ప్రధానమంత్రికి ప్రేమలేఖ!

 

images

ప్రధాన మంత్రి మోడీగారికి-

అయ్యా.. మీరు తీసుకున్న చర్య బహు బాగున్నది. మీ లాంటి ఉత్తములు ప్రధాన మంత్రి కావడం మాలాంటి నిజాయితీ పరులకు ఊతమిస్తోంది. ఊపిరి పోస్తోంది. సరిగ్గా ఆలోచించేవాళ్ళు వున్నారు సార్.. మిమ్మల్ని అర్థం చేసుకున్నవాళ్ళు వున్నారు సార్.. అందుకే మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, (మన వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువ తెలీకుండా మాట్లాడుతున్నారు) అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చెయ్యండి.. ఏం ఫరవాలేదు. ఇలాగే నాల్రోజులు గోలగోల చేసి అలిసిపోయి ఆగిపోతారు. అలవాటైపోతారు. కాని సార్.. ముందుగా ముఖ్యంగా చెప్పేది.. ఆ కోర్టుల నోళ్ళు మూయించండి సార్.. ఏ దేశంలోనయినా న్యాయం ఆరాజ్య ఆకాంక్షలకు లోబడి కట్టుబడి వుండాలి కదా

సార్.. మన సుప్రీం కోర్టును చూడండి యెలాంటి వ్యాఖ్యలు చేస్తోందో.. ఇది చాలా తీవ్రమైన విషయమట! ప్రజలు క్యూల్లో నిలబడడం తీవ్ర సమస్యట! ప్రజలు ఉపశమనం కోసం కోర్టులకు వెళతారట! కేంద్ర నిర్ణయంతో ప్రజలు ప్రభావితం అయ్యారట! ప్రజలు ఆవేశంలో వున్నారట! దాడులు కూడా జరగొచ్చట! అల్లర్లు జరగొచ్చట! అవకాశాలు వున్నాయట! అంచేత కోర్టులకు యెక్కే అవకాశం యిస్తే ఉపశమనమట! సరే, ఒకవేళ ప్రజలు అలా వున్నా- వున్నారని అనొచ్చునా? రెచ్చగొట్టినట్టు అవదూ? ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోందా? ప్రజలకు లేనిపోని ఆలోచనలు అందిస్తోందా? ప్రజలను అల్లర్లకూ అలజడులకూ పురికొల్పుతోందా?

జీ.. మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, అవసరమయితే వందా యాభై యిరవై కాదు, పది నోట్లనీ రద్దు చెయ్యండి. నోట్లనేవే లేకుండా రద్దు చేయండి. దెబ్బకి దేశం లైన్లోకి వస్తుంది.. ఇప్పటికే వచ్చేసింది.. లైన్లోకి వచ్చి నిలబడింది.. ఎటియంల ముందు! ఫేస్ బుక్కుల్లో ఈ విషయాన్ని గర్వంగా పెడుతూవున్నారు. మనకు మద్దతునిస్తూవున్నారు. ఏటియంల ముందు నిల్చుంటే యేo? సినిమా టిక్కెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి చచ్చిన వాళ్ళు లేరా? రేషన్ కోసం క్యూ లైన్లలో కొట్టుకు చచ్చినవాళ్ళు లేరా? దేవుడి దర్శనం కోసం క్యూ లైన్లలో పడిగాపులు పడినవాళ్ళు లేరా? కరెంటు బిల్లులూ వాటరు బిల్లులూ కట్టడానికి క్యూ లైన్లలో అఘోరించినవాళ్ళు లేరా? రైలు రిజర్వేషన్లకి క్యూ లైన్లలో రేయింబవళ్ళూ కాచినవాళ్ళు లేరా? పిల్లలకి చదువుకోసం సీట్లకోసం క్యూ లైన్లలో కునుకుపాట్లు పడుతున్నవాళ్ళు లేరా? ఈసేవా మీసేవా అని సేవలు అందుకోవడానికి క్యూ లైన్లలో కుదురుగా వున్నవాళ్ళు లేరా? ఫోను చేస్తే కూడా యూ ఆర్ యిన్ క్యూ- అంటారే.. జీవితమంతా క్యూ లైన్లలోనే బతికి చచ్చిన వాళ్ళకి క్యూలోనే వుండడం కొత్తా కాదు. కష్టమూ కాదు. అందరూ లైన్లలోనే వున్నారు. దేశమొక్కటే లైన్లో లేదు. మీరు లైన్లో పెడుతున్నారు. పెట్టండి. మేమంతా అచ్చాదిన్ కోసం యెదురు చూస్తున్నాము. అచ్చాదిన్ రావాలంటే కొందరికి చచ్చేదిన్ తప్పదు. చచ్చాదిన్ రుచి చూసినప్పుడే అచ్చాదిన్ కు విలువ. మీ విలువ మాకు తెలుసు!

మీరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. లోకం ఆ శ్రీరామచంద్రుడినే- భార్యని అడవిలో నిండు చూలాలిగా వదిలిపెట్టాడని, వాలిని చెట్టుచాటు నుండి యెన్కౌంటరు చేసాడని- యెన్నో విధాల నిందించింది. ఆ రాముణ్ణి నమ్ముకున్న పార్టీ మీది. ఆ పార్టీకి సారధి మీరు. మీకు నిందలు రాకపోతే ఆశ్చర్యపోవాలి గాని వస్తే ఆశ్చర్యపోయేది యేమీ లేదు. అయినా మీకు నిందలు కొత్తా? గుజరాత్ అల్లర్లలో వేలాది మందిని హింసించి చంపించడంలో మీదే అసలు పాత్రని ఆనాడు లోకం కోడై కుయ్యలేదా? ఈనాడు మీకు బ్రహ్మరథం పట్టలేదా? అప్పుడు ప్రపంచానికి పెద్దన్న మీ వీసాని కూడా రద్దు చెయ్యలేదా? అమెరికా రావడానికి లేదని వీల్లేదని నిషేధం కూడా విధించలేదా? మళ్ళీ మిమ్మల్ని పిలిచి పీట వేయలేదా? అంతెందుకు వైట్ హౌస్ లోకి రానున్న ట్రంప్ నిన్నటికి నిన్న మీ పాలన బాగుందని కితాబు యివ్వలేదా? అమెరికా ప్రెసిడెంటే యిచ్చినప్పుడు యింకా మన దేశ ప్రజలు యిస్తే యెంత? యివ్వకపోతే యెంత? వీళ్ళ మాటలెంత? వీళ్ళివాళ నొచ్చుకున్నా రేపు మళ్ళీ మిమ్మల్ని చచ్చినట్టు మెచ్చుకుంటారు. అంచేత యెప్పుడూ ఈ పరిస్థితే వుండదు! మీరు క్షిపణిలా ప్రజల మీదకి దూసుకుపొండి! క్షిపణి అంటే గుర్తుకువచ్చింది.. మీరు చేసింది ప్రజల మీద ‘సర్జికల్ దాడి’ కాదట, ‘కార్పెట్ బాంబింగ్’అట.. సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్య.. ముందుగా ముఖ్యంగా చెప్పేది ఆ సుప్రీమ్ కోర్టు నోరు ముయ్యించండి సార్.. ప్రజలనోళ్ళు ఆటోమేటిగ్గా మూతబడిపోతాయి. సోషల్ మీడియాలో మిమ్మల్ని తప్పుపడుతూ పోస్టు పెట్టిన యిద్దరు వుద్యోగులని విధులనుంచి తప్పించారని వార్తలు చూస్తున్నాం. ఆ సంఖ్యను యింకాస్త పెంచితే అందరూ ఆఘమేఘాల మీద మీ చర్య వుత్తమోత్తమైనది అంటూ బుద్దిగా వుద్యోగాలు చేసుకుంటూ బతికేస్తారు.

అప్పుడే ఎనభై మంది ప్రజలు నోట్ల రద్దువల్ల చనిపోయారని లెక్కలు చూపిస్తున్నారు. ఎనభై కాకపోతే నూటాయెనభై మంది ప్రజలను చావనివ్వండి. బ్యాంకు వుద్యోగులు యిరవైమంది వొత్తిడితో చనిపోయారని చెపుతున్నారు. ఇరవై కాకపోతే నూటాయిరవై మంది వుద్యోగులను చావనివ్వండి. రథాన్ని లాగినప్పుడు తలలు రాలిపడతాయి. అయినా రథయాత్రలు చేసి రణరంగం వీరంగం చేసిన పార్టీవారు మీరు. మీకు చెప్పాలా? అయినా ప్లేగు వస్తే చావలేదా? కలరా వస్తే చావలేదా? డెంగ్యూ వస్తే చావడం లేదా? చికెన్ గున్యా వస్తే చావడం లేదా? ఎలకలకి నీటి కలకలకి దోమలకి అంతమందిని అప్పజెప్పినప్పుడు దేశ ప్రధానిగా మీకు వెయ్యీ పయీ అప్పజెప్పొద్దా? ఆమాత్రం మీపట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే మండుతోంది.

ఏమయినా ఒకమంచిపని చేసేటప్పుడు నలుగురు నాలుగు మాటలు అంటారు. బురద జల్లుతారు. తిట్టిపోస్తారు. శాపనార్థాలు పెడతారు. అసలు ప్రభుత్వం యేది చేసినా ప్రజలను మోసం చేసి పార్టీకి మేలు చేయడానికేనని పెడార్ధాలు తీసే మేథావులు మందలకొద్దీ మనకున్నారు. వాళ్ళు యూపీ ఎలక్షన్ల కోసమే మీరు యిదంతా చేసారని అంటున్నారు. అనుకోనివ్వండి. అలా అన్నా నోట్లతో వోట్లని కొనడానికి వీలు లేకుండా చేసిన మిమ్మల్ని అభినందించాలి కదా? మీ పార్టీ వాళ్ళు ముందే జాగ్రత్తపడ్డారని, సాక్ష్యంగా మీ ప్రకటనకు ముందే రెండువేల నోటుని సాంఘిక మాధ్యమాల్లో మీ నాయకుడు ట్వీట్ చేసాడని అంటున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నరు అనిల్ అంబాని మరదలికి మొగుడు అంటున్నారు. అన్నీ అందరికి తెలుసు అంటున్నారు. ఒకటా రెండా గవర్నరు సంతకాల దాక.. యెన్నో ఆధారాలంటూ ముందుకు తెస్తున్నారు. తేనివ్వండి. ఏనుగు వెళిపోతుంటే వెయ్యి కుక్కలు మొరుగుతాయి. మొరగనివ్వండి. అధికారం మంత్రదండం. ఆ మంత్రదండమే మీ చేతిలో వుంది. అంతకు మించిన ఆయుధం లేదు. అణచివేత మీ సాధనం. అదే యింధనం. మీదే విజయం!

అవకాశం కోసం కాచుకూర్చున్న ప్రతిపక్షాలు మీ మీద యుద్ధం చేస్తున్నాయి. చెయ్యనివ్వండి. పాకిస్తాన్ యుద్ధమే నోట్ల రద్దు దెబ్బకి ఆగిపోయింది. ఆ వార్తలే పత్రికల్లో లేకుండా పోయాయి. నోట్లు రద్దవడం కాదుగాని అన్ని సమస్యలూ దెబ్బకి రద్దయిపోయాయి. ప్రజలకీ పార్లమెంటుకీ వొక్కటే ఎజెండా. నోట్లే జెండా. నోట్ల రద్దుతో మీరు అనేక సమస్యల్ని అవలీలగా రద్దు చేసేసారు. మీ తెలివి చూస్తే నాకు ముచ్చటేస్తోంది! మీరు అధికారంలోకి వచ్చాక అన్నిటా అంతటా హిందూత్వం పెరిగిపోయిందని, గోరక్షణ పేరుతో దళితుల మీదా మైనారిటీల మీదా-  దాడులూ హత్యలూ దేశంలో యెక్కడో వొక చోట ఆగకుండా జరుగుతూ మీకు మచ్చతెచ్చాయి. ఆమచ్చ చెరుపుకోవడానికి ఆలస్యంగానైనా మీరు ‘దళితులు నాసోదరులు, నన్ను చంపాకే దళితుల్ని చంపండి’ అని ప్రకటించాల్సి వచ్చింది. ఆమొత్తాన్ని మీరిప్పుడు చెరిపేశారు.

మీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం మధ్యతరగతి జీవుల్లో మీకు మంచి మార్కులే వేసింది. మిమ్మల్ని తప్పు పట్టిన వాళ్ళనే తప్పు పట్టే దేశభక్తుల్ని తయారు చేసింది. పైగా ‘నా నిర్ణయంలో దురుద్దేశం వుందని తేలితే నన్ను నడిబజార్లో వురి తీయండి’ అని మీరు భావోద్వేగాలకు గురి కావడం- ‘నన్ను ప్రాణాలతో వుండనివ్వరేమో? ఐనా జంకను, సజీవ దహనం చేసినా నల్లధనం పై పోరు ఆపను’ అని మీరు కళ్ళనీళ్ళపర్యంతం కావడం- మమ్మల్ని చాలా దుఃఖానికి గురి చేసింది. మీరు మాటి మాటికి ‘నన్ను చంపండి.. నన్ను కాల్చండి.. నన్ను వురి తియ్యండి.. నన్ను సజీవ దహనం చేసినా..’ అని అస్తమానూ అనకండి సార్.. పైన తధాస్తు దేవతలు వుంటారు! మీరు లేని దేశాన్ని ఊహించలేకపోతున్నాను! దేశాన్ని అనాధను చెయ్యొద్దు! మీ పాలనలో ప్రజలు యెంత సుఖ సంతోషాలతో వున్నారో మీరెరుగరా?!

జీ.. రేపటి యేడాదికి డబ్బై యేళ్ళుగా పట్టిన మురికిని మంత్రం వేసినట్టు మాయం చెయ్యడం వశమయ్యే పనేనా? చురుక్కు మనకుండా యింజక్షనే వెయ్యలేరే. నొప్పి లేకుండా పుప్పన్నే తీయలేరే. మన గడ్డం మనం గీసుకున్నా- అది మన బ్లేడే అయినా- మన చెయ్యే అయినా- తెగకుండా వుంటుందా? అంతెందుకు నొప్పులు లేకుండా ప్రసవం అవుతుందా? ప్రసవ నొప్పులు ప్రజలకూ వుంటాయని తెలుసుకోవాలని యీ సందర్భంగా ప్రజలకు మీ విధేయునిగా విజ్ఞప్తి చేస్తున్నాను!

యధ్బావం తద్భవతీ.. అన్నారు. ప్రతిదాంట్లోనూ మంచి చూస్తే మంచి- చెడు చూస్తే చెడు కనిపిస్తాయి. మీ నిర్ణయంలో మంచిని చూశాను. ఇంత మంచిని చేసిన మీముందు ఆ మంచి మంచి విషయాలూ ఫలితాలూ రాశి పోసి పంచుకోకపోతే నాకు పాపం చుట్టుకుంటుంది.

ఎన్నడూ లేనిది ప్రజలకు డబ్బులు లేకుండా జీవించడం వచ్చేసింది. ఉన్నదాంట్లో వొద్దికగా బతికే నేర్పు వచ్చేసింది. ఆర్భాటాలు లేవు. అనవసర ఖర్చులు లేవు. షాపింగులు లేవు. సరదాలు లేవు. సందళ్ళు లేవు. సినిమాలు లేవు. షికారులు లేవు. పనుల్లేవ్. పాకుల్లేవ్. ఉన్నదాంట్లో తిన్నామా.. ఏటియం క్యూ లైన్లో నిల్చున్నామా.. వచ్చి గూట్లో గుట్టుచప్పుడుగా పడుకున్నామా.. అంతే. పొదుపుగా పొద్దు పుచ్చడం వచ్చింది. (చెప్పకేం దుబారా చేసే మాఆవిడ కూడా యెంత చిక్కిడి అయిపోయిందో..?) రేపు డబ్బులు చేతికి వచ్చినా ఏం చేసుకోవాలో తెలీక జనాలు తికమకపడతారంటే అతిశయోక్తి కాదు. కాదంటే మీ మీదొట్టు..

మరొక్క విషయమూ యిందులో వుంది. మనిషి తన మూలాలను గుర్తిస్తున్నాడు. వస్తుమార్పిడి విధానం మళ్ళీ మొదలైంది. మాదగ్గర బియ్యం తీసుకు వెళ్ళే మా పక్కింటివాళ్ళు మాకు అందుకు ప్రతిగా పప్పులూ ఉప్పులూ యిస్తున్నారు. మేం చింతపండు యిస్తే వాళ్ళు ప్రతిగా పసుపూ కారం యిస్తున్నారు. మనదగ్గర వున్నది యివ్వడం.. వాళ్ళదగ్గరున్నది పుచ్చుకోవడం.. యిలా యిచ్చిపుచ్చుకోవడంలో దేశ ప్రజల సహనమూ సౌశీల్యమూ స్నేహమూ సౌభ్రాతృత్వమూ యింకా చాలా చాలా వగైరాలు చూడగలిగాను!

మీ నిర్ణయం తర్వాత తాగుబోతులు తాగడం తగ్గించేసారు. జేబులు ఖాళీ అయి బుద్దిగా యింటికి వెళ్ళిపోతున్నారు. తంతే మరి నాలుగు పెళ్ళాలని తంతున్నారే తప్ప-  తప్పతాగి యెక్కడికక్కడ పడిపోవడం లేదు. చిల్లర సమస్య తాగుబోతులకు వుండరాదని రౌండ్ ఫిగరు చేసినప్పటికిన్నీ నలభై నుండి యాభై శాతం తాగడం తగ్గింది అంటే ముందు ముందు ఆశాతం మరింత పెరగొచ్చు అని రూడీగా చెప్పొచ్చు. చచ్చినట్టు మద్యపాన ప్రియులు కుటుంబప్రియులు అవుతారు. దేశంలోని మహిళలంతా యెప్పటికీ మీ ఋణం తీర్చుకోలేరు గాక తీర్చుకోలేరు!

కొందరు పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయని ఓ గగ్గోలు పెడుతున్నారు తప్పితే, సింపుల్ గా పెళ్లి చేసుకోవడం నేర్చుకు చావరే. అయినా పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల దేశానికి యెంతో మేలూ లాభమూ వున్నదన్న సంగతి మర్చిపోతున్నారే. పెళ్ళయితే యేముంది? మాహా అయితే పిల్లల్ని కంటారు. కోట్లలో జనాభాను పెంచుకుపోతారు. అదే పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల సంతతి ఆగిపోతోంది.. జనాభా తగ్గిపోతోంది. ప్రతి దానిలో పాజిటీవు కోణం చూడగలిగిన వాడే నిజమైన భారతీయుడు కాగలుగుతాడు!

పెద్దనోట్ల రద్దువల్ల యిచ్చిన లంచం తిరిగి వెనక్కి యిచ్చేస్తున్నారు ప్రభుత్వోద్యోగులు. లంచం లేకుండానే పనులు చేసేస్తున్నారు. ‘ఇప్పుడు కాదు, పని అయ్యాక ఆరుమాసాలు పోయాక యివ్వండి’ అని అంటున్నారు. డబ్బులు యిస్తేగాని పనిచెయ్యమని యిన్నాళ్ళలా పీక మీద కత్తి పెట్టుకు కూర్చోవడం లేదు. ఇంతటి పెను మార్పును మా జీవితాల్లో మేము చూస్తామని యెన్నడూ కలలో గాని అనుకోలేదు. ఈ శుభపరిణామానికి దేశంలోని పరిణామాలే కారణమని చెప్పకతప్పదు. అందుకు కారణమైన మిమ్మల్ని అభినంధించకా తప్పదు!

పేకాట రాయుళ్ళు పేకాట మానేశారు. డబ్బులు లేకుండా వొత్తి పుణ్యానికి ఆడడంలో వాళ్లకి మజా లేదు. అంతెందుకు కుర్రాళ్ళంతా వారం వారం అడ్డమైన సినిమాలను చూసేవాళ్ళు. వారానికి వో అరడజను సినిమాలు రిలీజు అయ్యేవి. యేవి.. యిప్పుడు వొకట్రెండు సినిమాలే ట్రెండు. బెండు తీసారు. ఇప్పుడు పిల్లలు గమ్మున యింటిపట్టున వుండి ఫేస్ బుక్కులు చక్కగా చదువుకుంటూ యూ ట్యూబులు చూసుకుంటూ వున్నారు.  టీవీల్లో వచ్చే సినిమాలు చూసుకుంటూ కాలం గడిపేస్తూ వున్నారు. యువత మీ మేలు మరిచిపోదు.. పోలేదు!

మరో ముఖ్యమైన విషయం చెప్పనా? దొంగతనాలు మా బాగా తగ్గాయి. అలవాటులో పొరపాటుగా వచ్చిన దొంగలు వెయ్యీ ఐదు వందల నోట్లు కళ్ళముందు కనిపించినా యెత్తుకు పోవడం లేదు. మా ఆవిడ దాచుకున్న పాతిక వేలు యెలా మార్చడమా అని ఆపసోపాలు పడుతున్న వేళ.. మొన్నటికి మొన్న మా యింట్లో పడ్డ దొంగ అది చూసి నన్ను బుద్దుందా? అని తిట్టాడు. క్లాసు కూడా పీకాడు. కౌటిల్యుడిలాగ బోధించాడు. డబ్బును డబ్బుగా దాస్తే దాని విలువ తగ్గిపోతుందట. కోల్పోతుందట. అందుకని బుర్రన్న వాడెవడైనా డబ్బు దాచుకోడట. భూమ్మీదో బంగారమ్మీదో షేర్లమీదో బినామీల మీదో పెడతాడు తప్ప యింట్లో లిక్విడ్ క్యాష్ దాచుకోర్రా యెర్రి నాగన్నా.. అని హితబోధ చేసాడు. నీదగ్గర కోటిరూపాయలు వుంటే పదిలక్షలైనా జేబులో కాదు కదా యింట్లో పెట్టుకుంటావా?.. అని అడిగాడు. డబ్బు పొదుపు చేసే కన్నా పొదిగితే పెరుగుతుంది.. ఈ సత్యం తెలియని సత్తికాలపు సత్తెయ్యవా నువ్వు?  దాచుకున్నా అది అయిదూ పది శాతమేన్రా నీ యబ్బా.. అని తిట్టి పోశాడు. బుర్రతక్కువ యెదవలు అని కూడా అనేశాడు. ఆ తిట్టు నాకు తగిలినందుకు కాదు, మీకూ తగిలినందుకు నేను చాలా విచారపడి విలవిలలాడిపోయానంటే నమ్మండి. మా ఆవిడ కూడా దొంగకే వంత పాడింది.

పర్లేదు.. మీది మహోన్నత నిర్ణయం. మీ దయవల్ల అందరికీ పని దొరుకుతోంది. బిందెలకు మాట్లేస్తాం.. అన్నంతగా మూల మూలలా వేల వేళలా- మీ పాత బిందెలకు కొత్త బిందెలు యిస్తాం.. అని అన్నంతగా  మీ పాత నోట్లకు కొత్తనోట్లు యిస్తాం.. అని నోట్లు మార్చే పని కుటీర పరిశ్రమలా సాగుతూ వుంది. అన్ని వ్యాపారాలు ఆగిపోయినా ఈ యవ్వారాలు ఆగలేదు. పెద్ద పార్టీలకు థర్టీ పర్సెంట్. డోర్ డెలివరీ సదుపాయం కూడా వుంది. బ్యాంకు మారాజులు మా బాగా చెయ్యి కలుపుతున్నారు. పోస్టుమాస్టర్సూ పోస్టాఫీసుల్లో నగదు మార్పిడిల్లో మాబాగా మార్చారు. ఏమార్చారు. ఏమయితేనేం మనం పాజిటీవుగా చూస్తే చాల మందికి పని దొరికింది. మీపేరు చెప్పుకొని పావలా పరకో యింతో అంతో సంపాదించుకుంటున్నారు.

అసలు సంపాదించుకోనిది యెవరు? ప్రభుత్వ సంస్థలే తీసుకుంటే యింతకు మునుపు కునారిల్లిపోయి వుండేవి. ఇప్పుడు కూటికి లేనివి కోటికి పడగలెత్తాయి. వెయ్యీ ఐదువందల నోట్లతో అన్ని పన్నులూ పాత బకాయిలూ కట్టొచ్చునని చెప్పినతరువాత మా హైదరాబాదు జీహెచ్ఎమ్సీ రెండువందల కోట్ల పైనే రాబట్టింది. గత వసూళ్లతో పోలిస్తే రెండువేల రెండువందల రెట్లు యెక్కువని కూడా వార్తలు వస్తున్నాయి. మొండి బాకాయిలు వసూలవుతున్నాయి. గుడ్డివాళ్ళు యివన్నీ చూడలేరు.

ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రవేటు వ్యక్తులకు అప్పులు వున్నా- బ్యాంకులకు అప్పులు వున్నా కూడా కొందరు ఆపద్భాందవుల్లా ముందుకు వచ్చి మీ అప్పులు తీరుస్తామని కోరి చెపుతున్నారు. మీరు తరువాత మాకు తీర్చండి అని భరోసా యిస్తున్నారు. మనిషిని మనిషి నమ్మని యీ రోజుల్లో యీ విధంగా మానవీయత పరిమళిoచడం మానవత్వం కాదా? ఇంతకుమించిన మానవత్వం వుంటుందా అని అమర్త్యసేన్ని అడుగుతున్నాను..

మనుషులే కాదు దేవుళ్ళ పరిస్థితి కూడా మెరుగయ్యింది. గుళ్ళూ గోపురాలు పుట్టిబుద్దెరిగి యింత కలక్షన్లు కల్లజూసాయా అని అడుగుతున్నాను. కలక్షన్ల కింగ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామివారి ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతుంది. శ్రీవారికి వొక్క రోజుకే ఆదాయం నాలుగుంపావూ నాలుగున్నర కోట్లు దాకా వస్తోంది. విజయవాడ దుర్గమ్మకూ మునుపెన్నడూ లేని ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం నెలాఖరుకల్లా మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం ఆదాయం లేని స్థానిక దేవుళ్ళ గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. తీర్థ ప్రసాదాలు అందుతున్నాయి. ఇదంతా మీ చలవే. భక్తులు పాత నోట్లని సగర్వంగా సమర్పించుకుంటున్నారు. అదీ యీ మీడియా వాళ్ళకి తప్పే. పాపంలో వాటా భగవంతుడికీ పంచుతున్నారని గోల పెడుతూ ప్రోగ్రాములమీద ప్రోగ్రాములు చేసేస్తున్నారు. దేవుడి దృష్టిలో చెల్లుబాటు అయేది.. చెల్లుబాటు అవనిది అంటూ వుంటుందా? దేవుడు అన్నిటినీ సమంగా స్వీకరిస్తాడు అన్న సత్యాన్ని మరిచిపోతున్నారు. తుచ్చులు.. సమాజానికి ఉచ్చులు..

అరే హాస్పిటల్స్ లో రోగాలన్నీ నయం చేసుకుంటున్నారు. అనారోగ్యాలను యేమాత్రం వాయిదా వెయ్యడంలేదు. నోట్లని మార్చేసుకోవడానికిది మరో మార్గం అని అంటున్నారే తప్ప యిందులోని పాజిటీవు అవకాశపు కోణం చూడరే అంధులు.. అర్భకులు..

విదేశాల్లోని నల్లధనం మీరు తీసుకురాలేక ఆ చిత్తశుద్ది మీలో లేక స్వదేశంలో డ్రామాలు చేస్తున్నారని అన్నవాళ్లకీ ఆడిపోసుకున్నవాళ్ళకీ వొక్కటే నా సమాధానం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మన సంస్కృతీ సాంప్రదాయాలూ వీళ్ళకి తెలిసి చావవు. అయినా స్విస్ బ్యాంకు రెండేళ్ళ తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో కొత్తగా ఖాతాలు తెరిచినవాళ్ళ వివరాలను చెపుతామని చెపితే సంతోషించక- అది మీ కృషి అని అంగీకరించలేక-  పాత ఖాతాదారుల వివరాలు రాబట్టలేరా.. అని తిరిగి అడుగుతారు. మాల్యాని మీరే టిక్కట్టు తీసి దగ్గరుండి పంపించినట్టు మాట్లాడుతారు. వదిలేసారని వాపోతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడువేల పదహారు కోట్లు ‘రద్దు పద్దు’లో వేసి నీళ్ళోదిలేసిందని, అందులో పన్నెండు వందల వొక్క కోటి విజయమాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దని, యిందులో ఆరు సంస్థలు మన తెలుగు రాష్ట్రాలవని కూడా వున్నాయని వాపోతున్నారు. అక్కడితో ఆగక మా బాకీలు కూడా మీ ‘రద్దు పద్దు’లో వేసి ఆదుకోమని వాడెవడో బయలు దేరాడు. ఇంక అందరూ అలా ముందుకు వస్తే బ్యాంకింగు వ్యవస్థ కుప్పకూలిపోదూ? అందుకే గదూ రైతుల్ని చితకతన్ని పాతిక వేలయినా లాక్కోనేది.. జప్తు చేసేది? మన బ్యాంకులను, మన ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవద్దూ? ప్రతి దానిలో మంచి చూడడం వీళ్ళకు యెందుకు రాదో నాకర్థమే కాదు!

ఉగ్రవాదం.. తీవ్రవాదం.. నక్సలిజం యివన్నీ అంతరించిపోవాలంటే నల్లదనం అరికట్టాలి. ఆ నల్లదనం పెట్టుబడిదారుల వ్యాపారుల దగ్గర వుంటే వ్యాపారాలు చేస్తారు. వారు అభివృద్ధిలోకి వచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తెస్తారు. మనీని డెడ్ చెయ్యరు. డెత్ కు వాడరు. మరంత మనీ జనరేట్ చెయ్యడానికి వాడుతారు. అంచేత అందర్నీ వొక గాట కట్టలేం!

మీ విజన్ మాకు తెలుసు. మీరు మన కంట్రీని  క్యాష్ లెస్ కంట్రీగా చెయ్యాలని కలలు కంటున్నారు. మీరు మాత్రమే కలలను నిజం చెయ్యగలరు. ఎనభైయ్యారు శాతంగా వున్న పెద్దనోట్లు రద్దయ్యాక- ఎనభైయ్యారు శాతం ఏటీయంలు పనిచెయ్యకుండా వున్నాక- అంతా క్యాష్ లెస్సే! మనది క్యాష్ లెస్ కంట్రీయే! మరో విషయం పాలుకీ పనిమనిషికీ కూరలకీ కోడిగుడ్లకీ స్వైప్ మిషనేనా అని యెద్దులు యెద్దేవా చేస్తున్నారు! కాని చిన్న చిన్న దుకాణాలలో అమ్ముకొనే స్క్రాప్ ని మీరు తీసి పడేసి- అంతా అందంగా హై ఫై చేసి- కార్పోరేట్ వ్యాపారాలవైపుకు మళ్లిస్తున్నారన్న మర్మాన్ని అర్థం చేసుకోరే?! పెద్దపెద్ద పెట్టుబడులు పెట్టి మనదేశానికి వచ్చిన వాళ్ళని మనం ఆ మాత్రం ఆదరించవద్దా?

చిన్నా పెద్దా తేడాలేకనే లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పుతీసుకున్న ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, రూలియా బ్రదర్స్, అనిల్ అగర్వాల్, గౌతమ్ ఆదాని- వేల కోట్లు అప్పుతీసుకున్న సైరుస్ మిస్త్రీ, మనోజ్ గౌర్, సజ్జన్ జిందాల్, లాంకో మధు, జియం రావ్, వియ్యన్ ధూప్, జీవీకే రెడ్డి- వీళ్ళ గురించి యిప్పుడే కొత్తగా తెలిసినట్టు తెగ యిదై పోతున్నారు. వాళ్ళు చేసిన రుణాలు కక్కించమంటున్నారు. లాగొచ్చు. కాని ఆ డబ్బు యెవరిది? వాళ్ళ వ్యాపారాలలో వున్నది ప్రజల డబ్బే. వాళ్ళు కుదేలయితే ప్రజలకు ఆ దెబ్బతాకుతుంది. అందుకని యిలాంటి పెద్దల్ని గౌరవంగా చూసుకోవాలి. ప్రోత్సహకాలు యివ్వాలి. రైతులకు సబ్సీడీలు తీసేసినా వ్యాపారాలకూ పెట్టుబడిదారులకూ సబ్సిడీలను యిచ్చి ప్రోత్సహించాలి. ఉచితంగా కోరినంత భూమి, కరెంటు, నీళ్ళు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందివ్వాలి. మీ చర్యతో బ్యాంకుల్లో చేరిన అనెకౌంటెడ్ మనీని.. ఎకౌంటెడ్ మనీని- ఈ పెద్దలకు మళ్ళీ మళ్ళీ రుణాలుగా యివ్వాలి. వాళ్ళు వ్యాపారాలు చేసి దేశ ప్రజలకి ఉపాధి కల్పిస్తారు. ఊతమిస్తారు. అంతే కాదు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. వాళ్ళని క్యూల్లో వచ్చి నిలబడాలని కొందరు మూర్ఖంగా ఆలోచనలు చేస్తున్నారు. మన దేశం సంపన్నుల జాబితాలో చేరడానికి కారకులైన వాళ్ళను మనం గౌరవించకపోతే ప్రపంచం గౌరవిస్తుందా? పేద దేశంలో ధనికులుగా రాణించడం అంత ఆషామాషీ యవ్వారం గాదు. అందుకైనా వాళ్ళ కాళ్ళు కడిగి మన నెత్తిన పోసుకోవాలి. ఆపనిచేస్తున్న ఏలికలకు యెంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

బీజేపీ యంపీ హర్షవర్ధన్ గారిని జనం అసహనంతో చితకబాదితే దేశమంతా అసహనం వున్నట్టు చిత్రీకరిస్తున్నారు. పాతిక రోజులుగా జనం కుక్కిన పేనుల్లా పడి లేరా? అవస్థలు పడుతూ ప్రజలు మీకు సహకరిస్తూ వుంటే వీళ్ళకు  కంటగింపుగా వుంది. మీ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్ళకు తగిన సమాధానం యిచ్చారు. అవినీతి పరులుగా ముద్ర వేసారు. అందుకే ప్రతొక్కరూ’ మోడీగారి నిర్ణయం మంచిదే కాని..’ అనేదాకా వచ్చారు. అది చాలు.. మీరు విజ్రుభించేయడానికి!

ప్రజలకి ఓర్పు లేకపోతే యెలా? భార్యా బిడ్డలా యేమి స్వార్థం మీకు? కాని భార్యా బిడ్డలు వుంటే మీరు యిలా చేసేవారా.. అని తిరిగి అడిగేవారూ వున్నారు. ఇలాంటి ప్రజలకోసమా మీరిన్ని అవస్థలూ పడుతున్నది అని తలచుకుంటే దుఃఖం వస్తుంది.

అప్పుడే రెండువేల నోట్లు నకిలీవి వచ్చేసాయని అంటున్నారు. ఇదీ తప్పేనా? తెలివిగా ఆలోచిస్తే నోట్ల కొరత వున్నప్పుడు నకిలీ నోట్లు కూడా చెలామణీ కావడం కొంత ఊరటే. అవి ఖాళీలను పూరిస్తాయి. అన్నీ నోట్లూ ప్రింట్ అయి వొకేసారి రావాలంటే కష్టం గదా? ఆమాటకు వస్తే మన భారతదేశానికి పాకిస్తానుకు మెటీరియల్ సరఫరా చేసేవాడు వొక్కడే. ఇప్పుడు యేమయ్యింది.. నోట్ల కొరత కొంత తీరుతోంది గదా.. అని పాజిటీవ్ గా చూస్తే నెలకొన్న సమస్య తీరడంలో నకిలీ నోట్లు అవసరం. లోపాలతో వున్న అయిదువందల నోట్లని వొదల్లేదా? రెండువేలతో సహా అన్నీ రేపు భవిష్యత్తులో రద్దయ్యేవేగా?

చెప్పడం మరిచాను. జనధన్ ఖాతాల్లో భారీగా డబ్బు చేరడంవల్ల పేద సాదలకు పైసా పరకో దొరుకుతుంది. మీరు చూసీ చూడనట్టు పోవడం వల్ల రేపు మీరు వొక్కొక్క ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని ముందే యిచ్చిన హామీని నిలబెట్టుకోకపోయినా పోయింది పొల్లు వచ్చింది గట్టి.. అని మిమ్మల్ని మన్నిస్తారు.

మీ ధ్యేయం ఫలిస్తోంది. నలుపు తెలుపవుతోంది.. బ్లాక్ మనీ మీరన్నట్టే తీసి పారేశారు. నల్లధనం లేదు. వుండదు. ఈ డిసెంబరు ముప్పైలోగా వున్న నల్లధనం తెల్లధనంగా మారిపోతుంది. స్వయంగా వస్తే ఫిఫ్టీ పర్సెంటు.. మేం పట్టుకుంటే ఫిఫ్టీన్ పర్సెంటు.. అని బంపరాఫరే యిచ్చారు. నలుపుని తెలుపు చేసుకొనే మహదవకాశం మీరిచ్చారు. కాని మనవాళ్ళు ఈలోపలే మార్చేసారు. ఉన్న అరా కొరా మీరిచ్చిన ఆఫర్లో మార్చేసుకోవచ్చు. నల్లధనమే కాదు, నాలుగు వందలకోట్ల నకిలీ నోట్లు కూడా దెబ్బకి బ్యాంకుల్లో జమయిపోయాయి. చెల్లని నోటుకు మళ్ళీ అది అసలా నకిలీనా అని చూస్తారా? అంత సమయం మన బ్యాంకుల వాళ్ళకి వుందా? లేదు! మన దేశంలో రద్దయిన పెద్దనోట్ల మొత్తం విలువ పదిహేనున్నర లక్షల కోట్లు. నవంబరు ఆఖరి నాటికే పదకుండు లక్షలకోట్లు బ్యాంకుల్లో జమయినాయి. మిగిలిన నాలుగున్నర లక్షలకోట్లు ఈ నెలాఖరులోపల ఈజీగా జమవుతాయి. బ్యాంకులకు రాకుండా నల్లధనం బయట మిగిలిపోయే అవకాశమే లేదని ఆర్ధిక నిపుణులు లెక్కలు కడుతున్నారు. తిరిగి లక్షన్నర కోట్లు మీ చర్య వలన నష్టం వస్తుందని కూడా చెపుతున్నారు. ఎవరెన్ని చెప్పినా యిప్పుడు మీ అడుగు వెనక్కి తీసుకోవడానికి లేదు. దేశం వృద్ధిరేటు తగ్గినా తప్పులేదు. ఎందుకంటే మీరు యెంతో సాహసంతో దేశంలో నల్లధనం లేకుండా చేసారు.  అది చాలు. ఆపేరు చాలు. నల్లధనంతో నానా అవస్థలూ పడుతున్న పెద్దలకు మీరిచ్చిన అవకాశం అమూల్యమైనది. అపురూపమైనది. మీరే మళ్ళీ మళ్ళీ మనదేశ ప్రధానమంత్రిగా వుండాలి. నల్లధనం లేని దేశంగా భారత దేశాన్ని మార్చేసి  చరిత్రలో స్థానం కల్పించిన మీకు ఈ దేశప్రజలు యెప్పటికీ ఋణపడే వుండాలి. వుంటారు!

ఈ దేశప్రజల్లో వొకడినైనందుకు యెంతగానో గర్విస్తున్నాను!

కృతజ్ఞతా పూర్వక నమస్కారాలతో-

మీ

అనామక భక్తుడు.

 

రూప్యములు!

 

        rupees

“నల్ల ధనం అంటే..?”

“వెయ్యి.. ఐదు వందల నోట్లు అని అర్థం!”

*   *   *

“మోడీ గారి నిర్ణయం వల్ల మీకేమర్థంయ్యింది..?”

“క్యాష్ ను లిక్విడ్ రూపంలో దాచకుండా- భూముల రూపంలోనో.. బంగారం రూపంలోనే దాచుకోవాలి..!”

*   *   *

“చంద్రబాబు అవినీతి పోరాటం ఫలించింది, వెయ్యి-ఐదొందల నోట్లు ప్రభుత్వం నిషేధించాలని పలు మార్లు మోడీని కోరారు..”

“బాబుగారు ముందే జాగ్రత్తపడ్డారన్నమాట..!”

*   *   *

“బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు డోకా లేదుగా..?”

“స్విస్సు బ్యాంకులో దాచుకున్నా డోకా లేదు..!”

*   *   *

పేపర్లో ఒక ప్రకటన:

“మాభూములకూ- వ్యాపార వ్యవహారాలకూ- బినామీలు వున్నట్టే.. మా నగదునకు కూడా బినామీలు కావలెను!”

*   *   *

“భలే మంచి చౌక బేరము.. సమయం మించినన్ దొరుకదు..”

“వందకు ఐదు అదొందల నోట్లట..?!”

*   *   *

“ఇక ఐదొందల నోట్లూ వెయ్యి నోట్లూ చెల్లవు..!”

“మంచి పని చేసారు, ఇక ఎంచక్కా రెండువేల రూపాయల నోట్లు దాచుకోవచ్చు..!”

*   *   *

“మోడీ విదేశీ పర్యటనలు చేసి చేసి విదేశాల మీద తనకున్న మమకారం మరోసారి చూపించుకున్నారు..!”

“అందుకేగా.. విదేశీ నల్లధనం వెనక్కి రప్పించేబదులు.. స్వదేశీ నల్లధనం వెలికి తీయిస్తున్నారు..?!”

*   *   *

“అసలు నోటుని చూసి నకిలీ నోటు నవ్విందట.. యెందుకూ..?”

“ఇప్పటికైనా అర్థమయ్యిందా.. నకిలీ నోట్ల వల్ల నష్టం లేదు, అవి యెలాగూ నకిలీయే! అసలు నోట్లే చెల్లవూ..అని!”

*   *   *

“మన రిజర్వుబ్యాంకు 1946లోనే వెయ్యి, పదివేల రూపాయల నోట్లని రద్దు చేసింది, 1978లో వెయ్యి, ఐదువేలు, పదివేలు రూపాయలు వంటి పెద్దనోట్లని రద్దు చేసింది.. చెలామణిలో వున్న నోట్లని రద్దు చేయడం యిదే ఫస్ట్..!”

“అయినా నల్లధనం పెరిగిందే కాని తరగలేదు..!”

*   *   *

“ఇప్పుడు నీకేమర్థమయ్యింది..?”

“డబ్బుని యెప్పుడూ ఇంట్లో దాచుకోకూడదు! విదేశీ బ్యాంకుల్లోనే దాచుకోవాలి..!”

*   *   *

“అప్పు యిచ్చినా వద్దన్నావా..?”

“అన్నీ పాత వెయ్యీ ఐదొందల నోట్లు యిస్తాడట..!?”

*   *   *

“వెయ్యీ ఐదొందల నోట్లు కేన్సిల్..”

“కాదు.. మా సినిమా కేన్సిల్ అయింది..!”

*   *   *

“దీనివలన భవిష్యత్తులో టెర్రరిజం పోతుందంటారా..?”

“చెప్పలేం, కాని రెండువేల రూపాయలనోటు కూడా వుండదు, పోతుంది..!”

*   *   *

“నరుడా ఏమి నీ కోరిక..?”

“పెట్రోలు బంకులూ రైల్వే స్టేషన్లతో పాటు వైన్ షాపుల్లో ఒక్కరోజుకి ఈ నోట్లు చెల్లుబాటు అయ్యేలా చూడు స్వామీ..!”

*   *   *

“మన బ్యాంకుకు చాలా రిక్విజేషన్స్ వచ్చినట్టున్నాయి.. ఏమిటవి?”

“మనబ్యాంకులో రుణంగా తీసుకున్నప్పుడు మనం అన్నీ వెయ్యీ ఐదొందల నోట్లే యిచ్చామట.. అవి చెల్లవు గనుక యిచ్చిన అప్పు కూడా చెల్లదని గుర్తించమని కోరుతున్నారు సార్..”

*   *   *

 

 

 

గైనేరా? గడ్డికుప్పా?

 bokeh-1505960_1920

 

ఒరే కొడుకా..

ఏడుకొండలూ.. యెలాగున్నావురా అయ్యా..

ఊరూ యేరూ వొక్కలాటివే. ఒడుపు తెలిసి బతకాల. బతుకు దాటాల. లేదంటే ములిగి చావాల. ఉన్నదే వూరు. పెట్టిందే కన్నతల్లి. నోరు మంచిదయితే వూరు మంచిదవుతాది. నీకసలే మా సెడ్డ నోటి తీట. ఈటిసిరితే యెనక్కి తీసుకోగలం గాని మాటిసిరితే యెనక్కి తీసుకోగలమా? కాలాలు చూస్తే బాగోలేవు!

ఎద్దు ముడ్డి పొడిసి యేదుం పిండి అంబలి తాగినోడు మీయయ్య. మీ అయ్యకేం తెలుసును? అని అనుకోకు. ఇదమూ తెలీదు.. పదమూ తెలీదు అని అనుకోకు. మాయమ్మ పేరు దాక.. మీ యమ్మ పేరు డోకి అనుకోకు. లోకం నన్నెరక్క పోవచ్చు. లోకాన్ని నానెరుగుదును. కనబడుతున్న దానికి గట్టిక్కి యేల సూడాల కొడుకా..!?

రాజుల కాలం పోయింది.. రాజులు సరి.. రాజ్జాలు సరి.. మంత్రులు వొచ్చినారు. మనమే జనమే అదికారంలోకి వొచ్చినామని అనుకున్నాం. జీ హుజూర్.. అని యికన వుండక్కర్లేదనీ అనుకున్నాం. కాలు మొక్కక్కర్లేదనీ- కళ్ళు దించక్కర్లేదనీ అనుకున్నాం. ఎవుడికి ఆడే రాజనకున్నాం. ఎవుడికి ఆడే బంట్రోతనుకున్నాం. ఎవుడు యెవుడికీ లొంగక్కర్లేదనుకున్నాం. ఎవుడు యెవుడికీ వంగక్కర్లేదనుకున్నాం. ఎవుడి బతుకు ఆడు బతకీయొచ్చనుకున్నాం. గాని యిదీ అదే. అంతా కనికట్టు. కాదంటే వొట్టు. మన సూపు మారింది.. మన రూపు మారింది.. గానొరే అసలు మారాల్సింది మారలే. ఇప్పుడు మంత్రులందరూ రాజులే. ఆల రాజ్జిమే నడస్తంది. ఆల కత్తులు తుపాకులయినాయి. ఆల మొల నుండి పక్కోడి మొలకి మారినాయి. ఇప్పుడు ఆల కత్తులు ఆలు పట్టుకోరు. పట్టుకోడానికి పదిమందుంటారు. వందమందుంటారు. ఆల గుర్రాలూ యేనుగులూ- కార్లూ యెలీకాప్టర్లయినాయి. ఆల సైన్యం- పోలీసు, మిలటరీ బలగాలయినాయి. తప్పితే ఆల యంత్రాంగమూ మారలేదు. ఆల మంత్రాంగమూ మారలేదు. మన రాతా మారలేదు. లోకం తిత్తవా మారలేదు.

మన బంట్రోతు బుర్ర మీద కుచ్చీల టోపీ మారలేదు. పై మీద పయ్యాడ బెల్టూ మారలేదు. బిళ్ళా మారలేదు. అంతెందుకు తెల్లోడి దగ్గిర కాలు నేలకు తన్ని.. చెయ్యి నుదిటికి తిరగేసి అతికించి కొట్టిన సెల్యూటూ మారలేదు. వేసుకున్న ఖాకీ బట్టా మారలేదు. పట్టుకున్న లాటీ మారలేదు. పోలీసు తీరూ మారలేదు. ఆడి క్రాపు మారలేదు. కాసిన మన యీపు మారలేదు. మారలేదంతే మారలేదు.

ఆ మాటకొస్తే అప్పుడు కలకటేరు యిప్పుడూ కలకటేరుగున్నాడు. అప్పుడు కప్పమే లాక్కుండోలు. యిప్పుడు పంట మీద కప్పమే కాదు, పంటే కాదు, పంటేసిన బూమి కూడా లాక్కుంతన్నారు. తన్ని మరీ. కేసులు పెట్టి మరీ. కాల్చిచంపి పడీసి మరీ. ఆ అబివుద్ది జోలికి పోను గాని కొడుకా.. యేటీ మారలేదు. కేసులంటే యాదికొచ్చింది.. దర్మల్ పవరు ప్లాంటు కేసులల్ల కోర్టుల చుట్టూ తిరిగినాను గదా.. జడ్జీ గారని తెలీక పెద్దలాయరనుకోని ఆయమ్మగారికి అనుకోకండా మొదట్ల యెదురైపోన్ను. దండవెట్టినాను. దేవుడ్ని చూసినట్టుగా చూసినాను. ఎన్నడూ చూడని దేవుడు యెదురొస్తే యెలాగ చూస్తామో అలాగ చూసినాను. కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాను. అలాగ కళ్ళలో కళ్ళు పెట్టి చూడగూడదని నాకు తెల్దు. దెస్టా.. అని మనోలు నా తల కిందకి వంచీసి గబుక్కున వుపద్రవం ముంచుకొచ్చినట్టు అందరూ వొక్కపాలి యెనక్కి లాగినారు. తెలక పులికి ఆహారం అయిపోతానన్నంత యిదిగా గబుక్కున ముందు నుండి యెనక్కి లాగినారు. యెంత పని చేసినావని మనోలు నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టిపోసినారు. నానేటి చేసినానో నాకు తెల్లేదు. నాను యెర్రి మొకం యెట్టుకు చూస్తే చెప్పినారు. ఎన్నడు గాని.. యెప్పుడు గాని.. యేటి.. తెలిసిగాని.. తెలియక గాని.. జడ్జీలకి యెదురెళ్ళ రాదు. ఒకేళ పొరపాట్న యెదురయిపోతే.. దండమెట్టి పక్కకి తప్పుకొని తోవ యివ్వడం గవురవము కాదట?! ఎనక్కి అలాగే నాలుగడుగులు యేసి- అప్పుడు దండమెట్టి- పక్కకి జాగర్తగ- తలవొంచి తప్పుకోవాలట. పొరపాట్న కూడా యెనక్కి తిరిగి పోగూడదు. యెన్నూ యీపూ నడ్డీ ముడ్డీ సూపగూడదు! అలాగని యే రాజ్జాంగంలో వుందని నువ్వు అనొచ్చు. అన్నీ రాజ్జాంగంలోనే రాసుండవు. కొన్ని రూల్సు సెక్సన్లూ పాలో కావాలంతే! ఇలాటివి యెవుడూ చెప్పడు. ఏ పుస్తకాల్లంట వుండవు. గాని తెలుసుకొవాల. తెలుసుకొని మసలు కోవాల. మంచిగ బతుక్కోవాల.

