బాపూ గారూ- నేనూ అతి క్లుప్తంగా

మా ఇంట్లో బాపూ గారు -1996

మా ఇంట్లో బాపూ గారు -1996

ఆయన నిర్యాణం వార్త వినగానే ముందుగా కళ్ళ ముందు మెదిలింది ఆయన నవ్వే. అది ఎక్కడా కల్మషం లేకుండా అత్యంత సహజమైన ఆహ్లాద కరమైన, విశాలమైన నవ్వు. విశాలం అని ఎందుకు అంటున్నాను అంటే ….ఆ బూరి బుగ్గలకి ఇవతలి నుండి అవతలి దాకా పూర్తిగా, హాయిగా నవ్వడం, నవ్వించడం ఆయన స్వభావం. ఆయనతో నా పరిచయం కేవలం ముఫై సంవత్సరాల పైనే. వ్యక్తిగతంగా కలుసుకుని ఆయన తో పూర్తిగా గడిపిన రోజులు మహా అయితే 30 ఉంటాయేమో. ఫోన్ లో మాట్లాడినది సుమారు 60 గంటల పైగానే. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు పరవా లేదు.

తన గురించి “గొట్టాం గాణ్ణి” అనుకునే ఏకైక కారణ జన్ముడు, కేవలం తెలుగు జాతి జాతకం బావుండి తెలుగు వాడిగా పుట్టి “పద్మశ్రీ “ బిరుదుతో సద్దుకున్న అసల, సిసలు “భారత రత్న” బాపు గారు. ఆయన ఎంత “సింపుల్” మనిషి అంటే ఆయనకి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అని తెలిసి ఫోన్ చేసి “గురువు గారూ…మీకు ధన్య వాదాలే కానీ మీకు ఇలాంటివి చాలా చిన్న గుర్తింపులే కదా.” అని అప్రస్తుత ప్రసంగం లాంటిది చేశాను.

దానికి నవ్వేసి “అలా అనకండి. ఇది కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే మొన్నటి దాకా స్వామి దర్శనం చేసుకోవాలంటే పదేసి గంటలు లైన్ లో నుంచో వలసి వచ్చేది. ఇప్పుడు వాళ్ళే వచ్చి, నాకు ప్రత్యేక దర్శనం చేయించారు” అన్నారు.

“కానీ…అదేమిటో, నాకూ, రమణ గారికీ ఒకటే దండ వేశారు. అదేదో గజమాలట. ఈ సభల్లో అన్ని పువ్వులు ఎందుకు వేస్ట్ చేస్తారో?” అని కూడా అనగానే “అవును సుమా” అని నాకు అనిపించి ఆ తరువాత ఆయన వచ్చిన మా సభ కి పువ్వులు బదులు పుస్తకాలు బహుమతిగా ఇచ్చాను. ఆయన భలే సంతోషించి…”తెలివైన వాడివే” అన్నారు.

అదే సభ లో మేము తొలి అంశంగా మేము ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న చాలా జిల్లాల నుంచి ఎంపిక చేసిన “ఉపాధ్యాయుల సత్కారం” అనే కార్యక్రమం తలపెట్టి, అ విషయం ఆ సభ ప్రధాన అతిథులైన బాపు-రమణ లకి తెలియజేశాను. వెనువెంటనే బాపు గారి దగ్గర నుంచి ఎప్పటి లాగానే క్లుప్తంగా ఒక ఇ-మెయిల్ వచ్చింది. అందులో ఒకే ఒక్క మాట….”అద్భుతం”…ఆ తరువాత ఫోన్ లో ఆ ఆలోచన ఎంత బావుందో ఆయనా, రమణ గారూ వివరంగా చెప్పారు.

అదే సభలో రమణ గారి కథ – బాపు గారి బొమ్మ తొలి సారి గా ప్రచురణ కి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము నిర్వహించిన బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి సందర్భంగా మరొక తమాషా జరిగింది. “మీ సన్మానం సందర్భంగా నారాయణ రెడ్డి గారు, మరి కొందరు మాట్లాడతారు” అని నేను ఇంకా ఆ సన్మాన కార్యక్రమం ఎలా జరుగుతుందో చెప్తూ ఉండగా “వాళ్ళంతా మమ్మల్ని పొగుడు తారా?” అని అడిగారు బాపు గారు.

నేను సమాధానం చెప్పే లోగానే “ఒకటే కండిషన్. మా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేను చస్తే స్టేజ్ మీద కూచోను. ఎందుకంటే వాళ్ళ మైక్ స్టేజ్ ముందు ఉంటుంది. మా కుర్చీలు వెనకాల ఉంటాయి. అంచేత వాళ్ళ వాగుడు అంతా ఆడియన్స్ కే కానీ నాకు వినపడి చావదు. వాడు తిడుతున్నాడో, పొగుడుతున్నాడో తెలిసి చావదు. అంచేత నేను నేనూ, రమణ గారూ కింద కూచుని ఆ వాగుడు వింటాం. అందరి స్పీచ్ లూ అయ్యాక అప్పుడు మమ్మల్ని స్టేజ్ మీదకి పిలు” అన్నారు.

“సరే, సార్.” అని ఆ మాట సి. నారాయణ రెడ్డి గారితో చెప్పాను. ఆయనకి భలే కోపం వచ్చింది.

“బాపుకేం తెలుసూ..వాళ్ళు ఆడియన్స్ లో కూచుని . స్టేజ్ ఖాళీగా ఉంటే నాకు అవమానం. పైగా అది సంతాప సభ అవుతుంది కానీ , సన్మాన సభ ఎలా అవుతుందీ” అని కోప్పడ్డారు.

