పేదవాడి కుట్ర  

ramana1

 

 

-రమణ యడవల్లి

~

ఇది పవిత్ర భారద్దేశం. ఈ దేశం అటు ప్రాచీన సంస్కృతికీ ఇటు ఆధునికతకీ నిలయం. అలనాడు గంధర్వులు పుష్పక విమానంలో మబ్బుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ‘మనవాళ్ళొట్టి వెధవాయిలు’ కాబట్టి ఆ పుష్పక విమానం ఫార్ములానీ రైట్ బ్రదర్స్ ఎగరేసుకుపొయ్యారు. ఇంకో విషయం – మనం కొన్ని యుగాల క్రితమే వినాయకుడి తలని హెడ్ ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజితో మార్చేసుకున్నాం. ఇవ్వాల్టికీ అదెలా చెయ్యాలో అర్ధంగాక తల పట్టుకుంటున్నారు పాశ్చాత్య వైద్యాధములు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన ప్రధానమంత్రిగారు అనుక్షణం తపన పడుతూ యెక్కే విమానం, దిగే విమానంగా క్షణం తీరిక లేకుండా వున్నారు. ఫలితంగా – ఒకప్పుడు ప్రపంచ పటంలో ఎక్కడుందో తెలీని భారద్దేశం ఒక గొప్పదేశంగా అందరికీ తెలిసిపోయింది. త్వరలోనే అమెరికా, చైనాల్ని తలదన్నేంతగా తయారవబోతుంది. రండి – మన ప్రధానమంత్రులవారి కృషిని అభినందిద్దాం, వారి చేతులు బలోపేతం చేద్దాం.

మంచివారు మంచిపన్లే చేస్తారు, చెడ్డవారు చెడ్డపన్లే చేస్తారు. అలాగే – ఒక మంచిపనికి అడ్డుపడే దుర్మార్గులు అన్ని యుగాల్లోనూ వుంటూనే వున్నారు. అలనాడు ఉత్తములైన ఋషుల చేసే యజ్ఞాల్ని భగ్నం చెయ్యడానికి దుష్టులైన రాక్షసులు అనేక కుట్రలు పన్నారు. ఆ రాక్షస సంతితే ఇవ్వాళ మరోరూపంలో దేశాభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకొడానికి కుట్ర చేస్తుంది.

ఇదంతా యెందుకు చెబుతున్నానంటే – ఈమధ్య గుజరాత్‌లో నలుగురు కుర్రాళ్ళని కారుకి కట్టేసి ఇనప రాడ్లతో చావగొట్టార్ట. దేశంలో మరే వార్తలు లేనట్లు మీడియా ఈ విషయాన్ని చిలవలు పలవలు చేసి చెబుతుంది. నేను శాంతికపోతాన్ని, హింసని ఖండిస్తాను. కానీ – ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో హింసని సమర్ధించక తప్పదు. ఇప్పుడు ఆ కుర్రాళ్ళని కొట్టిన సంఘటన వెనుక కారణాల్ని విశ్లేషించుకుందాం.

ఈ దేశంలో పుట్టిన ప్రతివారూ హిందువులే, అందరికీ దైవం ఆ శ్రీరాముడే. ఇందులో ఎటువంటి వాదప్రతివాదాలకి తావు లేదు. మన ప్రభుత్వం పేదవారికి అనేక పథకాల ద్వారా సహాయం చేస్తోంది. తద్వారా అనేకమంది తమ జీవితాల్ని మెరుగు పర్చుకుంటున్నారు. అయితే – కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పథకాలకి దూరంగా వుంటున్నారు. చదువుకొమ్మంటే చదువుకోరు, ఉద్యోగం వున్నా చెయ్యరు, ఆహారం వున్నా తినరు. యెందుకు?

యెందుకంటే – కుళ్లుకంపు కొడుతూ డొక్కలు యెండిన తమ పేదరికాన్ని ప్రపంచం ముందు దీనంగా ప్రదర్శించుకోవాలి, అంతర్జాతీయంగా మన దేశం పరువు పోగొట్టాలి. ఇది ఖచ్చితంగా కుట్రే! అందుకు ఋజువు – ఆ దెబ్బలు తిన్న కుర్రాళ్లే. చావుకు అంగుళం దూరంలో వున్నట్లు, దరిద్రానికి దుస్తులు వేసినట్లు.. జాలిజాలిగా, నిస్సహాయంగా, బాధతో అరుస్తూ, భయంతో వణికిపోతూ యెంత అసహ్యంగా వున్నారో కదా! గుండెని కలచివేసే వారి పేదరిక ప్రదర్శనకి ప్రపంచం కదిలిపోవచ్చు గాక, కానీ మన్లాంటి మేధావులు మోసపోరాదు.

ఈ దేశంలో అందరూ సమానమే. మనం కష్టపడ్డాం, అవకాశాలు అంది పుచ్చుకున్నాం, జీవితంలో స్థిరపడ్డాం, సుఖంగా బ్రతికేస్తున్నాం. ఇవ్వాళ మనకి గాలి యెలా పీల్చుకోవాలో చెప్పేందుకు బాబా రాందేవ్‌గారు వున్నారు, యెలా జీవించాలో చెప్పేందుకు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌గారు వున్నారు, యెలా ఆసనాలు వెయ్యాలో చెప్పేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రిగారే వున్నారు. ‘ఇవన్నీ మాకు అక్కర్లేదు, మేం మా పేదరికంలోనే మగ్గిపొతాం’ అని మొరాయించేవాళ్ళని యెవరు మాత్రం యేం చెయ్యగలరు!?

మనది పుణ్యభూమి, కర్మభూమి. అన్నిరకాల ఆహారాల్లోకి శాకాహరం మాత్రమే అత్యున్నతమైనదని వేదాలు ఘోషిస్తున్నయ్. అసలు ఆహారం కోసం ఇంకో ప్రాణిని చంపడమే దారుణం, అంచేత మాంసాహారం నీచమైనది. ఈ మహాసత్యాన్ని గుర్తించని కొందరు ‘మా ఆహారం, మా అలవాటు, మా ఇష్టం’ అంటూ వితండ వాదం చేస్తున్నారు.

మనం శాంతి కాముకులం, ఇతరుల అలవాట్లని గౌరవించే సంస్కారం వున్నవాళ్ళం. కాబట్టే అత్యంత దయతో – “వురేయ్ అబ్బాయిలూ! మాంసాహారం మహాపాపం. ఈ విషయాన్ని ముందుముందు మీరే తెలుసుకుంటారు. సరే! కోళ్ళు, కుక్కలు.. మీ ఇష్టం.. మీరేవైఁనా తినండి, మాకనవసరం. కానీ – గోవు మా తల్లి, దయచేసి మా తల్లి జోలికి మాత్రం రాకండి.” అని చిలక్కి చెప్పినట్లు చెప్పాం.

నేను ముందే మనవి చేసినట్లు వీళ్ళు పేదరికం ముసుగేసుకున్న అరాచకవాదులు. మనం యేది వద్దంటామో అదే చేస్తారు, యెంత సౌమ్యంగా చెబుతామో అంతగా రెచ్చిపోతారు. మన మంచితనాన్ని అసమర్ధతగా భావిస్తారు. అందుకే గుజరాత్‌లో మన తల్లి చర్మం వలిచేందుకు తెగబడ్డారు. మీరే చెప్పండి, మీ మాతృమూర్తి చర్మం వలిచేవాళ్ళని మీరైతే యేం చేస్తారు?

“మీరు వాళ్ళని గొడ్డుని బాదినట్లు బాదడం తప్పు.”

“అయ్యా! మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఆ నలుగురు కుర్రాళ్ళు తప్పుడు పని చేశారు. చెడుమార్గం పట్టిన కొడుకుని తండ్రి శిక్షించకుండా ఉపేక్షిస్తాడా? యెంత కొట్టినా దాని వెనుక ప్రేమ తప్ప ఇంకేమీ వుండదు కదా? ఇదీ అంతే! వాళ్ళు చేసింది హత్య, మానభంగం లాంటి సాధారణ నేరం కాదు – అత్యంత హేయమైన నేరం. నేరానికి తగ్గ శిక్ష పడాలి కదా! అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో (యెంతో బాధ పడుతూ) ఇనప రాడ్లతో బాదాల్సి వచ్చింది. ఇది మన దేశ సాంప్రదాయతని కాపాడ్డానికి చేసిన పుణ్యకార్యంగా మీరు భావించాలి.”

“నిందితుల్ని పట్టుకుని పోలీసులకి అప్పజెప్పాలి. వాళ్ళు నేరస్తులని చట్టబద్దంగా నిరూపణ కావాలి. మీరిలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అన్యాయం.”

“ఊరుకోండి సార్! మీరు మరీ అమాయకుల్లా వున్నారు. నేరం, చట్టం లాంటి పదాలు లలిత్ మోడీ, విజయ్ మాల్యాలకే గానీ సాధారణ ప్రజానీకానిక్కాదు. వాళ్ళు నీచులు, నీచులకి నీచభాషలోనే చెప్పాలి. అందుకే తాట వూడేట్లు బాది పడేశాం. అయినా మనకెందుకు భయం!? స్టేట్‌లో మనవేఁ, సెంటర్లో మనవేఁ. ఈ హడావుడి రెండ్రోజులే. ఆ తరవాత మళ్ళీ మామూలే.”

“ఆవుని చంపడం నేరం అని దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేసే చర్యలు చేపడదాం. అవసరమైతే రాజ్యంగ సవరణ చేయిద్దాం. ఆ కుర్రాళ్లని చావగొట్టడం.. ”

“ఎళ్ళెళ్ళవయ్యా! పెద్ద చెప్పొచ్చావ్! నీ మాత్రం మాకు తెలీదనుకున్నావా? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మేం మా పని చేసుకుంటూ పోతాం. కాబట్టే మేం గోరక్షక ముఠాలుగా యేర్పడ్డాం.”

“కానీ, చట్టబద్ద పాలన.. ”

“అసలెవడ్రా నువ్వు? ఇందాకట్నించీ ఒకటే లెక్చర్లిస్తున్నావ్! ఎవర్రా అక్కడ? ముందీ గాడ్దె కొడుకుని ఆ కారుకి కట్టేయ్యండి. మొన్న మనం వాడి పడేసిన ఆ ఇనప రాడ్లు తీసుకురండి.”

“హెల్ప్.. హెల్ప్.. ”

 

*

టూత్ఏక్.. టూ మెనీ డౌట్స్

 

 

 

 

-రమణ యడవల్లి 

~

సుబ్బు నా చిన్ననాటి స్నేహితుడు. మా స్నేహం ఇప్పటికీ మూడు మసాలా దోసెలు, ఆరు కాఫీలుగా వర్ధిల్లుతుంది. సుబ్బుకి ఉద్యోగం సద్యోగం లేదు, పెళ్ళీపెటాకుల్లేవు. వుండడానికో కొంపా, వండి పెట్టడానికో తల్లీ వున్నారు. మావాడు కబుర్ల పుట్ట, వార్తల దిట్ట.

ప్రస్తుతం నా కన్సల్టేషన్ చాంబర్లో సోఫాలో కూలబడి వున్నాడు సుబ్బు. కుడిబుగ్గ మీద అరచెయ్యి ఆనించుకుని, ఏసీబీ రైడ్సులో దొరికిపోయిన ప్రభుత్వోద్యోగిలా దిగాలుగా వున్నాడు సుబ్బు.

“సుబ్బూ! సిగరెట్లు మానెయ్యమని మొత్తుకుంటూనే వున్నాను, విన్నావు కాదు – అనుభవించు.” అన్నాను.

“ఆ చెప్పేదేదో సరీగ్గా చెప్పొచ్చుగా! ‘సత్యము పలుకుము, పెద్దలని గౌరవింపుము’ టైపులో నీతివాక్య బోధన చేస్తే నేనెందుకు వినాలి?” అన్నాడు సుబ్బు.

“ఇంకెట్లా చెప్పాలోయ్! ‘సిగరెట్లు తాగితే ఛస్తావ్’ అని చెబుతూనే వున్నాగా!?” ఆశ్చర్యపొయ్యాను.

“సిగరెట్లు తాగేవాడు సిగరెట్ల వల్లే చావాలని రూలేమన్నా వుందా? ఈ దేశంలో దోమతో కుట్టించుకుని చావొచ్చు, ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని చావొచ్చు, ఫ్రిజ్జులో మాంసం వున్నందుకు తన్నించుకుని చావొచ్చు, మునిసిపాలిటీ మేన్‌హోల్లో పడి చావొచ్చు. అసలెలా చస్తామో తెలిసి చస్తేనే కదా, అలా చావకుండా ముందు జాగర్తలు తీసుకునేది?” అన్నాడు సుబ్బు.

“అంతేగాని సిగరెట్లు తాగితే చస్తారన్న సంగతి మాత్రం ఒప్పుకోవు.” అన్నాను.

“ఒప్పుకుంటాను. ఈ లోకంలో సిగరెట్ల వల్ల చచ్చేది ఇద్దరైతే, ఇతర కారణాల్తో వెయ్యిమంది చస్తున్నారు. ఇటు సిగరెట్టు మానేసి, రేపింకేదో కారణంతో చస్తే దానికన్నా దారుణం మరోటుంటుందా?” నవ్వుతూ అన్నాడు సుబ్బు.

కొందరు విషయం తమకి అనుకూలంగా వుండేట్లు వితండవాదం చేస్తారు, అందులో మా సుబ్బు గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు సిగరెట్లు ఆరోగ్యానికి మంచిదని ఇంకో లెక్చర్ ఇవ్వగల సమర్ధుడు. సుబ్బు ధోరణి నాకలవాటే.

ఇవ్వాళ సుబ్బుని చూస్తుంటే జాలేస్తుంది. అసలు విషయం – రెండ్రోజులుగా మా సుబ్బు పంటినొప్పితో బాధ పడుతున్నాడు.

నిన్న ఫోన్ చేశాడు సుబ్బు.

“పన్ను నొప్పిగా వుంది.”

“పెయిన్ కిల్లర్స్ వాడి చూడు. తగ్గకపోతే అప్పుడు చూద్దాం.” అన్నాను.

“నేను ఇంగ్లీషు మందులు వాడను, సైడ్ ఎఫెక్టులుంటయ్.” అన్నాడు సుబ్బు.

“మందులకి ఇంగ్లీషు, తెలుగు అంటూ భాషాబేధం వుండదోయ్. నీకు రోగం తగ్గాలా వద్దా?” నవ్వుతూ అన్నాను.

“ఇంగ్లీషు మందులు వాడితే వున్న రోగం పొయ్యి కొత్త రోగం పట్టుకుంటుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.

“అట్లాగా! మరి ఫోనెందుకు చేశావ్?” విసుగ్గా అన్నాను.

“ఊరికే! నువ్వేం చెబుతావో విందామని!” నవ్వాడు సుబ్బు.

‘వీడీ జన్మకి మారడు.’ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను.

ఇవ్వాళ నొప్పి బాగా ఎక్కువైందిట, నా దగ్గరకొచ్చేశాడు – అదీ విషయం.

“ఇంగ్లీషు మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి, నువ్వు వాడవుగా!” వ్యంగ్యంగా అన్నాను.

“అవును, కానీ వాడాలని నువ్వు ముచ్చట పడుతున్నావుగా! ఒక స్నేహితుడిగా నీ కోరిక తీర్చడం నా ధర్మం. కాబట్టి నిన్న చెప్పిన ఆ మందులేవో రాసివ్వు, వాడి పెడతాను.” అన్నాడు సుబ్బు.

“బుగ్గ కూడా వాచింది సుబ్బూ! ఇదేదో పెద్దదయ్యేట్లుంది. డెంటల్ డాక్టర్ దగ్గరకి వెళ్దాం పద.” టైమ్ చూసుకుంటూ లేచాను.

సుబ్బు కుర్చీలోంచి లేవలేదు.

“నీతో నేన్రాను. నువ్వూ, ఆ డాక్టరు నా పంటి గూర్చి డిసైడ్ చేసేసి ఏదో చేస్తారు. హడావుడిలో పన్ను పీకించినా పీకేంచేస్తావు, నీదేం పోయింది.” నిదానంగా అన్నాడు సుబ్బు.

“అంటే – నీకు నామీద నమ్మకం లేదా?” కోపంగా అన్నాను.

“ఎంతమాట! నువ్వు నా ప్రాణస్నేహితుడివి. కావాలంటే నీ కోసం నా ప్రాణాన్నిచ్చేస్తాను, కానీ పన్నుని మాత్రం ఇవ్వలేను.” నొప్పిగా నవ్వుతూ అన్నాడు సుబ్బు.

“సుబ్బు! ఎక్కువ మాట్లాడకు. న్యాయంగా మాట్లాడితే నీమీదసలు జాలి చూపకూడదు.” చిరాగ్గా అన్నాను.

“చూడబోతే నా టూత్ఏక్ నీకు సంతోషంగా వున్నట్లుంది.” నిష్టూరంగా అంటూ అరచెయ్యి దవడపై ఆనించి బాధగా కళ్ళు మూసుకున్నాడు.

పాపం! బిడ్డడికి బాగా నొప్పిగా వున్నట్లుంది.

“సరే. నా ఫ్రెండ్ డాక్టర్ సుబ్రమణ్యంకి ఫోన్ చేసి చెబుతాను. సిటీలో ఇప్పుడతనే టాప్ డాక్టర్. నువ్వే వెళ్లి చూపించుకో.” అన్నాను.

“నేను బిజీ డాక్టర్ల దగ్గరకి పోను. వాళ్ళు హడావుడిగా పైపైన చూస్తారు.” అన్నాడు సుబ్బు.

“పోనీ – నీ పంటిని నిదానంగా, స్పెషల్‌గా చూడమని చెబుతాను. సరేనా?” అన్నాను.

“సరే గానీ – నాకో అనుమానం వుంది.” గుడ్లు మిటకరించాడు సుబ్బు.

“యేంటది?” అడిగాను.

“డెంటల్ డాక్టర్లు అవే ఇన్‌స్ట్రుమెంట్లు అందరి నోట్లో పెడుతుంటారు కదా! సరీగ్గా కడుగుతారంటావా?” అన్నాడు సుబ్బు.

“కడుగుతార్లే సుబ్బూ! అయినా ఇన్ని డౌట్లు సర్జరీ చేయించుకునే వాడిక్కూడా రావు.” అసహనంగా అన్నాను.

“పన్ను నాది, నొప్పి కూడా నాదే. అన్ని నొప్పుల్లోకి తీవ్రమైనది పన్నునొప్పి అని నీవు గ్రహింపుము.” నీరసంగా నవ్వాడు సుబ్బు.

“గ్రహించాన్లే, పోనీ డాక్టర్ రంగారావు దగ్గరకి వెళ్తావా?” అడిగాను.

“ఎవరు? బ్రాడీపేట మెయిన్ రోడ్డులో వుంటాడు, ఆయనేనా?”

“అవును, ఆయనే.”

“రోజూ అటువైపుగా వెళ్తుంటాను. యేనాడూ ఒక్కడంటే ఒక్క పేషంటు కూడా నాక్కనపళ్ళేదు.” అన్నాడు సుబ్బు.

“నీక్కావల్సిందీ అదేగా సుబ్బూ! ఆయన దగ్గర జనం తక్కువగా ఉంటారు. శ్రద్ధగా ఎక్కువసేపు చూస్తాడు, ఇన్‌స్ట్రుమెంట్లూ శుభ్రంగా వుంటాయి.” అన్నాను.

“అంత శ్రద్ధగా చూసేవాడైతే ప్రాక్టీసు లేకుండా ఖాళీగా ఎందుకున్నాడంటావ్?” అడిగాడు సుబ్బు.

“యేమో! నాకేం తెలుసు?”

“నీకే తెలీదంటే – ఆయన వైద్యంలో ఏదో లోపం వుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.

“నీకు నీ పంటినొప్పికి ట్రీట్మెంట్ కావాలా? డాక్టర్ల బయోడేటా కావాలా?” విసుక్కున్నాను.

“పేషంటన్నాక అన్నీ విచారించుకోవాలి.”

“వొప్పుకుంటాను. కానీ నీక్కావలసింది పంటి వైద్యం, గుండె వైద్యం కాదు.”

“గుండె ఒక్కటే వుంటుంది. అదే నోట్లో పళ్ళైతే? ముప్పైరెండు! డాక్టర్లు కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ ఎక్కువ. పొరబాటున ఒకదాని బదులు ఇంకోటి పీకేస్తే!” అన్నాడు సుబ్బు.

“నాయనా! నీకో నమస్కారం. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు.” అన్నాను.

“నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు. ఆసనాల బాబా పళ్ళపొడి వేసి పసపసా తోమితే పంటినొప్పి ఇట్టే మాయమౌతుందని టీవీల్లో చెబుతున్నారు.” అంటూ లేచాడు సుబ్బు.

“సుబ్బూ! శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందిట! ఇన్ని కబుర్లు చెబుతావ్, చివరాకరికి నువ్వు చేసే పని ఇదా!” అన్నాను.

“ఈ దేహం భారతీయం, ఈ పన్నూ భారతీయమే. తరతరాలుగా మన పూర్వీకులు ప్రసాదించిన ప్రకృతి వైద్యం గొప్పదనాన్ని నేను నమ్ముతాను. ఆసనాల బాబా పళ్ళపొడిని వాడి మన భారతీయ సాంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచానికి యెలుగెత్తి చాటుతాను. ఇంగ్లీషు డాక్టర్లు డౌన్ డౌన్, ఆసనాల బాబా జిందాబాద్!” అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

నాకు విషయం బోధపడింది! సుబ్బుకి డాక్టర్లంటే భయం. దాన్ని కప్పిపుచ్చుకోడానికి యేదేదో మాట్లాడాడు.

కొద్దిసేపటికి నా పనిలో నేను బిజీ అయిపొయ్యాను.

సాయంకాలం సుబ్బు మదర్ ఫోన్.

“ఒరే నాయనా! ఇక్కడ సుబ్బు పరిస్థితి ఏమీ బాగాలేదు. అదేదో పళ్ళపొడి తెచ్చుకుని మధ్యాహ్నం నించి పళ్ళకేసి ఒకటే రుద్దుడు. నోరంతా పోక్కిపొయింది, మూతి వాచిపోయింది. మాట్లాళ్ళేకపోతున్నాడు, సైగలు చేస్తున్నాడు.” అన్నారావిడ.

“అమ్మా! వాణ్ని నోరు మూసుకుని నే చెప్పినట్లు చెయ్యమను.” అన్నాను.

“వాడిప్పుడు నోరు మూసుకునే వున్నాడు, తెరవలేడు. మళ్ళీ మూసుకొమ్మని చెప్పడం దేనికి?” ఆశ్చర్యపొయ్యారావిడ.

ఈవిడ అన్నివిధాలా సుబ్బుకి తల్లే!

“సరేనమ్మా, కారు పంపిస్తున్నాను. ఆ వెధవని అర్జంటుగా నా దగ్గరకి రమ్మను. వెళ్ళనంటే కర్ర తీసుకుని నాలుగు బాది కార్లోకి నెట్టు.” అంటూ ఫోన్ పెట్టేసి డ్రైవర్ కోసం కాలింగ్ బెల్ నొక్కాను.

~

కృతజ్ఞత –

ఈ రచన ప్రధాన పాయింట్‌కి ఆధారం – చాలాయేళ్ళ క్రితం ‘హిందు’ చివరిపేజిలో వచ్చిన ఆర్ట్ బక్‌వాళ్ (Art Buchwald) కాలమ్.

*

మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!

 

 

 

రమణ యడవల్లి 

———————-

“ప్రధాన మంత్రిని అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్‌వ్యూ చూశావా?” అడిగాడు నా స్నేహితుడు.

“చూళ్ళేదు.” అన్నాను.

“అదృష్టవంతుడివి. నాకా ఇంటర్‌వ్యూ ఉప్మా లేని పెసరట్టులా చప్పగా అనిపించింది. అర్నబ్ గోస్వామికి బుద్ధిమంతుడి వేషం నప్పలేదు. థాంక్స్ టు మోడీ, అర్నబ్ నోర్మూసుకుంటే యెలా వుంటాడో మొదటిసారి చూశాను.” అంటూ నవ్వాడు నా స్నేహితుడు.

గత కొన్నేళ్లుగా టీవీ మీడియంలో అర్నబ్ గోస్వామి పేరు మోగిపోతుంది. మోడెస్టీ కోసం తానో జర్నలిస్టునని చెప్పుకుంటాడు కానీ, అర్నబ్ జర్నలిస్టు స్థాయి ఎప్పుడో దాటిపొయ్యాడు! అతను ఒక షోమేన్, ఒక పెర్ఫామర్! సినిమా నటులు పాత్రోచితంగా అనేక రసాలు పండిస్తారు. అర్నబ్ ‘చర్చో’చితంగా కోపావేశాల్ని పండిస్తాడు. సినిమావాళ్ళది బాక్సాఫీస్ దృష్టైతే, అర్నబ్‌ది టీఆర్పీ దృష్టి!

అర్నబ్ గోస్వామి పాపులారిటీకి కారణం యేమిటి? యే దేశంలోనైనా సుఖమయ జీవనం సాగిస్తూ కులాసాగా ఆలోచించే వర్గం ఒకటి వుంటుంది. వీళ్లు రాజకీయంగా కలర్ బ్లైండెడ్‌. అంటే – ప్రతి సమస్యనీ బ్లాక్ వైట్‌లోనే ఆలోచిస్తారు, అధికారిక (ప్రభుత్వ) వెర్షన్‌ని సమర్ధించేందుకు రెడీగా వుంటారు, ప్రభుత్వ అభివృద్ధి నమూనాల పట్ల విశ్వాసం కలిగుంటారు (తమకీ ఓ రవ్వంత వాటా దొరక్కపోదా అన్న ఆశ కూడా వుంటుందనుకోండి). వీరిలో ఎక్కువమంది వేతనశర్మలు (చూడుము – రావిశాస్త్రి ‘వేతనశర్మ కథ’).

ఈ అర్నబ్ గోస్వామి వీక్షక వర్గం సోషల్ మీడియాని ప్రతిభావంతంగా వాడుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ గూర్చి కేంద్ర హోమ్ శాఖ చెప్పింది కరెక్ట్. వ్యతిరేకించావా? – నువ్వు ‘మావోయిస్టు టెర్రరిస్టువి’.  కల్బుర్గి హంతకుల కోసం ప్రభుత్వం ఇంకా వెదుకుతూనే వుంది. ప్రశ్నించావా? – నువ్వు ‘సూడో సెక్యులరిస్టువి’. రోహిత్ వేముల ఆత్మహత్య కేంద్రాన్ని కలచివేసింది! సందేహించావా? – నువ్వు ‘దేశద్రోహివి’.

ఈ వర్గంవారి అభిప్రాయాల పట్ల ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆసక్తికర అంశం యేమంటే – ‘రాజకీయాలు చెత్త, అవి మాట్లాడ్డం టైమ్ వేస్ట్’ అన్న లైన్ తీసుకున్న ‘న్యూట్రల్’ వ్యక్తులు కొన్నాళ్లుగా ఘాటైన రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చడం! అవి అచ్చు అర్నబ్ గోస్వామి అభిప్రాయాలే! ప్రతి అంశాన్నీ సింప్లిఫై చేసి బ్లాక్ ఎండ్ వైట్‌లో ప్రెజెంట్ చేసే అర్నబ్ గోస్వామి స్టైల్ వీళ్ళకి బాగా నచ్చింది.

మర్నాడు న్యూస్‌పేపర్లలో పదోపేజీలో కూడా రిపోర్ట్ కాని అంశాన్ని కొంపలు మునిగిపొయ్యే సమస్యలా చిత్రించ గలగడం అర్నబ్ గోస్వామి ప్రతిభ. అతని డిబేట్లు WWE కుస్తీ పోటీల్లా స్క్రిప్టెడ్ కేకలు, అరుపుల్తో గందరగోళంగా వుంటాయి. చూసేవాళ్ళకి ‘ఈ వీధిపోరాటంలో ఎవరు గెలుస్తారు’ లాంటి ఆసక్తి కలుగుతుంది. ఇట్లాంటి చౌకబారు ఆసక్తిని రేకెత్తించి వ్యూయర్‌షిప్ పెంచుకోవటమే టైమ్స్ నౌ చానెల్ వారి ఎజెండా. ప్రతిభావంతులైన నటుల్ని అభినందించినట్లుగానే అర్నబ్ గోస్వామిని కూడా అభినందిద్దాం.

టీవీల్లో వార్తల్ని విశ్లేషించే చర్చా కార్యక్రమాలకి కొంత ప్రాముఖ్యత వుంటుంది. వీక్షకులకి ఎదుటివారి వాదన యేమిటనేది తెలుసుకోడానికీ, తమకంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడానికి ఈ చర్చలు ఉపయోగకరంగా వుంటాయి. కానీ – అర్నబ్ గోస్వామి స్టూడియోలో కూర్చుని ప్రతి సబ్జక్టు పైనా ముందుగానే ఒక ఖచ్చితమైన అభిప్రాయం యేర్పరచుకుని వుంటాడు. ఆ అభిప్రాయంలో తీవ్రమైన దేశభక్తీ, భీభత్సమైన ధర్మాగ్రహం వుంటాయి. ఈ కారణాన – తన అభిప్రాయాన్ని వొప్పుకోనివారికి తిట్లు తినే సదుపాయం తప్ప, మాట్లాడే హక్కుండదు. ఈ సంగతి తెలుసుకోకుండా అర్నబ్ షోలో పాల్గొన్న JNU విద్యార్ధులకి యేమైందో మనకి తెలుసు.

“టీఆర్పీ రేటింగ్ కోసం చర్చా కార్యక్రమాన్ని వినోద స్థాయికి దించడం దుర్మార్గం.” ఒక సందర్భంలో నా స్నేహితుడితో అన్నాను.

“నీకు మర్యాదస్తుల న్యూస్ డిబేట్ కావాలంటే బిబిసి చూసుకో! మజా కావాలంటే అర్నబ్‌ని చూడు. అది సరేగానీ, అర్నబ్ డిబేట్లలో స్క్రీన్ మీద మంటలు మండుతుంటాయి. ఎందుకో తెలుసా?” అడిగాడు నా స్నేహితుడు.

“తెలీదు.” ఒప్పేసుకున్నాను.

“అరుంధతి రాయ్, తీస్తా సెటిల్వాడ్ లాంటి దేశద్రోహుల్ని అందులో పడేసి రోస్ట్ చేసెయ్యడానికి.” కసిగా అన్నాడతను.

ఈ విధంగా ప్రజలు ప్రశాంతంగా టీవీ చూసేస్తూ చాలా విషయాల పట్ల చక్కటి అవగాహన యేర్పరచుకుంటున్నారు! ‘ముఖ్యమైన’ సమాచారం ప్రజలకి చేరే విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వుంటాయి. తమకి ఇబ్బందిగా ఉండే విషయాల్లో (రాజకీయాలకి బయటనున్న ప్రజల) ఒపీనియన్ మేకింగ్ అన్నది అధికారంలో వున్నవాళ్ళకి చాలా అవసరం. ఈ వ్యవహారం సాఫీగా సాగడానికి అనేకమంది స్టేక్‌హోల్డర్స్‌ పాటుపడుతుంటారు (చూడుము – Noam Chomsky ‘Media Control’).

ఇంతటితో నేను చెబ్దామనుకున్న విషయం అయిపోయింది. అయితే – చెప్పుల షాపులో పన్జేసే వ్యక్తి దృష్టి తనకి తెలీకుండానే ఎదుటివారి చెప్పుల వైపు పోతుంది. దీన్ని occupational weakness అనుకోవచ్చు. వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని కాబట్టి చాలా అంశాల్లో సైకలాజికల్ యాస్పెక్ట్స్ కూడా ఆలోచిస్తాను. అంచేత కొద్దిసేపు – సైకాలజీ బిహైండ్ అర్నబ్ గోస్వామి సక్సెస్.

ఒక వ్యక్తి ‘చర్చా కార్యక్రమం’ అంటూ గెస్టుల్ని పిలిచి మరీ చెడామడా తిట్టేస్తుంటే, చూసేవారికి ఎందుకంత ఆనందం? సైకాలజీలో Frustration-Aggression అని ఒక థియరీ వుంది. సగటు మనిషికి దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, చిరాకు.. ఇవన్నీ frustration కలిగిస్తాయి. ఈ frustration ఒక స్టీమ్ ఇంజన్ లాంటిదని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఇంజన్ స్టీమ్ వదలాలి, లేకపోతే పేలిపోతుంది. అంచేత frustration అనేది తప్పనిసరిగా aggression కి దారితీస్తుంది. సగటు మనిషిలో వున్న ఈ aggression కి అర్నబ్ గోస్వామి కార్యక్రమం ఒక విండోగా ఉపయోగపడుతుంది. అందుకే చూసేవారిలో అంత ఆనందం!

అన్ని వృత్తుల్లాగే – జర్నలిస్టులకీ వృత్తి ధర్మం వుంటుంది. వాళ్ళు అధికారంలో వున్నవాళ్ళని ప్రజల తరఫున ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టాలి. మరప్పుడు అర్నబ్ గోస్వామి – “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! విదేశాల నుండి నల్లడబ్బు తెచ్చే విషయం ఎందాకా వచ్చింది? NSG కి చైనా అడ్డుపడకుండా ఎందుకు ఆపలేకపొయ్యారు? అదానీ వ్యాపారానికి అన్నేసి రాయితీలు ఎందుకిస్తున్నారు?” అని అడగాలి. అతనికి ప్రధాన మంత్రి ఆఫీసు నుండి ఫలానా ప్రశ్నల్ని అడక్కూడదనే ఆదేశాలు వొచ్చి వుండొచ్చు. అయితే చండప్రచండులైన గోస్వాములువారు ప్రధాన మంత్రి ఆఫీసు ఆదేశబద్దులై వుంటారా? వుండకూడదు కదా! స్టూడియోలో కూర్చుని కేకలేస్తూ గెస్టుల్ని తిట్టేసే అర్నబ్ గోస్వామి, ప్రధానమంత్రి దగ్గర వినయపూర్వకంగా ఎందుకు వొదిగిపొయ్యాడు?

సోషల్ సైకాలజీలో Obedience to Authority అని ఒక థియరీ వుంది. ఇది ‘పైనుండి’ వచ్చే అదేశాల్ని తుచ తప్పకుండా పాటించేవారి మనస్తత్వాన్ని చర్చిస్తుంది. లక్షలమంది యూదుల్ని హిట్లర్ వొక్కడే చంపలేదు, చంపలేడు. అతనికి తన ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసిన నాజీ అధికారులు తోడయ్యారు. మన సివిల్ పోలీసులు పై ఆధికారుల ఆదేశాలని పాటిస్తూ నిరసన చేస్తున్న వికలాంగులు, వృద్ధులు, స్త్రీలని చావ చితక్కొడతారు. ఈ పోలీసులే పోలీసు అధికారుల ఇళ్లల్లో ఆర్దర్లీలుగా మగ్గిపోతుంటారు (చూడుము – పతంజలి ‘ఖాకీవనం’, స్పార్టకస్ ‘ఖాకీబ్రతుకులు’).

అర్నబ్ గోస్వామి టీఆర్పీ కోసం aggression చూపిస్తాడు, తన కెరీర్ కోసం Obedience to Authority కూడా చూపిస్తాడు. స్టూడియోలో కూర్చుని చిన్నాచితకా నాయకుల్ని మందలిస్తూ, దేశభక్తిపై లెక్చర్లిచ్చే అర్నబ్ గోస్వామి బ్రతక నేర్చినవాడు. అందుకే ఎక్కడ ఎలా వుండాలో అర్ధం చేసుకుని సెలబ్రిటీ జర్నలిస్టయ్యాడు. ఇతగాడి విజయ యాత్ర యెందాకా సాగుతుందో తెలీదు గానీ, అది ఎంత తొందరగా ముగిసిపోతే దేశానికీ, ప్రజలకీ అంత మంచిదని నమ్ముతూ –

“మిస్టర్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!”

*

పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!

 

 

-రమణ యడవల్లి
~
 
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే పాలకులు. ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగినవారెవరైనా సరే – ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు, గెలవచ్చు. ప్రజలకి పజ్జెనిమిదేళ్ళు నిండగాన్లే ఓటుహక్కు వస్తుంది, ఈ హక్కుతో వారు ప్రజాప్రతినిథుల్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రభుత్వాల్ని యేర్పాటు చేస్తారు. ఇంత పారదర్శకమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇంకోటి వున్నట్లు నాకైతే తెలీదు.
 
మన్దేశంలో రాజ్యం అనుక్షణం ప్రజల సంక్షేమం గూర్చే తపన పడుతుంటుంది. అందువల్ల ప్రజలు తమగూర్చి తాము ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం యేది తినాలో, యేది తినకూడదో పాలకులే నిర్ణయిస్తారు. ఇది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమేనని మీరు అర్ధం చేసుకోవాలి. ఓటేసే హక్కుంది కదాని యేదిబడితే అదితింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాలకులకి ప్రజలు బిడ్డల్లాంటివారు. మనం మన పిల్లల మంచికోసం జాగ్రత్తలు తీసుకోమా? ఇదీ అంతే!
 
ఇక సినిమాల సంగతికొద్దాం. ఈ దేశంలో సామాన్యుల వినోద సాధనం సినిమా. తినేతిండి విషయంలోనే సరైన అవగాహన లేని ప్రజలకి యేం చూడాలో యేం చూడకూడదో మాత్రం యెలా తెలుస్తుంది? తెలీదు. అందుకే ప్రజలకి మంచి సినిమాలు మాత్రమే చూపించేందుకు పాలకులు ‘సెన్సార్ బోర్డ్’ అని ఒక సంస్థ నెలకొల్పారు. ఇందుగ్గాను మనం ప్రభుత్వాలకి థాంక్స్ చెప్పాలి.
 
‘సినిమా చూసే విషయంలో ఒకళ్ళు మనకి చెప్పేదేంటి?’ అని ఈమధ్య కొందరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అనార్కిస్టులు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటిస్తాం? మన మంచి కోసమేగా? ఇదీ అంతే! ఆ తెలుగు సినిమావాళ్ళని చూడండి.. బుద్ధిగా రూల్స్ పాటిస్తూ పాటలు, ఫైట్సు, పంచ్ డైలాగుల్తో మాత్రమే సినిమా తీసేస్తారు. ఒక్క తెలుగు సినిమానైనా సెన్సారువాళ్ళు అభ్యంతర పెట్టారా? లేదు కదా! అంటే ట్రాఫిక్ రూల్సు పాటించనివారి వాహనం సీజ్ చేసినట్లే.. సమాజం, సమస్యలు అంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సినిమాల్ని మాత్రమే సెన్సారువాళ్ళు ఆపేస్తున్నారు.
 
అసలు సెన్సార్ బోర్డ్ అంటే యేంటి? అమాయకులైన ప్రజలు యేదిపడితే అది చూసి చెడిపోకుండా వుండేందుకు ప్రభుత్వంవారిచే నియమింపబడ్డ సంస్థ అని ఇందాకే చెప్పుకున్నాం. సెన్సారు బోర్డులో దేశం పట్ల, దాని బాగోగుల పట్లా అవగాహన కలిగినవారు మాత్రమే సభ్యులుగా వుంటారు. వారు మిక్కిలి నీతిపరులు, జ్ఞానులు, మేధావులు. కనుకనే రాముడి కోసం శబరి ఫలాల్ని ఎంగిలి చేసినట్లు, అన్ని సినిమాల్ని ముందుగా చూస్తారు. ఆపై మనం యేది చూడొచ్చో, యేది చూడకూడదో వడపోస్తారు (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది, కొద్దిసేపు ఆగుతాను).
 
ఈ విధంగా దేశసేవలో పునీతమవుతూ ప్రశాంతంగా వున్న సెన్సార్ బోర్డుకి అనురాగ్ కాశ్యప్ అనే తుంటరివాడు తగిలాడు. ఆ అబ్బాయి వర్తమాన సాంఘిక సమస్యల ఆధారంగా వాస్తవిక సినిమాలు తీస్తాట్ట. దేశమన్నాక సమస్యలుండవా? వుంటాయి, వుంటే యేంటి? అవన్నీ చూపించేస్తావా? ఒకప్పుడు సత్యజిత్ రే అని ఓ దర్శకుడు వుండేవాడు, ఆయనా అంతే! భారద్దేశం పేదరికాన్ని ప్రపంచానికంతా టముకు వేసి మరీ చూపించాడు. ఆయనకి ఎవార్డులొచ్చాయి, మన్దేశానికి మాత్రం పరువు పోయింది! సమస్యలు ఎవరికి మాత్రం లేవు? మాంసం తింటామని బొమికలు మెళ్ళో వేసుకుని తిరుగుతామా!
 
ఆ అనురాగ్ కాశ్యపో, హిరణ్యకశ్యపో.. ఆ కుర్రాడి సినిమాకి సెన్సార్ బోర్డు బోల్డెన్ని కట్స్ చెప్పిందట, సినిమా పేరులో ‘పంజాబ్’ తీసెయ్యమందిట. ఇందులో అన్యాయం యేమిటో మనకి అర్ధం కాదు – సెన్సారు బోర్డు వుంది అందుకేగా! పైగా ఆ కుర్రాడు ఒక ఇంటర్వూలో – “పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం వల్ల యువత చాలా నష్టపోతుంది. ఒక సమస్యని గుర్తించడంలో సమస్యేంటి?” అని ప్రశ్నించాడు. అంటే ఒక సమస్య వుంటే, దానిమీద యెడాపెడా సినిమాలు తీసేస్తావా? దేశం పరువు బజార్న పడేస్తావా? ఇప్పుడు నీలాంటివాళ్ళ ఆటలు సాగవ్, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం వచ్చేసింది.
 
మా పక్కింటాయనకి ముంజేతి మీద యేదో మచ్చ వుంది, ఆయన దాన్ని ఫుల్ హాండ్స్ చొక్కా వేసుకుని కవర్ చేసుకుంటాడు. మా ఎదురింటాయన తెల్లజుట్టుకి రంగేసుకుంటాడు! వాళ్ళ అందానికొచ్చిన ఇబ్బందుల్లాంటివే దేశానికీ వుంటాయి. నీ సినిమాలు యే సౌదీ అరేబియాలోనో తీసిచూడు, దూల తీరిపోతుంది. ఎంతైనా – మన్దేశంలో ఫ్రీడమాఫ్ ఎక్స్‌ప్రెషన్ మరీ ఎక్కువైపోయింది, అందుకే దేశాన్ని విమర్శించడం ఈమధ్య ప్రతివాడికి ఓ ఫేషనైపోయింది.
 
సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు విదేశీ ఏజంట్లు. పవిత్రమైన సెన్సారు వ్యవస్థని కాపాడుకోకపోతే మన దేశభవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. హీనమైన పాశ్చాచ్య సంస్కృతిని వొంటబట్టించుకున్న కుహనా మేధావులు మన్దేశంలో చాలా సమస్యలున్నట్లు చూపించేస్తారు, అతంతా నిజమని అమాయక ప్రజలు నమ్మేస్తారు. చివరాకరికి ప్రజల వల్ల ఎన్నుకోబడి, ప్రజల బాగుకోసం నిరంతరం శ్రమిస్తున్న పాలక వర్గాలపైన నమ్మకం కోల్పోతారు. ఇలా జరగకుండా దేశభక్తులమైన మనం ప్రతిఘటించాలి.
 
భారత సెన్సార్ బోర్డుకి ప్రస్తుత హెడ్ శ్రీమాన్ పెహ్లాజ్ నిహలానిగారు. ఆయన భారతీయ సంస్కృతి పరిరక్షణకి కంకణం కట్టుకున్న వ్యక్తి, గొప్ప దేశభక్తుడు. సినిమా సెన్సార్ విషయాల్లో చంఢశాసనముండావాడు. అందుకే కాశ్యప్‌గాడికి జెల్ల కొట్టాడు. ఆ మేరకు ఒక సందేశం ఆల్రెడీ ఈ సోకాల్డ్ రియలిస్టిక్ సినిమాగాళ్ళకి చేరిపోయింది, ఇక ఇట్లాంటి జాతివ్యతిరేక సినిమాలు తియ్యాలంటే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అసలు వీళ్ళెందుకు పాజిటివ్ సినిమాలు తియ్యరు? చాయ్ అమ్మిన ఒక మహానుభావుడు ప్రధాని అయ్యాడు. ఈ ఆలోచనే గొప్ప ఉత్తేజాన్నిస్తుంది! ఇట్లాంటి గొప్ప కథాంశంతో యే వెధవా సినిమా తియ్యడు, ఇది మన దురదృష్టం. 
 
సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు దేశద్రోహులని కూడా నా అనుమానం. సెన్సారే లేకపోతే విపరీతంగా బూతు సినిమాలు వచ్చేస్తాయి, యువకులంతా రేపిస్టులుగా మారిపోతారు. ఆడవాళ్ళల్లో పతిభక్తి తగిపోతుంది, బరితెగించిపోతారు. సీతామహాసాధ్వి జన్మించిన ఈ పుణ్యభూమి విచ్చలవిడి భూమిగా మారిపోతుంది.
 
ఇంకో ముఖ్య విషయం – సెన్సార్ బోర్డు వల్లనే సాంఘిక సమతుల్యత రక్షించబడుతూ వస్తుంది. అదే లేకపోతే – దళితుల సమస్యని హైలైట్ చేస్తూ కారంచేడు, చుండూరు మారణకాండల మీద సినిమాలొస్తాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ సంపదల లూటీకి అడ్డుగా వున్న ఆదివాసీల దారుణ అణచివేతపై సినిమాలొస్తయ్. ఇవన్నీ ప్రజలకి తెలిసిపోతే దేశానికి ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి.
 
సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. సెడిషన్ యాక్ట్ (1870) లాగే సినిమాటోగ్రాఫ్ చట్టం కూడా నిత్యనూతనమైనది! ఈ పురాతన చట్టాల్ని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు, వీరిని పట్టించుకోరాదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. మన కంట్లో మనమే ఎలా పొడుచుకుంటాం!
 
పోలీసులంటే దొంగలకి పడదు. కానీ – పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, సమాజ రక్షకులు. సెన్సార్ బోర్డూ అంతే! అంచేత – తనకి అప్పజెప్పిన బాధ్యతల్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న పూజ్య పెహ్లాజ్ నిహలానిగారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్! గో ఎహెడ్, వుయార్ విత్ యు సర్! 
 
చివరి మాట –
 
ఈ రచనకి స్పూర్తి – “పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు” అని డిక్లేర్ చేసి ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త!’ కథ చెప్పిన కిరీటిరావు.  

అవినీతిని అంతం చేసేద్దాం!

 

Bribery

-రమణ యడవల్లి 

~

‘ఈ సమాజానికి పట్టిన చీడ అవినీతి, ఇది అంతరించిపోవాలి.’ సినిమా డైలాగులాంటి ఈ స్లోగన్ ఎంతందంగా వుంది! నా చిన్నప్పట్నుండీ గొంతు పగలేసుకుంటూ ఈ స్లోగన్ని అరిచేవాళ్ళు అరుస్తూనే వున్నారు. అవినీతి మాత్రం కులాసాగా, హాయిగా తన మానాన తను పెరిగిపోతూనే వుంది. అంచేత ముందుగా ఈ స్లోగనీర్స్‌కి నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను.

ఇవ్వాళ నీతి అడ్రెస్ లేకుండా అంతరించిపోయింది. అడ్రెస్ లేనివాటి గూర్చి చర్చ అనవసరం, టైం వేస్ట్! కానీ, అవినీతి గూర్చి ఎంతైనా రాయొచ్చు – ఎందుకంటే అదిప్పుడు సినీతారల సౌందర్య రహస్యంలా తళతళా మెరిసిపోతుంది కనుక. అవినీతి కొంత కష్టమైనది, మరెంతో క్లిష్టమైనది! అందుకే ఈ అవినీతిలో ఎప్పుడూ రాజకీయ నాయకులు, బ్యూరాక్రసీ, పారిశ్రామికవేత్తలు.. ఇంకా చాలామంది పార్ట్నర్లుగా వుంటారు. వాళ్ళంతా అలా భాగస్వామ్యం కలిస్తేనే, అవినీతి అదేదో సిమెంటుతో కట్టిన గోడలాగా మన్నికగా, ధృఢంగా వుంటుంది.

గవర్నమెంటు ఆఫీసుల్లో వాడే గుండుసూదుల దగ్గర్నుండీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళల్లో పసిపిల్లల తినే తిండి దాకా కమీషన్లు లేకుండా ఉద్యోగులు పని చెయ్యరు (ఇది వారి ఉద్యోగ ధర్మం). ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, దుప్పట్ల కొనుగోళ్ళల్లో కమీషన్ ఫస్ట్, క్వాలిటీ లాస్ట్ (ఇది వారి వృత్తిధర్మం). ఈ అవినీతి మునిసిపాలిటీ చెత్తలాగా అందరికీ కనబడుతుంటుంది కాబట్టి – మధ్యతరగతి మేధావులు తీవ్రంగా ఖండిస్తుంటారు (వీళ్ళకోసమే ‘భారతీయుడు’ సినిమా తీశారు).

ఇప్పుడు ఇదే అవినీతి మోడల్ని దేశస్థాయిలోకి తీసుకెళ్దాం. దేశం అన్నాక దానికో రక్షణ వ్యవస్థ అవసరం. ఈ రక్షణ వ్యవస్థ కోసం గన్నులు, యుద్ధ ట్యాంకులు, ఓడలు, విమానాలు, హెలీకాప్టర్లు.. ఇలా చాలా సామాగ్రి కావాలి. కళ్ళముందు జరిగే అవినీతి గూర్చి సామాన్య ప్రజలకి తెలుస్తుంది కానీ రక్షణ వ్యవస్థ – దాని అవసరాలు, కొనుగోళ్ళ గూర్చి తెలీదు.

అందువల్ల యే దేశప్రభుత్వాలకైనా రక్షణ సామాగ్రి కొనుగోళ్ళల్లో రిస్కు తక్కువ, సేఫ్టీ ఎక్కువ! ఇంకోకారణం – రక్షణ సామాగ్రికి ఇడ్లీ, అట్టు రేట్లలాగా పారదర్శకత వుండదు, బిస్కెట్ పేకెట్లకున్నట్లు ఎమ్మార్పీ వుండదు. ఒక వస్తువు ఉత్పత్తి ఖర్చు వందరూపాయిలైతే – దాన్ని లక్షకి అమ్ముకోవచ్చు, కోటికీ అమ్ముకోవచ్చు. రేటు అనేది ఆయా దేశాల రాజకీయ నాయకత్వాల అవసరం (కక్కుర్తి) బట్టి వుంటుంది.

‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఎకనామిక్ హిట్ మేన్’ (తెలుగులో ‘ఒక దళారి ఆత్మకథ’) అనే పుస్తకంలో జాన్ పెర్కిన్స్ అనే ఆయన బయటకి గౌరవంగా, మర్యాదగా కనిపిస్తూనే అనేక దేశాలు ఈ వ్యవహారాల్ని ఎలా చక్కబెట్టుకుంటాయో, వాటి మోడస్ ఒపరాండై ఏవిఁటో చక్కగా వివరించాడు. అభివృద్ధి చెందిన దేశాలకి ఉప్పుపప్పూ వ్యాపారాల మీద మోజుండదు – ఆ రంగాల్లో కిరాణాకొట్టులాగా పరిమిత లాభాలు మాత్రమే వుంటాయి కనుక. అంచేత అవి ఆయుధాల వ్యాపారం ఎంచుకుని, ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా చేస్తుంటాయి (ఆయుధాల టెక్నాలజీ వారికి మాత్రమే సొంతం, ఇంకెవడైనా ఆయుధాలు తయారు చెయ్యాలని ప్రయత్నిస్తే వాడికి సద్దాం హుస్సేన్‌కి పట్టిన గతే పడుతుంది).

ప్రజలు తమ అవసరాల నిమిత్తం కొన్నిచోట్లకి వెళ్ళి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు – బట్టలకొట్టు, చెప్పులషాపు.. ఇలాగా. అలా కొనేవాళ్ళని అయా వ్యాపారస్తులు ‘కస్టమర్లు’గా పరిగణిస్తారు. మరైతే ఆయుధాలు ఎవరికి అవసరం? అవి కొనడానికి కస్టమర్లు ఎక్కణ్నుండి వస్తారు? ఒక వస్తువుని అమ్ముకోవాలంటే ఆ వస్తువుకి డిమాండ్ వచ్చేలా చేసుకోవటం వ్యాపారంలో ప్రాధమిక సూత్రం. కావున రక్షణ సామాగ్రి అమ్ముకునేవాళ్ళు తమ కస్టమర్లని తామే సృష్టించుకుంటారు. అందుకోసం తాము ఆయుధాలు అమ్మాలనుకునే దేశాల్లో అంతర్గతంగా అశాంతి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వుండేట్లు ఆయుధ వ్యాపారులు తీవ్రంగా శ్రమిస్తారు (ఇందుకయ్యే ఖర్చులు ఫైనల్ బిల్లులో రాబడతార్లేండి).

ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో తిరుగుబాటుదార్ల దగ్గర ఇబ్బడిముబ్బడిగా ఆయుధాలుంటాయి (అవి ఎక్కణ్నుండి వచ్చాయని అడక్కండి), వారి నుండి తమ ప్రభుత్వాల్ని రక్షించుకోడానికి ఆ ప్రభుత్వాలు ఆయుధాలు కొనుక్కోవాలి. అమ్మయ్య, ఇక్కడ పనైపోయింది! మరి మిడిల్ ఈస్ట్ సంగతేంటి? అక్కడ ఇజ్రాయిల్ పుణ్యామని యుద్ధం రావణ కాష్టంలా మండుతూనే వుందిగా! వాళ్ళు తమ సహజ సంపదైన చముర్ని అమ్ముకుంటూ, ఆయుధాలు కొనుక్కుంటూ, జాతి విద్వేషాల్తో ఒకళ్ళనొకళ్ళని చంపుకుంటూ కులాసాగా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే పేకాటలో డబ్బు ఎవరు పోగొట్టుకున్నా వాళ్ళందరికీ అప్పిచ్చేది మాత్రం ఒక్కడే!

ఇక మన విషయానికొస్తే – మనకీ, పాకిస్తాన్‌కీ మధ్య ఇంచక్కా కాశ్మీర్ ‘సమస్య’ వుండనే వుంది. ఈ రెండుదేశాల సాధారణ ప్రజానీకం మాత్రం మలేరియా, టైఫాయిడ్‌లాంటి సింపుల్ రోగాల్తో చస్తుంటారు. వడదెబ్బకీ, చలిక్కూడా చస్తుంటారు. పంటలు పండకా, పండినా గిట్టూబాటు ధరల్లేకా రైతులు ఆత్మహత్యలు చేసుకు చస్తుంటారు. దిక్కులేనివాళ్ళు ఆకలి చావులు చస్తుంటారు. ఇంకా చెప్పుకోడానికి సిగ్గుపడే అనేక కారణాలతో రోజువారీ కుక్కచావులు చస్తూనే వుంటారు.

‘ప్రజలారా! కలత చెందకండి, భయపడకండి. కాశ్మీరు మనది, అక్కడ ప్రతి అంగుళం మనదే, ఒక్క అంగుళం కూడా అవతలవారికి చెందనియ్యం.’ ఈ తరహా ప్రచారం ఇటు ఇండియాలో, అటు పాకిస్తాన్‌లోనూ నిరంతరంగా కొనసాగుతుంటుంది. ‘కాశ్మీరు సంగతి సరే! మరి మా సంగతేంటి?’ అనడిగితే మనం అర్జంటుగా దేశద్రోహులైపోతాం, మనని అరిచి మందలించి భయపెట్టడానికి అర్నబ్ గోస్వామి వంటి భీభత్సమైన దేశభక్తులు వుండనే వున్నారు!

అయ్యా ఆయుధాలమ్మే అగ్రరాజ్యంగారు! నమస్తే. మాది శాంతికాముక దేశం సార్! కానీ మా సరిహద్దు దేశంగాడున్నాడే, వాడొట్టి దొంగాముండావాడండీ! ఆ దుర్మార్గుణ్నించి మమ్మల్ని మేం రక్షించుకోవాలి కదండీ? అంచేత అర్జంటుగా మాకిప్పుడు ఆయుధాలు కావాలి. కానీ మాదగ్గర ఈడ్చి తన్నినా పైసా లేదు. ఇప్పుడెలా? ఎలా? ఎలా?

డోంట్ వర్రీ! మై హూనా? అప్పుగా ఆయుధాలు ఎన్నైనా తీసుకోండి. వడ్డీలు, చక్రవడ్డీలు, ఈయమ్మైలు.. మొత్తం మేమే నిర్ణయిస్తాం. మీరు నిదానంగా కట్టండి. ఈలోపు అంతర్జాతీయంగా మేం తీసుకునే ప్రతి నిర్ణయానికీ మీరు కిక్కురుమనకుండా, గుడ్డిగా మద్దతు పలకాలి. లేదా, మా అప్పు వసూలుకి విజయవాడ కాల్ మనీ టైపు పద్ధతులు అమలు చేస్తాం. ఇంకో ముఖ్యవిషయం – మా మార్కెట్ రంగాన్ని మీ దేశంలోకి తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించాలి.

తలుపులు మరీ బార్లా తెరిస్తే మాకు రాజకీయంగా ఇబ్బంది.

నిజమే కదూ! అయితే ఓ పన్జెయ్యండి, తలుపులు కొద్దిగా తెరవండి చాలు. వేలుపెట్టే సందు దొరికితే కాలు పెట్టడం మా ప్రత్యేకత! అయినా – ఒక ఇంట్లోకి ప్రవేశించాలంటే మాకు అనేక మార్గాలున్నాయి. సమయానుకూలంగా దొడ్డిదోవన వొస్తాం, వంటింటి కిటికీలోంచి దూరి వొస్తాం, పక్కింటిగోడ దూకి వొస్తాం.

ఇప్పుడు మనం అలనాటి బోఫోర్సు నుండి నేటి అగస్టావెస్ట్‌లేండ్ (ఈ హవాలా దివాలా పేర్లు భలే సెక్సీగా వుంటాయి) దాకా తెర వెనుక కథ తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా సాధారణ విషయాలు, పవిత్ర గంగానదిలాగా నిరంతరం అలా పారుతూనే వుంటాయి. ఈ వ్యాసం రాస్తున్న సమయంలో ప్రపంచంలో యేదోకచోట ఒక డీల్ కుదురుకుంటూ వుంటుంది.

నోనో, ఇలా స్వీపింగ్ జెనరలైజేషన్ చెయ్యకూడదు. మా ప్రభుత్వం గత ప్రభుత్వం కుంభకోణాన్ని బయటపెట్టింది, మా పార్టీ నిప్పు.

సరే! కుంభకోణాల్ని బయటపెడుతున్నారు. మరప్పుడు బోఫోర్స్ కుంభకోణంలో ఎందరు జైలుకెళ్ళారు? కార్గిల్ శవపేటిక కుంభకోణంలో ఎందరు శిక్షించబడ్డారు? సమాధానం చెప్పి మమ్మానందింపజేయ ప్రార్ధన. ఈ కుంభకోణాల వెలికితీత వెనుక రాజకీయ ప్రయోజనాలకి మించి ప్రజల సంక్షేమం ఎంత మాత్రం లేదని మరీ బల్ల కాకపోయినా టీపాయ్ గుద్ది చెప్పొచ్చు.

‘పార్ధా! ప్రభుత్వ పక్షమేమిటి? ప్రతిపక్షమేమిటి? అన్నిపక్షాలు నేనే! నువ్వు యే పక్షమైనా డీల్ కుదుర్చువాడను నేనే! ప్రజలకి ఫలానా పార్టీకి చెందిన ప్రభుత్వంపై మొహం మొత్తంగాన్లే పాతపార్టీల్తో కొత్తపక్షాన్ని సృష్టించి గద్దె నెక్కించువాడను నేనే! చదరంగంలో ఇవ్వాళ తెల్లపావుల్తో ఆడినవాడు రేపు నల్లపావుల్తో ఆడతాడు. ఒక దేశంలో ప్రభుత్వ ప్రతిపక్షాలన్నియూ ప్రజల భ్రాంతేనని వికిలీక్స్ సాక్షిగా నీవు గ్రహించగలవు. కావున నీవు నిస్సందేహముగా అవినీతికి పాల్గొనుము. ఇదే కలియుగ ధర్మం, వినకపోతే నీ ఖర్మం.”

తెలుగు సినిమా ప్రేక్షకులు హీరోలకి వీరాభిమానులు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని తన్నుకు చస్తుంటారు. ఈ హీరోలతో సినిమాలు తీసేవాళ్ళు మాత్రం తెర వెనక ఐకమత్యంగా వుంటారు. డబ్బు సంపాదనే తమ ధ్యేయమనీ, మీరు కొట్టుకు చావకండని హీరోలు చచ్చినా చెప్పరు, చెబితే అది బ్యాడ్ బిజినెస్ స్ట్రేటజీ అవుతుంది. ఎందుకంటే – తమలో తమకి పడదని సాధారణ ప్రేక్షకుడు భావించడం కూడా హీరోల వ్యాపారంలో భాగమే కాబట్టి.

తెలుగువాళ్ళకి సినిమా ట్రాజెడీగా ముగిస్తే నచ్చదు. ఈ నచ్చకపోవడం అనేది ఇలాంటి వ్యాసాలక్కూడా అప్లై అవుతుందని నా అనుమానం. అందువల్ల ఈ వ్యాసాన్ని పాజిటివ్ నోట్‌తో ముగిస్తాను. భవిష్యత్తులో ఈ అవినీతి చీడ / భూతం (యేదైతేనేం) అంతరించిపోవాలని, నీతి అనేది నిజాయితీగా తలెత్తుకు నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం పొయిటిక్‌గా, పచ్చిఅబద్దంలా అనిపిస్తుంది కదూ! నేనేం జెయ్యనూ? అబద్దాలంతే, అవలాగే వుంటాయి!

*

దొంగ 

 

 

– రమణ యడవల్లి 

~

ramanaఅది ఆంధ్రదేశంలో ఒక పట్టణం. ఆ వీధి ఎప్పుడూ రద్దీగానే వుంటుంది గానీ – ఇప్పుడు మిట్టమధ్యాహ్నం కావడం వల్ల ఆట్టే సందడి లేదు. ఇద్దరు కుర్రాళ్ళు నడుచుకుంటూ అటుగా వెళ్తున్నారు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు, చిన్నప్పట్నుండీ స్నేహితులు. కొన్నాళ్లుగా వారిద్దరు రాజకీయంగా గొడవలు పడుతున్నారు. కారణం – ఆంధ్రరాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు (ఎవరెన్ని కబుర్లు చెప్పినా) రెండు కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నయ్. దురదృష్టవశాత్తు – స్నేహితులిద్దరూ చెరోకులానికి చెందినవారైపోయినందున అనివార్యంగా తమతమ కులపార్టీల తరఫున వాదించుకోవాల్సి వస్తుంది!

ఇవ్వాళకూడా (రోజూలాగే) ఇద్దరి మధ్యా చర్చ చిన్నపాటి వాదనగా మొదలైంది. ఆ తరవాత ఇద్దరిలో ఆవేశం ఉప్పొంగింది. ఫలితంగా పెద్దపాటి కేకలు, అరుచుకునే స్థాయిదాకా వెళ్ళింది.

“మీ నాయకుడు రాజధాని పేరు చెప్పి వేల కోట్లు కాజేస్తున్నాడు.”

“మీ నాయకుడు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు కాజెయ్యొచ్చు.”

“మీ నాయకుడి కొడుకు మాత్రం తక్కువా? ఇప్పటికే రెండు లక్షల కోట్లు కాజేశాడు.”

“మా నాయకుడికి అభివృద్దే ఊపిరి. మీ నాయకుడు అడ్డు పడకపొతే ఈ పాటికి మన రాష్ట్రం సింగపూరుని మించిపొయ్యేది.”

“అవును, మా నాయకుడు అడ్డు పడకపొతే  ఈ పాటికి రాష్ట్రం అమ్ముడుపొయ్యేది.”

స్నేహితులిద్దరూ బుసలు కొట్టారు, ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకున్నారు.

ఇంతలో –

“దొంగ! దొంగ!” అంటూ పెద్దగా అరిచారెవరో. స్నేహితులిద్దరూ తలతిప్పి అటుగా చూశారు.

ఎదురుగా – బడ్డీకొట్ట్టు ముందు కూల్ డ్రింక్ తాగుతున్నాడో నడివయసు బట్టతల పెద్దమనిషి. అతని జేబులోంచి పర్స్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడో కుర్రాడు. చెరుకు రసం బట్టతలాయన తన జేబులో చెయ్యి పెట్టిన ఆ కుర్రాడి చెయ్యి చటుక్కున పట్టేసుకుని ‘దొంగ దొంగ’ అంటూ అరుస్తున్నాడు.

స్నేహితులిద్దరూ సింహాల్లా లంఘించారు, క్షణంలో దొంగని దొరకబుచ్చుకున్నారు. ఆ కుర్రాడికి సుమారు పదహారేళ్ళు ఉండొచ్చు. నల్లగా, సన్నగా వెదురుబద్దలా ఉన్నాడు. మాసిన బట్టలు, చింపిరి జుట్టు. మన స్నేహితుల పట్టు విడిపించుకోడానికి గిలిగిలలాడుతూ మెలికలు తిరిగిపోతున్నాడా కుర్రాడు.

స్నేహితులిద్దరూ ఆ దొంగ కుర్రాణ్ణి బోర్లా పడేసి మోకాళ్ళతో తొక్కిపట్టి కదలకుండా చేశారు. ఆ పక్కనే కొబ్బరి బొండాలు అమ్మేవ్యక్తి దగ్గర కొబ్బరితాడు తీసుకున్నారు. తాడుతో ఆ కుర్రాడి పెడరెక్కలు బలంగా వెనక్కి విరిచి కట్టేశారు. ఆపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రోడ్డు వారాగా ఉన్న కరెంటు స్తంభానికి కట్టేశారు.

ఇంక విడిపించుకోలేనని గ్రహించాడా కుర్రాడు. “అన్నా! వదిలెయ్యన్నా! ఇంకెప్పుడూ చెయ్యనన్నా! నీ కాల్మొక్తా అన్నా!” అంటూ ఏడవసాగాడు. ఈలోపు చుట్టూతా పెద్ద గుంపు తయారయ్యింది.

ఎర్రటి ఎండ. తారు రోడ్డు పెనంలా కాలిపోతుంది. కరెంటు స్తంభం నిప్పుల కొలిమిలో కాల్చి తీసినట్లు మండిపోతుంది. గుంపులో ఒకరు అతని చొక్కాని, పేంటుని చింపేసారు. చిరుగుల డ్రాయర్ అతగాడి నగ్నత్వాన్ని కప్పలేకపోతుంది.

స్నేహితులిద్దరూ దొంగపై పిడిగుద్దులు కురిపించారు. కొద్దిసేపటికి చేతులు నొప్పెట్టాయి. మోకాళ్ళతో డొక్కల్లో కుమ్మారు. కొద్దిసేపటికి మోకాళ్ళు నొప్పెట్టాయి. అంచేత ఎగిరెగిరి కడుపులో తన్నారు.

ఈ ‘నేరము – శిక్ష’ దృశ్యానికి ఉత్తేజితులైన ఇంకొందరు యువకులు వారికి జత కూడారు. వంతులవారీగా దొంగని తన్నటం మొదలెట్టారు. తరవాత దొంగని తన్నే పవిత్ర కార్యానికి వారిలో పోటీ మొదలైంది. అటు తరవాత గుంపుగా తన్నారు.

కొద్దిసేపటికి దొంగ కళ్ళు తేలేశాడు. నోట్లోంచి నెత్తురు కారసాగింది. శరీరం మాంసం ముద్దలా మారిపోయింది. ఇంకొద్దిసేపటికి తల వాల్చేశాడు.

రొప్పుతూ రోజుతూ చెమటలు గక్కుతూ శ్రమిస్తున్న ప్రజానీకం ఓ క్షణం ఆగింది.

“మాస్టారు! ఈ మధ్యన తన్నులు తప్పించుకోడానికి దొంగలు దొంగేషాలేస్తున్నారండీ! అదంతా యాక్షన్ సార్! కుమ్మండి కొడుకుని!”

మళ్ళీ తన్నులు మొదలు. ఈసారి కర్రలు వచ్చి చేరాయి. ధనా.. ధన్ .. ఫటా.. ఫట్.. దొంగవేషాలు వేసే దొంగలూ, అసలు యే వేషాలు వెయ్యలేని దొంగలూ.. వందసార్లు చచ్చేంతగా నిరంతరాయంగా కొనసాగిందా హింసాకాండ.

ఇది పుణ్యభూమి, ఇక్కడ చట్టం తనపని తను చేసుకుపోతూనే ఉంటుంది. అంచేత కొంతసేపటికి చట్టబద్దులైన పోలీసులొచ్చారు. దొంగ కట్లిప్పదీశారు. దొంగ రోడ్డుమీదగా వాలిపోయ్యాడు. తల పగిలింది, దవడలు విచ్చిపొయ్యాయి. నెత్తురు కమ్మిన ఎర్రటి కళ్ళు ఈ ప్రపంచాన్ని అసహ్యంగా, కోపంగా చూస్తున్నట్లు వికృతంగా వున్నాయి.

చచ్చాడా? చచ్చే ఉంటాళ్ళే, దొంగ ముండాకొడుకు. మురికిలో పుట్టి మురికిలోనే కలిసిపొయ్యాడు. మాస్టారూ! ఎందుకలా ఫీలవుతున్నారు!? మీరెవరో మరీ అమాయకుల్లా వున్నారే! యేదీ – ఓ సిగరెట్టిలా పడెయ్యండి. థాంక్యూ! పరాయి సొత్తు నిప్పుతో సమానం. నన్ను చూడండి! ఆకలేస్తే చావనైనా చస్తాగానీ, దొంగతనం చేస్తానా? ఈ నేరస్తుల్ని జైల్లో వెయ్యడం, వాళ్ళు బయటకొచ్చి మళ్ళీ నేరం చెయ్యడం – మన టాక్స్ పేయర్స్ మనీ ఎంత వృధా! అంచేత దొంగతనం చేసే లమ్డీకొడుకుల్ని ఇలా చావ చితక్కొట్టేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏవఁంటారు?

రాష్ట్ర రాజకీయాల పట్ల వైరుధ్యం వున్నా, దొంగని శిక్షించే విషయంలో ఒకటవ్వడం స్నేహితులకి సంతోషం కలిగించింది. బాధ్యత కలిగిన పౌరులుగా సమాజానికి మొదటిసారిగా సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది. ‘ఈ దేశంలో అందరూ తమలా నేరం చేసినవాడికి శిక్ష పడేట్లు చేస్తే నేరాలే ఉండకపోను!’

స్నేహితులిద్దరు మళ్ళీ కబుర్లలో పడ్డారు.

“మా నాయకుడి ప్రజాసేవకి అబ్బురపడి మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారు.”

“అది మీ నాయకుడి ప్రతిభ కాదు, అధికారం అనే బెల్లం!”

ఈ విధంగా తమ కబుర్లు కొనసాగిస్తూ ఇంటిదోవ పట్టారు.

ఫేస్‌బుక్‌ కవుల ఫేసు లెక్కడా?!

స్కై బాబ

~

skyసోషల్‌ మీడియా ఇంటలెక్చువల్స్‌కి, ఆక్టివిస్టులకు, కవులు, రచయితలకు ఒక ఆయుధంగా అందివచ్చింది. అందులోనూ ఫేస్‌బుక్‌ మరింత వెసులుబాటు కల్పించింది. మీడియా ‘మోడియా’గా మారిపోయిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఎన్నెన్నో భావ వ్యక్తీకరణలకు వేదికగా మారింది.

ఈ నేపథ్యంలో సాహిత్యానికి అతి కొద్ది స్పేస్‌ కల్పిస్తున్న మీడియా చెంప ఛెళ్లుమనిపిస్తూ ఫేస్‌బుక్‌, మరికొన్ని వెబ్‌ మాగజైన్స్‌ కవులు, రచయితల భావ వ్యక్తీకరణకు చోటు కల్పిస్తూ భావ సంఘర్షణలకు తావునివ్వడం మంచి పరిణామం. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూప్స్‌ కవిత్వానికి పెద్ద పీట వేస్తూ ఎంతో కృషి చేశాయి. అందుకు పూనుకున్న కవులు, సాహిత్యకారులను తప్పక అభినందించాలి. పత్రికల సాహిత్య పేజీల కరుణా కటాక్షాల కోసం మొహం వాచి ఉన్న ఎందరికో ఫేస్‌బుక్‌, అందులోని కవిత్వ గ్రూపులు ఒక మంచి వేదికగా మారాయి. అస్సలు పత్రికలు చూసే తీరిక లేని వారి దగ్గరి నుంచి, తమలో ఒక కవి/కవయిత్రి ఉందని తెలుసుకునే అవకాశమే లేనివారి దగ్గరి నుంచి, హౌజ్‌వైఫ్‌ల దగ్గర నుంచి, సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వారి నుంచి, ఎంతో తపన ఉన్న వారి దాకా ఈ వేదిక ఒక పెద్ద క్యాన్వాస్‌ అయ్యింది. దాంతో వందలాది కవులు పుట్టుకొచ్చారు. అందులో ఎందరో అతి తక్కువ కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం కూడా అందరూ హర్షించదగిందే.

ఈ సందర్భంలోనే ఒక వైచిత్రి చోటు చేసుకుంది. సాహిత్యమంటే అదేదో సులభమైన వాహికగా, కవిత్వం రాయడమంటే అదో చిన్న విషయంగా చాలామంది భావించడం మొదలయ్యింది. అస్సలు కవితా హృదయం లేనివారు కూడా నాలుగు ముక్కలు, నాలుగు వాక్యాలు పరిస్తే అది కవిత్వమై పోతుందని తమకు పేరొచ్చేస్తుందని భావించే దాకా ఈ వ్యవహారం వెళ్లింది. అవకాశవాదాలు, పేరుకోసం పాకులాటలు మొదలయ్యాయి. ఏ పెయిన్‌ లేనివాళ్లు కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో ఇలాంటి వారి పద గారడీ అలా ఉండడం మామూలే. సరే, ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయిలే అనుకోవచ్చు. మరోకోణం ఏమిటంటే, ఫ్యామిలీ అంతా సెటిల్‌ అయిపోయింది, ఇక మనం హాయిగా శేషజీవితం గడపొచ్చు అనుకున్నవారు కూడా కవులుగా పేరు తెచ్చుకోడానికి నానా తంటాలు పడడం కవిత్వానికి ఒకింత చేటు చేయడం మొదలయ్యింది. ఎందుకంటే వారి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు స్మార్టెస్ట్‌ కవిత్వం ఒలకపోయడం మొదలుపెట్టాయి.

ఇదిలా ఉంటే, ఒక కవిత రాస్తే, మిత్రులకు చూపెట్టుకొని ఎంతో భావ సంఘర్షణ తర్వాత, చర్చోపచర్చల తరువాత, మార్పులు చేర్పుల తర్వాత దాన్ని అచ్చుకి ఇచ్చే సాహసం చేసేవారు, చేస్తుంటారు గట్టి కవులు. దానికి కవుల కలయికలు, గ్రూపులు, సంఘాలు ఎన్నో, ఎన్నెన్నో..! ఇలాంటి వాతావరణం అసలే లేకుండా పోయింది ఫేస్‌బుక్‌ కవులకు. రాసింది రాసినట్లు పోస్ట్‌ చేసేస్తూ, రోజుకో కవిత, గంటకో కవిత, రెస్పాన్స్‌ వచనం రాసేసి అవే కవితలు అనుకునే స్థాయికి దిగజారడం జరిగిపోయింది. చాలామంది కాసిన్ని కవితలు రాసి మహా ఫోజు కొట్టే స్థాయికి ‘ఎదిగిపోయారు’. ఏండ్లకేండ్లు.. అన్నపానీయాలు మాని, రాత్రులలకు రాత్రులు కాల్చుకొని ఒక్కో కవితను ఒక్కో కార్యంగా భావిస్తూ, ఒక్కో దివిటీగా వెలిగిస్తూ ఎదిగొచ్చిన కవులను, వారి కవిత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. ముందు నమస్కారం వెనక వెటకారం చేస్తూ.. ప్రతి విషయాన్ని జోక్‌గా మార్చేసి హిహి.. హెహెల దాకా వెళ్లారు కొందరు!

సరే, వారెవరినీ ఏమీ అనొద్దని, అసలు కవులే పుట్టడం తగ్గిపోయిన కాలంలో కొత్త తరం ఇలా పుట్టుకు రావడం, అందుకు ఫేస్‌బుక్‌ వేదిక కావడం ఎంతో మేలు అని అనుకున్న కవులు ఈ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ కొందరు, గమనిస్తూ కొందరు ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో ‘ఏంటన్నా! మనం కవులుగా ఎంతగా తపనతో, సంఘర్షణతో కవిత్వం రాశాం.. కవిత్వానికి ఎంతటి ఉన్నత స్థానం ఉంది మన హృదయంలో.. వీళ్ళెంటి, ఇంతగా మిడిసిపడుతున్నారు.. నిలువని కవితలు, నిలువని ఒక్కో పుస్తకం వేసుకొని మహా ఫోజు కొడుతున్నారు???’ అనే ప్రశ్నలూ, ఆశ్చర్యార్ధకాలూ వినబడ్డాయి. ఏది తోస్తే అది రాసేసి కవిత్వమనుకోవడం, కవిత్వాన్ని అవహేళన చేసే శీర్షికలు పెట్టడం, భావ సంఘర్షణగానీ, భావజాల సంఘర్షణగానీ అస్సలు లేకపోవడం మొదలైనవన్నీ తీవ్రమయ్యాయి. ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు అనే దగ్గర మొదలై, ఎవరైనా సద్విమర్శగా ఏదైనా కామెంట్ చేస్తే దాన్ని వెకిలి చేయడం దాకా వెళ్లింది. పొగడ్తలు తప్ప విమర్శను భరించలేని విపరీత బుద్ధి ఈ ‘కవుల’కు పట్టుకుంది.

ఇక్కడ గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫేస్‌బుక్‌ కవులుగా ఎదిగి వచ్చిన వారిలో బీసీ, ఎస్సీ కులాలకు చెందిన కవులు, కవయిత్రులు ఎక్కువమందే ఉన్నారు. మైనారిటీలు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది మొదట్లో తమ జాతుల వెతలను, సంఘర్షణను కవిత్వీకరించారు. కాని ఆ కవితలకు వచ్చిన రెస్పాన్స్‌ కన్నా పువ్వూ ప్రకృతీ ప్రేమ సౌందర్యం లాంటి భావ కవిత్వం రాస్తే వచ్చే రెస్పాన్స్‌ సాధారణంగానే ఫేస్‌బుక్‌లో చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ వాడే సౌకర్యం అగ్రవర్ణాల వారికి, ‘సాఫ్ట్‌వేర్‌ కోళ్ల’కే ఎక్కువగా ఉంటుంది. వారిలో 99 శాతంమందికి అణగారిన జాతుల కవిత్వం పట్ల, వారి సామాజిక సమస్యల ఏమాత్రం కన్‌సర్న్‌ ఉండదు, అవగాహన ఉండదు. అది వారికి అవసరం లేని విషయంగా తయారయింది వ్యవస్థ. దీనికి తగ్గట్టుగానే కొందరు కవులు కూడా ‘భావ కవిత్వం’ రాయడానికే మద్దతునిచ్చి ఆ కొత్తతరం ఫేస్‌బుక్‌ కవులకు మార్గదర్శకులుగా మారడంతో వారు భావకవిత్వానికి పరిమితమవడం మొదలయింది. దాంతో వారు వేసుకుంటూ వచ్చిన కవితా సంపుటులకు అలాంటి  పేర్లే పెట్టడం, ఏ అస్తిత్వమూ అంటకుండా జాగ్రత్తలు తీసుకోవడం వేగంగా జరిగిపోయింది. ఎన్నో కవితా సంపుటులు వెలువడ్డాయి. ఆవిష్కరణలు, పార్టీలు, చిన్న చిన్న రివ్యూలు, ఒకరిద్దరి ఇంటర్వ్యూలు జరిగిపోయాయి. వీరు గురుసమానులుగా భావించినవారు ఎంతగా వీరిని ప్రభావితం చేశారంటే అస్తిత్వవాదులు, విప్లవవాదులు, సామాజిక సమస్యల మీద కవిత్వం రాసే ఎవరితోనో వీరికి సాంగత్యమే లేకుండా పోయింది. మొదట్లో ఉన్నా తర్వాత్తరువాత అది అంతరించి పోయింది.

సరే, మరికొంత కాలం గడిచింది.. ఈ మిడిసిపడ్డ కవులంతా ఒక్కొక్కరూ మాయమైపోతూ వస్తున్నారు.. చాలామంది ఫేస్‌బుక్‌లో కనబడ్డమే మానేసారు. ఏ గ్రూపుల నుంచి ఎదిగొచ్చారో వాటి మీదే జోకులెయ్యడం.. వాటికి వ్యతిరేకమవ్వడం కూడా జరిగిపోయింది.. ఫేస్‌బుక్‌లోకి రాట్లేదు అని ‘మేధావు’ల్లాగా అనేదాకా వచ్చింది. మొత్తంగా సామాజిక సమస్యలకు వీరు మొత్తంగానే స్పందించడం మానేసారు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా లాగా తయారయింది కొందరి పరిస్థితి.

తమ ఇంటి కాడ, కుటుంబంలో, కులంలో, మతంలో, తమ ఊర్లలో, ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల స్పందించే గుణం కోల్పోయి, ముఖ్యంగా ఆ పెయిన్‌ను కోల్పోయి జడపదార్ధాలుగా మారిపోతున్నారు. కంటికి సూటిగా కనిపించే ప్రేమ ప్రకృతి అందం తప్ప ‘కాళ్ల కింది నేల కోతకు గురవుతున్న’ విషయం పట్టని స్థితి ఇది. ఇదే ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్న రోహిత్‌ వేముల ‘హత్య’ పట్లగాని, హిందూత్వవాదుల, బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తుల దాడుల పట్ల గాని ఆయా కవుల నుంచి స్పందన కరువైన పరిస్థితిని అద్దం పడుతున్నది. పైగా కొందరు ‘కవుల’ మనుకుంటున్నవారు కొత్తగా తమ వెనుకబాటుతనాన్ని బట్టబయలు చేసుకుంటూ తామేదో కొత్త విషయాన్ని కనుగొన్నట్లు పోస్టులు పెట్టే స్థాయికి ఈ పరిస్థితి దారితీసింది. ఈ సందర్భంలోనే ఫేస్‌బుక్‌ ‘యువ’, ‘నవ’ కవులను, ‘పెద్ద’ కవులమైపోయామనుకుంటున్న వారిని ‘గౌతమి మాసుల’ (Gouthami Masula) నిగ్గదీసి అడిగారు.. ఇలా-

 

”కవులెక్కడ ? మరీ ముఖ్యంగా యువకవులు 

ఏ అమ్మాయి పిరుదుల మీద పద్యాల్లో బిజి ఉన్నారో తెలుసుకోవచ్చా ? (vis-A_vis ) 
అత్యాచారం లాంటి కేసులకి వద్దన్నా బక్కెటడు కవిత్వం గుమ్మరించి మొసలి కన్నీరు కార్చే కవులెక్కడ ? 
అమ్మ దినం అయ్యా దినం ఆ దినం ఈ దినం అనగానే ఉరుక్కుంట వచ్చి ఫేస్బుక్ నిండా బరికి పోతారు వద్దురాభై అంటే కూడా అట్లాంటి కవులెక్కడ ? 
హత్య అంటే భయపడ్డారా ? లేక ఆకుకి పోక కి అందని చిదానంద స్వాముల అవతారం ఎత్తారా ?

రోహిత్ హత్యకి ప్రో గానే రాయమని కాదు కనీసం ఒక ఇస్శ్యు జరిగినప్పుడు మనకి ఎదో ఒక అభిప్రాయం లేకుండా అభావంగా బ్రతికేసే దిక్కుమాలిన సేఫ్ ప్లే ఇపుడు కొత్త తరం కూడా నేర్చుకుంది అంటే మాత్రం ఇన్నాళ్ళు వీళ్ళనా అభిమానించి వాళ్ళ వాక్యం కోసం ప్రపంచంతో పోరాడింది అని అసహ్యం వేస్తుంది

రైటో మేమంతా అంటీ సోషల్ ఎలిమేంట్స్ ఒప్పుకుంటున్నా. కానసలు మండిపోతున్న సోషల్ ఎలిమెంట్ మీద కూడా నోరిప్పలేని కలం ఎందుకు 
ఇదంతా మానవతా వాదం మేమసలు కులం మతం లేని సొసైటీ నే చూడాలనుకుంటున్నాం అంటే మాత్రం మీ అంత సమస్య ని వదిలిపోయే పిరికి సన్నాసులు లేరని ఘంటాపథంగా రాసివ్వగలను స్టాంప్ పేపర్ మీద.” (జనవరి 22, సా. 6:53)

అయితే, ఫేస్‌బుక్‌ వల్ల ఇంకా ఎందరో కొత్తవాళ్లు పుట్టుకొస్తున్నారు. వారికి కూడా సరైన దిశానిర్దేశం లేదు. వారి పరిస్థితి కూడా రేపు ఇంతే. అందుకని, కనీసం ఆయా గ్రూపులవాళ్లు, కవిత్వ ప్రేమికులు కొత్తవారితోనైనా కవులనుకునేవారికోసమైనా, కవిత్వం పట్ల తపన ఉన్నవారికోసమైనా కొన్ని అంతర్గత సమావేశాలు, గ్రూప్‌ డిస్కషన్స్‌ పెట్టి భావ సంఘర్షణకు, భావజాలాల సంఘర్షణకు తావు కల్పిస్తే తప్ప కొత్తతరం ఎదిగివచ్చి నిలదొక్కుకునే పరిస్థితి లేదు. అందుకు వారు పూనుకోవాలని, పూనుకున్నవారికి సహకరించాలని మనవి.

*

 

మైనారిటీ వాదం మత వాదమా ?

 

-పి. విక్టర్  విజయ్ కుమార్

~

‘ చమ్కీ పూల కథ ‘ అని నేను ‘ చమ్కీ  పూల గుర్రం ‘ కథ పై రివ్యూ రాసాక, కొంత మంది మితృలు నాతో ఒక ప్రశ్న లేవనెత్తారు ‘ ముస్లిములను సపోర్ట్ చేయడం అంటే ( ముస్లిం ) మతాన్ని సపోర్ట్ చేసినట్టు ఉండదా ? ‘  అని. ‘ మైనారిటీ మత ప్రజలను సపోర్ట్ చేయడమంటే , వాళ్ళ మతాన్ని కూడా సపోర్ట్ చేయడం అవ్వదా ? ‘ అని. అటు తిరిగి, ఇటు తిరిగి – ఇది చాలా మంది బుర్రల్లోనే, పైగా మార్క్సిజం నమ్మిన వాళ్ళలో కూడా, ఉన్న ప్రశ్న అని చాలా ఆలస్యంగా గమనించాక, ఒక   detailed explanation    ఇచ్చి చర్చిస్తే ,   probably   ఈ చర్చలకు ఒక లంగరు దొరుకుతుందేమోనని ఉద్దేశ్యం తో ఈ వ్యాసం.

వంద ఏళ్లకు పైగా మార్క్సిస్టు చరిత్ర ఉన్న దేశం మనది. అంత అనుభవం ముందు –  ఇది నిజానికి చాలా చిన్న ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే  preliminary question  . ఐతే ఇప్పుడిప్పుడే ప్రగతి వాద రాజకీయాలు నేర్చుకుంటున్న వారికి, సిన్సియర్ కమిట్ మెంట్ ఉండి  progressive dilemma   ఉన్న వాళ్లకు ఈ వ్యాసం ఉపయోగ పడవచ్చని సాధ్యమైనంత సాధారణ భాషలోనే ఇది రాయడం అయినది.

మతం  superstructure  అని మార్క్సిజం చెప్తుంది. ఆర్థిక ప్రాతిపదిక   base   గా ఉండడం వలన , మతం ఇప్పుడున్న ఆర్థిక అసమానతలు కొన సాగినంత కాలం మతం కొన సాగుతుంది అన్నది   dialectical interpretation  . మరి అంత వరకు మతం మాయమయ్యేంత వరకు, మెజారిటీ మత వాదులు మైనారిటీ మతస్తులపైన చూపించే   prejudices   ను   hostility   ని ఎలా ఎదుర్కోవాలి ? ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోదల్చుకోవాల్సిందేమంటే – ఇది    prejudices    ను రూపు మాపే పోరాటం. అణగారిన వరుసల్లో ఉన్న మైనారిటీల సాంస్కృతిక సమస్యను ఎదుర్కోవడం. మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం , లెదా అందుకు సంబంధించి రచనలు చేయడం అంటే ఆయా   prejudices  ను వ్యతిరేకించడం. అంతేకాని  మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం అంటే – మైనారిటీ మతం   Vs  మెజారిటీ మతం అని అర్థం కాదు. అంతే కాక సెక్యులరిస్ట్ ఉద్యమాలు  మత పరమైన యుద్ధాలు కాదు, లేదా కేవలం మత విశ్వాసాల గొప్ప తనానికి సంబంధించిన పోటీ కూడా  కాదు.

