ప్లీజ్ సేవ్ తెలుగు!

 

“తెలుగు దేశం పార్టీకి ఆ పేరెలా వచ్చింది..?”

“పాఠశాల విద్యలో తెలుగును తొలగించింది, అందుకే ఆపేరు వచ్చింది..!”

*   *   *

“అర్థం పర్థం లేదు.. అనుటకు వొక ఉదాహరణను యిమ్ము..?”

“తెలుగు దేశం పార్టీ’ పాలనలో తెలుగు లేదు, అది వొక దేశమూ కాదు! ‘తెలుగుదేశం’ అనుట అర్థం పర్థం లేనిది!”

*   *   *

“తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని చెప్పి, తెలుగును తొలగించడమేమిటి..?”

“ఒకప్పుడు తెలుగు వుండేది అని చెప్పుకోవడం వల్లనే కదా.. అది ప్రాచీన భాష అవుతుంది..?!”

                                          *   *   *

“తెలుగు బాషను తొలగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వాన్ని యేమని డిమాండ్ చేయాలి..?”

“ముఖ్యమంత్రి మొదలు.. తెలుగుదేశం ప్రభుత్వనేతలూ నాయకులు కూడా యిక తెలుగులో మాట్లాడరాదు..!”

                                      *   *   *

“గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో- ‘తెలుగుజాతి తమ గౌరవం, తెలుగుజాతి పూర్వ వైభవం, నాలుగొందల యేళ్ళు పాలించిన శాతవాహనులు, యిరవై మూడవరాజు శాతకర్ణి’- అని చరిత్ర చెప్పిన చంద్రబాబు తెలుగును చరిత్రలో యెందుకు కలిపేసారో అస్సలు అర్థం కావడంలేదు..!?”

“ఇందులో అర్థం కాకపోవడానికి యేముంది?, బాలక్రిష్ణ తెలుగులో చెప్పిన డైలాగులు వినలేక.. యేకంగా తెలుగు భాషనే రద్దుచేసి అందరికీ రక్షణ కల్పించారు..!”

                                      *   *   *

“పాతనోట్లు చెల్లవంటే భరించాం కదా?, పాత తెలుగుభాష చెల్లదంటే యెందుకు భరించలేరు..?”

“అయితే.. పాతనోట్ల స్థానంలో కొత్త నోట్లు పెట్టినట్టు, పాత తెలుగు స్థానంలో కొత్త భాష ప్రవేశపెడతారా..?”

                                      *   *   *

“తెలుగు భాషని తొలగించడం అన్యాయం..!”

“ఇంగ్లీషు మీడియంలో మీ పిల్లల్ని చదివిస్తూ తెలుగు భాష వుండాలనడం మరీ అన్యాయం..!”

                                      *   *   *

“తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..”

“సాంగ్ యీజ్ వెరీ గుడ్.. బట్ వాటీజ్ ది మీనింగ్ అఫ్ తెలుగూ మమ్మీ..?”

                                         *   *   *

“తెలుగు యీజ్ ది ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్!”

“చూశారా?, తెలుగుని కూడా యింగ్లీషులో మెచ్చుకున్నారు.. అందుకే తెలుగు గొప్పతనం తెలుసుకోవాలన్నా యింగ్లీషే అవసరం..!”

                                      *   *   *

“అసలుకే లేదు అంటే కొసరు పెట్టమన్నాడట..!”

“తెలుగే తీసేస్తుంటే.. మాండలికం సొగసే వేరు అన్నాడట..!”

                                      *   *   *

“దేశ భాషలందు తెలుగు లెస్స..!”

“తెలుగు రాష్ట్రంలోనూ తెలుగు లెస్సే..!”

                                      *   *   *

“మా అబ్బాయికీ అమ్మాయికీ యిద్దరికీ తెలుగు అస్సలు రాదు..!”

“మా పిల్లలకీ రాదు, అందులో మునిపటిలా మనగొప్పలేదట, ప్రభుత్వమే తెలుగు పీకేసిందని మన మాటకెవరూ వెయిటివ్వడం లేదు..!”

                                        *   *   *

“తెలుగు తొలగింపు మీద రామోజీరావు యేమంటారు..?”

“మండలి బుద్ద ప్రసాద్ యింటర్వ్యూ మళ్ళీ వేస్తారు. ‘తెలుగు వెలుగు’ ప్రత్యేక సంచిక తీసుకొస్తారు. ఇంకా ఈనాడులో సంపాదకీయమూ రాస్తారనుకుంటా..!”

                                      *   *   *

“తెలుగు భాషలో యాభయ్యారు అక్షరాలు. తెలుగు లిపి గుండ్రంగా వుంటుంది. అందంగా వుంటుంది. మన జాతీయాలూ.. నుడికారాలూ.. సామెతలూ.. పొడుపు కథలూ.. పల్లె పదాలూ.. మాండలిక మందహాసాలూ..”

“అవున్లెండి బతకని బిడ్డ బారెడు.. అనేది కూడా తెలుగు సామెతే!”

                                      *   *   *

“వాడు తెలుగుకు భాషకు వీరాభిమాని. అంతెందుకూ తెలుగే మాట్లాడుతాడు.. తెలుగులోనే రాస్తాడు..!”

“ఏం?, పాపం చదువుకోలేదా..?”

                                      *   *   *

“నోబెల్ తెచ్చిన తెలుగు వారికి వందకోట్లు..!”

“నోబుల్ మాట దేవుడెరుగు.. తెలుగు ఎత్తేయడం వల్ల యింగ్లీషు మీడియం పాఠశాలలకు మరో వందకోట్ల ఆదాయం..!”

                                      *   *   *

 -బమ్మిడి జగదీశ్వరరావు

మజిలీ మాత్రమే!

afsar1

 

విత్వం వొక గమ్యం కాదు,

అదెప్పుడూ వొక మజిలీ మాత్రమే.

అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం. దీన్ని ఎవరూ ఏ ఆనకట్టా వేసి బంధించలేరు. బంధించిన చోట కవిత్వం నిలవ నీరైపొతుంది. కట్టుగొయ్యలూ కృత్రిమమైన కట్టుబాట్లూ ఆకవిత్వాన్ని మాత్రమే రాయించగలవు. ప్రవాహం కవిత్వ లక్షణం. గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు. ప్రవాహ గమనమే కవిత్వం. ఇక్కడే వుంటానన్న సుస్థిర భావన అకవిత్వం. ఇక్కడే వుండిపోలేనన్న అస్థిరమైన వలస జీవనం కవిత్వం.

afsar4

-ఇవన్నీ కవిత్వానికి నిర్వచనాలు కాకపోవచ్చు. ఇవి నా నమ్మకాలు మాత్రమే. ఇవి మూఢ నమ్మకాలైనా నాకు ఇష్టమే. ఎవరి ఇష్టానిష్టాల కోసమో కవిత్వం రాయడం నాకు కష్టం కాబట్టి.

కవిత్వ ప్రయాణం ఇవాళ కొత్తగా మొదలు కాలేదు. నాకు మాత్రం నా ప్రతి కవితా వొక కొత్త ప్రయాణమే. ప్రాణాన్ని పొదిగే వాక్యాలు విఫలమైన నా కోర్కెలు.  ఆ వాక్యాలు ఆదిమ గోడ మీద అస్పష్టమైన చిత్రాలే ఇప్పటికీ!

afsar2కవిత్వ ప్రయాణం ఇప్పటికిప్పుడో రేపో మాపో అంతమయ్యేదీ కాదు. దేవుడు మరణించాడని చెప్పిన  వాళ్ళు కూడా కవిత్వం మరణిస్తుందని మాత్రం చెప్పలేరు. పుస్తకాలు మ్యూజియంలో తప్ప ఇంకెక్కడా కనిపించవని నమ్మబలుకుతున్న కాలంలోనూ కవిత్వం బతుకుతుంది. కవిత్వం అంటే నల్లగా మారిన కాయితం కాదు కాబట్టి-

కవిత్వం అచ్చులోంచి పుట్టిన మూస కాదు. లిఖిత లిపి కాదు. గుండెలోంచి గొంతులోంచి పొంగుకొచ్చే శబ్దానికి శైశవ రూపం. ఎన్ని కరువుకాలాలు వెంటాడినా, ప్రకృతి ఆకుపచ్చదనాన్ని మరచిపోయినా ఆకాశం నీలిమని రాల్చుకున్నా గాలి ఊపిరాడక వురేసుకున్నా …నేల ఉన్నంత కాలం కవిత్వం వుంటుంది. నేలని వెతుక్కుంటూ ఇంకో నేల వున్న చోటికే వలస పోతుంది. అందుకే స్థలరాహిత్యంలో మాత్రం అది బతకదు.

కవిత్వం విశ్వజనీనం సార్వకాలీనం అనే భ్రమలు బద్దలైన కాలంలోకి మనం వచ్చాం. సర్వ కాల సర్వావస్థల్లోనూ వుపయోగవస్తువు కాగలిగిన కవిత్వాన్ని బాగా శంకించాలి. ఈ కాలాన్ని కాదని అతీతరేఖల మీద సాహంకారంగా సంచరించే అక్షరాల్ని వొదులుకోవడమే ఇప్పటి కవిత్వ జీవలక్షణం. ఎప్పటికీ ఎవరూ వదిలించుకోలేని వర్తమానం కవిత్వ ప్రాణం. సమకాలీన స్థల కాలాల్లోకీ…ముఖ్యంగా తన కాలంలో వొదగలేని కవిత్వం ఇప్పుడు బొత్తిగా అనవసరం. ఆ మాటకొస్తే కవి తన స్థలకాలాల్ని అన్వేషించడానికే రాస్తాడని నాకు అనిపిస్తుంది.

జీవితం అంటే నలుపూ తెలుపూ కాదనీ, ఇతరేతర రంగు తేడాలూ వున్నాయని, వ్యవస్థ అంటే వున్న వాళ్ళూ లేని వాళ్ళే కాదనీ ఇంకా ఇతరేతర స్థాయీ భేదాలున్నాయని ఇప్పుడేమీ నేను కొత్తగా చెప్పడం లేదు. ఈ నిర్దిష్టత అర్ధమైన తరవాత ఇప్పటి దాకా మనం రాస్తున్నదల్లా అమూర్త కవిత్వమే అన్న నిజం తెలిసింది. జీవితం వ్యాఖ్యానాలలో లేదనీ, క్రూరమైన వాస్తవికతలో ఉందనీ అర్థమైంది. ఆ మేలుకొలుపులోంచి వచ్చిన రెండు తరాలని చూస్తూ వాళ్ళ అంతరంగాల అలజడిని వెతకడానికి భాష చాలక రోదించిన క్షణంలో ఈ పాటలన్నీ పాడుకున్నాను. ఇందులో నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొక మూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట మానసాన్ని.

నిన్నటి కన్నా ఎక్కువగా భయపెడ్తున్నా ఇవాళ్టినే ప్రేమిస్తున్నా. ఇవాళ్టి కన్నా అస్థిరంగా కనబడుతున్నా రేపటినే కళ్ళలోకి నిలుపుకొంటున్న అనేక సమూహాల అస్తిత్వ వేదనని నేను.

afsar5

afsar3

నిన్నటి నించి ఇవాళలోకీ, ఇవాళ్టి లోంచి రేపటిలోకీ వలసపోతున్న జీవన యాతన నేను. అందుకే, నా వాక్యాల్లోని ఏక వచనం నేను కాదు, అనేకం! నేను ఇప్పుడు ద్వీపం కాదు, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న లాంతరు అనుక్షణిక వెలుగు.

ఈ చిన్ని వెలుగులోనే దారి వెతుక్కోవాలి. కాస్త చోటిమ్మని నేలని అడగాలి. ఆగకుండా సాగిపోయే కాలం నించి అర అర క్షణాలుగా బతుకు క్షణాల్ని అప్పడగాలి.

అప్పో సప్పో చేసి ఆగిపోకుండా నడవాలి, నడుస్తూనే వుండాలి.

నేలని నమ్ముకున్న వాడికి ఆకాశమే దారి చూపిస్తుందని ప్రవక్త ఎందుకన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. వలస పాదాలక్కూడా అదే దారి. నేల అంతమయ్యే చోట అవి తెగిపోతాయి, దారిలానే!

తెలియని దారిలో వొంటరిగా వెళ్తున్నప్పుడు భయంతో అరుస్తాం. ఏవేవో మాటలు పాటలుగా పాడుకుంటాం. మొండి ధైర్యంతో కాళ్ళని నేలకేసి కొడతాం. అలా నడవని నేలకూ, నడిపించే కాళ్ళకూ, దగ్గిరే దగ్గిరే అనిపించే ఆకాశానికీ మధ్య వెతుకులాట ఇదంతా.

దీనికో గమ్యం మాత్రం లేదు, అదొక్కటీ అడక్కండి!

 

(12 డిసెంబర్ 2000)

డిసెంబర్ ఇరవై హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం సందర్భంగా  మళ్ళీ…

telugu-award

ధింసా ఆడే కాళ్ళు..

Artwork: Rafi Haque

Artwork: Rafi Haque

జనపథపు ఆనందంతో వెలిగిపోయిన ముఖాలు
పోరాట సంబరాన్ని చిందించే ముఖాలు
ఏవేవో ఆశయాలతో రక్తం ఉరకలెత్తే ముఖాలు….
ఈ ముఖాల్ని యూనిఫారం తొడుకున్న హైనాలు పట్టి పీకాయి
రాజ్యం కత్తిపీటై క్రూరంగా చెక్కేసింది
పోరాటం చేసేవాళ్ళు సజీవులుగానే కాదు
శవాలుగా కూడా రక్తాన్ని మరిగింప చేస్తారు
ఒక్కో మృతదేహానికి ఒక్కో సజీవ చరిత్ర
అది వాళ్ళ స్తంభించిన కనుపాపల్లో కనిపిస్తుంది
****
రండి కార్పొరేట్ బాబులూ
ఇనుమడించిన ఉత్సాహంతో రండి
పలుగు పారలు డైనమేట్లు బాంబులు పొక్లైనర్లతో రండి
ధ్వంసంచేసి దోచుకున్నదాన్ని ఎత్తుకెళ్ళడానికి
బహుళజాతి కంటైనర్లతో రండి
మీ తరపున యుద్ధం చేసి
రాజ్యం పరిచిన నెత్తుటిమడుగుల రెడ్ కార్పెట్ల మీద
పరుగులెత్తుతూ రండి
బాయొనెట్లతో పొడిచేసిన ముఖాల్ని
ముఖాల్లేని మొండేల్ని
తెగిపడ్డ అవయవాల్ని తొక్కుకుంటూ ఉబలాటంగా  రండి
లక్షల ఏళ్ళుగా నిటారుగా ఎగిసిన
కొండలనన్నింటినీ పేల్చిపారేయండి
భూమిని బద్దలు చేయండి
చెట్లని బాంబులతో కూల్చి
పత్రహరితం పేగుల్ని మెడలో వేసుకు తిరగండి
కొండల రొమ్ముపాలులాంటి
జలపాతాలకి నిప్పెట్టండి
ఆదివాసీల అందమైన అమాయకపు
ధింసా ఆడే కాళ్ళు నరకండి
కొమ్ముబూరల్ని పగలగొట్టండి
దండారీ కొలాంబోడీ పండగల్లో
ఒళ్ళుమరిచి పులకరించే గూమేలా కోడల్ డప్పుల్ని
మోకాళ్ళకేసి కొట్టి విరగ్గొట్టండి
కాలికోం, పేప్రి, కింగ్రి వాయిద్యాల పీక నులిమేయండి
రేలపాటల గొంతుల్లో సీసం పోయండి
గోండు గుస్సాడీ కిరీటాల్ని విరిచేసి నెమలిపింఛాల్ని తగలబెట్టండి
వాళ్ళ కాళ్ళ గజ్జెల్లోని తుంగగడ్డల పూసల్ని చిందరవందరగా విసిరేయండి
గదబ గిరిజనుడి గుడిసె ముందున్న మట్టి అరుగు మీదే
మొదటి గునపం పోటెయ్యండి
ఏ ప్రకృతి విలయం చేయలేని
వినాశనానికి పూనుకోండి
అడవినంతా ఓ కబేళాగా మార్చి
నగరాల్లో ఫ్లై ఓవర్లు, పబ్బులు క్లబ్బులు కాఫీ షాపులు కట్టుకోండి
ప్రకృతి సంపదని
డబ్బుకట్టల్లోకి విలాసాల్లోకి
మార్చుకోవడమేగా నాగరీకత అంటే!
అడవి కడుపు కొల్లగొట్టి అక్కడి ఖనిజాల్ని
బులియన్ మార్కెట్లలో షేర్లు షేర్లుగా
అమ్ముకోవడమేగా పరిపాలన అంటే!
దండయాత్రలు చేసేవాడు
స్వదేశీయుడైతనేం విదేశీయుడైతేనేం?
*****
కానీ వీళ్ళు మాత్రం
పుడుతూనే విల్లంబులు బాణాలతో పుట్టినవాళ్ళే!
*

ఎవరూ ‘నో’ చెప్పలేని సినిమా!

 

pink1

చిత్రం – ‘పింక్‌’ (హిందీ), తారాగణం – అమితాబ్‌ బచ్చన్, తాప్సీ పన్ను, కీర్తీ కుల్హారీ, ఆండ్రియా తైరాంగ్, అంగద్‌ బేడీ, పీయూష్‌ మిశ్రా, కథ – స్క్రీన్‌ప్లే – రితేశ్‌ షా, కెమేరా – అభిక్‌ ముఖోపాధ్యాయ్, సంగీతం – శాంతను మొయిత్రా, ఎడిటింగ్‌ – బోధాదిత్య బెనర్జీ, నిర్మాతలు – రష్మీ శర్మ, సూజిత్‌ సర్కార్, దర్శకత్వం – అనిరుద్ధ రాయ్‌ చౌధురి, నిడివి – 136 నిమిషాలు, రిలీజ్‌ – సెప్టెంబర్‌ 16

 

ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయమని తెలిసేలా టైటిల్‌ పెట్టుకున్న ‘పింక్‌’ సినిమా గురించి హాలులోకి వెళ్ళే దాకా నిజంగా నాకేమీ తెలియదు. అమితాబ్‌ నటిస్తున్న సినిమా అనీ, తాప్సీ కూడా ఉందనీ మాత్రం చదివాను. ఎందుకనో అంతకు మించి తెలుసుకోలేదు. ట్రైలర్‌ కూడా మిస్సయ్యాను. కానీ, పోస్టర్‌ చూసినప్పటి నుంచి సినిమా చూడాలని మైండ్‌ ఫిక్సయిపోయింది. మనసు చెప్పేవాటికి మెదడు వివరణ ఇవ్వలేదు. అది అంతే! సినిమా చూడదలుచుకొంటే అది రిలీజయ్యాక దాని గురించి దూషణ భూషణ తిరస్కారాలేవీ తెలుసుకోకపోవడం, విశ్లేషణలు చదవకపోవడం నాకున్న అలవాటు. అవన్నీ తెలుసుకుంటే ఏమీ రాయని పలకలా స్వచ్ఛంగా సినిమాకు వెళ్ళలేనేమోననీ, ఆ చదివినవాటి ప్రభావంతోనే హాలులో ఆలోచిస్తానేమోననీ ఒక చిన్న భయం. అందుకే, ‘పింక్‌’ వచ్చి మూడు రోజులైనా, దాని గురించి ఏమీ చదవలేదు. తెలుసుకోలేదు. ఇప్పుడే సినిమా చూసొచ్చాను. అర్ధరాత్రి అయ్యిందన్న మాటే కానీ, నిద్ర పట్టని అనుభవం ఈ సినిమా. ఇంటికొచ్చేశాక కూడా దర్శక, రచయితలు సమాజానికి సంధించిన ప్రశ్నలు నా బుర్రలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మనసులో అనిపించింది ఏదో రాయాలి… మనసు చెబుతోంది. రాయకుండా పడుకోలేని మనఃస్థితిలో… ఒకానొక రాత్రివేళ రాసుకుంటూ వెళ్ళిన ర్యాంబ్లింగ్స్‌ ఇవి…

అవునూ… కాస్తంత నవ్వుతూ, తుళ్ళుతూ, షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ తిరిగే అమ్మాౖయెతే… ఇక ఆ అమ్మాయి తిరుగుబోతు అనేనా? పార్టీకి వచ్చి ఒక దమ్ము బిగించి, బీరు కొట్టినంత మాత్రాన ఆడపిల్లంటే అలుసా? డబ్బుకో, మరొక దానికో చటుక్కున లొంగి, టపుక్కున పక్కలో చేరిపోతుందనే భావనా? వర్కింగ్‌ లేడీ కాస్తంత ఆలస్యంగా రూమ్‌కొచ్చినా, ఆమె కోసం ఇద్దరో ముగ్గురో మగ ఫ్రెండ్స్‌ రూమ్‌కు వచ్చినా ఆ అమ్మాయి బజారుదనే అర్థమా? కాస్తంత అందంగా తయారై ఆఫీసుకు వచ్చినా – క్యారెక్టర్‌ బ్యాడ్‌ అనే తాత్పర్యమా? ఏమిటీ మైండ్‌సెట్‌! తప్పు మనదా? మనల్ని ఇలా తయారుచేసిన చుట్టుపక్కలి సమాజానిదా? మరి, మనం మారమా? ఎప్పటికీ మారమా? మనసుతో బుర్రకు పని చెప్పే ఇలాంటి ప్రశ్నలెన్నో ‘పింక్‌’ మనకి వేస్తుంది. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

————————-

కథగా ఈ సినిమా చాలా సింపుల్‌. ఢిల్లీ పిల్ల మీనల్‌ అరోరా (తాప్సీ), లక్నో వనిత ఫాలక్‌ అలీ (కీర్తీ కుల్హారీ), మేఘాలయ పిల్ల ఆండ్రియా (ఆండ్రియా తైరాంగ్‌) – ముగ్గురూ వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధుల్లో ఉంటారు. స్వతంత్రంగా గడపాలనుకొనే ఈ ఆధునిక తరం యువతులు ఢిల్లీలో ఒక అపార్ట్‌మెంట్‌ను కలసి అద్దెకు తీసుకొంటారు. స్వేచ్ఛగా బతుకుతుంటారు. సిగరెట్‌ తాగడం, అవసరాన్ని బట్టి ఒకటో రెండో పెగ్గులేయడం, మనసుకు నచ్చితే దైహిక అవసరం తీర్చుకోవడం – ఇవేవీ తప్పు కాదని నమ్మి, అలాగే బతికే కొత్త తరానికి వీళ్ళంతా ప్రతినిధులు. ఒకసారి ఫ్రెండ్స్‌ నైట్‌ పార్టీలో జరిగిన ఒక గొడవలో మంత్రి గారి బంధువైన యువకుడు రాజ్‌ వీర్‌ (అంగద్‌ బేడీ)ని సీసాతో కణత మీద గట్టిగా రక్తమోడేలా కొట్టి, మీనల్‌ తన స్నేహితురాళ్ళతో కలసి పారిపోతుంది. అతగాడికి కంటి పైన తీవ్రగాయమై, ఆస్పత్రిలో కుట్లు కూడా పడతాయి. మీనల్‌ మీద కక్ష తీర్చుకోవాలని విలన్‌ బృందం ప్రయత్నం. పోలీసుల దగ్గరికి వెళ్ళాలని హీరోయిన్‌ సాహసం. రాజీ కుదర్చాలని మధ్యలో ఫ్రెండ్స్‌ తాపత్రయం.

రాజీ ప్రయత్నం విఫలమైపోతుంది. పోలీసుల దగ్గరకు హీరోయిన్‌ వెళ్ళడంతో ఆమెను ఏకంగా కిడ్నాప్‌ చేసి, వ్యాన్‌లో అఘాయిత్యానికి పాల్పడి మరీ విలన్లు బెదిరిస్తారు. పైగా, అమ్మాయిలపై తామే ఎదురు ఫిర్యాదు చేస్తారు. హీరోయిన్‌ జైలు పాలవుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిలకు, ఆ ఇంటి పక్కనే ఉండే ప్రముఖ రిటైర్డ్‌ లాయర్‌ దీపక్‌ సెహ్‌గల్‌ (అమితాబ్‌ బచ్చన్‌) బాసట అవుతాడు. చాలా రోజుల క్రితమే నల్ల కోటు వదిలేసిన ఆయన మళ్ళీ ఈ ఆడపిల్లలకు న్యాయం జరిపించడం కోసం బరిలోకి దిగుతాడు. కానీ, తీరా విలన్లు, వారి లాయర్‌ (పీయూష్‌ మిశ్రా) మాత్రం హీరోయిన్, ఆమె స్నేహితురాళ్ళు పక్కా వ్యభిచారుణులన్నట్లు చిత్రీకరిస్తారు. మరి, అప్పుడు ఏమైంది? ఆ అపవాదును ఆ అమ్మాయిలు ఎలా ఎదుర్కొన్నారు? అసలింతకీ ఆ పార్టీ రోజున జరిగిందేమిటి? మొదలనవన్నీ మిగతా సినిమా.

————————-

ఒక చిన్న సంఘటన, దాని పర్యవసానాలు… అంతే ఈ సినిమా కథ. పాటలు, డ్యాన్సులు, కామెడీల లాంటి ఐటమ్‌లు, కనీసం ఐటమ్‌ సాంగ్‌లు కూడా లేని సినిమా. సినిమాలో ఒకటికి రెండుసార్లు వినిపించే ఒకే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్, రోలింగ్‌ టైటిల్స్‌లో వచ్చే కవితాత్మక గీతం మినహా ఇందులో సోకాల్డ్‌ ‘సినిమాటిక్‌ సాంగ్స్‌’ లేవు కాక లేవు. ఆ మాటకొస్తే, సినిమాలో పేరున్న నటీనటులు మాత్రం ఎవరున్నారని? మనందరికీ తెలిసిన అమితాబ్‌ బచ్చన్, మన దగ్గర మాత్రమే కాస్తంత పాపులరైన తాప్సీ. వాళ్ళు కూడా మనకు వాళ్ళలా కనపడరు. కథలో పాత్రలుగానే అనిపిస్తారు.

అమితాబ్‌ను ఎందుకు గొప్ప నటుడంటారో తెలుసుకోవాలంటే, అనారోగ్యం పాలైన భార్యను చూసుకొనే టైమ్‌లో అతని హావభావాలు, అతని డైలాగ్‌ మాడ్యులేషన్, పూడుకుపోయిన గొంతుతో అతను మాట్లాడే డైలాగులు చూడండి, వినండి. ఫెమినిస్టుగా కనిపించే అదే మనిషి – కోర్టులో నిలదీస్తున్నప్పుడూ, నిర్ఘాంతపోయి ఆవేదనాపూరిత మనస్కుడైనప్పుడూ మాట్లాడే తీరు, ప్రవర్తన గుర్తించండి. ఇవాళ్టికీ ‘సర్కార్‌’, ‘బ్లాక్‌’, ‘పీకూ’ లాంటి విభిన్న తరహా సినిమాలు, వయసుకు తగ్గ సినిమాలూ చేసే ఆయన మీద మన సినిమా స్టార్స్‌ అందరి కన్నా ప్రేమ పెరుగుతుంది. ఇప్పటి దాకా తాప్సీని గ్లామర్‌ రోల్స్‌లోనే చూసి, మానసికంగా అలాగే ఫిక్సయిపోయివాళ్ళకు ఈ సినిమా ఒక స్టార్‌ట్లింగ్‌ రివిలీషన్‌. ఈ పాత్ర, కోర్టు బోనులో నిలబడే సీన్లలో ఆమె నటన చూశాక, నటిగా ఆమె మీద గౌరవం కలుగుతుంది.

సినిమాలో ఇక, మిగతా అంతా పెద్ద పేరున్నవాళ్ళు కాదు. కానీ ఎంత బ్రహ్మాండంగా పాత్రల్ని పండించారో! తాప్సీకి స్నేహితురాలుగా వేసిన ఇద్దరమ్మాయిలూ, ముఖ్యంగా ఫాలక్‌ అలీ పాత్రధారిణి, అలాగే కోర్టులో అబ్బాయిల తరఫు లాయర్, జడ్జి (ధ్రుతిమాన్‌ ఛటర్జీ), అమితాబ్‌ భార్య (మమతా శంకర్‌), చివరకు హౌస్‌ ఓనర్‌ సహా ప్రతి పాత్రా సహజంగా అనిపిస్తుంది. తెరపై సజీవంగా కనిపిస్తుంది.

————————-

టెక్నికల్‌గా కూడా ‘పింక్‌’ సౌండే! విడిగా మళ్ళీ డబ్బింగ్‌ చెప్పాల్సిన అవసరం లేకుండా సెట్స్‌లో నటిస్తున్నప్పుడే డైలాగులు కూడా రికార్డు చేసే ‘సింక్‌’ సౌండ్‌ విధానం వాడారు. ఇవాళ తెలుగు సినిమాకు కూడా విస్తరిస్తున్న హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల తాలూకు ‘సౌండ్‌ డిజైనింగ్‌’ అనే ప్రత్యేక శాఖతో స్క్రిప్టుకు వచ్చే బలం ఎంతో సినిమా చూస్తే అర్థమవుతుంది. నేపథ్య సంగీతం అంటే, డబ డబ డప్పుల మోత, హీరో గారి ఎంట్రన్స్‌ నుంచి విలన్‌తో ఢీ అన్నప్పుడల్లా హై డెలిబల్స్‌ సౌండ్‌ అలవాటైపోయిన ప్రాంతీయ భాషా సినీ ప్రేక్షకులకు ‘పింక్‌’ ఒక రిఫ్రెషింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. శాంతను మొయిత్రా (గతంలో రాజేశ్‌ టచ్‌రివర్‌ డైరెక్ట్‌ చేసిన అవార్డు చిత్రం ‘నా బంగారు తల్లి’కి నేపథ్య సంగీతం కూడా శాంతనూయే) నేపథ్య సంగీతం, రీ–రికార్డింగ్‌ ఇటీవల వచ్చిన సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అంటే అతిశయోక్తి అనిపిస్తుందేమో! కానీ, అది నిజం!

సినిమా చూస్తుంటే… తెరపై టైట్‌ క్లోజప్‌లు, నేమ్‌బోర్డ్స్‌ మీదుగా ప్యాన్‌ చేస్తూ సిటీలోకి కారులో సాగే ప్రయాణం – ఇలా చాలా చోట్ల కెమేరామన్‌ అభిక్‌ ముఖోపాధ్యాయ్‌ పనిమంతుడని అర్థమైపోతుంటుంది. ఆ సీన్‌లో, ఆ సన్నివేశం తాలూకు అనుభూతిలో ప్రేక్షకుణ్ణి కూడా ఒక భాగం చేసే ఆ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక, సినిమా ఎడిటింగ్, షాట్స్‌ సెలక్షన్, వాటి కూర్పులో తెచ్చిన డ్రామా కూడా చాలా ఉంది. వీటన్నిటినీ సౌండ్‌ డిజైన్, నేపథ్య సంగీతం మరో మెట్టు పైన కూర్చోబెట్టాయి. కథ జరుగుతున్న కొద్దీ, టైమ్‌కు తగ్గట్లుగా విలన్‌ ముఖం మీది గాయం కూడా క్రమంగా మానిన లక్షణాలతో మేకప్‌ చేయడం లాంటివి చూడడానికి చాలా చిన్న విషయాలే. అయితే, అవన్నీ దర్శకుడి శ్రద్ధాసక్తులకు నిస్సందేహంగా నిదర్శనం.

————————-

pink2

సినిమా మొదలైన క్షణాల్లోనే ప్రేక్షకుల్ని కెమేరా కన్ను వెంట కథలోకి లాక్కుపోవడం ఏ ఉత్తమ స్క్రిప్ట్‌కైనా ప్రాథమిక లక్షణం. అది ‘పింక్‌’లో పుష్కలం. న్యూస్‌పేపర్లలో వస్తున్న సమకాలీన సంఘటనల స్ఫూర్తితో రితేశ్‌ షా రచన చేసిన ఈ సినిమా మొదలైన తర్వాత గంటకి ఎప్పుడో ‘ఇంటర్‌మిజన్‌’ అని తెరపై పడితే కానీ, టైమ్‌ తెలీదు. ఇక, పూర్తిగా కోర్టు డ్రామాగా నడిచే సెకండాఫ్‌ అయితే అంతకన్నా రేసీగా, ఆలోచించే తీరిక ఇవ్వకుండా పరుగులు తీస్తుంది. ఆస్పత్రిలో భార్యకు ఈ ముగ్గురు ఆడపిల్లల్నీ అమితాబ్‌ పరిచయం చేస్తుంటే, మంచం మీద నుంచి లేవలేని భార్య బిస్కెట్‌ ప్యాకెట్‌ అందించే సీన్‌ లాంటి సెన్సిబుల్‌ మూమెంట్స్‌ ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. అసలు జరిగిన కథేమిటో ఆఖరులో రోలింగ్‌ టైటిల్స్‌లో చూపెట్టే ‘పింక్‌’ స్క్రీన్‌ప్లే పరంగా, కథాకథన శైలి పరంగా ఔత్సాహికులు గమనించాల్సిన సినిమా.

అలాగని ఈ సినిమా స్క్రిప్టులో లోపాలు లేవని కాదు. హీరోయిన్‌ను పోలీసులు జైలులో పెట్టినా, ఆ తరువాత కథ కోర్టు దాకా వెళ్ళినా – అంతకు ముందు కనిపించిన హౌస్‌ ఓనర్‌ ముసలాయన ఎందుకొచ్చి, నోరు విప్పడో తెలియదు. అలాగే, తనను కిడ్నాప్‌ చేసి, ఊరంతా వ్యాన్‌లోనే విలన్లు తిప్పిన సంగతి గురించి కోర్టులో హీరోయిన్‌ చెప్పదు. విలన్ల కన్నా ముందే పోలీసుల్ని ఆశ్రయించి భంగపడిన విషయమూ జడ్జి ఎదుట బయటపెట్టదు. అయితేనేం! ఈ సినిమా ప్రస్తావించిన అనేక మౌలిక అంశాల ముందు ఈ లోటుపాట్లు మర్చిపోదగ్గవే!

చలం ఏనాడో చెప్పినట్లు, స్త్రీకి కూడా ఒక మనసుంటుంది… ఆమెకూ ఇష్టానిష్టాలు ఉంటాయి. అవేవీ గమనించకుండా, గౌరవించకుండా తాళి కట్టిన భార్య అనో, సరదాగా తిరిగిన తోటి ఉద్యోగిని అనో, స్నేహితురాలు అనో… పశువులా మీద పడితే? అచ్చంగా పశువు అనే అనుకోవాల్సి వస్తుంది. తనకు ఇష్టం లేదని తోటి మనిషి ‘నో’ అంటే, ఆ ఒక్క పదంలో కొన్ని కోట్ల భావాలు, వాక్యాలు ఉన్నాయని గుర్తించాలని ‘పింక్‌’ మన పురుషాహంకార జీవుల చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. రూల్‌ నంబర్‌ 1, నంబర్‌ 2 అంటూ కోర్టులో అమితాబ్‌తో దర్శక, రచయితలు చెప్పించే ప్రతి డైలాగూ ఒక పాఠమే. ‘విక్కీ డోనర్‌’, ‘మద్రాస్‌ కేఫ్‌’, ‘పీకూ’ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఈసారి నిర్మాతగా వెండితెరపై చేసిన కాంటెంపరరీ సోషల్‌ కామెంట్‌ ‘పింక్‌’. రాగల చాలా కాలం పాటు ఈ సినిమా గుర్తుంటుంది.

ఒక సినిమాలో మహా అయితే కథ బాగుండవచ్చు. మరొక సినిమాలో నటీనటుల అభినయం బాగుందనిపించవచ్చు. ఇంకొక సినిమాలో టెక్నికల్‌ బ్రిలియన్స్‌ కొట్టొచ్చినట్లు కనిపించవచ్చు. కానీ, ఒకే సినిమాలో ఈ మూడూ బాగుంటే? ఈ మధ్య కాలంలో అలాంటివేవీ లేవు. కానీ, ఇప్పుడు ఆ కొరత తీరుస్తుంది – ‘పింక్‌’. ఆ మాటకొస్తే – చూసిన కాసేపే కాకుండా, హాలులో నుంచి బయటకు వచ్చేశాక కూడా వెంటాడే ఒక అనుభూతినో, ఆలోచననో మిగల్చడానికి మించి ఏ సినిమాకైనా ప్రయోజనం ఇంకేం ఉంటుంది! రెండుంబావు గంటల ‘పింక్‌’ అచ్చంగా అలాంటి సినిమానే! అందుకే, ఇలాంటి సినిమాలకు యూ కాన్ట్‌ సే… ‘నో’. కావాలంటే, వెళ్ళి చూసి రండి. చూసి వచ్చాక నా అభిప్రాయంతో నూటికి నూరుపాళ్ళూ మీరూ ‘యస్‌’ అనే అంటారు! మే ది ట్రైబ్‌ ఆఫ్‌ థాట్‌ ప్రొవోకింగ్‌ ఫిల్మ్స్‌ గ్రో!

 

తాజా కలం

 ఇంతకీ ‘పింక్‌’ అంటే ఏమిటి? అమ్మాయిలకు సంబంధించిన విషయమనేది వాచ్యార్థం. కానీ, ‘పింక్‌’ అంటే భయపెట్టి, బాధించి, బలవంతాన స్త్రీ జననేంద్రియాన్ని పురుషుడు ఆక్రమించడమనేది కొన్ని దేశాల్లో ఉన్న అర్బన్‌ స్లాంగ్‌ అట! జర్నలిస్ట్‌ మిత్రుడొకడు తాజాగా గుర్తుచేశాడు. అది ఈ టైటిల్‌లోని సూచ్యార్థం. సినిమా చూస్తే, ‘పింక్‌’ అంటే ఏమిటో ఇట్టే అర్థమవుతుందని సూజిత్‌ సర్కార్‌ అన్న మాటల వెనుక ఇంత నిగూఢార్థం ఉందన్న మాట! ఈ సినిమానే కాదు టైటిల్‌ కూడా ప్రేమ ముసుగులో బయటా, పెళ్ళి ముసుగులో ఇంటా జరుగుతున్న కనిపించని లైంగిక హింసకు అర్థవంతమైన అద్దం కదూ!

…………………………………..

 

 

 

 

జర్నీలో తోడు సంగీతం: రంజని

chaya1

 

ఛాయ (సాంస్కృతిక సంస్థ) నిర్వహిస్తున్న తమ పదమూడవ కార్యక్రమం – ఛాయ తరంగిణి (సెప్టెంబర్ 4- 6PM) కార్యక్రమంలో రంజని శివకుమార్ పాల్గొంటున్న సందర్భంగా తనతో ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ చేసిన సంభాషణ.

—-*—

నెలవంక పసివెలుగులా దినదినమూ ప్రవర్ధమానమై పూర్ణచందమామ వెన్నెల్లా  మనోలోయలని సంపూర్ణంగా నవరాగ సంమ్మిళితంలో మంత్రముగ్ధులని చేసే రాగరంజని  ఆమె.

దైనందిన జీవితపు ప్రతిమలుపులో మనపై చిలకరించే ఆ స్వరపరాగపు అంతరంగమంతా సంగీతమే.

ఆ సుస్వరాల ప్రవాహపు గమనాన్ని వినటం వొక అందమైన అనుభవం.

మీ అందరితో పంచుకోవటం చాల సంతోషం.

యిక విందామా?

 

రంజని, చిన్నప్పుడు మీరు విన్నపాటల్లో యే పాట మీకు బాగా గుర్తుంది?

రంజని : మా బామ్మ గారు వాళ్ళంతా కృష్ణ భక్తులు. యింట్లో నామావాళి పాడుతుండే వాళ్ళు. చిన్న చిన్నవి. అవి యెలా అంటే బృందగానం లాగ. భజన సాంప్రదాయం. యెలా వుంటుందంటే ‘ఆనందకందా గోపాలా గోవిందా – జే జే నందా యశోదా చందా…’ అలా చాల ఫోక్సీగా వుంటుంది ట్యూన్. యింట్లో జస్ట్ అవి పాడతారు. అవి నాకు కాస్త కాస్త జ్ఞానం తెలిసినప్పటి నుంచి బాగ జ్ఞాపకం వున్న పాటలు.

అంతే కాకుండా అప్పా ఫ్లూట్ వాయిస్తారు. నిజానికి మా అమ్మ అప్పా సంగీతం వల్లే ప్రేమలో పడ్డారు. మా అమ్మ అప్పాకి కాంభోజివర్ణం, సరసిజనాభ నేర్పించే వారు.

మా యింట్లో యెప్పుడు సంగీతం గురించిన మాటలు మాటాడుతుంటారు. అమ్మ పాడతారు. నిజానికి వాటిని మాటలు, సంభాషణ అనడానికీ లేదు. జస్ట్ ప్లే మ్యూజిక్… యింటి వాతావరణం అంతా నిత్యం సంగీతంతో నిండివుండేది. సంగీతోత్సవంలా వుండేదనుకో యిల్లు. రిచువలిస్టిక్ కాదుకానీ పండగలతో మ్యూజిక్ ముడిపడి వుండేది.

మార్గశిర మాసం వస్తే యం యల్ వి అమ్మ పాడిన ఆండాళ్ తిరువప్పై మా యింట్లో వుదయం వేళ కాసేట్ ప్లే అవుతుండేది. అనుకోకుండా అది చెవ్వుల్లో పడిపడి చాల యెంజాయ్ చేసేవాళ్ళం. వినీవినీ మాకు యం యల్ వి అమ్మ పై యిష్టం వచ్చేసింది. అలా ఆ కేసెట్ తో మేమూ కలసి పాడుకునే వాళ్ళం. అలానే భద్రాచల రామదాస్ కృతీస్ బై బాలమురళి కృష్ణ సర్ వి ప్లే అవుతుండేవి. ‘తక్కువేమి మనకూ రాముడొక్కడుండు వరకు’ అని వస్తుంటే మధ్యలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాసేజ్ వచ్చేది. అవి కూడా బట్టీ అయిపోయేవి. అమ్మ కర్నాటిక్ పాడేవారు. అప్పా ఫ్లూట్ వాయించేవారు. తమ్మూ మృదంగం వాయించేవారు. అలా యెప్పుడు మా యిల్లు సంగీతంతో నిండి వుండేది. అంతే కాని కూర్చోని విను, విను… పాడుపాడు… నేర్చుకో నేర్చుకో… అలా అసలు వుండేది కాదు. సంగీతమంటే సరదాగా వుండేది. యిష్టంగా వుండేది.

అమ్మ అప్పా యిండియన్ బ్యాంక్ లో పనిచేసే వారు. వాళ్ళు వాళ్ళ కెరీర్లో బిజీ. అయినా యెప్పుడూ యింట్లో మ్యూజిక్కే వుండేది.

రంజని, మనం చిన్నప్పుడు పెరిగిన యిల్లు మనల్నిచాల influence చేస్తుంది కదామీకు మీ యిల్లు యెలా వుండేది?

రంజని: చెన్నైలోని ఐనవరంలో మాది చిన్ని యిండిపెండెంట్ యిల్లు. నా పర్సనాలిటి రూపు దిద్దుకోవటంలో ఆ యిల్లు పెద్ద పాత్రే పోషించింది. యింట్లో వొక్కొక్కరికి వేరువేరుగా గదులు వుండేవి కావు. అందరం వొకే గదిలోనో, హల్లోనో పడుకునే వాళ్ళం. కాని మా యింటి చుట్టూ చాల పెద్ద తోట వుండేది.

తోటాయేయే చెట్లు పూల మొక్కలు వుండేవి?

రంజని: సపోటా రెండు రకాల మామిడి, పారిజాతం, గొయ్య , పనస, సామంది కొబ్బరి చెట్లు టిపికల్ హౌస్ హోల్డ్… అడివి మాదిరి వుండేది. మైంటైన్ చెయ్యటం పెద్ద పని.

డాబా యిల్లా

రంజని: డాబా యిల్లే. ఆ డాబా మీద కొట్టాయి (ఆస్బెస్టస్ షెడ్డు) వుండేది. యెక్కడ నుంచి వచ్చారో యెవరికి తెలీదు కాని నేను పుట్టేటప్పటికే అందులో వరదరాజన్ గారు వుండేవారు. 50 యేళ్ళు వుండేవి. అతని దగ్గరకి వీణ, వయిలన్, వోకల్ నేర్చుకోడానికి చాల మంది వచ్చేవారు. అమ్మ యింట్లో యేది వండితే అది అతనికి పెట్టేది. అతని దగ్గర వొక్క కిరోసిన్ స్టవ్ మాత్రమే వుండేది. అతను టీ మాత్రం చేసుకునేవారు.

photo: Meena

photo: Meena

యింట్రస్టింగ్యెలా వుండేవారు చూడటానికి… .

రంజని: బీడీ తాగేవారు. పొడవుగా వుండేవారు. యెప్పుడు తెల్లని పంచె, లాల్చితో వుండేవారు. బీడీ తాగటం వలన sunken cheeks వుండేవి. Nonviolent person. ఆ జమానాలో చాల మందిలానే చాల సింపుల్ లివింగ్. హ్యాపీ పర్సన్.. వరదరాజన్ గారి దగ్గర చాల ఫ్లూట్స్ వుండేవి. అతనికి అన్ని రకాల యింస్ట్రుమెంట్స్ రిపేర్ చెయ్యటం వచ్చు. అతని స్నేహితులు మృదంగాన్ని బాగు చేసేవారు. నాకు మొట్ట మొదట సరిగమ పదనిసలు… వరదరాజన్ సర్ నేర్పించారు. వొక రోజు ఆయన కనిపించకుండా వెళ్ళిపోయే వరకు అంటే ఆరేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వరకు వరదరాజన్ గారి దగ్గరే సంగీతంలో బేసిక్స్ నేర్చుకున్నాను. యెక్కడి నుండి వచ్చారో తెలియనట్టే యెక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. యెస్… వెరీ వెరీ యింట్రస్టింగ్ పర్సన్. అతనికి మ్యూజిక్ యింస్ట్రీమెంట్స్ గురించి యిన్ అండ్ అవుట్ తెలుసు.

 

రియల్లీ యింట్రస్టింగ్ పర్సన్ఆ తరువాత సంగీతం యెక్కడ నేర్చుకున్నారు…?

రంజని : ఆ తరువాత, తమిళియన్నే కాని జంషడెపూర్ లో సెటిల్ అయిన సీతనారాయణన్ చెన్నై కి తిరిగి వచ్చారు. ఐనవరంలోనే మా యింటికి దగ్గరలో వుండేవారు. కర్నాటిక్ సంగీతం నేర్పించటమే కాదు సీతా అమ్మకి భజన్స్, హిందుస్తానీ సంగీతంలో కూడా ట్రైనింగ్ వుంది. కర్నాటిక్ మ్యూజిక్ తో పాటు భజన్స్ కూడా సీతా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.అప్పుట్లో పిల్లల్లా వున్నప్పుడు మనకి వీడియో గేమ్స్ అలా యేమి వుండేవి కాదు కదా. స్కూల్ నుంచి మూడు లేదా మాక్సిమమ్ మాడున్నరకి వచ్చేసే వాళ్ళం. బయట ఆడుకోవటం, మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళటం, భారత నాట్యం క్లాస్ కి వెళ్ళటం, సమ్మర్ హాలిడేస్ వస్తే వాలీబాల్ కోచింగ్, స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళటం యిలా అప్పట్లో టైం అంతా యాక్టివిటీస్ తో నిండిపోయి వుండేది.

యిల్లు లానే మనపై స్కూల్ ప్రభావం కూడా వుంటుంది కదా. మీ స్కూల్ గురించి

రంజని: Its an amazing school Padma. భావన్స్ రాజాజీ విద్యాశ్రమంలో. చదువుకున్నాను. కిల్ పాక్ లో వుండేది. చాల మంచి టీచర్స్ వుండేవారు. అక్కడ చదువొక్కటే కాదు. యెక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి చాల యింపార్టేన్స్ వుండేది. వైవిధ్యభరితంగా ఆలోచించేవారుండే వారు. వొక్కోసారి మంజుల మేడం యింగ్లీష్ క్లాస్ లని చెట్ల కింద చెప్పేవారు. చిత్ర సంపత్ మేడం డాన్స్ నేర్పించేవారు. మీరా మిస్ సంస్కృతం, శాంతా మిస్ తమిళం నేర్పించేవారు.స్కూల్ ల్లో ఉదయాళూర్ కళ్యాణ్ రామన్ సర్ మ్యూజిక్ టీచర్. భజన సంప్రదాయం లో సుప్రసిద్దులు. స్కూల్ ల్లో యానివాల్ డే కి అందరూ యేదో వొక యాక్టివిటీలో పాల్గునేవారు. టీచర్స్ అంతా చాల నాలెడ్జబుల్. అలాంటి టీచర్స్ వుండటం నిజంగా లక్కీ. యీ ప్రపంచంలో వివిధ రకాల కెరీర్ ఆప్షన్స్ వున్నాయని అవన్నీ యెక్స్ ప్లోర్ చెయ్య వచ్చనేట్టు యెంకరేజ్ చేసేవారు. యిప్పుడు మా క్లాస్ మేట్స్ ని చూడు పద్మా, స్పోర్ట్స్ మెడిసన్, యోగా, యానిమేషన్ యిలా వొక్కో ఫీల్డ్ లో వున్నారు.

నైస్యింట్లో కెరీర్ గురించి చెప్పేవారాయింజినీరింగ్ చదవాలన్నది యెవరి ఛాయిస్

రంజని: యింట్లో యెప్పుడూ యిదే చెయ్యాలని చెప్పేవారు కాదు. చదువు ,మ్యూజిక్, ఆటలు యెందులోను బలవంతం చేసేవారు కాదు. అన్నీ పూర్తిగా నా ఛాయస్. అప్పాకి నేను B A మ్యూజిక్ ఆ తరువాత M A మ్యూజిక్ చెయ్యాలని వుండేది. కాని

యింజినీరింగ్ చదవాలన్నది నా ఛాయిస్. వేలూరు యింజనీరింగ్ కాలేజీలో చేరడానికి వొక కారణం హాస్టల్ జీవితాన్ని చూడాలనిపించింది. ఐనవరానికి బయట వున్న ప్రపంచం యెలా వుంటుందో చూడాలనే కుతూహలంతో యింజినీరింగ్ కాలేజ్ లో చేరాను.

యిప్పుడు ఆ కాలేజీ ని VIT యింజనీరింగ్ కాలేజీ అంటున్నారు. యింజినీరింగ్ సెకండ్ యియర్ లో వున్నప్పుడు డ్రామా చెయ్యాలనిపించింది. అప్పాకి డ్రామా అంటే చాల యిష్టం సరే చెయ్యి… చెయ్యి అని NSD కి వెళ్ళమన్నారు. నేనే వెళ్ళలేదు. కాని అంతలా మా ఛాయిస్ లని యిష్టంగా వొప్పుకునేవారు.

యిల్లు, స్కూల్ మీ విషయంలో వొక దానిని మరొకటి కాప్లిమెంట్ చేసేట్టు వున్నాయి. కానీ బయట అప్పుడు వేగంగా వచ్చే రకరకాల మార్పులని యెలా చూసేవారు మీరు.

రంజని: చదువుకునేప్పుడు కెరియర్ డే డ్రీమ్స్ చాలానే వుండేవి. I had all career choices in my life. యేయిర్ హోస్టెస్ అవ్వాలనిపించాగానే ‘ లెట్స్ అప్లై అనుకునే వాళ్ళం. యెలక్త్రనిక్స్ చెయ్యాలని, కాపీ రైటింగ్ బాగుంది అందులోకి వెళ్లాలని, యానిమేషన్ స్కెచెస్ గీయాలని, వావ్… MTV విజేస్ అంట అవి ట్రై చేద్దామాని, జింగిల్స్ పాడాలని యిలా అందరికి ఆ యేజ్ లో యేలాగయితే రకరకాల కలలు, ఆలోచనలు వుంటాయో నాకు వుండేవి. అంతా మాలో మేమే నలుగురైదుగురు ఫ్రెండ్స్ మి అనుకునే వాళ్ళం. టీవీ యెక్కువ చూసే వాళ్ళం కాదు కానీ టీవిలో చూసేవి మాత్రం వెరీ ఫైన్ ప్రోగ్రామ్స్. మీఠా విసిట్, దీప్తి నావల్ , షబానా ఆజ్మీ లాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడటం వలన అదీ మన పెర్సనాలిటీకి యాడ్ అవుతుంది కదా… అలానే లిటరేచర్ కూడా సత్య జిత్ రేస్ Feluda, యిలా చాల ఫైన్ గా వుండేవాటికి యెక్స్పోస్ అవ్వటం వల్ల యే ప్రభావం  నుంచి యెప్పుడు బయటకి వచ్చేయ్యాలో తెలిసేది. యిలా అవన్నీ వున్నా సంగీతం నా జర్నీ లో భాగంగా యెప్పుడు వెన్నంటే వుండేది. మ్యూజిక్ మాత్రం పార్ట్ అఫ్ మై లైఫ్.

 

ఫైన్జాబ్ చేసేవారు కదా మరి మీరెప్పుడు సంగీతానికి పూర్తి టైం యివ్వలనుకున్నారు

రంజని: యింజినీరింగ్ తరువాత T C S లో పోస్టింగ్ హైదరాబాద్ లో వచ్చింది. హైదరాబాద్ లో నేను ఫ్లూటిస్ట్ యన్ యెస్ శ్రీనివాసన్ సర్ ని కలిసాను. ఆయన శారదా శ్రీనివాసన్ గారి  హస్బెండ్. హైలీ యింటలేక్చువల్ పర్సన్స్. హెచ్ డి వెల్స్ నుంచి కోట్ చేస్తూ నాకు మ్యూజిక్ ని వివరించే వారు. కాన్సెప్ట్ అఫ్ టైం, కాన్సెప్ట్ అఫ్ సైలెన్స్ ని చెప్పేవారు. మ్యూజిక్ విషయంలో డీప్ థాట్ వున్న వ్యక్తి.

అలా మ్యూజిక్ పట్ల పూర్తి అవగాహన, విజ్ఞానం వున్న యన్ యెస్ సర్ ‘వుద్యోగాలు చెయ్యడానికి చాల మందే వున్నారు. కానీ మ్యూజిక్ అందరికి రాదు. నువ్వెందుకు మ్యూజిక్ పైనే పూర్తి గా కాంసెంట్రేట్ చెయ్యవు. నీ టైం అంతా మ్యూజిక్ పైనే పెట్టు’ అని చెప్పారు.

నాపై యన్ యెస్ మామ ప్రభావం చాలా చాల వుంది. నేను నా కార్పరేట్ వుద్యోగం మానేసి నా సమయమంతా మ్యూజిక్ కే పూర్తిగా యివ్వడానికి యన్ యెస్ మామే కారణం. నేనెప్పుడు అంత బ్రిలియంట్ పర్సన్ని చూడలేదు.

యెప్పటి నుంచి కాన్సర్ట్స్ యిచ్చే వారు రంజని.

రంజని: నేను చైల్డ్ గా వున్నప్పటి నుంచే సీతామామీ చెన్నై లో కాశీవిశ్వనాథ్ టెంపుల్ ల్లో నవరాత్రి వుత్సవాలకు, పరుశువాకం లో త్యాగరాజ ఆరాధనై కాన్సర్ట్స్ కి తీసుకు వెళ్ళేవారు. అలా చిన్నతనం నుంచే టెంపుల్ కాన్సర్ట్స్ లో పాల్గునేదాన్ని.

 

చిన్న పిల్లలాగా మనం వున్నప్పుడు పిల్లల్లో టాలెంట్ ని అంతా చాల మెచ్చుకోవటం చాల కామన్ కదా. చిన్న పాపగా వున్నప్పుడు యీ కాన్సర్ట్స్ లో మీరు పాడినప్పుడు చాలమంది చాల మెచ్చుకొంటుంటే ఆ ప్రశంసల నుండి డిస్టెన్స్ మైంటైన్ చేసేవారాచేస్తే యెలా చెయ్యగలిగే వారు.

రంజని: మనలని యెవరు యెంత మెచ్చుకున్నా మనకి మనం యెక్కడ వున్నామో తెలుస్తుంటుంది. మనం ఆ పొగడ్త  కాదని తోసైయ్యం. కాని ఆ పొగడ్తలు యిచ్చే సంతోషం క్షణికం. అంతే. తిరిగి మనల్ని మనం చెక్ చేసుకుంటాం. మనకి మనమే అసలైన చెక్. ప్రతి కాన్సర్ట్ లో మనం యెలా పాడేం, యెక్కడ యే పదం బాగ పలక లేదు, యే సంగతి మరింత బాగా మనం యేఫ్ఫోర్ట్ పెట్టాల్సింది, యిప్పటి కంటే అంతకు ముందు యింట్లో పాడిందే బాగున్నట్టు అనిపించవచ్చు. విలువైన వ్యక్తులు మన చుట్టూ వున్నప్పుడు మనల్ని మనం యెప్పుడు త్వరగా గ్రేట్ అనుకోలేం. మనం మన ఫీల్డ్ లో మనకి వున్న నాలెడ్జ్ యెంతో మనకి తెలుస్తుంటుంది. యింకా యెంతో తెలుసుకోవలసింది వుందని మనకి తెలుస్తునే వుంటుంది. యెంతో సాధన చెయ్యాలని తెలుస్తుంటుంది. ఆ రియాలిటీ చెక్ యెప్పుడూ వుంటుంది నాకు.

ranjani1చెన్నై లో చాల కంపిటేటివ్ సర్క్యూట్ వుంటుంది. చిన్నప్పటి నుంచి అక్కడ పార్టిస్స్పేట్ చేసేదానిని. అప్పా చెపుతుంటారు, చిన్నప్పుడు అలా పాడటానికి వెళ్ళినప్పుడు నా పాట పాడటం అయిపోగానే నేను ఆ ప్రాంగణం నుంచి రాకుండా అక్కడ శ్రోతల్లో కూర్చుని మిగిలిన వారు పాడుతుంటే వింటాననే దాన్నంటా. మిగిలిన వాళ్ళు యెలా పాడుతున్నారో చూడటం నాకు చాల ఆసక్తి. వాళ్ళు వాయిస్ ని యెలా వాడుతున్నారు, కృతి యే స్టైల్ ల్లో వుంది, యే కృతి ప్రెజెంట్ చేస్తున్నారు, హై రేంజ్ స్ ని యెలా ప్రెసెంట్ చేస్తున్నారు యిలా మిగిలిన తోటి వాళ్ళని పూర్తిగా గమనిస్తాను. దాంతో నాకు నేను యెక్కడ వున్నానో తెలిసేది. నేను యెక్కడ సరి అవ్వాలో కూడా తెలిసేది.

అదీ కాకుండా మా పేరెంట్స్ నేను కాన్సర్ట్ స్ యిచ్చినప్పుడు చాల త్వరగా గా నేను చేసిన పొరపాట్లని చెపుతారు. గుడ్ క్రిటిక్స్. వొకసారి యేమయిందంటే తాన్పూరాని చాల సేపు వాయించాను. అలా యెలా వాయిస్తావ్… శ్రోతల్ని అలా బోర్ కొట్టించటం కరెక్ట్ కాదు కదా అన్నారు. యీ మధ్య అయోధ్యా మండపం లో నేను కాన్సర్ట్ యిచ్చాను. చాల బాగ పాడేనని నాకు నేను గాల్లో తెల్తున్తున్నాను. యెప్పుడో కాని నాకు అటువంటి సంతోషం కలగదు. మామూలుగా యెలా వుంటుందంటే, అక్కడ సంగతి మరింత ఫీల్ తో పాడాల్సిందనో, లిరిక్ లో యేదో మర్చిపోయాననో యిలా యేదో వొక కొరత వుంటుంది మనసులో పాడిన ప్రతి సారి. ఆ రోజు అలా యేమి లేకుండా చాల సంతోషం గా వున్నప్పుడు మా పేరెంట్స్’ నువ్వు అలా అన్ ప్రోఫ్ఫెషనల్ గా యెలా ప్రవర్తిస్తావ్ అన్నారు. నేనేం చేసాను అని అడిగాను. మా పేరెంట్స్ చెప్పారు ‘మృదంగం వాయించే వారికి తనియావర్తనం ప్లే చేసే సమయం యివ్వకుండా మొత్తం నువ్వే పాడేసావు. స్టేజి మీద యెవరి లైం లైట్ వారికి యివ్వాలి కదా. అలా అన్ ప్రోఫ్ఫేషనల్ గా వుంటే యెలా… ధర్మా అనేది వొకటుం టుంది’ అన్నారు. అతనికి వెళ్ళి సారీ చెప్పాను. అతను నాకు సీనియర్ కూడా. పర్వాలేదు నువ్వు చాల యిన్న్వాల్వ్ అయి పాడేరు అన్నారు. అది గంటన్నర కాన్సర్ట్ . సో.. స్టేజ్ మీద టైం చాల ముఖ్యం.

అలానే రేడియోలో పాడినప్పుడు అరగంట లో లైవ్ యిచ్చేటప్పుడు టైం ఛాలెంజ్ గా వుంటుంది. యెలా వుంటుందంటే వర్డ్ లిమిట్ వున్నప్పుడు రాయటంలా పద్మా. టైం ని సెట్ చేసుకోడానికి NS మామ నాకు టైమర్ యిచ్చారు.

 

పాడేటప్పుడు స్టేజి మీద మిమ్మల్ని మీరు యెప్పుడైనా మైమర్చిపోతారా

రంజని: మర్చిపోతా ఐ లూస్ మై సెల్ఫ్. బాగుంటుంది అలా మర్చిపోవటం.