నేను ఏం చెయ్యాలో తెలియక, ఇద్దరికీ నచ్చ చెప్పా లేక మొత్తానికి “నేను మిమ్మల్ని ఇద్దరినీ ఒకే సారి వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఆ తర్వాత మీరు, మీరూ చూసుకోండి” అని అలాగే చేశాను. ఆఖరి క్షణంలో నారాయణ రెడ్డి గారు ఎంత బతిమాలినా, బాపు-రమణలు ముందుగా స్టేజ్ మీదకి రాకుండా అన్ని ప్రసంగాలూ అయ్యాకే వేదిక మీదకి వచ్చారు. చికాకులో ఉన్నా, ఆ రోజు బాపు-రమణ ల మీద సి. నారాయణ రెడ్డి గారు అద్భుతంగా ప్రసంగించారు.

డిశంబర్ 31, 2006 – జనవరి 1, 2007 తారీకులలో “మొట్ట మొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” జరిగిన ఆ మహా సభలో నా కథల పుస్తకాన్ని బాపు-రమణ లో ఆహ్వానించారు. ఆ నాటి ఫోటో ఒకటి, 1996 లో బాపు గారు మా ఇంట్లో వారం రోజుల పైగా ఉన్నప్పటి ఫోటో ఒకటి, ఆయన కేవలం నా ఫోటో చూసి వేసి నాకు బహుకరించిన ఒక కేరి కేచర్ ఇందుతో జత పరుస్తున్నాను.

మరొక సారి ఏమయిందంటే…బాపు గారిని మా హ్యూస్టన్ లో ఉన్న నాసా అంతరిక్ష కేంద్రం చూడ్డానికి తీసుకెళ్ళాను. అది ఆయనకీ చాలా నచ్చింది. అక్కడ విజిటర్స్ పుస్తకంలో “ఇందులో తెలుగులో సంతకం పెడితే అదేదో తురకం అనుకుని నన్ను జైల్లో పెడతారా” అని అడిగి, నవ్వేసి ఇంగ్లీషులోనే పొడి సంతకం పెట్టారు.

మరొక సారి అమెరికా ఆహ్వానిస్తే “వద్దు లెండి. మీ అమెరికా ఎయిర్ పోర్ట్ లో బట్టలు విప్పేసి మగాళ్ళ ముందు నగ్నంగా నుంచోడానికి అంత దూరం ఎందుకూ? మా ఇండియాయే బెటరు” అన్నారు. “పోనీ ఆడ సెక్యూరిటీ వాళ్ళని ఏర్పాటు చేస్తాను లెండి” అనగానే అరగంట సేపు నవ్వారు బాపు గారు. నేను అమెరికాలో “శ్రీ రామరాజ్యం” విడుదల ఆట చూసి, హాలు నుంచి బయటకి రాగానే ఆనందం పట్ట లేక బాపు గారికి ఫోన్ చేశాను.

మాములుగా క్లుప్తంగా మాట్లాడే బాపు గారు మహానందపడి ఎన్నడూ లేనిది అనేక విషయాల మీద …ముఖ్యంగా రమణ గారు లేని లోటు గురించి …గంట సేపు మాట్లాడారు.

ఎంతో “సెన్సిటివ్” మనిషి అయిన బాపు గారు, తనకే ఏదైనా విషయం బాధిస్తే, దానిని కార్టూన్ రూపంలో వెలిబుచ్చే వారు. ఉదాహరణకి మొట్టమొదటి సారి ఒక జాతీయ సంఘం అమెరికా పిలిచినప్పుడు ఆయనకి చాలా అవమానం జరిగింది..అని ఆయన చెప్పకుండా చెప్పిన మాటలు. అప్పుడు ఆయన చేత ఆ కన్వెన్షన్ సెంటర్ లో “స్త్రీల మరుగు దొడ్డి” లాంటి సైన్ బోర్డులు బాపు గారు అమెరికాలో మొట్టమొదటి సారి అడుగు పెట్టగానే రాయించారుట. అప్పటి నుంచీ బాపు గారికి అమెరికా రావడం అంటే ఎలర్జీ యే. ఆయన అమెరికా అనుభావాల మీద కొన్ని కార్టూన్ లు వేసి మా బోటి గాళ్ళకి చూపించారు బాపు గారు. అవి చూస్తే ఆయన ఎంత బాధ పడ్డారో తెలుస్తుంది.

అలాగా లూయీ మాలే అనే ఫ్రెంచ్ దర్శకుడు “మహాభారత” అనే సినిమాని ..పాండవులు, కౌరవులు. కృష్ణుడు ఐదు వేల ఏళ్ల క్రితం ఆటవిక జాతుల కుటుంబ కలహంగా, అందులో పాత్రధారులని అసహజమైన రీతిలో చిత్రీకరిస్తూ తీసిన చిత్రం బాపు గారిని చాలా బాధ పెట్టింది. అందులో భీష్ముడి పాత్ర ఒక సౌత్ ఆఫ్రికా నల్ల వాడి చేతా, ఇతర పాత్రలు ఇతర దేశాల నటుల చేతా వేయించి మొత్తానికి హిందువుల మనోభావాలని దెబ్బతినేటట్టుగా ఆ సినిమా ఉంది. దానికి స్పందనగా బాపు గారు ఒక కార్టూన్ లో జంధ్యము, బొట్టు, పిలకా ఉన్న ఒక బ్రాహ్మణుడి ని శిలువ మీద క్రీస్తు గానూ, మిగిలిన పాత్రలని, నల్ల జాతి మొదలైన వారి లా చిత్రీకరించి “ఇది చూస్తే క్రైస్తవ మతస్తులు ఏమనుకుంటారో?” అని అనుమాన పడుతూ ఆ కార్టూన్ పంపించారు. ఆయనకీ అర్థం అవని మరొక విషయం అమెరికాలో విరాళాల మీద ఆధారపడి సాంస్కృతిక కార్యక్రమాలు చెయ్యడం. “నన్ను ఏదో జూలో కోతిని కూచో బెట్టి అందరి చేతా డబ్బులు వేయించినట్టు, మీరు విరాళాలు అడుక్కుని నన్ను పిలవడం ఎందుకూ, ఏదో యాయవారం బ్రాహ్మడికి దక్షిణ పారేసినట్టు నాకు మీ దాన ధర్మాలు ఎందుకూ?” అనే వారు ఎప్పుడు అమెరికా రమ్మని పిలిచినా.

