స్వేచ్ఛ

Siva

తెనాలిలో పుట్టి పెరిగి గత పదహారేళ్లుగా అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్నాను. “మై హార్ట్ ఇస్ బీటింగ్..అదోలా” అనే సినిమాకి డైలాగులు వ్రాయటంతో,

నా రచనా వ్యాసంగం మొదలయ్యింది. తరువాత రెండు షార్టు ఫిల్ములకు స్క్రిప్ట్ లు, సినిమాల కోసమని అనేక కథలు (అవి తీసే సాహసవంతులు ఇంకా ఎదురవ్వలేదు)
వ్రాసాను. వాకిలిలో కథల ద్వారా నాకు తెలుగు సాహితీరంగంతో పరిచయం ఏర్పడింది. నా కథలు వాస్తవికతకి దూరంగా, సినిమాటిక్ గా ఉంటాయన్న అభియోగం ఉంది.
నేను ఆ “నేరాన్ని” అంగీకరిస్తూనే, “సినిమాటిక్ అవాస్తావికతకి”, నేటి తెలుగు కథలలో కనిపిస్తున్న “రియలిజానికి” మధ్య, “మిడిల్ గ్రౌండ్” ని వెతుక్కుంటూ, నా

కథలలో నా ముద్ర మాత్రం ఒకటి వేద్దామనుకుంటున్నాను.  నాకు కథలతో పాటు సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తి ఉంది.

   ***
Swetcha1
“నీక్కాబోయేవాడు ఎలా ఉండాలే?” అరకిలోమీటరు జాగ్ వల్ల కలిగిన ఆయాసంతో బరువుగా ఊపిరి పీలుస్తూ అడిగింది సుజాత.

మూడు కిలోమీటర్ల దూరాన్నిసునాయాసంగా పరిగెత్తి, సుజాత అలసట వల్ల ఆగిన స్వేచ్ఛ, దానికి బదులిస్తూ, “నావి చాలా చిన్న కోర్కెలే..అతడు బయట ప్రపంచానికి కాన్ఫిడెంట్, ఆర్టిక్యులేట్, మెట్యుర్ పర్సనాలిటీని, నా ఎదుట మాత్రం ఒక చిన్న పిల్లాడి లాగా నా ఒడిలో ఒదిగిపోయే మెంటాలిటీ కలిగి ఉండాలి”
“ఊ..ఇంకా?”

“పదునైన సెన్స్ ఆఫ్ హ్యుమర్, కంట తడి చూపించటానికి భయపడని నైజం, ఒక మంచి సోషల్ సర్కిల్, నా కంటే ఈ ప్రపంచంలో తనకెవ్వరూ ఎక్కువ కాదన్నట్లుండే స్వభావం, ఆర్ట్స్ అంటే ఆసక్తి, కావాలనిపించినప్పుడల్లా నాకు ఆసరా ఇచ్చే భుజం… ఇలా ఏవో చిన్న చిన్న లక్షణాలుంటే చాలే! మిగిలినవాటితో నేను సర్దుకు పోతా..” అంటూ ఒక చిలిపి నవ్వుతో ముగించేసింది స్వేచ్ఛ.

“నీకు చిన్నప్పుడు మీ అనాధశరణాలయంలో ఏమి నేర్పించారో కానీ..బాగానే ఎక్కింది…పిచ్చి! నీకు కావాల్సిన ఈ లక్షణాలు ఒకడిలో ఉన్నాయంటే..వాడికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్నమాటే!” తేల్చేసింది సుజాత.

కొంచెం సీరియస్ గానే, “నేను పెరిగిన చిన్నప్పటి వాతావరణం వల్లే కావచ్చు…నాకు అందరి ఆడపిల్లల లాగా ఆలోచించటం రాదే…నాలో ఎందుకో, ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ ఏర్పర్చిన రూల్స్ అన్నీ చెరిపేసి, ఒక మగాడి కున్న స్వాతంత్ర్యాన్నీ, బాధ్యతలేనితనాన్నీ అనుభవించెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. కరణేషు, భోజ్యేషు, శయనేషు, నా బొందేషు అంటూ స్త్రీల నించి రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళనించి, ఆ మాత్రం లక్షణాలు ఆశించడం తప్పుకాదనుకుంటాను?” సంధించింది  స్వేచ్ఛ.

“ఆశించటం తప్పు కాదు కానీ..ఆచరించటం నీ వల్ల కాదే. నీకు రాసిపెట్టి ఉన్నవాడు ఎదురైనప్పుడు, లక్షణాలు లెక్కెట్టటానికి నీ మెదడు పని చేయదు..మనసు మాత్రమే పని కట్టుకొని నిన్ను పడేస్తుంది…అతడి ప్రేమలో”
“అదీ చూద్దాం…ఆఫీసుకి టైం అవుతోంది. ఈ రోజు మన బ్యాంక్ లో ఎవరో కొత్త ఎంప్లాయీ జాయిన్ అవుతున్నాడు.. ఇన్వెస్ట్మెంట్స్ సెక్టర్ లీడ్ కాబట్టి, అతడిని నేనే రిసీవ్

చేసుకోవాలన్నాడు..బాస్.” జాగ్ చేసుకుంటూ తన అపార్ట్మెంట్ వైపు మళ్ళింది స్వేచ్ఛ.

***

“సూర్య..”

“స్వేచ్ఛ..”

“చాలా అందమైన పేరు…”

“పేరొక్కటేనా?”

“ఇప్పుడే కదా కలిసింది…ఇంకా ఏమేం నచ్చాయో అప్పుడే చెప్పేస్తే బాగోదేమో నని….”

“నాట్ బ్యాడ్.. కొత్తగా జాయిన్ అవుతున్నారంటే, ఎవరో ఫ్రెషర్, ర్యాగింగ్ చెయ్యచ్చనుకున్నాను.. కాన్ఫరెన్స్ రూమ్, దిజ్ వే”

***

“మొదటి రోజు కాబట్టి, ఈ రోజు మీ లంచ్ కి కుడా, నేను పే చేస్తున్నాను”

“ధాంక్ యూ…ఇందాక ట్రైనింగ్ లో, మన బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి…మీతో క్లియర్ చేసుకోవాలి.”

“సారీ సూర్యా..లంచ్ టైంలో వర్క్ విషయాలు అస్సలు మాట్లాడను..”

“వెరీ గుడ్..పర్సనల్ విషయాలు మాట్లాడుకొని ఒకరి నొకరు తెలుసుకోవచ్చన్న మాట.”

“పరిచయాలు పెంచుకోవాలని చాలా తొందరగా ఉన్నట్టుందే..మన వర్క్ మ్యాటర్ చాలా కాన్ఫిడెన్షియల్..ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు అని.”

“ఆ.. ఒకే.. సేఫ్ సైడ్ కి పర్సనల్ మ్యాటర్సే బెటర్…. నేను ఇంజనీరింగ్ వరంగల్ లో చేసాను. యం.బి.ఎ, ఐ.ఐ.యం అహ్మదాబాద్ లో..మా నాన్నగారు……”
సూర్య చెప్పిన దంతా విని,  స్వేచ్ఛ, “మీకు కళలంటే ఆసక్తి ఉందా?”

“మీరు మళ్ళీ ర్యాగింగ్ మొదలెట్టేశారు….”

“లేదు..సీరియస్ గానే అడుగుతున్నాను…సాహిత్యం, సంగీతం, నాట్యం…ఇలాంటివి”, చిరునవ్వును, పంటితో బిగిస్తూ.

“నాకు అంత పాండిత్యం లేదు…రహమాన్, సీతారామ శాస్త్రి, ప్రభు దేవా నా ఫేవరెట్స్. నవలలు ఎక్కువ ఇంగ్లీష్ వే చదువుతాను.”

“అర్ధం అయ్యింది..ఇక వెళ్దామా?”, తన లంచ్ ట్రే తీసుకొని లేచింది, స్వేచ్ఛ.

“అయ్యో..నా గురించి అంతా చెప్పను కాని…మీ గురించి తెలుసుకోటానికి టైం సరిపోలేదు”

“ఫర్లేదు..ముందు ముందు చాలా టైం ఉంటుంది. ఒకే డివిజన్ లో ఉన్నాం కదా…”

***

“బై స్వేచ్ఛ..” అంటూ పార్కింగ్ వైపు నడుస్తున్నసూర్యని చూసింది  సుజాత.

“వావ్…చాలా హ్యాండ్సం గా ఉన్నాడే, మీ కొత్త కుర్రాడు.”
“నాట్ బ్యాడ్..వెరీ షార్ప్ ఫెలో”

“మరింకేం…ఇంక కౌంటింగ్ మొదలెట్టు, నీక్కావల్సిన లక్షణాలు..”

“నువ్వే చెప్పావు కదా…మెదడు ఆగిపోతుంది..అది, ఇదీ అని…అంత సీన్ ఉన్నప్పుడు చూద్దాం”

***

“మనం కలిసిన ఈ నాలుగు నెలల్లో, వర్కులోను, బయటా నీతో స్పెండ్ చేసినంత టైం ఇప్పటి వరకూ ఏ అమ్మాయితోనూ చెయ్యలేదు తెల్సా!” సినిమా హాల్లో, పక్కనే కూర్చొన్న స్వేచ్ఛతో అనేశాడు  సూర్య.

“నిన్ను ఇంత కాలం భరించిన అమ్మాయి ఎవరూ లేరంటావ్..అంతేనా?” కొంటెగా బదులిచ్చింది   స్వేచ్ఛ.

“జోకద్దు. ఎన్నో విషయాలు పంచుకొన్నాం. నేనెప్పుడూ చెప్పకపోయినా, నువ్వంటే నాకు పిచ్చ, పిచ్చ, ఇష్టం అని నీకు తెలిసే ఉంటుంది. నువ్వే నా గురించి ఏమనుకుంటున్నావో, నాకు క్లారిటీ రావట్లే!” సీరియస్ గానే అడిగేశాడు సూర్య.

“నీ పైన ఇష్టాన్ని నేను చెప్తే గానీ తెలుసుకోలేనంటావ్? నీతో పాటు సినిమాలు, షికార్లు లాంటివి చేసినా నీకు అనుమానమే నంటావ్? అందుకే నువ్వు నాకు చాలా, చాలా నచ్చావ్!”, తేరుకొనే లోగా, ఒక్క సారి సూర్య పెదాలను తన పెదాలతో లిప్త పాటు తడి చేసింది స్వేచ్ఛ. సినిమా మొదలయ్యింది.

***

“నేను కోరినవన్నీ ఉన్నాయా అంటే… లేవనే చెప్పాలి. నిజంగానే అన్నీ కావాలా అని ఆలోచింఛి నిర్ణయం తీసుకోవటానికి  ఇంత సమయం పట్టింది”, సంజాయిషీ ఇస్తున్నట్లుగా, సుజాత తో అన్నది స్వేచ్ఛ.

“అదేదో పెద్ద తప్పైనట్లు అలా నానుస్తూ చెప్తావెందుకు? వెరీ హ్యాపీ ఫర్ యు!” అంటూ గట్టిగా హగ్ చేసింది సుజాత.

“ఎంత వరకూ వెళ్ళారేంటి? హద్దులు దాటేశారా?”, బిగించిన హగ్ ని విడుస్తూ, క్యాజువల్ గా అడిగేసింది సుజాత.

“లేదే.. అతను ఆ విషయాల్లో కొద్దిగా స్లోనే. ఆఫీసులో కలిసి ఉన్నా, ఎప్పుడూ పని మీద ధ్యాసే. వర్క్ లో అన్నీ వెంటనే నేర్చేసుకోవాలని తెగ తొందరపడిపోతూ ఉంటాడు. బయట మాత్రం, రొమాంటిక్ గానే మాట్లాడతాడు కానీ, ముద్దుకు మించి, ముందుకెళ్ళడు, అదీ చొరవ చేసి, నేను మొదలెట్టిన తరవాతే..”  అంటూ నిజాయితీగా బదులిచ్చింది స్వేచ్ఛ.

“మరీ మంచాడి లా ఉన్నాడే…నీకు సూట్ అవ్వడేమో” అంటూ ఒక నవ్వు నవ్వేసి, స్వేచ్ఛ ఉత్తుత్తి ఆగ్రహాన్ని పట్టించుకోకుండా, తన ఆఫీసు వైపు మళ్ళింది సుజాత.

***

“కమాన్ సూర్యా..ఇంత హటాత్తుగా జాబ్ మారాల్సిన అవసరం ఏముంది?” కొంత చిరాగ్గానే అడిగింది స్వేచ్ఛ.

“వాళ్ళ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్ కి లీడ్ రోల్ ఆఫర్ చేశారు. ఇంకొక బాడ్ న్యూస్ కూడా…”, నెమ్మదిగా నసిగాడు సూర్య.

“ఏంటి? నిన్ను అండమాన్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వమన్నారా? శుభం. రోజూ ఫేస్బుక్ లో చాట్ చేస్తూ ఏడాదికొకసారి కలుస్తూ ఉండచ్చు.”

“ప్లీజ్ .. మరీ అంత కోపమా.. అండమాన్ కాదు కానీ ఒక మూడు నెలలు అమెరికా వెళ్ళమన్నారు, ట్రైనింగ్ కోసం. రోజూ కాల్స్, చాటింగ్..ఇట్టే గడిచిపోతాయి.” అంటూ తన చేతులను స్వేచ్ఛ చుట్టూ వేసి, ఆమెను ముద్దులతో ముంచేత్తేశాడు సూర్య. వాళ్ళ అందమైన ఏకాంతాన్ని భగ్నం చెయ్యటానికా అన్నట్లు, సూర్య సెల్ ఫోను మ్రోగటం మొదలెట్టింది. కాలర్ ఐ.డి.

“తేజ” అని చూపిస్తోంది.

“తీస్కో…మీ ఫ్రెండు ఎప్పుడూ మంచి టైం చూసి కాల్ చేస్తూ ఉంటాడు”, అని చురకేసి లోపలి కెళ్ళింది స్వేచ్ఛ. కాసేపాగి బయటకు వచ్చిన స్వేచ్ఛకి సూర్య ఎదో పరధ్యానంగా కనపడ్డాడు. తేజ, సూర్యా చిన్నప్పటినిండీ మంచి స్నేహితులు. వారానికొకసారైనా మాట్లాడుకోందే వీళ్ళకి తోచదని, స్వేచ్చకి తెలుసు.

