అక్షరాలు కలిసిన వేళ…!

డాలస్ అంటే ప్రవాసాంధ్ర రాజధాని. వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక సభో, సమావేశమో…మొత్తానికి తెలుగు సందడి! అలాంటి డాలస్ లో తానా జరుగుతుందంటే ఇంక ఆ సందడీ అది రేకెత్తించే ఉత్సాహమూ అమితం. పదివేల మందిని ఒక చోట చేర్చిన మెయిన్ హాల్ కార్యక్రమాలూ, పాడుతా తీయగా, జేసుదాస్ కచేరీ లాంటివి అరుదయిన అవకాశాలూ, చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మానందంల కబుర్లూ…తనికెళ్ళ భరణి సినిమా ‘మిధునం’ యూనిట్ కి జరిగిన సత్కారాలూ, ధిమ్ తానా నాట్య సందోహాలూ…ఇవన్నీ మరచిపోలేని అనుభవాలే! ఈ సందడితో పోలిస్తే సాహిత్య సమావేశాల సందడి తక్కువే.

          కానీ, ఈ సారి డాలస్ సాహిత్య మిత్రులు – మద్దూరి విజయచంద్రహాస్, చంద్ర  కన్నెగంటి, మందపాటి సత్యం, వంగూరి చిట్టెన్ రాజు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వురిమిండి నరసింహ రెడ్డి,  సుద్దాల శ్రీనివాస్, జాస్తి  చైతన్య, సింగిరెడ్డి శారద, కాజ సురేశ్, నసీమ్ షేక్, పులిగండ్ల విశ్వనాథం, రాయవరం భాస్కర్   ల  – సారధ్యంలో జరిగిన సాహిత్య సభలు ప్రయోజనకరంగా అనిపించాయి.

          సినిమా పాటని సాహిత్యం గా అంగీకరించలేని స్థితి ఇంకా వుంది.  ఈ సంప్రదాయిక ఆలోచనని బద్దలు కొడుతూ సినిమా పాటల్లోని సాహిత్య విలువల్ని చర్చకి తీసుకు వచ్చే తొలి సభ ఆసక్తికరంగా జరిగింది. పాటల గురువు రామాచారి, గాయని శారదా ఆకునూరి పాటలు పాడగా-  అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, వడ్డేపల్లి కృష్ణ, జొన్నవిత్తుల తమ పాటల నేపధ్యాల్ని వివరించారు.

          మధ్యాన్నం మందపాటి సత్యం అధ్యక్షతన వచనరచనా వైదుష్యంపై చర్చ జరిగింది. ప్రసిద్ధ కథకుడు శ్రీరమణ, వ్యాసకర్త అక్కిరాజు రమాపతి రావు, కథాసాహితి ఎడిటర్ వాసిరెడ్డి నవీన్, రచయిత్రులు వాసా ప్రభావతీ, సూర్యదేవర రామమోహన్ రావు పాల్గొన్నారు. ఇటీవలి వచన సాహిత్య ప్రక్రియల భిన్నత్వాన్ని వక్తలు సింహావలోకనం చేశారు. కోసూరి ఉమాభారతి కథా సంపుటి ‘విదేశీ కోడలు’ని ‘సారంగ’ ఎడిటర్, రచయిత్రి కల్పనా రెంటాల ఆవిష్కరించారు. 2012 కథల సంకలనం  “కథా వార్షిక” ని వాసిరెడ్డి నవీన్ ఆవిష్కరించారు.

          రెండో రోజు “భాష-మనం- సమాజం” సభకి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు. సభని చంద్రహాస్ నిర్వహించారు. గొల్లపూడి మారుతీ రావు, రేజీన గుండ్లపల్లి, గంజి సత్యనారాయణ, అఫ్సర్, కల్పనా రెంటాల ఈ సభలో వివిధ అంశాల గురించి మాట్లాడారు. ఆ తరవాత జరిగిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, గరికిపాటి నరసింహారావుల అవధానం జరిగింది. సాయంత్రం తనికెళ్ళ భరణి “శభాష రా…శంకరా” నుంచి కవితలు చదివి వినిపించారు.

ఎప్పటి నించో కలవాలని అనుకుంటున్న రచయితల్నీ, సాహిత్య మిత్రులనీ కలిశామన్న తృప్తితో ఈ సభలు ముగిశాయి.