Bapu & Chitten Raju
ఇలా బాపు గారి గురించి వ్యక్తిగతంగా నాకు తెలిసినవి చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలే ఉన్నాయి. కానీ మనసు బాగా లేదు. నేను, ఆ మాట కొస్తే తెలుగు వారు ఎంతో అదృష్ట వంతులు. రమణ గారి సాయుజ్యంలో ఇప్పుడు బాపు గారు మళ్ళీ స్వాంతన పొందుతున్నారు. ఆయన జ్జాపకాలు నన్ను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. అంత కంటే ఆయనకి ఇవ్వగలిగిన నివాళి ఇంకేమీ లేదు.

-వంగూరి చిట్టెన్ రాజు

ఆయన వ్యక్తిత్వమే ఆయన బొమ్మ!

bapu-laughing

బాపుగారితో దాదాపు ముప్ఫై ఆరేళ్ళ స్నేహం. చిత్రకారుడిగా, దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగా ఆయనతో చాలా దగ్గిరగా మెలిగే అవకాశం నిజంగా అదృష్టమే. ఎందుకంటే, బాపు గారు చాలా private person. అంత తేలిక కాదు, ఆయన మిత్రబృందంలో చేరడం! పని మాత్రమే లోకంగా బతుకుతూ అతితక్కువగా బయట కనిపించే వ్యక్తి ఆయన. అలాగే, అతి తక్కువ మాట్లాడే తత్వం ఆయనది. అలాంటప్పుడు బాపు సన్నిహితులలో వొకడిగా చేరడం, ఆ స్నేహం దాదాపు నలభయ్యేళ్ళ పైబడి నిలబడడం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

1978- బాపుగారితో మొదటి సారి కలిసాను. అదీ ‘నవోదయ’ రామమోహన రావు గారూ, ఆంధ్రజ్యోతి నండూరి రామమోహన రావు గార్ల వల్ల- ముళ్ళపూడి రమణ గారికీ నండూరి వారికీ బంధుత్వం కూడా వుంది. అయితే, వాళ్ళ స్నేహాలకీ, మా ఇద్దరి స్నేహానికీ కొంత తేడా వుంది.

మొదటి నించీ నేనేదో మహాపండితుడినని – అది నిజమైనా కాకపోయినా సరే- ఒక అభిప్రాయమేదో ఆయనకీ వుండడం వల్ల మా ఇద్దరి మధ్య అపారమైన గౌరవ భావంతో కూడిన స్నేహం వుండేది. వ్యక్తిగా ఎంతవరకు సన్నిహితంగా వుండాలో అంత వరకూ వుండే వాళ్ళం. నేనేం రాసినా – అది వచనం కానీ, పాట కానీ- ఆయనకీ ఇష్టంగా వుండేది.

మొదటి సారి నాతో సినిమాకి రాయించింది ఆయనే. 1980లో ఆయన నా చేత మొదటి సారి సినిమా పాట రాయించారు, “కృష్ణావతారం” సినిమాకి- “చిన్ని చిన్ని నవ్వు, చిట్టి చిట్టి తామర పువ్వు,” అనే ఆ పాటని బాలు, శైలజ పాడారు.

అప్పటి నించీ నిన్న మొన్నటి “శ్రీరామరాజ్యం” దాకా బాపుగారి ప్రతి సినిమాతో నాకు ఏదో ఒక విధంగా అనుబంధం వుంది. నాకు బాగా గుర్తుండే జ్ఞాపకాలు బాపూ రమణల “మిస్టర్ పెళ్ళాం”తో ముడిపడి వున్నాయి.

చిత్రకళ అంటే ఎంత ప్రేమో ఆయనకీ చలనచిత్ర కళ అన్నా అంతే ప్రేమ! సినిమాలో దృశ్యాలూ, సన్నివేశాల విషయంలో ఆయన ఎంత ఆలోచన పెట్టే వారో గుర్తుకు తెచ్చుకుంటే, అది ఆయన వ్యకిత్వంలోని విశేషంగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనలో చాలా మందికి తెలియనిది ఏమిటంటే, ఆయన మొదట్లో గొప్ప ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రఫీ ప్రావీణ్యమే ఆయన్ని సినిమా వైపు తీసుకువచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆయన ప్రతి సినిమాలో ఆ ఫోటోగ్రఫీ కన్ను చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

అలాగే, ఆయన సినిమా సృజనాత్మకత ఆయనలోని చిత్రకారుడి తత్వాన్ని కూడా చెప్తుంది.