తిరిగి మళ్ళీ యిక్కడ మా పేరెంట్స్ చెప్పిన విషయాలు గుర్తు వస్తున్నాయి. వొక సారి లిరిక్ మరచి పోయా. you can’t afford to forget a lyric అని చెప్పారు. అలానే నిన్ను నువ్వు పాడుతూ అలా స్టేజి మీద మర్చిపోవటం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నీ డ్యూటీ ని మర్చిపోకూడదు’ అని చెప్పారు. అలా మర్చిపోవటం శ్రోతల ముందు ఆ క్షణాలని వాళ్ళ కి ప్రెసెంట్ చెయ్యటం వొక రకంగా బాగానే వుంటుంది. కానీ మా పేరెంట్స్ చెప్పినట్టు నేను నా డ్యూటీ నీ పేరఫోం చెయ్యటం మీద యెక్కువ దృష్టి పెట్టటం కూడా నేర్చుకుంటున్నాను.

 

మీరు చాల చోట్ల పాడేరు కదామీకు ఫలానా చోట తప్పకుండా పాడాలని వుండేదా

రంజని: కళాక్షేత్రా లో పాడటం చాల యిష్టం. ఆ యామ్బియన్స్ అందంగా వుంటుంది. అక్కడ పాడటానికి అవకాశం వచ్చినప్పుడు చాల సంతోషపడ్డాను.

యెక్కడెక్కడ పాడేరు రంజని?

రంజని: సేలం, కోయింబత్తుర్, మధురై, చెన్నయి లో యిలా దాదాపు చాల వూర్లలో పాడేను. విశాఖపట్నం, కాకినాడ, తెనాలి , బెర్హంపూర్, భద్రాచలం యిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కచేరీలు యిచ్చాను. అలానే బెంగళూరు, యూ యస్ లో, యూకే లో పాడేను.

యింకా మ్యూజిక్ నేర్చు కొంటున్నారా…?

రంజని: కర్నాటిక్ సంగీతంలో అంతా వచ్చేసింది అని యెప్పుడూ వుండదు. ప్రతి వొక్కరికీ యే స్టేజ్ లో అయినా వొక గురువు అవసరం. నేను యుకే నుంచి తిరిగి వచ్చాక చెన్నై మ్యూజిక్ సీజన్ లో పంతుల రమ గారి పాటలు విని మైమరచిపోయాను. అదృష్టవశాత్తూ యిప్పుడు ఆమే నా గురువు. మ్యామ్ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ లో ఫైనర్ యాస్పెక్ట్స్ నేర్చుకొంటున్నాను.

నాకు ఆమె గురువుకంటే కూడా వొక అక్క లాంటిది. నన్ను యెంతో ప్రేమగా చూసుకుంటుంది. తన సంగీతమన్నా, తనన్నా నాకు చాలా యిష్టం.

యిప్పుడు ఛాయాలో ఛాయా తరంగిణిని హైదరాబాద్ లో తెలుగు యూనివెర్సిటీలో పాడబోతున్నారు. మీ పాటని యెప్పుడెప్పుడు విందామాని యెదురు చూస్తూన్నాను.

రంజనినేను కూడా హైదరాబాద్ లో పాడి కొన్ని నెలలయింది. నేను కూడా మీలాగే యెదురుచూస్తున్నాను.

*

 

బతుకు లయను వినుడీ! 

తెలుగు సాహితీమేరువు సోమసుందర్

soma2

1989లో మా యానాం డిగ్రీ కాలేజ్ వార్షికోత్సవానికి శ్రీ సోమసుందర్ గారిని ముఖ్య అతిధిగా పిలిచారు. అప్పుడు ఏం మాట్లాడారో గుర్తులేదు కానీ, ఆయన వస్త్రధారణ ఆకర్షించింది నన్ను. సన్నని దేహం, మడతనలగని పంచె, లాల్చీ లతో గొప్ప కాంతితో కనిపించిన ఆయన రూపం నా ఊహల్లో ఇంకా తాజాగానే ఉంది.

బదిలీపై 2007 లో కాకినాడ వచ్చాకా మరలా ఆవంత్స సోమసుందర్ గారిని కలిసాను. వారితో సంభాషించాకా, వారిగురించి ఏదైనా చిన్నవ్యాసం వ్రాసి అంతర్జాలంలో పెట్టాలన్న కోర్కె కలిగింది. మూడు నాలుగు సార్లు కలిసి కొన్ని వివరాలు సేకరించి వ్యాసం తయారు చేసి వికి పీడియాకు పంపాను. వారు అంగీకరించి యధాతధంగా తీసుకొన్నారు.

ఈ కలయికల ద్వారా సోమసుందర్ గారిని కొద్దిగా అర్ధం చేసుకోగలిగాను. ఆయనకు భాష పట్ల అపారమైన పట్టు ఉంది. ఇప్పటికీ బాగా గుర్తు ఉన్న అంశం – ఒకసారి ఆయన నన్ను “పీయూషమంటే ఏమిటి” అని అడిగారు మా జువాలజీలో పీయూష గ్రంధి (Pituitary gland) ఉంటుంది. కానీ పీయుషం అంటే ఏమిటో తెలీదు. అదే నసుగుతూ అంటే ‘పీయూషమంటే అమృతం” అని చెప్పి ‘కవిత్వం వ్రాసేవ్యక్తికి భాషమీద పట్టు ఉండాలి, అది విస్త్రుతంగా చదవటం ద్వారా వస్తుంది” అన్నారు.

వారికి వాక్యనిర్మాణం పట్ల చాలా శ్రద్ద. నా కవితల్ని కొన్ని చదివి వినిపించుకొన్నారు. ఒక చోట “ఏదైతే ఉందో అది” లాంటి ఒక దూడ వాక్యాన్ని పట్టుకొని “ఛి ఛి ఎందుకలా భావాన్ని అన్ని వంకర్లు తిప్పటం, సూటిగా రాయి” అని మందలించారు.

soma1

శ్రీశ్రీ , తిలక్, నారాయణబాబు, ఆరుద్ర, కృష్ణ శాస్త్రి వంటి మహామహులతో వారి అనుభవాల్ని ఎన్నో చెప్పారు. ఆయనతో జరిపిన ఆనాటి మూడు నాలుగు సమావేశాలు నాకు సంబంధించి మంచి సాహిత్యపాఠాలు. ఆయన శతాధిక గ్రంధకర్త,, వేయి పున్నములు చూసిన పూవనం, మేరుసమానమైన సాహితీమూర్తి, … అయినప్పటికీ, ఏదైనా ఆయనకు నచ్చిన వాక్యం కనిపిస్తే, కల్మషమెరుగని హృదయంతో నిండార నవ్వుతూ, భలే ఉంది ఊహ…. బాగు బాగు అంటూ మెచ్చుకొనే వారు.

ఆ తరువాత  సోమసుందర్ ఏటా నిర్వహించే అవార్డుల సభకు రెండుమూడు సార్లు వెళ్ళాను. పోయినేడాది కాకినాడ బుక్ ఎక్జిబిషన్ ప్రారంభించటానికి ఆయన వచ్చినప్పుడు- పెద్దవయసు కదా గుర్తుపట్టగలరా అంటో సందేహిస్తూ వెళ్ళికలవగా ‘నువ్వు బాబా వి కదూ? ఏం రావటం లేదు, రా ఒకసారి’ అని ఆశ్చర్యపరిచారు.

గత నెల 10 వ తారీఖున  అవధానుల మణిబాబుతో కలిసి వెళ్ళి  సోమసుందర్ గారిని కలిసినపుడు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఉత్సాహంగా కనిపించారు.

soma3
అక్కడ అల్మారా డిస్ప్లే లో వీరు వ్రాసిన “పాబ్లో నెరుడా కవితా జీవితయాత్ర” పుస్తకాన్ని చూసి ‘సార్ .. ఈ పుస్తకం నాకు కావాలి’ అని అడగ్గా వెంటనే ఆయన పక్కనే ఉన్న కిటికీ గూడులోని ఆ పుస్తకాన్ని తీసి ఇచ్చారు. సంతకం పెట్టి ఇవ్వండి సార్ అంటే సంతకం కూడా చేసారు దానిపై.
నీ వయసెంత అని అడిగారు- చెప్పాను నేను. చాలా చిన్నపిల్లాడిలా కనపడుతున్నావు అన్నారు. బయటకు వచ్చేసాకా – అదేమిటి పెద్దాయన అలాగ అంటారు? అని మణిబాబుని అడిగితే, “ఆయన వయసు 94, ఆయనకు మీరు చిన్నపిల్లాడిలా కనపడక ఇంకెలా కనపడతారు అని తిరిగిప్రశ్నించాడు నన్ను.

అద్దేపల్లి రామమోహనరావు గారు గతించి ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇప్పుడు  సోమసుందర్ గారు. కొద్దో గొప్పో వారిరువురితోనూ భౌతికంగానో, మానసికంగానో సన్నిహితంగా మసలిన నాలాంటి వారికిది తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

సోమసుందర్ గారు తమ దేహాన్ని రంగరాయ మెడికల్ వైద్యకళాశాలకు దానమివ్వటం వారి శాస్త్రీయ దృక్పధానికి నిదర్శనం.

సోమసుందర్ గారిపై నేను వ్రాసిన వ్యాసం లింకు

http://sahitheeyanam.blogspot.in/2009/01/blog-post_25.html

 

ఆమె ఒక సైన్యం!

mahasweta

 

(కల్పన రెంటాల  2007 లో మహాశ్వేత దేవిపై ఈటీవీ -2 మార్గదర్శి కార్యక్రమం కోసం రాసి ఇచ్చిన స్క్రిప్ట్ )

ఆదివాసులంటే భయంకరమైన మనుష్యులనీ, వాళ్ళకు సభ్యతా సంస్కృతి లేవన్న అపోహల్ని ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగలు, దోపిడీ ముఠాలు నెలవుండే చోటన్న కట్టుకథల్నీ ఆమె చెదరగొట్టింది. అక్కడి మనుష్యులు రాక్షసులైన అసురతేగలకి చెందిన వాళ్ళన్న ప్రచారాల్నీ ఆమె పట్టించుకోలేదు. ఆత్మ స్థైర్యాన్నే దివ్వెగా వెలిగించుకొని, ఆమె అడవుల్లోకీ వెళ్లింది. నగర జీవితం లో పుట్టి పెరిగిన మహాశ్వేతా దేవి కీకారణ్యాల గుండెల్లో ఏ మారుమూలనో దాక్కుని బతుకుతున్న అడివి బిడ్డల ఆక్రందనల్నీ వింటూ వాళ్ళ గుండెల్లోకి అడుగుపెట్టింది. భయం, ఆకలి, దారిద్ర్యం, అమాయకత్వం ….వీటన్నింటికి పర్యాయ పదాలుగా బతుకుతున్న ఆదివాసులకి కొండంత అండగా నిలబడింది. ఇప్పుడు ఆమె అడివి బిడ్డలకుఅమ్మ. తరతరాల దోసిళ్లకు ఆనవాలుగా మిగిలిన గిరిజనానికి కనుపాప. ఒకవైపు ఆయుధాలతో కొండ బతుకుల్నీ తీర్చిదిద్దే నక్సల్బరీ పోరాటం సాగుతున్న దశ లోనే ఒకే ఒక్క కలం బలంతో తానే ఒక సైన్యం గా పోరాడి గెలిచిన యోధ మహా శ్వేత దేవి.

ఇప్పటికీ ఎనభై ఏండ్ల క్రితం ఢాకా లోని ఒక సాహిత్య సంప్రదాయ కుటుంబం లో పుట్టిన మహా శ్వేతా దేవి చిన్న వయస్సులోనే ‘ గణ నాట్య ‘ అనే ఒక ధియేటర్ బృందం తో కలిసి పని చేసింది. 1930,40 ల్లో ‘ గణ నాట్య ‘ అంటే సామాజిక రాజకీయ విప్లవ సంకేతం. ఆనాడు బెంగాల్ లోని పల్లె సీమల్లో ‘ గణ నాట్య ‘ గజ్జెల మోత వినిపించని ఊరు లేదు. ‘ గణ నాట్య ‘ అడుగు పెట్టిన చోట అజ్నానానికి నిలవ నీడ లేదు. కలకత్తా విశ్వ విద్యాలయం లో ఆంగ్ల సాహిత్యం లో ఎమ్మే చదువుతున్న కాలం లో కూడా మహాశ్వేత ‘ గణ నాట్య ‘ ప్రభావం తో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక రంగం లో తలమునకలుగా వుండేది. అతి కొద్ది కాలం లోనే ఆమె అధ్యాపకురాలిగా , పత్రికా రచయితగా ఉద్యోగ జీవితం లోకి అడుగిడింది.

మన దేశాన్ని చేజిక్కించుకొని దుష్ట పాలన సాగిస్తున్న తెల్లవాళ్లని గజ గజ వణికించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాన్ని ఆధారం గా తీసుకొని చేసిన ప్రయోగాత్మక రచన “ ఝాన్సీర్ రాణి ‘ తో ఆమె సాహిత్య జీవితం 1956 లో మొదలైంది.

కేవలం గ్రంధాలయాలు శోధించి, చరిత్ర పుస్తకాల ఆధారాలతోనే ఆమె ఈ జీవిత చరిత్ర రాయలేదు. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగిందో, ఆ నేల మీద జీవిస్తున్న సామాన్య జన హృదయాలో ఝాన్సీ లక్ష్మీ బాయి ఎలా శాశ్వతం గా నిలిచి పోయిందో, ఇప్పటికీ ఆ నేల మీద, ఆ ప్రజానీకం లో ఆ వీరనారి జ్నాపకాలు ఏ విధంగా సజీవం గా వున్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహా శ్వేత చేసిన ప్రయోగం. నిరుద్యోగ రక్కసి ఒక వైపు పట్టి పీడిస్తున్నా, కుటుంబం లో భార్య భర్తలిద్దరికీ ఉద్యోగం కూడా లేని దుర్భర స్థితి వున్నప్పటికీ నాలుగు వందల రూపాయలు అప్పు చేసి బుందేల్ ఖాండ్ కి ప్రయాణమైంది మహా శ్వేత. బుందేల్ ఖాండ్ చుట్టూరా ఎన్నో ఉర్లు తిరిగింది. మామూలు జనం తో ముఖ్యం గా స్త్రీలతో కలిసి మాట్లాడింది. తరాలుగా చెప్పుకునే కథల్ని రికార్డ్ చేసింది. ఆ పరిశోధన ఫలితమే ఆమె మొదటి రచన ‘ ఝాన్సీర్ రాణి’.

ఆ తరువాత నాలుగు దశాబ్దాల పైబడిన సాహిత్య జీవితం లో ఆమె ఇరవై సంపుటాల కథలు, వందకి పైగా నవలలు, వందల కొద్దీ వ్యాసాలూ, ఉపన్యాసాలూ ఆమె బహుముఖ ప్రతిభా కి నిలువుటద్దాలు. భారత దేశం లోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన జ్నానపీఠ పురస్కారాన్ని ఆమె గెలుచుకుంది. ‘ ఆసియా నోబెల్ గా  పేరు పొందిన రామన్ మెగాసెసే అవార్డ్ ఆమెకు దక్కింది. ఒక తల్లి ఆత్మ ఘోష ని అక్షరబద్ధం చేసిన ‘ హజార్ చౌరాసీ మా ‘నవల ప్రసిద్ధ దర్శకుడు గోవింద్ నిహలానీ దర్శకత్వం లో చిత్రం గా వెలువడి , ఆమె కీర్తి ని అంతర్జాతీయ పటం మీద నిలబెట్టింది.

mohaseta1468494824

1965 లో పలమావు అనే ఒక గిరిజన గూడేన్ని చూసిన తర్వాత మహాశ్వేత లో చాలా మార్పు వచ్చింది. “ ఈ ఊరు గిరిజన భారతానికి అద్దం” అని ఆమె అనుకుంది. ఆ ఊళ్ళోని భూమి లేని నిరుపేద గిరిజనుల దారుణ జీవన స్థితిగతులూ, భూమి వున్న ధన స్వాముల అరాచకాలూ ఆమె ఆలోచనల్ని మేల్కొలిపాయి. నిజమైన భూమి బిడ్డలకీ, భూమి ని బలవంతాన స్వాధీనం చేసుకొని గిరిజనుల నోటి మట్టికొట్టి విలాసం గా బతుకుతున్న భూస్వాములకీ మధ్య జీవితం లో ఇన్ని వ్యత్యాసలున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పు పేరిట గిరిజనుల మీద పెత్తనం సాగిస్తున్న భూస్వాముల దాష్టీకాన్ని ఎండ కట్టాలని ఆనాడే ఆమె ప్రతిజ్న చేసింది. ఇంక కాలినడకన గిరిజన గూడేలన్నీ తిరగడం మొదలుపెట్టింది.

తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహా శ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రం గా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే రాస్తున్నారో ఆ పీడితుల నిజ జీవితం లో, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేత దేవిది.

ఒక వైపు దేశం 21 వ శతాబ్దం లోకి ఉరుకులు పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న దశ లోనే మరో వైపు అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కక ఆదివాసులు బాధిత, పీడిత ప్రేక్షక జన సమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని కంకణం కట్టుకుంది. అడవి బిడ్డల హక్కుల సాధన కోసం నడుం బిగించింది. వివిధ అవార్డుల నుంచి తనకు అందిన వేల కొద్దీ ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రి గా కాకుండా ఒక క్రియాశీల కార్యకర్త గా భారతీయ గిరిజన జీవిత చరిత్ర పైన చెక్కు చెదరని ముద్ర వేసింది.

గిరిజనల బతుకుల్లో వెలుగులు నింపే దశ లో ఆమె మొదటి మెట్టు: వాళ్ళ ఆర్ధిక స్థాయి ని పెంచడం, జీవన స్థితి ని మెరుగు పరచడం. ఇప్పటికే గిరిజనులకు అందుబాటు లో వున్న వ్యవసాయం, పాడి సంపాదల్ని ఆధారం గా తీసుకొని , వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలో శాస్త్రీయం గా శిక్షణ ఇవ్వడం మహాశ్వేత సాధించిన తొలి విజయం. అదే సమయం లో వాళ్ళను అక్షరాస్యులుగా చేయడం. అందుబాటు లో వున్న వనరులు, అక్షరాస్యత రెండూ గిరిజనుల బతుకుల్ని మార్చాయంటుంది మహా శ్వేత. ఇంతకు ముందు ఒకే ఒక్క పంట వేసి, భూమిని పోడు తో పాడు చేసే స్థితి నుంచి ఇప్పుడు అదే భూమి లో మూడు పంటలు వేసే స్థితి కి గిరిజనులు వెళ్లారు. దాంతో గిరిజనులు ఆర్ధిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరగడమే కాదు, వాళ్ళలో కొండంత ఆత్మ విశ్వాసం మేల్కోంది. ఇంతకు ముందు పూట కింత సరిపోయేటంత మాత్రమే పండించిన గిరిజనం ఇప్పుడు శక్తి సామర్ధ్యాలున్న రైతులుగా మారి, ధాన్యం తో పాటు బంగాళా దుంపలు, వేరుశనగల్లాంటివి కూడా పండిస్తున్నారు. కాసింత నమ్మకమిస్తే చాలు, కొండల్ని పిండి చేస్తాం అనే గొప్ప జీవన సూత్రం ఇప్పుడు వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.

ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకు వచ్చిన వెలుగులు లెక్కలేనన్నీ. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్య సమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతి వృత్తుల్ని, హస్త కళా నైపుణ్యాన్ని వినియోగం లోకి తీసుకువస్తున్నాయి. వాళ్ళ చేతుల్లోంచి తయారైన అద్భుతమైన , కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యం తో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని ఛిన్నాభిన్నామయిపోతున్న స్థానిక కళా రూపాలకు పునర్జన్మనిస్తున్నారు ఈ గిరిజన మహిళలు.

కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి, నేరమే జీవితం గా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయడం మహా శ్వేత ఇటీవలి గొప్ప విజయం. సమాజం, అధికార వ్యవస్థ చెక్కిన వికృత నేర శిల్పాలుగా మారిన దాదాపు రెండున్నర కోట్ల మందిని నేర కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నది మహా శ్వేత శపథం. విషాదం ఏమిటంటే పురిలియా లోని ఖేరియా శబర అనే తెగకు చెందిన వీళ్లని గిరిజనుల్లోని మిగిలిన తెగలవారు కూడా నేరస్తులు గానే పరిగణించే ఈ తెగను అక్కున చేర్చుకుని, వారి జీవితాల్నీ మార్చడానికి, వాళ్ళ పట్ల సమాజ దృక్పథం లో మార్పు తీసుకురావడానికి మహాశ్వేత పోరాడుతోంది. దారుణం ఏమిటంటే , పోలీసు వ్యవస్థ వీళ్లను ఇంకా నేరస్తులు గానే మారుస్తోంది.
9 ఏళ్ల క్రితం శబర తెగకు చెందిన బుధాన్ అనే ఒక గిరిజనుడ్ని పోలీసులే కొట్టి చంపిన ఉదంతం తో ఈ పోరాటానికి నాంది పలికింది మహా శ్వేత. బుధాన్ ని కొట్టి చంపిన పోలీసుల్ని కలకత్తా హై కోర్ట్ కి ఈడ్చి న్యాయపోరాటం మొదలెట్టింది మహాశ్వేత . ఈ పోరాటం లో శబర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ళ చరిత్ర లో మొట్ట మొదటిసారిగా ఒక శబర గిరిజనుడు కోర్టులో నిలదొక్కుకొని విజయం సాధించాడు.

మహాశ్వేత పోరాటంతో అనేక సంఘాల కళ్ళు తెరుచుకున్నాయి. తరతరాలుగా నేర జీవితం వైపు నెత్తివేయబడిన శబర తెగల హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. అప్పటి నుంచీ శబర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమైంది. దేశం నలుమూలలా తిరిగి శబర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ళ కష్టాల్ని రికార్డ్ చేసింది. “ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ రైట్ యాక్షన్ గ్రూప్ “ అనే ఒక సంస్థ ఆమె ఆలోచనలకు అక్షర రూపం. దేశం లోని రెండు వందలకు పైగా గిరిజన తెగల్ని ఈ సంస్థ పరిధి లోకి తీసుకువచ్చింది.

2006 లో ఫ్రాంక్ఫర్డ్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి మహాశ్వేత దేవి విశిష్ట అతిధిగా హాజరైంది. ఇది భారతీయ సాహిత్యానికి, భారత దేశం లో పీడిత ఉద్యమాలకీ గర్వ కారణం. ఆ ఉత్సవంలో మహాశ్వేత కీలకోపన్యాసానికి కరగని గుండే లేదు. ఆమె మాట్లాడుతున్నంత సేపు ఆ ఉత్సవానికి వచ్చిన వందల కొద్దీ రచయితల కళ్ళు చెమరుస్తూనే వున్నాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల మతాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆమె బాధ పాడింది. దుష్ట శక్తుల పన్నాగం లో భిన్న సంస్కృతుల నాగరికత అణిగిపోయిందనీ ఆవేదన పడింది.

*

మేముకోరుకుంటున్నకళింగం!

 

 

చికాగో ఆటా సభలో… ఉత్తరాంధ్ర కధా ప్రయాణం పై  అట్టాడ  అప్పల్నాయుడు  ప్రసంగానికి ఇది వ్యాసరూపం    

*

         అందరికీ నా నమస్కారాలు. ఇవ్వాళ నాకెంతో ఉద్వేగంగా ఉంది.శ్రీకాకుళానికీ చికాగోకీ రాజకీయ నెత్తుటి సంబంధముంది. ఆ నెత్తుటి సంబంధమే నన్ను ఆటా సభలో పాల్గొనేట్టు చేసిందనుకుంటాను.నాకిచ్కిన సమయమ్ లో సాధ్యమయినంత మేరకు వందేళ్ళ పై బడ్డ ఉత్తరాంధ్రా కధను సంక్షిప్తంగా మీ ముందుంచుతాను.

దిక్కుపేరుతో పిలువబడే ఒక దిక్కుమాలిన ప్రాంతం…ఉత్తరాంధ్ర. కళింగాంధ్ర అనే చారిత్రాత్మక పేరు చెరిగిపోయింది. గోదావరి నుంచి మహానది దాకా కళింగాంధ్ర అంటారు. ఇవ్వాళ ఆ సరిహద్దులు కుదించుకోవాలి. మాకు గూడా ఇపుడా కళింగం   మేముకోరుకుంటున్నకళింగం.  అదేఉత్తరాంధ్ర.

ఆధునిక తొలి తెలుగుకధ !దిధ్దుబాటు’ అనంటే ఇవ్వాళ అందరూ అంగీకరించకపోవచ్చుగానీ,కళింగాంధ్ర తొలి ఆధునిక కధ మాత్రం దిధ్దుబాటు అని చెప్పే హక్కు మాకుంది. కళింగ సమాజం ప్రయాణించిన మేర కళింగ కధ కూడా ప్రయాణించింది. సంస్కరణవాదం,జాతీయోద్యమం,అభ్యుదయోద్యమం,విప్లవోద్యమం…తర్వాతి ప్రపంచీకరణ,విధ్వంశ వ్యతిరేక ప్రజాఉద్యమాల వెంట కళింగకధ నడచింది. తొలి ఆధునిక కధ వచ్చిన 1910 నాటికి కళింగాంధ్ర…జమీందారీ,ఈనాందారీ పాలనతో పాటు ఆంగ్లేయుల పెత్తనంతో ముప్పేట పాలనలో వుండేది. దాదాపు 37 చిన్నా,పెద్దా జమీందారీలు,మరికొన్ని ఈనామ్ దారీలు. ఫ్యూడల్ భావజాలం ..నిండివుంది. అగ్రవర్ణ, ఉత్పత్తేతర కులాల వారికి మాత్రమే విద్యా,ఉపాధి అవకాశాలు.

ఆంగ్లేయుల పాలన రెండు రకాల ప్రభావాలను వేసింది. వారి ఆధునిక శాస్త్రీయ భావజాలమూ,ప్రజాస్వామిక ధోరణులూ…విద్యా,ఉపాధి అవకాశాలు పొందిన ఉత్పత్తేతర కులాలపై…సంస్కరణవాద ప్రభావాన్ని వేస్తే: ముప్పేట పాలనలో కష్హ్టఫలం నష్టపోయిన ఉత్పత్తికులాల పై తమ ఉపాధికోసం సమరబాట పట్టాల్సిన స్తితి కలిగించింది. అడవిమీద హక్కు కోల్పోయిన ఆదివాసీలు సమరం చేస్తే పితూరీలన్నారు వాటిని ఆంగ్లేయులు. జమీందారీ రైతులు ఇచ్చాపురం నుండి చెన్నపురి దాకా రైతు రక్షణయాత్ర చేసారు. గ్రామీణవ్రుత్తుల వారు విధ్వంసానికి గురయ్యారు. కళింగనేల బొమ్మా,బొరుసూ స్తితి ఇది.

ఈ స్తితిలో సమాజం లోని ఫ్యూడల్ భావజాలం లోని చెడుని  వ్యతిరేకించే, ముఖ్యంగా మత మౌడ్యాన్ని,అవిద్యను,స్త్రీ పట్లవివక్షను,  బాల్యవివాహాలను  వ్యతిరేకిస్తూ సమాజాన్ని భావజాల రంగం లో సంస్కరించే సాహిత్యం 1910 నుంచీ దాదాపు 1945 దాకా వచ్చింది.గురజాడ రాసిన దిద్దుబాటు,మెటిల్డా,పెద్దమసీదు,దేవుళ్ళారా మీ పేరేమిటి…సంస్కర్తహ్రుదయం కధల్లో పైన చెప్పిన సంస్కరణవాద భావజాలమే కన్పిస్తుంది. ఆ తర్వాతి తరం రచయితలు…పూడిపెద్ది వెంకటరమణయ్య,వలివేటి బాలక్రిష్ణ్,స్తానాపతి రుక్మిణమ్మ,పిల్లలమర్రి వేదవతి,విశ్వనాధ కవిరాజు,కాలూరి నరశింగరావు,మండపాక పార్వతీశ్వరశర్మ మొదలయినవారు కూడా గురజాడ బాటలోనే,కధలు రాసారు.

నీలాటిరేవు,అమ్మోరుదేవత,క్షవరకల్యాణం,యుక్తిమాల ,దయ్యాలు వంటి శీర్షికల్తో కధలు రాసారు. స్తానాపతి రుక్మిణమ్మ…ఆనాటి నీలాటిరేవు ఆడవారికి ఒక సమావేశ స్తలంగా అనేక విశయాలు కలబోసుకునే ప్రదేశంగా యెలా ఉపయోగపడేదో కధలు రాసారు. అలాగే దయ్యాల గురించీ. ఆనాడు దయ్యం పడని ఆడది లేదని కందుకూరి గారు వ్యాఖ్యానించారంటే దయ్యాల ప్రభావం యెంతటిదో తెలుస్తుంది. ఇక,పూడిపెద్ది వారయితే ప్రజల నానుడిలోని అనేక సామెతలను కధలు చేసారు…కాకర పువ్వు వచ్చి కాళ్ళమీద పడితే,నొచ్చిందా అనడగడు,ఈ ముండ సంసారం నేను చెయ్యలేనమ్మాఅన్న సామెతతో ఒక కధ, ఓపిక ఉందని ఇద్దర్నిపెళ్ళాడితే,ఒకామె తెల్లవెంట్రుకలనూ,  మరొకామె నల్లవెంట్రుకలనూ పీకిందట…సామెత కధ. వీరు పూలగుత్తి అనే పత్రికను కూడా కధల కోసం నడిపేరు.

మొత్తానికి గురజాడ గారన్నట్టు…మంచీ,చెడుల విచక్షణ,మంచివేపు మార్చే సంస్కరణ వాదమూ ఈ తరం కధల్లో చూస్తాం.వీరిలో మరి కాస్తా ముందుకు చూసినవారు…శెట్టి ఈశ్వరరావు,పండిత అ.న.శర్మ. ఈశ్వరరావు గారి హిందూ,ముస్లిం:తిండిదొంగ కధలు,అ.న.శర్మగారి..వారసత్వం కధ కేవలం ఆదర్శవాద దృష్టి గాక,నిజ జీవితాన్ని చిత్రించి చూపాయి.

ఇక జాతీయోద్యమాన్ని చిత్రించిన కధలకు వస్తే…ఇక్కడినుండి తక్కువ కధలే వచ్చాయి. బహుశా అప్పటి రచయితలు సంస్కరణవాద భావజాల ప్రభావితులేమో. కందుకూరి ప్రభావితం చేసినంతగా అల్లూరి ప్రభావితం చేయలేదేమో. ప్రజాపోరాటాలపట్లగానీ,జాతీయోద్యమం పట్లగానీ…సంశయాలే యెక్కువేమో అన్పిస్తుంది,కాంగ్రెస్ సభ ల మీద గురజాడ వ్యంగ్య రచన…మనకు ఈ అనుమానాన్ని కలిగిస్తుంది. అయితే…జాతీయోద్యమ సందర్భాన్ని కధనం చేసిన రెండు కధలు చెప్పుకోవచ్చు…ఒకటి..బంకుపల్లి రామజోగశాస్త్రి గారి విమలాదేవి కధ,మరొకటి…గోవిందరాజు రామశాస్త్రి గారి నీళిజోళ్ళమరమ్మత్తు కధ.జాతీయోద్యమం లో పాల్గోనందుకు భర్తను వ్యతిరేకించి,భర్తను వదిలేసి ఉద్యమం లోకి నడచిన ఓ స్త్రీ కధ విమలాదేవి కధ. పాత సాంప్రదాయాలే కాదు,పాత పాలనలే కాదు దేశం మరమ్మత్తు చేయబడాలని తెలిపే కధ నీళిజోళ్ళ మరమ్మత్తు కధ.

ఇక స్వాతంత్ర్యం రావడం,మనల్ని మనం పాలించుకోవడం…ప్రజల జీవితంలో యెటువంటి మార్పు లేకపోవడం…మన స్వాతంత్ర్యం ఒక మేడిపండు,మన దారిద్ర్యం ఒక రాచపుండు అన్న స్తితిని గమనించిన రచయితలు…పాలనను విమర్శించడం,ప్రజల బాధలను వివరించడమ్…కధనం చేసారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు,అవసరాల సూర్యారావు,మసూనా,భరాగో,బలివాడ కాంతారావు తదితరులు…చీకటిరోజులు,ఒడ్డుదాటినవాడు,పడగనీడ,పూర్ క్రీచర్స్,గమనశ్రమ వగయిరా శీర్షికల కధలు రాసేరు. వీరిలో అవసరాల వారి సమ్మె కధ అప్పట్లోనే  కాంగ్రేస్ పై ఇప్పటికి సరిపోయే వ్యాఖ్య చేస్తుంది. వీధులు తుడిచేవారు సమ్మె చేస్తుంటే,ఆ సమస్య పట్టించుకోకుండా…వీధులు దుమ్ముపట్టినాయని కాంగ్రేస్ వాలంటీర్లు…చీపుర్లు పట్టి వీధులు ఊడ్వడం చేస్తారు…దాన్ని వ్యాఖ్యానిస్తూ…కాంగ్రెస్ తన గత కీర్తిని తానే ఊడ్చి వేస్తోందంటాడు  రచయిత.

ఈ దశల కధలను రావిశాస్త్రి అయ్యో,అయ్యో కధలన్నారు. నిజానికి ఆయనకూడా ఆరు సారో కధలు రాసారు. గానీ త్వరలోనే మారని పాలన రీతుల వెనుక గల రాజ్య స్వభావాన్ని గుర్తించారు.బహుశా అప్పటికే వామపక్ష భావజాలం కళింగాన చోటుచేసుకోవడంతో…చాసో,రావిశాస్త్రి,కారా,శ్రీపతి వంటివారు పాలకులది ఒక వర్గమనీ,ప్రజలది ఒక వర్గమనీ..ఇది వర్గసమాజమనీ,వర్గసమాజం లో ఏదీ వర్గాతీతంగా ఉండదనీ తెలియపరిచే కధలు రాయడం జరిగింది.చాసొ గారి…కుంకుడాకు,భల్లూకస్వప్నం,బూర్జువాకుక్క,రావిశాస్త్రి గారి పిపీలికం,సారాకధలు,కారాగారి యగ్యం …అభ్యుదయ దృక్పధాన్ని అందించే కధలు. తాను యెవరో ఎరుక పొందాలనుకునే ఒక చీమకు శత్రువయిన ఒక సర్పం …తాను కష్టజీవి అని ఎరుకను కలిగించిందనీ,శత్రువుని శ్రమజీవులంతా కలిసి యెదుర్కొని హతమార్చడాన్ని ఈ కధలో చిత్రించారు.  రావిశాస్త్రి గారి పిపీలికం ఒక గొప్ప మార్క్సిస్ట్ తాత్విక కధ. దాదాపు మూడు పంచవర్ష ప్రణాళికలు ధనిక,పేదలమధ్య వ్యత్యాసాన్ని పెంచాయి.ఇటు కళింగాంధ్రలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం,తెలంగాణా సాయుధపోరాట ప్రభావం,అరసం యేర్పాటు,ఆదివాసీప్రాంతాల్లో సంగాల నిర్మాణం,పాలకవర్గవ్యతిరేక ఉద్యమ వాతావరణం నిండివుండిన కాలమ్ లో కారా మాస్టారి యగ్యం కధ వచ్చింది.తొలి తరం రచయిత- అప్పు తీర్చడానికి తన సంతానాన్ని వారసుడిగా పెంచదలచిన ఒక తండ్రిని…వారసత్వం అనే కధలో చూపిస్తే…కారా మాస్టారు…అప్పు కోసం సంతానం బానిస బతుకు బతకడానికి వీల్లేదని,సంతానాన్ని గ్రామ పంచాయితీ మండపం సాక్షిగా చంపిన ఒక తండ్రిని చూపిస్తారు. భవిష్యత్ తరం బానిసలు కాగూడదనే ఆకాంక్షతో విముక్తి పోరాటబాట నడచింది శ్రీకాకుళ రైతాంగం.దాని పూర్వదశను యగ్యం చూపింది.

ఈ కాలం లో అప్పటిదాకా మధ్యతరగతి ఇళ్ళల్లో ఉండిపోయిన కధ…వీధుల్లోకీ,బజారులోకీ,పంటపొలాల్లోకీ నడచింది..రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీవులను,అల్పజీవులను సాహిత్యం లోకి   తీసుకువచ్చింది.

శ్రీపతి నర్తోడు,పతంజలి..మోటుమనిషి,రావిశాస్త్రి..రాకెట్టప్పారావు, కారా…అప్పల్రాముడుఆనాటి కష్టజీవులూ..కష్టఫలితాన్ని కోల్పోయిన నష్టజీవులు. సర్వేజనా సుఖినోభవంతు అని అమాయకంగా ఆశించిన గురజాడ తరం నుండి ఈ తరం…శ్రామిక జన సుఖినోభవంతన్న శ్రామికవర్గధోరణికి కధను నడిపింది.

ఆ తర్వాత శ్రీకాకుళ గిరిజన రైతాంగపోరాటం సాయుధరూపం తీసుకోవడం…ఆ పోరాటం లో మేధావులూ,ఉపాధ్యాయులూ,కవులూ పాల్గోవడం,విశాఖ విద్యార్దులు..రచయితలారా మీరెటు వేపు అని ప్రశ్నించడం,విరసం యేర్పాటు…కళింగసాహిత్యావరణం లోకి రక్తసిక్త సాయుధ గిరిజనుడొచ్చాడు. అడివంటుకుంది,ఇదేదారి,తీర్పు,పులుసు వగయిరా భూషణం గారి కధలు, నర్తోడు,నక్సలైట్ రాత్రులు వంటి శ్రీపతి కధలు,ఎన్నెస్ ప్రకాశరావ్,ప్రకాశరావ్,బి.టి.రామానుజం వగయిరా కధకులు విప్లవకధా పతాకను యెగురవేసారు.

శ్రీకాకుళాన్ని కల్లోలితప్రాంతంగా ప్రకటించడం,అడవినీ,గిరిజనగూడేలనూ దగ్దం చేయడమ్,ఎన్ కౌంటర్ పేరిట చంపడం…మొత్తానికి ఉద్యమాన్ని అణచివేయడం చేసిన ప్రభుత్వం ఇంకోవేపు సంక్షేమ పధకాల పేరిట ప్రజలకు ఆశలు రేకెత్తించి ఉద్యమానికి దూరం చేయడం ఎనభయిల నాటి కళింగ స్తితి. ఈ స్తితిని భూషణం గారి కొత్తగాలి కొన్ని కధలూ,అప్పల్నాయుడి పోడు..పోరు, కొలతలు…కధలు చిత్రించాయి.

తొంభయిలనాటికి ప్రవేశించిన సరళీకరణా,ప్రయివేటీకరణా,ప్రపంచీకరణా తమ ప్రభావాన్ని కళింగాంధ్రలో గూడా కలిగించాయి. నడువని పరిశ్రమలు (జూట్,సుగర్) ,ప్ర్రూర్తిగాని నీటిప్రాజెక్టులు, ఫైనాన్స్ కంపెనీలు,ఫోర్లైన్ల రోడ్లూ, మార్కెట్ పంటల జూదం లో ఓడిన రైతులూ, ఉపాధులు కోల్పోయిన గ్రామీణ చేతివ్రుత్తులవారూ… వలసబాట పట్టిన బతుకులు…వీటిని శ్రీకాకుళసాహితి… గావలికధలు, వంశధారకధలు, జంఝావతికధలు,వేగావతికధలు పేరిట సంకలించింది. బమ్మిడి జగదీశ్వరరావు … మట్టితీగలు, గంటేడ గౌరునాయుడు…ఒక రాత్రి రెండు స్వప్నాలు,సువర్నముఖి…సువర్నముఖి   కధలు,మరి కొందరి కధాసంపుటాలు దాదాపు దశాబ్దకాలపు మార్పుల్ని చిత్రించాయి. ఆ తర్వాత వర్తమానమ్ లో కళింగాంధ్రాలోకి విదేశీకంపెనీలతో పాటూ, ఇతరప్రాంతాల పెట్టుబడుల ప్రవాహం రావడమ్…ఇక్కడి పంటభూములను సెజ్ లుగా మార్చడం,ధర్మల్,అణువిద్యుత్ కుంపట్లు పెట్టడం,అడవీ,కొండల్లోని అపార ఖనిజాలను దొలుచుకు పోవడం,సముద్రతీరాన్ని యురేనియం కోసం, మత్స్యసంపదకోసం జల్లెడపట్టడం…ఈ పరిణామాలకు వ్యతిరేకంగా మైదాన ప్రాంతాన రైతులు, దళితులు,బహుజనులూ,అటవీప్రాంతాన ఆదివాసీలు, తీరప్రాంతాన మత్స్యకారులు పోరాడుతున్నారు.

తాము కోల్పోయే  నేలకోసం,. ఉపాధికోసం ఉద్యమిస్తున్నారు…ఈ స్తితిని.. మల్లిపురం జగదీశ్…శిలకోల,గాయం,బల్లెడనారాయణమూర్తి…ఉద్దానంకధలు,బజరా…హింసపాదు,గౌరునాయుడు…మాయ,అప్పల్నాయుడు..సందిగ్దాకాశమ్,దయ్యపుభరోసా, వంటి కధల్లో గమనించవచ్చు. అలాగే చింతకింది శ్రీనివాసరావ్, కె.యెన్.మల్లీశ్వరి,  డాక్టర్.బి.ఎసెన్.మూర్తి,పి.వి.బి.శ్రీరామమూర్తి,ఎ ఎన్ జగన్నాధశర్మ వంటివారి కధల్లో వర్తమాన కళింగజీవితాన్ని చూడవచ్చు.

ముగించే ముందుగా…కొందరు విలక్షణ రచయితల గూర్చి చెప్పవల్సివుంది. వ్యక్తుల గుణగణాల మీదా,వ్యక్తుల ప్రవర్తనల మీదా తాత్విక విమర్శగా కొన్ని కధలూ,మరికొన్ని మానవజీవితం లో యెదురయే ఘటనల గూర్చిన చింతనను తెలిపేకధలు రాసిన బలివాడ కాంతారావు గారూ,హాయి అయిన హాస్య కధలు రాసిన భరాగో గారూ,వేటకు సంబంధించిన కధలు రాసిన అల్లం శేషగిరిరావుగారూ, రాజుల శిధిలవైభోగాలను రాసిన…పూసపాటి క్రిష్ణమ్రాజు,దాట్ల నారాయణమూర్తిరాజూగారూ.. వీరితోపాటూ తప్పకా చెప్పుకోవాల్సిన విలక్షణ,విశిష్ట రచయిత పతంజలి గారు. ఈ విలక్షణ,విశిష్టరచయితల రచనలు కళింగాంధ్రా కధా పతాకకు వన్నె తెచ్చిన రచనలు.

సంస్కరణవాద భావజాలంతో ఆరంభమయిన కళింగ కధ,సమరబాటనూ నడచి..విఫలమయిన విప్లవాన్నించి వర్తమానం దాకా కళింగసమాజ ప్రయాణాన్ని చిత్రిస్తూనే ఉంది.

కొత్త తొవ్వల్లో తెలంగాణా చరిత్ర!

THRC-group

తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సంస్కృతిపై లోతైన పరిశోధన జరిగి మరుగున పడ్డ, వివక్షకు, విస్మరణకు, వక్రీకరణకు గురైన అసలు  సిసలైన తెలంగాణ చరిత్రను సాక్ష్యాలు, ఆధారాలతో సహా రికార్డు చేయాలనే ఉద్దేశ్యంతో ‘తెలంగాణ చరిత్ర పరిశోధన కేంద్రం’ హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు కేంద్రంలో  ఏప్రిల్‌ 10వ తేదీనాడు ఏర్పాటయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత నాణేల విశ్లేషకులు, సేకర్త, పరిష్కర్త దేమె రాజారెడ్డి ఈ సంస్థకు గౌరవాధ్యక్షులుగా ఉంటారు. అలాగే సహాదారులుగా బి.నరసింగరావు,  అనురాధారెడ్డి, అయూబ్‌ అలీ, కొల్లూరి చిరంజీవి, వి. ప్రకాశ్ లు వ్యవహరిస్తారు. అలాగే ఉపాధ్యక్షులుగా ముదిగంటి సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌లు, సహాయ కార్యదర్శుగా సంగనభట్ల నరసయ్య, జగన్‌ రెడ్డిలు, కార్యనిర్వాహక కార్యదర్శిగా కటికనేని విమల, కోశాధికారిగా ద్యావనపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా  సంస్థ అధ్యక్ష కార్యదర్శులుగా అడపా సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.

అడపా సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ ….

సారంగ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలోనే తెంగాణ హిస్టరీ కాంగ్రెస్‌, తెంగాణ హిస్టరీ సొసైటీ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి కదా! మళ్ళీ ఈ సంస్థ పుట్టవలసిన  అవసరం ఏంటి?
అడపా: ఈ సంస్థలు  పుట్టి కొంత పని చేసినా ఇప్పుడు   అవి అంత చురుకుగా పని చేయటం లేదు. పైగా తెలంగాణ చరిత్ర సమగ్రంగా నిర్మాణం కావలసి ఉంది. కాబట్టి చరిత్రకారులతో పాటు సాహితీవేత్తలు, కళా రంగాల్లో నిపుణులు తదితర మేధావులు కూడా తెలంగాణ చరిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలని వారందరి భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాము.

సారంగ: సంస్థ ప్రధానంగా ఏయే కార్యకలాపాలు నిర్వహించబోతున్నది? దాని లక్ష్యాలను కొంచెం వివరంగా చెప్పండి.

అడపా: మా సంస్థ ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సమగ్ర చరిత్రను అనేక కోణాల్లో పరిశోదించి ప్రామాణిక ఆధారాలతో పు సంపుటాలుగా ప్రచురించడం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1959లో తెలుగు  భాషా సమితి ఏర్పాటై తెలుగు  వారి చరిత్రను ఒక సమగ్ర సంపుటంగా తెచ్చిందో అలాగే ఇంకా అంతకన్నా మెరుగ్గా తెలంగాణ చరిత్రను రచించి జన సామాన్యానికి అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నాము.
సంస్థ ఇతర లక్ష్యాల విషయానికి వస్తే… క్లుప్తంగా చెప్పాలంటే… పరిశోధన, డాక్యుమెంటేషన్‌, డిజిటలైజేషన్‌, రచన, ప్రచురణ, త్రైమాసిక పత్రికా నిర్వాహణ, వార్షిక సమావేశాలు,, సదస్సు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సంప్రదింపులు, చారిత్రక సంపద పరిరక్షణ, అభివృద్ధి వంటి బృహత్తర లక్ష్యాలు మా సంస్థకున్నాయి.

సారంగ: తెంగాణ సమగ్ర చరిత్ర నిర్మాణ, ప్రచురణకు కొంత సమయం పట్టవచ్చు, త్రైమాసిక పత్రిక మాత్రం  రెగ్యుర్‌గా వస్తుంది కదా! దాని బాధ్యతలు  ఎవరికి అప్పగించారు?
అడపా: త్రైమాసిక పత్రికకు సంగిశెట్టి శ్రీనివాస్‌ సంపాదకులుగా వ్యవహరిస్తారు. సంపాదక మండలిలో  ద్యావనపల్లి సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగనభట్ల నరసయ్య, జయధీర్‌ తిరుమరావు వంటి నిష్ణాతులున్నారు.

సారంగ: త్రైమాసిక పత్రిక ప్రత్యేకతలేమైనా ఉన్నాయా?
అడనా: ఉన్నాయి. గతంలో తెలుగు దేశంలో వచ్చిన భారతి అనే మాస పత్రిక విశిష్టత గురించి పరిశోధకులందరికీ తెలిసిందే! అదిప్పుడు రావడం లేదు. మా త్రైమాసిక పత్రికలో వివిధ  ప్రాంతాలో వెలుగులోకి వచ్చిన, వస్తున్న ప్రాథమిక చారిత్రక అంశాలపై లోతైన ప్రామాణిక వ్యాసాలు, విశ్లేషణలు ఉంటాయి. తెలుగు, ఆంగ్ల భాషాల్లో రాసిన వ్యాసాలను విషయ నిపుణులు సరి చూశాకే ప్రచురిస్తాం. దీనితో పాటు పత్రికకు ఐఎస్‌ఎస్‌ఎన్‌ నంబరు తెప్పిస్తాం. కాబట్టి పత్రికలో  అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలుంటాయి.

సారంగ: వార్షిక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వాటి గురించి కొంచెం వివరిస్తారా?
అడపా: మన దేశంలో ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఎపి హిస్టరీ కాంగ్రెస్‌ లాగా మా సంస్థ కూడా తెలంగాణలో ఉన్న చరిత్ర అధ్యాపకులు, ఉపన్యాసకులు, విద్యార్థులు, విషయ నిపుణులు, ఔత్సాహికులు తదితరులందరిని ఆహ్వానించి సంవత్సరానికి ఒకసారి ఒక్కో చోట వారి పరిశోధన పత్రాల సమర్పణతో వార్షిక సమావేశాలు నిర్వహిస్తుంది. ఎంపికైన పత్రాలను ప్రచురిస్తుంది.
సారంగ: ప్రభుత్వంతో మీ సంస్థ వైఖరి ఎలా ఉంటుంది?
అడపా: ప్రభుత్వంతో మా సంస్థ వైఖరి సామరస్యంగా, సమన్వయంగా, సహకారిగా ఉంటుంది. అనేక కారణా వల్ల రాష్ట్ర పురావస్తు శాఖలో విషయ నిపుణుల కొరత ఉంది. అందువల్ల  అనేక చారిత్రక స్థలాల్లో తవ్వకాలు చేపట్టలేక పోతున్నారు. వందలాది శాసనాలను చదివించి ప్రచురించలేక పోతున్నారు. మా సంస్థ కొంత మంది విద్యార్థులను ముంబయి, నాసిక్‌, పూనా వంటి నగరాలకు శాసనాలు, నాణాలు, పురావస్తు  శాస్త్రం వంటి సబ్జెక్టుల అధ్యయనానికి పంపించి సంపాదించిన విషయ పరిజ్ఞానంతో పురావస్తు శాఖ సమన్వయంతో అనేక చారిత్రక విషయాలను వెలువరించేందుకు కృషి చేస్తుంది.
సారంగ: మీ సంస్థ ద్వారా తెలంగాణ సమాజానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?
అడపా: తప్పకుండా ఉంటాయి. మేము తెలంగాణ గత చరిత్ర వైభవాన్ని వెలికి తీస్తాము. తెలంగాణ ప్రజల్లో తమ ఘన వారసత్వం పట్ల గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాము. మా సంస్థ ప్రచురించే, వెలుగులోకి తెచ్చే  తెలంగాణ సాంస్కృతిక, కళలు, తెలంగాణ ప్రజలకు గర్వకారణమవుతాయి. మా సంస్థ గుర్తించే పెద్ద  పెద్ద చారిత్రక స్థలాలు సమీప భవిష్యత్తులో పర్యాటక స్థలాలై అలరిస్తాయి.

చరిత్ర రచనకు  సామూహిక  స్వరం: సుంకిరెడ్డి

 

తెలంగాణాలోని చరిత్రకారులు , పరిశోధకులు ఇటీవల  హైదరాబాద్ లోని ఆంధ్రసారస్వత పరిషత్తులో సమావేశమై ‘తెలంగాణా చరిత్ర పరిశోధక కేంద్రం’ (తెలంగాణ హిస్టారికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ  డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారితో  ఏశాల  శ్రీనివాస్‌ ఇంటర్యూ…..

ప్రశ్న: తెంగాణ చరిత్ర పరిశోదక కేంద్రం ఏర్పాటు గురించి చెబుతారా?

బవాబు: నిజానికి ఈ సంస్థ ఎప్పుడో ఏర్పడాల్సి ఉండింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన వెంటనే సాహిత్య సాంస్కృతిక రంగాలో ఉద్యమోన్ముఖమైన కదలికలు ప్రారంభమైనవి. అట్లా 1998 నవంబర్‌ 1న ‘‘తెలంగాణా సాంస్కృతిక వేదిక’’ ఆరంభమైంది. మన చరిత్రను మనమే రాసుకోవాలని తీర్మానం చేసింది. ‘తెలంగాణా తోవలు’, ‘మత్తడి’ పుస్తకాలను వెలువరించడం ద్వారా తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రను నిర్మించే పని కొంత చేసింది.

   కొంత ఆలస్యమైనా 2006లో ‘‘తెలంగాణా హిస్టరీ సొసైటీ’’ ఏర్పడింది  ‘1857 తిరుగుబాటు’, ‘17 సెప్టంబర్‌`భిన్న దృక్కోణాలు’, ‘ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు విద్రోహ చర్య’, ‘1969 ఉద్యమ కరపత్రాలు’, ‘1969 చారిత్రక పత్రాలు’ లాంటి గొప్ప పుస్తకాల్ని మెవరించిన ఆ సంస్థ ఎందువల్లనో ఆగిపోయింది. ఆ తరువాత ‘‘తెలంగాణా హిస్టరీ కాంగ్రెస్‌’ ఏర్పడింది . రెండు సమావేశాలు నిర్వహించి అదికూడా ఆగిపోయింది. అందువల్ల ఈ సంస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది.

   ఈలోగా సంస్థాగతంగా కాకుండా వ్యక్తిగతంగా సంగిశెట్టి శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌, ముదిగంటి సుజాతారెడ్డిలాంటి వాళ్ళు తెంగాణా ఆధునిక సాహిత్య చరిత్రను నిర్మించే విడివిడి ప్రయత్నాలు చేసినారు. అందులో భాగంగా తెలుగు కథ గురజాడతో కాకుండా భండారు అచ్చమాంబతో మొదలైందని తేల్చినారు.  అయినా ఇంకా గురజాడతోనే అని ఆంధ్ర చరిత్రకారులు రాస్తున్నారు.

   2005లో ప్రొ. అడప సత్యనారాయణ సంపాదకత్వంలో ‘ History and  culture of telangana’,  డా.రాజారెడ్డి గారి ‘‘చరిత్ర ఖజానా’’ నేను రాసిన ‘‘ముంగిలి`తెంగాణ సాహిత్య చరిత్ర’’ `2009, ‘‘తెలంగాణా చరిత్ర’’`2011 మొదలైన పుస్తకాలు తెలంగాణా కేంద్ర దృక్కోణంతో వచ్చినవి. ఇంకా సంగనభట్ల నరసయ్య, ద్యావనవల్లి సత్యనారాయణ మొదలైన వారు ఈ దృక్కోణంతోనే పరిశోధన చేసినారు. అయినప్పటికీ ఇంకా ఆంధ్ర చరిత్రకారులు కోస్తాంధ్ర కేంద్రంగానే సాహిత్య చరిత్రను, తెలంగాణ చరిత్రను రాస్తున్నారు.

అంటే తెలంగాణా అస్తిత్వవాదాన్ని స్థిరీకరించడానికి చేసే వ్యక్తిగత ప్రయత్నాలు  వారికి ఆనడంలేదని అర్థమవుతున్నది. అందువల్ల ఒక సామూహిక స్వరం అవసరం అనిపించిది. అందుకే ఈ సంస్థ ఆవిర్భవించింది.

   తెలంగాణ మలిదశ ఉద్యమం అస్తిత్వ వేదనతో నడుస్తున్నప్పుడే ఆ ఉద్యమ స్పిరిట్‌ను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా A P History congress ‘‘ఆంధ్ర ప్రదేశ్‌ సమగ్ర చరిత్ర`సంస్కృతి’’ పేరుతో కొన్ని సంపుటాల్ని వెలువరించింది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా కొన్ని సంపుటాల్ని వెలువరించింది. వి.వి.కృష్ణ శాస్త్రి, పి.వి.బరబ్రహ్మ శాస్త్రిలాంటి వాళ్ళు తెలంగాణా చరిత్రకు సంబంధించిన కొత్త విషయాను ఆవిష్కరించినప్పటికీ ఈ సంపుటాలు కోస్తాంధ్ర కేంద్రంగానే వెలువడినవి. సహజంగానే అవి తెలంగాణ కేంద్రంగా వెలువడలేదు. శాతవాహన పూర్వ తెంగాణ చరిత్ర విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించినారు.

   ప్రశ్న: ఈ సంస్థ తరపున ఎలాంటి కార్యకలాపాలు చేపట్టనున్నారు?

   జవాబు: ముందుగా ఒక త్రైమాసిక పత్రికని తేవాలనుకున్నాం. ఈ పత్రికను  తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్ర, పరిశోధనాంశాలకు వేదికగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. పరిశోధక బృందంతో తెలంగాణా సమగ్ర చరిత్రను సంపుటాలుగా రాయించి అచ్చువేయానుకుంటున్నాం.

ప్రశ్న: ఇతర రాష్ట్రాలో వున్న అరుదైన సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారు?

   జవాబు: మద్రాసు, తంజావూరు, తిరుపతి, డిల్లీ, కొల్‌కతాలో వున్న తెలంగాణకు  సంబంధించిన తాళపత్రాను, రాతప్రతులను, పుస్తకాలను యదాతథంగా కాని, నకలు రూపంలో గాని లేదా డిజిటలైజ్‌ రూపంలో కాని తెప్పించాలి. ఈ పని మన రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం ద్వారానే తెప్పించాలె.

   ప్రశ్న: పురావస్తు సంపదను రక్షించడం`చరిత్ర పునర్‌నిర్మాణంలో భాగంగా ఏవిధమైన కార్యాచరణ వుంటుంది?

   జవాబు: తెలంగాణాలో అనంతమైన పురావస్తు సంపద వుంది. సీమాంధ్ర ప్రభుత్వ వివక్ష వలన పురావస్తు తవ్వకాలు పదిశాతం కూడా జరుగలేదు. ఒక్క కోటి లింగాల ఉదాహరణ తీసుకొంటే ప్రముఖ నాణాల  అధ్యయన వేత్త డా.రాజారెడ్డిగారి అభిప్రాయం ప్రకారం అక్కడ పదిశాతం కూడా తవ్వకాలు జరగలేదు. తవ్వకాలు సాగినట్లయితే ఏంతో  చరిత్ర బయటపడే అవకాశం వుంది.

   ప్రశ్న: ఇప్పటి వరకు పరిష్కరింపబడని తాళపత్ర గ్రంథాల  పరిష్కరణ, ముద్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకొంటారు?

   జవాబు: తాళపత్ర గ్రంథా పరిష్కరణ ముద్రణ కూడ బృహత్‌ కార్యమే. ప్రాచ్యలిఖిత భాండాగారం (ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ లైబ్రరీ) ద్వారా పరిష్కరణ ముద్రణ జరిగేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తం. గతంలో వ్యక్తుగా మానవల్లి రామకృష్ణ కవి, శేషాద్రి రమణ కవులు, గడియారం రామకృష్ణ కవి, బిరుదురాజు రామరాజు, వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, రవ్వా శ్రీహరి, శ్రీరంగా చార్య, జయధీర్‌ తిరుమలరావు, సంగనభట్ల నరసయ్యలాంటి వాళ్ళు గ్రంథ పరిష్కరణ చేసినారు. అట్టే ఈ పనిని చేసే వ్యక్తులకు అండదండగా ఉంటాం.

   ప్రశ్న: సంస్థకు వున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? ప్రాధాన్యతా క్రమం ఏమిటి?

   జవాబు: ప్రభుత్వంతో సంప్రదించి, అమరావతి బౌద్ద ఉత్సవాల  సందర్భంగా తెలంగాణా నుంచి తీసుకెళ్ళిన పురావస్తు సంపదను వెనక్కు తెప్పించడం, పురావస్తు శాఖ, ఆర్కైవ్స్‌ శాఖ, ప్రాచ్యలిఖిత భాండాగార శాఖ విభజన సందర్భంగా తెంగాణ వాటా సరిగ్గా దక్కేలా జాగ్రత్త వహించడం, కొన్ని కార్యక్రమాల  గురించి రెండవ ప్రశ్నకు చెప్పిన సమాధానంలో ఉన్నవి.

   ప్రశ్న: యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనను ఎలా సమన్వయం చేసుకొంటారు?

   జవాబు: యూనివర్సిటీల్లోని చరిత్ర శాఖలో, తెలుగు  శాఖలో ఆయా శాఖ అధ్యక్షులతో సంప్రదించి 80శాతం పరిశోధన తెలంగాణ అంశా మీద జరిగేటట్లు చూడవలసి వుంటుంది.

   ప్రశ్న: ప్రభుత్వానికి చరిత్ర, సంస్కృతి పాలసీకి సంబంధించిన సూచనలు సహాలు ఏమైనా ఇస్తారా?

   జవాబు: తప్పకుండా, త్వరలో సంస్థ విస్త్రృత సమావేశం ఏర్పాటు చేసి సమగ్రమైన పాల సీ రూపొందిస్తుంది.

   ప్రశ్న: సంస్థకు నిధుల  సేకరణ ఏవిధంగా చేయగలరు?

   జవాబు: సంస్థ సభ్యుల  నుంచి జీవిత సభ్యత్వ రుసుం సేకరించడం, వివిధ ప్రభుత్వ సంస్థల నుండి గ్రాంట్స్‌ వచ్చేలా చూడడం, వ్యక్తులనుండి విరాళాలు  పోగు చేయడంలాంటి పద్దతుల  ద్వారా నిధులను సమకూర్చుకుంటాం.

ఇంకా లాంగ్ డ్రైవ్ లోనే వున్నాం, అరుణ్!