“ఏమంటున్నాడు తేజ?”, అంటూ సూర్య పక్కన కూర్చోంది స్వేచ్ఛ.

“ఐ.టి సెక్యూరిటీ లీడ్ గా ఒక మల్టీ నేషనల్ లో హైదరాబాద్ లోనే జాబ్ వచ్చింది వీడికి. నెక్స్ట్ వీక్లో ఇక్కడికి వచ్చేస్తున్నాడు వాడు. కానీ నేను అమెరికా వెళ్ళాల్సింది కుడా అదే టైం లో. అదే ఏం చెయ్యలా అని ఆలోచిస్తున్నా.”

“అతడేం చిన్న పిల్లాడు కాదుగా, నువ్వు వర్రీ అవ్వటానికి. ముందు మన గురించి ఆలోచించు…” అంది స్వేచ్ఛ టాపిక్ డైవర్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తూ.

“అది కాదు రా. వాడికి ఊరు పెద్దగా తెలీదు. వాడిని నా అపార్ట్మెంట్ లోనే ఉండమంటాను. వాడికి కొంచెం సిటీ చూపించి సెటిల్ అవ్వటానికి నువ్వే సాయం చెయ్యాలి…” అంటూ అభ్యర్ధించాడు సూర్య.

“నీ గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు, నా ఫ్రెండ్ ని చూస్కో, అని అప్పగిస్తున్న నీ నమ్మకానికి జోహార్లు అర్పించాలో లేక నీ అమాయకత్వాన్ని తిట్టాలో, డిసైడ్ చేసుకోలేకపోతున్నాను…” రాని కోపం నటిస్తూ అడిగింది స్వేచ్ఛ.

***

“బై..స్వీట్ హార్ట్..” అంటూ పెదాల పై ఒక ముద్దిచ్చేసి సెక్యురిటీ వైపు నడిచాడు సూర్య.

“ఏంటీ..అంత డ్రై గా కిస్ చేసి వెళ్ళిపోయాడు…వాడికి మొహమాటం ఎక్కువనుకుంటా…” చాల క్యాజువల్ గా అడిగాడు తేజ.
కొద్దిగా ఎరుపెక్కిన చెక్కిళ్లతో, “నీకస్సలు సిగ్గు లేదన్న విషయం చెప్పాడు సూర్య…కానీ ఇంత లొడ లొడా వసపిట్ట లాగా వాగుతూనే ఉంటావన్న విషయం  మాత్రం దాచాడు. ఇంటి నించి ఎయిర్పోర్ట్ దాకా త్రోవ పొడవునా నాన్ స్టాప్ గా.. నీ కసలు అలసట రాదా?” సిగ్గు, విసుగు, కోపం అన్నీ మేళవించిన స్వరంతో అడిగింది స్వేచ్ఛ.

“నీకు కొంచెం కోపం ఎక్కువే అని చెప్పాడు సూర్య…కానీ ఆ కోపం లో నువ్వెంత అందంగా ఉంటావో చెప్పటం మాత్రం దాచాడు” తడుముకోకుండా తేజ.

జవాబు ఇవ్వకుండా పార్కింగ్ లాట్ లో కార్ వైపు దారి తీసింది స్వేచ్ఛ. కార్లో, పిచ్చ సీరియస్ గా మొహం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు తేజ. ఆ నిశ్శబ్ద వాతావరణం కలగజేసే ఇబ్బందిని తట్టుకోలేక, స్వేచ్ఛ రేడియో ఆన్ చేసింది. “కయీ బార్ యూహి దేఖా హై..యే జొ మన్ కి సీమ రేఖా హై..మన్ యూ బెహెక్నే లగ్తా హై” అంటూ ముఖేష్ తియ్యని గళంతో పాడుతున్నాడు. పాటను చక్కగా ఆస్వాదిస్తూ, స్టీరింగు వీల్ మీద వేళ్ళతో తాళం వేస్తూ డ్రైవ్ చేస్తున్న స్వేచ్ఛ, తరువాతి పాట “షీలా..షీలా కీ జవానీ” అని రావటం తో రేడియో ఆపేసింది.

“I’m too sexy for you, మై తేరే హాత్ నా ఆనీ…అంత మంచి పాట..ఎందుకు ఆపేశావ్?” నవ్వుతూ అడిగాడు తేజ.

“నీ టేస్టు కి తగ్గట్టే ఉంది ఆ పాట కూడా”

“నా టేస్టుకి చాలా పెద్ద రేంజ్. ఇంతకు ముందు నువ్వు అంతగా ఎంజాయ్ చేశావే, ఆ పాట గురించి తెలుసా నీకు?”

“మంచి పాట…ముఖేష్ పాట…అంత తెలిస్తే చాలు”

“ఆ పాట కి నేషనల్ అవార్డు వచ్చింది, ముఖేష్ కి. రజనీగంధ సినిమా లోది. సినిమాలో ఆ పాట నేపధ్యం గురించి తెలిస్తే ఇంకా ఎంజాయ్ చేసేదానివేమో!” వస్తున్న చిరునవ్వును పంటితో బిగిస్తూ అన్నాడు, తేజ.

“ఎందుకంట?” కొంచెం అనుమాదాస్పదం గా అడిగింది స్వేచ్ఛ.

“తన బాయ్ ఫ్రెండ్ వేరే ఊరికి వెళ్తే, తన పాత స్నేహితుడిని రిసీవ్ చేసుకొని, కారులో వెళ్తూ, ఆ స్నేహితుడి వైపు, ఆకర్షితురాలవుతున్న మనస్సుని ఉద్దేశింది పాడుకున్న పాట అది…” ఈ సారి, గట్టిగా నవ్వేస్తూ అనేశాడు, తేజ.

స్వేచ్ఛ కుడా అతడి నవ్వులో శ్రుతి కలిపింది.

“నువ్వు అందరి అమ్మాయిలతో కలవంగానే ఇలాగే ఫ్లర్ట్ చేస్తావా?”

“అందరితో కాదు. అందమైన, నేను అందుకోలేని, అమ్మాయిలతో మాత్రమే… నువ్వు నా ఫ్రెండు తో ఆల్రెడీ బుక్ అయిపోయావు కాబట్టి, మనిద్దరి మధ్య ఎలాంటి ఛాన్స్ లేదు కాబట్టి..నీతో డైరెక్ట్ ఫ్లర్టింగ్ అన్నమాట.. ఒక వేళ నేను ఎవరైనా అమ్మాయిని పటాయించాలంటే మాత్రం నా నైజాన్ని దాచి, బుద్ధిగా ప్రవర్తించే వాడిని,” వివరించి చెప్పాడు, తేజ.

“నీ నిజాయితీ…నీ పొజిషన్ మీద నీకున్న అవగాహన, నీలో నాకు నచ్చేసిన అంశాలు. నాతో బుద్ధిగా కాకుండా, కావలసినంత ఫ్లర్టింగ్ చేసుకో ” అంటూ నవ్వేసింది, స్వేచ్ఛ.

“నువ్వదే మాట మీదుండు… రేపు సాయంత్రం డేట్ కి వెళ్దామా?”, తన అపార్ట్ మెంట్ దగ్గర కారు దిగిన తరవాత అన్నాడు, తేజ.

“నో..ధ్యాంక్ యూ. నిన్ను రోజూ భరించాలంటే కొంచెం కష్టమే”

“అదీ చూద్దాం…రేపు నాతో ఎలా రాకుండా ఉండగలవో. నీ విల్ పవర్ కి టెస్ట్ అన్నమాట”, కవ్విస్తూ అన్నాడు తేజ.
“నీకు అంత సీన్ లేదు…” అంటూ విండో రోల్ చేసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్లి పోయింది, స్వేచ్ఛ.

***

“నేను రానని చెప్పను కదా.. నాకు చాలా పనులున్నాయి. నా ఆఫీస్ కి వచ్చి చాలా టైం వేస్ట్ చేసుకొన్నావు” మందలింపు ధోరణి లో చెప్పింది స్వేచ్ఛ.

“ఓకే..నా దగ్గరో ఎక్స్ ట్రా టికెట్ ఉంది, ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కి. ఏం చేస్తాం మరి…ముఖ్యమైన పనులున్నప్పుడు వదులుకోలేం కదా..” అంటూ తన దగ్గర ఉన్న టికెట్ ను చూపించాడు, తేజ.

బాలమురళీకృష్ణ, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా జుగల్బందీ. “యూ…ఈవిల్, ఈవిల్ మాన్.. ఒక్క టూ మినిట్స్ లో వచ్చేస్తాను” అని చెప్పి లోపలి పరిగెత్తింది, స్వేచ్ఛ.
హిందుస్తానీ, కర్నాటక రాగాలలో తేజ పరిజ్ఞానాన్ని చూసి చకితురాలయ్యింది స్వేచ్ఛ. సాహిత్యంలో కుడా విశ్వనాధుడి నించీ నేటి తరం రచయితల వరకూ అతడి విశ్లేషణాత్మక అభిప్రాయాలు, అతడి అభిరుచులు కూడా ఒకింత ఆకట్టుకున్నాయి స్వేచ్ఛని. వీకెండ్ సాయంత్రాలన్నీ ఇలాంటి డేట్స్ తోను, తదనంతరం డిన్నర్స్, కొన్ని సార్లు రాత్రి మొత్తం కొనసాగిపోయే చర్చల తోను రెండు నెలలు ఇట్టే గడచిపోయాయి.

***

“నువ్వేం చేస్తున్నావో నీ కేమైనా తెలుస్తోందా?” సీరియస్ గా అడిగింది సుజాత.

“నువ్వనుకుంటున్నలాంటిదేమి లేదు… తేజాకి, నాకు అభిరుచులు బాగా కలిశాయి. అతనితో ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుందో అస్సలు తెలీదు. అతని తో మాట్లాడకపోతే మాత్రం ఎదో వెలితి గా ఉంటుంది” అంటూ సిన్సియర్ గా సమాధానం ఇచ్చింది స్వేచ్ఛ.

“రోజూ మాట్లాడుతున్న నీకు తెలియకపోవచ్చేమో గానీ…మాకు మాత్రం అతని కళ్ళల్లో నీతో మాట్లాడుతున్నప్పుడు కనపడే మెరుపు, ఆత్మీయత, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, స్నేహం కంటే ప్రేమే ఎక్కువగా కనపడుతోంది”

“నీకు అతని గురించి తెలియదు… మా ఇద్దరికీ, మా రిలేషన్ గురించి మంచి క్లారిటీ ఉంది”

“ఐ హాప్ సో! మేము కన్విన్స్ కాకపోయినా నష్టం లేదు…మిమ్మల్ని మీరు వంచించుకోకపోతే చాలు” అంటూ తన పని అయిపోయినట్లుగా లేచి, ఆలోచనలోకి నెట్టిన స్వేచ్చను వదిలేసి, క్యాంటీన్ బయటకు నడచింది సుజాత.

***

సాయంత్రం డాన్స్ ప్రోగ్రాం ముగిసిన తరువాత, స్వేచ్ఛ అపార్ట్ మెంట్ కి చేరుకున్నారు, ఇద్దరూ. స్వేచ్ఛ, ఇద్దరికీ వైన్ ఇచ్చి, ఒక్క అరగంటలో డిన్నర్ సిద్ధం చేస్తానంటూ కిచెన్ లోపలికి వెళ్ళింది. సోఫా మీద వదిలేసిన స్వేచ్ఛ ఆఫీస్ ల్యాప్టాప్, తీసుకొని, కీబోర్డ్ మీద టకటకా టైప్ చెయ్యటం ప్రారంభించాడు తేజ.

“ఔను తేజ… ఈ మధ్య ఏమిటి నాతో ఫ్లర్టింగ్ తగ్గించేసావు…ఐ యాం మిస్సింగ్ మై ఓల్డ్ తేజా..” అంటూ కిచెన్ నించే ప్రశ్నించింది స్వేచ్ఛ.

“నాకు నిజంగానే అలా చెయ్యాలనిపించట్లేదు…ఎందుకో అనిపించట్లేదో తెలుసుకోవాలంటే కుడా భయమేస్తోంది.”

మాటలలోని తీవ్రతని పసిగట్టినా, ముఖకవళికలని గమనించే అవకాశం లేకపోవటం వల్ల, ఒక్క క్షణం గుగుర్పాటు చెందిన గుండెను సంభాలించుకొని, స్వేచ్ఛ “జోక్ చెయ్యద్దు…తేజా..నీ మనసులో ఏముందో చెప్పు..” అన్నది. తేజ నెమ్మదిగా నడచివచ్చి, ఆమె చెయ్యి పట్టుకొని, లివింగ్ రూమ్ లో ఉన్న సోఫా దగ్గరకి తీసుకొచ్చాడు. ఆమె ల్యాప్టాప్ తెరచి చూపించాడు. హార్ట్ షేప్ లో బెలూన్స్ ఎగురుతున్నాయి. “స్వేచ్ఛ.. I love your name.. I love your confidence.. I love your presence… I love everything about you..కానీ నీకు ఐ లవ్ యూ అని చెప్పటానికి మాత్రం భయపడుతున్నాను. కొన్ని సార్లు కొన్ని భావాలు వ్యక్త పరచటానికి  ఒక జీవిత కాలం పడుతుందేమో కదా?”
ఊహించని ఈ సంఘటనతో ఒక్క సారిగా ఆశ్చర్యపడింది స్వేచ్ఛ. ప్రతిస్పందనకి తావివ్వకుండా, స్వేచ్చని తన బాహువులలో బంధించాడు తేజ. స్వేచ్ఛ పెదవులపై తన పెదవులతో ముద్ర వేశాడు. మొదట ప్రతిఘటించినా ఆమె పెదవులూ విడిపోయి అతనికి పూర్తి సహకారాన్ని అందించాయి. స్వేచ్ఛ మొబైల్ రింగు తో మళ్ళీ మామూలు ప్రపంచం లోకి వచ్చారిద్దరూ. సూర్య నించి కాల్.

