అవ్యవస్థపై అపహాస్యం, ధిక్కారం పతంజలి అక్షరం

ఎన్ వేణుగోపాల్

 

venuమళ్లీ మళ్లీ చదివినకొద్దీ, ఆలోచించినకొద్దీ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రేరేపించగల శక్తి పతంజలి రచనలది. అందుకు కొంతవరకు కారణం ఆ రచనలలోని బహుళార్థ సూచన, బహుళార్థబోధకత కావచ్చు. రచయిత అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నపూర్వకంగా ఆ బహుళార్థ సూచన ఉద్దేశించారని చెప్పడం అతిశయోక్తే అవుతుంది. ఆయన అలా ప్రత్యేకంగా రాసిన సందర్భాలు కూడ కొన్ని ఉన్నాయి గాని అంతకన్న ముఖ్యంగా రెండు కారణాలు ఉండవచ్చునని అనిపిస్తుంది.

ఒకటి, విస్తృతమైన అధ్యయనం వల్ల, వస్తుశిల్పాలలో అపార వైవిధ్యం ఉన్న సాహిత్యాన్ని చదవడం మాత్రమే గాక జీర్ణం చేసుకున్నందువల్ల ఆయన రచనల్లోకి ఈ బహుళార్థకత సహజంగా ప్రవహించి ఉంటుంది. రెండు, ఆయన రచనలన్నిటిలోను మానవ అనుభవ, మానవ అస్తిత్వ సారాంశాన్ని నైసర్గికంగా, సహజంగా పట్టుకున్నారు గనుక మానవ అస్తిత్వంలో గుణాత్మక మార్పు వచ్చేవరకూ ఆ విభిన్న కోణాలు పఠిత స్ఫురణకు వస్తూనే ఉంటాయి. అంటే ఆ బహుళత్వం వ్యక్తీకరణ పొందుతూనే ఉంటుంది. అలాగే, మానవ అస్తిత్వ సారం అన్నప్పుడు కూడ సాధారణంగా సాహిత్యానికి, ప్రత్యేకంగా తెలుగు సాహిత్యానికి తెలిసిన పరిమిత, సంకుచిత, ఏకైక రూపంలో ఆయన అర్థం చేసుకోలేదు. దాన్ని కేవలం వేదనగానో, సంతోషంగానో, విచికిత్సగానో మాత్రమే ఆయన అర్థం చేసుకోలేదు, అన్నీ కలగలసినదిగా, విశాలమైనదిగా, లోతైనదిగా అర్థం చేసుకున్నారు. అందువల్ల కూడ ఆయన రచనలకు బహుళార్థ బోధకత వచ్చిఉండవచ్చు.

నిజానికి తెలుగుసాహిత్య చరిత్రలో పతంజలి రచనలు రాశి రీత్యా చాల ఎక్కువేమీ కావు. పది నవలలు (ఖాకీవనం – 1980, పెంపుడు జంతువులు – 1982, రాజుగోరు – 1983, వీరబొబ్బిలి – 1984, అప్పన్న సర్దార్ – 1986, గోపాత్రుడు – 1992, పిలకతిరుగుడు పువ్వు – 1995, ఒక దెయ్యం ఆత్మకథ – 1992, నువ్వేకాదు – 1996, రాజుల లోగిళ్లు – 2002 అసంపూర్ణం), ముప్పై లోపు కథలు, పదిహేనో పదహారో అనువాద/జ్ఞాపక కథలు, కొన్ని వ్యాసాలు, సంపాదకీయాలు…అన్నీ కలిపినా పద్నాలుగు వందల పేజీల సాహిత్యసంపద మాత్రమే. ఆ సాహిత్యరాశి కొంతవరకు తక్కువే అనిపించినా, అది సందర్భం మారినప్పుడల్లా, బహుశా మారనప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొత్త పాఠకులను, కొత్త అర్థాలను, కొత్త చూపును పునరుత్పత్తి చేస్తున్నది. ఒక పఠనంలో అర్థం కాని విషయాలు మరో పఠనంలో తెలియవస్తున్నాయి. ఒక పఠనంలో తెలియని వైశాల్యమూ లోతూ మరొక పఠనంలో బైటపడుతున్నాయి. కొత్త అర్థాలు గోచరిస్తున్నాయి. పతంజలి సాహిత్యానికి ఈ అసాధారణమైన శక్తినిచ్చిన విశిష్టత గురించి కొన్ని ఆలోచనలు పంచుకోవడమే ఈ వ్యాసలక్ష్యం.

ప్రక్రియ ఏమైనప్పటికీ, పతంజలి రచనలన్నిటికీ సాధారణ లక్షణం అవ్యవస్థను అపహాస్యం చేయడం, అవ్యవస్థ మీద ధిక్కారాన్ని ప్రకటించడం. నిజానికి ఈ లక్షణంలో పతంజలి ప్రత్యేకత ఏమీ లేదు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధాన ధోరణి ఆ లక్షణమే. కందుకూరి వీరేశలింగం నాటి నుంచి ఇవాళ్టిదాకా ప్రతి తెలుగు రచయితా ఏదో ఒక స్థాయిలో అవ్యవస్థ గురించే రాస్తూ ఉన్నారు. అవ్యవస్థను కొందరు ఊరికే యథాతథంగా చిత్రించి ఉండవచ్చు, మరి కొందరు అసహ్యం కలిగేట్టు చిత్రించి ఉండవచ్చు. కొందరు అపహాస్యం చేయడమో, ధిక్కరించడమో చేసి ఉండవచ్చు. మరికొందరు ఇంకా ముందుకు వెళ్లి ఈ అవ్యవస్థను ధ్వంసం చేసే, ఒక కొత్త వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలూ చేసి ఉండవచ్చు. మొత్తం మీద అవ్యవస్థ గురించి రాయని సాహిత్యకారులు, ఈ వ్యవస్థ బాగుందని రాసిన సాహిత్యకారులు తెలుగులో దాదాపుగా లేరనే చెప్పాలి.

అయితే పతంజలి విశిష్టత ఏమంటే వ్యవస్థనూ, అవ్యవస్థనూ అర్థం చేసుకునే పద్ధతిలో ఆయన గణనీయమైన మార్పు తెచ్చాడు. అప్పటివరకూ అసమగ్రంగా ఉన్న అవగాహనను ఆయన రచనలు విశాలం చేశాయి. అంతకు ముందు వ్యవస్థ పట్ల సమగ్ర అవగాహన ఉన్నవారిలో కూడ ప్రాధాన్యతల హెచ్చుతగ్గుల వల్ల దృష్టి పడని అవ్యవస్థలను, అవ్యవస్థల సూక్ష్మ, విస్మృత కోణాలను కూడ ఆయన రంగస్థలం మీదికి లాగి వాటిని తన విమర్శకు లక్ష్యం చేశాడు. నిజానికి అపహాస్యాన్నీ, ధిక్కారాన్నీ ప్రధాన సాధనాలుగా చేసుకుని, ఆయన అప్పటివరకూ విమర్శ అంటే ఉండిన అర్థాన్ని కూడ మార్చాడు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు వీరేశలింగం దగ్గరే అవ్యవస్థ మీద విమర్శ ప్రారంభమయిందనుకుంటే, పితృస్వామిక వ్యవస్థలోని (లేదా అవ్యవస్థలోని) స్త్రీ విద్యకూ పునర్వివాహానికీ అవకాశం ఇవ్వని ఒకటి రెండు చిన్న అంశాల మీదనే ఆయన ఎక్కుపెట్టాడు. అప్పటినుంచి బహుశా విప్లవ సాహిత్యోద్యమం వచ్చేవరకూ తెలుగు సాహిత్యంలో అవ్యవస్థను ఖండించిన రచయితలందరూ కూడ ఏదో ఒక అవ్యవస్థను, లేదా కొన్ని అవ్యవస్థలను, లేదా సామాజిక అవ్యవస్థలోని కొన్ని అంశాలను మాత్రమే పట్టించుకున్నారు, విమర్శించారు, మార్చడానికి ప్రయత్నించారు.

patanjali choopu

ఈ క్రమంలో సామాజిక అవ్యవస్థ అంతటికీ మూలకారణం అసలు వ్యవస్థలోనే చూడాలని, విడివిడి అంశాలలో కాదని అవగాహన పెరిగింది. కాని దానితోపాటే, వ్యవస్థను మార్చడమంటే ప్రధానంగా అధికార వ్యవస్థలను మార్చడమనే, విమర్శించడమనే అవగాహన కూడ పుట్టిపెరిగింది. అధికార వ్యవస్థలను విమర్శించడమే వ్యవస్థ మీద విమర్శగా సాగింది. సాధారణంగా పాశ్చాత్య ప్రజాస్వామిక సంప్రదాయంలో అధికార విభజనలో భాగంగా అధికార వ్యవస్థను మూడు అంగాలుగా – శాసననిర్మాణ, పాలక, న్యాయ విభాగాలుగా – విభజించడం అందరికీ తెలిసిందే. వీటినే సమాజానికీ, ప్రజాస్వామ్యానికీ మూల స్తంభాలుగా భావిస్తారు. నాలుగో స్తంభంగా పత్రికా వ్యవస్థను కూడ గుర్తించడం ప్రారంభించారు. ఈ నాలుగు రంగాలే సామాజిక అవ్యవస్థకు పాదులుగా ఉన్నాయి గనుక పతంజలి రచనలు ఈ నాలుగు రంగాల మీద విమర్శను ఎక్కుపెట్టాయి. ఈ నాలుగు వ్యవస్థలలోని అవ్యవస్థను ఆయన ఒక పద్ధతి ప్రకారం అపహాస్యం చేశారు, ధిక్కరించారు, అసహ్యం కలిగేలా చిత్రించారు, ఈ అవ్యవస్థ ధ్వంసమై, సువ్యవస్థ ఏర్పడక తప్పదనీ, ఆ సువ్యవస్థ నిర్మాణానికి తనవంతు కృషి చేయాలనీ పాఠకులు ప్రేరణ పొందడానికి అవసరమైన పేలుడు పదార్థమంతా తన రచనల్లో దట్టించారు.

అయితే ఈ అధికార వ్యవస్థల మీద, ప్రత్యేకించి మొదటి మూడు అధికారవ్యవస్థల మీద, ఇంకా తీవ్రమైన విమర్శ విప్లవ సాహిత్యోద్యమంలో కూడ ఉన్నదే. విప్లవ సాహిత్యం కన్న ఎక్కువ ఆదరణనూ, విస్తృతినీ పతంజలి రచనలు సాధించడానికి కారణమేమిటో అన్వేషించవలసి ఉంది. విప్లవ సాహిత్యం ప్రధానంగా ఈ అధికార వ్యవస్థల మీద గురి పెట్టింది గాని, అధికారం అమలు చేసే ఇతర వ్యవస్థలను గుర్తించలేకపోయింది. గుర్తించినా వాటి మీద విమర్శను తన సాహిత్యంలో భాగం చేయలేకపోయింది.

