ప్రతి నాటకం ఓ సెన్సేషనే!

  డాక్టర్  వాణి  దేవులపల్లి

IMG_0978భారత ఆధునిక నాటక రంగం అనగానే మనకు మొట్ట మొదటగా గుర్తొచ్చే పేరు మరాఠీ నాటక రంగ దిగ్గజం విజయ్ టెండూల్కర్ !  మరాఠీ  నాటక రంగాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేసిన టెండూల్కర్ 1960 వ దశకంలో పేలవంగా, నిర్జీవంగా ఉన్న మరాఠీ థియేటర్ కు ఊపిరులూది నూతన జవసత్వా లందించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి  అయిన టెండూల్కర్ నాటక రంగంలోనే కాక,  తన ప్రతిభను వివిధ రంగాల్లో చాటాడు. సినీ, టెలివిజన్, స్క్రీన్ ప్లే  రచయితగా, నవలా రచయితగా, సాహితీ వ్యాస కర్తగా , రాజకీయ జర్నలిస్టుగా,   గొప్ప వక్తగా, వ్యాఖ్యాతగా  పేరు  గాంచాడు.  టెండూల్కర్ తన మాతృ భాష మరాఠీ లో రాసిన అనేక నాటకాలు ఆంగ్లం లోకి  అనువదింపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆధునిక భారతీయ ఆంగ్ల సాహిత్యం లోనూ తనకంటూ ఓ స్థానం సుస్థిర పరచుకున్నాడు  టెండూల్కర్. 

అతడు రాసిన నాటకాలు చాలా వరకు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్నవే !  నాటకాలు రచించడం పై అమెరికా విశ్వవిద్యాలయ విద్యార్థులకు పాఠాలను భోధించి,  అధ్యాపకుడుగా కూడా అవతారమెత్తిన   టెండూల్కర్ దాదాపు యాభై ఏళ్ళు పైగా భారతీయ నాటక రంగాన్ని ఏలడమే  గాక,  మరాఠీ నాటక  రంగంలో  ఓ సంచలనాత్మక శక్తిగా భారతీయ నాటక రంగానికి ఓ గొప్ప ప్రేరణ గా నిలిచిపోయాడు.

విజయ్ టెండూల్కర్ జనవరి 8, 1928  వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో, బాలవాలీకర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.  అతడి తండ్రి ఓ చిన్న ప్రచురణ సంస్థను నడిపేవాడు. ఆ విధంగా ఇంట్లో ఉన్న సాహితీ వాతావరణం సహజంగానే తెలివైన టెండూల్కర్ కు రచనా రంగం పై మక్కువ పెంచుకోవడానికి దోహద పడింది. తన ఆరేళ్ళ వయసు లోనే ఓ కథ రాసాడంటే ఆ వాతావరణం చిన్ని టెండూల్కర్ పై ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసికోవచ్చు.

ముఖ్యంగా, పాశ్చాత్య నాటకాలను ఎక్కువగా వీక్షించడం కూడా అతను నాటక రంగం పై ఇష్టాన్ని పెంచుకోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్ధర్ మిల్లర్ అమెరికా సమాజం లోని మధ్య తరగతి ప్రజల జీవన విధానాన్ని చిత్రీకరించిన తీరు, ఆ ప్రభావం టెండూల్కర్  రచనల్లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవన చిత్రణ ఆవిష్కరించిన తీరులో ప్రస్పుటంగా కనిపిస్తుంది.  పదునాలుగేళ్ళ వయస్సులో తన చదువును వదిలేసి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తన దేశభక్తిని చాటాడు. చదువుకు స్వస్తి పలికి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు  దూరంగా,  ఒంటరిగా ఉన్న టెండూల్కర్ కు ‘రచనా వ్యాసంగ’ మే లోకమైంది. మొదటగా, పత్రికలకు వ్యాసాలు రాయడం ద్వారా కెరీర్ ను ప్రారంభించిన టెండూల్కర్ తరువాత నాటక రంగం పై ఉన్న అభిమానంతో నాటక రచయితగా మారాడు.

తన కెరీర్ ఆరంభంలో టెండూల్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ముంబాయి లోని పూరి గుడిసెల్లో చాలీ చాలని అవసరాలతో జీవితాన్ని వెళ్ళదీసిన అతడు తాను చూసిన పట్టణాల్లోని మద్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవితాల స్పూర్తిగా వారి జీవన విధానాన్ని తన రచనల్లో ప్రతిబింబించాడు. టెండూల్కర్ తాను చూసిందే రాసాడు. తాను విన్న సంఘటనలనే  కథా వస్తువుగా మలచుకున్నాడు. మానవ నైజాన్ని నిక్కచ్చిగా, నిష్కర్షగా ఆవిష్కరించాడు. మానవ స్వభావం లోని హింసను, దాని అనేక రూపాలను తనదైన శైలిలో ఎత్తి చూపాడు. తద్వారా సామాజిక వాస్తవికతకు పెద్ద పీట వేసాడు టెండూల్కర్.

ఓ చోట ఇంటర్వ్యూ లో ఇలా అంటాడతను. “నేను సమాజం లో చూసిందే నా కథా వస్తువుగా మలచుకున్నాను. లేనిది ఊహించి రాయడం గానీ, కలల్లో విహరించి రాయడం గానీ నేను చేయలేదు. నేను ఓ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. అనేకసార్లు జీవితంలో చేదు నూ చవిచూసాను. నేను అనుభవించినదే నా రచనల్లో చిత్రించాను…….” సామాజిక వాస్తవికత పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది. టెండూల్కర్ లోని నిక్కచ్చి తనం, నిర్మొహమాటం, నిర్భీతి మనల్ని అబ్బురపరుస్తుంది. అతడు తన పదునాల్గవ ఏటనుండి నాటకాలు రాస్తున్నప్పటికీ,  1950 వ దశకం లో అతను రాసిన ‘శ్రీమంత్’ సంకుచితత్వంలో కొట్టు మిట్టాడుతున్న మరాఠీ    వీక్షకులను కదిలించింది. ఈ నాటక కథాంశాన్ని తీసుకుంటే పెళ్లి కాకుండానే తల్లయిన ఓ ఆగర్భ శ్రీమంతుడి  కూతురు సమాజ కట్టుబాట్ల కతీతంగా  బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. సహజంగానే, ఆమె తండ్రి దీనిని  వ్యతిరేకించి, ఈ విషయం బయటకు పొక్కకుండా తన డబ్బుతో కూతురికి భర్తను కొనాలని నిర్ణయిస్తాడు. ఈ విధంగా తన సామాజిక ప్రతిష్టకు భంగం కలగ కూడదని  అతని ఆశ. ఈ కథాంశం సమకాలీన  మరాఠీ నాటక రంగంలో  ఓ పెను తుఫాను సృష్టించింది.

టెండూల్కర్ రచనలు ఆధునిక మరాఠీ థియేటర్ ను తీవ్రంగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా, 1950 మరియు 1960 వ దశకం లో ‘రంగయాన్’ లాంటి నాటక సంస్థలు,  అందులోని సభ్యులు శ్రీరాం లాగు, మోహన్ అగాషి, సుభాష్ దేశ్ పాండే మొదలగు వారు టెండూల్కర్ నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో భాగంగా ఓ నూతన ఒరవడిని సృష్టించారు. అతని ప్రతి నాటకం ఓ సెన్సేషనే! సమాజం లోని కుళ్ళు, కుతంత్రం, కుత్సితత్వం, హింస, అవినీతి, అన్యాయాలకు టెండూల్కర్ రచనలు అద్దం పడతాయి.

1961 లో టెండూల్కర్ రాసిన  ‘ద వల్చర్స్ ‘ (The Vultures) కుటుంబ వ్యవస్థ లోని నైతిక విలువల పతనానికి పరాకాష్ట గా చెప్పుకోవచ్చు. కుటుంబ బంధాలు సైతం వ్యాపార బంధాలుగా మారుతున్న తీరు, ప్రబలే  హింసాత్మక ధోరణులు, ఏ విధంగా మానవ సంబంధాలు అడుగంతుతున్నాయో చెప్పిన తీరు నిజంగా విప్లవాత్మకమే! ఈ నాటకం సమకాలీన మధ్య తరగతి మరాఠీ ఆడియన్స్ కి మింగుడు పడ లేదు.ఎలాంటి హిపోక్రసి లేకుండా కుటుంబ హింస, అక్రమ సంబంధాలను టెండూల్కర్ దిగంబరంగా చూపించడం వారికి నచ్చలేదు. ఇక పోతే, ఫ్రెడ్ రిక్  డ్యురోన్ మాట్ ‘ట్రాప్ స్ ‘ (Traps) కథ ఆధారంగా రాసిన ‘సైలెన్స్ ! ద కోర్ట్ ఈజ్ ఇన్ సెషన్ ‘ (Silence! The Court is in Session) 1967 లో మొట్ట మొదటగా ప్రదర్శింప బడ్డప్పుడు నాటక రంగంలో టెండూల్కర్ పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. తదుపరి సత్యదేవ్ దూబే దాన్ని 1971 లో సినిమాగా మలచినప్పుడు టెండూల్కర్ స్క్రీన్ ప్లే రాసాడు. ఆ తర్వాత అతను రాసిన ‘సఖరాం ద బుక్ బైండ ర్ ‘ (Sakharam The Book Binder), కమల , (Kamala), ‘కన్యాదాన్ ‘ (Kanyaadaan) మరియు  ‘ఘాశీరాం  కొత్వాల్ ‘ (Ghashiram Kotwal);  ఈ ఒక్కో నాటకం సమకాలీన మధ్య తరగతి ప్రజల సమస్యలపై అతడు  సంధించిన ఒక్కో  ఫిరంగి  గుండు.  సామాజిక అసమానతలపై అతను పూరించిన శంఖా రావం.

‘సఖరాం ద బుక్ బైన్దర్ ‘ (Sakharam The Book Binder) కథాంశా న్నే తీసుకుంటే బుక్ బైందర్ గా పని చేసే సఖరాం అనే వ్యక్తి వివాహ జీవితంలో వైఫల్యం పొందిన స్త్రీలను ‘ఆదరిస్తున్న’ ముసుగులో చేరదీసి వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆసరాగా ఉన్న నెపంతో వారిని తన ఇంటి పనులు చేయడానికి మాత్రమే గాక భౌతిక అవసరాలు కూడా తీర్చుకునేందుకు ఉపయోగించుకునే తీరు అతని హిపోక్రసీని, కుటిలత్వాన్ని బట్టబయలు చేస్తుంది. ఆ తర్వాత అతని బంధం ఆ స్త్రీలతో తనకు ఇష్టమున్నంత కాలం కొనసాగుతుంది. తరువాత అతనికి వారిలో ఏ నచ్చని అంశం కనిపించినా బయటకు వెళ్ళ గొడతాడు. సఖరాం  చేరదీసిన లక్ష్మి, చంప ఇద్దరూ రెండు విభిన్న మనస్తత్వాలు. ఇద్దరూ వైవాహిక జీవితం లో ఓడిపోయిన వారే. లక్ష్మి పిల్లల్లేని కారణంగా భర్త నిరాదరణకు గురై వంచించ బడుతుంది. ఇకపోతే, చంప భర్త శాడిజాన్ని భరించలేక ఇంటి నుండి పారిపోయి వస్తుంది.

సఖరాం లక్ష్మి తో అన్న మాటల్లోనే అతని స్వభావం తెలుసుకోవచ్చు. ” నువ్వు ఎవ్వరి వైపు కన్నెత్తి చూడకూడదు. పల్లెత్తి మాటాడకూడదు. కొత్త వారి ముందు తలపై ముసుగు తీయకూడదు. నేను ఈ ఇంటి యజమానిని. ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం…. అంతే!……”  వైవాహిక బంధం పట్ల తనకు నమ్మకం లేదంటూనే వారిపట్ల కపట జాలిని, సహానుభూతిని చూపుతూనే తాను చేరదీసిన స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించడం టెండూల్కర్ అతని పాత్ర కిచ్చిన మరో కోణం.

ఈ నాటకం మరాఠి థియేటర్ లో ఒక రేవల్యుషన్  గా చెప్పుకుంటారు. టెండూల్కర్ రచనల్లోని మరో కోణం మానవీయ కోణం. స్రీలు మానవుల్లా చూడబడాలనే  ఆకాంక్ష అతడి రచనల్లో గోచరిస్తుంది. స్రీలు ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూడబడ టాన్ని, హింసకు బలి కావడాన్ని , అన్యాయానికి గురి కావడాన్ని అతని స్త్రీ పాత్రలు ప్రశ్నిస్తాయి; తిరగబడతాయి. అయితే ఆ పాత్రలు పరిస్థుతులకు తలొగ్గే విధానం మాత్రం విమర్శలకు లోనైంది. అతడి నాటకాలు ముగింపులో ఎలాంటి పరిష్కారాన్ని సూచించకపోవడం ఓ లోపం అంటారు విమర్శకులు. అయితేనేం, అతని స్త్రీ పాత్రలు అన్యాయాన్ని ప్రతిఘటించడం నేర్చుకుంటాయి. పోరాట పటిమను చాటుతాయి. బహుశా టెండూల్కర్ లోని ఈ దృక్కోణమే అతడు స్త్రీల పక్షపాతి అని ముద్ర పడడానికి దోహదం చేసిందేమో!

అతడి మరో నాటకం ‘కమల’ కూడా అశ్విన్ సరీన్ ‘ద ఇండియన్  ఎక్స్ ప్రెస్ ‘ కోసం నిజ జీవిత సంఘటన నేపథ్యంగా రాసిన కథనంతో ప్రేరేపింప బడి రాసిందే! ఎగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యంగా రాసిన ఈ నాటకం లో జైసింగ్ ఓ పేరున్న జర్నలిస్టు. అతని భార్య సరిత విధ్యాదికురాలు అయినప్పటికీ భర్త పురుషాధిక్యతను, నిరంకుశత్వాన్ని, హిపోక్రసీని మౌనంగా భరిస్తుంది. ఆ ఇంట్లో తన స్థానం కూడా  ఓ బానిస వంటిదనే విషయం జైసింగ్ మానవ సంతలో కొనుక్కొచ్చిన కమల అనే గిరిజన మహిళ ” సార్ నిన్నెంతకు కొన్నాడ మ్మా ?” అని ప్రశ్నించే వరకు సరిత గుర్తించదు. జైసింగ్ పేరుకు ఓ పేరున్న జర్నలిస్టు అయినప్పటికీ అతనిలో ఆదర్శ భావాలు, సమభావాలు మచ్చుకైనా కానరావు. పైగా, తన పేరు కోసం, ప్రమోషన్ కోసం చిరిగిన దుస్తుల్లోనే యధాతధంగా కమలను మీడియా ముందు ప్రవేశ పెట్టాలనుకోవడం జైసింగ్ అమానవీయ కోణాన్ని, మీడియా లోని ఎల్లో జర్నలిజాన్ని, హిపోక్రసీని ప్రతిబింబిస్తుంది.

ప్రచారాలను, పై పై మెరుగుల  సంస్కరణలను మాత్రమే  ప్రతిబింబించే నాటకాలకు  పరిమితమైన సమకాలీన మరాఠి థియేటర్ ను టెండూల్కర్ తన సామాజిక పరిశీలనా పటిమతో మరో కొత్త లోకంగా ఆవిష్కరించాడు. నిజాల నిగ్గు తేల్చి, మనిషి అసలు నైజాన్ని, వివిధ సందర్భాల్లో అతని ప్రవర్తనను, హింసా ప్రవృత్తిని, హిపోక్రసీని బట్టబయలు చేసాడు. సామాజిక అసమానతల పై అలుపెరుగని సైనికుడిలా పోరాటం చేసే వైనం అతని సమకాలీనులైన మోహన్ రాకేశ్, బాదల్ సర్కార్, గిరీష్ కర్నార్డ్ ల నుండి అతణ్ణి విభిన్నంగా, విలక్షణంగా, ప్రత్యేకంగా నిలబెడుతుంది.

టెండూల్కర్ తన రచనల్లో మానవ ప్రవర్తనకు, మానవ సంబంధాలకు, విలువలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అతని కథా వస్తువు మనిషి- అతని చుట్టూరా ఉన్న ప్రపంచం. అతని రచనల్లో కుటుంబ ప్రాధాన్యాన్ని కూడా ఎక్కువగా  చూస్తుంటాము. ప్రేమానుబందాలతో అల్లుకున్న చక్కటి కుటుంబాలు, చక్కని సమాజానికి దోహదం చేస్తాయని అతని నమ్మకం. అందుకే, ‘కమల’ నాటకం లో విధ్యాదికురాలైన సరిత, భర్త పురుషాహంకారాన్ని, అమానవీయ ప్రవర్తనను, అణచివేత ధోరణిని, బానిస ప్రవృత్తిని భరించలేక , అతణ్ణి విడిచి వెళ్లి పోవాలని నిర్ణయం తీసుకున్నా, భర్త  ఉద్యోగం కోల్పోయి దిక్కుతోచక బాధలో కోట్టుమిట్టాడుతున్నప్పుడు అన్నీ మరిచిపోయి, తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తుంది ; ఆ క్లిష్ట సమయం లో అతనికి బాసటగా నిలవాలనుకుంటుంది. అంతేనా, భవిష్యత్ లో అతన్నెలాగైనా  మార్చుకుంటాననే ధీమాను, ఆశను వ్యక్తపరుస్తుంది.

విమర్శకులు టెండూల్కర్ ను పెసిమిస్ట్ గా ముద్ర వేసినప్పటికీ చాలా సందర్భాల్లో అతని నాటకాల్లో ఆప్టిమిజం ‘అండర్ కరెంట్ ‘ గా ప్రవహించి, ఆదర్శవంతమైన సమ సమాజ స్థాపనకు అర్రులు చాస్తున్నట్టు అనిపిస్తుంది. బలమైన కథా వస్తువులతో ప్రజల హృదయాల్ని బలంగా తాకిన అతని నాటకాలు మొత్తంగా మరాఠీ నాటక సమాజాన్నే ఓ కుదుపు కుదిపి ఓ సమున్నత మార్పుకు దారి తీసాయి. టెండూల్కర్ సంచలనాత్మక నాటకాలు నాటక ప్రపంచంలో అతణ్ణి ఓ డైనమిక్ నాటక రచయితగా నిలబెట్టి, అవార్డులు, రివార్డులివ్వడం మాత్రమే కాదు; సమాజం లోని కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను, అవమానాలనూ, ఓ దశలో అయితే చెప్పు దెబ్బలనూ మిగిల్చింది. అయితే రెంటినీ సమదృష్టితో చూడగలిగిన అతని ‘స్థితప్రజ్ఞత’ మనల్ని విచలితుల్ని చేస్తుంది. తన వ్యక్తిగత జీవితం లోనూ అనేక ఒడిదుడుకుల నెదుర్కున్న టెండూల్కర్  2008, మే 19 న  ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు.

నాటక రచయితగా, ముఖ్యంగా,   ‘మనీషి’ గా అతని కీర్తి కేవలం మరాఠి థియేటర్ కో, ఇండియన్ థియేటర్ కో మాత్రమే పరిమితం కాలేదు; ప్రపంచ నాటక రంగం లో విజయ్ టెండూల్కర్ ఓ కలికితురాయి.

*

జాయపసేనాని

OLYMPUS DIGITAL CAMERA

దృశ్యం  : 3

(క్రీ.శ. 1225 జాయప వయస్సు 36 సంవత్సరములు. గుర్రపు డెక్కల, సైన్యసందోహధ్వని..వేయిస్థంబాల దేవాలయంలోకి గణపతిదేవుడు, జాయపనేనాని, గుండనామాత్యులు, రాజనర్తకి మాళవికాదేవి..ప్రవేశం…గర్భగుడిలోని రుద్రేశ్వరాలయంలో శివస్తుతితో కూడిన  మంత్రోచ్ఛారణ…మంగళకర ధ్వని…)

వందిమాగధులు :    జయహో…విజయహో..రాజాధిరాజా…రాజమార్తాండ…సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య…కాకతి రాజ్యభార దౌరేయ శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి…జయహో…విజయహో…

ఆలయ ప్రధాన అర్చకులు : స్వాగతము… మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుం గారికి స్వాగతం..సుస్వాగతం.

గ.ప.దే : రుద్రాలయ ప్రధాన అర్చకులుగారికి అభివాదములు..ఖడ్గాన్ని ధరించిన హస్తంతోనే నాట్యాభినయం చేసి కత్తినీ, కలాన్నీ ఒకే చేత్తో సమర్థవంతంగా ప్రయోగించి ఖ్యాతివంతుడు కావడం మన సేనానీ, గజసైన్య సాహిణి, నాట్యకోవిదుడు, వీరాగ్రేసరుడు, అరివీర భయంకరుడైన జాయపసేనానికే సాధ్యమైనది. వారు గత నాల్గు వత్సరములుగా సృజించిన కావ్యశాస్త్రము…’గీత రత్నావళి’ మహాగ్రంథము ఈనాటికి సంపూర్ణమైనది. దీనిని శివసాన్నిధ్యంలో పరమేశ్వరునికి అంకితమొనర్చుటకై మా రాక..తగువిధముగా ఆ గ్రంథసమర్చనకు ఏర్పాటు చేయండి. జాయనా..పట్టు వస్త్రములో ఒదిగిన ఆ ‘గీత రత్నావళి’ గ్రంథమును దైవసన్నిధిలో సమర్పించి ప్రజాపరం చేయండి..

జాయన : ఆజ్ఞ మహాప్రభూ…గణపతి దేవులుంగారి శుభాశీస్సులతో రూపుదిద్దుకున్న ఈ ‘గీత రత్నావళి’ గ్రంథ సృజనకు కారకులు, పోషకులు, ప్రేరకులు అన్నియును మహాప్రభువులే. వారికి కృతజ్ఞతాభివందన చందనములు అర్పించుకుంటూ..,

ప్ర.అ.: (గ్రంథమును పట్టుబట్టతో సహా అందుకుంటూ…) మహాప్రసాదం…ఈ అక్షరామృత నిధిని శివ కృపార్థం సమర్పించే మహాభాగ్యం మాకు లభించడం మా సుకృతం..ఓం రుద్రాయ…(రుద్రస్తుతి ప్రారంభం..ఆలయం గంటలు…అభిషేకం..సంరంభం… శంఖధ్వని..)

గ.దే : జాయనా…మాపెద్ద తండ్రిగారైన రుద్రదేవుడు 1162 ప్రాంతంలో కాకతీయ స్వతంత్ర సామ్రాజ్యమును ప్రకటించిన సందర్భంలో కట్టించిన త్రికూటాలయమే ఈ సహస్ర స్తంభాలయం. ఇక్కడ రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు కొలువై ఉన్నారు. విష్ణు ఆలయమునకు అద్భుతంగా అదిగో అక్కడే ఉత్తరాభిముఖముగా ఆసీనుడై ఉన్న నంది ”విష్ణునంది”. సర్వాంగ స్వర్ణాభరణ శోభితమై బలిష్టుడైన బసవేశ్వరుడు పొంగివచ్చిన రక్తనాళాలతో సహా సజీవ మహాసౌందర్యంతో మనను ఎప్పడూ పిలుస్తూంటాడు. నంది వెనుక ఉన్నది రంగ మండపము. నందీశ్వరుని అవతారమైన వీరభద్రునికి ప్రతీకగా, రుద్రుడు మన ఇలవేల్పుగా సిద్ధపరుస్తూ ఈ సహస్ర స్తంభాలయములో చెక్కిన ప్రతి శిల్పం మన సమకాలికులైన చాళుక్యుల, హొయసళుల శిల్పరీతులకు భిన్నమై ఉత్తమోత్తమమై , ఉన్నత  ప్రమా ణములతో విరాజిల్లుతున్నది.

గుండనా : సృజనకారులెవరైనా ఎప్పుడూ తన కృతిచేత, విలక్షణ శైలిచేత ప్రత్యేకంగా పరిగణించబడాలి. కాకతీయుల శిల్పం, నృత్యం, గీతం, వాద్యం…అన్నీ విశిష్టమైనవే. కాకతీయ శిల్పంలోని ప్రధాన లక్షణం గతి శీలత. ఇందులోని ప్రతి మూర్తీ ప్రాణ లయతో ప్రకంపిస్తున్నట్టు గోచరిస్తుంది. (అప్పుడే..రుద్రాభిషేకంతో పాటు…ఉచ్చైస్వరంలో పంచమహావాద్యాలు హోరెత్తాయి). మన ప్రత్యేకత..పంచ మహాశబ్దాలు…అవి అనంత విజయం, పౌండ్రము, దేవ దత్తం, సుఘోష, మణి పుష్పకం…మరియు పంచమహావాద్యాలు అవి శృంగము, శంఖము, మృదంగము, భేరి మరియు ఘనము. ఇవిగాక నిస్సహణము, కాంస్య తాళములు, కాహళము, మహామద్దెల…యివన్నీ శబ్ద గంభీరతను తురీయ స్థాయికి చేర్చి రుద్ర  తాండవ రౌద్రతను హెచ్చింపచేస్తాయి. కాకతీయ జీవనం ప్రధానంగా వీర రసభరిత, శౌర్య సమ్మిళితం.

మాళవిక : కాకతీయ నృత్యము కూడా అత్యంతోత్తమమైనది. రంగ మంటప నాట్యస్థలిపై ప్రవేశించి..త్రిభంగిమలో నిల్చి, అంగ సంచలనం చేస్తూ భ్రూ లతలను నర్తింపచేస్తూ, శిరః కంపనము అంగుళీ స్ఫోటనము చేస్తూ వంజళము, ఢాళము, వళి, దిరువు, బాగు, వాహిణి, సాళి, బయగతి, సుగతి, బహుగతి అనే వివిధ గతులను, భంగిమలను అభినయించడం మన కాకతీయుల విలక్షణ దేశీ నృత్యరీతి. యిది సకల జనరంజకమైనది, పరవశ ప్రధానమైనది.

ప్రధాన అర్చకుడు : శివానుగ్రహమునకు ప్రాత్రమైన ఈ ‘గీతరత్నావళి’ గ్రంథం ఆచంద్రార్థం బుధజనరంజకంగా వర్థిల్లుగాక.. స్వీకరించండి.

(జాయన పట్టు దస్త్రమును స్వీకరించి గణపతిదేవుని చేతుల్లో ఉంచి ముందు తలవంచాడు)

గ.దే : మహేశ్వరాశీర్వాద ప్రాప్తిరస్తు..ఈరోజు ఎంతో సుదినము. తెలుగుజాతికి ‘గీతరత్నావళి’ అనే సంగీత, సాహిత్య సమ్మేళనాల ఆత్మరహస్యాలను విప్పిచెప్పగల ఒక ప్రామాణిక గ్రంథము లభించినది. ఈ ఘట్టము చరిత్రలో శాశ్వతమై నిలిచిపోతుంది.

మాళవిక : మహాప్రభువులకొక విన్నపము.

గ.దే.: తెలియజేయుము మాళవికా…మా రాజనర్తికి ఊరికే కల్పించుకోదు

మాళవిక : సూర్యుడొక్కడే ఐనా చీకట్లను చీల్చగల వెలుగులనూ, ప్రాణకోటిని మేల్కొలిపి సృష్టిని జీవన్వంతం చేయగల ఉష్ణకిరణ సందోహాలనూ, ప్రచలిత మార్మిక జీవశక్తినీ ప్రదానం చేసినట్టు.. యిన్నాళ్ళూ నృత్యశాస్త్ర అధ్యయనంలో జాయపసేనానితో సహకరిస్తూ సంగతిస్తున్న నేను అతని యందు నిబిడీకృతమై ఉన్న యితర సృజన రంగాల కళా విశారదకతనూ గమనిస్తున్నాను. ఆయన నృత్య, వాయిద్య రంగాలతోనే కాకుండా కరి గణాధ్యక్షుడుగా ఉంటూనే యుద్ధ తంత్రజ్ఞతతో అనేక విజయాలనుకూడా కాకతీయ సామ్రాట్టులకు సంపాదించినారు కదా…అందుకని..

గ.దే : భళా..మాకర్థమైనది…సరిగ్గా మా మనసులో ఎప్పటినుండో నిప్పుకణికవలె మెరుస్తున్న మహదాలోచననే మాళవిక గ్రహించి వ్యక్తీకరించినది..భళా…జాయనా..,

జాయన : మహాప్రభూ..

గ.దే : ఎప్పుడైనా ప్రతిభాశీలి యొక్క  ప్రజ్ఞ స్వయంగా అతనికి పూర్తిగా తెలియదు. నీలోని బహుముఖ సమర్థత నీకంటే మాకే ఎక్కువ తెలియును. గత పదేళ్లుగా నాట్యాచార్య గుండనామాత్యుల వద్ద నీవు పొందుతున్న నృత్య శిక్షణ, మేము అప్పగించిన అనేక దండయాత్రల బాధ్యులను అద్భుతముగా నిర్వర్తించి మాకు సంప్రాప్తింపచేసిన విజయపరంపర..నీ వాద్య నిర్వహణ పద్ధతి…వీటన్నింటినీ మేము ప్రత్యేకముగా, సునిశితముగా ఎప్పటినుండో పరిశీలిస్తూనే ఉన్నాము…యిప్పుడిక ఒక స్ఫుట నిర్ణయానికొచ్చి నిన్ను ఆదేశిస్తున్నాము. భవిష్యత్తులో నీవు నీ సకల సృజనాత్మకశక్తులన్నింటినీ ప్రోదిచేసుకుని సరస్వతీ కటాక్షముతో మూడు ప్రధాన గ్రంథములను సృజియించవలె. అవి…’నృత్య రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ మరియు సకల యుద్దతంత్ర రహస్యాలను, వ్యూహాలనూ, సంపుటీకరించే ‘యుద్ధ రత్నావళి’…ఊఁ.. ఏమందువు జాయనా…

గుండ : యిది చక్రవర్తుల సముచితాదేశము…భళా.

మాళవిక : మహాచక్రవర్తుల ఈ ఆదేశముతో తెలుగునేల చతుర్వేదాల వంటి నాలుగు గ్రంథ రత్నాలతో కాంతివంతమై సంపన్నమవుతుంది మహాప్రభూ..

గ.ప : విన్నావు కదా జాయనా…బుధజన గుప్తాభిప్రాయము…మా అందరి ఆశీస్సులు నిరంతరం నీకుంటాయి. ఈ అపూర్వ గ్రంథాల రచనకు మా సంపూర్ణ సహకారం ఎల్లవేళలా నీకుంటుంది అంగీకరించి అడుగు ముందుకువేయి.

జాయన : మహాప్రసాదం మహాప్రభూ..నా జన్మ తరించినది. మీ అభిమానమునకు పాత్రుడనై, కాకతీయ సామ్రాజ్య బుధజన ఆశీస్సులను పొందగలిగి చరితార్థుడనైన నేను అవశ్యము మీ ఆదేశమును శిరసావహిస్తాను. నాకు కూడా ఈ విభిన్న రంగములందు సమగ్రాధ్యయనము నిర్వహించి నూతన ప్రమాణాల పరికల్పనలతో గ్రంథరచన చేయవలెననే ఉన్నది..తమరి ఆజ్ఞ.

గ.దే.: ప్రధాన అర్చకులుంగారూ.. ఏదీ.. ఆ రుద్రలింగంపై ఉన్న ఆ పూలమాలను మాకందించండి. (ప్ర.అ. లావుపాటి పూమాలను గ.దే. న కందిస్తాడు. గ.ప దేవుడు తన వేలికున్న వజ్రపుటుంగరాన్ని తీసి.)

గ.దే.: జాయనా… యిటురా.. (అని.. దగ్గరకువచ్చిన తర్వాత)..యిదిగో ఈ మా ఆదేశపాలన శుభసందర్భాన్ని పురస్కరించుకుని మా ‘వజ్రపు అంగుళీయ ప్రదానం’.. శివాశీస్సులకు చిహ్నంగా ఈ గులాబీపూమాల. విజయోస్తు.. శీఘ్రమే కలాన్ని కత్తివలె ఝళిపించి  అక్షరాలను కురిపించు.

(చుట్టూ  చప్పట్లు.. శంఖ ధ్వని.. మంగళారావములు.. ఎట్సెట్రా)

జాయన : ధన్యోస్మి ప్రభూ.. ధన్మోస్మి…

దృశ్యం : 4

(1240 సం||. జాయప వయస్సు 50 సం.. తామ్రపురి ఆస్థానం (యిప్పటి చేబ్రోలు).గణపతిదేవుడు తన యిద్దరు సతులతో సందర్శన..జాయపసేనాని రాజ్యము..)

వందిమాగధులు : మహారాజాధిరాజ.. మహామండలేశ్వర..పరమమహేశ్వర.. శ్రీ స్వయంభూనాథదేవ దివ్యపాద పద్మారాధక.. ప్రత్యక్ష ప్రమథగణావతార.. లాడచోటకటక చూరకార.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి.. జయహో..విజయహో…

(గణపతి దేవుడు పేరాంబ, నారాంబలతో సహా అంతఃపుర ప్రవేశం.. జాయపసేనాని సకుటుంబంగా.. ఎదురొచ్చి బావగారిని ఆలింగనము చేసుకుని.. ప్రసన్న వదనంతో..)

జాయన : మహాచక్రవర్తలకు మా హృదయపూర్వక స్వాగతము.. బావగారూ, కాకతీయ మహాసామ్రాజ్యంలో ఎల్లరూ సుఖులే కదా.. రాజపరివార, మహామంత్రిగణ, సకలసైన్య వీరసమూహాలూ, ప్రజాశ్రేణులన్నీ సౌఖ్యంగా వర్థిల్లుతున్నాయిగదా..,

గ.దే.: ఎల్లరూ సుఖులే జాయపసేనానీ.. వైరి గోధూమ ఘరట్టా.. మా మహామాత్యులూ, దండనాధులూ, సకలసేనాధిపతిలూ, శ్రీమన్మహాసామంత నామిరెడ్డీ.. నీ స్థానంలో నియమితులైన గజసాహిణి బొల్లమరాజూ..మీదుమిక్కిలి మా సువిశాల కాకతీ సామ్రాజ్యవాసులైన లక్షలమంది ప్రజాశ్రేణులన్నీ సౌభాగ్యముతో అలరారుతున్నాయి.

జాయన : ఈ రత్నఖచిత ఆసనాన్నధిష్టించండి మహాప్రభూ. సోదరీ పేరాంబా, నారాంబా.. అంతా క్షేమమేకదా.., సుఖాసీనులుకండి.

గ.దే.: దాదాపు ఇరవది ఐదు సంవత్సరముల క్రితం రాజ్యవిస్తరణలో భాగంగా అనేక యుద్ధములను గెలుచు బాధ్యతను మీకప్పగించగా.. జాయపసేనానీ, యుద్ధతంత్ర విశారదుడవూ, సకలకళాప్రవీణుడవూ, తంత్ర విద్యా నిపుణుడవూ.. ప్రత్యేకించి గజసైన్య నిర్వహణా ధురీణుడవూ ఐన నీవు సాధించిన విజయముల పరంపర తర్వాత మేము నిన్ను ఈ తామ్రపురికి సామంతులను చేసి పట్టముగట్టితిమి. మీరుకూడా ప్రజా సుభిక్షముగా పరిపాలను నొనరిస్తూ ఉత్తర రాజ్య నాయకుడగు ఇందులూరి సోమమంత్రినీ, రాచెర్ల రుద్రసేనాపతినీ తోడుగా చేసుకుని గజసైన్యమధికముగా గల కళింగ రాజులనోడించి కాకతీయ మహాసామ్రాజ్య పరిధిని అటు కళింగమునుండి యిటు నెల్లూరు వరకు విస్తరించి మాకు మహానందమును కల్గించితివి. ఈ మహాముదమును నీతో పంచుకొనుటకే యిప్పుడు నీవద్దకు మీ సోదరీమణులతో సహా మా రాక. కొద్దిరోజులు నీ అతిథిగా మేము విశ్రమించెదము.

జాయన : మహాభాగ్యము.. గణపతిదేవులకు ఆతిథ్యమొసగుటకంటే, మా  తోబుట్టువులైన పట్టపురాణుల సమక్షములో గడుపుటకంటే మాకు కృతార్థమేమున్నది.

గణ.దే.: జాయపా.. ఈ డెబ్బదిఏండ్ల సుదీర్ఘ జీవితకాలమంతయూ యుద్ధతంత్రములందూ, రాజ్యవిస్తరణయందూ, ప్రజాహితపాలనా ప్రణాళికా రచనయందూ, రక్షణ తంత్రములందూ అహర్నిశలూ శ్రమించి శ్రమించి అలిసితిమి. యిక మా మనము కించిత్తు విశ్రాంతిని కాంక్షిస్తున్నది.. వినోద, సంగీత, సాహిత్య, కళాత్మకరంగాలలో ఏదో చేయవలయునను కోరికా బలీయమౌతున్నది.

జాయప భార్య : అగ్రజులు.. గణపతిదేవులుంగారు మా వదినలను తోడ్కొని మా నేలను పావనం చేయడమే మా అదృష్టము.. రసహృదయులైన మీ బావమరిది జాయపసేనాని యిప్పటికే ఎంతో మగ్నతతో గ్రంథరచన చేస్తూనే ఉన్నారు. మీరు సాలోచనగా ఆ పుటలను అవలోకించవచ్చును.

గ.దే : అహాఁ.. ఎంత సంతోషము.. సోదరీ.. ఏమేమి సృజన చేసియున్నాడు జాయన.. చూడు.. ఎంత నిశ్శబ్దముగా గోప్యము నటిస్తున్నాడో.

జాయన : ప్రభువుల వద్ద గోప్యమేమున్నది.. మీరు అప్పగించిన పనినే చేయుచు ప్రత్యేకముగా మీముందు విశేషముగా నుడువుటకేమున్నది..,

గ.దే : అత్యంత విశేషమైనది కానిది మా జాయన అక్షరసృజన చేయడుకదా. ఆ విషయం మాకు తెలుసు.. వివరాలు తెలియజేయుము జాయపా.,

జాయన : మీరు ఆదేశించిన విధముగానే భరతముని ‘నాట్యశాస్త్రము’ లోని సకలశాస్త్ర సమ్మతములైన ‘మార్గ’ నృత్య పద్ధతులను సమగ్రపర్చి నాలుగాధ్యాయములు ‘నృత్తరత్నావళి’ పేర రచించడము పూర్తయినది మహారాజా.. యిక మన..అంటే ప్రధానముగా కాకతీయ సామ్రాజ్య పర్యంత ప్రజాజీవనములో జీవభరితమై ఒప్పుతున్న జానపద, ఆదిమ, గిరిజన, సామాన్య పల్లెప్రజల దేశీ నాట్యరీతులను సంపూర్ణముగా అధ్యయనము చేసి మరో నాలుగు అధ్యాయముల సృజన కొనసాగుతున్నది.

గ.దే.: మాకు కూడా.. ప్రజారంజకమైన ప్రజానాట్యరీతులను ప్రామాణికపర్చవలెనను అభిలాషయున్నది ..కొనసాగింపుము.. ఐతే, మొత్తము ఎనిమిది ప్రకరణములతో ‘నృత్త రత్నావళి’ సంపూర్ణమగునా.?

జాయన : ఔను మహాప్రభూ.. ఇరువది మూడు దేశిస్థానములతో శివారాధకులైన మన ప్రాంత ప్రజల ఉద్దీప్తమూ, ఉత్తేజకరమూ, వీర రౌద్ర రస ప్రధానముగా ఐన ‘ప్రేరణి’ అనే ఒక అతినూతన నృత్త రీతినీ, శివతాండవ తురీయస్థితినీ చాటిచెప్పగల ‘శృంగ నర్తనము’ నొకదానిని సృష్టిస్తున్నాను.

గ.దే : (సంతోషముతో చప్పట్లు చరుచును..) భళా జాయనా భళా.. మేమీ సమాచారము విని కేవలం ఆనందించడమేకాక ముదముతో పొంగిపోవుచున్నాము. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఔనూ.. రేచర్ల రుద్రదేవుడు గత రెండు దశాబ్దాలుగా పాలంపేట అను ప్రాంతంలో మహోత్తమ స్థపతి, శిల్పాచార్యులు రామప్పతో ఒక రుద్రాలయమును నిర్మిస్తున్న విషయం తెలుసుకదా. మనమే దానికి సకల నిధులనూ, సదుపాయములనూ, పోషణనూ కల్పిస్తున్నాము.. ఒకసారి నీవు పాలంపేట సందర్శించి నృత్యశాస్త్రము కొరకు సంభావిస్తున్న దేశీ నృత్య భంగిమలను ఎందుకు దేవాలయాలంకారములుగా స్థాపించకూడదు. మన రాజనర్తకి మాళవికా, రేచర్లరుద్రుని స్థానిక నర్తకి కేశికీ నీకు సహకరిస్తారు కదా..

జాయన : మహాప్రసాదం.. తప్పనిసరిగా ఆ విధముగనే చేసెదను.. నేనూహించిన దేశీ నృత్య భంగిమలతో రూపుదిద్దుకునే శిలాకృతులు అవశ్యము ఆ రుద్రాలయశోభను యినుమడింపజేస్తాయి.

గ.దే.: శుభం.. తామ్రపురిని చేరు త్రోవలో ఓరుగల్లు నుండి.. తలగడదీవి, తామ్రపురి వరకు మీ తండ్రిగారి జ్ఞాపకార్థం నిర్మించిన ‘చోడేశ్వరాలయం’..దాని అనుబంధ తటాకము ‘చోడసముద్రము’.. అదేవిధముగా భీమేశ్వరాలయం, గణపేశ్వరాలయం.. ద్రాక్షారామాలయం…వాటి ప్రక్కనున్న చెరువులు.. ఆవిధముగా నూటా ఒక్కటి.. మీ నిర్మాణాలలో నివి చాలావరకు సందర్శించి సంతసించితిమి .. “ఆలయమూ, ప్రక్కనే ప్రజోపయోగకరమగు తటాకము” అన్న కాకతీయ సంస్కృతిని పాటిస్తున్నందుకు అభినందనలు జాయనా.. దేవుడు నిన్ను కరుణించుగాక..

జాయన : మా వేగులవారిద్వారా మీరు మాచే నిర్మితములైన ఆలయములనూ, సరస్సులనూ సందర్శించిన సమాచారము మాకున్నది. మీ ప్రశంసతో, అభినందనలతో నేను ఉత్తేజితుడనైనాను.. మహాచక్రవర్తీ.. మరి మనం..మధ్యాహ్న భోజన ఆరగింపునకు..,

గ.దే.: అవశ్యము.. అంతా ఆనందకరముగా నున్నది..

WEEK-5

దృశ్యం : 5

(1241 :పాలంపేట..రామప్ప దేవాలయ నిర్మాణథ.. ప్రాంగణం.. మహాశిల్పి రామప్ప, రేచర్ల రుద్రదేవుడు, జాయపసేనాని, రాజనర్తకి మాళవిక..రుద్రదేవుని ఆలయ నర్తకి కేశికి.. ఉన్నారు.. సందర్భం.. పీఠంవరకు.. అధిష్ఠానం.. చుట్టూ స్తంభాలు, అరుగులు.. వరకు నిర్మాణమై.. అలంకరణ, పై కప్పు విశేషాలపై చర్చ.. ప్రతిపాదనలు..)

(అప్పుడే ఏనుగు అంబారితో కూడిన అలంకృతపీఠంపై నుండి దిగుతున్న జాయపసేనానిని ఉద్ధేశించి..)

రే.రు.: తామ్రపురి రాజులు..మహా గజసాహిణి, వైరి గోధూమ ఘరట్ట, శ్రీశ్రీశ్రీ జాయపసేనానికి రేచర్ల రుద్రమదేవుని ప్రణామములు.. స్వాగతం.. సుస్వాగతం.,

జా.సే.: (దిగి..రుద్రదేవుని స్నేహపూర్వకముగా కౌగలించుకుని..) విజయోస్తు రుద్రదేవా..మీ రాజ్యమును సందర్శించడముతో మా జన్మ పావనమైనది. గణపతిదేవుల ఆజ్ఞమేరకు.. మీరు ఒక జీవితకాల లక్ష్యంతో, శివాజ్ఞకు బద్ధులై నిర్వహిస్తున్న ఈ బృహత్‌ రుద్రేశ్వరాలయ నిర్మాణమునకు అదనపు సొబగులను అద్దడానికి, నాట్యశాస్త్ర సంబంధ వన్నెలు కూర్చడానికి మేమిక్కడికి..,

రే.రు.: మాకు సమాచారమున్నది సేనానీ.., రండి.. భావితరాలను మంత్రముగ్ధుల్ని చేయగల ఈ మహాశివాలయ నిర్మాణాన్ని మరింత జీవవంతం చేయడానికి విచ్చేసిన మీకు స్వాగతం.. యిదిగో వీరి పరిచము.. వీరు ఈ ఆలయ ప్రధానకర్త.. మహాశిల్పి రామప్ప.. అపరబ్రహ్మ.. రాతిని మైనపు ముద్దవలె రూపింపజేసి, శిల్పించగల ప్రజ్ఞాశీలి.. మీ రాకకు ముందే యిక్కడికి చేరుకున్న ఈమె కాకతీయ సామ్రాజ్య రాజనర్తకి మాళవికాదేవి.. మా సంస్థానికి చెందిన మా స్థానిక రాజనర్తకి కేశికి… వీరు ఆలయ అర్చకులు.. సోమశివాచార్యులు ..(చుట్టూ చూపిస్తూ..) వీళ్ళందరూ ముప్పదిరెండుమంది సుశిక్షితులైన యువ శిల్పులు.

జా.సే.: మాళవికాదేవి మాకు ఇదివరకే తెలిసిన అతిసన్నిహిత విదుషీమణి. అందరికీ ప్రణామములు.. మీవంటి మహానుభావుల కలయికతో నేను కృతార్థుడైనాను.. రుద్రదేవా.. ఈ ఆలయనిర్మాణ ప్రధానాంశములు వివరించండి.

రు.దే.: మీరు తొలుత ఈ శిలాసనముపై ఆసీనులుకండి.. కేశికీ, వివరాలు తెలియజేయి.

కేశికి : ఇది తూర్పుముఖ శివాలయం. నల్లరాతి కురివెంద కఠినశిలలతో నిర్మితమౌతున్న ఈ శివాలయమునకు దగ్గర్లోనే మూడు ప్రకృతి సిద్ధమైన కొండలను ఆలంబనగా చేసుకుని ఎనిమిది చదరపుమైళ్ళ విస్తీర్ణములో ఒక ప్రజోపయోగ జలవనరుగా తటాక నిర్మాణం జరుగుతున్నది. ఇసుక ఆధారపీఠంగాగల ఎనిమిది అడుగుల పునాదిపై ఆరు అడుగుల ఎత్తున గర్భగుడిలో శిలాపీఠం ఏర్పాటు చేయబడి లోపల అధిష్టానంపై రెండున్నర అడుగుల పొడవు, అంతే వెడల్పుగల రుద్రేశ్వర లింగం ప్రతిష్టితమౌతున్నది. గర్భగుడికి ఎదురుగా..పశ్చిమాన మహాశిల్పి ప్రత్యేకంగా రూపొందించిన ఈ శివనంది ప్రత్యేకతేమిటంటే.. ఒక్కటి, ఎవరు ఈ నందిని ఎటునుండి వీక్షించినా అది ఆ వీక్షకుణ్ణే చూస్తున్న అనుభూతిని కల్గించడం.. రెండు..ముఖంపై తేలిన రక్తనాళాలు, ఒంటిపై ఆభరణాలు వీక్షకున్ని స్పర్శించకుండా ఉండలేనివిధంగా ముగ్ధుణ్ణి చేయడం..గర్భగుడి ముఖద్వారంవద్ద..లతాలంకృత స్తంభం.. లోహధ్వనులతో సరిగమలను పలికించడం…

జాయన : మహాశిల్పి రామప్పా.. వింటూంటే మేము పులకించిపోతున్నాము.

రామప్ప : ధన్యుణ్ణి మహాసేనానీ.. మీ కూర్పుతో ఈ ఆలయం యింకా శోభిస్తుందని మా ఆకాంక్ష.

జాయన : అవశ్యం.., యింకా,

రామప్ప : ఈ ఆలయ శిల్పం ప్రధానంగా మూడు రకాల శిల్పరీతుల సంగమం.. హోయసళుల, చాళుక్య, చోళ శిల్పవిధానాలను అనుకరిస్తూనే స్థానిక దేశీ జీవనరీతులనూ, మన సంస్కృతినీ మేళవించి ఒక అద్వితీయ సృష్టిని కొనసాగిస్తున్నాము.

జాయన : బాగున్నది.. నేను ప్రధానంగా గజసైన్యాధ్యకక్షుణ్ణి.. అందువల్ల పలు గజవిన్యాసాలనూ, గజశ్రేణులనూ చిత్రించి తెచ్చినాను.. అదీకాక నేను ప్రామాణికంగా రచిస్తున్న ‘నృత్త రత్నావళి’ గ్రంథంలో దేశీ నృత్యరీతులననుసరించి తయారుచేసిన దాదాపు ఇరవై చిత్తరువులను, చిత్రాలను నా పరివారంతో తెప్పించిన పేటికలలో కూర్చి తెచ్చినాను.. వీటిని శిల్పాలుగా చెక్కి ఈ ఆలయ గోపుర పరివేష్ఠితములుగా అమర్చినచో మహాలంకారముగా భాసించునని మా ఊహ..ప్రతీహారీ.. ఆ పేటికలను తెరవండి.,

(ఒక సైనికుడు.. ఒక పెద్ద పేటికను తెరుస్తాడు.)

రే.రు.: సైనికా.. యిటివ్వు.. తొందరగా చూడవలెననే ఉత్కంఠ..రామప్పా.. రండి..చూడండి .. ఈ చిత్రాలు.ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో. ఒక్కో చిత్రం ..కళ్ళముందు..ఆయా సుందరాంగనలు నిలబడ్డట్టుగానే తోచుచున్నది)

(రే-రుద్రుడు, రామప్ప, కేశికి..అలంకృతమై ఉన్న మాళవికాదేవీ.. చూస్తారు)

జా.సే.: ఉహు..ఆ విధముగా కాదు.. శిల్పిముందు ఈ ఒక్కో భంగిమను ప్రదర్శింపజేస్తాను..అప్పుడుగాని ఆ నృత్త ఆంగికము రూపుకట్టదు.. మాళవికాదేవీ, ఏదీ..సిద్ధపడు..

(జాయన..ఏడెనిమిది చిత్రాలున్న పటాలను చేతిలోకి తీసుకున్నాడు.. ఆహార్యం ధరించిన మాళవికాదేవి పైనున్న సన్నని తెరను తొలగించి..శిలా రంగస్థలిపై చేరి నిలబడింది సిద్ధంగా..)

జా.సే.: చతుర విన్యాసము.,

(మాళవిక..క్షణకాలంలో..మెరుపువలె కదిలి ఒక విశిష్ట భంగిమలో స్థాణువై నిలబడింది.

కర్తరీ నర్తనము (మాళవిక భంగిమ మారింది)    (ఇక్కడ భంగిమల మధ్య శ్రావ్యమైన మ్యూజిక్‌)

భ్రమరీ నర్తనము (మరో భంగిమ)

సువ్యాపక నర్తనము (ఇంకో భంగిమ)

దక్షిణ భ్రమణ నర్తనము (మరో భంగిమ.)

దండలాస్యము (ఇంకో భంగిమ)

నాగిని, (భంగిమ)

రామప్ప : జాయపసేనానీ.. అద్భుతము.. ఈ ఒక్కో రీతి, భంగిమ మా హృదయమును జయించింది. మీరన్నట్లు ఈ ఒక్కో శిల్పమును ఆలయ శిఖర చూరుకు ఒడ్డాణమువలె అమర్చినచో రంజకంగా ఉంటుంది. ఈ దేశీ నృత్తభంగిమలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

జా.సే.: మా అభిలాష కూడా అదే మహాశిల్పీ..యివిగాక యింకా ‘ప్రేరిణి’ అనే శివతాండవ శృంగనర్తనంలో భాగమైన వీరరసప్రధాన భంగిమలు కొన్ని ఈ పటాలలో ఉన్నాయి. వీక్షించండి..