అన్నట్టు చెప్పడం మరసిపోనాను. కలకటేరు ఆపీసుకు ఆమద్దిన యెల్లినాను గదా? అతగాడూ యెనకటి రాజుగోరే. తలమీద కిరీటమొకటే తక్కువ. ముందలే రాజావారి దర్శనానికి మా పేర్లు రాసుకున్నారు. తెల్లారగట్ల యెల్లి దండమెట్టి కూకున్నాం. ఎయిటు సెయ్యండి.. ఎయిటు సెయ్యండి.. అన్నారు ఆపీసర్లు. ఎయిటేటి నైనూ టెన్నూ కూడా అయిపోయింది. పొద్దుటి నుండి అతగోడు వస్తాడు.. యెల్తాడు.. వస్తాడు.. ఆడి పేసీల వున్నాగాని ఆడు మన పేసు సూడ్డు. ఆడు లార్డు కజ్జిన్ లాగ.. మనమేమో గుమ్మంలో వున్న గజ్జి బేపిలాగ.. ఆడు మనొంక సూడ్డానికి కూడా యిష్ట పడ్డు. పెర్మిషను యిస్తే గాని పెదవి యిప్పగూడదు.. అని ముందలే తాకీదు యిచ్చినారు ఆపీసోలు. సచ్చినట్టు నోరు కుట్టుకున్నాం. మూగోల్లాగ వుండిపోనాం. శిలా పతిమల్లాగ వుండిపోనాం. పొద్దోయిందాక. రేపు రా.. మాపు రా.. అని గాని అన్లే. సారూ పులుసూ యెల్లి పోనాడని ఆయెనక చెప్పినారు. చెస్.. ఈ కుక్కల కొడుకు తోటి మనకేటని రైతులందరం యెనక్కి యెలిపోచ్చినాం. నీకొకటి తెలుసునా.. కలకటేరుకే కాదు, యూనివరిసిటీల ఈసీలకీ, మన యిరిగేషను యింజినీరుకీ గొడుగు పడతారు. ఎండా వానా యేటి లేనప్పుడూ పడతారు. దేవుళ్ళకి తల యెనకాల సెక్రం వున్నట్టుగా యీలకి గొడుగుండాల. అదేట్రా అంటే మన యెలమ యెంకడు ‘దటీజ్ వోదా’ అంటాడు. ఇంక రాష్ట్రానికి వోదా వొస్తే యేటవుతాదో యేటో?

సర్లే గాని మన కానిస్టేబులు కనకారావు లేడా? మన యెనక సెగిడీదిల వుంటాడు. ఇంజనీరింగు సదివినాడు గుంటడు. ఐయ్యేయస్ ఐపీయస్సు ఐపోతాననుకున్నాడు. ఆపరీచ్చా ఈపరిచ్చా రాసినోడే. తెలివైనోడే. గాని అడుగు సిల్లి. అసల బొక్క. కూతురు కూటికి యేడిస్తే అవ్వ రంకుమొగుడికి యేడిసిందని అలయ్య గోల. పూట పూటకీ పూట గడవక కష్టంగ వుంటే యెప్పుడో ఆపీసరయ్యి మేం సచ్చినతర్వాత మా సమాదిమీద యీడు గేదిని కడతాడు.. అని రోజూ యింట్ల యేలాలూ గుడిసిలే. ఇంక యేలని పోలీసు పరీచ్చలు రాసి కానిస్టేబులు అయిపోండు. పోనీ అని లాఠీ వూపుకొని సక్కగా వుండొచ్చును కదా.. వుండలే.. ఈడికి ఐయ్యేయస్ ఐపీయస్సు పిచ్చ వుంది కదా? ఆ ఐపీయస్సు బాసుని సూడాలని మాటాడాలని మన బాసేకదా అని యెల్లబోనాడు. ‘వుద్యోగం సెయ్యాలని లేదా లం.. కొడకా’ అని ఆడి తోటోలూ పైయ్యోలూ తిట్టినారట. ఐపీయస్సు ఆపీసర్లతోటి కానిస్టేబుళ్ళు కలవడానికి లేదట. మాట్లాడడానికి లేదట. అసలు యెదురు పడడానికే లేదట. అంత హీనము మరి అని అనుకుంటే కాదు. అదే వోదా. ఆవోదా యెక్కడిది? రాజుల కాలం నాటిది కాదా? ఆలు రాజులు కారా?

చెప్పినాను కానా? ఏటీ మారలేదు. ఎనకటికి బుగత యింటి ముందు చెప్పులు తీసి చేత్తో పట్టుకు నడిసోలమా? అచ్చం అలగే. కావాలంతే కొన్ని ఆపీసులకి యెల్లి నీకళ్ళ తోటి సూడు. అందల పని చేసినోలే, చెప్పులు యిప్పి అయ్యవారి గదిలోకి అడుగు పెడతారు, దేవుడిగారి గర్బ గుడిలోకి అడుగు పెట్టినట్టు. మెడకాయ మీద తలకాయ యేలాడేసుకొని భక్తి మీద యెల్లి దండమెడతారు. మన ముందున్నోళ్ళని చూసి మనమూ జనమూ పాలో కావాలంతే! అడిగిన అన్నిటికీ ఆనసరు వుంది గదా అని చెప్పీగూడదు. మూగోలి లెక్క వుండాల. తల వూపాల గాని అడ్డంగా వూపగూడదు. అన్నిటికీ యస్సే అనాల. వోయస్ అనీసి వుత్సాహపడగూడదు. టెంపరి అనుకుంటారు. ఒళ్ళు బలుపు అనుకుంటారు. కొవ్వి పోనాడని కూడా అనుకుంటారు. అనుకోడానికి అడ్డేటి?

అసలు అనుకున్నా అనుకోకపోయినా ఆదోరంనాడు చేసిన ‘తిర్నాద సాముల కత’లాగ యిదాయికం పాటించాల. ఇవీ యిది యిదానాలని కార్తీక పురాణం పుస్తకంల రాసినట్టు వరసాగ రాసుండదు. గాని అచ్చరం ముక్క రానోడికి కూడా అంతా తెలుస్తాది. అర్దమవుతాది. టీవీలల్ల సూడ్లేదా? మన సినిమావోలు పతొక్కలూ పాదాలకి మొక్కీవోలే. అయిటయిటికీ వొంగి దండాలు పెట్టీవోలే. నడుము నొప్పులు రావో యేటో? అన్నిటికీ డూపులు పెడతారు, అదయినా వొరిజినలుగా సెయ్యనీరా అంటాడు మన సిమాచలం దద్ద. ఆడు అప్పుడ్లో సినిమాల్లో చేసీవోడని కతలు చెపుతాడుగదా. మోకమాటంగా వంగీ వంగక మద్దిల వుంటే- వొద్దు.. వొద్దనీసి మెడమీద సెయ్యపెట్టితే.. మనం లేపుతున్నాడు గావాల అనుకుంటాం. కాదట. పాదాలకు టచ్చు చెయ్యమని మెడమీద సెయ్యి తియ్యకుండా కిందకి వొంచుతారట కొందరు పెద్దలు. రాజుల కాళ్ళమీద.. జెమిందారుల కాళ్ళ మీద.. దేహీ అని పడినట్టు పడాల. అర్థమయ్యింది గదూ..?

రాజులెందుకు సరిపోతార్రా.. రాచరికాలు యెందుకు సరిపోతాయిరా కొడుకా.. మనవూరి కతే తీస్కో. గ్రామ పెసిరెంటు ఆపీసుల మీటింగు పెడితే యెల్లాల. తప్పకుండా యెల్లాల. గాని ఆపీసు యివతలే నిలబడాల. అదీ యిలువ. మరి మన డోక్రా మహిళా సర్పంచులయినా అంతే. ఆలు యింట్ల మీటింగు పెడితే మనం ఆడోళ్ళు యీదిల నిలబడాల. అదీ యిలువ. రెస్పెక్టు యివ్వకపోతే రేపు మన మొకం యెవ్వడూ సూడ్డు. తెలిసిందా? వాటమూ గీటమూ లేని వూరే యింత వయ్యారంగా వుంటే- పట్నమూ.. నగరమూ.. మరెంత వంపులతోటి వయ్యారాలతోటి వుంటాదోనని నా బయ్యిం.

సిటీలల్ల అలగేటి వుండదు. వొకడికి లచ్చిం లేదు.. సల్దికి బత్తిం లేదు.. అన్నట్టుగ బతికీయొచ్చు అని అంటావు. నీకా యీక తెంపితే కడేదో మొదులేదో తెల్దు. పేంటూ సర్టూ యేసీగాన సరికాదు. రంగుల కళ్ళ జోడు పెట్టీగాన సరికాదు. సరిగ్గ సూడు.. టీవీలల్ల సూడ్డం లేదనుకోకు. మినిస్టర్లూ మంత్రులూ వస్తే.. ‘రాజుగారు వొస్తన్నారహో..’ అని దండోరా యేయించినట్టు ‘పోయ్.. పోయ్’ మని అరుపులూ ఆరన్లూ. ‘అడ్డు తప్పుకోండహో..’ అని పోలీసులు దారి క్లియారు చెయ్యడాలు. ట్రాపిక్కు ఆపీడాలు. ఆపదైనా సాపదైనా ఆడికి ముందల దారిచ్చీయాల. నువ్వు ఆగాల. నీ సావు నువ్వు సావాల. రాజుగారు యెల్లీదాక సావయినా రేవయినా అంతే. ఆ తరవాతే బతికి సావాల. బట్ట కట్టి సావాల. రాజుగారికి పత్తింగుంటాది. మనకే మాడి పోతాది. మసయిపోతాది. నువ్వా దర్జా చూసి చెప్పు. ఇప్పుడుకీ మనం రాజులకాలం వున్నామా? లేదా? అది ముందు చెప్పు.

నాయనా! మన వూర్లంట యే మాటన్నా సెల్లుతాది. ఆడేటి ‘గైనేరా? గడ్డికుప్పా?’ అని గైనేరుని తిట్టీసినా దీవించీసినా ఆతు ముక్క కింద తీసీసినా చెల్లుతాది. ‘గైనేరుకు గడ్డు- మేస్త్రీకి మెడ్డు’ అనీసినా ఆడిపోసుకున్నా చెల్లుతాది. ఓట్లు తప్ప మన పాట్లు తెలీని అవుకు గాళ్ళని ఆడి యమ్మా యక్కా యాలి చేసి నానా తిట్లు తిట్టీసినా చెల్లుతాది. ఏలిన నంజి కొడుకుల్ని యెన్నన్నా చెల్లుతాది. ఆల ఆడోలు యేటి చేస్తారు గాని మద్దిన? యింకో తోవ లేదు. తెన్నులేదు. అమ్మనాబూతులు తినని వొక్క నాకొడుకుని చూపించు. రాజకీయాల్లోకి వొచ్చినప్పుడే ఆలూ అన్నిటికీ సిద్దమైపోయి వొస్తారు. సిగ్గూ యెగ్గూ వొదిలేసి వొస్తారు సన్నాసులు! మనము తిడతన్నామని పదవుల్లో వున్న యెదవలకి తెలీదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం సీకటయి పోద్దా?

ఒరే.. చివరాకరుగా నే చెప్పేది యిను. కుట్టినోలుకి కుడిపక్క వుండకూడదు. ఏడిసినోలుకి యెడమపక్క వుండకూడదు. అదికారంలో వున్నోలుకి ఆపక్కా యీపక్కా యేపక్కా వుండకూడదు. నువ్వసలే ‘గుర్రమ్మీదున్నోడు గుడ్డిగాడు.. యేనుగుమీదున్నోడు ఆతుగాడు’ అనే రకం. కానొరే.. అది కుదర్దు. మొన్నటికి మొన్న చూసినావు కావా? అయిదరాబాదులే.. సర్దారు వల్లబాయి పటేలు పోలీసు ట్రైనింగు కేంపులే.. అడీసినల్లు డీజీపీ యిందుకుమారు బూషణు అని రాజస్తాను నుండి వొచ్చినాడు. మన గవర్నరుని అడిగినాడు.. యేటని? మీ రాజబవనం నుండి సమాచారం అడిగిన ఆర్టీఐ కార్యకర్తలని మాపియా అని యెందుకు అన్నారు.. అని. రాజుని ప్రశ్నిస్తే సైన్యాదిపతికైనా తల తెగిపోద్ది. ఆ పోలీసు బాసుని టక్కున ట్రైనింగు ఆపీసి మరీ యెనక్కి పంపించీసినారు గదేటి? అతగాడు గొంతు కోసుకొని పేనాలు తీసుకోబోతే జైపూరు యిమానంల తొస్సి యెనక్కి పంపించీసినారు. ఇదంతా నాకెలాగ తెలుసును అనుకోకు. పేపర్ల వొస్తే మన ఈసుగాడు చదివి యినిపించినాడు. నువ్వు పేపర్ల యెడ్డింగులు చదివీసి.. సినిమా బొమ్మలు చూసీసి.. కిర్కెట్టు పరుగులు లెక్కట్టుకున్నంత కాలం నీకిలాటివి కనబడవు. ఆ పేపరోలు కూడా అదొక వార్త కాదన్నట్టుగ యేసినారు. కానొరే.. యెందులో నుండయినా మనం తెలుసుకోవల్సింది.. నేర్సుకోవల్సింది వొకటుంటాది.. అర్ధమయింది కదా.. కోవిల కెళ్ళి పిత్తకుండా వుంటే దూపమేసినంత పలితము. మనకాడ వాగినట్టు యెక్కడ పడితే అక్కడ యేది పడితే అది వాగీకు. నోరు మనదే. కాని వూరు మనది కాదు కదా?!

యిప్పుడుకే చేట బారతం రాసినాను.. వుంతాన్రా అయ్యా.. జాకర్త!

యిట్లు

మీయయ్య

అప్పలకొండ

‘మాష్టారూ.. పేకేసుకుందామా..?’

images

గౌరవ పూజ్యులైన మాస్టారికి..

నమస్కారాలతో-

బావున్నారా?, గురుపూజోత్సవం రోజు గుర్తుకు వచ్చారు. నేను గురువునైనా నా గురువు మీరు కదా? మీతో ఫోన్లో రెండు ముక్కలు మాట్లాడేకన్నా నాలుగు ముక్కలు వుత్తరంగా రాద్దామని యెందుకో అనిపించింది. ఇదిగో అదిగో అని మన ‘ఉపాధ్యాయ దినోత్సవం’ వెళ్ళిపోయి ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ వచ్చేసింది.

మాస్టారూ.. మీరంటే చిన్నప్పటి నుండి నాకు చాలా యిష్టం. ఎంత యిష్టం అంటే పెద్దయ్యాక నేను కూడా మీలాగ మాస్టారు అవ్వాలనుకున్నాను. అయ్యాను. అయినందుకు చాలా సంబరపడ్డాను. అదే విషయం అప్పుడు మీకొచ్చి చెప్పాను. చాలా ప్రయోజకుడినయ్యానని నన్ను మీరు మెచ్చుకున్నారు. ‘మన దగ్గరున్నది జ్ఞానమైనా అజ్ఞానమైనా దాచుకోము.. పిల్లలకి యిచ్చేస్తాము..’ అని మీరు నవ్విన నవ్వు కూడా నేను మరిచిపోలేదు. మనకి మాత్రమే నిరంతర విద్యార్థిగా వుండే వీలు.. కాదు, అవసరం వున్నదని మీరు గర్వంగా చెప్పారు. అప్పటికీ నేను మిమ్మల్ని అడిగాను.. ‘ఆ రోజుల్లో- మీ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారట కదా?’ అంటే- ‘మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుంది?’ అని మీరన్న మాట చదివిన పాఠాలకన్నా యెక్కువ గుర్తుంది. ఈ రోజుల్లో- మా రోజుల్లో ‘బతకడానికి బడిపంతులు’ అని అంటున్నారు!

ఔను.. ఇప్పుడు బతకడానికి బడిపంతులు. జీతాలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో వుద్యోగాలు వొదులుకొని వొచ్చిన వాళ్ళున్నారు. పిల్లలతో పాటు మనమూ యింటికి వచ్చేయొచ్చు. పిల్లలతో పాటు మనకూ సెలవులు వుంటాయి. స్ట్రెస్ లేదు. స్ట్రెయిన్ లేదు. ప్రెజర్ లేదు. బ్లడ్ ప్రెజర్ లేదు. పాఠం చెప్పామా.. మన పని అయిపోయిందా.. అంతే. చెప్పినా చెప్పకున్నా నడుస్తుంది. అదంతే. అప్పుడప్పుడూ ప్రభుత్వం ఆపనీ ఈపనీ అని అడ్డమైన పనులూ అప్పజెప్పినా మిగతా ప్రభుత్వ వుద్యోగులతో పోలిస్తే మనమే నయం. మిగతా ప్రభుత్వ శాఖల్లో వుద్యోగులు వుద్యోగుల్లా లేరు. పార్టీ కార్యకర్తల్లా వున్నారు. జెండాలూ చొక్కాలూ వొక్కటే తక్కువ. అలా వుండకపోతే వుద్యోగం చెయ్యలేరు. చెయ్యనివ్వరు. ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా అంతే. ఇప్పుడు యింకాస్తా యెక్కువయ్యింది. మన పనిగంటల్లో మనం పనిచేసి రావడానికి లేదు. సాయంత్రం అయిదు తరువాతే అధికారులు వస్తారు. పగలంతా పని వొదిలి, అప్పుడు విధులు చేపడతారు. పని గంటలు దాటాకే వుద్యోగులకి పనికి ఆహార పథకం ప్రారంభమవుతుంది. కింది నుండి పైదాకా ఆమ్యామ్యాలే. పెరసంటేజీలే. కంచం లేని యిల్లు వుండొచ్చు. లంచం లేని ఆఫీసు లేదు. అయ్యయ్యో అనుకోకుండా అసహ్యించుకోకుండా ‘అయ్యో.. మనకి వాళ్ళలా రెండు చేతులా రాబడి లేదే’ అని వాపోయే వుపాధ్యాయులే మాలో యెక్కువ. డిగ్రీలూ పీజీలూ పీహేచ్దీలూ చేసి చాలక- బియ్యీడీ యెంట్రెన్సులూ రాసి- ర్యాంకుల కోసం కోచింగులకూ వెళ్ళి- చచ్చే చెడీ ర్యాంకులూ తెచ్చుకొని- శిక్షణ పూర్తిచేసి- పాసయినా కాదని లేదని మళ్ళీ టెట్ లూ రాసి- దాని కోసం మళ్ళీ కోచింగులకూ వెళ్ళి మార్కులు స్కోరూ చేసి- మళ్ళీ డియ్యస్సీ నోటిఫికేషన్ కోసం చూసి- కోచింగ్ సెంటర్లో చేరి- పరీక్ష రాసి- నెగ్గితే అప్పుడు వుద్యోగం. ఈ వుద్యోగంలో చేరినాక ఆ అలసట తీరేలా రిలాక్స్ అయిపోవడమే. జీవితాంతమూ రిలాక్స్ అయిపోవడమే!

ఉపాధ్యాయ వృత్తి గొప్పది కావచ్చు. కాని వుద్యోగంలో చేరినాక – వుద్యోగంగా గొప్పది అనుకొనేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే వుపాధ్యాయ వుద్యోగంలో చేరినవాళ్ళు సబ్జెక్ట్ చేతిలో వుంటుంది.. గ్రిప్ వుంటుంది.. అన్నంతవరకే వుండి, ఆపైన పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు గాలికి వదిలి, ‘కాంపిటేటీవ్ కు ప్రేపేరవడం’లో ములిగి, గ్రూప్సో సివిల్సో సాధిస్తామన్న నమ్మకంలో తేలి, తాము అవకాశం లేకనో ఆపద్ధర్మంగానో అందులో వున్నాం తప్పితే, తమ స్థాయి యిది కాదని ప్రెస్టేజ్ ఫీలవడం.. ఆఫీలింగు అందరికీ చూపించడం ద్వారా యెక్కడో వుండాల్సిన వాళ్ళం యిక్కడ యిలా యీసురోమంటూ యేడవాల్సి వొస్తున్నందుకు దేవుణ్ణి నిందించడమో.. పూజలు చెయ్యడమో.. మొక్కులు మొక్కడమో.. యింతే. కాదంటే ఒక టీచర్ మరో టీచర్ని వృత్తి ద్వారా జీవిత భాగస్వామిగా యెంపిక చేసుకొని యెడ్జెస్ట్ చేసుకోవడమో.. అంతే!

ఒక్క జీతం మీద బతకడం కష్టం. నాతం కూడా వుండాలి. నాతం లేదని నాతోటివాళ్ళు నానా బాధా పడిపోతున్నారు. నానా గడ్డీ కరుస్తున్నారు. ఇప్పుడు మన వుపాధ్యాయుల్లో చాలా వరకు రియలెస్టేట్ బ్రోకర్లే.. తప్పితే డైలీ కట్టుబడి వ్యాపారం చేసేవాళ్ళే.. ఈ బ్రోకర్లకి యే సైటు యెక్కడవుందో తెలిసినట్టుగా యే పాఠం యెక్కడవుందో తెలీదు. ఈ ఫైనాన్షియర్లకి వడ్డీ లెక్కలు తప్ప మరే లెక్కలూ రావు. మొత్తానికి యేదో వొక వ్యాపారం.. యేదో వొక వ్యవహారం.. యేదీ లేకపోతే ప్రవేటు కాన్సెప్ట్ కార్పోరేట్ స్కూళ్ళలో కాలేజీల్లో పిల్లల్ని పోటాపోటీగా చేర్పిస్తున్నారు. ఒక విద్యార్థిని చేర్పించినందుకు అయిదు నుండి పది వేలు ఆదాయం. అక్కడున్న విద్యాసంస్థలను బట్టి.. యేరియాని బట్టి.. ఆ ధరలు అటూ యిటూ అవుతాయి.. అంతే. గవర్నమెంటు కాలేజీల్లో పనిచేసిన లెక్చరర్లు అయితే రిజైన్ చేస్తే భద్రత వుండదు గనుక సెలవు పెట్టి ప్రవేటు కాలేజీలలో పనికి కుదిరిపోతున్నారు. ఎన్నడూ లేనిది శ్రద్ధగా నోట్సులు కూడా తయారు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం కంటే ప్రవేటు వాడు యెక్కువ యేమీ యివ్వడు. కాని అసలు కంటే కొసరు మీదే యావ. ఇక్కడ చూస్తే సెలవు పెట్టిన కాలేజీకి కొత్త లెక్చరర్లు రారు. పాఠాలు జరగవు. ఆశించిన ఫలితాలు రావు. కాలేజీలు నడవవు. గవర్నమెంటు ఇన్స్టిట్యూషన్స్ లో చదువులు బాగోవు అని మాట. ఉన్న క్యారక్టర్ని చెరిచేస్తున్నారు. చేరిపేస్తున్నారు. అధికార్లూ అంతే. రేకుల షెడ్లలో వేలకొద్దీ లక్షలకొద్దీ ప్రవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అవి అర్హత లేనివి కావు. ఆదాయ మార్గాలు. అంతే. ఇక, మాటకారితనమూ చనువూ చతురతా వున్నవాళ్ళు యివికాక యల్ఐసి యితరత్రా యిన్సూరెన్సు యేజెంట్లుగా.. అది కూడా పెళ్ళాల పేర్లతో.. తెగ కష్టబడుతున్నారు. చాలా కష్టపడి యీ దశకు వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు.

‘ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ వుద్యోగం యివ్వాలి’ అని సోషల్ నెట్ వర్క్స్ లో పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠాలు చెప్పే మాస్టార్లు తమ పిల్లల్ని మాత్రం తాము పనిచేసే పాఠశాలల్లో చేర్పించరు. తమ పాఠశాల వున్నా చోట కూడా కనీసం వుండరు. ఒకసారి వుద్యోగంలో చేరామా? యిక అంతే. వేసినప్పుడు వేప చెట్టు. తీసినప్పుడు రావి చెట్టు. మన ఈక కూడా యెవడూ తెంపలేడు. అదీ ధీమా. అదీ భీమా. కాదన గలమా? లేదనగలమా?

చదువుని వ్యాపారం చేసిసింది ప్రభుత్వం. నేనో బడ్డీ పెట్టుకుంటా.. నేనో దుకాణం తెరచుకుంటా.. అంటే నాకు డబ్బు కట్టు.. నీవు నీ వ్యాపారం చేసుకో అని సెన్సు లేకుండా లైసెన్సులు యిస్తోంది. నచ్చినంత ఫీజు వసూల్ చేయడమే. ఏటికి యేడూ ఫీజుల నియంత్రణ మీద టీవీల్లో చర్చలు. ఎప్పటిలాగే. ఫీజుల నియంత్రణ పోరాట కమిటీలు యేర్పడ్డాయని అంటే పరిస్థితిని అంచనా వెయ్యొచ్చు. కోర్టులు తాఖీదులు యిస్తాయి. కాని యేమి లాభం? ప్రభుత్వమూ అధికారులూ వెచ్చగా ముడ్డి కింద వేసుకు కూర్చుంటున్నారు. చూస్తే స్కూళ్ళకు గ్రౌండ్స్ కూడా లేవు. కోళ్ళ ఫారంలో కోళ్ళలా పెరుగుతున్నారు పిల్లలు. చాలక యిన్స్టిట్యూషన్స్ మీద సెల్ టవర్లు. అద్దెలు వస్తాయి కదా? అసలు ప్రభుత్వం వుందో చచ్చిందో తెలీడం లేదు!

మాస్టారూ.. నేను మిమ్మల్ని చూసి చెడిపోయాను. అనవసరంగా మాస్టారునయ్యాను. మాస్టారూ.. మా మాస్టారులు యెలా వున్నారో తెలుసా? పాఠం వదిలి యెప్పుడూ యింక్రిమెంట్ల గురించే మాటలు. మీకాలంలో వుపాధ్యాయులు వుద్యమాలు నడిపారు. జనాన్ని నడిపించారు. మీది వొక చరిత్ర. మాది హీన చరిత్ర. దీన చరిత్ర. మాస్టారూ.. మీకు యిక్కడ వొక మాట చెప్పాలి. నిజాయితీగా ప్రభుత్వ పాఠశాల నడిపితే మా వూరి చుట్టూ వున్న మూడు నాలుగు ప్రవేటు స్కూళ్ళు మూతబడ్డాయి. అందుకు బహుమతిగా ప్రవేటు పెద్దల యిన్ఫ్లియన్సుతో నన్ను ట్రాన్స్ ఫర్ చేసారు.

మాస్టారూ.. మీ తరంలో యేమో గాని మా తరంలో మాస్టార్లు అంటే గౌరవం లేదు. సినిమాల్లో కూడా యెప్పటి నుండో బఫూన్లని చేసేసారు. అదేమిటో సినిమాలే కాదు, లోకం కూడా అంతే అనిపిస్తుంది. ‘మాష్టారూ.. పర్లేదు యింకో పెగ్గేసుకోండి’ అంటాడు వొకడు. ‘మాష్టారూ.. పేకేసుకుందాము వస్తారా..?’ అంటాడు మరొకడు. ‘మాస్టారూ.. ఓ ఫైవుంటే సర్దుతారా..?’ అని, ‘మాష్టారూ.. మీరు భలే మెగాస్టారు..!’ అని యెకసెక్కానికి మనమే యెబ్రివేషన్లయిపోయాము.  అప్పటికీ ‘మాస్టారు’ మన తెలుగు పదం కాదు, ‘గురువు’ కదా అని సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకోనిస్తేగా? ఆ వెంటనే ‘గురువుగారూ.. అగ్గిపెట్టి వుందా?’ అని, ‘గురూ.. గుంట భలేగుంది కదూ..’ అని, ‘గురూ.. నీ పెరసెంటేజీ నువ్వు తీసుకో..’ అని, ‘గురూ.. ఆ లం– డబ్బులు తీసుకుంది, రాలేదు..’ అని మనకి మర్యాదే మర్యాద. పోనీ కాసేపు ‘పంతులు’ అనుకుందాము అని అనుకోనేలోపే- ‘పంతులూ పంతులూ పావుసేరు మెంతులూ’ పద్యాలున్నూ!

పోనీ ప్రవేటు విద్యాసంస్థల్లో మనకి మర్యాద వుందా అంటే అదీ లేదు. అక్కడ స్టూడెంటు కంటే మనం హీనం. డబ్బులు కట్టేవాడు కస్టమర్. మనం సర్వీసు మాత్రమే యిచ్చే సర్వెంట్స్.. అంతే!

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః అన్నారు. పిల్లలకు రాత నేర్పించే గురువే వారి తలరాతని కూడా మార్చెయ్యగలడని నమ్మాను. కాని మన గురువుల తలరాత అంతకన్నా ముందే చెరిపేసి కొత్తగా రాస్తే కాని యేదీ రాయడం సాధ్యం కాదని తెలుసుకున్నాను. కానీ రాయడం కన్నా చెరపడం కష్టంనిపిస్తోంది.

యిట్లు

మీ

శిష్య గురువు

స్వాతంత్ర ఫలాలు!

 

Indian Flag 3

ప్రధాన అమాత్యుల వారికి..

ప్రణామములు!

భారత దేశానికి డబ్బైవ స్వాతంత్ర్య దినోత్సవం! ఈ సందర్భంగా “స్వాతంత్ర్య ఫలాలు ప్రతి వొక్కరికి అందాలి..!” అన్న మీ పిలుపు జాతికి మేలు కొలుపు! స్వాతంత్ర్య ఫలాలు అందుకున్న భారతీయ మణి మకుటములైన వారి సందేశాలను సంక్షిప్తంగా మీకు కొన్ని సమర్పించుకొనుచున్నాము!

***

“విదేశాల్లో నల్ల ధనాన్ని మేం దాచుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“విదేశాలలో నుండి నల్ల ధనాన్ని రప్పిస్తాం.. తెప్పిస్తాం..’ అని పదే పదే మీరు ప్రకటించినగాని- ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోవడం, తప్పనిసరి వొత్తిళ్ళలో కొందరిని మొక్కుబడిగా యిబ్బంది పెట్టినగాని- మా యెవ్వరి పేర్లూ ప్రకటించనందుకు.. బయటపెట్టకుండా గోప్యత పాటించినందుకు.. మీకూ మీ మంత్రివర్గానికి పేరు పేరునా కృతజ్ఞతలు..!”

యిట్లు

నల్లకుబేరులు.

***

“మీ దేశంలో పెట్టుబడులు పెట్టి మా వ్యాపారాలు మేము చేసుకోనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు! మా వృద్ధిని ప్రజల అభివృద్ధిగా మీరు అభివర్ణించిన తీరు మిక్కిలి ఆనంద దాయకము మరియు శుభకరము!

“మీ ప్రజలకు రాయితీల్లో కోతలు విధించుకుంటూ వొచ్చినా గాని- ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’తో మమ్మల్ని ప్రోత్సహించి రాయితీలు కల్పిస్తున్నందుకు మీకు మా ధన్యవాదములు.!”

యిట్లు

విదేశీ బిజినెస్ మేగ్నెట్స్.

***

“ఉల్లి నుండి కందిపప్పు వరకు..

మినప్పప్పు నుండి మిరప వరకు..

అన్నిటా మార్కెట్టును బ్లాక్ చేసి.. అధికరేట్లతో అమ్ముకొని.. మేం వ్యాపారం చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“మా వ్యాపారాలే కాదు, మీ వ్యాపారాలూ బావుండాలని కోరుకుంటున్నాము!”

యిట్లు

స్వదేశీ వ్యాపారస్తులు.

***

“ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్య..

అన్ని విద్యా విభాగాల నుండి మీరు తప్పుకొంటూ మా ప్రవేటు వాళ్ళకి అప్పగించడమే కాక, నచ్చినంత ఫీజులు మేము వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

విద్యాసంస్థల నిర్వాహకులు.

***

 

“ప్రతి పౌరుడిని రోగిగా గుర్తించి అందించే మా వైద్యానికిగాను  మాకు నచ్చినంత ఫీజు వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“ప్రభుత్వ వైద్య రంగాన్ని రోగగ్రస్తము చేసి యేకంగా పడక యెక్కించి.. మీరు సేవా విభాగాలనుండి తప్పుకొని.. ఆ బాధ్యతను మా భుజస్కంధాలపై వుంచడమే కాక వైద్యము లాభసాటి వ్యాపారముగా మించి వొక పరిశ్రమగా అభివృద్ధి చేసుకొనే వెసులుబాటు కల్పించినందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు!”

యిట్లు

ప్రవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.

***

“దళితులమీద దాడులు చేసే ఆధిపత్య స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“తోలు కనిపిస్తే దళితుల తోలు తీసే హక్కునూ.. మాంసము కనిపిస్తే దళితులను మాంసము కొట్టే అధికారమునూ మాకు సంక్రమింపజేసిన మీ పాలన పదికాలాలు వుండాలని కోరుకుంటున్నాము!”

“గోవును నువ్వు రక్షించు! గోవు నిన్ను రక్షిస్తుంది!”

“గోరక్షణే మానవ రక్షణ!”

యిట్లు

గో రక్షక దళం మరియు అగ్రకుల హిందూ ధర్మ పరిరక్షకులు.

***

“మానవ వనరులను బహు చవుకగా వినియోగించుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

“చైల్డ్ లేబర్ కారు చవగ్గా దొరకడం బహు ఆనందనీయమూ మరియు అభినందనీయమూ!”

యిట్లు

పారిశ్రామిక వేత్తలు.

***

“మహిళలను అత్యాచారం చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“నిర్భయ లాంటి కేసులనేకం దేశమంతా తలెత్తడం.. అయినా తగు చర్యలు తీసుకోకుండా జరిగినప్పుడు మాత్రము హడావిడి చేసి మమ్ములను విచ్చలవిడిగా వదిలేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము!”

యిట్లు

పురుష పుంగవులు.

***

“విమెన్ ట్రాఫికింగ్ ను కూడా ‘యెగుమతి’ వనరుగా గుర్తించి మా పనులు మేము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

బ్రోకర్ల ముఠా.

***

”మాదక ద్రవ్యాల సరఫరా మరియు అమ్మకము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

మాఫియా ముఠా.

***

“ఓడిన పార్టీలో కొనసాగకుండా-

పోటీచేసిన పార్టీకి రాజీనామా చెయ్యకుండా-

అధికార పార్టీలోకి జంప్ చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

జిలానీ ఎమ్మెల్యేలు.

***

“మీ వోటును మీరే శ్రమపడి వెయ్యకుండా మేము వేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

పార్టీ కార్యకర్తలు!

***

నోట్:

తమ తమ స్వాతంత్ర్యాలను.. తమకు దక్కిన స్వాతంత్ర్య ఫలాలను గుర్తు చేసుకుంటూ యిలా యెన్నో యెన్నెన్నో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల సందేశాలు మన కోటప్రాసాదాలకు లెక్కకు మిక్కిలిగా వచ్చినవి! కొన్ని ఉత్తరాలను మచ్చుకి మీ దృష్టికి తెస్తూ తమ పరిశీలనార్థం జతపరచడమైనది!

మళ్ళీ స్వాతంత్ర్య దినోత్సవానికి చూసుకుందాంలే అని మిగతా వుత్తరాలను సమయ స్థలాభావాల వల్ల పక్కకు పెట్టడం జరిగినది!

కృతజ్ఞతలు!

యిట్లు

తమ వ్యక్తిగత సహాయక కార్యదర్శి

 

ఆవు అంబా అనును!

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

అఖ్లాక్.. రోహిత్.. యింకా ఆ‘నలుగురికి’!

అనామకులకి.. అనేకానేకులకి!…

చూసారా? దెయ్యాలు వేదాలు వల్లించడం చూసారా?..

“మీరు తూటాలు పేల్చాలనుకుంటే నన్ను కాల్చండి.. ఇప్పటికైనా ఈ దాడులు ఆపేయండి..”

“నా దళిత సోదరులపై దాడులు ఆపండి. కావాలంటే నాపై దాడి చేయండి.. నాతో యుద్ధం చేయండి..”

ఈ వేద మంత్రాలు విన్నారా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయనేమో? ఆవేశం చూసారా? ఆ-వేషం చూసారా? ఆ వేగమూ వుద్వేగమూ చూసారా? దేశ ప్రజలే నా హైకమాండ్ అంటున్నాడు! నూటా యిరవై అయిదు కోట్లమంది నా అధిష్టానం అంటున్నాడు! వారి ఆశలూ ఆకాంక్షల మేరకే.. మార్గదర్శకత్వం మేరకే ప్రభుత్వం నడుస్తోందంటున్నాడు! ఓటు వేసి అధికారము అందివ్వడంతోనే అయిపోలేదంటున్నాడు! నన్నూ నిలదీయండంటున్నాడు! ప్రధానినీ ప్రశ్నించే వ్యవస్థ రావాలంటున్నాడు!

అందుకైనా ప్రశ్నిద్దాం! ప్రశ్నించమన్నందుకైనా ప్రశ్నిద్దాం! మన చావులు వొక ప్రశ్న కాదా? మన వొంటి మీది గాయాలు ప్రశ్నల గుర్తులుకాక మరేమిటి? ప్రశ్నిస్తే మాత్రం వాడు జవాబుదారి కాగలడా? అయినా కాకపోయినా మనం ఈ దేశ ప్రజలమే కదా? మనల్ని అధిష్టానం అని అన్నందుకైనా.. నిలదీయమన్నందుకైనా.. నిలదీద్దాం! నిగ్గదీద్దాం!

నిన్న నిన్న ఢిల్లీ టౌన్ హాల్లో- భిన్నత్వంలోనే భారతదేశం బలం దాగుందని సెలవిచ్చాడే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో తీవ్ర వివక్ష యెదుర్కొన్నారని, విదేశాల్లో గౌరవం పొందారని, అయినా ఆయన భారతీయుడుగానే వున్నారని, ఆయన స్ఫూర్తి ప్రతివొక్కరిలో వుండాలని విన్నవించాడే?..

మరి ఆ స్పూర్తి చెప్పేవాడిలో చిగురంతయినా వుందా? ఏలేవాడిలో పూచిక పుల్లంతయినా వుందా? ఉంటే దేశమిలా వుంటుందా? అంబేద్కర్ యెదుర్కొన్న తీవ్ర వివక్ష వారి జాతి జనులమైన మనకు యింకా వారసత్వంగా కొనసాగుతూనే వుందే? స్వాతంత్ర్యం వొచ్చి యేడు దశాబ్దాలు గడుస్తున్నా సామాజిక రుగ్మతలు కొనసాగడం, అంటరానితనం వుండడం, దళితులు వివక్షకు గురికావడం సిగ్గుచేటని మళ్ళీ ఆ నోటితోనే అన్నాడు! మొట్ట మొదట దేశ ప్రధానిగా సిగ్గుపడాల్సింది తను కాదూ?!

వివక్ష! కక్ష! కక్ష గట్టి కత్తిగట్టి చంపుతున్నారే?, ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. పంతొమ్మిది శాతం దాడులు యెక్కువయ్యింది? ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. ఈ రెండేళ్లలో నలభైయ్యేడు వేల అరవైనాలుగు దాడులు జరిగింది? లెక్కలకందినవే.. లేనివి లేవే?, యెక్కడికక్కడ యెప్పటికప్పుడు వుసుళ్ళు తీస్తున్నారే? జీవాలార్పేస్తున్నారే? మాది మతం కాదు, జీవన విధానం అంటున్నారే.. మరి యెవరి జీవన విధానాన్ని యెవరు డిజైన్ చేస్తున్నారు? సంస్కృతి మాత్రం అందరికీ వొక్కటే వుంటుందా? ఒకవైపు భిన్న సంస్కృతుల సమాహారం అంటున్నారే.. మరోవైపు సహనం తప్పి సంహారం చేస్తున్నారే..?

జీవమంటే గోవుదీ ఆవుదేనా? మనిషి.. సాటి మనిషి జీవి కాడా? ప్రాణి కాడా? జంతు వధశాలలు దేశంలో పదహారువందల యిరవైమూడేనని వాడనుకుంటున్నాడు! మహారాష్ట్రలో మూడొందల పది, ఉత్తరప్రదేశ్ ల రెండువందల యెనభై అయిదు, ఏపీ తెలంగాణాల కలిపి నూటా యెనభై మూడు.. జంతు వధశాలలు లెక్కలు చూపుతున్నారే! మరి యెక్కడికక్కడ దళితుల్ని చంపుతున్నారే, ఆదివాసీలను చంపుతున్నారే, మైనార్టీలను చంపుతున్నారే.. వధిస్తున్నారే.. మనిషి కూడా జంతువే కదా? వేటాడుతున్నారు కదా? వెంటాడి చంపుతున్నారు కదా? మరి ఈ వధ శాలల లెక్కల మాటేమిటి? అయినా జంతుమాంసం వుత్పత్తిలో భారతదేశానిదే అగ్రస్థానం కదా, ఆ స్థానం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా? ముప్పై మూడు వేల నూటా యిరవై యెనిమిది కోట్ల రూపాయల ఆదాయం వొస్తోందే? ఒక్క యేడాదికే వొచ్చిన ఆదాయం అది. అందులో పశుమాంసమే యిరవైతొమ్మిది వేల రెండువందల యెనభై రెండు కోట్ల రూపాయలు. ఆడబ్బుతో పరిపాలిస్తున్న వాళ్ళకీ జబ్బేమిటి? జాడ్యమేమిటి?

మరోవైపు నిస్సిగ్గుగా ఆయనగారు లండన్ లో అంబేద్కర్ నివసించిన భవనాన్ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని గొప్పగా చెపుతున్నాడు. చివరి రోజుల్లో ముంబైలో అంబేద్కర్ నివసించిన భవనాన్ని స్మారక చిహ్నంగా అభివృద్ధి చేస్తున్నట్టు మహగొప్పగా చెపుతున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్మారక భవనం యేర్పాటు చేస్తున్నాడట! అయ్యవారు చేస్తున్నదానికి అంబేద్కర్ ఆనందపడతాడా? మన నోట్లో మలమూ మూత్రమూ పోసి దేశాన్ని స్వచ్చభారత్ చేస్తున్నారే? గో మూత్రము తాగించి.. పేడ తినిపించి.. అక్కడితో ఆగక హత్యలు చేస్తున్నారే? ఆనవాళ్ళు కావాలా? హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్.. యెక్కడికి వెళ్ళినా శవాలు సాక్ష్యం చెపుతాయి! గాయాలే కావాలా.. ఆమడదూరం అక్కర్లేదు.. నిన్నటి తూర్పుగోదావరి ఉప్పలగుప్తం మండలం.. భీమనపల్లి శివారు సుధాపాలెం శ్మశానమే సాక్ష్యం! ఎలీషా, లాజర్ యిద్దరూ చనిపోయిన గోవుల చర్మం వొలిచారు! చేసిన నేరానికి శిక్షగా వాళ్ళిద్దర్నీ చావుబతుకుల్లోకి తోసేసారు! ఊనా లో జరిగిందే ఊళ్ళోనూ జరిగింది! యిప్పుడు ప్రతి వూరు ఊనా నే! ‘ఆ నలుగురినీ’ కారుకి కట్టి తొక్కుతొక్కు పొట్టుపొట్టు కొట్టారే.. అదే విధము.. అదే పథము..

కులవృత్తికి కట్టు బానిసలని చేసారు. కుల వృత్తి చేస్తే నేరం. చెయ్యకుంటే నేరం. పుట్టుకే నేరం చేశారే? పుట్టకముందే నేరస్తులను చేశారే? అరే.. వీళ్ళకు వీళ్ళే న్యాయ మూర్తులు! వీళ్ళకు వీళ్ళే తీర్పరులు! వీళ్ళకు వీళ్ళే పోలీసులు! ఎన్నడూ లేనిది వీళ్ళకు యింత కండకావరం యెలా వొచ్చింది? వీళ్ళకు వీళ్ళే కత్తులు కర్రలు గొడ్డళ్ళు పట్టుకొని వుగ్రమూకల్లా వురికురికి మీద పడుతున్నారే?

గోరక్షకుల ముసుగులో కొందరు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన పడడానికి అల్లాటప్పావా ప్రధానివా అని అడగాలని వుంది. ఆ మొసలికన్నీరు చూసి నిజంగానే మొసలి కన్నీరు పెట్టుకుంటుంది. గోపరిరక్షక దళాల పేరుతో సంఘవిద్రోహక శక్తులు దుకాణాలు తెరిచారు, వారి చర్యలపట్ల నాకు ఆగ్రహం కలుగుతోంది అంటున్నావే?, వారి చర్యలు యివాల్టికి యివాలే మొదలు కాలేదు, నువ్వు అధికారంలోకి వొచ్చినప్పటి నుండి జరుగుతున్నాయే? రోజు రోజుకీ మితిమీరుతున్నాయే? ఎంత విదేశాలలో తిరిగితే మాత్రం అంత మాత్రము కూడా దేశం గురించి పట్టదా? దొంగలు పడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరిగినట్టు లేదూ?

అడగాలని వుంది! అగ్గితో కడగాలని వుంది! నిలదియ్యాలని వుంది! నిప్పుతో వొడి కట్టుకోకు అని చెప్పాలని వుంది!

అయ్యా దాద్రీ మొదలు ఊనా వరకు దేశం రెండేళ్లుగా దద్దరిల్లిపోతూనే వుందే.. వొక్కనాడు వొక్కమాట మాట్లాడావా? వొక్క భాదితున్ని పలుకరించావా? విషం తాగి దళితులు ఆత్మహత్యలకి పాల్పడబోతే వద్దన్నావా? వారించావా? శవాలు లేచిన వొక్క యింటికయినా వెళ్లి కనీసం సానుభూతి చూపించావా? కన్నీళ్ళయినా తుడిచావా? కనీసం ఖండించావా? హంతకులు రోజుకి రోజూ చెలరేగిపోతుంటే ఆగమన్నావా? ఆపమన్నావా? అరెస్టులు చెయ్యమన్నావా? కఠినంగా వున్నావా? వుండమన్నావా? వాళ్ళని ఆపే శక్తి నీకు లేదా? మీ సంఘ్ పరివారమనే వెసులుబాటు యిచ్చావా? గోరక్షక దళ్ దాని తోక అనో.. తొండం అనో.. చూసి చూడనట్టు వున్నావా? వూరుకున్నావా? అందరం ఆ బళ్ళో చదివినోల్లమే అని మూకల్ని వెనకేసుకు వచ్చావా? ఆనాడే ఆపివుంటే యెన్ని ప్రాణాలు దక్కేవి? రాజ్యాంగ వ్యతిరేక శక్తులపట్ల అంత రాగమూ అనురాగమూ నీకెందుకయ్యా? పిర్ర గిల్లేది నువ్వే.. జోల పాడేది నువ్వే.. నువ్వు మా కానోడివి.. అని ముఖం మీద అడగాలని వుంది!

చేపల కోసం కొంగ జపం చేసినట్టు దళిత జపం! దళితులు యెప్పటికీ కళ్ళు తెరవని చేపపిల్లల్లాగే వుంటారా? నేను చావనైనా చస్తాను గాని నీకు గులాం కాను, ఆహారం అంతకన్నా కాను.. అని బలవంతంగా వెళ్ళిపోయిన రోహితా నువ్వు తిరస్కరించిన గడ్డమీద మాట్లాడాడు. నీ హత్యకు కారకుడైన వీసీ పొదిలి అప్పారావు మీద యింతవరకూ చర్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో మాట్లాడి రెండుమూడు రోజుల్లోనే చక్కదిద్దుతానని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన మాట యెన్నడో యాది మరిచిపోయాడు. విద్యార్థులను వెక్కిరించి, రెచ్చగొడుతున్న వాన్నే తెచ్చి తిరిగి పెట్టారు. అడిగిన యిద్దరు ప్రొఫెసర్లని సస్పెండ్ చేసారు. ఇరవయ్యేడు మంది విద్యార్థులను అరెస్టు చేసారు. కేసులు పెట్టినవి పెట్టినట్టే వున్నాయి! బెయిల్లూ జెయిల్లూ యివే విశ్వవిద్యాలయాలు! అటు హంతకులకి అధికారమిచ్చి యిటు దళితులు నా సోదరులు అనడం నోటితో పిలిచి నొసటితో వెక్కిరించడం కాదా అని అడగాలని వుంది. నిజంగా నీకు దళిత సానుభూతి కావాల్సి వస్తే మానవ వనరుల మంత్రిత్వ శాఖ నీ చేతుల్లో లేదా? నిప్పు రాజేయకూడదని నువ్వు అనుకొని వుంటే ఈపాటికే చల్లార్చేవాడివి కాదా? నీ చేతొక తీరు.. నీ మాటొక తీరు.. అని నిలబెట్టి అడగాలని వుంది! అడగనా?

గుండెలు జలదరించే గుజరాత్ అల్లర్లు మేం మర్చిపోలేదు.. నీవు మాదేశం రావటానికి వీల్లేదని అమెరికా కూడా అభ్యంతరం చెప్పడం మేం మరిచిపోలేదు.. ఢిల్లీ బీహార్‌లో నువ్వు వోడిపోయావని మేం మర్చిపోలేదు.. పంజాబ్ లాభం లేదు.. యూపీ గుజరాత్ లో నీవు వోడిపోతావన్న భయంతోనే యిదంతా నువ్వు మాట్లాడావని మేం మరిచిపోలేదు.. ఎన్నికలు వస్తే యెలా అయినా మాట్లాడతారని మేం మరిచిపోలేదు.. అందుకే నిన్ను నమ్మలేదు.. మాటుగాసిన నీ మాటలు నమ్మలేదు..

అని రాజుకి చెప్పాలా? చెప్పకుండానే గ్రహించాడు! అందుకే అంతలా నటించాడు!

అయ్యగారు అధికారంలోకి వొచ్చింది మొదలు నల్ల రంగు నిషేధించబడింది! నల్లని చర్మాలు ఫెటిల్లున పేలిపోతున్నాయి! ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి! మనం తినే తిండి.. పీల్చే గాలి.. కట్టే బట్ట.. అన్నిటా వాడే! వాడి కాషాయమే! పైగా కాషాయం విప్లవమంటున్నాడు! విద్యుత్ వెలుగులంటున్నాడు! విడ్డూరం గుడ్డెడితే తెల్లుల్లిపాయ పిల్లెట్టినట్టుగా లేదూ?

అఖ్లాక్.. వాళ్ళు మనిషి మాంసాన్ని తప్ప గొడ్డు మాంసాన్ని చూడలేరు! అంతటి దయామయులు!

