నాట్స్ సాహిత్య సభా ప్రయోగం సక్సెస్!

సాహిత్య సభల్ని ఏదో ‘నామ’ మాత్రంగానో, ఒక తంతులాగానో కాకుండా- స్పష్టమయిన ఉద్దేశంతో, చిత్తశుద్ధి తో చేస్తే అవి ‘సక్సెస్’ అయి తీరుతాయని నిరూపించారు నాట్స్ సాహిత్య కమిటీ నిర్వాహకులు. చిత్తశుద్ధితో పాటు కొంత ప్రయోగాత్మక దృష్టి తోడయితే, సాహిత్య సభలకి పదీ పాతిక మంది మాత్రమే హాజరయ్యే దుస్థితి కూడా తొలగిపోతుందని ‘నాట్స్’ నిరూపించింది. మూడు రోజులు ఒక మహాసందడిగా జరిగిన నాట్స్ సభల్లో రెండు రోజుల సాహిత్య సభలు ఒక హైలైట్ గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు, కేవలం సాహిత్య అభిమానిగా చెప్తున్న మాట కాదు. “  ” సాహిత్య సభలకి నేను- బాబోయి -ఆమడ దూరంలో ఉంటా. అలాంటిది, వూరికే అలా వచ్చి ఇలా చూసిపోదామని వచ్చి, ఇక్కడ సెటిలై పోయా,” అన్న వాళ్ళు వున్నారు.

శుక్రవారం అమెరికాలో పనివారమే. ఆ రోజు మొదలయిన సాహిత్య సభ మొదట్లో పలచగా వున్నా, నెమ్మదిగా హాలు నిండిపోయింది. “రండి…కూర్చోండి,” అని బతిమాలుకునే అవస్థ నిర్వాహకులకు పట్టకుండానే, మొదటి సభకి వచ్చిన వాళ్ళంతా చివరి కార్యక్రమం దాకా అంటే – వొంటి గంటకి మొదలై, ఆరు గంటల దాకా- వోపికగా కూర్చోడం ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా సభల్లో ఎవరో సినిమా వాళ్ళు వుంటే వాళ్ళ పాటలో, మాటలో విని అక్కడినించి వెళ్ళిపోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కాని, నాట్స్ సాహిత్య సభల్లో అలాంటి స్థితి కనిపించలేదు.

మొదటి రోజు సాహిత్య సభలు

 తెలుగు భాష గురించి చర్చ అంతా ఒక ఎత్తు. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో స్థానికత/ ప్రాంతీయత  గురించి చర్చలు వేడెక్కుతున్న సమయంలో మాండలికం మీద చర్చకి తెర తీయడం- అదీ నాట్స్ లాంటి వేదికల మీద- నిజంగా సాహసం. గిడుగు రామమూర్తి  పంతులుకి అంకితం చేసిన ఈ సభా వేదికకి అది సందర్భోచితమే. ప్రసిద్ధ విమర్శకులు కె. శ్రీనివాస్ కీలకోపన్యాసంతో మొదలయిన చర్చలో ఆధునిక తెలుగు భాషలో మాండలికాలకు సంబంధించిన భిన్న కోణాలని సినిమా సాహిత్య భాష గురించి కోన వెంకట్, చంద్రబోసు, భాషా సాహిత్య కోణం నించి అఫ్సర్, సరిహద్దు భాషల మాండలికం గురించి గాలి గుణశేఖర్, స్త్రీల రచనల్లో  మాండలికం గురించి కల్పనా రెంటాల మాట్లాడారు. అనంత మల్లవరపు సభా సంధాతగా వ్యవహరించారు. మాండలికంవేపు సాహిత్యం సాగిస్తున్న  ప్రయాణంలోని మైలురాళ్ళని గుర్తు చేయడంతో పాటు, ముందుకు సాగవలసిన  దారిని ఈ చర్చ సూచించింది.

