మళ్ళీ చెప్పాడు. స్వార్జితమైన తాత పొలం, ఇంటి కొట్టాంల పైన ఆయనకి తప్ప, ఇతర వ్యక్తులకి ఎటువంటి హక్కు ఉండదని చెప్పి, క్షణమాగి, నా వంక చూశాడు రాంబాబాయి…

egire-pavuramaa-15

“చూడు గాయత్రి, ఇలా నలుగురిలో పంచాయతి పెట్టుకునే అవసరమేముంది చెప్పు. నీకు ఆయన తాత. నీ కోసమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునున్నాడు. నీ మంచి కోరే ఏదైనా చేసాడు. చేస్తాడు కూడా. కాబట్టి నీవిప్పుడు చేరవలసింది సత్యమయ్య కాడికే.. అలోచించి ఏ సంగతీ చెప్పు… నా వెంట వచ్చెయ్యి,” అన్నాడు బాబాయ్…

 

“ఇదిగో రాంబాబు…ఏంది నీ మాటలు? మేము ఎంత కష్టపడితే, ఈ మూడేళ్ళు బతుకెళ్ళదీసింది నీ గాయత్రి? వైద్యం సేయించి బాగుసేసినంక, పిట్టలాగా ఎగరేసుకుపోదామని సూస్తుండావా?

ఆ పిల్లకి భరోసా ఇచ్చి, ఆ పొలం-కొట్టాం దానికి కట్టబెట్టి, నిలబడి పెళ్ళి సేయండ్రి. పెళ్ళి కుదిరిపోయింది గాయత్రికి.   వచ్చే నెలలో ఈడనే పెళ్ళి. మర్యాదేమన్నా తెలుసా మీకు?

ఈడనుండి తీసుకెళ్ళతానంటావ్? మళ్ళీ ఆ అమ్మాయిని గుడి మెట్ల మీద అడక్కతినిపిస్తారా? దాని ఆదాయం కోసమేగా ఆ తాత పన్నాగం,” అరిచి వెనక్కి పడినంత పనిచేసింది కమలమ్మ.

 

“అక్క, ఏందే నీ అరుపులు? నెమ్మదిగా ఉండు. పిచ్చి వాగుడు నువ్వూ…మరోమాట మాట్టాడితే ఊర్కోను,” ఆమెని గదమాయించాడు గోవిందు.

వాళ్ళ మాటలతో చెవులు తూట్లు పడుతున్నాయి…

గదిలో కాసేపు….నిశ్శబ్దంగా అయింది..

“చూడు రాంబాబు, …అందరి మాటలు విను. ఆలోచించు…ఏది ఏమైనా గాయత్రికి ఇంకా నెలరోజుల వైద్యం ఉంది.. ఇంతా చేసాక, అది సరిగ్గా పూర్తయ్యేలా చూడ్డం కూడా అవసరం…

ఇప్పుడు గాయత్రి మేజర్.   పెళ్ళి విషయంతో పాటు మరే విషయమైనా ఆమె ఇష్టానుసారమే జరుగుతుంది. ఆమెకి సమయం ఇవ్వండి. తెలివిగా నిర్ణయం తీసుకోనివ్వండి,”…అంటూ ఆగాడు…జేమ్స్.

కాసేపు ఎవ్వరూ ఏమీ అనలేదు…

బాబాయే నోరు విప్పాడు. నావంక సూటిగా చూసాడు.

 

“సరే, గాయత్రి, నిన్ను దేనికీ బలవంత పెట్టద్దని, ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోవద్దని, సత్యమయ్య నాకు మరీ మరీ చెప్పి పంపాడు.

నిన్నల్లరి పెట్టడం ఇష్టంలేకే అప్పట్లో, పోలీస్ రిపోర్ట్ కూడా వద్దన్నాడు,” అంటూ క్షణమాగి, తన జేబు నుండి ఓ కవర్ తీసి నాకిచ్చాడు.

 

“ఉమమ్మ చేత రాయించిన ఈ ఉత్తరం నీకివ్వమన్నాడు తాత…. నా ఎదురుగా చదువుకో… నీవు చదివాకే నేను వెళతాను…ఆ కింద ఉమమ్మ ఫోన్ నంబర్ ఉంది. నా నంబర్ ఉంది. గుడి పంతులుగారి నంబర్ కూడా ఉంది. నీకోసం రాములు, ఉమమ్మ, మీ పిన్ని కూడా ఎదురు చూస్తున్నారు మరి…,” అని ముగించాడు….

 

అదురుతున్న గుండెలతో ఉత్తరం చదవసాగాను.

 

ప్రియమైన గాయత్రీ,

ఇంతకాలానికి నీ నుండి వచ్చిన ఉత్తరం నాకు పట్టలేని ఆనందాన్నిచ్చింది తల్లీ. నీ కాలుకి చికిత్స జరుగుతున్నందుకు కూడా సంతోషం తల్లీ…

మూడేళ్లగా నీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆరోగ్యం చెడి ఆశ సన్నగిల్లింది. చూపు ఆనడం లేదు. నిన్ను చూడలేని కంటిచూపు అవసరం లేదులేమ్మా.  

మొదటిసారి నిన్ను చూసింది మాత్రం పెనుతుఫానులో కాలవగట్టున చలికి వణుకుతున్న పసిబిడ్డగా. ఆ రూపం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటాది…

గాలిలో కొట్టుకుంటున్న నీ బుజ్జి చేతులని కాసింత దూరాన్నించి చూడగలిగాను. దగ్గరగా వచ్చి చూస్తే – కక్కటిల్లి నువ్వు ఏడుస్తున్నా, బయటకి వినబడని రోదనే. నిన్ను కదలనివ్వని నలిగి నెత్తురోడుతున్న నీ పాదాలు, కాళ్ళు చూసి, బాధతో తట్టుకోలేకపోయానమ్మా..

 

అరవై ఏళ్ళ ఏకాకినైన నాకు అనాధగా దొరికావు. కళ్ళల్లో దీపాలెట్టుకుని పెంచాను. నీ జీవితంలో పువ్వులు పూయించాలనే, నీ ముఖాన నవ్వులు చిందించాలనే పూజారయ్యని ఆశ్రయించాను. ఆరోగ్యం బాగోక బతుకుతెరువు లేని నాకు, కోవెల్లో కొలువిప్పించి ఆదుకున్నాడాయన.

నువ్వు నాకు దొరికిన రోజే నీ పుట్టిన రోజుగా, నన్ను నీ శ్రేయోభిలాషిగా తాలుకాఫీసులో నమోదు చేయించాడు పూజారయ్య. ‘గాయత్రి’ అని నామకరణం చేసి, కోవెల్లో ఓ స్థానమిచ్చి, నీకు ఓ గౌరవమైన జీవనం కల్పించింది కూడా పూజారయ్యే.

 

నిన్ను చదివించాలని ఆశపడ్డాను. చెప్పుడు మాటలు నమ్మి నన్ను వదిలి వెళ్ళిపోయావు. దగాకోర్ల నుండి నిన్ను కాపాడలేక పోయానే అని కుమిలిపోతుండాను.

 

ఇకపోతే, నీ అవిటితనం నయమయ్యే అవకాశం ఉందని నా నమ్మకం. నీది పసితనంలో అఘాతం వల్ల ఏర్పడ్డ అవిటితనం అని నా గట్టి నమ్మకం. జరగవలసిన నీ వైద్యం కోసం, నీ సొమ్ము కూడా పక్కకెట్టే ఉంచానమ్మా.

అంతేగానీ నువ్వనుకున్నట్టు నీ అవిటితనం మీద యాపారం చేసి బతకాలని కాదు – అని నీకు తెలియ జెప్పాలనే నా తాపత్రయం. పనిచేయలేని పరిస్థితిలో కూడా ఫించను మొదలయ్యాక గాని ఆటో నడపడం మానలేదు. నీ తాత మీద నీకున్న అనుమానం దూరం చెయ్యాలనే ఈ గోడు చెప్పడం.

 

 

ఇప్పటికైనా పాలెంకి తిరిగొచ్చి నేను ఆశ పడుతున్నట్టుగా అందరి మధ్య గౌరవంగా బతుకుతావని ఆశిస్తాను.

నాదైన పొలం-కొట్టాం, అనుభవించే హక్కు పూర్తిగా నీదే తల్లీ.

నీకు కొదవలేకండా ఉండేలా, చేతనైనంతలో   కొన్ని ఏర్పాట్లు చేసాను గాయత్రీ. చదువుకున్నదానివి కనుక నీకు అన్నీ అర్ధమవుతాయి.

నువ్వు అవస్థలు పడవద్దు. అలోచించి తిరిగి వచ్చేయి తల్లీ.

నిన్ను ఈ కళ్ళతో చూసుకునే అదృష్టం నాకు ఉందో లేదో మరి.   ఆ అమ్మవారి కనికరం నీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను…

ప్రేమతో,

తాత….(తాత మాటలు రాసింది ఉమమ్మ)

కళ్ళ నుండి తెగబడే నీళ్ళని ఆపుకుంటూ తాత రాసిన ఉత్తరం చదవడం ముగించాను. ఇలాటి దేవుడినా అనుమానించి, అవమానించి పారిపోయాను?

నేనేదో అన్యాయమైపోయానని, తాత నన్ను అవిటిని చేసి, నా సంపాదన తింటున్నాడని అపోహతో మానసికంగా బాధపడ్డ నాది మూగవేదనా?

లేక అనాధనైన నన్ను దగ్గరికి తీసి, గొప్పగా పెంచి ఓ గౌరవమైన జీవితాన్ని ఇవ్వాలనుకుని నా వల్ల మనక్షోభ అనుభవించిన తాతది మూగవేదనా?

నా మేలు తప్ప వేరే ఆలోచనే లేకుండా గత పద్దెనిమిదేళ్ళగా నా ధ్యాసతోనే జీవించి నా మూలంగా ఈ వయస్సులో కూడా వేదన అనుభవించడంలేదా?

ఎన్నో ప్రశ్నలు నన్ను చుట్టేశాయి. ఉత్తరం చదివేసాక కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ అలా ఉండిపోయాను…

 

అంత వరకు ఎట్లాగో ఓపిగ్గా ఉన్న కమలమ్మ మళ్ళీ నోరెత్తింది.

“సుఖంగా ఉన్న పిల్లని అడ్డమైన ఉత్తరాలతో, మాటలతో ఎంత కష్టపెడతారయ్యా? ఇగ బయలుదేరండి. కాలు బాగయి పిల్లకి పెళ్ళి కూడా అవబోతుందని సెప్పండి… దాని డబ్బు, ఆస్థి ఇస్తామని సత్యమయ్యని కబురెట్టి పెళ్ళికి రమ్మను…,” అంటూ నావంక చూసింది..

“మీ బాబాయేగా, సెప్పు గాయత్రీ,” అంది…

(ఇంకా ఉంది)

 

‘ఎగిరే పావురమా!’ – 14

egire-pavuramaa14-banner

డాక్టర్ తో మాట్లాడి, పది నిముషాల్లో తిరిగొచ్చాడు జేమ్స్…

“అంతా సెటిల్ అయింది, నీ కొత్తకాలు కూడా రెండు వారాల్లో వచ్చేస్తుందట. మన ‘అనాధాశ్రమం’ నర్సుతో కూడా మాట్లాడింది డాక్టరమ్మ. నీతో రోజూ వ్యాయామం చేయించమని, అవసరాన్ని బట్టి కట్టు మార్చమని చెప్పింది,” అన్నాడు.

 

“అన్నీ హ్యాపీ న్యూసులే,” నవ్వుతూ తను తెచ్చిన జిలేబి ప్లేట్లో పేర్చాడు.

ఆ ప్లేటు నాకందిస్తూ, “మంచి అవకాశం – కరెక్ట్ సమయం నీతో మాట్లాడ్డానికి,” అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని కూచున్నాడు.

 

“చూడు గాయత్రి, నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి కోరిక. మొదట్లో తెలీకుండానే, నీకు కిచన్ లో పనిచ్చి, ఆకలిదప్పుల నుండి కాపాడాను.   లేదంటే, నిన్ను రైల్వే స్టేషన్లోనో, గుడిమెట్ల పైనో ఓ బోర్డ్ పెట్టి బిక్షాటన చేయించేది కమలమ్మ.

తరువాత కూడా నిన్ను ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా కాపాడాను. ఎలా అంటే విను.

నీకు ఆ   దద్దమ్మ గోవిందుతో పెళ్ళి చేస్తానంటే, పద్దెనిమిదేళ్ళు నిండని పిల్లకి పెళ్ళి చేసి కష్టాల పాలవ్వద్దని కమలమ్మకి చెప్పి ఆ పెళ్ళి ఆపించానని   నీకూ తెలుసుగా.

మీ తాత నుండి ఆస్తిపై హక్కుకి గాని, పెళ్ళికి గాని మేజర్ అయి ఉండాలన్న విషయం ఆమెకలా చెప్పి, భయపెట్టి, నిన్ను మూడేళ్ళు కాపాడుకున్నాను.

ఇక మూడోది. నాకు ‘మదర్ తెరెసా’ వాళ్ళ పర్మనెంట్ కాంట్రాక్ట్ వచ్చాక కూడా, నిన్ను నా కళ్ళెదుట ఉంచుకోడానికనే మీ అందరికీ క్యాంటీన్ లో కొలువులిచ్చి,   నాకాడే పెట్టుకున్నా,” క్షణం ఆగాడు.

 

నా మీదకి వంగి, నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తాడు. నా కళ్ళలోకి చూస్తూ, “వింటున్నావా? నువ్వంటే నాకెంత ఇష్టమో అర్ధమయిందా? ఇంకా చెప్పాలా?” అడిగాడు.

 

దుఖాన్నిఆపుకోవడానికి ప్రయత్నిస్తూ తల వంచుకున్నాను.

నడవలేను, పలకలేను. అలాంటి నాకు ఏమిటీ గోల??? నాకంటే సరయిన ఆడపిల్లే దొరకలేదా వీడికి? వీడి బుద్ధి వక్రించింది.   మామూలు ఆలోచన కాదు వీడిది, అని భయము, గుబులు కలిగాయి….

గొంతు సవరించి మళ్ళీ మొదలెట్టాడు.

“ముఖ్యంగా నీ కాళ్ళకి చికిత్స గురించి   ఆలోచన చేసాను. మనం పనిచేస్తున్నది ధార్మిక సంస్థ కాబట్టి, ముందుగానే, అర్జీ పెట్టి నీ విషయం చర్ఛ్ ఫాదర్లతో మాట్లాడాను. నువ్వు నా సొంత మనిషివని, నేను తప్ప నీకు ఆసరా లేదనీ   వాళ్ళకి చెప్పాను. నీకు కాళ్ళకి వైద్యం అవసరమని విన్నవించాను…

నువ్వు మతం పుచ్చుకొని, నామమాత్రపు జీతానికి రెండేళ్లు పనిచేస్తావని వాళ్ళకి నేను హామీ ఇచ్చాను. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని ఈ కాడికి తెచ్చాను,” అంటూ   మళ్ళీ నా వంక చూసాడు.

 

“ఇకపోతే, అతి ముఖ్యమైన విషయం… నాకు రాబడుంది. ఊళ్ళో రెండు క్యాంటీన్ల అద్దెలొస్తాయి. నేవేసుకున్న నగలు నీకు క్షణంలో ఇచ్చేస్తా. నీకిప్పుడు పద్దెనిమిదేళ్ళు. నువ్వు నా సొంతమవ్వాలి. నిన్ను నాకాడ ఉంచుకొని రాత్రింబవళ్ళు ప్రేమిస్తా, కామిస్తా.

నీవు కుంటివి, మూగవి అయినా పర్వాలేదు. నిన్ను ఉద్దరిస్తాను. నన్ను ప్రేమించి ‘సరే’ అను. చాలు,”   అంటూ ముగించాడు.

లేచి మంచం చుట్టూ పచార్లు చేయసాగాడు…….

 

తమ తమ స్వార్ధాల కోసం కమలమ్మ, జేమ్స్ – వారి ఇష్టానుసారంగా నన్ను బంధించాలని చూడ్డం ఏమిటి…ఈ రకమైన ఇక్కట్లతో బతకాలని కూడా అనిపించడంలేదు.

 

“ఎల్లుండి నేను మళ్ళీ రావాలి ఇక్కడికి. నీ బిల్లు సెటిల్ చేయడానికి జలజ మేడమ్ నన్నే పంపుతారు. ఈ లోగా, నేను చెప్పే మరో సంగతి కూడా విని, మన విషయంగా నీ నిర్ణయం తీసుకో…” అన్నాడు జేమ్స్ మంచానికి దిగువున నిలబడి….

 

చుట్టూ చూశాను. ఎవ్వరూ లేరు.. మూలనున్న ఇద్దరు ముసలి రోగులు కదలకుండా అటు తిరిగి పడుకునున్నారు.

‘ఇంకా ఏమి సంగతని’ వింటున్నాను….

 

తిరిగొచ్చి, జేమ్స్ మళ్ళీ నా మంచం పక్కన కుర్చీలో కూచున్నాడు.

“నీవు ఇక్కడ ఆసుపత్రిలో చేరిన రెండోరోజు, మీ రాంబాబాయి ఈ ఊరొచ్చాడు. కమలమ్మతో గొడవ పెట్టుకొన్నాడు. చిన్నపిల్లవైన నిన్ను తప్పుడు దోవ పట్టించిందని కేకలేశాడు.

మీ తాత పొలం, కొట్టాం స్వార్జితమంట. కాబట్టి   పోట్లాడి దక్కించుకునే అవకాశం నీకైనా లేదని,   ఏదేమైనా నిన్ను వెంటబెట్టుకొని ఇంటికి తీసుకెళతానని ఆమెతో బాగా గొడవపడి గాని ఈడనుండి వెళ్లలేదు,” చెప్పడం ఆపి నా చేయి తన చేతిలోకి తీసుకోబోయాడు.

చేయి వెనక్కి లాక్కున్నాను.

 

ఓ క్షణం మౌనం తరువాత నా వంక సూటిగా చూసాడు….

“అంటే, నీ ముందు మూడే దారులున్నాయి…మార్పే లేకుండా – మీ తాతతో అదే పాత బికారి జీవితం. లేదా నా కింద నౌకరీ చేస్తున్న ఆ దద్దమ్మ గోవిందుని పెళ్ళాడి, బతుకుతెరువు కోసం నా క్యాంటీన్ లో చాకిరీ కొనసాగింపు. ఈ రెండూ కాదని, తెగించి నాకాడ నా ప్రియురాలిగా మంచి రంజైన జీవితం… ఏది కావాలో ఎన్నుకో,” అన్నాడు వికారంగా నవ్వుతూ వాడు.

“పోతే, మీ బాబాయికి నీ కాలు-చికిత్స గురించి వివరించి, మళ్ళీ నాలుగు వారాలకి రమ్మన్నాను. సర్దిచెప్పి నేనే ఆ రోజు బస్ స్టాండు వరకు దింపానతన్ని. లేదంటే ఇక్కడే తిష్టేసి కమలమ్మతో యుద్దానికి సిద్దమయ్యాడు,” చెప్పడం ముగించి, మళ్ళీ ఎల్లుండి కనబడుతానంటూ వెళ్ళిపోయాడు… జేమ్స్ గాడు….

 

నా మనస్థితి అల్లకల్లోలమయ్యింది…రాంబాబాయి రాక, జేమ్స్ పోకడ – అంతా అయోమయం. … తాత ఎలా ఉన్నాడో? ఎవరు చెబుతారు? కమలమ్మతో బాబాయి గొడవపడ్డాడా? ఏమన్నాడో? నెల రోజులకి తిరిగి మళ్ళీ వస్తాడా బాబాయి?

తాతదంతా స్వార్జితమంటే? చెప్పుడు మాటలు నమ్మి, అప్పట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానా? నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నానా?

‘తాత నుండి మళ్ళీ కబురు’ అంటూ మొన్న గోవిందు ఏదో అనబోయాడు … అని గుర్తొచ్చింది.

గోవిందు ఏమన్నా చెబుతాడేమో…. అడగాలి… ఆగి చూడాలి ఏమి జరుగుతుందో?

వళ్ళంతా చెమటలు పట్టేసింది…

egire-pavuramaa-14

“ఇదిగో పట్టమ్మాయి, కాస్త నీ అంతట నువ్వు పక్కకి తిరగ్గలవేమో చూడు, కాఫీ తాగి మందేసుకో,” అంటూ వచ్చింది ఆయమ్మ.

**

వారం రోజులుగా మళ్ళీ క్యాంటీన్ పనిలోకొచ్చాను.   కాలు నొప్పి తగ్గింది. మరో వారమో రెండో గడిస్తే, నాకు కొత్తకాలు కూడా వస్తుంది.

రోజూ మార్కెట్ నుండి కూరలు, వెచ్చాలు దింపి వెళ్ళిపోయే గోవిందు, ఇప్పుడు కిచెన్లో నా కాడికొచ్చి, ఎలా ఉన్నానని కనుక్కుని పోతున్నాడు.

అనాధాశ్రమం నర్స్ వచ్చి రోజూ నా కాలు ఓ మారు చూసి, డాక్టరమ్మ సూచనలందుకొని బ్యాండేజీ మార్చి వెళుతుంది.

జేమ్స్ మాత్రం రెండు రోజులుకోసారి దగ్గరగా వచ్చి, నా భుజం మీద చేయి వేసి, “ఎలా ఉంది కాలు నొప్పి,” అంటూ నా కాలు, పాదాలు వొత్తి పళ్ళికిలించి వెళ్తున్నాడు.

నేనేదో తన సొంత ఆస్థినన్నట్టు మాట్లాడి కళ్ళెగరేసి పోతాడు.

 

ఓ మధాహ్నం గోవిందుని దగ్గరికి రమ్మని పిలిచాను…వచ్చి పక్కనే నిలుచున్నాడు.

“తాతనుండి ఏదన్నా జవాబు వచ్చిందా? బాబాయి ఓ సారి వచ్చెళ్ళాడని తెలుసు… మళ్ళీ కబురేమన్నా అందిందా?” సైగలతో వాకబు చేసాను.

 

“ఇదిగో, సూడు, నీవేమీ బెంగెట్టుకోకు. మీ బాబాయి మళ్ళీ తప్పక   వస్తాడు.   అన్నీ సర్దుకుంటాయి,” అనగానే ఒక్కసారిగా ఏడ్చేసాను.

నన్ను ఓదార్చడానికి చాలా కష్టపడ్డాడు గోవిందు….

“ఏడవమాకు గాయత్రీ.   అన్నీ బాగానే ఉంటాయిలే. నేను సెపుతున్నాగా. నా మాట ఇని కళ్ళు తుడుచుకో,” అంటూ సముదాయించాడు గోవిందు.

**

నాకు కొత్త కాలు పెట్టే రోజు.

కమలమ్మని తోడు తీసుకొని, ‘అనాధాశ్రమం’ వారి వాన్ లో ఆసుపత్రికి బయలుదేరాను. ‘మదర్ తెరెసా’ వారి ఇతరత్రా పనులు కూడా ఉన్నాయంటూ జేమ్స్ కూడా ఆఖరి నిముషంలో వాన్ ఎక్కాడు.

కొంత దూరం వెళ్ళాక మాటలు మొదలు పెట్టింది కమలమ్మ.

 

“చూడు గాయత్రీ, నీవు రాసిన ఉత్తరం అందుకొని మీ బాబాయిని పంపాడు మీ తాత. నీవు ఆపరేషనయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చి సచ్చాడులే మీ రాంబాబాయి.   కల్లు తాగిన కోతిలాగా నానా యాగీ చేసి నా మీద రంకలేసి పోయాడు. నీ తాత ముసలాడు నీకు ఒక్క కానీపైసా కూడా ఇచ్చేది లేదంట,” కోపంతో ఊగిపోయింది కమలమ్మ.

 

మంచినీళ్ళు సీసా అందించి, ఆమెని నెమ్మది పరిచే ప్రయత్నం చేసాడు జేమ్స్…నీళ్ళ సీసాలో నుండి గుక్కెడు తాగిందామె.

 

“వాడట్టా అన్నంతమాత్రాన ఏంకాదు… నువ్విప్పుడు మేజర్ కాదా…నివ్వు గట్టిగా నీ మాట మీద నిలబడితే, ఆ దిక్కుమాలిన పొలం, కొట్టాం నీకొచ్చి తీరుతాది… నువ్వు గాక ఎవరున్నారు వాడికి?” క్షణమాగింది..

 

“అయినా గాయత్రి, ఇదంతా ఒకెత్తైతే – నేను, గోవిందు ఎంత త్యాగం సేసి నిన్ను ఈ కాడికి తెచ్చామో నువ్వు గుర్తెట్టుకోడం మరో ఎత్తనుకో….నీ డబ్బు, దస్కం వచ్చాక కూడా నీ కాడ ఊడిగం సేస్తాం మేము. ఇప్పటి వరకు మేము సేసిన కష్టం మరిసిపోమాకు.

మళ్ళీ ఎప్పుడో దాపురిస్తాడు నీ బాబాయి.   గట్టిగా తిప్పికొట్టి రానని నిక్కచ్చిగా సెప్పేయి. నీ డబ్బు ఇప్పించుకో,” అని ముగించింది…

అలిసిపోయి వెనక్కి వాలింది.

 

“ఆ అమ్మాయికి అన్నీ అర్ధమవుతాయిలే కమలం.   సరయిన నిర్ణయం తీసుకుంటుంది,”   నా వంక చూసి కన్ను గీటి ఇకిలించాడు జేమ్స్.

నేనూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను.

 

కమలమ్మ మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి.

‘నాకన్నీ గుర్తే కమలమ్మా’ అనుకున్నాను.   మరువలేని సంఘటనలు ఒకటా రెండా?’ ఈ ఊరు చేరిన మొదటి వారం, ఎప్పటికైనా మరువగలనా?

కొత్తూళ్ళో రైలు దిగి సత్రంలో చేరాక,   మొదటి రెండు రోజులు మాత్రమే నాతో మామూలుగా మసిలారు అక్కాతముళ్ళు. తరువాత నా పాటికి నన్నొదిలి రోజంతా వెళ్ళిపోయేవారు….

వారం పాటు ఆకలితో మాడిపోయాను…గది బయట ఉన్న నీళ్ళకుండ నుండి తాగునీరుతో దప్పిక, ఆకలి కూడా తీర్చుకున్నాను.

 

వారమయ్యాకే నోరు విప్పి నాతో మాట్లాడింది కమలమ్మ.

నాకు మేలు చేయాలని ఉన్నట్టుండి అన్నీ వదిలి ఊరు మారడంతో, తమ జీవనం దిక్కులేకుండా అయిందని, అందుకే బతకుతెరువు వెతుక్కోడానికి తిరుగుతున్నామని, ఎడంగా కూచుని పెద్ద గొంతుతో   చెప్పింది.

 

నీరిసించిపోయున్న నన్ను, ఆ రోజు గోవిందే దగ్గరగా వచ్చి పలకరించాడు. తనకి సత్రంలోనే ఏదో పని దొరికేలా ఉందని చెప్పి, తన వద్దున్న అరడజను అరటిపళ్ళ నుండి రెండు నాకిచ్చాడు.

నాకు తెలిసి వారంపాటు తిండిలేకుండా ఉన్నది అదే మొదటి సారి..

 

ఆ రాత్రి పడుకునే ముందు నా పక్కన చేరింది కమలమ్మ…

”ఇదో సూడు గాయత్రీ, వాడా ఏదో సంపాదిస్తాడు. నేను పక్కనే ఉన్న అమ్మగార్ల కాన్వెంట్ లో స్వీపర్ గా సేరాను. నన్నాడ కొలువులో పెట్టినాయన ప్రహ్లాద జేమ్స్. ఆయన ఈడ సత్రం కాంటీన్ తో పాటు ఎదురుగా ఉన్న టీ బడ్డీ కూడా నడుపుతాడు. అతనే సొంతదారు, వంటవాడు కూడా.

అతని కాడ వంటింట్లో నీవు పని సేస్తావని ఒప్పుకున్నాను. అలాగైతే, మనకి రెండు పూటలా తిండి ఆడనుండే ఇస్తాన్నాడు. కాఫీలు టిఫిన్లు అన్నీ ఫ్రీ. రేపు పొద్దున్న ఐదు గంటలనుండే పప్పులు రుబ్బడంతో నీపని మొదలని అన్నాడు.   ఇక పడుకో,” అంటూ నా పక్కనే అటు తిరిగి పడుకొంది.

అట్లా ప్రహ్లాద్ జేమ్స్ మా జీవితాల్లో ప్రవేశించాడు….

 

శబ్దం చేస్తూ వాన్ ఆసుపత్రి ముందు ఆగడంతో నా ఆలోచనల నుండి బయట పడ్డాను.

**                                                                          (ఇంకా ఉంది)

 

 

ఎగిరే పావురమా! – 13

egire-pavuramaa13-banner

ఆలోచిస్తూ ఆయమ్మ పెట్టెళ్ళిన బన్ను తిని నీళ్ళు తాగాక వెనక్కి జారిగిల బడ్డాను…

 

మొదటినుండీ నా పట్ల ఈ అక్కాతమ్ముళ్ల వైఖరి తలుచుకొని మనసంతా హైరానాగా అయిపొయింది….

పాలెం వదిలేసి, రైలెక్కి అరపూట ప్రయాణం చేసాక, ‘రాణీపురం’ అనే ఈ ఊళ్ళో దిగిన దగ్గరినుండి…వారి పోట్లాటలు, వాదులాటలతో మనసుకి శాంతన్నది లేకపోవడం ఒకెత్తయితే, నేనెదుర్కున్న ఇబ్బందులు, నిస్సహాయతలు మరో ఎత్తు.

గుర్తు చేసుకోగానే, కన్నీళ్లు ఆగలేదు……

 

“ఏమ్మాయి చాలా నొప్పిగా ఉందా కాలు? ఏడ్చేస్తున్నావు,” అంటూ మందులందించింది ఆయా.

 

‘డాక్టరమ్మ వచ్చే టైం’ అంటూ నా కాలి కట్టు మార్చి వెళ్ళిందామె.

**

పొద్దున్న తొమ్మిదవుతుండగా, నన్ను డాక్టరమ్మ పరీక్ష చేసేప్పుడు వచ్చారు కమలమ్మ, గోవిందు. కాస్త ఎడంగా బెంచీ మీద కూచున్నారు.

 

తను రాసిన కొత్త మందులు వెంటనే మొదలెట్టమని నర్సుకి చెప్పి,

“మీ పెద్దవాళ్ళెవరన్నా వచ్చారా?” అనడిగింది డాక్టరమ్మ.

అది విన్న కమలమ్మ లేచి గబగబా మంచం కాడికొచ్చింది….

 

“చూడండమ్మా, అమ్మాయి ఆరోగ్యంగా ఉంది కాబట్టి బాగానే కోలుకుంటుంది.. ఎల్లుండి ఇంటికి వెళ్ళవచ్చు… మళ్ళీ వారానికి తీసుకు రండి. చూస్తాను. ఆ పై వారానికి కొత్తకాలు కూడా వచ్చేస్తుంది… అంతా బాగుంటే, దాన్ని అమర్చే విషయం చూడవచ్చు,” అందామె కమలమ్మతో…..

 

“పోతే గాయత్రి, కూర్చుని ఏ పనైనా ఎంత సేపైనా చేయవచ్చు.   అప్పుడప్పుడు మాత్రం నీ క్రచ్చస్ తోనే కాస్త తేలిగ్గా అటు ఇటూ మెసలాలి. మందులు   మాత్రం ఇంకా వేసుకోవాలి. నీకు సాయం చేయడానికి ఎవరైనా ఉంటారుగా!” అడిగిందామె నన్ను.

 

“ఎందుకుండమూ? ఎవరో ఒకరు కంటికి రెప్పలా కాసుకునుంటామమ్మా,” పలికింది కమలమ్మ.

డాక్టరమ్మ వెళ్ళాక నా దగ్గరగా వచ్చాడు గోవిందు.

“ఈడ ఉన్నన్నాళ్ళు నీకు పొద్దుపోతదని ఈ పుస్తకాలు తెచ్చా,” అంటూ రెండు పత్రికలందించాడు.

 

ఎదురుగా కూచుని నా చేయి తన చేతిలోకి తీసుకొంది కమలమ్మ…

“ఇదో గాయత్రి, రెండు రోజులు కాస్త నిమ్మళంగా ఈడనే ఉంటావుగా!

బాగయిపోతావుగా! నువ్వు క్యాంటీన్ లో పనికి లేవని, పాపం జేమ్స్ ఇబ్బంది పడుతున్నాడు…

ఇయ్యాల జేమ్స్ అసలు మాతో రావాల్సింది. నిన్ను చూడలేదని చాలా ఆతృత పడుతున్నాడు.   ఏదో పని తగిలిందంట. తనకోసం ఆగొద్దని మమ్మల్ని పంపాడు.   మేము తిరిగెళ్ళి   అతనికి వాన్ అప్పజెప్పాక, ఏదో ఒక టైంకి వస్తాన్నాడు,” అంది.

 

….ప్రహ్లాద్ జేమ్స్… నన్ను చూడ్డానికి ఒక్కడే వస్తాడనగానే, నాకు కడుపులో తిప్పేసింది…

అందరితో కలిసి ఎందుకు రాలేదు? అట్లా రాడు. శని లాగా ఒక్కడే వస్తాడు. అవకాశం దొరికితే వెకిలి వాగుడుతో నరకం చూపిస్తాడు కూడా అని తలుచుకోగానే మనసంతా అసహ్యంతో నిండిపోయింది…

‘నేను ఒంటరిగా దొరికితే, వాడి వెటకారం నుండి, వాడి అసభ్యకర మాటల నుండి ఎలా తప్పించుకోవాలి?… నాలాంటి అవిటిని కూడా వేధించే వాడిది ఎంతటి దిగజారిన మనస్థితి!!…

కోపంతో నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

“ఏందాలోచిస్తుండావు? ఏమన్నా తింటావా?” అడిగాడు గోవిందు మంచం ఎదురుగా నిలబడి..

ఏమొద్దని సైగ చేసాను…

అయినా, ఇప్పుడే వస్తానని బయటకి పోయాడు గోవిందు.

కాస్త అవతలికి పోయి, చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లల్లో పడ్డది కమలమ్మ. ఆమె గొంతు బిగ్గరగా వినబడుతూనే ఉంది.

నన్ను జేమ్స్ కాడ పనికి పెట్టిన ఆమెకి గాని, టెంపోలో కూరలు, సామగ్రి తెచ్చాక, రోజూ క్యాంటీన్ లోనే తినెళ్ళే గోవిందుకి గాని – జేమ్స్ మాటలతో నన్ను వేధిస్తాడని – తెలీదు..

రోజూ సాయంత్రం ఏడింటికి, అతికష్టంగా పని ముగించి, మా ముగ్గురికి రాత్రికి సరిపడా తిండి తీసుకొని బయటపడేదాన్ని మొదట్లో, సత్రం క్యాంటీన్ లో పని చేసినన్నాళ్ళూ.

 

సాగుతున్న ఆలోచనలు గోవిందు పిలుపుతో ఆగాయి…. ఎదురుగా చేతిలో తిండి పోట్లాలతో నిలబడి ఉన్నాడు…

పక్కనే ఉన్న గుడి నుండి పులిహోర, దద్దోజనం ప్రసాదాల ప్యాకట్లంట, మంచం పక్కన స్టాండ్   మీదెట్టాడు.

వాటితోపాటు తెచ్చిన కుంకుమ వీభూతి పొట్లాలు మాత్రం నాచేతుల్లో పెట్టాడు.

ఎంతో అపురూపంగా అనిపించింది దేవుని కుంకుమ బొట్టు.

 

క్రైస్తవ మతం పుచ్చుకొని, ‘మదర్ తెరెసాలో’ పని చేయడం మొదలైనాక మొహాన బొట్టు పెట్టనే లేదు.

కుంకుమ నుదిటిపై   పెడుతూ తాతని గుర్తు చేసుకున్నాను….

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి….

“మీ తాతకి ఉత్తరం రాసావుగా! నీ కొత్తకాలు పెట్టే లోగా ఆడనుండి మళ్ళీ ఏదో ఒకటి తెలుస్తాదిలే…,” అంటూ గోవిందు ఇంకా ఏదో చెప్పేలోగా కమలమ్మ వచ్చింది.

 

“ఇక పోవాలిరా గోవిందూ,” అంటూ దగ్గరగా వచ్చి నా పక్కన కూచుంది. కమలమ్మ…

 

నా వంక చూస్తూ, ”ఇదో గాయత్రీ, జేమ్స్ వచ్చినప్పుడు, ఇక మూడు రోజులకి పనిలోకొస్తాని అతనికి భరోసా ఇవ్వు…. సైగలతోనే మంచిగా సెప్పు. మేము మళ్ళీ రేపో ఎల్లుండో కనబడతాము,” ఒకింత ఆగి, నా వంక తేరిపార చూసింది.

“బొట్టెడితే మునపటి గాయత్రిలాగే ఉన్నావు. ఇక్కడున్న ఈ రెండురోజులు సక్కగా పెట్టుకో,” అంటూ లేచి గోవిందుతో పాటు వెనుతిరిగింది కమలమ్మ.

 

ఆమైతే, ఏనాడూ బొట్టు, పూలు పెట్టదు. గుళ్ళో కొలువుకొచ్చాకే, చిన్న నల్ల బొట్టెడం మొదలెట్టానంది అప్పట్లో.

ఊరు దాటగానే అదీ తీసేసింది. తనకసలు బొట్టు, పూలు, పెళ్ళి, పిల్లలు, సంసారం అంటే గిట్టదని ఓ మారు మాటల్లో అన్నది కూడా….

 

అన్నీ ఎడమతం చేష్టలు, వింత పోకడలే కమలమ్మవి. అందుకే జేమ్స్ కి నేను మంచిగా భరోసా ఇవ్వాలని చెప్పి మరీ వెళుతుంది. అవసరమా? తెలిసిందేగా నేను వెంటనే ఆ కిచెన్లో వంట-వార్పు – చాకిరీ మొదలెట్టాల్సిందేనని…మళ్ళీ భరోసా ఇచ్చేదేముంది!

 

గుండెలు, కడుపు రగిలిపోతుంటే గబగబా గుడి పులిహోర తిని, నర్సు ఇచ్చిన నీళ్ళ కాఫీతో కొత్త మందు వేసుకుని వాకిలి వైపుగా తలగడ మీదకి ఒరిగాను.

 

జేమ్స్ మీద అసహ్యం, వాడు ఎప్పుడొస్తాడో అన్న భయంతో అయోమయంగా అనిపించింది.

అసలతను మా జీవితాల్లోకి ఎలా వచ్చాడని గుర్తు చేసుకున్నాను.

సత్రంలో క్యాంటీన్ వోనర్ అయిన జేమ్స్ కాడికెళ్ళి, ఊరికి కొత్తగా వచ్చిన మాకు దారి చూపెట్టమని కమలమ్మ మొర పెట్టుకోడం, లేదనకుండా అతను ముగ్గురికీ బతుకుతెరువు చూపించడంతో మొదలైంది, అతనితో సంబంధం.

egire-pavurama-13

ఇంకేముంది….నా గురించిన సంగుతులన్నీ కమలమ్మ నుండి విన్నాక, జేమ్స్ మా అందరి బలహీనతలు తెలుసుకుని చనువు తీసుకున్నాడు. మొదట్లో జాలిగా ఉన్నా, నాపట్ల వైఖరి మారింది. చెప్పుకోలేని ఇబ్బందులు మొదలయ్యాయి.

టైం దొరికితే పుస్తకాలు-పత్రికలూ చదవాలనుకునే నాకు, పక్కన చేరి, తను భార్యని ఎందుకు వదిలేసాడో, మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదో చెప్పడం మొదలెట్టాడు. అతని సొంత విషయాలు వినడానికి విసుగ్గా ఉండేది.

జేమ్స్ చేయి తిరిగిన వంటవాడే. కొత్తల్లో నాకు వంట నేర్పించే సాకుతో అవసరానికి మించి చేరువగా ఉండేవాడు.

నాతో పాటు పనిచేసే ‘జాన్వి’ టిఫిన్ పొట్లాలు టీ బడ్డీకి జారవేసే సమయాల్లో నాతో బాతాఖానీ వేసేవాడు…. చేతులు, మెడలు పడతానని వెంట పడేవాడు. నా రంగు, నా జుట్టు, నా తేనె రంగు కళ్ళని పొగిడేవాడు.

కొత్తపత్రికల మధ్యలో అసభ్యకరమైన బూతు పుస్తకాలు పెట్టి చదువుకోమని ఇచ్చేవాడు.

ఇలాంటివన్నీ వార్తల్లో, పత్రికల్లో చదువుతూనే ఉన్నాను.   నా పట్ల అతడి వెకిలితనం అర్ధమయిపోయింది…

 

ఇట్లాంటి అడ్డమైన పన్లు   చేస్తున్నా, వాడిని ఏమీ చేయలేక పోయాను. ఎవరికి ఎలా చెప్పగలను. నేను చెప్పినా కమలమ్మ నమ్మదు. కమలమ్మకి జేమ్స్ దేవుడుతో సమానం.

అతడు నా భుజం మీద చేయి వేస్తే, ఒకటి రెండు సార్లు విదిలించాను. దూరంగానే ఉండమని తెలియజెప్పాను. అంతకంటే ఏమి చేయలేని దుస్థితి నాది…

పైగా ఆ కొలువు చేయకపోతే, నా గతేంటి?.. ఆ కొలువు వల్లే మాకు తిండి ఖర్చు లేకపోగా, మొదట్లో ఏడాదిపాటు టీ బడ్డీ వెనకాతల ఉన్న ఓ రేకుల గది, వంటిల్లు బాత్ర్రూం సహా మాకు ఉండడానికి ఇచ్చాడు. …..

 

వాడి ఆగడాల్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి, సత్రం కొలువుతో మొదలైంది.

రెండేళ్లగా మాత్రం ‘మదర్ తెరెసా’ కిచెన్లో, హెల్పర్స్ ఉండడంతో, వాడికి నన్ను వేధించే అవకాశాలు తగ్గాయి.

 

ఇలా ఆలోచనలు సాగుతున్నా, కళ్ళు మూసుకుపోతున్నాయి..కాలు నొప్పి కాస్త తగ్గినట్టే అనిపించింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను…

**

“గాయత్రీ, ఇక లే మరి. చాలా సేపయిందట నీవు నిద్రకి పడి,” అంటూ నా చెవిదగ్గరగా వినిపించడంతో, మెల్లగా కళ్ళు తెరిచాను. నా భుజంపై చేయి వేసి రాస్తూ మంచానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు జేమ్స్…

ఒక్కసారిగా కుంచించుకుపోయాను.

భుజం మీద చేయి తీసేసి, లేచి కూచోవాలని ప్రయత్నించాను. కుదరలేదు.   ఆయమ్మ కోసం, చేతికందిన సత్తు గ్లాసుతో బల్లమీద నాలుగు సార్లు శబ్దం వచ్చేలా గట్టిగా కొట్టాను.

నా చేతి నుండి గ్లాసందుకొని, “చూడు, లంచ్ చేసి రమ్మని నేనే ఆయాని పంపాను. నేనొచ్చి ఇరవై నిముషాలయింది. పక్కకొదిగి, ముద్దుగా గువ్వపిట్టల్లే పడుకున్న నిన్ను   చూస్తూ కూర్చున్నాను. బొట్టు పెట్టుకొని చాలా కళగా ఉంది నీ ఫేస్.

ఈ రోజున, మన అసిస్టెంట్ కి డ్యూటీ అప్పజెప్పి సెలవు తీసుకున్నా. ఆయమ్మ రాగానే నిన్ను కూర్చోబెట్టి, లంచ్ తినిపిస్తూ కబుర్లు చెబుతా కూడా,” జేమ్స్ అంటుండగానే వచ్చింది ఆయా.

 

చేతిలో నోట్లు అతినికందించి, “ఏం చేయమంటారు సారూ,” అడిగింది.

ఇద్దరూ కలిసి నన్ను పైకి లేపి కూర్చోబెట్టారు..చుట్టూ కలియజూసాను. గది సగానికి పైగానే ఖాళీ అయింది. దూరంగా ఇద్దరు ముసలాళ్ళు పడుకునున్నారు. మిగతా రోగులు డిస్చార్జ్ అయ్యారేమో!

 

“తిని మందేసుకున్నాక, ఆయాని నీ పక్క మార్చమంటావా లేక ఇప్పుడే సర్దమంటావా? నేను పక్కకెల్తాలే,” అన్నాడు జేమ్స్….

 

‘లేదు తిని మందేసుకుంటానని’ సైగ చేసాను. నేను తినేస్తే, వాడు త్వరగా పోతాడేమోనని..

 

“సరే అయితే. గాయత్రికి నేను తినిపిస్తాలే, నువెళ్ళి పక్కనే ఉండు,” అన్నాడు ఆయాతో.

తెచ్చిన క్యారేజీ విప్పాడు. ప్లేట్, గ్లాస్, ఫ్లాస్క్ బ్యాగ్ నుండి తీసాడు.

 

“సేమియా ఉప్మా, పెరుగువడ, జిలేబి…నీకోసం…స్వహస్తాలతో పోద్దుటినుండి నేనే చేశా,” అంటూ ప్లేట్లో సర్డాడు.

నాకు దగ్గరగా చేరి, తినిపించసాగాడు. రెండు సార్లు అయ్యాక, నేనే తింటానని పళ్ళెం లాక్కున్నాను.

“సరే, అంతా తింటే గాని ఒప్పుకోను,” అన్నాడు జేమ్స్ నవ్వుతూ నా ఎదురుగా కూచుని.

 

వాడెందుకలా మెడలో లావుపాటి బంగారు గొలుసు, పది వేళ్ళకి బంగారు ఉంగరాలు, ఓ చేతికి బంగారు కడియం, మరో చేతికి బంగారు రంగు రిస్ట్ వాచి అలంకరించాడో తెలియడం లేదు.   తెల్లటి సిల్క్ లాల్చీ వేసాడు. వాడి దగ్గర ఘాటుగా అత్తర్ల వాసనలు…

పెద్ద పొట్ట, వెకిలి నవ్వు, బట్టతల, చెంప మీద కత్తి గాటు. పెద్ద రౌడీలా ఉంటాడు.

వాడి రూపం, వేషం కడుపులో తిప్పేస్తుంది.

ఎలాగో తినడం ముగించాను…

 

“నే వెళ్ళి డాక్టర్ని కలిసొస్తాను, నీవీలోగా మందేసుకొని పక్క మార్పించుకో,” అని ఆయాని పిలిచాడు వాడు.

**                                                                 (ఇంకా ఉంది)

 

ఎగిరే పావురమా! – 12

egire-pavuramaa12-banner-1

పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పురాణ కాలక్షేపం ముగిసినట్టుంది. మైకు మూగబోయి హడావిడి తగ్గింది. రెండు రోజులుగా కళ్ళతో చూడలేకపోయినా, ఇలా పక్కమీదనుండే వినగలుగుతున్న పురాణ కాలక్షేపం చెవులకి అమృతంలా ఉంది. సాయంత్రాలు ఓ రెండుగంటల సేపైనా కాలు నొప్పిని, బాధని మరచిపోగలుగుతున్నాను… ప్రతిరోజూ నాలుగు నుండి ఆరు గంటల వరకు మరో వారమంతా జరుగుతుందంట ఆ కార్యక్రమం.

ఈ పూట వినవచ్చిన ప్రసంగంలో, ఆ అయ్యవారు చెప్పిన విషయాలు నా గుండెల్ని సూటిగా తాకాయి…

…..’కష్టనష్టాలకి, సుఖధు:ఖాలకి అతీతమైనది కాల గమనం.
కాలానికి అతీతులై కూడా ఎవరూ లేరు
’…..అన్న మాటలకి, ………..
మనసంతా గజిబిజిగా అయిపొయింది.

‘నేను – పుట్టిన ఊరిని, పెంచిన తాతని వదిలొచ్చి మూడున్నర సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తొచ్చింది.
ఈ మూడేళ్ళలో నా జీవనం ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని, మనస్సు అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉందని కూడా’ గుర్తొచ్చింది.
తాత ప్రాపకం నుండి బయటపడితేనే నా జీవనం మెరుగవుతుందని, సరైన వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని, అందుగ్గాను సాయపడతానన్న కమలమ్మని నమ్మాను అప్పట్లో…

పద్దెనిమిదేళ్ళు నిండగానే, తాతనుండి నాదైన డబ్బు, ఆస్తి ఇప్పుంచుకోవచ్చని, ఆ తరువాత పట్టణంలో వైద్యం చేయించుకొని నా బతుకు బాగుచేసుకోవచ్చన్న కమలమ్మ మాటతో ఇన్నాళ్ళూ కాలం వెళ్ళబుచ్చాను.
అదే ఆశతో, తాత మీద చాలా బెంగగా ఉన్నా, గుబులుగానే గడుపుకొస్తున్నాను.

…… ఆలోచనలతో ….. గుండెలు బరువుగా తోచాయి….. గొంతు తడారి పోతుంది. ఆపరేషనయ్యి, ఆసుపత్రి మంచంపై కదలకుండా ఉంటూ, మూడు రోజులుగా వేసుకుంటున్న మందులతో, నోరంతా చేదుగా అయిపొయింది.

మంచినీళ్ళన్నా అడుగుదామని తల పైకెత్తి చుట్టూ చూసాను. ఆసుపత్రి ఆయా గాని, నర్సు గాని కనబడలేదు. పిలవలేను…
వాళ్ళూ టైం ప్రకారంగా వస్తున్నారులా ఉంది. ఆగి చూద్దామనుకున్నాను..
నిముష నిముషానికి ఎక్కువౌతున్న కాలుపోటుకి స్పృహ పోతున్నట్టుగా అయిపోతుంటే గట్టిగా కళ్ళు మూసుకొన్నాను.
నొప్పి, దాహం, మగతగా ఉంది……
మరికాసేపటికి అలాగే నిదురలోకి జారుకున్నాను….

egire-pavurama-12-1
**
“ఇదిగో అమ్మాయ్, లేచి నీ మందులేసుకో,” గట్టిగా భుజం పట్టుకు కుదుపుతుంది ఆసుపత్రి ఆయమ్మ.
అతి కష్టంగా కళ్ళు తెరిచి, ఆయమ్మ సాయంతో, తలగడనానుకుని కూర్చుని, వేడి కాఫీ నీళ్ళతో మందేసుకున్నాను. తల భారంగా ఉంది…

“బల్ల మీద బన్ను, అరటిపండు పెట్టారుగా! తినలేదే?….. చూసుండవు…. …ఇప్పుడు తిని నీళ్ళు తాగు…. మందులతో నొప్పి, భారం తగ్గిపోతాయిలే. ఇక ఈ రాత్రికి ఇంతే….. మీ అవసరాలకి నైట్ డ్యూటీ ఆయమ్మ ఉంటది. రేపు తెల్లారుతూనే డాక్టరు వస్తారు. ఇక నేనెళుతున్నా,” అని చెప్పి వెళ్ళిపోయిందామె…

నా పక్కనే కొత్తగా వచ్చిన పేషంట్ అనుకుంటా… బాధగా ఏడుస్తూ, మూలుగుతుంది….
గదిలో ఐదారుగురు రోగులు. అందరూ ఏదో ఒక బాధతో మూలుగుతూనే ఉన్నారు….

నేను ఆసుపత్రిలో జేరి ఇవాల్టికి మూడో రోజు.
వొంటికి ఇంత నొప్పంటూ ఉంటుందని, డాక్టర్లు నా కుడి కాలు మోకాలు వరకు తీసేసినాకే తెలిసింది. నొప్పితో, వొళ్ళంతా బండబారిపోయింది…….

నా మంచం ఎదురుగా తెరిచి ఉన్న వాకిలి నుండి కాస్త చల్లనిగాలి వీస్తుంది. వర్షం మొదలయ్యేలా ఉంది..
ఈ నొప్పి ఒర్చుకోడం ఎలాగో తెలీడం లేదు… ఇప్పుడు మింగిన మందుతో నొప్పి తగ్గి నిద్ర పోతానని చెప్పింది ఆయమ్మ. కళ్ళు మూసి వెనక్కి వాలాను….

గత రెండేళ్లగా ‘మదర్ తెరెసా అనాధాశ్రమం’ కి పనిచేస్తున్నందుకు, వారు చూపుతున్న ఉదారతే, నాకు రాబోతున్న ఈ కృత్రిమ కుడికాలు.
ఈ ఉచిత వైద్యం కోసమే, క్రైస్తవ మతం పుచ్చుకోడానికి, “మదర్ తెరెసా” లోని క్యాంటీన్ కి నామమాత్రపు జీతానికి రోజంతా పనిచేయడానికి ఒప్పుకోక తప్పలేదు…

ఈ ఆపరేషన్ చేయించాలని, ఆమె స్నేహితుడు ప్రహ్లాద్ జేమ్స్ తోను, ‘మదర్ తెరెసా’ వైద్యులతోను సంప్రదించి, నిర్ణయించింది కమలమ్మే.

అప్పట్లో తాత నన్ను వంశీ సంస్థకి డబ్బు కోసం అమ్మేస్తున్నాడని, వాళ్ళు కృత్రిమ కాళ్ళు పెట్టించి వెట్టి చాకిరీ చేయిస్తారని భయపెట్టింది కూడా ఆమే.
మరిప్పుడు మోకాలి నుండి కృత్రిమ కాలే నాకు సరయిన చికిత్సని నిశ్చయించింది. అదేమని అడిగే నోరు గాని, ధైర్యం గాని నాకు లేవు.

పోయిన వారం నాకు పద్దెనిమిదేళ్ళు నిండిన సందర్భంగా కమలమ్మ, ముందుగా ఈ ఆపరేషన్ జరిగవలసిన రోజు నిర్ధారించింది. రెండో పనిగా, పొలం – డబ్బు – కొట్టాం అడుగుతూ, నా చేత తాతకి ఉత్తరం రాయించింది. మూడో పనిగా – గోవిందుతో త్వరలో నా పెళ్ళని ‘మదర్ తెరెసా అనాధాశ్రమం’ లో అందరికీ చెప్పింది,…

తాతకి ఉత్తరం పంపిన మరునాడే, ఊరికి దూరంగా ఉన్న ఈ ఆసుపత్రిలో, నా ఆపరేషన్ జరిపించేసింది కమలమ్మ.

ఈ ఆపరేషన్, మా కొలువులు, ప్రహ్లాద్ జేమ్స్ అనే వ్యక్తి చలవేనంటుంది కమలమ్మ. కమలమ్మకి స్నేహితుడు, శ్రేయోభిలాషి అయిన ప్రహ్లాద్ జేమ్స్, మూడేళ్లగా మా జీవితాలకి సూత్రధారి. అతను గీసిన గీటు దాటకుండా, అతను చెప్పింది చేస్తుంది ఆమె.

కొత్త ఊళ్ళో, సత్రంలో దిక్కు తోచక సతమవుతున్న మా ముగ్గిర్ని ఆదుకొని, ఏడాదిపాటు తన క్యాంటీన్ లో, తరువాత రెండేళ్ళగా ‘మదర్ తెరెసా’లో మమ్మల్ని కొలువులకి పెట్టింది అతనే అవడంతో, మరి అతని మాట వేదవాక్కు కమలమ్మకి…..
ఆలోచనలతో తల మరింత మోద్దుబారింది… మందువల్లేమో, నొప్పి తగ్గినట్టుగా మగతగా నిద్రలోకి జారుకున్నాను…..
**
“అమ్మాయ్, లేలే, తెల్లారుజామున నాలుగయింది. రాత్రంతా ఈ గదిలో అందరూ ఒకటే మూలుగడం. కసేపన్నా నిద్రలేదు.. ఓ వరస మీ అందరి పనులు చూసి, నిన్ను రెండో పక్కకి తిప్పి, పోయి మళ్ళీ తొంగుంటా,” అంటూ కుదిపి లేపింది రాత్రి డ్యూటి ఆయమ్మ…
బయట సన్నని జల్లు మొదలైంది. సుతిమెత్తగా గాలి గదిలోకి వీస్తుంది. తిరిగి నిద్ర పోదామనుకుంటే, మళ్ళీ కాలు నొప్పెట్టడం మొదలైంది.

‘నొప్పి’ తోచగానే కమలమ్మ గుర్తొచ్చింది…గోవిందుతో పాటు.

కమలమ్మని చూసి రెండు రోజులౌతుంది.. మనస్సుకి హాయిగా ఉంది…నిత్యం మాటలతో, చేష్టలతో కాల్చుకుతినే ఆమె నుండి విశ్రాంతి.
ఇక గోవిందు – సరేసరి..ఆమె చేతిలో కీలుబొమ్మ.
అప్పుడప్పుడు తాగి వాగుడు, అరుపులు కూడా.
అయినా అతనంటే నాకు మన్ననే. రెండేళ్లగా, చదువుకునేందుకు సాయం చేస్తున్నాడు. స్కూల్ పుస్తకాలు కావాలని అడగంగానే, నా కాడనున్న ఏడో తరగతి పుస్తకాలు పట్టుకెళ్ళి అనాధాశ్రమం టీచర్లతో నా విషయం మాట్లాడాడు. చర్చ్ లైబ్రరీ నుండి ఎనిమిదో తరగతి పుస్తకాలు పైసా ఖర్చు లేకుండా తెచ్చిపెట్టాడు.
అసలు ఈ ఊరొచ్చిన కాడినుండి కూడా ఇతరత్రా పుస్తకాలు, పత్రికలు, పేపర్లు వీలున్నప్పుడల్లా దొరకపుచ్చుకొని తెచ్చిస్తుంటాడు. కమలమ్మలా కాదు గోవిందు…

ఆలోచనల్లో మెల్లగా తెల్లవారుతుంటే, నా కాలు నొప్పిలా, బయట వర్షం మాత్రం ఉధృతంగా మారింది……
వర్షం పడ్డప్పుడల్లా, తాత గురించిన ఆలోచనలు నన్ను మరింతగా కమ్ముకుంటాయి.
‘గాయత్రీ,’ అనే తాత పిలుపులోని ఆప్యాయత ఎంతగానో గుర్తొస్తుంది. తాత మాట వినబడక యుగాలైనట్టుగా అనిపిస్తుంది.
తాతకి నేను చదువుకోడం ముఖ్యమనే, వెంట తెచ్చుకున్న ఏడవ తరగతి పుస్తకాలు మొదలుకొని వదలకుండా చదువు సాగిస్తూనే ఉన్నాను. పుస్తకాలు – చదువే నాకు ఊరటనిచ్చే తోడయ్యాయి. లోకం తీరు కాస్తైనా తెలుసుకోగలుగుతున్నాను.
వర్షంలోకి తీక్షణంగా చూసాను. తొలిపొద్దు వెలుగుల్లో మెరుస్తున్న వెండి తీగల్లా ఉన్నాయి వర్షపు ధారలు.
ఇలాంటి హోరెత్తే వర్షంలోనే నేనానాడు సొంత మనుషులని వదిలి- అంతగా తెలియని వాళ్ళతో తెలియని జీవనంలోకి పరుగెత్తాను.
అప్పటి స్థితిలో, ఆ వయస్సులో ఆ నిర్ణయం దిద్దుకోలేని తప్పుగా మారిందా?
బతుకులో పెనుమార్పులు తెచ్చి, నేనూహించని ప్రపంచంలో నన్ను నిలబెట్టిందా?
ఆ నాటి నా తలంపు సరయిందా? అని నిత్యం నిలదీస్తుంది మనస్సు.

నేనాశపడ్డట్టుగా ఏమీ జరగకపోగా, తాత కాడికి తిరిగివెళ్ళే దారి తోచక, అలవాటులేని అడ్డమైన కొలువులు చేస్తూ కమలమ్మ చేతిలో పావుగా మారిపోయాను…….ఇక ఈ ఆపరేషన్ తో అందరిలా రెండు పాదాల మీద అయితే, నడుస్తానన్న ఆశ సగం హరించుకుపోయినట్టే….ఓ కాలు కృత్రిమ కాలే మరి….

ఇలా సాగుతున్న ఆలోచనలకి ఆనకట్టు వేసింది, పొద్దున్నే డ్యూటి మారిన ఆయమ్మ బొంగురు గొంతే….

“లే పిల్లా లే, డాక్టరమ్మ వచ్చేలోగా, నీ పనంతా కానివ్వు. తిని, వేడి నీళ్ళతో మందేసుకో… అదేలే వేడి కాఫీ నీళ్ళతో మందేసుకుంటే నొప్పి, నీరసం పోతాయి,” నవ్వుతూ నన్ను పట్టి పైకి లేవడానికి సాయం చేసింది…….,.

నా చుట్టూ సర్దుతూ, “అవునూ మీ వదిన, నీ కాబోయే పెనిమిటి మళ్ళీ రాలేదే? ఇవాళ వస్తారేమోలే! మొత్తానికి, దుర్మార్గుడైన మీ తాత బారి నుండి పారోపోయొచ్చావంటగా! పోనీలే, మంచి పనే చేసావు…మనువయ్యాక కూడా నిన్ను బాగానే చూసుకుంటాడులే ఆ అబ్బాయి,” గబగబా అంటూ కదిలిందామె…
విననట్టే నేల చూపులు చూసాను….ఆమెకా సమాచారం అందించింది కూడా కమలమ్మేగా!.
ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రోజు మధ్యానం, డ్యూటీలో ఉన్న ఈమెకి, కమలమ్మ చెప్పని సంగతి కాని, ఆడని అబద్దం కాని లేదని తెలుసు…తను చెప్పేవే నిజమని అందర్ని నమ్మించాలని చూస్తది కమలమ్మ …

“ఇదిగో, మళ్ళీ నేనొచ్చేలోగా ఈ బన్ను, పండు తినేసేయి. నీ కట్టు మార్చి మందులిస్తాను,” అని వెళ్ళింది ఆయమ్మ.

గోవిందుతో నా పెళ్ళంటూ ఆయమ్మ అన్న మాటలే గుర్తొస్తున్నాయి.
గడిచిన ఏడాదిగా మాత్రం, ఇలాగే ఎందరికో నా పెళ్ళి మాట చెబుతూ ఉంది కమలమ్మ..
..నన్ను ఉద్ధరించడానికే తనూ, తన తమ్ముడు కంకణం కట్టుకున్నామని చెబుతుంది. వయస్సుకి రాగానే, నేను తాత నుండి నా ఆస్థులు ఇప్పించుకున్నాక, నన్ను కాపాడ్డం కోసం, అదే త్యాగ గుణంతో నన్ను తమ్ముడుకిచ్చి పెళ్ళి జరిపించేస్తానని,,, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా పని కట్టుకుని చెబుతుంది.

మొదట్లో నాకు చిరాకు ఏవగింపు కలిగేవి, కమలమ్మ నోటెంట నా పెళ్ళి మాటలు..
ఇప్పుడసలు పట్టించుకోను…

“ఈ అవిటిదాన్ని నాకు కట్టబెడతానంటావ్. దీన్ని కట్టుకుంటే, నా బతుకు హాయిగా గడుస్తాదని బలవంతబెట్టి, నాకిష్టం లేందే ఊరు కూడా దాటించావు.
అది సంపాదించడమే కాక, దాని తాత పొలం, కొట్టాం వస్తాయని కానిమాటలు సెబుతుంటావు…
నాకు బతుకు మీద ఇష్టం పోయింది,” అంటూ కమలమ్మ మీద విరుచుకు పడ్డాడు పీకల వరకు తాగేసి ఒకటి రెండు సార్లు, ఈ మధ్య గోవిందు.
వల పన్ని ఈ అక్కాతమ్ముళ్ళు, నన్నో పథకం ప్రకారమే తాత నుండి వేరు జేసారని తెలిసినప్పుడు కోపంతో గుండెలు మండిపోయాయి. అప్పటికే తాతని వదిలొచ్చి రెండున్నరేళ్ళు గడిచిపోయాయి కూడా…

ఏమీ చేయలేని ఆ స్థితిలోనే, కాస్త ఊరటనిచ్చిన విషయం మాత్రం – కమలమ్మ దండోరా వేసే పెళ్ళి మాటలకి, నాతో పాటు గోవిందుకి కూడా ఎటువంటి విలువా లేదని.
(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా! – 11

egire-pavuramaa11banner
“విననంటే ఎలా గాయత్రి? నువ్వేమౌతావో అనే నా బెంగ. నీ డబ్బంతా పెట్టి పట్నంలో వైద్యం సేయిస్తే నడక, మాట వచ్చేస్తాయి. నీకు పదిహేనేళ్ళు కదా! సరయిన వయసు.
నీకు మేమున్నాము. మా వెంట వచ్చేసేయి. అన్నీ సేస్తాము.
నేనూ, గోవిందు కూడా అండగా నిలబడి నీ మీద ఈగ వాలనివ్వం. అన్నీ సూసుకుంటాం. ఇప్పుడు మేమే నీకు సాయం సేయగలం.
నీ తాత నుండి నీ కొట్టాం, పొలం కూడా అడిగి ఇప్పించుకోవచ్చు. జీవనం ముగిసిపోతున్నవాడు నీ తాత. జీవనం ఇంకా మొదలెట్టని దానివి నువ్వు,” , “ఆలోసించుకో నీ ఇష్టం,” అనేసింది కమలమ్మ.

నా చేయి వదిలేసి, ఎంగిలి చేతిని కంచంలోనే కడిగించి అక్కడినుండి వెళ్ళిపోయింది ఆమె.
దుఖాన్ని అపుకునే ప్రయత్నంలో అక్కడినుంచి లేచి, ఎలాగో నా పక్క మీదకి చేరాను.
ఏనాడు లేనిది, నన్ను కని కాలువగట్టున పారేసిన ఆ నా కన్నతల్లిని తలుచుకున్నాను. నా రోదన వినబడకుండా గొంతు బట్టతో చుట్టిన ఆమె నిర్దయ నిజమేనా అనుకున్నాను. అసలు నన్ను ఇలా దిక్కు మొక్కు లేకుండా చేయడానికి ఆమెకి అధికారం ఉందా? నా ఈ దుస్థితికి ఆ అమ్మ కాదా కారణం? అని తిట్టుకున్నాను…
లేచి మంచినీళ్ళు తాగాను. మరో పక్కకి ఒత్తిగిల్లాను. కమలమ్మ గురకతో అసలు నిద్ర రావడం లేదు. ఆలోచన ఆమె మీదకి మళ్ళింది. మా జీవితాల్లోకి కమలమ్మ వచ్చి మూడేళ్ళవుతుంది. ఆమె ఎసుమంటి మనిషో అంతగా అర్ధం కాలేదు. నా మీద ప్రేమ చూపిస్తది. నా మంచి కోరుకుంటది.
తాతకి అమె నచ్చదు. ఎందుకు?
ఆలోచన తాత మీదకి మళ్ళింది. గుండెలు చల్లగా అయిపోయాయి. గుండెలు జారి నేలకొరిగినట్టుగా అనిపించింది. తల మొద్దుబారింది. నిజంగా నా జీవితం ఇలా అవ్వడానికి తాత కారణమా? నా అవిటితనం తాత వల్ల ఏర్పడిందా?
మరి చంద్రమ్మతో నేను తనకి దొరికినప్పుడు కాళ్ళు, పాదాలు దెబ్బ తిన్నాయని, ఊపిరి కూడా అందకుండా గొంతుకి గుడ్డ చుట్టి ఉందని అన్నాడే?
కన్నతల్లే నిర్దయగా అలా వదిలేసిందేమో అని బాధపడ్డాడే? అది అబద్దమా?

కమలమ్మ మాటలు తలుస్తూ మితిమీరిన బాధతో, కోపంతో వణికిపోతున్న నా వొంటిని, అవిసిపోతున్న గుండెల్ని సముదాయించే ప్రయత్నంలో తెల్లారిపోయింది.
**
నా బాధ, ఆందోళన పట్టనట్టుగా మామూలుగా తెల్లారింది. కమలమ్మ చెప్పిన విషయాలు గుండెల్ని మండిస్తున్నా ఎప్పటిలా నేను గుళ్ళో నా స్థానంలో కూచుని, నా పని చూసుకుంటున్నాను.
పూలపని, వత్తులు, కుంకుమ పొట్లాల పని అయ్యేప్పటికి తొమ్మిదిన్నరయ్యింది.

పదిగంటల సమయంలో, గుడి ఆవరణలోనే దూరంగా ఓ మూలకి పెద్ద బస్సు వచ్చి ఆగింది. కొద్దిసేపట్లో హడావిడి మొదలైంది. అప్పటికే గుడి బయట – చూపు లేని వారు, వికలాంగులు – పిల్లలు, పెద్దలు, వారి వెంట వచ్చిన వారు ఒక పాతిక మందైనా కూడారు.

మరో పది నిముషాలకి పూజారయ్య, ఉమమ్మ, నేను ఆ బస్సు దగ్గరకి వెళ్ళాము. వైద్య సదుపాయాలున్న ఆ బండి చిన్న ఆసుపత్రి లాగానే ఉంది. ఇద్దరు డాక్టరమ్మలు, ఒక డాక్టరయ్య ఉన్నారు.

ముందుగా నన్నే లోనికి తీసుకెళ్ళారు.
వారు నిర్వహించబోయేది – రక్త పరీక్షలతో మొదలెట్టి –
‘అంగవైకల్య సంబంధిత ప్రాధమిక పరిశీలన’ – అన్నారు.
కాళ్ళలో – కదలిక పరిధి, స్పందన – నమోదు చేసారు
గొంతు బయట-లోపల ఫోటోలు, ఎక్సురేలు తీసారు
స్వతహాగా గొంతునుండి వెలువడే ధ్వనులు పలికించి విన్నారు.
నెలక్రితం వంశీ సంస్థతో తాత దాఖలు చేసిన అర్జీ నా ముందుంచారు. నా పేరు రాసున్న దస్త్రం – నా తరఫున తాత దరఖాస్తు పెట్టిన కాగితాలవి. ఉమమ్మ దాన్ని చదవమని నా పక్కన కూచుంది.

అభ్యర్ధి: గాయత్రి సాయిరాం – వయస్సు: 15 సంవత్సరాలు – 6 వ తరగతి విద్యార్ధిని.
సంరక్షకుడు – (తాత) సత్యం సాయిరాం – వయస్సు: 73 సం – గంగన్న పాలెం వాస్తవ్యులు
సంక్షిప్త ఫిర్యాదు : అంగవైకల్యం – (నడక, మాట లేకపోవడం)
వివరణ: 15 యేళ్ళ క్రితం, ఉధృత పరిసరాల్లో – కాళ్ళు, పాదాలు, మెడ, గొంతు భాగాలు నలిగి, శారీరికంగా గాయపడి, తీవ్ర వొత్తిడికి లోనయిన పసిబిడ్డ.
ప్రస్తుత పరిస్థితి: కదలిక లేని కాళ్ళు, సామాన్య మాట సామర్ధ్యం లేని వాక్కు (మూగి).
జరిపిన చికిత్స: కాళ్ళకి, అరికాళ్ళకి ఆకు పసర్ల పూత, ఆయుర్వేదం.
పై విషయమంతా ఆ దస్త్రం లోని వివరణాపత్రికలో స్పష్టంగా రాయించాడు తాత ….
దానితో పాటుగా —
తమ ఆర్ధికస్థితి దృష్ట్యా ఉచిత వైద్యసహాయం కోరుతున్నామని కూడా….తాత చేసిన ఆభ్యర్ధనా పత్రం – ఆ దస్త్రంలో ఉంది.
**
నాతో పాటు మొత్తం ఐదుగురికి మాత్రమే డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల వివరాలు సాయంత్రానికల్లా చెబుతామన్నారు.
నేను, ఉమమ్మ గుళ్ళోకి వెళ్ళిపోయాము.
**
గుడిలో పని ముగించుకొని ఐదింటికి మళ్ళీ వైద్యుల్ని కలిశాము.
వారు జరిపిన ప్రాధమిక పరీక్షల ఫలితాల పత్రం మా చేతికిచ్చారు.
కదలిక పరంగా :
కాళ్ళల్లో ఎదుగుదల – 80% (ఎనభై శాతం) ఉంటే, స్పందన – 40% (నలభై శాతం) ఉందంట.
అరికాళ్ళల్లో స్పర్సజ్ఞానం – 20% (ఇరవై శాతం)గా.. నిర్దారణయ్యిందంట.
పాక్షిక ప్రతిస్పందనకి కారణం వైజ్ఞానికంగా కనుగొనవలసిన అవసరం ఉందని ప్రస్తావించారు.

కంఠధ్వనుల పరంగా:
నేటి సాధారణ పరీక్షా ఫలితాలు అసంపూర్ణం అని, ప్రత్యేకంగా సున్నితమైన ‘స్వర పేటిక’ వైద్య పరీక్షలు జరపవలసుందని తెలియజేశారు.
యేడాది సమయం పట్టే ఆ వైద్యానికి, ‘వంశీ సంస్థ’ నివాసిగా నమోదైన రుజువు అవసరం అని కూడా సూచించారు ఆ సంస్థ వైద్యులు.

వొత్తిడి పడని మిగతా ప్రమేయాలు సవ్యంగానే ఉండడంతో, సరయిన వైద్యం అందితే, పరిస్థితి మెరుగుపడే అవకాశం హెచ్చుగానే ఉందని కూడా నిర్ధారించారు.
వాళ్ళతో సంప్రదింపులు అయేప్పటికి సాయంత్రం నాలుగయింది.

ఆ తంతు ముగుస్తూనే ఉమమ్మ ఆ వివరణాపత్రం మళ్ళీ చదువుతూ అరుగు మీద నా పక్కనే కూచుంది. సమాచారమంతా సరోజినిగారికి ఫోనులో వివరించి, వంశీ వారి సౌకర్యంలో నివశించే వారికి మాత్రమే, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారని కూడా ఆమెతో చెప్పింది.
ఫోను పెట్టేసి ఆలోచనలో పడింది ఉమమ్మ.
“అంటే నువ్వు ఈ ఊరునుండి వెళ్లి కనీసం ఓ ఏడాది పాటు అక్కడ గుంటూరులో వాళ్ళ వసతిలో ఉండాలన్నమాట. అలా కాకుండా ఇంకే విధంగానైనా ఆ వైద్య పరీక్షలు చేయించవచ్చేమో, సరోజినిగారి సాయంతో కనుక్కుంటానులే,“ అంది ఉమమ్మ.

egire-pavurama-11
**
పొద్దున్నుంచి జరిగిన విషయాలు తలచుకుంటూ మధ్యానం కమలమ్మ ఇచ్చిన పులిహోర తిన్నాను.
వంశీ సంస్థ వారితో, తాత ద్వారా నమోదైన నా వివరాలు పదే పదే గుర్తొస్తున్నాయి. పసిపిల్లగా నా కాళ్ళు చితికిపోతే, గాయాలు మానిన గుర్తులు చూడంగా గుర్తులేదే? మరి మాట ఎందుకు రాకుండా పోయినట్టు? పుట్టుకతో వచ్చిన మూగతనమా?

వెన్నంటే కమలమ్మ మాటలు కూడా పదే పదే గుర్తొస్తున్నాయి. ఇన్నేళ్ళ ‘గాయత్రి’ హుండీ డబ్బు ఎంత? నా కోసం పిన్ని తన వద్ద దాస్తుందేమో? ఆ డబ్బుతో పట్నంలో పెద్దాసుపత్రికి వెళ్ళలేమా? వెళ్ళి వైద్యం చేయిస్తే, నా కాళ్ళు బాగయిపోతాయేమో… నడవగలుగుతానేమో, అది చాలు నాకు…
తాత రిక్షానో, ఆటోరిక్షానో నడిపి సంపాదించిన డబ్బుతో కొట్టాం, పొలం కొనలేడని కమలమ్మ అంటుంది. మరి తాతకెలా ఉన్నాయవి?
జవాబు లేని ఎన్నో విషయాలు.

మా రాబడి – మా తిండికి, జీవనానికి అయిపోతుందేమో.. నాకు వైద్యం చేయించడానికి సరిపడా డబ్బు లేకనే, వికలాంగుల సంస్థలో నన్ను నమోదు చేశాడేమో తాత…
తాతని అడిగి కనుక్కునే స్థితి లేదిప్పుడు. జబ్బు పడిపోయాడు.
నన్ను బాగు చేసే ఓపిక ఇక తాతకి లేదేమో! నా జీవనం నేనే బాగు చేసుకోవాలి. డబ్బు దగ్గర మాకు ఎప్పుడూ కొదవే అని పిన్ని మాటల వల్ల తెలుస్తుందిగా.
నాకు మంచి వైద్యం తాత చేయించలేడేమో. సాయంత్రం వరకు ఆలోచనల్లో మునిగి తేలాను.
కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి.

ఎవరి సాయం లేకుండానే, ఇప్పుడు మెల్లగానే అయినా కర్రల సాయంతో మెసలగలను, కదలగలను. ఇప్పుడు నా కదలిక నా అధీనంలోనే ఉంది కూడా…
పనయ్యాక గోవిందు రిక్షాలో తాతని చూడ్డానికి ఆసుపత్రికి వెళతానని కమలమ్మకి తెలియజెప్పాను.
“అయితే నన్ను దారిలో గోవిందు పాకలో దింపెళ్ళండి,” అని నాతో పాటే బయలుదేరింది కమలమ్మ.
**
నేను ఆసుపత్రికి వెళ్ళేప్పటికి తలగడని ఆనుకుని కూచోనున్నాడు తాత. కాస్త తేరుకున్నట్టే కనబడ్డాడు. పక్కన చేరి ఆ రోజు అప్పటివరకు జరిగిన విషయమంతా తెలియజెప్పాను తాతకి.
వంశీ సంస్థ డాక్టర్లు వచ్చారని, నన్ను పరీక్షించారని సైగలతో వివరించాను.
నా వైద్యం విషయం ఏమన్నారని అడిగాడు తాత. మరిన్ని పరీక్షలకి వెళ్ళాలన్నారని తెలియజెప్పాను. నాకు ఏడవ తరగతి పుస్తకాలతో రెండో తరగతి ఇంగ్లీషు కూడా అందాయని తెలిపాను. సంతోషంతో తాతకి కళ్ళల్లో నీరు తిరిగింది.