 

-ప్రసాద మూర్తి

~

 

మనసు నిండ లేదురా. నీ స్నేహాన్ని పూర్తిగా..తృప్తిగా కడుపు నిండా నింపుకోనే లేదురా. ఉదయించే సూర్యుణ్ణి మన ధిక్కార అక్షరాలతో ఇంకా ఇంకా కవ్విస్తామని, అస్తమయాలను ఇంకా ఇంకా రెప్పవాల్చని మన యవ్వన స్వప్నాలతో నవ్విస్తామని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆకాశం గోడ మీద నీడలమై మనం ఎన్ని నినాదాలు రాసుకున్నాం. ఏ చెట్టూ నీ కంటే పచ్చగా వుండలేదని మేమంతా ఎంత మురిసిపోయే వాళ్ళం? తనివి తీరలేదురా తమ్ముడూ. నీతో కలిసి వేసిన అడుగుల కడుపులో పూచిన చెలిమి మొగ్గల తొడిమలు ఇంకా తడితడిగా కదులుతున్న చప్పుడే వినిపిస్తోందిరా.

అన్నయ్యా నీ పెళ్ళికి(1985) నిక్కరు వేసుకుని విజయవాడ ప్రజాశక్తి కార్యాలయం మీటింగ్ హాల్లో కూర్చున్నానని అనేవాడివి. కావాలంటే చూసుకో అని అప్పట్లో నేను ప్రజాశక్తిలో రాసిన కవితల కటింగులు చూపించి నా కళ్ళల్లో చిరుబొట్టువై మెరిసేవాడివి. కాని కవిత్వంలో కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా నిక్కరు వేయించి నీ ముందు కూర్చోబెట్టుకునేంత ఎత్తుకు ఎదిగిపోతావని నీ మొదటి వాక్యం దగ్గరే పసిగట్టాను. ఆ మాట చాలాసార్లు నీతో అంటే నువ్వేమనేవాడివి? ఊరుకో అన్నయ్యా మరీ చెప్తావు అని నవ్వేసే వాడివి గుర్తుందా? నిన్నింకా పూర్తిగా స్పష్టంగా తేరిపార చూడనేలేదురా. నిద్దట్లోంచి అదాటున లేచి..నిన్ను చూసి..చాచిన నీ చేతుల్ని చూసి నిన్ను వాటేసుకొని ఇంకా నీ కౌగలి విడిపించుకోనేలేదురా. ఇంతలోనే అంత మాయ చేస్తావా తమ్ముడూ.

ఇంకా నీతో కలసి లాంగ్ డ్రైవ్ లో వున్నట్టే వుంది తమ్మీ. కింద మిత్రులు..పైన పగటి పూట సూర్యుడు, రాత్రి చంద్రుడితో కలిసి రయ్ రయ్ న తుపాకీ గొట్టంలోంచి వచ్చే అక్షరాల్లా దూసుకుపోతున్నట్టే వుంది. అదిగో అలా నువ్వింకా స్టీరింగ్ తప్పుతూ ఎక్సలేటర్ తొక్కుతూ ఇంకెంత దూరం అన్నా వచ్చేసాం. ఇదిగో ఈ పాట విని అంటూ ఏ రాజేష్ ఖన్నా షర్మిలా టాగూర్ ల మధ్య నలిగిన ఏ పూల గుత్తినో రేకులు రేకులుగా తుంపి నా చెవుల్లోనువ్వు పిండుతున్నట్టే వుంది. ఏంటో నీ మాటలు ఆగిపోయాయని..ఈ  చెవులు తుడిచేసుకోవాలని అనిపించడమే లేదు.

నీకు స్క్రీన్ మీద ఫ్రేములు బిగించడం తెలుసు. దృశ్యాలను ఫ్రేముల్లోపెట్టే రహస్యాలు తెలుసు. మాటలను కూడా ఫ్రేముల్లో దృశ్యాలను చేసే మాంత్రికుడివని మరి మాలాంటి వాళ్ళకు తెలుసు. నువ్వు మాగ్జిమమ్ రిస్క్ చేసినప్పుడే అనుకున్నాను వీడు మా తొక్కలో లెక్కల్లో ఒదిగేవాడు కాదని. నీ రెండో కవితా సంపుటి మియర్ మేల్ కి చిన్న ముందు మాట రాయమన్నావు. రాస్తే అన్న వాక్యం అని ఎంతో గౌరవంగా వేసుకున్నావు. అది నాకు దక్కిన గొప్ప గౌరవం అని నేననుకున్నాను. అప్పుడే అన్నాను నీ మీద అసూయగా వుందిరా అని. అప్పుడు కూడా పో అన్నా నువ్వు మరీనూ అని నవ్వేశావు. నువ్వు నవ్వుతావురా. నీ నవ్వు వినడం కాదు చూడాలి. ఒరేయ్ ఇంకా నీ నవ్వు చూడ్డంలో వున్న హాయి తీరలేదురా. నీ నవ్వుల్లో ఏవో కెరటాలు కెరటాలుగా కాంతి గోళాలు కనిపించేవి మరి. రాజేష్ ఖన్నాని వర్ణించేవు చూడు.  అంత కంటె అందగాడిగా కనిపించేవాడివి. అవును మరి అమ్మాయిల్ని ఎలా కళ్ళతో పడేయాలో రాజేష్ ఖన్నాని చూసి తెలుసుకోవాలనేవాడివి. ఆ మర్మ విద్య నీకు తెలిసిందా అంటే చెప్పీ చెప్పక తప్పించుకునేవాడివి. చెవి దగ్గరగా పెడితే చాల్లే అన్నా అని సిగ్గుపడే వాడివి.

నువ్వు చెప్పని రహస్యాలు చాలా వున్నాయిరోయ్. నీ వయసెంతో మాకింకా పజిల్ గానే మిగిల్చావుకదా. అందరినీ అన్నా అనే పిలిచేవాడివి కదా. టీవీ 9 ఆఫీస్ బాయ్ దాసు గుర్తున్నాడా? వాడు నీకంటె పదేళ్ళుపైనే చిన్నోడు. అయినా దాసన్నా అని పిలిచేవాడివి. ఇదేం అన్యాయంరా అంటే ఏంటన్నా నేనింకా పోరగాడినేగా అని కొంటెగా కొట్టిపారేసే వాడివి. లోకంలో అందరిలోనూ నువ్వే చిన్నవాడివనిపించుకోవాలని నీ ఆశచూసి మేం నిన్నెంత ఉడికించేవాళ్ళం? ఎప్పుడో నలభై గీత దాటక ముందే నీ వయసు ఆగిపోయింది. అదేంటంటే సర్టిఫికెట్ దొంగ లెక్క అనేవాడివి. ఫార్టీప్లస్ అనిపించుకోవడమే ఎలర్జీ. మరి ఫిప్టీకి దగ్గరపడ్డాన్ని నువ్వెలా తట్టుకోగలవులే. లోపల్లోపలే అవయవాలు ఎదురు తిరుగుతున్నా శరీరాన్ని మాత్రం నలభై దగ్గరే అట్టిపెట్టి వుంచావు. ఇంకా వుంటే మేమంతా నీ వయసు కనిపెట్టేస్తామని అనుకున్నావో ఏమో నీతోపాటే నీ వయసునూ మాయం చేద్దామనే ఇలా మాయమైపోయి వుంటావు.

bandaru

పూలండోయ్…పూలు!

నువ్వు కులం గురించి నాకు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పనులే తమ్ముడూ. నిన్ను కౌగలించుకుని గట్టిగా హత్తుకున్నచేతుల్లో కూడా కులం ఏ రంగులో ప్రవహిస్తుందో చూడగలిగిని వాడివి. నీ వయసులానే నీ కులం విషయం కూడా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశావు.తెలుసుకోడానికి ఎందరు ఎన్ని రకాల అంజనాలు వేశారో..ఎన్నిరహస్యోద్యమాలు నడిపారో తెలిసి మనం ఎంత గట్టిగా నవ్వుకున్నాం. వాళ్ళకి తెలిస్తే ఆ నవ్వుకి బట్టలూడి  పరుగులు తీసేవారేమో. కమ్యూనిజంలో నిజం వుందని గట్టిగా నమ్మినవాళ్ళం కదా. ఆఫ్టరాల్ అవర్ హార్ట్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అని కదా నీ లెక్క. అవును నీ అక్షరాక్షరం వామపక్షమే. కానీ కమ్యునిజంలో వున్న నిజం నాయకుల్లో లేదని నువ్వెంత బాధపడేవాడివి?

ఉద్యోగం నిమిత్తం నేను రాష్ట్రాలు పట్టి తిరిగి తిరిగీ 2000లో హైద్రాబాద్ చేరుకున్నది మొదలు ఇప్పటిదాకా మనం కలుసుకోని రోజులు తక్కువే. ఒకరినొకరం తలుచుకోని క్షణాలూ తక్కువే. ఏది రాసినా ముందు నాకే చూపించే వాడివి. దగ్గర లేకుంటే ఫోనులో వినిపించేవాడివి. వయసైపోతోంది. నీలా నేనెప్పటికి రాస్తాన్రా అంటే పో అన్నా నువ్వలా నన్ను పెద్దోణ్ణి చెయ్యకు. ఆయుక్షీణం అనేవాడివి. నిజంరా అంటే నమ్మేవాడివి కాదుకదా. ఇప్పటికీ నేను అదే మాటమీదున్నాను. నువ్వు డిఫెరెంట్. నీ స్టయిల్ డిఫెరెంట్. నీ కలం డిఫెరెంట్. నీ కవిత డిఫెరెంట్. నీ కంటెంట్ విషయంలోనే నేనప్పుడప్పుడూ గొడవపడేవాడిని.

నీకు గుర్తుందో లేదో నీ లంగ్ ఆపరేషన్ చేసినప్పుడు నా ఊపిరితిత్తుల మీద కత్తెర్లు పడినట్టు గిలగిల్లాడాను. లంఘించరా తమ్ముడా ఉల్లంఘించరా ఒక్క ఛలాంగ్ తో ఈ లంగ్ జంగ్ జయించరా అని రాశానే. మరి నువ్వలాగే అన్నావుగా. అదో వేలంవెర్రిగా నిన్ను చుట్టేసుకునే నీ చేలాగాళ్ల ఊపిరి కూడా పోసుకుని పయనించరా తమ్ముడా ప్రస్థానించరా..నిండు నూరేళ్ళూ హాయిగాజీవించరా అని అన్నాను కదా. మాటిచ్చావుగా. ఎందుకిలా ఇంత తొందరగా నీ మాటను కూడా ఉల్లంఘించిపోయావురా?

నువ్వు పదికాలాలు బతికుంటే తెలుగు కవిత్వం పదికాలాలు బతికుండే జవసత్వాలు పుంజుకుంటుందన్న ఆశతోనే నిన్ను చాలా చాలా తొందరపెట్టాను. నువ్వు జేగురు రంగు జ్ఞాపకాలు రాస్తే నీ అక్షరాల్లో అసలు రంగు అదే అన్నాను. నువ్వు యాన్ ఆఫ్టర్ నూన్ యట్ చట్టి అంటే నీలో మండుతున్న మధ్యాహ్నాలు చాలా వున్నాయి. వాటినే బయటకు తీయమన్నాను. భద్రాచలం రాముడి పాదాలు ముద్దాడే పాపికొండలకు నువ్వు తలబాదుకుంటే రానీయ్ రానీయ్ నీలోంచి లక్షల క్యూసెక్కుల ఉధృతిలో అక్షరాలను ఉరకనీయ్ అన్నాను. అన్నీ పక్కన పెట్టి పోలవరం ముంపు గ్రామాల కంటె ముందు వందల సార్లు మునిగి తేలి మునిగి తేలి ఊపిరాడక కొట్టుకుంటున్న నీ కవితల్ని ఒక్కచోట చేర్చి పోగుపెట్టమన్నాను. నా మాట కాదనలేదు. అలాగే అన్నా అన్నావు. అలాగే చేశావు. నా మాటదేముందిలే నీకు మిగిలిన టైం నిన్నలా తొందరపెట్టి వుంటుంది. ఇంక ఈ సాగరానికి అడ్డూ ఆపూ లేదనుకున్నాను. నేనే కాదు.

నీ మరణ వాంగ్మూలం అనబడే మ్యూజిక్ డైస్ చూసిన ప్రతివాడూ ఆ మృత్యు సంగీతం విన్నవారంతా వందల అడుగుల నీటి లోతులో సమాధైన గ్రామాల్లా దు:ఖించడం ప్రారంభించారు. ఎవడూ నాకు ఒక్క అవార్డన్నా ఇవ్వలేదేంటన్నా అనేవాడివి. ఒకటేంట్రా వందలొస్తాయి అనేవాడిని. ఆ రోజులు వచ్చేశాయిక అని అన్నాను కదా. నువ్వే తొందరపడ్డావు. ఆ రోజులు చూడకుండానే తొక్కలో అవార్డులు నాకెందుకు..నేనే మీకో అవార్డు అని ప్రకటిస్తూ వెళ్ళిపోయావు. కొందరు కాలం కంటె ఎప్పుడూ ముందే వుంటారు. తమ్ముడూ నిన్ని అర్థం చేసుకునే కాలంలోకి మమ్మల్ని నడపకుండానే ఎలా వెళ్ళిపోయావురా?

నేను చెబుతున్నానుకదా నీ డిక్షన్..నీ కవన కుతూహల రాగం తెలుగు కవిత్వ విద్యార్థులకు..విరాట్టులకూ ఒక తప్పనిసరి పాఠం అవుతుందిరా. నీ పదాల్లో మార్మికత లేని మంత్రధ్వని వుంది. నీ ముందు కూర్చోడానికి అందరం పలకాబలపం పట్టుకుని కూర్చునే టైమొచ్చినప్పుడే నువ్విలా అదృశ్యమైపోవాలా? నిన్ను ఎవరు అనుకరించినా ఇట్టే దొరికిపోయేట్టు పోయెం పోయెం మీదా నీ పేరును వాటర్ మార్క్ గా వేసిపోయావు.ఎంతైనా టీవీవోడివి కదా. అసాధ్యంరా నిన్ను చూసి పొంగిపోవలసిందే తప్ప నిన్ను దొంగిలించడం అసాధ్యం. ఇంగ్లీషు చదువుకున్న తెలుగు కవులున్నారు.

కానీ తెలుగు కవిత్వం ఇంగ్లీషు చదుకునే దశ నీతోనే మొదలైందనుకుంటా. ఆంగ్లమా..ఆంధ్రమా లాంగ్వేజి కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా చూడమన్నావు. నువ్వు భలే తుంటరోడివిరోయ్.  నువ్వొక పక్క..మిగిలిందంతా ఒక పక్క రెండు పాయలుగా తెలుగు కవిత్వం అలా వుండిపోతుందేమో అని అనుకునే వాడిని. ఆ స్థాయికి నువ్వు ఎదిగే దశలోకి రాగానే ఉన్నట్టుండి నీ ప్రయాణం దిశ మార్చేశావు. నిన్నింకా చదువుకోవడం పూర్తికానేలేదురా. పొయిట్రీని ప్రోజ్ చేసి పోజుకొట్టే  మనోపాజ్ ఘనాపాటీలున్నారిక్కడ. నువ్వేమో ప్రోజ్ ని కూడా పొయిట్రీగా పొర్లించవచ్చని నిశ్శబ్దంగా నిరూపించావు. అన్నట్టు నిశ్శబ్దమంటే గుర్తొచ్చింది వ్యూహాత్మకంగా నిశ్శబ్దాన్ని పాటించే శబ్దాడంబరులున్నారిక్కడ. నీ నిష్క్రమణతోనైనా నిన్నలముకున్న నిశ్శబ్దం బద్దలవుతుందేమో చూడాలి.

నీ నరనరంలో టీయార్పీ మందుపాతర పేలిన సంగతులు నాకు తెలుసు. చేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు రోజురోజూ శకలాలు శకలాలుగా విఛ్చిన్నమైన విషయాలూ తెలుసు. టీవీ రేటింగ్ నీ హార్ట్ బీటింగ్ ని ఎలా కొంచెం కొంచె కొరుక్కు తినేసిందో తెలుసు. నిన్ను లొంగదీసుకుని..కుంగదీసిన అసలు జబ్బు నీ ఉద్యోగమే అదీ తెలుసు. నీ శరీరంలో మృత్యు కవాతులు నువ్వే చూస్తూ మాకు మాత్రం నిత్యం నవ్వుల కవిత్వపు కబాబులు తినిపించావు. ఈ మిగిలిన లైఫ్ అంతా బోనస్ అన్నా అనేవాడివి. కాని నువ్వే మా బోనస్ కదరా. మా బోనస్ ని మేమింకా పూర్తిగా అనుభవించక ముందే వెనక్కి తీసేసుకున్నావా?  సావాసగాళ్ళతో తిరుగుళ్ళంటే నీకెంత ఇష్టం. కారు నడపడం..కవిత్వం రాయడం..దోస్తులతో సూర్యాస్తమయాలను కోసుకోవడం..అడవినీ గోదావరినీ కొండలనీ ప్రవహించే రాత్రులనీ  స్నేహితుల చేతలన్నీ నీవే చేసుకుని వాటేసుకోవడం నీ నుండి ఇంకా మేం నేర్చుకోలేదురా. అందరూ తాగుతుంటే నువ్వందరినీ తాగేవాడివి. అయినా ఇంటిదగ్గర మల్లెపూదండనీ బంగారు కొండనీ అశ్రధ్ధ చేయలేదుగా. నీ మత్తు మాకింకా దిగకుండానే ప్రయాణాల మత్తులోపడి ఎటో కొట్టుకుపోయావు కదా. పోరా పో.

నీకు నేనంటే ఎంతిష్టమో నాకు తెలుసు. నీ చివరి మెసేజ్ నాకొక అత్యున్నత అవార్డు సైటేషన్ అనుకుంటాను. ఫిబ్రవరి 1 న ఆంధ్రజ్యోతి వివిధలో అచ్చయిన నా కవిత చూసి నువ్వేం రాశావు? “ poem adbhutam. Maatallo cheppalenanta adbhutam.very touching, very deep, very poetic. And highly dense. You have shown how a poem should be. Congrats for setting high standards.”  మరి నేనేమన్నాను. ఇటీజ్ యువర్ హైనెస్ అన్నాను. నా మీద ప్రేమతో నువ్వెక్కువ చెప్పావేమో. కానీ ఈ మాటలు నీ  ప్రతి వాక్యానికీ  వర్తిస్తాయి.

ఎన్ని వందలమందికో నువ్ జీతాన్ని జీవితాన్నీ ఇచ్చావు. నువ్వు ఒకసారి వెళ్ళొస్తా బాస్ అని అందరి దగ్గారా సెలవు తీసుకున్నప్పుడు..నీ ఇంటి నుండి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం స్మశానవాటిక దాకా రోడ్డంతా వందలాది కళ్ళు కురిపించిన కన్నీటి వర్షం మమ్మల్ని ఎప్పటికీ తడుపుతూనే వుంటుంది. నువ్వెంత ధన్య  జీవివో మాకు తెలుపుతూనే వుంటుంది.

అందరూ నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే వాడు టీవీ5 కి వెళ్ళాడు నేను 10టీవీలోనే వున్నానని అనేవాడిని. ఇక ఇప్పుడెవరైనా అడిగితే వాడు పైకి వెళ్ళిపోయాడు. నేను కిందే వుండిపోయానని చెప్తాను. తమ్ముడూ నీతో అన్నయ్యా అని పిలిపించుకున్న గర్వాతిశయం నా మీదా నా అక్షరాల మీదా ఎప్పుడూ వెలుగు రేఖై వెలుగుతుందిలే. అయినా ఏమోరా  మనసు నిండ లేదురా. అంతా అధూరాగానే మిగిలిపోయినట్టుందిరా. మన మాటలు..మన పాటలు..మన చెలిమి అంతా సగం సగంగానే ముగిసిపోయినట్టుందిరా. కడుపు నిండలేదురా. సాగరా. సాగరా. సోదరా.

 

అరుణ్ కాలింగ్ అరుణ్!

 

– అరుణ్ తోట

~

arun tota

ఏ సంవత్సరమో గుర్తు లేదు కాని ఆంధ్రజ్యోతిలో ‘నవీన’ అన్న కాలమ్ లో మొదటిసారి తన పేరు చూసినట్టు గుర్తు. కాలమ్ చదివిన వెంటనే అడిగాను అమ్మని, “ఎవరమ్మా ఈ అరుణ్ సాగర్? ఇంత బాగా ఎలా వ్రాస్తున్నారు?”

ఇక అప్పటి నుంచి ప్రతీ వారం అయన కాలమ్ కోసం ఎదురుచూడడం, ఆయన్ని కలవాలని తపించటం, కలవటం. అయన వ్రాసిన ప్రతీది పనిగట్టుకుని చదవడం, చదివించడం – కొద్ది కాలానికి ఫేస్బుక్ లో మా యాదృచ్ఛిక చర్చలు, ఆయనతో వ్యక్తిగత సంభాషణలు – తిరిగి చూసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అన్ని సంఘటనలు ఒక సహేతుక కారణంతోనే జరిగినట్టు.

తనకి ముందే తెలుసేమో ఇలా జరగబోతుంది అని. జీవితంలోని విషాదాన్ని “యు నో, ఐ డోంట్ హావ్ టైం ఫర్ యు” అని తన్నితరిమేసి, చేతనైనంత కాలం మాన్ వాచింగ్ చేసి, మనల్ని కాచి వడబోసి, పనికిరాని చెత్తను తన రచనలతో అలా పక్కకి తోసేసి, జీవిత గడియారంలో సమయం చూసుకుని “చలో, మేరా వక్త్ ఆగాయ” అని నిష్క్రమించారు.

ఎలా వ్రాస్తున్నారు అనే దానికంటే ఎలా వ్రాయగలిగారు అనేది ఒక శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. తనని ఏ సంఘటనలు, అనుభవాలు ప్రేరేపించాయో ఇంకొంచెం సన్నిహితం అయినప్పుడు అడగాలనుకున్నా, కానీ ఆ అవకాశం లేకుండా ‘మ్యూజిక్ డైస్’ అని సైన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఏ జ్ఞాపకాల కొలిమి ఆయన గుండెల్ని సమ్మెట కొట్టి, కాల్చి ఇంతగా సానపెట్టిందో కదా?

అరుణ్ సాగర్ – ఆ పేరు తలుచుకుంటేనే ఏదో పులకరింపు, లేక జలదరింపా? తన కవితలు, రాతలు, వ్యాఖ్యలు, ఫేస్బుక్ పోస్టులు ఏవైనా కాని, చదువుతుంటే ఆ పదాల నుంచి అరుణ్ సాగరే ఒక్కసారిగా బయట కొచ్చి మన భుజాల్ని పట్టుకుని ఆపాదమస్తకం ఊపినట్టు ఉంటుంది. మాటలా లేక అక్షర తూటాలా అవి? కళ్ళు అక్షరాల వెంట పరుగుతీస్తుంటే నికోటిన్ , కేఫైన్, ఇథనాల్ మరే ఇతర ఉద్దీపన అవసరంలేని హిజ్(అరుణ్ సాగర్) హైనెస్ ఎఫెక్ట్ కి గురౌతాం.

 

చట్టబద్ధమైన హెచ్చరిక: ఈయన రచనలు చదువువారు వెంటనే వారికీ వీరాభిమనులవుదురు. జాగ్రత్త!

 

ఈయన ధరించే ఒక సాధారణ జీన్స్ ప్యాంటు నీల్ కమల్ అని సోల్ ఫుల్ ఆటిట్యూడ్ చూపెడుతుంది. తాటి తోపు కాడ తాటాకుల పరుపు, కల్లుకుండతో జతకట్టి ఆయనను ఊర్ధ్వలోకపు అంచులకి తీసుకెళ్తుంది. విశాఖ గాని దుబాయ్ కానీ మరే సాగరతీరం కాని, అరుణ సాగర ఆలోచనా తరంగాల ముందు అ కడలి కెరటాలు కూడా ‘మన కంత బలమేక్కడిదిలే బాస్’ అని చిన్నబుచ్చుకుని నెమ్మదిగా వెనక్కు జారిపోతాయి. సగటు మగాడిని ‘రోబోసేపియన్’ అని వెటకరించినా, బాహర్ నికల్ రే భై, నికల్కే నిన్ను నీవు తెలుసుకొనుము అని జిడ్డు గారి ఇష్టైల్లో ‘మేల్’ కొల్పినా ప్రతిదానిలో హిజ్ హైనెస్ ఎఫెక్ట్ నిను వీడని నీడను నేనే అంటుంది.

 

డిస్క్లైమర్: ఈయనను అనుసరించు వారు కార్పొరేట్ కొలిమిలో ఊపిరాడక, సాలెగూట్లో చిక్కుకున్న కిటకంలా గిలగిలా కొట్టుకుందురు.

 

అయన వ్రాతలలో ఒక్కోసారి కవితావేశం కొంచెం ఎక్కువై పిచ్చితనం లాగ (భావోన్మాదం అనాలా?) అగుపడచ్చేమో. కాని అరుణ్ సాగర్ మాటలలో మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు మాటలలో వ్యక్తపరచ లేని, చేతలతో చూపెట్టలేని భావ సంచలనానికి గురి కావడం, అది బయటకు పిచ్చితనంగా కనపడడం సహజం. అసలు అలా కనపడక పోవడమే నిజమైన పిచ్చితనమేమో! అలా కాలేదు అంటే మన జీవిత పరిణామ క్రమంలో ఏర్పడ్డ మానసిక కాలుష్యం మనల్ని కుళ్ళపొడిచేసిందని అర్ధం. ఆయన రాతలు ఒక్కసారి చదివితే అర్ధం కావట్లేదా? ఒకటికి పదిసార్లు, ఇంకా కావాలంటే వంద సార్లు చదవండి, చదివిన ప్రతీసారి ఒక కొత్త కోణం ఆవిష్కృతమౌతుంది.

 

ఇంతకీ ఆయనదే శైలి? సర్రియలా, అబ్స్త్రాక్టివా, హైకూనా లేక ఇంకేదైనానా? ఆయన ఎంచుకునే అంశాలు, భావజాలం ఎటువంటిది? రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ లేదా లిబరల్? బహుశా ఆయననే అడిగి వుంటే, తన మార్కు చిరునవ్వుతో భుజాలు చిన్నగా ష్రుగ్ చేసి “యు డిసైడ్ అండ్ టెల్ మీ డ్యూడ్” అనేవారేమో. తన భావజాలాన్ని ఏ గాటన కట్టలేం. అదొక స్వచ్చమైన నీటి లాంటి స్థితిలో వుంటుంది. వరద ప్రవాహమయ్యి ఏమీ మిగుల్చకుండా సమస్తాన్ని తనతో తుడిచిపెట్టుకు పోగలదు, బావిలో నీటి ఊట లాగ ఉండుండి ఉబికుబికి విస్తారించవొచ్చు లేదా నీటితో నిండివున్నకుండలా నిశ్చలంగా ఉండి కదలక – ఎప్పుడో భళ్ళున బ్రద్దలవనూ వొచ్చు. ఆయన ప్రభావం ఇలాగే ఉండబోతుంది అని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ‘హిజ్ హైనెస్’ హిప్నొటైజ్ చేస్తుంది.

కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలం. అరుణ్ సాగర్ వ్రాతల్ని అంచనా వేయాలంటే ఇంకో అరుణ్ సాగర్ కావాలి. నాకున్న (కొద్దిపాటి) పరిజ్ఞానంలో ఈయన లాగ వ్రాయగలిగిన సమకాలీకులు ఎవరూ లేరు. బహుశా ఏ శ్రీశ్రీ కాలంలోనో పుట్టి వుంటే ఈయన, శ్రీశ్రీ గారి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని కొత్త పిడివాదాల్నితెలుగు ప్రజలకి రుద్దేవారు. వారిద్దరూ మాత్రం ఒక చోట కూర్చుని చాయ్ సిప్పుతూ చిద్విలాసంగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేవారు. ఇప్పుడు కూడా వారు ఆ పని చేయ్యటం లేదని చెప్పలేం సుమా – కాకపోతే , చాయ్ బదులు అమృతం – అంతే తేడా.

ఏమైనప్పటికీ, ఐ టిప్ మై టోపీ టు అరుణ్. నేను తెలుగువాడి ఒంటి మీద వున్నాను అని నా నీల్కమల్ డెనిమ్ కాలరెగరేసిందంటే అది అరుణ్ లాంటి వారి రచనలని చదవగల్గినందుకే. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక అలజడిని, భిన్నమైన శైలితో-బిగువైన మాటలతో కొత్త ఒరవడిని, తన వైబ్ అందుకో ప్రయత్నించిన వారికి గుండెతడిని మిగిల్చి – బాబ్ డైలాన్ పాట గాలిలో ఊదుకుంటూ (‘బ్లోయింగ్ ఇన్ ద విండ్’) వెళ్ళిపోయారు. బాబ్ డైలాన్ అంటే గుర్తుకువోచ్చింది, తను పీటర్ సీగర్ పాటల్ని చింతూరు ఏజెన్సీ కోయలకు వినిపించారో లేదో.

అయన నాకు ప్రత్యేకంగా సంతకించి పంపిన కొత్త పుస్తకం ఇంకా నా చేతికి రానే లేదు, పక్షం రోజుల క్రితం దాని గురించి ఫేస్బుక్ లో అయనతో మాటలు ఇంకా స్మృతి నుంచి చెరగనేలేదు. ఈలోగానే ఆయన్ను “లగజా గలే” అంటూ ఒకానొక దేవత – క్వశ్చన్, మియ్యర్ మేల్స్, పురుషులు, “షు” అక్షరం పీకగా వొచ్చిన పురుగులు అక్కడ కూడా వున్నారా? – చుపా రుస్తుంలా వొచ్చి అసలు సిసలైన ఆండ్రోమెడ పబ్లిషింగ్ యూనిట్ కి తీసుకెళ్లింది.

ఇంతకీ అక్కడ ఎలా వుంది ప్రభు? ఆ గాలక్సీ కూడా మీ మాటల తూటాలకి మేధోవిస్ఫోటం చెందుతుందా? చెందే వుంటుంది లెండి, మాకిక్కడి నుంచి రాత్రివేళ ఆకాశవీధిలో కొత్త పాలపుంత అలజడి కనపడుతుంది.

– అరుణ్ తోట

peepal-leaves-2013

 

అరుణ్ సాగర్ రాసిన ఏకైక నవల!

 

-ఝాన్సీ  పాపుదేశి

~

jhansi papudesiసమాజ చీకటి  కోణాల పై సీరియస్ రచనలు చేసిన అరుణ్ సాగర్ అంతర్లీనంగా హాస్యప్రియుడు. అందుకే అతడి కవితల్లో ఎంతటి ఆలోచింపజేసే విషయం ఉన్నా దాన్ని ప్రకటించిన విధానం పెదాలపై చిరునవ్వును రప్పిస్తుంది. కవితల్లో సినిమా పాటలు రాసినా, వాణిజ్య ప్రకటనలు వినిపించే విధంగా తన వాక్యాలను చదువుకోవాలని చెప్పినా ఒక వెక్కిరింత చదువరులను నవ్విస్తుంది.

సమాజం నడిచే తీరుపై తనలో ఉన్న అసహనాన్ని ప్రకటించే తీరులో అరుణ్ సాగర్ వొక వైవిధ్య కెరటం.  ఎప్పుడూ కవిత్వమేనా…కథలు రాయొచ్చు కదా..అంటే చాలా ఏళ్ళ  క్రితం తాను రాసుకున్న ఒక పెద్ద కథో ..చిన్న నవలో..కామెడీ సినిమా నో చెప్పలేని ఒక “లస్కుటపా” ను నాకు పంపించారు.  నేను తన అభిమాని అయినా…పదే పదే నేను చదివానో లేదో అడిగేవారు. ఇంకా చదవలేదని చెబితే తొందరగా చదివి అభిప్రాయం చెప్పమన్నారు. నా సహజమైన లేజీనెస్ నన్ను ఇప్పటిదాకా చదవనీయలేదు.

నిజం చెప్పాలంటే ఆయన సహజ శైలికి పూర్తి భిన్నంగా ఈ కథ ఉండటం…నన్ను చదవనీయలేదు. అరుణ్ సాగర్ లేరన్న షాక్ లో కన్నీళ్ళతో అర్దాంతరంగా ఆపిన ఈ హాస్య రచన చదవడం  పూర్తి చేశాను.

నైంటీన్ నైంటీఫోర్ …ఎ లవ్ స్టోరీ .

సూరీ.. కిట్కీ గళ్ భాగీల ప్రేమ కథ.

పదిహేడు రీళ్ళుగా రాసిన ఈ కథ సూరి చందుల స్నేహంతో ప్రారంభమవుతుంది. ఇద్దరు స్నేహితులే కాబట్టి స్నేహనౌక కాస్తా స్నేహ డింగీ గా మారి హుస్సేన్సాగర్ లో సాగిపోతోంది. వాళ్ళిద్దరూ అమ్మాయిల విషయంలో ఎంత ఉద్దండులంటే డాక్టర్ ఆఫ్ బీట్, సైటు రత్న అవార్డులు అందుకునేంత. అలాంటి స్నేహితులు  విధి ఆడిన వింత నాటకంలో విడిపోయారు. సూరి నాన్నకు ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్రికా లాంటి వూరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రేకుల షెడ్డులతో, విరిగిపోయిన బల్లలతో పశువుల కొట్టంలా సీతకోకచిలుకల్లాంటి స్టూడెంట్స్ తో అలరారే కాలేజ్ నుంచి సూరి టిసి తీసుకున్నాడు.

తన స్నేహం గురించి ఆలోచిస్తూ ఆటోలో కూర్చుని  తను వదిలిన నిట్టూర్పు విని స్కూటర్లో వెళ్తున్న వ్యక్తి హారన్ అనుకుని ఆటో డ్రయివర్ తో గొడవ పడటం , ఆగిపోయిన ట్రాఫిక్ మీద దయతలిచి తన బాధను రాత్రికి ఫోన్లో వివరిస్తానని సూరి చెప్పడం కథలో పెద్ద ట్విస్టు.

చేసిన ప్రామిస్ ను నిలుపుకోవడానికి ఆ రాత్రి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి స్కూటరిస్టుకు ఫోన్ చేసి 48 గంటల తన స్నేహ వియోగాన్ని చెప్పడం, ఆ ఇంట్లోనుంచి తన కథకు కోరస్లో వెక్కిళ్ళు వినిపించడంతో సూరి మనసు కుదుటపడినా  అతిపెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. బూత్ లోంచి బయటకు రాగానే సమయానికి తన గర్ల్ ప్రెండ్ కి ఫోన్ చెయ్యలేక బ్రేకప్ అయిన ఆనంద్, పక్కింటి కిట్కీ గాళ్ ఫ్రెండ్ భాగీ ప్రేమను తట్టుకోలేక గట్టిగా గెంతిన గెంతుకు ఫ్యాన్ ఊడి పడి సంసారానికి పనికి రాకుండా పోయిన ఇంటి వోనర్ రాఘవేందర్ సూరిపై పగబట్టడమే ఆ అతి పెద్ద ప్రమాదం.

ఆంధ్రా యూనివర్సిటే లో ఆంథ్రోపాలజీ చదువుతున్న రోజుల్లో ల్యాబ్ నుంచి ఆస్ట్రలోపితికస్ పుర్రెను కొట్టేసి కోట్లు సంపాదించి విలన్ గా అవతారమెత్తిన రాఘవేందర్ క్లాస్మేట్  జబ్బల్ భాయ్ ను పగతీర్చుకోవడం కోసం పిలిపించడం తో క్లైమాక్స్ ప్రారంభమవుతుంది. ఇదే సమయానికి అన్నిరోజుల విరహం తట్టుకోలేని చందూ , సూరి దగ్గరకు రావడం.. ఇద్దరూ కలిసి జబ్బల్ భాయ్ కిడ్నాప్ చేసిన భాగీ ను విడిపించడం, భాగీ నాన్న తనకు మేనమామే అని తెలియడంతో కథ సుఖాంతం అవుతుంది.

నా మేనమామే నా మామా! అని సూరి ఆశ్చర్యపోవడం నవ్విస్తుంది.

క్యుములోనింబస్ మేఘాలను గన్ తో కాల్చి విలన్ వెళ్ళే సెకండ్ హ్యాండ్ హెలీకేప్టర్ లోకి నీళ్ళు రప్పించడం క్లైమాక్స్ హాస్యం.

ఈ రచన ప్రారంభం నుంచీ మనల్ని విపరీతంగా నవ్విస్తుంది. అరుణ్ సాగర్ రచనల్లో సాధారణంగా కనిపించే సీరియస్ నెస్ ఇందులో వెదికినా కనిపించదు. ప్రతి పదంలో కామెడీ నర్తిస్తుంది. ఆంత్రోపాలజీ సబ్జెక్ట్ పై తనకున్న మొహం మాత్రం అన్ని రచనల్లో కనిపించినట్టే ఇందులో కూడా విలన్ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించేటప్పుడు కాస్త కనిపిస్తుంది. కళ్ళనిండుగా నీళ్ళను…కడుపులో నొప్పిని తెప్పించే ఈ రచన అరుణ్ సాగర్ మరణం తరువాత కన్నీళ్ళతో పూర్తిచేయడం, ఆయన రాసిన ప్రతి అక్షరాన్ని ప్రేమించే అభిమానిగా మనసునిండుగా ఈ కథలో నవ్వుతూ కనిపించే అరుణ్ సాగర్ ను మీకు కొత్త కోణంలో పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తాను.

“తప్పు తనది కాదు నీది.. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదని తెలిసీ…నువ్వే అపరాధి”…వీడ్కోలు మిత్రమా!

నవల లింక్: http://saarangabooks.com/retired/wp-content/uploads/2016/02/laskutapa.pdf

 

peepal-leaves-2013

 

 

 

 

మంటల ఫౌంటెన్

 

-రామతీర్థ

~

 

మాధ్యమాలన్నీ చెప్పేస్తున్నాయి నువ్విక మా మధ్య లేవని. అందిన పుస్తకమ్మీద సమీక్ష రాద్దామనుకున్నాము, చదువుతూ నీ పోలవరం కవిత్వాన్ని, చట్టి గ్రామం వద్ద ఒదిశా, ఛత్తీస్ ఘర్ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాలుగు రాష్ట్రాల మధ్య ఇరుక్కుపోయి ఇంకా బయటకు రాకుండా మేం ఉంటే, ఎలా సమయం వెదుక్కున్నావయ్యా నువ్వు నీ గుండెనాపేసుకోవడానికి.

బాగా చదువుకున్న వాడికి మంది బాగు కోరడానికీ,  ఎక్కువ తెలుసుకున్న వాడికి  ఎక్కువ కాలం బతికే అవకాశం ఉండడానికీ సంబంధం లేదేమో. కవిత్వం లోకి ఒక సమష్టి అశాంతి, కొంత వైయక్తిక అరాచకం ప్రవేశిస్తే, ఒకడు అలనాడు అల్లెన్ గిన్స్ బెర్గ్  అయ్యాడు. మాటలు వివాదాస్పదంగా విసిరి, సౌకర్యవంతంగా ఉండాలనుకునే భద్రలోగ్ సంఘానికి, ఆదిసూకర వేద వేద్యంగా, అడివి పందుల్లాంటి  గిరిజనులున్నారని, సిద్ధాంతాల వాగ్దాన భంగాలు జరిగి,  డబ్బు వేటాడుతున్న సమాజంలో, ఆధునిక, అత్యాధునిక ఆటవికులున్నారని చెప్పిన నీ వాక్యాలకు ఒక ప్రజాస్వామ్య ఉష్ణోగ్రత ఉంది.

ధన్య మనస్కంగా విభిన్న శృంగార హక్కుల పసి కేరింతలు, కసి  కసుర్లూ, అస్తిత్వ సంచార యాత్రలో, పోస్ట్ మాడర్న్ ఖెయాస్ లో మనిషికెవరూ దిక్కు లేరని చెప్పే వాతావరణ హెచ్చరికలూ, పలు జిహ్వల్లో నాగరికుల మిశ్రమ దుఖార్తి, నువ్వు రాస్తే, సంక్లిష్ట నిరసనయ్యింది.

రాయాల్సినంత రాశావా, చెప్పాల్సినంత చెప్పావా, లేక కొత్త ఉద్యోగాలయిన దృశ్య మాధ్యమాల్లో, నిన్ను నువ్వు ఖర్చు పెట్టేసుకున్నావా  ఎవరూ చెప్పరు. సాంకేతిక మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, యంత్ర భూతముల కోరలు తోమే,   ఇనుప అడుగుల నాగరికత, ఇసుక రేణు సూక్ష్మ ఫలకం, సిలికాన్ చిప్ లో దాచిన జ్ఞాన బీజం, స్వార్థ స్వర్గాలకే పయనిస్తుందా, ఒంటి కంటి సిద్ధాంతపు, ఒంటి స్తంభ సంస్కృతుల, ఒంటరి పట్టా పై, మోనో రైలు లా – – అడగాల్సిన ప్రశ్నలున్నాయి.

పాత జవాబులేవీ రాయకుండా పరీక్షలు రాయాల్సిన రోజులివి. మార్కుల పద్ధతిని దాటిన జవాబు పత్రం కావాలి ఇవాళ కవిత్వం. ఠావు  అంతా ఖాళీగా ఉంచి, మార్జిన్ లోనే ఉంచిన వారిని,  ఫుల్ స్కేప్ బతుకు లోకి తీసుకురావాలి. అలా జవాబులు రాయవలసిన కాలం ఇది. కోటానుకోట్ల బతుకు పేపర్లను ఇలానే దిద్దాలి అంటూ దిద్దుతున్న వారిని, జన జీవన విద్యలో జ్ఞాన  శూన్యులు  గా కోలహాల ప్రకటన చేయాల్సిన రోజులివి.

కొత్త సహస్రాబ్దికి, ఇంకా పదిహేనేళ్ళే, నీకా అర్థ శతాబ్దపు ఆయుష్షు  నిండ  లేదు. ఆయుధమై పదునెక్కి, సాయుధ పటాలాలు గా   అక్షరాలను నడపాల్సిన నిర్ణాయక దశలో, మరణ వాంగ్మూలాన్ని పౌర సరఫరా చేసి, బతుకు లగేజీలు వదిలేసి, మరణాన్నే ఒక్క మూట  కట్టుకుని , జల క్రోధం జన క్రోధంగా  మారే దారి లో మోసుకెళ్తున్నావు.

కనిపించని డబ్బు కరిగిపోయిందని  స్టాక్ మార్కెట్లు మోరలెత్తి ఏడుస్తున్నాయి. పని లేని ఆయుధ సంపత్తి ఎవరి సంపదో చెప్పలేక రాజకీయం నీళ్ళు నముల్తోంది. ఏర్పడని దేశాల కోసం, ప్రజలు పురిటి పడకల నుంచే ఉద్యమ ఉంగాలాపనలు చేస్తున్నారు.  నాగరికుడా – నువ్వు స్వైర సంగీత జీవ శక్తిని ఆటవికతలో విన్నావు, అమెరికాలో విన్నావు. ఆటవికుడా, నువ్వు కోయ వేషంలో కూచుని ఏదో ఆండ్రోమెడా  చానెల్లో, ఆక్స్ ఫర్డ్  ఇంగ్లీష్ లో, అడవి బిడ్డల హక్కుల గురించి, బతుకులు అడవులైపోయిన ఆధునిక దిశాహీనత గురించి, మాట్లాడుతూ, మాట్లాడిస్తున్నావనుకోనా?

పాంటూ, చొక్కా వేసుకు తిరిగిన కోయ రాజా – నీకు పెన్ను నిండా గోదారి.  కూనవరం రేవే దగ్గర ఒంటరి పడవలో నువ్వొదిలేసిన అక్షరాలు ఇప్పుడిక  ఈ తరాలు రాయాలి.

అల్విదా జెంటిల్ జ్వాలారుణ  సాగరుడా,  నిప్పు పెట్టెల్లోంచి  పేలాల్సిన ప్రజాగ్రహ గంధక ధూళి, నీకు ఎప్పటికైనా  నివాళి.

 

*

 

వంటిల్లు కథ అదే..కొన్ని సవరణలతో…!

 

-అపర్ణ తోట

~

aparnaఉపోద్ఘాతం

రాత్రి తొమ్మిదిన్నర. లాప్ టాప్ ముందు కూర్చుని ఆమె శ్రద్ధగా పని చేసుకొంటోంది. అతను కూడా…అతనికి ఆకలి వేసింది. “ భోంచేద్దామా” అన్నాడతను. ఆమె ఇప్పటికిప్పుడు పని ఆపితే లెక్క తప్పుతుంది. అరగంట నుంచి చేస్తున్నపని మళ్ళీ మొదలు పెట్టాలి. “కాసేపు”. అందామె లాప్టాప్ నుంచి కళ్ళు తిప్పకుండా.. ఇంకో పది నిముషాలు గడిచాయి. “ఎంతసేపూ?”…విసుగు! “వస్తున్నా..” కళ్ళు మరల్చకుండా అందామె. “అయిపోవచ్చింది. ఇంకో ఐదునిముషాలు…”ఆమె లెక్క తేలడం లేదు. అతను చప్పుడు చేస్తూ లేచాడు. డైనింగ్ టేబుల్ మీద కంచం గట్టిగా చప్పుడు చేస్తూ పెట్టాడు(ఒకటే కంచం, ఆమెకు లేదు. నోట్ దిస్ పాయింట్) ఉదాసీనంగా తింటున్నాడు. ఆమె హడావిడిగా లాప్ టాప్ మూసేసి వచ్చింది. “సారీ, ఎంతకీ పని తెమలలేదు.”  “పర్లేదు.” అన్నాడు. బోల్డంత పరవా ఉందందులో…

  “పొద్దుట పూట హడావిడి పడకుండా ఉండాలంటే రాత్రికే అన్నీ సిద్దం చేసుకోవాలి. కూరగాయలు టివి చూస్తూ కట్ చేసుకోవచ్చు. అలానే పిల్లల బూట్లూ, సాక్సులూ, యూనిఫాం రెడీగా ఉంచుకోవచ్చు. పనిని సంబాళించుకోవడం లో ఉంది గృహిణుల నేర్పంతా… “కర్టసి తెలుగు మాగజైన్స్ అండ్ వనితల వంటల షోస్.

భర్తకి టీ, పిల్లలకు పాలు, పిల్లలకు పోషకాహారానికి లోటు చెయ్యకూడదు. డ్రై ఫ్రూట్స్, గుడ్లు. మరి భర్తకూ, తనకూ- కొన్ని స్ప్రౌట్స్, అందరికీ ఫ్రూట్స్, ఒళ్ళు పెరగకుండా ఓట్స్, అత్తగారు మరవన్నీ తినరు. అవసరమైతే ఒక ప్లేట్ ఇడ్లి వెయ్యాలి. మరి చట్ని? ఇంకాస్త పని. రాత్రి అన్నం- పులిహార? ఫ్రైడ్ రైస్? మధ్యాహ్నం ఒక్క పప్పు, కాస్త చారు, ఒక కూరా…పెరుగు? తోడేసానా లేదా? టిఫిన్ బాక్సులు ఏవి? పనమ్మాయి సరిగ్గా తోమిందా? అన్నం సరిపడా చల్లారిందా? లేకపోతే మధ్యాహ్నానికి వాసనొస్తుంది. మళ్ళి భర్త గారికి రోటీలు. పిల్లలు ఫ్రై తప్ప తినరు. ఈయనకి కాస్త తడికూర అయితే తప్ప రోటీ గొంతు దిగదు.

“అన్నయ్యకి కాస్త ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వెయ్యి, బాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.” ఆడపడుచు సలహా. మగవారి ఆరోగ్య రహస్యాలెప్పుడూ వారి భార్యల దగ్గరే ఉంటాయి. మరి ఆడవారి ఆరోగ్యాలో..

ఆరింటి నుంచీ తొమ్మిదింటి వరకూ ప్రతీరోజు సాగే ట్రపీజ్ షో.

సరే మరి. ఇంత శ్రమ ఎవరి కోసమట? ఇంట్లో అందరికి ఆరోగ్యం బానే ఉందే? ఈ సూపర్ హీరోయిన్ రోల్ ఎవరి కోసం. కన్నాంబా, సావిత్రి మార్కు ఆక్షన్ సమంతా సీజన్లో ఏలా?

దాదాపు ఇరవైయేళ్ళు కావొస్తోంది కుప్పిలి పద్మ “మమత(మాతృక- జనవరి- మార్చ్ 1996) ” వచ్చి! అందులో ఇప్పటి ఆధునిక మహిళని  ఆవిష్కరించారు రచయిత. చదువు, ఇష్టపడే ఉద్యోగం. ఈ రోజుల్లో ఒక అర్బన్ మిడిల్ క్లాసు అమ్మాయికి ఈ రెండూ అంత అసాధ్యమైన విషయాలేమీ కావు.

కాని పెళ్ళి! అందులోనూ వంటిల్లు! ఇంతకూ మించిన కష్టం ఉంటుందా? ఈ కథ లో ఒక జనరేషన్ ముందు నుంచే ఉద్యోగం చేస్తున్న అత్తగారూ, అమ్మా ఉంటారు. అత్తగారికి కోడలి పరిస్ధితి అర్ధమైనా ఎక్కడో కొడుకు వ్యక్తిగత వ్యవహారంగా కల్పించుకోదు. ఇలా వ్యవహరించడం ఆమెకు తెలియని సదుపాయం ఏదైనా ఉందేమో. ఆర్నెల్లు వంటగదికే పరిమితం అయిన అమ్మాయి- భర్తతో ఉండే ఇంటిమేట్ టైమ్స్ లో కూడా ‘రేపటి వంట ఏంటి’ అని ఆలోచిస్తూ ఉంటుంది.

మొదట్లో వంటమనిషి మానేసింది. వంట బాధ్యత కొద్దిరోజులు తీసుకొమ్మని భర్త అంటే…

“నాకు వంట సరిగ్గా రాదే” అంటుంది.

“ఆ దానిదేముంది. రెండు రోజుల్లో అలవాటయిపోతుంది.”

“మీకొచ్చా”

“అబ్బెబ్బే…రాదు”

అదే మగవాళ్ళకైతే జీవితాంతం నేర్చుకున్నారాదు. ఆడవాళ్ళకు నిముషాల్లో వచ్చేస్తుంది.

అంతెందుకు వంట గురించి మాట్లాడే మోడరన్ విమెన్ అంటే అందరికీ తెలియని గౌరవం కలుగుతుంది. చీర కట్టుకోవడం, వంట రావడం- ఇవి రెండూ మన భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ సోపానాలు. మరి ఆడవాళ్లందుకే కదా ఉండేది! మగవారు ఎటన్నా పోనీ!

మమత అమ్మా, అన్నయ్య భార్యా మమత బాధని అర్ధం చేసుకుంటారు. నాన్నకూ, అన్నయ్యకూ అదొక విషయం లా కూడా తోచదు. పాపం మమత వంటగది నుంచే కాదు, మాతృత్వభారాన్ని కూడా వదిలించుకోవాలి. రచయిత్రి ఇక్కడ చూపిన తెగువకు వంద సాష్టాంగాలు చెయ్యాలి.

సమస్య చిన్నదే. కాని దాని వెల చాల పెద్దది. ఎంత పెద్దది అంటే ఒక జీవితం లో సగభాగమంత. రోజులో ఐదారు గంటలంత. వంటింటిని భుజాన మోసుకు తిరిగినంత. పాతివ్రత్యమంత. మాతృత్వమంత! ‘అసలు ఆడదానివేనా’, అనే పనికిరాని మాటలకు బాధపడి గిల్ట్ ను జీవితమంతా మోసేటంత. ఇష్టమైన ఉద్యోగాన్ని పక్కకు నెట్టేసేంత. ఒక మంచి నిద్రంత. ఒక చక్కని పుస్తకం చదవలేనంత. మనకిష్టమైన స్నేహితులను పక్కన పెట్టేంత. ఎంతో ఎదురు చూస్తున్న ఒక మీటింగ్ లో మంచి మాటలు వదిలి పరిగెత్తి ఇంటికి వచ్చి పోపు వెయ్యవలసి వచ్చేంత. మహానుభావురాలు మన రచయిత. ఇడ్లి లో కొబ్బరి పచ్చడి గురించి మమత పడే టెన్షన్ అర్ధం చేసుకుంది.

Art: Srujan Raj

ఇంచుమించు అదే వయసున్న భర్త. కానీ క్రికెట్, రాజకీయాలు, సినిమలాకన్నా రేపటి వంట ఏంటి? అనే కబురు బాగా సాగుతుంది.

“ఇవాళ బాంక్ లో విశేషాలేంటి?” అడుగుతుంది మమత. వెర్రిదాన్ని చూసినట్టు చూస్తూ, “ఏమైంది” అంటాడు కిషోర్

“ఏం లేదు, ఊరికే.” దిక్కులు చూస్తూ అంటుంది.

“పకోడీలు బావున్నాయా?”

“ఇంకాస్త కరకరలాడితే బావుండును.”

“దోస బాగొచ్చిందా”

“ఇంకాస్త పల్చగా రాదా?”

“పాయసం బావుందా?”

“తీపి ఎక్కువైంది. నీకు కేరళ వాళ్ళ పాయసం వచ్చా?” సో..వంతావంతకాలు..మా మధ్య ఈ సంభాషణ బాగా జరిగేట్లుంది, అనుకుంటుంది మమత.

ఈ పనితో విసిగి పోయి నేను వంట పని చేయలేను ఉద్యోగానికి వెళ్ళిపోతానని, తెగించి చెప్పన మమత తో, “నీతో చక్కగా పనులు చేయిస్తున్నానని అంతా మెచ్చుకుంటుంటే నువ్వేంటి ఆ ఏడుపు మొహం? ఏదో, పరాయివాళ్ళకి చేసినట్టు..” పితృస్వామిక వ్యవస్తను ఇంకా భుజానేసుకు తిరుగుతున్నామని చెప్పడానికి ధీటైన వాక్యమిది.

ఈ కథలో ఇంకా ఎన్నో విస్తృతంగా చర్చించవలసిన అంశాలున్నాయి. కాని, ప్రస్తుతం వంటిటి గురించి మాత్రమే మాట్లాడదామని ఆగిపోతున్నా. ఇంత మంచి కథను రెండు దశాబ్దాల క్రితమే అందించిన పద్మగారికి అందరమూ రుణపడిపోయాము.

‘ఈ రోజుల్లో వంటేటమ్మా..మా రోజుల్లో ఐతే ఈ ఫ్రిజ్జూ, మిక్సి, కుక్కర్లు లేనే లేవు. అన్ని రోట్లో దంచుకోవడం, కుంపటి మీద వాడుకోవడం. ఈ మాత్రం దానికే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలా..’

‘అమ్మమ్మగారూ మీలా రోలూ, రోకళ్ళతో కష్టం పదకుండా ఉద్ధరిద్దమనేగా మేమంతా చదివి ఉద్యోగాలు చేస్తోంది. అయినా సంపాదన లో భాగం ఉన్నప్పుడు వంటగదిలో భాగస్వామ్యం వద్దా?’

అసలు మన ఆడవారి శీలపరీక్ష అంతా వంటగదిలోనే జరుగుతుంది. ఆవిడెవరో బాగా వంట చేసి వడ్డిస్తే చాలు. ఎంతటి క్రూరురాలైనా క్షమించేయచ్చు. పిల్లలను కొట్టినా, భర్త సంపాదన సరిపోవట్లేదని వేపుకుతిన్నా పర్లేదు. వంట చాలా బాగా చేసిపెడుతుంది. పెళ్లిలో క్వాలిఫై కావడానికి పొందవలసిన ప్రైమరీ డిగ్రీ! వంట సరిగ్గా రాని ఆడది కాదని కాదు కాని..ఆమెలో ఫెమినిటి పాలు తక్కువ! స్త్రీత్వ చాయలు తగ్గిపోతాయి..ఎండలో కి వెళితే రంగు తగ్గిపోయినట్లు. వంట రాకపోతే ఆడవారిలో ఆ స్త్రీత్వం దెబ్బతింటుంది—కొంచేమేలే!అయినా…

భర్త మనసులోకి దారి అతని కడుపేను. మరి భార్య మనసులోకి దారి? సారీ, ఈ విషయాలు మనకెవరూ చెప్పరు. అసలు తెలుసుకోవలసిన అవసరమేముంది. మగవాళ్ళ పెర్ఫార్మన్స్ ప్రెషర్ గురించి మనకెందుకు గాని ఆడవారి కిచెన్ పెర్ఫార్మన్స్ ప్రెషర్ ఏంటో తెలుసా మీకు- అందునా అత్తగారి తరఫు చుట్టలవారు వచ్చినప్పుడు?

ఇల్లు బాగా పెట్టుకుంది. వంట బాగా చేస్తుంది. మరి ఆమె వేరే పనులు కూడా చేస్తుంది. మీకు తెలుసా?

“తెలుసులేగానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అయినా ఫెమినిస్టు మాటలు బాగా నేర్చారు ఈ ఆడవాళ్ళు. వాళ్ళకేం తక్కువ. ఇంట్లోనే పనమ్మాయి, బంగారం లాంటి భర్తా..ముద్దులు మూటగట్టే పిల్లలు. ఇంకేంటి?”
“అయ్యయ్యో…ఇంకా ఉన్నాయి. ఆమెకో ఉద్యోగం ఉంది తెలుసా…ఆమె ఆఫీసులో ఎన్నో వ్యవహారాలూ యిట్టే పరిష్కరిస్తుంది. ‘ఆడవారు కబుర్లు చెప్పుకుంటారు గాని పనిచెయ్యరు అనే నానుడి’ ఆమెకు బాగా తెలుసు. అందుకే ఇంకాస్త ఎక్కువ కూడా పనిచేస్తుంది. మగవారిలా టీలకనీ సిగరెట్టుకనీ రెండు మూడుసార్లు బయటికెళ్ళదు. మొన్న సెమినార్ లో ఆమె ప్రెజెంట్ చేసిన పేపరుకి…”

“అవునా, మరిన్ని చేసినామెకి ఇల్లు చక్కపెట్టుకోవడం ఎందుకు రాదంటావు?”

“మరి మీ అబ్బాయికో..? అతనికెందుకు రాదు.”

“అయ్యో, చాలా పని చేస్తాడమ్మ…ఆమె టూర్ల మీద వెళ్ళినప్పుడు, పిల్లలని హోటల్ కు తీసుకెళతాడు. స్కూల్ లో దింపుతాడు. వాళ్ళమ్మ ఫ్రిజ్జిలో వండి పెట్టినది వేడి చేసి తినిపిస్తాడు. కానీ వంట కష్టమమ్మాయ్..మగవాళ్ళు కదా..పాపం చేసుకోలేరు!”

నిజమే చాలా మారారు మగవారు! పాపం.

ఇప్పుడు విమల చెప్పిన వంటింటి తనాన్ని గురించి మాట్లాడుకుందామా?  (‘వంటిల్లు’ కవిత; ఆంధ్రజ్యోతి’ 86)

చిన్నప్పటి జ్ఞాపకాల తరువాత ఆడతనాన్ని ఆపాదించుకునే వయసులో ముఖ్యంగా అందుకోవలసినది- వంటింటితనం!

భయం భయంగా, నిశబ్దంగా, నిరాశగా

మా అమ్మొక ప్రేతం లా తేలుతూ ఉంటుందిక్కడ

అసలు మా అమ్మే నడుస్తున్న వంటిగదిలా ఉంటుంది

నడుస్తున్న వంటగదిలా ఆడవాళ్ళు కనిపించడం మానేసి చాలాకాలమైంది అనవచ్చు. కాని ఆడవాళ్ళు ఒప్పుకోరు. చిన్నప్పుడు వారి అమ్మలు పడిన కష్టాల్లో మనం పడేవి కష్టాలే కావని చెప్పొచ్చునుగాక. వారికీ మనకీ తేడా ఉందని విషయం కూడా గుర్తిస్తే బావుండును. అదేదో మా మాస్టారు మమ్మల్ని కోదండం వేయించేవాడు, మిమ్మల్ని బెత్తంతో మాత్రమే కొడుతున్నారు అని చెప్పినట్లుగా…ఏంటో ఈ సామ్యం!

వంటగది మాత్రమే ఎదురుగా నిలబెట్టి స్త్రీల మెదడును ఎక్కడో ప్రాచీననా కాలాల్లో ఇరికించడానికి తీవ్రప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తమ మేధస్సు ఆచూకీ తెలీక స్త్రీలు నిజంగానే తెలియని అశాంతికి లోనవుతారు.  అందుకే అంటుంది –విమల

ఒక్కోసారి ఆమె మండుతున్న పొయ్యిలా ఉంటుంది

అప్పుడు బందీ అయినా పులిలా ఆమె

వంటగదిలో అశాంతిగా తిరుగుతూంటుంది

నిస్సహాయతతో గిన్నలు దడాల్నఎత్తేస్తుంది

ఇంటి ముందు నిలబడో, బిందెల దగ్గరో కొట్టుకునే ఆడవాళ్ళని చూసి అందరూ నవ్వుకోవడం లో బోల్డంత ‘జోకు’ ఉండొచ్చుగాక..కాని అంతకన్నా భావప్రకటన స్వేచ్చని ఇవ్వలేని పితృస్వామ్య వ్యవస్ధని ఏమనగలం. సరే, అది ఒక కాలం లో జరిగింది. ఇప్పుడు ఆడవాళ్లకా ప్రారబ్ధం లేదు. ఇంచుమించుగా మధ్యతరగతి ఆడవాళ్ళందరూ  చదువుకున్నవారు. వారిలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారి పరిస్ధితేంటి? విమల చెబుతున్నారిలా…

నేనొక మంచి వంటగదిలో పడ్డానన్నారందరూ

గ్యాసు, గ్రైండరూ, సిలిండరూ, టైల్సూ…

అమ్మలా గారెలూ, అరిసెలూ గాక

కేకులూ పుడ్డింగులూ చేస్తున్నాను నేను

గిన్నెల పై పేర్లు మాత్రం నా భర్తవే.

