బతకల్ల  అంటే ఎదకల్లేమో !!

-సడ్లపల్లె చిదంబర రెడ్డి 
~
     కరంటు లేని కాలంలో పల్లి జనాల బతుకులు యట్లుండేవో ముందే రవ్వంత సెప్పినాను! అయినా ఇంగా కొంత లోతుగా——
     వానలు దండిగా కుర్సి ఏట్లో సదుము బాగా వుంటే, కాలువ కింద బూములుండే జనాలంతా ఏట్లో నడుముల్లోతు కాలువ తీసి ఎద్దుల్తో గోరి ఆడ ఊరిన నీట్ని నల్లేరు కాలువతో సేన్లకి తెస్తా వుండ్రి.అన్ని పొలాలకీ ఒగటే కాలువ. అందరూ మడకకి(కాడికి) ఇంత సేపు అని సరతలు(వంతులు) ఏసుకోని పంటలు పండిస్తా వుండ్రి. ఏటి సదుము తగ్గితే బాయినీళ్లే గతి. రెండు మూడు కుటుంబాలకి కలిసి ఒగ బాయి,వాళ్ళు ఉమ్మడి సేద్యం సేసుకొంటా యకరా అర్దము ఎకరా  పంట పెట్టుకోని నీళ్లకి సరతలు ఏసుకోని ఎద్దులు కట్టి కపిల తోలుకోని పంటలు పండిస్తా వుండ్రి.
     యపుడు కరెంటొచ్చినో అపుడు ఒగే బాయికి రెండు మూడు మోటార్లు బిగించ బట్రి. కస్టపడాల్సిన పనే లేదు! స్టాటర్ను ఏల్తో ఒత్తితే సాలు బుస్సు న నీళ్లు బాయిలో నుంచి పైకొచ్చేవి.
     అయిదారు నెల్లు కరెంటు నీళ్లని ఒంతులేసుకోని పదున్లు పారిస్తూనే జనాల బుద్దులు మారి పాయ. పశువులకు గడ్డీ గాదం పెరుగుతా వుండే బీడు బూముల్ని గూడా సాగు సేసేకి మొదలు  పెట్రి. ఒగే కాలువలో రెండు మూడు సరతల నీళ్లు పారిచ్చు కొంటా సరతలు మీరి పాయిరి. ఆరకంగా మాఊరి పొలాల్లో అన్నా దమ్ముల మాదిరీ వున్న కాపోళ్లకి కురువోళ్లకి కొట్లాట పది  బాగా కొట్టుకొన్రి. పోలీసు స్టేషను కానా పాయిరి. అది మర్సి పోకున్నట్లే మాకీ మా మామగారు వాల్ల బందూ బలగానికీ యాజ్యం మొదలాయ. దున్నిన మడి ఎండి నెర్రిలు పొయ్యింది అని ఒగ గంట సేపు ఎక్కువగా కాలువని వాడుకొంటాము అని ఒగరు, సెరుకు కన్నె తోట ఎండి సెదలు తిని పోతా  వుంది రెండు గంటలు ఎక్కువ సేపు కాలువ కావల్ల అని ఒగరు మాటా మాటా పెరిగి కొట్టుకొన్రి. మా నాయనకి, పెద్దన్నయ్యకి రెండు మూడు ఏట్లు పడ్నట్లు గుర్తు.
     కరెంటు నీల్లకి కొట్లాడిండారు అంటే వానలు తగ్గి ఏరు ఎండి కాలువ నీళ్లు రాలేదు అని అర్తం. ఈ నీళ్ల పీకులాట జరుపు కొంటా పంపు సెట్లతో తోడి పోస్తా వుంటే బాయిలన్నీ ఖాళీ అయ్యిపాయ.
     ఊర్లో అందరి కంటే ముందే ఎండేది మా బాయే!! యాలంటే పెన్నేరు దక్షిణం నుంచి ఉత్తరానికి పారుతుంది. దక్షిణానికి ఎత్తు బూములు మావి. మా నీల్లు ఉరంతటికీ పారొచ్చు గాని,మా సేన్లకి ఎవరి నీళ్లూ వొచ్చే అవకాశమే లేదు. అందుకే బాయిలు ఎండుతూనే పచ్చగా వుండే సేన్లన్నీ అగ్గి తెగులు సోకిన వరి మళ్ల మాదిరీ ముదురుకు పాయ.
    *****     *****     *****     *****     ****     *****     *****     *****     *****
     మా నాయనకి బారతం సదివేది బాగ వొచ్చు. వానలు రాని దానికి పక్కూర్లకి పొయ్యి విరాట పర్వం సదివి అన్నో ఇన్నో రాగులూ, దుడ్లూ ఇంటికి తెస్తా వుండె. ఆయప్ప కంఠము శానా  పెద్దది.రాగము తీసి పద్యం పాడి అర్తం సెప్పితే మైలు దూరానికి ఇనిపిస్తా వుండె.
     నాయిన ఇంట్లో వుండాడు అంటే యంత లేదన్నా అయిదారు మంది జనాలు సేర్తా వుండ్రి. బారతం కతలు, రాజకీయము, పెండ్లిపెత్తనాలూ అన్నీ కలిసి పోతావుండె.
     ఒగ నాడు ఇట్లే మా ఇంటి ముందర జనాలంతా సేరిండారు. ఒగాయప్ప “ఏమి అనుమంతప్పన్నా!! వానలు ఇట్ల పనిచ్చె మనం బతికేది యట్లన్నా??” అనె.
    “ఏడిది తీయన్నా! తెలుగోళ్లంతా ఒగతావకి సేరి బాగా బతుక్కో వొచ్చు అని అరవ దేశం నుండి వారగ ఒస్తిమో!! ఇపుదు సూడు తప్పల్దారా పండెండేండ్లాయ!! అతీ లేదు గతీ లేదు. ఆడ బళ్లారి తావ తుంగ బద్రా నది మింద డాము కడితే మనకి నీళ్లు ఒస్తావని శానా ఆశ పడితిమి” అని మా నాయిన అంటా వున్నట్లే…
     “ఊను గదన్నా డ్యాము యట్ల కడ్తారో సూస్తాము అని నువ్వు సైకోలు మింద పొయ్యింటివి.(హిందూపురం నుంచి టి.బి. డ్యాముకు 276 కి,మీ. అక్కడికి వెళ్లొచ్చిన సంగతులు చాలా రోజులు కథలుగా చెప్పే వాడు) అది పూర్తీ అయితే  మన కరు తీరు తుంది,బాయిల్లో నీల్లు పొంగుకొస్తాయి అని సెప్పితివి గదా!! ఇంతకూ అది ఏమయ్యింది??” అనె ఒగాయప్ప.
     అపుడు మా నాయన” అంతా అయ్యిందప్పా. కానీ ఏమి లాబము?? ఈ రాజకీయం పెద్ద తలకాయలు   మనదంకా రానిస్తాయ? ఎత్తు కుర్చీల మింద కూకోనుండే వాళ్లూ, నూరారెకరాలు బూమి సంపాదన సేసిండే వాళ్లూ, రూకలు సల్లేవళ్లూ వాళ్లకి కావాల్సిన సోటుకు కాలువలు తీసి నీళ్లని  గద్దల మాదిరీ తన్నుకు పొయ్యిండారు. ఇంగ మన సేతికి సిప్పే గతి. ఈ కొంపల్ని ఇడిసి వేరే ఊర్లకి వలస పక్షుల మాదిరీ ఎగిరిపొయ్యి బతుక్కోవాల్సిందే” అనె.
     అపుడు ఇంగొగు ఆయప్ప”కాదు రెడ్డీ!! మాకంతూ సదువూ శాస్త్రం తెలీదు.నువ్వు అంతో ఇంతో సదివిండావు, దేశాలు తిరిగిండావు మాకి బతుక్కొనే ఉపాయమన్నా సెప్పగూడదే”అనె.
     అపుడు ‘బుద్ది బూమేలుదాము అంటే అద్రుష్టం గాడిదలు కాస్తాము  ‘అంటుందంట!! అనే సామెత సెప్పి బీడీ అంటిచ్చుకోని గుప్పున పొగ ఇడిసి జరిగిండే కతంతా సెప్పేకి మొదలు పెట్టె………
     మా తాత పేరు కొందయ్యంట. వాళ్లమ్మ పుట్నిల్లు పెనుగొండ దగ్గర బాపన పాల్లంట. అందుకే ఆయప్ప ఆ ఊర్లోనే పెరిగి పెద్దగాయనంట. దానికి దగ్గరోవుండే పందిపర్తి  అనే వూర్లో(1850 కి అటూ ఇటు) సదివి నంట. ఆయప్పని అందరూ బాపనపల్లి కొండయ్య అని పిలుస్తా వుండ్రంట. అదే టయానికి ఇంగిలీషోళ్లు గుంతకల్లు నుంచి బెంగుళూరుకు రైలు రోడ్దు పని మొదలు పెట్రంట.
     వాళ్లు రోడ్డు పని సేపించేకి జనాలని ఎదుక్కోని ఊర్లల్లోనికి ఒస్తే  ఆ కాలం అమాయకం జనాలు బయం పడి పరిగెత్తిపొయ్యి ఇండ్లల్లో దాక్కొంటా వుండ్రంట. మా తాత కొండయ్య శానా ధైర్యమయి నోడంట. అంతో ఇంతో సదివిండాడు గాబట్టి వాళ్లతో” ఏమి సారూ ఒచ్చింది?? మా నుండి మీకి ఏమి పని కావల్లో సెప్పండి శాతనయితే సేసి పెడతాను” అని వాళ్లతో మాట కలిపినంట.
మా నాయన

మా నాయన

    అపుడు వాళ్లు “మీ ఊరి పక్కంటీ పొగ బండి పొయ్యేదానికి రోడ్దు ఏయల్ల.దానికి కష్టం సేసే జనాలు కావల్ల. వాళ్లకి తిండి గింజకు కానీ, కూలికాసులు కానీ ఇస్తాము” అని సెప్పిరంట.
     అపుడు మా తాత” స్వామీ మాన్న బావులారా!! పిలిసి పనులిస్తాము అంటే సేయకుండా వుండే దుర్మార్గులు యా పల్లి లోనూ వుండరు. అయితే రెడ్డీ, కరణాలట్లా దగుల్బాజీలు అమాయికం జనాలకి ఆశలు పుట్టిచ్చో, బయాలు సెప్పో శరీరంలో వుండే రగతం ఇమిరి పొయ్యేదంకా,కండలు కరిగి పొయ్యేదంకా పనులు సేయించుకోని, కడాకి ఉత్త సేతుల్తో ఉసూరని ఇండ్లకి పంపిన దినాలుండాయి. రాజుల కాలము నుంచి ఈ దోపిడీ అలవాటయ్యింది. అందుకే మా జనాలు పెద్దోళ్లని నమ్మరు” అని సెప్పినంట.
     దానికి తెల్ల దొరలు ” అప్పయ్యా!! నువ్వు మంచోని మాదిరీ వుండావు.లేకుంటే జనాలకి జరిగే అన్యాయాలను సెప్పవు! అందుకే నిన్ను నమ్మ బుద్ది అయితావుంది. మీ ఇంటెలుపు దేవుని మింద మా ఏసు క్రీస్తూ ప్రబువును మింద ప్రమాణం సేసి సెబుతా వుండాము. నువ్వు దిన్నమూ జనాలని పనికి పిల్సుకురా తలకాయలు లెక్క బెట్టి ప్రతివారమూ నీకు కూలీలిస్తాము. నువ్వు వాళ్ల జతలో శాకిరీ సేయాల్సిన పని లేదు.పనికి ఒచ్చినోళ్లు మద్యలో ఎల్లి పోకుండా సూసుకో.వాళ్లకి మంచి మాట్లతో దైర్యం సెప్పి యా పని యట్ల సేయల్లో నేర్పిచ్చి మద్యలో తప్పిచ్చుకు పోకుండా సూసుకో. వాళ్లందర్కీ నువ్వే మేస్త్రీగా వుండు” అని సెప్పిరంట.
     అపుడు మా కొండయ్య తాత సుట్టూ పక్కల పల్లెలకి పొయ్యి కుర్ర పెయ్యలట్లా మగ మనుషుల్ని గుంపేసుకోని రోడ్దు పనులు సేపించేది మొదలు పెట్నంట.
     పొద్దున్నే ఈళ్లందరూ ఒగ పల్లి తాకి సేరితే లారీలోనో,రైల్లోనో పనులు సేసే సోటుకు పిల్సుకు పోతావుండ్రంట.అట్ల శాకిరీ వాళ్లు ఎక్కే సోటు ఒగ రైలు స్టేషను కట్రంట . ఆ శాకిరీ వారి పల్లే ఇపుడు శాకార్లపల్లెగా మిగిలింది.(హైదరాబాదు నుంచి బెంగుళూరు వెళ్లే దారిలో పెనుగొండ తరువాత “చాకార్లపల్లి” అనే రైల్వే స్టేషను మీరు గమనించవచ్చు) ఇపుడు మా తాత బాపనపల్లి కొండయ్య కాదు. కొండా మేస్త్రీ!!
     రోడ్దు పని ముగిసిపొయ్యి (1900 అటు ఇటు) రైలు తిరిగేది మొదలు పెడుతూనే– అంతకు ముందు పన్లు సేసిన వారి పిల్లోల్లు సదివింటే పిల్సి ఉద్యోగాలు ఇచ్చిరంట. మా నాయిన అనుమంతప్ప( హనుమంత రెడ్డి= మీసాల రెడ్డి) అంతో ఇంతో సదివినాడు గాబట్టి నెలకు అయిదు రూపాయల జీతంతో రైలు పనిలో సేరమని ఉత్తరం వొచ్చినంట.( మా నాయనకు సత్యనారాయణ రాజు అని వీది బడిలో సదువు సెప్పిన సారు. నాకు 20 సం. వయ్యస్సొచ్చె వరకూ మా ఇంటికొచ్చే వాడు. మా నాయిన అతనికి అన్నం పెట్టి డబ్బులిచ్చి కాళ్లకు మొక్కే వాడు)
     అది రైతుల కాలము. మాకి పదెకరాల ఏటిగట్టు బూమి. దిన్నమూ ఇద్దరు ముగ్గురు కూలిమనుషులు సేసినా పనులు సాగనంత యవ్వారము. అట్లాంటిది ఒగని కింద సేసే శాకిరీ ఎవరిక్కావల్ల!? అని మా నాయిన ఉద్యోగంలో సేరలేదంట.
     వానలు పడక కరువొచ్చినప్పుడంతా నాయన దీన్ని సెప్పుకోని అంగులారుస్తా వుండె. మా పెద్దన్నయ్య (ధనుంజయరెడ్డి) కూదా దీన్ని గుర్తు సేసుకొనే వాడు. యాలంటే 1960 కి ముందే యస్. యస్. యల్.సి. సదివి పని సిక్కక తిరుగుతా వుండె. ఆ కాలంల రైలు పనికి పరీచ్చలు గట్రా పెడ్తా వుండ్లేదంట!!అంతకు ముందు నమ్మకంగా ఎవరు రైలు శాఖలో పనులు సేస్తారో ఆ కుటుంబంలోని వాళ్లకే ఇస్తా వుండ్రంట. (నాకు కూడా రైల్వే డిపార్టుమెంట్లో ఉద్యోగం వస్తే ఎలా తప్పి పోయిందో మరలా చెబుతా)
    ఈ సేద్యాల్తో బతుకులు సాగేది లేదని మా నాయిన రొన్నాళ్లు పెయ్యల యాపారం సేసెనంట.  (అప్పుడు వ్యవసాయానికి ముఖ్యాధారం ఎద్దులు.మా ప్రాంతంలో పశు పోషణ చాలా తక్కువ. అందువల్ల కర్నాటకలోని మైసూరు ప్రాంతానికి పోయి కుర్రదూడలు మందలు మందలు కొని తెచ్చి మారకం చేసేవారు. ఈ వృత్తి 1980 ప్రాతంలో ట్రాక్టర్లు రంగ ప్రవేశం చేసే దాకా ఉండేది) దూరాబారం డబ్బులు తీసుకు పోవడము, దొంగల బయము, అమ్మకం కాక మిగిలిన వాటిని ఉంచుకొనే సోటు లేక దాన్ని వదిలేసి నంట.
     ఇది కాదని ఎనుములు మేపి పాలు అమ్మేది మంచిదని మొదలు పెట్టినంట. బెంగుళూరు ఇందూపురానికి దగ్గర(100 కి.మీ.) అయ్యిందానికి వాటి రేట్లు శానా అయిపాయనంట. అపుడు ఒగ దినం పేపర్లో అయిద్రాబాదు పక్క కరువొచ్చి ఎనుములు అగ్గువగా అమ్ముతా వుండారని రాసిండారంట.
    దేశాలు తిరిగే దాంట్లో మా నాయనది ఎత్తిన సెయ్యి. ఆ యప్ప కాళ్లకి శక్రాలు ఉండావని జాతకంలో రాసిండ్రంట. ఒగతావ పొందుతా వుండ్లేదు. మా ఇంట్లో ఒగ సైకోలుండె. అది ఇరవై నాలుగు ఇంచీల ఎత్తుది. 1977 నేను డిగ్రీ సదివే వొరుకూ వున్నట్ల గురుతు. దాని మింద మేడిన్ ఇంగ్లాడ్ అని రాసిండ్రి.దానికి శక్రాలకి నల్లగా ఉండే మిలిటరీ రిమ్ములుండె.
     మా యమ్మ పుట్తినిల్లు కర్నాటకంలోని కల్యాకన పల్లి అని ముందే సెప్పితిగదా. ఆడ రెండో ప్రపంచకం యుద్దం జరిగేతప్పుడు మిలిట్రీ క్యాంపులుండెనంట.(దీని గురించి మరలా చెబుతాను) వాళ్లు ఎల్లి పొయ్యేతప్పుడు సామాన్లు యాలము ఏసిరంట. అపుడు ఒగ మడత మంచము,సైకోలూ మా నాయిన కొనిన్నంట. ఆ సైకో లేసుకోని అయిదరాబాదుకు (450కి.మీ.) పొయ్యిన్నంట. ఆడ ముసల్మాన్ల దర్బార్లు,ఒగొగురు పదయిదు ఇరవై మంది ఆడోళ్లని పెండ్ళి సేసుకోనేది; వాళ్లు తెలుగు తురకము కలిపి మాట్లాడేదీ, నవాబు వంశమోళ్ళు ఎదురొస్తే తలమింద పేటా తీసి నడుముకు సుట్టుకోని కాళ్లకి మొక్కేదీ కతల మదిరీ సెప్పుతా వుండె.
    ఇట్ల దేశాలు తిరిగేకి దుడ్లు యాట్నుంచి ఒస్తాయి? అని మీరు అడగొచ్చు. ఆయప్పకి దుడ్లతో పనే లేదు. ఒగ బ్యాగులో బారతం బుక్కు,పచ్చడము( రెండు మూడు దుప్పట్లు కలిపినట్లు నేసిన తెల్లని కప్పడము. అప్పుడు మా ఊళ్లో మాల కులస్తులు మగ్గంపై నేసే వారు) సైకోలుకు తగిలించు కొని పోతావుండె. దావలో ఒగ పల్లిలో దిగి ఊరిముందర బారతం పద్యాలు సదివి అర్తం సెబుతా వున్నంట.
     అంతేనంట!! మా ఇంటి తావ సదువు మా ఇంటితావ సదువు– అని షావుకార్లు పిల్సుకు పోతా వుండ్రంట. అట్ల ఒగొగొ వూర్లో వారం పది రోజులు నిల్సి పోతావున్నంట. అంతో ఇంతో దుడ్లు గూడా గిట్టుబాటు అయితా వున్నంట. అయిదరాబాదు దగ్గర మహబూబు నగరం దగ్గర ఒగ పల్లెంట. వాళ్ళు గూడా మా కాపోళ్ల మాదిరీనే కుడికొంగు కాపులంట.(నా చిన్నప్పుడు కుడి కొంగు కాపులు- ఎడమ కొంగు కాపులు అని తేడాలుండేవి) మా నాయిన పద్యాల్ని ఇని శానా సంబరం పడిరంట నెల దినాలు ఆడే ఉంచుకొనిరంట.
     అపుడు మా నాయిన ” అయ్యా నేను గూడా సరి కాపోన్ని! మన్ను దున్ని గింజలు పండిచ్చే మట్టి జనానికి పుట్టినోడిని. మనుషుల బుద్దులు మారిండివి, కాలం మారింది. మా పక్క వానలు కురీకుండా అయ్యిండివి. కురిసినా పెన్నేరు పారకుండా మైసూరు స్టేటోల్లు సెరువులు అడ్డం కట్టిండారు. బుక్కితికి జరిగేది గగన మయ్యింది. ఇంటి నిండా గంపెడు బిడ్లు. ఏమన్నా సాయం సేస్తే మీ పేరు సెప్పుకోని బతుకుతాను” అన్నెంట.
     అపుడు ఆ ఊరి పటేలు జీత గాన్ని పిల్సి వూరి మందలో నుంచి మూడు ఎనుములు పట్టిచ్చినంట.  వాట్ని మాఊరికి సేర్సేకి ఒగ మనిషిని గూడా ఏర్పాటు సేసి నంట. మా నాయిన సైకోల్లో ఇల్లు సేరిన పదయిదు ఇరవై దినాలకి ఎనుములు ఒచ్చినంట. వాట్ని ఉద్దరగా తీసుకొనేకి ఇష్టం కాలేదంట. అపుడు ఎనుములు యాపారం సేసే దళ్లాలి గాళ్లను పిల్సి రేటు గట్టి నూటా యాబై రూపాయలు, తోలుకొచ్చిన మనిషికి దారి బత్తెమూ ఇచ్చి పంపెనంట.
    ఇదంతా గుర్తు సేసుకొన్నంక సింతల పల్లి నర్సయ్య అనే ఆయప్ప” అన్నా ఇదంతా జరిగి పొయ్యింది. మనము యన్ని సార్లు సెప్పుకొన్నా తిరిగి ఒచ్చెల్లేదు. ఇపుడు బతికే మార్గం ఆలోశన సేయన్నా” అనె.
     అపుడు మా నాయిన “అయితే ఒగ పని సేస్తాము. రేపు శుక్కురారుము మంచి దినము. పొద్దున్నే అయిదు గంటల్కే యల్ల బారుదాము. రవ్వంత ఆలస్సిమయినా బాపన ముసిలమ్మ దావకి అడ్డం కూకోనుంటుంది. ఆ తల్లి ఎదురు రాకున్నట్లే తుమకూరు దిక్కుకు పొయ్యి సెరువుల కింద అమ్మకానికి ఉండే బూముల్ని సూసొస్తాము” అనె. (మా ఊరి గుడికి పూజారి లేకుంటే కర్నాటకా నుండి ఒక బాపన కుటుంబాన్ని(సూబ్బప్పస్వామి) తెచ్చి పెట్టారు. అతని తల్లి వయస్సు దాదాపు 85సం. భర్త లేడు. భారీ కాయం,  చెవులు వినపడవు, ఆమె ఉదయం చీకటున్నట్లే రాగి చెంబుతో ఊరి వెనకాలకు వెళ్ళి కాల కృత్యాలు తీర్చుకొని బెంగళూరు రోడ్డులోని మోరీ మీద కూర్చొనేది. అక్కడామె ఉన్నదంటే ఎవరూ ఊల్లకు బయలు దేరేవారు కాదు. కొందరు పెద్ద పలుకుబడి గల రెడ్లు ప్రయాణమై వచ్చి గుడి ముందర నిలబడే వారు. పూజారి వాళ్లను గమనించి దేవుని పూజలు మాని మోరీ దగ్గరకు వెళ్లి ముసలామెను బలవంతంగా ఇంటికి పిల్చుకొచ్చేవారు!! మా ఇల్లు అక్కడకు దగ్గరే ఈ తతంగం నాకు ప్రతి రోజు విచిత్రంగా తోచేది)
    అనుకొన్నట్లే మా నాయినా వాళ్ళు శానా వూర్లు తిరగ బట్రి. యాడా సరి పోలేదు.
    కడాకి మా యమ్మ పుట్టినిల్లు కల్యాకనపల్లి లో ఏటిగడ్డ బూములు అమ్మకానికి పెట్టిండారని తెల్సి ఆసాముల్ని ఎదికేకి మొదలు పెట్రి. ఆ బూములు వేరే ఎవిరివీ కాదంట!! లేపాక్షి గవిరెడ్డి గారివంట. వాళ్ళు మాకి పాత సుట్టాలంట. బందుత్వాలు కలుపుకోని కరీదు గట్రి. సింతలపల్లి నర్సయ్యా వాళ్లుగూడా అదే ఊరితావ బూములు కొన్రి.
      సడ్లపల్లి తావ మా బూములు యగువపక్క ఉండే దానికి ఎవరూ కొనేకి ముందరికి రాలేదు. కడాకి బసనపల్లి వాళ్ల బాయి నీళ్ళు పారుతావని రామిరెడ్డి అనే ఆయప్ప కొనుక్కోనె.
     అట్ల మేము మా ఊరిడిసి నీటి జాడ ఎదుక్కోని ఎగువ సీమకి వలస పోతిమి.

నాకి రోగం తగుల్కోనె !!