సూర్య ఎంతో ఉత్సాహం గా “గుడ్ న్యూస్… నేను అనుకున్నదాని కంటే ముందుగా పని ముగించుకొని వచ్చేస్తున్నాను. రేపే ల్యాండ్ అవుతున్నాను.”

“లేదు, సూర్యా…ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది! రేపు కలుద్దాం” అని చెప్పి స్వేచ్ఛ ఫోన్ కట్ చేసింది.

***

స్వేచ్ఛ, సూర్య, తేజ, ముగ్గురూ, గుడిలో కలుసుకున్నారు. స్వేచ్ఛ ముందర మాట్లాడటం మొదలెట్టింది.

“మీ ఇద్దరిలో ఎవ్వరినీ నేను తప్పు పట్టటం లేదు. ఇద్దరికీ చేరువై నేనే ఈ పరిస్థితి కి బాధ్యురాలిని. మీరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవటం నాకస్సలు ఇష్టం లేదు. అలా అని మీ ఇద్దరిలో నేను ఎవ్వరినీ వదలుకోలేను. దానికి ఒక్కటే మార్గం…”

“ఏమిటది?” అన్న ప్రశ్నార్ధకమైన చూపుతో ఇద్దరూ స్వేచ్ఛ వైపు చూశారు.

“మన మధ్య ఈ “ప్రేమ” అనే జంజాటాన్ని తీసేస్తే, మన ముగ్గురం మంచి స్నేహితుల్లాగా ఉండిపోవచ్చు.”

“ఫ్యూచర్ సంగతేమిటి?” అంటూ సూర్య ప్రశ్నిస్తే, “ఇది మరీ తొక్కలో తెలుగు సినిమాలా ఉంది” అంటూ తేజ తనదైన శైలిలో స్పందించాడు.

“మనకి జోడైన వాళ్ళు మనకు తగలక పోరు. ప్రేమ ఒక్కసారే కలగదు అనటానికి వేరే ఋజువులఖ్ఖర్లేదనుకుంటాను?” ఒక రకమైన నిర్లిప్తతతో పలికింది స్వేచ్ఛ.

సూర్యా, తేజా లు కొంచెం దూరంగా వెళ్లి మంతనాలు జరిపారు. తిరిగి వచ్చి, “ఈ వీకెండ్ లో నువ్వేమీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికొచ్చి, నీకు మండే మార్నింగ్ చెప్తాం, ఏం చేయాలో” అంటూ స్పష్టత లేకుండా చెప్పి, శలవు తీసుకున్నారు.

***

మండే మార్నింగ్ ఆఫీసు కొచ్చిన స్వేచ్ఛ చాలా అసహనంగా ఉంది. వెబ్ సైట్లు ఒక్కక్కోటే తెగ తిప్పేస్తోంది. ఇ-మెయిల్ ఒకటి ఇన్ బాక్సు లో కొచ్చి కూర్చోంది.

“స్వేచ్ఛ,
నీకు మా మీద ఏ మాత్రం ప్రేమ, నమ్మకమూ ఉన్నా, మేం చెప్పేది జాగర్తగా విను. ఇంకొక అయిదు నిమిషాలలో నువ్వు ఆఫీసు వదిలేసి బయటకు వచ్చెయ్యి. అక్కడ సిద్ధంగా ఉన్న టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపో. నీ కోసం ఒక ఏజెంటు నీ పాస్పోర్ట్, బోర్డింగ్ కార్డు తో సిద్ధంగా ఉంటాడు. అది తీసుకొని ఫ్లైట్ ఎక్కేయి. నీ కెక్కువ సమయం లేదు. ల్యాప్టాప్ వదిలేసి, బయటకు పరిగెత్తు, ప్లీజ్!
సూర్య, తేజ.”

స్వేచ్ఛకి ఆలోచించటానికి సమయం కూడా లేదు. గబుక్కున తన బ్యాగ్ తీసుకొని బయట పడింది. చెప్పినట్లుగా ఒక టాక్సీ రెడీ గా ఉంది. ఎయిర్పోర్ట్  చేరుకొని, బోర్డింగ్ కార్డ్ తీసుకొని, ఫ్లైట్ లోకి చివ్వరి నిమిషంలో అతి కష్టం మీద అడుగు పెట్టింది. బాగ్ లోని, బ్లాక్ బెర్రీ వైబ్రేట్ అవుతోంది. తీసి చూస్తే, రెడ్ ఫ్లాగ్ తో టాగ్ అయ్యున్న ఇ-మెయిల్, బ్యాంక్ సెక్యురిటీ నించి. “బ్యాంక్ లో సెక్యురిటీ ఫైల్యూర్. ఎవరో ఎంప్లాయీ ల్యాప్టాప్ ద్వారా సెక్యురిటీ బ్రేక్ చేసి, బ్యాంక్ నించి అయిదు మిల్లియన్ డాలర్ల మొత్తాన్ని ఫారెన్ బ్యాంక్ కి బదిలీ చేశారు. అందరు ఎంప్లాయీలు క్యాంపస్ లో ఉండమని, ఎవ్వరినీ కదలద్దని,” ఆ మెయిల్ సారాంశం. “Bastards! చాలా మోసం చేశారు. కానీ నన్నెందుకు తప్పించారు?”

***

Cayman Islands – సూర్య, తేజ, స్వేచ్ఛని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు.

“బాంక్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వివరాలను రాబట్టి, ఇక్కడ అకౌంట్స్ సెట్ అప్ చెయ్యటమే నీ పని.. మధ్యలో ఈ ప్రేమ గొడవెందుకు పెట్టుకున్నావు?” అడిగాడు తేజ.

“నువ్వేమన్నా తక్కువ తిన్నావా? స్వేచ్ఛ తో పరిచయం పెంచుకొని తన ల్యాప్టాప్ ద్వారా సెక్యురిటీని బ్రేక్ చేసి, నేను సెట్ అప్ చేసిన అకౌంట్స్ లోకి డబ్బు పంపటమే నీ పని. పైగా నేను తనని ప్రేమిస్తున్నానని తెలిసి కుడా ఇంత మిత్రద్రోహం చేస్తావా?” అన్నాడు సూర్య.

“ఒకే.. నా ప్రపోజల్ విను. ఆ అయిదు మిలియన్ డాలర్లు నువ్వు తీసేసుకో. స్వేచ్ఛను నాకు వదిలెయ్!”

“అదే ప్రపోజల్…నా సైడ్ నించి కుడా…” బదులిచ్చాడు సూర్య.

“పోనీ కాయిన్ టాస్ చేద్దామా?”

“మన మాటలు కానీ స్వేచ్ఛ విన్నదంటే, ఇద్దరినీ తన్ని తగలేస్తుంది.”

ఇద్దరూ నవ్వుకుంటూ స్వేచ్ఛని రిసీవ్ చేసుకోటానికి గేటు దగ్గరకెళ్ళారు. స్వేచ్ఛ బయటకు వస్తూనే కనపడిన సూర్యను, చాచి ఒక్కటి కొట్టింది చెంప అదిరేటట్లు. వెనక దాక్కున్న తేజ కుడా, అది చూసి, ముందుకు వచ్చి బుద్ధిమంతుడి లాగా కళ్ళు మూసుకొని నిలబడ్డాడు. అతడి గూబా గుయ్యిమనిపించింది స్వేచ్ఛ.

***

కారు, సముద్రపు ఒడ్డున ఉన్న ఒక భవంతి బయటకొచ్చి ఆగింది. “జరిగినదంతా నీకు కారులో వివరంగా చెప్పాం.. ఏం చేస్తావో నీ ఇష్టం. మాలో ఎవరో ఒకరిని ఎంచుకో. డబ్బు రెండు వాటాల్లో పంచుకుందాం. నిన్ను పొందలేని వాడు జీవితాంతం నిన్ను మర్చిపోయేందుకు తాగడానికి సరిపోయే డబ్బు ఎలాగూ ముడుతుంది…” అంటూ డైరక్టు గా చెప్పేశాడు తేజ.

“ముగ్గురం ఫ్రెండ్సు అని మాత్రం మొదలెట్టద్దు….” అనేశాడు, సూర్య.

“మనం మనకు తెలిసిన సమాజాన్ని వదిలేసి వచ్చేశాం. ఇంకా వాళ్ళు పెట్టిన రూల్స్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మన దగ్గర కావలసినంత డబ్బు ఉంది. మన రూల్స్ మనమే రాసుకోలేమా?” అంటూ స్వేచ్ఛ వారిద్దరి చేతులను తన రెండు చేతులతో తన ఇరు వైపులా పట్టుకొని, ఇసుక బీచ్ లో ఆ భవంతి వైపు నడవ సాగింది. మరింత అందంగా ఆ చిత్రాన్ని దిద్దుదామనేమో సూర్యుడు వేగంగా సముద్రంలోకి దిగిపోనారంభించాడు.

ప్రయాణం

lingareddiఅప్పుడప్పుడే తూర్పురేఖలు విచ్చుకుంటున్నాయి. చీకటి పూర్తిగా తొలిగిపోకుండా నల్లటి మబ్బులు బాల భానునిమీద కొంగులా కప్పుతున్నాయి.  సికిందరాబాద్‌ రైల్వేస్టేషన్‌ రణగొణ ధ్వనులతో కోలాహలంగా వుంది. వస్తున్నవాళ్ళు,  పోతున్నవాళ్ళు ఒకర్నొకరు తోసుకుంటూ హడావుడిగా నడుస్తున్నారు. రైళ్ళకోసం వేచివున్నవాళ్ళు వచ్చిపోయే రైళ్ళను చూసు కుంటూ వాళ్ళ వాళ్ళ సంభాషణల్లో మునిగి తేలుతున్నారు. రైళ్ళ రాకపోకల గురించి హిందీ, ఇంగ్లీషు, తెలుగు మూడు భాషల్లో శ్రావ్యమైన గొంతుతో అనౌన్సర్‌ అదే పనిగా చెప్తూవుంది. ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫాం మీద కొడుకును సముదాయించడానికి శ్రీధర్‌ నానా అవస్థలు పడుతున్నాడు.