ఫోటోలు : కృష్ణ కీర్తి

అవును నిజంగా కవిత్వమొక తీరని దాహమే!

rajyasri2

( డాలస్ లో మే 24 నుంచి జరగనున్న తానా సభల్లో  పాల్గొంటున్న ముఖ్య అతిథుల్లో  ఒకరైన  కేతవరపు రాజ్యశ్రీ సాహిత్య నేపథ్యం )

నా సాహితీ ప్రస్థానం గురించి చెప్పాలంటే నిజానికి మాది సాహితీ నేపధ్యమున్న కుటుంబం. మా పితామహులు కీ||శే|| విద్వాన్‌ మహాకాళి వేంకటేశ్వరరావుగారు చెళ్లపిళ్ల వారి శిష్యులు. జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారు, మా తాతగారు కలిసి చదువుకున్నారు. మా తాతగారు బహుభాషా కోవిదులు. పదవీ విరమణానంతరం ఖ.జు., ఉఊ చేసి విద్యార్జనకి వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు. వీరు ”శ్రీ వేంకటేశ్వర శతకము”, ”రవీంద్రుని జీవిత సంగ్రహము” ”కృష్ణకుమారి”, చరిత్ర విషయక నవలలు, హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ (ఇంగ్లీషులో), జాగ్రఫీలో పాఠ్యాంశాలు, తెలుగు టు ఇంగ్లీషు పాకెట్‌ డిక్షనరీ, ఇలా అనేక ఇతర రచనలు చేశారు. నిత్య విద్యార్థికి మల్లే, డెభై యేళ్ల వయసులో కూడా ఇంగ్లీషులో కొత్త పదాలకు అర్థాలు డిక్షనరీ చూసి తను నేర్చుకుని, మాకు ఆ పదప్రయోగం చేస్తూ వాక్యనిర్మాణం కావించమని చెప్పమని ప్రోత్సహించేవారు. చక్కని భాషా పరిజ్ఞానం, స్ఫూర్తి వారి దగ్గర నుంచి నాకు లభించిన అమూల్య సంపద.

మా నాన్నగారు కీ||శే|| మహాకాళి వేంకటరావుగారు తండ్రిని మించిన తనయులు. కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారి శిష్యులు. అడపా దడపా వారిని మా ఇంటికి పిలిచి, కాలనీ వారందరిని సమావేశపరచి వారి ప్రసంగాలు ఏర్పాటు చేసేవారు. వారు రచించిన రామాయణ కల్పవక్షంలోని పద్యాలు మాచేత బట్టీ కొట్టించి, ఆయన ముందు చెప్పించేవారు. నాన్నగారు వృత్తిరీత్యా ఎ.జి. ఆఫీసులో ఆడిట్‌ ఆఫీసరు, ప్రవృత్తిరీత్యా కవి, నటులు, నాటక రచయిత, జ్యోతిష వాస్తు శాస్త్ర పండితులు. ”అయోమయం”, ”అదేమిటి” అనే హాస్య నాటకాలు రచించి, నటించారు. ఎ.జి. ఆఫీసులో ”తెలుగు నాటక సమితి”, ”రంజని” సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులు.
జ్యోతిష శాస్త్రంలో విశేషప్రతిభ కనపరచినందుకు ”దైవజ్ఞ శిరోమణి” అనే బిరుదును పొందారు. శ్రీ లలితా ఉపాసకులు. చిన్నతనంలోనే మాకు ”లలితా సహస్రనామ” పారాయణం, పూజావిధానం నేర్పించారు. తనతోపాటు కవిసమ్మేళనాలకూ, సాహితీ సమావేశాలకు తీసుకెళ్లేవారు. మా అమ్మ శ్రీమతి ప్రభావతి ప్రముఖ వీణావిద్వాంసురాలు. సంగీత సాహిత్యాల నేపధ్యంలో పెరగడం వలన, అమ్మ నుంచీ వీణ వాయించడం, నాన్న దగ్గర నుంచి సాహిత్యాభిలాష సహజంగా అలవడినాయి.