 

-సడ్లపల్లె చిదంబర రెడ్డి 

 

     అపుడు నేను నాలుగో క్లాసో అయిదులోనో సదువుతా వుంటి.
     ఒగదినం మేం పిల్లోల్లంతా కల్సి కల్లాల్లో “ప్యాకాట” అడ్తావుంటిమి. ప్యాకాటంటే ఏమంటే.. పుల్లలు వాడి పారేసిన అగ్గి పెట్టెల్ని నిలివునా రెండు బాగాలు సేస్తే రెండు ప్యాకులు. సిగరెట్టు పెట్టెల్ని గూడా అట్లే సేస్తా వుంటిమి. అయితే సిగరెట్టు ప్యాకులు శానా అపురూపము!!  ఎవరన్నా పట్నానికి పోయినపుడు ఏరుకోనొస్తే ఈరో కింద లెక్క!! వానికి శనక్కాయలు, బెల్లపుంటలు,ఏపిన ఉలవ బ్యాళ్లు ఇచ్చి జత సేసుకొంటా వుంటిమి. రెండు అగ్గిపెట్టి ప్యాకీలు ఒగ  సిగరెట్టు ప్యాకీకి సమానము.
     ఆ ప్యాకిల్ని ఆడే పిల్లోళ్ల తావ వుండేవాట్ని బట్టి రెండు, మూడు, నాలుగు… కలిపి ఒగదాని మిందొగిటి దొంతులుగా పేర్సి, పడిపోకుండా కాసింత మన్ను పోసి, వాటి సుట్టూ గుండ్రముగా గీత గీస్తా వుంటిమి. వాటికి పదయిదు ఇరవై అడుగుల దూరంలో గురుతుపెట్టి, ఆట్నుంచి గెత్తాలు(చేత్తో విసరడానికి అనువుగా ఉండే చెక్క రాయి) ఇసర్తావుంటిమి. ఆటగాళ్లు అందరూ ప్యాకల తాకి ఇసరినంక, వాటికి అందరికంటె దూరముగా ఎవర్ది పడితే వాడు మొదట ప్యాకులు  గెల్సుకోవచ్చు. యట్లంటే…..
     గెత్తా పడిన తావ కుడికాలుంచి యడమ కాలు యనక్కి సాపి, కుడి కాలు కింద నుంచి చేత్తో గెత్తాని ప్యాకల మిందికి ఇసరల్ల. గెత్తా తగిలి గీసిన గీత దాటి బయటపడినవన్నీ  వాడే గెల్సినట్లు లెక్క.
     ఆ ఆట అర్దం అయ్యిందో లేదో యనక నుంచి మా యన్న(నాయిన)వొచ్చి బర్ర కట్టెతో ఒగటి అంటిచ్చె. జుట్టు పట్టుకోని ఇంటికి ఈడ్సుకు పాయ. అంత సేపటికి మా యమ్మ అటకడు నీళ్లు పొయ్యిమింద కాగబెట్టి, ఇంటి ముందర మగోళ్లు పోసుకోనే బండ తావ పెట్టిండె. నాయిన కొట్టిన ఏట్లకి ఏడుస్తా వుండే నన్ని మా యమ్మ అట్లనే బండ మింద కుదేసి అంగీ ఇప్పి బుడుకూ బుడుకున నాలుగు సెంబులు నీళ్లు కుమ్మరించె. పచ్చి సీకాయి యేసి తలంతా రుద్దె. సీకాయి కండ్లల్లో పడి మంటకెత్తుకోనె.
    ఈడ పచ్చి సీకాయంటే ?? ఇనండి…. మా యమ్మ పుట్నిల్లు కర్నాటకము-కోలార్ జిల్లా– లోని పెన్నా నది గట్లో వుండే కల్యాకన పల్లి(కలినాయకన హళ్లి)(అప్పుడు దాన్ని మైసూర్ స్టేట్ అనేవారు) ఆ కాలంలో పెన్నా జీవనది!! ఆ ఏటి గట్లో సీకాయ పొదలు దండిగా వుండె. అవి పెరగల్లంటే ఇరవై నాలుగ్గంటలూ నీళ్లు పారతా వుండల్ల. ఆ సీకాయి పొదలు పిందిలు ఏసినప్పట్నుంచి మా యవ్వ (అమ్మమ్మ) పచ్చివే తెస్తావుండె. పండి ఎండినంక మా ఊర్లో కావాల్సినోళ్లకందరికీ మూటలు మూటలు ఇస్తావుండె.
    నీళ్లు పోసుకోనేది అయితూనే నా శరీరమంతా దద్దులు పొంగిండివి!! కండ్లు కాల్సిన సింత నిప్పుల మాదిరీ యర్రగా అయ్యిండివి. మంటకి తట్టుకో లేక నేను గట్టిగా ఏడ్సబడ్తి. అపుడు మాయమ్మ “పచ్చి సీకాయి ఒంటికి పట్టక అట్లయ్యిది. రవ్వంత సేపటికి తగ్గి పోతుంది.” అని సెప్పి గుడవలో వుండే బెల్లపుంట ఇచ్చి ఒదార్సబట్టె. అయినా దద్దర్లు తగ్గలేదు!!
   అంత సేపటికి మా యవ్వ (నాన్నమ్మ) నా దగ్గిరికొచ్చి “అయ్యో బాశాలీ నీళ్లు పోసేటవుడు కుమ్మరి పులుగో, జర్రో కర్సినట్లుంది. అందుకే ఇట్లయ్యింది.బెస్తోళ్ల ఇంట్లో నీళ్లు తాపిచ్చుకురా పో ” అని మా యమ్మని పురమాఇంచె.
   అపుడు నన్ని యండ్లో నిలబెట్టి తలకాయి ఆరబెట్టి,సెక్క దూబానితో పద్ద పెద్దగా దూబి ఒగ అంగీ తొడిగె. అది రెట్ల మింద సినిగింటే బాగలేదని ఏడిస్తి. దాన్ని ఇప్పదీసి సూదీదారంతో నాలుగు కుట్లేసి ఒగ సెంబు తీసుకోని నన్ని బెస్తోళ్ల ఇంటికి పిల్సుకు పాయ.
     బెస్తోళ్ల ఇల్లుండేది ఊరి మద్యలో. నేనూ మా యమ్మా పోతూనే బెస్త ఈసూరమ్మ “ఏమి ఆదెమ్మక్కా పిల్లోన్ని పిల్సుకొస్తివి? ఏమయ్యిది??” అని అడిగె.
     “అయ్యో సూడమ్మా! ఇంటి ముందర నీళ్లు పోసేతవుడు దీని రావిడి అణగా ఏడిదో పులగ పయ్యి మింద(ఒంటి మీద) పారాడి నట్లుంది. మాగిన సింత తొడల(తొనల) మాదిరీ దద్దు లొచ్చిండివి అపుట్నుంచి ఈయప్ప ఏడుపు సూసేగ్గాదు ” అనె.
    అపుడు ఆయమ్మ నా అంగీ ఇప్పి “అవును కదక్కా పిల్లోడు గాబట్టి ఓర్సుకో నుండాడు. మనట్లా వాళ్లయితే యా బాయిలోనో పడ్తావుంటిమి.” అని సెప్పె. అంతవొరుకూ ఊరికే వున్న నేను గట్టిగా ఏడ్సబడ్తి. “ఊరుకోరా అప్పయ్యా! గడియలో తగ్గి పోతుంది అని ఓదార్సి ఇంట్లోకి పొయ్యి గలాసు నిండా నీళ్లు యెచ్చి నన్ని తాగమనె.
    నేను లోటాడు నీళ్లు గొటగొట్న తాగేస్తి. ఇంగ రవ్వన్ని నీళ్లు ఆ యమ్మ పుడిసిలి నిండా తీసుకోని నా ఒల్లంతా తుడిసె. సల్లగా వుండే ఆ నీళ్లు తగుల్తూనే నాకు సగిచ్చినట్లాయ. కాసంత సేపటికి దద్దులన్నీ తగ్గి పాయ.
    ఇంటికి పొయినంక మా యమ్మ తో అడిగితి” అమా మనమూ బెస్తోళ్లూ ఒగే బాయి నీళ్లు తాగుతాము గదా!! అట్లాది మనింట్లో తాగితే తగ్గని రోగము వాళ్లింట్లో తాగితే యట్ల తగ్గుతుంది?? అని అడిగితి.
     దానికి మా యమ్మ”వాళ్ల సెయ్యి వాసి(హస్త వాసి) అట్లాది.యంత పెద్ద రోగమైనా వాల్ల ఇంటి గడపతాకి పోతూనే దిగి పోవాల్సిందే. బెస్త పెద్దప్పయ్య అని ఆ ఇంటి యజమానిపేరు. యంత మొండి రోగమైనా ఆయప్ప నయం జేస్తావుండె. సుట్టూ పక్కల ఇరవై ఆమడ్లనుండి ఆయప్పని ఎదుక్కోని వొస్తావుండ్రి. ఆయప్ప పేరూ క్యాతులు సూసి ఓర్సని జనాలు ఏడిదో సెడుపు సేస్తే ఈ నడమే సచ్చి పాయ.
     ఎవరి కతలో యాల!! అయిదారేండ్లకి ముందర నాకి ఒగ దినం ఇపరీతమైన జరం. మీ నాయిన సూస్తే సైకోలేసుకోని దేశాలంటీ పొయ్యిండాడు. రాగి సేను కోతకొచ్చింది. కూలోల్లంతా తట్లుతీసుకోని యల్బార్తా వుండారు. వాళ్ల జతలో ల్యాకుంటే ఎన్ను యాడిది ఆడ పరిగిలు ఏరుకొనే వాళ్లకి ఇడ్సిపెదతారు. రాగి తాళు జానెడు కొయ్య ఇడిసి కోస్తారు. బంగారట్లా తాళు అద్దువాన్నమయి పోతుంది” అని అనుకోని, బెస్తోళ్ల ఇంటికి పోతి. నేను పొయ్యే తప్పటికి బెస్త పెద్దప్పయ్య పొయ్యి ముందర కూకోని సలి కాపుకొంటా వుండాడు. నన్ని సూసి” ఏమే ఆదెక్కా! ఇంతపొద్దున్నే ఒస్తివి?” అనె.
    ” మామా!! సేని తాకి కూలోళ్లు పొయ్యిండారు. నీ కొడుకు ఊర్లో లేడు. నాకి రాతిరి నుంచి ఒగటే సలీ జరము ఏడిదన్న ఒగ మాత్ర ఈ మామా” అని అంటి.
     “థూ నీ యక్క సలీ జరానిగ్గూడా మందులు మాకులూ కావల్నా?? కోమటి లచ్చుమయ్య అంగట్లో రెండు బొట్లిచ్చి కాపీ పుడి కొనుక్కొని డికాషను సేసుకోని తాగుపో అదే పోతుంది.” అనె.
     ” నాదగ్గర బొట్టూ లేదు. గుడ్డి కాసుగూడా లేదు. యావిదన్నా ఒగ మాత్ర ఇయ్యి మామా” అంటి  .
   అపుడు తలకాయి గీరుకోని, అక్కడిక్కడ సూసి, తుబుక్కున పొయ్యిలోని బూడిద మిందకి ఎంగిలి ఉమిసి మూడు వుంటలు మాదిరీ సేసి “మూడు పూట్లా మూడు ఏసుకో పో” అని మంత్రించి ఇచ్చె.
    అపిటికే రెండు బార్ల పొద్దెక్కింది ఆయప్పిచ్చింది బూడిదో, గుంత సేని మన్నో అనుకో లేదు. తూరుపుకు తిరిగి దేవునికి మొక్కోని ఒగ మాత్ర మింగి కక్కుల కొళ్లి, ఈత తట్టి తీసుకోని పడేదీ లేసేదీ తెలీకుండా సేని దావ పడ్తి. అంత సేపటికి కూలోళ్లు గనిమింద నిలబడి ముణాలు పట్టిండారు. నేను గూడా ఒగ మునం అందుకొంటి సేని కోతలయ్యే పొద్దుకి నా సలెక్కడ పాయనో, జర్రమెక్కడ పాయనో నాకే తెలీదు.
      ఇంగొగ సారి…… అది యండ కాలము. పగలంతా మిరప సెట్లు తవ్వకాలు సేసి ఇంటికి యల్ల బార్తి. సురుకు తీసుకోనె. కాళ్లు మడిసేకి(ఒంటేలుకు) పోతే ఒగటే మంట. అట్లా పొద్దులో పెద్దప్పయ్య ఎదురొచ్చె. నా బాద సెప్పుకోని ఏడిదన్నా మందియ్యి మామా అని అడిగితి.
     అదే టయానికి ఉప్పరోళ్లు ఎనుంపోతులు మేపుకోని, ఊర్లోనికి తోలుకోని ఒస్తావుండ్రి. అవి ఏటి కెచ్చుల్లోనా కానుగ తోపుల్లోనా పచ్చి మ్యాత బాగా మేసి నట్లుండివి వర్సగా ప్యాడ దుస్స బట్టె!!(పేడ వేయ సాగాయి) దాన్ని సూసిన మామ “ఇంత మాత్రానికే మందూ మశానమూ యాలసే! ఆ ప్యాడ కొంగులోకి ఏసుకోని బాగా పిండి రసం తాగు టక్కున తగ్గిపోతుంది” అనె.
     అట్లే సేస్తి…. కడుపులో ఎవరో సెయ్యి పెట్టి తీసేసి నట్ల సురుకు తగ్గి పాయ.” అని ఆయప్ప సెయ్యి వాసి గురించి సెప్పె.(ఇదే పేడ వైద్యాన్ని మా అమ్మ 1980 ఆ ప్రాంతంలో కూడా మా మాట  వినకుండా ఆచరించేది!!)
    పయ్యంతా దద్దర్లొచ్చే రోగం ఆ పొద్దు తగ్గి పాయ కానీ తిరగ యపుడు నీళ్లు పోసుకొన్నా అట్లే అయితా వుండె. నేను బెస్తోళ్ల ఇంట్లో నీళ్లు తాగి వొస్తానే ఉంటి. రొన్నాళ్లకి దగ్గూ పడిశం తగుల్కోనె.
     ఒగ దినం మాయమ్మ నాయినతో ” ఏమండ్రా! పిల్లోడు రాతిరి పూట నిద్దరేపోడు. కయ్ కయ్ అని దగ్గీ దగ్గీ సచ్చి సున్నమయితా ఉండాడు. అస్పత్రికన్నా పిల్సుకు పో” అనె.
    అఫుడు మా నాయిన” ఈడు పుట్టిండేది ఆసుపత్తిరిలో. పాలు సాలక సక్కెర నీళ్లు పోసి శీతల శరీరమయ్యింది. దాంజతకి ఈడు బయ్యుమూ దిగులూ ల్యాకుండా కుక్క నేరేడికాయలూ, సొండి సెరుకులూ(లేత చెరుకు) తిని తలమీదకి తెచ్చుకోని వుండాడు. రొన్నాళ్లు పిల్లోల్ల జతలో తిరగ నియ్యకుండా పత్యం సేసి పెట్టు అదే తగ్గి పోతుంది ” అనె.
     ఒగదినం ఇసుకూలుకు పోతి పిల్లోల్ల జతలో కూకోని దగ్గేకి మొదలు పెడ్తి. దగ్గి దగ్గి తిన్న సంగటి అంతా వాంతి సేసుకొంటి. అయివారు ఇంటికి పంపిచ్చె. ఆ పొద్దు మా నాయిన ఊర్లో వుండ్లేదు. అయిదారుదినాలకి ఒచ్చె. ఒస్తూనే మా యమ్మ కొట్లాట మొదలు పెట్టె .
    “పిల్లోనికి బాగలేదు. మేపుకొచ్చే వాళ్లు లేక ఎనుములు పాలు తక్కువిస్తా వుండివి. పెద్ద పిళ్లోళ్లు సేన్లకి నీళ్లు సరిగ్గా కట్టక అవి ఎండుకు పోతా వుండివి. అంగిడిలో అప్పు శానా అయ్యింది. కాపీ పుడి గూడా పుట్టందుము లేదు. ఈ సంసారము ఏగేకి నాకి శాతగాదు. బాయన్నా సెరువన్నా సూసుకొంటాను” అని ఏడ్సబట్టె.
    అపుడు నాయిన నన్ని దగ్గరికి తీసుకోని కండ్ల మిందకి పడిండే యంటికిలు యనిక్కి తీసి నులక దారముతో జుట్టు కట్టి” ఈ పొద్దు బాగనే ఉండాడు కదా!? ఊరకే ఇల్లెగిరి పొయ్యేటట్ల యాల అరుస్తావు??” అనె.
    ” మూడు దినాలకి ముందర సూడాల్సింటివి పిల్లోని అవస్తలు.నిన్నా, ఈ పొద్దూ మాత్రమే అట్ల వుశారుగా ఉండాడు. తిరగ యపుడు కొప్పెత్తు తాడో ఏమో పెద్దాసుపత్రికన్నా పిల్సుకపో” అనె.
    నాయిన ఏమీ మాట్లాడలేదు. స్నానం సేసి బట్లు మార్సుకోని నాగ్గూడా వుదికిన అంగీ తొడిగి ఇందూపుర గవుర్మెంటాసుపత్రిక్కి పిల్సుకు పాయ.
    అదే నేను తొలి సారి ఆస్పత్రికి పొయ్యింది. శానా పెద్దగా వుంది. దూరం దూరంగా ఆడొగిటి ఈడొగిటి రూములు మాదిరీ కట్టిండారు. వాటి మద్యాలో పెద్ద పెద్ద యాప మాన్లు పెరిగిండివి. ఒగ డాకుట్రు నన్ని పరీచ్చలు సేసి పిల్లోడు బాగనే వుండాడే అని అను మానం పడుతూనే ఇంగొగు డాట్టరు దగ్గిరికి పొమ్మనె. ఆయప్ప పోటోలు(ఎక్స్రేలు) తీసే రూము తావ యాప మాని కింద సెక్క కుర్సీమింద కూకోని వుండె. నన్ని పరీచ్చలు సేసి “బాగనే వుండాడుగదా పెద్దాయనా??” అనె. అపుడు మా నాయిన….
    “సారూ ఇపుడు మీరు బాగుంది అంటారు. మాడాలు(మేఘాలు)మూసు కొంటేనో, తేమలో తిరిగితేనో తిరగబెడుతుంది. తగ్గీ తగ్గీ ఊపిరి తిప్పుకొనేకి శాతగాక ప్రాణం పొయ్యేవాని మాదిరీ తనుకు లాడతాడు. రాతిరి పూట గొంతులో గొర గొర అని పిల్లి కూతల మాదిరీ శబ్దమొస్తుంది. రాతిరి పొద్దు నిద్దరే పోడు. బొక్క బార్లా తల కిందకేసి పిర్రలు పైకెత్తుకోని గస పోసు కొంటాడు. పడిశం పట్టి బట్నేల్లావు సీమిడి ముక్కులో కార్తావుంటుంది.” అని సెప్ప బట్టె.
    అపుడు డాక్టురు ఒగాయప్పని కేకలేసి పిల్సి బకీటునిండుకా నీళ్లు తెమ్మనె. తెస్తూనే నేలమింద సల్ల మనె. సల్లి బురదయినంక నన్ని దానిమింద బిరబిరా నడసమనె. నేను ఆయప్ప సెప్పినట్లే సేస్తి. అపుడు డాకుట్రు మా నాయన్ని పిల్సి “సూడప్పా పెద్దాయనా! తేమలో తిరిగితే పడిశం పడుతుంది దగ్గొస్తుంది అంటివి. ఇపుడు సూడు అర్దగంట నుంచి తిరుగుతా వుండాదు ఏమీ కాలేదు. బాగుండాడు కదా!!” అనె.
     మా నాయిన గుటకలు మింగుతా ఏమీ మాట్లాడ లేదు.
      అపుదు దగ్గిర దగ్గిర నాకు 9-10 ఏండ్లు ఉంటుంది. తేమలో తిరిగేది అంటే ఇది కాదని తెలుస్తానే ఉంది!! అట్లాది ఇంత సదువు సదివిన డాక్టరు నా కొడుక్కి అర్తం కాలేదంటే ఏమనుకో వల్లో ఆ బగవంతునికే తెలియల్ల??  (ఇప్పుడు నా వయస్సు 64. సం. నిత్య రోగిని ఎన్ని మందులు తిన్నానో నాకే తెలియదు. అయినా ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రం వెళ్ల లేదంటే నమ్మండి)
    అపుడు ఒగ రూము తాకి పొమ్మన్రి. ఆడ నాపేరు రాసుకోని సీటీ రాసిచ్చిరి. దాన్ని తీసుకోని ఇంగొగ రూముతాకి పోతే, తెల్ల బట్లేసుకోనుండే నర్సమ్మ “ఖాలీ సీసా కొనుక్కురాపో మందే సిస్తాను” అనె.
    ఆసుపత్రికి ముందరే సన్నవి,పెద్దవి వర్సగా పెట్టి ఎవరో సీసాయిలు అమ్ముతావుండ్రి. అణా(ఆరు పైసలు) ఇచ్చి సన్న సీసాయిని తెస్తిమి. నర్సమ్మ దాన్నిండా ఎర్రగా వుండే మందు నించి, సన్న గొట్టమట్లా దాంట్లో  రవ్వంత పోసి ఆడే తాగమనె. దాని వాసనకి వాంతికొచ్చినట్లాయ. అయినా కండ్లు మూసుకోని గుటుక్కున మింగేస్తి. తియ్య తియ్యగా సారాయి వాసన మాదిరీ వుండె. దాన్ని దినానికి మూడు పూట్లా తగమన్రి.
    ఆపొద్దుట్నుంచి దిన్నమూ పొద్దున్నే కుడి పక్కలోనే లేయల్ల. ఎవరి మొకమూ సూడకుండా దేవిని పటాలు మాత్రమే సూడల్ల. ఇటికి పొడితో పండ్లు తోముకోని ముకము కడుక్కోని సూరే బగవంతునుకి మొక్కుకోవల్ల. పణమింద అడ్డం ఈబూతి దిద్దుకోని “స్వామీ రామా నారాయణా పరమాత్మా పరంధామా నన్ని బాగా కాపాడప్పా!! నా రోగం నయం సేయప్పా ” అని దేవుని పటాలకి మొక్కుకోవల్ల అని  నాయిన నాకి అలవాటు సేశె.
   ఇట్ల మొదలైన రోగము నన్ని ఎట్ల సంపుకు తినిందో సెప్పాల్సింది శానా వుంది. అవసరమయినవుడు సెప్పుతా…
*

కాలమయి పోయిన “కళల” పంటలు!!

 

