భలే మలుపుల గెలుపుల సితార !

 

vamsy1

 

నా జీవితంలో పహాడీ రాగం వాయించింది సితార, మాసిపోయిన నా ముఖాన్ని వెన్నెల నీళ్ళతో కడిగింది సితార, అరిగి పోయిన నా కాళ్ళకి బూరుగు దూది చెప్పులు తొడిగింది సితార.

*               *               *

నా మహల్లో కోకిల పట్టుకుని రాత్రీ పగళ్ళు కూర్చుని పదహారు రోజుల్లో సితార సినిమాకి స్క్రీన్ ప్లే రాశాను.

కానీ,

నా లాస్ట్ ఫిల్మ్ సరిగ్గా ఆడక పోడంవల్లనుకుంటాను, ఈ సినిమా డ్రాప్ అవుదామని ఏడిద నాగేశ్వరరావుగారనుకుంటే, వారి బావమరిదీ అల్లుడు… నాకు మిత్రుడు అయిన తాడి బాబ్జీగారు ఏడిద గారితో గొడవపడతా నాకు ఫర్ గా చాలా మాటాడేటప్పటికి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది.

మళ్లీ ఇదో క్లాసిక్ అన్న ఫీల్ వచ్చేంత బాగా వర్కవుటయ్యింది క్లైమాక్స్. మొత్తం కథంతా విన్న నాగేశ్వరరావు గారు ‘’బాగుందయ్యా ….కానీ ,హీరో చచ్చిపోడం బాలేదు మార్చు ‘’అన్నారు.

vamsy

మొదట్నుంచీ వాళ్ళ సినిమాలకి అసిస్టెంట్ గా పనిచెయ్యడమే గాకండా, వాళ్ళింట్లో ఒకడిగా కలతిరగడం వల్ల నాగేశ్వరరావు గారితో బోలెడు చనువుంది నాకు. దాంతో కొంచెం చిరాగ్గానే “హీరోని బతికించడం చేస్తే ,కధ ప్రీ క్లైమాక్స్ నుంచీ మార్చుకుంటా రావాలి’’ అన్నాను.

“మార్చు …నాకు మాత్రం హీరో బతకాలి ‘’అన్నారు .

చిరాకు పెరిగిపోయిన నేను ‘’మీరే చెప్పండి ఎలా మార్చాలో” అన్నాను.

“ఏంటయ్యా …. ఆ పౌరుషం హీరో చచ్చిపోతేనే గొప్ప క్లైమాక్స్ అవ్వుద్దా ?…. సిరిసిరిమువ్వ చూడు కావాలంటే!” అన్నారు.

ఎన్ని రాత్రుళ్ళు ,పగళ్ళు ఆలోచించినా ఫస్ట్ టైం రాసిన క్లైమాక్స్ లా రావడం లేదు.అసలు స్క్రిప్టులో నాకు నచ్చిందే ఆ క్లైమాక్స్. కానీ , నేను నొచ్చుకున్నా పర్లేదు నాగేశ్వరరావు గార్ని నొప్పించ కూడదు అనుకుంటా ఆవేళ అనుకున్నకొత్త క్లైమాక్స్ పేపర్ మీద పెట్టి, మర్నాడు ఆఫీసు కెళ్ళి ఆయనకి చెపితే బాగుందన్నారు.

1 (1)

2 (1)

*               *               *

 

‘’మంచి పేరు పెట్టవయ్యా  వంశీ…. ‘’శ ‘’తోగానీ’’ స’’తో గానీ మొదలవ్వాలయ్యా టైటిల్ ఇది మా సెంటిమెంటు’’అన్నారు.

‘’ఇది మన డైరెక్టర్[విశ్వనాథ్] గారి సెంటిమెంటు గదండీ ?’’అంటే ‘’మా సెంటిమెంటు గూడా అదే’’అన్నారు.

సీతామాలక్ష్మి హిందీ వెర్షన్ టీ.వీలో వస్తుందా సాయంత్రం . గుల్జార్ అసిస్టెంట్ డైరెక్ట్ చేసిన సినిమాకి “సితార’’ అని పెట్టారు .

ఇక్కడ జూస్తే  “స’’తో మొదలవ్వాలంటున్నారు నాగేశ్వరరావు గారు. ఇదేదో బాగుంది గదాని ఆయనకి చెపితే “సరే ” అంటా అదే ఖాయం చేసేసారు .

7 (1)

ఇళయరాజా గారి దగ్గర కెళ్ళాం. కధ చెప్పడం ఏమాత్రం (ఇప్పటికి కూడా) రాని నేను నోటికొచ్చింది చెప్పాను. “ఒక మహల్లో ఎండపొడ తగలకండా ఆ చీకట్లోనే కలతిరుగుతుంటుంది కధానాయిక” అన్న లైన్ పట్టుకున్న రాజాగారు ‘’బాగుంది’’అంటా నేను చెప్పిన ఒక పాట సిచ్యువేషన్ విని “ఇంతవరకూ రాని పాట చేస్తాను’’ అంటా కంపోజ్ చేసారో పాట. అది ‘’కుకుకూ  కోకిలరావే’’

సాగర సంగమం సినిమా కోసం చేసి వాడ్డం మానేసిన ‘’కిన్నెరసాని’’ పల్లవిని ఫుల్ సాంగ్ చేద్దామని నాగేశ్వరరావు గారంటే దానికి చరణం చేసారు రాజా గారు. తర్వాత నా గురువు భారతీరాజా గారు నిళల్గల్ అనే సినిమాకి చేసి వాడడం మానేసిన ఇంకో పాట “ఈ సినిమాలో పెడదాం” అన్నాను ఇలా … ఒక దాని తర్వతొకటి చాలా మంచి ఆల్బం కుదిరింది.