(రామప్ప అందుకుంటాడు చిత్రాలను)

రామప్ప : ‘ ‘ప్రేరిణి’ నృత్యం గురించి చెప్పండి

జా.సే.: మహాశిల్పీ.. సుకుమారమై కేవలం స్త్రీలచేతన నర్తితమయ్యేది లాస్యము.. ఉద్ధతమైన అంగహారములతో వీర, రౌద్ర భావనలు ప్రధానముగా గలిగి పురుషుల చేతమాత్రమే నర్తించబడేది ‘తాండవము, శివతాండవము ప్రధానముగా ఏడు విధములు.. అవి శుద్ధ, దేశి, ప్రేరణ, ప్రేంఖణ, దండిక, కుండలి మరియు కలశ..ఈ భంగిమలన్నీ మన రుద్రేశ్వరాలయ కీలకస్థానాల్లో స్థాపించబడాలి.

రామప్ప : అవశ్యము ఆచార్యా.. అది అర్థవంతముకూడా.. రుద్రునిచుట్టూ శుద్ధ, పూర్ణ పురుష వీర భావనలు పరిఢవిల్లడం సృష్టి ప్రతిఫలనయేకదా..తప్పక ఆ ఆకృతులను తీర్చిదిద్దుదాం.,

రే.రు : జాయపా.. మీరు సంకల్పించిన ఈ ప్రతిపాదనలన్నీ శ్లాఘనీయమైనవి.. వీటిని యథాతథముగా ప్రతిష్టిద్దాం.

జా.సే.:  స్తంభములపై..ప్రాకారములపై..పై కప్పులపై..స్తంభ తలములపై.. వక్రములపై..రామాయణ, భాగవత.. మహాభారతాది ఇతిహాస ఘట్టాలను కూడా శోభింపజేద్దాం రుద్రదేవా..

రే.రు.: అవశ్యము..తప్పక.. మీరు మా ఆతిధ్యమును స్వీకరించుటకు వేళయ్యింది. భోజనానంతరము తటాక నిర్మాణ ప్రాంతమును సందర్శిద్దాం.. జాయపసేనానీ ఈ పక్షము రోజులు యిక్కడే మాతో, రామప్ప మహాశిల్పితో గడిపి మాకు మార్గదర్శనం కావించండి…

జా.సే : మీ ఆతిథ్యం మాకూ అంగీకారమే. యిక్కడ కొద్దిరోజులుండి గణపతి దేవులను కూడా సందర్శించుకుని మా తామ్రపురికేగుతాం.,

దృశ్యం  : 6

(1254వ సం||. జాయప వయస్సు 60 సం||లు.. రామప్ప దేవాలయ ప్రాంగణం.. దేవాలయ ప్రదేశమంతా, సహస్ర దీపాలంకరణతో తేజోవంతమై కాంతిమయంగా, దేదీప్యమానమై ఉంది. రుద్రేశ్వర గర్భగుడి ఎదుట.. రాతి సింహాసనంపై గణపతి దేవుడు..ప్రక్కన  రాణులు.. మరో ఆసనంపై జాయపసేనాని, రేచర్ల రుద్రదేవుడు.. అటువేపు రామప్ప అతని యిద్దరు శిష్యులు.. వెనుక.. రాజనర్తకి మాళవికాదేవి.. కేశిక.. యితర పురప్రముఖులు దండనాయకుల..కోలాహలం..

సందర్భం.. ‘నృత్త రత్నావళి’ గ్రంథావిష్కరణ.. దేవాలయమునకు ‘రామప్ప’ నామప్రతిష్ట..

(రుద్రాభిషేక స్తుతి.. జమకం.. మంగళకర ధ్వని.. మంత్రఘోష..ఘంటలు క్రమంగా..తగ్గుతూండగా..)

ప్రధానార్చకులు సోమాచార్యులు : (శివలింగ సన్నిధి నుండి నృత్తరత్నావళి గ్రంథం ఉన్న పట్టువస్త్రపు మూటను తీసుకొని వచ్చి.. గణపతిదేవుని చేతుల్లో ఉంచి.. నమస్కరించి..) ఈశ్వర  ప్రసాదంగా ఈ మహత్తర కృతి.. భవిష్యత్‌ తరాలూ.. దాక్షిణాత్యులూ గర్వించదగ్గ నాట్యశాస్త్ర ప్రామాణిక గ్రంథం, జాయపసేనాని కృత ‘నృత్తరత్నావళి’ని తమ అమృతహస్తాలతో స్వీకరించండి మహారాజా.

గ.దే.: మహాప్రసాదము.. ఈ గ్రంథమును స్పర్శించిన మా యొల్లము పులకించుచున్నది.. ఎపుడో దాదాపు ముప్పది సంవత్సరముల నాడు ప్రజ్ఞాశాలియైన జాయనను మేము ‘నృత్యము’తో సహా వాద్య, యుద్ధ విద్యలపై ప్రామాణిక గ్రంథములను రచించి ఈ లోకమునకందించమని ఆదేశించియుంటిమి. యిన్నాళ్ళకు మా స్వప్నము సాకారమైనది. జాయపసేనానికి మేము మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ..ఈరోజు నిర్వహించ తలపెట్టిన రెండు ప్రధాన కార్యాక్రమములు వివరములను రేచర్ల రుద్రదేవులను ప్రకటించవలసినదిగా అభ్యర్థిస్తున్నాము.

రే.రు.: చిత్తము మహాప్రభూ.. మనందరము ఆసీనులమై ఉన్న ఈ రుద్రేశ్వరాలయమును ఆమూలాగ్రం ఊహించి, రూపొందించి, శిల్పించి.. వన్నెలద్ది..భావితరాలకు అందించినవాడు మహాశిల్పి రామప్ప.. కాబట్టి యింతవరకు ఎక్కడా ఒక శిల్పినామముపై లేనివిధముగా ఈ దేవాలయమునకు ‘రామప్ప దేవాలయము’గా నామకరణం చేయవలసిందిగా మహాచక్రవర్తి శ్రీశ్రీశ్రీ గణపతి దేవులను ప్రార్థిస్తున్నాను.

గ.దే.: తథాస్తు.. భవిష్యత్తులో ఈ శివాలయం సురుచిరమై ‘రామప్ప దేవాలయం’ గా ప్రసిద్ధి పొందుగాక.. మహాశిల్పీ రామప్పా.. నీ జీవితం చరితార్థమైనది.. మీకు మా అభినందనలు.

రామప్ప : ధన్యోస్మి ప్రభూ.. ధన్యోస్మి.

రే.రు.: యిక.. భరతముని రచించిన ‘నాట్యశాస్త్ర’ సకల మార్గపద్ధతులను ఆంధ్రీకరించి, కాకతీయ సామ్రాజ్య స్థానీయ ప్రజానాట్య రీతులను కూడా థాబ్దాలుగా అధ్యయనము చేసి ‘దేశీ’ నృత్యపద్ధతులుగా గ్రంధస్థం చేసిన సకల కళాకోవిదులు శ్రీశ్రీశ్రీ జాయపసేనాని. ఈ దేశీ రీతులలో ప్రపంచ నాట్యచరిత్రలో ఎక్కడాలేని.. మగవారిలోని మగటిమినీ, పురుషుల్లోని పురుషత్వాన్నీ, వీరునిలోని వీరత్వాన్నీ సమ్మిళితం చేసి రుద్ర  ప్రేరణగా రూపొందించి అందిస్తున్న శృంగనర్తనం, శివతాండవం ‘ప్రేరణి’. ప్రేరణి నృత్యాన్ని ఒక బృందముగా పది, ఇరవై..నలభై మంది నర్తకులతో సామూహిక వీరనర్తనముగా ప్రదర్శించడం సముచితం. నిజానికి యిది బృంద నర్తనము. ఈ ప్రేరణి నృత్యాన్ని మన ఆస్థాన నర్తకుడు మల్లయనాథుడు గ్రంథకర్త జాయపసేనాని ప్రవేశిక తర్వాత ప్రదర్శిస్తారు..

(చప్పట్లు..మంగళ ధ్వనులు..)

జాయప : మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులకు, సభాసదులైన బుధజనులందరికీ ప్రణామములు. ఏదేని ఒక విషయముపై సాధికారమైన అధ్యయనం జరుపనిది సృజనచేయడం భావ్యముకాదని తలంచి భారతీయ నాట్యశాస్త్రాలన్నింటినీ సంపూర్ణముగా పరిశోధించి ముప్పయ్యేళ్ళ కాలము సాగించిన సుదీర్ఘ కృషి ఫలితమే ఈ ‘నృత్తరత్నావళి’ గ్రంథము. యిక ‘ప్రేరణి’ అనే నామముతో ‘నృత్తరత్నావళి’ గ్రంథంలో ప్రస్తుతించబడినది పూర్తిగా నా స్వీయ సృష్టి. యిది గేయ ప్రాధాన్యంగల నర్తనం కాదు. వాద్య ప్రాధాన్యతగల నర్తనం. యుద్ధసన్నద్ధత కోసం వీరరస ప్రధాన ప్రేరక ఉత్సవాలలోనూ, ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం స్వయంచాలన లక్ష్యంగా రూపొందించబడ్డ పురుష నర్తనం ‘ప్రేరణి’. మార్ధంగికులు మహామద్దెలపై తన్నారకం, తత్కారం, తహనాలు, యతులు, గతులు, జతులు ‘భాం’కార ధ్వనితో పలికిస్తూంటే..నందిమద్దెల, ఉడుక్కు, కంచుతాళ మేళనతో నాదం గాంభీర్యమౌతూండగా రుద్రస్వరూపుడైన నర్తకుడు అంగ, ప్రత్యంగ, ఉపాంగాల సంచలనాల ద్వారా పరమశివుని తాండవకేళిని మన అనుభవంలోకి తీసుకురాగల మహారౌద్రానుభూతి యిది.. వినండి.. వీక్షించండి..,

(శబ్దం.. భాంకార ధ్వని.. పేరిణి..సిడి ఒకటుంది .. దాంట్లో పది ట్రాక్స్‌ ఉన్నై.. మొత్తం 3.5 ని||లు బిట్స్‌ బిట్స్ గా వేయాలి)

….ముగింపులో

గ.దే.: జాయపసేనాపతీ..మేము ఈ పంచముఖ శబ్ద ప్రపంచంలో ఓలలాడి మైమరిచి, లీనమై రుద్రున్ని మా మనోమయ లోకంలో దర్శించుకున్నాము. దీనిని సృజించి నీ జన్మను చరితార్థం చేసుకున్నావు.. ఏదీ..ఒక్కసారి మా బాహువుల్లో ఒదిగి మమ్మల్ని సంభావించు.

జా.సే: ధన్యుణ్ణి ప్రభూ.. ధన్యుణ్ణి.. మీరన్నట్లు నేను శివకృపతో, మీ అనురాగ స్పర్శతో తరించిపోయినాను.. ఆచంద్రార్కం ఈ నృత్తరత్నాళి కృతి శాశ్వతమై నిలుస్తుంది.. ధన్యోస్మి…

(ప్రేరణి నృత్యము కొనసాగుతూంటుంది.. ఆలయ ఘంటలు.. మంగళధ్వని.. సంతోష సంకేత కోలాహలం)

 -రామాచంద్ర మౌళి

Ramachandramouli 

జాయపసేనాని -2

OLYMPUS DIGITAL CAMERAదృశ్యం-2

స్వయంభూ దేవాలయం..రంగ మండపం

( గణపతిదేవుని అజ్ఞానుసారము గుండామాత్యులు జాయనను తనకు అభిముఖముగా కూర్చుండబెట్టుకుని నాట్యశాస్త్ర బోధనను ప్రారంభిస్తున్న రోజు..జాయన గురువుగారికి పాదాభివందనం చేసి..అశీస్సులను పొంది..ఎదుట కూర్చుని..)

 గుండామాత్యులు:నాయనా “గురు సాక్షాత్ పరబ్రహ్మ..కాబట్టి ఈరోజునుండి కాకాతీయ మహాసామ్రాజ్య చక్రవరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుంగారి ఆదేశానుసారము   నేను నీకు  బోధించడానికి ఉపక్రమిస్తున్న ఈ నాట్యశాస్త్ర రహస్యాలను అతిజాగ్రత్తగా గ్రహించు..ఓం….దైవస్వతమన్వంతరము తొల్లి త్రేతాయుగమందు,కామక్రోధాది అరిషడ్వర్గములకు లొంగి లోకులందరును సుఖదుఃఖములననుభవించుచుండగా,ఇంద్రుడు మున్నగు దేవతలు బ్రహ్మను “అందరూ చూడదగిన,వినదగిన వినోద సాధనమును” అపేక్షించుచున్నామని అర్థించగా బ్రహ్మ ఆత్మాంతర భావనచేసి అన్ని వర్ణముల,వర్గముల వారికిని హితమైన సారమును వేదములనుండి సంగ్రహించి “నాట్యవేదము”ను సృజించినాడు.తర్వాత ఆంగికాది అభినయములందు మనుషులకు గల చాతుర్యమును గమనించి తన మానసపుత్రుడైన భరతమునికి ఆ నాట్యకళను నేర్పించినాడు.భరతుడు తన కుమారుడు శాండిల్యుడు మొదలైనవారికి దానిని నేర్పెను.వారితోను,అప్సరసలతోను,భరతముని నాట్యవేదమును ప్రయోగించి ప్రవర్తింపజేసెను.

       జాయప:ఊ…ఆచార్యా..ఈ నృత్యకళకు ఆధారభూతములైన మూలభావనలేమిటి.?

గుండా:మంచి ప్రశ్న జాయపా..ఎప్పుడైనా మూలమునూ,కేంద్రకమునూ స్పృశిస్తేగాని అసలు రహస్యం బట్టబయలు కాదు..సృష్టిలోని పంచభూతముల ప్రతీకాత్మక వ్యక్తీకరణే నృత్తము.భూమిలోని రత్నకాంతుల తళతళలు,నీటి తరంగముల లాలిత్యము,అగ్నిజ్వాలల ఊపు,వాయుసహజమైన వింతనడక,ఆకాశంలోని మెరుపుతీగల విన్యాసము..యివే నాట్యవేదమునకు పునాది భావనలు.ఐతే సుఖ దుఃఖ మిశ్రమమైన లోకస్వభావముననుకరించి నాలుగు విధముల అభినయములతో ఏర్పడినదే నాట్యవిద్య.ఆంగికము,వాచికము,ఆహార్యము,సాత్వికము అని అభినయము నాల్గు విధములు.నాట్యకళ అంతయూ వీటియందే నెలకొని ఉన్నది.

   జాయప:ఆచార్యా..నాట్యము..నృత్యము..మున్నగు ఏకరీతి భావనలవలె,పర్యాయపదములవలె ధ్వనింపజేయు రూపాలన్నీ ఒకటేనా.?

గుండా:నాయనా..శాస్త్రరీతిలో భరతమునిచే నిర్వహించబడ్డ ఈ విశేషణాలన్నీ అతి సూక్ష్మ భిన్నతలతో స్పష్టముగా చెప్పబడి ఉన్నాయి…ప్రధానమైన “నర్తనము” మూడు విధములు.ఒకటి..పాట,వాద్యములు మొదలగువానితోగలిసి,లయనుమాత్రము ఆశ్రయించి,అభినయములేక,అంగముల నాడించుట ‘ నృత్తము ‘. రెండవది..భావముల నాశ్రయించినది,పదార్థములను అభినయించు స్వరూపముగలది ‘ నృత్యము ‘.మూడవది..సాత్త్విక భావములతోనిండి,రసాశ్రయమై,వాక్యార్థమును అభినయించునదై ఉన్నచో అది ‘ నాట్యము ‘.

జాయప:గురువర్యా..నా సంశయములు సూర్యసమక్షములో మేఘ శకలాలవలె తొలగిపోయినవి.

   గుండా:జాయనా..నాట్య,నృత్య,నృత్తములలోని ప్రధానమైన చేష్టలను నిర్వహించు అంగ,ప్రత్యంగ,ఉపాంగములు మొత్తము 18..ఒక్కొక్కటి ఆరు.శిరస్సు,చేతులు,వక్షము,ప్రక్కలు,మొల మరియి పాదములు అంగములనబడును.ప్రత్యంగములు మెడ,భుజములు,కడుపు,వెన్ను,తొడలు మరియుపిక్కలు.మొత్తము ఆరు.కన్నులు,బొమ్మలు,ముక్కు,పెదవులు,చెక్కిళ్ళు మరియు గడ్డము..ఇవి ఉపాంగములు.

జాయప:శాస్త్రసారము ఇసుకలోనికి నీరువలె నాలోకి ప్రవహిస్తున్నది గురుదేవా..ధన్యుడను.

  గుందన:నృత్తము మార్గము..దేశీ అని రెండు విధములు.నాట్యవేదమునుండి మహర్షులచేత వెలికితీయబడి,సజ్జనుల ద్వారా ప్రచారము చేయబడినదిగా ఉన్న శాస్త్రానుగుణ పద్ధతిని బుధులు ‘ మార్గము ‘ అనీ,దేశ కాల స్థితిగతులనుబట్టి ఎప్పటికప్పుడు కొంగ్రొత్త విధానాలతో ఆయా దేశ రాజుల,జనుల యిష్టానుసారము చెల్లుబాటు ఐన నృత్త విధానమును ‘ దేశీ ‘ అని వ్యవహరించినారు.

 జాయప: ఉహూ..

  గుండన:కాగా నృత్య,నృత్తములు లాస్యమని,తాండవమని మరల రెండు విధములు. అందు మొదటిది లాస్యము..సుకుమారముగా ఉండునది.రెండవది..తాండవమైనది.స్త్రీ పురుషుల పరస్పర విషయములైన భావనలు లాసము.దానికొరకైనది,లేదా దానికి తగినది అను అర్థము గలది లాస్యము.అది కామోల్లాసమునకు హేతువులగు మృదువైన అంగవిక్షేపములు గలది.పార్వతీదేవికి శివుడుపదేశించినది కనుక ప్రాయికముగా దీనిని స్త్రీలే ప్రయోగింతురు.

  జాయప:గురువర్యా..లాస్య సంబంధ నృత్యములు కేవలము స్త్రీలచేతనే నిర్వర్తింపబడ్తాయా.?

గుండన :ఔను జాయనా..సందర్భోచిత పురుష ప్రవర్తనను ప్రయోగాత్మకంగా నర్తించడము అప్పుడప్పుడు జరిగినా లాస్యము ప్రధానముగా స్త్రీల నృత్యక్రియే.ఉద్ధతము పురుషులచే ప్రదర్శింపబడునది.

లాస్యాంగములు పది.గేయపదము,స్థిత పాఠ్యము, ఆసీనము, పుష్పగంధిక, ప్రచ్ఛేదకము, త్రిమూఢము, సైందవము, ద్విమూఢకము, ఉత్తమోత్తకము, ఉక్త ప్రత్యుక్తము..అనేవి ఆ అంగములు.వీటిలో సంక్లిష్టమైనవి .. విరహమందు స్త్రీ కామాగ్నిచే దేహము తపించగా, ఆసనమందుండి ప్రాకృతభాషతో వ్యవహరించునది స్థితపాఠ్యము..నానావిధములైన నృత్తగీత వాద్యములతో మగవానివలె స్త్రీ వివిధ చేష్టలు చేయుట పుష్పగంధిక..వెన్నెలవేడి తాళలేక కామినులు సిగ్గువదిలి,తప్పుచేసిన ప్రియులనైననూ వెన్నాడుట ప్రచ్ఛేదకము.ముఖ ప్రతిముఖములు గలది,చతురశ్రమైన నడక గలది,భావరసములు శ్లిష్టముగా నుండు,విచిత్రములైన అర్థములు గలది ద్విమూఢకము.

ఇకపోతే..ఉద్ధతము మహేశ్వరుని ఆజ్ఞచే భట్టతండువు భరతమునికి చెప్పినది.అందువలన అది “తాండవము” అని వ్యవహరింపబడుతున్నది.దానిని ప్రాయికముగా ఉద్ధతమైన అంగహారములతో పురుషులే నెరవేర్తురు.

        జాయన:గురుదేవా..కేవలము కొన్ని స్త్రీలచేతనే,మరికొన్ని పురుషుల చేతనే నిర్వర్తించబడవలెనన్న నియమము ఎందుకు విధించబడినది.

 గుండన:ఏలననగా .. నాట్యక్రియలో కొన్ని శరీర పటుత్వ, శక్తి, సమర్థతా సంబంధ విషయములతో కూడిఉన్నవి.ఉదాహరణకు ..ఉద్ధత నృత్యములో ఎంతో దుష్కరమైన ప్రదర్శనను..అంటే గాలిలోకి పైకి ఎగిరి, గాలిలోనే పద్మాసనం వేసి,వెంటనే కాళ్ళను విడదీసి నేలమీద నిలుచోవడమో, కూర్చోవడమో చేయగల ‘ అంతరపద్మాసనం’,’ ఊరుద్వయ తాడితం ‘,’ లవణి ‘ వంటి సంక్లిష్ట భంగిమలను ప్రేక్షకులకందించి నర్తకుడు మన్నన పొందుతాడు.దీనికి బలిష్ఠమైన,సౌష్ఠవమైన,శరీరం,దారుఢ్యం అవసరం.

జాయప:ఆచార్యా..పరమ ఆసక్తికరమైన ఈ అంశములను వింటున్నకొద్దీ సముద్రాంతర లోలోతులను సందర్శిస్తున్న మహానందానుభూతి కలుగుతున్నది.నేనదృష్టవంతుడను.

     గుండన: అతి విసృతమైన నాట్యశాస్త్ర వివరాలు ఇంకెన్నో ఉన్నాయి జాయనా.26 రకముల శిరోభేదములు,36 రకముల దృష్టిభేదములు,స్థాయిదృష్టులు.సంచారి దృష్టులు,దర్శనరీతులు,పుటకర్మలు,భ్రూకర్మలు,నాసాకర్మలు,ఓష్ఠకర్మలు,68 రీతుల హస్తలక్షణములు,వక్షో,పార్శ్వ,జఠర,కటి,జాను,ఊరు,జంగా,పాదాంగుళీ కర్మలు,108 రకముల నృత్తకరణములు..ఈ విధముగా నృత్యశాస్త్రము ఒక అనంతాకాసము వంటిది పుత్రా.దీని అధ్యయనము తపస్సమానమైనది..ఉత్కృష్టమైనది.

 జాయన:ఈ మధుర శాస్త్రాన్ని మీనుండి ముఖతః వినే భాగ్యము నాకు కలుగడము నా పూర్వజన్మ సుకృతము ఆచార్యా.ధన్యుడను.

( రాజనర్తకి మాళవిక ప్రవేశము)

మాళవిక:ఆచార్య గుండనామాత్యులకు కాకతీయ సామ్రాట్టుల రాజనర్తకి మాళవికాదేవి ప్రణామములు.

     గుండన:ఆయుష్మాన్ భవ..చిరంజీవ.రా మాళవికా.ఈతడు జాయప…(పరిచయం చేస్తూందగా..)

మాళవిక:గణపతిదేవ చక్రవర్తులు మాకు విషయమంతా చెప్పి జాయనకు శాస్త్ర బోధన జరుపుతున్నపుడు మీతో సహకరించమని మమ్మల్ని అదేశించి ఉన్నారు.తమరి ఆజ్ఞ గురుదేవా.

 గుండన:జాయనా..కొద్దిరోజులు ఈ ప్రాథమికాంశాల చర్చ తర్వాత మన రాజనర్తకి మాళవికాదేవి స్వయముగా మూడు రకముల గతులు..అంటె నదక,ద్రుతము,మధ్యము మరియు విళంబితముల గురించీ,శుద్ధ సంకీర్ణ గతుల గురించీ ప్రదర్శించి అవగతపరుస్తుంది.

జాయన:సరే గురుదేవా..మాళవికాదేవి గారికివే మా నమోవాకములు.

మాళవిక: శివానుగ్రహ ప్రాప్తిరస్తు..చిరంజీవ.

     గుండన:ఈ నాటికీ పాఠం చాలు నాయనా..నీవిక విశ్రమించుము.

( తెర..)

జాయపసేనాని -1

OLYMPUS DIGITAL CAMERA

దృశ్యం :1

(క్రీ.శ. 1203వ సంవత్సరం . కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా తీరాంధ్రదేశంపై దండయాత్రను కొనసాగిస్తున్న క్రమంలో మల్యాల చాముండసేనాని సారథ్యంలో కృష్ణానదీ ముఖద్వార ప్రాంత”మైన తలగడదీవి, హంసల దీవి,  మోపిదేవి, నాగాయ లంక, అవనిగడ్డ మొదలైన వెలనాటి మండల క్షేత్రపాలకుడైన పృధ్వీశ్వరుని ఓడించి అతని సకల సంపదనూ, అనర్ఘ మణిమాణిక్యాలనూ ఓరుగల్లు కోశాగారానికి తరలించి అతని సైన్యాధిపతియైన పినచోడుని జయించి..దివి సీమను కాకతీయ సామ్రాజ్యంలో కలుపుకొనకుండా తన రాజనీతిలో భాగంగా  అయ్యవంశీకుడైన పినచోడున్నే సామంతరాజును చేసి రాజ్యమేలుకొమ్మని ఆదేశించిన క్రమంలో…,

పినచోడుని పరమ సౌందర్యవతులైన యిద్దరు కుమార్తెలు నారాంబ, పేరాంబలను వివాహమాడి…అతని ముగ్గురు పుత్రులలో ఒకడైన జాయపలో అజ్ఞాతమై ఉన్న ప్రతిభావ్యుత్పత్తులను గ్రహిస్తున్న సమయంలో..,

గణపతిదేవుని వివాహానంతర విజయవసంతోత్సవ వేడుకల వేదిక.,

పినచోడుని సామంతరాజుగా గణపతిదేవుని ప్రకటన…ప్రతిష్టాపన సందర్భం.

స్వాగత…మంగళధ్వనులు

                                                         పిన్నచోడనాయకుని   ఆస్థాన దృశ్యం:   

 వందిమాగదులు : రాజాధిరాజ .. కాకతీ సామ్రాజ్య రాజమార్తాండ .. శత్రుభీకర కదన వీరాధివీర .. కళాధురీణ .. ప్రతిష్ఠాపనాచార్య.. కదన ప్రచండ..చోడకటక చూఱకాఱ  శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తులుంగారికి  వెలనాటి  ఏలిక ద్వీపీలుంటాక .. దివిచూఱంకార .. అయ్యకుల సంజాత .. శ్రీ పిన్నచోడనాయక .. సకల అమాత్య,సైనిక నాయకజన, ప్రజా సమూహాల పక్షాన జయహో..విజయహో.. స్వాగతం . .సుస్వాగతం.

( వెనుకనుండి మంగళ ధ్వనులు వినిపిస్తూండగా గణపతిదేవుడు,తన ఇద్దరు నవ వధువులు నారాంబ పేరాంబ లతో వెనుక ఇతర పరివారంతో ప్రవేశం . గంభీరంగా మెట్లెక్కి , సింహాసనాన్నధిష్టించి ఆసీనుడై .. ఆస్థానంలో పరివేష్టితులై ఉన్న పిన్నచోడనాయకుడు, మల్యాల చాముండదేవుడు, కాటమ నాయకుడు తదాది బుధజన సమూహాలకు ప్రణామంచేసి కూర్చుని విరాజిల్లగానే .. స్వాగత గీతం..3 నిముషాలు)

జన హృదయ విరాజిత భోజా

వన వసంతకాంతులొలుకు రారాజా

స్వాగతం..తామ్రపురికి ఘనస్వాగతం

కళాధురీణా..కదన ప్రవీణా

యుద్ధవిద్యలలొ విక్రమతేజా

శతృసంహార..పురవరాధీశ్వరా

పరమ మహేశ్వర..మండలేశ్వరా       జన!!

కదన ప్రచండా..విభవ దేవేంద్ర

తిమిర మార్తాండ..లక్ష్మీ నిజేశ్వర

కాకతీరుద్ర..అరివీరభయంకర

గణాధీశ్వరా ..గణపతిదేవా           జన!!                          ( సాంప్రదాయ..కూచిపూడి పద్ధతిలో నిర్వహించాలి)

(గణపతిదేవుదు తన ఉన్నత సింహాసనం పైనుండి లేచి .. పినచోడ నాయునివైపూ.. అమాత్య .. సైనికాధిపతులవైపూ.. సభాసదులూ.. పురప్రజలందరివైపూ.. నిర్మలంగా చూస్తూ నిలబడి )

 గణపతిదేవుడు: ఈ నిండు పేరోలగంలో ఆసీనులైఉన్న తామ్రపురి పూర్వపాలకులైన చోళాధీశులు,పృధ్వీశ్వరులు,వారి సైన్యాధ్యక్షులు..ప్రస్తుతం కయ్యము విడిచి మాతో నెయ్యముతో వియ్యము గరిపిన పినచోడులుంగారికి..మావెంట యుద్ధములలో పాల్గొని మాకు విజయమును సాధించిపెట్టిన మా సేనాధిపతి మల్యాల చాముండదేవుడు,కాటమ నాయకుడు..తదితర ప్రముఖులకు..మేము మా సువిశాల కాకతీయ సామ్రాజ్యంలో దైవసమానులుగా సంభావించే మా ప్రజలతోపాటు ఈ రోజునుండి మహోజ్జ్వల వీర కాకతీయ సుభిక్ష పాలనలోకి ప్రవేశిస్తున్న మా ప్రియతమ వెలనాటి ప్రజలకూ..ఈ గణపతిదేవుని వినమ్ర ప్రణామములు.

ఈరోజు ఎంతో విశిష్టమైన సుదినము.దివిసీమను కాకతీయ సామ్రాజ్యాంతర్భాగంగా ప్రకటిస్తూ నిర్వహిస్తున్న ఈ విజయోత్సవ వసంత సభలో మేమొక విస్పష్ట స్నేహపూర్వక ప్రకటనను చేస్తున్నాము.ఇక ముందు అయ్యవంశీకులైన పినచోడులుంగారు ఈ వెలనాడు ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తులమైన మా పరిపాలనా విధానాలకు లోబడి ప్రజారంజకంగా,సుభిక్షముగా మా సామంతరాజు హోదాలో ఏలుబడిని కొనసాగిస్తారని ఈ నిండు ప్రజాసభలో సాధికారికంగా ప్రకటిస్తూ..అజ్ఞాపిస్తున్నాము.

పినచోడుడు: ధన్యవాదములు మహారాజా..మా జన్మ చరితార్థమైనది.ప్రజలను కన్నబిడ్డలవలె కాచుకునే మీ పరిపాలనా సూత్రములననుసరించి మేముకూడా మీ అజ్ఞాబద్దులమై జనరంజక పాలననందిస్తామని ఇందుమూలముగా మీకు సవినయముగా హామీ ఇస్తున్నాము.

 గణపతిదేవుడు:మల్యాల చాముండదేవుడుగారూ..ఒకసారి స్థూలముగా మన కాకతీయ పాలనా విధానాన్ని ఈ తామ్రపురివాసులకు తెలియజేయండి.

 చాముండదేవుడు:చిత్తము మహరాజా.రాజు అనగా ఒక కుటుంబమునకు తండ్రివలె తన సామ్రాజ్యములోని ప్రజలందరకూ సంరక్షకుడు మాత్రమే.ప్రజల ధన మాన ప్రాణ రక్షకుడై వారి నిత్యాభివృద్ధికోసం తపిస్తూ జనరంజకముగా అందరినీ సమదృష్టితో,సమన్యాయముతో ధర్మబద్ధంగా పాలించడమే కాకతీయుల విధానము.ప్రతి ఊరూ ఒక గుడితో,ప్రక్కనే పంటపొలాలతో విరాజిల్లే చెరువూ,తల్లి ఒడివంటి బడితో ప్రశాంతముగా వర్థిల్లడమే చక్రవర్తుల అభిమతము.గొలుసుకట్టు చెరువల నిర్మాణం మన సేద్యవిధానం.

 గణపతిదేవుడు:కాటమ నాయకా మీరు చెప్పండి.

 కాటమనాయుడు:చిత్తము మహాప్రభో.ప్రతి పౌరుడూ నైతిక విలువలు నిండిన జీవన విధానముతో ధర్మబద్ధముగా జీవిస్తూ సకల యుద్ధ విద్యలలోనూ,కళా రంగాలలోనూ,వృత్తి నైపుణ్యాలతోనూ పరిపూర్ణుడుగా వర్థిల్లడమే చక్రవర్తుల ఆకాంక్ష.

(ప్రజల జయజయ ధ్వానములు)

 గణపతిదేవుడు:ఇప్పుడు..ఈ దండయాత్రలో మా విజయానికి కారకులైన మా సేనాని మల్యాల చాముండదేవుణ్ణి మేము “ద్వీపలుంటాక”బిరుదుతో సత్కరిస్తున్నాము.ఎవరక్కడ..,

పినచోడుదు:ఏర్పాట్లు చేయబడ్డాయి మహరాజా..(చేయితో సైగ చేస్తాడు)

(మంగళ వాద్యాలతో..ఖడ్గమూ..హారమూ..కిరీటమూ తెస్తారు.గణపతిదేవుడు చాముండదేవునికి వాటిని ధరింపజేసి.,)

చాముండదేవుడు:మహాప్రసాదము మహారాజా.నా జన్మ ధన్యమైనది.మున్ముందుకూడా కాకాతీసామ్రాజ్య పరిరక్షణ బాధ్యతలో నా జన్మను పునీతం చేసుకుంటానని ఇందుమూలముగా ప్రతిజ్ఞ పూనుతున్నాను.

గణపతిదేవుడు:శెహబాస్ చాముండదేవా.ఇప్పుడు ఈ మా సామ్రాజ్య విస్తరణాయాత్రలో మాకు కుడి భుజముగా సహకరించిన మరో యోధుడు కాటమ నాయకుడిని మేము “దీవి చూరకార”బిరుదుతో సత్కరిస్తున్నాము.

(మళ్ళీ మంగళ ధ్వనులు…ఖడ్గము…ప్రదానము )

కాటమ నాయకుడు:నా జన్మ సార్థకమైనది మహారాజా.యుద్ధవిద్యలలో..రాజ్యవిస్తరణ వ్యూహ రచనలో అజేయులైన మా చక్రవర్తులకు బాహుసమానుడనై కంటికి రెప్పవలె నిరంతరమూ అహర్నిశలూ కాపలాదారుడనై ప్రవర్తిస్తాననీ,కాకతీ సామ్రాజ్య రక్షణలో నా జీవిత సర్వస్వాన్నీ ధారపోస్తానని ఇందుమూలముగా ప్రమాణము చేస్తున్నాను.

 గణపతిదేవుడు:భళా కాటమనాయకా భళా.నీవు మాకు నీడవే కాదు బహిర్ ప్రాణానివి కూడా.

ఈ విజయోత్సవ సందర్భంలో మేము ఇష్టపడి పవిత్ర వివాహ కార్యముతో మా దేవేరులుగా స్వీకరించిన మా సామంతరాజు పినచోడులుంగారి కుమార్తెలు నారాంబ మరియు పేరాంబలను మా కాకతీయ సువిశాల సామ్రాజ్య పట్టపురాణులుగా ప్రకటిస్తూ దివిసీమ ప్రజల ప్రేమమయ కానుకగా మా హృదయసీమలో భద్రపరుచుకుంటున్నాము.ఈ శుభ సందర్భముగా విజయోత్సవ సంరంభాలను ప్రారంభించవలసినదిగా మాచే నియమితులైన మా సామంతరాజు పినచోడులుంగారిని ఆదేశిస్తున్నాము.

 పినచోడుడు:చిత్తము మహారాజా..శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశాన్నీ,జాతినీ ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన కాకతీయ మహాసామ్రాజ్యములో ప్రజలకు సంప్రాప్తించినది స్వర్ణ యుగము..స్వర్గ యుగము.మీ ప్రజారంజక పాలనలో నన్ను మీ సామంతునిగా నియమించినందుకు ధన్యవాదములు.నిబద్ధతతో,నిజాయితీగా,మీ ఆజ్ఞాబద్ధుడనై ఈ వెలనాటి సీమను విధేయంగా పాలిస్తానని ఈ నిండుసభలో ప్రమాణము చేస్తున్నాను. మానవుల మధ్య ఉందదగు మానవీయ బంధమును మన మధ్య స్థాపించి మా  కుమార్తెలు నారాంబ,పేరాంబలను మీ ధర్మపత్నులుగా స్వీకరించి మా జన్మలను ధన్యము చేసినారు.ఇక మేము ఈ పవిత్రబంధమును ప్రాణముకన్నా మిన్నగా కాపాడుకుని మీకు వినమ్రులుగా ఉంటామనీ జీవితాంతం ఋణగ్రస్తులమై ఉంటామనీ వాగ్దానము చేస్తున్నాము.

ఇక ..ఈ విజయోత్సవ కార్యక్రమంలో భాగముగా..మొదట మా వీరులచే “ఖడ్గప్రహార ప్రదర్శన”,”శబ్దవేది”,”విలువిద్యా విన్యాసము”,సాహిత్య కళారంగాలలో అభిజ్ఞతగల పండితులచే జ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయబడ్డాయి.తమరి అనుమతికోసం నిరీక్షణ ప్రభూ.,

  గణపతిదేవుడు:కొనసాగించండి పినచోడ రాజా..మేమూ వీక్షించుటకు ఉత్సుకులమై ఉన్నాము.

  పినచోడుడు:దండనాయకా..వీరులను ప్రవేశపెట్టుము.

(మ్యూజిక్..కోలాహలం..ప్రజలు,వీక్షకుల హడవుడి..ఉత్సుకత..మొద11)

  గణ.దే: దేవీ నారాంబా..అక్కడ ప్రదర్శన క్షేత్రంలోకి ప్రవేశించి కళ్ళకు నల్లని వస్త్రమును ధరించి నిలబడి ఉన్న బాలుడు మీ సోదరుడు జాయపకదా.

  నారాంబ: ఔను మహాప్రభూ..అతను జాయపే…జాయప జన్మతః అద్భుతమైన ప్రతిభాశీలి.గజవిన్యాస శిక్షణలో,గజనియంత్రణలో..ఖడ్గప్రహార విద్యలో..ఇతరేతర సకల సైనిక యుద్ధవిద్యల్లో..ఆయుధ ప్రయోగకళల్లో అతను అజేయుడు.ఏకసంతాగ్రాహి.మా అందరి ఊహలకు మించి మహోన్నతంగా ఎదుగుతున్న పరాక్రమవంతుడు.

 గణ.దే: భళా..బాగున్నది..ముచ్చటైన రూపురేఖలు,నిండైన విగ్రహం..సౌష్టవమైన శరీరం..ఊ..

 పేరాంబ: జాయప ప్రత్యేకముగా ప్రదర్శించే “శబ్దవేది విద్య” ఎంతో ఆసక్తికరమై చూపరులను ఊపిరిసలుపకుండా చేసేది.ఎలా సాధన చేశాడో తపస్సువలె.

 గణ.దే:జాయప అక్కలిద్దరూ సృష్టికే అలంకారాలైన సౌందర్యరాసులైనప్పుడు తమ్ముడు వీరుడూ పరాక్రమశాలి కావడం సహజమేకదా..ఏమంటావు నారాంబా.

 నారాంబ:ఔనంటాను ప్రభూ..చక్రవర్తులెప్పుడూ ఉచితమే తప్ప అన్యము పలుకరుకదా.

( ప్రదర్శన కొనసాగుతూంటుంది..)

 పేరాంబ:ప్రభూ..వివాహానంతరం మేము చక్రవర్తులవెంట రావడం మిగుల ఆనందదాయకమే ఐనా..జాయపను విడిచి.. పన్నెండేళ్ళైనా నిండని మా తమ్ముని సాంగత్యాన్ని కోల్పోయి ఎడబాటును పొందవలసిరావడం కించిత్తు దుఃఖకరముగానే ఉన్నది.జాయన సాంగత్యం చంద్రునితో వెన్నెల వంటిది.

గన దే: ఉహూ..అలాగా..సోదర సాన్నిహిత్య మాధుర్యాన్నీ,వియోగ విషాదాన్నీ ఈ మహరాజు అర్థం చేసుకోగలడు దేవీ..చూడు,జాయన కళ్ళు మూసుకుని ఖడ్గచాలనానికి సిద్ధపడుతున్నాడు.

దండనాయకుడు:.సభాసదులారా.ఇప్పుడు సుశిక్షితుడైన ఒక ఖడ్గవీరునితో కళ్ళకు గంతలు కట్టుకుని పన్నెండేండ్లుకూడా నిండని “జాయన” శబ్దాధార ప్రహార నైపుణ్యంతో మనముందు వీరోచితంగా తలపడబోతున్నాడు..ఇది ఒక రోమాంచితమైన ప్రాణాంతక ప్రదర్శన..వీక్షించండి.

( కాహళి ధ్వని దీర్ఘంగా..క్రీడ ప్రారంభం..ఖడ్గముల కరకు ధ్వని..వీరోచితంగా మధ్య మధ్య కరతాళ ధ్వనులు..కేరింతలు..హాహాకారాలు..ఉద్విగ్నత..)

దండనాయకుడు: బాలవీరుడు జాయప ఖడ్గ చాలన విద్యానైపుణ్యాన్ని వీక్షించిన చక్రవర్తులకు,దేవేరులకు పురప్రముఖులందరకూ ధన్యవాదములు..ఇప్పుడు..వినోదార్థం..యువకిశోరం జాయప కొన్ని సంవత్సరాలుగా తనంత తానుగా వృద్ధిపర్చిన ఒక వింత జంతుభాషతో,హృదయంగమ సాన్నిహిత్యంతో గజసమూహాలతో మనముందు చిత్రమైన గజవిన్యాస క్రీడను ప్రదర్శిస్తారు.గజసాధకునిగా జాయప ఈ రంగంలొ అజేయుడు.

( గజ విన్యాసాలను లైట్ అండ్ షేడ్ పద్ధతిలో..మ్యూజిక్ తో చూపిస్తూ..సౌండ్ ను డిం చేస్తూ..,)

గణ.దే:(పేరాంబనుద్దేశ్యించి) మీ తమ్ములుంగారు ఈ విధముగా భిన్నమైన వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కలిగి విద్యావిశారదుడు కావడం మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నది..భళా.,

 పేరాంబ: అదంతా దైవ ప్రసాదిత నైపుణ్యమె ప్రభూ.శివాజ్ఞ.జాయన సాధన..కృషి..పట్టువిడవని తపస్సమాన దీక్ష నిజముగా శ్లాఘనీయమైనదే.ప్రతిదినము ప్రాతఃసమయములో రెండవజాముననే అతను చేపట్టే నిరంతర సాధన మమ్మల్నందరినీ అబ్బురపరుస్తుంది.స్వామీ..మీరన్నట్టు చిత్రమే అతని తత్వము..నైపుణ్యము కూడా.

( ఏనుగుల చిత్ర విన్యాసాల ధ్వని..కొనసాగింపు)

ధ్వనిమాత్రంగా..

దండనాయకుడు:పది ఏనుగులు గల ఈ కరిసమూహముతో జాయన వివిధ భంగిమలలో, భిన్న శ్రేణులుగా,పరిపరి పరిస్థితులలో శాంత..ప్రసన్న..ఉగ్ర..మహోగ్ర..ఉద్విగ్న పద్ధతులలో ప్రవర్తించు విధములను ప్రదర్శిస్తారు..వీక్షించండి..చకితులమౌతాం మనం.. ( సౌండ్..గజ క్రీడ..శబ్దాలు).లైట్స్ ఆన్.

గణ.దే: భళా..బాగున్నది.జాయనయొక్క గజ నియంత్రణ..సాహిణత్వం బహుదా ప్రశంసనీయముగా ఉన్నది.మేము ముదముతో పొంగిపోయితిమి…ఊ..తర్వాత.,

దండనాయకుడు:చివరి అంశము..మహాచక్రవర్తుల సమక్షమున పురుషులు మాత్రమే చేయు సంధ్యాసమయ శివతాండవ శృంగనర్తనమును జాయన ఇపుడు ప్రదర్శిస్తారు..పంచశక్తులైన పృథ్వీ,జల,వాయు,తేజో,ఆకాశ లింగ మూర్తులను స్తోత్రం చేస్తూ..పంచముఖ శబ్దాలతో సునిశితమైన ప్రణవ,ప్రణయ,ప్రళయ నాదాలతో కూర్చిన ఈ నర్తనం కరణ,చారీ,అంగ హారాల సంపుటీకరణతో మనల్ని చకితుల్ని చేస్తుంది.ఈ నాట్యగతిని జాయన తనకుతానుగా రూపొందించుకుని కూర్చిన కళగా మహాచక్రవర్తులకు నివేదించబడుతున్నది..తిలకించండి.

గణ.దే:ఊ..మహదానందముగా ఉన్నది..ఖడ్గ విద్య..గజపాలనా నైపుణ్యము..ఇప్పుడు నృత్తమా.?పరస్పర సంబంధమే లేని ఈ భిన్న కళారంగాలలో నిపుణత్వం నిజముగా విచిత్రమే..అనితర సాధ్యమే ఇది..(పారవశ్యంతో)

“నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం

భావాభినయహీనంతు నృత్యమిత్యభిధీయతే

రసభావవ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే”..

అనికదా తన అభినయ దర్పణములో నందికేశ్వరుడు నాట్య,నృత్త,నృత్యములను నిర్వచించినది. అంటే పూర్వకథాయుతమై,పూజనీయమైన నాటకమే నాట్యము.భావాభినయ హీనమైనది నృత్తము.రసభావవ్యంజనాది యుక్తమైనది నృత్యము ..అని అర్థము.కానివ్వండి..మేము మిగుల ఉల్లాసభరితముగా ఈ ప్రదర్శనను వీక్షిస్తాము.

( గజ్జెల చప్పుడు.శంఖ ధ్వని..మద్దెల..మహా మద్దెల..ఉడుక్కు..పెద్ద కంచు తాళాల మేళప్రాప్తి..మార్దంగికుని బీభత్స రసవిన్యాస క్రీడ.కొనసాగుతూండగా..జాయన రంగప్రవేశం.నర్తనం..ధ్వనిపూర్వక శ్రవణం..మధ్య మధ్య..గణపతిదేవుణి పారవశ్య వ్యాఖ్యలు..భళా..అద్భుతం..మహాద్భుతం..చప్పట్లు..కేరింతలు..నవ్వులు..శ్లాఘత..పరాకాష్టల కరతాళధ్వనుల కెరటం..ఒక ఉత్తుంగ తరంగం ఎగిసి శాంతించిన స్థితి..తర్వాత..నడుస్తూ జాయన తన దగ్గరకు రాగా., )

  గణ.దే:జాయనా..నీ శృంగనర్తనము అపూర్వము..భావ,రాగ,తాళ యుక్తముగా సాగిన శివతాండవము అపురూపము.ఈ వీరనాట్యములో నీవు శివరౌద్రావాహన జరిపిన తీరు మమ్మల్ని పారవశ్యుల్ని చేసింది.భళా..(తన ఇద్దరు భార్యలనూ,పిన చోడునినీ ఉద్దేశ్యించి) ఈ బాలుడు దైవాంశసంభూతుడు..జన్మతః ప్రధాన సృజన విద్యలలో పూర్ణుడైన ఈ బాలునకు సశాస్త్రీయమైన శిక్షణ ఉన్నచో యితడు ఈ సైనిక,కళా విద్యలలో ఎంతో వన్నెకెక్కి జగత్ ప్రసిద్ధి చెందుతాడు.ఇతనిలోని కళాభిజ్ఞతను మేము గుర్తించితిమి..దేవీ..జాయనను మనతోపాటు కాకతీయుల రాజధానియగు ఓరుగల్లు నగరమునకు వెంట తోడ్కొనిపోయి అచట ఈ కళారంగాలన్నింటిలో , యుద్ధవిద్యలలో, నిష్ణాతులైన శ్రేష్టులతో ప్రామాణికమైన, శాస్త్రీయమైన శిక్షణనిప్పించెదము .. పినచోడులుంగారూ, బాలుని మాతోపాటు పంపించి సహకరించండి.

  పిన చోడుడు: ధన్యోస్మి ప్రభూ.కృతార్థులము..మా జాయన భవిష్యత్తు మీ స్పర్శతో సూర్య సందర్శనముతో కమలమువలె వికసిస్తుందిక.సకల సన్నహములను కావించెదము.

 గణ.దే:రేపే ఓరుగల్లు మహానగరమునకు మా పయనము.చాముండ నాయకా..మన సేనా పరివారమును సంసిద్ధులను చేసి జాయనతోసహా మన ప్రస్థానమునకు ఏర్పాట్లు గావింపుము.

 జాయన:( పరుగు పరుగున మెట్లెక్కి వచ్చి గణపతిదేవునికి పాదాభివందనం చేసి..ఎదుట నిలబడి)ధన్యుడను మహారాజా..మీ కరునకు,శ్లాఘతకు పాత్రుడనైన నా జన్మ ధన్యము..ఆజన్మాంతము మీకు నేను ఋణగ్రస్తుడనై,విధేయుడనై ఉంటాను.

గణ.దే:భళా జాయనా..నీవు జన్మతః ప్రతిభాశీలివి..వినమ్రుడవుకూడా.అందువల్ల రానిస్తావు.మాకు జ్వాలలో కాంతివలె తోడుండి కొనసాగు..శుభం..శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

 జాయన:ధన్యులము మహారాజా..ధన్యులము.

(పిన చోడుడు,నారాంబ,పేరాంబలతో సహా..)

గణ.దే:శుభం..కాకతీయ మహాసామ్రాజ్యంలో ఒక భాగమై..దివిసీమ పినచోడుని సుపరిపాలనలో కలకాలం సకల సంపదలతో సంపన్నమై వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..సర్వం శుభం..సకలం సుభిక్షం..సెలవిక.

(గణపతి దేవుడు ప్రాంగణంనుండి నిష్క్రమిస్తారు.వెంట అనుచరగణం..తదితరులుకూడా నిష్క్రమిస్తున్న చిహ్నముగా ధ్వని..కాహళి శబ్దం)

” ఫ్రిజ్ లో ప్రేమ ” ” పూర్ణ విరామం ” పూర్తి నాటకాలు

friz

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

పాత్రల పరిచయం

దృశ్యం – 1                                                                                        దృశ్యం – 5

    పార్వతి                                                                                            పార్వతి

    ప్రసన్న                                                                                            ప్రసన్న

    పార్వతీబాయి                                                                                    పార్వతీబాయి

దృశ్యం – 2                                                                                         దృశ్యం – 6

   పార్వతి                                                                                              పార్వతీబాయి

    ప్రసన్న                                                                                             ప్రసన్న

    పార్వతీబాయి                                                                                     పార్వతి

దృశ్యం -3                                                                                          దృశ్యం – 7

    ప్రసన్న                                                                                             పార్వతీబాయి

    అతిప్రసన్న                                                                                        ప్రసన్న

    పార్వతీబాయి                                                                                     పార్వతి

దృశ్యం -4                                                                                           దృశ్యం – 8

    చంద్రుడు                                                                                             ప్రసన్న

    సూర్యుడు                                                                                            అతిప్రసన్న

    చంద్రుడు

    సూర్యుడు

దృశ్యం -1

( పార్వతీ (32) ప్రసన్న (35) ల ఇల్లు. ప్రసన్న తెల్ల కాగితాల కుప్పలో కూర్చున్నాడు. నోట్లో పెన్ను పట్టుకొని ఆలోచిస్తున్నాడు. పార్వతి ఫోనులో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ పచార్లు చేస్తుంటుంది. ప్రసన్న కాగితాలను చింపేస్తుంటుంది. )

పార్వతి: నేను పార్వతిని మాట్లాడుతున్నాను. అవునవును, కాదు.. కాదు, అవును.

ప్రసన్న: (రాస్తూ రాస్తూ తనలోతాను) నేను ప్రసన్నని రాస్తున్నాను. ఖచ్చితంగా ఏం రాస్తున్నానో తెలీదు. మధ్యలో ఎక్కడో ఒక పక్షం కోసం రాయడం రాదు.

పార్వతి: హలో… మొదటి ప్రశ్న జవాబు ‘అవును’, రెండవ ప్రశ్న జవాబు ‘కాదు’. అర్థమయిందా ? నాకిందులో ఏ confusions వద్దు. నాకు నచ్చదది. ఉంటాను మరి.

ప్రసన్న: ఎవరితో ఇంత clarity గా మాట్లాడేది ? కాస్త ప్రేమగా మాట్లాడొచ్చుగా పార్వతి ఫోన్లో. కనీసం ఫోన్లోనయినా.

పార్వతి: ప్రసన్నా, ఇవాళేం వారం ?

ప్రసన్న: మంగళవారం.

