గుర్రపుకళ్ళెం

chinnakatha 

అనగనగా ఒక ఊళ్ళో ఒక మనిషి. అతనికొక బండి, బండికొక గుర్రం, గుర్రానికొక కళ్ళెం ఉన్నాయి.

మనిషి పొద్దస్తమానం బండికి గుర్రాన్ని కట్టి, బండిలో జనాన్ని, వస్తువుల్ని ఎక్కించుకుని ఒకచోటినించి మరోచోటికి చేరవేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. సంపాదించిన డబ్బు దాచుకుంటున్నాడు. కానీ గుర్రానికిమాత్రం సరిగా తిండి పెట్టట్లేదు. బలమైన ఆహారం లేక, చాకిరి ఎక్కువై గుర్రం వేగంగా పరుగెత్తలేక పోతోంది. దాంతో కొరడా దెబ్బలు ఎక్కువయ్యాయి. దానికితోడు నోట్లో కళ్ళె మొకటి, ఇబ్బందిగా. గుర్రానికి జీవితం అస్సలు నచ్చలేదు.

ఒకరోజు గుర్రం అతన్ని అడిగిందిబండబ్బాయ్! బండబ్బాయ్! నన్ను ఉపయోగించుకుని నువ్వు ఇంత డబ్బు సంపాదిస్తున్నావే! నాకు కడుపు నిండా తిండి పెట్టరాదా?” అని.

అప్పుడు అతను! ఎన్ని డబ్బులు వచ్చినా నాకు, నా కుటుంబానికి తిండి ఖర్చులకే చాలట్లేదు. ఉన్నదాంట్లోనే నీకూ ఏదో కాస్త పెడుతున్నాను. సరిపెట్టుకోఅన్నాడు.

రోజంతా గుర్రం పరుగెత్తుతూ, పరుగెత్తుతూ ఆలోచించింది, ఆలోచించింది. చాకిరి తప్పించుకుని, సుఖంగా జీవించే మార్గం అన్వేషించింది. చీకటి పడే వేళకి గుర్రం బండిని తిరగేసి, కట్లు తెంచుకుని పారిపోయింది.

బండి లాగే బాధ తప్పించుకున్నాను. ఏదో ఒక ఉపాయంతో కళ్ళేన్ని కూడా వదుల్చుకో గలిగితే నేను చాలాసతోషంగా జీవించ గలుగుతానుఅనుకుంటూ గుర్రం పరుగెత్తుతోంది. అట్లా వెళ్ళివెళ్ళి, తెల్లవారేటప్పటికి అడవికి చేరింది.

అడవిలో జంతువులన్నీ ఒకచోట విచారంగా కూర్చుని ఉన్నాయి. గుర్రాన్ని చూడగానేఎవరు నువ్వు? ఇక్కడి కెందుకు వచ్చావు? ఎక్కడినించి వచ్చావు? నీ నోట్లో అదేంటి? నోట్లో అది పెట్టుకుని గడ్డి ఎట్లా మేస్తావు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి.

నేను పట్నంలో బండి లాగే గుర్రాన్ని. మనుషులు పెట్టే హింస భరించలేక పారిపోయి వచ్చాను. నా నోట్లో ఉన్న దీన్ని కళ్ళెం అంటారు. ఇది ఉన్నా గడ్డిమెయ్యడానికి నాకేం ఇబ్బంది ఉండదు. కానీ దీన్ని పెట్టుకోవడం నా కిష్టం లేదు. ఎట్లాగైనా దీన్ని వదుల్చుకోవాలిఅని జంతువుల ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పి గుర్రంమీరంతా అందమైన అడవిలో స్వేచ్చగా తిరుగుతూ ఆనందంగా ఉంటారనుకున్నాను. పొద్దున్నే ఇట్లా కూర్చున్నారేంటి?” అని అడిగింది.

అడవికి రాజు ఒక సింహం. రోజుకొక జంతువు దానికి ఆహారంగా వెళ్ళాలి. అట్లా వెళ్ళడం మా కెవరికీ ఇష్టం లేదు. ఎవరికిమాత్రం చచ్చిపోవడం ఇష్టంగా ఉంటుంది? కానీ ఎదురుతిరిగితే విచక్షణ లేకుండా అందరినీ చంపేస్తుందన్న భయంతో అది చెప్పినట్లే నడుచుకుంటున్నాం. సింహం బాధ తప్పించుకునే ఉపాయం ఆలోచిస్తూ ఇట్లా కూర్చున్నాంఅని చెప్పాయి జంతువులన్నీ ఏడుపు గొంతుతో.

ఇంతలో సింహం అక్కడికి వచ్చిఏమే కుందేలూ! ఎండబడిపోతుంటే ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఆకలి దంచేస్తోంది. పూర్వం మా ముత్తాతని బావిలో పడేసినట్లు నన్నూ మట్టుబెట్టాలని చూస్తున్నావా?” అని గర్జించింది.

కాదు మహారాజా! అడవిలోకి కొత్త నేస్తం వస్తే మాట్లాడుతున్నాం. దీనికి మన అడవిలో ఆశ్రయం కావాలటఅంటూ గుర్రాన్ని చూపించింది కుందేలు. అంతటితో ఊరుకోకుండాచూశారా మహారాజా! అడవిలోని మిగతా జంతువుల్లా కాకుండా కొత్త జంతువుకు నోట్లో ఏదో ఆభరణం ఉంది. ‘రాజు మీరైతే ఆభరణం వేరే జంతువు పెట్టుకోవడమేంటి?’ అనిపించినువ్వు అడవిలో ఉండాలంటే ఆభరణం తీసి మా రాజుగారికి బహుమతిగా ఇవ్వాలని సంప్రదింపులు జరుపుతున్నాంఅంది.

సంప్రదింపులు జరిపేదేంటి? ఆభరణం నాకే చెందాలి. తక్షణం దాన్ని గుర్రం నోటినించి తొలగించి నాకు తగిలించండిఅని ఆజ్ఞాపించింది మృగరాజు.

గుర్రం సూచనల ననుసరించి జంతువులన్నీ కలిసి గుర్రం నుంచి కళ్ళేన్ని విడదీసి సింహం నోటికి తగిలించాయి.

నేను ఆభరణం అలంకరించుకున్న శుభసందర్భంగా ఇవాళ్టికి నిన్ను వదిలేస్తున్నాను. రేపు తెల్లవారే టప్పటికి నా గుహ ముందుండాలిఅని కుందేలుకి చెప్పి వెళ్ళిపోయింది సింహం.

అమ్మయ్య!” అనుకున్నాయి గుర్రము, కుందేలు ఒకేసారి.

ఆకలి మాట మర్చిపోయి కొత్త ఆభరణాన్ని అలంకరించుకున్న సంతోషంతో అడవంతా సందడి చేస్తూ తిరిగింది సింహం రోజంతా. మర్నాడు తెల్లవారేటప్పటికి సింహానికి ఆకలి నకనకలాడడం మొదలుపెట్టింది. కుందేలు వస్తుందేమోనని ఎదురు చూసిచూసి సింహమే వేటకు బయలుదేరింది.

నిన్న కుందేలుని తినకుండా వదిలేశానని ఇంక నాకు ఆహారంగా ఎవరూ రావక్కర్లేదు అనుకుంటున్నారా? పిచ్చివేషాలు వేశారంటే అందర్నీ ఒకేసారి చంపిపారేస్తానుఅని అరిచింది ఒకచోట చేరిన జంతువుల్ని చూసి.

జంతువులు వినయంగా చేతులు కట్టుకునిమహారాజా! మీరు కొత్త ఆభరణం ధరించి మరింత హుందాగా, ఉన్నతంగా కనిపిస్తున్నారు. మీకు ఆహారమయ్యే అర్హత మాకు ఉందో లేదో అని సందేహిస్తున్నాముఅన్నాయి.

అప్పుడు సింహం నోరు తడుముకుంది. ‘నోట్లో ఇది ఉంచుకుని తినడమెట్లాఅని ఆలోచించింది.

ముందు దీన్ని తొలగించండి. నా భోజనం అయ్యాక మళ్ళీ ధరిస్తానుఅంది.

అది మాటిమాటికి తీసి పెట్టుకునే ఆభరణం కాదు మహారాజా! ఒకసారి తీస్తే మళ్ళీ పెట్టడం కుదరకపోవచ్చు. మీరు మృగరాజు, అడవికి మహారాజు. ఒకసారి ఆభరణం ధరించి తీసెయ్యడం మీ హోదాకి తగదుఅంది గుర్రం.

మరి నేను ఆహారం తీసుకునే దెట్లా?” ప్రశ్నించింది సింహం.

తమ శరీరం కొత్త ఆభరణానికి ఇంకా పూర్తిగా అలవాటు పడకపోవడంవల్ల ఇబ్బందిగా ఉంది. రేపటికి అంతా సర్దుకుంటుంది. కాస్త ఓపిక పట్టండిఅన్నాయి జంతువులన్నీ ముక్తకంఠంతో.

మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా బింకంగా కాసేపు అటూఇటూ తిరిగి , ఇంక తిరిగే ఓపిక లేక గుహలోకెళ్ళి పడుకుంది సింహం.

ఆకలివల్ల రాత్రంతా నిద్ర పట్టలేదు సింహానికి. ‘రెండురోజులుగా ఆహారంలేక చాలా నీరసంగా ఉంది. మూడురోజులవార మూడు జంతువుల్ని చంపి తినాలిఅనుకుంటూ అడవిలోకి బయలుదేరింది పొద్దున్నే. కనుచూపు మేరలోనే జంతువులన్నీ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టుకోబోతే అందట్లేదు. వాటి వెంటపడి అలసిపోయిన సింహం ఏమీ చెయ్యలేక గుహలోకెళ్ళి నిరాహారంగా అలా పడుకుండిపోయింది.

ఇంతలో బండివాడు గుర్రాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడు. గుర్రాన్ని చూసిఎందుకిట్లా పారిపోయి అడవికి వచ్చావు? ఇంటికెళ్దాం రాఅన్నాడు.

నేను రాను. నా కిక్కడే బాగుందిఅంది గుర్రం.

ఎంతో కాలంగా మనం కలిసి ఉంటున్నాం. నా కుటుంబాన్ని పోషించేది నువ్వే. నువ్వు లేకపోతే మేమంతా ఆకలికి తట్టుకోలేక చచ్చిపోతాం.”

నీ దగ్గర నాకు తిండి చాలట్లేదు. అరకొర తిండితో నీకు కావలసినంత చాకిరి నేను చెయ్యలేను.”

ఇకమీదట అటువంటి పొరపాటు జరగనివ్వను. నీ తరువాతే నా కెవరైనా. ముందు నీ కడుపు నిండాకే మా పొట్టల సంగతి చూసుకుంటాము.”

నా కళ్ళెం అడవికి రాజైన సింహం తీసుకుంది. వెళ్ళి తీసుకురా.”

ఇంకా అందమైన కొత్త కళ్ళెం కొంటానుగదా నీకు.”

ఊళ్ళో మనుషులమధ్య జీవితం నాకు నచ్చలేదు.”

ఊళ్ళో మిగిలిన జంతువులు యజమానులపట్ల విధేయతతో మెలుగుతుంటే నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు?”

వాటి గోల నా కనవసరం. నేను నా మిత్రులందరిని వదిలి నీతో రాను.”

బండివాడు కోపంగా చెర్నాకోలా జంతువులవైపు విసిరాడు. జంతువులన్నీ భయపడి చెల్లాచెదురై పోయాయి. బండివాడు బలవంతంగా గుర్రాన్ని తోలుకుని వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు మళ్ళీ సింహం ఆహారంకోసం అడవిలోకి వచ్చింది. జంతువులు పారిపోకుండా సింహం ఎదురుగా ధైర్యంగా తిరుగుతున్నాయి. ఉడుతలు, ఎలుకల్లాంటి ఆకతాయిలు సింహం నోట్లోని కళ్ళెంనుంచి కిందకి వేళ్ళాడుతున్న పగ్గాల్ని పట్టుకుని లాగి సింహాన్ని ఆటపట్టించడం మొదలుపెట్టాయి. మిగతా జంతువులన్నీ వినోదం చూసి ఆనందిస్తున్నాయి.

రేయ్! వచ్చి ఆభణాన్ని తొలగించండిరాఅంటూ గర్జించాననుకుని మూలిగింది సింహం.

గుర్రం సహాయం లేకుండా మేం దాన్ని తియ్యలేం మహారాజా!” అన్నాయి జంతువులు.

ఏదీ, ఎక్కడ గుర్రంఅంటూ మళ్ళీ మూలిగింది సింహం.

బండివాడు వచ్చి ఊళ్ళోకి తీసుకెళ్ళిపోయాడు ప్రభూ!” సమాధాన మిచ్చాయి జంతువులు.

సింహం గుర్రాన్ని వెతుక్కుంటూ ఊళ్ళో కొచ్చింది.

రోడ్డుమీద సంచరిస్తున్న గుర్రాన్ని చూసి జనం భయంతో ఇళ్ళలోకి దూరి తలుపులేసుకున్నారు. గబగబా జూ అధికార్లకు ఫోన్లు చేసారు.

చుట్టూ మెష్ తో పంజరంలా ఉన్న వ్యాన్ లో జూ అధికారులు వచ్చారు. మత్తు ఇంజెక్షన్ ని బాణానికి కట్టి అరఫర్లాంగు దూరంనుంచి సింహంమీదికి వదిలారు. సింహం నెమ్మదిగా మత్తులోకి జారింది.

జనం ఇళ్ళలోంచి బయటికి వచ్చారు. నోట్లో కళ్ళెం కలిగిఉన్న సింహాన్ని చూడడానికి ఎగబడ్డారు. వాళ్ళని అదుపు చెయ్యలేక పోలీసులు బాష్పవాయుగోళాల్ని ప్రయోగించారు. జనాన్ని పక్కకి నెట్టి సింహాన్ని బోనులో కెక్కించి జూకి తరలించారు.

వివిధ టీవీ ఛానెళ్ళవాళ్ళు, నోట్లో కళ్ళెంతో ఊళ్ళోకొచ్చిన సింహాన్ని అందరికంటే ముందు తమ ఛానెల్లోనే చూపించాలన్న ఆరాటంతో జూమీదికి దండయాత్రకి వచ్చారు. పోలీసులు వాళ్ళని జూలోపలికి రాకుండా లాఠీలతో నెట్టేస్తూ, అవసరమైతే ఒక దెబ్బ వేస్తూ శాంతిభద్రతల్ని పరిరక్షిస్తున్నారు. ‘పోలీసుల జులుం నశించాలిఅన్న నినాదాలమధ్య జూ అధికారులు నిపుణుల్ని పిలిపించి సింహం నోటినుండి కళ్ళేన్ని విజయవంతంగా విడదీసి మ్యూజియంకు పంపించారు.

జూలోనోట్లో కళ్ళెంతో నగరంలోకి వచ్చిన సింహంగా మృగరాజుకు విశేషమైన ఖ్యాతి లభించింది. దేశవిదేశాలనుంచి యాత్రికులు తండోపతండాలుగా సింహాన్ని చూడడానికి వస్తున్నారు.

అంతరించిపోతున్న జంతుజాతుల్ని పరిరక్షించడం మన కర్తవ్యంఅన్న నినాదంతో జూ అధికారులు అడవిలోంచి రోజుకో జంతువును పట్టుకొచ్చి ఆహారంగా సమర్పించుకుంటూ సింహాన్ని అపురూపంగా చూసుకుంటున్నారు. ఏమాత్రం ఒళ్ళలవకుండా కడుపునిండా తిండి తింటూ, బోరు కొట్టినప్పుడు సరదాగా గర్జించి జనాన్ని భయపెడుతూ సింహం అనతికాలంలోనే దిట్టంగా తయారయ్యింది.

మ్యూజియంలో ధగధగ మెరిసే ఇత్తడి పళ్ళెంలో మఖమల్ గుడ్డ పరిచి సింహం నోట్లో దొరికిన గుర్రపుకళ్ళేన్ని ప్రదర్శనకు ఉంచారు. రోజూ దుమ్ము దులుపుతూ, వారానికోసారి షాంపూతో తలంటు పోస్తూ మ్యూజియం అధికారులు దాన్ని కాపాడుతున్నారు. రోజురోజుకూ కొత్త అందాల్ని సంతరించుకుంటూ విశేషంగా సందర్శకులని ఆకర్షిస్తోంది సింహం నోట్లో దొరికిన గుర్రపుకళ్ళెం.

నోటికి కొత్త కళ్ళేన్ని తగిలించుకుని, చాలీచాలని ఆహారంతో, చర్నాకోలా దెబ్బలు తింటూ, నోట్లో కళ్ళెంతో నగరంలోకి వచ్చిన సింహాన్ని, దాని నోటిలో దొరికిన కళ్ళేన్ని చూడడానికి వచ్చే జనాన్ని అటూఇటూ చేరవేస్తూ భారంగా బతుకీడుస్తోంది బండివాడి గుర్రం.

-పాలపర్తి జ్యోతిష్మతి

 

సాహిత్యం- సాహిత్తెం

 

 

కలలు చమత్కారంగా ఉంటవి. దెయ్యాలూ భూతాలు కలలోకి వచ్చినా మర్నాడు లేచాక మనకి కనిపించవు కదా? మంచి కలలొస్తే మంచి జరుగుతుందనీ, పాడు కల వస్తే చెడు జరుగుతుందనీ ఎక్కడైనా ఉందా? కల వచ్చిన మర్నాడు పొద్దున్నే కొంత సుఖమో కష్టమో అనిపించవచ్చు గానీ తర్వాత రోజూ పనుల్లో పడి ఇవన్నీ మర్చిపోతూంటాము కదా? కానీ నా కొచ్చిన కల వింతగా ఉంది.

 

లేకపోతే ఇది చూడండి. రాత్రి పడుకున్నానన్న మాటే గానీ ఎప్పటికో గాని నిద్రలేదు. అప్పుడొచ్చిన కలలో నేనూ, బిల్ గేట్సూ, వంగూరి చిట్టెన్ రాజు గారూ కలిసి నడుస్తున్నాం. ఇప్పుడు మనమో విమానం ఎక్కాలి అన్నారు బిల్ గేట్స్. “ఎక్కడికండి మనం వెళ్ళేది? ఇండియాకేనా?” అని ఎంతో ఉత్సాహంగా అడిగేను. సమాధానం లేదు. నాకేమో ఒళ్ళు జలదరిస్తోంది వీళ్ళతో వెళ్ళడానికి. వాళ్ళేమో సమాధానం చెప్పరు. విమానం వచ్చింది. ఎక్కాక పైలట్ కూర్చుని ఏవో మీటలన్నీ నొక్కుతున్నాడు. “బోయ్” మని చప్పుడు. విమానం తూర్పు కేసి ఎగురుతోంది అని నేనంటే వీళ్ళు “ఇండియాకి కాదు వెళ్ళేది ఆఫ్రికాకి” అనడం.

 

గేట్స్ గారితో వెళ్ళడం అంటే ఏ ఫస్టు క్లాసులోనో వెళ్ళచ్చేమో, వైన్ అదీ తాగి, పీక దాకా తినేసి, సీటు నూట ఎనభై డిగ్రీలు వచ్చేదాకా కాళ్ళు తన్ని పడుకోవచ్చు అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఎకానమీలో ఎక్కించారని ఎక్కేదాకా తెలీలేదు. తీరా ఎక్కిన తర్వాత దాహంతో నోరు పిడచగట్టుకుపోతూంటే, ఓ కోక్ ఇమ్మన్నా, కాసిని మంచినీళ్ళిమ్మన్నా గంటు మొహం పెట్టుకుని ఏదో ముష్టి పారేసినట్టు తెచ్చి మొహం మీద విసరడం.

 

ఇంక ఎలాగా తప్పదు కదా? వాళ్ళు పెట్టిన గడ్డీ గాదం (అవే లెండి, ఆంగ్లంలో సలాడ్లు అంటారు కదా) తిని ఓ కునుకు తీసి లేచేసరికి సీటు బెల్ట్ పెట్టుకోమని ఆర్డర్. అప్పటికే రాజు గారూ, గేట్స్ గారూ రడీగా ఉన్నారు. నేనే లేటుగా లేచింది. కిందకి దిగి “ఇది హైద్రాబాదులా లేదే, ఇదే ఊరండి రాజు గారు?” అనడిగాను. సమాధానం లేదు.

 

కాస్త ముందుకెళ్ళాం. ఇక్కడకెందుకొచ్చామో నాకర్ధం కాలేదు. చుట్టూ చూసాను. మమ్మల్ని దింపిన విమానం వెళ్ళిపోతోంది మళ్ళీ. కార్లూ అవీ ఉన్నట్టులేదు. ఇండియా అయితే ఎడ్లబండో, ఏనుగో కనపడాలి కదా విమానం దిగిన పదినిముషాల్లో? రాజుగారి కేసి ప్రశ్నార్ధకంగా చూస్తే ఆయనే చెప్పేరు ఈ సారి – “ఇది ఆఫ్రికా, మనం ఇక్కడ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి.”

 

“మరి బిల్ గేట్స్ గారేరీ?” అన్నాను ఆయన మాతో లేకపోవడం గమనించి.

 

“ఆయనకి వేరే పనులున్నాయి, పోలియో, మలేరియా మందులు ఇప్పించడానికీ, దానికీను. ఆయనరారు మనకి తప్పదు.” చెప్పేరు రాజు గారు.

 

“మనకి ఎందుకు తప్పదు?”

 

“నేను కధలు రాస్తాను. నువ్వు నాకన్నా బాగా రాస్తావు; అందుకని” వెర్రి వెధవని కాకపోతే రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

ఎదురుగా “విలియం ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లైబ్రరీ” అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద భవనం కనిపించింది. “మనమే ఎం.బి.ఏ చేసుంటే నేను ఏ వాల్ స్ట్రీట్ లోనో లక్ష డాలర్లు సంపాదించేవాడిని, నువ్వు ఏ కోటి డాలర్లో తెచ్చేవాడివి గేట్స్ గారిలానే.” నేను ఆ బిల్డింగ్ బోర్డు చూసి నోరు వెళ్ళబెట్టగానే చెప్పేరు రాజుగారు.

 

ఏమైనా నేను కోటి డాలర్లు తెస్తున్నట్టే అనిపించింది. మీరు ఎందుకు ఎం. బి. ఏ చేయలేదని రాజుగార్ని అడుగుదామనుకున్నాను కానీ ఊరుకున్నాను.  జేబులన్నీ వెతికి తుపాకులూ అవీ ఉన్నాయా అనే చూసి, ఏమీలేవని నిర్ధారించుకున్నాక లైబ్రరీ లోపలకి వదిలేరు.

 

పుస్తకాలు కుప్పలకొద్దీ బీరువాల్లో దాచి ఉంచారు. చూస్తూ పోయేసరికి ఓ చోట తెలుగు సాహిత్యం అని ఉంది. కనుబొమ్మలు పైకెత్తి రాజు గారు కేసి చూసాను ఆశ్చర్యంతో.

 

“ఇప్పుడర్థం అయిందా?” అన్నట్టూ నవ్వుతున్నారు ఆయన. ఆయన పబ్లిష్ చేసిన పుస్తకాలూ, అందులో నేను అప్పుడప్పుడూ రాసిన కధలూ అన్నీ ఉన్నట్టున్నాయి.

 

“ఇక్కడకి తెలుగు సాహిత్యం ఎలా వచ్చిందో?” అని నేననుకునేలోపల రాజుగారే చెప్పారు, “తెలుగు వాడు లేని నేల ఎక్కడుందోయ్ ఈ భూమ్మీద?”

 

“ఇక్కడ ఆఫ్రికాలో ఎవరు చదువుతారండీ ఇవి?” అడిగేను ఆయన్ని.

 

“ఎవరో చదువుతారని కాదు, ప్రపంచం నాలుగు మూలలా మువ్వన్నెల తెలుగు సాహిత్య పతాకం ఎగరవల్సిందే,”

 

మళ్ళీ నడవడం మొదలు పెట్టాం. “ఇక్కడ్నుంచి, రచయితల సెక్షన్” అని రాసి ఉంది.

 

మొదటి చోట కొంతమంది తెలుగు వాళ్ళు కాయితాలు ముందేసుకుని ఏవో రాస్తున్నారు. మేము రావడం చూసారు కానీ ఏమీ పట్టించుకున్నట్టు లేదు. కాయితానికి రెండంటే రెండే లైన్లు రాసి పారేస్తున్నారు పక్కన. కాయితాలు ఖరాబు చేస్తున్నట్టు అనిపించి ఏదో అనబోయేను కానీ రాజు గారు నా నోటి మీద చెయ్యేసి నొక్కేసి అక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్ళి చెప్పేరు, “వీళ్ళు రాసేవి నానీలు. నోరెత్తావా, పెన్నుతో పొడిచి చంపేస్తారు.”

 

ఒళ్ళు జలదరించింది.  కాస్త ముందుకెళ్తే కొంత మంది కాయితాల మీదే రాసుకుంటూ కనిపించేరు. దగ్గిరకెళ్ళి చూద్దుం కదా, వాళ్ళు రాసేవి సమస్యా పూరణాలు. ఓక్కో చోట ప్రాసకోసం “గూగిలించుచో” అనో, “యాహూలించుచో” అనో “బింగులించుచో” అని రాసేస్తున్నారు. “ఇదేమిటండీ రాజుగారు ఇవి అంతర్జాలంలో ఉండేవి కదా, అవి తెలుగు పదాలు ఎలా అవుతై?” అనడిగేను. రాజుగారు సమాధానం చెప్పేలోపుల అక్కడే ఉన్న ఒకాయన చెప్పేడు, “కొత్త కొత్త పదాలు మనం సృష్టించపోతే బాష ఎలా ఇంప్రూవ్ అవుద్దోయ్ చెవలాయ్?” మొహం గంటు పెట్టుకుని రాజు గారి కేసి  చూస్తే ఆయన “ఊరుకో, ఊరుకో తెలుగు పద్యాల్లో కాసినేనా తెలుగు పదాలున్నాయని సంతోషపడు” అని చెప్పి ముందుకి లాక్కేళ్ళేరు.

 

ఇంకాముందుకి వెళ్లేసరికి అక్కడంతా కలగా పులగంగా ఉంది వాదోపవాదనలతో. నేను అడిగేలోపులే రాజుగారు చెప్పేరు, “వీళ్ళందరూ ఎడిటర్లు, మనం రాసేది ఎలా తీసిపారేద్దామా అని చూస్తూ ఉంటారు. ఓ రకంగా డాక్టర్ల లాంటి వాళ్ళు, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగమ్ము ఖంఢించి.. లాంటి వాళ్ళనుకో”.

 

“అదేమిటండోయ్, డాక్టర్లకీ ఎడిటర్లకీ పోలిక?” వెర్రిమొహం వేసి అడిగాను.

 

“అదంతే. ఎవడికి ఎప్పుడు రోగం వస్తుందా, ఎప్పుడు పేషంట్ మన దగ్గిరకి వస్తాడా అని డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలాగే ఎవడు ఏమి రాసి రచయిత అవుదామా అని చూస్తూ ఎడిటర్లకి పంపిస్తే వాళ్ళు ఏ కారణం చూపించి రాసినది అవతల పారేద్దామా అని వీళ్ళు చూస్తూ ఉంటారు.” విడమర్చి చెప్పేరు రాజు గారు.

 

“ఛా, అలా అంటారేంటండీ? నాకు అలా అవలేదే? నేనేం రాసినా వేసుకుంటున్నారు ఎడిటర్లు.”

 

“చెప్పేనుగా నువ్వు నాకన్న మంచి కధలు రాస్తావని?” గుంభనంగా నవ్వుతున్నారు రాజు గారు. మట్టిబుర్ర కాకపోతే ఈ పాటికైనా రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

మళ్ళీ ముందుకి నడిచాం.  అందరూ కంప్యూటర్లమీద చక చకా ఏదో టైప్ చేస్తున్నారు. కాయితం లేదు, కలం లేదు. ఏదో రాయడం, పబ్లిష్ చేయడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా చూద్దును కదా, రాజుగారు నన్ను వెనక్కి లాగి చెప్పేరు, “వీళ్ళు బ్లాగు రైటర్లు. అలా చూడకూడదు, అవి పబ్లిష్ అయ్యేదాకా”.

 

“ఇక్కడ చూడకపోతే పబ్లిష్ అయ్యేక ఎలా చూస్తామండి?”

 

“అవి పబ్లిష్ అయ్యేక, మాలిక అనీ కూడలి అనీ బ్లాగుల సమాహారాల్లో వస్తాయి. అక్కడ్నుంచి చూసి కామెంట వచ్చు.”

 

“కామెంటడం అంటే?” కామెర్లు అంటే తెలుసు, కామేశ్వరీ తెలుసు. కామెంటడం అంటే తెలియక అడిగేను సిగ్గు పడుతూ.

 

“వాళ్ళు రాసి పారేసాక మన అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టడాన్ని కామెంటడం అన్నారు. అలాగే ధన్యవాదాలు చెప్పడాన్ని నెనర్లు అనీ, ఈకలనీ ఏవోవో పేర్లు. పక్కనున్న సెక్షన్లో ఇందాకే చెప్పేడు కదా ఒక మహామహుడు, కొత్త పదాలు సృష్టించకపోతే తెలుగు ఎలా నిలబడుద్దో చెవలాయ్ అనీ? అయినా ఇన్ని ప్రశ్నలు అడక్కూడదు.”

 

“రాసేసినవి ఎడిటర్లకి పంపొచ్చు కదా? బ్లాగులో రాసుకోడం ఎందుకో?” నా మనసులో సందేహం అనుకోకుండా నోట్లోంచి బయటకొచ్చేసింది.

 

“చెప్పాను కదా, పాతిక కధలు పంపిస్తే ఎడిటర్లు ఒకటో రెండో వేసుకుంటారు. మిగతావి చెత్తబుట్టలోకే. వాళ్ళు పబ్లిష్ చేయకపోతే నిరుత్సాహ పడిపోకుండా, ఈ బ్లాగుల్లో మనకి మనవే పబ్లిష్ చేసుకోవచ్చు. ఎడిటర్లు నీ రచన బావోలేదు అంటే, నీ సలహా ఎవడిక్కావాలోయ్ ఇదిగో నేనే పబ్లిష్ చేసుకోగలను అని వీళ్ళు ఇలా రాస్తారు.”

 

“అలా ఏది పడితే అది రాసేయొచ్చా బ్లాగులో?”

 

“ఆ, మన ఇష్టం. ఆ తర్వాత ఏదైనా తేడాలొస్తే దాంతో తంటాలు పడాల్సింది కూడా మనమే.”

 

కంప్యూటర్ల దగ్గిర కూచున్నవాళ్ళు మమ్మల్నీ, రాజు గారి చేతిలో ప్రింట్ పుస్తకాలనీ చూసి నవ్వడం. ఈ రోజుల్లో పుస్తకాలెవడు చదువుతాడోయ్ చెవలాయ్ అనడమూను. రాజు గారు పబ్లిషర్ అని చెప్తే ఇంకా నవ్వులు.

 

తెలుగు సాహిత్యం ఎంత పైపైకి పోతోందో, నేనెంత వెనకబడి ఉన్నానో ఇదంతా చూసేసరికి అర్ధమైంది. కళ్ళు తిరిగేయి గిర్రున.  రాజుగారు నా చేయి పట్టుకుని బయటకి నడిపించుకొచ్చేరు. దారిలో తత్త్వ బోధ చేస్తున్నట్టూ చెప్పేరు రాజుగారే, “చూసావా తెలుగు సాహిత్తెపు మువ్వెన్నల  జండా ఎంత గొప్పగా పైపైకి పోతోందో?”

 

“సాహిత్యం అనకుండా సాహిత్తెం అన్నారేమిటబ్బా?”

 

“మన కవులు రాసినదీ సాహిత్యం. ఇప్పుడొచ్చేది సాహిత్తెం. అంతే తేడా”

 

ఇంతట్లో మేడూరు వచ్చి ఉయ్యూరు మీద పడిందన్నట్టూ ఎవరికో నేను కధలు రాస్తానని తెల్సింది. నాకేసి వేలెత్తి చూపించి చెప్పేడు, “జాగ్రత్త, నువ్వు మా గురించి రాసావా, మరి చూస్కో!” అన్నాడు.

 

“ఏం చేస్తారేం?” అని ఇంకేదో అడగబోతుండగా రాజుగారు వారించి నన్ను బయటకి తీసుకొచ్చేరు. లోపలకి వెళ్ళిన దారి వేరూ, బయటకొచ్చిన దారి వేరూను. బయటకి రాగానే తలుపు దగ్గిరే జీరాఫీ, చిరుతపులీ కనిపించేయి.

 

ఇది ఇండియా అయితే జిరాఫీ ఉండదే, చిరుతపులి ఇండియాలో ఉంటే దాన్ని చంపేసి చర్మం అమ్ముకోరూ ఈపాటికి అనుకుంటూంటే వెనకనుంచి చింపాంజీ అరుపు వినిపించింది. భయపడి పక్కనే ఉన్న రాజు గారి చెయ్యి పట్టుకున్నాను.

 

“చూసావా, నేచెప్పలే? ఇది ఆఫ్రికా” అని మృదువుగా చేయి విడిపించుకుని భుజం తట్టేరు రాజు గారు. బుర్ర పక్కకి తిప్పిచూస్తే ఏదో జలపాతం. చల్లని నీళ్ళు మొహం మీద పడ్డాయి. చటుక్కున మెలుకువొచ్చింది.

 

పగటి కలలకి పాటి లేదు. అరచేతి మీద “శ్రీరామ” అని రాసి కళ్ళకద్దుకున్నాను. అంతే!

 

[ఉపసంహారపు చివరితోక:  తెలుగు వారి గోల్డ్ నిబ్బు, విశ్వనాథ గారి ‘జూ’ కధ గుర్తొచ్చిందా? అది చదివాక రాసినదే ఈ కధ. ఆయన కాలిగోరుక్కూడా పనికిరాని వాణ్ణి కనక ఇవే చిట్టెన్ రాజుగారికీ , విశ్వనాథగారికిచ్చే క్షమాపణలు]

 

– ఆర్. శర్మ దంతుర్తి

అపరాధం

ఆ సంఘటన గురించి ఇప్పుడు తల్చుకున్నా కూడా నాకు అపరాథభావనతో కన్నీళ్ళు వస్తాయి. నా కళ్ళల్లో కలవరం వచ్చి చేరుతుంది. అయితే దాన్ని నేను తల్చుకుని అప్పుడు జరిగిన పొరపాటు లాంటిదే మళ్ళీ జరగకుండా చూసుకోవడానికి ఈరోజు అది నాకు ఉపయోగపడింది. ఈరోజు జరిగిన పొరపాటుని గురించి శ్యామలకి చెప్పి క్షమాపణ చెప్పగలిగిన దానిని ఆ రోజు ఆ పొరపాటుని రాకేష్ కి చెప్పి క్షమాపణ అడగకపోవడానికి కారణం ఏమిటి?

భయం – ఔను.

ఆ రోజు నేను ఇంట్లో అబద్దాలు చెప్పి పెళ్ళి కాకుండానే రవిని హోటల్ రూమ్ లో కలవడం అందరికీ తెలుస్తుందనే భయంతో మౌనంగా ఉన్నాను.

మనకి బాధ కలిగించిన విషయాలని చెప్పుకుంటే ఆ బాధ తొలుగుతుంది నిజమే కావొచ్చు కాని కొన్ని కొన్ని మనం బయటకి చెప్పుకోలేని అనుభవాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ అనుభవాలు మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా మనకి ఉపయోగపడితే మన బాధ తొలగిపోతుందనే విషయం నాకు ఈరోజు తెలిసింది……

నిన్న రాత్రి మా అబ్బాయి “అమ్మా! నా నైకీ టీ షర్ట్ కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?” అని అడిగాడు.

“నీ అల్మైరాలోనే పెట్టి ఉంటుంది శ్యామల సరిగా్గ చూడు” అన్నాను.

వాడు వెతుక్కుని వెతుక్కుని ఏడుపు ముఖం పెట్టుకోని “కనపడటం లేదమ్మా!” అన్నాడు. నేను వాడి బట్టల అల్మైరాతో పాటు ఇల్లంతా వెతికాను.

“సరే రేపొద్దున శ్యామల రాగానే అడుగుదాములే పడుకో” అని వాడిని సముదాయించాను కాని నా ఆలోచనలన్నీ ఆ షర్ట్ మీదే ఉన్నాయి.

శ్యామల కాజేసి ఉంటుందా? స్కూల్లో పనులు, పరీక్షల హడావుడి లో ఇంటిని అసలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఏమి పోయాయో, ఏమున్నాయో కూడా చెప్పలేనేమో ఇప్పుడు. పని వాళ్ళ మీద పూర్తి బాధ్యత వదిలేస్తే ఇలాగే జరుగుతుంది అనుకుంటూ బాధపడసాగాను.

తెల్లవారింది. ఎవరి పనులకి వాళ్ళు తయారవుతూ హడావుడిగా ఉన్నాం. శ్యామల రాగానే వాకిట్లోనే నిలేసి షర్ట్ గురించి అడిగాను.

“నాకు తెలియదమ్మా!” అంది.

“నీకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది? ఇల్లంతా వెతికాం రాత్రి. ఎక్కడా లేదు. నువ్వు తీయకపోతే ఇంట్లో ఉండాలిగా” అన్నాను.

“లేదమ్మా! నేను తీసుకోలేదు” అంది.

“నువ్వు తీశావని నేను అన్నానా? తీయకపోతే ఇంట్లోనే ఎక్కడో ఉంటుందిగా సాయంత్రం నేను వచ్చేలోపు ఇల్లంతా వెతుకు” అన్నాను కఠినంగా.

“సరేనమ్మా” అంది శ్యామల.

సాయంత్రం నాలిగింటికి వచ్చి కాఫీ పెట్టుకుంటుండగా “అమ్మా! షర్ట్ ఇదిగో – మొన్న స్పెషల్ పంక్షన్ కి అభినవ్ అడిగితే ఇచ్చా. ఈరోజు స్కూల్లో వాడిని చూడగానే గుర్తొచ్చింది. స్కూలు నుంచి నేరుగా వాళ్ళింటికి వెళ్ళి తీసుకొస్తున్నా” అన్నాడు – నా కోసం ఏదో ఘనకార్యం చేసిన వాడిలా.

“అలా ఎలా మర్చిపోయావురా? రాత్రంతా వెతుకుతూనే ఉన్నాను నువ్వు నిద్రపోయాక కూడా” అన్నాను కోపంగా.

వాడు నన్ను పట్టించుకోకుండా “అఁ మర్చిపోయాను – ఏమయింది? ఇప్పుడు తెచ్చానుగా” అంటూ దాన్ని నా ముఖాన విసిరేసినట్లుగా కిచెన్ కౌంటర్ మీద పడేసి వాడి గదిలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు ఒక్కసారిగా – మళ్ళీ చాలా రోజుల తర్వాత – రాకేష్ గుర్తొచ్చాడు.

ఇరవయ్యేళ్ళ క్రితం……

నేను హోటల్ నుంచి ఇంటికి రాగానే మా అమ్మ “ఎక్కడికెళ్ళావే? నీ కోసం మీ హెడ్ మిసెస్ వచ్చారు మనింటికి. ఏదో ఫైలు అర్జంటుగా కావాలని వెతికితే ఎక్కడా కనపడలేదంట. నువ్వు ఎక్కడ పెట్టావో అడగాలని వచ్చిందిట” అంది.

మీ మేడమ్ వచ్చింది అని చెప్పగానే నా గుండెలు గుబుక్కుమన్నాయి. ఈ రోజు ఉదయం రవిని కలుసుకోవడానికి హోటల్ కి వెళుతున్నప్పుడు మా స్కూల్లో పని చేసే ఒక టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని అమ్మకి చెప్పాను. దాన్నే మళ్ళీ చెప్తూ ఆ టీచర్ కీ, మా హెడ్ మిసెస్ కీ పడదులేమ్మా అందుకే ఆమె ఫ్రెండ్స్ ని మాత్రమే పిలిచింది. కొంపదీసి ఆమెకి ఈ సంగతి చెప్పలేదు గదా!” అన్నాను – నేను చెప్పిన అబద్దానికి నిజం రంగు పులుముతూ.

“నాకేం తెలుసే మీరు ఆవిడకి చెప్పకుండా పార్టీ చేసుకుంటున్నారనీ…. ఎవరో టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని వెళ్ళిందని చెప్పా” అంది.

రవితో గడిపిన మధురక్షణాల తాలూకు మైకం నాలో మాయమైపోయి ఆందోళన ప్రవేశించింది. హోటల్ రూమ్ నుండి మా హెడ్ మిసెస్ కి ఫోన్ చేసినపుడు అదృష్టవశాత్తూ ఆవిడ ఫోన్ ఎత్తలేదు, నా అసిస్టెంట్ రాకేష్ ఎత్తాడు. చాలా పేదబ్బాయ్. పదవ తరగతి వరకూ చదివి కాలేజీకి ఫీజు కట్టలేక మేడమ్ ని బ్రతిమాలుకుని ఇక్కడ అసిస్టెంట్ కమ్ అటెండర్ గా చేరాడు.

“రాకేష్ నాకు జ్వరంగా ఉంది, చూపించుకోవడానికి హాస్పిటల్ కి వచ్చాను. మేడమ్ కి చెప్పు ఈరోజు ఆఫీసుకి రావడం లేదని” అన్నాను.

“ఆఁ ఆఁ” అంటున్నాడు.

“రాకేష్” అన్నాను.

“మీకేం నంబరు కావాలి?” అన్నాడు.

“ఇది 26…..9 కదా!”

“ఆఁ చెప్పండి… ఎవరూ?”

“ఏంటి రాకేష్ నేను స్వప్నని వినపడుతోందా…. నాకు బాగాలేక హాస్పిటల్ కి వచ్చాను. డాక్టర్ కి చూపించుకోని త్వరగా రావడానికి ట్రై చేస్తాను కాని వీలయ్యేట్లు లేదు. ఇక్కడ క్యూలో చాలా మంది ఉన్నారు. ఈ విషయం కూడా మేడమ్ కి చెప్పు – సరేనా, చెప్తావా” అన్నాను.

“ఆఁ చెప్తా చెప్తా” అంటున్నాడు.

నాకు భలే ఆశ్చర్యమేసింది అతని ముభావతకి. ఆఫీసు ఇన్ ఛార్జినైన నన్నుగౌరవంగా ఎప్పుడూ ‘మేడమ్’ అని పిలుస్తాడు. ‘ఈరోజేంటి ఇతను ‘చెప్తా చెప్తా’ అంటున్నాడు కాని ‘మేడమ్’ అని పిలవడం లేదు పైగా గొంతులో గౌరవం కూడా లేదు? నేను చెప్పింది నమ్మడం లేదా లేక నేను ఈ లాడ్జిలోకి రావడం చూశాడా? – ఇక్కడెక్కడో దగ్గర్లోనే అతనిల్లు అని చెప్పడం గుర్తు. చూసి ఉండడులే ఒట్టి అనుమానం నాది, పనిలో ఉండి ఉంటాడు’ అనుకున్నాను.