”నిన్ను వదిలేసి మేమెప్పుడైనా సమ్మర్‌టూరు వెళ్ళామా? ఇప్పుడు నేను ట్రైనింగ్‌కు వెళ్తున్నానని నిన్ను వద్దంటున్నాను,” అన్నాడు శ్రీధర్‌.
అయినా యశ్వంత్‌ మారాం ఆపడం లేదు.
”చెప్తే వినవా? నీ గొడవ నీదేనా? పద్నాలుగేండ్లు వచ్చినయి.కొంచెమన్నా అర్థం చేసుకోవా?” తల్లి శోభకోపంతో కసురుకుంటోంది.
”నువ్వెప్పుడూ ఇంతే. నాకు మాత్రం ఢిల్లీ చూడాలని వుండదా?”అంటూ ఏడ్వడం మొదలుపెట్టిండు యశ్శు.
కొడుకును దగ్గరకు తీసుకొని భుజంచుట్టు చేతులు వేసి నెమ్మదిగా బ్రతిమాలసాగిండు శ్రీధర్‌. బాధ, నిస్సహాయత అతని ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. ఇంతలో,
”హైదరాబాద్‌సే నయిదిల్లీ జానేవాలీ రాజధాని ఎక్స్‌ప్రస్‌ ఏక్‌ నంబర్‌ ఫ్లాట్‌ఫాం పర్‌ ఆ చుకీ హై” అని అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అది విన్న శ్రీధర్‌ హడావుడిగా ట్రాలీ సూటుకేసును లాక్కుంటూ, ఎయిర్‌బ్యాగ్‌ని భుజానికి తగిలించుకొని ఎస్‌ సిక్స్‌కేసి నడవసాగిండు. కొడుకు చేయిపట్టుకొని నడిపించుకుంటూ వెనుకాలే వచ్చిన శోభ, ఎయిర్‌బ్యాగ్‌ని శ్రీధర్‌
దగ్గరనుంచి తీసుకొని ముందుకు నడవసాగింది.
బోగీలోకి వెళ్ళిన శ్రీధర్‌ పర్స్‌లోంచి రిజర్వేషన్‌ టికెట్స్‌ తీసి, బెర్తు నంబర్లు సరిచూసుకొని ట్రాలీ సూటుకేసుని సీటుకిందకు తోసే ప్రయత్నం చేసిండు.
”హేయ్‌! గట్టిగా నెట్టకు.సూటుకేసు చినుగుతది” అంది శోభ.
”మరెట్లా? ఈ ట్రావెల్‌ఎజెంట్లకు చెప్తే ఇదేగోల. ఎప్పుడూ ఈ సింగిల్‌సీటర్సే ఇస్తరు”అంటూవిసుక్కున్నడు.
” ఆ త్రీ సీటర్‌ కిందకు పెట్టు. వాళ్ళు వచ్చినప్పుడు ఇటు పెట్టుకోమందాము” అని శోభ అనగానే అదేఆలోచనతో వున్న శ్రీధర్‌ సూటుకేసును ఆ సీటుకిందకు నెట్టి చైన్‌తో లాక్‌చేసి, ‘హమ్మయ్య’ అనుకుంటూ వెనక్కు తిరిగేసరికిముఖం మాడ్చుకొని సింగిల్‌సీటులో ముభావంగా కూర్చున్న యశ్వంత్‌ కనిపించాడు. ఒక్కసారిగా గుండె పిండినట్లయి, దగ్గర
కు పోయి యశ్శూ భుజంమీద చేయివేసి,”నెక్స్ట్‌ టైమ్‌ తప్పకుండా నిన్ను కాశ్మీర్‌ తీసుకెళ్తాను. ఈ ఒక్కసారికి అమ్మమ్మతో వుండు, ప్లీజ్‌,” అన్నాడు.
తండ్రి చూపించిన ప్రేమకు ఒక్కసారిగా  యశ్శు ఏడుస్తూ,
”నాకు కిటికీ పక్కన కూర్చొని రైలు ప్రయాణం చేయడం చాలా ఇష్టం నాన్నా!” అన్నాడు.
అసలే భారంగా వున్న వాతావరణం మరింత వేడెక్కింది. కొడుకు తపనను గమనించిన శోభ ఒక ఉద్విగ్న మానసిక స్థితికి లోనై యశ్శూని గుండెలకత్తుకొని,
”ప్రామిస్‌ యశ్శూ! నిన్ను తీసుకెళ్ళకుండా ఇంకెప్పుడూ వెళ్ళం. సరేనా?” అంటూ సముదాయించింది.
పరిస్థితి కొంచెం తేలికపడుతున్న సమయంలో హడావుడిగా జనం బోగీలోకి రావడం మొదలయ్యింది. ఇద్దరు చిన్న పిల్లలు,చంకలో మరో పిల్లాన్ని ఎత్తుకున్న భార్య వెంటరాగా ఒక మధ్యవయస్కుడు భారీ లగేజీతో వీళ్ళున్న కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చిండు. అతని వాలకం చూస్తే మొత్తం సంసారాన్నే వెంటతీసుకొచ్చినట్టుంది. వస్తూ, వస్తూనే చిరాగ్గా,
”యే సూటుకేస్‌ కిస్‌కా హై? యహాసే నికాల్‌దో” అంటూ శ్రీధర్‌ వైపు చూశాడు.
”ఆ.. అది సూటుకేసు ఇక్కడ పట్టటంలేదు. అందుకని అక్కడ పెట్టాము. మీవి చిన్న సూటుకేసులే కదా!
ఇక్కడ పెట్టుకోండి” అని శ్రీధర్‌ ముగించే లోపునే,
”లేదు. అట్లా కదరదు. నేను, నాకుటుంబం, నా లగేజి అంతా ఒకే చోట వుండాలి. ఇక్కన్నుంచి తీసెయ్‌.
ఎక్కడ పెట్టుకోవాలనేది నీ సమస్య. నాకేంది?” అంటూ చాలా రాష్‌గా సమాధానమిచ్చిండు. మనిషిలో ఎక్కడా సున్నితత్వంలేదు. హైదరాబాద్‌లో సెటిలయిన మార్వాడిలా వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతున్నడు. తెల్లని పైజామా మీద కాషాయ రంగు చారలున్న లాల్చీ ధరించివున్నాడు. వెడల్పయిన గుండ్రటి ముఖం, చిన్న కళ్ళు, ముందుకొచ్చిన పొట్ట, నోట్లో కిల్లీతోఎర్రగా పూసిన పెదవులు, అసలే ఓ మాదిరిగా నవ్వు తెప్పించే విధంగావున్న మనిషి ఆ హైరానా వల్ల మరింత వింతగా కనిపిస్తున్నాడు.అటు ఇటు తిరుగుతున్న ప్రయాణీకులతో బోగీ రద్దీగావుంది. దానికితోడు ఈ ఇద్దరు పిల్లల ఎగురుడు దుంకుడుతోఆ ప్రాంతం కూరగాయల మార్కెట్టును తలపిస్తోంది.
” చాలా దూరం పోవాలి కదా! కొంచెం సహకరించండి” అని శోభ ఏదో అనబోయే లోపునే,
”ఏం?మీకుకాదా చెప్తుంటే.”అంటూ చాలా అమర్యాదగా సూటుకేసును కాలితోతన్ని,జరిపే ప్రయత్నం చేశాడు. శ్రీధర్‌ అదాట్నలేసి”ఎక్కువ మాట్లాడకు.తీస్తానుండు”అని చైన్‌లాక్‌తీసి బర్రున సూటుకేసు తనవైపు లాక్కున్నాడు.ఇంతలో”హైదరాబాద్‌సే నయిదిల్లీ జానేవాలీ రాజధాని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏక్‌ నంబర్‌ ఫ్లాట్‌ఫాంసే రవాణా హోనేకే లియే తయ్యార్‌ హై” అని అనౌన్సర్‌ శ్రావ్యంగా చెప్పింది.
”అమ్మా! ట్రైన్‌ కదులతది. నువ్వు యశ్శూను తీసుకొని ఇంటికెళ్ళు” అంటూ తల్లిని పురమాయించి, కొడుకునుదిటి మీద ముద్దు పెట్టింది శోభ.యశ్వంత్‌ లేచి కదలబోతుంటే,
”నాన్నకు బై చెప్పవా?” అంటూ కొడుకుకు కర్తవ్య బోధ చేసింది.
”డాడీ! బై” అంటూ యశ్వంత్‌ అమ్మమ్మతో కలిసి రైలు దిగి వెళ్ళిపోయిండు
సూటుకేసును ఏమి చేద్దామా అని మధనపడుతుంటే,
”శ్రీధర్‌! ఈ రెండు సీట్లు పరిచి సూటుకేసు దీనిమీదికి ఎక్కిద్దాము. మనమెట్లాగో సర్దుకొని కూర్చుందాము”
అని పరిష్కారం చూపించింది శోభ. పెళ్లయిన గత పదహారు సంవత్సరాలుగా శోభ శ్రీధర్‌ని పేరు పెట్టే పిలుస్తుంది. పెళ్ళికంటే ముందే ఇద్దరికి పరిచయం ఉండడం వల్లనో, ఆమెకున్న మితిమీరిన ఆత్మాభిమానం వల్లనోగాని అందరి ఇండ్లల్ల పిలిచినట్టు ‘ఏమండీ’ అని ఆమె ఎన్నడూ పిలువలేదు. ప్రగతిశీల భావాలున్న శ్రీధర్‌ ఆమె అట్లా పిలువడాన్ని ప్రోత్సహించాడే తప్ప ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు.
మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చిన శోభకు ఆత్మాభిమానం ఎక్కువ. ఏలోటులేకుండా పెంచిన తల్లిదండ్రులు, మంచిహోదా ఆర్థిక పరిపుష్ఠి కలిగిన భర్త, తనూ విద్యాధికురాలై వుండడం ఆమెలో ఆత్మాభిమానాన్ని మరింత ఇనుమడింప చేశాయి. ఎప్పుడూ నిండుగా చీర కట్టుకునే శోభ ప్రయాణాల్లో సౌకర్యంగా వుంటుందని పంజాబీ డ్రస్సు వేసుకుంది. మంచి ఎత్తు, కోల ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడే చక్కటి ముక్కు, చిన్న నోరు, దొండపండులాంటి సన్నని పెదవులు ఎవరైనా ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయేలా వుంటుంది శోభ. కాని, ఇప్పుడు ఆమెలో ఆ ఆత్మవిశ్వాసపు వెలుగుమీద నల్లటిమబ్బేదో కమ్మినట్టు అనిపిస్తోంది.
కనిపించినదాకా కొడుకుకు బై చెప్పుతున్నట్టుగా చెయ్యూపిన శ్రీధర్‌, రైలు వేగాన్ని అందుకోవడంతో వెనక్కి ఒరిగి కూర్చున్నాడు. రైలుతో పోటీ పడుతున్నట్టుగా శ్రీధర్‌ ఆలోచనలు వెనక్కి పరుగెత్తసాగాయి. తన ఆరోగ్యం సంగతి కొడుకుకు తెలవకూడదన్న కారణంగా యశ్శూని విడిచి వెళ్తున్నాడు. కొడుకన్నా, భార్యన్నా శ్రీధర్‌కు ఎనలేని ప్రేమ.తన అనారోగ్యం
బయటపడినప్పటినుంచి అది మరింత పెరిగి ఒక పతాక స్థాయికి చేరింది. స్వతహాగా కవి అయిన శ్రీధర్‌ బాధను వ్యక్తీకరించడానికి కవిత్వాన్ని ఆశ్రయిస్తాడు కాని, ప్రేమనెట్లా వ్యక్తీకరించాలో అతనికి తెలియదు.
ఉగాది అంటే అమితంగా ఇష్టపడే శ్రీధర్‌ జీవితంలో ఆ ఉగాది మిగిల్చిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆరోజు కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగమంతా పాల్గొంటున్న ఉగాది ఉత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్న శ్రీధర్‌ సెల్‌ మోగింది. ‘హల్లో’ అన్న శ్రీధర్‌ అవతలి వైపునుంచి అందిన పిడుగులాంటి వార్తకు నిలువెల్లా క్రుంగిపోయాడు. అయినా తన్ను తాను నిలువరించుకొని, సమావేశం ముగించుకొని ఇల్లు చేరాడు. గడపలో అడుగు పెట్టగానే శోభకు విషయం తెలిసిపోయిందనే సంగతి శ్రీధర్‌కు అర్థమైంది. అణుబాంబు పడ్డప్పటి నాగసాకిలా వుంది ఆమె పరిస్థితి. ద:ఖానికి, బాధకు అతీతమైన ఒక అవ్యక్త విషాదం ఆమె మఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చడీచప్పుడు కాకుండా స్నానం ముగించుకొని, విస్కీ పెగ్‌ కలుపుకొని వచ్చి టీపాయ్‌ మీద కాళ్ళు చాపి కూర్చొని, టీ.వి. చూస్తూ ఒక్కొక్క గుక్క చప్పరించసాగాడు. ఇంతలో, మిన్ను విరిగి మీద పడ్డట్టు
”నేనింత బాధతో, దు:ఖంతో కాలిపోతుంటే నువ్వు నింపాదిగా మందు తాగుతావా?” అంటూ విరుచుకు పడింది శోభ.
” ఏం చేయమంటావు నన్ను?” అంటూ నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు శ్రీధర్‌.
నిజానికి శోభ దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కాని, తను అందంగా నిర్మించుకున్న కలల గూడు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయినప్పటి  ఒక హిస్టీరిక్‌ ఆవేశం ఆమెను ఆవహించింది. రెండు చేతుల్తో తల కొట్టుకుంది, అతన్ని కొట్టింది, తలను గుండెలకత్తుకొని ముద్దు పెట్టుకుంది. విచిత్ర ప్రవర్తనతో ఆవేశం చల్లారే దాకా ఏడుస్తూనే
వుంది. రెండో పెగ్‌ పూర్తిచేసిన శ్రీధర్‌”ప్రాణం పోయేది నాది కదా! నా కంటె నువ్వే ఎందుకు ఎక్కువ రియాక్టు అవుతున్నావు?” అన్నాడు. ఆ ప్రశ్న అడిగిన శ్రీధర్‌ వైపు పిచ్చిదానిలా చూసింది. హఠాత్తుగా లేచి వచ్చి శ్రీధర్‌ ఒడిలో తలవాల్చింది. ఏడ్చింది, గొణిగింది.
”అదేదో నాకొచ్చినా బాగుండేది” అంటూ స్వగతంగా అనుకుంటున్నట్టు పలవరించింది. ఎప్పుడో సంవత్సరం కింద ఛాతిలో నొప్పివస్తే ఇ.సి.జి., టి.యం.టి తో పాటు రొటీన్‌ పరీక్షలన్ని చేయించుకున్నడు శ్రీధర్‌. దాంట్లో హీమోగ్లోబిన్‌ చాలా ఎక్కువగా వున్నట్టు తేలింది. కొన్నాళ్ళపాటు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న శ్రీధర్‌, డాక్టర్‌ సలహామేరకు ‘జాక్‌2’
అనే పరీక్ష చేయించుకున్నడు. ఉగాది రోజు ఫోన్‌లో విన్న పిడుగుపాటి వార్త ఈ ‘జాక్‌2’ పాజిటివ్‌ అనేదే. ‘జాక్‌2’ పాజిటివ్‌ అంటే ఎర్ర రక్తకణాల్లో కాన్సర్‌ సంబంధమైన జబ్బు వుండడంవల్ల హీమోగ్లోబిన్‌ పెరింగిందని అర్థం. దానికి సంబంధించినఅత్యుత్తమ సలహా ఆలిండియా మెడికల్‌ సైన్సెన్‌లో దొరుకుతుందనే ఆశతో శ్రీధర్‌ ఢిల్లీకి పయనమయ్యాడు. ఈ ప్రయాణంముఖ్యంగా శోభ వత్తిడిమేరకే జరిగింది. ఎండమావులని తెలిసినంక ఎంత దూరం పరుగెత్తితే మాత్రం లాభమేముంటుందనేనిర్వేదంలో శ్రీధర్‌ వున్నాడు. అతని మెదడునిండా తన తర్వాతి కాలంలో తన భార్యాబిడ్డలకు సంబంధించిన ఆలోచనలే ముసురుకుంటున్నాయి. పేదగ్రామీణ, నిరక్షరాస్య కుటుంబంనుంచి తను ఎదిగొచ్చిన ప్రస్థానాన్ని మననం చేసుకుంటున్నాడు.
ఈ ప్రయాణం ఇంత త్వరగా ముగిసే పరిస్థితి ఏర్పడుతుందని అతనెన్నడూ ఊహించలేదు. అతని ఆలోచనల ధారలాగానేబయట కూడ హోరున వర్షం కురుస్తోంది. ఎండాకాలపు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు కిటికీలు దించి ప్రయాణీకులు ఎవరికి వాళ్ళు మాటల్లో పడిపోయారు. అప్పుడు హఠాత్తుగా,”మేరా బచ్చా, హే భగవాన్‌! క్యా హువా మేరే బచ్చేకో?” అంటూ పక్కనున్న మార్వాడి ఏడుపు లంఘించుకుంది. అప్పటిదాకా తల్లి చంకలోవున్న పిల్లవాడు మెడకాయ తెగిన కోడిలా కాళ్ళు, చేతులు కొట్టుకుంటున్నడు. తండ్రి పిల్లవాన్ని తీసుకొని సీటుమీద పడుకోబెట్టి కాళ్ళు, చేతులు రాయసాగిండు.
”శ్రీధర్‌! ఆ పిల్లాడికి ఫిట్స్‌ వొస్తున్నయి” అంది శోభ. అతను ఏమీ మాట్లాడకపోయేసరికి, భుజం తట్టి
”శ్రీధర్‌!” అంటూ మళ్ళీ పిలిచింది. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా శ్రీధర్‌ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. తలతిప్పిచూసేసరికి శ్రీధర్‌కి పరిస్థితి అర్థమయ్యింది. వెంటనే లేచి సూటుకేసుని సీటుమీద పడుకోబెట్టి ”శోభా! తాళాలివ్వు” అన్నాడు.
శోభ సూటుకేసు తాళం తీయగానే తన ఎమర్జెన్సీ కిట్‌ని బయటకు తీసి వెదకసాగాడు.
”ఫిట్స్‌ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినయా, ఇదే మొదటిసారా?” అని తల్లిని అడిగింది శోభ. స్త్రీగా పిల్లల మీద సహజసిద్ధంగా వుండే ప్రేమవల్ల, తన సహజ ప్రవర్తనలో భాగంగా అట్లా అడిగింది శోభ.
”రాలేదు, అయినా నీకెందుకు?” అని కసురుకుంది మార్వాడి ఆమె. శోభ ముఖం ఒక్కసారి కందగడ్డలామారిపోయింది. పుణ్యానికి పోతే పాపమెదురవ్వడం అంటే ఇదేనేమో? అనుకుంది. దాంతో శ్రీధర్‌కు కూడ విపరీతమైన కోపము, చిరాకు కలిగాయి,అయినా తమాయించుకొని బ్యాగులోంచి రెండు టాబ్లెట్లు తీసి, పిల్లవాడి తండ్రిని ఉద్దేశించి
”చూడు, పిల్లవాడికి ఫిట్స్‌ వస్తున్నయి. ఈ టాబ్లెట్‌ పెడితే తగ్గిపోతయి. పెట్టమంటావా?”అన్నాడు. ఆందోళనలోవున్న తండ్రి సరేనన్నట్టుగా తలవూపాడు. శ్రీధర్‌ చేతులకు గ్లౌజు తొడుక్కొని ఒక టాబ్లెట్‌ తీసి పిల్లవాడి ముడ్డిలోపెట్టాడు.
రెండు నిమిషాల్లో ఫిట్స్‌ తగ్గి పిల్లవాడు అచేతనమైండు.
”కండ్లు మూసిండు. కాళ్ళు చేతులు ఆడుతలేవు. ఏంకాదా?” భయంతో,ఆందోళనతో అడిగిండు తండ్రి. కంపార్టుమెంటులోని చాలా మంది ప్రయాణికులు అప్పటికే అక్కడికి చేరుకొని తలొక మాట మాట్లాడ సాగారు. ఇంతలో ఒకామె కలుగచేసుకొని,
”ఫిట్సు తగ్గినంక కొంతసేపు అట్లనేవుంటరు.ఏంగాదు. నా కొడుకుకు కూడ గిట్లనే వచ్చేటివి”అంది. శ్రీధర్‌పిల్లవాడి నాడి చూసిండు. నుదురు మీద చెయ్యిపెట్టి జ్వరం చూసిండు. ఛాతిమీద చెయ్యిపెట్టి గుండె పరీక్షించిండు. పొట్టమీద గిచ్చి కదులుతండా లేడా అని చూసిండు. పిల్లవాడు కొంచెం చేయి కదిపిండు.
”జ్వరం చాలా వుంది. తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడవండి” అని తల్లిని పురమాయించిండు. తల్లి తుడవడం మొదలు పెట్టగానే పిల్లవాడు కండ్లు తెరిచి చూసిండు. బిడ్డ బతికిండన్న సంతోషంతో శ్రీధర్‌ రెండు కాళ్ళు మొక్కి”ముఝే మాఫ్‌ కరో సాబ్‌” అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
”భాయిసాబ్‌! నన్ను క్షమించండి. మీతో అమర్యాదగా ప్రవర్తించాను. అయినా నా బిడ్డను కాపాడిండ్రు” అని శ్రీధర్‌ రెండు చేతులు పట్టుకొని అపరాధభావంతో క్రుంగిపోయిండు తండ్రి.
”మీ దయవల్ల పిల్లవాడు బతికిండు.నువ్వు డాక్టరువా బిడ్డా?”అని అడిగింది ఎదురు సీట్లోవున్న పెద్దమనిషి.
”అవునమ్మా! నేను పిల్లల డాక్టర్ని”అని సమాధానమిచ్చిండు శ్రీధర్‌. ప్రయాణికులందరూ శ్రీధర్‌ని ఆరాధనాభావంతో చూడసాగారు. తెలుగు నవలాకారులు చెప్పినంత అందగాడు కాకపోయినా, ఎత్తుకు తగ్గ లావు, కొసదేరిన ముక్కు,
తన అంతరంగపు లోతులు బయటివాళ్ళు పసిగట్టకుండా అడ్డుపడుతూ ముక్కుమీదినుంచి అప్పుడప్పుడూ కిందికి జారుతున్నకళ్ళద్దాలు, కోలముఖం, గోధుమ వర్ణపు మేని ఛాయ, నల్లరంగు ప్యాంటులో టక్‌ చేసిన బ్లూకలర్‌ షర్ట్‌ మొత్తంగా చూడగానేలోతైన మనిషిలా కనిపిస్తాడు. మనుషుల ప్రవర్తనను బేరీజు వేసుకుంటూ, శ్రీధర్‌ చాలా నిర్లిప్తంగా ఎమర్జన్సీ కిట్‌ను యధాస్థానంలో వుంచి సూటుకేసును లాక్‌చేయసాగిండు.
”సార్‌! ఈ సూటుకేసును అక్కడ పెడతానివ్వండి” అని శ్రీధర్‌ చేతిలోని సూటుకేసును తీసుకొని తన సీటుకింద పెట్టుకుండు. ఈలోపు పూర్తిగా తెలివిలోకి వచ్చిన పిల్లవాన్ని చంకలో వేసుకొని తల్లి శోభ దగ్గరికి వచ్చి, రెండు చేతులుపట్టుకొని,
”బహన్‌! నన్ను మన్నించు” అని బ్రతిమాలింది.శోభ గుంభనంగా ఒక నవ్వు నవ్వింది.
అవసరం మనుషుల్ని ఎట్లా ఆడిస్తుందో కదా అని శ్రీధర్‌ ఆశ్చర్యపోసాగాడు. ఈ వింత మనుషుల మధ్యనుంచి ఈ ప్రయాణం ఇంకొక పన్నెండు గంటల్లో ముగుస్తుంది. ముగుస్తున్న జీవన ప్రయాణానికి సంబంధించిన శ్రీధర్‌ఆలోచనలు రైలు కంటె వేగంగా పరుగెత్తసాగాయి.
డా.కాసుల లింగారెడ్డి