మొద్దుబారిన నా బుర్ర తాతతో కూడా ఎప్పటిలా ఉండనివ్వలేదు. తాత నన్ను ప్రేమతో పదిహేనేళ్ళగా పెంచాడా? లేక అవిటిని చేసి, నా అవిటితనం ఫణంగా పెట్టి తను బతుకుతున్నాడా? అన్న తలంపే బాధపెట్టింది.

చిక్కిపోయి కళ తప్పిన తాత రూపాన్ని చూసి గుండెలు బరువుగా అనిపించాయి. నన్ను సాకిన ఆ పెద్దాయన నా పాలిట దేవుడో? కసాయివాడో? అన్నదానికి జవాబు దొరకేనో? లేదో?

లోతుగా ఊపిరి తీసి తాత రూపాన్ని నా గుండెల నిండా ఎప్పటికీ చెరగనంత బలంగా నింపుకున్నాను.
తాతకి చెప్పి బయలుదేరాను.
హోరున గాలివాన. తగ్గుముఖం పడుతుందేమోనని కాసేపు వరండాలో వేచి చూసాను.
నిముష నిముషానికి వర్షం ఎక్కువవ్వడం చూసి, గోవిందు నేనున్న కాడికి వచ్చాడు. “నాకు వానలో రిక్షా నడపడం కొత్తేమీ కాదు,” అన్నాడు.
**
రిక్షాలో వొదిగి కూచున్నా, రెండువైపుల నుండి వాన తాకిడి ఉధృతంగా ఉంది. గోవిందుకి అలవాటేగా! తడవకుండా పొడవాటి ప్లాస్టిక్ చొక్కా, తలకి ప్లాస్టిక్ టోపీ వేసుకొని రిక్షా నడుపుతున్నాడు.

ఉరుములు – మెరుపులు – గాలి – వాన – హోరెత్తిపోతున్నట్టుగా ఉంది. నా అలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి.
కోపం, అసహనం, భయం, అనుమానం, అంతలోనే మొండి ధైర్యం గుండెల్ని చుట్టేసాయి.

ఇదే సమయం. తాత ఉంటే ఈ తెగింపు రాదు.
ఆ ప్రేమ నిండిన ముఖం చూస్తూ అనుమాన పడలేను.
నేను ఇలా తెగించలేను.
అందుకే కొట్టాం చేరగానే, గోవిందుని ఆగమన్నాను, సాయం అడిగాను. ఇకనుండి నిబ్బరంగా నడుచుకోవాలి. ధైర్యంగా ముందుకి సాగాలి అని నాకు నేను మరీ మరీ అనుకున్నాను.

అంతే! వెనుతిరిగి చూడకండా పిచ్చిధైర్యంతో, దృఢనిశ్చయంతో, పెట్టెబేడా సదురుకొని – తాతని, అక్కడి నా జీవితాన్ని వదిలేసి, కమలమ్మని కలవడానికి గోవిందుతో అతని పాకకి బయలుదేరాను.

దారిపొడుగునా నా మదిలో మెదిలింది – ప్రేమని పంచిన తాత రూపమే.
ప్రతి పొద్దు నాకోసమే అన్నట్టుగా నాముందు వాలి నాకెంతో ఆనందాన్నిచ్చే నా పావురాళ్ళు, నాకు చదువు చెప్పి ప్రేమతో ఆదరించే ఉమమ్మ రూపం కూడా నా గుండెల్లో కదిలాయి.
ఓ పావురంలా గూడు వీడి పోతున్నానా? అనిపించింది ఓ క్షణం.

‘పావురం శాంతికి చిహ్నంగా ఆకాశంలో సంచరిస్తుందంట’… ‘నేను మాత్రం మదినిండా ఎంతో అశాంతిని నింపుకొని ఓ విహంగంలా గూడు వీడుతున్నాను’ అనిపించింది.

(ఇంకా ఉంది)

‘ఎగిరే పావురమా!’ – 10

egire-pavuramaa10-banner
సినిమా కథ మొదట్లో అంతగా అర్ధం కాలేదు. సినిమాలో ఓ కొండంత మీసాలవాడు అనాధ పిల్లల్ని వీధుల్లోంచి తీసుకొచ్చుకొని, కొన్నాళ్ళు సాకిన తరువాత వాళ్ళని అవిటిగానో, మూగగానో, గుడ్డివాళ్లగానో చేస్తాడు.
ఆ తరువాత ఇక వాళ్ళని బిచ్చగాళ్ళగా మార్చి, ఆ అవిటోళ్ళతో బిక్షాటన చేయించే యాపారం మొదలెడతాడు. ఆ మీసాలాడి నుండి తప్పించుకొని పారిపోయిన ఇద్దరబ్బాయిల కథే ఆ సినిమా.

నాకు అస్సలు నచ్చలేదు. సినిమా అయ్యాక ఇంటికెళ్ళినంత సేపూ సినిమాలో నాకు నచ్చని ఆ మీసాల వాడి కథే గుర్తుండిపోయి చాలా విసుగ్గా, కోపంగా అనిపించింది.

“ఏమో గుబులుగా ఉన్నావే గాయత్రి? సినిమా నచ్చలేదా? అడిగింది కమలమ్మ.
నా ఆలోచనలో నేనున్నాను.

“ఏం సినిమానే పాడు సినిమా. అట్టా ఏడన్నా జరుగాతాదా?” అన్నాడు రిక్షా నడుపుతున్న గోవిందు, మాకు వినబడేలా ఓ మారు ఎనక్కి తిరిగి..

“పిచ్చోడా, విజయవాడ లాంటి నగరాల్లో అవిటి యాచకుల నెలసరి సంపాదన నాలుగైదు వేల రూపాయలంట. ఈ రోజుల్లో బతుకుతెరువు కోసం యాచించే వాళ్ళు, వడ్డీలకి అప్పులిచ్చే స్థాయిలో ఉండారంట. అందుకే ఈ సినిమాలో మల్లేనే ఇట్టాంటివన్నీ నిజంగానే జరుగుతున్నాయిరా,” అంది కమలమ్మ పెద్దగా గొంతెత్తి, గోవిందుకి వినబడేలా.

“సరేలేవే అక్కా, ఇట్టాంటి సినిమా సూపించాలా ఏంది?” విసుక్కున్నాడు గోవిందు.
“పోనీలే గాని, ఆ సినిమాలో అమ్మాయి కంటే మన గాయత్రి ఎంతో అందంగా కళగా ఉందా లేదా? నువ్వు సెప్పు. నాకైతే, సినిమా యాక్టర్ కంటే గాయత్రి సక్కంగా ఉంది. వైద్యం చేయించి నడక వచ్చేస్తే,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా….
అవసరం లేని మాటలు ఆమెకి అలవాటే అని చిరాగ్గా అనిపించింది.

“అరేయ్ గోవిందు, ఈ సారి మన కొత్తపాక సూపెట్టాల గాయత్రికి,” అంది మళ్ళీ పెద్దగా…నవ్వుతూ కమలమ్మ.
రద్దీ లేని దోవవడంతో ఆమె గొంతు ఆమడ దూరానికి వినబడుతుంది….
“సర్లేవే, ఓ తడవ ఆదివారం అట్టాగే సూపెడదాములే,” అన్నాడతను.
మరి కాసేపటికి, నన్ను కొట్టాంలో వదిలెళ్ళారు కమలమ్మా వాళ్ళు.

సినిమా గురించి తెలీజెయ్యాలని తాత కోసం చూస్తే, నులక మంచం మీద అటు తిరిగి తొంగొనున్నాడు. నేనొచ్చేవరకు కాసుకొని ఉండకుండా తొంగున్నాడని కాస్త బాధేసింది.
తాతకి ఇష్టంలేని మనిషితో తిరగడం నాకూ కష్టంగానే ఉంది. ‘తాతకి కమలమ్మ మీద కోపం పోతే బాగుణ్ణు’ అనుకుంటూ సినిమా గురించే ఆలోచిస్తూ నేనూ పక్క మీద చేరాను.
**
పొద్దున్నే గుడికి బయలుదేర బోతుంటే తాత కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయాడు. దగ్గు, వాంతులు ఒకదాని వెంట ఒకటి తాతని ముంచెత్తాయి. పిన్ని, బాబాయి తాతని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నన్ను గుడికి వెళ్ళిపొమ్మన్నారు.
‘తాత మళ్ళీ నీరసించాడన్నమాట. అందుకేనేమో రాత్రి అలా పెందరాళే తొంగున్నాడు.
**
దినమంతా తాత విషయం చాల దిగులుగా ఉంది. మధ్యానం నాలుగింటికి గుడికొచ్చిన చంద్రం పిన్ని ముఖంలో ఆదుర్దా, బాధ, నిరాశ కనిపించాయి. నాలో కూడా తాత గురించి గుబులు, భయం పెరిగాయి.
“తాత వారం రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఉన్న రోగాలకి తోడు చిన్నపేగు మెలిక పడిందంట. పెద్దాపరేషను చేసి లోపలి మెలిక తీయాల్సిందేనంట. నేను తాతకి తోడుగా ఆడనే ఉండాలి. ఈ వారం రోజులూ నీకు పగళ్ళు సాయంగా, రాత్రిళ్ళు తోడుగా మనోళ్ళు ఎవరన్నా ఉండేలా సూడాలి.
నీకీ విషయం చెప్పి పెందరాళే తీసుకెడదామని ఈడకొచ్చా. పనయ్యాక రాత్రికి తాత కాడికెళ్తాను,” అని చెబుతూ నన్ను బయలుదేర దీసింది పిన్ని.

అన్నీ వింటున్న కమలమ్మ, “అయ్యో అదేంది? నేను లేనా? మా గాయత్రిని నేను సూసుకోలేనా? తాతని మీరు బాగు చేసి ఇంటికి తెండి. గాయత్రికి నేనుంటాను తోడుగా.
రేపటినుంచి నా మకాం గాయత్రి దగ్గరే. సొంత బిడ్డలా సూసుకుంటాను. సరేనా? ఇక మీరెళ్ళండి. నేను అవసరమైనవి సర్దుకొని రేత్రికి వస్తాలే,” అంది చంద్రం పిన్నితో.
**
మౌనంగా కొట్టాం చేరాము. నాకు దిగులుగా ఉంది. రాగి జావ కాసి పళ్ళెంలో పోసి తెచ్చిచ్చింది పిన్ని.

“ఇదిగో గాయత్రి, మాకు ఈ కమలమ్మ యవ్వారం, మాట నచ్చవు. చాలా బధ్రంగా ఉండు ఆమెతో. గత్యంతరం లేక ఈ ఒక్క తడవ నీకు తోడుగా ఉండనీ,” అంది తాత బట్టలు సంచికేస్తూ ఆమె.
అర్ధమయింది అన్నట్టు తల ఊపాను.
ఇంకా అప్పటికి బట్టలవీ తెచ్చుకొస్తానన్న కమలమ్మ రాలేదు.
కొట్టామంతా ఓ సారి చీపురుతో చిమ్మింది. మరచెంబుడు నీళ్ళు నాకు తెచ్చిచ్చి కమలమ్మ కోసం చూస్తూ, పక్కనే కూచుంది పిన్ని.
తాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇంటికాడ నేను తీసుకోవల్సిన జాగ్రత్తలు మళ్ళీ చెప్పింది.

మరో ఐదు నిముషాలకి పెట్టెబేడాతో కమలమ్మ వచ్చాకే పిన్ని వెళ్ళింది.

egire-pavuramaa-10
**
తాత ఆసుపత్రిలో జేరి వారమయింది. తాత దగ్గరలేని వెలితి బాగా తెలుస్తుంది.
రోజు మార్చి రోజు తాతని చూడ్డానికి, పిన్నితోనే ఆసుపత్రికి పోతున్నాను. నాలుగు రోజులైనా తాత మగతలోనే ఉన్నాడని చంద్రం పిన్నికి గాబరాగా ఉంది. నాకైతే ఏమీ తోచడం లేదు.
**
గుడి నుంచి కొట్టాం చేరి పుస్తకాలు ముందేసుకొని చదువుతూ కూచున్నా. మనసు లగ్నం చేయలేక చదువు సాగడం లేదు.

చీకటి పడ్డాక చంద్రం పిన్నొచ్చింది. “ఈ పూటే తాత లేచి మాట్లాడుతున్నాడంట. రాంబాబాయి ఇప్పుడే తాతని చూసొచ్చాడు. ఇక నీకోసం అడుగుతాడు. పద చూసొద్దాము,” అని నన్ను బయలుదేరదీసింది.
**
మేమెళ్ళేప్పటికి తాత తెలివిగానే ఉన్నాడు. మమ్మల్ని చూసి ఆనందపడ్డాడు.
మందులకి బిల్లు కట్టాలని నర్సు చెబితే, తాతని పలకరించి బయటకెళ్ళింది చంద్రమ్మ.

“ఈ పూటే కాస్త కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు మీ తాత,” అంది తాతకి బ్యాండేజీ మార్చడం ముగించిన నర్సు.

“కట్టు మార్చానులే. ఇక్కడకొచ్చి కూర్చో. నీ గురించే చెబుతున్నాడు. నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నట్టున్నాడు. అదృష్టవంతురాలివే గాయత్రి,” అంటూ తాతతో మందు మింగించి వెళ్ళిందామె.
తాత మంచం కాడికెళ్ళి కూచున్నాను. గోడకి నిలబెడితే జారుతాయని ఊతకర్రలు తాత మంచమెనక్కి పెట్టాను.

మెల్లగా లేచి తలగడ కానుకుని కూర్చున్నాడు తాత.
“నా ఆరోగ్యం అంతంతగా ఉంది తల్లీ. నీ గురించేనమ్మా నా దిగులు. ఈ వారంలో ‘వంశీ వికలాంగుల సంస్థ’ వాళ్ళు మన ఊరికి రావచ్చు. వాళ్ళ రాక విషయం పూజారయ్యకి ముందుగానే తెలుస్తుంది. మన ఊళ్ళోకి వచ్చినప్పుడు మన కాడికి వస్తామన్నారులే.
నిన్ను చూసి, వాళ్ళ వైద్యుల చేత పరీక్ష చేయించాకే – నీ చికిత్స విషయంగా సాయం చేయగలరంట,” అని వివరంగా చెప్పాడు తాత.
విని సరేనని తలూపాను.
**
మరునాడు పూలపని చేస్తుండగా, పూజారయ్య వచ్చి నాకెదురుగా అరుగు మీద కూచున్నారు. నా పక్కనే తమలపాకులు శుభ్రం చేస్తున్న కమలమ్మ, తన పనిని కాస్త దూరంగా వెనక్కి జరుపుకొంది.
“చూడమ్మా గాయత్రి, “ ‘వంశీ’ సంస్థ వారు రేపు మన ఊళ్ళోకి వస్తున్నారు. మీ తాత వెళ్ళి వాళ్ళతో నీ విషయం మాట్లాడిన సంగతి తెలుసుగా! తీరా వాళ్ళు మన దగ్గరికి వచ్చే సమయానికి ఇలా ఆసుపత్రిలో ఉన్నాడు పాపం సత్యం. అయినా పర్వాలేదులే. నేను, ఉమా ఉన్నాముగా నీకు సాయం,” అన్నారాయన.
ఔననట్టుగా తలూపి వింటున్నాను.

“వాళ్ళ వైద్యుల్ని వెంట బెట్టుకొని మరీ వస్తారుట. ఇక్కడ మన గుడి ఆవరణలోనే వాళ్ళ బస్సు పెట్టుకుంటారు. మన పల్లెలో ఇంకా అంగవైకల్యం ఉన్న పసివాళ్లని కొందరిని చూస్తారట.
నువ్వైతే రెడీగా ఉండు,” అంటూ తాత గురించి అడిగారు పూజారయ్య.

“మీ రాంబాబాయి వచ్చి వెళ్ళాడులే. నిన్ననే కళ్ళు తెరిచాడటగా సత్యం? వంశీ సంస్థతో మన పని కూడా అయ్యాక, అతన్ని చూడ్డానికి వెళతాము,” అంటూ లేచి గుడిలోకి వెళ్లారు పూజారయ్య.
**
తరువాత అరగంటకి ఉమమ్మ వచ్చింది. “నీ పనులన్నీ మెల్లగా ఒక్కోటి అవుతున్నాయిగా! రేపు నీకు వైద్యపరీక్షలు జరిగే అవకాశం ఉందంట. నేను ఆ సమయానికి నీతోనే ఉంటానులే,” అంటూ నా పక్కనే కూచుందామె.

శుభ్రం చేసిన తమలపాకులు లోనికి తీసుకెళుతూ కమలమ్మ మా కాడికి వచ్చింది. మరునాడు సంస్థ వాళ్ళు వచ్చే సమయానికి ఏ సాయం చేయడానికైనా, తను అందుబాటులోనే ఉంటానని ఉమమ్మకి, నాకు చెప్పి వెళ్ళింది.

ఎప్పటిలా పర్సు నుండి చాక్లెట్టు తీసిస్తూ, “మాస్టారుగారు పంపిన కొత్త పుస్తకాలు ఇవ్వడానికే వచ్చాను,” అంటూ సంచి నుండి ఒక్కో పుస్తకం నా చేతుల్లో పెట్టింది ఉమమ్మ.
“ఇవి ఏడవ తరగతి లెక్కలు, సాంఘికం, సైన్స్ పుస్తకాలు. రెండో తరగతి ఇంగ్లీష్ కూడా తెచ్చాను. ఎల్లుండి నుంచి మొదలు ఈ చదువు,” అని నా భుజం మీద తట్టింది మెచ్చుకోలుగా.

సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఆశించినట్టు వంశీ వారు మా ఊరు రావడం, నేనేమో ఏడవ తరగతి చదువు మొదలెట్టడం, రెండు సంగతులూ తాతకి ఆనందాన్ని కలిగించేవే….రేపే చెప్పాలి అనుకున్నాను.
**
సాయంత్రం ఇంటికాడ పనులు చేసుకొని కొత్త పుస్తకాలు ముందేసుకోగానే చంద్రం పిన్నొచ్చింది.

“గండం నుండి బయటపడి మొత్తానికి తాత మరో మూడురోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు,” అని చెపుతూ నా పక్కనే కూచుని, సంతోషంతో నా చెంపలు నొక్కి ముద్దెట్టుకుంది.
‘ఎప్పటిలా మా కొట్టాంలో, మళ్ళీ తాత నా కళ్ళ ముందు’ అన్న తలంపే ఎంతో తృప్తిగా అనిపించింది.

“నాకూ కాస్త ఈ తిరగడం తగ్గుతుందిలే. మళ్ళీ రేపొస్తా ,” నవ్వుతూ పనుందంటూ వెళ్ళింది పిన్ని.

ఇదంతా చూస్తూ, మా మాటలు వింటూ వంట ముగించిన కమలమ్మ నన్ను బువ్వ తినడానికి రమ్మంది. పుస్తకాలు పక్కనెట్టి వెళ్ళి తినడానికి కూచున్నా.
కమలమ్మ కొసరి కొసరి వడ్డించింది.
“చూడు గాయత్రి, ఎప్పటినుంచో నేను తెలుసుకొన్న కొన్ని ఇషయాలు నీకు సెప్పాలనుకున్నా. ఇప్పటివరకు నోరు తెరవలేదు. నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు,” అని తానొక ముద్ద తిని నీళ్ళు తాగి మళ్ళీ మొదలెట్టింది కమలమ్మ.
ఆమె అనేది వింటూ తింటున్నాను.

“ఇది నీ అవిటితనం గురించి, నీ బతుకుతెరువు గురించి, నువ్వు దేవుడనుకుంటున్న నీ తాత గురించి,” మళ్ళీ ఆగి నా వంక చూసింది.

“మీ తాత ఉప్పరోడిగానో, రిక్షావాడిగానో బతికే టైములో నువ్వు దొరికావంట. దిక్కులేని దానవేనంట. ఎత్తుకొచ్చుకొని సాకాడు, సరే! ఎందువల్లో మరి నీకు నడక, మాట రాడం ఆలస్యమయితే, వైద్యం సేయించాల్సింది పోయి, అవిటిదని ముద్రేసి, ఆ నాటి నుంచి ఈ నాటి వరకు, నిన్ను ఆ గుడి మెట్ల మీద కూకోబెట్టి డబ్బు సంపాదిస్తున్నాడు.
అసలు నన్నడిగితే, ఆ ముసలాడే నిన్ను కసాయి ముఠా వాళ్ళ చేత అవిటిదానిగా సేయించుంటాడు.. మనం మొన్న చూసిన సినిమాలో లాగా,” అన్న కమలమ్మ మాటలకి ముద్ద మింగుడు పడలేదు నాకు.

తల వంచుకునే ఉన్నాను. గుండెలు బరువెక్కి, కడుపులో దేవేసినట్టయింది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.
నా వంక చూస్తూనే మళ్ళీ మొదలెట్టిందామె.
“ఎంతో కాలంగా మీ తాత స్నేహితులే ఆ కూరలబడ్డీ వాళ్ళు, నాయుడన్న వాళ్ళు. వాళ్ళ మాటల్ని బట్టే తెలిసింది.
మీరుండే కొట్టాం కాక ఆరెకరాల వరిపొలం ఉందంట నీ తాతకి.
నీ డబ్బుతోనే కాదా ఇంత మంచి కొట్టాం, పొలం సంపాదించుకున్నాడు ఆ ముసలాడు?.
కాని ఏదీ నీది కాదు. ఇన్నేళ్ళ నీ చాకిరీ ఏమైంది? నీ వైద్యానికి సరిపడా డబ్బు ఉన్నా, ఉచిత వైద్యం కోసం వికలాంగుల సంస్థకి నిన్ను అప్పజెప్పాలని చూస్తున్నాడంట ఆ ముసలాడు,” క్షణం ఆగింది.

నేనేమి వింటున్నానో, అర్ధమవుతుందో లేదో కూడా తెలీడం లేదు…

“మొన్ననెళ్ళి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడంట నీ తాత. ఆ సంస్థ వాళ్ళేమో తిన్నగానే ఉన్న నీ కాళ్ళని మోకాళ్ళ వరకు తీసేసి, కుత్రిమంగా కాళ్ళు పెట్టి నీతో వెట్టి చాకిరీ చేయిస్తారంట.
అందుగ్గాను మీ తాతకి డబ్బులిస్తారంట,” నా వంక సూటిగా చూసింది.
ఆపుకోలేని కన్నీళ్ళని తుడుచుకోను ప్రయత్నిస్తున్నాను…
“అసలా ముసలాడు చేసేది పెద్ద నేరమంట. పసిపిల్లతో పని చేయించి డబ్బులు దోచుకుంటున్నాడని నా బోటిది ఫిర్యాదు చేస్తే, ‘బాల కార్మికం’ నేరం మీద పోలీసోళ్ళు నీ తాతని జైల్లో తోస్తారంట కూడా,” అంది ఆవేశంగా.
ఆమె మాటలతో నా కడుపు ఉడికిపోయింది. నా గుండె ఆగిపోతుందేమో అన్నంత బాధ కలిగింది. చేతినున్న మెతుకులని పళ్ళెంలోకి వదిలేసి ఎడమ చేత్తో ఆగని కన్నీళ్లు తుడుచుకున్నాను.

మళ్ళీ అందుకుందామె.
“ఇయ్యాలో రేపో అన్నట్టయిపోయాడు నీ తాత. నీ సంపాదన, తోడు లేందే ఆ ముసలాడి జీవనం జరగదు. ఆయన చికిత్స, మందులు అంతా నీ సంపాదనే. పూజరయ్యకి కూడా ఇందులో భాగముందని నా అనుమానం,” అన్న ఆమె మాటలకి తల మొద్దెక్కిపోయింది.

నా కింద భూమి జారినట్టయింది. ఎలాగో అక్కడి నుంచి జరిగాను.
ఇంక చాలు అన్నట్టు కమలమ్మని వారించబోయాను. నా చేయి ఆమెవైపు చాచి, ‘ఇంకేమీ నాకు చెప్పొద్దన్నాను.
నా చేయి తన చేతిలో బిగించింది కమలమ్మ.

(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా!-9

egire-pavuramaa9-banner

నా కోసం ఎవరో మనిషి ‘ఊతకర్రలు’ తెస్తారని తెలుసును గాని ఇలా డాక్టరుగారు, ఓ పెద్దావిడ కూడా వస్తారని ఊహించని మేము ఆశ్చర్య పోయాము.
**
అదే సమయానికి ఉమమ్మ కూడా వచ్చి వారికి ఎదురెళ్ళింది. తాత భుజం మీద చేయి వేసి నా దిశగా నడిపించుకు వచ్చారు డాక్టరుగారు. అంతా కలిసి నేనున్న రావి నీడకి చేరారు.

“అమ్మా, ఈమె ఉమాదేవి, వీళ్ళ నాన్నగారే ఈ గుడి బాధ్యతలు నిర్వహించేది,” అంటూ ముందుగా ఉమమ్మని, తరువాత నన్ను, తాతని కూడా వాళ్ళమ్మగారికి పరిచయం చేసారు డాక్టరుగారు.
హుందాగా, అందంగా ఉన్న ఆ పెద్దావిడకి అందరం నమస్కారం చేసాము.

“మా అమ్మగారు. పేరు సరోజిని దేవి. అమ్మకి దేవాలయాలు, పూజలు అంటే శ్రద్ధ. ఇక్కడ ఈ గుడి ఉందని తెలుసును గాని చూడలేదట.
అందుకే ఈ గుడి చూస్తారని అమ్మని కూడా ఇలా తీసుకొచ్చాను.
గాయత్రి కోసం నేను అడిగిన ‘ఊతకర్రలు’ కూడా రావడంతో, స్వయంగా చూసి అమర్చవచ్చని వచ్చాను,” అంటూ మాకు వివరించారాయన.

“అయ్యో ఎంత మాట. మీరు రావడం మాకు చాలా సంతోషం. నాన్నకి మంగళగిరి గుడిలో హోమం ఉండడంతో అక్కడికి వెళ్లారు. మీరు వచ్చినందుకు సంతోషిస్తారు. పదండమ్మా దేవుడిని చూద్దురుగాని,” అంటూ సరోజినిగారితో ఉమమ్మ గుడివైపుకి దారి తీసింది.

“రాజమ్మా, నువ్వు పెట్టిలోంచి ‘క్రచ్చస్’ తీసి, గాయత్రికి సరిగా ఉన్నాయో లేదో చూడు. నేనిప్పుడే వస్తా,” వెంట వచ్చిన స్త్రీకి పురమాయించారు డాక్టరుగారు.
**
రాజమ్మ ప్యాకేజీ ఇప్పి ‘ఊతకర్రలు’ బయటకి తీసి, పరిశీలించింది.
కొలతలు సరిచేయ్యాలంటూ డ్రైవరుకి మరలు పెట్టమని పురమాయించి, తాతతో మాట కలిపింది.
సరిజిని గారి ‘శ్రీ సత్యశారద చారిటీ’ కి ఇరవై ఏళ్లగా పని చేస్తుందంట ఆమె.

“అస్పత్రులకి వచ్చే ఎందరో బీదవారికి సహాయం చేస్తారు మా మేడం సరోజినమ్మ, సార్ జనార్ధన్ గార్లు. వారు గుంటూరు వైద్య కళాశాల యజమానులు.
ఈ సంస్థ ద్వారానే గుంటూరు శివారుల్లో పెద్ద ఆసుపత్రి కట్టబోతున్నారు మా అయ్యగారు,”
గర్వంగా చెప్పింది రాజమ్మ.
నేను, తాత వింటున్నామో లేదో అని ఓ సారి మా వంక చూసిందామె.

“వారి రెండో అబ్బాయే, డాక్టరు మల్లిక్ బాబు.
ఆయన అసలు పేరు మల్లికార్జునరావు,” అందామె.
త్వరలో మల్లిక్ గారు అమెరికా వెళ్ళబోతున్నారని, చెప్పింది.

ఇలా రాజమ్మ మాటల్లో, డాక్టరు మల్లిక్ గురించి, ఆయన కుటుంబం గురించి, ఎన్నో సంగతులు తెలిసాయి మాకు.
మరలు బిగించిన ‘ఊతకర్రలు’ నా పక్కగా ఉంచెళ్ళాడు డ్రైవర్.
**
ఇంతలో ఉమమ్మ వాళ్ళు తిరిగొచ్చారు. నాకు సాయంపట్టి నిలబెట్టి, ఊతకర్రలు సరిచేసి, వాటి సాయంతో ఎలా కదలాలో, ఎంత ప్రయత్నం చెయ్యాలో చూపించారు డాక్టరుగారు. వాటితో అరుగు మీదనుండి లేవడం, కూచోడం, ఎంతో వీలుగా, సుళువుగా ఉందనిపించింది నాకు. కొంత ఉషారుగా అనిపించింది కూడా.

కొబ్బరి ప్రసాదాలు తింటూ నా ఎదురుగా అరుగు మీద కూచున్నారందరు. ఇంతలో అతిధుల్ని చూడాలన్నట్టు మా పావురాళ్ళు కూడా వచ్చాయి. అరుగులకి కాస్త దూరంగా వయ్యారంగా గింగిరాలు తిరుగుతూ కువకువలాడాయి. ఉమమ్మతో పాటు సరోజినిగారు కూడా వాటికి పిడికిళ్ళతో గింజలు జల్లారు.
సరదాగా తలా ఓ మాట, ఓ కబురు చెబుతున్నారు. నేను వింటూ కూచున్నాను.
“చూడండి ఉమాగారు, మీరు ప్రస్తావించిన ‘ప్రత్యేక విద్యావిధాన క్రమం’ ప్రాధమికంగా మన గుంటూరు కాలేజీల్లో ఉన్నాయట. వాటి తరువాత హైదరాబాదులో మరో రెండేళ్ళ చదువు కూడా పూర్తిచేసి పట్టా పొందాలట. మా అమ్మగారు చెప్పారు.
ఈ కవర్లో మీకు కాలేజీ దరఖాస్తు, సమాచారం ఉన్నాయి. అమ్మే తెప్పించారు,” అంటూ రాజమ్మ దగ్గరున్న బ్యాగు నుండి ఉమమ్మకి ఓ పెద్ద కవరు అందించారు మల్లిక్ గారు.
కవరందుకొని సరోజినిగారికి కృతజ్ఞతలు చెప్పింది ఉమమ్మ.

“అవునమ్మా ఉమా, నీకు ఈ విషయంలో ఏ సహాయం కావాలన్నా నేను చేయగలను. అసలు ఈ చదువు ఎన్నుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీకు లాగ సేవా దృక్పథంతో అలోచించి ఉన్నత విద్యలను ఎన్నుకునేవారు అరుదుగా ఉంటారు.
మల్లిక్ బాబు వచ్చే నెలలో అమెరికా వెళతాడు. అక్కడ చదువు ముగించుకొని ముడేళ్ళకి వస్తాడు. ఈ లోగా నీకు గాని, గాయత్రికి గాని ఏ సహాయం కావాలన్నా నా వద్దకు రండి. నా ఫోను నంబర్లు ఇస్తాను,” అన్నారు ఉమమ్మతో సరోజినిగారు.

తరువాత మా వంక చూసారు ఆమె. “ఇక పోతే, గాయత్రి విషయంలో – ఇక్కడ మీకు దగ్గర్లోనే డాక్టరు శివారెడ్డి ఉన్నారు. ఆయన వద్దనుండి ఓ మనిషి ఇంటికే వచ్చి నెల రోజులపాటు గాయత్రి కాళ్ళకి చికిత్స, వ్యాయామం చేయించేలా ఏర్పాటు చేయించాము,” అన్నారు సరోజినిగారు.
“మా సంస్థ వాళ్ళు ఇవన్నీ ఎప్పుడూ చేసేవే. మీరేమీ మొహమాట పడవద్దు,” అని కూడా అన్నారామె.
ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తాత. అందరి వద్ద శెలవు తీసుకొని మల్లిక్ గారు, సరోజినిగారు వెళ్ళిపోతుండగా వచ్చింది కమలమ్మ.
**
మరునాటి నుండి, సరోజినిగారు అన్నట్టుగానే ఓ ఆయా కొట్టాంకి వచ్చి నా కాళ్ళని రకరకాల నూనెలతో మర్దనా చేసిన తరువాత వ్యాయామం, కర్రల సాయంతో పైకి లేచి కొంత దూరం మెసలడం కూడా చేయిస్తుంది.
అలా నెలరోజులు పాటు జరిగింది ఆ చికిత్స.
నాకు సహాయపడిందనే అనిపించింది అందరికీ.

“ఇకనుండి ఈ కర్రలే నీకు సహకరించే కాళ్ళ లాటివి కాబట్టి, ఎప్పుడూ మనిషిలో భాగంగా నీ వెంటే ఉండాలి. గుర్తుపెట్టుకో. నూటికి నూరుపాళ్ళు వాడాలి వీటిని,” అని కూడా చెప్పింది వెళ్లేముందు ఆయమ్మ.

illustration 9
**
మల్లిక్ గారిని, సరోజినిగారిని, వారి మంచితనాన్ని, తాత తలవని రోజుండదు.
ఈ నెలలోపే సొంతగా ఊతకర్రల సాయంతో పైకి లేవడం, నిలదొక్కుకొని మెల్లగా ముందుకు కదలడం మొదలెట్టాను.
అరికాళ్ళు ఒక్కోటి నేల మీద ఆన్చి ముందుకు కదలాలని కూడా ప్రయత్నిస్తున్నాను. కర్రల సాయంతో నిలబడినప్పుడు సరిగ్గా ఉమమ్మంత ఎత్తు ఉన్నాననుకుని గర్వంగా అనిపించింది.
**
కొత్తగా ఊతకర్రల సాయంతో నేను కదలగలగడం చూస్తే కమలమ్మ ఆశ్చర్య పోతుందేమో నని అనుకుంటూ మొదటిసారి కర్రలని తీసుకొని గుడికి బయలుదేరాను రిక్షాలో. దారిపొడవునా ఆమె గురించే ఆలోచించాను.

నెలక్రితం మల్లిక్ గారు గుడికి వచ్చెళ్ళారని తెలిసినప్పటి నుండి, వారి వివరాలు, వచ్చిన కారణాలు కమలమ్మ నన్ను ఎన్నోరకాల అడిగింది.
సమాధానంగా – వచ్చినాయన నాకు వైద్యం చేసిన డాక్టరని, నాకు ఊతకర్రలు ఇప్పించినవారని, వాళ్ళమ్మగారితో ఈ గుడి చూడ్డానికి వచ్చారని తెలియజెప్పాను. ఎప్పటిలాగానే నేను చెప్పింది చాల్లేదు ఆమెకి.
**
నేను సొంతంగా పైకి లేచి మెసల గలగడం చూసి, నేననుకున్నంత ఆశ్చర్యపోలేదు కమలమ్మ.
“ఇట్టా కాదుగా నేననుకున్నది. నీ కాళ్ళు నేలమీద ఆనించి నడవ గలుగుతావని కదా నేనానుకున్నా,” అని పెదవి విరిచింది.
‘ఈమె అనుకున్నంత మార్పు రావడం అయ్యేనా? అట్లా వస్తే ఎంత బావుండునో’ అనుకున్నాను.
**
మళ్ళీ ఆదివారం. మళ్ళీ మధ్యానం. ఈ సారి కూడా కమలమ్మ గుళ్ళో లేకుండా పోయినప్పుడే – డాక్టర్ మల్లిక్ గారు కార్లో వచ్చి దిగారు.
ఈ మారు ఉమమ్మ, పూజారయ్య కూడా ఆయనకి ఎదురెళ్ళారు.

నాకు అమడ దూరంలోనే వాళ్ళతో మాట్లాడుతూ నా వంక చూసి, ‘నేనే అక్కడికి వస్తా’నని సైగ చేసారు డాక్టర్ గారు. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి.

డాక్టరుగారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు పూజారయ్య.
“మా గాయత్రికి, ఉమాకి కూడా మీరు, మీ అమ్మగారు అందించిన సహాయ సలహాలకి ధన్యవాదాలు డాక్టరుబాబు,” అన్నారాయన.

ఆ మాటలకి ఆయన చేతులు జోడించి, “అంత మాటెందుకు సోమయాజులుగారు? నా వృత్తి ధర్మం అది. ఎల్లుండి అమెరికా ప్రయాణమయ్యే ముందు గాయత్రిని చూసి, మిమ్మల్నందరిని కలిసి, చెప్పి వెళదామని వచ్చాను,” అంటూ తన చేతిలోని తెల్లని కవర్ పూజారయ్యకి అందించారు.

పూజారయ్య అది విప్పి చదువుతూ, “సంతోషం బాబు. ఈ ఆహ్వానంకి ధన్యవాదాలు. మీకు మా శుభాకాంక్షలు, ” అంటూ దాన్ని ఉమమ్మ చేతికందించారు.

“నా ప్రయాణంకి ముందుగా ఎల్లుండి మంగళవారం నాడు, ఇంట్లో వ్రతం, భోజనాలు ఏర్పాటు చేసారు అమ్మావాళ్ళు.
మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించాలని కూడా వచ్చాను. మీరంతా తప్పక రావాలి,” అన్నారు మల్లిక్ గారు పూజారయ్యతో.

ఉమమ్మ వంక చూస్తూ, “మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, అలాగే ఎల్లుండి పొద్దునే తొమ్మిదింటికి కారు ఏర్పాటు చేశామని కూడా చెప్పమంది అమ్మ,” అన్నాడాయన.

“ఇక గాయత్రి సంగతికి గాని, మీ కాలేజి సంగతి గాని, మొహమాట పడకుండా ఎప్పుడైనా అమ్మకు ఫోను చెయ్యండి. పర్వాలేదు,” అంటూ వారిద్దరితో పాటు నా అరుగుల కాడికి వచ్చారు మల్లిక్ గారు.

నా అంతట నేను కర్రల సాయంతో లేచి నిలబడ్డం చూసి ఆయన సంతోషించారు.
డాక్టరుగారిని కలవడానికని తాత కూడా బయటనుండి వచ్చాడు. డాక్టరు బాబుకి దణ్ణాలెట్టి కృతజ్ఞతలు చెప్పాము.
రెండు నిముషాలు మాతో మాట్లాడి, దేవుడి దర్శనం చేసుకొని మా అందరి వద్ద శలవు తీసుకొని వెళ్ళారాయన.
**
మళ్ళీ తాను లేనప్పుడే, డాక్టరుగారు వచ్చి వెళ్ళారని తెలిసిన కమలమ్మ చాలా కష్టపెట్టుకుంది. చాలాసేపు మాట్టాడకుండా ఉండిపోయింది.
**
మరునాడు మధ్యానం నేను, తాత సెనగలు తింటుండగా మా కాడికి వచ్చి కూచుంది కమలమ్మ.
“నాతో పాటు ఈ వారంలో గాయత్రిని మంచి సినిమాకి తీసుకెడతానన్నా,” అని తాత సమ్మతి అడిగింది.
తాత కిమ్మనలేదు. కొబ్బరినీళ్ళు తాగి ఏమనకుండానే వెళ్ళిపోయాడు.

“అసలు దేనికీ మాట్లాడడు సత్యమన్న. అంటే సరేనని అన్నట్టే లెక్క,” అనుకుంటూ వెళ్ళింది కమలమ్మ.

సాయంత్రమయ్యాక కాలేజీ నుండి వెళ్తూ, ఉమమ్మ నా వద్దకి వచ్చింది. కాడలు తీసిన గులాబీలు, చేమంతులతో ఓ పూలబుట్ట తయారుగా ఉంచితే, మరునాడు తాము సరోజినీగారింటికి పూజకి వెళ్తూ తీసుకుంటామంది.
**
పొద్దున్నే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. పుజసామాను కొనుగోళ్ళతో హడావిడిగా గడిచింది కాసేపు.
తొమ్మిది గంటల సమయంలో ఉమమ్మ, పూజారయ్యలు కారులో గుడి ముందాగారు.

ఉమమ్మ వచ్చి నాకాడనున్న పువ్వులబుట్ట తీసుకొంది. నేను సొంతగా తయారుచేసిన ఓ మల్లెలదండతో పాటు ఆమె అడిగిన గులాబీలు, చేమంతులతో నింపే ఉంచాను.

చూసేవాళ్ళ కళ్ళు చెదిరిపోయేంత అందంగా ముస్తాబయ్యింది ఆమె. ఆకుపచ్చ రంగు చీర, బంగారు రంగు రవిక వేసుకొంది. పచ్చని పూసల దండ, జుమ్కాలు, చేతులకి బంగారు గాజులు ఎంతో బాగున్నయి.
కమలమ్మయితే చేతిలోని పని కూడా మానేసి ఉమమ్మని చూస్తూండిపోయింది. వాళ్ళు కారులో వెళ్ళిపోయేంత మటుకు కిమ్మనలేదు కమలమ్మ.

ఆ తరువాత తేరుకుని, “ఉమమ్మ కన్ను చెదిరే అందచందాల అప్సరస” అంటూ ఆపకుండా మెచ్చుకొంది. “కథల్లో యువరాణిలా ఉందామె,” అంది.
**
భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయం. సందడిగా గడిచింది పగలంతా.
సాయంత్రం ఐదయ్యాక గాని సద్దుమణగి కాస్త ఊపిరి సలపలేదు. వెనక్కి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళు తీసుకొని తాగాను.
చీకటి పడుతుండగా పుస్తకం చేత పట్టుకొని తాత కోసం చూస్తున్న నా వద్దకి పరుగున వచ్చింది కమలమ్మ.

“పద, పద, మీ తాతకి కబురెట్టానులే. గుడిలో మన పని ముగిసిందిగా! ఇయ్యాల నిన్ను ఓ మాంచి సినిమాకి తీసుకెడతానని తాతకెరుకే.
సినిమాకి టైమయ్యింది. గోవిందు టికెట్లు తీసుకొన్నాడు. నీ లాటి వారి గురించి కూడా ఉండాది ఆ సినిమాలో,” అంటూ నన్ను హడావిడిగా బయలుదేర తీసింది ఆమె.
తాత కోసం గేటు వైపు చూస్తున్న నన్ను, “తాతకి, కబురంపానని చెబుతున్నాగా! పద టైం లేదు మనకి,” అంటూ తొందర చేసింది….
**
దారిపొడుగునా, తాను గుల్బర్గాలో ఉన్నప్పుడు హిందీ సినిమాలు చూసానని, అప్పుడు చూసిన సినిమానే ఇప్పుడిక్కడ ఆడుతుందని, పెద్ద పేరున్న సినమాని చెప్పింది. అన్నట్టే నన్నేదో హిందీ సినిమాకి తీసుకెళ్ళింది. అంత రద్దీగా లేదు. అదే మొదటిసారి నేను సినిమా చూడ్డం. ఏ భాషైనా పర్లేదులే అనుకున్నా. కమలమ్మ పట్ల కృతజ్ఞతగా అనిపించింది. ఉడికించిన వేరుసెనగలు, నిమ్మకాయి సోడా తెప్పించింది. సినిమా మొదలయిన క్షణం నుండీ కళ్ళు పెద్దవిగా చేసుకొని చూసాను.

(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా! -8

egire-pavuramaa8-bannermadhav

‘అట్లతద్ది’ అనగానే రాములు గుర్తొచ్చి దిగులుగా అనిపించింది.

‘ఈ చిన్నారి ఆడపిల్లకి నా అట్లతద్ది బహుమానం’ అంటూ నాకు జడలల్లి ముస్తాబు చేసేది రాములు. సొంత అక్కలా ప్రేమగా చూసుకునేదని గుర్తొచ్చింది.
రోజూలానే పావురాళ్ళు వచ్చి అరుగుల ముందు నిలిబడ్డాయి. రాముల్ని మరింత జ్ఞాపకం చేసేలా పాలనురుగు లాంటి తెల్లని గువ్వలు రెండొచ్చాయి. నాలుగు పిడికిళ్ళ గింజలు వేసి, వాటిని గమనిస్తూ పూల పని ముగించాను.
పూలబుట్టలు కమలమ్మకి అప్పజెప్పి, కుంకుమ పొట్లాలు కడుతూ కూడా రాములు గురించే ఆలోచిస్తున్నాను.
**
పావురాళ్ళు గింజలు తిని ఎగిరిపోడం కూడా గమనించలేదు. జనం రాడం ఈ పొద్దు కాస్త తక్కువగానే ఉంది.
చదువుదామని పుస్తకం చేతిలోకి తీసుకొన్నా మనసెట్టలేక పోతున్నా.

“గాయత్రీ, ఏమి సంగతి? చదువు మీద శ్రద్ధ తగ్గిందా? పుస్తకం ముందు పెట్టుకుని పరధ్యానంగా ఉన్నట్టున్నావు? లేక అట్లతద్ది రోజున రాముల్ని తలుచుకుంటున్నావా?” అంటున్న ఉమమ్మ గొంతు దగ్గరగానే వినిపించింది.
ఆమె వచ్చినట్టు కూడా నేను గమనించలేదు.
పర్సులోనుంచి చాక్లెట్టు తీసిచ్చి నా పక్కనే కూచుందామె.

“నాక్కూడా రాములు ఎంతగానో గుర్తొస్తుంది. పాపం ఆమె జీవనం ఎలా ఉందో అక్కడ,” అంది ఉమమ్మ రాముల్ని తలుచుకొని.

“నువ్వు మాత్రం శ్రద్ధ పెట్టి చదువు. లెక్కల్లో మంచి మార్కులే వస్తాయి నీకు. మిగతా సబ్జెక్ట్స్ లోనూ మెరుగ్గా రావాలి. పరీక్షలకి నిన్ను సిద్ధం చేసే సమీక్ష పుస్తకాలు పంపిస్తానన్నారు మాస్టారు. పరీక్షలకి మూడు రోజుల సమయమే ఉంది. ఇవాళ నాకు సెలవేగా! పుస్తకాలు అందితే సాయంత్రం తెచ్చిస్తాను,” అంది ఆప్యాయంగా ఆమె.

ఆమె వంక చూసి నవ్వాను…
నా భుజం మీద తడుతూ, “పోతే, మరో సంగతి,” అందామె.
”డాక్టర్ మల్లిక్ గుడికి ఫోను చేసారట. నీ ‘ఊతకర్రలు’ ప్రత్యేకంగా రేపు ఒక మనిషి చేత పంపిస్తున్నామని మనకి చెప్పమన్నారట. ఎలాగు రేపు ఆదివారం. వివరాలు కనుక్కొని అదే సమయానికి నేనూ వస్తాను. మొత్తానికి చాలా సంతోషంగా ఉందిరా,” అని కాసేపు నాతో పాటు పావురాళ్ళని గమనిస్తూ, కబుర్లు చెప్పింది ఉమమ్మ.
**
పనయ్యాక తన వంతు గుడి రాబడులు పంతులుగారికి అప్పజెప్పి, బత్తెం అందుకొని నాతో పాటే ఇంటి దారి పట్టాడు తాత.
ఎప్పటిలా బండిలో వరకు నాకు సాయం చెయ్యడానికి వచ్చిన కమలమ్మ, నా చేతికర్ర, చక్రాల పీట కూడా బండిలో పెట్టాక, ఉన్నట్టుండి నా పక్కన తానూ ఎక్కి కూచుంది.

తాతతో మాట్లాడాలంటూ, నన్ను అడ్డం జరగమంది.
“అన్నా, ఇయ్యాల నేను గాయత్రిని అయ్యప్ప గుడికి తీసుకెళ్ళి రేత్రికి మీ కొట్టాంలో దింపేస్తాలే. ఆ గుడి సుట్టూతా పూదోటలు, మయూరాలు, వందరకాల పక్షులు ఉంటాయంటన్నా.
గాయత్రి పాపం ఏనాడు సూసుండదు. నువ్వేమో తీసుకెళ్ళకపోతివి. సరదాగా మరి ఎళ్ళి రామా? అయినా నువ్వు మాత్రం కాదంటావా?” గబగబా తాతకి చెప్పేసి, రిక్షాని పోనీమ్మంది.

“ఇదిగో, సత్యమన్నా ఎండాకాలం కదా! తొమ్మిదింటి వరకు బోలెడంత ఎలుతురుగా ఉంటాది. నువ్వేమీ బెంగెట్టుకోకే,” అంటూ వెళ్ళిపోతున్న రిక్షా నుండి తాతకి వినపడేలా మళ్ళీ బిగ్గరగా అరిచి మరీ చెప్పింది.

ఆమె అకస్మాత్తు చేష్టకి తాత, నేను కూడా ఆశ్చర్యపోయి, ఏమనాలో తోచకుండా అయ్యాము. కమలమ్మ ఆ మధ్య నాతో ఈ విషయం గురించి చెప్పినట్టు గుర్తే కాని ఇలా ఉన్నట్టుండి నన్ను బయలుదేరదీస్తదని అనుకోలేదు.
**
కమలమ్మ అన్నట్టు అయ్యప్పసామి గుడి ఎంతో కన్నులపండువగా ఉంది. వీలున్నంత మటుకు నన్ను గుడి చుట్టూతా తోటలో రిక్షాలోనే తిప్పాడు గోవిందు.
చాలాకాలంగా అదంతా గులాబి తోటలంట. రకరకాల పక్షులకి, నెమళ్ళకి నెలవుట. తోటలు, పక్షులని చూడ్డానికి జనం ఎప్పుడూ వచ్చేవారంట.
రెండేళ్ళ క్రితం కేరళ వర్తకులు కొందరు ఈ తోటలు కొన్నాకే, తోట మధ్యగా అయ్యప్ప స్వామి గుడి కట్టారని వివరించాడు గోవిందు.

తోటల చుట్టూ పిల్లలు సైకిళ్ళ మీద కూడా తిరుగుతున్నారు.
ఆ ప్రదేశమంతా చాలా విశాలమైన ఏర్పాటుగా ఉంది.
రంగురంగుల గులాబీలు అంత దగ్గర నుంచి చూడ్డం బాగుంది. కాసేపు నా అవిటితనం కూడా మరిచిపోయేటంత బాగా అన్పించింది. నెమళ్ళ గురించి, పక్షుల గురించి గోవిందు, తనకి తెలిసింది చెప్పాడు.

అంతా తిరిగి చూసాక, ఆవరణ బయట తోటలో కూచున్నాము. చుట్టూ జనం. అందరూ తీరిగ్గా చిరుతిళ్ళు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

గుడి బయట హోటలు నుండి వడ, దోస తెప్పించింది కమలమ్మ.
చేతుల నిండా తిండి పొట్లాలతో వచ్చిన గోవిందు, వాటిని మాకాడిచ్చి, క్షణాల్లో వస్తానంటూ మళ్ళీ వెళ్లాడు.
“ఏం మర్చిపోయాడో! అంటూ నెమ్మదిగా ఆ పొట్లాలు ఒక్కోటి విప్పడం మొదలెట్టింది కమలమ్మ.

ఇంతలోనే, “గులాబీలు కోయకూడదు కానీ,” అంటూ చేతుల్లో సంపెంగలతో త్వరగానే వచ్చాడు గోవిందు.

“పూల కోసం ఎల్లావా? మన గాయత్రికేనా? బాగుండాయి. ఆ పూలు ఆడ పక్కనెట్టి…ముందైతే, ఇవన్నీ వేడిగుండగానే తిను,” అంటూ ముగ్గురి మధ్యా పంచింది కమలమ్మ.

నోట్లో ముద్దెట్టబోతూ, క్షణమాగింది. తినబోతున్న గోవిందు చేయి పట్టుకుంది.
“అరేయ్ తమ్ముడు, గోవిందు, గుడి ముందు కూకొని ఈ అమ్మాయి ఎదురుగా నీకో మంచి మాట సెబుతున్నా ఇయ్యాల. అదేమంటే, ఎప్పటికీ మన గాయత్రికి నువ్వు సాయంగా ఉండాలి.
దాని వైపు ఓ కన్నేసి ఉండాలి మనం. బయటకి తీసుకెళ్ళాలి, సంతోషపెట్టాలి,” క్షణమాగి మా ఇద్దరివంకా చూసింది…

“ఎందుకంటే, ఆ పిల్ల అచ్చట ముచ్చట తీర్చే ఓపిక దాని తాతకి లేదు. ఇప్పటికే ఎన్నో మార్లు జబ్బు పడ్డాడు పాపం ఆ ముసలాడు,” అంటూ పెదవి విరిచింది కమలమ్మ.
నేనేమనాలో తోచలేదు.

“పాపం! గంగిగోవు లాంటిది గాయత్రి. ఎంత ప్రేమ? ఎంత త్యాగం? ఐదేళ్ల వయసునుండి కొలువు చేసి ముసలి తాతకి ఆసరా అయ్యింది. ఆ కొట్టాం కూడా దాని సంపాదనే అంటే నమ్ము.
అసుమంటి పిల్లకి సాయంగా ఉంటే దేవుడు చల్లంగా చూస్తాడు నిన్ను,”, “ఏరా తెలిసిందా?” అడిగింది గోవిందు నెత్తిన మొట్టి.
గోవిందు అయోమయంగా చూసాడామెని.

నా గురించి, నాకే తెలియని సంగతులు ఆమె నుండి వినడం వింతగుండి, చికాకుగా అనిపించింది.

“అసలీ అమ్మాయి ఓర్పు, జాలి, పనితనం నాకెంతో నచ్చాయి.
ఎవడు కట్టుకుంటాడో గాని అదృష్టమంతుడే. ప్రేమగా ఉండిపోతాది,” నా గురించే మళ్ళీ కమలమ్మ.
ఇక తినండి అంది అతని చేయి వదిలేసి….
‘అవసరం లేని ఆమె మాటలు’ విననట్టే తలొంచుకుని తింటున్నాను.
ఇంకాసేపటికి గోవిందు చేత బయట నుండి కాఫీ తెప్పించింది.

illustration 8

“గాయత్రీ, ఇప్పుడు నీకేమో నాకు తెలిసిన అట్లతద్ది కథ సెబుతాను,” అని మొదలెట్టింది కమలమ్మ. “అసలు మా ఊళ్ళల్లో అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు. అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. ‘అట్లతద్దోయ్, ఆరట్లోయ్ – ముద్దపప్పు మూడట్లోయ్’ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి ఆడతారు,” చెప్పడం ఆపి కాస్త కాఫీ తాగింది.

నేనూ వింటూ, మధ్యలో, అలవాటు లేని కాఫీ తాగాను.
“బాగుందా?” అడిగింది. ‘ఔనని’ తలాడించాను.
మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.
“అమ్మవారికి మొక్కులు మొక్కి, తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనాలిచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో చేతికి తోరం కట్టుకుంటే, మంచి మొగుడొస్తాడంట,” అని, “ఇవన్నీ నేను కథలుగా ఇన్నవే. ఏనాడు సెయ్యలేదు,” అంటూ పెద్దగా పగలబడి నవ్వింది.

“అక్కా ఏందే ఆ పిచ్చి నవ్వు? అందరూ మననే సూత్తుండారు. ఇక ఆపవే,” గొడవ పడ్డాడు గోవిందు.
తినడం ముగించి ఇంటి దారి పట్టాము. గుడి ముందు అమ్ముతున్న గోరింటాకు ముంత ఒకటి కొనిచ్చింది నాకు.
“ఈ యాత్ర, దోస భోజనం, నీకు మా ‘అట్లతద్ది’ బహుమానమనుకో,” అంటూ మళ్ళీ పెద్దగా నవ్వింది కమలమ్మ.¬¬
**
నేను కొట్టాం కాడ రిక్షా దిగేప్పటికి వాకిట్లో తాత, పిన్ని ఉన్నారు. కమలమ్మ నాతో పాటు లోనికొచ్చి కొట్టమంతా తిరిగి చూసింది.
“ఇదిగో అన్నా, గాయత్రిని సంపెంగ పూలతో సహా క్షేమంగా తిప్పి తెచ్చాము. ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ సూడలేదు ఆ పిల్ల. గాయత్రిని అడుగు సత్యమన్నా. ఆచ్చర్యంలో, ఆనందంలో మునిగి తేలిందనుకో.
ఇయ్యాల ‘అట్లతద్ది’ కూడానాయే. బయటే తిని మరీ వచ్చాము. నేను మళ్ళీ వస్తాలే,” అని బయటికి నడిచింది.

కాళ్ళు చేతులు కడుక్కొని, బట్టలు మార్చి, నేను పడక మీద చేరాను.
నిద్రపోయే ముందు తాత వచ్చి పుస్తకాల సంచి నా తల కాడెట్టాడు. “నీ కోసం ఇవి సమీక్ష పుస్తకాలంట, ఉమమ్మ చెప్పమంది. రేపు రెండింటికే నీ కాడికి వస్తానందమ్మా. నీ ‘ఊతకర్రలు’ కూడా వస్తాయటగా! ఇక నిదరపోరా,” అని తల నిమిరి వెళ్లాడు.

‘నాకు పుస్తకాలివ్వడానికి, నేనెళ్ళాక మళ్ళీ వచ్చిందన్నమాట ఉమమ్మ’ అనుకుంటూ ఆ కాస్త వెలుతురులోనే పుస్తకాలు తిరగేశాను. ఉత్సాహంగా అనిపించింది.
**
తెల్లారక మునుపే దూరంగా చంద్రం పిన్ని మాటలు వినబడ్డాయి. కళ్ళు నులుముకొని అటుగా చూశాను. వాకిట్లో కాళ్ళు చాపి కూర్చుని తాత టీ తాగుతున్నాడు. పిన్ని తాత పాదాలకి నూనె రాసి కాళ్ళు పడుతుంది.

“ఏమోనే చంద్రమ్మా, ఆ కమలమ్మ తీరు నాకు నచ్చలేదు.
ఆమె గుణం ఎలాటిదో చిన్నతల్లికి వివరంగా చెప్పడం ఎలాగో తెలీడం లేదనుకో.
బిడ్డ పతనానికి దారి తీయకుండా ఉంటే అంతే చాలు.
బిడ్డకి సత్యదూరమైన విషయాలు చెబుతా వుండాది.
ఆ కమలమ్మ తీరు, మాటల గారిడీ చూస్తుంటే చిన్నదాని మనసు పాడు చేస్తుందేమో అని భయంగానే ఉంది,” అన్నాడు తాత.

“అంతే కాదే చంద్రం. జబ్బుపడి నేను పనికెళ్ళనప్పుడు, గుడి ఊడ్చే పని ఆమెకి ఎక్కువయింది కదా. అందుగ్గాను పంతులుగారు అదనంగా ఇచ్చేది కాక మరో యాభై రూపాయలు నన్నివ్వమని అడిగింది. పూజారయ్య వరకు వెళ్ళింది విషయం,” అన్నాడు హైరానాగా తాత.

“ఆమె డబ్బు మనిషని తెలిసిందే కదన్నా..మాంసాలు, నీసులు తినడం, ఆదివారాలు కల్లు తాగడానికే డబ్బంతా ఖర్చు పెడతారులా ఉంది గోవిందు, కమలమ్మ కూడా.
అప్పుడెప్పుడో, ఆటో కోసం అర్జీ పెట్టాడాబ్బాయి.!…రెండు వేలు బ్యాంకులో సూపెడితే వెంటనే ఆటోరిక్షా ఇస్తామని ఆఫీసు కబురెట్టినా జవాబివ్వడంట,” అంటూ తైలం సీసా అందుకొని లోనికొచ్చింది పిన్ని.
**
వాళ్ళిద్దరికీ కమలమ్మంటే ఇష్టం లేదని అర్ధమయ్యింది.
‘కమలమ్మంటే నాకూ అంతగా ఇష్టం లేదు. మాటతీరు కూడా బాగోదు.
కాని నాకు బయటి నుండి జిలేబీలు తెచ్చిపెడుతుంది.
ఎప్పుడూ నేను అందంగా ఉన్నానంటుంది.
నిన్న చిత్రమైన పక్షుల్ని, అందమైన గులాబీ తోటల్ని చూపెట్టింది. ఇడ్లి, దోస తినిపించింది. ఊరంతా తిప్పుతానంది. నాకు సాయంగా ఉంటామంది. నయాపైసా ఖర్చు లేకుండా గోవిందు ఎన్నో మంచి స్థలాలు చూపెడతాడంది.
ఇంకా, నా అవిటితనం పోవాలని చాలా కోరుకుంటుంది. సినిమాలు కూడా చూపిస్తానంది’ అనుకుంటూ పడక మీద నుంచి లేచాను.
**
ఆదివారం మధ్యానం ఒంటిగంట దాటింది.
గుడిలో భక్తుల రద్దీ సద్దుమణిగాక, గోవిందు పాకకి బయలుదేరి పోయింది కమలమ్మ.

నాతో పాటే కాస్త పొంగలి ప్రసాదం తినేసి కూరగాయల బడ్డీ వైపెడుతున్న తాతకి, కారు దిగి గుడి ఆవరణలోకి వస్తున్న డాక్టరు మల్లిక్ ఎదురు పడ్డారు.
నేను కూచున్న కాడినుండి డాక్టరుగారి వెంట ఓ పెద్దావిడ కూడా రావడం అగుబడుతుంది. వారి వెనకాలే మరో స్త్రీ, చేతుల్లో పొడవాటి ప్యాకేజీతో డ్రైవర్ కూడా ఉన్నారు.

(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా! -7

egire-pavuramaa-7

సమాచారం దాఖలు చేసి, ఉమమ్మ అందించిన కాగితాలు తీసుకుని నర్సు చేతికిచ్చారు డాక్టరుగారు.

“గాయత్రిది జబ్బు కాదు. ఆమె స్థితిని అంగవైకల్యంగా పరిగణిస్తారు.
ఆసుపత్రి చేయగలిగిందల్లా సులువైన పద్ధతిలో, కనీసం ఒక కాలైనా మోకాలు వరకు తీసేసి కుత్రిమ కాలు అమర్చవచ్చు. దానికైనా గాయత్రికి పద్దెనిమిదేళ్ళు నిండితేనే మంచిది,” అని ఓ క్షణమాగారు ఆయన.

“ఇకపోతే, గాయత్రి మూగతనం పోయి మాట వస్తుందా? అని నిర్ధారించేవి మాత్రం, కొన్ని సున్నితమైన ‘స్వరపేటిక పరీక్షలు’. ప్రభుత్వాసుపత్రిలో అవి కుదరకపోవచ్చు. ఆ విషయంగా, ఇక్కడి పెద్ద డాక్టర్ గారు మిమ్మల్ని గుంటూరు లేదా హైదరాబాదులోని నిపుణల వద్దకు వెళ్ళమని సూచనలిస్తారు. ఎంతో సమయం, వ్యయం అవ్వొచ్చు,” అంటూ తాతకి నెమ్మదిగా వివరించారాయన.
అందరం శ్రద్ధగా వింటున్నాము.

క్షణమాగి మా వంక సూటిగా చూసారాయన.
“పోతే గాయత్రికి వినికిడితో పాటు మిగతా ప్రమేయాలన్నీ మామూలుగా ఉన్నాయి. బాగానే చదువుకుంటుందని కూడా తెలిసింది. కాబట్టి, సరయిన పద్ధతిలో వైద్యం అందితే ఆమె స్థితి మెరుగవుతుందనే ఆశించవచ్చు, ఆశిద్దాము,” అన్నారు డాక్టర్ గారు.

తాత ఉమమ్మ వంక చూసాడు.
“అయితే మీరు ఏమంటున్నారో దయచేసి మాకు అర్ధమయ్యేలా చెప్పండి. ‘క్రచ్చస్’, అదే ‘ఊతకర్రలు’ వాడమంటున్నారు, మరి తరువాత జరపవలసిన పరీక్షలవీ ఎప్పుడు? ఎక్కడ?” అని ఆగింది ఉమమ్మ.

“చూడండి ఉమాగారు, నేను ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్ని. ముందు ‘ఊతకర్రల’ కి నర్సుని అవసరమైన వివరాలు, కొలతలు తీసుకోనివ్వండి. ఈ ఆసుపత్రి అనుబంధ సంస్థ ‘శ్రీ సత్య శారద చారిటీ’’ నుండి వారంలోగా గాయత్రికి వాడుకోడానికి ‘ఊతకర్రలు’ మీ చిరునామాకే వస్తాయి.

ఇకపోతే, గాయత్రి విషయమంతా దాఖలు చేసి మా పెద్ద డాక్టరుగారికి పంపిస్తాను. మీరు మళ్ళీ కొంత ఆగి, ఇక్కడ ఆసుపత్రిలో ఆయన్ని కలవచ్చు,” అని ముగించాడాయన.

ఆయన వద్ద సెలవు తీసుకొని, నర్సుకి కావలసిన కొలతలు, వివరాలిచ్చి బయటపడ్డాము.
**
తాత కూడా తన విషయంగా వైద్యుడిని చూశాడు. ఆయన ఆరోగ్యం బాగా పాడయిందని, ఎక్సురే తీసి, రక్తపరీక్షలు చేసారు. కడుపులో ఆమ్లత ఎక్కువుగా ఉందని, దాంతో కడుపులో వ్రణాల ఉదృత వల్ల కూడా బాగా కడుపు నొప్పి, మంట, వాంతులు తరుచుగా అవ్వొచ్చని చెప్పారు.
ఆమ్లతకి వెంటనే చికిత్సతో పాటు శ్రద్ధగా మందులు వాడకం, మంచి ఆహారం, విశ్రాంతి అవసరమని చెప్పారు. జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చారు.
అవి తీసుకొని ఇంటిదారి పట్టాము.
**
తాత దిగులుగా కనబడ్డాడు. కారులో తలా ఒక మాట మాట్లాడుతుంటే తాత మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
చంద్రం పిన్ని తాతకి మంచినీళ్ళ చెంబు అందించింది. నీళ్ళు తాగి మరచెంబు నాకందించాడు.

”గాయత్రి విషయంలో డాక్టరుగారు చేసే సాయం ఏదైనా మంచిదే, ఉమమ్మా. అయినా నా ప్రయత్నంగా మాత్రం పూజారయ్య చెప్పిన వికలాంగుల సంస్థని కూడా కలుస్తానమ్మా,” అని ఆమెతో అంటూ ఇంకాస్త ముందుకెళ్ళాక, పనుందని కారు దిగిపోయాడు తాత.

కాసేపటికి మమ్మల్ని కూడా కొట్టాం కాడ దింపేసి కారు ఉమమ్మ ఇంటి వైపు మళ్ళింది.
**
కొట్టాం చేరాక, పిన్నిచ్చిన గంజి తాగి, పుస్తకం చదువుతూ కూచున్నాను.
టీ కాచి తెచ్చుకొని, పక్కనే కూచుంది పిన్ని.

“మా కొట్టాంకెళ్ళి కాసేపట్లో మళ్ళీ నీ ముందుంటా. మీకు ఈ పూటకి కాస్త పప్పు, రొట్టెలు కూడా తెస్తా. ఈ లోగా అవసరం వస్తే పొయ్యికవతల కట్టిన గంట మోగించు,” అని మరి కాసేపటికి పిన్ని తమ కొట్టాంకి వెళ్ళింది.
**
సాయంత్రం చీకటి పడుతుండగా తాత రిక్షాలో దిగాడు. రిక్షాబ్బాయి సాయంతో లోనికొచ్చాడు. తాత ముఖం మీద, బట్టల మీద రక్తపు మరకలు చూసి భయపడిపోయాను.
తాతని పట్టుకు కుదుపుతూ ఆదుర్దాగా ఏమయిందని అడిగాను. వకీలు ఇంటినుండి రిక్షాలో వస్తున్న తాతకి విపరీతంగా దగ్గు మొదలయ్యిందంట. ఆ వెంటనే రక్తం కక్కుకున్నాడంట.
రిక్షాబ్బాయి సాయం చేసి మెల్లగా ఇంటికి చేర్చాడంట.

తాత ముఖం కడుక్కొని, బట్టలు మార్చి వచ్చేలోగానే పిన్నొచ్చింది. ఆమెని చూడగానే ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చేసాను. తాత పడక పక్కనే కూచున్న నా కాడికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొంది.

అంతలో స్నానాల గది నుండి బయటపడి, కాళ్ళీడ్చుకుంటూ వచ్చి తన నులక మంచం మీద కూచున్నాడు తాత. సత్తువ లేకుండా అయిపోయిన తాతని చూసి మేమిద్దరం దిగాలు పడ్డాము.

కాస్తాగి పిన్ని వంక చూసాడు తాత. “పోతే చంద్రమ్మా, వికలాంగుల సంస్థ యజమాన్ని కలిసి గాయత్రి కోసం అర్జీ పెట్టాను. వకీలుని కలిసి పొలం విషయం మాట్లాడి, లంచాలకంటూ ముందస్తు డబ్బులు నా కాడ లేవని వివరించాను. చూడాలి దేవునిదయ. నా చేతుల్లో ఇకేమీ లేదమ్మా,” అంటూ మంచం మీద తొంగున్నాడు తాత.

తాత చెప్పింది ఒపిగ్గానే విన్నది పిన్ని.
”ఏదేమైనా విశ్రాంతి లేకుండా వొళ్ళు పాడయ్యేటంతగా అలిసిపోడం మంచిది కాదన్నా నీకు. ఇలా రక్తం కక్కుకోడం, నీరసం వచ్చి పడిపోడం డెబ్బైయేళ్ళ వయసులో ఏ రకంగా నీకు, నీ గాయత్రికి మంచిదో సెప్పు,” కోపంగా మాటలంటూనే పోయింది చంద్రం పిన్ని.

పిన్ని చెప్పేదంతా వింటూ కిక్కురు మనకుండా పడుకుండి పోయాడు తాత.
**
మరసటి రోజు పావుగంట ముందే నేను గుడికెళ్ళాను.

నన్ను చూస్తూనే గబగబా పరిగెత్తుకొనొచ్చింది కమలమ్మ.
“అబ్బో పిల్లా, వచ్చేశావా? ఒకే ఒక్కరోజు పువ్వుల్లాంటి నీ నవ్వులు సూడకపోతే పొద్దు పోలేదనుకో. నీ తానంలో నేను కూకుంటే గుడికోచ్చే నీ అభిమానులకి నచ్చలేదనుకో.
మా గాయత్రి ఎప్పుడొస్తుంది? అని ఒకటే గోల. నీ అందం అసుమంటిది మరి. నీ అవిటితనం పోతే అసలు నీ లెవెలే మారిపోతాదిలే,” గంటలా గణగణా మోగింది కమలమ్మ గొంతు.
నవ్వేసి ఊర్కున్నాను. పూజసామాను సర్దుతూ నాతో మళ్ళీ మాట కలిపింది కమలమ్మ. ఈ సారి నా విషయంలో డాక్టర్లు ఏమన్నారనడిగింది. తాతెందుకు రాలేదని అడిగింది.

‘నాకు ఇంకా వైద్య పరీక్షలు ఉంటాయని, తాతకి వొంట్లో బాగోక రాలేదని’ తెలియజెప్పాను.
నేను చెప్పిన వివరాలు చాల్లేదామెకి.
“మీ తాత కనపడ్డప్పుడు అడిగి తెలుసుకుంటాను. నీకేం తెలుస్తాదిలే? చిన్నపిల్లవి,” అంటూ కాస్త విసురగా అవతలకి వెళ్ళబోయింది.

వెళుతున్న ఆమెని చేయి పట్టి ఆపాను.
‘నిన్నటి రోజున పావురాళ్ళు వచ్చాయా? గింజలేసావా?’ అని సైగలతో అడిగాను.

“ఆ ఆ, ఎందుకు వేయను? బాగానే ఒకటికి రెండు మార్లు వచ్చి గింజలు మెక్కి, కావలసినంత గోల చేసి మరీ వెళ్ళాయిలేమ్మా,” రుసరుసమంటూ కదిలిందామె.
**
గుడిలో మధ్యాహ్నం రద్దీ తగ్గాక నా కాడ చేరింది కమలమ్మ. నా కిష్టమైన బెల్లం పాయసం అంటూ గ్లాసు అందించింది.

“మా గోవిందు, ఊరికి కాస్త దూరంగా విశాలమైన పాక కిరాయికి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు ఎవరితోనో కలిసి సత్రంలోలా ఉండేవాడుగా!. ఇప్పుడు వాడి సొంత పాకలో కాస్త అదీ ఇదీ సర్ది, వాడికిష్టమైంది వండి పెడదామని, ఆదివారాలు మధ్యాహ్నాలు కాసేపు ఎళ్ళొస్తున్నా. నాకు కొడుకైనా, తమ్ముడైనా వాడేగా,” అని వివరించింది.

‘ఊ’ కొడుతూ వింటున్నాను. పాయసం బాగుందని సైగ చేసాను.
కబుర్లు చెబుతూనే ఉంది కమలమ్మ.
“ఈడ నుండి విశ్రాంతి కావాలంటే, హాయిగా గోవిందు పాకకి పోవడమే,” అన్నది మళ్ళీ సంబరంగా కమలమ్మ.
**
ఒక్కింత ఓపిగ్గానే ఉందంటూ ఖాయిలా పడి లేచిన మూడోరోజు చీకటితో నా రిక్షా వెనకాలే నడుస్తూ పనికొచ్చాడు తాత.
పూజసామాను సర్దుతున్న తాతతో మాట కలపాలని ఆత్రుతగా వచ్చింది కమలమ్మ.

“అయితే అన్నా, మరి డాక్టరు ఏమన్నాడు? మా గాయత్రికి మాట, నడక ఎప్పుడొస్తాయన్నాడు? మాకు తెలిసిన ఒకమ్మాయికి ఇలాగే ఉండేది. పట్నం డాక్టర్లు వైద్యం చేసి ఇప్పుడు చకచకా నడిపిస్తున్నారు. మన గాయత్రి లాగానే అప్సరసనుకో.
ఇక కాలు బాగయిన రెండేళ్ళకి ఓ గొప్పింటి కుర్రాడు ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడు సత్యమన్నా. నిజ్జంగా, అమ్మతోడు,” అంది తల మీద చెయ్యెట్టుకొని నవ్వుతూ కమలమ్మ.
తాత కిమ్మనలేదు.
తన మాట చెప్పుకుంటూ పోయిందే గాని తాతకి నోరు విప్పి మాట్లాడే సందు ఇవ్వదుగా కమలమ్మ.
నాకేమో ఆ అమ్మాయికి వైద్యం చేసిన డాక్టర్లు ఎవరని కనుక్కుంటే బాగుండుననిపించింది.
egire-pavurama-7-revised
**
మధ్యాహ్నం పొంగలి ప్రసాదం తిని తాత కూరల బడ్డీ వైపు వెళ్ళగానే కమలమ్మ నా కాడికొచ్చి కూచుంది.
నడకొచ్చిన ఆ చుట్టాలమ్మాయి గురించి ఎలాగైనా అడగాలని అనుకుంటుండగా, ఆమే అందుకుంది.

“నే చెప్పేది నిజమేనే తల్లీ, నీకిప్పుడు పదిహేనేళ్ళు కదా! ఐదేళ్ల వయసు నుండి ఈడ ఇలా కొలువు చేస్తివి కదా! నీ హుండీ డబ్బే బోలెడంత కూడుకొనుంటుంది మీ తాత కాడ.
ఆ డబ్బు పెట్టి వైద్యం చేయిస్తే పోలా?
ఎంచక్కా మా చుట్టాలమ్మాయి లాగా బాగయిపోయి ఎవరినో ఎందుకు?
నీకు తెలిసిన నా తమ్ముణ్ణి పెళ్ళి చేసుకోవచ్చు,” క్షణమాగి నా వంక చూసింది…
ఏమంటుందో అర్ధం అవ్వలేదు నాకు…

“సవితితల్లి కొడుకన్న మాటేగాని, నా బిడ్డ లాంటోడేగా గోవిందు. కాస్త రంగు తక్కువేమో గాని బాగుంటాడు వాడు. ఆటో కూడా చేతికొచ్చేస్తే, రాజాలా సంపాదిస్తాడు.
వాడు ఒప్పుకోవాలే గాని, మంచి మొగుడౌతాడు నా తమ్ముడు,” నోటికొచ్చింది అంటూనే ఉంది కమలమ్మ.

నా తల గిర్రున తిరిగినట్టయింది. నా కాళ్ళ వైద్యం నుంచి పెళ్ళి వరకు వెళ్ళిపోయిన కమలమ్మ మాటల్లో నిజం ఉందా అనిపించింది.

ఆలోచనలో పడ్డాను.
‘అసలీ బుర్రలేని పెళ్లి మాటలేంటి? పిన్నికి, తాతకి అందుకే నచ్చదేమో కమలమ్మ తీరు’ అనుకుంటుండగా ……
“ఏమోలే, నువ్వా నోరులేని దానివి. ఇలాంటి ఇషయాలు మీ తాతతో, ఎలాగైనా నువ్వే తేల్చుకోవాలి. నిన్ను చూస్తే చానా కష్టంగా ఉంది. వైద్యం చేయిస్తే మాములు మనిషయ్యి చక్రం తిప్పగలవు నువ్వు,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా నవ్వుతూ.

ఆమె మాటలకి ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఇట్టాగే మాట్లాడుతుంది.

“అయ్యో నీతో మాటల్లో పడి మరిచేపొయ్యా. ఇయ్యాళ ఆదివారం కదా. ఈ సమయానికి మా తమ్ముడు వచ్చుంటాడు. వాడి పాక వరకు ఎళ్ళి గుడి తెరిచేలోగా, నాలుగింటికంతా వచ్చేస్తానే,” అంటూ రిక్షా ఆగే చోటు – గుడి వెనక్కి పరుగు తీసింది కమలమ్మ.
**
బయట సన్నగా తుప్పర పడుతుంది. ఇంకా తెల్లారలేదు. ఈ మధ్యనే నా కోసం తాత వేసిన కొత్త పరుపు మీద బాగా నిద్ర పడుతుంది. అయినా చీకటితో లేచి కూచున్నాను.
పరీక్షల భయం పట్టుకుంది. నాలుగు రోజుల్లో మాష్టారు పెట్టబోయే పరీక్షలు మునపటికన్నా మెరుగ్గా రాయాలంది ఉమమ్మ.