పార్వతి: నీకు తెల్సిందేగా. వారమంతా ప్రేమ వ్యక్తంచేయడానికి నాకు సమయం సరిపోదని. చూస్తుంటావుగా నేను పడేపాట్లు? ఇదంతా చేస్తూ కూడా ఆదివారం రోజు నీతో ప్రేమగా ఉంటానా లేదా? మన నిర్ణయమే కదా ఇది ? పూర్తి ఆదివారం అంతా నేనింకేపనీ చేయనుకదా ? అలా కాకుండా నేను వారమంతా నా పనులన్నీ ప్రక్కన పెట్టి ప్రేమిస్తూ కూర్చుంటే నా కుక్కలేం కాను ? చంద్ర-సూర్యులు ఏమయిపోతారు ?

( ఇంతలో తలుపు నుండి చంద్ర, సూర్యులు అనబడే రెండు కుక్కలు పరుగున వస్తాయి. ప్రసన్న చాలా భయపడిపోతాడు. పరుగెత్తుతాడు. అరుస్తాడు. చంద్ర పార్వతి కొంగు నోట్లో పెట్టుకొని  కూర్చుంటుంది. సూర్య ప్రసన్న వెనకాల పడుతుంది. ప్రసన్న అరుస్తూ ఇల్లంతా పరిగెడుతుంటాడు. పార్వతి పడీ పడీ నవ్వుతుంటుంది.)

పార్వతి:  సూర్య… సూర్య… మా సూర్య  మంచి వాడంట. రా.. ఇటొచ్చెయ్. ఎంత దుష్ట ప్రపంచంరా ఇది … నోరులేని కుక్క మీద కూడా కాస్త ప్రేమ చూపలేరు. రా… నా దగ్గరికి రా ( సూర్య పార్వతి దగ్గరికెళ్ళి నిల్చుంటుంది ) ఎవరంటారండి కుక్కలు మూగ జీవులని. ఏం మెచ్యురిటీ, ఎంత అర్థం చేసుకొనే గుణం.

ప్రసన్న: పార్వతీ, నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్, కనీసం ఈ చంద్ర-సూర్యులకి ఓ పట్టా వేసి గొలుసుతో కట్టెయ్. వాటికి నాలుగు ఇంజక్షన్స్ ఇవ్వు. వాటి గోళ్ళు కత్తిరించు. ఓ రోజు ఎప్పుడో అవి నా ప్రాణం తీస్తాయి.

పార్వతి: హ్హ… హ్హ… ప్రాణం తీస్తాయండీ. పట్టా అట, గొలుసు అట, ఇంజక్షన్స్ ఇవన్నీ వెధవ పెంపుడు కుక్కల లక్షణాలు. ఇవి స్వేచ్ఛాజీవులు. వాటి స్వేచ్ఛని పరిరక్షించడమే నా కర్తవ్యం. అది నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను.

( ప్రసన్న చెమటతో తడిసి ముద్దయిపోయాడు. భుజమ్మీది షర్టుతో మొహం తుడుచుకుంటూ నేలమీద కూర్చున్నాడు.)

ప్రసన్న: పార్వతీ, నాక్కాస్త ప్రేమనివ్వు.

పార్వతి: అలాగే ఇస్తాను, నేను కూడా కాస్త ప్రేమ తీసికొనే బయల్దేరుతాను. ఇవాళ చాలా పనులున్నాయి.

(ఆమె బ్లవుజు నుండి తాళంచెవి తీస్తుంది)

ప్రసన్న: ఫ్రిజ్ కి తాళం వేయాల్సిన అవసరం ఏమిటి? ఇంట్లో ఉండేది నేనొక్కడినే కదా. నీ ఈ అనుమానం నాకస్సలు  నచ్చదు.

పార్వతి: పోయిన ఆదివారం తాళం వేయడం మర్చిపోతే ఫ్రిజ్ లోని సగం ప్రేమ ఖాళీచేసావు కదా ఒకేసారి? మళ్ళీ ఆదివారం వరకు దాన్నెలా సరిపెట్టానో నా బాధ నాకే తెల్సు.

ప్రసన్న: (రుద్ధమయిన కంఠంతో) నాకు మరీ ఒంటరిననిపించింది. అమ్మా-నాన్నా, అందరూ బాగా జ్ఞాపకం వచ్చారు. ఇక ఉండలేకపోయాను. తెలీకుండానే ఫ్రిజ్ ముందుకెళ్ళిపోయాను. తలుపు తెరిచి చూద్దును కదా ఫ్రిజ్ లో అంతా ప్రేమే ప్రేమ. కాస్త గడ్డకట్టి ఎండిపోయినట్టుంది. కానీ చేతుల్లోకి తీసుకుంటే మెత్తని, చల్లని ప్రేమ. ఇంకేం రెండు చేతుల్తో తింటూ కూర్చున్నాడు. కడుపునిండా తిన్నాను. ఫ్రిజ్ ముందునుండి లేవడమే రాలేదు. కళ్ళమీదకి మత్తులా వచ్చిందనుకో.

పార్వతి: అదే మరి. భావనాలోకంలోకి వెళ్ళి బాధ్యతారహితంగా ప్రవర్తించడం! నాకస్సలు నచ్చదు.

ప్రసన్న: భావనా ప్రపంచంలో బాధ్యతారహితంగా ఉండకపోతే ప్రేమ తయారే అవదు మరి.

పార్వతి: ఇది కేవలం ఆదివారపు కార్యక్రమం, నీకెందుకు అర్థం కాదు ప్రసన్న… అరే జనాభా ఎంతగా పెరుగుతుందో చూస్తూ ప్రేమని యోగ్యమైన పరిధుల్లో వాడాలని తెలీదా ? లేకపోతే ప్రపంచంలోని ప్రేమ పది పన్నెండేళ్ళలో అయిపోవస్తుంది.

ప్రసన్న: బుల్ షిట్! నేను మరీ మరీ చెప్తున్నాను. భావనలోకంలో అందరూ బాధ్యతారహితంగా ఉంటేనే కావల్సినంత ప్రేమ నిర్మాణం జరుగుతుంది.

పార్వతి: అది ఆదివారం మాత్రమే. ఆరోజు తప్పితే నాకు మాత్రం సమయం లేదమ్మా. ఇలా ప్రతిరోజూ బాధ్యతారహితంగా ప్రవర్తించడం మీ కళాకారులకి కుదురుతుంది కానీ మాబోటి వాళ్ళకు కాదు. నీకేంటీ. కాలు కదపకుండా ఓ నాలుగొందల పేజీల నవల రాసేస్తే ఒకటీ, రెండు లక్షలొచ్చిపడతాయి ఇంటికి.

( సూర్య-చంద్రులు మొరుగుతుంటాయి)

పార్వతి: ఏయ్…. పదండి… ష్.. పదండి. కిందికెళ్ళండి ( అవి రెండూ వెళ్ళిపోతాయి.) నేనొస్తాను.

(పార్వతి లోపలికెళ్తుంది. ప్రసన్న ఉండచుట్టిన తన కాగితాలని ఏరుతుంటాడు. కళ్ళు తుడుచుకుంటుంటాడు. పార్వతి లోపల్నుండి రెండు చిన్న చిన్న గాజు గిన్నెలు తెస్తుంది. ఒకటి ప్రసన్నకిస్తుంది.ఒకటి తను తీసుకుంటుంది. ఇంతలో చంద్ర లోపలికొస్తుంది. పార్వతి దగ్గర మోకరిల్లుతుంది. పార్వతి దానికి తన గిన్నె నుండి కాస్తంత ప్రేమని ఇస్తుంది. ఫోన్ మ్రోగుతుంది. పార్వతి ఫోనెత్తి చంద్ర వీపుమీద గుర్రం మీద కూర్చున్నట్టుగా కూర్చుంటుంది. గదంతా తిరుగుతుంటుంది. ప్రసన్న మాత్రం ఆబగా గిన్నెలోని ప్రేమని నాకుతూ తింటుంటాడు.)

పార్వతి: హలో… నేను పార్వతిని మాట్లాడుతున్నాను. చెప్పండి అడ్వకేట్ దేశ్పాండే. అవునండీ… చారుదత్త కులకర్ణీమీద కేసు వేయలనుకుంటున్నాను. లేదు అతన్ని వదిలేది లేదు.మొన్నటి రాత్రి ఏదో డాన్స్ ప్రోగ్రాంకో,సినిమాకో వెళ్ళి రాత్రి ఒంటిగంటా రెండింటికి వస్తుంటే మా సందులోని ఒక కుక్క అతని స్కూటర్ వెనకపడింది. మనిషి కాస్త స్కూటరాపి పాపం ఆ కుక్కకి ఏం కావాలో చూడాలా? లేదా? ఆ పట్టున స్కూటర్ జోరుగా ముందు… ఆ వెనక ఈ కుక్క, దానిక్కాస్త కోపం వచ్చి అతని కాలిని కాస్త గీకినదనుకోండి. దానికి ఆ పెద్దమనిషి ఏం చేసాడో తెల్సా దేశ్పాండే, కర్రతో కొట్టాడా కుక్కని! Can you imagine ? ఎంత అమానుషమయిన హింసా ప్రవర్తన. నేనందుకే అతన్ని వదలదల్చుకోలేదు. కోర్టుకీడ్వాల్సిందే. లేదంటే ప్రక్కింటాయన అయితే మాత్రం, మూగజీవులని కష్టపెట్టే వాళ్ళను నేను క్షమించను. అవును. మీరు అన్ని కాగితాలు తయారుచేయండి. నేను మీ ఆఫీసుకే బయలుదేరుతున్నాను.

(పార్వతి వెనక్కొస్తుంది. ఆలోచిస్తుంది.)

పార్వతి: ప్రసన్న.. ప్రసన్న.. ఆ గిన్నె కిందపెట్టెయ్. అలా నాకుతావేంటి మొహంవాచినవాడిలా. ఆ… అయితే నేననేదేమిటంటే మనం ఇంటిపని కోసం ఓ పనమ్మాయిని పెట్టుకుందాం. ఇటు చూస్తే నా పనా పెరిగింది. ఇదివరకటిలా పని కుదరడం లేదు.

ప్రసన్న: సరే.

పార్వతి: సరే… వా.. !

(పార్వతీబాయి ప్రత్యక్షమవుతుంది. తొమ్మిది గజాల చీరకట్టు. తల్లో చేమంతిపూలదండ. ఓ దగ్గర కుదురులేని తత్వం.)

పార్వతీబాయి: నాపేరు పార్వతీబాయి. పనిమనిషిని. ఇల్లు తుడుస్తాను. బట్టలుతుకుతాను. కోయడం, చీరడం అన్ని చేస్తాను. రెండువేళలా టీ పెడతాను. పొయ్యి తుడుస్తాను. ఫ్రిజ్ శుభ్రం చేస్తాను.

పార్వతి: లేదు. ఫ్రిజ్ ని ముట్టుకోవద్దు. తక్కినవన్నీ చేయొచ్చును.

పార్వతీబాయి: సరే. నీ ఫ్రిజ్ ని ముట్టుకోను. నన్ను పనిలో పెట్టుకోండి.

ప్రసన్న: పార్వతీబాయి, అసలు నువ్వు మా ఇంటి వరకు ఎలా రాగలిగావు ? ఈ సందంతా వదిలేసిన కుక్కలమయంగా ఉంటుంది. అవి గురగుర మంటాయి. కరుస్తాయి. ఎట్లా వచ్చావ్ ?

పార్వతీబాయి: ఈ చేమంతిపూలదండ పెట్టుకుంటే ఈ ప్రాణులభయం ఉండదు. ఒంటె- గుర్రం-ఏనుగు- పిల్లి- ఎలుగుబంటి వీటన్నింటి నుండి ఏ భయము మోసమూ దరిదాపుల్లోకి రావు.

పార్వతి: విన్నావా ప్రసన్న… రేపట్నుండి నువ్వు ఓ చేమంతిహారం పెట్టుకుంటే పోలే…

ప్రసన్న: పార్వతీ, పరిహాసం చాలించు, పార్వతీబాయి నీ వివరాలేంటే? ఎక్కడదానివి. ఊరూ- పేరూ, కొంపా- గూడూ.. ?

పార్వతీబాయి: నేనో బీద- దరిద్ర- అసహాయ అబలని. కానీ నా చేతులకి వేగం ఉంది. ఈ చేతులకి రుచి ఉంది. చేతులకి పని ఉంది.

పార్వతి: నీ పరిచయం చాలింక. లోపలికెళ్ళి పని చూసుకో. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఫ్రిజ్ చుట్టు ప్రక్కలకి కూడా వెళ్ళొద్దు. ఈ అయ్యగారు రోజంతా కూర్చుని రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడడిగితే అప్పుడు చాయ్ చేసివ్వు. తక్కిన పనులన్నీ మామూలు ఇండ్లల్లోలానే, ఆ… ఇంకో విషయం. అన్నిళ్ళలో ఆదివారం సెలవు దొరుకుతుందేమో కానీ మా దగ్గర మాత్రం దొరకదు. ఆదివారం రోజు నేను ఇంటిని ఇంటిలా ఉంచాల్సి వస్తుంది.

పార్వతీబాయి: నాకర్థం కాలేదు.

పార్వతి: ఆదివారం వస్తే అదే అర్థం అవుతుందిలే.

(సూర్య చంద్రులు ఇంట్లోకి పరిగెత్తుకొస్తారు. ప్రసన్న భయపడతాడు అవి పార్వతీబాయి దగ్గరికెళతాయి. సౌమ్యంగా మారతాయి. చేమంతి వాసన వాటికి నిషానిస్తుంది. అవి నవ్వుతూ పార్వతీబాయిని చూస్తూ కూర్చుంటాయి. ప్రసన్న, పార్వతి ఆశ్చర్యచకితులయి పార్వతీబాయి వంక చూస్తుండిపోతారు. ఆమె సిగ్గుపడుతుంది.)

పార్వతీబాయి: ఛీ…. పొండి.. బాబూ!

(దీపాలు ఆరిపోతాయి)

దృశ్యం-2

(ఆదివారం శుభ్రమయిన బట్టలు వేసుకుని రాసుకుంటూ ఉంటాడు ప్రసన్న. ఫ్రెష్ గా సంతోషంగా, వేగంగా కాగితాలమీద ఏదో దించుతున్నాడు.)

(పార్వతి వస్తుంది.)

పార్వతి: ప్రసన్నా… ప్రసన్నా, కాస్త డబ్బిస్తావా? పార్వతీబాయితో కాస్త కూరగాయలవీ తెప్పించాలి.

ప్రసన్న: తీసుకో.. లోపల పర్సుంది. దానికడగడమేమిటి పార్వతీ?

పార్వతి: భోజనంలోకి ఏం చేయమంటారు?

ప్రసన్న: నీచేత్తో చేసిన పనసకూర తిని చాలా రోజులయింది. చేస్తావా?

పార్వతి: దాన్దేముంది చేస్తాను. చాయ్ తీసుకుంటారా?

ప్రసన్న: చాయ్ ఇస్తానంటే నేనెప్పుడన్నా వద్దంటానా?

పార్వతి: విన్నారా…. ఇవాళ మధ్యాహ్నం టీ.వీ.లో షోలే సినిమా ఉంది. తొందరగా భోజనాల కార్యక్రమం ముగించుకొని ఎంచక్కా సినిమా చూసేద్దాం. సాయంత్రం టీతో పచ్చి బఠానీల గింజెలు తాలింపు చేస్తాను.

ప్రసన్న: పార్వతీ… ఇదే. నా కవిత…. చదువుతాను విను.

పార్వతి: తర్వాత, నేను కాస్త వంటింట్లో పని సవరించుకొని టీ తీసుకొస్తాను. అప్పుడు చదివి వినిపించండి.

(ఆమె తొందరతొందరగా లోపలికెళ్తుంది.)

( పార్వతి లోపలికెళ్ళి పార్వతీబాయిని స్టేజి మీదికి తోస్తుంది. పార్వతీబాయి ప్రసన్న ముందుకొచ్చి పడుతుంది.)

ప్రసన్న: ఏమయింది పార్వతీబాయి ?

పార్వతీబాయి: ఎక్కడ ఏమీ కాలేదు. ఏమయిందవడానికి? అమ్మగారు ఏమో తను ఫ్రిజ్ శుభ్రం చేసుకుంటానన్నారు. క్రిందిది పైనా, పైనది కిందా పెడుతుంటారు. నన్నేమో బయటికెళ్ళి కూర్చోమన్నారు.

ప్రసన్న: పార్వతీబాయి, బజారుకెళ్తున్నవా? (whisper చేస్తాడు) నేనొకటి చెప్పనా ?

పార్వతీబాయి: నేనో బీద-దరిద్ర-అసహాయ-అబలని, మీరు పని చెప్పేవారు నేను వినేదాన్ని.

(ప్రసన్న దాచిపెట్టిన ఓ కవరు బయటికి తీస్తాడు. కాగితాల గుట్ట నుండి ఓ కాగితం వెదికి తీస్తాడు. పార్వతి చూస్తుందాలేదా అన్నది నిర్ధారించుకుంటాడు. ఆ కాగితాన్ని కవర్లో వేసి కవరుమీద నాలికతడి తగిలించి మూసేస్తాడు. పార్వతీబాయి ఇస్తాడు.)

ప్రసన్న: ఈ కవర్ తీసుకో… ఎవరితో చెప్పొద్దు… మన ఇంటి సందు మూలలో ఒక చెత్తకుండి ఉంది చూసావా…

పార్వతీబాయి: ఎక్కడా…?

ప్రసన్న: ఎర్ర రంగుది. గుండ్రంగా ఉంటుంది. ముందుభాగంలో ఇలా నల్లటి మొహంలా ఉంటుందే అది.

పార్వతీబాయి: సరే, అయితే ?

ప్రసన్న: ఈ కవర్ని ఆ కుండిలో వేసెయ్. ఎవ్వరికీ చెప్పకు. కానీ ఇంకా ఆ చెత్తకుండీ అక్కడే ఉందంటావా? ఆరేళ్ళ నుండి ఈ ఇంటి బయటికి వెళ్ళింది  లేదు నేను. ఈ కుక్కల భయంమూలంగా ఎక్కడికీ వెళ్ళింది లేదు. మా దగ్గరికీ ఎవరూ రారు. ఆ కుక్కలకి పెద్ద పెద్ద కోరలుంటాయి. మన కాళ్ళల్లోకి చేతుల్లోకి దిగబడతాయి. పది పన్నెండు కల్సి మొరుగుతుంటే సాయం కోసం మనం పెట్టే కేకలు మనకే వినబడవు. కళ్ళెర్రబడ్డ పిచ్చిపట్టి అసహ్యపు బరితెగించిన కుక్కలు!

పార్వతీబాయి :  నేనో  బీద _ దరిద్ర -అసహాయ- అబలని. మీదీ,  నాది అదృష్టమనుకోండి. నేనీ  ఇంటికొచ్చి  పడడం.  భయపడకండి. నేనేసేస్తానీ కాగితం చెత్తకుండిలో. అన్నా నేనో బీద పేద- దరిద్ర- అసహాయ- అబలని…. చిన్ననోటితో పెద్దమాటనుకోనంటే ఒకటడిగేదా….

ప్రసన్న: అడుగడుగు.

పార్వతీబాయి: మీరు పెద్ద రచయితలు. ఇల్లుదాటకుండా కూర్చుని ఈ బరితెగించిన కుక్కల గురించి రాస్తుంటారా? ఉర్కే! నాకు చదువొచ్చు. చదువుకున్నదాన్నే. పుస్తకాలు చదువుతాను. మీ పుస్తకాలిస్తారా చదవడానికి?

ప్రసన్న: తప్పకుండా ఇస్తాను, పార్వతీబాయి.

పార్వతి: (లోపలి నుండి వస్తుంది) పార్వతీబాయి… వచ్చేసావా బజారునుండి పనసకాయ తెచ్చావా?

పార్వతీబాయి: తెచ్చాను. ఇప్పుడే వచ్చాను బజారు నుండి. ఇదిగోండి పనసకాయ బజారంతా ఒకటే రద్దీ.

ఆదివారం కదా ఇవాళ! కొత్త కొత్త బట్టలేసుకొని తిరుగుతున్నారు జనాలంతా.

పార్వతి: ఆ… ఇవాళ ఆదివారం. పార్వతీబాయి, ఇవాళ చాలా పనిచేసావ్. ఇవాళ నీకు ఒకపూట సెలవు. ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రసన్నా, పదిహేను నిమిషాల్లో పనసకూర చేసేస్తాను. భోంచేసి కబుర్లు చెప్పుకుందాం. నీ కొత్త రచనలు వినిపించాలి. నేనొస్తానిప్పుడే…

(పనసకాయ తీసికొని వెళ్తుంది.)

(పార్వతి వెళ్తూనే సూర్య, చంద్రులు పరిగెత్తుకొస్తారు. అవి అతని కాగితాలని చెల్లాచెదురు చేస్తాయి.        చంద్ర పార్వతీబాయి చేతిలోని కవర్ తెసికొని పరిగెడుతుంది.)

(పార్వతీబాయి తలలోని చేమంతుల దండ తీసి సూర్యచంద్రులకి వాసన చూపిస్తుంది. రెండూ ఆమె కాళ్ళు నాకుతూ మోకరిల్లుతాయి. ఆమె చంద్ర నోట్లోని కవర్ తీసికొని దాన్ని ఓ గుద్దు గుద్దుతుంది. అది కుయ్యో మొర్రోమంటుంది. ప్రసన్న ఇదంతా భయంభయంగా చూస్తుంటాడు.)

పార్వతీబాయి: చచ్చిందానా, మళ్ళీ ఇలాంటి అల్లరి పని చేసావంటే ఒంటిమీద కిరసనాయిలు పోసి నిప్పంటిస్తాను. నువ్వురా…. సూర్య.. మాదర్చోద్, అన్ని కాగితాలని చిందరవందర చేస్తావా? సరిగ్గా పెట్టవన్నీ

… ఒక్క దగ్గర పెట్టు… (దాన్నీ కొడుతుంది.)

(సూర్య వెళ్ళి కాగితాలన్నీ సరిచేస్తాడు.)

పార్వతీబాయి: ఇప్పుడేమంటారు?  అన్న పేద్ద రచయిత. ఇంటికాలు బయట పెట్టకుండా ఏడు సముద్రాలు తాకి వచ్చినవారు. నేనూ చదువుకున్నదాన్ని. నేనాయన పుస్తకాలు చదివాను. ఆయన్ని బాధపెట్టకూడదు. ఆ… అయితే.. నాకిప్పుడు ఓమాట చెప్పండి (పార్వతి లోపలే ఉందని నిర్ధారించుకొని) ఫ్రిజ్ లో ఏముంది?

ప్రసన్న: (ఒకేసారి) ఫ్రిజ్ లో ప్రేమ ఉంది.

పార్వతీబాయి: పద… పదండి… బయటికి పొండి.

(చంద్ర, సూర్యులు వెళ్ళిపోతారు.)

( ప్రసన్న వైపుకి తిరిగి – )

అన్నా, నేనొస్తా. ఇవాళ ఆదివారం. సగం పూట సెలవు. నేనెళ్ళి మీ పుస్తకం చదువుకుంటాను.

(తలలో పూలదండ ముడుచుకొని ఉత్తరం తీసికొని వెళ్తుంది. ప్రసన్న మెడ త్రిప్పుతూ నవ్వుతాడు.)

(పార్వతి రెండు కంచాలు తీసుకొని వస్తుంది.)

పార్వతి: ప్రసన్నా… నేనొచ్చేసాను. ఇదిగో, వేడి వేడి పనసకూర.

(ప్రసన్నకి ప్రేమగా ముద్దలు తినిపిస్తుంటుంది.)

ప్రసన్న: కూర చాలా బాగా కుదిరింది పార్వతీ, నేనో గమ్మత్తు చెప్పనా నీకు.

పార్వతి: అయ్యో…. నేను కూడా చెప్పాలి నీకు ఓ గమ్మత్తు.

ప్రసన్న: అయితే మొదట నువ్వు…

పార్వతి: లేదు, లేదు. ముందు నువ్వు.

పార్వతి: ప్లీస్, ప్లీస్.. ముందు నువ్వు.

పార్వతి: సరేనమ్మా…

(ఆమె ప్రసన్న చెవిలో ఏదో చెబుతుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. ప్రసన్న ఆమె చెవిలో ఏదో చెపుతాడు. మళ్ళీ ఇద్దరూ నవ్వుతారు.)

(పార్వతి ఒక్కసారిగా లేచి నిల్చుంటుంది.)

(మొహం గంభీరంగా)

పార్వతి: సరే, పన్నెండయింది. ఆదివారం గడిచిపోయింది. సోమవారం మొదలయింది.

ప్రసన్న: పార్వతీ, కూర్చో పార్వతీ, ఐదు నిమిషాలు… మాత్రమే.

పార్వతి: కూర్చొనే సమయం లేదు బాబూ. ఇంటి నిండా అక్కడక్కడ అంతా ప్రేమ పడిపోయింది. అంతా ఒక్క దగ్గర చేర్చి ఫ్రిజ్ లో పెట్టాలి. చాలా పనులు ఉన్నాయి. ఇవాళ తెల్లవారుఝామున బయల్దేరాలి నేను. ఈ నోరులేని కుక్కల హక్కుల సంరక్షణ పరిషత్తు తరపున..

ప్రసన్న: ఎక్కడికి ?

పార్వతి: అందరమూ తిరువనంతపురంలో కలుస్తాం. ముందు లెనిన్ గ్రాడ్, తర్వాత స్టాలిన్ గ్రాడ్, ఆ తర్వాత బేల్ గ్రాడ్, ఆ… తర్వాత మాస్కో.

ప్రసన్న: ఓహో … అయితే ‘వాళ్ళు’ నడుపుతారా మీ సంఘటనని?

పార్వతి: లేదు. ముందు పూర్తిగా విను. మాస్కో నుండి వాషింగ్టన్, న్యూయార్క్, లండన్ లో కూడా ఒక పరిచర్చ ఉంది.

ప్రసన్న: వాళ్ళు కూడా ఉన్నారా మాలో?

పార్వతి: ముందు విను.. తిరిగి వచ్చే దారిలో బాగ్దాద్, తెహ్రాన్ లో కూడా పరిషత్తు సమావేశాలు ఉన్నాయి. ఈ మూగజీవుల కోసం పని చేసేవారిని దేశం, ధర్మం, రాజకీయాలు బంధించిపెట్టలేవు. బాగ్దాద్ నుండి పెద్ద సంఖ్యలో వేల కుక్కల్ని తీసికొని తిరిగి వస్తాము మేము. పండరిపురంలో చంద్రబాగానది తీరపు ఇసుక తిన్నెల్లో వాటిని వదిలివేస్తాం. వేలకొద్దీ కుక్కలవి, వేరువేరు జాతులవి, ధర్మాలవి, చంద్రభాగ ఇసుక తిన్నెలు

అదిరిపోతాయి. ఎంత బాగుంటుందో కదా ఆ దృశ్యం?

ప్రసన్న: అవునవును!

పార్వతి: నేనివాళ వెళ్ళి రేపొస్తాను. ఇల్లు జాగ్రత్త. నీమీద విశ్వాసంతో ఫ్రిజ్ తాళంచెవి నీకిచ్చి వెళ్తున్నాను. తాళంచెవి జాగ్రత్త. ప్రేమని జాగ్రత్తగా వాడు. అంతా ఖాళీ చేయకు. ఫ్రిజ్ కి మళ్ళీ జాగ్రత్తగా తాళంవెయ్. తాళం చెవి భద్రంగా దాచెయ్- ఏం?

ప్రసన్న: సరే… సరే. కంగారుపడకు. బేఫికరుగా వెళ్ళు.

(పార్వతి జాకెట్టులో నుండి తాళంచెవి తీసి ప్రసన్న చేతిలో పెడుతుంది. ప్రసన్న దాన్ని పిడికిట్లో పెట్టుకుంటాడు. దీపాలు ఆరిపోతాయి.)

దృశ్యం-3

(ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం వెదికి రాయడం మొదలుపెడతాడు. జేబులో నుండి తాళంచెవి తీసి కళ్ళముందు ఆడిస్తాడు. సంతోషపడి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు.)

(ఇంతలో బయటనుండి అతి ప్రసన్న ఇంట్లోకొచ్చి పడతాడు. పాకుతూ ప్రసన్న దగ్గరికి వస్తాడు. రక్తసిక్తమయిన బట్టలు, ఒళ్ళంతా గీరుకుపోయి ఉంటుంది.)

ప్రసన్న: అతి ప్రసన్నా… నువ్వా?

అతిప్రసన్న: అవును ప్రసన్నా.. నేను. నేనే. ఉత్తరం చేరగానే పరుగున వచ్చేసాను. ఎలా ఉన్నావు మిత్రమా?

ప్రసన్న: నేను… నేను బాలేను… అతి ప్రసన్నా…

(అతడి దగ్గరికెళ్ళి ఏడుస్తుంటాడు)

అతిప్రసన్న: ఇన్నేళ్ళుగా ఎక్కడున్నావ్? నీ గురించి మాకెవరికీ ఏమీ తెలియలేదు. అసలేం చేసావ్ ప్రసన్నా?

ప్రసన్న: అతి ప్రసన్న… నీకెన్ని దెబ్బలు తగిలాయి… ఎంత రక్తం పోయిందో! నిన్నా కుక్క కరిచిందా ఏమిటీ? ఇలా రా… నా దగ్గర కూర్చో రా..

(ప్రసన్న అతి ప్రసన్నని నేలమీద కూర్చోబెడతాడు. తను రాసుకునే కాగితాలని ఉండగా చుట్టి మెల్లగా రక్తాన్ని తుడుస్తాడు.

అతిప్రసన్న: మీ ఇంటి నాలుగు ప్రక్కల్లో ఈ వీధి కుక్కలే వందలకొద్దీ. నీకు కుక్కలంటే భయం కదా రాజా, చిన్నప్పట్నుండీ? మరెలా.. ఇక్కడెలా బ్రతుకుతావురా ? ఈ ఇంటి నుండి బయట ఎలా పడతావ్ ?

ప్రసన్న: (ఆగకుండా కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటాడు) గడిచిన ఎన్నో ఏళ్ళుగా నేనీ ఇంటి బయట అడుగుపెట్టింది లేదు. ఇక్కడికి ఎవరూ రారు. ఈ కుక్కలు రాత్రంతా ఒకదాంతో ఒకటి కొట్లాడుతుంటాయి. కరుచుకుంటాయి. నాకు నిద్రరాదు. ఎన్నేళ్ళగానో ఇంట్లో వాళ్ళెవరినీ నేను కలవలేదు. స్నేహితుల మొహం చూసి ఎరుగను.

అతిప్రసన్న: అయితే ప్రసన్నా, ఫోనయినా ఎందుకు చేయలేదు? నేనొచ్చేవాడిని కాదా నిన్ను తీసికెళ్ళడానికి ?

ప్రసన్న: నేనంతా సరిగ్గా చెప్పగలనా? నాకు విశ్వాసం కలగడం లేదు. కాస్త కాస్తగా చెపుతాను. ఈ మధ్య నాకు కేవలం రాయడం మాత్రమే తెలుసు. ఇరవైనాలుగు గంటలూ కాగితాల గుట్టముందు కూర్చుని రాస్తూ కూర్చుంటాను.

అతిప్రసన్న: (ఒక్కో ప్రతిని కళ్ళ దగ్గరగా తీసుకొని చూస్తాడు) రాగిరంగు… కుంకుమ పువ్వు రంగు.. పసుపు… వంకాయరంగు .. అన్ని రంగులూ రాస్తావు కదా నువ్వు? ఇదేంటో వేరుగా ఉంది. నీకు గుర్తుందా, కాలేజ్ లో ఉండగా రాత్రి రాత్రంతా జాగారం చేస్తూ ఏమేం రాసేవాడివో! అంతా ఆకాశంలా నీలమయం. ఓసారి ఏదో రాస్తూ కూర్చున్నావ్. మధ్యరాత్రి కాగితాలు అయిపోయాయి. నువ్వయితే టేబిల్, నేల, గోడలు, బట్టలు, అద్దం లాంటి వాటిమీద రాస్తూపోయావ్. నేను మరోరోజు నీ రూముకొచ్చి చూద్దును గదా, అంతా నీలమే.

ప్రసన్న: మనుషుల ప్రవృత్తి మారుతుంది. దానంతటదే..

అతిప్రసన్న: ఇంత పెద్ద మార్పా?

(ప్రసన్న తలవంచుకొని తల ఊపుతాడు.)

అతిప్రసన్న: బయటికి పద. బయట బాగుంటుంది. గత అయిదారేళ్ళలో లోకం చాలా మారిపోయింది.

ప్రసన్న: అంటే, ఏమయింది? చెప్పు సరిగ్గా.

అతిప్రసన్న: ఒకలాగే… దానంతటదే జరిగింది.

ప్రసన్న: దాన్లో గొప్పదనమేముందని?

అతిప్రసన్న: అంతా దాగుడు మూతలాట. ఒకళ్ళు బయటికి వెళితే మరొకరు లోపలికెళతారు.

ప్రసన్న: మన కాలేజ్ ప్రక్కనుండే ఆ పెద్ద గడిలాంటి ఇల్లు.

అతిప్రసన్న: అది పడిపోయింది.

ప్రసన్న: ఇంటి ముందటి నది ?

అతిప్రసన్న: అది ఎండిపోయింది.

ప్రసన్న: మరేముంది అంటున్నావ్?

అతిప్రసన్న: మనుష్యులు! బయట మనుషులున్నారు ప్రసన్నా. వివిధ రకాలు. వేరు వేరు తరహాలలో. తమదైన పధ్ధతిలో బ్రతికేవాళ్ళు. ఇంకొకళ్ళని బ్రతకనిచ్చే వాళ్ళు. ఈ కుక్కలకన్న నయమైన వాళ్ళు. పద… ఉన్నపళంగా.. నేను తీసికెళ్తాను నిన్ని బయటికి.

ప్రసన్న: లేదు. అది సాధ్యం కాదు. ఇన్ని కుక్కలు ఇంటి చుట్టూ ఉండగా నేను కిటికీ నుండి బయటికి తొంగికూడా చూడలేను.

అతిప్రసన్న: మీ ఇంట్లోవాళ్ళకి నీ భాష అర్థమవుతుంది కదా?

ప్రసన్న: కావొచ్చు.

అతిప్రసన్న: ఏదేమైనా నీకు నేనున్నానని గుర్తుంటుంది కదా ?

(ప్రసన్న ఏడుస్తూ తల ఊపుతాడు.)

(అతిప్రసన్న అతడిని దగ్గరికి తీసుకుంటాడు.)

ప్రసన్న: చాలా రోజుల తర్వాత బాగాన్పించింది. అడక్కుండా చాలా దొరికింది.

అతిప్రసన్న: అడక్కుండా? ప్రేమ ఏమయినా ఇచ్చే వస్తువూ, అడిగే వస్తువా ఏమిటి ? ప్రేమ ఉంటుంది. అదో ప్రవాహం. ఒక వైపునుండి మరోవైపుకి దానంతటదే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రేమనెవ్వరూ ఆపలేరు. నిలువ  ఉంచలేరు.

(ప్రసన్న నవ్వుతూ జేబులో నుండి తాళంచెవి తీస్తాడు. పడేస్తాడు. అంతలో సూర్య వచ్చి ఆ తాళం చెవిని మింగేస్తాడు. ప్రసన్న, అతిప్రసన్నల దృష్టికి రాదిది. సూర్య గప్ చుప్ గా పారిపోతాడు.)

అతిప్రసన్న: నువ్వు బయటపడే అవకాశం, గురివింద గింజంత అవకాశం వచ్చినా నన్ను పిలువు. ఫోన్ చెయ్. ఉత్తరం రాస్తూ కూర్చోకు. ఆ ఫోన్ ఎత్తి ఈ నెంబర్ నొక్కెయ్. నేనీ కాగితం మీద రాసి ఇక్కడ పెడ్తున్నాను. ఇది చూసుకో. ఈ నెంబర్ కలిపి ‘అతిప్రసన్న, వచ్చెయ్’ అను. నేను వెంటనే వచ్చేస్తాను.

ప్రసన్న: ఫోనులో నువ్వు నాకెంత కావాలో, ఎలా కావాలో తెలుస్తుందా నీకు? సమాచారం అంతా అందుతుందా?

అతిప్రసన్న: నీ పిలుపులో నాకంతా అందుతుంది. ఉత్తరం మాత్రం రాస్తూ కూర్చోకు.

ప్రసన్న: సరే.

( అతి ప్రసన్న గబుక్కున లేచి వెళ్ళిపోతాడు.)

( ప్రసన్న ఏడుస్తుంటాడు. కాగితాలని జరిపి అక్కడే నిద్రపోతాడు.)

( ప్రసన్న నిద్రపోతుండగానే పార్వతీబాయి వస్తుంది. చేతిలో పూలదండ. వెనకనుండి సూర్య పరిగెత్తుకుని వచ్చి ఆవిడ కాళ్ళు నాకడం మొదలెడుతుంది.)

పార్వతీబాయి: ఇవ్వు!

(సూర్య నోట్లో నుండి తాళంచెవి ఆవిడ ముందు పడేస్తాడు. ఆవిడ అత్యంత ఆనందంతో ఆ తాళం చెవిని తీసుకుంటుంది. ఆనందంతో చుట్టూ తిరుగుతూ పాట పాడుతుంటుంది.)

పార్వతీబాయి: ప్రేమలో పడేవాళ్ళూ…

ప్రేమలో పడేట్టు చేసేవాళ్ళూ..

ప్రేమలో మునిగితేలే వాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

తలక్రిందులుగా కాళ్ళు పైకిగా

భేటీ కార్డ్ అచ్చేసుకొనేవాళ్ళూ..

ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళూ..

సైటు కొట్టేవాళ్ళు…

నా చేతిలో ఏముందో తెల్సా ?

వేడిపాలపైన మెత్తమెత్తని మీగడ

కండోమ్ అమ్మేవాళ్ళూ…

ప్రసవం చేసేవాళ్ళూ…

అమ్మాయిని లేవదీసుకు వెళ్ళేవాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

సుధృడమైన కామధేను…

వీధి కుక్కల మేడం గార్లూ…

బద్దకించిన రచయితల్లారా..

నా చేతిలో ఏముందో తెల్సా ?

W , X మరియు Y

(కర్ణకఠోరంగా పకపకలుగా నవ్వుతుండగా దీపం ఆరిపోయింది.)

దృశ్యం-4

(రంగస్థలం మీద దీపాలు వెలిగేప్పటికి ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. చంద్ర సూర్యులు అతని ముందు కొంతదూరంలో కూర్చుని ఉంటారు. ముఖాల్లో శాంతి, బుద్ధిస్టు మాంక్ లాగా.)

(మోనాస్ట్రీలలోని కర్ర గంటలు అదేపనిగా మోగుతుంటాయి)

చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోరాదు.

చంద్ర: మధ్యలో ఎక్కడో…

సూర్య: మధ్యలో ఎక్కడో?…

చంద్ర: మారాలి.

సూర్య: పరివర్తనం

చంద్ర: కొత్త యుగం.

సూర్య: నాకు స్వేఛ్చ

చంద్ర: నాకుమల్లే

సూర్య: అధికారం మారుతుంది.

చంద్ర: ఆ… తెలుస్తోంది.

సూర్య: ఇది సమ్మతమేనా?

చంద్ర: ఇదో సంభ్రమం.

సూర్య: కారణం.

చంద్ర: ప్రామాణికత, యాజమాని పట్ల విశ్వాసం.

సూర్య: ఎవరు, ఎప్పుడు నిర్ణయించారు?

చంద్ర: యుగయుగాలుగా మనుషులు మన గురించి ఇదే చెప్తూ వస్తున్నారు.

సూర్య: మన ప్రామాణికతని మనుష్యులు నిర్ణయిస్తారన్నమాట… మనం కాదు! … మనుష్యులు వాళ్ళు చేయలేని పనులకు ఇంకొకళ్ళకి అప్పగిస్తారు.

చంద్ర: ఏమంటున్నావ్!

సూర్య: యోగ్యమైనదే.

చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు.

(కర్ర గంట)

సూర్య: పార్వతిబాయి…

చంద్ర: జై. ఒక సుందర శబ్దాన్ని ఉచ్చరించండి.

సూర్య: పార్వతిబాయి…

చంద్ర: జై.. ఒక సుందర శబ్దాన్ని ఉచ్చరించండి. జీవన అంతిమ సత్యం.. ఒక సుందర శబ్దం.. జీవన అంతిమ సత్యం..

సూర్య: (రెండు కుక్కలూ గట్టిగా మొరగడం మొదలుపెడతాయి.)

(ప్రసన్ననిద్రనుండిలేస్తాడు. నోటినుండికార్తున్నచొంగతుడ్చుకుని, చిన్నపిల్లాడిలాగాకాళ్ళుచాపిగట్టిగాఏడవడంమొదలుపెడతాడు).

దృశ్యం-5

(ప్రసన్న కాగితాలని జరిపి అలానే పడుకున్నాడు. పార్వతి ఇంట్లోకి వస్తుంది)

పార్వతి: చంద్రా, సూర్య… ఎక్కడి కెళ్ళార్రా అందరూ…. ప్రసన్న… (నిద్రపోతున్న ప్రసన్నని చూస్తుంది.) ప్రసన్న… లే…. లే…. దేశదేశాలు తిరిగి, పని చూసుకొని ఇంటికొస్తే, ఇదండీ ఇంటి వాళ్ళ ఉత్సాహం. నిద్రపోతున్నారు. ప్రసన్న….లే.

(ఓ మూలగా పడి నిద్రపోతున్న చంద్ర సూర్యులని చూస్తుంది.)

అయ్యో… ఇదేంటి, చంద్ర, సూర్య… లేవండి. పగలు వీళ్ళిద్దరూ పడుకోవడమేమిటి? మనుష్యుల ఛాయపడిందా ఏమిటి?

(ప్రసన్నకి మెలకువ వస్తుంది.)

ప్రసన్న: పార్వతీ… ను… నువ్వా, ఎప్పుడొచ్చావ్ ? నాకు నిన్నట్నుండీ కళ్ళు తిరిగినట్టుగా, తల దిమ్ముగా ఉంది.

పార్వతి: సరే… నీకెప్పుడెప్పుడు అలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఫ్రిజ్ అంతా ఖాళీ చేసేసావా? భగవంతుడా…. ఏం చేయాలి ఈ మనిషిని ?

ప్రసన్న: అపారమైన తాజాప్రేమ దొరికింది నాకు. ఆ ఫ్రిజ్ లోని గడ్డ కట్టుకపోయిన ప్రేమ పేరే ఎత్తకు నా దగ్గర. అట్టముక్కల రుచి అదీనూ.

పార్వతి: అపారమైన తాజా ప్రేమ…. ఎవరొచ్చారబ్బా నీకా ప్రేమ పంచడానికి? అబద్ధాలాడకు. తాళంచెవి ఇవ్వు ముందు.

(ప్రసన్న తాళం చెవి వెతుకుతుంటాడు.)

ప్రసన్న: నిన్ననేమో…. మనవాడొచ్చాక…

పార్వతి: ఎవరొచ్చాక ? ఎవరు?

ప్రసన్న: అతిప్రసన్న… చిన్నప్పటి నా ప్రాణమిత్రుడు.

పార్వతి: అనవసరపు నీ భ్రమ ఇది. ఇక్కడికెవరూ రావడం సాధ్యం కాదు. ప్రసన్నా తాళం చెవి ఇవ్వు ముందు.

(పార్వతీబాయి వస్తుంది. చేతిలో బట్టలుతికే సంకోరా, కాళ్ళకి కాన్వాస్ షూస్.)

( వచ్చీ రావడంతో సంకోరాతో నేల మీద కొడ్తుంది.ఆ చప్పుడుకి చంద్ర సూర్యులు లేచి ఇంటి బయటకి పరిగెడతారు.)

పార్వతీబాయి: తాళంచెవి కోసము వెతకడమెందుకు  పార్వతొదినా… ( పకపకా నవ్వుతుంటుంది )

పార్వతి : మూర్ఖత్వం   చాలించుకో , పార్వతీబాయి! దాన్ని  ఎందుకు  నేలకేసి   కొడతావ్? లోపలికెళ్ళి   పనిచూసుకో. మా మాటలమధ్యకి   రాకు. వెళ్ళు  లోపలికి  వెళ్ళు .

పార్వతీబాయి:  ఓ…  సోషల్ వర్కర్  నోర్మూస్తావా … కొంచెం  ( సంకోరాని  నేలమీద  కొడుతుంది ) నోర్ముయ్.తాళంచెవి కావాలా?  ఇదో .. ఇక్కడుంది .

(జాకేట్టులోనుంచి  తాళం  చెవి తీసి చూపిస్తుంది . మళ్లీ జాకేట్టులో  పెట్టేసుకుంటుంది .)

పార్వతి:  ప్రసన్నా …మూర్ఖుడా … తెలివిలేదా … తాళంచెవి  అక్కడికెట్లా  వెళ్ళింది ?

ప్రసన్న :  నాకు … నాకేమి  తెలియదు.

పార్వతీబాయి :  నీది  మూర్ఖత్వం .ఇది చేమంతుల  దండ  శక్తి . ‘ఫ్రిజ్ ముట్టుకోకు ఫ్రిజ్ ని  తాకకు’ అని నౌకర్ల  ముందు  వేలసార్లు అంటుంటే  వాళ్ళ దృష్టి దానిమీదకే పోతుందా , లేదా? నీకీమాత్రం తెలియకపోతే  ఎలా ? కుక్కలతో  ఉండి, ఉండి నీ మెదడూ అలానే తయారయింది. ముట్టుకుంటే విరుగుతుంది. ఫ్రిజ్ లో సంవత్సరానికి సరిపడే ప్రేమ ఉండి. నాకది తెల్సింది. నేనా అబలని, జన్మతః ప్రేమకోసం తపించేదాన్ని. తల్లి వదిలేసింది. మొగుడు వదిలేసాడు. నాకసలు ప్రేమే దొరకలేదు. ఇప్పుడందరి తలమీద కొట్టి మరీ ప్రేమ తింటాను.

పార్వతి: పార్వతీబాయి… మీరు.. మనందరం ప్రేమని సమభాగాలు పంచుకుందాం…

పార్వతీబాయి: ఏ… సోషలిస్ట్… అతి తెలివి చూపించొద్దు. నోరు మూసుకొని ఓ మూల కూర్చో. నోరు తెరిచావంటే చూస్కో. ఇంటి బయటికి వెళ్ళొద్దు. ఫిర్యాదు చేయొద్దు.

ఆ… అయితే అన్నా… మీరు… రాస్తూ ఉండండి… నేను చదువుతుంటాను… మీరు రాయడం… నేను చదవడం… మేరు రాయడం…

(సంకోరాని నేలమీద కొడ్తుంది.)

ప్రసన్న: పార్వతీబాయి… నువ్వు ఆ ఫ్రిజ్ తీసుకుపో, ఇదో… నేను రాసిన ఈ కాగితాలన్నీ తీసుకుపో… కానీ మమ్మల్ని వదిలెయ్.

పార్వతీబాయి: ఇద్దీస్కెళ్ళు… అద్దీస్కెళ్ళు. అరే… ఏం మగమనిషివయ్యా.. నేను కాయితాలు తీసుకెళితే, ప్రేమ తీసుకెళితే దేనిమీద బతుకుతావ్? ఏం రాస్తావ్? ఈ కట్టేసిన కుక్కలు… మొరిగి మొరిగి నీ బ్రతుకు బుగ్గి చేస్తాయి. అద్సరే, నువ్వు మాత్రం రోజూ రాస్తూ ఉండాలి. ఇవాళ్టినుండి నువ్విక నా ప్రైవేటు రచయితవి. నీ రచనలను, నిన్ను గౌరవించడం నా వంతు… నీకు గౌరవపూర్వకంగా రోజుకోసారి ప్రేమ దొరుకుతుంది. కానీ ఎప్పటికీ రాస్తుండాలి. తలెత్తకుండా.

పార్వతి: (లేచి పరిగెత్తుతుంది.) నేనిది భరించలేను. నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. సీబిఎమ్, ఇంటర్ పోల్, యుఎన్ఓ వరకు వెళ్తాను.

(ఆమె లేచి పరిగెత్తడం మొదలుపెట్టగానే చంద్ర సూర్యులు ఆవిడ మీదకెళ్ళి మొరుగుతుంటాయి. పార్వతి విస్తుపోతుంది. భయపడుతుంది. మూలకెళ్ళి ముడుచుకుని కూర్చుంటుంది. చంద్ర సూర్యులు మొరుగుతూనే ఉంటాయి. పార్వతీబాయి సంకోరా నేల మీద కొట్టి పకపకా నవ్వుతుంటుంది. చీకటి.)

దృశ్యం-6

(పార్వతీబాయి, చంద్ర వీపు మీద కూర్చుని గది చుట్టూ తిరుగుతుంటుంది. చేతిలో కాగితాలు. దాంతోపాటు గట్టిగట్టిగా పైకి చదువుతుంటుంది. పార్వతి ఓ మూల ముడుచుకుని కూర్చుని ఉంది. తలంతా రేగిపోయి ఉంది.ప్రసన్న చెమటలు కక్కుతూ కాగితం మీద త్వరత్వరగా అదేపనిగా రాస్తుంటాడు.)

పార్వతీబాయి: అన్న,సాయంత్రం వరకు నాకు యాత్రా వర్ణన రాసివ్వాలి. ఇవాళ అది చదవాలనే మూడ్ వచ్చింది.

ప్రసన్న: సాయంత్రం వరకా? కానీ పార్వతీబాయి… నేను గత ఆరేళ్లుగా ఈ ఇంటి బయటకన్నా వెళ్ళలేదే, యాత్రా వర్ణన ఏం రాయగలను?

పార్వతీబాయి: అట్లా అనకన్నా. ఇవాళ యాత్రా వర్ణన, రేపొక నవల, ఎల్లుండి ఒక నాటకం,ఆవలి ఎల్లుండి ఒక కావ్య సంగ్రహం.నాకు కావాలి అంతే. కావాలి. ఉండండి, మీకు నేనో గమ్మత్తు చూపిస్తాను.

(లోపలికి వెళ్తుంది. వాఙ్మయంలో నుండి ప్రేమ తెచ్చి ప్రసన్న ముందు పెడుతుంది.)

పార్వతిబాయి: తీసుకోండి. మన మధ్య, నీ నా మధ్య intellectual friendship.

(పార్వతి వాఙ్మయం  వైపు చేయి చాస్తుంది. పార్వతీబాయి ఆమె చేతి మీద చట్టున కొడుతుంది.)

పార్వతీబాయి: ఒళ్ళు జాగ్రత్త ఖబర్దార్.. ఇది అన్న వంతు ప్రేమ. ముట్టుకోవద్దు. అన్నా, నువ్వాగొద్దు. రాస్తూ ఉండు.

(పార్వతీబాయి మళ్ళి గది చుట్టూ తిరగుతుంది. కాగితాలు చదువుకుంటుంది. ఆ అవకాశం చూసుకుని ఆవిడ చూడకుండా ప్రసన్న కాసింత ప్రేమ పార్వతి కి ఇస్తాడు. పార్వతి ఆబగా తింటుంది. నవ్వుతుంది. ప్రసన్న ఆమె తల నిమురుతాడు.

పార్వతీబాయి ఉన్నట్టుండి తల పట్టుకుంటుంది. తనకి కళ్ళు తిరుగుతాయి. చంద్ర వీపు మీద నుండి పడిపోతుంది. చంద్ర పరుగున ఇంటి బయటికి వెళతాడు. )

పార్వతీబాయి : అన్నా …అన్నా …ఎంత  బాగా రాసావ్. చూడ్చుడు…. నేనేమైపోయానో  .స్పృహ కోల్పోతున్నట్టుంది .

(తల పట్టుకుని కూర్చుంటుంది . దీర్ఘశ్వాస తీసుకుని నవ్వుకుంటుంది .)

ప్రసన్న : పూర్తి మనసుపెట్టి చదువుతావు పార్వతీబాయి.నువ్వు తెలివైనదానిమల్లే అన్పిస్తున్నావే.

పార్వతీబాయి : నేను తెలివైనదాన్నా ..? నాకు చదువొచ్చని నాకు తెల్సు .కానీ తెలివైనదాన్నని ఇవాళే తెల్సింది .థ్యాంక్యు అన్నా .

ప్రసన్న :  పార్వతీబాయి, రాసి రాసి నా వ్రేళ్ళు వాచిపోయాయి .చేయి తిమ్మిరెక్కింది .నువ్వు అనుమతిస్తే కాసేపు రాయడం ఆపేయనా?