సడ్లపల్లె చిదంబర రెడ్డి 
     నేను ముందే సెప్పితిగదా– మా కాపుదనము గుంపు, కమసలోళ్లు ఒచ్చి ఊరు కట్టుకోని వుండేదని!! అది యపుడు ఒచ్చిండారో తెలీదుగానీ 1850 ఇరుమైల్లో (దాదాపు) ఒగ పెద్ద ఇల్లు కట్టుకో నుండారు. అది యంత పెద్దదంటే తూరుపు బెంగులూరు రోడ్డు నుంచి పడమర ఊరిలోని కంకర రోడ్డు దంకా నూరు అడుగుల పొడవు, ఉత్తరం నుంచి దచ్చిణానికి 250 అడుగులు ఎడెలుపుతో నాలుగు బాగాలుగా ఒగే పునాది మింద కట్టిండారు. నాలుగు ఇండ్లకీ తూరుపు పడమరల దిక్కులకి వాకిళ్లు. విడివిడిగా వున్నాకుడా ఉత్తరం దచ్చిణంగా అన్ని ఇండ్లనూ కలిపే వాకిళ్లు. వాటికే వేరేగా సేద బాయి.
     అన్ని ఇండ్ల లోనూ బంగారు పనికి, ఎండి పనికి, ఇనప సామాన్లు సేసేకి,ఇగ్రహాలు సెక్కేకి వేరే వేరే రూములు. పడమర పక్క కవురుసాల్లు. ఇంత పెద్ద ఇంటిని ఆకాలంలో ఆరు నెల్లకే కట్టిరంట!!
     ఆ సుట్టూ పక్కల ఇరవై ముప్పై పల్లిల్లో పెద్ద పేరు తెచ్చుకొన్న ఆశార్లంట వాళ్లు. రైతుల కంతా అప్పులిచ్చేదే కాకుండా  వాళ్ల యగిసాయానికి(వ్యవసాయానికి) కావల్సిన ఇనుము సామాన్లు, ఎద్దుల బండ్లు ఇతరాలన్నీ తయారు సేసి ఇస్తావుండ్రంట. ఇంగ బంగారు, ఎండి సొమ్ములు సేసేకి వాళ్లకి మించినోళ్లు లేరంట!!
     అందుకే ఆ సుట్టూ పక్కల ఊర్ల జనాలు యాబై ఎద్దుల బండ్లు కట్టుకోని, బాగా బలిసి సేగు బారిండే పనస, మామిడి, నేరిడి,పత్తి(మేడి), ఊడుగ,యాప, ఇప్పి… ఇట్లా మాన్లన్నీ నరుక్కోనొచ్చి కట్టి పొయ్యిరంట. పెద్ద పెద్ద దూలాల మింద శక్క పలకలు పర్సి కట్టిన మొదతి మాడీ అదేనంట. మేము ఆ ఇల్లు కొన్నంక ఒగసారి ఇంగులీసోళ్లు టూరొచ్చి– ఈ రోడ్లో నుంచి ఆ రోడ్లో దంకా వరుస కంబాల్తో కనిపించే ఇంటిని ఇసిత్రంగా సూసి పోటో తీసుక పోయిండ్రి!!
     మా ఊర్లో మొదట సదువు నేర్సింది కూడా ఆశార్లేనంట!! ఊరికి ఉత్తరం దిక్కు ఇరవై యకరాల దంకా దచ్చినం పక్క బసనపల్లికి ఆనుకొని ఇరవై యకరాల దంకా బూములు వాళ్లవే. ఆ తావ బాయిలు పండ్ల తోటలూ వుంటా వుండె. ఆంజనేయుని గుడి కట్టిచ్చి మొదట పూజారి తనంగూడా వాళ్లే సేస్తా వుండిరంట!!(దీనికి సంబంధించి వెంకట్రామా చారి చెప్పిన కథనాల్లో వివరించ గలను).
    ఆశార్ల నాలుగిండ్లలో ఒగ బాగానికి హక్కుదారు నీకంఠాశారి. మా ఊరి కూలి బడికి ఆయప్పే అయ్యవారంట.(కూలిబడి=డబ్బులు, ధాన్యం తీసుకొని చదువులు చెప్పే వీధి బడి) 1930 నుంచి గవుర్నమెంటు ఇసుకూలు వొచ్చే ఒరుకూ (1955) ఆయప్పే తన సొంత ఇంట్లో సదువులు నేర్పిచ్చిండాడు. ఆ ఇంటిని 1960 లో మాకి ఆయప్ప అమ్మేసి పట్నానికి ఎల్లిపాయ.
     ఈది బడి నడిసే తపుడు 1930 ఆ సగాల్లో దాని ముందర ఒగ కంప సెట్టు నాటిండాడు. అది సూసేకి జాలి మాను(నల్ల తుమ్మ) మాదిరీ వుండే దానికి అందరూ దాన్ని సీమ జాలి (సర్కారు తుమ్మ)మాను అని పిలుస్తా వుండ్రి.
     మేము ఇల్లు కొని రిపేరీ సేస్తా వుంటే ముండ్ల సెట్టు ఇండ్ల ముందర వుండకూడదు, దాన్ని నరికేయమని శానా మంది మా నాయనికి సెప్పిరి. అయితే అది అపుటుకే పెద్దగా పెరిగింది. ఎనుములు కట్టేసేకి నీడగా ఉంటుందని మా నాయన దాని కిందపక్క వుండే సన్నాబన్నా కొమ్ములు కత్తిరించి ఇడిసి పెట్టె. బెంగలూరు రోడ్డుకు పక్కలోనే వుండే ఆ సెట్టు, ఆకాశానికి తీగల మాదిరీ పెరుగుకొంటా గుత్తులు గుత్తులు కాయలు కాయబట్టె. సుట్టూ పక్కల వూర్ల జనాలు వాళ్ల సేన్ల సుట్టూ కల్ల(కంచె) మాదిరీ పెంచు కొనేకి తిరునాల్లకు ఒచ్చినట్ల ఒచ్చి కోసుకు పోబట్రి!!
     కరువు వొచ్చి మేము ఊరిడిసి కర్నాటకాకు వలసపొయ్యి,12 ఏండ్లకు తిరిగొచ్చి, ఇంగొగు ఊర్లో సేద్యం సేసి ఆడ కూడా ఓడిపోతిమి!! వానలు ఏటిచ్చి మా ఊరిపక్క పల్లెలన్నీ ఏరు పురుగు కొరికేసిన మల్లె తీగల మాదిరీ ఎండి దుంప నాశన మైనా… ఈ సీమ జాలి సెట్టు మాత్రం వాడబట్ట లేదు!! ఇపుడు యా పొలం బీడు నేల్లో సూసినా సీమతుమ్మ మాన్లే సిట్టడివి మాదిరీ అల్లుకు పోయిండివి. రాత్రీ పగలూ కష్ట జీవులు ఆ సెట్లని నరికి లారీల్లో తమిల దేశానికి తోలినా తరుగుతా వుండ్లేదు.
    బూమికానా కనిపించే మొదల్లు నరికేసినా, లోపలుండే కూటేర్లు మాత్రం రాచ్చాసి గడ్డల మాదిరీ ఊరి పొయ్యిండివి. ఇపుడు ప్రొక్లెయినర్లు తెచ్చి ఊడబెరికి కాల్సి బొగ్గులు సేసి పాత ఇనుము కరిగిస్తావుండే కార్కానాలకి అమ్ముతావుండారు.
    మా ఇంటి ముందర మాన్లోని కొమ్మలను ఆర్నెల్లకొగసారి నరుకుతా వుంటిమి.వంత సేసేకి గ్యాసు ఒచ్చినంక ఇడిసిపెడితిమి. సింతమాను మాదిరీ పెద్దగా పెరిగిన ఆసెట్లో నల్ల సీడ(పేను బంక) పడిండె. అవు సుట్టూ పక్కల ఇండ్లల్లో పడి గలీజు అయితా వుందని పంచాయితీ పెడితే 2005 కు యనకా ముందు దాన్ని నరికేస్తిమి.(దాని వేళ్లు ఇంకా భూమిలోనే ఉన్నాయి.సీమ ప్రాంతం సర్కారు తుమ్మకు అదే ఆది వృక్షమని చెప్పడాన్ని ఎవరైనా శాస్త్రీయంగా పరీక్షించవచ్చు).
     ఈ సీమ జాలి నుంచి ప్రయోజనం ఏమంటే ఇక్కడ వానల్లేక బూముల్లో పంటలు లేక పోయినా యాడజూసినా పచ్చగా కనిపిస్తాయి.బీదా సాదా వంట సెరక్కు దేవుని సెట్టు మాదిరీ ఎంత నరికినా సిగరిస్తానే వుంటుంది!!
     ఒగనాడు పది అడుగులకు మించి పెరిగిన సెరుకు తోట బూముల్లో తుమ్మ మాన్లు ముండ్లతీగల్తో సీమలు దూరని సిట్టడవి, కాకులు దూరని కారడవి మాదిరీ పెరిగిండివి.(01.08.2015 నాడు పొలాల్లో తీసిన ఫోటో జతపరుస్తున్నాను.ఈ రోజుదాకా ఇక్కడ ఈ వర్షాకాలంలో ఒక పదును వాన కూడా పడలేదు!!).
     ఇంగ కమసల ఆశార్ల కతకొస్తాము!!
IMG_0010
     మేము కొన్న దానికి ఉత్తం పక్క ఒగటి, దచ్చినం పక్క రెండు ఇండ్లూ వాళ్లవే.
     పొద్దున్నే లేస్తూనే వాళ్ల ఇండ్ల ముందర జనాలంతా పరస మాదిరీ సేరుతావుండ్రి. కొత్తగా ఇనప సామాన్లు సేయించేకి, పాతవి సరిసేసేకి రైతులు ఒగరి మింద ఒగరు పడతావుండ్రి. యంత మంది ఆశార్లు సుత్తి, సమ్మెట, శాణము, పట్టుకారాల్తో పనులు సేసినా నాలుగయిదు కొలిమిలు పెట్టి పెద్ద పెద్ద తిత్తుల్తో ఊదినా, బండ్ల కొద్దీ బొగ్గులు కాల్సినా పనులు తెముల్తా వుండ్లేదు!!
     వాళ్ల ఇండ్లలో లో కణజాలు(భూములోపల పాత్రలుగా కట్టినవి) పై కణజాలు(భూతలానికి పైన కట్టినవి) ఉండేవి.యాభై పల్లాల(బస్తాల) గింజలు పట్టేవి.(పాడుబడిన మాయింట్లో ఇప్పటికీ కణజం వుంది.అయితె అక్కడికి వెళ్లడానికి కుదరలేదు) పంట కోతలయినంక రైతులిచ్చే గింజల్తో ఆ కణజాలన్నీ నిండిపోతా వున్నెంట!!
     ఇంగ వాళ్లు సేస్తా వున్న ఎండి, బంగారు సొమ్ములు, పంచలోహ ఇగ్రహాలు యంత సుందరముగా,యన్ని కండ్లున్నా సూసేకి తనివి తీర్తా వుండ్లేదు.నేను రోగంతో తగ్గుకొంటా, తుమ్ముకొంటా ఇంట్లో పండుకొంటే వాళ్లు సుత్తితో ఏసే దెబ్బల్ని బట్టే అది ఎండిదో, బంగారుదో,ఇనుముదో, ఇత్తడిదో తెలుస్తావుండె!!
     పెండ్లిండ్ల కాలంలో రైతులే కాకుండా ఇందూపురం లోని షరాబోల్లంతా ఈల్లతోనే రకరకాల సొమ్ములు సేయిస్తా వుండ్రి. ఆసొమ్ములు సేసేది.బంగారు తునకని కమ్మచ్చులో దూరిచ్చి సన్న దారం మాదిరీ తయారు సేసేదీ అన్నీ సుస్తావుంటి.వాళ్ల ఇంట్లో ఒగ మూగాయప్పుండె.ఆయప్పకి మాట్లు వొస్తావుండ్లేదు. పెదవులు కదిలిచ్చి సేతుల్తో సైగలు సేస్తే అర్తం సేసుకొంటా వుండె. పొద్దస్తమ్మనమూ ఆయప్పకి సొమ్ములు సేసే పనే.
     ముసలాయప్ప పేరు యంగటరామాశారి. ఆయప్ప పని ఇగ్రహాలు సేసేది. మా దెండిండ్లకీ ఒగే కవురుసాలి. బెంగులూరు, మైసూరు,బళ్లారి నుంచి ఇగ్రహాలు సేసేకి ఆయప్పకే ఇస్తావుండ్రి. ఇగ్రహాలు యట్ల సేస్తావున్నంటే… కావల్సిన ఆకారముతో మొదట బొమ్మ తయారు సేస్తావుండె. దాని మింద బంక మన్ను(నెర్రెలు చీలనిది) నున్నగా నూరింది పల్సగా బల్లి పర్ర మాదిరీ ఆరేకొద్దీ పూస్తావుండె. బొమ్మ కిందబాగం పీటందగ్గర సన్న రంద్రం ఇడుస్తావుండె. ఆరకంగా అంగులం మందం పూసినంక దాన్ని కుంపట్లో పెట్టి యచ్చగా సేస్తే మైనమంతా కారిపోతావుండె. లోపల ఇగ్రహం ఆకారం మిగుల్తావుండె. దాన్ని ఇసకలో పెట్టి పీతం కింద ఇడిసిన రంద్రంలో పంచ లోహాలు కరిగించి పోస్తావుండె.
     అట్ల పోత పోసినంక రకరకాల పోగర్లతో సెక్కి లచ్చిమి, శివుడు,సీతారామ లచ్చుమనులు,కాళికాదేవి, ఆంజనేయుడు…ఇట్లావన్నీ సేస్తావుండె. ఆ బొమ్మలు నిజంగా నడిసొచ్చే దేవాను దేవతల మాదిరీ ఉంటావుండె. వాటి జతకి ఆయప్ప శార్దూలం పద్యాల్తో శతకాలూ, జాతకాలూ రాస్తావుండె. బొలే కతలు సెప్పుతా వుండె. అవనీ ఈడ సెప్పేకి కుదరదుకానీ ….ఒగటి సిత్తూరు తీరుపు–
     ముందు కాలంలో సూద్రోల్లు బాయిలో నీల్లు సేదినంక బాపనోళ్లు–ఆ తాడును,బాయి అరుగునూ,గిలకనీ కడిగి సుద్ది సేసి నీళ్లు తోడుతా వుండ్రంట. ఒగదినం కమసల ఆశార్లు నీల్లు సేదినంక బాపనోళ్లు అట్లే సేసిరంట. అపుడు ఆశారు తాము శూద్దరోల్లు కాదని బాపనోళ్లతో సమానమని సిత్తూరు కోరుట్లో వ్యాజ్యం ఏసిరంట.అవుడు కోరుట్లో ఆశార్లు గూడా బాపనోల్లతో సమానమే అని తీరుపు వొచ్చినంట.
     ఒగసారి ఒగ రైతు కొత్తగా కొడవలి సేపిచ్చేకి ఒస్తే పెద్ద ఆశారి ఇంట్లో ఉండ్లేదంట. పిల్ల ఆశారే కొడవలి తయారు సేసిచ్చినంట. అది మొద్దోని ముక్కు గూడా తెగుతావుండ్లేదంట.
     ఒగనాడు పెద్ద ఆశారి సొరకాయని మోసుకోని సేని తావ నుంచి ఇంటికొస్తావున్నంట. దావలో రైతు ఎదురుపడి “స్వామీ ఆయుదము మీ సేతిలో అయితేనే సరుక్కున తెగుతుంది.మీ పనితనానికి ఎదురే వుండెల్లేదు.  మీ పిల్లోనికి ఏమీ శాతగాదు. ఆయప్ప సేసిన కొడవల్తో కోసీ కోసీ సేతులు బొబ్బలు పాయకానీ గడ్డి తెగలేదు” అన్నెంట.
     అపుడు ఆశారి కొడవలి సేతికి తీసుకోని సేని గట్టుమిందపెట్టి సొరకాయతో రెండు దెబ్బలు ఏసి “ఇంక బాగ తెగుతుంది పో”– అన్నెంట. తిరగ దినం కొడవలి బాగా తెగుతా వుందనిసెప్పి రైతు గంపడు రాగులు తెచ్చి పాతర్లో పోసినంట!!
     ఈ ఆశారికి అవతలింట్లో లచ్చిమీ నారాయనాశారి. ఆయప్ప యంత ఇద్యా వంతుడంటే ఒగ మనిషిని ఎదురుగా కూకోపెడితే పొల్లు పోకుండా అట్లే బొమ్మ గీస్తావుండె.
    ఒగ సారి(1970 ఆ ప్రాంతం)నాకు బాగా గురుతు ఒగ ఆసామి వివేకానందుని ఫోటో తీసుకోని బొంబాయినుంచి కారులో ఒచ్చిండె. పెద్దది అయిదారు కేజీలది బంగారు రేకు ఇచ్చింటే బొమ్మలో వున్నట్లే దాన్ని ఉబ్బెత్తుగా సెక్కి తయారు సేసిండె. దాన్ని సూసేని ఇందూపురంలోని షావుకార్లంతా జటకాల్లోవొచ్చిండ్రి.
     వాళ్ల సేతుల్లో కళమ్మ తల్లి కాళ్లు కదిపి నడుస్తావుండె. వాళ్ళు రేకు మింద గీత గీస్తే అది సూర్యుని కిరనాల మాదిరీ మెరుస్తావుండె. సుత్తితో కొట్టి శాణంతో సెక్కిన ఏడిదయినా నిండయిన ఇగ్రహం గానో, ఇంపుదీరి పంటలు పండిచ్చే పని ముట్టుగానో తయారవుతా వుండె. వాళ్లంటే ఊరందరికీ గవురవమే!!  అట్లాది…….
     1975-80 కాలానికి పెద్ద ఆశార్లంతా కాలమయి పాయిరి. వాళ్ల వారసు దార్లకెవరికీ కళలు కాదుగానీ నాలుగు అచ్చరం ముక్కలుగూడా అబ్బలేదు!!అంతా కూలీ నాలీ సేసి బతుకులు ఈడుస్తా వుండారు. సివరి ఆశారి దాసప్ప(65సం.) ఒగడు మాత్రం వారానికి ఒగసారి కొలిమి అంటిచ్చి సావుకోసరం బతుకు ఈడుస్తా వుండాడు.
*****
    1960-65 కాలం తీసుకొంటే మా ఊరి జనాబా ఏడెనిమి నూర్లు వుంటుంది. అపుడు సదువు నేర్సింది( కేవలం చదవడం, రాయడం) మా నాయన ఇంకో ముగ్గురు నలుగురు మాత్రమే!! అయినా కళలకు కొదువే వుండ్లేదు!!
    పొద్దున్నే కపిల పాట్లు, సేన్లలో నాట్ల పాట్లు, తవ్వకాలవి, గానిగిండ్ల యాళ పాట్లు యా తావ సూసినా ఇనిపిస్తా వుండె. ఉప్పర అనుమంతప్ప అని ఒగాయప్ప వుండె. ఆయప్ప కత మొదలు పెడితే నెల దినాలు నిలపకుండా సెప్పుతా వున్నెంట!! అందుకే ఆయప్పని కతల అనుమంతప్ప అని పిలుస్తా వుండ్రి.
     ఇంగ ఇండ్లలో ఆడోల్లు ఇసర పాటలు, దంపుడు పాటలు, నలుగు పాటలు, యాగటి మనిషిని కూకోబట్టి పాడే పాట్లు, పెండ్లిపాట్లు, ఊయాల పాట్లు యన్ని రాగాల్తోనో ఇనిపిస్తా వుండె.
     ఇంగ పండగ లొస్తే యా సందులో సూసినా కోలాట పాట్లే!! నిక్కారు కట్టేది నేర్సిన ప్రతి మొగోడూ ఎగురుకొంటా కుణుసుకొంట కోలాట ఏస్తావుండె. అట్లా పాట్లన్నీ నేర్సు కోవల్లని, సిన్నప్పుటినుంచి నాకి శానా ఇదిగా వుండె. వలస బతుకులు, అనారోగ్యము, ఉద్యోగమూ సేసుకొంటా  పుట్టినూరికి దూరమయ్యి, 1990 లో రవ్వంత దగ్గరికొస్తి. పాటల కోసర ఎదికితే ఒగటీ కనిపించలేదు ఇనిపించలేదు!! అంతలోనే—–
IMG_0012
      అందరూ అచ్చిరాలు నేర్సల్ల, దేశాన్ని వుద్దారకం సేయల్ల అని వుద్యమము ఒస్తే నేను దాంట్లో కూరుకు పోతి. అపుడు పల్లి జనాలకి కోలాట పాటల్తో సదువు సెప్పిస్తే బాగుంటుంది అనుకోని కాలికి బలపం గట్టుకోని ఇల్లయిన ఇల్లూ తిరిగితే ఒగ కురుబాయపా రవ్వన్ని సెప్పె. అదిగూడా పూరా పాట్లు కాకుండా మొదటి శరణాలు మాత్రం అర్తం కాకుండా మారిపొయ్యిండివి!! రాగాలు మాత్రం మిగిలిండివి!! అవస్తలు పడి “లచ్చిమి పెండ్లి” అనే కోలాట పాటల కత తయారు సేస్తి. కోలాట ఏపిచ్చుకోని ఎర్రోని మాదిరీ ఊరూరు తిరగలాడితి!! అది తెలిసి ఆకాశవాణి అనంతపురము వాళ్లు మా గుంపును ఎదుక్కొచ్చి రికార్డు సేసుకుపొయ్యి శానా సార్లు ఇనిపిచ్చిరి!!
      ఒగ పాట సదవండి……
ఉంగరమా  ముద్దుటుంగరమా  మా రాము సేతిలో  బంగారమా….(ప్రజల నోట దొరికిన అవ శేషం)
తిరగ రాసింది..అక్షరమా ముద్దుటక్షరమా మా నోటి మాటలా ఆకారమా!!
                 నిన్ను మొదటెవరు పలికిరే అక్షరమా!!
                 నీకు పేరెవరు పెట్టిరే అక్షరమా!!
                 మా బతుకులో వెలుగైన అక్షరమా………!!
       ఇప్పుడు మా ఊరిసుట్టూ పది పదకొండు కాలనీలు (టీచర్స్ కాలనీ, వీవరుసు కాలనీ, ఆటో నగర్, డ్రయివర్స్ కాలనీ,ఎస్టేటు, యస్.సి. కాలనీ, పోస్టల్ కాలనీ, హవుసింగు బోర్డు, హవుసింగు బోర్డు కాలనీ, యన్. టి ఆర్. కాలనీ…..మొ.) జనాబా సూస్తే పది పదకొండు వేలు దాటింది. దగ్గరదగ్గర అంతా సదువులు నేర్సిన వాళ్ళే!!
      అయితే ఒగ మనిషికి గూడా పాటలు పాడేది రాదు. కతలు సెప్పేది అసలుకే తెలీదు. వానలు యగేసుకోనె. పెన్నేరు ఎండి పాయ. ఎండిన ఏటి ఇసకని బెంగలూరు సిటీకి రాజకీయమాయప్పగారు దొంగగా తోలి కోటాదీశులయిపాయిరి. పంటలు పచ్చదనాలతో కల్సి సహజముగా జనాల నోర్లల్లో పుట్టిన పాటలు, ఆటలు, నాటకాలు, కతలు కనిపించకుండా కాటికి సేరి పాయ.
    నికాల్సుగా, నిజాయితీగా, నిరాడంబరముగా, అమాయికముగా– అడవిలోని తంగేడు పూలంత అచ్చముగా బతికిన జనాలని పాడు సదువులు, యాపారం సినీమాలు,ఇండుల్లో దూరిన కట్ల పాములట్లా కేబులు వయిర్లూ, రాజకీయమోళ్ల మాయదారి ఎత్తులు నాశన సేశె.
     జీవితమంటే మరిసి నాటకాలాడేది, ఊరుమ్మడి బతుకులు మర్సి కులాల కోటలు కట్టేది, కష్టం సేసి తినేది మర్సి మాసకారి మాటల్తో దోసుకోని తినేది బాగ నేర్సిరి.
       ఇపుడు తినేది సినీమాలు.తాగేది సినీమాలు. పాడేది సినీమాలు. నడిసేది సినీమాలు. మాట్లాడేది సినీమాలు. రాజకీయాలు సినీమాలు. అన్నీ క్రుతకాలు  కుత్సితాలు నేల ఇడిసిన సాములు.
అసలు మనిషి మాయమై పాయ! ఆ మనిషితో పాటు కళల పంటలు కూడా కాలమయి పాయ!!
*