చదువుతూ ఆలస్యంగా తొంగోడంతో బద్ధకంగా ఉంది.
తాత లేచాడో లేదో తెలీలేదు.. పడక మీదనుండి లేవబోయాను….

కొట్టాం తలుపు తెరిచిన చప్పుడయింది. చూస్తే, చేతిలో ఎర్ర మందార పువ్వులతో, పిన్ని లోనికి వచ్చింది….

“లేరా గాయత్రి, ఇవాళ ‘అట్లతద్ది’. త్వరగా లేచి స్నానం చేసి తయారవ్వు. తాత కుట్టించిన కొత్త పరికిణీ వోణీ వేసుకో. నీ తలదువ్వి రెండు జడలు వేద్దామని వచ్చాను.
నీ జుట్టు పెద్దపని కదా. టైం పడుతుంది,” అంటూ నా ఎదురుగా చతికిల పడింది పిన్ని.
రాములు వెళ్లిపోయాక పండగలప్పుడు తప్పనిసరిగా నాకు రెండు జడలు వేస్తుందామె.
**
పొద్దున్నే, గుడికి రిక్షా అల్లంత దూరముండగానే సంతోషంగా ఎదురొచ్చింది కమలమ్మ. నాకు చేయందిస్తూ “ఈ రోజు ‘అట్లతద్ది’ ఆడపిల్లల పండుగ. పిండి రుబ్బి అట్లు వేయలేను గాని మధ్యానం బయట హోటలు నుండి మనకి అట్లు తెప్పిస్తాను గోవిందుతో,” అంది సంబరంగా కమలమ్మ.
ఒక్కోసారి కమలమ్మ చేసే హడావిడి తలనొప్పిగా ఉంటుంది నాకు.

(ఇంకా ఉంది)

ఎగిరే పావురమా! – 6

egire-pavuramaa-tytle-6th-p

రాములు వెళ్ళిపోయిన మూడో రోజు గుడి ‘స్వీపరు’గా కమలమ్మ కొలువులో చేరింది. రాములు ఉండెళ్ళిన పెంకుటింట్లోనే ఇప్పుడు ఆమె ఉంటుంది. నన్ను రోజూ కోవెలకి తిప్పే రిక్షాబ్బాయి గోవిందుకి అక్క కమలమ్మ.

 నా విషయం, నా అవసరాలు ఆమెకి వివరించి, నేను గుడిలో ఉన్నంత సేపు కాస్త సాయం చేయాలని ఆమెని అడిగాడు తాత. నెలకి యాభై రుపాయలిస్తే సాయమందిస్తానందంట. వేరే గత్యంతరం లేక తాత ఒప్పుకున్నాడంట.

 సాయం చేయమంటే యాభై రూపాయలు అడగడం ఏమిటని, పిన్ని గోలెట్టింది. ఆఖరికి ‘గాయత్రి హుండీ’ నుండి నెలకి ఆ యాభై   కమలమ్మకిచ్చేలా ఆలోచించారు. కొత్తగా కొలువులో కొచ్చింది, గోవిందు అక్కని తాత చెపితేనే పిన్నికి తెలిసింది.

మళ్ళీ వారానికి ‘కృష్ణ’ అనే పదేళ్ళ అబ్బాయిని కూడా పనికి పెట్టుకున్నాడు పంతులుగారు. మాకు మల్లేనే రోజూ పొద్దుటే కోవెలకి వస్తాడాబ్బాయి. శ్లోకాలు చదువుకుంటూ పూజసామాను తోమి, గర్భగుడిలో సైతం శుభ్రం చేసి, విగ్రహాలకి పూల మాలలు అలంకరిస్తాడు కృష్ణ.

పంతులుగారికి దూరపు చుట్టమంట. పనయ్యాక బట్టలు మార్చుకొని, కృష్ణ బడికి వెళ్ళిపోతాడు కూడా.

**

పొద్దున్నే, పూలబుట్ట నా ముందుంచి వెళుతున్న కమలమ్మని చూడగానే, చంద్రం పిన్ని అన్న మాటలు గుర్తొచ్చాయి.

…… “కమలమ్మ గురించి ఆరా తీసానురా గాయత్రీ, ఆమె అదోరకం మనిషని విన్నాను. తగువులు పెడుతుందంట. బద్రంగా ఉండాలి ఆమెతో. అయినా గుళ్ళో కమలమ్మ నీకు చేసేది మొక్కుబడి సాయమేలే,” అని చంద్రమ్మ అనడం అక్కడే ఉన్న తాత విన్నాడు.

“ఆ కమలమ్మతో, నువ్వూ కాస్త ఓపిగ్గా ఉండాలి, గాయత్రి,” అన్న తాత మాటలు కూడా గుర్తు చేసుకుంటూ పూల పని ముగించాను.

కాసేపటికి తిరిగొచ్చిన కమలమ్మకి పూలబుట్ట అందివ్వబోతే, నా జాకెట్టు కుట్టు పిగిలింది. తన చీర ఒకటి తెచ్చి నాకు కప్పి, నా వెనుక కూచుని సూది-దారంతో గబగబా నాలుగు కుట్లేసింది కమలమ్మ.

ఈ మధ్య నా బట్టలు కురచైపోతున్నాయి. బిగుతుగా కూడా తోస్తున్నాయి. చంద్రం పిన్ని గమనించి రెండుజతల బట్టలు కొని కుట్టించుకొచ్చింది. ఉమమ్మ కూడా తనకి కురచైపోయిన పరికిణీ జుబ్బాలు తెచ్చిచ్చింది.

నేను అందంగా, ఆరోగ్యంగా ఎదుగుతున్నానని, అందరి కళ్ళు నా మీదే ఉంటున్నాయనంటూ, పొద్దుటే చంద్రం పిన్ని చేత్తోనే  ఈ మధ్య మురిపెంగా దిష్టిచుక్కెట్టిస్తున్నాడు తాత.

“అన్నా, గాయత్రితో రిక్షాలో కూచుని గుడికెళ్ళరాదా? అని మళ్ళీ చంద్రమ్మ ఎంతడిగినా ససేమిరా వినలేదు. తాత కాలినడకనే గుడికి వస్తాడు, పోతాడు.

**

గుళ్ళో రాములు లేని లోటు, కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ కలివిడిగా పనులు కలిపించుకుంటూ, అందరికి సాయం చేస్తుండే రాములు లేని లోటు మాకే కాదు – పూజారయ్య, ఉమమ్మలకి కూడా అనిపిస్తుందంట.

ఉమమ్మ కలిసిన ప్రతిసారి రాముల్ని తలుచుకుంటున్నాము. ఆమె పెనిమిటికి ఆరోగ్యం ఇంకా బాగవలేదని మాత్రం తాత మాతో అన్నాడు.

పావురాళ్ళకి గింజలెయ్యడం, వాటి వెనువెంటే శుభ్రం చేయడం తన వల్ల కాదని గొడవ చేసింది కమలమ్మ ఓ సారి.

గుడికి పావురాళ్ళ రాక ఎప్పటినుంచో ఉన్నదేనని, అవి వచ్చి వెళ్ళాక అరుగులు రెండు పూటలా శుభ్రం చేయడం, కోవెలనాశ్రయించిన పక్షులకి, పశువులకి దానా వేయడం, ఆమె పనిలో భాగమే అని పంతులుగారు చెప్పాక గాని కమలమ్మ పావురాళ్ళ మీద విసుగ్గోడం మానలేదు.

కమలమ్మకి – రాములికి అసలు ఏ విషయంలోనూ పోలిక లేదనిపించింది.

**

మరో నెల రోజుల్లో నాకు పదమూడేళ్ళు నిండుతాయని ముందుగానే కొత్త పరికిణి, జాకెట్టుతో ఈ తడవ వోణి, గాజులు తీసుకున్నాడు తాత.  మరో రెండు జతలు బట్టలు తీసాడు. అందుకోసం పూజారయ్య కాడ  అప్పు కూడా చేసాడు.

ఉమమ్మ ఇచ్చిన వాటితో కలుపుకొని ఇప్పటికే సరిపడా బట్టలున్నాయని తాతకి తెలియజెప్పాను. అప్పు చేయవద్దని గొడవపడ్డాను.

“నిన్ను గొప్పగా చూడాలని ఉంటాదమ్మా.  పెద్దదానివౌతున్నావు. తొందరగా నడవగలగాలని, చదువుకొని నువ్వు స్వతంత్రంగా బతకాలని నా కోరిక,” అన్నాడు తాత చమర్చిన కళ్ళతో.

నన్ను కన్న వాళ్ళు ఎలా దూరమయ్యారో కాని,  తాత లేకపోతే నేనేమయ్యేదాన్నో తెలీదు.

మొత్తానికి అలా నా పదమూడవ పుట్టిన రోజు నుండి పైట వెయ్యడం మొదలెట్టాను.

పూజారయ్య భార్య మంగళమ్మగారితో సహా పంతులుగారి భార్య, నాయుడన్న భార్య కూడా నాకు పుట్టినరోజు కానుకగా పరికిణీ, వోణీలు పంపారు.

**

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉమమ్మ రెండు పుస్తకాల సంచులు తీసుకొని వచ్చింది.

‘ఏమిటా? ఇన్ని పుస్తకాలు ఉమమ్మ చేతుల్లో! అసలు ఇవాళ ఆమె మాములుగా వచ్చే రోజు కూడా కాదే ’ అని కుతూహలంగా ఉంది.

గట్టి అట్ట పుస్తకాలు ఎన్నో! పక్కనే కూచుని వరసగా పుస్తకాలని తీసి నా ముందు పేర్చింది ఆమె.

నా వంక చూసి, “ఇప్పటినుంచి ఈ పుస్తకాలతోనే నీ అస్సలు చదువు మొదలవుతుంది,” అంది ఉమమ్మ.

అర్ధమవ్వక, ‘అంటే’ అన్నట్టు చూసాను ఆమెని.   నా ముఖంలో గాబరాని చూసి ఫక్కున నవ్విందామె.

“ఏం లేదురా గాయత్రీ, లెక్కలు, సాంఘికం, తెలుగు, కాస్త ఆంగ్లం మాత్రమే చదువుతున్నావు ఇప్పటి వరకు. పబ్లిక్ పరీక్షలకి కూడా నిన్ను తయారు చేయాలి కదా!” నా వంక చూసింది.

“అంటే, సైన్స్ – భూగోళ శాస్త్రం- ఆల్జీబ్రా – లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నాలుగవ తరగతి నుండి మొదలవుతాయి. అందుకే నీకు ఆ సబ్జెక్ట్లు – నాలుగు, ఐదు, ఆరవ తరగతుల పాఠ్య పుస్తకాలు తెచ్చాను.

నీకు రెండేళ్ళ సమయం ఉంది. మూడు నెల్లకోసారి ఈ సబ్జక్టుల్లో పరీక్షలు రాయవచ్చు,” చెప్పడం ఆపి నా వంక చూసి, సరేనా?” అంది ఆమె.

‘అర్ధమయ్యింది’   అని తలూపాను.

“ఈ సారి నుంచి ఓ పథకం ప్రకారం ఈ పుస్తకాలే విప్పుదాము,” అని ముగించింది ఉమమ్మ.

కొత్త పుస్తకాలని చూస్తే, నాకు ఉత్సాహంగా ఉన్నా , భయంగా కూడా అనిపించింది.

“సరే, కొత్తగా వచ్చిన కమలమ్మ సాయంగా ఉంటుందా?” ఆరా తీసింది ఉమమ్మ.

సన్నగా నవ్వాను.

“ఇంకా కొత్త కదా! చనువు లేదుగా. దూరంగానే మసులుతున్నట్టుగా ఉంది. మంచిదేలే. వచ్చే రెండేళ్లు గట్టిగా చదువు మీద దృష్టి పెట్టు గాయత్రీ, నేను రెండు రోజుల్లో వస్తా. ఈ లోగా కొత్త పుస్తకాలు తిరగేయి,” అంటూ వెళ్ళింది ఉమమ్మ.

**

యేడాదిన్నర సమయం ఇట్టే గడిచిపోయింది. చాలా కష్టపడి చదువుతున్నాను. ఆ చదువు అర్ధమయ్యి, నేర్చుకుని, పరీక్షలు రాయడం లోనే ఎక్కడి సమయం చాలడం లేదు. ఇంకొక్క వరస పరీక్షలైతే, నేను పూర్తిగా అరవ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నట్టే లెక్క అంది ఉమమ్మ.

అందుకే, సమయం దొరకగానే పుస్తకాలతో గడిపేస్తున్నాను.

కమలమ్మ అప్పుడప్పుడు అలుగుతూ, అలసిపోతూ, పంతులుగారితో చెప్పించుకుంటూ, పని చేసుకుంటుంది.

నాతో ఇప్పుడిప్పుడే కాస్త ఓపిగ్గా మాట్లాడుతుంది.

తాతతో మాట కలపాలని చూస్తుంది కమలమ్మ. తాత తలొంచుకుని తన పని చేసుకోడమే తప్ప రాములుతో లాగా మాట్లాడడు.   ఎప్పుడన్నా తాతకి నలతగుండి పనిలోకి రాకపోతే, ఆ పని కూడా తన మీద పడిందని అందరికీ తెలిసేలా రుసరుసలాడుతుంది కమలమ్మ.

ఆమె, గుడికి ఎదురుగా ఉండే కూరలబడ్డీ సీతమ్మ దగ్గర కబుర్లకి కూచుంటుందని, మధ్యాహ్నాలు అక్కడే భోజనం చేస్తూ, తాతని కూడా తమతో కూచోమని పిలుస్తుందని చెప్పాడు తాత.

నాయుడన్న భార్య కూడా అప్పుడప్పుడు వచ్చి కమలమ్మతో మాట్లాడి పోతుంటది.

**

గుడిలో ఒక్కోసారి కుర్రోళ్ళు కొందరు పూజసామాను కొనే సాకుతో మాటలు సాగిస్తూ, నన్ను అల్లరి పెట్టడం మొదలెట్టారు.

కమలమ్మ ఒకటి రెండు సార్లు వాళ్ళని తిట్టి పంపేసింది.

“నీకు నేను తోడుంటాలే గాయత్రి,” అంటూ నా కాడ కూచుంది కొన్ని మార్లు.   “వోణి యేశాక ఎక్కడిలేని అందం వచ్చింది నీకు గాయత్రి. నీ నవ్వులు, నీ చూపుల కోసం కుర్రాళ్ళు బారులు కడుతున్నారా? ఒక్క అవిటితనమే నీ లోపమిప్పుడు,” అంది కమలమ్మ.

ఆమె మాటలు నాకు నచ్చలేదు. అసలా సంగతులేవీ తాతకి చెప్పలేదు.

**

నిద్రపోయే సమయానికి హడావిడిగా చంద్రం పిన్నొచ్చింది.

“అన్నా, ఈ వారంలో గాయత్రిని మంగళగిరి ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి, పూజారయ్య బండి కావాలన్నారుగా.

మా ఆయన, వాళ్ళ రవాణ ఆఫీసు బండి ఏర్పాటు చేశాడు.

ఎల్లుండి పొద్దున్న తొమ్మిదికంతా బయలుదేరుదామన్నా.

రేపు గుడి కాడికొచ్చి అన్ని విషయాలు మాట్లాడుదాములే, వస్తానే,” అంటూ వచ్చినంత హడావిడిగా వెళ్ళిందామె.

**

egire-pavurama-6

అనుకున్నట్టే పొద్దున్న పదిగంటలకి మంగళగిరి ధర్మాసుపత్రికి తాత, చంద్రమ్మ, ఉమమ్మ, నేను బయలుదేరాము. మొదటి సారిగా నేను కారెక్కాను.

మాకు కావలసిన సాయం చెయ్యమని, తెలిసిన ఆసుపత్రి సిబ్బందికి ముందే కబురంపారంట పూజారయ్య.   దాంతో నాకు ఆసుపత్రి వారి చక్రాలబండి ఏర్పాటు, వైద్య నిపుణుల సంప్రదింపులు సులువుగా అయ్యాయి. నా విషయంగా మొత్తం ముగ్గురు వైద్యులని చూసాము.

ఆఖరున డాక్టరు మల్లిక్ గారిని కలిసాము.

ఆయన నన్ను పరీక్షించి, ఊతకర్రల సాయంతో నిలదొక్కుకొని కొంత మేర సులువుగా కదలవచ్చన్నారు.

నాతో మాట్లాడుతూ, “చూడు గాయత్రి, చక్రాల పీటలవీ చిన్న పిల్లలు కొద్ది రోజుల వాడకానికి పర్వాలేదు.

కానీ, నీవిక ఈ వయస్సుకి ఊతకర్రల సాయంతో కదలడం అలవరచుకోవాలి.

లేదంటే నీ ఎదుగుదలకి మంచిది కాదు. వెన్నెముకతో పాటు కదలిక మరింత స్తంభించే అవకాశముంది.

అసలిప్పటికే నీవు కర్రలు వాడుతుండవలసింది,” అంటూ సమయం తీసుకొని, నాకు ఆరోగ్యం పట్ల ఉండవలసిన సామాన్య శ్రద్ధ గురించి వివరించారు.

నన్ను, ఉమమ్మని తన ఆఫీసులో కలవమని చెప్పి వెళ్ళారు డాక్టరుగారు.

**

మేము వెళ్ళేప్పటికి అటుగా తిరిగి ఫోనులో మాట్లాడుతున్న ఆయన మమ్మల్ని కూచోమని సైగ చేసారు. ఆ గదిలో, ఓ పక్కగా రకరకాల కొలతల్లో ఊతకర్రలు, చెక్క కాలితొడుగులు ఉన్నాయి.

ఫోనులో కూడా డాక్టరుగారు ఊతకర్రల గురించే ఎవరితోనో మాట్లాడుతున్నారని అర్ధమవుతుంది. ఆయనకెదురుగా బెంచీ మీద కూర్చుని, చిన్న సైజు బూట్లకొట్టులా ఉన్న ఆ గదిని కలయజూసాము.

ఫోన్ పెట్టేసాక, ఆయన మావైపు తిరిగారు.

“చూడండి మేడమ్, గాయత్రికి వెంటనే ఊతకర్రలు తెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాను. మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు? మీరంతా ఎక్కడ వుంటారు? గాయత్రి వైద్యసహాయ విషయమై కాగితాలు మీరే చూస్తారా?” అని ఉమమ్మని అడిగాడు డాక్టర్ గారు.

“గాయత్రి విషయమై కాగితాలు నాకు ఇవ్వచ్చు. నా పేరు ఉమాదేవి సోమయాజులు. పాలెం లోని మా ‘శ్రీ గాయత్రి’ కోవెల్లోనే వాళ్ళ తాత సత్యం సాయిరాం కొలువు చేస్తున్నారు. గాయత్రికి మేము శ్రేయోభిలాషులం అనుకోండి. ఆమె తాత, పిన్నమ్మ మా కూడా వచ్చారు. బయట కూర్చున్నారు,” అని ముగించింది ఉమమ్మ.

“అలాగా,” అంటూ తాతావాళ్ళ కోసం కబురంపి, ఊతకర్రల విషయంగా నా గురించిన సమాచారం, చిరునామా రాయమని ఉమమ్మకి కొన్ని కాగితాలు ఇచ్చారు డాక్టరుగారు.

తన కాడ ఉన్న నా వివరాల పత్రాలు మరోసారి పరిశీలించి, లోనికొచ్చి కూర్చున్న తాత, చంద్రమ్మల వంక చుసారాయన.

“చూడండి సత్యంగారు, గాయత్రి ఎదుగుదల, కదలికకి సహాయపడాలంటే వీలయినంత త్వరలో ఆమె ‘ఊతకర్రలు’ వాడకం అలవాటుగా మొదలుపెట్టాలి.

ఆసుపత్రి ద్వారా అయితే, దానికి కొంత సమయం, మీకు కొంత ఖర్చు అవుతుందట.

నేనిప్పుడే కనుక్కున్నాను. మా ‘ధార్మిక సంస్థ’ ద్వారా మీకు ఉచితంగా వాటిని ఏర్పాటు చేయించగలను,” అంటూ వాళ్ళకి ఓపిగ్గా వివరించారు.

తాత మాత్రం అర్ధం కానట్టుగా చూసాడు డాక్టరు వంక.

“అదేమిటి బాబు. ఆసుపత్రి వాళ్ళు చేయవలసినది, మీరు మీ సొంతంగా చేయడమేమిటి?

అసలు గాయత్రికి మాట, నడక స్వతహాగా వస్తాయేమోనని పరీక్షించి చెప్పలేరా బాబు? అని అడిగాడు.

(ఇంకా ఉంది)

 

 

ఎగిరే పావురమా! ఐదవ భాగం

serial-banner5

ఐదవ భాగం

గడిచిన రెండేళ్ళల్లో, రాములు నాలుగు తడవలన్నా వాళ్ళ మామని చూడ్డానికని ఊరికి పోయింది. ఎప్పుడెళ్ళినా పొద్దున్నే పోయి సాయంత్రానికి తిరిగొచ్చేస్తది.

 

వచ్చాక మాత్రం ప్రతిసారి రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉంటది.

నాకు రాములుని అట్టా చూడ్డం కష్టంగా అనిపిస్తది.

తాతైతే ఇంకా ఎక్కువే బాధపడతాడు.

 

నెలకిందట  రాములు ఊరికి పోయొచ్చాక మాత్రం తాత ఆమెని కోప్పడ్డాడు.

 

“ఎందుకు పోయి భంగపడి వస్తావే? నీకు కనీసం ఒక్కపూట తిండి కూడా పెట్టించే ధైర్యం చేయని పెనిమిటి కోసం ఏందే నీ పరుగులు రాములు? “ అన్నాడు తాత కఠినంగా.

 

“కాదు సత్యమయ్యా, మామ నా ఇషయంలో చేసిన తప్పు తెలుసుకున్నాడు. బాధ పడుతున్నాడు. ఆరోగ్యం బాగా చెడింది. మనిషి సగమయ్యాడయ్యా.

తాగుడు, పొగాకు బాగా వ్యసనమైపోయాయి వాడికి.   ఏమౌతాడో?

ఆరోగ్యం చెడినా సంపాదన తగ్గద్దని, ఇంకా రేత్రిళ్ళు లారీ నడుపుతున్నాడు.

మామకి కాపలాగా తమ్ముణ్ణి పెట్టింది ఆ పెళ్ళాం. అందుకే నేనే పోయి కనీసం కళ్ళతో మామని చూసుకొనొస్తున్నా,” అంది రాములు తాతతో.

 

ఓపిగ్గానే విని, “ఈ తడవ నాకు నీ కష్టం చెప్పమాకు, నా కాడ ఏడవమాకు. నేనూ బాధపడాలా?” అన్నాడు తాత విసుగ్గా.

**

తాత ఈ మధ్య బాగా నీరసపడ్డాడు. తినడం బాగా తగ్గించాడని పిన్ని కూడా గోలెడుతుంది.. గత ఆర్నెల్లలో తాత రెండు తడవలు జబ్బుపడ్డాడు. బాగా చిక్కిపోయాడు.

మూన్నెళ్ళ కిందట ఆసుపత్రి వైద్యులు మందులిచ్చిన కాడినుండి గంజి, మజ్జిగల మీదే తాత బతుకుతున్నాడు.

 

తాతనట్టా చూడ్డం చాల దిగులుగా ఉంది.  నీరసించి, చేతనవక వారమేసి రోజులు ఇంటికాడే ఉండిపోతున్నాడు.

తోడుగా ఉంటానని నేను అడిగినా, “అమ్మో నువ్వు లేకపోతే పూజసామాను కాడ ఎవరుంటారు? పూజారయ్య ఊరుకోడు తల్లీ. నువ్వెళ్లాల్సిందే,” అని నన్ను గుడికి పంపేస్తున్నాడు తాత.

**

పొద్దున్నే పడక మీంచి లేస్తూనే, తాతకి కడుపులో మంట, దగ్గు, తట్టుకోలేనంతగా ఎక్కువయ్యాయి. ఎప్పటిలా బలవంతంగా నన్ను గుడికి పంపేసి చంద్రమ్మతో హడావిడిగా ఆసుపత్రికి పోయాడు తాత.

**

పగలంతా తాత గురించే గుబులు పడ్డాను. పనయ్యాక తాతని చూడాలని ఆదుర్దాగా కొట్టాం చేరేప్పటికి, తాత బయట నులక మంచం పైన తొంగొనున్నాడు. కాస్త ఎడంగా కూచుని చాటలో రాగులు చెరుగుతూ పిన్ని తాతతో గొడవ పడుతుంది.

 

తాత కాడికెళ్ళి కూచున్నాను. మాటలాపి చాట తీసుకొని పిన్ని లోనికెళ్ళింది.

తాతని చేత్తో తట్టి, “నొప్పి తగ్గిందా? మందులేసుకొన్నావా?” అని సైగతో అడిగాను. లేచి కూచున్నాడు తాత. నా చేయందుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు.

 

“అయ్యో చిట్టితల్లీ, బాగున్నానే. పనికెళ్ళలేక ఇప్పటికే చానా రోజులయింది. ఖర్చుకి, తిండికి, నా వైద్యానికే డబ్బులన్నీ అయిపోతున్నాయే,” అన్నాడు తాత దిగులుగా.

‘పర్లేదు తాత, నేనున్నాగా. చంద్రం పిన్ని ఉందిగా,’ అని సైగ చేసాను.

egire-pavurama5

 

ఉడికించిన అలసందలు ఉప్పేసి తెచ్చి తాత కందించింది పిన్ని.

“అన్నా, ఇటు నా మాట కాస్త విను. ఇక నీవిలా కష్టపడి పని చేయడానికి లేదు. డబ్బు లేదంటూ దిగులు పడుతూ మందులు కొనడానికి వెనకాడితే నేనూరుకోను. చేతనయినన్నాళ్ళు బాధ్యతలు మోసావు,” అంటూ నన్ను కాస్త జరగమని, నాకు – తాతకి మధ్యన చతికిల పడింది పిన్ని.

“ఇటు సూడన్నా, నువ్వే కాదా మాకున్న పెద్ద దిక్కు?

నీకేమన్నా అయితే నేనూ, గాయత్రి ఏమవ్వాలి?” అంది పిన్ని దిగులుగా.

 

“పోతే, వకీలు నీ వరిపొలం విడిపించగానే అమ్మేద్దాములే. నీ వైద్యానికి, అవసరాలకి అక్కరకొస్తుంది,” అని తాతతో అంటూ నా వైపు తిరిగింది చంద్రమ్మ.

 

“నీ కోసం రాగి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు మూతేసి పొయ్యి కాడ ఉంచానురా. నువ్వు తిన్నాక, గిన్నెలోకి తీసిపెట్టిన రాగిజావ తాత చేత తాగించు,” అంటూ తాతని లేపి, మెల్లగా కొట్టాంలోకి సాయం పట్టింది పిన్ని.

 

“నేనెళ్ళి ధర్మాస్పత్రిలో అన్నకి మందులు తీసుకొని రేపొస్తా. ఆడైతేనే కాస్త చవక. ఉచిత వైద్యమే ఐనా మనకీ ఖర్చవుతుంది,” అంటూ గబగబా వెళ్ళిపోయింది పిన్ని.

కాసేపు తాత కాడ కూచుని, పుస్తకం చదువుకున్నాకే, నేను తిని తాతతో జావ తాపించాను.

**

తెల్లారకముందే తడికలవతల వైపు నుండి పిన్ని మాట వినిపించింది. కళ్ళు విప్పి తొంగి చూస్తే వాకిట్లో కూచునున్నారు తాత, పిన్ని. తాత టీ తాగుతూ ఆమె చెప్పేది వింటున్నాడు.

“అన్నా, రేత్రి మా ఆయనతో మాట్లాడాను. నీ పొలం విడిపించడానికి డబ్బు ఖర్చవుతదంట. నీతిమాలిన నీ సవిత్తల్లి, పొలం కబ్జా చేయడంతో నీకీ దరిద్రం పట్టింది.

నువ్వేమో గాయత్రి డబ్బు దేనికీ ముట్టుకోనంటావు. పసిబిడ్డగా కాపాడి, పెంచి పెద్ద చేసి, దానికి ఒక బతుకు తెరువు కూడా ఏర్పాటు చేసావు.

ఇకనైనా గాయత్రి చింత మాని, నీ బాగోగులు చూసుకోవయ్యా.

నీ ఫించను డబ్బులున్నా, రోగం ముదిరితే మాత్రం, నీ మందులకి కూడా కష్టమౌతాదేమో,” అంది చంద్రం పిన్ని.

 

ఆమె మాటలు మెదలకుండా విన్నాడు తాత.

“లేదులేవే చంద్రం. నేను పనిలోకెడతా. గాయత్రి డబ్బు అలాగే ఉండనీ. పద్నాలుగేళ్ళు నిండాక గాయత్రిని పట్నంలో వైద్యుల కాడ సూపెట్టాలన్నారు పూజారయ్య. బోలెడంత ఖర్చవుతుందంట.

గాయత్రి విషయంగా పట్నంలో ఏదో వికలాంగుల సంస్థ ఉందంట. ఈ నెలలో ఆడికి కూడా పోయి మాట్లాడి వస్తాలే. నా పొలం సంగతికి నేనెళ్ళి వకీలు బాబుని కలుస్తాలే,” అన్నాడు తాత..

 

“అది కాదన్నా నేననేది,” అంటున్నామెని ఆపాడు తాత.

“అయినా ఆ పసిదాన్ని ఇంటికి తెచ్చినప్పటి పరిస్థితి నీ కెరుకే.

కన్నతల్లో, మరెవరైనా కసాయో? ఆ పసిదాని గొంతుకి గుడ్డ చుట్టి మరీ కాలువ గట్టున వదిలేసారు. అట్టాగని, పెంచిన నేను దాన్ని గాలికొదిలే లేనుగా!.

ఆ తల్లి దయలేని చర్య వల్లే, ఆ అఘాతం వల్లే, బిడ్డకి మాట రాకుండా అయిపోయిందని నా అనుమానం. ఆ పసిది పాపం! నలిగి నెత్తురోడే కాళ్ళతో, ఆ తుఫానులో ఒక్కరోజన్నా అలా పడుందేమో కదా,” అని కళ్ళు తుడుచుకున్నాడు తాత.

“అందుకే, నా ఊపిరి ఉన్నంత దాకా బిడ్డ జీవనం సరిచెయ్యాలనే ప్రయత్నం చేస్తానే చంద్రమ్మా. అయినా నా చిట్టితల్లి చిరునవ్వులు, నీ ఆప్యాయత చాలు – నా జీవనానికి,” అంటూ నన్ను నిద్ర లేపడానికన్నట్టుగా పైకి లేచి నా వైపుకి నడిచాడు తాత.

 

‘నన్ను కన్నతల్లి వదిలించుకుందని, తాత నన్నాదుకుని ఇంటికి తెచ్చాడని అప్పుడప్పుడు పిన్ని మాటల్లో ఇదివరకే తెలుసును.   కాని ఇప్పుడు తాత నా గురించి అన్నది వింటుంటే, పసిపిల్లగా అట్టాంటి బాధలో దొరికానా తాతకి? అని చానా కష్టమనిపించింది…..

 

ఇక పిన్ని కూడా ఏమనలేక పోయింది. “సరేలే అన్నా మళ్ళీ పనిలోకెడుతుండావు. రవ్వంత గమనించుకొని విశ్రాంతిగా ఉండు,” అంటూ లోనికొచ్చి పొయ్యి కాడికెళ్ళింది.

**

ఎన్నో రోజుల తరువాత పనిలోకొచ్చాడు తాత. కోవెల ఆవరణంతా ఊడ్చి వచ్చిన తాతకి, మంచి నీళ్ళిచ్చి పక్కనే కూచుంది రాములు.

 

క్షణమాగి, “అయ్యా, నేను నా మామ కాడికి ఎళ్ళిపొతున్నా. మంచాన ఉండాడంట.   వాడిని చూసుకోడానికి నన్ను రమ్మని ఇన్నాళ్ళకి ఆడి పెళ్ళాం కబురెట్టింది.   ఎళ్ళడం మటుకేనయ్యా. మరి మళ్ళీ ఎప్పుడొస్తానో, అసలొస్తానో లేదో తెలీదయ్యా. కాళ్ళాడ్డం లేదు,” అంది రాములు జీరబోయిన గొంతుతో.

 

తాత జవాబుగా ఏమంటాడో అని వింటున్నా. నిట్టూర్చాడు.

“వెళ్ళిరాయే. చూద్దాం ఏదేమవుతాదో.   పదైదేళ్ళగా ఓ బిడ్డలా మెలిగావు. గాయత్రికి ఇన్నేళ్ళగా తోడు-నీడ అయ్యావు. నువ్వు లేకుండా మా జీవనం ఈడ ఎలా సాగుతుందో ఇకపైన చూడాలి మరి,” అన్నాడు దిగులుగా.

‘నిజమే, అసలు ఎట్టా?’ తాత మాటలు విన్న నాకూ అనిపించింది. రాములు అన్నిటికి మాకు సాయపడ్డం, నన్ను ప్రేమగా చూసుకోడం తలుచుకున్నాను. మరి ఇప్పుడు రాములు వెళ్ళిపోతే ఎట్టా? అని దిగులేసింది.

కన్నీళ్లు పెటుకున్న రాములుని సముదాయించాడు తాత.

**

మధ్యాహ్నం, ప్రసాదం తినేసి తాత బడ్డీకి పోబోతుండగా, ఉమమ్మ హడావిడిగా వచ్చింది మా కాడికి.

 

“శుభాకాంక్షలు సత్యమయ్యా, మన గాయత్రి ఐదవ తరగతి లెక్కలు, తెలుగు, సాంఘికం, యాభై శాతం మార్కులతో పాసయింది తెలుసా? నా మొదటి శిష్యురాలు. చాలా గర్వంగా ఉంది. ఇంతకన్నా సంతోషం నాకైతే లేదు,” అంటూ నిలుచునున్న తాతని నా పక్కనే కూచోబెట్టింది ఉమమ్మ.

 

నాయుడన్న, పంతులుగారినే కాక వాళ్ళ నాన్నగారిని కూడా అరుగు కాడికి రమ్మని రాములు చేత కబురెట్టింది.

 

ఉమమ్మ చేస్తున్న హడావిడికి పూజారయ్య సైతం మా కాడికి చేరాక, అందరినీ చుట్టూ కూచోబెట్టి మరోసారి నేను పరీక్షలు పాసయిన విషయం చెప్పిందామె.

“గత వారం గాయత్రికి మాస్టారు పెట్టిన ఐదో తరగతి పరీక్షా ఫలితాల పత్రం ఇదిగో,” అంటూ మార్కుల పత్రం నాకిచ్చి, తాను తెచ్చిన లడ్డు అందరికి పంచింది. తాత చాలా ఆనందపడ్డాడు.

చేతిలోని లడ్డు కొద్దికొద్దిగా తింటూన్న వాళ్ళ నాన్నగారి పక్కనే వెళ్ళి కూచుంది ఉమమ్మ.

“నాన్నా, నేను రెండు నెలల్లో మంగళగిరి డిగ్రీ కాలేజీకి వెళతాను కదా!

అక్కడే  బి.ఇ.డి కూడా చేసి ఉపాధ్యాయిని అవ్వాలని నిశ్చయించుకున్నాను. ఆ తరువాత వికలాంగులకి ప్రత్యేక విద్యాభ్యాస విధానంలో పై చదువులకి వెళతాను.

గాయత్రి లాంటి తెలివైన వారికే కాదు, ఇంకా ప్రత్యేకమైన అవసరాలున్నవారికి నా వంతు సేవ, సాయం చేయాలనుంది. నానమ్మకి చెపితే సంతోషించింది. అమ్మ నేనేమన్నా ఒప్పుకుంటుందని తెలుసుగా,” అంది ఉమమ్మ ఒకింత సంబరంగా.

 

కూతురి వంక చూసి, “ఇంకా సమయం ఉందిగా! ఆ విషయం మాట్లాడుదాములే,” అన్నారు ఓపిగ్గా పూజారయ్య.

 

ఇంతలో అందరికీ మంచినీళ్ళు తెచ్చిచ్చింది రాములు.

మరో రెండు రోజుల్లో రాములు ఊరికెడుతుందని, అందునా ఆరోగ్యం బాగోలేని పెనిమిటికి సేవ చేయడానికని విని సానుభూతి చూపించారందరూ. అతని పేరిట ప్రత్యేక పూజ చేయించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలు తీసుకెళ్ళమన్నారు పంతులుగారు.

 

ఇంతలో ‘మీ సంబరంలో మేము కూడా’ అన్నట్టు దూసుకొచ్చాయి పావురాళ్ళు.

 

“అబ్బో మీ గువ్వల సంఖ్య పెరిగిందే? శాల్తీలు కూడా మారాయి,” అంది ఉమమ్మ.

 

“అలవాటుగా వచ్చేవి పదికి పైనే ఉన్నాయి, ఉమమ్మా. చిట్టి పావురాళ్ళు కూడా ఎకువయ్యాయి ఈ మధ్య,” అంటూ పక్కనే ఉన్న గింజల డబ్బా అందుకుని కాస్త దూరంగా పావురాళ్ళ వైపు వెళ్ళింది రాములు.

**

కాసేపు ఆ మాట, ఈ మాట చెప్పి అందరూ తిరిగి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. కొళాయి వద్ద చేతులు కడుక్కుని, నా కాడికి వచ్చి కూచుంది ఉమమ్మ.

కొత్త పుస్తకాలున్న సంచి నా కందించింది.

“ఇందులో ఆరో తరగతి పుస్తకాలతో పాటు ఆంగ్లభాష అక్షరాల పుస్తకం కూడా ఉంది,” అన్నది ఆమె నా భుజం మీద తడుతూ. నాకెంతో గర్వంగా అనిపించింది.

 

“నువ్వు సంతకం చేయడం కూడా నేర్చుకోవాలి. ఇంకెవ్వరూ కాపీ చెయ్యకుండా ఉండాలి. నీ సంతకం నీ ఇష్టం.   నీకు నచ్చింది ఒకటి కాస్త సాధన చేయి.

పోతే, నాకు కాలేజీ మొదలయ్యాక కూడా, ఇప్పటి లాగే బుధవారం, ఆదివారం రాగలుగుతాను. నీ చదువు ఆటంకం లేకుండా సాగుతుందిలే,” అంది ఉమమ్మ.

**

తెల్లారితే రాములు ప్రయాణమనగా రాత్రి నాకు నిద్ర పట్టలేదు. సాయంత్రం ఆరింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది రాములు.

రాములు కోసమని చంద్రం పిన్ని చేత తెప్పించిన ఎర్రరంగు చీర, రవిక, గాజులు సంచిలో సర్దుకొని పొద్దున్నే కోవెల చేరాము.

**

ఎప్పటిలా మేము పూలపని చేస్తుండగా, ఊరెళుతున్న రాముల్ని చూడ్డానికి సుబ్బి, మాణిక్యం వచ్చారు.

ఎదురుగా అరుగు మీద కూచుని, పెనిమిటి ఆరోగ్యం కుదుట పడగానే జాప్యం చేయకుండా తిరిగొచ్చేయమని రాములికి చెప్పారు.

 

“మరీ బెంబేలెత్తకు రాములు. మీ మామకి సేవ చెయ్యి. అసలు నిన్ను అధోగతి పట్టించింది అతనేనని మాత్రం మరవకు. అతను నిన్నొగ్గేసినందుకే, గతిలేక నువ్వీడ స్వీపరుగా కొలువు చేస్తున్నావనీ మరవకు. వీలయినంత త్వరగా నీ బతుకు నువ్వు చూసుకో,” అంది సుబ్బి.

రాములు ఏదో అనబోయేలోగా, “నువ్వు బాధపడకు రాములు. ఊరికి పోయిరా. సుబ్బి అంటున్నది కూడా నిజమే కదా. మేమే నీకు మళ్ళీ మనువు చేస్తాము,” అంటూ రాముల్ని సముదాయించింది మాణిక్యం.

దుఃఖంలో ఉన్న రాములు మాట పెంచలేదు.

**

నా చేత రాములికి చీర ఇప్పించాడు తాత. రాములు బయలుదేరే సమయానికి ఉమమ్మ, చంద్రం పిన్ని కూడా గుడికొచ్చి, ఆమెని సాగనంపారు. నా తల మీద ముద్దెట్టుకుని, కన్నీళ్ళతో వెళ్ళింది రాములు. నా మనసంతా గుబులుగా అయిపోయింది.

(ఇంకా ఉంది)

 

 

ఎగిరే పావురమా ! – 4 వ భాగం

serial-banner4

( గత వారం తరువాయి )

నాల్గవ భాగం

పిన్ని కాడనుండి కదిలి, గుడికి తయారవుతుండగా, కొట్టాం బయట “సత్యమన్నా,” అని ఎవరిదో పిలుపు. ఇంత పొద్దున్నే ఎవరా! అనుకుని పిన్ని వంక చూసాను. తాత లేచి వెళ్ళి వారగా వేసి ఉన్న కొట్టాం తలుపు తీశాడు.

“నువ్వా వెంకటేశం? రా లోనికి రావయ్యా. నిజంగానే వచ్చావన్నమాట?” అంటూ ఒకతన్ని కొట్టాం లోనికి తెచ్చాడు. వచ్చినాయన చేతిలో ఒక చక్రాల పీట ఉంది.

“చంద్రమ్మా ఈడ చూడవమ్మా. ఇతనే వెంకటేశం. పక్క ఊళ్ళోనే ఉంటాడు. నడక రాని వారికి పనికొచ్చే బండ్లు, పీటలు చేస్తుంటాడు. వాటిని వాడే విధానం కూడా నేర్పిస్తాడు.
మన గాయత్రికి కూడా ఒకటి చేసి ప్రత్యేకంగా ఈ రోజు తెమ్మని అడిగాను. ఇంత పొద్దున్నే మన కోసం ఇలా వచ్చాడు,” అంటూ పిన్నిని పిలిచాడు తాత.

“వెంకటేశం, నువ్వు చేసిన పీట గాయత్రికి చూపిద్దాం. ఈ రోజు చిట్టితల్లి పుట్టినరోజు తెలుసా?” అంటూ అతని చేతిలోని పీట తీసుకొని, నేల మీద ఉంచాడు తాత.

జాలీ చెక్కపీటకి నాలుగు రబ్బరు చక్రాలు ఉన్నాయి. నేల మీద నుంచి పీట కాస్త ఎత్తుగానే ఉంది. ఒక పక్కగా చేత్తో పట్టుకోడానికి పొడవాటి పిడి బిగించి ఉంది.

“గాయత్రికి అది ఎలా పని చేస్తుందో చెప్పవయ్యా వెంకటేశా,” అన్నాడు తాత.

నేను, పిన్ని కూడా చాలా శ్రద్ధగా విన్నాము. కూసేపు ఆ పీట నాకు ఎంతగా పనికొస్తుందో, దాన్ని ఎలా వాడాలో, ఎలా నడపాలో, ఎలా ఆపాలో చెప్పాడు వెంకటేశం.
నా పుట్టినరోజుకి తాత తెప్పించిన చక్రాల పీట బాగుంది. నాకు నచ్చింది.

“తాత నీ గురించి అలోచించి అన్నీ చేస్తాడని చెప్పానా?” అంది పిన్ని నా చెవిలో.
కొద్దికాలం గుంటూరు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశాడంట వెంకటేశం. ఈ పీటలు వాడే నా ఈడు పిల్లల కన్నా, నేను బలంగా, మెరుగ్గా ఉన్నానన్నాడు.

“ఆ దేవత కూడా కనికరిస్తే మా గాయత్రి అవిటితనం పోయి మాములుగా నడుస్తుందిలే, వెంకటేశం. ఆ ప్రయత్నమే చెయ్యాలి,” అంటూ వెంకటేశంని సాగనంపాడు తాత.

**

రోజూ దేవత కాడ నా సంగతి మొరెట్టుకో మన్నాడు తాత. ‘నేనూ అందరి మల్లే నడవాలని, మాట్లాడాలని’ ఆ దేవతని వేడుకోడం మొదలెట్టాను.
అట్టాగే ప్రతిరోజు చక్రాలపీట కూసేపు వాడుతుంటే అలవాటయి, కొట్టాంలో నా కదలిక సుళువయ్యింది. చిన్న పనులు నా అంతట నేనే చేసుకోడం మొదలెట్టాను.

సాయంత్రం కొట్టాంలో మెసులుతూ, దండెం మీద నుండి తీసిన బట్టలు మడతేస్తుండగా వచ్చింది చంద్రం పిన్ని. తన సంచి నుండి తాతకని తెచ్చిన మందులు తీసి తాత పడక కాడెట్టమని నాచేతి కిచ్చింది.
వాకిట్లోకెళ్ళి తాతకాడ కూకుని కబుర్లు చెబుతూ, నా కోసం చక్రాల పీట చేయించినందుకు తాతని మెచ్చుకుంది.

“అన్నా, చెప్పడం మరిచిపోతానేమో! రేపటి నుంచి గోవిందు అనే మరో రిక్షాబ్బాయి వస్తాడు. ఇప్పుడున్నోడిక్కూడా ఆటోరిక్షా వచ్చేసింది. ఇక అతను రాడు. ‘గోవిందు’ ని నేను చూసి మాట్లాడానులే అన్నా,” అని చెబుతూ లేచెళ్ళి – కంచాలు, మంచినీళ్ళెట్టి, మా కోసం చేసి అట్టే పెట్టిన సంకటి, చింతపండు మిరపకాయ పప్పు వడ్డించింది పిన్ని.
**
నా చక్రాల పీటని నాతో పాటే రిక్షాలో గుడికి తెచ్చుకోడం మొదలెట్టాను. పీట సాయంతో అరుగు చుట్టూ కొంత దూరం మెసలడం, నీళ్ళకి కొళాయి కాడికెళ్లడం చేస్తున్నా. అమ్మవారి గుడికాడికెళ్ళి, ప్రసాదాలు తెచ్చుకోడం కూడా చేస్తున్నా.

గుడికొచ్చే భక్తుల్లో నవ్వుతూ పలకరించి, ‘గాయత్రి’ అని రాసున్న చెక్క హుండీలో డబ్బులు వేసేవారు కొందరైతే, “ఇలా మూగ, కుంటిని కూర్చోబెట్టి పూజాసామాను అమ్మించాలా? పక్కనే మరో హుండీ కూడానా అడుక్కోడానికి?” అంటూ నా ముఖం మీదే అనేవారు మరికొందరు.
ఒక్కోప్పుడు  ఆ ఈసడింపులు, చీదరింపులు కష్టమనిపిస్తది.
**
కొత్త పుస్తకాల సంచీ తీసుకొని మూడింటికి వచ్చింది ఉమమ్మ. నా పక్కన కూకుని ఓ బొమ్మల పుస్తకం నాకందించి, నా చేతిలోని పలక, నోటు పుస్తకం తీసుకొని చూసింది.

“పర్వాలేదే, ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు. నా చేతివ్రాత కంటే నీది వందరెట్లు అందంగా ఉంది గాయత్రి.
మా అందరి పేర్లు కూడా రాయగలుగుతున్నావు,” అంటూ నా తల మీద తట్టింది ఉమమ్మ.

“సరే, ఇక నీ పూర్తి పేరు రాయడం కూడా నేర్చుకోవాలి. నీ పేరు చిన్నదే. మూడే అక్షరాలు. ‘గాయత్రి’ అని. పూర్తి పేరు అంటే మాత్రం నీ పేరు వెనక ‘సత్యం’ లేదా ‘సాయిరాం’ అని తాత పేరు కలిపి రాయాలి. ఇలా అన్నమాట,” అని ‘గాయత్రి సాయిరాం’ అని రాసి చూపింది ఉమమ్మ.

పేరు వినడానికి – బాగుందన్నారు అక్కడే ఉన్న తాత, రాములు.
‘అమ్మో’ ఇంత పొడుగు పేరా?’ అన్నట్టు చూశాను ఆమె వంక.
నా ముఖం చూసి ఉమమ్మ ఫక్కున నవ్వింది.
“అయినా పెద్ద తొందర లేదులే. మెల్లగా రోజూ చదువు అయ్యాకే పేరు రాయడం సాధన చెయ్యి,” అందామె.
నేనూ నవ్వేశాను.

“నీవు చదివే ప్రతి పాఠం మన స్కూల్లోని శ్రీనివాసు మాస్టారు సాయంతో నీ కోసం అలోచించి తయారు చేసేదే. నీ పరీక్షలు కూడా ఆయన పథకం ప్రకారమే జరుగుతాయి,” అంటూ నా చేతికిచ్చిన కొత్త బొమ్మల పుస్తకం తీసుకొని పేజీ తిరగేసింది ఉమమ్మ.

“ఈ పుస్తకంలో చూడు. ప్రతి పేజీలో బొమ్మ కింద రెండేసి వాఖ్యాలు – వివరణ ఉంటుంది, అన్నీ చిన్న మాటలే. మాటలు విరిచి గుణించుకుంటూ చదవచ్చు. ఇలా,” అని నా వేలుతో అక్షరాలని చూపుతూ నాకు తెలిసేలా చదివింది ఉమమ్మ.

“ఇలాటివే నంబర్లు వేసి మరో మూడు పుస్తకాలున్నాయి ఈ సంచిలో.
మొదటిది పూర్తయ్యాక, రెండోది చదవడం తేలికవుతుంది.
తరువాత మూడో పుస్తకం చదవగలిగే వరకు వస్తే నీకు చదవడం వచ్చేసిందన్నమాట. ఇక నీ తీరికని బట్టి సాధన చెయ్యి,” అంటూ కూడికలు, తీసివేతలు రాసిచ్చి, కొత్త పుస్తకాల సంచి కూడా నా చేతికిచ్చి రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది ఉమమ్మ.

illustration4

 

**

కొత్త పుస్తకం చదివే ప్రయత్నం సరదాగుంది. నాలో చదవాలన్న కోరిక పెరిగింది. పూలపని అవుతూనే వీలున్నప్పుడల్లా కొత్త బొమ్మల పుస్తకం చేత పట్టుకుంటున్నాను.

మొదట్లో కష్టమనిపించినా, ఎలా చదవాలో తెలిసింది. కాస్త సులువు వచ్చాక, మొదటి పుస్తకం సగమవ్వడానికి మూడు వారాలు పట్టింది.

**

రుద్రాక్షలు, రంగురంగుల పూసలతో నిండిన పళ్ళెం తెచ్చుకొని నా పక్కనే కూకుంది రాములు. పుస్తకం మూసేసి నేను కూడా వాటిని వేరు చేయడం మొదలెట్టాను.

“ఏమో, ఈ సారి ఉమమ్మిచ్చిన పుస్తకాలు వదలకుండా ఉన్నావే? ఎప్పుడూ నీ మొహంకి పుస్తకం అడ్డం. నీ పావురాళ్ళు కూడా అలిగి రాడం మానేస్తాయేమో సూడు,” అంది రాములు.

ఫక్కుమని నవ్వాను. ‘అయితే పుస్తకాల్లో మునిగి ఉంటున్నానని రాములు అలిగిందన్నమాట’ అనుకున్నాను.

‘నేను నీకు చదువు చెబుతాను. నా లాగా నువ్వూ పుస్తకాలు చదివేయచ్చు,’ అని సైగ చేసాను.

“నాకా? సదువా?” అంది రాములు. కొద్ది క్షణాలాగి, “మా అమ్మ చనిపోకుండా ఉంటే, అమ్మమ్మ కాడికి ఎళ్ళకుండా ఈడనే ఉండి సుబ్బి, మాణిక్యం లాగా బుద్ధిగా సదువుకునుంటే బాగానే ఉండేదిరా,” అంది నా జడ లాగి.
“అంతే కాదు, మా అమ్మమ్మ అతిగారాంతో, ‘ఆడపిల్లకి సదువేంది? ఏమవసరం?’ అని నన్ను పాడుచేసింది. నా కన్నా పెద్దోడు, నా మామతో కలిసి పుట్లెంట, గట్లెంట తిరిగి సెడాను… సదువు కాదు కదా, కనీసం వంటా-వార్పు అయినా వంటబట్టాయి కాదు నాకు,” అంది దిగులుగా రాములు.
ఆమె వంకే చూస్తూ ఆమె చెబుతున్నది వింటున్నాను.
“ప్చ్, ఎవర్నని ఏమి లాభంలే! అమ్మ, అమ్మ ప్రేమ, మంచి-చెడు సెప్పే అమ్మ ఆదరణ లేని జీవనం, అందుకే ఇలాగయ్యింది,” అని బాధపడుతూ తిరిగి పూసలు వేరుచేసే పనిలో పడింది రాములు.
**
శనివారం నాడు కొబ్బరులమ్మి పెందరాళే వచ్చాడు తాత. రాములికి, నాకు కాసిన్ని ద్రాక్షపళ్ళు తెచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి పైమెట్టు మీద నా పక్కనే చెట్టునానుకొని కూకున్నాడు.

“రాములూ, ఇలా రాయే. ఈ ద్రాక్షలు కడిగి ఇద్దరు తినండి,” అంటూ ఎనక్కి జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు.

ఐదు నిముషాలైనా రాములు రానేలేదు. నా కర్ర తీసుకొని చెట్టుకు కట్టిన గంటని మెల్లగా కొట్టాను. అవసరం వస్తే రాములు కోసం అట్టా పిలవడం నాకలవాటే.

మరో రెండు నిముషాలకి వచ్చింది రాములు. మొహం దిగులుగా ఉంది. తాతని, ద్రాక్షని చూపెట్టా. ద్రాక్ష తీసుకొని లోనికెళ్ళి కాసేపటికి తాతకి టీ కూడా తెచ్చింది.
నాకు ద్రాక్ష, తాతకి టీ గ్లాసు అందించి తాత కాడనే కూకుంది.

“ఏమయిందే రాములు? బాగా ఏడ్చినట్టున్నావు. నీ పెనిమిటి సంగతేమయింది?” టీ తాగుతూ రాముల్ని అడిగాడు తాత.

బొళ్లున ఏడ్చేసింది రాములు. “వాడికి వ్యాధి ముదిరిందంటయ్యా. వాడి రెండో భార్య వాడి కాడ డబ్బులు తీసుకోడమే కాని, వాడి సంగతే పట్టించుకోదంట. మామని ఎవరితోనూ కలవనివ్వదంటయ్యా.
మామని చూడ్డానికి, చివరికి నేనెల్లినా, వాడ్ని చంపేస్తానందంటయ్యా,” అంది వెక్కుతూ ఆమె.

“బంగారం లాంటి నిన్ను పిల్లలు పుట్టలేదన్న పిచ్చి సాకుతో వదిలేసి, తెలిసి తెలిసి అసుమంటి దాన్ని మారు మనువాడితే, బాధలు పడక తప్పుతాదా? అది మాత్రం కన్నదా పిల్లల్ని? లేదే.
పైగా ఇద్దరూ కలిసి తాగుడికి బానిసయ్యారంట. వాడి ఖర్మ. నువ్వు బాధపడమాకు. నీ చేతుల్లో ఏం లేదే,” అంటూ రాముల్ని ఓదార్చాడు తాత.
ఖాళీ అయిన టీ గ్లాసు పక్కకెట్టి నిముషం ఆగాడు..

“అయినా, నువ్వు కూడా మొండిగా, వయసులో పెద్దోడైన నీ మేనమామనే మనువాడుతానని గోలెడితివే? చదువుకోకుండా, మాటినకుండా నీ అయ్య పక్షవాతంతో మంచాన పడేవరకు బాధపెడితివి… ఇప్పుడు నువ్వేడుస్తుండావు. నీ కష్టం చూసి నా గుండె కలిచేస్తుంది రాములు,” అన్నాడు తాత బాధగా.

**

రెండు రోజులయినా రాములు దిగులుగానే ఉంది. ఆమెని మాట్లాడించాలనే ప్రయత్నం చేస్తున్నా.

రాములట్టా మాటలేకుండా ఉంటే రోజంతా అస్సలు తోచడం లేదు. చేసేది లేక ఇంకింతసేపు పుస్తకం చదవటం చేస్తున్నా.

రెండో పుస్తకం సగమయ్యేప్పటికి చుట్టూ ఉన్న ప్రపంచం అక్షరమయంగా తోచింది నాకు. ఎక్కడ అక్షరాలు కనబడ్డా చదవడం సంతోషంగా ఉంది. చిన్న సాదా మాటలు గుణించుకొనే పనిలేకుండా చదవగలను. ఇప్పుడు చిన్న తరగతి పుస్తకాలు చదివి, లెక్కలు కూడా చేస్తున్నా.
**
మరో రెండు ఎండాకాలాలు, రెండు చలికాలాలు గడిచాయి. నాకు పన్నెండేళ్ళు నిండాయి.
గడిచిన రెండేళ్ళల్లో నా చదువు విషయంగా ఉమమ్మ నన్ను మెచ్చుకొంది.
నా మీద నాకు నమ్మకం, ధైర్యం వచ్చాయి.
‘ఇప్పుడు నాకు మాట వస్తే కాస్త చక్కంగానే మాట్లాడగలను కూడా!’ ఉమమ్మకి మల్లే …..అనుకున్నాను.
ఏదైనా బాగానే చదవగలను. రాయగలను. పెద్ద పదాలు కూడా అర్ధమవుతున్నాయి.

ముందుగా నా వెనుక రావి చెట్టునున్న బోర్డుల మీద వివరాలు సుళువుగా చదివాను.
‘విన్నపము’ అని రాసున్న బోర్డు మీద నా పేరు, నా పేరుతో పాటున్న వివరాలు ముందుగా చదివాను……
‘గాయత్రి’ అనే ఈ అమ్మాయి – మాట, నడక లేని అభాగ్యురాలు. జీవనాధారం లేని ఈ చిన్నారికి వైద్య సహాయార్ధం దయతో మీ విరాళాన్ని ‘గాయత్రి’ హుండీలో వేయ ప్రార్ధన.
ధన్యవాదములు…. – ఇట్లు ఆలయ నిర్వాహకులు ….

అక్కడినుండే అందరికీ నా పేరుతో పాటు పూర్తిగా నా గురించి తెలుస్తుందన్న సంగతి అర్ధమయ్యింది.

పోతే, పైన ఉన్నది పూజా వస్తువుల వివరాలు, ఖరీదుల పట్టికలు, డబ్బు చెల్లించే పద్ధతి….

‘ఆలయ నిధుల కోసం పూజాసామగ్రిని మీ వీలు కోసం విక్రయిస్తున్నది గాయత్రి. వస్తువులు కొన్నవారు నిధులని పక్కనే ఉన్న ‘గుడి’ హుండీలో వేయ ప్రార్ధన – ఇట్లు ఆలయ నిర్వాహకులు’
ఆరు నెల్లక్కోసారి ఆ పలకలకి, బోర్డులకి రంగులు వేయించి తిరిగి కొత్తగా రాయిస్తుంటారు పూజారయ్య.
(ఇంకా ఉంది )

ఎగిరే పావురమా! – 3

serial-banner3

మూడవ భాగం

తాత పూర్తి పేరు ‘సత్యం సాయిరాం’ అంది. వాళ్ళది మంగళగిరిలో చీర నేతగాళ్ళ కుటుంబమంట. పదారేళ్ళ వయస్సులోనే సవతితల్లితో పడలేక ఇల్లొదిలి విడిగా వొచ్చేసి గంగన్నపాలెం చేరాడంట. కొన్నాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ, తరువాత ఆటో రిక్షా నడపడం మొదలెట్టాడంట.

 కోవెలకి వస్తూపోతూ పూజారయ్యతో పరిచయం, కొలువు కాడ రాములు తండ్రితో స్నేహం పెంచుకున్నాడంట తాత.

అందరూ తాతని ‘సత్యమయ్యా’ అని పిలిస్తే పూజారయ్య మాత్రం ‘సత్యం’ అని పిలుస్తారంట.

 పూజారయ్య కూతురు ఉమమ్మని బడికి తీసుకెళ్ళడం, ఆయన భార్య మంగళమ్మకి ఇంటి పనులతో సాయం చేయడం, పూజారయ్యని స్నాతకాలకి, వ్రతాలకి తీసుకెళ్ళడం చేస్తూ, పూజారయ్య కుటుంబానికి దగ్గరయ్యాడంట తాత.

 “ఇంటున్నావా లేదా మీ తాత కథ? అడిగింది….రాములు నన్ను.

‘చెప్పు, ఆపకు,’ అని సైగ చేసాను.

పాలెంలోనే ఉంటూ అందరికీ చాతనైన సాయం చేస్తూంటాడంట. తనని ఆదుకొని  గుళ్ళో పనిప్పించింది కూడా తాతేనంది రాములు.

తాత గురించి వింటుంటే, నాకు కన్నీళ్ళాగలేదు.

అది చూసి, “ఇదిగో నువ్విట్టా ఏడిస్తే నేను చెప్పను,” అని కోపగించుకుంది రాములు. కళ్ళు తుడుచుకొని ఇంకా చెప్పమని బతిమాలాను.

క్షణమాగి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.

“ఇకపోతే, సత్యమయ్యకి పెళ్ళాం, ఒక కొడుకు ఉండేవారని ఇన్నాను. కొడుకు పుట్టి చిన్నప్పుడే జబ్బు చేసి పోవడంతో, మనస్సు పాడయి పెళ్ళాం ఎటో ఎళ్ళిపోయిందని అంటారు.

ఇంకోప్రక్క తండ్రిని – అతని రెండో పెళ్ళాం మోసగించి పారిపోతే, అతనితో పాటు పదేళ్ళ చంద్రమ్మని కూడా దగ్గరెట్టుకుని సత్యమయ్యే సాకాడని కూడా ఇన్నాను.

కష్టపడి పని చేసేవాడని, కడుపు నొప్పితో బాధపడుతూ కూడా చానాళ్ళు ఆటో నడిపాడని అందరికీ తెలిసిందే. వాంతులయ్యి తరచు ఆసుపత్రిలో చేరేవాడు,” అని క్షణమాగింది రాములు.

‘ఆగావెందుకు? చెప్పు’ అన్నట్టు రాములు కాలు మీద తట్టాను.

“జబ్బు పడ్డప్పుడల్లా కషాయం కాసిచ్చేదాన్ని,” అని ఆమె అన్నప్పుడు

మళ్ళీ ఏడుపు ఆగలేదు నాకు. రాములికి కనబడకుండా కళ్ళు తుడుచుకున్నాను.

“ఇక రానురాను నీరసపడిపోయి ఆటో నడపలేక, గుడిలో పని వొప్పుకున్నాడు. ఆ తరువాతే మీ తాత ఆరోగ్యం కాస్త కుదురుగా ఉంది,” అని  నిట్టూర్చింది రాములు.

రెండో జడ కూడా వేయడం ముగించి, రాములు నడినెత్తిన తట్టడంతో, “ఏమిటి?” అన్నట్టు చూసానామెని.

“ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? ఇంకిప్పుడు ఎర్ర రిబ్బన్లు పెట్టబోతున్నా. ఎంత బాగుంటాయో సూడు నీ జడలు,” అంది రాములు.

జడలు తడిమి చూసుకొని మళ్ళీ తల తిప్పి ఆమె వంక చూసాను.

‘మరి నా సంగతి ఏంటి? నేనెప్పుడు? ఎలా వచ్చాను? తాత కాడికి,’ అని సైగలతో అడిగాను.

“నాకేం తెలుసు నీ సంగతి,” అంటూ నవ్వింది రాములు.   గమ్మునుండిపోయాను. రాములు మీద కోపంతో తల వంచుకున్నాను.

నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి, “నీ బుంగమూతి సూడాలని అట్టాగన్నాలే. మరీ చిన్నపాపలా అట్టా అలగమాకు, నీకిప్పుడు ఎనిమిదేళ్ళు,” అంటూ నా బుగ్గలు నొక్కింది రాములు.

నా గురించిన విషయాలు చెప్పడం మొదలెట్టిందామె.

 

egire-paavurama-3-pic-part

“మీ తాతకి దగ్గర దగ్గర అరవైయేళ్ళ వయస్సులో, ఇంకా ఆటోరిక్షా నడుపుతున్నప్పుడే నువ్వు అతని కాడ చేరావుగా! పసిపిల్లవంట.

మీ అమ్మ నిన్ను పెంచలేకపోయిందంటలే.   పూజారయ్యగారి చేత నీకు ‘గాయత్రి’ అని అమ్మవారి పేరు పెట్టించి, కష్టపడి పెంచుకున్నాడు సత్యమయ్య.

నేను ఈడ గుడికి స్వీపరుగా వచ్చినప్పుడు నీకు నాలుగేళ్ళు కదా! నీ ఇషయాలే చెప్పేవాడు. ఐదోయేడు నిండాక గాని, నిన్ను గుడికాడికి తెచ్చాడు కాదు,” అంటూ మళ్ళీ ఆగింది రాములు.

నా జడలకి రిబ్బన్లు పెట్టడం ముగించి నా ముందుకి వచ్చి కూకుంది. ముంగురులు సర్దుతూ నా గురించిన విషయాలే చెబుతూ పోయింది. చెవులప్పగించి వింటున్నాను.

“ఇక ఆరోయేడు నుండీ, పూజసామాను అమ్మకాలకి కూకుంటున్నావు కదా! ప్రతిపొద్దు నీ ముందు పూజసామాను మీ తాత సర్దితే, నీకు మరో పక్కన కాస్త ఎనకాలకి ‘గాయత్రి’ హుండీ’ – అదే, ఆ చెక్కపెట్టి- ఉంచేది నేను కదా!

అది ‘నీ కోసం’ పెట్టిందన్నమాట. అది ఆడుంచి నీకు సాయం చేయమని పురమాయించారు మన పూజారయ్య. నిన్నీడ కూకోబెట్టాలన్నదీ పూజారయ్యే. చెక్కపెట్టి హుండీ మీద ఉమమ్మ చేత ‘గాయత్రి’ అని నీ పేరు రాయించింది కూడా మన పూజారయ్యే.

అసలీ అరుగుకి పైకప్పు యేయించి, ఎనకమాల గదులు బాగుచేయించింది కూడా నీ కోసమేరా,”

అని ఇక అక్కడికి చెప్పడం ఆపి, గట్టిగా ఊపిరి తీసుకొంది రాములు.

“అదమ్మా మీ కథ. నీ జడలు బాగా కుదిరాయి. అద్దం తెస్తాను సూసుకో. నాకైతే ఆకలిగా ఉండాది. నీక్కూడా తినడానికి ఏదైనా తెస్తా,” అంటూ పైకి లేచి నూనె సీసా, సామాను తీసుకొని లోనికెళ్ళింది రాములు.   పోతూ ఖాళీ అయిన పావురాళ్ళ గింజల డబ్బా కూడా అందుకొంది.

**

తాత గురించి రాములు చెప్పిందే ఆలోసించాను. పూజారయ్యగారమ్మాయి ఉమమ్మ గురించి కూడా… అందంగా ఉంటది ఉమమ్మ. మొన్ననే పద్నాలుగేళ్ళు నిండాయంట ఆమెకి.

‘కనపడినప్పుడల్లా నవ్వుతూ నా కాడికొచ్చి పలకరిస్తది కూడా’ అని గుర్తు చేసుకున్నా.

**

అద్దం, బొరుగుల పొట్లం ఓ సేత్తో, పెద్ద బరువైన సంచీ మరో సేత్తో పుచ్చుకుని కాళ్ళీడుస్తూ వచ్చింది రాములు. అన్నీ అరుగు మీదుంచి ఎదురుగా కూకుంది.   అది రయికల బట్టల సంచీలా కనిపించింది.

తలెత్తి ఆమె వంక చూసాను.

“నేను పోయి పెద్ద దీపాలు కడిగివ్వాలి. నువ్వు ఈ రైకల బట్టల్ని సక్కగా మడతలేసి పక్కనెట్టు. పంతులుగారు వాటికోసం అట్టడబ్బా ఇస్తాన్నాడులే,” అంటూ ఎళ్ళింది రాములు.

సంచి నుండి రయికలు తీస్తుండగా, దూరంగా ఉమమ్మ మాటలు వినొచ్చాయి. పక్కకి తిరిగి చూస్తే గుడి బయట నుండి తాతని వెంటెట్టుకొని ఉమమ్మ నావైపు రాడం అగుపడింది.

దగ్గరగా వచ్చి, తాతని ఎదురుగా అరుగు మీద కూకోమని, తను నా పక్కనే కూకుంది.

నా చేయి తన చేతిలోకి తీసుకుంది ఉమమ్మ.

“నీకిప్పుడు ఎనిమిదేళ్ళు నిండాయి గాయత్రీ. నువ్వు చదువుకోవాలని మీ తాత ఆశ పడుతున్నాడు. నువ్వు బడికి పోలేవుగా! అందుకొని నేను నీకు చదువు చెప్పడం మొదలెడతాను.

వారానికి రెండురోజులు గంటసేపన్నా నా దగ్గర చదువుకోవాలి. మిగతా రోజుల్లో నేర్చుకున్నవి చదివి, రాసి మళ్ళీవారం నాకు అప్పజెప్పాలి. చేస్తావా?” అనడిగిందామె నన్ను.

పెద్ద తరగతి చదివే ఉమమ్మ నాకు చదువు చెబుతానంటే సంతోషమనిపించింది. సరేనని తలూపాను.

తన చేతిసంచి నుండి నాకు చాక్లెట్టు తీసిచ్చింది.

“సరే కానీ, నీ జడలు ఎవరు వేసారు? చాలా అందంగా ఉన్నాయే? మా అందరి తలనీలాలు కలిపితే నీ ఒక్క జడంత ఉంటాయేమో,” అని గలగలా నవ్వింది ఉమమ్మ.

ముందుకు పడిన జడల్ని వెనక్కి తీసుకున్నాను… నన్నామె మెచ్చుకుందని బాగనిపించింది.

“ఇవాళ నాకు స్కూలు సెలవు. ఓ గంటలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను.

తయారుగా ఉండు. ఇవాళే నీ చేత అక్షరాలు దిద్దిస్తా,” అని చెప్పెళ్ళినామె, గంటలోపే కొత్త నోటుపుస్తకం, పెన్సిళ్ళు, పలక, బలపం తీసుకొచ్చింది.

అమ్మవారికి అర్చన చేయించాక నాచేత ఓనామాలు దిద్దించింది.

తాతతో పాటు పూజారయ్య, పంతులుగారు, నాయుడన్న, రాములు కూడా సంతోషించారు.

“నువ్వు శ్రద్ధపెట్టాలే గాని, నేను పద్ధతిగా చదివిస్తానని సత్యమయ్యకి మాటిచ్చాను. మీ తాత కూడా తొమ్మిదో తరగతి వరకు చదివాడని తెలుసా? అడిగింది ఉమమ్మ.

“ఇకపోతే నాకు బుధవారాలు కాక ఆదివారాలు సమయం దొరుకుతుంది. వచ్చే వారం నుండి ఆ రెండు రోజులు మధ్యాహ్నాలు మూడింటికి వస్తా. సరేనా?” అడిగింది ఉమమ్మ.

‘ఉమమ్మ మాటతీరు ఎంతో బాగనిపించింది నాకు. అందరి మాటల్లా కాకుండా, చక్కంగా, తీయంగా తోచాయి ఆమె మాటలు. వింటూ ఆమెనట్టాగే చూస్తుండిపోయాను. ఆమె కాడ చదువే కాదు, ఆమెలా సక్కంగా మాట్లాడ్డం నేర్చుకుంటే గొప్పగా ఉంటుంది’ అనిపించింది.

పూజారయ్య నేనున్న అరుగు కాడికి వచ్చారు.

“నీకు ఉమమ్మ ఇచ్చిన అట్లతద్ది బహుమానం ఈ అక్షరాభ్యాసం, శ్రద్ధగా చదువుకోవాలి మరి,” అంటూ నా తలను తాకి దీవించారాయన………

“గుడి కార్యకలాపాలు, ఈ చదువు, గాయత్రి ఎదగదలకి  సరైన పునాదులు. బాగానే చదువుకుంటుందిలేరా సత్యం,” అన్నాడాయన ఎదురుగా ఉన్న తాతతో….

“పెద్ద పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయంటమ్మా అవిటివాళ్ళకి ప్రత్యేక బడులు.

మన పాలెం బడిలో అట్టా వసతి లేదన్నారు మాస్టారుగారు.  అసలు గాయత్రిది పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం కాకపోనేమో అని నా ఆశ. అందుకే తమరు దానికి కాస్త చదువంటూ మొదలెడితే బాగుంటుందని చొరవ చేసి అడిగాను. నీకు పుణ్యమే ఉమమ్మా,” అన్నాడు వినయంగా తాత.

 

ఇంతలో, రెండు మట్టి ముంతలు తెచ్చి నాకొకటి, ఉమమ్మకొకటి ఇచ్చింది రాములు.   గోరింటాకు ముంతలంట. ఇంటికెళ్ళి పనులయ్యాక పెట్టుకోమంది.

అలా ఆ రోజు నుండి నాకు చదువు చెప్పడం మొదలెట్టింది ఉమమ్మ.

అందరూ అరుగుల కాడ ఉండగానే, రోజూ రెండోసారి వచ్చే సమయానికే పావురాళ్ళు కూడా వచ్చాయి. అరుగులకి దూరంగా తచ్చట్లాడుతూ గింజల కోసం కువకువలాడ్డం మొదలెట్టాయి.   గింజల డబ్బా అందుకొని వాటికి దానా ఎయ్యడానికి అటుగా పోయింది రాములు.

**

నేను చదువుకోడం తాతకి చాలా గర్వంగా ఉంది. మధ్యానాలు ప్రసాదం తింటూ చదువుల మాటలే చెబుతున్నాడు. బాగా చదువుకుంటే జీవనం బాగుంటదన్నాడు.

“నాకు చదువుకోవాలని ఎంతో ఆశగా ఉండేదిరా గాయత్రీ. నాకు దక్కని అవకాశం కనీసం నీకైనా ఉండాలనే నా తపనంతా,” అన్నాడు ఓ మారు.

ఈ మధ్య, తన ఊరు మంగళగిరి గురించి, అమరావతి అమ్మవారి ఆలయం గురించి చెప్పాడు. ఈ ఊళ్ళకి కుడి పక్కన పారే కృష్ణానది, చుట్టుపక్కలనున్న ఉండవల్లి గుహల అందాలు గురించి చెప్పాడు. తను స్నేహితులతో సైకిళ్ళ మీద ఉండవల్లి, భట్టిప్రోలు గుహల వరకు కూడా వెళ్ళేవాడంట.

“ఇవన్నీ మనకి దగ్గరలోనే, గుంటూరు జిల్లాలోనే ఉన్న ఊళ్లు, గ్రామాలు,” అన్నాడు తాత. “విజయవాడ మాత్రం కాస్త దూరంగా ఉంది, అక్కడ కృష్ణానది తీరానే కనకదుర్గమ్మ ఆలయం బ్రహ్మాండంగా ఉంటదిరా, ఆ తల్లి దర్శనానికి ఎప్పటికైనా పోదాములే,” అని కూడా అన్నాడు.

**

గుళ్ళో ఎప్పుడూ ఉండే సందడికి తోడు, చదువు, పరీక్షల మధ్య రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి.

కొద్ది రోజుల్లో నాకు పదేళ్ళు నిండుతాయని గుర్తు చేసుకుంటుంటాడు తాత.

చదువు మొదలెట్టి గడిసిన రెండేళ్ళల్లో అక్షరాలు దిద్దాక, ఇప్పుడు చిన్న మాటలు రాయగల్గుతున్నాను.

చిన్న లెక్కలు చేయగలను. నా పేరే కాక ఇతరుల పేర్లు చిన్నవైతే చదవగలను, గుర్తించగలను.

ఉమమ్మ మాటతీరు కూడా గమనించి నాకిష్టమైన మాటలు గుర్తెట్టుకుంటున్నాను.

రాములు నా పక్కనెట్టే చెక్కపెట్టి మీద, రావి చెట్టునున్న మరో బోర్డు మీద కూడా నా పేరు చూశాను. ఆడనుండే కొందరు నన్ను పేరు పెట్టి పలకరిస్తారని ఎరుకయింది.

**

పనయ్యాక, నాకాడ చేరిన ప్రసాదాలు, డబ్బులు సర్దుకొని ఇంటిదారి పట్టాము. రిక్షా ఎనకాలే నడుస్తున్న తాత దారిలో పుజారయ్యగారి ఇంటి ముందు ఆగమన్నాడు.

మా కోసం ఆరుబయటకి వచ్చిన పూజారయ్యతో నా గురించి చెప్పాడు. “రేపు గాయత్రి పుట్టినరోజయ్యా. నిండా పదేళ్ళండయ్యా. ఓసారి తమరు ఆలోచన చేసి, గాయత్రి మాట-నడక విషయమై పట్నంలో వైద్యుల కాడికి పంపే ఏర్పాటు చెయ్యాలండయ్యా ,” అన్నాడు తాత చేతులు జోడించి.

‘……నా పుట్టిన రోజంట రేపు…’ వాళ్ళ మాటలింటున్నాను….

“అలాగేలే సత్యం, తప్పకుండా పట్నంలో వైద్యులతో మాట్లాడుదాము. పోతే, రేపు కాస్త పొంగలి, బెల్లంపాయసం చేయించి గుడి మెట్లకాడ పంచుదాములే. నువ్వు అమ్మవారి అర్చనకి మాత్రం డబ్బుకట్టుకో,” అంటూ నా వంక చూసి, “ఏమ్మా చదువు బాగా సాగుతుందా?” అని అడిగారు.