సమాజ చరిత్ర క్రమంలో “అనధికార వ్యవస్థలు” కూడ అధికారవ్యవస్థలతో సమానంగానో ఎక్కువతక్కువలుగానో అధికారాన్ని చలాయించడం ప్రారంభిస్తాయి. అధికారవ్యవస్థల మీద దృష్టి కేంద్రీకరణలో ఈ “అనధికార వ్యవస్థలు” విస్మరణకు గురి కాగూడదు. ఫ్రెంచి మార్క్సిస్టు తత్వవేత్త లూయీ ఆల్థూసర్  రాజ్యాంగయంత్రం గురించి వివరిస్తూ, ప్రభుత్వం, పాలన, సైన్యం, పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు వంటి రాజ్యసాధనాలతో పాటే, అంతకన్న ఎక్కువగా వ్యవస్థా నిర్వహణలో పాల్గొనే మతం, విద్య, కుటుంబం, న్యాయభావన, రాజకీయాలు, కార్మికరంగం, ప్రచార సాధనాలు, సాహిత్య కళారంగాలు, క్రీడలు వంటి భావజాల రాజ్య సాధనాలు (ఐడియలాజికల్ స్టేట్ ఆపరేటస్) ఉంటాయని గుర్తించాలన్నాడు. రాజ్యసాధనాలు హింస మీద, బలప్రయోగం మీద ఆధారపడే ఏకీకృత శక్తిగా ఉండగా, భావజాల రాజ్య సాధనాలు బహుళత్వపు శక్తులుగా భావజాలం ద్వారా అదే పని చేస్తాయని అన్నాడు.

మరోమాటల్లో చెప్పాలంటే మతం, కులం, వంశం, కుటుంబం వంటి ఆభిజాత్యాలు, దురభిప్రాయాలు, అవకాశాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నుడికారం వగైరా ఎన్నో మానవసంబంధాల వ్యవస్థలు మన ఆలోచనల మీద, అభిప్రాయాల మీద, ప్రవర్తన మీద బలమైన ప్రభావం వేస్తున్నాయి. అవన్నీ అవ్యవస్థ స్థితిలోనే ఉన్నాయి. అంటే అవ్యవస్థ మనకు బైట ఎక్కడో కాదు మనలోపలే ఉంది. మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో ఉంది. మనం గురి చూడవలసిన లక్ష్యం అవతల ఉన్నమాట ఎంత నిజమో, మనలోపల ఉన్నమాట కూడ అంతే నిజం. అందుకే పతంజలి పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ వంటి ప్రత్యక్ష అధికార వ్యవస్థల అవ్యవస్థ మీద ఎంతటి పదునైన విమర్శ ఎక్కుపెట్టారో, అన్నిరకాల భావజాల సాధనాల అవ్యవస్థ మీద అంతకన్న పదునైన విమర్శ ఎక్కుపెట్టారు. పతంజలి రచనల్లో ఏ ఒక్కటి తీసుకున్నా అధికారిక అవ్యవస్థ మీద ఎంత అపహాస్యం, ధిక్కారం ఉన్నాయో, స్వయంగా చదువరి భావాల్లో, ప్రవర్తనలో ప్రబలంగా ఉన్న భావజాల అవ్యవస్థల మీద అంత వెటకారమూ, ధిక్కారమూ ఉంటాయి.

అందుకే పతంజలి రచన సమాజం మీద ఎంతగా విమర్శో, అంతగా ఆత్మవిమర్శ. చదువరులంగా మనం ఏకకాలంలో ఒక పోలీసు అధికారినీ, రాజకీయ నాయకుడినీ, న్యాయమూర్తినీ, పత్రికాధిపతినీ అపహాస్యం చేస్తున్నట్టుగానే, ధిక్కరిస్తున్నట్టుగానే, మనలో ఉన్న మోసకారితనాన్నీ, నంగితనాన్నీ, అధికారాపేక్షనూ, లాభాపేక్షనూ, అటువంటి అవలక్షణాలన్నిటినీ కూడ అపహాస్యం చేసుకోవలసి ఉంటుంది. సమాజాన్ని శాసిస్తున్న, నిర్వహిస్తున్న వారి మీద ఎంతగా విమర్శ చేయవలసి ఉందో, ఆ శాసనాన్నీ నిర్వహణనూ ఆమోదిస్తున్న, అనుకరిస్తున్న, మౌనంగా భరిస్తున్న మనమీద మనం కూడ అంతగా విమర్శ చేసుకోవలసి ఉంటుంది. పతంజలి రచనల ఆకర్షణా బలమూ అదే. సాధారణంగా ప్రత్యర్థిని బైట చూసి విమర్శ చేసినప్పుడు మనకు ఒక సంతృప్తీ గర్వమూ కలుగుతుంటాయి. కాని ఆ ప్రత్యర్థి లక్షణాల్లో ఎంతో కొంత, శతాంశమో, సహస్రాంశమో మనలో కూడ ఉన్నప్పుడు, ప్రత్యర్థి మీద విమర్శకు పదను తగ్గుతుంది. అప్పుడు తప్పనిసరిగా అవసరమైనది ఆత్మవిమర్శ. లోచూపు. అది కలిస్తేనే అవ్యవస్థ మీద విమర్శ బలోపేతమవుతుంది.

“సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నాచుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఫలితంగా ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్థాయిలో సామూహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నాకంట్లో ఒక నీటి బొట్టవుతుంది. ఏది సమూహం, ఏది వైయక్తికం” అని పతంజలి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆయన రచనల సమాజం-వ్యక్తి సమ్మేళనానికి, విమర్శ-ఆత్మవిమర్శ స్వభావానికి నిదర్శనం.

మరొక అంశం కూడ చెప్పుకోవాలి. పతంజలి కేవలం సామాజిక విమర్శకుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప కళాత్మకత ఉన్న సృజనాత్మక రచయిత. అందువల్ల ఆయన రచన నిస్సారమైన విమర్శగా, విశ్లేషణగా ఉండదు. అది అపహాస్యం, వెటకారం, వ్యంగ్యం వంటి కళాత్మక దినుసులు అద్దుకుని ఆకర్షణీయంగా తయారవుతుంది. అది ధిక్కారంలా కనిపించకుండానే ధిక్కారం అవుతుంది. అది మళ్లీ ఉట్టి వెటకారమేనా, ఉట్టి ధిక్కారమేనా అంటే అంతమాత్రమే కూడ కాదు. మరింత ఉన్నతమైన సందేశం వైపు చూపుతుంది. తెలుగు సాహిత్యంలో అలవాటైన మొరటు, తక్కువస్థాయి పద్ధతిలో సందేశం చెప్పలేదు గనుక అసలు పతంజలి సాహిత్య లక్ష్యం సందేశం కానేకాదని వాదించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వాచ్యంగా సందేశం ప్రకటించిన ‘పతంజలి భాష్యం’ వంటి రచనలు ఆయనలోని కళాకారుడివి కావనీ, ఆయన కథలూ నవలలూ సందేశం లేనందువల్లనే గొప్ప కళాత్మక రచనలనీ ఆయన మౌలిక స్వభావాన్నే ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

కాని పతంజలి రచనల్లో సందేశం ఉందా లేదా, సాహిత్య ప్రయోజనం అనే ఉదాత్త లక్ష్యానికి పతంజలి రచనలు లొంగుతాయా లేదా, ఆయన కేవలం కళ కోసమే కళ అనుకున్న రచయితేనా అనే చర్చే అనవసరం. వాస్తవంగా చెప్పాలంటే, వాచ్య రూప సందేశం కన్న ధ్వని రూప, వ్యంగ్య రూప సందేశమే ఎక్కువ శక్తిమంతమైనది. అలా చూస్తే సామాజిక అవ్యవస్థ గురించీ, వ్యవస్థ మారవలసిన అవసరం గురించీ పతంజలి ఇచ్చినంత బలమైన సందేశాన్ని ఇచ్చినవాళ్లు తక్కువమంది.

*

ధర్మగ్రహానికి భాష్యం!

 

పతంజలి కథల గురించి ఏం రాస్తాం? రాయటం అంటే, మళ్ళీ మనల్ని, మన బలహీనతల్నీ, బోలుతనాల్నీ, ఇంకెన్ని పరమ అధర్మాలూ ఘోరాలూ, చేయగలమో, అలాంటివాటిని, పాస్సీసాలో కొస్సారాలా చదువుకోవటమే. అయినా ఇక్కడ రెండు కథలు, నాకిష్టమైన రెండు కథల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

చూపున్న పాట :

ఇదొక మార్మిక కధనం. వొక గుడ్డివాడి పాట విన్న, వొక పోలీసు వాడి అసహనం..ఎందుకంటె, గుడ్డి లంజాకొడుకు పాడుతున్నది గద్దరు పాట.. అది చెప్తూ పతంజలి ఇలా అంటారు- “గుడ్డి వాడి పాటలు గరికపూలై ఆ రోడ్డునిండా గుట్టలు గుట్టలైతే విశ్వనాధం వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. గుడ్డివాడి పాటలు సీతాకోక చిలుకలై మబ్బుల్లాగా వీధినంతా ఆవరిస్తే విశ్వనాదం వాటిని చీల్చుకొని వెళ్ళిపోతాడు”

ఇంతకంటే, ఒక వాక్యంలో  విశ్వనాధం పాత్ర పరిచయం అవసరం కూడా లేదు. గుడ్డివాడు, ఏ దేవుడి పాటలో పాడాలి గానీ, ఈ గద్దర్ పాటలేంటి, పోలీసు బెదిరిస్తే, “గుడ్డికళ్ళ గుహల నుండి చీకటి చిమ్ముకొచ్చింది” అంటారు పతంజలి ..ఇంతకంటే వొక వల్నరబిలిటీని హృద్యంగా చెప్పటం కూడా ఆయనకే చెల్లింది.

దేవుడి పాటలు పాడితే భత్యం ఇప్పిస్తానన్న పోలీసు మాటకి.. మురళి వాయించే గుడ్డివాడి సమాధానం “..నేర్పిస్తే రాదండీ పాట.. మనం ఇనీసరికీ పాట మనల్ని తగులుకోవాలండీ .. అదండీ పాటంటే..”

గాయపడినా, రక్తం స్రవిస్తున్నా, వేణువు అణువణువునా కన్నాలైనా .. ఇష్టమైన పాట, వొక అస్తిత్వ వేదంలా, అదుముతున్న దాష్టీకాన్ని అడ్డుకోనేలా, పాట స్రవిస్తూనే ఉంటుంది.. పాట ఎన్నో అణచివేతల్నీ, వెతల్నీ ప్రశ్నిస్తూనే ఉంటుంది.. అధర్మాన్ని పాట భయపెట్టినంతగా మరేదీ భయపెట్టదు.