మా ఊరి పేరు యనక– ఒగ కత

సడ్లపల్లె చిదంబర రెడ్డి
మావూరి కాపోళ్లలో ఎక్కువ బాగము “సజ్జన”కాపోల్లే. అందుకే మావూరు సజ్జన పల్లయి, సడ్లపల్లిగా మారిందంట. అయితే దాన్ని ఇష్టంపడని గుంపోళ్లు మాత్రం ఉప్పర సజ్జయ్య అనే ఆయప్ప ఈడ వున్నెంట ఆయప్ప పేరుమిందనే “సజ్జయ్యపల్లి” సడ్లపల్లి అయ్యిందని అంటారు.
    అయితే దాంట్లో నిజ్జం లేదనిపిస్తుంది. ఊర్లో ఉప్పరోళ్లు వుండారుగానీ,ఈళ్లకి సెంటు బూమిగూడా లేదు. అందరూ ఎనుంపోతుల్తో మడకల్దున్ని, మన్ను మోయించి,కూలీనాలీ సేసుకోని బతుకుతా వున్నోళ్లే.
    అయితే మా జనాలు “సజ్జను”లేనా?? అని మీరడగొచ్చు!!నేతిబీరకాయలో  నెయ్యి వుందనే దానికి ఆ పేరొచ్చిందా?? అనే సిన్న అనుమానముగూడా రావల్ల!! ఎవరో యనకటి కాలము ఎర్రోళ్లు ఆ పేరు పెట్టింటారు! పేర్లని బట్టే బుద్దులుంటాయనుకొంటే ఈ దేశంలో జనాలందరూ అరిచ్చందురుడు,సీరామ శందురుడు అనే పేర్లే పెట్టుకొంటా వుండ్రికదా!!
     అదట్ల ఇడిస్తే మా గుంపోళ్లు దిగువ సీమనుంచి వొచ్చిరంట! వాళ్ల యనకనే ఒగ కమసలోళ్ల కుటింబంగూడా వొచ్చినంట.
     ఈ ఊర్లో మాత “కాపోల్లు” అని పిలుస్తారు.అంటే పంటలు పెట్టి “కాపుదల సేసే”(పెంచే) జనాలని అర్తం.(గొర్రెలు పెంచేవోల్లు,ఆవులు పెంచేవోల్లు,పందులు పెంచేవోల్లు..ఇట్ల)
    బూమ్మీద ఏట్నుంచి కాలువలు తవ్వేది,బావులూ సెరువులు కట్టేదీ జనాలు నేర్సినపుడు–యక్కడికీ కదలకుండా ఒగ తావే నివాసాలు సేసుకోని, నిలిసిపొయ్యి యగిసాయం(వ్యవసాయం) మొదలుపెట్టిన గుంపే కాపోల్లు!! ఈళ్లకి అరవై డెబ్బయ్యేండ్లకి ముందు పేరుకి యనక “రెడ్డి” అనే తోకలు ఉండ్లేదు.
   రాజులు, పాళ్లేగాల కాలంలో ఎక్కువ జమీన్లో పంటలు పెట్టే ఆయప్పని ఆ సుట్టూపక్క లుండే జనాల గుంపులమింద అజమాయిషీ సేసే  అదికరము ఇస్తావుండ్రి. అంటే  అందరిదగ్గరా దవసము(ధాన్యం) కందాయం(భూమి సిస్తు) వొసూలు సేసి కొంత బాగము వాల్లదగ్గిరే వుంచుకోని, మిగిలింది రాజుల కజానాలో జమా సేసే అదికారము. దాన్నే”రెడ్డిరికము” “రెడ్డి పదవి” అని పిలుస్తా వుండ్రి. (పూర్వపు విరాటుడు లోని”రాట్” పదమే క్రమంగా రెడ్డి గా రూపాంతరమయ్యినదని ఎక్కడో చదివినట్లు గుర్తు)
    దాని అర్తం తెలీని ఎర్రోల్లు రాజులు, ఎంగిలీసోల్ల కాలంలో తోకలిప్పుకోకుండా గమ్మనూరుకో నుండారు!! సొతంతరమొస్తూనే ఎగిసాయం సేసేవోల్లంతా రెడ్డీసే   అనే ఒగ పెద్ద ఆశతో దాన్ని తగిలిచ్చుకోనుండారు- అనిపిస్తుంది.
     అది అట్ల వుండని:
     మా గుంపోల్లు, కమసలోల్లు వొచ్చిరంటగదా!! పెన్నేటికి తూరుపుపక్క ఏరు పొంగి ఎత్తుతగ్గులు సమానం సేసి ఒండునింపిన విశాలమయిన బూముంటే ఆడే నిల్సిపోయిండారు. ఏటిగట్లో అంతా కాపోల్ల సేద్యాలు. ఊరికి ఆనుకోని పదయిదు ఇరవై యకరాల్దంకా ఉత్తరానికి కమసలోల్లది. రయితులకి కావాల్సిన కొడవలి, పార, గుద్దలి,గడారు…కాడీ, మేడీ,పలుగు, బండీ..ఇట్లా సామాన్లు సేసేవాల్లే కమసలోల్లు. వాళ్లకి ఆకాలానికే బయ్యమో,బక్కితో,అట్ల్లంటిదేదో శానా వున్నట్లుంది! వాళ్ల బూముల్లోనే పెద్ద కోనేరు తవ్విచ్చి(1967 ఆ ప్రాంతంలో దాన్ని మూసేశారు) గుడికట్టిచ్చిండారు. ఊరిజనాలకి రోగాలొస్తే మందులిచ్చేదీ, ఒడ్డీలకి అప్పులిచ్చేదీ వాల్లే.(కాలమయిపోయిన కళలు– అనే కతలో వాళ్లగురించి మరలా చదవగలరు)
     గుడి యనకాలే ఒగ సింతసెట్టు నాటిండారు. (దానికి వయసుమళ్లి బెంగళూరు రోడ్డుకు అడ్డంగా కొమ్ములు విరిగి పడ్తూంటే 1986 ఆ ప్రాంతంలో తొలగించేశారు) అది యంత పెద్దదంటే నేను ఇందూపురానికి సుట్టూపక్కల 500 మయిళ్లవొరుకూ మర్రి, రాగి,సింత సెట్లు యన్నో సూసిండానుగానీ ఇంత ఎత్తూ, ఇసరమూ(వెడల్పు) వున్న మాను సూడ్లేదు!! కాతకాలమొస్తే ఇరగ్గాసిన కాయల బరువుకే కొమ్ములు ఇరిగి పోతావుండె. ఆ కాతని సింతపండు యాపారము సేసే మావూరి పింజిరోల్లు కొంటావుండ్రి. ఆదుడ్లని కమసలోల్ల ఇండ్లు, మా సజ్జనకాపోల్ల ఇండ్లోల్లు వాటాల్లెక్కన పంచుకొంటా వుండ్రి.దీని ఆదారం సేసుకోనే సజ్జన పల్లి సడ్లపల్లి  అయ్యిదనుకోవొచ్చు!!
    ఇదే కాలంలో ఈతావుండే సెరువుల్లోన, ఏట్లోన, గుంతల్లోన శానా నీళ్లు వాట్లో దండిగా శాపలు వున్నంట వుంటే వాట్ని పట్టుకోని బదికేకి ఒగ బెస్తోల్ల కుటింబుమూ వొచ్చింది. వాళ్లు వూరికి దచ్చిణంపక్క బాయి తవ్విచ్చి ఇరవై యకరాలుదంకా  సేద్యం సేసుకోని ఈశ్వరుని గుడికట్టుకోని నిల్సి పొయ్యిండారు.ఈళ్లూ వైదీకం (వైద్యం) సేసే వాళ్లే. ఈళ్లు వొచ్చినంక కమసలోల్ల వైదీకము యనకబడి పొయ్యింది.(వీళ్ల వైద్యం గురించి “నాకు రోగం తగుల్కోనె” అనే కథలో వివరిస్తాను).
     మా వూరికి తూరుపుకి మూడుమైళ్ల దూరంలో రైలు రోడ్డుకు  అవతల ఇంగొగు సడ్లపల్లి వుంది. యనకటికి వానలు పడకుండ కరువు మూసుకొంటే మా సజ్జన గుంపోళ్లు ఆ ఊరిడిసి యగువసీమకి ఎల్లిపాయరంట గాని,వూరిపేరు మాత్రం అట్లేవుంది. దీన్ని పులమతి(పులిమృతి)పి. సడ్లపల్లి అని పిలుస్తారు.
   ఆదికాలములో వాన్లు ఇగ్గదీసి కొట్టినపుడు, ఏరు పొంగి దావని పడమరకి మళ్లిచ్చుకోనుంది. అందుకే మా వూరికి ఉత్తరానికి ఏటిగడ్డలో శానామంచి మాగాణిబూములు తయారయ్యిండివి. అక్కడ (సూగు= సుగ్గి= ధాన్యం) సూగు దండిగా పండిచ్చే దానికి దాన్ని (సూగు ఊరు) సూగూరు అని పిలిసినారు. దానికి ఆనుకోని వుండేదానికి మా ఊర్ని సూగూరు సడ్లపల్లి (యస్. సడ్లపల్లి) అని పిలుస్తారు!! (ఈ సూగూరు దగ్గర హిందూపురం పట్టణం కొత్తగా పురుడుపోసుకొంది.అది ముందుముందు వివరిస్తాను).
   మా గుంపు జనాలుండేది పెన్నేటికి రెండుపక్కలా మా వూర్నుంచి దిగువ సీమలో పెనుగొండ నుంచి, ఎగువసీమ కర్నాటకంలోని తొండేభావి రైలు స్టేసనుకు అవతల కలినాయకన హల్లి(కల్యాకనపల్లి) వొరుకూ వుండారు.
   ఇపుడు తోకలోల్లంతా కల్సిపోయిండారుగాని, అది యేరే కత!! మా సుట్టూపక్కల ఉరుల్లో
సడ్లపల్లొల్లంటా
నా మొగిని షడ్డుకులంటా
రాతిరికొస్తారంటా
జొన్న రొట్టెలు కాలల్లంటా..
అని నేను సన్నపిల్లోనిగా వున్నపుడు పాట్లు పాడ్తా వుండ్రి!!
****                    ****              ****                     ***
అయిదరాబాదు నుంచి బెంగుళూరికి రైల్లో పోతే దొడ్డబళ్లాపురానికి ముందే “మాక్లీ రైలు స్టేషన్” అని ఒగటొస్తుంది. ఆడ వూర్లే లేవు. కొండలకి నడిమద్య కట్టిండారు. యాలంటే దానికి ఆరేడు మైళ్లదూరంలో సుబ్బరమణ్యం స్వామి ఘాటీ అని వుంది.
    ఆడ డిశంబరు నెల్లో ఎద్దుల పరస జరుగుతా వుండె. అది దచ్చిన బారత దేశంలోనే శానా పెద్దదంట!! దానికి నెలరోజుల ముందుగానే లక్షాంతరం ఎద్దులు ఒస్తావుండె. అవి పాతకాలం జాతిమాదిరీ మేకలు, జింకలట్లా గిత్తలు కాదు.మైసూసు,హలికేరి జాతిలో బాగా సురుకయిన ఉక్కుశరీరం పుట్టుకవి!! దూరాబారమోల్లు వాట్ని రైల్లో తీసుకుపోతావుండ్రి అందుకే ఆడ స్టేషను.
    మనిషై పుట్టినంక ఆ పరసలో సూడల్లన్నా మూగ జీవాల అందసందాలు!! ఒగ ఎద్దును సూసిన కండ్లతో ఇంగొగు జతని సూసేకయితా వుండ్లేదు!! ఆ ఎద్దులకుండే సోగ కండ్లు, ముఖం మింద నక్షత్రం మాదిరీ మెరిసే తెల్ల సుక్కలు,కత్తులకంటే కొస్సిగా వుండే నిటారయిన కొమ్ములు. రాజులు మెరవణీసేసేకి నున్నగా మేపిన అరేబియా జాతి గుర్రాలుగూడా ఈ ఎద్దుల కాళ్లకింద దూరాల్సిందే!!
IMG_0011
    మంచి వయసు కుర్రల్ని కోడిగుడ్లు,వులవనూక,శెనగపప్పు,అగిశాకు,సెరుకు మోసులు తినిపిచ్చి ఉడుకు నీళ్లతో రెండుపూటా స్నానాలు సేయిస్తా, శాన ముతువర్జీగా(ప్రేమగా) పెంచుతావుండ్రి. కింద పండుకొంటే నేల ఒత్తుకొంటుందని లేపులు(పరుపులు) పరుస్తావుండ్రి.ఈగలు మైమింద వాలకుండా మనుష్యుల్నిపెట్టి ఇసనకర్రల్తో ఇసరిస్తావుండ్రి. ఇట్ల ఇంపుగా వుండే వాటికి కొమ్మలకి మెరిసే కొమ్ముకుప్పలు, మెడలో ఇత్తడి సైను,గంటలు,గగ్గిరీట్లు,గవ్వలు,దిష్టితగుల్కుండా నల్ల కురుబదారము. రంగుల నులకల్తో పేడిన మూతికి ముగజింబారము. కొమ్మలకి జండాల మాదిరీ గాలికెగిరే టేపులు. అరసేతెలుపు అద్దాల బిల్లలుంచి బొమ్మలు బొమ్మలుగా అల్లిండే బురికీలు ఒళ్లంతా కప్పుతావుండ్రి. ఇంట్లో జనాలు పెండ్లి కూతురుకంటే అందుముగా సంబరాలు సేసుకోని సింగారం సేస్తావుండ్రి. ఆడే టెంటుల్లో కత్తులూ, కఠారుల్తో కొట్టుకోనే సినీమాలు ఆడ్తావుండె. జాత్రకొచ్చిన జనాలు సినీమాలకంటే ఎద్దుల్ని సూసేకే సెవులుకోసుకొంటా వుండ్రి.
    వాట్ని సూస్తే నాకి సిన్నపుడు అనిపించేది– సింబాలు, పులులు ఎద్దుల్ని సంపి తింటావని సెప్పేది అబద్దమని!! సరకస్సులో సింబాలూ పుల్లూ దండిగా సూస్తావుంటి. అవిగానీ ఈ జాతెద్దుల్ని సూస్తే “ఇవి యాడ్నో మమ్మల్ని సంపి తినేకి పుట్టిండే కొత్త పసరాలు”అనుకోని, గుండె పగిలి సచ్చేటంత కోపుగా ఏపుగా రోషంగా వుంటావుండె.
    దూరాబారమొల్లు గూడ్సు రైల్లొ తీసుకుపోతే నూరూ ఇన్నూరు మైల్ల దూరమోల్లు మా ఊరిముందరి రోడ్లోనే తోలుకు పోతావుండ్రి. వూర్లో జనాలంతా కన్నురెప్పలు కొట్టకుండా,నోరుఎల్లబెత్తుకోని ఎద్దుల సొగసులు సూస్తావుండ్రి. దాని జతకి పరసల కాలమొస్తే గుడిముందర టెంకాయ గర్రుల్తో పెద్దగా సప్పరం ఏసి, వర్సగా గూటాలు బాత్తావుండ్రి. ఊర్లోని అందరి వాముల్లో గడ్డి తెచ్చి వామిమాదిరీ ఏస్తావుండ్రి. కొందరు గంపలు తీసుకోని ఇంటింటికీ పొయ్యి సంగటిముద్దలు, శార, మజ్జిగ, ఊరగాయి,పాకపట్టలు(విస్తర్ల లాంటివి=వక్క మట్టలు) తెస్తావుండ్రి. బాయిదగ్గర కట్టిండే గారు తొట్టీనిండా నీల్లు నించుతావుండ్రి.
    ఎద్దులు తోలుకోని వూర్లకు పొయ్యేవోల్లంతా రాతిరిపొద్దు మావూరిదగ్గరే నిల్సి, ఎద్దుల్ని మేపుకోని, సంగటితిని, బయ్యంలేకుండా పండుకోని పోతావుండ్రి. ఇట్ల అల్కూర్లో జనావరినెల్లో జరిగే సోమేశ్వస్వామి పర్స,ఊగాదికి యనకా ముందు విదురాస్వత్తనంలో జరిగే జాత్రవొరుకూ మా వూరిజనాలకంతా ఇదేపని. దాని జతకి యండకాలమొస్తే రోడ్డు పక్కలో సత్త్రం ఏసి పెసరబ్యాళ్లు,పాణకం,మజ్జిగని బాటసార్లకి పిల్సి పిల్సి పోస్తావుండ్రి.
   ఆ జాత్రల కాలంలో మాయట్లా పిల్లోల్లంతా పసరాలకతలే సెప్పుకొంటావుంటిమి. ఆ కతల్లో ఎద్దులే ఈరోలు. వాట్లో శానా మర్సిపొయ్యిండాను గానీ ఒగటిమాత్రం బాగా గురుతుంది.
    ఒగ దిగువసీమ రైతుకు అయిదారెకరాల మంచి సత్తువయిన బూమి వున్నంట. మేలుజాతి కుర్రలు కొనల్ల అని మున్నూరు రుపాయలు (అప్పుడు దినకూలీ 12 పైసలు.ఇప్పుడు (01.07.2015–నాడు) 300రు.లు దీని ఆధారంగా బేరీజు వేసుకొండి) తీసుకోని పర్సకి పాయినంట. పర్సంతాతిరిగి వాటముగా వుండే గట్టి కాళ్లని, ఒంటిమీద సుళ్లని,కంటిసూపుల్ని, ముడ్డిమింద సైగల్ని బాగ పరీచ్చలు సేసి, దళ్లాళి గాళ్లని పిల్సి యాపారము మొదలుపెట్నంట. అంత సేపటికి ఆపక్కలో ఊడుగుసెట్టుకింద ఒగ జుట్టుస్వామి బుర్రంతా ఈబూతి దిద్దుకోని మంత్రాలు సదువుకొంటా కండ్లు మూసుకోని శాస్త్రం సెప్పుతావున్నెంట.
    “ఈ యాడాది దిగువ సీమలో వానలు యగేసుకొంటాయి. తట్న ఒగ సినుగ్గూడా పడెల్లేదు”అని. ఆ మాట్లిన్న రైతుకు బయం సుట్టుకొన్నంట. తెచ్చిన దుడ్లంతా కర్చుపెట్టేకి దయిర్యం సాల్లేదంట.
    అందుకే నూర్రూపాయల్ని అట్లేమిగిలిచ్చుకోని ఇన్నూర్రూపాయల్కి ఎద్దులు కొన్నంట. అది ఎండిరూకల కాలమంట!! దుడ్లని “వొల్లం”లో పేర్సుకోని(నులకల్తో కాని,గట్టి బట్టతో కానీ అరచేతి వెడల్పు-వడిసెల ఆకారంలో– మూడడుగుల పొడవుతో ఉండే పట్టీవంటిది. దాన్లో నాణ్యాలనుంచి నడుముకు చుట్టుకొని, దానిమీద పంచె కట్టుకొనే వారు) నడుముకు సుట్టుకోని వూరికి యల్లబార్నంట.
    కంకర రోడ్లో బిరిబిర్న నడిపిస్తే గిట్టలకి కొట్టిండే నాడాలు సమిసి మెతువు కాళ్లు(గిట్టలరిగి రక్తం కారడం) పడతావని మెల్లిగా నడుస్తావున్నంట. ఆయప్ప జతలో వొళ్లు ముందరయిపాయిరంట. సూస్తావున్నట్లే మబ్బయిపాయనంట. ఈడొస్తుందూరు,ఆడొస్తుంది అని ముందర సూసుకొంటా పోతా వుండాడంట గానీ యాడా సన్న దీపంగూడా కనిపించలేదంట.
    కండ్లు సించుకొన్నాగూడా కనిపించుకుండా వుండే కారు సీకటంట! సుట్టురా మర్రిమాన్లూ, ఇప్పిమాన్లూ దెయ్యాలమాదిరీ కనిపిస్తా వుండివంట. ఆ సెట్టుల్లో నల్ల మిడతలు(కీచురాళ్లు) జిర్ర్ అని అరుస్తావుండివంట. దావపక్క గుంతల్లో సేరుకోని కప్పల్నక్కలు గొళో అని కూస్తావుండివంట. అంతసేపటికి ఒగ దొంగనాకొడుకు అడ్డమొచ్చి “ఏయ్! ఆడ నిలబడ్రా” అని అర్సినంట. ఎద్దులాయప్ప ఇనపిచ్చుకోలేదంట. దొంగోడు నాలుగడుగులు ముందరికొచ్చి, అంగీ కాలరుపట్టుకోని నిలేసి “దుడ్లు యాడుండివో బయటికి తియ్యరా” అన్నెంట. అపుడు ఈయప్పకి కోపమొచ్చి బుజం మిందుండే వార్ల శలకోలా తీసి ఒగటి అంటిచ్చినంట.
    ఆ ఏటు సురుక్కున తగుల్తూనే దొంగోడు నడ్డిలో ఇరికిచ్చుకోనుండే కొస్సిగా వుండే కత్తి తీసి ఎద్దులాయప్పాయ్ప కడుపులోకి కసుక్కున పొడిసినంట. ఆయప్ప “అయ్యో” అని ఒర్లుకొంటా నెట్తుతప్పి కిందకి పడిపాయనంట.
    అపుడు సూడన్నా నా సామిరంగా తమపాట్న తాము మూగ బసవణ్ణల మాదిరీ నడుస్తావున్న ఎద్దులు తోక తొక్కిన నాగుబాము మాదిరీ సర్ర్ న ఎనిక్కి తిరుక్కొన్నంట. కొమ్మల్తో వాన్ని మెలేసి పర్ర్ న సించేకి పాయనంట. సివంగిలు మాదిరీ ఎద్దులు మిందకొస్తూనే పరిగెత్తి పొయ్యి వాడు బాటపక్కలో వుండే సెట్టెక్కినంట.
    అంత సేపటికి ఇంగొగ దొంగొచ్చి  కిందపడిండే రైతు దుడ్లని ఎదికేది మొదలు పెట్నంట. ఒగెద్దు వాన్ని సూసి లగెత్తుకొచ్చి దూరము తరిమేసినంట. ఆతాకి ఇంగొగురు రాకుండా ఈనిన సిరుతపులిమాదిరీ కావిలి కాస్తా నిల్సిపాయనంట.
   సెట్లో ఎక్కిన దొంగని కిందికి దిగనీకుండా ముందరి కాళ్లతో నేలని గీరుకొంటా, కొమ్మల్తో బుడాన్ని(మొదల్ను)పొడుసుకొంటా తెల్లారేదంకా వుండిపాయనంట.
   ఎలుగయితూనే అది పోలీసోళ్లకి తెల్సి, రైతును ఆస్పత్రికి తీసుకపొయ్యి  బతికిచ్చిరంట!!సెట్లొ దాక్కోవుండే దొంగని జయిలుకేసి, ఎద్దులకి బంగారి కొమ్ముకుప్పల బోమానుముగా ఇచ్చిరంట!!
      ****                  ***                ***               ***
   బాటసార్లకీ, యాత్రీకుల్కీసాయం సేస్తే దానాలుసేస్తే దండిగా పుణ్యమొస్తుంది అని గుడ్డిగా నమ్మిన కాలమది!! అయితే ఆపుణ్యం పలాలేవీ మా పల్లిజనాలకి అందినట్ల రుజువులుమాత్రం యాడాలేవు!!
    వానలు ఏటిచ్చె. బాయిలు ఎండిపాయ. బోరింగులేసి బూమమ్మతల్లి పాతాళములో దాసుకోనుండే నీటి కణాల్నంతా తోడి పారేసిరి. టాట్టర్లొచ్చి ఎద్దుజాతిని దుంపనాశనం సేశ. జనాలంతా అచ్చరాలు నేర్సిరి. బతుకులు సదివేది మర్సిపాయిరి. పైర్లు నాటేది మర్సి సెరువులూ,కుంటలూ,ఏర్లూ,వాగులూ ఏకం సేసి ప్లాట్లు గీసి రాళ్లు నాటేది నేర్సిరి.
     ఇపుడు మాపల్లె లేదు. పేరుమాత్రమే వుంది. ముందరపుట్టిన సెవులకన్నా యనకపుట్టిన కొమ్ములు పెద్దవి అన్నట్ల, గువ్వనీ, గుడ్లనీ, గూటినీ దాసరిపాము(కొండచిలువ) మింగేసినట్ల నిన్నా మొన్నా నోట్ల కట్టల్తో  కండ్లు తెర్సిన హిందూపురమనే రంకుది పచ్చగా వున్న మాఊర్ని దిగమింగేసింది.
   ఇపుడు మా జనాల సేతుల్లో యర్రనోట్లు పెళపెళా!! మాటల్లో దుడ్లు గలగలా!!
   పంటల్ని పాడెకెక్కిచ్చి నోట్లని నెత్తికెక్కిచ్చుకోని బతికే దుర్మార్గం కాలము  ఇట్లే యన్నాళ్లుంటుందో సూడల్ల!!??
***

ఏం బతుకులో ఏమో!!!

సడ్లపల్లె చిదంబర రెడ్డి 
 
     కండ్లతో సూస్తావున్నట్లే యాబై యేండ్లలో ఈ జనాలు యంత నాజూగ్గా తయారయ్యిండారో నాకయితే నమ్మ బుద్దే అయితా వుండ్లేదు!!
     అపుడు నేనింకా సన్న పిల్లోడు!! మా బాయికి రెండు జతల ఎద్దులు కట్టి కపిల (మోట) తోల్తావుండ్రి. ఎద్దుల శర్మంతో కుట్టిండే కపిల బాన, గిలక మింద నుండి బాయిలోనికి ఇడిస్తే నీళ్లతో నిండుతుంది. దాన్ని ఎద్దుల మెడమీదుండే కాడిమానుకు కట్టిండే పెద్ద మోకు మింద కూకోని మనిషి ఎద్దుల్ని బారి లోనికి తోలల్ల(ఏటవాలుగా బావికి సమాంతరంగా ఉండే గుంతలాంటిదాన్ని బారి అంటారు) ఆ పని మా అప్పప్ప (అప్ప-నాన్న- తర్వాత అప్పలాంటి వాడు=అప్పప్ప)సేస్తావుండె. శ్యాద్యాలు సేసే జనాలకి తలమింద టువ్వాలు,ఒంటిమింద మిసీన్లొ కుట్టిన బనీను, కింద జాండుపొడువుండే సల్లడము!!(షెడ్డీ లాంటిది) అవే వాల్ల బట్లు. యండ పొద్దులో కష్టం సేసే టవుడు శమటకి నాని సినిగి   పోతావని, బనీను గూడా ఇప్పేసి ఉత్త పొయ్యితోనే పన్లు సేస్తా వుండ్రి.
 
    యాపొద్దన్నా సుట్టాలూరికో, జాత్తర్లకో పోవలిసొస్తే, ఉతికి గుడవలో దాసి పెట్టిండే అంగీని బుజం మీద ఏసుకోని ఆ ఊరి పొలిమేరదంకా పొయ్యి ఆడ తొడుక్కోని  పోతావుంద్రి.
    ఇంగ ఆడోల్ల బతుకు మరీ అద్దువాన్నము. అంతో ఇంతో బూములుందే కాపుదనమోల్ల(రెడ్డ్ల) ఆడోళ్లు మాత్రమే రవికెలు తొడుక్కోని, కింద పాదాల వొరుకూ సీర కట్టుకొంటా వుండ్రి. బీదా సాదా కూలిజనాలు మాత్రం మా ఊర్లో మాలోల్లు నేసిండే బారెడు పొడువు సీర గుడ్డనే శరీరానికంతా సుట్టుకొంటా వుండ్రి.(అట్లా జనాల్ని మీరు ఇవుడు టి.వి.ల్లో ఆఫిరికా దేశాల్లో సూడొచ్చు) ఇంగ పిల్లోల్లు ఏడెనిమిదేండ్ల వొరుకూ ఉత్తబెత్తలే తిరుగుతా వుండ్రి.
    బెంగళూరు నుంచి ఇందూపురానికి ఒచ్చే రోడ్లో,పెన్నేటి గట్లో వుండే మా ఊరికతే ఇంత మాత్రం ఉంటే?? మూలతట్టు తావుల్లో బూమీ ఆకాశమూ కల్సుకొనే సోటుండే జనాలు ఇంగ యంత అద్దువాన్నముగా వుండ్రో కదా అనిపిస్తుంది!!
    ఒగ దినం రాజా స్టేట్ నుంచి( అపుడు కర్నాటక ను రాజా స్టేట్ అని,మైసూర్ స్టేట్ అని పిల్చే వారు)మా మేన మామ అంజినప్ప వొచ్చిండాడు. అవుడు మా సిన్నాయన మోకుమింద   కూకోని కపిలి తోల్తా వుండాడు. తోలే తవుడ ఆయప్ప పిర్రని, మోకుకి ఆనిచ్చి కూకోందానికి అదంతా రాపిడికి రాసుకుపొయ్యి పుండయ్యింది. రగతము కారుతాఉంది. దాన్ని ఆడుండే కానగాకుల్తో తుడిసేసుకోని, రవ్వన్ని రెమ్మల్ని మోక్కీ పిర్రల్కీ మద్య ఇరికిచ్చుకోని మొండోని మాదిరీ ఎద్దుల్ని సైగజేసి కపిల తోల్తా వుండాడు.
     దాన్ని మా సిన్నమామ సూసి, “థూ థూ తు ఏం బతుకు బావా నీది!? పిర్రల మిందుండాల్సిన సల్లడాన్ని పైనికి మడిసిపెట్టి, పుందుమింద పుట్ర అన్నట్ల రగతాన్ని సేతులకి,కపిల మోక్కీ పూసుకొంటా మురుగుం పన్లు సేస్తా వుండావు?? ఆ సల్లడాన్ని తొడలకానా దిగబీక్కోనేకి అయ్యెల్లేదా??” అని బేజారు సేసుకోనె.
    దానికి మా సిన్నాయన” ఒరే నీకేమిరా!! సేనిలో వొరుకూ ఏటి నీళ్లొస్తాయి. మీరు మా మాదిరీ యముకులు ఇరగ్గొట్టుకోకుండా పంట్లు పండిస్తారు.మాకి అట్ల యాడ కుదురు తుందప్పా?? నాకుండేది ఒగ సల్లడము. అది సినిగి పోతే ఎవురు తెచ్చిస్తారు? తిరగ ఉగాది పండగ దంకా వీట్నే కాపాడుకోవల్ల!! పిర్రలకి గాయ మైతె ఏం జేస్తుంది!!గుంట గరగము,పసుపు కొమ్ము నూరి రొన్నాళ్లు పూసుకొంటే మేలయ్యి కొత్త శర్మం ఒస్తుంది” అన్సెప్పె.
     దానికి మా మామ ” ఆ పుడగోశెలుపు సల్లడం కోసరము ఉగాది పండగ ఒరుకూ కాసుకో వల్లో?? ఎవరికీ తెలీకుండా రెండు గంపలు జొన్నలో, రాగులో, కొర్రలో అంగడికి సాగిచ్చేకి గూడా నీకి శాతగాదో??” అనె.
    “నా గింజలకి నేనే దొంగ కావల్ల అని సెబుతావేమ్రా బాడ్కావ్! ఈ మాట్లు ఎవరన్న కాపుదన మోళ్లు ఇంటే- పాత సెప్పు తీసుకోని పునక(నెత్తి)మింద యంటికిలు ఊడిపొయ్యేదంకా తపా తపా అని కొడతారు. ఆ మాటనేకి నీకి సిగ్గి లేదేమిరా” అనె సిన్నగా నవ్వుకొంటూనే.
  “మీ ఏడుపు మీరు ఏడ్సండి నాకి యాల” అని మామ ఎల్లి పాయ.(ఈయప్ప కతలు శానా  ఉండివి మేము వాళ్లూరికి వలస పోయినంక అవన్నీ సెబుతా)
    ఈడ అసలైన సంగతి ఏమంటే…. ఆ కాలములో అన్ని పల్లెల్లో, అన్ని ఇండ్లల్లో ఏమి   జరుగుతా ఉండిందో దాన్నే మా మామ సెప్పిండాడు!!  అపుడు జనాలకి దుడ్లు పుట్టే మార్గాల్లేవు. శలామణీలో ఉండే రవ్వన్ని రూపాయలు గూడా తెలివైన జనాలుండే పట్నాలూ, నగరాల్లోనే–గూటానికి కట్టేసి మేపే జంతువుల మాదిరీ– నిల్సి పొయ్యిండివి!!
    అయినా మనిషి ఆశల పుట్ట!! కొత్తగా కనిపించేవి కొనల్ల. నోటికి రుసిగా వుండేవి తినల్ల. అందరికంట్లో పడేరకంగా బాగుండల్ల…అనే రకరకాల కోరికలు యంటాడతానే ఉంటాయిగదా!! ఊరిదేవర సేయల్లంటే, దేవునికి పెండ్లి సేయల్లంటే, జాత్రలకి పోవల్లంటే దుడ్లు కావల్ల గదా!!
   ఇట్ల దుడ్ల పనులన్నీ గొర్రెలు మేపే వొళ్లే ముందర పడి సేస్తావుండ్రి. యాలంటే పుట్టిన గొర్రి పిల్లల్లో పొట్లి పిల్లల్ని ఆర్నెల్ల కొగతూరి సంతలో అమ్మి దుడ్లు మొకము సూస్తావుండ్రి. మామూలు జనాలకి రూపాయలల్ని సూసే అవకాశమే ఉంటావుండ్లేదు. గుడిలో దేవినికి ఒగ గుడ్డి కాసు ఆరతి పళ్లెంలో ఏసేకి గూడా బగలాటమే!! ఎవుర్నడగల్ల? యట్ల సంపాదన సేయల్ల??
   ఈ దుడ్ల కోసరం కత్తిరింపులు యట్ల  జరుగుతా వున్నో సెప్పుతా సదవండి.
   ఒగ ఇంటి యజమాని గురించి ఒద్దు. సంపాదన సంసారమూ ఆయప్ప యేటుకి ఎదురుండేది కాదు. దాని జతకి ఉమ్మడి కుటుంబాలు. ఒగొగ కొంపలో ఇరవై నుంచి యాబై మంది దంకా జనాలు. ఒగొగుర్ది ఒగో లోకము!!
   ఆ ఇంటికొచ్చిన కోడల్లకి గాజులు,పొవుడౌర్లు,జాకీట్లు,తల నూనెలు, వక్క, ఆకు, కడ్లపొడి,ఇండ్లదగ్గరికి మోసుకొచ్చే పకోడాలట్లా సిరు తిండ్లు…శానా వాటిమింద ఆశ!! ఇట్లా ఆశల జనాలు ఇంట్లో ఒగరికి తెలీకుందా ఒగరు గింజలు, బెల్లము,గడ్డి గట్రా మారకం సేసి తీసుకొంటా వుండ్రి.(అప్పుడెక్కువగా వస్తుమారకం ఉండేది
   ఇంకా కొంద్రు సుట్టాల ఇండ్లలో గొర్రెలు, మేకలు, కోల్లు పాలకు మేపిచ్చి సంపాదన సేస్తా వుండ్రి.
   ఇంగ మగ జనాలకి బీడీలు,సిగరెట్లు,సినీమాలు, ఓటలు తిండ్లు(హోటలు తిండికి అలవాటు పడి మా ఊల్లో రెండు మూడు కుటుంబాలు ఆస్తులు మొత్తం పోగొట్తుకొన్న సంఘటనలున్నాయి) దుద్లు కావల్ల. వాళ్లు కల్లం నుండి గింజలు,  గానుగ నుండి బెల్లము ఇండ్లకి మోసేటవుడే పనులు సేసే జీతగాల్లకి సెప్పి దార్లు మాల్లించి అంగళ్లకు సేరుస్తా వుండ్రి. ఇంగొగు పక్క జీతగాల్లు రాతిరి పొద్దు కాయగూర్లు, టెంకాయలు, సేన్లకి సల్లే ఎరువులు దాసిపెట్టి దుడ్లు సేసుకొంటా వుండ్రి. ఈ దొంగ సరుకులు రూపాయికి పావళా గూడా బాళుతా వుండ్లేదు.
    ఇట్లా యవ్వారము దగ్గర దగ్గర  1980 వొరుకూ ఉమ్మడి కొంపలు ఇడిపొయ్యేదంకా జరిగి యాపారస్తులు బాగా బలిసి పొయ్యిరి.
   ఆ ఇరుమొయిలు తరువాత జనాల మద్య రూపాయల శలామణీ ఎక్కువాయ. రూపాయలు ఒడ్డీలకు ఇచ్చేది, దళ్లాళి యాపారము,లంచాలు రకరకాల గిలీటు యాపారాలు మొదలయ్యి, శమట కారిచ్చి కష్టం సేయకుండ దుడ్లు తోనే దుడ్లు సంపాదన సేసే యవ్వారం మొదలాయ!!
    ఇంగ పాత కాలములో మాల మాదిగోళ్ల బతుకు సెప్పేకి మాటలు సాలవు.
    నీల్లు కావలిస్తే ఊరిముందర సేద బాయి దగ్గరికి కుండలు తెసుకోనొచ్చి అంత దూరములో నిలబడతా వుండ్రి. “అమ్మా నీల్లు పోయండి  ఇంట్లో బిడ్దేడుస్తా ఉంది. అయ్యా నీళ్లు పొయ్యండి కూలికి పొయ్యేకి యాలవుతుంది.” అని అందర్నీ బంగ పోతావుండ్రి.వాళ్ళ  సేన్లలో పనులు సేసే వాళ్లకయితే రవ్వన్ని పోస్తా వుండ్రి గాని, లేకుంటే వాళ్ల మొకమే సూస్తా వుండ్లేదు.
    ఒగొగు దినము అదే పొద్దుకి– దురిబిచ్చంలో అదిక మాసం — అన్నట్లు గుడి పూజారి సాములోరు నీళ్లకొస్తే శూద్రోళ్లు కూడా వాళ్లు సేదే శేత్తాడు కూడా బాయి గిలకమింద నుంచి తీసుకోని దూరం పోవాల్సిందే!!
     ఆ సామి తాను తెచ్చిన తాడు గిలక్కి తగిలిచ్చి ఒగ బిందెడు నీల్లు సేత్తా వుండె. మొదటి బిందెతో అంతవరకూ శూద్రోళ్లు సేదిన గిలకని,బాయి అరుగునీ కడిగి ఆడే స్నానం సేస్తావుండె. అంటే గాదు ఆయప్ప తాడు బాయిమిందేసి గుడిలోనికి పొయ్యి మంత్రాలు సదువుకొంటా దేవునికి అలంకారము సేసిన పూలు,తులసీ ఆకులు తెచ్చి బాయిలోకే ఏస్తావుండె. యాలంటే దేవుడు అంటిన పూలు శానా పవిత్రం అయ్యినవంట. వాట్ని యాడజిక్కితే ఆడ పారేయగూడదంట!!
    అప్పుడు శానా పుణ్యాత్తుములు ఉండేవోల్లు. ఇంట్లో ఎనుము గాని ఆవుగాని ఈనితే దండిగా పుణ్యం రావల్లని మురబాలని బాయి లోకే పోస్తావుండ్రి.(అట్లయితే ఊర్లో అందరికీ దానం సేసినట్లేనంట!!). బాపనోళ్లకి కమసలి ఆశార్లకి ఇస్తావుండ్రి.
    పూజల పూలు,మురబాలు కల్సిన నీళ్లు తాగి రోగాలొస్తే ఊరి   ద్యావర్లూ,కలిశపూజలూ, దీపాలూ సేసి పాకు కాలుస్తా వుండ్రి.(పట్టుతో ప్రత్యేకంగా నేయించిన పాగా ను ఆవు నేతితో బాగా తడిపి ఇత్తడి పళ్లెంలో దేవుని ముందు నైవేద్యంగా వుంచి కాల్చి, కాలగా మిగిలిన కందెనవంటి దాన్ని నుదుటిమీద బొట్టుగా ధరించడం). దండిగా ముడుపులు కట్టుకొంటా వుండ్రి.
     దాన్నట్లిడిసి మాదిగ మాలోళ్ల కతలు సూస్తాము!!
     ఈళ్లు నీల్లకి నిలబడి నిలబడి ఎవరన్న దయతల్సి పోస్తే ఇంటికి మోసుకు పోతా వుండ్రి. ల్యాకుంటే వంకల్లోనో వాగుల్లోనో నించుకొస్తావుండ్రి.(నాకి ఇరవై ఏండ్లు వయసొచ్చే సరికి ఊరికి ఆనుకోని ఒగ బాయి తవ్వి కరెంటు మోటారు బిగిచ్చిరి.ఈ శేదబాయి దగ్గర జనాల్తో అడుక్కోనే దేమని ఒగరిద్దరు మాల మాదిగోల్లు ఆ బాయి దగ్గర తొట్టీలో తీసుకుపొయ్యేది మొదలు పెట్ట్రి.దాన్ని సూసిన యజమాని రెడ్దెమ్మకు కడుపుమండి తొట్టీని పేడతో నింపేది మొదలుపెట్టె– సూస్త్రేమన్నా !! మనుషుల బుద్దులు యంత బాగుంటాయో??)
     ముందే సెప్పింటిగదా? మేము కొత్తగా కొనుక్కొన్న ఇంటి ముందర తార్రోడ్డుకు తూరుపు దిక్కులోనే మాదిగ నారాయణప్ప గుడిశె అని! ఆయప్ప కొడుకే అశ్వత్తుడు. అశ్వత్తుడు పుడుతూనే వాళ్లమ్మ సచ్చిపొయ్యిండె. వానికి అవ్వుండె.ఆయమ్మ పేరేమో ఎవ్వురికీ తెలీదు. అందరూ నల్లమ్మ అనే పిలుస్తా వుండ్రి.
     ఊర్లో ఏడిదయినా రగడ జరిగితే సాలు– ఈ నల్లమ నల్ల గాన్నే అడ్దం పెట్టి తిడతావుండ్రి.నీళ్లకి ఈల్లు పడే అవస్తలు సూసి అస్వత్తునితో నేను అంటావుంటి “ఒరే నేను తాడు బకీటు తెస్తాను. రాతిరిపూట అందరూ నిద్దర పొయ్యినంక నీళ్లు సేది మీ ఇంటి నింద పోస్తాము” అని.
    దానికి వాడు ఒప్పుకొంటావుండ్లేదు. మా ఇంట్లో ఎవురూ లేనవుడు గడపదాటి లోపలికి రారా ఏమయితుందో సూస్తాము అన్నాగూడా వాడొస్తావుండ్లేదు. దానికి ఒగ పెద్ద కత సెప్పుతా వుండె!!
    ” మేము ఈ బూముకి మూల వాసులు. అందుకే మాజనాన్ని ఆది ఆంద్రులు అని పిలుస్తావుండ్రి.తాజకీయం ఆయప్పగారు మమ్మలి మేము మర్సిపోవల్లని”అరిజనులు” అనే పేరుపెట్టి నాటకాలు ఆడతావుండారు.
   పూర్వకాలంలో ఒగాయప్ప ఉన్నంట! ఆయప్పకి ఇద్దరు పెండ్లాములంట. పెద్దపెండ్లాముకి ఇద్దరు కొడుకులంట.వాల్లలో పెద్దోడు మాదిగోడంట! సన్నోడు మాలోడంట!! అపుడింకా జనాలకి బూములు దున్ని పంటలుపండిచ్చేది తెలీదంట. ఈ మాల మాదిగపిల్లోల్లది జీవాలు మేపే పనంట.
   పిరికి జనాలయితే బయంతో గుంపులు గుంపులుగా వుంటావుండ్రంటకదా. ఈల్లయితే శానా దైర్యమయినోళ్లంట. కష్టజీవులంట.అందుకే ఒగరిజత ఒగరు పట్టకుండ వాల్లకి ఇష్టమైన దిక్కికి పశువులు తోలుకు పొయ్యి మేపుకొస్తా వుండ్రంట.
   సిన్న పెండ్లాముకి శానా ఏండ్లకి ఒగ కొడుకు పుట్నంట. ఆయమ్మకి ఆ పిల్లోడంటే శానా ప్రాణమంట. వాన్ని మాల మాలమాదిగ పిల్లోల్ల మాదిరీ పుశువులెంట పంపగూడదు, నీడలో కూకోని సుకుంగా బతికే ఉపాయము ఎదకల్ల అని అనుకొన్నంట.
     ఒగదినము ఎవరూ లేంది సూసి,ఒగ గడ్డం స్వామిని పిలిపిచ్చి ఒగ ఆవుదూడని పట్టిచ్చి మనసులోని మాట సెప్పినంట. ఆ స్వామి కండ్లు మూసుకోని శానాపొద్దు ఆలోశన సేసి ఆయమ్మ సెవిలో గుసగుసా అని ఉపదేసికం సేసినంట.
   ఉన్నట్లుండి ఆయమ్మ మొగునికి ఆరోగ్యం సెడిపాయనంట. కండ్లు తెరీకుండ,నోటిమాట రాకుండ, కాళ్లూ సేతులూ కదిలిచ్చుకుండా అయిపాయనంత. అవుడు సిన్న పెండ్లాము,ఆయమ్మ బిడ్డ నెత్తీ నోరూ బాదుకొంటా గొళో అని ఏడ్సబట్రంట. పెద్దపెండ్లాము గాబిరి పడి సెయ్యీ కాలాడక రవ్వంతసేపు నిలబడి, కడాకి గడ్డము స్వామిని పిల్సుకొచ్చినంట.
    ఆయప్ప నాడీ పట్టి,యదమింద సెయ్యేసి,తితులూ వారాలూ నచ్చత్తరాలూ లెక్కబెట్టి, పెద్దపెండ్లామును దగ్గరికి పిల్సి సేయాల్సిన పనంతా పూస గుచ్చినట్ల సెప్పినంట. అపుడు పెద్ద పెండ్లాము తన కొడుకుల్ని పిల్సి ….” ఒరే నా బిడ్దల్లారా!! మీ నాయనికి ఆరోగ్యం సెదిపొయ్యింది. అది గ్రహాలు సేసిన సెడుపంట. దాన్ని అంతం సేసేకి నేను మన ఇంటికి ఉత్తరం వాకిలి తెర్సి నెట్టగా ఏడు ఆమడలు దూరం పోతాను. ఆడ ఏడు వంకలు అడ్డమొస్తాయి. వాట్ని దాటినంక ఏడు మర్రిమానులుంటాయి. వాట్నెక్కి కొమ్మలమిందే పోతే దెబ్బయ్యి అడుగుల గుట్ట సిక్కుతుంది. దాని ముందర ఒగ గుడి. గుడుముందర ఒగ కోనేరు. దాంట్లో గ్రాచారాలు కడిగే నీళ్లుంటాయి. ఆ నీళ్లలో ఏడు సార్లు మునిగి ఒంటిమింద నూలు పోగుకూడాల్యాకుండా బయటికొచ్చి, గుడిలో వుండే దేవతని ఏడుసార్లు ప్రదచ్చిన సేయల్ల. ఆ తల్లి సేతిలో ఒగ బంగారు బరిణె వుంటుంది. దాంట్లో ఈబూతి తీసుకోనొచ్చి మీ నాయిన శరీరానికి రాస్తే రోగము నయమవుతుంది. దీన్నంతా నేను దిగంబ్ర శరీరముతో సేస్తాను. ఇది ముగిసేవొరుకూ మీరు మన ఇంట్లేకే కాదు ఊరిలోపలికి గూడా అడుగు పెట్టగూడదు. అన్నీ సక్కబడినంక నేనే మిమ్మల్ని పిలుస్తాను ” అని సెప్పి పొయ్యింది.
      మాయమ్మ సెప్పిన మాటకి కట్టుబడి మేము ఊరికి బయటే నిల్సిపోతిమి. ఉత్తరానికి పోయిన మాయమ్మ ఒచ్చిందో రాలేదో మాకి తెలీదు. మా నాయిన సచ్చినాడో బతికినాడో తెలిసేకి మాకి వూర్లోకి ప్రవేశము లేదు. మా సిన్నమ్మ కొడుకులు మాత్రం పెరిగి కోమటోల్లయినారంట. వాళ్లే అందరికన్నా శ్రేష్టులు అని సాటుకోని నీడలో కూకోని అంగళ్లు పెట్టుకోని కడుపులోని సల్ల కదలకుండ యాపారాలు సేసుకోని బతుకుతా ఉండారంట.” అని సెప్పె అస్వత్త.
   అపుడు నా వయస్సు 8–9 మద్య ఉండొచ్చు. ఆయప్ప నాకన్న మూడు నాలుగేండ్లు పెద్దోడు. ఆయప్ప సెప్పిందంతా యిని నేను పకా పకా నగితి. “యంత యెర్రిజనాలప్పా మీరు!! ఇదంతా నిజమే అనుకోని ఇన్నేండ్లనుండి ఊర్లకి దూరమయ్యి బంగారట్లా బతుకుని నాశనం సేసుకో నుండారు” అని అంటి.
  ” ఏమన్నా అట్లంటావు?? ఎవురు యంతకి బతికినా బంగార్ని పుటం పెట్టుకోని తినరు. మేము సచ్చిన జీవాల నంజిరిని తినేదీ బతికేకే! మీరు సంగటిముద్దలు గతికేదీ బతికేకే!! ఈ బతుకులు ఆరినంక కడాకి అందరూ సేరాల్సింది మూడడుగుల గుంతకే!!!”
    “మా నాయన్ని బతికించల్ల, అని నిజమైన ఆలోశనతో పోయిన మాయమ్మ యాపొద్దుటికైనా తిరిగొస్తుంది. మమ్మల్ని జనాల మద్యాకి పిలుస్తుంది. మాయమ్మ పేరు సత్తెక్క. సత్తెక్కంటే సత్యము. సత్యానికి సావు లేదు!!” అని గంటకొట్టినట్ల సెప్పుతావుండె.
     ఈ జనాలవి  ఏం బతుకులో ఏమో?? నాకయితే సీమంత గూడా అర్తమయితా వుండ్లేదు!!

