రోషం, ఆనందం కలగలసి…

 

 

ఎవరిదా శిబిరం?

ఎవరున్నారు అక్కడ?

ఇంకెవరు ?

సాళ్వుడు

అప్పుడు ఎప్పుడో ఉద్యానవనం నుంచి సరాసరి ఇంటికెళ్ళిపోయిన సాళ్వుడు, వాళ్ళ నాన్నగారితో ప్రేమ దోమ గురించి మాట్లాడితే నాన్నగారన్నారు – ఒరే నాయనా, ఈ కాలంలో అలా నడవదు. మగపెళ్లివాళ్ళం మనం వెళ్ళి వాళ్ళను అడగటమేంది ? యుగధర్మం, సాంఘికధర్మం ప్రకారం నా అంచనా తప్పక ఆ కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. అప్పుడు వెళ్ళు, ఆ అమ్మాయి ఎలాగు నిన్ను ప్రేమించిందంటున్నావ్ కాబట్టి, నీ మెళ్ళోనే మాల వేస్తుంది. అప్పుడు ఇంటికి తీసుకొచ్చెయ్. నేను అందరికీ పప్పన్నం, పరవాన్నం పెట్టుకుంటా అన్నాడు

దాంతో సరేనని, స్వయంవరం ప్రకటన జరగటం ఆలస్యం, మనవాడు పరుగెత్తుకుంటూ వచ్చేశాడు

రేపు జరగబోయే స్వయంవరానికి సన్నద్ధమైపోయాడు

అలా వచ్చి విడిదిలో కులాసాగా నిదరపోతున్నవాణ్ణి తట్టి లేపింది అంబ

ఏంటిది? ఈ రాత్రి పూటా వచ్చేవేమి ఎవరన్నా చూస్తే బాగుండదు, వెళ్ళిపో అన్నాడు

అయ్యో ఆడపిల్లనైన నాకుండాల్సిన సిగ్గు నువ్వు పడుతున్నావేమి స్వామీ అని బుగ్గ మీద చిటికె వేసి నీకు తెలుసా గాంగేయుడు వచ్చాడని అని అడిగింది

ఆ తెలుసు, అయినా ఎవరొస్తే నాకేంటి, నీ మాల నా మెళ్ళోనేగా అన్నాడు ఈయన

అది కాదండి, ఆయన ఆయనకోసం రాలేదు, నాకోసమూ రాలేదు, తన తమ్ముళ్ళ కోసం వచ్చాడు అంటూ నాలిక కరుచుకుంది

ఏమిటీ? అని ఆశ్చర్యపోయాడు సాళ్వుడు

తనకోసం కాక తమ్ముళ్ళ కొసం రావటం ఏమిటి? అది నీకెట్లా తెలుసు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు

దేవదూత చెప్పిన సీక్రెటును లీకు చేసినందుకు కొరుక్కున్న నాలిక సరిచేసుకుని, నాకు కల వచ్చింది అలా అని, రేపు యుద్ధం జరగబోతోంది అని కూడా ఆ కల్లో వచ్చింది అంటూ మాట దాటవేసి, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు మనకి, ఇద్దరం కలిసి ఇప్పుడే మీ ఊరికి వెళ్ళిపోదాం పద అని అన్నది అంబ

గొడవేముంది, యుద్ధానికొస్తే ఊడ్చవతల పారేస్తా ఎవరినైనా అన్నాడు ఈయన

స్వామీ, నువ్వు ఊడ్చవతల పారేస్తావులే కానీ, అటుదిటైతే నా బతుకు చీపుగా చీపురైపోతుంది, అందుకని నా మాటిని పారిపోదాం పద మీ ఇంటికి అన్నది అమ్మాయి

ఠాట్, ఠూట్ అని మొత్తానికి ఒప్పుకోలా మహానుభావుడు

అంబ ఉస్సురంటూ కాళ్లీడ్చుకుంటూ అంత:పురానికి వెళ్ళిపోయి పొద్దుకిరణాలు పొడిచేదాకా దిండు మీద తలపెట్టుకుని పడుకోకుండా పడుకుండిపోయింది

సన్నగా ఒక నవ్వు, అశరీరవాణి నవ్వు

ఆరు నూరైనా ఆ రాతను, నీ తలరాతను మార్చలేవు నువ్వు అంటూ నవ్వు

నవ్వులతోనే తెల్లవారిపోయింది

స్వయంవరం

అంతా విచ్చేశినారు మంటపానికి

రాజకుమారులందరూ వచ్చేశినారు

ఒక్కొక్కరి అందం వర్ణించనలవి కావట్లా

అంతందంగా ఉన్నారు

అయితే ఎంత అందం ఉంటే ఏమిటి, అమ్మాయీమణులకు నచ్చినవాడే స్వయంవర విజేత

అమ్మాయీమణులు కూడా వచ్చేశారు

అంతా వరసాగ్గా నిలబడుకొని ఉన్నారు

ఇంతలో వచ్చాడు

ఎవరు ?

ఇంకెవరు ?

గాంగేయుడు

సభ అంతా కళకళలాడిపోయింది ఆయన రాకతో

ఆ అందగాడి రాకతో

రావటం, అమ్మాయిలూ రథం ఎక్కెయ్యండి అనటం జరిగిపోయింది

అమ్మాయిలు ఖంగారు పడ్డారు

సభలో గుసగుసలు, కొంతమంది రాజుల్లో పౌరుషాలు పెల్లుబుకినాయి

ఎట్లా ఉన్నది ఆ కొంతమంది రాజుల పరిస్థితి ?

కళ్ళు ఎరుపెక్కినాయ్

పళ్ళు పట పట సవుండ్లు చేస్తున్నాయ్

పెదాలు కొరుకుడు పడుతున్నాయ్

కపోలాలు చెమటలు పడుతున్నాయ్

కనుబొమలు ముడిపడుతున్నాయ్

ఇవన్నీ కోపారంభానికి సూచన

ఆ కోపంలో చేతులు ఒరల మీదకు వెళ్ళిపోయినాయి

గాంగేయుడు ఓరకంట చూశాడు

పక్కవాడి చేయి కత్తి మీద ఉన్నది కదానని ధైర్యం చేశిన మిగిలిన వారి అందరి చేతులు కత్తుల మీదనే ఉన్నవి

కొంతమంది చేతులు వణుకుతున్నవి, అయినా మేకపోతు గాంభీర్యంతో కత్తి పిడులు పట్టుకునే వున్నారు

మీసం మెలివేశాడు గాంగేయుడు

ఎవరురా కత్తి ఒరలోనుంచి బయటకు తీసేది అని సింహనాదం చేసినాడు

ఆ సింహనాదానికే చేతులు కత్తుల మీద నుంచి తీసివేశారు చాలా మంది

మిగిలినవారిలో ఓ పదిమంది తమ ఆసనం మీదనుంచి కిందకు దిగివచ్చి సవాలు చేసినారు

మీ లాటి చిన్న చితక వారికి ధనస్సు ఎత్తటం, దానికి బాణాలు వేష్టు చెయ్యటం ఎందుకని అందరిని దాపుకు రానిచ్చి ఒక ముష్టిఘాతం విసరినాడు

అంతే, ఆ పదిమందీ గింగిరాలు తిరుగుతు పడిపోయినారు

ఎట్లా పడిపోయినారు వారంతా ?

పోతన గారు హిరణ్యాక్షవధను వర్ణించిన ఈ క్రింది విధంగా పడిపోయినారు

 

బుడబుడ నెత్తురు గ్రక్కుచు

వెడరూపముదాల్చి గ్రుడ్లు వెలికుఱుక నిలం

బడి పండ్లు గీటుకొనుచును

విడిచెన్ బ్రాణములు….

 

ఆ దృశ్యం అచ్చంగా అలాగే ఉన్నది అక్కడ

మరి దెబ్బ విసరినది ఎవరు ?

సాక్షాత్ ఆ పరశురాముని శిష్యుడు

ఆ దేవదేవుని అవతారం ఆ రాముని శిష్యుడు

ఆయన వద్ద విద్య నెర్చుకున్నవాడికి తిరుగు ఉంటుందా?

ఆ విద్యకు ఎదురు నిలవగల శక్తి ఈ లోకంలో ఉన్నదా?

అంతటి విద్య అది, అంతటి ప్రతిభాశాలి ఆ గాంగేయుడు

ఆ పడిపోయిన వారిని చూచి మిగిలినవారికి ముచ్చెమటలు పట్టినాయి

ఎవరి అడుగు ముందుకు పడలా

గాంగేయుడు అమ్మాయీమణుల దగ్గరకు వచ్చి ముగ్గురినీ రథంలోకి ఎక్కించాడు

అశ్వాల వెన్ను మీద ఒక్క చరుపు

అంతే, ధనస్సు విడిన బాణంలా పరుగు అందుకున్నాయ్

అయ్యో అయ్యో అని హాహాకారాలు మిన్ను ముట్టినాయి

సాళ్వుడు అక్కడే ఉన్నాడుగా, చూశాడు, ఆ దృశ్యాన్ని చూశాడు

నోట మాటే రాలా

అయినా చిక్కబట్టుకొన్నాడు

ధైర్యం చిక్కబట్టుకొన్నాడు

మరి అమ్మాయీమణి కావాలిగా

అంబా పాణిగ్రహణం జరగాలిగా

ముందు వెళ్ళిపోతున్న రథం వంక చూచినాడు

ఆ రథంలో దీనంగా నిలబడుకొని ఉన్న అంబ వంక చూచినాడు

రథం తోలుతున్నా గాంగేయుని వంక చూచినాడు

అంబ సైగలు చేస్తోంది ఇంకా నిలబడి ఉన్నావేం అన్నట్లు

ఇక అదే ఊతంగా తీసుకొని వెళ్ళిపోయినాడు

గాంగేయుని రథమ్మీదకు ఉరుకులు పరుగులుగా వెళ్ళిపోయినాడు

సాళ్వుడూ వీరుడేగా?

మొత్తానికి గాంగేయుడి రథం వేగాన్ని అందుకున్నాడు

అందుకోవటమేమిటి, దాటేశాడు కూడాను

ఆపాడు రథాన్ని, ఆపించాడు దేవవ్రతుడి రథాన్ని

కానీ ఆయన్ని ఎదురెదురుగా చూడగానే సాళ్వుడికి ఒళ్ళు గగుర్పొడించింది

ఆ అందానికి, ఆ భీషణత్వానికి, ఆ వీరత్వానికి, సహస్ర సూర్య భగవాను తేజానికి

ఒంటి మీది రోమాలన్నీ నిలబడుకొనిపోయినాయి

అచ్చంగా బ్రహ్మ నిద్ర నుంచి లేచి కాళ్ళు చేతులు విదిలించినప్పుడు పుట్టిన సరీసృపాల్లా, పాముల్లా నిలబడుకొనిపోయినాయి

** తన సృష్టి వృద్ధిలేమికిఁ

గనలుచు శయనించి చింతఁ గర చరణాదుల్

గొనకొని కదలింపఁగ రా

లిన రోమము లుగ్రకుండలివ్రజ మయ్యెన్**

అన్న పద్యం గుర్తుకువచ్చిందా?

అంతే మరి, భావన అంటే ఒక శక్తి

ఆదిపరాశక్తితో సమానం

అంత గగుర్పాటును అణుచుకొంటూ సింహనాదం చేసినాడు

అమ్మాయీమణులను వదిలెయ్యమన్నాడు దేవవ్రతుడితో

ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పొదిలోనుంచి ఒక మహాస్త్రం తీసి ఒక్క వేటు వేసినాడు

మాట మంతీ లేకుండా, ఆ మహాస్త్రపు దెబ్బకు రథమ్మీదనుంచి కిందపడిపోయి ఆమడ దూరం జారిపోయినాడు

అక్కడికి సాళ్వుడి యుద్ధ నైపుణ్యం సమాప్తం

దేవవ్రతుడు వెళ్ళిపోతున్నాడు

హస్తినకు వెళ్ళిపోతున్నాడు

అమ్మాయీమణులను తీసుకొని వెళ్ళిపోతున్నాడు

సాయం సమయమయ్యింది

అమ్మాయిలకు విశ్రాంతి కావాలని విడిది చేశినాడు

మార్గమధ్యంలో ఉన్న అడవిలో విడిది చేశినాడు

రాతిరి ఒకటవ జాము నడుస్తుండగా అంబ వచ్చింది గాంగేయుని దగ్గరకు

నిద్ర పోకుండా ఏమి చేస్తున్నావ్ అన్నాడీయన

భీష్మా, నీవు సత్యానికి బద్ధుడవేనా ? అని నోరు పెగలించుకొని అడిగింది అంబ

సత్యానికొక్కదానికేనేమి, ధర్మానికి కూడా బద్ధుడినే అన్నాడు గాంగేయుడు

మరి నీ శపథం వదిలివేసుకుంటున్నావా అని ప్రశ్నించింది అంబ

ఎవరన్నారు నా శపథం వదిలి వేస్తున్నానని అన్నాడు భీష్ముడు

మరి నీవు పెండ్లాడకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకొని పోతున్నావు అని మరో ప్రశ్న వచ్చింది అంబ నుండి

నా తమ్ముడు విచిత్రవీర్యునికి మిమ్మలందరినీ ఇచ్చి కట్టబెట్టటానికి అన్నాడు ఈయన

ఎవరికో ఇచ్చి కట్టబెట్టటానికి నీ వీరాన్ని చూపించావా అంటూ అంబ హేళణగా నవ్వింది

ఆయన మారుమాట్లాడలా

రెట్టించింది అంబ

మీ నాన్న పంపించిన స్వయంవర ఆహ్వానంలో ఉన్నదే నేను చేసినాను, నా తప్పేమీ లేదు అన్నాడీయన

మా నాన్న చెప్పింది చెయ్యటమేమిటి ? ఏమున్నది ఆహ్వానంలో అంటూ ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరి అయినది అంబ

ఎవరు వీరాధివీరులో, ఎవరి రాజ్యంలో అందరూ వీరులేనో, ఎవరు ఆ వీరులకు రాజో, ఎవరు యుద్ధవిజేతో వారికే మా అమ్మాయిమణులను కట్టబెట్టేది అని ఉన్నది

నాన్నగారు అలా అనలేదే మాతో, స్వయంవరం అన్నారే అంటూ అంబ ఆశ్చర్యపడ్డది

అది మీరు మీరు తేల్చుకోవాల్సిన విషయం అన్నాడు ఈయన

ఆ, గుర్తుకు వచ్చింది ఆ ఆహ్వానం మా మంత్రిగారు పంపించారు, ఆయన మతలబు చేశి ఉంటాడు ఇందులో, నరికేస్తా వాడిని అంటూ ఆవేశానికి లోనయ్యింది అంబ

ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు కానీ, ఆహ్వానం వచ్చాక మా రాజ్యంలో అంతా వీరులే, ఇంత చిన్నదానికి రాజుగారు రావటం ఎందుకని నేనే వచ్చేశా, మిమ్మల్ని తీసుకెళ్ళి మా చిన్నరాజు గారికి అప్పగించేసి పెళ్ళి చేసేస్తానంటూ అటు తిరిగి నిద్రకుపక్రమించాడు

అదంతా నాకు తెలియదు, ఎవరికో కట్టబెట్టటమేమిటి ? నన్ను ఎత్తుకొచ్చిన నీవే నన్ను పెండ్లి చేసుకోవాలి అని మరో మాట విసిరింది

కుదరదు అన్నాడు గాంగేయుడు

ఎట్లా కుదరదు? నన్ను సాళ్వుడికి కాకుండా చేసి, ఎత్తుకొచ్చిన నీకు కాకుండా చేసి, వేరెవరికో కట్టబెడితే నీ అంతు చూస్తాను, నీకు మృత్యుదేవతనవుతాను అంటూ తాండవం చేసింది

ఆయన సాళ్వుడి పేరు వినగానే కాస్త అశ్చర్యానికి లోనైనాడు

సాళ్వుడా? వానికి నిన్ను కాకుండా చెయ్యటమేమిటి అన్నాడు

సాళ్వుని వృత్తాంతం, తమ ప్రేమ వృత్తాంతం తెలిపింది అప్పుడు అంబ

అది విన్న భీష్ముడు మ్రాన్పడిపోయినాడు ఒక్క నిముషం

ఏ నాడు తప్పు చేయని నేను దారి తప్పినట్టే ఉన్నది, తప్పు కాదు కానీ తప్పు అనబడదగ్గ పని చేసినాను. నీ మనసులో మాట రథం ఎక్కక ముందైనా చెప్పినావు కాదు నాకు అని చింతించాడు

అయిపోయిందేదో అయిపోయింది, ఇక సాళ్వపతి దగ్గరకన్నా నన్ను పంపించివేయి, లేదా నీవే నన్ను పెండ్లి చేసుకోమని పట్టు పట్టినది

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్న సూత్రముననుసరించి పట్టు పట్టినది

నేను శపథ బద్ధుడిని, అది ఆ పరమశివుడు కూడా మార్చలేడు, అందువల్ల నీవు నా మీద కోరిక వదిలి ఆ సాళ్వరాజు వద్దకు వెళ్ళిపో అని , గుర్రం ఎక్కించి పంపివేశినాడు

అంబ రోషం, ఆనందం కలగలసిన మన:స్థితిలో పరుగు పరుగున సాళ్వుడు పడిపోయిన ప్రదేశానికి దౌడు తీయించింది గుర్రాన్ని…

అక్కడ….

 

(ఇంకా ఉంది….)

ఎట్లా ఉన్నది అక్కడ?

 

అనగనగా ఒక నగరం.

నగరం అంటే నగరం కాదు.

బ్రహ్మాండమైన నగరం.

అలాటిలాటి నగరం కాదది.

సాక్షాత్తూ విశ్వనాథుడి నివాసం.

జటాజూటవాసిని, గంగానమ్మవారి తీరం.

ఆ తీరంలో ఆ పురం.

ముల్లోక పూజ్యం.

సకల సద్గుణం.

సకల విద్యాపురం.

పేరు కాశీపురం.

ఆ పురానికి ఒక రాజు.

చాలా గొప్ప రాజుగారు.

సద్గుణ విరాజమానుడు.

ధర్మనిరతుడు.

పేరు విక్రమసింహుడు.

పేరొక్కటే విక్రమం కాదు.

అన్నిట్లోనూ త్రివిక్రముడే.

అందులోనూ సింహంలాటి వాడయ్యె.

ప్రజలకు లోటేమి ?

అసలైనా శాస్త్రాలెం జెపుతయ్?

**************************

రాజాదైవతరూపేణ

కామధేనుశ్చ మంత్రిణః

పరివారం కల్పవృక్షంచ

యథారాజాతథాప్రజాః

 

రాజారాక్షసరూపేణ

వ్యాఘ్రరూపేణ మంత్రిణః

పరివారం శ్వానరూపేణ

యథారాజాతథాప్రజాః

**************************

అని కదా!

మరి మనవాడేమో దైవతరూపేణ గా ఉన్నాడయ్యె.

ఇహ ప్రజలెట్లా ఉంటారు ?

తథాస్తుగా ఉంటారు.

అంతేగా మరి ?

అంతే అంతే.

 

అలాటి రాజుకు కష్టమొచ్చిందయ్యా?

ఏవిటి కష్టం?

పిల్లల్లేకపోటం.

ఆ రోజుల్లో పిల్లల్లేకపోటం అంటే చాలా నామోషి.

ఇప్పటి చైనా వాళ్ళలా ఇబ్బడి ముబ్బడిగా ఉండాలన్నది అప్పటివారి కోరిక.

అంతకు కాదంటే మనవాళ్ళల్లా ఇబ్బు మబ్బుగానన్నా ఉండాలని కోరిక.

అందువల్ల ఏం జేసాడాయన ?

పిలిచాడు!

ఎవరిని ?

జ్యోతిష్యులని, శస్త్రాధికారుల్ని.

అడిగాడు.

ఏవిటీ సంగతి అని.

చార్మినారు రేకులు అప్పటికి లేవు కాబట్టి జ్యోతిష్యులేమి చెప్పలేకపొయ్యారు.

శస్త్రాధికారుల్ని అడిగితే శాస్త్రం మాకు తెలీదు సార్, మీలో లోపం మటుకు ఏమీ లేదు అన్నారు.

శస్త్రాధికారులంటే, శాస్త్రాధికారులనుకొని పొరబడేరు, కాదు కాదు వారు ఇప్పటి డాక్టర్లండోయ్

అప్పుడయన ఇలాక్కాదు సంగతి అని, సరాసరి విశ్వనాథుడి దగ్గరకెళ్ళిపోయాడు.

దగ్గరికెళ్ళిపోయి స్తోత్రం చేశాడు.

శివయ్య రాలా.

అరే, ఇదేమిట్రా నాగతి. ఈయన రాపోతే ఇక్కడే తలపగలగొట్టుకుని చచ్చిపోతానని ఆయన్ని కావలిచ్చుకుని కూర్చున్నాడు.

అలా ఆయన్ను పట్టుకుని విడవలా.

ఎంత విగ్రహమైనా భక్తితో పట్టుకుంటే అసలాయన్ని పట్టుకున్నట్టే.

పైగా పట్టుకుని విడవకపోతే ఇంకోళ్ళెలా పట్టుకుంటారు ?

అమ్మవారేమో అయ్యవారి పక్కనే ఉంటుందాయె.

ఇలా ఈయన ఆయన్ని పట్టేసుకుని కూర్చుంటే ఆవిడకు పట్టు దొరకట్లా.

అమ్మవారికి ఇక విసుగొచ్చింది.

ఇదేవిటండీ ఇలా మిమ్మల్ని కావిలిచ్చుక్కూర్చుంటే ఎట్లానని.

శివయ్య తత్తర బిత్తర పడ్డాడు.

అమ్మకు కోపం వస్తే ఇంకేవన్నా ఉందీ ?

గగ్గోలు గందరగోళం అయిపోదూ ?

అదంతా ఎందుకని నీకేవిటి కావాలి అని అడిగాడు విక్రమసింహుణ్ణి.

ఆయనన్నాడు, అయ్యా! దేవరా! నాకు సంతానం కావాలి అన్నాడు.