మన దేశం లో మైనారిటీ మతస్తులు – ప్రధానంగా కార్మికులు,   unskilled workers , నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళెవరూ అధికారం లో భాగస్తులుగా లేరు. అక్కడక్కడ  tokenism  కనిపిస్తుంది గాని ( సినిమా స్టార్స్, పఠాన్, రాజ వంశస్తులు )  , అత్యధిక పేద వర్గానికి చెందిన వాళ్ళు కూడా వీళ్ళే.  నిజానికి  75 శాతం   death row convicts   ముస్లిములే మరి !   ఇక దళిత క్రిస్టియన్స్ సంగతి తెలియంది కాదు. వీల్లందరు సమస్యలున్నా ఇంకా అంతో ఇంతో మనశ్శాంతిగా, కొంత  జీవితం పట్ల confidence  తో  బతుకుతున్నారు అంటే – దానికి కారణం వారి మత విశ్వాసం. బ్రాహ్మినిజానికి వ్యతిరేకంగా వీరిని , పెట్టుబడి దారీ ఫ్యూడల్ వాదులకు, రాజ్యానికి వ్యతిరేకంగా కూడగట్టాలనుకున్నప్పుడు , నాస్తిక వాదం ను ముందు పెట్టి పోరాటం చేయడం మొదలు పెడితే – ఇక్కడో   friction   అనివార్యం అవుతుంది.  ఐతే   marxism   అన్నది   scientific socialism  ను చెప్తుంది . మతాన్ని నిర్ద్వందంగా  వ్యతిరేకిస్తుంది. అలాంటి సమయం లో – మైనారిటీ మత విశ్వాసాన్ని , తమ నాస్తిక వాదం తో దూషిస్తూ పోతే – శ్రామిక వర్గం లో పాతుకుపోయిన (మూఢ ) విశ్వాసాలను   hurt  చేయడం జరుగుతుంది. అందువలన , వాళ్ళు ప్రగతి వాదం , సెక్యులరిజం వేపు మొగ్గడం పోయి, తిరిగి మత వాద పార్టీల చేతిలో కీలు బొమ్మలై , కుల , వర్గ పాలన చట్రం లోనే ఇరుక్కుపోతారు. మరెలా ? వీరి సంస్కృతిని , వీరిని విస్మరించాలా ?   Communal violence   తో పాటు, వారిని ఆర్థికంగా, సాంఘిక, సాంస్కృతికంగా  అణగదొక్కే పరిస్థితి తో ఇలా గడపవలసిందేనా ?

ఇంతకు ముందు మనం అనుకున్నట్టు – మైనారిటీ హక్కుల పోరాటం –  institutional and individual prejudices   కు వ్యతిరేకంగా జరిగే పోరాటం. అంతే కాని మత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదు. మరి మత విశ్వాసాలను అలాగే అంగీకరించి మిన్నకుండి పోవాలా ? అందుకే   dialectics   చూస్తే క్లియర్ గా , వర్గ పోరాటాలను ( సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలు కూడా భాగమే ) ఉధృతం చేసి ఆ క్రమం లో, మైనారిటీలను కూడా గట్టుకోవాలి తప్ప వారి విశ్వాసాల పై పోరాటాన్ని   prioritise   చేస్తే, మొత్తంగా వర్గ పోరాటాన్ని పక్కకు పట్టించాల్సి వస్తుంది అని అర్థమౌతుంది.

రష్యా అనుభవం చూస్తే – లెనిన్ అధికారం లో వచ్చిన వెంటనే మతం వ్యక్తిగత వ్యవహారం అందుకు ఎటువంటి    state support   ఉండదు అని ప్రకటించాడు. అంతే కాక ఆయా వ్యక్తిగత విశ్వాసాలను ప్రకటించుకోడానికి పూర్తి స్వేచ్చ ఉందని కూడా ప్రకటించాడు. ఇది ఇక్కడ   paradox  . శ్రామిక వర్గ ప్రగతి నిరోధకమైన మత విశ్వాసాల ప్రచారం కొనసాగించడం దేనికి ? ( కేంద్రీయ) నియంతృత్వ విధానాన్ని అనుసరించి ఒకే వేటులో దీనిని ఎందుకు తొక్కేయలేదు ?  ఇంకొక అడుగు ముందుకేసి – పార్టీలో ఏ వ్యక్తిగత విశ్వాసం ఉన్న వారైనా చేరవచ్చు ఐతే వాళ్ళు పార్టీలో ఉన్న   collective opinion  కు కట్టుబడి ఉండాలి అనే విధానం ప్రకటించాడు. ఇంకా పరిశీలిస్తే – చర్చ్ ఫాదర్స్ ను కూడా సోషలిస్ట్ పార్టీలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఇదంతా చూస్తే – సైంటిఫిక్ సోషలిజం, మతాన్ని మత్తు మందుగా ప్రకటించిన మార్క్సిజం, మతం మీద ఒక   lenient view    తీసుకుందని అనిపిస్తుంది. ఐతే, నిజమైన ప్రజాస్వామిక దృక్పథం తో పరిశీలిస్తే   pluralism   మరియు  multiculturalism  తో సోషలిస్ట్ దృక్పథాని ఎలా ముందు తీసుకెళ్ళాలో లెనిన్ ఒక అద్భుత ఉదాహరణ ముందుంచాడని చెప్పుకోవచ్చు. సోషలిస్ట్ పార్టీ ఇటువంటి  stand   తీసుకోవడం గురించి లెనిన్ మాటల్లోనే గమనించండి.

lenin

(  in his writing – The Attitude of Workers’ Party to Religion )

To draw a hard-and-fastline between the theoretical propaganda of atheism, i. e., the destruction of religious beliefs among certain sections of the proletariat, and the success, the progress and the conditions of the class struggle of these sections, is to reason undialectically, to transform a shifting and relative boundary into an absolute boundary; it is forcibly to disconnect what is indissolubly connected in real life. Let us take an example. The proletariat in a particular region and in a particular industry is divided, let us assume, into an advanced section of fairly class-conscious Social-Democrats, who are of course atheists, and rather backward workers who are still connected with the countryside and with the peasantry, and who believe in God, go to church, or are even under the direct influence of the local priest—who, let us suppose, is organising a Christian labour union. Let us assume furthermore that the economic struggle in this locality has resulted in a strike. It is the duty of a Marxist to place the success of the strike movement above everything else, vigorously to counteract the division of the workers in this struggle into atheists and Christians, vigorously to oppose any such division. Atheist propaganda in such circumstances may be both unnecessary and harmful—not from the philistine fear of scaring away the backward sections, of losing a seat in the elections, and so on, but out of consideration for the real progress of the class struggle, which in the conditions of modern capitalist society will convert Christian workers to Social-Democracy and to atheism a hundred times better than bald atheist propaganda.

So,    ప్రధానంగా ఈ కింది పాయింట్స్ మనం గమనించాలి :

(1) శ్రామిక వర్గాల్లో ఉన్న మత విశ్వాసాలను ధ్వంసం చేయడం అది   undialectical   అవుతుంది . ఇది సమస్యను   relative boundary   నుండి  absolute boundary   కి షిఫ్ట్ చేసి తప్పిదం చేసినట్టౌతుంది ( కింద పేరాల్లో దీని కంప్లీట్ మీనింగ్ దానితో పాటు దీన్ని  అంబేద్కర్ ఎలా డీల్ చేసాడో చూద్దాం )

(2)   Country side   శ్రామికులు తమకున్న విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ  ( అంటే మనకు పీర్ల దేవుళ్ళు, బతుకమ్మలు, సమ్మక్క సారక్క లకు మల్లే ) ఏదన్నా ఒక ఆర్థిక పోరాటం చేస్తున్నప్పుడు , వాళ్ళను కూడగట్టుకుని పోరాటాన్ని ముందు తీసుకు పోవాలంటే నాస్తిక వాదాన్ని ఉపయోగించడం   వర్గ పోరాటానికి అనవసరం మరియు హాని కారకం  కూడా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉద్యమ లక్ష్యం పక్క దారి పట్ట రాదు మరియు ఉద్యమ లక్ష్యమే అన్నిటికన్నా ఉన్నతమైనది కాబట్టి.

(3) ఈ విధంగా చేయడం వలన శ్రామికులు మత విశ్వాసం నుండి   social democracy   లోకి మారడం జరిగి తద్వారా క్రమేపీ నాస్తిక వాదం లోకి మారడం జరుగుతుంది. ఇది ప్రత్యక్ష నాస్తిక వాద  ప్రచారం కన్నా వంద రెట్లు మేలు.

లెనిన్ ఎంత క్లియర్ గా చెప్పాడు ఇందులో ? చెప్పడమే కాక, మతం మన జీవితాల్లో నుండి మాయమవ్వడం కోసం కొన్ని దశాబ్దాల కృషి కావాలని తెలిసాక,  మైనారిటీ మత విశ్వాసాలను అధికార వర్గ భావజాలమైన  majoritarianism  కు వ్యతిరేకంగా  organise  చేసి శ్రామిక వర్గాన్ని కూడగట్టమని చెబుతున్నాడు. అంతే కాక, ఈ మైనారిటీ విశ్వాసాలను పని గట్టుకుని దెబ్బ తీస్తూ ప్రవర్తిస్తే , ఈ వర్గాలు మరింతగా కుంచించుకుపోయి మరింతగా  rigid   అయిపోయి ప్రగతి వాద ఉద్యమాల వేపు ఆకర్షించబడకుండా , తమను మతం గోతిలో పాతి పెట్టే తమ శతృవు గుప్పిట్లోకే వెళ్ళిపోతారు. ఇదే అదను తీసుకుని అధికార వర్గం ( బ్రాహ్మిణిజం) , ఈ ఉద్యమాలను తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది అని స్పష్టంగా తెలియ జేసాడు. ఆపై ఏంగెల్స్ ఏ మతాన్ని అయినా పిడివాదం తో గుడ్డిగా వ్యతిరేకించడం గురించి ఏమన్నాడో చూడండి ” మతం పై ప్రత్యక్ష యుద్ధం చేయడం మూర్ఖత్వం. అటువంటి యుద్ధం మతాన్ని పునరుద్ధరిస్తుంది తప్ప ఫలితం ఉండదు.  నిజానికి ఈ యుద్ధం మతాన్ని మరణించకుండా నిరోధిస్తుంది తప్ప ఎటువంటి దోహదం చేయలేదు   ”

పైన చెప్పిన  relative boundary  మరియు   absolute boundary   అన్నవి చాలా  important concepts . అసలు దేవుడే లేదు అన్నది  absolute boundary .   ‘ దేవుడున్నాడా లేదు అన్నది ప్రధానం కాదు ప్రస్తుతానికి, ఆయా వర్గాల ప్రజలను ప్రజాస్వామికంగా కూడగడుతున్నామా లేదా ‘ అన్నది  relative boundary .  సమస్యను  absolute boundary   కి  షిఫ్ట్ చేసే మార్క్సిస్టులను లెనిన్   Anarchists  గా వర్ణించాడు ( మన యాంత్రిక పిడివాద ఇండియన్ మార్క్సిస్టులు చేస్తున్నదిదే. శ్రామిక వర్గ పక్షపాతం ఉండాల్సిన వాళ్ళకు మైనారిటీ పక్షపాతం ఎందుకుండదో అర్థమవ్వదు. ) . ( మరి ఇదే  anarchist  ల   analogy  ప్రకారం చూస్తే Uniform Civil Code  ను సమర్థించే బ్రాహ్మణియ వాదులు కరెక్ట్ అయిపోవాలన్న మాట )

అంబేద్కర్ , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా నాస్తిక వాదాన్ని ప్రోత్సాహించకుండా , బుద్దిజం ను ఎందుకు పుచ్చుకున్నట్టు ? అంబేద్కర్ ఎప్పుడూ దేవుడిని నమ్మ లేదు . తన దృష్టిలో మతం అంటే ”  no god, no dieties, no rituals and no customs  ” అని ప్రకటించాడు. అలాంటప్పుడు ఇక అసలు మతం దేనికి ? అంబేద్కర్ బ్రాహ్మిణిజానికి ఒక ప్రత్యమ్నాయ వ్యవస్థను సృష్టించాలనుకున్నాడు ( ఇదే   relative boundary   ) అంటే – సాపేక్ష విలువను ఒకటి సృష్టించి బ్రాహ్మిణిజం ను ఆ విలువతో  పోల్చి బ్రాహ్మిణిజం ఘాతుకాన్ని ఎండగట్టడం. దీనికి బదులు,  rationalism  మరియు  education  హీనంగా ఉన్న కాలం లో,  నాస్తిక వాదం ముందుకు తీసుకుపోయి ఉంటే  ఏం జరిగేది ? శూన్యం లో శతృవు పేరు చెప్పి కరవాలం తిప్పినట్టు ఉండేది. ఎందుకంటే అలా చేస్తే ఏ శతృవు తలలు ఎగరవు. కాని వట్టి కరవాలం మాత్రం తెగ వేగంగా కదుల్తూ ఉంటుంది !

ఒక బైబిల్ పిట్ట కథ ఒక ఉదాహరణగా చెప్తాను ఇక్కడ ( దయ చేసి ఇదో ఉదహరణగా మాత్రమే పరిగణించమని మనవి ).  యేసు క్రీస్తు ఒక వ్యక్తికి పట్టిన దెయ్యాన్ని( సాతాను) వదల గొట్టి ‘ అక్కడున్న పందులలోకి వెళ్ళిపో ‘ అని దెయ్యాన్ని ఆదేశిస్తాడు.  అప్పుడు ఆ దెయ్యము  అక్కడున్న పందుల లోకి వెళ్ళిన వెంటనే, ఆ పందులు అడ్డగోలుగా పరిగెట్టి దగ్గరున్న సముద్రం లో పడి చనిపోతాయి. ఇక్కడ చూడాల్సిందేమంటే – ఏం దెయ్యాన్ని ఉత్తిగా వెళ్ళిపొమ్మని చెప్పొచ్చుగా అని ? ఐతే దానికి ఆయనిచ్చిన వివరణ ” ఆ దెయ్యం ఎటువంటి వైపరీత్యాన్ని కలుగ జేస్తుందో , ఎటువంటి ఘాతుకానికి పూనుకుంటుందో , అది వెళ్ళిపోవడం వలన ఎంత మేలు జరిగిందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించాలి కాబట్టి “. ఇదో పిట్ట కథ అంతే. శూన్యం లోకి దెయ్యాన్ని వదలగొట్టడం అంటే – నాస్తిక వాదం తో మైనారిటి మత విశ్వాసాలను దెబ్బ తీయడం. పందుల్లోకి పంపి దెయ్యాన్ని నాశనం చేయడం అంటే – ఒక  relative bench mark   సృష్టించి  systematic  గా దెయ్యాన్ని  expose  చేసి, దెయ్యాన్ని తరిమి వేయడం. అంటే దెయ్యం వైపరీత్యాన్ని ప్రజాస్వామికంగా నిరూపిస్తూ ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఉద్యమ లక్ష్యం కోసం కూడా గట్టుకోవడం అన్న మాట.

కాబట్టి, సెక్యులరిజాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన ఎంతో అవసరమున్న ఈ కాలం లో, మతమనే దెయ్యాన్ని నాస్తిక వాదం తో మాత్రమే కాక, ప్రజాస్వామిక పోరాటాల్లో మైనారిటీ మత విశ్వాసాలను , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా కూడ గట్టి ఆయా పోరాట క్రమం లో మతం అనే దెయ్యాన్ని వదల గొట్టాలి. ఎందుకంటే మనకు మైనారిటీ మత విశ్వాసానికి మించిన సమస్య కంటే , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా సాంస్కృతికంగా , సాహితీ పరంగా కూడా గట్టడమే ప్రధాన లక్ష్యం కాబట్టి. అందునా అసహనం ఒక సిద్ధాంతంగా , ఒక తాత్వికతతో బల పడుతున్న ఈ రోజుల్లో – మెజారిటీ మత వాద బ్రాహ్మిణిజాన్ని ఓడించడం ప్రధాన లక్ష్యం కావాలి కాబట్టి.  ఈ క్రమం లో – మైనారిటిలను ప్రజాస్వామిక ఆలోచన విధానం వేపు, సెక్యులరిస్ట్ జీవన విధానం వేపు కూడగట్టుకుంటే , వారి మత విశ్వాసాలు క్రమేపీ నాస్తిక రూపం లోకి మారకుండా ఉండే   option  ఇంకా ఏం మిగిలుంటుంది ? ఉత్తి నాస్తిక వాదానికి ప్రజలను కూడగట్టే దమ్ముంటే , మనకు ఇక ఏ ప్రగతి వాద సిద్ధాంతాలైనా అవసరం ఎందుకు ఉండేది ?   లెనిన్, అంబేద్కర్ లు చూపిన మార్గాన్ని మించి, ఇంతకంటే ఉన్నతంగా ప్రజాస్వామిక బద్దంగా మతాన్ని కూలగొట్టడం ఎలా సాధ్య పడుతుంది ?

*

నా గొయ్యి నాకు ముద్దు !

 

-పి.  విక్టర్ విజయ్ కుమార్ 

~

 

రంగనాయకమ్మ రచనను స్వీకరించడం ద్వారా ‘ సారంగ ‘, మెయిన్ స్ట్రీం  కమర్షియల్ పత్రికల వ్యవహారానికి భిన్నంగా, విభిన్న అభిప్రాయాలను ప్రజాస్వామిక బద్ధంగా చర్చించాలి అన్న ప్రిన్సిపుల్ ను తన చేతనైనంతగా అనుసరించాలనే ప్రయత్నం  అభినందనీయం. ఎవరో సరిగ్గా అబ్జర్వ్ చేసారు – ఈ రచయితలు , మరీ రాజకీయ నాయకులకన్నా దారుణంగా వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు అని. ఆ దృక్పథం ను నేను  పూర్తిగా  endorse    చేస్తూ – రంగ నాయకమ్మ వ్యక్తిగత ప్రవర్తన సబబుగా ఉందా లేదా అంటూ సాగదీసి    court hearings   లా పొడిగించదల్చుకోలేదు.  సింపుల్ గా – ఆ గొడవ ల్లోకి పోకుండా , అసలు రంగ నాయకమ్మ తన పాయింట్ ప్రూవ్ చేసుకోడానికి  ఎటువంటి అప్రోచ్ అవలంబించింది అని చూస్తే చాలు. సాక్ష్యులు లేని వాదనొకటి తీసుకుని వ్యక్తిత్వాలు నిర్ణయించాల్సిన అవసరం ఉండదు. ఇందులో సబ్జెక్టివిటీ కూడా ఉండదు.

(1)   వరూధిని అమ్మ  కు (    KV     అనే రెఫెర్ చేస్తా ఇక నుంచి . ఈమె నోట్లో సెంటిమెంట్స్ ను పెట్టి ట్రేష్ చేసుకోవడం అవసరం లేదు) రంగ నాయకమ్మ   తాను ఒక లెటర్ రాసినట్టు ఇంటర్నెట్ లో పెట్టారు ( లేదా పెట్టించారు ). K V  రంగ నాయకమ్మ అభిప్రాయాలతో ఏకీభవించలేదు అని తెలిసాక,  ఈ  లెటర్ రాసి పంపడం ఏంటి ?  కామన్ సెన్స్ క్వశ్చన్. రంగ నాయకమ్మ అంటుంది ఏంటంటే –  ఆమె నే చెప్పిన మాట వినడం ఆపేసింది. ఆమెతో మాటలు కట్ అయ్యాయి అని.   మరైతే ఖేల్ ఖతం ! ఆ మాటనే రాసేయండిక !   ఎలిబీ సృష్టించుకోవడం దేనికి ?  మీరు ఎంత మంది గురించి వ్యక్తి గత జీవితాలలో onesided   గా రాస్తే మేం నమ్మ లేదు ?

ఈ ఎలిబీ కూడా ఎలా ఉంది చూడండి ? ఏ అడ్రస్ కు పోస్ట్ చేసిందో, ఎక్కడికి పోస్ట్ చేసిందో తెలీదు.   ఎందుకంటే – రంగ నాయకమ్మ మాటలు ఆపేసాక – 2013 కల్లా వాళ్ళు ఇళ్ళు మారిపోయి నెలలు అయ్యింది. వాళ్ళు ఇల్లు మారిన సంగతి ప్రత్యేకంగా ఫోన్ చేసి పలకరిస్తే గాని చాలా మందికి తెలియ రాలేదు.  మీ భార్య తో గొడవ పడ్డారనుకోండి.  మాటల్లేవు ఇద్దరికి మధ్య. మొబైల్ లో  S M S  పంపితే, ఏదోలా ఐనా చూసి రెస్పాండ్ అవుతుందేమో అనుకుని వేచి చూసారనుకోండి – అది సాధారణం. అలా కాక –  మీరే మీ భార్య పేరు మీద ఒక సి ం  కార్డు తీసుకుని , ఒక సెల్ లో వేసి వంద   S M S  లు పంపి , అందరికీ ‘ నేను ఎన్నో   S M S  లు పంపినా ఫలితం లేకుండా పోయింది ‘ అని చూపిస్తే జనాలు నమ్ముతారేమో కాని, అసలు విషయం ఏంటో – మీకూ, మీ భార్యకు మాత్రమే తెలుసు.

అందునా ఆ దాడి చేయాలనే ఆరాటం కొకు మీద కాదు. సాంఘిక , ఉద్యమ జీవితానికి దూరముండే ఒక వ్యక్తి మీద. అది కూడా ఆమెతో జరిగిన  ఒక  private talk    ను ( నాతో పాటు ఎవరూ సాక్ష్యులు లేరు దీనికి ) పబ్లిక్ గా తన   image projection  కోసం వాడుకోవడం లో ఏం బాపుకోవాలనుకుంటుంది రంగ నాయకమ్మ ? ఇక్కడ మీకు ఒక ప్రఖ్యాత అల్ఫ్రెడ్ కిచ్ కాక్ సినిమా గురించి చెప్పాలి –    Dial M for Murder   లో టోనీ అనే కేరక్టర్ తన భార్యను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి, స్వాన్ అనే కేరక్టర్ తో ఆ మర్డర్ చేయించాలని – ఒక లెటర్ ను అమాయకంగా అతని చేతిలో పెట్టి వేలి ముద్రలు  సంపాదించి ఒక ఎలిబీ ని సృష్టించి, తద్వారా బ్లేక్ మెయిల్ చేసి తన భార్యను మర్డర్ చేయించడానికి ఉసిగొల్పుతాడు.  ఈ స్టొరీ లో థీం చూడండి.  రంగనాయకమ్మ తన గొప్ప తనాన్ని కాపాడుకోడానికి పాటించిన అప్రోచ్ చూడండి).

(2) మధ్యలో చలసానిని, ఈమె   K V   కి డబ్బులిస్తున్నారా అని అడిగినందుకు  ఒక నవ్వు నవ్వాట్ట. మన మధ్యలో లేని చలసాని సాక్ష్యం ఉపయోగించుకోవాలనుకుంది. కానీ చలసాని నవ్వింది, ఈమె వెర్రి ప్రశ్నలను చూసి . అది చలసాని వ్యక్తిత్వం గురించి తెలిసిన ఎవరైనా , చలసానికి రంగనాయకమ్మ మీద ఉన్న అభిప్రాయం గురించి తెలిసిన ఎవరికైనా అర్థమౌతుంది.

(3) లేని సాక్ష్యాల గురించి మాట్లాడే ముందు – చలసాని గారు    K V    కి 50,000 ఇచ్చారా లేదా ? ఎందుకిచ్చారు ? అన్న విషయం లోకి వెళ్ళే ముందు వేసుకోవాల్సిన ప్రశ్న – అసలు రంగ నాయకమ్మకు, తడుముకుని తడుముకుని పని గట్టుకుని ఫోన్ చేసి ఇంకో వ్యక్తి గురించి ( ఇంతకు ముందు అనుకున్నట్టు – సామాజిక జీవితం లో గానీ, ఉద్యమ జీవితం లో గాని లేని మనిషి గురించి ఇదంతా )  ఇంత   criminal anxiety   ఏంటి ?  అది ఏదో ఒక ముప్పాళ్ళ గణపతినో, ఇంకెవరినో  శోధించి, పరిశోధించి వ్యక్తిత్వాలను బయట కు తీసుకొచ్చి ఉంటే ఒక అర్థముంది. ఇది   gossping culture   కలిగినట్టుగా ఎందుకు పరిగణించరాదు ? అది అలా పక్కన పెడితే –  ఒక వేళ చలసాని నిజంగా డబ్బులు  అలా ఇచ్చి ఉంటే – అది    commercial consideration    అనే అర్థం మాత్రమే వస్తుందా ? ఏం చెప్పదల్చుకుంది రంగ నాయకమ్మ ? తీవ్ర వృద్ధాప్యం లో ఉన్న   K V    ని తన వద్దనే ఉండమని ఆత్మీయంగా బలవంతం చేసిన చలసాని, అది కూడా   commercial consideration   లో భాగంగా  చేసాడా ? చలసాని రంగ నాయకమ్మ తో పాటు, ఎందరికో ఎటువంటి ఆపేక్ష లేని సహాయాలు చేసాడు.  ఇంత బలహీనంగా మాట్లాడ్డం, ఆరోపణలు చేయడం రంగ నాయకమ్మ   image saving anxiety   కే చెల్లింది.

(4) అన్నిటి కంటే ఘాతుకం – మొదటి భార్య కొడుకు గురించి మాట్లాడ్డం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి పోయింది ?  ఎవరో అనామకంగా ఐ డీ లు మార్చుకుని వచ్చి చేసిన చిల్లర కామెంట్ ను   anchor   చేసుకుని ( ఈమెనే ప్రత్యక్షంగా ఇలా చేసింది అని అడగచ్చుగా ? పిల్లికి ఎలుక సాక్ష్యం ఎందుకు ? ) , ఏవో తాను అర్థం చేసుకున్న కల్పితాన్ని అందరికీ వినిపించింది. ఆప్తులకు తెలుసు – మొదటి భార్య కొడుకుకు   K V    ఏం చేసిందో , ఎలా చూసిందో అన్న విషయం. అది ఇప్పుడు నేను – కోర్ట్ లో కేస్ వివరించినట్టు వివరించడం హీన స్థాయికి చర్చ తీసుకెల్లడవం అవుతుంది అని ముందే చెప్పాను. అసలు మధ్యలో మొదటి భార్య కొడుకు , అనే ఒక   popular negative opinion   ను ఆధారం చేసుకుని ఒక వ్యక్తి మీద బురద చల్లుదామనుకునే అప్రోచ్ గురించి ఆలోచించండి.  ఇప్పుడు నేను రంగ నాయకమ్మ మొదటి భర్త తో ఎలాంటి గొడవుంది, ఇప్పుడున్న భర్తతో తానెంత   equality  పేరుతో   hegemony   ఎలా చలాయిస్తుందని రాస్తే – ఎంత నీచంగా ఉంటుంది ? రంగ నాయకమ్మ   image saving   కోసం ఎంత కన్నా దిగ జారుతుంది. ఇది ఖచ్చితమైన తార్కాణం.

రంగ నాయకమ్మ కు, ఆమెతో ఒక   interaction    లో ఉన్న వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణకు సాక్ష్యులు కాని మనం, ఈ అప్రోచ్ ను ఎలా అర్థం చేసుకోవాలో జాగర్తగా ఆలోచించుకోవాలి అన్నదే ఇక్కడ అభ్యర్థన.  ఆమె రాసిన వ్యాసం లో ఎన్నో ఉన్నాయి – డాక్టర్ కు డబులివ్వమని సజెస్ట్ చేయడం  అందుకు ఆమె ( అమాయకంగా ) నా దగ్గర ఎవరూ డబ్బులు తీసుకోరు అనడం ఒక విలనీ కింద ఈమె రాయడం, కోపం రావాల్సిన సందర్భాల్లో కూడా   K V   కి కోపం రాదు అన్నది కూడా ఒక కంప్లైంట్, ” మీకో చిన్న లెటర్ రాయాలని మొదలు పెట్టాను ” అని లెటర్ మొదలు పెడుతుంది. పెద్ద లెటర్ రాయబోతున్నప్పుడు ‘ రాయాలని ‘ అంటూ రాయడం అమెకున్న  farse opinion making skills   లో భాగమే.

ఇక అన్నిటినీ రాసుకుంటూ పోతే ఒక పుస్తకం అవుతుంది. అందునా కొకు ను ( అలాంటి  social characters  ను)  అడ్డం పెట్టుకుని, అటువంటి విలక్షణ వ్యక్తులతో అనుబంధం లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క character assassination  చేయాలని పూనుకున్న ఆమెకు బోల్డంత ఫోకస్ ఉంది. నా గొయ్యిలో నే పడ్డమే బెటర్ గా ఉంది. నాకు ఆమె మీదున్న ఉన్న  కొన్ని  సంకోచాలు కూడా ఆమె వ్యాసం తో పటా పంచలయ్యాయి.

*

పిపీలక సోదరులారా… !

maxresdefault

-కళ్యాణి తాళ్ళూరి

~

kalyani“పాముల పుట్ట లోనికి పంపించి, వాళ్లు పాములు కరిచి చనిపోతే, ఆ దుఃఖం చూపించి మరి కొందరినీ పుట్ట లోకి పంపించే…”…  ఉద్యమాలంటూ ఈ మధ్య కొన్ని వాదాలు వింటున్నాం . అవి  పైకి హేతుబద్ధం గానూ, మానవతా దృక్పధం తోనూ ఉన్నట్టుగానే తోస్తాయి ! వాటిని నమ్మినట్టయితే,   ‘అదిగో అది- పాములపుట్ట; ఇదిగో ఇది నీ నాగరిక మానవ సమాజం! అదుగో అటు వెళ్ళకు- అది పాము, కరుస్తుంది, ఇదుగో ఇటు రా- ఇదీ మనందరం సంచరించే జాగా, ఇటు ఆ పాము రాదు, అది వచ్చినా… మనందరినీ చూసి పారిపోతుంది’… అని demarcate చేసుకుని బతికెయ్యవచ్చని మనకు సంబరం కలుగుతుంది.

నిజమేనే, అంత ప్రాణాపాయం కలిగించే పాముకి దూరం గా ఉంటే పోలా…సరే, మరి అలాటి విభజనరేఖ వాస్తవమేనా? ఆ పాములపుట్ట పుట్టు పూర్వోత్తరాలేమిటని ఒక్క క్షణం తరచిచూస్తే.. .దాని అసలు తత్వం తలకెక్కుతుంది.

పాముల పుట్ట గా వీరు భ్రమిస్తున్నది, దూరం గా ఎక్కడో లేదు, అది సాక్షాత్తూ మన ప్రపంచం- మనదే, మీలాటి, నాలాటి చీమలది!  దానిలో చొరబడి, మనల్ని మట్టుబెట్టాలని వచ్చే ఆ మహా సర్పం పేరు ‘దౌర్జన్యం’. దురదృష్టవశాత్తూ, పుట్టద్వారం దగ్గర చిక్కుకున్న చీమలు – ఆ సర్పాన్ని చూసి, గగ్గోలు పెడుతున్నాయి. వాటి అరుపులు వినగలిగిన కొన్ని చీమలు లోపలినుండి పరిగెత్తుకు వస్తున్నాయి.  “బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి … …” అని చెప్పిన సుమతీ శతకకారుణ్ణి తలుచుకుని లేని ధైర్యం తెచ్చుకుంటున్నాయి, ఎదురుతిరుగుతున్నాయి!

మరి మనం ఎక్కడున్నాం అంటారా? మన మధ్యతరగతి పిపీలకాలం … “అల వైకుంఠపురంబులో, నగరిలో, ఆ మూల సౌధంబులో… ” అని అన్నట్టు, లోలోపలి గదుల్లో దూరి నిశ్చింత గా కూర్చున్నాం… పైగా, అడ్డగించి ఆ పాముకాటు తిని దుర్మరణం పొందుతున్న బడుగు చీమలను చూసి ‘పాముతో తలపడితే అంతేగా మరీ !’ అని నిట్టూరుస్తున్నాం!  మిగిలిన చీమల హాహాకారాలు విని ‘ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని, కేకలు మానెయ్యండి… పామువారికి కోపం వస్తే… మీ పని సఫా’ అని గుడ్లురుముతున్నాం!!

కానీ – మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే – ఆ పాము వారు మనల్నందరినీ పుట్టలోంచి తరమడానికే విచ్చేస్తున్నారు! మనం కేకలు వెయ్యకపోయినా, దారితొలిగి లోపలికి ఇరుక్కుపోయి గడుస్తనం చూపించినా  – వారి పని వారు నిశ్శేషంగా కానిచ్చే తీరతారు! మరేది దారి తండ్రీ మనకు…  పోరాటం కాక!?

అరే! పోరాడ వద్దనలేదమ్మా, వారి క్షేమం కోరే, వారి మార్గం మార్చుకొమ్మంటున్నాం, వారి దారి సరైనది కాదు, ఇలా గమ్యం చేరడం అసాధ్యం అని వాపోయే కొందరు హితైభిలాషులకు ఒక్క మాట! ‘పోరాట రూపాలు’
లోపరహితం గా లేవు, నిజమే, నిజాయితీ తో చేసిన విమర్శలను విశ్లేషించుకోవడం ప్రతీ ఉద్యమానికీ తప్పనిసరే! కొన్ని సద్విమర్శలు : ఇవిగో మచ్చుకి …
“1. భూస్వాముల్నివ్యక్తులిగా నిర్మూలిస్తే, భూస్వామ్య విధానం పోతుందని భ్రమింపజేసే వర్గశత్రునిర్మూలనా కార్యక్రమం…
2. సాహితీ, సాంస్కృతిక విప్లవకర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి తోడ్పడే బదులు, సాంస్కృతిక రంగాన్ని వొదిలి విప్లవరాజకీయాల్లో పాల్గొనడాన్నే ప్రధాన కర్తవ్యం గా భావించడం… 

వంటివి సరికాదంటూ, తప్పొప్పులు విడమర్చి చెప్పడం – అభిలషణీయమే !!! దానితో పాటు విభిన్నసాయుధపోరాటాల చారిత్రక, భౌగోళిక విలక్షణతలను గురించి కూలంకషంగా పరిశీలించాలి,  లోతుగా విశ్లేషించాలి. మూలాన్ని పట్టుకోగలగాలి. అప్పటివరకూ, మార్గాంతరాలను అన్వేషించమని వారికి ఉపదేశించలేం.

ఉదాహరణకు, దండకారణ్యపు ఆదివాసీ అస్తిత్వపోరాటానికి ఇలా అర్ధం చెప్పుకోవచ్చు…అన్యాయంగా  తన్ని తగిలేస్తుంటే – నిస్సహాయులైన చిన్నపిల్లలు ఇల్లువదిలిపోలేక స్థంభం గట్టిగా పట్టుకుని మొరాయిస్తారే,
అలాటి resistance అది. మనలాంటి మధ్యతరగతిని, వారి గోడు విననీయకుండా చేసేందుకు …వారిని ఊచకోత కోస్తున్నమన శత్రువు వద్ద మనం ఊహించ లేనన్ని వనరులూ, వ్యూహాలూ ఉన్నాయి.

కనుక మేధావులమనుకునే వారందరికీ ఒక్క సూచన, మనం రాసే ప్రతీ అక్షరం – దెబ్బతింటున్న వాడికి చెయ్యూత నిస్తోందా, పోనీ ఓదార్పు నిస్తోందా… లేక అది దౌర్జన్యం చేసేవాడి పన్నాగాల్లో పడిపోతోందా అని తరచి తరచి చూసుకోవడం చాలా అవసరం.  అది లేకనేగా, జరుగుతున్నదురాగతాన్నిఖండించక పోడం … పైపెచ్చు సానుభూతిపరులే దానికి కారణమని నెపం వెయ్యడం. మధ్యతరగతి లోని యీ అతి తెలివిధోరణిని అలుసుగా తీసుకుని ‘దౌర్జన్యం’ మరింత నిర్భయంగా బుసలు కొడుతోంది  సాయుధపోరాటాల దాకా ఎందుకు, వీధిపోరాటాలను కూడా నిర్దాక్షిణ్యం గా అణచివేస్తానని సవాలు చేస్తోంది.

‘హింస ఒక్క అడవుల్లోని అన్నలమీదా , అక్కలమీదే కాదు జరిగేది ‘.  ‘ రైతుల ఆత్మ హత్యలు, రోడ్డు యాక్సిడెంట్లు, కాలేజీల్లో పిల్లల ఆత్మహత్యలు, ఆసుపత్రుల్లో పసిపాపల మరణాలు …ఇలాంటి ఎన్నో హత్యలు’ కూడా ఆ విష సర్పపు కాట్లే!  దాని వేటు స్వయంగా రుచి చూసిన నాడు మనం పెట్టే కేకలు – బాబూ!  … ‘ఉల్లిగడ్డల ధరలు అందుకోలేక కన్సూమర్ల కష్టాలు’ చూసి గొణుక్కున్నట్టూ mild గా ఉండవు!  ‘ఉల్లిగడ్డల ధరలు గిట్టక రైతులు ఆత్మహత్యలు’ చేసుకున్నట్టు wild గా ఉంటాయి… కనక పిపీలక సోదరులారా ! ఆ పాముకాటు తినే దుస్థితి కలక్కుండా జాగ్రత్త పడదాం…చీమలకు సహాయపడదాం…

జలియన్ వాలా బాగ్ లో చంపేసుకుందాం..

 

-సత్యమూర్తి

 

వరంగల్ జిల్లాలో జరిగిన శ్రుతి ఎన్ కౌంటర్ పై ‘ఆ పిల్ల..’ పేరుతో రమాసుందరి గారు రాసిన భావోద్వేగ కవితపై కొందరి వ్యాఖ్యలు చూశాక కొన్ని అభిప్రాయాలు పంచుకోవాలనిపించింది. వ్యాఖ్యల్లో చెప్పాల్సిందంతా  వివరంగా చెప్పలేం కనుక విడిగా రాయాలనిపించింది.

శ్రుతి వంటి అమాయక పిల్లలకు మాయమాటలు చెప్పి సాయుధ పోరాటంలోకి పంపి ప్రాణాలు తీయిస్తున్నారని కొందరు కొందరిని పేర్లు ప్రస్తావించకుండా తిట్టారు. యువత ఏదైనా సాధించాలనుకుంటే అడవులకు వెళ్లకుండా, వీధుల్లోకి వచ్చి పోరాడాలని నిరాయుధ ఉద్యమ పిలుపు ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంపై వ్యతిరేకతను ఛిద్రమైన శ్రుతి శవం సాయంతో ముసుగులేకుండా వ్యక్తీకరించుకున్నారు. చరిత్ర సంఘర్షించేటప్పడు నిజానికి ఇలాంటి స్పష్టమైన అభిప్రాయాలే రావాలి.

ఎవరు ఎలా పోరాడాలన్నది ఒకరు చెబితే తేల్చుకోవాల్సిన విషయం కాదు. పోరాట రూపం ఎంపికలో వ్యక్తిగత చైతన్యమే కాకుండా సామూహిక చైతన్యం కూడా పనిచేస్తుంది. విప్లవోద్యమంలో పీడితులు, తాడితులు మాత్రమే పోరాడరని,  సమాజంలో మార్పును ఆశించే వాళ్లు కూడా పోరాడతారని చరిత్ర చెబుతోంది.  శ్రుతి దీనికి తాజా నెత్తుటి ఉదాహరణ. శ్రుతి ఎంచుకున్న మార్గం మంచిదా, చెడ్డదా అని ప్రశ్నించుకునే ముందు ఆమెను కిరాతకంగా చంపడం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్నా వేసుకోవాలి. దీనికి వచ్చే జవాబును బట్టే ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆమెకు ఆ పోరాటాన్ని మించినదేదో సాయుధపోరాటంలో ఉందనిపించి అటువైపు వెళ్లింది. తెలంగాణ కోసం పోరాడాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా ప్రోత్సహించారు కూడా.  బహుశా ఆమె తెలంగాణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బలిదానం చేసుకుని ఉండుంటే కూడా అభ్యంతరం చెప్పకుండా ఆమె త్యాగంపై కవితలూ, పాటలూ రాసేవాళ్లు. ఇప్పుడు ఆమెను కిరాతంగా చంపేసిన ప్రభుత్వం ఆమె తెలంగాణ కోసం చట్టబద్ధంగా ప్రాణం తీసుకుని ఉంటే ఆమె కుటుంబానికి లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఆమె అడవులకెళ్లి  చచ్చిపోవడమే! ప్రాణాన్ని బట్టి కాకుండా చచ్చిన ప్రాంతాన్ని బట్టి చావుకు విలువ!

శ్రుతి విద్యావంతురాలు కనుక అడవులకెళ్లకుండా ఏ  గ్రూప్-1 పోస్టో కొట్టి, ప్రజల బాగు కోసం ప్రజాస్వామికంగా పోరాడి ఉంటే, సమాజానికి కూడా మేలు చేసే అవకాశముండేదని ‘అడవుల’ వ్యతిరేకులు అంటున్నారు. శ్రుతి పోలీసు అయ్యి నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేసి వ్యవస్థను భద్రంగా కాపాడుతూ ఉండుంటే వీళ్లకు మరింత సంతోషంగా ఉండేది కాబోలు!

ప్రభుత్వాలు, రాజ్యాంగాలు నిర్దేశించిన రూపాల్లోనే ఉద్యమిస్తూ ఉండుంటే శ్రుతి మన కళ్లముందరే తిరుగుతూ ఉండేది. కానీ ఆమెకు ఈ చక్కని మనుగడ కిటుకు తెలియదు. శ్రుతి ఆలోచనలేమిటో మనకు తెలియదు కాని, ఆమె మమేకమైన ఉద్యమం ఆలోచనలు ఆమెవి కూడా కనుక ఆమె ఎందుకు అడవులకు వెళ్లిందో వాటిద్వారా తెలుసుకోవచ్చు. దేశ స్వాతంత్ర్య పోరాటం ఎంత బలహీనంగా, అడ్డగోలుగా సాగినా, దానితోపాటు,  ‘కలసి వచ్చిన‘ రెండో ప్రపంచం యుద్ధం వంటివాటితో తెల్లదొరలను దేశం నుంచి వెళ్లగొట్టి, నల్లదొరలను గద్దె ఎక్కించాం. నల్లదొరలు మన నెత్తికెక్కి తెల్లదొరలను మించిపోయారు. తెల్లదొరల పాలనలో కనిపించని నల్లకుబేరులు ఇప్పుడు ఊరికి పదిమంది, వీధికొకరు  పుట్టుకొచ్చారు. స్వతంత్ర భారతంలో  ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరే ఒకే ఒక చట్టవిరుద్ధ ఉద్యమం కూడా నక్సల్స్ రూపంలో అవతరించింది. నల్లదొరలను గద్దెదింపి సమసమాజ స్థాపనకోసం పోరాడుతోంది. దాని పోరాట రూపంపై అభ్యంతరాలు ఉండడం తప్పేమీ కాదు. కాని బ్రిటిష్ వాళ్ల పాలనలో కూడా లేనంత ఘోరంగా, కిరాతకంగా ఉద్యమకారులను చంపడం మటుకు కచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఖండించకపోవడం, ఖండించక్కర్లేదని అనడం అమానుషం, అనాగరికం, అవకాశవాదం. ఆ చావుకు చచ్చిన వాళ్లదే బాధ్యత అని తెలివిగా మాట్లాడ్డం పోలీసుల భాష మాట్లాడ్డమే.