ఔనన్నట్టు తలాడించాను.

“ఆ చిన్నపిల్ల పై మా అందరికి జాలేరా, సత్యం. పైగా గాయత్రి పూజసామగ్రి దగ్గర రోజంతా కూర్చుని, కోవెలకి తన వంతుగా సాయపడుతుంది కదా! మనం కూడా మరి ఆ అమ్మాయి కోసం, భక్తుల సాయం అర్ధిస్తూ ‘గాయత్రి’ పేరుతో హుండీ కూడా పెట్టించాముగా,” అన్నారాయన మళ్ళీ తాత వంక తిరిగి.

“అంతా తమరి దయ,”చేతులు జోడించి దణ్ణాలెట్టాడు తాత.

**

చీకటితో  నిద్ర లేపాడు తాత. ముఖం కడిగించి పక్కింటి నుండి పిన్నిని పిలుచుకొచ్చాడు. నా పుట్టినరోజున పెందరాళే తలంటి, కొత్తబట్టలు వేసి, ప్రత్యేకంగా ముస్తాబు చేయమని ఆమెని పురమాయించాడు.

బుద్ధి తెలిసినప్పటి నుండి నాకు అన్నీ చేసేది చంద్రం పిన్నే. చంద్రమ్మని ‘పిన్ని’ గా అనుకోమన్నదే తాత. నామటుకు నాకు చంద్రమ్మ, అమ్మతో సమానమే. నాకు పిన్నంటే బాగా చనువే.

నాకు, పుట్టినరోజన్న ఉత్సాహం లేదు. అసలు చికాకుగా ఉంది. కొద్ది రోజులుగా నా అవిటితనం గురించి దిగులు ఎక్కువయ్యింది. నా ఈడువాళ్ళలా పలకాలని,  పరుగులెట్టాలని వెర్రి  ఆశగా ఉంటుంది నాకు. కానీ మాట పెగలక, కాళ్ళు కదలక దుఃఖం పొంగుకొస్తుంది. నా స్థితి ఇలా ఎందుకుంది? అసలు నాకేమయింది? తాతని అడగాలనుకున్నాను.

నా తల దువ్వుతున్న పిన్నితో మాట కలుపుతూ నా పక్కనే కూకునున్నాడు తాత.

ఇక నాకు దుఃఖం ఆగలేదు. గట్టిగా ఏడ్చేశాను. తాతని అడిగేశాను.

కాన్నీటితో వెక్కిళ్ళెడుతూ, “ఆ, అమ్,” అని నోటితో పదే పదే నాకు చేతనయిన శబ్దాలు చేస్తూ, చేతితో నా గొంతు తాకి, నా పాదాలు తట్టి చూపిస్తూ ఏడ్చాను.  “ఏ ఏం,” ఎందుకు నేను ఇట్టా?” అన్నట్టు సైగలతోనే అడిగాను.   కోపగించుకున్నాను.

“నీకు తెలుసు తాత, సెబుతావా లేదా,” అనాలని ఏడుస్తూ తాత భుజాలు పట్టుకు కుదిపేశాను. నా ఏడుపుకి, చేష్టలకి చంద్రమ్మతో పాటు తాత కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

తన కళ్ళెంట కూడా నీరు కారుతుంటే, నా కళ్ళు తుడిచాడు తాత.

నన్ను దగ్గరికి తీసుకొని, తల నిమిరాడు.

“అంతా ఆ దేవుడు లీల తల్లీ, నీవు రోజూ ఆ దేవతకి కనబడుతావుగా! అడుగు. నేనూ అడుగుతాను. ఎప్పుడో ఒకప్పటికి ఆ అమ్మవారు పలుకుతాది, నీ మీద దయ సూపుతాది,” అంటూ లాలించాడు తాత.

చంద్రం పిన్ని కూడా కళ్ళు తుడుచుకొంది.

“పిచ్చిపిల్లా అంత ఉక్రోషం ఎందుకే? తాత నీకోసం అన్నీ చేస్తున్నాడు.   తన సుఖం కూడా చూసుకోకుండా ఈ వయస్సులో నీ కోసం ఎన్ని అమర్చాడో తెలుసా?

రాములమ్మ తోడు, ఉమమ్మ సదువు, పూజారయ్య ఆశీస్సులు అన్నీ నీ బాగు కోసమే. తాత మంచితనం, సేవ వల్లనే నువ్వు ఇంత మాత్రం ఆనందంగా ఉన్నావురా,” అంటూ నా తల నిమిరింది.

“అంతెందుకు? మీ తాతని బట్టే కదా నిన్ను నా సొంతబిడ్డలా చూసుకుంటున్నాను.

పసిగుడ్డుని నిన్ను పగలంతా నా కాడ వదిలి, ఆరోగ్యం బాగోకున్నా కష్టపడి ఎన్నో గంటలు, ఎంతో దూరాలు ఆటో నడిపి సంపాదించేవాడు. రాత్రంతా నిద్రకాచి మరీ పెంచుకున్నాడే తాత నిన్ను.

సంతోషంగా ఉండాలమ్మా. నీవు బాగయ్యే రాతుంటే అవుతుంది. తాత ప్రయత్నిస్తాడులే,” అంది పిన్ని నన్ను దగ్గరకి తీసుకొని.

కాసేపు పిన్ని వొళ్ళో తల పెట్టుకు తొంగున్నాను.

(ఇంకా ఉంది)

**

‘ఎగిరే పావురమా’! ….. రెండవ భాగం

GD banner part 2

“దసరాలయ్యి వారమైనా, ఈ తడవ మిగులు పనులు అవ్వనే లేదు. అమ్మోరికి భక్తులిచ్చుకున్న కానుకలు, చీరలు సగమైనా సర్దలేదు,” అంది రాములు మాల కడుతూ.

పదిరోజుల దసరా పూజలకి గుడి హుండీలో తరగని చిల్లర చేరిందంట.
పూల పనులయ్యాక చిల్లర పట్టుకెళ్ళి వేరుచేయమని పంతులుగారు పిలిస్తే వెళ్ళింది రాములు.

చిల్లరతో నిండున్న పళ్ళాలు దొంతిగా పేర్చి పట్టుకొని, అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా వస్తున్న రాములుని చూసి నవ్వొచ్చింది.
అరుగు మధ్యగా పరిచిన తెల్లటి తుండు మీద చిల్లర పోసుకొని, కాసుల్ని వేరు చేయడం మొదలెట్టాము.
“ఆ చిల్లరంతా అయ్యేంతమటుకు రోజూ కాసేపు చెయ్యాలంట ఈ పని,”… అంది రాములు.

మధ్యానం ఒంటిగంటకి ముందే, కూరల బడ్డీ కాడ ఉండాల్సిన తాత గుడిలోకి రాడం అగుపడింది మాకు. వెనకాల ఓ పెద్దాయన, ఓ ఆడమనిషి కూడా ఉండారు.

“గుడి మూయడానికి ఇంకా అరగంటైనా ఉందే! సత్యమయ్య ఇయ్యాళ కాస్త పెందరాళే తినడానికి వస్తున్నాడా?” అంది రాములు అటుగా చూస్తూ. అప్పటికే ఆ పూట తినడానికి మాకు ప్రసాదాలు, తాగడానికి కొబ్బరినీళ్ళు తెచ్చి పక్కనెట్టింది.
“కాదులే, ఆయనెంట ఇంకెవరో కూడా ఉండారుగా,” అంది మళ్ళీ తనే.

మాకు దగ్గరగా వచ్చాక, ‘ఇప్పుడే వస్తా’ అన్నట్టు సైగ చేసి వచ్చినోళ్ళని గుళ్ళోకి తీసుకుపోయాడు తాత.
**
చిల్లర సంచులు అప్పజెప్పడానికి రాములటెళ్ళగానే, అరుగుల కాడికొచ్చాడు తాత.
తన వెంటున్నోళ్ళని ఆయుర్వేద డాక్టర్లు – లలితమ్మ, శివయ్యలుగా చెప్పాడు.
వాళ్లకి దణ్ణాలెట్టాను.

శివయ్య నాకు ఎదురుగా కూకుంటూ, ”బాగా ఎదిగావు పాప! నిన్ను మూడేళ్ళప్పుడు మా వద్దకు తెచ్చాడు మీ తాత. నిన్ను పరీక్షించి – ఆరోగ్యం, ఎరుక, తెలివితేటలు వయసుకి తగ్గట్టుగానే అనిపించడంతో, నీ కాళ్ళల్లో చలనం, నీ నోటెంట మాట తప్పక వస్తాయనే చెప్పాము,” అన్నాడు.

లలితమ్మ నా పక్కనే కూకుని నా కాళ్ళు పరీక్షించింది. ఎదురుగా నిలబడ్డ తాత వంక చూసి, “చూడు సత్యం, మేము గాయత్రిని చూసి కూడా అప్పుడే ఐదేళ్లవుతుంది. ప్రస్తుతం ఎనిమిదేళ్ళ వయస్సుకి తగ్గట్టుగానే ఉంది. పెరుగుదల విషయంగా ఏ లోటు లేదనిపిస్తుంది,” అన్నదామె.

“మరి నేనిచ్చే తైలం, పసరు కాళ్ళకి పట్టిచ్చి కాస్త మర్దన చేస్తున్నారా గాయత్రీ?” అని ఆమె నన్నడిగిన దానికి తలాడించాను. వారానికి ఒకసారే చేస్తున్నామన్న సంగతి ఆమెకి నచ్చలేదు.

తాత వంక తిరిగి, “పిల్లకి పద్దెనిమిదేళ్ళ వయస్సు వరకు పెరుగుదల ఉంటుంది.
ఈ లోగానే, ముందైతే, గాయత్రిని ఒకసారి మావద్దకి తీసుకొనిరా.
కాళ్ళకి వ్యాయామం చేయడం నేర్పిస్తాను,” అంది డాక్టరమ్మ.

చిల్లరప్పజెప్పి తిరిగొచ్చిన రాములు, ఆమె మాటలింటూ కాస్త ఎడంగా నిలబడుంది.

ఇక వెళ్లాలంటూ అరుగుల మీద నుండి లేచారు లలితమ్మ, శివయ్య.
“ఏమ్మా గాయత్రీ, నువ్వు ఈ పరిమితులు అధిగమించి వృద్ధిలోకి రావాలని కోరుకుంటాము,” అంటూ నన్ను ఆశీర్వదించి వెళ్లారు..

రాములు దగ్గరగా వచ్చి నా భుజం తట్టింది…

“అంటే నీ ఇక్కట్లని దాటి, అందరిలా నువ్వూ నడవాలని, మాట్లాడాలని అంటుంది ఆ డాక్టరమ్మ,” అంది అరుగు మీద పక్కకెట్టిన ఫలారాలు అందుకుంటూ….

**

 

సామాను అప్పజెప్పి మేము ఇంటి దారి పడుతుండగా, మరునాడు సాయంత్రం గుళ్ళో పురాణ కాలక్షేపం ఉందని మాకు గుర్తు చేసాడు పంతులుగారు.
మూడు నెలలకోసారి జరిగే పురాణ కాలక్షేపంకి ఊరంతా కదిలి వస్తది. అదయ్యేంత మటుకు నేను, తాత గుళ్ళోనే ఉండిపోతాము కూడా.

**

మధ్యానం నాలుగింటికి ఇంకోసారి అరుగులు శుభ్రం చేయించారు పూజారయ్య.
నేను, రాములు ముందుగానే పుజసామాను పంతులుగారికి అప్పజెప్పి అరుగుల మీద ఓ పక్కగా కూకున్నాము.
ఆరింటికి మొదలయ్యే కాలక్షేపం కోసం, గంట ముందే – అరుగుల కాడ ప్రత్యక్షమయ్యారు సుబ్బి, మాణిక్యం.

“కాసేపు నీతో కూచుని మాట్లాడచ్చని ముందుగా వచ్చామమ్మా ఓ రాములమ్మా,” అంది నవ్వుతూ సుబ్బి. “ఇదిగో నీకోసం మిరపకాయ బజ్జీలు చేశాను,” అంటూ రాములికి పొట్లం అందించింది మాణిక్యం.
ఆ పొట్లం నా ముందుంచి, ఎదురుగా అరుగు మీద స్నేహితురాళ్ళకి దగ్గరగా కూకుంది రాములు.
నేను ముగ్గుల పుస్తకం ముందేసుకుని, బజ్జీ తింటూ వాళ్ళ మాటలు వింటున్నాను.
కాసేపు ముగ్గురూ కబుర్లు, నవ్వుల్లో గడిపారు.

“కబుర్లకేముంది కాని రాములూ, నీ మామతో సంగతి తేల్చుకున్నావా? లేదంటే నిన్నింకా కాపురానికి పిలుస్తాడన్న భ్రమలోనే ఉంటావా? అడిగింది సుబ్బి.

రాములు తలొంచుకొని నేలచూపులు చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

రాములలా కంటతడి పెట్టడం నాకు చాలా బాధేసింది. ఆమె కష్టం ఏంటని తెలియకున్నా, రాముల్ని అలా చూడలేకపోయా.
మాణిక్యం మాత్రం, లేచి రాములికి దగ్గరిగా వచ్చింది.

ఆమె భుజం మీద చేయివేసి, “ఏడవమాకే రాములు. నీకు సాయపడదామన్న ధ్యాసతో గట్టిగా అడిగింది సుబ్బి. నిన్ను కష్టపెట్టాలని కాదు. నువ్వు కళ్ళు తుడుచుకో. తరువాత మాట్లాడుదాములే,” అని సర్దేసింది మాణిక్యం.

“నువ్వుండవే మాణిక్యం. ప్రేమించానంటూ మేనమామని ఈ గుళ్ళోనే కదా! ఏడేళ్ళ కిందట మనువాడింది రాములు. అతనేమో దీన్నొగ్గేసి అప్పుడే నాలుగేళ్ళగా మరెవ్వత్తినో కట్టుకొని వేరే కాపురమెట్టాడు. ఇదేమో అతన్ని గదమాయించి అడగదు. పాతికేళ్ళకే ఒంటరిదై ఎలా బతుకుతుంది ఇది?” అంటూ మండిపడింది సుబ్బి.

‘ఏందో ఇదంతా? వాళ్ళ ముగ్గురి మధ్య గొడవ’ నాకొకింత భయమేసింది.

‘వాళ్ళిద్దరూ తన మేలు కోరేవాళ్ళని, తనకన్నా బాగా చదువుకున్నాకే పెళ్ళిళ్ళు చేసుకొన్నారని చెబుతుంటుంది రాములు. పాలెంలోనే ఉంటూ, కేవలం తన మీద ఆపేక్ష కొద్దీ వచ్చి పోతుంటారంటుంది కూడా.
‘మరి ఇంతలా ఈ తగువులెందుకో, ఈ కేకలెందుకో వీళ్ళ మధ్య’ అనుకున్నాను.

పురాణంకి జనం రాడం మొదలవడంతో, ముగ్గురూ కాస్త సర్దుకున్నారు.

egire-paavurama-2-inside
**
పురాణ కాలక్షేపంలో – మధ్యన కూసేపు, నా ఈడు పిల్లలు పాటలు పాడారు. వాళ్ళల్లో ఎనిమిదేళ్ళ కవలలు చక్కగా పాడారని జనమంతా మెచ్చుకున్నారు. వాళ్ళు పంతులమ్మ మహలక్ష్మిగారి కూతుళ్ళంట.
శిష్యులందరి తరఫునా, ఆమె మెప్పులందుకుంది.
**
ఇలా గుడికొచ్చే నా తోటి పిల్లల్ని చూసినప్పుడు మాత్రం వాళ్ళకీ-నాకు మధ్య తేడా గుర్తొస్తది. అంతే కాదు పోను పోను నా స్థితి ఏమిటో ఎరుకయింది. ‘నేను అందరిలా మాట్టాడలేనని, నడవలేననే కాదు. ఎన్ని రోజులు గడిచినా నాకు మాట, నడక ఇక రావనిపిస్తది. ఎప్పటికీ ఇక ఇంతేనని’ గుబులుగా కూడా ఉంటది.

వెంటనే తాత గుర్తొస్తాడు. నన్ను తాత ఎంతో ప్రేమతో సాకుతున్నాడన్నదీ గుర్తొస్తది.
పసిబిడ్డగా దిక్కులేని నన్ను తాత దయతో దగ్గరికి తీసాడని నాకెరుకే. మరి నాకు అమ్మా నాన్న లేనట్టేగా! అని బాధగా ఉంటది. ఒకవేళ ఉన్నారేమో! ఉంటే ఏమయ్యారు? అని కష్టంగా అనిపిస్తది.

నా చుట్టూ లోకాన్ని చూస్తుంటే, రోజంతా ఈ మధ్య ఇలాంటి ఆలోచనలే కమ్ముతున్నాయి. ఒక్కోసారి పావురాళ్ళు వచ్చి నా ఆలోచనలని మళ్ళిస్తాయి. ఒకటైనా వచ్చి నా భుజం మీద కూడా వాలుతుంది.
పావురంలా ఎంచక్కా నేనూ ఎగిరిపోగలిగితే? నడవలేను-మాట్లాడలేను అన్న ఆలోచనే ఇక ఉండదుగా అనుకొని నవ్వొస్తది.
**
“కోవెల్లో మళ్ళీ దీపాల పండుగ సందడి రాబోతుంది,” అంది అరుగులు కడుగుతూ రాములు.
అరుగులు కాడ తచ్చాడి, అప్పుడే ఆకాశంలోకి ..దూసుకుపోతున్న పావురాళ్ళ వంక చూస్తూ, మా కాడికి వచ్చాడు పంతులుగారు.

చేతుల్లోని ప్రసాదం దొన్నెలు నా పక్కనే అరుగు మీదెడుతూ, మా దినచర్యలో భాగమయిపోయిన పావురాళ్ళు నిజానికి పెంపుడు పక్షులేనన్నాడు ఆయన.
“పావురాయి – శాంతికి, ప్రేమకి, చిహ్నం. నిష్కళంకమైనది కూడా. మీ ఇద్దరూ వాటిని దయతో చూస్తున్నారుగా! మంచిదే,” , “అలాగే ఆ గాయత్రీ దేవిని నమ్ముకోండమ్మా. మిమ్మల్ని ఆ తల్లి కాపాడుతుంది,” అంటూ నా వంక చుసాడాయన.

“ఏమ్మా గాయత్రీ, ఈ మధ్య పూలదండలు కూడా తయారు చేస్తున్నావుగా! ఇవాళ తులసిమాల నీవు చేసిందేనని చెప్పింది రాములు. చక్కగా ఉందమ్మా. కానివ్వు, మంచి పనే,” అంటూ వెనుతిరిగాడు పంతులుగారు.

రాములు వచ్చి నా పక్కనే కూచుని, ప్రసాదం అందుకుంది.
“అంటే, మన పావురాళ్ళు నీకు మల్లేనే అమాయకమైనవి, చాలా మంచివని చెబుతున్నాడు మన పంతులుగారు,” అంది నవ్వుతూ రాములు.
**
దీపాల పండుగ అనంగానే, బారులు తీరే పెమిదలు, రకరకాల తీపి మిటాయిలు, ప్రసాదాలు గుర్తొచ్చాయి. పండుగ బాగుంటుంది.

దీపాల పండుగప్పుడే నా చేత రాములుకి, పిన్నికి కూడా చీర, రవిక, గాజులు ఇప్పిస్తాడు తాతని గుర్తొచ్చింది.

“మా అయ్య జబ్బుపడి మంచాన ఉంటే, మరి మీ తాతే నా మనువు జరిపించాడు. అందుకే సత్యమయ్య నాకు తండ్రితో సమానం,” అని రాములు, గుర్తు చేసుకుంటే,
“సవితితల్లి బిడ్డనైన నన్ను, తన బిడ్డలా చూసుకుంటాడు మా అన్న,” అంటూ కంటతడి పెడుతుంది చంద్రం పిన్ని.
తాతంటే వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ అని కూడా గుర్తొచ్చింది.

**

వర్షం మూలంగా గుడి కాడనే, ఒకింత ఆగినంక ఇంటిదారి పట్టాము.
కొట్టాం చేరగానే, కాళ్ళు చేతులు కడుక్కొని, పొయ్యికాడ మూతేసున్న ముద్దపప్పుతో బువ్వ తింటుండగా వచ్చారు చంద్రం పిన్ని, రాంబాబాయి.

“ఏందన్నా? ఆలస్యంగా వచ్చారా ఇయ్యాళ? తొందరేం లేదు. మేమాగుతాములే. నింపాదిగా తినండి,” అంటూ మాకు కాస్త దూరంగా గట్టు మీద కూకున్నారు.

గబగబా తినేసి వాళ్ళ కాడికెళ్ళాడు తాత.
“ఇదిగోనే చంద్రమ్మా, నీ లెక్క. ఈ తడవ నువ్వన్నట్టు, చిల్లరంతా పోగేసి నోట్లుగా మార్చి ఉంచాను,” అంటూ తన చొక్కా జేబు నుండి డబ్బు నోట్లు తీసాడు తాత.
“ఇదేమో నీకియ్యాల్సింది. ఇదేమో మన గాయత్రి చెక్క హుండీ లోది. మరి చిన్నదాని లెక్కంతా నీ చేతుల్లోనే ఉంది,” అంటూ వేరువేరుగా ఆ డబ్బుని చంద్రం పిన్ని చేతికిచ్చాడు.

ఆమెనా డబ్బు లెక్కెట్టుకోనిచ్చాడు.
“ఏమైనా, నీ మేలుకి రుణపడి ఉంటానే చంద్రమ్మా. ఇంటి లెక్క, వంట, మా బాగోగులు అన్నీ నీవు చూడకపోతే, మేమెట్టా బతుకుతామో కదా!,” అన్నాడు తాత.
లెక్కెట్టిన డబ్బుని చెంగున ముడేసుకొంది చంద్రమ్మ.
“ఊర్కో అన్నా. ప్రతిసారి నువ్వీ మాటనాలా? తల్లొగ్గేసిన నన్ను ఆగమైపోకుండా కాపాడావన్న విశ్వాసమే అనుకో నాకు,” అంటూ లేచి, వెంట తెచ్చిన వెచ్చాలు పొయ్యికాడ ఉంచొచ్చింది పిన్ని.
రాంబాబాయి కూడా లేచెళ్ళి, పొయ్యి ఎనకాతల కిటికీలో మేకులు కొట్టి, ఏదో చెక్కపని చేడం మొదలెట్టాడు.

“సరేలే గాని, ఇక నుంచి గాయత్రిని రిక్షాలో గుడికి చేర్చన్నా. మా ఆయన కూడా అదే అంటున్నాడు.
నీ వయస్సుకి, ఇంత పిల్లని రెండు ఆమడల దూరం బండి మీద లాగడం మామూలు విషయం కాదు. చిన్న చక్రాలతో తేలిగ్గా ఉండేట్టు నువ్వు గూడురిక్షా చేయించినా, లాగాలిగా! నీ ఆరోగ్యం చూసుకో మరి. లేదంటే, గాయత్రికే కష్టమవుతది.
ఎల్లుండి నుంచి నేను మాట్లాడి పెట్టిన రిక్షాబ్బాయి వస్తాడు,” అని నా స్నానానికి బట్టలు, తుండు అందుకొంది పిన్ని.

“నీకు తెలిసిన రిక్షానా?” అడిగాడు తాత.
“అవును, మా ఆయన పని చేసే రవాణా ఆఫీసులో ఆటోరిక్షా ఇప్పించమని అర్జీ పెట్టాడంట ఒక తెలిసినబ్బాయి. ప్రస్తుతం పాలెంలోనే రిక్షా నడుపుతున్నాడులే అన్నా. మా ఆయన ఈ విషయం నాకు చెబితేనే ఇలా ఏర్పాటు చేసాను,” అంటూ భరోస ఇచ్చింది పిన్ని.

ఈ లోగా మా పొయ్యి ఎనకాతల కిటికీలో, వాళ్ళ కొట్టాం వైపుగా ఒక బడిగంట లాంటిది బిగించాడు రాంబాబాయి. నాకది చూపెట్టి, ‘గణగణా’ దాన్ని మోగించి ఇనిపించాడు కూడా. అత్యవసరంగా వాళ్ళని పిలవాలంటే “గంట మోగించడమే,” అంటూ చేతులు దులుపుకొని, పొలం సంగతి మాట్లాడాలని తాతని బయటికి తీసుకుపోయాడు.
“కాసేపు బాతాఖానికేమో, అట్టా బయటకెళ్ళారు. ఇద్దరికీ మంచి స్నేహితంలే. ఈలోగా నీ పని, నీ బట్టల పని కానిద్దాం పద ,” అంటూ కదిలింది పిన్ని.

**
శుక్రవారాలు అలవాటుగా అమ్మవారికి తులసి మాలలు కడుతుంది రాములు…
మాలలు అందించడానికి వెళ్ళినామె, చేతుల్లో రెండు గ్లాసులతో తిరిగొచ్చింది.
బెల్లం పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదం ఇచ్చాడంట పంతులుగారు. నా కిష్టమని తెచ్చానంటూ గ్లాసు చేతికిచ్చింది.
“తాతక్కూడా కాస్త తీసి అట్టే పెట్టాలే, నువ్వు కానిచ్చేయి,” అంది రాములు నా పక్కనే కూకుంటూ.
**

పాయసం తాగాక నా చేతి నుండి గ్లాసందుకుంది.
“నీకు రెండు జడలు ఎయ్యాలని ఉంది. అట్లతద్ది కదా! మధ్యాహ్నం వరకు గుడికి భక్తుల రద్దీ ఉండకపోవచ్చు. గుడిలోని పెద్దదీపాలు బయట పెట్టించారు పూజారయ్య. అవి శుభ్రం చేయడమే ఈ పూట పని. అంటే రద్దీ లేదు, పనీ లేదు, పొద్దూ పోదు,” నవ్వింది రాములు

“నీకు నా ‘అట్లతద్ది’ బహుమానంగా తలకి కొబ్బరి నూనె రాసి, తల దువ్వి ఈత జడెయ్యనా? లేదా రెండు జడలేసి యువరాణికి రిబ్బన్లు కట్టనా?” అని అడిగింది రాములు నా తలపైన మొట్టి.
రాములు తల దువ్వితే నాకిష్టమే. అందుకే రెండు జడలు కావాలని సైగ చేసాను.
నా భుజాల మీద చేతులేసి తలపైన ముద్దెట్టుకుంది రాములు.

”నీ జుట్టు ఇంత ఒత్తుగా, పొడుగ్గా అందంగా ఉంది. నీ బుగ్గన చొట్టలు, చారడేసి తేనెరంగు కళ్ళు, ముద్దొచ్చే నవ్వులు. యువరాణి అందమే. ఎవరి పోలికో గానీ,” అంటూ ఛటక్కున మాటలు ఆపేసింది రాములు.

వెనక్కి తిరిగి లోనికెళ్లి నూనె, రిబ్బన్ల పెట్టి తీసుకొనొచ్చింది. అరుగు మీద నన్ను ముందుకి జరిపి కూకోబెట్టి, జుట్టు చిక్కుదీడం మొదలెట్టింది.

“సరేలే, తిన్నగా కదలకుండా కూకోవాలి మరి. నీ జుట్టు బారెడు. పెద్ద పని కదా. గంట పడుతుందేమో!” అంది రాములు.

ఒకింత సేపటికి విసుగనిపించింది. కూనిరాగాలు తీస్తున్న రాముల్ని సైగలతో ఏదన్నా కథ చెప్పమన్నాను.

ఒక్క క్షణం ఆగి, “ఇయ్యాళ మీ తాత కథ నాకు తెలిసినంత మటుకు సెబుతాను,” అంది రాములు.
తాత గురించి నాకు తెలియని ఊసులు వినడం నాకెంతో ఇష్టం. అసలు, తాత కథ అంటూ రాములు మునుపెన్నడూ చెప్పనేలేదు. వినాలని సంతోషంగా ఉంది. (ఇంకా ఉంది)

**

‘ఎగిరే పావురమా!’–మొదటి భాగం

 

my pic 3

రచయిత్రి , కళాకారిణి కోసూరి ఉమా భారతి
రచయిత్రి – శ్రీమతి. కోసూరి ఉమాభారతి Director – Archana Fine Arts Academy, U.S.A కూచిపూడి నృత్య కళాకారిణి, నాట్య గురువు, నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి. ఆంధ్రప్రదేశ్ నుండి సాంస్కృతిక రాయబారిగా ఉమాభారతి దేశావిదేశాలు పర్యటించారు. కళ ద్వారా స్వచ్చంద సమాజసేవకి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు, అవార్డులు పొందారు. చలన చిత్రాల్లో నటించి, నృత్య సంబంధిత చిత్రాలని నిర్మించి, దర్శకత్వం వహించారు. 1982లో హ్యూస్టన్, టెక్సాస్ లో ‘అర్చనా డాన్స్ అకాడెమి స్థాపించారు. శాస్త్రీయ నృత్యరూపక రచనలకి అవార్డులు పొందారు. రచనానుభావం : శాస్త్రీయ నృత్య సంభందిత వ్యాసాలతొ పాటు, పలు నృత్యరూపకాలు రచించి దేశవిదేశాల్లో ప్రదర్శించారు. వాటిల్లో ప్రేక్షకుల ఆదరణ, అవార్డులు పొందినవి – ‘భరత ముని భూలోక పర్యటన’ (తాన మహా మహా సభలు 1998) , ‘అమెరికాలో అనసూయ’, ‘ఈ జగమే నాట్యమయం’ (ఆటా తెలుగు సభలు), ‘తెలుగింటి వెలుగు’, ‘లయగతులు’ (తానా 2002) ‘పెళ్లిముచ్చట’, ‘కన్య’, ‘మానసపుత్రి’ …… ‘భారతీయ నృత్యాలు'(డాకుమెంటరీ), ‘ఆలయ నాదాలు’ (టెలిఫిలిం), ‘రాగం-తానం-పల్లవి’ (శాస్త్రీయ నృత్య టెలిఫిలిం) లకు కాన్సెప్ట్, కొరియాగ్రఫీ, & డైలాగ్ సమకూర్చారు. ఇతర రచనలు: గత రెండేళ్లగా – ప్రవాసాంద్రుల జీవన విధానాన్ని ప్రతిబింబించే వ్యాసాలు, కుటుంబవ్యవస్థ లోని మానవ సహ సంబంధాలు ఇతివృత్తంగా, ఆమె చేసిన నృత్యేతర రచనలు నలభైకి పైగా పలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 2012, 2014 లో వంగూరి ఫౌండేషన్, USA వారి ఉగాది ఉత్తమ రచన పురస్కారం అందుకున్నారు. 2013 లో ‘విదేశీ కోడలు’ కథాసంపుటి వంగూరి వారి ముద్రణగా ‘తాన సభల్లో ఆవిష్కరించబడింది. ‘రాజీ పడిన బంధం’ ఆమె రచించిన తొలి నవల కాగా, ‘సారనగా సాహిత్య పత్రికలో’ జూలై నుండి ప్రచురింపబడుతున్న తొలి ’ సీరియల్ గా ‘ఎగిరే పావురమా!’

నా మాట ....

 

...... మహారాష్ట్రలో కొద్దిమంది గ్రామీణులు తమ ఆడపిల్లకి “నకూసా” అని పేరు పెడతారని మీకు తెలుసా? ‘నకూసా’ అంటే ‘అవాంఛిత’ అని అర్ధం. ‘నకూస’ వద్దంటే పుట్టిన ఆడపిల్ల, చంపేయలేక వదిలేసిన ఆడపిల్ల. ఆ పిల్ల జీవిత పర్యంతం, తానో అవాంఛితనని ప్రకటించుకుంటూ బ్రతికి, అవాంఛితగానే మరణిస్తుందని   మీకు తెలుసా?....(విహంగ పత్రిక – జనవరి 2012)

 

ఆడపిల్ల పుట్టిందన్న నిరాశతో, ఆ పసికందుని చంపారనో, వదిలేసారనో వార్తల్లో విన్నప్పుడల్లా – ఓ నాలుగు మాటలనడమో లేదా బాధపడ్డమో చేసేదాన్ని. కాని ‘నకూసా’ గురించి చదివినప్పుడు చాలా కలవరంగా అనిపించింది. “ఇంతటి అన్యాయం ఎలా సాధ్యం?’ అని జీర్ణించుకోలేక పోయాను. ప్రేమకి, త్యాగాలకి ప్రతిరూపాలు తల్లితండ్రులని నమ్మే నన్ను ‘నకూసా’ గురించిన విషయం ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది....

ఆ స్పందనే ‘ఎగిరే పావురమా!’ రాయడానికి ప్రేరణ అయింది.

చదివి ఆదరిస్తారని, మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తాను.

..... ఉమాభారతి

 

 

 

 

కోవెలలోని రావిచెట్టు నీడనే, అలవాటుగా నేను కూకునే నా స్థానం.
చీకటితో తలార స్నానాలు చేసి తయారయ్యాక, పొట్టి చక్రాల బండి మీద నన్ను గుడికాడికి తెస్తాడు తాత. గుడివాకిళ్ళు తెరవక మునుపే, మేము అమ్మవారి గడపల్లోకి చేరుకుంటాము.

కోవెల వెనుకనుండి వస్తే తిన్నగా రావిచెట్టు కాడికే చేరుతాం.
వస్తూనే చెట్టుపక్కనున్న కొళాయి నీళ్ళతో మళ్ళీ ముఖం కడిగించి, నా నుదుటిన అమ్మవారి కుంకుమెడతాడు తాత.

“బొట్టెడితే మాలక్ష్మివేనే. వేడుకున్నా పలకని ఆ దేవత కన్నా పలకలేని నీ నవ్వులే నాకు చాలమ్మా,” అంటూ నా తలమీద ముద్దెట్టుకొన్నాకే ఆ దేవుడికి దణ్ణాలెట్టుకుంటాడు తాత.

రావిచెట్టు నీడనున్న అరుగు మీద నన్ను కూకోబెడతాడు.
నా కాళ్ళ చుట్టూ కంబడి కప్పి, నాకు కావాల్సినవన్నీ అందేలా సర్దుతాడు.

“దట్టంగా విస్తరించిన ఈ రావిచెట్టుని చూడు,” అంటాడు తాత ఒక్కోప్పుడు.
“అన్ని వైపులనుండి నీ అరుగుని చేతులతో కాపాడుతున్నట్టుగా ఉందిరా, గాయత్రీ,“ అంటాడు నాతో.

నాకేమో, నా అరుగు సాంతం ఆ రావిచెట్టు పొట్టలో ఉన్నట్టుగా అగుపించి నవ్వొస్తది.
దాని పెద్దపెద్ద కొమ్మలేమో అరుగుకి చుట్టూ కాపలాగా ఉన్నట్టనిపిస్తది.

నేను కూకున్న మేరకు, అరుగుకి దిట్టమైన పైకప్పేసే ఉంది. ఆ చెట్టు నీడన కూకుంటే వానచినుకుల తడి గాని, ఎండవేడి గాని అంతగా నన్ను తాకవు. ముంచెత్తే వానలైతేనే అరుగు తడుస్తది.

బుద్ధి తెలిసిన కాడినుండి – చంద్రం పిన్ని సాయంతో పొద్దు మొదలై, నా జీవనం ఆ రావిచెట్టు నీడనే గడుస్తది. పగలంతా గుడిలో పంచే ప్రసాదాలతోనే నా కడుపు నిండుతది.

**

రోజూ నేను అరుగుమీద చేరిన కాసేపటికే, చీకట్లు పోయి ఎలుగొచ్చేస్తది. సూరీడి ఎలుగులతో పాటే, ఆకాశంలో నుండి సూటిగా నా వైపుకే ఎగిరొస్తాయి పావురాళ్ళు. నా భుజం మీదగా పోయి అడుగులేస్తూ ఒకింత దూరంగా నంచుంటాయి, ‘మేమొచ్చాము’ అన్నట్టు. అవి అట్టా బారుతీరి రోజూ అదే సమయానికి రాడం బాగనిపిస్తది..

నేను చిమ్మిన గింజల్ని, అవి ముక్కులతో ఒక్కోగింజ ఏరుతుంటే, చూస్తూ నా పూల పని మొదలెడతాను.....
**
మా ఊరు గంగన్నపాలెం లోని ‘గాయత్రి’ అమ్మవారి గుడి అది. ‘శ్రీ గాయత్రీ కోవెల’ అంటారు.
గుడి చుట్టూ పెద్ద ఆవరణ. తెల్లారేలోగా ఆ మేరకు శుభ్రం చేస్తాడు తాత.

పూజారయ్య వచ్చినాక, నా ముందు బల్లపీటేసి, అమ్మకానికి దేవుని బొమ్మలు, పూజసామాను, పుస్తకాలు, జపమాలలు, లక్ష్మికాసులు దాని మీద సర్డుతాడు.
అందరు అంటకుండా వస్తువులు కాగితాల్లో చుట్టే ఉంటాయి. వస్తువుల ధరలు రాసిన పలకలు రావిచెట్టుకి కట్టుంటాయి.

సామాను తీసుకున్నోళ్ళు, నా పక్కనే భూమిలోకి దిగేసున్న ‘గుడి హుండీ’లో వాటికి సరిపడా డబ్బులేస్తారు. చీకటిపడ్డాక మాత్రం పూజసామాను గుడిలో పంతులుగారి కాడ తీసుకోవాల్సిందే.

పూజసామాను కొనడానికి వచ్చినోరు కొందరు నాతో నవ్వుతూ మాట్లాడతారు కూడా.
“నీ తేనెరంగు కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా పాపా?” అంటారు.
“నీవు నవ్వితే నీ బుగ్గన చొట్టలు ఎంత ముద్దుగా ఉంటాయో తెలుసా గాయత్రీ?” అంటారు.

నాకు సిగ్గనిపిస్తది.

**

తాతతో పాటు గుడి పనులకి రాములు ఉంది. కోవెల్లో ‘స్వీపరు’గా చాన్నాళ్ళగా పని చేస్తుందంట.
నేను అరుగు మీద చేరగానే పూలబుట్టలు, ఓ చెక్కపెట్టి తెస్తుంది. చెక్కపెట్టిని నాకు మరో పక్కన కాస్త ఎడంగా పెట్టి, పూలబుట్టలు నా ముందుంచుతుంది.

గుడి చెట్ల నుండి కర్వేపాకు, పూజారయ్య ఇచ్చే కొబ్బరిచిప్పలు సంచులకేసి, అమ్మకానికి దారవతల కూరలబడ్డీ కాడికెళ్ళి కూకుంటాడు తాత.

“కాస్త నా బిడ్డని సాయంత్రం వరకు చూసుకోవే రాములు,” అంటాడు తాత బయటకి పోయే ముందు.
“అట్టాగేలే సత్యమయ్యా, బంగారు తల్లి మన గాయత్రి. దానికి అందరూ చుట్టాలే,” అంటది బదులుగా రాములు ప్రతిసారి. రాములు అసలు పేరు రాములమ్మ. ఎప్పుడూ నవ్వుతుండే ఆమెని అందరు ‘రాములు’ అనే పిలుస్తారు. ఆవరణలోనే రావిచెట్టుకి అవతల పెంకుటింట్లో ఉంటది.
ఇంకా ఈడ కొలువు చేసే మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాడు తాత. వాళ్ళే - అర్చకులు పంతులుగారు, గుడి కాపలాదారు నాయుడన్నా.
వాళ్ళు కూడా కుటుంబాలతో రాములు పెంకుటిల్లు ఎనకాలే మిద్దెల్లో ఉంటారు.

ఇక, ఈ కోవెలకే కాదు – మా ఊరిక్కూడా పెద్దదిక్కు, పూజారయ్య సోమయాజులుగారేనంట.
వీధవతల పెద్ద ఇంట్లో ఉంటారు పూజారయ్య కుటుంబం. ......

”గుడి వ్యవారాలన్నీ చూస్తూ, అందరికి మేలు చేసే పూజారయ్యని చుట్టూ ఊళ్ళవాళ్ళు కూడా గౌరవిస్తారు. మంచిమనిషి మన పూజారయ్య,” అంటాడు తాత.
**
ఇక ఇప్పుడు ‘దసరా’ మూలంగా గుడి అవరణ రోజంతా జనంతో కిటకిటలాడుతుంది. ఈ యేడు పూజలకి, ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని తాత, చంద్రం పిన్ని అనుకున్నారు.
పిన్ని, ఆమె పెనిమిటి - రాంబాబాయి మా పక్క కొట్టాంలోనే ఉంటారు.

“నా చంద్రమ్మ చెల్లికి మనమీద గొప్ప ప్రేమరా గాయత్రి. యేడకీ పోకుండా మనకోసం పక్కనే చిన్న కొట్టంలో వుండిపోయారు పిన్ని వాళ్ళు,” అంటాడు తాత.

“రాంబాబాయి మనకి చుట్టాలబ్బాయవుతాడులే. అందుకే సాయంగా తోడుగా ఉంటాడు,” అంటుంది పిన్ని.

పండుగ పూజలకని ఇంకాస్త పెందరాళే నిద్ర లేపుతున్నాడు తాత.
పొద్దున్నే సాయం చేయడానికి వచ్చే పిన్ని, దసరాపూజలు జరిగినన్నాళ్ళు నాకొకింత ముస్తాబు చేసి మరీ కోవెలకి పంపుతుంది.
**
పండుగ ఆఖరి రోజున అమ్మవారి పూజలకి ఆడోళ్ళంతా ఎర్రరంగు దుస్తులు ఏసుకోవాలంట. పిన్ని నాచేత ఎర్రచుక్కలంచు పరికిణీ, ఆకుపచ్చ జుబ్బా వేయించింది. ఎర్రటి బొట్టు, గాజులతో సహా.

సాయంత్రం జరగబోయే పాటకచేరి-డాన్సు ప్రోగ్రాంల గురించే ఊరంతా చెప్పుకుంటున్నారంది పిన్ని. పాట-డాన్సు చూడాలని నాకూ ఉత్సాహంగా ఉంది.
ఈ గుళ్ళో నేను చూస్తున్న మూడో దసరా ఇది. మొదటిసారి దసరాకి నాకు ఐదేళ్ళంట.

“అందంగా బొమ్మల్లే ఉన్నావే,” తల దువ్వడమయ్యాక, నా బుగ్గలు నొక్కింది పిన్ని.
“పద, పద, ఇకెళ్ళండి. తయారయి నేనూ పెందరాళే వచ్చేస్తా” అంటూ నన్ను, తాతని బయలుదేరదీసింది.
**
గుళ్ళో అడుగు పెడుతూనే, రాములు నీళ్ళ బిందెతో ఎదురుబడ్డది.
జాప్యం లేకుండా పనులు చకచకా జరగాలన్నాడు తాత, మాతో.

రాములు తెచ్చిన ఐదు బుట్టల పూలు విడదీసి, గుట్టలుగా పోసుకొని పని మొదలెట్టాము. తొడిమలు తీసి, కాడలు కత్తిరించి నేను పూలని బుట్టకేస్తుంటే, అరుగుల మధ్య గింజలేరుతున్న పావురాళ్ళని గమనిస్తూ మాలలు కడుతుంది రాములు.

“ఆ చిన్నగువ్వలు నీకు మల్లేనే ముద్దుగా, బొద్దుగా ఉన్నాయి కదూ,” అంటూ వాటికి మరో గుప్పెడు గింజలు చిమ్మిందామె.
అట్టా అన్నందుకు తల వంచుకొని నేను కోపం నటించాను.

“అబ్బో, మా గాయత్రి బుంగమూతి ఎంత ముద్దుగా ఉందో, ఇయ్యాల చేతులకి గాజులు, కాళ్ళకి పట్టాలెట్టి, గువ్వపిట్టల్లె సక్కగా ఉంది పిల్ల,” అంటూ నా నెత్తిన మొట్టింది. ఇద్దరం నవ్వుకున్నాం.

రాములుకి నేనంటే ప్రేమని ఎరుకే. ఎప్పుడన్నా నా జడ కుదరకపోతే, పనులయ్యాక కబుర్లాడుతూ మళ్ళీ జడేస్తుంది..

రాములు, తాత కూడా రోజూ కాసేపు కబుర్లు చెప్పి నన్ను నవ్విస్తుంటారు.
నాకెన్నో సంగతలు తెలిసేలా ఇవరంగా చెబుతారు.
తిరిగి నేనూ ఏదైనా అన్నా, నా సైగలని తెలుసుకునేది తాతతో పాటు రాములు, చంద్రం పిన్నే.

మధ్యానాలు గుడి తలుపులు మూసాక, ఒక్కోమారు కాసిన్ని బొరుగులు తెచ్చిచ్చి, పక్కనే కూకుని, కథలు చెబుతూ చక్కని బొమ్మలు కూడా గీస్తుంది రాములు. దగ్గరుండి చూసినా నాకు ఆమెలా బొమ్మేయడం చాతవలేదు.

ఇట్టా రాములు గురించే అనుకుంటూ పూలపని ముగించేప్పటికి, ఆమె దండలు కట్టడం కూడా అయినట్టుంది.

“ఏయ్ గాయత్రి, ఏమంతగా ఆలోచన? పండుగపూట, చకచకా పనులు కానీమన్నాడుగా తాత ! నీ పూలిటియ్యి, అన్ని దేవుళ్ళకి అందించాలి,“ అంటూ నా కాడి పూలు కూడా కలిపి నాలుగు బుట్టలకేసి, ఆవరణలోనే ఎడంగా ఉన్న చిన్నగుళ్ళ వైపుగా కదిలింది.
**
రాములు కాళ్ళకెట్టిన మువ్వల చప్పుళ్ళు వింటూ ఆమె వంకే చూసాను. పండుగ ముస్తాబుగా కళ్ళనిండా కాటుకెట్టి, చేతులకి రంగురంగుల మట్టి గాజులేసింది రాములు. కడియాలు, ముక్కెరతో సహా.
‘ఎన్ని గాజులో! ఎన్ని రంగులో! చూడ్డానికి బాగున్నయి. రాములు ముస్తాబే కాదు - నాకు ఆమె చెప్పే కథలు కూడా బాగుంటయి’ అనుకుంటూ అరుగు మీద చిందరవందరగా పడున్న తొడిమలు, కాడలు, రాలిన ఆకులు అందినంత మేరకు బుట్టకెయ్యడం మొదలెట్టాను.
కోవెలకి వచ్చినోళ్ళందరూ రాములుతో ప్రేమగా మాట్టాడుతారు. నాకే కాదు, రాములంటే అందరికీ ఇష్టమే. ఆమె చిరకాల స్నేహితులు - సుబ్బి, మాణిక్యం. ఒక్కోప్పుడు గుడికొచ్చి కాసేపు ఆమెకి కబుర్లు చెప్పి పోతుంటారు.

రాములు గురించి అనుకుంటూ నా చుట్టూ ఉన్న అరుగంతా శుభ్రం చేసేసాను.
ఇంతలో బుట్టెడు పత్తి తెచ్చి నా ముందుంచింది రాములు.

“పండుగలు కదా! ఎన్ని వొత్తులైనా చాలడం లేదు. పంతులుగారికి ఇంకా వొత్తులు కావాలంట,” అంటూ పక్కనే కూకుంది.
సగం పత్తి విడదీసి తన ముందేసుకొని, “ఏమాలోచిస్తున్నావు? అడిగింది నా వంక చూస్తూ...

‘నీ గురించే,’ అని సైగ చేసాను.
నా చెవి పిండింది రాములు. “తిన్నగా ఎనిమిదేళ్ళు లేవు నీకు. నా గురించి ఆలోసించేంత పెద్దదానివా? పని కానీయ్,” అంది తనూ నవ్వుతూ.

“చేతిలో పనయ్యాక నీ జడలోకి మల్లె చెండు కడతాలే,” అంది.
ఇద్దరం వొత్తులు చేయడం మొదలెట్టాము.
**
సాయంత్రం పండుగ సంబరాలకి సుబ్బి, మాణిక్యం సహా చాలా జనం వచ్చారు.
పాట కచేరి – డాన్స్ మొదలయ్యాయి.

నా ఈడు ఆడపిల్లలు అందంగా అమ్మవారికి మల్లేనే తయారయి, కాళ్ళకు గజ్జెలు కట్టి - అందంగా ఆడుతున్నారు. మధ్యమధ్యలో నాకన్నా చిన్న కూనలు గొంతెత్తి, కీర్తనలు... దేవుని పాటలు - తాళమేసి మరీ పాడుతున్నారు. జనాలు మెచ్చుకుంటున్నారు.

డాన్సులు చూస్తూ పాట వింటుంటే, వాళ్ళకు మల్లే నేనెందుకు ఆడలేనని - ఈ తడవ మరింత నిరాశగా అనిపించింది.
అసలెందుకు కదలలేనని దిగులుగా అయిపోయాను.
ఇట్టా నా ఈడువాళ్ళు పట్టుపరికిణీలు వేసి పరుగులెట్టడం చూసినప్పుడల్లా, నాకూ వాళ్ళలా పరిగెట్టాలనిపిస్తది. నా అరికాళ్ళు చీమలు పాకినట్టుగా చిమచిమలాడతాయి.
బొద్దుగా కనబడినా నడువలేవు నా కాళ్ళు. కావలసినప్పుడు చేతుల సాయంతోనే నేల మీద కాస్త దూరం మెసలగలను. సాయం పడితే, పైకి లేచి కొంత దూరం గెంతుతూ కదలగలను.

నా ఆసరా కర్ర ఎప్పుడూ నాతోనే ఉన్నా కదలడానికి మరొకరి సాయం ఉండాలి. ప్రతిరోజూ నాకు సాయం పట్టి, “ఇంకోమారు, మరోమారు,” అంటూ నన్ను అరుగుల చుట్టూత తిప్పుతది రాములు.

నా ఈడు వాళ్ళలా చిలుకల్లె పలుకలేను. దేవుని ముంగిట గొంతెత్తి పాడనూలేను.
అందరిలా నేనూ పలకాలనీ, పాడాలనీ కష్టపడ్డప్పుడల్లా గొంతు మంటెట్టి, నొప్పెట్టి కన్నీళ్ళొస్తయి.

‘అ, మమ్, మ, ఉమ్’ అని మాత్రమే శబ్దాలు చేస్తది నా గొంతు.
ఎప్పుడన్నా కష్టంగా తోచి గట్టిగా అరవాలనిపిస్తది కూడా.

‘అంతకన్నా ఏం చెయ్యగలను, ప్చ్,’ అనుకుంటూ తలొంచుకొని ఉండిపోయిన నా భుజంమీద ఎవరో తట్టారు. తిరిగి చూస్తే చేతిలో ప్రసాదాలతో పిన్ని.

“అట్టా చూస్తూండిపోయావేరా? అలిసిపోయావా? లోన పూజ ముగిసి హారతి ఇవ్వడం కూడా అయ్యిందిలే,” అంటూ ప్రసాదం అందించింది పిన్ని.
“కళ్ళకద్దుకొని తినేసెయ్యి. ఇంక ఇంటిదారి పడదాము. తాత మనకోసం మెట్లకాడ ఉంటాన్నాడు,” అంటూ పక్కనే కూకుంది.
“ఎందుకా దిగులు మొహం? కాస్త నవ్వు. ఈ పండుగనాడు నీ ఈడు పిల్లలందరిలో నువ్వే ముద్దుగా ఉన్నావంట తెలుసా? మన వీధి అమ్మలక్కలంతా అంటున్నారు,” అన్నది నన్ను నవ్వించాలని పిన్ని.
నా నవ్వులు బాగుంటాయని తాత అంటాడు. రాములు కూడా నాకు చక్కిలిగింతలు పెట్టి మరీ నవ్విస్తది. ...............
(ఇంకా ఉంది)
**

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 20 నుంచి 26 భాగాలు ( సమాప్తం )

26( గత వారం తరువాయి )

 20

కొద్దిగా కళ్ళు తెరిచాడు రామం.. రెండ్రోజుల తర్వాత అప్పుడే స్పృహలోకొచ్చి..

అపోలో హాస్పిటల్‌.. హైద్రాబాద్‌.

బయట ఎడతెగని వర్షం.
రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఇరవైమూడు జిల్లాల జనసేన కార్యాలయాల దగ్గర వేలకొద్ది ప్రజలు. టి.వి. చానళ్ళన్నీ బ్రేకింగు న్యూస్‌.. ఎప్పటికప్పుడు రామం ఆరోగ్య పరిస్థితిపై బులిటిన్లు. భారతదేశంలో ‘ప్రక్షాళన’ పేరుతో ఆరంభమైన ఈ వినూత్న అహింసాయుత వైవిధ్య ఉద్యమాన్ని పరిశీలించేందుకు, విశ్లేషించేందుకు జాతీయ, అంతర్జాతీయ టి.వి చానళ్ళుకూడా హైద్రాబాద్‌లో మకాం వేశాయి.

అంతకుముందు రోజే రామం కోరికగా క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి, శివ ఒకేమాటగా.. ‘వ్యక్తులు ముఖ్యంకాదు.. ముందుకుపోవడం, యుద్ధం చేయడం, పోరాటాన్ని కొనసాగించడం.. అవిశ్రాంతంగా లక్ష్యంవైపు  పయనించడం.. యివే ముఖ్యం’ అని భావించి రామం హాస్పిటల్లో ఉన్నా… యథావిధిగా ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని జిల్లా కేంద్రాల్లో ‘ప్రక్షాళన” మూడవ విడత కార్యక్రమం జయప్రదంగా నిర్వహించబడింది. అన్ని కేంద్రాల్లో రిటైర్డ్‌ ఆడిటర్స్‌, ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ ఆఫీసర్స్‌, కొందరు మాజీ ఎస్పీలు, యిదివరకు ప్రభుత్వంలో పనిచేసి అన్ని రూల్స్‌ సమగ్రంగా తెలిసిన సెక్రటరీ స్థాయి ఉద్యోగులు.. తమతో చాకుల్లాంటి, దేశంపట్ల, సమాజంపట్ల తమ బాధ్యతలనెరిగిన మెరికల్లాంటి, క్రీమ్‌వంటి యువకులు తోడుగా.. చేతిలో ‘సమాచార చట్టం’ ప్రకారం సంపాదించిన సర్టిఫైడ్‌ కాపీలను జతచేసి.,
శక్తి నిత్యమూ, సత్యమూ, నాశనంలేనిదీ ఐనట్టే.. అందరికీ చెందిన గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం వంటి సహజవనరుల ద్వారా ఉత్పత్తిగా, సేవగా, వస్తువుగా.. చివరికి డబ్బుగా మారిన సంపద.. అంతిమంగా సమాజానికి చెందాలి. సమంగా అందరికీ పంచబడాలి. కాని అందరికీ చెందాల్సిన సామాజిక సంపద అనేక అక్రమ మార్గాలద్వారా కొందరి.. అంటే దేశంలోనే ఓ ఏడెనిమిది శాతం మంది గుప్పిట్లలో బందీ ఐ ఉంది. అందరికి చెందవలసిన ప్రజలఉమ్మడి సంపద కొందరి దగ్గర్నే గుప్తమై ఉండడం సహజన్యాయానికి విరుద్ధమైంది కాబట్టి.. దాన్ని ప్రజలే విముక్తం చేస్తున్నారు.
ఆ క్రమంలో.. జనసేన రహస్య సమాచార సేకరణ బృందాలు అన్వేషించి సంపాదించిన అవినీతి సంపాదన, లంచాలద్వారా కూర్చుకున్న నల్లడబ్బు గల అనేకమంది ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థలవాళ్ళు, బ్రోకర్లు, కన్‌సల్టెంట్స్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు.. వీళ్ళ గత ఐదు సంవత్సరాలుగా ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన రిటర్న్స్‌, ఎలక్షన్‌ కమీషన్‌కు లిఖితపూర్వకంగా యిచ్చిన సమాచారం.. ఒక్కొక్కరిపేర ఉన్న బినామీ ఆస్తుల వివరాలు.. అన్నీ జతచేసి ప్రజల సమక్షంలో దాడులు నిర్వహించి నిగ్గుతేల్చాల్సిందిగా ప్రజల పక్షాన ప్రజలు ఋజువుల్తో సహా కంప్లెయింట్‌ చేయడమే.. వాటిపై చర్య తీసుకోకుండా ఎగవేసేందుకు వీల్లేకుండా కాపీ టు కలెక్టర్‌, కాపీ టు చీఫ్‌ సెక్రటరీ, కాపీ టు గవర్నర్‌.. కాపీ టు.. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌, గవర్నమెంటాఫ్‌ ఇండియా.. బృందాలు బృందాలుగా చేసిన కంప్లెయింట్లను కార్యరూపంలోకి తెచ్చేదాకా డే టు డే ఫాలోఅప్‌.. ఎవర్నీ నిద్రబోనిచ్చేది లేదు.. తాము నిద్రపోయేది లేదు.
పరిస్థితి ఏమైందంటే.. ‘జనసేన’ వెంటపడ్తే..ఒక ఆల్సేసియన్‌ కుక్కలమంద వెంటపడి తరిమినట్టే.. చంపవు.. విడిచిపెట్టవు. సాధారణ ప్రజలకుమాత్రం ఒక సుదీర్ఘ చీకటి తర్వాత.. కొత్త ఉషోదయం.
మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులు.

27
ఆ రోజు విప్లవించిన అహింసాయుత ప్రజాచైతన్య ప్రభంజనాన్ని మీడియా ఆకాశమంత విశాలంగా కథనాలు కథనాలుగా.. ప్రజల అభిప్రాయాలుగా, స్పందనలుగా, మేధావుల ప్రశంసలుగా.. కొందరు గుండాల పశ్చాత్తాపాలుగా ప్రసారంచేసి, ప్రచురించి ఎంతో ప్రాచుర్యం కల్గించాయి.
పరిస్థితి.. నిబద్ధత.. ఎవరికోసం ఏదీ ఆగదు. తీరం చేరేదాకా ప్రయాణం తప్పదు. కొనసాగింపేగాని విరామంలేదు.
వందల వేల సంఖ్యలో ‘రామం’ గురించిన ఎంక్వయిరీలు.. రాష్ట్రం నలుమూలల్నుండి.. ఇతర రాష్ట్రాల అభ్యుదయకాముకులనుండి, ప్రజాసంఘాలనుండి.
ఎప్పుడూ శక్తి ఒకచోట క్షిప్తమై ఉంటుంది. కాని ఒక వెక్టార్‌గా బాణంవలె, తుపాకీగుండువలె అనుసంధానించగలిగే కర్త ఒకరు కావాలి. రామం.. నాయకుడు.. ప్రజాశక్తిని ఒక నిశ్శబ్ద రక్తపాతరహిత ఉద్యమంగా రూపొందించి బ్రహ్మాస్త్రాన్ని చేసి సంధించిన సంధానకర్త. కర్త కర్మ క్రియ..అన్నీ.
యిప్పుడా నాయకుడెలా ఉన్నాడు. అసలా ‘అగ్ని’పై దాడి ఎలా జరిగింది.
పోలీసులు.. కుక్కలు.. అందరూ రంగప్రవేశం చేశాయి.
కాని.. జనసేన కార్యకర్తలు.. సుశిక్షితులు.. యోధులు.. కొత్తవాడ దాడి జరిగిన రెండుగంటల్లోనే శివనగర్‌లో పట్టుకున్నారు ఆ బాంబువేసినవాణ్ణి. ఆ వ్యక్తిని పోలీసుల అదుపులోకి ఇచ్చేముందు సరియైన పద్ధతిలో గూఢాచార కార్యకర్తలు విచారిస్తే.. అంతా బయటపడింది. దాదాపు ఐదు ప్రజాసంబంధమైన ప్రాజెక్ట్‌ల్లో పధ్నాలుగు వేలకోట్లు ప్రక్కదారి పట్టించి తింటున్న ఒక రాయలసీమ రాజకీయ నాయకుడు యిక తన దుశ్చర్యలన్నీ బట్టబయలైతాయని భయపడి, ‘జనసేన’ ఉద్యమం ఇంకా ఇంకా బలపడి వేళ్ళూని బలపడకముందే ఆదిలోనే తుంచేయాలని రామంను హతమార్చేందుకు యాభై లక్షల బేరాన్ని కుదర్చుకుని పంపగా వచ్చిన కిరాయిరౌడీ.. పేరు ఈరప్ప.. మొత్తం కూపీ బయటపడింది. ఆ నాయకుడెవడు. వాని చరిత్ర నేపథ్యం ఏమిటి.. వాని వెనుక ఉన్న తెరవెనుక గుండాలెవరు.. అంతా వెంటనే చర్యకొరకు రాయలసీమలోని ‘జనసేన’ కార్యాలయానికి ఆదేశాలు వెళ్ళాయి.
రామం కళ్ళు తెరిచి.. స్పృహలోకొస్తూ.. మెల్లగా చుట్టూ చూశాడు.
వర్షం చినుకుల చప్పుడు.
గదిలో.. క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, శివ.. మూర్తిగారు.
”బాంబు పేల్చినవాడు పట్టుబడ్డాడు”అన్నాడు శివ ఆత్రంగా
”….” మౌనంగా శివవంక చూశాడు రామం నిర్మలంగా.. ప్రశాంతంగా.. ఆ చూపులనిండా కరుణ జాలువారుతోంది.
”పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు..రాయలసీమవాడు.”
”శివా.. వాణ్ణి వదిలేయమని నా తరపున ఒక ఆప్లికేషన్‌ తయారుచేయి ప్లీజ్‌”
”రామం.. మీరేమంటున్నారు. వాడు మిమ్మల్ని హతమార్చాలనుకున్నాడు”
”ఔను.. అందుకే వదిలేయమంటున్నాను”
”….” శివ అవాక్కయి శూన్యంగా చూస్తూండగా.,
గోపీనాథ్‌కు రామంలో పూర్తి పరిపక్వత చెందిన పరిపూర్ణ మానవుడు దర్శనిమస్తూండగా..,
”శివా.. అతను యిప్పటికే పశ్చాత్తాపపడ్తూంటాడు. విడిచిపెట్తే వాడొక వాల్మీకిలా పరివర్తన చెందుతాడు శివా.. నిజం.. ద్వేషానికీ, పగకూ శిక్ష ఎప్పుడూ పరిష్కారం కాదు. క్షమ ఒక్కటే అటువంటి వ్యక్తికి సరైన శిక్ష”
మూర్తిగారు ఆశ్చర్యంతో ఆనందపడిపోయాడు. తను ఇన్నాళ్లుగా జరిపిన ప్రపంచ తత్వవేత్తల, మహాపురుషులకు సంబంధించిన అనేక అధ్యయనాల్లో యింత పరిణతి కనిపించదు. రామం ఆయనకు ఓ కొత్తకోణంలో మహామనీషిలా కనబడ్డాడు మొదటిసారి.
ఈలోగా శివ చేతిలోని ‘జనసేన’కు సంబంధించిన హాట్‌లైన్‌ మొబైల్‌మ్రోగింది. వరంగల్లు జనసేన కేంద్రక కార్యాలయంనుండి..
”హలో..” అన్నాడు శివ ఏదో ముఖ్యవిషయమే ఐ ఉంటుందని ఊహిస్తూ,
‘ఆపరేటర్‌ పద్మజ.. హలోశివా.. అస్సాంనుండి అఖిల్‌ గొగోయ్‌ అనే సామాజిక ఉద్యమకారుడు రామంగారి ఆరోగ్యంగురించి వాకబు చేస్తున్నాడు. మనవలెనే సమాచారచట్టం ఆర్టిఐని ఆధారంగా చేసుకుని 2006 నుండి కృషిక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి అనే సంస్థను స్థాపించి ఎఫ్‌ సి ఐ గోదాములు, ప్రజాపంపిణీ వ్యవస్థపై చారిత్రాత్మకమైన పోరాటం చేస్తున్నాడు.. అతను..”
”కనెక్షన్‌ యివ్వు పద్మజా”
వెంటనే లైన్‌ రీ ఓపెనై అఖిల్‌ గొగోయ్‌ ట్రాక్‌లోకొచ్చాడు.
”గుడ్మార్నింగు.. హౌ ఈజ్‌ మిస్టర్‌ రామం.. జనసేన చీఫ్‌”
”గుడ్మార్నింగు సర్‌. హి ఈజ్‌ ఔటాప్‌ డేంజర్‌ నౌ.. ఆల్సో సేఫ్‌..”
”థాంక్‌గాడ్‌.. రామం వంటి వారు ఈ దేశానికి చాలా అవసరం.. మీ జనసేన గురించి మీడియాలో జాగ్రత్తగా గమనిస్తున్నాను. నేను ‘అగ్ని’ ఛానల్‌ చూస్తా. మేము యిక్కడ చేయలేని పనిని మీరు భారీఎత్తున చేపట్టి విజయం సాధిస్తున్నారు.. బెస్టాఫ్‌ లక్‌.. ఒకసారి రామం గారికివ్వండి” అన్నాడు అస్సామీ భాషలో-
శివ ఫోన్‌ను రామంకు అందించాడు.. యిచ్చి ”అఖిల్‌ గొగోయ్‌.. కె ఎమ్‌ ఎ స్సెస్‌ అస్సాం” అన్నాడు.
”గుడ్మాన్నింగు.. మిస్టయ్‌ గొగోయ్‌.”
”…..” అట్నుండి సంభాషణ జరిగి.,
”థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్‌.. ఐ ఆల్సో విష్‌ ద బెస్ట్‌ ఇన్‌ యువర్‌ ఎండీవర్‌” అన్నాడు  రామం.
”యు ఆర్‌ ది హోపాఫ్‌ ది నేషన్‌.. మిస్టర్‌ రామం.. ప్లీజ్‌ టేక్కేర్‌..”
”….” నిశ్చలంగా మొబైల్‌ను శివకు అందించాడు రామం.
”శివా.. మొన్నటి మన ‘ప్రక్షాళన’ జరిగిందా ముందే అనుకున్నట్టు”
”ఔను.. జరిగింది.”
”క్యాథీ… గోపీనాథ్‌ సార్‌.. నావల్ల మన కార్యకలాపాలేవీ ఆగొద్దు. మనవంటి సామాజిక ఉద్యమాల్లో ఒక నాయకుడు, అనేకమంది అనుచరులుండొద్దు.. ప్రతివ్యక్తీ ఒక స్వయంచోదిత నాయకుడుగా ఎదిగి ఎదురొడ్డి పోరాడాలి.. క్యాథీ మనం అనుకున్న ప్రోగ్రాం చెప్పవా ప్లీజ్‌” అన్నాడు రామం ఆమెవైపు చూస్తూ.
”మన కార్యాచరణ పథకంలో మనం ప్రధానంగా ఐదు థల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం. అవి అవగాహన, ప్రక్షాళన, సంగ్రామం, పరిపాలన మరియు కొనసాగింపు. మనం గత మూడునెలలో నెలపదిహేను రోజులు అవగాహన పేరుతోలక్షలమందిని సంప్రదించి, అభిప్రాయాలు సేకరించి, డాక్యుమెంట్‌ చేసి ప్రజల్లో పౌరవిధులపట్ల, బాధ్యలపట్ల, హక్కులపట్ల, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలపట్ల అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశాం. దాదాపు నాల్గు లక్షలమందిని జనసేనలో చేర్పించి, లక్షమంది క్రియాశీల కార్యకర్తలతో ఒకటి, ప్రక్షాళన రెండు.. ప్రక్షాళన మూడు కార్యక్రమాలను అమలుచేస్తూ కాంట్రాక్టర్లరూపంలో ఉన్న రాజకీయ నాయకులపైన, యితర దుర్మార్గ బినామీ ఆపరేటర్ల మీద, పవర్‌ ప్రాజెక్ట్‌లు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, రోడ్లు, వంతెనలు, నిర్మాణాలు.. వీటన్నింటిపై మొత్తం ఆరువందల నలభై ఎనిమిది కేసులను ముఖాముఖి ప్రజల సమక్షంలో నిలదీసి.. దాదాపు డెబ్బయిఎనిమిది వేల కోట్ల రూపాయల పాక్షిక దుర్వినియోగాన్ని కోర్టులద్వారా, లోకాయుక్త ద్వారా.. నైతిక విజయాలద్వారా ఆపి నిలదీశాం. దీంతో ప్రభుత్వ సూడో రాజకీయ యంత్రాంగమంతా తోకముడిచి కలుగుల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు యిప్పుడు నేయి హవిస్సుగా లభిస్తున్నప్పుడు ఎగిసెగిసిపడే యజ్ఞ అగ్నిజ్వాలల్లా చైతన్యంతో ధగధగలాడ్తున్నారు. యిక ప్రక్షాళన నాల్గు ఇంకో వారం తర్వాత ఉంది. ఆ థలో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు రావట్లేదు. ఉద్యోగాలు ఎందుకు రూపొందించబడట్లేదు. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో బడాబడా వెధవలు ఎలా శాశ్వత ప్రకృతి వనరులను, మానవశక్తిని దోపిడీ చేస్తున్నారు. దేశీయ ఆదివాసీ, గిరిజన, అరణ్యప్రాంత తెగల ప్రజలు ఎందుకు అణగారిపోయి జీవిస్తున్నారు. వీరిపేర ప్రభుత్వాలు ఇంతవరకు ఎన్నివేల కోట్లను ఉపయోగించి, ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామని చెప్పి.. ఎంత భోంచేశాయి.. యివన్నీ, వీటి చిట్టా విప్పవలసి ఉంది. వీటి సమగ్ర సమాచారం మన గూఢాచార, యువజన విభాగాలు సేకరిస్తున్నాయి. యిక ఆ తర్వాత అతి కీలకమైన సంగ్రామం ప్రారంభమౌతుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చైతన్యవంతులైన ప్రజలు యిక బెబ్బులులై విజృంభించి నేరచరితులు, గుండాలను, అవినీతిపరులైన రాజకీయ నాయకులను కనబడ్తే తరిమి తరిమికొడ్తారు. కలుషితమైన ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా నిర్మలమై, స్వచ్ఛమై పారదర్శకమయ్యేదాకా మన ‘సంగ్రామం’ కొనసాగుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం.. నిరంతరమై, అవిశ్రాంతమై కొనసాగవలసిన ప్రాణక్రియ. ఒకసారి మన ‘జనసేన’ చేత ఆమోదముద్రను పొంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. అధికారంతో సంబంధంలేని మన ‘జనసేన’ సూచించిన ఆదర్శపాలనను ఆరంభించిన తర్వాత.. పరిపాలనా విధానం.. జనాన్ని పూర్తిస్థాయి ఆత్మగౌరవంతో యాచకులవలెగాక ఆత్మాభిమానంతో బతుకగల నాణ్యమైన జీవితాలన్నందించే స్థాయిని, స్థితిని సాధించిన తర్వాత.. మార్గదర్శకాలను, ఆదేశాలను ఎప్పటికప్పుడు స్వార్థరహిత సలహాదారుల నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షమై.. సుశాంతమై.. వర్థిల్లుతూంటే.. యిక ఆ స్థితియొక్క కొనసాగింపు..  ఓ నిరంతర నియంత్రణ క్రియ. నియంత్రణ లేకుంటే పాలనా వ్యవస్థ కుప్పకూలి పతనమైపోతుంది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పదేళ్ళకాలం రాజకీయ విలువలతో కూడిన సంస్కారవంతమైన వ్యక్తులే దేశపరిపాలనలో పాలుపంచుకున్నారు. తర్వాతనే ఎవరి నియంత్రణాలేక, అసమర్థతవల్లా, అధికార వ్యామోహం వల్లా నాయకులు నీచులైపోయారు. యివీ మన ప్రధాన కార్యక్రమాలు రామం..” క్యాథీ ఆగింది నెమ్మదిగా.
”ఇవేవీ ఎక్కడా ఒక్కశాతం కూడా డిరైల్‌ కావద్దు. నేను కోలుకునేదాకా.. మీరంతా మనం అనుకున్న ప్రకారమే కార్యక్రమాలను యథావిధిగా నడిపించండి.. నేనుంటా మీవెంట.. ఈ బెడ్‌పై నుండే..”
”యస్‌.. యస్‌..” అన్నారు గోపీనాథ్‌.. మూర్తి సాలోచనాగా..ఒకేసారి.
తర్వాత.. చుట్టూ నిశ్శబ్దం.
బయట వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా.
”నాకు నిద్రొస్తోంది..” అన్నాడు రామం.. మెల్లగా కనురెప్పలను మూసుకుంటూ.
అది నిద్రకాదు.. యింతకుముందు డాక్టర్‌ యిచ్చిన ట్రాన్‌క్విలైజర్‌ అని గోపీనాథ్‌కు తెలుసు.
శివ, గోపీనాథ్‌, మూర్తి.. ఆ గదిలోనుండి బయటికి.. బాల్కనీలోకి నడిచారు.
క్యాథీ ఒక్కతే ఆ గదిలో మిగిలింది.
ఎందుకో ఆ క్షణం నిగ్రహించుకోలేని దుఃఖం ఆమెను ముంచేసింది. ఎక్కెక్కిపడి ఏడ్చింది మౌనంగానే.