సరే ఇంక కొన్ని రోజులాగు, నీకు సంతానం కలుగుతుంది. ఇంక నన్నొదిలెయ్ అన్నాడాయన.

పట్టు వదలని విక్రముడు పట్టు వదిలాడు.

శివయ్య హాపీసు.

అమ్మవారు హాపీసు.

ఆ తర్వాత కొన్ని రోజులకు విక్రముడు హాపీసు.

ఎందుకు ?

ఒకరు కాదు, ఏకంగా ముగ్గురొచ్చారు.

కూతుళ్ళ రూపంలో.

అంబ, అంబిక, అంబాలిక పుట్టారయ్యా..

పుట్టారు, పెద్దవాళ్ళయ్యారు.

అందరూ కూతుళ్ళే కావటంతో వాళ్ళనే కొడుకులనుకుని కత్తి యుద్ధాలు, అస్త్ర విద్యలు అన్నీ దగ్గరుండి నేర్పించాడు విక్రముడు.

అందులో అంబ చలాకీదవ్వటం వల్ల, చటుక్కున మెలకువలన్నీ పట్టుకుని ఆరితేరిపోయింది.

సరే ఆటలు, పాటలు పక్కనబెడితే – కూతుళ్ళు గెడకర్రల్లా పెరిగిపోవటంతో పెళ్ళీడుకొచ్చారు అన్న సంగతి తెలిసిపోయింది.

పెళ్ళంటే మటాలా?

అందులోనూ యువరాణులు.

పైగా కాశీరాజు కూతుళ్ళు.

సరితూగేవాడు కావొద్దూ ?

సరితూగేవాడు రావొద్దూ ?

అలా వచ్చేవారకూ కొంతమంది ఎదురు చూస్తారు.

అలా కుదిరేవరకూ కొంతమంది ఎదురు చూడరు.

అలా ఎదురు చూడకూడదని డిసైడు అయిపోయినవారి లిష్టులో అంబ చేరింది.

అలా చేరటానికి ఒక కారణం వున్నది.

ఆ కారణానికి కారణం యవ్వనం.

అవును యవ్వనమే.

యవ్వనమంటే కలకలం, కిలకిలం.

కిలకిలలతో కళకళలాడుతున్న కాలంలో ఒకరోజు అంబ ఒక ఉద్యానవనానికి వెళ్ళింది.

ఉద్యానవనానికి యువరాణులు మామూలుగా వెళతారూ ?

బోల్డంతమంది చెలికత్తెలు వగైర వగైరా.

అలా అక్కడికెళ్లినప్పుడు సౌంభపురానికి రాజైన సాళ్వుణ్ణి అక్కడ చూసింది.

సౌంభపురం అంటే ఇప్పటి పంజాబులో ఒక ప్రాంతం.

కాశీకి కాస్త దగ్గరే.

సాళ్వుడు కూడా యవ్వనంలో వున్నాడు.

నాన్న ఆజ్ఞప్రకారం దేశాటనలో పడ్డాడు.

రాజు కాబోయేముందు అలా దేశాటన చేసిరావటం ఒక ఆచారం.

అలా అలా తిరుగుతూ కాశిపురానికి వచ్చాడు.

యువరాజు, అందునా అందగాడు.

విక్రమసింహుడు సాళ్వుడొచ్చిన విషయం తెలుసుకుని ఆతిథ్యం స్వీకరించబ్బాయ్ అని ఒక భవంతిలో కూర్చొబెట్టాడు.

రోజంతా భవంతిలో కూర్చుని విసుగొచ్చి సాళ్వుడు అమ్మాయిగారొచ్చేసమయానికే వ్యాహ్యాళికి వెళ్ళాడు.

అటో ద్వారం.

ఇటో ద్వారం.

అటు పక్క అంబ.

ఇటు పక్క సాళ్వుడు.

అటుపక్కన ఉన్న అంబ ఎలా ఉందిట?

ఎలా ఉంది ఆ సౌందర్యవతి ?

ధగధగ మెరిసిపోయే తెల్లని చీర

చేతులకు గాజులు

కాలికి అందెలు

జబ్బలకు కడియాలు

మధ్య పాపట

దమ్మిడీ అంత బొట్టు

మెళ్ళో ఆభరణాలు

కోరకొప్పు

కొప్పుగొలుసులు

ఈ కొప్పుల గురించి కుమార సంభవంలో “పలుచని పూతలున్ మెరుగుబండ్లును నున్నని కోరకొప్పులున్ బొలకువ తీపు జెన్ను బొరపొచ్చెము బొచ్చము కాగ మాయలన్ లలనల దేర్పజూచు” అంటూ ఒక మాంచి మాట ఉన్నది

మరి ఇటుపక్కన ఉన్న సాళ్వుడు ఎలా ఉన్నాడట?

ప్రచండంగా ఉన్నాడు

విక్రమం ఉట్టిపడుతున్నాడు

మార్తాండమండల తేజంతో వెలిగిపోతున్నాడు

తీరైన తల

ఆ తల మీద పాగా

ఆ పాగలో నెమలీకలు

కోటేరులాటి ముక్కు

కోర మీసాలు

చిరు గడ్డం

అసలు అబ్బబ్బా లాగ ఉన్నాడు

ఆడపిల్ల చూసిందంటే గుండెలో తంత్రులు తెగిపోవాల్సిందే

అంత అందగాడు

అందాల సంగతి పక్కనబెట్టేస్తే వీళ్ళు నిలుచుకొని ఉన్నచోట పూలు, సువాసనలు, మకరందాలు, తేనెటీగలు.

ఎలా ఉంది అక్కడ?

అదీ కాక అప్పుడు వసంత కాలం

వసంత కాలం గురించి కుప్పలు తెప్పలుగా వర్ణనలు

***********************

ఎందును బుష్పసౌరభము * లెందు నమందమదాలిఝంకృతం

బెందును సాంద్రపల్లవము * లెందును గోకిలకంఠకూజితం

బెందును విస్ఫురత్ఫలము * లెందును గోమలకీరభాషితం

బందము లయ్యె మందమరు * దంచితచారువనాంతరంబులన్

***********************

అని నృసింహపురాణంలో ఒక వర్ణన మచ్చుకి

సరే, అదలా పక్కన పెడితే – కేతకీ పుష్పాలు వికసించిపోయి వున్నాయి

నువ్వేనేమిటే వికసించేదని వకుళ, చంపక, నాగ, పున్నాగ, సన్నజాజి అన్నీ పోటీలు పడ్డాయి

ఇక కలువలు, పద్మాలు వాటితో పాటు చకోరాలు, హంసలు, చిలుకలు సంగతి చెప్పనే అక్కరలా

ఆ మధ్యలోనే యవ్వనం.

ఇహ సీను ఊహించుకోవచ్చును.

వీటన్నిటికి తోడు ఆ సమయంలోనే మన్మథుడు కూడా లోకసంచారం చేస్తూ అక్కడికొచ్చాడు.

అంతే, వీళ్ళిద్దరిని చూసి, వాళ్ల అందాలు చూసి ఆయనకు మతిపోయింది.

ఆయనకు మతి పోయిందంటే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు.

అహా అని పొగుడుదామని చేతులెత్తాడు.

ఆయన చేతులు ఎంత పొడుగో ఆయన బాణాల సంచీ అంత పొడుగు.

అందులో బాణాలు ఇంకా పొడుగు.

పైగా వాటికి పూలు గట్రా, ఆ హంగామా అంతా ఉంటుందాయె.

ఈయన చేతులెత్తినప్పుడు ఆ పూల వొత్తిడి మెత్తగా తగిలింది.

ఆడవారి చిటికెనవేలి కొసలు, పూలు ఒకటే.

ఆయనకు రతీదేవి వేళ్ళు గుర్తుకొచ్చినై.

దక్షుడి కూతురైన రతి, అందరికీ మనఃవికారాలు కలిగించే తన మనస్సునే అల్లకల్లోలం చేసిన సంగతి గుర్తుకువచ్చింది.

రతీదేవిని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆవిడ చిటికెనవేలు ఈయన చిటికెనవేలిని పట్టుకుని నడిచిన సంగతి గ్యాపకం వచ్చింది.

చిటికెనవేలు తగలటమేమిటి, రసవాహిని ఒళ్ళంతా ఝల్లుమనిపించటమేమిటి – అలా అన్నీ గుర్తుకొచ్చినాయి.

వీళ్ళ సంగతి కూడా అట్లా చెయ్యాలన్న చిలిపి కోరిక అలా వచ్చి చేరింది మన్మథుడి మనస్సులోకి.

అంతే, ఆ పొడుగు చేతుల్తో ఇంత పొడుగు పూల బాణాలు, పంచబాణాలు ఒకసారి సవరించుకొన్నాడు

ఆ బాణాలు ఏవిటయ్యా అని ఎవరైనా అడిగితే “అరవిందాశోకచూత: నీలోత్పలే నవమల్లికా” అని ఒక లైను వదలండి

తామర, అశోక, మావిడి, మల్లె, కలువ పువ్వుల బాణాలు అవి

ఒక్కొక్కదానికి ఒక్కో మోహం, ఒక్కో సువాసన, ఒక్కొక్క వశీకరణం

మరి ఐదూ కలిస్తే ఇంకేమన్నా ఉన్నదీ ?

సరేనని ఎడమ భుజమ్మీదున్న విల్లందుకున్నాడు.

ఆ విల్లు చెరుకు గడలతో చేసి ఇంత పొడుగ్గా ఉన్నది.

చెరుకు గడల కణుపుల మీద చెయ్యి పెట్టాడు.

ఓ సారి నారిని టక్ టక్ మని సవరించాడు.

బాగా చప్పుడు చేసిందది.

అంటే బిగువుగా సిద్ధంగా ఉన్నానని ధరించినవాడికి చెప్పటమన్నమాట.

అయితే ఆయన దేవుడు కావటం వల్ల, ఆ విల్లు కూడా దేవుడి చేతిలో ఇమడటం వల్ల, అది చేసిన చప్పుడు తేనెటీగల ఝంకారంలా వినపడింది ఆ ఉద్యానవనంలో.

సవుండు ఆగింది. నిశ్శబ్దం రాజ్యమేలింది.

అప్పుడు చూశాడు.

ఎవరి వంక?

అంబ వంక చూశాడు, సాళ్వుడి వంక చూశాడు.

మధ్యలో ఉన్న ఖాళీ స్థలం వంక చూశాడు.

పరుగు పరుగున ఆ మధ్యలోకొచ్చి నిలబడి అటు ఐదు బాణాలు, ఇటు ఐదు బాణాలు వదిలేసాడు

ఫాస్టుగా, తేరుకునేందుకు అవకాశమే ఇవ్వకుండా.

ఆయన బాణాలెయ్యటం, ఈ ఇద్దరికీ గుచ్చుకోవటం ఒక వరసలో ఇరికింది.

వెయ్యగానే అటు అంబకు, ఇటు సాళ్వుడికి మనసు ఝల్లుమనటం. గుండె ఘల్లుమనటం జరిగిపోయినై.

ఝల్లు, ఘల్లుల మధ్య ఒక ఆవేశం కలిగింది.

అదే మోహావేశం.

అది పట్టుకుంటే ఎవరు నిలబడతారు ?

మోహం అనేది ఒక వలయాగ్ని.

కొంతమందికి విషవలయాగ్ని.

యవ్వనమనే నెయ్యి ఆ అగ్గిలో పోస్తే పెచ్చరిల్లటమే కానీ, తగ్గేదుండదు.

బాలానాం న భయం న మోహం అన్నారు కానీ, యవ్వనానాం న భయం న మోహం అనలేదందుకనే!

అయితే సత్ పురుష, సత్ స్త్రీల మోహం ఇంకో మెట్టు ఎక్కుతుంది.

ఆ మోహానికి పైనున్న మెట్టు పేరు ప్రేమ.

వీరిద్దరూ సత్ కోవకు చెందినవారు కాబట్టి మోహం వదిలి ప్రేమ మెట్టు ఎక్కేశారు.

సాళ్వుడు, కళ్ళు మనసు గిరగిరా తిరుగుతున్నా, స్టెబిలైజు అయిపోతూ, నేన్నిన్ను పెళ్ళి చేసుకుంటా అన్నాడు.

ప్రేమ దోమ ఎంత ఉన్నా అమ్మాయీమణి అమ్మాయీమణేగా! ఆవిడ భయం ఆవిడది. పైగా నాన్న మాట జవదాటనిది.

అందువల్ల ఆవిడన్నదీ – సామీ, ఇలా అడిగితే గెష్టు లేదు, లిష్టు లేదు అని మా అయ్య నిన్ను తుక్కు చేస్తాడు. నువ్వెళ్ళి మీ పెద్దాళ్ళనేసేసుకుని రా! – అని

సాళ్వుడు, సరే ఇదేదో బాగుంది, నేనెళ్ళొస్తా – అందాకా ఇక్కడే ఉద్యానవనంలో తిరుగుతూ ఉండమాక, చల్లగా ఉంది జలుబు చేస్తుంది అంత:పురానికి వెళ్ళు అని ఒక జోకు జోకి ఇంటికి పరుగులెత్తాడు.

ఇంతలో కాశీరాజుగారు ఒక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసారు.

ఆ సమావేశంలో రాజుగారన్నారు – బాబూ! లోకధర్మం ప్రకారం పెళ్ళి చెయ్యాలి, రాజ్యధర్మం ప్రకారం స్వయంవరం ఏర్పాటు చెయ్యాలి. కానీ…”

కానీ అని ఆగిపోయాడు.

ఆలోచనలో పడ్డాడు.

ఇక మాట పొడిగించలా.

ఎందుకా ?

ఆయన ఒక సాత్త్విక భావానికి గురైనాడు.

సాత్త్విక భావమంటే సత్వానికి సంబంధించిన భావమనే అనుకోకూడదు.

సాత్త్విక స్వభావాలు ఎనిమిదని లోకోత్తరం.

సాత్త్వికం అంటే ఒక భావం.

భావాలు మనుషులకు కాక ఎవరికుంటయ్యి ?

ఆ భావం ఏదైనా కావొచ్చు.

అయితే ఆ ఏదైనా ఈ ఎనిమిదిట్లో ఇరకాల్సిందేనని లోకధర్మం, శాస్త్రసమ్మతం.

ఆ ఎనిమిదినిట్లా నిర్వచించారు.

“స్తంభః స్వేదః రోమాంచః స్వరభంగః వేపథుః వైవర్ణ్యం అశ్రుః ప్రళయమ్ ఇతి అష్టౌ సాత్త్వికా స్మృతాః ”

స్తంభః అంటే నిశ్చేష్టత

స్వేదః అంటే చెమటలు పట్టటం

రోమాంచః అంటే గగుర్పాటు కలగటం

స్వర భంగః అంటే గొంతు గద్గదం కావడం

వేపథుః అంటే ఒంట్లో వణుకు పుట్టటం

వైవర్ణ్యం అంటే కళ తప్పిపోవటం

అశ్రుః అంటే కళ్ళలో నీళ్ళురావటం

ప్రళయమ్ అంటే పూర్తిగా వివశుడైపోవటం

ఇవీ ఎనిమిది సాత్త్విక భావాలు

ఈ ఎనిమిదిట్లో స్వరభంగః భావానికి గురైనాడు.

మాట పెగలట్లా.

పైగా రాజుగారు.

మంది ఉన్న సభ.

మంది ఉన్న సమావేశం.

మంత్రులున్న సమావేశం.

మంత్రులకేం తోచలా.

ఎందుకు ఏడుస్తున్నాడన్నది ముందు అర్థం కాలా.

ఇంతలో తెలివికల ఒక మంత్రి లేచి – అయ్యా, మీ బాధ నాకర్థమయ్యింది, మీ ఏడుపు నాకర్థమయ్యింది అన్నాడు.

మిగిలిన మంత్రులంతా ఈ తెలివిడి మంత్రి వంక చూసారు.

అబ్బో మాకు తెలీంది వీడికి తెలిసింది ఏమిటానని!

ఆయన స్పీచు మొదలుపెట్టాడు.

“అయ్యా ఆడపిల్లలున్న తండ్రికి ఇదే చిక్కు, పెళ్ళి చేసి పంపించాలంటే గుండె అంతా మెలిపెట్టేసినట్టు ఉంటుంది. మాటలు రావు. మనసు కదలదు. అయినా ఒక తండ్రిగా మీరు మీ బాధ్యత నెరవేర్చాలి. పిల్లలను గుదిబండగా చేసుకోకుండా ఒక మొగుడుబండని చూసి వాడికిచ్చేసి మన బాధ వాడికి ట్రాన్స్ఫరు చేసేస్తే అయిపోతుంది, కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా స్వయంవరం ప్రకటించండి. పైగా ముగ్గురూ ఈడుకొచ్చారు కాబట్టి, ముగ్గురికీ ఒకటే సారి ప్రకటించెయ్యండి పనైపోతుంది” అని స్పీచు ముగించి కూర్చున్నాడు.

అప్పుడు మిగిలిన వారందరికీ అర్థమయ్యింది, రాజుగారి బాధ.

సందు దొరికింది కదాని ప్రతివాడు సలహాలివ్వటం మొదలుపెట్టాడు.

అవతలివాడు బాధ పడుతున్నాడంటే ఆనందించటం లోకస్వభావం.

ఆ స్వభావం ఆ కాలంలో తక్కువే అయినా ఉచిత సలహాలకు మటుకు తక్కువ లేదు.

అంతా తలో సలహా పడేసి కూర్చున్నారు.

అప్పుడు రాజు గారిని రెండో సాత్త్విక స్వభావం ఆక్రమించుకుంది.

అశ్రు: అని ఆ స్వభావం.

అది వచ్చినప్పుడు ఆపుకోవటం పరమాత్మకైనా కష్టమే.

రాజుగారి స్థితిని గమనిస్తున్న ముఖ్యమంత్రి అందరిని బయటికి తరిమేశి – సార్, మీరట్లా మంది ముందు ఏడిస్తే కష్టం సార్ అన్నాడు

మరి ఏం చెయ్యమంటావయ్యా? ఏడుపొచ్చినప్పుడు ఏడవక కుక్కుకోమంటావా అని కసిరాడు రాజుగారు

సంభాళించుకోవాలి సార్, మీరు రాజుగారు కాబట్టి చెప్పటం, మామూలు వాళ్ళైతే గంగాళాలు కార్చినా నే పట్టించుకోను అన్నాడు ఆ మంత్రి

దాంతో తెలివి తెచ్చుకుని, సరే ఆలోచన చేసి స్వయంవరం ఎప్పుడు ప్రకటిద్దామో చెప్పండి అని అంత:పురంలోకి వెళ్లిపోయాడాయన

దీనికి ఆలోచన ఎందుకండీ, మీరు ఊ అనండి స్వయంవరం ఏర్పాటు చేసే బాధ్యత అంతా మాది అని, ఆయనతో పాటు అందాకా వెళ్ళి ఆయనతో ఊ అనిపించుకుని దండోరాలు, ఆహ్వానపత్రాలు వేసేసి ప్రపంచం నలుమూలలకి పంపించేసాడు ఆ ముఖ్యమంత్రి

స్వయంవరం వార్త అమ్మాయీమణికి చేరింది

సంతోషకరమైన వార్త వింటే ఒళ్ళు పులకించదూ

అలా పులకింతల్లో ఈ ప్రపంచమే మర్చిపోతుంటే చెల్లెళ్ళిద్దరూ వచ్చారు

అంబాలిక అన్నదీ, ఈ స్వయంవరం ఒక్కొక్కళ్ళకు ఒక్కో సంవత్సరం పెడితే బాగుండునేమో అని

అయ్యో, ఈ స్వయంవరంవల్ల మనం ముగ్గురూ మూడు రాజ్యాలకు వెళ్ళిపోతే ఎట్లానే అక్కా అని అంబిక అన్నది

అంబాలిక పోనీ ముగ్గురం కలిసి ఒకణ్ణే పెళ్ళి చేసుకుంటే పోలానని వేళాకోలమాడింది

ఊరుకో పైన తథాస్తు దేవతలు ఉంటారు, నిజమయ్యేను అని కోపగించింది అంబ

ఆవిడ బాధ ఆవిడది, ఎక్కడ సాళ్వుణ్ణి పంచుకోవాల్సి వస్తుందోనని

ఎందుకే అంత కోపం, స్వయంవరానికొచ్చే యువరాజుల్ని పెళ్ళి చేసుకోవటం నీకిష్టం లేనట్టున్నది అన్నది అంబాలిక

రాజు లేదు, పేద లేదు, కులం లేదు, మతం లేదు, ఎవరైనా సరే నేను మెచ్చినవాణ్ణే పెళ్ళాట్టం అని గట్టిగా తెగేసిందీవిడ

మరి స్వయంవరం అంటే అంతేగా అన్నది అంబిక

స్వయంవరంలో వచ్చిన పదిమందిలో ఒకరిని మెచ్చటం కూడా ఒక మెచ్చటమేనని వెళ్ళిపోయింది అంబ

రాత్రయ్యింది, రేయి గడిచిందంటే పొద్దున్నే స్వయంవరం

యువరాజులందరూ వచ్చేసారు

పట్టణం అంతా కోలాహలంగా ఉన్నది

ఆ కోలాహలమంతా చూట్టానికి కళ్ళు చాలట్లేదు

పట్టణమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది

ప్రాకారాలన్నీ మేరు పర్వతమంత ఎత్తున బోర విరుచుకొని ఉన్నవి

ఎందుకట ?

బంగారంతో తాపడం చేసేశారని

స్థంభాలన్నీ నిటారుగా తలేత్తుకొని నిలబడినవి

ఎందుకట?

స్ఫటికాలతో చుట్టివేసి అలంకరించేశారని

కుడ్యాలన్నీ మీసాలు మెలివేస్తున్నవి

ఎందుకుట?

మరకతమాణిక్యాలతో సింగారించేసారని

లతలన్నీ, చెట్లు తాండవమాడుతున్నవి

ఎందుకుట?