ఈ కవిత 1986 లో రాసింది. సరిగ్గా ముప్ఫైయేళ్ళ క్రితం. నిజంగానే ఇప్పుడేం మార్పు వచ్చింది. ఒక రొటీన్ లా ఎందరు భర్తలు వంటగదిలోకి  వెళ్లి వంటతో తమ రోజును మొదలు పెడతారు? ఒక రోజు ‘చేంజ్’ కోసమో, ఒక ‘స్పెషల్ డిష్’ కోసమో కాక ఒక బాధ్యతగా ఎప్పుడు ఫీల్ అవుతారు? వంటమనిషిని పెట్టుకోవచ్చు. అది ప్రివిలేజేడ్ భార్యకు వచ్చే కన్సొలేషన్ ప్రైజ్ మాత్రమే అని ఒప్పుకుంటారా…

పాపం ఆ అమ్మాయి అంటుంది గదా…

నేనొక అలంకరించిన వంటగదిలా

కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతుంటాను

నా వంటిల్లొక యంత్రసాలలా ఉంది

ఈ యంత్రసాల ఆమెను నెమ్మదిగా ఎలా మార్చేసిందంటే….ఆమె ‘మల్లెపూలలోనూ పోపువాసనలే!!’ ఇంతకన్నా భావ దారిద్ర్యం ఇక ఉందా…వంటగది వాసనలు పడకగది వరకూ చేరుతాయి!

కూరగాయలైపోయాయి. బిగ్ బాస్కెట్ వచ్చింది. వంటగది ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ అయిపోయింది. జీతం పెరిగాక కొందరు మహా అదృష్టవంతురాళ్ళకు వంటమ్మాయి కూడా దొరకొచ్చు. కానీ బాధ్యత మాత్రం- పూర్తిగా అమ్మదే. అంతేగదా అమ్మ కడుపు చూసి పెడుతుంది. మరి నాన్నేమి చేస్తాడు? నాన్న ఏమి చేసినా, అమ్మ కూడా చేయగలుగుతుంది. కాని నాన్నే పాపం. సొంతఇంటి వంటగదిలో వాలంటరీ వెలివేత తీసుకుంటాడు. అందులో ఉండే సుఖం ముందే తెలిసిన మహానుభావుడు!

శ్రమవిలువను కాల్కులేట్ చేయడంలో ఏమి తక్కువ లేదు. కాని దానికి మారకం ఏంటో తెలియడం లేదు. రోజుకు నాలుగైదు గంటల కూలి. ఆఫీసులో గంట బిల్లింగుకు వెయ్యిరూపాయిలు. మరింటిలో నాలుగు కూరలు. ఆకొన్న కుటుంబం కడుపు నింపిన తృప్తి. ఎంత సంపాదిస్తే వస్తుంది. అయ్యో… వంకల గురించీ, వెక్కిరింపుల గురించీ మాట్లాడకండి మరి.

కాదని ఎవరూ సవాలు చేయకండి. మీకు 103 డిగ్రీల జ్వరమున్న రోజున మీ భర్త తప్పక టీ పెట్టి ఇస్తారు. కొన్నిసార్లు, సూర్యుడు దారి తప్పినప్పుడో, ఆర్నాబ్ గోస్వామి నోరుమూసుకున్నప్పుడో….మీ భర్తని టీ పెట్టమనండి. ఏ కళనో టీ అందిస్తారు. ఆగండి- మరి మీరు టీ పొడి ఎక్కడుందో చెప్పారా..తిట్టుకోకండి. మరి పంచదార అనిపించకుండా పెడితే మీదే కదా తప్పు. పాలు. ఫ్రిజ్ లో ఉన్నాయని చెప్పొచ్చుకదా అంత విసుగెందుకు? కప్పులా.ఎదురుగా ఉన్నాయి కాని మీ ఆయనకీ ఆ టైం కి వంటగదిలో ఊపిరాడక కళ్ళు కనిపించడం మానేశాయి. విసుక్కుని లేస్తున్నారా..వంటగదిలోకి వచ్చి విసురుగా టీ కప్పు లాక్కున్నారా? తప్పుకదూ!

Art: Srujan Raj

Art: Srujan Raj

ఐతే వంటింటి సామ్రాజ్యానికి తాము మహారాణులమని ఇంట్లో ఏదైనా తమ కనుసైగల పైనే నడుస్తుందని భ్రమించే కొందరు ‘సూపర్ మామ్’ లు ఉంటారు. ఇలాంటి ‘కంట్రోల్ ఫ్రీక్ మామ్స్’ తో ఏం చెప్పినా చిక్కే! అన్నింటా తామే అయ్యే అడ్వర్టైస్మెంట్ అమ్మల్లా ఉందామనుకునే ఆడవారంటే జాలిపడాలి. ఆమెకు నడుమునొప్పి వస్తే కానీ ఎవరికీ, ఆఖరుకి  భర్తకు కూడా సాయం చేయాలని తోచదు. అది కూడా మూవ్ కాని విక్స్ కానీ రాసేవరకే. ఆమె బాగుపడగానే  మళ్ళీ ఆమె దారి –రహదారి- అదే వంటిటికి దారి.

మనదేశంలో వంటిల్లంటే వంటపనే కాదు. చాలాసార్లు ఆరోగ్యమూ, వ్యక్తిత్వము కూడా పెట్టుబడవుతాయి. కొన్నిసార్లు ఈ కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ లో ఆడవారు ఘోరమైన లాస్ లో పడతారు. కొన్నిసార్లు ఆరోగ్యం నష్టపోతే ఇంకోన్నిసార్లు వ్యక్తిత్వాన్ని కోల్పోయి. టైం బావుండకపోతే, కొన్నిసార్లు రెండూ తన్నేస్తాయి.

సూపెర్ మామ్ సిండ్రోమ్’- సుప్రభాతం, 20 జూన్, 1996, ఇల్లలకగానే– ఉదయం వారపత్రిక, 4 మే, 1990

సత్యవతిగారి ఈ రెండు కథలూ అదే చెబుతాయి. పైన చెప్పిన పరిస్ధితి ‘సుపర్ మామ్  సిండ్రోమ్’ లో ప్రస్తావిస్తే, ‘ఇల్లలకగానే’ కథలో ఇంటికే జీవితాన్నంతా ధారబోసిన ఆమె తన ఉనికి పూర్తిగా మర్చిపోయేంత ప్రమాదంలో పడుతుంది. కుటుంబం కొరకు సర్వమూ త్యాగం చేసే ఆడవారికి ఈ విషయం అర్ధమవుతుందా? ఆమె పేరే ఆమె వ్యక్తిత్వమైతే …ఆమె ఏది? భర్త పేరు లోనో, పిల్లలపేరులోనో, ఆ చివరింటి ఆవిడగానో ఆమె మిగిలి పోతుంది. పెళ్ళికి ముందు ఆమె చదివిన చదువులు, వాదించిన ఉపన్యాసాలూ, స్నేహితులూ…వీరంతా ఏరి. ఫన్ని విషయం ఏంటంటే- ఇల్లలికే ఈగ మాత్రమే తన పేరు మరచిపోతోంది అన్నారప్పుడు. ఇప్పుడు ఇల్లూ, ఉద్యోగమూ చక్కబెట్టే ఈగనేమనాలి? ఈగలనెప్పుడూ ఉద్యోగాలతో కొలవరు. కొలిచినా మన కుటుంబవ్యవస్ధలో దానికే గుర్తింపూ ఉండదు. ఆడవారి ఔన్నత్యాన్ని కొలవడానికి మొదటి మూడు స్థానాల్లో- కన్యత్వమూ, పాతివ్రత్యమూ, మాతృత్వమూ ఉంటాయి. కల్పనా చావ్లా, కిరణ్ బేడి, సునీత విలియమ్స్  ఇలాంటి వారింట్లో వారిని ఏమన్నారో తెలుసుకోవాలని మహా ఉబలాటంగా ఉంటుందెప్పుడూ…

చాలా చదువులు చదివాం కాని ఈ వంటింటి గోల మాత్రం తప్పట్లేదు. వంట మనుషులని పెట్టుకున్నంత మాత్రాన ఆడవారు వంటిల్లు తప్పించుకున్నరనుకోకూడదు. వంటింటి చాకిరీ నుంచి తెరపి ఉండొచ్చు కాని, నైతికంగా…అవును నైతికంగానే, వంటిల్లు, ఇంట్లో అందరికీ తిండి ఏర్పాటు చేసే బాధ్యత భార్యదే. చేయని భార్యలు లేరా అని అడగకండి. ఉన్నారు. వారిని గురించి ఎలా మాట్లాడతారో, వారికి అందే గౌరవం ఏంటో మనందరికీ తెలుసు. చాల చాలా తక్కువ సందర్భాలలో- భార్య ఉన్నతోద్యోగం చేస్తూ, వంటింటికీ ఆమెకే బాధ్యత లేదనుకునే కొన్ని ఉద్యోగాలలో ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు ఈ నైతిక శీలపరీక్ష నుంచి విడుదల. లేకపోతే ఈ పరీక్షకు ఏ పూటకు ఆ పూట సిద్ధపడుతూ ఉండవలసిందే.

సామాన్య కథ “ కల్పన” లో ఇదే చర్చకు వస్తుంది. “ ఎంత పెద్ద చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎంత టీం లీడర్ గా ఎదిగినా ఎక్కడుందీ లోపం ఒక చిన్న కుటుంబ వ్యవస్ధ ను మేనేజ్ చేయలేకపోతున్నాం. “ అని. నిజమే. ఈ మాట అంటే నాతో ఒక పెద్దావిడ అన్నది. “ఇప్పటి పిల్లలలకి తెలివి ఉండడం లేదు. భర్తను, అత్తగారింటి వారిని ఎలా తనవైపుకు తిప్పుకోవాలో తెలీదు.” బహుశా నిజమేనేమో..ప్రేమకన్నా లౌక్యం తోనే పెళ్ళిళ్ళు నిలబడతాయనిపిస్తుంది. మరి మన చదువుల్లో వంటింటి బాధ్యతా మరియు లౌక్యం అనే అంశాన్ని కూడా చేరిస్తే బావుండు.

మరిప్పటి పిల్లలకో? చైతన్య, నారాయణ, ఐఐటి, బిట్స్ పిలాని వీటిని దాటాక ప్రొఫెషనల్ కోర్సులు- తర్వాత ఉద్యోగమూ…తర్వాత పెళ్ళి. సరిసరి. ఇప్పుడుగదా మళ్ళీ వంటింటి గురించి మాట్లాడవలసింది. సామాన్య ‘కల్పన’ కథలో కల్పన చెబుతుంది. “ ఎంతెంత పెద్ద కార్పరేట్ ఆఫీసుల్లో, యునివర్సిటీల్లో పనిచేస్తున్నాం ఇప్పటి ఆడపిల్లలం. ఎంతమంది కస్టమర్స్ ని హాండిల్ చేస్తున్నాం. విదేశాలకు కూడా ఒంటరిగా వెళ్ళి వచ్చేస్తాం. టీం ని లీడ్ చేసేస్తాం. కాని కుటుంబం విషయం వచ్చేసరికి ఎక్కడో తప్పు జరిగిపోతుంది. మన తెలివంతా ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది. మన జనేరేషన్ ఆడపిల్లలం చదువు నుండి నేరుగా ఉద్యోగాల్లోకి, పెళ్ళిలోకీ వచ్చేస్తున్నాం కదా. తినడం తప్ప వంట నేర్చుకునే తీరిక కుడా ఉందని షెడ్యూల్స్ కదా మనవి.“  మరి తనను ఒకేసారి వంటగదికి పంపి అత్తగారు. తమాషా చూద్దామనుకుని బయటకు వచ్చేసారు. “ పాపం కల్పన చింతపండు వెయ్యని సాంబారు చేసిననదుకు పెద్ద రాద్ధాంతం చేసారు. అదేదో ప్రపంచ యుద్ధమైనట్టు.  ‘మమత’ కథలానే ‘కల్పన’ అత కూడా విస్తృతి ఎక్కువ. ప్రస్తుత చర్చ కోసం ఈ భాగాన్ని మాత్రమే ప్రస్తావించాను. కాని కథా మూలాలలోకి వెళితే ఎన్నో విషయాలు అర్ధమవుతాయి.

కామన్ గా వినే మాటేంటంటే…’మీరు వంట నేర్చుకోకపోతే మమ్మల్నంటారు.’ అమ్మ వైపు వాళ్ళంతా పెళ్ళికి ముందనే మాటలివి. ఎందుకంటారు? అబ్బాయి పుట్టింటివారిని ఎప్పుడైనా  అతని అత్తగారంటారా? మీరు మీ అబ్బాయికి వంటనేర్పలేదేమని?

అత్త- కోడలు మధ్య దెబ్బలాటలలో పెద్ద అంశం- వంటిల్లు ఎవరిదీ? అనీ. కోడలుకు పూర్తిగా బాధ్యత లేకపోతే అత్తకు ఇష్టం ఉండదు. అలా అని పూర్తి బాధ్యతా కోడలి మీద వేయలేదు. ఈ వంటింటి పవర్ డైనమిక్స్ చూస్తే దుఖ్ఖం వస్తుంది. కాని మన కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. ఇలాంటి ఆడవారి మధ్య ఇటువంటి చిల్లర గొడవల సృష్టించడం వలనే వలనే మన వ్యవస్థను కాపాడుకుంటున్నాము. ఈ గొడవలో వంటింటికి ఎవరు రాజీనామా చేసిన రాజకీయ కారణాలు వెతికినా అది సమాజానికి పెద్ద ముప్పే. ఎందుకంటే, పెళ్ళికాని మగవారికి కుటుంబమంటే ఒక వంటిల్లు కలిసిరావడం. ఆడవారికి కుటుంబమంటే వంటచేయడం. పిల్లలు పుట్టాక అడిషనల్ మార్పులు రావచ్చుగాని నిజం ఇదే. మారా వంటింటి వ్యవస్ధకే ఉసురు తగిలితే..అమ్మో, కాపురాలు కూలిపోతాయి.

శుభమా అని ఇంటిలో అందరి యోగక్షేమాలూ పట్టించుకునే దేవత లాంటి ఆడవారి హృదయాన్ని ఇలా విషపూరితం చేసే ధోరణిలో రాసే నాకు నిష్కృతి లేదు. తెలుసు. కానీ, ఈ వంటింటి పాతివ్రత్యాన్ని వదిలించుకోని ఆడవారికి ఎలా చెప్పాలి? కొత్తగా పెళ్లైన కోడలు అత్తగారింట్లో అందరి మనసుని అలరించడానికి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకూ…పుట్టింటి నుంచి తెచ్చిన జెమినీ టీ వాడుతూనే ఉంటారు. కాలం మారింది కదా మరి వంటింటి విషయమో? ష్..ఇన్ని విషయాలు మనం మాట్లాడకూడదు.

ఉపసంహారం:

“అరే, భలే ఇంత కాలానికి కలిసామే! రా టీ తాగుదాం.”

“ఓయ్, మీటింగ్ కి వచ్చావా…టీ నా, లేదురా పనుంది.”

“ఆడవారి హక్కుల గురించి భలే మాట్లాడావే. నువ్వెప్పుడు మాట్లాడినా చాలా నేర్చుకున్నానో  అనిపిస్తుంది.”

“హక్కులే కాదు, వారి సెక్సువాలిటి లిమిటేషన్స్ నుంచి బయట పడవలసిన అవసరం ఎంతో ఉంది. అసలు “ సెకండ్ సెక్స్” అనే పుస్తకం చదివావా నువ్వు? చదివితే మతిపోతుంది.”

“నీ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. నీలా అందరు మగవాళ్ళూ ఆలోచిస్తే ఎంత బావుంటుంది. ఇంటికి రా మాట్లాడుకుందాం.”

“ఆ..నీకే పిలుస్తావు. అసలు ఇన్నిసార్లు కలిసాం కదా. ఎన్నో ఏళ్లుగా పెళ్లాం పిల్లలు లేనివాన్ని. ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టవేమి.”

 

 

 *

 

 

 

 

 

అసమానతల్ని ఇంకా అర్థం చేసుకోవాలి:ఓల్గా

జనవరి 10 న అజో విభో వారి ప్రతిభా మూర్తి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..ఓల్గా తో ప్రత్యేక ముఖాముఖి

 వి. ప్రతిమ

~

 

స్త్రీవాద రాజకీయోద్యమాన్ని నిర్మించాలన్న ఆలోచనే ఆమె బలమూ బలహీనతా కూడ. రచయితగా, కార్యకర్తగా, నాయకురాలిగా, నిరంతర చలనశీలిగా ఆమెచేసిన అలుపెరగని పోరాటం తెలుగు  సాహిత్య ప్రపంచానికి చిరపరిచితం. స్పష్టమైన అవగాహనతో, నిశితమైన ప్రాపంచిక దృక్పథంతో, స్త్రీజన విముక్తి కోసం రచనను ఒక రాజకీయ చర్యగా, కార్యాచరణగా భావించి సుదీర్ఘమైన ప్రయాణం సాగించిన ఓల్గాకి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కార సత్కారం జరుగుతోన్న శుభ సందర్భంలో ఆమెతో ఒక సన్నిహిత సంభాషణ.

 

 1. ఓల్గా రష్యాలో ఒక నదిపేరు కదా? మీకా పేరెలా వచ్చింది?

జ. వ్యక్తిగతం రాజకీయం కలగలిసిన జీవితం నాది. నా కలం  పేరు ఓల్గా అవటానికి కూడా వ్యక్తిగత, రాజకీయ కారణాలున్నాయి. ఓల్గా మా అక్కయ్య అసలు  పేరు. నాకంటే నాలుగేళ్ళు పెద్దది. మా నాన్నగారు ఆమెకా పేరు పెట్టారు. కారణం మా నాన్న కమ్యూనిస్టు కావటం. మా అక్క పుట్టినపుడు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నెదిరించి సోవియట్‌ యూనియన్‌లో వీరోచిత పోరాటం జరిపిన ‘ఓల్గా’ అనే రెడ్‌గార్డ్‌ మరణించిందనే వార్త వార్తా పత్రికల్లో రావటంతో మా నాన్న ఆమె జ్ఞాపకంగా మా అక్కకు ఆ పేరు పెట్టారు. మా అక్క నా పదహారో ఏట మరణించింది. అది మా కుటుంబానికి కోలుకోలేని విషాదం. నేను అప్పుడప్పుడే కవితలు  రాస్తున్నాను. మా అక్కయ్య కూడా కవిత్వం రాసేది. ఇద్దరం ఆ కవితలు  చదువుకుని ఆనందపడేవాళ్ళం. బతికివుంటే మా అక్క మంచి రచయిత్రి అయ్యేది. ఆ అక్కను రచయిత్రిగా బతికించాలనే ఆశతో నేను ఆమె పేరును కలం  పేరుగా చేసుకున్నాను. మా నాన్న రాజకీయ కారణంతో పెట్టిన పేరు వ్యక్తిగత కారణం చేత నా కలం  పేరయింది. ‘‘వ్యక్తిగతం కూడా రాజకీయమే’’ అన్నమాట నా కలం  పేరులో కూడా నిజమయింది.

 1. మీ పుట్టుక, బాల్యం , మీ నాన్నగారి గురించి చెప్పండి… ఆనాటికే స్త్రీవిద్య ప్రాముఖ్యతని గుర్తించి మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారనీ, స్వేచ్ఛ నిచ్చారనీ విన్నాను…

జ. నేను 1950వ సంవత్సరంలో నవంబర్‌ 27న పుట్టాను. మాది గుంటూరు దగ్గర యడ్లపాడు గ్రామం.. నాకు ఊహ వచ్చినప్పటి నుండీ గుంటూరులో పెరిగాను.  St. Joseph’s School లో 12వ తరగతి వరకు చదివి ఎ.సి. కాలేజీలో బి.ఎ. చదివాను.  ఎం.ఎ. పిజీ. సెంటర్   గుంటూరులోనే చదివాను. 1972 లో ఎం.ఎ. పూర్తి అయింది. 1973లో తెనాలి వి.యస్‌.ఆర్‌ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి 1985 వరకూ పనిచేశాను. మా నాన్నగారి గురించి ఎంత చెప్పినా నాకు తృప్తి కలగదు. అమ్మని గురించి కూడా. మా నాన్న  కమ్యూనిస్టుగా మంచి విలువలు  నేర్చు కున్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి దూరమైనా కూడా జీవితాంతం ఆ విలువలను  పాటించారు. ఆ విలువలను  సాహిత్యరూపంలో ఎక్కువగా ఆయన నేర్చుకున్నారు అనిపిస్తుంది. మాకు కూడా ఆ సాహిత్యాన్ని, ఆ విలువలను  అందించారు. మేం సాహిత్య ప్రేమికులమవుతుంటే మనసారా ఆనందించారు . పిల్లలందరికీ  మంచి చదువు అందించాలనే తాను యడ్లపాడులో కట్టించిన హైస్కూలు ను, అక్కడ సర్పంచ్‌గా పనిచేసి ప్రజలతో పెంచుకున్న అనుబంధాన్ని ఒదులుకుని గుంటూరు వచ్చి మంచి స్కూళ్ళలో చేర్పించారు. మా నాన్న మాకు నాన్నగా, స్నేహితుడిగా, గురువుగా జీవితం గురించి ఎన్నో కోణాలను అర్థం చేయించారు. ఎన్నడూ మందలింపులైనా ఉండేవి కావు. నీతి బోధలు  అసలే లేవు. ఆట పాటలు, సంగీత సాహిత్యాలు , సినిమాలు , విహార యాత్రలు  స్నేహ పరిమళాలు  ` వీటితో నా బాల్యాన్ని నింపింది మా అమ్మా నాన్నలే. నాకు చాలామందికి లాగా పల్లెటూరి బాల్యం  లేదు. పల్లెటూరి జీవితం పెద్దయ్యాక దూరం నుంచి తప్ప దగ్గరగా తెలియదు. అది ఒక రకంగా లోటయినా, నా ఎదుగుదలకు అది తోడ్పడింది. .

స్వేచ్ఛ ఇచ్చారనీ, విద్య ప్రాముఖ్యం గుర్తించారనీ నాకు మొదట్లో తెలియదు. పదో తరగతిలో అగ్ర వర్ణాలకు, అగ్ర వర్గాలకు చెందిన నా స్నేహితులు , నాతోపాటు చదువుకునే వాళ్ళు పెళ్ళి చేసుకుని చదువు మానేస్తుంటే నాకు భయం వేసి మా నాన్నతో చెబితే ఆయన స్త్రీలు  చదివి ఉద్యోగం చేస్తూ అప్పుడు మాత్రమే పెళ్ళాడాలని, మన పాత సంప్రదాయాలను ఒదిలేయాలని తనకు తోచినట్లు చెప్పి మంచి పుస్తకాలు  నా చేతికిచ్చేవాడు. మా నాన్న చదివింది పదో తరగతే` కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద డాక్టర్లు, ఉన్నతోద్యోగులు  కూడా పిల్లలకు  పదో తరగతిలో పన్నెండో తరగతిలో పెళ్ళి చేసేవారు. చదువు, డిగ్రీలు  వేరు, జ్ఞానం, చైతన్యం వేరు అని తెలిసి మా నాన్నను చూసి గర్వపడేదాన్ని. చదువు విషయమే కాదు. అప్పటికి గుంటూరులో దాదాపు మూడువేల మంది అమ్మాయిలు  కాలేజీ చదువులో ఉన్నారు. కానీ పట్టుమని పదిమందికి కూడా సమాజ పరిజ్ఞానం లేదు. రాజకీయ పరిజ్ఞానం లేదు. కాలేజీ పుస్తకాలు  తప్ప ఇతర పుస్తకాు చదివితే చెడిపోతారనే   కుటుంబ వాతావరణంలోనే ఉండేవారు. అలాంటి రోజుల్లో తన రాజకీయ నేపథ్యం వల్లనే  కావొచ్చు నా రాజకీయ ఆసక్తుల ను కూడా ప్రోత్సహించారు.

నేను విశాఖ ఉక్కు ఉద్యమం రోజు నుండీ వామపక్ష రాజకీయాల  పట్ల ఆసక్తిని పెంచుకున్నాను. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేయటం మొదలు పెట్టాను. అప్పటినుంచి ఫెమినిస్టు రాజకీయాల వరకు సాగిన నా రాజకీయ జీవితాన్ని మా నాన్న అర్థం చేసుకుని ప్రోత్సహించారు. నా ఫెమినిస్టు భావాల ప్రచారంతో ఆయన కూడా మారారు. డెబ్భై ఏళ్ళ వయసులో ఇంటి పనులలో తనవంతు పనులు  చేయటం మొదలుపెట్టారు. నిజంగా ప్రజాస్వామిక విలువలను  నమ్మిన మనిషి.

 1. మీ చదువు?…. చిన్నప్పుడే మీకు వామపక్ష భావాల పట్ల ఆసక్తి ఎలా ఏర్పడింది. అందుకు దోహదం చేసిన పరిస్థితులేమిటి?

జ. చిన్నప్పటి నుంచీ చదివిన సాహిత్యం ప్రధాన కారణం. పది పన్నెండేళ్ళ వయసులోనే రష్యా అనువాద సాహిత్యం చాలా చదివాను. శ్రీశ్రీ మహా ప్రస్థానం చదివాను. అదంతా అర్థం కాకపోయినా వామపక్ష భావాల పట్ల ఆసక్తి కలగటానికి కారణమయ్యాయి. నేను 12వ తరగతికి వచ్చేసరికి. S.F.I. చాలా చురుగ్గా పనిచేస్తోంది. ముఖ్యంగా గుంటూరులో చాలా మంచి విద్యార్థులుండేవారు. సమస్యలపై కదిలి సమ్మెలు, ప్రదర్శనలు చేసేవారు. ఆ విద్యార్థి నాయకులలో డా॥ చాగంటి భాస్కరరావు, డా॥ మల్లికార్జునుడు (శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్నారు. పోలీసులు  వారిని తూటాలతో కాల్చి చంపారు) వంటి వాళ్ళు వై.కె. వంటి నాయకులు  ఉండేవారు. అందరూ నక్జల్బార్  ప్రభావానికి లోనయ్యారు. అందరితోపాటు నేనూ ‘‘వసంతకాల మేఘ గర్జన’’ పిలుపుకు స్పందించాను. ఆనాటి రాజకీయ వాతావరణం అలాంటిది. సాహిత్యంలో కూడా దిగంబర కవుల ధిక్కార స్వరం అంతకు ముందటి కవుల కంటే భిన్నంగా వినిపించారు. గుంటూరులో నేనూ, దేవిప్రియ, సుగమ్‌ బాబు, కిరణ్‌బాబు, కమలాకాంత్‌ కలిసి పైగంబర కవులు  అనే పేరుతో కవిత్వం రాయటం మొదుపెట్టి రెండు సంకలనాలు  ప్రచురించాం. శ్రీశ్రీ షష్టిపూర్తి సభ విశాఖలో జరుగుతోందని తెలిసి నేనూ ప్రయాణ మయ్యాను. అక్కడి విద్యార్థుల కరపత్రాన్ని వేడి వేడిగా అందుకుని చదివాను. ఇంతలో విరసం ఏర్పడటం ` నిజంగా 67 నుంచి 70 వరకూ ఆ మూడు సంవత్సరాలు  చైతన్యంతో వెలిగిన సంవత్సరాలు.

 1. స్త్రీల జీవితాలలో తమకు తెలీకుండానే తమ మీద అమలవుతోన్న పెత్తనాలను మీరే క్రమంలో గుర్తించారు? ఉద్యమరూపంలో దాన్ని ఎదుర్కోవాలన్న చైతన్యం ఎలా కలిగింది?

జ. స్త్రీల మీద  పెత్తనం మనకు రోజు వారీ జీవితంలో అర్థమవుతూనే ఉంటుంది. మా ఇంట్లో వాతావరణంలో ఆ పెత్తనం లేదు గానీ నా చుట్టూ సమాజంలో అసమానత్వం ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతూనే ఉండేది. దానిపట్ల నాకు కోపం వస్తూనే ఉండేది. దానికి తోడు చలం  రచనలు  స్త్రీల  అణచివేత ఎంత భయంకరంగా ఉందో చెబుతుండేవి. చలం , కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం, గురజాడ కన్యాశుల్కం  నాటకం వీటన్నిటి ప్రభావం వల్ల  స్త్రీల  అణచివేత మీద నాకొక స్పష్టమైన అవగాహన ఉంది. వామపక్ష ఉద్యమాల  ద్వారా స్త్రీ పురుష సమానత్వం సాధించవచ్చనుకున్నాను. కానీ ఉద్యమాలలో కూడా పురుషాధిక్యత ఉండటం గమనించి నిరాశ చెందాను.

 1. 1970లో విరసం ఏర్పడి తొలి మహా సభలు జరిగినప్పుడే మీరు హాజరయ్యారని విన్నాను. అప్పటి మీ అనుభవాలేమిటి? ఆ తర్వాత విరసానికి ఎందుకు దూరమయ్యారు? జనసాహితి లోనూ ఇమడలేక పోయారు మీ కభ్యంతరం లేకపోతే చెప్పండి?

జ. శ్రీశ్రీ షష్టిపూర్తి సభ నుంచీ ఏదో జరుగుతుందని నమ్మకం కలిగింది. విరసం ఏర్పడగానే చాలా సంతోషించాను. ఖమ్మంలో జరిగిన మొదటి మహా సభకు వెళ్ళి మహా మహులందరినీ కలిసి, వాళ్ళతో గొంతు కలిపి నినాదాలిచ్చి ఊరేగింపులో పాల్గొనటం మర్చిపోలేని అనుభవం. అప్పుడు అందరిలో ఒకే భావన. విప్లవం వర్థిల్లాలి. సభ్యురాలినవుతానని శ్రీశ్రీ గారికి ఉత్తరం రాస్తే ఆయనిచ్చిన జవాబు పదిలంగా  ఇప్పటికీ దాచుకున్నా. విరసం సభ్యురాలిగా పని చేశా. విరసంలోంచి బైటికి రావటానికి రాజకీయ కారణాలు  ముఖ్యంగా పనిచేశాయి. విప్లవ పార్టీలో ఏర్పడిన గ్రూపు ప్రజా సంఘాలను కూడా చీల్చాయి. చాలా అనవసరం ప్రజా సంఘా చీలికలు . ‘అది తర్వాత తర్వాత అర్థమయింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారి నాయకత్వంలోని సిద్ధాంతాలతో ఏకీభవించి పనిచేసేదాన్ని. విరసం చారు మజుందార్‌, కొండపల్లి సీతారామయ్యగార్ల నాయకత్వంలోని సిద్ధాంతాల ప్రచారం చేస్తున్నట్లు మాకనిపించేది. వాటిమీద చర్చలు  జరిగేవి. నిజానికి రచయితల సంఘం ఒక పార్టీ సిద్ధాంతాకు కట్టుబడి పనిచేయటం కుదిరే పనికాదు. సృజనాత్మకతకు   ఏదో ఒక సంకెల  వేసినట్లే ఉంటుంది. కానీ విద్యార్థి సంఘాలు , రచయిత సంఘాలు , పౌరహక్కు సంఘాలు  అన్నీ గ్రూపుల  వారీగా చీలిపోయాయి. ఆ నేపథ్యంలో నేను జన సాహితిలో చేరాను. కానీ అక్కడ కూడ సాహిత్య విషయాలలో రాజకీయ జోక్యం తప్పలేదు. చలం  గారు మరణించినపుడు మేము రచయితలుగా చేసిన తీర్మానం పట్ల పార్టీ వాళ్ళకు అభ్యంతరాలు . విమర్శలు , చలం  సాహిత్య విషయంలో వాళ్ళ అభిప్రాయాలు  వేరు. అక్కడ మొదలై చాలా విషయాలలో విభేదాలొచ్చాయి. ఈ మొత్తం క్రమంతో పురుషాధిపత్యం కూడా నాకు అనుభవమయింది. అసలు  ‘‘పురుషాధిపత్యం’’ అనే మాటనే అప్పట్లో ఒప్పుకునేవారు. స్త్రీల  సమస్యలు అణచివేత వీటి గురించి మాట్లాడితే ఉద్యమాల ను పక్కదారి పట్టించటమనీ, విప్లవం విజయవంత మైతే స్త్రీ పురుష సమానత్వం వస్తుందని నమ్మ మనేవారు. అది నేను నమ్మలేకపోయిను. సోవియట్‌ యూనియన్‌, చైనాలో విప్లవం వచ్చి దశాబ్దాు గడిచినా స్త్రీ పురుష సమానత్వం రాలేదని తెలుస్తూనే  ఉంది. వీటి గురించి చర్చించు కోవచ్చు. అభిప్రాయ బేధాలతోనే పనిచేయవచ్చు. కానీ వామపక్ష పార్టీలలో సంఘాలలో ఉన్న ఒక ప్రత్యేక క్షణమేమిటంటే నాయకత్వం చెప్పిన మాటతో విబేధిస్తే ఇక వారిని చాలా పరాయి వాళ్ళుగా చూస్తారు. దాదాపు వెలివేస్తారు. సంఘాలకు బైట సంప్రదాయివాదులతోనైనా స్నేహంగా ఉంటారు గానీ వీళ్ళను శత్రువుల్లా చూస్తారు. వారి వెనుక గ్రూపు కడతారు. వ్యతిరేక ప్రచారాలు  నడుపుతారు. చివరికి వారు ఆ సంఘంలో ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. వెళ్ళిపోతారనుకున్నపుడు బహిష్కరించా మంటారు. రాజీనామా చేశామని వీళ్ళు, బహిష్కరించామని వాళ్ళు. పులి మేక ఆటలా సాగుతుంది. ఇంతా చేసి అవి విప్లవాన్ని అడ్డుకునేంత పెద్ద విబేధాలు  కూడా అయి ఉండవు. ఒక ప్రజాస్వామిక వాతావరణం లేకపోవటమే అనేకమంది రచయితలు  ఆ సంఘాల లోంచి బైటికి రావటానికి కారణం.

 1. ఆ రాజకీయం, సాహిత్య ఉద్యమాలోంచి స్త్రీ రచయితగా పరిణామం చెందే క్రమంలో మీరు ఎదుర్కున్న సంఘర్షణ, బాధ, రాజకీయ ప్రశ్నలు చివరగా సంతృప్తి వీటి గురించి ఏదయినా చెప్పగలరా?

జ. స్త్రీల  అణచివేత గురించి అధ్యయనం చేసే క్రమంలో నాకు చాలా తృప్తి కలిగింది. ఆయా సంఘాల నుంచి బైటికి వచ్చినపుడు నేను ఒంటరిని. స్త్రీ వాదమంటూ ఒక సమూహం లేదు. ఒంటరిగానే బయలుదేరాను. ఆ ఒంటరితనంలో కొంతకాలం  బాధపడటం సహజమే. కానీ స్త్రీవాద రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయం నాకు చాలా బలాన్నిచ్చింది. అధ్యయనం, రచన, ఉపన్యాసాలు  వీటిని  సాధనాలుగా చేసుకున్నాను. స్త్రీ శక్తి సంఘటన (హైదరాబాద్‌) వారితో పరిచయం నాకు మరింత బలాన్నిచ్చింది. ‘‘అతడు ` ఆమె ` మనం’’ రచనతో మొదలయింది ఆ దిశగా నా ప్రయాణం. అంత వరకూ నేను రచనను సీరియస్‌గా తీసుకోలేదు. నా ముందు తరం రచయితలు  రాస్తున్నారు గదా, నేను మిగిలిన పనులు చేద్దాం అని కార్యకర్తగానే పనిచేస్తూ వచ్చాను. స్త్రీవాద ఉద్యమం నిర్మించాలంటే రచనలు  చాలా అవసరం. నేనే రచయితను,  కార్యకర్తను, నాయకురాలిని కావలిసివచ్చింది ఆ రోజుల్లో.

1985 లో హైదరాబాద్‌ వచ్చాక ఆ పరిస్థితి పోయింది. వరసగా నా నవలలు, సాహిత్య విమర్శ, సిద్ధాంత వ్యాసాలు, అనువాదాలు  రావటంతో ఒక చర్చ మొదలవటం. నా భావాలతో ఏకీభవించే వారితో స్నేహం. అన్వేషి బృందంతో, H.B.T.తో కలిసి పనిచేయటం వీటన్నిటితో చాలా బలం  వచ్చింది. ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ మూడేళ్ళపాటు నడిపాము. ప్రతినెలా ఆ సమావేశం, స్త్రీవాదం గురించి ఉపన్యాసాలు . వాటిని పుస్తకాలు గా తేవటం ఈ పనులన్నీ చేయటానికి అంత శక్తి ఎలా వచ్చిందో ఇప్పుడు తలచుకుంటే  ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా ప్రతివారం తెలంగాణాలో ఏదో ఒక పట్టణంలో స్త్రీవాదం గురించి ఉపన్యాసాలు  ఏర్పాటు చేసి నన్ను పిలిచేవారు. తెలంగాణా  అంతా తిరిగాను. స్త్రీవాదం పై ఉన్న భ్రమను, అపోహలను, అపార్థాలను తొగించి ఒక సగౌరవ స్థానాన్ని కల్పించటంలో నా వంతు కృషి నేను చేశాను.

 1. స్త్రీల శరీరాల చుట్టూ అల్లుకుపోయిన అనేకానేక భ్రమలనీ, పితృస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ మీరు రాసిన రాజకీయ కథలు  తెలుగు  సాహిత్యరంగంలో ఒక గొప్ప మలుపు …. ఆ నేపథ్యం చెప్పండి?

జ. రాజకీయ కథల నేపథ్యం ప్రత్యేకంగా ఏమీలేదు. స్త్రీల  శరీరాల గురించి ఎన్నో తరాలుగా  పోగుపడి వున్న మిత్‌ను బద్దలు  కొట్టి శరీర రాజకీయాలను అర్థం చేసుకునే క్రమంలో రాసినవి. ఆ కాలం లో (85 నుంచి  90) ఆ కథలు రాయటం నాకు కష్టమే అయింది. కానీ ఆ పనిలో విజయం సాధించాను.

 1. తెలుగు సాహిత్యంలో పూర్వ రచయితలంతా అప్పటిదాకా స్త్రీలంటే శరీరాలుగా మాత్రమే చూసినా లేని అభ్యంతరం తమ శరీరాల  గురించి, శరీర ధర్మాల  గురించీ స్త్రీలు  మాట్లాడ్డం మొదలు పెట్టాక వారి కవిత్వం, నీలి కవిత్వమంటూ తీవ్రమైన దాడి జరిగింది కదా? ఆ విమర్శల్ని స్త్రీవాదులెలా అధిగమించగలిగారు?

జ. ఔను ` స్త్రీల శరీరాలు  వర్ణనీయ వస్తువు కవులకు. వర్ణనీయ వస్తువే తిరగబడి తనను తానే కొత్తగా నిర్వచించుకుంటాననే సరికి భయపడ్డారు. అందులో కవయిత్రులు  ఎంతో పదునుగా కవిత్వం తొణికిస లాడేలా రాశారు. అప్పటిదాకా వచనరచనకే పరిమిత మయ్యారు, కవితా రంగమంతా తమదే అని ధీమాగా ఉన్న కవుల పీఠాలు  కదిలాయి. అభద్రతతో దాడికి దిగారు. ఆ సమయంలో ‘అస్మిత’ చొరవ తీసుకుని రచయిత్రుందరినీ 1992 అక్టోబర్‌ 2న హైదరాబాద్‌లో సమావేశ పరచి రెండు రోజుల  సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో స్త్రీలు  ఎన్నో విషయాలు  చర్చించుకున్నారు.  అదొక చరిత్రాత్మక సమావేశం. భాష, వస్తువు, స్త్రీ పురుష భావ వ్యక్తీకరణలో భిన్నత్వం, దానికి సామాజిక అంగీకారం సాధించడం ఇలా ఎన్నో విషయాలు  మాట్లాడుకున్నారు. మా చర్చ సారాంశాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి పత్రికల కు విడుదల  చేశాం. ఒక సంవత్సరంలో స్త్రీవాద కవిత్వం సంకలనంగా తేవానుకున్నాం. 1993 అక్టోబర్‌ 3న ‘‘నీలిమేఘాలు ’’ నా సంపాదకత్వంలో వెలువడింది.  రావు బాలసరస్వతి గారు ఆవిష్కరించారు. ఆ సంకలనం ఈ శతాబ్దంలో వచ్చిన రెండవ ఉత్తమ కవితా సంకలనమని చేకూరి రామారావు గారి లాంటి విమర్శకులు  గుర్తించారు. అదంతా తల్చుకుంటే ఇప్పుడు కూడా చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. ‘‘నీలిమేఘాలు ’’ కవితా సంకలనం తర్వాత స్త్రీ వాద కవిత్వానికి ఒక ఆమోదం దొరికింది సాహిత్య ప్రవచనంలోనూ, సమాజంలోను. ఆ కీలక పాత్రను ‘నీలిమేఘాలు ’ నిర్వహించింది.

9.‘స్వేచ్ఛ’ నవల వెలువడి  బహుమతి పొందినప్పు డయితే మీ మీద వ్యక్తిగతమైన దాడి జరిగింది… కొత్త తరం స్త్రీవాదులకీ, కొత్తతరం పాఠకులకీ విషయాలు  తెలిస్తే బావుంటుందనుకుంటే చెప్పండి?

జ.‘స్వేచ్ఛ’ నవల  స్త్రీల  పౌరసత్వాన్ని చర్చకు పెట్టిన మొదటి నవల . దాదాపు సంవత్సరం పాటు, ఇంకా ఎక్కువగానో రాష్ట్రంలో ప్రతి పట్టణంలో చర్చావేదికల్లో చర్చనీయాంశమైంది. అది చాలా మేలు  చేసింది. చర్చలో అనేక విషయాలు  స్పష్టమయ్యాయి. ఇక వ్యక్తిగతమైన దాడి అంటారా ` అసూయతో  ఒకరిద్దరు చేసిన చిల్లర పని. దానిని పట్టించుకోలేదు. దానివలన నా బలం  ఏమిటో, ధైర్య సాహసాలెలాంటివో నాకూ, నా చుట్టూ వారికి తెలిసి వచ్చింది. అలాగే నాకు చాలా మంచి మిత్రులు  దొరికారు. తప్ప, తాలు  లాంటి వాళ్ళు ఎగరిపోయి జీవితం ప్రశాంతమయింది. ఆ రోజుల్లో అదొక సంచలనం. రచయిత్రులు  లోక రీతికి భిన్నంగా జీవించినపుడు రాసినపుడు ఇలాంటివి తప్పవేమో. లలితాంబిక అంతర్జనం, రాజ్యలక్ష్మి వంటి మళయాళ రచయిత్రుల  జీవితాలు తెలుసుకున్నపుడు నే ఎదుర్కొన్న సంఘటన చాలా చిన్నదనిపించింది.

10.‘స్వేచ్ఛ అన్నది ఒక కఠోరమైన బాధ్యత’ అంటారు మీరు. ఆ బాధ్యత పట్ల స్త్రీలను చైతన్యవంతం  చేయడం కోసమే మీరు సాహిత్య రచన చేపట్టారు. మరి ఈ చిరంతన దీక్షలో, తపస్సులో మీరు కృతకృత్యులయ్యారనే అనుకుంటున్నారా?

జ.స్వేచ్ఛ గురించిన ఆలోచన, ఆచరణ సమాజంలో నిరంతరం సాగుతూనే ఉంటుంది. స్వేచ్ఛ తన సరిహద్దును విస్తరించుకుంటూ పోతూనే వుంటుంది. దానికి నిరంతర చైతన్య స్రవంతి వంటి సాహిత్యం అవసరం. దానిని ఏ కాలంలో ఆ కాలానికి తగినట్లు రాసే రచయితలు  వస్తూనే ఉంటారు. ఆ ప్రవాహంలో నేనూ ఒక బిందువును అంతే. కృతకృత్యు లవటం అనేది చిన్న చిన్న పనుల  గురించి చెప్పుకోవచ్చేమో గాని ‘స్వేచ్ఛ’ వంటి భావన కుదరదు. కొత్త అణచివేతను గుర్తిస్తూ దానినుంచి సేచ్ఛ పొందే మార్గాన్వేషణ నిరంతరం చేయాల్సిందే.  ఆ విషయాన్ని నేనా వ్యాసంలో చెప్పాను. ఆ తర్వాత 1992లో రచయితు స్త్రీ వాద కవిత్వం మీద దాడిచేసి ఆ కవయిత్రులను నియంత్రించాలని చూశారు. అప్పుడు అందరం కలిసి ఆ దాడిని ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 1997 ` 98 నుంచి పదకొండు భారతీయ భాషలలో రచయిత్రులతో సమావేశాలు  ఏర్పాటు చేసి వారిపై అమయ్యే సామాజిక, కుటుంబ, స్వీయ నియంత్రణ గురించి వర్క్‌షాపులను నిర్వహించాం. ఎన్నో విషయాలు  ఆ రచయిత్రులు  మాతో పంచుకున్నారు. వాటి సారాంశాన్ని పుస్తకాలుగా ఆంగ్లంలో ప్రచురించాం. తెలుగు లో  ‘అక్షర యుద్ధాలు ’ అనే పేరుతో మంచి పుస్తకం అనువాదం చేశాను. అది పై వర్కుషాపు సారాంశమే. దీన్నుంచి రచయిత్రులు  నేర్చుకోడానికి ఎంతైనా వుంది. అనేక కంట్రోళ్ల నుంచి మనం రచయిత్రులం  స్వేచ్ఛ పొందాల్సి వుంది. ముఖ్యంగా మన సహ రచయితల  దాడునుంచి, గురుత్వాల  నుంచి! గురుత్వం అంటే మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు, మన రచనలని సరిదిద్దుతున్నట్లు, మనల్ని మరింత మెరుగైన రచయిత్రులుగా తీర్చిదిద్దుతామంటూ వచ్చే వారినుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. వారి ప్రోత్సాహంతో ఒక కంట్రోలు  వుంటుంది. మనకి తెలిసే లోపలే మనం వారి ఆధిపత్యంలోకి వెళ్తాం. మనదైన స్వరం మనకి లేకుండా పోతుంది. దీని గురించి గుజరాతీ రచయిత్రి ‘సరూప్‌ధ్రువ్‌’ చెప్పిన విషయాలు  అందరూ తెలుసుకోవాల్సినవి. ఇలా రకరకాల  సెన్సార్‌ షిప్‌లకు మనం తెలిసీ తెలియక కూడా గురవుతూంటాం. అందుకే ఈ విషయం మీద శ్రద్ధపెట్టి దాదాపు అయిదేళ్ళు పనిచేశాను.

 1. స్త్రీల అస్తిత్వ మూలాలను వెతుక్కుంటూ చైతన్యవంతమై, శక్తివంతంగా నిటారుగా నడిచే క్రమంలో మార్కెట్టు సమాజాన్ని కబళించి, వారిని సరుకుగా మార్చివేసింది. డెబ్భయ్యయిదు శాతం నిచ్చెన ఎక్కాక  పాము నోట్లో పడ్డట్టయింది కదా… మరి ఈ సందర్భాన్ని ఎలా అధిగమించాలి. ?

జ. మార్కెట్‌ ఇవాళ వెయ్యితలల  రాక్షసిలా మారింది గానీ ఎప్పుడూ ఉంటూనే ఉంది. దాని గురించి సాహిత్యం కూడా వస్తూనే ఉంది. ‘సరుకు ఆరాధన’ మార్క్స్‌ మాటే` అది ప్రపంచీకరణ నేపథ్యంలో మరింత అమానుషమైంది. రచయితలుగా మనం ఆ అమానుషత్వాన్ని విప్పి చెబుతూ మానవీయ విలువలను  ప్రతిపాదిస్తూ రచనలను చేయటమే.

 1. పురాణాలను, ముఖ్యంగా రామాయణంలోని కొన్ని సందర్భాలను మన పూర్వ రచయితలు తిరగరాసి పాఠకులకో కొత్త దృష్టినిచ్చారు. మీరు యింకా ముందుకెళ్ళి అందులోని స్త్రీ పాత్రలను ఈ కాలపు సందర్భాలకు తగినట్లుగా మలచి ‘విముక్త’ని అందించారు కదా? అప్పటివరకూ ప్రజల జీవితా లలో కలగలిసి, జీర్ణించుకుపోయిన ఇతిహాసాల్లోన్ని వాదానికి ప్రతివాదం చేయాన్న ఆలోచన ఎలా కలిగింది? సాహసం కదా?

జ. పురాణాలను తిరగరాసే పని త్రిపురనేని రామస్వామి చౌదరి గారే మొదలు పెట్టారు. చలం , కొ.కు వంటి వారు ఆ దారిలో నడిచారు. సాహసం నాది కాదు, వాళ్ళది. ఐతే నా మార్గం భిన్నం. అందువల్లనే ఆ కథలకు ఎంతో ఆమోదం దొరికింది. నాకెంతో తృప్తి కలిగింది. స్త్రీల మధ్య పరస్పర సహకారం నాకు ప్రియమైన భావన. దానిని ‘విముక్త’ కథలో చాలా సమర్థవంతంగా నిర్వహించాననే అనుకుంటున్నా.  ‘పురాణాలోని పాత్రలను ఎగతాళి చేయటం, కించపరచటం కాకుండా వారి జీవితగమనంలోని ఆటుపోట్లని, పరస్పర మానవ సంబంధాలలోని ఆ కాలపు విలువలను  గమనంలో ఉంచుకుని రాయటం వల్ల  నేనాశించిన ప్రయోజనం నెర వేరింది.

 1. సహజంగానే పునరుత్పత్తి శక్తి కలిగిన స్త్రీ… సమాజాలు , జాతుల అభివృద్ధికి దోహదం చేస్తున్నది కదా? మరి స్త్రీల కు ఆ పునరుత్పత్తి హక్కు కూడా లేకుండా చేయడం, పుట్టిన బిడ్డలు తండ్రికి చెందడం, ఈ పునరుత్పత్తి విధులను చూపించి స్త్రీలను ఉత్పత్తి ప్రక్రియనుండి దూరం చేయడం వల్ల  ఏర్పడిన తారతమ్యాలు … వీటన్నిటి గురించి మీరు చాలా మాట్లాడారు. ఈ పాఠకులకు కూడా మీరు కొంత చెప్పండి….

జ. ఉత్పత్తి సమాజ మనుగడకు ఎంత ముఖ్యమో పునరుత్పత్తి అంత ముఖ్యం. దానిలో కీలక పాత్ర స్త్రీది. అక్కడ వారి శ్రమకు విలువ, , గుర్తింపు, గౌరవం దొరకాలి. ప్రస్తుతం అవి లేవు. మాతృమూర్తి, దేవత అని కితాబునిచ్చి ఊరుకుంటారు. ఉత్పత్తిలో రైతు ప్రస్తుత పరిస్థితి వంటిదే పునరుత్పత్తిలో స్త్రీ పరిస్థితి. దాని గురించి ఇంకా ఎంతో సాహిత్యం రావాలి.

 1. స్త్రీలు రాస్తున్నపుడు స్వయం నియంత్రణ, అంటే సెల్ఫ్‌ సెన్సార్‌షిప్‌ వుంటుంది… ఏది రాసినా వారి వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి చర్చల్లోకి లాగుతారు. అదే పురుషుల విషయంలో అయితే వ్యక్తిగతాన్నే రాసినా రచనగా చెలామణి అయిపోతుంది… రచన అన్నది రచయిత్రులకి ప్రాణావసరం… దీనిమీద మీరు చాలాపని చేశారు. కొంచెం చెప్పండి…

జ. స్త్రీల  సాహిత్యం`సెన్సార్‌షిప్‌ గురించి నేను 1990 లోనే ఒక వ్యాసం రాశాను. భావ కవిత్వంలో రచయిత్రులు  కనిపించక పోవటానికి కారణం, సామాజిక, స్వీయ సెన్సార్‌ షిప్పే. ఆ విషయాన్ని నేనా వ్యాసంలో చెప్పాను. ఆ తర్వాత 1992లో రచయితులు  స్త్రీవాద కవిత్వం మీద దాడిచేసి ఆ కవయిత్రులను నియంత్రించాలని చూశారు.  అప్పుడు అందరం కలిసి ఆ దాడిని ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 1997-98 నుంచి పదకొండు భారతీయ భాషలలో రచయిత్రులతో సమావేశాలు  ఏర్పాటుచేసి వారిపై అమలయ్యే సామాజిక, కుటుంబ, స్వీయ నియంత్రణ గురించి వర్క్‌షాపును నిర్వహించాం.

ఎన్నో విషయాలు  ఆ రచయిత్రులు   మాతో పంచుకున్నారు. వాటి సారాంశాన్ని పుస్తకాలుగా ఆంగ్లంలో ప్రచురించాం. తెలుగులో ‘అక్షర యుద్ధాలు ’ అనే పేరుతో మంచి పుస్తకం అనువాదం చేశాను. అది పై వర్కుషాపు సారాంశమే. దీన్నుంచి రచయిత్రులు  నేర్చుకోడానికి ఎంతైనా వుంది. స్వేచ్ఛ పొందాల్సి వుంది. ముఖ్యంగా మన సహ రచయితల  దాడుల  నుంచి, గురుత్వా నుంచి! గురుత్వం అంటే మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు, మన రచనని సరిదిద్దు తున్నట్లు, మనల్ని మరింత మెరుగైన రచయిత్రుగా తీర్చిదిద్దుతామంటూ వచ్చేవారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. వారి ప్రోత్సహంలో ఒక కంట్రోలు  వుంటుంది. మనకి తెలిసే లోపలే మనం వారి ఆధిపత్యంలోకి వెళ్తాం. మనదైన స్వరం మనకి లేకుండా పోతుంది. దీని గురించి గుజరాతీ  రచయిత్రి ‘సరూప్‌ ధ్రువ్‌’ చెప్పినవి   అందరూ తెలుసుకోవాల్సినవి. ఇలా రకరకాల సెన్సార్‌షిప్‌కు మనం తెలిసీ తెలియక కూడా గురవుతూంటాం. అందుకే ఈ విషయం మీద శ్రద్ధ పెట్టి దాదాపు 5 సంవత్సరాలు  పని చేశాను.

 1. మీ నృత్యరూపకాల గురించి, స్త్రీవాద కోణంలో వాటినెలా రూపొందించారు?

జ. సంప్రదాయ సంగీత నృత్యాల ను ఆధునిక భావాలు  చెప్పటానికి ఉపయోగించాలనే ఆలోచన నాకు చాలా రోజు ల నుంచీ ఉంది. యక్షగానాలనూ, నృత్య రూపకాలనూ మనం నిర్లక్ష్యం చేయగూడదనీ, ఆ ప్రక్రియల్లో కేవలం  పురాణ కథలు  భక్తి గాథలే కాక వర్తమాన కథలు , సమస్యలూ  చిత్రించి ప్రజలకు రసానుభూతితోపాటు కొత్త ఆలోచనలను  కూడా అందించవచ్చని నా అభిప్రాయం. 2000 సం॥లో ‘‘యుద్ధము `శాంతి’’ అనే నృత్య రూపకం రాశాను. ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌  విమెన్స్‌ స్టడీస్‌. జాతీయ సదస్సు హైదరాబాదులో ఆ సంవత్సరం జరగటంతో ఆ సదస్సులో ప్రదర్శించాం. మంచి స్పందనే వచ్చింది. ఆ ప్రదర్శనకు ప్రముఖ నాట్య గురువు శ్రీమతి ఉమారామారావు గారు నృత్య దర్శకత్వం వహించారు. రెండేళ్ళు ఆ నృత్య రూపకం ఆంధ్రప్రదేశ్‌ లోని ముఖ్యపట్టణాల్లో, డిల్లీ , జయపూర్‌, త్రివేండ్రం వంటి భారతీయ నగరాల్లో ప్రదర్శించాం. ఆ తర్వాత ప్రసిద్ధ కూచిపూడి నృత్య విద్వాంసులు  శ్రీ భాగవతుల  సేతురాం గారు దర్శకత్వ బాధ్యతలు  తీసుకున్నారు! ఆ నృత్య రూపకం దాదాపు వంద ప్రదర్శనలు  ఇచ్చాం. అందులో సీత, శూర్పణఖ, ద్రౌపది, మాధవి వంటి పురాణ పాత్రలతో పాటు దేశ విభజన ఘట్టంలో  హింసకు గురైన స్త్రీల కథ ప్రముఖంగా ఉంటుంది. ఇతి హాసాలలో స్త్రీలు  నలుగురూ కలిసి ‘‘అనాదిగా స్త్రీ శరీరం పిత్రుస్వామ్య సంఘర్షణ రంగస్థలం , చరిత్రలో ప్రతి సమరం నారీ శరీరోపరిత నిర్మితమని తేల్చి చెప్పిన తర్వాత ఆధునిక కాలం  మనందరికీ తెలిసిన వాస్తవ సంఘటన దేశ విభజన ఘట్టాన్ని తీసుకున్నాను. ఆ సంఘటన అందరికీ.. తెలిసినదనుకుంటాం గానీ తెలియని విషయాలు  ఎన్నో ఉన్నాయి.

ప్రతి సమరం నారీ శరీరోపరిత నిర్మితమనీ’’ చెప్పిన తరువాత ఆధునిక కాలానికి వచ్చాను. మనదేశంలో దేశ విభజన సమయంలో, ఉత్తర భారతదేశంలో, సరిహద్దు రాష్ట్రాలో జరిగిన మతకల్లోలాలలో స్త్రీ జీవితాలు  నాశనమైన ఘట్టాన్ని తీసుకున్నాను. దేశ విభజన జరిగినపుడు హిందూ స్త్రీలను ముస్లిములు , ముస్లిం స్త్రీలను హిందువులూ ఎత్తుకెళ్ళారు. స్త్రీల  మీద అత్యాచారాలు  చేశారు. తమ స్త్రీలు  అత్యాచారాలకు గురవుతారనే భయంతో పురుషులు తమ భార్యలను, అక్కచెల్లెళ్ళను, తల్లులను  తామే చంపేశారు. స్త్రీల  శరీరాలు  అత్యాచారానికి గురైతే తమ వంశపు పరువు మర్యాదలు , పవిత్రత మట్టిలో కలుస్తాయనే భయంతో తమ స్త్రీల  ప్రాణాలే తీశారు వారు. అపహరణకు గురైన ఇరు దేశాల  స్త్రీలూ  దేశంకాని దేశంలో ఎన్ని అగచాట్లో పడ్డారు. తిండికీ బట్టకూ ముఖం వాచారు. జీవన పోరాటంలో అందిన ఆసరాతో నిలబడ్డారు. కొన్నిసార్లు తమని ఎత్తుకెళ్ళిన వాళ్ళతోనే జీవితం సాగించారు. ఆశ్రయ మిచ్చిన వారితోనే జీవితం పంచుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు. పిల్లల్ని  కన్నారు. ఇంత జరిగాక, ఇంతకాలం  గడిచాక ప్రభుత్వాలు పౌరుషాలతో మేల్కొన్నాయి. తమ దేశాల  స్త్రీలను వెనక్కు పిలిపించు కునే పనిని చేపట్టాయి. కుదురు తెచ్చుకున్న జీవితాలను మళ్ళీ కూకటి వేళ్ళతో పెళ్ళగించ బూనుకున్నారు. స్త్రీలు  రామని మొత్తుకున్నా, ఎలాగోలా బతుకుతున్న తమని మరొకసారి పెళ్ళగించ వద్దని ప్రార్థించినా వినకుండా స్త్రీల  మార్పిడీ కార్యక్రమాన్ని అమలు  జరిపారు. స్త్రీలు  కన్న బిడ్డల్ని ఒదిలి, వివాహమాడిన వారిని ఒదలి, ఆ కుటుంబాల ను ఒదిలి వెళ్ళాల్సి వచ్చింది. తమను ఎత్తుకెళ్ళిన వారి మతాన్ని స్వీకరించాల్సి వచ్చిన ఆ స్త్రీలు , తిరిగి వెళ్ళాంటే తమది ఏమతం అనే ప్రశ్న, తమ పిల్లలది  ఏ జాతి అనే ప్రశ్న ఎదుర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం లేదు.

మాతృదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషిద్దా మంటే వారి కుటుంబాలు  వారిని స్వీకరించలేదు. ఇన్నేళ్ళు వేరే దేశంలో ఉండి, వేరే మతస్థుడిని వివాహమాడి, ఆ మతం స్వీకరించి, అక్కడే పిల్లల్ని  కని వచ్చిన స్త్రీలను  కుటుంబాలు  ఆదరిస్తాయా? ఆ స్త్రీలు  ఒంటరిగా ప్రభుత్వం ఏర్పరచిన శరణాలయాల్లో జీవితం వెళ్ళబుచ్చాల్సివచ్చింది. తమ కంటూ ఎవరూ లేని మోడు బతుకు బతకాల్సి వచ్చింది. వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు. దేశ విభజన ఘట్టాన్ని వివరంగా చిత్రించిన తర్వాత, ప్రస్తుతం యుద్ధోన్మాదంలో కొట్టుకుపోతున్న ప్రపంచ దృశ్యాన్ని ‘స్థూలం’గా చూపి, శాంతి ఆవశ్యకతనును తెలిపే నృత్యాలతో ముగించాను.