21

‘శత్రుశేషాన్ని సమూలంగా ధ్వంసం చేయాలి. ఆ విషయంగా ఉపేక్ష అస్సలే కూడదు.’ అనేది ఎస్పీ విఠల్‌ సిద్ధాంతం.
మంత్రి మాధవయ్య హత్య.. కానిస్టేబుల్‌ హత్య.. తర్వాత ఒక అద్భుతమైన కథ.. హోంమంత్రి స్థాయిలో అంతా మర్యాదల అంగీకారాలు.. నానుండి.. నీకేంకావాలి..నీనుండి నాకేంకావాలి.. బేరసారాలు, లావాదేవీలు. ముఖ్యమంత్రిదాకా  ఒక రాయబారం – ఒక అవగాహన. చివరికి మంత్రి మాధవయ్య హత్యపై ఒక కమీషన్‌.. ఎంక్వయిరీ.. మంత్రి. కాబట్టి తొందరగా నివేదిక కావాలని ఆదేశం..
ఈ దేశంలో ప్రధానమంత్రి హత్య చేయబడ్తే పదేళ్లు.. ముఖ్యమంత్రి చచ్చిపోతే నిజంనిగ్గు తేల్చడానికి పదినెలలు పట్టే ‘రెడ్‌టేప్‌’ కాలంలో, వ్యవస్థలో.. ఎవని గోల వానిది.. ఎవని శ్రద్ధాసక్తులు వానివి. భారతదేశంలో పై తరగతి ఉద్యోగుల్లో పశువులకంటే ఎక్కువ అతిస్వేచ్ఛ, ఎవనిపై ఎవనికీ నియంత్రణలేని అరాచకత్వంతో నిండిన విచ్చలవిడితనం ఉందంటే.. ఆ బురదలో నివసిస్తున్నవాడికే ఈ దుర్గంధానుభవం అర్థమౌతుంది.
విఠల్‌ ఆరోజు రాత్రి చాలా ఆనందంగా ఉండి మధ్యవర్తిత్వం జరిపిన ముగ్గురు ఫ్రెండ్స్‌కు మద్యం, మగువలతో పోలీస్‌ గెస్ట్‌హౌజ్‌లో పోలీసుల పహరామధ్య పార్టీ యిచ్చాడు. మంత్రి మాధవయ్య హత్యను ఎంక్వయిరీ చేసిన వన్‌మ్యాన్‌ కమీషన్‌.. మంత్రిగారిని అతని దగ్గర అంగరక్షకుడుగా పనిచేస్తున్న మురళీధర్‌ అనబడే గన్‌మన్‌ ముఖ్యమంత్రి యొక్క వీరాభిమాని కావడంవల్ల, ఆరోజే ఉదయం మంత్రి మాధవయ్య ముఖ్యమంత్రిని విమర్శిస్తూ, తూలనాడ్తూ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించడంవల్ల మానసికంగా గాయపడి.. బాగా తాగిన మైకంలో అర్ధరాత్రి బాగా తాగిఉన్న మంత్రి మాధవయ్యను రివాల్వర్‌తో రెండుసార్లు తూటాలు పేల్చి హత్య చేశాడు. ఈ తతంగాన్నంతా తన కళ్ళముందు జరుగుతూండగా ప్రత్యక్షంగా చూస్తున్న ఎస్పీ విఠల్‌ తన విధినిర్వహణలో భాగంగా కానిస్టేబుల్‌ను అడ్డుకోబోయి విఫలుడై విధిలేని పరిస్థితుల్లో ఆత్మరక్షణార్ధం తన సర్వీస్‌ రివాల్వర్‌తో గన్‌మన్‌ మురళీధర్‌ను కాల్చవలసి వచ్చింది. అందువల్ల మురళీధర్‌ అనివార్యమై మరణించాడు. ఇదంతా ఒక అతి సహజ ఘటన. దీంట్లో ఎస్పీ విఠల్‌ ప్రమేయం అస్సలేలేదు. అతను పూర్తిగా నిర్దోషి.. అదీ సారాంశం.
ఎంక్వయిరీ కమీషనర్‌కు కోటి రూపాయలు ముట్టాయి.. మధ్యవర్తులిద్దరికి చెరో పది పదిలక్షలు. ఒకటి రెండు నెలల తర్వాత.. ముఖ్యమంత్రి సమక్షంలో జెంటిల్‌మన్‌ అగ్రిమెంట్‌.. మంత్రి తాలూకు బ్రతికున్న వారసులకు, తనకు.. బార్ల లెక్కలు, భూముల లెక్కలు, సెటిల్‌మెంట్ల అకౌంట్స్‌.,
రాజీకి రాకుంటే చచ్చినోడు ఎట్లాగూ తిరిగిరాడు.. కనీసం ఈ పరిష్కారం క్రింద ఇరవైరెండు కోట్లు పోతాయని చెప్పినమాట వినుడు. అంతేగాని ఎవడు వెధవ కాడు.. ఎవడూ గాజులేసూక్కుర్చోడు.
మంత్రిని చంపడం వల్ల వాడు లెక్కలు తప్పించి నొక్కేసిన డబ్బులోనుండి ముప్పయి రెండు కోట్లు తనకు లాభం.
మొత్తంమీద ఎస్పీ విఠల్‌ టైం బాగుండి హత్యవల్ల ఇబ్బడి ముబ్బడిగా కోట్ల కొద్ది రూపాయల లాభమే చేకూరింది. పైగా బోనస్‌ క్రింద వేరొక జిల్లాకు ట్రాన్స్‌ఫరై.. మళ్లీ కొత్త గడ్డిమైదానం.. పచ్చని తాజాగడ్డి. మళ్ళీ ఇష్టమున్నట్టు మేత.
కాని.,
ఆ రోజు.. ఆ వర్షం కురిసిన రాత్రి..హత్యచేయబడ్డ మంత్రిగారు బాగా తాగి, తనూ తాగి, తనతో షూట్‌ చేయబడ్డ గన్‌మెన్‌ మురళీధర్‌ కూడా బాగా తాగి.. అందరికందరూ తాగుడుమైకంలో పిచ్చిపిచ్చిగా ఓలలాడ్తున్న ఆ చీకటి రాత్రి.,
తను మంత్రిని కాల్చిచంపడం కిటికీలోనుండి ఆరోజు సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రాములు చూశాడేమోనని అనుమానం విఠల్‌కు. అందుకే రాములును అప్పుడప్పుడు ఏదో ఒక నెపంమీద తన దగ్గర్కి రప్పించుకుని మాటల్తో పరీక్షించాడు. కాని అనుమానం బలపడ్తూనే ఏదీ స్పష్టంగా అర్దంగాక పిచ్చిపిచ్చిగా, చికాగ్గా ఉందతనికి.
మరి.. శత్రుశేషం.. సిద్ధాంత కింద రాములుగాణ్ణి శాశ్వతంగా లేపేస్తేమిటట.,
ఏమీలేదు.. లేపెయ్యొచ్చు సుళువుగా.
రాజు తల్చుకుంటే దెబ్బలక్కొదువా అన్నట్టు ఎస్పీ తల్చుకుంటే ఒక కాన్‌స్టేబుల్‌ను చంపడం కాలితో చీమను తాడించి చంపినంత సుళువు.
ఒక ఎన్‌కౌంటర్‌.. ఒక తుపాకీ శుభ్రం చేసుకుంటూండగా పొరపాటున తూటా పేలి ప్రమాదవశాత్తు దుర్మరణం.. డ్యూటీపై వెళ్తూండగా లారీకింద పడి పరమపదించెను.. ఇలాంటివి సవాలక్ష.,
కాని.. ఏది చేసినా.. పకడ్బందీగా, రంజుగా చేయాలని విఠల్‌ కోరిక.
అందుకే.. రాములును తనతోపాటే తనకు కొత్తగా పోస్టింగిచ్చిన జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని రప్పించాడు.
రేపు ఉదయం.. ఏడుగంటలకు సీక్రెట్‌ ట్రిప్‌.. ముత్తారం అడవుల్లోకి.. ఒక నక్సలైట్ల రహస్య స్థావర ఆచూకీ కోసం.. టాఫ్‌లెవల్‌ పర్సూఎన్స్‌లో.. ఎస్పీ తను.. డ్రైవర్‌ రాములు.. ఇద్దరే.. రహస్య పర్యటన.. అడవి లోపలికి.. మనుష్య సంచారమేలేని అడవి గర్భంలోకి.,
అక్కడ.. రాములు.. పరలోకగతుడగుట.,
శత్రుశేషం పూర్తిగా నిశ్శేషమై.. క్లీన్‌బౌల్డ్‌.. పరమపదసోపానం.
విఠల్‌ విస్కీ మత్తులో తన సరికొత్త ఉంపుడుగత్తె రాణీ పద్మజ కౌగిట్లో దొర్లుతూ.. రాములు కథను ఊహించుకుంటూ.. ఆమెతో.,
”రేపుదయం ఆరింటికి లేపాలి.. ఆరున్నరకు స్పెషల్‌ దౌరా.. ” అంటున్నాడు ముద్దముద్దగా.
అప్పుడు రాత్రి ఒంటిగంట పదినిముషాలైంది.
కానిస్టేబుల్‌ రాములుకు ఆశ్చర్యంగా, అదోలా, విచిత్రంగానే కాకుండా భయంగాకూడా ఉంది.
నక్సలైట్ల వేటకోసం కేంద్ర నిధులతో సమకూర్చుకున్న బులెట్‌ ఫ్రూఫ్‌ వాహనాల్తోసహా నిజంగా కొన్నవి కొన్ని, కొన్నట్టు కాగితాల్లో చూపించినవి కొన్ని. ప్రత్యేకంగా అడవులు, కొండల్లో పనికి వచ్చేవి కొన్ని.. అందులో ఒకటి.. ఎస్పీగారు తన యిష్టమొచ్చినపుడు టీ షర్ట్‌, స్పోర్ట్స్‌ ష్యూస్‌ వేసుకుని థర్డ్‌లేడీతో విహారశృంగారయాత్ర జరపడానిక్కూడ పనికొచ్చే ధగధగా నల్లనాగులా మెరిసే ర్యాంగ్లర్‌ జీప్‌.,
ఆ జీప్‌డ్రైవర్‌గా తను.. ప్రక్కసీట్లో ఎస్పీ విఠల్‌.. ఉదయమే నాల్గున్నర గంటలకు.. ఇద్దరే ఇద్దరు వర్షం వెలిసి చల్లగా ఈదురుగాలి వీస్తున్నవేళ బయల్దేరి.,
”మహాముత్తారం అడవుల్లోకి.. ” అన్నాడు జీప్‌ కదలగానే. అంతే యిక మాట్లాడ్డేదు ఎస్పీగారు ఇంతవరకు. మధ్య ఒకసారీ స్పీడ్‌పెంచి యింకా యింకా వేంగా పోనీ అన్నట్టు చూశాడంతే. గంటకు నూరుకిలోమీటర్లకన్నా ఎక్కువవేగంతో జీప్‌ గత మూడుగంటలు పరుగెత్తి పరుగెత్తి.. మహాముత్తారం అడవుల్లోకి ప్రవేశించి.. అరగంటగడిచి..,
మధ్య మధ్య అక్కడక్కడ పోలీస్‌పోస్ట్‌ల్లో రోడ్డుపైకి ఓ కానిస్టేబుల్‌ గన్‌తో సహా పరుగెత్తుకొచ్చి అతి వినయంగా సెల్యూట్‌ చేసి.. అంటే.. ఎస్పీ గారొస్తున్నట్టు కొంతమందికి సమాచారముందున్నమాట.
ఎస్పీ విఠల్‌ ప్రయాణిస్తున్న మూడుగంటల్లో ఎక్కువసేపు కండ్లమూసుకుని ధ్యానంలోఉన్నట్టు ఉండిపోయాడు. అతను ఏదన్నా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడో, నిద్రపోతున్నాడో, ధ్యానముద్రలో ఉన్నాడో రాములుకు అర్ధంకాలేదు. ఏది చేస్తున్నా అతని శరీరంలోనుండి విస్కీవాసన, బట్టల పోలీస్‌ వాసన.. వెరసి ఖాకీ కంపుకొడ్తోంది. ఒక ఎలుగుబంటు ప్రక్కన భయం భయంగా తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చున్నట్టు రాములు వణికిపోతూ గజగజలాడ్తూ వేగంగా, పదిలంగా జీప్‌ను నడిపిస్తున్నాడు.
అడవంతా నిశ్శబ్దంగా గంభీరంగా.. తపస్సు చేసుకుంటున్న ఋషిలా ఉంది.
ఎక్కడో అక్కడక్కడ కనబడ్డ చిన్న చిన్న ఆదివాసీ గ్రామాలు కనుమరుగైపోయి.. యిక అంతా అడవే. ఎక్కడా మానవ సంచారంలేదు.
”అడవంటే యిష్టమా రాములూ నీకు” అన్నాడు విఠల్‌.
మూడున్నర గంటల తర్వాత అతను మాట్లాడిన మొదటి మాట అది.
”ఔన్సార్‌..”
”చాలా యిష్టమా.. కొంచెం యిష్టమా”
”చాలానే యిష్టంసార్‌..”
‘ఊఁ.. నాక్కూడా అడవంటే చాలా యిష్టం నీకులాగానే”
రాములు మాట్లాడలేదు.. ఈ సంభాషణేమిటి అసంగతంగా అనుకున్నాడతను.
”ఔను రాములూ ఆ రోజురాత్రి.. వర్షం కురుస్తున్న రాత్రి.. వరంగల్లు గెస్ట్‌హౌస్‌లో..జ్ఞాపకముందా..” అన్నాడు సడెన్‌గా.
పోలీస్‌ బుద్ది, కుక్కబుద్ది ఒకటే.. వాసన చూడ్డం. ఐతే, వాడు కానిస్టేబులైనా ఎస్పీఐనా ఒకటే.
”జ్ఞాపకముంద్సార్‌.. మంత్రి మాధవయ్యగారు హత్యచేయబడ్డ రాత్రిగదా మీరంటూన్నది.”
”ఊఁ.. ” ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు ఆ రాత్రి తను మంత్రిని చంపుతూండగా వీడు చూశాడని.
”నువ్వప్పుడు సెంట్రీడ్యూటిలో ఉన్నావా రాములూ”
”ఔన్సార్‌..”
వెంటనే ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు యిక వీణ్ణి లేపేయాలని.
సరిగ్గా అప్పుడే గ్రహించాడు రాములు ఈ ఎస్పీగానితో ఏదో ప్రమాదం పొంచిఉందని.
”ఐనా మీరు మొన్నటి ఎంక్వయిరీ కమీషన్‌ రిపోర్ట్‌లో నిర్దోషని తేలిపోయిందిగదా సర్‌.. కంగ్రాట్స్‌ సర్‌” అన్నాడు రాములు.
”ఊఁ..”
వెంటనే ఒక మెరుపులా లీల జ్ఞాపకమొచ్చింది విఠల్‌కు. పాపం పుణ్యాత్మురాలు తనను కాపాడిందా గండంనుండి. ఎంక్వయిరీ కమీషన్‌గా వేసిన ఆ ఢిల్లీ బేస్ట్‌ రిటైర్డ్‌ డిజిపి లక్ష్మీనారాయణ సక్సేనా ముక్కూమొఖం తెలియదు తనకు. ” అమ్మా కాపాడని” వేడుకున్నాడు తను లీలను దీనంగా. ఎంత విస్తృతమైన పరిచయాలో, ఎన్ని గ్లోబల్‌ లావాదేవీలో లీలకు. క్షణాల్లో తనను ఢిల్లీ పిలిపించుకుని ఒక కోటి రూపాయలతో సక్సేనాతో డీల్‌ సెటిల్‌ చేసింది. తర్వాత్తర్వాత చచ్చిపోయిన మంత్రి పెళ్ళాన్ని, తనను హైద్రాబాద్‌ పిలిపించి మూడు ముక్కల్లో మూడువందల కోట్ల వ్యవహారాలను ఫటాఫట్‌ పంచి సరే అనిపించింది. తనుమాత్రం రెండు కేసులకూ కలిపి ఓ నాలుక్కోట్లు తీసుకుందంతే. డెడ్‌ చీప్‌. సెటిల్‌మెంట్లు చేయడంలో ఎవడు సాటొస్తాడు లీలకు. వినకుంటే వాడు లేచిపోయిండంతే. ఒకసారి ఓ కర్ణాటక పాలిటీషియన్‌ వినకుంటే వాన్ని చార్టర్డ్‌ ప్లేన్‌లో తీసుకెళ్లి హిందూమహాసముద్రం డీప్‌వాటర్స్‌లో పడేసొచ్చింది స్వయంగా. వాడింకా పోలీస్‌ రికార్డుల్లో అబ్‌స్కాండింగుగానే ఉన్నాడు. ఒక్క ఆడది.. వంద మగాళ్లకంటే ఎక్కువ.. రియల్లీ గ్రేట్‌ లేడీ.
విఠల్‌ చుట్టూ చూచి.. ఎక్కడా మానవ సంచారంలేదని పకడ్బందీగా నిర్ణయించుకుని.. బాగా దట్టమైన చెట్లు, పొదలు, తుప్పలు.. పక్కనే పెద్ద లోయ.. నదిపాయ ఉన్న కీలక ప్రాంతాన్ని ఎన్నుకుని..
”జీప్‌ ఆపు రాములూ” అన్నాడు మృదువుగా.
రాములు సాలోచనగా ఎస్పీగాడి దిక్కు చూచి.. జీప్‌కు బ్రేక్‌ అప్లయ్‌ చేస్తూ.. ఇప్పుడు నిరాయుధంగా ఉన్న తనను వీడు తను పిస్టల్‌తో కాల్చే ప్రయత్నం చేస్తే ఎలా తప్పించుకోవాలా అని మెరుపులా ఆలోచిస్తున్నాడు. ఏమీ తోచడంలేదు. మరోవైపు భయం ముంచుకొస్తోంది గుండెల్లోకి.. వణుకు..వణుకు.
అనివార్యమైనపుడు..జైల్లో ఉన్నవాడు వేలిగోటితో గోడను గీకిగీకి పొక్కచేసుకుని తప్పించుకుని పారిపోయిన ఉదంతం జ్ఞాపకమొచ్చింది రాములుకు.
”యిక్కడెక్కడో.. నక్సలైట్ల డంప్‌ ఉండాలి.. వెదుకుదాం.”
విఠల్‌ కిందికి దిగాడు. అటువైపు నుండి రాములుకూడా దిగి.,
”నువ్వటు పో.. నేనిటు చూస్తా..ఓ.కే..”
”యస్సార్‌..”
అక్కడ డంప్‌ లేదు పాడులేదని విఠల్‌కు తెలుసు.. కాని ఒట్టి బహానా.
అటుదిక్కు విఠల్‌ అడుగులో అడుగేసుకుంటూ కదిలాడు ఏదో వెదుకుతున్నట్టు.
అదేక్షణం.. విఠల్‌ వెళ్తున్న దిశకు వ్యతిరేకదిశలో రాములు బయల్దేరాడు మెల్లగా.. అతని ఒళ్ళు గజగజ వణికిపోతోంది.. ఏ క్షణాన్నైనా విఠల్‌ చటుక్కున వెనక్కి తిరిగి తనను రివాల్వర్‌తో కాలుస్తాడని ఊహిస్తున్నాడతను.. కాని ఎలా.
మెరుపులా.. ఏదో తోచి.. జరజరా వాలుగా ఉన్న పెద్ద మట్టిజాలుపై నుండి క్రిందికి జారాడు రాములు కావాలని..వేగంగా, బండరాయిలా జారుతూ జారుతూ వేగంగా వచ్చి వచ్చి.. ఒక మోదుగుచెట్ల తుప్పకు తట్టుకుని ఆగి.. పిర్రలు, చేతులు, కాళ్ళంతా గీరుకుపోయి..,
లేచి నిలబడి.,
పైకి చూశాడు రాములు.. ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్న పెద్దపెద్ద ఎత్తైన చెట్లు.. కింద ఒంపులో.. ఒర్రెలో తను. విఠల్‌ కనిపించడంలేదు.
ఇలాగే పారిపోయి తప్పించుకుంటే.,
”అరె రాములూ.. ఏడున్నవ్‌రా.” పైనుండి ఎస్పీగారి అరుపులు,.,
పైకి చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తున్న రాములు కాలికి ఏదో చల్లగా, నునుపుగా తాకి.. దిగ్గున ఉలిక్కిపడి.. ఆగి.,
కాలిదగ్గర.. తుపాకీ.. ఎ.కె. ఫిఫ్టీ టు.. నల్లగా త్రాచుపామువలె మ్యాగజైన్‌ లోడ్‌ చేసి.. రెడీ టు యూజ్‌ టైప్‌లో, చటుక్కున చుట్టూ చూశాడు.. ఎక్కడా ఎవరూ లేరు.
రాములుకు క్షణంలో అంతా అర్థమైంది. తను యిదివరకు నక్సలైట్ల కూంబింగు ఆపరేషన్స్‌లో పాల్గొన్న అనుభవం గుర్తొచ్చింది. మళ్ళీ చుట్టూ చూశాడు పరిశీలనగా.. అటుప్రక్క తుప్ప.. అప్పుడే కప్పినట్టు ఎర్రగా.. కొత్తగా మట్టి..పైన తుమ్మకొమ్మలను కప్పినట్టు పచ్చిపచ్చి.,
టకటకా తుమ్మకొమ్మలను జరిపి.. కప్పిన మట్టిని చేతివ్రేళ్ళతో పెకిలించి. తోడి ..చకచకా..ప్రాణభయం ఒకవైపు.. అనుకోని గగుర్పాటు కల్గించే సందర్భం మరోవైపు.. ప్రక్కన ఎ.కె ఫిప్టీటు తుపాకీ..కొండంత ధైర్యం..ఓ జానెడు లోతుపోగానే చేతికి తాకింది పెద్ద రేకు సందుగ. తుపాకీతో మట్టిని పెళ్ళగించి, అటుతోడి ఇటుతోడి.,
”అరే రాములూ.. ఏడ సచ్చినౌరా..” విఠల్‌ గొంతు.. దగ్గరైతోంది తనకు.
కరకరా ఎండిన ఆకులు బూటు కాళ్ళకింద నలిగి విరుగుతున్న చప్పుడు
హమ్మయ్య.. ట్రంక్‌పెట్టె మూత తెరిచాడు రాములు.. తెరిచి కొయ్యబారిపోయి.. కళ్ళప్పగించి.. గుండె చెదిరి.
అన్నీ వేయి రూపాయలనోట్ల కట్టలు.. భద్రంగా నింపి, పేర్చి.. ప్రక్కన కొన్ని గ్రేనైడ్స్‌. రెండు ఎ.కె ఫార్టీసెవెన్‌ గన్స్‌.,
”వీటిని తను చేజిక్కించుకంటే..”రాములు మెదడులో ఓ మెరుపు మెరిసి, జలదరింపు కలిగి., చుట్టూ చూశాడు.. ఆలోచన పదునెక్కుతోంది. క్షణంలో వందప్లాన్స్‌ రూపొంది, మలిగి..మళ్ళీ రూపొంది.. మళ్ళీ చచ్చి.. మొండి ధైర్యం తలెత్తుతోంది నిద్రలేస్తున్న బ్రహ్మరాక్షసిలా.
ఏదన్నా చేస్తే?.. ఈ డంప్‌లోని కోట్లకొద్ది డబ్బు తనదే.. పోలీసోళ్ళు ఎన్ని డంప్‌లను దొంగతనంగా దొంగల్దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దోచుకోలేదు.. తనకిప్పుడు భగవంతుడు ఒంటరిగా దీన్ని చేజిక్కించుకునే అవకాశమిచ్చాడు ..కమాన్‌ కమాన్‌ క్విక్‌.. ఏదో నిర్ణయం తీసుకోవాలి రెప్పపాటులో .. అవకాశాలు మళ్ళీ మళ్ళీరావు.
వెనుకనుండి మెత్తగా బూట్ల చప్పుడు వినబడింది రాములుకు.
విఠల్‌.
పిలుస్తూ రావడం మానేసి.. హైడ్‌ అండ్‌ సీక్‌ టైప్‌లో దాడికి వస్తున్నాడు..
యిక ఒక్క లిప్తకాలం కూడా వృధా చేయలేదు రాములు. చేతిలోని ఎ.కె. ఫిఫ్టీ టు తో విఠల్‌ను దగ్గరగా పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో తూట్లు తూట్లు కాల్చాడు వరుసగా దూసుకుపోయే బుల్లెట్లతో.
విఠల్‌ శరీరం క్షణాల్లో మాంసం ముద్దలుగా ఖండఖండాలై ఎగిరి..ఎర్రగా రక్తం.. మజ్జ.. ఎముకలు చిట్లి చిట్లి.. గాలిలోకి ఎగిరి ఎగిరి చెల్లాచెదరైపోయింది.
క్షణకాలం అడవి తుపాకీ గుళ్ళధ్వనితో దద్దరిల్లి.,
చెట్లపైనుండి పకక్షులు అదిరిపడి ఎగిరి.. ఆకాశంలోకి రెక్కలార్చి.. టపటపా టపటపా ,
మరుక్షణం.. మళ్ళీ భీకర నిశ్శబ్దం.
రాములు నిలబడ్డాడు అలాగే.. దృఢంగా.. స్థిరంగా.. ఒక చెట్టువలె. అతని తల దిమ్మెక్కిపోయింది.. తిమ్మిరి.. భయం.. దడ దడ.. ప్రకంపన.. సంతోషం.. తను బతికినందుకు. తనను చంపాలనుకున్నవాణ్ని తాను చంపినందుకు.
పైగా.. ప్రక్కన.. కోట్ల రూపాయలు..పిచ్చి ఆనందం. ఉద్విగ్నత.
క్షణకాలంలో తేరుకుని రాములు..షాక్‌లోనుండి బయటపడి.,
వంగి చకచకా ట్రంక్‌పెట్టెలోని వేయిరూపాయల కట్టలను బయటికి తోడుకుంటు పడేస్తూ చుట్టూ ఉన్న సర్వ ప్రపంచాన్ని మరచిన ఉన్మాదక్షణంలో.,
ప్రక్క సెలయేరు దాపుల్లోనుండి దూసుకొచ్చిన ఎ.కె. ఫార్టీసెవెన్‌ తుపాకీ గుళ్ళు రాములు శరీరాన్ని తుత్తునియలు చేసి ముక్కలు ముక్కలుగా గాల్లోకి విసిరేశాయి.
అడవి దద్దరిల్లంది.
అక్కడంతా చెల్లాచెదురుగా.. పచ్చని ఆకులపై ఎర్రగా చిక్కని రక్తం.. మాంసం ముద్దలు. నిశ్శబ్దం.
ఎక్కడా మనుషుల అలికిడిలేదు
ఐతే.. దూరంగా.. సెలయేటి ఒడ్డుమీద ప్రశాంతంగా గడ్డిమేస్తున్న పశువులమంద దగ్గరినుండి ఎవరో కాపరి వినిపిస్తున్న పిల్లనగ్రోవి ధ్వని మృదువుగా, లలితంగా.. తెరలు తెరలుగా అడవిలోకి ప్రవహించడం మొదలైంది.
అడవి తనను స్పర్శిస్తున్న పాటకు పులకించిపోతోంది పరవశించి.. వివశయై.

22

28

అర్ధరాత్రి దాటింది.
సువిశాలమైన ముఖ్యమంత్రి అత్యంత ఆంతరంగిక సమావేశ మందిరం. హాల్‌నిండా వెన్నెల నిండినట్టు, చల్లగా వసంతఛాయలు వ్యాపించి, గాలినిండా పారిజాత పరిమళం నిండి.. నిశ్శబ్దం ఎంతో మధురమై ధ్వనిస్తున్న వేళ..
ఇద్దరే వ్యక్తులు.
డెబ్బయ్యారేండ్ల ముఖ్యమంత్రి. ముప్పయిరెండేళ్ళ లీల.
సోఫాల్లో ఎదురెదురుగా.. మధ్య మౌనగంభీర అనిశ్చితి.
‘ఇంత’రాత్రి ముఖ్యమంత్రి గారు తననిలా ఏకాంతంగా, ఒంటరిగా ఎందుకు పిలిపించినట్టు. ఇది ఒక ప్రత్యేక రహస్య సమావేశం వలెనే ఉంది. లోపలికొస్తూంటే పి.ఎస్‌, సెక్యూరిటీ, స్టెనో.. ఇతరేతర ఇన్‌విజిబుల్‌ గార్డ్స్‌ ఎవరూ లేరు. ఒక్క బంట్రోతుమాత్రమే ఉండి రాగానే ‘ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ హాల్లో కూర్చోమన్నారు’ అని ఈ హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. అంతే.. యిక ఏ ఇతర మానవ సంచారమూ లేదు.
ఎందుకిలా..
వ్చ్‌. అర్ధంకావడంలేదు.
ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితుడు, మధ్య అత్యంత పరస్పర విశ్వసనీయుత కూడా ఉంది.. అనేకానేక కోటానుకోట్ల ప్రభుత్వ ప్రభుత్వేతర ఆర్థిక లావాదేవీలు తమ మధ్య ఉన్నాయి. వ్యాపారముంది. వ్యవహారముంది. వీటికి అతీతమైన ఇంకేదో వాత్సల్యంతో కూడిన, భాషకందని ఆత్మీయతకూడా ఉంది.
ఏమున్నా.. అతని సంస్కారంపట్ల, తెలివిపట్ల, వ్యవహార దక్షతపట్ల.. అన్నింటినీ మించి తనతో పనిచేస్తున్నపుడు చూపే హృదయస్పర్శపట్ల ఎంతో గౌరవముంది తనకు.
జీవితాన్ని చాలా లోతుగా, చాలా తరచి తరచి సూక్ష్మదర్శినిలో చూచినట్టు దర్శించిన వాడాయన. తన దాదాపు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరో కౌటిలుల్ని, వ్యూహకర్తలను, దార్శనికులను, ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాళ్లను, పరమ దుర్మార్గులను, నీతిహీనులను, గుండాలను.. ఎందర్నో చూశాడు తను. అన్నింటినీ ఎదుర్కొని.. అందర్నీ తట్టుకుంటూ, భరిస్తూ..
తను వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత..పదినిముషాలు గడిచి..అప్పుడొచ్చాడాయన. అదే తెల్లని ధోతీ.. తెల్లని లాల్చీ.. అర్ధరాత్రి దాటినా ముఖంపై చెదరని చిర్నవ్వు. అలసటలేని గాంభీర్యం.
వచ్చి తన ఎదురుగా సోఫాపై మౌనంగా కూర్చుని,
అలా కూర్చునిపోయాడంతే చాలాసేపు.
ఐతే అతను వ్యాకులంగా ఉన్నాడు. అంతఃర్మథనంలో ఉన్నాడు. ఏదో లోలోపల ఘర్షణపడ్తున్నాడు.
”లీలా.. నువ్వు విజ్ఞురాలివి.. అనేక విషయాలు తెలిసిన దానివి. చిన్నవయసులోనే ప్రపంచాన్ని లోతుగా చదివినదానివి.. అందుకే నీతో మనసును పంచుకుందామనీ, బయటికి వ్యక్తీకరించలేని ఒక అంతర్గత మథనకు నిష్కృతిని అన్వేషిద్దామని..” ఆగిపోయాడు.
వత్తి అంటుకున్నపుడూ, ఆరిపోబోయేముందూ తెగుతూ మండుతూ, మండుతూ తెగుతూ తల్లడిల్లుతుంది కాసేపు. అలా ఉన్నాడతనప్పుడు.
”జీవితంలో ఎప్పుడూ అధికారంలో ఉండడమే విజయమనీ, విజయమే మనిషి ప్రతిభకు తార్కాణమనీ, విజయాన్ని సాధించే క్రమంలో రాజనీతి ప్రకారం ధర్మాధర్మ విచక్షణ అనవసరమనీ అనుకుంటూ వచ్చాను లీలా. ఐతే కొన్నిసార్లు విజయాలు సాధిస్తాం కాని నిజాకి ఓడిపోతాం.. అధికారంలో, కుర్చీలో ఉంటాం కాని వాస్తవంగా ఎవడికో బానిసగా, తోలుబొమ్మవలె ప్రవర్తిస్తూ జీవిస్తాం.. ఈ తేడా మనిషిని నిశ్శబ్దంగా ఒక లోహాన్ని ఆసిడ్‌ తిన్నట్టు తినేస్తూ మెల్లగా మరణం రుచిని చూపిస్తూంటుంది.. ఔనా..” అని ఆగి,
అతను తనతో తానే గంభీరంగా సంభాషించుకుంటున్నట్టు.. లేదా తనపై ఎంతో ఆత్మీయతతో కూడిన గౌరవంతో తనను తాను నివేదించుకుంటున్నట్టు.,
”మీకు తెలియందేముంద్సార్‌. వర్చువల్‌ రియాలిటీ, రియల్‌ రియాలిటీ అని రెండున్నాయి గదా. గెలుస్తాం కాని నిజానికి ఓడిపోతాం.. ఒక వస్తువు హర్రాజ్‌లో ఏదో క్షణికమైన ఆవేశానికి లోనై దాని వాస్తవ విలువకంటే ఎన్నోరెట్టు ఎక్కువపెట్టి దాన్ని స్వంతం చేసుకుంటాం. కాని తర్వాత తెలుస్తుంది దాని విలువ తక్కువని. అది గెలిచి ఓడడం. నీతిగా, నిజాయితీగా ఒక రోజంతా కష్టపడి వందరూపాయలే సంపాదించినా అదే పనిని అవినీతితో నిర్వహించి ఐదువందలు సంపాదించే వ్యక్తితో పోల్చుకుని ఆత్మతృప్తితో ఆనందపడడం ఓడి గెల్వడం వంటిది. ఇదొక ధర్మ మీమాంస..”
”’ఔను.. ధర్మం వేరు న్యాయం వేరుగదా..”
”ధర్మం కాలంతో పాటు మారనిది. శాశ్వతమైంది. న్యాయం మనిషి చేత నిర్వచింపబడేది, కాలంతోపాటు మారేది.”
”అధికారం.. వ్యామోహం.. శాశ్వతత్వం.. చరిత్ర.. వీటిని విస్తృతమైన అవలోకనలో దర్శించినపుడు.. మనిషి యొక్క దూరదృష్టి, పరిణతి, వికాసం నిజంగా ఎంత ఉదాత్తంగా ఉండాలి లీలా.. మనం ఆ కోణంలో చూచినపుడు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నామో అనిపిస్తోందప్పుడప్పుడు. ఒక విషయం చెప్తాను చూడు, 1776లో బ్రిటిష్‌ పాలనలో ఉన్న అమెరికాను యుద్ధంచేసి విముక్తంచేసిన తర్వాత జార్జ్‌ వాషింగ్టన్‌ తను తలచుకుంటే తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుని ఏకచ్ఛత్రాధిపత్యంగా యిష్టమున్నంతకాలం యిష్టమొచ్చినట్టు పరిపాలన కొనసాగించగలిగేవాడు. కాని ప్రజాపక్షపాతి ఐన దార్శనికుడు కాబట్టి ఆయన ఆ ఏకవ్యక్తి పాలనను వద్దని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి, ఒక రాజ్యాంగాన్ని నిర్మించి, క్రమశిక్షణతో కూడిన అనేక నియంత్రణలతోపాటు అతిస్వేచ్ఛను పరిహరించే శాస్త్రీయ స్వాతంత్య్రాన్ని ప్రసాదించాడు. అందుకే ఒక ప్రపంచ అగ్రరాజ్యానికి ”జాతిపిత” కాగలిగాడు. రెండు వందల ఏళ్ళకు పైగా కాలం గడిచినా యింకా తరతరాలుగా అమెరికా ప్రజల హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిఉన్నాడు. అధికార వ్యామోహం గనుక వాషింగ్టన్‌కు ఉంటే చరిత్రలో యింత పవిత్రమైన స్థానం దక్కి ఉండేదికాదుగదా.. కుర్చీ.. సింహాసనం.. అధికారం.. యివి..”
ఒక తీవ్రమైన ఉప్పెనలో కొట్టుకుపోతున్న ఒట్టి అట్టపెట్టెలా అనిపించాడాయన ఆమెకాక్షణం.
”నిస్సందేహంగా జార్జ్‌ వాషింగ్టన్‌ చాలా గొప్పవాడే సర్‌. కాని చక్రవర్తిత్వాన్ని కాదని ఒక ప్రజాస్వామ్య దేశంగా అమెరికానుప్రకటించిన తర్వాత ఆయనే మొదటి, రెండవ అమెరికా అధ్యకక్షునిగా అధికార పగ్గాలను చేపట్టారు గదా.ఆ కోణంలో చూస్తే ఎప్పుడూ ఏ అధికారాన్నీ ఆశించకుండా ఒక రక్తపుబొట్టు కూడా చిందకుండా భారత స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీ సంగతి..ఈయనెంత గొప్పవాడు. స్వతంత్ర సాధన తర్వాత కూడా ఎన్నడూ ఏ పదవీ కోరుకోలేదే….
” ఆదే పొరపాటు జరిగింది లీలా. నీ వంటి పరిణతి గల ఆధ్యయనకారులు కూడా యిక్కడే హేతుబద్దంగా ఆలోచించడం లేదు…”
”ఎలా….”లీలా కంగుతుంది.
”అక్కడ వాషింగ్టన్‌ ప్రజాస్వామిక ఆమెరికాను ఏ రకంగా స్యప్నించాడో ఆ విధంగా అ దేశం యొక్క ఆకృతిని తీర్చిదిద్దేంకు స్వయంగా పూసుకుని పటిష్టమైన రాజ్యాంగాన్ని నిర్మింపజేసి, దాన్ని స్వయంగా తాను ఆమలు చేసి చూపించి ఒక దారి ఏర్పర్చి….. యిక ఈ మార్గంలో నడవండని చిటికెన ప్రేలును వెనక్కి తీసుకుని వెళ్ళి పోయాడు. అలాగే గాంధీ కూడా తన అద్భుతమైన సిద్ధాంతాలను రాజ్యాంగబద్దం చేసి, కుర్చీపై కూర్చుని ఆమలుచేసి చూపి విలువలతో కూడిన రాజకీయ సంస్కృతిని స్థాపిస్తే బాగుండేదేమో…ఆది జరుగలేదు కాబట్టి ఓ పదిరవై ఏండ్లు దాటక ముందే చూడు రాజకీయాలు బురదకుంటై, పందులు పొర్లాడే రొచ్చుగుంటై ఛండాలమైపోయింది.”
”……” లీల నిజంగా షాకైంది… నిజమేనా ఆని అన్పించిందామెకు.
గాంధీ… అనే జీవి ఒక్కడే… కాని వ్యక్తినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా అర్థమౌతున్నాడు గదా.
”విలువల కోసం అధికారమా… అధికారంకోసం విలువల త్యాగమా, ఇదమ్మా అసలు ప్రశ్న ఈ రోజు” అన్నాడు ముఖ్యమంత్రి మళ్ళీ.
”నిస్సందేహగా అధికారంకోసమే విలువల విధ్వంసం నిర్లజ్జగా కొనసాగుతోంద్సార్‌ ఈ రోజు భారతదేశంలో..
ఈ దౌర్భాగ్య పరిస్థితి మారాలి లేకుంటే ఎవనికందిందివాడు అప్పులుతెచ్చి..పైనబడి లాక్కుని.. ఎగబడి గుంజుకుని దోచుకునే స్థితి ఏర్పడ్తుంది. విలువలకోసం మాత్రమే అధికారం ఒట్టి నామమాత్రంగా నిర్వహించబడే  చేష్ట కావాలి.”
”ఔనా..”
”ఔన్సార్‌ .. ” అంది లీల స్థిరంగా .. దృఢంగా ఖచ్చితంగా
”కదా .. అసలీ రామం ఎవడమ్మా”
లీల మాట్లాడలేదు.
అనుకోని ప్రశ్నకు ఉలిక్కిపడి.. తర్వాత ఆశ్చర్యపడి.. తేరుకుని,
”రామం అనేవాడు జనసేనను స్థాపించి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు”
”…”
”రామం అనేవాడు .. నాలోకి నేను తొంగిచూచుకుని ఆత్మాన్వేషణతో పునర్విమర్శ చేసుకొమ్మని వేదిస్తున్నాడు..”
”…..”
”రామం అనేవాడు నా ఆత్మను ఒక గునపమై పొడిచి పొడిచి ప్రశ్నిస్తున్నాడు”
”……”లీల ఆవేశంగా మాట్లాడ్తున్న ముఖ్యమంత్రి ముఖంలోకి కొయ్యబారి చూస్తోంది.
”రామం అనేవాడు హిరణ్యకశిపుణ్ణి పరేషాన్‌ చేసిన ప్రహ్లాదునివలె వెంటాడ్తూ చాలా కలవరపెడ్తున్నాడు”
”……”
”రామం అనేవాడు దుర్మార్గులైన రాజకీయ నాయకులందర్నీ ఉచ్చలుపోయిస్తూ అంతరాంతరాల్లో వీడురా మగాడంటే..అని అన్పించుకుంటూ అందరిచేతా ప్రేమించబడ్తున్నాడు”
”…..” లీల ఆశ్చర్యంగానేఐనా.. ఆనందంగా ఆయనవంక చూస్తోంది.
”అసలు ఈ రామం ఎవడు..?” స్థిరంగా ఉంది ముఖ్యమంత్రిగారి గొంతు.
లీల లేచి నిలబడింది సోఫాలోనుండి.
యటికి నడవడం ప్రారంభిస్తూ.. ”రామం ఒక ఋషి” అంది స్పష్టంగా
బయటికొచ్చి కార్లో కూర్చుంటున్న లీలకు ముఖ్యమంత్రి తనను ఎందుకు పిలిపించుకున్నాడో అర్థంకాలేదు. కాని వచ్చి తను ఏమి నేర్చుకుందో మాత్రం స్పష్టంగా అర్థమైంది.

29

23

”ఎందుకు..?”
”వ్చ్‌.. ఏమో..”
”ఎందుకో..?”
”ఏమో తెలియదు.”
”ఇంత అర్ధరాత్రి ఈ అత్యవసర పిలుపేమిటో.. మీకేమైనా తెలుసా”
”తెలియదు. మీకు తెలుసా”
”ఉహుఁ.. నాక్కూడా తెలియదు. వెరీ అర్జంట్‌ అంటే ఉన్నపళంగా వచ్చా. ఇంత రాత్రి నలభైమందికి అత్యవసర పిలుపు. పన్నెండు గంటల ముప్పయి నిముషాలకు.. ముఖ్యమంత్రి నివాసభవనంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో.. అందరికీ ఆశ్చర్యం.. ఎందుకు.. ఎందుకు..?
అన్ని ప్రముఖ దినపత్రికల సంపాదకులకు మాత్రమే, అన్ని తెలుగు న్యూస్‌ చానళ్ళ అధిపతులకు, ‘జనసేన’ బాధ్యులు ముగ్గురు..రామం, డాక్టర్‌ గోపీనాథ్‌, క్యాథీ, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌..ఒకే ఒక లోక్‌సభ సభ్యురాలు, ఒక పౌర హక్కుల నేత, ఒక మానవ హక్కుల సంఘ నాయకుడు, ఒక యాభై తొమ్మిదేళ్ళ వయసున్న సీనియర్‌ ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ సుబ్బన్న ఐఎఎస్‌, అటార్నీ జనరల్‌, ఆంటీ కరప్షన్‌ బ్యూరో చీఫ్‌.. వీళ్ళు మొత్తం నలభైమంది.ఒక్క మంత్రి కూడా ఆ మీటింగుకు ఆహ్వానింపబడలేదు.
రాత్రి పన్నెండుగంటల ఇరవై నిముషాలైంది.
బయట చిక్కని చీకటి.. ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌హాల్‌లో చిక్కని పాలవంటి వెలుగు.
ఒకటితర్వాత ఒకటి..మెత్తగా, మెల్లగా ఒక్కోకారు వచ్చి పొర్టికో ముందు ఆగి.., ఆహ్వానితుల్లో ఎవరో ఒకరు దిగి.. హడావుడిగా.. ముఖంనిండా మొలిచే ప్రశ్నతో లోపలికి నడుస్తూ,
బయట ఎక్కడా సెక్యురిటీ హంగామా లేదు.
ఉన్నత రాజకీయవర్గాల్లో వార్త ఎప్పుడూ అంటుకున్న పెట్రోల్‌ మంటే..ప్రాకిపోయింది. మనిషికి ఎప్పుడూ ఉత్సుకత అనేది నోట్లో నానని నువ్వుగింజ. బయటికి కక్కేదాకా కడుపుబ్బుతుంది.
దాదాపు నలభై రెండుమంది మంత్రుల ఇళ్ళలోని అందరి సెల్‌ఫోన్లు పరమబిజీగా ఉన్నాయి. ‘మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి నివాసంలో ఏమిటీ ఉన్నతస్థాయి సమావేశం.. ఎందుకు. ఏమిటి సంగతి.. ఏం జరుగబోతోంది..” అంతా టెన్షన్‌.
”కనుక్కునేదెలా..?”
ప్రయత్నించు ప్రయత్నించు.. నీకు తెలిస్తే నాకు చెప్పు.. నాకు తెలుస్తే నీకు చెప్తా.
ఈ లోగా ఢిల్లీకి కబురు.. అధిష్టానం పెద్దలకు..తాబేదార్లకు, పైరవీకార్లకు, బ్రోకర్లకు, ఏజంట్లకు.. సలహాదార్లకు అందరికి వాళ్ళవాళ్ళ మనుషులు హాట్‌లైన్లలో సమాచారం చేరవేసి ‘ఏమిటో’ కనుక్కుంటున్నారు.
అన్ని చోట్లనుండీ ఒకటే జవాబు ‘తెలియదు’ అని
సమయం పన్నెండూ ముప్పయి.
సెక్రటరీ రామలక్ష్మి వచ్చింది ముఖ్యమంత్రి గదిలోకి. అక్కడ ఆయన, అతని భార్య ఉంది. ఆమె డెబ్బయిమూడేళ్ళ వృద్ధాప్యంలో పండుపండిన గోగుబుట్టలా ఉంది.. నిండుగా, ప్రసన్నంగా ముఖ్యమంత్రి కూడా చాలా నిబ్బరంగా, తృప్తిగా.. ముఖంనిండా వెలుగుతో ఉన్నాడు.”సర్‌. అందరూ వచ్చార్సార్‌” అంది రామలక్ష్మి వినయంగా. ఆమెకు జరుగబోయేది చూచాయగా అర్ధమైంది. రేపు భారత రాజకీయ చరిత్రలో సంభవించబోయే పెనుసంచలనాన్ని అంచనా వేస్తోందామె. ఐతే ఆమె ఒక రకమైన లౌకికాతీత ఆనందాన్ని అనుభవిస్తూ ముఖ్యమంత్రి గారి ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూచింది.
మాట్లాడకుండానే లేచి వెంట భార్యను తీసుకుని మౌనంగా కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి నడిచాడు. అతని వెంట ఓ బరువైన తోలుసంచీని మోసుకుంటూ రామలక్ష్మి కూడా కదిలి,
హాలులోని వేదికపైకి ముఖ్యమంత్రి దంపతులు రాగానే గౌరవపూర్వకంగా అందరూ లేచి నిలబడ్డారు. దంపతులిద్దరూ వేదికపైకి చేరగానే చేతులు రెండూ వినమ్రంగా జోడించి అందరికీ నమస్కరించి వేదికపైనున్న రెండే రెండు కుర్చీల్లో ఆసీనులై,
హాల్‌లో ఒకే ఒక ఫోటోగ్రాఫర్‌ ఉండే విధంగా ఏర్పాటు చేయబడింది.
వేదికపై మీడియా మైక్రోఫోన్‌లున్నాయి.
అంతా నిశ్శబ్దం.. గంభీరం.. ఉద్వేగం.
అందరి ముఖాల్లోకి ఒకసారి కలియజూచి, ఆయన కళ్ళు ‘జనసేన’ సంస్థాపకుడు రామం కోసం వెదికాయి..కాని రామంపై కొద్దిరోజుల క్రితం వరంగల్లులో జరిగిన బాంబుదాడి జ్ఞాపకమొచ్చి., జనసేన తరపున వచ్చిన సిద్ధాంతకర్త గోపీనాథ్‌, క్యాథీ, ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తి..ఇతర నిప్పువంటి వ్యక్తిత్వం గల పాత్రికేయులు..పత్రికా సంపాదకులు, టి.వి. సిఇఓలు, హైకోర్టు చీప్‌ జస్టిస్‌.. లోకాయుక్త.. అందర్నీ కళ్ళతో పలకరించి,
”మిత్రులారా.. డెబ్భై మూడేళ్ళ వయసులో.. నిజానికి ఏ రాజకీయనాయకున్నీ ఇన్నాళ్ళ దాకా పని చేయనివ్వద్దు.. ఈ పెద్ద వయసులో చాలా అలసటతో, బాధతో, దుఃఖంతో మీతో ఒక మంచి స్నేహితునిగా నా వ్యధను పంచుకోవాలని ఈ వేళగానివేళ మిమ్మల్ని యిక్కడికి రప్పించాను. మొదట అందుకు నన్ను క్షమించండి. దాదాపు యాభై సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్నాను. చిన్నపిల్లాడిగా గాంధీ టోపిని నెత్తిపై పెట్టుకుని ఈ పవిత్ర మాతృభూమినే తలపై కిరీటంగా ధరించినంత ఆనందాన్ని పొందాను. ఒక్కోమెట్టు. ఒక్కో అడుగు.. ఒక్కో అధ్యాయం.. ఎందరో మహానుభావులు.. పుచ్చలపల్లి సుందరయ్యగారు, తరిమెల నాగిరెడ్డి, తెన్నేటి విశ్వనాధం, సురవరం ప్రతాపరెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, చండ్ర రాజేశ్వర్రావు.. పార్టీలు ఏవైనా.. అందర్లోనూ మూలధాతువైన మానవతా విలువలు, దేశభక్తి, సామాజిక చింతన, ప్రజాసంక్షేమ పరితపన. బ్రిటిటిష్‌వాడు విడిచిపెట్టివెళ్ళిన ఈ భారతదేశంలో అవిద్య, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం, దరిద్రం.. ఇవే ఎక్కడ చూచినా.. వీటికితోడు మతకలహాలు.
పరిపాలన అనే ఫ్లైట్‌ టేకాఫ్‌ సరిగానే జరిగింది.
ప్రజాకవి శ్రీశ్రీ చెప్పాడు..కాదు హెచ్చరించాడు 1964లోనే,
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగ మింకొకవైపు-
అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు-” అని
జాతీయభావం, దేశంపట్ల ప్రేమ, మాతృభూమిపట్ల మమకారం, పౌరునిగా సామాజిక బాధ్యత.. యివన్నీ క్రమంగా నశిస్తూ.. నిజంగానే అతివేగంగా ఈ దేశం దిగజారడం మొదలైంది.
నిజానికి నేనిప్పుడు మీతో మాట్లాడ్తున్నదంతా నా ఆత్మతో నేను జరుపుతున్న ఒక స్వగత సంభాషణ వంటిది.
కర్ణునిచావుకు కారణాలనేకం అన్నట్టు ఈ దేశం ఈ రకంగా పతనమై దిగజారిపోయేందుకు గల అనేక కారణాల్లో నాలాంటి సీనియర్‌ రాజకీయనాయకులు కూడా శల్యుని పాత్ర, శకునిపాత్ర, విభీషణుని పాత్ర యిలా అవకాశాన్ని బట్టి  కుర్చీకోసం, పదవులకోసం, అధికారంకోసం రాజీపడి.. తలవంచుకు నిలబడి.. తప్పులు చేసి.. తప్పువెనుక తప్పులు చేసి.. దుర్మార్గాన్ని ఎదిరించవలసివచ్చినపుడు ఎదిరించకుండా మౌనం వహించడం యుద్ధనేరం. మాట్లాడవలసివచ్చినపుడుమాట్లాడకుండా మిన్నకుండడం పరమ పాతకం. అలాంటి పాపాలు, నేరాలు నేను కూడా చాలానే చేశాను. యిప్పుడు నేనిలా మాట్లాడ్డం వృద్ధ నారీ పతివ్రత’ లాంటిదే. నాకు తెలుసు. కాని యిప్పటికైనా నేను చేసిన తప్పులకు చెంపలేసుకుని కన్‌ఫెస్‌ ఐపోదామనే.
వెనక్కి తిరిగి చూచుకుంటే.. నాపై నాకే అసహ్యమేస్తోంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు చేస్తున్న అకృత్యాలనెన్నింటినో వ్యతిరేకించి ఎదిరించలేదు సరికదా, అమోదముద్ర వేశాను. బొక్కసంలో ఒక్క పైసా లేకున్నా ప్రజలకు పంచరంగలు కలలను చూపించాం. అధిష్టానం అడిగినా అడుగకున్నా నెలకింత అని కోట్లానుకోట్ల రూపాయలను కార్లలో పంపించాం. శాసనసభ్యులు ఎదురుతిరుగుతారనే భయంతో ఎవడేదికోరితే అది..రోడ్ల కాంట్రాక్ట్‌లు, పవర్‌ ప్రాజెక్ట్‌లు, సెజ్‌ల అలాట్‌మెంట్స్‌, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, మైన్‌ లీజులు, ఇసుక సీనరేజ లీజ్‌లు.. హార్బర్లు, సముద్ర జలాల అప్పగింత, అడవుల లీజ్‌, కొండల గుట్టల లీజ్‌లు.. ఎన్ని..ఎన్నెన్ని.
ఓట్లకోసం ఆర్థికంగా సాధ్యంకాని ఎన్నో ఉచితాలను ప్రకటించాం. బియ్యం, విద్యుత్తు, టి.విలు, ఫీజులు, పచ్చకార్డులు, ఆరోగ్యపథకాలు.. మాకు తెలుసు ఇవేవీ అమలు కావని. ప్రపంచబ్యాంక్‌ అప్పులు, ఐఎమ్‌ఎఫ్‌ అప్పులు, జపాన్‌లాంటి దేశాల పరస్పర వినియోగ ఆర్థిక సహకారాలు.. పబ్లిక్‌ బాండ్స్‌, ప్రజలనుండి అప్పులు.. ఎన్ని చేసినా తెచ్చిన బుడ్డపరకలాంటి అప్పును రాజకీయనాయకుల రూపంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ జస్ట్‌ చప్పరించి సఫా చేయడమే. మరుక్షణమే మళ్ళీ మేతకు తయ్యార్‌.  ఈ నా ప్రక్క తోలుసంచీలో అన్ని వివరాలున్నాయి. తొంభైశాతం శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, జిల్లాలలో కార్పొరేటర్లు.. అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయినిబట్టి జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయి కాంట్రాక్టర్లే. సిగ్గులేకుండా ప్రజలసొమ్మును, ప్రభుత్వ సొమ్మును భోంచేయడానికి అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీ, వామపక్ష పార్టీ అన్న తేడాలేదు. అందరిదీ ఒకటే జాతి. వీళ్ళందరూ నా హయాంలో అడ్డమైన పనులను చేస్తూ నాతోకూడా చేయించినవారే. యిప్పుడు ప్రజాకర్షక పథకాలను ఓట్లకోసం ప్రవేశపెట్టిన భారతదేశంలోని ప్రతి రాష్ట్రప్రభుత్వం ప్రజలను బిచ్చగాళ్ళను చేయబోయి తామే ఓ పెద్ద బిచ్చగత్తె ఐ కూర్చుంది. చివరికి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ తాగుబోతుల దయతో, వాళ్ళు దానం చేస్తున్న ఎంగిలి సొమ్ముతో బతికి బట్టగడ్తున్నాయి. కాని ఈ నీటి బుడగ ఎన్నాళ్ళో నిలవదు. చితికి బ్రద్దలైపోద్ది.

30
ప్రజల తరపున రాజ్యాంగ నిర్వచనం ప్రకారం ప్రభుత్వ అధికారుల పనితీరును, శాసనాల, విధానాల అమలును పర్యవేక్షించి తనిఖీ చేయవలసిన ప్రజాప్రతినిధులే అధికారులతో కలసిపోయి కంచే చేను మేసినట్టు, ఇంటికుక్కే ఇంటి యజమానిని కరిచినట్టు కుమ్మక్కయితే యిక ఏ రూల్సూ, ఏ నిబంధనలూ సమాజాన్ని భ్రష్టుపట్టడం నుండి కాపాడలేవు. ఈ రోజు..నావద్ద రికార్డులున్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎనభైశాతం అవినీతి ఉంది. పర్సెంటేజ్‌లున్నాయి. కమీషన్లున్నాయి. దీనికి తోడు నాణ్యతలేక, ప్రమాణాలు పడిపోయి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో పనికిరాని, పనిచేయరాని ఉద్యోగుల మెజారిటీవల్ల అసలు పరిపాలన స్తంభించిపోయింది. అంతా కాగితాలకే పరిమితమైన పని మాత్రమే మిగిలి ఉంది..నిజానికి ఎక్కడా ఏమి ఉండదు. వ్యవస్థ అంతా అసమర్థమై, నిర్వీర్యమై క్రమశిక్షణ పూర్తిగా లోపించింది.
ఎవడు ఎవనిమాట వినడు.. ఎవడు ఎవన్ని లక్ష్యపెట్టడు.. అతిస్వేచ్ఛ.. నిర్లక్ష్యం.. ఎదురుతిరుగుడు.
అనేక దేశాల్లో ఉన్నట్టు ”ఐ లౌ మై ప్రొఫెషన్‌” అనే తత్వమే యిక్కడ లేదు. అంకితభావం లేదు. ఇది ప్రజలసొమ్ముకదా మనం ప్రజలకు జవాబుదారులం కదా అన్న స్పృహ లేదు.
‘కుచ్‌తో భీ కరో.. బస్‌ పైసే కమావో” అనే కల్చర్‌ ప్రబలిపోయింది.
మిత్రులారా.. యిదంతా మీకు తెలిసిందే. కాని ఈ రోజు నా తప్పును నేను ఒప్పుకుని తలవంచుకుని ఈ వ్యవస్థ యికముందు యింకా యింకా పతనం చెందొద్దనీ, ఈ దురాగతాలకు కనీసం యికనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, భావితరాలు ఈ పరమ దుర్మార్గ మృగతుల్య రాజకీయ నేరచరితుల చేతుల్లో బందీలై నష్టపోవద్దని క్షోభపడి క్షోభపడి, కొద్ది రోజులుగా అంతర్మథనం చెందీ చెందీ, ‘భయం’ అనే సంకెళ్ళను తెంచుకుని, నన్ను ఈ రాజకీయ బురద కంపునుండి విముక్తం చేసుకోడానికి భరించలేని ఆత్మక్షోభతో, దుఃఖంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా నా ప్రధానమైన కొన్ని నిర్ణయాలను బహిరంగంగా, నిస్సంకోచంగా మీముందు, మీరు సాకక్షులుగా ప్రకటిస్తున్నాను.
ఒకటి.. నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంలేదు. నా నాయకత్వంలో పనిచేస్తున్న నాతోసహా చాలామంది అవినీతి మంత్రుల సవివరమైన, లంచగొండి పనితీరు నివేదికలను ఋజువుల్తో సహా గవర్నర్‌కు, రాష్ట్రపతికి సమర్పిస్తూ నా ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్‌ చేసి ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాను.
రెండు.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యిదివరకటి ముఖ్యమంత్రుల హయాంలో కూడా నేను మంత్రిగా ఉన్నపుడు కలిపి.. గత పదిసంవత్సరాల అప్పులు, ఆస్తుల పట్టికలను, ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నలభై ఐదుశాతం ఋణాలు, వడ్డీచెల్లింపుల కిందనే ఖర్చుచేస్తున్నామనే భయంకరమైన సత్యాన్ని, గత ప్రభుత్వాల ద్రోహాన్ని అధికారిక శ్వేతపత్రంద్వారా ప్రజలకు తెలియజేస్తూ నన్ను క్షమించమని ప్రజలను వేడుకుంటున్నాను.
మూడు..ఈ తోలు సంచీలో ఉన్న నాల్గువందల అరవై నాల్గు కరప్టివ్‌ కేసులను..మంత్రులపైన.. శాసనసభ్యులపైన, ఉన్నత ప్రభుత్వాధికారులపైన, కార్పొరేట్‌ బ్రోకర్‌ కంపెనీలపైన, నగరాల్లో పెత్తనం చెల్లాయిస్తున్న మాఫియాలపైన ఆధారాలూ, నిరూపణలతో పాటు హైకోర్టుకు, లోకాయుక్తకు, మానవ హక్కుల కమీషన్‌కు ముఖ్యమంత్రిగా వీళ్ళందరిపై వెంటనే తగు విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని అప్పీలు దాఖలా చేస్తున్నాను.
ఈ మొత్తం అవినీతి ఉదంతాల మొత్తం విలువ లక్షాయాభై రెండు వేల కోట్లు. మీకు ఇన్నాళ్ళబట్టి కరకరలాడే గంజిబట్టలవెనుక నవ్వు ముఖాల్తో కనబడ్డ అనేకమంది యొక్క నిజమైన అసలైన వికృతరూపం ఈ కేసుల్లో సవివరంగా ఉంది. వీటిని గత ఆరునెలల కాలంగా యింకా ప్రభుత్వంలో అవశేషంగా మిగిలి ఉన్న కొద్దిమంది నీతివంతులైన అధికారులతో సమగ్రంగా దర్యాప్తు చేయించి తయారు చేయించాను. వీటిమొత్తం విలువ రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెటుకు సమానం.
నాల్గు..నాలో ఈ పశ్చాత్తాప బీజాన్ని నాటిన జనసేన వ్యవస్థాపకుడు శ్రీ రామంకు వ్యక్తిగతంగా నేను ఋణపడి ఉన్నాను. ఒక మొలకలా పుట్టి మహావృక్షమై విస్తరించిన ఈ ఆత్మప్రక్షాళన సంస్కృతి నిజంగా నన్ను ముగ్దుణ్ణి చేసింది. ‘జనసేన’ స్థాపన ఆలోచనే మంచిది. ఎటువంటి స్వార్థ చింతనాలేని నాయకత్వ విధానం కలకాలం వర్థిల్లుతుంది. భావితరాలకు ఆదర్శమౌతుంది. అందువల్ల ‘జనసేన’ సంస్థకు నా సకల స్థిరాస్తులన్నింటినీ విరాళంగా దాఖలు పరుస్తూ ఓ విల్లు రాశాను. దానిని స్వీకరించి ఈ నా పశ్చాత్తాపానికి నిష్కృతిగా ప్రాయశ్చిత్తం చేసుకునే అదృష్టాన్నీ ప్రసాదించవలసిందిగా రామంగారిని వేడుకుంటున్నాను.
మన భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రులను శాసన సభల్లో అభిశంసించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాని ముఖ్యమంత్రే తన సహచర మంత్రుల అధికారుల, ప్రజాద్రోహాల అవినీతిని బట్టబయలుచేసి కంప్లెయింట్‌ చేసిన ఉదంతాలు ఎక్కడాలేవు. ఈ సాంప్రదాయం నాతోనే మొదలౌతుంది. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు పిల్లిమెడలో గంట కట్టాలి..తప్పదు.
నాకిక ఏ పదవిపైనా, అధికారంపైనా కాంక్షలేదు.
రేపు మతిచలించి ముఖ్యమంత్రిగారు పిచ్చిపిచ్చిగా ఏదేదో చేశాడని మొగుణ్ణి కొట్టి వీధిలో మెరమెరలాడే తరహా మా రాజకీయ సహచరులంటారు. అందుకే నేను మంచి స్వస్థతతో, స్పృహతో, జాగ్రదవస్థలో ఉండి ఈ ప్రకటన చేస్తున్నానని ప్రభుత్వ డాక్టర్‌తో ధృవీకరణ పత్రాన్ని జతచేస్తున్నాను.
ఈ సమావేశానంతరం.. గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. వారిని కలిసి కాగితాలు అప్పగించి ముఖ్యమంత్రి నివాసంనుండి నిష్క్రమించి వానప్రస్తాశ్రమం.. నా స్వంత జిల్లా విజయనగరం వెళ్ళిపోతున్నాను.
మిత్రులారా.. యింతసేపు నన్ను ఓపిగ్గా విన్నందుకు.. నా వ్యథను పంచుకున్నందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు.
ముఖ్యమంత్రి గొంతు ఎందుకో పూడుకుపోయి గద్గదమైంది. ఇన్నాళ్ళబట్టి తనను బంధించి ఉంచిన ఇనుప సంకెళ్ళు అప్పుడే భళ్ళున తెగిపడిపోయి విముక్తుడైన మహానుభూతి కలిగిందతనికి. మౌనంగా ఉండిపోయాడు.
హాలునిండా ఒట్టి నిశ్శబ్దం
వెంటనే రామం తరపున డాక్టర్‌ గోపీనాథ్‌ లేచి నిలబడి ముఖ్యమంత్రినుద్దేశించి ”థాంక్యూ సర్‌” అన్నాడు.
ఎందుకో..అనూహ్యంగానే కొందరు చప్పట్లు కొట్టారు.    రామలక్ష్మి యింకో వ్యక్తి సహకారంతో తోలుసంచీలోని కాగితాల సెట్లను హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు, పత్రికా సంపాదకులకు, టి.వి. అధిపతులకు.. అందిస్తోంది వినయంగా.
హాలులోని నిశ్శబ్ద ప్రళయం ఒక అరగంట తర్వాత మీడియాలో భళ్ళున బాంబులా ప్రేలి ఢిల్లీ వీధులను గడగడలాడించింది..అంటుకున్న పెట్రోలుమంటలా దేశం వీధివీధిలో ప్రవహించింది.
రాత్రి కొనసాగి కొనసాగి.. చీకటి వెలుతురుగా రూపాంతరం చెందుతున్నవేల..
ఎదుట ఆకాశంలో శిశుసూర్యుడు ఎర్రగా.. రౌద్రంగా.. కాంతివంతంగా.,

24

లీలకు ఎందుకో చాలా భయంగా ఉంది.
న్యూ ఢిల్లీ..హోటల్‌ లి మెరిడియాన్‌.. విండ్సర్‌ ప్లేస్‌..రాష్ట్రపతి భవన్‌నుండి రెండు కిలోమీటర్ల దూరం
నంబర్‌ పధ్నాల్గువందల పది.. పదిహేనవ అంతస్తు.
లీల.. ఒకప్పుడు ఒట్టి అనాథ.. దిక్కులేక రోడ్డుమీద జనం చీత్కరిస్తూండగా అడుక్కుంటూ చిరిగిన బట్టలు, చీమిడికారే ముక్కు.. ఆకలితో నకనకలాడే కడుపు .. కళ్ళనిండా నీళ్ళు.,
ఎవరో పుణ్యాత్ముడు అనాథ బాలల పాఠశాల ‘చిగురు’లో చేర్పించాడు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి రైల్వేస్టేషన్‌లో అడుక్కుంటూండగా..క్రిస్టియన్‌ మిషన్‌ క్రింద నడుపబడే అనాథ బాలల ఉద్ధరణ సంస్థ.. ఎన్‌జివో.. జీసస్‌ ఈజ్‌ ఓన్లీ ద గాడ్‌.., దేవుడు చెప్పెను.. ప్రవచనాలు.. బైబిల్‌ ఆరవ అధ్యాయము మూడవ పేరా..యోహాను..బోధనలు..ప్రక్కన గర్జిస్తూ, తలనిమురుతూ, ఊరడిస్తూ గలగలా పారే నది. నది ఒడ్డుపై కూర్చుని ఏకధాటిగా ఎవరికీ తెలియకుండా ఏడ్చిన ఎన్నో రాత్రులు.
ఎక్కడ పుట్టానో.. ఎవరికి పుట్టానో.. ఎందుకు పుట్టానో.. ఏమి తెలియని వయసునుండి..జీవితమంటే ఒక ఆసరా వెదుక్కోవడమని, జీవితమంటే లోతును తెలుసుకుని సముద్రాన్ని ఈదడమని..జీవితమంటే ఓడినా సరే మళ్ళీ మళ్ళీ గెలవడమని.. ఎన్నో నిర్వచనాలు.,
దిక్కులేక అనాథగా ఎదుగుతున్న తను తనకుతాను ఒక ప్రశ్న. తనతోపాటు ప్రశ్నకూడా ఎదిగి..పెరిగి.. పెద్దదై.. జీవితమంటే ప్రశ్నించడమని అంతిమంగా నిర్ణయించుకున్న రాత్రి..,
తమ ‘చిగురు’ సంగతి తెలిసింది. ఎన్‌జివోగా అది ప్రభుత్వం నుండి పదెకరాల నదిఒడ్డున ఉన్న సారవంతమైన ప్రభుత్వ స్థలం.. ఏడాదికి ఎనభై లక్షల ప్రభుత్వ నిధులు.. మతం ముసుగులో, సేవ ముసుగులో ఎన్నో భవనాలు.. ఎన్నో సౌకర్యాలు..
అనుకునేది.. ఈదేశంలో మతమేదైనా, కులమేదైనా.. కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో రిజస్టరై ఎన్‌జివోలుగా చెలామణి ఔతున్న, ఈ సమాజాన్ని సంస్కరించి, ఉద్ధరించి, బాగుపరిచి సేవలు చేస్తున్న సంస్థలు దేశ్యాప్తంగా ఎన్నున్నాయి.. వాటి వివరాలు,వారు స్వాహా చేస్తున్న నిధులు, వారు పంచుకుంటున్న భూములు, వారనుభవిస్తున్న సౌకర్యాలు, సౌఖ్యాలు.. వీటన్నింటినీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రంగా విడుదలచేసి గనుక ప్రజల సమక్షంలో విడుదలచేస్తే నిజాన్ని తెలుసుకుని ప్రజలు వేలమంది దొంగ సామాజిక కార్యకర్తలను, బాబాలను, ధార్మిక సంస్థల నిర్వాహకులను, గ్రుడ్డి, వికలాంగలు ఉద్ధరణ సంస్థల నిర్వాహకులను, వాళ్ళ నిజరూపాలను తెలుసుకుని పెడ్డలతో, కర్రలతో తరిమి తరిమి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వేల ఎన్‌.జి.వోలు కోట్ల కొద్ది రూపాయలు ఎవని పర్సెంటేజ్‌ వానికి పోగా ఎవనికి దొరికిందివాడు పందికొక్కులకంటే హీనంగా తింటూ..,
లీలకు ఎందుకో గతం గుండెలో నిప్పులా భగభగమండుతూ దహిస్తోంది పొద్దట్నుండి.
ఒకటే ప్రశ్న.,
కారణమేదైనా.. కసి ఎవరిపైననో, ఎందుకో ఐనా.. తెగబడి అసాధ్యాలను సాధ్యంచేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ కోట్లకుకోట్లు పోగేసి.. ఎంతపెద్ద వెధవనైనా డబ్బుతో, ఇంకేదో ప్రలోభంతో కొనచ్చునని, వానిలోని బలహీనతతోఎవన్నయినా జయించవచ్చునని..ఋజువు చేస్తూ చేస్తూ.,
ఐతే.. తను చేస్తున్నది కూడా పైరవీయే కదా.. తను చేస్తున్నది కూడా అవినీతి, మోసం, దగాయే కదా.. చీకటిపనే కదా.. చేసే విధానం వేరు కావచ్చు కాని అంతిమంగా తన పనులన్నీ కూడా అనైతికమైనవీ, తుచ్ఛమైనవీ, హేయమైనవే కదా.
ఔను.. ఔను.. తెలుసు తనకు. తెలిసే చేసింది..చేస్తోందింకా.,
ఇంకా ఇంకా చేస్తుందా తను ఈ తప్పును..?
అది అసలు ప్రశ్న.. వేదిస్తున్న ప్రశ్న.. తనను ఛేదిస్తున్న ప్రశ్న. మొన్న ముఖ్యమంత్రిని కలిసి ఢిల్లీకి చేరిన మరుక్షణంనుండి హృదయాన్ని తొలుస్తున్న ప్రశ్న.
జవాబు కావాలి.. జవాబు కనుగొనాలి.,
అద్దాల కిటికీలోనుండి చూస్తోంది లీల. చుట్టూ ఢిల్లీ మహానగరం.. విస్తరించి విస్తరించి.. భవనాలు భవనాలుగా, రోడ్లు రోడ్లుగా, డబ్బు డబ్బుగా, అధికారం, దర్పం, అహంకారం, మోసం, దగా, కుట్ర, కుతంత్రం, హత్యలు, ప్రాణముండీ చచ్చిపోవడాలు.. చచ్చిపోయీ బతికుండడాలు.. అంతా ఓ పెద్ద చదరంగం.. వైకుంఠపాళీ.. పావులు, పాములు, నిచ్చెనలు.. లోయలు, శిఖరాలు.. పరుగు.. పరుగు-
లీలకు ఎందుకో చాలా భయంగా, వ్యాకులంగా, వెలితిగా.. ఎవరో లోపల చేయి పెట్టి దేవినట్టుగా ఉంది.
ప్రక్కకు చూచింది.
పన్నెండు దినపత్రికలు టీపాయ్‌పై పరిచి ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ.. ఎన్నో.
”రాష్ట్ర ప్రభుత్వ పతనం.. రాజకీయ సంక్షోభం..స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా బయటపెట్టిన లక్షాయాభైవేల కోట్ల అవినీతి”
”రాష్ట్ర ప్రభుత్వ బర్త్‌రఫ్‌.. కదుల్తున్న అధికార పీఠాలు.. ప్రజల్లో ఆగ్రహజ్వాలలు.. లక్షా యాభైవేల కోట్ల అవినీతిని ఋజువుల్తో సహా బయటపెట్టిన ముఖ్యమంత్రి”
”మాకు తెలియకుండా మమ్మల్ని ఎప్పుడో ఎవరికో అమ్మారు..ప్రజల గగ్గోలు. రాష్ట్ర ప్రభుత్వ పతనం. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన, అవినీతి మంత్రులు, నాయకుల పరార్‌. రోడ్లపై రాళ్ళతో దాడిచేస్తామని ప్రజల ధర్మాగ్రహం.”
”పునాదుల్తో సహా కూలిపోయిన రాష్ట్రప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన.”
”అవినీతి యింత భయంకరంగా ఉందని అనుకోలేదు. నీతిమాలిన నాయకులను ఉరితీయాలి – హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌”
‘జనసేన’ చైతన్యంతో ప్రభుత్వ పతనం,
”పరార్‌లో అవినీతి మంత్రులు.. నాయకులు.. తరుముతున్న ప్రజలు”
”దేశరాజకీయాల్లో మొదటి పెనుతుఫాను. రాష్ట్ర ప్రభుత్వం పతనం.. శాసనసభ రద్దు.”
ప్రపంచం విస్తుపోయింది. రాజకీయ పండితులు అవాక్కయిపోయారు. వ్యూహకర్తలు జుట్టు పీక్కున్నారు. ఢిల్లీ కుర్చీలు గడగడలాడినై.. బలిసిన ఎలుకలన్నీ అర్జంటుగా కలుగుల్లోకి పరారై పారిపోయినై.
లీలకు పిచ్చి ఆనందంగా ఉంది. భరించలేనంత సంతోషంగా ఉంది.
ఎవడో ఒకడు.. ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు హనుమంతునిలా అగ్నినంటించాడు. యిక మంటలెగిసి సర్వం దగ్ధమైపోతుంది. శుభం.. ఇది జరగాలి.. ఇది జరిగి తీరాలి.
లీలకు బిగ్గరగా అరిచి ఎగిరి గంతేయాలన్నంత మహోద్వేగంగా ఉంది.
రామం జ్ఞాపకమొచ్చాడు.
రాముని రూపంలో ఉన్న హనుమంతుడు వీడేనా.. అసలు రాముడూ, హనుమంతుడూ వేర్వేరుకాదుగదా.. అంతా శకలాలు శకలాలుగా సర్వవ్యాప్తమై ఉన్న శక్తి సంలీనానికి ప్రతీకలుకదా వీళ్ళిద్దరు.
రామం ఒక నిశ్శబ్దం.. రామం ఒక చర్య.. రామం ఒక ప్రజ్వలన.. రామం ఒక విజయం.
లీల చేతిలోని మొబైల్‌ మోగింది.
”హలో..”
”కింద కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాట్లన్నీ ఓ కే మేడం.. రిపోర్టర్సందరూ మీకోసం నిరీక్షిస్తున్నారు” నిర్మల.
నిర్మల ఈట్రిప్‌లో తనతోనే ఉంది.. వెంటరమ్మని తనే చెప్పిందామెకు.
నిర్మల.. తన అసిస్టెంట్‌.. ఒక మెరుపు.. వందమంది ఐపిఎస్‌ ఆఫీసర్స్‌, వేయిమంది ఇంటలిజెన్స్‌ పర్సెనల్‌, ఒక వ్యక్తి.. ఒక వ్యవస్థగా.. ఒక డిపార్ట్‌మెంట్‌తో సమానం.
తన దగ్గర చేరి.. తన దగ్గర శిక్షణ పొంది.. తనవలెనే ఎదిగి.. పదునెక్కి,
కాని తనవలెనే ఓ అవినీతి సామ్రాజ్యానికి అధిపతి ఔతుందా చివరికి..
కావద్దు.. కావద్దు.. అలా జరుగొద్దు.
అందుకే రమ్మంది ఈ సారి తనవెంట.. చివరి పాఠం చెప్పేందుకు.
నిర్మలకు తెలియదు ఇప్పుడీ ప్రెస్‌ కాన్ఫరెన్సెందుకో. అందుకే ఉదయం నుండి తన వంక పిచ్చిపిచ్చిగా, ప్రశ్నప్రశ్నగా చూస్తోంది భయంతో వణికిపోతూ.
”ఐదు నిముషాల్లో వస్తున్నా నిర్మలా.. యు హోస్ట్‌ దెమ్‌”
”యస్‌ మేం”
లీల ఒకసారి అద్దంలో చూచుకుని ప్రక్కనే ఉన్న స్కాజెన్‌ బ్రీఫ్‌కేస్‌ను తీసుకుంది చేతిలోకి.
అప్పుడామె అప్పుడే సముద్రగర్భంలోంచి జలతలంపైకి మహాప్రచండంగా పయనిస్తూ చేరుకుంటున్న వాయుగుండంగా ఉంది.
స్థిరంగా బయటికి నడిచి.. లిఫ్ట్‌ఎక్కి.. మొదటి అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి ప్రవేశించి,
దాదాపు ఇరవైమంది.. తెలుగు పత్రికా విలేఖరులు, టి.వి. చానళ్ళవాళ్ళు, హిందూ, టైమ్సాఫ్‌ ఇండియా ప్రతినిధులు.,
”గుడ్మార్నింగు ఎవ్రీబడీ”
”ఆంధ్రప్రదేశ్‌ ఈరోజు ఒక ప్రపంచ ప్రసిద్ధమైన ఘటనను సృష్టించి చరిత్రలో నిలిచిపోయింది. దీనిని మీలోని ఓ కార్పొరేట్‌ నిర్వాహకురాలు ఎలా స్వీకరిస్తోంది.”
”కార్పొరేట్‌ ప్రపంచానికి చెందిన దానిగానైనా, ఒకప్పటి పేద అనామకురాలిగానైనా, ఒక సాధారణ భారతీయ పౌరురాలిగానైనా, మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగానైనా ఈనాటి ఈ పరిణామాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాను, భావిస్తున్నాను.చరిత్రను ఒక కుదుపు కుదిపి మలుపు తిప్పిన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఈ ఆరోగ్యకర మహాపరిణామానికి కారణమైన ‘జనసేన’ను, దాని వ్యవస్థాపకుడు, రూపకర్త, సాహసి రామంను, అతని సహచరురాలు క్యాథీని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసిస్తున్నాను”
”దీని ప్రభావం మున్ముందు ఎలా ఉంటుంది మేడం”
”చాలా ప్రభావశీలంగా ఉంటుంది. జనసేన చెప్పినట్టు ‘ప్రక్షాళన’ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడే. యిక స్కావెంజింగు చర్య జరుగుతుంది. అశుద్ధాన్ని నీటిధాటితో కడిగి శుభ్రం చేయాలి. నిజానికి ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ అవినీతిపరులైన రాజకీయనాయకులను, అనైతిక పాలనను కొనసాగిస్తున్న ప్రభుత్వాలను, చాలా తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. యిక దొంగలను, గూండాలను, నేరచరిత్ర గలిగిన ఏ పార్టీ నాయకున్నైనా ప్రజలు వీధిలో గల్లాపట్టి కొడ్తారు. పారిపోవాలి కంటకులు తోకముడుచుకుని. ప్రజాబలం ఎంత శక్తివంతమైందో ఋజువౌతోంది.”
అందరూ రాసుకుంటున్నారు.
”సరే.. మిమ్మల్ని ఈ ప్రెస్‌మీట్‌కు పిలిపించిన కారణాలు చెప్తాను”
రెండు నిముషాల్లో అందరూ అప్పటిదాకా రాసుకుంటున్నదాన్ని ఆపి.. తలలెత్తి.. ప్రశ్నలై.,
”మిత్రులారా.. యిప్పుడు నేను చెప్పబోతున్నదాన్ని యధాతథంగా, విపులంగా, నిజాయితీగా రిపోర్ట్స్‌ చేసి నా హృదయాన్ని ప్రజలకు ఒక పూర్తి పాఠంగా అందజేయాలని ఆకాంక్షిస్తున్నాను…నిజాకికి యిది ఒక ‘కన్‌ఫెషన్‌ సెషన్‌’ ఈ సందిగ్ధ సందర్భంలో ఒక విద్యావంతురాలైన పౌరురాలిగా యిన్నాళ్ళ బట్టి.. అంటే దాదాపు పదిహేనేళ్ళుగా ప్రపంచ వేదికపైన నిర్వహించిన అనేక అసాంఘిక, సంఘవిద్రోహ, నేరపూరిత చర్యలను మీముందుంచి, నిజాన్ని నిర్భయంగా అందరికీ తెలియజేసి, ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తూ ప్రజలను నన్ను క్షమించమని వేడుకునేందుకే ఈ ప్రత్యేక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశాను.
తప్పులు చేయడం.. తోటి మానవులకు నష్టం కల్గించే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం.. చివరికి ఏదో ఒక సందర్భంలో జ్ఞానోదయమై పశ్చాత్తాపాన్ని ప్రకటించి సన్మార్గంలోకి మళ్ళి శేషజీవితాన్ని మానవ వికాసం కోసం శ్రమించడం మానవ చరిత్రలో కొత్త విషయమేమీకాదు. బుద్ధునినుండి, అశోకుని నుండి మొన్న ది కన్ఫెషన్‌ ఆఫ్‌ ది హిట్‌మన్‌ అనే పుస్తకాన్ని రాసి అమెరికా రహస్య దుర్మార్గ ఆలోచనలను బయటపెట్టిన జాన్‌ పెర్కిన్స్‌ వరకు, నిన్నరాత్రి మన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివరకు.. పశ్చాత్తాప ప్రకటించిన మహావ్యక్తులెందరో ఉన్నారు. తెలిసి తెలిసి తప్పులు చేస్తూ చేస్తూ తన చేస్తున్నది తప్పని తెలుసుకుని యిక తప్పులు చేయకుండా మారినవాడు యింకా యింకా తప్పులు చేస్తూ ఎప్పుడూ తప్పుని తప్పని తెలుసుకోకుండా మరణించేవానికంటే ఉత్తముడని నేను విశ్వసిస్తాను.
ఈ రోజు బహిరంగంగా నా తప్పులన్నింటినీ మీ అందరి సమక్షంలో బయటపెట్టి.. నా నుండి నా సంఘర్షించే ఆత్మనుండి.. చివరికి అర్ధరహితంగా కొనసాగుతున్న ఈ జీవితం నుండి విముక్తమైపోతున్నాను..”
నిర్మల షాకైంది.. అవాక్కయి చూస్తోంది లీలవంక. అసలేం జరుగుతోందో అర్ధం కావడంలేదామెకు.
”సరిగ్గా నేను పది మార్చి పందొమ్మిదివందల తొంభై ఐదు నాటి రాత్రి వరంగల్లు చౌరస్తాలో ఒక విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి ఒక ప్రకటన చేశాను. పుట్టు అనాథను, దిక్కులేనిదాన్ని, నిట్టనిలువుకొండను ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాకుతూ ప్రాకుతూ జీవితాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకొని బ్రతకాలనుకుంటున్నదాన్ని.. చేతిలో ఒక్క రూపాయికూడా లేనిదాన్ని సరిగ్గా పదిహేను ఏండ్ల తర్వాత సర్వశక్తులనూ ఒట్టి యిరవై వేల కోట్ల రూపాయలను సంపాదించి ఒక మామూలు స్త్రీ ఎలా విజయాలను సాధించగలదో ఋజువు చేసి చూపిస్తానని సవాలు విసిరి నిష్క్రమించాను. మర్నాడు ఆ విషయం ఒక ఉత్కంఠభరితమైన విషయంగా అన్ని తెలుగు పత్రికల్లో వచ్చింది. దాని కాపీ మీకు అందిస్తాను తర్వాత. అప్పట్నుండి యిక జీవితంలో పరుగు ప్రారంభించాను. నేను ఎంబిఎ చదివినప్పుడు మౌళిసార్‌ అని ఓ ప్రొఫెసర్‌ ఉండేవాడు. ఒక వాక్యం చెప్పాడాయన.. మనిషి సర్వకాల సర్వావస్థల్లో సుఖ, దుఃఖ, నిర్వేద, సంకక్షుభిత సర్వసందర్భాల్లో తోడుండేది ఒక ‘పుస్తకమే’ అని. పుస్తకాన్ని ఆయుధంగా చేసుకుని భారత పురాణేతిహాసాల్నుండి ప్రపంచ సకల మానవవికాసానికి సంబంధిచిన పుస్తకాలన్నింటిని ఒక సంవత్సరంపాటు ఆమూలాగ్రం అధ్యయనం చేశాను. పదిహేనేళ్ళలో ఒక ఏడాది గడిచింది. యిక రెక్క విప్పి నన్ను నేను ఒక ప్రశ్నగా, పదునైన పనిముట్టుగా, ఆయుధంగా, బాణంగా, శక్తిగా.. శిల తనను తాను చెక్కుకుని శిల్పంగా మలుచుకున్నట్టు రూపాంతరీకరించుకుని యిక పరుగు పందెంలోకి ప్రవేశించాను.
యిప్పుడు నా నెట్‌ అసెట్‌ వ్యాల్యూ యిరవై ఐదు వేల కోట్ల రూపాయలు. నేను చాలెంజ్‌ చేసినదానికంటే ఐదువేల కోట్ల రూపాయలు ఎక్కువ.
ఐతే మనిషికి పరుగుపందెంలో ఉన్నప్పుడు ఒక్క లక్ష్యం, గమ్యం మాత్రమే కనిపిస్తుందిగాని విచక్షణ ఉండదు. డబ్బు.. డబ్బు.. డబ్బు. డబ్బేలోకం, డబ్బేదైవం, డబ్బే జీవితం. డబ్బు ఇంకా ఇంకా చేరుతున్నకొద్దీ మనిషిని ఒక అజ్ఞాతమైకం కమ్ముతుంది. నిషా శరీరం, మనసు, హృదయం, బుద్ధి వీటన్నింటినీ ఆవహించి ఉన్మాదుణ్ణి చేస్తుంది. డబ్బుతో అధికారం, అధికారంతో వ్యామోహం, వ్యామోహంతో మదం, మదంతో అహంకారం, అహంకారంతో పశుప్రవృత్తి.. యిక మనిషి ధనమదంతో మృగమైపోతాడు. విచక్షణ పూర్తిగా నశించిపోతుంది.
నేను గత పదిహేనేళ్ళుగా మృగంగా జీవిస్తున్నాను.
కాని యిప్పుడు నాలో.. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న ఉదయించింది.
ఈ గుట్టల గుట్టలు డబ్బు ఎందుకు.. కనీసావసరాలకు మించిన ఈ సౌకర్యాలెందుకు.. ఈ అవధులు మీరిన లౌల్యం ఎందుకు.. అసలు గమ్యమే తెలియని ఈ ప్రయాణం ఎందుకు.
ఏమిటి..?ఎందుకు?..ఎక్కడికి?..యివి అసలైన ప్రశ్నలు
యిక యిప్పుడు నన్ను నేను తెలుసుకుని విముక్తమౌతున్నాను.
సూట్‌కేస్‌లో సర్వ వివరాలతో, ఋజువుల్తో కొన్ని ఫైళ్ళున్నాయి. వీటిలో ఈ కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా చెలామణిఔతూ కోట్లకోట్ల అవినీతికి పాల్పడ్తున్న దాదాపు నూటా ఇరవై మంది ఐఎఎస్‌లూ, మంత్రులూ, డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తుల జాతకాలు, వాయిస్‌ ఎవిడెన్సెస్‌, వీడియో క్లిప్పింగ్సు.. అన్నీ ఉన్నాయి.
అంతర్జాతీయంగా ప్రపంచబ్యాంక్‌, ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ వంటి సర్వోన్నత సంస్థల్నుండి బిలియన్సాఫ్‌ డాలర్స్‌ను పర్సెంటేజ్‌లపై భారతదేశపు ఎనిమిది రాష్ట్రప్రభుత్వాలకు తరలించి, ఎన్నో పవర్‌ ప్రాజెక్ట్‌లకు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు, రోడ్లకు, విద్య, వైద్య, ఆరోగ్య పథకాలకు కోటానుకోట్ల మళ్ళించి.. ఇన్ని రాష్ట్రాల్లో ఎవడు ఎంత కమీషన్‌ తీసుకుంటాడు, ఎవడు ఎలా పనులు చేస్తాడు.. ఎవడు ఎంత దోచుకుంటాడు.. ఏ కార్పొరేట్‌ కంపెనీ ఎంత ముట్టజెప్పి ఎంత లాభపడ్తుంది.. యివన్నీ లీలకు ఫింగర్‌ టిప్స్‌. లీల నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా ఉంది. లీల సామ్రాజ్యం అదృశ్యంగా భారతదేశం మొత్తం వ్యాపించి ఉంది. నేను ఒక ఆక్టోపస్‌ వంటిదాన్ని. విస్తరణ నాకు వెన్నతో పెట్టిన విద్య.
నా సామ్రాజ్య రూపురేఖల వివరాలన్నీ ఈ సూట్‌లోని కాగితాల్లో మైక్రోఫిల్ముల్లో నిక్షిప్తమై ఉంది.
సారాంశమేమిటంటే.. దేశమేదైనా.. భాష ఏదైనా.. విషయమేదైనా.. వ్యవహారమేదైనా.. చాలావరకు ‘మనిషి దొంగ.’ ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగుతాడు..పడిపోతాడు చెప్పిన పనిచేస్తాడు..అది పెద్ద రహస్యమేమీకాదు.. మనం ఎవనికివాడు గుండెపై చేయేసుకుంటే మనకే తెలుస్తుంది మనం దేనికీ లొంగిపోతామో.
ఐతే.. ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగిపోవడం మాత్రం ఖాయం అన్న సూత్రంపై ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాను.
కాని అంతిమంగా ఈ డబ్బంతా ఈ సమాజానిది.. ఈ ప్రజలది.. ఈ దీనులది.. ఈ ప్రజలది.. ఇథియోఫియాకు పోండి. ఇండోనేషియాకు పోండి, యుద్ధానంతరం ఇరాక్‌ వీధుల్లో తిరగండి, అప్ఘనిస్తాన్‌ పల్లెల్లో నడవండి. భారతదేశపు ఆదివాసీ గ్రామాల్లోకి తొంగిచూడండి. దుఃఖం.. కన్నీళ్ళు ఏరులై పారుతాయి. ఆకలి, అనారోగ్యం.. దరిద్రం.. నిస్సహాత, దిక్కులేనితనం.. యివి మనల్ని ఒక జీవితకాలం వెంటాడ్తాయి. డబ్బును యింత దారుణంగా దోచుకుంటున్న మనల్ని నిలదీసి సిగ్గుతో తలవంచుకునేట్టు చేస్తాయి.
పశ్చాత్తాపపడ్తూనే నేను ఈ సందర్భంగా దోపిడీదారులైన ఈ దేశవ్యాప్త రాబందు నాయకులకు, ప్రభుత్వాధికారులకు, వ్యాపార రాక్షసులకు ఒకటే వినయపూర్వక విన్నపం చేస్తున్నాను. లంచం తీసుకునేప్పుడు, లంచం యిచ్చేప్పుడు ఈదేశంలో ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్లమంది పేదల కన్నీళ్ళను, వాళ్ళ ఆకలి కడుపులను, వాళ్ళ దుర్భర జీవిత ఆవరణను ఊహించుకోండి. మీరు తీసుకుంటున్న డబ్బు వాళ్ళ రక్తాన్ని తాగుతున్నట్టు వాళ్ళ శరీరాన్ని చించుకుని తింటున్నట్టుగా దృశ్యించండి. ఆ డబ్బు వాళ్ళదే…మీరు దొంగతనంగా వాళ్ళ నోటిముందరి అన్నం ముద్దను లాక్కుని తింటున్నట్టుగా ఊహించుకోండి. యిక మీరు మీ జన్మలో ఎక్కడా లంచం తీసుకోరు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, సర్వ న్యాయవ్యవస్థకు చేతులెత్తి విన్నపం చేస్తున్నాను.. మీ కళ్ళముందే యిన్ని ఘోరాలు, నేరాలు, దౌర్జన్యాలు, బహిరంగ రాజకీయదోపిడీలు, శాసనాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ గూండాలు చట్టసభలను ఆక్రమించుకోవడాలు..జరుగుతుంటే దయచేసి మాకెవ్వరూ కాగితాలపై పిటిషన్‌గానో, దరఖాస్తుగానో దాఖలు చేయడం లేదని చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తున్నారు. ఒక సాధారణ మనిషిగా మీరే  ఓ రాజ్యాంగ పౌరునిగా స్పందించి సుమోటో కేస్‌గా ఈ దోపిడీని, దొంగతనాన్ని ఆపండి. అవినీతిని పరిహరించండి ప్లీజ్‌.
అంతిమంగా ప్రజలకు చేతులెత్తి దండంపెడ్తూ వేడుకుంటున్నాను. రామం వంటి నాయకులు ఎప్పుడో ఒకరో ఇద్దరో పుడ్తారు. కాని మీరు ఎవరికి వారు ఒక్కోనాయకునిగా ఎదగండి. సింపుల్‌ ఫార్ములా..కోట్లను కుప్పలేస్తున్న వానిదగ్గరికి ఒక సమూహ జనశక్తిగా వెళ్లి నువ్వేం పనిచేస్తున్నావ్‌..నీకిన్ని ఆస్తులెక్కడివి..కోటానుకోట్లు ఏ అపక్రమ మార్గంలో వస్తున్నాయ్‌..అని బాజాప్తాగా నిలదీయండి. వ్యక్తి ఒంటరిగా ఎప్పుడూ బలహీనుడు..సంఘటితం కండి..చినుకు చినుకు కలిసి ఉప్పెనై విజృంభించండి.
రామం స్థాపించిన ‘జనసేన’ ఒక మహాశక్తి కేంద్రకం. ఎటువంటి అధికార వాంఛలేని, స్వంత ఆస్తులపై మమకారం లేని, ఏ పదవీ వ్యామోహం లేని లక్షమంది శాశ్వత కార్యకర్తలతో, ఒక నిరంతర మహోద్యమాన్ని ఈ దేశానికే ప్రేరణగా రూపొందించి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అతని ఆ మహాయజ్ఞంలో సమిధగా నా సర్వ స్థిర చరాస్తులన్నింటినీ ‘జనసేన ట్రస్ట్‌’కు ధారాదత్తం చేస్తున్నాను. ఆ విల్లు ఈ సూట్‌కేస్‌లో ఉంది. నా తరపున నిర్మల ఈ కేసులన్నింటిని కోర్టుల్లో ఫైల్‌ చేస్తుంది. మిగతా వ్యవహారాలన్నీ నా వారసురాలిగా కొనసాగిస్తుంది. నిర్మలే మున్ముందు నాకు వారసురాలు.
విలేఖరులందరూ తలలు వంచుకుని రాసుకుంటున్నారు. టి.వి. ఛానల్‌ వాళ్ళు కెమెరాల్లో ముఖాలు పెట్టి షూట్‌ చేస్తున్నారు. అటు ప్రక్క నిర్మల నిర్ఘాంతపోయి రాతిబొమ్మలా నిలబడి వింటోంది.
అప్పట్నుండి ఒక ప్రవాహంలా మాట్లాడ్తున్న లీల గొంతు ఆగిపోయింది చటుక్కున. ధార తెగి…నిశ్శబ్దమై..స్తబ్దమై
అందరూ ఆ అంతరాయానికి స్పందిస్తూ తలెత్తారు లీలవైపు…
కాని ఎదురుగా అప్పట్నుండి మెరుపులా కనిపించిన లీల అక్కడ లేదు. ఒక లిప్తకాలంలో సుడిగాలిగా కదిలి..ఉరికి.. ప్రక్కనే ఉన్న గాజు కిటికీ తలుపులను తెరుచుకుని చటుక్కున బయటికి కిందికి దూకింది…పదిహేనవ అంతస్తుపైనుండి…అకస్మాత్తుగా.
అందరూ గగుర్పాటుతో ఉలిక్కిపడి..కిటికీ దగ్గర చేరి..కిందికి చూస్తూ.
క్రింద రక్తపు మడుగులో లీల శవం..చుట్టూ ఎర్రగా రక్తం…సడన్‌గా జరిగిన సంఘటనకు విస్తుపోయి గుమికూడుతున్న జనం…కోలాహాలం.
కాన్ఫరెన్స్‌హాల్‌లో…టేబుల్‌పై లీల అప్పట్నుండి చెప్పిన డాక్యుమెంట్లతో నిలిచిన స్కాజెన్‌ తోలు సూట్‌కేస్‌…
కొందరు విలేఖరులు లీల మరణ దృశ్యాన్ని రికార్డ్‌ చేయడానికి పరుగు తీశారు కిందికి కెమెరాల్తో. హాల్‌నిండా గంభీర నిశ్శబ్దం అలుముకుంది.
ఏమిటి?…ఎందుకు?…ఎక్కడికి? లీల గొంతు ప్రతిధ్వనిస్తోంది.
ప్రశ్నలు ప్రశ్నలుగా నిర్ఘాంతపోయిన నిర్మల కళ్లనిండా నీళ్లు…ఎదుట ఏమీ కనబడడం లేదు. గాలి బరువెక్కుతుంది.