శ్రుతి చట్టబద్ధ హత్యను సమర్థిస్తున్న వాళ్లు అల్లూరి, భగత్సింగ్, కొమురం భీంల హత్యలను కూడా సమర్థించినట్లే అవుతుంది. ఎందుకంటే వాళ్లు కూడా శ్రుతి మాదిరే ‘చెప్పుడు మాటలు’ విని  ప్రభుత్వ ఆమోదిత రూపాల్లో పోరాడకుండా, అడవులూ, ఆయుధాల బాటలూ ఎంచుకుని అనవసరంగా చచ్చారు కనుక. ‘వాళ్లు పరాయి ప్రభుత్వాన్ని కూలదోయడానికి అలాంటి మార్గం ఎంచుకోవచ్చు. కానీ మనం చెమటోడ్చి ఓటేసి ఏర్పాటుచేసుకున్న మన ప్రభుత్వాలను కూలదోయడానికి మటుకు ఆ మార్గాన్ని కాకుండా బహిరంగ, ప్రజాస్వామ్య పోరాటాలు చేయాలి’ అని అని సెలవిస్తారా? అలా అయితే, అసలు ఆ పోరాటాలే అక్కర్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎటూ  ఐదేళ్లకు ఒకసారి మారిపోయి, కూలిపోయి.. మళ్లీ ఐదేళ్ల తర్వాత మరింత బలం పుంజుకుని వచ్చే ప్రభుత్వాలను అనవసరంగా పనులు మానుకుని, వీధుల్లోకి వెళ్లి, గొంతులు చించుకుని కూలగొట్టడమెందుకు? లేదు లేదు, ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఉద్యమించి తీరాల్సిందే అని అంటారా? అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఓటేయాలని ‘చెప్పుడు మాటలు’ వినే జనానికి పిలుపిస్తూ కవితలు, వ్యాసాలు రాసి, సభలు పెడితే సరిపోతుంది. ఆ పార్టీలు ప్రగతి వ్యతిరేకం అనుకుంటే సీపీఐకో, సీపీఎంకో ఓటేయమనాలి. వాటికేయడం దండగ, అవి అధికారంలోకి రావు, వచ్చినా అవి కూడా బెంగాల్ లో మాదిరి జనాన్ని పీడిస్తాయి అని అంటారా? అయితే ఎంచక్కా ఏ ప్రభుత్వమూ రావడానికి వీల్లేని ‘నోటా’ ఉండనే ఉంది. వాళ్లకు, వీళ్లకు ఓటేయాలని ఇచ్చే పిలుపులు, సభలు కూడా ఉద్యమాలకిందికే వస్తాయి అని వాదిస్తారా? అయితే అవీ అక్కర్లేదు. పార్టీలు ఆ ఉద్యమాలను దాదాపు డెబ్బై ఏళ్లుగా కన్నులపండుగగా కదం తొక్కిస్తూ నిర్వహిస్తున్నాయి కనుక..

శ్రుతి హత్యపై కవితలు, పాటలు రాయొద్దంటే అల్లూరి, భగత్సింగులపైనా, ప్రజాస్వామికబద్ధంగా హత్యకు గురయ్యే హక్కుల కార్యకర్తలపైనా రాయొద్దు. ఇలాంటి కవితల వల్లే అడవులకు వెళ్తున్నారని అడవుల వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు కాని, నిజానికి వాళ్లది శుద్ధ అనసరమైన ఆందోళన. ‘మాకొద్దీ తెల్లదొరతనమూ..’, ‘పదండి ముందుకు, పదండి తోసుకు.. ’, ‘నీ త్యాగం ఉన్నతమైనది..’ వంటి పాటలు, కవితలు మనసును కదిలించి, ఆవేశం తెప్పిస్తాయంతే. నిజానికి వాటికి ఉద్యమబాట పట్టించే శక్తే ఉంటే బ్రిటిష్ వాడు 1910లలోనే మనకు స్వాతంత్ర్యం ఇచ్చిపోయుండేవాడు. 1940లలోనే ఇప్టా కళారూపాలతో ఒక్క నెత్తురుబొట్టూ చిందకుండానే దేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వచ్చుండేది. 1970లలో నక్సలైట్ల రాజ్యం వచ్చుండేది.

కనుక ఈ కవితలు, పాటలు మీరనుకున్నంత ప్రమాదకరమేమీ కావు. నిశ్చింతగా ఉండండి. సందర్భం కనుక మరో మాట.. ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ దుస్థితిని గుండెకరిగేలా, తెలంగాణ కోసం రోడ్లపైకొచ్చేలా చేసిన ప్రసంగాలు విని, రాసిన కవితలు, పాటలు పాడి.. తమ చావుతో అయినా తెలంగాణ వస్తుందేమోనని బలిదానాలు చేసుకున్నారు కొందరు ‘చెప్పుడు మాటలు’ వినే యువకులు. పాపం.. ఆ అమాయకులు ఆ పాటలు వినకపోయుంటే ప్రత్యేక, సుభిక్ష తెలంగాణాలో నిక్షేపంగా బతికుండేవాళ్లు. వాళ్ల చావులకు ఆ పాటలు రాసిన కవులు, పాడిన గాయకులు ఇప్పుడు బాధ్యత వహించాలి..! అడవులకు పంపేవాళ్లతోపాటు వీళ్లనూ బోనెక్కించాలి..!

సందర్భం కనుక మరోమాట.. అడవుల్లో చనిపోయిన ఎంటెక్ శ్రుతిపై మనం కవితలు రాస్తాం, ఆమెను అడవులకు తీసుకెళ్లి చంపించేశారని వలపోస్తాం కాని, అడవుల్లో శ్రుతిలాగే చచ్చిపోతున్నగిరిజన యువతుల గురించి, పల్లెటూరి రైతుకూలీల గురించి రాయడానికి మన కలాలు కదలవు, మన గొంతులు పెగలవు. కలాల సంగతి పక్కన బెడితే.. అలాంటి వాళ్లు అడవుల్లో చచ్చినా ఫర్లేదు, శ్రుతి లాంటి వాళ్లు మాత్రం చావకుండా, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకోవాలి అని అనుకుంటున్నారా జాలిగుండెల అడవుల వ్యతిరేకులు?

ప్రజాస్వామిక పోరాటాలు ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించనంతవరకు ప్రమాదకరమేమీ కాదు. కానీ శ్రుతికి వాటిపై నమ్మకం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమెకు తెలంగాణ వచ్చాక కూడా అసంతృప్తి పోలేదు. తన కలలు కల్లలయ్యాయని భావించింది. అందుకే మరో మార్గం ఎంచుకుంది. ఆమె అడవులకెళ్లిందని తప్పుబడుతున్న మనం ఆమె అలా వెళ్లకుండా ఉండడానికి, మన మధ్యే ఉండి పోరాడడానికి ఆమెకు బహిరంగ ప్రజాస్వామ్య ఉద్యమాలపై గట్టి నమ్మకం కలిగించామా? రెండు రెండు నాలుగు అంటే జైళ్లు నోళ్లు తెరవడం కాదు.. కేసులు, హత్యల దాకా వెళ్లే మన ఘన ప్రజాస్వామ్యంలో చేస్తున్న రాజ్యాంగబద్ధ ఉద్యమాలు విజయం సాధించి తీరతాయని ఆమెకు గట్టి విశ్వాసం కలిగించామా? కలిగించడానికి ఏమన్నా చేశామా?

1969 నాటి ప్రత్యేక తెలంగాణ పోరులో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన 369 మంది, 1975నాటి ఎమర్జెన్సీలో జైళ్లలో చిత్రహింసలకు గురై కన్నుమూసి స్నేహలతారెడ్డి వంటి వాళ్ల నుంచి మొదలుకుని.. నిన్నమొన్నటి బషీర్ బాగ్ కాల్పుల్లో(2000) చచ్చిపోయిన ముగ్గురు, ఖమ్మం ముదిగొండ కాల్పుల్లో(2007) చనిపోయిన ఏడుగురు, సోంపేట కాల్పుల్లో(2010) చచ్చిపోయిన నలుగురు.. ఇంకా అనేకచోట్ల ప్రభుత్వం చట్టబద్ధంగా పొట్టనబెట్టుకున్న వాళ్లందరూ  ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడారు. వీళ్లలో ఎవరూ ఆయుధాలు పట్టుకోలేదు. వీళ్లెవరూ అడవుల్లో వాగు ఒడ్డున శ్రుతిలా నీళ్లు తాగుతూ.. ఢిల్లీ, హైదరాబాద్ లలోని ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించి వాళ్లు కాదు. కానీ.. శాంతిభద్రతలకు ‘భంగం’ కలిగించిన వీళ్లు, ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్టయి, జైళ్లలో ఉండాల్సిన వీళ్లు కూడా శ్రుతి మాదిరే రాజ్యాంగబద్ధంగా ఎన్ కౌంటర్ అయ్యారు. శ్రుతి ‘కాస్త తెలివైన’ పిల్ల కనుక అలా ఉత్తిపుణ్యానికి చావకుండా తన చావుపై కన్నీటి, గుండెతడి కవిత్వం, పాటలు రాయించుకోవడానికి అడవులకు వెళ్లింది!! ఆమెకు బషీర్ బాగ్, సోంపేట వంటి ప్రజాస్వామిక, చట్టబద్ధ, ప్రభుత్వామోదిత, ‘గెలుపు గ్యారంటీ’ ఉద్యమాలపై నమ్మకం కలిగించని మనం మాత్రం అడవులంటే జడుసుకుంటూ, మిగిలిన వాళ్లను జడిపిస్తూ బతుకుతున్నాం..

మనకు మన రాజ్యాంగాలు, చట్టాలు, ప్రభుత్వాలు, పాలకులు, పోలీసులు నిర్దేశించిన బాటలోనే ఒక్క అంగుళం, అటూ ఇటు కదలకుండా మనవైన ప్రెంచి, రష్యన్, చైనా మహా విప్లవాలు రావాలి. 1857లు, 1942 క్విట్ ఇండియాలు, 1946-51 తెలంగాణ రైతు పోరాటాలు.. చరిత్రను కుదిపిన అనేకానేక విప్లవాలు, పోరాటాలు అన్నీ ఒక్క నెత్తురు బొట్టు కూడా నేలరాలకుండా కొనసాగాలి. అన్యాయం, అక్రమాలపై మన నోళ్లు నిరంతరం నినదిస్తూనే ఉండాలి, మన పిడికిళ్లు బిగుస్తూనే ఉండాలి. అయితే అందుకు శక్తినిచ్చేందుకు మన చిన్ని బొజ్జలకు నిరంతరం శ్రీరామరక్ష కూడా కావాలి. దీనికి మరీ అంత తప్పనిసరైతే మన బిడ్డలు ప్రజాస్వామిక జలియన్ వాలా బాగ్ లలో చస్తే చావొచ్చు కానీ అడవులకెళ్లి మాత్రం చావకూడదు..!

*

 

 

 

 

జయహో మాతా!

 

కొరతబోయిన జానకి

 

పరమ పూజనీయ మహామహోపాధ్యాయ శ్రీశ్రీశ్రీ ప్రతివాది భయంకర సాధ్వీమణి ఆశ్రమమూ, అశేష కోటి భక్తజన సందోహమూ గగ్గోలుగా ఉన్నాయి. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. కేకలతో అరుపులతో నినాదాలతో హోరెత్తుతున్నాయి.

“జయహో మాతా” నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

“పేడ విసిరే హక్కు మాతాజీది మాత్రమే” అనే శంఖారావాలు దిక్కులు పిక్కటిల్ల జేస్తున్నాయి.

ఆశ్రమం ఆశ్రమమంతా రణగొణధ్వనులలో మునిగి ఉంది.

ఆశ్రమమంటే ఆశ్రమం అని కాదు. ఆ ఆశ్రమంలోకి అతి కొద్దిమంది ఆంతరంగికులకు మాత్రమే ప్రవేశం గనుక లోకమంతా ఆశ్రమమే. భక్తశిఖామణుల మనసులన్నీ ఆశ్రమాలే. ప్రతి భక్త శిఖామణీ మాతా స్వరూపమే.

భక్తకోటి అంటే నిజంగా భక్తకోటి అని కూడ కాదు. అది నిజంగా భక్త డజనో భక్త ద్విడజన్లో అని కొందరు అంటారు గాని ఒక్కొక్కరిదీ లక్ష గళార్చన. పామర భాషలో చెప్పాలంటే నోరు పెద్దది.

మాతాజీ పూర్వజన్మ సత్కర్మల ప్రభావపు మత్తు ఇంకా వదలని వాళ్లూ, ఆ సత్కర్మలకు ఇంకా ధన్యవాదాలు చెప్పాలనే వాళ్లూ కొందరు.

మాతాజీ పస్తుత జన్మలో చేస్తున్న పనులలో కొన్ని తమకు గిట్టనివాళ్లకు ఎక్కుపెట్టినవి గనుక శత్రువుకు శత్రువు మిత్రులు సూత్రాన్ని పాటించే అవకాశవాద భజనపరులు కొందరు.

మాతాజీ చెప్పేదీ అవతలివాళ్లు చెప్పేదీ అక్షరం కూడ తెలియకపోయినా లక్ష గళార్చనలో గొంతు కలిపితే సరిపోతుంది గదా అని పెదాలు కదిపే గాలివాటాలు కొందరు.

అంతా కలిసి తలలు వందా, నోళ్లు కోటీ కలిపి భక్తకోటి అనవచ్చు.

మాతాజీకి అసలు నరవాసన గిట్టదు. అందువల్లనే మాతాజీ నాలుగు దశాబ్దాలలో నాలుగు ఆశ్రమాలు మార్చారు.

ప్రతిసారీ, పాపం, నరవాసన లేనిచోట ఆమె ఆశ్రమం నిర్మించుకోవడం, త్వరలోనే అక్కడ చుట్టూ ఇళ్లూ మనుషులూ నిండిపోయి, ఆ నరవాసన గిట్టక ఆమె మరొక చోటికి ఆశ్రమాన్ని తరలించడం.

ఈసారి మాత్రం ఇక మరొకవైపు ఇళ్లు రావనే నమ్మకంతో ఒక సరస్సు తీరాన ఆమె ఆశ్రమం నిర్మించుకున్నారు. కాని అప్పటి మహారాజు ఆ సరస్సు తీరాన్ని దేశదేశాల వ్యాపారస్తులకు పంపిణీ చేయడం మొదలెట్టాడు. ఒకటే నరవాసన.

పాపం, మాతాజీ ఇబ్బందులు ఎవరర్థం చేసుకుంటారు?

అప్పటికే నాలుగు ఆశ్రమాలు మార్చిన అలసటతో, ‘పోనీలే, ఇక ఇది భరిద్దాంలే’ అని ఆమె తనకు తాను నచ్చజెప్పుకున్నారు.

కాని ఆశ్రమంలోపలికి మాత్రం అత్యంత సన్నిహిత భక్తులకు మాత్రమే ప్రవేశార్హత ఉంది. ఇతరులకు లేదు.

మాతాజీ పూర్వజన్మలో అద్భుత కళానైపుణ్యాన్ని వరంగా పొంది వేలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ పూర్వజన్మ వాసనలు ఎంత గాఢమైనవంటే, గాఢ గంధకికామ్లం లాగ అవి ఈ జన్మకు కూడ సాగి వచ్చాయి. భూమ్యాకర్షణ శక్తిలాగ వలయాన్ని సృష్టించాయి. నరవాసన గిట్టని మాతాజీకి, నరసమాజ భక్తకోటి ఏర్పడింది.

ఇక ఈ జన్మలోనూ ఆమె భక్తజనకోటి పెరగడానికి కలిసివచ్చిన కారణాలున్నాయి.

ఆమె ఒక పేడ ముద్దల విసురుడు యంత్రాన్నీ, ఒక కొలతల కార్యశాలనూ, ఒక అబ్రకదబ్ర రసాయన కర్మాగారాన్నీ ఏర్పాటు చేశారు. అవి ఆమెకు భక్తకోటిని సమకూర్చడంలో మహత్తర దోహదం చేశాయి.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. పేడముద్దల యంత్రం అసాధారణమైన కృషి. ఆ పేడముద్దలు దశదిశలా విసరడంతో మాతాజీ ప్రతిష్ఠ దశదిశలా మార్మోగిపోయింది.

అయితే పేడముద్దలు విసరడంలో మాతాజీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని గిట్టనివాళ్లు అంటారనుకోండి.

మాతాజీ పేడముద్దల్ని ప్రతిసారీ ఉడతల మీదా, కుందేళ్ల మీదా, లేళ్ల మీదా విసిరారు గాని పొరపాటున కూడ క్రూరమృగాల మీదా, పులుల మీదా, తోడేళ్ల మీదా, నక్కల మీదా విసరలేదు. మనుషుల మీద, మనుషుల్ని ప్రేమించేవాళ్ల మీద విసిరారు గాని మనుషుల్ని చంపేవాళ్ల మీద, తినేవాళ్ల మీద ఎప్పుడూ ఎంతమాత్రమూ విసరలేదు. చనిపోయిన మంచి మనుషుల మీద విసిరారు గాని బతికి ఉన్న దుర్మార్గుల జోలికి వెళ్లలేదు.

మాతాజీ పేడముద్దల విసురుడుకు ఒక పద్ధతి ఉంది. తాము స్థాపించిన కొలతల వ్యవస్థ ప్రకారం ‘కొలత తగ్గింది, కొరతవేయాలి’ అని ధ్రువీకరణ పత్రం వచ్చిన వాళ్ల మీద మాత్రమే ఆమె పేడముద్దలు విసురుతారు. మనుషుల్ని తినేవాళ్లను కొలిచే ప్రయత్నమే ఎప్పుడూ చేయలేదు గనుక వాళ్లకు ‘కొలత తగ్గింది, కొరతవేయాలి’ అనే నిర్ధారణ వచ్చే అవకాశమే లేదు.

తమకు ఎర కాదగిన చిన్నా చితకా జంతువుల మీద, తమను ప్రశ్నించే వాళ్ల మీద పేడముద్దలు విసిరితే మరీ మంచిది, తాము చంపదలచిన కుక్కకు పిచ్చి కుక్క అని పేరు పెట్టే మహత్తర బాధ్యత మాతాజీ తీసుకున్నారు గదా అని క్రూర మృగాలు సంతోషించాయి. మనుషుల్ని తినేవాళ్లు మహదానందపడ్డారు.

ఈ పేడముద్దలు విసిరే కార్యక్రమం మాతాజీకి కొందరు అభిమానులను సంపాదించిపెట్టింది.

ప్రతి మనిషికీ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది గదా. చాలామందికి ఆ అసంతృప్తికి కారణాలూ తెలియవు. ఆ అసంతృప్తి ఎలా పోతుందో తెలియదు. ఆ నిస్పృహాహావరణంలో ఏమి చేయాలో తోచక వాళ్లు దారిపక్క నిలబడి గారడీవాడు ముంగిసతో పామును ఎప్పుడు కొరికిస్తాడా అని ఎదురుచూస్తుంటారు. వీథిలో ఒకరి మీద ఒకరు విసురుకునే తిట్లను ఆసక్తిగా వింటూ కాలక్షేపం చేస్తారు. మనిషిలోని ఈ బలహీనతను మాతాజీ కనిపెట్టారు.

కొందరిని ఎంచుకుని పేడముద్దలు విసురుతూ ఉంటే మనుషులలోని ఈ హింసాకాలక్షేప ప్రవృత్తిని ఆకర్షించగలనని మాతాజీ గుర్తించారు. ఆ పేడముద్దలు బలహీనుల మీద విసిరితే మరింత చప్పట్లు పడతాయి. ప్రజల అభిమానాన్ని చూరగొని కొందరిలోనైనా అసూయ పుట్టించిన వారి మీద విసిరితే కూడ చప్పట్లు పడతాయి.

ఎప్పుడో ఒకసారి మాతాజీ పేడముద్దలు నిజంగానే తప్పులు చేసినవారి మీద కూడ పడేవి. అయినా తప్పులు చేయని మానవమాత్రులు ఉంటారా? అది చూపించి ఆమె పరమపావన న్యాయమూర్తి అని, తప్పులు చేసినవారి మీదనే ఆమె పేడముద్దలు విసురుతారని భక్తజనం పారవశ్యగీతాల హోరెత్తించేది. ఆ ఘోషలో అనుమానాలూ ప్రశ్నలూ మణగిపోయేవి.

తనకు గతజన్మలో అందిన కళానైపుణ్య వరం ఈ జన్మలో శాపవశాన రద్దయి పోయింది గనుక అంతమంది భక్తులను మళ్లీ కూడగట్టుకోవాలంటే పేడముద్దలు విసరడమే ఏకైక మార్గమని మాతాజీ కనిపెట్టారు.

మాతాజీ స్థాపించిన కొలతల వ్యవస్థ అయితే కనీవినీ ఎరగనిది. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఈ స్థాయిలో లేనిది. మాతాజీ దగ్గర ఒక కొలబద్ద ఉండేది. అది ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల, మూడు లైన్ల, ఎనిమిది థౌ ల పొడవు కొలబద్ద. (క్షమించాలి, ఈ కొలతలు నాకూ ఇప్పుడే తెలిశాయి. లైన్ అంటే అంగుళంలో పన్నెండో వంతు, థౌ అంటే అంగుళంలో వెయ్యోవంతు!)

ఈ కొలబద్ద సరిగ్గా మాతాజీ పొడవు అని, ప్రపంచానికి తానే ప్రమాణం అనే ప్రగాఢ విశ్వాసంతో ఆమె అది తయారు చేశారని గిట్టనివాళ్లంటారు గాని నిజంగా మాతాజీ పొడవు ఎంతో మానవమాత్రులం మనం గ్రహించగలమా?

కళానైపుణ్యం ఉండిన పూర్వజన్మలో మాతాజీ అన్ని రకాల మనుషులనూ మనుషుల మధ్య సంబంధాలనూ చాల బాగా చెప్పేవారు. ఆ కళానైపుణ్యానికి కన్నీళ్లు పెట్టుకుని ఆమె అభిమానులైపోయి, ఇప్పటికీ ఆ అభిమానం వదలని వాళ్లెంతో మంది ఉన్నారు.

ఈ జన్మలో మాత్రం మాతాజీకి మనుషులూ మనుషుల మధ్య సంబంధాలూ అనేవి కంటగింపైపోయాయి. మనుషులందరూ ఒక్కటే అని ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. మనిషి అంటే నిర్వచనం మారిపోయింది. తన కొలబద్దకు సరిగ్గా సరిపోతేనే మనిషి. అంతే. ప్రతి ఒక్కరినీ మాతాజీ ఆ కొలబద్దతో కొలిచేవారు. “నువ్వు ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల మూడు లైన్ల, ఏడు థౌల పొడవున్నావా, ఒక్క థౌ కొలత తగ్గింది, ఫో, కొరత వేయాల్సిందే” అనేవారు. “నువ్వు ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల మూడు లైన్ల  తొమ్మిది థౌల పొడవున్నావా, కొలత మారింది, ఫో, కొరత వేయాల్సిందే” అనేవారు.

ఇది మనుషుల పొడవుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అనుకునేరు, ఇంకా చాల కొలతలున్నాయి. చుట్టుకొలత, జుట్టుకొలత, కట్టు కొలత, చొక్కా రంగు, ఆలోచనలు, కనుముక్కు తీరు, కులం, ప్రాంతం, స్త్రీలైతే మాతాజీ కట్టుకున్న పట్టుచీర లాంటి పట్టుచీరే కట్టుకున్నారా లేదా, మాతాజీ మడమల మీద చీర ఎక్కడిదాకా ఉందో వాళ్లకూ అక్కడిదాకే ఉందా లేదా, యువతులైతే చున్నీ నిండుగా కప్పుకున్నారా లేదా, చేతుల్లేని రవికలు తొడుక్కున్నారా చేతులున్న రవికలు తొడుక్కున్నారా…ఇలా ఎన్నెన్నో. కాదేదీ కొలతకనర్హం.

ఒకసారి ఒక బాటసారి తన ఐదు సంవత్సరాల మనుమరాలితో ఆమె ఆశ్రమం ముందునుంచి పోతున్నాడు.

పాపం, ఆ చిన్నారి పాప గలగల మాట్లాడుతూ చెంగుచెంగున ఎగురుతూ ఆశ్రమం ఆవరణలో పూలమొక్కలు చూసి లోపలికి ఒక్క ఎగురు ఎగిరింది.

“ఏయ్ ఆగక్కడ. ఎవరు నువ్వు? ఆ భుజాలు కనిపించే గౌను ఏమిటి? ఎంత అప్రదిష్ట. శరీరభాగాలు ప్రదర్శిస్తూ ఆ గంతులేమిటి? భుజాలు కనిపించని నిండు జాకెట్టు పరికిణీ వేసుకోవాలి గాని ఆ చేతుల్లేని గౌనేమిటి? మోకాళ్ల కిందంతా కనబడడం ఏమిటి? నిండు జడ వేసుకోవాలి గాని ఆ కురచజుట్టు ఏమిటి? కొలత తగ్గింది, ఫో కొరత వేయాల్సిందే” అని గర్జన వినబడింది.

అలా ఆమె కొలతకు తగ్గి కొరతకు గురైన వాళ్లు ఎందరెందరో. ఎన్ని రకాల వాళ్లో.

అలా కొందరిమీద పేడముద్ద విసిరీ, కొందరిని కొరత వేసీ మాతాజీ మరే వ్యాపకమూ లేక నిస్పృహలో ఉన్నవారెందరికో నిరతాన్నదానం వంటి నిరంతర హాస్య కాలక్షేపదానం కలిగించి వారందరినీ భక్తులుగా మార్చుకున్నారు.

ఈ రెండు కార్యక్రమాలతో పాటు మాతాజీ ప్రారంభించిన మూడో కార్యక్రమం మరింతగా ఆమెకు అభిమానులను సంపాదించి పెట్టింది.

పూర్వజన్మలో ఆమె కళానైపుణ్యం చూసి ఇంత ప్రతిభావంతురాలు మన అభిప్రాయాలు చెపితే మనకెంత గొప్ప, మనకెంత ఆదరణ దొరుకుతుంది అని పావన నవజీవన సమాజం అనే అభిప్రాయాలు గల భవిష్య సాహితి సంస్థవారు తమ కాగితాలూ కరపత్రాలూ పుస్తకాలూ మాతాజీకి సమర్పించుకున్నారు.

మాతాజీ అవన్నీ గంభీరంగా చదివారు. వాటిలో ఉన్నది మాతాజీకి ఎంత అర్థమయిందో తెలియదు గాని ఆమె పునర్జన్మ ఎత్తారు. కొత్త అవతారంలో పాత కళానైపుణ్యం మిగలలేదు. ఇంగువవాసన మాత్రం మిగిలిపోయింది.

మాతాజీ కొత్త పుస్తకాలను తనకు తోచినట్టుగా అర్థం చేసుకుని తనకు అర్థమైనవి మాత్రమే పావన నవజీవన సమాజం పరమ గురువుల ఆదేశాలని చెప్పడం ప్రారంభించారు.

భవిష్యత్ సాహితి వంటి సంస్థలకు పావన నవజీవన సమాజ ఆశయాలే తెలియవని, అసలు తనకు తప్ప మరెవరికీ అవి తెలియవని చెప్పడం ప్రారంభించారు. ఆ ఆశయాలు అమలు చేయడానికి వీథుల్లోకి రావాలనీ పోరాటాలు జరపాలనీ కొందరు అంటారు గాని అదంతా అనవసరం అని మాతాజీ ఉపదేశించారు. గుహలో కూచుని పరమ గురువుల పాఠాలు, వాటికి మాతాజీ భాష్యాలు అధ్యయనం చేస్తే చాలునని కొత్త సిద్ధాంతం తయారు చేశారు.

ఈలోగా వయసు పెరిగిపోవడం వల్లనో, జన్మ మారినందువల్లనో, పాత కళానైపుణ్యం పోయినందువల్లనో కారణం తెలియదు గాని మాతాజీకి పైత్యరసం ప్రకోపించింది. దానికి దివ్యౌషధం ఒక్క మాదీఫల రసాయనం మాత్రమేనని మాతాజీ భక్తుడైన వైద్య శిఖామణి సలహా ఇచ్చాడు. ఒక్క చెమ్చాడు మాదీఫల రసాయనంతో పైత్య ప్రకోపం ఇట్టే మాయమైపోయింది.

దానితో పావన నవజీవన సమాజ సాధనకు తాను తయారు చేసిన కొత్త సిద్ధాంతాన్ని ఇలా సర్వరోగ నివారిణిగా మార్చి అందరిచేతా చప్పరింపజేస్తే బాగుంటుందని మాతాజీ సంకల్పించారు.

అలా మాతాజీ సృష్టిగా అబ్రకదబ్ర రసాయనం తయారయింది.

సమాజ మార్పు కొరకు ఏదో దివ్యౌషధం కావాలని చాలామందిలో ఉన్న కోరిక వల్ల అబ్రకదబ్ర రసాయనానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ అబ్రకదబ్రకూ పావన నవజీవన సమాజపు పరమగురువుల పాఠాలకూ సంబంధం ఉందా లేదా తరచిచూసే ఓపిక లేని వారూ, పోరాటాల్లో పాల్గొని పులుల నోటా, తోడేళ్ల నోటా పడనక్కర లేకుండానే తమవి కూడా పావన నవజీవన సమాజపు ఆదర్శాలేనన్నట్టు నటించవచ్చునని గ్రహించినవారూ మాతాజీ భక్తులైపోయారు.

అట్టి విధంబుగా, మాతాజీ పూర్వజన్మ వాసనల కళానైపుణ్య ప్రభావంలో కొందరు, ప్రస్తుత జన్మలో పేడముద్దలకు అంటిస్తున్న హాస్యరస గుళికల వల్ల ఆత్మశాంతీ వినోదమూ పొంది కొందరు, కొలతల కొరతలతో అంచితానంద శాంత సామ్రాజ్యం చేరి కొందరు, సమాజ పరివర్తనా ఔషధ అబ్రకదర్బ రసాయనం గురించి అమాయకత్వం వల్ల కొందరు, మాతాజీ భక్తకోటి పెరిగిపోయింది.

పాపం, ఆశ్రమం నుంచి కాలు బైట పెట్టగూడదనే ముని శాపం వల్ల మాతాజీ ఎన్నడూ సూర్యుణ్ని కూడ సరిగా చూసి ఎరగరు. భక్తులు ఆశ్రమానికి రావడానికీ వీల్లేదు, మాతాజీ ఆశ్రమం వదలడానికీ వీల్లేదు. అయినా మాతాజీ మాహాత్మ్యం ఎంత అరివీర భయంకరమైనదంటే ఆమెను ఒక్కసారి కూడ చూడనివాళ్లెందరికో ఆమె ఆరాధ్యదేవత అయిపోయారు.

ఆమె మీద ఈగవాలితే (అది వాళ్లెట్లాగూ చూడలేరు గాని), ఈగ వాలిందని తెలిస్తే వెంటనే చతురంగబలాల అక్షోహిణులు రంగంలోకి దిగిపోతాయి. ‘ఈగ మీదనే అంత యుద్ద సన్నాహాలు జరిగినప్పుడు, అమ్మో మనమెంత’ అని మామూలు మానవులు నిర్లిప్త మౌన ముద్రాంకితులైపోయారు. ఆ అప్రతిహత వాతావరణంలో జయహో మాతా భీషణ నినాదాలు ఎల్లవేళలా ఆకాశంలో ప్రతిధ్వనిస్తుంటాయి.

అంతటి ఘనకీర్తి గల పరమ పూజనీయ మాతాజీ భక్త శిఖామణులలో ప్రస్తుత ఆందోళనకు, హఠాత్తు గగ్గోలుకు ఒక కారణం ఉంది.

దారిన వెళ్లే దానయ్య ఒకరు కాలికి పేడ ముద్ద తగిలిందే అని తీసి పక్కకు విసిరాడట. ఆ పేడముద్ద ఆశ్రమం నుంచి బైటపడినదేనట. దానికి మాతాజీ అంటించిన హాస్యరస గుళికలు కూడా అట్లాగే ఉన్నాయట.

స్వయంగా మాతాజీ తయారుచేసిన రంగరించిన ఆ హాస్యరస గుళికల పేడముద్ద నేరుగా మళ్లీ మాతాజీ తలకు తగిలిందట. విలువిద్యా నిపుణులు విసిరిన బాణం తిరిగివచ్చి వారి అమ్ములపొది లోనే పడినట్టు, ఈ పేడముద్ద ఇటువంటి పేడముద్దలు అసంఖ్యాకంగా వెలువరించిన బుర్రకే తగిలిందట. (మహా ప్రజ్ఞావంతమైన మాతాజీ మేధను బుర్ర అంటారా అని భక్తులు నన్ను కోప్పడవచ్చు గాక, కాని సరిగ్గా తగిలింది అక్కడే గనుక, నన్ను క్షమించాలి).

ఎంతటి అపచారం. ఎంత ఘోరం. ఎంతటి దారుణం. ఎంత అన్యాయం. ఎంత అక్రమం. ఎంత… ఎంత…ఎంత…

ఎవరి మీదనైనా పేడ విసిరే ఏకైక సమస్త గుత్తాధికారం మాతాజీకి మాత్రమే గాని దానయ్యకు ఉండవచ్చునా? భోషాణాలకొద్దీ పేడకుప్పలు సమకూర్చుకుని అందరిమీదా విసిరే మహత్తర వరప్రసాదిని హక్కును మరొకరు కొల్లగొట్టడం ఎంత అన్యాయం?

అసలు ఆ పేడముద్దను చేతితో తాకే అర్హతా యోగ్యతా మరొకరికి ఉన్నాయా?

పోనీ, తాకారే అనుకో, మహాప్రసాదం అని కళ్లకు అద్దుకోవలసింది, పక్కకు విసిరిపారేస్తారా?

పారేశారే అనుకో, అది ఆశ్రమం వైపు గురిచూసి విసురుతారా?

విసురుతారే అనుకో, ఆ సమయంలో మాతాజీ అక్కడ నిలబడి ఉంటారనీ, ఆ పేడముద్ద ఆమె మీద పడుతుందనీ స్పృహ లేకుండా ఉంటారా?

ఎంతటి అపచారం!

ఇదివరకు మాతాజీ వేల పేడముద్దలు విసరలేదా, ఈ ఒక్కదానికి ఏమొచ్చె అని అడిగే గడుగ్గాయిలూ ఉంటారా?

ఎంతటి దుర్మార్గం!

దానయ్య అపచారానికి మద్దతు కూడానా, సమర్థన కూడానా, ప్రచారం కూడానా…?

లోకం ఎంత చెడిపోయింది!

లోకానికి అబ్రకదబ్ర అవసరం ఎంతగా ఉంది!

వాడు నన్ను తిరిగి కొట్టినప్పుడు కదా కథ మొదలయింది. దాని ముందు కొట్టింది నువ్వే కదా అని తప్పుడు తర్కం తీస్తారా? ఏమి బేహద్బీ?

అపచారం అపచారం అనే నినాదాలతో భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. దానయ్యను మాత్రమే కాదు, ‘ఆ దానయ్య ఏం చేశాడబ్బా, దారిలో కాలికి పేడముద్ద తగిలితే పక్కకు విసరగూడదా’ అన్నవారినీ, ‘ఆశ్రమమే పేడముద్దల కర్మాగారం కదా, ఎంతోమంది ఆ పేడముద్దల బారిన పడ్డారు గదా, అప్పుడు లేని అపచారం ఇప్పుడొచ్చిందా’ అన్నవారినీ నరికి పోగులు పెట్టవలసిందే అని భజన బృందం ఆందోళన ప్రారంభించింది.

*

ఆ బ్రెడ్డుకు మరీ ఇంత బటరేంది సారూ !

 

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

సోమవారం పొదున్నే బ్రేక్ ఫాస్ట్ కోసం బ్రెడ్ కు బటర్ రాసుకుంటూ ‘ వివిధ ‘ పేజీలు తిప్పాను. ‘ ఇదేం ఆనందం సారూ ! ‘ అని రాసిన ఆర్టికల్ లో నా ఆర్టికల్ ప్రస్తావిస్తూ ఒక రంగనాయకమ్మ అభిమాని రాసిన వ్యాసం చదివాక, ముచ్చటేసింది. బ్రెడ్ నోట్లో పెట్టుకుని నముల్తూ ఉంటే, చదువుతూ బటర్ ఎక్కువ రాసానేమో, వెగటనిపించి పక్కన పెట్టి, ఇంకో బ్రెడ్ మీద ‘ జాం’ రాసుకుని తినేసాను. ఇక ఈ వ్యాసానికి ప్రత్యుత్తరం రాయాలనిపించి ఇదుగో –

‘ వసంత కన్నాభిరాన్ గారు వ్యక్తిగతంగా రంగ నాయకమ్మను విమర్శిస్తూ రాసిన కవిత గురించి మొదట మాట్లాడాలి, ఆ అప్రోచ్ తీవ్రంగా వ్యతిరేకించదగ్గది ‘ అనే పాయింట్ ప్రధానంగా కనిపిస్తుంది ఈ వ్యాసం లో. వ్యక్తి ప్రతిపాదించిన విషయాన్ని వదిలి వ్యక్తిగత విమర్శ చేయడం అన్నది తప్పుడు నడక అనే వాదన గురించి ఈ సాహితీ లోకం లో ఇప్పుడు మాట్లాడ్డం పదో తరగతి కుర్రోడు రెండో ఎక్కం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి – ఈ రెండో ఎక్కం వ్యవహారం మాట్లాడే ముందు – 2010 సంగతి మాట ఒకటి చూద్దాం. ఆజాద్, హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ జరిగాక, అంత్య క్రియల సందర్భంగా వర వర రావు గారు చదివిన మెసేజ్ ను విమర్శిస్తూ రంగ నాయకమ్మ ఆంధ్ర జ్యోతి లో ‘ ఒకే కలం….’ అనే వ్యాసం లో ఇలా రాసింది

” మరి, నిషేధిత పార్టీ తో ఎంతో దగ్గిర సంబంధం లో ఉన్నట్టు ఆధారాలతో సహా కనబడుతోన్నా, వర వర రావు గారి మీద పోలీసుల దృష్టి పడలేదంటే , ఆ వింతకి ఏదో ప్రత్యేక కారణం ఉండి ఉండదా ? “. వాళ్ళ సంస్థ నిర్మాణం లో భాగం కాకుండా దూకుడుగా ‘ వర వర రావు కోవర్ట్ ‘ అనే విషయాన్ని సజెస్ట్ చేస్తూ రాయడం , ఇది వ్యక్తిగత విమర్శగా రంగ నాయకమ్మ అభిమానులకెందుకు తట్ట లేదు ? ఇది కేవలం వ్యక్తి గత విమర్శ అని సర్దుకు పోవడానికి కూడా కుదరని ఘాతుకమైన విమర్శ !! అంతే కాదు – ఈ స్థాయిలో విమర్శించబడ్డ వ్యక్తి రాసిన వ్యాసం పరిశీలనకు ఎలా తగిందో కూడా ఎవరికీ క్లూ లేదు.

ఒక సిప్ టీ తాగేసా. చక్కర సరిగ్గా సరిపోయింది.

ఈ ఆర్టికల్ రాసిన అభిమానిలో ఒక అమాయకత్వం ఉంది. మార్క్సిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ – మధ్య తరగతిని ఎలా కన్ ఫ్యూజ్  చేయొచ్చో తెలియజేయాలి.

‘ మార్క్స్ తో  పాటు  అంబేద్కర్ కూడా  కావాలి ‘ అని విప్లవ సంస్థలు కూడా గ్రహించి ఒకడుగు ముందుకెళ్ళి, దళిత దృక్పథం తో సంస్థలను స్థాపించడం, దళిత పోరాటాలకు వెనుదన్నుగా నిలవడం జరుగుతున్న పరిస్థితి వచ్చాక మధ్యలో కలగ జేసుకుని , ‘ అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి ‘ అనడం లో కుట్ర తేట తెల్లంగా కనిపిస్తుంది. దీనికో భీభత్సమైన సైద్ధాంతిక  చర్చ  ఏముంది ? అంబేద్కర్ సాధించిన వృద్ధి ‘ వ్యక్తి కి సంబంధించిన ది మాత్రమే . వ్యవస్థకు సంబంధించింది కాదు ‘ అనే  బోలు వాదన – ఎన్నో ఏళ్ళుగా కొరవడిన దళిత ఉద్యమాలను వాటి మహోన్నత కుల నిర్మూలన ఆశయాన్ని కించ పరచడం లో భాగం ఎందుకవ్వదో తెలుసుకోలేని పరిస్థితిలో రంగనాయకమ్మ అభిమానం చేరుకుంది. దీనికి గొప్ప సైద్ధాంతిక చర్చ అవసరం లేదు అన్న విషయాన్ని ఇంకా గమనించుకోలేని సాధారణ ఆలోచన కూడా ఈ అభిమానం లో ఒక లేమి.

టి మరో సిప్ చేసా. చిక్కగా ఉంది.

ఇక రంగనాయకమ్మ ప్రజలను, అభిమానులను – చైతన్య వంతం చేసిన విధానం గురించి కృతఙతతో ఉండడం అనే కారణం తో ఆమె తప్పు రాసినా  అర్థం చేసుకోవాలనే ఒక లిబరల్ దృక్పథం  ను ప్రగాఢంగా వాంఛించడం. నిజమే ! రంగ నాయకమ్మ మార్క్సిజం కు సమబంధించి మంచి ‘ గైడ్స్ ‘ రాసింది. అది ఎంత మంచో పక్కన పెడితే – అదే లాజిక్ తీసుకుంటే – ఈ దేశం లో ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని, ప్రభుత్వం తయారు చేసిన సిలబస్ చదివి పైకొస్తున్న ప్రజలు ఇంక ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించరాదు. ఎందుకంటే విద్య ప్రభుత్వ పుణ్యమే కాబట్టి.

ఇక ఆమె చెప్తున్నదే మార్క్సిజమా అన్నది మౌళికమైన ప్రశ్న ! ఆమె చెప్తున్న మార్క్సిజం ఆమె వర్షన్ మాత్రమే. గతి తార్కిక భౌతిక వాదాన్ని వదిలేసి , ఆదనపు విలువ సిద్ధాంతాన్ని మాత్రమే లెక్కలేసి  వివరించడం పూర్తి మార్క్సిజం కాదు. అది నిజం మార్క్సిజం కాదు. దీనికి తోడు   – మార్క్సిజం ను అన్వయించాలసిన సమస్యలకు  ‘ బూర్జువా ‘ టేగ్ తగిలించేస్తే , అది మార్క్సిస్టు  విశ్లేషణ కాదు.

నాకు మార్క్స్ అంటే ఇష్టం, అంబేద్కర్ అంటే ఇష్టం, చలసాని ప్రసాద్ అంటే ఇష్టం –  కానీ రంగనాయకమ్మ చెప్పిందాని లో గూఢం అర్థం చేసుకోను అంటే – ఇదేదో పప్పులో వెల్లుల్లి వేస్తే ఇష్టం, పోపు పెడ్తే ఇష్టం అన్నట్టు మాత్రమే ఉంటుంది.

‘ బూర్జువా డెమొక్రసీ ‘ పరిధికి మించి అంబేద్కర్ ఆలోచనలు ఉపయోగ పడ్తాయా ‘ అనే ప్రశ్న ఈ వ్యాసం లో ఎక్కడో తగుల్తుంది. ఈ బూర్జువా పదం ఇదేదో దండకం అయిపోయిందన్నది ఇక్కడ స్పష్టం. దళితులు సమానత్వాన్ని కోరుకోవడం – ఒక ప్రజాస్వామిక డిమాండ్.  సమానత్వం వచ్చాక , ఎటువంటి విప్లవం తీసుకోవాలో అప్పుడు అది ‘ బూర్జువా సమస్య ‘ అవుతుందో కాదో తేల్చొచ్చు. ఇదే పేరుతో దళితులకు సమానత్వం సాధించడం సెకండరీ అని చిత్రీకరించిన బ్రాహ్మణిక కుట్రలు ఈ రోజో రేపో బౌన్స్ అవ్వక మానవు.

టి కప్పు జాగర్తగా పట్టుకుని సిప్ చేసా. వేడిగా ఉంది టీ.

ఈ వ్యాసం లో చాలా విచిత్రంగా – రంగ నాయకమ్మ రాసిన  పుంఖాను పుంఖాలైన వ్యాసాలకు బలవంతంగా ఒక సింపతీ తీసుకురావాలనుకోవడం. అదే సమర్థనీయం ఐతే – కుట్ర కేసులకు వ్యక్తి గత జీవితాలను ఒడ్డిన వి ర సం కు ఎంత సిపతీ కావాలి అన్న ఆలోచన రంగనాయకమ్మ అభిమానులకు ఎందుకు తట్టదో తెలుసుకోలేనంత ‘ దూరా ‘ భిమానం ‘ అయ్యింది. మళ్ళీ అదో ప్రశ్న – ‘  ఏం ఈ పుస్తకాలు  మార్క్సిస్ట్ – లెనినిస్ట్ పార్టీలు తీసుకు రావచ్చుగా ‘  అని ? …  ఏం ఎందుకు తీసుకు రావాలి ? – ఒరిజినల్ మార్క్స్ పుస్తకాలు చదవడానికి,  చదివే వాళ్ళకు బద్దకమైతే – అది భగ భగ మండి పోతున్న ‘ విప్లవ సమస్యా ‘ ?  అలా పుస్తకాలు తీసుకు వస్తేనే సిన్సియారిటీ నా ? ఇది విప్లవోద్యమమా లేపోతే ‘ పబ్లికేషన్స్ ఉద్యమమా ‘ ? ఇలా పుస్తకాలు ప్రచురించే బెంచ్ మార్క్ ఏంటో ఎన్ని టీ కప్పులు ఖాళీ చేసినా తెలీదు.