రెండో సభ ప్రముఖ విద్వాంసులు మీగడ రామలింగ స్వామి సంగీత  నవావధానం. ఇది ప్రయోగాత్మక అవధానం. అమెరికాలో సాహిత్య సభలంటే  అవధానాలే; పద్యాలు అనగానే ఎవరయినా చెవికోసుకుంటారు. కాని, మీగడ వారి సంగీత అవధానం అటు సాహిత్యమూ ఇటు సంగీతమూ కలగలిసిన శబ్ద రాగ విభావరి.  ఈ సభకి అటు పండితుల నించి, ఇటు సాధారణ సాహిత్య అభిమానుల దాకా, అటు సంప్రదాయికుల నించి ఇటు ఆధునికుల దాకా అపూర్వమయిన స్పందన లభించింది. మూడు గంటల పాటు కరతాళ ధ్వనులతో సభాస్థలి మార్మోగిపోయింది.సంగీత నవావధానికి సంధాత గా రమణ జువ్వాది వ్యవహరించారు. అక్కిరాజు సుందర రామకృష్ణ, రమణ జువ్వాది, గాయని జ్యోతి, మద్దుకూరి చంద్రహాస్, మహారాజపురం రాము, తదితరులు సంగీత నవావధానం లో పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఇద్దరు పిల్లలు కూడా పృచ్ఛకులుగా పాల్గొని పద్యాలు పాడటం అందరినీ ఆనందింప చేసింది. ఆశ్చర్యపరిచింది. నాట్స్ సాహిత్య కమిటీ సభ్యులు అనంత్ మల్లవరపు, శారద సింగిరెడ్డి, సతీష్ పున్నం, శ్రీనాధ్ జంద్యాల , జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, నసీం షేక్, సురేష్ కాజా తదితరులు అతిథులను సత్కరించారు.

 రెండో రోజు

సభలు రెండవ రోజు ఇంకా  ఘనంగా జరిగాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి శత జయంతితో రెండవరోజు సాహితీ సభలు ప్రారంభమయ్యాయి.పాపయ్య శాస్త్రి గారి మనవడు శ్రీనాథ్ జంధ్యాల ఈ కార్యక్రమానికి సంధాతగా వ్యవహరించారు. ప్రముఖ నటులు, గాయకులు అయిన అక్కిరాజు సుందర రామకృష్ణ గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి  గారి పద్యాలను చక్కగా పాడారు. ఈ ప్రపంచంలో సూర్యచంద్రులున్నంత వరకు పాపయ్య శాస్త్రి గారి పద్యాలు అందరికీ గుర్తుండి పోతాయన్నారు.ఈ సందర్భంగా అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడు, మనవరాలు కుటుంబ సమేతంగా సత్కరించారు.

పద్య వాణీ విన్యాసం కార్యక్రమంలో సమైక్యభారతి సత్యనారాయణ, డి.ఎస్.డీక్షిత్, ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాజా సురేష్ గారు నిర్వహించారు. శ్రీకృష్ణ రాయబారం, శ్రీనాధుడు, సత్య హరిశ్చంద్ర నాటకాల నుండి కొన్ని పద్యాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

ప్రముఖ కవులయిన చంద్రబోస్, సిరా శ్రీ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ గారితో ‘మా బాణి-మీ వాణి’ శీర్షికన ఆశువుగా గేయ రచన కార్యక్రమం జువ్వాడి రమణ గారి ఆధ్వర్యంలో ప్రేక్షకుల చప్పట్లతో మారుమోగింది. మహారాజపురం రాముగారు రసరాజు గారిని పరిచయం చేస్తూ అసెంబ్లీ రౌడీ సినిమాకి  వ్రాసిన “అందమయిన వెన్నెలలోనా” పాటను పాడారు. ఈ పాటకు కళాసాగర్ అవార్డు వచ్చిందని రసరాజు గారు గుర్తు చేసుకున్నారు.  సిరా శ్రీ గారిని పరిచయం చేస్తూ “ఇట్స్ మై లవ్ స్టోరీ” సినిమా నుండి “నిన్నలా లేదే, మొన్నిలా లేదే” పాట పాడారు. చంద్రబోస్ గారిని పరిచయం చేస్తూ ఝుమ్మంది నాదం సినిమా నుండి దేశమంటే మతం కాదు పాట పాడారు.మగధీర సినిమాకి పంచదారా బొమ్మ,బొమ్మా పాటను గుర్తుకు తెచ్చుకుంటూ చంద్రబోస్ గారు ఆ పాట అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.కన్నడ, మళయాల, తమిళ బాణీలకు వడ్డేపల్లి కృష్ణ, సిరా శ్రీ, రసరాజు చంద్ర బోస్ గారు చక్కగా తెలుగు వాణిలను వినిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డాలస్ నుండి మద్దుకూరి చంద్రహాస్, రాయవరం భాస్కర్, దివాకర్ల మల్లిక్ గారు కూడా పల్లవి అందించి అందరి చేత “శెభాష్” అనిపించుకున్నారు. మల్లవరపు అనంత్ గారి నవ్వు మీద రసరాజుగారు ఆశువుగా పాట పాడి అనంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసారు.అన్ని పాటలను మహరాజపురం రాజు గారు, డాలస్ ఆస్థాన గాయని జ్యోతి గారు పాడి వినిపించారు.