అన్నింటికీ సాహిత్యం వేటూరి గారే రాశారు .

ప్రసాద్ ఓల్డ్ దియేటర్ లో పూజ …‘’వెన్నెల్లో గోదారి అందం’’అన్న ముహూర్తం సాంగ్ తో మొదలెడదాం ‘’అంటే ‘’శుభమా అని పని ఈ పేథాస్ సాంగ్ తో మొదలెడతారేంటయ్యా’’ అని నాగేశ్వరరావు గారనేటప్పటికి ‘’నీ గానం మృదుమధురం ….’’అనే చిన్న బిట్ చేశాకా ఈ పాట రికార్డ్  చేశాం.

 

*               *               *

 

‘’హీరోయిన్ గా ఎవర్ని అనుకుంటున్నావయ్యా?’’అడిగేరు నాగేశ్వరరావుగారు.

‘’నేను రాసుకున్న కేరెక్టర్ కి రాధ సరిపోద్దండి’’అన్నాను.

మర్నాడు ఆ రాధ గురించి ఎంక్వయిరీ చేయించిన నాగేశ్వరరావుగారు ‘’లక్షరూపాయిలoటయ్యా…. మన బడ్జెట్ అంతలేదు గదా…. పదివేలిద్దాం ఎవరైనా కొత్తమ్మాయిని చూడు’’ అన్నారు.

ఆవేళ పొద్దుట పొడుగాటి ఫ్రాక్ లాంటిదేసుకుని ఆఫీస్ కొచ్చిన ఒకమ్మాయి నల్లగావుంది, పెద్ద కళ్ళు. “పేరేంటి?’’ అన్నాను.

“భానుప్రియ’’

‘’ఇది నీ అసలు పేరయ్యుండదే’’

“ఔను…ఈ పేరు తమిలోళ్ళు పెట్టేరిది ……నా  అసలు పేరు మంగ భాను’’

1 (6)

“రేపు ఫోటో సెషన్ పెడదాం’’ అని భానుప్రియకి  ప్రోగ్రాం చెప్పి పంపేశాక ‘’రేపు ఆ అమ్మాయికి కట్టడానికి బట్టలేంటి’’అనుకుంటుంటే ….మొన్న తీసిన సాగర సంగమం లో జయప్రదకి వాడిన చీరలున్నాయిగదా అవి వాడెయ్యండి పర్లేదు’’అన్నారు నాగేశ్వరరావు గారు.

కాస్టుమ్స్ బాక్స్ లు ఓపెన్ చేస్తుంటే వాటిల్లోంచి బయటికి లాగిన చీరల్లో , గులాబిరంగు చీరొకటి బాగుంది తక్కిన వాటితో పాటు దీనిక్కూడా మేచింగ్ జాకెట్ కుట్టమన్నాను కాస్ట్యూమ్స్ సూర్రావు గార్ని.

మర్నాడు ఈ కొత్తమ్మాయి భానుప్రియకి మేకప్ వేస్తున్నాడు ముండూరి సత్యం అక్కడికొచ్చి నిలబడ్డ నేను “మరి హీరో వేషానికనుకున్న సుమన్ రావడం లేదాండీ’’ అన్నాను

“అతనికి విజయా గార్డెన్స్ లో దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా షూటింగ్ ఉందంట, మధ్యాన్నం తర్వాతొదులుతామన్నారా ప్రొడక్షన్ వాళ్ళు’’ అన్నారు నాగేశ్వరరావు గారు.

1 (8)

“సరేమరి’’ అనుకుంటా పనిలోకి దిగిన మేం , నాగేశ్వరరావు గారింటి పక్కనే మలయాళీ సింగర్ మధురి గారింటి డాబా మీద ఖాళీగా ఉంటే దానిమీద మొదలెట్టాం.

సినిమా షూటింగ్ లాగే చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే లైటింగ్ చేస్తున్నాడు కెమెరామేన్ రఘు.

ఆ కొత్తమ్మాయి క్లోజప్పులు తీస్తున్నప్పుడడిగేను. “ఇంతకుముందు ఎవన్నా సినిమాల్లో చేసావా?’’అని.

“మెల్ల పెసున్గల్ అనే తమిళ్ సినిమాలో చేసేను’’అంది.

మధ్యాన్నం దాకా తీస్తానే ఉండగా సుమన్ జాయిన్ అయ్యేడు. చీకటి పడేదాకా కాంబినేషన్ స్టిల్స్ తీశాక ముందు కాంటాక్ట్ ప్రింట్స్ వేసి నాకు చూపించు ,,, తర్వాత ఏమేం ఎన్లార్జ్ చెయ్యాలో చెపుదాం’’ అని  స్టిల్ కెమెరామేన్ సత్యనారాయణతో చెప్పాను.

*          *         *

1 (9)

 

సత్యనారాయణ పట్టుకొచ్చిన  కాంటాక్ట్ ప్రింట్స్ లోంచి బ్లోఅప్ చెయ్యాల్సిన ఫ్రేములు మార్క్ చేసి కలర్ ప్రింట్స్ వేసే 7 స్టార్స్ క్రిష్ణకిచ్చాం.

పెద్ద సైజు ప్రింట్లు వచ్చాయి.

ఆ అమ్మాయిది ఫొటోజెనిక్ ఫేస్. విశాల నేత్రాలంటే అవే అనిపించాయినాకు. అందరికీ బాగుందా మనిషి .

ఈలోగా ఏదో పనుండి అక్కడికొచ్చిన మా గురువు కె. విశ్వనాథ్ గారు ఆ ఫోటోలు చూసి ‘’బావుందోయ్ ‘’ అన్నారు.

కాస్త దూరంగా తలుపు దగ్గర నిలబడ్డ ఏడిద నాగేశ్వరరావుగారి భార్య జయలక్ష్మిగారు ‘కొంచెం మెల్ల ఉందిగదండీ’’ అన్నారు.