పతంజలి ధార్మిక ఆవేశం, ఈ కథలో మనల్ని మార్మికంగా కమ్ముకుంటుంది. నిస్సహాయత్వం తిరగబడితే, ఆ గాయం ఎంత భయపెట్టేదిగా ఉంటుందో చెప్పకనే చెప్తుంది ..!

 

మోటు మనిషి:

One of the easiest ways to Analyse a Peson is to Pre-judge him or her from the Apearance..! ఆ మాట ఎంత నిజం అనిపిస్తుంది , ఈ కథ చదివితే, ఇది ఎక్కువమంది చదివారో లేదో నాకు తెలీదు. వేట కథల చప్పుళ్ళలో ఇలాంటి కొన్ని మంచి కథలు పతంజలి గారివి మరుగున పడ్డాయి అన్న మాట మాత్రం నిజం.

సోడారం బస్సు ఎక్కినవాళ్లకి ఎలా ఉందో లేదో తెలీదు గానీ, ఇజీనారం పెజల్లో వొకదానిగా ..సోడారం బస్సు వాసన గుమ్మని తగిలీసినట్టుగా రాస్సీరు పతంజలి గోరు ఈ కతని. వొకానొక మోటుమనిషి, ఆ మనిషిని కించపరుస్తూ, చూసే మరో చదువుకున్న జీనియస్సు (అతని మాట్లల్లోనే ) .. అలాంటి మోటుమనిషి పక్కన కూర్చున్న జీనియస్సు మనస్సు ఎలా ఉంటుంది .. పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్నవాడిలాగ ఉంటుంది ( ఇవి కూడా రాజు గోరి మాటలే సుమండీ )

శుభ్రంగా భోంచేసి బస్సెక్కిన ఈ జీనియస్సు గారి భళ్ళున కక్కితే .. పతంజలి మాటల్లో చెప్పాలంటే  “.. నా తలని, గడ్డి తవ్వటానికీ, కట్టెలు చీల్చటానికీ, వేరు శెనగ మోటుగా వోలవటానికీ పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి ఆప్యాయంగా పట్టుకొని, దుమ్ముపట్టిన, తెగ మాసిన, అసహ్యకరమైన వొడిలోనే పడుకో బెట్టుకున్నాయి.”

సమాజంలో వైకల్యం అనాలో, నపుంసకత్వం అనాలో, లేదా ఇంకేం అనాలో తెలీని జాడ్యాల్ని, ఇంత నిండైన ధార్మిక ఆవేశంతో కడిగేయటం రావి శాస్త్రి తర్వాత పతంజలి గారి సొంతం అనాలి.

ఇది కేవలం వ్యంగ్యం మాత్రమే అనటం, వొక పవర్ఫుల్ సోషల్ స్నోబరీ ని .. డైవర్ట్ చేయటమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది ..!

ధర్మాగ్రహాన్ని, నిస్సహాయుల పట్ల కరుణనీ.. అంతే బాలన్సుడ్ గా చెప్పిన పతంజలిగారి ఋణం తెలుగు భాష, తెలుగు చదువరులు ఎప్పటికీ తీర్చుకోలేరు..!

అంతటి గొప్ప మనసుకి..ఆ అక్షరాల అనంత శక్తికీ..

వినమ్రతతో,

సాయి పద్మ

  లోగుట్టు పతంజలికి తెలుసు!

    సి.ఎ ప్రసాదు   

 

11083897_732861206835128_3509838977011454215_nఫుస్తకాలను  ప్రేమించండి- ఆవి మీ జీవితాలను సుఖమయం చేస్తాయి. భయంకర బాధల ఉప్పెనలో వుపశమనం అందిస్తాయి. – గోర్కీ.

ఫుస్తకాలను, మనుషులను, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తి  పతంజలి. పత్రికా సంపాదకుడిగా, కధకుడిగా, కాలమిస్ట్ గా, నవలా రచయితగా, వైద్యునిగా, అనేక వైవిధ్యాలతో ఆయన జీవన విధానాన్ని మనం అర్ధం చేసుకోగలిగితే స్పష్టమైన పతంజలి “చూపు” మనకు తెలుస్తుంది. కేవలం హాస్యం కోసం పతంజలి రచనలు చదివితే ఆ చూపు మనకర్ధం కాదు., సమాజంలో తనకు నచ్చని చాలా అంశాలపైన, ఉండకూడని ఆలోచనల పైన,  చెడుపైన, రాజ్య విధానాలపైనా నిర్మొహమాటంగా తన అసహనాన్ని, కోపాన్ని వ్యక్తం చేయడానికి పతంజలి ఎన్నుకున్న ఓ అద్భుతమైన పద్ధతే “వ్యంగ్య రచన”. సాహిత్యానికి, జీవితానికీ ఓ అర్ధం, ప్రయోజనం ఉండాలనేదే పతంజలి దృక్పధం/చూపు అని చెప్పాలి.

తన ప్రతి రచనలోనూ మామూలు జనం పక్కన, వాళ్ళ అమాయకత్వం పక్కనే, వాళ్ళ చేతకాని తనం పక్కనే పతంజలి నిలబడ్డాడుగానీ, పాలక వర్గాల కొమ్ము కాసిన పతంజలిని మనం చూడలేం. మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా మనం చెప్పుకుంటోన్న శాసన వ్యవస్ఠ , న్యాయ వ్యవస్ఠ, పోలిస్ వ్యవస్ఠ, పత్రికా/మీడియా వ్యవస్థల రంగాల్లో జరిగే అన్యాయాలను ఏమాత్రం సందేహించకుండా విమర్శించడం మనకు అర్ధంకావాలి. అదే పతంజలి నైజం, అదే పతంజలి చూపు. అన్ని రచనలనూ “చూడటం” ఇప్పుడు కుదరదు కాబట్టి ప్రస్తుతం నేను “పిలక తిరుగుడు పువ్వు” అనే నవలిక, అందులో రచయితగా, సామాజిక శాస్త్రకారుడిగా పతంజలిని చూసే ప్రయత్నం చేస్తాను…

అనగనగా ఈ భూప్రపంచంలో ఉన్న అనేకానేక గ్రామాల్లో ఆలమండ గ్రామమొకటి.  ఆలమండ గ్రామంలోని రాజుల్లో ఒకరికి భూమి బల్లపరుపుగా వుందనే అభిప్రాయం నచ్చింది. ఆ వూళ్ళోని వెలమలకు భూమి బల్లపరుపుగా లేదనీ, గుండ్రంగానే వుందనీ నమ్మారు.  సరే – ఈ గొడవ మామూలుగానే పెద్దదై కోర్టు వారి దగ్గరికి వెళ్లింది. మేజిస్ట్రేటు తన తీర్పులో “మన జ్ఞానానికి సార్ధకత లేదు.  మన విశ్వాసాల పైన మనకు నమ్మకం లేదు.  మన విలువల పైన మనకు గౌరవం లేదు. మన దేవుళ్ళ పైన మనకు భక్తి లేదు.  మన నాస్తికత్వం పైన మనకు విశ్వాసం లేదు.  మన మీద గానీ, తోటి వాళ్ళ మీద గానీ మనకు మమకారం  లేదు. మన ప్రజాస్వామ్యం పైన మనకు అవగాహన కానీ గురి గానీ లేదు. మన జ్ఞానానికీ – విశ్వాసానికీ పొంతన లేదు.  విశ్వాసానికీ – ఆచరణకూ పొందిక లేదు..భూమి బల్ల పరుపుగా వున్నప్పుడే ఇలాంటి జీవితం కనపడుతుంది” అని వ్యాఖ్యలు చేస్తూ ఆ కేసును కొట్టేస్తాడు.

ఈ మేజిస్ట్రేట్ గాడికి పిలక తిరుగుడు జాస్తిగా వుంది.  అందుకనే ఇలాంటి తీర్పు చెప్పాడు.  పోలీసోళ్ళు పెట్టిన కేసు కొట్టేశాడు కాబట్టి ఈ మేజిస్ట్రేట్ కు బుద్ధి చెప్పి ఆ పిలకతిరుగుడుతనం తగ్గించాలని ఆ ప్రాంతంలోని డిఎస్పీ దొరగారికి అనిపిస్తుంది.  ఆ తర్వాత జరిగిన ప్రహసనమే పిలక తిరుగుడు పువ్వు నవలిక. మేజిస్ట్రేట్ చెప్పిన తీర్పు ఆధారంగా ఆయన బుర్రతిరుగుడుతనం తగ్గించాలని ఆ పోలిస్ దొర డిఎస్పీ, సిఐ కలిసి ఓ ప్రణాళిక ప్రకారం పేపరోళ్ళనీ, ఆవూళ్ళోని పెద్దోళ్ళనీ కూచొబెట్టుకుని పేపర్లల్లో వార్తలు రాయిస్తారు. ఓ పత్రికా రిపోర్టర్ కూ ఆలమండ వూళ్ళోని పెదరాజుగోరికీ జరిగిన మాటలు ఓసారి చూడండి….

రిపోర్టర్: మీరుగాని పాతిక రూపాయలిచ్చారనుకోండి. ఇంత పిసరు సింగల్ కాలం వార్త ఏస్తానండి. హండ్రెడ్ రూపీసైతే బెత్తెడు వార్తండీ. మరో యాభై ఇస్తే మీ ఫోటో కూడా పంపిస్తానండీ. వార్తతో పాటు అది పడితే పడొచ్చండీ నేపోతే నేదండీ.” ఆ తర్వాత పెదరాజుకూ రిపోర్టరుకూ మధ్య ఒ చిన్నసైజు వాదన జరుగుతుంది.

patanjali choopu

మా దగ్గర నుంచి సంగతులు తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు కాబట్టి మేం నీకెందుకు డబ్బులియ్యాలి అని పెదరాజు ప్రశ్న. అప్పుడు పత్రిక రిపోర్టర్ జవాబు చాలా గొప్పగా, గమ్మత్తుగ్గా, మన భ్రమలను పోగొట్టేదిగా వుంటుంది.  “మీరు చెప్పాలన్నా, మేం రాయాలన్నా మీరే మాకు డబ్బులియ్యాల. అట్లానే మీరు చెప్పిందే మేం రాయం. మేం మాకు బోధపడినట్లు రాస్తాం.  పేపర్ లో సబ్ ఎడిటర్లు అది చదివి ఆళ్ళకి అర్దమైంది రాస్తారు.  ఆపైన చీప్ సబ్బులుంటారు, ఆళ్ళు దాన్ని చదివి తమకు అర్ధమైనట్లు దిద్ది పంపిస్తారు. ఆపైన కంపోజింగోళ్ళు ఆళ్ళకెలాగ బోధపడితే అలాగా కంపోజింగ్ చేస్తారు.  అబ్బో, శానా తతంగం వుందండి” అని రిపోర్టర్ కుండ పగలేసినట్లు చెప్పి మనకున్న భ్రమల్ని చాలా పోగొట్టటమే పతంజలి దృక్పథం, చూపు అని చెప్పాల్నా?