 

దేశం ద్వేషించిన సిపాయి

నా పరిచయం: ఆకలికి ముందు, ఆశల వెనుక పడుతూ లేస్తూ పరిగెత్తే  ఓ అతి సామాన్యుడ్ని….

Shiva Bandaru

శివ బండారు

రోజూ పరేడ్ కోసం తెల్లవారుఝామున నాలుగున్నరకే తెల్లవారే నాకు, రాత్రి అర్దరాత్రి వరకు పంజాబ్ నుండి పక్క ఊరు స్టేషన్ వరకు షుమారు మూడు రోజులు సాగిన పొగబండి ప్రయాణం వల్లా, వర్షంలో తడుస్తూ బురదలో నాలుగు మైళ్ళు నడుస్తూ రావడం వల్లా   మెలకువ రావడం మూడు గంటలు ఆలస్యం అయింది. ఇంటి వసారా నుండి బయటకి వచ్చేసరికి బజారంతా హడావిడిగా గోల గోలగా ఉంది. వచ్చేటప్పుడు వానకి తడిసిన ఎర్రటి యూనిఫారం ఇవాళ పొద్దున్న రంగులతో మళ్ళీ తడిసిపోయినట్లుంది . నేను బయటకి బయల్దేరి రెండు అడుగులేసేసరికి బజార్లో నుండి ఇంట్లోకి పరిగెత్తుతూ వస్తున్న అన్న కొడుకు తన రెండు గుప్పిళ్ళ నిండా ఉన్న రంగుని ఎగిరి నా మీదకి విసిరి మళ్ళీ వెనక్కి బజార్లోకి పరిగెత్తాడు.
నేను బజాట్లోకి వెళ్లి పక్కనే ఉన్న అరుగు మీద కూర్చున్న వాళ్ళని అడిగాను ఈ సంబరమేంటి అని?? వాళ్ళల్లోంచి ఒక ముసలతను బదులిచ్చాడు ” తెల్ల దొరలు మన దేశాన్ని వదిలి పోతున్నారని ఇందాక రేడియో వార్తల్లో చెప్పారు”. గాంధీని నాయకుడ్ని చేసిన పోరాటం, భగత్ సింగ్ ని బలి తీసుకున్న పోరాటం చివరికి సొంత పాలనని ఆలస్యంగానైనా అందించింది సంతోషం.
కానీ  ఈ సంబరంలో మునిగి ఉన్న గుంపులోకి చేరి నేను కూడా చిందులెయ్యలా ?? అసలు వేసే అర్హత నాకు ఉంటుందా ?? నేను బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 1 వ బెటాలియన్, పంజాబ్ రెజిమెంట్లో పనిచేస్తున్న సిపాయిని. సిపాయినని గర్వంగా చెప్పుకోడానికి నేనేం దేశం మీద ప్రేమతో శివారులో శత్రు సిపాయిలతో పోరాడుతున్న వీరుడ్ని కాదు, నా దేశంలో పరాయిదేశం వాళ్ళకోసం పనిచేస్తూ సొంత మనుషులకి తుపాకి తూటాలు పేల్చే ఓ సిపాయిని.
అలా అని శ్రీ కృష్ణుడు చెప్పినట్లు ” ధర్మ సంరక్షణ కోసం నీ సొంత వాడితోనైనా యుద్ధం చేయాల్సిందే” అనుకుందాం అంటే ధర్మం కూడా నా వైపు లేదు కేవలం దరిద్రం తప్ప. ఓ మనిషి ఆకలిని చంపుకోవాలా లేక ఆత్మాభిమానాన్ని చంపుకోవాలా అన్న సంశయంలో పడినపుడు, మన చేతిలోలేని ఆకలిని చంపడం కంటే మన ఆలోచనలో ఉన్న ఆత్మాభిమానాన్ని చంపుకోడం తేలికగా భావించి నా ఆకలి పోరాటాన్ని బ్రిటీషు వారి అధికార పోరాటం కోసం పనిచేస్తున్న ఓ సాధారణ భారతీయ సిపాయిని. ఆ నిమిషం నా ముందు రంగురంగులలో ఎగురుతున్న సీతాకోకల గుంపులో నాకు నేను గొంగళి పురుగులా అనిపించాను.
ఇంట్లోకి వచ్చి స్నానం చేసి ఊళ్లోకి బయల్దేరాను. ఊరు ఊరంతా పండగ వాతావరణం. మిఠాయిలు పంచుతున్న వాళ్ళు, రంగుల్లో మునిగి తేలుతూ గుంపులు గుంపులుగా సంబరాలు చేసుకుంటున్న వాళ్ళు. భారతదేశపు ఆత్మాభిమానపు పోరాటపు ఘట్టాల్ని కళ్ళకి కట్టినట్లు, జనాల రక్తాన్ని సల సల మరిగేటట్లు వివరిస్తూ బుర్రకథ జరుగుతుంది రచ్చబండ దగ్గర రావి చెట్టు కింద అరుగు మీద. అక్కడే ఉన్న జనాలతో పాటు నేను కూడా కలిసి విన్నాను. ఆ హడావిడి అంత అయ్యేసరికి సూర్యుడు నారింజ రంగులోకి, మేము రంగురంగుల్లోకి మారిపోయాం. పక్కనే ఉన్న గుడి ఎదురు కోనేట్లో మునిగి, వంటికి ఉన్న రంగుల్ని, బుర్రలో ఉన్న ఆలోచనల్ని వదిలించడానికి ప్రయత్నించాను  కాని రెండూ పూర్తిగా వదల్లేదు.
తిరిగొచ్చి మళ్ళీ రావి చెట్టుకింద అరుగు మీద కూర్చున్నా. ఈ సారి ఇందాకటి హడావిడి ఇపుడు లేదిక్కడ. ఎంత సంతోషమైనా, బాధైనా దాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించే లేదా అనుభవించే అవకాశం జీవితం ఎప్పుడూ మనిషికివ్వదు. మన దారిలో ఏదొచ్చినా ముందుకి సాగిపోవాల్సిందేననే షరతు ఎప్పటికీ మనతోనే ఉంటుంది, దానిలో భాగంగానే ఊరు ఇందాకటి సంబరాన్ని వదిలి ముందుకు సాగింది. ఈ రోజు, ఈ నిమిషం, ఈ ఊరు, ఈ దేశం అంతా స్వేచ్ఛ దొరికిందన్న సంతోషంలో రెక్కలు విదుల్చుకుని ఎగురుతుందనేగాని,  అసలు స్వేచ్ఛ ఉంటే ఈ దేశం బావుంటుందనే ఓ ఊహ ఈ దేశంతో ఇంత పోరాటాన్ని చేయించిందే  తప్ప , షుమారు మూడొందల సంవత్సరాల ముందు ఈ దేశం స్వేచ్ఛని కోల్పోయిన మొదటి రోజుని చూసిన వాడెవడ్నీ , మూడొందల సంవత్సరాల  తరవాత స్వేచ్ఛ  దొరికిందని సంతోషించడానికి కాలం మిగల్చలేదు. ఇపుడు స్వేచ్ఛ దొరికిందని సంబరపడుతున్న మాకు అసలు ఈ స్వేచ్ఛ ఎలా ఉంటుందో అనేది తెలుసుకుని దానికి అలవాటుపడటానికి కొన్నాళ్ళు పట్టోచ్చు.
నేను పోయిన సంవత్సరం ఊరికి వచ్చినప్పటికి, బ్రిటిషు వాళ్ళ పాలనలో ఊరు ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే, నన్ను చూడగానే ఎప్పుడొచ్చావని పలకరించే జనాలు, నా ముందు గౌరవంగా  నటించే కొందరు,  నా దగ్గర డబ్బులు తీసుకోకుండా అయ్యో మీ దగ్గర డబ్బులు తీసుకోడం ఏంటని మొహమాటంగా అతిగౌరవంగా నటించే టీ కొట్టువాడు , నాకు తెలుసు ఇవన్నీ నన్ను చూసి ఇస్తున్నవి కాదు. నా ఆత్మాభిమానపు తాకట్టుకి  బ్రిటీషు జీతంతో పాటు ఇవి అదనపు కానుకలని, ఇవన్నీ నేను అక్కడి నుండి వెనక్కి తిరగ్గానే అవి నేను సొంతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న స్వార్ధానికి శాపనార్థాలవుతాయని . ఇక్కడున్న కరవు పరిస్థితులకి వ్యతిరేకంగా మా ఇంట్లో వాళ్లకి రెండు పూటలా తిండి దొరుకుతుందన్న దాన్ని ద్వేషంగా మార్చుకుని, వ్యక్తిగత ద్వేషాన్ని చూపించడానికి, వ్యవస్థ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నాన్నదాన్ని సాకుగా చూపించే వాళ్ళు. ఊరి మీద అనవసరపు శిస్తులు వసూలు చేసే బ్రిటీషు సిపాయిలు మా ఇంటికి వచ్చేసరికి మన కోసం పనిచేసే వాడి ఇల్లని కొంచెం మంచిగా వ్యవహరించడం ఇలాంటివి దొరికేవి నాకు.
స్వాతంత్ర్యం లేనపుడే నాకు ఇన్ని దొరికాయంటే, కొత్తగా వచ్చిన ఈ స్వాతంత్ర్యంలో నేను ఏం పొందుతానో చూడాలి. ఈ హడావిడిలో ఓ వారం గడిచింది. మా రెజిమెంట్  నుండి ఓ ఉత్తరం వచ్చింది. పంజాబ్ 1 వ బెటాలియన్  దేశవిభజనలో  భాగంగా పాకిస్తాన్ కి చెందుతుందని. 1 వ బెటాలియన్లో ఉండి భారతదేశంలో ఉండాలనుకునే వాళ్ళు  1 వ బెటాలియన్ నుండి రాజీనామా చేసి అదే రెజి మెంట్లో 2 వ బెటాలియన్లో చేరాలని దాని సారాంశం. ఇంట్లో వల్ల ఒత్తిడి వల్లనైతేనేమీ,   , ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేకపోడం వల్లనైతేనేమీ ఊరు విడిచి వెళ్ళాల్సినంత  కష్టాలు ఇంక ఇక్కడ ఉండవేమో అన్న నమ్మకం వల్లనేమో కానీ  నేను 1వ బెటాలియన్ కి రాజీనామా పంపాను కానే రెండో బెటాలియన్ కి దరఖాస్తు పంపలేదు. ఊళ్లోనే వానలు పడితే వ్యవసాయం లేనపుడు ఉపవాసాలు చేసుకు బతికేద్దాం అని ఉండిపోయాను.
క్రమంగా ఊళ్ళో స్వాతత్ర్యం వల్ల పరిస్థితులు కొంచెం కొంచెంగా మెరుగుపడుతున్నాయి. మనం ఏదైనా పనిలో కష్టపడితే ఇంతకు ముందులా కాకుండా ఫలితం మనకే దక్కుతుందన్న నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ పెరిగాయి మనుషులకి. ప్రజలకి కలిగిన ఇదే ఆశ, నమ్మకం ప్రకృతికి కూడా బాగానే కలిగినట్లుంది. ఆ  సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. అందరితో పాటు నేను కూడా వ్యవసాయపు కూలీ పనులకి వెళ్ళడం మొదలుపెట్టాను.
రాను రాను నా చుట్టూ మార్పు చాల వచ్చింది, అది పరిస్థితుల మీద అయితే నేను కూడా అంతగా పట్టించుకునే వాడ్ని కాదేమో, కానీ అది నా విషయంలో కాబట్టి గుర్తించగలిగాను. పనిలో ఉండగా ఎవరినన్నా సరదాగా ఏమన్నా అంటే దానికి వెటకారంగా మాట్లాడటం, మధ్యాహ్నం  అన్నంతినే దగ్గర నాతో కలిసి కూర్చోడానికి ఆలోచించడం, పనిలోకి వెళ్ళేటపుడు పిలవకపోవడం,  ఇదివరకు నా సిపాయి ఉద్యోగం వల్ల తప్పక గౌరవం నటించాల్సి వచ్చిన వాళ్ళంతా ఇపుడు ఆ నటనని వదిలి అసలు ఉన్న అసహ్యాన్ని అలా చూపడం మొదలుపెట్టారు. కాలం గడచినకొద్దీ జనాలు నన్ను ఏదో దొంగతనాలు చేసి జైలుకి పోయి వచ్చినట్లు, అంటరాని వాడిగా చూడటం మొదలుపెట్టారు. ఇపుడు చుట్టాల ఇళ్ళలో జరిగే ఏ శుభకార్యానికి మా ఇంటికి పిలుపురాదు, ఒకవేళ దేనికి అయినా వచ్చినా వెళ్తే మాకక్కడ పలకరింపు ఉండదు.
చివరికి మా ఇల్లు ఊరిమధ్యనే  ఉండి కూడా వెలివేయబడిన ఇల్లు, నేను జనాల మధ్యన ఉండగలిగి కూడా జనం పట్టించుకోని ఓ అంటరానివాడ్ని. తెల్ల దొరల పాలన ఉండగా వాళ్ళ  తరపున శిస్తులు వసూలు చేసి, తిరుగుబాటు చేయగలిగి కూడా గులాం గిరి చేసిన దొరలు ఇపుడు కూడా దొరలుగానే చెలామణి అవుతున్నారు. నేను ఆ రోజు చేసిన సిపాయి పనిగానీ లేదా ఈ రోజు చేసిన కూలీ పనిగానీ కేవలం నా మీద ప్రతిపూటా  దండయాత్ర చేసే ఆకలి అనే శత్రువుని చంపడం కోసం అన్నం అనే విషం సంపాదించుకోడానికే. కానీ ఇపుడు నేను మూడు రంగులద్దుకున్న ఈ దేశప్రజలనే సీతాకోకల గుంపులో ఉన్న ఓ గొంగళి పురుగుని. సంబంధాలన్నీ పోగొట్టుకోవడం వల్ల వచ్చిన ఏం చేసుకోలేని ఒంటరి  స్వేచ్ఛని పోగొట్టుకుని, నా చుట్టూ నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలనుకునే “దేశం ద్వేషించే సిపాయిని ” .
శివ బండారు