గాలిదేవుడు ఒక పుప్పొడిని ఇంకో పుప్పొడితో కలిపేసి హోలీ రంగులు చల్లేశాడని

ఇలా ఒక రకమైన కోలాహలం కాదు, వెయ్యి పండగల కోలాహం అంతా అక్కడ కుప్పపోసినట్టు ఉన్నది

ఆ కోలాహలంలో ఒక ఆజానుబాహుడు ఆరు అశ్వాలు పూంచిన రథమ్మీద నెమ్మదిగా ఆ పట్టణంలోకి అడుగుపెట్టాడు

వీర స్వభావమే ఆయన కాళ్ళ ముందు పడిగాపులు కాస్తున్నంత ఇదిగా ఉన్నాడు

అంత వీరంతో ఉన్న వీరుడెవరయ్యా?

ఇంకెవరు? గాంగేయుడు

సాక్షాత్ ఆ గంగమ్మ పుత్రుడు

పేరు దేవవ్రతుడే అయినా గాంగేయా అని పిలిస్తేనే ఇష్టమట ఆయనకు

అమ్మంటే అంత ప్రేమ

అమ్మ పేరంటే అంత ప్రేమ

కొంతమంది వెంటనే గుర్తుపట్టారు

కొంతమందికి ఆయనెవరో తెలియదు

కొంతమంది ఆ అందగాణ్ణి విభ్రమంగా చూస్తూ నిలబడిపోయినారు

కొంతమంది చెవులు కొరుక్కోవటం మొదలు పెట్టారు

గాంగేయుడు వచ్చాడేమి?

ఆయన పెళ్ళి చేసుకోనని కదా శపథం పట్టాడు!

శపథం వదిలేశాడా?

ఇలా నానారకాలుగా మాటాడుకుంటున్నారు

దేవవ్రతుడు వచ్చాడన్న వార్త అంత:పురానికి చేరిపోయింది

అంబాలిక అంబిక కూడా చెవులు కొరుక్కున్నారు

అంబకు ఆ చెవుల కొరుకుడు శబ్దం నచ్చలేదు

వచ్చి అడిగింది సంగతేమిటని

వారిద్దరూ చెప్పినారు వింతగా ఉన్నదే, పెళ్ళి చేసుకోనని శపథం పట్టిన శంతనమహారాజు కొడుకు దేవవ్రతుడు కూడా స్వయంవరానికి వచ్చాడని

దేవతల వ్రతం కలవారంతా దేవవ్రతులే కానీ, పెళ్ళి చేసుకోకపోతే ఎందుకు వచ్చాడట అని దీర్ఘాలు తీసింది అంబ

నీ దీర్ఘాల వల్ల అక్కడ ఏమీ కాదు కానీ, రేపు స్వయంవరంలో ఏమవుతుందో ఏమిటోననుకుంటూ వెళ్ళిపోయినారు అంబిక అంబాలిక

అంబ దీర్ఘాలోచనలో పడిపోయినది

సాళ్వుడే మది నిండా

ఆ అందగాడి తలపులే

ఆ అందగాడి పాణిగ్రహణమే

రేపటి స్వయంవరంలో ఆ అందగాడి మెడలో తన చేతినుంచి పడబోయే వరమాల ఊసులే

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే మాగన్నుగా మగత నిద్రలోకి జారిపోయింది

ఇంతలో ఒక ధవళవస్త్రధారి, ఒక దేవదూత వచ్చాడు

అంబా, అంబా అని పిలుస్తూ వచ్చేశాడు

ఎవరది అంటూ దిగ్గున లేచింది అంబ

నీవు చేయవలసిన కార్యం జరిగించే సమయం వచ్చేసింది అంటూ ఆ దేవదూత వచనం మొదలుపెట్టినాడు

అంబ తికమక పడిపోయింది

నేను చేయవలసిన కార్యమేమిటి, అసలు నువ్వెవరు అన్నది

నేనొక దేవదూతను, నీవు చేయవలసిన కార్యం ఆ మహానుభావుడు దేవవ్రతుణ్ణి కడతేర్చడమే

నేనా, ఆ గాంగేయుణ్ణా హతమార్చేది అంటూ మ్రాన్పడిపోయినది అంబ

దేవదూత నెమ్మదిగా దగ్గరకు వచ్చి, అంబా నీవు దేవాంశ సంభూతురాలవు, అతణ్ణి నిర్జించటానికే పుట్టించబడ్డావు అంటున్నాడు

అయ్యో నాకా సంకల్పం ఈషణ్మాత్రమైనా లేదేనని అన్నది తేరుకున్న అంబ

నీకు తెలియని సంకల్పాన్ని చిగురించి, దానిని దృఢ సంకల్పం చేయటానికే దేవతలు నన్ను పంపించారు అన్నాడీయన

దేవతలకు ఆయన మీద అంత కోపమేమి అని ప్రశ్న వేసింది అంబ

దేవతలూ తప్పులు చేస్తారు. సాధారణంగా ఆ తప్పులు దేవతలకార్య నిమిత్తం ఆ పరమాత్ముడు చేయిస్తూ ఉంటాడు. అలాటి తప్పు ఒకటి చేసి శాపవశాన ఈ భూమ్మీదకు వచ్చినవాడు ఆ శాంతనవుడు, ఆ గాంగేయుడు. అతని శాపం నీవల్ల తీరవలసిందే. ఇది దైవ నిర్ణయం అని చెప్పాడు ఆ దేవదూత

మరి అతను చేయవల్సిన కార్యం ముగిసిపోయిందా అని మారుప్రశ్న వేసింది అంబ

లేదు, కొద్దికాలంలో పూర్తిచేస్తాడు, అప్పుడే నీ అవసరం, ఆ అవసరానికి తగ్గ సంకల్పం, దృఢసంకల్పం నీకు కలిగించడానికే నేను వచ్చింది, తయారుగా ఉండు అంటూ మాయమైపోయినాడు దేవదూత

దిగ్గున కల నుంచి లేచింది అంబ

ఒక జాము గడిచింది

రెండో జాముకి వచ్చింది ఒక ఆలోచన

లేచి వడివడిగా బయటకు నడిచింది

ఎక్కడికి ?

విడిది ప్రదేశానికి

రాకుమారుల విడిది ప్రదేశానికి

ఎట్లా ఉన్నది అక్కడ?

కోలాహలం అప్పుడే సద్దుమణిగినట్లు కనపడుతున్నది

కొబ్బరి ఆకుల పందిళ్ళు తలలు నిటారుగా నిలబెట్టి నిద్రపోతున్నాయి

కాశీరాజు గారి తరఫున వచ్చిన రాకుమారులందరికీ “ఎదురు కోలు” కార్యక్రమం పూర్తైపోయింది

మేళతాళాలు భూనభోంతరాలుగా వాయించినవారు అలసిపోయి నిద్రపోతున్నారు

అంతమంది రాకుమారుల కాళ్ళు కడిగటంతో ఒక చిన్న సరస్సు ఉద్భవించిందా అన్నట్లు ఉన్నది అటు పక్కన

అమ్మాయీమణులు నన్నే వరించటం ఖాయమని కొంతమంది ఆత్రంగా పారాణి కూడా రాసుకుని రాగా, కాళ్ళు కడుగుడు కార్యక్రమంలో ఆ పారాణి అంతా పోయి, ఆ చిన్న మడుగు ఎర్రగా రక్తపుటేరులా ఉన్నది

దివిటీలు ధగధగా మెరిసిపోతున్నాయి

చటుక్కున మేలిముసుగులాటి వస్త్రమొకటి తలమీదకు కప్పుకొంది, ఎవరికీ తెలియకూడదని

నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒక శిబిరంలోకి ప్రవేశించింది

అక్కడ………

 

(ఇంకా ఉంది….)

ఇంతకీ ఎవరు గెలిచినట్లు ?

 

 

 

 

ఖాన్
అబ్బూఖాన్
మేకల అబ్బూఖాన్
ఆ ఊళ్ళో అబ్బూఖాన్ అంటే తెలియందెవరికి ?
ఎన్నో మేకలుండేవి అబ్బూఖాన్ దగ్గర
కావలసినవాళ్ళు అబ్బూఖాన్ దగ్గరికొచ్చి కొనుక్కుపోయేవాళ్ళు
వేట కోసం, జాతర కోసం, నోట్లో తగలాల్సిన ముక్క కోసం
కొనుక్కోటానికి వచ్చే రకరకాల జనాలు, వాళ్ళ మాటలు
చాలా కాలక్షేపంగా ఉండేది అబ్బూఖానుకు
పనిలో పనిగా పైకం కూడా
ఇహనేం ? ఇల్లు కట్టాడు, దాన్ని బంగళా చేశాడు
ఇంకా ఎన్నో ఎన్నో చేశాడు ఆ పైకంతో
 

అయితే అన్ని రోజులూ ఒకలా ఉండవుగా
ఎక్కడినుంచో ఒక తోడేలు వచ్చింది
అబ్బూఖాన్ ఇంటి పక్కనే ఉన్న కొండమీద ఉన్న కొండగుహలో కాపరం పెట్టిందయ్యోయ్
అబ్బూఖాన్ మేకలు, రోజూ ఈయన పెట్టేవి చాలక కొండగాలి తిరిగింది అని పాటలు పాడుకుంటూ కొండ మీదకెళ్ళిపోదామని చూస్తూ ఉండేవి
కట్టిన తాళ్ళు తెంచుకుని కొన్ని పోయేవి కూడాను
ఉన్నదాంతో సుఖంగా ఉండాలని లేకపోతే తాళ్ళు ఒక లెక్కా డొక్కా?
అంతే మరి , అలా పోయిన వాటిని చూసి మిగతావాటికి ఉబలాటం
ఒకటి అరా రెండూ మూడు నాలుగు ఇలాగలాగ కొన్ని రోజులకి మేకలన్నీ ఖాళీ
అబ్బూఖాను కానీ, ఆ ఊళ్ళో జనాలు కానీ ఆ తోడేలుని ఏమీ చెయ్యలేకపోయారు
తోడేలు రాజ్యంలో తోడేలు చెప్పినట్టే అన్నీ
సరే చివరిగా మిగిలున్న మేకలకు చెప్పి చూసాడు అబ్బూఖాన్
అటువైపు వెళ్ళబాకండి పోతారు అని
అయినా వింటేగా మేకల మంద
సందు చూసుకోవటం, స్వాతంత్రం లభించిందని పరుగెత్తుకుంటూ కొండమీదకు వెళ్ళిపోవటం
సందు మేకలకు, పసందు తోడేలుకి
అలా జీవితార్పణం చేసుకునేవి
కేవలం పచ్చని పచ్చగడ్డి కోసం, దూరపు కొండల నునుపు కోసం, బంధాల వంటి తాళ్ళ నుంచి స్వాతంత్రం కోసం
అబ్బూఖానుకు అర్థమయ్యేది కాదు
బాధపడుతూ ఉండేవాడు
చివరకు ఒకే ఒక్క మేకపిల్ల మిగిలింది
ఇదంతా చూసి అబ్బూఖానుకు ఓ రోజు చిరాకొచ్చింది
 

ఇక మేకలూ లేవు ఏమీ లేవు అని కూర్చున్నాడు
ఉన్న ఒక్క మేక పిల్లను అమ్మేద్దామనుకొన్నాడు
కానీ అలవాటైపోయిన ప్రాణం వల్ల చేతులు రాలా
ఏం చేస్తాడు ?
ఆలోచించి ఆలోచింది మొత్తానికి ఒక ఉపాయం చేశాడు
ఈ మేకపిల్ల కొండమీదకు పారిపోకుండా ఒక దొడ్డి ఏర్పాటు చేశాడు
దొడ్డి నిండా గడ్డి ఏర్పాటు చేశాడు
దొడ్డి నిండా తొట్లు పెట్టించాడు
దొడ్డి నిండా చెట్లు నాటించాడు
ఇక ఎటు నుంచి చూసినా కొండ కనపడితేగా
అన్నీ అయ్యాక ఒక బలమైన గుంజ కట్టాడు
ఆ గుంజకు ఇంకా బలమైన తాడు కట్టాడు
ఈ చివరన మేకపిల్లను తగిలించాడు
మేకపిల్ల చాలా అందంగా ఉండటంతో దానికో పేరూ పెట్టాడు
ఏమని ?
 

చాందినీ అని
చాందినీ అంటే ఏమిటి ?
చాందినీ అంటే మేలుకట్టు
చాందినీ అంటే చంద్రోదయం
అంతందంగా ఉన్నదీ మేకపిల్ల
ఒకసారి పేరు పెట్టామంటే అనుబంధం మరింత బలపడినట్టే
అది వస్తువు కావొచ్చు, జంతువు కావొచ్చు
ఇక ప్రాణాలన్నీ దానితో పెనవేసుకుపోయినట్టే
ప్రాణాలు పెనవేసి పెంచుతున్న మేకపిల్ల పెద్దదవుతున్నది
 

ఈయన తాడు పొడవు పెంచుతూనే ఉన్నాడు
కాసంత దూరపు గడ్డి అందుబాటుకు రావాలని
నోటికి పట్టాలని
పొట్టకు పట్టాలని
చిన్ని పొట్టకు శ్రీరామరక్ష అవ్వాలని
అయితే స్వాతంత్ర తృష్ణ ఉన్నది చూసారూ ?
దాని ముందు బంధాలు ఎంత?
ఆ అగ్గికి ఊతంగా జన్యువుల పాత్ర ఒకటి
పిల్ల వాళ్ళమ్మ కూడా స్వాతంత్రాభిలాషతో కొండ మీదకెక్కేసింది ఒకప్పుడు
పిల్ల వాళ్ల నాయన కూడా అదే అభిలాషతో కొండకు ఆహారమైపోయినాడు
అదే! కొండ మీద తోడేలుకు ఆహారమైపోయినాడు
ఆ జీవులు ఉత్పత్తి చేసిన ఈ చాందినీకి కూడా లోపల ఎక్కడో ఆ జన్యువు సలపరం ఉన్నది
అదే జీవోత్పత్తి క్రమం
అదే జీవన్యాయం
అదే ప్రకృతిన్యాయం
ఆ న్యాయం హృదయాల్లో ప్రతిష్టితమైపోతుంది
అది తప్పించుకోవటం ఎవరి వల్లా కాదు కదా
పెద్దదవుతున్న కొద్దీ ఆ తృష్ణా పెద్దదైపోయింది
తాడు తెంచుకోవాలని చూసింది
ఉహూ కుదరలా
ఇక ఇలాక్కాదని సత్యాగ్రహం మొదలుపెట్టింది
తిండి తినటం మానేసింది
అబ్బూఖానుకు అర్థం కాలా
అరే ఇదేమిటి ఇలా చిక్కిపోతున్నదని డాక్తర్లను పిలిపించాడు
వాళ్ళన్నారూ – నాయనా అబ్బూ, దీనికి మనోవ్యాధి పట్టుకున్నది, దానికి మందు లేదన్నారు
అది విని దిగాలుగా చాందినీ పక్కన కూర్చున్నాడు
నీక్కావలసినవన్నీ చేస్తున్నాం ఇంకా ఏమిటి నీ బాధ అన్నాడు
ఇదే సందు అని, కొండ మీదకు వెళ్ళాలి నేను అంటూ మనసులో మాట బయటపెట్టింది చాందిని
అవాక్కయ్యాడు అబ్బూఖాను
అరెరే, ఆ ఆలోచన ఎట్లా వచ్చిందే నీకు,

అక్కడ తోడేలు ఉన్నది అక్కడకు వెళితే అనవసరంగా చచ్చూరుకుంటావు అని చెప్పచూశాడు
వినలా, అసలు విననే వినలా
పైగా, సమర్థనగా –
అబ్బూజాన్, నువ్వెన్నా చెప్పు ఇక్కడ అంతా బందిఖానాగా ఉన్నది నాకు,
ఇక్కడ ఉండలేను, అయినా చూశావా దేవుడు నాకు రెండు కొమ్ములిచ్చాడు,
వాటితో ఆ తోడేలు పని కట్టేస్తానని బీరాలు పలికింది
ఇక ఇలా లాభం లేదని గుంజ నుంచి వేరు చేసి, గదిలో బంధించేశాడు
అయితే తెలివైన వాళ్ళు కూడా ఎక్కడో ఒకచోట తప్పు చేస్తారు
ఆ తప్పు అబ్బూఖాను, ఆ గదికి ఉన్న కిటికీ మూయకపోవటం
అంతే! పొద్దున్న వచ్చి చూసేసరికి మేకపిల్ల మాయం
ఆ తెరిచి ఉన్న కిటికీ లోనుంచి పారిపోయింది చాందినీ
అబ్బూఖాను లబోదిబో
చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభమేమి?
ఇదీ అంతే!
 

ఆ కిటికీ వంక చూశాడు అబ్బూఖాను
నోరంతా తెరుచుకొని పగలబడి నవ్వుతున్నట్లనిపించింది
దైన్యంగా చూస్తూ నిలబడిపోయినాడు
అక్కడ మేకపిల్ల కొండ ఎక్కేసింది
చెంగు చెంగున దూకుకుంటూ
అక్కడ ఉన్న చెట్లూ చేమలూ, పచ్చగడ్డీ, పూలమొక్కలు అన్నీ తన కోసమే అనుకున్నది
గంతులు వేస్తూనే ఉన్నది
వేస్తూ వేస్తూ కొండ చివరకు వచ్చేసింది
అక్కడినుంచి ప్రపంచం మొత్తం కనపడుతోంది
కింద ఉన్న అబ్బూఖాన్ ఇంటివంక చూసి నవ్వుకుంది
ఇల్లు, దొడ్డి అంతా చిన్నగా కనపడ్డవి
 

అంత చిన్న ఇంట్లోనేనా నేనున్నది అనుకొన్నది
అంత చిన్న దొడ్డిలోనేనా నన్ను బంధించింది అనుకొన్నది
ఇప్పుడు చూడు నేనెక్కడ ఉన్నానో అని మరల చిందు వేసింది
ఇప్పుడు నేనెంత ఎత్తున ఉన్నానో అని మరల మరల చిందు వేసింది
చిందులు వేస్తూనే ఉన్నది
ఇంతలో సాయంత్రం
సూరీడు సాబు గారు దిగిపోతున్నాడు
చాందినీ చిందులు వేస్తున్న ఆ కొండనానుకునే దిగిపోతున్నాడు
ఏకాంతం, స్వేచ్ఛ అంటూ ఆ మేకపిల్ల పడిన సంతోషం కూడా ఆ కొండ అంచునుంచి దిగిపోవటం మొదలయ్యింది
ఇంతలో ఎక్కడో దూరంగా కొంకికర్ర చప్పుడు
దానివెంటే అబ్బూఖాన్ పిలుపు
చాందినీ చాందినీ చాందినీ అంటూ గొంతు పగిలేలా అరుపు
సంతోషం ఆవిరైపోతున్న చాందినీకి ఆ పిలుపు ఆశ పుట్టించింది
అంతలోనే మళ్ళీ నిరాశ ఆవరించుకొన్నది
అయ్యో, మళ్ళీ బందిఖానాలోకి పోవాలానని సంకటంలో పడ్డది
ఇంతలో మరో అరుపు
అలాటిలాటి అరుపు కాదది
ప్రాణాలు తోడేసే అరుపు
తోడేలు అరుపు
 

కొండపైనుంచి, అటుపక్కగా
భయం, ఆశ్చర్యం కలిగినాయ్ మేకపిల్లకు
అప్పటిదాకా లేని ఆలోచనలు హఠాత్తుగా చుట్టుముట్టాయి
ఏమో అబ్బూఖాన్ చెప్పినట్టు తినేస్తుందేమో
ఏమో అబ్బూఖాన్ చెప్పినట్టు చంపేస్తుందేమో
అబ్బూఖానుతో వెళ్ళిపోదామా వద్దానని ఊగిసలాడిన సంకటం
కాస్త ఇప్పుడు తోడేలు రాకతో ప్రాణసంకటంగా మారిపోయింది
ఒకసారి చుట్టూ చూసింది,
అటూ ఇటూ అంతా పచ్చదనం, ఆహారం,
బంధాలు లేని స్వేచ్ఛ
అప్పుడనిపించింది ఆ మేకపిల్లకు, చాందినీకి –
అక్కడ బానిసగా బతకటం కంటె ఇక్కడ తోడేలుకు ఆహారమైపోవటమే మంచిదని
అబ్బూఖాను పిలుపు ఆగిపోయింది
దబ్ అని చప్పుడు పక్కనే
ఉలికిపడి ఇటు చూచింది
ఇంకేముంది ?
రానే వచ్చింది
ఎవరు ?
 

ఇంకెవరు తోడేలు
ఎర్రగా మెరిసిపోతున్న కళ్ళు, వికృతమైన పళ్ళు – ఆ తోడేలుకు ఆభరణాలు
అవన్నీ చూసి మొదట్లో భయపడినా, చచ్చిపోయేప్పుడు వెంటవచ్చే తెగువతో, ఆ తెగువ ఆసరాతో కొమ్ములు విదిల్చింది
తోడేలు ఒకడుగు వెనకడుగు వేసింది
అంతే! మేకపిల్లకు దమ్ము ధైర్యం వచ్చేసినాయ్
హోరాహోరీ మొదలయ్యింది
ఆ హోరాహోరీ మేకపిల్లకే, మేకపిల్ల మనసుకే
తోడేలుకు అది ఒక ఆట
మేకలు ఏమీ చెయ్యలేవని తోడేలుకు తెలుసు
అయినా ఆడుకుంటోంది మేకపిల్లతో
మేకపిల్ల మధ్య మధ్యలో ఆకాశం వంక చూస్తోంది
ఆ మిణుకు మిణుకు నక్షత్రాల వంక చూస్తోంది
ఆ దేవుణ్ణి వేడుకుంటోంది
కొమ్ములు విదిలిస్తోంది
 

ఉదయం దాకా ఇలా యుద్ధం జరగనిస్తే, ఎవరో ఒకరిని ఆ దేవుడు సాయానికి పంపిస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది
నెమ్మదిగా నక్షత్రాలు మాయమైపోయినాయి
తొలివెలుతురు కిరణాలు
తొలికోడి కూత
మేకపిల్ల ఉన్న శక్తంతా కూడగట్టుకొని పోట్లాడుతోంది
చివరిగా మిగిలున్న శక్తంతా కూడదీసేసుకుని మరీ పోట్లాడేస్తోంది
తోడేలుకు ఆశ్చర్యం, ఒకింత భయం కూడా కలగటం మొదలుపెట్టింది
కిందనున్న మసీదులోనుంచి నమాజు వాణి – తెరలు తెరలుగా
అల్లాహో అక్బర్ అని తలుచుకుంటుండగానే రాయి తగిలి కిందపడిపోయింది
తోడేలు వెయ్యాల్సిన దెబ్బ వేసేసి …………

కొండ మీద పక్షులు మాట్లాడుకుంటున్నాయి
చాందినీ ఓడిపోయిందని అనుకుంటున్నాయి
ఒక ముసలి పక్షి మాత్రం చాందినీ గెలిచిందని పొలికేక పెట్టింది

ఇంతకీ ఎవరు గెలిచినట్లు ?