గురూ.. మీ నలుగురూ చూసారు కదా? కాశారు కదా? మీ వొంటి మీద పడ్డ దెబ్బల్ని లెక్కపెట్టండి! వడ్డీతో సహా రేపోమాపో మన సహ దళితులు తీర్చేస్తారులే! తిరుగులేదులే! తిరగ రాస్తారులే!

మన పక్షం వహించిన మన ప్రధాని మీద వొట్టు!

యిట్లు

‘అధిష్టానం’లో వొకడు!

ఈ గంట గణగణ మోగాలి..!

 shool

 

 

గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి-

నమస్కారం!

సార్.. మీతో మాట్లాడడానికి మాకు అవకాశం లేదు. అందుకే వుత్తరం రాస్తున్నాము. పేరు లేదని ఏదో ఆకాశ రామన్న వుత్తరమనుకోకండి. ఇది రాసేది ఒక్కరమే అయినా యివి మా బడి పిల్లలందరి అభిప్రాయాలు వరుసగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి, యింకా ప్రాధమిక – మాధ్యమిక –  ఉన్నత – సాంకేతిక – చదువుల మంత్రి మీరు. అంటే.. మీరు మా మంత్రి!

మన ప్రధానమంత్రిగారిలాగే మన ముఖ్యమంత్రిగారిలాగే మీరూ దేశ విదేశాల్లో తిరగడం తప్పు కాదు. కాని అక్కడైనా యెక్కడైనా మన దేశ ప్రతిష్ట జెండా కర్రలా- మనకుండాల్సిన వెన్నెముకలా- నిటారుగా వుండాలి! తలెత్తుకు తిరగాలి! రండి బాబూ రండి.. మా దేశంలో వ్యాపారాలు చేసుకోండి.. యవ్వారాలు చేసుకోండి.. మా దేశంలో తాగడానికి నీళ్ళు లేకపోయినా మీకు నీళ్ళిస్తాం.. మాదేశంలో ప్రజలకు పవర్ కట్లున్నా మీకు పూర్తి కరెంటు యిస్తాం.. మా వాళ్ళు భూముల కోసం సొంత అన్నదమ్ములే తలలు పగలగొట్టుకొంటున్నా, పోలీసుల్ని పెట్టయినా కొట్టయినా కేసుకట్టయినా కాల్పించయినా ప్రజలదగ్గర లాక్కొనయినా పీక్కోనయినా మీకు కావలసినంత భూమి యిస్తాం. మా దేశంలో ప్రజలకి వొక్కో రాయితీ తీసేసి.. రాయితీలు లేకుండా చేసి.. మీకు మాత్రం అడిగినన్ని రాయితీలు యిస్తాం.. అని దండోరా వేసుకు తిరుగుతున్నప్పుడు ‘దేశం పరువు తీసేస్తున్నార్రా’ అని చెప్పకేం ఈ దేశ నాయకులని తిట్టుకున్నాం. తిట్టుకుంటూనే వున్నాం!

మీరనుకోవచ్చు.. యివన్నీ నాకెందుకు రాస్తున్నారని? చెప్పాము కద సార్.. మీరు మా మంత్రి. మా విద్యార్థుల మంత్రి. అంతే కాదు, మీరు కూడా యీ మధ్య పై దేశముకెళ్ళి మా పరువు తీసారు. మా పరువు అంటే మా బడి పరువు. మన బడి పరువు!

మేము పేపర్లో చదివాము. కొలంబస్ నుండి ఆవార్త వొచ్చింది. మీరు యిక్కడికి మన దేశానికి వొచ్చాక కూడా అవే మాటలన్నారు. ఆ వార్తా చదివాము. యాభై లక్షలు విరాళంగా యిస్తే, అలా యిచ్చిన వారి పేర్లను, లేదా వారు సూచించిన వారి పేర్లను స్కూళ్ళకు పెడతాము.. అన్నారు. అలాగే పది లక్షలు యిస్తే తరగతి గదులకు పేర్లు పెడతాము.. అన్నారు. మా బడిలో చదివే ఆడపిల్లలు యేమంటున్నారో తెలుసా సార్.. లక్ష రూపాయలు యిస్తే యేకంగా టాయిలెట్స్ కట్టించి మరీ వారి పేర్లేకాదు, వారి మొత్తం కుటుంబం పేర్లూ పక్కనే శిలా ఫలకం మీద మీ పేర్లూ పెడతామని కూడా మీరు చెప్పివుంటే బాగుణ్ణు అని అనుకున్నారు. మీరు అమెరికాలో పర్యటనలో వున్నప్పుడే ఆ పని సిగ్గులేకుండా చెయ్యాల్సింది అని అన్నారు. ఓహియో తెలుగు సంఘం, టాకో వారు నిర్వహించిన సభలో మీరు పాల్గొన్నప్పుడే టాయిలెట్ల విషయమూ ప్రకటించి వుండాల్సింది..

సార్.. మన దేశంలో చదువుకొనే పిల్లలకి ఉచ్చపోసుకోవడానికి కూడా లేదూ అంటే సిగ్గు చేటు కాదా సార్.. మీ తెల్ల చొక్కాల మీద మురికి మాకందరికీ కనిపిస్తోంది, మీది మీకు కనిపించడం లేదా సార్.. ప్రభుత్వంలో వున్న మీకు ప్రభుత్వమంటే గౌరవం లేదా సార్.. ‘ప్రభుత్వ పాఠశాల’ అంటే బాగోలేదా? ‘సర్కార్ స్కూల్” అంటే బాగోలేదా? మీకీ దృష్టి వుండడం వల్లే కొందరు మా బడులను ‘దుంపల బడి’ అంటున్నారు. మీకు లేని సిగ్గు మాకేల? అని యిన్నాళ్ళూ వూరుకున్నాం. కాని మా బడి యెంత దిక్కుమాలిన పరిస్థితుల్లో వుందో మీరు విదేశాల్లో అడుక్కుంటూ వుంటే మీకు లేదేమో గాని మాకు అవమానంగా వుంది సార్. సార్.. మమ్మల్ని మీరు ముష్టివాళ్ళను చేసేసారు సార్.. ప్రభుత్వంలో వున్న మీరు ముష్టెత్తుకుంటుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మేము ముష్టివాళ్ళం కాక మరేమీ అవుతాం సార్..?

నిజం సార్.. మా బడికి కోట్ని గురుమూర్తి గేటు కొనిచ్చాడు.. గేటు మీద ‘ధర్మదాత కోట్నిగురుమూర్తి గారిచే దానము చేయబడినది’ అని వుంటుంది. ‘గది గచ్చులు పెంట భాస్కరమ్మ జ్ఞాపకార్ధం’ అని వుంటుంది. ‘గోడలకు చెక్క సున్నాలు చేయించినవారు బెహరా జగన్నాథ్’ అని రంగుల అక్షరాలతో రాయించి వుంటుంది. తాగే నీళ్ళ డేక్సా మీద ‘బిస్వజిత్ పాఠక్ గారి పాప సునంద రజస్వల సందర్భంగా యిచ్చిన కానుక’ అని వుంటుంది. డేక్సా సరే, ఆఖరికి చైను కట్టి వుంచిన నీళ్ళు తాగే గ్లాసు మీద కూడా ‘చైన్లు మాస్టారు గృహప్రవేశం సందర్భంగా యిచ్చినది’ అని వుంటుంది. బ్లాకు బోర్డులు, బెంచి బల్లలు, టేబుళ్లు, కుర్చీలు, హెడ్ మాస్టారి చైరు దాక.. అన్నీ దానం చేసినవే! ధర్మం చేసినవే! దయ తలచినవే!

సార్.. ఈ పేర్ల వెనుకన యెవరి పేర్లున్నాయో తెలుసా సార్..? ‘సత్యమేవ జయతే -మహాత్మా గాంధి’, ‘దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా -గురజాడ, ‘దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు’, ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా- ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా- పొగడరా నీ తల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవము! -రాయప్రోలు సుబ్బారావు’, ‘ మా తెలుగు తల్లికి మల్లెపూదండ – మాకన్న తల్లికి మంగళారతులు -శంకరంబాడి సుందరాచారి’… యిలా యెంతోమంది గది పెచ్చులు రాలిపడ్డప్పుడే పెచ్చులతో పాటు రాలిపోయారు. గోడలు కూలినప్పుడే గోడలతో పాటే కూలిపోయారు. వెల్ల వేసినప్పుడే వెల్ల కింద వుండి చెరిగి పోయారు! దారి చూపే పేరున్న దీపదారులే కాని దాన ధర్మాల పేర్ల కింద ఆరిపోయారు! అగుపడకుండా పోయారు!

సార్.. మీకు తెలుసా? మాబడిలో యిప్పటికే వొక్కో తరగతి గదికి వొక్కో పేరుంది. ‘చాచా నెహ్రూ తరగతి గది’, ‘కోడి శ్రీరామ మూర్తి తరగతి గది’, ‘ఆదిభట్ల నారాయణ దాసు తరగతి గది’, ‘కవికోకిల సరోజినీ నాయుడు తరగతి గది’, ‘సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గది’, ‘ఐన్ స్టీన్ తరగతి గది’, ‘అబ్దుల్ కలాం తరగతి గది’, ‘కల్పనా చావ్లా ప్రయోగ శాల’, ‘భగత్ సింగ్ ప్లే గ్రౌండ్’.. యిలా చాలా వున్నాయి సార్.. పెట్టుకున్నాం సార్.. కావాలంటే మీరు మా బడికొచ్చి చూడండి సార్.. మదర్ ప్రామిస్ సార్..

మరిప్పుడు యెలాంటి పేర్లు వొస్తాయి సార్? జొన్నలగడ్డ జోగేస్వరరావో.. చౌదరి మురళీ మన్మధరావో.. పూసపాటి నారాయణ రాజో.. వేదుల కాంతమో.. పెంట లక్ష్మీ కాంతమో.. యిలానో మరోలానో దాతల పేర్లు మా బడికీ తరగతి గదికీ పెట్టారే అనుకోండి.. యెవరైనా అడిగితే యేమని చెప్పాలి? మా తమ్ముడో చెల్లో అడిగితే యేమని చెప్పాలి? దేశభక్తులా? కారు!, దేశ నాయకులా? కారు!, కవులూ కళాకారులా? కారు!, శాస్త్రవేత్తలా? కారు, స్వాతంత్ర్య సమర యోధులా? కారు!, సంఘ సేవకులా? కారు!.. మరెవరు? అనంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్లనో.. లేకపోతే మన బడికి బెంచి బల్లలు కొనిపెట్టారనో.. గది కట్టారనో గోడ కట్టారనో.. యిటుకలు యిచ్చారనో.. లేదూ అంటే మన పేద గవర్నమెంటుకు డబ్బులిచ్చి ఆదుకున్నారనో.. చెపితే బావుంటుందా? దేశంపట్ల భక్తిని కలిగి వుండడం కన్నా- ప్రజల కష్టసుఖాలు యెరిగిన నాయకులుగా వుండడం కన్నా – కవిత్వములోనో కళలలోనో రాణించడంకన్నా – తమ జీవితాన్నిచ్చిన శాస్త్రవేత్తలకన్నా – సంఘ సేవకులకన్నా – దేశం కోసం ప్రాణాలిచ్చిన సమర యోధులకన్నా – అన్ని కష్ట నష్టాలు పడేకన్నా డబ్బు సంపాదిస్తే సుఖము. సౌఖ్యము. కీర్తి. కాబట్టి బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించాలి.. డబ్బు ముందు అన్నీ దిగదుడుపేనంటే.. యేదో యెక్కడో బాగోలేదు సార్. మంచిది కాదు సార్.. మంచిగా లేదు సార్.. సారీ సార్..

జనం కూడా గుర్తుపెట్టుకోరు సార్.. యిప్పుడు నవీన్ జిందాల్ యెంతమందికి తెలుసు సార్.. జిందాల్ ఫ్యాక్టరీ వల్ల కొంతమందికి తెలుసు. తండ్రి ఓం ప్రకాష్ జిందాలే తెలీదు. నవీన్ జిందాల్ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ యెట్ డల్లాస్ లో చదువుకొని, ఆర్ధిక సాయం చేసినందుకు అక్కడ అతని పేరుతో ‘నవీన్ జిందాల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంటు’ అని వొకటి పెట్టారు. చెప్పనా సార్.. మనదేశంలో జిందాల్ అంతడబ్బు యెలా సంపాదించాడు అని ఆలోచిస్తారు గాని వేరేలా ఆలోచించరు. డబ్బు లేనివాళ్ళంతా డబ్బు వున్న వాళ్ళదగ్గర యెలా వుందో వచ్చిందో ఆలోచిస్తారు. మీ మంత్రులు కూడా డబ్బు యెలా సంపాదిస్తున్నారో మా తలిదండ్రులూ టీచర్లూ మాట్లాడుకుంటూ వుంటే వింటూనే వుంటాము. అలా తెలిసిన విషయాలే యివి.

మరో విషయం.. ఆమధ్య వొక టీవీ వాళ్ళు.. ఆంధ్రులు.. ప్రవాసాంధ్రులు.. పూర్వ విద్యార్థులు.. వాళ్ళనీ వీళ్ళనీ అందర్నీ పిలిపించి.. ‘నీ బడి పిలుస్తోంది.. సాయం కోరుతోంది’ అని గజల్ శ్రీనివాస్ తో పాట పాడించి.. మరీ పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసారు. ప్రభుత్వ పాఠశాలలు దీనంగా హీనాతి హీనంగా వున్నాయని అందరూ చెప్పారు. మేము చాలా సంబరపడ్డాము. అంతా కలిసి ప్రభుత్వాన్ని అడుగుతారనుకున్నాం. నిలదీస్తారని అనుకున్నాం. ప్రభుత్వంలో దానికో శాఖ వుంది.. మంత్రి వున్నాడు.. విద్యకి కూడా బడ్జెట్ వుంది.. మాట్లాడుతారు.. అని ఆశ పడ్డాం. లేదు, అడగలేదు. అవస్థ యిది అని వ్యవస్థని అడగలేదు. అడుక్కున్నారు. తప్పితే హక్కులు మరిచిపోయారు. కలిగిన వాళ్ళని జాలి చూపించమన్నారు. దయ చూపించమన్నారు. మన వూరు.. మన మట్టి.. మన బడి.. అని సెంటిమెంటుల ఆయింట్ మెంటులు రాసారు. లక్షల బడుల్లో వంద బడులు అదీ అప్పటికి బాగుపడితే చాలా? వుమ్ముతడి పనులు తప్ప శాశ్వత పనేనా యిది? ఇచ్చిన వాళ్ళ ఔదార్యం యెంత కాలముంటుంది? ఎందరికి వుంటుంది? అదికూడా బడి నుండి వెళ్లి బాగా చదువుకొని బాగుపడిన వాళ్ళు వున్నప్పుడే. లేనప్పుడు? లేదు! అంతే! మా బడులనుండి బాగా చదివి వెళ్ళిన వాళ్ళు లేరు. మా బడులు అలాగే వున్నాయి. అప్పటికీ వినాయక చవితికీ దసరాకీ చందాలు అడిగినట్టు డబ్బా పట్టుకు వెళ్లి అడుక్కున్నాము. బడిలో ‘బడికి సాయం చేయండి’ అని రాసి హుండీ కూడా పెట్టాము. అది గుడా? హుండీ నిండడానికి!? బడి కదా?!

సార్.. హక్కుగా అడగాల్సిన వాటికి.. అమలు పరచాల్సిన వాటికి.. అడుక్కోవడం బాగోలేదు సార్.. ఒకరి దయా దాక్షిణ్యాలమీద యెల్లకాలము నడవదు సార్.. మా పెద్దలు చెప్పారు సార్.. సార్ మీ మంత్రులంతా ప్రయివేటు బడుల ప్రారంభోత్సవానికి వస్తుంటారు. తప్పితే వొక్క సారి మా బడిలోకి రండి సార్.. స్లాబ్ పడిపోదు. పెంకులు జారి నెత్తి పగలదు. గోడ కూలి గాయం కాదు. పోనీ తలకు హెల్మెట్ పెట్టుకొని, వొంటికి బులెట్ ప్రూఫ్ తొడుక్కొని, సెక్యూరిటీ సిబ్బందిని పిలుచుకొని రండి సార్.. ఒక్క రోజుకి అలా అయితే భయపడితే యెలా సార్.. మేం నిత్యమూ చిన్నపిల్లలతో సహా యిక్కడే చదువుకుంటాము. వుంటాము. మేం మీరు పెట్టిన మీటింగులకి మా హెడ్ మాష్టారు చెపితే యెండలో రోడ్డు పొడుగునా నిలబడి మీకు స్వాగతాలు పలక లేదా సార్.. మానవహారాలు కాట్టాము సార్.. మరిచిపోయారా సార్..?

ప్రయివేటు విద్యాసంస్థలకి వేల యెకరాలు యిస్తున్నారే.. యెంకరేజ్ చేస్తున్నారే.. పెద్ద మాటలు అనుకోవద్దు, మేం రోజూ పేపరు చదువుతాము.. సార్.. ప్రయివేటు రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. మరి ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం కాక యెవరు ప్రోత్సహిస్తారు? లేదు సార్.. ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు సార్.. సార్ యేమిటో సార్.. ప్రభుత్వరంగంలో వున్నవన్నీ నీరసించి నశించి పోతున్నాయి.. అది విద్యయినా.. వైద్యమైనా.. యేదయినా.. ప్రభుత్వ బడులు వెనక బడితే అధికారులూ మంత్రులూ వెనకబడినట్టు కాదా? మాకేనా మార్కులు? మీకుండవా? ప్రభుత్వ బడులు దీటుగా నడపకుండా మూసేస్తే పోతుంటే మీరు ఫెయిల్ అయినట్టా? పాసయినట్టా?

దయచేసి డబ్బుకోసం ధరలు నిర్ణయించి బడిని బద్నాం చేయకండి. చేస్తామంటారా? అంతకన్నా ముందు వొక పని చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమో.. భారత ప్రభుత్వమో.. అని కాక యిక్కడ పెట్టుబడులు పెట్టే టాటా ప్రభుత్వమో.. బిర్లా ప్రభుత్వమో.. రిలయన్స్ ప్రభుత్వమో.. విప్రో ప్రభుత్వమో.. హేచ్సీయల్ ప్రభుత్వమో.. హిందూజా ప్రభుత్వమో.. అదాని ప్రభుత్వమో.. అని పేరు మార్చుకోండి అంటే మార్చుకుంటారా? వాళ్ళంతా మన పేద దేశంలో డబ్బుగలవాళ్ళు.. వాళ్ళ వ్యాపారాల వల్ల మనకు ఉపాధి కలుగుతోంది అని అంటే పేర్లు మార్చేస్తారా? అంతెందుకు.. మీ ప్రభుత్వ శాఖల పేర్లు అయినా మార్చేస్తారా? మన చదువుల శాఖే వుంది. ప్రాధమిక విద్యని విజ్ఞాన్ విద్యనో భాష్యం విద్యనో కృష్ణవేణి విద్యనో మార్చమంటే మార్చేస్తారా? అలాగే మాధ్యమిక విద్యని చైతన్యా నారాయణల ‘చై.నా’ విద్యాశాఖ అని మార్చమంటే మార్చేస్తారా? మీకు కోర్టులు కూడా అనుకూలంగా వున్నాయి. ఈమధ్య విద్యా విషయాల మీద కోర్టు స్పందించింది. ప్రభుత్వ బడులను ప్రభుత్వం నడపలేకపోతే ప్రయివేటుకి అప్పగించమంది. అప్పుడే చాలా మంది ప్రయివేటు విద్యా వ్యాపారులు అందుకు సిద్ధంగా వున్నామని అన్నట్టుగా కూడా పేపర్లో చదివాము. అంచేత మీరు సిద్ధమే అయితే యింక మీకు శాఖ వుండదు! మీ అవసరమూ వుండదు!

సరే సార్.. ఆఖరిగా వొక మాట.. మా బడిలో పేద్ద సరస్వతీ దేవి పటం వుంది సార్.. అది కూడా మా బడికి యెవరో బహుమతిగా యిచ్చిందే సార్.. దానమిచ్చిందే సార్, జిల్లా ఫస్టు వొస్తే. సార్.. మా సరస్వతీ దేవి యెలా వుంటుందో తెలుసా సార్.. తెల్ల చీర కట్టుకొని చేతిలో వీణతో హంస మీద కూర్చొని మెరిసిపోతుంటుంది సార్.. ఆ చీర గురించి చాలా సార్లు మా అమ్మకు చెప్పాను సార్, సరస్వతీ దేవి అందమంతా చీరలోనే వుందని! కాని సార్.. యిప్పుడెప్పుడు చూసినా సరస్వతీ దేవి అందంగా కనిపించడం లేదు సార్.. తెల్ల చీర మాసిపోయి చిరిగిపోయి వీణ తీగలు తెగిపోయి ఆముఖంలో నవ్వు మాయమైపోయి దిక్కుమాలిన దానిలా వుంది సార్.. అచ్చం మాలాగే!

పెద్ద వుత్తరం రాస్తే చేట భారతమని చదవరట గదా సార్.. అందుకే రాయాలని వున్నా రాయకుండా ఆపేస్తున్నాము. తప్పులుంటే మన్నించండి. అయినా వొక తప్పు వల్ల వొంద తప్పులు జరుగుతాయి. మా తప్పులు అలాంటివేనని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము!

మళ్ళీ నమస్కారాలతో-

మీ

విద్యార్థులు

(ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులు)

పువ్వులు జాగ్రత్త!

 

 

     -బమ్మిడి జగదీశ్వరరావు

 

అమ్మా..

ఎలా వున్నావమ్మా.. నువ్వూ అల్లుడుగారూ యిద్దరూ బాగున్నారు కదా? నానిగాడు కూడా పదిలమని భావిస్తాను! మీ యింటి నుండి వచ్చాక మనవడి ముచ్చట్లు చెప్పినవే పదే పదే అడిగి మరీ చెప్పించుకుని మీ అమ్మ మురిసిపోతోంది! రోజూ కొత్త కొత్త విషయాలు విన్నట్టుగా వింటోంది! నా మనవడు చాలా తెలివైన వాడు అంటోంది! ఏ మాటకామాట మీ అమ్మ నిన్ను గురించి తలచుకోవడం తగ్గింది! నీ కొడుకు గురించి తలచుకోవడం పెరిగింది! వాడు పుట్టిన ఈ ఆరేడేళ్ళుగా యిదే వరుస! అదే అలవరుస!

అడిగితే చెప్పడానికి నీకేమిటి నొప్పి? అని తిరిగి మీ అమ్మ అడుగుతుంది! గొడవపడుతుంది! పోట్లాడుతుంది! నువ్వేం మనిషివి అంటుంది! నువ్వేం తాతవి అంటుంది! నిజంగా నానిగాడి గురించి చెప్పాలంటే నాకు నొప్పే! మీ అమ్మతో కాదు, నీతో మీ ఆయనతో గొడవ పడాలనిపిస్తుంది! పోట్లాడాలనిపిస్తుంది! తాతనని మరిచిపోయి తాట తియ్యాలనిపిస్తుంది!

అయినా తప్పు వాడిది కాదులే! వాడొక్కడిదే కాదులే! పిల్లలందరూ యిలానే వున్నారేమో..? తలచుకుంటే భయమేస్తోంది! నేను మీ అమ్మలా సరదాగా తీసుకోలేకపోతున్నా! నానిగాడి ముచ్చట్లు చెప్పినపుడల్లా నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి! మీయమ్మకు యివేవీ పట్టవు! నేను యెక్కువగా ఆలోచిస్తున్నానని అంటుంది! అనవసరంగా భయపడుతున్నానని అంటుంది!

నాది భయమో.. బాధ్యతో తెలీదు! నీ దృష్టికి తేవాలనిపించింది! యివన్నీ ఫోనులో మాట్లాడలేక వుత్తరం రాస్తున్నాను!

మీ యింటికి వొచ్చిన దగ్గరినుండి నానిగాడు నన్ను ప్రశ్నల వర్షంతో ముంచెత్తాడు! ప్రశ్నించడం జీవ లక్షణం! కాని నా మనవడి ప్రశ్నలకు నాకు రాత్రుళ్ళు నిద్దర పట్టేది కాదు! వేడి పాలు తాగినా వుపయోగం వుండేది కాదు! నువ్వేమో కొత్త ప్లేసు కదా అనేదానివి! ఏమి చెప్పాలో నాకూ తెలీలేదు!

మొదటి రోజు రాత్రి నానిగాడ్ని పక్కన వేసుకొని పడుకున్నానా? వాడి తల నిమిరానా? అప్పుడు అడిగాడు.. ‘తాతయ్యా తలలో యేముంటాయ్?’, నాకు సమాధానం యేo చెప్పాలో తెలీక, తిరిగి ‘యేముంటాయ్?’ అన్నా! ‘అది కూడా తెలీదా?’ అని చాలా ఆశ్చర్యపోయాడు! వాడి ఆశ్చర్యం చూసి నేనూ అంతే ఆశ్చర్యపోయా! అయ్యో అదీ తెలీదా అని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేసి నా చెవిలో చెప్పాడు! ‘తలలో యినుము వుంటాది, మెటల్.. మెటల్..’ అన్నాడు! విని, ‘మెంటల్..’ అన్నా! ‘మెంటల్ వాడి తలలో కూడా మెటలే వుంటుంది..’ అన్నాడు! ‘నీకెవడురా చెప్పాడు..?’ అన్నా, ‘అన్నీ అందరూ చెప్పరు, కొన్ని మనకి మనమే తెలుసుకోవాలి..!’ అని నాకు జ్ఞానోదయం చేశాడుతల్లీ నీకొడుకు.. అప్పటికీ ‘నీ తల యిందుకేనా యింత గట్టగా వుంది..’ అని నవ్వేశా! వాడు నవ్వకుండా ‘అమ్మని మట్టి బుర్ర అని నాన్న తిడతాడు, కాని అమ్మతలలోనే కాదు, యెవరి తలలో మట్టి వుండదు, మెటలే వుంటుంది.. వూ..!’ సత్యాన్ని కనుగున్నట్టు చెప్పాడు! అప్పటికీ ‘అలా అని మీ పాఠాల్లో వుందా..?’ అడిగాను. ‘పాఠాల్లో అన్నీ వుండవు తాతయ్యా..’ కాస్త విసుక్కున్నాడు కూడా!

ఒప్పుకున్నాను తల్లీ.. నీ కొడుకుతో చాలలేక వొప్పుకున్నాను!

ఆ రాత్రి నా మనవడు నాతల నిమిరాడు. ‘ఏమిటి తాతా..?’ అన్నాను, ‘నీ తలలో కూడా మెటలే వుంటుంది..’ చెప్పాడు. ‘నయం.. సమయానికి మీయమ్మమ్మ లేదు..’ అన్నా. ‘వుంటే..?’ అన్నాడు. ‘నన్ను యినుప సామానుల వాడికి కేజీల్లెక్క అమ్మేసేదిరా..’ నవ్వుతూ అన్నా. ‘నీకే అనుకున్నా, అమ్మమ్మకి కూడా తెలీదా..?’ అడిగాడు. ఏమిటి అన్నట్టు చూసాను. ‘తలలో మెటల్ వుంటుందని..’ అన్నాడు. ‘చాల్లే పడుకో..’ అన్నాను. నన్ను చూసి నా సమాధానం విని నేను వాడి మాటలు నమ్మడం లేదని అనుకున్నట్టున్నాడు. అందుకే ‘నీ తల మీద సుత్తితో.. వూ.. రాడ్ తో కొట్టి చూద్దామా..? టంగ్ టాంగ్..మని శబ్దం వస్తుంది..’ అన్నాడు. నానిగాడి మాటలకు భయంతో చూసాను. ‘తాతయ్యా.. నీకు భయమేస్తే పోనీ నా తలమీద కొట్టు తాతయ్యా..’ అని తల వంచాడు.

ఏమనాలో తెలీక ‘నాకు నిద్దరొస్తోంది..’ అన్నా. కళ్ళు మూసుకున్నా. ‘తాతయ్యా..’ పిలిచాడు. నే పలకలేదు. కొంపతీసి సుత్తో రాడ్దో తీసుకువొచ్చి మెటల్ సౌండ్ కోసం వొక్కటేస్తే..?’ వులిక్కిపడి కళ్ళు తెరిచాను. నన్నే చూస్తూ నవ్వాడు. ‘నీకు నిద్దర్రావడం లేదు కదా తాతయ్యా..’ అన్నాడు. అని లేవబోతే.. లేవనీయకుండా చెయ్యి అడ్డం పెట్టా. దాంతో వెనక్కి వొక్కసారిగా నేలమీద పడ్డాడు. తలకి తగిలిందేమోనని చేత్తో వాడి తలని తడమ బోయా.

‘తలలో మెటల్ వున్నట్టే.. నేలలో రబ్బరువుంటుంది..’ అన్నాడు. వాడివి వెర్రి మాటలన్నట్టు నేను చూస్తే.. వాడు నన్ను వో వెర్రిబాగులవాన్ని చూసినట్టు చూసాడు. ‘బంతి నేలకు కొడితే యేమవుతుంది?’ అడిగాడు నాని. ‘కొట్టినంత వేగంగా పైకి లేస్తుంది..’ అన్నా. ‘బంతే కాదు, బలంగా కొడితే మనిషులయినా యిలా కిందకి కొడితే అలా పైకి లేచి యెగురుతారు..’ అన్నాడు. అక్కడితో ఆగక ‘యేoటో తాతయ్యా.. ముసలయ్యే కొద్దీ అన్నీ మర్చిపోతారట.. నువ్వు కూడా అన్నీ మర్చిపోయినట్టున్నావ్..’ చెప్పక ముందే ‘వొక్కటిచ్చానంటే మీ అమ్మ దగ్గరకు వెళ్లి పడతావ్..’ అన్నా. ‘గుడ్.. నాకు పొద్దున్న వొక్కటివ్వు తాతయ్యా.. స్కూల్లో పడాలి దెబ్బకి.. స్కూల్ బస్సు మిస్సయినప్పుడు అమ్మ తిడుతుంది గాని గట్టిగా యివ్వదు.. షాట్’ అన్నాడు.

అప్పటికీ వాడిది పిచ్చి వాగుడు అనుకున్నా. కాని సరిపెట్టుకోలేకపోయా. ముందు రోజు జర్నీలో తలకింద చెయ్యి పెట్టుకు పడుకున్నానేమో.. మెడ దగ్గర నరం పట్టేసి జండూబామ్ రాసుకుంటుంటే ‘పైప్ కు ప్రాబ్లమా తాతయ్యా..?’ అని అడిగాడు. ఏమంటే ఏమంటాడో అని ‘ఆ’ అన్నా. ‘పైపుల్లో బ్లడ్డు రయ్ మని తిరుగుతుంది కదా..?’ అన్నాడు. ‘పైపులేమిట్రా.. అవి నరాలు..’ ఆగలేక చెప్పా. ‘పైపులు.. అదే నరాలు.. యెత్తుగా బాడీ మీద కనిపిస్తాయి కదా..’ అని అంటే ‘యెప్పుడు..?’ అని అర్థం కానట్టు చూస్తే, ‘కోపం వస్తే.. యెవడ్నన్నా కొట్టే ముందు.. పైపులు.. నరాలు.. బ్లడ్ అంతా పచ్చగా బాడీ అంతా యిలా యిలా..’ చెప్పేవాడే, ‘తాతయ్యని పడుకోనివ్వవా..?’ వాళ్ళ నాన్న కేకతో సైలెంట్ అయ్యాడు. అలాగే నిద్ర పోయాడు. అని అనుకున్నాను. కాని గొంతు తగ్గించి ‘యెవరైనా మనల్ని గన్ తో కాల్చితే చచ్చిపోతామా? చచ్చిపోమా?’ గుసగుసగా అడిగాడు. నిర్ఘాంత పోయా.

నాకు మాత్రం వచ్చిన నిద్ర వదిలి పారిపోయింది. ‘చెప్పు తాతయ్యా..’ గుగుసగా అడిగాడు. గట్టిగా కూడా అడిగాడు. ‘బుల్లెట్ తగిలితే యెవరైనా చచ్చిపోతారు..’ అన్నా. ‘యెవరి గురించి కాదు.. మన గురిచి చెప్పు.. చచ్చిపోతామా లేదా?’ ఖచ్చితంగా అడిగాడు. ‘మనల్ని యెవరు యెందుకు కాలుస్తారు చెప్పు..’ అన్నా. ‘యెందుకో కందుకు..’ అన్నాడు. ‘నన్ను కాలుస్తున్నావు కదరా..’ అన్నా. ‘సరే కాల్చాను.. చచ్చి పోతావా లేదా?’ అడిగాడు. చేసేదిలేక ‘చచ్చి పోతా..’ అన్నా. ‘నువ్వు బ్యాడ్ పర్సన్ వి.. విలన్ వి.. అందుకే చచ్చిపోతావ్..’ అన్నాడు. ‘మరి నువ్వో..?’అన్నా. ‘ ఐయామే గుడ్ పర్సన్.. హీరో.. యెన్ని బుల్లెట్స్ కాల్చినా..’ యింకా చెప్పేవాడే ‘నానీ..’ వాళ్ళ నాన్న పిలిస్తే వెళ్ళాడు. వెళ్లి నిద్రపోయాడు.

నాకింక రాత్రి తెల్లవార్లూ నిద్ర పట్టలేదు! నువ్వు అడిగినా చెప్పలేదు! ఎందుకంటే నాకే యేమీ బోధ పడలేదు! ‘నాన్నా నువ్వెందుకలా వున్నావ్.. నేనేమి అన్నానా? మా ఆయనేమి అన్నారా?’ అని నువ్వు అడిగావు. చెప్పేంత పెద్ద విషయమూ కాదు, వదిలేసేంత చిన్న విషయమూ కాదు. కూరగాయలు తరిగినట్టు మనుషుల్ని తరిగే సినిమాలకు దూరంగా వుంచు, వుంచగలిగితే! సుత్తితో నెత్తి బద్దలుగొట్టినా రక్తం దారాలు కడుతుంటే దులిపేసుకొని ఫైట్ చేసే తెలుగు హీరోల సినిమాలకు దూరంగా వుంచు, వీలయితే! ఆటవిక రాజ్యం నడుస్తున్నట్టు యెవరు యెవర్నైనా చంపేసుకోవచ్చనే ముఖ్యంగా పోలీసులకు ఆ హక్కువుందనే తొక్కు తెలుగు సినిమాలకు దూరంగా వుంచు, క్రూర జంతువులకంటే దుర్మార్గంగా చంపుకొనే చెత్త సినిమాలకు దూరంగా వుంచు, వాడికో వ్యక్తిత్వం రూపు కట్టేదాకయినా దూరంగా వుంచు, వాడిలో సున్నితత్వం బండబారిపోకుండా దూరంగా వుంచు, వుంచగలిగితే!

టుపుక్కుమంటే పుటుక్కున పోయే ప్రాణాలు కదా మనవి.. మనుషులవి! ప్రాణం విలువ తెలియకుండా వొక్కోడు వొక్కో సినిమాలో పదిమందివో వందమందివో ప్రాణాలు తీయడం.. మన పిల్లల ప్రాణాలు తీయడమే! ఒక్కటంటే వొక్కటి.. వొక్క ప్రాణం పోసే సినిమా.. వొక్క సినిమా వొచ్చినా బాగున్ను! ప్రాణం పోసినట్టుగా వున్ను! ప్రాణం విలువ తెలిసున్ను!

ఎవరికీ వారే- తమ పిల్లలు పువ్వుల్లా కళకళలాడుతున్నారా? యినుప చువ్వల్లా ఫెళ ఫెళలాడుతున్నారా? తెలుసుకోవాలి తల్లీ.. తల్లివి కదా అదేదో నీనుండి ప్రారంభం అవ్వాలని మనసాగక నీకు యీ వుత్తరం రాస్తున్నా..

నానిగాడికి నాముద్దులు..

వుంటానమ్మా..

మీ

నాన్న

 

 

క్విడ్ ప్రో కో.. యేలుకో!

 

 

 -బమ్మిడి జగదీశ్వరరావు

~

ప్రియమైన అల్లుడు గారికి!

యెంత రాజ్యసభ సీటు రాకపోతే మాత్రం.. ‘బాగున్నారా?’, అని అన్నా తప్పేనా? ‘యింకెక్కడ బాగుంటాను?’ అని ఫోను కట్ చేసారు! మా అమ్మాయిని అడిగితే ‘ఫోను కట్ అవడం కాదు, నా తల కట్టయినట్టు వుంద’ని మీరు అన్నారట! మీ బాధను నాబాధ చేసుకోగలను! మీ ఆవేశం, ఆందోళన అర్థం చేసుకోగలను! కాని మీరు అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి! యిప్పుడు కాకపోయినా తరువాతయినా నిదానంగా చదువుతారని అవగాహన చేసుకుంటారని ఆశతో యీ వుత్తరాన్ని మెయిల్ చేస్తున్నాను!

రాజ్యసభ అంటే పెద్దల సభ అని మీరూ నేనూ చదువుకున్నాం. మనం చదువుకున్నట్టు యేదీ వుండదు. యెంపిక కూడా వుండదు. సంఘ సేవకులు, కళాకారులు, క్రీడాకారులు, లబ్దప్రతిష్టులైన వివిధ రంగాలకు చెందిన వాళ్ళ ప్రాతినిద్యాన్ని కోరి- యెన్నికలలో నిలబడకుండా పోటీలేకుండా గౌరవించి వారి భాగస్వామ్యం కోరి- వారి మేథని, తెలివితేటల్ని, నైపుణ్యాన్ని వుపయోగించగోరి అంటే అవసరమైన సలహాలూ సూచనలూ కోరి- బలపరిచేది నియమించేది గనుక అది పెద్దల సభ అయ్యింది! ఇదంతా రాజ్యాంగం! రాజ్యాంగము కన్నా రాజ్యము గొప్పది! రాజు గొప్పవాడు!

‘వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చుంటే యేమి?’ అని సామెత.. అంచేత ‘రాజు’ అంటే ‘మంత్రి’ మనవాడు అయ్యుండాల.. రాజ్యం మనదయ్యుండాల.. అప్పుడు మనం పాడిందే పాట.. అంటే మనమే గాయకులం! మనం ఆడిందే ఆట.. అంటే మనమే క్రీడాకారులం! మనం వాయించిందే సంగీతం.. అంటే మనమే సంగీతకారులం! మనం రాసిందే రచన.. అంటే మనమే రచయితలం! మనం నటించేందే నటన.. అంటే మనమే కళాకారులం! మనం చేసిందే సేవ.. అంటే సంఘ సేవకులం! మనకున్న పెట్టుబడి పేరే ప్రతిష్ట.. అంటే లబ్దప్రతిష్టులం! యెప్పుడూ? పైవాడు మనవాడు అయినప్పుడు! అప్పుడు! అప్పుడు మనమే తోపులం! మనమే పుడింగిలం! మనమే లార్డ్ కర్జిన్లం! రాజ్యసభ అభ్యర్దులం! పెద్దలం! పెద్దల సభకు పొద్దులం! యెప్పుడూ? వాడు.. ఆపైవాడు కాదు, ఈ పైవాడు అనుకున్నప్పుడు! అప్పుడు!

అప్పుడు మనం గెలవక్కర్లేదు! గెలిస్తేనే అర్హత అనే రూలేం లేదు! ప్రజాభీష్టంతో సంబంధమూ లేదు! ప్రజలు నువ్వు వొద్దు అని వోడించినా.. నువ్వు వోడినా.. గెలిచినట్టే! డిపాజిట్లు కోల్పోయినా.. గెలిచినట్టే! ప్రజాభీష్టం లేకపోయినా.. వున్నట్టే! గెలిచి యెవడైనా వెళ్తాడు! ఓడి వెళ్ళడం.. అంత మామూలు విషయం కాదు! ప్రజలు కాదన్నాసరే ప్రజా ప్రతినిధిని చేసి అందనాలు యెక్కించడం యిందులో గొప్ప విషయం! అందుకే రాజ్యసభకి వెళ్ళడం అంత గౌరవం! అంత పోటీ! అంత విలువ! అంత అవకాశం! అందరికీ అంత ఆశ! అందరికీ అంత మోజు!

ఎమ్మెల్యే ఎంపీ సీట్లకన్నా రాజ్యసభ సీట్లకు డిమాండ్ యెక్కువ! మామూలుగా అంటే ‘మామూలు’గా.. ధర కూడా యెక్కువ! ఖర్చు తక్కువ! ఓడిపోతామన్న భయం తక్కువ! గెలుపుకు గ్యారంటీ! ఏకగ్రీవానికి వారంటీ!

మన రెండు తెలుగు రాష్ట్రాలే తీసుకో. ఆరుగురు యేకగ్రీవంగా యెన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎంసెట్ సీట్లు లాంటివి అయితే, రాజ్యసభ సీట్లు ఐఐటి ఎఐయంసి సీట్లు లాంటివి అన్నమాట! చాలా పోటీ వుంటుంది. రాకపోతే బాధే! ‘బ్యాడ్ లక్’ అని యిలా బాధపడితే యెలా చెప్పండి.. ‘నెక్స్ట్ టైం బెటర్ లక్’ అనుకోవాలి అల్లుడు గారూ..?!

ఇప్పుడు రాజ్యసభకు యెన్నికయిన ఆరుగురు కంటే నాకు యేమిటి తక్కువ అన్నారు. నిజమే! మీరు యెక్కువే! కాని మన యిద్దరు చంద్రులు వొకేలా ఆలోచిస్తున్నారు! ప్రతిపక్షాల్ని తమ పాలకపక్షంలో కలిపేసుకోవడంలో యిద్దరూ సిద్ధహస్తులే! వేరే పార్టీల నుండి వచ్చిన వారిని తక్కువ చేసి చూడడంలేదని చెప్పడానికి వొక సందేశం పంపడానికి అటు ఆంద్రాలో టీజీ వెంకటేష్ గారికి – యిటు తెలంగాణలో డి శ్రీనివాస్ గారికి రాజ్యసభ సీట్లు యిచ్చారు. సొంత పార్టీలో మీరు వుండొచ్చు. మీకివ్వొచ్చు. కాని అవతల పార్టీ నుండి వచ్చిన వాళ్లకి యివ్వడంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు అత్యున్నత పురష్కారం యిచ్చినట్లు అవుతుంది! ఇదేమిటి.. అయినవాళ్ళకి ఆకుల్లో.. కాని వాళ్ళకు కంచాల్లోనా? అనో- యింట్లోవాళ్ళకి యీత చాప.. పై వాళ్ళకు పట్టెమంచం? అనో- అనుకోవచ్చు! కాని యిద్దరు చంద్రులకూ ముందు చూపు యెక్కువ! అవతలి పార్టీలో మిగిలిన వాళ్ళకి వెళ్ళ వలసిన సందేశం వెళ్ళిపోతుంది! పాత కండువా పడేసి కొత్త కండువా వేసుకుంటారు! వేసుకుంటూనే వుంటారు!

ఇదేమిటి అంటావా? ఇదే క్విడ్ ప్రో కో! నిన్ను గెలిపించిన ప్రజల్ని వారి అభిప్రాయాల్ని వెక్కిరించినట్టుగా అవతలకు నెట్టి, నువ్వు మా పార్టీలోకి వస్తే.. నీకు యివ్వాల్సింది యిస్తాం అన్నట్టే కదా? ‘నువ్వు వొస్తావు.. ప్రతిగా మేము యిస్తాము’.. యిది క్విడ్ ప్రో కో కాదా?

తెలంగాణ చంద్రుడు కేసీఆర్ కు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంచి స్నేహితుడు. స్నేహితుడయితే వాళ్ళింటికి నువ్వు వెళ్లి తిను. నీ యింటికి వాళ్ళనొచ్చి తినమను. మీరు మీరు యేదన్నా యిచ్చిపుచ్చుకోండి. కాని స్నేహం పంచాడు కాబట్టి రాజ్యసభ సీటు పంచుతాను అంటే అదెలా? అప్పుడది క్విడ్ ప్రో కో కాదా? క్విడ్ ప్రో కో కిందికి రాదా?

ఇక తెలుగు చంద్రుడు సుజనా చౌదరికి రాజ్యసభ సీటు మళ్ళీ యివ్వదలచుకున్నాడు. సుజనా చౌదరి విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడాడని అందుకే మళ్ళీ రాజ్యసభకు పంపుతున్నట్టు తెలుగు చంద్రుడు చెపుతున్నాడు. విభజనకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళను గౌరవించదలచుకుంటే వైయ్యెస్ జగన్‌ని కూడా గౌరవించాలి గదా? మరి గౌరవించగలడా..? పైగా విదేశీ బ్యాంకుల ఋణం యెగ్గొట్టినట్టు అనేక అవినీతి ఆరోపణలు యెదుర్కొంటున్న సుజనా చౌదరిని రాజ్యసభకు పంపుతూ వుల్టా ‘పదకుండు చార్జిషీట్లు పదమూడు కేసులూ వున్న ఏ-2 ముద్దాయిని రాజ్యసభకు యెలా పంపిస్తారు? ఏ-1 నిందితుడు సపోర్టు యెలా యిస్తాడు?’ అని చంద్ర బృందం అడుగుతూ వుంటే- యెల్లమ్మని యెంచక్కర్లేదు.. పోలమ్మని పొగడక్కర్లేదు అన్నట్టుగా వుంది.  అవినీతిపరులేనా అభ్యర్ధులు? మరెవరూ యిరు పార్టీలలో లేరా? అంటే అలా యివ్వడంలో క్విడ్ ప్రో కో లేదని చెప్పగలరా?

తెగమాట్లాడే తెలుగు వాడు.. ప్రధాని తరువాత రెండోస్థానంలో వున్నాడంటున్న వెంకయ్య నాయుడుకు కాకుండా మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభుకు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సీటును వాళ్ళు కోరడంలో- వీళ్ళు యివ్వడంలో మతలబు యేమిటి? పోనీ మన నిర్మలా సీతారామన్‌ను కర్నాటక పంపడంలో మతలబు యేమిటి? తెలుగు తమ్ముళ్ళు కాదన్నారా? లేక రేపెప్పుడో కాదంటారనా? ‘మీకీ హోదా యిచ్చాం.. మాకు ప్రత్యేకహోదా యివ్వలేరా’ అని అంటారనా? సరే అందరికీ అర్థమయ్యే రాజకీయాలు మాట్లాడుకోవడంలో అర్థం లేదు!

సొంత రాష్ట్రం వాళ్ళే చెయ్యలేనిది.. వేరే రాష్ట్రం వాడయిన సురేష్ ప్రభు చేస్తాడనా? బీజేపీ యెందుకడిగింది? టీడీపీ యెందుకిచ్చింది? ఇది కూడా క్విడ్ ప్రో కో అంటే కాదనగలరా?

కేంద్రంతో అవసరాలు వున్నాయి! కేంద్రం అవసరం మనం తీరిస్తే మన అవసరం కేంద్రం తీరుస్తుంది! కేంద్రానికి మనం సహకరిస్తే కేంద్రం మన రాష్ట్రానికి సహకరిస్తుంది! కేంద్రంతో స్నేహంగా వుండి నిధులు తెచ్చుకోవాలి! రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం యివ్వాలి! వారికి వొక అవకాశం యివ్వడం అంటే మనం వారి నుండి వొక అవకాశం తీసుకోవడం! కేంద్రంలో అధికారంలో వున్న వాళ్ళకి మనం మన మద్దతు యిచ్చాం.. వారు అందుకు ప్రతిగా మనవాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు యిచ్చారు! విశాఖపట్నంకు రైల్వే జోన్ యివ్వమని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాం.. యిప్పుడు ఆ రైల్వే శాఖా మంత్రిని రాజ్యసభకు మన ఏపీ నుండి పంపిస్తున్నాం.. కాబట్టి రేపు రైల్వే జోన్ ఆశించొచ్చు.. అడగొచ్చు.. సాధించుకోవచ్చు.. మనం రాజ్యసభ సీటిచ్చాం.. వాళ్ళు మనకి రైల్వే జోన్ యిచ్చారు.. యిస్తారు.. ఏం లేదు.. యిచ్చి పుచ్చుకుంటున్నాం.. ‘నీకిది.. నాకది!’

ఇది కూడా క్విడ్ ప్రో కో కాదా? ఆర్ధిక అవినీతి మాత్రమే అవినీతా? రాజకీయ పార్టీలు జట్టులు కట్టి వుమ్మడిగా ‘నీకిది.. నాకది’ అని అంటే అనుకుంటే ముందుకుపోతుంటే అధికారం పంచుకుంటే అది మాత్రం అవినీతి కాదా? దీన్ని ‘క్విడ్ ప్రో కో’గా చూడకూడదా? అలా చూస్తే తప్పా?

కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి రాజ్యాంగములో యేమి రాసుకున్నా.. మద్దతు వున్న రాష్ట్రాల వాళ్ళతోనే ఆ సంబంధాలు సజావుగా కొనసాగుతాయా? లేదంటే శాంతి భద్రతల బూచి చూపించి రాష్ట్రపతి పాలన విదిస్తారా? రాష్ట్ర అవసరాలకు సహకరించకుండా మొండి చెయ్యి చూపిస్తారా? మద్దతు యిచ్చినప్పుడే వున్నప్పుడే రాజ్యాంగము అమలవుతుందా? లేదంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలని అది నిర్వచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతారా? మరి ‘మద్దతు’ అంటే యేమిటి? ‘నాకు నా పాలనకి- నా అధికారానికి- నేను అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నువ్వు సహకరించు.. నీకు నీ పాలనకి- నీ అధికారానికి- నువ్వు అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నేను సహకరిస్తా..’ అనే కదా? నాకిస్తే – నీకిస్తా! మళ్ళీ అది అవ్వదా ‘నీకిది.. నాకది?’

ఏది క్విడ్ ప్రో కో కాదు? సమస్తమూ క్విడ్ ప్రో కో నే! సమస్త సంబంధాలు క్విడ్ ప్రో కో నే! రాజకీయ సంబంధాలే కాదు, అధికార సంబంధాలే కాదు, సమస్త మానవ సంబంధాలూ క్విడ్ ప్రో కో నే! కుటుంబంలోనే తీసుకో.. నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు! ద్వేషించినా ప్రేమిస్తారా? లేదే? నువ్వు నీ కష్టాన్ని యిచ్చావనుకో.. ప్రతిగా నీకు సుఖాన్ని యిస్తారు! నువ్వు వాళ్ళ కోరిక తీర్చావనుకో.. ప్రతిగా వాళ్ళు నీ కోరిక తీరుస్తారు! ఇచ్చిపుచ్చుకోవడం అన్నింటా వున్నదే! యివ్వకుండా పుచ్చుకోలేవ్!