ఇక చిత్రరచనకి సంబంధించినంత వరకూ అంత స్వతంత్ర భావన వున్న తెలుగు చిత్రకారుడిని నా అనుభవంలో చూడలేదు. ఆంద్ర దేశంలో చిత్రకళ చరిత్రలో బాపుకి ముందూ బాపు తరవాత అన్న యుగవిభజన చేయాల్సి వుంటుంది. ఈ చరిత్రలో నూరింట ఎనభై వంతుల ఖ్యాతి బాపుగారికే దక్కుతుంది. ఎందుకంటే, అది ఆధునిక కథ కానివ్వండి, ప్రబంధ కథ కానివ్వండి. ఆ కథా హృదయాన్ని పట్టుకోవడంలో బాపు రేఖ అపూర్వం.

22fr_Bapu_panel_jp_1372569g

రచయిత ఏ కాలం వాడైనా సరే, ఆ రచయిత ఉద్దేశించిన భావాన్ని అందుకోవడమే కాకుండా దాని మీద వ్యాఖ్యానంలా వుంటుంది బాపు బొమ్మ. ఆ విధంగా రచన వుద్దేశాన్ని ఇనుమడింపచేసే శక్తి ఆయనకి వుంది. అందుకే, పత్రికల్లో కాని, పుస్తకాల కవర్ పేజీలుగా కాని బాపు బొమ్మ వుందంటే అది ఒక గౌరవంగా భావించే సాంప్రదాయం తెలుగు సంస్కృతిలో ఏర్పడింది. “అమరావతి కథల”కి బాపు వేసిన బొమ్మలు నాకు మహా ఇష్టం. ఆ కథలు వస్తున్నప్పుడు కథల కోసం ఎదురు చూపు ఒక ఎత్తు, బాపు బొమ్మ కోసం నిరీక్షణ ఇంకో ఎత్తు. ఆ ఎదురు చూపు చాలా ఇష్టంగా వుండేది నాకు.

కవిత్వంలో మనం సొంత గొంతు అంటూ వుంటామే, చిత్ర రచనలో అలాంటిది create చేసుకున్నారు బాపు. ఆయనదే అయిన సొంత రేఖ. బొమ్మ కింద సంతకం వేరే అక్కర్లేని సొంత రేఖ. దానికి కారణం- ఆయనకి రేఖల మీద అధికారం మాత్రమే కాదు, ఆయనలోని స్వతంత్రమైన భావుకత. అది ఆయన గీసిన బొమ్మలలోనే కాదు, రాసే అక్షరాల్లోనూ కనిపిస్తుంది. అది కూడా ఆయన వ్యక్తిత్వంలోంచి వచ్చిందే అనుకుంటాను. బాపు చిత్రకళా రీతి అనేదొకటి ఏర్పడడంలో ఆ రేఖల వ్యక్తిత్వంతో పాటు, ఆయనా సొంత స్వతంత్ర వ్యక్తిత్వమూ సమాన పాళ్ళలో వుంటాయని అనుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే, చిత్రకళకి బాపు జీవరేఖ వంటి వాడు. ఆయన ఇప్పుడు లేకపోయినా, ఆ జీవరేఖ జీవించే వుంటుంది.

Bapu20bomma20athiva

మళ్ళీ ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడాలని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే, నన్ను ఆయనతో బాగా కట్టిపడేసింది అదే కాబట్టి! చాలా కచ్చితంగా వుండే మనిషి. మనిషైన వాడు ఎక్కడున్నా మనిషిగానే వుండాలని నమ్మిన వాడు. ఎంత స్పష్టత వుండేదో ఆయనకి! చాలా మందిలో లోపలి జీవితానికీ, బయటి జీవితానికీ మధ్య confusion వుంటుంది. లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా వుండడం బాపు వల్ల కాదు. తన పని పట్ల అంత భక్తి భావం వున్న మనిషిని కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు. “బహుమతులూ పురస్కారాలూ కాదు, work మిగలాలి” అనే వారు. ఎక్కువగా బహిరంగ ప్రకటనలు చేయడం ఆయన మనస్తత్వానికి విరుద్ధం. ఒక అవార్డు సన్మాన సభలో చివరికి ఆయన్ని మాట్లాడమని అడిగారు. ఆయన కచ్చితంగా రెండు మాటలే మాట్లాడి, కూర్చున్నారు. ఒక మాట: ఈ సన్మానానికి కృతజ్ఞతలు. రెండో మాట: ఈ పురస్కారానికి కూడా కృతజ్ఞతలు. అంతే!

నలుగురిలోకీ దూసుకుంటే వచ్చే ధోరణి కూడా కాదు, మహా సిగ్గరి ఆయన! మామూలుగా స్నేహితుల మధ్య మాట్లాడేటప్పుడు కూడా ఆయన తక్కువే మాట్లాడే వారు. ఆయనకీ చాలా ఇష్టమైన విషయాలు: సాహిత్యం, కార్టూన్లు. ఈ రెండు విషయాల గురించే ఎక్కువ మాట్లాడే వారు. విస్తృతంగా చదివేవారు. ఆ చదివిన రచయితల గురించి మాట్లాడేవారు. కార్టూన్లు బాగా follow అయ్యేవారు. వాటి గురించి మాట్లాడే వారు. ఎంత మాట్లాడినా ఆయన వ్యక్తిగా చాలా private అని తెలిసిపోయేది.

చాలా ఆహ్లాదకరమైన జీవితం ఆయనది. మంచి స్నేహం ఆయనది. ఇప్పుడు ఆయన లేకపోయినా జీవరేఖలాంటి ఆయన చిత్రాలతో పాటు ఆ రెండూ మిగిలి వుంటాయి నాలో!

-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

indraganti

 

 

 

 

 

బాపు శ్రీరాముని చేరి యున్నారు!