పుస్తకాలంటే ప్రాణం పెట్టే మన రాష్ట్రపతి, మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సైన్ గారి రచన “అబ్బూఖాన్ కి బక్రీ” చదివినాక, 2009లో నాకొచ్చిన మాటల్లో స్వేచ్ఛానువాదంగా రాసుకున్న ఒక చిన్న కథ….

అదే… ఆకాశంలో ఇంద్రధనస్సు!

 

అనగనగా ఒక ఊరు.

ఊరంటే మామూలు ఊరు కాదు.

అందమైన ఊరు.

అంతకన్నా అందమైన మనుషులు.

ఆ అందమైన మనుషులకు ప్రకృతి అంటే ప్రాణం.

అందువల్ల ఆ ఊళ్ళో పచ్చ పచ్చటి చెట్లు.

ఆ పచ్చా పచ్చాని చెట్లను చూసి వనదేవత తెల్ల తెల్లని చెరువులు, పొంగిపొర్లే చెరువులు ఇచ్చింది.

ఓసోస్ వనదేవతేనా పులకించిపోయేదని, వరాలిచ్చేదని భూమాత ఆ ఊరికి నీలి నీలపు కొండలు ఇచ్చింది.

గరుత్మంతుడు ఎర్రగా బుర్రగా ఉండే పిట్టలు పంపించాడు.

ఎన్ని రంగుల పిట్టలో? రంగురంగుల పిట్టలు.

నీలి నీలి నెమళ్ళు.

ఆకుపచ్చని చిలకలు.

ఎర్ర ఎర్రని లకుముకిపిట్టలు .

వంగపండు వడ్రంగిపిట్టలు.

పసుప్పచ్చని పైడికంటిపిట్టలు.

నారింజరంగు జీనువాయిపిట్టలు.

ఇల్లా ఒకటి కాదు రెండు కాదు బోల్డు బోల్డు పిట్టలు.

ఆ ఊరు చూసి అందరూ అసూయపడేవారు.

చివరికి దేవతలు కూడా.

వంగపండు వడ్రంగి పిట్టలు టకటక తకధిమి అని తలలతో సంగీతం వాయించేవి

అరెవా! అంత సంగీతానికి తగ్గట్టు నాట్యం ఉండొద్దూ అంటూ నీలి నెమళ్ళు రోజూ బయట పురులు విప్పి నిలబడేవి.

ఆ పురులు, ఆ అందాలు, ఆ సంగీతాలు చూసి పిట్టలన్నీ కేరింతలు.

కేరింతలంటే ఏమిటి?

సంతోషంతొ చేసే గోల, ఆర్భాటం.

సంతోషం ఎక్కువైన చోట పిల్ల పిట్టల ఆటలు, పాటలు తప్పకుండా ఉంటవి.

పిల్లల ఆటలంటే ఉరకలు, పరుగులు.

ఈ ప్రపంచకంతో సంబంధం లేనట్టుండే ఉరకలు, పరుగులు, పాటలు, సంగీతాలు

ఓ రోజు ఆకాశంలో దేవతలంతా, రాజుగారైన ఇంద్రుడితో పాటు కైలాసానికి వెడుతూ ఈ ఊరిని దాటుతున్నారు

కిందంతా గోల గోలగా ఉన్నది

ఇంత గోలగా ఉన్నదేమిరానని తల వంచి చూసినారు

అందరితోపాటు ఆ ఆటలు పాటలు తాను కూడా చూసాడు ఇంద్రుడు.

ఆయనకు ఆ ఆటల ఐడియా నచ్చింది

ఆ వెంటనే ఒక ఆలోచన వచ్చింది

ఆలోచన, అది కూడా ఇంద్రుడికి వచ్చింది.

ఇంద్రుడంటే ఎవరు ?

ఇంద్రుడంటే రాజుగారు.

దేవతలకు రాజుగారు.

రాజుగారంటే మాటలా?

రాజుగారు ఏది చెపితే, ఏదనుకుంటే అది అయిపోవాల్సిందే

దేవతలందర్నీ పిలిచాడు.

మనం కూడా ఆటలాడుకుందాం అన్నాడు.

అంతే, గుసగుసలు మొదలైనాయి.

కొంతమంది వింతగా చూసారు.

కొంతమంది మా వల్ల కాదన్నారు.

కొంతమంది మమ్మల్నొదిలెయ్ నాయనా అన్నారు.

ఎప్పుడూ రాక్షసులతో యుద్ధాలు, అప్సరసల నాట్యాలు ఏవిటి చూస్తాం అనుకున్న కొంతమంది సంబరపడ్డారు.

తర్జనభర్జన పడుతున్నారు.

తర్జనతోనూ భర్జనతోనూ ఏమిటొస్తుందీ?

ఇహ ఇలా లాభం లేదని అష్టదిక్పాలకుల్ని పిలిచాడు.

ఆడుకుందాం పదండన్నాడు.

ఎవరికి తప్పినా వాళ్ళకు తప్పదుగా!

రాజు గారి దగ్గర కొలువులో ఉన్నారయ్యె.

ఆజ్ఞ ధిక్కరిస్తే తల తీసి ఆకాశగుమ్మానికి వేళ్ళాడదీస్తాడేమో!

ఏమో మరి, అంత పని చేస్తాడు, చెయ్యగలడు ఆయన.

అదీ భయం. ఆ పవరు అంటే భయం

అవతలివాడికి పవరున్నవాడంటే, ఏం చేస్తాడో తెలియని భయం.

అందువల్లే ఆ పవరుకోసం పోట్లాటలు

ఈ లోకంలో అందరూ అర్రులు చాచేది దానికోసమే

ఆ గొడవంతా పట్టం ఎందుకని సరేనన్నారు వాళ్ళు.

ఏ ఆట ఆడడం సార్ అనడిగారు.

ఎలా ఆడతామన్నారు ? మరి రూల్సు రాళ్ళు రప్పలు ఏమిటన్నారు ?

అలా రూల్సు గట్రా ఏమిటని అడగ్గానే ఇంద్రుడు తలగోక్కొని  ఆలోచించాడు.

మళ్ళీ ఓ సారి కిందకు చూచాడు.

ఆ కింద, రూల్సు రప్పలు ఏవీ ఉన్నట్టు కనపడని ఉరకలు పరుగులు కనపడ్డాయ్.

రూల్సు గట్రా ఏమీ లేవు , అందరం పరుగులెత్తుదాం పదండి అన్నాడు.

ఇదేమి ఆటండీ ? ఆయినా ఆకాశంలో ఎక్కడ పరుగులు పెడతాం అన్నారు దిక్పాలకులు ?

ఏవండీ అంటే అన్నానంటారు, ఆ తెల్ల మబ్బులున్నవి ఎందుకు, వాటి మీద పెట్టండి అన్నాడు ఇంద్రుడు.

తెల్ల మబ్బులు ఖంగారు పడ్డాయ్.

కొన్ని మబ్బులు ఈ రాజుగారి ఆట మా ప్రాణానికొచ్చిందిరా అనుకున్నాయ్.

పొరపాటున బయటకే అనేసాయ్.

అది చూశాడు ఇంద్రుడు. అది విన్నాడు ఇంద్రుడు.

ఛస్! నా ఆజ్ఞకు ముహం మాడుచుకుంటారా? ఆ మాడ్పు లానే మీరు కూడా మొత్తం నల్లగా అయిపోయి జీవితమ్మొత్తం అలాగే గడపండి అని శాపం పెట్టిపారేశాడు.

మొహం మాడ్చుకున్న మబ్బులన్నీ నల్లగా అయిపోయినై.

ఏడుస్తున్నాయ్.

వాటి ఏడుపే వాన అయిపోయింది.

ఆరోజునుంచి, పైనుంచి పడే వానకు ఆ నల్ల మబ్బుల ఏడుపే కారణం

ఇంద్రుడికి ఇంకా కోపం తీరక, మిగిలిన తెల్ల మబ్బులన్నీ ప్రేక్షకులుగా ఉండమని ఈ నల్లమబ్బుల మీద ఆట మొదలుపెట్టాడు.

ఆట మొదలయ్యింది. దేవతల పరుగులాట మొదలయ్యింది

కొంతసేపు అందరూ అటూ ఇటూ పరుగెత్తాక, గందరగోళంగా ఉండటంతో, అందరూ ఓ చోటికి చేరి తూర్పు చివరి నుంచి మొదలుపెట్టి పశ్చిమం చివరి దాకా ఎవరు ఫాష్టుగా పరుగెత్తుతారో వాళ్ళు గెలిచినట్టు అని తీర్మానించారు

సరే, ఈ రూల్సు లంపటం నాకు పెట్టకుండా వాళ్ళే తీర్మానించారుగానని చంకలు గుద్దుకొని ఇంద్రుడు పరిగెత్తటం మొదలెట్టాడు.

వాయువు, ఓస్ ఇంతేనా! రాజుగారండీ, మీరు మీ పరుగూ ఓ లెక్కా నాకు అని, మాజ్డా కారులా జూం జూం అని ఇంజను దడదడలాడించి పరుగెత్తటం మొదలుపెట్టినాడు.

అది చూసాడు ఆదిత్యుడు. వార్నీ కొంపలంటుకుపోతాయ్ ఈ వాయువుగాడు రాజుగార్ని ఓడించాడంటేనని ఏడు గుర్రాల బండెక్కి పరిగెత్తిపోయి వాయువుని – ఒరే నెమ్మదిరా నాయనా, రాజుగార్ని గెలవనియ్యమని ఒప్పించి ఆ వేగం తగ్గించాడు.

అలా ఇంద్రుడు గెలిచాడు.

కేరింతలు కొట్టాడు.

ఆ సంతోషంలో ఓడిపోయినవాళ్ళందరి మబ్బుల మీద వజ్రాయుధంతో ఓ దెబ్బా వేశాడు.

మెరుపులు పుట్టినై.

ఆ మెరుపులే మనం చూసే మెరుపులు

ఇంకోసారి పరిగెత్తుదాం అన్నాడు.

ఇష్హో, అష్హో అని అనుకుంటూ , కాళ్ళీడ్చుకుంటూ దిక్పాలకులు పరుగులెట్టారు.

రాజుగారు కాబట్టి ఆయన్నే మళ్ళీ గెలవనిచ్చారు.

నాలుగు రవుండ్లయినై.

నాలుగు సార్లూ ఇంద్రుడే గెలిచాడు, మబ్బుల మీద దెబ్బలు వేసి మెరుపులు తెప్పిస్తూనే ఉన్నాడు.

ఐదో రవుండ్లో కూడా గెలిచి మబ్బుల మీద కొడుతుంటే వజ్రాయుధం సర్రున చేతిలోంచి జారిపోయింది.

ఆ ఊళ్ళో పడిపోయింది.

భూమి లోపలికంటా వెళ్ళిపోయింది.

భూమాతకు కోపం వచ్చేసిందయ్యోయ్.

ఆవిడ కాళికా మాత అయిపోయింది.

ఒరోరి ఇంద్రా, నీ వజ్రాయుధంతో నాకు నొప్పి పుట్టిస్తావా? ఇక నువ్వది తీసుకోలేవ్ ఫో అని ఆ ఆయుధాన్ని పొడి పొడి చేసేసి వజ్రాలుగా మార్చేసింది.

ఇంద్రుడు బిక్కమొహం వేసాడు.

ఇదేమిట్రా ఇలాగయ్యిందని.

ఇప్పటిదాకా ఆడుకున్నాం. పాడుకున్నాం. గెలిచాం. ఓడాం. ఇంతలో ఈ విపరీతం ఏమిటి, చేతిలో ఉన్న ఒక్క గొప్ప ఆయుధం పోయిందేనని దిగాలుగా కూర్చున్నాడు.

రాజుగారు దిగాలుగా కూర్చోటం చూసి కొంతమంది కష్టపడ్డారు, కొంతమంది ఇష్టపడ్డారు

మనసు కష్టపెట్టుకున్నవాళ్లలో సూర్యుడు ఒకడు.

ఎప్పుడు కానీ, అప్పుడప్పుడు కాని దిగాలుగా కూర్చునే వాళ్ళంటే సూర్యుడికి పడదు.

అందుకు ఆయన ఉరుకులు పరుగుల మీద వొచ్చేసి ఓ రాజరాజ నీకు ఆయుధం కావాలి అంతేగా! నేనిస్తా, ఇంత పెద్దదిస్తా, అన్నిటికన్నా పెద్దదిస్తా తీసుకో అన్నాడు.

ఇంద్రుడి ముహం వెలిగిపోయింది.

సరే ఇవ్వు అన్నాడు సూర్యుడి చేతులు పట్టుకొని తబ్బిబ్బైపోతూ!

సూర్యుడు ఉండు ఒక్క నిమిషం, తెచ్చిస్తా అని కింద ఉన్న ఊళ్ళోకి వచ్చేశాడు.

పిట్టల్ని పిలిచాడు. మీ ఈకల్లో కొన్ని నాకిచ్చెయ్యండి అన్నాడు.

అన్ని పిట్టలు సూర్యుడొచ్చాడని ఊగిపోతూ ఈకలిచ్చేసినై.

అవన్నీ కుప్ప చేసుకుని పొయ్యాడు సూర్యుడు.

అందులో వెలిగిపోతున్న రంగుల్ని కొన్ని తీసుకున్నాడు.

చకచకా ఒక ఆయుధం తయారు చేసాడు.

తీసుకెళ్ళి ఇంద్రుడికిచ్చాడు.

ఇంద్రుడు దాన్ని పట్టుకోలేక సతమతమైపోయినాడు.

చేతులు పట్టనంత పెద్దదైపోయింది అది.

మొత్తానికి కష్టపడి చేతుల్లోకి తెచ్చుకున్నాడు.

దీన్ని పెట్టుకోవాలంటే దేవేంద్రలోకం సరిపోదు. ఎక్కడ దాచిపెట్టాలన్నాడు.

ఇప్పటిదాకా ఆడుకున్నావుగా రాజా మారాజా, ఆకాశం ఉందిగా అక్కడ పెట్టుకో అన్నాడు సూర్యుడు.

సరే, మళ్ళీ ఓ సారి పరుగులాట ఆడదాం అని ఆట మొదలుపెట్టాడు.

షరా మామూలుగా గెలిచాడు.

గెలిచిన ఆనందంలో చేతిలో ఉన్న ఆయుధాన్ని మబ్బుల మీద తాటించాడు.

ముసిముసిగా నవ్వుకుంటూ సూర్యుడు దాక్కున్నాడు, ఆ నవ్వు ఎక్కడ కనపడుతుందోనని.

ఆకాశం అంతా ధగధగా మెరిసిపోయింది ఉన్నట్టుండి.

ఆ రంగులతో. ఆ ప్రకాశవంతమైన రంగులతో. ఏడు రంగులతో!

ఇంద్రుడు ఆటాడినప్పుడల్లా, గెలిచినప్పుడల్లా, నల్ల మబ్బులు ఏడ్చినప్పుడల్లా, ఆయుధం తాకించినప్పుడల్లా ఆకాశం మెరిసిపోతూనే ఉంది.

సూర్యుడు ముసిముసిగా నవ్వుతూనే ఉన్నాడు.

అదే ఆకాశంలో ఇంద్రధనస్సు అయ్యిందయ్యా!

అలా ఇంద్రధనస్సు పుట్టిందయ్యా!

అయ్యా అదీ ఇంద్రధనస్సు సంగతి….

ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక బల్గేరియన్ కథలో ఒక అబ్బాయి రంగు పిట్టల ఈకలు చూసి ఇంద్రధనసు ప్రస్తావన తీసుకొని రావటం చదివాక వచ్చిన ఆలోచనతో రాసుకున్న పిట్ట కథ ఇది…పిట్టల కథ ఇది…ఇంద్రధనస్సు కథ ఇది…

*

ఏ సౌందర్యరాశి కోసం ఈ కథ …!

 

 

రాముల వారు.

శ్రీరాముల వారు.

సీతాసమేత రాముల వారు.

వాళ్ల నాన్న ఎవరు ?

దశరథుడు.

దశరథుడి నాన్న ఎవరు ?

అజుడు.

ఈయన నాన్న ఎవరు ?

రఘు మహారాజు.

రఘు మహారాజు ఎక్కడుండేవాడు ?

కోసలపురంలో.

అయోధ్య రాజధాని.

బోల్డంత మంచోడు.

జపతపాలు బాగా చేసినవాడు.

తపస్సులు కూడా చేసినవాడు.

ఓ రోజు సభలో కూర్చోనున్నాడు.

సభ అన్నాక బోల్డంత మంది.

ఆటపాటలు, చర్చలు దేనికవే నడుస్తున్నై.

ఎవరిక్కావలసినవి వాళ్ళు చూసుకుంటున్నారు.

ఇంతలో ఒక వార్తాహరుడు వొచ్చాడు.

చేతులు కట్టుకొని, అయ్యా దణ్ణం అన్నాడు.

ఎవరి దగ్గర ?

రఘు మహారాజు దగ్గర.

ఏవిటి ఆ చేతులు, ఏవిట్రా సంగతీ అన్నాడాయన.

మరేనండి, విదర్భ నుంచి సందేశం వచ్చిందండి అన్నాడు.

ఆ కాలంలో ఈ సందేశాలు అవీ మనుషులే అందించేవాళ్ళు.

మాటలు మనుషుల మధ్య ఉండేవి.

మరల మధ్య కాకుండా.

మరల ద్వారా కాకుండా.

ఎంత అదృష్టవంతులో.

ఏవిటా సందేశం అన్నాడీయన.

పురోహితుల వారు వచ్చారండి, ఆయన చెపుతాడు అన్నాడు వార్తాహరుడు.

పిల్చుకురా ఆయన్నిటు అన్నాడీయన.

ఆ వార్తాహరుడు పరుగున పోయినాడు పిలుచుకొని రావటానికి.

ఇంతలో మంత్రులందరికీ అనుమానాలు.

పురోహితుడు రావటమేవిటి ?

పెళ్ళికేవన్నా వచ్చాడా?

రాజుగారికి ఆల్రెడీ పెళ్లైపోయింది.

మరెందుకు వచ్చాడు?

రాయబారానికి వచ్చాడా?

రాయబారానికి మనమధ్య పెద్ద గొడవలేవీ లేవే, అక్కడక్కడా అరుణాచల్ప్రదేశు, చైనా లాటి చిన్న చిన్న ఆక్యుపేషన్లు తప్ప.

ఆ ఆక్యుపేషన్లు మనమూ చేస్తున్నాం. అవి చెయ్యొద్దని చెప్పడానికి వొచ్చాడా?

ఇలా నానారకాలుగా మాటాడుకుంటున్నారు.

ఇంతలో నుదురు మీద ఈలావున ఓ పెద్ద వీభూతి, మెళ్ళో రుద్రాక్షలు, ధగధగ మెరిసిపోతూ తెల్లగా ఉన్న ఒహాయన వచ్చాడు.

ఆయనే ఆ పురోహితుడు.

నవ్వుతున్నాడాయన.

మంత్రుల మనసు స్థిమిత పడింది.

ఇదేదో మంచి వార్తలానే ఉంది అనుకున్నారు.

గుసగుసలు తగ్గినై.

రాజుగారన్నారు ఆయనకో కుర్చీ ఇవ్వండి అని.

కుర్చీలేవీ ఖాళీ లేవయ్యె.

రాజుగారి నోటి వెంట మాట రావటం, అది కాకపోటమే?

విదర్భుడు అని ఒహ మంత్రిగారు లేచి ఆయన కుర్చీ ఈయంకిచ్చాడు.

రాజుగారు మంత్రిగారికి ఒహ 500 పరగణాలు బహుమానంగా ఇచ్చాడు.

అది చూసి మిగిలిన మంత్రులంతా కుతకుతలాడారు.

సరే ఆ కుతకుతల సంగతి తర్వాత, పురోహితుడు కూర్చున్న తర్వాత ఏమయ్యింది ?

రాజు గారు ఆ పురోహితుణ్ణి పట్టుకొని, అంతా బాగేనా? తమరి రాకకు కారణమేవిటి ? విదర్భలో అంతా బాగున్నారా? మీ ఇంటో అంతా బాగున్నారా ? అని నానారకాల కుశల ప్రశ్నలు వేశాడు.

ఆ కాలంలో కుశల ప్రశ్నలు అవీ చాలా సామన్యం.

మనుషుల్లో మంచి మానవత్వం ఉండేది.

మా సభలో సంభారాలు ఇలాగున్నై, అలాగున్నై అని గొప్పలు గప్పాలు రాజుగారి దగ్గర ఉండేవి కావు.

ఇంటికి వచ్చినవాణ్ణి నెత్తి మీద కూర్చోబెట్టుకొని వాడు సంతొషపడిపొయ్యేదాకా వదిలేవాళ్ళు కాదు.

ఈరోజు ఇంటో ఉన్న అత్తగారికీ, మావగారికే దిక్కులేకుండా పోతుంది. బయటివాళ్ళ సంగతి, బంధువుల సంగతి బెమ్మ దేవుడికెరుక.

సరే అదలా పక్కనబెడితే, రాజుగారు అడగ్గానే పురోహితుడు పులకించిపొయ్యాడు.