సో.. ఆ ‘క్విడ్ ప్రో కో’లోకి రాకుండా ‘క్విడ్ ప్రో కో’లో లేకుండా రాజ్యమే నిలబడదు! రాజ్యసభ సీటు నిలబడుతుందా? ‘క్విడ్ ప్రో కో’ పాటించకుండా రాజ్యసభ సీటు ఆశించడం నేతి బీరలో నెయ్యిని ఆశించడం లాంటిది! ముందు ‘క్విడ్ ప్రో కో’ని గౌరవించు! ‘క్విడ్ ప్రో కో’ని ఆచరించు! ‘క్విడ్ ప్రో కో’ని అనుభవించు! ‘క్విడ్ ప్రో కో’ నిత్యము! ‘క్విడ్ ప్రో కో’ సత్యము! ‘క్విడ్ ప్రో కో’ శాశ్వతము!

అల్లుడూ.. ‘క్విడ్ ప్రో కో’ యే రూపంలో వున్నా అది అపురూపమైనది! అందులో నువ్వు భాగస్వామి కావలసియున్నది! అది మాత్రమే నీకు భవిష్యత్తులో రాజ్యసభ సీటుని తెచ్చును! యిచ్చును!

వొచ్చే పెద్దల సభ యెన్నికల్లో మీ కోరిక తప్పక నెరవేరుతుంది!

అభిమాన పూర్వక ఆశీస్సులతో..

మీ

మామ

అబ్ కీ బార్.. అగ్లీ బార్..

 

                       -బమ్మిడి జగదీశ్వరరావు

~

గౌరవనీయులైన ప్రధాని మోడీగారికి!

నమస్కారాలతో-

‘నా దేశం మారుతోంది

ముందుకు పురోగమిస్తుంది’ – అని,

“అబ్ కీ బార్” యువతకు అపారమైన అవకాశాలు’ – అని,

మీరు యిచ్చిన ప్రకటన.. మన భారత ప్రభుత్వం తరుపున మీరు యిచ్చిన ప్రకటన.. చాలా బావుంది. అందుకు మీకు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు!

’20 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం’ అన్నారు. ఢిల్లీ జవహరలాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలను తలదన్నేలా యివాళ మీ పాలనలో దేశమే వొక యూనివర్సిటీగా మారింది అందుకు కూడా మీకు నిజంగా అభినందనలు!

‘ప్రధానమంత్రి “కౌశల్ వికాశ్ యోజన” కింద 20 లక్షలకు పైగా యువకులు శిక్షణ పొందారు’ అన్నారు. యిది నిజం! ముమ్మాటికీ నిజం! అయోధ్యలో నిర్వహించిన, నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రమే అందుకు సాక్ష్యం! స్థానిక యువతకు శిక్షణ యివ్వడం యెంతయినా గొప్ప విషయం! మన ఆరెస్సెస్, విహెచ్పీల పాత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించతగ్గది! శిలాక్షరాలతో నమోదు చేయతగ్గది! భారత దేశ భవిష్యత్తును యిప్పుడే సందర్శించతగ్గది!

అయ్యా.. మన యువత తుపాకులూ కర్రలూ పట్టుకొని సైన్యంగా కవాతులు చేస్తుంటే – పరుగులు తీస్తుంటే – అగ్గిలోంచి దూకుతూ వుంటే – నిప్పు చక్రాల్లోంచి యెగురుతూ వుంటే – ముస్లింలను పోలిన ఆ వుగ్రమూకలపై తిరగబడుతూ వుంటే – తలలుబద్దలు చేస్తూ వుంటే – రక్తాలు పారిస్తూ వుంటే – కాల్పులు జరుపుతూ మందిని మట్టుబెడుతూ వుంటే – వాళ్ళంతా అలా నేలకు వొరిగిపోతూ వుంటే – శాంతి కపోతం ఆకాశంలోకి యెగరడం చూస్తూ వుంటే – నా వొళ్ళు పులకరించిపోయింది అంటే నమ్మండి! అప్పుడే కొందరి గుండెల్లో చెమటలు పడుతున్నాయి! అందుకే అంతలా యేదో అనర్ధం జరిగిపోతున్నట్టు గగ్గోలు చేస్తున్నారు! మాక్ ప్రదర్శనలా కావవి.. భారత సైన్యం యెక్కడో సరిహద్దుల్లో లేదని.. మన పక్కలో భల్లెంలా దుర్గామాత భల్లెంలా వుందని.. మన మధ్యనే వుందని.. కళ్ళు పట్టని ఆదృశ్యం చూస్తే.. ఆహా అనిపించింది! ఓహో అనిపించింది!

మరి నోయిడాలో? అభం శుభం తెలియని పిల్లలకు అద్భుతమైన శిక్షణ యివ్వడం కూడా మామూలు విషయం కాదు! మొక్కలే వంగుతాయి! మానులు వంగవు! దేశానికి పిల్లలే గాని దేశ భక్తికి పిల్లలు కారు! వొకరా యిద్దరా.. యెందరో వీర శివాజీలు! వీర సావార్కరులు! భవిష్యత్ భగవతీలు! రేపటి మన తొగాడియాలు! పిల్లలలో యిలాగే స్పూర్తిని నింపాలి! రగిలించాలి! రణరంగంలోకి పంపించాలి! చదువుకున్న పాఠాలలో మార్పులతో పాటు యీ విధమైన శిక్షణ ప్రతి పాఠాశాలలో యివ్వాలి! పాఠాశాలలు లేనిచోట అంగన్వాడి కేంద్రాలలోనే శిక్షణని యివ్వాలి! మొదలవ్వాలి! భారతీయతను దర్శించేలా తరించేలా తయారు చేయాలి! ముక్కుపచ్చలారని ముఖాల్లో వెచ్చటి దేశభక్తి టీవీల్లో చూసి యెలా మరిచిపోగలను? అసలుసిసలు “మేక్ యిన్ యిండియా” అంటే యిదే! అర్థం చేసుకోలేని కుహనా లౌకికవాదులు చేస్తున్న పర్ధం లేని ఆరోపణలు అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు! ప్రతిపక్షాలన్నాక ఆ మాత్రం విమర్శించకపోతే వాటికి వునికి వుండదు! డోంట్ కేర్! కేర్ వోన్లీ కేర్ కేర్ పిల్లలు! కేరింతల పిల్లలు! కరసేవకు పిల్లలు!

యింకా వారణాసిలో? మన వీహెచ్‌పీకి అనుబంధ సంస్థ.. దుర్గావాహిని సంస్థ యిచ్చిన శిక్షణ భారతీయ మహిళా చరిత్రలోనే మరువలేనిది! మరువరానిది! మరపురానిది! నిజంగా ఆడవాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది! అది మనం వారి మాటల్లోనే వినొచ్చు! కనొచ్చు! ‘లవ్ జీహాది’ పేరుతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకుంటామని పిడికిలి బిగించి ముందుకు వచ్చారు యెందరో గృహిణులు.. విద్యార్ధినులు.. అమ్మాయిలు! పెళ్లి కూడా వాళ్లకు ప్రతిబంధకం కాలేదు! ఒక్కొక్కరూ వొక్కో లేడీ బ్రిగ్రేడ్! వీళ్ళంతా దేశానికి గొప్ప సందేశాన్ని యిచ్చారు! ‘ఆత్మరక్షణకే ఆయుధం’ అంటున్నారు! తుపాకులు యెక్కుపెడుతున్నారు! తూటాలు దట్టిస్తున్నారు! సుకుమారము వొదిలి మారాము చేస్తున్నారు! సున్నితమైన వేలిని ట్రిగ్గర్ మీద పెట్టి టార్గెట్ ని టార్గెట్ చేస్తున్నారు! వారి కన్ను మనకి వెన్ను! కాంతలు కత్తులైనారు! కరవాలాలై తిరుగుతున్నారు! తిప్పుతున్నారు! కరసేవకు సిద్ధమంటున్నారు! ఆత్మవిశ్వాసమే మా అడ్రెస్స్ అంటున్నారు! అంతే కాదు, దేశంలో యితర ప్రాంతాలలో కూడా శిక్షణ యిస్తామని కొనసాగిస్తామని యెంతో నమ్మకంగా చెపుతున్నారు! అబ్ కీ బార్.. ప్రపంచ మహిళల్లోనే భారతీయ మహిళ అందరికన్నా ముందున నిలబడ్డది!

అయోధ్యా.. నోయిడా.. వారణాసి ప్రాంతాల్లో శిక్షణలను యివాళ మీడియా బూచిని చూపించినట్టు చూపించొచ్చు! కాని మా వూళ్ళో.. వూరు విడిచిపెట్టి వచ్చి వున్న ఈ నగరంలో.. చాలా స్కూళ్ళలో పొద్దున్నే తెల తెలవారక ముందే ఖాకీ నిక్కర్లూ తెల్ల చొక్కాలు వేసుకొని- కర్రలు పట్టుకొని- తలకు ఓం గుర్తుగల కాషాయపు జెండాలు కట్టుకొని- కర్రసాములూ కరాటేలూ చేస్తూ వుంటే.. రేపటి యుద్ధానికి యివాళే సిద్ధమవుతూ వుంటే.. చూడాలంటే కళ్ళు చాలవు! యిది నర సైన్యం కాదు, వానర సైన్యం!

“స్టార్టప్ యిండియా’ – దేశంలోని యువతే మన సంపద. వీరిలో కొత్త కొత్త అన్వేషణలు చేసేవారికి ప్రభుత్వం సాంకేతిక సహకారం, మెంటార్ షిప్ ద్వారా సాయం అందిస్తోంది” అంటూ మీరిచ్చిన ప్రకటన.. ప్రకటన మాత్రమే కాదని, ప్రచారం కానే కాదని, ‘ఆచరణ’ అని అక్షరమక్షరమూ నిరూపిస్తోంది! సాక్ష్యంగా నిలుస్తోంది! దేశంలోని అణువణువూ నినదిస్తోంది!

ప్రతిపక్షాలకు పని లేదు! మేథావులకు పని లేదు! ఆలోచనాపరులు అని చెప్పుకొనే వాళ్ళకి అస్సలు బుద్ది లేదు! యూపీ యెన్నికలలో లబ్ది పొందడానికే యిదంతా చేస్తున్నామని ఆరోపిస్తున్నారు! ఆరోపిస్తారు.. అరుస్తారు.. అంతకంటే యేమి చేస్తారు? ఆరెస్సెస్ ఐయస్ వొకటేనా.. రామ రామ.. దుర్మార్గం కాకపోతే?  ఆరెస్సెస్ ని ఐయస్ తో పోల్చడం మేథో దివాళాకోరుతనం తప్ప యింకోటో మరోటో కాదు! మన వాదాన్ని వాళ్ళు వివాదం చేస్తున్నారు! తప్పనిసరి పరిస్థితుల్లో అయోధ్యలో శిక్షణ పొందుతున్న యువకుల్ని కొద్దిమందినైనా అరెస్టు చేయడాన్ని మేము అర్థం చేసుకోగలము! మళ్ళీ మనం రెట్టింపు వుత్సాహంతో పని చేయాలి! నిజం చెప్పనా.. మీరు అధికారంలోకి వచ్చాకే మాకు అనేక అవకాశాలు వచ్చాయి! మనం విస్తరిస్తున్నాం! అందుకు కూడా మీకు నా కృతజ్ఞతలు!

మన ప్రభుత్వ ప్రతినిధులూ నాయకులూ యెవరి వంతు సహకారం వారు అందిస్తూ మాట్లాడుతున్నారు! వారికి నా కృతజ్ఞతలు! అన్నట్టు చెప్పడం మరిచాను, మన సుబ్రహ్మణ్య స్వామి అయోధ్యలో ఆలయ నిర్మాణం యీ యేడాదే చేస్తామనడం.. దానికి వుమా భారతి గారు ‘సుబ్రహ్మణ్య స్వామే నా హీరో’ అనడం యివన్నీ కూడా మాలో నిద్రాణమై వున్నా ఆత్మా’రాముణ్ణి’ లేపుతున్నాయి! మేల్కొలుపుతున్నాయి!

మనది లౌకిక రాజ్యం! లౌకిక రాజ్యానికి యెప్పుడూ శ్రీరాముడే రక్ష! నాకు తెలుసు మీరు రామ రాజ్యం తెస్తారు! తెచ్చి తీరుతారు!

‘అబ్ కీ బార్’ ప్రకటనలోనే- మీతో మాట్లాడడానికి ఫోను నెంబరు యిచ్చి మిస్సుడు కాల్ యివ్వమన్నారు.. యిచ్చినా యివన్నీ మాట్లాడే అవకాశం వుండదని మీకు యిలా వుత్తరం రాయాల్సి వొచ్చింది!

‘యధారాజా తదా ప్రజ’ తప్పక అవుతారని ఆశిద్దాం..!

మీకు మరోసారి మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తూ..

జై హింద్!

మీ

దేశభక్త అభిమాని

 

 

నీళ్ళూ నిప్పులే!

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

ఒరేయ్ రాజుగా..!

యెలాగున్నావురా? వూరొదిలీసావు కదా యెలాగుంటావ్? బాగనే వుండుంటావులే! బాగుపడక పోయినా చెడిపోకుండా మాత్రం వుండుటావ్!

వదిలేసినోడి పెళ్ళాం యెవడితో పోతే యెందుకన్నట్టు.. వూరు వొగ్గేసాక యెలాపోతే అలాపోనీ అని అనుకోక వూర్లోని కబుర్లు రాయమని వుత్తరం రాసావ్! ఫోన్లో మాట్లాడితే చాలదా.. చేదస్తం కాకపోతే అని అనుకున్నాన్రా.. కానోరే- యివి ఫోన్లో మాట్లాడేవి కావురా, వుత్తరం రాయాల్సిందే..! వూరూసులు నీకు చెప్పాల్సిందే..!

వూరికి కరువొచ్చింది! అలాటి యిలాటి కరువు కాదు! కాటకము లాటి కాటకము కాదు! గింజకు కరువైతే పంటకు వుంచిన యిత్తనాలు తిన్నాము! గడ్డికీ గాదాముకీ కరువొస్తే పసులను కబేలాలకి పంపించీసినాము! వూరికి మరిడొస్తే మహంకాలమ్మకు దిష్టితీసి దండవెట్టి ముడుపులుగట్టి మొక్కులుదీర్సి సంబరాలుసేసి సచ్చినోల్లని సాపల్ల జుట్టి వల్లకాడుకు యీడ్సినాము! పూడ్సినాము!

ఏ తల్లి దయ చూపినా గంగమ్మ తల్లి దయ చూపడం లేదురా.. శివయ్య నెత్తిమీద నుండి గంగమ్మని దించడు గావాల.. అతగాడికి సల్లదనం సాలదు గావాల.. అనీసి నలుగురం అనుకోని, ఆడుకోని.. యింటికి పది బిందిలు.. వంద గడప.. వంద యిళ్ళు.. మొత్తానికి యెక్కడెక్కడ్నుంచో నీళ్ళు తోడుకొచ్చినాం.. సేతులు బొబ్బలు కాలు బొబ్బలు.. ‘దేవుడు దిబ్బయిపోయిన దేవుడు’ అని తిట్టకోకుండా వోపిక పట్టినాం.. సుమ్మగుడ్డ నెత్తి మీన  యెట్టుకోని బిందిలికి బిందిలు మోసినాం.. కావిళ్ళు యేసినాం.. బళ్ళు పూసినాం.. పులిసిపోనాం.. పులకించిపోనాం.. పంతుళ్ళ మంత్రాలొకపక్క.. జంగమోడి శంఖమొకపక్క.. దీపాలు దూపాలు.. ఆరతులు ఆబిసేకాలు.. అది కళ్ళు తోటి చూడాల్సిందేరా.. చెప్పనలవయితే గాదు.. వూరందరం గలిసి మనూరి శివాలయంలో శివుడి నెత్తిమీద వెయ్యిన్నొక్క కుండల నీళ్ళు కుమ్మరించినాం.. గర్బగుడిలోంచి నీళ్ళు పోకండా స్నాన మట్టం ముందలే మూసీసినాం.. ద్వార ప్రవేశకాల దగ్గర కన్నాలు కలిపి వొగ్గకుండా బిరడాలు సుట్టి పెట్టి మూసీసినాం.. నీళ్ళు యెట్నుంచి పోకండా చేసీసినాం.. యేటవుద్ది? శివలింగం ములిగిపోయింది..! దేవుడికి వూపిరాడక వుక్కిరి బిక్కిరి అయిపోయి.. ‘ఓళ్తల్లో.. గంగమ్మ తల్లో.. వూపిరి సలపడం లేదు, దిగి బేగి అవతలికి యెల్లే..’ అనీసి శివుడు అంటాడు గావల.. గంగమ్మతల్లి గంగ వెర్రులెత్తుకోని మేగాలంట పరుగులెట్టుకోని బూమ్మీదకి అడ్డగ దిగిపోద్ది గావాల.. వర్షాలు కుండపోతగా కుమ్మరించేస్తాయి గావాల.. దబ దబమని దబాయించి అంచెట్టకుండా బాదికెలిపోద్ది గావాల.. వానలు వరదలై యెత్తి ముంచేస్తాది గావాల.. కరువుదీరా కసిదీరా కురుసేస్తాది గావాల.. కరువు తీరిపోద్ది గావాల..

వానల్లు కురవాలి వానదేవుడా!

వరిసేలు పండాలి వానదేవుడా!

సెర్లన్నీ నిండాలి వానదేవుడా!

మడ్లన్నీ పండాలి వానదేవుడా!

కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా!

గొప్పగా జరగాలి వానదేవుడా!

అనీసి పాడీసి.. ఆడీసి.. గెంతీసి.. కప్పలకి పెళ్ళిళ్ళు చేసీసి.. ముత్తైదువులు పేరంటాళ్ళు మండోదరికి పూజలూ పునస్కారాలూ చేసీసి.. యిలాగ బూమ్మీద యెన్నున్నాయో అన్నీ చేసిసి.. వూరు వూరంతా కిందా మీదా పడిపోయినా గంగమ్మ తల్లి దిగలే! మొగుడు నెత్తినెక్కించుకుంటే దిగుతాది? యే యాడదాయన్నా దిగుతాది? నువ్వయినా సెప్మీ?

యారళ్ళ పోరు పడలేనని పార్వతమ్మ యెదురుతిరిగినా బాగుణ్ను! మొగుడా.. శివుడా.. గంగని యిడిసిపెట్టురా అనీసి అలనాడు సేసినట్టు గోల గోల గొల్లు గొల్లు సేసినా బాగుణ్ను! శివుడికి సిగ్గయినా వచ్చును! యిడిసీ పెట్టును! మనూర్ల ఆడోలు నాలికలు అరిగిపోయినట్టు మాట్లాడుకున్నారు గాని సుక్క పడ్లే! సినుకు కుర్లే! యెప్పటిలాగ యదావిది.. సిద్దిరస్తు..!

కప్పలు అరిస్తే వానలు కురుస్తాయంటారు.. సెర్ల నీళ్ళే లేవు! కప్పలు యెక్కడి నుండొస్తాయి? అప్పుడికీ మనోలు యెక్కడికో యెల్లి కప్పల్ని పట్టుకొచ్చినారు! కొండమీది కోతే మందంటే తేవాల గదా? తెచ్చిన కప్పల్ని అరండే అంటే అరుస్తాయీ? సెప్పితే నీకు అబద్దము, నాకు నిజిము.. ఈలు మనోలు బెక బెక మనడమే గాని కప్పలు అరేలేదు.. అరుపులు నేర్పించినా అరలేదు! మూగి కప్పల్లాగ కియ్ అనలేదు.. కయ్ అనలేదు! ‘యేమే కప్పా అరవూ.. అంటే నానోటి నిండా నీళ్ళున్నాయని..’ సామెత! నీళ్ళూ లేవు! అరుపూ లేదు!

పుర్రాకులు యెన్ని పడినా గుక్కెడు నీళ్ళకి గుటుక్కుమన్నట్టుగుంది బతుకు!

మన వూరి పెద చెరువు యెండిపోయింది! చిన్న చెరువూ యెప్పుడో యెండిపోయింది! తూరుపున వున్న గుండం యింకేపోయింది! పడమరన వున్న బట్టి యెండిపోయి యిటికల బట్టీ అయిపోయింది!

మనూరి బోర్లు యెండిపోయినాయి! బావిలు యెండిపోయినాయి! మంచినీలకు కష్టమంటే కష్టం కాదు! కనా కష్టంగుంది! యమ యాతనగుంది! యిప్పుడు యెలక్షన్లు వున్నా బాగుణ్ను! సర్కారు పట్టించుకున్ను! మనం దిక్కులేని పక్షుల్లా చచ్చినా యిప్పుడు యెవుడుకీ పట్టదు! మీ చావు మీరు చావండి అని వదిలేసినారు! మనూర్లదాక మజ్జిక పేకట్లు రాలే! అయినా మజ్జికతో కడుపు నిండుతాదా? మంచినీళ్ళతో దినమెళ్తాదా? యేమంటే ‘చెట్టూ – నీరు’ పోగ్రాముకి రమ్మంటారు.. మనుషులకే నీళ్ళు లేవు.. మోడులకి నీళ్ళు యెక్కడి నుండి తెచ్చి పోసీది?

ఊళ్ళో ట్యాంకులతో నీళ్ళ అమ్మకం లేదు! మనూరోలికి కొనే తాహత్తు లేదనేమో ట్యాంకులోల్లు పట్నం  పోయినారు! ఎక్కడైనా గిరాకీయే గాని అక్కడైతే వొక రూపాయి యెక్కువకి అమ్ముకోవచ్చు! నాల్డబ్బులు సీజన్ల సంపాదించుకోవచ్చు! ఆల యాపారాలు ఆలవి! కాదని అనగలమా? ఆపగలమా?

గోర్జిల నంద నుయ్యి వుందికదా.. మనం స్నానాలు చేసీవోళ్ళం.. ఆడా మగా పిల్లా పిచ్చుకా అందరం అక్కడే కదూ! కళకళలాడే నుయ్యి! నుయ్యికాడ నీళ్ళుతోటి యెన్నెన్ని కతలు తెండీ వోరని?! నీళ్ళు పట్టుకొని యెల్లగానే యెల్లినమ్మ మీద అమ్మలక్కల వూసులు! వయిసిన గుంటల సూపులు గునపాల్లాగా వుండీవి కావూ?! ఓలి మరదలా బీపి రుద్దిమీ.. బాగా రుద్దినావంతే మీ యప్పకి సెప్పి పెళ్ళాడేస్తాన్లే.. యిద్దరు సక్కన వుందురు.. యికటాలు! ఓరే గండా.. మనవడా.. నన్ను పెళ్ళాడుతావేట్రా అని ముసిలమ్మల ముసిముసి నవ్వులు! వోరి గొల్లిగా నూతిలోని నీలన్నీ తోడేస్తావేటి?, ఆపిల్ల వూరెల్లింది, యిప్పుడప్పిడే రాదు.. సిగ్గుపడి సేద వొదిలీసి పరుగులు.. పరాసికాలు! నుయ్యి నూర్రకాలుగా వుండీది.. నవ నవ లాడీది!

యెలాటి నుయ్యిరా అది.. రెండు బారలకే నీళ్ళందీవి! పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఫంక్షన్లు గింక్షన్లు అన్నీ ఆపీది! అది కూడా వెలవెలబోయింది! తొంగి చూస్తే అడుగు కనిపిస్తోంది! అడుగంటీసింది! మట్టి తీతుమన్నా కళ్ళు తిరిగిన లోతు! ముంత వొలకబోసినట్టు నీళ్ళు! చిన్న పిల్లాడు వుచ్చపోసినట్టు వూట! జల యింకి పోలేదు! తగ్గిపోయింది! పొయ్యి పొక్కల్లలా మూడు పక్కలనుండి మూడు వూటలు! వూరిని.. వందగడపని.. కొంత కాకపోతే కొంతయినా కాపాడుకొస్తోంది ఆ నుయ్యమ్మ తల్లి!

‘పెపంచకంల వున్ని నుయ్యిలన్నీ యెండిపోయినా మన గోర్జి నుయ్యి యెండదురా..’ అనీసి కంచరాన అచ్చమ్మ అనీది.. ఆ ముసిల్ది వంద నిండినదాక వుండి కొండెక్కిపే! పిచ్చికలాటి మనిషి! ముంతడు అంటే ముంతడు నీలు తోటి తాన్నం జేసీసి బట్ట కూడా తడిపీసీది.. ఆ మారాజు కూతుర్ని తలవనోలు లేరనుకో! యెందుకని అడుగు? నీల కరువుకి.. దేవుడికి నీలదార తియ్యడమే మరిసిపోయిన కాలంలో అచ్చేమ్మే ఆదర్శము గదూ? ‘ముంతడు నీలల్ల ములిగి సచ్చిపోడమేటో’ సాస్త్రం యిప్పుడు బోదపడింది!

తడిగుడ్డతోటి వొళ్ళు తుడుసుకోడం తప్ప తాన్నాలు లేవు! ‘పులులూ సింహాలూ రోజూ తానమాడుతాయేట్రా?’ అనీసి నీల్లున్నప్పుడే నెలకీ పదికీ తాన్నం జేసే మన సావాసగోడు కామేసు లేడూ.. ఆడ్ని అందరం యెక్కిరించీవోలిమి గదా..? ఆడిప్పుడు ‘సెయ్యండిరా.. తలారా తాన్నాలు సెయ్యండిడ్రా!” అని యెక్కిరించి నవ్వుతున్నాడు. ‘మనిషి అంటే జంతువే, జంతువుల్లాగా బతకండి..’ ఆడు యెకసెక్కానికి అన్నా గాని.. నీళ్ళు కాదు గాని మనషులు మనషులుగా మిగిలినట్టు లేరు.. ఆ కత కూడా చెపుతాను విను..

ఊరంతటికీ వంద కుటుంబాలకి గోర్జి నుయ్యే దిక్కు! పూటకి యిన్నీ యిన్నీ నీల్లవుతున్నాయి.. లేదనడానికి లేదు! అయితే అవి అందరికీ చాలవు! కొట్టుకు చచ్చినా చాలవు! కత్తులు నూరినా చాలవు! కేసులు పెట్టుకున్నా చాలవు! నాను ముందొచ్చినాను అనంటే నాను ముందొచ్చినాను అని కయ్యాలు! కళ్ళు అగుపడవా.. పిల్లడ్ని పెట్టి యెల్లినానని వొకమ్మ, మీ నయనాలు తీసి గైనాన దోపుకున్నారా.. బింది పెట్టి యెల్లినానని వొకమ్మ! రాత్రి తెల్లవార్లూ నుయ్యి దగ్గరే జాగారం జేసి సచ్చినానని మరకమ్మ, నీకు మొగుడు లేడు.. నువ్వు నుయ్యిదగ్గిరే పడుకుంటే అవుతాది, నాకు మొగుడున్నాడు.. ఆడి పక్కన పడుకోపోతే అవుతాదా.. అని యింకొకమ్మ! నీకంతే సంసారం లేదు, సన్నాసిలాగున్నావు వొంటిగ.. మమ్మల్నీ సన్నాసరకం సెయ్యమంటావా.. సంసారరకం వొద్దంటావా.. చెప్పు మానేస్తాను.. అనంటే- అయితే మానియ్యే, నా మాట మీద యేటి రోటి పోస్తావు.. అని అలగన్నాదోలేదో- మరి నువ్వొచ్చి నామొగుడు పక్కన పడుకోయే.. అనంటే- ఆ గుడిసేటోడు దగ్గిర నీనేల పడుకుంటాను అని.. నా మొగుడు గుడిసేటోడా?.. వొవ్వో గొడవ! ఓసి నువ్వెవులెవులకాడ పడుకున్నావో నాకు తెల్దా? అంతకంటే నా మొగుడు యేటి తక్కువ అనంటే- నువ్వే గాల మా పక్కలు యెత్తినావు అని- నీనేనికి యెత్తుతాను?, లంజలవల్ల.. అనంటే- లంజా లమ్మిడీ.. రామాయణ భారత భాగవతాలెల్ల చదివేసింది చాలక.. జుట్టులు పట్టుకున్నది చాలక.. యేడు తరాలు యెక్కబీక్కున్నది చాలక.. కాంతలందరూ మొగుళ్ళ మీద పడ్డారు. నువ్వు సేత్తక్కువోడివి కాబట్టి ఆ నంజ అన్ని పేలతంది.. నీ నోట్ల యేటున్నాది.. దనిమీద నీకు యేటి లేకపోతే యెందుకడగవు? అని వొక పెళ్ళాం పేచి. నాకు దానిమీద యేటుంది? అని మొగుడు. రోకు అని పెళ్ళాం. మొగుడూ పెళ్ళాల గొడవలు. పిల్లలు మద్దిలో యేడిస్తే పిత్త సిరగ బాదీడిం.. కాదంటే దుడ్డుగర్రలు పుచ్చుకొని యెప్పుడువో పాత పగలు పెట్టుకోని బాగారుల్లాగా యిప్పడు తలలు బద్దలు చేసుకోవడం.. యికనేటుంది? కట్టులూ.. బెండేజీలూ.. ఆస్పెటిల్లూ! పోలీసులూ.. కేసులూ.. కోర్టులూ! సాచ్చికాలు యిస్తే వొక తప్పు! యివ్వకపోతే యింకొక తప్పు! యెటెల్లినా తప్పే! యెల్లక పోయినా తప్పే! నీళ్ళు కాదుగాని వూరు నిప్పుల గుండమయిపే!

యికన యిలగ లాభం లేదని వూరి పెద్దలందరూ కలిసి వుమ్మడిగ యేటి సేద్దాము అనంటే యేటి సేద్దాము అనుకోని వొక తీరుమానం చేసినారు! వూర్ల వున్నవి వంద యిళ్ళు.. వంద కుటమాములు.. కాబట్టి వంద అంకెలు చిట్టీలు రాసి.. చీటీ పాట లాగ యేసి.. వొకటోకటి చిట్టీలు తీసి.. యే నెంబరికి ముందొస్తే ఆలకి ముందు నీలకి అవకాశమిచ్చి.. చీటీల వారీగా వొకరి తరువాత వొకరికి అందరికీ వూరందరికీ వందమందికీ అవకాశము యిచ్చినారు! యింటికి రొండు బిందిలు నీలు! వొక ట్రిప్పు అవడాకి రొండొందలు బిందిలు కావాల! పూటకి నుయ్యిల పది బిందిలు నీల్లూరినా రొండుపూటలా కలిపి యిరవై బిందిలు.. మరీ పెద్ద బిందిలు తెస్తే కాదు, వొక్కలు యెత్తికెల్లగలిగిన బిందే.. పది రోజుల్లల్ల అందరికీ అవకాసమొస్తాది.. రొండో ట్రిప్పు మళ్ళా పదిరోజులకే! వొకేల ముందు ట్రిప్పుల ముందే వొచ్చి యెనక ట్రిప్పుల యెనకే వొస్తే నడుమ దూరానికి నట్టేట్లో మునిగినట్టే! యేటో బతుకు పీనుగుల పెంటయిపోయిందనుకో!

అందరూ వైష్ట్నమయ్యిలే.. గాని దాకలో రెయ్యిలు మాయమయిపోయినాయట.. అలగుంది యవ్వారం! అందరూ మంచోల్లే.. మంచోడి బుద్ది మత్స మాంసాల కాడని సామెత. మంచినీళ్ళ కాడా అంతే! యే రేతిరప్పుడు యెవలు తోడికేలిపోతే? దొంగల్ల దోపల్ల ఆపని చేస్తే? చేస్తే కాదు.. చేసినారు! వూరిల నీటి దొంగలు బయలెల్లినారు! కన్ను సేరేస్తే సేన! సత్య పెమానకాలు చేసేస్తన్నారు, మేం కాదంటే మేం కాదని! తెల్లారితే నుయ్యిల నీలు మాయం! యిలాక్కాదనీసి కొత్త చెప్పులు నాలు జతలు తెచ్చి నూతి మీద యేలాడేనాగ కట్నాం! ‘నీళ్ళు దొంగతనం చేస్తే చెప్పు దెబ్బలు తింటారు’ అని నంద మీద నల్లటి మసిబొగ్గుతో తాటికాయంత అచ్చరాలతో రాయించినాం! అయినా గాని నీళ్ళ దొంగతనం ఆగలే! అరే రేతిరి పూట కాలు మడుద్దుమని లేస్తే తప్పు! వుచ్చకో దొడ్డికో పొతే కూడా నిజంగానే పోతన్నాడా లేదా అని పోసినదాక ఆగి, యెల్లినదాక ఆగి అప్పుడు చూసి గాని వొదిలేది లేదు! నీడలాగ పెతీ వోడికీ యింకోడు కాపలా! నిద్దర్ల నడిసే అలవాటున్న అప్పడినయితే కొట్టేన్రు కూడా! రేతిర్లు కక్కుర్తి పడ్డ ఆడా మగా కయితే అడ్డుకట్ట పడిపే! లాభం లేదని మళ్ళీ ఆలోచన జేసి.. యింటికి యిద్దర్ని నుయ్యికాడ రేతిరిపూట కాపలా వుండీలాగా డూటీలు యేసుకున్నాం! యెవులుకి యే రోజు కావాలో ఆరోజే డూటీ చేసినట్టు సర్దుబాటు చేసుకున్నాం! అందరూ మేముంటాం అంటే మేముంటాం అంటే.. మళ్ళీ అనుమానం.. కాపలా వున్నోలుగాని రేతిరిపూట కుమ్మకైపోయి గాని నీలు మోసికెలిపోతే? అమ్మో.. యింకెవులికి పడతాయి నిద్దర్లు? రోజూ శివరాత్రే! రోజూ జాగారమే!

నీలు లేవు! నిద్దర్లు లేవు! నీలకి కాపు! నూతికి కాపు! మనిసికి కాపు! కాపు వున్నోడికి కాపు! చీమ చిటుక్కుమంటే చాలు.. అబరా గుబరా లేసి నుయ్యికాడికి పరుగే పరుగు! నీలు కాదుగాని యెవులూ యెవల్నీనమ్మడం లేదు! వూర్ల నీల్లారిపోయినట్టు నమ్మకం ఆరిపే! నీలు లేపోతే యెంత ప్రమాదమో.. నమ్మకం లేపోతే అంతే ప్రమాదం గదూ? మనూర్ల అప్పయినా తనకాకయినా ప్ర్రాముసరీ నోట్లు రాసుకొని యెరగం! అంతనమ్మకం! అలాటిది గాచ్చారం కాపోతే నీటి తిత్తవ వూరి తిత్తవని పూరా మార్సీసింది! నిప్పుని ఆర్పడాకి కదా నీలు! నీలే నిప్పయితే? అయితే కాదు, అయ్యింది! వూరంటుకుంది! తగలబడిపోతోంది! నీలు కావాలి! నీలు కురవాలి! నిప్పు ఆరాలి! నీలు తాగాలి! దప్పిక తీరేలా నీలు తాగాలి! మలినం అయిపొయినాము గదూ? ఆ కుళ్ళూ కుతంత్రం కడగడానికి నీలు కావాలి! కన్నీలు కడగడానికి నీలు కావాలి! నీలు కావాలి! స్వచ్చంగా మనిసి మెరవడానికి నీలు కావాలి! నీలు కావాలి! నీలు కురవాలి!

తుఫానట! తీవ్ర వాయుగుండమట! బతుకు గండమట! మూడో నెంబరు ప్రమాద సూచిక యెగరేసారట! వూరికి తుఫాను యెన్నడో వొచ్చింది! అతలాకుతలం చేసింది! యీ తుఫాను వొక లెక్కా? లెక్కే! తుఫానొస్తే వానలు వస్తాయి! అదే తెలిసిన లెక్క! గాలోనయినా అది నీలోనే! నీల వానే! యీదురు గాలులు గంటకి నూటిరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయట! వియ్యనీ! యెలాగోలా వాన కురిస్తే చాలు! ఆకశాన హరివిల్లు మెరిస్తే సేన!

ఉరుము వురికి వస్తే బాగున్ను! మెరుపు మేగాలను చీల్చితే బాగున్ను! దాక్కున్న నీలు దబదబ కింద పడిపోను! పిడుగు పడింది! పడనీ! అర్జునా ఫలుగునా అంటే ఆగుతుందా? పిడుగులతో పాటు యింత వర్షం కురిస్తే బాగున్ను! అల్పపీడనం అటెటో తిరక్కుండా వున్నా బాగున్ను! తిరిగి వొస్తే బాగున్ను! తడిసి ముద్దయితే బాగున్ను!

అరే.. గాలి తేలిపోయింది! మబ్బూ తేలిపోయింది! మసాబు తేలిపోయింది! వానా తేలిపోయింది! ప్రాణం పోయింది! చినుకు కురవాలి! చిగురు తొడగాలి! మొక్కలే కాదు, మోడులైన మనుషులు తిరిగి మొలవడానికి! మొలకెత్తడానికి!

వానోస్తేనే.. తిరిగి నీకు వుత్తరం రాస్తాను!

అంతవరకూ సెలవు!

యిట్లు

నీ

నేస్తం!

తల్లికడుపులోకి తోవ యివ్వండి!

 

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ఓ నా నగర జీవులారా..!

మీరు మల మలా కాకుల్లా మాడిపోతున్నారు కదూ? పెనం మీద వేసిన నీటి బొట్టులా మీ వొంట్లోని ప్రతి నీటిబొట్టూ చెమటై ఆవిరై యింకిపోతోంది కదూ? గొంతు యెండిపోతోంది కదూ? నాలుక పిడచ కట్టుకు పోతోంది కదూ? దాహం.. దాహం.. అని అల్లల్లాడిపోతున్నారు కదూ? పిల్లలూ పెద్దలూ తేడా లేదు కదూ? వయసుకూ వల్లకాడుకూ సంబంధం లేదు కదూ? అమ్మ చేతి దెబ్బ తిననివారున్నారేమో గాని వడదెబ్బ తిననివారు లేరు కదూ?

ఎండ ఫెళ్ళున ‘పేల్చేస్తోంది’ అంటే.. అదేమన్నా తుపాకీనా- పేల్చేయడానికీ కాల్చేయడానికీ.. అని హాస్యానికి అన్నా.. అంతకన్నా యెక్కువేనని యిప్పుడిప్పుడే అర్థమవడం లేదూ? ఎండలకు కొండలు పగలడం అంటే.. అర్థమవడం లేదూ? రోహిణీ కార్తె యెండలంటే రోళ్ళు పగులుతాయి అంటే.. అర్థమవడం లేదూ? రథసప్తమి రోజున సూర్యుడు రథం మారింది మొదలు.. యెండలు మండిపోవడానికి అదే మొదలు అంటే.. అర్థం అవడం లేదూ?

ఎండాకాలం వచ్చిందంటే.. మామిడిపళ్ళూ మల్లె పూలూ వొస్తాయని మీలో యెదురు చూసిన సంబరం చచ్చిపోయిందని నాకు తెలుసు! మీరు చచ్చిన శవాలైపోయారనీ తెలుసు! పిల్లలు మునిపటిలా వేసవి సెలవులని సరదాగా గడపడమే మర్చిపోయారనీ తెలుసు! అమ్మమ్మా తాతయ్యల యిళ్ళకు వూర్లు పోవడమే మానుకున్నారనీ తెలుసు! ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టలేని బందీలయిపోయారనీ తెలుసు! మీకు ఆకలి మందగించిందనీ తెలుసు! మీరు నిద్రకు దూరమయ్యారనీ తెలుసు!

అరే.. మెత్తని స్పర్శకీ మొత్తబుద్ది అవుతోందే..! మీ దాంపత్యానికి కూడా వేసవి సెలవులు యిచ్చేసినట్టున్నారే..! పిల్లల్నో పెళ్లాన్నో పట్టుకుంటే కాని నిద్రరాని మీకు.. పట్టుకుంటే చాలు నిద్ర వొదిలిపోతోందే..! చిన్న విషయాలకు కూడా చిరాకులూ పరాకులూ పెరుగుతున్నాయే..! అన్ని పనులూ వాయిదా పడుతున్నాయే! అయ్యో పని చెయ్యకుండానే అలసి సొలసిపోతున్నారే..! వేసవి కాలపు నాలుగు నెలల్ని చిన్న పిల్లల్లా కేలండర్లోనుంచి చింపేస్తున్నారే..!?

మా చిన్నప్పుడు శివరాత్రికి ‘శివ.. శివ’ అనుకోనేంత చలి వుండేదని అంటే.. మా చిన్నప్పుడు యెండలు వుండీవి కాని యిలాంటి యెండలు కావు బాబోయ్.. అని ఠారెత్తి పోతున్నారా? బీర్లతో కూల్ డ్రింకులతో వేసవిని చల్లార్చలేక పోతున్నారా? కరెంటుపొతే చాలు ప్రాణం పోతోందా? అప్పు చేసన్నా ఎయిర్ కండిషనరో.. కనీసం ఎయిర్ కూలరో కొనుక్కుంటున్నారా? కరెంటుబిల్లు బెంబేలు యెత్తిస్తోందా?

నీళ్ళు లేవు! నగరం నిప్పులగుండం! ఇల్లు అగ్నిగుండం! బతుకు మృత్యుగండం! అకాలమరణం కాదది హననం! పాప హరణం! వడగాల్పులు కావవి యముని పాశాలు! నరక ద్వారాలు!

నిప్పుల కొలిమిలా భగ భగల భుగ భుగల సూర్యుడు! భూతాపం! ప్రకృతి ప్రకోపం! తార్రోడ్డులు కావవి నిలిచి కాలుతున్న తాటాకు మంట! రాక్షసబొగ్గుతో రాజేసిన చితి! చితీ కాదిది.. చింతా కాదిది.. నిప్పుల పుంత!

గుక్కపెట్టి యేడుస్తున్న పిల్లల్ని చూసి.. దేవుడా తీసుకుపోరా తండ్రీ అన్న పెద్దల్ని చూసి.. బతుకు కాలి బొబ్బలెక్కిన మిమ్మల్ని చూసి.. గడ్డకట్టిన నేను కదిలి కరిగి నీరయ్యాను! తొలకరి చినుకయ్యాను! ఎండాకాలంలో వానయ్యాను! వడగాల్పుల మీద వడగళ్ళ వానయ్యాను! ఎండాకాలంలో వానలు.. వానాకాలంలో యెండలు.. కలికాలం అని వెక్కిరించినా.. కాలం తప్పినా.. కర్మం తప్పకూడదని కురిసాను! మురిసాను!

గాలితో గంతులేసాను! అది చూసి చెలిమి చేయ రమ్మని మెరుపు మేళమయ్యింది! ఉరుము తాళమయ్యింది! చెట్టూ చేమతో చెలిమి చేద్దామనుకున్నాను! కొమ్మ కొమ్మన చేరి ఆకు ఆకున జారి ఆడుదామనుకున్నాను! పిందెలతో పోటీపడి రెమ్మ రెమ్మనా ఆకు ఆకునా వేళ్ళాడదామనుకున్నాను!

నిజమే! కాంక్రీట్ జంగిల్! ఈ జంగిల్లో వొక్క చెట్టూ లేదు! పుట్టా లేదు! పిట్టాలేదు! అరుపూ లేదు! ఆనవాలూ లేదు! చిరునామా లేదు! మీ డ్రాయింగ్ రూముల్లో పచ్చని పెయింటింగ్ గా తప్ప, యే జాడా లేదు! లేదే లేదు.. లేనే లేదు!

మీరు నన్ను వెలేశారు! నేలలో యింక కుండా విడదీసారు! అసలు నేలేది? మట్టేది? మట్టి వాసనేది? తొలకరి పరిమళమేది? మట్టి పరిమళాల మధుర వాసనలు యేవి?

సిమెంట్.. సిమెంట్.. సిమెంట్.. వున్నదంతా సిమెంటే! పచ్చదనం లేని పేవ్ మెంటే! ఇళ్ళు కావివి యినుప గూళ్ళు! రాతి నగరం! రాగం లేని నగరం! అనురాగం లేని నగరం! ఆదరము లేని నగరం! శిలా నగరం! శ్మశాన నగరం! క్షుద్ర నగరం!

ఒరే.. నేను మీకోసమే వచ్చాన్రా.. నాకు తోవ యివ్వండ్రా.. దారివ్వండ్రా.. నన్ను పోనివ్వండ్రా.. నన్ను యిమ్మనివ్వండ్రా.. యింకనివ్వండ్రా.. నేల వొడిని చేరనివ్వండ్రా.. అమ్మనిరా.. చెమ్మనిరా..  నేను జలాన్నిరా.. జీవాన్నిరా.. మీ జీవాన్నిరా.. మీ జీవనాధారాన్నిరా.. యేదీ అమ్మ గర్భంలోకి నన్ను చేరనివ్వండ్రా.. చేరుకోనివ్వండ్రా.. చేదుకుందుర్రా.. దప్పికలు తీర్చుకుందుర్రా.. నాలుకలు తడుపుకుందుర్రా.. వొరే దెష్టల్లారా.. దరిద్రుల్లారా.. భ్రష్టుల్లారా.. ద్రష్టల్లారా.. నాకు దారి వొదలండ్రా.. వదలండి!

అరే.. యెదవల్లారా.. మొదవల్లారా.. పాలు కొనుక్కుంటారు సరే, నీళ్ళు కూడా యెన్నాళ్ళు కొనుక్కుంటారురా? లీటరు బాటిలు యిరవై.. యిరవై లీటర్ల నీళ్ళ కేను యాభై రూపాయలు.. వున్న ఖర్చులకు తోడు నెల నేలా నీళ్ళ ఖర్చు.. డబ్బుల్లేకపోతే మంచి నీళ్ళు కూడా తాగడానికి లేదన్నమాట..! గుక్కెడు నీళ్ళ కోసం రొండు వందలు కాదు.. రెండు వేలు.. రెండు వేల అడుగులు తవ్వుతున్నారే.. డ్రిల్లింగ్ మిషన్లు దించుతున్నారే.. తోడేస్తున్నారే.. అమ్మ దగ్గర పాలుంటే చిమ్ముతూ వుంటే తాగొచ్చు.. తాగే పెరగాలి! కానొరే.. స్తన్యంలో పాలు లేవని రావని నెత్తురు పీలిస్తే యెలారా..? రేపు మీ పిల్లలు యేమి తాగి బతుకుతార్రా..? బతికి చస్తార్రా..?!

నీళ్ళురా.. నీ ముంగిటకి వచ్చాయిరా..! తలుపు మూయకురా..! నేను తీర్థాన్ని రా..! దేవుడు పంపిన తీర్థాన్ని రా..! తీర్థ ప్రసాదాల్ని పారబోయకురా..! మూడొంతుల నీళ్ళు యీ భూమ్మీద వున్నట్టు.. మీ దేహంలో కూడా మూడొంతుల నీళ్ళు వుండాలిరా..!

నీరు పల్లమెరుగు.. పల్లానికిపోదామంటే దారీలేదు.. నిజం దేవుడెరుగు.. అడుగుదామంటే దేవుడి జాడా లేదు! మట్టి జాడా లేదు! నేలని యిలా సిమెంటు పోసి కప్పేస్తే.. తల్లికి వూపిరెలా ఆడుతుందిరా? తల్లి పేగు తెగాక మీకు వూపిరెలా ఆడుతుందిరా? సమాధులు కట్టినట్టు కట్టారు కదరా? బతికుండగానే కప్పెట్టారు కదరా? ఇంచీ వదలకుండా సిమెంటు తాపడం పెట్టారే..! యిళ్ళూ వాకిళ్ళూ సరే..! అరుగులూ మెరుగులేనా..? వీధులూ.. వాడలూ.. దారులూ.. రహదారులూ.. వాటి పక్క ఆ వార యీ వార .. దేన్నీ యెక్కడా వదలర్రా? మట్టి అంత అంటరానిది అయ్యిందా? మీరు వేసిన వేషాలు చాలవని యింకుడు గుంతల కంటి తుడుపుతో కవరు చేస్తున్నార్రా?

చిన్న చినుకుకే చిత్తడి అయ్యే మీ నగరం వొక నగరమా? జల జలమని జల్లు కురిస్తే జడిసిపోయే మీ నగరం వొక నగరమా? వానొస్తే రోడ్లమీద మీ బళ్ళూ మీరూ తేలుతారే.. పడవలేసుకు పరుగులు తీస్తారే.. గట్టిగా గంట వాన కురిస్తే మునిగిపోయి.. నీట్లో తేలే మీ నగరం వొక నగరమా? మురుగు కాల్వలు ముడ్డికింద దాచుకొని ముక్కు మూసుకు బతికేస్తారే నాకేమో కడిగి పారేయ్యాలని వుంటుంది.. కాని దెబ్బ యెప్పుడూ ముందు తగిలేది చిన్నవాళ్ళకే! నిజమే, వాన కూడా అందరికీ వొకటి కాదు.. ప్చ్..!

ఏసీలు మీరు పెడతారు.. మీకు చల్లందనము.. మీ చుట్టూ వున్నవాళ్ళకి వెచ్చందనము.. మొక్కలొద్దు.. చెట్లద్దు.. దొడ్లద్దు.. తోటలొద్దు.. పచ్చదనం మీద యింత పగ పట్టారేమిరా? సిమెంటు రంగుకి సాటిరాదురా?

ఇంకా నాకు వోపిక లేదు! అదంతా నాకు తెలీదు.. నాకు దారి యిస్తారా? చస్తారా? యింకుడు గుంతలకన్నా ముందు.. సిమెంటు కనపడితే తవ్వండిరా.. పలుగూ పారా అందుకోండిరా.. గునపాలు తియ్యండిరా.. యీ సిమెంటుని తవ్వి పారేయండిరా.. గచ్చులు చప్టాలు ప్లాస్టింగులు పగలగొట్టండిరా.. మీ సమాధులు మీరు తవ్వుకొని బయటకు రండిరా.. బయటపడండిరా.. నేలతల్లికి గాలాడితేనే మీకు గాలాడుతుంది! నాకు దారి యిస్తేనే మీకు దారి! వీధులన్నీ తిరిగి కాలనీలన్నీ తిరిగి జనావాసాలలో తిరిగి యింకుడు గుంతలలోనే యిమిడలేక అలసిపోయి మట్టిలో యింకే మార్గం లేక రోడ్డెక్కానురా..! మీరూ మీ బతుకులూ రోడ్డెక్కుతాయిరా..!

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలో చేరి స్తన్యమవుతాను.. మీ దప్పిక తీరుస్తాను.. మీకు ప్రాణం పోస్తాను..

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా..

మీ

వాన చినుకులు

 

 

లడ్డూ కావాలా నాయనా..!?!

A_Tirupathi_laddu

 

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ప్రియమైన భక్తులకి..

భగవంతుడు పంచుకోవాల్సింది వొకటుంది.. అది లడ్డు.. మహా ప్రసాదం!