‘’మెల్ల ఉంటే అదృష్టం గదమ్మా ?’’ అన్నారు విశ్వనాధ్ గారు.

ఆయనెళ్ళాక “ఆ అమ్మాయిని పిల్చిమనం  కన్ఫర్మ్ చేసుకున్నట్టు చెప్పండి వంశీ’’ అన్నారు నాగేశ్వరరావు గారు.

సాయంత్రం కబురుచేస్తే వచ్చిన భానుప్రియతో “మా సినిమాలో హీరొయిన్ నువ్వే”  అన్నాను.

చాలా సంబర పడ్డ ఆ భానుప్రియ “చాలా థాంక్సండి ఒక సారి డైరెక్టర్ గారిని పిలిస్తే ఆయనక్కూడా థాంక్స్ చెప్పి వెళతాను’’అంది .

“నేనే డైరెక్టర్ ని” అన్నాను.

“అదేంటి విశ్వనాథ్ గారు కాదా ? ఈ కంపెనీ సినిమాలన్నింటికీ ఆయనే కదా డైరెక్టరు?’’ అంది.

*             *             *

1 (15)

హీరోయిన్ గా ఆ భానుప్రియ ఫైనలైజ్ అయింది గానీ , నా మహల్లో కోకిల నవలలో అయితేనేం , సినిమా స్క్రిప్టులో నయితేనేం , నేను రాసుకున్న కథానాయిక రూపం వేరే…తెల్లగా గిల్లితే పాలుగారినట్టుండే శరీరంతో మిసమిస లాడతా, మెరిసిపోతా ఉంటుంది. నిత్యం కలలు కనే పెద్ద పెద్ద కళ్ళు. ఒక్క కళ్ళు తప్ప , ఓకే చేసుకున్నఈ మనిషిలో ఆ లక్షణాలు లేవుగదా….సరే తనని బట్టి ఇప్పుడు మార్చు కోవాలి అనుకున్నాను.

మిగతా వేషాల్లో సితార అన్నయ్య వేషానికి శరత్ బాబు ,లాయర్ కి జే.వి. .సోమయజులుగారు, దేవదాస్ వేషానికి భానుచందర్, జర్నలిస్ట్ కి శుభలేఖ సుధాకర్ . అనుకుంటే “తక్కినవన్ని ఓకే గానీ ,ఆ దేవదాసు కి శుభలేఖ సుధాకర్నేసి, జర్నలిస్ట్ కి మన రాంబాబు (ఏడిద శ్రీ రాం )నెయ్యి” అన్నారు నాగేశ్వరరావు గారు.

*                    *                    *

ప్రధానమైన లొకేషన్ ఎక్కడా అని నాగేశ్వరరావు గారడిగితే’’వెంకటగిరి కోట బాగుంటుంది’’అన్నాను.

“సరే ….వెళ్లి చూసి రండి” అన్నారు.

నేను నవల రాసింది సత్యం ధియేటర్ లోపల వేంకటగిరి రాజావారి భవనం వెనక శాస్త్రి రూములో. ఆ టైములో వెంకటగిరి రాజావారి రెండో అబ్బాయి సాయికృష్ణ యాచేంద్ర గారు పరిచయమే నాకు. కలిసి అడిగితే నవ్వినాయన “వెళ్లి చూసుకోండి బాగుంటే మాకు అభ్యంతరం లేదు’’అన్నారు.

*                     *                   *

ఒక తెల్లవారుఝామున ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి , ఎమ్వీ రఘు , నేనూ కారులో వెంకటగిరి బయలుదేరాం.

కోట లోపల పాతకాలంనాటి సరంజామాతో చాలా రిచ్ గా ఉందికానీ, సీలింగ్ చాలా కిందికుంది. హాలు పర్లేదు, గదులు చాలా చిన్నవి .సగం కథ ఇక్కడే తియ్యాలి గాబట్టి కుదరదిక్కడ. అదే మా వాళ్లకి చెబితే “మా ఫీలింగ్ కూడా అదే” అన్నారు.

రాజావారి పిల్లలకి సత్యసాయిబాబా అన్నా క్రికెట్ అన్నా చాలా ఇష్టం. ఊరికి ఆ చివర క్రికెట్ పిచ్ చాలా బాగా మెయింటెయిన్ చేస్తున్నారని తెలిసి వెళ్ళాం.

ఐతే , ఎంట్రీ ఒక కోట లాగ చాలా బాగుంది. డోర్ తెరుచుకుని లోపలికెల్తే ఒక పిచ్ తప్ప ఇంకేమీ లేదు .అది చూసిన తరణి , రఘు “వంశీ….కోట ఎక్స్ టీరియర్ గా ఇది వాడుకుని ఇంటీరియర్ కింద వాహినీ స్టుడియోలో నైన్త్ ఫ్లోర్ వాడుకుంటే ?’’అన్నారు .

మర్నాడు వాహినీ కెళ్ళి చూశాం.

నాకు నచ్చింది. నా కథానాయిక అక్కడ కల తిరుగుతున్నట్టు ఆ సీన్స్ ఊహించుకోగలుగుతున్నాను. ’’ఓకే గానీ సెట్ చాలా బ్రైట్ గా ఉందిగదా?’’ అన్నాను .

bhanu

 

“డల్ చేస్తాను …ఇందులో చాలా యాంటిక్స్ కూడా యాడ్ చేయాలి” అన్నాడు తరణి.

షూటింగ్ మొదలయ్యింది.