పార్వతీబాయి : మీ ఈ లక్షణమే నాకు అంతుపట్టదు .కళాకారులైన వాళ్ళు ఎలా ఉండాలి .ధీమాగా…మనసుకి తోచిన రీతిలో ఉండాలి. పూర్తిగా మస్తీలో మీదైన రీతిలో ఇలా అనుమతులడిగే రచయిత ఎందుకయ్యారు? పోనీ, మనం కబుర్లాడుకుందాం …మీ జీవితం గురించి మీరు నాకు చెప్పండి. మీ రచనలు ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవచ్చును .హృదయపు లోతుల్లోకి వెళ్ళి అప్పుడు ఆ రచనలు ఇంకా ఇంకా నచ్చుతాయి .

ప్రసన్న : నువ్వు నా రచనలు చదివి నేనేమిటో తెల్సుకుంటావు పార్వతీబాయి , తెలివైన  దానివి కదా !

పార్వతీబాయి : ఇంకా అంతగా తెలివి రాలేదు .కాబట్టి మీరు మీ గురించి చెప్పండి.. చెప్పండి.. తొందరగా చెప్పండి .

ప్రసన్న : రోజూ సాయంత్రం నా దిష్టి తీసేసే మా అమ్మ, ప్రతినెల ఒకటవ తారీఖున నా కోసం పుస్తకం కొని  తెచ్చే మా నాన్న .మా ఇల్లు.. దాన్లోని చిన్న చిన్న ఆనందాలూ , దు:ఖాలు మాకు సరిపోయేవి .మా ఇల్లు శాంతంగా ఉండేది .అమ్మ వంటింట్లో ఎంత పని అయినా చూడచక్కగా అమర్చి ఉండేది.బయట గేటు కాస్త కదిలి కుర కుర మన్నా ఆ చప్పుడు ఇంట్లోకి వచ్చేది .చిత్రాల్లోలా అంతా అందంగ ఉండేది కాదనుకో! కాస్త చిర్రుబుర్రులు ఉండేవి .అప్పుడప్పుడూ ఏడుస్తూ అమ్మ దేవుడి ముందు కూర్చునేది .నాన్న వరండాలో పచార్లు చేస్తూ కన్పించేవారు .కానీ హఠాత్తుగా ఎవరికీ తెలీకుండానే ఆ గొడవలు చిర్రు బుర్రులు ఏమయిపోయేవో ఎవరికి తెల్సు? మరురోజు అమ్మ చేతి చాయ్ రుచిని పొగుడుతుండే నాన్న దర్శనమిచ్చే వారు .అమ్మ ఉదయాన్నే ఎప్పుడూ నవ్వుతూ కన్పించేది

(పార్వతీబాయి గ్లానిలో గుర్రుపెడుతూ నిద్రలోకి జారుకుంటుంది)

వాళ్ళ ఆశలు, కోరికలు, పరిధుల్లో ఉండేవి. కాబట్టి తమకేదో పెద్ద బ్రహ్మజ్ఞానం తెల్సనీ, దాన్ని జనాల్లో పంచి, లోకోద్ధారణ చేయాలనే ఉద్దేశం వాళ్ళల్లో ఉండేది కాదు. కానీ మమ్మల్ని మాత్రం కష్టపడి మంచివాళ్ళుగా పెంచారు.

పార్వతి :  ప్రసన్నా… ప్రసన్నా… వెధవా ,ఆపేయ్ మీ అమ్మానాన్నల పురాణం . అటు చూడు తను నిద్రపోతుంది. (పార్వతి లేచి కూర్చుంటుంది ) సంకోరా శక్తితో అధికారం దొరుకుతుంది. కానీ తెలివి? ఇది అర్థం చేసుకొని నడవాలి. బుర్రలో తెలివి నింపుకోవాలి. ఈ పుస్తకాలు చదివే తెలివి తలకుందాని?

ప్రసన్న :   పార్వతీ….. కాస్త నోరు మూస్తావా…. శాంతంగా నేను చెప్పేది విను ….మనం ఇందులోంచి బయట పడాలి. అతి తొందరలో నాకో మార్గం తడుతుంది. నీకు నచ్చదు. కానీ అదొక్కటే మార్గం.

పార్వతి: ప్రసన్నా…. నన్నిక్కడి నుండి విడిపించు. నేనేం చేయడానికైనా తయారు.

ప్రసన్న:  నేను చెప్పింది చేస్తావా ?

పార్వతి:  అవును.

ప్రసన్న:  అవుననేముందు బాగా ఆలోచించుకో.

పార్వతి:  చెప్పు ప్రసన్నా. నువ్వేం చెయ్యమన్నా చేస్తాను. తొందరగా చెప్పు అది లేవకముందు ఏదో  ఒకటి చేసి తీరాలి. నా శరీరంలో శక్తి లేదు. లేచి నిలబడ్డం కూడా రావడం లేదు. నన్ను విడిపించు ఇక్కడ్నుండి.

ప్రసన్న:  అలాగైతే సరే , ఈ కాగితాల మీద అంతా రాసుంచి.

(కాగితాల గుట్ట నుండి ఒక కాగితం తీసి పార్వతికిస్తాడు .)

(పార్వతి చదువుతుంటూంది. ఏడుపు మొహం పెడుతుంది . అస్వస్థతతో అటు ఇటూ తిరుగుతుంది.

ఉన్నట్టుండి ప్రసన్నని కొడుతుంది .)

పార్వతి:  ఇంకే మార్గము లేదా?

(ప్రసన్న లేదని తలూపుతాడు.)

పార్వతి:  సరే నేను సిద్ధమే.

ప్రసన్న:  వా….చేతులు నీ ముందు జోడించాలి. పార్వతీ, ఇంత తొందరగా నీకిది నచ్చిందంటే ? ఏ నది          నీళ్ళు తాగి పెరిగావో కానీ!

పార్వతి:    బ్రతకడం ముఖ్యం ప్రసన్నా…. దాన్తరువాతే ఏదైనా.

(పార్వతి లేచి నిలబడే ప్రయత్నం చేస్తుంది .లేవలేదు .మూలుగుతూ పాక్కుంటూ ఫోన్ దెగ్గరికి వెళ్తుంది.పార్వతీబాయి నిద్ర పోత్తుందని ధృడపర్చుకుని నంబర్ డయల్ చేస్తుంది.)

పార్వతి : నేను పార్వతిని మాట్లాడుతున్నాను .ఒక ముఖ్యమైన సూచన ఇవ్వాలి. వెంటనే అత్యవసర పరిస్థితి ప్రకటించండి. పట్టణంలోని అన్ని వీధి కుక్కలను సేకరించండి. ప్రశ్నలొద్దు. రేపు ఉదయం వరకు పట్టణంలో ఒక్క వీధి కుక్క కూడా బ్రతికుండడానికి వీల్లేదు. దారులు, చెత్తకుండీలు, మోరీలు, ఊరి బయట బంజర్లు, కూరగాయల మండీలు అన్నింటినీ వెదికి పిండేయండి. చిన్న చిన్న పిల్లలను కూడా వదిలేది లేదు. సాయంత్రం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చెయ్యండి. (ఏడుస్తుంటూంది)వాళ్లకి చెప్పండి, కొన్ని అనివార్య కారణాల వల్ల పార్వతి సమాజసేవ నుండి విరమించుకుంటుందని చెప్పండి. ఇది నాకు దుఃఖదాయకమైన సమాజానికి మంచిదని చెప్పండి. నేనిది చేసినా సమాజం శ్రేయస్సుకోసమే చేస్తున్నానని చెప్పండి. ఇక ఉంటాను.

ప్రసన్న : గుడ్ ….ఇంకముందు జరిగేది నేను చూసుకుంటాను.

పార్వతి : ఇంకేం చూసుకుంటావ్ నువ్వు? పదేళ్లుగా చేస్తున్న పనికి తిలోదకాలిచ్చాను. తాళం చెవి ఎందుకు పోగొట్టావ్ ప్రసన్నా ? ఏం గతి మనది? మనకి నడవడం కూడా రావడం లేదాయెను. మన సాయానికి ఎవరొస్తారు? ఇక్కడ్నుండి ఎవరు తప్పిస్తారు?

ప్రసన్న : వస్తారు…. ఎవరో వస్తారు…. సరైన సమయం రానీ.

(బయట కాల్పుల చప్పుడు విన్పిస్తుంటుంది. కుక్కల కర్కశమైన మొరుగుళ్ళు – దీనంగా మూలుగులు. పార్వతి చెవులు చేతులతో మూసుకుంటుంది. ప్రసన్న భయంతో ఓ మూలకెళ్ళి కూర్చుంటాడు. తూటాలు తగిలిన చంద్ర సూర్యులు ఒక్కసారిగా స్టేజి మీదికి విసిరేసినట్టుగా పడతారు. పార్వతి కీచుమని అరుస్తుంది. అంతా చీకటి.)

 దృశ్యం-7

(దీపాలు వెలిగేటప్పటికి పార్వతిబాయి ప్రసన్నని, పార్వతిని తాళ్ళతో కట్టేస్తుంటుంది. ప్రసన్నవి కాళ్ళు మాత్రం కట్టేస్తుంది.)

పార్వతీబాయి : బంగారం లాంటి కుక్క​లు…. చచ్చాయి. నాకెంత సాయం చేసాయవి. నేను ఇవాళ ఈ స్థానంలోకి వాటి మూలంగానే రాగలిగాను. దేవుడు వాటి ఆత్మకి శాంతి ప్రసాదించుగాక.

అన్నా, పద…. రాయడం మొదలు పెట్టు.

ఆగొద్దు. భయపడొద్దు. ఈ తాళ్ళు కట్టడాలూ అంతా ఫార్మాలిటీ. ఇక్కడ కుక్కలు కూడా లేవు మీ మీద వాచ్ ఉంచడానికి. అందుకే మీ మీద నాకు పూర్తిగా భరోసా, నమ్మకం. కాకపోతే పార్వతొదినే, పోలీస్ బీలీస్ అంటే కష్టం.

ప్రసన్న : పార్వతీబాయి నువ్వివాళ బయటకెళ్ళావు  కదా?

పార్వతీబాయి : అయితే ఏమిటి?

ప్రసన్న : బయట ఏం ఏం జరిగింది? పట్టణంలో  ఏం ఏం జరిగిందో నాకు చెప్పగలవా?

పార్వతీబాయి : కళ్ళకి కనపడింది, నా బుర్రకి ఎక్కింది చెప్తాను. అంటే కుక్కలు లేవు దార్లలో.కాస్త శాంతంగా అన్పించాయి రహదార్లు. ఇంకా…. ఏంటబ్బా? తక్కిందంతా మామూలే. అన్నా, ఈ కుక్కలన్నీ ఒక్కసారిగా ఎలా చచ్చాయంటావ్?

ప్రసన్న: ఫై నుండి ఆర్డర్లు వచ్చుంటాయ్. ప్రభత్వ నియమాలు మారాయేమో.

పార్వతీబాయి : అన్నా…. ఇవాళేమో నా కోసం ఓ పాట వ్రాయి. నా కోసం ఎవరూ ఎప్పుడూ పాట వ్రాయలేదు. నేను మీ కోసం చాలా ప్రేమ తీసికొస్తాను.

(పార్వతీబాయి అటూ ఇటూ తిప్పుకుంటూ వెళ్తుంది.)

(ప్రసన్న నుదురు కొట్టుకుంటాడు. పార్వతీబాయి లోపల్నుండి పెద్ద గిన్నెలో ప్రేమ తెచ్చి ప్రసన్న ముందుంచుతుంది.  ప్రసన్నకి  తినిపిస్తుంటుంది. అతడు ఆబగా తింటుంటాడు.)

(ఇప్పుడు చెప్పు అన్నా… ఈ ఊపులో ఓ పాట కానీ? (ప్రసన్న గిన్నెని నాకి నాకి శుభ్రం చేస్తాడు. హుషారుగా అవుతాడు.)

ప్రసన్న​: పార్వతీబాయి…

పార్వతీబాయి: నేను నీకో ప్రేమలేఖ రాయనా?

(పార్వతీబాయి ఒక్కసారిగా నిల్చున్నది నిల్చున్నట్టుగా క్రింద పడిపోతుంది.)

పార్వతీబాయి: ఏమన్నారు? మళ్ళీ అనండి..

ప్రసన్న​: నేను నీకో ప్రేమలేఖ రాయనా? అని అడిగాను.

పార్వతీబాయి: (ఏడుపు మొదలు పెడుతుంది.) ఇంత వరకు నాకెవరూ ప్రేమలేఖ రాయలేదండీ! మీరే మొదటగా రాస్తుంది. నాకెన్నిసార్లు అన్పించేదో మిమ్మల్ని ప్రేమలేఖ రాయమని అడగాలని. మీరేమో ఇంత పెద్ద రచయిత​. ధైర్యం చాలింది కాదు. నా మనసులో మాట సరిగ్గా గుర్తించారు మీరు! నాదే తప్పయింది. నాదే తప్పయింది.

(ప్రసన్న కాళ్ళ తాడు విప్పేస్తుంది)

(ప్రసన్న కాగితం తీసికొని ప్రేమలేఖ రాయడం మొదలు పెడతాడు. పార్వతీబాయి మధ్య     మధ్యలో తొంగి చూస్తూంటుంది.)

ప్రసన్న​: ఏయ్… అలా మధ్యలో దొంగతనంగా చదవకూడదు.

పార్వతీబాయి: అలాగేలెండి. చూడను.

(దూరంగా వెళ్ళి నిల్చుంటుంది.)

ప్రసన్న​: ఆ…. ఇదో తీస్కో.

(పార్వతీబాయి పరుగున వెళ్ళి ఆ లేఖ తీసుకుంటుంది. చదువుతుంటుంది. అమితానందంలో ఆమె ఒళ్ళంతా వణుకుతుంటుంది. చెమటపడ్తుంది. స్పృహ  కోల్పోయి నేలమీద పడుతుంది.

(ప్రసన్న లేచి ఫోన్ దగ్గరికి పరిగెడతాడు. జేబులో నుండి కాగితం చూసుకొని నంబర్ డయల్ చేస్తాడు.)

ప్రసన్న​: హలో… అతి ప్రసన్న వచ్చెయ్!

(ద్వారంలో నుండి అతి ప్రసన్న వస్తూ కన్పడతాడు.)

అతి ప్రసన్న​: చుసావా… నువ్వు పిలవగానే వచ్చేసాను.

(ప్రసన్న వెళ్ళి అతి ప్రసన్నని కౌగిలించుకుంటాడు.)

ప్రసన్న​: నా ఉత్కృష్టమైన ప్రేమలేఖని చదివి స్పృహ కోల్పోయింది. ఎక్కువ సమయం లేదు పద​.

అతిప్రసన్న​: తాళం చెవి?

ప్రసన్న​: పార్వతీబాయి దగ్గరుంది.

(అతి ప్రసన్న వెళ్ళి పార్వతీబాయి జాకెట్టు నుండి తాళం చెవి తీస్తాడు.

(ప్రసన్న పార్వతి దగ్గరికెళ్తాడు. ఆవిడ అలసి డస్సిపోయింది. అతడు ఆమె తల నిమురుతాడు.)

అతిప్రసన్న: ప్రసన్నా, తొందరగా.. సమయం లేదు.

ప్రసన్న: లోపల ఖాళీ సంచులు ఉన్నాయి. నువ్వు ఫ్రిజ్ లోని ప్రేమంతా వాటిల్లో నింపేసి కట్టెయ్. నేను తయారవుతాను.

(అతి ప్రసన్న లోపలి కెళతాడు. ప్రసన్న ఓ కాగితం తీసికొని పార్వతి తలకట్టున కూర్చుని రాయడం మొదలు పెడతాడు.)

(అతి ప్రసన్న పెద్ద పెద్ద సంచులను ఈడుస్తూ స్టేజి మీదికి తెస్తాడు. చాలా పెద్ద సంచులు. ఆలసిపోతాడు.)

అతిప్రసన్న: ప్రసన్నా.. పద… ఫ్రిజ్ పూర్తిగా ఖాళీ చేసాను. పద త్వరగా. ఇప్పుడేం రాస్తూ కూర్చున్నావ్ ?

ప్రసన్న: ఉత్తరం రాస్తున్నాను. పార్వతికి… ప్రేమలేఖ.

అతిప్రసన్న: ప్రేమలేఖా …?

ప్రసన్న: అవును. మేమిద్దరం ఒకరి జీవితాల్లోకి ఒకరం ఎందుకొచ్చామో, ఎలా వచ్చామో తెలీదు. దానంతట జరిగినట్టుగా గడిచిపోయింది అంతా. కాకపొతే నేను తనని భరిస్తూ వచ్చాననుకున్నప్పుడు తనూ నన్ను భరిస్తూ వచ్చుండొచ్చుగా! ఆ విషయమై తనకెన్నో విషయాలు చెప్పాలి. అవే రాస్తున్నాను. జీవితం చాలా చిన్నది అతి ప్రసన్నా, దాన్లో ఈ ప్రపంచం మరీ చిన్నది. అందులో దానిది గుండ్రటి ఆకారం. అందులో తిరిగే మనుష్యులు తిరుగుతూ ఒకరి ముందుకు ఒకరు రావాల్సిందే. భవిష్యత్తులో ఎప్పుడయినా మళ్ళీ పార్వతి నా ముందుకొస్తే అప్పుడు మేం సమంజసంగా, శాంతంగా ఆ సమయం గడపగలగాలి. అందుకే రాస్తున్నాను.

(ఉత్తరాన్ని మడుస్తాను. పార్వతి చేతుల్లో పెడతాడు)

ప్రసన్న: ఇక్కడ్నుండి తీసికెళ్ళేవి ఇంకేమయినా ఉన్నాయా ?

ప్రసన్న: ఏమీలేవు. నిజం చెప్పాలంటే ఈ సంచుల్లో గడ్డకట్టిన ఆ ప్రేమ కుడా వద్దు. వెళ్తూ వెళ్తూ ఆ సంచుల్ని నదిలో విసిరేద్దాం. గొడవ ముగుస్తుంది.

(ఇద్దరు సంచులెత్తుకొని వెళ్తారు.)

(కొద్ది క్షణాలు చీకటి.)

(మళ్ళీ మసక వెలుతురు. పార్వతి లేస్తుంది. కూర్చునే ప్రయత్నం చేస్తుంది. తాడుతో కట్టేసి ఉండడం వల్ల కదలడం రాదు. చేతిలో ఉత్తరం కన్పడుతుంది. తీసి చదవడం మొదలుపెడుతుంది. ఏడుస్తుంటుంది. ఆ ఏడుపు ఆక్రందనకి పార్వతీబాయికి మెలకువ వస్తుంది. పార్వతీబాయి పార్వతి చేతిలోని ఉత్తరం చూసి సంతోషిస్తుంది.)

పార్వతీబాయి: ఓయమ్మ​.. పార్వతొదినా… ఏం చదువుతావ్? అన్న ఎక్కడికెళ్ళాడు? నా ఉత్తరం చదువుతున్నావా? నోర్మూసుకొని ఆ ఉత్తరం ఇచ్చెయ్. (Panic అవుతుంది.) నా తాళం చెవి? ఓరి దేవుడా! (లోపలికి పరిగెడుతుంది) అంతా ఖాళీ చేసి దోచుకెళ్ళారమ్మా (గుండెలు బాదుకుంటూ ఏడుపు మొదలు పెడుతుంది. పార్వతి మీది మీది కెళ్ళి…) ఉత్తరం ఇచ్చెయ్.. ఏం రాసుంది అందులో?

పార్వతి: పార్వతీబాయి, నీ ఉత్తరం కాదది. చదవకు. నీకు అర్థం కాదు. నీ వల్ల కాదు. నేను నిజం చెప్తున్నాను. మాట విను. మరొకరి ప్రేమలేఖ చదవకూడదు. అనర్థం జరుగుతుంది.

(పార్వతీబాయి ఉత్తరం తీసికొని నిలబడుతుంది.)

పార్వతీబాయి: ప్రియమైన పార్వతీ.. అంటే నేనే!

(ఉత్తరం చదవసాగింది. ఆనందం కలుగుతుంది. గడగడా వణుకుతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కళ్ళు తిరిగి నేలమీద పడి మరణిస్తుంది.)

(పార్వతి ఇది చూసి లేచి నిలబడుతుంది. అతి ప్రయత్నం తర్వాత చేతి తాళ్ళని విడిపించుకుంటుంది. లేవడానికి ప్రయత్నిస్తుంది. ఒంట్లో శక్తి సరిపోదు. మళ్ళీ క్రింద పడుతుంది. పాకుతూ పాకుతూ పార్వతీబాయి దగ్గరికి వెళ్తుంది. ఆవిడ కంటి పాపలని మూస్తుంది. పాకుతూనే లోపలికి వెళ్తుంది.)

పార్వతి: (బయటకొస్తూ)(బ్రతకడం ముఖ్యం… ముందుకెళ్ళడం ముఖ్యం. బ్రతకడం ముఖ్యం… అంతా అయిపోయింది… ఏం అయిపోయింది ?…(కుక్కలాగా పాకుతూ ఇల్లంతా తిరుగుతుంది) ఏం అయిపోయింది ?.. ప్రసన్న వదిలేసి వెళ్ళాడు.. ఫ్రిజ్ ఖాళీ అయిపోయింది. .పార్వతీబాయి చచ్చిపోయింది . ఒకటి .. రెండూ… ముడూ… సరే … బాగుంది. బ్రతకడం ముఖ్యం. ముందుకెళ్ళడం ముఖ్యం. ప్రసన్న వదిలేసి వెళ్ళాడు.. ఫ్రిజ్ ఖాళీగా ఉంది. పార్వతీబాయి చచ్చిపోయింది.. కానీ .. అయినా బ్రతకడం ముఖ్యం… ముందుకెళ్ళాల్సి ఉంటుంది. కొత్తలోకం, కొత్త ప్రేమ, కొత్త పొట్లాటలు.. మళ్ళీ ముందుకు!

(ఆమె ఇల్లంతా పాకుతూ తిరుగుతుండగా దీపాలు ఆరిపోతాయి.)

దృశ్యం 8

(ఖాళీ స్టేజ్ , ప్రసన్న కొత్త ఇల్లు. నేల మీద బద్ధకంగా దొర్లుతుంటాడు.)

ప్రసన్న :    ( వింగ్ నుండి చూస్తూ అరుస్తాడు .) అతిప్రసన్నా…. ఏం చేస్తున్నావక్కడ ? ఇక్కడికి రాకూడదూ.

అతిప్రసన్న: (వస్తాడు) ఊ…. ఁ అయితే ఎలా ఉంది కొత్త ఇల్లు? నచ్చిందా?

ప్రసన్న​: బాగుంది. ముఖ్యంగా, శాంతంగా ఉంది. అమ్మా-నాన్న ఇంట్లోలా ఇక్కడా పిట్టల కిలకిలలు విన పడతాయి.

అతిప్రసన్న: ఇక్కడ హాయిగా ఉండు .సుఖంగా ఉండు అనను నేను ,సుఖంగా ఉంటే నువ్వేం రాస్తావ్ ? నువ్వు రాయకపోతే మేం మంచి రచనలు చదవకుండా అయిపోతాం  కదా !అందుకే  నీ  బుఱ్ఱలో కోట్ల ప్రశ్నలు ఉద్భవించనీ, confusions  రానీ, కానీ హాయిగా ఉండు.

ప్రసన్న :     ఇదేం దుష్టతత్వం ?

అతిప్రసన్న :    (నవ్వుతాడు ) బజారుకెళ్తున్నాను. సామాన్లు తేవాలి . లిస్టు రాసాను. నీకేం కావాలో వద్దో చెప్పు ….

కాగితాలు ……సిరా?

ప్రసన్న:      ప్రస్తుతం ఇప్పుడే వద్దు . కానీ తెచ్చిపెట్టు . మధ్యలో ఎప్పుడో కావాల్సి వస్తుంది.

అతిప్రసన్న:  పప్పూ …. ఉప్పు….?

ప్రసన్న :  చాలా కావాలి.

అతిప్రసన్న :  నీకు నచ్చిన సంగీతం ?

ప్రసన్న :     ఇది అడగాలా  ఏమిటి ?

అతిప్రసన్న : ఓ. కె. ముఖ్యమైనవి అయిపోయాయి .ఇప్పుడు చిల్లర వస్తువులు ..పంఖా ?

ప్రసన్న:  నడుస్తుంది.

అతిప్రసన్న​: వాషింగ్ మెషీన్, వ్యాక్యూమ్ క్లీనర్ ?

ప్రసన్న: సరే కావలి.

అతిప్రసన్న:  వాటర్ ప్యురిఫయర్ ,గాస్ , గీసర్ ?

ప్రసన్న: ఆ ……. సరే .

అతిప్రసన్న: ఫ్రిజ్ ?

(ప్రసన్న ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు.)

ప్రసన్న:    వద్దు .ఇంట్లో ఫ్రిజ్ వద్దు. మనం రోజూ తాజాగా వండుకుందాం . రోజుది రోజుకే కానిచ్చేద్దాం . దేన్నీ మిగిలించి ,దాచడం వద్దు. దీంతో జీవితం సులభం అవుతుంది. అవునా?

అతిప్రసన్న : తప్పకుండా.

(అతిప్రసన్న,ప్రసన్న ఇద్దరి చేతులూ కలిసి  చప్పట్లు కొడతారు .)

( దీపం ఆరిపోతుంది .)

 -: సమాప్తం :-

పూర్ణ విరామం

పాత్రల పరిచయం

దృశ్యం-1

           మిత్రుడు

           ప్రసన్న

           శ్రేయ

దృశ్యం-2

           ప్రసన్న

           మిత్రుడు

           శ్రేయ

దృశ్యం-3

           మిత్రుడు

           ప్రసన్న

           శ్రేయ

దృశ్యం-4

          ప్రసన్న

          శ్రేయ

దృశ్యం-5

           ప్రసన్న

           శ్రేయ

దృశ్యం-1

ఎండాకాలం

(పట్టణంలో చాలా ఏళ్ళుగా వాడుకలో లేని అపార్ట్ మెంట్ లోని బయటి హాల్. ప్రసన్న కొత్త ఇల్లు.

ఎడమ వైపు నుండి లోపలి గదుల్లోకి వెళ్ళేందుకు స్థలం. గదిలో ఉన్న ఒకటీ అరా ఫర్నిచర్ మీద తెల్ల చద్దరు కప్పి ఉంచారు.

(దీపాలు వెలిగేటప్పటికి ప్రసన్న(26) అతని స్నేహితుడు (26) నడుం మీద చేతులుంచుకొని ప్రేక్షకుల వైపుకి మిత్రుడు వీపు పెట్టి నిలబడి ఉన్నారు. ప్రసన్న సామానంతా అస్తవ్యస్తంగా పది ఉంది- ఉన్పకెద్. లైబ్రరీ లేచివచ్చునట్టుగా అన్పిస్తున్న పుస్తకాల Boxes మరియు Abstract పెయింటింగ్స్- నీలం రంగువి.)

మిత్రుడు: (తిరిగి) అయితే- ఇదన్న మాట పరిస్థితి! విద్యుత్తు ఉన్నట్టే కనపడుతుంది, నీళ్ళున్నాయా ?

(ప్రసన్న ఇటు తిరుగుతాడు. సామాను నుండి ఓ పెయింటింగ్ తీసి ముందుగా అది అమరుస్తాడు. దేవుడ్ని పెట్టుకున్నట్టుగా, దాని ముందు తన మున్షీడెస్క్ పెడతాడు.

ప్రసన్న: అరే…. ఆ అమ్మాయి ఉంటుంది ఇక్కడ! లోపలి గదిలో. కరెంటు నీళ్ళు ఉండే ఉంటాయి? ఏం పేరబ్బా తనది!

మిత్రుడు: శ్రేయ.

ప్రసన్న: శ్రేయా! శ్రేయ, నువ్వుంటావిక్కడ; కాని ఇల్లు మాత్రం ఎన్నో ఏళ్ళుగా ఎవరూ లేనట్టుగా మూసేసినట్టుగా ఉంది. నీ గది తప్ప వేరే గదుల శుభ్రత పట్టదా? ఏంటీ ధూళీ… సాలెగూళ్ళు… ఛ.. ఛ… శ్రేయా this is not done . అయినా I know నీకు పనీపాటా ఉంటాయని. కాని కాస్త శుభ్రత! కొంచెం టిప్ టాప్ అమరిక? కాస్త తొందరగా లేవాలి, కాస్త ప్రొద్దున్నే! I am very sorry ఇప్పుడిక నాతో ఇలా కుదరదు. అంతే…. నేనొప్పుకుంటాను నాకేం ప్రొద్దున్నే లేచి పనికోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అయినా No …. not done .

మిత్రుడు: ఆమె వచ్చాక కూడా నువ్విలా మాట్లాడగలవని నీకన్పిస్తూంటే అది అబద్ధమని నువ్వు గమనించాలి.

ప్రసన్న: అవును. ఇది అబద్ధమే.

మిత్రుడు: నువ్వొప్పేసుకుంటావ్ అన్నీ, ఎందుకు? ఎందుకు పోట్లాడవ్ రా?

ప్రసన్న: (నవ్వి) ఇల్లు సర్దేద్దామా?

మిత్రుడు: వట్టిగా ఇలా సర్దేస్తే ఏం మజా? రోజుకొకటి సర్దుతూ పోవాలి.

ప్రసన్న: నాలుగేళ్ళలో మూడో ఇల్లు! ముంబాయిలో రెండోది. మళ్ళోసారి.

(మిత్ర లోపలి గదుల్లో అటూఇటూ పచార్లు చేస్తూ ఉండడంతో ప్రసన్న తనలో తానూ మాటాడుకున్నట్టుగా అన్పిస్తుంటుంది.)

ముంబాయి కొస్తున్న ప్రతిసారీ అన్పిస్తుంటుంది. జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరగబోతుందని ప్రతిసారీ అన్పిస్తుంటుంది నాకు.

మిత్రుడు: మన ఇల్లు, ఊరు కాకుండా ఇంకెక్కడయినా ఏం జరిగినా అది ఏదో ముఖ్యమైనదిగా అన్పిస్తుంటుంది మనకు.

ప్రసన్న: నిజమే…. అంతేనేమో…. కానీ మళ్ళీ తిరిగి ముంబాయి.

మిత్రుడు: అంతగా ఆలోచించకు. ఇప్పుడు చేతిలో మంచి పని ఉంది కదా!

ప్రసన్న: హ….

(ఇంతలో మిత్ర పుస్తకాలది ఒక కట్ట తీసి నేల మీద ఒకే స్థలంలో అదేపనిగా కొట్టుతూ ఉంటాడు.)

(ప్రసన్న కళ్ళ విప్పారించుకొని నేలమీదకి వంగి చూస్తూంటాడు. అలసిపోయిన మిత్ర ఆగుతాడు.)

మిత్రుడు: చీమ… చచ్చింది.

ప్రసన్న: నువ్వు…. నువ్వు  కూర్చో…. కాస్త శాంతంగా ఉండు. ఇవాళ మనమేం చేయబోవడం లేదు. రేపట్నుండి పని మొదలు.

మిత్రుడు: (చప్పట్లు కొట్టి) అయితే నువ్వెక్కడుంటావ్?

ప్రసన్న: నేను… ఇక్కడే బయటి గదిలో ఆమె లోపలి గదిలో ఉంటుంది కదా! బెడ్ రూమ్ లో ఒకటే. నీరజ ముందే చెప్పింది నాకు, ‘నువ్వు హాల్లో ఉండాల్సి వస్తుంది, ఏం ప్రాబ్లెం లేదు కదా?’ అని ప్రాబ్లెం ఏం ఉంటుంది? నేనదే అన్నాను. ఆమెనే అడుగు. శ్రేయని.

మిత్రుడు: అడిగిందా?

ప్రసన్న: అమెరికా నుండి నీరజ చెప్పింది శ్రేయకి ప్రాబ్లెం లేదని, అయితే నాకేం ప్రాబ్లెం లేదన్నాను భారతదేశం నుండి- అప్పుడు అంది నీరజ నీ ఇష్టం. నీ వీలు ప్రకారం షిఫ్ట్ అయిపోవచ్చును. హాయిగా ఉండవచ్చును. ముంబాయికి- అమెరికా నుండి

మిత్రుడు: నీకేమన్నా తెచ్చిచ్చేదా?

ప్రసన్న: వద్దు.

మిత్రుడు: అయితే నేను వెళతాను.

ప్రసన్న: వెళ్ళద్దు. నాకు ఒంటరిగా, ఏకాకి నన్పిస్తుందిరా. ఇంకా వీటన్నిటి అలవాటు అవలేదింకా.

మిత్రుడు: మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి కదరా! మళ్ళీ ఇల్లు వదిలి బయటికి రావడం అన్నది నీ నిర్ణయమే కదా?

ప్రసన్న: నువ్వు నాతో ఉండవచ్చుగా? ఇక్కడ. నాతో?

మిత్రుడు: పిచ్చా నీకు? పోనీ నన్ను. రేపొస్తాను మళ్ళీ.

(ప్రసన్న, కోపగించుకుంటాడు. కలందాన్ దగ్గరికెళ్ళి కూర్చుంటాడు. అతని కళ్ళల్లో నీళ్ళు.)

మిత్రుడు: ప్రసన్నా, ఒంటరిగా, వేరుగా ఉండడం అంటే నిజంగా వేరుగా ఒక్కడివి ఉండాలి. అంత romantic గా ఏమీ ఉండదది. కానీ ఆ అనుభవం కూడా చవిచూడు. బాగుంటుంది. చాలా వేరుగా కూడా ఉంటుంది.

ప్రసన్న: నాకిప్పుడు ఫిలాసఫీ వద్దు, నువ్వు కావాలి. ఇక్కడ.

(మిత్ర నవ్వి వెళ్ళిపోతాడు.)

(ప్రసన్న లేచి ఇల్లంతా తిరుగుతాడు. ఫర్నిచర్ మీది చద్దర్ తీసేస్తాడు. తన సామాన్లలోని ఒక పెయింటింగ్ తీసి చూస్తూ కూర్చుంటాడు. ఇంతలో ఇంట్లోని ఫోన్ మ్రోగుతుంది. ఆ ట్రింగ్ ట్రింగ్ చప్పుడు ఇల్లంతా మారుమోగుతుంటుంది. ప్రసన్న ఫోన్ కోసం వెతుకుతుంటాడు. దొరకదు, అతను చెవుల్లో వేళ్ళు పెట్టుకొని అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరుగుతుంటాడు.)

(శ్రేయ అటు తలుపు నుండి పరుగున వచ్చి ఫోన్ ఎత్తుతుంది (శ్రేయ (28-29) ఒంటిమీద లాంగ్ స్కర్ట్, వదిలేసిన జుట్టు, graceful నవ్వు మొహం.)

(ప్రసన్న అవాక్కయి ఆమె వైపు చూస్తూంటాడు.)

శ్రేయ: ఆ…. చెప్పమ్మా…. కాదమ్మా… ఖాళీ అవుతుంది.

ఆ…. ఇప్పుడే వచ్చాను.

(మౌత్ పీస్ మీద చేయి ఉంచి ప్రసన్నకి నేను శ్రేయ- శ్రేయ అని చెప్తుంది. నవ్వుతుంది. తిరిగి వాళ్ళమ్మతో మాట్లాడుతుంటుంది.

అవునమ్మా…. బాగున్నాను, అవును…. వద్దు…. ఎక్కడ? చూస్తాను…. వద్దు…. నిజంగా…. అమ్మా నేను చీరలు పంజాబి సూట్లు వేసుకోను. పడెయ్ అవి. లేకపోతే సక్కుబాయి కోడలికి ఇవ్వు. లేకపోతే పరదాలు కుట్టు వాటితో. అవును. చేస్తాను. ఆ….ఁ ఫోన్ పెడతాను. బై… (ఫోన్ పెట్టేస్తుంది.)

ప్రసన్న: హాయ్….

శ్రేయ: హాయ్ ప్రసన్నా… ఇవాళ నువ్వొస్తున్నావన్న విషయమే మరిచిపోయాను! welcome

ప్రసన్న: Thanks –

శ్రేయ: నీరజ చెప్పింది నాకు. నువ్వు harmless అని, కానీ నువ్వెలా harmless చెప్పు?

ప్రసన్న: ఆ…. నేను….

శ్రేయ: Anyways ! ఇల్లు నచ్చిందా?

ప్రసన్న: ఆ…

శ్రేయ: సారీ, నేను లోపలి బెడ్ రూమ్ ఆక్రమించేసుకున్నాను. నువ్విలా హాల్ లో….

ప్రసన్న: లేదు…. Its okay ఇక్కడ ఇల్లు సర్దేసుకుంటాను నేను. మంచి స్పేస్ ఇది. ప్రొద్దున్నే మంచి వెలుగు వస్తుందనుకుంటాను ఇక్కడ.

శ్రేయ: నువ్వు చిత్రకారుడివా?

ప్రసన్న: లేదు. నా కోసం ఎవరన్నా వేయాల్సిందే.

శ్రేయ: నువ్వు బాగా చదువుతావనుకుంటాను! ఎన్ని పుస్తకాలున్నాయ్. నీతో ఉండడం బాగుంటుందనుకుంటాను.

(ప్రసన్న ఆమె బోళాతనం చూసి మనస్పూర్తిగా నవ్వుతాడు.)

శ్రేయ: (బాగ్ లో నుండి కేక్ పాకెట్ తీస్తుంది.) తీసుకో. కొంచెం తిను. అలసిపోయుంటావ్ కదా? నేను నీ కోసం కూడా భోజనం తయారీ చూస్తాను.

ప్రసన్న: (కేక్ తింటూ) నువ్వు actress వి కదా?

శ్రేయ: ఆ….. అనొచ్చు అలా. ఈ మధ్యే కాస్త పని దొరుకుతుంది. ఐదేళ్ళు కావస్తుంది, ముంబాయి కొచ్చి. Usual struggle అందరూ చేయాల్సిందే. మరి నువ్వు ?

ప్రసన్న: నేను రాస్తాను. ఇంతకు ముందు కొన్ని Corporate  films కోసం రాసాను. కొన్ని నాటకాలు రాసాను. ఓ Ad Agency లో పని చేసేవాణ్ని. శ్రేయా…. ప్రస్తుతం నేనొక నవల ప్రారంభించాను. నా…. మొదటిది.

శ్రేయ: అయ్య బాబోయ్ ఇంత చిన్న వయసులో నవలా అవీ…. నీ పట్ల నా ఆదరం పెరిగిపోయిందనుకో. నీకు Publishers  దొరికారా ?

ప్రసన్న: ఆ…. second draft తో పని జరుగుతుంది.

శ్రేయ: నేనింట్లో లేనపుడు ఈ ఫోన్ మోగితే మాత్రం నువ్వెత్తొద్దు.

ప్రసన్న: ఎందుకు?

శ్రేయ: సాధారణంగా మా అమ్మ చేస్తుంటుంది ఫోన్. నేనిలా ఒక అబ్బాయితో Apartment షేర్ చేసుకుంటున్నానని ఆవిడకి తెల్సిందో…. నన్ను…. back to Pandharpur .

ప్రసన్న: No …. ఇది అసంభవం. మీది పండర్ పూరా?

శ్రేయ: అవును! అయితే?

(ప్రసన్న పెద్దగా నవ్వుతాడు.)

శ్రేయ: This is not done . అంటే మాదెందుకు పండర్ పూర్ కాకూడదు? అయినా నేను కాలేజ్ రోజులనుండి ముంబాయిలోనే ఉన్నానుకో; అయినా still ….

ప్రసన్న: I am sorry …. I am sorry …. మీ అమ్మానాన్న ఏం చేస్తుంటారు?

శ్రేయ: నాన్న హాస్పిటల్ కురుడ్ వాడాలో ఉంటుంది. సర్జన్ ఆయన. అమ్మ ఏం చేయదు. ఇంట్లోనే ఉంటుంది. నా గురించి బెంగ పడుతుంటుంది. మిగిలిన సమయం నా కోసం సంబంధాలు వెతుకుతుంటారు ఇద్దరూ! The point is , నువ్వు ఫోన్ ఎత్తకు.

ప్రసన్న: సరే………(ఆవలిస్తూ)

శ్రేయ: పెసరపప్పు వేసి కిచిడీ చేసేదా? ఈ మధ్యే ఇంటికెళ్ళొచ్చాను. కాబట్టి అక్కడి నుండి తెచ్చిన నెయ్యి కూడా ఉంది.

ప్రసన్న: మా అమ్మ పచ్చళ్ళూ, పొడులూ కట్టిచ్చింది. నచ్చితే నువ్వే తినేయ్.

శ్రేయ: ఇవాళ హాయిగా నిద్రపో……… రేపంతా సామాన్లు సర్దుతూ కూర్చో.

శ్రేయ: కాకపొతే…. నీతో అస్సలు కొత్తదనం అన్పించలేదు. నేననుకున్నాను…. ఎవరొస్తారో…. బేవార్సువాళ్ళనుకున్నాను సరే….. రేపు పాలతనికి లీటరు పాలు చెప్పు. నేను పనిమనిషిని పెట్టుకోలేదు. నీక్కావాలంటే….

ప్రసన్న: ఏంటి?

శ్రేయ: పనిమనిషి.

ప్రసన్న: వద్దు…. వద్దు. అవసరం లేదు.

శ్రేయ: సరే, నల్లా నీళ్ళు పదింటికి పోతాయి. లిఫ్ట్ మీద ట్యాంక్ ఉంది. దాని నల్లా రాత్రి తిప్పి పెట్టుకొని పదింటికి బంద్ చేయాలి. నేను రేపట్నుండి బెల్ కొట్టి నువ్వు తలుపు తీసింతర్వాతే లోపలికొస్తుంటాను. ఇప్పట్లాగా కాదు. Dont worry .

(శ్రేయ నవ్వుతూ kitchen వైపుకెళ్తుంది. గబగబా పని చేస్తుంటుంది.)

ప్రసన్న: ఇక్కడనుండి స్టేషన్ కాస్త దూరమే! నడిచి వెళ్ళొచ్చా?

శ్రేయ: నిజానికి ఇక్కడనుండి స్టేషన్ దూరమేననుకో; కానీ గట్టిగా నడిస్తే ఇరవై నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఇక్కడి గొప్పతనం ఏంటో చెప్పుకో చూద్దాం!

ప్రసన్న: ఏమిటి?

శ్రేయ: ఇక్కడ నీళ్ళు నిలబడవు.

ప్రసన్న: ఆహ…. ముంబాయి క్వాలిఫికేషన్స్ ఈ మధ్యలో మారుతున్నట్టున్నాయి!

శ్రేయ: ఇళ్ళ విషయమయితే అవును. మనుషుల విషయం తెలీదు.

ప్రసన్న: ముంబాయివాళ్ళు స్వతంత్రులు, ఒపికవంతులు, మనసు కష్టపెట్టుకోనివాళ్ళూ…. ఇంకా వీళ్ళే కదా?

శ్రేయ: More or less !

ప్రసన్న: నాకీ మూడూ లక్షణాలూ applicable కాదు. బాత్ రూమ్ ఎక్కడుంది?

శ్రేయ: ఇలా ఈ పాసేజ్ లో! All your …. నాది రూమ్ లో ఉంటుంది. Independent bathroom .

ప్రసన్న: శ్రేయా….

శ్రేయ: ఆ….

ప్రసన్న: నీ రూమ్ నుండి సూర్యాస్తమయం కన్పడుతుందా? ఈ వైపంతా తూర్పు పక్కగా ఉంది, ఇక్కడనుండి ఈ చెట్ల మధ్య నుండి సూర్యోదయం సరిగ్గా కన్పడదనుకుంటాను.

శ్రేయ: సూర్యాస్తమయం? I don ‘t know . నేనెప్పుడూ చూళ్ళేదు. పొద్దున్న వెళితే రాత్రికే కదా తిరిగొచ్చేది.

ప్రసన్న: సూర్యోదయం, అస్తమయం…. ఏ ఒక్కటయినా చూడాలి. కనీసం సూర్యాస్తమయం అయినా సరే!

శ్రేయ: నువ్వేదో శాంతినికేతన్ లేదా దక్షిణం వైపు కళారామం నుండి వచ్చినట్టు మాట్లాడతావేమిటి? నీకొకవేళ సూర్యాస్తమయం చూడాలనిపిస్తే వెళ్ళి నా రూమ్ కిటికీలో నుండి చూడొచ్చు. ఆ కిటికీ నాది కాదు కదా! కిటికీ కాదు…. అందులో నుండి కనపడే ఆ….ఁ అవన్నీ నా ఒక్కదానివి కాదు కదా!

ప్రసన్న: ఏదైనా సాయం చేయాలా?

శ్రేయ: వద్దు.

(ప్రసన్న సామాను నుండి sleeping bag రోల్ తీస్తాడు. అది పరుచుకొని దాని మీద ఒళ్ళు వాలుస్తాడు.)

ప్రసన్న: ఓ మాట అడగనా?

శ్రేయ: అడుగు.

ప్రసన్న: నువ్వింత relaxed గా ఎలా ఉన్నావ్, ఓ పరాయి వ్యక్తితో Apartment share చేసుకుంటూ కూడా?

శ్రేయ: ప్రసన్నా…. నీరజ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీరజ స్నేహితుడు ఎలా ఉంటాడో నాకు తెల్సు. రెండో విషయం ఏంటంటే…. ఈ ఇల్లు నీరజది. ఆ ఇంట్లో ఎవరు ఉండాలన్నది నిర్ణయించాల్సింది తను. మూడోది, ఎవ్వరైనా నాకింకేం నష్టం చేయగలుగుతారు అన్పిస్తుంది నాకు.

(శ్రేయ మాట్లాడుతూ ఉండగానే ప్రసన్నకి కునుకు వస్తుంది.)

Anyways – ఒక్కదాన్ని ఉండి చూడడం ఇలాంటి క్రేజ్ అయిపోయింది. బయటి గదిలో అయితే అవనీ…. ఇంకో living object ఇంట్లో ఉంది. మనం anchord అనుకుంటే కాస్త నయంగా ఉంటుందా లేదా? నువ్వు చెప్పు, ముంబాయి కెందుకు షిఫ్ట్ అయావ్? మీ ఇంట్లో ఎవరెవరుంటారు? ప్రసన్న….?

(అతడు నిద్రలో ఉంటాడు. సమాధానమీయడు. పని చేత్తోనే ఆమె అతడి దగ్గరికొస్తుంది. అతడు చిన్న పిల్లాడిలాగా ఒళ్ళంతా ముడుచుకొని పడుకొని ఉంటాడు. ఆమె చూస్తూండిపోతుంది.)

(కొన్ని క్షణాల అంధకారం.)

(మళ్ళీ కాస్త మసక వెలుగులో శ్రేయ లోపలనుండి దుప్పటి తీసుకొస్తుంటుంది. మధ్య రాత్రి, మెల్లిగా ప్రసన్నకి కప్పుతుంది. అతడు పొడిగా దగ్గుతాడు. ఇంతలో ఫోన్ గట్టిగా మ్రోగుతుంది. ఆమె పరుగున వెళ్ళి ఫోనెత్తి ఇనీరిరీచీలిజీ లో మాట్లాడుతుంది.)

శ్రేయ: హలో…. ఎవరూ? లేదు Its wrong number . I said its wrong number .

(దీపాలు ఆరిపోతాయి)

దృశ్యం-2

వర్షాకాలం

(స్టేజ్ మీద వెలుగు వచ్చే వరకు ప్రసన్న మున్షీ డెస్క్ దగ్గర కూర్చుని రాసుకుంటూ కనపడతాడు. ఫ్రెష్ గా)

ప్రసన్న: నేనీ మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు వారివారి జీవితాలతో, వాళ్ళతో నాకు సంబంధించినంతవరకు లాజిక్ కుదురుస్తుంటారు. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమయింది. నాకింకొకటి కూడా అర్థమయ్యింది. ఏంటంటే….

మిత్రుడు: …. నేనొక…. అర్థంకాని వాణ్ణి. అర్థం చేసుకోవడం కష్టమయిన మనిషిని అయుండాలి. నాలాంటి ఓ మనిషిని అర్థం చేసుకోవడానికి ఎంతయితే సమయం పడుతుందో అంత సమయం ఈ జగంలో ఎవరి దగ్గరా లేదు. ఇందులో వాళ్ళ తప్పు లేదు.

ప్రసన్న: (రాస్తూ) వాళ్ళ తప్పు లేదు. చేతిలోకొచ్చిన తాజా పుస్తకం లాంటి వాళ్ళు ఎదురొచ్చిన ప్రతి మనిషీనూ! వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి. పుస్తకమయినా, మనిషయినా!

మిత్రుడు: నాకా సమయం ఇచ్చేవారే ఎవరూ లేరు.

ప్రసన్న: అందుకే నాకీ మధ్య నేనంటేనే భయం పట్టుకుంది. చుట్టుప్రక్కల వాళ్ళ గురించి ఏమీ అన్పించదు.

మిత్రుడు: ఇక్కడి వరకు బాగానే ఉంది; కానీ ముందు ముందు తెలుగులో రాయడం కష్టం. ఇంత భావాత్మకంగా, ఉత్కృష్టంగా వీటిని మించి శారీరక సుందరత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు…. తెలుగులో కష్టం అవుతుంది.

ప్రసన్న: కానీ, ఎందుకు?

ఇద్దరూ: కాస్త ఆగుదాం.

(ప్రసన్న ఓ రెండు క్షణాలు అస్వస్థతగా కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత చేతిలోని కాగితాలని చింపి పడేస్తాడు. ఏడవడం మొదలెడతాడు. మిత్రుడు పరుగున వెళ్లి అతన్ని దగ్గరికి తీసుకుంటాడు.)

మిత్రుడు: ఏమయింది?

(ప్రసన్న ఏడుస్తూనే ఉంటాడు.)

మిత్రుడు: అన్నీ సర్దేసుకొని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చును. ఏదీ బలవంతంగా చేయాల్సిన పని లేదు ఎవరూ. మనం రాగానే మన వెనక తలుపులు మూసుకోలేదు.

(ప్రసన్న ఏడుస్తూనే లేదు లేదంటాడు.)

(కాసేపయిన తర్వాత కళ్ళు తుడుచుకొని ఏడవడం ఆపుతాడు; కానీ వెక్కిళ్ళు వస్తుంటాయి.)

మిత్రుడు: ఏ విధమైన బలవంతం లేదు. రాయాలన్న నిబంధన లేదు. సమయం నిర్దేశమూ లేదు. మనసుకెలా తోస్తే అలా…. కాబట్టి ప్రశాంతంగా రాయి.

ప్రసన్న: మంచినీళ్ళు.

(మిత్రుడు నీళ్ళు తేవడానికి లోపలి వంటగదిలో కెళతాడు. ఇంతలో ఫోన్ మ్రోగుతుంది. మిత్రుడు ఫోన్ వైపుకెళ్తుంటాడు. ప్రసన్న అతడికి వద్దు వద్దని చెప్పే అంతలో అతడు ఫోన్ ఎత్తుతాడు.)

మిత్రుడు: ఎవరూ మాట్లాడేది? శ్రేయ….

(ప్రసన్న పరుగున వెళ్ళి రిసీవర్ తీసికొని చిన్న పిల్లాడి గొంతులో మాట్లాడడం మొదలుపెడతాడు.)

ప్రసన్న: హలో…. హలో…. ఎవలూ…. ఎవరు మాటాడేదీ? నేనా…. నేను నీళ్ళు తాగుతున్నాను ఎవలూ? శ్లేయా…. శ్లేయక్క బజారు నుండి సీట్లు తేవడానికెల్లింది చాలా శ్లేయక్క ఆచ్చిపోయింది…. మీరూ పోండి.

(ఫోన్ పెట్టేస్తాడు.) (మళ్ళీ ఫోన్ మ్రోగుతుంది.)

హలో…. ఎవలూ మాటాడేది?

(ఫోన్ కట్ అవుతుంది. ప్రసన్న గట్టిగా నవ్వుతాడు. మిత్రుడు కూడా నవ్వుతాడు.)

మిత్రుడు: ఏంట్రా ఇదంతా?

ప్రసన్న: శ్రేయ వాళ్ళమ్మ ఫోన్ చేస్తారు. General …. watch ఉంచడానికి, నేనొచ్చిన రోజే శ్రేయ చెప్పింది ఫోన్ ఎత్తవద్దని. నేన్నీకు చెప్తూనే ఉన్నంతలో నువ్వు ఫోన్ ఎత్తేసావు.

మిత్రుడు: మరిప్పుడు?

ప్రసన్న: శ్రేయ చెప్పుకుంటుందిలే, ఏమైనా…. చూద్దాం!

(ఒక్కసారిగా ఇద్దరూ కాసేపటి వరకు Block అయిపోతారు.)