ఈ రూపకంలో ‘రఘుపతి రాఘవ’ రెండవ నృత్య రూపకం లక్ష్మణరేఖ. కుటుంబ హింస గురించిన సారాంశంతో ఉంటుంది. అంబ పరాకుతో మొదవుతుంది కానీ అంబగా స్తుతించిన వాళ్ళందరూ భారతాంబకు కీర్తి తెచ్చిన పుత్రికలు  సావిత్రిబాయి ఫూలే, దుర్గాబాయి నుంచీ సువార్తమ్మ, అలీసమ్మ వరకూ అందరి స్తుతీ ఉంటుంది. తర్వాత గాంధారి, ఊర్మిళ, రేణుక మనసులు  చదివి ఆధునిక స్త్రీ కలలు, ఆశలు  – అవి విఫమయ్యే తీరు, పిత్రుస్వామ్య కుటుంబాధిపత్యం వీటన్నిటినీ చెప్పి ఇన్ని అవరోధాలున్నా స్త్రీలు  ముందడుగువేస్తున్న తీరుపై ఆశావహ దృక్పథం కల్పించి ముగింపు ఇచ్చాను. దశావతారం దరువులో స్త్రీలు  వివిధ రంగాలో రాణిస్తున్న తీరు చెప్పే ప్రయత్నం చేసి సఫలమైనందుకు గర్వపడ్డాను. ఈ రూపకం 2004 నుంచి ఇప్పటి వరకూ కొన్ని వంద ప్రదర్శనలు  జరుపుకుంది. దేశమంతటా, శ్రీలంకలో కూడా ప్రదర్శించాము.

16.మీ సినిమాలు , టి.వి.సీరియల్స్‌ ముఖ్యంగా ‘కన్నీటి కెరటాల  వెన్నెల ’లో ప్రపంచ ప్రసిద్ధ సినిమా నెన్నింటినో  పరిచయం చేసిన ఘనత మీది… ఆ నవలా నేపథ్యమేమిటి? సినిమాకి, సీరియల్స్‌కీ స్క్రిప్ట్‌, సంభాషణలు  రాయడం అంత అలవోకగా  ఎలా అలవాటయ్యింది?

జ.నేను 1986లో పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళి ఫిలిం అప్రిసియేషన్‌ కోర్స్‌ చేశాను. ఆ కోర్సులో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ సినిమాలు , సినిమా చరిత్ర, అనేక సాంకేతిక విషయాల  గురించి నేర్చుకున్నాను. ప్రతిరోజూ రాత్రి ఆ రోజు నేను చూసిన, నేర్చుకున్న విషయాలన్నింటిని కుటుంబరావుకి ఉత్తరం రాసేదాన్ని. ఆ కోర్సు ముగించి వచ్చాక కుటుంబ రావు ఆ ఉత్తరాలన్నీ నా ముందు పెట్టి ‘‘నవలగా రాస్తే బాగుంటుందేమో. ఆలోచించ’’ మన్నాడు. నేను నా పద్ధతిలో దాన్నొక నవలగా రాశాను. ఆ తర్వాత కొద్ది నెలలకే ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ కథా విభాగం నిర్వాహకురాలిగా చేరాను. దాదాపు 10 సం॥ ఆ సంస్థలో పనిచేశాను. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు వెళ్ళి మరిన్ని గొప్ప సినిమాలు  చూశాను. ఎన్నో స్క్రిప్టులు  చదవడం, రచయితలతో, దర్శకులతో చర్చించడం, మార్పు, చేర్పులు చెయ్యటం యివన్నీ నా ఉద్యోగంలో భాగం. ఇదంతా తర్వాతికాలం లో నేను సినిమా, టీవీ లకు రాసేటప్పుడు ఉపయోగ పడిరది. చాలా మెళకువలు  నేర్చుకున్నాను.

 1. ఆ నవలలో ‘ఇప్పటి మన సాహిత్యం మనరాష్ట్రంలో ఫాసిస్ట్‌ సమాజాన్ని యాంటిసిపేట్‌ చేసింది’ అన్పించారో పాత్రచేత… మరి ఇన్నేళ్ళ తరువాత భావస్వేచ్ఛని హరిస్తూ రచయిత మీద భౌతిక దాడులు ….. తినే తిండిమీద నిర్భంధం, అవార్డు తిరస్కరణ… వీటి గురించి మీరేమనుకుంటున్నారు?

జ. ఇప్పుడు దేశమంతా ఫాసిస్టు పాలనలో ఉందనిపిస్తోంది. ఈ అసహన పూరితమైన, ద్వేషాన్ని రగిలించే వాతావరణాన్ని బాగుచేసుకోవటానికి, శాంతి సామరస్యాలను జీవన విధానంలో భాగం చేసుకోవటానికి రచయితలు , మేధావులు  ఎవరికి తోచిన, ఇష్టమైన మార్గంలో, వారు పని చేయాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ రచయితకు ఊపిరి. దానిని ప్రభుత్వాలే కాదు, వీధి గుంపులు  కూడా హరిస్తున్నాయి. దీనిపట్ల అందరం అప్రమత్తంగా ఉండాలి.

 1. అస్మితతో మీ అనుబంధం గురించి చెప్తారా?

జ: అనుబంధం అనేది సరైనమాట కాదేమో. అస్మిత, నేను వేరు కాదు. గత పాతికేళ్ళుగా అస్మిత  వ్యవస్థాపక సభ్యురాలిని. అధ్యక్షురాలిని. అస్మిత కిప్పుడు పాతికేళ్ళ వయసు. పాతికేళ్ళ క్రితం వరకూ మేము అంటే నేను, వసంత్‌ కన్నబిరాన్‌, కల్పన  కన్నబిరాన్‌ తదితర మిత్రులం  అటానమస్‌ సంఘాలలో పనిచేస్తుండేవాళ్ళం. నేను 1987 నుంచి హైదరాబాదులో ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ నిర్వహించాను స్నేహితులతో కలిసి. డౌరీ డెత్‌ కమిటి ఉండేది. స్త్రీ శక్తి సంఘటన ఇంక చిన్న చిన్న సంఘాలుండేవి. మేమంతా వేరే వేరే ఉద్యోగాలు  జీవిక కోసం చేస్తూ, ఆ డబ్బు, ఆ ఉద్యోగాలకు పోగా మిగిలిన సమయం, శలవుదినాలు  మాత్రమే మాకు నిజమైన ఆసక్తి ఉన్న రంగంలో పనిచేయగలిగే వాళ్ళం. మాకు ఉన్న శక్తి అంతా స్త్రీ ఉద్యమానికి పెట్టాలని ఉన్నా కుదిరేది కాదు. ఏదైనా అత్యవసరమైన పని ఉన్నపుడే అందరం కలవగలిగేవాళ్ళం. నిజంగా సమస్య వచ్చినపుడు కొందరికి శలవు దొరక్క, డబ్బుకి ఇబ్బందై, చాలా కష్టాలు  పడేవాళ్ళం. కానీ చాలా ఇష్టంగా ఆ కష్టాలను స్వీకరించేవాళ్ళం. వాటిని చూసి నవ్వుకునే వాళ్ళం. అంతవరకూ బాగానే ఉంది గానీ మా తర్వాతి తరం ఇలా పనిచేసే వాతావరణం కనిపించటంలేదు. సమస్యులున్న స్త్రీలు  మా దగ్గరకు రావటానికి మాకు మా ఇల్లు  తప్ప వేరే చోటు, ఒక కార్యాయం అంటూ లేదు. వీటన్నిటితో ఒక  సంస్థను ఏర్పాటు చేసుకుని, దానికి నిధులు  సమకూర్చుకుని, మేము, ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు పూర్తికాలం  ఆ సంస్థ ద్వారా మా ఆశయాల  కోసం పనిచేయవచ్చు గదా అనే ఆలోచనవచ్చింది. నిధులంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర విదేశీ సంస్థల   నుంచి తీసుకోవాలి. దానిమీద చాలా చర్చ జరిగిన తర్వాత` మా ఆశయాలతో ఏకీభావం ఉండి మమ్మల్ని స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే సంస్థలు  ఏవైనా వాటినుండి ఆర్థిక సహాయం తీసుకుంటే దానివల్ల  హాని లేదనుకున్నాం. 1991లో అస్మిత ప్రారంభించాం. ఎన్జీవో గురించి సమాజంలో, ముఖ్యంగా వామపక్ష పార్టీలలో, విప్లవోద్యమంలో అంటరానితనం, వెలి వంటివి ఉన్నాయి. దానిని భరించటం, విదేశీ నిధులు , విలాస జీవితాలు  అని తెలియకుండా మాట్లాడే మాటలు , అనేక నిందలు  భరించాం. కానీ ఎంతపని చేయగలిగామో చూసుకుంటే అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. మా ఆశయాలకొక చోటు, మా సృజనాత్మక  శక్తును వెలికి తీసుకురావటానికి కావసిన సమయం, పదిమంది కలిసి పనిచేయటం ఎలాగో నేర్చుకునే వీలు -ముఖ్యంగా ఆపదలో అపాయంలో ఉన్న స్త్రీలు  వెంటనే వచ్చి ఓదార్పునీ సహాయాన్ని పొందటానికి ఒకచోటు కల్పించగలగటం- ఇలా ఎన్నో ప్రయోజనాలి . అన్నిటికంటే గ్రామీణ స్త్రీలతో నేరుగా మాట్లాడి వాళ్ళకు వారి కుటుంబ సమస్యల  లోని రాజకీయాల నుండి, అంతర్జాతీయ రాజకీయాల  వరకూ అన్నీ తేలిక భాషలో అర్థమయ్యేలా చెప్పగలిగే అవకాశం అస్మిత వల్ల  కలిగింది. ‘జాతర’ అనే రూపంలో పాటు, స్ట్రీట్‌ ప్లేస్‌, స్త్రీలకు అవసర మయ్యే చట్టపరమైన, హక్కు, ఆరోగ్యపరమైన చిన్న పుస్తకాల  ద్వారా గ్రామాల కు వెళ్ళి వేలాది స్త్రీల ను కలిశాం.  గ్రామీణ మహిళా సంఘాల తో నెట్‌వర్కింగ్‌ చేసి అనేక విషయాలు  వాళ్ళకు బోధించాం. ‘దళిత మహిళా నాయకత్వానికి తోడ్పాటునందించాం. ఇక రచయిత్రుల తో కలిసి పనిచేశాం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ‘‘సెన్సార్‌షిప్‌ ` విమెన్‌ రైటింగ్‌’’ గురించి పనిచేశాం. ‘‘మహిళావరణం’’ ` ఆంధ్రదేశ చరిత్రను నిర్మించిన స్త్రీల  గురించి పరిశోధించి గొప్ప పుస్తకం తెచ్చాం. కూచిపూడి భరతనాట్యం వంటి సంప్రదాయ రూపాల లో  ఆధునిక భావాలు చెబుతూ, స్త్రీల పై హింస గురించి మాట్లాడుతూ ఆ రూపాలు  నభిమానించే వారికి  కూడా ఆలోచించేందుకు మా భావాల  నందించాం. స్త్రీల  హక్కు గురించి మొదలైన అస్మిత   వికలాంగు ట్రాన్స్‌ జండర్‌ హక్కు గురించి పనిచేసే వరకూ విస్తరించింది. వసంత్‌ కన్నబిరాన్‌, నేను, కల్పనా  కన్నబిరాన్‌ ముగ్గురం కలిసి పాతి కేళ్ళు పనిచేయగలిగాం. ముగ్గురం స్నేహంగా ఒకరి బలాల  నుంచి ఒకరం నేర్చుకుంటూ, ఒకరి బలహీనత నొకరం అర్థం చేసుకుంటూ ఎదిగామనుకుంటున్నాను. మా ముగ్గురి స్నేహం మాకు ఎంతో అపురూపం. అమూల్యం .

 1. మీరు చాలా దేశాలు పర్యటించారని అనుకుంటాను.

జ: అన్నీ పనిలో భాగంగానే 1995లో బీజింగ్‌లో నాల్గవ  ప్రపంచ మహిళా సదస్సుకి ప్రతినిధిగా వెళ్ళాను. 2000 సం॥లో బీజింగ్‌ G 5 న్యూయార్క్‌లో యు.ఎన్‌. కార్యాయంలో జరిగింది. దానిలో ప్రతినిధిగా పాల్గొనటం మంచి అనుభవం. యు.ఎన్‌. తో కలిసి బీజింగ్‌ నిర్ణయాలను దక్షిణాసియా గ్రామీణ మహిళకు అందించే పనిలో దక్షిణ భారతదేశ బాధ్యతను తీసుకుని పనిచేశాను. ఆ పనిలో భాగంగా బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌లో జరిగిన యు.ఎన్‌. సమావేశాలకు హాజరయ్యాను. 1996లో న్యూజర్సీ రడ్గస్‌ యూనివర్సిటీలో  సదస్సుకి హాజరయ్యాను. మా బాల చిత్రం ‘‘పాత నగరంలో పసివాడు’’ కైరో ఫిలిం ఫెస్టివల్‌కు   ఎంపికైన సందర్భంలో ఈజిప్టు వెళ్ళాను.

ఈ దేశాలకు వెళ్ళటం కాదు. అక్కడి వారితో కలిసి పనిచేయగలగటం, పరస్పరం ఒకరి సమస్యలొకరు తెలుసుకోగలగటం చాలా బాగుంటుంది.

ముఖ్యంగా యు.ఎన్‌. మీటింగులో దక్షిణాసియా దేశాల ప్రతినిధుతో గడిపిన రోజులు చాలా విలువైనవి. ఎంతో మంచి స్నేహితులను సంపాదించుకోగలిగాను. వాళ్ళు ఇప్పటికీ ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే అది వారికి నాకూ కూడా ఎంతో ముఖ్యం అని అర్థం కదా!

 1. చివరగా, నిజానికి ముందుగా కుటుంబరావు గారితో మీ సాహచర్యాన్ని గురించి చెప్పండి… సహచరులు యిలా కూడా వుండొచ్చు అని మీరు నిరూపించిన వైనం, భార్యాత్వాన్ని శిరసావహిస్తూ, కుటుంబాలలో మగ్గిపోతోన్న స్త్రీలకి కొంత తెలియాలి కదా.

జ: కుటుంబరావు నేను మంచి స్నేహితులం. జీవన సహచరులం . భార్యా భర్తలం  కాదు. మా మధ్య ఆ రకమైన అధికార సంబంధం లేదు. కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలుండాని నమ్మే వ్యక్తులం  కాబట్టి ఒకరి అభిప్రాయాల్ని ఒకరం గౌరవించు కుంటూ ఒకరి మార్గానికొకరు అడ్డుపడకుండా వీలైనంత సహకరిస్తూ జీవిస్తున్నాం. మా ఇద్దరి అభిరుచులు , అభిప్రాయాలు , భావాలు , ప్రాపంచిక దృక్పథాలు  ఒకటే అవటం వల న మా సాహచర్యం చాలా ఫలవంతంగా సాగుతోంది. ఇద్దరం మేమనుకున్న పనులు  చేయగుగున్నాం. ఇద్దరికీ  ఒకటే ఆలోచనలున్నాయని, మాకు అభిప్రాయ బేధాలే రావని అర్థం కాదు. ఇద్దరం వాదించు కుంటాం. విబేధాలు  విబేధాలుగానే మిగిలే సందర్భాలు  కూడా ఉంటాయి. అయితే అవి మా స్నేహానికి అడ్డం రావు. ఎలకను మింగే పిల్లిగా మా ఇద్దరిలో ఎవరమూ లేము. ఆధిపత్యం అనే మాట మా ఇద్దరికీ సరిపడదు. మా పిల్లలు  నలుగురూ కూడా మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. మేము వాళ్లకిచ్చిన స్వేచ్ఛను ప్రజాస్వామిక వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

 1. జీవితమంతా యిన్నిన్ని ఆటుపోట్లను ఎదుర్కుంటూ కూడా ఎప్పుడూ యింత ప్రశాంతంగా ఎలా వుండ గలుగుతున్నారు? మీకెప్పుడూ అసహనం కలగదా?

జ: నా అసహనమంతా మనుషుల  జీవితాలను అస్త వ్యస్తం చేసి అశాంతిమయం చేసే పితృస్వామిక సమాజం మీద. ఆ అసహనాన్ని కోపాన్ని నా రచనలలో తీవ్రంగానే ప్రకటిస్తాను. ఈ సమాజం లోని అవకతవక వల్లనే  నా జీవితం లోని ఆటుపోట్లు కూడా. దానికి వ్యక్తుల  పట్ల అసహనం చూపించి ప్రయోజనం లేదు. ఇది తెలిశాక వ్యక్తుల  పట్ల అసహనం చాలా తక్కువసార్లు వస్తుంది.

 1. కొత్తగా రాస్తున్న స్త్రీల కు మీ సూచను?

జ: సమాజాన్ని, దానిలోని అసమానతను, అణిచి వేతను అర్థం చేసుకుని రాయమంటాను. సామాజికాధ్యయనం, నిరంతర సాహిత్య పఠనం, రచయిత్రులకు అవసరం.

 1. సాహిత్య విమర్శలో ‘రాజ్యాంగ నైతికత’ అనే భావనని మీరు కొత్తగా ప్రవేశపెట్టారు. దాని గురించి వివరించండి.

జ:‘రాజ్యాంగ నైతికత’ అనే భావనను అంబేద్కర్‌ అందించాడు. మన దేశానికి రాజ్యాంగ రచన జరిగాక ప్రజల  జీవితం, సామాజిక విధి విధానాలు  రాజ్యాంగం ప్రకారం నడవాలి. పాత ఆచార సంప్రదాయాలు  మరుగునపడి పోవాలి. స్త్రీ పురుష సమానత్వం ప్రాధమిక హక్కుల్లో చెప్పిన తర్వాత సంప్రదాయాల  ప్రకారం స్త్రీ మీద విధించే అసమానత్వపు ఆచారాల ను, పోకడను మనం పాటించకుండా ఉండే సంస్కారాన్ని అల వరచు కోవాలి. అలాగే కులం , అంటరానితనం విషయాల్లో కూడా రాజ్యాంగం చెప్పినట్లు నడుచుకోవాలి గానీ పురాణా సంప్రదాయాల  ప్రకారం పోతే శిక్షార్హు లవుతారు. పాత నీతుల  స్థానంలో మనకు రాజ్యాంగ బద్ధమైన నైతిక విలువలు  సమకూరాయి. మన స్వాతంత్య్రానంతర సాహిత్యంలో అనేకమంది  రచయితలు  ఈ నైతికతను ప్రజల కు అందించే రచనలను చేశారు. ఈ భావనతో, ఈ దృష్టితో సాహిత్య విమర్శ చేస్తే ప్రజకుల  ఆ నైతిక విలువ ప్రాధాన్యం మరింత వేగంగా వివరంగా అర్థమవుతుంది. ఆ ఆలోచనతో నేను ఆ సాహిత్య విమర్శనా రీతిని పరిచయం చేయాలనుకున్నాను. అక్కినేని కుటుంబ రావు నాలుగు నవలలను ఆ దృష్టితో విశ్లేషించాను. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. మిగిలిన రచయితల  రచనల ను ఈ దృష్టితో అంచనా వేయా లనిపించింది. సాహిత్య అకాడెమి సహకారంతో, అస్మితను సమన్వయ పరచి రెండు రోజు పాటు ‘‘రాజ్యాంగ నైతికత ` స్వాతంత్య్రానంతర తెలుగు  సాహిత్యం’’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించాను. దాదాపు ఇరవై మంది రచయితల  ముఖ్య రచనను ప్రసిద్ధ విమర్శకులు  ఈ దృష్టితో విశ్లేషించారు.   చాలా మంచి స్పందన వచ్చింది. సాహిత్య విమర్శనా పరికరాలను పెంచుకుంటూ విస్తరించుకుంటూ పోవాలి. అది నాకు చాలా ఇష్టమైన పని.

24.మీరు చాలా విస్తృతంగా రాసి సాహిత్యాన్ని, సాహిత్య రంగంలో స్త్రీవాద భూమికని వేగవంతం చేశారు… కథ, కవిత, నవల , వ్యాసం, నృత్యరూపకం,  నాటకం, సినిమా, అనువాదాలు … యిలా అన్ని ప్రక్రియల్లోనూ మీరు కలాన్ని కదిపారు. మరి మీ సాహిత్యం మీద జరగవలసినంత చర్చ జరిగిందనే మీరు అనుకుంటున్నారా?

జ.‘స్వేచ్ఛ’, ‘మానవి’, ‘రాజకీయ కథలు ’ వచ్చినప్పుడు వాటిమీద చాలా విస్తృతంగా చర్చ జరిగింది. నేను అనువాదం చేసిన ‘భూమిపుత్రిక’, ‘మూడు తరాలు ’, ‘పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం’ లాంటి నవలలు మీద కూడా చర్చ జరిగింది. తర్వాత ‘అయోని’, ‘భిన్న సందర్భాలు ’, ‘ప్రయోగం’, ‘కేసు’ యిలా ఒక్కొక్క కథ ఒక్కొక్క సంచలనమై వాటిచుట్టూ ఎన్నో వాద, వివాదాలు , చర్చలు  జరిగాయి. ఇదంతా 90వ దశాబ్దం వరకూ ఆ తర్వాత పత్రికలలో సాహిత్యా నికి, ముఖ్యంగా సాహిత్య విమర్శకు చోటు తగ్గిపోయింది. అయితే విడివిడిగా గ్రూపుగా చర్చలు  సాగిస్తూనే వున్నారు.

 1. భవిష్యత్తులో ‘ఆటోబయాగ్రఫీ’ రాయాన్న ఆలోచన ఏమయినా వుందా? మీ జీవితం, సాహిత్యం, ఉద్యమ పోరాటం… ఈ మొత్తం దాచేస్తే దాగని సత్యా లన్నింటినీ రికార్డ్‌ చేయాల్సిన అవసరం లేదా?

జ: ఆటో బయోగ్రఫీ గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు.

*

నయాగరాకి రంగులు అద్దితే…మన మోహన్!

 

(ప్రసిద్ధ చిత్రకారుడు మోహన్ కి పుట్టిన రోజు  శుభాకాంక్షలతో..)

-ప్రకాష్

~

 

prakashహృదయంలో ప్యూరిటీ- ఆలోచనలో క్లారిటీ- ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుంది గానీ, దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుకున్నా, చికాకు పడినా… రచయితలు… అర్టిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదే పదే చెబుతుంటాడు. మోహన్ అలాగే ఉండాడు.

మోహన్‌ కిప్పుడు అరవై ఐదేళ్లు. 1950 డిసెంబర్‌ 24న ఏలూరులో పుట్టాడు. తండ్రి తాడి అప్పల స్వామి అనే కమ్యూనిస్ట్ నాయకుడికీ తల్లి సూర్యావతికీ పుట్టిన మోహన్‌ని కమ్యూనిస్టు ఉద్యమమే ఎత్తుకుని పెంచి పోషించింది. అప్పల స్వామి ఆనాటికే బాగా చదువుకున్నాయన. ఇంగ్లీషు, హిందీ, సంస్కతం బాగా తెలిసినవాడు. చదువుకోవడమే, విద్యతో వెలిగిపోవడమే , జ్ఞానంతో రాణించడమే , పేద వాడి కోసం పోరాడడమే మానవుని విధి అని నమ్మేవాడాయన. అదే మోహన్‌కి అబ్బింది. మొదటి నుంచీ మోహన్‌ చదువరి. కథో, నవలో, పద్యమో, మార్క్సిస్టు సాహిత్యమో చదవడమే పని. ఆ చదువే ఆనందం. పధ్నాలుగు, పదిహేనేళ్ళకే బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు. రెండే వ్యాపకాలు చదవడం, బొమ్మలు వేయడం. మరొక్కటుంది, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చుట్టూ స్నేహితులే. మోహన్‌ చుట్టూ సంపాదకులు, జర్నలిస్టులు, రచయితలూ, ఆర్టిస్టులు, కవులు, ఉద్యమకారులు… ఎందరెందరో… కళాకారుడి కార్యాలయం పార్టీ ఆఫీసులాగే… టీలు… సిగరెట్లు… చర్చలు… ఎన్ని మాటలున్నా, జోకులున్నా, అందరి మధ్యలో మోహన్‌ బొమ్మలు వేస్తూనే వుంటాడు. నాజూకైన గీతలు. ఆడపిల్ల నడుం నుంచి అరచేయి దాకా వయ్యారపు ఒకే గీత. గీతాదత్‌ పాటలాగ. సర్రున మొగవాడి మోకాలి నుంచి చెయ్యెత్తి తుపాకీ పట్టే దాకా కత్తితో గీశాడేమో అనిపించే ఉద్యమగీత. పాబ్లోనెరూడా పోయిట్రీలా.

06

మోహన్‌ ఒక స్వచ్ఛమైన జలపాతం. అన్ని రంగులూ కలిస్తే తెలుపు అయినట్టుగా – అతను ఆర్టిస్టు, కమ్యూనిస్టు, కార్టూనిస్టు, జర్నలిస్టు, కవి, విమర్శకుడు, రచయిత, యానిమేటర్‌, మిత్రుడు, గురువు, డ్రీమర్‌, తండ్రి, నీ సగం సిగరెట్టు తీసుకొని తాగే సాదా సీదా సగటు ఒన్‌బైటూ చాయ్‌ గాడు. నీకెప్పుడూ అందుబాటులో వుండేవాడు. నీకెప్పటికీ అందనివాడు. కవిబాల గంగాధర తిలక్‌లాగా అందమైనవాడు. మనోహరమైన చిరునవ్వును ఆయుధంగా ధరించినవాడు. అడిగిన వాడికి లేదనకుండా బొమ్మగీసిచ్చేవాడు. వాడు ఐయ్యా, ఎమ్మా, ఎమ్మెల్లా, లిన్‌పియావో, పుల్లారెడ్డి, నాగిరెడ్డి, జనశక్తి, ప్రతిఘటన, అతి నటన, మహిళ, బడుగు, బలహీన, ముస్లిం మైనార్టీ, దళిత, మాదిగ, డక్కిలి, లంబాడా, నంగరా, అస్తిత్వ, సుత్తిత్వ, పరమబోరిత్వ… ఎవరైనా మోహన్‌కి ఒక్కటే. బొమ్మవేసిస్తాడంతే. నచ్చడం నచ్చకపోవడం జాన్తానై. ఒక్కోడిదీ ఒక్కోరకం కమ్యూనిజం. ఒకడిది వర్గకసి. ఒకరిది ప్రేమదాహం. మరొకరిది విప్లవద్రోహం. మరొకామెది మగదురహంకార పదఘట్టన కింద నలిగిపోయే భూమిక. ఇంకొకడు మానవ హక్కుల్ని ప్రేమిస్తాడు. మరొకడు తెలంగాణా కోసం ఉద్యమిస్తాడు. మోహన్‌కి ఫిర్యాదుల్లేవు. గొడవలూ పెట్టుకోడు. నువ్వేం చెప్పు, శ్రద్ధగా వింటాడు. నీక్కావాల్సిన బొమ్మ, నువ్వు కోరుకున్న బొమ్మ బాగా వేసిస్తాడు. నీ అజ్ఞానం వల్ల, ఉపన్యాసాలిచ్చే దురలవాటువల్ల మంచి బొమ్మని మార్చి పిచ్చిబొమ్మ వేయమని మర్యాదగానే అడుగుతావు. నో కంప్లయింట్స్. నువ్వు కోరుకున్న మీడియోకర్‌ బొమ్మే నీకు దక్కుతుంది. ‘అదేంటి?’ అని ఎవరన్నా అడిగితే ‘‘ వాళ్ళకదే నచ్చుతుంది’’ అంటాడు. మారేజి బ్యూరో క్లయింట్‌ సర్వీసా? పవిత్రమైన ఆర్టా? అని ఎవరైనా కోప్పడితే ‘‘నువ్వు ప్రపంచాన్ని మారుస్తావా? నేనైతే అలాచేయలేను’’ అంటాడు మోహన్‌.

మోహన్‌ ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కాలేజీలో బి.ఎస్‌.సి. చదివి, 19 ఏళ్ళ వయసులో విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌గా చేరాడు. విశాలాంధ్ర లైబ్రరీ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ పుస్తకాలూ, అప్పటి సోవియెట్‌ సాహిత్యం మోహన్‌కి ఎప్పటికీ మరిచిపోలేని మంచి మిత్రులు. ఏటుకూరి బలరామ్మూర్తీ, రాఘవాచారీ, కంభపాటి సీనియర్లు తనని బాగా ప్రభావితం చేశారు. ఇంత రియలెస్టేటూ, స్టాక్‌మార్కెట్టూ, ఐటీ బూమూ, సెల్‌ఫోన్లు లేని బంగారం లాంటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజులవి. పుస్తకాలూ, పేపర్లూ, చదువూ, కవిత్వమూ చర్చలూ. అటు సొదుం రామ్మోహన్‌, ఇటు పెద్దిభొట్ల సుబ్బరామయ్య – సాయంత్రం అయితే కె.రాజేశ్వరరావు, గాంధీ, టీలు, సిగరెట్లు, అదృష్ట దీపక్‌, కవిరవి ఇతర స్నేహితులు. రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి లతో మాటకచేరీలు. సబెడిటర్‌ పని అంటే ఇంగ్లీషు వార్తలను తెలుగులోకి అనువదించడం. అయ్యాక, ఓ రాజకీయ కార్టూన్‌ లాగించేవాడు. పబ్లిషింగ్‌ హౌస్‌కో కవర్‌ పేజీ వేసేవాడు. ఎవరి కవిత్వానికో ఓ బొమ్మ తగిలించేవాడు. జీవితంలో పెద్ద కోర్కెలేమీ లేనట్టుగానే బతికాడు. జెనీలియాలాగా కుదిరితే కప్పుకాఫీ, ఓ సిగరెట్టు. పుస్తకం ఎలాగో చేతిలో వుండేది. సింప్లీ, హి కెన్‌ కాల్‌ యిట్‌ ఎ డే.
చిన్న ఆనందాలు, గొప్ప అనుభవాలు (పైగా ఆ గురజాడ ఒకడు, జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును అని ఎగిరెగిరిపడుతూ)

ఎంటర్‌ హైదరాబాద్‌:

ఆంధప్రభలో అదే గొప్ప దిక్కుమాలిన కార్టూనిస్టు ఉద్యోగం కోసం మోహన్‌ 1980లో హైద్రాబాద్‌ వచ్చాడు, క్రోక్విల్‌ చెవిలో పెట్టుకొని. కార్టూన్లు పేలాయి. ఎబికె, వాకాటి పాండురంగారావు, దేవీప్రియ ఇంకా అనేకుల్‌, ‘‘ ఇరగదీస్తున్నావోయ్‌, రా చాయ్‌ తాగుదాం’’ అన్నారు లిబర్టీ సెంటర్లో. వో ఫర్లాంగు నడిస్తే, హిమాయత్‌ నగర్‌, అనగా మఖ్దూంభవన్‌ ఉండే చోటు. సి.పి.ఐ. నాయకులూ, స్నేహితులూ, అరివీర కామ్రేడరీ. ఆనక 1983లో ‘ఉదయం’ హడావిడి మొదలైంది. 1984 డిసెంబర్‌ 29 ‘ఉదయం’ దినపత్రిక మోహన్‌ కార్టూన్‌తో రిలీజైంది. మొదటిరోజు నుంచి ప్రతి ఉదయం కార్టూన్లు పేలాయి. బొమ్మల్ని జనం ప్రేమించారు. ఉదయంలో మోహన్‌ రోజుకి పది, యిరవై, పాతిక బొమ్మలు వేసిన రోజులున్నాయి. జనం మెచ్చినది మనం శాయడమే అనుకున్నాడో ఏమో! దారినపోయే దానయ్య నుంచి దాసరి నారాయణరావు దాకా ‘శెబ్బాష్‌ మోహన్‌’ అన్నారు. అండ్‌ ది రెస్ట్ ఈస్‌ కార్టూన్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధప్రదేశ్‌.

SHEET-1

మోహన్‌ చుట్టూ ఎప్పుడూ ప్రసిద్ధ కవులూ, కళాకారులూ, రచయితలూ, జర్నలిస్టులూ, మేధావులే. పురాణం సుబ్రమణ్య శర్మ నుంచి నామిని సుబ్రమణ్యం నాయుడు దాకా. గుడిహాళం రఘునాథం నుంచి గోరటి వెంకన్న దాకా. కేశవరెడ్డి నుంచి కె.ఎన్‌.వై.పతంజలి దాకా… సురవరం సుధాకరరెడ్డి, డాక్టర్‌ కె.నారాయణ మోహన్ని ఎంతగా అభిమానిస్తారో బాలగోపాల్‌, వరవరరావు అంతగా ప్రేమిస్తారు. ఎబికె ప్రసాద్‌, చేకూరి రామారావు ఎంత యిష్టపడతారో, వోల్గా నుంచి గద్దరు దాకా అంతే గౌరవిస్తారు. మన రాష్ట్రంలో అన్ని రకాల ప్రజా ఉద్యమాలలో అంతగా కలిసిపోయిన ఆర్టిస్టు మరొకరు కనిపించరు. మోహన్‌ యిదేమీ పట్టదన్నంత మౌనంగా, మయకోవస్కీ పుస్తకమో పట్టుకొని ‘‘అగ్గిపెట్టుందా?’’ అని అడిగి ప్రశాంతంగా చదువుకుంటూ నిద్రపోతాడు.

1990 తోసుకొచ్చింది. రాయటమూ, కార్టూన్లూ, కథలకి ఇలస్ట్రేషన్లూ, కవిత్వాలకు బొమ్మలూ, (ప్రపంచ పదులకి మోహన్‌ వేసిన బొమ్మలంటే సినారెకి ఎంత యిష్టమో) పోస్టర్లూ, కవర్‌ పేజీలూ చాలవన్నట్టు యానిమేషన్‌ మొదలుపెట్టాడు. యానిమేషన్‌ అంటే బొమ్మల్ని కదిలించడం కాదు, హృదయాల్ని కరిగించడం అన్నాడు. ఏళ్ళూ వూళ్ళూ గడిచిపోయాయి. ఇంకా హైద్రాబాద్‌కి మంచి కంప్యూటర్లు, స్కానర్లూ, హెచ్‌డి కేమెరాలు రాని కాలం అది. కాలం కంటే ముందు పరిగెత్తి అలసిపోయాడు. 17 సంవత్సరాలు గడిచి పోయాక ‘సాక్షి’ పేపర్‌ వచ్చింది. తర్వాత వాళ్ళు టీవీ ఛానల్‌ పెట్టారు. సజ్జెల రామకృష్ణా రెడ్డి, సువర్ణకుమార్‌ల పుణ్యాన అందులో మోహన్‌ యానిమేషన్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యాడు, వో పాతిక మంది టీమ్‌తో. తెలుగు ఛానళ్ళలో, ఆమాటకొస్తే ఏ జాతీయ ఛానల్లోనూ రాని అందమైన అపురూపమైన యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్లు చేసి చూపించాడు. జనం వెర్రెత్తిపోయారు. ఇన్‌స్టెంట్‌ హిట్‌.

జనరల్‌గా మోహన్ని ఆర్టిస్టుగానే చూస్తారు. అతనో మంచి రచయిత అని కొద్దిమందికే తెలుసు. మోహన్‌ ముందు జర్నలిస్టు. అనేక పుస్తకాలు తెలుగులోకి అనువదించాడు. కళమీదా, కార్టూన్లమీదా ఎన్నో వ్యాసాలు రాశాడు. ‘‘ఇతను ఎంత మంచి వచనం రాస్తున్నాడు’’ అని రచయితలూ, కవులే ముచ్చట పడ్డారు. ‘‘కార్టూన్‌ కబుర్లు’’ అనే మోహన్‌ వ్యాసాల పుస్తకం చాలా మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. ‘‘బాపూగారూ అందరూ మీరు అభిమానులు కదా, మీరు అభిమానించేదెవరిని?’’ అని ఒక సందర్భంలో ఆయన్ని అడిగినప్పుడు ‘‘ఇంకెవరు? మోహనే’’ అని బాపూ సమాధానం.

నవ్వులూ పూలూ చురకలూ మెరుపులూ అన్నీ కలిసి...

నవ్వులూ పూలూ చురకలూ మెరుపులూ “మేల్” కొల్పులు  అన్నీ కలిసి…

కార్టూన్లలో పొలిటికల్‌ కార్టూన్లు అనేవి మేలు జాతి పొట్టేళ్ళు లాంటివి. అవి వేయడంలో కొమ్ములు తిరిగిన వాడు మోహన్‌. ఎంకి ఏదంటే వెలుగునీడల వైపు వేలు చూపించినట్టుగా ఆంధప్రదేశ్‌లో పొలిటికల్‌ కార్టూన్‌ అంటే మోహన్‌ వైపే చూస్తారెవరైనా. మరో ఇంటరెస్టింగ్‌ సంగతి- మోహన్‌కి సంగీతం అంటే చాలా యిష్టం. పాత హిందీ సినిమా పాటలూ, తెలుగు పాటలూ, జానపదాలూ బాగా తెలిసినవాడు.

హేమంతకుమార్‌, సైగల్‌, సురయా, గీతాదత్‌, నూర్జహాన్‌ల పాటలంటే మరీ యిష్టం. సెర్జీ ఐజెన్‌ స్టీన్‌- ‘బేటిల్‌ షిప్‌ పొటెంకిన్‌’, కురొసొవా ‘సెవెన్‌ సమురాయ్‌’, ఇస్త్వాన్‌ జాబో ’కాన్ఫిడెన్స్’, పోలిష్‌ కీస్లెవయస్కీ, ‘త్రీకలర్స్ బ్లూ’ దాకా అన్నీ శ్రద్ధగా చూశాడు. ఎం.ఎస్‌.సత్యు, శాంతారాం, సత్యజిత్‌ రే నుంచి పట్టాభి సంస్కార మీదుగా శ్యాంబెనగల్‌ భూమిక దాకా భారతీయ సినిమాల గురించి సాధికారికంగా చర్చించగలడు. గురుదత్‌ సినిమాలన్నా, ప్యాసాలో వహీదా రెహమానన్నా చాలా చాలా మురిపెం మోహన్‌కి. టాల్‌స్టాయ్‌ వార్‌ అండ్‌ పీస్‌, అనాకెరినినా, షోలహోవ్‌ ‘అండ్‌ క్వయిట్‌ ఫ్లోస్‌ దిడాన్‌’ అన్నా అంతే ప్రేమ. రష్యా, చైనా, క్యూబా, వియత్నాం, లాటిన్‌ అమెరికా విప్లవోద్యమ చరిత్ర గురించి ఎన్ని గంటలైనా అలుపు లేకుండా మాట్లాడతాడు. చేగువేరా త్యాగమూ, హోచిమిన్‌ ఆదర్శమూ, నిరుపేదవాడి పోరాటమూ మోహన్ని కదిలిస్తాయి. గోబీ ఎడారిలో తూనీగల్లా పరిగెత్తే చంఘిజ్‌ ఖాన్‌ సేనల గుర్రాల నుంచి గుడిపాటి వెంకట చెలం మైదానం దాకా ఎన్ని కబుర్లయినా చెబుతాడు. నెరూడా జ్ఞాపకాల నుంచి మావ్‌సేటుంగ్‌ వ్యాపకాల దాకా ఎన్ని ముచ్చట్లో చెప్పలేం. విజయవాడ మారుతీనగర్‌లో మాయింటి పక్కయిల్లే విశ్వనాథ సత్యనారాయణ గారిదనీ, ‘విశాలాంధ్ర’కి వచ్చిన పుట్టపర్తి నారాయణా చార్యుల వారికి అరిటిపళ్ళు, టీ పట్టుకెళ్ళి యిచ్చేవాడిననీ, ఢిల్లీ పొలిటికల్‌ క్లాసుల్లో దేవీ ప్రసాద్‌ చటోపాధ్యాయ, గంగాధర అధికారి, డాంగే, నీలం రాజశేఖరరెడ్డి, మొహిత్‌ సేన్‌, సర్దేశాయ్‌ లాంటి మహామహుల దగ్గర మూడు నెలలు చదువుకున్నానని మహదానందంగా చెబుతాడు.

mohan2

ఇలా ఎన్ని చర్చలయినా, కబుర్లయినా, బొమ్మలు వేసివ్వడం అయినా బ్లాక్‌టీ తాగినంత హాయిగా, ఈజీగానే. భేషజానికో, పోజుకో తావేలేదు. ఇలా గత 40 సంవత్సరాలుగా నాన్‌ స్టాప్‌గా బొమ్మలు వేస్తూనే వున్నాడు. సాటి ఆర్టిస్టుల్ని ఎంతగా ఆదరించాడో అంతగానూ ప్రభావితం చేశాడు. విన్సెంట్‌వాంగో, పాల్‌గాగిన్‌, పికాసో బొమ్మలూ, బతుకులూ, ఎం.ఎఫ్‌,హుస్సేన్‌, సమీర్‌మండల్‌, సచిన్‌ జల్తారే, లక్ష్మాగౌడ్‌, వైకుంఠం బొమ్మల్లోని సౌందర్యమూ, తత్వాల గురించి మోహన్‌ చెబుతున్నప్పుడు వినితీరాలి. విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అలవోకగా, హాస్యానికి అణుమాత్రమూ కొదవలేకుండా చెప్పడంలో మోహన్‌ స్పెషలిస్టు. తెలుగు, భారతీయ ప్రాచీన చిత్రకళ మీద గట్టి అవగాహన వున్నవాడు. ‘శంకర్స్ వీక్లీ’ శంకర్‌ నుంచి డేవిడ్‌లో దాకా, అబూ అబ్రహాం నుంచి అమెరికన్‌ సూపర్‌స్టార్‌ సెర్గీ అరగాన్స్ దాకా జాతీయ అంతర్జాతీయ కార్టూన్‌ కళని బాగా అధ్యయనం చేసినవాడు. రాసినా, మాట్లాడినా, బొమ్మేసినా అతనికే చెల్లిందని అనిపించుకున్న అరుదైన గౌరవాన్ని పొందినవాడు మోహన్‌.

ఆర్టిస్టు మోహన్ని ‘జీనియస్‌’ అన్నాడు మణిశంకర్‌ అయ్యర్‌. ‘‘నీ గీతలో మేజిక్‌ వుంది మోహన్‌’’ అన్నాడు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మన గోవా ఆర్టిస్టు మారియో మిరాండా. ‘‘నీ గీతలు నాకిష్టం. నువ్వు రాసే అక్షరాల్లో మనోహరమైన చైనీయమైన కళవున్నది’’ అన్నారు లెజెండరీ ఆర్టిస్టు కొండపల్లి శేషగిరిరావు గారు.

చదువుకోవడమూ, బొమ్మలు వేయడం తప్ప తనకీ లోకంతో పనిలేనట్టుగానే వుంటాడు. శ్రీశ్రీ మహాప్రస్థానానికి యానిమేషన్‌లో దృశ్య రూపం యివ్వాలని తపనపడుతున్నాడు. అన్నమయ్య పదాలనూ, గోరటి వెంకన్న పాటలనూ యానిమేట్‌ చేయాలని కలవరిస్తున్నాడు. కొన్ని అరుదైన, తన హృదయానికి దగ్గరైన యానిమేటెడ్‌ షార్ట్ ఫిలిమ్స్ తీసి దుమ్మురేపాలని ఆత్రంగా వున్నాడు. ఇప్పటివరకూ ఏమీ చేయనట్టు, ఇప్పుడు అపూర్వమైన మేజిక్‌ చేయడానికి చిన్న యానిమేషన్‌ స్టుడియో పెట్టి గుండెనూయిల నూగించే బొమ్మలెన్నో మనకి చూపెట్టాలని మోహన్‌ సరదాపడుతున్నాడు. ఒక చేత్తో పెన్సిలూ, మరో చేత్తో బ్రష్షూ పట్టుకుని, ఇంకో డజను చేతుల్తో స్నేహాన్నీ, ప్రేమనీ పంచి యిచ్చే మాంత్రికుణ్ణి మీరెప్పుడూ చూడలేదా?
అయితే మోహన్ని మీరింకా కలుసుకోనట్టే.

*

ఆగ్రహం నగ్నముని కవిత్వ వ్యాకరణం!

-అఫ్సర్

~

[డిసెంబర్ 6 హైదరాబాద్ లో  యాభయ్యేళ్ళ దిగంబర కవిత్వం సందర్భంగా  “ఛాయ” ఏర్పాటు చేస్తున్న  నగ్నమునితో సంభాషణ సందర్భంగా…

 

సామాజిక సాహిత్య రూపాల పరస్పర సంబంధం 1955 పరిణామాల తర్వాత స్పష్టమయింది. సాహిత్య రూపాలపై క్రమంగా మధ్యతరగతి పట్టు  పెరగటం వల్ల వచన కవిత్వం బాగా విస్తరించింది. చాలా కొద్ది కాలంలోనే వచన కవిత్వానికి కూడా రూపపరంగా వొక ఫార్ములా యేర్పడిపోయింది. రాజకీయ, సామాజిక రంగల్లో వున్న స్తబ్దతా, మధ్య తరగతిలో కళారూపాల పట్ల ఏర్పడుతున్న పరాన్ముఖతా వచన కవిత్వంలోని ఈ ఫార్ములాని కొంతకాలం నిరాటంకంగా సాగ నిచ్చాయి.  ఈ నమూనాని చేధించి, మొత్తంగా కాకపోయినా శకలాలుగానైనా జీవన వాస్తవికతకి దగ్గరగా వెళ్లాలనే ప్రయత్నం ఆరుద్ర, అజంతా, నగ్నముని,  బైరాగి, వజీర్ రెహ్మాన్, ఇస్మాయిల్  లాంటి కవులు చేస్తూ వచ్చారు.

’60 ల మొదటి దశలో నగ్నముని ‘ఉదయించని ఉదయాలు’ వెలువడేనాటికి అదొక ప్రత్యేకమైన గొంతు. అంత్యప్రాసలకి అంత్యక్రియలు చేసి,  కొత్త నిర్మాణ వ్యూహాలతో నగ్నముని వొక కెరటంలాగా తెలుగు కవిత్వాల పొడి  వాతావరణంలోకి దూసుకొచ్చాడు. “అంతా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి, ఏదో పనిలో తమని తాము పోగొట్టుకుంటున్న”స్తబ్ధస్థితిలో మనిషిని, మనసులోని కొత్తగోళాల వైపు నడిపించడమే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. బహుశా, నగ్నముని ఈ దశలో చేసింది. కొత్త సంపన్నుల వరసలో చేరాలని తపించే మధ్యతరగతిపై నిరసన ప్రకటించడం.

“గుద్దేసి వెళ్ళిపోయిన కారు కింద పడ్డ మనిషి చుట్టూ జనం ఈగల్లా ముసురుతున్నారు. తిరిగి అంతా అతన్ని వదిలేసి మాట్నీకి వెళ్లిపోతున్నారు….

మధ్యతరగతి తన చుట్టూ   జరుగుతున్న వాటి గురించి కావాలని పెంచుకుంటున్న Alienation, కందమూలాలు ఏరుకోడంలో జీవితం అయిపోతున్నా,  కోర్టుల్లో కాలం ఉరి తీయబడుతున్న అక్షరాలు అర్ధాలు కోల్పోతున్నా, అంతా బావున్నారులే అకాశం కింద –

వాస్తవికతకి దూరంగా పారిపోతే తప్ప, మధ్యతరగతి తన ఊహాప్రపంచాన్ని పకడ్బందీగా నిర్మించుకోలేదు. చుట్టూ ఏమీ జరగడం లేదనుకోవాలి. అంతా బాగుందనుకోవాలి. తను తప్ప సమాజమంతా సుఖంగా వుందనుకోవాలి. ఇలా ఎండుటాకుల మీద చప్పుడు కాకుండా నడవాలనుకునే ఈ ధోరణిని నగ్నముని ఎండకట్టాడు.

2006021617180301_996062e

నగ్నముని మొదటినుంచీ చాలా Conscious poet. తనదేదో ఒక వింత దంత గోపురాన్ని నిర్మించుకొని అక్కణ్నించి దిగి రాకూడదని భీష్మించు కూర్చోడు. నేలమీద నిటారుగా నిల్చొని సూటిగా సూర్యుడి వైపు ప్రయాణించాలనుకుంటాడు. అందుకే నగ్నముని తనదైన ఒక ఏకాంత  స్వప్నాన్వేషణలో తడబడు గొంతుకతో మట్లాడలేదు. స్పుటంగా  పలకడం అతనిలోని శాబ్దిక బలం వల్ల కాదు. తాత్విక బలం వల్ల వచ్చిన లక్షణం. నిశబ్దంలో నిశ్శబ్ధ భావాల్ని పలికేటప్పుడు కూడా నగ్నముని బాహ్య జీవితాన్ని గురించి నిష్కర్షగా చెప్పగలడనడానికి ‘మార్లిన్ మన్రో కోసం’ రాసిన కవితే నిదర్శనం.

దిగంబర కవిగా అవతరించిన తర్వాత నగ్నముని యధాతథ వ్యవస్థ మీద కత్తి కట్టినట్టు కవిత్వం రాశాడు. వ్యవస్థని వెనక్కి నెట్టే లేదా ఎక్కడికక్కడే స్తబింపజేసే ఏ శక్తినీ నగ్నముని క్షమించలేకపోయాడు. ప్రతిఘటన, ఆగ్రహం తన కవిత్వానికి పర్యాయపదాలుగా మార్చుకున్నాడు. కవిత్వంలో  కప్పలా బెక బెక మంటున్న,  మేకలా మే మే అంటున్న   అసహాయపు కీచురాయి గొంతుని దగ్గరికి రానివ్వలేదు. అవకాశవాదమే జీవిత విధానంగా అన్ని విలువల్నీ వంచిస్తున్న నకిలీ వ్యక్తిత్వంపై నగ్నముని రెండో ఆలోచన లేకుండా కొరడా ఝళిపించాడు. ఇలాంటి కవితల్లో నగ్నముని సాధ్యమైనంత Satirical heights కి వెళ్లిపోతాడు. ఉదాహరణ: దేశభక్తి కవిత.

ఆధునిక జీవితానికి సంబంధించిన కొత్త కోణాలెన్నింటినో దిగంబర కవిత్వం వస్తువుగా తీసుకుంది. అయితే, 70లలో విప్లవోద్యమం వచ్చినప్పుడు నగ్నముని దృష్టి ‘తూర్పుగాలి’  వైపు మళ్లింది. దిగంబర కవిగా నగ్నముని అసహన, ఆగ్రహ ప్రకటనకే పూర్తిగా పరిమితం కాలేదు గానీ, ‘తూర్పుగాలి’ లో ఆ కోపానికో దిక్కు దొరికింది. దేన్ని కోప్పడాలి, ఎందుకు కోప్పడాలి అనేది ‘తూర్పుగాలి’ లో నగ్నమునికి సూటిగా తెలిసిపోయిందని పాఠకుడికి కూడా ఇట్టే తెలిసిపోతుంది.

మనిషిగా వర్గ చైతన్యంతో మనం ముందుకు వెడదాం అంటున్న నగ్నముని దిగంబర కవికాదు. వర్గచైతన్యం అనే పదం నగ్నముని  నిఘంటువులో కొత్తది. ఈ దశలో ఈ నగ్నముని నీలోనూ నాలోనూ  వున్నవాడు. మననుండి విప్లవాల్నీ, త్యాగాల్నీ నిరీక్షిస్తున్నవాడు.

విప్లవ కవిగామారిన తర్వాత నగ్నముని గొంతులో ఒక బాలెన్స్ వచ్చినట్టనిపిస్తుంది. భావాల్ని ఆవేశం స్థాయిలో కాకుండా ఆలోచన ప్రమాణంగా వ్యక్తం చేస్తున్నాడనిపిస్తుంది.

01-nagnamuni

విప్లవ కవిత్వం తరవాతి  దశకూడా నగ్నముని కవితల్లో కనిపిస్తుంది. “కొయ్య గుర్రం” ముగింపు వాక్యాల్లో కనిపించేది. మళ్ళీ కొత్త నగ్నమునే నమ్మాల్సిన వాటినన్నింటినీ నమ్మి, మోసపోయిన తర్వాత వుండే నిర్లిప్తతతో, జీవితాన్ని పునః ప్రారంభించాలనే అమాయక తపన కనిపిస్తాయి. అయితే, నగ్నమునిలో రకరకాల రూపాల్లో బహిర్గతమయ్యే సంఘర్షణా, అలజడీ అంత తేలిగ్గా దేనికీ లొంగవు. అంతా నిశ్శబ్దంగా వున్నప్పుడు నిప్పులు కురిపిస్తాడు. అంతా మౌనంగా వున్నప్పుడు శబ్దాల్ని వర్షిస్తాడు. ఈ నిశ్శబ్దం, ఈ మౌనం రెండు ఆయనకి భయంకరమైన ఉపద్రవాల్లా, శత్రువుల్లా కనిపిస్తాయి. అందుకే ఉద్యమాలు తగ్గుముఖం పట్టి, పోరాట పటిమ బలహీనపడిందని భావించి స్తబ్ద వాతావరణాన్ని వేలెత్తి చూపించాడు. విప్లవ నినాదం కాక, ఈ సమాజాన్ని కదిలించాల్సిన కొత్త శక్తి ఏదో కావాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య గొంతుకని సవరించుకున్నాడు. ఈ రెండు నినాదాల్లోనూ, వివాదాల్లోనూ నగ్నముని రాజీలేని తనమే కనిపిస్తుంది.

బాహ్య, అంతర్లోకాల సరిహద్దులు స్పష్టంగా గుర్తెరిగిన వాడవడంతో నగ్నముని కవిత్వరూపం సర్రియలిజంకి దగ్గిరగా వెళ్లిందనిపిస్తుంది. చాలా మామూలు మాటలూ, వాక్య నిర్మాణంలోనే ఎలాంటి ప్రయాసా పడకుండా అసాధారణ శైలిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధోరణి ‘ఉదయించని ఉదయాల్లో’  కాస్త తక్కువగా, దిగంబర కవిత్వంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ‘ఉదయించని ఉదయాల్లో’  లాండ్ స్కేప్ లాంటి కవితతో Para-linguistic features కనిపిస్తాయి. అంత్య ప్రాసల వచన కవిత్వ శైలి ప్రధానంగా వున్నప్పుడు దాన్ని ధిక్కరించి ‘దిక్’ల వైపు సాగే ప్రయత్నం ‘లాండ్ స్కేప్’లోనే కనిపిస్తుంది. ఈ Para-linguistic రూపాన్ని తర్వాత్తరవాత వజీర్ రెహ్మాన్,  స్మైల్ ఇంకా బలంగా, అర్ధవంతంగా వుపయోగించగలిగారు. ఇలా అత్యాధునిక కవిత్వ రూపానికి సంబంధించిన కొన్ని నమూనాల్ని నగ్నముని తన కవితల ద్వారా చూపించాడని చెప్పవచ్చు.

సాధారణ వచన కవిత్వ శైలిలో ఎంతకాదన్నా శబ్దం పంటికింద రాయిలా తగుల్తుంది. పైగా  అంత్య ప్రాసలవల్ల కవిత్వ వాతావరణం కొంత అసహజంగా వుంటుంది. ఈ రెండింటినీ నిరాకరించినది అత్యాధునిక కవిత్వ రూపం. ఈ రూపంలో భాష వొక వాహికగా వుంటుంది తప్ప తనే కవిత్వంగా మారదు. తిలక్ తరహా అలంకారిక శైలిని అత్యాధునిక కవిత్వంగా  కనీసం ఊహించలేం. అలాగే కుందుర్తి తరహా అంత్యప్రాసల అసహజ ప్రయాస కొత్త రూపంలో కనిపించదు.

8215_front_cover

ఈ కొత్త ధోరణికి చెందినవాడవడం వల్ల నగ్నముని కవిత్వంలో భాష కనిపించదు. అంతర్వాహినిలా వొక ఆధునిక మానవుడి సంభాషణ వినిపిస్తుంది. ఈ సంభాషణా శైలీ వ్యూహాన్ని నగ్నముని చాలా యాంత్రికంగా ప్రవేశపెట్టాడని అనుకోడానికి లేదు. తర్వాత్తర్వాత నగ్నముని కవిత్వరూపంలో ఎన్ని మార్పులొచ్చినా, మౌలిక నిర్మాణ ప్రాతిపదిక ఈ సంభాషణా వ్యూహమే. ఈ సంభాషణకి వొక క్రమం వుంది. నగ్నముని ప్రతి కవితలోనూ రెండు పాత్రలు కనిపిస్తాయి. ఒకటి కవి. రెండు తను లక్ష్యంగా వ్యక్తి లేదా వ్యక్తి ప్రతీకగా వున్న వ్యవస్థ. ఈ రెండు పాత్రల మధ్య సంభాషణలో గట్టి తర్కం వుంటుంది. నిర్మొహమాటంగా సాగే భావాల మార్పిడి వుంటుంది. ఒకే అంశాన్ని అనేక కోణాలనుంచి పరీక్షించి వీక్షించే వైరుధ్యమూ, విశాలత్వమూ వుంటాయి. ఇది (Monologue)గా మిగలదు. కచ్చితంగా (Dialogue) రూపంలో సాగుతుంది.

మొట్టమొదట , చిట్టచివరి కొమ్మన మనసు దిగంబరం కావాలి  – అని నగ్నముని చెప్పింది వ్యక్తీకరణ సమస్యే. ఈ దశలో నగ్నముని కవిత్వ శైలిలో అక్కడక్కడా అశ్లీలం పలకడం కూడా ఆశ్చర్యమేమీ కాదు. నగ్న సంభాషణలో శీలం, పాతివ్రత్యం, అశ్లీలం అంటూ ఏవీ మిగలవు. మాటల మీది ముసుగుని తొలగించడమే ఇక్కడ కవిత్వం పని. ఈ దిశగా నగ్నముని సాధించింది ఎంతో మిగిలింది. ఎన్ని వాదాలూ, అపవాదాలూ చేసినా అది ఖనిజం లాంటి నిజం

[నగ్నముని కవిత్వం మీద  1992లో తెనాలి పొయెట్రీ ఫోరం వారు “సంతకాలు” కవిత్వ పత్రిక నగ్నముని ప్రత్యేక సంచికకి  రాసిన గెస్ట్ ఎడిటోరియల్ ని ప్రచురిస్తున్నాం. ఈ రచనని ఇన్నేళ్ళ పాటు భద్ర పరచి మాకు పంపించిన పసుపులేటి వెంకట రమణ గారికి కృతజ్ఞతలు]

~

నైనతార – ఒక రెబెల్ తార

-కృష్ణ మోహన్ బాబు

~

mohanbabuసునామీలు, భూకంపాలూ వచ్చేటప్పుడు ప్రకృతిలో కొన్ని జీవులు వాటిని ముందుగానే పసిగడతాయి.  అలాగే మానవ సమాజం లో సామాజిక వుపద్రవాలు రాబోయే  ముందు బుద్ధిజీవులకు ముందుగానే తెలుస్తుంది, వాళ్ళు సమాజాన్ని అప్రమత్తం చేస్తారు.   88 యేళ్ళ నైనతార సెహగల్ తనకి 1986 లో వచ్చిన సాహిత్య అకాడెమీ అవార్డ్ ను తిరిగి ఇచ్చి వేయటం దేశంలో  తలెత్తుతున్న ఫాసిస్ట్ శక్తులను గుర్తించటం లో భాగంగా చేసిన హెచ్చరిక.

ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందుగానే చెప్పటం ఆవిడకి కొత్త కాదు.  1967-75 లో  ఇందిరాగాంధీ గురుంచి కూడా యిలాగే హెచ్చరించింది.  అందరూ ఇందిరని భుజాలకెత్తి మోస్తున్నపుడు యిది ప్రజాస్వామ్య పోకడ  కాదని, వ్యక్తి పూజ అని నెహ్రూ ఏర్పరచిన విలువల విధ్వంసం అని నైనతార తడువుకోకుండా, మొహమాటం  లేకుండా ఎంత గట్టిగా చెప్పాలో అంత గట్టిగా చెప్పింది.  ఇలా చెప్పడానికి ఆవిడ కున్న అర్హతని, సాధికారతని మనం తెల్సుకోవాలంటే ఆవిడ గురించి  తెల్సుకోవలసిందే.

నైనతార సెహగల్ భారత దేశం లో సుపరిచితమైన నెహ్రూ కుటుంబానికి చెందిన మనిషి.  నెహ్రూ – గాంధీ కాదు, నెహ్రూ కుటుంబం మాత్రమే.  ఈ విషయం ఆవిడ చాలా గట్టిగా నొక్కి చెపుతుంది.  మోతీలాల్  నెహ్రూ కూతురు, జవహర్ లాల్ చెల్లెలు అయిన విజయ లక్ష్మీపండిట్, రంజిత్ సీతారామ పండిత్ ల  రెండవ కూతురు, నైనతార.  10 మే 1927 జన్మదినం.  నెహ్రూ భావాలన్న, ఆలోచనలన్న, ప్రజాస్వామ్య విలువలన్న నైనతారకు విపరీతమైన గౌరవం.  ఆవిడ నమ్మిన విలువలు, సిద్ధాంతాలు అన్నిటికి ఈ రోజుకు కూడా నెహ్రూ భావజాలమే ఆధారం.  తల్లిదండ్రులు జైళ్ళ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఇందిరతో కల్సి ఆనంద భవన్ లోనే  వుండేది.  ఇద్దరూ కల్సి బోర్డింగ్ స్కూల్ కు వెళ్ళేవాళ్ళు.  వయసులో ఇందిర పెద్దదైనా యిద్దరి మధ్య చాలా మంచి స్నేహం వుండేది.  ‘ఇంది’ అని పిలిచే అంత చనువు.