ఆ ఫ్లోర్ లోపలే ముప్పై రెండు రోజుల షూట్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు.తీసుకుంటా పోతుంటే ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఒకరోజు నన్ను పిలచిన నాగేశ్వరరావు గారు’’ ఇప్పటివరకూ తీసింది ఎడిట్ చేస్తే ఎంత ఫుటేజ్ వస్తుంది ……ఇంకా ఈ సెట్లో ఎన్నాళ్ళు వర్క్ ఉంటుంది?’’ అనడిగితే చెప్పాను.

లెక్కలు గట్టిన ఆయన ‘’ఈ లెక్కన టోటల్ షూటింగ్ డేస్ 70 రోజులయ్యేలాగున్నాయి…… మన 16 లక్షల బడ్జెట్ దాటకూడదు. స్పీడ్ చెయ్యి’’ అన్నారు.

లాయర్ సోమయాజులు గారి పాతిల్లు . షూట్ జరుగుతావుంటే వచ్చిన ఇంటి ఓనర్స్.’’ఎట్టి పరిస్తితుల్లోనూ తెల్లవారేలోపు మీరు షూటింగ్ ఫినిష్ చేసుకోవాలి…లేక పోతే మీకు చాలా ప్రాబ్లం’’ అన్నారు .

” వేరే వాళ్ళేవరికన్నా షూటింగ్ కిచ్చారా?’’ అడిగేడు మేనేజర్ రాజగోపాల్.

“తెల్లవారుఝాము నుంచే పడగొట్టడం మొదలెడుతున్నాం ….ఎల్లుండి పొద్దుట కొత్తింటికి శంఖుస్థాపన’’ అనెళ్ళి పోయారాళ్ళు.

శరత్ బాబు షర్ట్ చిరిగిపోయే సీను అదీ చాలా వర్క్ ఉందిక్కడ…….ఇంక చూస్కోవాలి నాలో టెన్షన్.

తర్వాత రాజమండ్రి షెడ్యూల్,

దేవీపట్నం , గూటాల వీధులు, హుకుంపేట రోడ్డు ఇలా చాలా చోట్ల షూటింగ్. దేవీపట్నం గట్టు మీద సుమన్ని జనం తరుముతుంటే తప్పించుకు పారిపోతా కదుల్తున్న లాంచీ లోకి జంప్ చెయ్యాలి. ఈ షాట్ తీస్తుంటే లాంచీ పడిచెక్కకి తగిలిన సుమన్ కాలు, విరిగిపోయింది. దాంతో కొన్నాళ్ళు షూటింగ్ గ్యాప్.

ఇది చివరి షెడ్యుల్.

National Award Certificate

వెంకటగిరి వెళ్లి వాహిని స్టూడియో ఇంటీరియర్ని మేచ్ చేస్తూ అక్కడ తియ్యాలి. వాహిని ఫ్లోర్ చివర్లో కుడికాలు పైకెత్తిన హీరోయిన్ ఈ వె౦కటగిరి గుమ్మం దగ్గర అదే కాలు బయటకి ఆన్చడం లాంటి మాచింగ్  షాట్స్ . పగటి వేషగాళ్ళు ఇక్కడ ముఖ ద్వారం ముందు ఆట కడ్తుంటే వాహినీ ఫ్లోర్లో విన్న కథానాయిక పరిగెత్తు కుంటా  ఇక్కడ పగిలిన రంగుటద్దాల కిటికీ వెనక్కి రావడం లాంటి షాట్స్.

ఈ ప్రాంతంలో షూటింగ్ ఇదే ఫస్ట్ టైమవ్వడంతో జనం విరగబడతా రావడంతో కొన్ని షాట్స్ తీసి “జిలిబిలిపలుకుల’’ సాంగ్ లో వాడాను.

ఈ సినిమా కోసం ఒక అవుట్ డోర్ రౌండ్ ట్రాలీ తయారు చేశాం. ఇండస్ట్రీలో ఇది మొట్ట మొదటి ట్రాలీ. చాన్నాళ్ళ నించి వాడుతున్నారు గానీ దీని చుట్టుకొలత గురించి ఎవర్ని అడిగినా చెప్పలేరు. వెంకటగిరి బిల్డింగ్ మీద ఒక రౌండ్ ట్రాలీ షాట్ తియ్యల్సొచ్చి అక్కడి చుట్టు కొలత తీసుకుని ట్రాలీ చేయించి “కుకుకూ కోకిలరావే “  సాంగ్ లో వాడాం. షూటింగ్ మొత్తంలో ఆఖరి రోజు షాట్ అదే.

ఈ సినిమాకి ఎడిటర్ అనిల్ మల్నాడ్. ఎడిటింగ్ అంతా విక్రమ్ స్టుడియోలో.ఇళయరాజా గారు రీరికార్దింగ్ కి డేట్స్ ఇవ్వడంతో రాత్రీపగలనక కష్టపడి డబుల్ పాజిటివ్ తాయారు చేశాం.

రేపు రాజాగారు చూస్తారనగా ఆ రాత్రి సురేష్ మహల్లో ప్రోజక్షనేసి ఏడిద నాగేశ్వరరావు గారికి చూపించాను. వారి ఫ్యామిలీ ,ఇంకా యూనిట్ అంతా చూసారు..చాలా తక్కువ డైలాగులు, కామెడీ లేదు, ఏ థ్రిల్లు లేదు. ఏ ఒక్కరికీ నచ్చలేదు. నాతో ఏమీ మాటాడకండా కారెక్కి వెళ్లిపోయేరు నాగేశ్వరరావు గారు.

E Nagesh receiving Award

జాతీయ పురస్కారం అందుకుంటూ ఏడిద నాగేశ్వరరావు

మర్నాడు మద్యాన్నం ఇళయరాజా చూస్తున్నారంటే ఇష్టం లేకపోయినా యూనిట్లో కొందరొచ్చేరు.