ప్లీడర్ల గురించి మట్లాడుతూ ముత్యాలనాయుడుతో ఇలా అనిపించటం “ప్లీడర్ని తెమ్మంటే పీక్కుతినేవోడ్ని తెచ్చినారు. ఆడి మొగం చూస్తే దుమ్ములగొండి నాగుంది, మాట చూస్తే జలగవోటం. ఆడొచ్చింతర్వాత మూడే మూడు ముక్కలు మాటాడినాడు.  డబ్బులియ్యి అని తప్పించి ఆ పీడర్నంజికొడుకు మరేటి అన్లేదు” అని యింకా చెప్పిన వాటిని చదువుతేనే మజాగుంటది. లోకంలో జరిగే వాటిని మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పటమే పతంజలి భాష్యం అని అనుకుందామా? ఈ రకమైన రచనా విధానంలో పతంజలి స్పూర్తి రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారే.

ఆ మేజిస్ట్రేటు కోర్టుకు సిఐ వాళ్ళు కేసు తర్వాత కేసు తీసుకువచ్చి ఆయనకు చెమటలు పట్టిస్తారు. కోర్టు ధిక్కార నేరం అని, దేశద్రోహం అని, దేశాన్ని విభజించటానికి ఆలమందలోని జనం వీధి వీధినా కుట్రలు చేస్తున్నారనే పోలీసుల కేసులు చూసి, ఆ కేసులన్నింటిలో సాక్షిగా తన పేరును గమనించిన మేజిస్ట్రేట్ గంగాధరం, పోలీస్ మాయల్ని అర్ధం చేసుకున్నవాడై, ఈ కుట్ర కేసులన్నీ తన్ని అల్లరి చేయడం కోసమేననీ, పోలీసుల కంట్రోల్లో వుంచుకోవడమే వాళ్ళ ఆలోచన అనీ తెలుసుకుంటాడు. ఇంతలో ఆ కేస్ సెషన్స్ జడ్జీగారి దగ్గరికి వస్తుంది. ఆయన మేజిస్ట్రేట్ ని బోనులో నిలబెట్టి వార్నింగ్ ఇస్తాడు.  “ఒక వేళ మనం చూడాల్సొస్తే కేస్ వివరాలు చూడాలి, పోలీసోళ్ళ అభియోగాలు చూడాలి., సాక్ష్యాలు చూడాలి. వినాలి – అంతేగానీ అవన్నీ వదిలేసి, నీ పరిధులు దాటి జీవితం వైపు ఎందుకు చూశావు? జనం యెలా వున్నారో, భూమి యెలాగుందో నీకెందుకు? భూమిని జనాన్ని యెలా వున్నా పోలీసోళ్ళు సరిజేయగలరు, ఇంకెప్పుడైనా ఇట్టా పిచ్చి పిచ్చిగా పరిధులు దాటి ప్రవర్తిస్తే జాగ్రత్త.” అని చెప్పిన జడ్జీ గోరి మాటలిన్న పోలీస్ బాసులు ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టు వారికి విన్నవించుకుంటారు. “కేసులు పరిష్కరించు – జీవితాలను పరిష్కరించే బాధ్యత మనది కాదు” అని జడ్జీతో చెప్పించిన పతంజలి భావం అర్ధం చేసుకోవడమే పతంజలి చూపు.

అడుగడునా సమాజాన్నీ, జనాలనీ, పోలీసులనీ, పత్రికలనీ, పత్రికా విలేఖరులనీ, ఇంకా మరెన్నో రంగాల్లోని వైవిధ్యాలను అర్ధం చేసుకోవడానికి సాహిత్యం అనే అంకుశాన్నీ, చూపును వుపయోగించుకున్నవాడు పతంజలి. సమాజంలో జరుగుతోన్న అనేక అన్యాయాలకు మూల కారణాలు వెతుక్కునేటపుడు “తెలియనితనం, అజ్ఞానం, దాని వలన వచ్చే అహంకారాలే” నిజమైన కారణాలని గ్రహించిన ఈ సమాజ చిత్రకారుడు పతంజలి తనదైన శైలిలో విడమరచి చెప్పటమే – పతంజలి చూపు.

ఎదుటి వాళ్ళ తెలీనితనాన్ని ఆసరా చేసుకుని ప్లీడర్లు, పోలీసులు, పేపరోళ్ళు, మేజిస్ట్రేట్లు, జడ్జీలు ఎలాటి మాటలాడగలరో, ఆటలాడగలరో తన రచనల్లో కొంచెం వ్యంగ్యంగా, కొంచెం గిల్లినట్లుగా , ఇంకొంచెం గిచ్చినట్లుగా తన చదువరులకు చూపించడం పతంజలి మార్క్ చూపు అనుకుందామా? జీవితం స్వేచ్చగా వుండాలనీ, సాహిత్యానికి ఎలాటి చట్రాలూ వుండకూడదనీ తపించిన పతంజలి తన ప్రతి రచనలోనూ ప్రజల వైపునే నిలబడి అసాంఘీక శక్తులతో, ఏలుతోన్నవాళ్ళతో పోట్లాడాడు. (రచనల సాయంతో) నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, పదునుగా సాగే పతంజలి రచనలు మనల్ని ఆలోచనల్లో పడేస్తాయి.  ప్రశ్నించడం నేర్పిస్తాయి.  సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. పరుగెత్తించడమే కాకుండా ఎదురుగా జరిగే అన్యాయాల క్రమాలు చూడలేక మనం నిలువునా దహించుకు పోయేలా చేయటమే పతంజలి రచనల లక్షణం. వ్యక్తిగా కూడా పతంజలి చాలా స్పష్టమైన అభిప్రాయాలతో, నిక్కచ్చిగా జీవించారు. అందుకే పతంజలి తెలుగు సాహితీలోకంలో మిగిలిన వారికన్నా ప్రత్యేకం అని నా నమ్మకం.

*

 

 

గురి తప్పని ప్రయోగం…ఖాకీవనం!

నీరజ అమరవాది 

 

470086_126563650840971_1578940197_oపతంజలి గారి  ‘ సాహిత్యం’ సమాజాన్ని అద్దంలో చూపించినంత స్పష్టంగా ఉంటుంది. ఆయన ఎంచుకున్న వస్తువు కూడా భేషజాలు లేకుండా ఆలోచింపజేసి, హృదయాన్ని కదిలిస్తుంది.

 వ్యంగ్యాన్ని కొందరు ‘హాస్యాన్ని’  పండించడానికి వాడుకుంటే, మరి కొందరు ‘తమ బాధ, అక్కసును’ వెళ్లగక్కడానికి వాడుకుంటారు. అయితే పతంజలి గారి వ్యంగ్యం  “ సమాజంలో మేక వన్నె పులుల లాగా బయట హుందాగా తిరుగుతూ, లోపల పందికొక్కులలాగా వ్యవస్థలను భ్రష్టుపట్టించిన నాయకరౌడీల” మీద ఎక్కుపెట్టినది. ఆయన నవలలు, కథలు, కవితలు అన్నీ ‘సాహిత్యవిలువలతో’ పాటు, భాషా పరిమళాలని వెదజల్లుతాయి. ఉత్తరాంధ్రమాండలికానికి ‘పేటెంట్‘ లాగా పనికివస్తుంది. ఆయన సాహిత్యం ఎన్నో నూతన పదాలను, పదబంధాలను  పరిచయం చేసింది. ఒక రకంగా భాష, భావం, వ్యక్తీకరణ  ‘ముప్పేటగా’ కలిసి తెలుగు సాహిత్యానికి సొబగులద్దాయి .

“వజ్రానికి సాన పెట్టిన కొద్దీ  దాని విలువ, మెరుపు పెరిగినట్లు” గా   పతంజలిగారి కథ / నవల / కవిత ఏదైనా సరే మొదటిసారి చదివినప్పుడు ఆలోచింపజేస్తాయి. అదే రెండోసారి చదివితే మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. మరొక్కసారి చదివితే నిఘంటువులలో కెక్కని పదాలు, పదబంధాలు కనబడతాయి. అలా ఆయన కలంలోంచి ఎన్నో ఆణిముత్యాలు రాలినా నన్ను బాగా కదిలించినది  “ఖాకీ వనం“.

‘వనం’ అనగానే పూల మొక్కలు, సుకుమారమైన వన్యప్రాణులు స్ఫురణకు వస్తాయి. ఆ పదం ముందు  ‘ఖాకీ’ చేరగానే వనప్రాణులను ( సామాన్య జనం ) రక్షక భటులు ఎలా భక్షిస్తున్నారో అన్నది చెప్పకనే చెప్పినట్లైంది.

పోలీసు వ్యవస్థలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న అధికారులు అమాయక, సామాన్య, బడుగు జీవితాలపై అధికార జులుంని ఎలా చూపుతున్నారో, పవిత్రమైన లాఠీని, గన్ లను తమ స్వార్థానికి ఎలా ఉపయోగించుకుంటున్నారో, దానికి ఖద్దరు వ్యవస్థ మద్దతుగా నిలుస్తున్న నిజాన్ని ‘మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ‘ తో చూపించి నట్లుగా  ‘ఖాకీవనం’ మనకి చూపిస్తుంది. ఈ నవల  వెలువడి సుమారు ముఫ్పై ఐదు సంవత్సరాలు దాటుతున్నా ఆ వ్యవస్థలో మార్పు రాలేదు. ఖాకీ వనం out date కాలేదు.

 

 

నవల ఆరంభంలోనే   ‘ఎస్. పి పార్థసారథి’  పెంచుకుందామని ఇంటికి కుక్కని తీసుకుని వస్తే వాళ్ల అమ్మాయి  “ఇంటికి కాపలాకి మీ జవాన్లింత మందుండగా, మనకీ మళ్లీ ఈ వెధవకుక్కెందుకు డాడీ” అంటుంది. ఈ వాక్యం ఒక్కటే చాలు.  పోలీసు వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగుల స్థితిగతులను తెలియజేయడానికి.

“మెడకు బెల్టుంటే కుక్కట, నడుముకు బల్టుంటే పోలీసు” అన్న వ్యాఖ్యానం  వ్యంగ్య హాస్యానికి తల మానికంగా చెప్పుకోవచ్చు.

భూగర్భంలో లోతుకు పోయిన కొద్దీ అపురూప ఖనిజసంపద దొరికినట్లుగా ‘ఖాకీవనం’ చదువుతూ ఉంటే కొత్త కొత్త సాహిత్యాంశాలు బయటపడతాయి. ముఖ్యంగ పదచిత్రాలు . . . .

“కాకీ క్రోటన్ మొక్కలాగ నిల్చుని ఉన్న జవాన్లు”

“మూగ రిక్షా మూలగకుండా కదిలింది.”

“రిజర్వు పోలీసులు ఖాకీ కంచె కట్టారు.”