ఇంకో సిప్ కొట్టా. నాలుక పై వేడిగా టీ దిగుతుంది.

అలాగే – శ్రీ శ్రీ విషయం లో వర వర రావు గారి వ్యాసం శీర్షిక భాగం లో ” ఎటువంటి రాజకీయ , సాంస్కృతిక సందర్భం లోనైనా శ్రీ శ్రీని ముందు బెట్టి రచయితలను కలుపుకు  రావచ్చనేది చలసాని అవగాహన ” అని ఉంటే అందులో ‘ వీర పూజ ‘ ప్రస్తావన ఎక్కడిది ? ఆయన్ని తల మీద పెట్టుకుని ఊరేగినట్టు ఏముంది ? ఇదే శ్రీ శ్రీ,  విరసం నుండి  బహిష్కరించబడ్డప్పుడు మరి ‘ వీర ద్వేషం ‘  కనిపించలేకుండ పోవడం తమాషా. శ్రీ శ్రీ వి రసం లో చేరకున్నా విరసం ఏర్ప్డడేది . అదో చారిత్రక సందర్భం. శ్రీ శ్రీ , మోటార్ సైకిల్ కు పెట్రోల్ అడ్జస్ట్ చేసి ఇవ్వాలనుకున్న ఫస్ట్ కిక్కు మాత్రమే. వెంటనే ఇచ్చే రెండో కిక్కుకు మోటార్ సైకిల్ చచ్చినట్టు కదిలేది. అలాగని మొదటి కిక్కు వృథా చేసుకోకూడాదనుకునే  ‘ ఎంథూసియాజం ‘ మాత్రమే చలసాని ప్రసాద్ గారికి ఉంది  అన్న సాధారణ విషయాన్ని కూడా ఇంత విడమరిచి చెప్పాల్సి వస్తుందేంటో ?!  శ్రీ శ్రీ ని వెంటనే కార్ ఎక్కించకుండా – ఒక రెండు నెలలు ‘ మార్క్స్ ‘ టెస్ట్ పెట్టి తీరుబడిగా ఆహ్వానించి ఉంటే సరిపోయి ఉండేదా ?  పైగా వి ర సం ఏర్పడాలంటే – మొదట ప్రణాళిక రాసుకోవాలట, తర్వాత కార్య వర్గం నిర్మించాలంట –  ఆ తర్వాతే వి ర సం ఏర్పాడలట ! మార్క్సిస్టు ‘ రూలు బుక్కు ‘ ఒకటి తయారు చేయాలిక. ఎప్పుడెలా ప్రవర్తించాలి అని. రంగ నాయకమ్మ అభిమానులు గ్రహించాల్సింది ఏంటంటే – దోపిడీ, అణచివేత కు రూల్స్ లేవు,  మార్క్సిస్ట్ ఫిలాసఫీ రిజిడ్ ఫిలాసఫీ కాదు.  మార్క్సిజం మీద గైడ్స్ రాసి రంగ నాయకమ్మ ఇప్పుడు ‘ విప్లవ రూల్ బుక్కులు ‘ రాస్తుంది.

టీ అయిపోవచ్చింది. దాని ఘాటైన వాసన మనస్సును ఉత్తేజ పరుస్తుంది.

రంగ నాయకమ్మ కలం కు,  పోటు ఇవ్వడం తెలీదు. ఆ పోటుకు అభిమానులనుకున్నట్టు బాధితులెవరూ లేరు. నిజానికి ఇదంతా రంగ నాయకమ్మకు దళిత వాదులు, ప్రజాస్వామిక కాముకులు ఇచ్చే పోటు. అసలు కలం పోటు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే విరసం తో మమేకమైన చెరబండ రాజును చదవాలి. అంతే కాని ఇన్ని సంవత్సరాలు  ఎప్పుడో పాతిన ‘ వృక్షాలను ‘ ‘ మొక్కలను ‘ అమ్ముకుంటూ బతకడం కాదు.

చివరి సిప్ చేసేసా. ఈ రోజు ఏంటో టీ మస్త్ కిక్ ఇచ్చింది ! లేచి బటర్ ఎక్కువ రాసేసుకున్న బ్రెడ్ ను డస్ట్ బిన్ లో పారేసి వచ్చేసా.

 

(PS : This write up absolutely aims to dispassionately convince the masqueraded arguments in the name of Marxism and this comes with an earnest request to all readers to consider the essence of the article with an objective view and feel free to reach the writer in his inbox for any queries at pvvkumar@yahoo.co.uk or on Facebook )

 

 

 

 

 

 

 

 

 

 

గోదావరీ, కుక్కతోకలూ..

 

సత్యమూర్తి

‘‘నేను జ్ఞానవాపి వద్దకు వెళ్లాను. దేవుడి కోసం వెతికాను కానీ కనుక్కోలేకపోయాను. మనసంతా అదోలాగా అనిపించింది. జ్ఞానవాపి పరిసరాలు మహరోతగా ఉన్నాయి. దక్షిణ ఇవ్వాలనిపించలేదు..’’

మహాత్మాగాంధీకి వారణాసిలో ఎదురైన అనుభవం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గోదావరి పుష్కరాల పేరుతో చేస్తున్న ప్రచారం జ్ఞానవాపి పరిసరాలకంటే రోత పుట్టిస్తోంది. పవిత్ర పుష్కర గోదాట్లో మునిగితే పుణ్యం పురుషార్థం(మహిళార్థం ఉండదు!) దక్కుతాయని ప్రభుత్వాలు రేడియోల్లో, టీవీల్లో, నానా ప్రచారసాధనాల్లో చేస్తున్న నానాయాగీ మన దేశం లౌకిక దేశం కాదని, పుణ్యస్నానాల, పిండప్రదానాల హిందూదేశమని ఢంకా బజాయిస్తోంది. గుణదల మేరీమాత ఉత్సవాలకు, కడప అమీన్ పీర్ దర్గా ఉరుసుకు మన లౌకిక ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారం చేసిన దాఖలాలు లేవుగా మరి!

మనది పేరుకే లౌకిక దేశమన్న సంగతి కొత్తేమీ కాదు కానీ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పోటీపడి కీర్తికండూతితో అధికార పటిష్టత కోసం నిస్సిగ్గుగా తమ హిందుత్వాన్ని బహిరంగంగా చాటుకోవడం చూస్తుంటే కొనవూరిపితో ఉన్న లౌకికవిలువలకూ ముప్పు వచ్చిందని మరింత స్పష్టమవుతోంది. వాళ్లిద్దరిని ఎన్నుకున్న రెండు రాష్ట్రాల్లోని ముస్లింలు, క్రైస్తవులు ముక్కున వేలేసుకుని ‘మాకు మాంచి శాస్తి చేశారు’ అని గొణుక్కుంటున్నారు. క్రైస్తవుల పక్షమని చెప్పుకునే నాయకుడు కూడా గోదాట్లో మునకేయడం చూసి క్రైస్తవ సోదరులు సిగ్గుతో బిక్కచచ్చిపోతున్నారు. గత పుష్కరాల సంగతేమో కానీ ఇవి మాత్రం అసలు సిసలైన రాజకీయ పుష్కరాలు. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే తెలంగాణలో సగానికిపైగా జనం పుష్కరాల్లో మునిగారు. మొత్తం ఏపీ జనాభా అంతా మునిగిందని బాబు చెప్పడమే తరువాయి. పుష్కరాల డబ్బును జేబుల్లో వేసుకోకుండా పారదర్శకంగా ఖర్చుపెట్టామని చెప్పడానికి ఈ కాకిలెక్కలు తప్పనిసరి.

ఈ పుష్కరాలకు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ప్రచారం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రచారం కానే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వవాదుల మెప్పుకోసం కేసీఆర్, చంద్రబాబులు ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన పన్నుల డబ్బుతో చేస్తున్న నీచమైన పందేరం. మెప్పుకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వీళ్ల ప్రచారానికి మోసపోయి గోదాట్లో మునగడానికి వెళ్లే జనానికి కూడా తొక్కిసలాట చావులు ప్రతిఫలంగా ముడుతుంటాయి. కేంద్రంలో సంఘ్ పరివార్ అధికారంలోకి రావడం, ఘర్ వాపసీ, యోగాపై ఊకదంపుడు ప్రచారం.. వీటన్నింటి నేపథ్యంలో పుష్కర ప్రచారాన్ని చూస్తే దాని వెనక ఉన్న మతాధిపత్య కోణాన్ని సులభంగా గుర్తించవచ్చు.

మతం ఇంటికే పరిమితం కాకపోవడం వల్ల వచ్చిన జాడ్యాలివి. చంద్రబాబు ఏపీ కొత్త రాజధాని భూమిపూజను కుటుంబకార్యక్రమంగా మార్చి పక్కా హిందూమత కార్యక్రమంలా జరిపినా, తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ బ్రాహ్మణ గవర్నర్ కు బహిరంగంగా బోర్లబడి కాళ్లుమొక్కినా,  మోడీ విదేశీ నేతలకు భగవగ్దీతను కానుకగా ఇచ్చినా, భగవద్గీతను జాతీయగ్రంథం చేయాలని సుష్మా స్వరాజ్ వాగినా, వాళ్లపై వేసిన పిటిషన్లను కోర్టులు కుంటిసాకులతో కొట్టేసినా.. అవన్నీ ఆ జాడ్యాల ఫలితాలే. పుష్కరాలపై ప్రభుత్వాలు చేస్తున్నది ప్రచారం కాదని, సమాచారం ఇవ్వడమేనని, అన్నిమతాలకు సమప్రాధాన్యత ఇవ్వడమే లౌకికవాదమని, ప్రజల మతవిశ్వాసాలకు అనుగుణంగా తగిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వాల బాధ్యత అని మన శ్రీశ్రీశ్రీ గౌరవనీయ హైకోర్టు మహగొప్పగా వాక్రుచ్చింది. అవునా..? లౌకికవాదమంటే అదా? మనకు తెలిదే! వెర్రినాయాళ్లం, ఇంతకాలం లౌకికవాదం అంటే రాజ్యం మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండడమే సుమా అని అనుకున్నామే (Secularism is the principle of the separation of government institutions and persons mandated to represent the state from religious institutions and religious dignitaries. Secularism the belief that religion should not be involved in the organization of society, education, etc.)

రిపబ్లిక్ డే సందర్భంగా పత్రికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లోని రాజ్యంగ పీఠిక చిత్రంలో సోషలిస్టు పదం లేదని మొన్నామధ్య గొడవ జరిగింది. అది సోషలిస్టు పదాన్ని చేర్చకముందటి రాజ్యంగ పీఠిక చిత్రమని, ‘పొరపాటు’ జరిగిపోయిందని ‘నైపుణ్యాల అభివృద్ధి’ సర్కారు సమర్థించుకుంది. దేశాన్ని హిందూదేశంగా చేసిపారేస్తామంటున్న సంఘ్ నేతల ఆశయసాధనకు ఇలాంటి ‘పొరపాట్ల’తో శాయశక్తులా సాయం చేయడం తమ విధి అని చెప్పకనే చెప్పింది. ఈ పీఠిక గొడవ సమయంలో.. రాజ్యంగ పీఠికలోంచి సోషలిస్టే కాదు, సెక్యులర్ పదాన్నీ పీకిపారేయాలని(అసమానతల హిందూదేశం అనే పదాలు పెట్టాలని!) హిందూవాదులు డిమాండ్ చేశారు. ఒకరకంగా చూస్తే వాళ్లన్నది సరైందేనేమో. మేకమెడ చన్నుల్లాంటి ఆ పదాలను తీసేస్తే పోయిందేమీ ఉండకపోవవచ్చు. పైగా ఆ పదాల అచ్చుకు కావాల్సిన కాయితం, ఇంకు ఖర్చు ఆదా అవుతుంది కూడా. ఆ ఆదా డబ్బు రాబోయే మరింత పవిత్ర పుష్కరాలకు అక్కరకొస్తుంది.

లౌకికవాదం అంటే మతాలకు అతీతమైంది కాదు, అన్ని మతాలతో అంటకాగేది అని మన నేతలు అద్భుత నిర్వచనమివ్వడమే కాకుండా దాన్ని అమలు కూడా చేయబట్టి చాలాకాలమే అయింది. పత్రికల్లో లౌకికవాదం అనే పదం చూసి, ‘లౌకికవాదం అంటే లౌక్యంగా మాట్లాడ్డం కాబోలు’ అని అనుకునే వెర్రిజనం కోట్లకొద్దీ ఉన్న డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్, రిపబ్లిక్ వగైరా విశేషణాల భారత దేశంలో మతఛాందసవాదులకు అడ్డేముంది?

Godavari-Pushkaralu

మతభేదాల్లేకుండా వసూలు చేస్తున్న పన్నుల్లోంచి కోట్ల డబ్బును ఒక మతకార్యక్రమం కోసం వెచ్చించడం అప్రజాస్వామికం, దుర్మార్గం. ఒక మతానికి అని అంటే హిందూమతానికే అని కాదు. ముస్లింల హజ్ యాత్ర సబ్సిడీలను, క్రైస్తవ మిషనరీలకు ఇస్తున్న నిధులను, రాయితీలను, ఇతర మతాలకు కూడా ఇస్తున్న నిధులను కూడా రద్దు చేయాలి. కోట్ల మంది ప్రజలు బతుకుతెరువు, సాగునీళ్లు, తాగునీళ్లు, మందుమాకులు, ఇళ్లు లేక అల్లాడుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న మన పేరుగొప్ప దేశంలో ఉత్తి‘పుణ్యానికి’కి కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేయకుండా అసలైన ప్రజాక్షేమానికి ఖర్చుపెట్టినప్పడే మనది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది.

అన్ని కోట్లమంది భక్తివిశ్వాసాలుగల పౌరులు వెళ్లే పుష్కరాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తే తప్పేంటి అని కొందరు అడుగుతున్నారు. దెయ్యాలు, చేతబడులను నమ్మేవాళ్లు కూడా దేశంలో కోట్లమంది ఉన్నారు. వాటి ప్రచారానికి కూడా కోట్ల తగలెయ్యాలి. పాత గుళ్లలో, కోటల్లో గుప్తనిధుల కోసం పలుగుపారతో వెళ్లేవాళ్లకు ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలివ్వాలి.

మన దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సామ్యవాద విలువలు పాశ్చాత్యదేశాల్లో మాదిరి క్రమానుగతంగా, ప్రజాపోరాటాల ద్వారా వచ్చినవి కావని, అరువుకు తెచ్చుకున్నవని, అందుకే అవి వెర్రితలలు వేస్తున్నాయనే అభిప్రాయం ఒకటుంది. పతంజలి నవలిక ‘పిలక తిరుగుడు పువ్వు’లో మేజిస్ట్రేటు అన్న మాటల ప్రస్తావన ఇక్కడ అసందర్భమేమీ కాదు.. “మన జ్ఞానానికి సార్ధకత లేదు.  మన విశ్వాసాల పైన మనకు నమ్మకం లేదు. మన విలువల పైన మనకు గౌరవం లేదు. మన దేవుళ్ళ పైన మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం పైన మనకు విశ్వాసం లేదు. మన మీద గానీ, తోటి వాళ్ళ మీద గానీ మనకు మమకారం  లేదు. మన ప్రజాస్వామ్యం పైన మనకు అవగాహన కానీ గురి గానీ లేదు. మన జ్ఞానానికీ – విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ – ఆచరణకూ పొందిక లేదు..భూమి బల్ల పరుపుగా వున్నప్పుడే ఇలాంటి జీవితం కనపడుతుంది”

ఇది పాలకుల తప్పేకానీ ప్రజల తప్పుకాదు. ప్రజలకు ఎన్నుకోవడానికి మంచి నాయకులు లేరు. పైగా ఓటు వేయకపోవడం దేశద్రోహమని ప్రచారం చేస్తున్న నికృష్ట ప్రజాస్వామ్యమిది. మన ప్రజలు వెర్రివాళ్లే. కానీ ఎల్లకాలం అలాగే ఉండరు. వెర్రి కుదిరే కాలం వచ్చినప్పుడు తాము పట్టుకున్న కుక్కతోకలను వదలి సొంతంగా గోదారి ఈదకమానరు.

*

 

 

దేహాలు –దేవాలయాలు – కొన్ని సందేహాలు

కొండేపూడి నిర్మల 

 

nirmalaమధ్యప్రదేశ్ లో ఏడేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదన్ లాల్, కోర్టులో శిక్ష ఖరారయన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులతో రాజీ పడ్డాడు. దీ౦తో నిందితునికి విధించిన ఏడాది జైలు శిక్ష సరిపోతుందంటూ హైకోర్టు  అతని విడుదలకు ఆదేశించీంది. ( నేరస్తుల పట్ల కోర్టులు ఎంత సహోదర ప్రేమతో వుంటాయో మనకి తెలుసు.). దీనిపై  మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి౦ది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు  మాత్రం అత్యాచార కేసుల్లో రాజీ ఒప్పందాలు చెల్లవని, మెతక వైఖరిని ప్రదర్శించడం,  నిందితులను రాజీకి అనుమతించడ౦ తీవ్రమైన తప్పిదమని అది మహిళల ఆత్మగౌరవాన్ని కీంచపరఛడమే అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

ఇంతవరకు బానేవుంది.. మధ్యప్రదేశ్ హైకోర్టు కంటే మన సుప్రీకోర్టు కొ౦చెం విచక్షణతో వ్యవహరించింది  అని సంతృప్తి కూడా కలిగింది.

ఎందుకంటే అవిచ్చినంగా నడుస్తున్న కాఫ్ పంచాయితీల దగ్గర నుంచి సుప్రీ౦కోర్టు దాకా అత్యాచార బాధితురాల్ని, ఆ నేరం  చేసినవడు లగ్గం చేసుకు౦టే  న్యాయం జరుగిపోయినట్టే భావిస్తాయి.  . “గృహ ప్రవేశం”  సినిమా ఇదే కధా వస్తువుతో  350 రోజులు ఆడింది. కర్తవ్యం లో ఒక పోలీసు ఆఫీసరు  దగ్గరుండి బాధితురాలికి నేరస్థుడితో పెళ్లి జరిపిస్తుంది. చివరికి ఆ పెళ్ళిలో కూడా నేరస్థుడూ అతని తండ్రీ కలిసి  బాధితురాలిపై హత్యా ప్రయత్నం చేస్తారు . అయినా ఆ ప్రయత్నాన్ని  ఆ పోలీసు ఆఫీసరు తెలుసుకుని కాపాడి “ కలకాల౦ కలిసి వుండ “ మని ఆశీర్వదిస్తు౦ది. ఇలాంటివన్నీ  జనం కళ్ళకి అసహజంగా కాకుండా ఆనందబాష్పాలతో తిలకించేలా చెయ్యడానికి ఒక భావజాల౦ వుంది . మధ్యయుగాలకు చెందినట్టు కనిపించే ఈ భావజాలాన్ని చదువూ వివేకం , సాంకేతిక పరిజ్ణానమ్ ఏవీ మార్చలేవు.  అందుకు ఒక  చిన్న ఉదాహరణగా   పై కేసులో సంచలనాత్మక తీర్పు ఇచ్చిన న్యాయాకోవిదులు    అత్యాచారాల గురి౦చి  ఇచ్చిన నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు. ఏమిటా నిర్వచనం ;

“ఆత్యాచారానికి పాల్పడటం  అంటే దేహాన్ని దేవాలయంగా భావించే మహిళపై దాడి చేయడమే . దానివల్ల అత్యాచార బాధితులు మాన మర్యాదలు కోల్పోతారు. అది వారి ప్రాణాలను హరించడంతో  సమానం. ‘

తీర్పు  హేతు బద్ధంగానూ ,  నిర్వచనం దానికి భిన్నంగా వుండటానికి వెనకగల కారణ౦ నాకు చాలా  ఆసక్తి కలిగించింది.  పై మాటలు  స్త్రీలందరి దేహ దేవాలయాల శీలా సంపదల  గురించి న్యాయమూర్తులూంగారు   అంటున్నప్పటీకీ సందర్భం మాత్రం ఏడేళ్ళ పాప గురించే.  అదృష్టవశాత్తూ అంత లావు భావజాల౦ ఆ పాప కెలాగూ అర్ధాంకాదు.

ఆ మాటకొస్తే తన శరీర నిర్మాణమేమిటో , ఎవడు ఎందుకు  దాడిచేశాడో,  అసలు ఏం జరిగిందో తెలుసుకునే౦త వయసుకూడా లేదు. తెల్సిందల్లా  భయానకమైన దాడి, గాయాలు, రక్తస్రావం. మానసికంగా ఒక దిగ్భ్రాంతి. ఇలాంటప్పుడు తక్షణమే వైద్యం జరగాలి. వైద్యమ౦టే  ఆస్పత్రిలో వుంచి కట్టుకట్టడం మాత్రమే కాదు.  ఏ పరిసరాలు, సంఘటనలు, మనుషులు ఆమెని అంత భీతావహురాల్ని  చేశాయో దానికి దూరంగా వుంచడం , .కుటుంబం ,సమాజం ఆమె పట్ల సానుభూతి  కాకుండా సహానుభూతి కలిగివుండటం, . క్రమక్రమంగా ఆమె మనసుని  చదువు వైపు , ఆటలపాటలవైపు, ఆమె కిష్టమయిన మరో వ్యాపక౦ వైపు మళ్ళీంచడం- ఇవి కదా  జరగాలి.. వీటివల్ల మాత్రమే బాధితురాలు కోలుకోవడానికి అవకాశం వుంది. అదే సమయంలో  నేరస్థుడికి చట్టబద్ధంగా  విచారణ, రిమాండ్ , శిక్ష ఇలాంటి లాంటివన్నీ జరగాలి.

అంటే అటు ఆ పాపకి జరిగిన అన్యాయానికి, ఇటు నేరస్థుడి చర్యకీ చట్టం  బాధ్యత వహించాలి.  కానీ  వాస్తవంలో ఏం జరుగుతోంది? ఆ  నేరస్థుడ్ని తెచ్చి బాధితురాలితో పెళ్ళి చెయ్యడం జరుగుతోంది.  దీనివల్ల ఒకసారి అత్యాచారం చేసినవాడికి జీవితాంతమూ అత్యాచారం చెయ్యడానికి బోనస్ లాంటిది  దొరుకడంలేదూ| తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పోరాట౦ చేయాల్సిన బాధిత కుటుంబానికి  నేరస్థుడే మీసాలు తిప్పుతూ అల్లుడవుతాడు. ఎటువంటి శిక్షా, పరివర్తనా లేకుండా అటువంటి నేర ప్రవృత్తి గలవాడిని  ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబంలో  ఇతర బాలికలకు , స్త్రీలకు రక్షణ కరువయ్యే ప్రమాదం లేకపోలేదు.. బాధితురాలు సైతం తన ప్రాధమిక , మానవ హక్కులమీద దాడిచేసినవాడ్ని జైలుకి పంపడానికి బదులు ప్రేమిస్తూ, సేవలు చేస్తూ , వారసుల్ని కనివ్వాలి. ఇంత రోతను భరించినా సరే ఆమె ప్రాణానికి రక్షణ వుందో లేదో తెలీదు. అప్పుడు గృహహింస బాధితురాలి చిట్టాలో ఆమే పేరు నమోదవుతుంది.  ఇన్ని చట్ట విరుద్ధ , అప్రజాస్వామ్య , పౌరుష హీన చర్యలన్నిటికీ సదరు  స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధతో అల్లిన భావజాలమే కారణం.

ప్రస్తావన కోసం మళ్ళీ నిర్వచనాన్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం

స్త్రీలు  తమ శరీరాల్ని దేవాలయాలుగా భావిస్తారని సామాజం భావిస్తుందిట..  ముస్లిం స్త్రీలయితే మసీదులుగా , క్రైస్తవ స్త్రీలయితే చర్చీలుగా భావించుకోవచ్చు. పోనీ కాస్సేపు నిరర్ధకమయిన ఈ పోలికతోనే ఆలోచిద్దాం. మామూలుగా దేవాలయాల్లో  ఒక పశువు బురదకాళ్లతో అడుగుపెడితే ( రేపిస్టుని నోరులేని పశువుతో పోల్చడం  నా కీష్టంలేదు ) ఏం చేస్తారు? అప్పుడు ఆ ప్రాంతమంతా శుద్ధి చేసి సంప్రోక్షం చేస్తారు. దాంతో పవిత్రత తన్నుకుంటూ వచ్చి తీరుతుంది.. కానీ స్త్రీల విషయంలో ఒకసారి పోయిన పవిత్రత మళ్ళీ రాదు. కాబట్టి ఎవడైతే నేరం చేశాడో వాడే ఆమెని చేపట్టాలి.  అలా చేపట్టేలోపు ఆమే  మాన మర్యాదలు ప్లస్ ప్రాణం కూడా పోయినట్టే భావించుకోవాలి. ఎవదైనా చేపట్టీన తర్వాత అలా భావించనవసరంలేదు.  తాళి కట్టీన తుచ్చుడే రక రకాలుగా భావిస్తాడు కనక. 

అయ్యా | బాబూ | మేము మీ సాటి మానవుల౦, మీరు ఆపాదిస్తున్న  దైవత్వాలూ, పవిత్రతలూ వద్దే వద్దు. రాజ్యాంగం మాకు ప్రసాదించిన   హక్కుల మీద ఎవరేనా దాడి చేసినప్పుడు సకాల౦లో  స్పందించండి, చాలు-  అని మహిళలు ఎప్పటినుంచో తల బాదుకుంటున్నారు. అది మాత్రం జరగడంలేదు.

*

 

ఐటెం సాంగ్స్…కెవ్వు కేక..మా టెల్గూ ఈవెంట్!

మధు పెమ్మరాజు 

madhu_picఓ ఆదివారం సాయంత్రం స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గుడి ఆడిటోరియంలో ఏర్పాటు చేసారు. అప్పుడప్పుడు తెలుగుదనాన్ని దగ్గరగా చూసే అవకాశం, పాత కొత్త పరిచయాల పలకరింపులు, e-పిలుపులో ‘ముప్పై రకాల పిండి వంటలని సంకేతాత్మకంగా నిండు అరిటాకు’ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు..బోలేడు ఊరించే ప్రయోజనాలు తట్టడంతో వేడుక స్థలానికి కాస్త కంగారుగా, అరగంట ముందుగా చేరుకున్నాను.

ఆడిటోరియం గుమ్మంపై తళ, తళా మెరుస్తున్న ‘తెలుగు సాంస్కృతిక సమితి సిల్వర్ జూబ్లీ’ బానరు, ప్రవేశ ద్వారం వద్ద తెలుగింటి ఆడపడుచులు, కుర్తా బ్రదర్లు సాంప్రదాయంగా ఆహ్వానిస్తున్నారు. అదే రోజు సమితి ఎన్నికలు కూడా ఉండడంతో నవ్వులు మామూలు కంటే కాస్త ఎక్కువగా పూస్తున్నాయి. టికెట్ కొని లోపలకి అడుగు పెట్టానో లేదో జిగేల్మనిపిస్తున్న స్టేజి అలంకరణ, పట్టు బట్టల పరుగులు, వేడుక కోలాహలం నా అంచనాలని అంచలంచలుగా పెంచేస్తుంటే కాస్త నిలదొక్కుకుని, ఓ పాత పరిచయం పక్కన సెటిలయ్యాను.

తెర దించగానే అందంగా ముస్తాబయిన, అందమైన యెమ్.సీ ప్రేక్షకులకి, స్పాన్సర్లకి, కార్యవర్గానికి ధన్యవాదాలు చెప్పి, రాబోయే అంశాలతో పాటు ఇండియా నుంచి విచ్చేసిన ఆహ్వానిత అతిధిని సభకి పరిచయం చేసింది. ప్రేక్షకుల మొహంలో “యెమ్.సీ అంతా బానే చెప్పింది కానీ భోజనాల బ్రేకెప్పుడో చెప్పలేదు” అన్న సందేహం కొట్టొచ్చినట్టు కనపడింది. మొట్టమొదట పిల్లల ప్రార్ధనా గీతం, సమితి ప్రెసిడెంట్ ప్రారంభ ఉపన్యాసంతో వేడుక పద్దతిగానే ప్రారంభమయ్యింది.

“మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న…” అని యెమ్.సీ ప్రకటించడం ఆలస్యం పది, పన్నెండేళ్ళ పిల్లలు స్టేజిని “సారొత్తారొత్తారా.. రొత్తారా.?” అని ప్రశ్నిస్తూ స్టేజీని దున్నేయడం మొదలుపెట్టారు. తల్లితండ్రులు మంత్ర ముగ్దులై, పిల్లల్ని గర్వంగా వీడియోలలో, ఫోటోలలో బంధిస్తున్నారు. ఆకాశం వంటి వెండి తెర స్టెప్పులని నేలపైకి తెచ్చిన బాల భగీరధుల నైపుణ్యానికి ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పాట పూర్తి కాగానే చప్పట్లతో ఆడిటోరియం పైకప్పు సగం లేచిపోయింది. తర్వాత సామాజిక స్పృహ నిండిన పాట “పువాయ్ పువాయ్యాంటాడు ఆటో అప్పారావు..స్కూటర్ సుబ్బారావు..“ అంటూ పదిహేనేళ్ళ పిల్లలు గురువులు నేర్పిన స్టెప్పులు వరుస తప్పకుండా వేస్తుంటే ప్రేక్షకుల టెంపో తారాస్థాయికి చేరి ఆడిటోరియం కప్పు లేని సాసర్లా మిగిలింది.

నా పక్కనే కూర్చున్న పరిచయాన్ని “సంస్కృతి అంటూ ఈ రికార్డింగ్ డాన్సులు ఏమిటి సార్?” అనడిగాను

“పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారండి? కల్చరంటూ హరికధలు, బుర్రకధలు, లలిత సంగీతం మొదలెడితే చేతకాని కార్యవర్గం అంటూ ఆ వచ్చే పది మంది కూడా రారు. ఏ అసోసిఏషనయినా జనాలని ఆకర్షించడం మొదటి ఉద్దేశ్యం కదండి?” అన్నారు.

“మరి ఈ ఐటెం సాంగ్స్ పెడితే పేరెంట్స్ కి అభ్యంతరంగా ఉండదా?”

ఆయన మొదటిసారి నా మొహంలోకి మొహం పెట్టి చూసారు, నేను మర్చిపోలేని చూపు “మీరు ఇప్పుడే పుట్టినట్టున్నారే.. ఒక్కసారి తెలుగు చానళ్ళు పెట్టి చూడండి, ఇండియా చక్కర్ కొట్టి రండి….కోచింగ్ సెంటర్లు పెట్టి మరీ పిల్లలకి నేర్పుతున్నారు” అని చిరాగ్గా తల తిప్పుకున్నారు.

ఈ లోపు భరత నాట్యం అని అనౌన్స్ చెయ్యగానే ఆ పాల్గొనే పిల్లల తల్లి, తండ్రులు సెల్ ఫోనులు పట్టుకుని స్టేజిపైకి దండయాత్రకి వెళ్లారు. మిగిలిన వారికి కాస్త ఆటవిడుపు లభించి పక్క వారి చీరలని, నగలని, మేకప్పుని ఆపాదమస్తకం స్కాన్ చేసే సరికి.. ఆ చూపులు మాటలుగా మారి గదంతా వ్యాపించాయి. ఇక మిగిలిన వారు… అంటే మగవారు.. ప్రాజెక్ట్ కష్టాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్లంటూ తమ వంతు సాయం చేస్తూ డెసిబెల్ లెవెల్ రెట్టింపు చేసేసారు. ఇవేవీ పట్టని పిల్లలు డాన్స్ క్లాసుకొచ్చినట్టు తమ పని తాము సక్రమంగా పూర్తి చేసి ప్రశాంతంగా స్టేజి దిగిపోయారు.

అంతదాకా ముందు వరసలో ఉగ్గ బెట్టుకుని కూర్చున్న ఆహ్వానిత అతిధి, అదేనండి… ఇండియా నుండి విచ్చేసిన ప్రముఖ నేపధ్య గాయకుడికి తిక్క రేగింది. స్టేజి పైకొచ్చి పెద్ద గొంతుతో ప్రేక్షకులని గొంతు తగ్గించుకోమని… పిల్లల్ని, ముఖ్యంగా తనని ప్రోత్సహించమని హెచ్చరించాడు. ఆ తర్వాత ఆయన పాడినవన్నీ హిట్ సినిమా పాటలు అవ్వడంతో జనం పెద్ద మనసుతో క్షమించి, హుషారుగా హం చేసారు. ఊపొచ్చిన పెద్దలు ‘ఊకనే గూకోలేక’ స్టెప్స్ వేస్తూ స్టేజి పైదాకా వెళ్ళిపోయారు.

పాటలు, డాన్సులు మాత్రమేనా అని నిరుత్సాహ పడుతుంటే, యెమ్.సీ నాటకాలు రాబోతున్నాయని అనౌన్స్ చేసింది. “అబ్బో! ఇవి కూడా ఉన్నాయి, మరింకేం” అనుకుని ఓపిక అరువు తెచ్చుకున్నాను.

మొదటి నాటకం “వీడు ఆరడుగుల బుల్లెట్… “ తో మొదలు పెట్టారు, “అన్నానికి అరిటాకు..” అనే పాట రాగానే భోజనాల బ్రేకేమోనని అంతా భోజనశాల వైపు ఆశగా చూసారు. యెమ్.సీ “అమ్మా! ఆశ, దోశ … ” అని రెండవ నాటకం అనౌన్స్ చేసింది.

రెండవ నాటకంలో పెదరాయుడు గెటప్లో ఒక మోహన్బాబు, లయన్ గెటప్లో ఇంకో బాలకృష్ణ…. ఇలా వింత, వింత గెటప్పులతో మిగతా పాత్రధారులు స్టేజిపైకి వచ్చారు. “మీలో ఎవరు కోటీశ్వరుడు… “ అనే హిట్ టీవీ షోకి అనుకరణ. ఇందులో ప్రధానమయిన విశేషాలు విచిత్ర వేషాలు, ప్రీ-రికార్డు చేసిన మిమిక్రీ గొంతులు. జనాలు ఇవి నాటకాలా? అని డౌట్ పడకుండా సర్దుకుపోయి ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు. .

“మీరేంటి సార్! అంత విసుక్కుంటూ చూస్తున్నారు, సినిమాలంటే మీకు అలెర్జీనా?”

“సినిమా అంటే అలెర్జీ ఏమీ లేదు సార్! ఈ వెండి తెర వ్యామోహం, అనుకరణ కాలుష్యం చూస్తుంటే స్టవ్ మీద కూర్చునట్టుంది. మనం సొంతంగా ఏమీ చెయ్యలేమా? మనకి వెన్నెముక లేదా? అనేది నా ప్రశ్న” అని జవాబు చెప్పాను.

“మీలా సీట్లలో సుఖంగా కూర్చుని ఆశించడం బానే ఉంటుంది, అక్కడ స్టేజిపై ఉన్న వారికి తెలుస్తుంది కష్టం. సొంతంగా చెయ్యడానికి వారు ప్రొఫెషనల్స్ కాదు. పోనీ కిందా, మీదా పడి చేద్దామన్నా అంత ఖాళీ సమయం ఎవ్వరికీ లేదు. అన్నిటి కంటే ముఖ్యంగా జనాలు సినిమాలకి ఇట్టే కనెక్ట్ అవుతారు” అన్నారు.

“బాగా చెప్పారు, కనెక్ట్ అవ్వాలంటే సినిమాలు తప్ప తెలుగు వారికి వేరే మార్గం లేదన్న మాట” అని బయటకి నడుస్తూ బానర్ కేసి మరోసారి పట్టి, పట్టి చూసాను “తెలుగు సాంస్కృతిక సమితి.. “ బానర్ మెరుస్తూ కనిపించింది.

సినిమా ఇంత బలంగా, లోతుగా మనలో ఎందుకు పాతుకుపోయిందని ఆలోచిస్తే- తెలుగు పత్రికలు, టీవీ చానళ్ళు, ఫేస్బుక్, వెబ్సైట్లు, ఆఖరికి మిత్రులతో పిచ్చాపాటీ… ఇలా ప్రతి ఇంటరాక్షన్ సినిమా ఓవర్ఆక్షన్తో నిండిపోయింది.

షాంపూని రూపాయి సాషేలలో అందించి ఘన విజయం సాధించినట్టు పత్రికలు, సినిమా వార్తలని తెలివిగా ప్రతి పేజిలో చిన్న డబ్బాలలో అందిస్తూ ఉంటారు- పలానా సినీ తార బాయ్ ఫ్రెండ్తో బ్రేక్ అప్ అయ్యింది- (పాపం ఇంత చిన్న వయసులో ఎంత కష్టమోచ్చిందో?), రజనీకాంత్ నిర్మాతకి డబ్బులు మళ్ళీ తిరిగిచ్చాడు- (పాపం ఎంత మంచివాడో), ఒక సూపర్ స్టార్ శరీరం తగ్గించుకుందుకు ఓట్ మీల్ తినడం మొదలు పెట్టాడు (ఇక అతని ఫాన్స్ కూడా సన్నపడతారు).

ముఖపుస్తకం (పేస్బుక్) తెరిచి చూడగానే ఒక సోషల్ నెట్వర్కింగ్ స్టార్, దేశంలో ఏ సమస్యా మిగలనట్టు సినిమాలు ఉద్దరించడానికి పూనుకున్నాడు. తనని, తాను ఫిల్మ్ ఆక్టివిస్ట్ అని ప్రమోట్ చేసుకుంటాడు. ప్రముఖ సినీ కుటుంబాలు పరిశ్రమని మొనోపలైజ్ చేసి చిన్న నిర్మాతలని, బుల్లి హీరోలని నల్లిలా నలిపేస్తున్నారు, టాలెంట్ని అణగదోక్కేస్తున్నారు అని ఫేస్బుక్లో అంతర్మధనం చెందుతూ ఉంటాడు. ఎలాగైనా సినిమాని కబంధ హస్తాల నుండి విడిపించడం ఇతని జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా ఫేస్బుక్ అనే మాధ్యమాన్ని వాడుకుంటూ, లెక్క లేనంత మంది సినీ వ్యసనపరుల్ని ఫాలోయర్స్ గా కూడ గట్టుకున్నాడు. ఈ మధ్యనే “మాడిన దోశ” అనే “క్రౌడ్ ఫండింగ్” సినిమాని (బిలో) మామూలు ఫార్ములాతో తీసి చేతులు….కాదు, కాదు.. వేరే వాళ్ళ వేళ్ళకి వాత పెట్టాడు.

ఈ కాలుష్యానికి కొత్త పార్శం ఆడియో ఫంక్షన్లు, ఒక్కొక్కటీ నాలుగ్గంటల నాణ్యమైన న్యూసెన్స్. పబ్లిక్ సొమ్ము దుర్వినియోగం చేస్తే చట్టం దాన్ని నేరంగా పరిగణిస్తుంది. మరి మన దేశ భవిష్యత్తు (యువతరం) విలువైన సమయాన్ని ధీమాగా వృధా చేయిస్తున్న మనుషలకి ఏ శిక్ష వేయాలి? ఇటువంటి దుస్థితి వేరే రాష్ట్రాలలో ఉందా? లేక తెలుగు వారికేనా ఈ శాపం? అని కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు మనం వేసుకోవాలి.

క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చూడడం అంటే అర్ధం పర్ధం ఉంది. ఇక సినీ తారలు, వారి పిల్లల వివాహాలని ప్రత్యక్షంగా చూపించడం ఏమిటో? పెళ్ళంటే ఒకరి వ్యక్తిగత వ్యవహారం దానిని వాణిజ్య ప్రకటనలు అమ్ముకునే వీధి బాగోతంగా ఎప్పుడు మారిందో? పెళ్ళికొచ్చిన వారి నగలు, చీరలు, హంగులని చూసే సగటు మనిషి కలల్లోకి జారిపోతాడు.

సామెతల స్థానంలో పంచ్ డైలాగ్లు వాడతాం. ‘చాలా బావుంది’ అనాలంటే ‘కెవ్వు కేక’ అంటాం, ‘అంత స్థోమత/అర్హత లేదు’ అనడానికి ‘అంత సీన్ లేదు’ అంటాం. సినీ సంభాషణలు తప్ప మనకి సొంత భావజాలం మిగల్లేదు.

అసలు వీళ్ళు ఎవరు? వారి మొహాన్న టికెట్ డబ్బులు పడేస్తే తెరపైకొచ్చి తైతక్కలాడి, రంజింపచేసి, నిష్క్రమించే మామూలు మనుషులు. సినిమా ఒక కొనుగోలుదారుడికి, నటనతో (వస్తే) వినోదాన్ని అమ్ముకునే విక్రేతకి మధ్య జరిగే లావాదేవి మాత్రమే. మన కళలని, బాషని, సాహిత్యాన్ని, సంగీతాన్ని ధ్వంసం చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? అప్రమత్తంగా ఉండడం శ్రమతో కూడుకున్న పని, అందుకు సులువైన వినోదాన్ని, వెకిలితనాన్ని ఎంచుకుంటాం, వారికి సింహాసనంపై కూర్చోపెడతాం. ఈ passive, negligent encouragement వాడుకోవడం వాళ్ళకి తెలుసు కాబట్టి, వారు మనని పూర్తిగా ఆవహించారు.

వీరి లక్ష్యం ఒకటే- మన బుర్రలో ఒక శాశ్వతమైన గూడు కట్టుకోవాలి, ఆ గూడు సైజు పెంచుకుంటూ పోవాలి. తోచినా, తోచకున్నా, వేడుక జరుపుకున్నా, విషాదంలో మునిగి తేలుతున్నా సినిమా చూడాలి. సినిమా should be our only expression, culture, language, art…

జీవ నదులు సముద్రంలో కలిసి పనికిరాని ఉప్పు నీరుగా మారుతాయి. బాష, సంస్కృతి, సంగీతం సినిమా కాలుష్యంలో కలిసి అస్థిత్వాన్ని ఎప్పుడో కోల్పోయాయి. దశాబ్దాలుగా సినీ పరిశ్రమ ఇతర ఆలోచనలని ఎదగనివ్వకుండా ఉక్కు వేర్లతో పెనవేసి, గొంతు నొక్కేసిన మర్రి చెట్టు. ఆ నిజానికి దర్పణం నేను చూసిన “తెలుగు సాంస్కృతిక సమితి…” కార్యక్రమం.

*****

  ‘తప్పంతా వాళ్లదే!’

   ఆక్రోశ్

మన ఘనత వహించిన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉద్దేశంతో కానీ, ఉద్దేశ రహితంగా కానీ చంపడం ఏమంత పెద్ద నేరం కాదని సల్మాన్ ఖాన్ కేసు తీర్పుతో మరోసారి తేలిపోయింది. సల్మాన్ తాగిన మైకంలో నిర్లక్ష్యంగా కారు నడపడంతో ‘కుక్క’ లాంటి ఒక మనిషి చచ్చిపోయి, ‘కుక్కల్లాంటి’ మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు కనుక కోర్టు ఐదేళ్ల శిక్షతో సరిపెట్టింది. దొంగలను, రేపిస్టులను పిట్టల్లా కాల్చేసి తక్షణ న్యాయం చేయాలని బాధ్యతగల పౌరులు డిమాండ్ చేస్తున్న వర్తమానంలో పదమూడేళ్లకు పైగా నడిచిన ఈ కేసులో.. చివరకు కాస్త శిక్షతోనే అయినా వచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గదే.

సల్మాన్ హత్య చేయలేదు, నిజమే! కానీ తాగి కారు నడుపుతూ, ఫుట్ పాత్ పైకి దూసుకెళ్తే, అక్కడున్న జనం చస్తారని అతనికి తెలియదనుకోలేం. సినిమాల్లో డూపులు పెట్టుకునే ఆయనకు ఈ సంగతి ఇతరులకంటే మరింత బాగా తెలిసి ఉంటుంది. సినిమా కోర్టు సీన్లలో తిమ్మిని బమ్మిని చేసే వాదనలు, కూట సాక్ష్యాలు కూడా బాగా తెలిసిన ఆయన తాను కారు నడపలేదని నిన్న కూడా కోర్టులో చెప్పాడు. అప్పుడు కారు నడిపింది తన డ్రైవర్ అశోక్ సింగ్ అని కేసు చివరి దశలో చెప్పిన సల్మాన్ ఆ ముక్క 13 ఏళ్ల కిందటే ఎందుకు చెప్పలేదని ప్రాసిక్యూషన్ మంచి ప్రశ్నే వేసింది. చచ్చిన మనిషి  కారు కింద పడి చనిపోలేదని, ప్రమాదం తర్వాత కారును క్రేన్ తో ఎత్తుతుండగా కారు కిందపడ్డంతో చనిపోయాడని లాయర్ తో మరో సినిమా కథ చెప్పించాడు సల్మాన్.