 

చేతన ఆవిర్భావం :
1991లో ”చేతన సచివాలయ సారస్వత వేదిక” అనే సాహితీ సంస్థ ఆవిర్భవించినది. కొంతమంది సాహితీమిత్రులు కలిసి ‘చేతన’ అనే మొక్కని నాటారు. యాంత్రికమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు, వారి అంతరంగాల్లో కవిత్వం పట్ల నిగూఢంగా వున్న ఆర్తిని తృప్తిపరచి మనోల్లాసం కలిగించడానికి   ”చేతన” సంస్థ ఆవిర్భవించింది. చేతన నెలనెలా సాహితీ వెన్నెలలు వెదజల్లుతూ, చర్చలూ-గోష్ఠులూ, కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చింది.
అనేకమంది ప్రముఖ సాహితీమూర్తులు ‘చేతన’ వేదిక మీద ప్రసంగించారు. శ్రీయుతులు మధురాంతకం రాజారాం, ఆచార్య తిరుమల, అద్దేపల్లి రామ్మోహన్‌రావు, తనికెళ్లభరిణి, నండూరి రామకృష్ణమాచార్య ఇలా అనేకమంది సాహితీవేత్తలు ప్రసంగించి సచివాలయ కవులకూ రచయితలకూ స్ఫూర్తినిచ్చారు.

అప్పటి నుంచి అన్ని పత్రికలకు నా కవితలు పంపడం, అవి ప్రచురింపబడటం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.
తరువాత వరసగా అన్ని ప్రక్రియలలో కవితలు రాయాలని ”సిసింద్రీలు” అనే మినీ కవితల సంకలనం, ”వెన్నెల మెట్లు” అనే రెక్కల ప్రక్రియలో పుస్తకం, అలాగే సాహితీకిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు గారి మానస పుత్రిక, ”వ్యంజకాలు” అనే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఆయనకంటే ముందు నేనే 108 వ్యంజకాలు రాసి ”బొమ్మబొరుసు” అనే పుస్తకం వెలువరించాను.

‘అక్షరం’ మీద కవిసమ్మేళన సభలో పాల్గొని ”అక్షరం నన్ను వేధిస్తోంది” అనే కవిత చదివాను. ఈ అక్షరం అప్పటి నుంచి నన్ను వెంటాడి, చివరకు అక్షరం మీద 108 ముక్తకాలు రాసి ”అక్షర కేతనం” అనే పుస్తకం వెలువరించాను.

తరువాత ”తృప్తీ నీవెక్కడ” (2011)లో వచన అనే కవితా సంకలనాన్ని కూడా వెలువరించాను.

”ఊహల వసంతం” కవితా సంకలనానికి విశ్వసాహితీ సంస్థవారు ఉత్తమ గ్రంధ పురస్కారం, అలాగే నెల్లూరు సృజన సాహిత్య వేదికవారి ఉత్తమ గ్రంధ పురస్కారం లభించాయి. రెండో హనీమూన్‌ అనే కవితకు ఉత్తమ హాస్యకవితా పురస్కారం లభించింది.

మా అమ్మ ప్రభావతిగారితో ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్లడం, నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న భగవద్గీత, నాలో కొంత ఆధ్యాత్మికతను పెంపొందించాయి. ఎవరెన్ని పుస్తకాలు రాసినా, తృప్తి అనేది సంతృప్తిలోనే వుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ”సాహితీ కిరణం” మాసపత్రికలో ఆధ్యాత్మిక కాలమ్‌ నిర్వహిస్తూ చిన్న చిన్న కధలతో ఆధ్యాత్మిక గుళికలను అందరికీ అర్థమయ్యే విధంగా రాస్తున్నాను. ఆధ్యాత్మికత అంటే అదేదో ముసలివాళ్లకి సంబంధించిన విషయంగా చాలా మంది అనుకుంటారు. అందుకే ఆధ్యాత్మికతను నిత్య జీవితంలో జరిగే సంఘటనలతో పోలుస్తూ చిన్న చిన్న కధల ద్వారా వ్యక్తీకరించాను. విద్యార్థులు సైతం వీటిని చదివి, మాకు ఇలాంటి విషయాలు తెలియవండీ, ఇవి చదివిన తరువాత మాకు చాలా విషయాలు తెలిసాయంటూ ఉత్తరాల వర్షం కురిపించారు.
వీటన్నిటినీ సంకలంన చేసి ”నీలోకి నువ్వు” ”ఆధ్యాత్మికత వృద్ధులకేనా” అనే రెండు ఆధ్యాత్మిక గుళికల పుస్తకాలు వెలువరించి డా|| రమణాచారి, ఐఎఎస్‌గారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశాను. ఇప్పటివరకు 10 పుస్తకాలు, అనేక సామాజిక వ్యాసాలు, కొన్ని కథలు రాశాను.