పెద్దాయన కాఫీలు, టీలు, ఆల్కహాలు ఖాకుండగా చల్లని కరివేపాకు నిమ్మ మజ్జిగ కూడా ఇప్పించటంతో పురోహితుడు కళ్ళనీళ్ల పర్యంతం కూడా అయిపోయినాడు.

అంతా బానే ఉంది సార్! అన్నాడు ఆ సత్కారాలకు పొంగిపోతూ.

మరి అంతా బాగుంటే మమ్మల్ని చూసిపోటానికి వచ్చారా మీరు అన్నాడీయన నవ్వుతూ.

మజ్జిగిచ్చాక ఈ మాటతో మోతమోగించడంతో పురోహితుడన్నాడు, కాదండి మా రాజుగారి అమ్మాయికి పెళ్ళి చేద్దామనుకుంటున్నారు అని.

అప్పుడు వెలిగింది పెద్దాయనకు, మంత్రులకు వెలక్కపోయినా.

అజుడు ఉన్నాడుగా, ఆ యువరాజు గారికోసం సంబంధం కలుపుకుందామని మాటలు మాట్టాడదామని వచ్చాడాని అనుకున్నాడాయన.

చిరునవ్వు నవ్వాడు అప్పుడు రఘుమహారాజు.

ఏమాటకామాటే చెప్పుకోవాలె. రఘు మహారాజు చాలా అందగాడు.

రాజసంగా ఉన్నాడేమో, ఇంకా వెలిగిపోతున్నాడు.

అందులోనూ నవ్వితే బుగ్గలు సొట్టపడతయ్యిట.

సూర్యుడి వంశం వాళ్ళైనా సొట్టబుగ్గలు కనపడతవి, అంత సూర్యుడి వెలుగులోనూ.

సభంతా వెలిగిపొయ్యింది. సమ్మోహనమైపోయింది ఆ నవ్వుతో.

ఆ చిరునవ్వుతో.

అందరి కళ్ళు ఇటేపు తిరిగినై.

అయినా పురోహితుణ్ణి కొద్దిగా ఉడికిద్దామని, ఏవిటయ్యా పెద్దాయనా, ఆ చిన్న పిల్లతో నాకు పెళ్ళేవిటీ అన్నాడు.

అమ్మమ్మా, ఎంత మాటన్నారు, మీక్కాదండి మీవాడికి అని బయటపడ్డాడు ఆ పురోహితుడు.

అదీ ఇప్పుడు దారిలోకొచ్చావ్. సంగతి పుర్తిగా చెప్పు అన్నాడాయన.

మీకు తెలీందేముందండి, ఈ కాలంలో అందరూ స్వయంవరాలు ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి నేనైతే అబ్బాయికి డైరెక్టుగా ఇచ్చేద్దును. కానీ రాజ్యధర్మం పాటించాలె కదా. కాబట్టి స్వయంవరానికి మీ వాణ్ణి రమ్మని చెప్పడానికి వచ్చాను అన్నాడు పురోహితుడు.

అది విని రఘు మహారాజు ఆనందపడ్డాడు. ఏ భేషజం లేకుండా చక్కగా సంగతి చెప్పినందుకు ఆ పురోహితుడికి ఓ మూడువేల ఆవులు, ముప్ఫై గ్రామాలు ఇచ్చి పంపించేసాడు.

సభలో అంతా ఆనందం. కలకలం. రాజు గారి కొడుకు పెళ్ళి అని.

సాయంత్రం అజుణ్ణి పిలిచాడు పెద్దాయన.

నీకు పెళ్ళి అన్నాడీయన.

అదేంటి, నాకు చెప్పకుండా పెళ్ళేవిటి, నువ్వెవరు అని అడక్కుండా సరే నాన్నగారూ అంటూ సెలవు తీసుకోబోతుంటే అప్పుడన్నాడాయన.

పెళ్ళంటే పెళ్ళి కాదు, ఇప్పటికి స్వయంవరం. అందులో నువ్వు ఆ అమ్మాయి మనసుని గెల్చుకొని కోడలిగా తీసుకొచ్చెయ్ నా ఇంటికి అన్నాడు పెద్దాయన.

పెద్దవాళ్ల మాట శిరస్సున ధరించడమే తెలుసుకానీ, రెబెల్ మనస్తత్త్వాలు లేకపోడంతో అంటా శాంతంగా. ప్రశాంతంగా గడిచిపోయింది.

ఆ రోజొచ్చింది. బయల్దేరాడాయన.

ఎవరు ?

అజుడు. బోల్డు మంది పరివారన్నెంటబెట్టుకొని.

ఎక్కడికి?

విదర్భకు.

రథాలు సాగుతున్నై, పరుగులు తీస్తున్నై గుర్రాలు.

ఇంతలో ఓ పేద్ద అడవి వచ్చింది.

ఆ అడవంతా దట్టంగా ఉన్నది.

అడవిలోంచి వెళుతుంటే బోల్డన్ని జంతువుల అరుపులు.

ఇంతలో హృదయవిదారకమైన కేకలు వినపడ్డై.

చూస్తే ఒక పెద్ద బెబ్బులి, ఒక లేడిని కసుక్కున ఏసేసి తీసుకుపోతోంది.

అది చూశాడు అజుడు.

ఇంతవరకూ చెప్పుకోలేదు కానీ, మనవాడు చాలా గొప్ప వీరుడు.

విల్లు పట్టుకున్నాడంటే ఇహ ఆయన్ని ఓడించటం ఆ బ్రహ్మ తరం కూడా కాదన్నమాటే.

rama1

అలాటి వీరుడికి బెబ్బులి ఎదురు పడింది.

ఇహనేం ?

బెబ్బులి కూడా అజుణ్ణి చూసింది.

ఎవర్రా నువ్వు, నా అడవిలోకొచ్చి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తావా అన్నట్టు చూస్తోంది.

దాని కళ్ళు చింతనిప్పుల్లా వున్నవి.

అంత దట్టమైన అడవిలో, దాని కళ్ళు ధగధగా మెరిసిపోతున్నై.

ఇద్దరూ కళ్ళు దించకుండా ఒకళ్ళొంక ఒకళ్ళు చూసుకున్నారు.

ఉన్నట్టుండి భూమి ఆకాశం బద్దలయ్యేట్టు బొబ్బలు పెట్టింది ఆ పులి.

మరి బెబ్బులి కదా.

బొబ్బలు పెట్టాల్సిందే.

మనవాడు ఊరకుంటాడు ?

అసలే యువరాజు.

దబ్బపండులా మెరిసిపోతున్నాడు.

అసలే సింహం నడుం మనవాడిది.

దానికి పచ్చలతో బిగినిచిన పటకా.

దానికొక కత్తి వేళాడుతోంది.

మనవాడు బొబ్బలకు ప్రతిగా సింహనాదం చేశాడు.

ఆ నాదానికి నెత్తినున్న వజ్రపు తురాయి ఊగింది.

అది ఊగిందంటే మూడిందన్నమాటే.

బెబ్బులికి బాణం ఎందుకనుకున్నాడో ఏమో, పక్కనున్న బల్లాన్ని అందుకున్నాడు.

దక్షిణ హస్తంతో అందుకున్నాడు.

ఎంత సుందరంగా అందుకున్నాడో.

ఆయుధాలు పట్టుకోటం కూడా ఒక కళేనండి.

మాడ్రిడ్డు నగరంలో పోతుపోట్లాటల్లో మాటడోరు ఎంత వొడుపుగా దిగేస్తాడు బల్లేన్ని?

జీవహింసే అయినా ఆయుధాన్ని వొడుపుగా ఎలా ప్రయోగించాలె అన్నదానికి అదో గొప్ప ఉదాహరణ.

అది పక్కనబెడితే, మనవాడు అందుకున్న బల్లాన్ని అంతే వొడుపుగా విసిరాడు దాని మీదకు.

ఓస్ ఇలాటి బల్లాలు చాలా చూసా నేనన్నట్టు నిర్లక్ష్యంగా ఒక అడుగు పక్కకేసింది ఆ బెబ్బులి.

బల్లెప్పోటు తప్పిపోయింది.

మనవాడి మొహం ఎర్రబడిపోయింది.

రోషం వచ్చేసింది.

మామూలువాడికి రోషం వస్తే పక్కనబెట్టొచ్చు కానీ వీరుడికి రోషం వస్తే పట్టుకోగలమూ?

గుర్రాణ్ణి లార్డ్ ఆఫ్ ద రింగ్సులో నాజ్గుల్ రాజులు నల్లగుర్రాలను దుంకించినట్టు దుమికించాడు.

పోతే ఈయనది తెల్ల గుర్రం.

అంత గుయ్యారంలోనూ మెరిసిపోతోంది.

అరబ్బీ గుర్రాలని ఇప్పటి వాళ్ళకు తెలుసుకానీ, అసలు ఆ అరబ్బీ గుర్రాలు అనే మాట మన రబ్బు నుంచి వచ్చింది.

రబ్బంటే ఏవిటీ ?

కాంతి. ధగధగలాడిపోయ్యే కాంతి.

ఒగిప్రబ్బు బిగిరబ్బు నగుమబ్బు జిగినుబ్బులను ద్రొబ్బుగ….అంటూ ఒకానొక శాస్త్రంలో ఒకానొక పద్యం కూదా ఉన్నది.

కాంతితో సమానంగా పరుగులుపెడతవి కాబట్టి వాటికి రబ్బులని పేరు ఆ కాలంలో.

అలటి మన రబ్బు గుర్రాలని ఆ అరబ్ వాళ్ళు తీసుకునిపొయ్యి అరబ్బీ గుర్రాలుగా మార్చేసారు.

అది మనవాళ్లకు తెలీక అరబ్బీ గుర్రాలు వాళ్ళవే అనుకుంటున్నారు.

సరే గుర్రాల పుట్టుపూర్వోత్తరాలు అవీ వొదిలేస్తే, మనవాడి గుర్రం దుంకింది.

రౌతు రోషం రత్యానికి తెలియకపోతే ఎట్లా? (రత్యము అంటే గుర్రము నాయనా!)

అందుకని అదీ యజమానంత రోషంగానూ దూకింది.

బెబ్బులి కళ్ళు జిగేల్ జిగేల్ మన్నాయి ఆ తెలుపుకి.

అలా జిగేల్ జిగేల్ మనటంతో గుడ్డిదైపోయింది ఒహ నిముషం.

ఇంతలో మనవాడు ఇంకో బల్లెం అందిపుచ్చుకున్నాడు.

అంత పరుగులోనూ, దుంకులాటల్లోనూ.

అదీ నైపుణ్యం అంటే.

అదీ వీరుడంటే.

అందుకోటమేవిటి, విసరటమేవిటి అన్నీ కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయింది.

ఆ ఒక్క పోటుకు బెబ్బులి బజ్జుండిపోయింది.

బొబ్బలూ లేవు. బెబ్బులీ లేదు.

బెబ్బులి శాస్వతంగా బజ్జుంది కాబట్టి మనవాడు మళ్ళీ ఒక సింహనాదం చేసినాడు.

దాంతో అప్పటిదాకా బెబ్బులికి భయపడి దూరంగా చెట్ల వెనకాల దాక్కుని చూస్తున్నవాళ్ళంతా బయటకొచ్చారు.

జయజయధ్వానాలు చేసారు.

అలా దక్కునేవాళ్ళను ఈరోజుల్లోనూ చూడొచ్చు మనం.

మాట్టాడేవాణ్ణి ఒకణ్ణి ముందుకు తొయ్యటం, చోద్యం చూట్టం, మనకనుకూలంగా వచ్చేసిందనుకుంటే జయజయధ్వానాలు చెయ్యటం.

అదీ లోకం పోకడ.

మనవాడికి ఆ సంగతి తెలుసు కాబట్టి ఆ జయజ్యధ్వానాలు అవీ పట్టించుకోకండా, ఇహ పొద్దు గుంకిపోతోంది, అడవిలోనే గుడారాలేర్పాటు చెయ్యమని ఆర్డరిచ్చి పక్కనే ఉన్న ఏరు దగ్గరికి స్నానానికెళ్ళిపోయాడు.

అప్పుడు గ్యాపకం వచ్చింది మనవాడికి, అది నర్మదా నదీ తీరం అని.

అంటే విదర్భ ఇంకొంత దూరంలోనే ఉన్నదన్నమాట.

స్నానం అవీ చేసి, భోంచేసి సుబ్బరంగా నిద్దరోయి పొద్దున్నే ఫ్రెష్హుగా పోవచ్చులేనని ఆయన నదిలోకి దిగాడు.

నింపాదిగా స్నానం చేస్తున్నాడు.

అప్పుడు జరిగిందయ్యా ఇంకో సంఘటన..

ఒక మదగజం వచ్చింది.

నీళ్ళు తాగాలనో ఏమో.

కానీ మదంలో ఉందిగా, అందుకూ దార్లో ఉన్నవాటన్నిటినీ తొక్కి పారేస్తోంది.

చెరుకుతోటలో పడ్డట్టు నాశనం చేసేస్తోంది.

అది చూసి భటుల్లో కొంతమంది వీరులు పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఎవడొస్తే ఏవిటి నాకు అని వాళ్ళను కూడా తొక్కి పారేసింది ఆ మత్తగజం.

దాని కాళ్ళ కింద పడి పచ్చడి పచ్చడీపోయారు చాలా మంది.

ఇది చూసి ఆయన ఒడ్డుకు వచ్చేసాడు.

ఒడ్డున వదిలిన విల్లు, బాణం అందుకున్నాడు.

గజానికి గురిపెట్టాడు.

అంతే ఆశ్చర్యంగా గజం కిందపడిపోయింది.

మత్తొచ్చినట్టే, కిందపడిపొయ్యింది.

పడిపోటమేవిటి, ఆ స్థానంలో తెల్ల పొగలు రావటమేమిటి, ఆ పొగల్లోంచి ఒక దివ్యపురుషుడు రావటమేమిటి, అన్నీ వరసాగ్గా జరిగిపోయినై.

ఎవరు బాబూ నువ్వు, ఆ పొగలేవిటీ, ఏవిటి నీ సంగతి అని అడిగాడు ఈయన.

పొగల్లోంచి వచ్చిన నా పేరు ప్రియంవదుడు సార్! గంధర్వుణ్ణి. ఓ రోజు తాగిన మైకంలో ఒళ్ళు పై తెలీకుండా మతంగ మునిని ఏదేదో మాటలన్నాను. ఆయన నీకు మదమెక్కిందిరా, నువ్వు మదగజమైపో అని శాపమిచ్చాడు. మత్తు దిగిపోయి నేను భోరుమన్నా. అప్పుడు ఆయన, మీరొచ్చి మీ దివ్యమైన విల్లు పట్టుకుని నా మీదకు గురిపెడతారనిన్నీ, అప్పుడు ఆ బాణాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు కాబట్టి అప్పుడే నీకు శాపవిమోచనమని శలవిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరొచ్చారు. విల్లెక్కుపెట్టారు. పొగలొచ్చినై. నేను బయటకొచ్చాను అని అన్నాడు.

సరే ఈ కథంతా బాగుంది కానీ, ఇప్పుడు ఏవిటి చెయ్యాలి నేను అన్నాడీయన.

మీరేం చెయ్యక్ఖరలేదు సార్, నేనే మీకు ఒక అస్త్రం బహూకరిస్తా కానుకగా. ఇదిగో తీస్కోండి అని ఒక అస్త్రం ఇచ్చాడు.

ఆ అస్త్ర విశేషాలు ఏవిటి అని అడిగాడు ఈయన.

అప్పుడన్నాడు ఆ ప్రియంవదుడు.

అయ్యా ఇది సమ్మోహనాస్త్రం.

ఒకసారి ఎక్కుపెట్టి వదిలారంటే ఇందులోంచి సమ్మోహనం అనే గాసొస్తుంది. అందరూ మూర్చలో పడిపోతారు. ఎవరూ లేవను కూడా లేవలేరు చాలా సేపటిదాకా. ఇహ నాకు శలవు అని మాయమైపోయాడు..

వీరుడికి ఇట్లాటివన్నీ ఇస్తాడేమిటి ఈయన అని అజుడు ఆశ్చర్యపోతునే ఉన్నాడు.

ఎందుకా ?

వీరుడన్న వాడికి, ఎదురైనవాడితో స్వంతంగా పోట్టాడాలని ఉంటుంది కానీ ఈ సమ్మోహనాలు, మూర్చలు అవీ ప్రయోగించటానికి ఇష్టం ఉండదు.

అందుకూ.

అయినా సరే ఇచ్చాడు కదాని తీసుకున్నాడు.

అప్పుడు….

ప్రియంవదుడు మాయమైపోయాడు. పొగలు మాయమైపోయినాయ్. గజమూ మాయమైపోయింది.

పొదిలో కొత్త అస్త్రం వచ్చి చేరింది.

వీరుడికి, విలుకాడుకి కొత్త అమ్ము వచ్చి చేరితే ఆనందమే. అది బయటకు చెప్పుకోకపోయినా.

ఆ ఆనందంలో గుడారానికి వెళ్ళిపోయాడు. చక్కగా అందరూ నిద్దరోయారు.

పొద్దున్నయ్యింది. పైగా వసంత ఋతువు.

వసంత ఋతువులో అరుణకిరణాలు ఎంత బాగుంటవో ఆ సమయానికి చూస్తేనే కానీ తెలియదు.

భానుడు బాలుడైపోతాడు. కేరింతల కిరణాలు అలా అలా భూమ్మీదకు వచ్చేస్తుంటే ఎవడి మనసు పులకించదు.

దానికితోడు కోయిలలు. మావిచిగుళ్ళు తింటున్నవి పొద్దున పొద్దున్నే బ్రేక్ఫాష్టుకు.

చిగుళ్ళు తినగానే బోల్డంత శక్తి. బోల్డంత తీపి వగరు కలగలుపు. దాంతో పరవశం. దాంతో ఫాటలు.

ఇవన్నీ చూసి వాయుదేవుడికి ఆనందం. ఆయనా పిల్లవాడిగా మారిపోయి, పిల్లలగాలులు వీస్తూ ఉంటాడు.

ప్రకృతి అంతా శాంతం. ప్రశాంతం.

చుట్టుపక్కల ప్రశాంతంగా ఉన్నప్పుడు మనమూ ప్రశాంతమే, మన మనసూ ప్రశాంతమే.

అలా ఆ ప్రశాంతతలో కాలకృత్యాలు అవీ అయిపోయాక, తిపినీలు అవీ అయ్యాక బయల్దేరారు.

నర్మద దాటగానే విదర్భ.

ఈయన వెంట బోల్డంత పరివారం ఉందని చెప్పుకున్నాంగా.

అంత పరివారం ఎందుకు అని అనుమానం రావొచ్చు.

స్వయంవరాలంటే మాటలా.

అంతమంది ఉండగా ఆడపిల్ల ఒకడి మీదే మనసు పారేసుకుని మెళ్ళో మాల వేస్తే మీసాలు తిప్పుతున్న వేరే కుర్రరాజులకు కాలదూ?

అలా కాలిన కుర్రాళ్ళు యుద్ధాలకు దిగిపోరూ? అందులోనూ వీరులు, యువరాజులు, ఉడుకురక్తాలు.

ఆ ఉడుకురక్తాల వల్ల అవి, చినుకుగా మొదలై గాలివానగా మారిపోయే అవకాశాలు బాగా ఎక్కువ.

అందువల్ల వెంట పెద్ద పరివారం, దానికితోడు సైన్యం ఉన్నదనుకో అన్నీ చక్కబెట్టుకోవచ్చు.

అలా కొన్ని కొన్ని సార్లు ఇలా మాల పట్టమేవిటి, అలా పెళ్ళి అవటమేవిటి – యుద్ధం మొదలు.

పెళ్ళాంతో కాదండోయ్. ఆ పెళ్ళామ్మీద పోట్టాటకొచ్చిన వాళ్ళతో. విరగదియ్యటమే.

సరే పరివారం అంతా దిగారుగా విదర్భలో ? అక్కడంతా పెళ్ళి సందడి.

పెళ్ళి సందడంటే రాఘవేందర్రావు తీసిన ఆ పిచ్చి సినిమా కాదు.

నిజమైన పెళ్ళి సందడి.

ఎట్లా ఉందిట అక్కడ ?

అంత ఎత్తున ప్రాకారాలు.

వాటి మీద దివిటీలు.

పగలు కూడా ధగధగా వెలుగుతున్నయ్యిట.

ఆ ప్రాకారాలకు పాకుతున్న లతలు.

ఆ లతలకు సువాసనొచ్చే చిన్న చిన్నపువ్వులు.

ఆ ప్రాకారాల్లోపల విడిగా వనాలు. వాటికలు.

విశాలమైన వీధులు.

అంత పెద్ద వీధుల్లో ఇంకా పెద్ద పందిళ్ళు.

ఒక్కటేవిటి, అన్నీ కళ్ళు చెదిరిపొయ్యేలా ఉన్నవి.

బోల్డంత మంది జనాలు. చిన్నా పెద్దా ముసలీ ముతక.

విసవిసగా అధికారులు.

పకపకగా ఆడపిల్లలు.

తైతకలుగా నాట్యాలు.

వికవికలుగా చెలికత్తెలు.

ఆటపాటలు. చిందులు. సందోహాలు.

ఇక స్వయమవరం మంటపం.

ఇంద్రుడికున్న వెయ్యి కళ్ళు ఎందుకు పనికొస్తై చూట్టానికి. ?

అంతలా ధగధగ మెరిసిపోతోంది.

మద్దెలలు మోగుతున్నై.

సన్నాయిలు సాగుతున్నై.

అరిటాకులు ఊగుతున్నై.

వాయుదేవుడు సన్నగా ఈలలు వేస్తున్నాడు.

ఇహ స్వయంవర సమయం వొచ్చింది.

అమ్మాయీమణి వారు వచ్చారు.

రా.కు లంతా ఆవిడను చూశారు.

అంతే. కళ్ళల్లో చక్రాలు తిరిగినై.

వశీకరణం జరిగిపొయ్యింది.

రాజకుమారులకు మూర్చలొక్కటే తక్కువ.