మల్లాది వారన్నట్టు –“ఆయనకేం ఆయన సకల నిక్షేపరాయుడు”. బాపుగారు సర్వ సకల నిక్షేపరాయుడు. తెలుగువాళ్ళకింత బొమ్మపెట్టిన వాడు. బాపు చేతి బొమ్మ రుచి చూసిన తరవాత ఇంకే మహాబొమ్మా రుచించదని నిశ్శబ్దంగా వేలాది ఆయన బొమ్మలే కదా చెబుతాయి.

భావకవిత్వంలో కృష్ణ శాస్త్రి ఏం చేసేరో, ఆధునిక కవితకి శ్రీశ్రీ ఏం చేసేరో, ఆధునిక వచనానికి చెలం ఏం చేసేరో అది, దాన్ని మించిందీ బాపుగారు బొమ్మకి చేసేరు. మహనీయం, శాశ్వతం అనుకునే అరుదైన తెలుగు శిల్పాల్లాగే బాపు బొమ్మలు చిరాయువులు కదా!

బాపు గారికి ముందే కాదు, ఆ తరవాతా ఇప్పటి వరకూ ఎవరూ లేరు. దాదాపు శూన్యం గదా! రష్యా, సోవియట్ యూనియన్, అమెరికా, సరే- చైనా, జపాన్లలో illustrations వేసే వారు ఆధునికులు ఒకరికి మించి ఒకరున్నారు. పిల్లలకీ, పెద్దల పుస్తకాలకీ ఆ దేశాల్లో దిక్కులేని తనం లేదు. ఎటొచ్చీ, దురదృష్టవశాత్తూ తెలుగువారిలో బాపు తప్ప అలా బొమ్మలు వేసి గాని, బాపుని మించిన వారు గాని లేకపోవడం బాధాకరం. కళ్ళతో కన్నీరేం చెప్పుకోగలదు చెప్పండి.

1291730404_929e3ce233

మహాద్భుతాలు బాపు వలె వెళ్లిపోవాల్సిందేనా మరి?

తెలుగుజాతికి నిశ్శబ్ద విప్లవం, పటుతర ఘన సౌందర్యం ఇక మహాభినిష్క్రమణం చేసేయి- బాపు గారి రూపంతో.

మనం ఏం చేయగలం.. ఒక్క నమస్కరించడం తప్ప!

స్వామీ, శ్రీరామా, నీకు నిజముగా జయము కలిగెను. ఎట్లన, బాపు నిన్ను చేరియున్నారు గదా!?

-శివాజీ

sivaji

 

 

 

 

 

బాపు రమణీయం … 

పంటి బిగువున నవ్వు
కొంటె చూపులు రువ్వు 
అందమంటే నువ్వు  
ఓ బాపు బొమ్మా

తాను గీచిన బొమ్మ
చూడ నవ్వులు దొర్లు
తెరలు తెరలుగ పొర్లు
ఓ బాపు బొమ్మా
 
మాడ గట్టిన బొప్పి
మొగుడికెయ్యదు నొప్పి
మోటు సరసం తప్పి
ఓ బాపు బొమ్మా

ముత్యమంతయు పసుపు 
మొగుడు పెళ్ళాం వలపు
జడను విసిరిన మెరుపు 
ఓ బాపు బొమ్మా

రామ గాధను తరచి 
రంగు రంగుల మలచి 
మాదు కన్నుల విడచి 
ఓ బాపు బొమ్మా

రాముడన్నను తీపి
హనుమ చెంతను చూపి
మనసులన్నియు దోచి
ఓ బాపు బొమ్మా


బాపు గీచిన గీత
రమణ రాసిన రాత
కలిసెనెప్పుడు జత
ఓ బాపు బొమ్మా


బాపు రమణలు పేరు
వేరు వేరుగ లేరు
స్నేహమంటే మీరు
ఓ బాపు బొమ్మా


… … …


భార్యా భర్తల బంధం
స్నేహ వారధి అందం 
అనుక్షణ సామాజిక హితం 
బాపు రమణల గ్రంధం

సంపూర్ణ రామాయణం
బాపు రమణల విన్నాణం
కాంచ కన్నుల కమనీయం
ఇంటింట స్మరణీయం …

బాపు రమణీయం …
-ఎన్. ఎం రావు బండి.
~~

 బుడుగు

పాతతమిళ సినిమా పాట ఒకటుంది:

గాలి వీచినందుకు జెండా (కొమ్మ) కదిలిందా? జెండా (కొమ్మ) కదిలినందుకు గాలి వీచిందా?

అని.

అలాగే “బుడుగు, చిచ్చుల పిడుగు” లో ————

బాపు గీతలకి ముళ్ళపూడి వ్రాసాడా? లేక ముళ్ళపూడి వ్రాతలకి బాపు గీసాడా?

ఆప్పట్లో మన ఇంట్లోకి “ఆంధ్ర పత్రిక” రాగానే అయ్యేవి కలహాలు నేను ముందు చదవాలంటే నేను ముందని చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా!

తీరా చూస్తే ఆ కథలో ఓ పెద్దపొడిచేసిన యే హీరో లేడు, అందాలు చిందిస్తూ ఆపసోపాలు పడ్తున్న హీరొయినూ లేదు; అందరినీ ఇబ్బంది పెడ్తున్న విలన్ గాడూ అస్సలే లేడు -యువతకోసం;

పాతాళ లోకమూ, దెయ్యలూ, భూతాలూ, మాంత్రికుడూ వగైరా లేవు-పిల్లల కోసం;

రామాయణ-భాగవత, భారతాల కథలూ గాని ఏ వేదాంత సూక్తులూ లేవు- పెద్దవాళ్ళ కోసం;

థనం ఎటుల కూడ బెట్ట వలెను? ఏ రాజకీయుడు ఏమి(అ)రాచ కార్యాలు వెలగ బెట్టెను? అన్నవీ లేవు-నాన్న గార్ల కోసం;

అప్పడాలూ, అరిసెలూ, అల్లికలూ వీటి గురించి ప్రసక్తే లేదు-మన అమ్మల కోసం.