అంతరంగం

వసంతం వచ్చినా శిశిరం ఇంకా వీడ్కోలు చెప్పలేదంటూ చల్లటిగాలి విసురుగా ముఖాన్ని పలకరించింది.ఎటుచూసినా విరగబూసిన పూల గుత్తులే..ఒక్క క్షణం మనసు ఒకలాంటి తన్మయత్వంలో మునిగింది. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కధల్లో రాజకుమారి ఉద్యానవనం గుర్తొచ్చింది. సడనుగా రాజకుమారి ఎందుకు గుర్తొచ్చిందా అనుకుంటే ఎదురుగా పూపొదలు. అచ్చంగా చందమామ కధలో బొమ్మ లాగే…కారు పార్క్ చేసి ముందుకు నడుస్తూ నిట్టూర్చింది రజిత.

మనసునిండా ఆలోచనలు…అంతర్ముఖం ఫరవాలేదు, చిన్నప్పటినుండీ అలవాటేగా!ఎందుకో ఈమధ్య మరీ పరాకైపోయింది.పదే పదే వెనక్కి తొంగి చూసుకోవడం.సెల్ఫ్ పిటీనా?? మరీ ఎడారిలాంటి జీవితం.ఎలాంటి అనుభూతి గుర్తులేదేం? ఎందుకంత జడత్వం ఆపాదించుకున్నాను. ఏమో? అందరికీ నచ్చే ఏవీ తనకెందుకు ప్రత్యేకం అనిపించవు? చెట్టునిండా విరగ్గాసిన మల్లెపూలను 20 మైళ్ళు డ్రైవు చేసి మరీ వచ్చి కోసుకెళ్ళిన దీప గుర్తొచ్చింది. కుదిరినా కుదరక పోయినా ఎగబడి మోతీచూర్ లడ్డు తినే అనంత్, ఎక్కడ సేల్ అంటే అక్కడ ప్రత్యక్షం అయ్యే రూప,పట్టుచీరలకు ప్రాణం ఇచ్చే లలిత, కవిత్వం తో చంపే మధు, ఎక్కడా లిస్ట్ లో లేను..ఎందుకని?

అనవసరంగా లీవు వేస్ట్ చేసుకోవద్దని భర్తని వారించడం గుర్తొచ్చింది. పేచీలు పేచీలతో చిన్నాణ్ణి స్కూల్లో వదలడం గుర్తొచ్చింది..తెలీకుండానే ఓ నిట్టూర్పు..మెట్రోరావడంతో ఎక్కి కూర్చుంది.ఎందుకో ఇవ్వాళ శాంఫ్రాన్సిస్కో ఇంకా అందంగా కనిపిస్తుంది.మనసు వద్దన్నా గతం తోసుకొస్తూనే ఉంది.బహుశా మొన్నే విజిట్ కని వచ్చి కలిసిపోయిన క్లాస్మేట్ ప్రభావమేమో …..

ఆడపిల్లగా పుట్టడం శాపమా??వరమా? వరమైతే ఖచ్చితంగా కాదు.ఎందుకని? వివక్షను సహించాలిసి వచ్చినందుకా? ఎక్కడ లేదు వివక్ష? చదువురాని అమ్మమ్మ, కొద్దో గొప్పో చదువుకున్న అమ్మ, అందరూ భరించినవారే.అందుకే అప్పుడే నిర్ణయించుకుంది.

జీవితంలో ఓడిపోకూడదు అని. మరి గెలిచానా? గెలిచాను కానీ ….ఆగిపోయింది ఆలోచన అక్కడితో…

నిజంగా ఆలస్యంగా వివాహం వల్ల శారీరక సమస్యలుంటాయని ఎవరూ అనుకోగా వినలేదే?ఏమో? అందువల్లనే కాన్సరు వచ్చిందా? 30 ఏళ్ళు ఆలస్యమా?

ఎక్కడ పరుగాపాను? ఆడపిల్లనని గుర్తుంచుకున్నది ఎక్కడ? పదో తరగతి స్కూల్ ఫస్ట్.విజయపు రుచి తెలిసిన తొలి క్షణం…గుంటూరు జిల్లాలో వెనకపడ్డ చిన్న పల్లెటూరు. ఇంగిలీషు మీడియం అంటే పక్కనున్న టవును ఖర్చు..కనుక నాన్న వద్దనే అన్నాడు. తెలుగు మీడియమే ఐతేనేం ఇంజినీరింగ్.వెంటనే ఎంటెక్.భవిష్యత్ గురించి గంపెడాశ.దానితో పాటే పెరిగిన అహం..ఉద్యోగం రాని నిర్లిప్తత భాగ్యనగరం అక్క ఇంటికి చేర్చింది.బ్రతుకు పోరాటం…

ఏదో సాధిస్తానన్న గొప్ప నమ్మకంతో అందరూ కిరీటం నెత్తిన పెట్టి మామూలు ఆడపిల్లగా అలోచించనివ్వలేదు.మనసులో ఉక్రోషాన్ని ఆపుకోవటం మించి మార్గం లేదు.నోరు విప్పేలోపే పూలు పెట్టుకోననీ, గోరింటాకు వాసన చూడననీ, నగలు ఇంటరెస్ట్ లేదని ఒకటేమిటి సగటు ఆడపిల్ల కు అని సంఘం నిర్ణ్యించిన ఏ పనీ చెయ్యకూడదు అని వాళ్ళే నోరిప్పేలోపు ఓ స్టాంప్ వేసేసారు…పళ్ళబిగువున ఒప్పుకోవాలిసి వచ్చింది.

ఎర్రగా, మొహం నిండా చిన్న చిన్న గుంతలు, బిగించి కట్టిన కాటన్ చీర, జడా ఇవి చాలేదు ఆడపిల్లగా అబ్బాయిలు తిరిగి చూడ్డానికి…చిరుద్యోగిగా అంతవరకూ చదివించిందీ, కన్నదే గొప్ప పొమ్మన్న తండ్రీ…జీవితం మీద ఆశ చచ్చినవాడు చేసుకోవాలిసిందేరా ఈవిడగారిని పక్క మగపిల్లల కామెంట్లూ..రోషం.. పొట్ట చేతపట్టి వీధిలోకి తరిమింది. వరదొచ్చినట్లు కంప్యూటర్ అవకాశాలు..దానితో పాటే సంపాదన.పెళ్ళి గురించి అమ్మ కలలు తను అనుకున్న మిస్టర్ పర్ఫెక్ట్..కులం అక్కరలేదని ప్రకటించి మరీ వడపోసినా దొరకని అభ్యుదయం.. ఉద్యోగం తో అవకాశాలూ అమెరికా చేర్చాయి….

అమ్మ చూసిన సంబంధాలన్నిటిలోనూ ఆర్ధిక లెక్కలే కనపడ్డాయి..ఎంత చిత్రం!డబ్బు లేనప్పుడు డబ్బున్న మగవాడు అవిలేని ఆడపిల్లను ఎందుకు పెళ్ళాడరాదన్న సమభావన
స్వంతంగా డబ్బు చేరేసరికి ఎదుటి మనిషి మీద చిన్న చూపుగా మారింది..ఇష్టం లేకుండానే డిపెండెంట్గా వస్తానన్న కుర్రవాని సంబంధం…

అసంతృప్తి…భరించలేక పెళ్ళైన రెండు గంటలకే వదిలేసి తెగతెంపులు…మనసు మూలుగుతూనే…నా తప్పేమీ లేదని మనసుతో ఎన్నిసార్లు పోరాడినా ఓదార్పు లేదు..నిజంగానే తప్పు లేదా? అవును నన్నొక ఆడపిల్ల అనే అనుభూతిని కలిగించలేదు అతను నన్ను అడ్డు పెట్టుకుని నేను సంపాదించే డాలర్లతో తను కెర్రెరు ప్లాన్ చేసుకున్నాడు అందుకే వదుల్చుకున్నాను. ఛ…నిజమా? మరి ఈ పెళ్ళి తరువాత నువ్వెన్నాళ్ళు ఉద్యోగం చేసావు?నిన్నెంత నీ భర్త సపోర్ట్ చేసాడు? లోపలనుంచి వెటకారం. మరదే నువ్వు చెయ్యాలిసివస్తే ఎన్ని లెఖ్ఖలు వేసావు? మరి నీ లెఖ్ఖలు తప్పాయిగా?