మాటలసలే లేవు.

అంతందంగా ఉన్నది ఆ అమ్మాయి.

జగదేక సుందరి.

ఆణిముత్యాలన్నీ పోగుచేసి ఒక కుప్ప చేసి రూపు కల్పిస్తే ఎట్లా ఉంటుందీ ?

అంతందంగా ఉన్నది.

ఇంత అందమైన అమ్మాయి ఎవరి మెళ్ళో మాల వేస్తుందో?

ఎవరిని ఎంచుకుంటుందో?

అందరి గుండెలు గుబగుబలాట్టం మొదలుపెట్టినై.

నాకు దక్కితే బాగుండు, నాకు దక్కితే బాగుండునని ప్రతి రాజకుమారుడు కలలు కంటున్నాడు.

వాళ్ళలా కలల్లో ఉండగానే, ఆ అమ్మాయి దండ తీసుకుని బయలుదేరింది.

అందరి మనసుల్లోనూ ఒకే కోరిక.

“ఈ భువనైకం నన్నే వరించాలి!” అని ఆత్రపడిపోతున్నారు.

అమ్మాయి యువరాణి. కాబోయే రాణి. అప్పట్లో యువరాణులకు చెలులు ఉండేవారు.

చెలులందు నెచ్చెలులు వేరయా అని వేమన తన ఐదువేల పూర్వజన్మల వెనకాల చెప్పాడు.

ఆ ఐదువేల జన్మల కితం, ఆయన, ఆ వేమన పేరేవిటో ఆయనకి తప్ప ఎవరికీ తెలియదని లోకంలో కథ.

సరే వేమన సంగతి పక్కనబెడితే, అలాటి నెచ్చెలి ఒకావిడ.

ఆవిడ పేరు సునంద. యువరాణి వారి దగ్గరున్న నెచ్చెలులులందరిలోనూ సునంద అంటే బాగా ఇష్టం ఆ అమ్మాయికి.

యువరాణి గారి మనస్సు, రహస్యం, ఇష్టం, అయిష్టం అన్నీ తెలిసిన్న చెలి ఈ సునంద.

అలాటి సునంద వెంటరాగా వరమాలను సుకుమారమైన చేతులతో పట్టుకొని ఒక్కొక్క రాజునే చూస్తూ ముందుకు నడుస్తున్నది.

సునంద ఆ ఆమాయి పక్కనే నడుస్తూ ఆ రాజ కుమారుడిను గురించి యువరాణివారికి పరిచయం చేస్తోంది.

పరిచయం అంటే పరిచయం కాదది.

ఏడేడు జనమల తాతముత్తాతల దగ్గరినుంచి వంశ చరిత్ర, ఆ కుమారుడి చరిత్ర ఒక్క మాటలో చెప్పేస్తోంది.

ఒక్కోసారి ఎన్నో మాటలని ఒక్కమాటలో చెప్పొచ్చు. సైగతో చెప్పొచ్చు.

అది అందరికీ సాధ్యం కాదు కానీ నెచ్చెలులకు సాధ్యం.

అది వారికే ప్రత్యేకం.

సునంద చెప్పటం, సైగ చెయ్యటం, యువరాణివారు ఒక్క క్షణం ఆ రాజకుమారుడి ముఖాన్ని కళ్ళు విప్పారించి నిశితంగా చూట్టం.

అసలే చేపల్లాంటి కళ్ళేమో, విప్పారించేప్పటికి ఆ కళ్ళను చూస్తున్న, చూసిన రాకుమారుడికి అమ్మా తమ్ముడు మన్ను తినేను పాట తర్వాత యశోదా దేవి ఆ నోట్లోకి చూసి పడ్డ పరిస్థితిలా అయిపోతోంది.

మనసంతా కకావికలం. సత్వ గుణం అయిపూ అజా లేకుండా పోతోంది. దానిస్థానే తమోగుణం రెచ్చిపోతోంది.

అంత రెచ్చిపోతలోనూ, ఆ అమ్మాయి చూసిన క్షణాన ఆ రాజు ముఖం వెలిగిపోతున్నది

“ చూసింది నన్నే చూసింది. నావంకే చూసింది. నన్నే చూస్తోంది! అంతే! ఇక ఆ మాల నా మెళ్ళో పట్టమే మిగిలింది” అనుకుంటూ అష్ట వొంకరలూ తిరిగిపోతున్నారు. అసలు ఆ అమ్మాయి చూస్తోందన్న ఊహకే వాళ్ళ ముఖాలన్ని పెట్రోమాక్సు బల్బుల్లా వెలిగిపోతున్నై.

ఆ పెట్రోమాక్సు లైటు చూసిన యువరాణికి ఆ లైటు నచ్చకపోవటం వల్ల తల త్రిప్పేసి ముందుకు వెళ్ళి పోతోంది.

ఎంతో ఆశ పెట్టుకున్న రాకుమారుడు నీరసపడిపోతున్నాడు.

మొహం నల్లగా అయిపోతోంది.

అవమానం పాలైనట్టు.

అలా వరుసలోని వారందరిదీ ఇదే పరిస్థితి.

దీన్ని కాళిదాసు వర్ణించాడు, బ్రహ్మాండంగా ఇలా

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా ల్
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం స స భూమిపాలః

మా చిన్నప్పుడు దివిటీలు ఉండేవి.

ఆ దివిటీలు ఇప్పటివీ అప్పటివీ కావు.

ఎప్పటివో!

రాముడి కన్నా ముందు కాలం నాటివి.

ఆ కాలంలో రాత్రిపుట నడిచేటప్పుడు దివిటీలు తీసుకువెళ్ళేవారు.

ఎప్పుడైనా సరే లైటు పడ్డంతసేపే వెలుగు.

కదా?

అలా ఆ దివిటీ కాంతి బిల్డింగుల మీద పడ్డప్పుడు అవి కాంతివంతాలయ్యేవి. దివిటీని ముందుకు తీసుకువెళ్ళిన తరువాత వెనుకనున్న భవంతులు వెలవెల తెలతెల.

అలా ఆ రాకుమారుల ముఖాలు వెలాతెలా పోతున్నాయని కాళిదాసు ఉవాచించాడు.

సునంద అట్లా రాకుమారి చెయ్యి పట్టుకొని తీసుకొనిపోతోంది ముందుకు, ఒక్కొక్కరిని వర్ణిస్తూ.

అమ్మాయీమణివారు చూట్టం, ముందుకు నడవటం.

రాజుల, రాకుమారుల మొహాలు ఎర్రబట్టం.

ఆ కోపమంతా సునంద మీదకు తిరగటం.

సునంద సరిగ్గా చెప్పలేదేమో నాగురించి, అందుకే ఆ సుందరి అలా వెళ్ళిపోయింది.

సునందకు నేను నచ్చలేదేమో, ఏదో చెడు చెప్పుంటుంది చెవిలో, అందుకే ఆ సుందరి అలా వెళ్ళిపోయింది.

సునంద, సునంద, సునంద అని అందరి మనస్సుల్లో సునంద పేరే.

రాకుమారి అట్లా దాటటం, అందరి మనస్సుల్లో సునంద మీద కోపం పెల్లుబికటం.

ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే ఇదేనేమో.

మంగలం అంటే వేపుడు చట్టి. మాంసం అవీ పెట్టుకుని తినే పెద్ద చిల్లపెంకు ముక్క.

పెంకునొదిలి చట్టి గురించి మాట్టాడుకుందాం కాసేపు.

చట్టి అంటే కుండ.

ఆ కుండకొకపక్క చిల్లెట్టి అందులో మిరపకాయలు పడేసి అగ్గి మీద కుమ్ముతారు.

అలాగే పేలాలు కూడా వేయించుకోవచ్చు.

అసలే ఓటి కుండ. దానికో చిల్లు. పైగా కింద అగ్గి.దాని బాధలో అది.

ఉరుముడు దేవుడు బలం ఉంది కదాని ఉరుము ఉరిమి దాని మీద పడ్డాట్ట.

మిరపకాయలు, పేలాలు కాచుకునే ఓటికుండకు విలువ ఏమి ?

అది కాపోతే ఇంకోటి. అంతేగా!

అలాటి మంగలమ్మీద ఉరుము పడితే ఏమి, బరువు పడితేనేమి.

పోయేది ఉత్త ఓటికుండేగా? అంతకుమించి పోయేదేమీ లేదు.

అద్దానికోసం ఉరుముకున్న బలం అంతా నష్టమయ్యిందని చెప్పటమన్నమాట.

సరే చట్టినొదిలి చిల్లపెంకు దగ్గరకొద్దాం.

దీన్ని గురించి ధూర్జటి కాలంలోనే ప్రస్తావన ఉన్నది.

“ఎంగిలి మంగలంబులగు దొప్పల్ రా గతంబేమి?” అని తిన్నడి కతలో చెప్పిస్తాడు ధూర్జటిగారు.

ధూర్జటంత ఆయనచేత పద్యాల్లో ఇరికించబడే విలువ కూడా వున్నది మంగలానికి.

సరే అదలా పక్కనబెడితే, రాకుమారి మీద కోపం సునంద మీదకు తిరగటం అందరికీ అనుభూతికి వస్తోంది.

మరి ఆవిడ అలా అందరినీ కాదనుకుని వెళ్లిపోతే ఎట్లా ?

దాటిపోయిన ఒక్క రాజకుమారుడి ఛస్, ఎంత అవమానం అనుకుంటో చెయ్యి కత్తి మీదకు వెళ్ళిపోతోంది.

అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెయ్యిస్థంభాల్లా నుంచొన్న రాకుమారులనందరినీ వద్దనుకొని ఇక చివరివాడి దగ్గరకొచ్చింది.

ఆ చివరాయన ఎవరో కాదయ్యా!

మహావీరుడు, నాన్నగారి ఆజ్ఞ మీద నర్మదను దాటి వచ్చేసిన సుందరుడు మన అజుడు.

ఈయన మంటపానికి వచ్చేప్పటికి సొల్లు కార్చుకుంటూ ముందే వచ్చేసి ముందు సీట్లాక్రమించుకున్న రాకుమారులతో నిండిపోటంతో ఈయన సివరాఖరికి నుంచున్నాడు.

ఆయన్ని చూసి ముందు సునందకు కళ్ళు తిరిగినయ్.

సంభాళించుకున్నది. ఆతర్వాత అమ్మాయి గారి చెయ్యి సుతారంగా నొక్కింది.

అంతే అమ్మాయిగారికి అర్థమైపోయింది. నాకు నచ్చిందేదో దీనికి దొరికింది అని తల పైకెత్తింది.

అంతే! సునంద నోటినుంచి మాట కూడ రాకముందే, ఈవిడ చేతిలో మాల మనవాడి మెళ్ళో పడిపోయింది.

“లలాటలేఖానపున:ప్రయాతి” అని ప్రమాణవాక్యం.

దాన్ని అధిగమించేది ఈ భూప్రపంచకంలోనే లేదు.

ఏ శక్తీ దాన్నడ్డగించలేదు.

ఏ శక్తి దాన్నోడించలేదు.

సాక్షాత్ పరమేశ్వర ప్రసాదం.

ఈ లోకానికి ఆ దేవదేవుడు ప్రసాదించిన వరం.

ఆయన ఆ పనికి బ్రహ్మను నియోగించినాడు.

అంత శక్తిమంతం.

అందరి కళ్ళూ అటువైపు తిరిగినాయ్.

కొంత మంది కళ్ళల్లో చింతనిప్పులు.

కొంతమంది కళ్ళల్లో భాష్పపరిపూర్ణలోచనం.

కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యజనకం.

కొంతమంది కళ్ళల్లో విభ్రమం.

అలా నవరసాలు కురిసినాయ్ ఆ సభలో.

ఆ స్వయంవర మంటపంలో.

అజుడిని అంతవరకూ చూడనివారు, నగరప్రజలు ఆయన సౌందర్యానికి ముగ్ధులైపోయినారు.

త్రిలోక మోహినికి జగదేకసుందర వీరుడు దొరికినాడని జేజేలు పలికినారు.

మాల పడటమేమి ? కల్యాణమగుటమేమి ? అన్నీ వరసాగ్గా జరిగిపోయినాయ్.

అమ్మాయీమణివారికి చీరలు, సారెలు, నగలు, మణిమాణిక్యాలు, రతంఖచితాలు, ఏనుగులు, అంబారీలు – అబ్బో ఒకటా రెండా అన్ని ఇచ్చి అజుడి వెంట పంపించారు.

అప్పుడు జరిగిందయ్యా ఒక సంఘటన.

జరిగిన సంఘటనకు కారణం మత్సరం.

మత్సరం అంటే అసూయ.

తనకులేనిది వాడికున్నదేనని అసూయ.

తను చేజిక్కించుకోలేనిది వాడి పరం అయ్యిందేనన్న అసూయ.

పెళ్ళి అయ్యేంతవరకూ మౌనంగా వున్నవారు, అజుడు అమ్మాయిని, భార్యను తోడ్కునిపోతుంటే ప్రయాణం పెటాకులు చేద్దామని నిశ్చయించుకొనినారు.

దానికంతటికీ కారణం మత్సరం.

మానవుడికి బయటి శత్రువుల పీడ ఉన్నా లేకున్నా, అంత:శ్శత్రువుల పీడ తప్పక ఉంటుంది.

వాటికి అరిషడ్వర్గాలని పేరు.

అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు.

మాత్సర్యం అన్నిటికన్నా చివరిది.

అన్నిటికన్నా చివరిదానికి పవరెక్కువ.

అసలు కన్నా కొసరెక్కువ కదా, అలాగన్నమాట.

మాత్సర్యంతో ఉడికిపోయేవాడికి విచక్షణ వుండదు.

మునిపల్లె సుబ్రహ్మణ్య కవిగారు తన ఆధ్యాత్మ రామయణ కీర్తనల్లో చెప్పిస్తారు

పావనులై యీ క్రమ మెఱిగిన మ, ద్భక్తులు మత్సరము జెందుదు
రీ వసుధను భక్తివిహీనులుగ, గర్హితులై దుర్మతులై
కేవలమును శాస్త్రగర్తములబడి, కెరలిభవశతములు, నొందుచు
భావము చెడి సుజ్ఞానదూరులయి, పోవుట నిశ్చయము…..

అలాగే త్యాగరాజులవారు తెర తీయగ రాదాలో ఈ విధంగా అనిపిస్తారు.

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకట రమణ మత్సరమను (తెర)
పరమ పురుష ధర్మాది మోక్షముల
పార-దోలుచున్నది నా లోని (తెర)

సరే అదలా పక్కనబెట్టి అసూయాగ్రస్తులైన రాజకుమారుల దగ్గరకొద్దాం.

పెటాకులు చేసి అమ్మాయీమణిని తీసుకొని పోవాలని వారి ప్లాను.

అలాటి ప్లానులు ఆ కాలంలో సర్వసాధారణం.

అయితే పెటాకులకు విస్తరాకులకు భయపడే వీరులా మన సైన్యం ?

ఆ సైన్యానికి నాయకుడెవరు ? అజుడు! మహావీరుడు. వీరాధివీరుడు.

చుట్టుముట్తారు. నాదాలు, నినాదాలు అవీ వినపడుతున్నాయ్.

రథాల పరుగుల చప్పుడు.

దుమ్ము రేగిపోతోంది.

ఆకాశమంతా దుమ్ముతో కప్పబడిపొయ్యింది.

ఎర్రగా జేగురు రంగు.

సూర్యుడు అస్తమించే సమయం కావొస్తోంది కూడాను.

ఇదంతా చూసి ఇక సమయం వ్యర్థం ఎందుకు చక్కగా సూర్యుడు పొద్దుగుంకేలోపల అటో ఇటో తేల్చేద్దాం అని రంగంలోకి దిగిపోయాడు మనవాడు.

అలాగ్గా శత్రుసేనల్ని చెండాడేస్తున్నాడు.

విల్లు పట్టుకుంటే తిరుగే లేదని చెప్పుకున్నాంగా!

ఆ విల్లు పట్టుకుని రణరంగంలో నుంచుంటే ఎట్లా వున్నాడయ్యా అంటే వందమంది కోదండధారుల సమానంగా వెయ్యి దిక్కులనుంచి లక్షల బాణాలు విసిరే తేజంతో వున్నాడు.

అయితే అవతలి కలగాపులగ సైన్యం తక్కువదేమీ కాదు.

అజుడి రథాశ్వాలపై నాలుగొందల బాణాలు.

రథసారథిపై ఆరొందల బాణాలు.

ధ్వజం మీద యాభై, అజుడిపై అరవైవందల బాణాలు వేసారు.

వాటినన్నింటినీ ఎడమచేత్తో గాల్లోనే ఖండించి అవతల పారేసాడు మన వాడు.

ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చాడు.

అంతే ఆకాశం ఫెటిల్లుమని పగిలింది.

అమ్ములతో నిండిపోయింది.

వాళ్ళందరి శిరస్సుల మీద, లలాటాల మీద, మెడల మీద, బాహువులమీద, వక్షస్థలాల మీద ఉరుములు పిడుగులు పడ్డట్లుగా బాణాలు కురిపించే సరికి భీతిల్లిపోయి పరుగులు పెట్టారు

అందరూ కకావికలు. పరుగులు. ఉరకలు.

రక్తాలు. గాయాలు. శరీరాలు.

అటూ ఇటూ కేకలు.

రక్షించు రక్షించుమని కేకలు.

వీరుడు ఒకసారి శత్రువు మీద విల్లు ఎత్తాడంటే దించటం సామాన్యం కాదు.

కానీ ఎప్పుడైతే రక్షించండి అని వినపడిందో అప్పుడు విల్లు దించేసాడు.

బాణాల శరపరంపర ఆపేశాడు.

అవతలి సైన్యం కాస్త కోలుకుంది.

ఆహా ! ఇంత వీరుణ్ణి చిరకాలానికి చూసాం అని ఒకడు

ఓహో ఏమా బాహుబలం ఏమా ఆకారం అని ఇంకొకడు

యువరాజుగా ఉన్నప్పుడే చక్రవర్తిలా వున్నాడు, చక్రవర్తయ్యాక ఎట్లా వుంటాడో అని ఒకడు.

ఇన్ని యుద్ధాలు, ఇంతమందితో చేసాం కానీ, ఇంత వీరుణ్ణి ఎక్కడా చూడలేదయ్యోయ్ అని ఒకడు.

ఇలా అవతలి పక్క సైన్యంలో మాటలు వినిపిస్తున్నాయ్.

ఇంతలో ఇదే అదను అనుకొని విశ్రవసుడనేవాడు ఆ వెయ్యిస్థంభాల్లా నుంచొనున్న రాకుమారుల్లో నాలుగొందల స్థంభాలను తీస్కొని ఒక్కుమ్మడిగా మీద పడ్డాడు.

అజుడి చెయ్యి అమ్ములపొదిలోకి వెళ్ళింది.

చేతికి సమ్మోహనాస్త్రం తగిలింది.

దాని సంగతే మరచిపోయినాడు ఆయన.

ఇలాటి ఆపత్సమయంలో ఉపయోగానికొచ్చేందుకే చేతికి తగిలిందిలే అనుకొని దాన్ని సంధించాడు.

అంతే సమ్మోహనం గాసు రావటం, ఆ నాలుగొందల రాకుమారులు, వాళ్ల సైన్యం అంతా మూర్చ పోవటం జరిగిపోయింది.

అంతమంది అలా శలభాల్లా పడిపోవటం చూసి, మిగిలినవారు కూడా కింద పడిపోయారు దణ్ణాలు పెడుతూ

అలా విజయం ఆ వీరుణ్ణి వరించింది

సరే, ఈ పెళ్ళి సంగతులు అవీ రఘు మహారాజుకు చేరిపోయినాయ్

పెళ్ళి సంగతి చెప్పినవారు యుద్ధం సంగతి కూడా చెప్పారు

అందరు తండ్రుల్లా ఆయన, ఆ రఘు మహారాజు ఖంగారు పడలా

అన్నాడు, ఈ పాటి యుద్ధాలు ఇంకో వంద చేసి, గెలిచి ఇంటికొస్తాడు మావాడు అని మీసమ్మెలేసి చెప్పాడు

అంత నమ్మకం పిల్లలంటే ఆ రోజుల్లో

పిల్లలూ ఆ పెద్దల నమ్మకాలను వమ్ము చేయకుండా నూటికి వెయ్యి సాటం ప్రయత్నిచేవారు ఈ జమానా వారిలా కాకుండా

కోడలు వచ్చేసింది ఇంటికి

కనీవినీ ఎరగని రీతిలో ఉత్సవాలు జరిపినాడాయన

సాక్షాత్ మహాలక్ష్మే ఇంటికొచ్చేసింది అన్నంత ఇదిగా జరిగిపోయినాయ్ ఆ ఉత్సవాలు

కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక సమయం వచ్చింది పెద్దాయనకు

ఏం సమయం ?

రిటైరుమెంటు సమయం

అదేనండీ వానప్రస్థ సమయం

చక్కగా తపాలు, జపాలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతానని చెప్పి రాజ్యాన్ని అజుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడాయన

ఈ వానప్రస్థం గురించి భాగవతంలో ఒక మాంచి పద్యం ఉన్నది

దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలం
సత్యపూతాం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్ – 16

(శ్రీమద్భాగవతం 11-18-16)

అలా చక్కగా, సౌఖ్యంగా గడపాలని రూలు

వయసొచ్చాక అంతకన్నా కావలసిందేముంది ?

అందువల్లా ఆయన శేష జీవితం చక్కగా గడిచిపోయింది

ఆ పైన అజుడు ఎన్నో ఏళ్ళు పెద్దాయన బాటలోనే రాజ్యాన్ని పరిపాలిస్తూ గడిపాడు

అరివీర భయంకరుడు దశరథుణ్ణి కన్నాడు

ఆ తర్వాత ఆయన కథ, రాములవారి కథ మనకు తెలిసిందే!

బతికితే అజుడిలా, వీలైతే ఇంకా బ్రహ్మాండంగా రఘు మహారాజులా బతకాలి

ధర్మంగా బతకాలి, వీరత్వంతో బతకాలి, జనరంజకంగా బతకాలి, పరిపాలనాదక్షుడిగా బతకాలి, మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలి

ఇంతకీ అజుడి భార్య పేరేమిటో తెలుసునా ?