ప్రమాదం తర్వాత తన నుంచి సేకరించిన రక్తంలో ఆల్కహాల్ ఉందని ఫోరెన్సిక్ నిపుణుడు ఇచ్చిన సాక్ష్యం కూడా చెల్లదన్నాడు ఆయన. ఆ నిపుణుడికి అసలు రక్తం సేకరించడమే తెలియదన్నాడు. ఇలాంటి తైతక్కలెన్నో ఆడాడు. కోర్టు ఇవేవీ నమ్మలేదు. ఇవన్నీ లా పాయింట్లు. బాధ్యతగల పౌరులకు అక్కర్లేదు. వాళ్లకు కావాల్సింది తక్షణ న్యాయం. అది 2012లో జరగలేదు. 2015లో కాసింత తక్షణంగా జరిగింది. హత్య కేసులే కాదు, సామూహిక ఊచకోత కేసులు కూడా దశాబ్దాల తరబడి నడుస్తున్న, పేలపిండిలా తేలిపోతున్న ఈ దేశంలో ఇది పెద్ద విశేషమేమీకాదు కనుక దీని గురించి చర్చ అనవసరం. కానీ ఈ కేసు తీర్పు తర్వాత సల్మాన్ కు మద్దతుగా కొందరు బాధ్యతగల సినీప్రముఖులు  చేసిన వ్యాఖ్యలు చూశాక చర్చ అవసరమనిపించింది.

‘కుక్క రోడ్డుపై పడుకుంటే కుక్క చావు చస్తుంది. రోడ్లు పేదల సొత్తు కాదు. రోడ్లున్నది కార్లకోసం. ముంబై ఫుట్ పాత్ లు అలగాజనం పడుకోవడానికా? ఫుట్ పాత్ నిద్ర ఆత్మహత్యలాంటి నేరమే.  సల్మాన్ కు అండగా నిలబడండి’ అని బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ట్విటర్లో రాశాడు. తళుకెబెళుకుల జ్యుయెలరీ డిజైనర్ ఫరా ఖాన్ వంతపాడుతూ, ‘ఫుట్ పాత్ ల మీద పడుకునేవాళ్లు వాహనాల కిందపడి చావడానికి సిద్ధంగా ఉండాలి. మందు, డైవర్ను నిందించకూడదు. వేరే దేశంలో అయితే సల్మాన్ కారు మనుషులమీదికి పోయేదు కాదు. ఒకడు పట్టాలు దాటుతూ రైలు కింద పడి చనిపోతే రైలు డ్రైవర్ ను శిక్షించినట్లు ఉంది, సల్మాన్ కు వేసిన శిక్ష’ అంది(అందుకే ఈమెకు ఎవరో ‘ఇండియా మేరీ ఆంటోనెట్’ అనే బిరుదు కట్టబెట్టారు. ఈమెకు ఆంటోనెట్ గతి పట్టకుండుగాక).

సల్మాన్ అమాయకుడని కొందరు, ఏదో తెలీక చేస్తే ఇంత కఠిన శిక్షవేస్తారా అని కొందరు, అతడు దానవీరశూరకర్ణుడు, అపర గౌతమబుద్ధుడు కనుక వదిలేయాలని కొందరు వత్తాసు పలికారు. సారాంశం ఏమంటే.. సల్మాన్ ను శిక్షించకుండా వదిలేసి ఉండాల్సిందని, లేకపోపోతే నెలో, రెండు నెలలో ’అత్తగారింటికి‘ పంపి ఉండాల్సిందనీ. సల్మాన్ వీళ్లకు స్నేహితుడో, సాటి సినీ జీవో, బంధువో, గింధువో, అతనితో కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలో కావొచ్చు కనుక మద్దతు పలకడం సహజమే. సల్మాన్ బ్యాడ్ బాయ్ చేష్టలు, జింకలవేటలు, అతిలోకసుందరుల కోసం తోటి హీరోలతో చేసిన బాహాబాహీలన్నీ కన్వీనియంట్ గా మరచిపోయిన వీళ్ల వాదనతో బీదాబిక్కీకే కాదు, జనసామాన్యానికంతా పెద్ద ప్రమాదముంది. వీళ్ల మహత్తర ‘అభిప్రాయాలపై కాస్త ఆలోచించాలేమో, వీళ్లంటున్నది సమంజసమేనేమో’ అని మధ్యతరగతి బుర్రలు కూడా అప్పుడే ట్వీట్లు కొట్టేస్తున్నాయి. అసలే మనది సినిమాల వాళ్ల, రాజకీయ నాయకుల మాటలను వేదవాక్యంలా భావించే అమాయక చైతన్యవంతులున్న దేశమాయె! కార్లు, లారీలు రోడ్లపై వెళ్తాయో, పుట్ పాత్ లపై వెళ్తాయో తెలిసిన మహాజ్ఞానుల దేశమాయె!

‘తీర్పు ఇంత ఆలస్యంగా వస్తే ఏం ప్రయోజనం? నా కాలు పోయింది. బతుకు తెరువు పోయింది. జీవచ్ఛవంలా పడున్నా. వచ్చిన 3 లక్షల పరిహారంలో ఒకటిన్నర లక్ష లాయర్ ఫీజుకింద పోయింది..’ అని ఒక క్షతగాత్రుడు.., ‘నా తొడ చితికిపోయింది. వచ్చిన రూ. ఒకటిన్నర లక్ష చికిత్సకే సరిపోలేదు. ఇప్పుడు సల్మాన్ దోషిగా తేలితే మాత్రం నా కడుపు నిండుతుందా?’ అని మరో క్షతగాత్రుడు వెళ్లబుచ్చిన ఆక్రోశం మాత్రం సోషల్ మీడియా ప్రేమికుల చెవుల్లోకి ఎక్కలేదు. రోడ్లపై పడుకునోళ్లను చంపితే నేరం కాదు, పేదవాళ్ల కారణంగానే సల్మాన్ పాపం జైలుకెళ్లాల్సి వచ్చింది( సల్మాన్ ఇంకా జైలుకెళ్లలేదు, బెయిలు పుచ్చేసుకుని ఇంటికెళ్లాడు) అని బెంగటిల్లుతున్న సల్మాన్ అభిమానుల వాదనకే ఈ మీడియాలో, మామూలు మీడియాలో విపరీత ప్రచారం లభించింది.

వీళ్ల వాదన శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను పిట్టల్లా  చంపేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల, ఆ రాష్ట్ర మంత్రుల వాదనలా, ఆలేరులో ఐదుగురు తీవ్రవాద నిందితులను చంపేసిన తెలంగాణ పోలీసుల వాదనలా ఉంది(దొంగలు గతంలో అటవీ అధికారులను చంపడం, తీవ్రవాద నిందితులు పోలీసులు చంపడం నిజమే అయినా). దొంగతనంగా చెట్లు కొట్టేస్తే(మమ్మల్ని చంపితే, కాల్చితే ఊరుకుంటామా?) అని ఆ పోలీసులు చెప్పినట్లే.. ఫుట్ పాత్ లపై ఆదమరచి పడుకుంటే తాగినోళ్లు కార్లతో గుద్ది చంపకుండా పోతారా అన్నట్లుంది మహానటకుడి సమర్థకుల వాదన.

ఢిల్లీలో ‘నిర్భయ’పై పైశాచికానికి పాల్పడిన ముఖేశ్ సింగ్ కూడా బీబీసీ ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలే అన్నాడు. ‘పరువున్నఆడపిల్ల రాత్రి 9 గంటకు బయట తిరగకూడదు. రేప్ కు మగాడు కాదు, ఆడదే కారణం. ఆడాళ్లకు ఇంటిపనే తగింది. డిస్కోలకు, బార్లకు వెళ్లకూడదు. చెడు పనులు చేయకూడదు(మగాళ్లు చేయొచ్చు!), ఒళ్లు కనిపించే బట్టలు వేసుకోవద్దు. ఆమె(నిర్భయ) మేం రేప్ చేస్తుంటే ప్రతిఘటించకుండా మౌనంగా భరించి ఉండాల్సింది. మా పని అయిపోయాక ఆమె స్నేహితుడిని కొట్టి, ఆమెను చంపకుండా వదిలేసి ఉండేవాళ్లం’ అని అన్నాడు.

ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు అడుగుతున్న, గుంజుకుంటున్న పాలకులు కూడా వాచ్యంగా ఇలా బరితెగించి చెప్పకున్నా ధ్వనిగానైనా ఇలాంటి వాదనలే చేస్తున్నారు, ‘రైతులకు భూములున్నది మాకివ్వడానికి కాక మరెందుకు? భూములు కలిగుండడమే వాళ్ల తప్పు. అవి లేకపోతే మా పని సులభమయ్యేది కదా’ అని.

ముస్లిం, క్రైస్తవులు తతిమ్మా హైందవేతరులందూ హిందూమతం పుచ్చుకోవాలని బెదిరిస్తున్న సంఘ్ పరివార్ కూడా ఇలాగే అంటోంది కదా, ‘ముస్లింలతో హిందూ జనాభాకు ముప్పు ఏర్పడింది. వాళ్లు ఎక్కువ మంది కనేస్తున్నారు. హిందువులూ ఎక్కువ మందిని కనాలి. ఈ దేశంలోని సమస్యలన్నింటికీ మూలం లౌకికవాదులే. వాళ్లు లేకుంటే సమస్యలే లేవు. హైందవేతరులే ఈ దేశానికి పీడ. అందరూ హిందువులైతే సమస్యలే ఉండవు..’

‘తప్పంతా ప్రేక్షకులదే. హింస, బూతు, రక్తపాతాలను ఎగబడి చూస్తున్నారు. అందుకే అలాంటి సినిమాలే తీస్తున్నాం. మమ్మల్ని తప్పుబడితే ఎలా?’

‘వాళ్లకు ఓట్లేసి గెలిపించారు కదా, మరో ఐదేళ్లు అనుభవించండి. అదే నన్ను గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్ కాదు స్వర్గం చేసేసి ఉందును.. గెలిపించలేదు కనుక తప్పంతా మీదే’

‘మేం పాఠాలు బాగానే చెప్పాం. తప్పంతా పిల్లలదే. క్రికెట్ మ్యాచ్ అనీ, సినిమాలనీ సరిగ్గా చదవకుండా ఫెయిలయ్యారు. అయినా గవర్నమెంట్ స్కూళ్లకు వచ్చే పిల్లలకు చదువెలా వస్తుందిలెండి?’

‘లక్షలు పోసి చదివించాం పిల్లలను. ఎందుకూ పనికిరాకుండా పోయారు. తప్పు వాళ్లదే..’

‘లంచాలివ్వకుంటే పనులు జరుగుతాయా? ఆ మాత్రం తెలియకపోతే ఎలా?’

‘తప్పంతా పాఠకులదే.. మేం రాసేవి మంచిపుస్తకాలు కాకపోవచ్చు. కానీ వాళ్లు అలాంటివే చదువుతున్నారు కనుక అవే రాస్తున్నాం’

‘మేం కమ్యూనిస్టులం. కానీ మా షాపుల్లో భారతరామాయణాలు, భగవద్గీతలు, భాగవతాలు, హస్తసాముద్రిక పుస్తకాలు.. ఇంకా కమ్యూనిజానికి బద్ధవ్యతిరేకమైనవన్నీ అమ్ముతాం. పాఠకులు వాటిని కొంటున్నారు కనుక. తప్పు మాది కాదు, వాళ్లదే’

‘…………………………………….’

‘…………………………………….’

‘…………………………………….’

నేరమేదైనా సరే బాధితులదే తప్పు! బాధితులు, పీడితులు లేకపోతే ఏ సమస్యా లేదని సూత్రీకరణ! పేదలు, అబలలు, అనాథలు, అభాగ్యులు లేని లోకం కోసం యమ పరితపించిపోతున్న ఈ దయామయుల, సమసమాజ స్వాప్నికుల, సున్నిత మనస్కుల ఆశయాలను నెరవేర్చడానికి బాధితులారా కదలండి! కదం తొక్కుతూ, పదం పాడుతూ కార్లకిందా, రైళ్లకిందా పడి చావండి! కామపిశాచాల అత్యాచారాలకు సహకరించండి! భూబకాసురుల ఆకలి తీర్చి గంగలో దూకండి! ఈ కరుణామయుల కలల సాకారానికి ఎన్నెన్ని రకాలుగా చావాలో, అన్నన్ని రకాలుగా చావండి!. ఛస్తే పోయేదేమీ లేదు, లోకం బాధలు తప్ప! !

*

 

 

దేశ భక్తులు పోలీసులు – ఎన్ కౌంటర్లే దేశ సేవ!

పి. విక్టర్ విజయ్ కుమార్ 

ఎన్ కౌంటర్ జరిగిన ప్రతి సారి – ‘ పోలీసులు తమ వృత్తి ధర్మానికి ప్రాణలొడ్డినప్పుడు రాని హక్కుల సమస్య ఒక నేరస్తున్ని ఎన్ కౌంటర్ చేసినప్పుడు రావడం ఏంటి ‘ అనో ‘ పోలీసులకు మనుష్యులు కాదా ?వాళ్ళకు హక్కులు లేవా ? ‘ అనో కొన్ని కామన్ ప్రశ్నలు మన మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటాయి.

ఒక మితృడు వాదించాడు ఇలా –

” కూలీలైతేనేం….ఏం కోట్లు విలువ చేసే ఎర్ర చందనం ఎత్తుకు పోతున్నప్పుడు వెధవలకు తెలీదా అందులో రిస్క్ ? కాల్చి పారేయాలి నాయాళ్ళను. చంద్ర బాబు అంటే మాటా ?! మజాకా ?! ”

నేను అడిగాను ” మొన్న నీవు తాగి డ్రైవ్ చేసినప్పుడు , నీకు చలాను వేసాడు కదా పోలీసు ?”

” అవును ?! ” అందులో ఏమంత వింత అన్నట్టు చూసాడు.

” చలాను ఇవ్వకుండ ‘ తాగి డ్రైవ్ చేస్తే ఎంత నష్టమో తెలుసా ‘ అని చాచి లెంప కాయ ఇస్తే ఎలా ఉండేది నీకు ” అన్నా.

“ఆ……మ్మ్.. .మ్మ్ మ్మ….రీ …తాగినందుకే లెంపలు వాయిస్తారా ? వాడి బామ్మర్దులనుకుంటారా ……. లేపొతే ……ఎవన్ని పడ్తే వాన్ని వాయించొచ్చనుకుంటారేంటి ”

* * * * *

ఇంకొక మితృడు –

” చేసేది దొంగ తనం. పోలీసులు కాల్చకుండా ఉంటారా ? ”

” అవును. కాల్చకుండా ఉంటారా ?…అసల నీ చేతిలో ఒక గన్ను ఉండి ….నీవు అక్కడ ఉండి…వాళ్ళను కాల్చేసి ఉన్నావనుకో …..పోలీసులు నీలానే ‘ చేసేది దొంగ తనం . మరి ఇలా చావరా ఏంటి ‘ అని వాళ్ళను చంపేసిన నిన్ను సత్కరిస్తారా ? లేదా అరెస్ట్ చేసి 302 సెక్షన్ బుక్ చేస్తారా ? ”

” ఆబ్వియస్లీ …కేస్ బుక్ చేస్తారు ”

” ఓహ్ ! ఈ దేశానికి నీవు మాత్రం అంటే ఎంత శీత కన్ను ? ‘
* * * * * *

ఇంకో మితృడు –

” పోలీసులు పాపం రాత్రనక, పగలనక పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ….దొంగ తనం చేస్తున్న వాళ్ళను కాల్చి చంపితే జనాలకు…చంపారనే విషయం గుర్తుంటుంది తప్ప….అయ్యో పోలీసులు ప్రాణాలను రిస్క్ చేసి …..వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కదా …అని ఒక్క వెధవ కు అనిపించదు ‘ …..( ‘వెధవ ‘ అన్ని పలికినప్పుడు మాత్రం నా మొహాన్ని చూసి )

” మీ పక్కింట్లో కుక్క పిల్ల రాత్రులు అరిచి అరిచీ నీకు నిద్ర లేకుండా చేస్తుంది అన్నావు కదా మొన్న ? ”

” అవును ? ” ఇప్పుడు దీనికేం ఎదవ లింక్ అన్నట్టు మొహం చిట్లించాడు.

” ఆ కుక్కను చంపేస్తే ? ”

” చీ …సిగ్గు లేదూ ?! కుక్క ఓనర్ గాడికి బుద్ధి లేదు . పాపం కుక్కేం చేసిందంట మధ్యలో ? ”

” మీ వీధిలో గస్తీ తిరుగుతున్న పోలీసుకు కంప్లైన్ చేసావనుకో ‘ ఏవండీ , ఈ వెధవ కుక్క తెగ మొరుగుతుంది. దాని ఓనర్ గాడికి బానే ఉంది. మాకే నిద్ర పట్టటం లెదు ‘ అని. జస్ట్ అనుకో…పోలీసాయనుండి ‘ సార్…ఈ తల నొప్పి ఎందుకు ?’ అని గన్ తీసి కుక్కను ఒక్క సారి టపీమని కాల్చేసాడనుకో….అలా జరిగిందనుకో…..పర్లేదా ? ”

” అది పాపం కదా ? ”

” నీకు జరిగింది కూడా పాపమే కదా ? ”

” ఐతే పోలీసోళ్ళు చంపేస్తారా ? అందునా కుక్కను ? ”

” వాళ్ళు రాత్రంతా మేల్కుని మనల్ని పరిరక్షిస్తున్నారు కాబట్టి ఒక మంచి కోసం కుక్కను చంపేసినా ఒప్పేసుకోవచ్చులే !! ”

* * * * * * * *

మొదటి మితృడే మళ్ళీ ఇలా అడిగాడు –

” పోలీసులను లేండ్ మైను పెట్టి నక్సలైట్లు లేపేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాని హక్కులు ఎవర్నో దొంగ నాయాళ్ళను చంపితే గుర్తుకొస్తుందా ఈ హక్కుల వాళ్ళకు ? ”

” నీవు తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు పోలీసు చలాను ఇవ్వకుండా లాగి కొట్టి ఉంటే నీవేం చేసేవాడివి ? …జస్ట్ ఆస్కింగ్….”

” ఏం చేసేవాన్ని ……పడేవాన్ని ”

” ఏం తిరగ బడొచ్చు కదా ? ”

” ఇంకో రెండు ఎక్కువ తగిలిస్తారు. లేదంటే లోపలేసి కుమ్మేస్తారు ”

“కుమ్మించుకోడానికి నీవు రెడి అయినా …అది ఒక లెక్క కాదు అని అనుకున్నా …నీవు కూడా వాళ్ళను కుమ్మేస్తావన్న మాట ??? ”

” ఏమో ?! ”

” అంటే నీవు తిరిగి కుమ్మే రిస్క్ ఉందని తెలిసినా …వాళ్ళు నిన్ను మేన్ హేండిల్ చేసారన్నట్టు…అంతేనా ? ”

” అంతే కదా ?”

” నీకు తాగడం తెలుసు కాని తన్నడం తెలీదు కాబట్టి బతికి పోయారు పోలీసులు. అందరూ నీలానే ఉంటే ఎంత బాగుణ్ణు ? ”

“_______”

* * * * * * * *
మొన్న తీవ్ర వాదులు విచ్చల విడిగా పోలీసులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుని ఎన్ కౌంటర్ లో చావడం నా భార్య ఫోన్ చేసి చెప్పింది ‘ ఇదుగో ఇది న్యూస్ ‘ అని. నేను అన్నా ‘ ఇంకొన్ని రోజుల్లో ఆంధ్ర తెలంగాణా లో ఎన్ కౌంటర్స్ జరుగుతాయి మళ్ళీ ‘ అని.

ఈ దేశం లో మధ్య తరగతి జనాభా 50 శాతానికి పైనే ఉంటుంది. ఈ మధ్య తరగతి కి ఉండే ఒక ధోరణి ” Excessive neutrality ‘ ని కోరుకోవడం . ఏ సమస్య అయినా ఏదీ , ఎవరికీ నష్టం జరక్కుండా జరగాలని ఆశించడం …అది కుదరకపోతే న్యాయాన్ని ‘ బ్రేక్’ చేసిన వాడిని కాక సామరస్యానికి తల ఒగ్గ్గని వాడిని ప్రశ్నించడం. ఐతే ఏదైనా – సమస్య తమ స్వంత తలలకు చుట్టుకోనంత కాలం మాత్రమే ఈ ‘obsession ‘ ఉంటుంది.

చరిత్రలో ఏ ఉద్యమం చూసినా, ఏ డెవలప్ మెంట్ చూసినా – మద్య తరగతి పాత్ర ఇదే !
మన అభివృద్ధి చెందే భారత దేశం లో ఈ ధోరణి తో మన రాజకీయాలు , రాజకీయ పార్టీలు కూడా సతమౌతూ ఉంటాయి. అదే పాశ్చాత్య దేశాల్లో చూస్తే – ఎన్ కౌంటర్ జరిగితే – అది నిజం ఎంకౌంటర్ జరిగిందా …ఫేక్ ఎంకౌంటర్ జరిగిందా అనే చర్చ దగ్గిర సాధారణంగా ఆగిపోతుంది తప్ప – అసలు ఫేక్ ఎన్ కౌంటరా కాదా అనె ప్రశ్న లేకుండా చచ్చిపోయినోడు – చావడానికి అర్హుడా కాదా అనే దగ్గర చర్చ ఆగుతుంది ఇక్కడ.

అందుకే – కొన్ని సంవత్సరాల క్రితం వై యెస్సార్ టైం లో వరంగల్ లో అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన ముష్కరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పుడు అక్కడ ఎస్. పీ హీరో అయ్యాడు. అదేంటో మరి వాళ్ళను నక్సలైట్లు చంపి ఉంటే – నక్సలైట్లను ఎన్ కౌంటర్ లో లేపేసే వాళ్ళు ! అప్పుడు ఎవరూ అయ్యో అనరు ?! బాగా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే – ప్రజలు పుష్ప గుచ్చాలు ఇస్తుంటే ఎస్ . పీ గారు నవ్వుతూ కెమెరాకు పోజు ఇవ్వడం. ( ఏం ! మీ కూతురికో…మీ భార్యకో..అమ్మకో ఇలా జరిగి ఉంటే …మీరూ చెయ్యరా…అని ఒక personalised question ఒకటి ఎదురు చూడాలి ఇక ) . ఆయన గారు అంతటితో ఆగలేదు – ఒక గంజాయి స్మగ్లర్ను, ఒక పెద్ద నక్సలైటు లీడర్ ను ఎన్ కౌంటర్ లొ అంతం చేసాడు.

పోలీసులు మన వ్యవస్థలో చంపడానికి unconditional authorisation ఉన్న ఒకే ఒక Employee group గా ఈ దేశం లో ఉన్నట్టు అనిపిస్తుంది.

అమ్మాయి మీద యాసిడ్ పోసిన రాక్షసుడు, దేశ ధనాన్ని కొల్లగొట్టే ఎర్ర చందనం ‘కూలీ ‘ దొంగలు ….అందరూ దోషులే ! 5000 కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము, బేంకుల సొమ్ము ఎగ గొట్టిన రామలింగ రాజు కూడా ముష్కరుడే ! పోలీసులు ఆయన్ను ఎన్ కౌంటర్ చేయరు. ఒక ప్రజాస్వామిక వాదిగా ఆయన్ను ఎన్ కౌంటర్ చేసినా నేను సమర్థించలేను.

National Human Rights Commission రిలీజ్ చేసిన Manual on Human Rights for Police Officers ఎన్ కౌంటర్స్ గురిచి చెబ్తూ ఇలా అంది –

” False encounters are, at times, staged by police officers because there is pressure by the political masters to show quick results by means,fair or foul ” అని కారణం చెప్తూ ” The public, particularly the educated middle class, also donot mind if the police take the law in their own hands and become executioners, particularly with regard to the dreaded criminals ” అని ప్రస్తావిస్తుంది.

అసలు చట్ట ప్రకారం ఎవరు ఎవరినైనా ఏ కారణం చేతనైనా – పోలీసు అయినా సరే – మర్డర్ చేయడం నేరము అని చెప్తుంది. ఇలా ఎందుకు చెప్పడం ? పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ అయినప్పుడు మనం చాట్టాన్నిల ఎందుకు రాసుకోవడం ? అలా కాక – ఫలాన నేరం చేస్తూ దొరికినప్పుడు – మొహమాటం లేకుండా పోలీసులు కాల్చేయొచ్చు అని చట్టం చేస్తే సరిపోతుంది కదా ? వాళ్ళు చంపడం – దాని మీద మనమంతా చర్చించడం ఎందుకు ? ఫలానా సెక్షన్ అండ్ సబ్ సెక్షన్ ప్రకారం పోలీసులు ఈ దిగువ చెప్పబడిన నేరాలు చేస్తే ఎవడినైనా సరే అడ్డంగా కాల్చేయొచ్చు అని చట్టం మార్చేస్తే పోలా ?

” న్యాయాన్యాయా లేంది సార్…కొడుకులను వర్సపెట్టి కాల్చేయకుండ…” అని నా కేబిన్ లోకి విసురుగా వచ్చాడు మా ఆఫీసు లొ పని చేసే క్లర్క్. ” ఏం బాబు….నీ కొడుకును ‘ ఐ పీ యెస్ చేయి నాయనా ‘ అని పోరు పెడుతంటావు కదా ….అఫీషియల్ గా మర్డర్ చేసే అవకాశం కూడా ఒకటి దొరుకుతుంది అని కూడా చెప్పి కష్టపడి చదవడానికి inspiration ఇస్తావా ఇక ? ” అన్నా.

నాతో వాదించలేకో , వాదించడం ఇష్టం లేకో వెళ్ళిపోయాడు.

ఈ దేశం లో నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్మరు. ఈ దేశం లో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని నమ్మరు. చివరికి – ఈ దేశం లో – ప్రజలు కూడా రాజ్యాంగాన్ని నమ్మరు. ఏం దేశమయ్యా బాబు ఇది ?

అకస్మాత్తుగా మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాము అన్నది చాలా సౌకర్యదాయకంగా మన మధ్య తరగతి ప్రజలు మర్చిపోతారు. ఏదో ఇంకా ఏ గుప్త సామ్రాజ్యమో ఉన్నట్టు అకస్మాత్తు భావన వస్తుంది.

నేరాన్ని ఎలా రూపు మాపాలి ? నేరం మళ్ళీ బతక కుండా ఎలా భూస్థాపితం చేయాలి అనడానికి మన దగ్గర సమాధానాలు లేకపోతే నేరస్తులను చంపడం సమాధానంగా కనబడుతుంది. నేరస్తులను చంపడం సమాధానం ఐతే చంపే వాడు కూడా నేరస్తుడౌతాడు. ఎత్తుకు పోయి అడవిలో కణత మీద పిస్టల్ పెట్టి ట్రిగ్గర్ నొక్కే పోలీసులు మాత్రమే నేరస్తులు కారు ?!

మొన్న తెలంగాణ లో మధ్య ప్రదేశ్ నుండి పారిపోయిన టెర్రరిస్టుల ఎన్ కౌంటర్ లో సాధారణ పోలీసులు కూడా ప్రాణం కోల్పోవడం విచారకరం. ఐతే ఈ సంఘటన తో – రెండు రాష్ట్రాల పోలీసులకు ఒక నైతిక బలం చేకూరింది. తర్వాత జరిగిన రెండు ఎన్ కౌంటర్స్ కూడా Planned murers అని పెద్ద తెలివిలేనోళ్ళకైనా తెలిసిపోతుంది.

” మరి ఎందుకు అంతగా పట్టు పడుతున్నావు…పోలీసులు మర్డర్ చేసినా మన మంచికే కదా….చట్టం లో లోపాలు ఉన్నప్పుడు …మనకు అంకుశం రాజశేఖర్ లు కావాలి లే ! వదిలెయ్ ! ” ఒక మధ్య తరగతి ప్రబుద్ధుడి జడ్జ్మెంట్.

మనకెంత ఆత్మ వంచన కదా ? వేల మందిని చేతికి మట్టి అంటకుండా చంపినోడు మన దేశ సిం హాసనం మీద కూర్చున్నాడు. ఏ ‘అంకుశం’ పోలీసు ఆఫీసర్ వాడిని ఎన్ కౌంటర్ చేస్తాడు ?

SP సజ్జనార్ మర్డర్ యాసిడ్ అటాక్ ముష్కరులతో ఆగిపోలేదు. కుక్కను చంపే ముందు పిచ్చిదని చెప్తే చాలంటే – మనమందరం ఇల్లు దాటి బయట కెళ్ళకుండా కుక్కల్లా పడి ఉంటాం. ఎవడు ఎవడిని పిచ్చి కుక్క అంటాడో అని బిక్కు బిక్కు మనుకుంటూ.

ఐతే సమస్యేమీ లేదు అందులో – అందరం కుక్కల్లా బతకాలనుకున్నప్పుడు.
మనమెలా బతకాలనుకున్నామో మనకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ విచిత్ర వాదనలు వినాల్సిందే !

PS : The objective of this rhetoric essay is not to demean any individual of the skewed thinking but to let reader understand, in simple terms, that the institutionalised crime is more dangerous than individualised crime and we need to address institutionalised crime on priority basis. It may look ‘ heroic’ on face of it to contain individual crime by illegal means by the Police . However, the same is nothing but ‘shortsightedness ‘ and it is the effort of ‘ State ‘ to play with middle class belief system in order to protect its systemic inability to address the core content of the problem. It is often misconstrued that the crime cannot be contained through law and law has its limitations which justifies action of police to take law into their hands at their ‘discretion’. It is actually a misnomer undermining human’s ability to develop better society and strengthen institutions for safety and security while there are set examples in other parts of the world. Pursuit for low crime rate in a society is a incessant endeavour of nation and does not confine itself only to ‘ law and order’ and hence finding solutions within the hands of police makes us feeble and desperate prompting us to romanticise the police system

తెలంగాణలో ఇప్పుడు మౌనం కాదు, నిర్మాణాత్మక విమర్శ అవసరం!

10433633_689328201180016_1300384855878113980_n

(ఈ 23 న తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ తొలిసారిగా ఇస్తున్న తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన అవార్డుల సందర్భంగా)

గత  అరవై యేండ్లకు పైగా తెలంగాణ ప్రజల తండ్లాట తీరిపొయ్యి,  పోరాటం  సఫలమై,  కన్న కలలు  సాకారమై  ప్రత్యేక రాష్ట్రం యేర్పడ్డది. ఆంధ్ర వలస పాలకుల పాలన నుండి విముక్తి కలిగింది. పరాయి పాలన ను తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు,  రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ రాజకీయ పార్టీని యెన్నికల్లో గెలిపించిండ్రు. అధికారం కట్టబెట్టిండ్రు. ఉద్యమానికీ, రాజకీయ పార్టీ కి నాయకత్వం వహించిన వారే యిప్పుడు తెలంగాణ ప్రభుతానికీ నాయకత్వం వహిస్తున్నరు. ఇది తెలంగాణ చరిత్రలో మొత్తంగా భారతదేశ చరిత్రలో అపురూపమైన సన్నివేశం.

ఉద్యమంలో ప్రదాన భాగస్వామ్యం వహించినందుకూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతా, ఆకాంక్ష వెనుకనున్న ఆరాటమూ పోరాటంగా మునుముందుకు రావడానికి కీలక పాత్ర వహించినందుకూ రాష్ట్ర యేర్పాటు తర్వాత  ప్రభుత్వ పగ్గాలు చేపట్ట్డడం వల్ల,  సహజంగానే నాయకత్యం పైన ప్రజలకు ఆశలూ చాల ఎక్కువగా ఉంటాయి. అట్లే తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాలా ప్రజానీకం పట్లా నాయకత్వానికి బాధ్యతా కూడా చాలా  యెక్కువగానే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సమాజం లోని అన్ని  వర్గాల, సబ్బండ వర్ణాల ప్రజలు క్రియాశీలకంగా పాల్గొని తమవైన అనేకానేక నిర్దిష్ట  ఆశలనూ ఆకాంక్షలనూ యెజెండా మీదికి తెచ్చారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక అవన్నీ నెరవేరుతాయనీ, నెరవేరాలనీ ఆశించారు, కోరుకున్నారు. విభిన్న సమూహాలకు చెందిన ప్రజలు,  తమ తమ ఉమ్మడి సామాజిక కోర్కెలను, తరతరాలుగా అణచివేతకు గురైన  తమ అస్తిత్వ ప్రయోజనాలనూ  రంగం మీదికి తీసుకొచ్చి,  ప్రత్యేక రాష్ట్రం యేర్పాటైతే అవన్నీ సాధ్యమౌతాయని బలంగా నమ్మారు. తెలంగాణ లో బలంగా ఉన్న సామాజిక ఉద్యమాల నేపథ్యం లో ముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అటువంటి నమ్మకాలకు ఆలంబన నిచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల అనేకానేక సమస్యల పరిష్కారం కోసం సాగిన విస్తృత ఉద్యమమైంది. అయితే ఉద్యమం సాగుతున్న క్రమంలో యెక్కడా నాయకత్వం ఉద్యమ పరిధుల్నీ , పరిమితుల్నీ స్పష్టం చేయడం జరుగలేదు, అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు కూడా!

యిప్పుడు రాష్ట్రం సాకారమయ్యాక ఒక విచిత్రమైన వాతావరణం నెలకొని ఉన్నది. ప్రజలు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం తన పద్దతి లో తాను పరిపాలన కొనసాగిస్తున్నది.  ప్రభుత్వ నాయకత్వం , తెలంగాణ ప్రజా సమస్యల పట్ల తనదైన దృక్పథంతో పని చేస్తూ, తాను సరైనవనుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. రాష్ట్రం యేర్పడి ఆరు నెలలే ఐంది కాబట్టి, ప్రభుత్వానికి దొరికింది ఆరు నెలలే కాబట్టి,  అప్పుడే అది విఫలమైందా సఫలమైందా అని తీర్పు చెప్పడం సరైంది కాదు. చేసిన ప్రకటనలూ, అమలు చేస్తున్న కార్యక్రమాలనూ  బట్టి ప్రభుత్వం పనితీరుని బేరీజు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ పనితీరు పట్ల అభిప్రాయాలూ, వైఖరీ, విమర్శా యెట్లా ఉండాలి అనే అంశాల మీద భిన్న ధోరణులు మనకు కనబడుతూ ఉన్నాయి.

తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ ప్రజలు అత్యంత సమరశీలులూ, ఆలోచనల్లో అత్యంత పరిణతి చెందినవాళ్ళూ అనడం లో యెంత మాత్రమూ సందేహం లేదు. అందుకే  ప్రత్యేక రాష్ట్రం  యేర్పడగానే మనం యేమి జరుగుతుందని ఊహించవచ్చో,  యేమి ఆశించవచ్చో , తెలంగాణ ప్రబుత్వం యేమి చేయగలుగుతుందో, యేమి చేయలేదో, యేవి  దాని పరిధి కి లోపల  ఉన్నాయో యేవి బయట ఉన్నాయో, ప్రభుత్వ పరిమితులేమిటో అనే విషయాలపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునాయి. ఈ అభిప్రాయాలు సమాజం లోని భిన్న దృక్పథాల ప్రజానీకం నుండి వెలువడుతున్నయి కాబట్టి సహజంగానే వాటి మధ్య అనేక వైరుధ్యాలు ఉంటాయి.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ పార్టీ తో నున్న వారు రాష్ట్ర యేర్పాటు తర్వాత సహజంగానే ప్రభుత్వం తో, ప్రభుత్వం  నడిపే పార్టీ తో ప్రదాన స్రవంతి రాజకీయాలతో యేకీభవి స్తూ, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి  తమకు సరైందని తోచిన పద్దతుల్లో తోడ్పడుతున్నారు. ఈ క్రమంలో అవినీతీ, స్వలాభాపేక్ష తదితర అంశాలని కొంచెం సేపు పక్కకు పెడితే,  వీరికి ప్రభుత్వం పట్లా , ప్రభుత్వ కార్యక్రమాల పట్లా పద్దతుల పట్లా విమర్శనాత్మక దృక్పథం సహజంగానే ఉండదు. ప్రభుత్వం , ప్రభుత్వాన్ని నడిపిస్తున్న  నాయకత్వమూ, పార్టీ అంతా సవ్యంగానే చేస్తుందని, అందులో  విమర్శించడానికేమీ లేదనీ , విమర్శిస్తే మనం చేజేతులా మనం  నిర్మిస్తున్న భవంతిని మనమే కూలగొట్టుకున్న వాళ్లమౌతామని బలంగా నమ్ముతారు. తెలంగాణ వాదమే ఊపిరిగా ఉన్న రాజకీయ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా యేదీ చేయదనీ,   దాన్ని విమర్శించడం అంటే తెలంగాణ వాదాన్ని విమర్శించడమే అని గట్టిగా వాదిస్తారు.

‘అయితే మీరు మా వైపు లేదా తెలంగాణ వ్యతిరేకుల వైపు’ అని నిర్దంద్వంగా వర్గీకరిస్తారు.  మరో పక్క, తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు,  ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు లేదా మరేదైనా ప్రదాన స్రవంతి రాజకీయ అభిప్రాయాలను సమర్థించే వారైనా కావచ్చు – అదే పనిగా ప్రభుత్వం మీదా, నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ మీదా దుమ్మెత్తి పోస్తుంటారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ, నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ , అమలు చేయాలను కున్న ప్రతి పథకాన్నీ భూతద్దం లో చూపి  , పూర్తిగా నిరాకరిస్తూ  తీవ్రంగా విమర్శిస్తారు. విమర్శలో యేమాత్రం నిర్మాణాత్మకత ఉండదు. తెలంగాణ సమాజం తాత్కాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యాలకు గానీ ఉపయోగపడేది ఈషణ్మాత్రమైనా ఉండదు. యిటువంటి విమర్శ వినాశాత్మక విమర్శ. అది కేవలం తమ స్వప్రయోజనాలనాశించి, అవి యెట్లయినా సరే నిలుపుకోవాలనే పట్టుదలతో, హ్రస్వదృష్టి తో  చేసే  స్వార్థ పూరిత విమర్శ. యిటువంటి విమర్శ తెలంగాణ సమాజానికి చేటు  కలిగిస్తుంది.

అయితే, ప్రదాన స్రవంతి రాజకీయాలకు, అధికార రాజకీయాలకు వెలుపల వాటికి భిన్నమైన అభిప్రాయాలు కలిగి, ప్రగతిశీల ఆలోచనా విధానం కలిగి ఉన్న ప్రజా సమూహాలు తెలంగాణ లో యెన్నో ఉన్నాయి. వీరంతా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యెంతో ఉద్యమ స్ఫూర్తితో అత్యంత క్రియా శీలకంగా పాల్గొన్నారు. ప్రాణాలకు లెక్క చెయ్యకుండా ఉద్యమాల్లో దూకి లెక్క లేనన్ని పోలీసు కేసులు, నిర్బంధాలనూ తట్టుకున్నారు. తమదైన ఆశలతో, ఆకాంక్షలతో నిర్దిష్ట వ్యూహంతో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు లో వీరి కృషి సామాన్యమైనది కాదు.

telanga

అయితే ఆశ్చర్యంగా,  రాష్ట్రం యేర్పడ్దాక వీళ్లలో చాలా మంది ఒక రకమైన వింత మౌనాన్ని పాటిస్తున్నారు.  నిర్లిప్తతను ప్రకటిస్తున్నారు. వీళ్లలో చాలా మందికి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాలా వద్దా,  విమర్శిస్తే తమని తెలంగాణ వ్యతిరేకులంటారా అనే సందేహాలు బలంగా ఉన్నాయి. కొంతమందికైతే, ‘ ప్రత్యేక రాష్ట్రమొస్తే యేదో జరుగుతుందని తాము కేవలం  భ్రమ పడ్డామా ?   యిప్పుడీ ప్రభుత్వ పని తీరు చూస్తుంటే ఆ భ్రమలన్నీ పటాపంచలయ్యాయా? ’  అనే అభిప్రాయాలు కూడా బలంగానే కలుగుతున్నాయి. అయితే దీనికి కారణం ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు వల్ల తెలంగాణ లో సాధ్యమయ్యే వాటి కున్న పరిధులూ పరిమితుల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవడమన్నా కావాలి, లేదా తాము కలగన్నట్టు, తాము అనుకున్నట్టు, ఆశించినట్టు ప్రభుత్వమూ , నాయకత్వమూ ప్రవర్తించాలి అన్న అత్యాశా ఐనా కావాలి.

ముందుగా కొన్ని విషయాలని స్పష్టం చేసుకోవాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర యేర్పాటు కొన్ని పరిధుల్లో పరిమితుల్లో  జరిగింది అని మర్చి పోరాదు. భారత దేశ పార్లమెంటరీ విధానం లో భాగంగా  రాజకీయర్థిక  వ్యవస్థలో భాగంగా, భారత రాజ్యాంగానికి  అనుగుణంగా, భారత చట్ట, న్యాయ వ్యవస్థలకనుగుణంగా మిగతా అన్ని రాష్ట్రాల లాగానే ఆ పరిధి లోనే ఆ పరిమితుల్లోనే జరిగింది. దీనికి భిన్నంగా ఇక్కడేదో భిన్నమైన వ్యవస్థ ఉందనీ, భిన్నమైన చట్టం , న్యాయం , రాజకీయార్థిక వ్యవస్థ అమలు చేయవచ్చనీ అనుకోవడం సరైంది కాదు. అమాయకత్వమౌతుంది. తెలంగాణ ను విముక్తి చేసి   సమసమాజాన్ని యేర్పాటు చేయవచ్చని అనుకోవడం సరైంది కాదు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో పీడిత ప్రజలు రాజ్యంస్థాపించుకోగలరు అని ఆశ పడడమూ సరైంది  కాదు. భారత రాజ్యాంగం పరిధిలో యేది సాధ్యమౌతుందో అది మాత్రమే తెలంగాణలో వీలౌతుంది. నిజానికి అత్యంత ప్రగతి శీలమైన భారత రాజ్యాంగంలో ప్రజలకు మేలు చేసే వాటన్నిటినీ అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తేవచ్చు.

ఆ దిశగా సరికొత్త పునర్నిర్మాణ ఉద్యమం నిర్మించవచ్చు. అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రజలని అణచి వేసే వైఖరికి పాల్పడితే ప్రభుత్వం విధానాలను విమర్శించవచ్చు  – ఉద్యమించవచ్చు. అట్లా భారత రాజ్యాంగానికనుగుణంగా, రాజ్యాంగ పరిధిలో  తెలంగాణ లో ప్రజల విముక్తి, అభివృద్ధి, వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం (యే యితర రాష్ట్రాల ప్రభుత్వాలు యిప్పటిదాకా చేయక పోయినా, చేయ నిరాకరించినా ) సృజనాత్మకంగా యేమి చేయవచ్చో  యెజెండా మీదికి తీసుకురావాల్సిన అవసరమూ బాధ్యతా మనందరి పైనా ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రస్తుత పథకాలనూ , కార్యక్రమాలనూ నిర్ణయాలనూ , పనితీరునూ , ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యెజెండా మీదికి తెచ్చిన  నినాదాలకు  (“ మన నీళ్ళూ, మన నిధులూ, మన నియామకాలూ మన కోసమే , పరాయి వలస పాలన నుండి విముక్తి, ఆత్మగౌరవ పాలనా లక్ష్యం” )  అనుగుణంగా ఉన్నయా లేదా అనే గీటు రాయి మీద పరీక్షించాల్సి ఉంటుంది. యెక్కడైనా ప్రభుత్వం దాన్ని నడిపిస్తున్న నాయకత్వమూ దీనికి భిన్నంగా ఉందనిపించినా,  మళ్ళీ ఆంధ్రా వలస పాలకులకు, దోపిడీ పెత్తందార్ల కు  అడుగులకు మడుగులొత్తినట్టనిపించినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆశలకు నష్టం కలిగించేలా వ్యతిరేకంగా ఉందనిపించినా విమర్శించాల్సిన బాధ్యత  మనపైనున్నది.