“సగం చచ్చిన వెల్తురు బెడ్ రూం దీపం నుంచి బూడిద లాగా రాల్తోంది.”

ఇలా ఎన్నో_ _ _

ఖాకీవనం లోని స్త్రీ పాత్రలు గౌరి, కమలి. వీరిద్దరు భిన్న నేపథ్యాల నుండి నచ్చారు. గౌరి బీదరికంతో, అవిద్య, తండ్రి అనారోగ్యాలే సంపదగా కలిగింది. దేవుడిచ్చిన అందం, వయసులను  ‘సి.ఐ. కాశీపతి’  సొంతం చేసుకున్నాడు. రక్షకభటులు బీదవాడిని భక్షించే నైజం మరోసారి నిరూపించబడింది. నిస్సహాయురాలైన గౌరికి కూడా ఆత్మాభిమానాన్ని ప్రకటించింది. “నాకు బలం వుంటే నేనే ఆయన్ని కత్తెట్టి పొడిచి సంపేద్దును“ అంటూ కాశీపతిపై  గల అసహ్యాన్ని బయటపెట్టింది.

అవసరం, పరిస్థితులే మనిషి నీతి, నిజాయితీలను నిర్ణయిస్తాయి .

“అన్నం మీద ఆకలితో మేం వున్నాం

ఆడదాని మీద ఆకలితో ఆడున్నడు

ఆడి సేతుల్లో తుపాకీ ఉంది

మా అయ్య గుండెల్నిండా దగ్గు రోగం ఉంది.”

అన్న ‘గౌరి చిన్నాయన’  మాటలు ‘గౌరి’ పై జాలిని చూపించి, పాఠకులను కూడా ఆ కోణంలో ఆలోచించేటట్లు చేశాడు.

కమలి విద్యావంతురాలు. మనసుకి నచ్చిన వ్యక్తి, కాబోయే భర్త భాస్కర్ తో ఏకాంతాన్ని కోరుకుని లాడ్జికి వస్తే, మాటలతో, చేతలతో కాశిపతి  కమలిని  అవమానపరచాడు.  “పెళ్లి చేసుకుంటేగాని మంచ మెక్కకు” అంటూ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడినట్లు హేళనగా మాట్లాడాడు. ఈ సందర్భంలో కమలి కన్నీటి వర్ణన అలతి పదాలతో పాఠకులకు కూడా కన్నీటిని తెప్పించక మానదు .

“ఆమె కనుపాపలలోని చావులూ

భయంగా కదిలే అందలి నీరూ

అక్కడి బాధ

అప్పటి యాతనా

కటిక చీకటి

కమలి కళ్లు”

వాటిని చూసి చలించిన ‘భాస్కర్’   “ద్రౌపదిని చేపట్టాలనుకున్న కీచకుడిని వధించిన వలలుడి” లాగా  దొంగచాటుగా కాశీపతిని పొడిచేశాడు. ఆనాడే కమలి చేత స్త్రీలందరి దగ్గరా  ‘మిషన్ గన్స్’ ఉండాలని చెప్పించారు.

పతంజలి

ఏ యుగంలోనైనా  ఆడదానిని అవమానిస్తే నాశనం తప్పదని, చదువుకున్న వారు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి ఎటువంటి పరిస్థితులలో తీసుకుని, నేరస్తులుగా తయారవుతున్నారో అనే వాస్తవానికి ప్రతిరూపంగా ఈ సంఘటన నిలువుటద్దంలా నిలుస్తుంది. నవలలో నాటకీయతను పండించారు.

నేటికీ పారిశుద్ధ్య పనివారిని అంటరానివారుగానే సమాజంలో చాలామంది పరిగణిస్తుంటారు. వారు రాని రోజు మన బ్రతుకులు కూడా దుర్గంధం పాలే. వారికీ గౌరవమర్యాదలివ్వాలని  “ఒరే గిరే అంటే, పాకీవాడు, పీతోడు  అంటే మర్యాదక్కదు. జాగర్తకుండు మిమ్మల్ని అనావొద్దు, మా చేత తినావొద్దు”  అంటూ మనందరికీ సమతాబోధ చేశారు.

ఒక దృశ్యాన్ని ఫొటోలో చూసినప్పుడు అందంగా కనిపించవచ్చు. అదే వాస్తవంలో అంత గొప్పగా ఉండకపోవచ్చు. అలాంటిదే పోలీసు ఉద్యోగమంటూ ఎస్. పి నోట పలికించిన మాటలు …….

“తుపాకీ ఇస్తారు

వెన్నెముక లాంటి లాఠీ ఇస్తారు

ఉండటానికి గొడ్ల  పాకలిస్తారు

తింటానికి మాత్రం సరిపడా ఇవ్వరు

గుండెల మీద చెయి వేసుకొని పడుకోనివ్వరు

తిన్నది వంటబట్టే విశ్రాంతి ఇవ్వరు”

ఈ మాటలు  హృదయాన్ని తట్టి, వ్యవస్థ మార్పు కోసం ముందుకు దూకేట్టు చేస్తాయి.

భాషావేత్తలచే కూడా బహు బాగు అనిపించే  “చీకటి సౌఖ్యాలు, వేట కుక్కల దీక్ష, భయం వాసన, రోగిష్టి సిల్వర్ గిన్నెలు” లాంటి నూతన ప్రయోగాలకి కొదవలేదు ఈ ఖాకీ వనంలో.

మొత్తం మీద వ్యవస్థలో అన్యాయం, దుర్మార్గం, వ్యభిచారం, పేదరికం ప్రబలటానికి కారణం “చిన్న చేప పెద్ద చేపను మింగినట్లుగా “ అన్ని వ్యవస్థల అవినీతి హస్తం ఉందని  ‘ఖాకీ వనం’ ద్వారా పతంజలి గారు భాష్యం చెప్పారు.

***

 (ఫోటో సేకరణ : కూర్మనాధ్)

భూమి గుండ్రమో, బల్లపరుపో…!

వరవరరావు

vv.karaభూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పిన శాస్త్రజ్ఞుని సత్యాన్వేషణదారిలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులు భూమి తదితర ప్రకృతి సంపదలు, గనులు, కార్ఖానాలు, ప్రజలు ` పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసి – ప్రకృతి –  ప్రజల పరంగా చూసినపుడు ఇపుడు జరుగుతున్నదంతా విధ్వంసక అభివృద్ధి అనే నిర్ధారణకు వచ్చారు. వాళ్ల అధ్యయనం తెలుగులో పుస్తకరూపంలో వచ్చినపుడు ముందుమాట రాస్తూ నేనూ పతంజలి వ్యంగ్యాన్ని ఆశ్రయించాను. ‘పతంజలి నవలల్లో చర్చ ముగిసి భూమి గుండ్రంగా కాక బల్లపరుపుగా ఉంటే బహుశా ఈ ప్రజాసమూహాలు చీమలవలె ఈ భూగోళం మీంచి కృత్రిమ జలప్రళయంలో, ఖనిజ భూకంపంలో విస్థాపన, విధ్వంసం అయి వుండేవారు కారేమో’ అని.

‘గోపాత్రుడు’ (1992)లో చర్చ ఇరుపక్షాల దొమ్మీలో ముగిసింది. మెజిస్ట్రేట్‌ భూమి బల్లపరుపుగానే వున్నదని తీర్పు ఇచ్చాడు. అయితే ఆయన భూమి గుండ్రంగా ఉందని సత్యజ్ఞానంతోనే వున్నాడుగానీ ఈ భూమిమీద వ్యవస్థ సత్యజ్ఞానంతో లేదుగనుక ఆ నిర్ణయానికి వచ్చాడు.

‘‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాలమీద మనకు విశ్వాసం లేదు. మన విలువలమీద మనకు గౌరవం లేదు. మన దేవుడిమీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మనమీద మనకు గౌరవం లేదు. మనతోటి వాళ్లమీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ, గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతనలేదు. విశ్వాసానికీ, ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్లబడుతుంది. మన భూమి బల్లపరుపుగా వున్నదిగనుకనే మన సమాజం ఇలావుంది.’’

ఈ విషయాన్ని ఆయన పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదు. జీవితాన్ని పరిశీలించి నిర్ధారించుకున్నాడు.

మరి గోపాత్రుడు తండ్రికి భూమి బల్లపరుపుగా ఉందని ఎందుకనిపించింది? అతడు అటువంటి బతుకు బతికాడుగనుక. అతడు వైద్యుడుగా చెలామణీ అయ్యాడు. వైద్యమంటే ఏమిటో తెలియకుండానే మహావైద్యుడనిపించుకున్నాడు. జడ్డీపెట్టెలో తాటాకు పుస్తకాలు ఉన్నాయి. కాని అందులో ఏవుందో నరమానవుడికి ఎవరికీ తెలియదు. అది రాసిన అతని తాతయ్యకే తెలియదు…  ‘అందులో ఏవో ఉన్నాయని వూరందరూ అనుకున్నంత కాలమే నువ్వు సెలామణి అవుతావు అది గుర్తుపెట్టుకో. నోటు రాయని బాకీలు ఎగ్గొట్టీ…. నోటురాసిన బాకీలు వొచ్చేజన్మలో మానాయనే తీరుస్తాడని చెప్పు… నేను చచ్చి, దయ్యాన్నై నీకు చేదోడు వాదోడుగా ఉంటాన’ని హితబోధ చేసిన సందర్భంలో ‘మరో సంగతి భూమి గుండ్రంగా వుందిన ఎవరైనా సెప్పితే నమ్మొద్దు. భూమి బల్లపరుపుగా… నేను పడుకున్న మంచంలాగుంటుంది. మరిసిపోవద్దు.’ అని చెప్పాడు. ఇది సత్యశోధనలో వచ్చిన జ్ఞానం కాదు.

‘ఈ సంగతి మా నాయిన పోయేముందు నా సెవులో చెప్పి మరీ పోయాడు. మా తాత యీ రహస్యం మా నాయిన చెవిలో చెప్పి చచ్చిపోయాడట – నువ్వు కూడ నీ కొడుక్కు ఈ రహస్యం చెప్పాల….’ ఇది సత్యాన్వేషణలో పొందిన జ్ఞానం కాదు. వారసత్వ సంచిత స్వార్థ ప్రయోజనజ్ఞానం. కనుకనే రహస్యంగా వారసత్వంగానే అందించబడుతుంది.

ఇంక అక్కడినుంచీ ఇరుపక్షాలకూ స్వార్థప్రయోజనమే  రెండుపార్టీలుగా చీలడానికి కారణం తప్ప భూమి గుండ్రంగా వున్నదని అంటున్నవాళ్లంతా వెనుకటికి  మేజిలెన్ వలె పరిశోధనచేసి తేల్చుకున్నవాళ్లు కాదు. ఇపుడు పార్లమెంటులో భూఆక్రమణ బిల్లు మీద రెండు పార్టీలు తమ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు చీలి ప్రతిష్ఠంభన ఏర్పడుతుందో, అధికారంలో వున్న పార్టీ పడిపోతుందో అనిపించి – చివరకు అంతా ఒకటైపోయినట్లు.