ప్రసన్న: మా అమ్మ ఫోన్ వచ్చింది ప్రొద్దున్న. నాన్నా కూడా మాట్లాడారు.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నా గురించి పడే బెంగ బయట పడనివ్వకుండా మాట్లాడారు. పోయినసారి మూటాముల్లె సర్దుకొని ముంబాయి నుండి తిరిగి వెళ్ళిన వాణ్ణి కదా! బెంగ పడడం సహజమే కదా? కానీ వాళ్ళకూ ఎక్కడో తెల్సిపోయింది నేనా ఇంట్లో ఉండలేనని…. వాళ్ళతో నాకేం గొడవ లేదు; పైగా నాతో నాకే గొడవ. ఈ మధ్య నేనిలా అసంబద్ధంగా మాట్లాడుతున్నానా ?

మిత్రుడు: నాకెందుకు కన్పిస్తుందలా?

ప్రసన్న: ఒక్క నాన్నకి మాత్రం నాకిక్కడేం ప్రాబ్లం లేదని అర్థమయిందనుకుంటాను.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నాన్నన్నారు, ‘వెళ్ళు! నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఏదో మంథనం జరుగుతుందని మాత్రం అన్పిస్తుంది. వేరే ఇంట్లో ఉంటే నువ్వు ముందుకెళ్తావ్ అనుకుంటే, అలాగే వెళ్ళు!’ కాకపోతే రాసుకునేందుకు అనువుగా నాకు వీలయిన వాతావరణం తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

మిత్రుడు: ఇక్కడనుండి సూర్యాస్తమయం కన్పిస్తుందా?

ప్రసన్న: శ్రేయ నడిగాను నేను. తన గదిలోని కిటికీ నుండి కన్పిస్తుంది. పద….

(ప్రసన్న, మిత్రుడు లోపలికెళ్తారు. స్టేజ్ కొన్ని క్షణాల వరకు ఖాళీగా ఉంటుంది. మిత్రుడు లోపట్నుండి బయటకొస్తాడు. హాల్లోని lamp shades ల్లోని bulb on చేస్తాడు. నీలం రంగు చిత్రం మీద వెలుగు. అతడు రాసిన కాగితాలన్నీ సరిగ్గా అమర్చి బొత్తుగా పెడుతుండగా ఒక కాగితం పెడుతు పెడుతూ ఆగుతాడు. ఆ కాగితం పట్టుకొని ధ్యాసగా చదువుతుంటుంటే అతడి మొహంలో ప్రసన్నని గురించిన ఆదుర్దా.)

మిత్రుడు: గబ్బిలం….

సరిగ్గా నా కిటికీ ఎదురుగా రెండు విద్యుత్ తీగెల మధ్య చిక్కుకుని ఓ గబ్బిలం చచ్చిపోయింది. రాత్రిపూట ఆ తీగెలకానుకొని విద్యుత్ ఘాతంలో పోయింటుంది. అప్పట్నుండి నాకు తెలీకుండానే అంతా తలక్రిందులుగా జరుగుతూపోయింది. ఆ తీగల మీది గబ్బిలం చాలా బాగుండేది. అందుకనే దాని ఫోటోలూ తీయబడ్డాయి. దాని శరీరం నుండి అతివేగవంతమైన విద్యుత్ ప్రవాహం జరుగుతుండడం మూలాన అది అతి మెల్ల మెల్లగా పాడవుతూ వచ్చింది. ఓ ఆర్నెల్ల పాటు నేను దాన్ని చూస్తున్నప్పుడల్లా అయోమయంలో రకరకాల భావాలకు గురయ్యేవాడిని. మూడు నాలుగు నెలల్లో మధ్యలో ఆకారం అంతా ఎండిపోయింది. బక్కచిక్కిపోయింది. కానీ ఆ తీగల మధ్య చిక్కిన నల్లటి రెక్కలు అలానే ఉండిపోయాయి. అంతా అయిపోవచ్చాక వర్షాకాలం దాన్లోని ఒక్క రెక్క మాత్రం రాలి పడింది. ఇంకో రెక్క మాత్రం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ అలాగే ఆ తీగలకి అతుక్కుని ఉంది. అది రాలడానికి ఇంకా సమయం పడ్తుందని నాకన్పిస్తుంది.

(మిత్రుడు చీకట్లో కనీకన్పడకుండా ఉండిపోతాడు. ఫోన్ మ్రోగుతుంటుంది. ప్రసన్న లోపలనుండి మెల్లిగా వచ్చి ఫోన్ ప్రక్కన శాంతంగా కూర్చుంటాడు. అతడి మొహం మీద అప్పుడే సూర్యాస్తమయం చుసిన ప్రశాంతత. ఫోన్ మ్రోగి మ్రోగి ఆగిపోతుంది. శ్రేయ ఇంట్లోకి వస్తుంది మెల్లగా.)

(అలసిపోయింటుంది.)

(ఒంటి మీద పూలపూల కాటన్ చీర. బొమ్మలా ఉంటుంది.)

శ్రేయ: ఎలా ఉన్నావ్? ఇంట్లోనే ఉన్నావా?

ప్రసన్న: నేనెక్కడికెళ్తాను?

శ్రేయ: సారీ, ఇలా లంచ్ ముగించుకొని వచ్చే నా అలవాటు మారదు.

ప్రసన్న: It doesn’t matter . అలసిపోయినట్టున్నావ్, చాయ్ పెడతాను.

శ్రేయ: పనెలా జరుగుతుంది? రోజంతా రాసుకున్నావా?

ప్రసన్న: ఆ….

శ్రేయ: అమ్మ ఫోన్…. నాకివాళ కాస్త ఆలస్యం అయింది.

ప్రసన్న: మీ ఇంటికి పక్కింటి చిన్న పిల్లాడు వస్తుంటాడు. మధ్యమధ్యలో ప్రక్కింటి వాళ్ళు అప్పుడప్పుడూ వాణ్ణి నీ దగ్గరుంచి వెళ్తుంటారు. నీకు పిల్లలంటే ఇష్టమని.

(శ్రేయ చురుక్కున చూస్తుంది.)

…. ఇవాళ ఆ పిల్లవాడు ఫోన్ ఎత్తాడు.

శ్రేయ: No …. ఏమంటున్నావు నువ్వు?

ప్రసన్న: పొరపాటున ఇవాళ నేను ఫోన్ ఎత్తాను.

(ఇద్దరూ గలగలా నవ్వుకుంటారు.)

శ్రేయ: ప్రసన్నా, ఒక గుడ్ న్యూస్.

ప్రసన్న: ఏంటి?

శ్రేయ: నాకివాళ ఒక ad assignment దొరికింది.

ప్రసన్న: Oh wow ! Great ! నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వివాళ ఈ చీరెందుకు కట్టుకున్నావా అని!

శ్రేయ: నాలుగు ఆడిషన్స్ తీసుకున్నారివాళ. మధ్యాహ్నం మూడున్నర వరకు నా షూటింగ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఉండమన్నారు. మళ్ళీ రెండు టెస్ట్ షూట్స్ తీసికొని మరీ ఈ న్యూస్ చెప్పారు.

రెండు నెలల కాంట్రాక్ట్. నా కన్నిటికన్నా ఇందులో నచ్చినదిదే. నేను చాలాకాలం వీటిల్లో ఇరుక్కుని ఉండలేననిపిస్తుంది.

ప్రసన్న: ఎందుకు?

శ్రేయ: ఏం లేదు.

(ప్రసన్న చాయ్ ఇస్తాడు.)

ప్రసన్న: ఇదేమన్నా బాగుందా? నీకింత మంచి assignment దొరికిన రోజు మన మిలా కూర్చుని చాయ్ తాగడం, ఏం బాలేదు.

శ్రేయ: పార్టీ కావాలా ? పోదాం పద బయటికి.

ప్రసన్న: బయటికా? బయటికెందుకు? కాస్తాగు.

(ప్రసన్న లేస్తాడు. సామాన్లనుండి ఒక CD వెదికి తీసి Player లో వేస్తాడు. Wild music వస్తూంటుంది. అతడు ఆమె ముందుకెళ్ళి తనని లేవమన్నట్టుగా సైగ చేస్తాడు. ఆ ఇద్దరూ ఒళ్ళు మరిచి నృత్యం చేస్తారు. ఇద్దరూ very graceful dancers . శ్రేయ ఒక్క క్షణం అలసిపోయి కూర్చుంటుంది. ప్రసన్న తన ముందు కూర్చుంటాడు. ఇద్దరూ నవ్వుతారు.)

శ్రేయ: పిచ్చా…. ఎంత మంచి music పెట్టావ్! నా అంత నేను….

(తనకు మాట్లాడడం రాదు.)

ప్రసన్న: కాసేపయాక మళ్ళీ చేద్దామా?

శ్రేయ: పిచ్చి పట్టిందా ఏమిటి? ఎంత బాగా డాన్స్ చేస్తావ్!

ప్రసన్న: నేను రాక పూర్వం, సాయంత్రం ఇంటికొచ్చాక ఏం చేసే దానివి?

శ్రేయ: అంటే….ఆ…. చెప్తా నుండు. నేను…. ఇలా వచ్చేదాన్ని.

(ఆమె లేచి గుమ్మం దగ్గరికి వెళ్తుంది. ఏం చెప్తూ ఉంటుందో అది చేసి చూపిస్తూ ఉంటుంది.)

నేనిలా వచ్చేదాన్ని సీదా లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఈ గదిలో ఆగేదాన్ని కాదు. అమ్మతో ఫోన్లో మాట్లాడేదాన్ని. తినాలనిపిస్తే తినే దాన్ని…. ఏదో ఒకటి తినేదాన్ని…. అటుకులు, మురమురాలు, పేలాలు ఈ గదిలో లైట్ కూడా వేసేదాన్ని కాదు. ఒక్కళ్ళం ఉన్నప్పుడు చిన్న గదుల్లోనే సురక్షంగా అన్పిస్తుంటుంది కదూ! చుట్టుప్రక్కల గదులన్నీ చీకటిగానే ఉంచేదాన్ని. ఈ గదులన్నీ లేవనుకొని లోపలి గదిలో మాత్రం దీపం ఉంచుకొనేదాన్ని…. ఒక్కటే…. ఏడ్చేదాన్ని.

ప్రసన్న: ఏడవడం దేనికి?

శ్రేయ: ఏడ్చేదాన్ని. ఒంటరి మనిషి. మాట్లాడతాడా, నవ్వుతాడా? కేవలం ఏడవడమే చేయగలదు. నువ్వెప్పుడన్నా ఒక్కడివి ఉన్నావా ?

ప్రసన్న: చాలాసార్లు.

శ్రేయ: చాలాసార్లు?

ప్రసన్న: ఆ…. ఆ తర్వాతేం చేసేదావి ?

శ్రేయ: రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దీపం ఉంచుకునేదాన్ని. లోపలనుండి తలుపు మూడు గడియలు పెట్టేసుకునేదాన్ని. నల్లాలన్నీ గట్టిగా కట్టేసేదాన్ని.

ప్రసన్న: చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా ఇంటి కందరూ వచ్చేవాళ్ళురా, బాబాయి పిల్లలు, మేనత్త పిల్లలు, మామయ్యగారి అబ్బాయి, అమ్మాయిలు అందరూ. రోజంతా ఎంత కొట్టుకొని తిట్టుకున్నా రాత్రయేసరికి అందరూ కల్సి ఒక్క గదిలో పడుకోవాలని ఆరాటపడేవాళ్ళం. ఎలాగోలా. ఎలా పడితే అలా పడుకునేవాళ్ళం మేం. ఒకరు తలుపు దగ్గరయితే, ఒకరు కిటికీ అరుగు మీద పడి నిద్రపోయేవాళ్ళం. నేనేమో ఇంతుండే వాణ్ణి. బక్క పలచగా. ఓ మూలకొదిగి పడుకునే వాణ్ని. కానీ అలా అందరం కల్సుండడం ఎంత బాగనిపించేదో, అలా గది నిండా మన వాళ్ళ మధ్య ఎప్పటికీ ఉండిపోవాలన్పించేది.

శ్రేయ: ఏమయింది మరి?

ప్రసన్న: ఏముంది, అందరం పెరిగిపెద్దవాళ్ళమయాం.

శ్రేయ: ఊ…

(కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉంటారు.)

శ్రేయ: (ఉన్నట్టుండి) ‘ఒక తప్పుడు సహవాసం కన్న ఒంటరితనం మేలు’ అనుకుంటూ అనుకుంటూ ఒంటరితనం అనుభూతిలోకి రావడం మొదలుపెడుతుంది.

(శ్రేయ అలసటగా తన మొహం మీద, జుట్టులో చేతులు కప్పుకొంటుంది.)

ప్రసన్న: మధ్యాహ్నం వంట ఎక్కువ చేసిపెట్టాను. పద, భోంచేద్దాం.

(ప్రసన్న kitchenett వైపుకి వెళ్తాడు. శ్రేయ అతడు రాసిన కాగితాలు పరిశీలిస్తుంటుంది.)

శ్రేయ: ఏంటీ వాక్యం…. ఇంత పొడుగ్గా.

ప్రసన్న: చాలాసార్లు నేను పూర్ణవిరామం మర్చిపోతాను వాక్యం చివరలో. శ్రద్ధగా చదువు. నిజం చెప్పాలంటే, ప్లీస్…… ఉండనీయ్ ఇప్పుడు చదవడం. దానిమీద ఇంకా పని కావాల్సి ఉంది. ఇంకా మార్పులూ, చేర్పులూ ఉన్నాయి.

శ్రేయ: ఈ పరిమళ్ పశ్చిమానికి వెళ్ళాడూ అంటే విదేశాలకు వెళ్ళాడనా ?

ప్రసన్న: పెట్టెయ్ శ్రేయా, Please .

శ్రేయ: సర్లే, పెట్టేస్తాను. ఇంతకీ నీ నవలలో ఏం రాస్తున్నావ్ ?

ప్రసన్న: నా వల్ల కావట్లేదు. ఇవాళ చెప్పుకోదగ్గ పని జరగనే లేదు. రాయలేకపోయాను అనుకున్నట్టుగా!

(అతడు భోజనం పళ్ళాలు తెస్తాడు. ఇద్దరూ మౌనంగా తలలు వంచుకొని తింటూ ఉంటారు.)

శ్రేయ: నువ్వు రాసేదంతా ఎక్కడయినా ఎప్పుడయినా చెప్పగలగాలి. నేను.

ప్రసన్న: నువ్వు నటివి, నేను రాస్తుంటాననా! కానీ నేను నాటకాలు, సినిమా రాయను కదా! అప్పుడప్పుడు ads కోసం రాస్తాను. అది పెద్దగా రచనల క్రిందికి రాదు.

( ఫోన్ మ్రోగుతుంది.)

శ్రేయ: మ్రోగనీ…. రోజూ అదే అదే reporting ఏమనివ్వాలి తనకు.

(ప్రసన్న వెళ్ళి ఫోన్ ఎత్తి మళ్ళీ చిన్న పిల్లాడిలాగా మాట్లాడడం మొదలు పెడ్తాడు. మాట్లాడుతూనే ఉంటాడు.)

(శ్రేయ అతని చేతుల్లో నుండి రిసీవర్ లాక్కుంటుంది.)

శ్రేయ: చెప్పమ్మా…. అవును. పక్కింట్లోని కాళే వాళ్ళ అబ్బాయి. ఆడుకోవడాని కొస్తుంటాడు. అవునమ్మా…. రెండు…. రెండున్నరేళ్ళ పిల్లాడు. అవును…. ఈ మధ్యే వచ్చారు కొత్తగా. మంచివాళ్ళు. కాస్త మనిషి తోడుగా ఉంటారు. అమ్మా, నాకివాళ ఒక ad దొరికింది. నూనెది. నాన్నకి కుడా చెప్పు. Thank you . పదిహేను రోజుల్లో షూటింగ్ ఉంటుంది. అ…. ఆ సినిమా అయిపోయింది. నావి ఓ తొమ్మిది పది scenes ఉండొచ్చు. అంతే. కానీ హాయిగా జరిగిపోయింది షూటింగ్. రేపా…. రేపు ఎల్లుండి ఆడిషన్స్ ఉన్నాయి. అమ్మా, నేను భోంచేస్తున్నాను. రేపు మళ్ళీ మాట్లాడతాను. Okay మంచిది!

ప్రసన్న: అమ్మ తెలుగు సీరియల్స్ చూస్తుంటుంది, నాన్న…. నాన్నేమో ఆవరణలో పచార్లు చేస్తుండొచ్చు. గులామ్ ఆలీ గజల్స్ వింటారాయన రోజూ.

శ్రేయ: నువ్వొక్కడివేనా ?

ప్రసన్న: ఇప్పుడొక్కణ్ణే. అన్న పోయాడు. నిద్రమాత్రలు మింగేసాడు తను.

శ్రేయ: ఎప్పుడు ?

ప్రసన్న: నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. అన్నకి ఇరవై- ఇరవై ఒకటి ఉండొచ్చు. అసలు అమ్మ మంచి ధైర్యస్థురాలు. అప్పట్నుండి ఎలాగో అయిపోయింది. నాన్న ఏమీ పట్టనట్టుగా వట్టి కోపిష్టిగా ఉండేవారు, ఇప్పుడు శాంతంగా అయిపోయారు. అప్పుడప్పుడు నా వైపు అదో తరహాగా నేనేమయిపోతానో అన్నట్టు చూడడం అస్సలు చూడబుద్ధవదు.

అన్న నా హీరో. నాకు బైక్ నేర్పాడు. మొదటి బీర్ తనతోనే తాగాను. తన పాకెట్ మనీలో నుండి ప్రతి నెలా నాకు పది రూపాయిలిచ్చేవాడు. అన్న పోయినప్పుడు అమ్మానాన్నల ఆగని ఏడుపు చూసి నాకు కన్నీళ్ళే రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చుని అన్న గురించి అంతా రాసుకుని పెట్టుకున్నాను. అది శుభ్రంగా  మరోసారి రాస్తున్నప్పుడు అర్థమయింది నాకు, అన్న పోవడమంటే ఏమిటో, ఆ పోవడం ఏమేం తీసుకెళ్ళిందో!

శ్రేయ: రాస్తే అర్థమవుతుందా ఏం కోల్పోయామో!

ప్రసన్న: నాకు.

శ్రేయ: ఎలా…. ఎలా రాస్తావ్ నువ్వు? అంటే ఏం అన్పిస్తుంది? రాసే ముందు ఏం చేస్తావ్?

ప్రసన్న: కొత్త స్టేషనరీ సామాను తెచ్చుకుంటాను. ఎప్పుడు రాసినా రాసే ఆరంభం నేను కొత్త స్టేషనరీ తోనే చేస్తాను. కొత్త కాగితపు ఫోల్డర్స్, నోట్స్ కి పెట్టే చిన్న చిన్న రంగురంగుల క్లిప్స్…. కొత్త కాగితాలు. ఇంతకు ముందు నేను దేని మీద పడితే దాని మీద రాసేవాడిని. ఫోన్ ప్రక్కనుండే రాయని పెన్నులని దులిపి దులిపి మరీ రాసేవాడిని.

ఓ చిత్రకారుడు నా మిత్రుడు. అతనీ ఫౌంటెన్ పెన్ నాకు తెచ్చిచ్చాడు. ఇక ఇప్పుడు నేనీ పెన్ను నిబ్ శుభ్రం చేస్తాను. పెన్నులో సిరా పోసుకుంటాను. ఆ తర్వాత అన్నీ ముందు పెట్టుకు కూర్చుంటాను. సత్యనారాయణ వ్రతం పూజా సామాగ్రి అమర్చుకొంటున్నట్టుగా!

శ్రేయ: ఆ తర్వాత కుదురు వస్తుందా?

ప్రసన్న: ఆ…. ఒక్కోసారి…. ఒక్కోసారి అస్సలు కుదరదు.

శ్రేయ: సినిమాకి ఆక్టర్స్ ని ఇలా స్వచ్ఛంగా తెచ్చి పని చేయించడం కుదరదు… అసలు చెప్పాలంటే సినిమా పనంతా ముక్కలు ముక్కల్లో అవుతుంది. అది కాక చుట్టుప్రక్కల అంతా జనం…. అస్తవ్యస్తంగా…. వస్తువులు….! వేలాడే వైర్లు, థర్మాకోల్స్…. ధగధగలాడే లైట్స్…. ఏ క్యారెక్టర్ తో పని చేయాలో చాలాసార్లు వాళ్ళని మనం కలుసుకోలేం.

నా మొదటి సినిమా అప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లిమెల్లగా నేర్చుకున్నాను. ఆ గందరగోళంలో మనమే మన స్పేస్ వెతుక్కోవాల్సి ఉంటుందని నా కర్థమయింది. నాకు నా వంతు స్థలం దొరికింది.

ప్రసన్న: మేకప్ రూమ్?

శ్రేయ: ఛ…. ఛ…. అస్సలు కాదు. షాట్ ప్రారంభించే ముందు కొన్ని క్షణాలు మన మొహం ముందు క్లాప్ తీస్తారు. మనకీ జనాలకీ మధ్య. అప్పుడు సెట్ మీద ఒక momentary silence ఉంటుంది. అప్పుడు నేనోక్షణం కళ్ళు మూసుకుంటాను. ఆ తర్వాత అన్నీ వదిలేస్తాను. నన్ను నేను కూడా.

(ఒక్కసారిగా వెళ్ళి కూలబడినట్టుగా కుర్చీలో కూర్చుంటాడు.)

ప్రసన్న: పని చేస్తూండడం ఎంత బాగుంటుంది కదా! అదీ ఇష్టమయిన పని. నాకో స్నేహితుడు ఉన్నాడు.

శ్రేయ: చిత్రకారుడు?

ప్రసన్న: అవును-చిత్రకార మిత్రుడు…. అతనంటుంటాడు. పనిలో మనసు లగ్నం చేసిన మనుషులు అందర్లోకి అందంగా కన్పిస్తారు. అతి అందమైన వాళ్ళ కన్నా అందంగా!

శ్రేయ: నీ స్నేహితుడి పేరేంటి?

ప్రసన్న: పేరొద్దు. వట్టి చిత్రకార మిత్రుడు.

శ్రేయ: ఎక్కడుంటాడు అతను?

ప్రసన్న: బయటికి వెళ్ళాడు, వస్తాడు.

శ్రేయ: అసలు నీతో పరిచయం అయినట్టుగానే అన్పించదు నాకు. అప్పుడప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తావ్.

ప్రసన్న: చాలా విషయాల్లో మనమిద్దరమూ ఒకేలాంటి వాళ్ళం శ్రేయా, మనలాంటి ఒకేతీరు వాళ్ళకి చాలాసార్లు ఒక్కళ్ళనొకళ్ళం ఎరగమేమోననే భావన కలుగుతుంటుంది ప్రతీసారి. ఎందుకంటే మన ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మనం బయటి ఊర్ల నుండి, ఇంచుమించు ఒకే లాంటి ఇంటి పద్ధతుల నుండి అంతా వెనకాల వదిలేసి వచ్చిన వాళ్ళం మనం. ఒంటరులం.అందుకే నిన్ను అర్థం చేసుకో గలుగుతాను నేను.

శ్రేయ: My God ! ఏం అర్థం చేసుకున్నావ్ నువ్వు నన్ను?

ప్రసన్న: ఏముందీ, నువ్వు మంచి అమ్మాయివి. కష్టజీవివి. ఇంటి నుండి బయటపడిం తర్వాత ఈ గజిబిజి నగరంలో కలిసిపోతావ్ అయినప్పటికీ నీ ఎనర్జీ ని అలాగే కాపాడుకుంటావ్. ప్రొద్దున్న ఇంటి నుండి బయల్దేరేప్పుడు ఏదయితే మంచితనం ఉందో దాన్ని నవ్వు మొహంతో తీసికెళ్ళి మళ్ళీ సాయంత్రం అలాగే కాపాడుకుని తిరిగి సాయంత్రం ఇంటికొస్తావ్. నీకేం కావాలో నీకు తప్పక దొరుకుతుంది శ్రేయా!

శ్రేయ: నిజంగా?

ప్రసన్న: నిజంగా!

శ్రేయ: నేనేం ఏదో పెద్ద దిగివచ్చానని కాదు; కానీ చాలా కష్టపడ్డాను నా కాళ్ళమీద నేను నిలద్రోక్కుకోవడానికి!

కేవలం acting మాత్రమే కాదు కదా. అన్నీ…. అన్ని విషయాల్లో. నా పద్ధతిలో నేను బ్రతుకుదాం అనుకున్నాను గనక! ఈ ముంబాయి, పుణే మహానగరాల సంగతే తెల్సు నీకు…. కానీ చిన్న పట్టణాల్లో, ఊళ్ళల్లో ఆడపిల్లల్ని సరిగ్గా చూడరు ప్రసన్నా…. ఏ నిర్ణయమూ ఆడపిల్ల తీసుకోలేదు. ఆమె తరపున నిర్ణయాలన్నీ ఆమె బంధుజనమే తీసుకుంటారు. నేను కాలేజ్ చదువుకోసం వచ్చిందాన్ని ఇక తిరిగి వెళ్ళలేదు నేను. నా గూడు నేను ఏర్పరచుకొందామని తాపత్రయం.

(కాసేపు ఒక్కసారిగా విచారంగా మారిన మొహంతో ప్రసన్న వైపు చూసి, నవ్వి మెల్లిగా లోపలికెళ్తుంది.)

(కొన్ని క్షణాలు అంధకారం)

(మళ్ళీ ప్రకాశం వచ్చేవరకు మధ్య రాత్రి.)

(శ్రేయ లోపలనుండి దిండూ దుప్పటి తీసికొని వస్తుంది. ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. అతని కేసి చూసి గదిలో ఓ వైపుకి పక్క వేసుకొని పడుకుంటుంది.)

(చీకటి)

దృశ్యం-3

(దీపాలు వెలిగే వరకు లయబద్ధమయిన సంగీతం వినొస్తూ ఉంటుంది. ప్రసన్న, మిత్రుడు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటారు.)

(ఇద్దరు బాగా అలసిపోతారు. ఇద్దరూ క్రింద కూలబడ్డట్టుగా కూర్చుంటారు.)

మిత్రుడు: ఖుష్?

ప్రసన్న: చాలా! రోజంతా ఇంట్లో ఉంటాను కదరా! కాళ్ళతో పాటుగా పూర్తి మనసంతా పట్టేసినట్టుగా అయిపోతుంది. ఇదివరకోసారి శ్రేయతో ఇలాగే డాన్స్ చేసాను.

(ఫోన్ మ్రోగుతుంది. మిత్రుడు ఫోన్ వైపుకి పరిగెత్తుతాడు. ప్రసన్న అతన్ని వెనక్కిలాగుతాడు.)

మిత్రుడు: వదులు…. నన్నొదులు….

ప్రసన్న: లేదు…., లేదు, ఇవాళ నేను…. ఇవాళ నేను…. ప్లీజ్.

మిత్రుడు: కానీ నిన్న నువ్వు రెండుసార్లు మాట్లాడావు. ప్రసన్నా….. ప్లీజ్!

ప్రసన్న: ఒక్కసారే…. నన్ను…. నన్ను మాట్లాడనివ్వూ!

(ప్రసన్న ఫోన్ దగ్గరకు వెళతాడు. రిసీవర్ ఎత్తి చిన్న పిల్లాడి గొంతుతో చాలాసేపే మాట్లాడతాడు. ఫోన్ పెట్టేస్తాడు.)

మిత్రుడు: ఏమంటుంది శ్రేయ?

ప్రసన్న: బాగానే ఉంది. పని ఎక్కువగా ఉండడం మూలంగా తొందరగా అలసిపోతుందట. ఒప్పుకున్న పని తొందరగా ముగించేయాలని అంది. చాలా రోజులుగా సరిగ్గా మాట్లాడుకోవడమే కుదరలేదు. పోయిన వారమంతా అవుట్ డోర్ కి వెళ్ళింది తను. మొన్ననే వచ్చింది.

మిత్రుడు: చెప్పావా తనకంతా?

ప్రసన్న: చెప్పేది చెప్పాను. చెప్పిందాంట్లో ఏదీ అబద్ధం చెప్పలేదు. కాకపోతే పూర్తిగా చెప్పలేదు. వద్దనిపించింది అంతా చెప్పడం.

మిత్రుడు: ఇవాళ్టికి పది రోజులు మనమేం పనిచేయక.

ప్రసన్న: నాకు నా అలసట తెలుస్తోంది, అది నీకెందుకు కన్పించదని నా ప్రశ్న. నా వల్ల కాదు – కావట్లేదు.

మిత్రుడు: నేనేం నిన్ను, ఏ విషయంలోనైనా, బలవంతపెట్టడం లేదే!

ప్రసన్న: అది నాకు తెల్సు!

మిత్రుడు: నా కర్థం అయిందేమిటంటే, నీ చుట్టూ తిరిగే వర్తులాకారం నుండి బయటపడడానికి కదా నువ్విక్కడి కొచ్చింది.

ప్రసన్న: నాకూ అలాగే అన్పించేది…. అన్పిస్తుంది. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

మిత్రుడు: నేనొకటి చెప్పనా?

ప్రసన్న: ఏంటి?

మిత్రుడు: నిన్ను నువ్వు కష్ట పెట్టుకోవడం ఆపెయ్. మనసులో గూడు కట్టుకున్న అనవసర భయాల్ని వదిలెయ్. నీకు తెల్సు ఎలా బయటికి రావాలో.

ప్రసన్న: ఎగతాళి చేస్తున్నావా? ఏం చేయమంటావ్?

మిత్రుడు: తన చుట్టూ నిర్మించుకున్న వలయాన్ని బలపర్చుకుని అందులోనే ఉండే మనుషులు పైకి విచారంగా కన్పించినా వాళ్ళలో ఒక అంతర్ ప్రకాశం ఉంటుంది. దాన్లో జీవిస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలుసది.

ప్రసన్న: లోపల ఎక్కడో ఏదో చచ్చిపోయిందనిపిస్తుంది. దాని శోకంలో కొన్ని రోజులు గడవనీ!

మిత్రుడు: తమరు కాస్త పనిలో మునిగి, మెడలు వంచి అనుకున్న వేళకి పని ముగిస్తారని ఆశిస్తున్నాను.

ప్రసన్న: ప్రయత్నం చేస్తాను.

మిత్రుడు: దానికోసం నేను ముంబాయి రావాల్సిన అవసరం లేకుండింది అనుకుంటాను. I mean it ! ప్రయాణాల్లో కాలం గడిపేస్తే సరిపోతుంది.

ప్రసన్న: నాలోని ఓ కోణం ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నాకు, జవాబు కోసం అటు ఇటూ తిరగడం కన్నా ఇక్కడే జీవితంతో పణం పెట్టి ఆ జవాబు వెదుక్కుంటే సరిపోతుంది. నేనేం అంత గూఢమైన అజ్ఞాత ప్రశ్నలకి జవాబులడగడం లేదు కదా! నేను కేవలం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడ్డానికి ఒక కూడలిలో ఆగాల్సి వస్తుంది. గిరగిరా తిరిగితే ఏం వస్తుంది?

మిత్రుడు: మనసు దాని రీతిగతుల విశ్లేషణాత్మక చర్చ అయిపోయిందనుకుంటే నీకో సంగతి చెప్పడం నాకు మంచిదనిపిస్తుంది. అది ఏంటంటే బ్రతకాలి కదా నువ్వు. దానికోసం ముందుకు వెళ్ళాలి. కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు ఈ పనే చేయాలని నీ మీద ఎవరూ రుద్ద లేదన్న సత్యం అందరికంటే నాకే బాగా తెల్సు.

(ప్రసన్న భిన్నంగా నవ్వుతాడు.)

ప్రసన్న: దుఃఖాల వర్క్ షాప్ నడుపుతున్నాను నేను! నీకు తెల్సా శ్రేయ కుడా! ఆమె మొహం చూడగానే తెలిసిన వాళ్ళేనన్న భ్రమ కలుగుతుంది. మేమిద్దరం కుడా ఎంతో సహజంగా మామా దుఃఖాలు ఒకరికొకరం చెప్పుకుంటాం. జనాలు లోకల్ ట్రైన్ లో రష్ గురించీ, వాతావరణం గురించి discuss చేసుకున్నట్టుగా. సహజంగా ఓ వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు స్వంత దుఃఖం తప్ప కళ్ళ ముందుదేం కన్పించదు. ఓ symbol రూపొందించుకుంటాడు కళ్ళముందు. ఆ దుఃఖం ఒక్కోసారి భగభగమండే చెక్క ఇల్లు కావచ్చును. తర్వాత మిగిలే బూడిద కుప్పయితే నల్లటి నీళ్ళు ఆగిన చెరువులా మిగులుతుంది! ఆ నీళ్ళు పారడానికి దారే ఈ చిత్రం రాక మానదు!

మిత్రుడు: నీకేం కన్పిస్తుంది!

ప్రసన్న: గబ్బిలం.

మిత్రుడు: ఒకళ్ళనొకళ్ళం బాగా అర్థం చేసుకున్నాం మనం. ఓ పని చేద్దాం.

ప్రసన్న: నువ్వూ వెళ్ళిపోదామనుకుంటున్నావా?

మిత్రుడు: వా…. లోపలి కరుడుగట్టిన చేదు అంతా బాగా పుష్పిస్తుందన్న మాట! ఒక పని చేసి తీరాల్సిందే.ఒక్కొకళ్ళకి తెలియని మన జీవితాల్లోని ఒక్కొ విషయం ఒకళ్ళకొకళ్ళం చెప్పుకుందాం. ఒక్కొక్కటే . కావాలంటే నేను మొదలు పెడతాను.

(మిత్రుడు లేస్తాడు. ఏదో గుర్తుచేసుకుంటూ అటు ఇటూ పచార్లు చేస్తుంటాడు.)

మిత్రుడు: సరే…. ఇది హాస్పిటల్ అనుకుందాం. మనమిద్దరమూ పేషంట్ల బంధువులం. Semi private room లో ఉన్నాం. మీ అబ్బాయి admit అయ్యాడు.

ప్రసన్న: నా కొడుకా?

మిత్రుడు: అవును, నాకేమో మా నాన్న admit అయ్యాడు.

ప్రసన్న: సరే.

(ఇద్దరలా కల్సి హాస్పిటల్ రూమ్ లాంటి సిట్యుయేషన్ create చేస్తారు, పేషంట్ పక్కన్నే నత్త నడక సమయాన్ని భరిస్తున్న బంధువుల posture లో కూర్చుంటారు.)

ప్రసన్న: బాగా నిద్రొస్తున్నట్టుంది నీకు, కాస్త ఒళ్ళు వాల్చు. నిన్న రాత్రంతా జాగరణం చేసావ్, పడుకో నేను మెలకువగా ఉంటాన్లే.

మిత్రుడు: లేదు బాబాయ్, నాన్నకి మధ్య మధ్యలో దాహం వేస్తుంది. ఎప్పుడయినా లేవొచ్చు.

ప్రసన్న: నేనిస్తాలే మంచి నీళ్ళు లేదా నిన్ను లేపుతాను. పడుకో.

(మిత్రుడు తల వద్దన్నట్టుగా ఊపుతాడు)

ప్రసన్న: ప్రోగ్రెస్ బాగానే ఉన్నట్టు కన్పిస్తుంది.

మిత్రుడు: అవును, ఇవాళో అయిదు నిమిషాలు వాకర్ సహాయంతో నడిచారు. కాలు వాపు దిగట్లేదు. ఆయన బ్రతుకంతా నడుస్తూనే ఉన్నారను కోండి. డబ్బు సంపాదనలో, డబ్బు పొదుపులో, దాంతో పాటు ఆయనకి స్వావలంబనం మీద అమితమైన గురి. ఎవరి సాయం వద్దనే తత్వం.

ప్రసన్న: మనిషికో తత్వం. పెరిగే వయసుతో చాలా మార్పులు ఉంటాయనుకో.

మిత్రుడు: తండ్రిని తప్పకనచ్చి తీరాల్సిందేనాండీ? ఈ మనిషి నాకసలు నచ్చడు.

ప్రసన్న: మా అబ్బాయికి రేపు ఆపరేషన్. అందుకని నీ ప్రశ్నలకి జవాబిప్పుడు చెప్పలేను. నువ్వూ అలసిపోయావ్. పడుకో.

మిత్రుడు: నాకిప్పుడు కాస్త తేలిగ్గా ఉంది. బయటికి చెప్పేస్తే ఊరటగా ఉంటుందని ఇప్పుడే తెల్సింది నాకు. ఆయన నాకు నచ్చడన్న నిజం ఆయనముందే మరో మూడో మనిషికి చెప్పాలని ఉండేది నాకు.

ప్రసన్న: మరేం పర్వాలేదు. ఆయన కూడా శుభ్రంగా విని ఉంటారు. మెదడు పని చేస్తూనే ఉంది కదా! నువ్విప్పటికి పడుకో.

మిత్రుడు: ఆయన కదిలితే నిన్ను లేపుతారుగా మరి?

ప్రసన్న: లేపుతాను.

(మిత్రుడు అడ్డంగా పడుకొని గాఢ నిద్రపోతాడు. ప్రసన్న లేచి గడియారం చూస్తాడు.)

ప్రసన్న: శ్రేయ ఇంకా రాలేదేంటబ్బా, ఎప్పుడూ ఇంతా ఆలస్యం అవలేదు తనకి!

మిత్రుడు: ఇప్పుడు ఇక నీ వంతు. చెప్పు.

ప్రసన్న: ఇంకా ఎందుకు రాలేదంటావీమె! ప్రొద్దున్న నేను లేవకముందు వెళ్ళిన మనిషి.

మిత్రుడు: చెప్పమన్నానా!

ప్రసన్న: ఒక్కటేమిటి, రెండు-మూడు చెప్తాను. మొదటిది, సాస్ బాటిల్ పిల్లి కాదు నేనే పగలగొట్టి ఉంటాను. ఇంకా ..ఆ…. అన్న బైక్ నాన్న అమ్మకూడదనిపించేది. నాకు అందుకని బైక్ గేర్ బాక్స్ పాడు చేసాను నేను. ఇంకా…. నేను దీపావళి పటాసులకి భయపడేవాణ్ణి…. ఇంకా భయపడతాను ఇంకా….

మిత్రుడు: ఇంకా ఏమిటి?

ప్రసన్న: నేనేం చెడు చేయలేదు అన్నకి. నన్ను నేను అద్దంలో చూసుకొని పరిశీలించుకొని మరీ ఈ నమ్మకాన్ని గట్టిపరుచుకున్నాను. తను తిరిగిరావాలి.

మిత్రుడు: ఇదంతా నాకు తెల్సు. వట్టిగానే మళ్ళీ చెప్తూ కూర్చున్నావ్.

ప్రసన్న: లేదు, నేనేదో ఊరికే చెప్పలేదిదంతా. కాస్తాగమని నా మనస్సు చెప్పే మాట ఇది. వినకపోతే నేను ముందుకు వ్రాయలేను.

మిత్రుడు: నువెప్పుడూ ఎవరినీ బంధించలేదు.

ప్రసన్న: ఇది నిజం కాదు. నన్ను నేనే బంధించుకున్నాను. స్వతంత్రంగా ఏదీ ఉండదు, ఒకవేళ ఉంటే అది జ్ఞానం పరిధికి బయటి అంశం. చదునుగా.

మిత్రుడు: మంచిదే. ఈ ఎదురుచూసే కాలంలో కాస్తాగి చూడు. అప్పటికప్పుడు, కాస్తాగుదామనుకుంటే ఆగి చూడు.

ప్రసన్న: ఈ కాస్తాగడం బాధ్యతారహితం కాదని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. కారణం  ఈ రచనలోని చాలా రాగాలు కేవలం అన్నే వినగలడని నా నమ్మకం.

మిత్రుడు: ప్రపంచం దృష్టిలో నీ నిర్ణయం అగమ్యం కావచ్చును.కానీ నువ్వు నిర్ణయించుకో. నీకేం చేయాలనిపిస్తే అదిచెయ్.

ప్రసన్న: ఆ…. నువ్విందాక అన్నావే, ఈ లోపలి దుగ్ధని వదిలించుకోవడం నాకు తెలుసనీ, నేను వదిలించుకోవాలనీ….

మిత్రుడు: అవును.

ప్రసన్న: నాకు ప్రస్తుతానికి ఇంతే తోస్తుంది. నేనాగుతాను కాస్త.

(ప్రసన్న వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెడతాడు. మిత్రుడు శాంతంగా కూర్చున్న చోటు నుండి చూస్తుంటాడు. ఎలాంటి సాంత్వన ఇవ్వకుండా.)

మిత్రుడు: రెండు చిత్రాల మధ్యకాలంలో మీరిద్దరూ కల్సి ఉండినకాలం అన్నింట్లోకి మించిన సత్యం!

ప్రసన్న: (కళ్ళు తుడుచుకొని- నవ్వుతూ) దానంత అందమైనది ఇంకేం ఉండదు. ఒక నీలవర్ణ చిత్రం… మరోటి పచ్చది. మూడోది ఎర్రది. ఏ ఏ రంగు చిత్రాన్ని వేసేప్పుడు అతని కళ్ళు ఆ ఆ రంగుల్ని ప్రతిఫలించేవి. ఆ కళ్ళంత పారదర్శమైనవి నేనేవి చూడలేదింత వరకూ.

మిత్రుడు: ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నీ మనసు ఉల్లాసంగా ఉండాలని ప్రార్థిస్తాను.

ప్రసన్న: చూద్దాం. పోనీ కొంత కాలాన్ని. ఇక నువ్వెళ్ళిరా.

(మిత్రుడు చటుక్కున ఒక్కసారిగా అతనివైపు చూస్తాడు స్తబ్ధంగా.)

మిత్రుడు: నేనెప్పుడూ నీతో ఉండనవసరం లేదన్న నిజాన్ని నేను మరిచే పోయాను. నీ నిర్ణయాన్ని గౌరవించి ఆదరించడం అనే లోకరీతిని నేను ప్రారంభిస్తున్నాను.

ప్రసన్న: నేను జాగ్రత్తగానే ఉంటాను.

(ప్రసన్న అతన్ని వదిలేయడానికి తలుపు వరకు వెళ్ళాడు. ప్రసన్న తలుపు తీసాక మిత్రుడు వెళ్తాడు. శ్రేయ లోపలికొస్తుంది. ఒంటిమీద అక్కడక్కడా బాండేజెస్. బట్టలు అక్కడక్కడా చినిగిపోయినాయి. పూర్తిగా అలసిపోయి ఉంది.)

ప్రసన్న: శ్రేయా…. శ్రేయా ఏమైంది నీకు? ఎక్కడున్నావ్ నిన్న రాత్రంతా?

శ్రేయ: (ప్రసన్న మొహాన్ని రెండు చేతుల్లోకి తీసికొని) ప్రసన్నా, నా బిడ్డ పోయాడు. కడుపులో బిడ్డ.

(సంగీతం స్థాయి పెరుగుతుంది. శ్రేయ పెదవుల కదలిక కన్పిస్తుంటుంది. కాసేపయిన తర్వాత ప్రసన్న ఆమెనో చెంపదెబ్బ వేసి స్పృహలోకి తెస్తాడు. సంగీతం ఆగుతుంది.)

ప్రసన్న: నువ్వు ప్రెగ్నెంట్ వా?

శ్రేయ: నాబిడ్డ.. మనోజ్ బిడ్డ.. నెలన్నర బిడ్డ…. నా కడుపులో..

ప్రసన్న: మనోజ్? ఎవరు ? మనోజ్ ఎవరు?

శ్రేయ: మనోజ్ వెళ్ళిపోయాడు ప్రసన్నా.నేను  ప్రెగ్నెంట్ నని తెలియగానే నన్నొదిలి వెళ్ళిపోయాడు.

ప్రసన్న: శ్రేయా.. ఇటు చూడు.. నువ్వేం మాట్లాడుతున్నావ్? స్పృహలో ఉన్నావా?

శ్రేయ: ఆ కారొచ్చి నా కడుపుమీద తాకింది, నేను పడిపోయాను. అమ్మ ఫోన్ వచ్చిందా? వచ్చే ఉంటుంది.

ప్రసన్న: నువ్వెక్కడనుండి వస్తున్నావ్ శ్రేయా? శ్రేయ కాస్త వివరంగా చెప్పగలవా ఏం జరిగిందో?

శ్రేయ: బెంగపడకు. నా ఏడుపు అయిపోయింది. ఏడ్చేసాను. ఇప్పుడు బాగానే ఉన్నాను.

(ఒక్కసారిగా ఏడ్చేస్తుంది)

(చీకటి)

దృశ్యం-4

(రంగస్థలం మీద దీపాలు వెలిగేప్పటికి ప్రసన్న ఫోన్ వైపు మెల్లిగా వెళ్తుంటాడు. ఫోన్ మ్రోగుతుంది. ప్రసన్న శాంతంగా ఫోన్ ఎత్తుతాడు.)

ప్రసన్న: హలో…. ఆ…. చెప్పండి. వెరీ గుడ్! మీ ప్రయాణం ఎలా సాగింది? బాగుంది. లేదు. నేను చెప్తాను తనకు. లేదు, తనింకా లేవలేదు. నాకోసారి మందులు ఎలా వేయాలో చెపితే నేనవి వెతుక్కుంటాను ఇక్కడ. అవును. మీరేమి కంగారు పడకండి. మంచిది. మరి ఉంటాను.

(ప్రసన్న ఫోన్ పెట్టేస్తాడు. శ్రేయ Kitchenette లో పని చేస్తుంటుంది. ప్రసన్న తనవైపు తిరిగి-)

ప్రసన్న: మీ నాన్న ఇంటికి చేరుకున్నారు. ఆయన ముంబాయిలో వాళ్ళ డాక్టర్స్ ని కన్సల్ట్ చేసారట. ఒకటో రెండో మాత్రలు సజెస్ట్ చేసారు. ఆ పేర్లు చెప్పుతున్నారు.

శ్రేయ: శక్కర ఎక్కడ ఉంది ప్రసన్న? దొరకట్లేదు.

ప్రసన్న: అయిపోయింది. మళ్ళీ క్రిందికి వెళ్ళినప్పుడు తెస్తాను.

(శ్రేయ చేతిలో కప్పు పట్టుకొని వస్తుంది.)

ప్రసన్న: అదేంటి? అలానే తాగేస్తున్నావా?

శ్రేయ: పర్లేదు పోనీ, అమ్మ బాగుందటా?

ప్రసన్న: లేదు.

శ్రేయ: అమ్మదిది ఎక్కువయిపోయింది. కళ్ళు తిరిగి పడిపోవాల్సినంత అవసరం లేకుండింది-

ప్రసన్న: అది సహజమని నీకెందుకు అన్పించదు శ్రేయా? ముంబాయి నుండి దూరంగా ఎక్కడో ఊర్లో ఉండే తల్లిదండ్రులకి ఓరోజు ప్రొద్దున్నే ఫోన్ వస్తుంది. వాళ్లమ్మాయికి miscarriage అయిందని. దాంతో కానీ వాళ్ళకు తెలియదు, అంటే.., ఒహ్.. వాళ్ళమ్మాయి ప్రెగ్నెంట్ అని. ఆ ఫోన్ కూడా ఓ అబ్బాయి చేస్తాడు, వాళ్ళమ్మాయితో కలిసి ఒకే ఇంట్లో అద్దెకుండే అబ్బాయి. ఇవన్నీ నార్మల్ కాదని నీకు తెలీదా శ్రేయా!

శ్రేయ: నేను అమ్మకి చెప్దామనే అనుకుంటున్నాను.. కాస్త సరయిన సమయం చూసుకొని ఇంటికి వెళ్ళి.

ప్రసన్న: మొన్న రాత్రి మీ నాన్న వచ్చినప్పుడు తలుపు తీసిన దగ్గరనుండి ఆయన నా వైపు కోపంగా చూస్తూనే ఉన్నారు. ఏం చెప్పమంటావ్ ఆయనకి?

శ్రేయ: ఇంకిప్పుడు నువ్వు కూడా చికాకు పడకు ప్రసన్నా. అబార్షన్ చేయించేసుకోమన్న ఆ మనోజ్ తో పాటుగా నాకు ఆక్సిడెంట్ చేసి నా బిడ్డని పొట్టలోనే చంపేసిన ఆ డ్రైవర్ పత్తాలేడు. నేను మాత్రం దోషిని.. పెద్ద దోషిని.

(ప్రసన్న ఆమె దగ్గరికి వెళ్ళి తల నిమురుతాడు. ఆమె అతడి భుజం మీద తలవాల్చి నిలబడుతుంది.)

శ్రేయ: యమున అని పేరు పెట్టుకుందాం అనుకున్నాను నేను.

ప్రసన్న: అబ్బాయి అయితే…. యముడా?

శ్రేయ: మనోజ్ ఎంత సహజంగా వదిలేసి వెళ్ళాడు నన్ను? అతడికేం అన్పించి ఉండదా తన బిడ్డ గురించి ? నేనెవరికీ ఈ విషయం చెప్పలేదు. లేకపోతే అందరూ ఇదే అనేవారు, అబార్షన్ చేయించేసుకోమని. కానీ నాకు నా బిడ్డ కావాలనిపించింది ప్రసన్నా.

ప్రసన్న: నాన్న స్నేహితుడి కొడుకు అమిత్ అని ఉండేవాడు. అతడి శరీరంలో తుపాకి గుండు ఉండేది. బయటికి ఏం తెల్సేదికాదు. కానీ ఉండేది. తర్వాత ఇంకేదో ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ తూటాని కూడా తీసేసారు. అప్పట్నుండి నాకు వాడు మామూలు అబ్బాయిలా, మనందరిలాగే అన్పించేవాడు.

(శ్రేయ ప్రసన్నని నవ్వుతూ కొడ్తుంది. ఇద్దరూ మౌనంగా కూర్చుని ఉంటారు.)

శ్రేయ: చికాకు పుడుతుంది ప్రసన్నా, ప్రేమలో పడడం, మగవాళ్ళను అర్థం చేసుకునే ప్రయాసలు, సంబంధాలు వెతుక్కోవడం- అవి తెగిపోవడం, అలసిపోయానురా! మగవాళ్ళలో ఈ కరుడుకట్టినతనం ఎక్కడనుండి వస్తుంది? ఎప్పుడొస్తుంది. రిలేషన్ మొదట్లో వాళ్ళ ప్రవర్తన చాలా వేరుగా ఉంటుంది కదా!

ప్రసన్న: వీటన్నిటికీ జవాబు నీకు తెలిస్తే నాకు చెప్పు.

శ్రేయ: నీ లోపలినుండి ఏదైనా తీసిపడేస్తే ఎలా ఉంటుందో నీకు తెలీదు.

ప్రసన్న: అవునంటావా?

శ్రేయ: మగవాళ్ళకు అస్సలు తెలీదు.

ప్రసన్న: మహిళా మండళ్ళు నడిపే దీపావళి సంచికలోని వాక్యాలు వాగుతూ  కూర్చునేకంటే వెళ్ళి మందులు వేసుకొని పడుకో. sick మాటలు ఆపెయ్.

(శ్రేయ కోపంగా ప్రసన్న వైపు చూస్తుంటుంది.అతను లేచి వంటగది వైపు వెళ్తాడు.)

ప్రసన్న:  శ్రేయా, మీ నాన్న చెప్పేది విను, ఇంటికెళ్తావా ఓ వారంపాటు?

శ్రేయ: వద్దు, ఒకటి ఇప్పుడే నేను. నేను అమ్మ ముందుకు వెళ్ళలేను. రెండోది మా ఊళ్ళో వాళ్ళకు చాలా సమయం మిగిలి ఉంటుంది వేరేవాళ్ళ విషయాలు మాట్లాడుకోవడానికి. నేనిక్కడే ఉంటాను ప్రసన్నా, పనిలోకి వెళ్ళడం మొదలుపెడతాను.

ప్రసన్న: చాలా రోజుల తర్వాత ఇవాళ వ్యాయామం చేసాను. రోజులేంటి కొన్ని నెలల తర్వాత!  సముద్రం ఒడ్డుకి జాగింగ్ కి వెళ్ళాను.

శ్రేయ: రాయడం ఎలా సాగుతుంది?

ప్రసన్న: ప్రస్తుతానికి ఆగింది.

శ్రేయ: ఆగిందంటే? ఎందుకు? ఎందుకు రాయడం లేదు?

ప్రసన్న: కొన్ని రోజులు ఆపుదామనే శ్రేయా. చాలా విషయాలు తలనొప్పిగా తయారయాయి. కొన్నిటికి కారణాలే దొరకవు. ఏం రాయమంటావ్?

శ్రేయ: కారణం నువ్వే.

ప్రసన్న: నేను కాదు. కారణం నేను కావాలనుకోవడం లేదు నేను.