ఏ సుకుమారి కోసం ఇంత కథ జరిగిందో తెలుసునా?

ఏ సౌందర్యరాశి కోసం ఈ కథ జరిగిందో తెలుసునా?

ఆవిడే ఇందుమతీదేవి

ఈ కథను కాళిదాసు ఎంతందంగా వర్ణిస్తాడని?

అందుకు కాదు ఆ కథలు, ఆ ఇతిహాసాలు మనలో నిలిచిపోయింది

అవును అందుకే!

*

మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు…

 

జుట్టు.
గిరజాల జుట్టు.
రింగు రింగుల జుట్టు.
అందమైన జుట్టు.
ఎంతో అందమైన జుట్టు.
అబ్బబ్బా జుట్టు.
అమ్మమ్మా జుట్టు.
మదిని దోచేసే జుట్టు.
మనసుని గిరజాలుగా తిప్పే జుట్టు.
కళ్ళను రింగుచక్రాల్లా చుట్టేసే జుట్టు.
హృదయాన్ని గిరగిరా తిప్పి గిరవాటు వేసే జుట్టు.
అంత రసికుడు గిరీశానికే వన్నెతెచ్చిన జుట్టు.

గిరజాలు లేపోతే వాడి మొహం మధురవాణి చూసేదీ ?
చస్తే చూసేది కాదు. తన్ని తగలేసేది.
నున్న మొహం, సన్న కళ్ళజోడు, తెల్ల లాల్చీ, గిరజాల జుట్టు.
బండ మొహం, బండ కళ్ళజోడు, పంచె, గిరజాల జుట్టు.
ఇలా ఏ మొహాలతో పని లేకుండా అందాన్ని ఇనుమడింపచేసేది గిరజాలు.
జుట్టున్నవాడి అందం వేరు.
జుట్టులేనివాడి అందం వేరు.
గిరజాల జుట్టున్నవాడి అందం మరీను.
గిరజాలు చూసి చటుక్కున పడిపోని ఆడవాళ్ళు ఉండరని ఎవరిదో ఉవాచ.

ఆ గిరజాలు ఆడవారికుంటే ఆ అందమే వేరు.
కొప్పున్నమ్మ ఏ తిప్పు తిప్పినా అందమే అని ఒక నానుండి.

గిరజాల జుట్టువారికా బాధ లేదు.
ఏ తిప్పు తిప్పినా ఒకే రకంగా రింగులుగా ఉంటుంది.
అదీ సౌలభ్యం.
దువ్వెనతో పనిలేదు.
దువ్వెనతో పని ఉన్నా పనిలేనట్టే. దువ్వినా దువ్వకున్నా ఒకటే
తలంటి పోసుకుంటే ఆరబెట్టినా ఆరబెట్టకున్నా ఒకటే
రింగుల్లో పడి నీళ్ళు తళతళ మెరుస్తుంటే నెత్తి మీద నీళ్ళుంటే ఏమి ? జలుబొస్తే ఏమి ?
ఆ అందం చూట్టానికి కళ్ళు చాలవ్.
ఆమధ్య గిరజాలున్న ప్రతివారు భావకవులైపోయినారు.
భావకవులవాలనుకున్నవారు గిరజాలు తిప్పుకున్నారు.

అలాటి భావకవుల్లో ఒకరు , ప్రముఖులు , దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఆయన ఎంత భావకవి అయినా బోలెడంత హాస్యప్రియత్వం ఉన్నది
భావకవుల అతిని చూచి విసుగుపుట్టిందేమో మరి – గిరజాలు ఇరికించిన ఈ ప్యారడీ వచ్చింది

మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవిలేవు
కవితయందుతప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ….
మరి ఒక్క భావకవి గారి గురించే మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది.
ఒకసారి జ్ఞానపీఠం గురించి కూడా మాటాడుకుందాం
వారు తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
అదేనండి విశ్వనాథ వారి గురించి-
మరి విశ్వనాథ వారు వారి ఆత్మకథలో ఇలాగంటున్నారు.
నా రెండవ ఫారములో రాగం సత్యనారాయణ యని యొక డుండెడివాడు. అతని తండ్రి ఫారెస్టు ఆఫీసరు. ధనవంతులు వారు. కాపు లనుకొందును. అతడు కొంచెము బొద్దుగా నుండెడి వాడు. జుట్టు మాత్రము- హిందీలో గొప్పకవి సుమిత్రానందన్ పంత్, తెలుగులో నొక గొప్పకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి- వీరి జుట్టువలె నుండెడిది. వీరిద్దఱిని నేను పెద్దనైన తరువాత నెఱుగుదును. ఆ జుట్టు మాత్రము చిన్నప్పుడు యెఱుగుదును. అప్పటి నా వేషము చెప్పినచో మీకిప్పుడు నవ్వు వచ్చు ననుకొందును. ఒక లాగు, ఒక చొక్కా, చేతులకు మురుగులు, కాళ్ళకు కడియాలు, నెత్తిమీద జుట్టు, ముందు వసారా గొఱిగింపు, జుట్టుముడి వెనుక గిరజాలు, ముందు సన్నని గిరజాలు- ఇది నా వేషము. ఆ రాగం సత్యనారాయణ జుట్టు నా కబ్బురము గొల్పెడిది. నా వేషము సహజ మన్నమాట!”

మనకు తెలిసిన విశ్వనాథ వారికి వాస్తవంగా గిరజాల జుట్టు ఉండెడిది అన్న సంగతి తెలియట్లా? రాజకీయ నాయకులవరకు వస్తే చిలకమర్తి వారు టంగుటూరి వారి గురించి చేసిన వర్ణనలో ఆ అందగాడి గిరజాలను ఇలా వర్ణించారు.
వలె వాటు కండువా వైచినాడు
చెవుల సందున గిరజాలు చిందులాడ
మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త
టంగుటూరి ప్రకాశము రంగు మెరయ
ధవళగిరి తీర్ధము నకును తరలివచ్చె
ఇక జగమెరిగిన చిత్రకారుడు వడ్దాది పాపయ్య గారి చిత్రాల్లోని పురుషులను చూడండి
ఆడవారి అందాన్ని అత్యద్భుతంగా చిత్రించే ఆయన కలం మగవాళ్లను ఎంతో సుకుమారులను చేసి కొసతేలిన ముక్కుతో చక్కగా గిరజాల జుట్టుతో చిత్రించి మనకు వదిలిపెట్టింది
సినిమాల్లో హీరోలకు కూడా గిరజాల జుట్టంటే ఎంత ఇష్టమో.
కృష్ణగారిని, శోభనుబాబుగారిని చూడండి.
మొత్తం గిరజాలున్నా లేకున్నా, ఫాలభాగంలో మటుకు ఒక వంకీ తిరిగి వుంటుంది.
మొత్తంగా లేదే అన్నబాధను అలా ఒకటి తిప్పి ముందుకు పడవేసి కోరిక తీర్చుకున్నారు.
ఇహ కొబ్బరినూనె రాసి నున్నగా దువ్వితే హరోం హరహర.
చేతిలో ఇంత నూనె వేసుకొని గిరజాలకు మర్దన చేస్తూ ఉంటే మాడులో కూసాలు కదిలి జ్ఞానం పదింతలవ్వదూ ?
నూనె రాయకుండా వదిలేస్తే గోధుమరంగులోకి తిరిగి కపీశ్వర దర్శనమవ్వదూ ?
ఎలాగైనా గిరజం గిరజమే! దాని అందం దానిదే! ఆ అందం ఇంకోదానికొస్తుందీ ? దిష్టి కొట్టే పనీ లేదు. పొడుగు జుట్టున్నవారి మీద అనవసరంగా దుర్మార్గపు కళ్ళు పెట్టి నాశనం చేస్తారు కానీ గిరజాలను చెయ్యమనండి చూద్దాం?
జేజమ్మ దిగిరావాలి, గిరజాలకి దిష్టి తగలాలంటే!
అసలు చెప్పాలంటే, గిరజాలు మన పుట్టుకతో ముడిపడి వున్నవి
బిడ్డ పుట్టినప్పుడు చూడండి.
జుట్టు చుట్టలు చుట్టలుగా ఉంటుంది.
దాన్ని సాపు చేసి మంత్రసానో, డాక్టరమ్మో, నర్సమ్మో మనకిస్తుంది.
అలా జననంలోనే గిరజాల ప్రాముఖ్యత ఉన్నది.
దేవుళ్ళకి కూడా గిరజాల జుట్టంటే చాలా ఇష్టం
మన కోరికలు తీర్చి బదులుగా మన జుట్టు పుచ్చుకుంటారు
కొంతమంది పుట్టువెంట్రుకలు తీయించాలని అట్టిపెడతారు.
అప్పుడు చూడండి ఎంత చక్కగా రింగులు రింగులు తిరిగిపోయుంటుందో.
అలా మొక్కుల్లో కూడా గిరజాల ప్రాముఖ్యత ఉన్నది.
ఇక రింగుల గిరజాలు వదలి, ఒకసారి గిరజాల మీద చలామణిలో ఉన్న వాక్ ప్రయోగాలు చూద్దాం
“ఆయన పెద్ద గిరజా పెట్టించినాడులేబ్బా!”
“వాడిది గిరజాలు జుట్టులేయ్యా, తలంటిపొయ్యాలంటే చచ్చేచావు”
“ఇంత పొడుగు జుట్టు ఆరబెట్టుకోలేక చస్తున్నామమ్మా, దాన్ని చూడు కురచగా ఒక్క నిముషంలో ఆరిపోతుంది”
ఇక ఇంకో పక్కకు వస్తే, గుళ్ళో వైష్ణవ సాములు పెట్టించేది గిరజా!
ముందు భాగంలో కాస్త గొరిగేసి ఉంటుందే అదీ గిరజా!
అలా గొరిగిన తరవాత నామం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఫాలభాగం ఎక్కువైపోయి ముఖంలోని తేజస్సు చండప్రచండంగా ఉంటుంది.
అదీ లెక్క అన్నమాట.
క్రీడాభిరామంలో వల్లభరాయుడు ఇలా చెప్పిస్తాడు.

కర్పూర బూచాయ కరమొప్ప నీర్కావి
మడుగుదోవతి పింజె విడిచి కట్టి
గొజ్జంగి పూనీరు గులికి మేదించిన
గంగమట్టి లలాటకమున దీర్చి
వలచేత బంగారు జల పోసనముతోడ
ప్రన్నని పట్టు తోరము ధరించి
జరిగొన్న వెలి పట్టు జన్నిదంబుల లుంగ
యంటులు వాయంగ నరుత వైచి
తళుకు చెంగావి కోకయు వలుదశిఖయు
చిగురు బొమ్మంచు పెదవులు చిన్నినగవు
నంద మొందంగ వచ్చె గోవిందశర్మ
మాధవునిపట్టి యొసపరి మన్మథుండు

వలుదశిఖ అంటే లావుపాటి శిఖ అని అర్థం.
అంతలావు శిఖ కావాలంటే జుట్టు బ్రహ్మాండంగా పెంచాలె, ఆ తర్వాత చటుక్కున గిరజా పెట్టించాలె.
అప్పుడు ఎంతందంగా ఉంటుందీ ?
అందుకు కాదు తన పద్యంలో మన్మథుడిని చేశాడు వల్లభరాయుడు?
అదండీ సంగతి.
ఇక ఇతిహాసాలకు వెళ్లిపోతే బోల్డు చెప్పుకోవచ్చు.
అన్నిటికన్న ప్రముఖమైనవి ఒకటి రెండు మాత్రం చెప్పుకుందాం ఇప్పుడు.
మొదటిది ద్రౌపదికి గిరజాల జుట్టు ఉంటే వాడు, ఆ దుర్మార్గుడు ఆ జుట్టు, అంత కుఱచ వేణి పట్టగలిగేవాడా?
అది లేకపోబట్టి, ఆయమ్మకు ఇంతలావు జడ ఉండబట్టి కాదూ, వాడు జుట్టుపట్టి లాక్కురావటం జరిగింది ?
అందుకు కాదూ మహాభారత యుద్ధం జరిగిందీ ?
అలా గిరజాలు లేకపోబట్టి అంత హననం జరిగింది.
దీన్నే ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. గిరజాలు లేకపోబట్టి మహాభారతం మనకు మిగిలింది.

ఆ గిరజాల మహత్యం పరమాత్మకు తెలిసే తనకు గిరజాలు అట్టిపెట్టుకుని మిగిలినవారికి లేకుండా చేశాడు.
పరమాత్మ గిరజాల జుట్టు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండవది
పోతన తన భాగవతంలో యుద్ధ సమయంలో నల్లనయ్య జుట్టుని వర్ణిస్తాడు.
ఎలా ? ఇలా – ఒక చక్కని పద్యంతో
“హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
……
“సూక్ష్మంగా దీని అర్థమేమమనగా అర్జునిడి రథానికి సారథి అయినా పరమాత్మ నుదిటి మీద పట్టిన చెమటకు, ఆ నుదుటి మీద ముంగురులు గుండ్రంగా రింగులు తిరిగిపోయి గిరజాలు గిరజాలుగా అతుక్కుని పోయి ఆ నుదురు చెప్పలేనంత అందంగా ఉందిట. గుర్రాల డెక్కల వల్ల రేగిన దుమ్ము బూడిదవర్ణపు రంగుతో మరింత అందంగా ఉన్నాడట పరమాత్మ. మరి అంత అందగాడిని వర్ణించడం పోతన గారికి తప్ప ఎవరికి సాధ్యం?
సరే, అది అలా పక్కనబెడితే గిరజాల జుట్టుకు ప్రత్యేకంగా ఒక జీన్ ఉన్నది.
గుర్రపు జీను, తొడుక్కునే జీను కాదండి, మానవ జీను.
దాన్ని ట్రైకోహ్యాలిన్ జీన్ అని అంటారు.
ఈ జీన్ ఉన్నవాళ్ళ సంతానం ఆ జీను నుంచి తప్పించుకోలేరుట.
అంత శక్తివంతమైంది ఆ గిరజ జీను.
తెల్లవారిలో గిరజాలు తక్కువ.
నల్లవారిలో గిరజాలు ఎక్కువ.
క్రౌంచద్వీపంలో సలూనుల నిండా గిరజాలు తిప్పే యంత్రాలే.
గిరజాలను సరిచేసే యంత్రాలే.
అదో పెద్ద బిజినెస్సు కూడాను.
ఎన్ని కుటుంబాలు బతుకుతున్నయ్యో ఆ గిరజాల ఆదాయమ్మీద.
అయ్యా, ఇలా బోల్డు చెప్పుకుంటో పోవచ్చు, ఆ గిరజాల జుట్టు మీద. ఇహ ఇక్కడికాపి వచ్చే జన్మలోనైనా గిరజాల జుట్టు కావాలని, ఆ గిరజాలతో ఏ దేశానికి లేని అందం మన దేశానికి సొంతం కావాలని అందరూ ఆ పరమాత్మను కోరుకోవాలని నే కోరుకుంటూ
శలవు

* * *

పేరడీ

 

చిట్టిగారె – ఆనందభైరవి – రూపకం

పల్లవి:

వలలా యీ అన్న – మేలరా ఈ వేళ నాకు తనువేల తరుణులేల – ధనమేల ధామమేల ॥వలలా॥

చరణం:

ఆకులేల పోకలేల – కూరలేల పప్పులేల

చిట్టిగారె రాకయుండి – ఆశలుడిగి యున్నవేళ ॥వలలా॥

సొగసేల సొమ్ములేల – అగరేల గంధమేల

చిట్టిగారె దయలేక మేను – సగమై యున్నట్టివేళ ॥వలలా॥

అరిటాకు వడ్డనలేల – వంటలేల వార్పులేల

చిట్టిగారె కోర్కె బాసి – ఆశలుడిగి యున్నవేళ ॥వలలా॥

 

*

జంటకవిత్వం – కుదరని జంట

జంటకవిత్వం, జంటకవులు మనకు కొత్తకాదు. అలాటి జంటల్లో ఒక జంట అవుదామని, జంటకవిత్వం రాద్దామని దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుఱ్ఱం జాషువా కలిసి అనుకున్నారట. తిరుపతి వేంకట కవుల్లాగా ఒక మంచి పేరు పెట్టుకుందామనుకున్నారు కూడాను. అలా పేరు కోసం ఆలోచిస్తే వచ్చినవి ఇవిట. “దీపాల జాషువా, గుఱ్ఱం పిచ్చయ్య, పిచ్చయ్య జాషువా, గుఱ్ఱం దీపాల, గుఱ్ఱం శాస్త్రి” . ఇలా నానా రకాలుగా చూస్తే సరైన పేరే కుదరలేదు కనక మనకు జంటకవిత్వం ఎందుకులే అనుకొని మానేశారుట!

2

అపురూప చిత్ర సౌజన్యం :

సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి. ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో “ధర్మసందేహాలు” శీర్షిక ఆరంభించినప్పుడు శ్రీ ఆమంచర్ల గోపాలరావు, నండూరి, సి.రామమోహనరావు. ఆమంచర్ల గోపాలరావుగారు పరమపదించాక ఉషశ్రీ, ఏ.బి.ఆనంద్ నిర్వహించారు

భైరవ నాదం అను మిస్టర్ అండర్ డాగ్ లైఫ్ స్టోరీ!

 

కుక్క- శునకము-  విశ్వాసమునకు మొదటినోరు. నమ్మికకు మారుపేరు. ఆటపాటలందు ఆరితేరు. ఎప్పటి విశ్వాసం. ఎప్పటి కుక్క. భారత కాలం నాటిది. కుక్క లేకపోతే ఏకలవ్యుడు ఈ ప్రపంచానికి తెలిసేవాడా?

అసలు ఏకలవ్యుడెవరు ? నిషాద రాజ కుమారుడు. కిష్టప్పకు వరసకు సహోదరుడు అని కథ. నిషాదులకు దత్తతకే వెళ్ళాడని ఒక కథ. నిషాదులంటే అప్పట్లో అందరికీ చిన్నచూపు.  నిషాదులకు రాకుమారుడు కానీ బయటి ప్రపంచానికి పనికిరానివాడు. ఇంటికి పులే కానీ బయటకు  ఏదోనని ఒక సామెత. ప్రపంచానికి అలుసు.

 

అలా ద్రోణుడికి కూడా అలుసే.

అవును, ఆచార్యుడికి కూడా అలుసే.

నీకేమి, నా శిష్యరికమేమి అని వెళ్ళగొట్టినాడు.

వెళ్ళగొడితేనేమి?

ఏకలవ్యుడికి గురువులంటే అభిమానం.

గురువులంటే గౌరవం.

పెద్దలంటే ఆదరణ.

 

అలా ఒక బొమ్మ చేసుకుని కూర్చున్నాడు.

ఎక్కడ ?

మగధ రాజ్యం సరిహద్దుల్లో.

 

ఎందుకు ?

ఆ రాజ్యంలో వాళ్ళ పెంపుడు నాన్న సామంతుడు.

 

జరాసంధుడు సామంతుల్ని సైన్యాధిపతులుగా చేసి ఊడిగం చేయించేవాడు.

అవును, జరాసంధుడి కొలువులో నిషాదులు సైన్యాధిపతులు.

అలా ఏకలవ్యుడు మగధలో పెరిగాడు.

మరి పెరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తిరిగాడు.

అడవులు ఔపోసన పట్టినాడు.

అవసరం వచ్చినప్పుడు, విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ అడవినే ఆశ్రయించినాడు.

 

సరే ఇదొక కథ, దీనికి ఇంకో కతా రూపం కూడా ఉన్నది.

మహానుభావుడు ఆరుద్ర రాసిన ఒక కథలాటి వ్యాసంలో, వ్యాసంలాటి కథలో.

ఆయనంటాడూ – ఏకలవ్యుడు జరాసంధుడి సేనాధిపతి.

ద్వారకమీదికి 18 సార్లు జరాసంధుడు దండెత్తినప్పుడు ఏకలవ్యుడు సేనాధిపతి అని.

ధర్మజుడు చేసిన రాజసూయంలో ప్రముఖ పాత్ర వహించినాడని తెలియచేస్తాడాయన.

 

పుట్టుపూర్వోత్తరాలకు వస్తే కిష్టప్ప, ఏకలవ్యుడు మేనత్త మేనమామ బిడ్డలని చెప్తాడు కూడాను.

 

సంస్కృత హరివంశంలో

దేవశ్రవా: ప్రజాతస్తు

నైషాదిర్య: చ్రతిశృత:

ఏకలవ్యో మహారాజ

నిషాదై: వధివర్థిత:

అని ఉన్నది

 

సరే అది అంతా పక్కనబెట్టి అడవిలోకి వచ్చేద్దాం.

ఏకలవ్యుడు బొమ్మ చేసినాడు అని చెప్పుకున్నాం కదా

ఇంతకీ ఆ బొమ్మ ఎవరిదీ ?

ద్రోణుడిది. ఆచార్యుడిది. పరమవిద్య పారంగతుడిది.

బొమ్మతో మాట్టాడుకుంటూ విల్లెక్కుపెట్టి దదదడలాడించేవాడు.

బొమ్మని కాదండి, బాణాలను, విల్లుని, మొత్తం విలువిద్యని.

అలా కళ్ళు మూసుకొని బాణం వేసాడంటే జేజమ్మ దిగిరావల్సిందే!

అంత గురి.

 

ఓ రోజు ఆటాడుకుంటున్నాడు.

విద్యకు సానపెట్టుకుంటున్నాడు.

ఇంతలో పాండవులూ పాండవులూ తుమ్మెదా అయ్యింది.

అంటే వాళ్ళంతా కలిసి మగధ అడవుల్లోకొచ్చారు.

ఎందుకు?

అదేం ప్రశ్న?

వాళ్ళూ రాచబిడ్డలే

అప్పట్లో వేటలూ, వేటపోతులు వాళ్ళకు చాలా కామను.