ఇక ఇవన్నీ లేకుండా ————–

మన మమూలు మధ్య తరగతి ఇళ్ళళ్ళోనూ మన చుట్టు ప్రక్కలే వుండే వాళ్ళనీ ఎంచి మనల్ని కడుపుబ్బ నవ్వించేలా చేసారు వారిరివురూ.

మన జీవితాలలో:

మనం పదమూడో ఎక్కం అనే రాక్షసుడిని చూడ లేదూ?

మన అమ్మా నాన్నలు “రాథా గోపాళం” లా అప్పుడపుడూ పిడివాదాల తో ముచ్చటగా కలసిమెలసి వుండడం చూళ్ళేదూ?

మన ఆగడాలని మరచి అక్కున చేర్చుకున్న మన “బామ్మ”లూ,

ఇక “బుడుగు బాబాయి” పోకిరీ(షోకిల్లా)గాళ్ళూ, ముసిముసి నవ్వుల “రెండు జెళ్ళ సీత”లూ,

అందరిళ్ళళ్ళో తల దూర్చే “లావు పాటి పక్కింటి పిన్ని గారు”లూ,

మన నాన్నల “విగ్గు లేని యముడి” లాటి బాస్సులూ,

అగుపడ్డప్పుడల్లా ‘ఓ అయిదో పదో సర్దవోయ్’ అని అందరినీ అప్పడిగే అప్పారావులూ,

చీమిడి ముక్కుతో ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకొని చిన్నగా సన్నగా నసలు పెట్టే సీగానపెసూనాంబలూ,

అందరికన్నా మరీ “బుడుగు” లా కాకపోయినా అల్లరితో తల్లి తండ్రులకి బెదుర్లు పుట్టించే చిన్నారులూ,

వీళ్ళందరూ మనకి పరిచయమే కానీ మనం ఎవ్వరమూ వ్రాయలేక పోయాం, గీయలేకపోయాం వాళ్ళలా!!

అదండీ వారివురీ కథా అండ్ కమామీషూ!!

శ్రీమతి కుమారి సామినేని

స్నేహం, సంస్కారం రెండూ కలిస్తే …బాపు!

        బాపు

  ఆయన మన అభిమాన చిత్రకారుడు, సినిమా దర్శకుడు, హాస్య ప్రియుడు. బాపు తర్వాత బాపు అంతటివాడు.

          చేయెత్తి దణ్ణం పెడితే, తనని కాదు, ఎవరినో అనుకుని వెనక్కి తిరిగి చూసేంత నిగర్వి.

          మనందరం గర్వించదగ్గ మనిషి. ఆయన చిత్రాలూ, కార్టూన్లూ, సినిమాలూ చూసి ఆనందించటం, ఆయన జీవించిన యుగంలోనే మనమూ వుండటం మన చేసుకున్న అదృష్టం.

          ఆయనతో పరిచయం, నాకు అదృష్టంన్నర. మళ్ళీ మాట్లాడితే ఇంకా ఎంతో బోలెడు ఎక్కువ అదృష్టం.

౦                           ౦                          ౦

మొట్టమొదట బాపూగార్ని1996లో హ్యూస్టన్ నగరంలో కలిసాను. చూడగానే ఈయనేనా బాపుగారు అనుకున్నాను. కొంచెంసేపు కూడా అవకుండానే, ఈయనే బాపుగారు అని తెలిసిపోయింది. ఆయనతో మాట్లాడటమే, గిరీశం అన్నట్టు, ఒక ఎడ్యుకేషన్. ఆయన మాట్లాడుతుంటే, హాస్యానికి భాష్యం చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు పూర్తిగా ఆయనతో గడిపి, ఆ రోజుని నా జీవిత పుటలలో భద్రంగా దాచుకున్నాను. అంతకు ముందే నా కథలు కొన్ని చదివానని చెబితే, ముఖమాటం కొద్దీ అంటున్నారులే అనుకున్నాను. నా కథల ద్వారా నేను వ్రాసిన దేవుడి మీద నా నమ్మకాలు నాకే చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు. నా “అమెరికా బేతాళుడి కథలు” పుస్తకం ఇస్తే, కళ్ళకద్దుకుని తీసుకున్నారు. తప్పకుండా చదివి తన అభిప్రాయం వ్రాస్తానన్నారు. ఏదో బిజీగా వుండే పెద్దమనిషి కదా, సరదాగా అన్నారనుకున్నాను. తర్వాత ఒక నెల రోజుల్లో

తనకి నచ్చిన విషయాలూ, సంఘటనలూ వివరంగా రెండు పేజీల్లో వ్రాసి నన్ను ఆశ్చర్యపరిచిన గొప్ప పాఠకుడాయన.