 మొదటి సారి ప్రవాస వేదిక ఎక్కిన శ్రీధర్

ఈనాడు ఇదీ సంగతి శ్రీధర్ గారితో షేక్ నసీం ముఖాముఖి సందడిగా జరిగింది. ఆంధ్రదేశంలో తెలుగు కార్టూన్ల గురించి పోచంపల్లి శ్రీధర్ గారు చక్కగా మాట్లాడారు. రాజకీయనాయకుల ఇగోని కార్టూనిస్ట్ పంక్చర్ చేస్తూ ఉంటాడు అని చెప్పారు. చిన్న, చిన్న గీతలతో కార్టూన్లు ఎలా గీయచ్చో చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ కాలాలలో తను వేసిన కొన్ని కార్టూన్లను గుర్తు తెచ్చుకున్నారు.

సాహిత్య సేవలో భారీ వదాన్యులు కార్యక్రమంలో  గురవారెడ్డి, ప్రముఖ రచయిత భారవి ముఖాముఖి జరిగింది. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు  చెప్పారు. సియాటిల్ నుండి వచ్చిన పద్మలత భారవి గారిని సభకు పరిచయం చేసారు.  గురువాయణం పుస్తకం వ్రాసిన గురవారెడ్డిని పెనుగొండ ఇస్మాయిల్ గారు సభకు పరిచయం చేసారు. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు  చెప్పారు. అమెరికాలో సాహితీ సభలకు ఇంతమంది రావడం ఎపుడూ చూడలేదని గురవారెడ్డి గారన్నారు. అతిథులని నాట్స్ సాహితీ బృందం ఘనంగా సత్కరించడంతో కార్యక్రమం ముగిసింది.

‘స్రవంతి’ వెలుగులు

భాస్కర్ రాయవరం, రవి వీరెల్లి సంపాదకత్వంలో వెలువడిన నాట్స్ సాహిత్య ప్రత్యేక సంచిక ‘స్రవంతి’ కూడా ఒక విశేష ఆకర్షణ. ఇందులో కొన్ని రచనలు ఈ నెల ‘వాకిలి’ పత్రికలో వెలువడ్డాయి.  కవిత్వమూ, వచన రచనల ఎంపికలో వైవిధ్యానికి పీట వేసారు. మామూలుగా ఇలాంటి సావనీర్లలో షరా  మామూలుగా కనిపించే రచయితల పేర్లు కనిపించకుండా, కొత్త తరానికి ప్రాముఖ్యమివ్వడం బాగుంది.

                                                                               –     శ్రీనివాసులు బసాబత్తిన

సంబరాల – అలజడి

ఎద ఎన్నో భావాల సంద్రమై ఎగసి పడుతుంది

నిర్లిప్తతో, నిరాసక్తతో నా దరికి చేరకుండా ఆరాట పడుతుంది.

అభినివేశం, ఆత్మాభిమానం మాకే సొంతం!

అసూయ, అలజడి, అలుపూ సొలుపూ క్షణభంగురం!