కరెంటొచ్చె..! జనాలకి తీరిక సిక్కె..!

     సడ్లపల్లె చిదంబర రెడ్డి 

యనకటి  కాలంలో సేద్యాల్ని వాన దేవునిమింద బారమేసి సేస్తావుండ్రంట రైతులు. అదనుగా సినుకులు పడితే ఆనందము. ఏటిస్తే నీళ్ల నెదుక్కోని పొయ్యే వలస బతుకులంట.
 
    రాజులు తవ్విచ్చిండే సెరువుల కింద, ఏర్లు, వంకల తీరాల్లో యాతమెత్తి,గూడేసి,కపిలి(మోట)తో నీళ్లు తోడి కొందరు యవసాయం సేస్తా ఉండ్రంట.
 
    సేద్యాలు సేసేకి  బాయిలు తవ్వేది పజ్జెనిమిదో నూరేడు ఇరుమైలు ఒరుకు(18 వ శతాబ్దికి వెనకా ముందుదాకా) రైతులుకు తెలీదంట!!
 
   అపుడు గుళ్లూ గోపురాల దగ్గర నాలుగు మూల్లు సౌకంగా తవ్వి రాతి కట్టడం కట్టే  కోనేటి బావులు మాత్రమే తెలుసునంట. ఊర్లల్లో సేద బావులు గూడా నాలుగు మూళ్ల సౌకాలే!!
    కుంపిణీ వోని (ఆంగ్లేయుల కంపెనీ)కాలంలో రైతులకు పట్టాలిస్తూనే కొందరు బాయిలు తవ్వేది మొదలు పెట్రంట.  ఏటి గడ్డలో మెత్తగా ఉండే నేలని పదో పదకొండో అడుగులు తవ్వుతూనే దిక్కులేనన్ని నీళ్లు ఊర్తా ఉన్నంట. దానికి రాళ్లతో గోడ కడితే  నీళ్లూ మన్నూ కలిసిన(కొచ్చు) బురద, ముందరికి జరిగొచ్చి బాయిలన్నీ పూడుకు పోతా  ఉన్నంట.
   ఇట్లయ్యెల్లేదని ఎదురు పుల్లలు,లక్కిలి బర్రలు,పూలి కొమ్మలు నరుక్కొచ్చి తీళి తీగల్తో పెద్ద పెద్ద తడకలల్లి, బాయి తవ్వే కొద్దీ బూమి లోపలికి దించుతా వుండ్రంట. అపుడు మన్ను తడక ఎనకాలే నిల్సి, నీళ్లు మాత్రం బాయిలోనికి వొస్తా వున్నంట. వాట్ని “కొర్సు బాయిలు” అని పిలుస్తా వుండ్రంట!!
    ఒగసారి అరవ దేశం (మదరాసు రాష్ట్రం) నుంచి ఒగ ఇంజినీరు ఒచ్చినంట. ఆయప్ప సింత పలకల్ని గుండ్రంగా రింగుల మాదిరీ కోపిచ్చి,లోతుగా తీసిన బాయిలో అడుగున ఉంచేది, దాని మీద ఉలితో తొల్సిన రాళ్లను న్యారముగా (నీటుగా) కట్టేది, బురద మన్ను నూకినా కదలకున్నట్ల రాళ్లను పేర్సే ఇదానము రాళ్ల పని సేసే “వడ్డి” కులస్తులకు నేర్పినంట.
    అఫుడు అల్లో (అపుడు మా ఊరిదగ్గరున్నది పెన్నేరని చాలా మందికి తెలీదు.హళ్ల అంటే కన్నడంలో వంక అని అర్థం చాలా ఏళ్లవరకూ హల్ల అనే వ్యవహరించే వారు.) ఏడెనిమిది మట్లు (మట్టు=6 అడుగుల లోతు) బావులు తవ్వేది మొదలు పెట్రంట. రెండు మూడేండ్లు వానలు పడకుండా యగేసుకొంటే ఆ బాయిల మద్యలో పిల్ల గారండా (సిమెంటు రింగు లాంటిది.గారుతో చేసిన అండాకారం కలది) దించేది కూడా నేర్సిరి. బాయిల కన్నిటికీ అంతే  కొలతల్తో బార్లు తొలిసి కపిల బాన్లతో నీల్లు తోడి వానలు పడకున్నా గూడా సేద్యాలు సేసేది నేర్సిరంట.
     ఈ రకంగా సాగు బూమి యంత పెంచినా ఏంటేంటివో రోగాలొచ్చి పెట్టిన పంటంతా నాశన మయితా వున్నంట. అవుడు ఇంగిలీషోని రాజ్యమంట! ఆయప్పగారు పంటలకి మందులు సల్లమని రైతులకు పురమా యిస్తా వుండ్రంట. రైతులు వాళ్ల మాట ఇంటా వుండ్లేదంట. పంది రోగమని పైర్ల మింద పండులు కోసి రగతం సల్లేది,కొక్కెర రోగమని సేన్ల దగ్గర కోళ్లు కోసేది,ఎనుంపోతులు నరికేది సేస్తా వుండ్రంట.
 IMG_0008
    అపుడపుడే కొత్తగా సీమెరువులు(రసాయన ఎరువులు) ఒచ్చినంట. అవి మన్నులో ఏస్తే కరిగే దానికి రైతులు ఉప్పు అని పిలుస్తా వుండ్రంట. రైతులు బూములకు తోలే పశువులెరువులు,ఒండు మన్ను,పచ్చాకు జతకి రవ్వంత సేమెరువు సల్లండి పంటలు బాగా పండతాయని రెడ్డీ కరణాలు అందర్నీ పిల్సి బంగ పోతా వుండ్రంట. అయినా రైతుకు కిబ్బిబ్బీ (ఏమాత్రం)వాళ్ల మాట్లు ఇంటా వుండ్లేదంట!
     ఇట్ల అయ్యెల్లేదని కరణాలు రాతిరిపూట తలారోల్లని  పిల్సి సీమెరువులు,పురుగుల మందులూ ఇచ్చి– ఒగొగొ ఊర్లో ఒగొగు సేను గుర్తుపెట్టుకోని రహస్సింగా సల్లించేది మొదలు  పెట్రంట.
    సేమెరువులు మందులు తగిలిన పైర్లు ఏపుగా పెరిగి ఇరగ్గాసినంట. అది తెల్సి మిగతా జనాలుకూడా అవిట్ని వాడేది మొదలు పెట్రంట. దాంతో రెడ్డీ కరణాల జాతకాలు మారిపాయ నంట. యాలంటే గిరాకీ పెరిగి అవ్వి అంగాళ్లో సిక్కకుండా అయిపాయ నంట. రైతులు కొనల్లంటే రెడ్డీ కరణాల సంతకం కావల్లంట!!
   ఆ కాలంలో తిరుపతి యంగట్రాణస్వామి దర్శనం బిరీన అయితా ఉన్నంట గానీ,కరణం కంట్లో పడల్లంటే అయిదారు సార్లు అడుక్కు తినే వాళ్ల మాదిరీ రైతులు ఆయప్ప ఇంటిముందర పడిగాపులు కాయల్లంట. సేన్లో పండే కూరగాయలు,బెల్లము,నెయ్యి,టెంకాయలు,జున్నుపాలు… మోయ లేనన్ని మోసిస్తే గాని ఆయప్ప అర్జీ మింద సంతకం సేస్తా ఉండ్లేదంట.
    రెడ్డీ కరణాలు ఊర్లో కొస్తే సన్నాబన్నా జనాలు ఎర్సుకోని సస్తాఉండ్రంట. అపుడు యాడాదికి ఒగతూరి బూమి సిస్తు (రూకలు,కందాయము అనికూడా పిల్చేవారు)కట్టల్ల. గుత్త  రూకలు వసూలు సేసేది వాళ్లే.
      1960 ఇరుమైల్లో(వెనకా ముందు)నాకి ఆరేడు ఏండ్లు ఉండొచ్చు. రెడ్డీ కరణాలు ఊరంతా తిరిగి మా గుడిసి పక్కనుండే మా అప్పప్పా(చిన్నాయన) గుడిస్తా కొచ్చిరి. ఆయప్ప అయిదు రూపాయలు గుత్త రూకలు కట్లేదంట! దాని కోసరం జప్తు సేసి తలారాయప్ప  కుర్ర దూడని పట్టుకు పొయ్యి గుడి ముందర కట్టేశ.
     ఆపొద్దు మా నాయిన ఊర్లో ఉండ్లేదు. వానలు రాకుండా ఎగిచ్చుకోనుంటే ఇరాట పర్వం సదివేకి యావిదో ఊరికి పొయినట్లుండె. మా యవ్వ ఊరంతా దేబిరించినా అయిదు రూపాయల దుడ్లు పుట్టందం కాలేదు. కడాకి తాసిల్దారొస్తే ఆయప్ప కాళ్లు పట్టుకోని” ద్యావరా బంగారట్లా కుర్రదూడని పట్టుకు పోతే అది మేతా నీళ్లు లేక సస్తుంది. రెండు మూడు దినాలు గడువియ్యండి యాడో అప్పో సొప్పో సేసి కడతాము” అని అడుక్కోనె. అయినా ఆయప్ప సెవుల్లో ఏసుకో లేదు.
    ఇంగా ఎవురో కురవోళ్లు రెండ్రూపాయలు కట్టకుంటే ఇంటిని జప్తు సేసి ఇత్తడి తప్పేలా ఎత్తుకొచ్చిరి.
     సాయంత్ర మవుతూనే కుర్ర పెయ్యని ఇందూపురంలో వుండే బందుల దొడ్డికి తోల్రి. అపుడు మా యవ్వ “రాతిరంతా దాన్ని ఉపాసం సంపుతారు  మ్యాత ఎత్తుకుపొయ్యి ఏసి రారా “అని సిన్నాయన్ని పురమాయించె.
IMG_0021
    ఆయప్ప శానా అమాయికుడు, జతకి ఆని కాళ్లు సెప్పులు తెగి పొయ్యిండివి నడిసేకి శాతగాదు అని తెల్ల పదం పాడె.(నే చిన్నప్పుడు చాలా మందికి పదాల నిండా ఆనెలే.చెప్పులు కొనలేని చాలా మంది పాదాలకు పాత బట్టలు చుట్టుకొని నడిచేవారు. మా అమ్మకు, నాన్నకు,పెద్దన్నకు ఉండేవి. అది చర్మ రోగమో పరిశుభ్రతకు సంబందించినదో తెలియదు.ఇప్పుడు ఎక్కడా కనిపించదు).కడాకి మా సిన్నన్నయ్య రవీందర్రెడ్డి ఎండిండే రాగు తాళు మోపు మోసుకు పొయ్యి బందుల దొడ్డిలో కుర్రకు తినిపించి ఒచ్చె.
    రెడ్డీ కరణాలు 1982 దంకా పల్లుటూరి జనాల్ని పీతిరి పంతల మాదిరీ (రాబందుల్లాగా) పీక్కు తినిరి. అంత సేపటికి అపుల పాలై, సీమలో  సేద్యం సేసే బదులు అడుక్కితినేదే మేలని, మేము సేద్యం ఇడిసి పెడ్తిమి. ఇపుడు రైతుల్ని రాజ్యమే పీక్కు తింటావుందని గుస గుసలాడే వాసనొస్తావుంది!!
   సొతంతరం ఒచ్చిన పది పదకొండేండ్లకి, మా ఊరి పొలాలకి కరెంటొచ్చె!! అంతకు ముందు నీళ్లు తోడే కపిల బాన్లు, డీజలింజన్లని మూల కేసిరి. బాయిల దగ్గర రూములు కట్టించి కరెంటు మోటార్లు బిగిచ్చిరి.
    అయిదారు జతల ఎద్దులు,బీముని మాదిరీ వుండే మూడు జతల మగ మనిషులు పేగులు తెగి పొయ్యేతట్లు, పేడలో పులుగుమాదిరీ రాతిరీ పగలూ యంపిర్లాడినా రెండు కొడతల్ని నీళ్లు తడిపేకి అయితా వుండ్లేదు!! అట్లాది కరెంటు మోట్రు సుచ్చిని”టప్” న ఒత్తితే సాలు “జరో” అని ఇనుప్పైపుల్నిండా నీళ్లు పాతాళం నుండి ఎగజిమ్ముకోని ఒస్తావుండె.
    రైతుల ఆనందాన్ని కొల్సేకి మాటలు సాలవు. సాగు సేసే బూమిని పెంచి పారేసిరి. వేలాంతరం సన్న జీవాలు(గొర్రెలు,మేకలు),నూరారు ఊరి జీవాలు మేతకని ఇడిసిన బీడు బూములన్నీ మాయ మాయ.ఎద్దులకి పని తగ్గి పాయ. మనుషుల కష్టం తీరి పాయ.
    ఆడ మొదలాయనన్నా! అడవుల్ని అంతం సేసే ఆది కాలం!
    ఆడ మొదలాయనన్నా! పశువుల్ని కబేళా కెత్తే  కొత్త కాలం!
    ఆడ మొదలాయనన్నా! పని లేని జనాలు పట్నానికి తిరిగే కాలం!
    ఆడ మొదలాయనన్నా! ఓటలు తిండికి సినిమా బొమ్మలకి అలవాటు పడే  కాలం!
    ఆడ మొదలాయనన్నా! అప్పులు సేసి ఆస్తులమ్మే అద్దువాన్న కాలం!
    ఆడ మొదలాయనన్నా! ఆడబిడ్డల్తో కట్నం వొసూలు సేసే దుడ్ల కాలం!
    ఇంతకి ముందు పెడతా ఉండే ఆరుతడి పంట్లు రాగులు,జొన్నలు,సజ్జలు,కొర్రలు ఇడిసి పెట్టి సెరకు తోట్లు,మిరప సెట్లు,వొరి పైర్లు యేయ బట్రి.
   బూ మండలం తయారయ్యి యన్ని  యేల కోట్ల యేండ్లయ్యిందో !!??  ఆ పొద్దుట్నుంచి ఆ యమ్మ ఒంటి పొరల నిండా గంగమ్మ తల్లిని గుట్టుగా దాసుకో నుండె!! వానలు అయిదారేండ్లు పడకున్నా పై పైన మాత్రమే యండ పీరుపుకి బూని ఎండుకు పోతా వుండె. అట్లాది బాయిలకి బిగించిన కరెంటు పైపులు ఏనుగు తొండాల మాదిరీ నీళ్లని పీల్సి పారేశె. ఆకలి గొన్న పిల్లోడు పాల బుడ్డీని సిబికి సుక్కడు గూడా మిగలకుండా ఉత్తది సేసి నట్ల బూమితల్లిని నున్నగ పీల్సి పారేసిరి.
   దిక్కు లేనంత పంటలు పండిచ్చేది మొదలు పెట్రి. యంత జేసినా, ఇచ్చిన అప్పులకి ఒడ్డీలని, దళ్లాలని, రేట్లు పడిపొయ్యిండివని ఇందూపురం లోని యాపారస్తులు బతికి బాగు పడ్రేగాని రైతులకి కడాకి మిగిలింది అప్పులూ నొప్పులు  మత్రమే!!
   ఇదే కాలంలో అరవ దేశం కోయంబత్తూరు నుంచి యల్.జి.బాలక్రిష్ట్న అనే ఆయప్ప ఒచ్చె. మా ఊరికి మూడు నాలుగు మైళ్లదూరంలో నూరారెకరాల దిన్న (మెట్ట) బూమిని సూసు పాయ.
    ఉలవలు గూడా పండెల్లేదని ఇడిసిపెట్టిన బీడు బూములవి.గొర్రి మందలు, ఊరిజీవాలూ మేస్తావున్న పనికి రాని జమీన్లు. వాట్నంతా యకరా ఇరవై ముప్పై రూపాయలకే అరవాయప్ప కొనేసె. నూలు మిల్లు కట్టేది మొదలు పెట్టె.
   అపుడు రైతుల దగ్గర పని సేసేకి రెండణాలు(12 పైసాలు).కోయంబత్తూరాయప్ప పావలా( 25 పైసలు) ఇయ్య బట్టె. సుట్టూ పక్కల జనాలంతా మిల్లు కూలికే పోబట్రి.
   మిల్లు కట్టేకి ఇటికలు కావాల్సొచ్చె. ఏటి గట్టు రైతులు కొంద్రు సేద్యాలిడిసి ఒండు మన్నుతో ఇటిక బట్టీలు మొదలు పెట్రి. ఇటిక కాల్సేకి కట్టి కావల్ల గదా!! పెన్నమ్మ నది గట్లో నందన వనాల మాదిరీ వుండే కానుగ తోపుల్నంతా నున్నగా  నరికి పారేసిరి.
  గలగలా అని పార్తావుండే నీళ్లతో, పచ్చ పచ్చగా ఊగుతా వుండే అడవుల్తో నిండు ముత్తయిదువు మాదిరీ కళ కళా మెరుస్తావుండే పెన్నమ్మ— మొగుడు సస్తే తలకాయి కొరిగిచ్చుకోని కదలకుండా  మెదలకుండా మూల్లో కూలబడ్న ముండ మోపయిపాయ!!