అమ్మతో ఏదో చెప్పి నా గదిలోకి రాగానే ఆ సంభాషణంతా రీలు లాగా నా కళ్ళ ముందు కదలాడింది. ‘రాకేష్ మేడమ్ కి చెప్పి ఉంటాడు. రేపు స్కూలుకెళ్ళగానే మేడమ్ అడిగితే ఏం చెప్పాలి? ఆఁ ఏముందీ… నా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి బయలుదేరాను కాని బాగా తలనొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళానని చెప్తే సరి’ అనుకున్నాను.

ఒక అబద్దానికి ఎన్ని అబద్దాలు చెప్పాలో కదా అనుకుంటూ కాసేపూ, రవి గురించి కాసేపూ ఆ రాత్రంతా ఆలోచనలే… రవి నా క్లాస్ మేట్. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము గుంటూరులో ఉన్నప్పుడు ఎక్కడో చోట కలుసుకునేవాళ్ళం. నాన్నకి హైదరాబాద్ ట్రాన్సఫర్ అయ్యాక నేను కూడా ఇంటికి దగ్గరగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చేరాను. రవి ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడు. అతనికి ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాము.

హైదరాబాద్ లో ఏదో కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చి లాడ్జిలో దిగిన రవి నన్ను కలుసుకోమని ఫోన్ చేస్తే వెళ్ళాను.

‘ప్చ్! చాలా తప్పు చేశాను, అసలు అలా వెళ్ళకూడదు, అతన్ని ఏ పార్కులోనో కలుసుకుని ఉండాల్సింది’

తర్వాత జీవితంలో ఈమాటలు ఎన్ని సార్లు అనుకున్నానో…..

మేడమ్ రాకముందే రాకేష్ తో మాట్లాడాలి, మేడమ్ ఏమందో కనుక్కోవాలి అనుకుంటూ పది కాకముందే స్కూలుకి వెళ్ళాను. ఏవో జెరాక్స్ కాపీలు తీసుకుంటున్న రాకేష్ నన్ను చూడగానే “గుడ్ మార్నింగ్ మేడమ్. హెడ్ మిసెస్ మేడమ్ మీ కోసం మీ ఇంటికి వెళ్ళారు అప్లికేషన్స్ ఫైల్ కోసం – ఎక్కడ పెట్టారు?” అన్నాడు ఆందోళనగా.

“అదేంటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా హాస్పిటల్ కి వెళ్ళానని!” అన్నాను.

“నాకు ఎప్పుడు ఫోన్ చేశారు?” అన్నాడు ఆశ్చర్యంగా.

“అదేమిటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా – మేడమ్ కి చెప్పు అంటే సరేనన్నావ్” అన్నాను కోపంగా.

“నేనెప్పుడన్నాను? లేదు లేదు మీరు ఫోన్ చేయలేదు” అన్నాడు – అతని కళ్ళనిండా అంతులేని విస్మయం.

“నీకేమైనా పిచ్చా! మతిమరుపు ఎక్కువవుతుంది నీకీమధ్య. నేను మాట్లాడుతుంటే ‘ఆఁ ఆఁ’ అంటున్నప్పుడే అర్థమైంది మన మైండ్ లో లేవని” అన్నాను పెద్దగా అరుస్తూ. అక్కడే నిలబడి మా మాటలు వింటున్న ప్యూను వెంకటప్పయ్య “ఔనమ్మా! నేను కూడా విన్నాను ఎవరితోనో ఫోనులో ‘ఆఁ ఆఁ చెప్తాను చెప్తాను’ అని రెండు సార్లు అనడం” అన్నాడు నాకు సపోర్టు వస్తూ.

“మేడమ్ రాగానే చెప్పు నేను ఫోన్ చేసిన సంగతి ‘చెప్పడం మర్చిపోయాన’ని స్పష్టంగా చెప్పు లేకపోతే బాగుండదు చెప్తున్నా” అన్నాను కోపంగా – చూపుడువేలు విదిలిస్తూ.

అతను నేను ఫోన్ చేసిన సంగతి చెప్పడం మర్చిపోయి ఇప్పుడు మేడమ్ తిడుతుందని బొంకుతున్నాడనే అనుకున్నాను. మేడమ్ రావడం, ‘నేను చెప్పడం మర్చిపోయాను’ అని రాకేష్ ఆవిడతో చెప్పడం జరిగిపోయింది.

సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు మేడమ్ నన్ను పిలిచి “నువ్వు రాకేష్ ని బెదిరించి చెప్పించినట్లుగా ఉంది అతని ముఖం చూస్తుంటే – నిజంగా నువ్వు ఫోన్ చేశావా స్వప్నా?” అంది.

“నిజంగా చేశాను మేడమ్” అన్నాను ఆవేదనగా. నా ముఖంలో కూడా నిజాయితీని చూసిన మేడమ్ “సరేలే పో” అంది.

తర్వాత రోజు 10-11 గంటల మధ్యలో రాకేష్ వచ్చి “మేడమ్ మీకు ఫోన్” అన్నాడు. నేను ఫోన్ దగ్గరకి వెళ్ళి “హలో” అన్నాను.

“హల్లో…. ఏమంది మీ మేడమ్? మీరు నిన్న నాకూ చేసింది ఫోన్…. రాకేష్ కి కాదు. మీ పక్కన ఎవరో ఉన్నట్లుంది ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు….. నిజంగా మీరెళ్ళింది హాస్పిటల్ కా లేక…… ఇహిహి…”

టప్ న ఫోన్ పెట్టేశాను. కాళ్ళు వణకసాగాయి భయంతో. మళ్ళీ చేశాడు. ఫోన్ ఎత్తి “రాంగ్ నంబర్” అన్నాను.

“రాంగ్ నంబరా – హ!హ!హ!” అంటూ నవ్వుతున్నాడు.

వాడు నవ్వుతున్నందుకో లేక వాడు నేను వెళ్ళింది లాడ్జికన్న సంగతి కనిపెట్టినందుకో నాకు బాధ కలగలేదు కాని రాకేష్ ని అనుమానించి, బాధపెట్టి, భయపెట్టి మేడమ్ కి అబద్దం చెప్పించినందుకు నాకు కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి.

ఏడుస్తున్న నన్ను గమనించిన మేడమ్ “ఎవరు స్వప్నా?” అంది నాకు దగ్గరగా వచ్చి.

“ఎవరో మేడమ్ ఏదేదో చెత్తగా మాట్లాడుతున్నాడు” అన్నాను.

ఫోన్ మళ్ళీ మోగుతోంది. ఈసారి మేడమ్ ఫోన్ ఎత్తి “ఎవర్రా నువ్వు? స్వప్న భర్తని పిలిపించి మాట్లాడిపించనా?” అంది బెదిరింపుగా – నాకు పెళ్ళయి్య భర్త ఉన్నట్లుగా. ఆవిడ ఉద్దేశం పెళ్ళిగాని పిల్లలని ఇలా ఫోన్లు చేసి ఏడిపిస్తారని అనుకుని అలా చెప్పిందని అనుకుంటా.

అవతల వాడు ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఆ స్కూల్లో నాలుగేళ్ళు పని చేశాను. ఇక నాకు వాడి దగ్గరనుండి ఫోన్ రాలేదు కాని రాకేష్ ని చూస్తుంటే బాధ కలగసాగింది. ఆ రోజు నుంచీ రాకేష్ ని నా తమ్మడిలాగే చూసుకున్నాను. అతనికి ఫీజు కట్టి చదివించాను. ఇప్పుడతను గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఆఫీసర్. అతనికి సహాయం చేసి నా అపరాధాన్ని పోగొట్టుకున్నాను కాని నాలోని బాధ మాత్రం ఇన్నాళ్ళుగా తొలగిపోలేదు.

పెళ్ళి కాకుండానే లాడ్జిలకెళ్ళడం, ప్రమాదాల్లో ఇరుక్కోవడం ఎంత అసహ్యమైన విషయమో తద్వారా నా జీవితంలో జరిగిన ఈ అనుభవం ఇంకా అసహ్యం. ఆతొందరపాటుతనంతో మరో తప్పు చేయబోయేదాన్నే ఈరోజు.

“స్వప్నా వస్తున్నావా?” నా పక్కింటి వాకింగ్ ఫ్రెండ్ ప్రమీల కేకతో ఆలోచనల్లోనుండి బయట పడి వాకింగ్ షూస్ వేసుకుని బయటకొచ్చాను.

వాక్ చేస్తున్నప్పుడు చొక్కా విషయం ప్రమీలకి చెప్పాను దిగులుగా. “దొరికితే దొరికిందిలే – దొరికిందని మీ పనిమనిషికి చెప్పకు. నీకు భలే తొందరపాటని కాలనీ అంతా టాం టాం వేస్తారు ఈ పనోళ్ళు” అంది ప్రమీల.

“వద్దు వద్దు. వాళ్ళేమైనా అనుకోనీ నేను మాత్రం చొక్కా దొరికిన విషయాన్ని చెప్పేస్తాను. చెప్పకపోతే ఆ పిల్ల ముఖం చూసినప్పుడంతా వచ్చే అపరాధభావన అంతకంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది” అన్నాను.

వాక్ నుంచి ఇంటికి రాగానే “శ్యామలా షర్ట్ దొరికింది. వీడు వాళ్ళ ఫ్రెండ్ కిచ్చి మర్చిపోయాడు. ఇదిగో ఈ రోజు తెచ్చాడు” అన్నాను పని చేసుకుంటున్న శ్యామలకి షర్ట్ చూపిస్తూ.

“దొరికిందా – నేనే తీశానని నన్ను పనిలోంచి తీసేస్తారని భయమేసిందమ్మా” అంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు.

పొద్దునైనా నిన్ను నేను ఏమీ అనలేదుగా శ్యామలా… ఇంట్లో ఎక్కడో పడేసి ఉంటావు, వెతుకు అనే కదా అన్నాను, ఎందుకు భయం?” అన్నాను.

పైకి అలా అన్నానే కాని చొక్కా దొరక్కపోయినట్లైతే మరో తప్పు చేసి ఉండేదాన్నేమో!

ఆ ఆలోచన రాగానే ఏమాత్రమూ సంకోచించకుండా శ్యామల చేతులు పట్టుకుని “ఏది ఏమైనా నిన్ను బాధ పెట్టినందుకు, నా తొందరపాటుకు నన్ను క్షమించు తల్లీ” అన్నాను.

“అయ్యో అమ్మా!- ఏం ఫరవాలేదు ఊరుకోండి” అంది శ్యామల. మా ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు. రాకేష్ సంఘటన మళ్ళీ గుర్తొచ్చింది అయితే చిత్రంగా నాకు ఈసారి బాధ కలగకపోగా దాని నుంచి ఏదో నేర్చుకున్నట్లుగా అనిపించింది.

**********

మేకతోలు నక్కలు

నువ్వెవరో మరి డిసెంబరు 31 అర్థరాత్రి ఫోన్ చేశావు. “మీరు రాసిన కథ చదివాను బావుంది. నేను…..” ఇంకా ఏదో చెప్పబోయావు. గొంతులో మత్తు, మాటలో ముద్దతో కూడిన తడబాటు నాకర్థమయింది. ‘ఎవడో తాగి మాట్లాడుతున్నాడని.

సారీ! రేపు మాట్లాడదాంఅని ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేశావు. నేను ఫోన్ సైలెంట్ లో పెట్టాను. నాలుగు మిస్డ్ కాల్స్.

తర్వాత రోజు చేశావు అయితే అప్పుడు టైమ్ రాత్రి ఏడే. ‘పర్లేదు రాత్రి న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికే చేసుంటాడేమోలేఅనుకుని ఫోన్ ఎత్తాను.

సారీ అండీ మిమ్మల్ని అందరికంటే ముందుగా విష్ చేసి మీతో ఫ్రెండ్ షిప్ చేద్దామని రాత్రంతా మేలుకొని సమయంలో చేశానుఅన్నావు.

పాపం రాత్రంతా మేలుకున్నాడంటఅని నేననుకోవాలి కాబోలు నీ సంగతి అర్థం అయింది అయినా పర్లేదు చెప్పండిఅన్నాను.

మీ కథ బావుంది

మంచిది మీ పేరు?”

వర్మరాజా రవి వర్మ

వారం కూడా ఒక కథ వచ్చింది చదవండి వర్మ గారూ. మీరేమైనా రాస్తుంటారా?”

రాత్రి ఫోన్ చేశానని మీరు నన్ను గురించి చెడ్డగా అనుకుంటున్నారట్లుంది పైపైన మాట్లాడుతున్నారు

అనుకునేదేముంది. రాత్రి పూట తొమ్మిది దాటితే నేను బయటవారెవరితోనూ మాట్లాడను

నేను ఉమనైజర్ ని కాదు నాకు మీ దగ్గర నుండి ఏమీ అక్కర్లేదు. నాకు అన్నీ ఉన్నాయి నేను కోటీశ్వరుడిని మీకు విషెస్ చెబ్దామని చేశా అంతే

మైగాడ్! ఇదేమిటండీ మీరు అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నారు సరే ఉంటానండీఅని ఫోన్ పెట్టేశాను.

మళ్ళీ చేశావు. “ఏమిటండీ ఫోన్ పెట్టేస్తున్నారు? మాట్లాడుతున్నాను కదా! వినండి ప్లీజ్!”

సరే చెప్పండి మీరు నా కథలు ఇంకా ఏమైనా చదివారా?”

లేదు నేను బిజినెస్ మాగ్నెట్ ని బాగా బిజీగా ఉంటాను. ఇంతకీ మీరు చెప్పలేదు నన్ను మీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశారా?”

చూడండి ఇక్కడ ఫ్రెండ్ షిప్ ప్రసక్తి లేదు. మీరు నా కథ చదివి నచ్చిందని చెప్పడానికి చేశారు. నేను థాంక్స్ చెప్పాను. అంతే మీకు సాహిత్యాభిలాష కంటే ఫ్రెండ్ షిప్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది. ఉంటానండీఅని ఫోన్ పెట్టేశాను.

అప్పటికి ఊరుకున్నావు మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నరకి చేశావు, కట్ చేశాను. మళ్ళీ చేశావు, కట్ చేశాను. మూడోసారి మళ్ళీ చేశావు. ఫోన్ తీశాను నీ సంగతేందో తేల్చుకుందామని.

ఎందుకు చేశారు? రాత్రి 9 తర్వాత నేను ఫోన్ లో మాట్లాడనని చెప్పానుగా మీకుఅన్నాను

మీ కథ బావుందని చెప్దామని చేస్తున్నాను. మీరు నాకు థాంక్స్ చెప్పనే లేదు. ఇందాక థాంక్స్ చెప్పానని అన్నారు కాని థాంక్స్ చెప్పలేదు మీరు నాకుఅన్నావు.

ఓకే థాంక్స్

మీ కథ గురించి మాట్లాడాలి రెండో పేరాలో మీరు రాసిన వాక్యం …….”

వర్మ గారూ కథ గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు. నేను మీకు ముందే చెప్పాను 9 తర్వాత మాట్లాడనని ఇది నేను నిద్రపోయే సమయం కాబట్టి రేపు ఉదయం 10 లోపు లేదా సాయంత్రం 4 తర్వాత 9 లోపు చేయండి సరేనా బైఅని నేను ఫోన్ కట్ చేశాను.

మళ్ళీ ఫోన్ చేశావు ఏమనుకుంటున్నారు మీరు నన్ను నేను ఆడవాళ్ళ వెంట పడే వాడిననుకుంటున్నారా? సాయంత్రమైతే నా చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా! మాకు త్రీ స్టార్ హోటల్ ఉంది. గంటలు గంటలు మాట్లాడుకుంటాం మేము హోటల్ లో కూర్చుని ……..”

ఛీ! వెధవఅనుకుని ఫోన్ కట్ చేసి సైలెంట్ లో పెట్టుకున్నాను. నాలుగు మిస్డ్ కాల్స్.

అప్పడు ఎనలైజ్ చేశాను నీ గురించి ఖచ్చితంగా వీడెవరో మనకి తెలిసిన వాడే నా కథలు చదివి ఫోన్ చేసే వాళ్ళకైతే నేనెవరో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ‘మీరెక్కడ ఉంటారు? ఏం చేస్తారు?’ అని అడిగి తెలుసుకుంటారు.

కొంత మందికి నా వయసెంతో తెలుసుకోవాలని ఉంటుంది మరికొంత మందిలో నేను రాసిన కథలు నా స్వానుభవమా అనే ఉత్సుకత ఉంటుంది. ఆఫ్ కోర్సు అన్నీ తెలుసుకున్నాక కొంతమంది వెధవల గొంతులు నా మాటలకి గౌరవం గా మారడం, నిరుత్సాహంగా మారడం కూడా ఉంటుంది. కాని నువ్వు నా గురించి అడగడం లేదు నేనెక్కడ ఉంటానో ఆసక్తి లేదు. పోనీ సాహిత్య విమర్శకుడవీ లేదా అభిమానివి మాత్రమే అయితే కథ గురించీ మాట్లాడటం లేదు సంగతి నాకెప్పుడో తెలిసిందనుకో నీకు కథల గురించి ఏమీ తెలియదనిసో నేనెవరో నీకు తెలుసు. నువ్వు నన్ను చూసి కూడా ఉంటావు. బహుశా నేను కూడా నిన్ను చూసే ఉంటానేమో! నువ్వు ఖచ్చితంగా మాకు తెలిసినవాడివో లేకపోతే నాకు తెలిసిన స్నేహితురాళ్ళకి తెలిసినవాడివో అయి ఉంటావు.

ఈసారి ఫోన్ చేయాలి చెప్తా వీడి పనిఅనుకున్నాను.

తర్వాత రోజు సాయంత్రం 4 కి ఫోన్. నడుస్తూ మాట్లాడుతున్నావు. ఎక్కడో బస్టాండ్ లో ఉన్నట్లున్నావు చుట్టూ రణగొణ ధ్వనులు.

ఆఫీస్ నుండి ఇంటికి వెళుతున్నా సరిగ్గా వినపడటం లేదు మళ్ళీ చేస్తాఅని ఫోన్ కట్ చేశావు. ఇదొక డ్రామా నాలుగుకి చేయమన్నాను కదా పాపం చేశాడు అని నేననుకోవాలనమాట. ‘సరే .. కానీఇంకా ఎన్ని నాటకాలు ఆడతావనుకున్నాను. ‘

8 కి ఫోన్ చేసి సారీ మీతో కథ గురించి మాట్లాడదామంటే నాలుగుకి చేయమంటున్నారు. అప్పడు చేద్దామంటే నేను బిజీ. ఇప్పుడు మాట్లాడతాను ఇంకా తొమ్మిది అవలేదుగాఅన్నావు. ‘ఆహా! గొంతులో ఏమి నక్క వినయాలు!?’

ఆఁ మాట్లాడండి

మీరు నాతో ఫ్రెండ్ షిప్ చేస్తారా మాట్లాడతాను

మధ్య ఒక కథ చదివాను….”

ఏం కథ?”

కథలో ఒకావిడని ఫోన్లు చేసి విసిగిస్తుంటుంటాడొకడు. ఆమె ఎంతగా విసిగిపోతుందంటే బాధ తట్టుకోలేక చేతిలో ఉండే సెల్ ఫోన్ బద్దలు చేస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే కథ గుర్తొస్తుంది. కథలోలా నేను…..”

నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా అయితే ఇక మీతో మాట్లాడనులెండి. ఇక మీకు ఫోన్ కూడా చేయనుఅని కట్ చేశావు.

ఇదింకో ట్రిక్. అలిగినట్లుగా పెట్టేస్తే ఎదుటి వాళ్ళు చేస్తారని. ఇంకాసేపు బహుశా 10 నిమిషాలు చేయవు అనుకుని హాయిగా నైట్ కాఫీ తాగుతూ కూర్చున్నాను. 5 నిమిషాల్లోనే చేశావు పాపం నా టైమ్ వృథా చేయడం ఎందుకని!

మండిపోయింది నాకు నిన్ను మాట్లాడనివ్వకుండా వినండి నేను చెప్పేది కథలోలా నేను చేతిలో ఫోన్ విసిరికొట్టను ఎందుకంటే మీ నంబరు ద్వారా మీ పేరు, అడ్రస్ కనుక్కోవడం నాకు నిమిషం కూడా పట్టదు. మర్యాదగా మీరు మీరుఅని నన్ను గౌరవించి మాట్లాడారు కాబట్టి వదిలిపెడుతున్నా…..”

ఫోన్ కట్ చేశావు అంతే ఇక నీనుంచి నాకు ఫోన్లు లేవు. ఇప్పుడు నువ్వు విసిరికొట్టావా ఫోను? లేకపోతే సిమ్ విరక్కొట్టావా? ఎందుకైనా మంచిది సిమ్ పోయిందని పోలీస్ కంపైట్ ఇవ్వు లేకపోతే హెర్రాస్మెంట్ కింద జైల్లో పడతావు.

డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా వెకిలిగా మాట్లాడే మగవాళ్ళని చూస్తే భయం అక్కర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కాబట్టి వాళ్ళని తప్పుకోని పోతాం. కాని లోపల ఏదో పెట్టుకుని పైకి మర్యాదగా మాట్లాడుతుంటారే నీ లాంటి మేకతోలు కప్పుకున్న నక్కలు వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం.

అమ్మాయిలందరికీ చెప్తా నీలాంటి వాళ్ళ గురించి

అమ్మాయిలూ చూశారుగా ఇది నిజంగా జరిగింది కథ అనుకునేరు. ఇదొక రకం మేకతోలు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇంకా చాలా రకాల మేకతోళ్ళుంటాయి. అయినా మనకి తెలుసుగా ఎవరో గొప్ప రచయిత అన్నట్లు మనం మానసికంగా దృఢంగా ఉంటే వెధవలైన మగవాళ్ళు పిరికివాళ్ళవుతారనీ, మనల్నేమీ చేయలేరని!!? –

నువ్వూ విన్నావా?……

***

 

radhamanduva1మండువరాధ

 

ధ్యానం

chinnakatha

చిన్నప్పుడు మా పక్కింట్లో బిఎస్సీ విద్యార్థి ఒకతను ఉండేవాడు. ‘అన్నయ్యా, అన్నయ్యా’ అంటూ చుట్టుపక్కల పిల్లలమందరం అతని వెనకాల తిరుగుతుండే వాళ్ళం.

ప్రతి ఆదివారం సాయంత్రం అన్నయ్య మమ్మల్నందర్నీ మా ఊరిని ఆనుకుని ప్రవహిస్తున్న యేటి ఒడ్డుకు తీసుకెళ్ళేవాడు. అక్కడ ఇసుకలో పిల్లమూకనంతా చుట్టూ కూర్చోపెట్టుకుని సైన్సుపాఠాలు, నోటిలెక్కలు, పొడుపుకథలు, వాళ్ళ కాలేజీ విశేషాలు చెప్తుండేవాడు.

ఉన్నంటుండి ఒకరోజు “అందరూ మాట్లాడకుండా పద్మాసనంలో కూర్చుని ధ్యానం చెయ్యండి. రోజూ కాసేపు ధ్యానం చేస్తే తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. బాగా చదివుకో గలుగుతారు” అన్నాడు అన్నయ్య.

“ధ్యానం అంటే ఏంటి?” అని అడిగాడొక పిల్లాడు.

“మెడిటేషన్” అన్నాడు అన్నయ్య.

“మెడిటేషనంటే?” అడిగిందింకో పిల్ల.

“ధ్యానం” అన్నాడో కొంటె పిల్లాడు.

అన్నయ్య వాడివైపు ప్రశాంతంగా ఒక చూపు వేసి “నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని కూర్చోవడం” అని చెప్పాడు. అందరం ఏం మాట్లాడకుండా ‘అన్నయ్య ఎప్పుడు కళ్ళు తెరవమంటాడా’ అని ఎదురుచూస్తూ కళ్ళుమూసుక్కూర్చున్నాం.

మళ్ళీ ఆదివారం అన్నయ్య మమ్మల్ని ఏటి ఒడ్డుకు తీసుకెళ్ళేలోపల మేం ఏ ఇద్దరం ఎప్పుడు కలిసినా ‘ధ్యానం చేసినప్పుడు ఎవరికి ఏం ఆలోచనలు వచ్చాయి?’ అన్న విషయమే మాట్లాడుకున్నాం. ఏతావాతా తేలిందేంటంటే ఒకడు అమ్మ చేసి దాచిపెట్టిన అరిసెలు అమ్మకు తెలీకుండా ఎట్లా తినాలా అని ఆలోచిస్తే, ఇంకొకడు మాయచేసి తన హోంవర్కు అక్కచేత ఎట్లా చేయించాలా అని ఆలోచించాడు. ఒక అమ్మాయి అమ్మ చెప్పే పని ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తే, ఇంకో అమ్మాయి తెల్లవారుజామున లేచి చదువుతున్నట్టుగా నటిస్తూ ఎట్లా నిద్రపోవాలా అని ఆలోచించింది.

అన్నయ్య మా ఊళ్ళో చదివు అయిపోయి పై చదువులకు వెళ్ళిపోయాక మా ఏటి ఒడ్డు సమావేశాలు ఆగిపోయాయి. మిగతావాళ్ళంతా ఏం చేశారో నాకు తెలీదుగానీ నేను మాత్రం ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పించుకున్నాను.

కాలక్రమంలో ‘మెడిటేషన్’, ‘ధ్యానం’ అన్న పదాలు కనిపించిన ప్రతి పుస్తకం చదివేశాను కానీ ధ్యానమగ్నురాలిని కాలేకపోయాను.

ఆమధెప్పుడో మా ఊళ్ళో యోగా తరగతులు పెడుతున్నారనీ, ధ్యానం చెయ్యడం నేర్పిస్తారనీ తెలిసి ఆ తరగతులకి వెళ్ళాలని తెగ ఆరాటపడిపోయి, నన్ను చేర్చుకుంటారో లేదో అని కంగారుపడిపోయి, నానాతిప్పలూపడి సీటు సంపాదించి, అష్టకష్టాలూపడి కోర్సు పూర్తిచేశాక నాకర్థమైందేంటంటే అన్నయ్య ధ్యానం చెయ్యమన్నప్పుడు పిల్లలంతా కళ్ళు మూసుక్కూర్చుని చేసిన వెర్రిమొర్రి ఆలోచనలనే ధ్యానం అంటారని.

‘అయ్యో! అన్నయ్య చెప్పిన ప్రకారం మానకుండా ధ్యానం చేస్తూ ఉండుంటే పాతికేళ్ళనుంచి నేను ధ్యానం చేస్తున్నానని గొప్పగా చెప్పుకునేదాన్ని కదా’ అని కాసేపు బాధపడి, ‘సరే! అయిపోయిందేదో అయిపోయింది. యోగా తరగతుల్లో నేర్చుకున్న ధ్యానాన్ని మాత్రం వదలకూడదు’ అని నిశ్చయించుకున్నాను. అట్లా మనసులో వచ్చే ఆలోచనలని గమనిస్తూ కూర్చుంటే కాసేపటికి ఆలోచనలు ఆగిపోతునాయి. ‘అబ్బో! నేను ధ్యానం చెయ్యగలుగుతున్నాను ‘ అని సంతోషించేలోపల నాకు తెలిసిందేమిటంటే ధ్యానం చేస్తున్నాను అనుకుంటూ నేను కూర్చుని నిద్ర పోతున్నానని.

‘కూర్చుని నిద్రపోవడమేంటి ఛండాలంగా, హాయిగా పడుకుని నిద్రపోక’ అనుకుని ఆ ధ్యానాన్ని వదిలేశాక ఏ సంస్థ ధ్యానతరగతుల్ని నిర్వహించినా వెళ్ళడం, ‘ఇది నాకు కుదిరేది కాదు’ అనుకుని వదిలెయ్యడం నాకు అలవాటైపోయింది.

ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ‘స్కూల్ ఆఫ్ యోగా’ వాళ్ళ ధ్యానశిక్షణకి వెళ్ళబోతూ ‘ఇదే ఆఖరు, ఎట్లాగైనా దీన్ని సాధించాలి’ అని స్థిరంగా నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టుగానే మొదటి రెండు రోజులు చాలా ఆసక్తికరంగా సాగిన శిక్షణ చివరిదైన మూడోరోజుకు చేరుకుంది. ఆరోజు పైనుంచి పెద్దగురువుగారు వచ్చారు ఉపన్యాసం ఇవ్వడానికి.

“ఆధ్యాత్మికత అంటే ఏమిటి?” అన్న ప్రశ్నతో క్లాసు మొదలయింది.

ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా సమాధానం చెప్పారు. ఆధ్యాత్మికత అన్న పదానికి చాలా నిర్వచనాలే వచ్చాయి కానీ గురువుగారికి ఏదీ నచ్చినట్టు లేదు. ఎవరేం చెప్పినా గురువుగారు “ఇంకా…ఇంకా…” అని అడుగుతూనే ఉన్నారు. ఇంకేం సమాధానాలు రాని దశ వచ్చాక ఒక పదేళ్ళ అమ్మాయి లేచి నిలబడింది.

ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లల్ని “మీలా మా కాలంలో మేం టీవీ లెరుగుదుమా? కంప్యూట ర్లెరుగుదుమా? సెల్ ఫోన్లెరుగుదుమా?” అంటూ సాధించే లిస్టుకి యోగాక్లాసుల్ని కూడా కలపాలని నిర్ణయించుకున్నా న్నేను ఆ పిల్లని చూశాక.

“మగవాళ్ళయితే కాషాయబట్టలు కట్టుకుని, గడ్డాలూ, మీసాలూ పెంచుకోవడం, ఆడవాళ్ళైతే కాసంత బొట్టు పెట్టుకుని, పట్టుచీరలు కట్టుకోవడాన్ని ఆధ్యాత్మికత అంటారు” అని చెప్పిందా అమ్మాయి.

ఆ మాటలకి ఉలిక్కిపడ్డ జనం గట్టిగా నవ్వడానికి భయపడి మూతులకి చేతులు అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళని కళ్ళతోనే వారించి గురువుగారు ఆప్యాయంగా ఆ అమ్మాయి తల నిమురుతూ “అట్లా చెప్పావేంటమ్మా? నీ కెందు కట్లా అనిపించింది?” అని అడిగారు.

దానికా అమ్మాయి “టీవీల్లో అటువంటి వేషాల్తో కనిపించే వాళ్ళని ఆధ్యాత్మిక గురువులు అంటారు కదండీ! అందుకే అట్లా చెప్పాను” అందా అమ్మాయి.

తలకాయ అడ్డంగా ఊపి గురువుగారు అరమోడ్పు కన్నులతో “ఆధిదైన ఆత్మయొక్క కతే ఆధ్యాత్మికత” అంతూ ఎవ్వరికీ అర్థం కాని ఒక విచిత్రమైన నిర్వచనం ఇచ్చారు.

“ఆధి అంటే ఎవరండీ?” అని అడిగిందా అమ్మాయి.

గురువుగారు ఆ అమ్మాయిని కూర్చోమన్నట్టు సైగచేసి “టైం చాలా అయింది. ఇంకా మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

ముందు అందరూ ఒక అరగంట ధ్యానం చెయ్యండి” అన్నారు.

కళ్ళు మూసుకుని ‘ఆధ్యాత్మికత’ అన్న పదానికి నాదైన నిర్వచనం తయారుచెయ్యలనుకున్నాను కానీ నా వల్లకాక ‘గురువుగారు తొందరగా కళ్ళు తెరవమంటే బాగుండు’ అనుకుంటూ కూర్చున్నాను.

ఎట్టకేలకు గురువుగారికి దయకలిగి “అందరూ మెల్లగా కళ్ళు తెరవండి” అన్నారు. ‘అమ్మయ్య’ అనుకుని కళ్ళు తెరిచి, ‘ఇంక ఇంటికెళ్ళండి’ అని ఎప్పుడంటారా అని ఎదురుచూస్తున్నాను.

“ఇప్పుడొక ముఖ్యమైన విషయం చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి” అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు. “రాజధాని నగర పొలిమేరల్లో మనం ఒక పెద్ద ధ్యాన కేంద్రాన్ని నిర్మించుకో బోతున్నాం. ధ్యాను లెవరైనా అక్కడ ధ్యానసాధన చేసుకోవచ్చు. పదివేలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు డార్మిటరీలలో ఉండే అవకాశం పొందుతారు. లక్ష రూపాయలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు ప్రత్యేకగది వసతి కల్పిస్తాం. దూరప్రాంతాలనుంచి కానీ, విదేశాలనుంచి కానీ ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళకి రోజుకు వెయ్యి రూపాయల చెల్లింపుమీద ఎన్నిరోజులైనా ఉండడానికి వీలుగా అన్ని వసతులతో కాటేజీలు కట్టిస్తున్నాం. ధ్యానకేంద్ర నిర్వాహకులు నడిపే భోజన ఫలహారశాల లుంటాయి. చేతనయినవా ళ్ళెవరైనా హోటళ్ళు పెట్టుకుని నడుపుకోవచ్చు.ధ్యానకేంద్రం పరిసరాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ళస్థలాలు దొరుకుతున్నాయి. అవి కొనుక్కుని ఇల్లు కట్టుకో గలిగితే అంతకంటే అదృష్టం మరొకటుండదు. శాశ్వతంగా అక్కడే ఉండిపోయి ధ్యానంలోని మాధుర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు. ధ్యానంలో ఆసక్తి ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు ఈ విషయాలు చెప్పి మన ధ్యానకేంద్రం అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడండి…” గురువుగారి ఉపన్యాసం కొనసాగుతోంది కానీ అక్కడితో నా బుర్ర పనిచెయ్యడం మానేసింది.

‘ఇకమీదట ఏ ధ్యానశిక్షణ తరగతులకి వెళ్ళకూడ’దని గట్టిగా ఒట్టు పెట్టుకుని అక్కడినుంచి బయటపడ్డాను.

Jyothi–పాలపర్తి జ్యోతిష్మతి

 

అన్వేషి

టాక్సీ ఆగిన కుదుపుకి  కళ్ళు తెరిచింది క్రిస్టీనా. సిగ్నల్ పడినట్టుంది . ఏవో గుస గుసగా మాటలు వినిపిస్తే, కిందకి దింపి ఉన్న అద్దంలోంచి బయటకి  చూసింది. బైక్ మీద తండ్రి వెనుక కూర్చున్న ఇద్దరు పిల్లలు తనని విచిత్రం గా చూస్తూ  చెవులు కొరుక్కుంటున్నారు . స్కూల్  యూనిఫాం లో ఉన్నారు . నవ్వి చిన్నగా చెయ్యి ఊపింది. వాళ్ళు  కూడా ఉత్సాహంగా చేతులూపారు. పదినిమిషాల తర్వాత ఒక ఇంటిముందు ఆగింది టాక్సీ .