శ్రేయ: This is strange .

ప్రసన్న: Yes it is ! yes , it is strange .

శ్రేయ: అయితే?

ప్రసన్న: చూద్దాం. బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా? చేస్తాను.

శ్రేయ: కానీ నవల రాస్తున్నావే, అది?

ప్రసన్న: కొన్ని విషయాలు వ్రాయడానికి మనసులో నుండి ఊట కావాలి. రావాలి. కొన్ని విషయాలు మనం నిర్ణయించుకుంటాం. కొందరితో వాళ్ళకోసం ఎదురు చూడాల్సి ఉంటుంది ఇట్లాంటి సమయంలో.

శ్రేయ: మనం స్వతంత్రులం ప్రసన్నా. కళాకారులు స్వతంత్రులు అందుకనే ముందుకు వెళ్ళగలరు.

ప్రసన్న: బహుశా నా మట్టుకు ఈ అభిప్రాయం తప్పు శ్రేయా. కళాకారుడు ఎప్పుడు స్వతంత్రుడు కాదు.  ఎన్నో భావ పరంపరల్లో చిక్కుకుని ఉంటారు వాళ్ళు. కళాకారుడి వరకెందుకు, మనిషే స్వతంత్రుడు కాదు, అవకూడదు కూడా. ఇలాంటి భావ పారతంత్ర్యంలోనే కదా మనం ఒకరితో ఒకరం కల్సి ఉండగలిగేది? ఈ అవలంబనలోనే ఒకరికొకరంగా మిగులుతాం.

శ్రేయ: ఆ…కావచ్చు.

(ఒక్కసారిగా శ్రేయ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. భోంచేస్తూనే ఒక్కసారిగా ఏడుస్తుంది. ప్రసన్న ఆమె దగ్గరికి వెళ్ళి ముందరి కంచం తీసి తనని వీపు తడతాడు.)

ప్రసన్న: ఎవరతను? ఎలా ఉండేవాడు?

శ్రేయ: మనోజా? ఎలా ఉండేవాడంటే. ఛామనఛాయ బావుంటాడు. నాకు తెల్లగా ఉండే మగపిల్లలు నచ్చరు.మేం అతని రెస్టారెంట్ లోనే కల్సుకున్నాం. కొలాబోలో వాళ్ళ రెస్టారెంట్ ఉంది. చిన్నప్పుడు మనందరికీ ఒక్కోళ్ళకి ఒక్కో హీరో ఉంటారు కదా! కొందరికి పోలీసులు స్మార్ట్ గా అన్పిస్తే, కొందరికి క్రికెటర్స్ హీరోలు. నాకేమో హోటల్స్ లో రూమలీ రోటీ చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు ఎంతో గ్రేట్ గా అన్పించారు. అలా గాలిలోకి ఎగిరేసి రొట్టెలు చేయడం ఎలా కుదురుతుంది అన్పించేది. నేను మొదటిసారి మనోజ్ ని చూసింది అతడా రూమాలీ రొట్టెలను ఎగరేస్తున్నప్పుడే. అంతే ప్రేమలో పడ్డాను. నేను మరీ impulsive నేమో అన్పిస్తుంది. పెద్దగా ఆలోచించను.

నాకొక్కటి చెప్పు ప్రసన్నా, మన నిర్ణయాలెప్పుడు సరిగ్గా ఉండవంటావా?

ప్రసన్న: ఎవరు చెప్పరలా. Depends . ఏది సరయింది అన్న నిర్ణయం మీద అది ఆధారపడి ఉంటుంది.

(ప్రసన్న లేస్తాడు. ఆమె ముందు కంచం తీసి లోపల పెడతాడు. శ్రేయ తన గదిలోకెళ్తుంది. మెత్తా, బొంతా తీసికొని బయటికొస్తుంది.)

శ్రేయ: ప్రసన్నా, నేనివాళ్ళ ఇక్కడ నీ గదిలో పడుకోవచ్చునా?

ప్రసన్న: సరే, నువ్వా పరుపు మీద పడుకో.

(శ్రేయ బొంతని పరుపు పక్కన వేసి పరుపుమీద అడ్డంగా పడుకుంటుంది. ప్రసన్న ఇల్లంతా సర్ది ఒక్కో దీపం ఆర్పుతూ వస్తాడు.)

ప్రసన్న: అతడెక్కడ ఉన్నాడిప్పుడు?

శ్రేయ: ఎవరు? మనోజా? ఇక్కడే ముంబాయిలో. కానీ నేనెళ్ళి అతనితో చెప్పాలని అనుకోవడంలేదు.

(ప్రసన్న బట్టలు మార్చుకొని పరుపు దగ్గరికి వస్తాడు)

ప్రసన్న: ఎలా ఉంటుంది శ్రేయా? మన శరీరంలో ఇంకో జీవం ప్రాణం పోసుకోవడం..

నా స్నేహితురాలికొకామెకు బాబు పుట్టాడని వాళ్ళని కలుద్దామని వెళ్ళాను. ఓ చిన్న వెధవ బొటన వ్రేలు నోట్లో వేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. నాకు వాణ్ణి ఎత్తుకుందాం అనిపించింది. కానీ ఎలా ఎత్తుకోవాలో అర్థం కాలేదు. వాళ్ళ పిల్లాణ్ణి ఎత్తుకోవడం వాళ్ళ అమ్మానాన్నలకు నచ్చుతుందో లేదోనని కూడా అనిపించింది. నమ్రత, అదే.. నా స్నేహితురాలు, పిల్లాణ్ణి నా చేతుల్లో పెట్టింది. నేను వాణ్ని నెమ్మదిగా భుజం మీద వేసుకున్నాను. వాడు నా భుజాన్ని కరుచుకుని అలా పడుకుండిపోయాడు.

నాకొక్కసారిగా నేను పెద్ద వాణ్ని అయినట్టుగా అన్పించింది. బాధ్యతగా కూడా అన్పించింది. ఆ చిన్నవాడు ఎంత విశ్వాసంతోనో భుజం మీద నిద్రపోయాడు కదా అన్పించింది. నేను వాణ్ణి అలాగే ఛాతీ మీద పెట్టుకొని జోకొట్టుతూ ఉండిపోయాను.చాలాసేపు!

శ్రేయ: నువ్వు చాలా మంచి తండ్రివి అవుతావు.

ప్రసన్న: (నవ్వుతూ) చంటి పిల్లలు వాళ్ళు – వీళ్ళు అనరు. అందుకే చంటిపిల్లలను మన పిల్లలనుకోవాలనిపిస్తుంది.

శ్రేయ: పని గురించి కూడా నేను పెద్దగా ఆలోచించలేదు. కెరియర్ గురించి పట్టించుకోలేదు. నాకు నెల తప్పిందని తెలియగానే నాకు కేవలం…. నిజంగా…. కేవలం చాలా సంతోషంగా అన్పించింది. ఈ స్థితిలో భయం, ఆదుర్దా ఎందుకు ఉంటాయో జనాలకి నాకర్థం కాదు. అయినా నా స్థితిలో చూసుకుందాం ఏదయితే అది అనుకున్నాను. తన బిడ్డ జన్మకి ఆనందించని సత్పురుషుడు ఉంటాడా? నాకయితే తల్లినవుతానన్న ఆనందం ఎంత ఎక్కువగా ఉండిందంటే చాలా శాంతంగా అన్పించింది…. మనసులో నుండి…. మనోజ్ వదిలి పెట్టాడన్న కోపం కూడా మిగల్లేదు ఆ ఆనందం ముందు.

ఒంటరిగా అన్పించినపుడు, అతను గుర్తుకొచ్చినపుడు కడుపు మీద మెల్లిగా చేయి వేసి నిమురుకునేదాన్ని. ఇప్పుడిక్కడ ఏమీ లేదు! నా కంతా మోసమే జరిగింది.

(ప్రసన్న ఆమెని దగ్గరికి తీసికొని వీపు నిమురుతుంటాడు. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది. ప్రసన్న కాసేపయాక నెమ్మదిగా లేస్తాడు. అడుగుల చప్పుడు కాకుండా అతిమేల్లగా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నంబరు కలుపుతాడు. అట్నుండి ఫోన్ ఎత్తుతారు, ప్రసన్న లోగొంతుకతో మాట్లాడుతుంటాడు.)

ప్రసన్న  :నాన్నా గత కొద్ది రోజులుగా, నెలలుగా, నిజం చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా మన మధ్య సరిగ్గా మాటలే లేవు. ఈ సంవాదరహితం, దాని దిగులు చాలాసార్లు మీ కళ్ళల్లో కనిపించేది, నేను చూపులు తిప్పేసుకునేవాణ్ణి .

ఈ గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలియకుండానే నాలో ఏదో వెతుకులాట మొదలయింది. ఏంటో నాకు స్పష్టంగా తెలియలేదు. అప్పట్లో బిగుసుకుపోయినట్టుగా ఉన్న సమయం నుండి మనిషిగా నన్ను నేను పరీక్షించుకుంటున్న  రోజులవి.

అన్న పోయాక మీ ఇద్దరి చూపులు నావైపు ప్రేమకై చూసేవి.నేను ….నేను మాత్రం అసంతృప్తిగా, దిశారహితంగా ….నా లోకం నుండి బయటికి రావడానికి తయారుగా లేనే లేకుంటిని! చదువు, ఉద్యోగం, డబ్బు వీటన్నిటినీ  మించిన ప్రశ్నలకి నాకు జవాబే దొరకట్లేదు. నేను చాలా ప్రయత్నం చేసాను. చాలా పనులు చేసాను.

ఇప్పుడిక ఏమీ చేయనని నిర్ణయించుకున్నాను. నేను మీ కొడుకుని. మీ ముందరి ప్రయాణపు మజిలీని. నా రచనకి సంబంధించిన మూలభూత ప్రశ్నల జవాబులు మీలోనే దాగున్నాయి. అందుకై మీవైపు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను.

(ప్రసన్న మాట్లాడుతూనే ఉంటాడు. అతడి మీది ప్రకాశం పోతుంది. మళ్ళీ దీపాలు వెలిగే వరకు అదే స్థానంలో శ్రేయ ఫోన్లో మాట్లాడుతూ కన్పిస్తుంది.)

శ్రేయ: నాకు బిడ్డ తర్వాత నా మీది శ్రద్ధ కాస్త తగ్గుతుంది కావచ్చేమో కన్పించేది నాకు. ఆ బిడ్డకి నాదంతా ఇవ్వాలి. గత కొన్నేళ్ళుగా…. చాలా ఏళ్ళుగా ఇంటి నుండి బయట – ఒక్కదాన్ని ఉండీ ఉండీ నాకు కేవలం  నా జాగ్రత్త చూసుకోవడం అలవాటయి పోయింది. నా ఇల్లు, నా పని, నా భోజనం, నా సమయం, నా ప్రయివెసీ! కారణం ఇక్కడ ఒక్కో మాటకి గొడవ పడాల్సి వస్తుంది. దాంతో ‘స్వయం’ మీద నుండి ధ్యానం అటూ ఇటూ అవదు.

నాకు నా ఇల్లు కావాలనిపించింది అందుకే ఈ ప్రయత్నం చేసాను. నీ నుండి దూరం ఉండి ఉండీ నాకు తల్లి కావాలన్న అనుభవం కావాలనిపించింది. తల్లినవుదామనుకున్నాను. నేనెన్నుకున్న మార్గం నీకు తప్పుగా, అసభ్యంగా అన్పించొచ్చు. కానీ అదలా కాదు.

నేను తిరిగి వస్తే ఏం ఒరుగుతుంది ? జీవితం సాగదీస్తూ బ్రతకడం నా స్వభావం కాదు కదా! కాళ్ళీడ్చుకుంటూనయినా అవనీండి ముందుకు వెళ్తుంటే ఎన్నో విషయాలకు జవాబులు దొరుకుతూ పోతాయి నాకు. నా కోసం ఆదుర్దా పడేకంటే, ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.

(ప్రేక్షకుల వైపు చూస్తూ-)

శ్రేయా!

(దీపాలు ఆరిపోతాయి)

దృశ్యం-5

(దీపాలు వెలిగేసరికి ఏప్రాన్ వేసుకుని ప్రసన్నమాట గదిలో పనిచేస్తూ కనపడతాడు. అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇంటి అలంకరణ మారిందని స్పష్టంగా తెలుస్తుంటుంది. ఫోన్ మ్రోగుతుంది. అతను పరిగెత్తుకొని ఫోన్ ఎత్తుతాడు.)

ప్రసన్న: ఆ…. చెప్పమ్మా. ఆ…. ఆ…. నువ్వు పంపిన పాకెట్ అందింది. నిన్న ఆఫీసుకి వచ్చింది. శనివారం వచ్చేందుకు ప్రయత్నిస్తాను. నాన్న ఎలా ఉన్నారు? మంచిదమ్మా…. నేనింక ఉంటాను…. గాస్ మీద ఏదో పెట్టాను. బాయ్.

(బెల్ మ్రోగుతుంది. ప్రసన్న వెళ్ళి తలుపు తీస్తాడు. శ్రేయ లోపలికి వస్తుంది. ఆమె చేతిలో మొక్కల అంట్లు ఉంటాయి.)

శ్రేయ: నీకోసమే తెచ్చాను!

ప్రసన్న: చాలా బాగున్నాయి. ఊ…. ఏం జరుగుతుంది? ఎప్పుడొచ్చావ్ లడాఖ్ నుండి? నిన్న పూణేలో మొన్న హైద్రాబాద్ లో? ఏం చేస్తున్నావేంటీ?

శ్రేయ: ఏమీ అడక్కు. But Ladakh was the best . షూటింగ్ లో చాలా మజా చేసాం. కెమెరా ఎక్కడ పెడితే అక్కడ ఓ ఫ్రేం దొరుకుతుందక్కడ. ఆ ప్రకృతి ముందు actors వగైరాలంతా బలాదూర్. వాళ్ళ ప్రయోజనమే ఉండదక్కడ. Landscape కేవలం landscape .

ప్రసన్న: చాల్చాలు. చాలింక. మంచినీళ్ళు తాగు.

శ్రేయ: బీర్ లేదా?

ప్రసన్న: ఇస్తాను.

(శ్రేయ లోపలిగదిలోకి పచారుకొట్టి వస్తుంది.)

శ్రేయ: నేనివాళ ఇక్కడ ఉంటున్నాను.

ప్రసన్న: అదేదో నేను నిన్ను వద్దనేవాణ్ణి, అదేదో నేనే నిన్ను వేరే ఇంటికి వెళ్ళమన్నట్టుగా మాట్లాడుతున్నావ్ నువ్వు.

శ్రేయ: లోపలిగది చాలాబాగా అలంకరించావ్! ఇప్పటికీ సూర్యాస్తమయం చూస్తుంటావా రోజూ ?

ప్రసన్న: తొమ్మిదిన్నర పదవుతుంది. నాకు ఇంటికి రావడానికి. కాకపోతే ఆఫీసు రూమ్ కిటికీలో నుండి సముద్రం అవతలకి చూస్తుంటాను. అప్పుడప్పుడూ. సూర్యుడు మెల్లిగా అదృశ్యమవుతున్నప్పుడు.

శ్రేయ: పనెలా జరుగుతుంది?

ప్రసన్న: ఎలా జరుగుతుందో తెలీదు. కానీ చాలా పని నడుస్తుంది. పిల్లలకోసం రాయడం అన్నిట్లోకి కష్టం. మన కన్పిస్తుంది ఆ పని చాలా సులభమని, కానీ అలాక్కానే కాదు. మంచి ఉల్లాసంగా ఉండే పని. మూడు క్యారెక్టర్లని డెవలప్ చేసానిప్పటికి. పన్నెండు మంది ఇలస్ట్రేటర్స్ పని చేస్తున్నారు దాన్ని చేయడానికి. దీపావళప్పటికి మొదటి comic వస్తుంది. ఆ తర్వాత ప్రతి నెల నెలకొకటి!

ప్రస్తుతం నా సమయం ఆఫీసులో వీళ్ళ మధ్యే గడిచిపోతుంది. నేను ఇంట్లో కూర్చుని రాయడం లేదీ మధ్య. ఈ టీమ్ లో ఉంటే మంచి give and take ఉంటుందనిపించింది.

శ్రేయ: ఒక్కడివి ఉన్నప్పుడు ఏం చేస్తున్నావింట్లో ?

ప్రసన్న: (నవ్వుతాడు) నిజం చెప్పనా?

శ్రేయ: ఆ….

ప్రసన్న: నిద్రపోతాను. నిద్ర…. వట్టి నిద్ర. నిద్ర పూర్తవడమే లేదు.

శ్రేయ: Chasing the Monsoon translate చేస్తూ ఉండేవాడివి. పూర్తయిందా ?

ప్రసన్న: Almost . ఈ ఫ్రొటర్ గొప్ప స్వేచ్ఛాజీవి! కేరళ నుండి చిరపుంజి వరకు మాన్ సూన్ మేఘాలతో తిరిగాడు. translate చేస్తూంటే నాకే ఆ మేఘాలతో తిరిగిన అనుభవం అనుకో!

కార్తీక్, నాతో పని చేస్తాడు, వాళ్ళబ్బాయిని తెలుగు మీడియంలో వేసారు. కార్తీక్ భార్య, వాడితో పోట్లాడాం. కార్తీక్ తో నేనన్నాను ఇంగ్లీష్ భాషలో ఉన్న జ్ఞానభండారమంతా నేను నీ కొడుకుకి భాషాంతరం చేసి పెడతాన్లే. భయపడకు అని. అందుకే ఈ పుస్తకాలన్నీ. కార్తీక్ కొడుక్కోసం.

శ్రేయ: ఆకలి. తినడానికేముంది?

ప్రసన్న: పులావు చేసాను. మెంతికూర పరాఠాలు, సేమ్యా పాయసం.

శ్రేయ: కీరదోసకాయ పచ్చడి.

ప్రసన్న: చేసాను…. చేసాను.

(ప్రసన్న లేచి వెళ్ళి వంటింట్లో నుండి భోజనం తీసుకొస్తాడు. హాల్లో ఉన్న పెద్ద నాలుక్కాళ్ళ పీట కిటూ అటూ భోజనానికి కూర్చుంటారిద్దరూ)

ప్రసన్న: శ్రేయా….

శ్రేయ: ఆ….

ప్రసన్న: ఎందుకెళ్ళిపోయావ్? ఒంటరిగా అన్పిస్తుంది. వచ్చేయ్ మళ్ళీ.

శ్రేయ: పిచ్చా నీకేమన్నా ? సౌకర్యంగా ఉంటుందని కదా వేరేగా ఉండేది. అమ్మ సంవత్సరానికి ఆరు నెలలు ముంబాయిలోనే మకాం పెట్టేస్తుంది. తనని పెట్టుకొని ఇక్కడ ఎక్కడుండేది? నువ్వేమనుకుంటావ్ ఇక్కడనుండి వెళ్ళిపోవడం నాకు ఇష్టమనుకుంటావా ఏమిటి?

ప్రసన్న: సరే…. అమ్మతో హాయిగా ఉన్నట్టున్నావ్. లావయావ్ కాస్త.

శ్రేయ: ఈ మధ్య వెనక ముందూ చూడకుండా తినేస్తున్నాను మస్తుగా. మన దగ్గరో పిచ్చితనం కదా? నటి అనగానే సన్నగా పుల్లలాగా ఉండాలని అందరూ ఒకేలా అన్పిస్తారు నాకయితే. ఒక్కొ స్క్రిప్ట్ వింటుంటే ప్రసన్నా…. బాప్ రే… మూడేళ్ళు ఒళ్ళరిగేలా పని చేసాను. ఇప్పుడన్నా కాస్త choosy గా ఉండాలి. ఇక సంవత్సరానికి రెండు సినిమాలు. ఎక్కువలో ఎక్కువ మూడు.

ప్రసన్న: పూర్వపు ఫామిలీ ప్లానింగ్ లా చెప్తున్నావ్.

(ప్రసన్న తింటూ తింటూనే CD Player దగ్గరికి లేచి వెళ్ళి Yahn Tierson Piano CD వేస్తాడు.)

శ్రేయ: నీకు ఇది విన్పించాలనిపించింది. ఈ మధ్య ఇది వింటూ వింటూ రాసుకుంటుంటాను నేను.

(కాసేపు అంతా మౌనం. కేవలం సంగీతం విన్పిస్తూ ఉంటుంది. శ్రేయ ఆ సంగీతం వింటూ గదిలో అటూ ఇటూ తిరుగుతుంటుంది. Piano piece ముగిసిం తర్వాత ప్రసన్న దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది.)

(చీకటి)

(మళ్ళీ వెలుగు వచ్చేవరకు ప్రసన్న శ్రేయ ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని ఉంటాడు.)

శ్రేయ: ప్రసన్నా….

ప్రసన్న: ఆ..

శ్రేయ: ప్రసన్నా, నాకు బిడ్డ కావాలి, నీ బిడ్డ. మనిద్దరి బిడ్డ.

(ప్రసన్న లేచి కూర్చుంటాడు)

ప్రసన్న: శ్రేయా…. నీకు? నా బిడ్డ? ఎలా సాధ్యం? బహుశా నీకు….

శ్రేయ: నాకంతా తెల్సు; ప్రసన్నా నేను చాలా ఆలోచించుకునే మాట్లాడాను. గత కొన్ని సంవత్సరాలుగా నా కుటుంబం అన్నదాని కోసం నేనెంత తపిస్తున్నానో, నువ్వు అంతే తపిస్తున్నావని నాకు తెల్సు! మన మన పరిధులలో మనం ఏర్పర్చుకుందామనే సంబంధాలు కలవడం లేదు. అవి కుదరక పోవడంతో మన మొహాలు వేలాడిపోతాయి. మనని మూర్ఖపు మనుషులు అనుకుంటుంది ఈ లోకం- over sensitive , fragile . మనం తెలివైన వాళ్ళం ఎప్పుడవుతామో కదా?

(ప్రసన్నకి ఒక్కసారిగా చిన్న పిల్లాడిలా అన్పిస్తుంది.

ప్రసన్న: అవును, అవునవును.

శ్రేయ: నీపని, నీ రచనా వ్యాసంగం ఇవన్నీ కేవలం పనిలో భాగమేనా? నీ రచనలని నువ్వే చదువుకొని చూడు ఒకసారి! ఎప్పడినుండయితే అందరిలా మన కుటుంబం మనకుండదేమోనన్పించినదో అప్పట్నుండీ మనం ఇద్దరమూ అదే పనిలో ఉన్నాం.

ప్రసన్న: శ్రేయా…. నేను… కానీ నేను… ఎలా సాధ్యం? నేనెప్పుడూ ఊహించను కూడా లేదు. ఎవరన్నా నాతో ఆ ప్రసక్తి తెస్తారని.

శ్రేయ: నేనంటున్నాను కదా! నీలాంటి ప్రేమించే గుణం కలిగిన పిల్లలు కావాలి నాకు.

(ప్రసన్న చేయి ఒక్క క్షణం అతని భుజం మీదికి వెళ్తుంది.)

ప్రసన్న: శ్రేయా ఏమంటున్నావ్ నువ్వు. కానీ (కాస్త సిగ్గుపడి) ఇదెలా జరుగుతుంది శ్రేయా….

శ్రేయ: అది డాక్టర్ల కొదిలేద్దాం ప్రసన్నా!

(ప్రసన్న రెండు చేతులూ మొహం మీదుంచుకొని శ్రేయవైపు చూస్తుంటాడు)

శ్రేయ: నామీద నమ్మకముంది కదా నీకు! నేనేం నిన్ను బంధించి పెట్టను. పెళ్ళి కూడా నీ ఇష్టం. నీకేం, ఎలా కావాలంటే అలా చేద్దాం. కాకపోతే నేను తల్లిని కావాలి ప్రసన్నా! నీ పాపకి తల్లిని.

(ప్రసన్న ఆమె వైపు నవ్వుతూ చూస్తుంటాడు. ఇంట్లోని ఫోన్ మ్రోగుతుంది. శ్రేయ వెళ్ళి ఫోన్ ఎత్తుతుంది.)

శ్రేయ: హలో….ఆ…. ఒక్క నిమిషమండీ! ఉన్నారతను.

(ఫోన్ ప్రసన్నకిస్తూ -)

శ్రేయ: నాన్న.

(దీపాలు మలుగుతాయి)

(మళ్ళీ దీపపు వెలుగు వచ్చేవరకు ఉదయపు సమయం. శ్రేయా, ప్రసన్నా హాల్లో పడుకొని ఉంటారు. చెరో మూలల్లో గదికి ఇరువైపులా. రాత్రి భోజనపు పాత్రలు మధ్యలో అలానే ఉంటాయి. కాలింగ్ బెల్ మ్రోగుతుంది.)

(శ్రేయ లేచి గడియారం చూస్తుంది)

శ్రేయ: ప్రసన్నా…. లే…. పదయింది.

(శ్రేయ తలుపు దగ్గరికి వెళ్ళి పెద్ద flat parcel తీసుకుని వస్తుంది. ప్రసన్న దగ్గరికి వెళ్ళి అతన్ని లేపుతుంది.)

శ్రేయ: ప్రసన్న…. నీదే…. నీకోసం…. ఏదో వచ్చింది.. కొరియర్ లో.

(ప్రసన్న నిద్రలోనుండి లేస్తాడు. ఇద్దరూ కల్సి ఆ పెద్ద పార్సిల్ ని విప్పుతారు.

(దాన్లో నీలపు రంగుది ఒక పెయింటింగ్ ఉంటుంది)

(ప్రసన్న లేచి నిలబడతాడు. శ్రేయా అతనూ ఒకరి వైపు ఒకరు చూస్తుంటారు.)

(పెయింటింగ్మీదవెలుగుపడ్తూఉంటుంది.)

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

గూడూరు మనోజ

గూడూరు మనోజ

ఫ్రిజ్ లో ప్రేమ

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

దృశ్యం-3

             (ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం వెదికి రాయడం మొదలుపెడతాడు. జేబులో నుండి తాళంచెవి తీసి కళ్ళముందు ఆడిస్తాడు. సంతోషపడి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు.)

             (ఇంతలో బయటనుండి అతి ప్రసన్న ఇంట్లోకొచ్చి పడతాడు. పాకుతూ ప్రసన్న దగ్గరికి వస్తాడు. రక్తసిక్తమయిన బట్టలు, ఒళ్ళంతా గీరుకుపోయి ఉంటుంది.)

ప్రసన్న: అతి ప్రసన్నా… నువ్వా?

అతిప్రసన్న: అవును ప్రసన్నా.. నేను. నేనే. ఉత్తరం చేరగానే పరుగున వచ్చేసాను. ఎలా ఉన్నావు మిత్రమా?

ప్రసన్న: నేను… నేను బాలేను… అతి ప్రసన్నా…

(అతడి దగ్గరికెళ్ళి ఏడుస్తుంటాడు)

అతిప్రసన్న: ఇన్నేళ్ళుగా ఎక్కడున్నావ్? నీ గురించి మాకెవరికీ ఏమీ తెలియలేదు. అసలేం చేసావ్ ప్రసన్నా?

ప్రసన్న: అతి ప్రసన్న… నీకెన్ని దెబ్బలు తగిలాయి… ఎంత రక్తం పోయిందో! నిన్నా కుక్క కరిచిందా ఏమిటీ? ఇలా రా… నా దగ్గర కూర్చో రా..

(ప్రసన్న అతి ప్రసన్నని నేలమీద కూర్చోబెడతాడు. తను రాసుకునే కాగితాలని ఉండగా చుట్టి మెల్లగా రక్తాన్ని తుడుస్తాడు.

అతిప్రసన్న: మీ ఇంటి నాలుగు ప్రక్కల్లో ఈ వీధి కుక్కలే వందలకొద్దీ. నీకు కుక్కలంటే భయం కదా రాజా, చిన్నప్పట్నుండీ? మరెలా.. ఇక్కడెలా బ్రతుకుతావురా ? ఈ ఇంటి నుండి బయట ఎలా పడతావ్ ?

ప్రసన్న: (ఆగకుండా కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటాడు) గడిచిన ఎన్నో ఏళ్ళుగా నేనీ ఇంటి బయట అడుగుపెట్టింది లేదు. ఇక్కడికి ఎవరూ రారు. ఈ కుక్కలు రాత్రంతా ఒకదాంతో ఒకటి కొట్లాడుతుంటాయి. కరుచుకుంటాయి. నాకు నిద్రరాదు. ఎన్నేళ్ళగానో ఇంట్లో వాళ్ళెవరినీ నేను కలవలేదు. స్నేహితుల మొహం చూసి ఎరుగను.

అతిప్రసన్న: అయితే ప్రసన్నా, ఫోనయినా ఎందుకు చేయలేదు? నేనొచ్చేవాడిని కాదా నిన్ను తీసికెళ్ళడానికి ?

ప్రసన్న: నేనంతా సరిగ్గా చెప్పగలనా? నాకు విశ్వాసం కలగడం లేదు. కాస్త కాస్తగా చెపుతాను. ఈ మధ్య నాకు కేవలం రాయడం మాత్రమే తెలుసు. ఇరవైనాలుగు గంటలూ కాగితాల గుట్టముందు కూర్చుని రాస్తూ కూర్చుంటాను.

అతిప్రసన్న: (ఒక్కో ప్రతిని కళ్ళ దగ్గరగా తీసుకొని చూస్తాడు) రాగిరంగు… కుంకుమ పువ్వు రంగు.. పసుపు… వంకాయరంగు .. అన్ని రంగులూ రాస్తావు కదా నువ్వు? ఇదేంటో వేరుగా ఉంది. నీకు గుర్తుందా, కాలేజ్ లో ఉండగా రాత్రి రాత్రంతా జాగారం చేస్తూ ఏమేం రాసేవాడివో! అంతా ఆకాశంలా నీలమయం. ఓసారి ఏదో రాస్తూ కూర్చున్నావ్. మధ్యరాత్రి కాగితాలు అయిపోయాయి. నువ్వయితే టేబిల్, నేల, గోడలు, బట్టలు, అద్దం లాంటి వాటిమీద రాస్తూపోయావ్. నేను మరోరోజు నీ రూముకొచ్చి చూద్దును గదా, అంతా నీలమే.

friz

ప్రసన్న: మనుషుల ప్రవృత్తి మారుతుంది. దానంతటదే..

అతిప్రసన్న: ఇంత పెద్ద మార్పా?

(ప్రసన్న తలవంచుకొని తల ఊపుతాడు.)

అతిప్రసన్న: బయటికి పద. బయట బాగుంటుంది. గత అయిదారేళ్ళలో లోకం చాలా మారిపోయింది.

ప్రసన్న: అంటే, ఏమయింది? చెప్పు సరిగ్గా.

అతిప్రసన్న: ఒకలాగే… దానంతటదే జరిగింది.

ప్రసన్న: దాన్లో గొప్పదనమేముందని?

అతిప్రసన్న: అంతా దాగుడు మూతలాట. ఒకళ్ళు బయటికి వెళితే మరొకరు లోపలికెళతారు.

ప్రసన్న: మన కాలేజ్ ప్రక్కనుండే ఆ పెద్ద గడిలాంటి ఇల్లు.

అతిప్రసన్న: అది పడిపోయింది.

ప్రసన్న: ఇంటి ముందటి నది ?

అతిప్రసన్న: అది ఎండిపోయింది.

ప్రసన్న: మరేముంది అంటున్నావ్?

అతిప్రసన్న: మనుష్యులు! బయట మనుషులున్నారు ప్రసన్నా. వివిధ రకాలు. వేరు వేరు తరహాలలో. తమదైన పధ్ధతిలో బ్రతికేవాళ్ళు. ఇంకొకళ్ళని బ్రతకనిచ్చే వాళ్ళు. ఈ కుక్కలకన్న నయమైన వాళ్ళు. పద… ఉన్నపళంగా.. నేను తీసికెళ్తాను నిన్ని బయటికి.

ప్రసన్న: లేదు. అది సాధ్యం కాదు. ఇన్ని కుక్కలు ఇంటి చుట్టూ ఉండగా నేను కిటికీ నుండి బయటికి తొంగికూడా చూడలేను.

అతిప్రసన్న: మీ ఇంట్లోవాళ్ళకి నీ భాష అర్థమవుతుంది కదా?

ప్రసన్న: కావొచ్చు.

అతిప్రసన్న: ఏదేమైనా నీకు నేనున్నానని గుర్తుంటుంది కదా ?

(ప్రసన్న ఏడుస్తూ తల ఊపుతాడు.)

(అతిప్రసన్న అతడిని దగ్గరికి తీసుకుంటాడు.)

ప్రసన్న: చాలా రోజుల తర్వాత బాగాన్పించింది. అడక్కుండా చాలా దొరికింది.

అతిప్రసన్న: అడక్కుండా? ప్రేమ ఏమయినా ఇచ్చే వస్తువూ, అడిగే వస్తువా ఏమిటి ? ప్రేమ ఉంటుంది. అదో ప్రవాహం. ఒక వైపునుండి మరోవైపుకి దానంతటదే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రేమనెవ్వరూ ఆపలేరు. నిలువ  ఉంచలేరు.

(ప్రసన్న నవ్వుతూ జేబులో నుండి తాళంచెవి తీస్తాడు. పడేస్తాడు. అంతలో సూర్య వచ్చి ఆ తాళం చెవిని మింగేస్తాడు. ప్రసన్న, అతిప్రసన్నల దృష్టికి రాదిది. సూర్య గప్ చుప్ గా పారిపోతాడు.)

అతిప్రసన్న: నువ్వు బయటపడే అవకాశం, గురివింద గింజంత అవకాశం వచ్చినా నన్ను పిలువు. ఫోన్ చెయ్. ఉత్తరం రాస్తూ కూర్చోకు. ఆ ఫోన్ ఎత్తి ఈ నెంబర్ నొక్కెయ్. నేనీ కాగితం మీద రాసి ఇక్కడ పెడ్తున్నాను. ఇది చూసుకో. ఈ నెంబర్ కలిపి ‘అతిప్రసన్న, వచ్చెయ్’ అను. నేను వెంటనే వచ్చేస్తాను.

ప్రసన్న: ఫోనులో నువ్వు నాకెంత కావాలో, ఎలా కావాలో తెలుస్తుందా నీకు? సమాచారం అంతా అందుతుందా?

అతిప్రసన్న: నీ పిలుపులో నాకంతా అందుతుంది. ఉత్తరం మాత్రం రాస్తూ కూర్చోకు.

ప్రసన్న: సరే.

( అతి ప్రసన్న గబుక్కున లేచి వెళ్ళిపోతాడు.)

( ప్రసన్న ఏడుస్తుంటాడు. కాగితాలని జరిపి అక్కడే నిద్రపోతాడు.)

( ప్రసన్న నిద్రపోతుండగానే పార్వతీబాయి వస్తుంది. చేతిలో పూలదండ. వెనకనుండి సూర్య పరిగెత్తుకుని వచ్చి ఆవిడ కాళ్ళు నాకడం మొదలెడుతుంది.)

పార్వతీబాయి: ఇవ్వు!

(సూర్య నోట్లో నుండి తాళంచెవి ఆవిడ ముందు పడేస్తాడు. ఆవిడ అత్యంత ఆనందంతో ఆ తాళం చెవిని తీసుకుంటుంది. ఆనందంతో చుట్టూ తిరుగుతూ పాట పాడుతుంటుంది.)

పార్వతీబాయి: ప్రేమలో పడేవాళ్ళూ…

ప్రేమలో పడేట్టు చేసేవాళ్ళూ..

ప్రేమలో మునిగితేలే వాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

తలక్రిందులుగా కాళ్ళు పైకిగా

భేటీ కార్డ్ అచ్చేసుకొనేవాళ్ళూ..

ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళూ..

సైటు కొట్టేవాళ్ళు…

నా చేతిలో ఏముందో తెల్సా ?

వేడిపాలపైన మెత్తమెత్తని మీగడ

కండోమ్ అమ్మేవాళ్ళూ…

ప్రసవం చేసేవాళ్ళూ…

అమ్మాయిని లేవదీసుకు వెళ్ళేవాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

సుధృడమైన కామధేను…

వీధి కుక్కల మేడం గార్లూ…

బద్దకించిన రచయితల్లారా..

నా చేతిలో ఏముందో తెల్సా ?

W , X మరియు Y

(కర్ణకఠోరంగా పకపకలుగా నవ్వుతుండగా దీపం ఆరిపోయింది.)

మూలం: సచిన్ కుండల్కర్

                                                                                                                                                                    అనువాదం: గూడూరు మనోజ

గూడూరు మనోజ

~

“ఫ్రిజ్ లో ప్రేమ” అనువాద నాటకం – 6 వ భాగం

friz

దృశ్యం-2

వర్షాకాలం

(స్టేజ్ మీద వెలుగు వచ్చే వరకు ప్రసన్న మున్షీ డెస్క్ దగ్గర కూర్చుని రాసుకుంటూ కనపడతాడు. ఫ్రెష్ గా)

ప్రసన్న: నేనీ మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు వారివారి జీవితాలతో, వాళ్ళతో నాకు సంబంధించినంతవరకు లాజిక్ కుదురుస్తుంటారు. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమయింది. నాకింకొకటి కూడా అర్థమయ్యింది. ఏంటంటే….

మిత్రుడు: …. నేనొక…. అర్థంకాని వాణ్ణి. అర్థం చేసుకోవడం కష్టమయిన మనిషిని అయుండాలి. నాలాంటి ఓ మనిషిని అర్థం చేసుకోవడానికి ఎంతయితే సమయం పడుతుందో అంత సమయం ఈ జగంలో ఎవరి దగ్గరా లేదు. ఇందులో వాళ్ళ తప్పు లేదు.

ప్రసన్న: (రాస్తూ) వాళ్ళ తప్పు లేదు. చేతిలోకొచ్చిన తాజా పుస్తకం లాంటి వాళ్ళు ఎదురొచ్చిన ప్రతి మనిషీనూ! వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి. పుస్తకమయినా, మనిషయినా!

మిత్రుడు: నాకా సమయం ఇచ్చేవారే ఎవరూ లేరు.

ప్రసన్న: అందుకే నాకీ మధ్య నేనంటేనే భయం పట్టుకుంది. చుట్టుప్రక్కల వాళ్ళ గురించి ఏమీ అన్పించదు.

మిత్రుడు: ఇక్కడి వరకు బాగానే ఉంది; కానీ ముందు ముందు తెలుగులో రాయడం కష్టం. ఇంత భావాత్మకంగా, ఉత్కృష్టంగా వీటిని మించి శారీరక సుందరత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు…. తెలుగులో కష్టం అవుతుంది.

ప్రసన్న: కానీ, ఎందుకు?

ఇద్దరూ: కాస్త ఆగుదాం.

(ప్రసన్న ఓ రెండు క్షణాలు అస్వస్థతగా కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత చేతిలోని కాగితాలని చింపి పడేస్తాడు. ఏడవడం మొదలెడతాడు. మిత్రుడు పరుగున వెళ్లి అతన్ని దగ్గరికి తీసుకుంటాడు.)

మిత్రుడు: ఏమయింది?

(ప్రసన్న ఏడుస్తూనే ఉంటాడు.)

మిత్రుడు: అన్నీ సర్దేసుకొని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చును. ఏదీ బలవంతంగా చేయాల్సిన పని లేదు ఎవరూ. మనం రాగానే మన వెనక తలుపులు మూసుకోలేదు.

(ప్రసన్న ఏడుస్తూనే లేదు లేదంటాడు.)

(కాసేపయిన తర్వాత కళ్ళు తుడుచుకొని ఏడవడం ఆపుతాడు; కానీ వెక్కిళ్ళు వస్తుంటాయి.)

మిత్రుడు: ఏ విధమైన బలవంతం లేదు. రాయాలన్న నిబంధన లేదు. సమయం నిర్దేశమూ లేదు. మనసుకెలా తోస్తే అలా…. కాబట్టి ప్రశాంతంగా రాయి.

ప్రసన్న: మంచినీళ్ళు.

(మిత్రుడు నీళ్ళు తేవడానికి లోపలి వంటగదిలో కెళతాడు. ఇంతలో ఫోన్ మ్రోగుతుంది. మిత్రుడు ఫోన్ వైపుకెళ్తుంటాడు. ప్రసన్న అతడికి వద్దు వద్దని చెప్పే అంతలో అతడు ఫోన్ ఎత్తుతాడు.)

మిత్రుడు: ఎవరూ మాట్లాడేది? శ్రేయ….

(ప్రసన్న పరుగున వెళ్ళి రిసీవర్ తీసికొని చిన్న పిల్లాడి గొంతులో మాట్లాడడం మొదలుపెడతాడు.)

ప్రసన్న: హలో…. హలో…. ఎవలూ…. ఎవరు మాటాడేదీ? నేనా…. నేను నీళ్ళు తాగుతున్నాను ఎవలూ? శ్లేయా…. శ్లేయక్క బజారు నుండి సీట్లు తేవడానికెల్లింది చాలా శ్లేయక్క ఆచ్చిపోయింది…. మీరూ పోండి.

(ఫోన్ పెట్టేస్తాడు.) (మళ్ళీ ఫోన్ మ్రోగుతుంది.)

హలో…. ఎవలూ మాటాడేది?

(ఫోన్ కట్ అవుతుంది. ప్రసన్న గట్టిగా నవ్వుతాడు. మిత్రుడు కూడా నవ్వుతాడు.)

మిత్రుడు: ఏంట్రా ఇదంతా?

ప్రసన్న: శ్రేయ వాళ్ళమ్మ ఫోన్ చేస్తారు. General …. watch ఉంచడానికి, నేనొచ్చిన రోజే శ్రేయ చెప్పింది ఫోన్ ఎత్తవద్దని. నేన్నీకు చెప్తూనే ఉన్నంతలో నువ్వు ఫోన్ ఎత్తేసావు.

మిత్రుడు: మరిప్పుడు?

ప్రసన్న: శ్రేయ చెప్పుకుంటుందిలే, ఏమైనా…. చూద్దాం!

(ఒక్కసారిగా ఇద్దరూ కాసేపటి వరకు Block అయిపోతారు.)

ప్రసన్న: మా అమ్మ ఫోన్ వచ్చింది ప్రొద్దున్న. నాన్నా కూడా మాట్లాడారు.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నా గురించి పడే బెంగ బయట పడనివ్వకుండా మాట్లాడారు. పోయినసారి మూటాముల్లె సర్దుకొని ముంబాయి నుండి తిరిగి వెళ్ళిన వాణ్ణి కదా! బెంగ పడడం సహజమే కదా? కానీ వాళ్ళకూ ఎక్కడో తెల్సిపోయింది నేనా ఇంట్లో ఉండలేనని…. వాళ్ళతో నాకేం గొడవ లేదు; పైగా నాతో నాకే గొడవ. ఈ మధ్య నేనిలా అసంబద్ధంగా మాట్లాడుతున్నానా ?

మిత్రుడు: నాకెందుకు కన్పిస్తుందలా?

ప్రసన్న: ఒక్క నాన్నకి మాత్రం నాకిక్కడేం ప్రాబ్లం లేదని అర్థమయిందనుకుంటాను.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నాన్నన్నారు, ‘వెళ్ళు! నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఏదో మంథనం జరుగుతుందని మాత్రం అన్పిస్తుంది. వేరే ఇంట్లో ఉంటే నువ్వు ముందుకెళ్తావ్ అనుకుంటే, అలాగే వెళ్ళు!’ కాకపోతే రాసుకునేందుకు అనువుగా నాకు వీలయిన వాతావరణం తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

మిత్రుడు: ఇక్కడనుండి సూర్యాస్తమయం కన్పిస్తుందా?

ప్రసన్న: శ్రేయ నడిగాను నేను. తన గదిలోని కిటికీ నుండి కన్పిస్తుంది. పద….

(ప్రసన్న, మిత్రుడు లోపలికెళ్తారు. స్టేజ్ కొన్ని క్షణాల వరకు ఖాళీగా ఉంటుంది. మిత్రుడు లోపట్నుండి బయటకొస్తాడు. హాల్లోని lamp shades ల్లోని bulb on చేస్తాడు. నీలం రంగు చిత్రం మీద వెలుగు. అతడు రాసిన కాగితాలన్నీ సరిగ్గా అమర్చి బొత్తుగా పెడుతుండగా ఒక కాగితం పెడుతు పెడుతూ ఆగుతాడు. ఆ కాగితం పట్టుకొని ధ్యాసగా చదువుతుంటుంటే అతడి మొహంలో ప్రసన్నని గురించిన ఆదుర్దా.)

మిత్రుడు: గబ్బిలం….

సరిగ్గా నా కిటికీ ఎదురుగా రెండు విద్యుత్ తీగెల మధ్య చిక్కుకుని ఓ గబ్బిలం చచ్చిపోయింది. రాత్రిపూట ఆ తీగెలకానుకొని విద్యుత్ ఘాతంలో పోయింటుంది. అప్పట్నుండి నాకు తెలీకుండానే అంతా తలక్రిందులుగా జరుగుతూపోయింది. ఆ తీగల మీది గబ్బిలం చాలా బాగుండేది. అందుకనే దాని ఫోటోలూ తీయబడ్డాయి. దాని శరీరం నుండి అతివేగవంతమైన విద్యుత్ ప్రవాహం జరుగుతుండడం మూలాన అది అతి మెల్ల మెల్లగా పాడవుతూ వచ్చింది. ఓ ఆర్నెల్ల పాటు నేను దాన్ని చూస్తున్నప్పుడల్లా అయోమయంలో రకరకాల భావాలకు గురయ్యేవాడిని. మూడు నాలుగు నెలల్లో మధ్యలో ఆకారం అంతా ఎండిపోయింది. బక్కచిక్కిపోయింది. కానీ ఆ తీగల మధ్య చిక్కిన నల్లటి రెక్కలు అలానే ఉండిపోయాయి. అంతా అయిపోవచ్చాక వర్షాకాలం దాన్లోని ఒక్క రెక్క మాత్రం రాలి పడింది. ఇంకో రెక్క మాత్రం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ అలాగే ఆ తీగలకి అతుక్కుని ఉంది. అది రాలడానికి ఇంకా సమయం పడ్తుందని నాకన్పిస్తుంది.

(మిత్రుడు చీకట్లో కనీకన్పడకుండా ఉండిపోతాడు. ఫోన్ మ్రోగుతుంటుంది. ప్రసన్న లోపలనుండి మెల్లిగా వచ్చి ఫోన్ ప్రక్కన శాంతంగా కూర్చుంటాడు. అతడి మొహం మీద అప్పుడే సూర్యాస్తమయం చుసిన ప్రశాంతత. ఫోన్ మ్రోగి మ్రోగి ఆగిపోతుంది. శ్రేయ ఇంట్లోకి వస్తుంది మెల్లగా.)

(అలసిపోయింటుంది.)

(ఒంటి మీద పూలపూల కాటన్ చీర. బొమ్మలా ఉంటుంది.)

శ్రేయ: ఎలా ఉన్నావ్? ఇంట్లోనే ఉన్నావా?

ప్రసన్న: నేనెక్కడికెళ్తాను?

శ్రేయ: సారీ, ఇలా లంచ్ ముగించుకొని వచ్చే నా అలవాటు మారదు.

ప్రసన్న: It doesn’t matter . అలసిపోయినట్టున్నావ్, చాయ్ పెడతాను.

శ్రేయ: పనెలా జరుగుతుంది? రోజంతా రాసుకున్నావా?

ప్రసన్న: ఆ….

శ్రేయ: అమ్మ ఫోన్…. నాకివాళ కాస్త ఆలస్యం అయింది.

ప్రసన్న: మీ ఇంటికి పక్కింటి చిన్న పిల్లాడు వస్తుంటాడు. మధ్యమధ్యలో ప్రక్కింటి వాళ్ళు అప్పుడప్పుడూ వాణ్ణి నీ దగ్గరుంచి వెళ్తుంటారు. నీకు పిల్లలంటే ఇష్టమని.

(శ్రేయ చురుక్కున చూస్తుంది.)

…. ఇవాళ ఆ పిల్లవాడు ఫోన్ ఎత్తాడు.

శ్రేయ: No …. ఏమంటున్నావు నువ్వు?

ప్రసన్న: పొరపాటున ఇవాళ నేను ఫోన్ ఎత్తాను.

(ఇద్దరూ గలగలా నవ్వుకుంటారు.)

శ్రేయ: ప్రసన్నా, ఒక గుడ్ న్యూస్.

ప్రసన్న: ఏంటి?

శ్రేయ: నాకివాళ ఒక ad assignment దొరికింది.

ప్రసన్న: Oh wow ! Great ! నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వివాళ ఈ చీరెందుకు కట్టుకున్నావా అని!

శ్రేయ: నాలుగు ఆడిషన్స్ తీసుకున్నారివాళ. మధ్యాహ్నం మూడున్నర వరకు నా షూటింగ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఉండమన్నారు. మళ్ళీ రెండు టెస్ట్ షూట్స్ తీసికొని మరీ ఈ న్యూస్ చెప్పారు.

రెండు నెలల కాంట్రాక్ట్. నా కన్నిటికన్నా ఇందులో నచ్చినదిదే. నేను చాలాకాలం వీటిల్లో ఇరుక్కుని ఉండలేననిపిస్తుంది.

ప్రసన్న: ఎందుకు?

శ్రేయ: ఏం లేదు.

(ప్రసన్న చాయ్ ఇస్తాడు.)

ప్రసన్న: ఇదేమన్నా బాగుందా? నీకింత మంచి assignment దొరికిన రోజు మన మిలా కూర్చుని చాయ్ తాగడం, ఏం బాలేదు.

శ్రేయ: పార్టీ కావాలా ? పోదాం పద బయటికి.

ప్రసన్న: బయటికా? బయటికెందుకు? కాస్తాగు.

(ప్రసన్న లేస్తాడు. సామాన్లనుండి ఒక CD వెదికి తీసి Player లో వేస్తాడు. Wild music వస్తూంటుంది. అతడు ఆమె ముందుకెళ్ళి తనని లేవమన్నట్టుగా సైగ చేస్తాడు. ఆ ఇద్దరూ ఒళ్ళు మరిచి నృత్యం చేస్తారు. ఇద్దరూ very graceful dancers . శ్రేయ ఒక్క క్షణం అలసిపోయి కూర్చుంటుంది. ప్రసన్న తన ముందు కూర్చుంటాడు. ఇద్దరూ నవ్వుతారు.)

శ్రేయ: పిచ్చా…. ఎంత మంచి music పెట్టావ్! నా అంత నేను….

(తనకు మాట్లాడడం రాదు.)

ప్రసన్న: కాసేపయాక మళ్ళీ చేద్దామా?

శ్రేయ: పిచ్చి పట్టిందా ఏమిటి? ఎంత బాగా డాన్స్ చేస్తావ్!

ప్రసన్న: నేను రాక పూర్వం, సాయంత్రం ఇంటికొచ్చాక ఏం చేసే దానివి?

శ్రేయ: అంటే….ఆ…. చెప్తా నుండు. నేను…. ఇలా వచ్చేదాన్ని.

(ఆమె లేచి గుమ్మం దగ్గరికి వెళ్తుంది. ఏం చెప్తూ ఉంటుందో అది చేసి చూపిస్తూ ఉంటుంది.)

నేనిలా వచ్చేదాన్ని సీదా లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఈ గదిలో ఆగేదాన్ని కాదు. అమ్మతో ఫోన్లో మాట్లాడేదాన్ని. తినాలనిపిస్తే తినే దాన్ని…. ఏదో ఒకటి తినేదాన్ని…. అటుకులు, మురమురాలు, పేలాలు ఈ గదిలో లైట్ కూడా వేసేదాన్ని కాదు. ఒక్కళ్ళం ఉన్నప్పుడు చిన్న గదుల్లోనే సురక్షంగా అన్పిస్తుంటుంది కదూ! చుట్టుప్రక్కల గదులన్నీ చీకటిగానే ఉంచేదాన్ని. ఈ గదులన్నీ లేవనుకొని లోపలి గదిలో మాత్రం దీపం ఉంచుకొనేదాన్ని…. ఒక్కటే…. ఏడ్చేదాన్ని.

ప్రసన్న: ఏడవడం దేనికి?

శ్రేయ: ఏడ్చేదాన్ని. ఒంటరి మనిషి. మాట్లాడతాడా, నవ్వుతాడా? కేవలం ఏడవడమే చేయగలదు. నువ్వెప్పుడన్నా ఒక్కడివి ఉన్నావా ?

ప్రసన్న: చాలాసార్లు.

శ్రేయ: చాలాసార్లు?

ప్రసన్న: ఆ…. ఆ తర్వాతేం చేసేదావి ?