జీవితం చాలా చిత్రమైనది.  1967 ప్రాంతం లో ఇందిర కాంగ్రెస్ పార్టీని తన గుప్పెట్లో తీసుకునే ప్రయత్నాలలో వుంది.  అదే సమ యంలో గౌతమ్ సెహగల్ తో విడాకులు తర్వాత తప్పని పరిస్థుతులలో బతుకు తెరువు కోసం నైనతార ఢిల్లీ వచ్చి స్థిరపడింది.  ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ పత్రిక లో రాజకీయ వ్యాఖ్యాతగా వ్యాసాలు రాయటం మొదలు  పెట్టింది.  దేశంలోనే మొదటి మహిళా రాజకీయ వ్యాఖ్యాత అయింది.  అదే ఆవిడ జీవితంలో వచ్చిన పెద్ద మలుపు.  ఆర్ధిక అవసరాలు ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి మరింత విస్తృతంగా రాసేలా చేశాయి.  సండే స్టాండర్డ్ కి ఆవిడ 14 యేళ్ళు ఏకధాటిగా కాలమ్ రాసింది.  ఇది కాక ఎమర్జెన్సీ ముందు అజిత్ భట్టాచార్జీ నిర్వహణ లో, జయ ప్రకాష్ నారాయణ్ ప్రచురించిన పత్రిక ‘ఎవ్విరి మెన్స్ వీక్లీ’ కి రచనలు చేసింది.  వీటితో పాటు ‘ది న్యూ రిపబ్లిక్’, ‘అట్లాంటిక్ మన్త్ లీ’, ‘లండన్ టైమ్స్’, ‘ది ఫార్ ఈస్ట్రన్ ఎకనామిక్ రివ్యూ’ లాంటి పేరొందిన పత్రికలకి కూడా విస్తృతంగా రాసింది. రాజకీయాల పట్ల ఆవిడకున్న అనురక్తితో పాటు, రాజకీయ రాజధానిగా ఢిల్లీ నైనతారకి సంఘటనలను దగ్గిర నుంచి చూసి, లోతైన విశ్లేషణ చేసే అవకాశాన్ని కల్పించింది.  ఇందిర నెహ్రూ విధానాలను వదిలేసి, వ్యక్తి స్వామ్యానికి ప్రతీకగా మారటం ఆవిడ గుర్తించింది. ఇదే విషయాన్ని ఆవిడ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది.  ఆ వ్యతిరేకత ఎంత వరకూ వెళ్ళిందంటే ఇందిరాగాంధీతో ఆవిడ సంబంధాలు మొహం మొహం చూసుకోలేనంతగా దిగజారి పోయాయి.  నైనతార తో పాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్, ఫ్రాంక్ మొరేస్, సండే  స్టాండర్డ్ ఎడిటర్, నందన్ కాగల్ గొంతు కలిపారు.    1969 నాటికి ఈ మాటల దాడి నైనతారకి ‘జర్నలిస్ట్’ గుర్తింపుకు కూడా అనర్హమైన దానిగా చేశాయి.  అదే సమయంలో ఇందిర పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ బలమైన శక్తిగా ఎదగటం మొదలు పెట్టింది.  బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు లాంటి పాపులిస్ట్ విధానాలను ప్రకటించింది.  అయితే నైనతార వీటన్నిటినీ వ్యతిరేకిస్తూనే వచ్చింది.  గ్రామీణ పరపతి వ్యవస్థని పటిష్టం చేయకుండా కొద్ది మంది పారిశ్రామిక వేత్తలకి రుణాలు యివ్వటం ఏవిధంగా సమంజసం అని ప్రశ్నించింది.  కాంగ్రెస్ పార్టీలోని ఒక

బలమైన వర్గం మిగతా వారి పట్ల ఎప్పుడూ లేనంత దురుసు ద న్నాన్ని ప్రదర్శించి ప్రజాస్వామ్య విలువలని కాల రాసింది అని తీర్మానించింది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవటం, దాన్ని నిలబెట్టుకోవటానికి తప్పుడు దార్లు ఎంచుకోవటం ఇందిర చేస్తున్న పొరపాట్లు అంది.  ఒకప్పటి విలువలకు కాంగ్రెస్ తిలోదకాలు యిచ్చి, బేరసారాలలో కూరుకు పోయిందని రాసింది.  మరో పక్క  మతపరమైన తీవ్రవాద భావాలున్న జనసంఘ్(బి జె పి పూర్వ రూపం) ‘హిందీ – హిందూ –హిందూస్తాన్’ అనే ప్రమాద కరమైన నినాదాలను  ఎత్తు కుంటోందని కూడా గుర్తు చేసింది. పార్టీ లో విమర్శకు తావు లేదు.  ఓ పద్ధతిలో పెరిగిన వ్యక్తి పూజ ఏ విధమైన జవాబుదారీతనం లేకుండా చేసిందని భావించింది.  సొంత నియమ నిబంధనలను గౌరవించని పార్టీ, దేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవించగలుగుతుందీ? అని ప్రశ్నించింది.  అదే సంవత్సరం డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ చీలి పోవటం ఆవిణ్ణి చాలా నిరాశపరచింది. బంగ్లాదేశ్ యుద్ధంతో ఇందిర విజయ పరంపరలు, అప్రతిహతం గా సాగడం, ఇందిర ఎవరికి అందనంత ఎత్తు ఎదగటం జరిగాయి.

బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిర విజయాన్ని గుర్తిస్తూ, విదేశీ వ్యవహారాలలో ఇందిర చూపుతున్న పరిపక్వతను మెచ్చు కుంటూనే, పెరుగుతున్న ధనిక, పేద అంతరాన్ని, నక్సలిజం పట్ల యువతలో పెరుగుతున్న అదరణని గుర్తుచేసింది.    1974 లో బీహార్ లో నిప్పు రవ్వలా మొదలైన విధ్యార్థుల ఉధ్యమం జయ ప్రకాష్ నారాయణ్ (J.P.) ఆధ్వర్యంలో ఇందిరను చుట్టుముట్టినపుడు నైనతార జె.పి. తో కల్సి పని చేసింది.  1975 లో దేశంలో ఎమెర్జెన్సీ విధించినపుడు నైనతారని అరెస్టైతే చేయలేదు గాని నోరెత్తకుండా చేయగలిగారు.   తర్వాత తర్వాత మంచికో చెడుకో రాజకీయాలలో జేరి, దశాబ్దం పాటు అనేక ఆటుపోట్లను ఎదురుకొంది. 1982 లో ఇటలీ అంబాసిడర్ గా ఖరారైన నియామకాన్ని ఇందిర పదవి లోనికి రాగానే రద్దు చేసింది.

ఇందిర తో తన సంబంధాలు దెబ్బ తినటం నైనతార ని చాలా భావోద్వేగాలకి గురి చేసింది.  ఒక దశలో ఈ వ్యాసాంగాన్ని ఆపేద్దామనుకొంది.  అయితే ఏ విలువలకైతే నెహ్రూ కట్టుబడ్డాడో ఆ విలువల్ని సొంత కూతురే కాల రాయటం నైనతార జీర్ణించుకో లేకపోయింది.  అందుకే ఇందిర చేసే ప్రతీ పని ఆవిడకి తప్పు గా తోచేది.  తర్వాత రోజుల్లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తనకి ఆ రోజుల్లో పరిపక్వత లేకపోవడం వల్ల కొన్ని విషయాలను తప్పుగా అవగాహన చేసుకున్నాను అని ఒప్పుకుంది.  అందువల్ల వ్యక్తిగతం గా తను చాలా నష్ట పోయాను అని కూడా బాధ పడింది.

నైనతార 9 నవలలు రాసింది.  8 నాన్ ఫిక్షనల్ రచనలు చేసింది.  చిన్న కథల పుస్తకాలు వేసింది.  రాజకీయ, సాహిత్య వ్యాసాలు అనేకం రాసింది.  ఆవిడ రా సిన పుస్తకం ‘’ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ అండ్ స్టయిల్” 1977 లో ప్రచురించారు.  ఆ తర్వాత దీనిలోనే మరింత చేర్పులు చేసి “ఇందిరాగాంధి – హెర్ రోడ్ టు పవర్” గా మళ్ళీ వేశారు.  తన ప్రతి నవలలోను రాజకీయ వాతావరణాన్ని, నేపధ్యాన్ని ప్రతిబింబించిన ఏకైక ఇంగ్లీష్ రచయిత.  ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆంగ్లో ఇండియన్ రచయిత కూడా ఆవిడే.    సహచరుడు, మంగత్ రాయ్, నైనతార మధ్యన నడచిన ఉత్తరాల్ని 1994 లో “రిలేషన్ షిప్” పేరుతో పుస్తకం గా వేశారు.  అది చాలా సంచలనం రేపింది.     నైనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని రితు మీనన్ రాసిన పుస్తకం, “ఔట్ ఆఫ్ లైన్ : ఎ లిటరరీ అండ్ పొలిటికల్ బైయోగ్రఫీ ఆఫ్ నైనతార సెహగల్” గత యేడాది విడుదలైంది.  1980 ల మధ్య లో నైనతార చాలా కాలం ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబెర్టీస్’ (PUCL) కి జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసింది.  సిక్కుల వూచకోత మీద సమగ్ర నివేదిక ఇవ్వటం లో ప్రముఖ పాత్ర వహించింది.  ఆవిడ రాసిన కొత్త  కథల సంపుటి త్వరలో మన ముందుకు రాబోతోంది. ఎవరెలాంటి వ్యాఖ్యలు చేసిన, నైనతార చేసిన పని సమాజంలో ఒక అలజడిని సృష్టిస్తోంది.  మేధావి వర్గంలో ప్రకంపనలను సృష్టిస్తోంది.  నైనతార ఒక రెబెల్ తార.

*

 

లోపలి తపన ఒక్కటే, కవితలు వేర్వేరు!

 

కవి మోహన్ రుషితో కోడూరి విజయ కుమార్   సంభాషణ

 

 1. కవిత్వంలో ఆకర్షించింది ఏమిటి ?

మానవ సంవేదనల్ని లోతుగానూ, అత్యంత గాఢంగానూ ప్రతిబింబించే అత్యున్నత సాహిత్య రూపం కవిత్వం. అదే నన్ను కవిత్వానికి దగ్గర చేసింది.

 1. కవిత్వం ఏమిటి మీకు ?

కవిత్వం నాకు చాలానే. ఆనందం, బాధ, ఇష్టం, కష్టం, ఆర్తి, ఆత్మీయ స్పర్శ… అన్నీ. సీరియస్ గానే చెప్తున్నా, కవిత్వం రాయడం వల్లే బతికిపొయ్యాను.

 1. నవ తరం కవులు సీరియస్ సాహిత్యాన్ని చదవడం లేదు అంటున్నారు  …. నిజమేనా ?

నవతరం అంటే ఇప్పుడిప్పుడే రాస్తున్నవాళ్ళని అనుకోవాలా? అంటే నా తర్వాతి తరమా? నేనప్పుడే పాతతరం అనుకోవాలా? తక్కువ చదువుతున్నట్టుగానే అనిపిస్తుంది. పుస్తకాలు అందుబాటులో వుంటే  ఈ సంఖ్య పెరిగే అవకాశం వుందనుకుంటాను.

 1. మీ  కవిత్వంలో తెలంగాణ నగరాల భాష ఎక్కువగా కనిపిస్తుంది – అప్రయత్నంగా జరిగిందా …. లేక ?

అప్రయత్నమే. బతుకుతున్న బతుకును మాత్రమే రాయడం వల్ల అలా జరిగింది.

 1. తెలంగాణ వొచ్చింది కదా …. ఇప్పుడు తెలంగాణ కవిని ప్రేరేపించే అంశాలు ఏమున్నాయి ?

.    తెలంగాణ రాకపోవడమే ఇక్కడి కవులందరినీ ఇన్నాళ్ళూ ప్రేరేపించిన అంశం అని నేను అనుకోను. రావడంతోనే ఇక ప్రేరేపించే అంశాలు వుండబోవనీ అనుకోను. స్పందించే హృదయం తపన ఎప్పుడూ ఒక్కలానే వుంటుంది.

 1. తెలుగు కవిత్వం తెలంగాణ కవులను పట్టించుకోలేదు అన్న మాటను ఒప్పుకుంటారా ?

అవును. ఇంతకు ముందు పరిస్థితి అదే. తెలుగు కవిత్వం, తెలంగాణ కవిని పట్టించుకోకుండా వుండడం ఇప్పుడు సాధ్యంకాదు.

మీరు కవిత్వం వ్రాయడం ప్రారంభించిన కాలంతో పోల్చుకుంటే తెలుగు కవిత్వం ఇప్పుడెలా వుందని అనుకుంటున్నారు ?
కొందరుంటారు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ. మంచి కవిత్వం రాస్తూ. ఆశ్చర్యచకితుల్ని చేస్తూ. ఆ కొద్దిమందే కవిత్వానికి కొత్త జీవధార. మొత్తంగా చూస్తే గొప్పగా లేకపోయినా, ఈ కోణంలోంచి చూస్తే పరవాలేదేమో.

8. కవిత్వ వాక్యాల నిర్మాణంలో మీరు మామూలు ధోరణి కంటే కొంత భిన్నమైన నడక- కొంచెం వచనంలోని సహజ కవిత్వాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం ఏదో  కనిపిస్తుంది. ఇది మీరు conscious గా చేస్తున్నారా? మీ భాష  ఎంత వరకు మీ నియంత్రణలో వుంటుంది?

సహజ కవిత్వాన్ని పట్టుకోవాలన్న ప్రయత్నం conscious గా చేస్తున్నది కాదు. తీసుకున్న సబ్జెక్ట్ దానికదిగా ఎంచుకునే భాష ఒక ఫ్లోలో వస్తుంది. నియంత్రణ వుండదు, చాలా తక్కువసార్లు మాత్రమే కొన్ని పదాలు ఎడిట్ చెయ్యాల్సి వస్తుంది.

*

అక్షరమొకటే ఊరడించింది!

     –  హిమజ

himaja

1981లో హన్మకొండ పింగళి విమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు గ్రంథాలయ వారోత్సవాల్లో సరదాగా వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నందుకు ప్రథమ బహుమతి అందుకోవడం నా తొలి సాహితీ సంబరం.

పలు కాలేజీల్లో జరిగే కవితా పోటీల్లో పాల్గొనడం, కాలేజీ మాగజైన్ సంపాదకురాలిగా ఎంపికై బాధ్యతలు నిర్వహించడం మరిన్ని సంబరాలు.

పెళ్ళయ్యాక జింబో సహచర్యంలో సాహిత్యానికి మరింత చేరువైనా, పరవళ్ళు తొక్కే కుటుంబ బాధ్యతల్లో ఏమీ రాయలేదు.

కొంత ప్రయాణం తర్వాత – జీవితంలోని కొన్ని అలజడుల్ని, న్యూనతల్నీ కప్పిపుచ్చుకొని నార్మల్ గా బతకడానికి నాకో కవచం అవసరమైంది. ఆ ముసుగే కవిత్వమై అందంగా అమరింది. కుదిపేస్తున్న ఆవేదనల్లో అక్షరమొకటే నన్ను తన ఒళ్ళోకి తీసుకుని ఊరడించింది. హృదయవేదనలకీ, అంతరంగపు ఆర్తికి అక్షరాలు తొడగడమే నన్నిలా నిలబెట్టింది.

నా ’’సంచిలో దీపం‘‘ కవిత్వానికి గాను ’రొట్టమాకు రేవు‘ కవిత్వ అవార్డు అందుకోవడం మహా ఆనందంగా ఉంది. అవార్డు నిర్వాహకులు యాకూబ్, శిలాలోలిత గార్లకు నా కృతజ్ఞతలు. పల్లెల గాలుల్లోనే కవిత్వ వాతావరణం ఉంటుంది. దాన్ని మరింతగా పెంపొందింపజేసేందుకు ఈ కవి జంట చేస్తున్న కృషికి అభినందనలు.

కవిత్వం వేరెవరినో ఉద్ధరించడానికి కాదు. మనల్ని మనం వ్యక్తం చేసుకోడానికి, విముక్తమవడానికి అని నమ్ముతూ –

నా ముందు వెనకాల ఉన్న మహా సాహితీ సాగరానికి ఒక నీటిబిందువునై వినమ్రంగా నమస్కరిస్తున్నా.

బాపూరమణీయం@వైకుంఠం

 

-వై. వి.ఆర్.  శ్రీనివాస్ 

~

4saaranga (1)వైకుంఠంలో  బ్రహ్మ సరస్వతితో కలిసి తల్లితండ్రులతో కబుర్లు చెపుతున్నాడు. ఇంతలో జయవిజయుల అనౌన్స్-మెంటు “బాపూరమణలు తమ దర్శనానికి వచ్చారు ప్రభూ,” అంటూ. “వాళ్ళని త్వరగా తీసుకురండి, ఆలస్యమెందుకు?” అన్నట్టు లక్ష్మీనారాయణులు చూసిన చూపులకి బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది.

ఎవరీ బాపూరమణలు? రామలక్ష్మణులు, కృష్ణార్జునులు, జయవిజయులు, అశ్వనీ దేవతలు, నారద తుంబురులు, … లాగా బాపూరమణలనే ఈ కొత్త ద్వంద్వసమాసానికి కారకులెవరా అని నాలుగు ముఖాల్లో రెండే ప్రశ్నలు – బాపు ఎవరు? రమణ ఎవరు? – కదలాడుతూ చూసాడు. చదువులతల్లి మాత్రం పుట్టింటివాళ్ళని చూసిన భూలోకపు కోడల్లా సంబరపడుతోంది.

పరిస్థితి గమనించిన విష్ణుమూర్తి లక్ష్మి వైపు చూసి నవ్వాడు. “ఎంత గొప్ప స్నేహమో! రవఁణొచ్చి చాలా సేపే అయినా ఇద్దర్నీ ఒకేసారి చూడాలని మీ మావఁగారి ఉద్దేశం,”  అంది కోడల్తో. ఒదిగిఒదిగి వస్తున్న ఇద్దర్నీ చూసి వీళ్ళిద్దరి వినయం గురించి మనం విన్నది (వాళ్ళు వినాలా?) నిజ్ఝంగా నిజం సుమీ అనుకున్నారు లక్ష్మి శ్రీహరి. చిత్రకళలో శ్రీరాముడే తన  గురువని చూపిస్తూ వేసిన బొమ్మ – అదే, రాముడు సీత పాదాలకి పారాణి అద్దుతూ ఉంటే తను కుంచెలూ, రంగులూ పట్టుకుని రాముడి కందిస్తున్నట్టు గీసారూ, అదీ.

bapu ptgs

అందులో ఎంత ఆనందంగా ఉన్నారో అంతకన్నా ఆనందంగా చేతులు కట్టుకుని, అలవాటు ప్రకారం రమణగారికి కొంచెం వెనగ్గా నిలబడి ఆదిదంపతులని తదేకంగా చూస్తూ ఉన్నారు. గురువు మాట కాదని అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ అందించిన రామానుజుడి ఆవేశం, అద్వైతాన్ని అక్షరాలా అనుభవించిన శంకరుని జ్ఞానసౌందర్యం రమణగారిలో తొణికిసలాడుతున్నాయి. ఆయనలో  భక్తుడూ, సునిశిత పరిశీలకుడు, రచయితా, తత్త్వవేత్త ఒకేసారి కనబడుతున్నారు. స్వామివారికి ఇద్దరి సంగతీ తెలుసు కనక ధరహాసంతో, నిజభక్తులని  చూసిన సంతోషంతో అలాగే చూస్తూ ఉన్నాడు. అయ్యవారి సంతోషాన్ని చూస్తూ అమ్మవారూ అలా ఉండిపోయింది. బ్రహ్మ గారు మాత్రం నాలుగు చూపుడువేళ్ళు నాలుగు ముక్కుల మీదా వేసుకుని చోద్యం చూస్తున్నాడు. ఆయనకి రజోగుణం ఎక్కువ కనక ఒక్క క్షణం ఇదేమిటి ఈ మానవమాత్రుల  మీద ఈయనకింత ఆసక్తి అనుకున్నా అంతలో కృష్ణావాతారంలో గొల్లపిల్లల మీద ఈయన ప్రేమని తను పరీక్షించి మరీ భంగపడ్డ వైనం గుర్తొచ్చి సద్దుకున్నాడు. కలియుగంలో కూడా స్వామికి అలాంటి భక్తులున్నారనమాట అనుకున్నాడు. స్వామిని డిస్టర్బ్ చెయ్యకుండా గుసగుసగా అన్నాడు వాణితో, “సృష్టికర్తగా నేను టూ బిజీ కనక వీళ్ళెవరో తెలుసుకోలేదు కానీ నీకు తెలుసులా ఉందే? ఎవరు వీళ్ళు ఏమిటి కధ?” అన్నాడు. ఆవిడ మహానందంగా చెప్పింది “నా అంశలైన అరవైనాలుగు కళల్లో సాహిత్యం రమణగానూ, చిత్రలేఖనం బాపూగానూ అవతరించాయి” అని. “అవునా?! మరయితే వందలాది కళాకారులూ సాహితీవేత్తలూ ఉండగా వీళ్ళిద్దరే అని ఎలా చెబుతావు?” అన్నాడు. “ఎవరి విశిష్టత వాళ్ళదే. కానీ వీళ్ళిద్దరూ మూడు ప్రక్రియల్లో, అంటే సాహిత్యం, చిత్రలేఖనం, చలనచిత్రనిర్మాణ శైలీశిల్పాలలో జంటకవులు, కన్-జాయిన్డ్ ట్విన్స్. రమణ కధలు బాపు బొమ్మల్లోనూ, సినిమాల్లోనూ పొందిగ్గా ఒదిగిపోతాయి. వాటి గొప్పతనాన్ని బాపూరమణీయపు చవిచూసిన తెలుగువాళ్ళ ఆనందంతోనే కొలవగలం. అయినా మహా వినయసంపన్నులు. ఆధునిక పోతనలు. శ్రీరామునికి మహాభక్తులు. ఇంకేం ఋజువు కావాలి నా అంశ ఉన్నవాళ్ళనడానికి? ”

“నీ అంశలేనోయ్, సందేహమా? మరైతే చలనచిత్రాలన్నావ్, అవేంటి? కదిలే బొమ్మలా? వాటి గురించి వివరంగా చెప్పు”  అన్నాడు బ్రహ్మ దేవుడు.

“సాహిత్యం, నాటకం, ఛాయాచిత్రం, చిత్రలేఖనా ప్రావీణ్యం కలిపి వాటికి సంగీతనాట్యాలు జోడిస్తే చలనచిత్రం అని అరవై ఐదో కళ పుట్టింది. అందులో  నిష్ణాతులు వీళ్ళిద్దరూ”

“ఉట్టి కదిలే బొమ్మలే కాదు అవి మాటలు కూడా ఆడతాయి. చెట్లచుట్టూ, మంచు కొండల్లో డాన్సులు చేస్తూ పాటలు పాడతాయి. అంతే కాదు  అగ్నిపర్వతాల మధ్యా, ఎగిసి పడే కెరటాల మధ్యా నుంచుని ఏడుస్తూ కూడా పాడతాయి.”

“వింతగా ఉందే? ఇదీ నా సృష్టే?”

“ఈ కళ మానవ సృష్టి మహాత్మా! అయినా కళామతల్లిని నేనయితే, మీరు సృష్టించడం ఏమిటి?”

“సరే, సరే, సరే. చలనచిత్రాలలో వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటి?”

“మీకు ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి గుర్తుందా?”

“వాణీ, వీణా పాణీ ! నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వే ఆయనెవరో, ఆయన గొప్పతనం ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకో”

“ఇండియా, చైనా జనాభాలు మరీ అంత పెంచకండి, మీకు వర్క్-లోడ్ ఎక్కువైపోతుందని ఎన్నిసార్లు చెప్పాను? వింటేగా? మర్చిపోకూడని  విషయాలు మర్చిపోతున్నారు. మీ నోటిమాటతో ఎగిసిన గాన-సునామీని గుర్తించలేకున్నారు. యముడికి చిత్రగుప్తుడిలా మీకూ ఒక అసిస్టెంట్ ఉంటే బావుణ్ణు”

“ఏం చేస్తాం? యముడికి రెండు చేతులూ, ఒక తలే గదా! నాకు నాలుగు తలలు నాలుగు చేతులు ఉండడంతో అసిస్టెంట్ పోస్ట్ శాంక్షన్ అవ్వట్లేదు. అక్కడికీ తలరాతలన్నీ చాలామటుకు కాపీ, పేస్ట్ చేసేస్తున్నా, యాంత్రిక యుగానికి అంతకంటే కష్టపడ్డం ఎందుకని. అయినా తీరిక దొరకట్లేదు. అదలా వదిలేయ్. ఘంటసాల గురించి చెప్పు”

“ఒకప్పుడు మీ సభలో నారద,తుంబురుల సంగీత పోటీ జరిగినప్పుడు దేవతలందరూ కలిసి కూడా ఇద్దరిలో ఎవరు గొప్ప గాయకుడో తేల్చలేకపోయారు.  చివరికి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగి పోట్లాట వరకూ వచ్చింది. అప్పుడు మీరు కోపించి మీరిద్దరూ కలిసి మానవలోకంలో ఓకే శరీరంలో పుట్టండి అని శపించారు. శాపవిమోచనగా లక్షలాది, కోట్లాది ఆంధ్రులని ఇద్దరి గానమాదుర్యంలో ఒకేసారి ముంచి తేల్చి తరతరాల పాటు గుర్తుండిపోయేలా చేసి  తిరిగి మీ మీ రూపాలు పొందుతారు అని మీరు సెలవిచ్చారు.  అంతట నారద తుంబురులు ఒక్కటై ఘంటసాల వెంకటేశ్వరరావుగా జన్మించి ఆంధ్రదేశాన్ని తన గాత్ర మాధుర్యంలో ముంచి వేశారు”

“అవునా? నా శాపం తెలుగు వాళ్లకంత ఆనందం కలిగించిందా? సంతోషం.”

“ఆయన పాడిన భగవద్గీత కృష్ణావతారంలో మావఁయ్యగారే పాడినట్టు ఉంటుంది”

“ఔనా! చాలా బావుంది. లోకకళ్యాణం చేసి వచ్చారన్నమాట దేవ, గంధర్వ గాయకులిద్దరూ”

“సరిగ్గా అలాంటి లోక కళ్యాణమే చేసి వచ్చారు ఈ బాపు రమణ ద్వయం. ఆంధ్ర జాతిని వాళ్ళ మూలాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సంస్కృతినీ, సాంప్రదాయాన్ని; బలాల్నీ, బలహీనతలని; వాళ్ళ నిత్యజీవితాల్లో ఉండే హాస్యాన్ని, సున్నితత్వాన్ని, గాంభీర్యతని, శృంగారాన్ని, అమాయకత్వాన్ని, అహంకారాన్ని, ఆమ్యామ్యాని, మామూలు మనుషుల్లా కనిపించే క్రూరులనీ, క్రూరంగా కనబడే మంచివాళ్ళనీ, … అందర్నీ, అన్నిటినీ, ‘వోలు మొత్తం’ తెలుగుదనపు విశ్వరూపాన్ని రచించి, చిత్రించి, చలనచిత్రీకరించి –

తెలుగుదనం అంటే తెలీనివాడికి దాన్ని కంటికికట్టే ఎన్-సైక్లోపీడియాలా;తెలుగుకీ, ఆ నేలకీ దూరమైనవాణ్ని క్షణంలో సొంతూరికి, తన మనుషుల మధ్యలోకి తీసుకెళ్ళిపోయేలా; తెలుగు మర్చిపోయిన వాడికి తెలుగు సంస్కృతి మనసంతా నిండిపోయేలా,…..చెయ్యగల ఓ మూడు గంటల చలనచిత్రం తయారు చెయ్యగలరు.  మానవనైజానికి, మానవత్వానికి తెలుగు వెర్షన్ లా ఉంటుంది అది”

“ఒక సంస్కృతి రూపు దిద్దుకోవడంలో తమ వంతు చేసారన్నమాట. బావుంది, ఇంకా చెప్పు”

“కొంచెం కవితాత్మకంగా చెప్తాను,  I am waxing lyrical.”

“గో ఎహెడ్!”

“తెలుగుదనం స్పష్టంగా మాట్లాడితే అది రమణ రాత అవుతుంది. రూపం ధరిస్తే బాపు బొమ్మౌతుంది”

“భలే!”

బాపు౫

“పులిహారా, గోంగూరా, మజ్జిగపులుసు, పనసపొట్టు కూరా, గుమ్మడికాయ వడియాలూ … …. లాంటివన్నీ ఉన్న తెలుగు మీల్

బంతిపూలు గుచ్చిన గొబ్బెమ్మలనీ, చుట్టూ పాడుతూఆడే ముద్దబంతిపూలని చూసినప్పుడు కలిగే తెలుగు జీల్

చిరు వేసవిలో, పరీక్షల సీజన్లో రామనవమి పందిట్లో పానకం వడపప్పుల్లో ఘుమ ఘుమలాడే తెలుగు ఫీల్

తెల్లవారకట్ట కుంపటిపై కాఫీ కాస్తూ కబుర్లు చెప్పుకునే అచ్చ తెలుగు కొత్తజంటలో, కష్టసుఖాలు కలబోసుకునే పాతజంటలో కనిపించే తెలుగు సౌల్ (soul) ఇవన్నీ ఒక బాపు బొమ్మలోనూ, ఒక రమణ కధలోనూ లేక ఇద్దరూ కలిసి తీసిన సినిమాలోనూ ఒకేసారి అనుభవించవచ్చు”

“అద్భుతః, ఇంకా..”

“రమణ మాట, బాపు బొమ్మ కలిసి కదిలితే -‘ముత్యాలముగ్గు’ల మధ్య ‘గోరంత దీపా’ల కొండంత వెలుగు ల్లో ‘అందాల రాముడి’తో ‘సీతాకళ్యాణం’  జరిగినంత అందంగా ఉంటుంది”.

“పరమాద్భుతః! వాణీ, వీణాపాణీ! నీ మాటలు వింటుంటే నాకిప్పుడే మరో లోకాన్ని సృష్టించి పూర్తిగా తెలుగువాళ్ళతో తెలుగుదనంతో  నింపెయ్యాలనిపిస్తోంది”

“విధాతా! కొంచెం ఓపిక పట్టండి. నేనంతా చెప్పలేదు”.

“చెప్పు మరీ! చెప్పు మరీ! చెప్పు మరీ! చెప్పు మరీ!,” అది నాలుగు గొంతులతో ఒకేసారి మాట్లాడ్డం వలన వచ్చిన ఇకో ఎఫెక్ట్.  “పద్యాలు చదవకుండా ప్రబంధ నాయికలను పరిశోధించాలంటే ‘బాపు బొమ్మల్ని’ చూస్తే చాలు; ప్రపంచం, మనుషులు, దేవుడు సరిగ్గా అర్ధం కాకపొతే రవఁణ కధలన్నీ చదివేస్తే చాలు; బాపూరమణల సాంగత్యం మరిగితే ‘కలియుగ రావణాసురుడై’నా ‘కలాపోసన’ చెయ్యాల్సిందే; నరుల అనుభూతుల్ని, బలహీనతల్ని సానుభూతితో అర్ధం చేసుకోవాలంటే దేవతలంతా రవఁణ కధలు, డైలాగులు హాండ్ బుక్ గా వాడుకోవచ్చు; తెలుగుని, రసాత్మకతని, పెదవులు విడివడని చిరుహాసాన్ని చాలాకాలంపాటు మర్చిపోయినవాళ్ళు బాపు కుంచెనీ, రమణ కలాన్ని ఆశ్రయిస్తే చాలు; అప్పుల్లో, వాట్సప్పుల్లో మునిగిపోతున్న మనుషుల నుదుట ‘బుడుగు’, ‘రాధాగోపాళా’ల్ని చదువుతారు అని మీరు వ్రాస్తే వాళ్ళు కొంచెం సుఖపడతారు. ఓ వ్యక్తిలో మానవత్వం ఉందా లేదా అని డౌటొస్తే ‘కొంటె బొమ్మల బాపు’ అతని చేతిలో పెట్టండి, క్షణంలో వాడి ముఖంలో చిరునవ్వు కదలాడకపోతే  “వాడొఠ్ఠి నస్మరంతి” గాడని తెలుసుకోండి; మనిషి-దేవుడు రిలేషన్స్ ఎలావుండాలో తెల్సుకోవాలంటే మనుషులూ, దేవుళ్ళు కూడా బుద్ధిమంతుడులో మాధవయ్యా- మాధవుల బంధాన్ని చూస్తే  చాలు ; వీళ్ళ రచనలు, బొమ్మలు, కార్టూన్లు, సినిమాలు “శిక్ష”గా వేసేస్తే 50%  నరకవాసులు మంచివాళ్ళై పుట్టేస్తారు; వీళ్ళిద్దర్నీ స్వర్గంలో ఉండమంటే అక్కడికొచ్చిన పుణ్యాత్ములంతా స్వర్గ సుఖాలొదిలేసి ‘కోతికొమ్మచ్చి’ మొదలెడతారు”

“అమ్మో! అది కుదరదు. స్వర్గలోకం ఫంక్షన్స్ మార్చడానికి రూల్సొప్పుకోవు. వీళ్ళని వైకుంఠంలోనే వుంచుదాం”

ఆదిశేషుడు, గరుత్మంతుడూ కంగారుగా చూసారు. అక్కడే ఉన్న రామభక్త హనుమాన్ కి వాళ్ళ ఆదుర్దా చూసి రామావతారంనాటి ‘రాముడి ఆవలింతలకి  చిటికెలు’ ఉపాఖ్యానం గుర్తుకొచ్చింది. తను మాత్రం ” శ్రీ రామ జయరామ. సీతా రామా కారుణ్యధామా కమనీయనామా…” హమ్ చేస్తూ ఆనంద భాష్పాలు కార్చసాగాడు.

“క్షమించండినాధా! ఇవన్నీ మీకు తెలియవని కాదు, కలియుగం మరీ భరించలేకుండా ఉంది నరులకి. వీళ్ళిద్దరి తత్వాన్ని, భావాల్ని కొత్తతరాల నుదుట  రాస్తే నరులు కొన్నాళ్ళైనా  సుఖపడతారని తల్లిగా నా….,” శారదాదేవి మాట పూర్తయేలోపు శ్రీదేవి గొంతు సవరింపుతో వాణీ-బ్రహ్మసంవాదం ఆగింది.

“నాధా! రాబోయే కల్పంలో మళ్ళీ రామాయణం ఉంటుందిగా?”

“తప్పదుగా మరి!”

“అయితే ఈసారి నార్త్ ఇండియాలో వద్దు, సౌత్ లో, ఆంధ్రాలోనే పుడదాం. మీరు సరయూనది మిస్సవకుండా గోదావరి ఉండనే ఉంది”

“సరే! కానీ ఇంకా ఏదో ఉంది నీ మనసులో”

“బాల, అయోధ్య కాండలు తెలుగు నేల మీద, తెలుగు వాళ్ళతో గడిపి,  …”

“గడిపి?”

“తెలుగు సాంప్రదాయాలు, పండగలు, రుచులూ,…ఆస్వాదించి…”

“ఆఁ! దించి…?”

“అరణ్యకాండ పూర్వంలాగే పాపికొండల మధ్య గోదావరి ఒడ్డునా …”

“ఓకే! తధా…”

“ఆగండాగండి. బాపుతో పంచవటి డిజైన్ చేయించి అందులో రమణ శైలిలో మాట్లాడుకుంటూ ….”

“స్తు”

“శేషా! కంగారు పడకు వీళ్ళని అరణ్యవాసానికి తీసుకెళ్ళం. లక్ష్మి అడిగినవన్నీ వీళ్ళతో తయారు చేయించి దగ్గర పెట్టుకో. ఎగ్జిక్యూషన్  అంతా పూర్వంలా నీదే” అని ఆదిశేషుడి అంతరంగం తెలిసిన స్వామి ఇలా అన్నాక శేషుడి ముఖం పడగలై విచ్చుకుంది. బాపూరమణలు “దారుణమైన” వినయంతో మరీమరీ ఒదిగి స్వామిని, శ్రీమాతని చూస్తూండిపోయారు.

“మహాలక్ష్మీ! అనుకున్నవన్నీ అడిగావా? ఇంకేమైనా మిగిలాయా?”

“మనం త్యాగరాజు ఇంటికి అతిధులుగా వెళ్ళాం గుర్తుందా? అప్పుడు నేను త్యాగయ్యగారితో నేననుకున్నవన్నీ సరిగ్గా చెప్పలేదు, మీరు ఏమంటారోనని. ఆ మాటలన్నీ బాపు-రమణ వాళ్ళ ‘త్యాగయ్య’ సినిమాలో సీత చెప్పేసింది”

“సో?”

“ఈసారి మళ్ళీ మన రామావతార కార్యక్రమంలో త్యాగరాజ స్వామి ఘట్టం కూడా పునరావృత్తం అవుతుందంటే…”

“అవుతుంది మరి. అహల్య, శబరి, హనుమయ్య, త్యాగయ్య లేని రామకధలో రసం ఉంటుందా?”

“ఐతే ‘త్యాగయ్య’లో ఇంటివిషయాలు పట్టించుకోని త్యాగయ్యతో వీళ్ళ సీతమ్మ ఎలా మాట్లాడిందో నేనూ అలాగే మాట్లాడాలనుకుంటున్నా”

“ఏఁవర్రా! అమ్మవారనుకున్నవన్నీ జరిపిద్దామా?” అన్నాడు స్వామి. బాపు యధాప్రకారం బిడియంగా నవ్వారు,అంతే. రమణగారు మెల్లిగా,”స్వామీ ! జనం పొగుడుతారండీ, వద్దులెండి”అనేసారు.

” భూమ్మీద మీకు ఎలాగో పొగడ్తలు తప్పవు, ఇప్పుడు కింద నరులకి పైనున్న సురలు తోడౌతారు. అంతేగా?” స్వామి నవ్వాడు.

బాపు౭

ముళ్ళపూడివారిని మొహమాటం, వినయం ముప్పిరిగొన్నా సాక్షాత్తూ దేవదేవుడు చెప్పాడు కదాని సద్దుకున్నారు.  బాపుగారు మాత్రం ఎప్పట్లాగే మౌనంతో, చిరునవ్వుతో మేనేజ్ చేసేద్దామనుకున్నారుగానీ, ఆపుకోలేకపోయారు. “మా బ్రహ్మ ఉన్నాడుగా, చేస్తాము  స్వామీ” అన్నారు. బ్రహ్మదేవుడు “అపార్ధం” చేసుకోకుండా సరస్వతి ఆయన  చెవిలో చెప్పింది, “బ్రహ్మ అంటే మీరే అనుకునేరు, రమణని బాపు బ్రహ్మ అంటాడు.” అప్పటికే అంతా అర్ధమైన బ్రహ్మదేవుడు సీరియస్ గా “బాపూ నీకు మరణం లేదయ్యా?” అన్నాడు. అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూసారు. బాపుగారయితే మరి నేనిక్కడికెలా వచ్చాను అన్నట్టు చూసారు. అయినా తనకి సహజాతి సహజమైన మౌనాన్నే ఆశ్రయించి రమణగారి వైపు చూశారు.

“నా రాతల్లో చిన్న టైపో దొర్లింది. మరణం అని రాయబోయి రమణం అని రాసేసాను. అందువల్ల నువ్వు జస్ట్ రమణించావు, అంతే!” అని బ్రహ్మ  వివరణ ఇవ్వడంతో వైకుంఠం ఆనందంతో – కాదు, ఆనందం అక్కడ ఎప్పుడూ ఉండేదేగా- నవ్వులతో మారు మోగుతుండగా “తండ్రీ! మీ టైపో ఎర్రర్ లోక కళ్యాణార్ధమే! ఈ మిత్రద్వయం చేసిన కళాసృష్టికి ఎంతమంది పరవశించిపోతూ ఉంటారో ఇప్పటికీను. అదంతా మీ టైపో వల్లే కదా!” అంటూ నారద  మహర్షి ప్రత్యక్షమయ్యాడు.

“కుమారా! ఎక్కడి నుండి రాక?”

“కైలాసం నుంచి. మహాదేవుడు సకుటుంబంగా వస్తున్నాడు”.

అంతలోనే ఫస్ట్ ఫామిలీ ఆఫ్ క్రియేషన్ అరుదెంచారు. వస్తూనే బాపుగారి అర్ధనారీశ్వరుడి చిత్రంలోలాగ గణపతి కుమారస్వాములని చెరో పక్క  ఉంచుకుని ఆది దంపతులు అర్ధనారీశ్వరరూపంలోకి మారిపోయారు. బాపురమణలు ప్రణమిల్లారు. శ్రీహరి తనని బాపు శివుడితో కలిపి చిత్రించిన బొమ్మ తలచుకున్నాడు, గ్రహించిన శివుడు హరిలో అర్ధభాగంగా కనబడ్డాడు. హరిహరనాధుడు ఆనందతాండవం చేసాడు. అప్పటి వరకూ ఆనంద పరవశుడై ఉన్న బ్రహ్మ శివవిష్ణువులకి ఒక ప్రపోజల్ సమర్పించాడు. అందులో ఉన్న వివరాలివి (నీకెలా తెలుసు అని అడక్కండి,  వాళ్ళు నాకు చూపించారు) – “ఈ బాపురమణ తమ సృజనాత్మకతతో ఆంధ్రజాతి లక్షణాలకి, సంస్కృతికి గొప్ప గుర్తింపునీ, అందమైన ఐడెంటిటీనీ సంపాదించిపెట్టారు. ఆంధ్రదేశంలో ఏ కాస్త రసజ్ఞ్జత ఉన్నవాడైనా వీరివల్ల ప్రభావితుడౌతాడు. అలాంటి ఆంధ్రదేశం ఇప్పుడు రాజకీయ కారణాలతో రెండు ముక్కలైంది.  రాజకీయ కారణాలు కనక ఆ మార్పుతప్పలేదు. అయినా సంస్కృతిపరంగా జాతి విడిపోయిందని బాధ పడేవాళ్ళందరి కోసం తెలుగు భాష, తెలుగు వాళ్ళు మాత్రమే ఉండేలా ప్రత్యేక గ్రహాన్ని సృష్టించాలని కోరుతున్నాను. ఈ తెలుగు భూగోళం సృష్టించడంలో, అక్కడి ప్రకృతి, సాహిత్యం, ఇతర కళలూ;  ముఖ్యంగా తెలుగు భాష, సాంప్రదాయాలకి సంబంధించి నాకు, సరస్వతికి సలహాదారులుగా టాంక్ బండ్ లలితకళాతోరణంలో ఉన్న తెలుగు వెలుగులందరి తరఫునా బాపురమణలని నియమించాలని ప్రార్ధిస్తున్నాను”

ప్రపోజల్ పరిశీలించిన శివకేశవులు తలలెత్తి చూసారు. మహాదేవుడు నవ్వుతూ, “అం..త్తేనా..?” అన్నాడు. మిత్రద్వయం ఒకరినొకరు చూసుకున్నారు  ఎక్కడో విన్నట్టుందే ఈ డైలాగ్ మాడ్యులేషన్ అనుకుంటూ. వెంటనే బ్రహ్మ అందుకున్నాడు, “అంతేనా అంటే మరొకటుందండి. ముందు దీన్సంగద్దేల్చండి మరి!” అంటూ. బాపురమణలు ఉలిక్కిపడ్డారు, ఈ  వాక్యమూ తెలిసినదే. హనుమంతుడు మెల్లిగా ఎవరికీ వినబడకుండా గుర్తు చేశాడు,”మీ ముత్యాలముగ్గు కాంట్రాక్టర్ డైలాగులయ్యా ఇవీ”  అని. ప్రాణమిత్రులిద్దరూ చేతులు కట్టుకుని త్రిమూర్తులని, త్రిమాతలని తన్మయంగా, తదేకంగా చూస్తుండిపోయారు.  శివుడు మళ్ళీ అడిగాడు, “బ్రహ్మదేవా! తెలుగు భూగోళం గ్రాంటెడ్. ఆ మరోటి ఏమిటో చెప్పు?”

“ఆదిదేవా! కొత్త తెలుగు గోళంలో రాజకీయనాయకులు మాత్రం పుట్టకూడదని ఓ శాపం, కాదు వరం, ఇవ్వండి”

“తధాస్తు”

(ఈ కధ విన్నవారు, చదివినవారు, వ్రాసినవారు బాపురమణీయస్ఫూర్తితో సృష్టించబడిన తెలుగు భూగోళంలో శాశ్వత స్థానము పొందనర్హులని  త్రిమూర్తులు వారి దేవేరులతో కలిసి దీవించిరి.)

*

ఫియర్‌లెస్

-అరుణ్‌సాగర్
 ~
arunఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. ఇది సినిమా కాదు. సంభాషణల రచయిత రాసే రొటీను మాటా కాదు. ఎందుకో భయమైతున్నది ప్రభూ. యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు. భయమైపోతున్నది. రాజ్యము బలమూ మదమూ నీవే నీవే. మరియూ మతమూ నీవే. టూ బీ వెరీ క్లియర్ బోత్ రెండూ నీవే. అక్కడ గాఢ కల్బూరిక్ ఆమ్‌లవాయుగోళాలైనా ఇక్కడ ద్రోహముద్రలు వేసే తూటాలైనా. భయమైతున్నది ప్రభూ మాట్లాడాలంటే, నడవాలంటే, తల ఎత్తాలంటే, నినదించాలంటే. వాగర్ధాం వివ సంతృప్తం, వాగార్ధ ప్రతిపత్తయే. ప్రతిపత్తి. అభివ్యక్తి. భిన్నాభిప్రాయమిప్పుడు ప్రమాదసంకేతం. సర్వము నీవే ప్రభూ. సర్వాధికారము నీదే. వాక్కు. మా యొక్క వాక్కు. మా యొక్క హక్కు. ఆదియందు ఉండెడిదది ఇపుడేమున్నది. చెట్టుకు వేలాడే శవాలు తప్ప నినదించు శరీరమొక్కటైనను ఎక్కడ మొలకెత్తును. ఎక్కడ మేల్కాంచును. బాంచెనని కాల్మొక్కెటోళ్లము. వేడుకొనగలము. నినుజేరి నీ దివ్యసముఖమున కష్టమూ సుఖమూ చెప్పుకుని విప్పుకుని. వినరా దొరా కనీసము. దేవా నిను ప్రార్ధించనీ, ఒక ప్లకార్డు, ఒక విన్నపము, కేవల అభిప్రాయమైనను. ఒక్క గుంజుడు గుంజి, డిసియం వ్యాన్‌లో విసిరేసి, గోషామహల్ స్టేషన్ కాంపౌండ్‌వాల్‌లో పడేస్తే….భక్తా! నిన్నేరా తుకారాం. మైడియర్ రెబల్‌స్టార్. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకున్నావా. లక్కీ ఫెలో యు ఆర్! మా దేవుడిని నిందాస్తోత్రమైననూ చేయలేని పిరికిపందలము మేము. కలికాలము. ప్రభూ, భయమైతున్నది ప్రభూ. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకుని ఈ మూకలను `కానిండుమని ఆనతినిస్తివా`. నిటారుగా నడవాలన్నా గొంతు విప్పాలన్నా పాటలు పాడాలన్నా భయమైతున్నది. ఈ చిరుగు చొక్కాలకు ఒక నిరసన బ్యాడ్జ్ తగిలించుకుని నలుగురం పోగయి ఒక్క బక్క కర్రకు గుడ్డజెండా కట్టుకుని చౌరస్తాలో నిలబడాలంటే భయమైతున్నది. ఎంత భయమైతున్నదంటే మేమంటే మాకే భయమైతున్నది. భయపడి భయపడి చచ్చిపోతమేమోనన్నంత భయమైపోతున్నది. భయాన్ని జయించలేక శునకమరణము పాలగుదుమేమోనని భయమైతున్నది. గుండెల్లో దాచిపెట్టుకున్న జెండాలు జఠరికలూ కర్ణికలను పేల్చి పైకి లేచి ఆకాశాన్ని మట్టుపెడతయేమోనని భయము నిలువెల్లా వణికిస్తున్నది. గొంతులు పోయి, వెన్నులు విరిగి, మెదళ్లు బూజుపట్టి కాలానికి కలానికి కాగితానికి తెలియకుండా మరుగైపోయే బోడిబతుకు బస్టాండగునేమోనని భయకంపితమవుతున్నది. కానీ ప్రభూ, కొన్ని భయములు జయించని ఎడల మరణమునూ జయించలేమేమోననే శంక కూడా పీడిస్తున్నది. ఇక అందుకే ఆ పరమేశ్వరుని ప్రార్ధించుచున్నాము. లార్డ్ శివా అండ్ మదర్ పార్వతి, హూ ఆర్ ఇన్‌సెపరబుల్ యాజ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్ టూ గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్. మాకు వాక్కు నిమ్ము. ఉక్కుముక్కల వంటి వాక్యముల నిమ్ము. వాగర్ధం వివ సంతృప్తం! నీ భయం కంటే మా భయం పెద్దదయితున్నది ప్రభూ. నోరు పడిపోతే, కాలూచేయి పడిపోయి పక్షవాతమొస్తే. పగోడికి కూడా వద్దు. ఆయినెవరో అన్నడు కదా ‘నీ అభిప్రాయంతోని నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కాపాడడానికి నేను ప్రాణాన్నయినా ఒదులుకుంటా’నని! నీవంటే భయమైతుల్లే ప్రభూ. ఒక్కసారి ఆలోచించుకుంటే మా బలహీనత చూసే మాకు మిక్కిలి భయమైతున్నది. ఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది. వాక్యాలకూ వాక్యాలకూ మధ్య `ఎంటర్` కొట్టకపోయినంత మాత్రాన అది కవిత్వం కాకపోదురొరేయ్. భయం ఈజ్ నాట్ ఎటర్నల్. మాకు తెలుసు యు ఆర్ స్టేట్. యూ డోంట్ టాలరేట్. ఇక్కడ విషయమేమంటే: వియ్ ఆర్ పీపుల్. వియ్ ద పీపుల్. మైండిట్ మాణిక్యం!
*
Painting: Akbar

ఉల్లిపాయసం 

 

                             -బమ్మిడి జగదీశ్వరరావు    

bajaraమా యింటి మీద ఒక్కసారిగా ఇన్ కమ్ టాక్స్ దాడులు! మా బంధు మిత్రుల యిళ్ళమీద కూడా దాడులు జరుగుతున్నాయేమో తెలీదు! నేనెప్పుడు కుబేరుల్లో కలిసిపోయానో నాకే తెలీదు! చూస్తూ వుండగానే మీడియా లైవ్ యిచ్చేస్తోంది! మా ఆవిడ లైవ్ లో తనని తాను టీవిలో చూసుకొని తెగ మురిసిపోతోంది! ‘ముందే చెపితే యెoచక్కా ముస్తాబయ్యేదాన్ని కదా?’ అని తెగ ఫీలైపోయి నా వంక నిష్టూరంగా చూస్తోంది! ఆగక, ‘నీ సంగతి తరువాత చూస్తా’నన్నట్టు కనుగుడ్లు యెగరేస్తోంది! చాలక, ఫేషన్ పెరేడ్ జరుగుతున్నట్టు పైటకొంగు నేల మీద ఈడుస్తూ పని వున్నా లేకున్నా అటూ యిటూ తిరుగుతోంది! ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు లాగి పారేసిన చీరల్ని యేరుకొని యెoచక్కా మాటి మాటికి మార్చుకు వస్తోంది.. వెళ్తోంది.. కొంగు అటూ యిటూ తిప్పుతోంది! ఇటు కాలు అటుపక్కకేసి.. అటు కాలు యిటుపక్కకేసి.. తన పాదాలకి కాదు, భూమికే పుండయి పోయినట్టు అడుగులు వేస్తూ- వయ్యారాల హొయలు ఒలికిస్తూ నడుస్తూ ఆగి- అంతలోనే తల అటు తిప్పి యిటు తిప్పి చూసి- మళ్ళీ కదిలి వచ్చిన దారినే పోతోంది.

రెప్ప ఆర్పకుండా నేను మా ఆవిడ్నే చూస్తున్నాను! “మీ ఆవిడే కదా?” అడిగాడో అధికారి. అనుమానంగా చూసాను! “..తరువాత తీరికగా చూసుకుందురు” అని నవ్వాడు. తనతో రమ్మన్నట్టు తలవంచి సైగ చేసాడు. వెంట వెళ్లాను. అడిగిన అన్ని తాళాలు యిచ్చాను. తెరిచి చూపించాను. మీరెళ్ళి రిలాక్స్ కండి అన్నారు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అన్నారు. బుద్దిగా నేలమీద మటం దిద్ది పోగేసిన పేపర్లూ ఫైళ్ళూ తిరగేసుకుంటున్నారు. అప్పుడే బడిలోంచి వచ్చిన పిల్లలిద్దర్నీ చేరదీసిన మాఆవిడ “చూడండి అంకుళ్ళు యెంత బుద్దిగా చదువుకుంటున్నారో..” ఆదర్శంగా చూపించింది. ఎప్పుడూ హోంవర్క్ చెయ్యడానికి యేడు చెరువుల నీళ్ళు తాగించే మా పిల్లలు తోటి క్లాసు పిల్లలతో పోటీ పడినట్టు అధికార్ల పక్కన కూర్చొని హోంవర్క్ లు చేసేసారు!

మా ఆవిడ ముఖంలో ఆనందం. “అమ్మా ఈ అంకుల్స్ ని రోజూ మన ఇంటికి రమ్మని చెప్పమ్మా..” యిద్దరు పిల్లలు యేకమై అడుగుతుoటే అధికారులు ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళకన్నా యెక్కువ అయోమయం నా ముఖంలోనే! నన్ను పట్టించుకోకుండా “వస్తారులే..” వొప్పించేయడానికి అన్నట్టు అధికారుల్ని చూసి నవ్వుతూ అంది. “రాకపోతే మీ నాన్న రప్పిస్తారులే..” భలే నమ్మకంగా బడాయిగా అంది మా ఆవిడ.

ఇంతలో యిరుగూ పొరుగూ చేరారు. అంతా సంతలా వుంది. మా ఆవిడ అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి “మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారొదినా.. పిన్నీ మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారు.. అత్తా..” అని చాలా సంబరంగా అరిచిమరీ చెప్పింది.  అదో స్టేటస్ సింబల్ గా గర్వంగా తల తిప్పుకుంటూ యెగరేసుకుంటూ వచ్చింది. ఫ్రెండ్సుకూ పేరంటాళ్ళకూ ఫోన్లు కూడా చేసేసింది. టీవీలో చూడమని చెప్పేసింది. మధ్యలో యెందుకని యెవరో అడిగితే ‘సస్పెన్సు’ అని ఆట కూడా పట్టిస్తోంది. మరెవరితోనో ఏయే ఛానెళ్ళలో వస్తోందో అడిగి, రాని యేదో ఛానెల్ వాళ్ళ న్యూస్ కవరేజి బాగోదని, అసలు వాళ్లకి రేటింగ్ కూడా లేదని కసిదీరా రిపోర్ట్ యిచ్చేసింది.

“అమ్మా.. అమ్మమ్మా తాతయ్యా వాళ్ళకి చేప్పేవా?” పిల్లలు గుర్తు చేసారు. అందుకు ‘నా బంగారు కొండలు’ అని మెచ్చు కుంది. బంగారు కొండలయితే యెక్కడ యిన్ కమ్ టాక్స్ వాళ్ళు వదలకుండా పట్టుకుంటారోనని కలవరపడిపోయాను. నా బాధలో నేనుండగా మా ఆవిడ వెంటనే వాళ్ళ అమ్మానాయినలకు ఫోన్ చేసి చెప్పింది. అన్నా వదినలకు తను ఫోన్ చేసింది చాలక మళ్ళీ ఫోన్ చేసి చెప్పమంది. ఎవర్నీ మిస్సవవద్దంది. ఫోన్లో మాట్లాడుతూ “కనపడరుగాని దొంగ..” అని నా వంక ఓరగా మెచ్చుకోలు కళ్ళతో చూసింది. “ఇదిగో పక్కనే వున్నారు” అంటూ ఫోన్ నాకు అందించింది.

అవతల అత్తగారూ మాంగారూ స్పీకర్ ఆన్ చేసినట్టున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. “మా యింటా వంటా లేదు అల్లుడుగారూ..” ఆ మాటకు తిడుతున్నారని గతుక్కుమన్నాను. “..మన మొత్తం బంధు మిత్రుల అన్ని ఫేమిలీలలో మీరే ఫస్ట్.. ఫస్ట్ అఫ్ ది ఫస్ట్..” మామగారి మాటకు అత్తగారు అడ్డు తగులుతూ “ముష్టి ముప్పైయ్యారించీల ప్లాస్మా టీవీ మన మొత్తం కుటుంబాలలో అందర్లోకీ మేమే మొదాట కొన్నామని మా చెల్లెలు వచ్చినప్పుడల్లా అందరిదగ్గరా టముకేసుకొని తెగ గొప్పలు చెపుతోంది కదా?, మా అల్లుడుగారి యింటిమీదే యిన్కం టేక్సోల్లు మొదాటపడ్డారని యిప్పుడు మనమూ చెప్పుకుందాము!..” మా అత్తగారు గొప్పలకు పోతున్నారు. అంతకుమించి పట్టుదలకు పోతున్నారు. “ ఏమైనా బాబూ.. మీరింత ప్రయోజకులైనందుకు నాకు యెంతో గర్వంగావుంది..” మామగారి మాట పూర్తి కాలేదు. “రేపు అన్ని పేపర్లలో వస్తుంది కదండీ..” మామగారిని మటల మధ్యలో అత్తగారు అడుగుతున్నారు.

నా బుర్ర గిర్రున బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది. మా ఆవిడ నా చేతిలోని ఫోన్ లాక్కుంది. “నాన్నా.. తెలుసుకదా? మా ఆయనకి గొప్పలు చెప్పుకోవడం అస్సలు యిష్టం వుండదు.. గొప్పలు చెప్పుకుంటే యీ మనిషితో మనకెందుకిన్ని తిప్పలు?” అని మూతి మూడొంకర్లు తిప్పింది. “మన గొప్పలు మనమే కదా చెప్పుకుంటున్నాం.. వూరోల్ల గొప్పలు చెప్పుకోవడం లేదు కదా!?,  అయినా మనకి మనం చెప్పుకుంటే తక్కువయిపోతామా? మన గొప్పలు మనం చెప్పుకోనిదే లోకం దానికది గుర్తిస్తుందా?” నన్నే అడిగిందో వాళ్ళ నాన్నతో అందో అర్థం కాలేదు. “సరి సరే వుంటాను, చాలా ఫోన్లు వస్తుంటాయి.. అవతల వాళ్లకి యేంగేజ్.. ఆ..” మా ఆవిడ ఫోన్ కట్ చేసింది. టీవీ పెట్టింది.

టీవీలో నన్ను చూసి “హే.. నాన్న..” పిల్లలు అరిచారు. చూస్తే- చూపించిందే చూపిస్తున్నారు. చూసిందానికి మాఆవిడ కామెంటరీ కూడా తోడయింది. “అదిగో అటు టాటా యిటు బిర్లా- మధ్యలో..” మా ఆవిడ చెప్పకముందే “మధ్యలో లైలా” అన్నారు పిల్లలు. “తప్పమ్మా నాన్నగారిని అలా అనొచ్చా?” నా గౌరవానికి భంగం కలిగినట్టు నోటిమీద వేలు వేయించింది. ఛానెల్ మార్చిందే కానీ కామెంటరీ ఆపలేదు. “అటు ముఖేష్ అంబానీ యిటు అనిల్ అంబానీ మధ్యలో..” పిల్లలు మాఆవిడకి అవకాశం యివ్వలేదు. “మధ్యలో మన నాన్న..” అన్నారు నోటిమీద వేలు తియ్యకుండానే. మాఆవిడ పిల్లలు ప్రయోజకులైనట్టు గర్వంగా చూసింది. రిమోట్ నొక్కింది. కామెంటరీ ఆగింది. అనుమానంగా చూసింది. అర్థం చేసుకున్న అధికారి వొకరు నివృత్తి చేసేలోగా మధ్యలో “ఆర్ నారాయణమూర్తి నాకెందుకు తెలీదూ..” అంది. “ఆర్ నారాయణమూర్తి కాడమ్మా.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఆపక్క లక్ష్మీమిట్టల్..” అధికారి సరిదిద్దేలోపల “మధ్యలో మన నాన్న..” కోరస్ పాడారు పిల్లలు.

అలా ప్రముఖుల మధ్యలో నన్ను చేర్చి పెట్టడమేకాదు, నన్నో ‘పెద్ద చేప’గా ‘తిమింగలం’గా టీవీ ఛానెల్స్ వాళ్ళు తమ తమ క్రియేటివిటీని చూపిస్తూవున్నారు. “మమ్మీ.. డాడీ పేద్ద చేపా? తిమింగాలమా?” పిల్లల డౌట్లు పిల్లలవి. “మొదట బుల్లి చేప.. తరువాత బిగ్ చేప.. తరువాత తిమింగలం.. తరువాత బకాసురుడు..” మాఆవిడ ఆన్సర్లు మాఆవిడవి. “డాడీ.. డాడీ నువ్వెప్పుడు బకాసురిడివి అవుతావ్?” పిల్లలు నన్నడిగారు. “మీనాన్నకి అంత సీన్ లేదు..” మాఆవిడ నిరసన స్వరం. యేo అన్నట్టుగా చూసారు పిల్లలు. “బకాసురులవ్వాలంటే.. రాజకీయాల్లోనయినా వుండాల.. రాజకీయాలయినా నడపాల..” నన్నో వేస్టుగాణ్ణి చూసింది మాఆవిడ.