నాకు తెలుసు, నాకులాగే మీకూ ‘తిరుపతి’ లడ్దంటే మహా యిష్టం కదూ.. లడ్డూ ప్రసాదం కళ్ళకి అద్దుకోనే లోపలే నోట్లో నీళ్లూరుతాయి.. తప్పు కాదు.. ఆ రుచి అటువంటిది.. మీరే కాదు.. నేనయినా అంతే!

నన్ను చెయ్యెత్తి మొక్కనివాళ్ళు కూడా నాలడ్డూని యిష్టంగా అపురూపంగా తింటారు.. అంత కమ్మగా వుంటుంది. యెంతో జిమ్మగా వుంటుంది. అమృతమంత రుచిగా వుంటుంది. ఆమాటకొస్తే అమృతానిది యేమి రుచి? అమృతాన్ని తలదన్నే రుచి కదూ లడ్దూది..?

అందుకే సుప్రభాతం సమయాన వెన్నతో మొదలుపెట్టి యేకాంతసేవ లోపు లడ్డూ వడా చెక్కెర పొంగలీ బెల్లం పొంగలీ పులిహోరా దద్దోజనమూ వడపప్పూ చిన్నలడ్డూ మిరియాల అన్నమూ కలకండా యింకా నేతి మురుకూ జిలేబీ ఫోళీ సమోసా పాయసమూ పెద్దవడా సిరా బెల్లం దోశా మురుగన్నమూ అప్పమూ.. అన్నీ అర్పించినా సమర్పించినా.. నాకు ఆ లడ్డూయే వేరప్పా.. దాని రుచి దేనికీ రాదు గాక రాదు!

అంతెందుకు?, నాదర్శనం కానప్పుడు కూడా లేని నిరాశ లడ్డూ దొరకనప్పుడు వొస్తుంది.. ఔనా..?

లడ్డూ పదార్థమే కాదు పదం విన్నా నోట్లో నాలుక మునిగిపోతుంది! ఎంత కమ్మటి వాసన. అమ్మ దగ్గర వొచ్చే వాసన. ఆలి దగ్గర వచ్చే వాసనకు పోటీ పడదూ సువాసన..? ఆస్థానం లడ్డూ.. కల్యాణం లడ్డూ.. ప్రోక్తం లడ్డూ.. దేనికదే సాటి గదూ..?

మా యిద్దరు దేవేరులూ కలిసి యింత శనగపిండి తెచ్చి నలుగు పెడతారా? నాకు వొళ్ళు మంటగా వుంటుంది! అర్ధాంగీలే గాని అర్థం చేసుకోరూ?! ‘వొంటికి గట్టిగా గంపలకొద్దీ శనగపిండి పెట్టకపోతే రంగు యేడ నుంచి వచ్చుద్ది’ అంటారేగాని ‘అయ్యో శనగపిండి.. లడ్ల లోకి పనికొస్తాదే..’ అంటే వింటారా.. వినరు! క పోగా ‘యింత లడ్డులపిచ్చి యేమయ్యా నీకు’ అని మురిపెంగా తిట్టిపోసి తినబెడతారు!

లడ్డూలో వుండేది శనగపిండేనా? బూందీతోటి పటికబెల్లముతోటి పచ్చకర్పూరముతోటి.. నెయ్యేసి ముంతమామిడి పువ్వేసి కుంకుమపువ్వేసి.. కలకండా జీడిపప్పూ యాలకులూ యెoడుద్రాక్షా చెక్కెరా.. యెన్నెన్నో యేసి.. అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..

‘తేనెని మించిన తీయందనము.. మధువును మించిన మధురసము.. ఆహా.. ఆహాహా.. వోహో.. వోహోహో..’ యీ తిరుమల శ్రీవారు లడ్డూ కోసం తపిస్తూ పరితపిస్తూ అమ్మ వెంట పడ్డ పిల్లాడిలా గుమ్మలవెంటపడి పరిగెత్తుతూ రెండు చేతులూ చాస్తే- నాసామిరంగా.. కౌగిలికంటే తీయగుండదూ..?! ఆమాటే అంటే యిక ఆడంగులతో అగ్నిగుండం తొక్కడమే! యెందుకని.. ఆ పెదవులు అందుకొని.. లడ్డూలా వున్నాయి.. అంటే మురిసిపోయారే గాని లడ్డూ ‘అగ్రస్థానం’ అందనేలేదు!

‘లడ్డూ కావాలా నాయనా..’ అని అటు అలమేలు మంగమ్మా యిటు పద్మావతమ్మా యిద్దరూ చెరో లడ్డూ చేత పట్టుకు తెచ్చారు.. ఆవురావురు మన్నాను. ఆబగా అందుకున్నాను. ఆత్రంగా తినబోయి ప్రయత్నించి ఆగి.. నిమిరి ఆఘ్రాణిస్తూ వుండగా ‘యీ పతి.. మన శ్రీపతి.. యేనాడైనా మనల నిమిరి యింత పరవశించినాడా..?’ అలిగినారు భామలు. మూతులు మూడొంకర్లు పెట్టినారు. ‘వశమయ్యాక.. పరవశము యేడ నుండి వస్తుందే..!’ అని గొణిగినాను. అంతకన్న సణిగిన సమరమని నాకు అనుభవపూర్వకముగా తెలుసును! ముందు తిన్నాక ఆపైన అలక తీర్చవచ్చుననుకున్నాను!

‘అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..’ అనుకొనగా ‘నీ నామమెంతో రుచిరా..’ భక్తుల పాటలు నన్ను తాకాయి. ‘ఈ లడ్డూ యెంతో రుచి యెంతోరుచిరా’ సందర్భోచితంగా నా పలుకులు పల్లవించాయి. గొల్లపిల్లవాడిని అమ్మ నోరు తెరవరా అంటే తెరిచినట్టు ‘ఆ..’ అని తెరిచాను. ఔను మరి.. నోరు పట్టని లడ్డూ ఆయే! లాలాజలము యేడు సముద్రాల తీరున యెగసి పడుతోంది! లడ్డూ కొరకబోతే నా పన్నూడింది. నాది కాదు. భూలోకంలో భక్తుడిది. భక్తుని భక్తిని స్వీకరించినట్టే నొప్పినీ స్వీకరించినాను.

గుమ్మలిద్దరూ గమ్మున అలకని అవతలికి విసిరికొట్టి నన్ను వొక్క వురుకున చేరినారు. అర్ధ భాగాలు కదా? రెండు అర్ధ భాగాలు.. సగమూ సగమూ కలిపి నా జగము మొత్తం వాళ్ళే! ఏదీ నాకేదీ చోటు? నేను లేను! మొత్తం వాళ్ళే. వాళ్ళకే నొప్పి. వాళ్ళదే బాధ. వాళ్ళకి నేను బందీ!

నేను నవ్వాను. వాళ్ళు యేడ్చారు. యెద పోసుకున్నారు. నా విరిగిన పన్ను చూసి వొరిగిపోయారు. వలవల కన్నీరుగ కరిగారు. ‘గుమ్మలే కాదు అమ్మలు మీరు’ అనుకున్నాను. కన్నీటి పొరలు కమ్మగ మసక కళ్ళతో ‘యేమయింది..?’ అడిగారు. ‘శనగ గింజ’ అన్నాను. కమ్మిన మసక కరిగింది. ‘కాదు’ అన్నారు. ‘పచ్చ కర్పూరం.. పంటికి తగిలింది’ అన్నాను. ‘పటిక బెల్లం..’ అన్నాను. ‘కుంకుమ పువ్వు కొమ్మ’ అన్నాను. యేదన్నా నమ్మలేదు. యెనక్కి పెట్టిన చెయ్యిని ముందుకు లాగారు. మూసిన గుప్పిట దాచాను. గుమ్మలిద్దరూ వొక్కటైనా సుమబాలల సుకుమారిలు కదా.. పిడికిటిని తెరవలేకపోయారు. చెరో పక్క చేరి చక్కిలిగిలి పెట్టారు. నా పిడికిలి దానికదే తెరచుకుంది!

బోల్టు.. యినుప బోల్టు..!

‘మునుపు దొరికిన నట్టు తీసుకురా’ అన్నాను. ‘యెందుకు యెంకటేశా?’ అన్నట్టు చూసారు. ‘దీందో కాదో..?’ అన్నాను. తెచ్చిస్తే అమిర్చి చూసి ‘దీందే’ అన్నాను. ‘సిగ్గులేదూ..?’ అన్నారు. నా సిగ్గుకు సమతూకంగా.. లడ్డూల్లో రోజూ దొరికిన యినుప మేకులూ బొందులూ తాళాలూ నాణేలూ చాలక రాళ్ళూ రప్పలూ పిన్నులూ పెన్నులూ గుండు సూదులూ గుండీలూ.. వొకటి కాదు..!

‘యిందు దొరకనిదేదీ లేదు దేవీ..’ అన్నాను. ‘అవన్నీ యెందుకు..?’ దేవేరులు యేరులెత్తారు. ‘నా భక్తుల గాయాల గురుతులు’గా దాచుకున్నాను. కొట్టుగది నిండిపోయింది. ‘అవేమన్నా తులసీదళాలు అనుకున్నారా..?’ మంగమ్మ మండిపడింది. పద్మావతమ్మ కోపం పట్టనట్టే వుంది!

పంటి నొప్పికి నాకంట తిరిగిన నీరు సతులకంట జారింది!

కళ్ళు వొత్తుకొని మా ఆవిళ్ళిద్దరూ మళ్ళీ చెరో లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టారు. ఆబగా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని యెప్పటిలా లడ్డూ కొరకలేకపోయాను. ‘భగవంతుణ్ణి కూడా భయపెట్టేసారు కదరా’ అనుకుంటూ వొక లడ్డూ విప్పాను. అందులో నల్లజెర్రి. మరో లడ్డూ రెండు భాగాలు చేసాను. మధ్యలో తెల్ల తేలు. నా చూపు ప్రాణవాయువుగా సోకిందేమో.. యెండిన నల్లజెర్రీ.. వెల్లకిలా తిరగబడింది.. తెల్లతేలూ.. బొమ్మాల్లా పడింది.. ప్రాణం పోసుకున్నందుకు సాక్ష్యంగా! అవి రెండూ అరచేతుల్లోంచి నేలమీదపడి.. పోయిన ప్రాణం వొచ్చిందని తెలీక ప్రాణభయంతో లడ్డూల్లో దొరికిన యినుప సామాన్ల కొట్టుగదిలోకి దూరిపోయినాయి!

అలమేలు మేలు కోలేదు. పద్మావతి కోలుకోలేదు. బుంగమూతి బుజ్జాయిల్ని చెరో చెంక కిందికి తీసుకొని ఆలనగా పాలనగా అక్కున చేర్చుకున్నాను. నా చూపులయితే నేలమీద వాలాయి. నా సహచరులవి కూడా!

అదే లడ్డూలు.. యిద్దరు భక్తుల చేతుల్లో.. వొక లడ్డూలో నల్లజెర్రి దేహం.. మరో లడ్డూలో తెల్లతేలు దేహం.. భక్తులు కొయ్యబారి చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు విస్తుపోయి వింతగా చూస్తూ ‘లాడ్దూల్లో తేలూ జెర్రీ వున్నాయి కదా.. పాములు కూడా వుంటాయా..?’ అమాయకంగా అడుగుతున్నారు. ‘వుండవమ్మా.. పాములు వుండవు..’ తల్లులు నచ్చజెప్పుతున్నారు. ‘యెందుకు..?’ పిల్లలు అడగడం ఆపలేదు. ‘యెందుకంటే.. పాములు పెద్దగా పొడావుగా వుంటాయి కదా.. లడ్డూలో పట్టవు కదా..?!’ తర్కం బోధపడేలా తత్వం బోధపడేలా చెప్పాడో పెద్ద మనిషి! అంతా నవ్వారు!

నేను కూడా నవ్వుకున్నాను. గుమ్మలు నవ్వలేదు. ‘అపకీర్తి కాదా మీకు..?’ అన్నారు వుమ్మడిగా. ‘పాపభీతి లేదా..?’ నేనేదో చేసినట్టు నన్ను నిలదీశారు. ‘ఫలమూ పుష్పమూ తోయమూ మాత్రమేనా? యినుమూ ఘనమూ స్టిక్కూ ప్లాస్టిక్కూ జీవీ నిర్జీవీ.. అన్నిటినీ సమంగా చూడాలి కదా..?’ అన్నాను. యెంతయినా చేసినవారి చేతి రుచిని నిదించ నా తిన్న నోటికి మాట రాలేదు!

‘మీరు మాత్రం యేమి చేస్తారు.. బాగానే సరిపెట్టుకుంటున్నారు.. భక్తిని యుక్తిగా..’ అర్ధాంగులిద్దరూ నిందిస్తూనే నిట్టూర్చారు!

‘నాకు భక్తుల పోటు కన్నా- అధికారులకూ సిబ్బందికీ వీఐపీల పోటు యెక్కువైంది.. వారి సేవలు అటు మళ్ళించారు.. వారు నిమిత్తమాత్రులు..’ అన్నాను. ‘లడ్డూ..’ అని చెయ్యి చాపాను. లడ్డూ అందుకొని చేతిలో పెట్టింది మా పద్దూ అదే పద్మ. నోటికి అందించింది మా మంగ. తిన్నాను. కాని నా ముఖంలో మునుపటి అనుభూతిలేకపోవడం యిద్దరూ కనిపెట్టారు. అర్థమయ్యింది. నవ్వాను. ‘నకిలీ లడ్డు..’ అన్నాను. ‘భక్తుడు యిచ్చిందల్లా స్వీకరించాలిగా.. నోరు చూసుకుంటే అవుతుందా?, భగవంతుడి పాట్లు భగవంతుడివి..!’ అన్నాను. సతులు నకిలీ లడ్డూ లాక్కోబోతే వారికి అవకాశం యివ్వకుండా బాధ్యతగా మింగేసాను! నైవేద్యం వద్దనరాదు కదా..?

‘దళారుల్ని పెంచి పోషిస్తున్నారు కదా..?’ మంగమ్మ గంగవెర్రులెత్తి చూసింది!

‘వాళ్ళు అడుపు లేదు, వీళ్ళు తుడుపు లేదు, అందరి పోషణ భారము నాదే కదా..?’ అన్నాను.

‘మరి.. లడ్డూ.. ప్రత్యేక లడ్డూ.. విశిష్ట లడ్డూ.. యిన్ని తేడా లెందుకు..?’ పద్మమ్మ పరాకున అడగలేదు, పట్టించే అడిగింది!

‘భక్తీ వ్యాపారమయ్యే కొద్దే.. భగవంతుడికి విలువ!’ అని నవ్వాను. నవ్వడం మరచినట్టు నా సతులు. ‘నన్ను ధనిక దేవుణ్ణి చేసారు’ దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాను!

‘మనకొచ్చే ఆదాయం వల్లే మిగాతా దేవుళ్ళ గుడుల్లో గూట్లో దీపాలు వెలుగుతున్నాయి!’ అన్నారు మంగావతీ పద్మావతీ!

నా మౌనం చూసి యేమనుకున్నారో సతులిద్దరూ లడ్డూ నా చేతిలో పెడదామని చూస్తే వొక్క లడ్డూ కూడా లేదు! బిడ్డికిలు, అట్టికలు, దాకలు, దోకిలు, కడవలు, గూనలు, అండీలు సరి.. అండాలూ డేక్సాలూ బోనుపెట్టే కాదు, గదులన్నీ గాలించారు! వుట్టిమీది సట్టిలన్నీ వెతికారు! పళ్ళేలన్నీ బోర్లించారు! రుచి మరిగిన పెద్దలు వెనక ద్వారం ద్వారా లడ్డూలు సంచులకి సంచులు మోసుకు వెళ్తుంటే ముగ్గురం మూగవాళ్ళలా చూసాం! చూస్తే అనామక భక్తులకి లడ్డూలు లేవు! అదీసంగతి.. అందుకే నాకూ లడ్డూలు లేవు! భక్తుడికి లేనిదేదీ భగవంతుడికీ వుండదని భాగస్వామినులు యిద్దరూ అర్థం చేసుకున్నట్టే వున్నారు!

‘రోజుకు లక్షన్నర లడ్లు చేసినా దొరక్కపోవడమేమిటి?’ భక్తులు మనసులో అనుకున్నమాటలు మా చెవుల్లో పడ్డాయి! మా చూపులు భక్త జనంలోకి వారి యిల్లలోకి చొరబడ్డాయి!

సంచులకొద్దీ లడ్డూలు పట్టుకుపోయిన వాళ్ళు నాలుగేసి లడ్డూలు పంచుతున్నారు. వొక్క లడ్డూ దొరికిన వాళ్ళు అదే చిదిపి ముక్కలు చేసి పంచుతున్నారు. కొద్దిమంది నాలుగేసి లడ్డూలు వొక్కడే తింటూ వుంటే.. మరికొద్దిమంది నాలుగు రవ్వలూ పిసర్లూ నలుగురూ పంచుకు తింటూ వున్నారు!

మర్మమేమిటి అన్నట్టు చూసారు మా మగువలు!

అడక్క పోయినా అర్థం చేసుకున్న వాణ్ని! అందుకే అడగకనే చెప్పాను!

‘లడ్డూ మహా ప్రసాదం! ప్రసాదమేదయినా మహా ప్రసాదమే! ప్రసాదం ప్రజలందరికీ సమానమే! అందుకే అందరూ సమంగా పంచుకు తినేది! వొకరికి యెక్కువ మరొకరికి తక్కువ లేకుండా వుండేది! పెద్దవాళ్ళకి యెక్కువ చిన్నవాళ్ళకి తక్కువ అనేదే లేదు! లింగ భేదం లేదు! జాతి భేదమూ లేదు! అలా చేస్తే.. అది గుడి కాదు! ఆ గుడిలో దేవుడు వుండడు!’

మగువలిద్దరూ మౌనం వీడ లేదు!

‘నేనప్పుడూ యిప్పుడూ యెప్పుడూ రాయినే!’

నా మాటకు నా అమ్మలిద్దరూ కళ్ళలో కడివెడేసి నీళ్ళు నింపుకున్నారు.. నన్ను గట్టిగా పట్టుకున్నారు..!

‘ప్రసాదం అందరిదీ. ప్రసాదం అంటే లడ్డూ కాదు. ప్రసాదం అంటే గాలీ నీరూ నేలా. గింజా గంజీ. అన్నమూ వస్త్రమూ. పండూ కాయా. వసతీ వనరూ. సంపదా సకలమూ. సమస్తమూ. అన్నీ అంతా. సమంగా సమ సమంగా పంచుకోవాలి. అప్పుడే ప్రసాదం రుచి! ప్రసాదం తిన్న బతుకూ మెతుకూ రుచి! లేదంటే కాదంటే అదెప్పటికైనా అరుచే!’

‘మరి లడ్డూ అందరిదీ అవుతుందా..?’ పద్మావతి అంటే, ‘లడ్డూ అందరూ అందుకుంటారా..?’ మంగావతి అంది.

‘లడ్డూ మీద హక్కు అందరిదీ. దక్కని వాళ్ళు మొదట బతిమాలుతారు. దక్కకపోతే కొన్నాళ్ళకి తిరగబడి బలవంతంగా లాక్కుంటారు. లడ్డూ లేకుండా అయితే వుండనే వుండరు..!’

నా మాటలకు మా ముద్దుగుమ్మలిద్దరూ ముచ్చట పడ్డారు! అందరికీ లడ్డూలు దొరకాలని ఆశ పడ్డారు! అలాగని దీవించేసారు కూడా! యిక మీదే ఆలశ్యం! చేరుకోండి మీ లక్ష్యం!

మా యింట్లో జరిగిన యీ లడ్డూల కథ మీకు చెపితే – మీరు మీ యింటింటా కథలు కథలుగా చెప్పుకుంటే – చెయ్యాల్సిందేదో చేస్తే – మీ కథ మారుతుందని చెప్పాను! అయ్యో లేదుకదా అని దయతో జాలితో యెవరూ లడ్డూ యివ్వరు. ఎవరి లడ్డూ వాళ్ళే సంపాదించుకోవాలి!

భక్తులారా.. మీకు లడ్డూలు పంచలేకపోతున్నందుకు ఈ భగవంతుణ్ణి క్షమించండి!

యిట్లు

మీ

ఏడుకొండల వెంకటేశ్వరస్వామి

ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది..!

 Abstract-creative-lamp-concept

                                                      -బమ్మిడి జగదీశ్వరరావు

పూజ్యులైన అత్తమామలకు

నమస్కారం!

ఆగండి! చదవకుండా చించేస్తే నాగురించి మీరు తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోతారు! అందువల్ల మీ అమ్మాయికి మంచి మొగుణ్ణి కూడా కోల్పోతారు! అంతకన్నా వొక గొప్ప ఆవిష్కరణలో మీరు భాగం కాకుండా పోతారు! మనీ లేనప్పుడు మెనూ చూడడమెందుకు అనుకోవద్దు! మనీ అనేది యెప్పుడూ జేబులు మారుతుంది! నిండుగా వున్న జేబు ఖాళీ కావచ్చు! ఖాళీగా వున్న జేబు నిండవచ్చు! అంచేత మీ ఐశ్వర్యం అలాగే వుండిపోదు! నిన్న లేదు, యివాళ వుంది, రేపు?

నేను కోట్లు సంపాదిస్తానని అంటే “ఏం.. మీవాడు ‘మీలో యెవరు కోటీశ్వరుడు?’ నాగార్జున షోకి గాని వెళుతున్నాడా?” అని మా అమ్మా నాన్నతో అన్నారట! మీ వెటకారం నాకు నచ్చింది! కారం రాసినట్టయింది! పట్టుదల పెరిగింది! నేను కోటీశ్వరుడు అవ్వడమే కాదు.. మీకు కోటీశ్వరుడు అయ్యే అవకాశం యివ్వాలనిపించింది!

యస్.. రేపు నాదే! మీ దగ్గర ఐశ్వర్యం వుండొచ్చు! మరి నా దగ్గర? ఆ ఐశ్వర్యాన్ని సృష్టించే ఐడియాస్ వున్నాయ్! ఔను.. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది! ఎగ్జాంపుల్ గా వొక ఐడియా వొదులుతాను! కాసుకోండి! మీలాంటివాళ్ళు పెట్టుబడి పెట్టడానికి పోటీ పడతారు! కాని నాకు పెట్టుబడి పెట్టే ఛాన్సు మొదట మీకే యిస్తాను! మీరు కాదంటేనే వేరే వాళ్ళకి అదృష్టవంతులయ్యే అవకాశం వస్తుంది!

సొసైటీకి యేది రిక్వైర్మెంటో అది మనం కనిపెట్టాలి! యిన్నోవేట్ చేయాలి! యిదీ మీ రిక్వైర్మెంటు అని మనం పీపుల్ కి చూపించాలి! అంటే.. రిక్వైర్మెంటూ మనమే సృష్టించాలి.. సొల్యూషనూ మనమే చూపించాలి! దానికి సేవాభావం అనే కలరివ్వాలి! అప్పుడది సేవారంగం కేటగిరీ కిందికి వచ్చి సర్వీస్ వోరియంటేషన్ గా అనిపించాలి! సర్వీసు ప్రొవైడ్ చేయడంలో అంతవరకూ లేని మార్కెట్ స్పేస్ ని క్రియేట్ చేయాలి! అంటే.. అసలు మార్కెట్టే లేదని అనుకుంటే మార్కెట్టుని మనమే సృష్టించాలి! దానికదో మార్కెట్ గా ఆక్యుపై చేయాలి! మార్కెట్ కు డిమాండ్ క్రియేట్ చేయాలి! క్రియేట్ చేశాక అది బేసిక్ నీడ్ అవ్వాలి! నీడ్ ఈజ్ డీడ్!

అర్థమయ్యిందా? అర్థం కాకపోతే మరోసారి కేర్ ఫుల్ గా చదువుకోండి.. అర్ధం చేసుకోండి.. యింతకంటే బేసిక్ లెవెల్లో యెవడూ చెప్పలేడు.. మార్కెట్ మర్మం అర్థమయితేనే మార్కెట్లో రాణిస్తాం! మార్కెట్ మహారాజాలమవుతాం! మాయాజాల యింద్రజాలాలను మించిందీ మార్కెట్ మాయాజాలం! అర్థం చేసుకొనుటయే అర్థం! ‘అర్థం’ అంటే తెలుసుగా ధనం!

మీరు నా ఐడియా కోసం ఆవురావురు మంటున్నారని అర్థమయ్యింది.. యింక వూరించను.. పూరిస్తాను!

ప్రతిమనిషికి విద్య వైద్యం మస్ట్! మస్ట్ అండ్ షుడ్! విద్య వైద్యం ఆల్రెడీ ఆక్యుపైడ్ అని మీరంటారు! నిజమే! ఛాన్సు లేదు అంటారు! అదీ నిజమే! ఫుల్లీ ఫిల్లుడ్! బట్ స్పేస్ ఈజ్ దేర్! ఎందరు యెక్కినా చూసేవాడికి యింకా స్పేస్ వుంటుంది.. పుష్పకవిమానంలోనే కాదు, యిన్నోవేషన్లో కూడా! సో ఆ స్పేస్ మనం క్రియేట్ చెయ్యాలి! చేస్తే స్పేస్ యెప్పుడూ వుంటుంది! ఎడ్యుకేషన్ సిస్టంలో యెక్కడ వుంది?

యస్.. అన్ని యూనివర్సిటీల్లో గొడవలు అవుతున్నాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఢిల్లీ జేయెన్యూ.. కాశ్మీర్లో.. అంతకు ముందు పూణే ఫిలిం యినిస్ట్యూట్ లో.. యిక్కడా అక్కడా అని కాదు, దేశ వ్యాప్తంగా గొడవలు జరుగుతూనే వున్నాయా? పోలీసులు లాఠీఛార్జీలు చేస్తూనే వున్నారా? స్టూడెంట్స్ ని చితక్కొడుతూనే వున్నారా? యస్.. యస్.. యస్స్ .. యిక్కడ స్పేస్ వుంది.. మన మార్కెట్ కి కావలసినంత స్పేస్ వుంది..

పరీక్షలకి ప్రిపేర్ అవడం అందరికీ వస్తుంది! మరి దెబ్బలకి ప్రిపేర్ అవడం అందరికీ రాదు! పరీక్షలకి వో సిలబస్ యేడ్చి చస్తుంది! లాఠీఛార్జీలకి వో సిలబస్ యేడ్చి చావదు! ఏ క్వశ్చన్ కైనా యెవడైనా ఆన్సర్ చేస్తాడు.. కాని యే దెబ్బకైనా యెవడైనా బేర్ చేస్తాడా? చెయ్యలేడు! అంచేత దెబ్బలని తప్పించుకోవడానికో తట్టుకోవడానికో శిక్షణ తప్పనిసరి అవసరం! దటీజ్ యెసన్షియల్! దటీజ్ స్పేస్!

అలాగే టియర్ గ్యాస్.. రబ్బర్ బుల్లెట్స్.. వాటర్ ఫైరింగ్.. ఫైరింగ్.. యే క్షణాన యేదన్నా జరగొచ్చు.. జరిగినప్పుడు జడిసి పోకుండా జంప్ అవాలి! దేశ సరిహద్దుల్లో శత్రు శిబిరం నుండి కాల్పులు జరిగినప్పుడు మన త్రివిధ దళాలు అన్ని ఆయుధాలు వున్నప్పటికీ ముందు వొడుపుగా తప్పించుకుంటాయి.. తరువాతే తిప్పికొడతాయి! త్రివిధ దళాలకి ప్రభుత్వం కోట్లు వెచ్చించి అను నిత్యం శిక్షణని యిస్తోందే.. అలాంటిది భావి విధాతలైన విద్యార్ధులకి వద్దా? సో.. ‘మీ పిల్లల ప్రాణ రక్షణ కోసం మా ప్రాణ సమాన ప్రయత్నం..’ అని మనం పిలుపు యివ్వాలి.. జనం పొలో మని వొచ్చి మన ట్రైనింగ్ సెంటర్లో చేరిపోవాలి!

హై జంప్.. లాంగ్ జంప్.. చిన్నప్పటి నుండి నేర్చుకున్నవే! బట్.. బార్బడు వైర్ మీది నుండి జంప్ చేయడం రావాలి! గేట్లు మూసేస్తే దూకడం రావాలి! అబ్బో వో మిలటరీ శిక్షణా సంస్థ యిచ్చినన్ని శిక్షణలు యివ్వడానికి మనకి స్పేస్ వుంది!

అయిదు నిముషాలు అన్నం లేటయితే ఆకలి అంటారు మన పిల్లలు. అరగంట లేటయితే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటి వాళ్లకి ఆకలికి తట్టుకోవడం నేర్పాలి! పస్తులు వుండడానికి వీలుగా వుపవాసాలు నేర్పాలి! మెస్సులు మూసేసినా అప్పడే మేనేజ్ అవుతారు! సో.. యోగా గీగా చేసి గాలిపీల్చి గాలితాగి గాలితిని గాలికి బతికెయ్యాలి! ఆక్సిజనూ ఆహారమే అనే నినాదాన్ని హెల్త్ కాన్సియస్ తో విద్యార్థులలోకి వారి తలిదండ్రులలోకి తీసుకువెళ్ళాలి! పెట్టుబడిలేని బడి!

చిన్న మాటకే చివుక్కుమనిపోయే తరం! అందునా ఆడపిల్లలు వో మాటంటే వురిపోసుకుంటున్నారు! అలాంటిది యూనివర్సిటీల్లో పోలీసులూ సెక్యూరిటీ సిబ్బంది అమ్మాయిల్ని అమ్మనా బూతులు తిడితే తట్టుకోవాలి గదా? మిమ్మల్ని చెరిచేస్తాం.. రేప్ చేసి పడేస్తాం.. లంజా లమ్డీ అని అన్నాసరే.. యేమీ అననట్టు.. యేమీ విననట్టు.. నిమ్మకు నీరెత్తినట్టు వుండాలి కదా? ఈ చెవిన విని ఆ చెవిన వొదిలేయడం కాదు, అసలు చెవికి యెక్కకుండా వుండేలా శిక్షణని యివ్వడానికి కూడా చాలా స్కోప్ వుంది!

వీసీల నుండి ప్రొఫెసర్ల దాక కులం పేరు పెట్టి తిట్టినా దీవించినా- అనుమానించినా అవమానించినా- ఆటపట్టించినా ఆర్డర్లీలుగా మార్చినా.. వివక్షత చూపించినా విచక్షణ మరిచినా- మనిషిగా చూడకపోయినా- మొద్దులా.. యెద్దులా.. తుమ్మ మొద్దులా.. బుద్దిగా నాలుకని మడిచి పెట్టుకొనేలా మనం ట్రైనింగ్ యిస్తాం! సూదీ దారంతో నోళ్ళు కుట్టుకోవడమెలాగో నేర్పిస్తాం.. శాంతి భద్రతల్ని కాపాడుకుందాం!

పక్కనే పిడుగు పడినా పట్టించుకోనట్టు పిల్లలుండాలి! ప్రతీ పేరెంటూ కోరుకొనేదదే! సో.. పిల్లలతో శవాసనం వేయించెయ్యాలి! ప్రాక్టీస్ చేయించెయ్యాలి! పీస్ ఆఫ్ మైండ్! ఓం శాంతి శాంతి శాంతి హి! ప్రభుత్వం కూడా భారతీయమని.. మన సంస్కృతీ చచ్చుబండని.. మనకి యెంతో సపోర్టు చేస్తుంది! రాయితీలు యిస్తుంది! మనకి అవార్డులు యిచ్చినా యివ్వొచ్చు! వాళ్ళకి హెల్తూ.. మనకి వెల్తూ!

అలాగే పోలీసులు కేసులు పెడితే.. నాన్ బెయిలబుల్ కేసులు పెడితే.. యెలా బయటకు రావాలో.. బెయిల్లూ జెయిల్లూ యెలా దాటాలో.. యెలా లాయర్లని పెట్టుకోవాలో.. కింది కోర్టులో వీగితే పై కోర్టుకు యెలా పోవాలో.. లా యేమిటో.. సెక్షన్లు యేమిటో.. ఫనిష్మెంట్లు యేమిటో.. ప్రాధమిక హక్కులు యేమిటో.. సివిలేదో.. క్రిమినల్ యేదో.. ద్రోహానికి దేశ ద్రోహానికి వున్న తేడా యేమిటో.. దేశ ద్రోహిగా యెప్పుడు యెవరు ముద్ర వేస్తారో.. తెలీదు! అంచేత విద్యార్థులు వాళ్ళని వాళ్ళు కాపాడుకొనే లా’ని.. అవేర్నెస్ ని అందివ్వాలి! అవన్నీ మనం యిస్తాం! అదే స్పేస్!

యింకా స్టూడెంట్స్ కు రావలసిన స్కాలర్ షిప్పులని ఆపితే.. స్టయిఫండులని ఆపితే.. యెలా అప్పు చెయ్యాలో.. అప్పు  చేసుకు పప్పుకూడు వొండి యెలా బతకాలో.. మనం తర్ఫీదు యిస్తాం!

అన్నీ యూనివర్సిటీలో చదివే పెద్ద వాళ్ళకే అనుకోవద్దు! ఆ మాటకొస్తే యల్కేజీ నుండి పిల్లలు పుస్తకాల బస్తాలూ బరువులూ మొయ్యడంలోనూ మనం తర్ఫీదు యిద్దాం!

అన్నీ వేదాల్లో వుండొచ్చు! కాని అన్నీ పాఠాల్లో వుండవ్! వున్నా బోధ పడవ్! కొత్త సందర్భాలకి కొత్త స్కిల్స్ తాలూకా అవసరం యెంతో వుంది! వుంటుంది! ఈ స్పేస్ ని మనం ఫుల్ ఫిల్ చేద్దాం! బిజినెస్ గా చూద్దాం!

బిజినెస్ మెన్ మొదట నమ్మేది థాట్ ని! థాట్ కింగ్ లా ప్రవోకింగ్ లా వుండి కాన్ఫిడెన్సుని యివ్వాలి! ఆ పై సొసైటి అందుకు అనుకూలంగా వుండాలి! పదునుగా యెలా వుండాలో యిప్పుడు అచ్చం అలానే వుంది!

యిది పక్కా బిజినెస్ ప్లాన్! పక్కవాళ్ళకి చెప్పకండి! చర్చించకండి! మాట జారితే మార్కెట్ జారుతుంది! కాచుకొని వున్న కార్పోరేట్ శక్తులు యీ స్పేస్ లోకి కూడా వచ్చేస్తాయని నా సిక్స్త్ సెన్సు చెబుతోంది!

ఇప్పటికైనా నా తెలివిని నమ్మి మీ అమ్మాయిని నాకు యిస్తారని నమ్ముతున్నాను! రేపటి యీ కోటీశ్వరున్ని యివాలే దీవించండి! కోటీశ్వరులు కండి! ఆలసించిన ఆశా భంగము.. తక్షణం నన్నూ నా ఐడియాని మీదిగా చేసుకోండి!

ఆల్ ది బెస్ట్.. మై పార్టనర్స్ ..

ఆలోచించండి.. ఆచరించండి.. ఆనందించండి!

అభిమానంతో-

మీ

అల్లుడు!

సినిమా తీయిస్త మావా..!

 

 

                                                       -బమ్మిడి జగదీశ్వరరావు

వుడ్ బీ ప్రొడ్యూసర్ కి!

ఒరే మావా..

వుడ్ బీ అంటే కాబోయే అని మాత్రమే అనుకోనేవు! వుడ్ అంటే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లాగే.. ‘వుడ్’ అంటే చెక్క.. అలాగే ‘బీ’ ఫర్ భజన! టోటల్లీ చెక్క భజన! చెక్క భజన చేస్తూనే వుండాలి.. జీవితాంతమూ.. తల్లివి నీవే-తండ్రివి నీవే- చల్లగ మము కరుణించే దైవము నీవే- అని కీర్తించాలి.. నీ అంతటోడు లేడు.. నువ్వు హీరో కావడం మా పూర్వజన్మ సుకృతం.. బాబుగారు సహకరించడం వల్లే సినిమా పూర్తయింది.. బాబుగారు డేట్స్ యివ్వడం వల్లే జన్మ ధన్యమయ్యింది.. బాబుగారి సలహాల వల్లే సినిమా (ఫట్టయినా) హిట్టయింది.. ఆబాబుకు వంశముంటే ఆ వంశాన్ని కూడా అని నిత్యమూ నిరంతరమూ సోపెయ్యాలి! టిష్యూ పేపరు అవసరం లేకుండా సాంతం నాకెయ్యాలి.. యిదే మొదటి సక్సెస్ మంత్రం! యిదే గాయత్రీ మంత్రం!

ఓం ప్రధమం సినిమాకి కావలసింది కథ కాదు! పేకేజీ కావాలి! విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పేకేజీ యెంత అవసరమో- అంతకన్నా యెక్కువ అవసరమీ పేకేజీ! వొక హీరో.. వొకరో యిద్దరో ముగ్గురో నలుగురో బొంబాయి హీరోయిన్లూ.. హిందీ విలన్లూ.. మార్కెట్లో ఆరోజుకి హిట్టు కొట్టిన డైరెక్టరూ.. సాంకేతిక నిపుణులూ.. కామ్బినేషన్లన్నీ కలిపిన దాన్ని పేకేజీ అందురు! కథ లేకపోయినా- అది కథ కాకపోయినా- కథ ఫారిన్లో మొదలవ్వాలి.. ఇంటికి అంటే ఇండియాకి రావాలి! ఫారిన్ లోకేషన్లతోనే రిచ్ నెస్ తేవాలి! హీరోయిన్ల అందాల ఆరబోతే కావాలి! పాటలు అదిరిపోవాలి! ఫైట్లుకు బెదిరిపోవాలి! సంచులకొద్దీ పంచులు వుండాలి! వ్యాంపు సాంగ్ మస్ట్! కామిడీ కంపలసరీ.. సరేసరి!

ఇక సినిమా తియ్యాలంటే మనజేబులో డబ్బులు ఖర్చుపెట్టుట మహానేరము! పక్కవాడి జేబు పరమ వుపయోగమూ పరమపద సోపానమూ! పక్కవాడి జేబునే ఫైనాన్సు అందురు! సినిమా అనిన జూదము! జూదములో మన ఆస్తులు పోగొట్టుకొనుట తెలివి తక్కువతనము! పక్కవాడి ఆస్తులు పెట్టి మనము తాకట్టువుండుట గుడ్డిలో మెల్ల అగును!

మేకింగ్ కాస్టులో మేజర్ బడ్జెట్ అంటే సగం బడ్జెట్ హీరోకూ- మరో సగం డైరెక్టరూ హీరోయిన్లూ మిగతా ఆర్టిస్టులూ పోనూ.. ప్రొడక్షనూ పోస్ట్ ప్రొడక్షనూ పోనూ.. మన ఖర్చులు పోనూ- మన ఖర్చులు అంటే పార్టీలూ స్పాన్సరింగులూ కామన్.. పీఆర్ పెంచుకోవాలి కదా.. మన యింట్లోకి కాలసిన బియ్యమూ పప్పులూ వుప్పులే కాదు, కుర్చీలూ కంప్యూటర్లూ దాక అటు చూపించి యిటు మల్లించుటన్న మాట- చిన్నా చితకా ఆర్టిస్టులకు టెక్నీషియన్లకూ కాస్తంత ఎగ్గొట్టి- పైకి రావాల్సివుంటుంది!

నా అనుభవాలే నీకు చెప్పగలను.. నేను చూసినవి చెప్పగలను.. చాలామంది సినిమా మా ఫేషన్ అని, అందుకే ఈ రంగానికి వచ్చామని చెపుతుంటారు! సినిమావాళ్ళ మాటలు నమ్మొద్దు అనేది ఇక్కడా వర్తిస్తుంది! ఎందుకంటే యెక్కువమంది అమ్మాయిల కోసం వస్తారు! ఎంజోయ్ చెయ్యాలని వస్తారు! డబ్బు వున్నప్పుడు అన్నీ.. యెన్నోకొన్నీ సాధ్యమే! అయితే అందుకోసమే వస్తే వచ్చిన కంటే వేగంగా వెళ్ళిపోవడమూ నిజమే! రియలెస్టేట్ లాంటి వేరే వ్యాపారాలు వున్నవాళ్ళు సీజనల్ గా వస్తారు.. ఇండస్ట్రీకి బాకీ వున్నట్టు డబ్బు చెల్లించేసి వెళ్ళిపోతారు! ఆల్రెడీ యిండస్ట్రీలో వున్నోళ్ళు కొత్తవాళ్ళని ముంచేస్తారు.. మళ్ళీ తేలడం వుండదు.. అలాగే యిన్నాళ్ళు శాటిలైట్ వుండేది.. వూపిరి ఆడేది.. యిప్పుడు అదీలేదు.. పెద్దహీరోల సినిమాలే టీవీల వాళ్ళు కొనడం లేదు! దానికి కూడా వో హిట్టు సినిమాతో కలిపి అంటగడితే కాని అమ్ముడుపోవడం లేదు.. శాటిలైట్ వున్నప్పుడు తెగ చిన్నా చితకా చెత్తా చెదారం సినిమాలు వొచ్చేవి.. పెరుగుట విరుగుట కొరకే అయిపొయింది.. అయినా సినిమాకి జీవితానికి సంబంధం లేదు.. అలాంటప్పుడు సినిమాలు యెందుకు చూస్తారు చెప్పు..? అన్నీ నెగటివ్ పాయింట్స్ చెపుతున్నానుకోకు.. నెగటివ్ పాయింట్స్ అన్నీ ఫ్యూచర్లో నీకు పాజిటివ్ పాయింట్స్ అవుతాయి! అవ్వాలి!

నువ్వు ప్రొడ్యూసర్ కావడం నాకేదో పోటీ అని నేను నీకివన్నీ చెప్పడం లేదు.. అలా అయితే ఫిలింసిటీ వుండి- ఉషాకిరణ్ బేనర్ మీద సినిమాలు తీసిన రామోజీరావు మునిపటిలా సినిమాలు యెందుకు తీయడంలేదు? సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లకి హీరో వుండి స్టూడియో వుండి మునిపటిలా సినిమాలు యెందుకు తీయడంలేదు? రిలయన్సు లాంటి కార్పొరేట్ సంస్థలు వొచ్చినవి వొచ్చినట్టే యెందుకు వెనక్కి వెళ్ళిపోయాయి?

మాతో హిట్టులు కొట్టిన హీరోలే మాకు డేట్లు యివ్వడం లేదు! ఒక్క ఫ్లాప్ కొడితే మనమెలా డైరెక్టర్ ముఖం చూడమో.. మనమొక ప్లాప్ యిస్తే హీరోలూ మన ముఖం చూడరు.. తరువాత చెప్పలేదని నన్ను నిందిస్తే కుదర్దు.. అందుకే అన్నీ ముందే చెప్పేస్తున్నా..

అప్పటికీ తెలుగు సినిమాని కాపాడుకోవడానికి తెలివైన మేధావులమంతా యెప్పటికప్పుడు వొక్కచోట చేరుతూనే వున్నాం! మీటింగులు పెట్టి మాట్లాడుతూనే వున్నాం! ఆ అనుభవాలు కూడా నీకు తెలియజేస్తున్నాను..

ఏడాదికి నూటరవై స్ట్రెయిట్- డబ్బింగో నలభై- మొత్తం రెండువందల సినిమాలు తీస్తే నాలుగు నుండి ఆరు సినిమాలే ఆడుతున్నాయని, మిగతా నూట తొంభైయ్యారు సినిమాల నిర్మాతలు నెత్తిమీద తడిగుడ్డ వేసుకోవాల్సిందేనని చాలామంది నిర్మాతలు వాపోయారు! చిన్న నిర్మాతల చింతయితే యింతా అంతా కాదు!

నిర్మాతల బాధలు పగవాడికి కూడా రాకూడదు గాక రాకూడదు! మొన్న నిర్మాతల సంఘం మీటింగులో పైరసీ అన్నారొకరు. థియేటర్లు దొరకడం లేదు అన్నారింకొకరు. దొరికినా జనం రావడం లేదన్నారు మరొకరు. టీవీలకి జనం బాగా అలవాటు పడిపోయారన్నారు యింకొకరు. మరేం.. సినిమా రిలీజయినప్పుడు చూడకుండా టీవీలో వొచ్చినప్పుడు తెగ చూసేసి రేటింగ్ పెంచేస్తున్నారు అన్నారు వొకరు. అందుకే డైరెక్ట్ గా టీవీల్లో రిలీజ్ చేయండి.. జనం సినిమాలకు రావడం లేదని, థియేటర్లు దొరకడం లేదని ప్రోబ్లమే వుండదని కమలహాసన్ చెప్పలేదా? గుర్తుచేశారు యింకొకరు!

అందుకే వారానికి వొకట్రెండు సినిమాలే రిలీజు చేసి.. మరో సినిమా చూసే అవకాశం లేకుండా.. ఛాన్సు యివ్వకుండా.. అన్ని థియేటర్లలో ఆడించేస్తే జనం చచ్చినట్టు చూస్తారని.. వారంలో రెవెన్యూ గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వొచ్చేస్తుందని ప్లాన్ చేశాం.. అదీ పూర్తిగా వర్క్అవుట్ కాలేదని ఈసురోమంటుంటే- మీ పెద్ద సినిమాలు ఎంచక్కా వారానికి వొకటే.. ఎటొచ్చీ మా చిన్న సినిమాలే వారానికి ఏడు రోజుల్లాగ ఏడు సినిమాలేసి కలక్షన్లు కాదుకదా కనీసం రివ్యూ కూడా రావడం లేదని- పానకంలో పుడకలా చిన్న సినిమాల నిర్మాతలు లబో దిబో మన్నారు! మాది గానుగే పోయింది.. మీదెంత?, గానుగులోది గిద్దెడు- అని పెద్ద నిర్మాతలు పెడబొబ్బలు పెట్టారు!

ఎండలు కదా అని చల్లార్చబోయాడో మేథోనిర్మాత! కుర్రాళ్ళకి పరీక్షలు కాదా చెప్పాడో మేధావి! ఉపశమనం లేకపోగా వుస్సురు మన్నారు మన నిర్మాతలు! ప్రొడక్టివ్ ఖర్చు.. బడ్జెట్ తగ్గించుకుంటే జెట్ లా సినిమాలు దూసుకుపోతాయి అన్నాడు మరో మేథోనిర్మాత! ఆ  మేథావే స్టార్ హీరోకు మార్కెట్ రేటుకన్నా మరో రెండు కోట్లు యెక్కువిచ్చి డేట్స్ సొంతం చేసుకున్నాడు! తెలంగాణ సర్కార్ ఈమధ్య ఐదు ఆటలకు అవకాశం కల్పించినా అదీ వేస్టేనని యేమంత కలిసోచ్చేది కాదని కూడా మా నిర్మాతలు అనుకున్నారు!

అయినా రిస్కున్నప్పుడే కదా గ్రోతు?

ఎవరి అనుభవాలు వాళ్ళవి! నేను బయటకు వస్తుంటే నువ్వు లోపలకు వెళ్తానంటున్నావ్! వెళ్లి రా..! క్షేమంగా వెళ్ళి లాభంగా రా..! సినిమా యిండస్ట్రీ వొక పుష్పక విమానం.. తలుపులు యెప్పుడూ తెరచియే వుండును! నే వెంట్రుకంతే చెప్పాను.. జడంత మడంత నీకు నువ్వు అనుభవమ్మీద తెలుసుకోవలసి వుంటుంది! ఈతకు దిగేవాడికి లోతు గురించి చెప్పకూడదంటారు.. చెప్పి నేను తప్పు చేసానేమో..!?

నీకిదే స్వాగతం.. రా..

నీ

మావ

(ఆల్రెడీ ప్రొడ్యుసర్)

హింసే పరమో ధర్మః

 

                   -బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi ఉదయ భానూ..!

ఉన్నావా..?

కవిత్వంలో మాత్రమే సాధ్యం కదూ.. నిన్ను నీవు పలుకరించు కోవడం.. నిన్ను నీవు పరిచయం చేసుకోవడం.. నిన్ను నువ్వు పరామర్శించు కోవడం.. నీలోకి నువ్వు తొంగి చూసుకోవడం.. నీలోని ప్రపంచాన్నే కాదు, నీ చుట్టూవున్న ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం.. కవిత్వంలో మాత్రమే సాధ్యం కదూ..

కవిత్వం జీవితం కదూ.. జీవితంలో కూడా సాధ్యమే కదూ..

ఏమో.. అందుకేనేమో.. నాకు నేనే వుత్తరం రాసుకోవడం కోవడం చూస్తే భలే చిత్రంగా వుంది! విచిత్రంగానూ వుంది! నిజానికి యెవరికి వుత్తరం రాయాలో తెలీదు! చుట్టూ అందరూ వుండి వొక్కోసారి మనకు మనమే వొంటరి అవుతాం! వొంటరిగ అనిపిస్తాం! రోహిత్ అలాగే వొంటరయ్యాడు! సమూహం నుండి తాత్కాలికంగానైనా వేరవుతాం! వేరు చేయబడతాం! రాజ్యానికా బలం వుంది! బలగం వుంది!

మనసు నిండా రాయాలని వుండి కూడా రాయలేని వేళ్ళు.. నొప్పి పుడుతున్న వేళ్ళు.. కనీసం పెన్ను పట్టలేని వేళ్ళు.. కంప్యూటర్లో బటన్ వొత్తలేని వేళ్ళు.. నా వేళ్లే.. అందమైన అక్షరాలు అనంతంగా రాసిన వేళ్లే.. నా వేళ్లే.. పోలీసుల యినుప బూట్ల కింద నలిగిన వేళ్లే.. నా వేళ్లే.. పోలీసు వేను మెట్ల మీద నలిగిన నల్లని నా వేళ్లే.. నావి కాకుండా.. నా స్వాధీనంలో లేకుండా..

వేళ్లేనా నొప్పి పడుతున్నది.. ఈ దేహంమొత్తం ఈ దేశంమొత్తంలానే నొప్పి పడుతున్నది.. కాళ్ళు యిద్దరు.. చేతులు యిద్దరు.. పట్టుకున్నారు.. వొకడు.. ఆరున్నర అడుగుల దేహమున్న వాడొకడు.. దున్నపోతులా వున్నాడు.. గుండెలమీద.. పొట్ట మీద.. తొడల మీద.. పిచ్చి పట్టినట్టు గెంతుతున్నాడు.. శరీరాన్ని మట్టి ముద్దను చేసి కుమ్ముతున్నాడు.. వాడూ మనిషే.. వాడిలోని మృగమేదో.. రంకేలేస్తోంది.. దుంకులు దుంకుతోంది..