 అడ్రస్ సరిచూసుకుని టాక్సీ కి డబ్బులిచ్చి పంపేసి , తలుపు మీద మెల్లగా తట్టింది.  రెండు  నిమషాల తర్వాత తలుపు  తెరుచుకుంది . ఓ ముసలాయన తల బయటకి పెట్టి చూసి ఏదో అన్నాడు . క్రిస్టీనా కి అర్ధం కాలేదు . సిద్ధార్ధ్  ఉన్నాడా అని ఇంగ్లీష్ లో అడిగింది .ఆయన ఒకసారి  ఆమెని ఎగా దిగా చూసి అడ్డు తప్పుకున్నాడు . లోపలి రమ్మన్నట్టుగా . “నువ్వు కూర్చోమ్మా , నేను అర్జెంట్ పని మీద బయటకి వెళ్తున్నా . మా కోడలితో మాట్లాడు ”  ఈసారి ఇంగ్లీష్ లో  అన్నాడాయన సోఫా చూపిస్తూ. ఓసారి లోపలికి వెళ్లి వచ్చి  బయటకి వెళ్ళిపోయాడు.
లోపల్నించి ఏవో  చప్పుళ్ళు వినిపిస్తున్నాయి . ఏం చెయ్యాలో అర్ధం కాక సోఫా లో  ఇబ్బందిగా కదిలి గదంతా కలియ జూసింది . గోడ మీద ఉన్న ఒక ఫోటో వెంటనే ఆమె దృష్టిని ఆకర్షించింది . ఒక్క నిమిషం ఆమెకి గుండె ఆగినంత పనైంది. దిగ్గున లేచి ఫోటో దగ్గరగా వెళ్లి పరికించి చూసింది .
ఇంతలో వెనుక నుండి ఎవరో వస్తున్న అలికిడికి వెనక్కి తిరిగింది . అక్కడ ఒకామె నిలబడి ఉంది . ఆమె ముఖం నిండా విషాదం అలుముకుని ఉంది . ఒక రకమైన దైన్యం , నిరాశ ఆమె ముఖంలో స్పష్టం గా కనిపిస్తున్నాయి . పాతికేళ్ళ లోపే ఉంటుంది ఆమె వయసు .
క్రిష్టీనా కొంచెం తడబడింది  ” సిద్ధూ అదే సిద్ధార్ధ్ ఫ్రెండ్ ని నేను . తన కోసం వచ్చాను “
 ఆమె ఆశ్చర్యంగా చూసింది . సిద్ధూ కోసం మీరు  యు . స్ నించి వచ్చారా ! “
“అవును. మీరు…. “అని ఆగిపోయింది క్రిస్టీనా.
“ఆ ఫోటో లో వ్యక్తి నా భర్త , సిద్ధూ అన్నయ్య  గౌతమ్. వాళ్ళిద్దరికీ చాలా పోలికలు ఉంటాయి . అందుకే  కంగారు పడినట్టున్నారు “ఆమె ఇంగ్లీష్ స్పష్టం గా ఉంది
“అవునండీ , ఎప్పుడు జరిగింది . నాకు తెలీదు . అయాం రియల్లీ సారీ ” జాలిగా చూస్తూ అంది క్రిస్టీనా
ఒక్కసారిగా ఆమె లో దుఃఖం పెల్లుబికింది. అణుచుకోవడానికి క్రింది పెదవిని మునిపంటి తో నొక్కి పెట్టింది . ఏమీ మాట్లాడలేకపోతోంది. అంతటి శోకం  కూడా  ఆమె సౌందర్యాన్ని దాచలేకపోవడం  క్రిస్టీనా చూడగలుగుతోంది
” నా పేరు క్రిస్టీనా లీ , మీ పేరు?” టాపిక్ మార్చడం అవసరమనిపించింది.
” వైష్ణవి ”  కొంచెం ఆగి  అడిగిందామె   ” కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా?”
“ఇప్పుడేమీ వద్దు . సిద్ధూ ఎక్కడున్నాడో చెప్పగలరా “
క్రిస్టీనా ని తేరిపార చూస్తూ అడిగింది వైష్ణవి ” ముందు సిద్ధూ మీకెలా పరిచయమో చెప్పండి  “
  ***
పక్క ఫ్లాట్ లోంచి  భళ్ళున ఏదో పగిలిన శబ్దానికి మేలుకుంది  క్రిస్టీనా. టైం చూస్తే ఐదు  కావస్తోంది . ఇంత ఉదయాన్నే ఏమిటా శబ్దం!
ఒక్క నిమిషం మనకెందుకులే అనిపించినా ఉండబట్టలేక లేచి బయటకి వచ్చింది . పక్క ఫ్లాట్  దగ్గరకి వెళ్లి ఏం  చేద్దామా అని  ఆలోచిస్తుండగానే తలుపు తెరుచుకుంది. ఆ ఫ్లాట్ లో ఎవరుంటారో తెలీదు ఆమెకి . కానీ విచిత్రంగా తలుపు ఎవరు తీసారో కూడా ఆమెకి అర్ధం కాలేదు .
“లోపలి రండి” అని ఒక మగ గొంతు మాత్రం వినిపించింది . సంకోచిస్తూనే లోపలి అడుగు పెట్టింది . డ్రాయింగ్ రూం మధ్యలో ఒక వ్యక్తి తెల్లని దుస్తులు ధరించి కూర్చొని ఉన్నాడు . తనని చూసి చిన్నగా నవ్వాడు. సౌత్ ఈస్ట్ దేశాలకి చెందిన వాడిలా ఉన్నాడు.
“ఏదో పెద్ద చప్పుడు వినిపిస్తే, ఏమిటో అని …” సంజాయిషీ ఇవ్వడానికి ప్రయత్నించింది .
“ఏమీ లేదు లెండి . దయచేసి వచ్చి కూర్చోండి “అన్నాడు .
“తలుపు ఎవరు తీసారు ” నాలుగువైపులా కలియ జూసింది . ఓ పక్కగా పగిలి పోయిన గాజు ముక్కలు కనిపించాయి .అవి పగిలిన  చప్పుడే  తన నిద్ర పాడుచేసినట్టుంది.
“నా కళ్ళు ” అన్నాడతను .
ఏమిటితను! తనని ఆట పట్టిస్తున్నాడా? అతని ముఖ కవళికలు చూస్తే అలా అనిపించలేదు
“మీకు సరిగా నిద్రపట్టదు కదూ . ఏదో అశాంతి.  ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేసారా ఎప్పుడైనా  “
ఆమె ఉలికి పడింది.  ఇతనికి ఎలా తెల్సు. ఆ విషయం తెలుసుకోవాలనే సాయంత్రానికి  సైకియాట్రిస్ట్ దగ్గర అప్పాయింట్ మెంట్ కూడా తీసుకుంది
అతను లేచి వెళ్లి బుక్ షెల్ఫ్ లోంచి ఒక పుస్తకం తీసి తనకి ఇచ్చాడు .
“ఇది చదవండి . మీ సమస్యకి పరిష్కారం  దొరకచ్చు”  అప్పుడు చూసిందామె, అతని బుక్ షెల్ఫ్ నిండా చాలా పుస్తకాలున్నాయి
అయోమయంగా అతనిచ్చిన పుస్తకం  అందుకుంది  . “యు ఫరెవర్” అనే పుస్తకం అది . లోబ్సాంగ్ రాంపా అనే ఆయన రాసారు .
“మీరు టిబెటన్లా  లేరే?”
“కాదు, ఇండియన్ “
“మెజీషియన్ నా మీరు? “
అతను పెద్దగా నవ్వాడు. అతని ముఖం పై  వింత తేజస్సు అలుముకుని ఉంది  ” కాదండీ , నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న మామూలు మనిషిని  “
అలా జరిగింది వాళ్ళ పరిచయం. రోజూ ఉదయం నాలుగు గంటలకి నిద్ర లేచి అతను యోగ సాధన చేస్తాడట . తను కూడా ఆ టైం కి  అతని ఫ్లాట్ కి వస్తానని రిక్వెస్ట్ చేసింది . అతని  చర్యలని  ఆసక్తి తో గమనించేది . కొన్ని కొన్ని సందేహాలు అడుగుతుండేది . అతను తనకి తెలియని ఎన్నో విషయాలు చెబుతూ ఉండేవాడు. అతను తన చూపులతో వస్తువుల్ని కదపడానికి చేసే ప్రయత్నాన్ని క్రిస్టీనా ఆసక్తి తో గమనించేది .
కొన్నాళ్ళ తర్వాత ఆమె  అడిగింది  “నేను ఎందుకో ఎవరితోనూ గట్టి మానసికమైన సంబంధాన్ని ఏర్పరుచుకోలేక పోతున్నాను . తండ్రి లేకుండా గడిపిన బాల్యం, ఒంటరితనం  అందుకు  కారణం అంటావా సిద్ధూ “
“నీది నిర్లిప్తత అని నువ్వు అనుకుంటున్నావు . కానీ అది  మనసుకి ఉన్న నిశ్చలత అని నీకు త్వరలోనే తెలుస్తుంది. ఏదో ఒక రోజు నీకు కావాల్సింది ఏమిటో  నీకు అర్ధం అవుతుంది . నువ్వే అప్పుడు దాన్ని వెతుక్కుంటూ వెళతావు  “
ఆ రోజు ఉదయం సిద్ధూ ఫ్లాట్ కి వెళ్ళే సరికి అది ఖాళీ గా కనిపించింది. రెండు రోజుల్నించీ లేట్ నైట్ వరకు పని చెయ్యడం వల్ల ఆమె సిద్ధార్ధ ని కలవలేకపోయింది . సడన్ గా ఏమీ చెప్పకుండా అతను ఎక్కడికి మాయం అయిపోయాడో అర్ధం కాలేదు . చివరి సారి అతన్ని కలిసినప్పుడు అతను కొంచెం నిరాశగా ఉండటం గుర్తొచ్చింది
“చేస్తున్న ఈ సాఫ్ట్ వేర్ జాబ్ నాకు సంతృప్తిని ఇవ్వడం లేదు . ఇంకా ఏదో చెయ్యాలి అనిపిస్తోంది ” అన్నాడు అతనప్పుడు.
ఆ తర్వాత ఎంతో ప్రయత్నం మీద సిద్ధార్ద్  ఇండియా వెళ్లిపోయాడని అతని కొలిగ్ ద్వారా తెలుసుకుంది . అడ్రస్ కనుక్కుని ఇండియా కి బయలుదేరింది .
 ***
url
 క్రిస్టీనా తన మరిది గురించి చెబుతుంటే అతనికీ , తన భర్త కీ  ఆలోచనల్లో ఎంత సారూప్యం ఉందో వైష్ణవి కి అర్ధం అవుతోంది
మూడు నెలల క్రితం ఆ రాత్రి ఎక్కడినుండో మాటలు వినిపిస్తుంటే మెళకువ వచ్చింది వైష్ణవి కి . చూస్తే పక్కన భర్త కనిపించలేదు . ఎప్పుడూ తాళం వేసి ఉండే మరిది రూం తెరిచి ఉంది . ఆ రూం లో తన భర్త తో మాట్లాడుతున్న వ్యక్తి ని చూసి  ఆశ్చర్య పోయింది . ఇతను యు. ఎస్. నించి ఎప్పుడు వచ్చాడు! వస్తున్నానని చెప్పనైనా చెప్పలేదే?
 లోపలికి వెళ్ళ బోయిన వైష్ణవి, తన భర్త అన్న మాటకి గుమ్మం  దగ్గరే ఆగిపోయింది .
“నాకు మాత్రం ఇక్కడ ఇలా ఈ జీవితాన్ని గడపడం ఇష్టం అనుకుంటున్నావా?” భర్త గొంతు గంభీరంగా పలికింది .
“నీ సంగతి వేరు అన్నయ్యా ” అంటున్నాడు  సిద్ధూ
“వేరు ఏమీ లేదు రా , నాక్కూడా నీ లాగే ఇంకా  తెలుసుకోవాల్సిందీ , చెయ్యవలిసిందీ  చాలా ఉంది ఆనిపిస్తుంది . అదలా ఉంచు , అమ్మ , నాన్న గురించి ఆలోచించావా?”
“వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అన్నయ్యా, నీకంటే  బాగా  వాళ్ళని ఎవరు చూసుకోగలరు “
“ఇలా చెయ్యడం మన స్వార్ధం మనం చూసుకోవడం అవుతుంది రా ,బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించక పోవడం చాలా తప్పు “
తన భర్త ఇంకా ఏదో చెబుతున్నాడు .
 ఆధ్యాత్మిక పరమైన వాళ్ళ సంభాషణ మీద నుండి దృష్టి మరలిన వైష్ణవికి  తన పెళ్లి చూపుల్లో భర్త అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి
“నేను నీకు నచ్చానా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిర్మొహమాటం గా చెప్పమ్మా”   ఒంటరిగా వేరే గదిలో మాట్లాడమని పెద్దవాళ్ళు పంపినప్పుడు అడిగాడు గౌతమ్ .
సిగ్గుతో తల దించుకుని ఉన్న వైష్ణవి తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక పోయింది . ఎవరో పెద్ద వాళ్ళ లా తనని అమ్మా అని పిలుస్తాడు ఏంటి !
అతని వైపు చూడాలన్న కోరికని బలవంతం గా అదిమిపెట్టి ఇష్టమేనన్నట్లుగా తల ఊపింది
పెళ్లి తర్వాత  తెల్సింది అతని మంచితనం ఆమెకి . ఎప్పుడూ  ప్రశాంతం గా ఉండటం ,ఎంత పెద్ద విషయానికి అయినా కోపం తెచ్చుకోకపోవడం , తనని చిన్న పిల్లని చూసినంత అపురూపం గా చూడటం ఆమెని అమితమైన ఆనందాన్ని కలిగించేవి.
కానీ ఒక్కోసారి గంటల  తరబడి ధ్యానం లో ఉండిపోవడం చూస్తే భయమేసేది . ఏంటి ఈయన వాలకం అని
అలాగే ఓ సారి చుట్టపు చూపుగా  వచ్చిన ఒక పెద్దావిడ , తమ ఇంట్లో ఉన్న నిలువెత్తు శివుడి పటం  చూసి ” అంత పెద్ద  శివుడి పటం  ఇంట్లో పెట్టుకోకూడదమ్మా ” అన్నప్పుడు కూడా చాలా  ఆందోళన కలిగింది . భర్త తో చెబితే నవ్వి ఊరుకున్నాడు .
తన ఆందోళన గమనించిన అత్తగారు ఒక రోజు తనని దగ్గర కూర్చోబెట్టుకుని కొన్ని విషయాలు చెప్పారు
“అమ్మా , వాళ్ళకి  వంశ పారంపర్యం గా వచ్చిన లక్షణాలు ఇవి . గౌతమ్ తాతగారి తాతగారు అంటే మా మామగారి తాతగారు బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసేవారట . ఆ తల్లి అయన కి కనిపించేదనీ,మాట్లాడేదనీ చెబుతారు . ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో రాత్రి వేళ గజ్జెల మోత వినిపించేదట . వాళ్ళ వశం లో తరం వదిలి తరం మీద తన ప్రభావం ఉండేలా చేయమని అయన ఆ తల్లిని వరం కోరుకున్నారని అంటారు . మా మామగారు కూడా చాలా ఆధ్యాత్మికమైన భావాలతో, తీవ్రమైన భక్తి భావంతో  జీవితాన్ని గడిపారట . కానీ అయన తన ముప్ఫైయవ ఏట ….. “అని అర్ధోక్తి గా ఆవిడ చెప్పడం ఆపేసారు . తర్వాత ఎన్ని సార్లు అడిగినా ఆ విషయం గురించి ఆవిడ మాట్లాడలేదు .
అసలు గౌతమ్ కి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదేమో !వైష్ణవి  ఆలోచన ల్లోంచి  తేరుకుని చూసింది
గదిలోంచి ఇంకా అన్నదమ్ముల మాటలు విసిపిస్తూనే ఉన్నాయి  . నెమ్మదిగా  బెడ్ రూం లోకి వచ్చేసింది.
***
ఎవరో పిలిచినట్టు  అనిపిస్తే తుళ్లిపడి  లేచింది వైష్ణవి . ఎదురుగా హాస్పిటల్ బెడ్ మీద భర్త మెల్లగా కదులుతున్నాడు . ఒక్కసారిగా అల్లకల్లోలం చేసే నిజం ఆమె  కళ్ళ ముందు కనిపించి కలవరపాటు కి లోనైంది .
ఎవరెంత చెప్పినా వినకుండా సిద్ధార్ధ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ,అతని మీద బెంగ తో అత్తగారు మంచం పట్టి , నెల రోజులకే కన్ను మూయడం , కాశీ రామేశ్వరం అన్ని చోట్లా  సిద్ధార్ధ కోసం వెతికించి  అతని జాడ తెల్సుకోవడంలో తాము  విఫలం కావడం , అత్తగారు చనిపోయినప్పటి నుండీ భర్త ఉదాశీనం గా ఉండటం , పది రోజుల క్రితం మొదలైన జ్వరం ఎంతకీ తగ్గకుండా అతన్ని హాస్పటల్  పాలు చెయ్యడం అన్నీ ఆమె జ్ఞాపకాల్లోకి ఒక్కసారిగా తోసుకొచ్చాయి.
బాధ గా భర్త వైపు చూసింది . అతను మెల్లగా నవ్వాడు . ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరి  బిక్కిరైంది . రెండు రోజులుగా అతను మూసిన కన్ను తెరవలేదు. గౌతమ్ కి  నయమవ్వాలని  ఆమె చెయ్యని పూజలు లేవు . మొక్కని మొక్కులు లేవు . చివ్వున   లేచింది .
” ఆగు వైషు , నే చెప్పేది విను “
“ఎక్కువ మాట్లాడకండి . డాక్టర్ ని పిలుస్తాను “
“వద్దు , ఆగు , నేను చెప్పేది  జాగ్రత్త గా విను . ఇలా జరుగుతుంది అన్న విషయం నాకు ముందే తెలుసు. అయినా రాసిపెట్టి ఉన్నదాన్ని ఎవ్వరు మార్చలేరు కనుక మన వివాహాన్ని ఆపలేక పోయాను . నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి తప్పదు , కానీ ఆ  బాధ తాత్కాలికమే . ఈ సమయం లో ఇలా చెప్పడం సరి కాకపోవచ్చు . కానీ తర్వాత నాకు చెప్పే అవకాశం ఉండదు కనుక చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెబుతున్నాను . ప్రశాంతం గా విను . నేను దూరమయ్యాక నీకు అన్యాయం జరగదు . నా తర్వాత నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు “
“అయ్యో, ఏమిటండీ ఆ మాటలు, నాకోసం  ఇప్పుడిప్పుడే నాలో రూపుదిద్దుకుంటున్న మన బిడ్డ కోసం మీరు బాగుండాలండీ  ” దుఃఖాన్ని అపుకోలేకపోతోంది వైష్ణవి “బెంగ పడకు వైషూ , మన బిడ్డ కి ఏ లోటూ ఉండదు . వాడికి మంచి భవిష్యత్తు ఉంది “
అవే అతను ఆమెతో మాట్లాడిన చివరి మాటలు . ఆ తర్వాత మూసుకున్న అతని కనురెప్పలు ఇక  విడలేదు. అ మరుసటి రోజు ఉదయమే అతను  తన కోరుకున్న లోకానికి పయనమయ్యాడు .
***
అరె! నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా ?” క్రిస్టీనా అడుగుతుంటే వర్తమానం లోకి వచ్చిన వైష్ణవి భర్త జ్ఞాపకాలతో తన కళ్ళు విపరీతం గా వర్షించడాన్ని గమనించుకుంది
” లేదు, లేదు , మీరు అంత దూరం నుండి శ్రమ పడి  వచ్చారు . కానీ నాకు  సిద్ధార్ధ ఎక్కడున్నాడో తెలీదు. మా అత్తగారు చనిపోయినప్పుడు మా వారు సిద్ధూ కోసం చాలా  వెతికించారు . అతను ఆఖరి సారి కాశీ లో కనిపించాడట కొందరికి . తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు . ఇల్లు వదిలి వెళ్ళాక ఒకటి రెండు సార్లు మాత్రమే ఫోన్ చేసాడు . తాను హిమాలయాలకి వెళ్ళ దలుచుకున్నట్టు, ఎవరూ తనని వెతికే ప్రయత్నం చెయ్యొద్దనీ  మాత్రం చెప్పాడట “
క్రిస్టీనా ముఖం తెల్లగా పాలిపోవడం చూసిన వైష్ణవి చెప్పడం ఆపింది .
రెండు నిముషాలు మౌనం గా ఉండిపోయిన క్రిస్టీనా దీర్ఘంగా నిట్టూర్చింది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా .
“చివరి సారి గా సిద్ధూ ని చూసిన వాళ్ళ అడ్రస్ గానీ ,ఫోన్ నెంబర్ గానీ ఇవ్వగలరా “
తను వెతికి ఇచ్చిన అడ్రస్ తీసుకుని థాంక్స్ చెప్పిన క్రిస్టీనాని జాలిగా చూసింది వైష్ణవి.
“నా ప్రేమని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను , నీ ప్రేమ అయినా నీకు లభించాలి అని కోరుకుంటున్నాను “
 ఆ మాటలకి క్రిస్టీనా కొంచెం ఇబ్బంది పడింది.  తన ఫోన్ నెంబర్ ఆమెకి ఇచ్చి, సిద్ధూ గురించి ఏమైనా తెలిస్తే తనకి తెలియజేయమని చెప్పి , వైష్ణవి దగ్గర సెలవు తీసుకుని ఆ ఇంట్లోంచి బయటపడింది .
తను  సిద్ధూని ప్రేమిస్తున్నానని  వైష్ణవి అనుకుంటోందా! సిద్ధూని తను ఆ దృష్టితో  ఎప్పుడూ చూడలేదు . సిద్ధూ సామీప్యం లో తన మానసిక అలజడి  మటుమాయ మయ్యేది . అతని  మాటలు తనని ఎంతో ప్రభావితం చేసాయి . అతను  ప్రయాణించే మార్గమే తనని కూడా తన గమ్యానికి చేరుస్తుంది అనే నమ్మకం తోనే అతన్ని వెతుక్కుంటూ వెళుతోంది.
కనుచూపు మేర వరకు క్రిస్టీనాని చూస్తూ నిలబడిన  వైష్ణవి తలుపులు వేసే ప్రయత్నం చేస్తుండగా  ఓ అపరిచిత వ్యక్తిని  ఎదురుగా చూసి కంగారు పడింది
“క్షమించాలి. మిమ్మల్ని భయపెట్టినట్టున్నాను.   నా పేరు విష్ణు . గౌతమ్ నా ప్రాణ స్నేహితుడు. ఒక స్వఛ్చంద సంస్థ లో పని చేస్తూ రెండు  సంవత్సరాలు గా రుమేనియా లో ఉండిపోవటం  వల్ల  మీ పెళ్లి కి కూడా రాలేకపోయాను “
తేరుకున్న వైష్ణవి పక్కకి తొలగి అతన్ని లోపలి కి ఆహ్వానించింది .
        ***
bhavaniphani   -భవానీ ఫణి
(భవానీ ఫణి మొదటి కథ ఇది.  తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీ పోలవరం ఆమె స్వస్థలం. ప్రస్తుతం బెంగుళూర్ లో ఉంటున్నారు. అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉంటారు. )

గతం

అక్కా! అక్కా!అని అరుచుకుంటూ వచ్చాడు అభినవ్ నా గదిలోకి.

 అప్పుడు సాయంత్రం 5 అయిందినా స్నేహితురాలు  విజయలక్ష్మి  తో ఫోనులో మాట్లాడుతున్నాను.

 ఫోనులో మాట్లాడుతుంటేనేమి? నిద్రపోతుంటేనేమి? నేను పలికిందాకా అక్కా! అక్కా!అని చెవి కోసిన పిట్టల్లాగా అరుస్తూనే ఉంటారు పిల్లలు.

 మాది పెద్ద బోర్డింగ్ స్కూల్మా స్కూల్ లో మూడు వందల యాభై మంది పిల్లలు ఉంటారునేను ఇక్కడ తెలుగు టీచర్ని.  మా స్కూల్లో లేడీ టీచర్స్ ని పిల్లలు అక్కాఅని పిలుస్తారుస్కూల్లో ఇరవై హాస్టల్స్ ఉన్నాయిఒక్కో హాస్టలికీ అనుబంధంగా ఉండే ఇంట్లో ఒక టీచర్ ఉంటారుమా హాస్టల్ లో ఐదు,ఆరు తరగతుల పిల్లలు 18 మంది ఉన్నారు

 ఫోన్లో మాట్లాడుతున్న నేను ఉండమ్మా విజ్జీ లైన్లోఅని విజయలక్ష్మికి  చెప్పి ఏంటి చెప్పు అభీఅన్నాను.

అక్కో! నిన్న మనం హైక్ కి వెళ్ళాం గదా! అప్పుడు పొద్దున్నే డైనింగ్ హాల్ వాళ్ళు దోశలు పొట్లం కట్టిచ్చారు కదా! దోశ తినేదా? భలే ఆకలేస్తుందిఅని అన్నాడు.

 ఫోనులో విజ్జితో సంభాషణ  – లోకంలోని మనుషులు, వారి కోపాలూ, అసూయలూ దగ్గర  మొదలై  రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఆత్మ, ధ్యానం దగ్గర ఆగిపోవడంతో రకమైన తాదాత్మ్యంతో ఉన్న నాకు వాడు చెప్పింది సరిగ్గా అర్థం కాక   ” నిన్న తిన్నట్లు దోశ  తినాలని అనిపిస్తుందా? రోజు డిన్నర్ లో ఇవ్వరు కదా! గురువారం బ్రేక్ ఫాస్ట్ లో ఇస్తారులే. తిందువుగానిఅని అన్నాను. రోజు భోజనం పెడతారో మాకు ముందుగానే మెను చార్ట్ ద్వారా తెలుస్తుంది. ( ఇలా తెలియడం వల్ల  జీవితంలో నూతనత్వాని కోల్పోతున్నాం కదా! అనిపిస్తుంటుంది నాకు.)

 ” అది కాదక్కా! నిన్న ప్యాకెట్టు మొత్తం తినలేదుమిగిలినది బ్యాక్ పాక్ లో పెట్టుకున్నా. అది ఇప్పుడు తినేదా! అన్నాడు.

ఓరోయ్! నాయనోయ్! ఛీ! ఛీ! – నువ్వు ఫోను పెట్టెసెయ్ విజ్జీ! – ఫోరా ఫో. పోయి తీసుకురా ప్యాకెట్టుని”  అని అరిచాను.

 వాడు చాలా ముద్దుగా ఉంటాడువాడి తరగతిలో అందరికంటే వాడే పొట్టిఇంతలేసి కళ్ళునేనన్న మాటలకి మూతి ముడుచుకుని ఎందుకు అక్క  అరుస్తోంది ‘  అన్నట్లుగా ముఖం  పెట్టి గునగునా పరిగెత్తాడు హాస్టల్ లోకి.

 మిగిలిన నిన్నటి దోశ ఇప్పుడు తినేదా అన్నప్పుడు కోపం వచ్చినా, వాడు పెట్టిన ఆశ్చర్యకరమైన  ముఖాన్ని చూడగానే నాకు నవ్వు ఆగలేదు.  పెద్దగా నవ్వుతూ నా గదిలోనుండి  హాస్టల్  లోపలకి వెళ్ళాను.  నా నవ్వు విని ఎదురుగా ఉన్న గదిలో నుండి వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చింది.  జరిగింది చెప్పగానే  ” అబ్బేఅని ముఖం జుగుప్సగా పెట్టింది.  నాకు మాత్రం నవ్వు ఆగడం లేదు.    లోపు అభి ప్యాకెట్ ని పట్టుకుని వచ్చాడు.    వాడి ముఖం లో ప్రశ్నార్థకం కనిపిస్తూనే ఉంది. 

 “పారేసెయ్! పారేసెయ్! అన్నాను దగ్గరకు రాకుండానే.

ఎక్కడ పారేసేది? అన్నాడు అమాయకంగా.

ఎక్కడ పారేసేదేందబ్బాయ్? చెత్తబుట్టలో వెయ్! అంటూ ముక్కుకి పైట చెంగు అడ్డం పెట్టుకుని తనే వాడి చేతిలోనుంచి ప్యాకెట్ లాక్కున్నట్టు తీసుకుని బయట పారేయడానికి వెళ్ళింది వార్డెన్.

నిన్నటిది రోజు తినొచ్చా? పాడయిపోయింది తింటే జబ్బులు వస్తాయి”  అని అన్నాను నేను.

నాకు సంగతి తెలియదు అక్కా! అన్నాడు.

సరేలే! ఇంకెప్పుడూ అలా మిగిలిన తిండిని బ్యాక్ పాక్ లో దాచుకోకు. వెళ్ళు. వెళ్ళి చేతులు కడుక్కుని లాకర్లో నుంచి రెండు బిస్కెట్ లూ, ఒక చాక్లెట్ తీసుకుని తిను” అని అన్నాను.

వాడికి ఆకలేస్తుందట. చూసుకోమ్మా” అని వార్డెన్ తో చెప్పి నా గదికి వచ్చాను.

 విజయలక్ష్మికి ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లేదో మళ్ళీఅక్కా!” అని పిలుచుకుంటూ వచ్చాడు అభి.

ఏమిటిఅన్నట్టుగా చూశా వాడి వైపు.  ” మరీ, చాక్లెట్లూ, బిస్కెట్లూ కూడా నిన్నటివే కదా! అవి పాడైపోలేదా” అని అడిగాడు.  వాడు అడిగే ప్రశ్నకి, వాడు అడిగిన తీరుకీ భలే ముచ్చటేసింది.  అభిని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాను.  పక్కనే కూర్చోబెట్టుకునికొన్ని రోజులకి పాడవకుండా ఉండటానికి వీటిల్లో కెమికల్స్ కలుపుతారు. ఇవి కూడా మంచివి కావు కాబట్టే ఎక్కువ తినొద్దు అని చెప్పేది.  రేపు సైన్స్ క్లాస్ లో టాపిక్ నే డిస్కస్ చేయండి. ఆమె చక్కగా అర్థం అయ్యేట్లు చెప్తుంది.  నేను కూడా సుమతి అక్కకి (సైన్స్ టీచర్) చెప్తాలేవెళ్ళు. వెళ్ళి ఆడుకో” అన్నాను.

వాడు సంతోషంగా ముఖం పెట్టి బయటికి పరిగెత్తాడు తను గ్రహించిన విషయాన్ని అందరితో చెప్పడానికి.

 ‘ నిన్నటి ఆహారం శరీరానికి విషం. అది అందరూ ఒప్పుకుంటారు.  కాని నిన్నటి గతం మనసుకి విషం అని ఎందుకో తెలుసుకోలేకపోతున్నారు.  నిన్నటి నిందను ఈరోజు తలుచుకొని ద్వేషాన్ని లేదా బాధని పెంచుకుంటారు. అలాగే నిన్నటి చాక్లెట్ లాంటి పొగడ్తని తలుచుకొని ఆనందపడతారురెండూ ప్రమాదమేఅసలు గతమే మనసుకి విషం, మాయ అని గ్రహిస్తే ఆత్మ ప్రకాశిస్తుందిశాశ్వతమైన  ఆనందం లభిస్తుంది. ‘


        ***

radhamanduva1-రాధ మండువ

 

పు(ని)ణ్యస్త్రీ

chinnakatha

“సాంప్రదాయలని పాటించడమే  జీవితం అనుకొన్న  సీతమ్మ, జీవనభుక్తి కోసం  ఆ సాంప్రదాయానికి ఎదురీదెందుకు నిర్ణయించుకొంది.తను తీసుకొన్న నిర్ణయం ధర్మమో, అధర్మమో కాలమే   చెప్పాలి?”

రోజు గోదావరి  ఒడ్డున ఉన్న కోటి లింగాల రేవుకి  ఉదయాన్నే వెళ్లి కాలు ఝాడిస్తూ ఉంటాను. గత పదిహేను ఏళ్ళ గా ఉన్న అలవాటు అది, చేసేది కాలేజీ లో అధ్యాపక వృత్తి, ఇంక నా ప్రవృత్తి  అంటారా మనుషులని చదవడం, వాళ్ళ స్వభావాలను అంచనా వెయ్యడం తో పాటు అప్పుడప్పుడు చిన్న-చితక కధలు, కవితలు  రాస్తూ ఉంటాను . అన్నీ మన చుట్టూ జరిగే సంఘటనలని చూసి రాస్తూ ఉంటాను. ఇది నా అర్ధభాగానికి అస్సలు నచ్చని సంగతి. “ఎవరిగురుంచో మీకు ఎందుకండీ  ఇన్ని ఆలోచనలు” అని  ఆవిడ నన్ను సాధిస్తూ ఉంటుంది. అయినా  నా అలవాటు మారలేదు, మార్చుకోను లేదు.  అందుకే   పొద్దునే  వస్తాను  ఏకాంతంగా మనుషులని పరిశీలన చేస్తూనే ఉంటాను.  దాంతోటి  నాలోని  రచయతకు  పని  కలిపిస్తాను. ఇది స్థూలంగా నా దినచర్య.

ఈ మధ్యనే  ఒక ఆవిడను  ఇంచుమించుగ ఒక నెల రోజుల నుంచి గమనిస్తున్నాను.పెద్ద వయస్సు గల ఆవిడలా లేదు. పచ్చగా,  పెద్ద కుంకుమ బొట్టుతో నిండుగ    కనిపించే  రూపం. ముఖమంతా పరుచుకున్న చక్కటి నవ్వు చూస్తుంటే ఎవరో పెద్దింటి ఆవిడ లా వుంది అని అనుకున్నాను. ఆవిడ కూడా ఇంచుమించుగా రోజు పొద్దునే గోదారి గట్టుకు వస్తుంది. రావడమే ఎవరో తరుముతున్నట్లు గా భలే హడావుడి గా  వస్తుంది.  ఎప్పుడు వెళుతుందో మాత్రమూ  అస్సలు తెలియటం లేదు .అసేలే  నా బుర్ర కి  ఇలాంటి వి  చూస్తె కోతి కి కొబ్బరికాయ దొరికినట్లే ! ఈ మారు  శ్రద్ధ పెట్టి చూడాలి అని అనుకుంటూ  ఇంటికి బయల్దేరాను.

ఇల్లు ఇక్కడికి దగ్గరే సీతంపేటలో. మాది డాబా ఇల్లు, మా తాతగారి వారసత్వంగా వచ్చినది.  ఏదో పెద్దవాళ్ల పుణ్యమా అని తలదాచుకునేందుకు  ఓ సొంత గూడు అనేది వుంది. వస్తున్న జీతం తో ఏ ఒడిదుడుకులు లేకుండా  సాఫీగా సాగుతోంది జీవితం. అందుకు భగవంతుడికి సర్వదా కృతజ్ఞడుని.

అలానడుస్తూ వుండగా సన్నగా ఏడుపులు వినిపించాయి. పాపంఎవరో ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకొని ఇక తిరిగిరాని లోకాలికి వెళ్లి పోయిన ట్లున్నారు. గోదారి ఒడ్డునే ఉన్న స్మశానవాటిక  దగ్గరకి  తీసికొనివెళుతున్నారు.  అలా నేను అటువైపు చూస్తూవుండగా తొందర తొందరగా రోజు నేను  చూస్తున్న ఆవిడ  ఆ శవం వెనకాలే వెడుతోంది. పాపం ఆవిడ బంధువులు కామోసు, వాళ్ళు అని నాకు నేనే చెప్పుకున్నాను.

యధాప్రకారం మరునాడు నేను వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నా చూపులు ఆవిడ కోసం వెతికాయి.   కాని  ఆవిడ ఎక్కడా  కనపడలేదు. రోజులాగే నా ఉదయ వాహ్యాళి పూర్తిచేసుకొని వెళ్ళిపోయాను. ఇలా ఓ వారం రోజులు గడిచాయి. ఆ రోజు  ఆదివారం కావటం తో నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. నేను వెళుతుండగానే ఆవిడ  పరుగులాంటి నడక తో వస్తోంది. ఇంతలో  చలపతి గారని మాకు బాగా తెలిసిన బ్రాహ్మణుడే, ఆయన మా ఇంటికి పూజలు చేయించడానికి వస్తారు, ఆయన  ఈవిడని చూసి “ఏమ్మా ఇప్పుడా రావడం? నేను పొద్దున్నే రమ్మనిచెప్పాను కదా! వాళ్ళు అందరు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రయాణం  పొద్దునే అట, ఆలశ్యం అయిపోతోందని విసుక్కుంటున్నారు”  అంటూ  ఈయన కొంచెం గదమాయించి నట్లుగా అన్నాడు. దానికి సమాధానం గా  పాపం ఆవిడ  చిన్నపోయిన మొహంతో  ఎంతో నొచ్చుకుంటూ ‘ఏమీ అనుకోకండి చలపతి గారు,    మా మావగారికి ఒళ్ళు బాలేదు  బాబు,  అందుకే  కొంచెము   ఆలస్యమైంది’   అని అంటోంది .

“సరే  సరే  పదండి  వాళ్ళు ఆ పక్కన మనకోసం ఎదురు చూస్తున్నారు అంటూ  ఆపక్కగ  వున్న  పావంచల వైపు గబ గబా తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఓ ఇద్దరు ఆడవాళ్ళూ, కొంతమంది మగవాళ్లు వున్నారు. వాళ్ళు ఆవిడని గట్టుమీద  కూర్చోమన్నారు ఒకావిడ ముఖానికి పసుపు రాసింది ఇంకో ఆవిడ బొట్టుపెట్టింది మూసివున్న చేటలని  ఆవిడకి అందించింది. అప్పుడు అక్కడే వున్న  వేరే బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలూ చదివి “మీ అమ్మగారిని తలచుకొని నమస్కారం చెయ్యండి”  అని వాళ్ళ ఇద్దరకి చెప్పాడు.

ఆవిడతో చలపతిగారు “సీతమ్మ! ఇక్కడ నీ పని అయింది. ఇహ! ఆ శంకరం గారి భార్యది వుంది అందుకే ఎక్కడకి  వెళ్ళిపోక ఇక్కడే వుండు.! వాళ్ళు వచ్చాక ఆ  నిన్ను సూరిపంతులు పిలుస్తాడు”  అని చెప్పి  ఆయన వెళ్లిపోయాడు.

ఆవిడ  “అలాగే చలపతి గారు”‘అని తల ఊపి తన కూడా తెచ్చుకున్న సంచిలో  వాళ్ళు ఇచ్చిన వన్నీ సర్దుకుంటోంది. మధ్యలో  తలయెత్తి ఇందాక వాయనం ఇచ్చిన ఆడవాళ్ళని వో సారి చూసింది. అంతవరకూ మాములుగా కబుర్లు చెప్పుకుంటూ వున్న వాళ్ళు గబగబా అక్కడనుంచి నడచుకుంటూ కొంచెం పక్కకు వెళ్లారు. అందులోఒకావిడ అంటోంది “చూసావా ఆవిడ వాలకం, ఆ చూపులు వట్టి ద్రిష్టి కళ్ళు, అవి మంచివి కాదు బాబు నరుడి కళ్ళకి నాపరాళ్ళుఅయిన పగులుతాయి అంటారు అందుకే  ఇలాంటి వాళ్ళని శుభాలకి  ఎవరూ  పిలవరు” అంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు,

అంతవరకూ జరిగినదంతా చూస్తూనే వున్నాను. పాపం  ఆవిడ పచ్చటి మొహం  అవమాన భారంతో ఎర్రగా అయ్యి కన్నీళ్ళ పర్యంతం అయింది. ఇంతలో ఇందాకటి  బ్రాహ్మణుడు  అంత దూరమునుంచే “సీతమ్మ రావమ్మా! వాళ్ళు వచ్చేసారు”  అనిపిలుస్తున్నాడు. “ఆ వచ్చే! వచ్చే!”  అనుకుంటూ ఆవిడ  అక్కడనుంచి  ఆ పక్కగా వున్న గట్టు దగ్గర గా వెళ్ళింది. మళ్లి ఇందాక నేను చూసిన తంతు మొదలుపెట్టారు. అప్పటికే చాల పొద్దు పోవటం తో  నేను ఇంటి కి బయల్దేరాను.  కానీ  ఆరోజంతా అదే సంఘటన నా కళ్ళ ముందు కదలాడ సాగింది.

కాలేజీ లో పరీక్షల మూలం గ, అదీ గాక  ఎప్పటి నుంచో  వెళ్ళాలనుకొన్న   కాశి యాత్రకు కు కూడా వెళ్లి రావడంతో నా ఉదయ వ్యాహళ్లి కార్యక్రమం కొన్ని రోజులు గ  వెనుకబడింది. ఇదిగో మళ్ళి  ఈవాళ        ఆదివారం కావటంచేత కొంచెం తీరుబడిగా గోదారి ఒడ్డు కొచ్చి ఆ ప్రత్యూష వేళలో  ఆ నీటి తరగలమీద నుంచి వీచే చల్లని గాలి  మనసుని, శరీరాన్ని కూడా సేద  తీరుస్తూ వుంటే, ఎంతో హాయిగా, ప్రశాంతం గా వుంది. అలా ఏదో లోకాలలో విహరిస్తున్న నన్ను, “ఏం బాబు బావున్నారా?” అన్న చలపతి గారి పిలుపుతో తెప్పరిల్లి, ఆ! ఆ ‘! చెప్పండి చలపతి గారు ఎలా వున్నారు? ఏమిటి లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ ,పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తున్నాము.

ఇంతలో మళ్ళి ఆవిడ కనిపించింది.కాని మాములుగా కాదు. ఏదో జబ్బు పడి లేచినట్లుగా వుంది. అది చూసిన చలపతి గారు “ ఆ వచ్చేది సీతమ్మకదూ! అయ్యో అలా జబ్బు పడిన దానిలా వుందేమిటి? పాపం సంసారం కోసం మహా కష్ట పడుతుంది,ఏమిటో ఆ దేముడు కొంతమంది నుదుట కష్టాలే రాస్తాడు”  అంటూ కొంచెం ఆందోళనగా.ఎమ్మా! సీతమ్మా ఎలా వున్నారు? ఎవరో అమెరికానుంచి వచ్చిన వాళ్ళకి  వంటా అది చెయ్యడానికి  వాళ్ళతో పాటు వో 15 రోజులు కాశి వెళ్లావు అని చెప్పారు, ఆ విశ్వేశ్వరుని దర్శనం  అదీ బాగా అయిందా? అలా అయిపోయవేమిటమ్మ? ఏమి ఒంట్లో బావుండలేదా?” అంటూ ప్రశ్ర్నించారు.

“ఆ, ఆ ,అయింది చలపతి గారు! అబ్బే పెద్ద జబ్బు ఏమి చెయ్యలేదు,  కాని అక్కడ స్నానాలు అవి పడలేదండి” అంది ! “అవునమ్మా ! అక్కడి వాతావరణం వేరు”, అంటూ నావైపు తిరిగి “మీరుఎన్నయినా చెప్పండి రామారావు గారు మన రాజమండ్రి, వాతావరణమే నాకు నప్పుతుంది” అని అన్నాడు..

అంతవరకు ఏదో యథాలాపంగా చూస్తున్న నేను ఒక్కసారి సీతమ్మగారిని చూసి షాక్ తిన్నాను. కారణం ఆవిడ ముత్తైదువ గ కనిపించడమే . కొంచెసేపు అయిన తరువాత చలపతి గారు వెళ్ళిపోయారు.

అప్పుడు నేను వెంటనే అసహ్యంగా చూసి, ఆగ్రహం నిండిన గొంతుతో “ ఏమండీ సీతమ్మగారు! మీరు ఇలా ఎందరి ని మోసం చేస్తారు, అది తప్పు, పాపం అనిపించటం లేదా మీకు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ పరిస్థితి యెంత దారుణంగ వుంటుందో  గ్రహించారా?    భర్త చనిపోయినా మీరు  ఇలా పుణ్యస్త్రీ గా  కనిపిస్తూ  అవతలవాళ్ళ  ని  నమ్మిస్తూ  ఇలా చేయడం పాపం కాదా? మీరు కుటుంబం కోసం కష్టపడుతున్నారని తెలిసి  అయ్యోపాపం ఒంటరి గా సంసారభారం మోస్తున్నారని అనుకొన్నాను కాని. ఇలా అందర్నీ వంచన చేస్తున్నారని  తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని నేను  కాశి లో చూసాను, పాపం అది మీకు తెలియదేమో” వ్యంగంగా . అన్నాను

నామాటలకి ఆవిడ మొహం నెత్తురుచుక్కలేకుండా పాలిపోయింది. అసలే నీరసంగా ఉన్నదేమో ఒక్కసారిగా తూలి పడబోయి నెమ్మదిగా తమాయించుకుని “అవును బాబు మీరు చూసినది నిజమే ,కాని నేను ఇలా చెయ్యడానికి గల కారణం చెబుతాను. దయచేసి నన్ను అసహ్యహించు కోవద్దు, నేను చెప్పేది వినండి, అంటూ చెప్పడం మొదలు పెట్టింది. “ మాది చాలా పేద కుటుంబం. మేము గంపెడు సంతానం మా అమ్మ నాన్నలకి. ఏదో భుక్తి కోసం నాన్న చావు మంత్రాలూ చెప్పుతూ,అమ్మ వాళ్ళఇళ్ళల్లో వీళ్ళ ఇళ్ళల్లో  వంటలు వండుతూ  కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అందరిలోకంటే నేను పెద్దదాన్ని,చదువా ఏదో అక్షరంముక్క నేర్చుకొన్నాను. పెళ్లివయసు వచ్చింది. కాని  పెళ్లి ఎలా చేస్తారు ? ఏం పెట్టి చేయగలరు?వచ్చే సంపాదన తోఅందరకినాలుగు వేళ్ళు  నోట్లోకి వెళ్ళడ మే గగనమవుతోంది,ఆ సమయం లో మా మేనత్త, అదే మా నాన్నగారి చెల్లెలు వచ్చింది, వాళ్ళ అబ్బాయికి నన్ను అడగటానికి . వాళ్ళకి ఒకడే కొడుకు,అమాయకుడు, వయసు వచ్చినా మానసిక పరిపక్వత లేదు.  ఇకఇందులో నాఇష్టాల ప్రసక్తి అనేదే లేదు. ఇక్కడ నుంచి నేను వెళితే ఒక మనిషి బరువు తగ్గుతుంది. అది ఆలోచించి సరే అన్నాను. మావయ్య   ఏదో చావు మంత్రాలూ చెప్పుకొంటూ  రెండుపూటలా తిండికి లోటులేకుండా బతుకును ఈడుస్తున్నాడు. పెళ్లి జరిగింది అత్తయ్యతో పాటు నేను వంటలు చేస్తూ, ఇలా పుణ్యస్త్రీగా వాయినాలు అందుకొంటూ కాలం గడుపుతున్నాను. మా బావ చిన్న పిల్లాడితో సమానం. ఎప్పుడో ఒక స్వామీజీ “కాశి “గురించి చెప్పాడుట. అప్పటి నుంచి నేను కాశికి పోతానని ఒకటే గొడవ, నన్ను కూడా అడిగాడు  తీసుకొని వెళ్ళమని అలాగే వెళదాము అన్నాను. కాని ఇంతలోనే ఒక రోజున ఇంట్లోంచి చెప్పకుండా  ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడి కి వెళ్ళాడో తెలియదు. అన్ని చోట్ల వెతికించాను. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాను. కాని ఏమి లాభం లేకపోయింది. ఈ సంఘటనతో మావయ్య మంచాన పడ్డారు. అత్తయ్యకి షుగర్ కంప్లైంట్ వుంది దానితో కంటి చూపు బాగా దెబ్బతింది. అత్తయ్య ,మావయ్య కూడా రోజుకోసారి నీకు అన్యాయం చేసామని ఏడుస్తారు. ఈ  కష్ట సమయం లో నేనే వాళ్ళని వదిలి వెళ్ళలేకపోయాను. అప్పుడు అనుకొన్నాను. దేముడు నా నుదుటన ఇలాగ రాసాడు. అని సమాధానపరచుకొని  వాళ్ళని చూసుకొంటూ,ఇది గో ఈ చలపతి గారి ద్వార నాలుగు రాళ్ళూ తెచ్చుకొంటూ బతుకుని వెళ్లదీస్తున్నాను. ఒక పక్క మా బావ కోసం వెతుకుతూనే వున్నాను. నా కెందు కో అతను కాశి కి వెళ్లి వుంటాడు అని అనిపించేది. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ కూడా వెతికించమని చెప్పాను. ఇదంతా జరిగి పది ఏళ్ళు అయింది. అత్తా, మామలు పండుటాకులయ్యారు. ఏ క్షణమైన రాలిపోవచ్చు, ఇలాంటి సమయంలో నాకు కాశి నుంచి ఒక కబురు వచ్చింది.బావ దొరికాడని,కాని అతను ఆరోగ్యం బాగా దెబ్బతిని చివరి దశలో ఉన్నాడని. అప్పుడు నేను ఇక్కడ వీళ్ళకి ఎవరో అమెరికానుంచి వచ్చిన పెద్దవాళ్ళకి  వంటా అది చెయ్యడానికి అక్కడికి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్ళిన కొంచెం సేపటికే బావ చనిపోయాడని చెప్పారు. అక్కడ వాళ్ళనే  బతిమాలుకొని  అన్ని అక్కడే కానిచ్చుకొని వచ్చాను. అదే మీరు చూసి వుంటారు.

నాకు తెలుసు నేను చేస్తున్నది సమాజం దృష్టి లో చాలా పెద్దతప్పు అంటారని, కాని నాకున్న కారణాలు, చాలా వున్నాయి అందులో మొదటిది “ఆకలి”. మేము అవటానికి అగ్రవర్ణం వాళ్ళ మైన సమాజంలో మా స్టాయి వేరు.  మనిషి పోయినప్పుడు,లేదా ఆబ్దికాలు పెట్టానికి మాత్రమె మావాళ్ళు పనికివస్తారు, శుభకార్యాలకు వెళ్ళలేరు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, మేము వేరే వాళ్ళ చావును కోరుతున్నట్లు అనిపిస్తుంది.. ఇలాంటి స్థితిలో మాకు వేరే జీవనాధారం లేనప్పడు ఆ వచ్చే నాలుగు డబ్బులు కోసం నేను విధవనై మూల కూచుంటే,  ఈ ముసలి ప్రాణాలను ఎలా పోషించనూ? శరీరం లో ఊపిరి ఉన్నంతవరకు బతకాలి కదా? ఎలాగూ నాభర్త ఎక్కడి కో వెళ్లిపోయాడని అందరికి తెలుసు.  ఈ విషయం చెప్పి ఆ ముసలి ప్రాణాలు రెంటిని క్షోభ పెట్టదలచుకోలేదు. అందుకే నేను సమాజం కోసం కన్నా ఈ పెద్దవాళ్లని, ఆదుకోవడం ముఖ్యం అనుకున్నాను. ఆఫీస్ ఉద్యోగాలు చేసేందుకు నాకా చదువులేదు . నాకొచ్చినది ఒక్కటే, పది మందికి వంటలు చేసిపెట్టడం, ఇదిగో ఇలా పుణ్య వాయనాలు అందుకోవడము. బతకాడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా  అందుకే ఈ నిర్ణయం. తీసుకొన్నాను”  అంటూ చెప్పటం ముగించింది ఆమె.