శ్రేయ: రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దీపం ఉంచుకునేదాన్ని. లోపలనుండి తలుపు మూడు గడియలు పెట్టేసుకునేదాన్ని. నల్లాలన్నీ గట్టిగా కట్టేసేదాన్ని.

ప్రసన్న: చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా ఇంటి కందరూ వచ్చేవాళ్ళురా, బాబాయి పిల్లలు, మేనత్త పిల్లలు, మామయ్యగారి అబ్బాయి, అమ్మాయిలు అందరూ. రోజంతా ఎంత కొట్టుకొని తిట్టుకున్నా రాత్రయేసరికి అందరూ కల్సి ఒక్క గదిలో పడుకోవాలని ఆరాటపడేవాళ్ళం. ఎలాగోలా. ఎలా పడితే అలా పడుకునేవాళ్ళం మేం. ఒకరు తలుపు దగ్గరయితే, ఒకరు కిటికీ అరుగు మీద పడి నిద్రపోయేవాళ్ళం. నేనేమో ఇంతుండే వాణ్ణి. బక్క పలచగా. ఓ మూలకొదిగి పడుకునే వాణ్ని. కానీ అలా అందరం కల్సుండడం ఎంత బాగనిపించేదో, అలా గది నిండా మన వాళ్ళ మధ్య ఎప్పటికీ ఉండిపోవాలన్పించేది.

శ్రేయ: ఏమయింది మరి?

ప్రసన్న: ఏముంది, అందరం పెరిగిపెద్దవాళ్ళమయాం.

శ్రేయ: ఊ…

(కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉంటారు.)

శ్రేయ: (ఉన్నట్టుండి) ‘ఒక తప్పుడు సహవాసం కన్న ఒంటరితనం మేలు’ అనుకుంటూ అనుకుంటూ ఒంటరితనం అనుభూతిలోకి రావడం మొదలుపెడుతుంది.

(శ్రేయ అలసటగా తన మొహం మీద, జుట్టులో చేతులు కప్పుకొంటుంది.)

ప్రసన్న: మధ్యాహ్నం వంట ఎక్కువ చేసిపెట్టాను. పద, భోంచేద్దాం.

(ప్రసన్న kitchenett వైపుకి వెళ్తాడు. శ్రేయ అతడు రాసిన కాగితాలు పరిశీలిస్తుంటుంది.)

శ్రేయ: ఏంటీ వాక్యం…. ఇంత పొడుగ్గా.

ప్రసన్న: చాలాసార్లు నేను పూర్ణవిరామం మర్చిపోతాను వాక్యం చివరలో. శ్రద్ధగా చదువు. నిజం చెప్పాలంటే, ప్లీస్…… ఉండనీయ్ ఇప్పుడు చదవడం. దానిమీద ఇంకా పని కావాల్సి ఉంది. ఇంకా మార్పులూ, చేర్పులూ ఉన్నాయి.

శ్రేయ: ఈ పరిమళ్ పశ్చిమానికి వెళ్ళాడూ అంటే విదేశాలకు వెళ్ళాడనా ?

ప్రసన్న: పెట్టెయ్ శ్రేయా, Please .

శ్రేయ: సర్లే, పెట్టేస్తాను. ఇంతకీ నీ నవలలో ఏం రాస్తున్నావ్ ?

ప్రసన్న: నా వల్ల కావట్లేదు. ఇవాళ చెప్పుకోదగ్గ పని జరగనే లేదు. రాయలేకపోయాను అనుకున్నట్టుగా!

(అతడు భోజనం పళ్ళాలు తెస్తాడు. ఇద్దరూ మౌనంగా తలలు వంచుకొని తింటూ ఉంటారు.)

శ్రేయ: నువ్వు రాసేదంతా ఎక్కడయినా ఎప్పుడయినా చెప్పగలగాలి. నేను.

ప్రసన్న: నువ్వు నటివి, నేను రాస్తుంటాననా! కానీ నేను నాటకాలు, సినిమా రాయను కదా! అప్పుడప్పుడు ads కోసం రాస్తాను. అది పెద్దగా రచనల క్రిందికి రాదు.

( ఫోన్ మ్రోగుతుంది.)

శ్రేయ: మ్రోగనీ…. రోజూ అదే అదే reporting ఏమనివ్వాలి తనకు.

(ప్రసన్న వెళ్ళి ఫోన్ ఎత్తి మళ్ళీ చిన్న పిల్లాడిలాగా మాట్లాడడం మొదలు పెడ్తాడు. మాట్లాడుతూనే ఉంటాడు.)

(శ్రేయ అతని చేతుల్లో నుండి రిసీవర్ లాక్కుంటుంది.)

శ్రేయ: చెప్పమ్మా…. అవును. పక్కింట్లోని కాళే వాళ్ళ అబ్బాయి. ఆడుకోవడాని కొస్తుంటాడు. అవునమ్మా…. రెండు…. రెండున్నరేళ్ళ పిల్లాడు. అవును…. ఈ మధ్యే వచ్చారు కొత్తగా. మంచివాళ్ళు. కాస్త మనిషి తోడుగా ఉంటారు. అమ్మా, నాకివాళ ఒక ad దొరికింది. నూనెది. నాన్నకి కుడా చెప్పు. Thank you . పదిహేను రోజుల్లో షూటింగ్ ఉంటుంది. అ…. ఆ సినిమా అయిపోయింది. నావి ఓ తొమ్మిది పది scenes ఉండొచ్చు. అంతే. కానీ హాయిగా జరిగిపోయింది షూటింగ్. రేపా…. రేపు ఎల్లుండి ఆడిషన్స్ ఉన్నాయి. అమ్మా, నేను భోంచేస్తున్నాను. రేపు మళ్ళీ మాట్లాడతాను. Okay మంచిది!

ప్రసన్న: అమ్మ తెలుగు సీరియల్స్ చూస్తుంటుంది, నాన్న…. నాన్నేమో ఆవరణలో పచార్లు చేస్తుండొచ్చు. గులామ్ ఆలీ గజల్స్ వింటారాయన రోజూ.

శ్రేయ: నువ్వొక్కడివేనా ?

ప్రసన్న: ఇప్పుడొక్కణ్ణే. అన్న పోయాడు. నిద్రమాత్రలు మింగేసాడు తను.

శ్రేయ: ఎప్పుడు ?

ప్రసన్న: నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. అన్నకి ఇరవై- ఇరవై ఒకటి ఉండొచ్చు. అసలు అమ్మ మంచి ధైర్యస్థురాలు. అప్పట్నుండి ఎలాగో అయిపోయింది. నాన్న ఏమీ పట్టనట్టుగా వట్టి కోపిష్టిగా ఉండేవారు, ఇప్పుడు శాంతంగా అయిపోయారు. అప్పుడప్పుడు నా వైపు అదో తరహాగా నేనేమయిపోతానో అన్నట్టు చూడడం అస్సలు చూడబుద్ధవదు.

అన్న నా హీరో. నాకు బైక్ నేర్పాడు. మొదటి బీర్ తనతోనే తాగాను. తన పాకెట్ మనీలో నుండి ప్రతి నెలా నాకు పది రూపాయిలిచ్చేవాడు. అన్న పోయినప్పుడు అమ్మానాన్నల ఆగని ఏడుపు చూసి నాకు కన్నీళ్ళే రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చుని అన్న గురించి అంతా రాసుకుని పెట్టుకున్నాను. అది శుభ్రంగా మరోసారి రాస్తున్నప్పుడు అర్థమయింది నాకు, అన్న పోవడమంటే ఏమిటో, ఆ పోవడం ఏమేం తీసుకెళ్ళిందో!

శ్రేయ: రాస్తే అర్థమవుతుందా ఏం కోల్పోయామో!

ప్రసన్న: నాకు.

శ్రేయ: ఎలా…. ఎలా రాస్తావ్ నువ్వు? అంటే ఏం అన్పిస్తుంది? రాసే ముందు ఏం చేస్తావ్?

ప్రసన్న: కొత్త స్టేషనరీ సామాను తెచ్చుకుంటాను. ఎప్పుడు రాసినా రాసే ఆరంభం నేను కొత్త స్టేషనరీ తోనే చేస్తాను. కొత్త కాగితపు ఫోల్డర్స్, నోట్స్ కి పెట్టే చిన్న చిన్న రంగురంగుల క్లిప్స్…. కొత్త కాగితాలు. ఇంతకు ముందు నేను దేని మీద పడితే దాని మీద రాసేవాడిని. ఫోన్ ప్రక్కనుండే రాయని పెన్నులని దులిపి దులిపి మరీ రాసేవాడిని.

ఓ చిత్రకారుడు నా మిత్రుడు. అతనీ ఫౌంటెన్ పెన్ నాకు తెచ్చిచ్చాడు. ఇక ఇప్పుడు నేనీ పెన్ను నిబ్ శుభ్రం చేస్తాను. పెన్నులో సిరా పోసుకుంటాను. ఆ తర్వాత అన్నీ ముందు పెట్టుకు కూర్చుంటాను. సత్యనారాయణ వ్రతం పూజా సామాగ్రి అమర్చుకొంటున్నట్టుగా!

శ్రేయ: ఆ తర్వాత కుదురు వస్తుందా?

ప్రసన్న: ఆ…. ఒక్కోసారి…. ఒక్కోసారి అస్సలు కుదరదు.

శ్రేయ: సినిమాకి ఆక్టర్స్ ని ఇలా స్వచ్ఛంగా తెచ్చి పని చేయించడం కుదరదు… అసలు చెప్పాలంటే సినిమా పనంతా ముక్కలు ముక్కల్లో అవుతుంది. అది కాక చుట్టుప్రక్కల అంతా జనం…. అస్తవ్యస్తంగా…. వస్తువులు….! వేలాడే వైర్లు, థర్మాకోల్స్…. ధగధగలాడే లైట్స్…. ఏ క్యారెక్టర్ తో పని చేయాలో చాలాసార్లు వాళ్ళని మనం కలుసుకోలేం.

నా మొదటి సినిమా అప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లిమెల్లగా నేర్చుకున్నాను. ఆ గందరగోళంలో మనమే మన స్పేస్ వెతుక్కోవాల్సి ఉంటుందని నా కర్థమయింది. నాకు నా వంతు స్థలం దొరికింది.

ప్రసన్న: మేకప్ రూమ్?

శ్రేయ: ఛ…. ఛ…. అస్సలు కాదు. షాట్ ప్రారంభించే ముందు కొన్ని క్షణాలు మన మొహం ముందు క్లాప్ తీస్తారు. మనకీ జనాలకీ మధ్య. అప్పుడు సెట్ మీద ఒక momentary silence ఉంటుంది. అప్పుడు నేనోక్షణం కళ్ళు మూసుకుంటాను. ఆ తర్వాత అన్నీ వదిలేస్తాను. నన్ను నేను కూడా.

(ఒక్కసారిగా వెళ్ళి కూలబడినట్టుగా కుర్చీలో కూర్చుంటాడు.)

ప్రసన్న: పని చేస్తూండడం ఎంత బాగుంటుంది కదా! అదీ ఇష్టమయిన పని. నాకో స్నేహితుడు ఉన్నాడు.

శ్రేయ: చిత్రకారుడు?

ప్రసన్న: అవును-చిత్రకార మిత్రుడు…. అతనంటుంటాడు. పనిలో మనసు లగ్నం చేసిన మనుషులు అందర్లోకి అందంగా కన్పిస్తారు. అతి అందమైన వాళ్ళ కన్నా అందంగా!

శ్రేయ: నీ స్నేహితుడి పేరేంటి?

ప్రసన్న: పేరొద్దు. వట్టి చిత్రకార మిత్రుడు.

శ్రేయ: ఎక్కడుంటాడు అతను?

ప్రసన్న: బయటికి వెళ్ళాడు, వస్తాడు.

శ్రేయ: అసలు నీతో పరిచయం అయినట్టుగానే అన్పించదు నాకు. అప్పుడప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తావ్.

ప్రసన్న: చాలా విషయాల్లో మనమిద్దరమూ ఒకేలాంటి వాళ్ళం శ్రేయా, మనలాంటి ఒకేతీరు వాళ్ళకి చాలాసార్లు ఒక్కళ్ళనొకళ్ళం ఎరగమేమోననే భావన కలుగుతుంటుంది ప్రతీసారి. ఎందుకంటే మన ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మనం బయటి ఊర్ల నుండి, ఇంచుమించు ఒకే లాంటి ఇంటి పద్ధతుల నుండి అంతా వెనకాల వదిలేసి వచ్చిన వాళ్ళం మనం. ఒంటరులం.అందుకే నిన్ను అర్థం చేసుకో గలుగుతాను నేను.

శ్రేయ: My God ! ఏం అర్థం చేసుకున్నావ్ నువ్వు నన్ను?

ప్రసన్న: ఏముందీ, నువ్వు మంచి అమ్మాయివి. కష్టజీవివి. ఇంటి నుండి బయటపడిం తర్వాత ఈ గజిబిజి నగరంలో కలిసిపోతావ్ అయినప్పటికీ నీ ఎనర్జీ ని అలాగే కాపాడుకుంటావ్. ప్రొద్దున్న ఇంటి నుండి బయల్దేరేప్పుడు ఏదయితే మంచితనం ఉందో దాన్ని నవ్వు మొహంతో తీసికెళ్ళి మళ్ళీ సాయంత్రం అలాగే కాపాడుకుని తిరిగి సాయంత్రం ఇంటికొస్తావ్. నీకేం కావాలో నీకు తప్పక దొరుకుతుంది శ్రేయా!

శ్రేయ: నిజంగా?

ప్రసన్న: నిజంగా!

శ్రేయ: నేనేం ఏదో పెద్ద దిగివచ్చానని కాదు; కానీ చాలా కష్టపడ్డాను నా కాళ్ళమీద నేను నిలద్రోక్కుకోవడానికి!

కేవలం acting మాత్రమే కాదు కదా. అన్నీ…. అన్ని విషయాల్లో. నా పద్ధతిలో నేను బ్రతుకుదాం అనుకున్నాను గనక! ఈ ముంబాయి, పుణే మహానగరాల సంగతే తెల్సు నీకు…. కానీ చిన్న పట్టణాల్లో, ఊళ్ళల్లో ఆడపిల్లల్ని సరిగ్గా చూడరు ప్రసన్నా…. ఏ నిర్ణయమూ ఆడపిల్ల తీసుకోలేదు. ఆమె తరపున నిర్ణయాలన్నీ ఆమె బంధుజనమే తీసుకుంటారు. నేను కాలేజ్ చదువుకోసం వచ్చిందాన్ని ఇక తిరిగి వెళ్ళలేదు నేను. నా గూడు నేను ఏర్పరచుకొందామని తాపత్రయం.

(కాసేపు ఒక్కసారిగా విచారంగా మారిన మొహంతో ప్రసన్న వైపు చూసి, నవ్వి మెల్లిగా లోపలికెళ్తుంది.)

(కొన్ని క్షణాలు అంధకారం)

(మళ్ళీ ప్రకాశం వచ్చేవరకు మధ్య రాత్రి.)

(శ్రేయ లోపలనుండి దిండూ దుప్పటి తీసికొని వస్తుంది. ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. అతని కేసి చూసి గదిలో ఓ వైపుకి పక్క వేసుకొని పడుకుంటుంది.)

(చీకటి)

( సశేషం)

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

మరాఠీ మూలం : సచిన్ కుమ్డల్కర్

గూడూరు మనోజ

గూడూరు మనోజ

తెలుగు అనువాదం : గూడూరు మనోజ

” ఫ్రిజ్ లో ప్రేమ ” అనువాద నాటకం – 5 వ భాగం

తెలుగు అనువాదం:  గూడూరు మనోజ

గూడూరు మనోజ

” ఫ్రిజ్ లో ప్రేమ ” అనువాద నాటకం – 4 వ భాగం

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

దృశ్యం-4

(రంగస్థలం మీద దీపాలు వెలిగేప్పటికి ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. చంద్ర సూర్యులు అతని ముందు కొంతదూరంలో కూర్చుని ఉంటారు. ముఖాల్లో శాంతి, బుద్ధిస్టు మాంక్ లాగా.)

(మోనాస్ట్రీలలోని కర్ర గంటలు అదేపనిగా మోగుతుంటాయి)

చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోరాదు.

చంద్ర: మధ్యలో ఎక్కడో…

సూర్య: మధ్యలో ఎక్కడో?…

చంద్ర: మారాలి.

సూర్య: పరివర్తనం

చంద్ర: కొత్త యుగం.

సూర్య: నాకు స్వేఛ్చ

చంద్ర: నాకుమల్లే

సూర్య: అధికారం మారుతుంది.

చంద్ర: ఆ… తెలుస్తోంది.

సూర్య: ఇది సమ్మతమేనా?

చంద్ర: ఇదో సంభ్రమం.

సూర్య: కారణం.

చంద్ర: ప్రామాణికత, యాజమాని పట్ల విశ్వాసం.

సూర్య: ఎవరు, ఎప్పుడు నిర్ణయించారు?

చంద్ర: యుగయుగాలుగా మనుషులు మన గురించి ఇదే చెప్తూ వస్తున్నారు.

సూర్య: మన ప్రామాణికతని మనుష్యులు నిర్ణయిస్తారన్నమాట… మనం కాదు! … మనుష్యులు వాళ్ళు చేయలేని పనులకు ఇంకొకళ్ళకి అప్పగిస్తారు.

చంద్ర: ఏమంటున్నావ్!

సూర్య: యోగ్యమైనదే.

చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు.

(కర్ర గంట)

సూర్య: పార్వతిబాయి…

చంద్ర: జై. ఒక సుందర శబ్దాన్ని ఉచ్చరించండి.

సూర్య: పార్వతిబాయి…

చంద్ర: జై.. ఒక సుందర శబ్దాన్ని ఉచ్చరించండి. జీవన అంతిమ సత్యం.. ఒక సుందర శబ్దం.. జీవన అంతిమ సత్యం..

సూర్య: (రెండు కుక్కలూ గట్టిగా మొరగడం మొదలుపెడతాయి.)

(ప్రసన్న నిద్ర నుండి లేస్తాడు. నోటి నుండి కార్తున్న చొంగ తుడ్చుకుని, చిన్నపిల్లాడిలాగా కాళ్ళు చాపి గట్టిగా ఏడవడం మొదలుపెడతాడు).

” ఫ్రిజ్ లో ప్రేమ” అనువాద నాటకం – మూడవ భాగం

friz

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

దృశ్యం-3

             (ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం వెదికి రాయడం మొదలుపెడతాడు. జేబులో నుండి తాళంచెవి తీసి కళ్ళముందు ఆడిస్తాడు.

 సంతోషపడి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు.)

(ఇంతలో బయటనుండి అతి ప్రసన్న ఇంట్లోకొచ్చి పడతాడు. పాకుతూ ప్రసన్న దగ్గరికి వస్తాడు. రక్తసిక్తమయిన బట్టలు, ఒళ్ళంతా గీరుకుపోయి ఉంటుంది.)

ప్రసన్న: అతి ప్రసన్నా… నువ్వా?

అతిప్రసన్న: అవును ప్రసన్నా.. నేను. నేనే. ఉత్తరం చేరగానే పరుగున వచ్చేసాను. ఎలా ఉన్నావు మిత్రమా?

ప్రసన్న: నేను… నేను బాలేను... అతి ప్రసన్నా…

(అతడి దగ్గరికెళ్ళి ఏడుస్తుంటాడు)

అతిప్రసన్న: ఇన్నేళ్ళుగా ఎక్కడున్నావ్? నీ గురించి మాకెవరికీ ఏమీ తెలియలేదు. అసలేం చేసావ్ ప్రసన్నా?

ప్రసన్న: అతి ప్రసన్న… నీకెన్ని దెబ్బలు తగిలాయి… ఎంత రక్తం పోయిందో! నిన్నా కుక్క కరిచిందా ఏమిటీ? ఇలా రా… నా దగ్గర కూర్చో రా..

(ప్రసన్న అతి ప్రసన్నని నేలమీద కూర్చోబెడతాడు. తను రాసుకునే కాగితాలని ఉండగా చుట్టి మెల్లగా రక్తాన్ని తుడుస్తాడు.

అతిప్రసన్న: మీ ఇంటి నాలుగు ప్రక్కల్లో ఈ వీధి కుక్కలే వందలకొద్దీ. నీకు కుక్కలంటే భయం కదా రాజా, చిన్నప్పట్నుండీ? మరెలా.. ఇక్కడెలా బ్రతుకుతావురా ? ఈ ఇంటి నుండి బయట ఎలా పడతావ్ ?

ప్రసన్న: (ఆగకుండా కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటాడు) గడిచిన ఎన్నో ఏళ్ళుగా నేనీ ఇంటి బయట అడుగుపెట్టింది లేదు. ఇక్కడికి ఎవరూ రారు. ఈ కుక్కలు రాత్రంతా ఒకదాంతో ఒకటి కొట్లాడుతుంటాయి. కరుచుకుంటాయి. నాకు నిద్రరాదు. ఎన్నేళ్ళగానో ఇంట్లో వాళ్ళెవరినీ నేను కలవలేదు. స్నేహితుల మొహం చూసి ఎరుగను.

అతిప్రసన్న: అయితే ప్రసన్నా, ఫోనయినా ఎందుకు చేయలేదు? నేనొచ్చేవాడిని కాదా నిన్ను తీసికెళ్ళడానికి ?

ప్రసన్న: నేనంతా సరిగ్గా చెప్పగలనా? నాకు విశ్వాసం కలగడం లేదు. కాస్త కాస్తగా చెపుతాను. ఈ మధ్య నాకు కేవలం రాయడం మాత్రమే తెలుసు. ఇరవైనాలుగు గంటలూ కాగితాల గుట్టముందు కూర్చుని రాస్తూ కూర్చుంటాను.

అతిప్రసన్న: (ఒక్కో ప్రతిని కళ్ళ దగ్గరగా తీసుకొని చూస్తాడు) రాగిరంగు… కుంకుమ పువ్వు రంగు.. పసుపు… వంకాయరంగు .. అన్ని రంగులూ రాస్తావు కదా నువ్వు? ఇదేంటో వేరుగా ఉంది. నీకు గుర్తుందా, కాలేజ్ లో ఉండగా రాత్రి రాత్రంతా జాగారం చేస్తూ ఏమేం రాసేవాడివో! అంతా ఆకాశంలా నీలమయం. ఓసారి ఏదో రాస్తూ కూర్చున్నావ్. మధ్యరాత్రి కాగితాలు అయిపోయాయి. నువ్వయితే టేబిల్, నేల, గోడలు, బట్టలు, అద్దం లాంటి వాటిమీద రాస్తూపోయావ్. నేను మరోరోజు నీ రూముకొచ్చి చూద్దును గదా, అంతా నీలమే.

ప్రసన్న: మనుషుల ప్రవృత్తి మారుతుంది. దానంతటదే..

అతిప్రసన్న: ఇంత పెద్ద మార్పా?

(ప్రసన్న తలవంచుకొని తల ఊపుతాడు.)

అతిప్రసన్న: బయటికి పద. బయట బాగుంటుంది. గత అయిదారేళ్ళలో లోకం చాలా మారిపోయింది.

ప్రసన్న: అంటే, ఏమయింది? చెప్పు సరిగ్గా.

అతిప్రసన్న: ఒకలాగే… దానంతటదే జరిగింది.

ప్రసన్న: దాన్లో గొప్పదనమేముందని?

అతిప్రసన్న: అంతా దాగుడు మూతలాట. ఒకళ్ళు బయటికి వెళితే మరొకరు లోపలికెళతారు.

ప్రసన్న: మన కాలేజ్ ప్రక్కనుండే ఆ పెద్ద గడిలాంటి ఇల్లు.

అతిప్రసన్న: అది పడిపోయింది.

ప్రసన్న: ఇంటి ముందటి నది ?

అతిప్రసన్న: అది ఎండిపోయింది.

ప్రసన్న: మరేముంది అంటున్నావ్?

అతిప్రసన్న: మనుష్యులు! బయట మనుషులున్నారు ప్రసన్నా. వివిధ రకాలు. వేరు వేరు తరహాలలో. తమదైన పధ్ధతిలో బ్రతికేవాళ్ళు. ఇంకొకళ్ళని బ్రతకనిచ్చే వాళ్ళు. ఈ కుక్కలకన్న నయమైన వాళ్ళు. పద… ఉన్నపళంగా.. నేను తీసికెళ్తాను నిన్ని బయటికి.

ప్రసన్న: లేదు. అది సాధ్యం కాదు. ఇన్ని కుక్కలు ఇంటి చుట్టూ ఉండగా నేను కిటికీ నుండి బయటికి తొంగికూడా చూడలేను.

అతిప్రసన్న: మీ ఇంట్లోవాళ్ళకి నీ భాష అర్థమవుతుంది కదా?

ప్రసన్న: కావొచ్చు.

అతిప్రసన్న: ఏదేమైనా నీకు నేనున్నానని గుర్తుంటుంది కదా ?

(ప్రసన్న ఏడుస్తూ తల ఊపుతాడు.)

(అతిప్రసన్న అతడిని దగ్గరికి తీసుకుంటాడు.)

ప్రసన్న: చాలా రోజుల తర్వాత బాగాన్పించింది. అడక్కుండా చాలా దొరికింది.

అతిప్రసన్న: అడక్కుండా? ప్రేమ ఏమయినా ఇచ్చే వస్తువూ, అడిగే వస్తువా ఏమిటి ? ప్రేమ ఉంటుంది. అదో ప్రవాహం. ఒక వైపునుండి మరోవైపుకి దానంతటదే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రేమనెవ్వరూ ఆపలేరు. నిలువ  ఉంచలేరు.

(ప్రసన్న నవ్వుతూ జేబులో నుండి తాళంచెవి తీస్తాడు. పడేస్తాడు. అంతలో సూర్య వచ్చి ఆ తాళం చెవిని మింగేస్తాడు. ప్రసన్న, అతిప్రసన్నల దృష్టికి రాదిది. సూర్య గప్ చుప్ గా పారిపోతాడు.)

అతిప్రసన్న: నువ్వు బయటపడే అవకాశం, గురివింద గింజంత అవకాశం వచ్చినా నన్ను పిలువు. ఫోన్ చెయ్. ఉత్తరం రాస్తూ కూర్చోకు. ఆ ఫోన్ ఎత్తి ఈ నెంబర్ నొక్కెయ్. నేనీ కాగితం మీద రాసి ఇక్కడ పెడ్తున్నాను. ఇది చూసుకో. ఈ నెంబర్ కలిపి ‘అతిప్రసన్న, వచ్చెయ్’ అను. నేను వెంటనే వచ్చేస్తాను.

ప్రసన్న: ఫోనులో నువ్వు నాకెంత కావాలో, ఎలా కావాలో తెలుస్తుందా నీకు? సమాచారం అంతా అందుతుందా?

అతిప్రసన్న: నీ పిలుపులో నాకంతా అందుతుంది. ఉత్తరం మాత్రం రాస్తూ కూర్చోకు.

ప్రసన్న: సరే.

( అతి ప్రసన్న గబుక్కున లేచి వెళ్ళిపోతాడు.)

( ప్రసన్న ఏడుస్తుంటాడు. కాగితాలని జరిపి అక్కడే నిద్రపోతాడు.)

( ప్రసన్న నిద్రపోతుండగానే పార్వతీబాయి వస్తుంది. చేతిలో పూలదండ. వెనకనుండి సూర్య పరిగెత్తుకుని వచ్చి ఆవిడ కాళ్ళు నాకడం మొదలెడుతుంది.)

పార్వతీబాయి: ఇవ్వు!

(సూర్య నోట్లో నుండి తాళంచెవి ఆవిడ ముందు పడేస్తాడు. ఆవిడ అత్యంత ఆనందంతో ఆ తాళం చెవిని తీసుకుంటుంది. ఆనందంతో చుట్టూ తిరుగుతూ పాట పాడుతుంటుంది.)

పార్వతీబాయి: ప్రేమలో పడేవాళ్ళూ…

ప్రేమలో పడేట్టు చేసేవాళ్ళూ..

ప్రేమలో మునిగితేలే వాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

తలక్రిందులుగా కాళ్ళు పైకిగా

భేటీ కార్డ్ అచ్చేసుకొనేవాళ్ళూ..

ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళూ..

సైటు కొట్టేవాళ్ళు…

నా చేతిలో ఏముందో తెల్సా ?

వేడిపాలపైన మెత్తమెత్తని మీగడ

కండోమ్ అమ్మేవాళ్ళూ…

ప్రసవం చేసేవాళ్ళూ…

అమ్మాయిని లేవదీసుకు వెళ్ళేవాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

సుధృడమైన కామధేను…

వీధి కుక్కల మేడం గార్లూ…

బద్దకించిన రచయితల్లారా..

నా చేతిలో ఏముందో తెల్సా ?

W , X మరియు Y

(కర్ణకఠోరంగా పకపకలుగా నవ్వుతుండగా దీపం ఆరిపోయింది.)

(సశేషం)

మరాఠీ మూలం : సచిన్ కుండల్కర్
తెలుగు అనువాదం

గూడూరు మనోజ

గూడూరు మనోజ

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

అనువాద నాటకం ” ఫ్రిజ్ లో ప్రేమ” – రెండవ భాగం

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

friz

దృశ్యం-2 

           (ఆదివారం శుభ్రమయిన బట్టలు వేసుకుని రాసుకుంటూ ఉంటాడు ప్రసన్న. ఫ్రెష్ గా సంతోషంగా, వేగంగా కాగితాలమీద ఏదో దించుతున్నాడు.)

                                                    (పార్వతి వస్తుంది.)

పార్వతి: ప్రసన్నా… ప్రసన్నా, కాస్త డబ్బిస్తావా? పార్వతీబాయితో కాస్త కూరగాయలవీ తెప్పించాలి.

ప్రసన్న: తీసుకో.. లోపల పర్సుంది. దానికడగడమేమిటి పార్వతీ?

పార్వతి: భోజనంలోకి ఏం చేయమంటారు?

ప్రసన్న: నీచేత్తో చేసిన పనసకూర తిని చాలా రోజులయింది. చేస్తావా?

పార్వతి: దాన్దేముంది చేస్తాను. చాయ్ తీసుకుంటారా?

ప్రసన్న: చాయ్ ఇస్తానంటే నేనెప్పుడన్నా వద్దంటానా?

పార్వతి: విన్నారా…. ఇవాళ మధ్యాహ్నం టీ.వీ.లో షోలే సినిమా ఉంది. తొందరగా భోజనాల కార్యక్రమం ముగించుకొని ఎంచక్కా సినిమా చూసేద్దాం. సాయంత్రం టీతో పచ్చి బఠానీల గింజెలు తాలింపు చేస్తాను.

ప్రసన్న: పార్వతీ… ఇదే. నా కవిత…. చదువుతాను విను.

పార్వతి: తర్వాత, నేను కాస్త వంటింట్లో పని సవరించుకొని టీ తీసుకొస్తాను. అప్పుడు చదివి వినిపించండి.

(ఆమె తొందరతొందరగా లోపలికెళ్తుంది.)

( పార్వతి లోపలికెళ్ళి పార్వతీబాయిని స్టేజి మీదికి తోస్తుంది. పార్వతీబాయి ప్రసన్న ముందుకొచ్చి పడుతుంది.)

ప్రసన్న: ఏమయింది పార్వతీబాయి ?

పార్వతీబాయి: ఎక్కడ ఏమీ కాలేదు. ఏమయిందవడానికి? అమ్మగారు ఏమో తను ఫ్రిజ్ శుభ్రం చేసుకుంటానన్నారు. క్రిందిది పైనా, పైనది కిందా పెడుతుంటారు. నన్నేమో బయటికెళ్ళి కూర్చోమన్నారు.

ప్రసన్న: పార్వతీబాయి, బజారుకెళ్తున్నవా? (whisper చేస్తాడు) నేనొకటి చెప్పనా ?

పార్వతీబాయి: నేనో బీద-దరిద్ర-అసహాయ-అబలని, మీరు పని చెప్పేవారు నేను వినేదాన్ని.

(ప్రసన్న దాచిపెట్టిన ఓ కవరు బయటికి తీస్తాడు. కాగితాల గుట్ట నుండి ఓ కాగితం వెదికి తీస్తాడు. పార్వతి చూస్తుందాలేదా అన్నది నిర్ధారించుకుంటాడు. ఆ కాగితాన్ని కవర్లో వేసి కవరుమీద నాలికతడి తగిలించి మూసేస్తాడు. పార్వతీబాయి ఇస్తాడు.)

ప్రసన్న: ఈ కవర్ తీసుకో… ఎవరితో చెప్పొద్దు… మన ఇంటి సందు మూలలో ఒక చెత్తకుండి ఉంది చూసావా…

పార్వతీబాయి: ఎక్కడా…?

ప్రసన్న: ఎర్ర రంగుది. గుండ్రంగా ఉంటుంది. ముందుభాగంలో ఇలా నల్లటి మొహంలా ఉంటుందే అది.

పార్వతీబాయి: సరే, అయితే ?

ప్రసన్న: ఈ కవర్ని ఆ కుండిలో వేసెయ్. ఎవ్వరికీ చెప్పకు. కానీ ఇంకా ఆ చెత్తకుండీ అక్కడే ఉందంటావా? ఆరేళ్ళ నుండి ఈ ఇంటి బయటికి వెళ్ళింది  లేదు నేను. ఈ కుక్కల భయంమూలంగా ఎక్కడికీ వెళ్ళింది లేదు. మా దగ్గరికీ ఎవరూ రారు. ఆ కుక్కలకి పెద్ద పెద్ద కోరలుంటాయి. మన కాళ్ళల్లోకి చేతుల్లోకి దిగబడతాయి. పది పన్నెండు కల్సి మొరుగుతుంటే సాయం కోసం మనం పెట్టే కేకలు మనకే వినబడవు. కళ్ళెర్రబడ్డ పిచ్చిపట్టి అసహ్యపు బరితెగించిన కుక్కలు!

పార్వతీబాయి :  నేనో  బీద _ దరిద్ర -అసహాయ- అబలని. మీదీ,  నాది అదృష్టమనుకోండి. నేనీ  ఇంటికొచ్చి  పడడం.  భయపడకండి. నేనేసేస్తానీ కాగితం చెత్తకుండిలో. అన్నా నేనో బీద పేద- దరిద్ర- అసహాయ- అబలని…. చిన్ననోటితో పెద్దమాటనుకోనంటే ఒకటడిగేదా….

ప్రసన్న: అడుగడుగు.

పార్వతీబాయి: మీరు పెద్ద రచయితలు. ఇల్లుదాటకుండా కూర్చుని ఈ బరితెగించిన కుక్కల గురించి రాస్తుంటారా? ఉర్కే! నాకు చదువొచ్చు. చదువుకున్నదాన్నే. పుస్తకాలు చదువుతాను. మీ పుస్తకాలిస్తారా చదవడానికి?

ప్రసన్న: తప్పకుండా ఇస్తాను, పార్వతీబాయి.

పార్వతి: (లోపలి నుండి వస్తుంది) పార్వతీబాయి… వచ్చేసావా బజారునుండి పనసకాయ తెచ్చావా?

పార్వతీబాయి: తెచ్చాను. ఇప్పుడే వచ్చాను బజారు నుండి. ఇదిగోండి పనసకాయ బజారంతా ఒకటే రద్దీ.

ఆదివారం కదా ఇవాళ! కొత్త కొత్త బట్టలేసుకొని తిరుగుతున్నారు జనాలంతా.

పార్వతి: ఆ… ఇవాళ ఆదివారం. పార్వతీబాయి, ఇవాళ చాలా పనిచేసావ్. ఇవాళ నీకు ఒకపూట సెలవు. ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రసన్నా, పదిహేను నిమిషాల్లో పనసకూర చేసేస్తాను. భోంచేసి కబుర్లు చెప్పుకుందాం. నీ కొత్త రచనలు వినిపించాలి. నేనొస్తానిప్పుడే…

(పనసకాయ తీసికొని వెళ్తుంది.)

(పార్వతి వెళ్తూనే సూర్య, చంద్రులు పరిగెత్తుకొస్తారు. అవి అతని కాగితాలని చెల్లాచెదురు చేస్తాయి.        చంద్ర పార్వతీబాయి చేతిలోని కవర్ తెసికొని పరిగెడుతుంది.)

(పార్వతీబాయి తలలోని చేమంతుల దండ తీసి సూర్యచంద్రులకి వాసన చూపిస్తుంది. రెండూ ఆమె కాళ్ళు నాకుతూ మోకరిల్లుతాయి. ఆమె చంద్ర నోట్లోని కవర్ తీసికొని దాన్ని ఓ గుద్దు గుద్దుతుంది. అది కుయ్యో మొర్రోమంటుంది. ప్రసన్న ఇదంతా భయంభయంగా చూస్తుంటాడు.)

పార్వతీబాయి: చచ్చిందానా, మళ్ళీ ఇలాంటి అల్లరి పని చేసావంటే ఒంటిమీద కిరసనాయిలు పోసి నిప్పంటిస్తాను. నువ్వురా…. సూర్య.. మాదర్చోద్, అన్ని కాగితాలని చిందరవందర చేస్తావా? సరిగ్గా పెట్టవన్నీ

… ఒక్క దగ్గర పెట్టు… (దాన్నీ కొడుతుంది.)

(సూర్య వెళ్ళి కాగితాలన్నీ సరిచేస్తాడు.)

పార్వతీబాయి: ఇప్పుడేమంటారు?  అన్న పేద్ద రచయిత. ఇంటికాలు బయట పెట్టకుండా ఏడు సముద్రాలు తాకి వచ్చినవారు. నేనూ చదువుకున్నదాన్ని. నేనాయన పుస్తకాలు చదివాను. ఆయన్ని బాధపెట్టకూడదు. ఆ… అయితే.. నాకిప్పుడు ఓమాట చెప్పండి (పార్వతి లోపలే ఉందని నిర్ధారించుకొని) ఫ్రిజ్ లో ఏముంది?

ప్రసన్న: (ఒకేసారి) ఫ్రిజ్ లో ప్రేమ ఉంది.

పార్వతీబాయి: పద… పదండి… బయటికి పొండి.

(చంద్ర, సూర్యులు వెళ్ళిపోతారు.)

( ప్రసన్న వైపుకి తిరిగి – )

అన్నా, నేనొస్తా. ఇవాళ ఆదివారం. సగం పూట సెలవు. నేనెళ్ళి మీ పుస్తకం చదువుకుంటాను.

(తలలో పూలదండ ముడుచుకొని ఉత్తరం తీసికొని వెళ్తుంది. ప్రసన్న మెడ త్రిప్పుతూ నవ్వుతాడు.)

(పార్వతి రెండు కంచాలు తీసుకొని వస్తుంది.)

పార్వతి: ప్రసన్నా… నేనొచ్చేసాను. ఇదిగో, వేడి వేడి పనసకూర.

(ప్రసన్నకి ప్రేమగా ముద్దలు తినిపిస్తుంటుంది.)

ప్రసన్న: కూర చాలా బాగా కుదిరింది పార్వతీ, నేనో గమ్మత్తు చెప్పనా నీకు.

పార్వతి: అయ్యో…. నేను కూడా చెప్పాలి నీకు ఓ గమ్మత్తు.

ప్రసన్న: అయితే మొదట నువ్వు…

పార్వతి: లేదు, లేదు. ముందు నువ్వు.

పార్వతి: ప్లీస్, ప్లీస్.. ముందు నువ్వు.

పార్వతి: సరేనమ్మా…

(ఆమె ప్రసన్న చెవిలో ఏదో చెబుతుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. ప్రసన్న ఆమె చెవిలో ఏదో చెపుతాడు. మళ్ళీ ఇద్దరూ నవ్వుతారు.)

(పార్వతి ఒక్కసారిగా లేచి నిల్చుంటుంది.)

(మొహం గంభీరంగా)

పార్వతి: సరే, పన్నెండయింది. ఆదివారం గడిచిపోయింది. సోమవారం మొదలయింది.

ప్రసన్న: పార్వతీ, కూర్చో పార్వతీ, ఐదు నిమిషాలు… మాత్రమే.

పార్వతి: కూర్చొనే సమయం లేదు బాబూ. ఇంటి నిండా అక్కడక్కడ అంతా ప్రేమ పడిపోయింది. అంతా ఒక్క దగ్గర చేర్చి ఫ్రిజ్ లో పెట్టాలి. చాలా పనులు ఉన్నాయి. ఇవాళ తెల్లవారుఝామున బయల్దేరాలి నేను. ఈ నోరులేని కుక్కల హక్కుల సంరక్షణ పరిషత్తు తరపున..

ప్రసన్న: ఎక్కడికి ?

పార్వతి: అందరమూ తిరువనంతపురంలో కలుస్తాం. ముందు లెనిన్ గ్రాడ్, తర్వాత స్టాలిన్ గ్రాడ్, ఆ తర్వాత బేల్ గ్రాడ్, ఆ… తర్వాత మాస్కో.

ప్రసన్న: ఓహో … అయితే ‘వాళ్ళు’ నడుపుతారా మీ సంఘటనని?

పార్వతి: లేదు. ముందు పూర్తిగా విను. మాస్కో నుండి వాషింగ్టన్, న్యూయార్క్, లండన్ లో కూడా ఒక పరిచర్చ ఉంది.

ప్రసన్న: వాళ్ళు కూడా ఉన్నారా మాలో?

పార్వతి: ముందు విను.. తిరిగి వచ్చే దారిలో బాగ్దాద్, తెహ్రాన్ లో కూడా పరిషత్తు సమావేశాలు ఉన్నాయి. ఈ మూగజీవుల కోసం పని చేసేవారిని దేశం, ధర్మం, రాజకీయాలు బంధించిపెట్టలేవు. బాగ్దాద్ నుండి పెద్ద సంఖ్యలో వేల కుక్కల్ని తీసికొని తిరిగి వస్తాము మేము. పండరిపురంలో చంద్రబాగానది తీరపు ఇసుక తిన్నెల్లో వాటిని వదిలివేస్తాం. వేలకొద్దీ కుక్కలవి, వేరువేరు జాతులవి, ధర్మాలవి, చంద్రభాగ ఇసుక తిన్నెలు

అదిరిపోతాయి. ఎంత బాగుంటుందో కదా ఆ దృశ్యం?

ప్రసన్న: అవునవును!

పార్వతి: నేనివాళ వెళ్ళి రేపొస్తాను. ఇల్లు జాగ్రత్త. నీమీద విశ్వాసంతో ఫ్రిజ్ తాళంచెవి నీకిచ్చి వెళ్తున్నాను. తాళంచెవి జాగ్రత్త. ప్రేమని జాగ్రత్తగా వాడు. అంతా ఖాళీ చేయకు. ఫ్రిజ్ కి మళ్ళీ జాగ్రత్తగా తాళంవెయ్. తాళం చెవి భద్రంగా దాచెయ్- ఏం?

ప్రసన్న: సరే… సరే. కంగారుపడకు. బేఫికరుగా వెళ్ళు.

(పార్వతి జాకెట్టులో నుండి తాళంచెవి తీసి ప్రసన్న చేతిలో పెడుతుంది. ప్రసన్న దాన్ని పిడికిట్లో పెట్టుకుంటాడు. దీపాలు ఆరిపోతాయి.)

( సశేషం )

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

మూల రచయిత : సచిన్ కుండల్కర్

అనువాదం : గూడూరు మనోజ

guduru manoja

అనువాద నాటకం ” ఫ్రిజ్ లో ప్రేమ ” – ఒకటవ భాగం

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

పాత్రల పరిచయం

దృశ్యం – 1                                                                                        దృశ్యం – 5

పార్వతి                                                                                            పార్వతి

ప్రసన్న                                                                                            ప్రసన్న

పార్వతీబాయి                                                                                    పార్వతీబాయి

దృశ్యం – 2                                                                                         దృశ్యం – 6

పార్వతి                                                                                              పార్వతీబాయి

ప్రసన్న                                                                                             ప్రసన్న

పార్వతీబాయి                                                                                     పార్వతి

దృశ్యం -3                                                                                          దృశ్యం – 7

ప్రసన్న                                                                                             పార్వతీబాయి

అతిప్రసన్న                                                                                        ప్రసన్న

పార్వతీబాయి                                                                                     పార్వతి

దృశ్యం -4                                                                                           దృశ్యం – 8

చంద్రుడు                                                                                             ప్రసన్న

సూర్యుడు                                                                                            అతిప్రసన్న

చంద్రుడు

సూర్యుడు

దృశ్యం -1

( పార్వతీ (32) ప్రసన్న (35) ల ఇల్లు. ప్రసన్న తెల్ల కాగితాల కుప్పలో కూర్చున్నాడు. నోట్లో పెన్ను పట్టుకొని ఆలోచిస్తున్నాడు. పార్వతి ఫోనులో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ పచార్లు చేస్తుంటుంది. ప్రసన్న కాగితాలను చింపేస్తుంటుంది. )

పార్వతి: నేను పార్వతిని మాట్లాడుతున్నాను. అవునవును, కాదు.. కాదు, అవును.

ప్రసన్న: (రాస్తూ రాస్తూ తనలోతాను) నేను ప్రసన్నని రాస్తున్నాను. ఖచ్చితంగా ఏం రాస్తున్నానో తెలీదు. మధ్యలో ఎక్కడో ఒక పక్షం కోసం రాయడం రాదు.

పార్వతి: హలో… మొదటి ప్రశ్న జవాబు ‘అవును’, రెండవ ప్రశ్న జవాబు ‘కాదు’. అర్థమయిందా ? నాకిందులో ఏ confusions వద్దు. నాకు నచ్చదది. ఉంటాను మరి.

ప్రసన్న: ఎవరితో ఇంత clarity గా మాట్లాడేది ? కాస్త ప్రేమగా మాట్లాడొచ్చుగా పార్వతి ఫోన్లో. కనీసం ఫోన్లోనయినా.

పార్వతి: ప్రసన్నా, ఇవాళేం వారం ?

ప్రసన్న: మంగళవారం.

పార్వతి: నీకు తెల్సిందేగా. వారమంతా ప్రేమ వ్యక్తంచేయడానికి నాకు సమయం సరిపోదని. చూస్తుంటావుగా నేను పడేపాట్లు? ఇదంతా చేస్తూ కూడా ఆదివారం రోజు నీతో ప్రేమగా ఉంటానా లేదా? మన నిర్ణయమే కదా ఇది ? పూర్తి ఆదివారం అంతా నేనింకేపనీ చేయనుకదా ? అలా కాకుండా నేను వారమంతా నా పనులన్నీ ప్రక్కన పెట్టి ప్రేమిస్తూ కూర్చుంటే నా కుక్కలేం కాను ? చంద్ర-సూర్యులు ఏమయిపోతారు ?

( ఇంతలో తలుపు నుండి చంద్ర, సూర్యులు అనబడే రెండు కుక్కలు పరుగున వస్తాయి. ప్రసన్న చాలా భయపడిపోతాడు. పరుగెత్తుతాడు. అరుస్తాడు. చంద్ర పార్వతి కొంగు నోట్లో పెట్టుకొని  కూర్చుంటుంది. సూర్య ప్రసన్న వెనకాల పడుతుంది. ప్రసన్న అరుస్తూ ఇల్లంతా పరిగెడుతుంటాడు. పార్వతి పడీ పడీ నవ్వుతుంటుంది.)

పార్వతి:  సూర్య… సూర్య… మా సూర్య  మంచి వాడంట. రా.. ఇటొచ్చెయ్. ఎంత దుష్ట ప్రపంచంరా ఇది … నోరులేని కుక్క మీద కూడా కాస్త ప్రేమ చూపలేరు. రా… నా దగ్గరికి రా ( సూర్య పార్వతి దగ్గరికెళ్ళి నిల్చుంటుంది ) ఎవరంటారండి కుక్కలు మూగ జీవులని. ఏం మెచ్యురిటీ, ఎంత అర్థం చేసుకొనే గుణం.

ప్రసన్న: పార్వతీ, నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్, కనీసం ఈ చంద్ర-సూర్యులకి ఓ పట్టా వేసి గొలుసుతో కట్టెయ్. వాటికి నాలుగు ఇంజక్షన్స్ ఇవ్వు. వాటి గోళ్ళు కత్తిరించు. ఓ రోజు ఎప్పుడో అవి నా ప్రాణం తీస్తాయి.

పార్వతి: హ్హ… హ్హ… ప్రాణం తీస్తాయండీ. పట్టా అట, గొలుసు అట, ఇంజక్షన్స్ ఇవన్నీ వెధవ పెంపుడు కుక్కల లక్షణాలు. ఇవి స్వేచ్ఛాజీవులు. వాటి స్వేచ్ఛని పరిరక్షించడమే నా కర్తవ్యం. అది నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను.

( ప్రసన్న చెమటతో తడిసి ముద్దయిపోయాడు. భుజమ్మీది షర్టుతో మొహం తుడుచుకుంటూ నేలమీద కూర్చున్నాడు.)

ప్రసన్న: పార్వతీ, నాక్కాస్త ప్రేమనివ్వు.

పార్వతి: అలాగే ఇస్తాను, నేను కూడా కాస్త ప్రేమ తీసికొనే బయల్దేరుతాను. ఇవాళ చాలా పనులున్నాయి.

(ఆమె బ్లవుజు నుండి తాళంచెవి తీస్తుంది)

ప్రసన్న: ఫ్రిజ్ కి తాళం వేయాల్సిన అవసరం ఏమిటి? ఇంట్లో ఉండేది నేనొక్కడినే కదా. నీ ఈ అనుమానం నాకస్సలు  నచ్చదు.

పార్వతి: పోయిన ఆదివారం తాళం వేయడం మర్చిపోతే ఫ్రిజ్ లోని సగం ప్రేమ ఖాళీచేసావు కదా ఒకేసారి? మళ్ళీ ఆదివారం వరకు దాన్నెలా సరిపెట్టానో నా బాధ నాకే తెల్సు.

ప్రసన్న: (రుద్ధమయిన కంఠంతో) నాకు మరీ ఒంటరిననిపించింది. అమ్మా-నాన్నా, అందరూ బాగా జ్ఞాపకం వచ్చారు. ఇక ఉండలేకపోయాను. తెలీకుండానే ఫ్రిజ్ ముందుకెళ్ళిపోయాను. తలుపు తెరిచి చూద్దును కదా ఫ్రిజ్ లో అంతా ప్రేమే ప్రేమ. కాస్త గడ్డకట్టి ఎండిపోయినట్టుంది. కానీ చేతుల్లోకి తీసుకుంటే మెత్తని, చల్లని ప్రేమ. ఇంకేం రెండు చేతుల్తో తింటూ కూర్చున్నాడు. కడుపునిండా తిన్నాను. ఫ్రిజ్ ముందునుండి లేవడమే రాలేదు. కళ్ళమీదకి మత్తులా వచ్చిందనుకో.

పార్వతి: అదే మరి. భావనాలోకంలోకి వెళ్ళి బాధ్యతారహితంగా ప్రవర్తించడం! నాకస్సలు నచ్చదు.

ప్రసన్న: భావనా ప్రపంచంలో బాధ్యతారహితంగా ఉండకపోతే ప్రేమ తయారే అవదు మరి.

పార్వతి: ఇది కేవలం ఆదివారపు కార్యక్రమం, నీకెందుకు అర్థం కాదు ప్రసన్న… అరే జనాభా ఎంతగా పెరుగుతుందో చూస్తూ ప్రేమని యోగ్యమైన పరిధుల్లో వాడాలని తెలీదా ? లేకపోతే ప్రపంచంలోని ప్రేమ పది పన్నెండేళ్ళలో అయిపోవస్తుంది.

ప్రసన్న: బుల్ షిట్! నేను మరీ మరీ చెప్తున్నాను. భావనలోకంలో అందరూ బాధ్యతారహితంగా ఉంటేనే కావల్సినంత ప్రేమ నిర్మాణం జరుగుతుంది.

పార్వతి: అది ఆదివారం మాత్రమే. ఆరోజు తప్పితే నాకు మాత్రం సమయం లేదమ్మా. ఇలా ప్రతిరోజూ బాధ్యతారహితంగా ప్రవర్తించడం మీ కళాకారులకి కుదురుతుంది కానీ మాబోటి వాళ్ళకు కాదు. నీకేంటీ. కాలు కదపకుండా ఓ నాలుగొందల పేజీల నవల రాసేస్తే ఒకటీ, రెండు లక్షలొచ్చిపడతాయి ఇంటికి.

( సూర్య-చంద్రులు మొరుగుతుంటాయి)

పార్వతి: ఏయ్…. పదండి… ష్.. పదండి. కిందికెళ్ళండి ( అవి రెండూ వెళ్ళిపోతాయి.) నేనొస్తాను.