అలా మొదలైన నా సాహితీ ప్రస్థానం, ఇప్పుడు హైదరాబాదులోని సాహితీ సంస్థలన్నిటి ద్వారా సత్కారాలు పొందడమే కాక వారివారి సభలలో నన్ను వివిధ హోదాలలో ఆహ్వానించి, గౌరవిస్తున్నారు. శ్రీ త్యాగరాయగానసభలో ప్రత్యేకంగా నా చేత ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు.
”కవిత్వం ఒక తీరని దాహం” అన్నారు శ్రీశ్రీ. అది నా పట్ల నూటికి నూరుపాళ్లూ నిజమనిపిస్తోంది. మొదట్లో నేను సాహిత్యం మీద మక్కువ చూపిస్తే ఇప్పుడు సాహిత్యం నన్ను వెంటాడుతోంది.  నాకు స్ఫూర్తిదాతలైన మా తాతగారు, అమ్మానాన్నలు, ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
బిరుదులు
1. ”సాహిత్య శ్రీ” – అఖిల భారతీయ భాషా సమ్మేళన్‌ భోపాల్‌ వారిచే
2. ”ప్రజ్ఞాశ్రీ” – శ్రీ కిరణ్‌ సాంస్కృతిక సంస్థ వారిచే
పురస్కారాలు
1. ”మదర్‌ థెరిసా” – షి ఫౌండేషన్‌ వారిచే
2. ”స్త్రీ శక్తి” – కళా నిలయం వారిచే
3. ”కళా పురస్కారం” – జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ వారిచే
4. ”ఉత్తమ మాతృమూర్తి పురస్కారం” – సుధా ఆర్ట్స్‌ వారిచే
5. ”సాహితీ పురస్కారం” – తంగిరాల ఫౌండేషన్‌ వారిచే
6. ”ఉత్తమ రచయిత్రి” – విశ్వసాహితీ వారిచే
7. ”ఉత్తమ కవయిత్రి” – రావూరి కాంతమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ వారిచే
8. ”ఉగాది పురస్కారం” & ”సంక్రాంతి పురస్కారం” – వైష్ణవి ఆర్ట్స్‌ వారిచే
9. ‘దసరా’ పురస్కారం – చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే
10. టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక పురస్కారం – పద్మసాహిత్య పరిషత్‌ వారిచే
11. సప్తపదిలో తోడు నీడ పురస్కారం – జి.వి.ఆర్‌. ఆరాధన వారిచే
12. దామోదరం సంజీవయ్య స్మారక పురస్కారం – సాంఘిక సంక్షేమ శాఖ, ఆం.ప్ర. వారిచే
13. పట్టాభి మెమోరియల్‌ పురస్కారం – పట్టాభి కళాపీఠం వారిచే

పాట అంటే ‘ఎలక్ట్రిక్ గిటార్’ మోత కాదు: వడ్డేపల్లి కృష్ణ

వడ్డేపల్లి కృష్ణ

వడ్డేపల్లి కృష్ణ

   (  మే 24-26 వరకు డాలస్ నగరం లో జరుగనున్న ‘ తానా’ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రత్యేక అతిథుల్లో ఒకరైన వడ్డేపల్లి కృష్ణ గారి సాహిత్య నేపథ్యం )

బాల్యంలో మా వూరు (సిరిసిల్ల) ప్రక్కనే ప్రవహించే  మానేరులో స్నానం చేస్తూ, నాటి జానపద సినిమాల ప్రభావంతో ఏటి ఒడ్డున ఏపుగా పెరిగిన తుంగల్ని పీకి కత్తులుగా ఝళిపిస్తూ, ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిపేవాళ్లం. హైస్కూలు వరకు రోజులు అలాగే గడిచిపోయాయి. హాయిగా ఇప్పటిలా ‘ఎంసెట్’ టెన్షన్స్ లేవు గనుక స్కూలు అయిపోగానే సాయంత్రం వాలీబాల్, హాకీ ఆడుకునేవాళ్ళం. అనేక డ్రామాల్లో వేషాలు వేసేవాళ్ళం. ఆ డ్రామాలు నన్ను నటునిగానే గాక రాను రాను రచయితగా, ఆ తర్వాత అనేక సీరియళ్లు, సినిమా, డాక్యుమెంటరీలకు దర్శకునిగా తీర్చిదిద్దాయి. మా తెలుగుపండితుల కనపర్తి, నందగిరి  అనంత రాజశర్మగార్లు వ్యాకరణం యొక్క గొప్పతనాన్ని వివరించడం వల్ల ఆ రోజుల్లోనే చందస్సు బాగా ఒంటబట్టించుకున్నాను.