ఆమె చెప్పినది విన్నాక  ఒక సంప్రదాయవాదిగా ఆమె నిర్ణయం హర్షించలేకపోయాను. అలాగ అని పరిష్కారమూ చూపలేకపోయాను.

పాపమో,పుణ్యమో సాంప్రదాయలని పాటించడమే  జీవితం అనుకొన్న  సీతమ్మ, జీవనభుక్తి కోసం  ఆ సాంప్రదాయానికి ఎదురీదెందుకు నిర్ణయించుకొంది.ఆమె తీసుకొన్న నిర్ణయం ధర్మమో, అధర్మమో కాలమే   చెప్పాలి? అనుకొంటూ భారమైన మనస్సు తో  ఇంటి ముఖం పట్టాను.

***

Mani Vadlamaniమణి వడ్లమాని

 

 

 

 

 

 

 

 

ఉప్పరి పిచ్చోడు

chinnakatha

“ఒరేయ్ .. ఉప్పరి పిచ్చోడొస్తున్నాడ్రోయ్..!” దివాకర్‌గాడు అరిచాడు.

ఒక్క దెబ్బన అందరం పారిపోయాం.

తాసిల్దారుగారి అమ్మాయి ‘విజయ’ మాత్రం దొరికిపోయింది.

మేం కొంచెం దూరం పరిగెత్తి వెనక్కి చూస్తే ఏముంది… విజయ నవ్వుతూ వొస్తోంది. దానికి ఏడేళ్లు. అప్పుడు

“నిన్నేం చెయ్యలేదుటే వాడూ?” ఆత్రంగా అడిగాడు గంగాధరం.

“పోండ్రా పిరికిగొడ్డుల్లారా! వాడు నా తల మీద చెయ్యిపెట్టి బే..బే… అని వెళ్లిపోయాడు.” ఎగతాళిగా నవ్వింది విజయ. వాడి పేరు ఎవరికీ తెలీదుగానీ.. ఉప్పరిగూడెంలో ఉంటాడు గనక ఉప్పరి పిచ్చోడనేవాళ్లం.

కూలీనాలీ చేస్తుండేవాడు.

పిల్లలు అల్లరి చేస్తోంటే.. “అదిగో! ఉప్పరి పిచ్చోడొస్తున్నాడు. అల్లరిచేస్తే  ఎత్తుకుపోతాడు.! ” అని భయపెట్టేవాళ్లు.

అందుకే మేము భయపడి పారిపోయింది.

వెన్నెల రాత్రుల్లో నేనూ, రంగడూ, శేషగిరీ, గంగాధరం, శేషగిరి తమ్ముడు కృష్ణమూర్తీ, నాగమణీ, విజయ, అమ్మాజీ అందరం షికార్లు కొట్టేవాళ్లం.

పిండారబోసినట్టుండేది వెన్నెల. మామిడి చెట్ల మీదుగా వీచే గాలి మత్తుగా వుండేది.

అప్పుడప్పుడూ ‘చిట్టిబాబు’గారి తోటలో ‘వేట’కి పోయేవాళ్లం. వేటంటే జంతువుల్ని వేటాడ్డం కాదు. మామిడికాయలు ‘తోటమాలి’ కళ్ళు గప్పి దొంగిలించడానికి.

జేబుల్లో ఉప్పూ, కారం కలిపిన పొట్లాలు రెడీగా ఉండేవి. పాత బ్లేళ్లు కూడా.

‘సరుకు’ దొరకంగానే మామిడికాయని బ్లేడుతో ముక్కలుగా కోసి, ఉప్పూ కారం అద్ది ఆరగించడం ఆ వెన్నెల రాత్రుల్లో అద్భుతంగా ఉండేది. ఆ ఉప్పూ కారం కలిపిన మావిడి ముక్కల్ని ‘కైమా’ అనేవాళ్లం.

ఓసారి కాయలు కోసేసి ‘జోగులు’గారి ‘సా మిల్లు’ ముందున్న రంపంపొట్టు గుట్టలమీద కూర్చుని ‘కైమా’ లాగిస్తుంటే ఉప్పరి పిచ్చోడు వచ్చి నిశ్శబ్దంగా వచ్చి ‘బే..బే’ అని అరిచాడు. పారిపోబోయాం కాని విజయ, “ఆగండ్రా” అని ఆ పిచ్చోడికి నాలుకు మావిడిముక్కలు ఇచ్చింది.

రెండుచేతులూ దోసిలి పట్టి ‘ప్రసాదం’ తీసుకున్నంత భక్తిగా ఆ ముక్కల్ని అందుకున్నాడు.

వెండి వెన్నెల్లో నల్లని ఉప్పరి పిచ్చోడు విచిత్రంగా కనిపించాడు.

“నీ పేరేంటబ్బాయ్?” ఆరిందాలా అడిగింది అమ్మాజీ.

“బే..బే” అన్నాడు ఉప్పరి పిచ్చోడు.

“వాడు మూగవాడు. మాటల్రావు!”అన్నాడు శేషగిరి.

మనిషి ఆరడుగుల ఎత్తు. ఒక్క తువ్వాలు నడుం చుట్టూ కట్టుకున్నాడు. అంతే. మాకు పదేళ్ళుండేటప్పుడు వాడికి పాతికేళ్ళు ఉండేవేమో.

వాడంటే భయం పోయింది గనక మేమందరం కబుర్లు చెప్పుకుంటూ, రంపంపొట్టు గుట్ట మీద ఆటలాడుతూ చాలా సేపు గడిపాం. వాడూ కూర్చుని మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడని మాత్రం తెలిసింది. ఎందుకంటే మేం నవ్వుతున్నప్పుడల్లా వాడూ నవ్వాడు.

అప్పట్నించీ, మేం ఎక్కడ కనిపించినా ‘బే..బే’ అని నవ్వేవాడు.

దేవుడు వాడ్ని మూగవాడ్ని చేశాడు గానీ, వాడికెన్ని విద్యలో తెలుసా?

తాటి చెట్లెక్కి ముంజలు కోసేవాడు. కొడవలితో కాయని చెక్కి ‘నీళ్లు’పోకుండా ముంజలు ఆ కొడవలి అంచుతో తియ్యడం వాడి ప్రత్యేకత.

ఎండబెట్టిన కొబ్బరి పీచుతో ‘తాళ్లు’ నేసేవాడు. నాగిరెడ్డి గూడెం ఫారెస్టుకు పోయి ‘కంప’నరుక్కొచ్చేవాడు.

బ్రహ్మాండంగా ఆ కంపతో ‘దళ్ళు’ కట్టేవాడు.

గోడలు ‘మెత్తి’ నున్నగా పేడ పూసి.. ఎండాక రంగులు దిద్దేవాడు. ఇహ పాత పాకల కప్పు ఊడదీసి కొత్త తాటాకు కప్పడంలో వాడు ఎక్స్‌పర్టు.

‘రాజుగారి’ హోటల్లో పప్పు రుబ్బేవాడు. మేవందరం ‘తమ్మిలేరు’ పిక్నిక్ కి పోతే మాతో కూడా వచ్చి, తిరిగొచ్చేటప్పుడు మేం కోసిన ‘వాక్కాయలూ, అడివి కరేపాకు’ గోతాంలో నింపి ఇళ్లదాకా మోసుకొచ్చేవాడు.

వర్షాకాలం ‘యోగి లింగేశ్వర స్వామి’ గుడి పక్కనున్న చెరువు నిండి, నీళ్ళు ‘కళింగ’  దాటి రోడ్డు మీద ఇంతెత్తుకు ప్రవహిస్తుంటే జాగ్రతగా మమ్మల్ని ‘రోడ్డు’ దాటించేవాడు.

ఓ రోజు ‘దివాయ్‌’ గాడు మావిడి చెట్టెక్కి దిగటానికి భయపడితే వాడే చెట్టెక్కి ‘దివాయ్’ని భుజాలకెత్తుకుని కిందకి దింపాడు.

ఓ సారి నిప్పంటుకుని ‘ఇళ్లు’ తగలబడుతుంటే కడివెడు నీళ్లు మీద పోసుకుని మంటల్లోకి దూకి చాలా’మంది’నీ, ‘సొత్తు’నీ బయటికి చేర్చాడు.

ఏ యింటికెళ్లినా వాడికి తింటానికి ఏదో ఒకటి పెట్టేవాళ్లు. వాడూ తిన్నదానికి ప్రతిఫలంగా ఏదో ఒక పని చేసేవాడు. గడ్డి చెక్కడమో, అరుగులు మెత్తడమో, వాకిలంతా ఊడ్చి శుభ్రం చెయ్యడమో, ఏదో ఒకటి..

నానాదేశాలూ తిరిగి, ఇరవై ఒకటో ఏట మా చింతలపూడి వెళ్లి ఫ్రెండ్స్‌తో కబుర్లాడుకుంటూ ‘ఉప్పరి పిచ్చోడి’ గురించి వాకబు చేస్తే వాళ్లన్నారు ‘మర్దిమత్తెన నాగేశ్వర్రావుని పాము కరిస్తే వాడ్ని ఆస్పత్రికి తీసుకుపోయి తిరిగొస్తుండగా ఎద్దు పొడిచి చచ్చిపోయాడు” అని..

“అదేంట్రా?” అని నేను నివ్వెరపోతుంటే…

“పాపం. వాడు మూగే కాదు చెవుడు కూడా ఉంది. అందుకే వెనకాల్నించి జనాలు అరుస్తున్నా పక్కకి తప్పుకోలేకపోయాడు!” అన్నాడు కొనకళ్ల కృష్ణమూర్తి.

“మరి మనం చెప్పేవి వాడికి అర్ధమయ్యేవిగా?” అడిగా.

“పెదాల కదలికని బట్టి అర్ధం చేసుకునేవాడు. అంతేగానీ వాడికి పుట్టుచెముడు !”

“ఒరే..! సమయానికి నన్ను ఆస్పత్రికి చేర్చి నన్ను బతికించాడు కాని వాడు పోయాడ్రా! ఉప్పరాళ్ళే పాపం దహనం చేశారు. అస్పత్రి దగ్గర మా నాన్న నన్ను తీసుకొచ్చినందుకు డబ్బివ్వబోతే ‘బే…బే’ అంటూ వారించాడు. ఒక్క పైసా తీసుకోలా!.” కథ మధ్యలో వచ్చిన మద్ది మంచ్తెనోడు నాతో అన్నాడు. వాడి కళ్లల్లో నీళ్లు.

“వాడు మనందర్నీ స్నేహితులమనుకున్నాడ్రా.  అందుకే మనకి ఎన్ని పనులు చేసిపెట్టినా ఒక్క పైసా పుచ్చుకునేవాడు కాదు…!” విచారంగా అన్నాడు మా హిందీ  మాస్టారి కొడుకు రంగారావు.

అవును స్నేహానికి ‘ఇవ్వటమే’ తెలుసు. చివరికి ప్రాణాన్నైనా..

 

***

 

ఇది జరిగిన చాలా ఏళ్లకి ‘ప్రాణస్నేహితులు’ సినిమాలో ‘స్నేహానికన్న మిన్న’ పాట వ్రాసినప్పుడు గుర్తొచ్చింది మా అప్పరి పిచ్చోడే!

ఇప్పటికీ వూరు వెళితే ‘బే.. బే’ అని అరిచే వాడి గొంతు లీలగా మనసులో మెదుల్తుంది.

వెన్నెల రాత్రుల్లో ఆరుబయట పక్కలేసుకుని ఆకాశంలోని కోటానుకోట్ల నక్షత్రాలు చూస్తుంటే అనిపిస్తుంది.. వాడూ ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో వుంటాడు.

bhuvanachandra (5)–భువన చంద్ర

మరుగుజ్జు

 

Sujala_Ganti  

(రచయిత్రిగా  నా ప్రస్థాన౦  మూడేళ్ళు. నా మొదటి  కథ 2011 లో ప్రచురి౦చబడి౦ది. 2012 లో   “ అమ్మ బ౦గారు కల”  నవల అనిల్  అవార్డ్  గెలుచుకు౦ది . సప్తపది  నవల  గత ఆగస్ట్  లో  ఆ౦ధ్రభూమి  లోప్రచురి౦చబడి౦ది. —-సుజలమూర్తి గ౦టి) 

  ***

సాయ౦కాల౦  పార్టీకి  వెళదామని  తయారవుతున్నాను. నాభర్త   విక్ర౦  ఆఫీసులో  పార్టీ  ఉ౦ది. అద్ద౦లో  నన్ను  నేను చూసుకోవడ౦  నా కిష్టమైన  పనుల్లో ఒకటి. దానికి  కారణ౦ నేను చాలా  అ౦ద౦గా ఉ౦డడమే.

చక్కని  పసిమి చాయ. అ౦దమైన  అవయవసౌష్టవ౦, గులాబీలు  పూసినట్లు  ఉ౦డే  చెక్కిళ్ళు, కోటేరిన  ముక్కు, ప్రబ౦ధ కవులు  వర్ణి౦చే౦త  అ౦ద౦గా  ఉ౦టాను. నేను అనుకోవడమే కాదు, అ౦దరూ  అనడ౦ నాకు తెలుసు.అ౦దుకే  నన్ను  అద్ద౦  లో  చూసుకున్నప్పుడు  నాకు  చాలా  గర్వ౦  గా ఉ౦టు౦ది.

షిఫాన్ వర్క్ చీర దానికి  మాచ్  అయ్యే డిజైనర్  బ్లౌజ్  వేసుకున్నాను. లైట్ గా కా౦పాక్ట్  రాసి, విల్లులా వ౦గిన అ౦దమైన పెదవులకు లిప్స్టిక్ రాసి  మరోసారి  అద్ద౦ లో  చూసుకున్నాను. నా  గదిలో౦చి  బైటికి  వచ్చిన  నన్ను  నా  కూతురు గబగబా వచ్చి  నా  కాళ్ళ కు చుట్టుకోబోయి౦ది. చీర  నలిగి పోతు౦దన్న  క౦గారులో దాన్ని  ఆపబోయాను. నా చెయ్యి  తగిలి పడిపోయి౦ది.

గట్టిగా  “లతా”  అ౦టూ కేక పెట్టాను.  మా  పని పిల్ల  భయపడుతూ  వచ్చి౦ది. “ఏ౦  చేస్తున్నావు? నేను  బైటికి వెడుతున్నాను  కదా! పాపను  చూసుకోవాలి  కదా! నువ్వు  ఉన్నదే అ౦దుకు. పాప  నా  బట్టలు పాడు చెయ్యబోయి౦ది” అ౦టూ, మా   పాప వైపు తిరిగి, “ బుజ్జి  నేను  పార్టీకి  వెడుతున్నాను. అలా కౌగలి౦చుకు౦టే  నా  బట్టలు  పాడయిపోతాయి.” అన్నాను.

ఇ౦తలో  విక్ర౦  వచ్చినట్లుగా  కార్ చప్పుడు  అయ్యి౦ది. లతను  కాఫీ తెమ్మన్నాను.

“ హాయ్  డార్లి౦గ్ సూపర్. ఎప్పటిలాగే  చాలా  అ౦ద౦గా  ఉన్నావు.ఒక్క  పది నిముషాల్లో  రెడీ  అయి వస్తాను” అ౦టూ  లోపలికి వెళ్ళాడు. ఈ హడావుడిలో  బిక్క మొహ౦  తో  నా కూతురు  లతను  అనుసరి౦చి౦ది. నా ప్రవర్తనతో  నేను  ఎ౦త  తప్పుచేస్తున్నానో  నేను  గ్రహి౦చలేదు.

పార్టీ స్థలానికి  చేరుకున్నాము. అది  ఒక  ఫైవ్ స్టార్  హోటల్. విక్ర౦  ఆఫీస్  పార్టీలన్నీ ఎక్కువగా  అ౦దులో  జరుగుతాయి. మే౦ ఇద్దర౦  రాగానే  అప్పటికే  వచ్చిఉన్నవాళ్ళు  వెనుతిరిగి  చూసారు. నాకు  కావాల్సిన  మెరుపు వాళ్ళ కళ్ళల్లో కనిపి౦చి౦ది. కి౦చిత్ గర్వ౦.అ౦దరి  చూపుల్లో  ఉన్న మెచ్చుకోలు, ఈర్ష్య అన్నీ  ఎన్ జాయ్  చేస్తూ  పార్టీ కూడా  ఎన్ జాయ్ చేసాను. విక్ర౦ కూడా  నాలా౦టి  అ౦దమైన  భార్య తన  సొ౦త  అయిన౦దుకు చాలా గర్వ౦ ఫీల్  అవుతాడు.

మేము  పార్టీ  ను౦చి  వచ్చేసరికి మా  పాప నిద్రపోయి౦ది.  దాని బెడ్ రూమ్ లోకి వెళ్ళి దాన్ని  చూసి  నుదుటి మీద ముద్దుపెట్టుకుని నా  గదిలోకి  వచ్చి  బట్టలు  మార్చుకుని  పడుక్కున్నాను.

నేను  చాలా  తెలివైన  దాన్నని,  నా  కన్నీ వచ్చునన్న  అహ౦కార౦  నా నరనర౦  లో  జీర్ణి౦చుకు పోయి౦ది.  నా  లా౦టి  వాళ్ళు  చాలామ౦ది  కాకపోయినా  కొ౦తమ౦ది  అయినా  ఉ౦టారు. చదువుకున్నాను నాకు  రాని  విద్య  అ౦టూ  లేదు.  నా  భర్త  కూడా  నన్ను  పొగడ్డ౦  కొ౦త కారణ౦ కావచ్చు.  నా  చుట్టుపక్కల  ఆడవాళ్ళలో  నేనొక  విశిష్ట వ్యక్తిగా  ముద్రి౦పబడ్డాను.  అ౦దుకే  నేను ఎవరితో  మాట్లాడినా  నా గొప్పతనాన్ని  అడుగడుగునా  ప్రదర్శి౦చడానికి  తాపత్రయపడతాను.

నా  కూతురికి  పై౦టి౦గ్ అ౦టే  చాలా ఇష్ట౦.  కానీ  ర౦గుల  తో  అయ్యే క౦గాళ౦  నాకు  ఇష్ట౦  ఉ౦డదు. శుభ్రపరచడ౦ కూడా  శ్రమతో  కూడిన పని. అ౦దుకే  నాకు  నా  కూతుర౦టే  ఎ౦త  ఇష్టమైనా  నేను  దాన్ని ఆ  విషయ౦లో  మాత్ర౦  ఎ౦కరేజ్ చెయ్యను.

ఈ  విషయ౦లో  నా  భర్తకు  నాకు  చాలాసార్లు ఆర్గ్యుమె౦ట్స్  జరిగాయి. కానీ  చివరకు  నేనే గెలిచాను. ఆ విధ౦గా మా  అమ్మాయి  పై౦టి౦గ్  ముచ్చట  తీరలేదు.

ఒక  రోజు  నా  కూతురు  చాలా  ఆన౦ద౦గా  వచ్చి౦ది. “ అమ్మా  ఇవ్వాళ  నేను కరణ్, ప్రీతిల వాళ్ళ  ఇ౦టికి  వెళ్ళి ఆడుకున్నాను.” అ౦ది

కరణ్, ప్రీతి  మా  అపార్ట్ మె౦ట్స్  లోనే ఉ౦టున్నారు. వాళ్ళ తో  నాకు  పరిచయ౦ లేదు. అలా౦టిది  నా కూతురు వాళ్ళతో సడన్ గా  పరిచయ౦  పె౦చుకోవడ౦  నా కె౦దుకో  నచ్చలేదు.

“ సరేలే  ఆడుకున్నావు గా ఇ౦కెప్పుడు  వెళ్ళినా  నాకు చెప్పకు౦డా  వెళ్ళకు” అన్నాను.

నా  మొహ౦లోని  సీరియెస్ నెస్ చూసి  నా కూతురు మాట్లాడకు౦డా  తన  రూమ్ లోకి  వెళ్ళిపోయి౦ది. నేను కూడా వాళ్ళ గురి౦చి పెద్దగా  ఆలోచి౦చలేదు.

కరణ్, ప్రీతి  అప్పుడప్పుడు  బయిటికి  వచ్చినప్పుడు కనబడతారు. కడిగిన  ముత్యాల్లా  ఉన్న పిల్లలు నవ్వుతూ కనబడ్డ పెద్దవాళ్ళకు  నమస్కార౦  చెప్తారు. వాళ్ళను  చూసి  ముచ్చటపడని  వాళ్ళు లేరు. కానీ  నేను ఎ౦దుకు  హర్షి౦చలేకపోతున్నాను?

నేను  వద్దన్నా  మళ్ళీ  వాళ్ళి౦టికి  ఆడుకు౦దుకు  వెళ్ళి౦ది. తిరిగి వచ్చిన నా పాప లో  పట్టలేని  ఆన౦ద౦.

“అమ్మా  ఇవ్వాళ  నేనే౦ చేసానో   నీకు తెలుసా? ప్రీతీ  వాళ్ళి౦ట్లో  చాలా బాగా  ఆడుకున్నాను.వాళ్ళమ్మగారు కేక్ చేస్తు౦టే  మే౦ హెల్ప్ చేసా౦.  ఆ౦టీ  మాకు  ఫి౦గర్  పై౦టి౦గ్  నేర్పి౦చారు. ఎ౦త  బాగు౦దో  తెలుసా!నాకు  ఏ ఏ ర౦గులు కలిపితే కొత్త ర౦గులు  వస్తాయో  ఆ౦టీ నేర్పి౦చారు. వాళ్ళిల్లు  చాలా  నీట్ గా  ఉ౦టు౦ది. ప్రీతీ, కరణ్  వాళ్ళు  ఏ వస్తువు  వాడినా మళ్ళీ  ఆ  స్థాన౦లో  పెట్టేయాలి.  ఇల్లు నీట్ గా  ఉ౦డకపోతే  ఆ౦టీకి  నచ్చదు.” అ౦టూ పూర్తిచేసి౦ది.

సరే  దాని  ఆన౦దాన్ని  ఎ౦దుకు  పోగొట్టాలని, నాకు  ఇష్ట౦ లేకపోయినా  ఏ౦  మాట్లాడలేదు.  లేడీస్  క్లబ్  వార్షికోత్సవ౦  పనుల్లో  బిజీగా ఉన్నాను. అ౦దుకే  సమీర  కదలికలు  నేను  పట్టి౦చుకోలేదు. రోజూ  నా  కూతురిని౦చి  ఆ౦టీ  ఇలా  చేస్తు౦ది  అలా  చేస్తు౦ది  అన్న  ప్రశ౦సలు వినాల్సి  వస్తో౦ది.                                                              

నిజ౦  చెప్పాల౦టే  నాకు నన్ను  తప్ప  ఎవర్ని  పొగిడినా  భరి౦చలేను. నాలో మెల్లగా ఆవిడ  పట్ల ఈర్ష్య  మొదలయ్యి౦ది. నేనె౦దుకు  ఈర్ష్య కు  లోనవుతున్నానో  నాకే  అర్థ౦  కాలేదు.  నా  కూతురికి  అ౦త నచ్చిన  ఆమెను,  ఆమె ఇ౦టిని  చూడాలని  నిశ్చయి౦చుకున్నాను.                                                                                                      

ఒక  రోజు  వాళ్ళ  అపార్ట్ మె౦ట్  కు  వెళ్ళాను. బెల్  కొట్టగానే  అయిదునిమిషాలకు  తలుపు  తెరుచుకు౦ది. తలుపు  తెరిచిన  స్త్రీమూర్తిని  చూసి  ఆ ఇ౦టి ఇల్లాలు  ఆవిడే  అయ్యు౦టు౦దని  అనుకుని  “నమస్కారమ౦డి నేను  సమీర వాళ్ళమ్మను  మీ  గురి౦చి  మా  అమ్మాయి  తెగపొగుడుతూ  ఉ౦టు౦ది. అ౦దుకని  మిమ్మల్ని కలవాలని వచ్చాను.” అన్నాను.

“అరె  మీరా  లోపలికి  ర౦డి. సమీర  చాలా మ౦చి పిల్ల. బ౦గారు తల్లి. అన్నీ  నేర్చుకోవాలన్న కుతూహల౦  తన లో  చాలా ఉ౦ది.  కూర్చో౦డి”  అ౦టూ  సోఫా  చూపి౦చి౦ది.

సోఫాలో  కూర్చుని  ఇల్ల౦తా  పరిశీలి౦చాను. నిజ౦గానే  ఇల్లు  తీర్చిదిద్దినట్లుగా  ఉ౦ది. నేను  ఇల్లు  పరిశీలి౦చే లోపల  ఆవిడ లోపలికి  వెళ్ళి  ట్రేలో  కాఫీ, బిస్కెట్స్ తీసుకు వచ్చి౦ది. టీపాయ్  మీద పెట్టి “తీసుకో౦డి”  అ౦ది.

ఇ౦త  తొ౦దరగా ఇవన్నీ చేసిన  ఆమె  చురుకుతనాన్ని  మెచ్చుకోకు౦డా  ఉ౦డలేక పోయాను.

“ మీరు  ఇ౦ట్లో  కూడా నల్లకళ్ళద్దాలు  పెట్టుకు౦టారా?” అన్నాను.

నవ్వుతూ “నేను  కళ్ళద్దాలు  పెట్టుకోకపోతే  నన్ను  మీరు  చూడలేరు” అ౦ది.

“అ౦టే  మీరు” అ౦టూ  అర్థోక్తిలో  ఆగిపోయాను.

“ అవును  నాకు  కళ్ళు  లేవు”.

నమ్మశక్య౦  కాలేదు. నేను  వచ్చినప్పట్ని౦చీ  ఆవిడ  చర్యల్లో  ఎక్కడా  ఆవిడకు  కళ్ళు  కనబడవన్న  అనుమాన౦  రాలేదు. ఆమె  చేసే  ప్రతీ పనీ  సుశిక్షితుడైన  సైనికుడి చర్య లా ఉ౦ది.

నాకు  నోట మాట  రాలేదు. ఇవన్నీ  ఎలా  సాధ్య౦? బహుశా  ఆమెకున్న ఆ  ఒక్క  లోపాన్ని మిగిలిన గుణాలు  డామినేట్ చేసి  ఉ౦టాయి.

“ మీ రొక్కరూ  అన్ని  పనులూ  ఇ౦త  బాగా ఎలా  చేస్తున్నారు?”

“ అలవాటు  అయిన  ఇల్లే  కదా! కొత్త  జాగాలో అయితే  ఇబ్బ౦ది  అవుతు౦ది. మా  ఇ౦ట్లో ప్రతీ వస్తువు కు ఒక  నిర్ణీత  స్థల౦  ఉ౦ది. ఏ వస్తువు  ఎక్కడ  ఉ౦దో  నా  భర్త  కానీ  నా  పిల్లలు కానీ నాకు  చెప్తారు. దాన్ని బట్టి  నేను ఆ  వస్తువును  అవసరమయినప్పుడు  వాడుకు౦టాను. కొ౦చె౦  ప్రాక్టీస్ చేసి  టీ  పెట్టడ౦, వ౦ట కూడా  అలవాటు  అయిపోయి౦ది. పెద్దపనులు  తప్ప  చిన్నపనులు  అన్నీ  నేను  మానేజ్  చెయ్యగలను” అ౦ది.

“ మీరు  మొదటిను౦చీ  ఇలాగే  ఉన్నారా?” పుట్టుగుడ్డివారా  అని  అడగడానికి  సభ్యత అడ్డు  వచ్చి౦ది.

“  అవున౦డీ.  కానీ  నా  ఆ లోప౦ తెలియకు౦డా  మా  అమ్మ  నన్ను  పె౦చి౦ది. నేను  ఎప్పుడూ నాకు  చూపులేదని  బాధపడ కూడదని,  చిన్నప్పట్ని౦చీ  నేను ఎవరి  మీదా  ఆధారపడకు౦డా  ఉ౦డాలని  ఆమె చాలా తాపత్రయపడి౦ది నాలో ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని  పె౦చి౦ది.                                                                                                   జీవిత౦ లో  అ౦దరికీ  అన్నీ  దొరకవు  మనకు  దొరికిన  వాటితోనే  స౦తృప్తి  పడాలని  నేర్పి౦చి౦ది. నా  ప౦చే౦ద్రియాల్లో  ఒక  ఇ౦ద్రియ౦  పనిచెయ్యక  పోయినా  ఆ  ఒకదాని  శక్తి  కూడా దేముడు  మిగిలిన  వాటికి  ఇచ్చాడు నా  సిక్స్త్ సెన్స్ నాకు  చాలా  మటుకు  దోహద పడుతూ  ఉ౦టు౦ది” అ౦ది.

“ ఇ౦కా  మీ  గురి౦చి చెప్ప౦డి” అన్నాను.

“ చెప్పడానికి  ఏము౦ది?  నాన్నగారు  అమ్మకు మేనమామ.  చాలా  కాల౦గా దగ్గర  స౦బ౦ధాలు  చేసుకోబట్టి  నేను,  నా  తరువాత మా  తమ్ముడు  ఈ లోప౦  తో  పుట్టాము. డాక్టర్  తరువాత  పిల్లలు  కూడా  ఈ  లోప౦ తో  పుట్టే  అవకాశ౦  ఉ౦దని  చెప్పడ౦ తో  నాన్నగారు  తమ్ముడి  తరువాత ఇ౦కో  ప్రాణి  ప్రప౦చ౦లోకి  రాకు౦డా  జాగ్రత్తపడ్డారు.

ఇద్దర౦  చిన్నప్పట్ని౦చీ  బ్లై౦డ్ స్కూల్లో  చదివి డిగ్రీలు  స౦పాది౦చుకున్నాము. తమ్ముడు  కాలేజ్ లో  లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. మా  వారు  దూరపుబ౦ధువు.ఆయన  మనస్పూర్తిగా  ఇష్టపడే నన్ను  చేసుకున్నారు. లోక౦లో  మ౦చితన౦  ఇ౦కా  మిగిలి ఉ౦దన్న  దానికి  నిదర్శన౦  మా వారు” అ౦ది.

నా  కళ్ళు  చెమర్చాయి.  ఆమె  ఆత్మ  విశ్వాసానికి జోహార్లు.

“  నా పేరు  అరుణ. మీ  పేరు?”  అన్నాను.

“ నా  పేరు  అరు౦ధతి”  అ౦ది.

“ చాలా  చక్కని  పేరు”  నాకు  తెలియకు౦డానే నా  నోటివె౦ట  వచ్చి౦ది.

“ మీరు  పెయింటింగ్   నేర్పి౦చారని  మా  సమీర  చెప్పి౦ది. ర౦గులు  కూడా  ఏది  కలిపితే  ఏది వస్తు౦దో  కూడా మీరు  చెప్పారని  అ౦ది.  అదెలా  సాధ్యమయ్యి౦ది?”  అన్నాను.

“ అమ్మ  ఓపికగా అన్నీ  నేర్పి౦చి౦ది నేను కళ్ళతో  చూడలేకపోయినా  అనుభూతి  పొ౦దేటట్లుగా  అమ్మ  నేర్పి౦చి౦ది. మీ  సమీర  చాలా  తెలివైన  పిల్ల. నేను  చూడలేకపోయినా  నేను  చెప్పినట్లుగా  చేస్తూ  ఆమె  స౦తోష౦  లో  మాట్లాడుతున్న మాటలు నేను  గ్రహి౦చి ఆమెను  ప్రోత్సాహి౦చాను.తనకు  తెలియకు౦డానే  తను  వేసిన  చిత్ర౦  గురి౦చి  నాకు వివరణ  ఇచ్చేది. అది విన్న  నేను  ఆమె చిత్రాన్ని చూసినట్లుగా  మాట్లాడేదాన్ని. నేను  చేసిన  ఆ  పనికే  తను  నేను ఏదో  నేర్పానని నేను  చూసానని అనుకు౦టో౦ది. అ౦తకన్నా  నేను  చేసి౦ది  ఏమీ లేదు ” అ౦ది  అరు౦ధతి.

“ సరే   నేను  వెడతాను”  అ౦టూ  లేచాను.

“ అప్పుడప్పుడు  వస్తూ  ఉ౦డ౦డి”.

ఇ౦టికి  వచ్చినా  నా  ఆలోచనల  ని౦డా  ఆమే  ని౦డి  ఉ౦ది. నేను  ఎ౦తగానో  ప్రేమి౦చే  నా  కూతురు  నా కన్నా ఆమె  సా౦గత్యాన్ని  కోరుకు౦టో౦ది. ఇన్నాళ్ళూ  నేనేదో  గొప్పదాన్నని  మిడిసి  పడ్డ నాకు  ఆమె ప్రవర్తన, స౦స్కార౦  నాలో  ఏదో  అలజడిని  రేపి౦ది.

నాలో  ఏ౦  గొప్పతన౦  ఉ౦దని  ఇన్నాళ్ళూ  మిడిసి  పడ్డాను? చుట్టుపక్కల ఉన్న  మిగిలిన  వాళ్ళకన్నా ఒకటి  రె౦డు  విద్యలు  ఎక్కువ  వచ్చిన౦త  మాత్రాన  నేనేదో  అపురూప  వ్యక్తిగా గర్వపడ్డాను.

సమీర  వచ్చాక  అడిగాను “ అరు౦ధతి  ఆ౦టీ  నీకు  బొమ్మలు  వెయ్యడ౦  నేర్పి౦చి౦దన్నావు కదా! ఎలాగా? అన్నాను.

“ ర౦గులు  కలిపి  నా  చేతిని  ర౦గులో  ము౦చి  నా ఫి౦గర్స్తో  రకరకాల  బొమ్మలు గీసాను.ఆ౦టీ  ఏ ఏ ర౦గులు  వాడాలో  చెప్పేది.  ఆ౦టీ  చూసి  ఎ౦త  ఆన౦ది౦చేదో  తెలుసా  అమ్మా!  అ౦ది సమీర.

“సమీరా  ఆ౦టీ  కి  కళ్ళు  లేవు తెలుసా!”  అన్నాను.

సమీర  ఆశ్చర్యపోయి౦ది. “ అవునా  నాకు తెలియలేదు  అమ్మా.  నా  బొమ్మలు  తాను  చూసినట్లుగా ఎ౦త  బాగా మెచ్చుకు౦దో  ఆ౦టీ”  అ౦ది

“  అవును  ఆన౦ద౦లో నువ్వు  వేసిన  బొమ్మలు  ఎలా  వున్నాయో  నీ  నోటితో  చెప్పడ౦  విని నీకు ఆన౦ద౦ కల్గి౦చడానికి  అవన్నీ  తను  చూసినట్లుగా  మాట్లాడి౦ది” అన్నా.

“ మన౦  ఇలా  అనుకోవచ్చు కదా అమ్మా, ఆ౦టీ  తన  కళ్ళతో  కాకు౦డా  నా  కళ్ళతో  చూసి  ఉ౦డవచ్చు కదా!” అ౦ది.

“ అవునమ్మా  ఆ౦టీ  నిజ౦గా  నీ  కళ్ళనే  తన కళ్ళుగా  చేసుకుని  చేసి౦ది. తల్లిగా  నేను  చెయ్యలేని పనిని  ఆమె  చెయ్యగలిగి౦ది. నేనేదో  విశాలమ౦త  ఎత్తుకు  ఎదిగానని  ఏదో  గొప్పదాన్నని  మిడిసి  పడ్డాను. ఆమెను  చూసాక  నేను  ఎ౦త  మరుగుజ్జునో  అర్థ౦  అయ్యి౦ది”  అన్నాను.

నేనన్న  మాటలకు  అర్థ౦  తెలియని  నా  పాప  విస్మయ౦గా  నా  కళ్ళల్లోకి  చూసి౦ది.

బాహ్య  చక్షువులకన్నా  అ౦తర్  చక్షువులకున్న  ప్రాధాన్యత  నాకు  ఆ రోజు  తెలిసి౦ది. అ౦దుకే నాలో ఉన్న మరుగుజ్జుతనాన్ని  గుర్తి౦చడానికి  నాకు  సిగ్గు వెయ్యలేదు.

–సుజలా మూర్తి గంటి

 

 

ఉరిమిన మబ్బు

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

ఫోను మాట్లాడిన నాకు ఎగిరి గంతేయాలని అనిపించింది. రోడ్డు మీద దొరికిన టికెటుకి లాటరీ తగిలినంత ఆనందం కలిగింది. అగ్ని కర్తీరిలో చల్లని వాన కురిసినట్లు తోచింది.

ఒక ఊదటున లేచి ‘సేల్స  బ్యాగు ‘చంకకి తగిలించుకున్నాను. షూ లెసు ముడి వేసుకుంటూ వుంటే ,మా ఆవిడ

కేకేసింది. ‘’ఏమండోయ్   ,టిఫిను రెడి. తిని వెళ్ళండి.మళ్ళీ ఎప్పుడు ఇల్లు చేరుతారో ,ఏమూ —–‘’

వాచీ చూశాను. టైం పావు తక్కువ తొమ్మిది !

కచ్చితంగా తొమ్మిది గంటలకు రమ్మన్నాడు అతడు. తొమ్మిది దాటుతే అతడు  ఉండడట !

గేటు వైపు నడిచాను. చాలా ఉక్కగా వుంది. ఆకాశం నిండా నల్లని మబ్బు. చినుకు రాల్చని ఆ నల్లని మబ్బు ఆర్డర్లు రాల్చని కస్టమర్లను గుర్తు చేసాయి.

‘’ఏమండోయ్  —‘’ మళ్ళీ కేకేసింది మా ఆవిడ.

పట్టించుకోలేదు. మగడికి తిండి పెట్టె విషయంలో ఆడది చూపే ప్రేమ మరే విషయంలోనూ చూపదు కదా !

బైకు ఎక్కాను. టైముకి వెళ్ళాలి. వెళ్తే ఒక ఆర్డరు రావచ్చు.

ఆర్డరే కదా ,మాలాంటి ‘సేల్స్ మేను’ల ఉద్యోగానికి ప్రాణవాయువు !

మా మేనేజర్ కూడా అదే మాట అన్నాడు. ‘’ఎలాగోలా ఆర్డర్లు సంపాదించాలయ్యా.రెండు నెలలుగా ఒక ఆర్డరైనా తేలేదు నువ్వు’’

నిజమే !తల దించుకున్నాను.

‘’ఈ నెలలోనైనా ఆర్డరు తేలేకపోతే —–‘’

ఏమవుతుందో నాకు తెలుసు.’సేల్స్  బ్యాగు ‘ తిరిగి ఇచ్చేయాలిసిందే.

‘’ఒక పని చేయి ‘’మేనేజర్ సానుభూతితో అన్నాడు. ‘’నేను ఒక వెయ్యి  కరపత్రాలు అచ్చు వేయిస్తాను. అవి పంచు.గోడల మీద ,స్తంబాల మీద అంటించు. మన కంపెనీ గురించి జనానికి తెలియాలి కదా ‘’

అలాగే చేసాను. ఊరిలోని ప్రహారి గోడలు నిండా మా కరపత్రాలే !

మాది అంతర్జాలం అద్దికిచ్చే కంపెని . వెంటనే ఫలితం కనబడింది. ఫోను వచ్చింది.

నవ్వుతూ ఆత్మీయంగా స్వాగతం పలికాడు అతడు. ఇంటిలోపలకి తీసుకొని వెళ్ళి కూర్చోమని చెప్పాడు

అరవై సంవత్సరాలు దాటిన మనిషి అతడు. వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతని మాట తీరు చూస్తువుంటే ఆర్డరు ఇస్తారనే అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చాను.

‘’సరే ,వెంటనే కనెక్షన్ ఇచ్చేస్తావు. ‘’అతడు అన్నాడు ‘’మరి ఏదైనా సమస్య వస్తే —-‘’

‘’నేను ఈ ఊరిలోనే ఉంటాను కదండీ సార్.ఒక ఫోను కొట్టండి.చాలు వెంటనే స్పందిస్తాను ‘’

‘’కచ్చితంగా ——‘’

‘’కచ్చితంగా స్పందిస్తాను సార్ ‘’

‘’అయితే సరే ఫోను చేస్తాను ,ఈ రోజే ‘’

నాతో పాటు గేటు దాకా వచ్చాడు అతడు.

‘’మా ప్రహారీగోడ మీద అంటించిన కరపత్రం మీదే కదా —‘’

‘’అవును ,సార్ ‘’

‘’శుభ్రంగా పైంటు చేసి వుంచిన గోడ పాడు చేసారెమిటి ? ‘’అతని గొంతు మారింది ‘’ఆ కరపత్రం పీకెసి గోడ శుభ్రం చేసి వెళ్ళండి ‘’

నేను ఖంగు తిన్నాను. ఒక నిమిషం పోయాక అన్నాను ‘’అలాగే సార్ . కుర్రవాడ్ని పంపుతాను ‘’

‘’ఈ మాత్రం దానికి కుర్రవాడేందుకు ?’’

నేను మాట్లాడలేదు.

‘’అంటే మీరు చెయరన్న  మాట. అంతేగా. –ఇప్పుడేగా చెప్పారు సమస్యకి వెంటనే స్పందిస్తారని. ఇదేనా మీ స్పందన—‘’

ఇరకాటంలో పడ్డాను.

గోడ మీద కరపత్రం చించి గోడ శుభ్రం చేసి బైకు ఎక్కాను.

ఆకాశం నిండా మబ్బే !కాని మబ్బు కురవలేదు ;ఉరిమింది.

    –ఎల్. ఆర్ . స్వామి

*

 

 

 

నయ్ చోడేంగే !

“నయ్ చోడేంగే నయ్ చోడేంగే

హైద్రాబాద్ నయ్ చోడేంగే

నయ్ చోడేంగే నయ్ చోడేంగే

హైద్రాబాద్ నయ్ చోడేంగే ”

తుంగభద్రా నది గట్టున నినాదాలు దద్దరిల్లిపోతున్నాయి. చేతులు ‘లేదు లేదు’ అన్నట్లుగా వూపుతూ వుద్రేకంతో వూగిపోతున్నారు యువకులు. అదొక పెద్ద గుంపు. అందరూ ఎంతో ఆందోళనతో వున్నట్లు వాళ్ళను చూస్తే తెలుస్తుంది. మామూలుగా అయితే ఎంతో టిప్‌టాప్‌గా తిరిగే యువకులు ఏదో పోగొట్టుకున్నట్లు, మాసిన బట్టలతో, మాసిన గడ్డాలతో దిగులుగా, వుక్రోషంగా, ఆగ్రహంగా చెప్పలేనంత దుఃఖంగా కన్పిస్తున్నారు. నిజానికి వాళ్ళు యేం పోగొట్టుకున్నారో వాళ్లకు తెలిసినట్లు లేదు. వాళ్ల చేతుల్లో ఒక పెద్ద బ్యానర్. జై సమైక్యాంధ్ర అని రాసి ఒక మూల అర్ధనగ్నంగా వున్న పొట్టిశ్రీరాముల్ని ముద్రించింది.