31

25

రామం కొద్దికాలం కోమాలో ఉండి కోలుకుని మొదటిసారిగా ‘జనసేన’ కేంద్రకానికొచ్చాడు ఆ రోజు.
ఉదయం ఎనిమిది గంటలు…
మనిషి చాలా బలహీనంగా ఉన్నాడు. బాంబు ప్రేలినప్పుడు వీపు భాగం ఛిద్రమై, పేలికలై…మాంసం ముద్దగా మారి…
వరుసగా ఎనిమిదిసార్లు ఆపరేషన్స్‌ జరిపి సెట్‌ చేసి…కుట్టి…తొడల నుండి మాంసాన్ని కత్తిరించి అతికి..కోలుకోవడం ఓ గండం గడిచి బయటపడి…
రామంను క్యాథీ తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి నడిపించుకొచ్చింది కారు నుండి ఆఫీస్‌లోని కుర్చీదాకా.
అత్యంత కీలకమైన సమావేశం అది.
”అందరికీ నమస్కారం సర్స్‌…శివ, గోపినాథ్‌గారు, మూర్తి గారు…మీకందరికి ధన్యవాదాలు…నన్ను కంటికి రెప్పకన్నా అధికంగా చూచుకున్నారు”.
”ఒక్కసారి అటు చూడండి” అన్నాడు మూర్తి…హాల్‌లో ఓమూలనున్న అక్రిలిక్‌ ట్రాన్స్‌పరెంట్‌ షీట్‌తో చేసిన పెద్ద మనిషెత్తు పెట్టెను చూపిస్తూ.
రామం తలను అటు త్రిప్పిచూశాడు. దాదాపు దానినిండా ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉన్నాయి.
”అవన్నీ మీరు తొందరగా కోలుకుని జనసేన కార్యకలాపాలకు స్వయంగా నాయకత్వం వహించాలని రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రేతర ప్రాంతాల్నుండి, ఎన్నారైలనుండి వచ్చిన ఉత్తరాలు…మెసేజ్‌లు”
”రియల్లీ… ఐ ఓ టు దెం…ఏం చేసి వాళ్ల ఋణం తీర్చుకోగలను…” చటుక్కున అతని కళ్ల నిండా నీళ్లు నిండాయి చలించిపోయాడు.
కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత…తేరుకుని…”చెప్పండి సర్స్‌…విశేషాలు”
గోపీనాథ్‌గారు ప్రారంభించారు.”మీకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి గాని..ఫర్‌ క్లారిటీ..రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భవిష్యత్తుపట్ల పెల్లుబుకుతున్న విశ్వాసంతో చైతన్యం వెల్లివిరుస్తోంది. అన్ని ‘జనసేన’ కార్యాలయాల్లో పౌరశిక్షణ తరగతులు సజావుగా సాగుతున్నాయి. మనం అనుకున్న శాశ్వత లక్షమంది నిస్వార్ధ జనసైనికులు తమ విధులను జనంతో కలసి ప్రేరక్‌లుగా పనిచేస్తున్నారు. అవసరమైతే జనసైనికులుగా ఫుల్‌టైమర్‌లుగా పనిచేయడానికి ఇంకో లక్షమంది సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం జనసేన సభ్యుల ఎన్‌రోల్‌మెంట్‌ ఒక కోటి డెబ్బయి లక్షలు. అహింస…క్రమశిక్షణ…సంస్కారం…ప్రశ్న…త్యాగం అంశాలుగా నిరంతర శిక్షణ కొనసాగుతోంది.
తర్వాత మూర్తిగారు మాట్లాడ్డం మొదలెట్టారు.”ముఖ్యమంత్రి తనే స్వయంగా అవినీతి నిర్మూలన కార్యక్రమానికి శ్రీకారం చుడ్తూ లంచగొండి నాయకులపై, మంత్రులపై యితరేతర అన్ని రాజకీయ పార్టీలనాయకులపై అవినీతిపరులైన ప్రభుత్వాధికారులపై కేసులు పెట్టిన తర్వాత…మొత్తం పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని ఒక ‘నాన్‌వయలెంట్‌ సివిల్‌ రెవల్యూషన్‌గా’ మీడియా అభివర్ణించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేసిన తర్వాత ఇది ఒక ‘జనసేన’ ఘన విజయంగా ప్రజల హృదయాల్లో నమోదైంది. దేశం యావత్తూ మన రాష్ట్రం వైపు, జనసేన వైపు పరిశీలనగా, ఆశతో చూస్తోంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరి జనచైతన్య వేదికలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చేసుకున్న దరఖాస్తులు, మనం పెట్టిన వేల కంప్లయింట్స్‌తో ఇనకంటాక్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ‘వాలంటరీ డిస్‌క్లోజర్‌ అండ్‌ టాక్స్‌’ పథకాన్ని ప్రవేశపెట్టి నల్లడబ్బును సేకరిస్తే నమ్మశక్యం కాని విధంగా లక్షా నలభై రెండు వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. రెండు వందల రెండు కాంట్రాక్ట్‌లు రద్దయి రీవర్కవుతున్నాయి. ఎసిబీ మన కంప్లయింట్స్‌ ఆధారంగా జరిపిన దాడుల్లో మొత్తం ఒక వేయి ఆరువందల అరవై కోట్ల రూపాయలు, ఎనిమిది వందల కిలోల బంగారం పట్టుబడింది. మొత్తం ఎనిమిది వందల పైచిలుకు కేసులు నమోదై కోర్టుల్లో నడుస్తున్నాయి. మొత్తానికి వ్యవస్థలో సమూలమైన మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. పాలక రాజకీయ పార్టీకి చెందిన మూడువందల పదిమంది, ప్రతిపక్ష…వామపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నూటా పద్దెనిమిదిమంది రాజకీయనాయకులు…ఎంపిటిసి స్థాయి నుండి మంత్రుల దాకా అవినీతి ఆరోపణల కింద ప్రజలచే దాడి చేయబడి, ప్రశ్నించబడి ఆధారాలతో సహా నిలదీయబడ్డప్పుడు సిగ్గువిడిచి ముక్కును నేలకు రాసిన సందర్భాలున్నాయి. చిత్రమేమిటంటే ఒకనిపై ఒకరు పోటీపడి, ఎగబడి సంపాదించుకున్న ఆరువేల ఐదువందల తొంబై ఆరు మద్యం షాపుల్లో ఐదువేల నాలుగువందల పదహారు మంది మాకు షాపులు వద్దని ఆఫర్లు వెనక్కి తీసుకున్నారు. ఆడవాళ్ల పేరుమీద అప్లికేషన్‌ పెట్టుకుని మద్యం షాపును దక్కించుకున్న వందమంది పాలకపక్ష, ప్రతిపక్ష రాజకీయ నాయకుల్లో ఏడ్గురు మంది ఎమ్మెల్యేల పెళ్లాలు మొగుళ్లను బహిరంగంగా ‘జనసేన’ కార్యకర్తల ఎదుట చీపుళ్లతో కొట్టి సత్కరించారు. మద్యం సిండికేట్లన్నీ పటాపంచలైపోయాయి. ధరలు నలభై శాతం తగ్గాయి. డాక్టర్లు ఫీజులను స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. ప్రతి వక్రబుద్దిగలవానిలో ఎక్కడ్నుండో ఎవరో ‘జనసేన’ కార్యకర్తలు తమను గమనిస్తూ అంతా రికార్డు చేస్తున్నారనే భయం వ్యాపించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ పకడ్బందైన నిఘాలో ఉన్నాయి. అందువల్ల ఆఫీసుల్లో పనులు చకచకా, సజావుగా ఆమ్యామ్యాలు లేకుండా ఆరోగ్యవంతంగా నడుస్తున్నాయి. మొన్ననే ఎన్నికల కమీషన్‌ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ రోజు తేది పది. ఇరవై నామినేషన్లకు చివరి తేది. ఇరవై రెండు విత్‌డ్రాయల్స్‌…వచ్చేనెల ఎనిమిదిన పోలింగు. పన్నెండున కౌంటింగు.
రామం అప్పటిదాకా కళ్లు మూసుకుని సావధానంగా వింటున్నవాడల్లా…నెమ్మదిగా…ఆగండని సైగచేసి..కళ్లు తెరచి సర్దుకుని కూర్చుని…”ఇంతవరకు జరిగిందంతా ప్రక్షాళనే..అసలు మన ‘జనసేన’ యొక్క ‘సంగ్రామ’ థ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఒక గురువు తన సర్వశక్తులను ఒడ్డి శిష్యుణ్ణి తయారుచేసిన తర్వాత ఆ శిష్యుడు ప్రతిభాపాటవపరీక్షల్లో పాల్గొన్నప్పటి ఉద్విగ్న పరిస్థితి ఇది. ప్రస్తుత రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఎలా ఉంది…”
”యిదివరకటిలా రెచ్చిపోయి ఒకనిపై ఒకరు ఎగబడి టికెట్ల కోసం పైరవీలు చేసుకోవడం, లాబీలు నడపడం, డబ్బుతో ఎవర్నయినా కొనగలమనే స్థితి లేకపోవడం వల్ల దొంగ నాటకాలు వేయడం అంతగా ఎక్కడా కనబడ్డం లేదు. అంతా గుంభనంగా, నివురుగప్పిన నిప్పులా, దొంగలుపడ్డ యింట్లోని పరిస్థితిలా ఉంది. లీల అనే కార్పొరేట్‌ మహిళ ఢిల్లీలో వందలమంది కేంద్ర రాజకీయులు, ప్రభుత్వ పెద్దలపై వందల కేసులు పెట్టి ఎలక్షన్‌ కమీషన్‌కు నేరచరితుల లిస్ట్‌ వేరే ఋజువుల్తో సహా ఇచ్చి ప్రకంపనలు సృష్టించి ఆత్మార్పణం చేసిన తర్వాత ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల పునాదులు కదులుతున్నాయి…”
”లీలనా..” అన్నాడు రామం వెంటనే…చటుక్కున అని క్యాథీ వైపు చూశాడు.
”ఔను రామం…లీలనే…ఆమె తనకు చెందిన సర్వ లీగల్‌ ఆస్తులను జనసేనకు డొనేట్‌ చేసి గతనెల రెండవ తేదీ ఒక విభ్రాంతికరమైన ప్రెస్‌మీట్‌ పెట్టి అనేక అవినీతికర సంబంధిత చిట్టాలను బహిర్గతపరిచి అనూహ్యంగా పదిహేను అంతస్తుల హోటల్‌ భవనంపైనుండి కిందికి దూకి ఆత్మార్పణ చేసుకుంది. లీల మరణం ఢిల్లీ పెద్దలకు చలిజ్వరం తెప్పించింది. ఎందరి చీకటి చరిత్రలో బయటపడి ఒక్కొక్కడు అదిరి చచ్చిపోతున్నాడు. అంతా కకావికలైంది”
”ఉహు…చెప్పండ్సార్‌”
”శివా చెప్పు…” అన్నాడు మూర్తి తప్పుకుంటూ
శివ చెప్పడం ప్రారంభించాడు. యింతవరకు ‘జనసేన’ ద్వారా ప్రజల్లో ఒక నీతివంతమైన సంస్కృతి, ప్రశ్నించే చైతన్యం, శాస్త్రీయంగా సమాజం, దేశం స్పృహతో ఆలోచించే విధానం అలవడ్డాయి. మన ‘జనసేన’ కేంద్రాలన్నింటికి ఈ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సచ్చరిత్ర గలిగి, అంకితభావంతో, విలువలు ప్రధానంగా ప్రజలకోసమే పనిచేసే విద్యావంతులైన యువకులు అనేకమంది ఆసక్తిచూపుతూ ముందుకొస్తున్నారు. మనం మన స్పందనను తెలియజేయాల్సిఉంది. ‘సంగ్రామ’ థలో మన పాలసీని ప్రకటించవలసి ఉంది. ప్రధానంగా ఈ సమావేశం అందుకే..
”డు యు హావ్‌ స్టాటిస్టికల్‌ డాటా ఆఫ్‌ ఆల్‌ దోజ్‌”
”యస్‌..”
”క్యాథీ ప్లీజ్‌ స్క్రీన్‌”
క్యాథీ వెంటనే క్షణాల్లో ఎల్‌సిడి ప్రొజెక్టర్‌ను స్టార్ట్‌ చేసింది.
తెరపై..నియోజక వర్గం…’జనసేన’ ఆమోదముద్ర కోసం అప్లికేషన్‌ పెట్టుకున్న అభ్యర్థి వివరాలు కదులుతున్నాయి.. రామం చేతిలోకి మానిటర్‌ను తీసుకుని మచ్చుకు ఐదారు చూచి…పాస్‌ చేసి
”చెప్పండి మూర్తి గారు..తర్వాత” ప్రధానంగా ‘జనసేన’ ఆమోదం పొందిన ఏ అభ్యర్థి అయినా ఏ రాజకీయ పార్టీ క్రిందికి రాడు. అతను ఇండిపెండెంట్‌. అంటే స్వతంత్ర అభ్యర్థియై ఉండాలి విధిగా. దరఖాస్తు చేసుకున్న కాండిడేట్లలో ఎవరో ఒకరికి ఐతే.. మన జనసేన ఆమోద ముద్ర తెలిపిన అభ్యర్థిని ఎంపిక చేయడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను మన విధాన నిర్ణాయక సంఘం తయారుచేసింది. జనసేన ఆమోదం కావాలంటే మొట్టమొదట అభ్యర్థి ఈ కండిషన్లను సంతృప్తి పర్చాలి…విందామా వాటిని… శివా వినిపించు..”
”శివా…” అన్నాడు రామం
”ఒకటి.. అభ్యర్థి ఆ నియోజక వర్గానికి స్థానికుడై ఉండాలి. రెండు…కనీసం పట్టభద్రుడై ఉండాలి. వయస్సు అరవై ఏళ్ల లోపు గలవాడై ఉండాలి. మూడు…విధిగా నిరాడంబర జీవితాన్ని గడపడానికి ఇష్టపడే తత్త్వాన్ని, జనంలో మమేకమై వాళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు గ్రహించి పరిష్కరించాలనే అనురక్తిని కలిగి ఉండాలి. నాలుగు…ఎటువంటి నేరచరిత్ర ఉండకూడదు. ఐదు..రాజకీయమంటే కొంతపెట్టుబడిపెట్టి గెలిచి దానికి వందరెట్లు సంపాదించుకోవడమనే ఒక ముద్ర ఉండి. ఆ కోణంలో ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఆ అభ్యర్థి నిరాకరించబడ్తాడు. అందుకు అభ్యర్థి యొక్క సాధారణ ప్రవర్తనను, తత్వాన్ని జనసేన స్వయంగా అధ్యయనం చేయిస్తుంది. ఆరు… ఎన్నికైతే అభ్యర్థి ఆ నియోజక వర్గం ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న జనసేన కార్యాలయ ప్రాంగణంలో శాసనసభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చేఅన్ని సౌకర్యాలున్న సాధారణ గృహంలోనే భార్యా పిల్లలతో నివాసముండాలి. జనసేన ఇచ్చే వాహనాది సదుపాయాలనే ఉపయోగించాలి. ఏడు..ఏ ఓటరుకైనా ఎన్నికైన శాసనసభ్యుడు పిలుపు దూరంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. ఎనిమిది… ప్రవర్తన బాగా లేనప్పుడు ప్రతి ఆరునెలలకొకసారి జనసేన నిర్వహించే జనాభిప్రాయ సేకరణలో నిరసన వ్యక్తమైనపుడు ఆ శాసనసభ్యుడు తన సభ్యత్వాన్ని వదులుకొని వెనుదిరిగి రావడానికి సంసిద్దుడై ఉండాలి. తొమ్మిది తన పదవీ కాలం ఐదేళ్లలో ప్రభుత్వం తరపున, జనసేన తరపున లభించే ఆదాయం మినహా ఎటువంటి అదనపు సంపాదననూ సమకూర్చుకోరాదు. ఇతర వ్యాపారాలు చేయరాదు. అతనికి, అతని కుటుంబ సభ్యుల సౌకర్యార్థం జనసేన సకల ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి పదవీకాలం ఐదేళ్లను ప్రజల, నియోజకవర్గ అభివృద్ది కోసమే పాటుపడాలి. పది…నీతివంతమైన జీవన సంస్కృతిని జనసేన తరపున ప్రజల్లో ప్రతిష్టించి పౌరునిగా ఆదర్శంగా స్వతంత్రంగా జీవించాలి…ఇవి పది నిబందనలు”.
”ఊ…బాగున్నాయి…ఒకసారి ఒక స్వతంత్ర అభ్యర్థి. మన జనసేన తన ఆమోదముద్ర వేసిన తర్వాత అతను ప్రజల అభిమానాన్ని చూరగొని ఎన్నికై రావడానికి మనం అవలంభించే పద్దతులను కూడా ఖరారు చేద్దామనుకున్నాం గదా గోపినాథ్‌ గారు…” అన్నాడు రామం సాలోచనగా.
”ఔను..అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. క్యాథీ మీరు వినిపించండి”
‘ఒకటి…ప్రజలను ఇన్నాళ్లుగా మోసం చేసిన ప్రజాకర్షక పథకాల గురించి ఏమీ ప్రస్తావించం. ‘ఉచితాలు వద్దు…ఉపాధి ముద్దు..’ యాచకులుగా కాదు ఆత్మగౌరవంతో జీవిద్దాం’, ‘వృద్దుల సంరక్షణ సామాజిక బాధ్యత’ ఇవి మన సిద్దాంతపరమైన నినాదాలు.రెండు..ఏ నియోజకవర్గంలోనైనా జనసేన ఆమోదముద్ర పొంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తనతో పోటీలో ఉన్న ఏ ప్రత్యర్థి గుర్తించీ తన ప్రచారంలో ప్రస్తావించడు..దుర్భాషలాడడు, విమర్శించడు. తను ఎన్నికైతే ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడో, ఏమేం సేవలు చేయగలడో వివరిస్తారు. సంస్కారవంతమైన భాషతో ప్రచారం నిరాడంబరంగా కొనసాగిస్తాడు. మూడు…ఎక్కడా రోడ్‌షో వంటి పిచ్చి పిచ్చి నడిరోడ్డు చిందులాటలు జరిపి ప్రజలకు అసౌకర్యం కలుగజేయరు. నాలుగు…నిర్ణీతమైన విశాల మైదానాల్లోనే పద్దతి ప్రకారం…డబ్బిచ్చి జనాన్నికొనుక్కుని రాకుండా నిజంగా తనపై, జనసేనపై ఉన్న అభిమానంతో వచ్చిన ప్రజలతోనే చాలా నిజాయితీగా తన గురించి క్లుప్తంగా చెప్పుకుంటాడు. నాలుగు…జనసేన ఆమోదమున్న అభ్యర్థులెవ్వరూ పోలీస్‌ సెక్యూరిటీని పోటీ చేసినపుడు గానీ, గెలిచిన తర్వాత గాని అంగీకరించరు. ప్రజల మధ్య స్వేచ్చగా తిరుగలేని వాడు ప్రజలకు మిత్రుడు కాడని జనసేన నమ్ముతుంది. ఐదు…జనసేన తరపున సుశిక్షితులైన జిల్లాకే చెందిన మూడువేల కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో మన అభ్యర్థి తరపున యింటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. నిరాడంబరంగా, స్వచ్ఛందంగా, వాళ్ల క్రమశిక్షణాయుతమైన ప్రచారమే అభ్యర్థి గెలుపుకు ప్రాణవాయువు. ఆరు…ప్రతి నియోజకవర్గంలోని స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా మాత్రం మన అభ్యర్థి ప్రతిరోజు ఓ పావుగంట ప్రజలనుద్దేశించి ఏ పరిస్థితుల్లో ఎన్నికలొచ్చాయి…అంతకు ముందు ఏం జరిగింది..జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు ఎలా ఉండాలి…ఎలా ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రజాధనం ఎలా కొల్లగొట్టబడింది..ఎలా ప్రజలపై ఋణభారం మోపబడింది. మనం ఎంత లోతు అప్పుల బురదలో కూరుకుపోయి ఉన్నాం..ఈ విషయాలను అంకెలతో సహా పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలి. ఏడు…అభ్యర్థికి అయ్యే పరిమితమైన ఈ ప్రచార ఖర్చును, కార్యకర్తల నిర్వహణ ఖర్చును, ఎక్కడా అతిగా అనిపించని ప్రచార సామాగ్రి ఖర్చును స్వచ్ఛందంగా ‘జనసేన’ భరిస్తుంది. ఎనిమిది…ప్రచార సమయంలో పకడ్బందీ సమయపాలనతో రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తి, శివలతో కూడిన సారథ్య బృందం తప్పనిసరిగా ఒక్కసారైనా ప్రతి నియోజక వర్గంలో పర్యటిస్తుంది. ప్రజలను కలుస్తుంది. తొమ్మిది…మన లక్ష్యం…ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల వెంట…యివీ తొమ్మిది సూత్రాలు” ఆగింది క్యాథీ.
”బాగున్నాయి…ఫర్‌ఫెక్ట్‌..సర్‌… యింతవరకు ఎన్ని నియోజకవర్గాలనుండి ‘జనసేన’ ఆమోదం కోసం దరఖాస్తులందాయి మనకు”
”అన్నీ…రెండవందల తొంభై మూడు శాసనసభా నియోజక వర్గాలకు ఒక్కో నియోజక వర్గానికి కనీసం యిరవై మంది నుండైనా అప్లికేషన్లయినా వచ్చి ఉంటాయి. ఐతే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే…చాలామంది ముప్పయ్యేండ్లవయస్సు లోపు వారే కాకుండా అందరూ బీద, వెనుకబడిన, దళిత, ఆర్థికంగా నిమ్నమధ్యతరగతికి చెందినవాళ్లే. ఆ జన్మ ధనవంతులు దాదాపు ఎవరూ లేరు.
”మనకు వాళ్లే కావాలి…వాళ్లే చరిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఏ వస్తువు తయారైనా, ఎక్కడ ఏ బృహత్తర నిర్మాణం జరిగినా వాటివెనుక వీళ్ల శ్రమే ఉంది. నాయకుడెప్పుడు కరుణార్థ్ర హృదయుడై, పీడిత జన పక్షపాతియై ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాత నంబర్‌వన్‌ ధనవంతుడు వారెన్‌ బఫెట్‌ తన నలభై ఏండ్ల క్రితం కొనుక్కున్న పాత యింట్లో నివసిస్తూ, అతి సాధారణ జీవితం గడుపుతూ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయనంత పెద్ద మొత్తంలో ముప్పయి బిలియన్‌ డాలర్లను దానం చేస్తూ…ధనవంతులపై విపరీతంగా టాక్స్‌ పెంచి పేదలను టాక్స్‌ నుండి విముక్తం చేయమన్నాడు. మన లక్ష్యం పేదవాని అభ్యున్నతి”.
”…..” కొద్దిసేపు మౌనం తర్వాత…”కొద్దిగా టీ తాగుదామా..క్యాథీ విల్‌ యు కైండ్లీ అరెంజ్‌ సం టీ ఫరజ్‌…” అన్నారు రామం చొరవగా.
బాంబు పేలుడు ఉదంతం నుండి రామం టీ తాగలేదని అందరికి తెలుసు. అతను కోలుకుని స్వయంగా టీ అడగడం ఎందుకో అందరిని ఆనందపర్చింది.
ఓ ఐదునిముషాల్లో టీ వచ్చింది.
క్యాథీ అందరికి టీ ని స్వయంగా కప్పుల్లో వంచి అందించి ప్రేమగా ఓ కప్పును రామంకు కూడా ఇస్తూ, అతని కన్నుల్లోకి చూచింది లిప్తకాలంలో.
అతని కన్నుల నిండా పొంగిపొర్లే కృతజ్ఞత.
”సర్‌..ఐతే…అందరి అప్లికేషన్స్‌ను మీరు కలిసి పరిశీలన చేయండి. ఎల్లుండి ఫైనలైజ్‌ చేసి కమ్యూనికేట్‌ చేద్దాం..శివా..ఫైనల్‌గా నిలుస్తున్న వాళ్ల గురించి మన గూడాచారి విభాగంతో సమగ్రంగా అధ్యయనం చేయించు. ఎక్కడా మనంతట మనం నిర్ణయం తీసుకోవద్దు. నామినేషన్స్‌ విత్‌డ్రా డేట్‌ తర్వాత మన విస్తృతమైన అన్ని నియోజక వర్గాల పర్యటనను ఫిక్సప్‌ చేయ్‌…సంగ్రామం థ ప్రారంభమైంది…”
కుర్చీలో నుండి మెల్లగా, ఆయాసంగా లేచి నిలబడ్డాడు రామం. వెంటనే చటుక్కున క్యాథీ అతన్ని పొదివి పట్టుకుంది.
కారులోకి ఎక్కి వెనక్కి చేరగిలపడ్తున్న రామంకు…కారు కదుల్తుండగా ఎందుకో శివ చెప్పిన లీల విషయం గుర్తొచ్చింది..ఢిల్లీలో పదిహేనంతస్తుల హోటల్‌ గదిలోనుండి కిందికి దూకి మరణించండం…
ప్రొద్దున తను ఇంట్లో నుండి బయల్దేరే ముందు ఎన్నో రోజుల నుండి చెక్‌ చేసుకోకుండా ఉండిపోయిన ఈమెయిల్స్‌ని తన లాప్‌టాప్‌లో పరిశీలిస్తుండగా ఆ రోజే కావచ్చు…చనిపోవడానికి కొద్ది గంటలకు ముందు తనకు డిస్పాచ్‌ చేసిన మెయిల్‌ జ్ఞాపకమొచ్చింది.
”రామం..ఈరోజు వాషింగ్టన్‌ డి.సి. ఏర్‌పోర్ట్‌ ఫస్ట్‌క్లాస్‌ లాంజ్‌లో..నాతో నువ్వున్నావు..లీలా, నీకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసింది. ప్రవేశించి భీకరంగా , వీరోచితంగా యుద్ధం చేస్తున్నావు. కాని కావాలనుకున్నప్పుడు పద్మవ్యూహం నుండి నిష్క్రమించడం నీకు తెలియదు. అయితే విషాదమేమిటంటే నిష్క్రమించడం తెలియదనే విషయం కూడా నీకు తెలియదు..నిజం రామం..పద్మవ్యూహ నిష్క్రమణ నాకు తెలియలేదు. నేను నక్షత్రాణ్ణి కాను. తారాజువ్వను. కాంతివంతంగా క్షణకాలం వెలిగి తప్పనిసరిగా నేలరాలిపోతాను…నీకు ఏమీ కాలేకపోయిన..లీల”.
రామం కళ్లలో సన్నని కన్నీటి పొర  ఏర్పడి హృదయం భారమైంది.
అప్పుడతనికి ఎక్కడ్నుండో ఆరుద్ర గీతం…’ప్రాప్తమున్న తీరానికి పడవ చేరిపోయింది.’ గీతం వినబడ్తోంది..సన్నగా..లీలగా.

32

26

సురేఖ దిగ్గున ఉలిక్కిపడి…మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న గోడ గడియారం దిక్కు చూచింది.
సమయం ఉదయం నాలుగ్గంటలు    ప్రక్కనున్న పక్కను చూచుకుంది. మున్సిపల్‌ వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ భర్త బాలకృష్ణ యింకా ఇంటికి రాలేదు. ప్రక్కన ఇద్దరు పిల్లలు…రమ్య నాలుగేళ్లు, బాబు కృష్ణ ఏడాదిన్నర…ఇద్దరూ అదమరచి నిద్రపోతున్నారు.
రాత్రంతా గడిచిపోతోంది. ఇతనింకా రాడేమిటి…ఎక్కడ ఎవన్తో తాగి, ఏడ తందనాలాడ్తున్నాడో…అసలే మున్సిపాలిటీ చెత్త..కంపు.
‘అమ్మచెప్పింది స్త్రీకి రెండు జీవితాలని
ఒకటి ఇక్కడ…మరొకటి అక్కడ
కాని అమ్మ చెప్పలేదు స్త్రీకి మరణాలెన్నో’
ఇంటర్‌ ఫెయిలై, వీడు…ఈ బాలకృష్ణ అనబడే డిప్లమో ఇంజనీర్‌..మున్సిపల్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గాణ్ణి తన తండ్రి మూడు లక్షలకు కొని మెడకు ఆవుమెడలో మొద్దులా కట్టి సంసారంలోకి పంపితే…మొదటి రోజు…శోభనపు రాత్రే తెలిసింది…వాడు పరమ పచ్చి తాగుబోతు..లంచగొండి వెధవ…అవినీతిపరుడు…సర్వ దుర్లక్షణాలూ మూర్తీభవించినవాడు.
కాని ఏం జేయగలదు తను…కిక్కుమనకుండా కాపురం చేస్తూ…భరిస్తూ..,
యిద్దరు పిల్లలు…రమ్య, బంగారు బొమ్మ…కాని చెవులు వినపడవు…కొడుకు కృష్ణ..మూగ..మాటలురావు.
భర్త బాలకృష్ణ…మున్సిపల్‌ రోడ్లు వేయించి, కాలువలు కట్టించి, కల్వర్టులు కట్టించి, బాక్స్‌ డ్రాయిన్‌లలో పూడికలు తీయించి…పైప్‌లైన్‌లు, వాటర్‌ పైప్‌లు…కాంట్రాక్టర్‌లు…వీడు…బిల్లులు..కాంట్రాక్టర్‌…కమీషన్లు..రాత్రిదాకా ఎవడో తాగిస్తే పీకలదాకా తాగి…ఊగుతూ, తూగుతూ…ఎప్పుడో రాత్రి రెండు గంటలకు…చేతిలో మల్లెపూలు.. నోట్లో విస్కీ కంపు…జేబులో కొన్ని నోట్ల మడతలు..
ఏమిటిది…వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌…జీతం నాల్గువేల రెండు వందల యాభై…
కాని ఇంట్లో కలర్‌ టి.వి., ఫ్రిజ్‌., హీరోహోండా మోటార్‌ బైక్‌..స్వంత ఇల్లు…ఈ మధ్య వింటున్నది ఎక్కడో రెండో సెటప్‌…ఏమిటిదంతా…
పాపం….పాపం…లంచాలు…దోపిడీ..,
”వద్దండీ ఈ పాపపు డబ్బు…పిల్లలు చూడండి ఈ పాప ఫలితంగా ఎలా మూగ, చెవుడు”
‘చెంప చెళ్లు…గూబ గుయ్యి’
అదంతే…యిదంతే…వీడు మానడు…వీడు మారడు.
ప్రక్కనున్న సెల్‌ మ్రోగింది. సమయం సరిగ్గా నాల్గూ ముప్పయ్యయిదు.
”హలో”
”ఏయ్‌..తలుపు తియ్యవే..” మాట ముద్ద ముద్ద….తూలి తూలి.
తలుపు తీస్తే…ఎదురుగా మనిషిరూపంలో ఓ పశువు…విస్కీ కంపు…ఉల్లిపాయల వాసన.
”ఎంతసేపే నీయవ్వ…మొద్దు నిద్రపోతానవా…”దబాయింపు.
”ఏంరా ఒళ్లు బలిసిందా..రాత్రంతా నిదురపోక ఇద్దరు పిల్లల్నేస్కోని ఎదురు సూత్తాన…పోరికి జ్వరంతో ఒళ్లు కాలిపోతాంది. ఎవడో పోయిస్తే గుద్దబల్గ తాగిందిపోయి నకరాల్‌ చేస్తానావ్‌…మూస్కో”
”ఏందే మాటల్‌ బాగత్తానై”
”…..”తమాయించుకుంది సురేఖ.
”గా జేబుల నాల్గువేలున్నై తీయ్‌…”
”ఎక్కడియీ నాల్గువేలు…”
”ఎవడో యిచ్చిండు నీకేందే…చెప్పినట్టు చేయ్‌….తీసి లోపల దాయ్‌…” గదమాయింపు.
”పాపపు ముండాకొడ్కా…గీ పాపపు సొమ్ము చేయబట్టే నా పిల్లల మాట పాయె, చెవుల్‌పాయె..ఎందుకురా….వద్దంటే ఇనవుగదరా…లంచగొండి ముండకొడ్కా…”బాలకృష్ణ చొక్కా గల్లా పట్టుకొంది సురేఖ.
”పా….బైటికి పా…గీ పాపపు సొమ్ము నా యింట్లద్దు. గా జనసేన పోరగాండ్లు నెత్తి నోరుపెట్కొని ఒర్రుతాండ్లుగాదురా….లంచం వద్దు…అవినీతి వద్దు అని…చదువుకున్నవో సిగ్గుశరం లేదు…పో..బైటికి పో…లంచం తీసుకుంటే నా యింట్లకు రావద్దు…పో ముండకొడ్క…” బాలకృష్ణను బైటికి వీధిలోకి నెట్టి లోపల్నుండి తలుపులుగొళ్లెం వేసుకుంది సురేఖ.
ఎందుకోగాని ఆమెకు పిచ్చి ఆనందం….తృప్తికలిగాయి.
ప్రతిఘటించి..తను ఒక ప్రశ్నగా మారినందుకా….?

***

ఇంజనీరింగు రెండవ సంవత్సరం చదువుతున్న మాధవికి మూడు రోజులుగా కంటికి కునుకు లేదు.
ఆమెకు అవమానంగా ఉంది. సిగ్గుగా ఉంది. నలుగుర్లో తలెత్తుకోలేకుండా ఉంది. చాలా అసహనంగా,కోపంగా, అసహ్యంగా కూడా ఉంది.
ఎవరిపైనా…ఎందుకు….?
రెండ్రోజుల క్రితం తన తండ్రి ప్రముఖ ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల…ఎమ్సెట్‌ కన్వీనర్‌..ఎంతో పెద్ద విద్యావేత్త… ముప్పయ్‌ రెండేళ్ల సర్వీస్‌….ప్రతిష్టాత్మకమైన ఎమ్సెట్‌ పరీక్షలకు సాధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించవలసిన గురుతర బాధ్యత.
కాని ఏంచేశాడు…పరీక్ష ప్రారంభమైన అరగంట లోపే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు. ఇంజనీరింగు పేపర్‌ లీక్‌…జిరాక్స్‌ కాపీలు…పంపకాలు…డబ్బులు…వేటలు….కట్టలు కట్టలు..చేతులు మారటాలు..
తనకు ముందురోజే డౌటొచ్చింది…యింటికి ఎవరెవరో ఏవో వేళకాని వేళల్లో కార్లలో… మోటార్‌బైక్‌లపై..బ్రీఫ్‌ కేస్‌లు….డబ్బు వాసన…ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాలేజ్‌ల వాసన…ఏదో గుసగుస…వ్యాపారం.
బెడిసిందెక్కడో…పేపర్‌ లీక్‌..ద్రోహచర్య బట్టబయలు…
నాన్న అరెస్ట్‌…లాకప్‌…కస్టడీలోకి తరలింపు…విచారణ.
ఎమ్సెట్‌ పరీక్ష వాయిదా..మళ్ళీ నిర్వహించేందుకు ప్రభుత్వ అంగీకారం.,
కాని లక్షలమంది విద్యార్థుల మానసిక స్థితి…టెన్షన్‌,…వాళ్ల ఉద్వేగాలు…ఎవరి తప్పు…ఎవరు బలి…ఎవరి నేరం…ఎవరికి శిక్ష.
మాధవికి చాలా అసహ్యంగాఉంది తన తండ్రిపై…అవినీతి పనులు చేస్తుంటే వాడితో కలిసి కాపురం చేస్తూ పాపపు డబ్బుతో కులుకుతున్న అమ్మపై…తమ ఇంట్లోనే ఉంటూ డిఎస్పీ హోదాలో ప్రతినిత్యం ఎందరినో యింటికి రప్పించుకుని కట్టల క్కట్టలను లంచంగా స్వీకరించే తన చిన్నాన్నపై…వారి లంచం డబ్బుతో స్లీవ్‌లెస్‌ జాకెట్టు వేసుకుని జులాయిగా తిరిగే చిన్నమ్మపై…అందరిపై..తన కుటుంబ సభ్యులందరిపై.
కాని..ఎలా….ఎలా..దీన్ని పరిష్కరించాలి.
”మాధవీ….మీ నాన్నేనట గదా…నిన్నటి ఎమ్సెట్‌ పేపర్‌ లీక్‌…”
ప్రశ్నలు-ప్రశ్నలు-తలదించుకుని నడవడాలు…సిగ్గుతో కుచించుకుపోవడాలు’
‘నాన్నా నీకు ఈ కుక్క బుద్దెందుకు…నీకున్నది ఒక్కగానొక్క కూతుర్ని నేనే.. అసలు నీ దగ్గరున్న నీ డబ్బే నీకు ఎక్కువ…యింకా మందికొంపలు ముంచే ఈ దొంగ డబ్బెందుకు. పైగా పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్న విద్యావేత్తవు…తగునా యిది. నీకు సిగ్గెందుకు లేదు…బుద్దెందుకు లేదురా ఓ దుర్మార్గపు, ఛండాలపు నాన్నా”
ఎన్నట్నుండి డిఎస్పీ చిన్నాన్న..యింకెవడెవడో ఒకటే హైరాన పరుగులు….అటురుకు..యిటురుకు..ఎవరికో ఫోన్‌ చేయ్‌..ఎవడ్నో బతిమాలు…
తెలుసు తనకు …నాన్న అనబడే వీడికి ఈ దౌర్భాగ్యపు దేశంలో ఏ జడ్జో అమ్ముడుపోయి బెయిలిస్తాడు. మళ్లీ వీడు బాజాప్తాగా యింటికి తిరిగొస్తాడు.
అందుకే కసిగా…దుఃఖంగా.. అసహ్యంగా…పరమ క్రూరంగా ఎదురుచూస్తోంది మాధమి మూడు రోజుల్నుండి… నిద్రాహారాలు మాని లోలోపల కుమిలిపోతోంది.
సరిగ్గా..తెలతెల్లవారుతుండగా…ఉదయం ఐదున్నర-ఓకారు యింటి ముందు ఆగి ఓ తలుపు రెక్క తెరచి…లోపల్నుండి ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల బెయిల్‌పై విడుదలై దిగి నిస్సిగ్గుగా యింటికి చేరుతూ
మెరుపులా…రేచుకుక్కలా ఉరికొచ్చింది మాధవి తండ్రి పైకి…చేతిలో డిఎస్పీ డెన్మార్క్‌ పిస్టల్‌ క్షణంలో బుల్లెట్ల వర్షాన్నికురిపించి…
శరీరం తూట్లు, తూట్లు…గావుకేక…మరుక్షణం నిశ్శబ్దం.
లక్షల మంది విద్యార్థుల జీవితాల ట్రాజడీ సంగతేమిట్రా తండ్రి బాస్టర్డ్‌…ఎన్ని జనసేనలొస్తే, మార్తారురా మీరు ముండాకొడ్కుల్లారా…బుద్దిరాని, బుద్ది లేని దరిద్రుల్లారా చావండి…” మాధవి శపిస్తోంది.
ఎదురుగా ఎర్రగా రక్తం…మధ్య ప్రశ్న ఆకారంతో రాంనివాస్‌ శవం.
మాధవి నేలపై మోకాళ్ల మీద కూర్చుని పిస్తోలు అలాగే చేతిలో ఉండగా ఘొల్లున ఏడుస్తోంది.
ఎందుకు….?

***

ఎప్రిల్‌ పదమూడో తేది…ఉదయం పదకొండు గంటలు.
వరంగల్లు నగరం…జనసేన ‘కేంద్రకం’. కార్యాలయంలో ఓ వెల్లివిరుస్తున్న పండుగ..నగరం నిండా రోడ్లపై ఎక్కడ బడితే అక్కడ జనం సంబరాలు…మిఠాయి పంపకాలు. బాణసంచా కాల్చడాలు..మైకుల్లో జనసేన పేద, సాధారణ కార్యకర్తల చైతన్య గీతాలు…ఒక నూతన ఉత్సాహం…విజయ మహోద్వేగం.
రాత్రి పొద్దుపోయే దాకా శాసనసభా స్థానాల ఫలితాల ప్రకటన కొనసాగుతూనే ఉంది. తెల్లవారగానే పెద్ద పెద్ద పతాక శీర్షికలతో దినపత్రికలు.
‘నూతన శకారంభం..’
‘భారత చరిత్రలో ఓ కొత్త మలుపు’
‘ప్రజల విజయం…అవినీతి అంతం’
‘మరో కొత్త చరిత్ర…జనసేన చారిత్రాత్మక విజయం’
టి.వి.లు…..మేధావుల చర్చలు…విశ్లేషణలు…అంతటా కోలాహలం.
”రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థుల తిరుగులేని విజయం-ఓడిపోయిన అభ్యర్ధులందరి డిపాజిట్లు గల్లంతు”
బ్రేకింగు న్యూస్‌
‘ప్రజల స్వప్నం సాకారమైన వేళ’
‘ఒక చీకటియుగం ముగిసింది. ప్రజల విజయంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం’
‘అప్పులు లేని…దోపిడీ లేని స్వచ్ఛమైన పాలనకు హామీ’
‘ఒక నూతన రాజకీయ సంస్కృతికి రూపకల్పన’
ఎన్నో ఆశలు..ఎన్నో అంచనాలు..ఎన్నో కలలు.,
రాత్రికి రాత్రి రాష్ట్రం నలుమూలల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా, జనసేన ఆమోద ముద్రతో, జనసేన హామీపై గెలిచిన రెండువందల ఎనభై రెండు మంది శాసనసభ్యులను జనసేన రక్షక దళాలు ప్రాణ సమానంగా కార్లలో తీసుకుని వచ్చి ‘కేంద్రకం’లో హాజరుపర్చాయి.
లేలేత ఎండ…విశాలమైన ప్రాంగణం…నిండా పచ్చని గడ్డి…చెట్లు…పూల మొక్కలు…అంతటా క్రమశిక్షణ నిండిన వ్యక్తుల కదలికలు.
సెంట్రల్‌ హాల్‌లో నూతన సభ్యులందరూ తమ తమ కుర్చీల్లో ఆసీనులయ్యారు. వెంటనే ఉద్వేగ భరిత క్షణాల మధ్య వేదిక పైకి నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. రామం,క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి గారు..ఎటువంటి అట్టహాసం లేకుండా.
అప్పటికే శాసనసభ్యులందరికీ జనసేన తరపున శుభాకాంక్షల లేఖలను, పుష్ప గుచ్ఛాలను పంపిణీ చేయించాడు శివ.
మైక్‌లో డాక్టర్‌ గోపీనాథ్‌ మాట్లాడ్డం ప్రారంభించారు…’మిత్రులారా మీకందరుకు జనసేన పక్షాన మరోసారి విజయ శుభాకాంక్షలు. జనసేన అతి తక్కువగా మాట్లాడ్తుంది. ఎక్కువగా పనిచేస్తుంది. ఆ పరంపరలో భాగంగా మన జనసేన వ్యవస్థాపకులు రామం మీకు శుభాకాంక్ష సందేశం వినిపిస్తారు. తర్వాత కొత్తగా ఎన్నుకోబడ్డ మొత్తం శాసనసభ్యులు పన్నెండు బస్సుల్లో మన జనపథం ప్రాంగణం నుండి హైద్రాబాద్‌ శాసనసభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ లాంఛనంగా గవర్నర్‌ గారిని కలిసి తదుపరి నూతన ప్రభుత్వ నిర్మాణ కార్యాన్ని నిర్ణయించుకుంటారు. అని చెప్పి కూర్చుని..
రామం నిలబడ్డాడు. నిశ్శబ్దంగా, వినమ్రంగా రెండుచేతులా జోడించి అందరికీ నమస్కరించి.,
”మిత్రులారా..మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు..జనసేన ఆమోదముద్రతో పోటీ చేసిన అందరూ గెలిచారు. ఒక్కరు కూడా ఓడిపోలేదు. పైగా ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేంత భారీ మెజార్టీతో గెలిపించారు. అంటే ‘జనసేన’ ఆలోచనలను, విధానాలను ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో, మనమీద ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారో సృష్టమవుతోంది. ఒకటే మీకు వినమ్రంగా విన్నవించుకుంటున్నాను…మనం..మనందరం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేద్దాం. ఒక కొత్త చరిత్రను, నీతిమయమైన భవిష్యత్తును నిర్మిద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ”ఇండిపెండెంట్స్‌ రూల్డ్‌ స్టేట్‌” పరిపాలనలోకి రాబోతోంది. దేశం, ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా మన పనితీరును పరిశీలిస్తోంది. జాగ్రత్తగా ప్రగతి పథంలో అడుగులు వేద్దాం కలసికట్టుగా.
మేము…జనసేన సారథ్య సంఘ సభ్యులం నల్గురం నాల్గు దిక్కులమై, లక్షమంది కార్యకర్తలు మీ చుట్టూ ఒక వలయమై కవచమై అన్నీ పదవులకూ, అధికారాలకూ అతీతంగా ప్రజల పక్షాన మిమ్మల్ని డేగ కళ్లతో గమనిస్తూనే ఉంటాం. యిచ్చిన మాట ప్రకారం నిజాయితీగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకోండి…జైహింద్‌”.
చప్పట్లు…కొద్దిసేపు.
అందరూ ఒకరి వెంట ఒకరు క్రమశిక్షణతో బయటికి ఆవరణలోకి వచ్చి కార్యకర్తలు సూచించిన స్థానాల్లో నిలబడ్డారు.
ఎదురుగా అరుగుపై రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తిగారు…శివ…నిలబడి.,
ముందు…అందంగా అలంకరించిన గద్దెపై జెండాకర్రకు కట్టిన మువ్వన్నెల జెండా.
”మూర్తిగారిని మన జాతీయ జెండాను ఆవిష్కరించవలసిందింగా ప్రార్థిస్తున్నాను” అన్నాడు రామం.
నాల్గడుగులు ముందుకు నడిచి..సీనియర్‌ పాత్రికేయుడు ‘అగ్ని’ వార్తా ఛానెల్‌ అధినేత మూర్తి పులకించిపోతూ జాతీయ జెండాను నూలు తాళ్లు లాగి  వినీలాకాశంలోకి ఎగరేసి…
భారత పతాక ఒక చారిత్రాత్మక నూతన అధ్యాయానికి ప్రతీకగా…గర్వంగా, ధీమాగా ఉజ్జ్వలంగా ఎగుర్తూండగా..
”వందేమాతరం…” గీతాలాపన ప్రారంభించింది స్వయంగా క్యాథీ, బిల్టిన్‌ మైక్రోఫోన్‌లో.
వందలమంది చేతులు దేశంపట్ల భక్తిప్రపత్తులతో జాతీయ పతాకానికి వందనం చేస్తూ,
అందరి కళ్లలోనూ ఓ బంగారు రంగు కల…ముత్యమంత ఆశ…కొండంత ఆత్మవిశ్వాసం…ఓ సుదీర్ఘ అవిశ్రాంత నిరంతర ప్రయాణం వైపు చూపు.

***

అప్పుడు…ఆ క్షణం,
‘అగ్ని’ టి.వి.చానల్‌లో ఆ రోజు ‘రాజకీయ ముఖచిత్రం’ అనే అంశాన్ని ముగ్గురు వ్యక్తులు విశ్లేషిస్తున్నారు.        ఒకరు…ఆబిడ్స్‌లో ఫుట్‌పాత్‌పై అరటిపళ్లమ్మే యాకూబ్‌, మరొకరు..సికింద్రాబాద్‌, అంబాసిడర్‌ లాడ్జ్‌లో పనిచేసే బాయ్‌ మల్లేశం, ఇంకొకరు…ఓల్డ్‌ సిటీ మక్కా మసీద్‌ దగ్గర కంకులు కాల్చి అమ్మే యాకమ్మ.
యాంకర్‌ ఆనందరావు అడుగుతున్నాడు. ”ఈ పెనుమార్పును మీరెలా అర్థం చేసుకుంటున్నారు”
అరవై ఆరేళ్ల యాకమ్మ మాట్లాడ్తోంది..ఉద్వేగంగా.

( సమాప్తం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా- 19

 

Ekkadi(1)
జీవితకాలమంతా పనిచేసి.. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా, లాయర్లుగా.. రిటైరై.,
ఉద్యోగ విరమణ అనేది అకస్మాత్తుగా ఎదురై ముందునిలబడే ఒక వీధిమలుపు. నిన్నటిదాకా ఫలానా పనికి పనికొచ్చిన మనిషి ఒక ఈనాటినుండి పనికిరాడు అని నిర్దారించబడే వేళ. కాని చాలామందిలో ఇంకా జవసత్వాలుంటాయి. బతుకునంతా వడబోసి వడబోసి కూర్చుకున్న అనుభవసారం ఉంటుంది. జీవితాన్ని పూర్తి మానవతా దృష్టితో వీక్షించగలిగే పరిణతి ఉంటుంది. జీవిత సంధ్యాసమయానికి చేరువౌతున్నకొద్దీ సంయమనంతో కూడిన, మనిషిపట్ల సానుభూతితో స్పందించగలిగిన సంస్కారం అలవడ్తుంది. ఐతే ఈ అపూర్వమైన ఒక సంపదను సమాజం ఉపయోగించుకోవడంలేదు. అన్నింటినీమించి ఉద్యోగవిరమణ చేసినవాళ్లకు పెద్దగా ఆర్థికావసరాలుండవు. అయ్యో జీవితంలో అనుకున్న కొన్ని పనులు చేయలేకపోయామే..యిప్పుడవి చేస్తే బాగుండునన్న జ్వలన ఒకటుంటుంది. దాన్ని సామాజిక ఉన్నతికోసం ఉపయోగించుకోవాలనుకున్నారు రామం, క్యాథీ, గోపీనాథ్‌.. మూర్తి అందుకే రాష్ట్రంలోని ప్రధానమైన ఎనిమిది హైద్రాబాద్‌, వరంగల్లు కరీంనగర్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సామాజిక సేవా భావం కలిగి, ఐచ్ఛికంగా వాళ్ళంతట వాళ్ళు తమతమ నైపుణ్యాలను అందివ్వగలిగితే అటువంటివారి సేవలను ఉపయోగంచుకునేందుకు వాళ్ల వివరాలను సేకరించమని ‘జనసేన’ సేవా విభాగానికి అదేశాలొచ్చాయి. పదిహేను రోజుల క్రితం ‘జనసేన’ యువ కార్యకర్తలు రామదండులా కదిలి విస్తృతమైన సంపర్కం చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ వివరాలను సేకరించి వాళ్ళను కలిసి మాట్లాడారు. వాళ్ల సహకారాన్ని, ఆశీస్సులను, సేవలను అర్థించారు. వయోజనులు చిరునవ్వులు చిందించే ముఖాలతో స్నేహహస్తాన్నందించారు. ఒక్కో కేంద్రంలో వందలమంది వివిధ వృత్తి నిపుణుల సమాచారం, అంగీకారం ప్రోగైంది. వెంటనే ‘జనసేన’ కేంద్రంనుండి ప్రతి నగరంలోనూ విశాలమైన అన్ని వసతులున్న భవనాలను అద్దెపద్ధతిపై మొదట సమకూర్చమని ఆదేశాలొచ్చాయి. అదేరకంగా.. ఆ రోజు..ఎనిమది మహానగరాల్లో ఎనిమది ‘జనసేన’ ప్రజాసేవా కేందాలు అన్నిరకాల అత్యంతాధునిక పరికరాలు, ఫర్నీచర్‌, ఉపకరణాలు, ఇతరేతర సమస్త సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డాయి.
ఒక్కో ప్రజాసేవా కేంద్రంలో సీనియర్‌ డాక్టర్లతో ఉచిత వైద్య విభాగం, ఇంజినీరింగు నిపుణులతో ఏ నిర్మాణ కార్యకలాపాల్లోనైనా పనికొచ్చే సలహాసహకార విభాగం, రిటైర్డ్‌ లాయర్లతో న్యాయ సహాయ విభాగం, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లతో విద్యా విషయ సహకార విభాగం.. యువజనుల కోసం వ్యాయామ, క్రీడా, సేవా విభాగం ఇలా అనేకరంగాలతో ఒక విస్తృతమైన సామాజిక వేదిక.. కౌన్సిలింగు కేంద్రం.. ఒక్కోచోట వీటితో ఓ ప్రజాక్షేత్రం.
ఆ పరంపరలో.. వరంగల్లులోని కొత్తవాడలో .. ఒక పెద్ద ప్రైవేట్‌ భవనంలో.,
‘జనసేన’ సామాజిక సేవా కేంద్రం ప్రారంభం.
ఉదయం పదిగంటల ముప్పయి నిముషాలు.. భవనం బయట వేలమంది జనం. ప్రజల్లో ఉప్పెనై పెల్లుబుకుతున్న చైతన్యం. ఎక్కడో ఓ కిరణంలా ఆశ. ఈ చీకట్లోనుండి, బురదలోనుండి.. అందరి ఆత్మాభిమానాన్ని శూలంతో పొడిచి గాయపర్చి.. రక్తం చిందించి, ఛిన్నాభిన్నం చేసి.. వీడు మా ప్రజాప్రతినిధి..అని చెబుతే తలెత్తుకునేలా కాకుండా.. సిగ్గుపడేలా, తలదించుకుని లోపల ఎక్కడో దాచుకునేలా.. సరిగా చదువురాని వాడు, సంస్కారం లేనివాడు, తెలివి అస్సలే లేనివాడు..పశువకు మాటొస్తే వలె మాట్లాడువాడు.. పరమఛండాలుడు.. ఈ గుండెలను పిండే దుస్థితినుండి తప్పించి – ఏదో ఒక వెలుగు ద్వారాన్ని తెరుస్తున్న ‘జనసేన’.
‘భగవంతుడా.. ఈ జనసేనను కాపాడు తండ్రి” అని మొక్కుకుంటోంది ఓ ఎనభై ఐదేళ్ళ వృద్ధ మహిళ.. బయట పోచమ్మగుడి దగ్గర.
”ప్రియమైన మిత్రులారా.. మనం చేస్తున్న జైత్రయాత్రలో భాగంగా.. ఈ సామాజిక సేవా కేంద్రాల స్థాపన ఒక ప్రధాన ఘట్టం. ఎంతో అనుభవమున్న ఎందరో ప్రముఖ డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, విద్యావేత్తలు.. ఎందరో మీపై ప్రేమతో, వాత్సల్యంతో ఉచితంగా నిరంతరం సేవ చేయడానికి సంసిద్ధులై మీ ముందు యిక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. దయచేసి జనసేన సేవలను వినియోగించుకోండి. తెల్లకార్డులు, పచ్చకార్డులు.. పైరవీలు.. నూటా నాల్గు అన్ని మాయలు.. ఎండమావులు. మనం మననే నమ్ముకుందాం. ముందుక సాగుదాం.. జనసేన.. రేపు ఒక ‘ప్రభంజనం’ కార్యక్రమాన్ని చేపడ్తోంది. ‘సమాచార చట్టం ఆర్‌టిఐ ప్రకారం సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లా కేంద్రాల్లో ఫస్ట్‌ మెజిస్ట్రేట్‌ కలెక్టర్లకు, ఎసిబి అధికారులకు, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులను, అభియోగాలతో కూడిన కంప్లెయింట్స్‌ను, సమగ్ర విచారణను కోరుతూ అధికారికంగా విన్నపాలను సమర్పించబోతున్నాం. యిది ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద ప్రజాప్రతిఘటన. ఈ విన్నపాల ఆధారంగా ఎసిబి వాళ్ళు దాడులు చేయాలి. కోర్టులు విచారణను ప్రారంభించాలి. కలెక్టర్లు విచారణకు ఆదేశించాలి. లేకుంటే వాళ్ళ భరతంకూడా బజారుకెక్కుతుంది. నిజమైన అహింసాయుతమైన ప్రజాచైతన్య విజృంభణ రేపు మొదలుకాబోతుంది. సోదరులారా కదలిరండి..ఒక్కో లింక్‌ కలిస్తే చెయిన్‌ ఔతుంది.. చెయిన్‌ తయారై లాగితే జగన్నాధరథం కదుల్తుంది. హరోం హర హర.. హరోం హర హర..” శివ చెబ్తున్నాడు వేదికపై జ్వలిస్తున్న అగ్నిలా.
ప్రక్కన వేదికపై.. రామం.. క్యాథీ.. డాక్టర్‌ గోపీనాథ్‌.. మూర్తి.,

25
”ఇప్పుడు .. ఈ జనసేన సామాజిక కేంద్రాన్ని ప్రారంభించడానికి.. కొత్తవాడ నివాసి, బీడీ కార్మికురాలు.. ఆకుతోట లచ్చమ్మను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆమె ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తూండగా ప్రముఖ రిటైర్డ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అమర్‌సింగు ఆమెకు సహకరిస్తాడు. అమర్‌సింగు గారి నేతృత్వంలో ఈ కొత్తవాడ కేంద్రం ప్రజలకు ప్రక్కలో ఆపద్భంధువులా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సెలవు..” శివ కూర్చున్నాడు.
వేదికపైకి.. బీడీ కార్మికురాలు వస్తూండగా జనసేన కార్యకర్తలు.. డాక్టర్‌ అమర్‌సింగు ఎదురేగి.. వెంట తోడ్కొని వచ్చి స్విచ్‌ ఆన్‌ చేయించి..
ఎదురుగా.. ఎల్‌సిడీ తెరపై.. ఒక దివిటీని ఎత్తిన స్త్రీ బొమ్మ ప్రత్యక్షమైంది.
వేలమంది హర్షాతిరేకాలతో చప్పట్లు. ఒక ఆనందోద్విగ్న సందోహ సముద్రం.. జన జాతర.
వేదికముందు పదులసంఖ్యలో మీడియా ప్రతినిధులు. టి.వి. కెమెరాలు.. పదుల సంఖ్యలో పాత్రికేయులు.
పులకించిపోతూ ఒక సీనియర్‌ పాత్రికేయుడు నరేందర్‌ తన ప్రక్కనున్న శ్రీనివాస్‌తో అంటున్నాడు.. ”చీమ తన శరీరంకన్నా ఎనిమిదిరెట్ల బరువుగల పదార్థాన్ని మోసుకుంటూ నిర్విరామంగా, అవిశ్రాంతంగా కదుల్తూ, ఒక రోజు దాదాపు పన్నెండు మైళ్ళు వెళ్తుందట.. ఈ రామం అనేవాడు ఒక చిన్న చీమలా ‘జనసేన’ కార్యక్రమాన్ని ప్రారంబించి మెలమెల్లగా చూశావా ఎలా ఓ ప్రభంజనమై, ఓ తుఫానై విజృంభిస్తున్నాడో. చావుకు భయపడనివాణ్ణి ఎవడూ చంపలేనట్టే..ఏ స్వార్థమూ లేక సర్వసంగపరిత్యాగియై ప్రజలకోసం ముందుకు సాగుతున్నవాణ్ణి ఎవరైనా ఏంజేయగలరు. వాడికి పదవీవద్దు. అధికారం వద్దు… గాంధీవలె.. గాంధీ ఎప్పుడూ ఏ పదవుల్నీ కావాలనలేదు కదా. వీడు అజేయుడు శ్రీనివాస్‌.. ఇంతపెద్ద ప్రజాస్పందనను ఎన్నడూ చూల్లేదు. అస్థిత్వ ఉద్యమాలు, తాత్కాలిక గర్జనలు, శంఖనాదాలు.. సమరశంఖాలు.. ప్రజలను కొనుక్కుని ఏవో ఒక్కరోజు నిర్వహిస్తే చూశాంగాని, ప్రజలు స్వచ్ఛందంగా ఇలా స్పందించడం అద్భుతమనిపిస్తోంది..” అంటున్నాడు.
సరిగ్గా అప్పటికి అదే అభిప్రాయంతో ఉన్న శ్రీనివాస్‌.. ”ఎందుకో ఇక ఈ సమాజం బాగుపడ్తుందని ఆశ కల్గుతోంది నరేందర్‌” అన్నాడు ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.
ఈలోగా ఆకుతోట లచ్చమ్మ సభను నిర్వహిస్తున్న శివ కోరికపై నాల్గుమాటలు మాట్లాడ్డానికి మైక్‌ ముందుకొచ్చింది.
”అందరికీ దండం.. నా వయస్సు డెబ్బయ్యేండ్లు. ఎనకట ఆరోక్లాస్‌ చదివిన.. నా ఒక్కగా ఒక్క కొడ్కు నక్సలైట్లల్లపోయి పోరాటం చేసి పోలీసుల చేతుల్ల చచ్చిండు. ఏం ఫికర్‌ లేదు. ఆర్మీల ఒక కాప్టెన్‌ చచ్చినంత గౌరవం.. నాకిప్పుడు గీ ‘జనసేన’ను సూత్తాంటే నా కొడ్కుకల నిజమైతాందనిపిస్తాంది. రామంను నా కొడ్కనుకుంటాన.. ఒక్కటే చెప్త.. ఒకసారి గీ గీసుకొండ మండలం గంగదేవిపల్లెకు పోయిన. ఆదర్శగ్రామం అది. ఊరిదంత ఒకతే కత్తు. ఒకటే కుటుంబం. గట్లనే మనది ఒక ఆదర్శ జిల్లా. ఒక ఆదర్శ రాష్ట్రం. ఒక ఆదర్శ దేశం కాదా.. ఐతది.. తప్పకుండ ఐతది.. మనం చేద్దాం.. మనమే చేద్దాం..”
అంతే.. ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పిడికిళ్ళెత్తిన జనం.. ”జనసేన” అని గొంతెత్తి నినదిస్తే,
ఆకాశం ప్రతిధ్వనిస్తున్నట్టు ”వర్ధిల్లాలి” అని ప్రతినినాదం.
”జనసేన..”
”జిందాబాద్‌”
”జై జనసేన”
”జై జై జనసేన..” .. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల రక్తగర్భ ఓరుగల్లు మానవ మహోత్తేజంతో పొంగి ఉరకలేస్తోంది.
తర్వాత డాక్టర్‌ అమర్‌సింగు సామాజిక సేవా కేంద్రం ప్రజలకు ఉచితసేవలను అందించే విధానం క్లుప్తంగా వివరించారు.
శివ..తర్వాత మైక్‌ ముందుకొచ్చి.. జనసేనతో కలిసి పనిచేయడానికి, అవినీతి ప్రక్షాళనలో పాలుపంచుకోవడానికి, పరిశుద్ధ భావి భారత పునర్నిర్మాణంలో తామూ ఒక భాగం కావడానికి సంసిద్ధత వ్యక్త ంచేస్తున్న ప్రజా సంఘాల పేర్లను ప్రకటిస్తాననీ, ఆయా సంస్థల బాధ్యులు ఒకరొకరుగా వేదికపైకి వచ్చి ప్రజలకు పరిచయం కావాలనీ ప్రకటించి ఒక్కొక్క సంస్థ పేరును చదవడం ప్రారంభించాడు.
”జిల్లా జర్నలిస్ట్స్‌ యూనియన్‌.. రచయితల సంఘం.. మానవ బాధ్యతల సంఘం.. జిల్లా చర్మకార సంఘం..జిల్లా పద్మశాలి సంఘం.. జిల్లా యాదవ సంఘం.. జిల్లా ఎన్‌జివోల సంఘం.. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం..” పట్టిక కొనసాగుతూనే ఉంది.
సరిగ్గా.. ఆక్షణంలో.. రాష్ట్రవ్యాప్తంగా ‘జనసేన’ నిర్వహిస్తున్న అన్ని ఎనిమిదికేంద్రాల్లో .. అన్ని వేదికలపై అటువంటి కార్యక్రమమే జరుగుతున్నట్టుగా వీడియో సంధానంలో ఉన్న క్యాథీ ఎదుటి లాప్‌టాప్‌ కంప్యూటర్‌ ద్వారా రామంకు తెలుస్తోంది.
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి విజయాన్ని సాధించడానికి ”అత్యాధునిక సాంకేతికత వినియోగానికి ఎన్నటికీ మారని స్థిరమైన భారతీయ జీవన విలువలను జోడించి, పరిపుష్టం” చేసిన విధానాలను అనుసరించాలని రామం ఉద్ధేశ్యం.
అతనికి చాలా తృప్తిగా ఉంది.. ప్రణాళికలో అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతూ ముందుకు దూసుకుపోగల్గుతున్నందుకు. ఐతే తను ఊహించినదానికంటే దాదాపు నాల్గురెట్లు ప్రజల ప్రతిస్పందన రావడం, అదీ చిన్న, పెద్ద, క్రింది, పైది.. అన్న తేడాలేకుండా అన్నివర్గాలనుండి ప్రతిచర్య ఉవ్వెత్తున రావడం అతనికి పరమానందంగా ఉంది. ఆ పులకింతలోనుండే ప్రక్కనే ఉన్న క్యాథీతో అన్నాడు..”  ”ఫెర్మీ అణుకేంద్రక విచ్ఛిత్తి సిద్ధాంతం జ్ఞాపకమొస్తోందిక్యాథీ.. కేంద్రకాన్ని గనుక అద్భుతమైన శక్తినుపయోగించి విచ్చిన్నం చేయగలిగితే విడివడే శకలం మూడు ముక్కలై శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క మళ్ళీ మూడుముక్కలై.. మళ్ళీ శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క.. ఇలా క్షణాల్లో గుణశ్రేఢిలో, ఒక శృంఖలచర్యగా సాగే నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియ ఎంతో బహుళమైన శక్తిని అంతిమంగా అందిస్తుందో,  అదేవిధంగా అణుకేంద్రక సమ్మేళన కార్యక్రమంలోకూడా ఒక్కో అణుకేంద్రకం సంలీనమైపోతూ మళ్ళీ అఖండమైన శక్తిని.. సూర్యునినుండి వికరణజ్వాలలవలె వెలువరిస్తుందో.. జనసేనలోకి ఒక్కో మనిషి అణుకేంద్రకంలా ప్రవేశించి.. ఎంత వేగవంతంగా న్యూక్లియర్‌ రియాక్షన్‌వలె బలోపేతమై పోతోందో.. చాలా ఆనందంగా ఉంది క్యాథీ మనం చేపట్టిన ఈ ప్రక్షాళన చర్య..”
క్యాథీ మౌనంగా.. నిండుగా.. పరిపూర్ణంగా నవ్వుతూ రామంలోకి చూచింది.
ఇద్దరి కళ్ళలోనూ నక్షత్రాలు నిండుగా పూచిన ఆకాశంలో ఉండే పరిపూర్ణ వింతకాంతి.
అప్పుడే రామం రక్షణను పర్యవేక్షించే రఘు రామం వెనుకనుండి కొద్దిగా పైకివంగి.. ”సర్‌ మీరిప్పుడు రాష్ట్రస్థాయిలో కొందరు పత్రికా సంపాదకులతో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొనే కార్యక్రమముంది సార్‌.. మన కేంద్రక కార్యాలయానికి బయలేర్దామా..” అన్నాడు గుసగుసగా.
”యస్‌.. గోపీనాథ్‌ సర్‌.. మీరు మిగతా విషయాలు చూడండి. మేం వెళ్ళిరామామరి ”అని ప్రక్కనున్న గోపీనాథ్‌ గారి అనుమతి తీసుకుని.. క్యాథీ కూడా లేచి రాగా.., సెంటరింగు చెక్కలతో చేసిన విశాలమైన వేదికపైనుండి టకటకా మెట్లపైనుండి దిగుతూండగా,
భూనభోంతరాలు దద్దరిల్లేట్టుగా ఓ బాంబు ప్రేలింది.
అంతా బీభత్సం.. మంటలు పొగ.. ధ్వంసం.. వేదిక చెక్కలు ఎగిరెగిరిపడ్తూ.. ప్రేలుడు.
పరగులు.. అరుపులు.. కకావికలు.. కేకలు.. విధ్వంసం.