అట్లా ఒకటి కాకపోతే పోలీసోడు అందరినీ బొక్కలో తోసి ఒకటి చేస్తాడు. ఇప్పుడు పోలీసంటే ప్రపంచ పోలీసు  అమెరికా.

‘భూమి గుండ్రంగా లేదు. భూమి బల్లపరుపుగా కూడ లేదు. భూమి నా టోపీలాగుంటది. భూమి పోలీసోడి  లాఠీ లాగుంటాది తెలిసిందా?’ అని అడిగి తెలీకపోతే మళ్లా ఒకసారి గదిలోకొచ్చి తెలిసేట్లు చేస్తానంటాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.

అయితే ఇన్‌స్పెక్టర్‌కున్న విశ్వాసాన్ని కూడ తాత్కాలికంగా మెజిస్ట్రేట్‌ వమ్ముచేసాడు.

‘ఇదేం న్యాయం, నల్లగౌనేసుకున్నోడి నమ్మకం తీర్పయిపోయి, మిగిల్నోల్ల నమ్మకాలు విలువలేకుండా ఎలాపోతాయి?’… ఇందులో ఏదో మత్లబు ఉన్నది.

అది డిఎస్పీ సిఐకి అర్థం చేయించాడు. సిఐ కుట్రకేసుల మీద కుట్రకేసులు బనాయించి అందులో మెజిస్ట్రేట్‌నే సాక్షిని చేసి ఇరికించాడు. సెషన్స్‌జడ్జి ‘‘ఒకవేళ కుట్రకేసంటూ పెడితే నీమీదే పెట్టాలని నాకు అనిపిస్తున్నదయ్యా’’ అన్నాడు. ఎందుకంటే మెజిస్ట్రేట్‌ తన పరిధి దాటి జీవితంవైపు తొంగిచూసాడు. ‘‘ప్రజాజీవితం పోలీసువారి చేతుల్లో సుఖంగా, శాంతంగా, చల్లగా ఉందని, భూమి ఒకవేళ బల్లపరుపుగా ఉన్నాకూడ పోలీసువారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిండిలాగ కలిపి, గుండ్రంగా చేయగలరని నేను నమ్ముతాను… మున్సఫ్‌ మేజిస్ట్రేట్‌గా నీ నమ్మకంకన్నా సెషన్స్‌జడ్జిగా నా నమ్మకానికి ఎక్కువ విలువుంటుంది గదా. అప్పుడేమంటావు?’’

‘‘కేసులు పరిష్కరించు. అదే నీ పని. జీవితాన్ని పరిష్కరించే బాధ్యత మనది కాదు’’ అని మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌కు హితబోధ చేసి సెషన్స్‌జడ్జి గారు కుట్రకేసుల కట్ట అందుకున్నారు.

హితబోధలో పోలీసుల శక్తి సామర్థ్యాలు ఏపాటివో ఆ సంగతి మేజిస్ట్రేట్‌కే కాకుండా పోలీసులకు కూడ జడ్జిగారు గుర్తుచేసారు గనుక సి.ఐ. తటాలున లేచి కుట్రకేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు.

అయితే 92లో పతంజలి ఈ నవల రాసేనాటికే పోలీసోడి పవరూ, మెజిస్ట్రేటు పవరూ – ఆ మాటకొస్తే పిలకతిరుగుడు పువ్వు (95)లో సెషన్స్‌జడ్జి పవరూ, శాసనసభ, ప్రభుత్వపాలన, న్యాయవ్యవస్థ, మీడియా అన్నిటి పవరునూ శాసించే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మన దేశంలో నూతన ఆర్థికవిధానాల రూపంలో వచ్చింది. మీడియాకు సంబంధించిన పవరును ‘పిలకతిరుగుడుపువ్వు’లో కొంత, ‘పెంపుడు జంతువులు’లో వివరంగా పతంజలి చెప్పే ఉన్నారు.

‘పిలకతిరుగుడుపువ్వు’ 1995 ఇండియాటుడే సాహిత్య ప్రత్యేకసంచికలో అచ్చయింది. అప్పటికి సాధారణ ప్రజలు పోలీసుగా గుర్తించే రాజ్యాంగయంత్రం కూడ ప్రపంచబ్యాంకు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే స్థితి మనదేశంలో వచ్చింది.

ఇరవయ్యేళ్లు గడిచిపోయాయి. పతంజలి నవలల్లోని ఫ్యూడల్‌ భూస్వామ్యం, పోలీసు వ్యవస్థగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రాజ్యాంగయంత్రం, సాపేక్ష స్వాతంత్య్రం కలిగి ఉంటుందనుకునే న్యాయవ్యవస్థ,  ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభమనుకునే మీడియా అన్నీ కార్పోరేటు ప్రయోజనాలు నెరవేర్చే దళారీలుగా మారిపోయాయి. ఇప్పుడు భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా లేదు. పోలీసుటోపీ లాగ లేదు. లాఠీలాగ లేదు.

సరుకుగా ఉన్నది. మార్కెటు సరుకుగా ఉన్నది. ఇప్పుడది ఆలమండ దొమ్మీకేసులోని సమస్యగా లేదు. ఇది మామూలు దొమ్మీకేసుగా కాక ప్రత్యేక దొమ్మీకేసుగా మున్సిఫ్‌మెజిస్ట్రేట్‌ గుర్తించినట్లుగానే ఇరవయ్యేళ్లు పోయాక మనం దీనిని పార్లమెంటు ముందు ఉన్న భూఆక్రమణబిల్లుగా గుర్తించాల్సి ఉన్నది. అదీ పతంజలి దూరదృష్టి, ముందుచూపు.

భూమి పోలీసుటోపీ లాగ ఉన్నదనుకున్నపుడు అధికారబలం, అది కూడ లాఠీలాగ ఉన్నదనుకున్నపుడు కండబలం – అందువల్ల వచ్చిన అధికారబలం అనుకునే సామాన్యజ్ఞానం (స్వతంత్రం వస్తే హెడ్డ్‌ బదిలీ అయిపోతాడా అనే ‘కన్యాశుల్కం’లోని జట్కావాని సమస్య వంటిదే) నుంచి వ్యవస్థగా చూసినపుడు మనం ఒక సంక్లిష్టజ్ఞానంలోకి కళ్లు తెరవాల్సి ఉంటుంది. అది వేమన చెప్పిన ఎవరైనాసరే ‘పసిడిగల్లవాని బానిసకొడుకులు’. ఆ పసిడి ఇవ్వాళ భూమి. గర్భంలో పసిడిమాత్రమే కాక సమస్త విలువైన ఖనిజాలు ఉన్నందువల్ల, మార్కెట్లో సరుకయినందువల్ల అది భూమితో సంబంధమున్న ప్రజల చేతినుంచి భూస్వామి చేతినుంచి ఇపుడు కంపెనీల చేతిలోకి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్నది. కనుక భూమి గుండ్రంగా ఉన్నదో బల్లపరుపుగా ఉన్నదో కంపెనీవాడు నిర్ణయించేదే సత్యం. అందాకా ప్రజలు గుండ్రంగా ఉన్న భూమిమీద చీమలవలె పడిలేస్తూ పోరాడుతూ ఉండాల్సిందే.

~

 

 

మళ్ళీ మళ్ళీ చదవాలి!

విమల
విమల

మార్చి 29 పతంజలి పుట్టిన రోజు 

మనకున్న అతి కొద్దిమంది అద్భుతమైన రచయితల్లో పతంజలి ఒకరు. ఈ వ్యవస్ధ పరమ నికృష్టంగా, నీచంగా వుందనీ, మానవ సంబంధాలు వంచన, అన్యాయం, కపటత్వం, అసమానతలు, హింస, దోపిడీ, దుర్మార్గాలతోనూ, సకల మానవీయ విలువల పతనంతోనూ భ్రష్టుపట్టి పోయాయని, మనంత హిపోక్రసీతో బతికే ప్రాణి ఈ భూప్రపంచం మీద మరొకటేదీ లేదని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. సమాజ చలన సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు కాబట్టే అక్షరం పతంజలి చేతిలో అస్త్రం అయింది. ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు, అధిక్షేపణలు లోనంతా డొల్లే అయినా, డాంబికాలతో, ఆత్మవంచన, పరవంచనలతో బతికే ఆధిపత్య కులాల జీవన విధానాన్నీ, బూటకపు ప్రజాస్వామ్యపు నాటకాన్నీ ఎండగడతాయి.

రావిశాస్త్రిలానే, పతంజలి కూడా రాజ్యం దాని అంగాలైన, న్యాయవ్యవస్ధ, పార్లమెంటరీ వ్యవస్థ, సాయుధబలగాలు, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలిచే పత్రికారంగం ఎవరి కొమ్ముకాస్తాయో ఎలాంటి శషబిషలూ లేకుండా తెగేసి చెప్పాడు. ఆయన సృష్టించిన పాత్రలు, అవి చేసే తర్కము, వెక్కిరింతలు, చమత్కార సంభాషణలు, ఈ వ్యవస్ధను అపహాస్యం చేసి, దాని అసలు స్వరూసాన్ని నగ్నంగా మన ముందుంచుతాయి. గుండెలను బరువెక్కించే, మండించే, పదునైన, ప్రత్యేక శైలి పతంజలిది. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుండాలని, వస్తువే కాకుండా మనం చెప్పే విధానం,శిల్పం కూడా చాలా ముఖ్యమని నమ్మినవాడతను. మంచి సమాజంరావాలని, సమాజపు అంచులకి విసిరివేయబడ్డ దళితులు, స్త్రీలు తమదైన సాహిత్యాన్ని శక్తివంతంగా సృష్టిస్తారని, వ్యవస్ధలో వున్న సకల అంతరాలూ పోవాలనీ కోరుకున్న వాడు పతంజలి.