ఇప్పుడు నవ్వొస్తుంది అన్ని లెఖ్ఖలూ బాగానే ఉన్నాయి…ఆయువు లెక్కే తప్పింది. ఎవరినడగాలి? దేవుడి మీద నమ్మకం కూడా లేదే ?పరిచయస్తులందరి దగ్గరనుండీ పారిపోయి, చుట్టాలను పలకరించకుండా ఎన్నాళ్ళు?తెలిసి పిట్టపురుగుకు సాయపడలేదు.

చిత్రంగా ఆన్లైనులో కలిసాడు…దెబ్బ తిన్న జీవితం మళ్ళీ చిగురు వేయాలని ఆశ…అయ్యో మళయాళీ మనసు మూలిగింది….షట్ అప్..పెళ్ళీ, ఇద్దరు పిల్లలు…ఏ కెరీర్ చూసి మిగిలిన ప్రపంచాన్నినిర్లక్ష్యం చేసానో ఆ కెరీరు మూణ్ణాల ముచ్చటే ఐంది.ఆరోగ్యం సహకరించక, ఆనూ, ఆఫూ…

నర్స్ రిమైండ్ చెయ్యడం తో ఇహలోకంలోకి వచ్చింది…దాక్టర్ వచ్చే లోగా చుట్టూ చూస్తూ ఇండియాలో ఎంత క్రేజూ ఈ దేశం గురించీ ..అనుకోగానే పలుచటి నవ్వొచ్చింది..కళ్ళుమూసుకుని ప్రొసీజర్ కోసం ఎదురు చూస్తూ…

చూసినవీ, విన్నవీ గుర్తు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఊహూ…రెండు సార్లు సర్జరీలూ, కీమోలూ, అంతా బాగానే ఉంది
అనుకున్నాక మరలా ఈ తిరగబెట్టడం ఏంటో? మగత కమ్మేసింది….శరీరం గాల్లోకి లేస్తున్న ఫీలింగ్. భళ్ళుమంటూ రక్తం…దానితో పాటే కొంచం తెలివీ…సడుంగా గుర్తొచ్చింది.
పిల్లలు స్కూల్లో, భర్త ఆఫీసులో.ఇదేంటి ఇక్కడ? ఏమవుతుంది నాకు…ఒక్కసారి కన్ను మూసిన తండ్రీ, ముడుతలు పడ్డ ముఖంతో తల్లీ గుర్తొచ్చారు..చిత్రంగా అక్క,అన్నలు…ఏమవుతుంది. ఇల్లూ, ఇంట్లో క్లాకు, ఇస్త్రీ చెయ్యాలిసిన దుస్తులూ, తల తిరుగుతుంది.

అంటి? ఇవేనా ఆఖరి క్షణాలంటే? నేనేమి తప్పు చేసాను? 40 ఏళ్ళు చనిపోయే వయసు కాదు. చూడాలిసిన జీవితం ఇంకా ముందే ఉంది. ఎప్పుడన్నా, ఇగోతో, యాటిట్యూడ్తో జనాలను బాధపెట్టానేమో?
అంతే? నేనే పాపం చెయ్య లేదు…ఆ తెగతెంపుల పెళ్ళి కొడుక్కే నేను జవాబు చెప్పాలి..నేను ముందే చెప్పాను నాకు ఈ పెళ్ళి తంతు నచ్చదని.నగలు పెట్టుకోనని ఐనా వాళ్ళు ఎందుకు వెంటపడాలి?
ఏంటి? అదేనా కారణం?అందుకేనా తెగతెంపులు. మరి ఇంట్లో వాళ్ళు,ఊళ్ళోవాళ్ళు, చెప్పారని ఇవ్వాళ్ళ రేపు అమ్మనీ, అక్కనీ, సొంత ఆలోచన లేని వాడు….

ఆలోచనల పూసలు పేర్చుకుంటూనే ఉన్నాయి మధ్యలో దారం తెగి రాలుతూనే ఉన్నాయి.మొదటిసారి జేఎఫ్కేలో కాలు పెట్టడం..ఎదురొచ్చిన ఫ్రెండ్…జీవితమ్మీద బోలెడన్ని ఆశలూ, ఎవరూ లేకుండా నే జరిగిన పెళ్ళి…మొదటిసారి పుట్టిన పసికందును చేతిలోకి తీసుకున్న క్షణం…బుగ్గలమీద వెచ్చగా భర్త స్పర్శ…నా జీవితం నేననుకున్నట్లు ఎడారికాదు అని అరవాలనిపించింది..నోరు పెగల్లేదు…

దేవుడా, పాపాలూ, పుణ్యాలూ నేను లెఖ్ఖ కట్టుకోలేదు.నా జీవిత పోరాటమే నాకు సరిపోయింది.దయ చేసి నన్ను బ్రతకనివ్వు..మనసు వేడుకుంటూనే ఉంది. రైల్వే స్టేషన్ లో పార్క్ చేసిన కారు  గుర్తు కొచ్చింది.ఇవే ఆఖరి క్షణాలా? ఎక్కడ పుట్టాను? ఏడు సముద్రాల చివర ఈ ఒడ్డున ఎవరూ నన్ను కన్నవాళ్ళు, నేను కన్నవాళ్ళు, నా తోడబుట్టినవాళ్ళూ, నేను తోడు చేసుకున్నవాళ్ళు ఎవరూ ఒక్కరైనా తోడు లేకుండా ఎందుకింత శిక్ష? చిత్రంగా ఏమీ గుర్తు రావడం లేదు.. పిల్లలు అనుకునే లోపు అంతా చీకటైపోయింది.ఆఖరుగా మాటలు…మైగాష్…షి ఈస్ నో మోర్..కాల్ హర్ హస్బెండ్….అంతులేని నిశ్శబ్దం…..

సాహచర్యం

radhamanduva1

 

{రచయిత్రి రాధ మండువ మదనపల్లి కి దగ్గర లోని రిషీవాలీ స్కూల్లో తెలుగు టీచర్ గా పని చేస్తున్నారు. పిల్లల కోసం కొత్తపల్లి మాగజైన్ లో దాదాపు 25 కథలు రాశారు.)

నా చుట్టూ ఇంతమంది ఉన్నా నేను ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకుంటాను.  నాలోకి నేను చూసుకోవడానికి నేను ఏర్పరుచుకున్న ఈ ఒంటరితనం  నన్ను శిఖరానికి చేరుస్తుందా లేక లోయల్లోకి జారవిడుస్తుందా?  ఏదైతే మాత్రమేం?  నన్ను నేను తెలుసుకున్నాక.  అంతా ఒకటే అప్పుడు.  అసలు నాలోనే ఉన్న ‘ నేను ‘  ను వెతుక్కోవడానికి ఎందుకు ఇంత బాధ?  సహజంగా – మామూలుగా, అతి మామూలుగా, మంచి నీళ్ళు తాగినంత సులభంగా నాలోని నేనుని గుర్తించలేనా?  కళ్ళెత్తి చూశాను గర్భగుడిలో ఉన్న ఆ దేవదేవుడి వైపు – నా ప్రశ్నకి సమాధానం ఏమిటి అన్నట్లు.

నవ్వుతున్నాడు చిద్విలాసంగా.  అతని ప్రక్కనించి మెల్లగా నడిచి నా వైపే వస్తున్న ఆమెని చూడగానే సమాధానం కోసం ఆతృత పడబోతున్న నా మనసు నెమ్మదించింది.  సంతృప్తితో కూడిన సౌందర్యంతో వెలుగుతున్న ఆమె ముఖంలోని చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

” హారతి తీసుకోండి,” అంది నాకు దగ్గరగా వచ్చి.  ఆమె ఏమందో ఆమె పెదవుల కదలికల ద్వారా అర్థమైన నేను ఆమె చేతులవైపు చూశాను.  అప్రయత్నంగా హారతిని కళ్ళకద్దుకున్నాను.  కొబ్బరిముక్కను నా చేతిలో పెట్టి మెట్లు దిగి వెళ్ళి నందీశ్వరుడి విగ్రహం ప్రక్కగా వెలుగుతున్న హారతిని వదిలేసింది.  వెలుగుతున్న హారతిని చూస్తూ మళ్ళీ మెట్ల మీదకు వచ్చి కూర్చుంది నాకు కొంచెం ఎడంగా.

గోపురం మీద నుండి సూర్యుడు పైకి ఎగబాకుతున్నాడు.  గూళ్ళలోని పావురాలు మా ప్రక్కగా వాలి కువకువలాడుతున్నాయి.  ఆమెని పలకరించాలని, ఆమె ఎవరో తెలుసుకోవాలని తపనగా ఉంది.

” మీరు – మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు.  ఈ ఊరికి కొత్తవారిలా ఉన్నారు,” అన్నాను.

” అవును.  గుడికి మీరు రోజూ వస్తుంటారా?”

” ఊ ” అన్నాను ఆమె వైపే చూస్తూ – నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నట్లుగా ముఖం పెట్టి.

” నేను ప్రెసిడెంట్ రాఘవరావు గారి చిన్న చెల్లెల్ని ”  అంది.  నిర్లిప్తత ఆమె కంఠంలో స్పష్టంగా తెలుస్తోంది.

” నువ్వా! ” అన్నాను అప్రయత్నంగా.

” మీరు – నువ్వులోకి మారింది చూశారా!  నా గురించి చెప్పగానే ”  అంది ఆవిడ నవ్వుతూ.  ఆమెకేమీ సమాధానం చెప్పలేకపోయాను.

ఆమె ముఖంలో ఏ మాత్రం తొట్రుపాటు కాని, చేసిన పనికి పశ్చాత్తాపం కాని లేవు.  అదే సుందర దరహాసం.  శివుడి కోసం వచ్చిన పవిత్ర గంగలా అంత స్వచ్ఛంగా ఎలా ఉంది?  ఆమె గురించి నేను విన్నవన్నీ నిజమేనా?  ఇంట్లో పని చేసే పాలేరుతో లేచి వెళ్ళిపోయిందనీ,  అతన్ని కూడా వదిలేసి మరెవరితోనో ఉందనీ,  పాపం ఆ పాలేరు ఏ రైలు కిందో పడి చనిపోయాడనీ –  మరి ఆమె ముఖంలో ఆ సంతృప్తి , కళ్ళల్లో కాంతి ఎలా సంభవం?  –  ఏమిటిది?  లేచి పోయినంత మాత్రాన ఆమెలో సంతృప్తి ఉండకూడదా?  –

నా ఆలోచనల్లో నేనుండగానే ఆమె  మెట్లు దిగుతూ ” వెళ్ళొస్తానండీ ”  అంది.

నేను కూడా  ఆమె వెంట నడిచాను.  ముఖద్వారం దాటుతూ ఆమె ప్రక్కనే నడుస్తున్న నన్ను  చూస్తూ ” మీ గురించి ఇప్పుడే పూజారి గారు చెప్తే విన్నాను ”  అంది.

” మీ గురించి నాకూ తెలుసుకోవాలని ఉంది ”  అన్నాను ఆమెకి సమాధానంగా.  ఆమె మౌనంగా ఉంది.  ఏమీ మాట్లాడలేదు.

” మీ ఊళ్ళోని బడిలో ఉపాధ్యాయునిగా చేరి పదేళ్ళు అయింది. వరదల్లో భార్యాబిడ్డని పోగొట్టుకుని  ఒంటరివాడిని అయిందీ ఇక్కడే.  నాకు చేతనైనంతలో అందరికీ సాయం చేస్తున్నాను.  అయినా నాలో సంతృప్తి లేదు.  దాని కోసం నిరంతరాన్వేషణలో ఉన్నాను.  మీలో ఆ సంతృప్తిని చూశాను కనుకనే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ” అన్నాను.

నిదానంగా మాటలు పేర్చుకుంటూ ఏదో అలౌకికంగా మాట్లాడుతున్నాననేమో నన్ను గౌరవంగా చూస్తూ   ” నాక్కూడా నా గురించి మీకు చెప్పాలని ఉంది.  ఒకే అన్వేషణలో ఉన్న బాటసారులే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు ”  అని ఆగి  ” ఇప్పుడు సమయం లేదు.  ఇంటికి వెళ్ళి వంట చేసుకునే పని ఉంది.  క్షమించండి మిమ్మల్ని మా ఇంటికి పిలవలేను.  పరాయి పురుషుడిని ఇంటికి తీసుకొచ్చిందని లోకం కూసే కూతలు వినే ఓపిక ఇక నాకు లేదు.  అంతేగాని భయం మాత్రం కాదు ”  అంది.

ఏవో జ్ఞాపకాలు ఆమె కళ్ళను తడి చేశాయి.  ఆమె కళ్ళలోని ఆ తడిని నేను చూడకూడదన్నట్లుగా తలవంచుకుని ” రేపు ఇక్కడే మాట్లాడుకుందాం. వస్తానండీ ” అంటూ త్వరత్వరగా నడుస్తూ వెళ్ళిపోయింది.

ఆమె పేరు అపురూప.  నిజంగానే ఆమె అపురూపంగా ఉంది.  స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నా కూడా ఆమె జ్ఞాపకాలు నాలో వేళ్ళాడుతూనే ఉన్నాయి.  చిత్రంగా ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను.  నిద్ర లేవగానే మళ్ళీ నాలో ఆమె జ్ఞాపకాలు.  ఆమె స్నేహభావం, నిస్సంశయంగా ఆమెని ఆమె వ్యక్తీకరించుకున్న విధానం,  ఆమె కళ్ళల్లోని కాంతి తల్చుకుంటూ అలాగే పడుకున్నాను.  స్త్రీ లోని స్నేహభావాన్ని మొట్టమొదటి సారిగా చవి చూడటం వల్లనో లేక హాయిగా నిద్రించినందువల్లనో తెలియదు కాని నా అంతరంగం పురి విప్పిన నెమలిలా ఉంది.

లేచి గబగబా కాలకృత్యాలు , స్నానం ముగించుకుని రోజూ వెళ్ళే సమయం కంటే ముందే గుడికి చేరుకున్నాను.  లోపలకి వెళ్ళాలనిపించలేదు.  నిన్న కూర్చున్న చోటే మెట్ల మీద కూర్చున్నాను.