ఇంటర్వెల్లో ఒక మూల డల్ గా కూర్చున్న నన్ను పిల్చిన రాజా గారు పక్కన కూర్చోమని మిగతా సినిమా చూశాక “ బాగుంది సినిమా” “చాన్నాళ్ళ తర్వాత చాలా పని నాకు. అంతా మ్యూజిక్కే.’’ అంటుంటే అప్పుడు చూసాను నాగేశ్వరరావు గారి ముఖంలో వెలుగు.

ప్రసాద్ 70mm లో మర్నాటినుంచీ R.R.

Hundred Days Shield

ఒకో రీలు మ్యూజిక్ తో నిండిపోతుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. దాంతో నాలోంచి పారిపోయిన శక్తి పదింతలై పెరిగి, తిరిగి వెనక్కొస్తుంది. ప్రేతకళకీ జీవకళకీ తేడా అర్ధమవుతుంది.

రిరికార్డింగ్ అయ్యేకా మళ్ళీ ఆ సినిమా ముఖం చూసే అలవాటులేని ఇళయరాజా సవేరాలో షో వేయమని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని సినిమా  చూసిన ఆ ఇన్సిడెంటుని నేను మర్చిపోవడం కుదరదు.

మేనా దియేటర్లో షో జరుగుతున్నప్పుడు రెండు రీళ్ల తర్వాతొచ్చిన నా గురువు భారతీరాజా సినిమా అంతా అయ్యేక మొదటి రెండు రీళ్ళు వేయించుకుని చూశాక…సినిమా గురించి నా గురించీ చాలా ఎక్కువగా మాటాడతా, “ఏడీ వాడు?” అని నన్నడిగితే నే లేను.

సినిమా షో లు వేస్తున్నారు. ఒకరోజు నాగేశ్వరరావు గారి దగ్గర కొచ్చిన సీనియర్ జర్నలిస్ట్ ఐ.అర్జునరావు ‘’సినిమా టాక్ అఫ్ ది టౌన్ అయ్యిందండి’’ అన్నారు.

“అవ్వొచ్చు గానీ …ఇంకా బిజినెస్ అవ్వాలండీ” అంటా అక్కడే ఉన్న నన్ను పిల్చి “ఫస్ట్ హాఫ్ లో కొంత తీసేద్దామయ్యా నిన్న చూసిన మన సీడెడ్ బయ్యర్స్ చాలా ఇబ్బంది పడ్డారు’’ అంటా ఎక్కడెక్కడ తియ్యాలో చెపుతుంటే  “అదంతా మంచి పొయెటిక్ ఏరియా’’ అంటున్నాను నేను .”తప్పదు వంశీ ఇది వ్యాపారం గదా..పద ఎడిటింగ్ రూమ్ కి”అని తీసుకెళ్ళి పొయెట్రీ పార్ట్స్ చాలా వరకూ తీయించేశారు.

రిలీజయ్యింది.

మాకు పోటీ సినిమా ఆనందభైరవిలో కామెడి ఉండటం వల్ల మా సినిమా కంటే అది బాగుందన్న టాక్ వచ్చింది గానీ, తర్వాత వారంలో మాది కూడా నిలబడి పోయింది.

అట్లూరి పూర్ణ చంద్రరావు గారి ద్వారా ఈ సిన్మా షో నేయించుకు చూసిన అమితాబ్ బచ్చన్ చాలా మెచ్చుకుంటా మర్నాడు పొద్దున ప్రొడ్యూసర్నీ నన్ను కెమరామేన్ని, హీరోయిన్ని, తాజ్ కోరమండల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ కి పిల్చినప్పుడు నాకిష్టమైన జయబాధురితో ఎక్కువ మాటాడేను.

హిందీలో చేస్తావా అని భానుప్రియని అడిగేరు అమితాబ్ బచ్చన్.

శ్రీదేవిని పెట్టి హిందీలో చేసే ప్రపోజల్ తీసుకొచ్చారో నిర్మాత. కానీ, వేరే కారణాల వల్ల వర్కవుటవ్వలేదు.

ఈ సిన్మా రష్యన్ భాషలోకి డబ్ అయ్యింది.

స్టేట్ అవార్డ్స్ అన్నీ ఆనంద భైరవి కెళ్ళిపోయాయి.

“మనకి ఏ అవార్డు రాలేదు…..శంకరాభరణం తీసిన కంపెనీ మనది’’అని నాగేశ్వరరావు గారు తెగ ఫీలయిపోయారు.

అక్కడే ఉన్న వాళ్ళ ఆఖరబ్బాయి రాజా ‘’మనమో తప్పు చేశాం డాడీ …. క్లైమాక్స్  తీసేసి అవార్డ్స్ కి పంపించాం……ఈ సారి సెంట్రల్ అవార్డ్స్ కి పంపేటప్పుడు ఏ ట్రిమ్మింగు చెయ్యకండా పంపిద్దాం’’అని అలాగే చేసాడు.

నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయ్యాయి.

వెన్నెల్లో గోదారి అందం పాడిన జానకి గారికి బెస్ట్ ఫిమేల్ సింగర్ అవార్డు, ఎడిటర్ అనిల్ మల్నాడ్ కి బెస్ట్ ఎడిటర్ అవార్డ్ , సినిమాకి బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అవార్డు వచ్చాయి.

1 (23)

ఆ ఉదయం మీనం బాక్కం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఆ ఫ్లైట్లో అందరూ అవార్డ్ విన్నర్సే. దాంతో అంతా కల్సి దానికి అవార్డ్ విన్నర్స్ ఫ్లైట్ అని పేరు పెట్టారు.

మాలాగే రీజనల్ అవార్డ్ సంపాదించిన తమిళ్ సినిమా “ఆచమిల్లై ..అచ్చమిల్లై ‘’దర్శకుడు కె. బాలచందర్ గారు ఫ్లైట్ లో నా పక్కన కూర్చుంటా నన్ను పలకరించేరు.