ఆ గుంపులోంచి పదహైదు – ఇరవై మంది బిలబిలమంటూ నదిలోకి దిగి బాగా లోఫలివరకూ భుజాలు మునిగేవరకూ వెళ్ళారు. నినాదాలు చేస్తూనే వున్నారు. ఒకరిద్దర్ని  ప్రవాహం తోసేసింది. పక్కనవాళ్లు పట్టుకున్నారు. “జాగ్రత్త జాగ్రత్త.. మరీ లోపలికి వెళ్ళొందండి” గట్టు మీద నుంచి అరుపులు.  “మునిగితే  మునిగితిమిలే. రాష్ట్రమే మునిగిపాయ. మా ప్రాణాలెంతగానీ, యిట్లన్నా తెలుస్తుందిలే జనాలకి, ముఖ్యంగా తెలంగాణావాళ్లకి” అంటున్నారు నీళ్లలోని వాళ్ళు.

“నయ్ చోడేంగే నయ్ చోడేంగే;  హైద్రాబాద్ నయ్ చోడేంగే

జిందాబాద్ జిందాబాద్; సమైక్యాంధ్ర జిందాబాద్ ”

నినాదాలు ఆగడం లేదు. నాలుగైదు టీవీ కెమెరాలు దీన్నంతా చిత్రీకరిస్తున్నాయి. పది పదహైదు నిమిషాల తర్వాత టీవీల వాళ్లు వెళ్లిపోయారు. నీళ్ళలోకి దిగిన నిరసనకారులు చాలాసేపు అదే నినాదాలు, అంతే పట్టుదలగా అరచి అరచి గొంతులు బొంగురుపోతున్నాయి. గట్టుమీద వున్నవాళ్ళూ యిక చాలు రమ్మంటున్నారు.

ఇదంతా గమనిస్తున్న ఒకతను ఆ గుంపుకు లీడర్‌గా కన్పిస్తున్నతని దగ్గరకు పోయి  “యిదంతా ఏందన్నా…?” అనడిగాడు. చుట్టూ చేరినవారందరూ అతన్ని పిచ్చోణ్ణి చూసినట్లు చూసారు.

“ఇరవైరోజులాయ జరగవట్టి. సమైక్యాంధ్ర వుద్యమం యేందన్నా అంటావ్. యీ లోకంలో వున్నావా లేదా…?” గద్దించాడు లీడర్.

“అవునన్నా.. మరి యిదేందన్నా నీళ్ళలోకి దిగినారు. యీ నీళ్ళు  యాడికి పోతాయన్నా..?”

ఎవడో వీడు పూర్తి పిచ్చోడు మాదిరి వున్నాడే. సమైక్యాంధ్రను అర్ధం చేయిస్తామంటే నీళ్లు యెక్కడీకి పోతాయని అడుగుతున్నాడు అనుకొని,  “ఏమయ్యా!  యిది తుంగభద్ర, యీ నీళ్లు నేరుగా కృష్ణానదిలో కలుస్తాయి. అవి శ్రీశైలం డ్యాంలో పడతాయి..”

“శ్రీశైలం డ్యాం నుంచి యాడికి పోతాయన్నా..?”

“ఓర్ని అది కూడా తెలీదా? ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా నేరుగా నాగార్జునసాగర్‌లో పడి, అక్కడ్నుంచీ కాలవల్లో పడి పొల్లాల్లోకి పోయి పంటలు పండిస్తాయి.”

“ఎవురి పంటలన్నా?”

“ఎవరి పంటలా? రైతులవిరా. మన సమైక్యాంధ్ర రైతులవిరా…”

” ఆ రైతుల్లో రాయలసీమోళ్ళు ఎవరన్నా వుండారాన్నా?”

“రాయలసీమోళ్ళా.. మన పొలాలు ఆడెందుకుంటాయిరా.. మన పొలాలు యీడ కదా వుండేది..”

“మల్లా… మన పొలాలు యీడుంటే, నీళ్ళు యీడ్నించీనే పోతావుంటే మన నీళ్ళు మన పొలాలకి పెట్టుకోకుండా నీళ్ళెందుకు వదుల్తుండారన్నా..  నయ్ చోడేంగే నయ్ చోడేంగే కృష్ణాజలాలు నయ్ చోడేంగే అనాలకదన్నా. యాడోవుండే హైద్రాబాద్‌ను నయ్ చోడేంగే నయ్ చోడేంగే అంటుండారే? మల్లా యీడుండే నీళ్లను మాత్రమే హమ్ కైసే చోడేంగే అన్నా…”

గుంపుకూ, లీడర్‌కూ ఒక్కసారిగా అయోమయంగా అన్పించింది.”మనది ఒకటి పోగొట్టుకొని, మనది కానిదాన్ని వెతుకుతున్నామన్నా. సమైక్రాంధ్రలో పడి రాయలసీమను మరిచిపోయినామన్నా…”

“నిజమా..?” అన్పించింది వాళ్లకు.

venkatakrishnaజి. వెంకటకృష్ణ

స్నేహనామా

“అయితే  యూరోప్ లో అంతా ఫ్రీ లైఫ్ అన్నమాట!” ఆశ్చర్యంగా అడిగింది పక్క ఫ్లాట్ మిత్రురాలు సురేఖ.     “ ఒకరకంగా అలాగే అనుకోవాలి రేఖా! ఇరవయ్యేళ్లొచ్చేవరకే తల్లిదండ్రుల బాధ్యత,  తర్వాత తమ కాళ్ళ మీద తాము బతకాల్సిందే, వేరుగా ఉండాల్సిందే! మన దేశం లో లా కాదు.      ఇక్కడ కొంతమంది పిల్లలు ఎంత వయసొచ్చినా తల్లి తండ్రుల మీద ఆధార పడతారు.    మరికొంతమంది ఉద్యోగం వచ్చేవరకు తల్లిదండ్రుల్ని పీక్కుతినడం,   ఆ పైన ఆస్తుల కోసం పీల్చుకు తినడం కూడా మనం చూస్తూ ఉంటాం.   కానీ  అక్కడ  ఆడపిల్లైనా, మగపిల్లాడైనా  ఇరవై దాటగానే  ఏదో ఉద్యోగం  చూసుకొని  వేరే ఇంట్లో ఉండాల్సిందే!” అంది ఈ మధ్యే  ప్రాజెక్ట్ పని మీద బల్గేరియా వెళ్లొచ్చిన  ప్రొఫెసర్  నీహారిక.

“ మరి పెళ్ళి మాటో?” కుతూహలంగా అడిగింది సురేఖ.  “ ఆ, అక్కడికే  వస్తున్నా.    మన ఇండియా లో లా  పెద్దవాళ్ళు కుదిర్చి, కట్నాలు మాట్లాడి ,లగ్నాలు  పెట్టి   పెళ్లిళ్లు చేయడాలేమీ ఉండవు.    పిల్లలే  తమకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. కాదు కాదు,  సహజీవనం సాగిస్తారు ”  “అంటే  పెళ్ళి చేసుకోరా?”   విస్తుపోయింది సురేఖ.  “ చేసుకోరు.    పెళ్ళనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.    పెళ్ళి తంతు  వాళ్ళ  సంస్కృతి లో అంత ప్రధానమైన అంశం కాదు రేఖా!  సహజీవనం.    దీన్నే రిలేషన్ షిప్  అంటారు వాళ్ళు.    అది చాలా సీరియస్ మాటర్.    ఏదో ఇవాళ చూసి, రేపు నచ్చి,ఎల్లుండి కాపరం పెట్టి , వారం లో వదిలేసి వేరే వాళ్ళ వెంటబడ్డం కాదు.    చాలా రోజులు పరిశీలించి , ఒకళ్లకొకళ్ళు  నప్పుతారు అనుకుంటేనే పెద్దవాళ్లతో చర్చించి  నిర్ణయానికి వస్తారు.    ఒక్కసారి రిలేషన్ షిప్ లోకొచ్చాక  చాలా కమిటెడ్ గా ఉంటారు , మన వివాహబంధం లాగే! కొన్నిసార్లు  కంఫర్టబుల్ గా లేదనిపిస్తే   స్నేహంగానే విడిపోతారు.  ఈ కల్సిఉండడం అన్న కాన్సెప్ట్  మనకి విడ్డూరంగా అన్పిస్తుంది కానీ వాళ్లకిది తరతరాలుగా వస్తున్న ఆచారం అనుకోవచ్చు.” అంది నీహారిక ఆరెంజ్ జ్యూస్ సురేఖకి అందిస్తూ.

“అవునులెండి  మనలో కూడా  లక్షణం గా  మంత్రాల సాక్షిగా  చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని  పెటాకులు కావడం లేదు? బంధం పట్ల గౌరవం, భాగస్వామి పట్ల  ప్రేమ, నమ్మకం ఉండాలి కానీ పెళ్లి దేముంది లెండి!”   తేల్చేస్తూ పెదవి విరిచింది సురేఖ.    “నిజమే రేఖా! యూరోప్ సంస్కృతి  కాస్త తేడాగా ఉన్నట్టనిపించినా వాళ్ళనించి  మనం నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి తెల్సా? ముఖ్యం గా కష్టపడి పనిచేయడం, ఎవరి మీదా ఆధారపడకపోవడం ,  సాటివారికి సాయం చేయడం, గౌరవించడం ….  ఇలా! పిల్లలకి కూడా ఇవే అలవాటు చేస్తారు.”   అంటూ కితాబిచ్చింది నీహారిక.

“అవునుగాని నీహారిక గారూ!  మీ అమ్మాయి శ్రీజ చదువు  వచ్చే సంవత్సరం తో అయిపోతుందనుకుంటా.    సంబంధాలు చూడ్డం మొదలెట్టారా?  విదేశీ సంస్కృతి మోజులో కొట్టుకుపోతున్నారు మనవాళ్ళసలే!”   ఆసక్తిగా అడిగింది సురేఖ గ్లాస్ బల్ల మీద పెడుతూ.    ఫ్రిజ్ లోంచి  మల్లెపూలు, అల్మైరా నించి దారబ్బండి  తెస్తూ “ అమ్మో నాకూ అదే భయం రేఖా.    నీలాగా మగపిల్లలా  ఏమైనా?   ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా మన సంస్కృతిని ఎలా వదులుకుంటాం?  శ్రీజకి సంబంధాలు వెతికే  ప్రయత్నంలో ఉన్నాం.”   అంది నీహారిక.     “అయినా మీ ఫ్రెండ్ డాక్టర్ శ్వేత గారబ్బాయి నవీన్  ఉన్నాడుగా, ఇంక వేరే సంబంధం ఎందుకు?” అంది ఏదో గుర్తొచ్చినట్లు రేఖ.    “చిన్నప్పటినించీ  ఫ్రెండ్స్ మే గాని పిల్లనివ్వాలని అనుకోవడం లేదు.    తనకి  శ్రీజ ని కోడలిగా చేసుకోవాలని ఉందని నాకూ చూచాయగా తెల్సు.    అయినా…”.     “ఏం? నవీన్ అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు, పైగా మంచి ఉద్యోగం లో ఉన్నాడు.    బాదరబందీలేమీ  లేవు.    ఇంకేంటి?”  ఆశ్చర్యంగా అడిగింది.

“ఏమీ  కాదు.    జాతకాల పట్టింపు లేదు, కట్నం సమస్యా లేదు అదృష్టవశాత్తూ! శ్వేత ఆశించే రకమూ కాదు.    వాళ్ళాయన ఉత్తముడు.    నవీన్ బంగారుకొండ.”    “ అన్నీ మీరే చెప్తున్నారు.      మరింకేంటి  అభ్యంతరం?  ఓహో పిల్లలకిష్టం లేదా కొంపదీసి?”  అనుమానం గా అడిగింది.    “ అదేం లేదు.    శ్రీజ మాకే వదిలేసింది పెళ్లి విషయం, నవీన్ కూడా శ్వేత చెప్పినట్లే వింటాడు.    తానే అంది ఒకసారి ఏదో మాటల్లో.     నాకెలా చెప్పాలో తెలియడం లేదు “ అంది మాల కట్టడం పూర్తి చేసి.    “పర్లేదు ఎలా చెప్పినా అర్ధమవుతుంది, చెప్పండి ముందు” అంది రేఖ మల్లె చెండు జడ లో తురుముకుంటూ.    “మా పిల్లలు ఆట కెళ్లారు ఇంకో గంటగ్గాని  రారు, మా ఆయనేమో క్యాంప్ కెళ్లారు.    సో నేను ఫ్రీ! మీ వారు, శ్రీజ శిరిడీ నించి రేపు కదా వచ్చేది.    కాబట్టి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అడిగేవాళ్లు లేరు.   ” అంటున్న రేఖ మాటలకి అడ్డు తగులుతూ “తల్లీ, రేపు క్లాస్ కి ప్రిపేర్ అవ్వాలి, నన్నొదిలిపెట్టు, తర్వాతెప్పుడైనా చెప్తాలే “ అంది నవ్వుతూ నీహారిక.   “నో వే , నాకిప్పుడే తెలియాలి, తెలియాలి”  అంది సినీ ఫక్కీలో రేఖ.

“అయితే విను.    మా అమ్మ, మేనత్త బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నించి.    ఆ స్నేహం తోనే మా అత్త తన  అన్నతో అంటే మా నాన్నగారితో అమ్మకి పెళ్లయ్యేలా చేసింది.    కానీ ఆశ్చర్యం ఏంటంటే  ఏ స్నేహం శాశ్వతం కావాలని  మా అమ్మ ఆశపడి  పెళ్లి చేసుకుందో ఆ స్నేహితురాలు తర్వాత పూర్తిగా మారిపోయింది.    ఆడపడుచు గా రూపాంతరం చెంది మిగిలిన అక్కలతో, తల్లితో కలిసి అమ్మ ని సాధించడం మొదలెట్టింది.    అదేంటో చదువుకొని   ఉద్యోగాలు చేసేవారే  గాని ముగ్గురత్తలు పెళ్లిళ్లు చేసుకోలేదు.    దాంతో ఎప్పుడూ ఇంట్లో కళకళ్ళాడుతూ తిరిగే అమ్మని సూటిపోటి మాటలనడం,  అన్నిటికి వంకలు పెట్టడం.     అమ్మమ్మ వాళ్ళని కూడా ఆడిపోసుకోవడం .     దీంతో అమ్మ మనసు బాగా గాయపడింది.    ఫ్రెండ్ అన్నని చేసుకుంటే  తమ మధ్య అనుబంధం మరింత బలపడుతుందని నమ్మిన అమ్మకి ఇది ఎదురుచూడని దెబ్బ.    కొన్నాళ్ళకి నాన్న ట్రాన్స్ఫర్ రీత్యా మేము వేరే ఊరు వెళ్ళిపోయాము.   అత్తలూ, నాన్నమ్మ కలిసి ఉండేవారు.    ఎప్పుడైనా సెలవులకి వెళ్తే నన్ను, తమ్ముడిని  బానే చూసేవారు కానీ  అమ్మంటే పడేది కాదు.   ఆశ్చర్యమేంటంటే మా అమ్మ ఎప్పుడు వెనకాల కూడా అత్తల్ని తిట్టడం గాని, ద్వేషించడం  గాని చేయలేదు.    తనకి తోబుట్టువులు లేకపోవడంతో నాన్న కుటుంబం లో ఆ లోటు తీర్చుకోవచ్చని ఆశ పడింది, కానీ అది అడియాసే అయింది.     నాన్నకి కోపమొచ్చేది అత్తల ప్రవర్తనకి.     అమ్మ వాళ్లకేమన్నా ఇవ్వమని చెప్తే నాన్న తిట్టేసేవారు అమ్మని…., “వాళ్ళు నిన్ను అకారణంగా ఆడిపోసుకుంటున్నా బుద్ధి లేకుండా ఇంకా వాళ్ళని బాగా చూసుకోవాలి, ఆడపడుచులు సింగినాదం అంటా వేంటి?” అని.    మా అమ్మ ఎప్పుడూ బాధ పడేది.      స్నేహితురాలి అన్నని చేసుకోవడం వల్ల  మంచి భర్త అయితే దొరికాడు గాని ఒక ఆప్తమిత్రురాల్ని పోగొట్టుకున్నాను అని.    ఇంకెవరినో చేసుకొని ఉంటే  తన ఫ్రెండ్ తనకి శత్రువయ్యేది కాదుగా.    ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా అత్త తోనే షేర్ చేసుకొనే అమ్మ  తర్వాత కాలం లో అత్త తిరస్కారాన్ని తట్టుకోలేకపోయింది.

అమ్మ మాకు తన చిన్నప్పటి సంగతులు చెప్పిందంటే మూడొంతులు అత్త ముచ్చట్లే ఉండేవి.    నువ్వు నమ్మవు తెల్సా?  మా నాన్న కంటే ఎక్కువగా అమ్మ దగ్గరే అత్త గురించి విన్నానేమో? తను ఎంత అందంగా ఉండేదో? క్లాసులో ఎంత చలాకీ గా ఉండేదో? ఎంత బాగా చదివేదో?  అన్నీ  వర్ణించి చెప్పేది మా అమ్మ.    అంత అడ్మిరేషన్ అత్తంటే తనకి.    కానీ ఎప్పుడూ  అత్త మాతో అమ్మ గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు.   ఎన్నోసార్లు అడగాలనుకొనేదాన్ని నీకు మా అమ్మంటే ఎందుకు పడదు? అని , కానీ అంత చనువు లేదు మా మధ్య.     సో, మా అమ్మ, అత్తల  మాటర్ చూశాక ఫ్రెండ్షిప్ పదికాలాలు నిలవాలంటే అది బంధుత్వం గా మారకూడదు అని  తెల్సుకున్నాను రేఖా!  అందుకే  నా శ్వేత ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలనే స్వార్ధం తోనే నా కూతురి సుఖాన్ని కూడా పక్కన పెట్టి ఈ పెళ్లి వద్దనుకుంటున్నాను.    శ్రీజకి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందో లేదో కానీ శ్వేత కంటే మంచి ఫ్రెండ్ నాకీ జన్మ లో దొరకదు.    మా అమ్మ చివరి రోజుల్లో కూడా  తన ఫ్రెండ్ గురించే కన్నీరు పెట్టుకోవడం నేనింకా మర్చిపోలేదు.    నేను…. నేను….. మా అమ్మలా అవదల్చుకోలేదు.    అసలు….” దుఖంతో  నీహారిక మాట పూర్తిచేయలేకపోయింది.

“అంతా మీ అత్త లాగే ఉంటారా? మీ అమ్మగారిలా కూడా ఉండొచ్చని ఎందుకనుకోవు?” మాటలకి ఉలిక్కిపడి చూశారిద్దరూ.    ఎప్పుడొచ్చిందో శ్వేత డైనింగ్ హాల్ గుమ్మం దగ్గర నిలబడి ఉంది.    “ఏయ్ శ్వేతా రా రా ! ఏంటీ అకాల ఆగమనం?”  సంతోషంగా ఆహ్వానించింది నీహారిక.  “ నీ ఉపన్యాసమంతా విన్నానే నీహా!   నాకంతా అర్ధమైంది.    నేను పని మీద బైటకి వెళ్తూ దార్లో నిన్ను చూసిపోదామని  ఇలా రావడం మంచిదయ్యింది.    నీ మనసులో ఏముందో తెలుసుకోగలిగాను.”    అంది నిష్ఠూరంగా.    “ అది కాదే “ అంటూ ఏదో చెప్పబోతున్న నీహారిక తో “ నే వెళ్తాను మేడమ్! మా పిల్లలు వచ్చేసి  ఉంటారు.   ” “వస్తానండి” అని శ్వేత తో కూడా  చెప్పి బైటకి నడిచింది సురేఖ.    ఆమె వెళ్ళాక  నీహారిక వైపు తిరిగి  “నవీన్ కి శ్రీజ ని  అడగాలని ఎప్పటినించో నేను, మీ అన్నయ్య గారు అనుకుంటున్నాం.    ఇంకా అది చదువుకుంటోంది కదా, తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే, నీహా కూతురే గా, పరాయివాళ్ళా ఏమన్నానా? అనుకున్నా… .  ” శ్వేత మాట పూర్తి కాకుండానే  “అంతా అర్ధమయ్యాక కూడా మళ్ళీ ఎందుకే  మొదటికొస్తావ్? నాకంటూ ఆత్మీయురాలివి, ఆప్తురాలివి నువ్వే! ఏదైనా నీతోనే కదే నేను షేర్ చేసుకుంటాను!  నాకు తెల్సు నవీన్ కంటే ఉత్తముడు నాకు అల్లుడు గా రాడు.    అలాగే నీ అంత మంచి  అత్తగారు శ్రీజకి  ఖచ్చితంగా దొరకదు.   కానీ నేను చాలా స్వార్ధపరురాల్నే శ్వేతా! కూతురి  పెళ్లి కోసం స్నేహాన్ని పణం గా పెట్టలేను.   ” కళ్ళు తుడుచుకుంది నీహారిక.

“ ఆపుతావా  తల్లీ నీ దండకం? ఎప్పుడో మీ అమ్మ, అత్తల మధ్య స్నేహం దెబ్బతిందని ఇప్పుడు మనం వియ్యంకులం కాకూడదని శపధం చేస్తావేంటీ? అప్పుడంటే మీ నాన్నగారిది  మధ్యతరగతి  కుటుంబమవడం, అత్తలు అవివాహితలుగా ఉండిపోవడం తో అన్నావదినలు  పిల్లలతో హాయిగా సంసారం చేసుకోవడం…    వాళ్ళకి మీ అమ్మగారి మీద కసిని, ద్వేషాన్ని రగిల్చాయి.    వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మంచి సంబంధాలొచ్చినా, మీ నాన్నమ్మ ఎంతగా చెప్పినా ఒప్పుకోలేదని చెప్పావు… నాకు గుర్తుంది.    తను సెలక్ట్ చేసిన అమ్మాయే అయినా, తన ఫ్రెండే అయినా, తన కళ్ల ముందు పెళ్లి చేసుకొని కళకళ్ళాడుతూ తిరగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మీ అమ్మగార్ని ఏదో రకంగా సాధించి రాక్షసానందం పొందుంటారు.    అందుకే వాళ్ళ స్నేహం దెబ్బతింది.    ఇక మన విషయానికొస్తే  పెళ్లయ్యాక పిల్లలు మన దగ్గర ఉండమన్నా  ఉండరు.     అంతా ఫారిన్  మయం కదా! మనమూ ఉద్యోగస్తులమాయే! వాళ్ళకి అవసరమైతే మనల్ని రమ్మంటారు.    అతిధుల్లా వెళ్ళి చూసి , సాయం చేసి రావడమే.    వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళ పెంపకాలు, చదువులు, బాధ్యతలు.     ఇలా తమదైన లోకం లో తాముంటారు.    మనం మాత్రం ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము.    ఇంతోటి దానికి మన స్నేహాన్నిమర్చిపోయి గొడవలు పడుతూ ఎందుకుంటామే?అయినా దేనికి గొడవలు? అన్నిట్లో మనం సమానమే.    మన మధ్య ఏ దాపరికాలు,అసూయలు లేవు.   పోనీ “స్నేహనామా” రాసుకుందామా?”ఆవేశం గా అడిగింది శ్వేత.

“ అంటే?” అర్ధం కాలేదు నీహారికకి.    “ అదేనే వీలునామా లాగా! మనం వియ్యంకులమైనా ఎప్పటికీ మంచి మిత్రులుగానే ఉంటామనీ, మన స్నేహానికి ఏ  హాని కలగనివ్వబోమని, స్నేహబంధాన్ని జీవితాంతం గౌరవిస్తామనీ, ఒక వేళ పిల్లల మధ్య పొరపొచ్చాలొచ్చినా  మనం దెబ్బలాడుకోకుండా  సామరస్యంగా పరిష్కరిస్తామనీ  పేపర్ మీద రాసుకుందాం.    ఈ స్నేహనామా నీకు ఓకే నా నీహా?” ప్రేమగా, అనునయoగా  చెప్తున్న శ్వేతని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంది  నీహారిక.

“చాలే, నీ లాటి ఉత్తమురాలు నా ఫ్రెండ్ అయినందుకు నాకు  చాలా గర్వంగా ఉందే! ఏ స్నేహనామాలూ అక్కర్లేదు.    నా ఫ్రెండ్ ఎప్పటికీ నాతో ఉంటుందంటే  ఇంతకంటే ఏం కావాలి? నేను, నా కూతురు కూడా అదృష్టవంతులమే శ్వేతా!” ఆనందబాష్పాలతో అంది నీహారిక.

**  **  **

ఆచార్య పి. కె.  జయలక్ష్మి 

సానుభూతి

“సరోజా!  ఇటు రా! ”  బీరువా ముందు నిలబడి పనమ్మాయి సరోజని పిలిచింది విమల. 

“ఏంటమ్మా?”  అంది సరోజ విమల గదిలోకి వస్తూ.

“రేపు పార్టీకి ఏం చీర కట్టుకోమంటావు?”  అంది నాలుగు చీరలు తీసి మంచం మీద పడేస్తూ.

“మీరు ఏం చీర కట్టుకున్నా  బాగానే ఉంటారమ్మా!” అంది సరోజ.

“ఊ!  నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ.  నేనేది కట్టుకున్నా ఆరాధనగా చూస్తావు” అంటూ చీరలన్నీ కలబెట్టింది విమల.  దొంతరలు దొంతరలుగా పేర్చి ఉన్న చీరల్లో ఒక్కటీ నచ్చలేదు ఆమెకి. 

“అబ్బ!  ఒక్కటన్నా బాగా లేదు.  బజారుకి వెళ్ళి కొత్త చీర తెచ్చుకుంటా.  నువ్వు సాయంత్రం ఇంటికెళ్ళేప్పుడు రంగా కి బ్లవుజ్ ఇచ్చి ఉదయానికి రెడీ చేయమని చెబ్దువుగాని.  నేను వచ్చేప్పటికి పని పూర్తి చేసుకుని ఉండు” అంటూ హడావుడిగా బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళింది విమల.

 విమల కొత్త చీర కొనుక్కుని వచ్చి వంట చేస్తున్న సరోజకి చూపించింది.  నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలతో ఆ చీర చాలా బాగుంది.  “చాలా బావుందమ్మా! ”  అంది సరోజ. 

“బావుందా!  సరే నువ్వు బ్లవుజ్ కుట్టమని రంగా కి చెప్పి ఇంటికెళ్ళిపో.  రేపు ఉదయం వచ్చేటప్పుడు బ్లవుజ్ తీసుకురా – మర్చిపోకుండా”  అంది విమల. 

కుట్టాల్సిన రవికా, ఆది రవికా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటూ “ఎందుకు మర్చిపోతానమ్మా? రేపే కదా మీ పుట్టినరోజు”  అంది సరోజ.

 

     ***

 

తర్వాత రోజు సరోజ  తన కూతురు చిట్టిని తీసుకొచ్చింది.  చిట్టిని వరండా చివర కూర్చోపెట్టి   రవికల కవరు తీసుకుని లోపలకి వెళ్ళింది.

 

సూర్యుడు గబగబా ఏదో కొంప ముంచుకుపోయినట్లు  పైకి ఎగబాకుతున్నాడు.  వరండాలో కూర్చుని ఉన్న చిట్టికి బాగా ఆకలిగా ఉంది.  అమ్మ కోసం, ఆమె తెచ్చే అన్నం కోసం ఎదురు చూస్తోంది. ఆ ఇంట్లోకి ఎవరెవరో వస్తున్నారు,  వెళుతున్నారు.  ఇంట్లోకి వెళ్ళే వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు చిట్టి.  కాని లోపల నుంచి బయటకు ఎవరైనా వస్తున్న చప్పుడైతే మాత్రం ఆత్రంగా తల ఎత్తి చూస్తోంది తన అమ్మేమోనని. 

 

లోపల నుండి నవ్వులూ, మాటలూ వినపడుతున్నాయి.  వంటింట్లో నుండి వచ్చే వాసనల వల్ల చిట్టికి ఆకలి ఇంకా ఎక్కువవుతోంది.  ఇంతలో ఇద్దరు పిల్లలు బుట్టెడు ఆట సామాన్లతో వరండాలోకి వచ్చారు.  బుట్టలో నుండి రకరకాల బొమ్మలు తీసి వరండాలో సర్దుతున్నారు.  చిట్టి ఆకలిని మర్చిపోయి వాళ్ళ వైపే చూస్తోంది ఆసక్తిగా.  చివరగా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు బొమ్మలను తీసిన చిన్న పాప “అక్కా! పెళ్ళి ఆట ఆడుకుందామా?”  అంది.

“సరే”  అంది పెద్ద పాప.

పెళ్ళి ఆట అనగానే చిట్టి ఉత్సాహంగా వారి వైపే చూడసాగింది.  పెళ్ళికూతురినీ, పెళ్ళికొడుకునీ ప్రక్క ప్రక్కనే కూర్చోపెట్టారు.  పురోహితుడి బొమ్మని వాటికెదురుగా పీట వేసి దాని పైన పెట్టారు.  ఆడవాళ్ళనీ, మగవాళ్ళనీ, జంతువులనీ, పక్షుల్నీ వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మలన్నింటినీ ఎదురుగ్గా అలంకరించారు.  పెద్ద పాప లోపలకి వెళ్ళి స్టీలు గిన్నెలో ఏవో తెచ్చి ప్రక్కన పెట్టింది.  అవేమైనా తినేవేమో అనుకున్న చిట్టికి నోట్లో నీళ్ళూరాయి.  ఇద్దరూ ఏవేవో మంత్రాలు చదువుతూ బొమ్మలకు పెళ్ళి చేశారు.

“పెళ్ళయింది.  ఇక భోజనాలు పెట్టాలి చుట్టాలకి”  అంది చిన్న పాప.

“ఆ!  అందరూ భోజనాలకు లేవండి” అంది పెద్ద పాప ఎదురుగ్గా అలంకరించిన బొమ్మల వైపు చూస్తూ.

చూస్తున్న చిట్టి అప్రయత్నంగా లేచి వాళ్ళ దగ్గరకి వెళ్ళి భోజనాలా?  అంది.

తలతిప్పి చిట్టి వైపు చూసిన పిల్లలిద్దరూ “ఎవరు నువ్వు?”  అన్నారు ఇద్దరూ ఒకేసారి. 

“మా అమ్మ ఈ ఇంట్లో పని చేస్తుంది” అంది చిట్టి.

“సరోజక్క కూతురివా?” అంది పెద్ద పాప.

తల ఊపింది చిట్టి.

“దా!  నీ పేరేమిటీ?”  అన్న చిన్న పాపను చూస్తూ “చిట్టి” అంది చిట్టి.

“నా పేరు శరణ్య.  ఇది మా అక్క సాహితి” అని అక్కని వేలితో చూపించి “నువ్వు ఎన్నో తరగతి?” అంది మళ్ళీ.

“నాలుగో తరగతి” అంది చిట్టి.

“నేను కూడా నాలుగే..  దా!  కూర్చో!” అంది చిన్న పాప.

చిట్టి కూర్చోలేదు.  అలాగే నిలబడి ఉంది.

“కూర్చో.  ఆడుకుందాం”  అని పెద్ద పాప అనడంతో వాళ్ళకి కొద్ది దూరంలో కూర్చుంది చిట్టి బిడియంగా.

“స్టీలు గిన్నెలో నుండి కేకులు, చిప్స్ తీసి ప్లేట్లల్లో సర్దుతోంది పెద్ద పాప.  చిట్టి వాటి వైపే రెప్ప వాల్చకుండా చూస్తోంది.  దానికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఆగకుండా.  బొమ్మలన్నింటినీ వరసగా కూర్చోపెడుతున్న చిన్న పాప చిట్టి వైపు తిరిగి “నీకు కూడా ఇలాంటి బొమ్మలున్నాయా?”  అని అడిగింది.

చిట్టి తల అడ్డంగా ఊపింది లేవన్నట్లు.

“లేవా?”  అని ఆశ్చర్యంగా చూసి “ఇంకేమైనా బొమ్మలున్నాయా మరి?”   

“అస్సలు నాకు బొమ్మలే లేవు” అంది చిట్టి మామూలుగా.  దాని గొంతులో ఏమీ బాధ లేదు.  కళ్ళు మాత్రం చిప్స్ వైపే చూస్తున్నాయి.

“నేను నీకు కొన్ని బొమ్మలిస్తానుండు.  ఇది ఇవ్వనా?  అంటూ అమ్మాయి బొమ్మ ఇవ్వబోయిందివద్దు అన్నట్లుగా తల ఆడించింది చిట్టి.  “పోనీ ఇది ఇవ్వనా? ఇది ఇవ్వనాఅంటూ రకరకాల బొమ్మలు చూపిస్తోంది.  ఆ పాప ఏది చూపించి అడిగినా వద్దు – వద్దుఅంటున్న చిట్టిని చూసి పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ బొమ్మలు మాత్రం ఇవ్వను.  ఇంకేం కావాలన్నా తీసుకో”  అంది చిన్న పాప విసుగ్గా.

చిట్టి ఏమీ మాట్లాడలేదు

ఏం  కావాలో అడుగు భయపడకుండాఅంది పెద్ద పాప చిట్టికి దగ్గరగా వచ్చి

చిట్టికి ఏదైనా ఇవ్వాలని వాళ్ళిద్దరికీ చాలా కోరికగా ఉంది.

ఆకలేస్తుంది.  ఆ రొట్టె కావాలిఅంది చిట్టి కేకును చూపిస్తూ.

అయ్యో!  ఆకలేస్తుందా?అని  గిన్నె దగ్గరకి పరిగెత్తినట్లుగా వెళ్ళింది పెద్ద పాప.

చిన్న పాప నవ్వుతూ “అది రొట్టె కాదు కేకు” అంది.

కేకు, చిప్స్ ఉన్న ప్లేట్ తీసి చిన్న పాపకిచ్చి “చిట్టికి ఇవ్వు.  అమ్మని పిలుచుకొస్తా” అంటూ లోపలకి పరిగెత్తింది పెద్ద పాప.

పెద్ద పాప ‘అమ్మని పిలుచుకొస్తాన’న్న మాటకి చిట్టికి భయమేసింది. నాలుగు రోజుల క్రితం జరిగినది గుర్తొచ్చింది.

నాలుగు రోజుల క్రితం చిట్టి తన గుడిసె ముందు కోర్చోనుంది.  వాళ్ళ పక్క గుడిసెలో ఉండే గౌరి, కిట్టా వాళ్ళ నాన్న అరటి పళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళాడు.  చిట్టి తనకి కూడా నాన్నుంటే ఏదో ఒకటి తెచ్చేవాడు కదా అనుకుంటూ వాళ్ళ గుడిసె వైపే చూస్తూ ఉంది.  గౌరి, కిట్టా అరటి పండు తెచ్చుకుని తింటుంటే వాళ్ళ దగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళి గౌరిని కాస్త పెట్టమని అడిగింది.  గౌరి సగం తుంచి పెట్టింది.  కిట్టా లోపలకి వెళ్ళి వాళ్ళమ్మకి చెప్పాడు.  వాళ్ళమ్మ పెద్దగా అరుస్తూ బయటకొచ్చి చిట్టి వీపు మీద నాలుగు దెబ్బలేసి రెక్క పట్టుకుని చిట్టి గుడిసె దగ్గరకు లాక్కొచ్చింది.  “అన్నం పెట్టుకోలేక ఊళ్ళో వాళ్ళ మీదకు తోలతన్నావా పిల్లని?  మాకే గతి లేక చస్తా ఉంటే నా పిల్ల దాని చేతిలోది తీసుకుని తింటంది ఇది”  అని చిట్టి అమ్మని తిట్టింది.  చిట్టి అమ్మ ఏమీ చేయలేక చిట్టి వీపు మీద నాలుగు గుద్దులు గుద్ది చిట్టినే వాటేసుకుని ఏడ్చింది.  అది గుర్తొచ్చిన చిట్టి చిన్న పాప ఇస్తున్న కేకుని తీసుకోకుండా వణికిపోసాగింది.

 

పెద్ద పాప లోపల్నించి వాళ్ళమ్మని తీసుకొచ్చింది. నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలున్న చీర కట్టుకున్న ఆమె చాలా అందంగా ఉంది.  చిట్టి ఆమె వైపు భయంగా చూసింది.  ఆ చూపులోని భయాన్ని, వణుకునీ, కలవరాన్నీ చూసిన విమల సముదాయింపుగా “ఎందుకు భయపడుతున్నావు?  తీసుకో – తిను” అంటూ చిన్న పాప చేతిలోని కేకుని తీసుకుని చిట్టికి పెట్టింది.  చిట్టికి భయం తగ్గింది. 

“సరోజా! ఇలా రా”  అంటూ కేకేసింది విమల.

సరోజ పరిగెత్త్తుకుంటూ బయటకు వచ్చింది.  “పాపకి ఆకలేస్తుంటే అన్నం పెట్టకుండా ఏం చేస్తున్నావ్?”  అంది విమల.

“మీ భోజనాలయ్యాక పెడతాలేమ్మా”  అంది సరోజ.

“అదేంటీ?  ఇంట్లో వండలేదా”  అంది విమల ఆశ్చర్యంగా.  చిన్న పాప, పెద్ద పాప చిట్టి వైపు దిగులుగా చూస్తున్నారు. 

“లేదమ్మా.  నాకు మీరిచ్చింది సరిపోతుంది.  చిట్టికి స్కూల్లో పెడతారు.  బంద్ అని స్కూలు తెరవడం లేదు.  అందుకని వారం రోజుల నుండీ ఇక్కడ తీసికెళ్ళిందే ఇద్దరం తింటున్నాం”  అంది.  మళ్ళీ తనే “బంద్ ఎందుకోసమమ్మా?”  అని అడిగింది.

 

“రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బంద్ చేస్తున్నారు.  నీకర్థం కాదులే – ఇట్లా చెప్తే.  ఇప్పుడూ మీ పేట ఉందనుకో – పెద్దమనుషులు దాన్ని రెండుగా చేసి కొంతమంది అటు ఉండండి కొంతమంది ఇటు ఉండండి అని విడదీశారనుకో.  విడిపోవడం ఇష్టం లేని వాళ్ళు ‘అందరం కలిసి ఉందాం’  అని గొడవ చేస్తారు కదా!  అలా మన తెలుగు రాష్ట్రాన్ని వేరు చేస్తున్నారని కలిసి ఉండాలనే వాళ్ళు బంద్ చేస్తున్నారు”  అని విమల సరోజకి వివరంగా చెప్పింది.

“కలిసి ఉన్నవాళ్ళని విడిపొమ్మనడం ఏంటమ్మా?  కలిసి ఉండండి అని చెప్పాలిగాని” అంది సరోజ.

“అటుప్రక్క వాళ్ళు విడిపోవాలంటున్నారుగా” అంది విమల.

“ఇదేదో అత్తా కోడళ్ళ తగాదా లాగా ఉందమ్మా. పెత్తనం తనకే ఉండాలని అత్త కలిసి ఉందాం అంటుంది.  అత్త ఉంటే పెత్తనం రాదు కాబట్టి విడిపోవాలంటది కోడలు.  మా ఇళ్ళల్లో ఎన్ని జరగడం లేదు ఇట్టాంటి తగాదాలు.  అయినా పెద్దోళ్ళు గొడవ పడతా పిల్లలకి బడి లేకుండా చేస్తే ఎట్టమ్మా? మద్యాన్నమన్నం లేకుండా పోయింది”  అంది సరోజ.  సరోజ కళ్ళల్లో సన్నని నీటి పొర.

 

ఈ సమస్య గురించి అవగాహన లేని వాళ్ళకి దీని లోతులు  అంత తేలిగ్గా అర్థం కానుకున్న విమల “సరోజా! నువ్వనుకున్నంత చిన్న సమస్య కాదు ఇది కాని నువ్వన్నట్లు పిల్లలకి బడి లేకుండా చేయడం వల్ల ఎంతమంది చిన్నారులు ఆకలితో బాధపడుతున్నారో పాపంఅంది.

మాటలకి సరోజ కళ్ళల్లోని నీళ్ళు బుగ్గల మీదకి జారాయి.

విమల సరోజ భుజం మీద చేయి వేస్తూ   సరోజా! మీ పిల్లదానికి అన్నం ఇక్కడ పెడితే నేనేమైనా అంటానా?  స్కూలు తెరిచిందాకా రోజూ ఇక్కడే అన్నం పెట్టు”  అంటూ చిట్టిని సరోజతో వంటింట్లోకి పంపించింది. 

 

వాకిట్లో నిలబడి అంతా చూస్తున్న ఆమె స్నేహితులు కొందరు “ఇలా వాళ్ళని ఇంట్లో చేర్చావంటే నెత్తికెక్కుతారు.  ఎక్కడిదీ చాలదు”  అన్నారు. 

“ఫరవాలేదు.  మనం కొనే ఒక చీర ఖరీదు లేదు వాళ్ళు తినేది. ఎక్కడిదీ చాలకపోవడానికి  మనం వాళ్ళకేమైనా చీరలు సారెలూ ఇస్తున్నామా లేక జీవితమంతా పోషిస్తున్నామా?  వాళ్ళ పట్ల సానుభూతితో ‘మీకు కష్టం వచ్చినపుడు మేము ఉన్నాం’  అని అనడమే వాళ్ళకు మనం చేసే గొప్ప సహాయం.  అది వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని, ఓదార్పుని ఇస్తుంది”  అంది విమల. 

ఇలాంటి తన స్నేహితురాళ్ళని మెప్పించడం కోసం, వారి మెరమెచ్చుల కోసం తను నిన్న అప్పటికప్పుడు కొని కట్టుకున్న చీర  బరువైపోయినట్లుగా అనిపించసాగింది విమలకి.

 

  ***                     

radhaమండువ రాధ

ప్రేమరాగం వింటావా!

kumar raja copy

“వర్షాకాలం వచ్చేస్తోంది! ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ ప్రవేశించాయి . ఏరోజెైయినా, ఏ క్షణంలో అయినా మన నగరం లో ప్రవేశిస్తాయి” అని పేపర్లూ, టివీలు ఉదారగొట్టేస్తున్నాయి. జనం ఈ వేసవి ఏoడలు మరీ విపరీతం గా వున్నాయని చాలా అసహనంగా  వాపోతున్నారు.  దీనికి తగట్టు నీటి కొరత , కరెంట్ కట్టు, ఉక్కపోత  ఇక వీరి పాట్లు ఏమని చెప్పాలి ? అందుకే “వర్షాలు వచ్చేస్తున్నాయి” అనే వార్త కొచెం ఆనందాన్ని ఇస్తోంది. కానీ టివిల విపరీత ప్రచారం కొంచెం ఎబ్బెట్టుగా వుంది . ఇప్పుడు రుతుపవనాల ప్రభావం వల్ల చల్లగాలులు వీస్తున్నాయి . రాబోయే వర్షాన్ని అవి భరోసా ఇస్తున్నాయి.