అట్లే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు మాత్రమే కాకుండా ప్రజా బాహుళ్య  సంక్షేమం, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి , విముక్తి, వారి కనీస జీవిత అవసరాలని తీర్చడం, అందరికీ విద్య ఆరోగ్యం, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పనా , సామాజికాభివృద్ధీ, కనీస ప్రజా స్వామిక హక్కులు  లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని తన కనీస బాధ్యతలని గుర్తుచేస్తూ నిర్మాణాత్మక విమర్శ చేయడం ఇప్పటి పరిస్థితుల్లో మనందరి బాధ్యత! ముఖ్యంగా ప్రధాన స్రవంతి రాజకీయాలకు బయట ఉండి, యెటువంటి స్వలాభాపేక్షా, స్వార్థ ప్రయోజనాలూ లేకుండా కేవలం సమాజం మేలు కాంక్షిస్తూ ఉద్యమ స్ఫూర్తి గల  వారి పై ఈ బాధ్య త మరింత యెక్కువగా ఉన్నది. అట్లే మొత్తం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఖండాంతరాలలో ఉన్నా , తమ హృదయాలను తెలంగాణ లోనే పదిలంగా ఉంచి  ఉద్యమానికీ , రాష్ట్ర యేర్పాటు తర్వాత పునర్నిర్మాణానికీ యెంతో తోడ్పడు తున్న ఎన్ ఆర్ ఐ ల పైనా ఈ బాధ్యత యెంతో ఉన్నది.

అట్లా కాకుండా మౌనాన్నీ నిర్లిప్తతనూ పాటిస్తే తీవ్రమైన నష్టాలనెదుర్కోవాల్సి వస్తుంది. మాట్లాడాల్సిన వాళ్ళు, నిర్మాణాత్మక విమర్శ చేయా ల్సిన వాళ్ళూ తమకెందుకులే అనే నిర్లిప్తత ను పాటించినా , విమర్శిస్తే యేమౌతుందో అనే సందిగ్ధం లో పడి పోయినా,  ‘యింక అంతా యింతేలే ‘ అనే నైరాశ్యంలో పడిపోయినా తెలంగాణ సమాజం చాలా కోల్పోతుంది. అప్పుడు కేవలం ప్రభుత అనుకూల వ్యతిరేక అనే స్వలాభాపేక్షకలిగిన స్వార్థ పూరిత విమర్శలే తప్ప నిజాయితీ తో కూడిన నిర్మాణాత్మక విమర్శ ఉండదు. అందువల్ల  తాను తెలంగాణ సమాజావసరాలను తీర్చడంలో యెక్కడ నిర్ధిష్టంగా విఫలమైందో , యెందుకు విఫలమైందో తెలుసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికుండదు. అటువంటి పరిస్థితుల్లో పాలకులు  తాము చేసేదే యెల్లప్పుడూ సరైంది,  విమర్శించే వారంతా తెలంగాణ ద్రోహులు అనే ద్వంద్వాత్మక వర్గీకరణ (binary categorization) చేసి నియంతృత్వ పోకడలకు పోయే ప్రమాదమున్నది.

భిన్న అభిప్రాయాలకు, వాటి ఘర్షణలకు తావు లేని సమాజం ప్రగతి దిశగా  ముందుకు నడవడం అసాధ్యం. అట్లాంటి పరిస్థితి తెలంగాణా సమాజానికి రాకుండా ఉండాలంటే ఆలోచనా పరులు, బుద్ధి జీవులూ, ఉద్యమ శక్తులూ స్వార్థ ప్రయోజనాలకతీతంగా తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై నిర్మాణాత్మక విమర్శ చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను,  అవి సరిగా లేవనుకున్నప్పుడు,  విమర్శిస్తూ , సమస్యల కు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాలను సూచించాల్సి ఉన్నది.  భిన్న అభిప్రాయాలకు చోటునిస్తూ ప్రజాస్వామికంగా చర్చ చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సమాజం పునర్నిర్మాణం జరిగి సర్వతోముఖా భివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది.

-నారాయణస్వామి వెంకటయోగి

swamy1

అమెరికా తెలుగు కథ ఎటు పోతోంది?

(ఈ వారం హ్యూస్టన్ లో అమెరికా తెలుగు కథ యాభయ్యేళ్ళ వార్షికోత్సవం సందర్భంగా)

 

నాస్టాల్జియా, నాస్టాల్జియా, ఇంకాస్త నాస్టాల్జియా: వేలూరి

10735719_10152397663077060_729409723_nఅమెరికా తెలుగు కథ అంటే, అమెరికాలో నివసిస్తున్న చాలా మంది తెలుగు వాళ్ళు రాస్తున్న కథలు అని అర్థం చేసుకుంటే, అమెరికా తెలుగు కథ, అటు తూరుపు దిక్కుకేసి, అంటే, అట్లాంటిక్ సముద్రం ఆంజనేయుడిలా లంఘించి, హుటా హుటీన ఆంధ్ర దేశం కేసి పోతూఉన్నది;   అక్కడ అచ్చయితే చాలన్న దుగ్ధతో!

అదేవిధంగా, ఆంధ్ర దేశంలోనే ఉంటూ, అమెరికాలో తెలుగువాళ్ళ జీవనం గురించి కథలు రాస్తున్న చాలా మంది కథకుల కథలు బొంబాయిలో బోయింగు ఎక్కి  సరాసరి అమెరికా లో ఇ-పత్రికలకి చేరుతున్నాయి. కాదు కాదు. పొరపాటు. ఈ మెయిల్‌ ఎక్కి ఈ పత్రికల్లోకి చొరబడుతున్నాయి; ఇక్కడి వాళ్ళని ఉద్ధరిద్దామన్న మోజుతో!

అయితే, అమెరికాలో  చాలాకాలంనుంచీ “ స్థిరపడ్డ” అమెరికా తెలుగు వాళ్ళు – అంటే ఇక్కడే బడికెళ్ళి, ఉద్యోగంకోసం నానాయాతనాపడి నలభై గంటల పని జీవితంతో అలవాటు పడినవాళ్ళల్లో కథలు రాసే వాళ్ళు—కొద్దిమందీ– తమతమ నిజానుభవాలు,  అక్షరరూపంలో పెట్టటం మానుకున్నట్టుగా కనిపిస్తూన్నది. బహుశా అందుకు కారణం:   వాటి ప్రచురణకి ఆంధ్రాలో అవకాశం సున్న; అమెరికాలో  అరసున్న.

ఎందుకంటే, అక్కడ ప్రచురించబడాలంటే — వేడి వేడి సాంఘిక “సమస్య” వెతికి పట్టుకోవాలి. సదరు సమస్యని, ‘అపార్థం,’  లేకండా సాధించాలి; కనీసం సందేశం అన్నా ఇవ్వాలి. సమాకాలీన కథకుడిగా  ఒక ప్రత్యేకమయిన రంగుని ప్రోత్సహించాలి.  కథలకి అంతకన్నా విశిష్టమయిన  రంగు లేబిల్‌ తగిలించాలి. అమెరికాని, అమెరికా జీవనాన్ని, వీలుదొరికినచోటల్లా  అమెరికా “సామ్రాజ్యవాదాన్నీ” చెడా మడా ఖండిస్తూ రాయాలి. అది చేతకాకపోతే, కనీసం హేళన అయినా  చెయ్యాలి. ఇక్కడి జీవనాన్ని నికృష్టంగా చిత్రించగలగాలి. వాస్తవం చెప్పడానికి వెనుకాడని నిజాయితీ ఉన్న కథకులు,  అటువంటి దుస్థితికి దిగజారలేరు అని నా ఉద్దేశం.

పోతే, అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు – వీరిలో చాలమంది ఇంకా అమెరికా లో “సందర్శకులు” గానే ప్రవర్తిస్తారు. ఇక్కడి, కట్టు, ఇక్కడి బట్ట, ఇక్కడి ఆట, ఇక్కడి పాటా – వీటిగురించి ఏమీతెలియదు. తెలుసుకోవాలనే కుతూహలంకూడా లేదనిపిస్తుంది. ఇంకా ఒక కాలు, మూడువంతులు మనసూ, ఆంధ్రాలోనే! చూడటానికి, ఇక్కడ డబ్బుకోసమే గాని, ఇక్కడి వాతావరణంలో ఇముడుదామని వచ్చినట్టు కనపడరు. వీళ్ళు రాసే కథలు, తెలుగు సినిమా కోసం రాస్తున్న కథల్లా వుంటాయి. కొన్ని కథలు, తెలుగు సినిమాలు చూసి రాస్తున్నారా అన్నట్టు ఉంటాయి.

ముంగండలో కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, రెండు గేదెల పాడి, ఒక లేగదూడ, ఎంతో ప్రశాంతమయిన వాతావరణం, పైరగాలి, కాలవగట్టు, పడవల పాటలు – ఏదో పోగొట్టుకున్న బెంగ — నాస్టాల్జియా, నాస్టాల్జియా, ఇంకాస్త నాస్టాల్జియా! ఇవీ, ఇతివృత్తాలు. ఇటువంటి కథలు తెలుగునాట వాస్తవజీవితం  చిత్రించే  తెలుగు కథలు కావు. అమెరికా ఎడ్రెస్‌తో  అమెరికావాడు ఊహించి రాసినంతమాత్రాన , అమెరికా తెలుగు కథలు అసలే కాదు. నిజంచెపితే నిష్టూరం!

అయితే, అడపా తడపా, చెయ్యితిరిగిన కొద్దిమంది కథకులనుంచి చక్కని డయాస్పోరా కథలు, సహారాలో వానచినుకుల్లా అప్పుడప్పుడు అకస్మాత్తుగా వస్తున్నాయి. కానీ అవి నాస్టాల్జియా# noise# లో వినపడటల్లేదు; కనపడటల్లేదు. అదృశ్యమయిపోతున్నాయి.

ఎప్పుడో, ఎక్కడనుంచో, అమెరికా తెలుగు కథకి కూడా ఒక #Edward O’ Brien# లేదా ఒక # Martha Foley#   తప్పకండా  వస్తారని ఆశిద్దాం.

 

అమెరికా  జీవితాన్ని కథలలో ఇమిడ్చి రాయలేదేమో: వేమూరి

imagesXLM15PV1అమెరికా కథ ఎటు పోతోంది? ఈ ప్రశ్నకి నిర్దిష్టంగా “కథ ఈ దిశలో పోతోంది” అని సమాధానం చెప్పడం కష్టం. ఒకటి మాత్రం నిజం. ఏభై ఏళ్ల క్రితం తెలుగులో రాయగలిగేవారే కనిపించేవారు కాదు. రాసేవాళ్లు ఉన్నా వాటిని ప్రచురించడానికి ఇండియాలో తప్ప ఇక్కడ మాధ్యమాలు ఉండేవి కాదు. ఇండియా పంపడంలో ఉన్న ఇబ్బందులు నేను ఇక్కడ వల్లెవేయనక్కర లేదు.

ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వారిలో కథలు రాసేవాల్లు – మంచి కథలు రాసేవాళ్లు – చాలమంది కనిపిస్తున్నారు. అమెరికా కథలని ప్రచురించి ప్రోత్సహించిన వారిలో ప్రథములు వంగూరి సంస్థ, వారి కథా సంకలనాలు, తరువాత కిడాంబి రఘునాథ్ స్థాపించిన తెలుగు జ్యోతి అని చెప్పుకోవాలి. తరువాత కంప్యూటర్లు, అంతర్జాలం వాడుకలోకి వచ్చి కథలు ప్రచురించడానికి కొత్త వెసులుబాట్లు కల్పించేయి.  దీనితో ఇక్కడనుండి కథలు రాసేవారి సంఖ్య పెరిగింది.

అమెరికాలో ప్రస్తుతం కథలు రాస్తూన్నవాళ్లల్లో ఉన్నత స్థాయిలో రాస్తూన్నవాళ్లు కనీసం 5-10 మంది ఉంటారని నా  అంచనా. వీరు రాసే కథలలో అమెరికా జీవితం వల్ల ప్రభావితమైన కథలు కొన్ని ఉన్నాయి. కాని అమెరికా వారికి మనకి మధ్య జరిగే సంకర్షణలని ఎత్తి చూపే కథలు తక్కువనిపిస్తుంది. కిప్లింగ్ బ్రిటిష్ వాడైనా ఆయన రాసిన కథలలో ఆయన కళ్లకి భారతదేశం, భారతీయ సంస్కృతి ఎలా కనిపించేయో అవి రాసేరు. ఇంతమంది అమెరికా వచ్చేము కాని కిప్లింగ్ ఇండియా కథలులా మనం అమెరికా వాతావరణాన్ని, జీవితాన్ని కథలలో ఇమిడ్చి రాయలేదేమో అని అనిపిస్తుంది. ప్రయత్నాలు జరగడం జరిగేయి కాని అవి పతాక స్థాయిని చేరుకోలేదు.

“ఈ వ్యక్తి అమెరికా వేళ్లి అక్కడ నివసింఛి ఉండకపోతే ఈ కథ రాయగలిగి ఉండేవాడు కాదు” అనిపించుకోదగ్గ కథలు ఉన్నాయా? ఏమో. ఉన్నాయేమో. పాఠకులే నిర్ణయించి చెప్పాలి.

 

చాలా దూరం వచ్చాం: కిరణ్ ప్రభ

kiran prabhaఅమెరికా తెలుగు కథ ఎటుపోతోంది? గత రెండు దశాబ్దాలుగా ‘అమెరికా తెలుగు కథ ‘ అనే ప్రత్యేక విభాగాన్ని సృష్టించ గలిగిన అమెరిక తెలుగు రచయితల్ని అభినందించి తీరాలి.అమెరికా తెలుగు రచయితలు కేవలం ఇంటర్నెట్ పత్రికలు, బ్లాగుల్లోనే కాక ఆంధ్రదేశంలోని ప్రింట్ పత్రికల్లోనూ, అక్కడ ప్రచురితమౌతున్న కథా సంకలనాల్లోనూ ప్రముఖంగా కనిపించడం అమెరికా తెలుగు రచయితల సత్తాని తెలియచేస్తుంది. ‘మీరు అమెరికాలో ఉంటూ కూడా ఇంకా ఇక్కడి పరిస్థితుల గురించి ఎందుకు వ్రాస్తారూ, అమెరికా గురించి వ్రాయండీ.. ‘ అనే వ్యాఖ్యలు ఆంధ్రదేశం నుంచి అప్పుడప్పుడూ వినవస్తుంటాయి

కానీ అమెరికా తెలుగు కథా రచయితలు మాతృదేశం గురించి వ్రాయడంలో ఖచ్చితంగా ఔచిత్యం ఉందని అనుకుంటాను. అమెరిక తెలుగు రచయితలూ ఒకప్పుడు తెలుగు నేలమీద నివసించిన వారేకాబట్టి వారి కథల్లో ఇంకా కుటుంబ సంబంధాలు, సొంతవూరి మట్టి వాసనలు కనిపించడంలో తప్పూలేదు, ఆశ్చర్యమూ లేదు. అమెరికాలోని ప్రవాస భారతీయుల సమస్యలు, పెరుగుతున్న పిల్లల సమస్యలు, సాంస్కృతిక వ్యత్యాసాలు, అమెరికన్లతో స్నేహాలు, వారి జీవన శైలులకీ, ప్రవాస భారతీయుల జీవన శైలులకీ గల వ్యత్యాసాలూ కూడా అమెరికన్ తెలుగు కథల్లో బాగానే ప్రతిబింబిస్తున్నాయి.

ప్రపంచాన్ని మౌస్ క్లిక్ దూరంలోకి మార్చిన అంతర్జాలం వల్ల అమెరికన్ తెలుగు రచయితలూ, ఆంధ్రదేశంలోని తెలుగు రచయితలతో భావాలు పంచుకోవడం, కలిసి పనిచేయడం లాంటి సుహృద్భావ వాతావరణం పెంపొందడం కూడా హర్షణీయమైన పరిణామం. ఫేస్ బుక్ లోని కథలకి సంబంధించిన గ్రూపులు ఇందుకు చక్కటి ఉదాహరణ. వ్రాసేవి ఎప్పటికప్పుడు ప్రచురించుకునే సౌకర్యం ఉన్న బ్లాగుల వల్ల కూడా ఔత్సాహిక రచయితల సంఖ్య పెరుగుతోంది. వారికి సలహాలిచ్చేందుకు అనుభవజ్నులు ముందు కి రావడం కూడా మెచ్చుకోదగ్గ విషయం. వాదాలూ, వివాదాలూ, కాపీలూ, ఏది మంచి ఏది చెడు అనే చర్చలూ.. ఇలాంటివి ఎప్పుడూ ఉండేవే. ‘మంచి ‘ కోణంలో చూస్తే అమెరిక్ తెలుగు కథ చాలా దూరం ప్రయాణించింది, ఇంకా ప్రయాణించగలిగే జవసత్త్వాలని పోగుచేసుకుంటోంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ముప్ఫై ఐదేళ్లుగా  చూస్తున్న కథ: సత్యం మందపాటి

satyam mandapati ‘ముప్ఫై ఐదేళ్లుగా నేను చూస్తున్న అమెరికా తెలుగు కథ’ అని మకుటం పెట్టానుగానీ, అంతకు ముందు కూడా, అంటే మేం అమెరికాలో నివాసం ఏర్పరుచుకోక ముందు, అప్పటికే నేను ఎన్నో పత్రికలలో కథలు వ్రాస్తున్నందు వల్ల, అన్ని తెలుగు పత్రికల్లోనూ కథలు విడిచిపెట్టకుండా చదువుతూనే వుండేవాడిని. అమెరికా డయోస్పోరా తెలుగు సాహిత్యం ఏ పత్రికలోనూ చదివినట్టు గుర్తు లేదు. ఇక్కడా, అక్కడా ఒకటి రెండు కథలు వచ్చినా అవి అమెరికాలోని తెలుగువారి జీవిత సరళిని సరిగ్గా చూపించే కథలు కావు. బారిష్టర్ పార్వతీశం లాటి పుస్తకాలు వచ్చినా, అవి కేవలం హాస్యం కోసం తెలుగు రచయితలు తెలుగు దేశంలోనే వుంది వ్రాసిన కాల్పనిక కథలు. ఇంగ్లాండ్, అమెరికాలాటి దేశాల జీవిత అనుభవాలను చూపించినవి కాదు.

నేను అమెరికాకి వచ్చిన తర్వాత, కొంచెం పెద్ద నగరాల్లో చిన్న చిన్న వ్రాత పత్రికలూ, జెరాక్స్ కాపీ పత్రికలూ కనపడ్డాయి. కానీ అవి కూడా ఎక్కువగా సరదాగా వ్రాసే కథలు, కవితలు లేదా పండగలకి వేసుకునే చిన్న నాటికలే కానీ, అమెరికాలో తెలుగు వారి జీవితాల మీద, సమస్యల మీద వ్రాసిన కథలు ఎక్కువగా కనపడలేదు. 1980ల చివరలోనూ, 1990ల మొదట్లోనూ అలాటి కథలు వివిధ పత్రికలలో కనపడటం ప్రారంభించాయి. అప్పుడే నా అమెరికా బేతాళుడి కథలు రచన మాస పత్రికలో సీరియల్ లాగా వచ్చి, పుస్తకరూపం దాల్చింది. ఇదే అమెరికా డయాస్పోరా తెలుగు సాహిత్యం మీద, ఒకే ఒక రచయిత వ్రాసిన మొట్టమొదటి పుస్తకం అని నేను అనుకుంటున్నాను. వంగూరి ఫౌండేషన్ వారి అమెరికా తెలుగు కథానికల సంకలనాలు కూడా అప్పుడే మొదలయాయి. తర్వాత ఎన్నో కథలు, పుస్తకాలు రావటం ప్రారంభించాయి.

ఇక వస్తుపరంగా చూస్తే, నిజంగా సంతోషం వేస్తుంది. ఎంతోమంది అమెరికాలో నివసిస్తున్న తెలుగు రచయతలు ఉత్సాహంగా ముందుకి వచ్చి, అమెరికాలో తెలుగువారి జీవితాలను స్పష్టంగా చూపే చాల కథలు, నవలలు వ్రాస్తున్నారు. ఇండియానించి కొత్తగా వచ్చేవారి అనుభవాలు, ఇండియా వెళ్లి వారం రోజుల్లో పెళ్లి చేసుకున్న వారి కష్టాలూ, సుఖాలూ, సంభాషణా చాతుర్య సమస్యలూ, ఉద్యోగాలు రావటం, పోవటం, పిల్లల పెంపకం, చదువులు, రెండో తరం పిల్లల జీవితాలు, అమెరికాలో పెళ్ళిళ్ళు, ఇలా.. ఎన్నో విషయాల మీద కథలు వ్రాస్తున్నారు. తెలుగు డయోస్పోరా సాహిత్యానికి ఒక నిజమైన అర్ధాన్ని చూపించే కథలు రావటం ముదావహం. ఎన్నో వెబ్ పత్రికలూ, ఏటేటా జరిగే సాంస్కృతిక తిరునాళ్ళ సూవనీర్లు, వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కథల పోటీలు, వారి ప్రచురణలు వీటిని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఇండియాలో వివిధ పత్రికలు కూడా ఎన్నారై కథలు ఎక్కువగా ప్రచురిస్తూ, భారతదేశంలో మన సాహిత్యాన్ని చదివించటం నిజంగా మనం గర్వించదగ్గ గొప్ప విషయం.

ఆనందం, ఆందోళన రెండూ వున్నాయి :నారాయణస్వామి

nasyఅమెరికా తెలుగు కథ ఎటుపోతోంది అని ప్రశ్నించుకుంటే కొన్ని మెచ్చుకోవలసిన పోకడలతో బాటు కొన్ని ఆందోళన కలిగించే పోకడలు కూడా కనిపిస్తున్నాయి నాకైతే.

అమెరికా నించి నడుస్తున్న జాల పత్రికలు అరడజను పైనే ఉన్నాయి. రకరకాల మంచి సాహిత్యానికీ, చర్చలకీ ఇవి నెలవులుగా ఉంటున్నాయి. ఇది సంతోషించవలసిన విషయం. కానీ ఏ ఒక్కటీ కూడా అమెరికా తెలుగు కథకీ, అమెరికా తెలుగు రచనలకీ పెద్ద పీట వేసిన ధోరణి నాకైతే కనబళ్ళేదు. మొత్తంగా దానికే అంకితం కానక్కర్లేదు గానీ కనీసం ఒక సంచిక దీనికి కేటాయించవచ్చు. మన సాహిత్యాన్ని మనమే, మన పత్రికలే పట్టించుకోకపోతే భారత్ నుండి వెలువడే పత్రికలు పట్టించుకుంటాయి అనుకోవడం భ్రమ.

కథా రచయితల్లో ఎన్నో కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. కొందరు రచయితలు చాలాకాలంగా అమెరికాలో ఉంటూ ఉన్నా ఈ మధ్యనే రచనా వ్యాసంగం మొదలు పెట్టిన వారు కాగా, కొందరు యువతీ యువకులు, ఈ మధ్యనే అమెరికాకి వలస వచ్చినవారు ఉత్సాహంగా రచనలు చేస్తున్నారు. ఇది కూడా సంతోషించ వలసిన పరిణామం.తెలుగు వారు ఇక్కడికి వలస వచ్చి, తాము ఎక్కడ సెటిలయితే అక్కడ ఒక మినీ తెలుగు వాతావరణాన్ని (తెలుగు రెస్టారెంట్లు, సినిమాలు, ఇతర వినోదాలు) ఏర్పాటు చేసుకుంటున్నట్టే, ఈ కొత్త రచయితలు ఎక్కువగా భారత్ జీవిత ఇతివృత్తాలనే ఎక్కువగా రాస్తున్నారు. ఇది ఆలోచించవలసిన విషయం. క్రమం తప్పకుండ రాస్తూ ఉన్న కొద్ది మంది సీనియర్ రచయితలు మాత్రం అమెరికా జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు.

పదిహేను ఇరవయ్యేళ్ళ కిందట విరివిగా రాస్తుండిన రచయితల పేర్లు ఈ మధ్యన ఎక్కడా కనబడ్డం లేదు. సోమ సుధేష్ణ, రాధిక నోరి, మాచిరాజు సావిత్రి మొదలైన వారు తొలితరం ఎదుర్కున్న సందిగ్ధ పరిస్థితులను గురించీ, పడిన సంఘర్షణల గురించీ ఆలోచింపచేసే కథలు రాశారు. వీరెవరూ ఇప్పుడు రాస్తున్న దాఖలాలు లేవు. రెండవ, మూడవ తరాలను చూసిన అనుభవాలతో వీరి దృక్పథాలు పండుతున్న స్థాయిలో మరి ఏ కారణంగా రాయటంలేదో తెలియదు. పత్రికలు, ప్రచురణ సంస్థలు వీరిని ప్రోత్సహించి వీరితో మళ్ళీ కొత్త కథలు రాయించాలి. లేకపోతే, పండిన వారి అనుభవాలను, ఒక తరం కథలను మనం పూర్తిగా కోల్పోతాం.

ప్రతీ కథా డయాస్పోరా కాదు:సాయి బ్రహ్మానందం గొర్తి

678_10151452027784197_1581019673_nఅమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ వచ్చిన ఈ ఏభయ్యేళ్ళలో ప్రస్తుతం ఇంతవరకూ సుమారు 200 పైచిలుకు కథలొచ్చాయి. అందులో సింహభాగం 1995 తరువాత వచ్చినవే! మొదట్లో సావనీర్లకే పరిమితమయినా అమెరికా కథ తెలుగు సాహిత్యపు ఏరులో డయాస్పోరా పాయగా నిలదొక్కుకుంది. ఇంటర్నెట్ వచ్చి అచ్చు రేఖల్ని చెరిపేయడంతో తెలుగు కథ కొత్త సరిహద్దులు నిర్వచించుకుంది. కొత్త కథకుల్ని సృష్టించుకుంది. కాకపోతే డయాస్పోరా కథ చెప్పుకో తగ్గ రీతిలో ఎదగలేదు. చాలామంది అమెరికా కథకులకి ఏది డయాస్పోరా కథ, ఏది కాదు అన్న దాంట్లో ఇంకా సందేహాలున్నాయి. దీనిక్కారణం అమెరికా తెలుగు కథమీద సమీక్షలూ, విమర్శలూ తగినంతా లేవు.

అమెరికా నుండి రాసిన ప్రతీ కథా డయాస్పోరా కథే అన్నట్లు చెలామణీ అవుతోంది. డయాస్పోరా కథల్ని సమీక్షించడానికి సరైన నేపథ్యమూ, అర్హతా ఉన్నది ఇక్కడి కథకులకే! ఈ దిశగా అమెరికా తెలుగు కథకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇక్కడి కథల్ని లోతైన అధ్యయం చెయ్యాలి కూడా. అలాగే ఇక్కడి కథకులు కూడా ఇక్కడి జీవితన్నీ లోతుగా పరిశీలించి కథలు రాయాలి. మిగతా డయాస్పోరా కమ్యూనిటీలతో, అంటే చైనీస్, వియత్నమీస్, స్పానిష్ వాళ్ళతో, చూస్తే ఇండియన్ డయాస్పోరా అంతగా అభివృద్ధి చెందలేదు. భారత దేశపు దక్షిణాది భాషలు తీసుకుంటే ఉన్నంతలో తెలుగులోనే అమెరికా నేపథ్యంలో ఎక్కువ కథలొచ్చాయి. అవన్నీ నూటికి నూరు శాతం డయాస్పోరా కథలు కాకపోవచ్చు. అయినా ఇక్కడి జీవితానికీ, సమస్యలకీ, సంఘర్షణకీ ఒక కథారూపం ఇవ్వడం ముదావహం.

అమెరికా కథా సాహిత్యం కేవలం సావనీర్లకే పరిమితం కాకుండా తనకంటూ ఒక వేదిక నిర్మించుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. వంగూరి ఫౌండేషన్ వారు ఏభయ్యేళ్ళ అమెరికా తెలుగు కథ మీద సదస్సు నిర్వహించడం తొలి అడుగు. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. అమెరికా తెలుగు కథకి ప్రస్తుత కథకులు సరికొత్త వన్నెలు తీసుకొస్తారన్న నమ్మకాన్ని నిజం చేస్తారని ఆశిద్దాం.

 

 

ఈ సాహిత్య నోబెల్ మరో ‘రాజకీయ’ దురాక్రమణ!

untitled

ప్రతి యేటా అక్టోబర్ మొదటి వారం రాగానే సాహితీ ప్రియులంతా ఆత్రుతగా యెదురు చూసేది, ఈ యేడు సాహిత్యంలో నోబెల్ బహుమతి యెవరికొస్తుందా అని! దాదాపు నెల రోజుల ముందు నుండే ప్రపంచ వ్యాప్తంగా నోబెల్ బహుమతి విజేతలు యెవరౌతారా అని బెట్టింగ్ ప్రారంభమౌతుంది! ఇంగ్లాండ్ కు చెందిన లాడ్ బ్రోక్స్ అనే బెట్టింగ్ సంస్థ వెబ్ సైట్ లో ప్ర్తతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా యెవరు నోబెల్ ఫేవరైట్స్ అని బెట్టింగ్ ప్రాంభమైంది . జపాన్ కు చెందిన నవలా రచయిత హారుకి మురకామి, సిరియా కు చెందిన మహాకవి అదోనిస్, అమెరికా కు చెందిన నవలా రచయిత ఫిలిప్ రాథ్ అమెరికా కవి గాయకుడు బాబ్ డిలాన్ తదితరులు దాదాఉ ప్రతి సారీ ఈ బెట్టింగ్ లలో ప్రధానంగా కనబడతారు.

కీన్య రచయిత గూగీ

కీన్య రచయిత గూగీ

అయితే ఈ సారి దాదాపు అన్ని బెట్టింగ్ లలో ప్రముఖ కేన్యా రచయిత న్గూగి వాథియాంగో ముందు వరసలో వినబడింది. గత రెండు మూడు యేండ్లుగా అదోనిస్ పేరూ వినబడింది. అమెరికన్ నవలా రచయిత ఫిలిప్ రాథ్ ప్రతి యేటా వినబడుతూనే ఉంది. బహుశా నాలాంటి వాళ్ళకు మాత్రం న్గూగి పేరు వినబడడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రజల విముక్తి కోసం నిలబడి, ప్రజా ఉద్యమాల్లో భాగమై, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం రచనలు చేసి, అనేక మార్లు జైలు పాలయి, ప్రవాసంలోకి నెట్టబడి , వ్యక్తి గతంగా యెన్నో ఒడిదుడుకులకు, ఇబ్బందులకు, కష్టాలకు లోనైనా వెనుకంజ వేయకుండా గొప్ప నిబద్దతతో ఉద్యమ సాహిత్యం సృష్టిస్తున్న న్గూగి కి నోబెల్ రావచ్చేమో అని ఒకింత ఆశ కూడా కలిగింది. నిజానికి గత రెండు మూడేళ్ళ నుండి అరబ్ మహాకవి అదోనిస్ కు రావాలని చాలా ఆశ కూడా ఉండింది. పాలస్తీనా మహాకవి దార్వీష్ ని (ఆయన జీవించి ఉన్నపుడు) , అదోనిస్ ని , న్గూగి ని నోబెల్ కమిటీ గుర్తిస్తుందని అనుకోవడం అత్యాశే నేమో!

అవార్డుల పట్ల మోజూ, యేవో అవార్డులొస్తేనే రచయితలు కవులు గొప్పవారనే దురభిప్రాయం లేకున్నా, ఆ అవార్డ్ ద్వారా, ముఖ్యంగా నోబెల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అవార్డు ద్వారా వారు ప్రతినిధులుగా ఉన్న ప్రజలూ వారి ఉద్యమాలూ , కన్నీళ్ళూ, కష్టాలూ, యుద్ధాలూ, జీవన్మరణ పోరాటాలు – వీటన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుందనీ, వెలుగు లోకి వస్తాయనీ ఒక ఆరాటం! వాటికి ఒక వేదిక, జాగా దొరుకుతుందని తండ్లాట!

చివరకు సాహిత్యం లో నోబెల్ ప్రకటించబడ్డది – ఫ్రెంచి రచయిత పాట్రిక్ మాడియానో కు నోబెల్ ఇచ్చారు. నాజీ దురాక్రమణలో నలిగిపోయి మరుగునపడిన జీవన ప్రపంచాల్ని , పట్టుచిక్కని మానవ అనుభవాలని ఆయన రచనల్లో గొప్ప గ్నాపక కళతో వెలికితీసినందుకు’ ఆయనకు నోబెల్ ఇచ్చినట్టు కమిటీ ప్రకటించింది. యెప్పుడూ వినలేదు చదవలేదు యెవరీ మాదియానో అని దాదాపు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఒక్క ఫ్రెంచివాళ్ళు తప్ప. ఫ్రాన్సు లో ఆయన బాగా ప్రసిద్ధి చెందిన రచయిత నట! కొన్ని మినహాయింపులతో ఆయన ప్రముహ ఫ్రెంచి రచయిత ప్రౌస్ట్ అంత వాడట! ‘తప్పిపోయిన మనిషి’ అనే 130 పేజీల నవల ఫ్రాన్సు లో బాగా ప్రసిద్ది చెందినదట! తన గ్నాపకశక్తి కోల్పోయిన ఒక డిటెక్టివ్ తన అస్తిత్వం కోసం చేసిన ప్రయత్నాన్ని ఆ నవల చిత్రించిదట! డిటెక్టివ్ నవలా ప్రక్రియకి (genre) చెందినదట! కోల్పోయిన జీవితాన్ని వెతుక్కోవడం లో ఉండే సమస్యలని (వెతుక్కోవడమూ, పొందడమూ, దాన్ని అర్థం చేసుకోవడమూ కాదు) మాదియానో తన రచనలలో చిత్రించాడని, చాలా సరళంగా , సులభంగా రాసినట్టున్నా మాదియానో రచనల్లో అత్యంత సంక్లిష్టమైన మానవ జీవితం ప్రతిఫలిస్తుందని పత్రికలు రాసాయి.

అయితే మాదియానో ఫ్రెంచ్ దేశస్తుడు – ఇప్పటి దాకా 14 ఫ్రెంచి రచయితలకు నోబెల్ వచ్చింది. ఈయన 15 వ వాడు. మాదియానో యూదుడు – ఇప్పటిదాకా 13 మంది యూదులకు (కేవలం సాహిత్య రంగంలోనే ) నోబెల్ వచ్చింది ఈయన 14 వ వాడు. అట్లా అని ఫ్రెంచి వాళ్ళకు యూదులకు నోబెల్ రావద్దని కాదు – కేవలం ప్రతిభనాధారం చేసుకునే నోబెల్ ఇస్తున్నారని మనమనుకుంటే అది అసాధ్యం కూడా కాకపోవచ్చు! కానీ నోబెల్ ప్రధానంగా ఐరోపా వారినే వరిస్తుందనీ, అదీ 1948 తర్వాత యూదులకే ఎక్కువసార్లు ఇచ్చారనీ (సాహిత్యమూ యితర రంగాల్లో కూడా) అపవాదు నోబెల్ కమిటీ పైనున్నది. అయితే అది పెద్ద సమస్య కాదు.

నిజంగానే యూదులు ప్రతిభావంతులు కాబట్టి వారికే నోబెల్ వస్తుందనీ అనుకోవచ్చు. నాజీ దురాక్రమణ , హోలోకాస్ట్ అనేవి మానవ జాతి చరిత్రలో పెద్ద మచ్చలే! వాటి గ్నాపకాలు వెంటాడి వేటాడుతుంటాయి నిజమే! కానీ ప్రధానంగా యూదులచే నడుపబడుతున్న పాశ్చాత్య రాజకీయార్థిక చట్రమూ (ప్రభుత్వాలూ, ఆర్థిక వ్యవస్థలూ ) దాని చే నియంత్రించబడుతూ తిరిగి దానిని ప్రభావితం చేస్తున్న సాంస్కృతిక వ్యవస్థా నాజీ దురాక్రమణనూ, హోలోకాస్టునూ విపరీతంగా ప్రచారం చేసాయి. ప్రపంచ సాంస్కృతిక చరిత్రా గమనమూ అంతా వాటిచుట్టే తిప్పాయి. అవే యింకా ప్రదాన సమస్యలుగా, అవి తప్ప ప్రపంచప్రజలకు యింక వేరే యే కష్టాలూ కన్నీళ్ళూ లేవన్నట్టుగా తీవ్రంగా ప్రచారం చేసి వాటిని ఒక సాంస్కృతిక వ్యవస్థలుగా యేరాటు చేసినయి. ఒక్క తీరుగా మనల్ని నమ్మించినయి.

ఎడోనిస్

ఎడోనిస్

నిజమే నాజీ ల దురాక్రమణలో యూదులు చెప్పనలవి కాని కష్టాలు పడ్డారు. కాదనడం లేదు. చరిత్రలో పాలకులు యెప్పుడూ ఒక పని చేస్తూ ఉంటారు. తమ చరితే ప్రజల చరిత్ర అనీ , తమ కష్టాలే అందరి కష్టాలూ అనీ, తమ సంస్కృతే అందరి సంస్కృతి అనీ ప్రచారం చేసి ఒక వ్యవస్థగా యేర్పాటు చేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓటమి తర్వాత దేశదేశాలకు వలసపోయిన యూదులకు ఒకే దేశం పేరు మీద ‘తమ దేశం ఇజ్రాయిల్’ అని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఆయువుపట్టైన చమురు విస్తారంగా దొరికే మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని కబ్జా చేసుకోవడానికి, అక్కడి అరబ్బుల మీద ప్రత్యక్ష పెత్తనం చలాయించడానికి అమెరికా ఐరోపాలు కుట్రపూరితంగా ఇజ్రాయిల్ ని యేర్పాటు చేసారు. అప్పటిదాకా అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజలని నిర్వాసితుల్ని చేసారు. పాలస్తీనా ప్రజలని తమ దేశంలోనే కాందిశీకుల్ని చేసి ఆ ప్రాంతాన్ని దురాక్రమించుకున్నారు.

యిప్పటికీ ఆ దురాక్రమణ కొనసాగుతున్నది. గత ఆరు దశాబ్దాలకు పైగా అక్కడి ప్రాంతం పాలస్తీనా ప్రజల నెత్తురు కన్నీళ్ళతో తడిస్తున్నది. నిన్న గాక మొన్న ఇజ్రాయిల్ గాజా మీద నెల రోజులకు పైగా యెడతెరిపిలేని దాడులు చేసి ఆప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెయ్యి మందికి పైగా పాలస్తీనా ప్రజలను (స్త్రీలు పిల్లలు ముఖ్యంగా) హత్య చేసి లక్షలాది ప్రజల్ని నిర్వాసితుల్ని చేసింది. ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేసింది. నిజానికి నాజీ దురాక్రమణ, హోలోకాస్టు గత ఆరు దశాబ్దాలకు పైగా ఇజ్రాయిల్ అమెరికా ఐరోపా దేశాల సహయంతో పాలస్తీనా ప్రజలమీద చేస్తున్న దురాక్రమణ దాడుల ముందు వెల వెల బోతాయి. ఇజ్రాయిల్ అంత దుర్మార్గంగా దాడులు హత్యలు దురాక్రమణ చేస్తూ అది ఆత్మ రక్షణకోసమే అని బుకాయిస్తోంది కూడా!

బెంజమిన్ నెతన్యాహూ ని మరో హిట్లర్ గా, హిట్లర్ కన్నా దుర్మార్గుడిగా అనేక మంది (ప్రజాస్వామ్య వాదులైన యూదులతో సహా ) వ్యాఖ్యానించారు. జియోనిజం నాజీ లకన్నా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనీ, ప్రపంచాన్ని కబళించాలని పన్నాగాలు పన్నుతుందనీ ప్రజాస్వామిక వాదులు ప్రపంచవ్యాప్తంగా యెలుగెత్తుతున్నారు. నిరసిస్తున్నారు. అయినప్పటికీ జియోనిస్టు దురాక్రమణవాదులచే నియంత్రించబడుతున్న పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నయి. వారి సాంస్కృతిక యంత్రాగాలు మాత్రం యింకా నాజీ దురాక్రమణ గురించీ, హోలోకాస్టు గురించీ, వాటిలో యూదులు పడ్డ కష్టాల గురించీ ఆ గ్నాపకాల గురించీ పదే పదే ప్రచారాలు చేసి ప్రస్తుత చరిత్రలో తాము చేస్తున్న దుర్మార్గాలని, దాడులని, దురాక్రమణలనీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

నోబెల్ కమిటీ జియోనిస్టుల నియంత్రణలో ఉన్న పాశ్చాత్య ఆధిపత్య వ్యవస్థలకు అతీతమైంది కాదు. నిస్సందేహంగా వాటి నియంత్రణ లోనే ఉండి, ఆ పరిధిలోనే పని చేస్తుంది! కేవలం ప్రతిభకే పట్టం కడతామని చెప్పుకున్నా ప్రపంచంలోని ప్రతిభ అంతా పాశ్చాత్య దేశాల్లోనే ఉంది అదీ ఒక వర్గం ప్రజలకే ఉంది అని అవార్డులు ప్రకటించడం యాదృచ్చికమేమీ కాదు. హోలోకాస్టు కి వెయ్యి రెట్లకు మించి దురాక్రమణా దాడులకు, హింసకూ ప్రపంచవ్యాప్తంగా యెన్నో దేశాల్లో ప్రజానీకం గురవుతున్నారు. వారి కష్టాలూ కడగండ్లూ ఆనాడు యూదుల కష్టాలకన్నా నిస్సందేహంగా యెన్నో రెట్లు యెక్కువ కూడా! అది పాలస్తీనా లో కావచ్చు, ఆఫ్రికా దేశాల్లో కావచ్చు, లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు – ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి మరో సారి హోలోకాస్టు గ్నాపకాల గురించి రాసిన ఐరోపా యూదునికే సాహిత్యం లో నేబెల్ ఇవ్వడం ఆశ్చర్యమూ అన్యాయమూ కూడా!

నిజానికి సాహిత్యం లో నోబెల్ ఇచ్చే పద్దతి చూస్తే దురాక్రమణలకూ దాడులకు గురవుతున్న దేశాల ప్రజల రచయితలకు ఆ బహుమతి ఇస్తారని ఆశించడం అత్యాశ కూడా! యెందుకంటే వారికి నోబెల్ అవార్డుల కమిటీ లలో యెటువంటి ప్రాతినిధ్యం లేదు గనక!

-నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

తెలంగాణా రచయితలూ/ కవులు ఇప్పుడేం చేయాలి?