కంగారు పడిపోయిన నేను లేచి నిలబడి “మీ దగ్గర అసిస్టెంట్ గా పని చేద్దామని చాన్నాళ్ళ పాటు మీ ఇంటి గేటు దగ్గర నిలబడ్డాను గానీ,  మీ నేపాలీ  ఘూర్కా లోపలికి వెళ్ళనియ్యలేదు సర్” అన్నాను.

నవ్వేసిన ఆయన “మనమిలా కలిసి అవార్డ్స్ తీసుకోడానికెళ్ళాలని రాసి పెట్టుంటే, నా దగ్గర కెలా రానిస్తాడా దేవుడు చెప్పు ?’’ అంటా నన్ను ఆశీర్వదించిన ఆ దర్శక మేధావి పక్కన కూర్చోబెట్టింది సితార. నాకు ప్రాణమైన నా గురువు భారతీరాజాతో నాగురించి మాట్లాడించింది  సితార. ప్రెసిడెంట్ అఫ్ ఇండియా తో కరచాలనం చేయించింది సితార. ఇంకా ఎందర్నో .ఎన్నో విధాలుగా నాకు దగ్గర చేసిన సితార ఏ వెన్నెల వేడికీ వాడిపోని పరిమళించే జ్ఞాపకం ఐపోయింది……

ఎంత పని చేసింది ‘’మహల్లో కోకిల’’ నవల???

*

ఎదురు చూడని కల “మంచు పల్లకీ”

vamsy1

లోగో: భవాని ఫణి

 

ఐతే, నేను అసిస్టెంట్ గా పనిచేసే సినిమా ఆఫీసు, లేకపోతే జ్యోతి మంత్లీ ఆఫీసు, అదీ గాకపోతే ఏడిద నాగేశ్వరరావు గారిల్లు, ఒకోసారి జ్యోతి ఎడిటర్ వేమూరి సత్యనారాయణ గారిల్లు… ఇవీ ఆనాడు మద్రాసులో నేను కలతిరిగిన ప్రదేశాలు.

సీతాకోకచిలుక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాకా చాన్నాళ్ళు పనిలేకండా పోయింది నాకు. సరిగ్గా ఆ టైములోనే జ్యోతిలో మానేసి ఇంట్లో ఉంటున్న వేమూరి సత్యంగార్ని రెగ్యులర్ గా కలుస్తుండే వాడ్ని. సరిగ్గా అదే టైములో రాజమండ్రి నించి వచ్చిన ఎం ఆర్ ప్రసాదరావు గారు సినిమా తీస్తానంటే దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుదిరారు సత్యం గారు.

కమలహాసన్ కి అన్నయ్య, సుహాసినికి తండ్రి అయిన చారుహాసన్ గారు ఒక కథకి స్క్రీన్ ప్లే రాస్తే, వాళ్ళ దగ్గర మేనేజర్ గా పనిచేసిన వడివేల్ అనే ఆతను సుహాసిన్ని హీరొయిన్ గా పెట్టి సినిమా తీశాడు.పేరు ‘’పాలయ వన్న సోలై’’. హిట్ అయింది.

ఆ సినిమాని  తెలుగులో తియ్యడానికి రైట్స్ కొన్న ప్రసాదరావు, ప్రొడక్షన్ ఆఫీసు ఓపెన్ చెయ్యడం కోసం ఇల్లు కోసం తిరుగుతున్నారు.

ట్రస్ట్ పురంలో నేను ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఏడిద నాగేశ్వరరావు గారుండే వారు. శంకరాభరణం తర్వాత కామదార్ నగర్లో బాలసుబ్రహ్మణ్యం గారింటి అవతల ఇల్లు కొనుక్కుని అక్కడిడికి షిప్ట్ అవడంతో ఈ ఇల్లు ఖాళీ గావుంది .

కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న ఈ బాచ్ తో తిరుగుతున్న నేను ఖాళీ అయిన ఈ ఇంటిగురించి చెప్పేటప్పటికి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి ఇందులోకి దిగిపోయేరు.

vamsy

డైరెక్టర్ బాపూ గారయితే బాగుంటుందని వెళ్లి వార్ని కలిశారు.కానీ, వేమూరి సత్యనారాయణ గారన్న ఒక మాటకి హర్ట్ అయిన బాపుగారు ఆ సినిమా చెయ్యనన్నారు.తర్వాత జంధ్యాల దగ్గర కెళ్ళారు. మీరు కొత్తవాళ్ళు డబ్బుసంచి పట్టుకుని నా వెనకాల తిరిగితే చాలు సినిమా తీసి పెడతాను లాగేదో జంధ్యాలగారు అనేటప్పటికి ,సినిమా మేకింగ్ లో మా ఇన్వాల్వ్ మెంటు కూడా ఉంటుంది. అనుకున్న వీళ్ళు ఆయన్నొద్దను కున్నారు. వేజెళ్ళ సత్యన్నారాయణని కలిస్తే లక్ష రూపాయిలడిగేరు. వీళ్ళు వేసుకున్న బడ్జెట్ కి చాలా ఎక్కువ ఎమౌంట్ అది. దాంతో ఆయన్నీ వద్దనుకున్నారు.

‘’డైరెక్ట్ చేసే ఆయనెవరా’’ అని తెగ ఆపసోపాలు పడిపోతుంటే ‘’నాలాగ ఎందరో’’…..కుక్క కాటుకి చెప్పుదెబ్బ ‘’చూసేను.బాగున్నాయి  నాకు వాటి డైరెక్టర్ ఈరంకి శర్మ. మనకాయన బాగుంటారు అనిపిస్తుంది” అన్నాను .

భళే చెప్పేడే అని నన్ను తెగ మెచ్చుకుని, తెల్లరేకా మైలాపూర్ లో ఉన్న ఆ శర్మ గారింటికెళ్ళి పరిచయం చేసుకున్నాకా, వచ్చిన పనేంటో చెప్పారు.