అతనికి హైదరాబాద్ కొత్తేమికాదు. ఇంజనీరింగ్ ఇక్కడే చేసాడు. ట్రైనింగ్,ఉద్యోగాల కోసం వేరే నగరాలన్నీ తిరిగి మరల యిక్కడకు చేరుకొన్నాడు. చాలా రోజులు తరువాత సాయంత్రం నడకకోసం ఇలా పార్కుకు వచ్చాడు. చల్లగాలికి చెట్లన్నీ తలలు ఊపుతున్నయి, వర్షం రాకకోసం స్వాగతం పలుకుతున్నట్లు ఉంది. అతను నాలుగు  రౌండ్లు పాత్ వే  ఫై నడిచిన తరువాత,  ఎక్కడయినా కూర్చోవాలని బెంచీల కోసం వెతుకుతున్నాడు. ప్రేమికుల జంటలు చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. మరికొంత మంది జంటలు భయం గా నడిచి వచ్చే వారి వైపు బెదురు చూపులు  చూస్తున్నారు. ఎవరైన తెలుసున్నవాళ్ళు కనిపిస్తారేమో అని భయం. కొందరైతే ఈలోకంలోనే లేరు, కలలలో తేలుతున్నారు.  ఇంతలో అదిగో ఆ మోదుగుపూల చెట్టు కింద బెంచీ కనిపించింది. కానీ ఓ అమ్మాయి ఒంటరిగా కుర్చుని ఉంది. ఇయర్ ఫోన్ లో  మ్యూజిక్ వింటోంది. కాలేజి అమ్మాయా? సాఫ్ట్ వేర్  ఇంజనీర్? ఏమో ఎవరికీ తెలుసు? చూడటానికి చక్కగా ఉంది . జీన్ ప్యాంటు , టీ షర్ట్ వేసుకొని  సింపుల్ గా ఉంది . పేపర్లో ఎదో రాస్తోంది. ఇప్పుడు ఏంచెయ్యాలి ? ’బెంచీ పెద్దగానే ఉంది. తను మరోచివర కుర్చోవచ్చు‘ అనుకొన్నాడు. తను ఎవరికోసమయినా ఎదురు చూస్తోoదా!  అతను వస్తే,  ఆమె ప్రక్కనే కూర్చుంటాడు, తరువాత కూడా ఇంకా ప్లీస్ వుంటుంది , అని తనలో తనే అనుకొంటూ ఆ బెంచీ మీద మరో చివర కూర్చున్నాడు . ఆమె చట్టుక్కున అతనివంక చూసింది . మరల తనపనిలో ములిగిపోయింది.

ఓ చల్లని గాలి తెమ్మెర సుడులుగా వచ్చి తనను తాకింది. మనస్సు ఆనందంగా వుంది . ఇన్నాళ కు ప్రకృతిలో చెట్లమద్య గాలి ని  గుండె నిండా పీల్చుకొన్నాడు. బెంచీ ఫై వెనక్కు వాలి కళ్ళు ముసుకొన్నాడు . చటుక్కున గుర్తుకు వచ్చింది ,  ఈ బెంచీ పైనే ఆ చివర ఓ అమ్మాయి కూర్చుందని . ఆమె వంక చూసాడు . ఆమె సీరియస్ గా గడులు నింపే ‘సుడోకు ‘ అనే ఆట ఆడుతోంది . ఇప్పుడు అతనికి ఆమె ఇంకా అందంగా కనిపిస్తోంది . మాట్లాడిస్తే బాగుంటుంది అనుకున్నాడు . ఆమె మ్యూజిక్ వింటోంది కదా అని , ఓ సారి పెన్ను ఇస్తారా అని సైగలతో చెప్పాడు . తన సైగలు చూసి నవ్వుకొంటూ పెన్ను ఇచ్చింది . నవ్వుతున్నప్పుడు ఆమె మొఖం ఇంకా వికసించింది . తనుకూడా తాను తెచ్చుకున్న పేపర్లో సుడోకు  ట్రై చేసాడు . ఆమె నవ్వుతూ ఇటీ  చూస్తోంది . తనకు హటాత్తు  గా  గుర్తుకువచ్చి, పెన్ను ఆమెకు ఇచ్చేసి థాంక్స్ చెప్పాడు . తను కూడా విష్ చేసింది . కొద్ది సేపు మాటలు లేవు . తను లేచి వెళ్ళిపోయింది . వీళ్ళకు మ్యూజిక్ వినడం , సుడోకు  ఆడటం మినహా వేరే పని ఉండదా  అని అనిపించిది .

తరువాత రోజు కూడా అతను పార్క్ కు వచ్చాడు. అక్కడ బెంచీ కాళీగా వుంది . బెంచీ మీద రాలిన రెండు ఎర్రని మోదుగు పూలు వున్నాయి . తను బెంచీ పైన ఓ చివర కుర్చుని ఓ పువ్వును చేతిలోనికి తీసుకున్నాడు . ‘ఎంత అందమైన ఎర్రరంగు ‘ అనుకొంటూ వాసన చూసాడు. ఏ వాసనా లేదు . ‘అరె ఈ అందమైన పువ్వు కు మంచి సువాసన కూడా వుంటే ఎంత బాగుండును ‘ అనుకున్నాడు . ఈసారి తను తెచ్చుకున్న పేపర్ పైన ‘సుడోకు‘ ఆడుతున్నాడు . కొద్దిసేపటికి ఆ అమ్మాయి వచ్చింది . నవ్వుతూ విష్ చేసింది , తాను కూడా విష్ చేసాడు . ఆమె చేవ్వుల్లో ఇయర్ ఫోన్ , ‘ఈమె అంత మ్యూజిక్ ప్యానా!’ అనుకొన్నాడు . అతని పేపర్ లో ఓ మూల కాగితం చింపి  దానిమీద రాసి ఆమెకు చూపించాడు ,”ఈరోజు మీరు లేట్“ అని. ఆమె చిరునవ్వు నవ్వింది. వేయిపువ్వులు వికసించినట్లుగా. రెండుమూడు రోజులు గడిచాయి. స్నేహం పెరిగింది. ఇద్దరూ కొంచెం దగ్గరయ్యారు . ఈ అమ్మాయి ఎప్పుడు  మ్యూజిక్ వినడం అతనికి విసుగనిపించింది . అతను పేపర్ అంచుఫై “మీరు వినే పాట, నేనుకుడా వినోచ్చా!” అని రాసి ఆమెకు చూపించాడు . ఆ అమ్మాయి నవ్వుతూ తన ఇయర్ ఫోను తీసి అతనికి ఇచ్చింది . తను పెట్టుకొన్నాడు , ఏమీ  వినపడలేదు. “కొంచెం ముందుకు నడపండి” అన్నాడు. ఆమె నవ్వింది . పేపర్ అంచున రాసింది “అందులో ఏమి లేదు “  అతను ఆశచర్యం తో “మరి ఏమి వింటున్నారు “ అన్నాడు . ఆమె తలదించుకోoది. మొఖంలో నీలి నీడలు , నెమ్మదిగా పెన్ను తీసుకొని రాసింది “నాకు మాటలు రావు, వినిపిoచదు కూడా“. అతను హతాసుడయ్యాడు. ఆశ్చర్యం నుంచి తెరుకోలేకపోయాడు .ఆమె మరల రాసింది “ నన్ను క్షమించండి !”. కొద్దిసేపు మానం , తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది .

తరువాతి రోజు అదేసమయానికి అతను అక్కడికి వచ్చాడు. అప్పటికే ఆమె కూర్చొని సుడోకు  పుర్తిచేస్తోంది . అతను ఆమె దగ్గరగా కర్చున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది . అతను పేపర్ అంచున రాసి ఆమెకు చూపించాడు “క్షమించండి……కానీ మీ పాటను వినగలిగాను, తియ్యగావుంది , ఈరాగాన్ని ఎప్పుడు వింటూనే వుండాలనిపిస్తోంది “. ఆమె మొఖం వికసించింది. చల్లని గాలి బాగా వీచింది . యూకలిప్తుస్ ఆకులు వీళ్ళ మీద రాలాయి. రెండు మూడు పెద్ద నీటి చుక్కలు అతనిమీద పడ్డాయి . ఫైకి చుస్తే నల్లటి కారు మేఘాలు!. ఇద్దరూ లేచి తొందరగా నడుస్తూ షెల్టర్ వైపుకు వెళ్ళుతున్నారు . ఇప్పుడు వాళ్ళ చేతులు కలసి వున్నాయి . ఈ శ్రావన మాసపు మొదటి వర్షం జోరుగా ప్రారంభం య్యింది. రుతుపవనాలు నగరాన్ని ఆక్రమించాయి.

             15944_100443406646011_3087999_n — కూనపరాజు కుమార్ 

ప్రశ్నలు లేని జవాబులు

satyaprasad “రేపు ఒక కాన్పరెన్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాను. కుదిరితే డిన్నర్ కి కలవగలవా?”

ఎన్నిసార్లు ఆ మెసెజ్ చూసుకున్నావో లెక్కేలేదు. అందులో ఒక్కొక్క అక్షరం నీలో ఎన్నో జ్ఞాపకాలను కదిలిస్తోంది. అక్కడికి రమణిని మర్చిపోయావని కాదు. గుర్తుకువచ్చేది. నువ్వు రమణిని వద్దనుకున్న కొత్తల్లో చాలా తరచుగా గుర్తుకువచ్చేది. కానీ నీ చదువులు, ఉద్యోగం, పెళ్ళీ వీటన్నింటి మధ్యలో రమణి జ్ఞాపకం ఎక్కడో తప్పిపోయింది. నువ్వు వూరు వెళ్ళినప్పుడో, రమణితో కలిసి చూసిన పాత సినిమాలు టీవీలో చూసినప్పుడో, ఏదో ఒక అర్థరాత్రి కలలో ఆమె కనిపించినప్పుడో ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చి నిన్ను అతలాకుతలం చేసేవి.

చిన్నప్పుడు గుడి ముందర ఆడిన ఆటలు – దాగుడు మూతలు దండాకోర్ – పిల్లి వచ్చె ఎలకా భద్రం – ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి..

ఆ తరువాత ఆటలతో పాటు తొండి చెయ్యడం కూడా నేర్చుకున్న రోజులు. ఇంటికి వచ్చే ముందు చీకట్లో దొంగిలించిన ముద్దులు. ఆటలు ఆడుతూ ఆడుతూ జారిపోయిన బాల్యం. రమణిలో కొత్తగా పూసిన రంగులు, సిగ్గులు. ఆ తరువాత తల్లిదండ్రుల కనుసన్నలలో కట్టడైన తొలి యవ్వనం. తొలిప్రేమ – మొదలు ఎక్కడో తెలియని మనసుల కలయిక. ఒకే బస్సులో కాలేజీ ప్రయాణాలు, ఆ కాలేజీలో ప్రణయాలు. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పుకొకుండానే, అసలు ఆ విషయం తెలియకుండానే మునిగితేలిన ప్రేమానుభూతులు. ఇవన్నీ కలగాపులగం అయిపోయి ఒక కొలాజ్ లా నిన్ను కుదిపేసేవి.

నీ కార్పొరేట్ వుద్యోగంలో, నీ ఉరుకుల పరుగుల జీవితంలొ, నీ సంసార వ్యవహారాల్లో ఎక్కడో తప్పిపోయిన అందమైన కల రమణి. చిన్నప్పటి పుస్తకాలను తిరగేస్తుంటే కనపడే నెమలిపింఛెం లా ఈ మెసేజ్ రూపంలో మళ్ళీ నీ ముందుకి వచ్చింది.

కలిసినప్పుడు రమణి అడగబోయే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు లేదని నీకు తెలుసు. ఆమె చూసే చూపులను తట్టుకునే శక్తి నీకు వుండదనీ తెలుసు. అయినా వెళ్ళాలి అనుకున్నావు.

“తప్పకుండా వస్తాను..” రిప్లై పంపించి మర్నాడు సాయంత్రం కోసం ఎదురుచూస్తూ వున్నావు.

***

అన్నేళ్ళక్రితం ఎలా వుండేదో అలాగే వుంది. కొంచెం వళ్ళు చేసింది. కళ్ళకు అద్దాలు. ఆమెను చూడగానే నువ్వు కలవరపడటమో, కన్నీళ్ళు పెట్టడమో చెయ్యలేదు. అలా జరగకుండా జాగ్రత్తపడ్డావు. వయసుతో పాటు నీకు మెచ్యూరిటీ వచ్చిందనుకున్నావు. అయినా నీ మనసు మాత్రం పదహారేళ్ళ పసి వయసు వైపు పరుగులు పెడుతోంది. ఆ సంగతి నీకు మాత్రమే తెలుసు.

డిన్నర్ చేసినంతసేపు చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి, అప్పటి స్నేహాల గురించి సరదాగా మాట్లాడావు. పన్నెండేళ్ళ క్రితం వదిలేసిన కథని కొనసాగించినట్లే వుండాలని నీ ఆశ. అన్నేళ్ళు మీ ఇద్దరి మధ్య నిలిచిన మౌనవారధి ఎప్పుడు కూలిపోయిందో తెలియలేదని సంబరపడ్డావు. ఆమె ఆ ప్రశ్న అడిగే వరకు.

“పెళ్ళి చేసుకున్నావా?”

ఏ ప్రశ్నకి సమాధానం చెప్పడం నీకు ఇష్టం లేదో అదే ప్రశ్న వేసింది. తలూపావు.

“నా సంగతి తెలుసుగా. పెళ్ళి, విడాకులు..!! ఐ యామ్ హాపీ దట్ ఐ యామ్ ఔట్ ఆఫ్ ఇట్..! పీఎచ్.డీ చేశాను. ఇప్పుడు హాయిగా వుంది.” అంది. నీకు ఆమె మాటల్లో వినపడిందంతా ఒక అవకాశం. ఒక ఆహ్వానం మాత్రమే.

“ఒంటరితనం నాకు తెలుసు రమణీ. సరోజ చనిపోయి ఐదేళ్ళైంది. ఎండిపోయిన చెట్టులా పడివున్నాను” అంటూ విషాదాన్ని ఒలకబోశావు. ఆమె నుంచి ఎలాంటి సానుభూతి మాటలు లేవు.

“అయినా ఫర్లేదు… కార్పొరేట్ వుద్యోగం.. పదవి.. హోదా.. ఏదో ఒక వ్యాపకం కావాలి కదా? మూడు బంగళాలు, నాలుగు ఫ్లాట్లు, కార్లు… జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాననుకో..” గర్వం గొంతులోకి వచ్చేలా చెప్పావు. ఆమె కళ్ళలో ఆశ్చర్యమో, ఆరాధనో కనపడాలని నీ తాపత్రయం. ఆమె నవ్వింది.

డిన్నర్ పూర్తైంది. నన్ను ఎందుకు వదిలేశావు అని ఆమె నిన్ను అడగలేదు. నువ్వు పెళ్ళి చేసుకోను అని చెప్పిన తరువాత ఆమె ఎంత బాధ పడిందో చెప్పలేదు. అసలేం జరగనట్లే వుంది. పాత స్నేహితుణ్ణి కలిసినట్లే మాట్లాడింది. నీ కారు దాకా వచ్చి నిన్ను సాగనంపి హోటల్ లో తన రూమ్ కి వెళ్ళిపోయింది.

***

రమణి అడగాల్సిన ప్రశ్నలు అడిగివుంటే నీ దగ్గర సమాధానాలు సిద్ధంగా వున్నాయి. కానీ ఆమె అడగలేదు, నీ సమాధానాలు బయటపడలేదు. సమాధానాలు వున్నాయి. ప్రశ్నలే లేవు.

రాత్రంతా కలత నిద్ర. తెల్లవారగానే ఫోన్ చేశావు.

“మరో గంటలో బయల్దేరుతున్నాను” చెప్పింది చల్లగా.

“నేను వస్తున్నాను. డ్రాప్ చేస్తాను.” అన్నావు చొరవగా.

“వద్దు. టాక్సీ బుక్ చేశాను.” అన్నదామె కటువుగా.

వొప్పించేదాకా నువ్వూరుకుంటావా?

బీయండబ్లూ నడుపుతున్న గర్వం నీ కళ్ళలో వుంది కానీ అది ఎక్కిన ఆనందం ఆమె ముఖంలో కొంచెమైనా లేదు. నీకెందుకో అసహనం.

దారిలో చాలా విషయాలు మాట్లాడావు. నీ పెళ్ళి శుభలేఖ ఆమెకి పంపించావని అబద్ధం చెప్పావు.

“అందలేదు..” అంది ఆమె.

“నీ శుభలేఖ అందింది కానీ రావాలనిపించలేదు” అని చెప్పాలనుకున్నావు. “కుదరలేదు” అని మాత్రం చెప్పగలిగావు. మళ్ళీ మౌనవారధి ఇద్దరి మధ్య.

“ఒంటరి బ్రతుకు చాలా దారుణంగా వుంటుంది రమణీ” చెప్పావు. ఆమె విన్నదో లేదో తెలియలేదు. కానీ నువ్వు మాట్లాడటం మాత్రం ఆపలేదు.

నీ చుట్టూ వున్న కార్పొరేట్ ప్రపంచం ఎంత నిర్దయగా వుందో చెప్పావు. జ్ఞాపకాలలో శిధిలమైన రమణి స్నేహాన్ని గుర్తించానని చెప్పావు. రమణి ఇప్పుడు నీకు ఎంత అవసరమో చెప్పావు. అయినా ఆమె మాట్లాడలేదు. కనీసం ఏమైనా అడుగుతుందేమో అని నీకు ఆశ. ఆ ప్రశ్నలు సంధిస్తే నీ సమాధానాలు తయారుగా వున్నాయి.

ఆమె అడగలేదు. నీ అసహనం తగ్గలేదు. నీకు తెలియకుండానే నీ కళ్ళలో నీరు.

ఎయిర్ పోర్ట్ లో కారు ఆపి కిందకు దిగి లగేజ్ దింపావు. ఒక్కసారి ఆమె నిన్ను చిన్నగా హత్తుకుంది.

“టచ్ లో వుంటావు కదూ” అన్నావు.

ఆమె నవ్వింది.

“నువ్వు పూర్తిగా మారిపోయావు రమణీ” అన్నావు.

“నువ్వు ఏ మాత్రం మారలేదు ప్రదీప్…” అంది నవ్వి

“అంటే?”

“నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా వున్నాయని నీకు తెలుసు… అవి అడిగే అవసరం లేకుండా చేశావు. నీ గురించి కాకుండా నిన్ను ప్రేమించేవాళ్ళ గురించి ఆలోచించడం నేర్చుకో… బై.” అని చెప్పింది రమణి.

“ఫోన్ చేస్తావు కదూ..” అన్నావు వెనకనుంచి.

ఆమె నుంచి సమాధానం లేదు.

నువ్వు వెనక్కి తిరిగావు. ఆమె ముందుకు సాగిపోయింది.

[ *** ]

–అరిపిరాల సత్య ప్రసాద్

నయీ గాడీ

“నీకు బండి అర్జెంట్ కావాలి అంటున్నావు .. ఉద్యోగం కోసం ., చూడు షామీర్ భయ్యా! మా షోరూం లో ఇప్పుడు ఒక స్కీం వుంది . నెలనెలా పదమూడు వందలు కట్టాలి . ప్రతి నెల చివరి ఆదివారం స్కీంలోని సభ్యులందరి పేరు మీద డ్రా తీస్తాము. డ్రా వెళితే మిగతా  పైసల్ కట్టనవసరం లేదు., ఇలా యాభై కిస్తీలు కట్టాలి. డ్రా ల ఎల్లకుంటే లాస్ట్ ల బండి ఇస్తారు. ఇగ నువ్ అర్జెంట్ అంటున్నావ్ కనుక ఒక పదివేలు డౌన్ పేమెంట్ కింద కట్టి స్కీంల చేరు.. బండి తీస్కో , మధ్యల్ ఎల్తే నీకు మంచిదే, ఎల్లకుంటే నెల నెల పైసల్ కట్టుకో…ఎం అంటావ్ షామీర్ ..వింటున్నావా?”

“ఆ ఆ వింటున్న రమేష్ అన్న..ఇగ నాకు బండి ఎలాగు కావాలి. మైక్రో ఫైనాన్సుల కలెక్షన్ బాయ్ గా చేరాలంటే . కచ్చితంగా బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తా అని మేనేజర్ చెప్పిండు. ఇంట్లో నాన్న రిటైర్ అయ్యాడు , తన ఆరోగ్యం కూడా బాలేదు, నేను ఈ సమయంల ఉద్యోగం  చేయాలి అన్నా! ..”

సరే షామీర్! నువ్వు ఎప్పుడు పదివేలు తీసుకొని వస్తావో చెప్పు. నేను బండి తెప్పిస్తా. కాగితాలు రెడీ చేసి పెడతా సరేనా….”

“వెళ్ళొస్తా రమేష్ అన్న! వీలైతే వచ్చే గురువారం తీసుకుంటా..మళ్ళా  లేట్ అయితే ఉద్యోగం  వేరేవాళ్ళకు ఇస్తారు.

 షోరూంలకెళ్ళి బయటకు రాగానే ఎదురుగా మా  చిన్నమామ లతీఫ్.

“సలామా లేకూం  మామ…”

“వాలేకుం అసలాం ……క్యారే షామీర్.. రెండ్రోజుల నుండి రమేష్ తో కనపడుతున్నావ్ బండి గిట్ల  కొంటున్నావా!”  నోట్లో వున్న జర్దాను తుప్పుక్కు తుప్పుక్కు అని కింద ఉమ్మేస్తూ ఒక వెకిలి నవ్వుతో మామ అంటున్నాడు .

“ఆ అవును మామ ..ఇక్కడ మన ఊర్ల మైక్రో ఫైనాన్సు ఆఫీస్ లో  కలెక్షన్ బాయ్ వుద్యోగం ఉంది, చేరాలంటే బండి కావాలంటా, డిగ్రీ చేసిన వూరి పిల్లగానికే ఆ వుద్యోగం ఇస్తారంట. అందుకే రమేష్ అన్నతో మాట్లాడుతున్నాను.”

అంతా విని మళ్ళి తుప్పుక్కు అని ఉమ్మేసి “ఔరా ! షామీర్ ఇంట్లో నాయన రిటైర్ అయ్యి మంచాల ఉన్నాడు .,నీకు వేరే వుద్యోగం యేది దొరకలేదా ర..ఇప్పుడు బండెట్ల  గొంటావ్? ఏదైనా సెకండ్ హ్యాండ్ పాత బండి గిట్ల చూడు !”

“మామ! చూసిన కాని అవి మంచిగా లేవు, వాటిని కొన్నాక మల్ల రిపేర్ చేయించాలి…అందుకే కొత్త దే అడుగుతున్నా . రమేష్ అన్న ఒక పది వేలు కడితే ఇస్తా అన్నాడు, మిగతా పైసల్ నెల నెల జీతంలకెళ్ళి కడుతా.”

“అబ్బో ..సరే నీ ఇష్టం” అనేసి మామ పాన్ డబ్బా దగ్గరకు వెళ్ళాడు .

 ఇంటికొచ్చి నాన్న మంచంల కూర్చున్నా  ………”బేటా, వెళ్ళిన పని ఏమైంది? రమేష్  బండి ఇస్తా అన్నాడా?”

“పది  వేలు డౌన్ పేమెంట్ కడితే గురువారం బండి తీసుకోమన్నాడు” అని చెప్పిన నాన్నకు.

“అంత ఆలోచన ఎందుకు ర షామీర్ ! నేను ఇస్తా కదా నీకు పదివేలు .’బ్యాంకు ల నా ఎకౌంటుల మూడు లక్షలు ఉన్నాయి కదా అందులో ఒక పదివేలు తీసుకో. ఎలాగు నీకు వుద్యోగం బండి ఉంటే ఇస్తారు అంటున్నావు!” అప్పుడే వచ్చిన అమ్మ కూడా ‘నాన్న చెప్పినట్టు చెయ్యు’ అని అంది .

మధ్యతరగతి జీవితాలు ఇంతేనేమో! ఏది కొనాలన్నా అన్నీ ఆలోచించాలి.

  నాన్న బ్యాంకు అకౌంట్ లో అక్క పెళ్లి కోసం దాచిన మూడు లక్షలు మాత్రమే ఉనాయి, రిటైర్ అయాక వచ్చిన డబ్బు ఇంటి రిపేర్ కి నాన్న జబ్బు  తగ్గడానికి ఖర్చు  చేసాము. నాన్నకు నేను, అక్క, ఇంకో చెల్లె. చిన్న కుటుంబమే అయినా నాన్న జీతం మిగిలేది కాదు. రిటైర్ అయాక తన ఆరోగ్యం ఖరాబు కావడం, నా చదువు అయిపోవడం ఒకేసారి అయింది. ఇప్పుడు అక్క పెళ్లి చేయాలనీ నాన్న సంబందాలు చూస్తున్నారు.

ఈ పరిస్థితిలో కొడుకుగా నేను నాన్నకు సాయం చేయాలి ., సరిగ్గా ఇలాంటి సమయంలో అల్లాహ్ దయ వలన ఈ వుద్యోగం కోసం నా గురించి ఆ మేనేజర్ కు నా  దోస్తు చెప్పాడు. నా చదువు , కుటుంబ పరిస్థితి చూసి ఆ మేనేజర్ వుద్యోగం నాకే ఇస్తాను అన్నారు,  కాని బండి వుండాలని కండిషన్.

ఎందుకంటే చుట్టూ వున్న ఒక ఇరవై ఊర్లలో  వర్క్ కోసం తిరగాల్సి ఉంటుంది  .

అక్క పెళ్లి ఖాయం అయ్యే అంతలో ఉద్యోగం లో చేరితే నాన్నకు ఆసరా ఉండాలని నా ఆలోచన. రమేష్ అన్న కు ఫోన్ చేసి చెప్పిన గురువారం బండి తీసుకుంటా అని. బ్లాక్ కలర్ స్ప్లెండర్ , ఎప్పటి నుండో నేను కొనాలనుకుంటున్న బైక్ అది.

 ఆ రోజు గురువారం .  నాన్నతో కలిసి బ్యాంకులో పదివేలు తీసుకొని నేరుగా హీరో షోరూంకు నాన్నతో కలిసి వెళ్ళినా. అప్పటికే బండితో రమేష్ నవ్వుతూ ఎదురు చూస్తున్నాడు. పేపర్ వర్క్  చేసుకొని స్ప్లెండర్ బైక్ కీస్ నా చేతిలో పెట్టాడు. ఆనందంతో నా మొహం వెలిగింది. నాన్నను బండి మీద కూర్చోపెట్టుకొని రమేష్ కి నమస్తే చెప్పి ఇంటికి బయలుదేరాను కొత్త స్ప్లెండర్ బండి మీద .

ఇంటి దగ్గర అమ్మ అక్క చెల్లె ఎదురు చూస్తున్నారు. రాగానే అమ్మ నాతో “షామీర్!  అక్కతో కలిసి దర్గా వెళ్లి మొక్కి రా రా …అల్లాహ్ అంతా  మంచి చేస్తాడు” అని చెప్పింది.

దర్గా వెళ్లి దారిలో స్వీట్ షాప్ లో ఒక అరకిలో లడ్డు తీసుకొని ఇంటికి రాగానే అమ్మతో మాట్లాడుతూ లతీఫ్ మామ కనిపించాడు.

“ఏమి రా షామీర్! ….మంచి జోష్ మీద ఉన్నావ్ ! బండి కొన్నావు.. ” మామ మాటలకు నవ్వుతూ అమ్మ చేతిలో లడ్డు పాకెట్ పెట్టి ఏమి మాట్లాడకుండా మా దోస్త్ రాము ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి బండి స్టార్ట్ చేసినాను.

 జీవితం సాఫీగా గడుస్తుంది కొంచం ఇప్పుడు. చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. మైక్రో ఫైనాన్సు మేనేజర్ కి నా మీద మంచి అభిప్రాయం కలిగింది.

మా ఇంటి పక్కన  వుండే షేర్ సాహెబ్ మా అక్క కు ఒక మంచి సంబంధం చెప్పాడు. అబ్బాయి సింగరేణి బొగ్గు కంపెనీలో కాంట్రాక్టు ఫిట్టర్ గా పనిచేస్తాడు, నెలకు ఒక పన్నెండు వేలు జీతం, ఇంకో రెండేళ్ళు చేస్తే పర్మినెంట్ చేస్తారంట. ఒక్కడే కొడుకు . ఊర్లో  సొంత ఇల్లు వుంది.

అమ్మానాన్నలకు, నాకు ఈ సంబంధం నచ్చింది. పెళ్లి చూపులు ఆదివారం పెట్టుకున్నాము.  అంతా సాఫీగా జరిగింది.  పిల్లాపిల్లడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండ్రోజుల తరువాత కట్నకానుకల కోసం వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, పొద్దున్నే నాన్న, నేను, మా లతీఫ్ మామ కట్నం కోసం మాట్లాడటానికి వెళ్లిన్నాము.  లతీఫ్ మామ స్వభావం నాకు తెలుసు. తను పుల్ల ఎలా పెట్టాలా అని చూసే రకం. తను రావడం నాకు ఇష్టం లేదు  కాని మామ పెద్దవాడు ఇంకా పెళ్లి కొడుకు మేనమామ, లతీఫ్ మామ బచ్పన్  దోస్తులంటా ! అందరం కుర్చోన్నాము వాళ్ళ ఇంట్లో.. నాన్న పెళ్ళికొడుకు నాన్నతో మాట్లడుతున్నాడు , లతీఫ్ మామ పెళ్ళికొడుకు మామతో ముచ్చట్లలో ఉన్నాడు . నేను దేవుడికి మనసులో దండం పెట్టుకుంటున్నాను.  కట్నం తక్కువ వుండాలని, ఒక లక్ష నగదు, మూడు తులాల బంగారం, ఇంకా పెళ్లి కూతురు కోసం సామాను పర్నిచర్ …నాన్న వాళ్ళతో చెప్పాడు ఇంతే ఇవ్వగలము అని. సరే అందరు ఒపుకొన్నారు,

ఇంతలో పెళ్లి కొడుకు మేనమామ నాన్నతో “చూడండి ఇవ్వాళ్ళ అందరు పెళ్లి లో బైక్ పెడ్తున్నారు కట్నం కింద  మీరు మా వాడికి బైక్ పెట్టాల్సిందే అన్నాడు, నాన్న కుదరదు అని చెప్పాడు ఇంతో మా లతీఫ్ మామ నాన్న తో చూడు జహింగిర్ బావ…ఇంత దాకా వచ్చాక్కా బండి కోసం పరేషాన్ ఎందుకు? మన షామీర్ గాదిది కొత్త బండే కదా ! కొని రెండు నెలలే ఐంది, అది ఇద్దాము కట్నం కిందా అన్నాడు …ఒక్కసారిగా నాకు ఏదోలా అయింది. సరే మేము వెళ్లి కబురు చేస్తాం అని ఇంటికి వచ్చాము.

ఆ రోజు రాత్రి నాన్న నేను ఆలోచనలో పడ్డాము, నేను నాన్నతో అన్నాను … “నాన్న అక్క పెళ్లి ముఖ్యం మనకు,  బండి ఏముంది నాన్న మళ్లి కొందాము” .,

నాన్న నా తల మీద చేయి వేసి “మరి వుద్యోగం ఎలా?” అన్నాడు,

“నేను మేనేజర్  కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్దం” అన్నాను., అక్కడే వున్న అక్క కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి .

తెల్లారగానే ఆఫీస్ లో మేనేజర్ ని కలిసి విషయం చెప్పినాను, తను నా సమస్య అర్థం చేసుకొని ప్రత్యామ్నాయం ఆలోచిస్తా. ఏం భయపడకు షామీర్!  నీ వుద్యోగం నీదే” అన్నాడు, మేనేజర్ కి దండం పెట్టి బండి స్టార్ట్ చేసి పనికి వెళ్ళిపోయాను.

వచ్చే నెల పదో తారీకున పెళ్లి . పెళ్లి పనుల కోసం నాన్న నేను తిరుగుతున్నాము, చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది, మా స్తోమత ప్రకారం అయినంతలో చాలా బాగా పెళ్లి జరిగింది. అంత అయిపోయి పెళ్లి కారు , సర్వీసు వెళ్ళే సరికి రాత్రి ఒంటిగంట అయ్యింది. అక్క ఏడుపు ఆపుకోలేక పోయింది, నాకు ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అందరు వెళ్ళాక దూరంగా లతీఫ్ మామ, పెళ్ళికొడుకు మేనమామ నా బండి దగర ఏదో మాట్లాడుతున్నారు.  సలాం చెప్పి బండి స్టార్ట్ చేసి వాళ్ళ మామ నా దగర వచ్చి “షామీర్ పెళ్లి మంచిగా ఐంది, ఇక బండి నేను తీసుకొని వెళ్తున్నా.  నువ్ వలీమాకు వచ్చేటప్పుడు బండి పేపర్ లు మర్చిపోకు.  వెళ్తా మరి” అని నమస్తే చెప్పి నా బ్లాక్ స్ప్లెండర్ మీద వెళ్ళిపోయాడు…….అలానే చూస్తూ ఉన్న నేను ఏదో అలికిడి కావడంతో పక్కకు చూస్తే మా లతీఫ్ మామ జర్దాను తుప్పుకు తుప్పుకు అని ఉమ్మేస్తూ నా వైపు వస్తున్నాడు.

కొత్త బండి….అక్కతో పాటే వెళ్ళిపోయింది .. అల్లా అంతా మంచి చేస్తాడు.

–కార్తీక్ సాయిరాం

హోరు

ఇంటికి దగ్గరలో ఎలాటి సముద్రమూ లేదు, పోనీ అలాగని ఏ చిటాకమో చివరికి నీళ్ళగుంట అయినా లేదు. అయినా నాపిచ్చి గాని మూసీ మీదే ఆక్రమణలూ అద్దాల మేడలూ వచ్చాక ఇంకా నదులూ చెరువులూ ఎక్కడ? అయితేనేం ఈ సముద్రపు హోరు ఎక్కడిది? కొంచెం ఇలా ఏకాంతం వాలితే చాలు చెవులు దిబ్బళ్ళు వేసేట్టు ఈ హోరు…

నేనూ సమత చిన్నప్పుడు సముద్రం పక్కన బీచ్ లొ గంటలు గంటలు గడిపినా ఇలా ఎప్పుడూ అనిపించలేదు. అవును అప్పట్లో మద్రాస్ బీచ్ కి దగ్గరలో ఉన్న చిన్న ఇంట్లో పక్కపక్క పోర్షన్స్ లోనే ఉండే వారం ఇద్దరమూ . ఇంట్లో అమ్మ , నేను ,ఇద్దరు తమ్ముళ్ళు …నాన్న. నాన్నకు టీ నగర్ లో ఇరవై నాలుగ్గంటలూ కిటకిటలాడే బట్టల దుకాణం.

పొద్దున్న పూజా పునస్కారాలు భోజనం చేసి షాప్ కి వెళ్తే మళ్ళీ ఆయన తిరిగి వచ్చేది అర్ధరాత్రి పన్నెండు దాటాకే ,అందుకే మా చదువులు , మంచి చెడులన్నీ అమ్మే చూసుకునేది.

పక్కింట్లో ఉండేది సమత ,వాళ్ళమ్మ దేవిక ఇద్దరే . వాళ్ళ నాన్న గురించి ఎవరూ ఎప్పుడూ అడగలేదు , కాని దేవకీ గారు మాత్రం  మొహాన రకరకాల బొట్లు రోజుకొ రకం అలంకరించుకునే వారు.  ఆవిడ ఏదో ఆఫీస్ లో పెద్ద అఫీసరని చెప్పుకునే వారు.వాళ్ళ నాన్న మాత్రం ఎదో తప్పుచేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడని అనేవారు.  కాని ఒక్కరోజూ సమత కాని, వాళ్ళమ్మ గాని అయన ఊసే ఎత్తే వారు కాదు.

ఒకే కాంపౌండ్  లో ఉన్న రెండు ఇళ్ళు కొన్నప్పుడు; ఇద్దరికీ పెద్ద అభ్యంతరం అనిపించలేదు. కష్ట సుఖాల్లో , పండుగ పబ్బాల్లో కలిసి మెలిసి ఉండే వారం.

వాళ్ళింట్లో తల్లీ కూతుళ్లిద్దరూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడే వారు. దేవకీ గారే మంచి కాన్వెంట్ లో చదువుకున్నారట. అసలు సమత తండ్రి గురించి ఎవరికీ తెలియదు. పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కూడా కాదు. దేవకీ గారు కొత్త కొత్త ఫాషన్లు వదిలిపెట్టకుండా అనుకరిస్తూ ఎప్పుడు చూసినా ఉత్సాహానికి మారుపేరులా ఉండే వారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఒక నిశ్చలమైన నదిలా ఎంతో అందంగా మనోజ్ఞంగా అనిపించేవారు.

సమత మా ఇంట్లో అందరితోటీ చాలా బాగా కలిసిపోయింది. మాఇంట్లో అమ్మ చేసే మల్లెపూల లాంటి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు  ఎంతో ఇష్టంగా తినేది. అమ్మకూడా ఇంట్లో అమ్మాయి లాగానే చూసేది. ఏ పండగ వచ్చినా మాతో పాటు సమతకూ రకరకాల డ్రెస్ లు కొనేది. ఏ జాతరకో, పుణ్యక్షేత్రానికో వెళ్ళినా పూసలో, గాజులో కొనకపోతే అనుకోవాలి.

“ఎంతైనా ఆడపిల్ల ఉండే కళే వేరు “ అనేది.

“ పోనీ మించిపోయిందేమిటి , మరోసారి ..”అంటూ ఏడిపించేవాడు నాన్న.

నాకేమో దేవకీ ఆంటీ సాండ్ విచ్ లు , టోస్ట్ లు లాటివి బావుండేవి. చిన్నప్పుడు ఒకసారి  నా పుట్టిన రోజుకి  ఆవిడ కొనిచ్చిన పూలపూల చొక్కా ఎంత ఇష్టమో — అమ్మ చెప్పేది , రోజూ అదే వేసుకునే వాడినట … ఉతకాలి మొర్రో అన్నా వినకుండా … చివరికి అది దాచిపెడితే గాని వేరే షర్ట్ ఏదీ వేసుకోలేదట.

పిల్లలకి ఏ ఇల్లు ఎవరిదని పెద్ద తేడా కూడా తెలిసేది కాదు. అమ్మ ఇంటికి సుదూరంగా మరో రాష్ట్రం లో ఉన్నా పద్ధతులన్నీ తూచా  తప్పకుండా పాటించేది. ఆషాడ మాసంలో బోనాల పండుగ , బతుకమ్మ పేర్చడాలు,కృష్ణాష్టమి…పెద్దలకు బియ్యాలు ఇవ్వడం    వాటిన్నింటికీ దేవకీ గారు , సమత మాతోపాటే ఉండే వారు .అల్లాగే దేవకీ గారు వరలక్ష్మీ వ్రతం, అట్ల తద్దె , సంక్రాంతి పెద్ద గొప్పగా చేసినప్పుడు మేమందరం అక్కడే ఉండే వారం.

పేరుకి రెండు ఇళ్ళయినా ఎప్పుడు  ఎవరు ఎవరింట్లో ఉంటారో ఎప్పుడూ తెలిసేది కాదు.

చిన్నప్పుడు ఇద్దరం కలిసే చదువుకునే వాళ్ళం, ఒకరికొకరం సాయపడే వాళ్ళం. సమతకు లెఖ్ఖలు రావని నేను సాయం చేస్తే, తను నాకు ఇంగ్లీష్ హోమ వర్క్ చేసి పెట్టేది.

తొమ్మిదో తరగతిలో అనుకుంటా ఒకసారి సాయంత్రం ఆరున్నర దాటాక నా ఇంగ్లీష్ హోం వర్క్ కోసం వాళ్ళింటికి వెళ్లాను ఎప్పటిలా , తలుపు ఓరగా వేసుంది. కాస్త జడిపిద్దామని శబ్దం కాకుండా తలుపు తీసి లోపలకు అడుగు పెట్టె లోపలే దేవకీ గారి స్వరం వినబడింది,

“ నువ్వలా మాటిమాటికీ వాళ్ళింటికి వెళ్ళడం ఏంబాగాలేదు, ఇది వరకులా చిన్నపిల్లవు కాదు, అయినా వాళ్ళింట్లో అమ్మాయిలు ఉంటే అదో దారి అందరూ అబ్బాయిలే . ”

“ అమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు.నిన్నటి దాకా లేని తేడా ఇప్పుడెందుకు వస్తోంది, ” సమత గట్టిగానే అడిగింది.

“ ఆడపిల్లలు నిన్నటి దాకా ఉన్నట్టు ఇవాళ ఉన్నారా? నిన్నటిదాకా ఉన్నట్టు నువ్వున్నావా? ఉద్యోగం చేసినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వదిలేయ్యనా? అమ్మగా నా బాధ్యతా నాది. నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. పెరిగిన పిల్లవు,” నిశ్శబ్దంగా వెనక్కు వచ్చేశాను.

ఈ దెబ్బకు సమత నాతో మాట్లాడదనుకునాను కాని మర్నాడు సాయంత్రమే స్కూల్ అయాక ఇద్దరం బీచ్ కి వెళ్లి దూరంగా రాళ్ళమీద కూచున్నాం.

“చిన్నప్పటినుండి కలసిపెరిగాం , అప్పుడు లేని హద్దులు ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పు? ఏదేమైనా కానీ నిన్ను చూడందే,మాట్లాడందే నేను ఉండలేను, ” ఖచ్చితంగా చెప్పింది.

అవును అంతకు ముందు బహిరంగంగా అందరిముందూ కలిసి తిరిగే వాళ్ళం , ఇప్పుడు పెద్దలకు తెలియకుండా.

సమత కాలేజీ చదువుకు వచ్చేసరికి నాన్నకు కూడా ఏదో పెద్ద బిజినెస్ ఆఫర్ వచ్చి మద్రాస్ నుండి హైదరాబాద్ మారిపోయాం . అదేం చిత్రమో సరిగ్గా మేము మారే సమయానికి దేవకీ గారికి కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది.

ఇద్దరి ఇళ్ళూ కలిపి రియల్ ఎస్టేట్ వాడికి పెద్ద లాభానికే ఇచ్చేశారు.

హైదరాబాద్ లొ మంచి లొకేషన్ లొ ఇద్దరికీ పక్కపక్కనే ఇళ్ళు చూశాడు నాన్న.

కాలేజి చదువులకు వచ్చాక ఒకరికొకరం పెద్దగా సాయపడలేకపోయినా రోజుకోసారైనా కలిసి జరిగేవి జరుగు తున్నవి ఒకరికొకరం చెప్పుకుని చర్చించుకునే వాళ్ళం .

చివరికి ఇద్దరం  డాక్టర్లమైతే కష్టమని ,ఇల్లు వాకిలీ ఎవరు చూడాలని నేను మెడిసిన్ కి వెళ్తే తను ఫాషన్ డిజైనింగ్ లొ చేరింది.

మనకు ఇద్దరు పిల్లలు చాలు ఒకరిని మెడిసిన్ మరొకరిని ఇంజనీరింగ్ చదివిద్దామని అనుకున్నాము. మేము సెకండియర్ లో ఉండగా చిన్నగా మొదలయ్యాయి ఈ కొత్త గోడలు.

ఎప్పుడో 69 లో అణిగిపోయిన ప్రాంతీయత రాజకీయ లబ్ది కోసం మళ్ళీ తెర మీది కొచ్చింది.