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 18 వ భాగం

24

(గత వారం తరువాయి )

18

రాత్రంతా నిదురలేదు ముఖ్యమంత్రి గార్కి. అతనికి మేధావులను ఆ క్షణం చెప్పుతో కొట్టాలనిపించింది. మనిషికి సుఖాలు, సంపదలు, అధికారం.. యిలాంటివన్నీ ఉంటే సుఖంగా, సౌఖ్యంగా ఆనందకరంగా ఉంటుందని ఈ మేధావులైన రచయితలు, కవులు, యితరేతర సృజనకారులు చెప్పారు. అనేక సందర్భాల్లో అదంతా శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రిగారి గత నలభై సంవత్సరాల వ్యక్తిగత రాజకీయ జీవితం ఎంతో స్పష్టంగా చెబుతోంది.
ఎంతో పెద్ద ముఖ్యమంత్రి నివాసభవనం.. క్యాంప్‌ ఆఫీస్‌ కంప్లీట్లీ ఎయిర్‌ కండిషన్డ్‌, సకల సౌకర్యాలు.. ముట్టుకుంటే మాసిపోయేగోడలు. నడుస్తే అరిగిపోతుందా అన్నట్టు పాలరాతి నేల. వెన్నెల ముద్దవంటి బంగారు రంగు, మెత్తని పట్టు పాన్పు.. కాని..,
మనసునిండా మున్సిపల్‌ చెత్త. పాయఖాన కంపు. తలంతా పాకీవాడి బకెట్‌. ప్రొద్దునలేచినప్పట్నుండి తను ఇతరులను బ్లాక్‌మెయిల్‌ చేయడం, లేదా వెధవలందరూ తనను బ్లాక్‌మెయిల్‌ చేయడం. ఒకర్నొకరు వేటాడ్డం, ఎవడో ఒకడు తమను వెంటాడ్డం.. ఇదంతా నిజానికి అవసరమా మనిషికి.
అధికారం.. కుర్చీ.. పదవి.. మంత్రి పదవి.., ముఖ్యమంత్రి పదవి., ”అధికారంలో ఉన్న మజా.. అది అనుభవించితే తెలియనులే..” ఎక్కడో విన్నపాట.
ఉదయం… ‘అగ్ని’టి.విలో ఆ ‘రామం’ అనేవాడు ప్రసంగిస్తున్నపుడు అన్ని దిక్కుమాలిన కార్యక్రమాలను ప్రక్కనపెట్టి ఎవర్నీ తన చాంబర్‌లోకి రానివ్వద్దని, అన్ని టెలిఫోన్‌ హాట్‌లైన్లను కట్‌చేసి.. ప్రశాంతంగా .. సముద్రంలా పొంగిపోతూ విన్నాడు. విని..” నిజంగా వీడు రామంగాడు అనుకున్నాడు.
మనసు పవిత్రంగా, హృదయం నిష్కల్మషంగా.. తత్వం.. ఏ స్వార్థమూలేని పరిత్యాగకాంతితో నిండి.. మనిషి ఈ సకల తుచ్ఛమైన వాంఛలకు అతీతమైపోయిన తర్వాత.. వాడి ముఖంలో నిజంగా ఎంతో కాంతి, ఎంతో ఆకర్షణ.. ఎంతో జీవకళ.. ఎంత పరిపూర్ణతో.
నిండుపున్నమి చంద్రునిలా ముఖం.
అంటాడు.. ” ఈ తుచ్ఛమైన అధికారాన్నిపట్టుకు వేలాడ్తూ, కోట్లకు కోట్ల రూపాయలను దాచుకుంటూ.. ఎన్నాళ్ళు కొనసాగుతావు.. ఈ వెంపర్లాటకూ, సంపాదనకూ ఒక హద్ధు, ఒక అంతం ఉందా.. ఒక వేళ ఉంటే.. అది ఎంత..?”
తన గుండెలో చటుక్కున గుచ్చుకుందామాట.
ఐతే ఆ మాట డెబ్బయ్యారేండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు తెలియనిదా.. తెలుసు.. ఐతే చెప్పినవాడు ఎవడో దొంగ సన్యాసి బెంజ్‌కార్లో వచ్చి, ఫైవ్‌స్టార్‌ ప్రవర్తనతో ”ఆర్ట్‌ ఆఫ్‌ లివింగు” గురించి బూటకపు ఉపన్యాసం   చెప్పినట్టుగాకుండా..ఈ రామం అనేవాడు.. తన చదువును, ఉద్యోగ్యాన్ని, హోదాను, ఆస్తిపాస్తులను, సర్వసంపదలనూ వదలి ప్రజాపరం చేసి తను ఊరుబయట.. ఓ అతిసామాన్య పర్ణశాలవంటి కుటీరంలో జీవిస్తూ చెప్పడం.. ఎక్కడో హృదయంలో బాణం గుచ్చుకుని నాటుకుంది.
వాడు.. బమ్మెరపోతన చెప్పినట్టు.. ‘నవ్వు రాజిల్లెడు మోమువాడు, కృపారసమ్ము పై చల్లెడు వాడు..’
ఒక్కోసారి ధర్మాధర్మ విచక్షణ మన మనసును కల్లోల సముద్రంగా మార్చి.. కలవర పరుస్తున్నపుడు సత్యం ఒక కాంతిపుంజంలా విచ్చుకుంటుంది.
ముఖ్యమంత్రికనిపించింది.. ఎక్కడో తను ఓడిపోతున్నాడు.. అధర్మ రక్షణ చేస్తున్న తాను ఎక్కడో బురదలో కూరుకుపోతున్నాడు.. రామం.. ఉదయించే సూర్యునిలా అవక్రపరాక్రమంతో విక్రమించి విజయుడు కాబోతున్నాడు.
సరిగ్గా అప్పుడు ఉదయం ఐదుగంటల పదినిముషాలైంది. కారు మినిస్టర్స్‌ కాలనీలో రివ్వున దూసుకుపోతోంది. సన్నగా చినుకులు. పైన మేఘాలు నిండిన ఆకాశం.
అంతా నిర్మానుష్యం.
కారు ‘ఆ’ గోదాంలోకి పోయింది సూటిగా.
అంతారెడీ అప్పటికే.
రాంబాబు, శివరాజం.. ఢిల్లీ అధిష్టానం బాపతు మోహన్‌ సైగల్‌.. ముగ్గురూ రెడీగా ఉన్నారు.
మొత్తం పది నిముషాల కార్యక్రమం అక్కడ.
కారు ఆగగానే దిగి.. చకచకా లోపలికి .. ఒట్టి రేకులషెడ్డువంటి విశాలమైన గోదాంలోకి నడిచి..
ఎదురుగా.. ఒక గుట్టవలె.. సిమెంట్‌ ప్లాస్టిక్‌ సంచుల్లో కుట్టిన అన్నీ ఐదువందల, వేయిరూపాయల నోట్ల కట్టలు, పదులు, వందలు.. మొత్తం నెలరోజుల లెక్క వారానికి యాభై కోట్ల చొప్పున నాల్గు వారాల్లో రెండు వందల కోట్ల పార్టీఫండ్‌. నగదు. క్యాష్‌.. నోట్లు..
రెండ్రోజుల్లో రెండు లక్షలమంది జనంతో భారీ బహిరంగసభలు నిర్వహించాలన్నా, ఎక్కడన్నా ఏదైనా రాజకీయంగా మతకలహం సృష్టించాలన్నా, అర్జంటుగా ఏ ప్రతిపక్ష, లేదా స్వపక్ష ప్రతిపక్ష సభ్యున్నయినా కొనాలన్నా.. ఎక్కడన్నా ‘పే అండ్‌ యూజ్‌’ పద్ధతి పై రాజకీయం చేయాలన్నా.. అంతా టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌. నగదు దందా. ప్రతి రాష్ట్రం అధిష్టానానికి ఉడతాభక్తిగా వారానికో వందకోట్లు సమర్పించుకోవాలి. అదొక శాశ్వత సంప్రదాయం. ఎవడు ముఖ్యమంత్రయినా అంతే. ఈలోగా బుర్రున ముఖ్యమంత్రిగారి మొబైల్‌ మ్రోగింది.
”హలో..”
”ఊఁ.. నేనండీ.. నళినీ సదాశివం”
”హలో మేడం బాగున్నారా..”
నళినీ సదాశివం అధిష్టానంలో ”ఫండ్స్‌ ప్రాక్యూర్‌మెంట్‌ సెల్‌’ అధిపతి. జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి (నిర్వహణ)
”బోలీయే మేడం”
”సబ్‌ తయార్‌హై నా.. మోహన్‌సైగల్‌కో హాండోవర్‌ కర్‌దేనా ఓ పూరాపైసా.. అచ్ఛా గాడీ భీ దో ఉస్‌కో.. ఔర్‌ చోడ్‌ దో.. ఓ సంభాల్‌ లేంగే.. ఠీక్‌హై”
”హా మేడం..”
ఫోన్‌ కటైపోయింది అట్నుండి.
పెద్ద పెద్ద రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువ మాటలుండవు.. చేతలుంటాయంతే.
ముఖ్యమంత్రిగార్కి ఎందుకో ఈ తన దాదాపు యాభైఏండ్ల రాజకీయానుభవంలో .. మార్చిన నాలుగైదు జాతీయ పార్టీల్లో ఎప్పుడూ ఏదో ఓ మంత్రి పదవో, తత్సమానమైన ఇతర పదవేదో ఉండడం వల్ల.. ఏ పార్టీ ఐనా పార్టీ ఫండ్‌ క్రింద ఇండస్ట్రియలిస్ట్స్‌, భూస్వాములు, కాపిటలిస్ట్‌లు, మాఫియాలు, గుండాలు, ప్రభుత్వ పథకాల్లో కమీషన్ల రూపంలో నొక్కేయడాలు.. ఇటువంటి వనరులనుండి కోట్లకుకోట్లు పార్టీఫండ్‌ కింద లెక్కాపత్రంలేని డబ్బను గ్టుటలు గుట్టలుగా సమీకరించడం.. గోదాముల్లో, ప్రత్యేకంగా .. రహస్యంగా నిర్వహించే అపార్ట్‌మెంట్లలో, నేలమాళిగల్లో నగదు రూపంలో దాచి ఉంచడం.. పార్టీలో అత్యంత విశ్వసనీయమైన కుక్కవంటి వ్యక్తి నిర్వహణలో అంతా నడిపించడం.. ఎన్ని చూడలేదు తను.
ముఖ్యమంత్రి అంటే అధిష్టానం దృష్టిలో ఓ కుక్క. బాల్‌ విసిరి తెమ్మంటే తేవాలి. ఛూఁ.. అంటే పరుగెత్తాలి. కరువంటే కరవాలి.. వద్దంటే విడిచిపెట్టాలి.. ఒక్కోసారి ఒట్టిగానే భౌ భౌ అని అరవమంటే అరవాలి. అటు అఖండ అధికార పటాటోపపు మత్తు.. ఇటు ఆత్మాభిమానాన్ని చంపుకుని అధిష్టానం ముందు తలవంచుకుని ఓ కట్టుబానిస.
ఆ ‘జనసేన’ రామం అన్నట్టు.. మనిషికి ఈ దిక్కుమాలిన అధికార వ్యామోహంగానీ, మనసు చచ్చిపోతూండగా నిస్సిగ్గుగా తలదించుకునే బానిసత్వంగానీ అవసరమా. చరిత్రలో ఎవడుమాత్రం ఎన్నాళ్ళు జీవించి శాశ్వతమయ్యాడని. అలెగ్జాండర్‌నుండి బ్రిటిష్‌ సామ్రాజ్యందాకా.. నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారు గదా.  మరి.,
”సర్‌.. మొత్తం రెండువందల కోట్లు.. అన్నీ రెండు ఇన్నోవాల్లో సర్దుకున్నాన్సార్‌” అన్నాడు పార్టీ కార్యదర్శుల్లో ఒకడైన శివరాజం.
”ఔను.. వీటిని తీస్కొని ఆ సైగల్‌ గాడెక్కడికి పోతాడయ్యా”
”ఏమోసార్‌.. లంజకొడ్కు.. గత నెల మాత్రం చత్తీస్‌గఢ్‌లకెళ్ళిండ్సార్‌. అక్కడ అపోజిషన్‌ గవర్నమెంటుంది గదా.. దాన్ని పడకొట్టడానికి మనుషుల్ని కొనాలని..అంతకు ముందు ఓ చార్టర్డ్‌ ప్లేన్‌లో మన మూడు వందల కోట్లతో జార్ఖండ్‌కు పోయిండు. ఈ నార్త్‌ లంజాకొడ్కులు గింతకూడ వాసనరానీయర్సార్‌.. ఈసారి బహుశా ఈ డబ్బును మన ఎపిలనే ఎక్కడ్నో దాస్తడు.”
”ఫోనీ దొంగముండాకొడ్కు.. కని నెలనెలా ఈ రకంగా డబ్బు సమకూర్చడం కష్టమే శివరాజం..ఎక్కన్నుంచి తెస్తం.. ఎన్నని దొంగపనులు చేస్తం.. అవతల ఆ జనసేన ముండాకొడ్కులు ఒక్కొక్కని భరతంపట్టి జాడిస్తాండ్లు.. వ్చ్‌.. ఏదో కష్టకాలమే దాపురిస్తాంది.. సరేగని వాని వెహికిల్స్‌ పోంగనే జాగ్రత్తగా తాళాలేసి కీస్‌ పంపియ్‌.. ఇంక బ్యాలెన్స్‌ందుందిందుల..”
”ఏఁ. ఎంతసార్‌.. ఇరవై ఏడు కోట్లు..” శివరాజం అంటూండగా.,
‘ఏయ్‌ శివరాజం.. ఇరవై ఎనిమిది కదా.. నీయవ్వ ఎలాగూ లెక్కపత్రం లేదుగదా అని ఒకటి నొకేద్దామనుకుంటానవా..” అన్నాడు రాంబాబు. శివరాజం రాంబాబు దిక్కు గుర్రుగా, ఆల్సేషియన్‌ కుక్కవలె చూచి.. ”నీయవ్వ.. లెక్క ఒకటి తప్పిందన్కో .. యిప్పుడేమైంది. తింటమా..నువ్వు లేవా లెక్క చూచెడానికి.. ఓ ఒకటే తొందర నీ తల్లి..”
” అరెయ్‌.. లెక్కలు కిందిమీదికైతే ఎర్కేగదా.. పిట్టలోల్గె లేచిపోతరు..” ముఖ్యమంత్రి వెనుదిరిగి కారుదిక్కు నడుస్తూండగా.,
”సర్‌సర్‌.. ఈసారి మంత్రివర్గ విస్తరణలనన్న నన్ను ఓ కంట..” ప్రాధేయపూర్వకంగా శివరాజం గొణుగుతూ,
”చూద్దాం లేవయ్య.. అసలు మన సర్వైవలే కష్టంగున్నది..”
ముఖ్యమంత్రి చరాచరావచ్చి కార్లో కూర్చోగానే కారు బయల్దేరింది..పూర్తిగా రహస్యమైన ట్రిప్‌ కాబట్టి ఏ సెక్యూరిటీ, కాన్వాయ్‌, పటాటోపం లేని ప్యూర్‌ పర్సనల్‌ ట్రిప్‌.. చాలా హాయిగా ఉందతనికి.. అప్పటికే ఆయన మొబైల్‌ సైలెంట్‌ మోడ్‌లో అరుస్తూనే ఉంది.
అసహనంగా ఫోన్‌ ఎత్తాడు.. ”హలో..” అని. ఆ ఫోన్‌ హోంమంత్రి అప్పల్నాయుడుది. అప్పటికే ఎనిమిదిసార్లు వచ్చి వచ్చి వెయిటింగులో ఉంది. చాలా చికాకేసింది ముఖ్యమంత్రికి ఆ వ్యక్తి జ్ఞాపకం రాగానే. అతన్ని చూడగానే ఓ పందిని చూచినట్టు పైన ఓ బల్లో, తొండో పడ్డట్టు, ఓ బండెడు పేడ పైనబడ్డట్టు ఓ వికారమైన అనుభూతి. మొదట్నుండీ తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తనతో బలవంతంగా తన పనులన్నీ చేయించుకుంటున్నాడు. పదేండ్లక్రితం ఒట్టి కేబుల్‌ ఆపరేటర్‌ వెధవ అప్పల్నాయుడు.. ఇప్పుడు వాడొక క్యాబినెట్‌ర్యాంక్‌ మంత్రి. వాడి పెళ్ళాం ఎంపి. వాని తమ్ముడు ఎమ్మెల్యే. వేల ఎకరాల భూములు కబ్జా. వేల కోట్లరూపాయల సంపద.. మనిషి.. పశువుకే మాటొస్తే టైపు – నోరు తెరిస్తే అదొక మున్సిపల్‌ మోరి. సారా, లిక్కర్‌, బార్లు, పబ్‌లు, గనులు, హార్బర్‌, ఖనిజం ఎక్ప్‌పోర్ట్‌, ఇరవై రెండు ఇంజినీరింగు కాలేజిలు. రెండు మెడికల్‌ కాలేజీలు, రెండు షిప్పింగు కంపెనీలు. విదేశాల్లో రెండు హోటళ్ళు. యితర రాష్ట్రాల్లో నాల్గు పవర్‌ ప్రాజెక్ట్‌లు.. ఒక సామ్రాజ్యం వాడిది. ఒట్టి వీధిగుండా. ఒకప్పటి రౌడీషీటర్‌ ఇప్పుడు హోంమంత్రి. వాడికింద ఒకనిమీద ఒకడు పడిపడి బూట్లు నాకే ఐపిఎస్‌ ఆఫీసర్లు.. వేలకోట్ల సామ్రాజ్యం. అధిష్టానం దగ్గర పైవాళ్ల కటాక్షవీక్షణాలు వీడికి. డైరెక్ట్‌గా సూట్‌కేస్‌లకుసూట్‌కేసులు పార్టీ పెద్దలకు, సామంతులకు చక్రం తిప్పేవాళ్ళకు, ధనకనక వస్తు వాహనాదులతోపాటు కాంతామధువులు అన్నీ చేయిచాపినంత దూరంలో ఉంచి.. వాడికి ఎవన్ని ఎట్ల మేనేజ్‌ చేయాలో బాగా తెలుసు. తన కంట్రోల్‌ అస్సలే లేదు. వాడు తన మాట వినడు.. తనను ఖాతరు చేయడు.. ఎప్పుడూ ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలను పిల్లివెంట పిల్లల్లా వెంటతిప్పుకుంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. వీడూ పార్టీ రాష్ట్ర అధ్యకక్షుడు జయవిజయులు.. తోడుదొంగలు.. కత్తీ డాలూ.
యిప్పుడు వీడు ఉంచుకున్న ముండ చింతామణికి ‘రాజ్యసభ’ సీటు కావాలి. అధిష్టానంనుండి పైరవీ చేసుకుని అఫీషియల్‌గా రాష్ట్ర పార్టీ అధ్యకక్షుడు, ముఖ్యమంత్రి అంగీకారంతో ఒక లెటర్‌ తెచ్చుకొమ్మని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌తో చెప్పించుకుని.. ఒక లెటర్‌పెట్టి.. నిన్న రాత్రి రాష్ట్ర అధ్యకక్షుని సంతకం చేయించి.. పన్నెండు తర్వాత ఫుల్‌గా ఫుల్‌బాటిల్‌ తాగి తనదగ్గరికొచ్చి సంతకం పెట్టమంటాడా కాగితంపై.. సంతకం పెట్టడం గురించిగాక వాడింకొక మాట మాట్లాడడు. మాట్లాడనీడు. అతి కష్టంమీద ఆ కాగితం అక్కడ పెట్టిపో.. రేప్పొద్దున చూద్దామని పంపించగలిగాడు తను. పోతూ పోతూ ”రేప్పొద్దున చూస్తా కాదు.. రేప్పొద్దున చేస్తా అను” అని అరుచుకుంటూ వెళ్లిపోయాడు.. వాడివెంట పాతికమంది స్పెషల్‌ సెక్యూరిటీ, ప్రొటెక్షన్‌ పోర్స్‌.
”రామం.. నువ్వు చెప్పుతున్నది అక్షరాలా నిజమయ్యా.. మేమిద్దరం బయటికి రాలేని పీతిగుంటలో మునిగిపోయి ఉన్నాం.. సత్యం.. పరమ సత్యం.. సిగ్గుగా ఉంది.. అసహ్యంగా ఉంది.. జుగుప్సగా ఉంది నాపై నాకే.. కాని..?”
”ఏమైంది.. ఎక్కడున్నారు మీకోసం అరగంటనుండి వెయిట్‌ చేస్తున్నా చాంబర్లో.. ఎంతసేపు..” అరుస్తున్నాడా ఆంబోతు హోంమంత్రి అట్నుండి.
”వస్తున్నానయ్యా.. ఐదునిముషాల్లో.. వెయిట్‌ చెయ్‌..” అన్నాడు అసహనంగా. ఆయనకా క్షణం మొన్న టి.వి. ఇంటర్వ్యూలో ‘జనసేన’ రామం పదే పదే చెప్పిన ఆత్మగౌరవం, ఆత్మతృప్తి అనే పదాలు వందసార్లు జ్ఞాపకమొచ్చాయి. ఆ రెండూ ప్రస్తుతం తన దగ్గర అస్సలే లేవని అర్ధమై ఎందుకో అతనికి దుఃఖంముంచుకొస్తున్న ఫీలింగేదో కలిగి గిలగిల్లాడిపోయాడు. నిజంగానే ఈ వయసులో.. తను యాభై ఏండ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చినపుడు పార్టీ ఏదైనా ఋషుల్లాంటి వ్యక్తులుండేవాళ్ళు. శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, చంద్ర రాజేశ్వర్రావు, వందేమాతరం రామచంద్రరావు, పెండ్యాల రాఘవరావు.. మహానుభావులు.. అసలు స్వార్ధమే లేని ఆదర్శజీవులు. శాసనసభ అంటే పవిత్ర దేవాలయం. ప్రతి మనిషి కదలిక, నడక, మాట, ముచ్చట, ఆలోచన..సంభాషణ అన్నీ విశిష్టమే. అందరిలోనూ మానవ పరిమళం అక్కడ్నుండి.. పర్వతంపైనుండి రాయి కింది దొర్లిపడ్తున్నంత వేగంగా విలువలు పతనమై.. నైతికత ధ్వంసమై.. ఒక్క యాభై సంవత్సరాలలో భారతదేశంలోని శాసనసభలన్నీ .. పార్లమెంట్‌తో సహా మైక్‌లు విరిచి, బల్లలు చరిచి, అంగీలు చింపుకుని, పరమ చంఢాలమైన భాషతో తిట్టుకుని.. అంతా రోత. ఏమిటిది.. ఎందుకిలా.. నిజంగానే ఆ రామం అన్నట్టు నేరగాళ్ళందరూ శాసన సభల్లోకి ప్రవేశించారుగదా బాజాప్తాగా. ఆక్రమణ.. దురాక్రమణ జరిగింది.

గుండాలకు ప్రజాస్వామ్యపు అసలు రహస్యం తెలిసిపోయింది. అసలు ప్రజాస్వామ్యమే బూటకం. వంథాతం ఓటర్లలో ఏ ముప్పయ్యయిదు శాతం మందో ఓటేస్తే పద్దెనిమిదిశాతం ఓట్లను సంపాదించినవాడు గెలుస్తే. గెలిచినవాడు ఎంతశాతం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు.. పదిహేడుశాతం ఓట్లొచ్చి ఓడిపోయినవాడు ఎంతమందితో నిరాకరించబడినట్టు.. ఐనా ఒక నిరక్షరాస్యుడు, ఒక డాక్టర్‌, ఒక కూలీ, ఒక వైస్‌చాన్సలర్‌.. వీళ్ళందరూ పౌరులే ఐనపుడు అందరి ఓటు విలువ ఒకటే ఐనపుడు.. అసలా గణన విధానమే తప్పుకదా.. అందుకే వీధీరౌడీలు కూడా ఎన్నికల్లో అసలు ఓటు వేసే బడుగు ప్రజలను ఎలా లోబర్చుకుని, వశపర్చుకోవాలో, ఎలా భయపెట్టి మభ్యపెట్టాలో.. అన్ని పద్ధతులూ నేర్చుకున్నారు. పోలింగు తేదీకంటే ముందు రెండురోజులు సర్వవిధాలుగా ప్రజలను వెధవలను చేస్తే.. చెల్లు.. యిక ఐదేండ్లు ఆడింది ఆట పాడింది పాట. ఈ దేశంలో ఎలాగూ కోర్టులకు చెవులు, కళ్ళులేవు.. పోలీసులకు హృదయం, చేతులు లేవు.. మేధావులకు ధైర్యం, సమయం లేవు.
ఈ వ్యవస్థ శరీర సర్వాంగాలకూ కేన్సర్‌ చీడపట్టినట్టయి.,
బి.డబ్ల్యు.ఎమ్‌ కారు జారిపోతుంది విడిచిన బాణంలా.

రాజకీయాల్లో.. బ్లాక్‌మెయిల్‌ చేయడం.. బ్లాక్‌మెయిల్‌ చేయబడ్డం.. ఒక గొప్ప నీచమైన జూదక్రీడ.. ఆ పరంపరలో.. యిదివరకు ఎన్నో ప్రభుత్వాల్లో పంచాయితీరాజ్‌, ఎలక్ట్రిసిటీ, ఆర్థిక, రెవెన్యూ, ఆరోగ్య.. ఒకటేమిటి.. దాదాపు అన్ని శాఖలనూ మంత్రిగా నిర్వహించిన తనకు తెలియని రహస్యమేలేదు. తెలియని లోలోతుల విషయాలూ లేవు.. ఐతే జీవిత చరమథలో ముఖ్యమంత్రి కావడం ఒక వరమై.. ఒక అద్భుతావకాశమై.. ఓ అదృష్టమై.,
శేషజీవితమంతా మాజీ ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు గదా.. అని ఆశ.
కాని యిది ఒక శాపమై.. క్షణక్షణ నరకం, ఆత్మవంచన, అవమానాలు, క్షోభ.. అన్నింటినీ మించి మనసుకు నచ్చని ఎన్నో తప్పుడు పనులకు ఒడిగడ్తూ.. ఇన్నాళ్ళూ ఏదో కొద్దిగా గుండెల్లో మిగిలిన చెంచాడంత ఆత్మతృప్తికూడా ఇగిరిపోయి.. ముగింపులో ‘ముసలోడు ఛండాలపు పనులన్నీ చేశాడు. చేయనిచ్చాడు’ అన్న మచ్చ శాశ్వతమై.,
అవసరమా ఈ మచ్చ తనకిపుడు. ఈ మచ్చను ఇలాగే ఇంకా ధరిస్తే.. ఇన్నాళ్ళ జీవితమంతా బురదలో పోసిన అమృతమైపోదా.
ఉహుఁ.. లోపల..లోలోపల.. ఎక్కడో.. ఏదో తగలబడిపోతోంది ఎండిన అడవిలా.

ఒక నెలక్రితం గుఢాచార విభాగంలో నీతివంతులూ, తనకు బాగా విశ్వసనీయులైన ఓ పదిమంది అధికారులతో ప్రతి మంత్రి గురించీ, ప్రతి శాసనసభ్యుని గురించీ సమీకరించిన సమగ్ర నివేదిక జ్ఞాపకమొచ్చింది ఆయనకాక్షణం. ఒక రాత్రంతా ఆ వందల నివేదికలను పరిశీలించాడు తను.. ఏమున్నయందులో.. బురద.. చెత్త.. కంపు.. గబ్బు. ఎప్పుడూ ఎవ్వడూ శుభ్రం చేయలేని సముద్రమంత అవినీతి. దాదాపు ఎనభైశాతం మంది .. అందరూ నేరచరిత్రులే. ఓ సరియైన చదువులేదు. చరిత్రలేదు.. సంస్కారం అసలేలేదు. జ్ఞానం అంతకూ లేదు. .. అంతా రాక్షస గణం. తాను దానికి అధిపతి.. అంతే.
మొన్న రాత్రి తనవద్దకు వచ్చిన ఐదారుగురు మంత్రులు, యింకో ఏడెనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు.. బృందం గుర్తొచ్చింది ముఖ్యమంత్రిగారికి. వేలకోట్ల సాగునీటి ప్రాజెక్ట్‌లలో జరిగిన వేలకోట్ల అవినీతికి సంబంధించి సవివరమైన సమాచారంతోనే వచ్చారు వాళ్ళు. చాలా బహిరంగమైన దోపిడి. నిస్సిగ్గుగా ఎగబడి తినుడే.. అదీ ప్రపంచబ్యాంక్‌నుండి తెచ్చిన అప్పు డబ్బును.
అంతా నిజమే..నిజమే.. తనకు తెలుసు.
పవర్‌ ప్రాజెక్టులలో ఏ మంత్రి ఏ పార్లమెంట్‌ సభ్యుడు, ఏ బినామీదారు ఎంత దండుకుంటున్నాడో తెలుసు.. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ను అడ్డంపెట్టుకుని డిస్టిలరీస్‌.. ఎక్కడో అమెరికానుండి ఆంధ్రదేశందాకా విస్తరించడం తెలుసు తనకు. వాళ్లనుండి ఎవనికి అందిందివాడు కోట్లుకోట్లుగా తిని బలవడం తెలుసు. కార్పొరేట్‌ కంపెనీలకు భూముల అలాట్‌మెంట్‌ పేరుతో ఏ ఏ నాయకుడు ఎన్నెన్ని ఎకరాలు, సెజ్‌లపేరుతో గ్రామాలకు గ్రామాలను ఎలా పంచుకుతింటున్నారో.. రోడ్డు, భవనాలు, ఇసుక, బొగ్గు, అడవి, కలప, ఖనిజం, నీరు.. అంతా అంతా దోపిడీకి గురౌతున్నట్టు తెలుసు తనకు.
మొన్న తన చేయించిన సర్వేతో, ఇప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలో ఒక అవశేషంగా, మిగిలిన నీతిపరులైన ఏడెనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ల నేతృత్వంలో తయారుచేసిన ‘అవినీతి డాటా బ్యాంక్‌’ ఋజువుల్తోసహా.. తనదగ్గరుంది.. డాక్యుమెంట్లుగా.. అంతా తనకు తెలుసు.
తెలిసీ.. తెలువనట్టు.. కళ్ళు ఉండీ చూడలేనట్టు.. చెవులుండీ వినలేనట్టు.. నటిస్తూ.,
జీవిస్తూ.. మరణించినట్టు.. మరణించికూడా జీవిస్తున్నట్టు నటిస్తూ..థూఁ.. నీయమ్మ .. ఆ ‘జనసేన’ నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో … టి.విలో ఎవరో వేశ్య చెప్పినట్టు.. తమకంటే వేశ్యే నయంకదా.
అధిష్టానం.. పార్టీ.. పార్టీ సభ్యులు..ప్రజాప్రతినిధులు.. అధికారదాహంతో వికృతతాండవం చేస్తున్న వివిధ పార్టీ లాబీలు.. హైద్రాబాద్‌, ఢిల్లీ.. నడుమ వికృత మంత్రాంగం, యంత్రాంగం నడిపేవారు.. అందరూ చెప్పేదేమంటే.. ముఖ్యమంత్రి ఈ రొచ్చును ఈ కంపును, ఈ సర్వదరిద్రాన్ని భరిస్తూ, ధరిస్తూ.. నాయకత్వం వహిస్తూ.. ‘నడిపించండి.. నడిపించండీ రోతను’ అని కదా ఎప్పుడూ చెప్పేది.
కాని.. కాని.. ఉహుఁ.. యిక తనతో కాదు.. ఈ కుర్చీ, ఈ అధికారం.. ఈ నీచాతి నీచమైన పదవీవ్యామోహం.. అప్పులకుప్పపై దొంగ నాటకం.. ఖాళీ ఖజానాతో అబద్దాల పాలన.. వద్దు.. వద్దిక..,
కారు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందాగి.. దిగి.. గబగబాలోపలికి నడచి.,
చుట్టూ ఎందరో విజిటర్స్‌.. ఫైళ్ళతో అధికారులు.. పాత్రికేయులు.. టివివాళ్లు.. లోపల ఆంటీరూంలో హోంమంత్రి అప్పల్నాయుడు.. ఇంకా.. ఇంకా.,
బెల్లం చుట్టూ ఈగలు.
లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నాడో లేడో.. డోర్‌ దగ్గరగా పెట్టి అప్పల్నాయుడు ఒక వీధి రౌడీ మీదికురికొచ్చినంత రూడ్‌గా పైపైకొచ్చి,
”ఏమైందా కాగితం.. రాత్రిది.. చింతామణి రాజ్యసభ సీట్‌కు రికమెండేషన్‌ లెటర్‌. మీరు దాన్ని సంతకంచేసి నా ముఖాన పారేస్తే.. ఢిల్లీ లెవల్లో అన్ని ఏర్పాట్లూ చేసుకున్న”
”నేను చేయనయ్యా..”
”చేయవా.. ఎందుకు..” మాట ఏకవచనంలోకి దిగింది.
”ఒట్టి రోడ్‌సైడ్‌ మనుషులను పార్లమెంట్‌కు పంపడం సరియైందికాదు”
”ఏంటీ రోడ్‌సైడ్‌ మనిషా చింతామణి.. మరి నువ్వు, నేను, మన మంత్రులు, మనోళ్ళందరెవరు. సత్యహరిశ్చంద్రులా. పోవయ్యా.. ఏదో పెద్దమనిషివిగదా అని నీ సంతకం కావాలన్న. నువ్వు ఆ బోడి సంతకం చేయకుంటే పని ఆగిపోద్దనుకున్నవా. పై లెవల్ల ఎవనెవనికెంతియ్యాల్నో అన్ని ఇచ్చిపెట్టిన.. అందరూ పవర్లో ఉన్నంత సేపే తూర్పారపట్కొని పోతరు. పో.. నీతోనేంగాదు.. చూస్కుంట నీసంగతి..”అని విసవిసా, ఒక మామూలు మనిషిపై వీధిగుండా దాడిచేసి వెళ్లినట్టు.. ఓ వెంట్రుకముక్క పో అన్నంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు.,
ధూఁ.. నీయవ్వ..నిజంగానే ఏ విలువాలేని తనది ఏం బతుకు.,
పార్టీలో ప్రతివాడూ మాట్లాడేవాడే.. అందరూ ఒకర్నొకడు విమర్శించేవాడే.. అందరూ నీతిపరుల్లా మాట్లాడ్తూ ప్రతివాడూ మందికొంపలు ముంచుడే. ప్రతివాని వెనుకా ఎవడో ఒక గాడ్‌ఫాదర్‌.. ఎవనిదో దన్ను.. చివరికి అందరూ అక్కడ పైనుండి ఆడమంటే ఆడి, పాడమంటే పాడి.. కూర్చోమంటే కూర్చుని, నిలబడమంటే నిలబడి.. అంతా తోలుబొమ్మలాట.
ముక్కుతాళ్ళక్కడ.. ఒట్టి ఆడే బొమ్మలిక్కడ.
ఈ తోలుబొమ్మ జీవితం తనకు అవసరమా..?
ముఖ్యమంత్రి.. రాత్రి కూలంకషంగా పరిశీలించిన ఓ ఫైల్‌ఫోల్డర్‌ను తన టేబుల్‌ సొరుగులోనుండి బయటికి తీసి అప్రయత్నంగానే తెరచి ఓసారి తిరగేశాడు యథాలాపంగా. దాదాపు డెబ్బయిరెండు కేసులు.. మంత్రులు, శాసనసభ్యులు.. ఐఎఎస్‌ అధికారులు, వివిధ బోర్డు చైర్మన్లు.. వంటి హై ప్రొఫైల్‌ వ్యక్తుల జాతకాల చిట్టా.. ఋజువుల్తోసహా.,
ఎందుకో ఆయన తనకే అర్ధంగాని ఓ అంతర్వేదనలో.. నిర్వేదంలో.. నిశ్చేష్టలో కంపించిపోతూ.. అప్పుడతను కాలుతున్న కాగితంలా ఉన్నాడు.
కాగితం కాలిపోతూంటే అక్షరాలుకూడా కాలిపోతాయా..?

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 17 వ భాగం

(గత వారం తరువాయి)

17

ఒక్కసారిగా నూటా ఎనిమిది ప్రజాపనులు జరుగుతున్న ప్రాంతాలపై ‘జనసేన’ జరిపిన ‘ప్రక్షాళన’ యాత్ర ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. పత్రికలు, మీడియా.. తమ తమ రిపోర్టర్‌లందరినీ ‘జనసేన’ ప్రక్షాళన బృందాలు సమాచారచట్టం ఆధారంగా చేస్తున్న ‘ప్రశ్న’ కార్యక్రమాలను కవరేజ్‌ చేయడానికీ నియమించవలసి వచ్చింది.

గంటగంటకు అన్ని టి.వి. చానళ్ళలో వివిధ ప్రాంతాల్లో నాసిరకపు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సిగ్గుతో తలలు  వంచుకుని లొంగిపోవడం.. ఒక చోటనైతే నిస్సహాయుడైన ఓ కాంట్రాక్టర్‌ తన నిస్సహాతను ఏకరువుపెడ్తూ, పైన ఏ రాజకీయనాయకునికి, అధికారికి..ఎవరెవరికి ఎన్ని పర్సంటేజీలిచ్చి చివరికి ఎలా మోసానికి గురై.. యిప్పుడీ దుస్థితిలో ఇరుక్కుపోయడో వివరిస్తూ భోరున విలపించాడు సిగ్గుతో.
మొత్తానికి అధికారికంగా ప్రజాధనానికి సర్వాధికారులైన ప్రజలే ఒక సమూహంగా ఎదురుగా వచ్చి ప్రశ్నలు ప్రశ్నలుగా గుండెల్లోకి బాణాలను సంధించే పరిస్థితి ఒకరోజూ ఎదురౌతుందని ఊహించిన కాంట్రాక్టర్లు మింగలేక కక్కలేక గుడ్లప్పగించి, బిక్కచచ్చి లజ్జతో లుంగలు చుట్టుకుపోవడం అన్ని టి.వి. ఛానళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఐదారుచోట్ల కాస్త ముదురు కాంట్రాక్టర్లు మొదట ఎదురు తిరిగి, తను దుష్ట అనుచరవర్గంతో ‘జనసేన’ కార్యకర్తలపై దాడిచేసి, గాయపరిచి తలలను పగులకొట్టి దౌర్జన్యం జరిపి బీభత్సం సృష్టించారు. ఐతే ఈ విషయాలన్నీ మీడియాలో ప్రసారమై బయటి ప్రపంచమంతా చూస్తోందన్న భయం, జనసేన మనుషులు అడిగే ప్రశ్నలన్ని సమాచార చట్టం ప్రకారం అధికారులిచ్చిన సర్టిఫైడ్‌ కాపీలలో ఉన్నవే కావడం, నిజంగానే తాము చేస్తున్న కోట్లకొద్ది రూపాయల పనులు నాసిరకంగా ఉన్నట్టు జనసేన బృందాల్లో ఉన్న హైలెవెల్‌ సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తులు కళ్ళముందే జరుపుతున్న పరీక్షలద్వారా నిర్ధారిస్తూండడం, ఇన్నాళ్ళూ తమ దగ్గరినుండి లక్షలకు లక్షలు లంచాలను తిన్న అధికారులూ, పోలీసులూ, ఇతరేతర హైరార్కీ అందరూ తేలు కుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తూండడం.. ఇదంతా అయోమయంగా, పిచ్చిపిచ్చిగా, భయం భయంగా అనిపించి.. ఒక్క కాంట్రాక్టరైతే ఏమీతోచక, ఎవర్నీ ఏమీ చేయలేక అతని చొక్కాను అతనే పరపరా చింపుకుని గొడ్డులా అరిచాడు. ఆ అరుపు, ఆ ఉన్మాదస్థితి.. ఆ నిస్సహాయ దౌర్భాగ్యాన్ని దాదాపు అన్ని తెలుగు వార్తా చానళ్ళు పొద్దూ రాత్రనక అస్తమానం ప్రసారం చేశాయి.
23

బ్రేకింగ్‌ న్యూస్‌..
‘అవమానాన్ని భరించలేక ఒక అవినీతి కాంట్రాక్టర్‌ బహిరంగ రోదన’

‘ఏకు మేకై అవినీతి పర్వతాలను బ్రద్ధలు చేస్తున్న వైనం’
‘తెరవెనుక నిజాలను బయటపెడ్తున్న బినామీ కాంట్రాక్టర్లు’
‘రౌడీలందరూ రాజకీయ నాయకులూ, కాంట్రాక్టర్లయ్యారా!’
‘జనసేనను కదిపితే క్షణాల్లో వాని చరిత్ర బట్టబయలు’
‘గుప్పిట్లో నిప్పు.. విప్పుతే ముప్పు.. విప్పకుంటే తప్పు’

ఒక్కో ఛానల్‌ వాళ్ళవాళ్ళ శైలిలో ప్రత్యేక తరహా వాక్య విన్యాసాలు.. మొత్తానికి అందరికీ.. వార్తలు చదువుతున్నవారికి, వింటున్నవారికి, వార్తాపత్రికల్లో కథనాలను కంపోజ్‌ చేస్తున్నవారికి రిపోర్టర్లకు, అచ్చువేస్తున్న ప్రెస్‌మెన్‌కు, ఇన్నాళ్ళూ దుర్మార్గులకు కాపలాకాస్తున్న అట్టడుగు పోలీసులకు, అందరికీ పరమ ఆనందంగా ఉంది. చిన్న తెప్పలా వచ్చిన జనసేన ఒక ఉప్పెనగా మారి ఓ వినూత్న రీతిలో అవినీతి అంతానికి తిరుగులేని విధానాన్ని అమలు చేయడం చిత్రంగా, ఆశ్చర్యంగా.. పులకింతంగా ఉంది. ఎక్కడ చూచినా ‘జనసేన’ చర్చే.

‘జనంనాడీ’ ఇప్పుడు చూడండి.. అని ఓ ఛానల్‌లో ప్రజలముందు మైక్‌ ఉంచి వాళ్ళ అభిప్రాయాలను లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నారు.

‘నరకాసురుడు చచ్చిపోతే అబ్బా పీడవిరగడైపోయిందని జనమంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకున్నారట. జనసేన పుణ్యమా అని వందల వేలమంది నరకాసురుల వధ జరుగుతోందీ రోజు ఈ తెలుగునేలపై.. ఎన్ని దీపావళి పండగలు జరుపుకోవాలో అన్నంత ఉత్సాహంగా ఉంది..’ అంటున్నాడో నలభై ఏండ్లు పైబడ్డ పౌరుడు రోడ్డుపై నడచిపోతూ.
‘అరె.. మీతిమీరిపోయిండ్లు నాయకులు. సిగ్గుశరం లేకుండా దేశాన్ని పంచుకుని తినుడేనాయె. ఇన్నాళ్ళకు జనానికి వీళ్ళ పనిబట్టే విధానం దొరికింది. జనసేనకు ధన్యవాదాలు”
‘ప్రజలు.. ఒంటరిగా ఎంత బలహీనులో.. సమిష్టిగా అంత బలవంతులని యిది ఒక సజీవ ఉదాహరణగా నిరూపించింది.’
‘స్వార్థరహిత నాయకత్వం ప్రజలను ఎలా ఏకతాటిపై నడిపించి విజయాలను సాధిస్తుందో ఈ జనసేన ప్రతిఘటన వల్ల తెలుస్తోంది’
‘ఇగ కక్కుతరు కొడ్కులు..అరె కోట్లకు కోట్లు తినుడు. కిలోలకొద్ది బంగారం దోచుడు, దాచుడు.. ఎక్కడ్నుండొస్తానై యివన్నీ అని యిండ్లళ్ళ ఆడోళ్ళు కూడా అడ్గరు మొగోళ్ళను. అడిగేటోడు లేక జన్నెకిడ్సిన ఎద్దుల్లెక్క బలిసిండ్లు.. తీయాలె, ఒక్కొక్కన్ని తవ్వి బండారం బయటికి తీయాలె.. సంబురంగున్నది. జనసేనకు జై. దాని ఎన్క ఎవ్వడున్నడోగని వానికి దండం’
.. ఇలా సాగుతున్నాయి లైవ్‌ టెలికాస్ట్‌లో ప్రజాస్పందనలు.
‘ఇంకో ఐదు నిముషాల్లో.. జనసేన సృష్టికర్త రామం, జనసేన సిద్ధాంతకర్త డాక్టర్‌ గోపీనాథ్‌లతో ‘అగ్ని’ టి.వి. ముఖాముఖి. అగ్ని టి.వి. నిప్పు పిడికిలిని విప్పుతుంది.’ఏదో యాడ్‌.. కింద మూడు లైన్ల అక్షరాల స్క్రోలింగ్స్‌.

ఈ మూడు లైన్ల అక్షరాల కదలికలను, ప్రక్కన యింకో చిన్న అడ్వర్‌టైజ్‌మెంట్‌ డిస్‌ప్లేను, పైన ఇంకేదో రౌండింగ్‌ ఐటమ్‌, తెరపై యాంకర్‌ వాచకం.. ఏకకాలంలో ప్రేక్షకుడు ఈ తెరను చూస్తూ ఎంత హింసకు గురౌతాడో ఏ మేధావీ, పౌరహక్కుల వాళ్ళూ, ఈ మొద్దు ప్రభుత్వమూ ఆలోచించదు.
‘ఈలోగా.. గోవిందరావుపేట అనేచోట.. నిన్న జరిగిన ఉదంతాన్ని తిలకించండి’
ప్రొజెక్షన్‌ ప్రారంభమైంది

అక్కడ ఓ రెండు వందల మీటర్ల పొడవున్న రోడ్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం జరుగుతోంది. అటు ప్రక్క ఒక జెసిబి, టిప్పర్‌, రెండు కాంక్రీట్‌ మిక్సర్స్‌, రెండు లారీలు ఉన్నాయి. ఓ పదిమంది కార్మికులు పని చేస్తున్నారు. ఇద్దరు సగం నిలబడ్డ పిల్లర్‌కు ఉక్కు కడ్డీలను జతచేసి వెల్డింగ్‌ చేస్తున్నారు. కెమెరా దీన్నంతా చూపిస్తూంటే.. ప్రక్కన పచ్చగా పొలాలు, చెట్లు.. పెద్దగా సెలయేరులాంటి నీటి ప్రవాహపు జాడలు ఏవీలేవు. అసలక్కడ అంత పొడవైన వంతెన అవసరం ఉందా.. అని అన్పించే వాతావరణం ఉంది. చూస్తూంటే..మంత్రి, మంత్రి బామ్మర్దయిన కాంట్రాక్టర్‌, లోకల్‌ ఎమ్మెల్యే, ఆ ప్రాంత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌.. అందరూ కుమ్మక్కయితే ఫండ్స్‌ను పంచుకునేందుకు అసలు అవసరమే లేని కావలసిన డబ్బును దండుకునేందుకు వీలుగా నాసిరకం డ్యాం నిర్మిస్తున్నారనే పరమసత్యం అర్థమౌతోంది.
”నమస్కారం సార్‌. మీరేనాండి ఈ రాంపురం బ్రిడ్జ్‌ కంట్రాక్టర్‌. నా పేరు జగన్‌. జనసేన కార్యకర్తను” అని ఓ జనసేన కార్యకర్త అడిగాడు అక్కడున్న తెల్లని స్టార్చ్‌ బట్టలేసుకున్న నల్లని వ్యక్తిని. అతను బట్టలేసుకున్న ఎలుగుబంటులా ఉన్నాడు. అతని మెడలో నులకతాడంత మందం బంగారు గొలుసులు, రాళ్ళ బిళ్ళలు, రెండు చేతులకు రెండు ధగధగా మెరిసే బేస్‌లెట్లు, రెండు చేతులక్కలిపి ఎనిమిది ఉంగరాలు ఉన్నాయి.
”ఔను..” అన్నాడు అసహనంగా, నిర్లక్ష్యంగా
” ఈ కన్‌స్ట్రక్షన్‌, ప్రాజెక్ట్‌ డిటైల్స్‌ మా జనంకోసం డిస్‌ప్లే చేయాలెగద సార్‌”
”చేయాలె.. కని చేయలె..ఐతేంది.”
”యిప్పుడు చేస్తరా సర్‌”
”ఏమో చూస్తం.. అదంత అవసరమా”
”పోనీ.. మేం పెట్టాల్నా సార్‌ బోర్డును”
”మీరు పెడ్తరా.. మీ దగ్గర డిటైల్లున్నయా..”
”ఒక్క బోర్డుయేగాదు.. మీ అందరి చరిత్ర భూగోళాల వివరాలన్నీ మా దగ్గరున్నయ్‌ సార్‌. బొడ్డుబోయిన అంజయ్యగారూ.. బాబూ..” అని ఒక జనసేన కార్యకర్తను పిలిచి.. ”ఓ నలుగురు వెళ్ళి ఈ రాంపురం బ్రిడ్జ్‌ ‘పబ్లిక్‌ ప్రకటన’ బోర్డులను ఆ కొసకు, ఈ కొసకు పాతండయ్యా” అని పనిని పురమాయించి,
”ఊఁ.. చెప్పండి అంజయ్యగారు.. అసలు ఈ వర్క్‌కు ఆఫీషియల్‌ కాంట్రాక్టరెవరు”
”నీకు చెప్పడమవసరమా” అన్నాడు తలబిరుసుగా.
”చాలా అవసరం.. ఎందుకంటే యిది ప్రజల డబ్బు. మేం ప్రజలం” అన్నాడు జగన్‌ వెనుక నిలబడిన ఉన్న దాదాపు ఓ ఇరవైమంది యువకులు.
”చెప్ప..”
”సరే.. ఐతే మేమే చెప్తం. దీని అసలు కాంట్రాక్టర్‌ మంత్రి విశ్వేశ్వర్రావు తమ్ముడు జగపతిరావు. ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పనిని రెండుకోట్ల డెబ్బయి లక్షలకు ఓవర్‌ ఎస్టిమేషన్‌ వేయించుకుని.. గవర్నమెంట్‌లో మ్యామ్యాలిచ్చి సబ్‌ కాంట్రాక్ట్‌ క్రింది ఇక్కడి లోకల్‌ ఎమ్మెల్యేకు చెందిన మెసర్స్‌ వెంకటేశ్వరా కన్‌స్ట్రక్షన్స్‌కు రెండు కోట్ల రౌండ్‌ ఫిగర్‌కిచ్చి స్కిప్పయిండు. తర్వాత వాళ్ళు కూడా ఈ పనిని చేపట్టక ఈగిల్‌ అండ్‌ కంపెనీకి ఒక కోటీ ఎనభై లక్షలకిచ్చి పనిని మొదలుపెట్టి ఐదు లక్షల కమీషన్‌ మీద మీకు ఒక కోటీ డెబ్బయ్యయిదు లక్షలకిచ్చిండ్లు..మీరు..”
”వద్దు వద్దు.. యిగ చెప్పద్దు. అప్పటిక్కూడా ఆ ఎమౌంట్‌తో పనిచేస్తే పదిహేను లక్షల్నాకు మిగులుతై. కాని సిఇకి, ఇఇకి, ఎయికి.. వీళ్ళకు పదిశాతం, నక్సలైట్లకు పదిశాతం, ఎపిపి, జడ్‌పిటిసి, స్థానిక యువజన సంఘాలకు ఐదుశాతం.. అంతా తడిసి..వందల ముప్పయ్యిశాతమే మిగుల్తాంది టెండర్‌ కాస్ట్‌ల. గీ డబ్బుతో ఈ బ్రిడ్జ్‌కట్టుడు ఎవనితరంగాదు… నేను చావాల్నా .. ఏంజేయాలె”
”అసలెప్పుడైపోవాలె ఈ బ్రిడ్జ్‌.”
”మూడ్నెళ్ళ కిందట్నే హాండోవర్‌ చేయాలి.. గని యింక యాడాదైనా కాదు. యిగ నాతోని కాదు కట్టుడు. క్విటయ్‌పోత..”
”అసలిక్కడ బ్రిడ్జే అవసరంలేదు.. అక్కర్లేని దాన్ని కట్టేందుకు ఓ ప్రాజెక్ట్‌ తయారుచేసి.. ఉన్న కొత్త రోడ్డును డిస్మాంటిల్‌ చేసి, జనం రాకపోకలకు అంతరాయం కల్గచేసి.. యిప్పుడది పూర్తిగాక, వర్షాకాలంల మనుషులు నడ్వలేక..” జనసేన దళం సారధి రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రఘువీర్‌ అంటున్నాడు.
”ఔ…” అన్నాడు కాంట్రాక్టర్‌ అంజయ్య..అంగీకారంగా తలూపుతూ.
ఆ క్షణం.. అప్పట్నుండి జరుగుతున్న తతంగాన్నంతా మీడియా కెమెరాలు కవర్‌ చేస్తున్నాయనే స్పృహ కలిగి.. అంజయ్య భయంతో అదిరిపోయి.. తడబడ్తూ, తత్తరపడ్తూ.,
”జనానికి జవాబు చెప్పండి.. యిప్పుడు మీరేంజేస్తారు..”
”మంత్రి దగ్గరికి పోయి వందసార్లు మొరపెట్టుకున్న. ప్రతిసారీ ఫుట్‌బాల్‌ లెక్క బైటికి తంతాండు. మొన్నయితే గన్‌మాన్‌తోని మెడలుపట్టి బైటికి నూకించిండు..”
చటుక్కున.. అనూహ్యంగా.. అంజయ్య ఏడ్వడం ప్రారంభించాడు.
టి.వి లో ఆ స్ట్రిప్‌ ఐపోయింది..

వెంటనే యాంకర్‌ శ్రీరాం తెరమిదికొచ్చి.. గత ఒకటిన్నర నెలలకాలంలో ఆంధ్రదేశంలో ‘జనసేన’ అనే ప్రజాసంస్థను వరంగల్లులో స్థాపించి, అవినీతిలో, అనైతికతతో, లంచగొండితనంతో కూరుకుపోతున్న ప్రస్తుత సమాజాన్ని విలువలున్న పౌరసంఘంగా పునర్నిర్మాంచాలనే లక్ష్యంతో ఒక నిర్మాణాత్మక ప్రణాళికతో రంగప్రవేశం చేసిన ‘జనసేన’ వ్యవస్థాపకుడు రామం, ఆ సంస్థ సిద్ధాంతకర్త డాక్టర్‌ పి. గోపీనాథ్‌ యిప్పుడు ఈనాటి ‘ముఖాముఖి’లో మనతో మాట్లాడ్డానికి మన స్టూడియోలో ఉన్నారు. ఒక బిందువుగా పుట్టిన ‘జనసేన’ ఈ రోజు ఒక సింధువై విస్తరించింది. ‘అవగాహన’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు, ఏకకాలంలో ఓ ఇరవై లక్షలపైచిలుకు సమాజంలోని వివిధ వృత్తుల్లో, వివిధ స్థాయిల్లో, వివిధ రంగాలల్లో ఉన్న అనేకమంది పౌరులతో రెండే రెండు ప్రశ్నలున్న ప్రశ్నాపత్రంతో సర్వే చేసి విస్తృతమైన అభిప్రాయసేకరణ చేశారు. మేము ఈ సర్వే ఫలితాలనూ, జననాడిని యిదివరకే గణాంకాలతో సహా ప్రసారంచేశాం. కాగా..’ప్రక్షాళన’ పేరుతో వివిధ రంగాలకు చెందిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులను.. ఓ నూటా ఎనిమిదింటిని గుర్తించి, దాదాపు నలభై రెండు వేలకోట్ల విలువగల ప్రజోపయోగ నిర్మాణాల స్థితిగతులను తనిఖీ చేయడానికి ఈ దేశ రాజ్యాంగం ‘సమాచార చట్టం – 2005’ ద్వారా ప్రతి పౌరునికీ, సంక్రమింపజేసిన అధికారాన్ని చేతిలో ఓ అజేయమైన ఆయుధంగా ధరించి.. ఆ ప్రాజెక్టుల సర్వ సమాచారాన్ని సర్టిఫైడ్‌ కాపీలుగా వెంటతీసుకుని, ఆయా రంగాల్లో నిపుణులనుకూడా తమ తమ బృందాల్లో సభ్యులుగా స్వీకరించి.. ‘ప్రజాధన వినియోగాన్ని ప్రజలే తనిఖీ చేసుకుంటున్నారు’ అనే నినాదంతో మొన్న ఇరవైయవ తేదీన ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీయాత్రతో.. అనేకచోట్ల బయటపడ్డ నమ్మశక్యంగాని నిజాలను వెలికితీసి ప్రజలముందు, మీడియాముందు విప్పి పెడ్తూంటే.. కోట్లమంది దిగ్బ్రాంతికీ, ఉలిక్కిపాటుకు గురై.. అందరూ అవాక్కయిపోయారు. అసలు ఏం జరుగుతోంది. వేల లక్షలకోట్ల రూపాయలు ఇంత దారుణంగా భోంచేయబడ్తున్నాయా, అదీ ప్రజలపక్షాన అప్పుచేసి, రేపు పుట్టబోయే శిశువు నెత్తిపై కూడా అప్పును వారసత్వంగా మోపుతూ.. ఈ నాయకులు, ఈ అధికారులు ఇంత నిస్సిగ్గుగా దోచుకు తింటున్నారా అని విస్తుపోతున్న ఈ ఉద్విగ్న సందర్భంలో.. ‘జనసేన’ సంస్థ వ్యవస్థాపకులు..

”రామం గారూ.. నమస్కారమండీ..”
”నమస్కారం”.. తెరపై రామం ముఖం.. నవ్వుతూ.’జనసేన సంస్థ సిద్ధాంతకర్త.. ప్రముఖ సామాజిక శాస్త్ర గ్రంథాల రచయిత డాక్టర్‌ గోపీనాథ్‌.. నమస్కారం సార్‌..”
”నమస్కారం”
”చెప్పండి.. భారత జాతిపిత మహాత్మాగాంధి ‘అహింసా’ సిద్దాంతాన్ని ప్రవచించినపుడు.. ఎవ్వరూ దాన్ని ప్రశంసించలేదు సరికదా గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత నిజాయితే ప్రాణంగా గాంధీ తన అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని తీవ్రతరం చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్నప్పుడు అందరూ అవాక్కయి విస్తుపోయారు.. దాదాపు అదేరీతిలో.. నమ్మశక్యంగాని ఒక అతి సామాన్యమైన, సాధారణమైన సమాచార చట్టం అనే పౌరాధికారాన్ని ఒక వజ్రాయుధంగా ధరించి మీరు చేపట్టిన ఈ జనసేన జైత్రయాత్ర ఇపుడు దావానలంలా విస్తరించి చీకటి మనుషుల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించడం కాదు.. శతఘ్నులను ప్రేలుస్తున్నాయి.. ఈ వర్తమాన ఉద్విగ్న సందర్బంలో ప్రజలందరూ మిమ్మల్ని వినాలనీ, మీ ఆలోచనలను పంచుకోవాలనీ, మీతో కలిసి నడవాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. చెప్పండి.. అసలు ప్రజలను ఏ దిశలో మీ వెంట నడిపించాలని, అంతిమంగా ఏ లక్ష్యాలను సాధించాలని మీరనుకుంటున్నారు.”

రామం చాలా ప్రశాంతంగా చెప్పడం ప్రారంభించాడు. ”నిజానికి ఈ మితిమీరిన అవినీతి, అనైతికత, రాజకీయ నాయకుల అరాచక ప్రవర్తన ఒక్క మన రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన జాఢ్యంగానీ, సమస్యగానీ కాదు.. యిది ప్రస్తుతం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభలిన అంటువ్యాధిలాంటిదీ జాతీయ సమస్య. దీన్ని యుద్ధప్రాతిపదికపై ఎదుర్కొని ఎవరో ఒకరు రెండవ భారత స్వాతంత్య్ర సంగ్రామ స్థాయిలో అంతర్గత పోరాటం చేయకుంటే యిది భారత భావి తరాలను అంధకారంలోకి నెట్టి వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఒక చోట అసలు రోడ్డేలేకుంటే ఫర్వాలేదు. ఎవడో ఒకడు అందరికోసం ఎప్పుడో ఒకప్పుడు ఒక రోడ్డు వేస్తాడు. దానిపై అందరూ సౌకర్యవంతంగా నడుస్తారు. కాని అక్కడ లంచాలు మేసి మేసి ఒక దుర్మార్గుడు ఓ చెత్త, పనికిరాని, బొడుగు బొడుగు రాళ్ళతో అధ్వాన్నపు రోడ్డు వేస్తే.. యిక అక్కడ ఇంకో కొత్త రోడ్డు వేయడం సాధ్యంకాదు. ఉన్నదాన్ని తీసేయరాదు.. ఇట్‌ బికంస్‌ ఇర్రిపేరబుల్‌. అదిగో ఆవిధంగా కోటానుకోట్ల రూపాయలతో ఈ అధ్వాన్నపు రోడ్లవంటి ఎన్నో నిర్మాణాలు, పనులను చేసి ఈ దేశాన్ని చెత్తకుండీని చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.యిది హత్యకన్నా ఘోరమైన నేరం. దీన్ని నిర్దాక్షిణ్యంగా నిర్మూలించాలి.”

”అసలు మీ సిద్ధాంతమేమిటి”
”మాకు ఒకే ఒక పారదర్శకమైన లక్ష్యం ఉంది. దాన్ని సిద్ధాంతం అంటానికి వీల్లేదు. ఏ యితర రాజకీయ పార్టీల సిద్ధాంతాలతోనూ మాకు నిమిత్తం లేదు. ప్రమేయం లేదు, వ్యతిరేకతకూడా లేదు. మా గమ్యం ఒకటే. శాశ్వత ప్రాతిపదికపై ప్రతి పౌరున్నీ అహింసాయుతంగా ఒక ప్రశ్నించే పదునైన ఆయుధంగా రూపొందించడం. రాజ్యాంగబద్దంగా ఎవరైనా ఏంచేయాలి.. ఏం చేస్తున్నారు.. ఏదైనా చేయకూడని అసాంఘిక కార్యం చేస్తుంటే ఎందుకు చేస్తున్నావని నిలదీసి దోషిగా జనంలో నిలబెట్టడమే జనసేన ఏకైక కార్యక్రమం..”

”రాజ్యాధికారం చేపట్టడం సంగతి..”
”యిదివరకే చెప్పాం చాలా వేదికలపైన స్పష్టంగా. ‘జనసేన’ ఒక రాజకీయ పార్టీకాదు. ఇది ఎన్నికల్లో పోటీ చేయదు. ఇది రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించదు. ‘జనసేన’ కు ముందువరుసలో ఉన్న మేము.. ఎవరమూ ఏ నాయకత్వాన్నీ, పదవులనూ, సంపదలనూ ఆశించం. అసలు మాకు స్వంత ఆస్తులు ఉండవు. స్వంత ఆస్తి లేనివానికి స్వార్థం ఎందుకుంటుంది. అతి నిరాడంబరమైన జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తూ.. గాంధీ జీవితాంతం ప్రవచించిన నిరాడంబర జీవిత మాధుర్యాన్ని జనానికి ప్రయోగాత్మకంగా జీవించి చూపించాలనీ, మమ్మల్ని ప్రజలు విశ్వసించడానికి మూలమైన నమ్మకాన్ని కల్పించాలనీ ప్రయత్నిస్తున్నాం నిజాయితీగా. యిది ఈ దేశంలో ఏ నాయకుడూ చేయని పని.. ఇదివరకు మహానుభావులు వినోభా భావే నుండి బాబా ఆమ్టే వరకు నిస్వార్ధ జీవితాలను జీవించి చైతన్యాన్ని రగిలించినా.. వాటిని ప్రజాబాహుళ్యంలోకి ఒక మహోద్యమంగా శాశ్వతీకరించలేకపోయారు. ‘జనసేన’ ఒక నిజాయితీతో కూడిన పారదర్శకమైన జీవితాన్ని జీవించడం ఒక విశిష్ట సంస్కృతిగా పౌరులకు అలవాటు చేయాలని సంకల్పిస్తోంది. చెబుతే అతిగా అన్పిస్తుందిగాని.. రోడ్డుపై ఒక బంగారు బిళ్ళ పడివుంటే ‘మనది కాని దీన్ని మనం ముట్టుకోవద్దు’ అనే ఆత్మ సంస్కారంతో ఎవరికివారు దాన్ని చూస్తూ వెళ్ళిపోయే ఆదర్శ సమాజాన్ని ‘జనసేన’ లక్ష్యిస్తోంది.”
”రాజ్యాధికారాన్ని చేపట్టనప్పుడు వ్యవస్థపై మీకు ఎలా నియంత్రణ ఉంటుంది.”
”కౌటిల్యుడు చెప్పిన ‘రాజు..రాజగురు అనుబంధం’ గురించి మేం ఆలోచిస్తున్నాం. నిజానికి రాజు ప్రజలకూ, ప్రజాధనానికే రక్షకుడు, కస్టోడియన్‌ మాత్రమే. దుర్మార్గులైన పాలకులు దాన్ని ప్రజాధనానికి యజమానులుగా చిత్రించి  భక్షకులై అనుభవిస్తూ వస్తున్నారు. స్వార్థ చింతనతో ప్రజల అసలైన సంక్షేమావసరాలను రాజగురువు రాజుకు తెలియజేసినపుడు రాజు తు.చ. తప్పకుండా వాటిని అమలుచేసి ప్రజారంజకమైన, న్యాయబద్ధమైన పాలనను కొనసాగించాలి. ‘జనసేన’ విషయంకూడా అంతే. ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవాళ్ళలో ‘జనసేన’ ఆలోచనలనకు, విధానాలకు లోబడి నిస్వార్థ, ఆదర్శ ప్రజాజీవితాన్ని గడపడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినవాళ్ళకు ‘జనసేన’ ఆమోదముద్ర వేస్తుంది. ‘జనసేన’కు ప్రజల్లో నమ్మకంతో కూడిన ఆదరణ ఉంటే అపుడా అభ్యర్థి గెలుస్తాడు. అటువంటి అభ్యర్థి ‘జనసేన’ యొక్క ఒక అంగంగా, ప్రతినిధిగా ప్రభుత్వ నిర్మాణంలో, పరిపాలనలో పాల్గొంటాడు. స్థూలంగా ఇది మా ఆలోచనాధార. ఒక అతి ప్రధానమైన ఉద్యోగానికి అనేకమంది అభ్యర్థులు తమ దరఖాస్తులను పెట్టుకుంటే వాళ్ళలో అత్యుత్తమమైన వ్యక్తిని ఎలా ఎన్నుకుంటామో  పరమ పవిత్రమైన ప్రజాసేవకోసం శాసనసభ్యునిగా, లోకసభ సభ్యునిగా పనిచేయవలసిన ప్రజాప్రతినిధిని ఎంతో కూలంకషంగా పరిశీలించి, ఎటువంటి నేరచరిత్రఉన్నా, మా గూఢాచార వ్యవస్థ అధ్యయనంలో ఏమాత్రం దుష్టచరిత్ర ఉన్నా, వాణ్ణి కనీసం జనసేన దగ్గరిక్కూడా రానీయం. కనీస విద్యార్హతలు, వయోపరిమితులు, ఇతరేతర ప్రజాహిత సంబంధ ప్రత్యేకార్హతలు.. యివన్నీ కీలకాంశాలుగా పరిగణించబడ్తాయి.. ఏ క్షణాన్నైనా, ఏ మా వ్యక్తయినా ‘జనసేన’ నియమాలను ఉల్లంఘిస్తే వెంటనే ‘జనసేన’ తనవద్ద ఉన్న అతని అన్‌డేటెడ్‌ రాజీనామా లేఖను ఉపయోగించి ఆ వ్యక్తిని రీకాల్‌ చేస్తుంది. రాజకీయ వ్యవస్థలో విలువలు పూర్తిగా పతనమైపోతున్నాయి..కాబట్టి దుర్మార్గులైన నాయకులు ప్రజలకు ఆచరణయోగ్యంకాని అనేక హామీలనిచ్చి, ఆశలు కల్పించి కుర్చీపై కూర్చోగానే మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత వ్యవస్థలో దుర్మార్గ ప్రజాప్రతినిధులను వెనక్కి ‘రీకాల్‌’ చేసే ఏదో ఒక మార్గం, ఆయుధం ప్రజల దగ్గరుండాలి. ‘జనసేన’ దగ్గర ఉంటుందది. ఐతే ఎలా అనే దానిపైన యింకా స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ పార్టీలేవైనా, వామపక్ష పార్టీలతో సహా తమ పార్టీ నాయకుడెవడైనా తప్పు చేసినప్పుడు, స్కాంతో బయటపడ్డప్పుడు వాడిపైన ఏ చర్యా తీసుకోవడం లేదు. క్రమశిక్షణ చర్యలే లేవు. శిక్షించడం అసలే లేదు. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే…పత్రికారంగంలో ఏమున్నది.. ఏ పత్రికైనా అట్టతీసేస్తే అన్నీ ఒకటే అన్నట్టుగా.. రాజకీయపార్టీ పేరు ఏదైనా అవినీతి, లంచగొండితనం, అనైతిక ప్రవర్తనల విషయంగా అన్నీ ఒకే రీతిలో నీతిహీనంగానే ప్రవర్తిస్తున్నాయి. యిప్పుడు పరిస్థితి బాగా కుళ్ళిపోయి కంపువాసన కొడ్తోంది. దీన్ని వెంటనే ప్రక్షాళన చేయాలి.”

రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో, ఆశతో వింటున్నారు రామం ఎంతో ఓపెన్‌గా, నిజాయితీగా చెబుతున్న విషయాలను. పరిస్థితి ఒక మొక్క మొలకెత్తబోయేముందు భూమి పులకించిపోతున్నట్టుగా ఉంది.
యాంకర్‌ అన్నాడు.. ”యిప్పుడున్న రాజకీయ, సామాజిక వ్యవస్థ.. మీరు ‘జనసేన’ కోణంలో కలగంటున్న ఆదర్శ వ్యవస్థ.. స్వరూప స్వభావాల విషయంలో ఎలాంటి మౌలిక తేడాలను కలిగి ఉంటాయి. అది చెప్పండి.”
రామం మళ్ళీ అందుకున్నాడు. ”ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ అద్భుతమైన శాసనాలనే రూపొందించి కాగితాల్లో నిక్షిప్తం చేశాయి. కాని అమలులో మాత్రం ఆవగింజంతైనా చిత్తశుద్ధి లేదు. కాగా యిక్కడి ప్రభుత్వాలూ, ప్రజలూ ఇతర అన్ని ప్రపంచ దేశాల్లోవలె తాము నిర్మించిన తమ దేశశాసనాలను తామే గౌరవించరు, అమలు చేయరు సరికదా వాటిని వక్రీకరించి విపరీతార్థాలతో దోపిడీకి పాల్పడ్తారు. మీరు ఆశ్చర్యపోతారు. అనేక ప్రజాసంఘాలు సర్వేచేసి సమర్పించిన నివేదికల ప్రకారం వర్తమాన భారత రాజకీయాల్లో ఎనభై ఐదుశాతంమంది వీధి గూండాలు, రౌడీషీటర్లు, హంతకులు, నేరచరితులు ఉన్నారు.