చూసి- యిటు పిల్లల డౌట్లు తీరుస్తూ.. అటు లైవ్ ల్లో.. ఫోనుల్లో.. వచ్చీ పోయే వాళ్ళతో.. వీధిలో వాళ్ళతో.. ఫ్రెండ్స్ తో.. పేరంటాళ్ళతో మాఆవిడ అవధానం చేస్తూ “లైవ్ యివ్వడం లేదా?” మా ఆవిడ వుస్సురుమంది. “టీలూ కాపీలూ తాగారు.. టిపిన్లు పెడితే తిన్నారు.. చిన్న కునుకు తీస్తన్నారు.. లెగిసి సూటింగులు చేస్తారులేమ్మా..” సర్ది చెపుతోంది పనిమనిషి. ఓపిక పట్టలేక ఛానెళ్ళు మార్చుతోంది మా ఆవిడ!

“అమ్మా.. యిన్కం టేక్షోల్లు పడ్డారుకదా.. యిప్పుడయినా నా జీతం పెంచడమ్మా..” పనిమనిషి వొద్దికను మించి వుషారుగా అడిగింది. మా ఆవిడ నన్ను అడక్కుండానే సరేననేసింది.

టీవీలో- “ఊ!.. తాలింపు యెయ్యడానికి దాకే లేదు, యిల్లంతా యిత్తడి పెనాలని!.. వుల్లిపాయల రేటు తగ్గించడాకే లేదు, యీలు పత్తేకంగా ఓదా పట్టుకోస్తారంటే నమ్మీయాలా?” మూతి మూడొంకర్లు తిప్పి వెళ్లిపోయింది చిక్కోల్ ముసల్ది. ‘ప్రత్యేక హోదా సంగతీ రాజధాని సంగతీ  తరువాత ఆలోచించ వచ్చని, ముందు వుల్లి ధరలు తగ్గించాలని సామాన్య జనం కోరుకుంటున్నార’ని న్యూస్ యాంకర్ చెపుతున్నాడు.

యాంకర్ గొంతు నొక్కినట్టుగా రిమోట్ నొక్కింది మా ఆవిడ. న్యూస్ రూమ్ డిస్కషన్ నడుస్తోంది. అందరూ వొక్కసారే యెవరి వాదనని వారు బలంగా వినిపించి యెవరికీ యేమీ అర్థం కాకుండా చక్కగా మాట్లాడడంతో కాసేపటికిగాని అర్థం కాలేదు. ప్రతి రైతూ విధిగా తనకున్న భూమిలో పావొంతు వుల్లి పండించాలని ఆదర్శ రైతు వొకరంటే, వుల్లిని పౌడర్ చేసి పేస్టు చేసి దాచుకొని నిలవా పెట్టుకోవాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ యిప్పటికే సూచించారని అధికార పార్టీ సభ్యుడు గుర్తు చేసాడు. ఉల్లిని అధికార పార్టీ వాళ్ళూ వాళ్ళని సపోర్ట్ చేసే బడా వ్యాపారులు బాగానే నిలవా చేసారని ప్రతిపక్ష సభ్యుడు దుమ్మెత్తి పోసాడు.  ఉల్లి దొంగల్ని గజదొంగలుగా పరిగణించాలని జర్నలిస్టు మేథావి సూచిస్తే, అసలు వుల్లి లేకుండా వంట చేయడం మీద పరిశోధనలు జరగాలని సామాజిక మేథావుల సంఘం కన్వీనర్ అభిప్రాయపడ్డారు!

“రామాయణంలో ఈ పిడకల వేటేమిటో?..” నాలో నేను అనుకున్నాననుకున్ననేగాని పైకి అనేసాను. మాఆవిడ దగ్గర అన్నిటికీ ఆన్సర్ వున్నట్టే దీనికీ వుంది. “రామాయణంలో పిడకలవేట వుంది.. లంకా ప్రవేశం చేయడానికి సముద్రంలో  వానర సైన్యం వారధి నిర్మించింది. అప్పుడు సముద్రంలో వేసిన రాళ్ళన్నీ పిడకలగా తెలిపోయాయట.. వారదికోసం చేసిన రాళ్ళ వేటే రామాయణంలో పిడకలవేటగా ప్రసిద్దికెక్కింది..” మాఆవిడ వివరణకి నేనూ పిల్లలూ మాత్రమే కాదు ఇన్కమ్ టాక్స్ అధికారులూ నోళ్ళు వెళ్ళబెట్టారు!

‘ఉల్లిపాయలకూ ఇన్కమ్ టాక్స్ వాళ్ళకూ ఏమిటి సంబంధం?’ నా ఆలోచనలను అలవాటుగా స్కాన్ చేసిన మాఆవిడ “చెట్టు మీది కాయకీ సముద్రంలో వుప్పుకీ వున్న సంబంధమే!” అంటూ చెవిలో గుసగుసగా చెప్పి ముసిముసిగా నవ్వింది.

మా రొమాంటిక్ సీన్ ని అధికారులు ఆరాధనగానూ అనుమానంగానూ చూసారు.

మళ్ళీ రిమోట్ నొక్కింది. సెన్సెక్స్ స్థానంలో ‘ఆనియనెక్ష్’ యిస్తున్నారు. షేర్స్ లో తరగడం పెరగడం వుంది. కాని వుల్లికి సంబంధించిన ‘ఆనియనెక్ష్’లో పెరగడమే తప్ప తరగడం లేదు.  సెన్సెక్స్ పడిపోయినప్పుడు వచ్చిన గుండెపోట్లు కంటే  ‘ఆనియనెక్ష్’ పెరిగి పోయినప్పుడు వచ్చిన గుండెపోట్లే యెక్కువ!

ఛానెల్ మారింది. దృశ్యం మారింది. మా పిన్నీ కూతురు పద్మ. “పద్దూ వదిన వచ్చింది” సంబరంగా అంది మాఆవిడ. యింటి మీద యిన్కం టాక్స్ వాళ్ళు పడితే ‘బంధువులతో కూడా మాట్లాడిస్తారా?’ అవాక్కయాను. అందుకు కాదని కొన్ని క్షణాల్లో అర్థమయ్యింది. పద్దూ మొగుడూ లైవ్ లోకి వచ్చేసాడు. ‘యెంతో ప్రేమగా వుండే వాళ్ళు వీళ్ళకేమొచ్చింది?’ జుట్టు పీక్కున్నాను.

“..దుర్మార్గం కాకపొతే యేమిటండీ యిదీ.. అదనపు కట్నం అడిగితే.. మగనాకొడుకులు అంతా యింతే పోన్లే అని సరిపెట్టుకున్నాం, అత్తింటి వారు వుల్లి.. వుల్లిపాయలు అడిగితే పెట్టాలా అండీ.. అది సాధ్యమయ్యే పనేనా అండీ.. గొంతెమ్మ కోరికలు కోరితే యెట్లా అండీ..” మాపద్దూ రెచ్చిపోతోంది. “అదికాదండీ వుల్లిపాయలు నిండా వేసుకొని ఆమ్లెట్ తిని యెన్నాళ్ళయిందో తెలుసా అండీ.. యేమండీ ఆమ్లెట్ కాదండీ, వుల్లిగారెలు తనకీ యిష్టమేనండీ.. తను తింటుందనే అడిగాను..” కళ్ళ నీళ్ళ పెట్టేసుకున్నాడు మాబావ. ఎందుకో నా కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి. ఉల్లివల్ల కుటుంబాలు కూలిపోవడమే కాదు, ప్రేమలు యెలా పగలుగా మారుతున్నాయో.. విడాకులకు దారితీస్తున్నాయో న్యూస్ యాంకర్ చెప్పింది. సాక్ష్యంగా మరికొన్ని బైట్స్..

“మా ఆయన యెప్పుడూ నన్నొక మాట అనేవారు కాదు, వుల్లి పాయలు దుబారాగా వాడి సంసారాన్ని నాశనం చేసానని అన్నప్పుడు యింక అతనితో యెంత మాత్రమూ వుండకూడదనుకున్నాను.. డైవోర్స్ తీసుకొని పుట్టింటికి వచ్చేసాను..” కళ్ళు  వొత్తుకుంది ఓ ఆడ పడుచు.

“.. అరే.. నేనేమన్నా బాహుబలి టిక్కెట్లు అడిగానా? లేదే, రూబీ నక్లెస్ అడిగానా? లేదే, ఆధార్ కార్డు పట్టుకొని రైతు బజార్లో యిచ్చే సబ్సిడీ వుల్లి తెమ్మన్నాను, క్యూ అంటాడు, ఎర్రగడ్డ రైతుబజార్ క్యూ ఎల్బీనగర్ దాక వుందంటాడు.. ఎల్బీనగర్ కాదండీ విజయవాడ వరకూ.. విశాఖపట్నం వరకూ క్యూ వుంటుంది.. వుంటే మాత్రం ఫ్యామిలీ అంటే బాధ్యత లేదా? ఆ మాత్రం చెయ్యలేవా? అడిగాను. సంసారమే చెయ్యలేనన్నాడు.. దట్సాల్.. వుయ్ క్లోస్డ్ అవర్ రిలేషన్ షిప్..” డోoట్ బాదర్డ్ అన్నట్టు చెప్పింది ఓ పడుచుపిల్ల.

ఇంతలో నా సెల్లు ఘోల్లుమంది. హలో అన్నాను. పోలో మన్నాడు మిత్రుడు. నువ్వింత నమ్మక ద్రోహివి అనుకోలేదన్నాడు. ఔనౌను అన్నాను. మరి అధికారుల కళ్ళూ చెవులూ నన్నే చూస్తున్నాయి. నవ్వాను. ఏడ్చినట్టుంది అన్నాడు. ఔనౌను అన్నాను. ‘పిల్ల పెళ్ళికి కాస్త సాయం చెయ్యరా, అదీ అప్పుగా అంటే లేదన్నావ్’ అన్నాడు. ఔనౌను అన్నాను. ‘మరి నీ యింటి మీద యిన్కమ్ టేక్సోళ్ళు యెలా పడ్డార్రా?’ అన్నాడు. ఔనౌను అలవాటుగా అనేసి, నాలుక్కరుచుకొని తెలీదన్నాను. “ఇన్నాళ్ళూ డబ్బులు లేవని చాలడం లేదని తెగ దొంగేడుపులు యేడ్చేవా.. యిప్పుడు నిజంగా యేడు.. తధాస్తు దేవతలు వుంటార్రా..” తిట్టి తాటించి మరీ ఫోన్ పెట్టేసాడు.

“ఏంటండీ సుబ్బారావన్నయేనా?, చెప్పలేదని తెగ ఫీల్లవుతున్నారా? అవరూ.. యింటి మీద యిన్కం టేక్సోల్లు పడ్డారని యిప్పుడన్నా ఫ్రెండ్స్ కి మెసేజులు పెట్టండి.. మెయిల్లు చెయ్యండి.. మా ఫ్రెండ్ యింత గొప్పవాడయ్యాడని వాళ్ళూ పదిమందికి గొప్పగా చెప్పుకుంటారు. అది వాళ్ళకీ గౌరవం.. మనకీ గౌరవం.. నేనయితే నా ఫేస్ బుక్ లో మన ‘స్టేటస్’ పెట్టేసా..” టీవీ వదిలి కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కూ టక్కూ లాడిస్తూ వుంది.

పిల్లల చేతికి రిమోట్ దొరికింది. ఛానెల్స్ ఛేoజ్ చేస్తున్నారు. రీమిక్స్ సాంగ్ దగ్గర ఆగారు. కొత్త సినిమా పాట కాదు. పాతది. మూగనోము లోది.

“ఉల్లివి నీవే.. తల్లివి నీవే.. చల్లగ కరుణించే దైవము నీవే..” పాటకు మా పిల్లలిద్దరూ “ఉల్లివి నీవే.. తల్లివి నీవే..” అంటూ తెరమీది పిల్లలతో కలిసి కోరస్ యిస్తున్నారు.

“ఏవండీ..” పిలుపు విని మా ఆవిడ పక్కన చేరాను. ఫేస్ బుక్ లో తను బుక్కయింది చాలక నన్నూ లాగింది. “.. మీరు వుల్లిపాయలకు వెళ్ళేటప్పుడు.. పోలీస్ స్టేషన్ లో మీ యిన్ఫర్మేషన్ యిచ్చి వెళ్ళండి.. మార్గం మధ్యలో యెవరితో మాట్లాడకండి.. వీలయితే కిందింటి కుర్రాడు సైదుల్ని మీతో తోడు తీసుకువెళ్ళండి.. చైన్ స్నాచర్స్ లాగే ఆనియన్ స్నాచర్స్ తయారయ్యారు జాగ్రత్త.. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు మనీ డ్రా చేసేటప్పుడు యెన్ని జాగ్రత్తలు తీసుకుంటామో వుల్లిపాయలకి వెళ్ళినప్పుడు- కొని తీసుకోస్తున్నప్పుడు అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి..” చదువుతూ చెప్తోంది. మా ఆవిడ మాటకు గంగిరెద్దులా తలాడించాను. అలా తలాడిస్తే నేనెంతో ముద్దోచ్చేస్తానట!?

ముద్దుముద్దుగా మాఆవిడ “ఉల్లిని కోస్తే కళ్ళు మంట! ఉల్లిని కొంటె గుండె మంట! ఉల్లి ఉంటేనే వంట! ఉల్లి లేకుంటే తంటా! ఎలావుందంటా?” చెప్తే మురిసి? “నువ్వే నా కవితంట” అన్నాను!

ఇన్కమ్ టాక్స్ అధికారులు రిపోర్టులు తయారు చేసి పని పూర్తయినట్టు లేచి నిల్చున్నారు. నాతో కొన్ని సంతకాలు కూడా తీసుకున్నారు. “థాంక్స్ ఫర్ యువర్ కోపరేషన్..” అధికారి మాటకి “వెల్ కం.. మోస్ట్లీ వెల్ కం..” మాఆవిడ మగపెళ్లివారితో అన్నట్టు యెంతో ప్లీజింగ్ గా ప్లెజర్ గా అంది.

వెళ్ళిపోతున్న అధికారుల వెంట పడి “సార్.. యిప్పుడు యేమవుతుంది?” నా భయం కొద్దీ నేనడిగాను. “మొదటిసారి కదా.. అందుకని..” మాఆవిడ నవ్వింది. నవ్వి “యిన్కం టేక్సు రెయిడ్స్ జరిగినోల్లంతా అలా కోర్ట్ కు వెళ్లి యిలా వచ్చేస్తున్నారు.. సొసైటీ అన్నాక పెద్దవాళ్ళన్నాక పెద్ద సమస్యలు వస్తాయి.. పోతాయి.. కామన్..” చెప్తూ వుంటే మాఆవిడ నాకు ధైర్యం చెపుతోందో అధికార్లని అధైర్యపరుస్తోందో అర్థం కాలేదు!

“సార్.. యింతకీ మా యింటి మీదే మీరు యెందుకు పడ్డారు?” అని నా ప్రశ్న నాకే సబబుగా తోచక “ మీరంటే మీ  యిన్కం టేక్సోల్లు యెందుకు పడ్డారు సార్?” దీనాతిదీనంగా హీనాతిహీనంగా అడిగాను.

నా ముఖం చూసి నిజం చెప్పకుండా వుండలేక పోయారు.

“టెన్ డేస్ బాక్ మీరు ఆనియన్ దోస ఆర్డర్ చేసి తిన్నారు.. గుర్తుందా?” అడిగి, అదే కారణమన్నట్టు ఒక్క క్షణం చూసి, ఆగిన అధికారి సిబ్బందితో ముందుకు అడుగెయ్యబోయాడు.

సరిగ్గా అప్పుడే మాఆవిడ “యేవండీ మీకిష్టమని ముద్దపప్పుచేసాను,  పపూ టమాటా కూడా వండాను, రండి వేడిగా తిందురు..” నన్ను పిలిచింది.

ముందుకు వెళ్ళబోతున్న యిన్కమ్ టాక్స్ వాళ్ళు ఆగి వెనక్కి చూసారు!

*

కె. శివారెడ్డి @ 72

అరణ్యకృష్ణ
మట్టి మీద
మట్టి నుండి లేచిన చెట్టు మీద
చెట్టు మీదెక్కిన పిట్ట మీద
 
సముద్రం మీద
సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెల మీద
ఇసుక తిన్నెల మీది పాదముద్రల మీద
 
ఆకాశం మీద
ఆకాశం పైని చీకట్ల మీద
చీకట్లు విసిరే కాంతిపుంజాల మీద
 
అడవుల మీద
అడవులు పెంచిన ఆకుపచ్చని ఆశల మీద
ఆకుపచ్చని ఆశలతో సాయుధమైన కలల మీద
 
పల్లె మీద
పల్లె ఒంటి గాయాల మీద
గాయాలు మిగిల్చిన కసి మీద
 
మనిషి మీద
మనిషంతటి ప్రేమ మీద
ప్రేమతో పరితపిస్తూ హత్తుకునే హృదయం మీద
 
గుండె మీద
గుండె లోతుల్లోని స్నేహం మీద
స్నేహం కురిపించే అత్తరు జల్లుల మీద
 
కళ్ళ మీద
కంటి కొసల నీటి మీద
కన్నీళ్ళు నింపుకున్న కలాల మీద
 
కవిత్వం జెండా ఎగరేసిన వాడు!
*
aranya

శారద ఇప్పటికీ కావాలి!

కవిని ఆలూరి
 శారద తమిళుడు అయినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని ఉన్నతీకరించారు . నటరాజన్ “శారద ” అన్న కలం పేరుతో రచించటానికి కారణం రచనలు ప్రచురించక పోవటం వలన అని చెప్పుకునేవారు . అది సరికాదు . నటరాజన్ ‘గంధర్వుడు’,’ శక్తి’ లాంటి కలం పేర్లతో రచనలు చేసేవారు  . ఐతే ,ఆ పేర్లేవి ప్రసిద్ధి లోకి రాలేదు .సహజంగానే సౌందర్యోపాసి అయిన నటరాజన్ “శారద “అనే మూడక్షరాల స్త్రీ నామాన్ని ఎంతో ఇష్టంగా కలం పేరుగా పెట్టుకున్నారు. 
                                                      ఆనాటి మానవ సంబంధాలు చాలా దగ్గరగా ఉండేవి . ఆలూరి భుజంగరావు ,శారద లాంటి వాళ్ళ జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది. ముక్కామల మల్లిఖార్జున రావు గారు “శారద”ను కధలు రాయటానికి ప్రోత్సహించటము తో పాటుగా ఆర్ధిక సహకారాన్నీ చేసేవారు. ప్రకాశరావు ,అబ్బరాజు నాగభూషణం,నేతి పరమేశ్వర శర్మ లాంటి మిత్రులు “శారద”ను ఎంతో ప్రోత్సహించారు. గొన్నా బత్తుల వెంకటేశ్వర రావు లాంటి మిత్రులతో కలిసి అన్నదాన సమాజాలను నడిపిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తెనాలి వాతావరణమన్నా,అక్కడి మిత్రులన్నా శారద కు ప్రాణం .
                                             రోజుకు 12,13 గంటలు హోటల్లో చాకిరీ చేస్తూ సాహిత్య అధ్యయనం,రచనలు సాగించేవారు. శారద తాను చదువుతూ,రాస్తూ మిత్రుల చేత చదివించే వారు,రాయించే వారు.తెలుగు మాత్రుభాష కాక పోవటం వలన తెలుగు నేర్చుకోవటానికి ఎంతో శ్రమ పడ్డారు . తెలుగు సాహిత్యం లోని చలం ,కుటుంబరావులతో సహా ఆనాటి రచయితల ఉత్తమ  గ్రంధాలను  అధ్యయనం చేసేవారు.శారద 100 కధలను , 6 దాకా నవలలూ రాశారు. ఆనాటి హోటల్ వృత్తి అవగుణాలకు నిలయం గా ఉండేది. అత్యంత  కల్మషమైన వాతావరణంలో పని వాళ్ళు బతుకుతూ ఉండేవారు .అంతటి కల్మషంలో బతుకుతూ సాహిత్యాన్ని చదవాలన్న ఊహ, కధలు రాయాలన్న ఊహ తనకు కలగటమే కాకుండా అలాంటి ఊహలను తన మితృలకు కూడా కలిగించేవారు  శారద . తన మంచి అలవాట్లను మాత్రమే  స్నేహితులకు పంచేవారు. మితృలతో కలిసి అభ్యుదయ భావాలతో “ప్రజావాణి “అన్న రాత పత్రిక నొక దాన్ని నడిపారు.
sarada1
                                               ఆనాటి వాళ్ళ గొప్ప స్నేహానికి ఉదాహరణగా రెండు విషయాలను ఇక్కడ చెప్పుకుందాం! ఇంట్లో పస్తుల బాధ పడలేక తన మిత్రుడైన మల్లిఖార్జున రావు గారు కొత్తగా  కొనుక్కున్న ఇంగ్లీష్ పుస్తకాలను పాత పుస్తకాల వాళ్లకు అమ్మేశారు శారద .ఆ తర్వాత మల్లిఖార్జున రావు గారికి కనపడకుండా తిరుగుతూ ఉన్నారట శారద.ఒక రోజు మల్లిఖార్జున రావు గారు ఎదురుపడి “నువ్వు చేసిన పని నాకు తెలుసు. ఈ మాత్రానికే ఇంత బాధపడుతున్నావు?అవి అమ్మినందుకు నేనేమీ అనుకోను.నాలుగు రోజుల పాటు నీ కుటుంబం గడిచింది అంతే చాలు!మనం ఇప్పుడే వెళ్ళి వాటిని మళ్ళి కొని తెచ్చుకుందాము .”అని శారద తో అన్నారట .
అలాగే ఒకసారి స్థానం నరసింహారావు గారి అధ్యక్షత వహించిన సభలో తాను రాసిన ఒక వ్యాసాన్ని చదవమని భుజంగరావు గారికి ఇచ్చారట శారద . భుజంగరావు గారు కూడా చదువుతానని శారదకు ధైర్యాన్ని ఇచ్చారట. వ్యాసాన్ని చదవలేక మైకు పట్టుకుని వణుకుతున్న భుజంగరావు గారిని చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట . వాళ్ళను ఉద్దేశించి “నన్ను చూసి నవ్వనవసరం లేదు . ఇక్కడకు వచ్చి చదవటానికి నిలబడితే మీరూ ఇలాగే వణుకుతారు . “అతి కష్టం మీద అనేసి వేదిక నుండి దిగిపోయారుట. రత్నా టాకీసు దగ్గర టీ కొట్టు ముందు నుంచున్న శారద “నువ్వలా వణికి పోతూ ఉంటే చూడలేక ఇక్కడకు వచ్చి నిలబడ్డానురా “. అని అన్నారుట.
sarada
                                           పత్రికలలో ధారాళంగా శారద సాహిత్యం ప్రచురితమవుతున్న రోజులవి.  హోటలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు శారద కధ గురించి “రచయిత చాలా అద్భుతంగా రాశారని”చెప్పుకుంటుంటే విన్న శారద “ఆ కధ నేనే రాశానని “వాళ్ళతో అన్నారుట . వాళ్ళు శారదను ఎగాదిగా చూసి వెళ్ళి పోయారుట . ఈ విషయం మితృలకు చెప్తూ పక పకా నవ్వేవారట శారద . శారద అజాత శత్రువు . ఆయన జీవితంలో ఎవరినీ ద్వేషిస్తూ మాట్లాడిన సందర్భాలు లేవు.
                                       శారద కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు . ఆయన వితంతువును వివాహమాడాలనుకున్నారట. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకు వెళ్ళారట.ఈ విషయాన్ని వాళ్ళు అంతగా పరిగణన లోకి తీసుకోక పోయినా శారద మాత్రం తాను చెప్పినట్లుగానే మలయాళీ వితంతువును వివాహమాడారుట.అంతే కాకుండా  అభ్యుదయ రచయితల సంఘం 5వ మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు రచయితల పారితోషకానికి సంబంధించిన ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశ పెట్టారుట .కానీ  శారద దృష్టిలో డబ్బు తక్షణ అవసరాలకే పరిమితం .
                                     శారద తాను బాధలు పడుతూ , తన తోటి వారి బాధలను, గాధలను పరిశీలించేవారు . పత్రికలలో వచ్చే వార్తలను కూడా కధా వస్తువులుగా స్వీకరించేవారు . మట్టి మనుషుల మురికి జీవితాలను తెలుగులో అక్షర బద్దం చేసారు . శారద తుఫాను వేగంతో సాహిత్యంలోకి వచ్చి అంతే వేగంతో జీవితం నుండి నిష్క్రమించారు . ఆ కొద్ది కాలం లోనే అనంతం గా రాయాలన్న తృష్ణ ఆయనను క్రూరంగా వెంటాడింది .
                                ఒక ప్రవాహంలాగా శారద రచనలు ప్రచురిత మవుతున్న సమయంలో శారద కళాయి పెట్టుకుని బజ్జీలు ,గారెలు అమ్ముతుండే వారట . అంతేకాకుండా వేసవి కాలంలో బస్ స్టాండ్ లో ప్రయాణికులకు మజ్జిగ అమ్ముతుండేవారట .ఈ విషయాలను మాతో పంచుకుంటూ నాన్నగారు (ఆలూరి భుజంగరావు గారు) మాతో  “ఇంతటి ఉన్నత సాహిత్యాన్ని ఇచ్చిన వాడికి ఆంధ్ర దేశం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు నాయనా !”అని అనేవారు .
                              నాన్నగారు మరణించటానికి కొన్ని రోజుల  ముందు తన డైరీ లో-   “సాహిత్య బాటసారి -శారద” లో- ఇలా రాసుకున్నారు “శారద భౌతిక జీవిత బంధనాలను తెగదెంపులు చేసుకుని కేవలం అక్షర జీవిగా మాత్రమే మనకు మిగిలి పోయిన రోజు ఆగస్టు పదిహేడు.!
                                                                                                                                                             *
కవిని ఆలూరి

కవిని ఆలూరి

పెద్దకోతుల ధర్మం

సత్యమూర్తి

‘‘ఇది ఒక నిండు ప్రాణంతో ముడిపడిన సమస్య నాయనా! నిదానంగా ఆలోచించు. ఆప్తులను పోగొట్టుకున్న మనకు ప్రాణం విలువేంటో బాగా తెలుసు. అందుకే తొందరపడొద్దని అంటున్నాను. నామటుకు నాకు ఆ చిన్నకోతిని చంపేయకుండా.. జీవితాంతం అలా చెట్టుకు కట్టేస్తేనే మేలనిపిస్తోంది. మన వానరజాతి ధర్మగ్రంథాలు, శిక్షాస్మృతులు అలానే చెబుతున్నాయి. ఆ కోతిని మనం పట్టుకోలేదు. పశ్చాత్తాపంతో అదే లొంగిపోయింది. నేరం ఒప్పుకుంది. చెరలోనే ముసలిదైపోయింది. ఆ జీవచ్ఛవాన్ని అలా వదిలెయ్. అయినా అది మహా బతికితే రెండు, మూడేళ్లకంటే ఎక్కవ బతకదు. అంతేకదా.. ఆ మాత్రం దానికి ధర్మభ్రష్టులం కావడమెందుకు?’’

తెల్లగడ్డమున్న ముసలి కోతి పున్నమి చంద్రున్ని చూస్తూ అంది. అడవి వెన్నెల్లో తమకంతో స్నానమాడుతోంది. ముసలి కోతి కూర్చున్న రావిచెట్టు చిటారుకొమ్మ ఆ వెన్నెల్లో జాబిల్లిని ముద్దాడుతున్న నెమలీకలా ఉంది. ఆ కోతి తలపైనున్న పూలకిరీటం నుంచి పరిమళాలు బలహీనంగా వస్తున్నాయి.

‘‘మీరన్నది నిజమే కావచ్చు. కానీ, ఆనాడు చిన్నకోతులు చేసిన దారుణాన్ని తల్చుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. అవి చంపేసిన పెద్దకోతుల పెళ్లాం పిల్లలు ధర్మగంటను వాయించని రోజంటూ లేకుండా పోతోంది. కంటికి కన్ను, పంటికి పన్ను పీకాల్సిందేనంటున్నాయి అవి. ఇప్పుడీ చిన్నకోతిని వదిలేస్తే.. మిగతా చిన్నకోతులన్నీ రెచ్చిపోతాయి. మన పెద్దకోతులకు రక్షణ ఉండదు.. అరాచకం రేగుతుంది.. ’’

నడీడు బవిరిగడ్డం కోతి ఆవేశంగా చెప్పుకుపోతోంది. దాని కోరలు విషపు పుట్టగొడుగుల్లా తెల్లగా మెరుస్తున్నాయి. అది తల విసురుగా అటూ ఇటూ ఊపుతోంది. తలపై ఉన్న వట్టివాసనవేళ్ల కిరీటం ఆ వెన్నెల్లో తాచుపాము చుట్ట కదులుతున్నట్లు కదులుతోంది. దాని తోక రోమాంచితమైంది.

ముసలి కోతి చిన్నగా నవ్వింది. ఓ ఆకును నోట్లో పెట్టుకుని మునిపంట కొరికింది.

‘‘నాయనా, ఈ రాజ్య లాంఛన పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ ఇష్టం! కానీ ఒకటి మాత్రం గుర్తించుకో.. అంతరాత్మకు మించిన ధర్మశాస్త్రం లేదు…!’’

‘అంటే, మేం చేస్తున్నది అధర్మం అంటారా? తలపండిన న్యాయకోతులు ఇచ్చిన తీర్పు తప్పంటారా? నన్ను ఎంతో అభిమానంతో, నమ్మకంతో ధర్మసంస్థాపనార్థం రాజ్యనిర్వాహక కోతిగా ఎన్నుకున్న ఈ అశేష వానరజాతి అభీష్టాన్ని నెరవేర్చడం ధర్మవిరుద్ధం అంటారా?’’

‘‘హ్హు.. అశేష వానరజాతి అభీష్టం! అంటే ఏమిటి నాయనా? మన పెద్దకోతులు కోరుకునేదేనా? చిన్నకోతులకు అభీష్టాలుండవా? ధర్మగంట వాయించడానికి కాదు, అసలు దాని ఛాయలకు రావాలంటేనే వణికిపోతున్న వేలాది చిన్నకోతులకు కోరికలేమీ లేవా? అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందో నీకు మాత్రం తెలియదా?’’

బవిరిగడ్డం కోతి విసుగ్గా ముఖం పెట్టింది. ముసలి ఘటం ఇక చరిత్ర మొదలుపెడుతుంది కాబోల్రా బాబూ అంటూ బుర్ర గోక్కోబోయింది. కానీ అది తన అంతస్తుకు భంగమనుకుని ఆ చీకట్లో గంభీరంగా ముఖం పెట్టుకుంది. అంతే గంభీర గొంతుకతో..

‘‘మీతో చరిత్ర చెప్పించుకోవాల్సిన సమయం కాదిది. ఆ చిన్నకోతిని మూడో ఝాము మొదలవగానే ఉరితీయాలని న్యాయకోతులు తీర్పిచ్చాయి. ఆ శుభఘడియ కోసం రాజ్యమంతా ఎదురుచూస్తోంది. ఆ దెయ్యపు కోతి చివరిసారిగా మీకు మొరపెట్టుకుంది కనుక లాంఛనప్రాయమైన మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఇక ఒక ఝాము మాత్రమే గడువుంది. మీరు దాని మొరను తిరగ్గొట్టి, ఉరితీతకు ఒప్పుకుని తీరాలి..‘’

‘‘ఒప్పుకోకపోతే..?’’

‘‘మీ స్థానంలో మా మాట వినే ఆ జులపాల కోతి వస్తుంది..’’

ముసలి కోతి నిట్టూర్చుంది. దానికి మనసంతా కెలికినట్లు అయింది. ఉన్నపాటున మల్లెపూల కిరీటాన్ని తీసి కిందికి విసిరికొడదామనిపించింది. కానీ భయమేసింది. కొమ్మ నుంచి కొమ్మకు ఎగరలేని ముసలితనం గుర్తుకొచ్చింది. రాజ్యపెద్దగా చిటారుకొమ్మన గంధపు పుల్లలపై కూర్చుని అనుభవిస్తున్న లాంఛనాలు, గౌరవాలు, విలాసాలు, జుర్రుకుని, కొరుక్కుని తింటున్న తియ్యతియ్యని పళ్లు, ఒళ్లుపడుతున్న పరువాల ఆడకోతులు గుర్తుకొచ్చాయి. కానీ దాని అంతరాత్మ మాత్రం ఎందుకో ఎదురు తిరుగుతోంది. మళ్లీ అంతలోనే జావగారి పోతోంది..

‘‘నాయనా, నువ్వు రాజ్యనిర్వాహక కోతివి. అధికారమంతా నీదే. కాదనే శక్తి నాకు లేదు. కానీ నా అంతరాత్మ మాత్రం ఆ చిన్నకోతిని వదిలేయాలనే ఘోషిస్తోంది. నీకు విసుగ్గా ఉన్నా వినక తప్పదు. చేసిన పాపం చెబితే పోతుందంటారు.. చిన్నకోతులకు మనం అన్యాయం చేయబట్టే కదా, అవి ఆనాడు ఆ దారుణానికి ఒడిగట్టింది! ఆ ఘోరానికి ముందు.. వారం రోజులపాటు మన అల్లరి పెద్దకోతులు ఏం చేశాయో నీకూ తెలుసు కదా. ఆ చిన్నకోతుల చెట్లపైకి వెళ్లి, వాటిని పీక పిసికి చంపాయి. గోళ్లతో, నోళ్లతో రక్కి చంపాయి. వాటి పళ్లను, కాయలను దోచుకున్నాయి. వాటి ఆడకోతులను చెరిచాయి. వాటి పిల్లలను చితగ్గొట్టి చంపేశాయి. ఇంకా.. నోటితో చెప్పరాని పాడుపనులన్నీ చేశాయి. ఎందుకు చేశాయి? అవి చిన్నకోతులని, తిరగబడే శక్తి లేదని. వాటి వల్ల రాజ్యంలో చెట్లకు, పళ్లకు కొరతవచ్చిందని పెద్దకోతులను రెచ్చగొట్టి, వాటి అభిమానం సంపాయించి గద్దెనెక్కాలని. చిన్నకోతుల్లో అల్లరివి లేవని చెప్పను. కొన్ని ఉన్నాయి. కానీ వాటిని సాకుగా చూపి మొత్తం అవన్నీ చెడ్డవని తీర్పివ్వకూడదు నాయనా. బలహీనులను కాపాడాలని మన ధర్మం ఘోషిస్తోంది. మన పెద్ద కోతుల అకృత్యాలకు ప్రతీకారంగా ఆ చిన్నకోతి కుటుంబం సర్వనాశనమైంది. అలాంటి మరికొన్ని చిన్నకోతులు కలసి ఎక్కడో పాము విషం సంపాయించి, దాన్ని మన చెట్లపైని పళ్లకు పూశాయి. అవి తిని మన పెద్దకోతులే కాక, కొన్ని చిన్నకోతులు కూడా చచ్చాయి. ఉరికంబమెక్కబోతున్న ఈ కోతి కంటే ఘోర నేరాలు చేసిన చిన్నకోతులు పక్కరాజ్యంలో దాక్కున్నాయి. వాటిని తీసుకురావడం మన అరివీరశూర భయంకర పెద్దకోతులకు చాతకాలేదు. ఆ కోతులకంటే పెద్ద ఘోరాలు చేసిన పెద్దకోతులతో సాక్షాత్తు నువ్వే అంటకాగుతున్నావు. నీ అనుంగులూ అంటకాగుతున్నాయి. పట్టుకొచ్చి ఉరితీయాల్సిన మరెన్నో కోతులు మతపీఠాలపై, రాజ్యపీఠాలపై బోరవిడుచుకుని కూచుని నీతిన్యాయాలను శోష వచ్చి పడిపోయేలా వల్లిస్తున్నాయి.

నాయనా, మనం.. అంటే నువ్వనుకుంటున్నట్లు పెద్ద కోతులం మాత్రమే కాదు, చిన్నకోతులం కూడా.. ఆనాడు తెల్ల చింపాంజీల నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి చేతులు కలిపి తిరగబడ్డాం. చింపాంజీల దాడిలో చచ్చిన కోతుల్లో వేలాది చిన్నకోతులు కూడా ఉన్న విషయాన్ని మరవొద్దు. స్వాతంత్ర్యం వచ్చాక లెక్కలేనన్ని ధర్మపన్నాలతో పెద్ద ధర్మగ్రంథం  రాసుకున్నాం. రాజ్యంలోని కోతులన్నింటికి చిన్నకోతి, పెద్దకోతి అనే తేడాల్లేకుండా అన్ని హక్కులూ ఉంటాయని హామీ ఇచ్చాం. కానీ, ఆ హామీలు మనం కొరికి పారేసే నేతిబీరకాయలైపోయాయి, మేడిపళ్లయిపోయాయి, గుడ్డిగవ్వలైపోయాయి, గురివిందగింజలైపోయాయి. అన్నిచోట్లా పెద్దకోతులు చెబుతోందే వేదమైపోతోంది. వాటి రెట్టమతమే రాజ్యమతమైపోతోంది. అవి చేసేది పుణ్యమూ, చిన్నకోతులది పాపమూ ఐపోతోంది. వాటి పిల్లలు దేశభక్తులూ, వీటి పిల్లలు దేశద్రోహులూ అయిపోతున్నాయి. చివరకు ఆ చిన్నకోతులకు రెండు పిల్లలను కనే స్వేచ్ఛకూడా లేకపోతోంది. పక్కరాజ్యానికి పోవాలని బెదిరింపులూ.. ఆ చిన్నకోతులు అక్కసుతో తిరగబడితే అరాచకకోతులని ముద్రవేసి చెట్లకు కట్టేస్తున్నాం, పీక పిసికి చంపేస్తున్నాం…’’

ముసలి కోతి ఆయాసంతో రొప్పుతోంది.

బవిరి కోతి ముఖం క్రోధంతో ఆ వెన్నెల్లో నిద్రలేని పులికన్నులా ఎర్రబారి తళుక్కుమంది.

‘‘చాలుచాలు. ఇక ఆపండి. మీకు ముసలితనంలో మతి చెడింది. దేశద్రోహికంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోండి. అసలు ఉరి తీయాల్సింది ఆ చిన్నకోతిని కాదు, మిమ్మల్ని. మీ ధర్మపన్నాలకు కాలం చెల్లింది. మీ కాలం వేరు, మా కాలం వేరు. దండం దశగుణం భవేత్ అన్నారు. హక్కులు, గిక్కులు అంటూ కూర్చుంటే రాజ్యం అల్లకల్లోలమవుతుంది. మన కర్మభూమి విశ్వప్రేమిగా, శాంతిదూతగా ఎదగదు. శాంతికి, ప్రేమకు, కరుణకు మారుపేరైన పెద్దకోతులకు, వాటి ధర్మానికి ఉనికే లేకుండా పోతుంది. మీ పనికిమాలిన మాటలతో అప్పుడే అరఝాము గడిచిపోయింది. అక్కడ ఉరికి అంతా సిద్ధమైంది. తలారికోతి తాడు లాగడమే మిగిలింది. ఈ భువికి వన్నెతెస్తున్న మన మహోన్నత పరమపావన స్వర్గతుల్య పూజనీయ శాంతికాముక కర్మరాజ్యంలోని కోతులన్నీ ఆ మరణదండన శుభముహూర్తం కోసం వేచిచూస్తున్నాయి. ఈ తాటాకుపై సంతకం పెట్టి, ఆ తెగపండిన రేగుపళ్లను కొరుక్కు తినండి..’’

బవిరి కోతి కోపం, వెటకారం కలగలిపి తిట్టింది. ముసలి కోతి స్థాణువైపోయింది. బవిరి కోతి ఇచ్చిన తాటాకుపై కలలో మాదిరిగా సంతకం చేసింది. బవిరి కోతి ‘‘శభాష్’’ అంటూ ఓ రేగుపండును రాజ్యపెద్ద నోట్లో ముద్దుగా కుక్కి, తాటాకును నోట్లో కరచిపట్టుకుని ఆ చీకట్లో ఎంతో లాఘవంగా చెంగుచెంగుమంటూ చిన్నకోతిని ఉరితీస్తున్న చెట్టుమీదికి దెయ్యపు పిల్లిలాగా దూసుకుపోయింది.

 

 

 

 

 

 

 

 

పుస్తకాలూ, ప్రజల మధ్య చలసాని!

 నారాయణస్వామి వెంకట యోగి

  మా ఆఫీసు లో నాతో పాటు పనిచేసే అనిల్ అనే మిత్రుడు నెలరోజుల సెలవుపై వైజాగ్ వెళ్ళి,  వచ్చీ రాగానే ‘సార్ మీకో సర్ప్రైజ్ ఉంది’ అంటూ ఒక పాకెట్ తెచ్చి యిచ్చాడు. విప్పి చూద్దును కదా ‘సాహిత్య సమాలోచన’ కృష్ణా బాయి  గారి పుస్తకం, అందులో అందమైన దస్తూరి తో కృష్ణక్క ఉత్తరం – ఒక ఐదారు వాక్యాలతో మరో ఉత్తరం – ‘స్వామీ యెలా ఉన్నావ్ విద్యా పిల్లలూ  యెలా ఉన్నారు – ఈ ఒక్క పుస్తకం మా వదిన కోసం పంపి హెల్ప్ చెయ్యి – నినూ యెప్పటికీ మరవం’ అంటూ – వెనక నిన్నెట్ల్లా భరిస్తుందో అమ్మాయి అంటూ ఒక చురక – తనకు మాత్రమే సాధ్యమయ్యే పలకరింపు  వాక్యాలు – ప్రసాద్ గారి ఉత్తరం – చాలా సంతోషపడ్డా – గత దినాల స్మృతులన్నీ ఒక్క సారి చుట్టుముట్టినయి –

వెంటనే ఫోన్ చేసా వైజాగ్ కి – ‘యేమి నారాయణస్వామీ పూర్తిగా అమెరికనైజ్ అయిపోయావా  – ఇంక అక్కడే ఉండిపోతావా ‘   చాలా ఆత్మీయంగా,  హాయిగా పలకరింపు – ‘లేదండీ …’ అని నేనేదో అనబోతుంటే ‘అండీ యేమిటి నీ బొంద కొత్తగా ..’ అని ప్రేమగా చీవాట్లు – అదే చనువు అదే ఆత్మీయత అదే ఆర్తి గొంతులో..  యే మాత్రం మారలేదు – తనకి 83 యేండ్లు అంటే నమ్మ బుద్ది కాలేదు – పసి పిల్ల వాడిలా మాటలు – ఒక నాలుగైదు పుస్తకాల పేర్లు చెప్పి ఇవి వెతికి పంపు వెంటనే – వదిన (కృష్ణక్క) అడిగిన పుస్తకం వెంటనే పంపు – అని చనువుగా పురమాయింపు – పుస్తకాలు పంపాక ఫోన్ చేస్తే ‘అందినయి పుస్తకాలు చాలా థేంక్స్ – యెప్పుడొస్తావు ఇండియాకు – వచ్చేటప్పుడు మరిన్ని పుస్తకాలు తీసుకు వద్దువు కాని ‘ – పుస్తకాలే పుస్తకాలే ఇంకా యేమీ యెప్పుడూ అడగ లేదు,  కోరుకోనూ లేదు –

2005 లో అప్పటి వై ఎస్సార్ ప్రభుత్వం చర్చల ప్రహసనం ముగించి ‘ఎంకౌంటర్’ ల వేడి  నెత్తురు చిందించి ,  విరసం నిషేధించినప్పుడు, నిషేధం  యెత్తివేయాలని (అప్పుడు వీవీ ని కూడా జైల్లో పెట్టారు‌ )   సం తకాల సేకరణ కోసం శివారెడ్డి గారూ , వేణూ  నేనూ, యెం. టీ. వాసుదేవన్ నాయర్, కే. సచ్చిదానందన్ ల సంతకాల సేకరణ కోసం వెళ్ళినప్పుడు కలిసాం ప్రసాద్ గారిని – (నేనప్పుడే యేడేళ్ళ ప్రవాసం తర్వాత ఇండియా వెళ్ళి ఉండినాను) – ఒక డొక్కు స్కూటర్ వేసుకొని వచ్చారు – అదే ఇస్త్రీ లేని ముడుతల అంగీ , పాంటూ , బుజానికి సంచీ , లావుపాటి మసక కళ్ళద్దాలు – యేమివోయి స్వామీ యెప్పుడొచ్చావు – రాగానే నిషేధమా – నాకు సన్ ట్సు ‘ఆర్ట్ ఆఫ్ వార్ ‘ఒరిజినల్ స్పెషల్ ఎడిషన్ కావాలి – సంపాదించి పంపు యెట్లయినా ‘ – అప్పుడూ పుస్తకమే అడిగారు.

1984 లో శ్రీకాకుళం (మాకివలస) విరసం మహాసభల్లో చూసాను మొదటి సారి ప్రసాద్ గారిని – నేనంతకు ముందు సంవత్సరమే విరసం లో చేరాను. అప్పల్నాయ్డు గారి అధ్వర్యం లో చాలా గొప్పగా అద్భుతంగా జరిగినయి ఆ సభలు – అక్కడే నేను విరసం మహామహులందరినీ కలిసాను – కేవీ ఆర్, త్రిమరా, ప్రసాద్ ,సురా, అప్పల్నాయ్డు – ఇంకా చాలా మందిని మొదటి సారి కలిసేను –
సభ ప్రారంభం లో విరసం జెండా యెగరేసినాక

‘యెత్తినాం విరసం జెండా
అలలలుగా వరదలొత్తు
పోరు పోరు జెండా’
అధ్బుతమైన మమేకతతో ఆర్తితో నిండిన కంఠస్వరం తో కళ్ళు మూసుకుని గానం చేస్తుంటే ‘ఆయనే చలసాని ప్రసాద్’ అని చెప్పారెవరో – అప్పట్నుండీ ప్రతి విరసం సభలో సమావేశం లో రుద్రజ్వాల రాసిన పతాక గీతం ప్రసాద్ గారు పాడాల్సిందే!

‘సుబ్బారావు పాణిగ్రాహి సంధించిన కళల త్రోవ
మా యెన్నెస్ ప్రకాశరావ్ మండించిన కథనంలో ..
పరిటాలా రాములన్న ప్రతిఘటనా మార్గంలో
మా చెర యేతం పట్టిన విప్లవాల గానంలో ‘

గొప్ప తాదాత్మ్యం తో పాడే వారు ప్రసాద్ గారు – నాకూ నేర్పించండి పాట అంటూ వెంట పడ్డాను ఆయన వెంట – అప్పుడు నాకు 18 యేండ్లు – నవ్వి బుజం తట్టి ఓ తప్పకుండా అన్నారాయన ఆత్మీయంగా –

తర్వాత సభలో

‘ఈ విప్లవాగ్నులు యెచ్చటివని అడిగితే
శ్రీకాళం వైపు చూడమని చెప్పాలి
వెంపటాపు సత్యమెవరని అడిగితే
గిరిజనుల సత్యమని గొప్పగా చెప్పాలి

సత్యమూ మాస్టారు స్థానమెచటని అడుగ
గిరిజనుల హృదయాలు గుర్తుగా చూపాలి’

కళ్ళు పూర్తిగా మూసుకుని ఒక చేత్తో బల్ల మీద దరువేస్తూ మూసిన కళ్ళ వెనుక తడి ఉబుకుతుండగా చాలా ఆర్ద్రంగా గొప్పగా గానం చేసారు ప్రసాదు గారు. సభ అంతా పూర్తి నిశ్శబ్దంగా లీనమై పోయి విన్నారా పాటను. పాట తర్వాత నినాదాలు మిన్నంటాయి. అట్లే మరో పాట కూడా పాడే వారు – నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ తనకు మాత్రమే సాధ్యమయ్యే గొంతు తో పలికే వింతయిన గమకాలతో పాడే వారు ‘స్టాలినో నీ యెర్ర సైన్యం ఫాసిజ వినాశ సైన్యం ‘ అంటూ – ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి ఉద్యమాల్లో ఉన్న అపారమైన అనుభవం ప్రసాద్ గారిది.

పల్లెర్లమూడిలో విరసం తరగతులు నిర్వహించినప్పుడు మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం – గతితార్కిక చారిత్రిక భౌతిక వాదాల పైన పాఠం చెప్పారు ప్రసాద్ గారు. అంత సంక్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యేట్లు ‘in a nut-shell’ అనే పద్దతి లో గొప్పగా చెప్పారు పాఠాన్ని. నేనూ,  నా మిత్రుడూ సన్నిహితుడూ ఐన అమరుడు    మాధవస్వామీ పాల్గొన్నాం ఆ తరగతుల్లో – మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం  పునాదులేసింది ప్రసాద్ గారే. ఆ మొత్తం తరగతులైనన్ని రోజులూ మేమొకటి గమనించాం – ప్రసాద్ గారు గాడంగా యెప్పుడూ నిద్రపోయే వారు కాదు – వారిది పిట్ట కునుకే ! ఒక నాలుగైదు నిమిషాలు ఉన్నచోటే కూర్చునే కళ్ళుమూసుకుని కునికే వారు – తర్వాత మళ్ళీ యథాతథంగా చురుగ్గా ఉత్సాహంగా పనిచేసే వారు !

ప్రసాద్ గారు శ్రీ శ్రీ కి,  శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యానికీ పర్యాయ పదం మా దృష్టిలో – శ్రీ శ్రీ అంటే వల్లమాలిన ప్రేమ – చిన్నపిల్లాడై పోయే వారు  శ్రీ శ్రీ పేరు చెపితే – ఈగ వాలినా  సహించే వారు కాదు – ఆయన యెప్పుడు యేది మాట్లాడినా రాసినా తప్పకుండా ఒక్క సారైనా శ్రీ శ్రీ కవితా వాక్యమో వచన వాక్యమో తప్పకుండా దొర్లుతుంది – శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యం ప్రచురణ మొత్తం తన బుజాల మీద వేసుకున్నాడు – డబ్బుల సేకరణ దగ్గర్నుండీ, కవర్ పేజి డిజైన్ , ప్రూ ఫులూ, ఫుట్ నోట్సూ – సమస్తం ఆయనే – ఒక్కడే నెరవేర్చాడు అంటే అతిశయోక్తి కాదు –  సినిమా వాళ్లతో చాలా సంబంధాలుండేవి తనకి –తెలుగు సినిమా రంగంలో కొంత అభ్యుదయ భావాలున్న వారితోనే (ప్రత్యగాత్మ, కే.బి. తిలక్ తదితరులతో ..) సంబంధాలు – కొన్ని సినిమాలకి సహాయ దర్శకత్వం కూడా చేసారని విన్నాను – శ్రీశ్రీ  సమగ్ర  సాహిత్యం ప్రచురణ లో ప్రసాద్ గారు యెవరినీ ఇబ్బంది పెట్టలేదు – తన స్వంతపని లాగానే (యే విరసం పనైనా తాను అట్లే చేసేవారు గొప్ప కమిట్మెంటు తో డెడికేషన్ తో) అలుపెరుగకుండా చిరునవ్వుతో చేసారు – బాగా గుర్తు హైద్రాబాదు లో ఒకసారి కలిసినప్పుడు శ్రీ శ్రీ అనువాదం చేసిన 1968 ఫ్రెంచి విద్యార్థుల ఉద్యమం గురించిన గొప్ప పుస్తకం ‘రెక్క విప్పిన రివల్యూషన్’(The beginning of the End – Angelo Quattrochi) పుస్తకాన్నిచ్చి  – ‘యెట్లా వచ్చింది’ అని కనుబొమలెగరేసుకుంటూ కళ్లలో కించిత్తు సంతృప్తితో కూడిన గర్వం కదలాడుతుంటే అడిగారు – నిజంగా చాలా గొప్పగా అద్భుతంగా ప్రచురించబడిందా పుస్తకం.

విరసం సభలకే మరోమారు వైజాగ్ వెళ్ళీనప్పుడు ప్రసాద్ గారింటికి వెళ్ళాను. పుస్తకాలు,  పుస్తకాలు,  యెటు చూసినా పుస్తకాలే! విశాఖ సముద్రం ప్రసాదు గారింట్లో ఉన్నట్టనిపించిది – షెల్ఫ్ లో శ్రీ శ్రీ లండన్ మహాప్రస్థానం కనబడింది – ఆత్రంగా,  ఆకలిగా తీసుకుని చూడ్డం మొదలు బెట్టా! నా కళ్లలో వెలుగే చూసారో, పుస్తకా న్ని అంత వెల పెట్టి కొనుక్కోలేని నా అశక్తతనే గమనించారో  – ‘మా నారాయణస్వామికి ప్రేమతో’ అని రాసి సంతకం పెట్టి యిచ్చారా పుస్తకాన్ని – తనివితీరా శ్రీ శ్రీ నీ,  ప్రసాదు గారినీ  నీళ్ళు నిండిన కళ్ళతో గుండెలకు హత్తుకున్నా!

విరసం సంస్థాపక సభ్యులూ, జీవితాంతం నమ్మినదానికోసం నిలబడ్డ వారూ, అత్యంత సాధారణ జీవితం గడపిన వారూ, యెటువంటి ఆడంబరాలకూ, పటాటోపాలకు  పోకుండా చాలా సాదా సీదా గా జీవితాన్నీ , సాహిత్యసృజనూ కొనసాగించిన మహానుభావులు ప్రసాదు గారు. యెందరో రచయితలను ప్రచురించారు, వెన్ను దట్టి  ప్రోత్సహించారు – తాను స్వయంగా రాసిందానికన్నా యెక్కువగా,  ఆణిముత్యాల్లాం టి సాహిత్యాన్ని ప్రచురించారు విశాఖలో , తెలుగు నేలపైనా  విప్లవ సాహిత్యానికి మూలస్థంభంలా నిలబడ్దారు – యెంత సాదా సీదాగా ఉండే వారో అంతే సింపిల్ గా మాట్లాడినట్టున్నా గొప్ప లోతైన అర్థాన్నిచ్చేట్టుగా మాట్లాడే వారు – ‘ఆంధ్రప్రదేశ్ ఒక అందమైన అబద్ధం తెలంగాణ ఒక నిష్ఠూరమైన నిజం’ లాటి ఆణిముత్యాల్లాంటి వాక్యాలెన్నో ఆయన ముఖత చాలా యథాలాపంగా వచ్చేవి.

కేవలం పుస్తకాలే కాదు జీవితాన్ని, సమాజాన్నీ , ప్రజా ఉద్యమాలనీ క్షుణ్ణంగా చదివి పీడిత ప్రజా పక్షపాత ప్రాపంచిక దృక్పథాన్ని అణువణువునా వంటబట్టించుకుని అడుగడుగునా ఆచరించి చూపిన వారు ప్రసాద్ గారు. ఆయన ‘గాడిదా’ అని కానీ మరో రకంగా కానీ తిట్టినా చాలా ముద్దుగా ఉండేది. ఆక్షేపణీయంగా అసలు ఉండేది కాదు. ఆయన పాటలేకుండా విరసం సభలు ప్రారంభమవడం ఊహించడం కష్టంగా ఉన్నది. శ్రీ శ్రీ గురించి యెవరు యెక్కడ మాట్లాడినా వెంటనే స్పందించే వారు. ఆ మధ్య ఒడిస్సిస్ యెలైటిస్ ‘పిచ్చి దానిమ్మ చెట్టు’ పద్యాన్ని విన్నకోట అనువాదం చేస్తే వెంటనే స్పందించి ఇది శ్రీ శ్రీ యెప్పుడో అనువాదం చేసాడు – రవిశంకర్ అనువాదం కొంచెం తేడాగా ఉంది అంటూ స్పందించారు. సాహిత్యం , విరసం తదితర అంశాల మీద జరిగిన సుదీర్ఘ చర్చ లో వేల్చేరు తదితరులతో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీ శ్రీ నిజమైన జయంతి యేప్రిల్ 30 అని చాలా పరిశోధించి నిర్ధారించారు. ఈ యేడాది,  ఆ రోజు వివిధలో విలువైన శ్రీ శ్రీ స్మృతులెన్నో పంచుకున్నారు. బహుశ అదేనేమో ఆయన చివరి ప్రచురితం.

నవంబర్ లో వచ్చేటప్పుడు తీసుకురా అని నాకో పుస్తకాల జాబితానిచ్చారు  ప్రసాదు గారు. అప్పల్నాయ్డు  గారితో పంపిద్దామనుకున్నా పుస్తకాలు.   నవంబర్ రాకముందే హడావిడిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తలుచుకుంటే గుండె బరువెక్కుతోంది. కళ్లలో నీళ్ళు నిండుతున్నయి. రావిశాస్త్రి అంటే విపరీతమైన అభిమానం  ప్రసాదు గారికి.  రావిశాస్త్రి కథల్లోని, శ్రీ శ్రీ కవిత్వం లోని  అథోజగత్సహోదరులకోసం. పతితులు, భ్రష్టులూ, బాధాసర్పదష్టులకోసం,  జీవితాంతం సాహిత్య, సాంస్కృతిక సామాజిక రంగాల్లో కృషి చేసిన ప్రసాదు గారు అందరి హృదయాల్లోనూ , ప్రజల నాలుకల పైనా యెప్పుడూ జీవించే ఉంటారు. ఆయనకూ ,  అసాధారణమైనదీ  అయిన ఆయన జీవన శైలికీ మరణం లేదు.

*

చీమల వైపే వుండాలి మనం!

 

 చలసాని ప్రసాద్

అది 30వ తేదీ, జనవరి నెల, 1948వ సంవత్సరం. సాయంత్రం ఏడుగంటల సమయం. గాంధీ గారిని కాల్చేశారని ఆకాశవాణి అరిచింది. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా కృష్ణాజిల్లా – చల్లపల్లిలో. మాఊరు అక్కడికి 4 మైళ్ళు. ఆ ఊళ్ళో రేడియో లేదు. హుటాహుటిని సైకిలేసుకుని వెళ్ళి గొట్టాంతో గోడ మీద నిలబడి గాంధీ గారిని కాల్చి చంపారని చెప్పాను. అయితే అప్పటికి ఎవరు చంపారో ఇంకా ఇదమిద్ధంగా తెలియరాలేదు. ముస్లిం చంపాడేమోననుకుని భయపడిపోయి ఎక్కడికక్కడ ముస్లింలు కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులకి తరలి వెళ్ళారు. అప్పటికే కోస్తాజిల్లాలలో కమ్యూనిస్టు పార్టీ ఒక రాజకీయశక్తిగా రూపొందింది. బందరు, బెజవాడ, గుడివాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి మొదలైన పట్నాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు ముస్లింలతో నిండిపోయాయి. అలనాడు మైనారిటీలకు కమ్యూనిస్టు పార్టీ ఒక గొప్ప రక్షణ కవచం.

గాంధీ గారు చనిపోయి ఆరు నెలలు తిరక్కుండానే మా జిల్లాలు పళనియప్పన్ పోలీసు కాంపులతో నిండిపోయాయి. తీవ్రమైన నిర్బంధకాండ కొనసాగింది. కమ్యూనిస్టు కుటుంబాలు ఊళ్ళో ఉండలేని పరిస్థితి. అప్పుడు మా కుటుంబం మా ఊరి నించి చీమలపాడుకి వలస వెళ్ళింది. అది తెలంగాణా సరిహద్దున ఉన్న ఒక చిన్న జమీందారీ గ్రామం. మేము మా ఊళ్ళో ఉండగానే మా ఇంటికొచ్చి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రాజబహద్దూర్ గౌడ్ వారం రోజులున్నారు. అప్పటి తెలంగాణా మాకు రష్యాలాగా అనిపించేది.
chalasani1
       చీమలపాడులో ముస్లిం జనాభా ఎక్కువ. అందరూ మమ్మల్ని ఎంతో ఆదరించేవారు. అందరం వరసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం. మా నాన్ననీ, అమ్మనీ ఎక్కువమంది అన్నయ్య, వదిన అనేవారు. మా అమ్మ ముస్లిం స్త్రీలాగానే ఉండేది కూడా. మేమూ అలాగే వాళ్ళని బాబాయి, పిన్ని, అత్తయ్య, మామయ్య అనే పిలిచేవాళ్ళం. నేను అలా పిలిచేవాళ్ళలో జంగ్లీ మామయ్య ఒకరు. అతను కష్టజీవి. ఆదరణకీ, ఆప్యాయతకీ పెట్టింది పేరు. జంగ్లీ మామయ్యకి ముగ్గురు కుమార్తెలు. ఒక కూతురు పేరు సాదఖున్. చాలా చలాకీగా ఉండేది. నిరంతరం నన్ను ఆటపట్టిస్తుండేది. మిగతా యిద్దరు మునవ్వర్, హజరా. తర్వాతి కాలంలో జంగ్లీ మామయ్య కూతురు మునవ్వర్ తో కౌముది పెళ్ళి జరిగింది.

పల్లెటూరుకి, పనిపాటలకి సంబంధించిన ఎన్నో విషయాలు అక్కడ నేను గ్రహించాను. నేను పుట్టి పెరిగిన ఊళ్ళలో కన్నా అక్కడ పేదరికం ఎక్కువ. అక్కడ నించి మేము బెజవాడకి వచ్చేశాక కూడా మా అనుబంధం అలాగే కొనసాగింది. మేము మస్తాన్ బాబాయి అని పిలిచే ఆయనకి కౌముది స్వయానా బావమరిది.

       కౌముది ఆ ఊరి వాడే అని విని నా మనసు పొంగులు వారింది. నాకు తెలిసిన కౌముది, మునవ్వర్ ల కన్నబిడ్డే అఫ్సర్ అని తెలిసి మరింత ఆనందం కలిగింది. బెజవాడలో ఒకసారి కలుసుకుని కబుర్లన్నీ కలబోసుకున్నాం. పల్లెపట్టులలో వుండే ప్రశాంతత,  కలుపుగోలుతనం ఇవి అజరామరం. ఇవి ఉద్యమాలకి ఊతం ఇస్తాయి. అలనాటి కమ్యూనిస్టు పార్టీ సాహిత్య, సాంస్కృతిక రంగాలలో సాధించిన విజయాలు ఎప్పటికీ మనకి గర్వకారణమే.