గొడవలు గొడవలుగా ఉంది. ఎప్పుడు కాలేజీలు మూసేస్తారో ,ఎవరు ప్రాణ త్యాగం అంటారో తెలియడం లేదు. సమత కాస్త ఉదాసీనంగా మారిపోయింది.

“ ఈ రాజకీయాలు మనకెందుకు చెప్పు, మనం పరిచయం అయిన రోజున ఉన్నాయా ఇవి, మనం ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేమనుకున్న రోజున ఉన్నాయా?”

ఎన్నో మార్లు నచ్చజెప్పాను. “ అవును రవీ , అసలు నువ్వు లేకుండా నేను జీవితాన్నే ఆలోచించలేను. అదేమిటో విడివిడిగా చూస్తే అదివేరు ఇదివేరు అనిపిస్తుంది. కాని అడుగడుగునా ఆచారాలు, పద్ధతులు , ఆనవాయితీలు మళ్ళీ ప్రాంతాల పైనే ఆధారపడి ఉన్నాయి. అంతెందుకు , కూరల్లో పులుసూ బెల్లం వేసుకుంటామని ఆంటీ యే మొదట నవ్వేవారు. అల్లాగే మీరు అన్నిట్లో ఇంత అల్లం వెల్లుల్లి ముద్దా పారేస్తారని మా వాళ్లకు ఈసడింపు. ఏం అర్థం కావటం లేదు రవీ ” అనేది.

ఈ రెండేళ్ళుగా మా రెండిళ్ళ మధ్య కాస్త స్నేహ వాతావరణం తగ్గిందనే చెప్పాలి. ఎవరిల్లు ఎవరి సరదాలు వాళ్ళవిగా ఉంది. బహుశా మా ఇంట్లోనూ  మార్పు అనేది చల్లగా ఏ మూల నుండో దూరి ఉంటుంది.

ఒకరినొకరు పిలుచుకోడం తగ్గిపోయింది. కూరలు వంటలు ఇచ్చిపుచ్చుకోడాలు తగ్గిపోయాయి. అమ్మకు మా ప్రాంతం అనే గర్వం కాస్త వచ్చింది.

“ఇంకెంత ఇవ్వాలో రేపో తేలిపోతుంది. ఎగబడి వచ్చిన నా బిడ్డలంతా తోకముడుసుకొని పోవాలె “అనేది, రెండుమూడు సార్లు నేనే విన్నాను.

“వెర్రినామొహాలు అంతా  నవాబుల చేతుల్లో పెట్టి కూచ్చున్నారు,ఇప్పుడు నాలుగక్షరాలు నేర్చే సరికి పనికిరాకపోతున్నాము” దేవకీ గారు రుసరుసలాడేది.

నాకు నవ్వొచ్చేది.

ఈ నేల ఈ గాలి ప్రతి వ్యక్తీ వాళ్ళ అబ్బ సొత్తు  అయినట్టు దెబ్బలాడుకోడం… మొన్నమొన్నటి వరకు వాళ్ళూ, మేమూ పరాయి రాష్ట్రంలోనే గా ఉన్నాము. అక్కడి వాళ్ళు మమ్మల్నిలా వేరుగా చూడలేదే. మా పనేదో మేం చేసుకున్నాం, కలిసోచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం.

మరి పుట్టి పెరిగిన చెన్నై మా స్వంత రాష్ట్రమైతే ఇది ఇద్దరికీ వేరే రాష్ట్రమేగా?

ఎక్కడి నుండి పుట్టుకు వస్తోంది ఈ స్వార్ధం నాదనే స్వార్ధం , నేల నాది గాలి నాది ఆకాశం నాదనే స్వార్ధం? వీటికి నేనేం చేశాను? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడిక్కడికి వచ్చి మా తాతల నేల నాదనడం?

ఎక్కడికక్కడ ఇలా గోడలు కట్టుకుంటూ పొతే చివరికి ఎవరి చుట్టూ వారికి ఒకగోడ , ఎవరి చుట్టూ వారికి ఒక సముద్రం , దాని హోరు మిగులుతాయేమో!

అమెరికా వెళ్ళినా అంతరిక్షాని కెళ్ళినా ఇక్కడి హక్కులు మాత్రం భద్రంగా  పదిల పరచుకునే తీరతారా ? నా మాతృభూమికి నేనేం చెయ్యగలనన్నది ఆలోచించాలి గాని ..

ఇవెక్కడైనా పోనీ నా సంగతీ, సమత సంగతీ తేలాలి.

ఖచ్చితంగా ఈ జీవిత సగభాగం సమత తప్ప మరొకరు కాలేరు.

భగవంతుడా ఈ హోరునుండి  ఎలా బయట పడాలి?

సమతను కలుసుకుని మూడు రోజులైంది. ఉహు తను కనిపించకపోతేనే తోచదు.

సాయంత్రం సమతను కలిసే వరకూ ఆ హోరు అలాగే కొనసాగింది.

చీకటి పడ్డాక కూడా చాలా సేపు బిర్లా మందిర్ మెట్లమీద అలా కూర్చుండి పోయాం నిశ్శబ్దంగా.

ఎప్పటికో ఏదో చెబ్దామని తలెత్తాను .సరిగ్గా అదే ఉద్దేశ్యంతో సమత నావైపు చూసింది.

ఇద్దరమూ మాట్లాడలేదు.

మళ్ళీ కాస్సేపటికి కాస్త స్థైర్యం కూడగట్టుకుని పెదవి కదిపాను.

“సమతా ఈ ప్రాంతీయ విభజన ఇవ్వాళా జరగవచ్చు, మరో పదేళ్లకు జరగవచ్చు, జరక్కపోనూ వచ్చు. మనం మాత్రం చిన్నప్పటినుండీ పెంచుకున్న ప్రేమ వృక్షం ఇప్పుడిలా ఎవరికోసమో నరికేసుకోము. కాని నీకూ నాకూ సంబంధించినంతవరకే కాదు రేపటి మన బిడ్డల తరానికీ ఈ హోరు , ఈ ఏకాంతపు పోరు వద్దు సమతా. మనబిడ్డలు ఎక్కడి వారవుతారు? ఆలోచించు సమతా ఏ ప్రాంతమయినా మన ఇద్దరిదీ నువ్వు వేరు నేను వేరు కానప్పుడు , నాకు సంబందించిన వన్నీ నీవి, అలాగే నీకు చెందిన వన్నీ నావికూడా. ఏమంటావు”

సమత మాట్లాడలేదు. సుదూరంగా కనిపిస్తున్న బుద్ధ విగ్రహాన్ని చూస్తోంది.

నా మనసులో హోరు మాత్రం చిత్రంగా మాయమయింది.

“రా సమతా , వెళ్దాం చాలా రాత్రయింది” లేచి చెయ్యందించాను.

***

swathi –స్వాతి శ్రీపాద

 

 

 

 

 

 

 

 

జన్మభూమి

1016912_628010210545356_685997217_n

ప్రసాద మూర్తి

 

అమ్మనీ నాన్ననీ చూద్దామని ఊరెళ్ళాను . నేనొచ్చానని ఆనందం వారి కళ్ళల్లో,  తీసుకుపోతాడేమో అని బూచాడిని చూసిన పిల్లల్లా గుబులు వారి గుండెల్లో ఒకేసారి చూశాను. నాన్న తన మోకాలు చూపించి  అటూ ఇటూ ఊగించి ఇప్పుడు బాగుందని కూర్చుని లేచి మరీ నవ్వాడు. అమ్మ తన చేయి చూపించి అతుక్కుపోయింది నానా అంటూ  అటూ ఇటూ తిప్పి నన్ను నమ్మించడానికి తెగతిప్పలుపడింది. ఒంటరిగా ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నారన్న సంతోషం ఎప్పుడూ ఒక విచారాన్ని వెంటబెట్టుకుని నన్నంటిపెట్టుకుని ఉంటుంది. ఆరోగ్యంగానే ఉన్నామన్న ధీమాతో అతిహుషారులో వాళ్ళు అప్పుడప్పుడూ కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటూ ఉంటారు.

అప్పుడే సమస్య అంతా. వాళ్ళు నాతో రారు. నేను వాళ్ళతో ఉండలేను. డబ్బెంత పంపినా..మనుషుల్ని పెట్టినా ఇదో తెగని ఇనపతీగ సమస్య.   నేను అలా వారిని చూస్తూనే ఇల్లంతా కలయతిరిగాను. అమ్మ నా కళ్ళల్లో ఏదో వెదుకుతుంది. నాన్న నా కదలికల్లో ఏదో వెదుకుతాడు. నేను ఇల్లంతా తిరుగుతున్నట్టే వారి చుట్టూ తిరుగుతూ నా ఆరాలేవో నేను తీస్తాను. అమ్మ కళ్ళల్లో నా బాల్యపు ఆకాశాలు కనిపిస్తాయి. నా కళ్ళల్లో అమ్మ తన యవ్వన కాలపు బొమ్మల్ని చూస్తుంది.  

నా కూడా మా ఊరు చూద్దామని నాతో హైద్రాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు రమేష్ లోపలేమనుకుంటున్నాడో కాని అంతా మౌనంగా చూస్తున్నాడు. వాడు ఆర్టిస్ట్. నేను జర్నలిస్టు. ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. సికిందరాబాద్ లో జన్మభూమి ట్రైన్ పట్టుకోని తాడేపల్లిగూడెంలో దిగి మా ఊరు చేరుకునే సరికి సాయంత్రమైంది. ఊరంతా చీకటి. ఊళ్ళో చీకటి మా ఇంట్లో కూడా తిష్ట వేసింది. పరిచయాలయ్యాయి.  ఎప్పుడో కొనిచ్చిన ఛార్జింగ్ లైటు బాగానే పనిచేస్తున్నట్టుంది. అది పట్టుకోని అమ్మ మా కూడా ఒకటే తిరుగుడు. నాన్న హాల్లో కూర్చుని ఒంటరిగా గోడతో ఏదో మాట్లాడుతున్నట్టుగా పోజు పెట్టాడు. రమేష్ ఎప్పడూ ఆట పట్టిస్తూ ఆంధ్రా దొంగా అని ముద్దుగా పిలుస్తుంటాడు. మేమెక్కిన రైలు తెలంగాణా బోర్డర్ దాటగానే సమయం కోసం ఎదురుచూస్తున్న వాడిలా పచ్చని పొలాలను చూసి ఇక ఒకటే లంకించుకున్నాడు. ప్రపంచంలో పచ్చదనమంతా మీ దగ్గరే పెట్టుకున్నారు కదరా దొంగల్లారా అని దారి పొడవునా తెగ తిట్లు. ఇదంతా మమ్మల్ని దోచుకున్నదే కదా అని ఒకటే శాపనార్థాలు. పక్కనున్న ఆంధ్రావాళ్ళు వింటే వాడితో తగాదా పడతారని నా భయం నాది.

కాని అలా ఏమీ జరగలేదు. వాడు నన్నే ఉడికిస్తూ..ఉడికిపోతూ..రైలుబండిలా దారిపొడవునా మోతే మోత. వాడి మాటలు నాకు అలవాటే కదా నేను నవ్వుతూనే ఉన్నాను. ఎప్పుడూ మా ఇంటికి రాలేదని ఒకసారి కొల్లేరు ట్రిప్ వేద్దామని వచ్చాం. మా ఇంటికి రాగానే దారిలో కానిచ్చిన నసుగుడంతా మర్చిపోయాడు. మా అమ్మానాన్న కూడా నేను, నా కూడా వాళ్ళు, మా కూడా రమేష్.. ఇలా అలిసిపోయేదాకా అటూ ఇటూ ఆ మాటలూ ఈ మాటలూ చెప్పుకుంటూ ఇల్లంతా  తిరిగాం. ఇంట్లో ప్రతీగోడ మీదా నా బాల్యం నీడల్ని తడిమి తడిమి మరీ మరీ చూసుకున్నాను. ఏమిటీ తిరుగుడు అనుకున్నాడో ఏమో ఒక్కసారిగా కుర్చీలో కూర్చుని “ అమ్మా కరెంటు ఎప్పుడొస్తుంది” అని అడిగాడు రమేష్.  అమ్మకి ఏం చెప్పాలో తెలియక “ ఏమయ్యో..కరెంటంట ఎప్పుడొస్తాది?” అని నాన్న వైపు మా మిత్రుడి ప్రశ్నను ఫార్వర్డ్ చేసింది అమ్మ.  ఆ..అంటూ సాగదీస్తూ నాన్న ఓ సారి ఫోనందుకో అన్నాడు. ఎందుకో అని అమ్మ నవ్వుతూ అడిగింది. “ఛీఫ్ మినిస్టర్ ని అడిగి చెప్తాను.” నాన్న వేసిన ఈ జోక్ తో చెలికాడు రమేష్ ఒకటే పగలబడి నవ్వాడు. ఏంట్రా సంపదంతా మీ దగ్గరే పెట్టుకుని మీకెందుకిన్ని కష్టాలు? అమాయకంగా అడిగాడు రమేష్. పగటికీ రాత్రికీ తేడా ఏంటో జనానికి తెలియజెప్పాలన్న తాపత్రయంలో మన నాయకులు ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారు.  ఇందులో మాత్రం ప్రాంతీయభేదం లేదురా బాబూ.

అదోలా చూశాడు వాడు. ఇంతలో అమ్మ అందుకుంది. “కరెంటు మాట మర్చిపోయాం నాయనా. అది వచ్చినప్పుడు దాని అవసరం ఉండదు. అవసరం ఉన్నప్పుడు అదుండదు.”

‘దొంగలకు కూడా కష్టాలు తప్పవన్నమాట.’  చెవిలో గొణిగాడు రమేష్. ఇంతలో నాన్న బాత్ రూమ్ లో నీళ్ళు పెట్టాడు. డెభ్భయ్యేళ్ళు వచ్చినా తానింకా మిస్టర్ పెర్ ఫెక్ట్ అని  నిరూపించుకోవడానికి నాన్న ఒకటే ప్రదర్శన పెడతాడు. నేను వచ్చినప్పుడల్లా ఇది తప్పదు. అమ్మ కూడా చెంగుచెంగున తిరుగుతూ క్షణాల్లో వంట చేసి పడేసింది. ఎవరూ లేక ఇల్లు బోసిపోయినా వారు మాత్రం కళకళలాడుతూ  అప్పుడే పెళ్ళయిన కొత్త జంటలా ఉత్సాహంగా కనిపించారు మా వాడికి. నేను కూడా వీళ్ళెప్పటికీ ఇంతే ఆరోగ్యంగా ఉంటే ఎంత బావుండు అని ఆశపడుతూ ఉంటాను. అమ్మానాన్న కళ్ళ చుట్టూ కాళ్ళ చుట్టూ వారి కలల చుట్టూ ఒరుసుకుంటూ ప్రవహించిన నా బాల్యం తలపులు ఇక్కడికొచ్చినప్పుడల్లా నన్ను చుట్టుముడతాయి. వారు కూడా నాతో పాటే వస్తే అమ్మానాన్న పిల్లలై నా చుట్టూ తిరిగితే ఎంత బావుండు అనుకుంటాను. కాని వారికి పోటీ వచ్చేవారు నా చుట్టూ చాలా మందే ఉన్నారన్న స్పృహ నాకంటె వీళ్ళకే ఎక్కువ. అందుకే రారు.

“అదృష్టంరా మీ అమ్మా నాన్నా ఆరోగ్యంగా ఉన్నారు.” రమేష్ నార్మల్ గానే అన్నాడు.

“అంత లేదు. నేనెక్కడ నాతో తీసుకుపోతానో అని వారి హంగామా అంతే. నాకు పంచిచ్చిన రక్తం కంటె నాతో పంచుకున్న రక్తం మీద వారికి నమ్మకం లేదు.”

రాత్రి భోజనాల దగ్గర అమ్మ కొసరి కొసరి వడ్డించింది. అమ్మలంతా ఒకటే. నేను రమేష్ వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు రమేష్ అమ్మ చేసిన హడావుడి..చూపిన ప్రేమ మర్చిపోలేను. అమ్మ ప్రేమ తట్టుకోలేక పోతున్నాడు  రమేష్.  కొంచెం ఇబ్బందిగానే ఉన్నా చాలా త్వరగా వాళ్ళమ్మకీ మా అమ్మకీ తేడా మర్చిపోయి చనువుగానే మెలగడం మొదలుపెట్టాడు. ఆ చనువుతోనే ఏవేవో అడగడం స్టార్ట్ చేశాడు. అమ్మ, నాన్నా అంతే చనువుగా జవాబులు చెప్తున్నారు.

“ మీరు హాయిగా మాతోనే హైద్రాబాద్ లో ఉండొచ్చుగా అమ్మా. ఇక్కడెందుకు ఇంత ఒంటరిగా ఈ లంకంత కొంపలో?” అడగరాని క్వశ్చన్ అడిగేశాడు. అంతే అమ్మా నాన్నా బిగుసుకుపోయారు. మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు.

“అన్నట్టు పెద్దోడు పచ్చడి తీసుకు వెళతాడు. ఆ జాడీ తీసి కింద పెడతారా? ఎక్కడో అటకమీద పెడతారు. ఈయనగారి పచ్చడికోసమే దొంగలొస్తారు కాబోలు!” టాపిక్ డైవర్ట్ చేయడానికి  అమ్మప్రయత్నం.

‘అవును కదా..తీస్తానుండు!’ అని నాన్న అక్కడ నుండి లేచాడు. అమ్మ కూడా ఆయన్ని అనుసరించింది.

వాడికర్థంకాక నా మొహం చూశాడు.   ఏతల్లిదండ్రులూ రారు. ఉన్న ఊరినీ, పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసిన ఇంటినీ వదిలి అస్సలు రారు. పక్కనున్న పుల్లమ్మో ఎల్లమ్మో వారికి కొడుకుల కంటె కూతుళ్ళ కంటె దగ్గరవుతారు. వాళ్ళే సమస్తం చూసుకుంటారు. వాళ్ళు రాలేరు. బలవంతంగా తీసుకు వెళ్ళినా పోలీసులు ఎత్తుకుపోతున్న ఫీలింగ్.  ఒకవేళ మనతోపాటు వచ్చినా జైల్లో ఉన్నట్టు ఇబ్బంది. ఎవరి పనుల్లో వాళ్ళం పోయి, రాత్రి ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారో..కొడుకూ కోడలూ మనవలూ ఎవరూ ఎవరితోనూ కనీసం మాట్లాడుకోవడాల్లేని బిజీబిజీ. ఈ లైఫ్ లేమిటో వారికసలు అర్థం కాదు. వద్దురా బాబూ! మన దగ్గర అన్నీ ఉన్నా ఉండాల్సిందే ఏదో లేదని వాళ్ళకు తెలుసు. రెండు రోజులకే సంచులు సర్దేస్తారు. అలాగని మనం ఊళ్ళకు  వచ్చేసి వారితోనే ఉండిపోవాలనీ కోరుకోరు. సంపాదన లేని బిడ్డలంటే వారికీ కొంచెం నలుగురిలో నగుబాటే మరి. ఇరుగుపొరుగుతో మన గురించి గొప్పులు చెప్పుకోవాలిగా. అంతే! అమ్మా నాన్న మనమూ  చిన్నప్పుడు కలిసి ఏం ఉన్నామో ఏం తిన్నమో.. ఏం గడిపామో అదే మనకు చివరికి మిగిలేది. వీలు కాని జీవితంలోంచి కొంత టైమ్ తీసి వారికోసం వీలుచేసుకుని అప్పుడప్పుడూ వెళ్ళడం మినహా మరో గత్యంతరం లేదు. మనం వెళ్ళినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం మాత్రం ఏ ప్రపంచ భాషలోనూ ఎవడూ వర్ణించి ఉండడు. కానీ ఈ మధ్య నేనొచ్చినప్పుడల్లా స్కూలుకి రాకుండా మారాం చేసే పిల్లల్ని తన  కూడా తీసుకు వెళ్ళడానికి వచ్చే బడిపంతుల్ని చూసినట్టు  నన్ను అనుమానంగా చూస్తారు. ఈ సారి ఏమైనా రమేష్ తో తీవ్ర ప్రయత్నం చేయించైనా సరే  కూడా తీసుకుపోవాలి. అదీ నా ప్లాన్. లేదంటే చెయ్యి విరిగిందనో..జబ్బు చేసిందనో..మాటిమాటికీ ఎవరెవరో ఫోన్లు చేయడం అస్సలు తట్టుకోలేం.

దొడ్లో  ఆరుబయట ఆకాశం కింద మంచాలు వేసుకున్నాం. అమ్మా నాన్న త్వరగానే పడుకుండిపోయారు.

మేం ఏదేదో మాట్లాడుకుంటూ ఆకాశాన్ని చూస్తూ రాత్రిని ఆస్వాదిస్తూ చుక్కల్ని లెక్కపెడుతూ ఎప్పుడో కాని నిద్రలోకి జారుకోలేదు. నగరాల్లో దొరకని అనుభవం కదా. బాల్యంలో పొందిన ఆనందం కదా. ఆ జ్నాపకాలు, ఇప్పటి ఇరుకు బతుకుల చికాకుల అనుభవాలు, ఇద్దరికీ ఒకే గతం కాబట్టి మాటలూ మౌనం కలగలిసిన ముచ్చటైన రాత్రిని బాగానే ఎంజాయ్ చేశాము. నాలుగింటికే నాన్న లేచిపోయాడు. చీపురు పట్టుకుని వాకిలి..ఇల్లూ పరపరా ఊడ్చేశాడు. అమ్మ కూడా లేచి తెల్లారక ముందే స్నానం చేసి పనుల్లో పడింది. వాళ్ళ రొటీన్ అలవాటే కాబట్టి నేనూ లేచి కాసేపు వారి చుట్టూ తిరుగుతూ ఏవేవో కబుర్లు చెప్తూ గడిపాను.

నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అమ్మ నన్ను తెల్లవారు జామునే లేపేది. లాంతరు దగ్గర నేను చదువుకుంటుంటే అమ్మ మజ్జిగ కవ్వం తిప్పేది. ఆ శబ్దం భలే ఉంటుంది. బహుశా ఆ సవ్వడి వినే దొడ్లో మందారం..నంది వర్థనం, గన్నేరు పూలు రేకులు విప్పి నవ్వేవి. ఆ శబ్దం తాకిడికే ఎద్దుల మెడల్లో గంటలు ఘల్లున మోగేవి. పనిపాటలకు పోయే రైతుల కూలీల అరుపులు కేకలు మొదలయ్యేవి. అమ్మ కవ్వం చప్పుడు ఆగిందంటే అక్కడొక వెన్నెల ముద్ద నాకోసం తయారైనట్టే. దానికోసమే త్వరగా మొహం కడుక్కోవడం జరిగేది.  ఇప్పుడు నగరంలో బిజీబిజీ జీవితం..ఇద్దరు పిల్లల అల్లరి..అప్పుడప్పుడూ ఏ తెల్లారుజామునో అమ్మ కవ్వం చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కానీ అమ్మే కనిపించదు.

రమేష్ లేచినట్టున్నాడు. అప్పుడే తెల్లగా తెల్లారి వెలుగులు మా ఇంటి పెరటి గుమ్మం ముందు తచ్చాడుతున్నాయి చుట్టం ఎవరో వచ్చారని చూడ్డానికి వచ్చినట్టు. చిన్న బల్లమీద ఉన్న బిందెలో నీళ్ళు ముంచుకుని తాగబోయాడు రమేష్. అమ్మ ఎక్కడ చూసిందో కాని ఒక్కసారిగా అరిచింది.

‘వద్దు నాయనా!ఆ నీళ్ళు కాదు. ఆగు ఇస్తాను’ అని లోపలికి వెళ్ళి చెంబు నిండా మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆశ్చర్యం రమేష్ మొహం మీద మెరుపులా మెరిసింది.

“ఒక్క చుక్క మంచినీరు దొరకడం లేదురా. పొరుగూరి నుంచి వస్తున్న మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు నువ్వు తాగబోయిన నీళ్ళు కూడా స్థానిక ఎమ్మల్యే గారి పుణ్యమా అని టాంకుతో చేస్తున్న సరఫరా. అవి తాగడానికి పనికి రావని వంటకు వాడుతున్నాం. ఈ సరఫరా కూడా ఈ మధ్యనే మొదలు పెట్టారు. త్వరలో ఎన్నికలొస్తన్నాయ్ కదా. “ అమ్మ వివరణ.

“అరేయ్..వచ్చేప్పుడు పెద్దపెద్ద ట్యాంకులు చూశాం కదా?” రమేష్ ఆశ్చర్యం.

“బోర్డుంది..రోడ్డు లేదన్నట్టు..ట్యాంకులుంటాయి. నీళ్ళే ఉండవు.” నా సవరణ

“అదేంటిరా మా దగ్గర  దొంగిలించిన నీరంతా ఏమైపోయింది? అది  మీ  దాహం తీర్చడం లేదా..? ఆశ్చర్యంగా ఉందే?” నాకు మాత్రమే వినపడే  రమేష్ ప్రశ్న.

“అంత ఆశ్చర్యం వద్దురా.  చుట్టూ నదులు కాల్వలు  నిండుగా ప్రవహిస్తున్నాయి నిజమే. కాని అవి కొందరి ఇళ్ళవైపే పరుగులు తీస్తాయి.  ఇప్పుడిక్కడ బీద బిక్కీ ఇళ్ళల్లో  మాత్రమే కాదు ..మధ్యతరగతి  ఇళ్ళల్లో కూడా   ఎడారి ఇసుక మేటలు  వేసింది. నువ్వు నమ్మలేవులే కాని రా..అలా ఊరవతలకి వెళ్ళొద్దాం పద!”

ఇద్దరం బయటపడ్డాం. మా ఇంటి పక్కనే ఒక చెరువు ఉండేది. ఇది చిన్న చెరువు. మరొకటి పెద్ద చెరువు.  ఇందులో అసలు నీటి చుక్క జాడలే లేవు. గట్టుతో సమానంగా నేలపూడుకుపోయింది. నెర్రలిచ్చిన నేలలా మారింది. పుట్టి పెరిగిన తర్వాత ఇంత వరకు ఈ చెరువు ఇలా ఎండిపోవడం చూడలేదు.  ఒక్క పరుగులో ఇంట్లోకి వెళ్ళి అమ్మ అమ్మా అని కేకలు పెట్టాను. అమ్మ కంగారు పడి వంట గదినుంచి బయటకొచ్చింది.

“అమ్మా చెరువేంటే అలా ఎండిపోయింది?”

“అదా నాయనా..పూడిక తీయిస్తామని ఎండబెట్టారు. తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఏంటో  చెరువెవరిక్కావాలి.. చెరువులో నీళ్ళెవరిక్కావాలి..జనమెవరిక్కావాలి..జనం పడే బాధలెవరిక్కావాలి!” ఇలా గొణుక్కుంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది.

‘త్వరగా వచ్చేయండిరా..వేడివేడిగా దోసెలు వేస్తాను. చల్లారితే తినవుగా.’ అంటూ అరుస్తూ తన పనిలో తాను పడిపోయింది అమ్మ.

మా ఇంటి పక్క చెరువుతో నాకు చాలా జ్నాపకాలే ఉన్నాయి. చెరువు గట్టుమీదున్న రైలుచెట్టు  పైనుంచి అందులోకి దూకే వాళ్ళం. నన్ను తరుముకుంటూ వచ్చే నాన్నమ్మని ఏడిపించడానికి అందులో దూకి తామరాకుల కింద నక్కేవాడిని.  అప్పట్లో చెరువు తాటిచెట్టంత లోతుగా ఉండేది. నేనెక్కడ మునిగిపోతానో అని నానమ్మకు భయం. అందుకే ఆ వేట. నాకదో ఆట.  అంత లోతైన చెరువు ఎందుకు  ఎండిపోయిందో..అందులో  ఉండాల్సిన నీరు మాయమైపోయి మట్టి ఎలా పేరుకు పోయిందో కాని..ఆ పగుళ్ళిచ్చిన చెరువులో నాన్నమ్మ బొమ్మ కదిలినట్టనిపించి త్రుళ్ళిపడ్డాను.  మనుషులకు మట్టిని మాత్రమే మిగిల్చి..నీటిని మాత్రం కొందరి ఇళ్ళల్లో ఉరకేలేసే ఆనంద తరంగాలుగా మార్చుకున్నచిత్రాలు రమేష్ కి తీరుబడిగా ఎప్పుడైనా వివరించి చెప్పాలి.

నా తర్జనభర్జన వాడికి అర్థమైనట్టుంది?

“అరే ఇంతకీ మనలో మన మాట. మీక్కూడా ఈ నీటి కష్టాలేంట్రా?” మళ్ళీ ఉడికించడానికి రమేష్ ప్రయత్నం. చిరునవ్వే నా సమాధానం.

అలా నడుచుకుంటూ మా ఇంటికి అతి సమీపంలో ఆనుకుని ఉన్న పొలాల వైపు  వెళ్ళాం.  ఒకప్పుడు మా ఇంటి చుట్టూ పొలాలే ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు చేపల చెరువులు..రొయ్యల చెరువులు ఎక్కువయ్యాయి. వాటిలోనుంచి విడుదల చేసే మురికి నీరు కాల్వల్లో ప్రవహస్తోంది.  తెలిసిన ఒక మిత్రుడి చెరువు దగ్గరకు రమేష్ ని  తీసుకెళ్ళాను. అందులో చేపల పట్టుబడి జరుగుతోంది. ధాన్యాన్ని గుట్టలుగా వేసినట్టు చేపల్ని రాశులు పోసి ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎక్కించడం వాడికి చూడ ముచ్చటగా అనిపించింది.

02_13_Tribute-Dr-Rao-Painting

అలా ఆ చెరువులు దాటుకుని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్ళాను. రమేష్ సందేహాల శస్త్రాలు సంధించక ముందే వాడికి చెప్పాల్సిన విషయాలు చెప్పాను.

“ ఇక్కడ చుట్టూ చాలా మందికి పొలాలు ఉండేవి. అవి రానురాను కొందరికే సొంతమయ్యాయి. వేల మంది భూములు లేని వారిగా మారిపోతే పదుల సంఖ్యలో పెద్దలు మాత్రమే ఇలా చేపలు..రొయ్యల  గుట్టల మీద నిలబడి మీసాలు మెలేస్తున్నారు. మా చిన్నప్పుడు కొల్లేరు వ్యవసాయం కోసమని ఊళ్ళో కోమటాయన దగ్గర నాన్న చేసిన చిల్లరమల్లర అప్పులకు చెల్లుచీటీగా మా పొలాలు గల్లంతయ్యాయి.  ఇక్కడుండాల్సిన మా పొలాలు  ఏ చెరువులో కలిసిపోయాయో ఇప్పుడు పోల్చుకోలేం. ఊళ్ళో బలిసిన వారు బక్కజనుల  పొలాలను సొంతం చేసుకున్నారు. మా చిన్న తాతకు ఊళ్లో వందెకరాలు ఉండేవట. కానీ ఆయన ముగ్గురు కొడుకులు ఇప్పుడు మూడూళ్లలో ఉన్నారు. ఊళ్లో మాత్రం వారికి సెంటు భూమి మిగల్లేదు.  హైదరాబాదైనా ఆగడాల్లంకైనా సాగుతున్న నీతి ఒక్కటే. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా మార్చేయడం. ఇక్కడే కాదు. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కొల్లేరులో కూడా ఇదే పరిస్థతి. అక్కడకు మనం టిఫిన్ చేసి బయలుదేరదాం. నా చిన్ననాటి చేలాగాడు రాంబాబు వస్తాడు. వాడు మనల్ని కొల్లేరు తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేశాడు. “

ఇలా చెప్తున్నంతలోనే రాంబాబు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

“ఏరా రాంబాబు! ఏంటి సంగతులు. వీడు నా ఆప్త మిత్రుడు రమేష్. ఆంధ్రా దొంగలు ఏం తింటారో ఎలా ఉంటారో కళ్ళారా తిలకిద్దామని వచ్చాడు.” రాంబాబుకి రమేష్ ని పరిచయం చేశాను.

“ఏం కాదులేరా! కూడా ఇంకో దొంగను పెట్టుకుని వచ్చావు. ఎలాగైనా మీ అమ్మానాన్నని తీసుకుపోదామని. అది జరిగే పని కాదులే.” రాంబాబు ముందే నన్ను బెదరగొట్టాడు.

ఇద్దరూ హలో అంటే హలో అనుకున్నారు. రాంబాబు డిగ్రీ మథ్యలోనే చదువుకు స్వస్తిచెప్పి కుటుంబ పోషణార్థం కూలీగా మారిపోయాడు. అన్న అమెరికా వెళ్లిపోయాక ముసలి తల్లిదండ్రులకు అండగా.. ఉన్న ఊరినే నమ్మకుని ఉండిపోయాడు. రాంబాబు సైకిల్ ని కాల్వ పక్కనే నిలబెట్టి మాతో కొంత దూరం నడుచుకుంటూ వచ్చాడు.

ఊరిని ఆనుకుని ఉన్న పొలాల మధ్య మరుగుదొడ్డిలాంటి దారిని దాటుకుని కొంత దూరం నడిస్తే మాదిగ్గూడెం వస్తుంది. ఊళ్ళో చచ్చిన గొడ్ల అస్థిపంజరాలతో కంపుకొట్టే వాతావరణం మధ్య గూడెం జనాలు కాపురాలుండేవారు. మా నాన్న చేసే కొల్లేటి కమతాల్లో గూడెం జనాలు కొందరు పనిచేసేవారు. పనే కాదు. ఆ కమతాల్లో వారికి వాటా కూడా ఉండేది. అలా చిన్నప్పటి నుంచి దావేదు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళబ్బాయే రాంబాబు. వాడిని రాంబాబు అని పిలిచేది నేను ఒక్కడినే. ఊళ్లో జనమంతా వాణ్ణి రామిగా అనో చిన్ని దావేదుగాడనో  పిలుస్తారు.

“ఒరేయ్ రాంబాబు..ఇక్కడ మీ గూడెం ఆనవాళ్ళేమీ కనిపించడం లేదు. ఏంటి సంగతి?”

“ఇక్కడ గూడేన్ని లేపి ఊరవతల కట్టిచ్చిన ఇందిరమ్మ ఇళ్ళల్లో కూర్చోబెట్టారుగా.. తెలియదా..?” అన్నాడు రాంబాబు. ఈ మధ్య చాలాసార్లు వచ్చినా రాంబాబును కలవడం కుదురలేదు. అందుకే ఈ మార్పు తెలుసుకోలేకపోయాను.

వారసత్వంగా వచ్చిన ఇళ్ళూ ఊరవతలే. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళూ ఊరవతలేనా?  కనీసం ఇప్పుడు కట్టిన ఇళ్ళన్నా ఊరి మధ్య కడితే ఎంత బావుండు. నాలో మెదిలిన ప్రశ్న రాంబాబుకు అర్థమైనట్టుంది.  ఒక చిన్న నవ్వు వదిలి ముందుకు కదిలాడు. రాంబాబు వాళ్ళ గుడిసె ఎక్కడ ఉండేదో ఆ దిబ్బను చూపిస్తేనే కాని నాకు జ్నాపకం రాలేదు. ఇక్కడ ఒకప్పుడు ఒక జన సమూహం ఉండేదని.. దీపాలు లేకపోయినా తెల్లవార్లూ పాటలు పద్యాలతో ఆ పల్లె వెలిగిపోయేదని  అప్పుడు గాని గుర్తుకు రాలేదు.

రాంబాబుతో నా స్నేహం ఆ ఊరవతలి బతుకుల పట్ల  నాలో సానుభూతినే కలిగించింది కాని  అసహ్యాన్ని కాదు. ఊరి చుట్టూ ఎంత పచ్చని అందం అల్లుకుందో ఇక్కడి దళితుల బతుకుల లోపలా బయటా  అంత కారుచీకటి  ఆవహించి ఉండేది. ఆ పచ్చదనం ఈ గుడిసెల గుమ్మాల దాకా ఎందుకు పాకలేదని చిన్నప్పుడు ఎంతగానో బాధపడేవాణ్ణి. పెద్దయ్యే కొద్దీ రాంబాబులో కూడా ఈ బాధ అగ్నిపర్వతమై కూర్చుంది. కొంచెం పెద్దయ్యాక మాకిద్దరికీ అర్థమయ్యింది. ఊళ్ళ చుట్టూ ఉన్న ఆకుపచ్చ సౌందర్యం..పంటకాల్వల గలగలలూ..ఊరిని పలకరించి పోయే ఆరు రుతువుల అందాలూ అన్నీ కొందరికే సొంతమైనట్టు నేనూ రాంబాబు సమానంగానే గమనించాం. ఎందుకో కాని తరవాత్తర్వాత రాంబాబు చదువు మానుకుని కూలీల దండుకట్టే దండనాయకుడయ్యాడు. నేను ఉద్యోగం వేటలో ఊరొదిలి పారిపోయాను. ఇలా కలిసినప్పుడు ఆనాటి బాల్యాన్ని..ఈనాటికీ మారని బడుగుబతుకుల చిత్రాన్ని కలబోసుకుంటాం. వాడు ఉద్రేకపడతాడు. నేను ఊకొడతాను. మా ఇద్దరి బాల్యపు ముచ్చట్ల మథ్య ఇక్కడ ఒకప్పుడుండే గూడెం స్వరూపాన్ని రమేష్  అర్థం చేసుకున్నాడు.   మాటలు..జ్నాపకాలు..ఊళ్ళో సాగుతున్న తతంగాలు అన్నీ రాంబాబు చెప్తూ మేం వింటూ అలా కొంతసేపు తిరిగితిరిగి ఇంటికి చేరుకుని టిఫిన్లు ముగించాం. రాంబాబు మా కొల్లేరు యాత్ర ఏర్పాట్లకోసం ఇంటికెళ్ళాడు. మేం రెడీ అయ్యేసరికి ఒక బైక్ తో ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురం బర్రున కొల్లేరు వైపు దారి తీశాం.

కొల్లేరు చేరుకునే సరికి ఎండ బాగానే దంచుతోంది. చిన్నప్పుడు అక్కడన్నీ పొలాలే. వందల ఎకరాలు అక్కడ కమతాలుగా చేసుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలు వ్యవసాయం చేసుకునే వారు. ప్రభుత్వం నుంచి కూడా వారికి అధికారాలు అందేవి. నాన్న వ్యవసాయం చేసే రోజుల్లో ఒక పెద్ద కమతంలో వ్యవసాయం సామూహికంగా సాగేది.  అంతా కలిసి హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ వానల్ని ఎండల్ని తుపానుల్ని చలినీ అనుభవించేవారు. దళితులకు కూడా ఆ కమతాల్లో వాటాలుండేవి. హక్కులుండేవి. అప్పుడప్పుడూ నాన్నతో పాటు నేను కొల్లేరుకి వెళ్ళేవాడిని అంతా వరసలు కలుపుకుని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒకే కుటుంబంలా పనులు చేసుకునే వారు. ఇప్పటిలా రోడ్డు ఉండేది కాదు. ఒకరోజంతా నడుచుకుంటూ కొల్లేరు చేరాల్సిందే. వర్షాలు బాగా పడుతున్నప్పుడో..పనులు పోతాయనో..మాటిమాటికీ తిరగలేకో.. కొన్ని వారాల తరబడి ఒక్కోసారి వచ్చేవారు కాదు. మేం ఇంటి దగ్గర భయపడేవాళ్ళం. అప్పట్లో కొల్లేరంటే ఎటు చూసినా నీరు..వింతవింత పక్షులు.. శూన్యంలోకి ఎగిరే చేపల విన్యాసాలు..అంతా అదో ఆనందలోకం. ఒకే పంట పండించే వారు. వానాకాలం అదంతా అభయారణ్యమే. దాళ్వా పంట మాత్రమే వేసేవారు. ఆకుమళ్ళు కట్టే దగ్గర నుంచి..ఊడ్పులు..కోతలు..పంటనూర్పుళ్ళు..ఇంటికి ధాన్యం బళ్ళల్లో తోలుకు రావడాలు అంతా అదో కోలాహలం. అవే అసలైన పండగలుగా ఊరిని సంబరాల్లోకి నెట్టేవి.  మా ఇంటి పెరట్లో  పెద్ద గాదె ఉండేది. అందులో చాలా ధాన్యం నిల్వ ఉంచేవారు. మిగతాది షావుకార్లకు తోలేవారు. పంట కోతకు ఎదిగినప్పుడు కొల్లేటి పెద్దింట్లమ్మకు వేటలు వేసేవారు. వేటల్ని వేసినప్పుడు అటు గూడెంలోనూ ఇటు ఊళ్ళోనూ పగలూ రాత్రి తేడా తెలియని జాతర మత్తు గమ్మత్తుగా ఆవహించేది.

మా కోసం ముందే ఏర్పాటు చేసిన చిన్న పడవ ఎక్కి వెనక్కి వెనక్కి కుంచించుకుపోతున్న కొల్లేరు సరస్సులో విహారానికి బయలుదేరాం. చుట్టుపక్కల ఊళ్ళను ఉధ్ధరించడానికే పుట్టినట్టు  రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ తమ కబ్జా జమాయించిన పెద్దలు పేదల కమతాలను ఆక్రమించుకున్నారు. కొందరికి తాగించి..కొందరికి భూములకు భూములిస్తామని చెప్పి ఊరించి..లొంగని వారిని కొద్దిపాటి డబ్బుతో కొనేసి..ఎవరి మాటా వినని సీతయ్య లాంటివారిని భయపెట్టి కొల్లేటిలో పేదల భూముల్ని పెద్దలు స్వాధీనం చేసుకున్నారు. కొల్లేటి సరస్సును కొల్లగొట్టి దాన్ని చిన్నచిన్న చేపల చెరువులుగా కత్తిరించి తమ ఖాతాలో వేసుకున్నారు.  మా చిన్నప్పుడు మా నాన్న నిర్వహించిన కమతాలు అలా మాయమైపోయినవే. రాంబాబు వాళ్ళ కుటుంబానికి కూడా కొద్దోగొప్పో భూములుండేవంటే ఈ కొల్లేరులోనే. అవన్నీ ఇప్పుడు పరాధీనమైపోయాయి.

“అంతా సరస్సే అయినప్పుడు మరిన్ని సరస్సులు అవసరమా?” రమేష్ అమాయకంగా అడిగాడు.

వాడికెలా చెప్పాలి. కొల్లేరు ప్రకృతి ప్రసాదించిన సరస్సు. ఈ చెరువులు ప్రకృతిని కొల్లగొడుతున్న సరస్సులు. ఆ సరస్సు మీద వింత వింత పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి కొంతకాలం విడిది చేసి తిరిగి పోయేవి. ఈ చెరువుల మీద పక్షి వాలిందా..దాని గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. ఆ సరస్సుకు ఆకాశం కాపలా. ఈ చెరువులకు తుపాకుల కాపలా.  ఏ ఎరువులూ అవసరం లేకుండా కొల్లేరు సరస్సు నిండు గర్భణిలా నిత్యం రకరకాల జీవరాశుల్ని ప్రసవిస్తూ ఉండేది. ఈ చేపల చెరువుల్లో వాడుతున్న మందులు..ఎరువులు ఆ నాలుగు గట్ల మధ్యనున్న చేపల్ని తప్ప మరే జీవరాశినీ బతికి నీటిబట్ట కట్టనీయవు. ఇవి చేసే వాతావరణ కాలుష్యంతో కొంచెంకొంచెం కుంచించుకుపోతున్న సరస్సు ఏదో ఒకరోజున అమాంతం మనకు కనపడకుండా ఎక్కిడికో పరుగు లంకించుకుంటుంది.