మా అన్నయ్యకి పురుగు ముట్టె !!

     మేము ఇల్లు కొనుక్కొంటిమి అని ముందే సెప్పితి గదా! అది శానా పాతది. దాని వాకిళ్లు రాజుల కాలములో కోటలకి ఉన్నట్లుండె. వాట్ని మూసేకి ఒగరి శాత అయితా వుండ్లేదు. గోడ నాలుగడుగుల ఎలుపు. అంటే అది 1800 సగాల్లో (ప్రాంతంలో) కట్టిండొచ్చు. ముందు  కాలంలో ఆ ఇంట్లోనే కూలి బడి నడుస్తా ఉన్నంట.(మా ఊరి కథ చెప్పే తప్పుడు వివరంగా చెప్ప బడుతుంది)
 
     దాన్ని కొన్న మా నాయిన నూరో ఇన్నూరో రూపాయిలు తక్కువిచ్చినంట.అందుకే నీలకంఠాశారి అయ్యివారు ఇంటి మీదుండే మాడీ (మేడ), దానికి పర్సిండే పలుకులు పీక్కు పాయి నంట. దాన్ని రిపేరి సేయల్ల అని రెండు మూడు నెల్లు మేము ఆ ఇంటికి పోనే లేదు.
    ఒగదినం వాకిలి తీస్తే రామ రామా అది ఇల్లు గాదు శవాల్ని పూడిసేకి గుంతలు తీసిన మశానం మాదిరీ అయిపొయ్యింది!!
    ఆ ఇంటి ఆశార్లు ఊర్లో అందరికన్నా షావుకార్లంట!! వాళ్లు సెప్పిన మాటకి ఎదురు ఉండ్లేదంట. అవుసరాలకి రెడ్లకి ఎండి రూపాయలు అప్పులిస్తా వుండ్రంట. ఆ కాలంలో దుడ్లు  దాసి పెట్టుకొనేకి బ్యాంకులు,బీరువాలూ అట్లావి వుండ్లేదంట. అందుకే దొంగల భయానికి, కుండల్లో పోసి రూపాయల్ని ఇంట్లో గుంతలు తీసి బూమిలో పాతి పెడతా వుండ్రంట. ఆరకంగా ఆ ఇంట్లో దండిగా దనముంది. పూడిసి పెట్టిన కుండ్లు ఒగొగ సారి యజమానికి సిక్కకుండా తావలు గూడా మారుస్తాయి అనే నమ్మకాలతో రాతిరి పొద్దు కొందరు ఆశపోతు  జనాలు లోపలికి దూరి పెద్ద పెద్ద సప్పిడీల్ని (బండల్ని) గడార్ల(గడ్డపార)తో లేవదీసి గోడలకి నిలబెట్టి అయిదారడుగులు లోతు గుంతలు సేసిండారు.
     మా నాయన దాన్ని సూసి తల తలే కొట్టు కోని సదును సేసి బండ్లు పరిపిచ్చె. తిరగ రొన్నాళ్లకి ఆ ఇంట్లో సేరితిమి.
    ఒగ దినం పొద్దున్నే నేనింకా నిద్దర లేయనే లేదు. మా యమ్మ గట్టిగా అబ్బరిచ్చి ఏడుస్తా వుంది. ఊర్లో వుండే జనాలంతా మా పడమర వాకిల్లో దూరి తూరుపు వాకిలి దిక్క పారి పారి పోతా వుండారు. దుప్పటి కప్పుకోని పడసాల్లో పడుకో నుండే నేను దిడుగ్గున (ఉన్న ఫళంగా) లేస్తి. ఏమీ అర్తం కాక నేనుకూడా ఏడ్స బట్తి. అపుడు ఎవురో ఒగాయమ్మ(ఉప్పుర గంగప్ప పెండ్లాము కావొచ్చు) నా దగ్గరికొచ్చి, నా ముకమ్మింద అడ్డం పడిండే యంటికిలు సరి జేసి, దారం తీసుకోని జుట్టు మాదిరీ కట్టి తూరుపు వాకిలి దగ్గరికి పిల్సుకు పాయ.
IMG_0078
     ముందే సెప్పితి గదా అది లంకంత కొంప అని!! అంత పెద్ద ఇండ్లయినా మా ఊర్లో యా ఇంటికి గూడా ఇంటి లోపల బచ్చలి ఉండ్లేదు!! బయట తడకలు అడ్డం ఏసుకోనో, రాతి కూసాలు గోడ మాదిరీ పాతుకోనో, సెట్లు మరుగు సేసుకోనో బచ్చలి మాదిరీ వాడుకొంటా ఉండ్రి.
   ఇంటి ముందర తూరుపుకి బెంగులూరు మెయిను రోడ్డు. ఇంట్లో నుంచి బయటికి  అడుగు పెడుతూనే యడం పక్క పెద్ద సీమ జాలి మాను (సీమ తుమ్మ) దానికీ రాతి గోడకీ నడి మద్య ఎండి పోయిండే మిరప సెట్లు (వంట చెరుగ్గా వాడ్డానికి) ఎత్తుగా వామి మాదిరీ ఏసిండారు. అదే మాకి బచ్చలి.
    నిద్దర లేస్తూనే మా నాలుగో అన్నయ్య సదాశివ రెడ్డి కాళ్లు మడిసేకి (ఒంటికి పోసేకి) బచ్చల్లేకి పాయనంట. అట్ల యడం పక్కకి తిరుగుతా వున్నట్లే గోడ రాళ్ల సందులో నుంచి పామొచ్చి కర్సి సరుక్కున ఆ సందులోనే దూరుకొన్నంట!!
   “యనా నా కాలికి పాము కరిశ” అని అన్నయ్య గాట్టిగా అర్సి నంట. గప్పన లోపల్నుంచి మా యమ్మ,నాయిన,అన్నయ్య,అక్కయ్య అందురూ పారొచ్చిరంట!!
    యడమ కాలు పిక్కకి కాట్లు పడిండి వంట. రగతము దిగ్గారి పోతా వుందంట.
   దాన్ని సూసి మా నాయిన “అది పాము కాదురా ఏడిదో పురుగ ముట్టింది. ఏమీ కాదు వూరుకో” అంజెప్పి దాని ఇసం పైనికి ఎక్కకుండా పెద్ద రాయిని ఎత్తిచ్చుకోని పాముల మంత్రం  ఏసే ఆయప్పతాకి ఇందూపురానికి పిల్సుకు పోయిండాడు.
  ఇంటి ముందర గుంపులు సేరి జనాలు ఎవరికి నోటి కొచ్చింది వాళ్లు మాట్లాడ్తా వుండారు. “ఈ పిల్ల గాళ్లు సెప్పితే ఇనరు.ఎనుము గొడ్లు మేపేకి ఏటి గడ్డకు తోలుకు పోతారు. ఆకలయితే ఏడిదో కాయో కసురో తిని ఆడుకోరు. కాల్సుకు తినేకని అడివెలకల బక్కలు తవ్వుతారు. అవిట్లో నుండి పాములు బయటికొస్తాయి. ఈళ్లు రాల్లతో, సన్న సన్న బర్రల్తో సంపేకి సూస్తారు. కానుగ సెట్ల సీదార మద్య అవి తప్పించు కొంటాయి. నాగుబాము పగ నలబై ఏండ్లు అన్నట్లు, ఇట్ల పగబట్టి సంపుతాయి. అని ఒగరు. “మన గ్రాచారం బాగ లేకుంటే తాడే పామై పీకు తుంది ” అని ఒగరు. అనుకొంటా రోడ్లో నిలబడి ఎదురు సూస్తా వుండారు. అప్పిటికే మా ఊర్లో ఒగటి రెండు సైకిల్లుండె.” సైకిలేసుకోని ఎదురు పోండ్రా ఎవరన్నాను ” అని కొందరు ఎవర్నో పురమా ఇస్తా వుండ్రి.
    అంత సేపటికి పెద్ద సిత మాన్ల దగ్గర మా నాయిన వొస్తా వున్నట్ల కనబడె. బుజం మింద అన్నయ్య వుండాడు.
  మా అన్నయ్యకి పది పదకొండేండ్లు ఉండొచ్చు. సూసేకి యర్రగ పల్సగా కుర్ర పెయ్య మాదిరీ వుంటాడు. ఆ పొద్దు పోలీ సోల్లు ఏసుకోనే రకంగా వుండే కాకీ అంగీ నిక్కరు తొడుక్కోని సిపాయి సిన్నోని మాదిరీ వుండాడు. అట్లా ఆయప్పని సూసేకి అందరు ఆత్రమాత్రముగా ఎదురు పొయ్యిరి. ఆ జనాల మద్య నేను గూడా పోతి. ఆయప్ప తలకాయి నాయిన బుజం మీద నుండి యనక్కి యాలాడతా వుంది. కండ్లు మూతలు పడిండివి. నోట్లో తెల్లగ నురగ కారి పోతా వుంది.
   నాయిన బరువుగా అడుగులేసుకోని ఒస్తా వుండాడు.
   “అన్నా! అనుమంతన్నా! ఇట్లియ్యన్నా పిల్లోన్ని ఎత్తుకొంటాను” అని ఎవరో అడుగుతా వుండారు. మా నాయిన మొకం సూసేకి కాకుండా వుంది.గొంతు ఆరుకు పొయ్యి, ఏమీ మాట్లాడ కుండా బలంతంగా ఏడుపు బిగ బట్టి నట్లుండాడు. కాళ్లీడ్సు కొంటా వొచ్చి ఇంటి  ముందర పండేశ. ఎవరో పారొచ్చి ఆ యప్ప కిందకి శిరి సాప ఏసిరి.
    యల్లెలికిల పండుకోనుండే అన్నయ్యని సూసి అందరూ గొళో అని ఏడ్స బట్రి.” అయ్యో సివంగట్లా కొడుకు పొద్దున్నే కాపీ గూడా తాక్కుండా కాలమయ్యి పాయ గదమ్మా” అని తల  తలే కొట్టు కోని మా యమ్మ ఏడుస్తా వుంది. సుట్టూ పక్కల ఇండ్లొల్ల మాట్లు ఇనే కొద్దీ   అందరి కండ్లల్లో నీళ్లు కార బాట్టె.  ” అప్పయ్యా కాసంత సింత సిగర కావల్ల అంటే ఎదురు సెప్పుకుండా సెట్తెక్కి పీక్కోనొస్తా వుండె. శాత గాదంటే బాయిలో నీల్లు సేది పోస్తా వుండె. బంగారట్లా పిల్లోనికి ఇంత బిరీన నూరేండ్లు నిండిపాయనే!!అని ఏడుస్తా వుండ్రి.
    అంత సేపటికి జొమ్మాని పల్లి నరసిమ్మప్ప అని మాకి మామ వరసవుతాడు. ఆ యప్ప వొచ్చె.
   “పిల్లోనికి ఏమీ కాదు రవ్వంత సేపట్కి బతుకు తాడు. నేను సెప్పినట్ల మీరంతా యినండి” అని సుట్టూ ముసురుకోనుండే జనాల్నంతా దూరం జరిపె.
  “ఎవరూ సేతులు కట్టి నిలబడొద్దు.తలకి రుమాలు సుట్టుకో వద్దు. వక్కాకు నమిలే వొల్లు ఉమిసేసి నోరు కడుక్కొంది. బీడీలు, సిగరట్లు తాగొద్దు.” అని అందర్నీ అదుపు సేశ.
   మా ఇంటికి ఈశాన్యం మూలకి రెండు మైళ్ల దూరం లో రైలు స్టేషనుంది. అట్ల తలెత్తి పార జూస్తే కనిపిస్తుంది. దాంట్లో ఆవులప్ప (కన్నడం లో హావు అంటే పాము అని  అర్థం)అనే ఆయప్ప పంజేస్తాడంట. యట్లా పాము కర్సినా మత్రమేసి ఎక్కిన ఇసం ఎనక్కి తీస్తాడంట. ఒగొగు సారి కర్సిన పామే తిరిగొచ్చి కాటేసిన తావే నోరుపెట్టి ఇసం అంతా తాగేస్తుందంట. అట్ల శానా మందిని బతికిచ్చి నాడని సెప్పి నరసిమ్మప్ప మామ  సైకిలులెక్కి స్టేషనుకి పాయ.
   రవ్వంత సేపటికి తిరిగొచ్చె.
   పాం మంత్రగాడు ఆవులప్పకి ఆపొద్దు డూటీ బెంగులూరు లోనంట. స్టేషన్లో నుంచే ఫోన్ సేసి సదాశివ రెడ్ది పేరు, అమ్మా నాయిన పేరు, వయస్సు అన్నీ సెప్పిండాడంట. ఫోన్లోనే మంత్రాలు సదివి రెండు గంటల లోపల బతికిస్తానని మాట ఇచ్చిండాడంట. ఇదంతా మామ సెప్పుతూనే శానా మందికి నమ్మకం కుదిరినట్లుంది. ఏడ్సకుండ గప్చిప్ అయిపాయిరి.
    టయిమయి పోతా వుంది. ఒంటి గంటాయ. బెంగళూరు నుంఛి నందీ మోటారు గూడా వొచ్చె.( అప్పుడు హిందూపురం నుండి బెంగలూర్ కి యన్.యం.యస్. మరొకటి సి.పి.సి.అని రేండే బస్సులు. ఇప్పుడు ప్రతి పది నిముషాలకూ ఒక బస్సు. జతకు రైల్లు,కార్లు,టూ వీలర్లు,లారీలు చెప్పలేని రద్దీ) ఆ బస్సులోనే మేము కర్నాటకము లోని మేన మామగారి ఊరు కల్యాకన పల్లి కి  వొచ్చి పోతావుంటాము. ఆ బస్సొల్లంతా మాకి వాడికి. ఇంటిముందర జనాల్ని సూసి వాల్లు గూడా దిగొచ్చి “అయ్యో పాపము యంత పని జరిగింది” అని అంగలార్సి పొయ్యిరి.
   కడాకి ఎవరో వొచ్చి “మీకి బుద్ది వుందో లేదో. ఇసం ఒల్లంతా ఎక్కి ఎర్రగా వున్న పిల్లోడు నల్లగ కమురుకు పొయ్యిండాడు. నిప్పుల మిందేసిన పూల తీగిమాదిరీ మాడి కండ్లతో సూసేకి కాకుండా అయ్యిండాదు.ఇంకా బతుకు తాడనే ఆశ యాల పెట్టుకొంటారు?” అని బుద్ది మాట్లు సెప్పితే రెండు గంటలకి ఎత్తుకు పొయ్యి ఒలుకుల్లో పూడ్సి పెట్రి.
   ఆ కాలం లో మా ఊరిదగ్గరికి పాములు పట్టే దానికి అరవోల్లు వస్తా వుండ్రి.వాళ్లు బతికిన పామునే పట్టుకోని శర్మం వొల్సుకోని అమ్ము కొంటా వుండ్రి.వాల్లు సేన్ల దగ్గర  కరెంటు రూముల్లో ఉంటా వుండ్రి.
   వాళ్లకి ఎవురో సెప్పినట్లుడారు. మా ఇంటి దగ్గరికొచ్చి– పామును మేము పట్టేస్తాము  రెడ్డీ– అని సెప్పి శలాకాల్తో గోడని ఒగ పక్క నుంచి పీక బట్రి. యంత సేపు వాళ్లు అవస్త బడినా పాము కనబడ్లేదు. మబ్బయి పాయ. వాళ్లు ఎల్లి పాయిరి.
     ఇంగ రాతిర్లో ఇంట్లో పండుకొనే దేట్లా?? దాని జతకి సలుము పట్టిండే పాములు ఇంకా యందర్ని సంపుతాయో?? అనే బయము. అపుడు గడ్డం పెంచుకో నుండే ఒగ స్వామి ఒచ్చె.
   ఆ స్వామి అంతకు ముందే ఒగ సారి మా ఊర్లో తేలు మంత్రం ఏసి పొయ్యిండె. ఒగరిద్దరు తేలు కర్సి సచ్చి పొయ్యిరంట. అది తెలిసి ఆ గడ్డం స్వామి అందరి ఇండ్లలోనా దూలాలు,దంతెల మిందా శాకు పీసుతో “ఆస్తిక మహర్షి” అని రాసి పొయ్యిండె. యంత రాసినా మా ఇంట్లో యా మూల్లో జూసినా తేల్లు జర్రిలే!!
   ఆ స్వామి ” మీకేమీ బయ్య లేదు” అని సెప్పి రాగులు తెప్పిచ్చి కండ్లు మూసుకోని  మంత్రమేసి ఇచ్చె. అందర్నీ నైరుతీ  మూల్లో వుండే సిన్నిట్లో( రూములో) పడుకోని,కడప మాను మింద రాగులు ఏసుకొమ్మనె. అట్లే రెండు మూడు దినాలు సేస్తిమి.
   ఒగ దినము మా నాయిన తూరుపు వాకిలి పక్కలో బాతిండే రాయి మింద కూకో నుండాడు.  యాముల పల్లి నుంచి, ఒగాయప్పొచ్చి ” ఏమన్నా! పిల్లోడు కాలమయ్యి పాయ అని ఎవరో సెప్పిరి యంత పని జరిగిందన్నా” అని ఆ మాటా ఈ మాటా మాట్లాడుకొంటా నిలబడె.
   “ఏమి జేస్తామన్నా! ఎది గొచ్చిన కొడుకు కండ్లు ముందరే నా సేతుల్లోనే పానా లిడిసె.నాది శానా దురాద్రుస్టం బతుకన్నా. యంత మరుస్తాము అన్నా మరుపుకు రాదు..” అని అంగలార్సు కొంటా కూకోనివుండే బండ మిందనించి కిందకి దిగె.
   “ఇంట్లో నుంచి బయటికొచ్చి బచ్చల్లోకి ఇట్ల తిరిగిండాడు  అంత సేపుకు ఈ రాళ్ల సందులో నుంచి ఒచ్చినంట” అని ఆయప్పకి సూపిస్తా వుండాడు.
    ఆ మాట్లు ముగీ కున్నట్లే గోదుమ నాగు పాము నాలుకులు జవురు కొంటా బుస్సు అని బయటికొచ్చె. నేను కమసల దాస గాడూ ఆడే ఆడుతా వుంటిమి. దాన్ని సూసి మా నాయిన “ఒరే పాము ఈడే ఉందిరా!! ఇంగా యందర్ని సంపేకి కాసుకో నుందో ఈ దీనమ్మ ఈ పొద్దు దీన్ని సంపి పారేస్తాము రాండిరో ” అని గట్టిగా కేకలేసె.
    ఊర్లో అందరూ గడార్లూ, శలాకులూ,బర్జీలు(పాముల్ని పడిచేవి),కట్టెలూ తీసుకోని గుంపులు గుంపులు వొచ్చిరి.పొద్దుబడి నాలుగ్గంటలు నుండి ఒగ పక్కనుండి గోడ పీక బట్రి. అంకనం ఎలుపు ఇంటినంతా పడగొట్టినా పాము కని పించలేదు. మబ్బయితా వుంది.సీమ నూనె లాంతర్లు,సాకలోల్లు ఇలాటి కట్లు( కాగడాలు) తెచ్చిరి. కడాకి తొమ్మిది గంటల టయానికి  అడుగు వరుసలో ఒగ బండ కింద సుట్టుకోని పండుకోని వుండె. దాన్ని బర్జీ తో పొడ్సి బయటికి యల్ల బీకిరి.
    నడి మద్యకి దిగగుచ్చి పైకెత్తి, జనాలకి దాన్ని సూపిస్తా వుంటే అది నోరు తెర్సి పడగనిప్పి బుస్స్ బుస్స్ అని మెలికలు తిరుగుతా వుంది.
    మా అప్పప్ప(చిన్నాయన) కోపము తట్టుకో లేక సేత్తో పట్టుకొనే దానికి పాయ. ఎవరో ఆయప్పని తబ్బుల కర్సు కొన్రి. ఆ రాచ్చాసి పాముని రాళ్ల సందు నుండి తెస్తా  వుంటే రాళ్ల తోను,సెప్పులు తోను, కట్తెల తోను,ఆడోల్లు పరకల తోను వాంచ బట్టిరి. “రత్న మట్లా బిడ్డని యద మీద ఏసుకు పోతివి గదా లంజా” అని కోపాలు ఆరే దంకా తిట్ట బట్రి.
    దాని నోట్లో రూపాయి బిల్ల పెట్టి ఆ పక్కలో వుండే ఎండు మిరప సెట్లేసి నున్నగా  కాల్సి పారేసిరి. బొగ్గు మాదిరీ కాలినంక ఊరిముందరి సేనుల్లోకి మాదిగ నారాయణప్ప  గుడిశె ముందరికి ఇసిరి పారేసిరి.
(నాకు ఈ పాములతో అతి భయంకర మైన అనుభవాలున్నాయి. ఆ యా సంధర్భాలను  బట్టి  కానీ, అన్నీ ఒకే సారి కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను)

ఆకాలంలో మా వూరి జనాలు, సేద్యాలు

ఇది యాబై ఏండ్లకి ముందుకత. మా ఊర్లో  యాబై ఇండ్లకి మించి వుండ్లేదు. సగం ఇండ్లు కాపోళ్లవి.మిగిల్నవి కురవోళ్లు,ఉప్పరోల్లు,మాలోల్లు,మాదిగోల్లవి. కమసలోల్లు,  సాయాబులు,పింజిరోల్లు,బాయోల్లు,బలిజోల్లవి,బాప నోల్లవి ఒగొగ ఇల్లు మాత్రమే ఉండె!!
 