Manchupallki_001 copy

విన్న శర్మ గారు ‘’నాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ….ఇవ్వాళ మంగళవారం ….రేపు మాటాడుకుందాము’’ అని ఆఫీస్ అడ్రస్ అడిగితే చెప్పి బయల్దేరేరీళ్ళు.

వీళ్ళకి శ్రేయోభిలాషి అయిన ఒక ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళా ఈరంకి శర్మ గారి ఇంటికెళ్ళిన విషయం తెలిసి పోయింది .కారేసుకుని ఆఫీసు కొచ్చేసినాయన ” అసలా శర్మ గారిని పెట్టమని సలహా ఇచ్చిన చెత్త నా కొడుకు ఎవరు” అంటా చాలా అల్లరి చేసేటప్పటికి ,చాలా డల్లయిపోయిన నిర్మాతలు ,మర్నాడు బుధవారం నాడు ఆ శర్మ గారింటికెళ్ళలేదు.సరిగదా ,ఆఫీసు తాళాలేసుకుని బయటికెళ్ళి పోయేరు.

వస్తానన్న వీళ్ళకోసం ఎదురు చూసి చూసిన ఆ ఈరంకి శర్మ గారు, ఆటో వేసుకుని ట్రస్ట్ పురంలో ఉన్న ఆఫీసు కొచ్చేసి ,తాళం కప్ప వేసి ఉండటంతో చాలా సేపు వెయిట్ చేసి ,చేసి వెళ్లిపోయేరు.

డైరెక్టర్ ఫైనలైజవ్వడం లేదని తెగ ఇదయ్యిపోతున్న ప్రసాదరావుగారు ప్రోబ్లం ని ,నాతోకూడా పాలుపంచు కుంటా “ఎవరన్నా డైరెక్టర్ పేరు చెప్పవయ్యా” అన్నారు. మొన్న అనుభవానికి చాలా ఇన్సల్ట్ అయిపోయిన నేను ఇంక చెప్పనన్నాను.

ఒక రోజు పొద్దుటి పూట మేం అద్దె కుంటున్న ఒకే గది కటకటాలింటి కొచ్చిన సత్యం గారు ‘’డైరెక్టర్ ఫైనలైజయి పోయేడు వంశీ’’అన్నారు .

‘’అనుకున్నాను …ఈ చిరాకులో ఎవడో ఒకడ్ని చేసి పారేస్తారని ఎవరు ?’’అన్నాను.

నవ్వేసిన సత్యంగారు ‘’నువ్వే’’అన్నారు.

‘’భళే వోరే …. ముప్పై ఏళ్ళు వచ్చేదాకా నేను డైరెక్టర్ అవ్వను.’’అన్నాను .

‘’ఇప్పుడు ….నీ వయసెంత ?’’ అడిగేరు సత్యం గారు .

‘’ఇరవై రెండు ‘’చెప్పేను.

‘’ముప్పై ఏళ్ల దాకా ఎందుకు?’’

‘’ నా దృష్టిలో సినిమా డైరెక్టర్ అంటే మాటలు కాదండి …..చాలా నేర్చు కోవాలి ,చాలా సబ్జెక్ట్స్ మీద చాలా అవగాహన కావాలి …….వరల్డ్ ఫిల్మ్ గురించి ……..’’

‘’నేర్చుకున్నది చాల్లే గానీ ఆఫీసుకి పద చెప్తాను’’అంటా లాక్కెళ్ళి పోయేరు నన్ను.

మూడు రోజుల పాటు రాత్రి పగలు ఆలోచించిన నేను ‘’సరేనండి …. ఒక రోజు షూటింగ్ కి కావలసినవన్నీ ఎరేంజ్ చెయ్యండి….అది నాకు రిహార్సలు ‘’అన్నాను.

నేను చెప్పినవన్నీ చేసిన సత్యం గారు, నాకు అసిస్ట్ చెయ్యడానికి ఒక సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ ని కూడా పెట్టారు.

ఆఫీసు లోనే షూట్ .

Manchupallki_002 copy

హాఫ్ డే పాటు షూట్ చేశాక పాజిటివ్ ప్రింట్ చేయించి ,కోడంబాక్కంలో లిబర్టీ దియేటర్ ఎదురుగావున్న అప్సర  లాడ్జిలో చిన్న ప్రివ్యూ ధియేటర్ ఉంటే అందులో చూసుకున్నాను .నాతోపాటు చూసినోళ్ళంతా ….బాగుందన్నారు.

మర్నాడు ఆఫీసు కెళ్ళిన నేను ‘’సరే మీ సినిమా డైరెక్ట్ చేస్తాను గానీ ,ఆ సీనియర్ అసోసియేట్ డిరెక్టర్ని పనిలోంచి తీసెయ్యండి ముందు ‘’అని మొన్న సీతాకోకచిలుక సినిమాకి నాతోపాటు అసిస్టెంట్ గా చేసిన ముడుచూరి దొరసామి రెడ్డిని ,వైజాగ్ మిత్రుడు (ఇప్పుడు హీరోలకి ట్రైనింగ్ ఇస్తున్న ) ఎల్ .సత్యానంద్ నీ అసిస్టెంట్స్ గా పెట్టుకుని సిన్మా డైరెక్ట్ చెయ్యడం మొదలెట్టిన నాకు నెల జీతం 6.50 రూపాయిలు.

మాటల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారూ,నేనూ ఆ సాయంత్రం మా ఆఫీసు ఎదురుగుండా ఉన్న వీధిలో ఉన్న స్వర్గీయ కొడవటిగంటి కుటుంబరావు గారింటి  ముందు నుంచి వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు ‘’ఈ సినిమాకి నీ మొదటి నవల టైటిలే పెడితే బాగుంటుంది గదా ?’’ అన్నారు.