1966లో నేను నిజాం కాలేజీలో P.U.C చదువుతున్న రోజుల్లో హాస్టల్లో నా రూంమేట్స్‌గా డిగ్రీ చదువుతున్నవాళ్ళు వుండేవారు. వాళ్లకు రాని చందస్సును గణవిభజనను నేను చేసి చూపిస్తే ఆశ్చర్యంగా చూసేవారు. ఆ తర్వాత మాత్రాచ్చందస్సును కూడా మధించి, డా.సి.నా.రె. రచించిన లలితగీతం “సాగుమా ఓ నీలమేఘమా! గగన వీణా మృదుల రాగమా” మరియు దేవులపల్లి రచించిన సినీలలితగీతం “మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే!” అనేవి నాన్ను బాగా ఆకర్షించాయి. అలాంటీ గీతాల్ని నేనూ రాయాలన్న సంకల్పాన్ని కలిగించాయి. క్రమక్రమంగా నాచేత వందకుపైగా సినీగీతాల్ని వేయికి పైగా లలితగీతాల్ని భావయుక్తంగా రచింపచేసాయి.

1968 ఏప్రిల్‌లో ఒకనాటీ పున్నమిరాత్రి విశాఖ సముద్రతీరంలో ఉప్పొంగివచ్చే అలల్ని చూస్తూ అలవోకగా..
శిథిల శీల్పాల దాగిన – కథలగూర్చి ఎవడెరుగును ?
చితికిన బతుకుల లోపలి – వెతల గూర్చి ఎవడెరుగును ?
వాడిన కుసుమాలలోని – ఏడుపులను ఎవడెరుగును ?
వీడిన ప్రేమికులలోని – విరహాగ్నుల నెవడెరుగును ?
మినుకు మినుకు మను తారల – కునికిపాట్లనెవడెరుగును ?
సంద్రము చందురునకు గల – సంబంధమ్మెవడెరుగును ?
………………………………………………………

అంటూ ‘ఎవడెరుగును?’ అనే గేయం ఊపిరి పోసుకొని “స్రవంతి” జూన్ మాసపత్రికలో ప్రచురించబడింది. ఆ తర్వాత అనేక కవితలు ఆనాటి కృష్ణా పత్రిక, ప్రజామత, ప్రగతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి తదితర పత్రికల్లో వెలువడ్డాయి. 1963లో ‘లలితసంగీతం’ కోసం రచించిన నా  తొలిగీతి.

కనరా నీ దేశం! వినరా నా సందేశం!
కనులు తెరచి ఒక్కసారి కనరా నీ దేశం !
మనసుల్ని మంచినెంచి వినరా సందేశం!
//క//
నిత్యము దారిద్ర్యమ్మే నర్తించెను నేడు
సత్య, శాంతి సంపదలను స్థాపించగ చూడు.
//క//
ఆకశవాణిలో ప్రసారమైంది. ఆ తర్వాత నాకు బాగా పేరు తెచ్చిన “ఈ మా పాట”
జగతిరధం జైకొడుతూ ప్రగతిపథంపై పోటీ..
ప్రగతిపథం పైన జగతి పండువెన్నెలై రానీ…
స్వార్ధానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి..
అది యే దేశాభ్యుదయపు అందమైన పునాది..

అనేది 1972లో ప్రసారమైంది. అప్పటినుంచి నా లలితగీత జైత్రయాత్ర అవిచ్చిన్నంగా కొనసాగుతూ, ‘లలితగీతాలు’ అనే అంశం మీదే నేను ప్రప్రధమ ప్రామాణిక పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందేలా చేసింది. క్రమంగా ‘దూరదర్శన్లోనూ నా లలితగీతాలనేకం ప్రసారమయ్యాయి. ఆ తర్వాత ‘సంక్రాంతి’, ‘మూడుపువ్వులు ఆరుకాయలు కల్యాణం’, ‘గేయనాటికలు’ తో పాటుగా, ‘ఉగాదివేళ- వసంతహేల’ సంగీత నృత్యరూపకం1989లో ‘నేషనల్ నెట్‌వర్క్’లో దేశమంతా ప్రసారమై మంచి పేరు తెచ్చింది. దూరదర్శన్‌లో ప్రసారమైన దేశభక్తి గీతాలు.