చల్లని ఉదయపు గాలి, పక్షుల కిలకిలారావాలు స్థిర ప్రశాంతతను కలిగిస్తున్నాయి.  గర్భగుడిలో పూజారి చదువుతున్న లింగాష్టకం లీలగా వినిపిస్తుంది.  కొద్దిసేపటికి అపురూప హారతి పళ్ళెంలో కొబ్బరికాయ, పుష్పాలు, అగరొత్తులతో వచ్చింది.  నేరేడు రంగు పట్టు చీర, బంగారు రంగు జాకెట్టులో మెరిసిపోతుంది.  వదులుగా వేసిన జడలో మందారం తురుముకుంది.  నలభై ఏళ్ళ వయసులో కూడా ఆమె దేహం లావణ్యంతో కాంతులీనుతోంది.  నన్ను చూసి స్నేహపూర్వకంగా నవ్వింది.

లోపలికి వెళ్ళి పూజ ముగించుకుని వచ్చి నా ప్రక్కనే కూర్చుని ” మీ పూజ అయిందా ” అని అడిగింది.  ఆమెకి సమాధానం చెప్పాలనిపించలేదు.  గోపురం గూళ్ళల్లో ఉన్న పావురాలను చూస్తూ ” ప్రకృతిలో తెలియరాని రహస్యమేదో ఉంది.  విశ్వేశ్వరుని స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ఆ రహస్యాన్ని ఛేధించాలి.  ఆ లీలా రహస్యం మీకు అవగతమైనట్లుంది కదూ! ”  అన్నాను.

నా మాటలకు సమాధానం లేదు.  తలతిప్పి ఆమె వైపు చూశాను.  మోకాళ్ళ పైన గడ్డం ఆనించి తలవంచుకుని కూర్చుని ఉంది.  ఆమె ఏడుస్తున్నట్లు నాకు అనుమానం కలిగింది.

” ఏమైనా తప్పుగా మాట్లాడానా అపురూపా! ”  అన్నాను ఆందోళనగా.

ఆమె పేరు నా నోటి నుండి వినడంతోనే తల ఎత్తి నా వైపు చూసింది.  ఆ తడి కళ్ళల్లో కూడా వెలుగే.  సందేహం లేదు.  ఈమె అనుభవించిన జీవితం అమెకీ వెలుగునిచ్చి ఉంటుంది.  నడి సముద్రంలో జరిపిన ఒంటరి యాత్రలో ఆమె దు: ఖాన్ని  జయించగలిగి ఉంటుంది.

తూర్పు దిక్కున బాలభానుడు సింధూరపు రంగును పూసుకుని ఉదయిస్తున్నాడు.  చల్లని ప్రభాతవాయువులు మందబడుతున్నాయి.

” నా గురించి మీరేం విన్నారో నాకు తెలియదు.  అహంకారం, అధికారం, డబ్బు నాకు పుట్టుకతోనే వచ్చాయి.  నా చుట్టూ ఉన్న వాళ్ళూ అంతే.  వాళ్ళ ద్వారా నా అహం తృప్తి పొందేది కాదు.  నేను చెప్పే ప్రతి మాటకూ తల ఊపుతూ నన్ను పొగుడుతూ అందలం ఎక్కించే మా పాలేరు చంద్రం దగ్గర నా అహం అణిగేది.  వాడికి నా పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి నా చుట్టూ తిప్పుకోవాలనో లేక యవ్వనపు పరువాల మైకంతోనో నా జీవితభాండాన్ని పొగరుతో ఒలకబోసుకున్నాను.  ఇంట్లో వాళ్ళకి తెలిసింది.  అర్థరాత్రి నా గది కిటికీలో నుండి నేను చూస్తూనే ఉన్నాను.  అరవకుండా చంద్రం నోట్లో గుడ్డలు కుక్కి గొడ్డుని బాదినట్లు బాది చంద్రాన్ని చంపేశాడు నా అన్న.  అప్పుడు భయంతో నేను వేసిన కేకకి నా మాట పడిపోయింది.  రాత్రికి రాత్రే నన్ను హైదరాబాదులో ఉన్న మామయ్య ఇంటికి పంపాడు.  చంద్రం చచ్చిపోతాడని ఊహించని నా అన్న తన పైన పోలీసు కేసు లేకుండా చేసుకోవడానికి చంద్రంతో చెల్లెలు లేచిపోయిందని పుకారు వేయడానికి కూడా వెనుకాడలేదు.

ఎప్పుడూ బిజీగా ఉండే మా ఎం. పి మామయ్య ఇంట్లో నా గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు.  నాకు నా అంటూ అక్కడ ఎవరూ లేరు.  ఆ నగర జీవితం నన్ను ఒంటరిని చేసింది.  చంద్రం చనిపోయిన సంఘటన వల్ల నాలో అహంకారం తగ్గింది కాని జీవితేచ్ఛ తగ్గలేదు. ఆ ఇచ్ఛే నన్ను ఒకరోజు ఇంట్లో నుండి బయటకు వచ్చేట్లు చేసింది.  షాపింగ్ కి వెళ్ళొస్తానని మామయ్యతో చెప్పి కారులో బయల్దేరాను.  మామయ్య డ్రైవర్ కి పుస్తకాల పిచ్చి.  నవలలు మార్చి కొత్త నవలలు తెచ్చుకుంటానమ్మా అంటూ కారుని లైబ్రరీ ముందు ఆపి లోపలకి వెళ్ళాడు. గమ్యం లేని నాకు లైబ్రరీకి వెళితేనేం అని అనిపించింది.  నాకు తెలియదు అదే – ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేస్తుందని.

లోపల చల్లగా ఉంది.  చాలా మంది నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు.  డ్రైవర్ నన్ను చూసి ” ఆ గదిలో నారాయణ బాబు గారి ప్రసంగం జరుగుతోందమ్మా, లోపలకి వెళ్ళండి ”  అంటూ ఓ గదిని చూపించాడు.  లోపలకి వెళ్ళి తలుపు ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాను.

” ప్రతి మనిషీ తనకేది సుఖాన్నిస్తుందో దానినే కోరుకోవడం సహజం.  ఈ మనస్సు ఆ కోరిక వైపు పరిగెత్తుతుంది.  అది దొరికాక మరొక దాని కోసం పరిగెత్తుతుంది.  ఈ కోరికలకి అంతూ పొంతూ ఉండదు.  కాబట్టి ఈ కోరికలు ఎక్కడనుండి పుడుతున్నాయో కనుక్కో.  పుట్టే చోటుని వెతికితే చాలు ఆశ్చర్యంగా అన్ని కోరికలూ, సందేహాలూ ఆగిపోతాయి ”  సన్నగా, పొడుగ్గా లాల్చీలో ఉన్న అతని మాటల్లో కొత్తదనం – ఎప్పుడూ ఊహించను కూడా ఊహించని మాటలు.  నాలో ఏదో శాంతి.

ప్రతిరోజూ అదే సమయంలో నారాయణబాబు ప్రసంగం ఉంటుందని తెలిసింది.  ఎవరితో మాటలు లేవు.  నిశ్శబ్దంగా ఆయన ప్రసంగం వినడం,  వాటిని గురించి ఆలోచించడం.  నాకు తెలియకుండానే నాలో మార్పు.  నా తలనిండా సందేహాలు నా మౌనాన్ని విడిచేట్లు చేశాయి.  నారాయణ బాబుతో చర్చలు – గంటలు నిమిషాల్లా గడిచేవి.  ఈ సారి నా తప్పేమీ లేదు.  నారాయణ బాబే నా సందేహాలు తీరుస్తూ నాకు దాసుడయ్యాడు.  స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న నేను,  నా జీవితం నాకుండాలని తపన పడుతున్న నేను –  ధైర్యంగా  అతనితో  నిజంగానే లేచిపోయాను.  నా ఉనికే భరించలేని నా కుటుంబం’ పీడా వదిలింది ‘ అనుకుంది.   పాలేరుని కూడా వదిలేసి మరోడితో లేచిపోయింది.  పాపం వాడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అని మరో పుకారు లేపి ఊపిరి పీల్చుకుని ఉంటాడు మా అన్న.

నారాయణబాబు ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు.  పగలంతా ఇంటిపని చేసుకుని ధ్యానం లేదా పుస్తకాలు చదువుకోవడం.  సాయంత్రం లైబ్రరీలో అతని ప్రసంగాలు – నాకు జీవితం అంటే ఏమిటో తెలిసింది.

ఆరోజు – ఆఫీసు నుండి ఇంటికి వస్తూండగా నారాయణ బాబుని లారీ గుద్దింది.  ఎంత మందికో జీవన రహస్యాలని విశదీకరించిన నారాయణ బాబు రహస్యం గానే విశ్వంలో కలిసిపోయాడు.

‘నేను నీకంటే ముందు చనిపోతే నువ్వు మీ ఊరికి వెళ్ళిపో – స్వచ్ఛమైన ఆ పల్లెలో ప్రశాంతంగా బ్రతకొచ్చు.  ఎవరో ఏదో అంటారనే భయం నువ్వు తప్పు చేస్తేనే కలుగుతుంది.  సమాజ నీతిని నిర్లక్ష్యం చేస్తే కలుగుతుంది ‘ అని బ్రతికుండగా నారాయణ బాబు చెప్పిన మాటలే నన్ను మళ్ళీ మా ఊరికి చేర్చాయి  ”   ఏకబిగిన మాట్లాడిన ఆమె ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు క్షణం ఆగింది.

” నా గురించి నా వెనక ఏం మాట్లాడుకుంటున్నారో,  ఇంత కాలం ఎలాంటి కథలు అల్లారో నాకు అనవసరం ప్రసాద్ గారూ!  నా పూర్వజన్మ సుకృతం వల్లనో, నారాయణ బాబు సాహచర్యం వల్లనో’ నేను ‘  ను తెలుసుకుంటున్నాను.  ఈ పెంజీకటి కావల ఏముందో తెలుసుకోవాలని మీలాగే తపన పడుతూ అన్వేషిస్తున్నాను ”  అంది.  ఆమె గొంతులోని ఆర్తి రెపరెపలు నన్ను కదిలించాయి.  నేనేమీ మాట్లాడలేదు.  అసలు నాకు మాట్లాడాలనిపించలేదు.  దాదాపు గంట సేపు మా ఇద్దరి మధ్యా మౌనం భాషను తరంగాల రూపంలో ప్రసారం చేసింది.

” వెళ్ళొస్తానండీ ”  అంటూ నా అనుమతి కోసం చూడకుండా కనీసం నా వైపైనా చూడకుండా మెట్లు దిగింది.  ఎర్రగా కాలినట్లున్న ఆమె జడలోని మందారాన్నే చూస్తున్నాను.  హఠాత్తుగా ఏదో మరిచిపోయిన దాని మల్లే వెనుదిరిగి ఆమె నాకు దగ్గరగా వచ్చింది.  పళ్ళెంలోని కొబ్బరి ముక్కను నా చేతిలో ఉంచి కదిలిపోయింది.

వెనుదిరిగి నా దగ్గరకి వచ్చే ఆమెని చూసి నేనేం ఊహించానో మరి నా మనసు తీవ్ర ఆశాభంగానికి లోనయింది.  ఓ దీర్ఘ నిట్టూర్పు నాలోనుండి వెలువడింది.  నా మనసేమిటో నాకు తెలిసింది.

” అపురూపా!  ఒక్క క్షణం ఆగు ”  ఆమెని పిలుస్తూ మెట్లు దిగి ముఖద్వారం వైపు పరిగెత్తాను.  నా గొంతులోని ఆతృతకి ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసింది.   నేను పరిగెత్తిన అలికిడికి ఒక్కసారిగా అరిచి పైకి లేచిన పావురాలు నిశ్శబ్దంగా మళ్ళీ మెట్ల మీద వాలాయి.  గుడి గోపురం నీడ మా ఇద్దరినీ కప్పేసింది.

” నీ గురించి ఇన్నేళ్ళూ ఈ జనం ఏం మాట్లాడారో, ఇప్పుడు నీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు అపురూపా!  ఈ జనం నోళ్ళు మూతలు పడేట్లుగా అందరి ఎదుటా, వేదమంత్రాల సాక్షిగా నిన్ను స్వీకరిస్తాను.  అప్పుడే నారాయణ బాబు నీకందించిన సంతృప్తి మసి బారకుండా ఉంటుంది.  నీతో పాటు నా జీవితం సఫలమవుతుంది ”  అంటూ ఆమె అనుమతి లేకుండానే అప్రయత్నంగా ఆమె చేతిని అందుకుని నా చెంపకి ఆనించుకుని కళ్ళుమూసుకున్నాను.

ఆమె సున్నితంగా తన చేతిని విడిపించుకుంది.  ” క్షమించండి.  కాలం మించిపోయింది.  చిన్నతనంలో చేసిన తప్పులను, గాయాలను లెక్కచేయం.  యవ్వనంలో జరిగిన భావోద్రేకాలకూ భయపడం.  కాని ఇప్పుడు చిన్న గాయం గాని,  తప్పుడు భావం గాని సహించడం చాలా కష్టం.  నా వల్ల మీరు ఈ సమాజంలో గౌరవం కోల్పోయినప్పుడు – నా సంతృప్తిని మసిబారకుండా చేయాలన్న మీ ప్రయత్నం సంగతి అలా ఉంచండి – ఇద్దరం అశాంతి పాలవుతాం”  అని నా సమాధానం కోసం అన్నట్లుగా ఆగింది.  నేనేమీ మాట్లాడలేకపోతున్నాను.  నా మనసంతా శూన్యంలో ఉన్నట్లుగా ఉంది.

“నా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని నాకు తెలుసు.  వస్తానండీ ”  అంటూ ముఖద్వారం దాటి మలుపు తిరిగి  వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయిందన్న స్పృహ కూడా లేకుండా అలాగే నిలబడిపోయాను.  నా మనసు ఆమె మాటల లోతుల్లో ఉన్న గాఢత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.  ఆమె విచక్షణా జ్ఞానం ముందు తలవంచుతోంది.  గుడి గోపురమూ, పావురాల కువకువలూ, ఆమె రూపమూ అన్నీ నాలో ఐక్యమై ఎన్నడూ కలగని శాంతి కలగసాగింది.

అప్పుడు – ఆ క్షణం అర్థమయింది  – నేను ‘  ని  కనుక్కోవడానికి ఎంత గాఢత కావాలో.

 ***