ఈ ఐడియా అందరికీ నచ్చడం తో అదే పెట్టాం ‘’మంచుపల్లకీ’’.

ఒరిజినల్ వెర్షన్లో హీరోయిన్ గా చేసిన సుహాసిన్నే దీంట్లో కూడా పెట్టాం. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న చిరంజీవి గారి డేట్లు 13 రోజులు మాత్రం ఖాళీగా ఉన్నాయి .తక్కినవి ఎలాగోలా సర్దొచ్చులే  సిన్మా చేద్దాం’’ అన్నారు అరవింద్ గారు.

హైదరాబాద్ వచ్చేం.

Manchupallki_003 copy

సంజీవరెడ్డి నగర్లో (ఎస్.ఆర్ .నగర్ ) పిట్ట గోడల మీద షూటింగ్. యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులకి నా మీద నమ్మకం చాలా తక్కువగా ఉంది.వాళ్ళలా ఫీలవ్వడంలో తప్పులేదు.ఎందుకంటే ,సిన్మా డైరెక్ట్ చెయ్యడానికి నాకున్న అనుభవం ఏమాత్రం చాలదు.

ఫస్ట్ షెడ్యూల్ల్లో చేసింది ఎడిట్ చేసి సారధి స్టూడియోలో డబ్ చేస్తుంటే స్కీన్మీద చూసిన నటీ నటులు నమ్మడం వల్ల,మిగతాది షూట్ చేస్తున్నప్పుడు అసలు మాటాడలేదు. ఫైనల్ ప్రోడక్ట్ చూసిన చారుహాసన్  సిగరెట్ కాలుస్తా దియేటర్లోనుంచి బయటి కొచ్చి ఎవరితోనూ మాటాడకుండా కారెక్కి వెళ్లి పోయేరు.

ఈ రీమేక్ సినిమాలతో ప్రోబ్లం ఏమిటంటే ఎవరికైనా సరే ఒరిజినల్ వెర్షనే బాగుంటుంది .తర్వాత ఎన్ని వెర్షన్స్ ఎంత బాగా తీసినా ఒప్పించలే౦. ఒరిజినల్ అంత బాగా లేదనేస్తారు. చారుహాసన్ గారి విషయానికొస్తే………. సినిమాల మీద చాలా అవగాహన ఉన్న మేధావి ,పైగా ఒరిజినల్ వెర్షన్ స్కీన్ ప్లే రైటర్ .ఈ తెలుగు వెర్షన్ ఆయనకి నచ్చదు ఎందుకంటే నేనిందులో చాలా మార్చేసేను..

Manchupallki_004 copy

కానీ,

ఇక్కడ కొంచెం రివర్స్ అయ్యింది.మర్నాడు పొద్దుట నిర్మాతలకి ఫోన్ చేసిన చారుహాసన్ ‘’మీ సినిమా నెల్లూరు జిల్లా నేను కొనుక్కుంటున్నాను’’ అని రేటు మాటాడి ఫైనలైజ్ చేసుకున్నారు.

మద్రాసు లక్ష్మి కాలనీలో ఈ సినిమా షో వేస్తే సుహాసినితో పాటు వచ్చిన వాణి గణపతి (కమలహాసన్ మొదటి భార్య )లాస్ట్ లో సుహాసిని మీద పడి ఏడుస్తా ‘’నువ్వూ, ఆ హీరో చిరంజీవీ చివర్లో పెళ్లి చేసుకునే ఇంకొకటి సినిమా చూసేదాకా నా మనసు శాంతిoచదు’’అంటా కారెక్కి వెళ్లి పోయింది.

సురేష్ మహల్లో ప్రివ్యూ చూసిన మా గురువు శ్రీ కె .విశ్వనాద్ గారు నన్ను ఆశీర్వదించిన క్షణాలు మర్చిపోలేను.

అందరికంటే ,అన్నింటికంటే మా గొప్పగా గుర్తుంచు కోవాల్సిన మహానుభావులు లక్ష్మి ఫిలిమ్స్ లింగమూర్తిగారు.శ్రీ కె.ఎస్.రామారావు గారు చెపితే వచ్చి ఈ సినిమా చూసినాయన చాలా ఇష్టపడతా రిలీజ్ చేసారు .

కానీ ,

పేరయితే వచ్చింది గానీ ,తమిళ్లో అంత బాగా తెలుగులో ఆడలేదు. ఇక్కడ సక్సెస్ ప్రధానం అని తెలిసిన నాకు ,ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా బాగా తెలిసింది .

దాంతో ,

నిద్ర పట్టేది కాదు.తెలుగులో నా గురువుల్తో పాటు బిమల్ రాయ్,రిత్విక్ ఘటక్ ,అకిరాకురసోవా, జోల్డాన్ ఫాబ్రి లాంటి గొప్పగొప్ప దర్శకులు గుర్తుకొచ్చేవారు. అసలు ఫిల్మ్ డిరెక్టర్ అంటే మాటలా ……..అసలెందుకు దిగేను? ఎంత తప్పు చేసేను?….

Manchupallki_005 copy

మళ్ళి అసిస్టెంటుగా చేసి ,చాలా చూసి,చాలా చదివి ,చాలా టెక్నాలజీని ఔపోసన పట్టి ,తోక్కేసిన వాకిట్లో పండగ ముగ్గుని సరిదిద్దే వాడినేమో కానీ ,

నేను రాసిన ‘’మహల్లో కోకిల ‘’నవలని ‘’సితార’’ సినిమాగా తియ్యడానికి. ఆ సాయంత్రం పూట ఏడిద నాగేశ్వరరావు గారి దగ్గర్నుంచి కబురొచ్చింది.

 

*