ఆయన ప్రాపంచిక దృక్ఫధం ఆయన రచనలన్నిటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రాజ్యం తాలూకు హింసనీ, దుర్మార్గాన్నీ తప్పు పడుతూ రాయటంతో పాటూ, ఆయనకు తెలిసిన ప్రాంతపు జీవితాన్ని, అక్కడి భాషని, నుడికారన్నీ రాయటానికి పూనుకోవడం ఆయనే చెప్పుకున్నట్లు ఆయన సాహిత్యంలోని రెండవ దశ. ఖాకీవనం నవల చివరాఖర, సౌలభ్యం కోసం ఈ నవల తెలుగునాట, తెలుగు పాత్రలతో రాయటం జరిగిందనీ, వాస్తవంలో ఈ కధ తెలుగు దేశానికే పరిమితం కాదనీ, దేశంలో ఎక్కడైనా ఇలాంటిది జరిగివుండవచ్చనీ చెబుతాడు. ఈ నవలే కాదు. పతంజలి ఇతర నవలలోని పాత్రలకీ, ఇలాంటి సర్వజననీయతే వుందనిపిస్తుంది. మానవ స్వభావాలు, వ్యవస్ధ దుర్మార్గాలు, అవి మారటం కోసం మనుష్యులు చేసే పోరాటాలు, వాళ్ళ ఆశలు, కలలు అన్ని చోట్లా దాదాపు ఒకటిగానే వుంటాయి. యధాతధ స్ధితిని రాసి ఊరుకోవటం మాత్రమే కాకుండా, ఆ స్ధితి మారాలని గాఢంగా కోరుకున్నాడు పతంజలి. ఏ వ్యవస్ధలనైతే ఆయన వెక్కిరించి, వాటి ముసుగులు తీసి అసలు రూపు మనకి చూపాడో, ఆ వ్యవస్థలు మరింత దుర్మార్గంగా ఇవ్వాళ్ళ ప్రజల్ని పీక్కు తింటున్నాయి.

హిందుత్వ శక్తులు అధికార పీఠానెక్కాయి. ప్రపంచీకరణ విషఫలితాలు, సమాజంలోని ఆర్ధిక అంతరాలు, కుల వ్యవస్ధ పురుషాధిపత్యం ఏ అట్టడుగు ప్రజల జీవితాల గురించి పతంజలి రాసాడో, ఆ ప్రజల జీవితాల్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. పతంజలి మనకి దూరమైన ఈ ఆరేళ్ళ కాలంలో సమాజంలో హఠాత్తుగా చోటు చేసుకున్న పెద్ద మార్పులేవీ అంతగా లేవు. ఆయన మనకు సుదూరకాలపు రచయితేం కాదు. పతంజలి కానీ, ఆయనలా సమాజంలో మంచి జరగాలనీ, మార్పురావాలనీ రాసే రచయితల రచనలు కానీ అలాంటి మార్పు జరిగేంత వరకూ సమకాలీనతని కోల్పోవు. ఆతరువాత కూడా గత సమాజాల్ని అర్ధం చేసుకునేందుకు మనకు పరికరాల్ని అందిస్తాయి. పతంజలి సాహిత్యం అలాంటిదే.

పతంజలి సాహితీ సృజనంతా ఒకెత్తయితే, జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో ఆయన రాసిన కాలమ్స్‌, సంపాదకీయాలు పతంజలి భాష్యంగా వచ్చివవన్నీ మరొక ఎత్తు. వ్యాసాల్లో రాజకీయ అభిప్రాయాలను మరింత సూటిగా, స్పష్టంగా చెప్పేందుకు వీలుంటుంది. ఆయా పత్రికల యాజమాన్యాల వైఖరులను బట్టి కొన్ని సందర్భాల్లో రాయాల్సి వచ్చినా, కొన్ని అభిప్రాయాలు పంటికింది రాళ్ళలా చికాకు పెడతాయి. దానికన్నా ఆయన తన ఇంటర్వ్యూలలో, ఇతర రచయితల రచనల గురించి రాసిన సాహిత్య వ్యాసాలలోనూ తన ధృక్పధాల్ని, అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాడు. ప్రసిద్ధి చెందిన కొందరు రష్యన్‌ రచయితల్ని ఇప్పటికీ మనం మళ్ళీ చదువుకుంటాం. మనలోనూ, సమాజంలోనూ జరిగే మార్పులు, నూతన పరిణామాలను బట్టి ఆ రచనలు మనలో మళ్ళీ కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.అవి  కొత్త ద్వారాల్ని తెరుస్తాయి. వాటికి కాలదోషం పట్టదు. పతంజలి నవలలు, కధలు కూడా అలాంటివే.

 

వ్యంగ్యానికి చిరునామా పతంజలి                        

అంపశయ్య నవీన్
అంపశయ్య నవీన్

ఆధునిక తెలుగు సాహిత్యం గర్వించదగ్గ రచయితల్లో కె.ఎన్. వై. పతంజలిగారు ఒకరు. నవలాకారుడిగా, వ్యంగ్య రచయితగా, జర్నలిష్టుగా, ఆయుర్వేద వైద్యుడుగా ఆయన తెలుగు సమాజానికి విశిష్టమైన సేవలు అందించారు. ఇది వరకు అనేక మంది గొప్ప రచయితల రచనల్ని సంపుటాలుగా ప్రచురించి తెలుగు పాఠకులకు ఎనలేని సేవలు అందించిన మనసు ఫౌండేషన్ సంస్థవారు, ఇప్పుడు పతంజలి రచనల్ని కూడా వెలువరించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

పతంజలి రచనలు ఈనాటి సమాజానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయన అనేక సామాజిక వాస్తవాలను తన రచనల్లో వ్యంగ్యాత్మకంగా చిత్రించారు. ఆయన వ్యంగ్యం చాలా బలమైంది. పాఠకుల హృదయాల మీద అది బలమైన ముద్రను వేస్తుంది. మన సమాజంలోని అనేక వైరుధ్యాలను పతంజలిగారు చిత్రించినంత బలంగా చాలా తక్కువమంది చిత్రించారు. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది.

 

పుచ్చిపోయిన “నాలుగవ స్తంభం” గుట్టు విప్పిన పతంజలి

రమాసుందరి

రమాసుందరి

పతంజలి … ఇరవై ఒకటో శతాబ్ధపు ఆలోచనలను రగిలించిన అగ్గి. తల్లక్రిందులుగా వేలాడుతున్న సమాజపు పోకడ పట్ల ఆయనకున్న అసహనం, ఆక్రోశం, ఆవేదన గుండె పొరలు చీల్చుకొని, కంఠనాళాలు ఉబ్బి, కంటి జీరలు ఎర్రగా పొంగి … చివరాఖరుకు ఆయన కలంలోని సిరాతో  బులుగు రంగు అద్దుకొన్నాయి. ఆ బులుగు రంగు తీక్షణత వెటకారం అవతారం ఎత్తింది. ఆ వెటకారం ఒకసారి వీరబొబ్బిలిగా మారి మనసు లోగిళ్ళలో స్వేచ్ఛగా విహరిస్తూ మన హిపోక్రాటిక్ ఆలోచనలను మెల్లిగా నాకుతుంది. ఒక్కోసారి అదే వెటకారం గోపాత్రుడు రూపంతో భూమి బల్లపరుపుగా ఉందని వితండ వాదన చేసి గెలుస్తుంది.

సామాన్య ప్రజలు ఎన్నడూ చూడలేని ఫోర్త్ ఎస్టేట్ బండారాన్ని మనకు పరిచయం చేసినమిత్రుడు పతంజలి. “వెర్రి వెధవ. నీకు రాజకీయాలేమిటి?” అంటూ ఒక మినిస్టర్ ని ఎకసెక్కం చేసే విలేఖరి ఈ కొత్త లోకాలలో గవర్నరు బంగాళా కాడా, అసెంబ్లీ మెట్ల మీదా ఉంటాడు. నిత్యం టీవీల్లో చూసే పరిసరాలే. పాత్రలే సామాన్య ప్రజానికానికి అపరిచితం. జర్నలిష్టుగా తనకు మాత్రమే తెలిసిన సత్య లోకాలను తెలుగు పాఠక లోకానికి సంశయం లేకుండా విదితం చేశాడు పతంజలి. పడి పోయిన రైల్లో డబ్బు, బంగారం దోచుకొనే రిపోర్టర్లతో మొదలు పెట్టి, ఆ దోపిడికి మూలాలు ప్రధాన మంత్రి  కుర్చీలోనే ఉన్నాయని నిర్భయంగా వెల్లడి చేశాడు. బొగ్గు నుండి, వేవ్ లెంగ్త్ దాకా అమ్ముకొన్న అధికార రాజకీయాలు గుర్తుకు రావటం లేదూ?

పత్రికలనైనా, ప్రపంచాన్నయినా శాసించేది డబ్బు. ఆ డబ్బు ముంగిట్లో తాగి దొర్లే విలేఖరులు కూడా ఈ వ్యవస్థలో భాగమే. తన స్వజనం గురించి నిర్మొహమాటంగా మొదలు పెట్టి పెట్టుబడికి సాగిల పడే పత్రికా యాజమాన్య  వైఖరిని ఆయన బట్టబయలు చేసి రెండు దశాబ్ధాలు గడిచిన సందర్భంగా చెప్పవచ్చేదేమిటంటే ఇప్పుడు రాజకీయాలు, పెట్టుబడి, పత్రికలు మూడూ ఒకే శరీరానికి అంటుకొని ఉన్న మూడు ముఖాలు. ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో ముఖం కనబడుతుంది. పతంజలి! నువ్వు తొట్ట తొలిగా తొలిచిన రంధ్రంలో చూసిన లోకాన్ని  ఈ రోజు ఆమ్ ఆద్మీ 70 ఎం.ఎంలో చూస్తున్నాడు.

అక్షరాల మీద ప్రేమతో రిపోర్టరు వృత్తిలో చేరి, అదే అక్షరాల మీద జుగుప్సతో బతుకీడుస్తున్నవారు ఈ వృత్తిలో కోకల్లలు. కొత్త రాజధాని ప్రాంతంలో భూములిస్తున్న  రైతులు ఆనంద భాష్పాలు రాలుస్తున్నారనీ అబద్ధాలు రాసీ రాసీ అలసి పోవటం లేదా? వీడియోలలో ప్రశ్నిస్తున్న రైతులను కత్తిరించి కత్తిరించి చేతులు నొప్పి పుట్టటం లేదా? పతంజలి చెప్పినట్లు అక్షరాలు ఖాళీ పంజరాల్లాగా, ఓటి కుండల్లాగా, ఎవరినో దగా చేస్తున్నాట్లు, వేళ్ళ సందులో నుండి తప్పించుకొని పారిపోతున్నట్లు అనిపించటం లేదూ? ఒక రాయి విసరలేక పోవటం, ఒక కత్తి దూయ లేక పోవటం, ఒక చెంపపెట్టు వార్త రాయలేక .. ప్రసారం చేయలేక పోవటం .. అక్షరాలను కడుపు కూటి కోసం, టూ బెడ్ రూమ్ అపార్ట్ మెంటు కోసం  అమ్ముకొంటున్న అశక్తతని ఎన్నడో పతంజలి అర్ధం చేసుకొన్నాడు. ఆ అక్షర హత్యలనూ, ఆ గాయాలను సహృదయులైన తెలుగు పాఠకులకు చూపించే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ వర్గాల దృక్పధంతోనే జీవితాన్ని విశ్లేషించే మీడియా ప్రపంచపు మోసాన్ని జగద్విదితం చేశాడు.