ఉద్వేగం, ఉన్మాదం ఊపిరి తీస్తుంది!

ఉత్తేజం, ఉత్సాహం ప్రాణం పోస్తుంది!

పొగడ్త కోసమో, తెగడ్త కోసమో చేసే పని కాదది

జీవన్మరణాల మధ్య అస్తిత్వం కోసం ఆరాటమది!

భేషజాలకు, ఇజాలకు మేము దూరం

భాషకు, భావజాలానికి, బంధాలకు బానిసలం

బహుదూరపు బాటసారులు, మీరంతా మాకు బంధువులు

ఒక్క ఆత్మీయ పలకరింత, మాకు పులకరింత

– అనంత్ మల్లవరపు

నాట్స్ సంబరాలలో సాహిత్య సందడి

LITERARY flyer - Finalజూలై 4-6 తేదీలలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి మూడవ అమెరికా సంబరాలలో భాగంగా జరగనున్న సాహీతీ కార్యక్రమాల సమాహాలిక “నాట్స్ సాహిత్య సౌరభం” విశేషాలను తెలుసుకోవడానికి నిర్వాహకులు అనంత్ మల్లవరపు గారితో ముఖాముఖి.

అనంత మల్లవరపు

అనంత మల్లవరపు

Qఅనంత్ గారు, నమస్కారం.  ముందుగా “నాట్స్ సాహిత్య సౌరభం” నిర్వహణ కమిటీ కి శుభాకాంక్షలు. ఈ “నాట్స్ సాహిత్య సౌరభం” కార్యక్రమాలను వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అయినటువంటి గిడుగు గారికి అంకితం ఇవ్వడం లో మీ సంకల్పం గురించి చెబుతారా?

ఈ సంవత్సరం మనం గిడుగు గారి 150 వ జయంతి జరుపు కుంటున్నాము. ఇది కేవలం కాకతాళీయం అయినప్పటికీ, సాహిత్యం సామాన్య ప్రజానీకంలోకి చొచ్చుకుపోవటానికి, ఆనాటి ఛాందస గ్రాంధిక భాషావాదులను ఎదిరించి గిడుగు వారు నడిపిన వ్యవహారిక భాషా ఉద్యమం మరిన్ని రచనలు వాడుక భాషలో రావటానికి దోహదం చేసింది. వాటి ఫలాలనే మనం నేడు అనుభవిస్తున్నాం. నాట్స్ సంబరాలలో భాగంగా మేము జరుపుతున్న సాహిత్య కార్యక్రమాలలో గిడుగు గారికి నివాళి అర్పించడం మా భాధ్యతగా భావిస్తున్నాం.

  1. Qనాట్స్ సాహిత్య సౌరభం లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసారు? చాటి వివరాలు అందిస్తారా?

మా సాహిత్య సౌరభంలో వైవిద్యభరితమైన కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనవి  సమకాలీన భాష మీద చర్చా కార్యక్రమం, సంగీత నవ అవధానం,మా బాణి – మీ వాణి,ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ తో ముఖా ముఖి, పుష్పాంజలి, స్వీయ కవితా విన్యాసం మొదలైనవి.

Qసాధారణంగా అమెరికా లో అవధానం అంటే చాలా మందికి ఆసక్తి, ప్రతి మహాసభల లోను అవధాన ప్రక్రియ ఒక  ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది. ఈ సంబరాలలో అవధాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?