అప్పుడే ఇంకొక సంఘటన జరిగింది. ఆయన కాలిఫోర్నియాకి అనుకుంటాను, ఫీనిక్స్ మీదుగా వెళ్ళాలి. ఫీనిక్స్ ఎయిర్పోర్టులో ప్లేన్లు మారాలి. కొంచెం గాబరా పడిపోయి, మీకు ఎవరైనా తెలిస్తే అక్కడ ఎయిర్పోర్టుకి వచ్చి సహాయం చేయమని చెప్పగలరా అని అడిగారు. తప్పకుండాను అన్నానే కానీ, నాకు ఆ రోజుల్లో అక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళనీ వీళ్ళనీ అడిగితే, చివరికి అక్కడ వుండే ఒకాయన ఫోన్ నెంబరు దొరికింది. ఆయనకి ఫోన్ చేసి, “నేను ఫలానా, మాకు తెలిసిన వారికి మీ సహాయం కావాలి” అని విషయం చెప్పాను. ఆయన పాత తెలుగు సినిమాలో రేలంగిలా “ఎవడ్రా వీడు.. ముక్కూ ముఖం తెలీకుండా సహాయం అడుగుతున్నాడు” అనుకుని వుంటాడు, అయినా ఆరోజుల్లో ఇంకా సాటి తెలుగువాళ్ళం పరస్పరం గౌరవించుకునే వాళ్ళం కదా, అందుకని మర్యాదగానే, “ఎవరండీ ఆ వచ్చే ఆయన” అని అడిగాడు. “బాపూ గారని..” ఇంకా చెబుతుండగానే ఆయన ఎగిరి గంతేసాడని అర్ధమయిపోయింది. తర్వాత బాపూగారు అన్నారు, “అదేమిటండీ, నాకు సహాయం కోసం ఎవర్నో ఒకర్ని రమ్మని చెప్పమంటే, మరీ పెద్ద బెటాలియన్నే

పంపించారు” అని. అదీ ఆయన గొప్పతనమే అని నమ్మటం ఇష్టపడని గొప్ప మనిషి ఆయన.

తర్వాత ఆయన అమెరికాకి వచ్చినప్పుడల్లా ఎక్కడో అక్కడ కలుస్తూనే వున్నాను. ఎంతో ప్రేమగా పలకరించేవారు.

నా “గవర్నమెంటాలిటీ కథలు” పుస్తకానికి రమణగారు ముందుమాట వ్రాసి ఇచ్చారు. బాపుగారు అట్ట మీద బొమ్మ వేస్తానన్నారు కానీ, భాగవతం సీరియల్ తీస్తూ బిజీగా వుండి, వ్రాయలేకపోయారు.

“నన్ను క్షమించాలి. ఈసారి ఒకటి కాదు, మీకు రెండు పుస్తకాలికి బొమ్మలు వేస్తాను” అని ఉత్తరం వ్రాసిన ఎంతో పెద్దమనిషి.

తర్వాత ఒక సంవత్సరం గడిచిందనుకుంటాను. ఒకరోజు ఉత్తరాల కట్టలో, బాపుగారి ఉత్తరం వుంది. ఆయనకి మెహిదీ హసన్ సంగీతమంటే ప్రాణం. మెహిదీగారి సంగీతమంతా ఆయన దగ్గర వుందిట. మెహిదీ హసన్ కొడుకు అమెరికాలో కొలరాడోలో వుంటాడని తెలిసింది. ఇంట్లో కచేరీ చేసుకునేటప్పుడు పాడుకునే కొన్ని టేపులు ఆయన దగ్గర వుండే అవకాశం వుంది కనుక, అవి తెప్పించి పెట్టగలరా అని సారాంశం. “పుస్తకానికి ముఖచిత్రం వేయమంటే కుంటిసాకులు చెప్పాడు, ఇప్పుడేమో సంగీతం టేపులు కావాలని అడుగుతున్నాడు అనుకోకండి. సంగీతానికి సిగ్గూ ఎగ్గూ వుండవు” అని ఉత్తరంలో వ్రాసారు,

బాపూగారంటే నాకు భోలెడు ఇష్టం కాబట్టి, ఎలాగైనా సాధించాలని పట్టుబట్టాను. వరుసగా నాలుగు రోజులు ఎంతోమందికి ఫోన్ చేసి తారీఖ్ హసన్ గారిని పట్టుకున్నాను. ఆయన కూడా పాటలు చాల బాగా పాడతాడు. పేరున్న మనిషి. ముక్కూ ముఖం తెలియని నాతో మాట్లాడతాడని అనుకోలేదు. అయినా చాల స్నేహపూరితంగా మాట్లాడాడు. బాపుగారి గురించీ, ఆయన కోరక గురించీ అంతా చెప్పాను. అంతేకాదు, మెహిదీ హసన్ మద్రాసు వచ్చినప్పుడు బాపూగారు గీసిన ఆయన చిత్రాన్ని నాకు పంపించారు, తారీఖ్కి ఇవ్వండి అని వ్రాస్తూ. మీరు టేపులు పంపిస్తే, నేను మీ నాన్నగారి బాపూ బొమ్మ పంపిస్తాను అని. ఆయన వెంటనే టేపులు పంపించాడు. నేను ఆయనకి బొమ్మ పంపించాను. బాపుగారు “ఆ టేపుల క్వాలిటీ అంత బాగాలేదు కానీ, పాటలు చాల బాగున్నాయి. సంతోషం!” అని చెప్పారు తర్వాత.

తర్వాత నేను ఇండియా వెళ్ళినప్పుడు, బెంగుళూరు నించీ గుంటూరు వెడుతూ, మద్రాసులో బాపు గారింటికి వెళ్లాను.

“మద్రాసులో మా ఇల్లు ఎవరికీ తెలీదు. టాక్సీ ఎక్కి, సినిమా యాక్టర్ మాముట్టి ఇంటికి తీసుకు వెళ్ళమనండి. ఆయన ఇంటికి ఎదురిల్లే మాది” అని చెప్పారు రమణగారు.

నేను వెళ్లేసరికీ ఎండలో బయట నిలుచుని వున్నారు రమణ గారు “వచ్చారా” అంటూ.