1. భరతభూమి నా దేహం – భరతజాతి నా దేహం!
మంచిని పరిపాలించే మానవతకు దాసోహం!
2. మనమంతా బంధువులం! మానవతాసింధువులం!
భారతపద్మంలో ఉదయించిహ్న తీయని తేనియ బిందువులం!

అనేవి మాజీప్రధాని వాజ్‌యేయి గారిచే దేశభక్తి గీత ఉత్తమ రచయితగా 1996లో సత్కరింపజేశాయి. 1987లో ఎన్.టి.ఆర్ మొదలిడి ఇటీవలి కె.రోశయ్యగార్ల వరకు అందరు ముఖ్యమంత్రులచే రాష్ట్రకవిగా సన్మానాల్ని అందజేశాయి. 2006 మరియు 2009 టివి.నంది అవార్డ్స్ కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరింపజేశాయి. 2003లో జరిగిన 13వ బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ‘జ్యూరీగా’ స్థానం  కల్పించాయి. ఏడు సంవత్సరాలు ‘సెన్సార్ బోర్డు (2005-2011) సభ్యునిగానూ అవకాశం కలుగజేశాయి.
సెప్టెంబర్ 1995లో నేను రచించిన

మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి
జగమంతా ఒక్కటనే మంచి  రోజు రావాలి
మల్లిక మల్లికను చేరి మాలగ రూపొందును గాని
మాలను మలిచేందుకు ఒక దారమె ఆధారముగా.

అంటూ సాగిపోయే గీతం, ఆ నెలంతా ఆకాశవాణి అన్ని కేందరాల ద్వారా తెలుగు ‘సామూహిక గానం’గా ప్రసారమై, నాకేగాక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపును కలుగజేసింది.
నేను 1) కనరా నీ దేశం (గేయ సంపుటి) 2) అంతర్మధనం (కవితాసంపుటి) 3) వెలుగుమేడ ( గేయనాటికల సంపుటి) 4) వసంతోదయం (గేయ కథా కావ్యం) మొదలగు కావ్యాల్ని వెలువరించాక 1979లో ప్రథమ ప్రయత్నంగా బహు ప్రజ్ఞాశాలిని భానుమతిగారిని కలువగా సహృదయంతో ఆమె తాను చిత్రీకరిస్తున్న ‘రచయిత్రి’ చిత్రంలో బాణీకి పాటను రాసే అవకాశాన్ని కలిగించింది. ఆ తర్వాత నట సామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావుగారు తమ అన్నపూర్ణా ప్రొడక్షన్ వారి ‘పిల్ల జమీందార్’ చిత్రంలో మెలోడీ ప్రధానమైన
“నీ చూపులోన విరజాజివాన!
ఆ వానలోన నేను తడిసేనా? హాయిగా “
అనే యుగళగీతాన్ని చక్రవర్తిగారి బాణీకి రచించే సదవకాశాన్ని కలిగించారు. డా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ గానం చేయగా ఆ రోజుల్లో ‘ సిలోన్’ ద్వారా మారుమ్రోగి, ఎంతో పేరు తెచ్చింది. కాని ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్‌లో సినిమా ఫీల్డ్ మద్రాస్‌లో వుండడం వల్ల ఎక్కువ అవకాశాల్ని పొందలేకపోయాను. అయినప్పటికీ గిడుతూరి సూర్యంగారి ‘అమృతకలశం’, కె. రాఘవగారి ‘పెళ్ళిళ్లోయ్ పెళ్లిళ్లు” మరియు ‘యుగకర్తలు (దర్శకుడు ఆదిత్య), పి.ఎన్. రాంచంద్రరావుగారి ‘లీడర్’, మౌళిగారి ‘అందరూ అందరే’ మొదలగు చిత్రాలకు మరికొన్ని గీతాలను రచించాను. ఆ తరవాత 1993లో ఏ. ఎం. రత్నంగారి ‘పెద్దరికం’ చిత్రానికిగాను ‘రాజ్-కోటి’ స్వరాలకు

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తెవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
మురిపాల తేలించ మునిమాపులో
దివినుంచి రేరాజు దిగి వచ్చులే.