కళ్ళు మూసినా తెరచినా వాడి ముఖమే! ఆ మృగం ముఖమే! వాడి స్వరమే! ‘లంజా కొడకా.. లంజా కొడకా..’ నా చెవుల్లో యిప్పుడు కూడా ప్రతిధ్వనిస్తోంది!

‘అసలేం జరిగింది?’ యెవరికి వారే అడుగుతున్నారు! ఏం జరుగుతుంది? సెలవుమీద వెళ్ళిన వీసీ పొదిలి అప్పారావు యూనివర్సిటీకి మళ్ళీ వచ్చాడు! తన రాకను పండగ చేసుకొమ్మని రహస్యంగా సర్క్యులర్లు పంపాడు! మెయిల్స్ చేసాడు! రహస్యమెప్పుడూ బహిరంగమని ఆయనకు తెలుసు! రహస్యమే రాజ్యమేలుతుందనీ తెలుసు! రహస్యమే అద్భుతంగా ప్రచారం అవుతుందనీ తెలుసు! తెలిసిందే చేశాడు! తెలిసే చేశాడు! వేడుకగా తనని ఆహ్వానించమని టైంటేబుల్ని తనే యిచ్చాడు! తన అనుయాయులకు కార్యక్రమం తనే రాసిచ్చాడు! తనకు యెలా గ్రీటింగ్స్ తెలపాలో కూడా రాసిచ్చాడు! తనడబ్బా తనే కొట్టుకున్నాడు! టైం టు టైం జరిగే ప్రోగ్రాంషీట్ జిరాక్స్ కాపీలను విద్యార్థులలోకి వెళ్ళేలా చూసాడు! రెచ్చగొట్టాడు! మీరు నా వెంట్రుక పీకలేరని పరోక్షంగా అనిపించేలా ప్రత్యక్షంగానే అల్టిమేటం యిచ్చాడు!

విద్యార్థులు తనని అడ్డుకోవడానికి వస్తారని తెలుసు! విద్యార్థుల మిలిటెన్సీ తెలుసు! తను సేఫ్ గా వుండాలంటే యేo చెయ్యాలో కూడా తెలుసు! మీడియాని తిప్పుకోవడం తెలుసు! కొందరయినా తిరగరని తెలుసు! అందుకే తన అనుయాయులైన సంఘం విద్యార్ధులతో ఫర్నిచర్, అద్దాలు, టీవీలు ధ్వంసం చేయించాడు! కోపంతో వున్న విద్యార్ధులు వొచ్చి జత కలిసారు! అసలు పని చేసిన వాళ్ళు పక్కకు తప్పుకున్నారు! స్క్రీన్ మీదకొచ్చి వీడియోలకూ ఫోటోలకూ చిక్క వలసిన వాళ్ళే చిక్కారు! స్క్రిప్ట్ ప్రకారమే షూట్! దిగవలసిన సమయానికే పోలీసులు దిగారు! పోలీసులంటే క్యాంపస్ పోలీసులు కారు.. తెలంగాణ పోలీసులే!

పోలీసులు మొదట నెమ్మదిగా వొక్కొక్కర్నీ లాక్కు వెళ్ళారు! తరువాత వేగం పెంచారు! వందలమంది పోలీసులు! ఈడ్చి పడేశారు! రాకుండా లొంగకుండా పెనుగులాడుతూ వున్న వాళ్ళని డొక్కలోతన్నారు! విద్యార్ధులు మెలితిరుగుతూనే నినాదాలిచ్చారు! అంతే అమ్మాయిలని చూడకుండా చెంపలు చెల్లుమనిపించారు! బూతులు తిట్టారు! ‘రేప్ అయిపోతారే లంజముండల్లారా’ అని హెచ్చరించారు! అబ్బాయిలకయితే రెండుకాళ్ళ మధ్య యెక్కడ తంతే గింజుకుంటామో అక్కడ తన్నారు! తరిమి కొట్టారు! దొరికిన వాళ్ళని దొరికినట్టు చితక్కొట్టారు! విద్యార్థులు ఆవేశం పట్టలేక రాళ్ళు రువ్వారు! పోలీసులూ రాళ్ళు రువ్వారు! చెట్టుకొకర్నీ పుట్టకొకర్నీ చేశారు! చీమలపుట్టని కదిపినట్టు కదిపారు! ఒక్కొక్కర్నీ చేసి కొట్టారు! వందలమందిని యెత్తుకెళ్ళారు! ఎక్కడకు తీసుకు వెళుతున్నారో తెలీదు! ఏం చేస్తున్నారో తెలీదు! అప్పటికి నేను హ్యుమానిటీస్ బిల్డింగ్ దగ్గర వున్నాను! నీళ్ళు తాగి వచ్చాను! పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టాను! తప్పించుకున్నాను!

ఇరవై ఆరుగురు విద్యార్థులు అరెస్టు! ఇద్దరు ఫేకల్టీలు అరెస్టు! మొత్తం యిరవై యెనిమిది మంది అరెస్టు! చర్లపల్లి జైల్లో పెట్టారు! ఇరవై యిద్దరు అబస్కాండు.. అని చూపించారు!

వీసీ వొస్తున్నాడనగా నెట్ బంద్! వొచ్చాక ఆవాళ మధ్యాన్నం నుండే మెస్సులు బంద్! మంచినీళ్ళు బంద్! కరెంటు బంద్! నాన్ టీచింగ్ స్టాఫ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకొన్నాడు! తను తెర వెనక వున్నాడు! తెర ముందు లొల్లి విద్యార్థులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కూ! అదే అదునుగా ప్రచారం చేశాడు! చివరకు షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల్ని సయితం మూయించాడు! పోనీ యూనివర్సిటీ బయటి నుండి ఫుడ్ లోపలకు తెచ్చుకుందామంటే లేదు! సరే యూనివర్సిటీ బయటకు పోదామంటే లేదు! గేట్లు మూయించేశాడు! పిల్లిని తలుపుమూసి కొట్టినట్టుగా పిల్లల్ని కొట్టించాడు! పిల్లి తిరగబడదా? పిల్లలు తిరగబడరా? తిరగబడితే తప్పవుతుంది! నేరమవుతుంది! నేరం చేసి వాళ్ళకో అవకాశం యివ్వకూడదు అని అనుకున్నాం!

అప్పుడు కూడా ఆ సమయంలో కూడా తెలంగాణ వుద్యమమే మాకు ప్రేరణ! వంటా వార్పుకు దిగాం! మూడు రాళ్ళు తెచ్చి పొయ్యి పెట్టాం! రాళ్ళ మధ్యన వంటేమిటి? క్యాంపస్ రోడ్లమీద అనుకున్నాం! అలా అయితే మా ఆకలి లోకానికి తెలుస్తుందని అనుకున్నాం! అన్నం దొరికే మార్గం అదొక్కటే అనుకున్నాం! రోడ్డు మీద మూడు రాళ్ళ పొయ్యి.. కర్రా కంపా యేరి తెచ్చుకున్నాం! వంట చేసుకుంటున్నాం! నా తోటి వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు! యిది చరిత్రలో వొక రోజు అనుకున్నాం! ఎందుకంటే తెలంగాణ ప్రేరణగా వంటా వార్పే కాదు, తెలంగాణ వుద్యమం నా యంఫీల్! తెలంగాణ వుద్యమ కవిత్వం మీద నా పీహెచ్డీ! ఏడేళ్ళుగా తెలంగాణ వుద్యమంలో వున్నాను! విరసంలో వున్నాను! ‘జంగ్’ తెలంగాణ వుద్యమ కవిత్వం ప్రచురించాను! ప్రత్యేక తెలంగాణని నాకళ్ళతో చూసాను! నా ఆలోచనల్లో పప్పు వుడికింది! తాళింపుకు పచ్చిమిరపకాయలూ వుల్లిపాయలు కోసి పెట్టుకున్నాం! రుచిగా తిందాం అనుకున్నాం! ఆకలికి యెలా వండినా రుచిగా వుంటుందని నవ్వుకున్నాం!

తెలంగాణ వుద్యమంలో వంటా వార్పూ పబ్లిక్ రోడ్లమీద చేసి నెగ్గినం గాని.. మా ఆకలి తీరడానికి, అదికూడా పబ్లిక్కు సంబంధం లేని రద్దీలేని క్యాంపస్ రోడ్లో చేయడం నేరమయింది! పోలీసులు వచ్చారు! రోడ్లమీద ఆటలేమిటి అన్నారు! ఆటలు కాదు, ఆకలి అన్నాం! ‘మీకు బాగా కొవ్వు పట్టింది.. తియ్యండి.. వంటా వార్పూ లేదు.. లంజ కొడుకుల్లారా..’ లాఠీలతో అందర్నీ వొక వైపుకి తరిమి నన్ను మరో వైపుకి తరిమారు.. షాపింగ్ కాంప్లెక్స్ యెదురుగా వున్న కచ్చా రోడ్డు మీదికి మెడకింద చెయ్యిపెట్టి.. లాక్కెలుతూ వాడే.. మృగంలాంటి ఆ మనిషే.. లాల్ మథర్ గచ్చిబౌలి క్రైమ్ బ్రాంచి ఇన్స్పెక్టర్.. బలంగా వేన్లోకి తోసాడు! వేన్లో పడ్డానో లేదో.. వేన్ విండోస్ మూసేశారు! వేన్ డోర్స్ కూడా! నా గుండెలమీద తొడలమీద తొక్కుతూనే వున్నాడు! సహకరిస్తూ లోపల పోలీసులు! బయట వేన్ చుట్టూ గుంపుగా పోలీసులు! అమాయకంగా యేమీ జరగనట్టు పోలీసులు!

నా మీద వోరల్ చార్జిషీట్.. రోహిత్ పోస్టుమార్టం అప్పుడు వున్నడు వీడే.. డెడ్ బాడీని గుంటూరు వెళ్ళనివ్వకుండా ఆపింది వీడే.. యూనివర్సిటీల అణచివేతలని కుల వివక్షతలని కొట్లాటలల్ల వున్నది వీడే..

మధ్యలో మా యూనివర్సిటీ సేక్యూరిటీ ఆఫీసర్ టీవీ రావ్ వచ్చాడు, విండో తెరిపించి చూసి ‘ఈ లంజ కొడుక్కి బాగా బలుపు సార్.. తొక్కండి సార్ కొడుకును..’ అన్నాడు. మళ్ళీ ఒళ్ళు నెత్తురు యింకిన మట్టి ముద్దయింది!

వాళ్ళ మాటల నుడుమ కుమ్ముతూనే వున్నారు.. ఎడమ చేత్తో జుత్తు పట్టుకు యెత్తి కుడి చేత్తో దవడల మీద గుద్దు మీద గుద్దు గుద్దుతూనే వున్నారు! నన్ను లేపి కూర్చోబెట్టి నా తల స్టడీగా వొకడు పట్టుకుంటే మరొకడు చేతికి మెత్తటి గుడ్డ చుట్టి పిడిగుద్దులు కురిపిస్తూనే వున్నారు.. కనపడని పోలీసు దెబ్బలంటే తెలిసింది.. అంతలోనే మళ్ళీ కింద పడేసి తొక్కాడు.. వొక క్షణం అయితే ఊపిరి ఆగిపోతుందనిపించింది.. చిన్న పిల్లల కాలో చెయ్యో తగిలితేనే గింజుకు పోతామే.. అలాంటి టెస్టికల్స్ మీద బలంగా తన్నాడు! నా ప్రాణం నన్ను వీడి పోయిందా.. తెలీదు.. తలచుకుంటే యిప్పుడు కూడా వొళ్ళు జలదరిస్తోంది..!

‘ప్లీజ్ సార్.. వద్దు సార్.. ఆపరేషనయ్యింది..’ కళ్ళలో నెత్తురు తిరుగుతుంటే అడిగా. ఎక్కడన్నాడు. అబద్దం ఆడుతున్నానని అనుకుంటాడని చూపించా. పోలీసు అని మరిచిపోయా. నిజాయితీగా చెప్పా. వదిలేస్తాడని ఆశ పడ్డా. ఫాంటు విప్పి చూపించా. మల ద్వారం దగ్గర కుట్లు.. సాక్ష్యంగా వేళ్ళాడుతున్న దారాలు.. సరిగ్గా అక్కడే.. గురి తప్పకుండా తన్నాడు! ప్రాణం తెగింది.. విలవిలలాడాను.. పులులకు దొరికిపోయిన లేడి పిల్లనయాను.. నాది గట్టి ప్రాణమే! వున్నాను.. పుండు.. పచ్చి పుండయిపోయాను.. నెత్తురు చుక్క నేల రాలలేదు.. ప్రాణం పొతే యెలావుంటుందో టెస్టికల్స్ మీద తన్నినప్పుడు తెలిసింది! ప్రాణంతో వున్న గుడ్డు పగిలినట్టయింది! ప్రాణం పోయినా బాగున్నని వొక్క క్షణం అనిపించింది!

నా పొట్టలో పేగులు చిరిగే వుండాలి.. పక్కటెముకలు పగిలే వుండాలి.. ఎడమ చెవిలో కర్ణభేరి చిట్లే వుండాలి.. ఎడమ కంటి రెటీనా చిరిగే వుండాలి.. పొత్తికడుపు పొరలు తెగేవుండాలి..

‘చాలు వదిలేయండి’ అన్నాడు ఓ అధికారి. ఇంకో అధికారిణి చెవి దగ్గరకు వచ్చి ‘నిన్ను చంపేస్తాం..’ అని చెప్పింది. ఎందుకో నేను వినడమే తప్ప చూడని జార్జిరెడ్డి ఆ సమయంలో గుర్తుకు వచ్చాడు!

అక్కడికి యెంతోసేపు తెలివి లేదు, తెలివి వొచ్చేసరికి ఆసుపత్రిలో వున్నాను.. ఎవరెవరో వస్తున్నారు.. పోతున్నారు.. సెల్లో రికార్డు చేస్తున్నారు..

మూడ్రోజులకి అన్నిరకాలుగా ఆరోగ్యంగా వున్నానని డిశ్చార్జ్ చేసారు! రిపోర్టులలో నాకు ఆపరేషన్ అయినట్టే లేదు!? యూనివర్సిటీకి వస్తే యెందుకో యేదో నమ్మకమూ తెగువా వచ్చి వంట్లో చేరింది! సత్తువ వొచ్చింది!

ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రెస్ మీట్ పెడితే.. వెళ్ళా, అందరూ కూర్చోమన్న వాళ్ళే.. కూర్చోలేనే! నొప్పి! ‘లెఫ్ట్ చీక్ మీద చిన్న దెబ్బ తప్ప ఉదయ భానుకి దెబ్బలేమీ తగల్లేదు..’ అని పోలీస్ కమీషనర్ చెప్పాడని ఢిల్లీ నుండి వచ్చిన హక్కుల సంఘం ఆమె చెప్పి నవ్వింది!

కళ్ళముందు సాక్ష్యంగా శవంలా తిరుగుతూ నేను..

మూడురోజులుగా భోజనం లేదు! తింటే వాంతి అయిపోతోంది! నీరసంతో ఎన్నాళ్ళు? అడుగుతున్నారు.. తెలీదు.. రోహిత్ గుర్తుకొస్తున్నాడు.. ఓడిపోవడమంటే యేమిటో తెలుస్తోంది.. తెలిసే కొద్దీ రోహిత్ అర్థమవుతున్నాడు! సూసైడ్ చేసుకున్నాడనే రోహిత్ మీద మునుపు వున్న కంప్లైంట్ యిప్పుడు లేదు..

కేసీఆర్ వివక్ష గురించి అసెంబ్లీల మాట్లాడితే నవ్వొచ్చింది! పోలీసుల మీద జాలి చూపించడం చూస్తే.. అరిటాకుతో పోల్చడం చూస్తే జాలేసింది! వీసీని కొట్టి చంపేస్తే.. సియ్యమ్ము పడ్డ బాధ చూస్తే అతని బాదేందో స్పష్టంగానే అర్థమయ్యింది! ‘వీసీని రీకాల్ చేయిస్తా..’ సభకు హామీ యిచ్చి -‘ఎక్సెస్ ఫ్రం ది పోలీస్ వుంటే ఇమ్మీడియట్ ఎంక్వయిరీ చేయిస్తా’నంటున్నాడు. ‘సోషల్ వెబ్ సైట్లలో కావలసినన్ని సాక్షాధారాలు వున్నాయి..’ కళ్ళున్నా చూపులేదు అని మిత్రులు మాట్లాడుకుంటున్నారు!

‘అమ్మ బాధపడిందా..?’ చూడ్డానికి వచ్చిన ఫ్రెండ్ అడిగాడు. అమ్మ గుర్తొచ్చింది! అమ్మ మాటా గుర్తుకు వచ్చింది! ‘కనీసం మీ సెక్యూరిటీ ఆఫీసర్నన్నా కొట్టి రారా యింటికి..’ అమ్మ ఆగ్రహానికి నవ్వుకున్నాను! అమ్మలోని ఆగ్రహం చాలా మంది మాటల్లో చూసాను! రోహిత్ కోసం అందరూ వున్నట్టే.. నాకోసం యెందరో వున్నారు! ఒకరి కోసం వొకరున్నారు! సమూహంలోంచి నన్ను వేరు చేసినా నేను వొంటరి కాననిపిస్తోంది!

నీకు భయం లేదురా భానూ..

నువ్వేరా నేను!

నీ

ఉదయ భాను

 

 

 

మన వాదమూ.. మనువాదమూ..

 

 

   -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi అన్నా.. కేసీఆరన్నా..

యేమి సెప్పినావే.. దిమాక్ కరాబయిపోయిందనుకో! అసెంబ్లీల నీ మాటలు యిన్నం! చాన మంచిగున్నాయ్! మర్సిపోలేకుంటున్నం! సుద్దులూ సామెతలూ ముద్దు ముద్దు మాటలూ మంచిగ ముచ్చట్లూ మస్తుగ సెప్పి నవ్వించెటోనివి! నువ్వు యెంత సీరియస్సుగ సెప్పినావే?! నువ్వు గింత సీరియస్సుగ సెప్పినావంటే.. డవుట్లేదు.. గిది.. గిది సత్యప్రమానకంగా సీరియస్సు  యిషయమే!

నువ్వు వుస్మానియా యూనివర్సిటీల ఎమ్మే తెలుగు సాహిత్యం సదివొచ్చినోనివి! నువ్వు సామాన్యునివా? యెనభై వేల పుస్తకాలు చదివినోనివి! దేశమెట్టుందో యూనివర్సిటీలు యెట్టున్నాయో నీకు గాకపోతే యెవరికి తెలుస్తుంది? నువ్వు గాపోతే యూనివర్సిటీ పోరగాల్లకి యెవలు సెప్పాలే? సెప్పి సెడ్డయిందేమి లేదు! నువ్వు వున్న మాటే సెప్పినావ్!

ఉన్నమాట సెప్తే వూరినాయుడికి కోపమని సెప్పడం మానేస్తామా? మన సంస్కృతేంది? మన సాంప్రదాయమేంది? కతేంది? కార్ఖానా యేoది? గాచారం కాకపోతే యూనివర్సిటీలల్ల యీ లొల్లేంది? హెచ్సియ్యూ జేయెన్యూ వొకటేమిటి.. దేశంలో యూనివర్సిటీలల్ల యీ అగ్గి రాజుకొనుడేంది?

ఈ సమయంల నీ మాటలే యాదికొస్తున్నాయన్నా..

“రోహిత్ వేముల గురించి మాక్కూడా సానుభూతి వుందధ్యక్షా.. కాని ఇష్యూ చెయ్యదలచుకోలేదు మేము.. దాన్నో పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చెయ్యదలచుకోలేదు.. కారణాలు తెలుసుకున్నాం.. తగిన స్టెప్స్ తీసుకున్నాం.. దాన్ని ఖండించినాం.. అటువంటివి జరక్కూడదు.. అటువంటివి యెందుకు జరుగుతున్నాయధ్యక్షా.. దురదృష్టకర సంఘటనలు? ఢిల్లీల జేయెన్యూలో జరిగినా.. ఈడ మన దగ్గిర యిక్కడ సెంట్రల్ యూనివర్సిటీల జరిగినా దురదృష్టకరం.. ఐ హేవ్ కండెమ్ముడిట్.. యిటువంటి వాటికి ఆలవాలంగా మారుతున్నాయ్.. ఫిలాసఫీలూ సిద్ధాంతాలూ గుంచకపోయి యూనివర్సిటీలల్ల పెట్టి లేని జగడాలు పుట్టించి.. బీఫ్ ఫెస్టివల్.. కిస్ ఫెస్టివల్ అట అధ్యక్షా..  భారత దేశంల కిస్ ఫెస్టివల్‌ని వొప్పుకుంటారా అధ్యక్షా.. వొకడు కిస్ ఫెస్టివల్ అంటాడు.. యెన్నో రకాలు పెట్టి యేందేదో చేసి.. వాటన్నిటిని వొక చిత్ర విచిత్ర సంస్థలుగా తయారు చేసినారు.. ఆ పరిస్థితి పోవాలి.. పోవాల్నంటే దాన్ని పరిపాలన చేసేవాళ్ళు.. దానికి వైస్ ఛాన్సులర్ గా వుండే వాళ్ళు.. పటిష్టమైనటువంటి వాళ్ళు రావాలి.. దానికోసం మేము డిలే చేసినాము అధ్యక్షా.. ఐ థింక్ షార్ట్లీ- సెర్చ్ కమిటీవాళ్ళు రిపోర్ట్ యిస్తే అద్భుతంగా..” అని మీరెంత అద్భుతంగా మాట్లాడిన్రు!?

కవితక్క స్థాపించిన తెలంగాణ జాగృతి తరుపున వొకట్రెండు రోజులు కార్యకర్తలు దత్తాత్రేయ యింటిముందు గొడవకు దిగి సప్పుడు సెయ్యకుండా సక్కగున్నరు! మన యంపీ విశ్వేశ్వరరెడ్డి సారయితే రోహిత్ దళితుడే కాదని, ఆ అబ్బాయి చనిపోవడానికి వేరే కారణాలున్నాయని సెప్పాల్సింది సెప్పి సప్పుడు సెయ్యకుండున్నడు! పార్లమెంటుల మరొక యంపీ జితేంద్ర రెడ్డిసారు “దత్తాత్రేయ గురించి కేర్ తీసుకున్నాము, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు యిస్తే మేము వ్యతిరేకించాము” అని మన సపోర్టు ఫుల్లుగ సూపించారు! హెచ్సియ్యూకు అన్ని రాజకీయ పక్షాలు వొచ్చినా  బీజేపీ తోటి మీరు కూడా యెవరూ వెళ్ళకుండా సక్కగ వున్నరు! అలా కేంద్రంతో అందరూ యెంతో మంచిగున్నరు! కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటివి చానా ముఖ్యం! అందరూ కలిసి కేంద్ర రాష్ట్ర సంబంధాల్ని బలోపేతం చేసిండ్రు! రాష్ట్రానికి కావలసినవన్నీ తెచ్చుకోవాలె! అడుక్కు తెచ్చుకోవాలె! మద్దతు యిస్తున్నట్టే వుండాలె! ప్రజల మద్దతు ఆలకి పోకూడదు! ఆంధ్రోళ్ళ చంద్రబాబుతో కేంద్రానికి యెంత కవరు చేసినాగాని చెడింది.. మనం కేంద్రాన్ని మంచిగ మచ్చిక చేసుకోవాలె!

మీరు యిన్నిన్ని పాట్లు పడతాంటే యూనివర్సిటీ పోరాగాండ్లకు తలకి యెక్కుత లేదు! ఎకసెక్కం చేస్తాండ్రు! ‘మీ కేసీఆర్ చెండీ యాగం చేసినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! యాదాద్రికి అన్నన్ని నిధులు యిచ్చినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! మిమ్మల్ని మనువాదులని ముద్రవేస్తాండ్రు! ఆమాటకొస్తే దేశంల నాయకులందరూ మనువాదులేనట! వాళ్ళ ప్రతినిధులేనట! హిందూ మతమే అధికార మతంగా ప్రభుత్వాల అభిమతంగా- రాష్ట్రాల దేశాల మంత్రులందరూ ప్రజా ప్రతినిధులందరూ శంకుస్థాపనలకడ ప్రారంభోత్సవాలకడ వొకటేవిటి అన్నీట్లకడ- వేద మంత్రాలతో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టడం లేదా..?’ అని నిలదీస్తుండ్రు! ‘ఎవరి విశ్వాసాలు ఆలకి వుండవా?’ అని అడిగితే- “మల్ల.. మావిశ్వాసాలు మాకుండవా..?” అని వుల్టా అడుగుతాండ్రు! ‘ఎన్నో విశ్వాసాలకి – భిన్న విశ్వాసాలకి వేదికలు యూనివర్సిటీలు..’ అని మనకి తిరిగి పాఠాలు చెపుతాండ్రు! చెడిపోయిండ్రన్నా.. చదువుకున్న పోరగాండ్లు పూర్తిగా చెడిపోయిండ్రు!

తెలంగాణ పోరాటంల ముందుండి నడిసినారు బాగుంది! ఉద్యమాలు చేసినారు బాగుంది! ప్రాణ త్యాగాలు చేసినారు బాగుంది! ప్రత్రేక రాష్ట్రం సాధించినారు అదీ బాగుంది! అక్కడితో ఆగాలి గదే.. రాష్ట్రం సిద్దించింది రాజకీయాలు వొదిలి చదువుకోవాలి గదా.. మళ్ళీ యీ పోరాటాలు యేoదన్నా? ఇలాగుంటే బంగారు తెలంగాణ అస్తదా?

అన్నా.. కుర్రాళ్ళు ముదిరిన్రు అన్నా! మీరు బ్రాహ్మణ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. క్రిస్టియన్ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. భూమిలేని దళితులకు మూడెకరాల పొలం యిస్తామన్నట్టు.. బీసీలకు పెద్ద పీట వేస్తామన్నట్టు.. ఆదివాసీలకు కొమరంభీం బిల్డింగ్ నిర్మించి ఆదుకుంటామన్నట్టు.. ఆంధ్రా సెట్లర్లకు మేమున్నాం అని భరోసా యిచ్చినట్టు.. అన్ని వర్గాల ప్రజలని యెలా మీరు ప్రతినిధులుగా కలుస్తున్నారో- అచ్చంగ అలాగ మేమూ అన్ని వర్గాల ప్రజల ఆలోచనలకు ఆశయాలకు భావజాలాలకు ప్రతినిధులుగా వుంటారట.. మాట్లాడతారట..!

సమాజంలో వున్నన్ని వర్గాలు – యూనివర్సిటీలల్ల కూడా వుంటాయని – మీ ఫిలాసఫీ సిద్ధాంతమూ మీకున్నట్టే మా ఫిలాసఫీ సిద్ధాంతమూ మాకుంటుందని తెగేసి అంటున్నారన్నా.. ఏమైనా స్టూడెంట్లతో ప్రాబ్లం అన్నా.. ప్రత్యేక తెలంగాణ వరకే విద్యార్థులకు రాజకీయాలతో సంబంధం వుండాలిగాని.. యిదేటన్నా యిది..?

మనం కొద్దిగ జాగర్త పడాలన్నా! బీఫ్ తిన్నారని చంపేస్తే- ఫ్రిజ్ ల బీఫ్ వున్నాదని అనుమానించి చంపేస్తే- తినే తిండి మీద మీ పెత్తనమేంటని అడిగిన్రు! మా తిండి మేం తింటాం అని బీఫ్ ఫెస్టివల్ పెట్టిన్రు! అలజడి సృష్టించిన్రు! కాలికట్ ‘డౌన్ టౌన్’ రెస్టారెంట్ల వొక ప్రేమికుల జంట ముద్దులు పెట్టుకుంటే- రెస్టారెంటు మీద దాడి చేసిన్రని మోరల్ పోలీసింగ్ చేసిన్రని.. మీడియాల మాట్లాడుతూ పోరగాల్లు ముద్దులు పెట్టుకొని గిది మా పోరాటం అన్నరు! దేశంల యూనివర్సిటీలల్ల కిస్సు ఫెస్టివల్ జరిపిన్రు! రచయితల్ని ముగ్గుర్ని వరసగ సంపితే అవార్డులను అందరూ వెనక్కిచ్చినట్టు – పదిమంది పోరగాల్లు యూనివర్సిటీల వుసురు తీసుకుంటే వంద వెయ్యీ కాదు లక్షలమంది కదిలిన్రు! మీకివన్నీ తెలియవని కాదు, జర మనం సైలెంటుగ వుంటే అరిచి ఆల్లే నాలుగు రోజులకి కాకపోయినా నాలుగు నెలలకి అలిసిపోయి బతుకాగంల బడిపోతరు! కాంట్రాక్టు వుద్యోగుల్ని రెగ్యులరైజు చేస్తామంటే మరి మా కొలువులో అని నిన్నే కాదన్నరు. ఛలో అసెంబ్లీ అన్నరు. నువ్వు సేయిన్చాల్సింది సేసినావా లేదా? ఆంధ్ర పోలీసులలెక్క భగ్నం చేయించినవ లేదా? ఇయ్యాల యూనివర్సిటీలోకి కన్నయ్య రాక కన్నా ముందు వీసీ పోదిలి అప్పారావుని మళ్ళా దించితే – నీవంతు పోలీసు ఫోర్సు అందించినవ లేదా? పోలీసుల్ని దింపి అద్బుతంగా లాఠీఛార్జీలూ అరెస్టులూ సేయించి అదుపులోకి తెచ్చినవ లేదా? నువ్వు యేదయినా సెయ్యగలవే అన్నా.. నా ఆవుసు పోసుకొని నువ్వు సల్లగ వుండాల.. మరి నాలుగు కాలాలు మమ్ము పాలించాల..

అన్న.. ఆఖరుగ  వొక్క మాటే! రెడ్డిగార్లు అదికారంల వున్నప్పుడు అందరూ రెడ్డిగార్లదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! కమ్మగ చౌదరీలు అదికారంల వున్నప్పుడు అందరూ కమ్మలదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! మరి మన దొరల రాజ్యం వొచ్చింది! దొరాలకి న్యాయం చెయ్యవానే? మళ్ళీ సియ్యమ్ము సీటు దళితులకే అని యెనకటికి అన్నట్టు అనబాకు! ప్రతిపక్షమే లేకండ అందరొచ్చి మనపార్టీల చేరిండ్రు! ప్రతొక్కనికీ పంచాల గదా? పీటెయ్యాల గదా? అలగని మనోళ్ళకు అన్యాయం చెయ్యకు! మన వర్గమోల్లకు! వర్గమంటే కులమే గదనే! అన్నీ తెలిసినోనివి.. నీకేం సెప్పేది? ప్రేమతోటే సెప్పేది! తప్పులుంటే మన్నించు..!

జిందాబాద్.. జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్..!

అన్నా దండమే!

యిట్లు

మీ

వీరాభిమాని!

 

 

 

 

రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్!

 

-బమ్మిడి జగదీశ్వర రావు 

~

 

bammidi ఒరే తమ్ముడూ..

నాకో సమస్య వచ్చింది! సమస్య అంటే పెద్ద సమస్య కాదనుకో! అలాగని చిన్న సమస్య కూడా కాదు! పోనీ అని వదిలేద్దామన్నా అది నన్ను వదలడం లేదు! ఇలా యెన్నాళ్ళు అవస్థలు పడాలో అర్థం కావడం లేదు! నీకు కాకపొతే యెవరికి చెప్పుకోను చెప్పు? ఎవరికి చెప్పినా యెవరికి వారే అదో సమస్య కాదన్నట్టు చూస్తున్నారు! ఆ సమస్య తమకీ వుందన్నట్టు మాట్లాడుతున్నారు!

నువ్వు నవ్వకు! ఎందుకంటే నేను యేడుస్తుంటే అందరూ నవ్వుతూ వున్నారు! సమస్యను తీర్చలేనప్పుడు పోనీ దానికి అలవాటు పడాలి కదా? అలా పడిపోదామన్నా అవడం లేదు! పైగా నన్ను చూసి యింటా బయిటా అంతా నవ్వుతున్నారు! నువ్వు హైదరాబాదుకూ ముంబాయికీ తిరుగుతుంటావు కదా?, నీకయితే మంచి డాక్టర్లు తెలుస్తారని! యిదిగో.. నీకిలా మెయిల్ పెడుతున్నప్పుడూ అదే.. ఫోన్ రింగయినట్టు.. రింగు కాకుండానే రింగయినట్టు.. యిదే సమస్య!

అదేమిటోరా.. ఫోన్ రింగవుతుంది! వెళ్లి తీస్తే- యే రింగూ లేదూ బొంగూ లేదు! అంతా బ్రాంతి! భ్రమ! మోగకుండా మోగినట్టు! యెవరూ చెయ్యకుండా చేసినట్టు! చచ్చిపోతున్నాననుకో! అంతా భ్రమని బ్రాంతని ఆగిపోతే, ‘మీ నాన్నకీమధ్య చెముడు వొచ్చినట్టు వుంది..’ అని పిల్లలతో అంటోంది మీ వొదిన! ‘ఫోన్ రింగయినా తియ్యరా? మీకొకరు ఫోన్ వొచ్చిందని చెప్పాలా? ఫోన్ కూడా తెచ్చి అందివ్వాలా? మగ పొగరు!’ అని వున్న గొడవలకి తోడు కొత్త గొడవలు! పోనీ అని ఫోను పట్టుకొనివుంటే – ‘వొచ్చిన ఫోను చూడకపోతే రాదా?’ అంటుంది! మాటిమాటికి ఫోన్ చెక్ చెయ్యక తప్పడం లేదు! చేస్తే నాకేదో కొత్త నెంబర్లు కనెక్ట్ అవుతున్నట్టు.. కొత్త ఎఫైర్లు వున్నట్టు అనుమానిస్తోంది మీ వొదిన!

తమ్మూ.. వూళ్ళో మనింట్లో జరిగింది నీకు గుర్తుంది కదా.. రోజూ లాగే ఆరోజూ అమ్మ సీరియల్ చూస్తూ వంట చేస్తోంది కదా.. ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది! మోగుతూనే వుంది! అమ్మ వంట గదిలోంచి అరుస్తోంది.. ‘ఫోన్ యెత్తండ్రా’ అని! మోగిన ఫోన్ ఆగింది! ‘యెవరు చేసారో యేమో.. యీ ముష్టి మంద ఫోను యెత్తరు కదా..’ అమ్మ తిడుతోంది! ఆగిన ఫోన్ మళ్ళీ మోగింది! మోగుతూనే వుంది! ‘యెత్తండ్రా ఫోను..’ అమ్మ అరుస్తోంది! ఫోన్ మోగుతోంది! ఆఖరికి అమ్మే వొచ్చి ‘ఫోను యెత్తరేమర్రా..’ నోట్లో మాట నోట్లోనే వుండిపోయింది! ‘రింగయిందని టీవీ సీరియల్లో ఫోను యెలా యెత్తేది?’ నాన్న మాటలకు అందరం పడిపడి నవ్వలేదూ?..

ఆరోజు అలాగ నవ్వాననే యిలాగ యీరోజు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారా? మెలకువలోనే కాదురా, నిద్రలోనూ ఫోన్ రింగయినట్టే గబుక్కున లేచి కూర్చుంటాను! ఫోను చూస్తాను! అర్ధరాత్రీ ఆపరాత్రీ లేదా అని ఆవిడ అపర కాళీ అయిపోతుంది! నా వాలకం చూసి లేనిపోనివి అన్నీ వూహిస్తోంది! పోయేకాలం వొస్తే.. అన్నీ పాడుబుద్దులే పుడతాయట! మగనాకొడుకులంతా చిత్తకార్తె కుక్కలట! ఇన్నాళ్ళూ నోట్లో వేలు పెడితే కొరకలేని వాణ్నని అనుకుందట! నేను వాళ్ళ మాంగారి వారసత్వం నిలిపేస్తానట! డౌటూ అనుమానమూ రెండూ లేవట! అగ్గి ఫైరయిపోతోంది! అప్పటికీ యెందుకు పెంట అని- ఆవాళ రాత్రి ఫోను మోగితే మోగనీ అని వొదిలేశా! వొకటికి నాలుగు సార్లు రింగవుతూనే వుంది! అప్పటికీ అడిగా! ‘మీ ధ్యాస వల్ల మీకు అలా అనిపిస్తోంది గాని మోగలేదు.. చెయ్యాలనుకుంటే వెళ్లి ఫోను చేసుకోండి.. నేనేమనుకోను..’ అంది మీ వొదిన! తెల్లవారి ఆఫీసులో బాసు యెక్కి తొక్కి నామీద డాన్సు చేసాడు! నాలుగుసార్లు ఫోను చేసినా యెత్తవా? అని! బాధ్యత లేదని!

మా ఫ్రెండ్ కు చెప్పాను! వాడు నాకు టెస్టు పెట్టాడు! నా సెల్ కు రింగిచ్చాడు! రింగయింది అన్నాను! కాసేపు ఆగి యిప్పుడో? అడిగాడు! లేదన్నాను! ప్రాబ్లం లేదన్నాడు! కాసేపటికే రింగు వొచ్చినట్టు అయ్యి కంగారుగా తడుముకున్నాను! చూసి- ‘అర్జెంటుగా రింగ్ టోన్ మార్చు’ అన్నాడు! నా కిష్టమయిన రింగ్ టోన్.. ‘సడిచేయకే గాలి.. సడిచేయబోకే..’ అన్నాను! అలవాటు కూడా పోరపాటే అన్నాడు! గ్రహపాటు అనుకున్నా! మన పెద్దోడు ‘రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్’ పాటని నా సెల్లో రింగ్ టోన్ గా పెట్టాడు! అదిమొదలు మాబాస్ తో అందరితో తిట్లే తిట్లు! నేనెవరి ఫోనూ యెత్తడం లేదని కంప్లైంట్! నిజమే! రింగయినా యెత్తలేదు! యెవరిదో ఫోను మోగుతోంది అని అనుకొనేవాడిని! నాది కాదనుకొనేవాడిని! యెక్కడ ‘సడిచేయకే గాలి..’ అన్నా నేను నా ఫోను యెత్తేవాణ్ని! కొన్నాళ్ళకి గాని రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్ – రింగు టోన్ కు అలవాటు పడలేదు! యిప్పుడు యెక్కడ ‘రింగ రింగా’ అన్నా నాఫోనే రింగయినట్టు వుంటోందిరా! ఒకటి చెప్పనా.. నాకులాగే ఒక్క ఫోను మోగితే పదిమంది తమ సెల్లులు తీసి చూసుకుంటున్నారు తెలుసా? నిజంరా!

ఎప్పటికప్పుడు.. కనీసం మూడు నెలలకి వొకసారి రింగు టోను మార్చుకోవాలని సైక్రియాట్రిస్ట్ చెప్పాడు! నాకు ముచ్చెమటలు పోశాయి! రింగు టోన్ మార్చినపుడల్లా యింట్లో ఆఫీసులో గొడవలే గొడవలు! పిర్యాదులే పిర్యాదులు! అలవాటు పడడానికి అష్ట కష్టాలు! ఆ అలవాటు లోంచి మళ్ళీ బయిట పడడానికి తిప్పలే తిప్పలు! కొత్త టోన్ కు అలవాటు పడడానికి పాట్లే పాట్లు!

ఫోను కొన్నాళ్ళు మానేయమన్నాడు డాక్టరు! ఒక్క రోజు మరిచిపోయి వెళ్తేనే వెలితి! మనసులో మనసుండదు! తలకాయ తీసి యింట్లో వొదిలి వొచ్చినట్టే! నిలవ నియ్యదు! కొంపలు మునిగినట్టుగా వుంటుంది! యింటికొచ్చి ఫోను తీసికెళితే- మీ వొదిన ‘వోడల వర్తకం గాని ఆగిపోతోందా..?’ అని ఆడుకుంటుంది! పగ పెట్టేసుకొని బాతురూములో వున్నా తలుపు కొట్టి మరీ ఫోను తెచ్చి యిచ్చేస్తుంది! అడగకముందే ‘అదెంత అర్జెంటో’ అంటుంది! ఆగక ‘ఆ అన్నయ్య ఫోను చేసినప్పుడు యెత్తేస్తే వొక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాడు.. లేదూ అని మనం చేసామో- సరిగ్గా రొండు గంటలు మాట్లాడుతాడు..’ అంటుంది! రీజనింగులో మా యింటావిడకి వందకి వంద మార్కులు.. నీకు తెలియందా?

మొత్తానికి ఫోను రింగవకుండా అయినట్టు అనిపిస్తుంది! రింగయినాసరే కాదు నా భ్రమ అనిపిస్తుంది! చెప్పుకుంటే చాలా చిన్న సమస్యలా అనిపిస్తుంది! అనుభవిస్తే చాలా పెద్ద సమస్యలా తోస్తుంది! వైబ్రేషన్లో కూడా పెట్టి చూసా.. శరీరమంతా చెవులవడమూ కష్టమేరా..!? సేం టు సేం ప్రాబ్లం..!!

ఏదయితే అదే కానివ్వమని ఫోను వాడడం మానేసా! ‘పోన్లెండి.. రేడియేషన్ బారి నుండి మీరయినా తప్పించుకున్నారు..’ మీ వొదిన మెచ్చుకుంది! ‘వెనకటికి నీలాంటివాడే సిగరెట్లు తాగడంలేదని సంబరపడ్డాడట.. యాక్టివ్ స్మోకర్ వొక సిగరెట్ కాలిస్తే.. పాసీవ్ స్మోకర్ పద్దెనిమిది సిగరెట్లు కాల్చినట్లు.. యింటి చుట్టూ ఆఫీసుల చుట్టూ నీ చుట్టూ టవర్లే టవర్లు పెట్టుకొని.. రేడియేషన్లోనే రేయింబవళ్ళు రొస్టవుతూ రోస్టు అవుతూ.. చాల్లేరా.. ఫోను వాడకపోయినా రేడియేషన్ నిన్ను ఫుల్లుగా వాడుకుంటుంది..’ అని బావగాడి వెర్షన్! ఎవడి వెర్షన్ యెలా వున్నా నేనయితే ఫోను వాడడం మానేసా! జేబులో ఫోను లేదు! లేదని తెలిసినా రింగు వినిపించేది?! లేని ఫోను తడుముకొనే వాణ్ని! అలవాటుగా పక్కవాడి ఫోను రింగయితే నాఫోనే అని నేనే యెత్తేసా! ఇంతకన్నా నా ఫోను నేను యెత్తుకోవడం బెటరనిపించింది! ‘రావుగారూ.. ఫోనేం వాడడం లేదూ?’ అని ప్రతొక్కడూ అడిగేవాడే! నేనొక కథ చెపితే- జనంలో పది రకాలు కాదు, వంద రకాల కథలు వినిపించాయి! నాకే తెలియని నా ఫోను గురించి కథలు కథలుగా విని యింతకన్నా ఫోనుతో యెన్నెన్ని తిప్పలు పడుతూ నయినా ఫోను వాడడమే బెటరున్నర బెటరనిపించింది!

సో.. నేనిప్పుడు ఫోను వాడుతున్నాను! అష్టకష్టాలు పడుతున్నాను! మర్చిపోకు.. నాసమస్యకు పరిష్కారం చూపించే మంచి డాక్టర్ని చూడు! చచ్చి నీ కడుపున పుడతాను!

ఫోను రింగవుతున్నట్టుంది.. వుంటానురా..

ఫోనుతో- సారీ ప్రేమతో-

మీ

అన్నయ్య

న్యూటన్ సరికొత్త సిద్ధాంతం!

-బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ప్రియమైన సైంటిస్టులారా..  సైన్సు యిష్టులారా..!

నన్ను క్షమించండి!

“భూమికి ఆకర్షణ శక్తి కలదు!” అని నేను కనుగొని రాసుకున్న సిద్ధాంతాన్ని భేషరతుగా నేనే ఖండించు చున్నాను! నేను యింతకాలం భూమ్యాకర్షణ శక్తి గురించి మానవాళిని తప్పుదారి పట్టించానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను! సైన్సులో ముగింపులు వుండవని- కొనసాగింపులూ చేర్పులూ యెల్లప్పుడూ వుంటాయని విజ్ఞులైన మీకు గుర్తుచేసుకుంటున్నాను! చేసిన ప్రతిపాదిత తప్పు వొప్పుకొని- చెవులు నులుముకొని- గుంజీలు తీసి మరీ క్షమాపణలు చెప్పడానికి ఈ న్యూటన్ సిద్ధంగా వున్నాడు! నేను రాసింది కొట్టేశాను! చేతికి అందినంత వరకు చెరిపేశాను! చరిత్రని తప్పుదారి పట్టించానని తెగ బాధపడి బెంగపడి దుఃఖపడి యేడ్చాను కూడా!

సత్యం యెప్పుడూ వొకేలా వుండదు! అప్పటి పరిశోధనలకు అతీతమైన ఫలితాలు యిప్పుడు రావడాన్ని నేను గమనించాను! ఇందుకు భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలు తాజా ఉదాహరణలుగా నా ముందు మరోసారి నిలబడ్డాయి! ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రభావాల్ని తోసిపుచ్చలేకపోతున్నాను! తెలివిగల సైంటిస్టుల్లారా తెల్లమొహం వేయకండి! నా ‘న్యూటన్ సిద్ధాంతము’ తప్పే! ముమ్మాటికీ తప్పే!

ఫీల్డ్ రిపోర్టులు పరిశీలించాను! ఆంధ్రప్రదేశ్ లో జనం బతుకుతెరువుకి వూళ్ళు వొదిలి వలస పోతుంటే- కాంగ్రేసూ వైయ్యస్సార్ కాంగ్రేసు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసలు పోవడం గుర్తించాను! తెలుగుదేశానికి యింత ఆకర్షణ శక్తి వుంటే- అదే నిజమైతే- మరి తెలంగాణలో ఆ పార్టీ యెందుకు పూర్తిగా ఖాళీ అయిందో.. యెందుకు రేపోమాపో అధికార తెరాసలో విలీనం కానుందో.. యెందుకు ఆకర్షణ కోల్పోయిందో ఆరా తీసాను! అదే సమయంలో తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి గల ఆకర్షణ శక్తులను యేకకాలంలో పరిశోధించాను!

‘మా నియోజక వర్గాల అభివృద్ధి మాకు ముఖ్యం..’, ‘మాకార్యకర్తల డిమాండు మేరకే మేం పార్టీ మారాం..!’, ‘ రాష్ట్రాన్ని బాగుచేసే సత్తా ముఖ్యమంత్రిగారికే వుంది..!’, ‘ఉన్న పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు..!’, ‘ పార్టీని వీడడం బాధగా వుంది.. కాని తప్పడం లేదు..!’, ‘రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో వుంచుకొని పార్టీ మారాం..!’, ‘మాపార్టీ నుండి చాలా మంది వొచ్చి చేరబోతున్నారు..!’ – అని పైకి చెప్పిన కారణాలూ…

‘మామీద కేసులు పెడుతున్నారు.. పాతకేసుల్ని తిరగదోడుతున్నారు..!’, ‘మాకు వొక్క కాంట్రాక్టు కూడా రానివ్వడంలా..!’, ‘మళ్ళీ అయిదేళ్ళ తరువాత మా పార్టీ అధికారంలోకి వొస్తుందన్న నమ్మకమూ లేదు..!’, ‘అధికారంలో లేకుండా కార్యకర్తలని పెంచి పోషించడం యెలాగ?’, ‘అధికారంలో లేకపోతే మమ్మల్ని జనం కూడా మరిచిపోతారు!’, ‘అధికారం లేకుండా అర నిముషం బతకడం కష్టమండీ..!’ – అని  పైకి చెప్పుకోలేని కారణాలూ…

ఈ ఆకర్షణ అనేది ఆదినుండీ వుందనీ, లోగడ రాజశేఖరమాత్యులవారు తెరాస నందు గల పదహారు మందిలో ఆరుగురిని లాగేసారని – సదరు తెరాస యిప్పుడు అదేపని చేసిందనీ.. ముగ్గురంటే ముగ్గుర్ని యిప్పటికి మిగిల్చిందని – తెరాసని తిట్టిపోసిన తెలుగుదేశం తెరాస అనుసరించిన దారినే స్పూర్తిగా పూర్తిగా అనుసరించిందని – అంచేత జంప్ జిలానీలతో జగన్ జగడమాడుటకు లేనే లేదని – తండ్రిగారు యిచ్చిన అధ్బుతమైన తర్ఫీదు కొడుక్కి ప్రాణసంకటాన్ని తెచ్చిపెట్టిందని – అనుభవాల అపహరణల సోదాహరణల ఫుట్ నోట్సులూ…

అన్ని అధ్యయన అంశాలనూ గమనించాను!

భూమికి ఆకర్షణ శక్తి వున్నప్పటికీ.. అది వొస్తువులకు మాత్రమే పరిమితం! భూమికంటే ఆకర్షించేవి కూడా వున్నాయి! అధికారపార్టీ ఆయస్కాంతము వంటిది! టోర్నడోలు అంత శక్తిమంతమైనది! అధికారంలేని ప్రజాప్రతినిధులు గాలివాటంగా వుండక తప్పదు! మనగలగక తప్పదు! లేదంటే యేటికి యెదురీదడమే! అమ్ముడుపోవుటకు అందుబాటులో వుండడంవల్ల ‘సంతలో పశువులు’గ  యీ ప్రజా ప్రతినిధులని కీర్తిస్తారు! వీరు అన్ని వేళలా అమ్ముడుపోవుటకు అత్యంత అనుకూలముగా వుందురని అర్థమయినది!

ఎన్నికలు ముగిసిన వెంటనే- ప్రతీ ప్రతిపక్షమూ ప్రతీ అధికారపక్షంలో విలీనము చేయుట యెంతో మంచిది! ఉత్తమం కూడానూ! ఆమాటకొస్తే పాలకపార్టీ సభ్యులందరూ వొకే పార్టీ సభ్యులు కానే కారు! అనేకానేక సమీకరణల వల్ల వేరు వేరు పార్టీలలో పోటీ చేయుట యెంత సహజమో.. గెలుపు గుర్రాలన్నీ వొకే చోట చేరడమూ అంతే సహజము! అధునాతన రసాయన సమ్మేళనము! ఆమాటకొస్తే అధికార పార్టీలో చేరకపోతే గెలిచినా వోడినట్లే! వోడినవాళ్ళు రేపటికో మాపటికో గెలవాలన్నా అధికారపార్టీ అండ వుండాల్సిందే!

ఏ విధముగా  చూసినా భూమికి మించిన ఆకర్షణ శక్తి అగుపించు చున్నది!