వీళ్ళను క్రమంగా ఆ రంగంనుండి తప్పించడం అంతసుళువైన విషయంకాదు. భారత రెండవ స్వాతంత్య్ర సంగ్రామం తరహాలో ప్రజలు ఏ ఊళ్ళోవాళ్ళు ఆ ఊళ్ళో పోరాడ్తే తప్ప ఈ ప్రక్షాళన సాధ్యంకాదు. మొదటి స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌వాడనే శత్రువు స్పష్టంగా కళ్ళెదుటనే కనబడ్తూ ఉన్నాడు కాని ఇప్పుడు కనబడకుండా అవినీతిపరుల రూపంలో అదృశ్యంగా మనలో. మన ప్రక్కన, మన ఇంట్లోనే, మన కుటుంబసభ్యులుగా మన జాతిద్రోహులే కలిసిపోయి ఉన్నారు. కనబడని శత్రువుతో యుద్ధంచేయడం కష్టంకదా.. మీకొక అతి ప్రధానమైన రహస్యం చెబుతాను. చెప్పనా..”
”చెప్పండి..”
”ఈ దేశానికి నిరక్షరాస్యులైన భారత పౌరులతో ఎటువంటి హానీలేదు. కాని చదువుకున్నవారితో కొంత ప్రమాదం, బాగా చదువుకున్నవారితో ఇంకా భారీ ప్రమాదం పొంచివుంది. గత ఇరవై ఏళ్ళనుండి.. హర్షద్‌ మోహతా, కేతన్‌పరేఖ్‌ దగ్గర్నుండీ.. తెల్గీ.. ఈ మధ్య బయటపడ్ట అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల, కమ్యూనికేషన్‌ మంత్రిత్వశాఖ, కార్పొరేట్‌ కంపెనీల దాకా, ఖనిజాలు, గనులు, జలయజ్ఞాలు, ఛత్తీస్‌గడ్‌లో వందయూనివర్సిటీల స్థాపన, మెడికల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీల అనుమతుల్లో వేలకోట్ల అవినీతి. ఇవన్నీ ఏం చెబుతున్నాయి..ఉన్నత విద్యావంతుల్లోనే దొంగలు ఎక్కువగా ఉన్నారని ఋజువు చేస్తున్నాయిగదా. ఔనూ.. హౌటు కర్బ్‌ దిస్‌ ఈజ్‌ ద రియల్‌ ప్రాబ్లమ్‌”
”దీన్ని ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు మీరు..డాక్టర్‌ గోపీనాథ్‌గారు చెప్పండి”
”చాల సింపుల్‌.. మనిషి దొంగతనం చేస్తున్నపుడు దొంగతనాన్నెవరో చూస్తున్నారనే భయం ఉంటే చాలు. దొంగ భయపడి వెంటనే విరమించుకుంటారు. కాబట్టి మనిషిని అనుక్షణం గమనించే నిఘా కావాలి. అమెరికాలో సెటిలైట్‌ సర్వైలెన్స్‌ ఉంటుంది. ఎవనికివాడు నన్ను సిసి కెమెరాలో, ఆకాశంనుండి ఏ సెటిలైట్‌ వ్యవస్థో చూస్తోంది.. పట్టుబడ్తామని ఒళ్ళు దగ్గరపెట్టుకుని వెళ్తుంటారు రోడ్డుపై. యిక్కడకూడా అటువంటి ఈ దొంగనాయకులను వెంటాడే ఓ నిఘా వ్యవస్థ కావాలి. ‘జనసేన’ అదే. అదొక వాచ్‌డాగ్‌.. మా దగ్గర ‘జనసేన’ నిర్మాణం మూడు థల్లో ఉంటుంది. ఒకటి కేంద్రకం. దాంట్లో ఋషులవంటి నూటా ఎనిమిదిమందితో కూడిన సారధ్య బృందం ఉంటుంది. రామం, నేను ముందుంటాం. అధ్యకక్షుడు, కార్యదర్శి.. ఇటువంటి పదవులు లేవు. తర్వాత అంతర్‌వలయం. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు.. అన్ని జిల్లాల కార్యాలయాల బాధ్యులు. శిక్షణా విభాగం, క్రమశిక్షణా విభాగం, రక్షణ విభాగం, గూఢాచార విభాగం, ఆర్థిక విభాగం, విధాన విభాగం, విస్తరణ విభాగం, క్షేత్ర కార్యాచరణ విభాగం.. ఈ విధంగా ఎనిమిది సెక్టార్స్‌. దళాలుంటాయి. ఒక్కో విభాగంలో ఆయా రంగాల్లో నిపుణులైన, సాధికారత కల్గిన వ్యక్తులుంటారు. ఉదాహరణకు ఆర్థిక విభాగముందనుకో.. చార్టర్స్‌ అకౌంటెంట్స్‌, రిటైర్డ్‌ ఫైనాన్స్‌ సెక్రటరీలు, ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌.. ఇటువంటి వాళ్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా మిగతా వాటిల్లోకూడా. ఈ అంతర్‌వలయం అంతా నిరంతర ఉద్దీప్తతతో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, ప్రధానంగా పౌరుల్లో నైతిక విలువలను పెంపొందించడంలో, అనవసరంగా ఈ కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించాలనే దుర్భుద్ది నీకెందుకురా.. ఒక వ్యక్తికి నిజంగా ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు అవసరమా..ఏంజేస్తావ్‌ వీటితో.. వంటి జ్ఞానవికాసాన్ని కల్పించడంలో తలమునకలై ఉంటుంది. దీనికి వెలుపల ఒక బాహ్యవలయముంది. దీంట్లో ఆదర్శ భావాలున్న జనబాహుళ్యం ఉంటుంది. నిజానికి ప్రస్తుతం నాయకులకంటే ప్రజలే ఎక్కువగా కలుషితమై నీతిహీనులై ఉన్నారు. లంచాలు యిస్తారు, తీసుకుంటారు. అవకాశముంటే ఏ నీచమైన పనైనా చేస్తారు. వీడు మనిషికి వందిస్తే వీని సభకొస్తారు. మర్నాడు వాడు నూరిస్తే వాని సభకూ వెళ్తారు. ఉచితంగా ఇస్తానంటే కలర్‌ టి.వి. తీసుకుంటాడు. నగదు బదిలీ తీసుకుంటాడు. సైకిళ్ళు తీసుకుంటాడు. మోటార్‌సైకిళ్ళు, ఉచిత విద్యుత్తు, ఉచిత బియ్యం, ఉచిత బట్టలు.. ఉచితం ఏదైనా సరే.. తీసుకుంటాడు.. చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నమనుకుంటాడు. వీళ్లను సంస్కరించాలి. దేన్నయినా ఈ రాష్ట్రంలోగానీ, ఏ ఇతర రాష్ట్రాల్లోగానీ ఏనాడైనా..ఎవరైనా ప్రజలు దేన్నయినా మాకిది ఉచితంగా ఇమ్మని ఎప్పుడైనా అడిగారా. సిగ్గులేని నాయకులు వాళ్ళ ఓట్లకోసం బూటకపు ప్రజాకర్షక పథకాలను ప్రకటించి పబ్బం గడుపుకున్నారు తప్ప.. ఏ మనిషీ తనకు తానొక బిచ్చగాణ్ణి, నాకిది ఉచితంగా యిమ్మని ఎప్పుడూ అడగడు. ఇది మనిషి ‘రోషాని’కి, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. నీకంటె పెద్ద వెధవాయను నేను అన్నట్టు ఒకణ్ణి మించి ఒకడు ఉచితాలను ప్రకటించి, సబ్సిడీలను పెంచి, కమిషన్‌లను ప్రకటించి ప్రజలను భ్రష్టు పట్టించారు. నిజానికి .. ఇప్పటికీ ప్రభుత్వం ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 20 సబ్సిడీ యిచ్చి విచ్చలవిడిగా కుర్రకారు మోటార్‌బైక్స్‌పై పిచ్చితిరుగుడు, తిరగడానికి యిన్ని కోట్ల లీటర్ల పెట్రోల్‌ను.. రోజుకు ఇన్ని కోట్లరూపాయల సబ్సిడీని భరించడం అవసరమా. ప్రజలకు ఒకసారి తేరగా ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత అవి ఇవ్వడం మానేస్తే రేపు వాళ్ళే తిరగబడి గొడవలు చేస్తారు. ఈ దిక్కుమాలిన ప్రజాకర్షక పథకాలు వద్దు మహాప్రభో అని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, భారతీయ ఆర్థిక మండలి, వంటి సంస్థలు, పౌరహక్కుల, మానవ హక్కుల సంఘాలు, అమర్త్యసేన్‌ వంటి మేధావులు ఎప్పట్నుండో నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకుంటున్నారు. తోడుకుని తింటానికి ఆరోగ్యశ్రీలు, పద్దెనిమిదేండ్ల పోరగాండ్ల ఓట్లు దండుకోడానికి ఫీజ్‌ రీ ఎంబర్స్‌మెంట్‌, రైతుల ఓట్ల కోసం ఉచిత విద్యుత్తు.. విద్యుత్తును ఉచితంగా ఇస్తూంటే ఊళ్ళలో కొందరు రైతులు మోటార్‌ పంప్‌ ఆన్‌ చేసి పోతే రాత్రంతా అది నడుస్తూనే ఉంటుంది. అరాచకమైపోతోంది ఎన్నోచోట్ల.. అటుదిక్కు ఏదోరకంగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో నలభైశాతం అప్పులు, వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. కాబట్టి మళ్ళీ ఆదాయం సంపాదించుకునేందుకు నీతిమాలిన మద్యం వ్యాపారం. పదివేల కోట్ల కోసం జనానికి వాకిట్లోనే మద్యం అందుబాటు. బడి ఒడిలో, దేవాలయం ముంగిట ఎక్కడబడ్తే అక్కడ బార్లు, బ్రాండీషాపులు. పదివేలకోట్లు రాబడైతే.. మంత్రులు, ఎమ్మెల్యేలు.. అందరూ కలిసి ముప్పయ్యెనిమిది వేలకోట్లు ప్రజలనుండి పిండి దోపిడి.. సీసాపై యాభై రూపాయల ఎమ్మార్‌పి ఉంటే బహిరంగ దౌర్జన్యంతో డెబ్బయ్‌ రూపాయలకు అమ్మడం.. సిగ్గు చచ్చి ఎక్సైజ్‌, పోలీస్‌, నిఘా వ్యవస్థలు. సిండికేట్స్‌, మాఫియాలు, గూండారాజ్యాలు.. ఏమిటి.. ఏమిటిదంతా. పుచ్చిపోయింది వ్యవస్థ. అక్కడ ఒకవైపు ఆర్థిక శాఖే కదిలి మంత్రుల ముందు చేతులెత్తి నిలబడి ఈ ప్రభుత్వాలను నడుపలేమిక.. అని ఇంట్లో చారెడు బియ్యంలేక పిల్లలను పస్తులుంచవలసిన స్థితిలో ఉన్న ఇల్లాలులా రోదిస్తోంది.. ఏం జరుగుతోంది.. ఎటు పోతున్నాం మనం.. యిది.. ఈ దుష్టమైన భూమిపుండువంటి దురవస్థను ఎదుర్కోడానికి.. రిటైర్డ్‌ స్కిల్స్‌.. డాక్టర్లు, ఇంజినీర్లు, సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, దేశస్పృహ ఉన్న కత్తుల్లాంటి యువకులు, ఉద్యమకారులు.. వీళ్ళతో నిండిన బాహ్యవలయం. మొత్తం ‘జనసేన’ లక్షమంది పారదర్శకంగా జనసేన ‘కేంద్రకం’ ఈ లక్షమందిని పోషిస్తుంది – నడిపిస్తుంది.. నడుస్తుంది. ఈ సమాజాన్ని కొంగ్రొత్త మార్గంలో మున్ముందుకు తీసుకెళ్తుంది. కొత్త చరిత్రను రాస్తుంది.” చెబుతున్నారు డాక్టర్‌ గోపీనాథ్‌.

ఆనందం, ఆవేశం పట్టలేక యాంకర్‌ ఆనందరావు చప్పట్లుకొట్టాడు.. ”నిజంగా వ్యక్తిగతంగా నాక్కూడా ఎంతో సంతోషంగా ఉందిసార్‌. ఈ మా టి.వి. ద్వారా కొన్ని వందలమంది మేధావులను, పాత్రికేయులను, సూడో రాజకీయ విజ్ఞులను, విశ్లేషకులను ఇంటర్వ్యూ చేశానుగదా సార్‌ కాని ఇంత ధైర్యంగా, ఇంత ఖచ్చితంగా, యింత నిబద్ధతతో ఒక ప్రణాళికను తయారుచేసుకుని ముందుకొచ్చినవాళ్ళను చూడలేదు.. యింకా చెప్పండి..”
రామం అందుకున్నాడు.
”మన రాష్ట్రంలో అసలు పరిశ్రమలున్నాయా. యువత ఉపాధి సంగతేమిటి. విదేశీ నియంత్రణంలో ఉన్న ఎంఎన్‌సిలకు అనుబంధంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు తప్పితే ఈ రాష్ట్రంలో ఏవైనా భారీ పరిశ్రమలు పనిచేస్తున్నాయా ఆరోగ్యంగా, ఆర్థిక పరిపుష్టతతో. సాఫ్ట్‌వేర్‌ బహుళజాతి కంపెనీలు సామ్రాజ్యవాద రాజకీయాల్తో తమ తలుపులను భారతదేశంలో మూసేస్తే.. యిక్కడి ఇన్ని లక్షలమంది గతి ఏమిటి. ఎక్కడో స్విచ్‌ ఆఫ్‌ చేస్తే యిక్కడ లక్షల లైట్లారిపోతాయికదా. ఒకవైపు చైనా, కొరియా, థాయ్‌లాండ్‌, జపాన్‌ లాంటి దేశాలు పరిశ్రమలను ప్రపంచదేశాల గుండెల్లోకి విస్తరించుకుంటూపోతూంటే.. మన దేశీయులు చేవచచ్చి ఎందుకింత దద్దమ్మలుగా మిగిలిపోతున్నారు. వీళ్ళకెంతసేపూ కమీషన్ల యావతప్ప అసలు దేశం స్పృహలేదు. ఒక్క బొమ్మల పరిశ్రమ చూడు.. ప్రపంచమంతా మేడిన్‌ చైనా. అమెరికాలో చెప్పులు, పెన్నులు, కీచైన్‌లు, ఆహారం, చాక్లెట్స్‌, ఐస్‌క్రీం, కార్లు, మెమరీచిప్స్‌, బ్యాటరీలు.. అరెరె.. ఎన్ని.. ఎన్నెన్ని అన్నీ మేడిన్‌ చైనా.. కాని అమెరికావాడు ప్రపంచపోలీస్‌ కాబట్టి.. యిక్కడేదైనా అమ్ముకోండి.. కాని నాకు టాక్స్‌ కట్టండి. నా ఖజానాను నింపండి. నేను చెప్పిన మాట వినండి.. అని ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాడు. శాసిస్తున్నాడు. యిక్కడ మనం అద్భుతమైన మానవ వనరులుండి, సహజ ప్రకృతి వనరులుండి, అడవులుండి, నదులుండి, పర్వతాలుండి.. అన్నీ ఉండి అవినీతిలో కూరుకుపోయి మనను మనం గొంతులు పిసుక్కుంటున్నాం.. యిక్కడి ప్రజలకు నిజమైన స్పృహ లేకుండా చేసి ఈ పరమ దుర్మార్గ రాజకీయనాయకులు దేశద్రోహానికి తలపడ్తున్నారు. మనం భూమిపుండులో కూరుకుపోతున్నాం. ఇప్పుడు అర్జంటుగా ఏదో ఒకటి జరగాలి.. యిక్కడి భవిష్యత్‌ దృష్టిలేని నాయకులు ఒకటివెంట ఒకటిగా చేస్తున్న తప్పులవల్ల కోలుకోలేనంతగా ప్రజాసామాజికారోగ్యం ఆల్‌రేడీ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో ఆరువందలయాభై ఇంజినీరింగ్‌ కాలేజీలు, వందల సంఖ్యలో ఎంసిఎ, ఎమ్‌బిఎ, ఫార్మసీ కాలేజీలు అవసరమా. యాడాదికి ఏమాత్రం నాణ్యత, ప్రమాణాలు లేని రెండు లక్షల యాభైవేల యువకులు ఉద్యోగానికి పనికిరాని ‘హ్యూమన్‌ గార్బేజ్‌’గా మార్కెట్లోకి రావడం, నిరుద్యోగులై, దిక్కుతోచక రోడ్లమీద నింగిచూపులు చూచుకుంటూ వైట్‌ కాలర్డ్‌ లేబర్‌గా మారవలసిన దుస్థితి ఏమిటి.. ఎందుకు..రాష్ట్రం.. సమాజ రూపకల్పన, భవిష్యత్‌ దార్శనికత.. ఇవన్నీ పూర్తిగా లోపించి సమాజాన్ని అసమర్థ నాయకులు చీకట్లోకి నడిపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయ గుండాయిజం, కాన్సిట్యూషన్‌ వైజ్డ్‌ మాఫియా యిక్కడ సమాజాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తోంది. మేల్కోవాలి..మనం వెంటనే మేల్కోవాలి. లేకుంటే యిక శాశ్వత సమాధే.”
”కాని అహింసాయుతంగా.. మీరు మీ లక్ష్యాలను సాధించడం సాధ్యమయ్యే పనేనా..”
”తప్పకుండా సాధ్యమౌతుంది.. హింసతో నక్సలైట్లు నలభై ఏళ్ళుగా చేయలేని పనిని గత రెండునెలల్లో మేము చేయడం మీరు స్వయంగా చూస్తున్నారుగదా. తుపాకి ఏకకాలంలో ఒక వ్యక్తిని మాత్రమే చంపుతుంది. కాని అహింసాయుతంగా మేము చేపట్టిన రాజ్యాంగసమ్మత ప్రజాస్వామ్య ప్రక్షాళన, పరివర్తన వ్యక్తిని చంపదు సరికదా సమూలంగా, శాశ్వతంగా మారుస్తుంది. చట్టప్రకారం శిక్షిస్తుంది.. ఐతే.. విధిలేని పరిస్థితుల్లో.. హిందూ ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నట్టు.. యథా యధాహి ధర్మస్య.. తరహాలో.. దుర్మార్గుల దౌర్జన్యం హద్దులు మీరినపుడు, అవధులు దాటినపుడు ధర్మాగ్రహ ప్రదర్శన, దుష్టశిక్షణ అనివార్యమౌతుంది. నరకాసురవధ హత్యకాదు. దుష్టసంహారమౌతుంది. అలాగే దయ్యాలకు వేదపాఠం వినిపిస్తే ఎదురుదాడి చేసినట్టు. ఈ మాఫియాగ్యాంగ్‌లు మాపై ‘జనసేన’పై దాడిచేస్తాయని తెలుసు. అట్టి స్థితిని ఎదుర్కొనేందుకు మేము సుశిక్షితుమై, సశరీర సాయుధలమై ఉన్నాం. మా యువకుల ఒక్కో శరీరాంగం ఆయుధమే. ధర్మం దారితప్పినపుడు అవసరమైతే మనిషిని నిర్మూలించడానికి.. సీనియర్‌ సిటిజన్స్‌తో నిండిన.. అంటే వాళ్ళు డెబ్బయ్‌కిపైగా సంవత్సరాలు తృప్తిగా జీవించారు. జీవితానికి ఒక అర్ధవంతమైన ముగింపును కోరుకుంటున్నారు.. ఊర్కే యింకా యింకా అలా రాయిలా, రప్పలా జీవించి ఏమీ ప్రయోజనంలేదని నిర్ధారించుకున్న వయోవృద్ధులు ఒక ‘ఆత్మార్పణ దళం’గా మావద్ద ఉన్నారు. అవసరమైతే, అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళను బ్రహ్మస్తంగా ప్రయోగిస్తాం. ఎవడైనా ఒక పరమచంఢాలుడైన రాజకీయ నాయకుడు ఎవరిమాటా విననప్పుడు ఒక వరిష్ట ‘జనసేన’ వృద్ధ కార్యకర్త బహిరంగంగా, ప్రజల సమక్షంలో వాన్ని నిర్మూలించి వాడికి ‘మరణశిక్ష’ను అమలుచేసి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా లొంగిపోతాడు. వ్యూహాత్మక ఎత్తుగడలే అవసరమైనపుడు..”

టి.వి. ప్రసారం కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రం రాష్ట్రమంతా ఆ క్షణాన యిక ప్రళయించబోతున్న సముద్రాన్ని చూస్తున్నట్టు.. అప్రతిభులై మహదానందంతో ప్రసారాన్ని వింటున్నారు. వీక్షిస్తున్నారు.
అప్పుడాక్షణం.. చరిత్ర ఒక కొత్త పేజీని సింగారించుకుంటోంది.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -16 వ భాగం

( గత వారం తరువాయి )

16

ముందురోజు రాత్రి హైద్రాబాద్‌లో ‘జింఖానా గ్రౌండ్స్‌’లో జరిగిన ‘జనసేన’ అవగాహన బహిరంగ సభ ఎంతో విలక్షణంగా, విజయవంతంగా జరగడం రామంకు, గోపీనాథ్‌కు, క్యాథీకి, శివకూ.. ప్రధానంగా సలహాదారులుగా ఉండి వెన్నుతట్టిన ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తిగారికి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు, రాజీవ్‌శర్మ , జగన్నాథంలకు, మానవ హక్కుల సంఘం రాములు సార్‌కు, వేదికపై మాట్లాడిన యితర బాధ్యులకు .. ఎంతో ఆత్మతృప్తినీ, ఉత్తేజాన్నీ కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, మౌనంగా పరిస్థితిని గమనిస్తూ కూర్చున్న పరిశీలకుల్లో, భవిష్యత్తును అంచనావేస్తున్న వ్యూహకర్తల్లో ఒకరకమైన ఉత్సుకతను రేకెత్తించింది. భారత స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్నపుడు గాంధీ ఉన్నట్టుండి ‘అహింస’ సిద్ధాంతంతో ప్రతిఘటనను, సహాయ నిరాకరణను ప్రకటించిన రోజు తలలుపండిన రాజకీయ పోరాట యోధులు అందరూ పెదవివిరిచి, ఒకింత దాన్ని ఒక పనికిరాని వెకిలిచేష్టగా వ్యాఖ్యానించి, అబ్బే.. గీ గిచ్చుడు చర్యతో ఏనుగు మాటవింటుందా, అంకుశం పోటుపడాలిగాని.. పద్దతిలో వెటకారం చేసి గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత.. ఊహించని నిప్పురవ్వ మహారాజ్యాన్ని భస్మీపటలం చేసి రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తుంటే విస్తుపోయి తమ తప్పుడు అంచనాలకు సిగ్గుపడి తలలువంచుకున్నారు.
నిన్న జరిగింది అదే.. దాదాపు నెలరోజుల క్రితం ఒక ఊహకందని, ఊహిస్తే నమ్మశక్యంగాని, అహింసాయుతమైన ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్నీ, జనాన్ని ప్రశ్నించే పదునైన ఆయుధంగా మార్చి అవినీతి రాక్షసిపైకి ప్రయోగించే ఒక మహత్తర సాధనంయొక్క స్వభావాన్ని రామం తన ఆలోచనగా ప్రకటించినపుడు చాలామంది దాన్ని ఒట్టి అపరిపక్వ ఆలోచనగా కొట్టేశారు. అదసలు సాధ్యమయ్యేదేనా ఇది. అని కొందరు పరిహసించారు కూడా. చీమ ఏనుగును కుట్టి ఏం సాధిస్తుంది.. అని పెదవి విరిచారు. సాయుధులైన నక్సలైట్లు, అనేక ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమకారులు గత నలభై, యాభై ఏళ్ళుగా ప్రతిఘటిస్తూ ఈ ఘనీభవించిన అవినీతి పర్వతాన్ని ఒక ఇంచ్‌కూడా కదిపి పెళ్ళగించలేంది.. ఈ ప్రజాచైతన్య, ప్రక్షాళన వంటి సున్నిత కార్యక్రమాలతో ఏం జరుగుతుందిలే అని హేళన కూడా చేశారు కొందరు.
కాని మనిషి దుఃఖించాలంటే ఒంటిని గాయపరిచి హింసిస్తే లాభంలేదు. వాని హృదయం చలించి కరిగినప్పుడు మాత్రమే కన్నీటి చుక్క పొటమరిస్తుంది. అది ఎంతో గూఢమైన, సత్యమైన పరమ రహస్యం. ఆ రహస్యం నిన్న లక్షలమందిని ఏకకంఠంతో కదిలించే మహాశక్తిగా మార్చి చూపి ఊర్కే ప్రేక్షకుల్లా గమనిస్తున్న మేధావుల్ని దిగ్భాంత్రుల్ని చేసింది.
ఒక బిందువువంటి శుద్ధ ఆలోచన ఊహగా ఆరంభమై, భావంగా ఎదిగి, ఆలోచనగా పాదుకుని, ఆచరణగా విస్తరించి విస్తరించి, నియమాలుగా, సూత్రాలుగా,సిద్ధాంతాలుగా పరివర్తిన్నవేళ, ప్రయోగం ఫలించి అద్భుతమైన ప్రభావాలను ప్రసరించిన వేళ.. బిందువే ఒక సింధువును సృష్టిస్తూ తవనెంట లాక్కెళ్తున్నవేళ..,
”యిన్ని లక్షలమంది జనం తామంతట తాము.. ఎవరికి వారు. రాష్ట్రం నలుమూలల నుండి.. తమ స్వంత ఖర్చులతో.. స్వచ్ఛందంగా నాటి సభకు తరలి రావడం. ఎర్రటి ఎండలో గంటలకొద్దీ ఓపిగ్గా కూర్చొని.. ఎక్కడా జనాన్ని రెచ్చగొట్టేలా కాకుండా ఆలోచింపజేసే వక్తల ప్రసంగాలను విని ఆకలింపు చేసుకుని మమేకం కావడం. యిదంతా నన్ను పులకింపజేస్తోంది రామం. నిజంగా ఒక చిన్న అతి సున్నితమైన ఆలోచనను బ్రహ్మస్త్రంగా మలచి ప్రయోగించి చూపావయ్యా.. యామ్‌ ఎక్ట్స్రీమ్లీ హాపీ.. ఇప్పుడు మన ‘జనసేన’ బాధ్యులందరికి కోటి ఏనుగుల బలమొచ్చింది.. యిక పడగెత్తిన ఈ జనమహాసముద్ర తరంగ తురంగ ఉధృతిని నిలువరించడం ఎవరితరమూ కాదు.. యిప్పటికే బయట అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ప్రశ్నించేవాడూ, అడిగేవాడూ, నిలదీసేవాడూ లేనంతకాలమే ఎవని ఆటలైనా సాగేది. యిక ఈ దుష్టచదరంగం ఆటకు చెక్‌ పడ్డది..డాక్టర్‌ గోపీనాథ్‌ మాటలు గలగలా గోదావరీ ప్రవాహంలా సాగుతున్నాయి. ఆయన ఒక హర్షాతిరేక తాదాత్మ్యతలో మునిగిపోయాడు.
జనపథంలోని జనసేన ప్రధాన కార్యాలయం ప్రధాన సభామందిరంలో ఒక వలయసభ ఏర్పాటు చేయబడిందారోజు.. దానికి ఒక అధ్యకక్షుడు, ఒక అతిథి, ఒక వక్త.. అలా ఏవిధమైన సాధారణ సాంప్రదాయాలూ లేవు. మనుషులు.. మనసులు కలవడం, అభిప్రాయాలను, ప్రతిపాదనలను, అంతరంగాలను చర్చించుకోవడం, పంచుకోవడం.. ప్రజాస్వామ్యయుతంగానే కాని నిబద్ధతతో కూడిన క్రమశిక్షణతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం.. యిదీ అక్కడ ఇన్నాళ్ళుగా జరుగుతూ వస్తున్నది.. ఆ రోజూ జరుగవలసిఉన్నది కూడా.
ఆ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నేపథ్యంలో ఒక్క బోసినవ్వులు చిందిస్తున్న గాంధీ పటం మాత్రమే ఉంది. పటం క్రింద ఆనాటి సమావేశ లక్ష్యం ”ప్రక్షాళన సభ”అని బేనర్‌ ఉంది. రౌండ్‌ టేబుల్‌ మధ్య టేబుల్‌తో సమాన ఎత్తులో ఉన్న అందమైన చెక్కబల్లపై రెపరెపలాడ్తూ భారత జాతీయపతాక  హుందాగా ఎగుర్తోంది.
గత ఇరవైరోజుల క్రితం జనసేన ఎంపికచేసిన నూటా ఎనిమిది మంది ఋషులవంటి స్వార్థరహిత..రామం ఎన్నో ఏళ్ళుగా తన నిఘా విభాగాన్ని ఉపయోగించి, అధ్యయనాలు జరిపించి గుర్తించినవారే చాలామంది.. వ్యక్తులతో కూడిన ‘మార్గదర్శక సభ’  ఆరోజు సమావేశమైంది. అతి ప్రధానమైన ఆదేశిక సూత్రాలను రూపొందించి ఆచరణ విధానాలతోసహా ‘జనసేన’ మూల కార్యకర్తలకందించడం, అమలులో ముందుండి జనసేనకు నాయకత్వం వహించడం, కావలసివచ్చినపుడు ఏ అధికారినైనా, శత్రువునైనా, ఏ ప్రత్యర్థినైనా నిలువరించి ఎదుర్కోవడం.. సంస్థలో ప్రాణసమానమైన క్రమశిక్షణను స్వయంగా పాటిస్తూ, తమ విభాగంచే పాటింపజేయడం..యివీ మార్గదర్శక సభ సభ్యులు చేసేపని.
క్రమశిక్షణ.. సంయమనం.. సహనం. యివి ‘జనసేన’ యొక్క ప్రధానమైన ప్రాణసూత్రాలు.

ekkadi-April10
ఎవరికీ స్వార్థంలేకపోవడం, అధికార కాంక్షలకు కారణభూతమైన ఏ పదవులూ సంస్థలో లేకపోవడం, క్రమంగా మనిషిని ‘లౌల్యా’నికి అతీతంగా తయారు చేయగల ఉద్యమసంస్కారం ప్రతి కార్యకర్తలోనూ నిండి ఉండడం.. యివి అంకితభావం వల్ల అందరికీ సంక్రమించిన సులక్షణాలు.
సరిగ్గా నూటా ఎనిమిదిమంది ఉన్న ఆ ‘మార్గదర్శక సభను ప్రారంభిస్తూ, రామం లేచి నిలబడి.,
”మిత్రులారా.. ఈ నెలరోజుల తర్వాత మనం యిప్పుడు ఒక అతిముఖ్యమైన కీలకథకు చేరుకున్నాం. ఈ మాసం కాలంలో మనం ముందే అనుకున్నట్టు మన జనసేన సంస్థను ప్రజల్లో భవిష్యత్తులో అందరికీ ప్రాణసమానమైన అవసరంగా ప్రతిష్టించి వాళ్ళ హృదయాల్లో స్థాపించగలిగాం.. యిది సాధారణమైన విజయంకాదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నూటా అరవై కార్యాలయాలతో దాదాపు నాల్గు లక్షలపైచిలుకు సభ్యులు సైనిక సమానులైన కార్యకర్తలుగా ఉన్నారు. మనకు యిప్పుడు ‘జనసేన’ ఒక అజేయమైన సంస్థగా నిలబడ్డది. ఆకాశమంత ఎత్తులో. యిక మిత్రులారా.. మనం కార్యాచరణలోకి దూకబోతున్నాం. ప్రజలు అహింసా పద్ధతులను పాటిస్తూనే శాంతియుతంగా ఉద్యమిస్తూ సంఘటితంగా ఎన్నెన్ని అద్భుతాలు చేసి చూపించగలరో ప్రత్యక్షంగా రేపటినుండి మనం ఋజువు చేయబోతున్నాం. ‘ప్రక్షాళన’ యొక్క రూపురేఖలు మన కార్యాచరణ ఎలా ఉంటుందో పెద్దలు ‘అగ్ని’ వార్తా చానల్‌ అధినేత మూర్తిగారు మనందరికి వివరిస్తారు. మూర్తిగారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.” అని రామం ప్రశాంతంగా కూర్చున్నాడు కుర్చీపై,
ఆదేశికసూత్రాలలో, ప్రాథమిక జనసేన కార్యకర్తల శిబిరంలో నాయకులెప్పుడూ అతి తక్కువగా, సూటిగా, క్లుప్తంగా మాట్లాడాలని ఒక ప్రధాన అంశంగా శిక్షణ యివ్వబడింది. దాన్ని ప్రతిఒక్కరూ పాటిస్తారు.
మూర్తిగారు చేతిలో కొన్ని కాగితాలతో గంభీరంగా లేచి నిలబడి తన ముందున్న మైక్‌ను సవరించుకుని.,
ఆ హాల్‌లో సౌకర్యాలన్నీ అత్యాధునికంగా ఉన్నాయి. రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతున్న స్థలానికి ఎదుట ఒక పెద్ద ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ ఉంది. ప్రక్కనే యల్‌సిడి స్క్రీన్‌ ఉంది. ఇటు ప్రక్క మాట్లాడ్తున్న వక్త యొక్క ఫీలింగ్సు, హావభావలు స్పష్టంగా కనబడ్డానికి అతని లేజర్‌ ఇమేజ్‌ను చూపించే మరో తెర ఉంది. సభలో పాల్గొంటున్న ప్రతి సభ్యుని ముందు ఒక్కొక్క ఇండివిడ్యువల్‌ మైక్‌ ఉంది. హాల్‌ మొత్తం సెంట్రల్లీ ఏర్‌ కండీషన్డ్‌. కమ్యూనికేసన్‌ సౌకర్యాలు, డాటా సేకరణ, విశ్లేషణ, రాష్ట్రంలోని వందల కార్యాలయాలతో ఏ వ్యక్తితోనైనా సంధానించబడ్డానికి అత్యాధునిక ఏర్పాట్లు.. అన్నీ ఏ ప్రభుత్వ లేదా అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్‌ కంపెనీల కంటే కూడా ఆధునాతనంగా ఉండాలనీ క్యాథీ మొదట భావించి తను స్వయంగా పర్యవేక్షించి ఆ భవనాన్ని నిర్మింపజేసింది.
ఎదురుగా లేజర్‌ తెరపై మూర్తిగారి పొట్రేట్‌.
ఎల్‌సిడి స్క్రీన్‌పై ఒక విండో ఓపెనై.. జనసేన.. డాటా బ్యాంక్‌.. అని లోగోతో సహా ఒక స్క్రీన్‌ డిస్పే ్ల ఐ..,
అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
”మిత్రులారా.. ఒక చిన్న కథ చెబ్తా చాలా క్లుప్తంగా. ఒక తెలివైన భార్య, బ్రతుకనేర్చిన భర్త తాము నలభై ఏండ్ల వయస్సున్నపుడు కొన్ని బ్యాంకులను ట్రాప్‌ చేసి బ్యాంక్‌ అధికారులకు విపరీతంగా లంచాలిచ్చి నాల్గు కోట్ల రూపాయలను అప్పుచేసి అత్యాధునికమైన సర్వసౌకర్యాలున్న భవనాన్ని, కార్లనూ. అన్నీ సమకూర్చుకుని హాయిగా బ్రతకడం మొదలెట్టారు. నాల్గుకోట్ల రిపేమెంట్‌ టైం ముప్పయ్యయిదేళ్ళు, గ్రేస్‌ పీరియడ్‌ మరో పదేళ్ళు.. వడ్డీరేటు.. ఎంతోకొంత.. వాళ్ళకు తెలుసు ఈ నలభై ఐదు ఏండ్లకాలంలో తాము తప్పకుండా చచ్చిపోతామని. లంచాలు తీసుకుని అప్పిచ్చిన బ్యాంక్‌ అధికారులకూ తెలుసు నలభై ఐదేండ్ల తర్వాత తాము ఉద్యోగాల్లో ఉండమని.. నలభై ఏండ్ల తర్వాత.. ఈ పెళ్ళాం మొగులూ హాయిగా బ్రతికి హాయిగా చచ్చిపోయారు. బ్యాంక్‌ అధికారులు ఉద్యోగ విరమణ చేసి హాయిగా వాళ్ళూ చచ్చిపోయారు. చెల్లించవలసిన అప్పుల క్రింద నలభై ఏండ్ల తర్వాత వాళ్ళ పిల్లలిద్దరు అన్ని ఆస్తులనూ అమ్మినా అప్పులే తీరక, వడ్డీలు కట్టలేక.. ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు పిచ్చోడైపోయాడు.
మిత్రులారా.. అర్థమైందనుకుంటూ ఇపుడు నేను చెప్పింది.. ఎలా పసిగట్టారో గాని మన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులు బంగారు బాతువంటి ప్రపంచ బ్యాంక్‌ సంగతిని పసిగట్టారు. దాన్నుండి గత ఇరవై ఏండ్లలో ఎన్ని లక్షలకోట్లను తీసుకుని తిని మనకు ఎంత అప్పును వారసత్వంగా మిగిల్చిబెట్టారో ఇప్పుడు నేను చెబితే జనం గుండె పగిలి చచ్చిపోతారు. మంత్రులందర్ని ముఖాలపై ఉమ్మేస్తారు. ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులను చెప్పులతో కొడ్తారు.”
తెరపై వివరాలు కనబడ్డం మొదలైంది.
1999- ఎపిఇర్‌పి ప్రపంచబ్యాంక్‌ నుండి రూ. 1298.56 కోట్లు, మళ్ళీ రూ. 364 కోట్లు కర్నూల్‌ కడప ప్లాన్‌ కింద రూ. 555 కోట్లు, తుంగభద్ర రూ. 45 కోట్లు, తెలుగు గంగ రూ. 450 కోట్లు, ఖమ్మం.. వరంగల్‌ మరియు కోస్తా జిల్లాలకు రూ. 123.8 కోట్లు, యస్‌ఆర్‌బిసి క్రింద 939.85 కోట్లు, జూరాల, సోమశిల, సాగర్‌ ప్రాధాన్యతల పనికి రూ. 1095 కోట్లు.. చిత్రావతి నది రూ 78 కోట్లు, గన్నవరం రు. 34.8 కోట్లు, నిర్వాసితుల ఆరక్షణ క్రింద రూ. 136.18 కోట్లు, రు782 కోట్లు …యిలా చదివి చదివి మన నోరుపోతుంది. నా దగ్గర ప్రపంచ బ్యాక్‌, ఇంటర్నేషనల్‌  మానిటరీ ఫండ్‌, జపాన్‌ వంటి దేశాలనుండి తెచ్చిన అప్పుల జాబితా వివరాలు ముప్పైరెండు పేజీల నిండా ఉన్నాయి. వీటిని చూస్తే కంపరమెత్తుతోంది.
ఐతే…. మిత్రులారా… పెద్ద పెద్ద పరిశ్రమలు, దేశాలు అప్పుచేయకుండా ఎలా నిధులు సంపాదిస్తాయి. ఎలా సంక్షేమ పథకాలను చేపడ్డాయి  …అనే ప్రశ్నకు ఆర్థికశాస్త్రం ఏమంటోందంటే.భారీ ఋణాలనెప్పుడు ‘ఉత్పాదక రంగం’ కోసం చేయమంటోంది. ఉదాహరణకు.. ఒక ఉక్కు కార్మాగార నిర్మాణం కోసం వేయికోట్ల అప్పుచేస్తే.. అది ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత లాభాలతో అప్పు చెల్లించవచ్చు. కాని అనుత్పాదక రంగం కోసం అప్పు చేస్తే అవి శిరోభారమై వ్యవస్థను తినేస్తాయి.
ఐతే ఈ ఇర్రిగేషన్‌ ప్రాజెక్టుల క్రింద, రోడ్లు, ఆరోగ్యాభివృద్ధి, మురుగు కాల్వల అభివృద్ధి- మరమ్మత్తులు, వంతెనలు, విద్య.. ఆధునీకరణ.. ఇటువంటి అవ్యవస్థ రంగాల కోసం ఈ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు అప్పుతెచ్చి మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఐఎఎస్సాఫీసర్లు, ఇంజినీర్లు, మున్సిపల్‌స్థాయి నాయకులు.. అందరూ బినామీ పేర్లమీద కాంట్రాక్టర్లయి, సప్లయర్లయి, డెవలపర్సయి, కన్‌స్ట్రక్టర్లయి.. అంతా పంచుకు తినడమే.. పోనీ ఆ చేసిన కొద్దిపాటి పనుల్నైనా నాణ్యంగా, ప్రామాణికంగా చేస్తారా అంటే అదీలేదు. అంతా నాసిరకం. సిమెంట్‌ లేదు, ఇసుక లేదు. స్టీల్‌ లేదు.. అంతా దుమ్ము, దుబ్బ, రోత.. లోతుకుపోయి చూస్తే తెలుసుకుని గుండెలు పగిలి చస్తాం మనం.
పాపం.. మహానుభావులు.. కె. కన్నబీరన్‌, కె. బాలగోపాల్‌ 14 డిసెంబర్‌ 2003న ప్రపంచ బ్యాంక్‌కు సవివరంగా ఒక లేఖ రాశారు.. యిక్కడి అవినీతికర పరిస్థితులను సవివరంగా వివరిస్తూ అయ్యా మహాప్రభో మీరిచ్చే దీర్ఘకాలిక కోటానుకోట్ల అప్పులను మా వాళ్లు పంచుకుని, నంజుకుని తింటున్నారు. మీరు మీస్థాయిలో తగుమోతాదులో లంచాలనుతీసుకుని యిస్తున్న లక్షల కోట్ల ఋణాలను ఇకనైనా ఉదారంగా మా నెత్తిన రుద్దడం ఆపేయమనీ, మమ్మల్ని ఇంకా ఋణాల ఊబిలో ముంచవద్దనీ వేడుకున్నారు. నోబుల్‌ బహుమతి గ్రహీత. అమర్త్యసేన్‌ కూడా భారతదేశంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ నుండి పైరవీ చేసి తెచ్చుకుంటున్న అప్పు నిధులను స్వాహా చేస్తున్నాయి గానీ సక్రమంగా ఉపయోగించడం లేదనీ.. అందువల్ల యిక అప్పులీయడం దయచేసి బంద్‌ చేయండనీ అభ్యర్థించాడు. కాని ప్రపంచబ్యాంక్‌ వాడింటాడా.. కమీషన్లు తీసుకుని అప్పివ్వడం వానికిష్టం.. అప్పుచేసి పంచుకుతినడం యిక్కడ వీనికిష్టం.. అదీ తంతు.
ఐతే.. యిప్పుడు సరిగ్గా ఈ దౌర్భాగ్య దయనీయ స్థితిపైన మనం మన ప్రజాచైతన్య బాంబు పేల్చి మన మొదటి యుద్దాన్ని ప్రకటించబోతున్నాం.
మిత్రులారా జాగ్రత్తగా వినండి.. యిప్పుడు నేను చెప్పబోయేది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా.. కోట్లాది రూపాయల ప్రాజెక్ట్‌లుగా.. పద్దెనిమిది ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, ఇరవై ఆరు మేజర్‌ నేషనల్‌ రోడ్లనిర్మాణ పనులు, పద్దెనిమిది వంతెనల నిర్మాణాలు, ఇరవై ఎనిమది వివిధ మైనింగు ఆపరేషన్స్‌, పద్దెనిమిది మున్సిపాలిటీలలో ప్రపంచ బ్యాంక్‌ నిధులతో మురికివాడల అభివృద్ధి పనులు, ఎనిమిది గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకాలు, ఆరు పేద వృత్తిదారులకు ఉపకరణాల పంపిణీ పథకాలు.. ఇలా మొత్తం నూటా ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువకు తక్కువలేని పనులు అతి రోతగా, నాసిరకంగా, పంచుకుని మనం మనం తిందాం తరహాలో జరుగుతున్నాయి. వాటి పూర్తి వివరాలు యివిగో యివి.
ఎదుట ఎసిడీ స్క్రీన్‌పై ఒక్కో విండో ఒక ప్రాజెక్ట్‌ వివరాలు స్లైడ్‌షో వలె అంకెలతో సహా చూపిస్తోంది.
మనం ఈ నూటా ఎనిమిది ప్రాజెక్టులకు నూటా ఎనిమిది ‘జనసేన’ కమిటీలను ఆ పనులు జరుగుతున్న స్థలానికి దగ్గర్లో ఉన్న మన కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో.. ఆయా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఎక్స్‌పర్డ్‌ కమిటీ సారథిగా ఉంటాడు. ఉదాహరణకు..వరంగల్లులో ఎన్‌హెచ్‌ సెవెన్‌లో తొంభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌నుండి నూటా నలభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌ వరకు మొత్తం యాభై కిలోమీటర్లు రోడ్‌ లేయింగు వర్క్‌.. దీనికి.. ఇరవై ఎనిమిదిమంది జనసేన సభ్యులతో కలిపి కమిటీ వేస్తున్నాం. చైర్మన్‌ జి.పురుషోత్తమరావు. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌. ఆర్‌ అండ్‌ బి. రోడ్డు దాని పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలిసినవాడు. మరొక ఎమ్‌.టెక్‌ స్ట్రక్చర్స్‌ చదివిన యువ విద్యార్థి నాయకుడు ఆర్‌. గోఖలే ఉపసారథి. ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ మురళీమనోహర్‌ వ్యవహర్త. ధర్మసాగర్‌ ఇండిపెండెంట్‌ ఎం.పి.టి.సి., ఎమ్మే చదివిన యాదరిగి, ఇతరేతర యువకులు మొత్తం ఇరవై ఎనిమిది మంది టీం యిది.
మన దగ్గర ఈ ప్రాజెక్ట్‌, ఫండ్స్‌ వివరాలు.. అవి ఏ నాబార్డ్‌ శాంక్షన్‌ క్రింద విడుదలయ్యాయి, మొత్తం ఎప్పుడు ఎంత విడుదలయ్యాయి.. వాటికి టెండర్లు ఎప్పుడు పిలిచి ఎవరికి కాంట్రాక్ట్‌ అప్పజెప్పారు. ఆ కాంట్రాక్టరెవరు.. అతని వివరాలు.. వర్క్‌ షెడ్యూల్‌, వర్క్‌ స్పెసిఫికేషన్‌.. ఆ పని ఎప్పుడెప్పుడు ఎంతవరకు కావాలి. ఎప్పుడు ఫినిష్‌ కావాలి. ఆ సమాచారమంతా ”రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌ – 2005” క్రింద ఆయా సంబంధిత అధికారుల నుండి సర్టిఫైడ్‌ కాపీలను తీసుకుని సిద్ధంగా ఉంచాం. నిజానికి పని ప్రారంభిస్తున్నప్పుడు ఆ స్థలంలో ఆ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు పొందుపరుస్తూ ఒక ప్రజాప్రకటన ఉంచబడాలి. కాని అదక్కడ లేదు. అన్ని వివరాలతో మనమే కొన్ని బోర్డులు రాయించాం. అవి యివిగో..”
వెంటనే ఎస్‌డిసీ స్క్రీన్‌పై బోర్డులు కనిపించాయి
”మన ‘జనసేన’ కార్యకర్తల చేతుల్లో ఎప్పుడూ కొన్ని ప్లెకార్డులుంటాయి.. పని జర్గుతున్న ప్రతిరోజూ మనవాళ్ళు అక్కడ ఉండి నాణ్యతా ప్రమాణాలను చెక్‌ చేస్తారు. మెటీరియల్‌,మిక్సింగు నిష్పత్తులు, రీఇన్‌పోర్సింగు స్టీల్‌ క్వాలిటీ, క్యూరింగు.. బి.టి. రోడ్డయితే దాని స్పెసిఫికేషన్స్‌.. అన్నీ..”
స్క్రీన్‌పై ప్లెకార్డులు దర్శనమిచ్చాయి. ” ఈ ప్రాజెక్ట్‌ డబ్బు ప్రజలది”.. ”ప్రజల డబ్బు ప్రజలకు చెందాలి.” ”నాణ్యతా ప్రమాణాలు మాకు ప్రాణం”, ‘నిర్మాణంలో అవినీతి సహించం.” ‘జనం డబ్బుకు జనమే కాపలా”, కాపలా కుక్కలం – తప్పు చేస్తే కరుస్తాం” .. ఇవీ
”మిత్రులారా.. అసలు ఈ పనిని మనచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైన ఎంపిటిసిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుచేయాలి రాజ్యాంగం ప్రకారం.. కాని వాళ్ళే కాంట్రాక్టర్లయి దోచుకుంటున్నారు. కాబట్టే ఈ ప్రజల గర్జన, గాండ్రింపు అవసరమౌతున్నది.. మీరు మరో విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి.. మనం చేయబోతున్నది పూర్తిగా చట్టబ్దమైంది. సమాచారచట్టం ప్రకారమే మనం ప్రశ్నిస్తున్నాం. కాకుంటే ఒక బలమైన ప్రజావాణిని భరించలేనంత కటువుగా వినిపిస్తున్నాం.. ఇలా ప్రశ్నిస్తున్నామని.. ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు, సంబంధిత శాఖాధికారులకు ముందే తెలియజేశాం. అందరూ అంగీకారం తెలిపారు. తెలుపక తప్పదు వాళ్ళకు. లేకుంటే రేపు వాళ్ళే ప్రశ్నించబడ్తారు. ఎవ్రీథింగు యాజ్‌పర్‌ కాంస్టిట్యూషనల్‌ ప్రొవిజన్‌.. ఇక దీంతో చూడండి మిత్రులారా.. అధికార పీఠాలు కదుల్తాయి. ఇక నిశ్శబ్ద రక్తపాతరహిత విప్లవం రెక్క విప్పుతుంది.. గెట్‌ రెడీ.. జై జనసేన.. జై జై జనసేన..”
హాలునిండా చైతన్యం ఉప్పొంగి పొంగి వికసించింది.
నిస్వార్థమైన చింతన.. శుద్ధమైన ఆలోచన.. నిండైన అంకితభావం అక్కడి మనుషుల హృదయాల్లో తొణికిసలాడ్తున్నందువల్ల అందరి ముఖాల్లోనూ అతి సహజమైన జీవకాంతి, నిర్మలత్వం వెల్లివిరుస్తోంది. అందరిలోనూ విజయోత్సాహం ఉరకలెత్తుతోంది.
మూర్తిగారు కూర్చోగానే.. శివ లేచి.. ”మిత్రులారా.. వరంగల్లుకు సంబంధించిన ఎనిమిది కమిటీలవాళ్ళు.. బయట ప్రకటనా ఫలకంపై ఉన్న తమ తమ పేర్లను చూచుకుని సేవా విభాగం ఐదు నుండి తమ కమిటీకి సంబంధించిన ఆర్‌టిఐ సర్టిఫైడ్‌ కాగితాలు, ప్లకార్డులు.. అన్నీ తీసుకుని మీ కమిటీ సభ్యులతో విషయాలు చర్చించుకోవాలి. మేము యితర జిల్లాలలో ఉన్న మన మిత్రులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని సూచనలూ చేస్తాం.. ఈ రోజు తేదీ పదిహేను. సరిగ్గా ఇరవైయవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మనం అనుకున్న నూటా ఎనిమిది వర్క్‌ స్టేషన్ల దగ్గరికి ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఏకకాలంలో అన్ని కమిటీల వాళ్ళం హాజరౌతాం. ఇది భావి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతున్న ఓ మహత్తర ఘట్టం. మనం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం మిత్రులారా.. జై జనసేన…”
అందరూ నిశ్శబ్దంగా.. ఒక సైనిక శిబిరంలోలా నిబద్ధతతో విన్నారు.
వెంటనే… స్క్రీన్‌పై ‘జనసేన’ సమావేశ ముగింపు సంప్రదాయమైన లఘుచిత్రం ప్రత్యక్షమైంది.
ఒక దీపం.. ఆమె చేతిలో.. కదిలి కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఇంకాస్త కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఆ మూడు దీపాలూ కదిలి. మరికొన్ని దీపాలు.. మరిన్ని దీపాలు.. వత్తులు అంటుకుని వెలిగి వెలిగి .. ఎన్ని దీపాలో.. అన్నీ దీపాలే.,
అంతా తెల్లని కాంతి.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 15 వ భాగం

( గత వారం తరువాయి)

15

విపరీతమైన ప్రతిస్పందన ప్రవహిస్తోంది ‘జనపథం’లోకి. రాష్ట్రం నలుమూలలనుండి అనేక మంది ఆలోచనాపరులు ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లు,

విద్యాసంస్థలలోనుండి ఉత్తమ విద్యార్థులుగా నేపథ్యం గలవాళ్లు  ఎక్కువగా మహిళలు, సాహిత్యకారులు, కళాకారులు, కొద్దిమంది చిన్నస్థాయి పోలీసులు.. బీదలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అట్టడుగుస్థాయి వర్గం.. వీళ్ళు చురుగ్గా స్పందిస్తున్నారు.

దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టి.వి. వార్తా చానల్‌లో రామం.. లేదా డాక్టర్‌ గోపీనాథ్‌.. కొద్దిసార్లు క్యాథీలతో ముఖాముఖి ప్రసారాలు కొనసాగుతున్నాయి..’జనసేన’ ఆవిర్భావం, ఆలోచనలు, లక్ష్యాలు.. ప్రజాపాలనా రంగంలో విస్తరించిన అవినీతిని అంతమొందించేందుకు పథకాలు.. సంస్థ నిర్మాణం.. పారదర్శకత.. వీటిపై ఎక్కడ చూచినా చర్చ జరుగుతోంది. మంత్రి వీరాంజనేయులును విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సిఫారసుపై గవర్నర్‌ మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్‌ చేశాడు. మిగిలిన నలుగురు ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసి వివరణాత్మకమైన దర్యాప్తుకై ఒక కమిటీని నియమించింది.

పదిరోజుల్లో దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ‘జనసేన’ శాఖలు ఏర్పడ్డాయి.

ఒక కొత్త గాలి, కొత్త ఆలోచన వీచడం మొదలైంది.
విపరీతమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది మరోవైపు.

ఆపద సమయంలో ఆకలిగొన్న మందపైకి ఆహారపొట్లాలను విసిరితే మనుషులు పశువులకన్నా హీనంగా కొట్లాడుకోవడం కనబడ్తుంది. సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడగానే చుట్టూ ఉన్న నీరు మహోధృతితో సుడిగుండంగా రూపదాల్చడం మనం చూస్తూంటాం. ఒక ఖాళీ ఏర్పడగానే అక్కడికి చుట్టూ ఉన్న ద్రవ్యం చొచ్చుకురావడం ‘ఫిజిక్స్‌’లో చదవుకుంటాం. సరిగ్గా అదే జరుగుతున్నట్టుగా క్యాథీ గమనిస్తోంది.

”ప్రజలు ఈ విపరీతమైన అవినీతికర వాతావరణంతో విసిగి విసిగి.. ఈ దుస్థితిలోనుండి బయటపడ్డానికి ఎవరైనా పూనుకుని ఏదైనా చేస్తే బాగుండు.. మనం కూడా మంటకు గాలిలా తోడవుదాం అన్న ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు ఈ విపరీతమైన జనస్పందన తెలియజేస్తాంది.” అని డాక్టర్‌ గోపీనాథ్‌ వంక చూస్తూ అంది క్యాథీ.
అప్పుడు సరిగ్గా రాత్రి పదిగంటల యాభై నిముషాలైంది.

‘జనపథం’ బయట వాతావరణమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.

”ఈరోజు మన రాష్ట్రవ్యాప్త కార్యాలయాలన్నింటిలోకూడా మనం ముందే అనుకున్నట్టు ‘అవగాహన’ కార్యక్రమం నిర్వహించబడింది సార్‌. ఒక్కో కార్యాలయం నుండి దాదాపు లక్ష ప్రశ్నాపత్రాలను ప్రజల్లోని వివిధ స్థాయిలకు చెందిన జనానికి అందజేసి జవాబులురాయించి వెంటనే వాపస్‌ తీసుకుని క్రోడీకరణ చేశాం. వాటిని అన్ని జనసేన శాఖల్లోనుండి మన హైద్రాబాద్‌ సెంట్రల్‌ డాటా వెబ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే మనవాళ్ళు ఎనాలిసిస్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. రిపోర్ట్‌ సమ్మరీ చూస్తే చాలా ఆశ్చర్యం కల్గుతోంది రామంగారూ..” అంటున్నాడు శివ.

”చెప్పు శివా.. ఒక్కోసారి ఇటువంటి అభిప్రాయ సేకరణలనుండి మనం ఊహించని వింత ఫలితాలు ఫీడ్‌బ్యాక్‌ క్రింద మనకు చేరుతాయి. అవి మన భవిష్యత్‌ రూపకల్పనకు ఎంతో తోడ్పడ్తాయి..”

”సర్‌ మనం అందజేసిన ప్రశ్నాపత్రంలో రెండే రెండు ప్రశ్నలున్నాయి.. అవి., ఒకటి

అవగాహన (అతిగోపనీయం)

1) మీ చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం ఎంతమేరకు కలుషితమై ఉంది.
ఎ) కొద్దిగా     బి) చాలావరకు    సి) భరించలేని స్థాయికి
2) మీ పరిసరాల్లో అవినీతి ఏరూపంలో ఉంది..
……………………………………..
…………………………………….
మీపేరు :…………….. వృత్తి :………….. వయస్సు:………
అడ్రస్‌ :…………………….మొబైల్‌ నం.:……………….
గమనిక : మీరు రాస్తున్నది ఎవరికీ చెప్పబడదు. అతి రహస్యంగా ఉంచబడ్తుంది.

దాదాపు ఇరవై లక్షల ప్రశ్నాపత్రాలు ప్రజలకు అందజేయబడ్తే, అందులో బాధ్యతతో గరిష్టంగా పందొమ్మిది  లక్షల ముప్పయి రెండు వేల నలభై ఆరు మంది రెస్పాండయ్యారు. ఐతే చాలా ఆశ్చర్యంగా అందులో పందొమ్మిది లక్షల ఇరవై రెండు వేల నలభైమంది సామాజిక వాతావరణం ‘భరించలేని స్థాయిలో’ కలుషితమైందని జవాబు చెప్పారు. ‘కొద్దిగా’ అని చెప్పినవాళ్ళు అసలు లేనేలేరు. మిగిలిన అందరూ ‘చాలావరకు’ కలుషితమైందని బాధపడ్తున్నారు.

ఇక రెండవ ప్రశ్న.. ‘ మీ పరిసరాల్లో అవినీతి ఏ రూపంలో ఉంది’ అన్నదానికి.. అట్టడుగు వర్గాలు, చాలా విపరీతమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను, వ్యవస్థను తిట్టి తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు హాపీగా, డబ్బు సంపాదన విషయంలో నిశ్చింతగా ఉన్నారు కాబట్టి ప్రస్తుత సామాజిక స్థితిగతులపై మిగతా వాళ్ళున్నంత ఆగ్రహంగా లేరు. కాని ఆత్మానుగతమైన ఓ అపరాధ భావనతో ఈ పరిస్థితులు మారాలనిమాత్రం ఆకాంక్షిస్తున్నారు.

”మచ్చుకు విభిన్న వర్గాలకు చెందిన, భిన్న ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రతిస్పందనలను వినిపిస్తావా శివం” అన్నాడు డాక్టర్‌ గోపీనాథ్‌.

”ఓకే సర్‌.. వినండి..”అని శివం తన ముందున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ను సెట్‌ చేసుకుంటూ,

”ఊఁ.. ఇది .. ఒక హాకర్‌.. బి. అప్పారావు.. బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ, సెంటర్లో బండిపై అరటిపండ్లు అమ్ముతూ జీవిస్తాడు.. చదువురాదు.. ప్రక్కనున్న ఇంటర్‌ విద్యార్థితో ఫాం నింపించి మనకు జవాబిచ్చాడు.. మొదటి ప్రశ్న జవాబు.. సమాజం భరించలేనిస్థితిలో కలుషితమైందని.. రెండవ ప్రశ్నకు జవాబు.. థూ నీయమ్మ.. అవినీతి ఏ రూపంలో ఉంది.. అని అడుగుతున్నారా.. అన్ని రూపాల్లోనూ ఉంది. పోలీసుల రూపంలో, గుండాల రూపంలో, మున్సిపాలిటీ ముండా కొడ్కుల రూపంలో, రాత్రి కాకముందే లంజలరూపంలో, ఎమ్మెల్యేల రూపంలో, మంత్రుల రూపంలో, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని రాజకీయ పార్టీల రూపంలో.. ఇక బతకడమే కష్టంగా ఉంది సారూ. రోడ్లమీద అరటిపండ్లమ్మి రెండొందలు సంపాదిస్తే వందరూపాయలు అందరికి పంపకం.. మిగిలేది. వంద.. బొక్కలు తెల్లబడ్తానయ్‌గాని ఈ బతుకు బాగుపడ్తలేదు…”

శివ తలెత్తి ముగ్గురి ముఖాల్లోకీ చూశాడు.

”వీటి ప్రింటవుట్సన్నీ భద్రపర్చాలి శివా.. మనం రెండు మూడు రోజుల్లో వీటిని సమ్మరైజ్‌ చేసి.. ఒట్టి కీలుబొమ్మే ఐనా రాష్ట్ర గవర్నర్‌ను, తర్వాత ముఖ్యమంత్రిని కలిసి ప్రజల మనోగతాన్ని సాధికారికంగా వినిపించబోతున్నాం. తర్వాత మీడియా ద్వారా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది..” అన్నాడు రామం.

17

”యస్సార్‌.. ఇంకొక రెస్పాన్స్‌.. మరొక వర్గంనుండి.. ఇతని పేరు బి. రామచంద్రారెడ్డి. వయస్సు ముప్పయి రెండు. వృత్తి పోలీస్‌ కానిస్టేబుల్‌.. ఊరు వరంగల్‌.. మొదటి ప్రశ్న జవాబు.. సామాజిక వాతావరణం భరించలేని స్థాయిలో కలుషితమైందనే. రెండవ ప్రశ్న.. అంటాడు.. పోలీస్‌గా పుట్టడంకంటే ఏ క్లాస్‌ లంజెదగ్గరైనా కుక్కయిపుడ్తే ఎంతో సంతోషంగా ఉంటది. ఉన్న ఒక్క బిడ్డకు ఊరంతా మొగలే అని ఒక సామెత ఉంది.. పోలీస్‌ కానిస్టేబుల్‌కు అందరూ మొగలే. ఎస్సై, సి.ఐ, డిఎస్పీ.. క్యాంప్‌క్లర్స్‌, ఎస్పీ స్టెనో, ఎస్సై పెడ్లాం, సి.ఐ. ఉంచుకున్నది, డిఎస్పీ బిడ్డ, కొడుకు, బామ్మర్ది.. ఎందరయ్యో బాబు. ఒక వేళ పాళలేని కుక్కబతుకులు మావి.. యిక లంచాలా.. ఆదాయమా.. అధికారమా.. ఎవనికి ఎంత చేతనైతే గంత.. అందినకాడికి రిల్లుకుని ఉడాయించుడే. పోలీసుల సంస్కృతిలో ఏ పోలీసోడైనా తన క్రింది ఉద్యోగులకు పులి, పై ఉద్యోగులకు పిల్లి. మాకు రాజకీయ నాయకులందరూ మొగుళ్ళే. డబ్బు సంపాదన ప్రక్కనపెడ్తై.. ఈ సిగ్గూశరాలు లేని జీవితాలు జీవించడంకంటే బండకట్టుకుని బాయిలపడ్తే బాగుండనిపిస్తోంది. ఇగ ఈ దేశం ఎవడూ బాగుచేయలేనంత ఛండాలంగా చెడిపోయింది. గంతే..”

”ఊఁ.. జనం స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పమని ఎంకరేజ్‌ చేసి విషయాన్ని గోప్యంగా ఉంచితే చూడండి మనుషులు తమ మనసులోని మంటను ఎలా మనముందు ఆవిష్కరిస్తున్నారో.. ఇదీ ప్రజల అసలు అంతరంగం..” అంది క్యాథీ.

”ఒక మున్సిపల్‌ కార్పొరేటర్‌.. పేరు శ్రీనివాసరావు బర్రెల.. వార్డ్‌ యిరవై నాల్గు. వయస్సు ముప్పయి ఐదు. మొదటి ప్రశ్న జవాబు. సామాజిక వాతావారణం భరించలేని స్థాయిలో కలుషితమై చెడిపోయిందనే. ఇక రెండవ ప్రశ్న.. ఈ రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేటరన్నా, కౌన్సిలర్‌ అన్నా బ్రాకెట్లో కాంట్రాక్టరనే. పది లక్షలు ఖర్చుపెట్టి గెలిచిన. ఐదేండ్ల టర్మ్‌. యాడాదిగాకముందే ఇరవై రెండు లక్షలు సంపాదించిన. పొద్దున లేవగానే పైన ఎమ్మెల్సీ కింద మేయర్‌, అటు దిక్కు జిల్లా మంత్రి. పైరవీలు, పార్టీలు, దందాలు, ధర్నాలు, రాస్తారోకోలు. షానిటేషన్‌ కాంట్రాక్ట్‌, రోడ్ల కాంట్రాక్ట్‌, సిల్ట్‌ రిమూవల్‌ కాంట్రాక్ట్‌, మలేరియా ప్రెవెక్షన్‌, ఇందిరమ్మ ఇళ్ళ కథ.. వరల్డ్‌ బ్యాంక్‌ ఫండ్స్‌ కింద స్లమ్స్‌ డెవలప్‌మెంట్‌ కాంట్రాక్ట్‌.. ఏమాటకామాటేగని .. కేన్సర్‌ రోగంకన్న కడుహీనంగా ఈ అవినీతి రోగం ముదిరిన ఈ సిస్టంను ఎవడు బాగుచేస్తడు.. ఎట్టా బాగుచేస్తడు. మారె.. ఎవని చేతగాదు.. కాని..మేము విసిగిపోయినం. అందరం బురదల నిలబడ్డం.. బాగ తాగినప్పుడనిపిస్తది.. నీయమ్మ ఈ అన్యాయం బతుకు, పాపపు బతుకు వద్దని.. గుండెలల్ల ఎక్కడ్నో తప్పుచేత్తాన అన్న ఫీలింగు తినేస్తాంది. మంచిగా, సాఫ్‌గా నీతిగా బతుకుతే బాగుండు. కాని ఏ లంజకొడ్కు బత్కనిత్తడు.”

”ఒక సాధారణ పౌరుడు.. ఉదాహరణకు ఓ పెద్ద బట్టల దుకాణ్లో పనిచేసే గుమాస్తా, .. అలాంటివాళ్ళ ఫీలింగ్సు చెప్పు శివా..” రామం అడిగాడు
శివ వెంటనే తన చేతిలో ఉన్న కొన్ని కాగితాలనూ, లాప్‌టాప్‌ స్క్రీన్‌ను వెదికి ఒక్క నిముషంలో.. నంబర్‌ను వెదుక్కుని ఓ కాగితాన్ని బయటికి తీసి చదవడం ప్రారంభించాడు.

”ఇతను వందన బ్రదర్స్‌లో పనిచేసే ఒక గుమాస్తా.. గత ఐదేండ్లుగా చేస్తున్నాడు. పేరు – వల్లభనేని రామారావు. వయస్సు నలభై ఎనిమిది.. మొదటి ప్రశ్నకు జవాబు.. సామాజిక వాతావరణం ..మనమిచ్చిన మూడు ఆప్షన్స్‌ కాకుండా ఒక కొత్త ఆప్షన్‌ తనే రాశాడు.. ”భరించలేని, కాదు ఎవడూ బాగుచేయలేని స్థాయికి ఈ సమాజం చెడిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీ చెప్పాడుకదా యిక ఈ దేశాన్ని భగవంతుడుకూడా బాగుచేయడలేడని.. కాలుష్యం ఆ లెవెల్‌లో ఉంది. యిక రెండవ ప్రశ్న : మీరెవరోగాని ఈ ప్రశ్న కనీసం అడిగినందుకే నాకు పరమానందంగా ఉంది. దీనికి జవాబు తెల్సుకుని మీరేంజేస్తారో తెలియదుగాని కనీసం జనం గురించి కొందరు ఆలోచిస్తున్నందుకే రవ్వంత గర్వంగా ఉంది. యిక అవినీతి సంగతికదా.. చెబుతా.. వేయి రూపాయల కిరాయి కొంపలో కుక్కిన పేనువలె భార్యాపిల్లలతో గుట్టుచప్పుడు కాకుండా బ్రతుకేనేను మా ఓనర్స్‌ గొణుక్కుంటూ అప్పుడైదు వందలు అప్పుడైదు వందలుగా ఇచ్చే మూడువేల ఐదువందల రూపాయల జీతంతో ఎలా జీవిస్తానో ఆ భగవంతునికే ఎరుక.. యింట్లోనుండి బయటికి రాగానే మా వీధి మూలమీదో యాభైఫీట్ల వాకిలున్న విశాలమైన బిల్డింగు ఉంది. అది మా నగర ఎమ్మెల్యే ఉంపుడుగత్తె లలితాదేవిది. పొద్దున ఏడు గంటలనుండే ఆమె వాకిట్లో కార్లు, మోటార్‌ సైకిళ్ళు, ఆటోలు..ఫుల్‌ రష్‌. ఏంటయా అంటే.. ఎమ్మెల్యే గారితో చేయించుకోవాల్సిన అన్నిరకాల దిక్కుమాలిన పైరవీలకు బుకింగు పాయింట్‌ యిది. బుక్‌ ద కేస్‌, ఫిక్స్‌ ద రేట్‌.. టేక్‌ అడ్వాన్స్‌. పూర్తిగా బహిరంగ వ్యవహారం ఇది. పత్రికలవాళ్ళకు. పోలీసులకు, ప్రజాసంఘాలకు, నక్సలైట్లకు, సంఘ సంస్కర్తలకు.. అందరికీ తెలసిందే. ఏంజేస్తున్నారు ఎవరైనా. ఏమీ లేదు.. ఇంకాస్త ముందుకు రాగానే కుడిదిక్కు ఒక డిఎస్పీ ఉంచుకున్న రామలక్ష్మి ఇల్లు ఉంటది. యింటిముందు రెండు మనుషులకంటె పెద్దసైజు కుక్కలు. నిరంతరం ఇంట్లో బట్టలుతుకుడు దగ్గర్నుండి పిల్లల్ను బైటికి తీసుకుపోయి ఆడించేదాకా పోలీసుల చాకిరీ. ఉదయం, సాయంత్రం బుక్‌ ది కేస్‌.. టేక్‌ మనీ. అటుప్రక్క ఆడిటర్‌ రామనాథం. అన్ని రకాల ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ లావాదేవీలకు నగరంలో పెద్ద బ్రోకర్‌. ఆఫీసర్లకు అమ్మాయిలకు సప్లయ్‌ చేయడం దగ్గర్నుండి దొంగలెక్కలను స్కిప్‌ చేయడానికి, పన్ను ఎగవేయడానికి కోటి మార్గాలు వెదికి చూసి మందికొంపలు ముంచే పని. ఒక్క మా దుకాణం దొంగలెక్కలను కవర్‌ చేసినందుకు నేనే మొన్న రెండు లక్షల లంచమిచ్చిన. వాడు ఇరవై లక్షల పన్ను ఎగ్గొట్టించిండు. ఇంకో ఇవరై మీటర్లు నడువగానే ఒక ఇంద్రభవనం వంటి ఇర్రిగేషన్‌ సూపరింటెండ్‌ ఇంజినీర్‌ రామ్మూర్తి బిల్డింగు. (గారు అని సంబోధించడానికి సిగ్గనిపిస్తోంది) ఇరవై ఏండ్ల క్రితం ఆ స్థలంలోనే ఒక డొక్కు సైకిల్‌పై పోతున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా రామ్మూర్తి నాకు తెలుసు. అతను చిన్నప్పుడు మూడవక్లాసునుండి ఆరవక్లాస్‌దాకా నాకు క్లాస్‌మేట్‌. యిప్పుడు అతనికి ఒక పెళ్ళాం, ముగ్గురు ఉంపుడుగత్తెలు. కోట్ల ఆస్తులు. కిలోల బంగారం. దేవాదుల ప్రాజెక్ట్‌..ఎల్లంపల్లి.. ఓపెన్‌ కరప్షన్‌. అంతా బహిరంగమే.. ఏం జరుగుతోంది.. ఎవరేం పీకుతున్నారు వాళ్ళను (సారీ.. ఆవేశం, బాధ..దుఃఖం.. పేదవాడు ఒట్టిగా తిట్టుకోవడంకంటే ఏమీ చేయలేని నిస్సహాయ దుస్థితి) ఈ అవినీతిని చూడవలసినవాళ్లందరి కండ్లు చితికిపోయినయా.
వీటన్నింటిని మించి.. ఒక నగర రౌడీ.. రాజేందర్‌.. పిట్టల రాజేందర్‌.. వాని తండ్రి రౌడీ, వాని అన్న రౌడీ,  వాని పెండ్లాం ఆడ రౌడీ. వాడు విచ్చలవిడిగా నగరంమీద ఆంబోతులా పడి యింత అత్యాధునిక సమాజంలో అటవికంగా గుడిసెవాసులను, గవర్నమెంట్‌లో దొంగ అధికారులైన ఎఫ్‌సిఐ, గ్రేన్‌మార్కెట్‌, ఆప్కారీ, ప్రైవేట్‌ ఇంజినీరింగు కాలేజీలు, పాఠశాలలు, వేశ్యాగృహాలు, దొంగ సారాయి దుకాన్లు, రోడ్లకిరువైపుల ఉండే హాకర్ల హఫ్తాలు.. వానికి స్వయంగా మూడు  బినామీ బార్లు. వాని పెళ్ళానికి, ఉంపుడుగత్తెలకు ఆరు బ్రాండీ షాప్‌లు, లిక్కర్‌ షాపుల్లో ఎంఆర్‌పిని మించి ఇరవై శాతం ఎక్కువగా అమ్మే సిండికేట్‌లకు నాయకత్వం.. వీడు బహిరంగంగా బలిసి వెంట గుండా అనుచరులతో నెత్తిపై గొడుగు పట్టించుకుని ఊరేగుతూంటే.. ఒక్క..ఒక్క పోలీస్‌ అధికారిగానీ, కలెక్టర్లు, సబ్‌ కలెక్టరు, సిగ్గులేని పౌర సమాజం ఏం చేస్తోంది. గాజులు తొడుక్కుని కూర్చుంది.. అంతే..

…అబ్బా.. యిలా రాసుకుంటూపోతే యిదంతా ఒక గ్రంథమౌతుంది.

నిర్మూలన.. కుళ్ళిపోయిన దుష్టాంగ నిర్మూలన జరగాలి. అర్జంటుగా.
కాని ఎవరు చేస్తారు..? అదీ ప్రశ్న.. అదీ దుఃఖం.. అదీ నిస్సహాయత..”

శివ ఆగిపోయాడు.. చదవడం ముందకు సాగడంలేదు. గొంతు గద్గదమైంది.

వాతావరణమంతా..ఎవరో చనిపోతే దుఃఖం చుట్టూ వ్యాపించినట్టు.. విషాద గంభీరంగాఉంది. స్తబ్దత అంతా.

”ఈ ప్రజలకు ఓదార్పు కావాలి సార్‌.. రవ్వంత ప్రేమను, బ్రతుకు పట్ల పిడికెడు భరోసాను, ఒక తలనిమిరే అనునయింపును, కొద్దిగా వాత్సల్యాన్ని అందించే ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాల్సార్‌. నిజానికి అవినీతి మురుగు బురదలో కూరుకుపోయి ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎప్పుడో మృతిచెందాయి. ఈ సిస్టంను ఒక అంకుశం పోటుతో పునర్జీవింపజేయాలి..” అంటున్నాడు శివ..ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.

”మొత్తం పందొమ్మిది లక్షల ఇరవై రెండువేల నలభై మంది దుఃఖచరిత్రలు అవి శివా.. ఏ ఒక్కరూ నేను సంతోషంగా, ఆత్మసాక్షిగా, నీతిబద్ధంగా జీవిస్తున్నాడని చెప్పే పరిస్థితి లేదు. యిప్పుడు మనం వివిధ రకాల సామాజిక వర్గాల రోదనలను రికార్డ్‌ చేస్తున్నాం అంతే..ప్లీజ్‌ గొ ఎహెడ్‌..ఇంకో రెండు టిపికల్‌ కేస్‌లు విన్పించండి.” అన్నారు గోపీనాథ్‌.

శివ.. మరో కాగితాన్ని తీశాడు బయటికి.

”మూడు కేసులు విన్పిస్తున్నాను సార్‌. ఒకటి ఒక వేశ్యది. ఒకటి ఒక రచయితది. మరొకటి ఒక వైస్‌ ఛాన్స్‌లర్‌ది.. మొదటి కేస్‌.. పేరు బి. శ్యామల (నిజమైన పేరే) వయస్సు. ఇరవై ఏడు. వృత్తి శరీరాన్నమ్ముకోవడం. శరీరాన్నీ నమ్ముకోవడం. మొదటి ప్రశ్న : మూడవ ఆప్షన్‌కు టిక్‌ చేయబోయి.. మధ్యలో ఆగి.. రాసింది స్వయంగా.. అస్సలే భరించలేని కంపువలె ఈ సమాజం కలుషితమైపోయింది. రెండవ ప్రశ్న : నేను వేశ్యను. నాది అతినీతివంతమైన వృత్తి. సుఖాన్నందిస్తా, డబ్బు తీసుకుంటా. వృత్తి విషయంగా ఎటువంటి ఆత్మవంచన లేకుండా చాలా శుద్ధంగా, తృప్తిగా జీవిస్తున్నా. ఇప్పుడే పేపర్‌ చూచిన.. ఆంధ్రప్రదేశ్‌లో 6596 మద్యం షాపులను 7000 కోట్ల రూపాయలకోసం ప్రభుత్వం వేలం వేసి సంపాదించడంకంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వేశ్యాగృహాలను నడుపవచ్చనిపిస్తోంది. వేలంలో వందమంది మహిళలుకూడా పాల్గొని మద్యం షాపులను దక్కించుకున్నారట.. వాహ్‌ా.. భారతీయ పవిత్ర మహిళా నీకు జోహార్లు.. మహిళలందరం వీళ్ళందరికి హారతలు పట్టాలి. పోతే.. పత్రికలు చాలా స్పష్టంగా ఈ మద్యం షాపులు ఏఏ ప్రాంఆల్లో ఏఏ పార్టీవాళ్లు ఎన్ని దక్కించుకుని ఎవరెవరు సిండికేట్లుగా ఏర్పడ్డారో, ఏఏ మంత్రుల కొడు