“అదేమిటి సార్, ఎండలో నుంచున్నారు” అంటే, “మీకు దారి తెలుస్తుందో, లేదోనని” అన్నారాయన.

“అమెరికానించీ ఇండియా వచ్చివాడిని, సెంట్రల్ స్టేషన్ నించీ మీ ఇంటికి రాలేనా గురువుగారూ” అంటూ, అయన అలా ఎండలో ఎదురు చూసినందుకు బాధ పడ్డాను.

నా జీవతంలో ఎంతో మరువలేని రోజు అది. బాపుగారు కానీ, రమణగారు కానీ, కష్టాలూ సుఖాలూ ఏం మాట్లాడినా, హాస్యం రంగరించే చెబుతారు. జీవితంలో ప్రతి నిమిషాన్నీ అలా అనుభవించటం ఒక వరం. అప్పుడే గుర్తుకి వచ్చింది రమణగారు పెళ్లిపుస్తకం సినిమాలో వ్రాసిన గొప్ప డైలాగ్.

“నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు. ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!” అని.

ఆ మధ్యాహ్నం వాళ్ళింట్లోనే భోజనాలు. భాగ్యవతిగారు, శ్రీదేవిగారు ఆప్యాయంగా వండి, వడ్డించిన అసలు సిసలు గోదావరి వంటకాలు.

అప్పుడే నాకు అనిపించిది. నేనెవర్ని? అంత గొప్పవాళ్ళకి నేను ఏమవుతాను? బాపూ రమణల కళా వైదుష్యం ముందూ, పేరు ప్రతిష్టలకి ముందూ, నేనెంత? ఎందుకు నాకీ మర్యాదలు?

దానికి ఒక్కటే జవాబు. అది వారి సంస్కారం! మనం ఎవరైనా వాళ్ళు చేసేది అదే!

అది ఏ వ్యక్తిలోనైనా ఒక మనిషిని చూడగలిగే గొప్ప వ్యక్తిత్వం!

చీకటిలో చందమామ, ఎన్నారై కథలు అనే నా రెండు పుస్తకాల వ్రాతప్రతులూ బాపుగారికిచ్చాను. “మీకు వీలున్నప్పుడే ముఖచిత్రం వేయండి, గురువుగారు!” అని చెప్పి.

ఇక సెలవు తీసుకుంటానని చెప్పి, “మీ ఇద్దరి కాళ్ళకీ నమస్కారం చేసి వెడతాను సార్” అన్నాను.

కుర్చీలో కూర్చున్న రమణ గారు కాళ్ళు క్రిందకి దించారు. పాదాభివందనం చేసాను.

కార్పెట్ మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాపుగారు, “మీరు అమెరికా వాళ్ళు. షేఖాండ్ ఇవ్వండి చాలు” అన్నారు.

“లేదు. నేను ఇండియా వాడినే. మీ కాళ్ళు ముందుకి చాపండి” అన్నాను.

“నా కాళ్ళు. నేనివ్వను” అన్నారు బాపుగారు.

“మీరు ఇవ్వక పొతే, నేను వెళ్ళను. ట్రైన్ మిస్సవుతాను” అన్నాను.

మా ఇద్దరి పట్టుదల చూసి రమణగారు తీర్పు ఇచ్చారు. “బాపూ.. నీ కాళ్ళు చాపూ..” అని.

ప్రాణ స్నేహితుని మాట జవదాటని బాపూగారు, కాళ్ళు ముందుకి చాపారు. నేను ఆయన కాళ్ళకి నమస్కరించి బయల్దేరాను.

మర్నాడు ప్రొద్దున్నే గుంటూరుకి ఫోన్ చేసారు బాపుగారు. “బొమ్మలు రెడీ.. పంపిస్తున్నాను” అని.

ఆయన ఆ రాత్రి అసలు నిద్ర పోయారా అని నా అనుమానం! బాపుగారు నా రెండు పుస్తకాలకి ముఖచిత్రం వేస్తానన్న మాట నిలబెట్టుకున్నారు.

తర్వాత కొన్నేళ్ళకి, వంగూరి ఫౌండేషన్ వారు హైదరాబాదులో నిర్వహించిన ప్రప్రధమ ప్రపంచ తెలుగు సదస్సు, బాపు రమణల స్నేహానికి షష్టిపూర్తి సందర్భంగా నిర్వహించారు. దానిలో బాపు, రమణల గురించి మాట్లాడి, వారిని ఆహ్వానించే అదృష్టాన్ని నాకు ఇచ్చారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజుగారు. ఆరోజే బాపుగారు, రమణగారు నా రెండు పుస్తకాలు ఎన్నారై కబుర్లు ఒకటి, ఎన్నారై కబుర్లు మరోటి ఆవిష్కరించారు కూడాను.

బాపూ రమణలు, ఒకళ్ళకొకళ్ళు అతుక్కుపోవటమే కాదు, ప్రతి తెలుగువారి హృదయం మీదా పెద్ద ముద్ర వేసారు. చెరపలేనంత ప్రేమ ముద్ర అది. మనిషికీ మనిషికీ మధ్య ఏముంటుందో ఒక అనిర్వచనీయమైన అనుభూతి ద్వారా చెప్పిన సహృదయులు. కళాకారులు. స్నేహితులు.

మిమ్మల్ని మేం మరచిపోలేం గురువుగారూ!

అంతేకాదు మీరెక్కడికీ వెళ్ళలేదు, సార్. మా హృదయాల్లో అలా నిలిచేవున్నారు! నిలిచే వుంటారు!

౦                           ౦                           ౦

సత్యం మందపాటి

satyam mandapati