అధికారపార్టీ ఆకర్షణకు ప్రతిపక్షపార్టీ దూరంగా వుండి బతికి బట్టకట్టుట అసాధ్యము! అందువల్ల పాలక పక్షము ప్రతిపక్షము కలిసివుంటే కలదు సుఖము! పాలకపక్షమునకు ప్రతిపక్షపు తలనొప్పులు వుండవు! ప్రజల తలనొప్పులు ప్రజలు పడుదురు, అవి అత్యంత సహజమైనవి! అలాగే అధికారం వొచ్చునంతవరకూ ప్రతిపక్షములో వుండుట, ప్రతిపక్షమును నడుపుట బహుకష్టము! పాలకపక్షమూ ప్రతిపక్షమూ యేకపక్షమయినచో తిప్పలు, తలనొప్పులు తప్పును! ఎలక్షన్ల సమయంలో మాత్రమే యెవరి పార్టీ వారిది! ఎలక్షన్ల అనంతరం అన్ని పార్టీలు వొక్కటే! అందరి ద్యాసా భాషా ఘోషా వొక్కటే.. ప్రజాసేవ! ప్రజల అభివృద్ధి!

అధికారపార్టీ ఆకర్షించినంతగా భూమి కూడా ఆకర్షించలేదన్న సత్యాన్ని అనేకానేక ఆధారాలతో కనుగొన్నాను! సైన్సు సైన్సుగా వున్నప్పుడు ఫలితాలు వేరు! సైన్సు సోషల్ తో కలిసినప్పుడు వొచ్చే ఫలితాలు వేరు! అంచేత కొన్ని సవరణలు అవసరమని మీకు అర్థమయిందని నాకు అర్థమైనది!

మన్నింపులు కోరుతున్నాను!

యిట్లు

మీ

న్యూటన్

       రన్ రాజా రన్!

 

                                                  -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ఓయ్ హైదరాబాదీ..

నువ్వు అస్కాలో వున్నా బాధలేదు గానీ.. హైదరాబాదులో వున్నావు.. కురుక్షేత్రంలో వున్నట్టే! ఆమాటకొస్తే కురుక్షేత్రం జరిగింది పద్దెనిమిది రోజులే! హైదరాబాదులో వున్నోళ్ళకి నిత్యమూ నిరంతరమూ  కురుక్షేత్ర రణరంగమే! యమగండమే!

ఇక్కడ ‘నా దారి రహదారి’ అని రజనీకాంత్ కూడా అనలేడు! పవన్ కళ్యాణ్ కూడా ట్రెండ్ సెట్ చెయ్యగలడేమో గాని ట్రాఫిక్ సెట్ చెయ్యలేడు!

ఓరే.. నిన్నుగన్న తల్లికి వేయి దండాలు.. ఆ హైదరాబాదు రోడ్లమీద యెప్పుడూ రొండు కాళ్ళు యెడంగా పెట్టి నిలబడకు నాయనా.. నీకాళ్ళ సందున సందు చిక్కిందని ఆటోవాళ్ళు దూరిపోయి వెళ్ళిపోతారు! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

ఫుట్‌పాత్ మీద నడుస్తాను, నాకేంటి? అనుకోకు.. మన వూళ్ళోలాగ కాదు, ఫుట్‌పాత్ మీద టూ వీలర్లు నడుపుతారు! ఏమాటకామాట చెప్పుకోవాలి భలే ఫీట్స్ చేస్తారులే! జెమునాస్టిక్స్ టిక్కెట్టు లేకుండా చూడొచ్చు! వాళ్ళయినా యేo చేస్తారు? రోడ్లు ఖాళీ లేవు! వాళ్ళకి మరో దారిలేదు! టైము అంతకన్నాలేదు! ఫుట్‌పాత్‌ల మీద ఖాళీ యెక్కడుందీ అంటావా? ఉన్నంత వరకూ వున్నమాట చెపుతున్నా! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

రోడ్డు దాటేటప్పుడు వన్ వే కదా అని వొక వైపే చూస్తూ దాటేవు.. ‘చూడు.. వొక వైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు’ అని నందమూరి బాలకృష్ణ చెప్పాడు కదా అని రెండోవైపు చూడకుండా వుండేవు.. ఎట్నుంచి యెవడొస్తాడో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలీదు! అంచేత అటూ యిటూ చూసి వాయువేగంతో రోడ్డు దాటాలి! ఆయువుంటే అవతలికి చేరిపోతావు! లేదంటే నీ పూర్వీకులని చేరిపోతావు!

బస్సు యెక్కడం చేతకావడం లేదని అన్నావు. అదేమీ బ్రహ్మవిద్య కాదు. జనం మధ్యలోకి దూరితే వాళ్ళే నిన్ను బస్సులోకి తోసేస్తారు! దిగాలనుకుంటే కూడా అంతే.. డోరు దగ్గరకు రావడం నీవంతు! మిగతా తంతు మిగతా ప్రయాణీకులు చూసుకుంటారు! కొద్దిగ ఆసుకొని కాసుకోగలిగితే వాళ్ళే తోసేస్తారు! కాకపోతే మధ్యలో సన్నికల్లు తొక్కినట్టు కాళ్ళు తొక్కుతారు! నొప్పి పడకుండా వుండాలంటే పెళ్లి రోజుల్ని తలచుకో! తీయగా అనిపిస్తాది.. తరువాత యింటికెళ్ళి తైలం రాసుకోవచ్చు! కాళ్ళు తొక్కుతున్నావేమి? అని పొరపాటున కూడా అడక్కు నాయినా.. సిటీకి కొత్తనుకుంటారు! అలాగే చెప్పడం మర్చిపోయాను.. సీటు కోసం ఫిల్టీలు పట్టి కుస్తీపట్టులు పట్టకు.. యెంతో అదృష్టముంటే తప్ప అది అందరికీ దొరికేది కాదు! అదేమీ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల సీటు కాదు! నీ నుదిటన రాస్తే దొరుకుతుంది.. లేదంటే లేదు! ఒళ్ళు హూనమైతే రాత్రికి నిద్ర బాగా పడుతుందని సరిపెట్టుకో!

లేదూ నేనూ మార్గదర్శిలో చేరాను.. అని మోపెడ్ కొనుక్కున్నావనుకో- మోపెడు కష్టాలు.. తడిపి మోపెడు అనుభవాలు! ఇన్సూరెన్సూ ఆర్సీ లైసెన్సూ పొల్యూషనూ అన్నీ వున్నా హెల్మెట్ యేది అంటాడు, వెయ్యి బాత్తాడు! అది నిన్నటి మాట. ఇప్పుడు ఫస్ట్ టైం వంద, సెకండ్ టైం మూడొందలు చలానా ప్లస్ చార్జిషీట్.. ఆపైన వొక్క చాన్సు యిచ్చి జైలు.. వెహికల్ సీజ్.. చాలదని టూవీలర్ వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట గదా? నయం.. రోడ్డుమీద నడిచేవాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టుకోమనలేదు.. అని అనుకోకు! ఔనుమరి.. నడిపేవాళ్ళకీ వెనక కూర్చొనేవాళ్ళకేనా తలలుండేది? నడిచే పాదచారులకి తలలుండవా? తలసరి లెక్కల్లో ప్రతి తలా కౌంటబులే కదా? ఆ లెక్కన హెల్మెట్ కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది.. రావల్సినోళ్ళకి కావలసినంత పర్సెంటేజీ.. యిప్పటికే హెల్మెట్ల షార్టేజీ.. రెట్టింపు ధరలకి కొనాల్సిందే.. కాదంటే ట్రాఫిక్ పోలీసులకి అమ్యామ్యాలు యివ్వాల్సిందే.. దొరికినోళ్ళకి దొరికినట్టు చలానాలు రాయడంలో ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకోవడం మాత్రం అభినందించాల్సిందే! దారుల్లో వాహనదారుల్ని ఆపడం చూసి దోపిడీ దొంగల్ని చూసి హడలిపోయినట్టు హడాలిపోతున్నారట గదా? ఏమైనా నాలుగేళ్ళలో నూటరవై కోట్లు ప్రభుత్వానికి చేరిన ఆదాయమట! జేబుల్లో చేరిన డబ్బుల లెక్కలు ఏ పేపరోళ్ళూ యివ్వలేదు!?

అయినా అన్నిటికీ యిక మీ ఆవిడ్నో పిల్లల్నో బండిమీద తిప్పాల్సిన పనిలేదు. ఇంకో హెల్మెట్ లేదని చెప్పి యెంచక్కా నువ్వొక్కడివే టింగురంగా అంటూ తప్పించుకు తిరగొచ్చు! ఇవన్నీ సరేనని హెల్మెట్ పెట్టుకున్నావే అనుకో జట్కా గుర్రానికి గంతలు కట్టినట్టే, ముందున్నదే కనిపిస్తుంది తప్ప పక్కనున్నదేదీ కనిపించదు! అసలు యాక్సిడెంట్లు అప్పుడే అవుతాయి! జుట్టు రాలిపోయి నెత్తిమీద చంద్రుడు వొస్తే వొచ్చాడు, పక్కనుంచు! హెల్మెట్ పెట్టుకుంటే ముఖానికి రాసుకున్న పౌడర్ చెక్కు చెదరదు గానీ కాళ్ళూ చేతులే మనవి కావనుకోవాల!

అర్రన్నా బుర్రన్నా ఆపలేం.. హైదరాబాదు రోడ్లు అలాంటివి! రోడ్ల మీద యెక్కడ గొయ్యుoటాదో.. యెక్కడ నుయ్యే వుoటాదో నీకు తెలీదు.. నీకు తెలిసిందల్లా నీకు స్పాండిలైటీసా లేకపోతే వెన్నులో పూసలేమైనా రాలిపోయాయో కదిలిపోయాయో తెలుస్తుంది! రోడ్ల దయవల్ల డాక్టర్లకి మరింత ఆదాయం కలిసొస్తోంది! అన్ని సినిమాలు ఒకేలా వుండవు!’ అన్నట్టు రోడ్లన్నీ ఒకేలా వుండవు! పెద్దలున్న రోడ్లు ఒకలా వుంటాయి! తార్రోడ్డులు తల తలా కొత్తగచ్చులా మెరుస్తాయి! వొడ్డించిన వాళ్ళకే వొడ్డించినట్టు.. పోసిన రోడ్లమీదే రోడ్లు పోస్తారు! అయినా జూబ్లీహిల్స్ రోడ్లూ బంజారాహిల్స్ రోడ్లూ వున్నట్టు- కృష్ణానగర్ రోడ్లూ అమీర్ పేట రోడ్లూ యెందుకుంటాయి? రోడ్లకి కూడా వర్గముందని కమ్యూనిస్టులే చెప్పాలా?, మనకి తెలీదా?! రోడ్లు బాగుచెయ్యకుండా హెల్మెట్లతో పాటు బులెట్ ప్రూఫ్ తొడుక్కున్నా సేఫ్ గా నువ్వు యింటికి తిరిగి చేరుతావన్న గ్యారంటీ లేదు! అందుకే దానికి కూడా యిన్సూరెన్స్ సదుపాయముందని సంబరపడి సరిపెట్టుకోవాల!

సరే, లోను పెట్టి కారే కొన్నా.. గంటకు పదమూడు కిలోమీటర్లు కన్నా వేగంగా వెళ్ళమను.. నిన్ను గిన్నీసు బుక్ యెక్కించకపొతే అడుగు? పెట్రోలు పదహారు కాదు, పదకుండు కూడా రాదు! ఆటో యెక్కితే నగర సంకీర్తనమే! రోడ్డు మరమ్మత్తులని మూడు కిలోమీటర్లకి తొమ్మిది కిలోమీటర్లు చుట్టిరావలసిన పరిస్థితి! ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గరే సగం జీవితం సంకనాకిపోయే పరిస్థితి! అయితే వొక్కటి నిజం.. మనం ట్రాఫిక్ లో అలవాటు పడితే యెక్కడాలేని వోపికా సహనమూ సొంతమవుతుంది! దాంతో ఆఫీసులో బాసు తిట్టినా రుషి మాదిరి నీక్కాదని దులిపేసుకొని యెంచక్కా వుండిపోతావు! మీయావిడతో కూడా గొడవలు తగ్గిపోతాయి!

ఈ ట్రాఫిక్ లో పడి ఆఫీసుకు రావడమే పెద్ద డ్యూటీ! విడిగా డ్యూటీ చెయ్యక్కర్లేదు! సీటుల్లో కూర్చొని నిద్రపోవడాన్ని ట్రాఫిక్ని అర్థం చేసుకున్న యెవరన్నా అర్థం చేసుకొనే తీరుతారు!

కిరోసిన్ తో ప్రయోగాత్మకంగా బళ్ళు నడిపే ఆటో సైంటిస్టులూ.. పదకుండో శతాబ్దంనాటి ప్రభుత్వవాహనాలూ.. పగలే నల్ల మేఘాలు వొదిలే వాళ్ళను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు! జలుబూ జ్వరాల్లా కేన్సర్లూ ట్రీట్మెంట్లూ.. కార్పోరేట్ హాస్పిటల్లకి- రెండు చేతులా ఆదాయం వొస్తుందనుకో! ట్రాఫిక్ యిన్‌స్పెక్టర్లు తమ కండిషనేగాని బండి కండిషన్ చూడరు! లంబుగాడికి జంబుగాడు తోడన్నట్టు మెట్రో వర్క్స్.. మున్సిపల్ వర్క్స్.. పోటీపడి పురావస్తు శాఖలోళ్ళు తవ్విపారేసినట్టు తవ్విపారేస్తున్నారు!

దారీతెన్నూ తెలీని అడవిలో వొదిలేసినా హాయిగా యింటికి వొచ్చేయొచ్చు.. కానీ రోడ్లో వొదిలేస్తే యెలా వొస్తావు తమ్మీ? రాలేవు! తుఫాను భాదితుల్ని పట్టించుకుంటారు గాని ట్రాఫిక్ భాదితుల్ని పట్టించుకుంటారా? కోరు! అలవాటు పడకపోతే- ట్రాఫిక్ లోంచి వొచ్చినవాడు టెర్రరిస్టులా వుండక సౌమ్యంగా సున్నితంగా పెళ్ళాం బిడ్డలతో యెలా వుంటాడు? మన ఆడవాళ్లకే కాదు, మనకయినా సంసారం చెయ్యబుద్దవుతుందా? మా ఆయన కాపురం చెయ్యడం లేదని కోర్టుల కెక్కితే జడ్జిగారికి యేo చెప్పేది? విడాకుల కారణాల్లో ట్రాఫిక్ ని కూడా చేర్చాలి!

డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో చెకింగ్ లు యెక్కువయ్యాయి! తాగినందుకే ఖర్చు! మళ్ళీ తాగినడుపుతున్నావని ఫెనాల్టీ! రెండువిధాలా చిక్కే! బొక్కే! అయితే అదో కిక్కే! తాగకుండా ట్రాఫిక్ లో నడపడం ఆషామాషీ కాదు అని యీ ప్రభుత్వాలు యెప్పుడు గుర్తిస్తాయో యేమో? ఓ విషయం చెప్పనా.. యీ రోడ్లకి యీ ట్రాఫిక్‌కి తాగి నడుపుతున్నాడా?, తాగకుండా నడుపుతున్నాడా? తేడా యెవడూ కనిపెట్టలేడు!, బ్రీత్ అనలైజెర్ తో టెస్టు చేస్తే తప్ప! ఇవన్నీ సరే.. టీవీల్లో చూపించడం వల్ల యిలా కూడా కొన్నాళ్ళకి నువ్వు పాపులర్ కాగలవు!

ప్రతిదాన్లోనూ పాజటీవ్ యాటిట్యూడ్ అవసరం! ట్రాఫిక్ ని కూడా పాజిటీవ్ గా చూడడం వల్ల మాత్రమే నువ్వు ట్రాఫిక్ ని అధిగమించగలుగుతావు!

విష్ యూ హ్యాపీ జర్నీ!

మీ

పూర్వ హైదరాబాదీ

అన్నగారూ.. వాటీజ్ దిస్?

   

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

bammidi అన్నగారూ.. అన్యాయం అన్నగారూ.. యిది పూర్తిగా అసందర్భ సందర్భం అన్నగారూ.. యిప్పుడో- యిందాకో- మీరందించిన మీ చేతి చెమట నా అరచేతులకు అంటుకొని యింకా ఆరనే లేదు?! నాపక్కనున్న మీకు నేను మౌనం పాటించడం.. శ్రద్ధాంజలి ఘటించడం.. వర్తమానాన్ని గతం చేస్తూ జ్ఞాపకం చేసుకోవడం దుర్మార్గాలలోకెల్లా దుర్మార్గం కాదూ?

బుక్ రిలీజుల దగ్గరో- బరెల్ గ్రౌండ్ ల దగ్గరో కలుస్తూనే వున్నాం! అన్నగారూ అంటే అన్నగారూ.. అని పలుకరించుకుంటూనే వున్నాం! నా వురుకుల్లో నేను! మీ పరుగుల్లో మీరు! మాట్లాడుకుందామని మళ్ళీ యెప్పటిలాగే వాయిదాపడినప్పుడు వుపశమనంగా గుండెకు గుండె హత్తుకొని ఆలింగనం చేసుకొని పారిపోయేవాళ్ళం! ఈసారి మీరు మహా ప్రస్థానం దగ్గర ఆలింగనం చేసుకోకుండానే ఆగిపోయారు!

క్షమించు బాసూ.. నేనింకా పరిగెత్తుతూనే వున్నాను!

‘ఆగాలని వుంది.. అన్నగారూ.. ఈ రన్నింగ్ యెక్కువ కాలం చెయ్యలేం.. మానెయ్యాలని వుంది.. బయటికి మీలా వచ్చేయాలని వుంది.. ఫ్రీ అయిపోవాలని వుంది..’ తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చెట్ల కింద మీరు చెపుతునే వున్నారు! ‘ఫ్రీ యెక్కడన్నగారూ.. మీరు బందీ అయి- చీకట్లోంచి వెలుతురులోకి రావాలనుకుంటున్నారు! నేనేమో పరిగెత్తీ పరిగెత్తీ వెలుతురెక్కువై లోపలకి వొచ్చి కూర్చోవాలనుకుంటున్నాను. అతి చీకటిలోనూ అతి వెలుతురులోనూ మన చూపు మనకు చిక్కదు!’ చెప్పాలనుకున్నాను. చెప్పలేదు! అన్నీ వాయిదా వేసినట్టు యెవరెవరివో పలుకరింపుల నడుమ ఆడే మాట కూడా వాయిదా వేసాను! అప్పుడూ అందరిలో వున్నా మన ఒంటరి పరుగులు మనం పరిగెత్తుతూనే వున్నాం.. కూర్చున్నా! నిల్చున్నా! నిద్రపోతున్నా!

రన్నింగ్ అన్ ఎండింగ్ కావచ్చు.. ఎండింగ్ అబ్రెప్ట్ గా వుంది! పోయెమ్ అబ్రెప్ట్ గా వుంటేనే వొప్పుకోరే మీరు! అలాంటిది యిది లైఫ్ కదా? ఎందుకిలా?

కారణాలు వెతికారు! తో’రణాలు’ కట్టారు! ‘నౌ అయామ్ వోకే’ అన్నారు! ‘రెడీ టు ఫైట్’ అన్నారు!…

ఆగండి అన్నగారు.. ప్లీజ్.. మీకే గదా మౌనం పాటిస్తా.. యెందుకిలా డిస్టర్బ్ చేస్తారూ.. వొక్క నిమిషం కూడా వొదలరా?

వొదినేడుస్తోంది.. పాపేడుస్తోంది.. వొదల్లేని మిత్రులూ కొలీగులూ యేడుస్తున్నారు.. యేడవడమూ చేతకాని నాలాంటి వాళ్ళు యెడంగా పోయి యేడుపుగొట్టు ముఖాలేసుకు నవ్వుతున్నారు!

చీమూ నెత్తురూ గడ్డకట్టి యెంచక్కా మీడియా నిన్ను షూట్ చేస్తూనే వుంది! డ్యూటీ చేస్తోంది! లైవ్ యిస్తోంది!

”వాళ్ళు నాకు కావాలి! డెడ్ ఆర్ లైవ్!” నే రాస్తున్న సినిమా డై‘లాగు నన్ను తొడుక్కుంటోంది. డెడ్డూ నువ్వే! లైవూ నువ్వే! నేనే నువ్వు.. నువ్వే నేను.. లేనిచో ఈ జగమే లేదూ..’ సాంగు కనెక్ట్ అయింది.. ఆవహిస్తోంది మీ శైలిలా! మీరే కాదు, నన్ను నేనూ డిస్టర్బ్ చేసుకుంటున్నానా..?

ఆత్మకు శాంతి చేకూరిందా? నీవిచ్చిన నీ మరణ వాగ్మూలం రాముడికి అందిందా? పాపికొండలమీద పడి రోదిస్తున్నావా? రెవెన్యూ రికార్డులనుండి తొలగించడం ఆపే పని కాదని- రెవెన్యూ రికార్డులనే తగలబెట్టాలని చూస్తున్న ఆదివాసీ అంతరాత్మలో నీ ఆత్మ ఐక్యమయ్యిందా? అరే రోహిత్ సరే, జేఎన్ యూ మీద అర్టికల్ రాయాలని వుంది కదూ? లవర్స్ డే కి యెప్పటిలాగే భజరంగ్ దళ్ పోలీసింగ్ చేస్తోంది.. పోయెం యేది గురూ?

సీన్ మారింది! స్క్రీన్ మారింది! లొకేషన్ షిఫ్ట్! ఇంటినుండి మీ tv5 ఆఫీసుకి! పరుగులతోనే చేరాను! మధ్యలో ఫోన్లు! నా కథ బాలేదు, మరో కథ బాగు చేద్దామని బయల్దేరి విజయవాడ వెళ్ళా.. స్టోరీ సిటింగ్.. వొచ్చేసా.. చేరిపోయానని చెప్పా! నిజంగా నిన్ను చేరానా? యిప్పటికిప్పుడు చేరేంత దూరమా నువ్వు వెళ్ళింది?

గాఢ నిద్రలో నువ్వు!

వాసాంసి – జీర్ణాని – యథా – విహాయ – నవాని – గృహ్ణాతి – నరః – అపరాణి

తథా – శరీరాణి –  విహాయ – జీర్ణాని – అన్యాని – సంయాతి – నవానీ – దేహీ

అన్నగారూ.. మీ బాడీని పెట్టుకొని భగవత్ గీతేంటి అన్నగారూ? అంత యేడుపులోనూ నవ్వొచ్చింది! చెప్తే వొళ్ళు తిమురనుకుంటారు.. అని ఆగ లేదు, అదే అన్నా.. ‘తను వినడం లేదు కదా అని సరిపెట్టుకో’మన్నారు మన మిత్రులు! పోని.. నా మాట వింటున్నారా?

శ్రీశ్రీ మహాప్రస్థానం మాత్రమే తెలుసు నాకు. ఈ మహాప్రస్థానం కూడా వుంటుందని యెరుక లేదు నాకు. ‘వల్లకాడు’లా వుంది బతుకు అని యికమీదట అనలేను! అంత బాగుంది.. రిచ్ గా! కాని యిక్కడ కూడా మతముంది గురూ.. ఘంటశాలగారు పాడిన గీతలోని పద్యాలన్నీ గోడలమీద చెక్కినవి చదువుకున్నా! మార్క్సిజమే కాదు, మతం కూడా బలమైందేననిపించింది! ‘పెట్టుబడి’ బలం పెరిగింది.. సారీ.. పెట్రేగింది బాసూ? వొగ్గలేదు, ఈ బరేల్ గ్రౌండూ లోకి చొచ్చుకొచ్చింది చూడు! ‘థర్టీ పర్సెంటు గవర్నమెంటూ.. ప్రవేటేమో సెవెంటీ పర్సెంటూ’ కోలాబిరేసను.. మిత్రుల మాట! నోరుండదు కదా.. ‘యిదేటి యిలగుంది?’ అంటే- కథ యెలగుందో బోధపడిపోయింది! వల్లకాల్లకీ వర్గముంటుందని మార్క్సే వొచ్చి చెప్పాలా? పంజాగుట్ట శ్మశానం చూసారు గదా? మన జీవితాలంత యిరుకు! ఇరుకులో సర్దుకోకుండా ఎలక్ట్రిక్ బర్నర్ కి యెడ్జెస్టయిపోయారా? బాడీ అంటే ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ అన్నారే! మూలకాల సమ్మేళనం విద్యుత్తుకాంతిలో కరిగి కలిసిపోయిందా?

ప్రెస్ క్లబ్.. మీరు తిరిగిన చోటే- మీ జ్ఞాపకాలతో తిరుగుతున్నారు! మీ రూటే సపరేటు అంటున్నారు..

నాకు తెలుసు మీరు అందరిలా కాదు! అందరూ వొరుసలో నిల్చుంటే మీరు వొరుస తప్పి పక్కకి వెళ్లి నిల్చుంటారు! నిలబడ్డ చోటునే నిల్చుంటే ‘నిలువ’కు విలువలేదని మీకు తెలుసు! అందుకే నలుగురు నడిచిన దారి నాది కాదని వుద్దేశపూర్వకంగానే తప్పిపోతారు! తగువుపడ్డ వారిని తగుమాత్రం పట్టించుకోరు! మనం నిలబడ్డ చోటు మారితే చూసే దృశ్యం మారుతుందని మీకు తెలుసు! అందుకే మీరు మారుతుంటారు! అందరూ అటు వుంటే మీరు యిటు వుంటారు! అందరూ అమ్మ అంటే మీరు నాన్నంటారు! ఫెమినిజం పెల్లుబుకుతున్న రోజుల్లో మేల్ కొలుపులు పాడతారు! వి(మి)యార్ మేల్ అంటారు! మ్యాగ్జిమమ్ రిస్క్ తీసుకుంటారు! మ్యూజిక్ డైస్ అని మరణ మృదంగం వినిపిస్తారు! సామూహిక బృందగానంలో వుంటూనే మీ స్వరం మీరు వినిపిస్తారు! మీరు అపస్వరంగానైనా వుంటారే తప్ప అస్తిత్వావాన్ని కోల్పోరు!

ఇప్పుడు అందరూ మీ ముఖమ్మీది చిరునవ్వు గురించే మాట్లాడుతున్నారు! నేనేమో పదిహేనేళ్ళ వెనక్కి వెళ్ళా.. పంజాగుట్ట పక్కనున్న దుర్గానగర్‌లో ప్లాట్‌లో మనంపడ్డ పాట్లో? అప్పటికి ఆంధ్రజ్యోతి రీవోపెన్ కాలేదు! నేను ఆగ్రో నుంచి అప్పటికే రిటైర్ అయ్యాను! మానాన్నకన్నా ముందు నేనే రిటైర్ అయ్యానని గొప్పగా చెపితే- గొప్పల వెనక వున్న తిప్పలు తెలిసి- మీరు నడిపిన ‘వాసంతి’ మాస పత్రికలో ‘ఉడుతా ఉడుతా ఊచ్!’ పిల్లల శీర్షిక నాతో నడిపించారు. రెండుచేతులతో పేజీలు నింపే వాళ్ళం! చాలక జోగీబ్రదర్స్ కృష్ణంరాజు డైరెక్ట్ చేసిన ‘మధురం’ సీరియల్ కు స్క్రీన్ ప్లే మీరు, డైలాగులు నేనూ రాసాం! పచ్చామధు కెమెరా. అడవి శ్రీనివాస్ ఎగ్జిక్యుటీవ్ ప్రొడ్యూసర్. బల్లారివాళ్ళు ప్రొడ్యూసర్లు. అంతలోనే- కష్టమన్నగారూ.. అని అన్నీ నాకే అప్పగించారు. అప్పటికి రవిప్రకాష్ గారు జెమునిలో వుండి మన ఆఫీసుకు వొచ్చి కూర్చొనేవారు..

‘మీరు మాట్లాడండీ’ పక్కనున్న మిత్రుడు కదిపితే ఆలోచనలు చెదిరిపోయాయి! తలడ్డంగా వూపాను!

అన్నగారూ.. మీరు ఎడిటర్, సియ్యీవో యేవేవో అయ్యేక- పరిగెత్తినా పట్టుకోలేనంతగా మీ టైం యిరుకైపోతుందని తెలిసి కలిసేవాన్నే కాదు! మీరు నన్ను పట్టుకెళ్ళి హలీం తినిపించి ‘కారు కొనుక్కున్నానన్నగారూ’ అన్నారు! నేను యెప్పుడు హలీం తిన్నా మీరే గుర్తుకువస్తారు! ఎందుకంటే నేను ఫస్ట్ టైం హలీం తిన్నది మీతోనే! అప్పుడు నాముఖం చూసి నచ్చలేదా? అని అడిగారు.  నేను ఔనూ కాదూ అన్నట్టు అన్ని రకాలుగా తలవూపాను! ‘వేడి మీద తినండి బావుంటుంది.. అలవాటైతే వొదలరు’ అన్నారు! నిజమే!

మీరు ఫోన్ చేస్తూ వుండండన్నగారూ.. అన్నారు. అవసరమయినప్పుడే ఫోన్లు చేసాను. ఎవరో వూరినుండి వొచ్చి యిక్కడ సిటీలో యాక్సిడెంటయి పోతే శవాన్ని వూరు పంపించాలని మిత్రుడు సాయమడిగితే నేను మిమ్మల్ని అడిగాను! క్రైం రిపోర్టరుతో ఆ యేరియా రిపోర్టరుకు ఫోన్ చేయించితే- గుద్దిన ట్రక్ కంపెనీ వాడు.. శవాన్ని పెట్టుకు గేట్లో గొడవ చేసినా వినని వాడు.. దిగొచ్చి నష్టపరిహారం యివ్వకపోయినా యిచ్చిన ఆరువేలుతో శవం యింటికి చేరింది. మీ సాయం యిలాగే వేరే వేరే ప్రొబ్లెమ్స్ లో మళ్ళీ మళ్ళీ అడిగా, మీ పరిమితులు చెప్పారు! స్కూళ్ళ మీదా కాలేజీల మీదా సెల్ టవర్లు.. రేడియేషన్ ప్రొబ్లెమ్స్ దృష్టికి తెస్తే.. ‘కష్టం అన్నగారూ.. మాకు యాడ్స్ వొచ్చేది వాళ్లనుండే.. అప్పటికీ స్టోరీ చేసాం.. బట్..’ ఖాళీలను నేనూ పూరించుకున్నా, చాలా ఖాళీలు మిగిలిపోయాయి! యిలాగే మా వూళ్ళో విత్తనాలు అమ్ముకుంటున్న అగ్రికల్చర్ డిపార్టుమెంటు గురించి చెపితే – ‘మా వాళ్ళకీ.. రిపోర్టర్లకీ.. అందుతాయి.. అంచేత..’ యెప్పటిలా ఖాళీలను నేనూ పూరించుకున్నా.. పూరించినకొద్దీ ఖాళీలు! నేను కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్నట్టు మాట్లాడితే – యిదెంత పాత ప్రపంచమో.. రోత ప్రపంచమో చెప్పి మనమెంత చేతకాని వాళ్ళమో చెవి తిప్పకుండా చెప్పి- ‘యింకేంటి అన్నగారూ కబుర్లు?’ మాట మార్చి అసంతృప్తినంతా అక్షరాల్లోకి యెత్తి పొగలు కక్కుతున్న కొత్త పోయెమ్ చేతిలో పెట్టేవారు మీరు.. అప్పుడు మీరు సారీ చెప్పారు. యిప్పుడు నేను సారీ చెపుతున్నా..

ఆగండి అన్నగారూ.. మీకు  ట్రీట్ మెంట్ యిచ్చి మీ ప్రాబ్లం ఫస్ట్ రికగ్నైజ్ చేసిన డాక్టర్ శాస్త్రిగారు మాట్లాడుతున్నారు..

‘అరుణ్ సాగర్.. రికవర్ అయ్యాడు! సర్జరీ అయ్యాక కేర్ గా వుండాలి! తనకా అవకాశం లేదు. విపరీతమైన వొత్తిడి, బహుశా తనున్న ప్రొఫెషన్ వల్ల కావచ్చు! తను జాగ్రత్తగా లేడు, కొంత స్వయంకృతం కూడా వుంది, సో..’ నేను తెగిపోయాను!

అన్నగారూ.. టీవీ ఛానెల్ రేటింగ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడల్లా మీ పల్స్ రేట్ అప్ అండ్ డౌన్ అవడం బాలేదు! తెలుగులో అరవయ్యారు న్యూస్ ఛానెళ్ళు! పార్టీకో ఛానెల్! ఎవడి వెర్షన్ వాడిదే! మధ్యలో టీఆర్పీ పెంట! రోజూ పోటీయే! పూట పూటా పోటీయే! గంట గంటకూ పోటీయే! పోగ్రాము పోగ్రాముకీ పోటీయే! నిమిష నిమిషానికీ పోటీయే! ఎవ్విర్ సెకన్ కౌంటబుల్ యిక్కడ! దీనెమ్మా.. సారీ .. దీనెబ్బా జీవితం! దీనెబ్బా రేటింగ్! దీనెబ్బా టీఆర్పీ! ఛానెల్ వుంటే యెంత? పోతే యెంత? మనం ప్రాణాలతో వుండాలి గదా? మనోళ్ళు మిమ్మల్ని చూసయినా గ్రహించాలిగదా? అన్నగారూ.. ‘నాలాగ చావకండ్రా’ అని మీ మిత్రులకి మీరన్నా చెప్పండన్నగారూ.. దీనెబ్బా కెరీర్? మనల్ని తినేసే కెరీర్ యెందుకన్నగారూ? పులి మీద సవారీ లాగుందే!?

అన్నగారూ.. మీరు పోయిన వార్త- మీరు పనిచేసే ఛానెల్లో మొదట వొచ్చింది! వెంటనే ఓ మిత్రుడు అది చూసి తనూ తను పనిచేసే  ఛానెల్లో బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ చేసాడు! మీ ఛానెల్లో మీ మరణ వార్త అంతలోనే ఆగిపోయింది! ఇక్కడ వీడి గుండె ఆగిపోయింది! న్యూస్ అతి వేగం.. రోడ్డు మీద వాహన అతి వేగం కన్నా ప్ర్రమాదమైనది! వార్త నిజమా? కాదా? వేగంలో స్లిప్ అయితే ప్రమాదం మనకే! వుద్యోగం వుంటుందో పోతుందో? హమ్మయ్యా.. నువ్వు నిజంగానే పోయావ్.. తను బతికిపోయాడు!

ఏమిటిది అన్నగారూ.. మీరు టీవీ ఛానెల్‌లకు లైఫ్ యిచ్చారు! బట్ మీ లైఫ్ వాళ్ళు తీసేసుకున్నారు! చూడండి అన్నగారూ.. మీకు సంతాపం చెప్పేవాళ్ళే.. మీ హత్యలో భాగం పంచుకున్నారు అని నాలాంటివాడు అంటే నేరమవుతుంది! అసహనమవుతుంది! రాజ్య అసహనాన్ని అర్థం చేసుకుంటారు.. ఎటొచ్చీ నా అసహనమే అర్థం కాదు! కానట్టు వుంటారు! మీకుగాక యెవరికి చెప్పుకోను?

బాసూ.. మీరు గొప్పోళ్ళు బాసూ.. మీ వొత్తిడిని ముసుగేసి దాచేసి నవ్వితే- మీ నవ్వు బాగుంది అనుకున్నాం గాని కనిపెట్టలేకపోయాం.. క్షమించు!

ఈ ప్రెస్ క్లబ్ తాగుబోతుల అడ్డా కాదూ? రోజూ తాగి చచ్చేదేగా? ఆఫీసుల్లో బుర్ర పాడుచేసుకొనేది.. యిక్కడికొచ్చి పూటుగా తాగేది! మన కవులూ రచయితలూ తక్కువా? తాగి చచ్చేవాళ్ళే యెక్కువ! అన్నగారూ.. మానేసానన్నారు! మానేయ్యడాన్ని మానేసారా? ‘స్వయంకృతం కొంత’ అని డాక్టరుగారు అన్నారు! మీ మీద కూడా కోపంగా వుంది అన్నగారూ! అన్నగారూ.. యిక నన్నెవరు పిలుస్తారు ‘అన్నగారూ..’ అని?  పొండి అన్నగారూ.. మీతో జట్టు కట్! కట్ పీస్!

నేనింక మీతో మాట్లాడను!

సారీ అన్నగారూ.. ఎక్సుట్రీమ్లీ సారీ..

మీ

అన్నగారు

పర్సనల్ లెటర్ టు…  

                                                                                            -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

కమలనాథులారా! కలవర పడకండి..!

రాముడున్నాడు! రాజ్యమున్నాది! తొమ్మిది తలలు రాలాయి! యిప్పుడు పదో తల! యిది వొక్క హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయపు లెక్క! రాజ్యానికి యెదురు తిరిగితే తలలు తెగక తప్పదు పక్కా! హిందూత్వమే మన హుక్కా! తాగండి గుక్కా గుక్కా!

అయ్యో రామ.. అదరవద్దు.. బెదరవద్దు.. ఈ మాత్రము దానికే రాజ్యాన్ని కోల్పోతామా? రాజ్యం వీరభోజ్యమే కాదు.. రక్తభోజ్యం కూడా! మసీదుని కూలగొట్టినా మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళం.. స్టూడెంట్స్ యెంత? వారి బలమెంత? బలగమెంత? మన సైన్యమెంత? పోలీసులూ.. పారామిలటరీ బలగాలూ.. స్మోక్ ఫైర్లూ.. వాటర్ ఫైర్లూ.. గన్ ఫైర్లూ.. రబ్బర్ బుల్లెట్ ఫైర్లూ.. బార్బుడ్ వైర్లూ.. లాఠీచార్జీలూ.. హౌస్ అరెస్టులూ.. వన్‌ఫార్టీఫోర్ సెక్షన్లూ.. నిబంధనలూ.. నిషేధాజ్నలూ.. అత్యవసర పరిస్థితులూ.. అదుపు చేయుట అదెంత స్వల్ప పని? అల్ప పని? అణచివేతలతోనైనా రాజ్యాన్ని అదుపులో వుంచుకోవాలని మహానుభావుడు మాకీయవెల్లి చెప్పనే చెప్పాడు! అంచేత అదుపే మదుపు! మనశాంతీ మన భద్రతే.. దేశానికి శాంతి భద్రతలని యిచ్చును!

రాజ్యాంగము రాసిన అంబేద్కర్ దివంగతుడు గనుక మనము గౌరవించగలం గాని అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మి‘వున్న’ వాళ్ళను గౌరవించలేము. అటువంటి విద్యార్థులతో ఘర్షణ తప్పదు! ఘర్షణ కూడా అనేకవిధములు! అయితే సిద్ధాంత సంఘర్షణ ప్రజాస్వామికమైనదిగా గుర్తించాలి!

రోహిత్ వేముల ఆత్మహత్య అత్యంత విచారకరమే! కాని.. నిన్న పొతే రేపటికి మూడు రోజులు! మర్నాటికి.. నాలుగు రోజులకి జనం అంతా మర్చిపోతారు! ప్రజల జ్ఞాపకశక్తి మీద నాకు అపార నమ్మకమూ.. అపురూప విస్వాశామూనూ..

చచ్చిన వాడు వొచ్చి సాక్ష్యం చెపుతాడా? చెప్పినా యెవరికి చెప్పాలి? మనకే చెప్పాలి! వేదనలూ నివేదనలూ యెవరికి నివేదించాలి? మనకే నివేదించాలి! ఎంక్వయిరీలు చేసినా రిపోర్టులు యిచ్చినా యెవరికి యివ్వాలి? మనకే యివ్వాలి! ద్వి సభ్య కమిటీలయినా.. ఏక సభ్య కమిటీలయినా.. దాని సమగ్ర పరిశోధనలయినా యెవరికి సమర్పించాలి? మనకే సమర్పించాలి! విచారం వ్యక్తం చేసేదీ మనమే! విచారణ జరిపేదీ మనమే!

గీత యేమి చెప్పింది? ‘చేసేది నేనే.. చేయించేదీ నేనే.. అంతా నేనే!’ అని చెప్పిందా లేదా? నేనుకు బహువచనమే మనం! ఆవిధంగా హత్య చేసేది మనమే! శిక్షలు వేసేదీ మనమే! నేరము చేసేది మనమే! తీర్పులిచ్చేదీ మనమే! అన్యాయము చేసేది మనమే! న్యాయం చెప్పేదీ మనమే! సమస్య సృష్టించేది మనమే! సమస్య పరిష్కరించేదీ మనమే! పనీష్మెంట్ యిచ్చేది మనమే! కాంపన్సేషన్ యిచ్చేదీ మనమే!

మరి మేథావుల మాటంటారా? మనం గుర్తించిన వాళ్ళే మేథావులు! అందరినీ మేథావులుగా గుర్తించవలసిన పని యెంత మాత్రమూ లేదు! మన మేథావులను మనమే తయారు చేసుకొనవలెను! తర్ఫీదు యివ్వవలెను! మనమే సర్టిఫికేట్లు యిచ్చి గుర్తించవలెను! కొంత మందిని లోకం గుర్తిస్తుంది! వారికి కుడి చేతికి యెడమ చేతికి తేడా తెలియదు! అనివార్యమై మేథావులుగా గుర్తించిన వారి గురించి చింతించి ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు! అటువంటివారి చిన్న మెదడు యేనాడో చిదిగిపోయినది! మీడియాకు వారి మెదళ్ళు అనుసంధించబడినవి! వారి సంధింపులూ స్పందనలూ అన్నీ కూడా మీడియా ఆన్ చేస్తే ఆన్ అయి- ఆఫ్ చేస్తే ఆఫ్ అగును! మనము మీడియాను మేనేజు చేసిన చాలును.. నిప్పు కూడా నీరగును! నీరు గూడా ప్రవహింపక గడ్డకట్టును!

అసలు ఆంగ్ల మీడియా ఆగమాగమవబట్టి మన తెలుగు మీడియా తేరిపార వొకసారి చూసింది గాని లేకపోతే యెక్కడ యెలా ప్రవర్తించాలో దానికి మా బాగా తెలుసును!

మీడియాను పెట్టుబడిగా చూడుము. పెట్టుబడిని మార్కెట్ గా చూడుము. మార్కెట్టూ మతమూ వేరు వేరు కావు! వాటికి పేచీ లేదు. సర్దుబాటూ ప్రోత్సాహమూ తప్ప! నిజానికి మతమూ మార్కెట్టూ కవల పిల్లలవంటివి! ఒకదానినొకటి యిబ్బంది పెట్టుకోవు. మార్కెట్ మతాన్ని గౌరవిస్తుంది! మతం మార్కెట్టుని గౌరవిస్తుంది! మనము మతము పట్ల భక్తీ మార్కెట్ పట్ల గౌరవమూ కలిగి వుండాలి!

అందుకనే న్యూ ఎకనామిక్ ఎరలో తొంభైల తర్వాత అన్ని విద్యార్ధి సంఘాలూ తోకలు ముడిచి పారిపోయినవి! మతమూ మార్కెట్టూ కలిసివుండడం వల్ల అన్ని విద్యార్ధి సంఘాలూ దాదాపు అంతరార్ధమైనప్పటికీ ఏబీవీపీ వొక్కటే నిలిచి వెలుగుతోంది.. భారత ఖండం వెలిగినట్టు! ఇంతకు మునుపు మన అగ్రవర్ణ కులాలే మనల్ని యిబ్బంది పెట్టేవారు, విద్యార్థి సంఘాల్లో చేరి. ఎప్పుడైతే కెరియర్ వోరియంటేషన్ పెరిగిందో ఈ రాజకీయాల వైపు చూడడం మానేసి యెంచక్కా అమెరికా వైపు చూడడం మొదలుపెట్టారు! అలా వొచ్చిందే అమీర్ పేట టు అమెరికా థియరీ. సో యిప్పుడు ప్లెయిన్ గా వొపెన్ గా శత్రువు కనిపిస్తున్నాడు. మిలట్రీ థియరీ ప్రకారం పొదలు కొట్టేస్తే శత్రువు విజిబుల్ గా కనిపిస్తాడు.. కనిపిస్తున్నాడు! ఆలయాల్లోకి వొచ్చినట్టుగానే.. అంబేద్కర్ పేరు చెప్పి విశ్వవిద్యాలయాల్లోకి వొచ్చేసారు అలగా జనం. ఈ అలగా జనం తిరగబడతారు.  కాని వాళ్లకి శక్తి చాలదు! నిలబడడానికి నీడ లేదు! వెన్ను లేదు! దన్ను లేదు! సో.. వాళ్ళే యిలా వురిపోసుకుంటారు!

రోహిత్ వురి ఆది కాదు,  అంతమూ కాదు! మన పాలనకు ఆటంకమూ కాదు! అదొక సహజ అనివార్య పరిణామమే, కాని అందులోనూ మన హిందూ మతమ్మీద కుట్ర దాక్కొనివుంది! కుట్రలు వేయి విధములుగా యెటుల పనిచేయు చున్నవో రోహిత్ సంఘటన బయటపెట్టినది! జాగృతిగ మెలగమని మనకొక అవకాశం యిచ్చు చున్నది!

రాముడికే తప్పలేదు కష్టాలు! రామ రాజ్య స్థాపనలో కొన్ని కష్టాలు తప్పవు! నష్టమేమీ లేదు.. వున్నా పూడ్చుకుందాం! ఆపైన రాముడున్నాడు! రాజ్యమున్నాది!

యూనివర్సిటీలు మనకు పట్టు కొమ్మలు. ఆలోచనలకు ఆయువు పట్టులు. పాగా వెయ్యగలిగితేనే ప్రజల్లో వారి ఆలోచనల్లో భాగం కాగలం. భావాలు బహు ముఖ్యమైనవి! హిందూ మనో భావాలు మరీ ముఖ్యమైనవి! ఈ దేశమ్మీద.. దేవుడి మీద మనదే పేటెంటు! మనమే దేశ భక్తులం! ఇంకెవరునూ యెట్టి పరిస్థితుల్లోనూ దేశభక్తులు కాజాలరు గాక కాజాలరు!

ఏబీవీపీ మనది. మన యువతరానిది. మన విద్యార్థి నాయకుడు సుశీల్ మన బీజేవైఎం సభ్యుడైన విష్ణుదత్తు తమ్ముడు.  మన కేడరును మనం కాపాడుకొననిచో దేశాన్ని యెటుల కాపాడుకొనగలము? అందుకు మన ఎమ్మెల్సీ రాంచందర్ రావు పోలీసులకు రిపోర్టు చేసినా- యూనివర్సిటీ క్రమశిక్షణా సంఘం మీద వొత్తిడి తెచ్చినా యూనివర్సిటీలో బలప్రదర్శన చేసినా- కోర్టులకు తెలిపినా- ఫలితం వెంటనే లేకపోయింది. యూనివర్సిటీలో మన విద్యార్థి సంఘం గెలవక అధికారం కోల్పోయింది. ఏయస్ఏ వాళ్ళని అదుపుచేయుటకు తప్పలేదు. పైగా వారు తీవ్రవాదులు. ఉగ్రవాదులు. యాకూబ్ మెమన్‌ని వురి తీస్తే ఖండించారు. మెమన్ కు అనుకూలంగా మాట్లాడారు. అంచేత మన మంత్రి  మన దత్తాత్రేయగారు.. మన మానవ వనరుల మంత్రిత్వ శాఖా మంత్రి స్మృతి ఇరానికి లేఖల మీద లేఖలు దంచినారు. ప్రభుత్వ పనుల్లో అలసత్వము వుంటుంది గనుక ఒకటికి మరి నాలుగు రాయవలసి వొచ్చింది! మన స్మృతి ఇరానిగారు మన హెచ్సియ్యూ వీసీగారికి లేఖల మీద లేఖలు దంచినారు! మన వీసీ పొదిలి అప్పారావుగారు దళిత విద్యార్థుల్ని దబాయించి దంచినారు. వొక్క సెమిస్టరు కాలమే వేటు వేసి రూల్స్ కు అనుగుణంగానే సంఘ బహిష్కారము చేసినారు! తప్పంటూ వుంటే రూల్స్ పెట్టిన బ్రిటీష్ వాళ్ళది తప్పు కాని, ఎప్పటిలాగే అమలు చేసిన వారిది తప్పెలా అవుతుంది?

మన విద్యార్థి నాయకుడు సకాలంలో ఆస్పెట్లైజ్ కావడం బావుంది, మనం ఆరెస్సెస్ వీహెచ్‌పీ బీజేపీలుగా మనం బల ప్రదర్శన జరపడం బావుంది కాని పోలీసు అధికారి ఆనంద్ అందుకు విరుద్ధంగా దాడి జరగలేదనడం బాలేదు. తగు ముందు జాగ్రత్తలు తీసుకొనవలసింది. అయినప్పటికీ మన విద్యార్థి సంఘ మిత్రులు కోర్టులో వేయడం, సోషల్ మీడియాలో వీడియోను సగం రిలీజ్ చేయడం, అలాగే వురిశిక్షల్ని వ్యతిరేకిస్తే- మెమన్ ని సపోర్ట్ చేస్తున్నారని, వొక టెర్రరిస్టు మరణిస్తే వేయిమంది టెర్రరిస్టులు పుట్టుకు వస్తారని బహుబాగా ప్రచారం చేసి ఏయస్ఏ వాళ్ళని డైలమాలో పడేయడం మన విద్యార్థుల విజయంగా గుర్తించి అభినందించవలసి వున్నది!

రోహిత్ మృతదేహంతో బంద్ చెయ్యొచ్చు గాక.. పదమూడు విద్యార్థి సంఘాలు కలిసి జాక్ గా యేర్పడి బాధ్యులని శిక్షించమని డిమాండ్ చెయ్యొచ్చు గాక.. హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. మన పోలీసులు భారీగా మొహరించి బలవంతంగా భగ్నం చేస్తే- మళ్ళీ మళ్ళీ హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. అంతకుమించి యేo చేస్తారు? ఇలానే నాలుగు నెలలు పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్ట్యూట్ విద్యార్థులు గోల చేసి ధర్మరాజు ఈటె పీక్కోగలిగారా? మనం అనుకుంటే గిరీష్కర్నాడ్, ఆదూరి గోపాలక్రిష్ణన్, యూఆర్ అనంతమూర్తి, శ్యామ్ బెనగల్ పక్కన మన మేథావి గజేంద్ర చౌహాన్ని కూర్చోపెట్టగలం.. వాళ్ళు పీట లాగలేరు, పీఠం కదల్చలేరు! మద్రాస్ ఐఐటి డైరెక్టర్ని మర్చిపోయారా? ఢిల్లీ యూనివర్సిటీ మనకాదర్శం! రామ మందిర నిర్మాణానికి అరుంధతీ వాశిష్ట అనుసంధాన పీఠంతో రెండ్రోజుల సదస్సు జరిపారు మన విద్యార్థులు! అప్పుడూ గగ్గోలు పెట్టారు గాని ఆపగలిగారా? ఈ సమయంలో మన బలం గుర్తుచేసుకోవడం మరింత బలాన్ని యిస్తుంది..!