సంగీత నవ అవధానం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ సృష్టికర్త శ్రీ మీగడ రామలింగ స్వామి గారు నిర్వహిస్తారు. పాట, కీర్తన, గజల్ ని మిగతావారు కూడా ఆదరించినా తెలుగువారు పతాకస్థాయికి తీసుకెళ్ళిన కళాస్వరూపం పద్యం. అలాంటి పద్యాన్ని తెలుగు వారికి అందిస్తున్న అరుదైన కళాకారుల్లో ఒకరు మీగడరామలింగస్వామి గారు. ఈనాడు పద్యాల మాధుర్యాన్ని ప్రధానంగా అవధానాలు చేసే కవుల ద్వారా మనంవింటున్నాం. ఐతే పద్యం సొగసు పూర్తిగా కనిపించేది సంగీత పరిజ్ఞానం ఉన్న గాయకుడు గొంతెత్తిపాడినప్పుడు. సంగీతాన్ని దృష్టిలో పెట్టుకొని రామలింగస్వామి గారు ప్రవేశపెట్టిన ప్రక్రియ సంగీత నవ అవధానం. ‘నవ’ అంటే తొమ్మిది లేక కొత్త. ఏడుగురు ప్రాశ్నికులు(పృచ్ఛకులు), సంధాత, అవధాని కలిస్తే తొమ్మిది. వీరందరూ కలిసి నవ్యంగా చేసే అవధానం నవావధానం. పురాణం, ప్రబంధం, శతకం, నాటకం, అవధానం, ఆధునికం, శ్లోకం అనేవి ప్రాశ్నికుల అంశాలు. ఈ అంశాలలో ప్రాశ్నికులు అడిగిన పద్యాలు అడిగిన రాగంలో అవధాని ఆశువుగా ఆలాపించి ప్రేక్షకులని ఆనందింప జేస్తారు. మీగడ రామలింగస్వామి గారు సంగీత పరిజ్ఞానం అపారంగా కల ప్రముఖ రంగస్థల నటులు. పాండవోద్యోగవిజయాలు, గయోపాఖ్యానం, సత్య హరిశ్చంద్ర, అశ్వథ్థామ, గుణనిధి వంటి అనేక నాటకాలలో ప్రముఖపాత్రధారులు. ఎన్నో పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు రచించారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పరిశీలించి విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రచురించారు. పద్యంలో ఉన్న మాధుర్యాన్ని మీకందించాలని మేము చేసే ఈ ప్రయత్నాన్ని రసహృదయులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

Qఅవధానం లాగే మరో ఆసక్తి కరమైన అంశం సిని సాహిత్యం – ఈ విభాగం లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు?

చలనచిత్ర సాహిత్యంలో భాగంగా “మా బాణి – మీ వాణి” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాము. ఇందులో ప్రముఖ సినిమా కవులు చంద్రబోసు గారు, రసరాజు గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, సిరాశ్రీ గారు పాలుపంచు కుంటారు. వారందరికీ తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఇంతకుముందు వచ్చిన మధురమైన పాటల బాణీలు, తెలుగులో అనువాదం కానివి వారికి ముందు రోజు అందచేస్తే, వారు మరుసటి రోజు కార్యక్రమంలో ఆ బాణీలకు పాటలు రాస్తారు. వీటిని మధుర గాయకులు రాము ఆలాపిస్తారు. ఇందులో ప్రేక్షకులు కూడా పాలుపంచుకునే అవకాశం ఉంది.

Qమీ కార్యక్రమాల వివరాలు చూస్తే, చాలా వరకు కొన్ని కొత్త అంశాలు వాటికి తగ్గట్టు గా కొత్త తరం అతిధులు.  ఈ విషయం లో ఏమైనా ప్రత్యేకత పాటించారా?

తప్పకుండా! ఈనాడు కార్టూనిస్ట్ “ఇదీసంగతి” ఫేమ్ శ్రీధర్ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తున్నాం. ఆయన గురించి తెలియని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదేమో! ఆయనతో ముఖాముఖి, తెలుగు కార్టూన్ల మీద ప్రత్యేక ప్రసంగం ఉంటాయి. సాహిత్యరంగంలో ప్రతిభావంతులైన ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌ గారు ఈ కార్యక్రమాలలో మరో ముఖ్య అతిధిగా పాలుపంచుకుంటున్నారు.  అదేవిధంగా ఈతరం గీతరచయితలలో పంచదార బొమ్మ లాంటి మంచి పాటలను అందిస్తున్న సినీ గేయ రచయిత, గాయకుడు చంద్రబోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Qచివరిగా, ఈ నాట్స్ సాహిత్య సౌరభం – కార్యక్రమ నిర్వహణ ద్వారా మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏమిటి? చూడాలనుకున్న మార్పు ఏమిటి?