వ్యక్తిగత వైఖరులను సవరించుకోవాలి: కె. శ్రీనివాస్
Box content
195922_10150100454781059_8264333_nతెలంగాణ రచయితలు చాలా చేశారు. ముఖ్యంగా కవులు, పరిశోధకులు చాలా చేశారు.  కవుల్లో కూడా పాట  కవులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా వాద కథ మాత్రం రావలసినంత రాలేదు. నవల అయితే మరీ హీనం.  ఉద్యమప్రయాణం చివరి మజిలి కి చేరిన దశలో, నిరాశా నిస్పృహలు ముంచెత్తుతున్నప్పుదు, కవులు చేయాల్సింది ఆశను అందించడమే.  పరిణామాలు మన చేతుల్లో లేనప్పుడు, సంకల్ప బలాన్ని పోరాట స్ఫూర్తి నమ్ముకోవాలి. వాటిని కవులు గుర్తు చేయాలి. వచనం రాయగలిగిన వాళ్ళంతా వ్యాసాలు రాయాలి. శ్రీశ్రీ వంటి ఉద్యమ రచయితలు అనేక సందర్భాల్లో వివిధ ప్రక్రియల ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అందరినీ ఒకే గాట కట్ట కూడదు.
కాని, మన రచయితలకు అధ్యయ న ఆసక్తి తక్కువ. పేరు మీద ప్రచురణ మీద ఉన్న ఆసక్తి  సందర్భానికి అవసరమైన విశ్లేషణలను వ్యాఖ్యలను పాఠకులకు అందించడం మీద ఉండదు. విరివిగా విస్తృతంగా రాయాలి, నాణ్యత తక్కువైనా, తగిన సమాచారం, సందేశం ఉంటే చాలు అనే ఆచరణాత్మక ద్రుష్టి ఉండాలి . అందుకు వ్యక్తిగత వైఖరులను సవరించుకోవాలి. హైదరాబాద్ తో  తాదాత్మ్యాన్ని చెప్పే ఒక్క మంచి పోయెమ్ తెలంగాణా కవుల నుంచి రాలేదు. సీమాంధ్రు లను సంబోధిస్తూ రాసే సవాల్ కవిత్వాలే ఎక్కువ వస్తున్నాయి. అటువంటి వ్యక్తీకరణ రూపాన్ని  అధిగమించే ప్రయత్నం కూడా లేదు.  అనేక అస్తిత్వ వాద ధోరణుల్లో ఉండే కొన్ని అవలక్షణాలు   తెలంగాణ సాహిత్య రంగంలో కూడా బలపడ్డాయి. ప్రస్తుత సందర్భంలో అవసరమైన ధైర్యాన్ని, సందేశాలను ఇస్తూనే, తెలంగాణా సాహిత్య రంగ పునర్నిర్మాణం గురించి కూడా ఆలోచించాలి.
* *
తెలుగు-ఉర్దూల మధ్య వారధి కావాలి: స్కై బాబా
Box content
తెలుగు-ఉర్దూల మధ్య వారధి కావాలి: స్కై బాబా
skyహైదరాబాద్ పై సీమ, ఆంధ్ర ప్రాంతాల వారు గొడవ మొదలు పెట్టడం తో తెలంగాణ కవులు, వాగ్గేయకారులం కలిసి ఉర్దూ తెలుగు కవి గాయక సమ్మేళనం సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం.. దాదాపు 200 మంది కవులు వాగ్గేయకారులు పాల్గొన్నారు. 1953లో దాశరధి అధ్యక్షతన ఉర్దూ-తెలుగు ముషాయిరా జరిగిందట. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఉర్దూ-తెలుగు కవులు కలిసి పాల్గొన్న కవి సమ్మేళనం ఇదేనట! హైదరాబాదీ తెహజీబ్ ని అందరికీ తెలియజేయాలంటే ఉర్దూ-తెలుగు ముషాయిరాలు, సమ్మేళనాలు విరివిగా జరపాలి..
పై కార్యక్రమం కూడా నా ఆలోచనతోనే అలా రూపొందిన కార్యక్రమం. ఈ ఆలోచన 2 ఏళ్ల క్రితం నుంచే చేస్తున్న నేను ఉర్దూ-తెలుగు తెలంగాణ ముస్లిం కవితా సంకలనం కూడా వేసే పనిలో ఉన్నాను. ఆ సంకలనం ఈ వారం లో రానుంది.
తెలంగాణ లో కవులు, రచయిత లంటే తెలుగు వారితో పాటు ఉర్దూ వారు కూడా. ఆ విషయం నేటి ఉద్యమకారులు, సాహిత్య సంస్థలు విస్మరించాయి. ‘గంగా జమున తెహజీబ్’ కి హైదరాబాద్ రాజ్యం పెట్టింది పేరు. ఆ హిందూ-ముస్లిం అలాయిబలాయి సంస్క్రుతి గత 60 ఏళ్లుగా మాయమవుతూ వొచ్చింది. తిరిగి దానిని జీవింప జేసుకోవడం నేటి తెలంగాణ కవులు రచయితల బాధ్యత. దాని వల్ల ఇరు మతాల వారిలో సోదర భావం పెంపొందుతుంది. దేశంలోనే ప్రసిధ్ధి పొందిన ఉర్దూ రచయితలు మనకు ఉన్నారు. ఉర్దూ రచనలు తెలుగులోకి, తెలుగు రచనలు ఉర్డులోకి అనువాదాలు జరగాలి. తెలుగు-ఉర్దూ సాహిత్యకారుల కోసం ఒక అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలి.
* * *
ప్రాంతీయ వివక్ష తెలంగాణా సాహిత్యంలోనూ వుంది: ఎంవీ పట్వర్ధన్
Box content
ప్రాంతీయ వివక్ష తెలంగాణా సాహిత్యంలోనూ వుంది: ఎంవీ పట్వర్ధన్
మన పోరాటం అస్తిత్వం గూర్చే ఐనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అది బహు ముఖీనం అవుతుంది. అప్పుడూ ప్రాంతీయ భావాలు మరో రూపంలో పెల్లుబుకుతాయి. ఇప్పటి తెలంగాణా ఉద్యమ కవిత్వాన్ని గమనిస్తే అది ఏ రెండు మూడు ప్రాంతాల నుండో ఉద్ధృతంగా వచ్చినట్టు కనిపిస్తుంది.కానీ నిజం అది కాదు. మరి ఎందుకీ అభిప్రాయం అంటే పత్రికలూ,సుప్రసిద్ధ కవుల ధోరణే అని చెప్పాలి. చల్లకు వచ్చి ముంత దాచినట్లు ఎందుకు?ఉన్నదున్నట్టు చెప్పేస్తా.

ఈ పోరాట క్రమంలో ఉదాహరణకు ఆదిలబాదు జిల్లానుండి వచ్చిన సాహిత్యం వివక్షకు గురయింది.ఆదిలబాదు నుండి వచ్చిన ఎన్నో పుస్తకాలు గుర్తింపు పరంగా తొక్కి పెట్టబడ్డాయి.నేను జనాంతర్గామి -తెలంగాణా ఉద్యమ దీర్ఘ కవిత రాసి సమీక్షకు పంపిస్తే ఏ పత్రికా సమీక్షించలేదు.కవిత్వం బాగుంటే లాంటి మాటలు వద్దు.పత్రికా సమీక్షలకు ఏ కొలమానాలో చాలమందికి తెలుసు.ఈ అభిప్రాయం తప్పైతే ఆ బాధ్యత అ అభిప్రాయాన్ని కలిగిచిన పత్రికలదే! ఇంకా అనేకులు రాసిన పుస్తకాల పరిస్థితీ ఇదే.ఈ ప్రాంతం నుంచి ఏ ఒక పుస్తకానికో అవార్డు వచ్చినంత మాత్రాన అది ఈ ప్రాంత కవులందరికీ గుర్తింపు అనే మాటల్లో నాకు విశ్వాసం లేదు.

ఏ ఉద్యమ కార్యక్రమంలోనైనా ఆదిలాబాదుకు ప్రాధాన్యత అంతంత మాత్రమే.ఎప్పుడూ తల్లిచాటు బిడ్డలా అప్రాధాన్య పాత్రను పోషించాల్సిందే.అనవచ్చు గుర్తింపు కోసం ఇంత తహతహ దేనికని.నిజంగా మీరే చెప్పండి.ఎంతో కొంత గుర్తింపు కోరుకోని రచయిత ఉంటాడా?

ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న విషయం చిన్నదిగ కనబడవచ్చు.కొంత అపరిపక్వంగానూ.కానీ రేపు ఇదే మనసులకు మాంచలేని గాయాన్ని చేస్తుంది.ప్రస్తుత తెలంగాణా రచయితలూ,పత్రికలూ చేయాల్సిందేమంటే అన్ని ప్రాంతాల వారికీ సమాన అవకాశాలివ్వడం.

మన పోరాటంలో ముఖ్య భూమిక మాండలీకందే.సందేహం లేదు.కానీ దురదృష్టవషాత్తు మనది తెలుగు భాషే కాదనుకునే దాకా వెళ్ళిపోయాం.ఇప్పుడు రాష్త్రాన్ని కొంతైనా సాధించుకున్నం గదా ఇక నైనా భాషకూ,మాండలీకానికి ఉన్న తేడాను మనం గుర్తించాలి.రేపు పూర్తి స్థాయిలో రాష్ట్రం ఏర్పడ్డాక మనం మాట్లాడేది తెలుగు కాకుండా పోదు కదా!మరణాంతాని వైరాని అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. మన రచయితలు తెలుగు భాషనూ రచయితలను గౌరవించడమంటే తెలంగాణను వ్యతిరేకించడం కాదన్న గ్రహించిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి.మనమిన్నిన్ని రాయడానికి మాధ్యమం తెలుగే కదా!ఒక విజయం తరువాత తప్పనిసరిగా శాంతి పునరుద్ధరణ జరగాలి.

కుల సంకులాలను గూర్చి నేను మాట్లాడదల్చుకోలేదు.ఒక విశాల లక్ష్యంకోసం అన్ని అక్తులూ ఉద్యమిస్తాయి.ఏది ప్రతీప శక్తి అన్నది అనుభవం మీద గాని తెలువదు.ఎప్పుడూ నమ్మకం ఘనీకృతంగా కాక ఇష్యూ బేస్డ్ గా ఉండాలి.ఇది చర్చకు మీరు పెట్టిన అంశం ఐనా కాకపోయినా నా రాతలోనూ కొన్ని చర్చనీయాంశాలు లేకపోలేదు.

 

**
బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె: శ్రీరామోజు హరగోపాల్
Box content
బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె:    శ్రీరామోజు హరగోపాల్

haragopalకవులు, రచయితలకు ఎప్పుడేం రాయాల్నో తెలిసినవిద్యే. ఎల్లపుడు ప్రజలపక్షం వహించే వాళ్ళనే కవులని, రచయితలని గుర్తుంచుకుంటున్నాం.యివాళ్టి సంగతి ప్రత్యేకసందర్భం. తెలంగాణరాష్ట్రం కోసమేనైతే కవులేం చెయ్యాలె, రచయితలేం రాయాలెనన్నదానికి ఇంకా నిజం కానిదానికి, కోటి అనుమానాలు వున్నదానిగురించి రాసేదేం లేదు కాని, మనకల నిజమైతుందన్న ఆశతో రాయడం వేరేసంగతి.

ఏండ్లుపూండ్లుగా తెలంగాణాలో కవులేం రాస్తున్నరో అదే రాస్తాలో రాస్తరు.కాళోజి లెక్కనె ప్రజలగొడవే రాసి ధిక్కారం గొంతుతోనే లేస్తరు. తెలంగాణాసాయుధపోరాట కాలం నుంచి పాట,పోరాటం ధరించిన కవుల వారసత్వం నిలుపుతరు.ఎప్పటికప్పుడు మారుతున్న పోరాటాలకు జెండాలై నినాదాలిస్తరు. ఊరేగింపుల ముందునిలుస్తరు. ఇపుడు ప్రజల్లో వున్న భయాలు, ఆ భయాలను పురిగొల్పుతున్న దుర్మార్గపు అరాచకీయ వ్యవస్థలపట్ల ప్రజల్ని మేలుకొల్పి మేల్కొనివుండేటట్టు చూస్తరు.

మాసిపోయిన మనతెలంగాణాభాషను కవులు, రచయితలు రాయడం అలవాటుచేసుకోవాలె. మనం మన భాషను మన ముసలోల్ల దగ్గర నేర్చుకోవాలె, ఆ భాషను సేకరించాలె, నిఘంటువులని తయారు చేసుకోవాలె. భాషావేత్తలు తెలంగాణాభాష ఎట్ల ప్రత్యేకమైందో చెప్పాలె.ఎంత కాలం నుండి ఎంత సంపన్నంగా వుండేదో రాయాలి. బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె. అన్ని రకాల సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించాలి.

చరిత్ర విషయంలో తెలంగాణాకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడి ప్రాచీన, ఆధునిక చరిత్ర నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడున్న అపారమైన చారిత్రక పూర్వయుగ విశేషాలు కాని, శాసనాలు కాని, శిల్పసంపద గాని ఏదో పట్టీపట్టనట్లు కొంచెమే పేర్కొనబడ్డయి. మన చరిత్రను మనం యదార్థంగా రాసుకోవాలె. ఆ పనికి ఎవరైన పూనుకోవాలె కదా.

మనసంస్కృతి – మన సంప్రదాయాలని ( మతాతీతంగా, కులాతీతంగా) నిలబెట్టుకోవాలె. వాటిలో మన జీవనసంస్కృతిని దొరకబట్టుకుని కాపాడుకోవాలె. మనతెలంగాణాను మనం మళ్ళీ డిస్కవర్ చేస్కోవాలె.అందుకు తెలంగాణాను పునర్నిర్మాణం చేసుకోవాలె. దానికి కవి,గాయక,రచయితలు అందరు సనాతన సంచార మౌఖిక, లిఖిత సంప్రదాయాల్నన్నింటిని పరిశోధించాలె. ఇప్పటిదాకా నిర్లక్ష్యానికి గురైన మన భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర లన్నింటిని మళ్ళీ తిరగరాసుకోవాలె. ఇదొక సంధి సందర్భం. ప్రత్యేక పోరాటమెంతనో ఆ తర్వాత కూడా అంతే పటిమతోని పోట్లాడాలె. తెలంగాణాపోరాట చరిత్రను రేపటితరం కోసం నిష్కర్షగా రాసిపెట్టాలి. కవులు రేపటి తెలంగాణాలో ( ఎంత గొప్పగా వూహించినా అది మళ్ళీ ఈ రాజ్యలక్షణాలను వొదులుకునేదైతే కాదుగదా, అందుకని బద్మాష్ పాలకులతో తగాదా తప్పదుగా ) ప్రజల చేతుల్లో పదనెక్కిన పద్యమై, పాటై,కవితలై మోగుతరు.

——————————————————————————————————————

                    (గమనిక: ఈ అంశంపై మీ అభిప్రాయాలను editor@saarangabooks.com కి పంపండి)

తెలంగాణా కవులు/ రచయితలూ ఇపుడేం చేయాలి?

 

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నారు. గత దశాబ్ది కాలంగా తెలంగాణ రచయితలు, తెలంగాణ అస్తిత్వాన్ని, విముక్తి, స్వేచ్చా స్వాతంత్ర్యాకాంక్షలను, ప్ర్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షలను యెలుగెత్తి చాటారు. తమ రచనల్లో – పాట, కవిత్వం, కథ, నవల, సాహిత్య విమర్శ – అన్ని సాహితీ ప్రక్రియల ద్వారా ప్రధానంగా  వారు చాటింది ఈ ఆకాంక్షలనే! అయితే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష్లని మాత్రమే చాటితే తెలంగాణ సాహిత్యం రాజకీయ ప్రచార సాహిత్యం మాత్రమే అయి ఉండేది. కానీ గత దశాబ్దంన్నర కాలంగా తెలంగాణ రచయితలు సృష్టించిన సాహిత్యం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మాత్రమే కాకుండా,  అనేక విషయాలని తడిమింది.

ముందుగా తెలంగాణ రచయితలు తమ అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. తెలుగు భాష, సంసృతి, సాహిత్యం మొత్తం కూడా యెట్లా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలోని కొన్ని సామాజిక వర్గాల  వారి గుప్పిట్లోనే ఉండిపోయి, వారు రాసిందే సాహిత్యం, వారు మాట్లాడిందే భాష, వారిదే అసలైన సంస్కృతి అనే పద్దతిలో చలామణీ అయిందో, ఈ క్రమంలో మిగతా వెనుకబడ్డ ప్రాంతాల వారి సాహిత్యం, భాష, సంస్కృతుల లానే తాము కూడా యెట్లా అణచివేతకు గురయ్యారో, అయితే తాము గురయిన అణచివేత కు ప్రత్యేక చారిత్రిక కారణాలూ, ప్రత్యేక సందర్భమూ యెట్ల్లా ఉన్నయో గుర్తించారు. నిజానికి ప్రజా సాహిత్యం లో ప్రజల భాషకు పెద్ద పీట వేసినప్పటికీ , మాండలిక భాష అంటూ తెలంగాణ భాషకున్న ప్రత్యేక అస్తిత్వాన్ని, చారిత్రిక నేపథ్యాన్ని ప్రగతిశీల వాదులుగా చెప్పుకుంటున్న వారు కూడా   గుర్తించ నిరాకరించారో, తెలంగాణ రచయితలు బట్టబయలు చేసారు. తెలంగాణ లో మరుగున పడ్డ అనేక గొప్ప సాహిత్యకారులను, వారు సృష్టించిన సాహిత్యాన్ని వెలికి తీసారు. సాహిత్య విమర్శకు కొత్త తెలంగాణ దృష్టిని దృక్కోణాన్ని అందించి పదునెక్కించారు. గత తెలుగు సాహిత్య చరిత్రనూ దృక్పథాలను తెలంగాణ దృక్పథంతో వినిర్మాణం చేసి సాహిత్య చరిత్రనూ, సాహిత్య విమర్శనూ తిరగ రాసారు. కొత్త తెలంగాణ సాహిత్య శకాన్ని సృష్టించారు.

అట్లే తెలంగాణ ప్రజా జీవితంలో, సంస్కృతిలో, చరిత్రలోని అనేక అంశాలని వెలికితీయడమే కాకుండా , కొత్తగా కనుగొన్నారు, సూత్రీకరించారు, సిద్ధాంతీకరించారు . దీని వెనుక – తెలంగాణ సాహిత్యకారులు తమ సాహిత్య చరిత్రను (గత చరిత్రనూ, నడుస్తున్న చరిత్రనూ)   పునర్నిర్మించడానికీ, పునర్లిఖించడానికీ,  వినూత్నంగా కనుక్కోవడానికీ (discover ), “కేవలం తెలంగాణ దృష్టీ దృక్పథమూ మాత్రమే ప్రధానం”  అనే ‘సంకుచితంగా’ కనబడుతున్నట్ట నిపించే భావన ఆలంబన ఐంది. ‘సర్వే జనా సుఖినోభవంతు’ నుండి ‘ప్రపంచ కార్మికులారా యేకం కండి”  నుండి, ‘రైతాంగ ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్దిల్లాలి’ నుండి ఒక ప్రాంతీయ వాద దృక్పథానికి సాహిత్యంలో localized outlook కీ, expression కీ ప్రయాణించారు తెలంగాణ రచయితలు.

అయితే ఈ ప్రయాణానికి తెలంగాణ ఉద్యమ  చారిత్రక సందర్భం యెంత దోహదపడిందో , తాము తెలంగాణ సమాజపు అనేక దశల్లో సాధించిన పరిణామాలు, పరిణతీ, acquire చేసుకున్న చారిత్రిక అనుభవమూ, జ్ఞానమూ అంతే దోహదపడ్దాయి. యేదీ సమాజంలో చరిత్ర లేకుండా ఊడిపడదు కదా! అయితే కొన్ని సందర్భాల్లో తెలంగాణ రచయితలు ఒక తీవ్రమైన దృక్పథాన్ని అవలంబించి కొంత గత చరిత్రని నిరాకరించిన సందర్భమూ లేక పోలేదు. అచారిత్రికంగా అనిపించినా ఇది అన్ని అస్తిత్వ వాద ఉద్యమాల్లో మనకు సాధారణంగా కనబడే లక్షణమే! తమని తాము  నిర్మించుకునేందుకు, స్థాపించుకునేందుకు చాలా సార్లు పునాదుల్నీ, నేపథ్యాన్నీ పూర్తిగా నిరాకరించే ధోరణి సరైంది కాకపోవచ్చేమో కాని అసందర్భమూ అచారిత్రికమూ మాత్రం కాదు. ముఖ్యంగా ఒక ప్రాంతం విముక్తి కోసం పోరాడుతున్న ఉద్యమ నేపథ్యంలో, అన్ని రంగాల్లో  జరిగే assertions లో ఇది మనం చూస్తాం. అదే తెలంగాణ రచయితల్లో సాహిత్య విమర్శకుల్లో కూడా వ్యక్తమైంది.

ఐతే తెలంగాణ జీవితాన్ని అనేక సందర్భాల్లోంచి, అనేక పార్శ్వాలనుంచి, అనేక కోణాలనుంచి తెలంగాణ సాహిత్యం తెలంగాణ ఉద్యమ బీజాలు మొలకెత్తడం ప్రారంభించిన 1990 దశాబ్దం అర్ధ భాగం నుండే అద్భుతంగా ఆవిష్కరించడం ప్రారంభించింది. యే కాలంలో నైనా , యే స్థలంలో నైనా సాహిత్యం ఉద్యమం రాకని యెలుగెత్తే వైతాళిక పాత్ర పోషిస్తుంది అనేది తెలంగాణ విషయం లో అక్షర సత్యం. కథల్లో, నవలల్లో, కవిత్వంలో, మరీ ముఖ్యం పాటలో తెలంగాణ జీవితం లోని, చరిత్రలోని మున్నెన్నడూ వెలికిరాని ప్రతిఫలించని అనేక కొత్త కోణాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య విమర్శ కొత్త దృక్పథాలని ప్రకటించింది. ఐతే ప్రాంతీయ వాద అస్తిత్వ సాహిత్యమూ ఉద్యమంగా కనబడ్డా,  తెలంగాణ ఉద్యమమూ సాహిత్యమూ ప్రధానంగా ప్రపంచంలోని బడుగు దేశాలనీ, ప్రాంతాలనీ, ప్రజలనీ ముంచెత్తి వేసిన ప్రపంచీకరణకు ధీటుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టి,  సవాలు చేసి, ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సామాజిక నమూనాని ప్రకటించి, తన వనరులని తానే అనుభవించగలిగే రాజ్యనియంత్రణ, అధికారమూ కోసం చేసిన, చేస్తున్న  ఒక గొప్ప చారిత్రిక యుద్ధం ! యెలుగెత్తిన ప్రజాగ్రహ ప్రకటన! ఇందులో తెలంగాణ రచయితలు గొప్ప చారిత్రిక పాత్రను పోషించారు. పోషిస్తున్నారు. యిట్ల్లా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది, తెలంగాణ సాహిత్యమూ సాహిత్యకారులూ తెలంగాణ ఉద్యమానికి జెండాలై రెప రెప లాడుతారు.

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో ఉండడానికి కారణం తెలంగాణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంధి దశ!

ఒక వైపు కేంద్రంలో అధికారం లోనున్న ఒక ప్రధాన జాతీయపార్టీ అనేక సంవత్సరాల జాప్యం తర్వాత ప్రజా ఉద్యమాల పెను ఉప్పెనల ఒత్తిడికీ, మరుగుతున్న తెలంగాణ ప్రజాగ్రహానికి జడిసి, యెడతెరపిలేకుండా కొనసాగుతున్న తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా యెక్కడుందో కూడా తెలియని సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మరుక్షణమే ప్రత్యక్షమై నాటినుండి నేటి దాకా అనేక కుట్రలూ, కూహకాలతో కేంద్రప్రభుత్వం మీద వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర పెత్తందార్ల నాయకుల కనుసన్నల్లో నడుస్తూ చేతననంతగా ప్రయత్నించినస్తున్నది. తిరిగి 2009 డిసంబర్ ను పునరావృతం చేయాలని శాయశక్తులా కుట్రలు పన్నుతున్నది. అందుకే తెలంగాణ రచయితల మీద బాధ్యత నాలుగు రెట్లవుతున్నది.

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఒకటి: గతంలో లాగే (వీలయితే ఇంకా ఉధృతంగా) తెలంగాణ అస్తిత్వం నిలుపుకునే సాహిత్యం సృష్టిస్తూ పోవడం,

రెండు: వచ్చిన తెలంగాణ యేదో ఒక రాజకీయ పార్టీ అనుగ్రహిస్తేనో, దయాదాక్షిణ్యాల భిక్షలాగానో రాలేదని అది తెలంగాణ ప్రజా ఉద్యమాల వల్ల, ఆత్మ బలిదానాల వల్ల వచ్చిందనీ స్పష్టంగా గుర్తెరిగి దానిని కాపాడుకునే దిశగా ఉద్యమ సాహిత్య సృష్టి చేయడం,

మూడు: జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం స్పష్టంగా సీమాంధ్ర పెత్తందార్ల , దొపిడీ దార్ల నాయకత్వంలో వారి ప్రయోజనాలకోసం సాగుతున్న ఉద్యమమనీ దానికి నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు యెంతమాత్రమూ పట్టవనీ (నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే ప్రధానమై ఉంటే శ్రీకాకుళం నుండి అనంతపూర్ దాకా ప్రజలని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలమీద ఉద్యమం జరిగి ఉండేది) కేవల హైదరాబాదుని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న  రాజకీయార్థిక శక్తుల ప్రయోజనాలే ముఖ్యమనీ  యెలుగెత్తి చాటాలి.

నాలుగోదీ ముఖ్యమైనదీ – ఇప్పుడు పెత్తందార్ల కనుసన్నల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కుట్రపూరితంగా  తెలంగాణా ప్రజలకూ, సీమాంధ్ర ప్రజలకూ మధ్య సృష్టిస్తున్న తీవ్రమైన వైషమ్యాలనూ, వైమనస్యాలనూ రూపుమాపేందుకు, తిరిగి సామాన్య తెలుగు ప్రజల మధ్య స్నేహపూరిత సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేందుకు పూనుకోవాలి. ఈ పని రచయితలే చేయగలరు.

బాధ్యత సీమాంధ్ర రచయితలమీదా ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించాల్సింది తెలంగాణ రచయితలే! యిరు ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఒకరి హక్కులను ఒకరు, ఒకరి స్వేచ్చను యింకొకరు, ఒకరి వాటాను యింకొకరు, ఒకరి అభివృధ్ధిని యింకొకరు, ఒకరికొకరు భంగం కలుగకుండా గౌరవించుకుని facilitate చేసుకుని, పంచుకునే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పే అత్యవసర కర్తవ్యానికి  తెలంగాణ రచయితలు పూనుకోవాలి. ఈ పని యిరు ప్రాంతాల రాజకీయ పార్టీలు వాటి నాయకులూ చెయ్యరు – అందుచేత దీనికి తెలంగాణ రచయితలే పూనుకోవాలి! అప్రజాస్వామిక వలస  పాలకులనీ, అన్ని రంగాల్లో  వారి అంతర్వలసీకరణ ఆధిపత్య ఆజమాయిషీ కుట్రలనీ యెట్లా ఐతే వ్యతిరేకించి తిప్పికొట్టడానికి పదునైన సాహిత్యాయుధాలని సృష్టించారో, అట్లే యిరుప్రాంతాల ప్రజలు విడిపోయి సఖ్యంగా ఉండేందుకు, విభజన సృష్టించే అభద్రతలను పోగొట్టేందుకు, విభజన తర్వాత పంపకాలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు, యిరుప్రాంతాల ప్రజల్లో ఉన్న ప్రజాస్వామిక సంస్కృతినీ , ఆకాంక్షలను కలిసికట్టుగా నిలబెట్టేందుకు తెలంగాణ రచయితలు పెద్ద యెత్తున పూనుకోవాలి – నాయకత్వం వహించాలి! యీ క్రమంలో సీమాంధ్ర ప్రాంతపు రచయితలను ప్రజాస్వామ్యయుతంగా కలుపుకుని పోవాలి. విడిపోయి కలసి ఉండే ఒక సాంస్కృతిక వారధి నిర్మించాలి.

అంతే కాదు – విభజన జరింగితర్వాత జరిగే సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణానికి అవసరమయ్యే ఒక్కొక యిటుకరాయినీ యిప్పట్నుంచే సమకూర్చుకోవడమూ ప్రారంబించాలి! అందు కోసము అవసరమైన భవిష్యత్తు దృష్టినీ , నిర్మాణాత్మకమైన దృక్కోణాన్నీ దృక్పథాన్నీ అభివృద్ధి చేయాలి. అంటే యిప్పటిదాకా చేస్తూ వచ్చిన వినిర్మాణాన్ని కొనసాగిస్తునే కొత్తని ప్రయత్న పూర్వకంగా నిర్మించే చారిత్రిక దృష్టిని సమిష్టిగా యేర్పర్చుకోవాలి.

– నారాయణస్వామి వెంకట యోగి

index

———————————————————————-

తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని?

ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రశ్నని ఎలా స్వీకరించాలన్నదే మొదటి సవాలు –

‘తెలంగాణా ప్రజల స్వప్నం’ సాకారమవుతోన్న వేళ ‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ అన్నదే అడిగిన వారి ఉద్దేశ్యమైతే నేనందుకు సిద్ధంగా లేను –

ఇంకా సవాలక్ష సందేహాలున్నాయి …

గతానుభవాలు మిగిల్చిన నమ్మక ద్రోహపు గాయాల సాక్షిగా, తెలంగాణా రాష్ట్ర సాకారం కల ‘ సంపూర్ణంగా’ నిజమైతే తప్ప, తెలంగాణా ప్రజలెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు-

ప్రజాకవి కాళోజీ మాటల్లోనే చెప్పాలంటే- “ప్రజలూ – నేనూ కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాశులైన పాలకులకు చెబుతున్నాను”

కాబట్టి, తెలంగాణా రాష్ట్ర కల ఇంకా సాకారం కాలేదు కాబట్టి, తెలంగాణా కవులు తెలంగాణా ని తర  తరాలుగా  ఎలా గానం చేస్తూ వొస్తున్నారో ఆ పనిని ఇక ముందూ కొనసాగిస్తారు …

ఆ మాటకొస్తే, తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని? ….

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట కాలంలో ప్రజల చేతిలో శక్తివంతమైన గేయాలనీ/కవితలనీ పెట్టి వాళ్ళని సాయుధులని చేసి, తాము కూడా స్వయంగా ఆ పోరాటం లోకి దిగిన కాళోజీ, సుద్దాల హనుమంతు లాంటి కవులు ఎందరో ?

అనంతర కాలంలో తెలంగాణా భారత దేశం లో విలీనమైన తరువాత కూడా భూస్వాముల/దొరల ఆగడాలను ప్రతిఘటిస్తూ సాగిన అద్భుత ప్రజా ఉద్యమాలనూ, ఆ ఉద్యమాలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వాలు తెలంగాణా పల్లెలని రణభూములుగా, మరుభూములుగా మార్చి వేసినపుడు కూడా చెరబండరాజు, వరవర రావు, జ్వాలాముఖి, సిద్దారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, దర్భశయనం లాంటి కవులు గొప్ప కవిత్వాన్ని సృజించారు.

ఇక గద్దర్, గోరటి వెంకన్న లాంటి తెలంగాణా  ప్రజా వాగ్గేయకారుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? …. బహుశా, తెలంగాణా ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచిన గత చరిత్ర వల్లనే అనుకుంటాను, మలి  దశ తెలంగాణా ఉద్యమంలో ‘పాట’ తరువాత,  తెలంగాణా కవిత్వమే ముందు వరుసలో నిలబడి ఉద్యమానికి బాసటగా నిలిచింది-

కాబట్టి, ఇంకా తెలంగాణా కల సాకారం కాలేదు గనుక, తెలంగాణా కవులు ఇప్పటిదాకా తాము పోషిస్తూ వొచ్చిన పాత్రనే మరింత శక్తివంతంగా పోషిస్తారు. ‘పోషించాలి’ అనే మాట ఎందుకు వాడడం లేదంటే, తెలంగాణా కవులు ఇప్పటి దాకా పోషించిన పాత్రని ఎవరో ఆదేశిస్తేనో / సలహా యిస్తేనో పోషించలేదు. తిరిగి కాళోజీ మాటనే తీసుకుంటే, తెలంగాణా కవి తన ప్రజా సమూహపు గొంతునే వినిపించాడు ఏ కాలంలోనైనా!

‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ … అనే ప్రశ్నని మరో విధంగా స్వీకరిస్తే … అంటే, ఒక వేళ తెలంగాణా కన్న కల సంపూర్ణంగా సాకారమైతే ….. అప్పుడు తెలంగాణా కవులేం చేయాలి?

ఒక్క కవులు మాత్రమే అని ఏముంది? …. ఆలోచనా పరులైన పౌరులు ఎవరైనా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఏ అన్యాయాలని సరిదిద్ద వలసి వున్నదని తెలంగాణా ఉద్యమించిందో ఆ దిద్దుబాట్ల ప్రక్రియ నిజాయితీగా జరుగుతున్నదీ, లేనిదీ జాగరూకతతో గమనించాలి. సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యతతో మెలిగే పౌరులకు కవిత్వ కళ కూడా వుంటే, సమాజంలోని అసమానతలని  చూస్తూ ఏమీ ఎరగనట్లు సాక్షీ భూతులుగా పడి వుండ  లేరు … రేపటి తెలంగాణా లో కవులు అసలు ఉండలేరు.

బహుశా, ప్రజాకవి కాళోజీ లా “దోపిడి చేసే ప్రాంతేతరులను /దూరంగా తన్ని తరుముదాం /ప్రాంతం వారే దోపిడి చేస్తే /ప్రాణాలతో పాతరేస్తం ” అని మరొక యుద్ధ దుందుభి మోగిస్తారు!

అయితే, కవిత్వం ఒక కళ … కవులెవరైనా పనిగట్టుకుని, అది తెలంగాణ కోసమైనా, మరొక దాని కోసమైనా, కవిత్వం రాస్తే అది మిగలదు. ప్రజల ఉద్యమాలతో, వాళ్ళ సమస్యలతో మమేకం అయిన వాళ్ళు  స్పందించకుండా ఉండలేరు  … కవిత్వం చేయగల శక్తి వున్న  వారు ఆ వేదనని కవిత్వ రూపంలో వ్యక్తం చేస్తారు … అంతే  తేడా!

తెలంగాణా ఏర్పడిన తరువాత కవులు/రచయితలు చేయవలసిన పని, మిగతా వాటి సంగతి ఎలా వున్నా, ఒకటి మాత్రం వుంది అనిపిస్తుంది. కారణాలేమైనా, కారకులెవరైనా ప్రస్తుతం తెలుగు మాట్లాడే ప్రజల మధ్య ఒక భయానక అమానవీయ వాతావరణం కమ్ముకుని వుంది. బహుశా, కాలక్రమంలో ఒక మానవీయ వాతావరణాన్ని సృష్టించేందుకు ముందుగా తెలంగాణా కవులు చొరవ తీసుకోవలసి వుంది-

తెలంగాణా ఏర్పడినా, ఏర్పడక పోయినా ఎపుడేమి చేయాలన్న సంగతి తెలంగాణా కవులకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదనే అనుకుంటున్నాను …

ఎందుకంటే, “పరిస్థితులేట్లా వున్నాయని కాదు …. పరిస్థితులలో మనమెట్లా ఉన్నామని?” అన్న కాళోజీ లాంటి తెలంగాణా వైతాళికుల మాట ఒకటి వారికి ఎప్పుడూ దారి చూపిస్తుంది –

 

కోడూరి విజయకుమార్ 

హైదరాబాద్ – 17 సెప్టెంబర్ 2013

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

————————————————————————————

సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి

ఆరుపదుల పైబడిన ఉద్యమంలో ఈ  ప్రత్యేకరాష్ట్రకల సాకారమవడానికి ఇప్పుడు అతిదగ్గరలో ఉంది తెలంగాణా. ఈ కాలంలోనే రాష్ట్ర సాధన చివరిపేజీలోనించే ఓ భవిష్యత్ దర్శనం కావాలి. నిజానికి గత దశాబ్దిని “తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన దశ”గా అభివర్ణించుకోవలసిన అవసరం ఉంది.

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయం,జీవితం సమైక్య రాష్ట్రంలో నిరాదరణకి , అణచివేతకి గురయ్యాక ఉద్యమంతో సాధించుకున్న ఫలాలు నిండుగ కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే తెలంగాణా కవులు,కళాకారులు,మేథావులు భాష పట్ల ఈకాలంలో ఎక్కువ శ్రద్దని కనబరిచారు.ఇది పొక్కిలి,మత్తడి మొదలైన సంకలనాలతో పాటు మునుం వరకు కూడా కవిత్వంలో ఒక ప్రధాన పరికరంగా జీవధారలా సాగుతుంది.

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఈ కాలాన్నించి గతకాలపు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తరానికి గతాన్ని ఎలా అందించాలనేది ఇప్పుడాలోచించ వలసిన సమయం. తెలంగాణా సాహిత్యం ,చరిత్ర,భాష  రేపటి తరానికి అందడానికి ఏంచేయాలనేది ఇప్పుడాలోచించ వలసిన అంశం.

అందుకోసం రూపొందించవలసిన ప్రధాన అవసరాలు భాషాచరిత్ర,సాహిత్య చరిత్ర,నిఘంటువు.తెలుగులోనే అధికశాతం నిఘంటువులు సాహిత్యనిఘంటువులే.ప్రజా సమూహంలో ఉన్నభాషని నిఘంటువు రూపంలోకి తేవాలి. గతంలో వచ్చిన  నలిమెల భాస్కర్-“తెలంగాణా పదకోశం”, రవ్వా శ్రీహరి “నల్ల గొండ జిల్లా ప్రజల భాష”కొంత మేరకు ఈ అవసరాన్ని తీరుస్తాయి.కాని ఇది ఇంకా విస్తృత రూపంలో రావాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణా భాషకుండే ప్రత్యేక లక్షణాలను బట్టి సాహిత్య , ఔపయోగిక,మౌఖిక,జాన పద ధోరణులనుండి , కళలనుండి వర్ణం , పదం, వాక్యం మొదలైన స్థాయిల్లో భాషనిర్మాణాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.ఇందుకోసం ఒక భాషా చరిత్ర కావాలి.

సుమారు ఆరువందల సంవత్సరాలు సుల్తానుల పరిపాలనలో ఉన్నా, రాజ భాష మరొకటైనా అవసరాల మేరకు ఆ పదజాలాన్ని తనలో సంలీనం చేసుకుంది కాని తన ఉనికిని కోల్పోలేదు.దేశీ మాధ్యమంగా ఉండటం వల్ల ద్రవిడ జాతుల ప్రభావమూ ఎక్కువే.ఆయా మార్గాలనించి భాషని విశ్లేషించు కోవల్సిన అవసరం ఉంది.

తెలంగాణాలో జానపద,మౌఖిక  సాహిత్యంతో పాటు లిఖిత సాహిత్యం అధికమే. వీటన్నిటినీ బయటికి తేవడమే కాక అన్ని ప్రక్రియలను సమగ్రంగా చిత్రించ గల, అన్ని వాదాలను సమూలంగా నిర్వచించ గల”సాహిత్య చరిత్రను “అందించ గలగాలి.ఈ క్రమంలో తొలిదశలో తెలంగాణ రచయితల వేదిక తీసుకొచ్చిన కథా సంకలనం గాని, ఆతరువాత వచ్చిన “నూరు తెలంగాణా కథలు”గాని గమనించ దగినవి. ఈ మార్గంలోనే  సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి.

తెలంగణ లోని సాహిత్య మూర్తుల జీవితాలను రానున్న తరాలకు అందించేందుకు వారి ఆదర్శ జీవితాలను చిత్రించాల్సిన అవసరముంది.చరిత్ర రచన రచయితల బాధ్యత కాకపోయినా  గతంలో వచ్చిన ఒకే ఒక తెలంగాణా చరిత్ర (సుంకి రెడ్ది నారాయణ రెడ్డి)రచయితలందించిందే.ఈ అవసరం దృష్ట్యా మరింత లోతైన పరిశీలనలు జరగాలి. మతాలకతీతంగా జరిగే పండగల గురించి ,సంస్కృతి సంప్రదాయాల గురించి అందించ గలగాలి.

ఈ క్రమంలో రచయితలు గతానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందనేది సత్యమే అయినా కాపాడుకొని, సాధించుకున్న దానిని తరువాతి తరాలకు అందించ వలసిన అవసరమూ ఉంది.

              -ఎం.నారాయణ శర్మ

 

చలం వారసత్వం నిజంగా అందుకున్నామా ?

chalam
చలం కేవలం రచయిత కాదు. ఒక సాహితీ విప్లవం. ఒక సామాజిక ఉద్యమం.
నిర్ధిష్టమైన prescribed విలువల్లో కుంచించుకుపోతున్న మానవతలోని ప్రేమతత్వాన్ని, సత్యశోధనని తన రచనలతో ఉద్దీపనం చేసిన ఋషి. ప్రపంచ సాహిత్యంలోని నవీనపోకడలతో ధీటుగా తెలుగు రచనల్ని చేసి, తెలుగువారికి కాకుండా పోయిన ఒక తపస్వి.
మనమే ఒప్పుకోలేని మనలోని నిజాల్ని మనకు పరిచయం చేసిన చలాన్ని అర్థంచేసుకుంటే మనలోని వికారాల్ని, మకిలిని మనం అంగీకరించాలనే భయంతో కావొచ్చు, అతన్నే కాదన్నాం. ఎన్నో సంవత్సరాల విమర్శలు, వ్యక్తిగత ధూషణలు,అభాండాల మధ్యన చలం ఇంకా తన రచనలతో ఒక్కోతరాన్నీ కుదుపుతూనే ఉన్నాడు. సమాజానికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు.
చలం తరువాత ఎందరో రచయితలు వచ్చారు. ఎన్నో వాదాలు పుట్టాయి. సమాజంలో ఎంతో మార్పు జరిగిందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పటికీ చలం పేరు ఒక వివాదమే. ఇప్పటికీ చలం వేడివేడి చర్చలకు మూలమే. ఈ పరిణామాల దృష్ట్యా చలం సమకాలీన సమాజానికి రిలవెంట్ అనడంలో సందేహం లేకపోయినా, “చలం ప్రస్తుతం ఎంత రిలవెంట్?” అనే ప్రశ్న ఖచ్చితంగా అవసరం. దానికి సమాధానం కావాలి.
రెండోది చలం వారసత్వం గురించి. పాఠకులుగా, వ్యక్తులుగా చలం వారసత్వాన్ని ప్రతితరంలోనూ కొందరు అందిపుచ్చుకుని చదువుతూ, అనుభవిస్తూ,ప్రశ్నిస్తూ, పోరాడుతూనే ఉన్నారు. తెలుగు సమాజం మాత్రం ఇంకా చలాన్ని ఎలా ఓన్ చేసుకోవాలో తెలీని తికమకలోనే ఉంది.
నిజానికి ముఖ్యమైన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది. చలం తత్వాన్ని, దార్శనికతని,సత్యాన్వేషణని, శోధనని, శైలిని, శిల్పాన్ని, విషయాల్ని కొనసాగించిన రచయితలు ఎవరైనా ఉన్నారా అనేది. నిన్న వడ్డెరచండీదాస్, ఈరోజు కాశీభట్ల వేణుగోపాల్ వంటివారు ఏదో ఒక రూపంలో కొంత చలాన్ని తలపించినా, చలం వారసత్వాన్ని ఆపాదించేంత విశాలత్వం రచనలద్వారా, వ్యక్తిత్వాల ద్వారా వెలిబుచ్చారా అనేది ప్రశ్నార్థకమే.
అందుకే, ఒక సమాజంగా తెలుగు వారు చలం వారసత్వాన్ని అందుకున్నారా? తెలుగు రచయితల్లో చలం వారసత్వాన్ని కొనసాగిస్తున్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. సమాధానాలు ఉన్నాయో లేవో తెలీని ప్రశ్నలు. చర్చకు నాందిగా మాత్రం ఖచ్చితంగా పనికొచ్చే ప్రశ్నలు.
తాంబూలాలు ఇచ్చేశాం….ఇక మీదే ఆలస్యం….

ఏది ప్రధానస్రవంతి సాహిత్యం?

‘2012 ప్రాతినిధ్య కథ’  సంపాదకులు అస్తిత్వవాద సాహిత్యం గురించి, ఈ సంకలనం తీసుకురావడానికిగల ఆదర్శాలను చెబుతూ “బలమైన ఈ గొంతుకలకు స్పేస్ కల్పించడము, ప్రధాన స్రవంతి సమాజంలోకి ప్రమోట్ చెయ్యడము” ప్రాతినిధ్యకథల ఎంపికలో ప్రాతిపదికగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. పుస్తకావిష్కరణలో ఆవిష్కర్త ‘అంటరాని వసంత’ నవలా రచయిత జి.కళ్యాణరావు గారు దీంతో విభేదిస్తూ “ఏది ప్రధాన స్రవంతి సాహిత్యం?” అనే ఫండమెంటల్ ప్రశ్నను లేవనెత్తారు.

మైనారిటీ ప్రజల సాహిత్యాన్ని హెజిమోనిక్ తంత్రాలద్వారా ప్రధానస్రవంతి అని తరాలుగా నమ్మించిన ఐడియాలజీని దళితులు, మైనారిటీలు, ప్రాతీయవాదులు, బహుజనులు, స్త్రీలు అంగీకరించనఖ్ఖరలేదని. నిజానికి ప్రధానస్రవంతి ప్రాతినిధ్యం కోసం పోరాడుతున్న విభిన్నమైన, వైవిధ్యమైన అస్తిత్వసాహిత్యాలదే అటూ వివరణ ఇచ్చారు కూడా. కొంత ఆలోచించాల్సిన విషయం ఇది.

మరో వైపు చూసుకుంటే, సాహిత్యాన్ని సాహిత్యంలా చూడకుండా ప్రాంతీయ తత్వం, జెండర్ వాదాలూ, కులం రంగులూ, మతం ఐడెంటిటీలు కలగలిపి కుంచించుకుపోయేలా చేశారు. అనేది మరో వాదన.

ఈ సందర్భంలో మన ముందు ఉన్న ప్రశ్న ఏది ప్రధాన స్రవంతి సాహిత్యం? అస్తిత్వవాద సాహిత్యమా? మైనారిటీ సాహిత్యమా?