‘నేను రాజీనామా చేయను’ అని వీసి పొదిలి అప్పారావుగారు నిలబడ్డా తప్పని స్థితిలో తప్పించి ఆయనకు అసలు వారసుడు శ్రీవాస్తవని నియమించడంలో అప్పారావుగారిని అభినందించడం కనిపిస్తోంది. అయితే సమస్య తీవ్రత తగ్గించడానికి పెరియసామిని నియమించడాన్ని అర్థం చేసుకోవాలి! అలాగే ‘నేను లెటర్ రాయలేదు’ అని, ‘ఫార్వర్డ్ చేశా’నని, దత్తాత్రేయ మాట్లాడిన సందర్భంలో కాంగ్రేసు హనుమంతరావుగారు కూడా ముందే లెటర్లు రాసిన విషయం తగు సమయంలో బయటపెట్టి ‘యివన్నీ కామను’ అనుకొనేలా చేసిన పార్టీ శ్రేణులకు అభినందనాలు! ప్రతీ పదిహేను రోజులకు లెటర్లు రాయడం పనిలో భాగమని చెప్పి మన స్మృతి ఇరాని పనిమంతురాలని నిరూపించుకున్నారు! ఆమెకు ప్రత్యేక అభినందనాలు! రోహిత్ తల్లితో మాట్లాడడం ఇరానిగారి మాతృత్వపు మానవీయతకు పరాకాష్ట!

దేశంలో అసహనం పెచ్చరిల్లిపోతోంది. శవ రాజకీయాలకు మన ప్రధాని మోడీగారు స్పందించక పొతే కావాలని మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగక వారణాసి లఖ్ నవ్ లో ‘మోడీ ముర్దాబాద్.. మోడీ గోబ్యాక్..’ అని స్నాతకోత్సవాన్ని అడ్డుకున్నారు. సహనశీలి మోడీగారు యెంతో సహనంతో ‘కారణాలు వుండొచ్చు.. రాజకీయాలు వుండొచ్చు.. కాని భారతమాత బిడ్డను కోల్పోయింది.. తల్లి కడుపుకోతను అర్థం చేసుకోగలను..’ అన్నారు! ‘అంబేద్కర్ యెవరి మీదా ఆరోపణలు, పిర్యాదులు చెయ్యలేదు’ అని కూడా దేశానికి గుర్తు చేసారు. అంబేద్కర్‌ని మన మోడీగారు అర్థం చేసుకున్నట్టు మరెవరూ అర్థం చేసుకోలేదు! అంబేడ్కర్‌ని మన మోడీగారు సొంతం చేసుకున్నట్టు మరెవరూ సొంతం చేసుకోలేదు!

సంతాపము తెలిపి సహనం వహించవలసిన యీ సమయంలో యింత అసహనం వహించడం వెనుక రాజకీయ కుట్ర కలదు, ప్రతిపక్ష కాంగ్రేసు వామపక్ష నాయకులందరూ హెచ్సియ్యూ క్యూ కట్టుటలో వింత లేదు, విశేషము లేదు! అలా అయితే మునుపు తొమ్మిది మంది ప్రాణాలు తీసుకున్నప్పుడు యెందుకు రాలేదు? అని తిరిగి ప్రశ్నిచడంలో మనం కృతకృత్యులమయ్యాం! ‘రాహుల్ గో బ్యాక్’ ‘సేవ్ హెచ్సియ్యూ’ నినాదాలతో ప్రతిమండలంలో రాస్తారోకో జరపడం, దిష్టి బొమ్మలు దగ్ధం చెయ్యడం బహు ప్రశంసనీయం! ‘మీ ఎంపీ రాజయ్య దళితుడే, వాళ్ళింట్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాలేదేమి?’ లాజిక్కుల మేజిక్కులు అత్యంత ఆకర్షణీయం! మరోవేపు మన వెంకయ్య, నితిన్ గడ్కరీ, మహేశ్‌శర్మ, వీరేందర్ సింగ్ నోటికి వొచ్చింది మాట్లాడడం మరింత వుత్సాహాన్ని నింపుతున్నది!

దళితుల మీద దాడుల్ని తిప్పి కొట్టాం! ఎందుకంటే రోహిత్ దళితుడు కాదు! బీసీ వడ్డెర కులానికి చెందినవాడని నిరూపించాం! వాళ్ళ తండ్రి మణికుమార్ తో కూడా చెప్పించాం! తండ్రిని కన్న తల్లే చెప్పింది వడ్డెరని! తల్లి తను మాల కులస్తురాలినని చెప్తోంది, చెల్లదు. భర్త యింటి పేరే భార్య తన యింటి పేరుగా మార్చుకుంటుంది భారతీయ స్త్రీ! మరి తన కులాన్ని వొదిలి భర్త కులాన్ని స్వీకరించలేదా? విడిపోతే మాత్రం ఆమె బిడ్డలకి తండ్రి కాకుండా పోతాడా? రోహిత్ కులం గురించి జనంలోకి బాగానే తీసుకెళ్ళాం! భేష్!

రోహిత్ రెండుసార్లు జేఆర్ఎఫ్ పాసు అయ్యి ఫెలోషిప్ తెచ్చుకుంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లే నమ్మలే. ‘పేపర్ అంత యీజీగా వుందా?’ అని అడిగారు. రోహిత్ యిచ్చిన స్వీట్స్ కూడా తీసుకోలేదు. రాంక్ తెచ్చుకొని పీహెచ్డీ జాయినయినా అతను దళితుడను అని అంటున్నాడు కాబట్టి రిజర్వేషన్ మీద జాయిన్ అయ్యాడని జనం కూడా నమ్ముతున్నారు. అంచేత- తిన్నది అరక్క వొళ్ళు కొవ్వెక్కి సూసైడ్ చేసుకున్నాడని- సులువుగానే ప్రజలు అర్థం చేసుకోవడం మనకు కలిసొచ్చే విషయం! ప్రజలు చాలా గొప్పవాళ్ళు! మనం యెలా నేర్పితే అలానే ఆలోచిస్తారు!

అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో గొడవలవల్లే రోహిత్ చనిపోయాడని మన విద్యార్థులు మాట్లాడడం చూస్తుంటే భావి నాయకత్వ పటిమ అపురూపంగానూ అపూర్వంగానూ కనిపిస్తోంది! అలాగే పఠాన్ కోట్ ను ప్రస్తావించడం వల్ల ఏకకాలంలో మన దేశభక్తిని చెప్పడమేకాక మన ప్రత్యర్థుల నోళ్ళు మూయించగలిగాం!

సమయానికి మున్సిపల్ ఎన్నికలు తెరమీదికి రావడం.. ఫలితాలూ పట్టాభిషేకాలూ.. జంపు జిలానీలూ.. తెలంగాణలో తుడుచుపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ.. పిడకలవేటలా తుని బల ప్రదర్శనా.. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షా.. రైలుకు పెట్టిన నిప్పూ.. నీరుగార్చి- పాత వార్తా పచ్చళ్ళు పక్కనపెట్టి – తాజావార్తలకు మీడియా తల తిప్పడంతో ‘రోహిత్ యెవరు?’ అనే పరిస్థితి రాముని దయవల్ల రానున్నది.. అందుకే అన్నది.. రాముడున్నాడు.. రాజ్యమున్నాది..!

విద్యార్థుల సస్పెన్షన్ భేషరతుగా కాకపోయినా కండిషనల్ గా యెత్తేసాం! యెనిమిది లక్షల ఎక్సుగ్రేషియా వద్దన్నా ప్రకటించేసాం! హాయిగా తిరిగి రమ్మని వీసీని సెలవులో పంపేసాం! కేంద్ర మంత్రుల ప్రమేయం లేదని తేల్చి చెప్పేసాం! రేపు ప్రభుత్వం వేసిన కమిటీలతో యివే రిపోర్టులు అధికారికంగా యిప్పించేస్తాం! ఫెలోషిప్ పెండింగ్ తో కలిపి మరీ యిచ్చేద్దాం! పుష్పగుచ్చాలు పంచేద్దాం! పావురాలను పట్టి యెగరేద్దాం! ఓం శాంతి శాంతి హి!

అంతే! ఖేల్ ఖతం! దుకాణం బంద్!

రాముడున్నాడు! రాజ్యమున్నాది!

వీర కమలనాథులకు

ప్రేమతో-

మీ

శూర కమలనాథుడు!

   నీలి రంగు నీడలో… 

 

                                                                              -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ఒరే రోహితూ.. వీలేoట్రా.. నువ్వేదో యిప్పుడే కొత్తగా వురితాడు మెడకేసుకొని వూయలేదో వూగుతున్నట్టు చెపుతున్నారు? నీ మెడలో నా మెడలో మనవాళ్ళందరి మెడలో వురితాడు లేనిదెప్పుడు చెప్పు? నువ్వు మీ అమ్మ కడుపులో పడినప్పుడు నీకు పేగుతాడు పడకముందే వురితాడు పడిందని వీళ్ళకు తెలీదు! పుట్టినప్పుడు బొడ్డుతాడు కోస్తారుగాని మెడలో వురితాడు కొయ్యరని కొయ్యలేరని వీళ్ళకు తెలీదు! తాడు లేకుండా మనకి తనువుండదని కూడా వీళ్ళకు తెలీదు!

ఒరే గుర్తుందిరా.. నువ్వు చిన్నప్పుడు నా మెడలో ఈ తాడేమిటీ అని అడిగేవాడివి! అమ్మ యేమంది? బ్రామ్మర్లకి జంద్యమెలాగో మనకి యీ వురితాడు అలాగ అనేది! మూతికి ముంత – ముడ్డికి తాటాకు కట్టుకోడం కన్నా మెడలో తాడుంటే తప్పు కాదంది! తప్పు చేసినప్పుడు తప్ప దానితో ప్రమాదం లేదంది!

ఏదయినొరే.. నువ్వు తప్పు చేసావురా.. ఆల్లు యిదము అంటే అదే యిదము.. పదము అంటే అదే పదము.. అలా అని వుంటే యిప్పటికి బతికిపోదువు కదరా.. లోకమెలా చచ్చి బతికిపోతోందో చూస్తున్నావు కదరా.. నువ్వెందుకురా బతికి చచ్చిపోదామనుకున్నావ్?

కొత్తేట్రా నీకు.. నువ్వు అద్దంలో చూసుకుంటే మసిబొగ్గు అని నవ్వినోల్లని యేమన్నావ్? నలుపు కూడా వొక రంగే అన్నావ్! నువ్వు చదివితే కలక్టర్ దిగాడండీ అని బడిలో నవ్వినట్టే యూనివర్సిటీలోనూ ఆమాట అనకుండా నవ్వినోల్లని యేమన్నావ్? నానవ్వు నాదన్నావ్! నిజమేరా.. నీ నవ్వు యెవరూ కాపీ కొట్టలేరు! నువ్వు వాళ్ళలాగ నవ్వనందుకు వాళ్ళు యెంతో యేడ్చారు!

నువ్వు ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటే వాళ్ళు నీ పాదాల బురదని చూసారు! నీ నీలిరంగు జుబ్బా వాళ్ళకి నచ్చలేదు! వాళ్ళు కాషాయపు గోచీ కట్టమన్నారు! కట్టనన్నావు! కట్టిందే కట్టడం నాకు నచ్చదన్నావ్! పైగా గోచీ కనపడితే చింపుతానన్నావ్! కాషాయానికి అంటిన రక్తపు మరకలు నీకు నచ్చలేదు! దాని మాంసపు వాసన వొంట్లో తిప్పుతోందన్నావ్! తోడేలుగా మారలేనన్నావ్! వాళ్ళoతా విడిచిన బట్టలే తొడుక్కున్నారు.. వాడిన చెప్పులే వేసుకున్నారు.. వాడేసిన కళ్ళజోడే వాడుతున్నారు.. నాకళ్ళజోడు నాదన్నావ్! మీ కళ్ళజోడుతో చూడనన్నావ్.. చూడలేనన్నావ్! వాళ్ళు తాగి వదిలిన తీర్థమే తాగుతున్నారు.. యెంగిలి తింటూ ప్రసాదమన్నారు.. పెట్టినబొట్టే పెట్టుకున్నారు.. నెత్తికి కాషాయం చుట్టుకున్నారు.. నంది అంటే నంది అన్నారు.. పంది అంటే పంది అన్నారు.. ఆ పాఠాలే ప్రొఫెసర్ల నుండి వీసీ దాక పాడుతుంటే అరిగిన రాగం అందుకోనన్నావ్! ఆ రాగంలో ఆర్తనాదాలు వున్నాయన్నావ్! వాళ్ళ పలుకు పలకలేక పోయావ్!

ఊపిరి సలపడం లేదన్నావ్! ఉరితాడు తడుముకున్నావ్! యూనివర్సిటీలో చేరినరోజు మెడలోని వురితాడు తీసి నాకింక దీనితో పనిలేదని తీసి విసిరి పారేసావ్! వీసీతీసి దాచాడు!

నువ్వేమి తినాలో.. నువ్వేమి తాగాలో.. నువ్వేమి ఆలోచించాలో నీబాగుకోరి చెపుతామంటే కాదనేసావ్! వాళ్లకు నచ్చినట్టు తుమ్మడం రాదన్నావ్.. వాళ్లకు నచ్చినట్టు దగ్గడం రాదన్నావ్.. వాళ్ళలా పోతపోసినట్టు వుండరా అంటే వుండలేనూ రాత మార్చుకుంటానూ అన్నావ్.. నారాత నేనే రాసు కుంటానూ అన్నావ్.. అందరూ ఎద్దుకి మొక్కితే నువ్వు పొద్దుకి మొక్కావ్..

నా అభిమతం నాదన్నావ్.. వాడి మతం కాదన్నావ్.. వెక్కిరించాడు.. నువ్వు యెర్రగా చూస్తే తప్పయిపోయిందని అన్నాడు.. ఈ చేత్తో క్షమాపణ పత్రం రాసిచ్చాడు.. ఆచేత్తో పిటీషనూ యిచ్చాడు.. పోలీసులకి బెదరలేదు.. ఆస్పెటిల్ సాక్షం చెల్లలేదు.. కమిటీ కథ ముగిసింది అంది.. వాడు భయపడ్డాడు.. భంగపడ్డాడు.. వొకపక్క కోర్టుకెక్కాడు.. మరోపక్క కుర్చీకి బావురుమన్నాడు.. మేమంతా మీ వానరసైన్యం అని, యిలా అయితే రామరాజ్యాన్ని నిలబెట్టలేమన్నాడు.. ముగిసిన కథ మళ్ళీ మొదలయి మొదటికొచ్చింది.. కోర్టులు తీర్పివ్వకముందే కొరడాదెబ్బలకి మంత్రిగారి అర్జీల మీద అర్జీలు.. శాంతిభద్రతల సమస్య.. సంఘవిద్రోహుల సమస్య.. తీవ్రవాద సమస్య.. కులోన్మాద సమస్య.. సమస్యల తీవ్రతని గుర్తించిన రాణీగారు ఆదేశాలు.. ఆజ్ఞలు.. వీసీ తలారయ్యాడు.. మూటాముల్లె తీసి పడేసాడు.. నిన్నూ నీ నలుగురు నేస్తాలని బహిష్కరించాడు!

మీరంతా గుంపుగా తిరగకూడదన్నాడు! బహిరంగాప్రదేశాల్లో తిరగకూడదన్నాడు! ఒంటరిగా మీకు మీరే వొక జైలు కావాలన్నాడు! వర్సిటీలో నివాసం వుండరాదన్నాడు! చెట్టుకింద పిట్టలయ్యారు! ఎండనక వాననక పగలనక రాత్రనక వెలిలో చలిలో వున్నారు! ఆగక, ఆందోళన చెయ్యకూడదన్నాడు! ఆకలికి అరవకూడదన్నాడు! యిదే కాప్ తీర్పన్నాడు! అదే సాంఘీక బహిష్కారం అన్నాడు! సరే అని సిద్దమైపోయారు.. మనకి వెలి కొత్త కాదుగా? వూరిలో వెలి! బడిలో వెలి! గుడిలో వెలి! పేరుపెద్ద వూరుదిబ్బ అయిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ నట్ట నడుమన వెలి! వెలి వాడ! మనమున్నచోటల్లా వెలివాడే! చలికీ పులికీ దొరకని వాడు మనలో యెవడు అన్నావ్! నేస్తం జ్వరంతో వుంటే మనము యిలాగే చచ్చిపోవాలా అని బెంగ పడ్డావ్! అమ్మవాళ్ళకి డబ్బులు పంపలేదని బాధపడ్డావ్! ఫెలోషిప్ రాని ఫెలోష్ అయిపోయారు మీరు! ఏడు నెలలు ఎండబెట్టారు! యిప్పుడుమీడియాకి మంచి ఫుటేజి.. గొప్ప రేటింగ్.. యాడ్స్ తో యిన్కం పెరిగింది.. ఒక్క నా కొడుకూ మంచు ముద్దలైనప్పుడు రాలే.. నువ్వు మాంసపు ముద్దవైతే తప్ప! అంత గుట్టుగా అంచెలంచెలుగా చెండుకు తిన్నారని ఆగేవా?

వాడొక బంటు.. వాడొక బానిస.. వాడొక కీ యిస్తే తిరిగే మరబొమ్మ.. కుర్చీకి కాళ్ళోత్తే వాడెవడయినా వాడొక తలారి.. తలారి పనేంటి? తలలు తియ్యడమే! పది తలలు రాలినట్టే పదకుండో తల! వాడి లెక్కలు వాడివి! తల నువ్వు తీసేది యేమిటి? నా తల నేనే తీసుకుంటానన్నావ్! యింత విషమిమ్మన్నావ్! లేదంటే నా వురితాడు నాకివ్వు అన్నావ్! ఎప్పటిలాగే మళ్ళీ మెడలో ఉరితాడు వేసుకున్నావ్.. ఉసురు తీసుకుంటావని అనుకోలేదని నీ నేస్తగాళ్ళు దొంత ప్రసాదు, చెముడుగుంట శేషయ్య, పెద్ద పూడి విజయ్, వేల్పుల సుంకన్న వెక్కి వెక్కి యేడుస్తున్నార్రా.. నువ్వు చుక్కల్లో కలిస్తే చూడరా..

ఉరికి ఉమన్న గది వాడుకున్నానని క్షమాపణలు అడిగావు, చావడానికి చోటుకూడాలేని నీ లోలోపలి ఖాళీతనమేమిటో.. నిన్ను కమ్మేసిన శూన్యమేమిటో బోధపడినట్టు వుమన్న శూన్యంలోకి చూస్తున్నాడు చూడు.. ఏయస్ఏ ని నీ కుటుంబమన్నావ్.. క్షమిస్తారని యెంత నమ్మకంరా నీకు? రోజుకూలి చేసి రోజూ నీకు అన్నం పెట్టి చదివించిన అమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసారని అర్థం చేసుకుంది, కడుపు తీపికి పేగులు తెగేలా యేడుస్తోందిరా.. తమ్ముడూ చెల్లీ నమ్మకమిచ్చే నువ్వు లేక బితుకుబితుకుమంటున్నార్రా..

నువ్వన్నట్టు ‘గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయింది’రా..

‘నన్ను నేను చంపుకోవడానికి యెవరూ బాధ్యులు కారు’ అని భలే మర్యాదలు పాటించావులే! విష సర్పాలకు పాలు పోసినట్టు లేదూ నీ మంచితనం? నీ హత్యకు నువ్వే కారణం అని యెంత అబద్దం ఆడావురా?! నిజం తెలిసిన నేనే కాదు, లోకం మొత్తం నిన్ను క్షమిస్తుంది లే! నిన్ను వురితీసిన చోట నీ స్థూపం రాబోయే తరాలకు చెప్పాల్సిన పాఠమేదో చెపుతుందిలే! సైన్సు రచయితగా నీ రచనలు చదివే అదృష్టం మాకు లేకపోయినా- నీవు నడిచిన తోవ యెరుకనిచ్చి రేపటి చరిత్ర చెద పట్టకుండా కొత్తతరానికి యివ్వాల్సిన ఆయుధమేదో యిస్తుందిలే!

చివరిగా నీవన్న నీ మాటతో గొంతులో గొంతు కలిపి..

జై భీమ్!

నీ

సావాసగాడు

 

సినిమా కథ కాదు!

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi ఒరే బాబూ.. బాబూరావూ..

మీరందరూ నవ్వొచ్చు గాక.. నేనేమి సిగ్గుపడ్డం లేదు.. గర్వంగా ఫీలవుతున్నా..! ఔను, మొన్న రిలీజయిన సిన్మాలో వెంకటేశ్వర స్వామికున్న రెండు చేతులకి వెనకన వున్న రెండు చేతులు నావే! ఈ అవకాశం రావడం వెనుక యెంత కథ వుందో కష్టముందో మీకు తెలీదు! పదేళ్లుగా వున్న ఫ్రెండొకడు ప్రొడక్షన్ మేనేజరు అవబట్టి.. వాడితో స్నేహం నిలుపుకోబట్టి.. వాడికి నాలుగేళ్ళుగా తాగబెట్టి.. వాడికి యివ్వాల్సిన గౌరవము యివ్వబట్టి.. వాడికి చేయాల్సిన సర్వీసు చేయబట్టి.. కొట్టిన గోల్డెన్ ఛాన్సు యిది! ఫస్ట్ టైము తెర మీద భగవంతుడిగా, ..కాకపోయినా భగవంతుడి చేతులుగానైనా కనిపించడం.. మిమ్మల్ని అదే చేతులతో దీవించడం.. మీ నా పూర్వజన్మల పుణ్యమే తప్పితే అలాటప్పా విషయమేమీ కాదు! ఏ బ్యాకప్పూ లేకుండా సినిమాల్లో అవకాశము దొరకడం అంత వీజీ విషయమేమీ కాదు గాక కాదు!

ఇప్పుడు యిక్కడ యింటికి యిరవై మంది హీరోలు వున్నారు! ఈ పరిస్థితుల్లో నువ్వు నిజంగా హీరోవి అయినా హీరోవి కాలేవ్! అంత సీనూ లేదు.. అంత స్క్రీనూ లేదు..! నువ్వూ నేనూ కాదు, కొత్తగా బయటినుండి వొచ్చి సినిమాల్లో చెయ్యమను, చూస్తాను? అరగని తిండీ జరగని మాటలూ యెందుకు గానీ.. భవిష్యత్తులో మనకి జూనియర్ ఆర్టిస్టు వేషాలు కూడా దొరకవు! నిజం.. వొట్టూ.. యింటికి యిరవై మంది పోటీ పడితే జూనియర్ ఆర్టిస్టుల వేషాలు మనదాకా వస్తాయా? నువ్వు యిండస్ట్రీకి రావడం యిష్టం లేక కాదు! నాకేదో పోటీ అయిపోతావనీ కాదు! నీకు పోటీ దారులు యెంతమంది వున్నారో కళ్ళు తెరుచుకు చూడు!

మన టాలీవుడ్లో వున్నదంతా వంశాల చరిత్రే! వారసత్వ సంపదే! నందమూరి వంశంలో- అలనాటి హీరో యన్టీ రామారావు. కొడుకు హరిక్రిష్ణ హీరో. మరో కొడుకు మోహన క్రిష్ణ కెమెరా మెన్.  చిన్న కొడుకు బాలకృష్ణ హీరో. తరువాత తరంలో మనవలూ హీరో హరిక్రిష్ణ కొడుకులూ కళ్యాణ్ రామ్, జూనియర్ యన్టీఆరూ.. మోహన క్రిష్ణ కొడుకు తారక రత్న అందరూ హీరోలే! అభిమానులు ఎదురు చూస్తున్న మరో మనవడు హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వుడ్ బీ హీరో! మునిమనవడూ జూ ఎన్టీర్ కొడుకూ అభయ్ రామ్ మన రేపటి హీరో! కూతురు పురందరేశ్వరి రాజకీయ రంగంలో వారసురాలిగా వుండిపోయారు!

మరి హీరో అక్కినేని వంశంలో- హీరో నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ ప్రొడ్యూసర్, చిన్న కొడుకు నాగార్జున హీరో. మనవడు సుమంత్ హీరో. మనవరాలు సుప్రియ హీరోయిన్. మరో మనవడు సుశాంత్ హీరో. మనవలూ నాగార్జున కొడుకులూ నాగాచైతన్యా అఖిల్ యిద్దరూ హీరోలే!

ఇంకా ఘట్టమనేని వంశంలో- హీరో క్రిష్ణ వాళ్ళన్నయ్య ఆదిశేషగిరిరావు ప్రొడ్యూసర్. పెద్దకొడుకు రమేష్ బాబు వొకప్పుడు హీరో, తర్వాత నిర్మాత కూడా! కూతురు మంజుల హీరొయిన్. కొడుకు మహేష్ బాబు చెప్పక్కర్లేదు హీరోలకి హీరో. పెద్దల్లుడు సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. చిన్నల్లుడు సుధీర్ బాబు హీరో. మనవడు గౌతం కృష్ణ రేపటి హీరో, అప్పుడే ‘వన్ నేనోక్కడినే’ లో చేసాడు కదా? ఇక హీరోయిన్ విజయనిర్మలగారి అబ్బాయి నరేష్ హీరో. నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరో!

విలనూ కం హీరో కృష్ణంరాజు! అన్న యువీ సూర్యనారాయణరాజు ప్రొడ్యూసర్. వారి పెద్ద కొడుకు బాహుబలి హీరో ప్రభాష్!

చిరంజీవి మెగా హీరో. పెద్దతమ్ముడు నాగబాబు హీరో తప్ప అన్నీ. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హీరో. బావమర్దీ.. అల్లూ రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ నిర్మాతా నటుడు. అల్లుడు అల్లూ అర్జున్ స్టైలిష్ హీరో. చిన్న అల్లుడు అల్లూ శిరీష్ అప్ కమింగ్ హీరో. కొడుకు రామ్ చరణ్ హీరో. మేనల్లుడు సాయి ధర్మతేజ కూడా హీరో. పెద తమ్ముడు వరుణ్ తేజ్ హీరో. కూతురు నిహారిక త్వరలో హీరోయిన్!?

మరి మంచు వారి కుటుంబంలో మోహన్ బాబుగారి అబ్బాయిలు యిద్దరూ మంచు విష్ణు వర్ధన్ బాబూ మంచ్ మనోజ్ బాబూ హీరోలే! హీరోయిన్ మంచు లక్ష్మిదీ కీరోలే! తోడు సోదరుడు ఎం. కృష్ణగారు ప్రొడ్యూసరే!

నిర్మాతా నటుడూ రామానాయ్డు పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతా డిస్ట్రిబ్యూటర్. చిన్న కొడుకు హీరో వెంకటేష్. మనవడు దగ్గుబాటి రానా హీరో కం విలనూ!

పీజే శర్మ నటులైతే, వారి శ్రీమతి కృష్ణజ్యోతి శర్మ డబ్బింగ్ ఆర్టిస్టు. పెద్ద కొడుకు సాయి కుమార్ హీరో విలనూ అన్నీ. నడిపి కొడుకు రవిశంకర్ నటుడూ అనువాద రచయిత. చిన్న కొడుకు అయ్యప్ప పి శర్మ నటుడూ దర్శకుడూ. మనవడు ఆది హీరో!

శివ శక్తి దత్తా విజయేంద్ర ప్రసాదు వరుసకు అన్నదమ్ములు. కథా రచయితా దర్శకులు విజయేంద్ర ప్రసాదు గారి అబ్బాయి రాజమౌళి. రామా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్. మరి శివశక్తి దత్త కొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి. కీరవాణి తమ్ముడు కాంచీ నటుడూ రచయిత. చిన్నతమ్ముడు కళ్యాణ్ మాలిక్ మరో మ్యూజిక్ డైరెక్టర్. చిన్నాన్న కూతురు ఎం.ఎం. శ్రీలేఖ యింకో మ్యూజిక్ డైరెక్టర్!

నటులు కమలహాసన్ వారసురాళ్ళు శృతిహాసన్, అక్షరహాసన్ యిద్దరూ హీరోయిన్లే! జయసుధ కొడుకు శ్రియాన్ హీరో! జయప్రద (అక్క) కొడుకు సిద్దార్థ హీరో! రావుగోపాలరావు కొడుకే రావు రమేషు, హీరో లాంటి విలన్! బ్రహ్మానందం కొడుకు హీరో! ఎమ్మెస్ నారాయణ కొడుకు హీరో, కూతురు డైరెక్టర్! హీరో శ్రీకాంత్ హీరొయిన్ ఊహల కూతురు ఆల్రెడీ రుద్రమదేవిలో నటించింది, కొడుకు కాబోయే హీరో! హీరో రాజశేఖర్ హీరోయిన్ జీవితల పెద్ద పాప హీరోయిన్ గా వస్తుందిట?!

దర్శకులు దాసరి నారాయణరావు కొడుకు దాసరి అరుణ్ కుమార్ హీరో. ఈవీవీ సత్యన్నారాయణ కొడుకులు పెద్దాడు ఆర్యన్ రాజేష్ హీరో, చిన్నాడు అల్లరి నరేష్ హీరో. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రాం శంకర్ హీరో. కొడుకు ఆకాష్ పూరీ హీరోయే! టి. కృష్ణ కొడుకు గోపీచంద్ విలన్‌ను దాటి హీరో. సుకుమార్ అన్న కొడుకు హీరోగా రాబోతున్నాడట?!

నిర్మాతలు వీబీ రాజేంద్రప్రసాద్ కొడుకే కదా హీరో జగపతి బాబు. ఎమ్మెస్ రెడ్డి కొడుకు శ్యాం ప్రసాదరెడ్డి నిర్మాత. మనవరాలు కూడా నిర్మాతే! అశ్వినీదత్తు కూతుళ్ళూ నిర్మాతలే! ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరో. స్రవంతి రవికిశోర్ (అన్న) కొడుకు రామ్ హీరో! కేఎస్ రామారావు కొడుకు వల్లభ హీరో, ప్రొడ్యూసర్! ప్రొడ్యూసరూ డిస్ట్రిబ్యూటరూ యెన్ సుధాకరరెడ్డి కొడుకు హీరో నితిన్! బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో, పక్కన ఫస్ట్ సినిమాకే సమంతా హీరోయిన్. ఐటమ్ సాంగ్ కు హీరోయిన్ తమన్నానే దించేసారు!

సంగీత దర్శకులు టీవీ రాజు కొడుకు రాజ్. సాలూరి రాజేశ్వరరావు కొడుకు కోటి. కోటి కొడుకూ హీరోయే! రైటర్ సత్యమూర్తి కొడుకు మన దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకో కొడుకు గాయకుడు. బాలూ గారి చెల్లలే శైలజ. కొడుకే సింగర్ చరణ్. పాటల రచయిత సీతారామ శాస్త్రి వొక కొడుకు హీరో. యింకో కొడుకు డైరెక్టర్. కెమెరామెన్ ఛోటా కే నాయ్డు మేనల్లుడే హీరో సందీప్ కిషన్!

ఏ బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పే రాం గోపాల్ వర్మ వాళ్ళ నాన్న అన్నపూర్ణ స్టుడియోలో సౌండ్ యింజనీర్! మీనాన్న కనీసం ప్యూను కూడా కాదుగదా, నీకు గేటులోపలకి రానిస్తారా చెప్పు? ఈ సాక్ష్యాలు చాలవా చెప్పు?

సో.. ఈ సొదంతా.. సోదంతా నీకు ఎందుకు చెపుతున్నానో తెలుసా? మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ దగ్గరుండి ఈ రిలేషన్లు తెలిసినంతవరకు యెందుకు చెప్పాడో తెలుసా? రియలైజ్ అవుతావని! నువ్వు పేరుకి బాబువే గాని.. మీ బాబువల్ల నువ్వయితే బాబువి కావు, కాలేవు. ఇండస్ట్రీని యేలలేవు. వొద్దురా.. నాలాంటి వాడిని తెలియక సినిమా యిండస్ట్రీ కొచ్చేసాను. చాలా దూరం వచ్చేసానని తెలుసు. ఇంకెంత దూరముందో తెలీదు. ఇక్కడ అందరూ అంటే యెక్కువ మంది నాలా థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాళ్ళే!

లేదూ పెట్టేబేడా సర్దుకొని ఎవరి మాటా వినకుండా వస్తానంటే రా.. సంకనాకి పోదువు. పెళ్లి కాకుండా వచ్చావో నీకు భవిష్యత్తులో కాదు, యీ జన్మలోనే పెళ్లికాదు! అందుకని పెళ్లి చేసుకొని వచ్చావో మీయావిడ డైవోర్సు తీసుకున్నా ఆశ్చర్యపోకు! మీసాలు వచ్చినప్పుడు వచ్చాను, యిప్పుడు నెత్తిమీద వెంట్రుకలూ మిగల్లేదు!

నీ మీద నీకు నమ్మకం వుండడం మంచిదే. కానీ యితరుల అందాలతో పోల్చుకోవడం ప్రమాదం. ఎందుకంటే నీ వుత్తరం చదివితే వూపిరి ఆగిపోయింది. “నాగార్జున బిగినింగ్ లో విక్రం, అరణ్య కాండ సినిమాల అప్పుడు ఎలా వున్నాడు? యిప్పుడు యిండస్ట్రీకే ‘మన్మధుడు’ కాలేదా? జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. ఫస్ట్ సినిమాలకి యెలావున్నారు? యిప్పుడు యెలావున్నారు? మహేష్ బాబులో యెంత మార్పు వచ్చింది? మరి రాం చరణ్ మాటేమిటి?” అని రాశావ్. నటిస్తూ నేర్చుకుంటాననీ రాశావ్. ఈ లోగా ప్రేక్షకులు అలవాటు పడతారనీ అన్నావ్. నీకు యేమి చూసి యీ మెడపోత్రమో నాకేమీ అర్థం కావడం లేదు!?

ఓరే.. పిచ్చనాకొడకా.. నీ నుండి మీ అమ్మానాన్నా ఆరోగ్యం పాడై పోయిందని మీ అక్క ఫోన్ చేసింది. నీ యెర్రికి మందు లేదంది. సిన్మా వోళ్ళంతా చదువు సరిగ్గా అబ్బక.. యిల్లోదిలి మద్రాసు బండి యెక్కిన వాళ్ళేనని గర్వంగా చెపుతున్నావట. ఏ అపరాత్రి అర్ధరాత్రి నువ్వు రైలు యెక్కేస్తావేమోనని అందరూ నువ్వు వుచ్చకి లెగిసినా దొడ్డికి లెగిసినా భయపడి చస్తున్నారట! చాలక భూమి అమ్మేయమని, ఆస్తి రాసి యిమ్మని నువ్వూ నీ ఫ్రెండు కలిసి ముందు సీరియల్ తరువాత సినిమా తీస్తారట. ఒరే పద్దుకుమాలినోడా.. యిక్కడ టీవీల్లో కూడా వీజీ కాదురా. ఆల్రెడీ- ఆర్కే డైరెక్టర్ రాఘవేంద్రరావు వాళ్ళదీ.. అర్కా వాళ్ళ అల్లుడిదీ.. అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళదీ.. జయసుధ వాళ్ళదీ.. రాధిక వాళ్ళదీ.. మల్లె మాల మనవరాళ్ళదీ.. దత్తు కూతుళ్ళదీ.. మంచు లక్ష్మి వాళ్ళదీ.. క్రిష్ వాళ్ళ నాన్నగారిదీ.. తాజాలూ మాజీలూ అందరూ మఠం దిద్ది కూర్చున్నారురా.. ఒక్కో సీరియల్ వెయ్యీ రెండు వేల ఎపిసోడ్లు.. ఒకసారి వస్తే స్లాటు వదులుకోరు. నీవంతు వచ్చేసరికి నీకు సష్టి పూర్తి వయసు వొచ్చేస్తుంది. అంచేత చెప్పిన మాట విను.. భూమిని అమ్మి ఆస్తి లాక్కొని పీక్కొని వొచ్చి యిక్కడ వూడబోడిచింది యేమీలేదు!

నీ వేషాలు మానుకో.. ఇక్కడ హండ్రెడ్ పెర్సెంట్ రిజర్వు అయిపోయింది. నీ సామాజిక వర్గము అనబడు కులమునకు యిక్కడ తత్కాల్ సౌకర్యమూ లేదు. హీరో ఛాన్సు లేదు. రాదు. అందుకే మన సామాజిక వర్గపు హీరో వొక్కడూ లేడు! ఒక్కడూ రాడు! ఆ నలుగురి చేతిలో థియేటర్లు వున్నాయంటారు. నిజానికి అన్ని పాత్రలూ వేషాలూ విద్యలూ ఆ నాలుగు సామాజిక వర్గాల వాళ్ళదే!

ఇక్కడ రాణించాలంటే పట్టుదల, కష్టపడే గుణం, సాధన.. యివి వుంటే చాలవు. కులమూ ధనమూ బలగమనే బలమూ బ్యాకప్  వుండాలి. లేకపోతే ప్యాకప్పే! నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాటరీ బ్యాకప్ వున్నప్పుడే సెల్లు పనిచేస్తుంది అవునా?, అప్పుడు కూడా నీకు సిగ్నలింగ్ వ్యవస్థ బాగుండాలి! అన్ని వేళలా సపోర్ట్ చెయ్యాలి! అది కనెక్టింగ్ ది పీఆర్ కావాలి! వర్కౌట్ అవ్వాలి! అదృష్టం పాత మాట, టైమింగ్ కుదరాలి! నెలనెలా మీ యింటి నుండి డబ్బులు పంపుతూ వుండాలి! అప్పులు నాల్రోజులకి నాల్గు నెలలకి పుడతాయి, పోనీ నాలుగు సంవత్సరాల వరకు పుడతాయి! మరి పద్నాలుగు సంవత్సరాలకి పుడతాయా? పుట్టవు! పుట్టగతులు వుండవు!

అంతా అనుకోకుండా జరిగి అవకాశము రావాలి! ఆట ఆడాలి! ఇక్కడ ఆడకుండా ఓడిన వాళ్ళమే యెక్కువ! ఆడి.. బాగా ఆడి.. హిట్టు వస్తే నీ అంత పోటుగాడు లేడు. హిట్టు పక్కనే ఫ్లాప్ కూడా వున్నట్టే.. హిట్టు పక్కనే ఫ్లాప్ వొస్తుంది. వొచ్చిందా గొర్రె చచ్చింది. మళ్ళీ మన ముఖం యెవడూ చూడడు! ఈ లోపల పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి! మూటాముల్లె సర్దుకొని వెనక్కి వెళ్లి పోవడమే!

మరి కాదని మనలాంటి వాళ్ళం బతకడం యెలా అనా? మనకి యిక్కడ కొన్ని ఆల్రెడీ రిజర్వు చేసినవి వున్నాయి. హీరోని ఎలివేటు చెయ్యడానికి చక్రాలకింద టైర్లకింద హీరో చేతులకు బదులు మన చేతులు పెట్టడం, అగ్గిలోనుంచి నడిచే హీరో కాళ్ళకు బదులుగా మన కాళ్ళతో నడవడం, నదిలో సముద్రంలో మునిగిపోతున్న హీరోయిన్ని రక్షించడానికి హీరోకి బదులుగా మనం ఈదడం, ఫ్లైట్లోంచి విలన్ హీరోని తోసేస్తే గాల్లోంచి మనం కింద పడడం, రైల్లోంచి దూకడం, రైలెక్కి రన్నింగ్ చేయడం, పట్టాలపై పరిగెత్తడం వంటి పనులు అడపా దడపా మనకి దొరుకుతాయి. ఇందులో కొన్ని స్టంటు మాస్టార్లే చేసేస్తారు! తక్కువ బడ్జెట్ వున్నప్పుడు మనలాంటి వాళ్లకి అవకాశం వొస్తుంది. ఆ అవకాశం పంచుకుందాం రా..

ఇక్కడ రేపు లేదు! ఇవ్వాలైనా వుందో లేదో తెలీదు!

ఉంటా మరి! ఇండస్ట్రీని మార్చుదాము.. కొత్తనీరు ప్రవాహింప జేద్దాం అని వుంటే రా.. నే నేవడ్ని రావద్దని చెప్పడానికి. లోతు తెలిస్తే ఈత సులువవుతుందని యిదంతా రాసాను! వుంటా రా.. *

యిట్లు

నీ

థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాడు.

 

 

ఉరితాడూ ఈ ముడి నువ్వయినా విప్పవూ?

 

 

           -బమ్మిడి జగదీశ్వర రావు

                                     ~

bammidi అయ్యా రంగనాథ్ గారూ..

మీకు నేను తెలీదు, కానీ నాకు మీరు తెలుసు! నాలాంటి చాలా మందికి మీరు తెలుసు! యిప్పుడయితే అందరికీ మీరు తెలుసు! హీరోగా కాదు, విలన్ గా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అస్సలే కాదు, టీవీ ఆర్టిస్టుగా అంతకన్నా కాదు. కవిగా కాదు. నాటక కర్తగా కాదు. టెన్నీసు క్రీడా కారుడిగా కూడా కాదు. అరవై ఆరేళ్ళ వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్న.. సారీ రంగనాథ్ ని హత్య చేసిన రంగనాథ్ గా మాత్రమే తెలుసు! లోకం మీ మూడొందల సినిమాల్ని మర్చిపోయింది! అందమయిన ఆరడుగుల యెత్తయిన మిమ్మల్ని మర్చిపోయింది! అనుభూతినిచ్చే మీ కవిత్వాన్నీ మర్చిపోయింది! మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది! పెట్టుకుంటుంది! ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!

మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?

మీ అమ్మ జానకమ్మగారు మంచి గాయకురాలు. అంతేనా?, మించి తబలా విద్వాంసురాలు. మరి వీణలోనో.. యేకంగా గోల్డు మెడలిస్టు. అన్ని అర్హతలు వుండీ యిల్లాలయ్యాక  యింటి బరువు మోసాక తన కోరిక.. సినిమా నేపథ్యగాయని కావాలన్న తన ఆశని తీసి అటకా యెక్కించేసారు! సంసారమే సంగీతమయ్యాక దారి దొరక్క- గొంతుండీ పాడలేక – పిల్లల పెంపకం వీడలేక – కలని నెరవేర్చుకొనే తోవ లేక – వున్న ఒక్క జీవితాన్ని ముగించలేదు! మీలా వురి పోసుకోలేదు! వూపిరి పోశారు కలకి! కోరితే మీరు నీరు పోశారు! ఆ ఫలమే మీరు!!

మీ సహచరి నిర్మల చైతన్య కుమారి నుంచి మీరు యేమి నేర్చుకున్నారు? మీ ఆవిడ మేడ మీది నుండి కింద పడిపోయారు. నడుం విరిగింది. కాళ్ళు చచ్చు బడిపోయాయి. పద్నాలుగేళ్ళు పడకకే పరిమితమయిపోయారు! జీవితమన్నాక పడడం లేవడం సహజమనుకున్నారు. తప్పితే ఈ జీవచ్చవం లాంటి బతుకెందుకనిగాని, బరువెందుకనిగాని ఆవిడ అనుకోలేదు. అనుకుంటే ఆమెకు మృత్యువు పెద్ద దూరం కాదు. దేవుడు పిలిచినప్పుడే వెళ్లాలని అనుకుంది. తప్పితే మీలా తొందర పడలేదు. పడివుంటే మీకు మీ భార్యపట్ల వున్న బాధ్యత యెంతో నిరూపించుకొనే అవకాశమే లేదు! ఆబాధ్యతలకు మారు రూపు మీరు!!

అలాగే చైతన్య కుమారి జ్ఞాపకాల్ని ఆరేళ్లుగా ఆయువు పోస్తున్నారే.. ఆత్మ అన్నారు.. ఆజ్ఞాపకాల్నీ  మీ ఆత్మనీ మీరు వురితీసారని యెరుగుదురా?

మీ మిత్రుడు నందా ఎయిర్ ఫోర్సుకు వెళ్లిపోయాడని- మీరు వంటరి వాణ్ణి అయిపోయానని- ఆత్మహత్య చేసుకుందామని అనుకొని- రైలు కింద పడదామని పట్టాల ముందు కూర్చుని- తిరుపతి నుండి వచ్చే 156 ఆలస్యమైందని- అప్పుడు అమ్మా అమ్మ కోరికా గుర్తొచ్చి లేచొచ్చేసారని చెప్పుకున్నారే.. మరి రైలు రైట్ టైంకు వస్తే యేమయ్యేది? అమ్మ కోరిక తీరేదా? మళ్ళీ నందా కలిసేవాడా? మీ ఆలోచన ఆలస్యం కాలేదు! మీరు మిగిలారు! మీ కవిత్వమూ సినిమాలు మాకు మిగిలాయి! మీ పెద్ద కుటుంబం మీరు లేకపోతే యేమయ్యేది? మీ పాత్రలో మీరే వుండాలి! మీ పాత్ర మీరే పోషించాలి!

హీరో పాత్రే అనుకుంటే అరవై సినిమాల దగ్గర ఆగిపోయేవారు కాదా? అందరూ హీరోలయితే విలన్లెవరు? మిగతా క్యారెక్టర్లు యెవరు పోషిస్తారు? మిమ్మల్ని మెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆఖరిదాక హీరోగానే వున్నాడా? రేపు మహేష్ బాబు అయినా రాంచరణ్ అయినా అంకుల్ వేషమో తాతయ్య వేషమో వెయ్యక తప్పుతుందా? మనకు విలనుగా వచ్చి హీరోలు అయినవాళ్ళున్నారు. హీరోగా వచ్చి విలన్లు అయినవాళ్ళున్నారు. మీ తొలి విలన్ పాత్ర ‘గువ్వల జంట’ బాగా ఆడలేదని మిమ్మల్ని మళ్ళీ హీరోగా చూసారా? పంతోమ్మిదేళ్ళపాటు విలనుగా మీకు ఆయస్సు యెందుకు పోసారు?

అంచేత యెప్పటికి ఆపాత్రే! పాత్రకు న్యాయం చెయ్యడంలో మీ లోపలి హీరో పాత్రకు పాత్ర వుంది! మీలోపలి హీరో పాత్రని మీరు నిలబెట్టుకుంటూ వచ్చారు! మీలోపలి హీరో పాత్రని మీరు వురితీసి చంపేసి వుంటే మీ మరొక్క పాత్ర బతికే ఛాన్స్ వుoడేది కాదు!

జీవితమంటే జీవించడమంటే హీరోగా మాత్రమే మిగలడం కాదు అని- జీరో దాకా ప్రయాణించడమని- హీరో నువ్వే అనీ- విలనూ నువ్వే అనీ- బాబాయి నువ్వే అనీ- మామయ్యా నువ్వే అనీ- అన్నయ్యా నువ్వే అనీ- తాతయ్యానువ్వే- చివరకు ‘రైల్వే టికెట్ కలెక్టరూ’ నువ్వే- సమస్తమూ సకలమూ నువ్వే అనీ- యిన్నిన్ని పాత్రలు వేసిన నీకు యెవరు చెప్పాలి?!

ఔను! ఒంటరీ నువ్వే! సమూహమూ నువ్వే!

ఒంటరితనాన్ని ఓర్చుకోలేక పోయావా? మనిషి లోపల తనకు తాను ఒంటరి! వెలుపల ఒంటరి కాదే?!

మందసా మహరాజ్ ఎస్టేట్ లో మీతాతగారు వైద్యులుగదా? ఆ మందసా మహారాజు యిప్పుడు యేo చేస్తుస్తున్నాడు? యింకా రాజుగానే వున్నాడా? లేదే.. ఆ ప్రాంతంలో కొందరు రాజులు పాలు అమ్ముకుంటూ బతుకుతూ వున్నారు తెలుసా? మందసా రాజుగారు కూడా వురిపోసుకు చావలేదు!

ఒంటరినని వాదిస్తారా? యెవరు వొంటరి కాదు? మీ పిల్లలే కాదు, మా పిల్లలూ మా దగ్గర లేరే. రేపు వాళ్ళ పిల్లలూ వాళ్ళ దగ్గర వుండరే!? మనకి మనం దొరకనంత వేగంగా పరిగెత్తుతూ వున్నామే!? మీ మిత్రులూ చుట్టాలూ పక్కాలూ అందరూ ఆ పరుగు పందెంలోనే వున్నారే!?

మీ కవిత్వమూ మీ సినిమాలూ నాటకాలూ క్రీడలూ మీ వొంటరితనం నుండి మిమ్మల్ని విడదియ్యలేకపోయాయా?

నిజమే! ఒంటరితనం జైలే! మనుషుల్ని తోటి మనుషులనుండి వేరు చేస్తే అది జైలే! ఆ జైలు నిర్మాణానికి మీ చుట్టూ వున్న వాళ్ళతో పాటు మీరెందుకు పూనుకున్నారు? ఆ శిక్ష మీకు మేరే యెందుకు వేసుకున్నారు? అలా శిక్షించుకున్న ఉదయకిరణ్ ను మీరేమన్నారు? ‘నాదగ్గరకు వస్తే సంపూర్ణంగా మార్చేసేవాడిని’ అన్నారు కదా? మరి మిమ్మల్ని మీరు యెందుకు మార్చుకోలేక పోయారు? మార్పు యెప్పుడూ మననుంచే కదా మొదలవ్వాలి!

మీ సహచరి చైతన్య కుమారితో ప్రేమ కన్నా బాధ్యత గొప్పది అని మీ వుద్దేశాన్ని ఆమెతో విభేదించి మరీ చెప్పారే! మరి మీ బాధ్యత యిదేనా? సమాజంలో యెందరో బతకడానికి చస్తున్నారే?! అమ్మానాన్నాలేని అనాథలుగా యేతోడూ లేక వొంటరిగా బతుకుతున్నారే?! ఆ ఒంటరి వాళ్లను మీరెందుకు తోడు చేసుకోలేకపోయారు? మీ వొoటరితనాన్ని యెందుకు చేరిపేసుకోలేకపోయారు? మీ చుట్టూ మీరు వొంటరితనపు కంచె వేసుకున్నారెందుకు?

సమూహంలో కలవలేని వాళ్ళ కథ యిలానే ముగుస్తుందని చెప్పడానికా యీ మీ కథ?!

నేను నేనుగా వుండిపోతే మనము కాలేకపోతే యింత శిక్షా?!

వొక్క మాట చివరిగా చెప్పాలి.. సమూహంలోనే వొంటరితనానికి విముక్తి!

యేమైనా యింక యెప్పటికీ మిమ్మల్ని చూడలేమని తలచుకుంటే దుఃఖంగా వుంది!

కన్నీళ్ళతో-

వొక ప్రేక్షకుడు