తెలుగు భాష, తెలుగు సాహిత్యం అనేవి ఏ కొందరి మేధావుల సొత్తు కాదు. అది అందని ద్రాక్ష కాదు. అది తెలుగు మాతృభాషగా ఉన్నవారందరూ ఆస్వాదించేది. తెలుగు భాష మాట్లాడే వారందరూ తెలుగు సాహిత్యాన్ని చదవాలనీ, తద్వారా మానసిక సంతృప్తే కాకుండా, సామాజిక స్పృహ కూడా పెంపొందుతుందనేది నా నిచ్చితాభిప్రాయం. కాబట్టి సాహిత్య సభలని అందరూ ఆనందించాలని నేను కోరుకుంటాను. ఈ సందర్భముగా సాహిత్య మిత్రులకు, తెలుగు భాషాభిమానులకు నాట్స్ సాహిత్య కార్యక్రమాలకి రావలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను.

 ఇంటర్వ్యూ: షేక్ నసీం

నాట్స్ సాహిత్య పోటీల విజేతలు

nats-logo

డల్లాస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 4,5,6 వ తేదీలలో జరగబోయే 3 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను పురస్కరించుకొని సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు ఈ క్రింది సాహిత్య అంశాలలో పోటీలు నిర్వహించారు.

  • కథలు
  • కవితలు
  • ఫోటో కవితలు
  • ఛందస్సుతో కూడిన పద్యాలు

ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది రచయితలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు.  వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు. ఈ సందర్భముగా ఈ పోటీలలో పాలుపంచుకున్న ఔత్సాహికులైన రచయి(త్రు)తలకు, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీ మిత్రులకు, సాహిత్య కార్యక్రమాల కార్యవర్గ సభ్యులకు, ఈ సాహిత్య పోటీల మరియు నాట్స్ సంబరాల సాహిత్య కార్యక్రమాల సమన్వయ కర్త అనంత్ మల్లవరపు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 5,6 వ తేదిలలో సంబరాలలో భాగంగా జరిగే ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద జ్ఞాపిక  బహుమతి ప్రధానం ఉంటుందని తెలియచేశారు.

 

కథల పోటీల విజేతలు:

మొదటి బహుమతి:  రంగ పిన్ని ఆకాశం – సాయి పద్మ (విశాఖపట్టణం)

రెండో బహుమతి:  గజల్ – రఘు మందాటి  (హైదరాబాద్)

మూడో బహుమతి:  గులాబి ముల్లు – విజయ్ ప్రసాద్ కోపల్లె (కర్నూల్)

 

కవితలపోటీలవిజేతలు:

మొదటి బహుమతి:  కొన్ని రోజుల తర్వాత – నాగరాజు అవ్వారి (గిద్దలూర్)

రెండో బహుమతి: ఈ రాత్రి  – నిషిగంధ (ఫ్లోరిడా)

మూడో బహుమతి:  బాల్యం తిరిగొచ్చింది – ప్రసూన రవీంద్రన్  (హైదరాబాద్)

 

ఫోటో కవితలపోటీల విజేతలు:

మొదటి బహుమతి:  వలని వలచిన వాళ్ళు –  కె.వి.వి.డి.రావు (విశాఖపట్టణం)

రెండో బహుమతి:  పెద్ద సిక్కే పడిందయ్యా! – ఆర్.దమయంతి (నార్త్ కెరోలినా)

మూడో బహుమతి:  ఆశా దీపాలు – వెంకట శాస్త్రి చిలుకూరు  (డల్లాస్)

 

ఛందస్సుతో కూడిన పద్యాలపోటీల విజేతలు:

మొదటి బహుమతి:  తెలుగు భాషకు ‘విజయ’ వత్సరం – రామ మోహన్ అందవోలు (హైదరాబాద్)

రెండో బహుమతి:  పద్యాలు – గరికిపాటి వెంకట సుబ్బావధాని (విజయవాడ)

మూడో బహుమతి:  విశ్వ విజేత – విద్యాసాగర్ అందవోలు (డల్లాస్)