(పార్వతి లోపలికెళ్తుంది. ప్రసన్న ఉండచుట్టిన తన కాగితాలని ఏరుతుంటాడు. కళ్ళు తుడుచుకుంటుంటాడు. పార్వతి లోపల్నుండి రెండు చిన్న చిన్న గాజు గిన్నెలు తెస్తుంది. ఒకటి ప్రసన్నకిస్తుంది.ఒకటి తను తీసుకుంటుంది. ఇంతలో చంద్ర లోపలికొస్తుంది. పార్వతి దగ్గర మోకరిల్లుతుంది. పార్వతి దానికి తన గిన్నె నుండి కాస్తంత ప్రేమని ఇస్తుంది. ఫోన్ మ్రోగుతుంది. పార్వతి ఫోనెత్తి చంద్ర వీపుమీద గుర్రం మీద కూర్చున్నట్టుగా కూర్చుంటుంది. గదంతా తిరుగుతుంటుంది. ప్రసన్న మాత్రం ఆబగా గిన్నెలోని ప్రేమని నాకుతూ తింటుంటాడు.)

పార్వతి: హలో… నేను పార్వతిని మాట్లాడుతున్నాను. చెప్పండి అడ్వకేట్ దేశ్పాండే. అవునండీ… చారుదత్త కులకర్ణీమీద కేసు వేయలనుకుంటున్నాను. లేదు అతన్ని వదిలేది లేదు.మొన్నటి రాత్రి ఏదో డాన్స్ ప్రోగ్రాంకో,సినిమాకో వెళ్ళి రాత్రి ఒంటిగంటా రెండింటికి వస్తుంటే మా సందులోని ఒక కుక్క అతని స్కూటర్ వెనకపడింది. మనిషి కాస్త స్కూటరాపి పాపం ఆ కుక్కకి ఏం కావాలో చూడాలా? లేదా? ఆ పట్టున స్కూటర్ జోరుగా ముందు… ఆ వెనక ఈ కుక్క, దానిక్కాస్త కోపం వచ్చి అతని కాలిని కాస్త గీకినదనుకోండి. దానికి ఆ పెద్దమనిషి ఏం చేసాడో తెల్సా దేశ్పాండే, కర్రతో కొట్టాడా కుక్కని! Can you imagine ? ఎంత అమానుషమయిన హింసా ప్రవర్తన. నేనందుకే అతన్ని వదలదల్చుకోలేదు. కోర్టుకీడ్వాల్సిందే. లేదంటే ప్రక్కింటాయన అయితే మాత్రం, మూగజీవులని కష్టపెట్టే వాళ్ళను నేను క్షమించను. అవును. మీరు అన్ని కాగితాలు తయారుచేయండి. నేను మీ ఆఫీసుకే బయలుదేరుతున్నాను.

(పార్వతి వెనక్కొస్తుంది. ఆలోచిస్తుంది.)

పార్వతి: ప్రసన్న.. ప్రసన్న.. ఆ గిన్నె కిందపెట్టెయ్. అలా నాకుతావేంటి మొహంవాచినవాడిలా. ఆ… అయితే నేననేదేమిటంటే మనం ఇంటిపని కోసం ఓ పనమ్మాయిని పెట్టుకుందాం. ఇటు చూస్తే నా పనా పెరిగింది. ఇదివరకటిలా పని కుదరడం లేదు.

ప్రసన్న: సరే.

పార్వతి: సరే… వా.. !

(పార్వతీబాయి ప్రత్యక్షమవుతుంది. తొమ్మిది గజాల చీరకట్టు. తల్లో చేమంతిపూలదండ. ఓ దగ్గర కుదురులేని తత్వం.)

పార్వతీబాయి: నాపేరు పార్వతీబాయి. పనిమనిషిని. ఇల్లు తుడుస్తాను. బట్టలుతుకుతాను. కోయడం, చీరడం అన్ని చేస్తాను. రెండువేళలా టీ పెడతాను. పొయ్యి తుడుస్తాను. ఫ్రిజ్ శుభ్రం చేస్తాను.

పార్వతి: లేదు. ఫ్రిజ్ ని ముట్టుకోవద్దు. తక్కినవన్నీ చేయొచ్చును.

పార్వతీబాయి: సరే. నీ ఫ్రిజ్ ని ముట్టుకోను. నన్ను పనిలో పెట్టుకోండి.

ప్రసన్న: పార్వతీబాయి, అసలు నువ్వు మా ఇంటి వరకు ఎలా రాగలిగావు ? ఈ సందంతా వదిలేసిన కుక్కలమయంగా ఉంటుంది. అవి గురగుర మంటాయి. కరుస్తాయి. ఎట్లా వచ్చావ్ ?

పార్వతీబాయి: ఈ చేమంతిపూలదండ పెట్టుకుంటే ఈ ప్రాణులభయం ఉండదు. ఒంటె- గుర్రం-ఏనుగు- పిల్లి- ఎలుగుబంటి వీటన్నింటి నుండి ఏ భయము మోసమూ దరిదాపుల్లోకి రావు.

పార్వతి: విన్నావా ప్రసన్న… రేపట్నుండి నువ్వు ఓ చేమంతిహారం పెట్టుకుంటే పోలే…

ప్రసన్న: పార్వతీ, పరిహాసం చాలించు, పార్వతీబాయి నీ వివరాలేంటే? ఎక్కడదానివి. ఊరూ- పేరూ, కొంపా- గూడూ.. ?

పార్వతీబాయి: నేనో బీద- దరిద్ర- అసహాయ అబలని. కానీ నా చేతులకి వేగం ఉంది. ఈ చేతులకి రుచి ఉంది. చేతులకి పని ఉంది.

పార్వతి: నీ పరిచయం చాలింక. లోపలికెళ్ళి పని చూసుకో. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఫ్రిజ్ చుట్టు ప్రక్కలకి కూడా వెళ్ళొద్దు. ఈ అయ్యగారు రోజంతా కూర్చుని రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడడిగితే అప్పుడు చాయ్ చేసివ్వు. తక్కిన పనులన్నీ మామూలు ఇండ్లల్లోలానే, ఆ… ఇంకో విషయం. అన్నిళ్ళలో ఆదివారం సెలవు దొరుకుతుందేమో కానీ మా దగ్గర మాత్రం దొరకదు. ఆదివారం రోజు నేను ఇంటిని ఇంటిలా ఉంచాల్సి వస్తుంది.

పార్వతీబాయి: నాకర్థం కాలేదు.

పార్వతి: ఆదివారం వస్తే అదే అర్థం అవుతుందిలే.

(సూర్య చంద్రులు ఇంట్లోకి పరిగెత్తుకొస్తారు. ప్రసన్న భయపడతాడు అవి పార్వతీబాయి దగ్గరికెళతాయి. సౌమ్యంగా మారతాయి. చేమంతి వాసన వాటికి నిషానిస్తుంది. అవి నవ్వుతూ పార్వతీబాయిని చూస్తూ కూర్చుంటాయి. ప్రసన్న, పార్వతి ఆశ్చర్యచకితులయి పార్వతీబాయి వంక చూస్తుండిపోతారు. ఆమె సిగ్గుపడుతుంది.)

పార్వతీబాయి: ఛీ…. పొండి.. బాబూ!

(దీపాలు ఆరిపోతాయి)

( సశేషం )

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

మూల రచయిత : సచిన్ కుండల్కర్

అనువాదం : గూడూరు మనోజguduru manoja

కొత్త స్వతంత్ర మానవ సంబంధాల ప్రతిబింబం ‘ఫ్రిజ్ లో ప్రేమ’ !

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్ ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’, ‘పూర్ణవిరామం’ రెండు నాటకాలు రెండు విభిన్నమైన శైలుల్లో రాశారు. స్థూలంగా చెప్పాలంటే ‘పూర్ణవిరామం’ యొక్క శైలి వాస్తవిక వాదానికి సంబంధించింది. నిజ జీవితాల్లోని తర్కవితర్కాలు ఈ నాటకంలోని సంఘటనలకి అన్వయించు కోవచ్చును. ఈ నాటకంలోని మధ్యతరగతి వ్యక్తి రేఖా చిత్రాలైన ప్రసన్న, అతని స్నేహితురాలు శ్రేయల ప్రవర్తనకి కారణాలు, అందులోని సంఘటనలపరమైన ప్రశ్నలకి జవాబులు మనకి సాధారణ మానసిక శాస్త్రం లేదా సామాజిక శాస్త్రాల్లో దొరికిపోతాయి. కుండల్కర్ రాసిన మొదటి నాటకం ‘ఛోట్యాశా సుట్టీత్’ (చిన్నపాటి సెలవు) మరియు మొదటి నవల ‘కోబాల్ట్ బ్లూ’ ఈ రెండు కళాకృతులు వాస్తవికవాద శైలిలోనే రాయబడ్డాయి.

‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ (ఫ్రిజ్ లో ప్రేమ) నాటకం శైలి కుండల్కర్ రెండవ నాటకమైన ‘చంద్రలోక్ కాంప్లెక్స్’కి దగ్గరగా ఉంటుంది. ఈ శైలిని మనం స్థూలంగా ప్రతీకాత్మక శైలిగా అభివర్ణించవచ్చును. ఇందులోని ఘటనలు, వాటికి ఓ ఆకారాన్నిచ్చే తత్వం, ఏవీ సర్వసామాన్య తత్వానికి సంబంధించినది. ఇక్కడ ప్రేమ ఫ్రిజ్ లో గడ్డ కడుతుంది లేదా కుక్కలకి పూల వాసన చూపించి లొంగదీసుకోవడమూ జరుగుతుంది. ఈ నాటకంలో కూడా మళ్ళీ ప్రసన్న పాత్ర ఉంటుంది. కాకపోతే ఇందులో అతని జోడి ‘పూర్ణవిరామం’ లోని శ్రేయకి పూర్తిగా విరుద్ధమైన పార్వతి. వీళ్ళిద్దరితో పాటుగా వాళ్ళ హృదయాల్లోని ప్రతిబింబాలైన అతి ప్రసన్న, పార్వతిబాయి కూడా ఉంటారు. ఈ రెండు కాల్పనిక పాత్రల వల్ల నాటకానికి ఒక అవాస్తవిక వాదపు స్థాయి లభిస్తుంది.
ఈ రెండు నాటకాలు భిన్నమైన శైలుల్లో రాయబడినప్పటికీ రెండింటికి మానవ సంబంధాలే కేంద్రబిందువు. ‘పూర్ణవిరామం’ లోని ముఖ్య పాత్ర ప్రసన్న కుటుంబాన్ని వదిలి, కొన్ని చేదు జ్ఞాపకాలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చూస్తుంటాడు. అతనికి తోడుగా ఉండే ‘మిత్ర’ ప్రసన్నకి తోడుగానే ఉందామనుకుంటాడు. ప్రసన్నని తన మీద ఆధారపడే బలహీనుడిని చేయరాదని గట్టిగా అనుకుంటాడు. ఈ పాత్ర ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లోని అతి ప్రసన్నలా ప్రసన్న హితవుకోరే అంతర్ మనస్సు అయి ఉండాలి అన్పిస్తుంది.

నాటకంలోని మూడవ పాత్ర శ్రేయ. ప్రసన్న మాదిరిగానే తను కూడా కుటుంబానికి ముంబయిలో దూరంగా ఒక్కర్తే ఉంటుంది. కాకపోతే ఇంకాస్త ఎక్కువ ఆత్మవిశ్వాసంతో. ఆమెలో కన్పించే స్నేహభావం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. నిద్రపోతున్న ప్రసన్న మీద దుప్పటి తెచ్చి కప్పే సహజమైన స్నేహభావమిది. తను గర్భవతినని తెలిసి, ఆ బిడ్డ తండ్రి ఈ విషయం విని పారిపోయాడని తెల్సి ఆశ్చర్య పడుతూ ఇలా ఉంటుంది. “ఉద్యోగం గురించి ఆలోచించలేదు నేను, కెరియర్ గురించి కూడా. నెల తప్పిందని తెలియగానే నాకు కేవలం ఆనందంగా అనిపించిందంతే. ఇంత మంచి విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా భయం, దిగులు ఎలా కలుగుతాయి ? ఆ మాత్రం చూసుకోలేమా ముందేం జరిగితే అది. తనని తాను జీవితపు లాలసతో ముంచెత్తుకునే ఈ శ్రేయకి పూర్తి భిన్నమైన పాత్ర ” ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్” లోని పార్వతిది. ప్రేమని ఆచితూచి కొలిచి ఇస్తుంటుంది. కుక్కల మీద ప్రేమ వర్షం కురిపించే పార్వతి ప్రసన్నని మాత్రం ఆ ప్రేమ నుంచి వంచితుడ్ని చేస్తుంది.
ఈ రెండు నాటకాల్లోని ప్రసన్న జీవితంలోని ఒక్కో మలపులో ఒకే వ్యక్తిగా దర్శనమిస్తాడు.ఇద్దరు రచయితలే.ఇద్దరి వయస్సుల్లో తొమ్మిది సంవత్సరాలు తేడా ఉందంతే.’పూర్ణ విరామం’ లోని ప్రసన్న సున్నిత మనస్కుడు.ఈ నాటకం చదివేటప్పుడు కుండల్కర్ తన ‘కోబాల్ట్ బ్లూ’ నవలలోని నాయకుడు తనయ్ తన పేరు ప్రసన్న గ మార్చుకొని, కుటుంబాన్ని వదిలి ముంబైకి వచ్చాడా అనిపిస్తుంది.తన సామాను నుండి అతను ఆ నీలివర్ణపు పెయింటింగ్ తీసినపుడు మాత్రం కచ్చితంగా ఇతను తనయ్ నే అన్నది నిర్ధారణగ అనిపిస్తుంది.తనయ్ మిత్రుడు అతనింట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నప్పుడు నీలివర్ణపు చిత్రాలు వేస్తాడు.ఆ మిత్రుడు జ్ఞాపకార్థంగా కొన్ని చిత్రాలు వేస్తాడు.ఆ మిత్రుడి జ్ఞాపకార్థంగా కొన్ని చిత్రాలు ఇతను ముంబై కి తెచ్చుకున్నట్టు గా అనిపిస్తుంది.ఆ మిత్రుడు స్మృతి ‘పూర్ణ విరామం’ లో సుప్త దశ లో ఉంటుంది.నాటకం చివర్లో వచ్చే ఒక పార్సెల్ లో ఉన్న నీలివర్ణపు చిత్రం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చును.
నిష్కల్మష్కుడైన తనయ్ కి జీవన సంబంధ విషయలేన్నిటినో నేర్పించిన మిత్రుడు అతడిని మోసగించి వెళ్ళిపోయాడు.దాంతో తనయ్ లో వచ్చిన మార్పులు, 26 ఏళ్ళ ‘పూర్ణ విరామం’ లోని ప్రసన్న లో కనిపిస్తాయి. ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లోని ప్రసన్న మాత్రం 35 ఏళ్ళ వాడయాడు.కాని ప్రేమ కోసం అదే అలమటింపు,అయితే ఈ నాటకం ముగింపు లో మాత్రం,జీవితం లో వేరు వేరు స్థితిగతుల్లోని అనేక అనుభవాల తర్వాత,జీవితం ఎలా ఎందుకు జీవించాలి అన్నది అతనికి స్ఫురిస్తుంది.ప్రసన్న ఈ పరిపక్వారుపం మొదటి చిహ్నం మనకు ‘పూర్ణ విరామం’ లో కనబడుతుంది.ఒకప్పుడు తండ్రి దగ్గర నుండి దూరమైన ప్రసన్న ‘పూర్ణ విరామం’లో ఆయనతో సహ అనుభూతి అనుబంధాన్ని జోడించుకుంటాడు.

అతడు ‘పూర్ణ విరామం’ లో ఆపేసిన రచనా వ్యాసంగం ‘ఫ్రిజ్ లో ప్రేమ’ చివర్లో మొదలవడం,అదీ అతి జోరుగా సాగే సూచనలతో మొదలవడం మనం గమనిస్తాం.మనం మన ముఖ్యమైన పనులని ఇతరులు చేసిన దగా వల్ల వదిలేయడమో,మన స్వయం ప్రతిపత్తిని మన చేతులారా పోగొట్టుకోవడం,మనకి మనం చేసుకునే హాని అన్నది ప్రసన్నకి స్ఫురించినదని నాటకం ముగింపు సూచిస్తుంది.ఇక్కడ అతి ప్రసన్న ఎప్పుడైతే ప్రసన్న ని ‘అయితే ,ఎలా ఉంది కొత్త ఇల్లు’ అని అడిగినప్పుడు అతను ‘బాగుంది.ముఖ్యంగా శాంతంగా ఉంది.అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్లుగా పిచ్చుకల అరుపులు కూడా వినవస్తాయి’.ఇంట్లోని శాంతే ప్రసన్న మనఃశాంతికి సాక్ష్యం పలుకుతున్నట్టుగా ఉంటుంది.

‘పూర్ణ విరామం’ లో ప్రసన్న శ్రేయకి చెప్పిన జీవన తత్వమే మరో రూపంలో ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లో చెప్పబడుతుంది.’పూర్ణ విరామం’ లో ప్రసన్న అంటాడు,”కళాకారుడే ఎందుకు,నేనంటాను, అసలు మనిషి స్వతంత్రుడు కానేకాడు.కానవసరం లేదు కూడా.ఇలాంటి కాస్త కూస్త భావనిక ఆలంబనలోనైనా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడతాం కదా ! ” ఇలాంటి ఆలంబన మనిషిలోని మానవతా మర్మాన్ని తెలియచేసేదైతే,ఆ గుణాన్ని అలవర్చుకోవాలంటే శ్రేయలాంటి విశాల దృక్పథం కావాలి.అతి ప్రసన్న కొత్త ఇంటి కోసం కావాల్సిన వస్తువుల జాబితా తయారు చేస్తూ ఎప్పుడైతే ఫ్రిజ్ గురించి ప్రస్తావిస్తాడో ప్రసన్న చప్పున వెంటనే అంటాడు.”ఇంట్లో ఫ్రిజ్ వద్దు.మనం రోజు తాజాగా వండుకుందాం.ఏ రోజుది ఆరోజే తినేద్దాం.నిలువ ఉంచడం వద్దు.దీనితో జీవితం సరళంగా సాగిపోతుంది”.

friz
ఈ రెండు నాటకాలు మానవీయ సంబంధాలకి సంబంధించి ఉద్భవించే సమస్యలు నాటకకర్త వ్యక్తిగత సమస్యల్లాగా భాసిస్తాయి.ఈ నాటకాలు రాస్తున్నప్పటి సృజనాత్మక సెగ తాకిడి అనుభవం,ఎదుర్కొన్న ప్రశ్నలకి వెదుక్కున్న జవాబులు దీనికి కారణం కావచ్చు.ప్రతి రచయిత కొద్దో గొప్పో తనకి ఎదురైనా అనుభవాల్లోని ప్రశ్నలని తన రచనల్లో పొందుపరుస్తాడు.కానైతే కుండల్కర్ విషయంలో అదింకా ఎక్కువగా కనిపిస్తుంది.కారణం కుండల్కర్ రచనల్లోని ప్రధాన పాత్రలు రచయితలు అవి మొదట విచలితులై,నిలదొక్కుకుని,ఆ తర్వాత జీవితార్థన్ని వేదుక్కుంటాయి.ముఖ్యపాత్ర రచయిత అయినప్పుడే నాటకకర్త యొక్క ఆత్మ నిష్టాపరమైన ముద్ర స్పష్టంగా తెలుస్తుంది.కుండల్కర్ నవల మరియు ఈ రెండు నాటకాలని కలిపి చూస్తే ఇందులోని విషయ వివరాలు భావనాత్మకంగా పెనవేయబడి ఉంటాయి.రచయిత ఆత్మనిష్ట వీటిలో స్పష్టంగా ద్యోతకమవుతుంది.

ఇదే ఆత్మనిష్ట యొక్క మరో ఆవిష్కారం పార్వతి పాత్రలో కనపడుతుంది. కుండల్కర్ రచనలన్నింటిని చూస్తే తెలిసేదేమంటే ఉద్యమాలు, అవి ఏ మానవ సమస్యలకి సంబంధించినవైనప్పటికీ, అతనికి అసమ్మతాలే.అంతేకాక అతనికి ఉద్యమాల మీద కించిత్తు కోపం కూడా.’ఛోట్యాశా సుట్టిత్’ లో ఇదే కోపం అందులోని స్త్రీవాద పాత్రల మీద పరిణామం చూపిస్తుంది.అదే కోసానుభుతి ‘ఫ్రిజ్ మథె ఠేవ్ లేలా ప్రేమ్’ లోని పార్వతి పాత్ర చిత్రీకరణలో కనిపిస్తుంది.ఈ పాత్ర ద్వారా ఉద్యమాల్లోని కార్యకర్తలు మానవ సంబంధాలకు దూరమైనా ధోరణులను,రీతులను వెలికి తీస్తారు.వీటన్నిటి వెనకాల అతనిలోని నిఖార్సైన మానవతావాది కనపడతాడు.మానవ సంబంధాలను అరచేతులలో దీపంలాగా సంబాళీస్తాడు నాటకకర్త.అందుకే ఈ సంబంధాల్లోని ఆ పాత్రలేమో కర్కశంగా,బోలుగా,చదనుగా అనిపిస్తాయి.అయినప్పటికీ మానవతవాదంలోని ప్రతి వ్యక్తికీ న్యాయం జరగాలనే సూత్రాన్ని కుండల్కర్ ఒప్పుకోరు.ఉద్యమాల్లోని పాత్రల మానవత్వాన్ని ఉద్యమం లాగేస్తుంది.’ఫ్రిజ్ మథె ఠేవ్ లేలా ప్రేమ్’ లోని పార్వతి వ్యక్తీరేఖా చిత్రణ ఈ నాటకపు అస్తిత్వవాద శైలి యొక్క సుస్థిర భాగంగా చుస్తే,అదే రీతిలోని ‘ఛోట్యాశా సుట్టిత్’ లోని యశోద పాత్ర విభిన్నంగా కనిపిస్తుంది.స్త్రీవాది అయిన యశోద అభినేత్రి ఉత్తర తల్లి చేసిన ప్రతిపాదనలతో ఏకిభవించదు సరికదా విచారం వ్యక్తం చేస్తుంది.”ఆడవాళ్లేమైనా డైనోసార్సా ఏమిటి ! వాళ్ళ గురించి,వాళ్ళ స్వాతంత్రం గురించి పరిశోధనలు చేయడానికి?” అంటుంది.స్త్రీవాద ఉద్యమకారులు కర్కశ మనస్కులుగా ఉండవచ్చును.చాలాసార్లు ఉంటారు కూడాను.కానీ ఏ రచయితకైతే ఉద్యమం పట్ల సహానుభూతి ఉంటుందో అప్పుడు ఆ ఉద్యమపు ప్రాతినిధ్యం ఇలాంటి పాత్రల చేతుల్లోకి వెళ్ళవద్దన్నది ముఖ్యమైన అంశం.

కుండల్కర్ నిర్మించే భావవిశ్వం ఇవాల్టిదన్నదాంట్లో ఏ అనుమానం లేదు.ఇంతవరకు వచ్చిన మరాఠీ నాటకాల్లోని స్త్రీ పురుష పాత్రల సంబంధాలు ప్రసన్న-శ్రేయల సంబంధంలాగా స్పష్ట స్నేహభావంతో నిండిలేవు.స్త్రీ పురుషుల మధ్య నుండే అంతరం ‘పూర్ణ విరామం’ లో ఎక్కడా కనిపించదు.శ్రేయతో పాటుగా ప్రసన్న వంటింట్లో పనులు చూసుకుంటాడు. ఇక్కడ ఎవరూ ఎవరి మీద, కేవలం వాళ్ళు పురుషుడు- స్త్రీ అనే అస్థిత్వ వర్చస్సుని ఇంకొకళ్ళ మీద రుద్దరు. ఇద్దరు వ్యక్తులు సమాన సంబంధాలతో ఒకిరికొకరు ఆసరాగా నిలబడతారు. ఆధారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. చివర్లో శ్రేయ ప్రసన్న బిడ్డకి తల్లిని కావాలనుకుంటుంది. ప్రసన్న విచలితుడవుతాడు. అప్పుడు శ్రేయ అతడితో అంటుంది. “నీకు నామీద విశ్వాసం ఉంది కదా! నేనేం నిన్ను కట్టిపడేసుకోను. నన్ను పెళ్ళి చేసుకోమని కూడా అనను.”

ఇలాంటి స్వతంత్ర, సమాన సంబంధాలు ఇతని ఇతర రచనల్లో కూడా తగుల్తుంటాయి. అతి వేగంతో మారుతున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల సందర్భంలో మానవ సంబంధాలను ఒక్కసారి పరిశీలించుకొని, ఇదే మానవ సంబంధాల పరదాల వెనక విశృంఖలంగా మారుతున్న సంబంధాలను వేదిక మీదకి తెద్దామన్న బాధ్యత కుండల్కర్ సునాయాసంగా తనమీద వేసుకున్నాడు. ఈ కొత్త స్వతంత్ర మానవ సంబంధాల రూపాన్ని కొత్త రచయితలందరూ పరిశీలించాలి. ఇవే సంబంధాలు మరాఠీ రచయితలైన మనస్విని, లతా రవీంద్ర, ఇరావతీ కర్ణిక్ నాటకాల్లో కూడా కనపడతాయి. కాబట్టి కుండల్కర్ నాటకాలని ఈ తరహా ప్రాతినిధ్యంతో పాటుగా ఆత్మనిష్ట లేఖనంగా కూడా పరిగణించవచ్చు.

కుండల్కర్ తన నాటకాల్లో అందమైన పారదర్శక మానవ సంబంధాల విశ్వాన్ని నిర్మిస్తాడు. ఈ విశ్వం సౌమ్యం,సరళమైనప్పటికీ సున్నిత, సుమధురమైంది కాదు. సంబంధాలని నిర్మించుకోవాల్సి వస్తుంది. అందుకోసం పోట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ పోట్లాటలో తమ తమ మూల జీవనతత్వానికి విభిన్నమైన పరిణామం కలగకుండా జాగ్రత పడవలసిన అవసరమూ ఉంటుంది. అందుకే ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ నాటకాంతంలో ప్రసన్న పార్వతి కోసం ప్రేమలేఖ ఒకటి రాసిపెడతాడు. అతిప్రసన్న ఆ లేఖ అవసరమేమిటని ప్రశ్నించినప్పుడు, ప్రసన్న చెప్తాడు.”జీవితం చాలా చిన్నది. ఈ ప్రపంచమయితే మరీ చిన్నది. అందులోను గుండ్రమైనది. మనుషులు అందులోనే తిరుగుతూ, ఎప్పుడో ఒకప్పుడు ఒకరికొకరు ముఖాముఖిగా ఎదురెదురుగా నించోవాల్సిందే. అలాంటప్పుడు నేనూ, పార్వతీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురెదురుగా నిలబడ్డ క్షణం శాంతంగా, సమంజసంగా ఉండాలన్న ప్రయత్నం ఈ ఉత్తరం.”
ఎక్కడికక్కడ హింసాప్రవృత్తి ప్రబలిపోతున్న సమాజంలో కుండల్కర్ ప్రేమ, సమంజసతని గురించి చెబుతూ వాటితో జీవించాలని సూచిస్తారు. ఇది అతని మానవ జీవన దృష్టి కోణం.

శాంతా గోఖలే

శాంతా గోఖలే

-శాంతా గోఖ్లే , ముంబాయి

–అనువాదం : గూడూరు మనోజ

సూదంటు రాయి లా ఆకట్టుకునే నాటకం ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’

friz

మరాఠీ నాటకరంగం 1944లో శతాబ్ది ఉత్సవాలని జరుపుకొంది. నాటకకర్త, నటీనట వర్గం, సంగీతం- ఈ ముగ్గురి ప్రాభవాన్ని సమావిష్ట పరుచుకొని ఈ రంగం ముందుకు సాగుతున్నది. మరాఠీ నాటక రంగానికి, భారతీయ నాటక చరిత్రలో ఒక విలక్షణ స్థానం ఉంది. మరాఠీలు గొప్ప అంకితభావంతో ఈ రంగాన్ని నిర్మించుకుని పెంపొందించుకుని, నిలబెట్టుకున్నారు. నాటక ప్రక్రియ వాళ్ళ జీవనశైలిలో అభిన్న అంగం. దానికోసం వాళ్ళు ఎక్కువగా కష్టపడ్డట్టుగా చెప్పుకోరు కూడా. కష్టం అనివార్యం అని తెలిసిందే. రోజువారీ జీవన క్రమంలో భుక్తి కోసం వృత్తిలాగే, మానసికానందం కోసం నాటకం, అభినయం ప్రవృత్తి. దాన్ని వాళ్ళు సహజతతో నిభాయిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఆధునిక నాటకం సామాజిక తత్పరతని కూడా తనలో సంతరించుకోవడంతో నాటకం ఆయుధం అయింది. ప్రజల దృష్టికోణాన్ని ఆలోచనా విధానాన్ని నిర్దేశించగలిగింది.

ఇందులో భాగంగా కళాకారుల కృషి ఒకెత్తయితే మరాఠీ నాటకరంగాన్ని తమ రసజ్ఞతతో ఇముడ్చుకున్న ప్రేక్షకుల కళా హృదయం మరొక ఎత్తు. థియేటర్ జనజీవన సంస్కృతిలో భాగం. ఇరవై ఒకటవ శతబ్దారంభంలో మల్టీమీడియా అస్సాల్ట్ కాలంలో తమ ‘రంగ్ మంచ్’ని యధాతథంగా పదిలపరుచుకున్న ఘనత వాళ్ళది.
ఎన్నో పరిషత్తులు, అకాడెమీలు, సంఘాలు, సభాగృహాలు- ఉత్సవాలు, పోటీలు, అమెచ్యుర్స్, ప్రొఫెషనల్స్ కళని పండించుకొని తృప్తిపడే కళా పిపాసులు.
ఈ నేపథ్యంలో 1964 లో స్థాపించబడిన అఖిల భారతీయ మరాఠీ నాట్య పరిషత్, నాందేడ్ శాఖ వాళ్ళు 2006 లో జరిపిన నాటక ప్రదర్శనల్లో సచిన్ కుండల్కర్ ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ ఒకటి. నేను నాందేడ్ లోని శారదా భవన్ విద్యాసంస్థలో పని చేస్తున్నప్పుడు ఆ నాటకాన్ని చూసాను. మొదటగా ఈ నాటకాన్ని మహారాష్ట్ర సుదర్శన్ రంగ్ మంచ్ ప్రదర్శింపబడిందన్న అతి స్వల్ప పరిచయంతో పట్టణంలోని ప్రేక్షకులని సూదంటు రాయిలా తన వైపు మరల్చుకోగలిగింది. అందులోనూ నాటకకర్త శైలి అతి కఠినమైనది. సగటు ప్రేక్షకుడు సభాగృహాన్ని వదిలివెళ్ళలేడు, ఎందుకంటే సింబాలిక్ గా అర్థం అయీ కానట్టు చెప్పే కథ తనదిగానే ఉన్నట్టుంది. కూర్చుని ఏకాగ్రతతో చూద్దామా అంటే తన జీవితం ఇంత రసహీనంగా, ప్రేమ రహితంగా మారిందన్న సత్యాన్ని చెప్తున్న ఆ నాటక దృశ్యాల్లో తన జీవితపు సత్యాన్ని అంగీకరించాలి. అర్థం అయీ కానట్టున్న సందిగ్ధం. మొత్తానికి నాటకం ముగిసింది. ‘అమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని బయటపడి, తిరిగి ఆ నాటకపు చేదు నిజాన్ని నెమరువేసుకోవలసి వచ్చినప్పుడు ఈ నాటకపు ప్రాముఖ్యాన్ని గుర్తించాల్సి వస్తుంది. ప్రేక్షక, పాఠకులని అలరించడం కళలో ఒక భాగమైతే, కలవరపరచడం మరోభాగం. ఈ నాటకం ప్రేమ రాహిత్యాన్ని ఎత్తిచూపి కలవరపరిచి ప్రేమ మార్గంలో ఎలా తిరిగి ఊపిరి పీల్చుకోవచ్చో చెప్పి అలరిస్తుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో కొరవడిన ఒకే ఒక్క అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది.

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

ఈ పుస్తకానికి శాంత గోఖలే ప్రస్తావన చదివి తీరాల్సిన నాటక విశ్లేషణ. ఆంగ్ల, మరాఠీ సాహిత్యాల్లో పేరు పొందిన రచయిత్రిగా ఆమె ఈ పుస్తకాన్ని తన ప్రస్తావనలో ఆధునిక సాహిత్య వేదికల్లో సమీక్షిస్తూ విశ్లేషించారు.కుండల్కర్ కి మంచి ఆశీర్వచనం ఈ ప్రస్తావన.పాఠకులని కలవరపరిచి ఆలోచన ప్రేరేపిస్తుంది.
దీన్ని తెలుగు పాఠక ప్రేక్షకులు చదివితే బాగుండునన్పించి నాటక కర్తతో ఈ విషయం చర్చించినపుడు ఆయన వెంటనే అంగీకరించారు. మరాఠీ సినిమా దర్శకత్వంతో తన స్థానాన్ని పలు అవార్డులతో పటిష్టం చేసుకుంటున్న సచిన్ కుండల్కర్ నాటకాలు మొన్ననే హైదరాబాదులోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ లాంటి ఎకాడెమిక్ ఇన్స్టిట్యుషన్స్ లో చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త పంథాలో సాగే లక్షణాలున్న ఈ నాటకం ఇక్కడి పాఠకులని కూడా అలరిస్తుందని నమ్మవచ్చును.

-జి. మనోజ
పాలమూరు విశ్వవిద్యాలయం
మహబూబ్ నగర్.

భారతం విప్పని బాధలు ఈ చీకటి నాటకం!

DharmaveerBharatiiఇప్పుడే ధరం వీర్ భారతి హిందీ నాటకం  ‘ అంధా యుగ్ ‘ కి అశోక్ భల్లా  ఇంగ్లీష్ అనువాదం ముగించాను. యుద్ధానంతర భీభత్సం ఒకటే కాదు, చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. గాంధారి దృక్కోణం ప్రధానంగా ఉంది. ఆవిడ గర్భశోకం, కృష్ణుడిని శపించటం, ఆయన దాన్ని శాంతంగా స్వీకరించటం…వీటిలో కొత్త ఏమీ లేదు. అశ్వత్థామ ఉన్మాదాన్నీ   పైశాచికత్వాన్నీ ఎక్కువ చేసి చెప్పినదీ  లేదు. పాండవ శిబిరం వాకిట రుద్రుడు ఉండటమూ నిజమే, లయాత్మక ప్రతీక గా.. అయితే అశ్వత్థామ చేసిన[ముఖ ]  స్తుతికి ఆయన పొంగిపోయాడని చెప్పటం? పాండవులు ధర్మం తప్పారు కనుక నువ్వు వెళ్లి నిద్రపోయేవారందరినీ చంపేయవచ్చునని హామీ కూడా ఇస్తాడు అశ్వత్థామకి, నాటకం లో.  

andhayug1

ఇంకొక కొత్తదనం ఏమిటంటే అశ్వత్థామ చేసిన నీచాతినీచమైన పనిని గాంధారి సమర్థించి, అందుకు  అమితంగా సంతోషించి  అతన్నీ వజ్రకాయుడుగా దీవించటం. ఆ సౌప్తిక ప్రళయాన్ని సృష్టిస్తున్న అశ్వత్థామ తల చుట్టూ దివ్యకాంతులు ఉండిఉంటాయని ఆమె తలపోస్తుంది,అతన్ని చూసేందుకు దివ్యదృష్టిని అడుగుతుంది. దుర్యోధనుడి తొడలు ఎందుకు విరిగాయో, ఎక్కడ కూర్చోమని పాంచాలిని పిలిచిన ఫలితమో చెప్పకుండా వదిలేశారు. నిజమైన ఒక మంచి విషయం చెప్పాలంటే దుర్యోధనుడు రాజ్యాన్ని  పద్ధతిగానే ఏలాడు[ఈ విషయం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడికి   ప్రజా ప్రతినిధులు చెబుతారు భారతం లో ] .  ద్రౌపది  వస్త్రాలని తొలగించే ప్రయత్నం చేసి అవమానించినందుకు దుశ్శాసనుడి రొమ్ము చీలిందని కూడా నాటక కర్త మర్చిపోయినట్లు కనిపిస్తారు .[అనువాదకులు తమ ముందు మాటలో  గుర్తు చేసుకున్నారు కాని]. దుర్యోధనుడు పడిపోయినప్పుడు   బలరాముడు కృష్ణుడిని’ unprincipled rogue ‘  అని తిడతాడు, హిందీ సమానార్థకం ఏదో తెలియదు.

గాంధారి శాపాన్ని అనుభవించిన నాటికి కృష్ణుడు ఇంచుమించు వృద్ధుడైనాడు, యుగం ముగుస్తోంది. కృష్ణనిర్యాణం ఆయన అందరి భారాన్ని మోసిన ఫలితంగా చిత్రించబోయారు.  ఆయన మృత్యువుని  ఒక బలిదానంగా ఎందుకు చూపించారో తెలియదు, ఏ పోలిక కోసం చేసిన ప్రయత్నమో. ఉత్తర గర్భం లోని పరీక్షిత్ ని రక్షించటానికి కృష్ణుడు తన జీవితాన్ని ఒడ్డలేదు, అంత అవసరం రానేలేదు. ఆ పరీక్షిత్ కూడా క్రోధానికి లోబడి శాపగ్రస్తుడైన నాటికి చాలా కాలం పాలించి ఉన్నాడు. కృష్ణుడు రక్షిస్తేనేమీ, అతనూ మరణిస్తాడు అంటారు,  అసలే మరణించనివారెవరు?

andhayug2

మరీ వింతగా తోచినదేమంటే కురుక్షేత్రం ముగిసిన తర్వాత ధర్మరాజు చివరి వరకు,  నిత్య వ్యాకులత తో బాధపడ్డాడని చెప్పటం . పౌరులు ఈయనేమి రాజురా, గుడ్డివాడే నయం అనుకున్నారట.  భీముడు మందబుద్ధి, అహంకారి అని, అర్జునుడికి అకాలవ్యార్థక్యం వచ్చిందనీ జనం అనుకుంటున్నారట. భీముడు ధృతరాష్ట్రుడిని సూటిపోటి మాటలనేవాడన్నంతవరకు నిజం, యుద్ధం అంతమైనాక గాంధారీ ధృతరాష్ట్రులని  పరామర్శించేందుకు పాండవులు  వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు భీముడిని  చంపే ప్రయత్నం చేస్తాడని ఇక్కడ గుర్తు చేసుకోవలసి ఉంది.   అర్జునుడు అశ్వమేధయాగాశ్వం వెంట వెళ్లి దిగ్విజయం చేసినది కురుక్షేత్రం తర్వాతే. నకులుడు అజ్ఞాని అని[ కాదనేందుకు ఆధారం లేదు కానీ అవునని అనేందుకో ? ] , సహదేవుడు పుట్టుకతో బుద్ధిమాంద్యుడని [ ఆయన వివేకపు ప్రశంస భారతం లో చాలా సార్లు వస్తుంది ] ….

పాండవుల వైపున పోరాడిన కౌరవుడు ,  యుయుత్సుడి తల్లి గాంధారి కాదు. నాటకం లో యుద్ధం ముగిశాక ఆయన, తను  సరయిన పని  చేయ  లేదని కుమిలిపోతూ ఉంటాడు. విదురుడికి భగవంతుడిమీద సందేహాలు వస్తూ ఉంటాయి.

ద్వాపరం నాటికి అధర్మాన్ని ఎదుర్కొనే పద్ధతిలో కొంత అధర్మాన్ని వాడవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని భారత కథని  తమకు తోచినట్లుగా  నిరూపించే  ప్రయత్నాలు చాలా జరిగాయి. వాటిలో ఇది ఒకటి. అనువాదకులు ఈ నాటకాన్ని తరగతి గది లో బోధించేటప్పుడు దాదాపు అందరు విద్యార్థులూ గాంధారి దే న్యాయం  అనటమే కాకుండా కృష్ణుడిని తీవ్రంగా ద్వేషించేవారట. ఆ పరిస్థితి ని మెరుగు పరిచేందుకు సక్రమమైన అనువాదం చేద్దామని ఆయన భావించారట. కాని అది నెరవేరినట్లేమీ లేదు.  ధృతరాష్ట్రుడి పుట్టు గుడ్డితనం ఆయన పుత్రప్రేమలోఅన్నంతవరకు మాత్రమే ఔచిత్యం కనిపించింది నాకు.

                                                                       – మైథిలి అబ్బరాజు

maithili

డోంట్ మిస్ మీనా

Meena2

మల్టీప్లెక్స్ ఆన్ లైన్ బుకింగ్ లతో యూత్ నిలువునా బుక్ అయిపోతున్న నిస్సాయం కాలాలలో ఎంత పొగరుండాలీ తెలుగు నాటకానికి?

సాయంత్రాలను అలవోకగా చెవులు పిండీ, కళ్ళు నులిమీ కబ్జా చేస్తున్న రిమోట్లను బలదూర్ అనడానికి ఎంత బలుపుండాలి సెంట్రల్ యూనివర్సిటీకి?

వార్తలనూ వినోదాల ఫార్సుకు కుదించిన టి ఆర్ పి రేటిం’గులల్తో’ మైమరిపిస్తున్న బుల్లిపెట్టె బ్రే’కింగు’ల హవా మాత్రమే నడుస్తున్న ఈ కళా విహీన సమయాల్లో ఎంతటి దుస్సాహసం ఆ యూనివర్సిటి నాటక విభాగం మొదలుపెట్టిన ఔట్ రీచ్ ప్రోగ్రాంది?

పవర్ ప్రిన్స్ జూనియర్ రెబల్ మాస్ మహారాజాల సై ఆటలు వందకు నోచుకోకుండానే బ్లాక్ బస్టర్ నూకలు చెల్లించుకుంటున్న భారీ సందర్భాలను తూచ్ అనేందుకు ఎంత అహంకారం ఈ మిస్ మీనాటకానికి?

వగలు కాకపోతే రిలీజ్ రోజే వంద ఆటలు ఆడతానంటుందా?

అనడమేంటి ?

అలా అలా సగం ఆటలు అప్పుడే సునాయసంగా ఆడేసిందట కూడా?!

అవును ఇది నిజ్జంగా నిజ్జమే!

కారణాలు ఏమైనా చాలా కాలం నుంచీ మన నాటకాలకు పొయ్యేకాలం వచ్చిందని సర్ది చెప్పుకున్నామా?Meena3

పెదవి విరుచేసుకుని ఏదో మొగలీ, రేకూ అనుకుంటూ వున్నామా?

మిస్ మీనా మిడిమ్యాలం చూడబోతే ఇక మనమే నాటకాలకు పొయ్యే కాలం దాపురించిందేమో అనిపించింది.

మన రిమోట్ల మీద మనకే తెలియని మరో మాయా బటన్ ఒకటి మొలిచిందేమో అనిపిస్తుంది.

మన థియేటర్లలో ఆడని ఆట తాలూకు కనిపించని కొత్త పోస్టర్ ఒకటి వెలసిందేమో అనిపించింది.

మన సాయంకాలాలను మనకే తిరిగి ఇచ్చే కొత్త భరోసా ఏదో ఒనకూడిందని అనుమానమేసింది.

అందుకే డోంట్ మిస్ మీనా.

                                                                                                                              ***

వరంగల్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో మిస్ మీనా నాటకం తొలిసారి కెవ్వుమంది.

అప్పుడు లేబర్ రూంకి అటువైపు హెచ్ సియూ నాటక విభాగం ఔట్ రీచ్ ప్రోగ్రాం పెద్ద డాక్టర్ పెద్ది రామారావ్, ఇటు వైపు ఈ నాటకానికి  పదహారణాల దర్శకుడు ఇండ్ల చంద్ర తచ్చాడటం నేనూ చూసాను.

మిస్ మీనా నాటకం కేవలం కెవ్వు మనలేదు.

కేక పుట్టించింది.

రంగంపైని తొమ్మిది గడుల్లో సుడులు తిరిగే ఉరకలు. కోలాహలం. వేడుక. అల్లరి. కేరింతలు. సంబరం.

మిస్ మీనా నాటకం సాగిన తీరు ఇదీ.

అందుకే గంటకు పైగా సాగిన మిస్ మీనా నాటకం గంటకు అరవై కన్నా తక్కువ సెకన్లే అనిపింపజేసింది.

ఇదీ ఎక్కడా సడలకుండా సాగిన మిస్ మీనా నాటకం సాధించిన తొలి విజయం అనాలి.

ఆ క్రెడిట్ చంద్రకే దక్కాలి.

ఐమ్యాక్స్ థియేటర్లో ముందు వరసలో కూర్చున్నప్పుడు తెరకు ఆ కొసనా, ఈ కొసనా జరిగే యవ్వారాన్ని వడిసి పట్టుకునేందుకు కళ్ళు అటూ ఇటూ తిప్పడం చాలక తలకూడా తిప్పేస్తుంటామే అచ్చం అట్లాంటి అసంకల్పిత చర్య మిస్ మీనా నాటకం చూసినప్పుడూ ప్రేక్షకులకు కలుగుతుంది.

ఇంత ఎనర్జీ వేదికపైన సాంతం సృష్టించిన (ఎలాంటి అభినయ అనుభవం లేని) ఔట్ రీచ్ రిపర్టరీ నట బృందానికి ఈ క్రెడిట్ ఇచ్చేసేయాల్సిందే నూటికి నూరు పాళ్ళూ.

Meena4*

ఇంతకీ ఏంటి మిస్ మీనా నాటకం కత?

తుమ్మలపెంట అనే పల్లెటూరిలో విరిసీ విరియని ఓ మల్లి రివెంజ్ డ్రామానే ఈ నాటక కథ.

ఒక్క ముక్కలో చెబితే కాగజ్ కే ఫూల్ లాంటి యాత్రతో, సీతామాలక్ష్మి కెరీర్ ప్రగతితో, రంగీలా లాంటి అందమైన అల్లరి నడకతో సాగే మంగమ్మ శపథమే మిస్ మీనా నాటకం.
రెండో ముక్క చెప్పాల్పివస్తే అంతకన్నా ఎక్కువే మిస్ మీనా నాటకం.

మల్లి ప్రేమించి మోస పోతుంది.

కలయికలో బతకూ, కడుపులో బిడ్డా నిరాకరించబడతాయి మల్లికి.

ప్రియుడి మోసం, ఊరి కాఠిన్యం మల్లి కడుపులోని సన్న నలుసును హత్య చేస్తాయి.

అలా ఏమీ కాకుండా, ఎవరికీ కాకుండా పోయిన మల్లి ఊరి నుంచి గెంటి వేయబడుతుంది.

మోసం కారణంగా మల్లిలో ద్వేషం పుడుతుంది.

నిరాకరణ ఫలితంగా మొండి ధైర్యం, ఎక్కడ లేని రోషం, తీరని ప్రతీకారం పుట్టుకొస్తాయి.

ఊరి నుంచి బయటపడిన మల్లి జీవితం అనుకోని మలుపులకు గురవుతుంది.

వెలుగుజిలుగుల సినిమా లోకంలో మీనాగా  విరగబూస్తుంది మల్లి.

వెండితెరను ఒక ఊపు ఊపుతున్న ప్రముఖ హీరోయిన మిస్ మీనా ఇప్పుడు ఇక ఎంత మాత్రమూ మల్లి కానే కాదు.

అయితే తనపై ప్రసరించే వెలుగులు తనకు చెందవని చాలా తొందరగానే గ్రహిస్తుంది ఆమె.

మోసం, నిరాకరణ రూపంలో వున్న తన లోపలి చీకట్లే పెద్ద వెలితిలా వెంటాడతాయి మీనాను.

తనలో చీకటిగా పేరుకుపోయిన తన ప్రియుడి ప్రేమ లేమినీ, తన సొంతూరి కాఠిన్యాన్నీ జయించాలి… లేదా సంహరించాలి అనుకుంటుంది మల్లి ఉరఫ్ మిస్ మీనా.
అందుకు ఆమెకు అందవచ్చిన క్షిపణి పేరే విజయం.

మోసం ద్వేషానికీ, నిరాకరణ ప్రతీకారానికీ సహజంగానే పురుడుపోస్తుంది.

ఈ ద్వేషంతోనే, ఈ ప్రతీకారంతోనే నేరుగా తుమ్మలపెంట చేరుకుంటుంది మీనా.

ఇప్పుడు మీనా ముందున్న సింగిల్ పాయింట్ ప్రోగ్రాం తన ప్రియుడిపై ప్రతీకారం.

తన ఆత్మకథనే సినిమా తీయాలనుకున్నట్టు ఊరిని నమ్మిస్తుంది.

ఊరు మొత్తాన్నీ తన సినీమాయలో పడేసుకుంటుంది.

తన ప్రతీకార పథకాన్నేతను తీయబోతున్నసినిమాకు క్టైమ్యాక్స్ గా కూడా రచిస్తుంది.

పథకం అమలుకు తన సొంత ఊరినే ఆయుధంగా మలుస్తుంది మీనా.

తనని గతంలో మోసం చేసిన ప్రియుడి ప్రాణాన్ని కానుకగా కోరుతుంది.

గతంలో మీనా విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఊరు,  ఇప్పుడు ప్రియుడిని చంపేందుకు మాత్రం తటపటాయిస్తుంది.

విషయం తెలుసుకున్న ప్రియుడు ‘ఎప్పుడో పదైదేళ్ళ క్రితం జరిగిన సంఘటనకు ఇంత రాద్ధాంతం చేస్తావా?’ అని నిలదీస్తాడు.

గాయం పచ్చిగా వున్న మీనా అలియాస్ మల్లికి పదైదుళ్ళు అంటే ‘అప్పుడెప్పుడో’ కాదు.

అందుకే ప్రతీకారమే ఆమె తక్షణ కర్తవ్యం.

ప్రియుడి హత్యకే పట్టుపడుతుంది.

అయితే ప్రియడి హత్య జరగదు. మల్లి ప్రతీకారం తీరదు.

ప్రియుడు చనిపోతాడు. మల్లిలోపల ప్రతీకారంతో రగిలే మీనా కూడా మిస్ అయిపోతుంది.

ఊరిలో ప్రియుడి విగ్రహం వెలుస్తుంది.

పదైదేళ్ళ క్రితం తన మెడలో వరమాల వేయించుకోవాలని ఆశపడిన మల్లి ఇప్పుడు మిస్ మీనాగానే మిగిలిపోయి తన ప్రియుడి విగ్రహానికి నివాళి మాల వేయాల్సివస్తుంది.
ఇంతకీ మల్లి, మీనాలలో ఎవరు విజయవంతతం? ఎవరు విషాదాంతం?

ఇద్దరూ రెండూనేమో!

ఇదీ నేను చూసిన మిస్ మీనా నాటకం కథాంశం.

ప్రముఖ నాటక దర్శకుడు రాజీవ్ మీనన్ చాలా ఏళ్ళుగా దేశ వ్యాప్తంగా ప్రదర్శిస్తున్న నాటకానికి ఇండ్ల చంద్ర శేఖర్ తెలుగు మెరుగులు దిద్దుకున్నప్రయత్నమే ఈ మిస్ మీనా నాటకం.
నాటకంలో చంద్ర చేసిన సవరణలు, ఇంప్రొవైజేషన్లు, డిజైన్, ప్రాప్స్  మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

నాటకంలో సినిమా తాలూకు యవ్వారాన్ని చాలా సునిశిత వ్యగ్యంగా, కథకు తగ్గట్టుగా మలచుకున్న తీరు చాలా అభినందనీయం.

ఇంత మందితో పట్టు సడలని అభినయం, పైగా ఒకటికి మించి పాత్రలతో(సంగీతం, నృత్యంతో సహా) ఒకే నటుడిని/నటినీ దౌడు తీయించిన చాకచక్యం విస్మయాన్నే కలిగిస్తుంది.
సీన్ చేంజ్ లో చాలా పారదర్శకత ప్రదర్శించడంతో పాటు, దాన్ని కూడా నాటకంలోని బిగువైన అంతర్భాగంలా ప్రదర్శనకు అనుగుణంగా మలచిన పద్ధతి తాజా ప్రతిభకు తార్కాణం.

ఇక మల్లిగా ఒక చిన్న పాయగా మొదలై మిస్ మీనాగా నట నయాగరా రూపం దాల్చిన అశ్విని శ్వేతది నాటకంలోని అన్ని రంగాల విజయంలో, ప్రశంసలో ఎక్కువ శాతం దక్కించుకునే అభినయం.