 

రాచకుమారులకు వేట ఒక ఆనందం

అందుకని వచ్చారు.

 

అర్జునుణ్ణి నువ్వు వీరా కాబట్టి బాణం వెయ్యరా అని ఓ పొగిడి ఆయన వేటాడుతుంటే చోద్యం చూస్తున్నారు.

ఆ ఆటలో వీళ్ళెక్కిన గుర్రాలు ఏకలవ్యుడున్న ప్రాంతానికి వచ్చినై.

వేటకొచ్చినప్పుడు కుక్కలు వెంటబెట్టుకుపోవటం మరింత సాధారణం.

పాండవుల దగ్గరున్న కుక్కొకటి దారితప్పో, దారిచేసుకునో ఏకలవ్యుడి దగ్గరికొచ్చింది.

దానికేమో పాండవులంటే విశ్వాసం.

ఈ ఏకలవ్యుడెవరో తెలవదు.

కొత్తవాడు కనపడగానే పళ్ళికిలించి అరవటం మొదలుపెట్టింది.

ఈయన చూశాడు.

విద్య భంగం అవటం మొదలెట్టింది.

 

కుక్క అరవటం చూసి అర్జునుడొచ్చాడక్కడికి.

యజమానిని చూసి మరింత రెచ్చిపోయింది ఆ కుక్క.

అరుపులు మెరుపులుగా కురిపిస్తోంది

ఈ ఎదవ గోలంతా ఏమిట్రా నాయనా అనుకున్నాడు ఆయన.

 

అర్జునుణ్ణి, ఒరే నాయనా నువ్వెవరు, ఈ కుక్కేంది, ఈ కతేంది అన్నాడు.

నేనెవరా? నన్నే అడుగుతావా, ముందు నువ్వెవరు చెప్పు అన్నాడు ఫల్గుణుడు.

నేను ఏకలవ్యుణ్ణి, ఇదీ సంగతి, అదీ సంగతి అని మొత్తం కతంతా చెప్పినాడు కోపం తెచ్చుకోకండా.

 

కుక్కేమో అరుస్తూనే ఉన్నది.

ఈయన చెప్పేది అర్జునుడికి సగం వినపడీ వినపడక గోల గోల

ఈ కుక్క అరుపులు తగ్గే మార్గం కనపట్టల్లా

సరే ఇట్లా కాదని విల్లందుకున్నాడు

నారి సవరించాడు

కన్నుమూసి కన్ను తెరిచేలోగా గుప్పెడు బాణాలు ఆ కుక్క నోట్లో కొట్టాడు.

విచిత్రంగా దానికి దెబ్బా తగలకుండా, గొంతులోకి వెళ్ళిపోకుండా నోరంతా నిండిపోయినాయ్ ఆ బాణాలు

 

అంతే ఆ కుక్క మౌనవ్రతం దాల్చింది

అరుపులు ఆగిపోయినై

ఇప్పుడు ప్రశాంతంగా మాట్టాడుకోవచ్చు అబ్బాయ్, ఏమిటి సంగతి అన్నాడు అర్జునుడితో

కుక్క పరిస్థితి చూసి అర్జునుడికి ఆల్రెడీ కళ్ళు బైర్లు కమ్మినై

కుక్క నోరు కన్నుమూసేలోగా మూసేయించాడు ఈయనెవడండీ అని విభ్రమంగా చూస్తున్నాడు

అవును, సాక్షాత్ కిరీటి నోట్లో కూడా మాట పడిపోయింది

ఒక రెండు నిముషాలకు తేరుకున్నాడు

బాబూ, స్వామీ, నాయనా నీకు దణ్ణం పెడతా, ఈ విద్య ఏందండి, ఎక్కడ నేర్చుకున్నా ఇందాక ఏదో అనుకున్నా, నా పేరు అర్జునుడు, నువ్వెవరో ఇప్పుడు చెప్పు అన్నాడు

 

ఓ నువ్వు అర్జునుడివా? అంటే కుంతి కొడుకువేనా అన్నాడీయన

అవును అన్నాడు బీభత్స బాబాయ్

నా పేరు ఏకలవ్యుడు, మా అమ్మ పేరు శ్రుతదేవ మీ అమ్మ పేరు పృథ

ఇద్దరూ తోడబుట్టిన అక్కాచెల్లెల్లు కాబట్టి నువ్వు నాకు కజినువి అన్నాడు

 

అటు చేసి ఇటు చేసి నా అన్నవా నువ్వు, ఆనందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నాడు అర్జున్

బయటకైతే ఆనందం అన్నాడు కానీ లోపల బెంబేలు, కుతకుత

వీరుడికి తనకన్నా ఒక మెట్టు పైనున్నవాణ్ణి చూస్తే అలానే ఉంటుంది

సరే పిచ్చాపాటీ అయిపోయినాక, అర్జునుడు వెళ్ళిపోతూ – అన్నా ఆ కుక్క సంగతేంది అన్నాడు

ఆ బాణాలు ఊరకే చేత్తో సుతారంగా తాకితే వొచ్చేస్తయ్ కానీ ఖంగారు పడమాక అన్నాడు అన్న.

అర్జునుడు సుతారంగా తాకినాడు.

ఏదీ రాలేదే? ఊహూ బాణాలు రాలా! కుక్క నోట్లో ఇరుక్కున బాణాలు రాలా!

దిగాలుగా చూచినాడు అన్న వంక.

 

తమ్మీ ఇంతేనా నువ్వూ నీ సుతారం ఇంతేనా అని నవ్వి తన సుతారం ఉపయోగించి బాణాలన్నీ బయటపడేసాడు

ఒక్క రక్తం బొట్టు లేదు, ఒక్క గాయం లేదు, ఒక్క పన్ను ఊడలేదు

కుక్క, నాలిక బయటపెట్టి రింగులా తిప్పుతూ మూతి అంతా తడిమి తడిమి చూసుకుంది

తర్వాత ఆనందంతో గంతులేసింది

నాయనా ఇంకోసారి నీ దగ్గర అరిస్తే ఒట్టు అనుకుంటూ ఏకలవ్యుడి కాళ్ళని నాకి నాకి వదిలి పెట్టింది

అడవిలో ఉన్నాడు, దుమ్ము కొట్టుకుపోయున్నాడు, కాళ్ళు సుబ్బరమైపోయినై ఈ నాకటంతో

నాకింది చాల్లే అని అర్జునుడు ఆ కుక్కను తీసుకుని బై బై చెప్పి అన్నకు వీడ్కోలు పలికినాడు

 

వేట ముగిసింది. రాత్రయ్యింది.

అందరూ నిద్రపొయ్యేవేళ.

గుడారాల్లో గురకలు గుర్రుగుర్రుమంటూ వినపడుతున్నయ్

ఒక్కడు మటుకు నిద్దరోవట్లా.

ఆ ఒక్కడు ఎవరు ?

అర్జున్

కన్ను మూస్తే కుక్క

కన్ను తెరిస్తే బాణం

కన్ను మూస్తే విల్లు

కన్ను తెరిస్తే ఏకలవ్యుడు

పక్క మీద ఎటు తిరిగినా కుక్క నోట్లో బాణాలే గుర్తుకొస్తున్నయ్

ఈ బాణాల గోల తట్టుకోలేక లేచి పక్కనే ఉన్న గుడారంలోకి పొయ్యాడు

 

ఆ గుడారం ఎవరిది? ద్రోణుడిది

గుర్రుపెడుతున్న ఆయన్ని లేపాడు

నాయనా బీభత్స్, ఈ అర్థరాత్రి నాకు అంకమ్మ శివాలు ఏమిటి అన్నాడు

కాదు ఆచార్యా, ఇవి ఏకలవ్య శివాలు అన్నాడు అర్జున్

 

అదేమి శివాలు, కొత్తగా ఉన్నాయి, కథేమిటి చెప్పు అన్నాడీయన

 

కత చాలా ఉన్నది కానీ ఆచార్యా, ఇప్పుడే మిమ్మల్ని చూశాక, ఒక సంగతి గ్యాపకం వచ్చిందన్నాడు ఫల్గుణ్

 

నాయనా కతలకోసం ఏడ్చే పసిపిల్లాణ్ణి కాను, నీ గ్యాపకాల కోసం తపించే ఆడపిల్లనూ కాను – అర్థరాత్రి నాకు ఈ చిత్రహింస ఏమిటి నాయనా అన్నాడు గురువుగారు

 

ఆచార్యా మీరు ఆరోజు గురుకులంలో ఏమన్నారు ?

ఏ రోజు ?

ఆ రోజు, ఆ రోజు పేద్ద విష్ణుయాగం జరిగిన రోజు

ఏమన్నాను ?

ఈ అర్జునుడికి సరిజోడీ ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తానని అందరి ముందు చెప్పారా లేదా?

అవును చెప్పాను

ఈరోజు మీ మాట నిలబెట్టుకోలేకపోయినారు

అంతే, ఆ మాట వినగానే ఉగ్రుడైనాడు కుంభసంభవుడు

నేను మాట తప్పానని అభాండం వేస్తావా అని భాండం మీద ఉన్న విల్లు అందుకున్నాడు

అభాండం కాదు సార్, మీకు ఋజువు చూపిస్తాను అని ఈల వేసాడు అర్జున్

తోక ఊపుకుంటూ కుక్క వచ్చింది

ఋజువు చూపిస్తానని కుక్కను పిలుస్తావా అని మరింత ఆగ్రహోదగ్రుడైనాడు ద్రోణుడు

దీని నోట్లో ఏముందో చూడండి అన్నాడు కిరీటి

నిద్ర లేపింది కాక, మాట తప్పానని చెప్పి చిమ్మచీకట్లో నల్లకుక్కనోరు చూడమంటావా! ఇక లాభం లేదు అని వింటినారి ఠక్ ఠక్ లాడించాడు

అది కాదు ఆచార్యా ఓ సారి చూడండి మీరు అన్నాడు అర్జున్

ఈ చీకట్లో ఏం కనపడుతుంది ఆ దివిటీ ఇటు తీసుకురా అన్నాడు కుంభసంభవుడు

ఆ తర్వాత దివిటీలో ఆ నోరు చూసి ఆశ్చర్యపోయాడు

అర్థమైపోయింది ఆయనకు

 

 

నేను చిన్నప్పుడు నేర్చుకున్న విద్య, నేను తప్ప ఈ ప్రపంచకంలో ఎవరూ వెయ్యలేని బాణవిద్య ఎవరు ఉపయోగించారు అని తల గిర్రున తిరిగింది ఆయనకు

ఈ విద్య తెలిసినవాడికి ప్రపంచకంలో తిరుగు లేదు, ఎవరు ఈ పని చేసింది అన్నాడు

మీ శిష్యుడే అని అర్జున్ సమాధానం

నా శిష్యుడా? నాకు తెలియని శిష్యుడా? ఎవడు వాడు అన్నాడీయన

ఏకలవ్యుడు, వరుసకు మా అన్న, మీరు విద్యనేర్పనని పంపేసిన నిషాదుడు, మీ బొమ్మ పెట్టుకొని మిమ్మల్ని గురువుగా పూజిస్తూ అడవుల్లో కుక్కనోట్లో బాణాలు కొట్టి నాకు మాట రాకుండా చేసినవాడు అనె అర్జున్

ఇది చాలా ప్రమాదకరం! నా మాట నిలబడాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే! ద్రోణుడు మాట తప్పాడంటే ఇంకేమన్నా ఉందీ? నువ్వు పో, రేప్పొద్దున్నకల్లా సంగతి తేల్చేస్తా! ఆ కుక్కని కూడా తీసుకుపో నీతోపాటు అని ఆలోచనలో పడిపోయాడు

కుక్కను తీసుకుని అర్జున్ వెళిపోయె

తెల్లవారగానే అడవుల్లోకి ద్రోణుడు వెళిపోయాడు

ఏకలవ్యుణ్ణి పట్టుకున్నాడు

ఏకలవ్యుడి బొటనవేలు తీసేసుకున్నాడు

అర్జునుణ్ణి ధనుర్విద్యలో ఏకవీరుడిగా నిలబెట్టినాడు

అలా కుక్క, దాని అరుపులు చేసిన సాయంతో అర్జునుడు ఏకవీరుడిగా నిలబడిపోయినాడు

అయ్యా, అమ్మా – అందువల్ల కుక్క లేకపోతే మనకు తెలిసిన భారతం మరోలా ఉండేది అన్న సంగతి మీకు ఇప్పటికి తెలిసిపోయుండాలి.

అయితే కుడిచేతి బొటనవేలు లేకుండా కుడిచేత్తో బాణాలెయ్యలేమోమో కానీ, ఎడం చేత్తో వెయ్యొచ్చు. అదికాకుంటే ఎడమ చేత్తో కత్తియుద్ధం చెయ్యొచ్చు, ఇంకా బోల్డు చెయ్యొచ్చు. అందువల్ల ఏకలవ్యుడిని సేనాధిపతి పదవి నుంచి పీకెయ్యలా జరాసంధుడు

అలా ఎన్నో ఏళ్ళు ఆ జరాసంధుడి దగ్గర పంజేసి రిటైరు అయిపోదాం అనుకుని తన నిషాద రాజ్యానికి రాజుగా వెళ్ళిపోయాడు.

ఇంతలో ధర్మరాజు రాజసూయం వచ్చి పడింది.

రాజసూయం మొదలైపోతోంది.

ఎవరూ ఏకలవ్యుణ్ణి జయించడానికి రాలేదు.

రాజసూయానికి రాజులంతా ఓడిపోవాలి.

ఆ తర్వాత ఆ యాగానికి రావాలి.

ఇదేమి సంగతండి అని రాజసూయానికి వచ్చినప్పుడు కిష్టప్పని అడిగినాడు

కిష్టప్ప చిరునవ్వి నవ్వి, అయ్యా – రాజులెవ్వరూ నీతో పోట్టాడరు అన్నాడు

ఎందుకు అన్నాడు ఈయన

 

రెండు కారణాలు – ఒకటి నువ్వు నిషాదుడివి కాబట్టి నీతో పోట్టాడితే వాళ్ళకు తలవంపు, రెండు నీతో యుద్ధంలో నిలబడి గెలవటం అంత సులభం కాదు కాబట్టి

ఈ లెక్కన రాజైనా ఉపయోగమేమీ లేదన్నమాట అని నిట్టూర్చి, పరమాత్మా ఈ జీవితమ్మీద విరక్తి పుట్టేసింది, ఇన్ని యుద్ధాల తర్వాత  శాంతి కావాలి నాకు, మన:శ్శాంతి కావాలి నాకు, నీ మీదకు అన్నిసార్లు యుద్ధానికి వచ్చినా ఎప్పుడూ ఏమీ అనకుండా వదిలేసావే నన్ను. నాతో నువ్వుపోట్టాడతావా ఒక్కసారి అన్నాడు ఏకలవ్యుడు

అదే నీ కోరికైతే అలాగే కానివ్వు అన్నాడు కిష్టప్ప

ఎప్పుడు ? ఎప్పుడు ? ఎప్పుడు ? పరమాత్మా ఎప్పుడు ? అని ఆనందభాష్పాలు కారుస్తూ కరిగిపోయినాడు ఏకలవ్యుడు

తొందరెందుకు నాయనా వస్తా! ఇంతలో నువ్వెళ్ళి ఆ ధర్మరాజుకి బంగారు పాదరక్షలు ఇచ్చిరా అన్నాడీయన

అంతా అయిపోతూండగా, పనీపాట లేని శిశుపాలుడు లేచి గావుకేకలు పెడుతుంటే, నాయనా టైమొచ్చింది, ఓ సారి వాడి పని చూడు అని కిష్టప్ప సుదర్శన్ కి ఆర్డరిచ్చాడు.

వాడి ఖేల్ ఖతం చేసి మళ్ళీ వేలెక్కి కూర్చునె సుదర్శన్.

అది చూసి అంతా గప్ చుప్ అయిపోయి ఇంటికి పోయినారు.

ఏకలవ్యుడు కూడా వెళ్లిపోయినాడు కానీ, శిశుపాలుణ్ణి అలా చంపెయ్యటం నచ్చలా ఆయనకు

మానవుడుగా మరి! అంతే! ఓ క్షణం ఆనందభాష్పాలు, ఓ క్షణం రక్తభాష్పాలు! ఏం చేస్తాం!

కొద్ది రోజులు, కొన్ని ఏళ్ళు గడిచిపోయినయ్

కిష్టప్ప ప్రామిస్ చేసినవిధంగానే ఈయన టైమొచ్చినప్పుడు వచ్చి యుద్ధం చేసి ఖతం చేసినాడు

ఇదంతా భారత యుద్ధం మొదలవ్వకముందే

మొదలయ్యాక జరాసంధుడు, ఏకలవ్యుడు, శిశుపాలుడు వీళ్ళంతా బతికుంటే యుద్ధానికొచ్చేవాళ్ళు

అప్పుడు వీళ్ళను ఆపటం పాండవుల వల్ల ఏమవుతుందీ అని ప్లానేసి అందరినీ ఖతం చేసేసాడు పరమాత్మ

అదీ లెక్కన్నమాట

ఉద్యోగ పర్వంలో సంజయుడి సందేశంలో ఇలా చెప్పించాడని కథ

అయం స్మ యుద్ధే మన్యతేఽన్యైరజేయం

తమేకలవ్యం నామ నిషాదరాజం।

వేగేనైవ శైలమభిహత్య జంభః శేతే స కృష్ణేన హతః పరాసుః ॥ 5-48-77 (33649)

 

అలా కిష్టప్ప చేతిలో హతమైనాడు.

కోరుకున్న విధంగానే హరీమన్నాడు.

భగవంతుడి మీదకు యుద్ధానికి పోయి, చివరకు సత్యం తెలుసుకుని ఆయన చేతిలోనే హతమైనాడు

అరివీర భయంకరుడు, అఖిలబాణవిద్యా పారంగతుడు, ప్రపంచంలోనే మేటి శూరుడు ఏకలవ్యుడు

అలా భారతంలో కుక్క ప్రాధాన్యం మనకు పూర్తిగా తెలిసింది.

కుక్క మూలాన ప్రపంచానికి ఒక వీరుడు పరిచయమైనాడు.

అదే కుక్క మూలాన ఆ వీరుడి బొటనవేలూ తెగిపోయింది.

అదే కుక్కను తీసుకొని పాండవులు స్వర్గారోహణానికి వెళ్ళినారు

అలా భారతంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో వింతలు.

 

భారతం పక్కనబెడితే తెలుగువాళ్ళకు కుక్కతో ఎంతో అనుబంధం

సామెతలలో (1)కనకపు… (2)కరిచే కుక్క….(3)కుక్కకు సయ్యాట….

వృక్షవిశేషాల్లో (కుక్కతులసి….)

భక్ష్యాల్లో (కుక్కగొడుగు…..)

పద్యాల్లో (జాగిలములు మొఱసడములు…)

జనజీవనంలో (కుక్కజట్టీ…..)

అలా అలా ఎన్నో విధుల్లో, విధానాల్లో, జీవనాల్లో ఉన్నది కుక్క.

అందువల్ల మీరు తెలుసుకొనవలసినది – కుక్క అంత గొప్ప జంతువు ఈ ప్రపంచకంలోనే లేదు అని!

*

 

పేరడీ Thoughts

 

కుంపాటి తీపించి డియ్యాలో

బొగ్గులే పోయిస్తి డియ్యాలో

రాజేస్తి నిప్పే డియ్యాలో

లేసింది అగ్గే డియ్యాలో

గంటెలే గల్లాని వాయిస్తి డియ్యాలో

పొయ్ మీదా పెనముంచి డియ్యాలో

గంతంత నీళ్ళోస్తి ఉయ్యాలో

నీళ్ళన్నీ సుయ్యానె ఉయ్యాలో

గిన్నిలో గరిటేసి డియ్యాలో

ఓ తిప్పు తిప్తీనె డియ్యాలో

పుల్లాటి వోసనా డియ్యాలో

గుండెల్కు తగిలేసే డియ్యాలో

గంటెడు పిండిని డియ్యాలో

సర్రూన పోస్తీనె డియ్యాలో

నూనేను తీస్తీని డియ్యాలో

సుట్టంతా తగిలిస్తి డియ్యాలో

ఆనూనె ఈపిండి డియ్యాలో

సక్కంగ కాల్నెమ్మ డియ్యాలో

పిండీను పెనమూను గలిసె డియ్యాలో

బెమ్మదేవుడి అట్టిచ్చే డియ్యాలో

డియ్యాలో డియ్యాలో

డియ్యాలో డియ్యాలో

*

చమత్కారాలూ మిరియాలూ 

నిజంగా భట్రాజే!

Portrait of Dr. Pattabi Sitaramayya.

జాతీయవాది, దేశభక్తుడు అయిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని ఒక సారి బందరులో ఘనంగా సన్మానించారట.

ఆ సభకు వక్తగా విచ్చేసినవారిలో శ్రీ పి.పి.భట్ గారు ఒకరు. ఆయన పట్టాభి గారిని గురించి చెపుతూ – భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు, ధర్మగుణంలో ఆయన ధర్మరాజు, దానం చేయడంలో దానరాజు, త్యాగశీలతలో త్యాగరాజు అని ఇలా పొగడడం మొదలెట్టారట.

పొగడ్తలంటే అసలే గిట్టని పట్టాభి గారు ఆయన ప్రసంగం అయ్యాక “నా గురించి భట్ గారు చెప్పింది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ భట్ మాత్రం నిజంగా భట్రాజే” అన్నారట.

*

peepal-leaves-2013

ఎవరోహో..

radio 1

 శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి 

అపురూప చిత్ర సౌజన్యం : సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి

ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఒక నాటకంలో పాల్గొన్న నిలయ కళాకారులు – సి.రామమోహనరావు, కూచిమంచి కుటుంబరావు, నండూరి సుబ్బారావు, ఎం.వాసుదేవమూర్తి, వి.బి.కనకదుర్గ, ఎ.బి.ఆనంద్, ఎం.నాగరత్నమ్మ, ఆమంచర్ల గోపాలరావు (ప్రొడ్యూసర్), నారాయణమూర్తి.

peepal-leaves-2013