     మా కాపుదన మోళ్లంతా  స్యేదాలు  సేస్తా వుండ్రి.(మా కులం కత తిరగ సెప్పుతా) కురవోల్లు గొర్రెలు మేపి బొచ్చు కత్తిరించి కంబళ్లు నేస్తావుండ్రి.(కన్నడంలో “కురి”అంటే గొర్రి).మాలోల్లు దుప్పట్లు సీర్లు నేస్తా వుండ్రి.మాదిగోల్లు కట్టెలు కొట్టుకోని ఇదూపురానికి మోసుకపొయ్యి అమ్ముతా వుండ్రి.కమసలోల్లు బంగారు సొమ్ములు, రైతులకి ఇనప సామాన్లు సేస్తా వుండ్రి. సాయాబు బుడ్డూలయ్య బువ్వమ్మ- రెడ్ల ఇండ్లలో సినిగిన పాత సీర్లు,బట్లు తీసుకుపొయ్యి సూదీ దారంతో కుట్టుకో నొస్తా వుండ్రి.
పింజరోల్లు పరుపులు కుడతా వుండ్రి. బాయోల్లు పూల సెట్లు పెంచి ఇంటింటికీ తిరిగి పూలు అమ్ముతా వుండ్రి. బలిజోల్లు రైల్లో పని సేస్తావుండ్రి. బాపనోల్లు గుడిలో పూజార్లు.
    మా వూరి దగ్గర ముందుకాలంలో బూమి పైన పొరల్లో ఉప్పు నీళ్లున్నంట! వుప్పరోల్లు పై మన్ను తవ్వి మడులు గట్టి నీళ్లు నింపి, యండకి నీళ్లు ఆవిరి అయ్యినంక ఉప్పు తయారు సేస్తా వుండ్రంట. ఆ ఉప్పుని ఎనుంపోతుల మీద ఏసుక పొయ్యి ఊర్లంటీ అమ్ముతా వుండ్రంట. సముద్రం ఉప్పు ఒచ్చేది మొదలయ్యినంక వాళ్లకి పని జరక్క ఎనుంపోతుల మింద నులకల్తో అల్లిన గంతలు ఏసి సేన్లకి మన్ను తోలేది మొదలు పెట్రంట.
    ఇంగొగు ఇసిత్రం ఏమంటే– పూర్వ కాలంలో దచ్చిణ బారత దేశంలో  ఉండే ఆవులు  శానా సన్నవంట! వాట్ని సిట్టావులు అంటారు. ఈడ సిట్టావులమ్మ పేర్తో గుడ్లు కూడా వుండివి. అవి శ్యారెడో పుడిశడో పాలు ఇస్తా వున్నంట గాని, సిట్టెద్దులకి మడకలు(నాగలి) దున్నేకి అయితా వుండ్లేదంట. అపుడంతా ఎనుం పోతుల శ్యాద్యాలే నంట!!
    ఆర్య జాతోల్లు, సాయాబులు,పరంగొల్లు (ఫెంచి వారు),ఇంగిలీషోల్లు వాళ్ల  దేశాలనుండి మేలు జాతి కుర్రలు తెచ్చి సంకరం సేసి మేలు జాతి ఆవుల్ని తయారు సేసిరంట!! అపుడు యాడ జూసినా ఎనుములే (బర్రెలు) నంట. నల్లెనుము కాపులు,యర్రెనుము కాపులు,బోడెనుము కాపులు…అని మా రెడ్డికులంలో  తేడాలు గూడా వుండివి.
    కర్నాటక దేశంలో కావేరీ నదికి సుట్టూపక్కల ఇపరీతంగా నీళ్లున్నంట. ఆడ ఎనుముల్ని దండిగా మేపుతా వుండ్రంట. ఉత్తర దేశం నుంచి వొచ్చిన ఆవులోళ్లకి- ఈల్లకి తగాదా లొచ్చినంట. యాలంటే ఎనుములు బురదలో మునుగులాడి గడ్డి మింద తిరగలాడతాయి. ఆ గడ్డిని ఆవులు తినవు. అవి మడుగ్గట్టిన పెద్ద కులము రకమంట! ఎనుములు మాత్రం దూర ముండాల్సిన శూద్ర జాతికింద లెక్కంట!! అందుకే ఈ ఆవులోళ్లు రాజుల్తో జత సేసుకోని పెద్ద తపస్సు మాదిరీ సేసిరంట. ఒగ దేవతని ఒళ్లు మిందకి పూనకం మాదిరీ తెచ్చుకోని ఎనుములు మేపే వాల్లనందర్నీ సంపిరంట. అందుకే ఆడుండే మహిషాల ఊరు “మైసూరు” అయ్యిందంట!! ఎనుము లోళ్లని దేవత సంపిచ్చిందని, ఆయమ్మ పేరిట “మహిషాసుర మర్దిని”అనే గుడి కూడా వుందంట! ఇదంతా మా నాయిన కతల మాదిరీ సెప్పుతా వుండె!!
    1950 కి ముందు రాత కోతలు సూస్తే మా కులంలో “రెడ్డి” అనే మాటే కనిపించదు కొండ, తిమ్మ , రామ, యంగట,సిదంబర,లింగ…అనే వుండివి!! పులిని సూసి నక్క వాతలు పెట్టు నొన్నట్ల ,యాడో పెద్ద శేద్యాలు సేసి “రెడ్డి రికం” ఉద్యోగంతో మీసాలు తిప్పే వాళ్లని సూసి మా ఊరి జనాలు కూడా పేరుకు యనక తోక మాదిరీ రెడ్డి ని తగిలిచ్చుకో నుండారు! కులం మాత్రం “కాపు” అనే సెప్పుకొంటారు.
   పెన్నేటి గట్లో రెండు మూడు కుటుంబాలకి ఒగ బాయి. ఒగ బాయి కింద రెండు మూడు యకరాలకి మించి పంట పెట్టేకి కుదర్దు. పగలంతా కపిల(మోట) తోలల్లంటే ఆరి జతల ఎద్దులు కావల్ల. దాని జతకి మడకలు దున్నల్ల,ఒండుమన్నులు, ఎరువులు,పచ్చాకులు తోలల్ల.నీళ్లు కట్టల్ల.కలుపులు తియ్యల్ల.బెల్లం గానుగలు ఆడల్ల. అందుకే కులాలు తేడా లేకుండా రెండు మూడు కుటుంబాలు కల్సి- బదులుకు బదులు- పన్లు సేసుకొంటా వుండ్రి.
    రెండెకరాల్లోనే ఒడ్లు,రాగులు,సెరుకు,మిరప సేన్లో అన్నిరకాల తర్కారీలు,కందులు,శెనగలు,పెసులు,పగాకు,తలకు రాసే నూనె, తమల  పాకులు,వక్కలు,యర్ర గడ్డలు,తెల్ల గడ్డలు…అన్నీ పండిస్తా ఉండ్రి.ఇంట్లో సన్న పిల్లోల్లు యాడాదంతా తినేకి, ఉలవలు, శనగలు ఏంచుతా వుండ్రి. బొరుగులు,శెనగ పప్పులు,శెనిగిత్తలు కలిపి న్యాత(లేత) బెల్లంతో కలిపి “పాకం పప్పు” తయారు చేసి పెద్ద పెద్ద గుడవల్లో (మట్టి కడవలు) దాచి పెడతా ఉండ్రి.
     కాఫీ పొడి,బీడీలు,అగ్గిపెట్టె,బట్టలు,సీమనూనె,కుంకుమ,గాజులు…ఇట్లాంటి వాటికి  మాత్రమే డబ్బుల అవసరం.డబ్బుల చలామణీ లేదు. అంతా ఊరుమ్మడి బతుకులు. అయిదారు ఇండ్లోళ్ళు ఎనుములు మేపి పెరుగు నెయ్యి ఇందూపురానికి తీసుకపొయ్యి అమ్ముతా ఉండ్రి.శుక్కుర వారం సంత.ఆపొద్దు మాత్రమే రెండు మైళ్ల దూరంలోని టవునుకు కొందరు పోతావుండ్రి.
     మా యమ్మ మా నాయనతో గలాటకి పెట్టుకోని దినామూ ఏడిసేది! ఇంత మందిని పుట్టిచ్చిండావు. ఇంట్లో పండుకొనే దానికి సోటు లేదు. కడుపు నిండకా కూడులేదు. నువ్వు జూస్తే – దిమ్మి రంగా దీపాల పండగ- అని నెలకొగసారి దేశాలంటి యల్లబారి పోతావు? ఇంత సంసారాన్ని నాకి మోసేకి శాతగాదు, సెరువో,బాయో సూసుకొంటాను- అని అలుగుతా ఉండె.
    ఆయాడాది బెల్లంలో అంతో ఇంతో దుడ్లు మిగిలంట్లుంది. కిరికేరి బీగాల కొండప్ప తావ మానాయన అప్పుతెచ్చి ఒగ ఇల్లు కొనె. అది యంత పెద్దది అంటే నూరు అడుగుల పొడవు, యాబై అడుగుల ఎలుపు. అరవై అంకణాల లంకంతది. నీలకంఠ శారి అనే కమసల అయ్యవార్ది. తూరుపుకి బెంగళూరు రోడ్డు. పడమరకి కొత్తగా ఏసిండే కంకర రోడ్డు. రెండు సన్నిండ్లు(రూములను అప్పుడు చిన్నిల్లు అనే వారు) వొండే ఇల్లు,హాలు, పది జీవాలు కట్టేసే గాటిపట్టు.(అప్పుడు పశువుల్ని ఇంటిలోపలే కట్టేసే వారు). మాకు  ఇల్లు కొనిన సంబ్రం ఆర్నెల్లు కూడా మిగల్లేదు.
 వాన ఏటిచ్చె. పెట్టిన పంటలన్నీ ఎండుకు పాయ.ఇంట్లో తిండి గింజలు లేవు.మా నాయన ఊర్లంటీ పొయ్యి విరాట పర్వం సదివి గింజలు తెస్తా వుండె.(విరాట పర్వం చదివితే వర్షాలు పడతాయని అప్పుడో మూఢ నమ్మక ముండేది) పశువులు మేసేకి బూమ్మింద గడ్డి పాసుగూడా లేదు. నేను ఎనుముల్ని ఊరెనక్కి తోలుకు పొయ్యి సరగమాడిస్తా ఉంటి(కక్కసు తినడానికి తోలడం). అంత పెద్ద జీవాలకి సరగము యా లెక్క?? కండుల్తో సూసేకి కాకుండా అయిపాయ. అవి అన్నో ఇన్నో పాలిస్తేనే అమ్మి సంసారం సాగల్ల!
     ఒగదినం సుతారంగా గడ్డిలేదు. గాట్లో కట్టేసింటే,కడుపుకి ఏమీ లేక దొక్కలు ఇరబోసుకోని కండ్లు కండ్లు ఇడుస్తా ఉండివి.అంబా అని అరుస్తా ఉండివి. అవిట్ని సూడలేక మా రవిందర్రెడ్డన్నయ్య,దూళి దూళి మబ్బవుతూనే  ఉరెనక్కి పొయ్యి,ఎవరి  వామిలోనో ఒట్టి స్వాగ (చెరకు పంట అయ్యాక  ఎండు సోగ వామిగా వేస్తారు.అది కేవలం గుడిసెల పైకప్పడానికి,చెరకు పాలు కాంచడానికి మాత్రమే పనికొస్తుంది.గాడిదలు కూడా తినవు) దొంగగా తెచ్చాడు.  గాట్లో ఏసి వాకిలి మూశినాడు.ఆ దరిద్రం దాన్నే ఆత్రం   ఆత్రం గా ఎనుములు మేస్తావుండివి.
     అంత సేపటికి ఎవరో వొచ్చి వాకిల్ని దబా దబా తట్రి.మా నాయన రవ్వంత  సందుసేసి తొంగి సూసె.”ఏమి రెడ్డీ వాన కురిస్తే కారకుండా గుడిశ మింద కప్పుకొందామని,వాళ ఈళ్ల కాళ్లుబట్టి,బంగారు మాదిరీ కంపలేసి దాపెట్టింటే, మీ పిల్లోడు ఎత్తుకోని ఒచ్చినంట కదా!!కాపుదనమోళ్లు మీరే ఇట్ల సేస్తే యట్లన్నా!!” అనె మాల యంగటప్ప.
 “నీకి ఎవరు సెప్పిరన్నా? మేమేమిటికి తెస్తుము?” అనె మా నాయిన.
  “అన్నము తినే నోట్లో అబద్దం యాల సెప్పుతావు రెడ్డీ?” వాకిలి మూస్తే మాత్రము జీవాలు సర్ సర్ అని మేస్తా వుండే శ్యబ్బుదం ఈతాకి ఇనపడతావుంది.” అనె యంగటప్ప.
    మా నాయనికి గొంతు ఆరినట్లుంది. ” మబ్బులో ఎవుర్ని సూసి ఎవరను కొంటినో లేన్నా!” అని నీళ్లు నములుకొంటా ఆ మాటా ఈ మాటా మాట్లాడుకొంటా వాకిలి మూసేశ. యంగటప్ప వాకిలి అవతలే నిలబడి ఏడిదేడిదో రవ్వంతసేపు తిట్టుకోని ఎల్లిపాయ.
    గడ్డి సాలక పాలిచ్చేది ఎనుములు తగ్గిచ్చె. పొదుగులో శారెడుగూడా ఉంచకుండా పిండుకొనేది మొదలు పెట్రి. పెయ్యకి పాలు సాల్లేదు. అది శరీరమంతా జుబ్బర(బొచ్చు)పెరిగి,ఉరుకులు పడి(దూడల్లో పడే పేలవంటివి) సచ్చిపాయ. దాన్ని మా నాయన మాదిగ నారాయణప్పకి ఎత్తిచ్చె. ఆయప్ప దాన్ని కోసుకు తిని శాటపెయ్య తయారు సేసిచ్చె.(చేట పెయ్య=చచ్చిన దూడ చర్మాన్ని వొలిచి, ఎండబెట్టి, అందులో గడ్డి దూర్చి దూడలా తయారు చేసి తల్లి బర్రె ముందు వుంచేది). అయినా గూడా ఎనుము పాలు పిండ్లేదు.ఎగేసుకోనె.
    ఒగ శుక్కురువారము దినం మా నాయన సంతకు తోలి ఎనుమును అమ్మేశె.
    ఇందూపురంలో అమ్మిన ఎనుములూ,ఎద్దులూ,గొర్రిలూ,మేకలూ అన్నీ మా ఇంటి ముందరనుంచే బెంగుళూరికి పోవల్ల. మద్యానం ఒంటిగంటకు అయిదారు ఎనుముల్ని పెనేసి కట్టి రోడ్డంటీ తోల్తా వుండారు. మెడగ్గట్టిండే తాడుని పుటుక్కున తెంపుకోని మా ఎనుము ఇంటి ముందరికిచ్చి కుడితిలో నీళ్లు గొటగొట్న తాగబట్టె. దాన్ని సూసి మా యమ్మ” అయ్యో! బంగారట్లా ఎనుముకు యన్ని తిప్పలొచ్చినమ్మా! యంత దప్పిగోనిందో గదా?” అని ఇంగ రవ్వన్ని  నీళ్లు బకీట్లో తెచ్చే దానికి పాయ. అంత సేపటికి మందని తోలుకుపోయే కూలి జనాలు వారల శెలకోల్తో ఫెళా ఫెళా వాంచబట్రి. “అయ్యొ య్యో ! పాపిస్టి జనాల్లాలా ఆ పసరాన్ని రవన్ని నీళ్లన్నా తాగనియ్యండ్రా!!”అని మా యమ్మ ఏడ్సబట్టె. అయినా వాళ్లు దాన్ని బలంతుముగా ఈడ్సుకు పాయిరి.
     ఆ ఎనుము మా పక్క, మా ఇంటి దిక్క, కుడితి దిక్కా సూసుకొంటా దీనుముగా నడిసి పొయ్యింది నా జన్మంలో మర్సి పోలేను.(నేను 16సం.వయస్సులోనే రాయడం మొదలు పెట్టాను. మొదటగా రాసింది పెద్దకొడుకుగా కష్టపడిన ఎద్దుల్ని ముక్కూ మొగం తెలియని వారికి అమ్మేస్తే వారు వాటిని ఎంత భయంకరంగా హింసిస్తారో తెలిపే గేయం. ఎనుమును గురించి ఎందుకు రాయలేదంటే! చిన్నప్పుడు చదివిన ఏ పుస్తకం లోనూ వాటి ప్రస్తావన లేక  పోతే , రాయగూడదేమో అనే శంక!! అది ప్రచురనకు నోచుకోలేదు. అయితే 1995 లో “పశువులు” అనే కథ రాశాను.శశి శ్రీ సంపాదకుడుగా కడప నుండి వచ్చే సాహిత్య నేత్రం దానికి ప్రత్యేక బహుమతి నిచ్చారు.)
-సడ్లపల్లె చిదంబర రెడ్డి
 

అపుడు కరెంటుండ్లేదు!

అపుడు కరెంటుండ్లేదు. తెల్లారి మూడుగటల్కే లేసి మా నాయినావాళ్లు కపిలిబాన దాని సరంజామా అంతాతీసుకోని,ఎద్దులు తోలుకోని,సేన్లకి నీళ్లు తోలేదానికి పోతావుండ్రి.

దూళి దూళి మబ్బున్నట్లే మాయమ్మ,అన్నయ్య,అక్కయ్యావాళ్లు లేసి ఎనుములు(బర్రెలు)ఇంట్లోనుంచి బయటకట్టేసి,ప్యాడ తిప్పకిమోసి,గంజుతీసి పారబోసి పాలు పిండతావుండ్రి. అయిదుగంటల్కే ఇందూపురమ్నుండి పాలోడొచ్చి సేర్తోకొల్సి సైకిల్లో తీసుకుపోతావుండె.ఏడుగంటల్కి ఇసుకూలుమొదలయ్యి పదిగంటల్కి ముగుస్తావుండె.అపుడు ఇసుకోలు పిళ్లోళ్లంతా ఎనుముగొడ్లు మేపుకోనొచ్చేకి పోతావుంటిమి.

సానామంది రెడ్డ్ల ఇండ్లల్లో పనులుసేసేకి,సేద్యాలు సేసేకి, జీవాలుమేపేకి జీతగాళ్లు(సంబళగాళ్లు)వుంటావుండ్రి(ఎక్కువగా మాదిగలు ఒకసారి పెళ్లికో,జాత్రకో,ఇతరఖర్చులకో కొంత అప్పుచేసి,దానికి హామీగా వారిపిల్లల్ని చాకిరీకి వుంచేవారు దాదాపు 1977(ఎమర్జెన్సీ) వరకూ ఈపద్ధతి వుండేది). మాఇంట్లో అన్నిపన్లూ మేమేసేయల్ల.

వుప్పర నరసిమ్ముడు, పింజిరి పీరూగాడు,బేల్దారి అస్వత్తుడు,మురవోడు,నేను ఎనుముల జతగాళ్లు.వాటిమింద కూకోని గుర్రాలమాదిరీ ఎగిరిస్తావుంటిమి. అపుడు వాన్లు బాగకురుస్తావుండె. పొలాల్లో పంట్లు,కాణాసిల్లోగడ్డి పెరుగుతూనే “కట్” సేసినట్ల తప్పెటకొట్టి సాటింపేస్తావుండ్రి. ఇద్దురు ముగ్గురు కావలిగాల్లు పొలిమేర్లకానా గస్తీతిరుగుతావుండ్రి.పంట్లు కోసేవొర్కూ జీవాలు పోగూడదు,గడ్డికోయగూడ్దు.అట్లసేస్తే జూల్మానా ఏస్తావుండ్రి. బందుల్ దొడ్డికి తోల్తావుండ్రి.

అందుకే మేము బాటపక్కకి తోల్తావుంటిమి. సుక్కురువారుము ఇందూపురంసంత.సుట్టూపక్కల వూర్లజనాలంతా పొద్దుట్నుంచి రాత్రిఒరుకూ ఇసకేస్తే రాల్నట్ల పోతావుండ్రి.ఒగరిద్దరు రెడ్లు,కోమిటి లెచ్చుమయ్య మాత్రమే పావళాఇచ్చి జట్కాలో పోతావుండ్రి.

వుప్పరనరసిమ్ముడు బొలే కిల్లేకిత్తిరిగాడు. బోకుల్ని రెండణాలమాదిరీ(అప్పుడు పగలంతాపనికి రెండణాలకూలి.12పైసలు) తయారుసేసి పాతబట్టల్ని కర్చీపుల్మాదిరీసించి మూటగట్తి దావలో ఏస్తావుండె.శానామంది దుడ్లే అనుకోని అక్కడిక్కడసూసి ఎత్తుకుపోతావుండ్రి.సెట్లమరుగ్లో దీన్నిసూసి కడుపులు పగిలేతట్ల నగుతావుంటిమి.

మావూర్లపక్క యాడసూసినా సెరుకుతోట్లే!! బెల్లాన్ని బండ్లకినింపి మండీలకి తోల్తావుండ్రి.వాళ్లని అడిగితేసాలు తినే అంతబెల్లమిస్తావుండ్రి.ముందుగానే సంటకుపొయ్యి తిరిగొచ్చే వాళ్లనడిగితే బొరొగులూ కారంబూందీలు పెడతావుండ్రి.ఈపన్లు నరసిమ్ముడు,మురవోడు సేస్తావుండ్రి.

ఒంటిగంటకి సైరన్నుకూస్తావుండె.అవుడు ఎనుముల్ని గుంతల్లోకో సెరువులోకో దించి నల్లగా నిగనిగలాడేతట్ల కడిగి ఇంటికి యల్బార్తావుంటిమి.రెండుగంటల్కి పాలోడొచ్చేటయానికి మద్యాన్నంబెల్లుపడతావుండె. గోదుమరవ్వతో వుప్పుమా,పొవుడరుపాలూ ఇస్తావుండ్రి.రవ్వంత సదువవుతూనే ఇసుకూలు తోటకి సెరువునీళ్లు మోస్తావుంటిమి.

ఇంటికిపొయ్యినంక కట్లికి(వంటచెరుక్కు) పోవల్ల. ఆకాలంలో మావూరిదగ్గర తిండికన్నా కట్టెలకరువుశానా. ఈత తట్టెల్తీసుకోని జొన్నకొయ్యలు,కందికొయ్యలు,సన్నబన్న గబ్బుసెట్లు ఏరుకోని తెస్తావుంటిమి. తిరగ ఇంటిముంద్ర,పసువులకిందా కసువు సిమ్మల్ల.ఎద్దులకి సొప్ప,అగిశాకూ తినిపించల్ల. కుడితికి,ఇంటికి కావల్సినన్ని నీళ్లు బాయినుంచి సేదల్ల.(కొన్నిపన్లు నావరకూవచ్చేవికావు.అప్పుడు అందరు దాదాపు చేయాల్సినపనులు చెబుతున్నాను) రాగులు ఇసరల్ల,జొన్నలు వొడ్లుదంచల్ల సన్నపిళ్లోల్లని ఎత్తుకోవల్ల. లాటీన్ల(ల్యాంపుల) చిమిలీలమస్సితుడుసల్ల. సీమనూనె పోయల్ల,తావదీపం పెట్టేకి ప్యాడ తేవల్ల. ఏడుగంటల్కే బువ్వతినల్ల.

కడుపుకు సరయిన కూడులేక మేము సస్తావుంటే వానెమ్మ!!

నల్లుల బాదయాలసెప్పల్ల.ఇంటి నడిమద్య సాపలు,గోనిసంచులు పర్సుకోని అవిరాకుండ సుట్టూర కోటమాదిరీ రాగివుబ్బళ(రాగులమీది పొట్టు),మూటకట్టాకు(వరిమడికోశాక మొలిచే బంకబంక ఆకులుండేకలుపుమొక్క) ఏసుకొంటా వుంటిమి.జనాల రగతం తాగేదానికేమో!! అవి శానాతెలివయిన్వి.పక్క గోడ్లు,తడకలూ ఎక్కి మేలాటం (టాపు)మీద్నుంచి మిందకి దుముకుతావుండె.

నీళ్లు పోసుకోనేది, బట్టలిడిసేది ఒగవారం లేటయితేసాలు బట్టల్నిండా కూరేగంట్లు(చీర పేన్లు) ఇంకాకొంద్రు బీదాబిక్కీ జనాలకి పీడ పేన్లు పడతావుండె.అవి సంకలకింద,తొడలమద్య,కన్రెప్పల్కి అతుక్కోని గోరుల్తో గీకినా కనిపిస్తావుండ్లేదు.ఇట్ల అర్దం రగతం అవేతాగుతావుండె.

పున్నమికోసరం నెలంతా ఎదురుసూస్తావుంటిమి. యాలంటే ఆపొద్దు రాత్రిలో ఎలుగుంటుంది. యంతసేపయినా ఆడుకోవొచ్చు. ఆడపిల్లోల్లు మగపిళ్లోల్లు కల్సి సల్లేమల్లే గుడ్లు( చల్లే మల్లెల కుప్పలు-ఎంత అధ్భుతమైన పేరోకదా!!)పెద్దోళ్లు వుప్పురపెట్టెలు- ఆట్లు ఆడ్తావుంటిమి.

ఏమాట్లాడినా మానాయిన లేకుంటేనే!! ఆయప్ప కతలు ఇంగొగ సారిసెప్పుతాను. మాయన్న ఇంట్లో వుంటే నేను మాయమ్మకి సిక్కల్ల. నీళ్లు పోపిచ్చుకోవల్ల. పేన్లు సూపిచ్చుకోవల్ల. ఈపిలు(పేల గుడ్లు)ఈరబానితో ఈరిపిచ్చుకోవల్ల. గోర్లు కత్తిరిచ్చుకోవల్ల. పండుకొంటే ఇసనగర్రి తోఇసరుకొంటా కూకోవల్ల.

మాఇల్లు యట్లున్నిందో రవ్వంత సెప్పుతాను. అట్లాఇల్ల యాడన్నావుందేమో అని శానాఏండ్లు యెదికినా కనపడ్లేదు. నేను పుట్టేకి ముందే మాయప్పప్పా(చిన్నాయన) మానాయినా యారేపొయ్యిండారు. సుట్టూ ఇటికెలగోడ దానిమింద సెరుకు సోగల కప్పడము మాసిన్నాయనది.దాని పక్కలోనే సుట్టూ టెంకాయ గర్రుల తడకలు.ఆడ వానొస్తే ఈడకారేసోగలకప్పడము మాది.వాకిలికూడా తడకే.కుక్కలు,కోళ్లు,పిల్లులు,మేము యాడ్నుంచీ అయినా దూరి లోపలికిపోవొచ్చు.అందుకే మాయమ్మ శార,సంగటి,మజ్జిగ..అన్నీ వుట్టిమిందే ఎత్తిపెడ్తావుండె.

అది కూటికరువుకాలము. జనాలు పుట్టిండేది తినేదానికే అనిపిస్తావుండె. మేము అయిదారుమంది పిల్లోల్లు. వుండేది ఒగతట్ట. మాయమ్మ సంగటి కెలుకుతూనే తెడ్డు సుట్టూసేర్తావుంటిమి. అందురూ ఒగే తట్ట సుట్టూసేరి-నువ్వుముందో నేనుముందో-అన్నట్ల తింటావుంటిమి. వేరే ఇండ్ల్లో ఆడోల్లు మగోల్లు కూడా ఒగేతట్లో తింటావుండ్రి.

మానాయిన ఇపరీతంగా బీడీలు తాగుతావుండె.(గణేష్ బీడీలు) సాయంట్రమౌతూనే వాళ్లూ వీళ్లూ వొచ్చి మాగుడిసితాకొస్తావుండ్రి. వాల్లకి రాజకీయాలు,బారతంకతలు,దేశాలుతిరిగి సూసిన సంగత్లన్నీ సెప్పుతావుండె.మద్యాలో బీడీ ఆరిపోతే బుడ్డీలోనో,పొయ్యిలోనో అంటిచ్చుకు రమ్మని సెప్పుతావుండె.అది యంతసేపటికీ అంటుకోకుంటే నోట్లో పెట్టుకోని ఒగ పీక పీకుతావుంటి.

ఒగదినము గుంతులో పగసేరి తగ్గొస్తే అది సూసి జుట్టుపట్టుకోని వంగబెట్టి కొట్టింది ఇంకాబాగ గురుతుంది.

అట్ల బీడీలు తాగీ తాగీ నోరు సెడిపోతావున్నేమో. మాయమ్మ యంతబాగ శార సేసినా రుసీ పసీలేదని గలాటకి పెట్టుకొంటావుండె.గిన్నిచ్చి నన్ని ఇండ్లంటీ తరుముతావుండె.ఒగొగుదినము ఒగొగు ఇంటికిపొయ్యి శార పోపిచ్చుకొస్తావుంటి.ఇండ్లతాకిపొయ్యి అడుక్కుతినేవోళ్లమాదిరీ అడిగేకి, నాకి శానాసిగ్గి. పోకుంటే ఏట్లు.మేం పదిమంది సంతానం. మా అక్కయ్య ఇద్దరన్నయ్య గార్లూ శానా పెద్దోల్లు. ఇంకిద్ద రన్నయ్యగార్లూ సచ్చిపొయ్యిండారు.(వాళ్లు యట్ల సచ్చిరో తిరగ సెప్పుతా) ఇంకిద్దరు తమ్ముల్లూ, సెల్లెళ్లూ శానా సన్నపిల్లోళ్లు.అందుకే సన్నాబన్నా పన్లన్నీ నామిందే పడ్తావుండె.

-సడ్లపల్లె చిదంబరరెడ్డి

మా అయివార్లు–నా జుట్టుకత!!

photoఇంట్లో గలాట సేస్తే సాలు!”ఈన్ని ఇసుకూలుకు నూకల్ల. అయివారుకు సెప్పి నాలుగు ఏట్లు కొట్టిచ్చల్ల” అని ఇంట్లో యపుడుజూసినా అంటావుండ్రి. అందుకే ఇసుకూలంటే నాకి శానా బయ్యమయితావుండె. నిజముగా ఇసుకూలుకు పోతే ఆడ ఎవురూ ఏమీ అన్లేదు.నేను రాసిన అచ్చరాలని కిట్టప్పయివారు యపుడు మెచ్చుకొన్నో అపుట్నుంచి ఇసుకూలంటే నాకి శానా ఇష్టమయిపాయ. ఒగ ఏటుగూడా తినకుండా ,రాసిచ్చినవన్నీ నేరుస్తావుంటి.