అనే డ్రీమ్ సాంగ్ రచించి రాణించాను.ఇప్పటివరకు వచ్చిన ‘టాప్ టెన్’ సినిమా పెళ్ళిపాటల్లో నా పాటకు నాలుగవ ర్యాంక్‌ను యిచ్చి ‘గూగుల్’ ఆదరించడం ఆనందంగా వుంది. ఆ తర్వాత 1994లో సింగితం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన “భైరవద్వీపం”చిత్రంలో ‘క్లైమాక్స్’లో

అంబాశాంభవి భద్రరాజస గమనా..
కాళీ హైమవతీశ్వరిత్రినయనా..
అమ్మలగన్న అమ్మవే! ఈ అమ్మ మనసునే ఎరుగవా
ఒక అమ్మగా నువ్వు కరగవా?…

అనే పల్లవి గల పాటను రచించి, ప్రఖ్యాతి గాంచాను. ఆ తర్వాత రేలంగి నరసింహారావుగారి దర్శకత్వంలో హీరో నరేశ్‌గారి ప్రోత్సాహంతో “మొగుడు పెళ్లాల దొంగాట”లో చందన్‌రాజ్ – సంగం వెంకటేశ్వరరావుగారి ప్రోత్సాహంతో ‘ఏంటీ బావా మరీను?” చిత్రాల్లో సినీగీతాల్ని భావప్రధానంగా రచించగలిగాను. వాటికి రాజ్‌కోటి, విద్యాసాగర్ చక్కని స్వరాల్ని సంపకూర్చారు. ఇలా అనేక చిత్రాలకు సినీ గీతాల్నే గాక 2004 నుండి అమెరికా ‘ఆటా’కు వరుసగా మూడుసార్లు 18వ ‘తానా’కు కూడా అర్ధవంతంగా స్వాగత గీత సంగీత నృత్య రూపకాల్ని రచించాను.
‘అమృత కలశం’ చిత్రానికి గాను నేను రచించిన జావళి
సిగ్గాయె సిగ్గాయెరా! స్వామి
బుగ్గంత ఎరుపాయెరా
సద్దుమణిగినవేళ నీ ముద్దు సరసాల
నాకెంతో సిగ్గాయెరా!
చిగురు పెదవులలోన తగని కోరికలాయె
ఎదలోని కోరికలు ఎగిసి శారికలాయె!..  //సి//

అంటూ సాగిపోయే గీతాన్ని రమేశ్‌నాయుడుగారు మనోహరంగా మలచి, సుశీలగారిచే సుమధురంగా పాడీంచారు. నా అదృష్టంకొద్ది భానుమతి, రమేశ్‌నాయుడు, చక్రవర్తి, రాజ్-కోటి, విద్యాసాగర్, ఇళయరాజా మొదలగు గొప్ప సంగీత దర్శకుల స్వరాలకు పాటలు రాసే అవకాశం చిక్కింది. అలాగే ఎ.ఆర్.రెహమాన్‌గారి స్వరాలకు ‘పోలీస్ కర్తవ్యం’, ‘గూధచారి నెం 1’ మొదలగు డబ్బింగ్ చిత్రాలకు తెలుగుదనం ఉట్టిపడే గీతాల్ని రచించే భాగ్యం నిర్మాత ప్రతాపరాజుగారి ద్వారా దక్కింది. అవి ఇప్పటికీ ‘జెమిని’ టీవీలో అనేకసార్లు ప్రసారమై ప్రజాదరణ కలిగించాయి. ఎందుకంటే ప్రస్తుతం ‘బీట్’ ప్రధానంగానే పాటలు వస్తున్నాయి. ‘బీట్’కు తగిన పదాల్ని ఎంచుకొని రచించగలగడం వల్ల పాటలోని సాహిత్యం కూడా ప్రసన్నంగా వినబడి, అవి హిట్ కాగలిగాయి. పాట అనేది కేవలం వింటే కాదు పేపర్ మీద చూసినా భావయుక్తంగా కనిపించాలి. మచ్చుకు నేను దర్శకత్వం వహించిన  ‘ఎక్కడికెళ్తుందో మనసు?’ అనే చిత్రం కోసం తెలుగు భాష – సంస్కృతి ఔన్నత్యాన్ని కొనియాడుతూ రచించిన రాజ్-దీప్ (బాలుగారి గాత్రంలో) స్వరపరచిన

తేటతేనెల చిలుకు పలుకు నా తెలుగు!
రాజహంసల కులు తళుకు నా తెలుగు!
అద్భుత సంస్కృతి విరియు రెమ్మ నా తెలుగు!
అమృతధారల కురియు అమ్మ నా తెలుగు!
ఆ తెలుగు తల్లికి అభివందనం!
అనురాగవల్లికి శ్రీచందనం!