మనం చీమలవైపే ఉండాలని, పాముల పడగనీడలోకి దిగిపోగూడదనీ నేనక్కడే నేర్చుకున్నాను.

  14.01.2010

కౌముది కవిత్వ సంపుటి “అల్విదా” నుంచి …

(నాన్నగారి పుస్తక్తానికి చలసాని గారు రాసిన ఈ మాటల్ని వెంటనే సంపాదించి, టైప్ చేసి పంపిన కవిమిత్రుడు బాల సుధాకర్ మౌళి కి షుక్రియా)

వినిపించనా ఈ పూట ఆ పాట…

శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

sp dattamala“ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం”

   అని పాడింది  ఎవరో తెలుసా? విస్సంరాజు రామకృష్ణగారు .

  భక్త తుకారాం చిత్రంలోని   “పాండురంగ నామం పరమపుణ్య ధామం” పాట.

 ఆయన పాటలు కూడా అంతే. ఇంకా చెప్పాలంటే బాపుగారి ముత్యాలముగ్గులో  

“ఎదో… ఏదో.. అన్నది ఈ మసక వెలుతురు,గూటి పడవలో విన్నది కొత్తపెళ్లికూతురు”

ఈ పాట ఎన్ని మార్లు విన్నా,  మళ్ళీ కొత్తగా ఉంటుంది.

ఆ చిత్ర కథానాయకుడు శ్రీధర్  స్టైల్ కి తగ్గట్టు పాడారు.

“ఎదో …ఏదో ” వినసొంపుగా ఉంటుంది.

భక్త తుకారాం లో ఘంటసాల గారు, రామకృష్ణ గారు ఇద్దరూ పాడారు. లోతైన పరిశీలన ఉంటేగాని ఎవరు ఏది పాడారు అనేది చెప్పడం  కష్టం. రామకృష్ణగారి పాట వింటే ఘంటసాల గారే పాడారా అన్నట్టు  ఉంటుంది . ఈయన్ని ఘంటసాల గారి ఏకలవ్య శిష్యుడు అంటారు.  ఘంటసాల గారి చివరి రోజుల్లో ఆయాసం వల్ల హై- పిచ్ అంటే  తారాస్థాయిలో స్వరపరిచిన పాటల్ని రామకృష్ణ గారే పుర్తిచేసారట. ఎవ్వరు గుర్తుపట్టలేదు. అలా 15 పాటలు ఉన్నాయ్. మచ్చుకి కొన్ని …కన్నకోడుకులో “తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి”, అల్లూరి సీతారామారాజులో “తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా “. కాని సినిమాలో ఆయన పేరు లేదు. ఈ విధంగా గురుదక్షిణ సమర్పించుకున్నారు అని చెప్పవచ్చు.

1974 లో ఘంటసాల మాస్టారు పరమపదించారు. ఆయన ఉన్నపుడే, 1972 నుంచే , రామకృష్ణ గారు సినిమాల్లో         నేపధ్య గానం  మొదలు పెట్టారు. ఘంటసాల గారి గొంతులా ఉన్నా, ఈయనకి రావాల్సిన పేరు వచ్చింది. ఆయన మొదటి  సినిమా  “విచిత్ర బంధం” లో పాడిన  “వయసే ఒక పూల తోట”. వాణిశ్రీ ఆట, రామకృష్ణ పాటతో హుషారుగా సాగుతుంది.

మహాకవి క్షేత్రయ్య లో, గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలలు  తన్మయత్వం తో క్షేత్రయ్య పాడినట్టు ఓ పాట ఉంటుంది,  ” ఆ రేపల్లె లోని గోపాలుడంట యే పిల్లనైన చూస్తే తంటా ..తలచుకుంటే ఆ జగడం కన్నులపంట ఓ ఓ ఓ మజా మజా కన్నులపంట” బలిపీఠం లో  భార్య అలికను తీర్చే పాట  “చందమామ రావే జాబిల్లి రావే “. “ఇదెక్కడి న్యాయం”  లో  “ఎపుడైనా యే క్షణమైనా ” మొత్తం పాటంతా  సుశీలగారు   పాడినా ముగింపు రామకృష్ణగారు ఇస్తారు.  ఒకే  చరణమైనా చాలా  బాగుంటుంది.

“భక్త కన్నప్ప” అనగానే రామకృష్ణ గుర్తొస్తారు. ” అరె సిన్నమీ ! మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఓ.. ఓ.. ఓ..  మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా అబ్బో సిగ్గా! మల్లెమొగ్గా అబ్బో సిగ్గా!”

కన్నప్ప ప్రేయసితో పాడుకునే పాట అద్భుతం.

బాపుగారు గోదావరినది నేపధ్యంలో తీసిన అందాలరాముడు లో చాలామట్టుకు రామకృష్ణ గారే పాడారు.

“కురిసే వెన్నెల్లో మెరిసే గోదారి లా

మెరిసే గోదారి లో విరబూసిన నురగ లా

నవ్వులారబోసే “పడుచు”న్నది

కలువపువ్వు వేయిరేకులతో విచ్చుకున్నది

పున్నమి ఎపుడెపుడా అని వేచియున్నది”

డాక్టర్ నారాయణరెడ్డి గారి రచనకు, బాపుగారి దృశ్య కావ్యానికి తన గాత్రంతో వన్నెలద్దారు. “విచ్చుకున్నది” అంటూ, కలువ విచ్చుకునే వైనం తన గొంతులో రంగరించి పాడారు. “ఇదా లోకం” సిన్మాలో “నీ మనసు నా మనసు ఏకమై ప్రతిజన్మలోన ఉందాము జతగా”  రామకృష్ణ గారి  పాట, శోభన్ బాబు ,శారద పైట చెంగుతో ఇద్దరు  చేసే విన్యాసాలు చూస్తూ పరవశించపోతాము.  ఈ పాట ఆడియో వింటే ఘంటసాల గారు పాడిన “సంగమం సంగమం అనురాగ సంగమం” గుర్తొస్తుంది. ఇక్కడ తేడా తెలుస్తుంది. ఘంటసాలగారి గొంతులో గాంభీర్యం…రామకృష్ణ గళంలో  లేతకొబ్బరి కమ్మదనం. “వసివాడి శశిచెడి వన్నెవాసీ లేక – విరహాన వనలక్ష్మి వేగిపిలుచూ/ పగిలి గుండెల దాక పొగలతో సెగలతో – దాహాన భూదేవి తపియించి పిలుచూ/రా, తొర తొరగా రా . . తొందరగా రా/ఓ దూరగగన విహారా ఓ శీతల వర్షాధారా/తరలిరా జలధరా . . కరుణించి కదలిరా తరలిరా జలధరా . . కరుణించి కదలిరా”      దేవులపల్లి రచనకు సాలూరు రాజేశ్వరరావు “రాగ మల్హార్ “లో స్వరపరచిన గీతాన్ని బాలుగారితో ఆలపించినప్పుడు నిజంగానే వర్షం కురిసిందట.  చిత్రం  అన్నదమ్ముల కథ.

అందాల రాముడు లో హరికథ  ” ధన్యుడనైతిని ఓ రామా! నా పుణ్యము పండెను ఓ రామ” వచనం చెప్పింది అక్కినేనిగారైతే పద్యాలు పాడింది  రామకృష్ణగారు.

యశోద కృష్ణ లో కూడా ఒక పాట ఉంది .

” నెల మూడు వానలు నిలిచి కురిశాయీ – పచ్చిక మేసి మన పశువులే బలిశాయీ దేశాన కరువు రాకుండాలిరా . . దేవేంద్రునకు పూజ చెయ్యాలిరా !”

భక్తి పాటలకు ఆయన గాత్రం  పుట్టినిల్లు అని చెప్పవచ్చు. “శ్యామ సుందరా  ప్రేమ మందిరా నీ నామమే వీనుల విందురా” “రామా  శ్రీరామా  జయ జయ రామా  రఘురామా””మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి”… మొదలైనవి  కరుణామయుడులో వినదగిన పాట ” పువ్వులకన్న పున్నమివెన్నెల కన్న  మిన్న అయినది పసిడి కుసుమం ”

దానవీరశూరకర్ణ , విశ్వనాథ నాయకుడు ,షిర్డీ సాయిబాబా మహత్యం ,వెంకటేశ్వర వైభవం, బ్రహ్మంగారి చరిత్ర మొదలైన వాటిల్లో పద్యాలు ,దండకాలు చాలానే ఉన్నాయ్.

“ఓహో చెలి ఓనా చెలి

ఇది తొలి పాట

ఒక చెలి పాట

వినిపించనా  ఈ పూట

ఆ  పాట”

దాసరి నారాయణరావుగారి దర్శకత్వం లో వచ్చిన కన్యాకుమారి చిత్రానికి పై పాట పాడారు, కాని ఎందుకో తీసేసారు.    చెప్పాలంటే మనము వినని పాట .

“ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర”

“అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం” ఇలాంటి పాటలను  ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరి వల్ల ,ఎదో ఒక సందర్బంలో కనెక్ట్ చేసుకుంటూనే ఉంటాము.

“రాముడేమ్మాన్నాడోయ్ …సీతా రాముడేమ్మాన్నాడోయ్”…

బ్రహ్మంగారి చరిత్ర లో “ఏమండి పండితులారా ”

ఇవి  వ్యంగ్యపు పాటలు . మొత్తానికి చెప్పాలంటే పాటల్లో చేయని  ప్రక్రియ, ప్రయోగము లేదు.భక్తి పాటలు ,యుగళ గీతాలు,పద్యాలు ,దండకాలు మొదలైనవి .

ఇక వ్యక్తిగత విషయానికి  వస్తే ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఘంటసాలగారి ఏకలవ్య శిష్యుడు అంటేనే అర్ధం చేసుకోవాలి ఎంత కష్టపడ్డారో. నిచ్చెన ఎక్కించినట్టే ఎక్కించి డబ్బున కింద పడేసింది సినీ రంగం. అంటే వైకుంటపాళీ ఆటలో మాదిరి, నిచ్చెన ఎక్కారు ,పాము కాటుకూ  గురయ్యారు. పది సంవత్సరాలే ఉన్నారు ఇండస్ట్రీలో . తరువాత అరకొర ఆవకాశాలు ఆ తర్వాత అవీ లేవు. మనిషి వ్యక్తిత్వం బయటపడేది కష్టాలు ,సమస్యలు వచ్చినపుడే. రామకృష్ణగారి ఆశావహ ధృక్పధం ఆయనకు తోడ్పడింది. భక్తీ గీతాల ఆల్బమ్స్ , వివిధ కన్సర్ట్స్ , టీవీ సీరియల్స్ లో నటన, లాంటి  వ్యాపకాలు సృష్టించుకున్నారు.

మా ఊర్లో ఉన్న శివాలయం లో రోజు ప్రొద్దున్న ,సాయంత్రం “శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో” రికార్డు వేసేవారు .అప్పుడు తెలిసేది కాదు ఎవరు పాడారో. తర్వాత అది విన్నపుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేవి. ఎపుడైనా ఆ గుడికి వెళ్తే రామకృష్ణగారు తప్పక గుర్తొస్తారు నాకు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పాటల పడవెళ్ళి పోయిందిరా…!

 

ముళ్ళపూడి సుబ్బారావు

Srmతెలుగు సినీ సంగీతం పట్ల అభిరుచి ఉన్నవారికి పరిచయం అవసరంలేని పేరు రామకృష్ణ. (పూర్తి పేరు వి.రామకృష్ణదాస్). తెలుగు సిని సంగీతంలో (హింది సీమలో కూడా) స్వర్ణ యుగంగా చెప్పబడే అరవైలు, డెబ్భై లలో, డెబ్భయ్యవ దశకంలో నేపధ్య గాయకుడిగా గాఢమైన ముద్ర వేసిన గాయకుడు రామకృష్ణ. చిత్రరంగ ప్రవేశం తోనే అగ్రనటునకు నేపధ్య గానం చేసే అవకాశం లభించింది.అనతికాలంలోనే అగ్రనటులందరికీ పాటలు పాడే అవకాశాలు అందుకున్నాడు. ఐదారు సంవత్సరాలు నేపధ్య గాయకుడిగా మంచి స్థితి అనుభవింఛాడు.

రామకృష్ణ కు అవకాశాలు రావడానికి, గాయకుడిగా అతని ప్రస్థానం,దాని భూమిక ను పరిశించదలిస్తే అనేకవిషయాలు అవలోకించాలి.

తెలుగు సినిమా పాట-ఘంటసాల ఘరానా:

ఘరానా అనే పదానికి  తెలుగులో వాడుకలో ఉన్న అర్ధం గొప్పదేం కాదు. ఐతే హిందూస్తానీ సంగీతంలో ఘరానా అనేది గాయకుల, సంగీతకారుల బాణీని,సాంప్రదాయాన్ని  సూచించేది.అందులో ప్రాంతం కూడా కలసి ఉంటుంది.(ఉదా:  పటియాలా ఘరానా,ఆగ్రా ఘరానా). తెలుగు సినిమా పాటలకు సంబంధించి ఘంటసాల ఘరానా 70లవరకూ రాజ్యమేలింది. ఘంటసాల ఇదివరకటంత ఉత్సాహం గా పాడలేకపోవటం తో అదే తరహా లో సాగే ఆమోదయోగ్యమైన యువ స్వరం అవసరం సీనియర్ నటులకు కలిగింది. బాలూ ఘరానా ఇంకా వేళ్ళునుకునే స్థితిలోనే ఉంది. ఘంటసాల బాణీకి అలవాటుపడి ఉన్న ప్రేక్షకులు,శ్రోతలు అందుకు భిన్నమైన స్టైల్ ను ఇష్టపడతారా అనేదానిపై అందరికి అనుమానాలున్నాయి. ఘంటసాల కు భిన్నమైన పంథాలోనే సాగుదామని బాలు నిర్ణయించుకున్నట్టు అప్పటి బాలు పాటలు ఉంటాయి. ఎన్.టి.ఆర్, ఏ ఎన్నార్ లు బాలు తో ప్రయత్నించారు కాని బాలు ను ఘంటసాల కు ప్రత్యమ్నాయంగా చూడలేకపోయారు.  ఆ వెతుకులాటలో ఏ ఎన్నార్ కు రామకృష్ణలో ఘంటసాల ఘరానా కనపడి ఉండవచ్చు.

ఘంటసాల బాణీలోనే, ఘంటసాలతో పాటు కొన్ని సినిమాలకు ప్రముఖ హీరో లకు పాడటం,అవి ప్రేక్షకామోదం పొందటం వల్ల ఘంటసాల కు కొనసాగింపుగా రామకృష్ణ ముందుకు వచ్చాడు. ఫ్రఖ్యాత గాయని సుశీల చుట్టరికంకూడా ఈ ఎదుగుదలకు కొంత దోహదపడి ఉండవచ్చు.

హిందీ సినిమ సంగితంలో ఇదే తరహా ను గమనించవచ్చు. నలభైలనుండీ 1990 వరకూ హిందీ పాటల్ని గమనిస్తే ప్రముఖంగా వినిపించే స్వరాలు ..కె.ఎల్ సైగల్, ముఖేష్, మహమ్మద్ రఫి,కిశోర్ కుమార్ లవి.

స్టార్ స్టేటస్ అనుభవించిన ప్రతీ గాయకుడుకి తర్వాత కాలంలో ఆయన్ని అనుకరిస్తూ పాడే గాయకులు ఉంటారు. కొన్నిసార్లు ప్రధాన గాయకుడు పాడుతున్నపుడే అనుకరణలు కూడా కొనసాగుతాయి. హిందీ చిత్రసీమలో ఆరకం గా సైగల్ ను ఆయన తర్వాత వచ్చిన ముఖేష్, కిశోర్ లు అనుకరించారు. తర్వాత ఇద్దరూ తమ సొంత బాణీ ని ఏర్పరచుకున్నారు.

ముఖేష్  క్లోన్ గా ఆయన కొడుకు నితిన్ ముఖేష్, అంతకు ముందే (1969) గాయకుడిగా పరిచయమైన మన్ హర్ ఉధాస్ ని చెబుతారు.మహేంద్ర కపూర్ మొదటి రోజుల్లో పాడిన కొన్ని పాటలు జాగ్రత్త గా వినకపోతే రఫీ పాటలే అనుకునేంత సామీప్యత ఉంటుంది. రఫీ తరహా లో అన్వర్ (హం సె కా బూల్…. జనతా హవల్దార్) , జస్పాల్ సింగ్ (గీత్ గాతా చల్) రఫీ ఫీల్డ్ లో ఉన్నపుడే వచ్చారు. రఫీ మరణం తర్వాత, ఆ స్లాట్ ను భర్తీ చేయడం లో వచ్చిన  షబ్బీర్ కుమార్, మహమ్మద్ అజీజ్ ఆతర్వాత ఉదిత్ నారాయణ్, సోను నిగం రఫీ క్లోన్స్ గా ముద్ర పడ్డారు.కిశోర్ కుమార్ కు క్లోన్స్ గా కుమార్ సాను, అభిజీత్ కొనసాగారు. కిశోర్ కొడుకు అమిత్ కుమార్ గాయకుడైన కిశోర్ ను పూర్తిగా ఇమిటేట్ చేసినట్టు కనపడదు.

అలాగే తెలుగు లో ఘంటసాల కు ప్రత్యమ్నాయంగా రామకృష్ణను ప్రోత్సహించడటాన్ని చూడాల్సి ఉంటుంది.ఘంటసాల పాటలు పాడుతున్నపుడే రామకృష్ణ చిత్రరంగ ప్రవేశం జరగటం, ఘంటసాల తొ కలిసి చిత్రంలో పాటలు పంచుకోవడం, కొన్ని పాటల్లో ఘంటసాల తో (విత్ అవుట్ క్రెడిట్స్) పాడటం,( తింటే గారెలే తినాలి వింటే భారం వినాలి- కన్న కొడుకు (1973)  -రామ కృష్ణ ఇంటర్వ్యూ) వంటివి ఇక్కడి ప్రత్యేకం. రారా మా ఇంటికి  నిదురరాదు నా కంటికి (దొరబాబు 1974) పాటలో పల్లవి రామకృష్ణ పాడింది చరణాలు ఘంటసాల పాడింది సినిమాలో వినిపిస్తుంది.

తెలుగు సినిమాలలో 1950 నుండి 1980 వరకు కథానాయకులకు నేపధ్యగానాన్ని తరచిచూస్తే మూడు దశలు గమనించవచ్చు.అవి

1950 -1973    ఘంటసాల కాలం

యాభయ్యవ దశకం ప్రారంభంలోనే తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ డం ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రూపంలో  ప్రవేశించింది.తొలి రోజుల్లో ఇద్దరూ పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాల్లొ నటించినా వాటిని పంచుకున్నట్టుగా రామారావు జానపద, పౌరాణిక చిత్రాల్లోనూ, నాగేశ్వరరావు సాంఘిక చిత్రాల్లో ను రాణించారు.సాంఘిక చిత్రాల్లో రామారావు నటించినా, ఇరువురి ముద్రల మధ్య స్పష్టమైన తేడా కనిపించేది. వారి దర్శకులువేరు,నిర్మాతలు వేరు,నిర్మాతలు వేరు,సంగీత దర్శకులు వేరు. ఐతే వారిరువురికి సంబంధించి ఒక సామాన్యమైన విషయం వారి నెపధ్య గాయకుడు ఘంటసాల ఒక్కరే కావడం.సినీ నేపధ్య  గాయకులు అదేకాలంలో పి.బి.శ్రీనివాస్, ఎ.ఎం.రాజా, మాధవపెద్ది మొదలైనవారున్నా,  కాంతారావు,జగ్గయ్య,హరనాథ్  వంటి హీరోలు ఎన్.టీయార్, ఏ.ఎన్నార్ లకు ఎలా పోటీ కాలేదో ఘంటసాల కు  కూడా పోటి కాలేదు. ఆయన మాత్రమే ఆరంగంలో సూపర్ స్టార్. ఘంటసాల సూపర్ స్టార్ డం ఇంచుమించు ఆయన మరణానికి కొద్ది కాలంముందువరకూ, ఆయన పాటలు పాడగలిగేంతవరకూ అంటే 72/73 వరకూ కొనసాగింది.గాయకునిగానే కాక విజయవంతమైన సంగీత దర్శకునిగా కూడా( 100 కు పైగా చిత్రాలకు) కొనసాగారు.

1977  నుండిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కాలం

డెబ్భై ఏడవ సంవత్సరం వచ్చేసరికి తెలుగులో ఎన్.టి.ఆర్, ఏ ఎన్నార్ తో పాటు కృష్ణ,శోభన్ బాబులు తో కలిసి టాప్ ఫోర్ హీరోలుగా ఉన్నార్.కృష్ణం రాజు హీరో గా ఉనికి చాటుకుంటూ సొంత సినిమాల సక్సెస్ తో ఐదో స్టార్ గా మారుతున్నారు. ఐతే ఈ ఐదుగురు హీరోలకూ నేపధ్య గానం చేస్తున్న ఒకే ఒక ప్లే బాక్ సింగర్ మాత్రం బాలు గా పిలువబడే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల నేపధ్య గాయకుడిగా అప్రతిహతంగా వెలుగుతున్నపుడు అప్పడప్పుడూ వినపడె పి.బి.శ్రీనివాస్,ఏ ఏం రాజా, మధవపెద్ది, పిఠాపురం లాగానే ఇప్పుడూ కొన్ని గొంతులు ..రామకృష్ణ,ఆనంద్, మాధవపెద్ది రమేష్ వంటివి వినిపిస్తుంటాయి. (అప్పుడప్పుడూ జేసు దాసు వంటి పర భాష గాయకుని గొంతు).  కథానాయకుడు ఎవరైనా, సినిమా క్లాస్ ఐనా మాస్ ఐనా, కుటుంబపరమైన, సామాజికపరైనా, సంగీతభరితమైనా, గూఢచారి తరహా ఈన అన్ని మగపాత్రలకూ ఒకటే స్వరం నేపధ్య గానం చేస్తుంది. డెబ్భై నాటికి కృష్ణకు మాత్రమే పాడుతూ ఏక కంఠుడు గా ఉన్న బాలు పంచకంఠుడు గా, తర్వాత దశ కంఠుడు(వి.ఏ.కే మాటల్లో) మారి గాయకునిగా  నెంబర్ వన్ స్టేటస్ అనుభవిస్తున్నారు.

ఐతే ఘంటసాల నుండి స్టార్‌డం ను బాల సుబ్రహ్మణ్యం ఎలా పొందాడు? డెబ్భై రెండు నుండి డెబ్భై ఏడు వరకు తెలుగు కథానాయకులకు సంబంధించి నేపధ్య  సంగీత ప్రపంచం లో ఏమిజరిగింది?

1972 -1977

అరవయ్యవ దశకం మధ్య భాగంలో నటద్వయం మధ్య వయసుకు వచ్చారు.ఆ సమయంలోనే కొత్తనటులు హీరోలుగా ప్రవేశించసాగారు. అప్పటికి కొద్ది కాలంముందుగా శోభన్ బాబు ప్రవేశించి ఉన్నాడు, కృష్ణ, రామమోహన్,రామకృష్ణ, కృష్ణం రాజు హీరోలు గా పరిచయమయ్యారు. నేపధ్య గాయకులు గా ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, కె.బి.కె మోహన్ రాజు వంటివారు వేళ్ళునుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే కొత్తగా పరిచయమైన కథానాయకులు, గాయకులు అప్పటికి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నటద్వయానికి , ఘంటసాల కు పూర్తిస్థాయి పోటీ కాలేదు కానీ అలాకావొచ్చన్న సంకేతాలు కనిపించసాగాయి..

ఆలా తెరపైన, తెరవెనుక కూడా పాతకొత్త కళాకారులు రంగం మీద ఉన్నారు. వీరి మధ్య స్పర్థ అప్రకటితంగానూ, అంతర్గతంగానూ 1970 వరకూకొనసాగింది.

1965-70 మధ్య ఘంటసాల కొత్త హీరోలకు పాడటం, ఎన్ టీయార్,ఎ.ఎన్నార్ లు కొత్త గాయకులతో పాడించుకోవటం జరిగింది. ఎన్.టి.ఆర్ కు పి.బి.శ్రీనివాస్(ఆడబ్రతుకు),ఎస్.పి.బాలు (కోడలు దిద్దిన కాపురం, చిట్టిచెల్లెలు)పాడారు. అలాగే మహమ్మద్ రఫీ తో కూడా ఎన్.టి.ఆర్ పాడించారు (తల్లాపెళ్ళామా,భలే తమ్ము డు). ఏ.ఎన్నార్ కు పి.బి శ్రీనివాస్(ప్రేమించిచూడు), ఎస్.పి. బాలు(ఇద్దరమ్మాయిలు)పాడారు. ఐతే రెగ్యులర్ గా మాత్రంఘంటశాలే పాడెవారు. అలాగే కృష్ణ కు  కూడా ఘంటసాల కొద్దిరోజులు పాడారు. క్రమంగా కృష్ణకు పర్మినెంటు నేపధ్యగాయకుడుగా బాలు ఢెబ్బైకి ముందే స్థిరపడిపోయాడు. శోభన్ బాబు కు ఎస్.పి అప్పుడప్పుడూ పాడినా (కొన్ని పెద్దహిట్స్ కూడా ఉన్నాయి. ఊదా: చెల్లెలి కాపురం, మానవుడు దానవుడు, పుట్టినిల్లు మెట్టినిల్లు), ఘంటసాల చివరి వరకూ (ఖైదీ బాబాయి1974) పాడుతూనే ఉన్నారు.

70 తర్వాత ఘంటసాల పాటల్ని దగ్గరగా గమనిస్తే, గొంతు లో అలసట, ఊపిరి భారంగా తీసుకోవడం తెలిసిపోసాగింది. యువ హీరోలతో పోటిపడాల్సి వచ్చినె మధ్యవయస్కులైన నటద్వయం కొత్త గొంతు కోసం అన్వేషిస్తుంది.

ఆ సంధి కాలంలో ఏ ఎన్నార్ కు రామకృష్ణ రూపంలో ఒక సమాధానం దొరికింది. ఆల్ ఇండియా రేడియో కోసం చిత్తరంజన్ (కొన్ని సినిమా పాటలు పాడాడు) దర్శకత్వంలో  కే బి కే మోహన్ రాజు పాడవలసిన పాటలు ఆయన దొరకకపోవటంతో రామకృష్ణ అనే నూతన గాయకునితో కొన్ని పాటలు పాడించారు. (కుటుంబ నియంత్రణ ప్రచారం కోసం). ఆ పాటలు ఏ ఎన్నార్ సారధీస్టూడియో లో విన్నారు. ఆతని గొంతు లో ఉన్న ఘంటసాల సామీప్యత వల్ల కావచ్చు ఏ ఎన్నార్ కు అతని గొంతు నచ్చింది. నిర్మాణంలో ఉన్న తన చిత్రంలో పాడటానికి అడిగారు. రామకృష్ణ అప్పటికి చదువు పూర్తికాలేదు. పరీక్షలు అయ్యేదాక ఆగి తర్వాత అతనితో విచిత్రకుటుంలో రెండు పాటలు పాడించారు. ఏ ఎన్నార్ కు విచిత్రకుటుంబం సినిమా(విజేత నవల చిత్రరూపం) నే అప్పటివరకూ ఏ ఎన్నార్ సినిమా లకు కొంత విరుద్ధమైన పంధా లో ఉంటుంది.(హీరో యిన్ ను బలాత్కరించడం). అందులోనూ కొత్త గాయకునికి ప్రయత్నించడం విశేషమైనదే. కొత్తగాయకుని పాటలకు ఏ ఎన్నార్ కు నేపధ్య గానం గా శ్రోతల ప్రేక్షకుల ఆమోదం లభీంచింది.

విచిత్ర బంధం తర్వాత ఏ ఎన్నార్ కు ఘంటసాల తో పాటు రామకృష్ణ కూడా ప్లే బాక్ సింగర్ గా కొనసాగారు.ఆలాగె 73,74 సంవత్సరాలలో వచ్చినె పల్లెటూరి బావ, భక్తతుకారాం, దొరబాబు, బంగారుకలలు సినిమాలో కొన్నిపాటలు ఘంటసాల కొన్ని పాటలు రామకృష్ణ పాడారు. ( గతంలో ఏ ఎన్నార్,ఎన్.టి.ఆర్ కలిసినటించిన చిత్రాలలో ఇద్దరికి ప్లే బాక్ ఘంటశాలే కొనిసార్లు ఒకేపాటలో కూడా గమనించవచ్చు)

ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ నేపధ్యగానం చేయడం ధనమా? దైవమా? చిత్రంతో మొదలయ్యింది. తర్వాత ‘పల్లెటూరి చిన్నోడు ‘ లో ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ పాడారు.72 లో వచ్చిన కులగౌరవం లో బాలు ఎన్.టి.ఆర్ కు పాడారు. 73 లో వచ్చిన ఐదు  డైరెక్ట్ సినిమాలల్లో  నాలుగు సినిమాలల్లో ఘంటసాల పాటలే ఉన్నయి. 74 లొ వచ్చిన ఆరు సినిమాల్లో ఎన్.టి.ఆర్ కు  ఘంటసాల తో పాటు రామకృష్ణ ఒక సినిమాలో,బాలు  రెండు సినిమాలోపాడారు. అలా ఎన్.టి.ఆర్ రామకృష్ణను ఘంటసాలకు ప్రత్యమ్నాయం గా అప్పటికి చూడలేదు.

కృష్ణ కు తొలిరోజుల్లో ఘంటసాల పాటలు పాడినా తర్వాత తర్వాత బాలు కృష్ణకు పూర్తి స్థాయి గాయకుడై పోయాడు.  73 లో మమత, శ్రీవారు మావారు చిత్రాల్లో  రామకృష్ణ, కృష్ణకు నేపధ్య గానం చేశారు.

ఏ ఎన్నార్ తర్వాత రామకృష్ణను పూర్తిస్థాయి గాయకూడిగా అవకాశమిచ్చింది శోభన్ బాబు. విచిత్ర బంధం సినిమాలో పాటలు మద్రాస్ (ఇప్పటి చెన్నై) జెమినీ స్టూడియో లో విని హైదరాబాద్ నుండి తిరిగి మద్రాస్ పిలిపించారు. 73 లో ఆరు సినిమాల్లో 74 లో నాలుగు సినిమాల్లో శోభన్ బాబు కు రామకృష్ణ పాటలు పాడారు. 75 లో రెండు సినిమాల్లొ పాడారు.

అలా ఢెబ్బై మూడు,నాలుగు, ఐదు సంవత్సరాలలో అప్పటికి టాప్ ఫోర్ గా చెప్పబడే నలుగురు హీరోలకీ రామకృష్ణ పాటలు పాడారు. ఆ మూడు సంవత్సరాలలో నలుగురుకీ పాటలు పాడింది రామకృష్ణ ఒకరే.

75 లోనె ఎన్.టి.ఆర్ కొత్త ఇమేజి కు రూపకల్పన జరిగింది. కొత్త నిర్మాత అశ్వినీదత్ , దర్శకుడు బాపయ్య (ఎన్ టీ ఆర్ తో తొలిసారి) తొ ఎన్.టి.ఆర్ ను ఎదురులేని మనిషి సినిమాలొ ట్రెండీ గా చూపించారు. పాటలు, పాటల చిత్రీకరణ కొత్తపుంతలు తొక్కాయి. 1970 లో రైతు బిడ్డలో ఎన్.టి ఆర్ కు తమ్మునిగా నటించిన జగ్గయ్య ఈ సినిమాలోను తమ్ముడే. ఐతే ఆ సినిమాలో జగ్గయ్య కు బాలు పాడారు. ఈ సినిమాకి వచ్చేసరికి అన్న పాత్రకి బాలు పాడారు. (ఆలస్యంగా 76 వ సంవత్సరం విడుదలైన ఎన్.టి.ఆర్ చిత్రం మంచికి మరో పేరు (సి.ఎస్. రావు (దర్శకుడు), ఎస్.రాజేశ్వరరావు (సంగీతం), రామకృష్ణ(నేపధ్య గానం))సినిమాకు ,ఎదురులేని మనిషి సినిమాకు పూర్తి వైరుధ్యం కనిపిస్తుంది.)

అలా75 లో శోభన్ బాబు , ఎన్.టి.ఆర్ కు బాలు పూర్తిస్థాయి గాయకుడిగా స్థిరపడి పోయారు .  కృష్ణకు మొదటినుండి పూర్తిస్థాయి గాయకుడిగా కొనసాగుతూనె ఉన్నారు.

76 లో ఎ.ఎన్నార్ తిరిగి నటించడంమొదలైనాక వచ్చిన మహాకవి క్షేత్రయ్య, మహాత్ముడు, సెక్రెటరీ సినిమాలకు రామకృష్ణ నే నేపధ్యగాయకుడిగా  కొనసాగాడు.77 లో చక్రధారి సినిమాకు పూర్తి పాటలు ఎ.ఎన్నార్ కు పాడారు.

అదే సంవత్సరం ‘ఆలు మగలు’ సినిమాకు చాలా కాలం తర్వాత బాలు ఏ.ఎన్నార్ కు ప్లే బాక్ పాడారు. త ర్వాత వచ్చిన ఆత్మీయుడు ,రాజారమేష్ సినిమాలో కూడా పూర్తిగా బాలూ పాటలే చిత్రంలో వినిపిస్తాయి.

అలా 77 వ సంవత్సరానికి బాలు టాప్ ఫోర్ హీరోలకు పాడే సూపర్ సింగర్ గా బాలు మారిపోయాడు.

రామకృష్ణకు సంబంధించినంతవరకూ డెబ్భై రెండు తో మొదలై డెబ్భై ఏడు వరకూ గాయకుడి గా తెలుగు చలన చిత్ర సీమలో మంచి దశగా చెప్పుకోవచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు- రామకృష్ణ

రామకృష్ణ ఏ ఎన్నార్ కు 72 నుండి 78 వరకు పాడిన సినిమాలు పదిహేను.వీటిలొ పన్నెండు సినిమాలు సాంఘికాలు, మూడు సినిమాలు హిస్టారికల్ అందునా భక్తి పరమైన సినిమాలు.సాంఘిక చిత్రాలలో నలభై ఏడు పాటలు, భక్తి పరమైన మూడు చిత్రాలలో ఇరవై ఎనిమిది పాటలు/పదాలు/శ్లోకాలు పాడారు.72 నుండి ఘంటసాల బ్రతికున్నంతకాలం ఏ ఎన్నార్ కు రెండు మినహా అన్ని చిత్రాలలోనూ ఘంటసాల తో పాటలు పంచుకున్నారు. అలాంటి సినిమాలు విచిత్రబంధం, పల్లెటూరి బావ,భక్త తుకారాం,ప్రేమలు పెళ్ళిళ్ళు,దొరబాబు,బంగారు కలలు.అందాల రాముడు చిత్రంలో మాత్రం అన్ని పాటలు రామకృష్ణనే పాడారు. మంచివాడు చిత్రంలో అన్ని ఘంటసాల పాటలే ఉన్నాయి.

డెబ్భై ఐదు లో ఏ ఎన్నార్ చిత్రాలు రిలీజు కాలేదు. డెబ్భై ఆరు –ఏడు సంవత్సరాలలో వచ్చిన సెక్రెటరీ,మహాత్ముడు, మహాకవి క్షేత్రయ్య, చక్రధారి లో ఏ ఎన్నార్ కు రామకృష్ణనే పాడారు.

77లోనే వచ్చిన ఆలుమగలు సినిమాలో బాలు మరోసారి ఏ ఎన్నార్ కు ప్లే బాక్ పాడటం ప్రారంభించారు. అందులోనూ ఒక పాట రామకృష్ణ పాడినా బాలు పాడిన పాటలు జనాదరణపొందాయి.ప్రత్యేకంగా ‘ఎరక్క పోయి వచ్చాను ‘ పాట బాగా హిట్ అయ్యింది. పాటలో బాలూ ఏ ఎన్నార్ స్వరంలోని మానరిజాల్ని అంతకుమున్నెన్నడూ లేనంతగా పలికింఛాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఎ ఎన్నార్ సినిమా ఆత్మీయుడు లో పూర్తిగా బాలు నే పాడారు. 77లోనే వచ్చినె రాజా రమేష్ చిత్రంలో ఒక పాట రామకృష్ణ జానకి పాడిన పాట రికార్డ్ గా విడుదల అయ్యింది. కానీ చిత్రంలో అదే పాట బాలు సుశీల పాడింది చిత్రీకరించబడింది.

తిరిగి 78 లో వచ్చిన రామకృష్ణులు, దాసరి ఏ ఏన్నార్ ల తొలి కాంబినేషన్ లో వచ్చిన దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రాల్లో ఏ ఎన్నార్ కు రామకృష్ణ పూర్తిగా ప్లే బాక్ ఇచ్చారు.

సాంఘిక చిత్రాలలో పాటలు:

తొలిచిత్రం విచిత్రబంధం లో పాడిన ‘వయసే ఒక పూలతోట’, ‘చిక్కావుచేతిలో చిలకమ్మ’  రెండూ గాయకునిగా రామకృష్ణకు గుర్తింపు తెచ్చాయి. పల్లెటూరి బావ ‘ఒసే వయ్యారి రంగి’ హుషారైన వెర్షను పాడారు. 73 లో బాపు దర్శకత్వంలో బాపు రమణల స్వంత చిత్రం ‘అందాల రాముడు ‘ లొ అన్ని పాటలూ రామకృష్ణ తో పాడించారు. ఈ సినిమాలో పాటల్ని బాలు తో పాడించాలనుకున్నారు. భాపు రమనలకు బాలూ బహు ఇష్టుడు. కొద్ది సంవత్సరాలక్రింతం వచ్చిన ‘బంగారు పిచ్చిక ‘ చిత్రంలో హీరో గా బాలు ను తొలుత అనుకున్నారు కూడా. బహుశా ఏ ఎన్నార్ ఇష్టం మేరకు రామకృష్ణ కు ఈ అవకాశం వచ్చివుండవచ్చు. ఛిత్ర జయాపజయాలు ఏమైనా ఆడియో పరంగా అందాల రాముడు పెద్ద సక్సెస్. ఘంటసాల బ్రతికి ఉన్నపుడే ఎ ఎన్నార్ కు పూర్తి గా రామకృష్ణ పాడటం ఈ ఒక్క చిత్రంలోనే.

74 సంవత్సరంలో ఏ ఎన్నార్ ను కొత్త కోణంలో మాస్ హీరో గా చూపిన దొరబాబు చిత్రం లో రామకృష్ణ నాలుగు పాటలు ( ఒద్దు ఒద్దు అనొద్దు, నీకు నాకు పెళ్ళంటె,ఒంటరిగా ఉన్నాను,అమ్మమ్మో గుంటడు ) పాడారు.బంగారు కలలు లొ రెండు డ్యూయెట్లు (చెక్కిలి మీద కెంపులు, నీకన్నులలో నే చూశాను లే), ప్రేమలు పెళ్ళిళ్ళు లో అన్ని పాటలు (రెండు డ్యూయెట్లు, ఒక సోలో) పాడారు. అరోగ్య కారణాలలతో ఏ ఎన్నార్ సినిమాలు 75 లో ఏమీ సినిమాలు చేయలేదు. 76 లో సెక్రెటరీ(టీజింగు సాంగ్, డ్యూయేట్లు, సోలో) ,మహాత్ముడు(డ్యూయెట్లు, ప్రబోధగీతం)  సినిమాలో పాడారు.

77 లో సాంఘికచిత్రాలో ఒక్క ఆలుమగలు (ఒక్క రిద్దరుగ మారేది) లో ఒక్కపాట మినహా వేరే చిత్రాలో పాడలేదు.

78 లో రెండు రామకృష్ణులు సినిమాలో పాడిన ఐదు పాటల్లో ఒక్కటే డ్యూయెట్టు మిగతా నాలుగూ బాలూ తోనూ మిగతావారితోనూ కలిపి పాడినవే. ఏ ఎన్నార్ కి రామకృష్ణ ఆఖరి గా పాడినది “దేవదాసు మళ్ళీ పుట్టాడు “ లో నే. రామకృష్ణను బాగా ప్రోత్సహించిన ఎస్. రాజేశ్వరరావు ఈ సినిమాకు సంగీత దర్శకుడు. దేవదాసు సినిమాకు సీక్వెల్ (బహుశా భారతచలన చిత్ర పరిశ్రమలో తొలి సీక్వెల్ కావచ్చు) దాసరి ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. సంగీత పరంగా చిత్రం విజయవంతమే. మూడు డ్యూయెట్లు, ఒక అంతర్నాటకం, రెండు విషాద భరిత సోలోలు ..అన్నీ మంచి పాటలే, శ్రోతలకు చేరువైనవే.

ఈ చిత్రంతర్వాత, ఏ ఏన్నార్ నటించిన మల్టి స్టారర్ సినిమాల్లో కూడా రామకృష్ణ కు అవకాశం రాలేదు. హేమాహేమీలు సినిమాలో ఇద్దరు హీరో లకి కలిపిన ఒకపాట లో ఆనంద్ ఏ ఎన్నార్ కు ప్లే బాక్ పాడారు.

భక్తి పరమైన సినిమాలు

భక్త తుకారాం

తుకారాం (1608-1650) మహారాష్ట్ర కు చెందిన పాండురంగ విఠలుని భక్తుడు,వాగ్గేయకారుడు. ఈతని రచనా ప్రక్రియ ‘అభంగాలు’. తుకారాం కథ సినీ పరిశ్రమను ముందు నుంచీ ఆకర్షిస్తూనే ఉంది. 1936 లో మరాఠీ భాషలో  తుకారాం సినిమా వచ్చింది. తుకారాం గా తెలుగులోనూ వచ్చింది .1963 లో కన్నడంలో రాజ్ కుమార్ తుకారాం గా నటించిన చిత్రం విడుదలయ్యింది. అందులో పి.బి.శ్రినివాస్ రాజ్ కుమార్ కు నేపధ్య గానం చేశారు.

1973 లో అంజలీ పిక్చర్స్ పతాకం పై  సంగీత దర్శకుడు ఆదినారాయణరావు అంజలి దంపతులు  ఈ  సినిమా తెలుగులో నిర్మించారు . పాటలు వీటూరి,దాశరధి  రాశారు. ఘంటసాల ఐదు పాటలు (ఘనాఘన సుందరా, బలే బలే అందాలూ,చిందులు వేయకురా,ఉన్నావా అసలున్నావా, సరి సరి ) పాడారు. శాంతారాం సినిమా అమర్ భూపాలి లో ఘన శ్యామ సుందరా పాట ప్రభావం ఘనాఘన సుందరా పాటపై ఉంది. చిత్రీకరణలో కూడా ఆ చాయలు ఉంటాయి. ఘంటసాల అలభ్యత వల్ల మిగతా పాటలు రామకృష్ణ తో ట్రాక్ గా రికార్డ్ చేశారని తరవాత ఘంటసాల వాటిని విని వాటిని తిరిగిపాడాల్సిన అవసరంలేదన్నారని చెబుతారు. రామకృష్ణపాడిన పాటలు, అభంగాల ఆధారంగా దాశరధి  రాసిన గీతాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. శ్యామసుందరా ప్రేమ మందిరా,  పిలుపు వినగలేవా,కరుణామయా దేవా వంటి ఎనిమిది పాటలు రామకృష్ణ పాడారు.ఖండికలు గా పాడిన అభంగ అధారిత గీతాలను ఏ ఎన్నార్ పైనే కాక అవి ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోవడాన్ని వివిధ వ్యక్తులపై చిత్రీకరించారు.

మహాకవి క్షేత్రయ్య

కృష్ణా మండలానికి చెందిన మువ్వ గ్రామస్థుడు గా చెప్పబడె వరదయ్య కూడా వాగ్గేయ కారుడె. ఈతని కవితాప్రక్రియ “పదం “. ఎక్కువ పదాలు మువ్వ గోపాల మకుటంతో రచించాడు. ఈ రచనలు అభినయానికి అనువుగాఉన్న శృంగారభరిత పదాలు. ఈతని జన్మస్థలానికి చేరువగానున్న కూచిపూడి గ్రామంలో ప్రాచుర్యంలో ఉన్న కూచిపూడి నృత్యకారులు ఈ పడాలను వారి నర్తనంలో వాడుకున్నారు.వరదయ్య అనేక క్షేత్రాలను దర్శిస్తూ క్షేత్రయ్య గామారి తమిళ దేశంలో ఉన్న తెలుగు రాజుల ఆస్థానంలో కొంతకాలం ఉన్నడు. గోలకొండ పాదుషా ఆస్థానాన్నీ దర్శించాడు. నాలుగు వేలపైగా ఈయన రాసిన పదాలలో నాలుగు వందలలోపే లభ్యమౌతున్నయి.

ఈ తని కథను భక్తతుకారాం తరువాత అంజలీ దంపతులు నిర్మించారు. ఏ ఎన్నార్ ఆరోగ్యనిమిత్తం తీసుకున్న విరామం తరువాత ఈ చిత్రంలో నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడిగా ప్రారంభమైన చిత్రం ఆయన మరణం తర్వాత సి.ఎస్.రావు దర్శకత్వంలో పూర్తి అయ్యింది. తుకారాం జీవితంలో ఉన్నంత నాటకీయత వరదయ్య కథ లో లేదు.ఇది భక్తి రస ప్రధానమైన చిత్రమూ కాదు. క్షేత్రయ్య పద రచయితే కాని కావ్యాలు వంటివి రాసిన వాడు కాదు. రాసిన పదాలు అన్నమయ్య, రామదాసు ల్లా భక్తిపూరితాలూ కావు. వాణిజ్య పరంగా అనేక కారణాలవల్ల చిత్రంవిజయవంతం కాలేదు. అందువల్ల అద్భుతమైన ఈ చిత్ర సంగీతం ప్రజలకు అవ్వాల్సినంత చేరువ అకాలేదు.

నేపధ్య గాయకుడిగా రామకృష్ణకు ఈ చిత్రం మేలుబంతి. రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను, చల్లగా నెలకొన వయ్యా వంటి పాటలు కాకుండా , రామకృష్ణ పాడిన క్షేత్రయ్య పదాలు ప్రత్యేకంగా ఎన్నదగ్గవి.

పదాలను స్వరబద్ధం చేయటానికి ఆరుద్ర, ఆదినారాయణరావు ఆంధ్ర దేశం లో అనేక ప్రాంతాలలో ఈ పదాలకు నర్తించే వారిని సంప్రదించారు. వి ఏ.కే రంగారావు గారి మాటల్లో “వి రామకృష్ణ పగిడీ లో కలికితురాయి అయిన ఆనంద భైరవి రాగ పదం ‘శ్రీపతి సుతు బారికి ‘, నాట్య సుందరి స్వప్న సుందరి పాడిన ‘చేడెరో నా సామికి’ పాటలు మణిపూసలు,ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం ఆ పాటలు ప్రజల ఆదరణనోచుకొనక పోవడానికి కొంత కారణం “.

rama1

మరో రెండు మనోరంజకమైన పదాలు  “ఎటువంటి మోహమో కాని ” “వదరక పోవే” రామకృష్ణ గొప్పగా గానంచేశారు. మొదటిది గోలకొండ పాదుషా కొలువులో భామ నృత్యంచేస్తుంటే క్షేత్రయ్య పాడుతాడు. రెండవది విజయరాఘవుని (మధుర) సంస్థానంలో క్షేత్రయ్య అభినయిస్తూ పాడుతాడు. వదరక పోవే పదం ఆఖరి పంక్తులు తాత్వికత తో కూడి అప్పటివరకు ఆ పదం పట్ల ఏర్పడుతున్న భావననూ ఆసాంతం వేరే వైపుకు తీసుకెళ్ళి పోతుంది. (ఈ పదం తోపోల్చదగిన ఒక హిందీ పాట మన్నడే గానం చేసింది ” లాగా చునిరీ మే దాగ్..చుపావూ కైసే….దీని ఆఖరి పంక్తులు ఓ దునియా మేరి బాబుల్ కా ఘర్ ఏ దునియా ససురాల్”). ఇదే పదం బాలమురళీకృష్ణ గానంచేసింది(సినిమాకు కాదు)లభ్యమౌతూ ఉంది. పోలిక కోసమని కాకుండా సినిమా సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి తేడాగమనించడానికి ఒక ఉదహరణగా రెంటినీ వినవచ్చు.

రామకృష్ణ మొత్తం పదిహేను పదాలు ఇందులో పాడాదు. ఇవి అచ్చ తెలుగు కవితాపదాలు, తెలుగు వారికి బాగా పరిచితమై, తమవి అనుకోదగిన వాద్యాలతో కూడి అద్భుతానుభవాన్ని కలగ జేస్తాయి.

 

చక్రధారి

కన్నడ రాజకుమార్ ప్రధాన పాత్రధారి గా భక్త కుంబార చిత్రం వచ్చింది. విజయవంతమైన ఆ చిత్రాన్ని ఎం ఆర్ అనూరాధాదేవి కి రాజ్ కుమార్ సూచించారు. ఆ చిత్రాన్నే చక్రధారి చిత్రంగా నిర్మించారు. ఛక్రధారి పేరుతోనే ఒకసారి, భక్త కుంబార పేరు తోనూ ఆ కథ అంతకుముందు సినిమా గా వచ్చింది.చక్రధారి గా వచ్చిన తమిళ సినిమాలో నాగయ్య కుంబార పాత్ర పోషించారు. కుంబార వృత్తి రీత్యా కుమ్మరి.విఠలుని భక్తుడు. మరాఠా ప్రాంతానికి చెందినవాడు. హరి కీర్తనా తన్మయత్వంలో కాళ్ళకింద తన బిడ్డ నలిగిపోతున్నా చూసుకోలేనివాడు. వ్రతభంగమయ్యిందని చేతులు ఖండించుకున్నవాడు. అశక్తుడైన తన కు హరే వచ్చి సేవలు చేస్తే ,హరి ని గుర్తించలేనందుకు తపించాడు.

అంతటి భక్తుని కథ జనరంజకంగా తీస్తే ప్రేక్షకుల శ్రోతల కళ్ళకు చెవులకు పండగే.

తెలుగు లో చక్రధారి కన్నడ భక్త కుంబార కు అణువణువునా రీమేక్కే. రెంటికి సంగీత దర్శకుడు జి.కె.వెంకటెష్. పాటల వరసలూ ఇంచుమించు ఒక్కటె. స్వతహాగా రాజ్ కుమార్ గాయకుడు. కొన్ని యేళ్ళగా తన పాటలు తానే పాడుకుంటున్నారు. కాని ఈ చిత్రం లో అన్ని పాటలు రాజ్ కుమార్ కు పి.బి.శ్రీనివాస్ పాడారు.తెలుగు లో ఆ పాటలన్నింటినీ అదే వరసలలో రామకృష్ణపాడారు. విఠలా విఠలా పాండురంగ విఠలా అనే ఒక్కపాట (కథానాయకునికి కాదు) కన్నడంలో బాలు పాడారు. తెలుగు లో అదే పాట గాయకుడు ఆనంద్ పాటగా రిలీజ్ అయ్యి బహుళ ప్రచుర్యంపొందింది. ఐతే సినిమా లో బాలు స్వరంతో సత్యనారాయణ పై చిత్రీకరించబడింది.

కన్నడంలో పాడిన పి.బి శ్రీనివాస్ పాటలు, తెలుగులో రామకృష్ణ పాటలూ అన్నీ కర్ణపేయాలే. మార్దవమైన,సాత్వికమైన, భక్తిభావనతో సాగే ఇరు స్వరాలూ సంగీతప్రియుల్ని అలరిస్తాయి.

తుకారాం,కుంభార్ పాత్రలు మరాఠీ ప్రాంతానికి చెందినవి. సినిమాలుగా అనేక పర్యాయాలు తెర పై వచ్చినవి. అందులోని పాటలు వేరే కవులతో రాయబడ్డవి. సంగీత పరంగా భక్త తుకారాం లో కొంత పాతచిత్రాల ప్రభావం ఉంది, చక్రధారి పూర్తిగా కన్నడచిత్ర సంగీతమే. ఈ రకంగా చూస్తే క్షేత్రయ్య కథాపరంగా, రచనల పరంగా, సంగీతపరంగా పూర్తి తెలుగు సినిమా.

ఏ ఎన్నార్ కు రామకృష్ణ పాడిన మిగతా సాంఘిక చిత్రాల పాటలతో పోలిస్తే ఈ మూడు సినిమాలలో పాటలు ఉన్నత శ్రేణికి చెందినవే.

 

ఎన్.టి.ఆర్ రామకృష్ణ

రామకృష్ణ ఎన్.టి.ఆర్ కు సాంఘిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు, చారిత్రత్మక చిత్రాలలో కలసి సుమారు 13 చిత్రాలలో పాడారు.

సాంఘిక చిత్రాలు:

ఎన్ టి ఆర్ కు రామకృష్ణ తొలిసారి ధనమా దైవమా చిత్రం లో పాటలు పాడారు. అ ది సంగీత దర్శకుడు టి.వి.రాజు కు ఆఖరి చిత్రం. ఓక శ్లోకం తో కలిపి ఐదు పాటలు ఆ సినిమా లో పాడారు. ఘంటసాలకొరకై స్వరబద్ధం చేయబడిన పాటలని అవి విన్నప్పుడు అనిపించేలానే పాటలు ఉంటాయి. చిత్రము, పాటలు కూడా హిట్ కాలేదు.

దిలీప్ కుమార్ హీరో గా నటించిన హిందీ సినిమా గోపి ఆధారంగా తెలుగులో వచ్చిన పల్లెటూరి చిన్నోడు సినిమాలో ఒక పాట(పల్లెటూరి చినావాడే) రామకృష్ణ పాడారు. ఈ సినిమానూ హిట్ కాలెదు. 75లో వచ్చిన రాముని మించిన రాముడు చిత్రంలో (ఎన్.టి.ఆర్ రెండు పాత్రల్లో ఒక పాత్రకు) ఒక పాట బాలు తో కలసి (‘అందరిదీ ఈ విజయం’) ఒక పాట పాడారు.76 లో రిలీజ్ ఐన మంచికి మరోపేరు సినిమా లొ అన్ని పాటలు పాడారు. ఆ సినిమా ఎన్.టి.ఆర్ తో సి.ఎస్.రావు కు ఆఖరి చిత్రం. అలాగే ఎస్.రాజేశ్వరరావు ఎన్.టి.ఆర్ కాంబినేషన్ కు కూడా అదే ఆఖరి చిత్రం. అప్పటి ట్రెండు కు తగ్గ్గట్టు లేని ఆ చిత్రం విజయవంతం కాలేదు.77 లో విడుదలైన మా ఇద్దరికథ చిత్రం (రెండు పాత్రలలో ఒక పాత్రకు) లో రెండు పాటలు పాడారు. ఈ చిత్రంకూడా విజయవంతం కాలేదు. మావారి మంచితనం (1979 దో అంజానే తెలుగు రూపం) లో ఒక పాట పాడారు. ఇదీ సక్సెస్ కాలేదు. రామకృష్ణ ఎన్.టీ.ఆర్ కు పాడిన మొదటి సినిమా ధనమా? దైవమా? చిత్రంలో ‘నాడు వైదేహీ పాటలో ఎన్.టి.ఆర్ మాటలు పాటలో ఉంటాయి. అదేవిధంగా ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ సాంఘికచిత్రాలలో ఆఖరి పాట ‘మావారి మంచితనం’ లో ‘చెంచితా పాటలో కూడా రామకృష్ణ గొంతుతోపాటు ఎన్.టి.ఆర్ మాటలు కూడా వినిపిస్తాయి.

ఐతే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంఘిక చిత్రాలలో ఏ చిత్రంకూడా పెద్దగా విజయవంతం కాలేదు.

పౌరాణిక చిత్రాలు:

75 లో వచ్చిన మాయామశ్చీంద్ర సినిమాలో ఒక పాట( రారా రజనీకరా) రామకృష్ణ పాడారు. 77 వ సంవత్సరం జనవరి లో విడుదలైన దానవీర శూర కర్ణ సినిమాలో శ్రీ కృష్ణ పాత్రకు  రామకృష్ణ పాడిన తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయాలలో పద్యాలు ప్రజల మన్నన పొందాయి. ఈ పద్యాలు తెలుగులో అప్పటికి మూడు చిత్రాలలో ఉపయోగించారు. పూర్తిగా పద్యాలపైనే అధారపడి వచ్చిన చిత్రం ‘శ్రీకృష్ణ రాయబారం’  సినిమాలో అప్పటి ప్రముఖ గాయకులు, రంగస్థల గాయకులతో పద్యాలు పాడించారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లేరు. తర్వాత 67 లో వచ్చినె శ్రీ కృష్ణావతారం లో ఇవే పద్యాలు ఘంటసాల తో పాడించారు. మళ్ళీ శ్రీకృష్ణ సత్య సినిమాలో ఇవే పద్యాలు ఘంటసాల, ఎస్.పి. బాలు తో పాడించారు. రెండు సినిమాలలో ఇవి ఎన్.టి.ఆర్ పైనే చిత్రీకరించారు. దాన వీర శూర కర్ణ నిర్మించేటప్పుడు ఈ పద్యాలను వినియోగించుకోవాలని అవి పాడటానికి అప్పటి ప్రముఖ గాయకులు ,స్టేజి కళాకారులనూ ఎన్.టి.ఆర్ పరిశీలించారని, ఎస్. రాజేశ్వరరావు సలహా మేరకు రామకృష్ణను ప్రయత్నించి ఎన్.టి.ఆర్ తృప్తి చెందారని రామకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘ఎక్కడనుండి రాక ఇటకు’ పద్యంతో మొదలై ‘ఏ మూల దాగనే ఈ ధర్మ పన్నాలు’ వరకు పదిహేను పద్యాలు రామకృష్ణ పాడారు. ఈ పద్యాలు ఎన్.టి.ఆర్ తదితర నటుల సంభాషణలతో కలిపి రికార్డ్ గా విడుదలై ప్రజలకు చేరాయి. ( షణ్ముఖి ఆంజనేయరాజు పద్యాలు రికార్డ్గా విడుదలై  పొందినట్టి గుర్తింపు కర్ణలో ఈ పద్యాలు పొందాయి).

rama2

సినిమాలో వచ్చిన ఒక పద్యం ‘సంతోషమ్మున సంధిసేయుదురే ‘  రఘురామయ్య(శ్రీ కృష్ణ రాయబారం), ఘంటసాల (శ్రీకృష్ణావతారం), ఎస్.పి.బాలసుబ్రహ్మ ణ్యం (శ్రీకృష్ణ సత్య), రామకృష్ణ (దాన వీర శూర కర్ణ) నోట వినటం ఒక చిత్రమైన అనుభవం.

దాన వీర శూర కర్ణ చిత్రం విజయవంతం కావడానికి అనేక ఇతర కారణాలతో పాటు ఈ పద్యాలు కూడా కారణ మయ్యాయి. ఈ చిత్రం తర్వాత ఎన్.టి.ఆర్ రామకృష్ణకు తను తీసే ప్రతీ పౌరాణిక చిత్రంలోనూ అవకాశమిస్తానని మాట ఇచ్చారట (రామకృష్ణ ఇంటర్వ్యూ).  ఐతే కర్ణ చిత్రం వచ్చిన తర్వాత ఎన్.టి.ఆర్ పౌరాణికం ‘విరాటపర్వం’లో రామకృష్ణ పాటలు లేవు. తర్వాత వచ్చిన శ్రీ రామ పట్టాభిషేకం లో పాటలు రామకృష్ణ పాడారు. శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం లో  రమేష్,ఆనంద్ ల తొ కలిసి సుప్రభాతం  వరకూ రామకృష్ణ గానం చేసారు. తర్వాత చాలా రోజులతరువాత ఎన్.టి.ఆర్ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర (రవింద్ర జైన్ సంగీత దర్శకత్వం) లో రామకృష్ణ , నటుడు బాలకృష్ణ కు హరిశ్చంద్ర పాత్రకు కొన్ని పద్యాలు పాడారు. ఐతే ఇవి బహుళ ప్రచుర్యంలో ఉన్న బలిజేపల్లి, జాషువ పద్యాలు కాకపోవటం తో  సరైన గుర్తింపు రాలేదు. చిత్రం పరాజయం, చిత్రం పాటలతో విడుదలైన కేసెట్టు లో ఈ పద్యాలు లేకపోవడం కూడ దీనికి కారణం.

 

చారిత్రక చిత్రాలు

ఎన్.టి.ఆర్ చారిత్రక చిత్రాలు వేములవాడ భీమకవి (1976) లో ఒక పాట(అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను)  రామకృష్ణ పాడారు. వీరబ్రహ్మేంద్ర  స్వామి చరిత్ర(1984) లో బ్రహ్మంగారి తత్వాలు కొస రాజు రాయగా రామకృష్ణ పాడారు. చిత్రం పెద్ద విజయం సాధించింది. రామకృష్ణ పాడిన తత్వాలు ఇప్పటికి గ్రామ సీమల్లో మైకు సెట్ల లో వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్.టి.ఆర్ 94 లో నిర్మించిన శ్రీ నాథ కవి సార్వభౌమ చిత్రంలో రామకృష్ణ పాటలు లేవు.ఐతే ఈ సినిమా కోసం తన గానంతో ,పెండ్యాల స్వరకల్పనలో పద్యాలు రికార్డ్ చేశారని అవి సి.నారాయణరెడ్డి సమక్షంలో విని ఎన్.టి.ఆర్ చాలా ఇష్టపడ్డారని రామకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

(మిగతా వచ్చే వారం)