   మా వూరిపేరు సడ్లపల్లి.ఇదేపేర్తో ఇంగొగు వూరుంటే దీనికి ముందు సూగూరు అనే మాపక్కూరిపేర్ను గూడా సేర్సిండారు. ఇట్లా మావూరు యాడో కొండల్లోనో,నగరాల గాలి సోక్కుండ నూరామడల దూరంలోనో లేదు!!
   అయిద్రాబాదునుంచి బెంగులూరుకు రైలు మా వూరి ముందరనుంచే పోతుంది. ఇందూపురం నుంచి బస్సు మా ఇంటిముదరే  పోవల్ల. మాఊరి పొలాలన్నీ పెన్నేటి గట్లోనే వుండివి. ఇందూపురం మావూరికి మూడు మైళ్లు దూరము. అట్లా వూర్లో ఒగటో తరగతి పిల్లోళ్లలో అర్దం మందికి బట్లే వుంటావుండ్లేదు. నాకి అదొగరకం ఆఫారం ఏస్తావుండ్రికాని నిక్కారు తొడిగింది మూడో క్లాసులోనే!!
    అంగీ నిక్కార్ లేకుండా నేను ఇసుకోలుకు పొయ్యేదిలేదని మా యమ్మ దగ్గర శానాసార్లు,ఏడిసి మొత్తుకొంటావుంటి.యాలంటే మాకి కిట్టప్పయివారు మారిపోతూనే రెండో క్లాసుకి సీనివాసరావని ఒగాయప్ప ఒస్తావుండె. ఆయప్ప శానా శడ్డయివారు. ఇసుకోలు ఇడిసినంక నాయట్లా ఇద్దరు,ముగ్గురు పిల్లోళ్లని బడిలోకి పిలుస్తావుండె. మెల్లగా వాకిలి మూసి,యాడాడో పిసుకుతావుండె. దోసిలి నిండా వొంటికి పోపిచ్చుకోని, సెడ్డాట్లు ఆడతావుండె. ఆ పన్లకి ఒగపక్క మాకి నగువు,ఇంగొగుపక్క ఏడుపు ఒస్తావుండె. ఆ అయివారు శానాకాలముంటే ఏమయితావున్నో గానీ,రొన్నాళ్లకే మారిపాయ. నేను పెద్దయ్యి, మీసాలొచ్చినంక గూడా ఆయప్ప ఆడీడ కనబడతావుండెగానీ, ఏమో రోగమంట పెండ్లి సేసుకో కుండానే సచ్చి పాయనంట!!
   మా వూర్లో బోడప్పగారి కురుబ సంజీవయ్య అని వుండె. ఆయప్ప వైదీకం(వైద్యం)సేస్తావుండె. ఇసుకూలుకు ఒంటికిడిసినపుదు,పెద్ద సిప్పతో వొస్తావుండె. పిళ్లోళ్ల దగ్గరికిపొయ్యి ” ఒరే నింపులుసు పొప్పరమెంటిస్తాను దోసెడు వుచ్చులు పోయండ్రా” అని దేబిరిస్తావుండె. మాకయితే శానా సిగ్గి. ఆయప్ప కనిపిస్తే సాలు దూరము పరిగెత్తిపొయ్యి పోస్తావుంటిమి. కొంతమంది గబ్బు నాయాల్లు పోస్తావుండ్రి. వాళ్లని మేము “ఆశపోతు నాకొడుకులు”అని ఎక్కిరిస్తావుంటిమి.
    అపుడు మాకి ఒగిటికి పోసేది ఒగ పెద్దాట. ఇసుకూలు ముందర కంకర రోడ్డులో వర్సగా ఏటవాలుగా బద్దిలు(చిన్న కాలువలు) తవ్వుతా వుంటిమి. ఎవురు పోసినవి ఎక్కువదూరం పోతే వాళ్లు గెల్సినట్ల. అందుకే పోసినవి నేల్లో ఇంకకుండా బోకి పెంచలు,పల్సగావుండే రాల్లు బద్ది అడుక్కు మెత్తిచ్చి శానా అవస్తలు పడతావుంటిమి.
    ఇంగ ఇసుకూల్లో శానామందికి జుట్లే!! యాలంటే మా కాపోల్ల(రెడ్డ్ల) ఇంటి దేవుడు తిరపతి  యంగటరాణస్వామి. అది మా వూరికి శానా దూరము. దాంజతకి,వూరకే షికారుకు పొయ్యినట్ల పొయ్యి కొరిగిచ్చు కొచ్చేది కాదు. సుట్టాలందర్నీ పిల్సల్ల. కొత్త బట్ట్లు కొనిపెట్టల్ల. అంతకు ముందు ఇంట్లో జనాలకి రోగమొచ్చినపుడు, వానలు రాకుంద మొండికేసినపుడు,ఆవుకు కుర్రదూడ,ఎనుముకు ఆడపెయ్యి పుట్టల్లని మొక్కుకొన్నప్పుదు, ఏటివన్న శడ్డపన్లు సేసినపుడు దేవునికి మొక్కుకోని ముడుపులు కట్టి, దొంగలకి సిక్కకుందా దాసిపెడ్తావుండ్రి. అవిట్ని తీసి పూజల్సేసి దాసప్ప కీయల్ల.(మా వూర్లో దాసరితనం కురువ కులస్తులది) దాసప్ప వాట్ని గంతలుగట్టి ఎద్దుమీదకి ఎత్తి నానా శాస్త్రాలు సేయల్ల. పూజార్లకి,బాపనోళ్లకి సంబావనాలియ్యల్ల. సాకలోల్లు బట్టలు తడుపుకొచ్చి దావలో పర్సి(అడుగులకు మడుగు లొత్తడం)గుడికానా నడిపిచ్చుకు పోవల్ల…. అంతా దుడ్ల యవ్వారము!!
   రాత్రీపగలూ కష్టంసేసినా కడుపుకు సాలని కాపుదనమోల్లు, దేవుని మిందబారమేసి “ఆ మానబావుదు సల్లగా సూసినవుడు కొండకిపొయ్యి పుట్టెంటికిలు కొరిగిస్తాములే” అని ఇడిసిపెట్తావుండ్రి. అట్ల నేను ఎనిమిదో కలాసు సదివేదంకా నా జుట్టుని తిరపతి కొండని మోసినట్ల మోసిండాను. ఆ జుట్టు తెచ్చిన అగసాట్లు ఇంగా శానా వుండివి. తిరగ సెబుతాను.
    ఈ జుట్టును మోసే బారము మిగతా కులాల కురబోల్లు,ఉప్పరోల్లు,మాదిగోల్లు,మాలోల్లు,మంగలోల్లు….ఈల్లకి లేదు. యాలంటే వాళ్ల దేవుడు మా ఊరుకి శానా దగ్గిరే వుంటావుండె. అందుకే బిరీన గుండుకొట్టిస్తావుండ్రి.
   అపుడు ఆదపిల్లోల్లు ఇసుకూలుకి వొస్తావుండ్లేదు. ఇంట్లో బోకులు కడిగేది,సన్నపిల్లోల్లను ఎత్తుకొనేదే వాల్ల పని.ఇంటి పన్లయిపోతే ఒగొగు కలాసుకు ఒగురో ఇద్దరో వొస్తావుండ్రి. మగపిల్లోల్లు నున్నగా తలదువ్వుకోని ఒంటిజడలేసుకోని,రిబ్బన్లు కట్టిచ్చుకోని, మల్లి పువ్వులు ముడుసుకోని వొస్తావుండ్రి. నేనూ అట్లే పోవల్ల అని బొలే ఆశపడ్తావుంటి. అయినా మాయమ్మకి పురుసత్తే వుండేదికాదు. ఆదరా బాదరాగా సెక్కదువ్వానితో రెండుసార్లు దిగదున్ని జనుబు దారంతో గట్టిగా ముచ్చిన గుంతలో “సుళ్” అనేటట్ల నిగర గట్తావుండె. కలర్ టేపు కావల్లని యన్నిసార్లు మా నాయన్ని అడిగినా ఇందూపురంలో మా బట్టలుకుట్టే సాయాబు దగ్గర అయిదారు రకాలు రిబ్బన్ల మాదిరీ  కత్తిరిచ్చుకొస్తావుండె గాని, నాజుట్టుకి మల్లి పూలు రిబ్బన్నుల అలంకారమే తెలేదు.
   నేను అచ్చరాల్ని ముత్యాలమాదిరీ గుండ్రంగా రాస్తావుంటి.మిగిల్న పిల్లోల్లని నేను రాసినట్లే రాయమని అయివారు కొడతావుండె. అందుకే నేను ఏడిదైనా రాస్తావుంటే,యనక కొందరు నా జుట్టు పీకుతావుండ్రి.కుల్లు నా కొడుకులు ఇంకొందురు బలపంతో ఈపుమింద పొడుస్తావుండ్రి. దానిజతకి సింపిరెంటికిలు కండ్లకి అడ్దంపడతావుండె. ఇన్నిటినీ మించి పలకనిండా రాసినంక సీమిడి నా ముక్కులో నుంచి”తప్” న పడి,రాసిందాన్నంతా నాశనం సేస్తావుండె. స్వామీ అదేమిరోగమో గాని,ఇరవైనాలుగ్గంట్లూ నా ముక్కుల్లో సీమిడి పాములుమాదిరీ “సర్ బుర్” అని కారి పోతానేవుండె. యంత యగబీకినా దారం తెంపుకొన్న జీరంగి మాదిరీ నిలుస్తానే వుండ్లేదు. ఆపక్కా ఈపక్కా తల తిప్పి బుజాలకి రుద్దుతావుంటి. ఇంటికి పొయ్యే టయానికి అంగీ రెట్లన్నీ ఎండి అట్టగట్టుకు పోతావుండె. అది జూసి మానాయిన ఈపి ఇరగ్గొట్తావుండె.
   నాకే తెలీకుందా “సర్”న జారొచ్చే సీమిడ్ని ఏమి సేసేకీ నా శాత అయితావుండ్లేదు. కానీ, కండ్లకి అడ్డమొచ్చే యంటికిలికి మాత్రం బుద్ది సెప్పుతావుంటి. రాత్రిపొద్దు సదూకొనేతప్పుడు సీమనూనె(కిరోసిన్) బుడ్డీ మిందకి తలకాయని రవంత వొంచితే సాలు,”సుర్  సుర్..” న కాలి పోతావుండె. తిరగ వారానికే సిగిరొస్తావుండె. తిరగా అదేపని సేస్తావుంటి.
   నేను రేండోకలాసులో వున్నపుడు ఒగ అయివారుండె.  యర్రగా సూసేకి బొలేవుండె.ఆయప్పేరు తెలీదుగానీ యపుడు జూసినా సిగరెట్లు తాగుతావుందె. వూర్లో అందరూ ఆయప్పని సిగరెట్ల సిద్దగాడు అని పిలుస్తావుండ్రి. ఆయప్పకీ పెద్దయివారికీ అయితావుండ్లేదు. పామూ ముంగిస యవ్వారము!! ఒగదినం మాతో దూరం దూరం  నిలబెట్టి డికుటీసన్ సెప్పుతావుండాడు. ఆపక్క పెద్దపిల్లొల్లు .”అమ్మరో నేను నీ అబ్బయి కాక,ఆకుపచ్చని ఒక చిలుకనై వున్నయెడల? పంజరంబున నన్ను బంధింతువేమో!! భయపెట్తి పోనీక బాధింతువేమో? రానుపో నేనట్టులైన నీకడకు రాను రాలేను!! తల్లిరో నేను నీ తనయుడగాక! నల్లని ఒక కుక్కపిల్లనై వున్నయెడల? పొత్తున కూర్చుండి భుజి ఇంపనీక థూత్తని పొమ్మంచు తోసి పుచ్చుదుగదా?? రానుపో నేనట్టులయిన …” అనే పద్యాలు సెప్పుకొంటావుండారు. నా తలకాయలోకి అయివారు సెప్పే పదాలకన్నా, ఇవే బాగా దూర్తావుండివి. అట్లా పొద్దులో పెద్దయివారు ఒగ సీటీ పంపిచ్చె సంతకం సేయమని. సిగరెట్టయివారు యగా దిగా దాన్ని సూసి “సిరా పరా” సించి కిటికీలో నుంచి అవతల్కి పారేశ.
   వున్నట్లుండి పెద్దయివారు పొడిసే ఎద్దు మాదిరీ తలకాయి నిలెత్తుకోని,సేతి రెట్లు యగమడ్సుకోని గుడిబారొచ్చె. ఒచ్చినోడు వొచ్చినట్లే శంపల మింద నాలుగంటిచ్చె. ఆయప్పేమీ సన్నోడుగాదు ఆ మూల్లో ఇరిగి పడిండే శర్కా శక్కలుంటే అందుకోని వాంచబట్టె. మేం పిల్లోల్లంతా కేకలేసుకొంటా అవతల్కి పారి పోతిమి.
   వూర్లో జనాలొచ్చి ఇడిపిచ్చిరి. తిరగ సూస్తే మా కలాసులో ఒగ పలకగూడా మిగల్లేదు.అన్నీ వాళ్ల కాళ్లకిందబడి వడకలయిండివి. అవిటింజూసి అందరూ ఏడ్సిరి గాని,నాకి ఆనందమాయ. యాలంటే అది పాతగయ్యి అచ్చరాలు కనపడకుండా సమిసింది,  శానాసిన్నది. తిరగ దినమే మా యన్న  (అప్పుడు నాయనను  “అన్న” అనేవారం.నా+అన్న “నాయన” అయి అందులోని సగం “అన్న” కావచ్చు) రెండణాలు(12 పైసలు) పెట్టి కొత్తపలక తెచ్చె.
    ఈ అయివార్ల గలాట ముగిసి పోలేదు. ఒగదినం సిగరెట్టయివారు సినిమా సూసి రాతిరి తొమ్మిది గంటల్కి ఇందూపురం నుంచి సైకిల్లో వొస్తావుంటే– పెద్దయివారు,ఆయప్ప బావమరిదితో కల్సి మరవ వంకతావ నిలబెట్టి బాగ సితగ్గొట్టిండాడు. తిరగదినం వూర్లో పెద్దరెడ్లనందర్నీ పిల్సి పంచాయితీపెట్రి. అది రెండుమూడు దినాలు జరుగుతానే వుండె. ఒగదినము మామిళ్ల ముసలమ్మ కావొచ్చు అంతదూరంలో నిలబడి “బాపనోళ్లంతా శ్వాములు. స్వాములంటే పెద్దబుద్దు లుండాల్సినోళ్లు. సన్న జనాల మాదిరీ కర్సలాడేకే సరిపోతే ఇంగ పిల్లోల్లకి సదువు లెట్ల సెప్పుతారు” అని, ఇనీ ఇనపడ్నట్ల యక్కడో సూసుకొంట దులిప్పరేశ. ఆయమ్మ మాట్లిన్న జనాలు గట్టిగా నగిరి. అదేమి జరిగినోగాని, సిగరెట్లయివారు మారిపాయ.
   ఇంగొగయివారొచ్చె. ఆయప్ప పేరు శానా బాగుండేకానీ, ఆ మాన్నబావుదు ఇసుకూలుకొస్తూనే కురిసీలో కూకోని గొరకలుపెట్టి నిద్దర పోతావుండె. తూక్కొంటా ముగ్గరిచ్చి,ముందరికి పడతావుండె. పిల్లోల్లు ఆ అయివార్ని తూగుడు కోడి అని పిలుస్తావుండ్రి. (అప్పుడు ఇళ్లలో పెంచే కోళ్లకు కొక్కెర తెగులు అనే రోగం వచ్చేది.అది సోకగానే నిలబడిన కోడి నిలబడినట్లే కళ్లుమూసి తూగుతూ నేలకు పడి చనిపోయేది).ఆ  అయివారుకు పాటం సదివేదే వొస్తావుండ్లేదు. ఒకట్లు(ఎక్కాలు) పదిసార్లు రాయండి,బయట కూకోని పాటం సదివేది నేర్సండి…..మిరప సెట్లు ఏసినోల్లు కాయగూర్లు పీక్కు రాండి…అనే పొద్దు గడుపుతా వుండె.

అప్పయ్యా!చిదంబర్రెడ్డీ నీ పలక తీసుకురాప్పా!

రాయలసీమ బతుకు – అందునా అనంతపురం బతుకు కరువుతో కన్నీళ్ళతో సహజీవనం. ఆకలిదప్పుల నిత్య మరణం. అలాంటి బతుకులోంచి వచ్చి అక్షరదీపం పట్టుకొని ముందుకు నడిచిన రచయిత సడ్లపల్లె చిదంబర రెడ్డి.  ఆయనలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, ఒక మంచి రచయితా అంతకంటే ఎక్కువగా ఒక హృదయ జీవీ కనిపిస్తారు. ఆయన బతుకు పుస్తకం ఈ రచన.

-ఎడిటర్

My First Picture with Hair(scan0002)ఆ పొద్దు తేదీ1.1.1959.

పొద్దున్నే కుడిపక్కలో లేసి,దేవుని పటాలకి మొక్కుకోని,ముకమూ కాళ్లూ కడుక్కొంటి.అట్టవ(అటక) మింద పొదుగుడు కోడి పిల్లలు సేసి నట్లుంటే మా అన్నయ్య,అక్కయ్యా వాళ్లు తట్టిదించి సూస్తావుండ్రి.రెండు మూడు మురుగుడ్లు పడిండివి.మిగిల్న వన్నీ పిల్లలయిండివి.సెయ్యి వాసి మంచిదని మాయమ్మ, మాలోల్ల ముసలమ్మతో మూడు గుడిసెల్లో ఎండుసోగ తెప్పిచ్చి పొదిగి పిచ్చిండె.సన్న పిల్లులు సూసేకి ముద్దుగావుంటే నేను సేతికి తేసుకోని రవ్వన్ని బీము నూకులు తినిపిస్తి.మా యమ్మిచ్చిన గొర్రిపాల కాపీ తాగితి.

     మాయింట్లో పాలు పిండే ఎనుములు వుండే గానీ పాల టోరోల్లకి అమ్ముతావుండ్రి.కొలతలకి తక్కువొచ్చి అన్నీ అయిపోతే కాపీకి మిగల్లేదని– మా అన్నయ్య రప్పాల్లో గొర్రిపాలు పిండుకోనొస్తావుండె.(రప్పం=రాయీరప్పా పదబంధంలోని మాట. గొర్రెల కొట్టం) మా ఇంటికి సుట్టూపక్కా ఇండ్లు శానాతక్కువ.అందుకే జతగాళ్లతో ఆడుకొనేదానికి రప్పాలతాకి యల్లబార్తావుంటి.అవి మాఇంటికి దచ్చినంపక్క వుండివి.ఏడెనిమిది రప్పాల్లో వేలాంతర గొర్రిలు.పొద్దస్త మానమూ క్యార్ బ్యార్ అని అరుస్తావుండె.బారెడు పొద్దెక్కుతూనే సంగటి తిని,సిక్కాల్లో సద్దిగట్టుకోని,సొర్ర బుర్రలో నీళ్లు మోసుకోని,కావిలి కుక్కల్ని యంటబెట్టుకోని గొర్రలు కాసే వోల్లు– మందల్నంతా దిన్న(మెట్ట)కి,పెన్నేటి గట్లోని కానగ సెట్లవనానికి తోలుకు పోతా వుండ్రి.
     మేము ఇద్దరుముగ్గురు పిల్లోల్లు లోపలి రప్పాల్లో వుండే గొర్రి,మేకపిల్లల్తో ఆడ్కొంటావుంటిమి. సన్న పిల్లలకి అగిశాకు,ఆమిదాకు,పుండాకు,బెండాకు,యాపాకు..రకరకాలవి కోసుకొచ్చి నులకల్తో కుచ్చులుకట్టి,రప్పంలో సూర్లకి యాలాడగట్తావుండ్రి.బుడుగు(చిన్న)పిల్లలకి ఆకు అందకుంటే కుచ్చలిప్పి నోటికందిస్తావుంటిమి. రాతి కుడితిలో నీళ్లు తాగిస్తావుంటిమి.(అప్పుడు సినెంటు,గార కుడితెలు వాడుకచాలా తక్కువ.పెద్ద రాతి దిమ్మెలను వులితో తొలిచి తయారు చేసేవారు.ఇప్పుడు వూరంతా గాలించినా కేవలం ఒకటి మాత్రమే కనిపించింది.దాని ఫోటో చూడగలరు) కొత్తగా ఈనిండే గొర్రెల్ని రప్పాల్లోనే ఇడుస్తావుండ్రి.పిల్లులొగ పక్కా మేమొగపక్కా పొదులో పాలు తాగుతావింటిమి.
     ఇంగుగు ఇసిత్రమేమంటే!! ఆకాలంలో వానల కార్తులు ముగుస్తూనే శానామందికి కండ్లకలక రోగమొస్తావుండె.మా ఇంట్లో ఎవిరికి రాకపోయినా నాకొచ్చేది.పొద్దున్నే లేసే టయానికి కన్నురెప్పలు జాలిబంక(తుమ్మబంక) పూసి దారముతో కుట్టేసినట్ల మెత్తుకు పోతావుండె. నేను దుప్పటిగూడా తీయకుండా గుడ్డోనిమాద్రీ ఏడుస్తావుంటి. అపుడు మా అన్నయ్య రప్పాల్లోకి ఎత్తుకుపొయ్యి,గొర్రొకింద పండుకోబెట్టి పొదుగులోనుంచి పాలు సర్ సర్ న పిండుతావుండె.కారం పూసినట్ల మండతావుండే కండ్లమిందకి యచ్చగా పాలు కారితే హా  హా ఆ ఆనందము యా మటల్లో సెప్పల్ల?? సాయంత్రము గొర్రిలు తిరిగొచ్చేకిముందే పిల్లలు మేసి మిగిల్నరమ్మలన్నీ వామికి మోస్తావుంటి. ఎండినంక అవే పొయ్యిలోకి కట్టెలు.
     మా యన్న(నాన్న), మా యమ్మకి ఏమి సెప్పిండాడోకానీ,గుడిసెలోనుంచి పరిగెత్తి పోతావుండే నన్ను”ఒరే! పప్పులు పెడతాను రారా,తినిపోదువు” అని పిడికిలి సూపిచ్చె.దగ్గిరికొచ్చి సూస్తే అది వుత్తది.యనక్కి తిరిగి దౌడుతీసేకి మొదలుపెడ్తి.మా యమ్మ లటుక్కున నా జుట్టుపట్కోని బచ్చల్లోకి ఈడ్సుకుపాయ.బచ్చలంటే అది తడకల్తోనో,గోడల్తోనో కట్టింది కాదు.మా పాకకి యనక తూరుప్పక్క పెద్ద కనకాంబర సెట్టు.పడమరకి దాసవాళం(మందారం)సెట్టు.దచ్చినానికి కంపలు పాతిండే రప్పాల కల్ల(కంచె).ఆసెట్ల సందేమాబచ్చిలి. ఆడ ఒగ రాతిపలకమీద మగోళ్లు పుట్టగోసీలు పెట్టుకోని,వారానికొగసారి నాలుగుసెంబులు దిగబోసుకొంటారు.ఆడోళ్లయితే సీర అడ్డామేసి కుక్కిరికాళ్లతో కూకోని దొంగలమాదిరీ బిరబిర్న అటుకుడు(మట్టిపాత్రడు)నీళ్లు కుమ్మరిచ్చుకొంటారు.
     ఇడిస్తే పరిగెత్తి పోతానేమో అని జుట్టని యడమ సేత్తో పట్కోని,కుడిసేత్తో బుడుంగ్ బుడుంగున నా నెత్తిమీద నీళ్లు కుమ్మరించె.టెంకాయ సిప్పలోని మాసీకాయని ముట్టుకోలేదు.అక్కడిక్కడసూసి మా యవ్వ మర్సిపొయ్యిండే దాన్నే రవంత తీసి నాతలకి రుద్దె.ఇది సూస్తావున్న నాకండ్లు సీకాయిపడి మండిపాయ.గట్టిగా ఏడిస్తి.అంతసేపటికి మా యవ్వ సంజీవమ్మ వూతకట్టి పట్టుకోని కుంటుకొంటా ఒచ్చె.అంతే!! “నోరుముయ్య్! దొంగబడవా” అని మాయమ్మ నా వుత్తపయ్యిమింద నాలుగంటిచ్చె.ఇంకా గట్టిగా ఏడిస్తి.
“ఊరుకో బాశాలీ! పొడ్డూన్నే యాళకి పిల్లోన్ని యాల అట్ల్త పసరమ్మాద్రీ కొడతావుండావు” అని నన్ని ఎనకేసుకొచ్చె.మరిగి(మట్టి గిన్నె)లో మాయమైన సీకాయ మర్సిపాయ.
     నీళ్లు పోసేదయితూనే సీర కొంగుతోనే నా తలకాయ తుడిసి,యడ్లో ఆరబెట్టి, సెక్క దువ్వానితో దువ్వె.ఒంటిజడేసి సెండుమల్లి పూలు ముడిసి అదికిండే అంగీతొడిగె.అంతసేపటికి మాయన్న లోపల్నుండి ఒగ నల్ల బళపమూ,అణాపెట్టి కొనిండే(6పైసాలు)సన్న బోకి పలకా తచ్చి ఇసుకూలుకు ఈడ్సుకుపాయ.
     అపుడు ఇసుకోల్లో ముగ్గురయవార్లు.సింగప్పయివారు,సీనివాసరావు,కొత్తాయప్ప కిస్టునారెడ్డి.పెద్దయివారు సింగప్ప సారుతావ పెద్దబుక్కులో పేరు రాపిచ్చి,నన్ను మా నాయన కిస్టప్పయివారుతాకి పిల్సుకుపాయ.నన్ను సూస్తూనే నాజతగాళ్లు “ఒరే సిదంబరగా” అని పిల్సిరి.అది ఇన్న మా నాయిన అగ్గయిపాయ.”లే!ఎవుడ్రా ఆనాకొడుకు మావోన్ని అట్ల పిలిసింది?ఆ కూత ఇంగొగసారి ఇనిపిస్తే సెప్పు ఇరిగేతట్ల కొడతాను.చిదంబర రెడ్డి అనే పిల్సల్ల.ఇదిగో అయివారూ గురుతుపెట్తుకో” అనీసుకూలు పెంకులు ఎగిరిపోయేతట్ల అరిశ.ఆశబ్దానికి పిల్లోల్లు,అయివారూ అందురూ అదిరిపాయిరి.కరెంటు పోయిన సినిమా మాదితీ అయిపాయ ఇసుకూలు.
అ ఆలు దిద్దించిన కృష్ణా రెడ్డి గారికి చిన్న సత్కారం

అ ఆలు దిద్దించిన కృష్ణా రెడ్డి గారికి చిన్న సత్కారం

     మా నాయిన అట్ల పోతూనే అయివారు”అప్పయ్యా!చిదంబర్రెడ్డీ నీ పలక తీసుకురాప్పా” అనె.అ ,ఆ లు రాసిచ్చె.నేర్సు కొంటి.అయివారు బొలేమెచ్చుకోనె.
   ఆపొద్దు మద్యాన్నం ఇంగరెండచ్చరాలు నేర్సుకొంటూనే ఒంటికిడిసిరి.అవుడు పెద్దపిల్లోల్లంతా పలకమింద కూకొంటావుండ్రి. అవన్నీ గోడకానిచ్చిరి.కొండరు ఒడికిండే పత్తి దారం తీస్కోని సేవామందిరానికి పొయ్యిరి.మిగిల్నొళ్లు సెడుగుడు,కరీప్పాట,మేకాపులాట,దొంగాట,బుర్రాట..ఆడ్రి.లోపలికి బెల్లు కొడుతూనే అందరూ ఒగేతావ కూకొన్రి.ప్రభవ విభవ,చైత్రము,జనవరి,అశ్విని భరణి,ఆని ఆవడి..పద్యాలు,ఒక్కట్లు(ఎక్కాలు)నోటికి నేర్సిన పెద్దపిల్లోళ్లు వర్సగా సెప్పిచ్చిరి.వాల్లలో మాదిగి అస్వత్తప్ప ఒగుడే నాకి తెల్సినోడు.యాలంటే వాళ్ల నాయన నారయణప్ప జతలో మా ఇంటికి ఒస్తావుండె.సిలావరి గలాసు తెచ్చుకోని మాయమ్మ పోసిన కాపీతాగుతావుండె.
     ఈడ ఈళ్ల నాయిన మాదిగ నారాయణప్ప కత రవ్వంత సెప్పల్ల.
    మా ఇంట్లో సన్న సీమనూని బుడ్డీ మాత్రమే వున్నంట.బ్యాటరీలు కొనేకిదుడ్లు,కరెంటుగాని లేని కాలము.ఒగదినము పొయ్యితావ కట్టెలమిందికి బుడ్డీపొర్లుకోని పెద్దమంట లేస్తావున్నంట.అంతపొద్దుకి నారాయణప్ప ఏమిటిదో పనిమింద మాయింటి తాకి వొచ్చిన్నంట.మానాయిన నీళ్లుపోసి అగ్గి అరిపేది సూసినంట.”అమ్మయ్యా!మాది పుడుగోసెలుపు గిడిసె.సన్న గుడ్డిదీపమున్నా సరిపోతుంది.మీది పెద్ద కుటింబుము.వుంచుకొండమ్మ”కొత్తది లాటీని(కిరోసిన్ లాంతర్)తెచ్చిచ్చినంట.అందుకే ఆయప్ప యపుడొచ్చినా మాయమ్మ కాపీ పోస్తావుండె.(మా అమ్మ ఆ లాంతర్ గురించి ఎన్నిసార్లు చెప్పేదో!!దానిమీద మేడిన్ ఇంగ్లాండ్ అని వుండేది.మేము రెండు మూడు వూర్లకు వలసలుపోయి తిరిగి సడ్లపల్లెకు వచ్చి 1975 ప్రాంతంలో ఇంటికి కరెంటు తీసుకొనేదాకా అలాగే వుండేది.సినిమాలో కానీ,బొమ్మల్లోకానీ చేతి ల్యాంపు కనిపిస్తే నాకు మాదిగ నారాయణప్పే గుర్తుకు వస్తాడు.)
    ఇంటికిడుస్తూనే అస్వత్తప్ప నాదగ్గరికొచ్చి అన్నో ఈపొద్దుటినుంచి మనం జతగాళ్లు.నువ్వు బాగ సదువుకో లెక్కలు బాగ నేరిపిస్తాను”అని మా ఇంటిదంకా విచ్చి ఇడిసిపాయ.
-సడ్లపల్లె చిదంబర రెడ్డి