రిపోర్టరు భార్యగా కాలరెగరేసుకొని తిరిగిన రాధిక అత్యాచారానికి, హత్యకు గురి అయినపుడు, ఆమెను పత్రికా రిపోర్టర్ల పేరంటాలుగా పేర్కొన్న దమ్ము పతంజలిది. “మందు బుడ్డీలకూ, పోసుకోలు కబుర్లకూ, అబద్ధాలకూ, కుట్రలకూ, క్షుద్ర రాజకీయాలకు అలవాటైనా పాపిష్టి ప్రెస్ క్లబ్ ను కూలదోసి మనందరం ఆవిడకు అక్కడ ఒక గుడి కట్టాలి.” అని  రెండు దశాభ్డాల క్రితం ప్రతిపాదించాడు పతంజలి. పేగులు తెగేదాకా  అత్యాచారానికి గురి అయి, చచ్చిపోయి ..  దేశమంతా అలజడికి కారకురాలైనా ‘నిర్భయ’ను కనీసం ‘ఇండియన్ డాటర్’ గా నిరాకరించే స్థితిలో ఇంకా మేము ఉన్నాము అని మీకు మనవి చేసుకొంటున్నాము పతంజలి!

“పాలక వర్గాలు తమ దోపిడీ స్వేచ్ఛకు ప్రమాదం అనిపించినప్పుడల్లా ప్రజాస్వామ్యానికి ముప్పు అని గగ్గోలు పెట్టినట్లే, మీరు మీ వ్యాపార స్వేచ్ఛకు హాని కలిగినప్పుడల్లా పత్రికా స్వేచ్ఛకు ముప్పు అని గోల చేస్తారు. వెర్రి నా ప్రజలు రెండూ నమ్ముతారు.”

ప్రజలు హక్కులను గుర్తు చేసుకోకుండా ఏమార్చి, వారి కలలు నులిమేసి .. పత్రికలు పాలక వర్గాలకు కొమ్ముకాస్తున్న ఈ వర్ధమాన సందర్భం, ‘పత్రికా స్వేచ్చ’ గురించి చేస్తున్న జపం ..  మనం పతంజలిని ఎంత స్మరించాలో కదా!

 

పతంజలిని చదువుతుంటే ఏమవుతుంది?

29-raghava
రాఘవరెడ్డి

పతంజలిని  చదువుతున్నప్పుడు ఏమవుతుంది? చిరునవ్వు మొలుస్తుంది. చురుక్కుమంటుంది. కసి రేగుతుంది. ఎప్పటి నుండో పేరుకు పోయిన కసి తీరుతున్నట్లుగాను తోస్తుంది. పదునైన కత్తి అంచు మీద పరుగు పెడుతున్నట్లు ఉంటుంది. గట్టిగా తొడపాశం పెట్టినట్లు ఉంటుంది. గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది. ఆ అక్షరాలు పరమ  ధైర్యంగా, కరుగ్గా పదునెక్కి తోస్తాయి. సూటిగా, ధాటిగా వెంటాడే వాక్యాలై నిలుస్తాయి. కళ్ళు తెరిపిస్తాయి. భ్రమల్ని బద్దలుగొడతాయి. ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అనుకొంటూ, పడక్కుర్చిలో అలా ఆరాముగా పడుకొందామనుకొంటే ఎక్కడో తగిలి కసుక్కున గుచ్చుకొంటాయి. అసలు మనుషులంతా సగం మంది జైళ్ళలో, సగం మంది పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్ళు అంటూ అధారిటీ చేస్తాయి.

అయితే ఇంతకీ పతంజలిని ఇప్పుడు కూడా చదవాలా? ఈ పిజ్జా, బర్గర్ తరానికి ఆయనేం చెబుతాడు ఇప్పుడు? పాత వాసన కొట్టడా? కొట్టడు. మేడి పండు పొరలు వలిచి, “ఇదిగో ఇవిరా నాయనా దీని లుకలుకలు.” అని చూపెడతాడు. ఉన్న రంగులన్నీ కడిగేసి “ఇదిగో, ఇదీ అసలైన ముఖం.” అని తెలియ చేస్తాడు. మన సర్వ సత్తాక లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం .. ఎంత సుందరమైనదో, ఎంత ఘనమైనదో, ఎంత ఉన్నత ఉదాత్త ఉత్కృష్టమైనదో మన కళ్ళకు కడతాడు. ఎంత గొప్ప స్వేచ్చ మనకుందో, అది మనం ఏం చేయనంత వరకూ మనకుంటుందో అర్ధం చేయిస్తాడు.

అయితే ఒక దుర్మార్గపు పనికి కూడా పూనుకొంటాడు. నాలుగు స్థంభాలూ కలిసి నమ్మకంగా నీ కళ్ళకు గట్టిన గంతలు ఉన్నాయే! నీకు చాలా సుఖాన్నిస్తున్న గంతలు. నా యిల్లు, నా పిల్లలు, నా పెళ్ళాం, నా భద్ర జీవితం అనుకొంటూ  వెచ్చగా రగ్గు కప్పుకొని, కమ్మగా నిద్ర పోవటానికి అవకాశం యిస్తున్న గంతలు. వాటికి ఎసరు పెడతాడు. పుస్తకం మూసి, పక్కన పెట్టి పడుకొన్న తరువాత కూడా వెంటపడి, వేధించి, కలల్లోకి దూరి నీ గంతలు దొంగిలిస్తాడు. వ్యవస్థను నగ్నంగా నీ ముందు నిలబెడతాడు. నీ శాంతిని దూరం చేస్తాడు. నిన్నూ నొప్పి పుట్టేటంతగా డిస్టర్బ్ చేస్తాడు. వీలయినంత వొంగి, లేదా నేలకు అంటుకొని సాగుతున్న ఆలోచనలను జుట్టు పట్టుకొని పైకి లేపీ, ‘నువ్వు సకశేరుకానివి రా నాయనా’ అని అనవసరంగా గుర్తు చేస్తాడు. నాలుగు చితుకులేరీ పోగు పెట్టి, మంట రాజేస్తాడు. శివుడాజ్నను ధిక్కరించకుంటే చీమలు నలిగిపోక తప్పవనీ నిరూపిస్తాడు. మనిషన్నాక ఒక పాట ఉండద్దా అంటాడు. పాటన్నాక ఒక చూపు ఉండద్దా అంటాడు.

మరి కొత్త తరం పాఠకులు? మీ గంతలు మీకే ఉండాలనుకొంటే, మీ నిద్రలు మీరు పోవాలనుకొంటే, డిస్టర్బ్ అవద్దనుకొంటే హాయిగా దేశభక్తితో సంచరించండి. ఈ వైపుకు చూడద్దు. ఈ పెద్ద సూటైన రాస ముక్కు పెద్ద మనిషి వైపు రావద్దు.

 *

త్వరలో కొత్త శీర్షిక: “పతంజలి చూపు”

 

తెలుగు సాహిత్యంలో పతంజలి ఒక ఆశ్చర్యం! ఒక మిరకిల్! కొత్త పొగరుబోతు వాక్యం! ఈ స్వరం కొంచెం వగరు! కాని, అసలు రహస్యమంతా ఆ చూపులో వుంది. చూపున్న వచనం ఆయన శైలి, ఆయన థియరీ! “దిక్కుమాలిన కాలేజీ” తో మొదలు పెట్టి, చివరి దాకా అలుపు లేకుండా ఆయన సృష్టించిన వచనం మనకూ ఒక నిటారైన వెన్నెముక వుందని నిరూపించే ప్రయత్నమే! ఆయన వ్యంగ్య రచనలూ, కథలూ, నవలలూ అన్నీ తమకంటూ ఒక కొత్త దారిని వెతుక్కుంటూ వెళ్ళిన బాటసారులు. ఆ బాట గురి తప్పని బాణం.

అటు జీవితంలోనూ, ఇటు సాహిత్యంలోనూ, మధ్యలో వృత్తిగతంగానూ పతంజలిని అనుకరించడం కానీ, అనుసరించడం కాని అసాధ్యమంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఇప్పటి దాకా ఆ దారిన వెళ్ళే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోయారు. తెలుగు మాటలోని వ్యంగ్యం, గాంభీర్యం, సూటిదనం,  అన్నిటికంటే మించి అందులో వుండే నిక్కచ్చితనంలాంటి నిబద్ద గొంతుక పతంజలి వచనంలో తప్ప ఇంకో చోట ఊహించలేం. సమకాలీన జీవితానికి ఆయన ఇచ్చిన భాష్యం చెక్కుచెదరని భవిష్య శాసనం!

e7d8e98f-7240-4980-858b-f6edd6f6cb79

పతంజలిని తలచుకోవడం అంటే మన వెన్నెముకని ఇంకో సారి నిటారుగా నిలబెట్టుకొని, తల ఎత్తి, ఠీవిగా మాట్లాడడం…నంగిరి మాటలకూ మతలబులకూ సమాధి కట్టడం…ధిక్కారం ఇలాగే వుంటుందని చాటి చెప్పడం…నమ్ముకున్న అక్షరం మీద ఆన చెయ్యడం…!

ఈ “పతంజలి చూపు” శీర్షిక పతంజలి బాటలో మరో సారి చూపు నిలబెట్టి, మనల్ని మనం వెతుక్కోడం. ఈ అన్వేషణలో మీరూ చూపు కలపండి. మీ చూపులోంచి పతంజలిని చూస్తూ మీరూ రాయండి.

పతంజలి సృజన ప్రపంచంలోకి – ఆయన కథల్లోకీ, నవలల్లోకీ- మళ్ళీ వెళ్ళండి. ఆ పాత్రలతో కరచాలనం చేయండి. ఆ ఊళ్ళతో మాటలు కలపండి. అవి ఎందుకు మన లోకంలోకి అంత బలంగా దూసుకువచ్చాయో అడిగి చూడండి.

ఇది పతంజలి సృష్టించిన లోకంతో ఒక సంభాషణ. మనతో చుట్టూ వుండే లోకంతోనూ సంభాషణ. ఒక కథ చదవండి, ఒక నవల చదవండి. అది మిమ్మల్ని మళ్ళీ ఎందుకు చదివిస్తోందో తరచి కనుక్కోండి. ఆ వెతుకులాటనే వ్యాసంగా మలచండి. మాకు పంపండి.

photo

“మరో సారి కా.రా. కథల్లోకి…” శీర్షిక ద్వారా తెలుగు సాహిత్య పత్రికా ప్రపంచంలో ఒక వినూత్న విమర్శ ఒరవడిని తీసుకువచ్చిన రమా సుందరి “పతంజలి చూపు” శీర్షికని నిర్వహిస్తున్నారు.

మీ రచనల్ని రమా సుందరి ఈమెయిల్ కి పంపండి. ఈ శీర్షికని విజయవంతం చేయండి.

రమాసుందరి ఈమెయిలు : manavi.battula303@gmail.com. ఈ శీర్షికకి సంబంధించిన అన్ని వివరాలకూ రమా సుందరి గారిని సంప్రదించండి.

పతంజలి చూపు లోగో: బంగారు బ్రహ్మం