అనే గీతాన్ని గమనించవచ్చు! నా దృష్టిలో పాట అనేది ప్రసన్నంగా వీణానాదంలా వినబడాలిగాని, బీట్ ప్రధానమై రూట్ మార్చుకొని ‘ఎలక్ట్రిక్ గిటార్’ మోత కాకూడదు.
‘దూరదర్శన్’లో, జెమిని, భక్తి టీవీలో దశాబ్దానికి పైగా పునఃహ్ప్రసారమవుతున్న ‘భక్తికవి పోతన’, ‘భారతీయ సంస్కృతి శిఖరాలు’, ‘శ్రీ గురురాఘవేంద్ర స్వామి'(దర్శకులు – కె.రాఘవేంద్రరవు) సీరియల్స్ నాకు రచయితగా, దర్శకునిగా సంతృప్తిని సమకీర్తిని కలుగజేశాయని సగర్వంగా చెప్పుకోగలను.

గీతా(నా)oజలి గీత రచన పోటీలు

TaNa COMPETITION -1ఒకప్పుడు తెలుగు జాతి గురించిన ప్రబోధ గీత రచనలో పోటీలు నిర్వహిస్తే చేయెత్తి జైకొట్టు తెలుగోడా,పాడరా ఓ తెలుగువాడాలాంటి అజరామరగేయాలు వెలువడ్డాయి. అదే స్ఫూర్తితో, డాలస్ లో మే 24-26 తారీఖుల్లో జరుగనున్న 19వ తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మహాసభల సందర్భంగా, గీతా(నా)oజలి పేరుతో తెలుగు భాష వస్తువుగా గేయ రచన పోటీలు నిర్వహిస్తున్నాము. వివరాలు ఇలా వున్నాయి.
అ)పాట తెలుగుభాషను అంశం గా తీసుకుని వ్రాయాలి.
ఆ)పోటీలో 19వ తానా సాహిత్య వేదిక సభ్యులు తప్ప ఎవరైనా, ప్రపంచం ఏమూల నుండైనా పాల్గొనవచ్చు.
ఇ)చక్కని చిక్కని కవిత్వం, క్రొత్తదనం,శిల్పం, గాన సౌలభ్యం కొలమానాలు గా ప్రముఖ పాటలరచయితలు విజేతలను ఎంపిక చేస్తారు.
ఈ)మొదటి బహుమతి పొందిన పాటకు రూ. 10116, రెండవ బహుమతి పొందిన పాటకు రూ. 5116, మూడవ బహుమతి పొందిన రచనకు రూ. 3116 నగదు బహుమతులు ఇవ్వబడతాయి. వీటితో పాటు ఉత్తమంగా వున్న పాటలు తానా, ఆంధ్రజ్యోతి పత్రికలలో ప్రచురించబడటమే కాకుండా, స్వరపరచబడి, రికార్డు చేయబడి, తానా వెబ్సైటు లో అందరి సౌకర్యార్థం పొందుపరచబడతాయి.
ఉ)మీ రచనలు literary@tana2013.orgకి ఇ-మెయిల్ ద్వారా PDF, JPEG లేకUnicode ఫార్మాట్లలో పంపండి. రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ మే 3, 2013. ఈ తేదీలోపు, వీలైనంత త్వరగా పంపగలిగితే మరీ మంచిది.
ఊ)తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. దీనిలో వాద ప్రతివాదాలకు ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు
ఈ పోటీలో ఔత్సాహిక కవులనుండి విశేషంగా స్పందన వస్తుందని చిరస్మరణీయమైన పాటలు జాతికి లభిస్తాయనీ ఆశిస్తున్నాము.
మద్దుకూరి విజయ చంద్రహాస్
19వ తానా సాహిత్య వేదిక సమన్వయకర్త