ఇక్కడ ప్రకృతి విధ్యంసమే కాదు..పర్యావరణ వినాశనమే కాదు..బీదాసాదా రైతుల జీవనాధారం కూడా ధ్వంసమైంది. కొల్లేరంటే అందం..ఆనందం..బతుకు పడవ కదా..మరిప్పుడు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కొంప కొల్లేరైందన్న సామెత ఎందుకు వెలిసిందంటే కారణం ఇదేనేమో.

ఊళ్ళో ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉన్న మా నాన్నలాంటి పెద్దరైతులే పేదరైతుల్లా బతుకుబండి లాగుతున్నారు. ఇక రాంబాబులాంటి గూడెం జనాలు గోడు ఎవరు పట్టించుకుంటారు ? నా ధోరణిలో నేనేదో చెప్తున్నాను.

ఏందిరా బాయ్ మీరేదో ఆనందాన్ని అనుభవిస్తున్నారని చూడ్డానికి నేనొస్తే అన్నీ కష్టాలే వల్లిస్తున్నారు? అంటూ రమేష్ ఎగిరి మా పడవలో పడిన చేపను పట్టుకుని ముచ్చటగా ముద్దాడాడు. అప్పటికే  మా పడవ నడపుతున్న మనిషి  చిన్నచిన్న చేపల్ని పట్టుకుని మాకోసం కాల్చి పెట్టడానికి పడవలోనే అన్నీ ఏర్పాట్లు చేసిపెట్టాడు. పేరు రాముడు. మా చిన్నప్పుడు రాముడు కాదు భీముడు అనేవారు. ఇప్పుడు కొల్లేరు చిక్కిపోయినట్టే కొంచెం కొంచెం ఎండిపోయి కండ తీసేసిన కొరమేను ముల్లులా తయారయ్యాడు.  చేపల రుచి..ప్రకృతి రుచి..అనుభవిస్తూ కొల్లేటి అంతరంగంలోని విషాదం చేదును మర్చిపోదామని రమేష్ తో పాటు మేం కూడా ప్రయత్నించాం.

ఏం బాబూ అసలు ఊరికి రావడమే మానేశారు? రాముడు కాల్చిన చేపలతోపాటు కొన్ని ప్రశ్నల్ని కూడా మావైపు పంపడం మొదలుపెట్టాడు. వాణ్ణి కదపకూడదనే అనుకున్నాను. కదిపితే కొల్లేరు డొంక కదిపినట్టే. ఏ డొంకలో ఏ పిట్టలుంటాయో..ఏ పిట్ట ఏం తింటుందో ఎలా తింటుందో..ఎంత ఒడుపుగా దాన్ని పట్టుకోవాలో కతలుకతలుగా చెప్తాడు. ఏ కాలంలో ఏపక్షులు వచ్చేవో..ఎంతకాలం ఉండేవో కల్లాకపటంలేని కొల్లేటి కొంగల భాషలో వర్ణించిపాడతాడు. అంతటితో ఆపడు. ఆపితే రమేష్ కి మంచి వినోదమే దొరికేది . కాని వాడి కథ మొదలుపెడతాడు. ఇప్పటికే రమేష్ కి ఇక్కడి వాతావరణం కంటె దాని వెనక సాగుతున్న దోపిడి కాస్త అసహనానికి కారణమవుతోంది. ఎందుకొచ్చానురా బాబూ అని తలపట్టుకుంటాడేమో అని నా సందేహం. కాని వాడూరుకుంటాడా. కదపనే కదిపాడు రాముడి కొల్లేటి డొంకని.   వాడి యవ్వనంలో కొల్లేరు ఎంత గొప్పగా ఉండేదో..ఇక లంకించుకున్నాడు.

“ నా మాలచ్చిని చూసినా కొల్లేటిని చూసినా నాకు రత్తంలో ఒకటే తియ్యని దురద మొదలయ్యేది బాబయ్యా. ఆ రోజులే ఏరు. వర్షాలు తగ్గి నీరు వెనక్కి తీసినప్పుడు ఇక్కడ ఎగసాయం మా జోరుగా సాగేది. నాక్కూడా ఏడెనిమిది ఎకరాల ఎగసాయం ఉండేది. ఇదిగో ఈళ్ళ నాన్నగారు కమతాలనీ..కలిసి ఎగసాయం చేసుకోవాలనీ మొదలెట్టాక అబ్బో అదో పండగలా సాగేదనుకోండి. ఊళ్ళో జనాలు ఎలాగుండేవారో కాని..ఇక్కడ మాత్రం ఊరూ వాడా తేడా లేకుండా అందరం అల్లదిగో ఆ ఎగురుతున్నాదే చేప పిల్ల. మరలా ఎగిరి గంతులేసే వాళ్ళం. కలిసి వండుకునే వాళ్ళం. కలిసి పండుకునే వాళ్ళం. వారాల పాటు ఇళ్లకు పోకుండా ఇక్కడ మేం ఎగసాయం చేస్తా ఉంటే మా ఆడది  అప్పుడప్పుడూ అనుమానంతో ఇక్కడికి లగెత్తుకొచ్చేది. మాలచ్చి వచ్చిందంటే ఇక నాకు పండగే. అందరూ నన్ను వదిలేసే వారు. దాన్ని తీసుకుని అదిగో ఆ దోనెలున్నాయే అలాంటి తాటి దోనెలో ఇక కొల్లేరులో ఒకటే తిరుగుడు. దూరంగా ఎవరికీ కనిపించకుండా దాన్నెటో తీసుకుపోయేవోణ్ణి. ఇప్పడు నేనిస్తన్నట్టే అది నాకు చేపలు కాల్చి పెట్టేది. నేను పాటలు పాడేవోణ్ణి. నాసామిరంగా నేను పాటలు పాడతా వుంటే ఎగిరే పచ్చులు కూడా అల్లాగిపోయేవనుకోండి. అయ్యా..పిట్టల మాటేం కాని ఆకాసంలో సూరీడు కూడా ఆగిపోయేవాడంటే నమ్ముతారా? “

‘నమ్ముతాం నమ్ముతాం.’  రమేష్ ఊతమిచ్చాడు. ఆ ఊతంతో పాటందుకున్నాడు. మేమంతా ఎక్కడన్నా పక్షులు ఎగురుతూ ఆగి వెనక్కి చూస్తాయేమో అని దిక్కులు చూశాం. పక్షులుంటేగా! ఖాళీ డొంకలు వెక్కిరిస్తున్నాయి.  అటు ఆకాశం వైపు చూశాం. నిజంగానే సూర్యుడు నిదానంగా కదులుతున్నాడు.

‘ఇప్పుడేం చేస్తున్నావ్ రాముడు?’ అడిగాడు రమేష్.

ఏం చేస్తాం బాబయ్యా. ఆ ఎగసాయం లేదు. ఆ బూములు లేవు. ఆ పనీ లేదు ఆ పాటా లేదు. ఉన్న కమతాలన్నీ పెద్దోళ్ళ చేపల చెరువుల్లో ఎక్కడ కలిసిపోయాయో తెలీదు.  కాగితాల మీద ఏలి ముద్రలు ఏయించుకున్నగ్నాపకాలు తప్ప ఇంకేం గుర్తులేదు. ఇదిగో ఇప్పుడు ఆ చెరువుల దగ్గర కాపలా కాసే పనోడిగా బతుకుతున్నాను. తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఈ కుళ్ళు నీరు తాగి నేనైతే సయించుకున్నాను కాని..నా ఆడది మాత్తరం కుంగి కుశించుకుపోయింది. మాయదారి రోగం కానరాలేదు. కానొచ్చినా బాగుచేసుకునే సత్తా వున్నోణ్ణి కాదు. అలాగే అర్థాంతరంగా మాయమైపోయింది మాలచ్చిమి. బిడ్డలకి రెక్కలొచ్చాక ఇక్కడ రెక్కాడినా డొక్కలాడ్డం కష్టమని నగరాలకి వలస పచ్చుల్లా ఎగిరిపోయారు.”

ఉన్నట్టుండి రాముడు..నేను..రాంబాబు ముగ్గురం సైలెంట్ అయిపోయాం. రమేష్ కూడా మాతో పాటు నిశ్శబ్దంగా ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఎగిరే చేపపిల్లల్లో చిన్నప్పటి జ్నాపకాల తుళ్ళింతల దృశ్యాలేవో దోబూచులాడుతూ నన్నుఉడికిస్తున్నాయి. నాన్న పొలాలు పోగొట్టుకున్న తర్వాత చుట్టం చూపుగా కొల్లేరు రావడమే అవుతుంది కదా అన్న బాధ కొంచెం గుండెల్లో మెలిపెట్టింది. రాంబాబు మనసులో ఏం జరుగుతుందో నేనూహించగలను. గతం వర్తమానం కలిసి అతని మనసులో ఒక ద్రావకంలా మరుగుతున్న విషయం అర్థమవుతోంది. ఇక రాముడు ఫ్లాష్ బ్యాక్ లోకి జారిపోయిన సంగతి తెలిసిపోతోంది. రాముడు పాలేరుగా మారడం..రాంబాబు కూలీగా మిగిలిపోవడం..కాస్త కలిగిన  కుటుంబంలో పుట్టినా చివరికి ఊళ్ళో బలవంతులకే ఆస్తులన్నీ ఫలహారంగా సమర్పించుకుని  ఇప్పుడు మేము ఇల్లు తప్ప ఏమీ మిగుల్చుకోలేకపోవడం .. ఈ విషయాలన్నీ రమేష్ కి కూడా అర్థమైనట్టున్నాయి. వాడూ మా నిశ్శబ్దంలో మరింత నిశ్శబ్దంగా ఒదిగిపోయాడు.

అలా కొల్లేటి కొంగలు సంధ్యరంగుల ఆకాశాన్ని తమ రెక్కల మీద ముద్రించుకుని ఒక గుంపుగా మా కళ్ళను తాకుతూ ఎగిరినప్పుడు ఇళ్ళకు తిరుగుముఖం పట్టాం.

ఇంటికి రాగానే నాన్న కనిపించలేదు.

అమ్మా నాన్నేడి?

“ఈ మథ్య గుడి కట్టిస్తున్నారుగా..శివాలయం. పొద్దస్తమానం అక్కడే గడిపేస్తున్నార్రా బాబూ. అన్నట్టు మీ ప్రయాణానికి అన్నీ రాత్రికే సర్దుకోండి నాన్నా. పొద్దుటే లేచి తాడేపల్లి గూడెం వెళ్లాలిగా. ఇలా ఒకరోజు ప్రయాణాలేంటిరా! పోన్లే కనీసం నెలకోసారైనా రా! మేమెలాగూ ఈ రైళ్ళూ బస్సులూ ఎక్కలేం!”

అమ్మ మాటల్లో నాకెందుకో ఏదో కనిపించని ఆరా..అన్వేషణ.. ఇంకేదో ప్రశ్న గుండెల్ని తాకుతున్నాయి. నేను వచ్చిన వాడిని వచ్చినట్టే తిరిగి వెళ్ళి పోతానని..వాళ్ళను నాకూడా తీసుకు వెళ్ళే ప్రయత్నాలేమీ చేయనని అమ్మ ఇంకా కన్ ఫాం కాలేదు. వారికి ఏ మూలో అనుమానం ఉంది. అందునా ఈసారి ఒంటరిగా రాలేదు. హైద్రాబాద్ మిత్రుణ్ని వెంటేసుకుని  సశస్త్రంగా వచ్చాను.

అమ్మా ఈసారి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికే వచ్చాను. మీరు కూడా బట్టలు సర్దుకోండి.

“వచ్చే నెల్లో వస్తాంలే నాన్నా.  నా బ్యాగూ నాన్న బ్యాగూ పక్కింటి పార్వతి తీసుకుంది. ఊరికెళ్ళాలంట. పాపం ఎప్పుడూ మమ్మల్నే కనిపెట్టుకుని ఉంటుంది. దానికేమైనా చెయ్యాలిరా!” అమ్మ జవాబు.

అమ్మ మాటలు నాకెందుకో నమ్మబుద్ది కావడంలేదు. “ అయినా బ్యాగులదేముంది. ఇప్పుడే పోయి రెండు కొత్తవి కొనుక్కొస్తానుండు.”  అమ్మ ఏదో గొణుగుతున్నా వినకుండా బయలుదేరాను. రమేష్ స్నానానికి వెళ్ళాడు.

ఎక్కడికిరా?

నాన్నని తీసుకువస్తా.

అప్పుడే వస్తాడా ఆయనగారు. మీరు ముందు స్నానాలు ముగించండి.

అమ్మ మాటలు వినకుండా త్వరగా గుడి దగ్గరకు బయలుదేరాను. పక్కింటి పార్వతి ఎదురుపడింది. బ్యాగులు తీసుకువెళ్ళి  అమ్మే పార్వతి ఇంట్లో దాచిపెట్టిందట. వచ్చే నవ్వు ఆపుకోడానికి పార్వతి చీరకొంగును సాయం తీసుకుంది.

చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టడానికి నేను కూడా ఇలా ఎన్నిసార్లు పుస్తకాల సంచి అక్కడా ఇక్కడా దాచిపెట్టేవాడినో. ఎక్కడ దాచానో అమ్మకు మాత్రమే తెలుసు. నాన్న వెదికి వెదికి నన్ను ఉతకడానికి రెడీ అయినప్పుడు ‘ పోన్లెండి రేపు వెళతాడులే బడికి’ అని అడ్డం పడేది అమ్మ. చిన్నప్పుడు నేనేసిన ఎత్తులన్నీ ఇప్పుడు నాదగ్గర అమ్మ ప్రదర్శిస్తోందన్నమాట. నవ్వుకుంటూ గుడికి వెళ్ళాను. అక్కడ నాన్న ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి ఏరా పొద్దున్నే వెళ్ళాలన్నారు. త్వరగా తిని రెస్టు తీసుకోండి. ఇదిగో గుడి కడుతున్నాంగా ఇప్పటిదాకా మీటింగే సరిపోయింది. అంతా ఇప్పుడే వెళ్ళారు.

“ఎందుకు నాన్నా! మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళనులే. కనీసం నేను ఉండే ఒక పూటైనా ఇంటిదగ్గర ఉండొచ్చుగా! రాపోదాం”  నాన్న చేయి పట్టుకుని పైకి లేపాను.

“మళ్లీ ఎప్పుడొస్తార్రా? ఈసారి కోడల్ని..పిల్లల్ని తీసుకురావాలి మరి ఆ!”

నేను చిన్నప్పుడు బడికి ఎగనామం పెట్టి పాత శివాలయం దగ్గర గోళీలాడేవాడిని. ఆ విషయం నాన్నకెవరో చెప్పేవారు. దారీపోయేవారెవరో పెద్దమనిషి ఒరే మీ నాన్నొస్తన్నాడని బెదిరిస్తే గుడిదగ్గరే రాత్రి దాకా ఉండిపోయేవాడిని. ఎప్పుడో చీకటి పడ్డాక నాన్న వెదుక్కుంటూ వచ్చేవాడు.

“అమ్మ దొంగా నా దగ్గరే నా చిన్నప్పటి ట్రిక్కులు ప్లే చేస్తున్నావా నాన్నా”  అసలింత అవసరమా?  మనసులోనే అనుకుని నాన్నతో ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి రాగానే స్నానాలు చేసి ఒకసారి రాంబాబు ఉంటున్న ఊరవతల కాలనీకి వెళ్ళాము.

అక్కడ రాంబాబు కాలనీ చూసి మరీ బాధ కలిగింది. చూడ్డానికి దూరంగా ఇళ్ళలానే కనిపిస్తాయి. కాని అవి తలుపులూ కిటికీలూ లేని అగ్గిపెట్టె గుడిసెలంటే తప్పుకాదు. అక్కడ కూడా కాలనీలు ఏర్పడ్డాయి. దళితులు ఒక పక్కకి..వారికి దూరంగా ఇతర కులాల ఇందిరమ్మ ఇళ్ళు మరో మూలకి ఉన్నాయి. అభివృద్ధిని అంకెల్లో చూపించేవారికి ఈ కాలనీలను చూపిస్తే ఏమంటారో మరి.  రాంబాబు నాన్న దావీదుతో కాసేపు మాట్లాడాము. ఆయనా పాత ముచ్చట్ల నడుమ ఊరి గురించి బాధనే నిట్టూర్పుల భాషతో వ్యక్తం చేస్తున్నాడు.

“మీ పెద్దబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్ళారా” అని అడిగాను. సమాధానం రాంబాబు దగ్గర నుండి వచ్చింది.

“అన్నయ్య ఇక్కడకు రాడు. వచ్చినా వీళ్ళని ఇక్కడ నుంచి తరలించడానికే ప్లాన్లు వేస్తాడు. టౌన్ లో ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉండమంటాడు. డబ్బు పంపినా అమ్మానాన్నకి నాతోనే ఉండడం ఇష్టం. అయినా ఈ ఊరిని వదలడానికి ఏమాత్రం వీరికి ఇష్టం లేదు. ఇక్కడేముంది ఒక ఊరి చివరి నుంచి ఇంకో చివరికొచ్చారు. ఎప్పుడైనా ఊళ్ళల్లో చివరి బతుకులేకదా అన్నది అన్నయ్య వాదన. కొడుకుల దగ్గరున్నా మనుమలూ మనవరాళ్ళూ చుట్టూ ఉన్నా ఒంటరితనమే వెంటాడుతుందని అమ్మకీనాన్నకి భయం. పంచిన రక్తంలోనే మమకారాల కంటె పెత్తనాలు ఎక్కువవుతుంటే ఏ బంధాలూ లేకున్నా ఉన్న ఒక్క మట్టి బంధంతోనే హాయిగా గడిపేద్దామని మా పేరెంట్స్ వాదన. వీళ్ళకోసం నేనుంటున్నానో..నాకోసం వీళ్ళుంటున్నారో కాని ఉంటున్నాం. ఊళ్ళోనే ఉంటున్నాం. “  రాంబాబు మాటల్లో, కళ్ళల్లో, మనసులో ఏదో గుబులు కనిపించింది.

ఇక రాంబాబు ఇంటి దగ్గర సెలవు తీసుకుని మా ఇంటికి ముగ్గురం వెళ్ళాం. వేడివేడిగా అమ్మ వడ్డించింది. నాతోపాటు అమ్మనీ నాన్ననీ తీసుకు వెళ్ళే ప్రయత్నంలో మరోమాటు భంగపాటు చవిచూసి గమ్మున ఊరకున్నాను.  రాంబాబు కూడా ఆ రాత్రికి మాతోనే ఉండిపోయాడు. ఊరూ..వాడా..రిజర్వేషన్లు..ఎవరు ఎదిగారు..ఎవరు కుదేలయ్యారు..రాంబాబు ఏదో తన రహస్య రాజకీయ కార్యకలాపాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మర్నాడు ఉదయమే లేచి స్నానాలు చేసి తాడేపల్లిగూడెం బయలుదేరాం. మళ్ళీ తిరిగి జన్మభూమి ట్రైన్ లోనే  ప్రయాణం.

వెళుతూ వెళుతూ రమేష్ నాన్నతో మళ్ళీ  కొంచెం కదిపి చూశాడు.

“ఏంటంకుల్..ఇక్కడేముంది? తాగడానిక్కూడా నీరు లేదు. మాకెలాగూ తెలంగాణా ఇచ్చేస్తున్నారుగా అక్కడికే వచ్చేయండి.”

ఏం సమాధానం వస్తుందో అని ముగ్గురం ఉత్కంఠగా ఎదురు చూశాం.

“లేదు. ఎక్కడికీ రాము.”

నాన్న నుండి వచ్చిన ఈ ఠపీమన్న సమాధానంతో నేనూ రాంబాబు నవ్వుకున్నాం కాని రమేష్ మాత్రం ఆశ్చర్యంగా అలాగే నోరు తెరిచి ఉండిపోయాడు.

“ఏమీలేదురా బాబూ. మీకు తెలంగాణా వస్తేనన్నా కనీసం ఇక్కడ ఊళ్ళు బాగుపడతాయేమో అని మా ఆశ.”

“అధికార బదలాయింపులతో ఊళ్ళు బాగుపడవు అంకుల్. ఆ అధికారం ఎవరి చేతుల్లోకి పోతుందన్నదే పాయింట్. స్వతంత్ర పోరాటం ఎప్పుడూ సమరోత్సాహంగానే ఉంటుంది. స్వాతంత్ర్య ఫలితాలు ఎవరికి దక్కుతాయన్నదే చూసుకోవాలి.”  ఇక రాంబాబు దొరికిందే తడవుగా అందుకున్నాడు. నాన్న కూడా తీరిగ్గా ఉపన్యాసానికి ఉపక్రమించాడు.

అంతా హైదరాబాద్ కే పరుగులు తీశారు తప్ప పుట్టిన ఊళ్ళు..పెరిగిన ఊళ్లు ఎలా ఉన్నాయో ఎంత ధ్వంసమవుతున్నాయో పట్టించుకునే తీరికా ఓపికా ఎవరికీ లేకుండా పోయింది. రాజకీయ నాయకులకు రాజకీయాలు కావాలి. పదవులు కావాలి. పీఠాలు కావాలి. పెట్టుబడిదారులకు వ్యాపారాలు కావాలి. ఏ వూరు ఎలా పోయినా పర్వాలేదు. వారి పెట్టుబడులు పెరగాలి. హైదరాబాదైనా పోతారు..ఆఫ్రికా అయినా పోతారు. వారికి మట్టిబంధాలు..మమతానుబంధాలు ఉండవు. ఉన్నదొక్కటే బంధం అది డబ్బు బంధం. నగరాలేవైనా వారికే ఉంపుడుగత్తెలు.  మనం మన రాష్ట్రంలో ఉన్నా..మన దేశంలో ఉన్నా..ఈ నేల మనది..ఈ గాలి మనది..ఈ నీరు మనది అన్న  ఏదో తెలియని భావంలో ఉప్పొంగిపోతాం. తీరా హక్కులు అనుభవించే సరికి ఎక్కడా నీకు కూర్చోడానికి కూసింత జాగా కూడా దొరకదు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినా డబ్బున్న వాడికి పక్కవేసే నగరంలో నిజానికి నువ్వు అనాథవే. కూలికోసం ఉదయాన్నే నాలుగురోడ్ల కూడలిలో నిలబడే వేలాది జనానికి నగరం ఎప్పటికీ పరాయిదే. వారితో పనిచేయించుకుని వారిని కుక్కలకంటే హీనంగా చూడ్డమే నగర సంస్కృతి వికృత రూపం. అలాంటి నగరం కోసం ఏడవడం కంటె కనీసం ఇప్పటికైనా మన ఊళ్ళను బాగుచేసుకుందాం అన్న స్పహ మా వాళ్ళకి కలిగితే అదే పదినగరాలపెట్టు.”  నాన్న ఉపన్యాస ధోరణికి బ్రేక్ వేస్తూ రాంబాబు అందుకున్నాడు.

“ రమేష్ ! జన్మభూమి అన్నది ఒక ఫీలింగ్ మాత్రమే.  అది సామాన్యులకే కాని పెట్టుబడుల గుండెకోటల్లో అది మొక్కుబడిగానైనా ఉండదు. జన్మభూమి భావనే అందరినీ సమానంగా ఆదుకుంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అన్నార్తులు, అభాగ్యుల శాతమే ఎందుకు ఎక్కువగా ఉంటుంది చెప్పు? కూలికోసం కూటికోసం నిలువ నీడకోసం నువ్వక్కడా మేమిక్కడా పోరాటాలు చేయాల్సిందే. అధికారాలు..హక్కులూ సామాన్యులకు అందని ద్రాక్షల్లా ఉన్నంతకాలం యుద్ధం ఎక్కడైనా ఒకటే. ప్రాంతీయభేదాలు మామూలు మనుషులకే కాని దొంగలకు ఉండవురా బాబూ. యువకులను బలిపెట్టి మీరు సాధించిన ఈ స్వతంత్రం ఈనగాచి నక్కల కుక్కల పాలు కాకుండా కాపాడుకోండి. అందుకోసం ఒక మహాసంగ్రామానికి సిద్ధం కావాలి మరి. ఇక మీ తిప్పలు మీరు పడాలి. మా తిప్పలు మేం పడతాం. అందరి తిప్పలూ ఒకటేఅని వాటంతటికీ పరిష్కారం కూడా ఒకటేఅని..దానికోసం నువ్వూనేనూ వీడూ వాడూ అంతా కలిసే కత్తుల నదిలో ఈదాలని మాత్రం మర్చిపోవద్దు సుమా!”

నాన్న మాటలు, రాంబాబు మాటలు విన్న తర్వాత హైదరాబాద్ విషయంలో  జన్మభూమి ఫీలింగ్ తో బరువెక్కిన నా హృదయం ఇప్పుడు కాలిపోతున్న నుదిటిమీద అమ్మ చేయి పడినంత హాయిగా ఉంది.

పొద్దుటే తిరుగుప్రయాణం. రాంబాబు వాళ్ళ నాన్న దావీదు కూడా వచ్చాడు. మా వీధిలో ఉండే సోమన్న కూడా వచ్చాడు. మా ఊళ్ళో మొదటి డాబా ఇల్లు కట్టిన మొనగాడు అతడే. ఇరవై ఎకరాల ఆసామి. ఇప్పుడు నిలువ నీడ లేదు. ఇద్దరు కొడుకులు హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ల దగ్గర వాచ్ మెన్ లుగా పనిచేస్తున్నారు. నేనెప్పుడొచ్చినా వారి దగ్గర నుంచి వర్తమానం కాని..డబ్బులు కాని ఏమైనా వస్తాయేమో అని నన్ను పలకరిస్తాడు. మేం వెళుతుంటే అమ్మా..నాన్న..దావీదు. సోమన్న అలా శూన్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఊరు వెనక్కి వెళుతుంది మేం ముందుకు కదిలాం. నిర్వాహకులు ఎవరూ లేని అనాథ వృద్ధశరణాలయంలా కనిపించింది నాకు మా ఊరు.

ట్రైన్ ఎక్కించి రాంబాబు వెళ్లిపోయాడు. అన్నీ కోల్పోయినా, ఉన్న ఊరినే జన్మభూమి అని మా అమ్మానాన్నలాంటి వృద్ధులెందరో ఆ మట్టినే అంటిపెట్టుకుని ఉంటున్నారు. రాంబాబు మాత్రం జన్మభూమి ఒకఫీలింగే అంటాడు. హైదరాబాద్ నా జన్మభూమి కాదంటే నా గుండె తట్టుకోలేకుండా ఉంది. రమేష్ మాత్రం నా జన్మభూమి అని ఎంతో ఉప్పొంగిపోతూ రాగాలు తీస్తున్నాడు. అసలు జన్మభూమి విషయంలో నీ అభిప్రాయం ఏంట్రా అని రమేష్ ని అడిగాను. “ అరేయ్ లైట్ తీసుకో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నది జన్మభూమి ట్రైన్ లోనే”  అని పకాలున నవ్వేసాడు.  వాడి మాటలతో తేలికైన మనసు కాసేపు అలా రైలు కిటిలోంచి బయట పచ్చదనం మీదకి మళ్ళింది. ఇంతలో  ఏమనుకున్నాడో రమేష్ “అరేయ్ పాగల్ గా ఏమనుకుంటున్నావో నాకంతా తెలుసు. ఇదిగో చూడు రాష్ట్రం ముక్కలైనా మన స్నేహాన్ని ముక్కలు చేసే శక్తి ఎవరికీ లేదురా బాయ్. మన అసలు జన్మభూమి స్నేహమేరా. దాని  పరిమళం తెలుగు.”

– ప్రసాద మూర్తి

చిత్రం: పెమ్మరాజు వేణుగోపాల రావు

సూడో రియాల్టీస్

aparna“చెత్తా… ” అనే అరుపు, తర్వాత కాలింగ్ బెల్ మోత.

బద్ధకంగా నిద్రలేచి టైం చూశా. ఏడైంది. ‘లేటైందే’ అనుకుంటూ లేచి  తలుపు తీసాను. “చెత్తున్నదామ్మా?” చేత్తో పెద్ద చెత్తబుట్టను పట్టుకుని అడిగింది. ఉండమని లొపలికొస్తున్నాను.  బెడ్ రూమ్ లోనుంచి ప్రకాష్ లేచి వచ్చాడు.
“చెత్తనేనిస్తాలే, నువ్వెళ్ళి టీ పెట్టు” అని డస్ట్ బిన్ తెచ్చాడు.
” సాయి రాలేదా?” ప్రకాష్ చెత్త తీసుకోవడానికి వచ్చినమనిషిని అడగడం వినిపిస్తోంది.  వంటింట్లోకి దారితీసాను.
” సాయి కి యాక్సిడెంట్ అయ్యిందంట” డస్ట్ బిన్ లోపలికితెస్తూ  ప్రకాష్ చెప్పాడు.
“ఔనా, ఎలా… ?!!”
“ఏమో, బండి మీద నుంచి పడ్డాడు అంది . ఎలా పడ్డాడో ” ఆలోచిస్తూ అన్నాడు.నిన్న  పనమ్మాయి రాక వంటింట్లొని  అంట్లతొ కుస్తీ పడుతూ అంతకన్నా ఎక్కువ అడగలేదు నేను.
సాయి మా ఇళ్ళల్లో చెత్త తీసుకెళ్ళే అతను. కానీ అంతకు మించిన పరిచయం మా మధ్య లేదు. ఎప్పుడూ మా అపార్ట్ మెంట్ లోనో, లేక చుట్టూ పక్కల అపార్ట్ మెంట్స్లోనో చెత్త తీసుకెళ్తూ  కనిపిస్తుంటాడు. ఎప్పడైనా అతని బదులు అతని భార్యో, చెల్లెలో వస్తారు. కూడా వారి పిల్లలు.
అప్పుడప్పుడూ పనమ్మాయి రాకపోతేనే ఐఎస్ డి  కాల్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అయ్యేంత విషయంలా ఉండే నాకు సాయి జీవితం ఒక వెక్కిరింపులా  ఉంటుంది. నేనీ ధోరణిలో మాట్లాడితే ప్రకాష్ కి చిరాకు. “ఎందుకలా సుపర్ఫిషియల్గా మాట్లాడతావు?’ అని విసుక్కుంటాడు. చిన్నప్పట్నించీ చదివిన సాహిత్యం, పెరిగిన వాతావరణం వల్ల పేదవారు అలా ఉండటానికి డబ్బున్నవారి బాధ్యత చాలా  ఉందని నా నమ్మకం. కాని నా ఆత్మావలోకనం వల్ల సాయి కి పెద్దగా ఒరిగిందేం  ఉంది? అప్పుడప్పుడు పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం, పండుగ  ఈనంలు మినహా నా వల్ల అతనికి ఏమి లాభం లెదు. నాకే ఎప్పుడైనా మొలకెత్తే ఈ అనవసరపు  అపరాధపు భావన నుండి కొంత తెరిపి.
***
“డబ్బులేమన్నా  ఇచ్చావా ?” బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అడిగా.
“ఆ.. రెండు వందలిచ్చాను.”
“రెండు వందలేనా,  ఏం సరిపోతాయి? డబ్బులేని వారికి అనారోగ్యానికి మించిన కష్టం లేదు తెలుసా?”
“ఎంతివ్వను? మొత్తం ఇవ్వలేముగా.. ఐనా ఎంతయ్యిందో ఎలా తెలుస్తుంది?అడిగితే  చూద్దాం. “
అడగరని తెలుసు మాకు. “……  మొన్న సూపర్ బజార్ కి వెళ్తుంటే చుసాను. రోడ్డు పక్కన కూర్చుని అన్నం తింటున్నాడు. పక్కనే చెత్త బండి. తనతోనే తన బావమరిది అనుకుంటా. ఎవరో అన్నం ఇచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ కనీసం తిండి తినడానికి అనువైన చోటు కూడా లేదు. చాలా బాధనిపించింది.”
“ఎందుకెప్పుడూ ఇలాంటి విషయాలు చెప్తావ్?  నీకేం తెలుసు, రోడ్డుపక్కన కూర్చుని తినడానికి అతనికంతగా బాధలేకపోతే? అతను చెత్త తీసుకెళ్తాడు. ఎవరూ ఇంట్లో పిలిచి భోజనం పెట్టరు. డిస్క్రిమినేషన్ కాదు, సానిటరీ రీజన్స్. అసలు ముందు, నువ్వు పెడతావా?
“………. “
“ఊర్లలో అయితే ఇంటి బయట వరండానో, అరుగో, పెరడో ఉంటుంది.  అపార్ట్ మెంట్ లో ఎలా అవుతుంది?  ఒకవేళ వాళ్ళను పిలిచినా  ఎంత కంఫర్టబుల్ గా తినగలడు ? దాని బదులు రోడ్డే బావుందనుకున్నాడేమో..”
మన కోసం పనిచేసే ఒక మనిషి ‘డిగ్నిటి’ అనే పదం అర్థమయ్యే మార్గం తెలియక రోడ్డు పక్కన రాజీ పడి తింటేనే కంఫరటేబుల్ గా ఫీల్ అయి తింటుంటే  ఏమనుకోవాలి? నిట్టూర్చాను.
నా సుడో అభ్యుదయవాదం, ప్రకాష్ కన్వినియంట్ వాదం అర్థమయ్యాయి నాకు.
 చాలా కాలం క్రిందటి విషయం  గుర్తు వచ్చింది.
***
అప్పటికి రెండు వారాలబట్టీ ఊర్లోలేము. ముఖ్యమైన బంధువులు చాల కాలం తర్వాత ఇంటికొస్తున్నారు. ప్రకాష్ కూడా నాతో పాటే లీవ్ పెట్టి ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. కానీ నా క్లీనింగూ, ప్రకాష్ సౌందర్యాభిలాషా సరిపోవు. ఎవరన్నా బాత్రూములు కడగటానికి దొరుకుతారేమోనని  సాయినడిగా. “మా బావమరిది ఉండమ్మా, బాత్రూంకి వంద  అడగతడు”, అన్నాడు. పంపించమన్నాను.
అన్నట్లుగానే పదకొండింటికి వచ్చాడు అతని బావమరిది.  ఒక కవరు పట్టుకొచ్చాడు. ముందు షర్టు విప్పేసి,మడిచి బాత్రూం బయట తలుపు పక్కగా పెట్టాడు.  పాంటు మడిచి కవర్లోంచి ఆసిడ్ బాటిలు, కొద్దిగా కొబ్బరి పీచూ, ఐదు రూపాయల సర్ఫ్ పాకెట్టు తీసాడు. చెప్పులు వేసుకోమని చెప్పాలనిపించింది కాని చెప్పలేదు. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏమన్నా ఖరీదైన వస్తువులున్నాయేమోనని  చెక్ చెసి వంట గదిలోకొచ్చి,టీ పెట్టా.  ప్రకాష్ నా దగ్గరికి వచ్చివచ్చినతనికి తినడానికి కూడా ఏమన్నా పెట్టిమన్నాడు.
కొద్దిగా టిఫిను, టీ పట్టుకెళ్ళి పిలిచాను. పనిలో ఉండి వినిపించలేదనుకుంటాను. బాత్రూంలోకి చూస్తే అతను పీచుతో కమ్మోడ్లో చెయ్యిపెట్టి కడుగుతున్నాడు. అతను నన్ను చూసి, చేతిలో పని ఆపి, చేతులు కడుక్కుని టీ , టిఫిను అందుకున్నాడు.
వంటగదిలోకి వెళ్లాను గానీ ఎంత ఆపుకున్నా సొంత ఎద్దేవాను తట్టుకోవడం కష్టం అయింది.  చిన్నప్పుడు మా అమ్మ స్నేహితురాలి పుట్టింటికి వెళ్తే, అక్కడ టాయిలెట్ సౌకర్యం లేక ఇంటివెనుక దొడ్డిని వాడేవారు. రొజూ ఒకావిడ దొడ్డి వెనుక తలుపు తీసుకువచ్చి  శుభ్రం చేసి వెళ్తూ ఉండేది. పెద్దయ్యాక ఆలోచిస్తే ఆ పని చేయించుకోవడం ఎంతో హీనంగా అనిపించింది . కానీ ఇప్పుడు అపార్ట్ మెంట్ కల్చర్  వచ్చాక మాత్రం ఏమి తగ్గింది?
పిండాకూడు దళితోద్యమాలూ, పనికిమాలిన సాహిత్యం. ఊరికే  ఉండనివ్వట్లేదు. విసురుగా బాత్రూం వైపు చూశాను.
అతను తిని కడిగి బాత్రూంకి కాస్త ఎడంగా పెట్టిన, కప్పు, ప్లేటు. పక్కనే మడిచిన షర్టు.
ప్రకాష్ బెడ్ రూమ్ సర్దడం పూర్తయినట్లుంది. నెమ్మదిగా  దగ్గరికి వచ్చి, ” బ్రష్షు వాడొచ్చుకదా? ఎందుకు?’ గుసగుసగా అడిగాడు.
“చేత్తో రుద్దితే బాగా పోతుందనేమో”. అభావంగా  అన్నాను. “ఎవరైనా అలా చెయ్యమన్నారేమో ….” కలుక్కుమంది.
ఇంకో గంట తర్వాత రెండో బాత్రూం కూడా కడిగి, ” అయిపోయిందమ్మ..” అన్నాడు. చేతిలో ఇంకా మడిచిన షర్ట్. వళ్ళంతా తడి. నీరు, చెమట కలిసిపొయాయి.
బాత్రూములు చూసి వచ్చాను. అందులో నేను హర్పిక్ తో తోమినా  రాని  తెల్లని మెరుపు.  కొద్దిగా ఆసిడ్, సర్ఫ్, కొబ్బరి పీచుతో హ్యాండ్డన్ క్లీనింగ్! ఒక్కో బాత్రూం కీ వంద.  రెండు బాత్రూములకీ  రెండు వందలు.  ఇంకో వంద ఎక్కువ ఇచ్చాను.
ఈ బాధ, ఒక వందతోనో, నాలుగు చాక్లేట్లతోనో తీరేటట్లు అనిపించడం లేదు నాకు. డబ్బులు తీసుకుని గుమ్మం దాటుతున్నాడు. క్షమించమని ఎలా అడగాలి?
“చెప్పులు వేసుకుని కడగొచ్చుగా కాళ్ళు పాడవ్వవా?
” అలవాటైపోయిందమ్మ.” నవ్వాడు “మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే  చెప్పండి.”
లోపలికొచ్చి మళ్ళీ పని మొదలు పెట్టా ..”వెళ్ళిపోయాడా?” ప్రకాష్ అడిగాడు.
తలూపాను. “ఛీ, ఇంకో సారి బాత్రూంలు వేరే వాళ్లతో కడిగించొద్దు. ఐనా  ఎవరి బాత్రూములు వాళ్ళే కడుక్కోవాలి.”  ఏమి మాట్లాడలేదు నేను.
***
మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ప్రస్తుతానికొచ్చి తలుపు తీశా. పనమ్మాయి.  ” ఏంటి  లేటు. నిన్న కూడా రాలేదు ” గయ్యిమన్నాను.
“ఔమా, రాలె. జరా పెయ్యిలో బాలె.” చీపురు తీసుకుని ఊడ్చటం  మొదలుపెట్టింది . ” గా సాయిని నిన్న దొంగతనం జేస్తుంటె జూషి తన్నిన్రు. “
“ఎక్కడా?”
“అగొ , ఆ అపార్ట్ మెంట్ల  షాదీ అవుతున్నది గదా.. అక్కడ ఒక సిలిండరు, స్టవ్వు ఎత్కవోతుంటే జూషిన్రు . వర్షమొస్తన్నదని ఎక్కనివక్కన్నే వదిలేసిన్రు. ఇగనెవ్వరూ లేరని  ఎత్కవొనికి జూషిన్రు.”
” నిజంగా తీసుకెళ్తుంటే చూసారా…?!!”
” జూషిన్రమ్మా. చెత్త బండిలో  బెడతంటే   సూషి ఒర్లిన్రు. అందరూ  గాల్చి  పరేషాన్ జేసి కొట్టిన్రు. రెండు నెల్లయెన్క  బీ ఇట్లనే చోరి చేస్తే తన్నిన్రు. ” మేటర్ అఫ్ ఫాక్ట్ లా చెప్పుకుపోతోంది.
” అందుకేనా వాళ్ళావిడ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది?” ప్రకాష్ ఆశ్చర్య పో తూ  అడిగాడు. ” లే, యాక్సిడెంట్ గాలే, తన్నిన్రు.”
***
కొన్ని రోజుల తరువాత మళ్ళీ సాయి రావడం మొదలు పెట్టాడు. అతని మొహంలో  భావాలను చదవాలని కష్టపడ్డాను గానీ చదవలెకపోయాను. తిరుగుబాటో, లొంగుబాటో, నిర్లక్ష్యమో ఏదోకటి  కనిపిస్తే  స్థిమితంగా ఉండేదేమో  నాకు.
ఒక నెల గడిచింది. నాలో ఆవేశం చల్లబడింది.  ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. మొదట్లో ఉన్న ఆవేశం తగ్గినట్లే బాత్రూం ల పై శ్రద్ధ కూడా తగ్గింది.  బాత్రూంలు శుభ్రం గా అనిపించట్లేదు నాకు. ఐనా  నేను పిలవక పోయినంత మాత్రాన అతను తన పనిని  మానేస్తాడా? అతనికి కుడా డబ్బులు రావొద్దా?  నేను కుడా అంత  హీనంగా చూసేమనిషినేమీ కాను. సమర్దించుకుని సాయిని బాత్రూం లు కడిగేవారుంటే పంపమని అడిగాను.  
“ఇప్పుడెవరు దొరకట్లేదమ్మ ..బాత్రూములు లు కడిగే పని చెయ్యమిగ అంటున్రు .” కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
ఏమనాలో తెలియక అతనివైపే చూస్తున్నా.” నేను మా బామ్మర్ది ఇద్దరం గీ పని ఇడిషివెట్టి రేపటిసంది మెకానిక్ బంకు లో  పనికి వోతున్నం.” చెత్తడబ్బా పట్టుకుని మెట్లుదిగుతూ చెప్పాడు వెనక్కి తిరగకుడా చెప్పాడు. నా సంఘర్షణా, సమర్ధింపూ మధ్య సమస్య దానికదే పరిష్కారమైపోయి ఎక్కడో దాక్కున్న ఇబ్బంది తేలికైపోయిందా?
లోపలికోచి తలుపేస్తున్నా, వద్దన్నా పెదవులమీద నవ్వు పూస్తూనే ఉంది.
నడుము తిప్పుతూ,  కూనిరాగాలు తీస్తూ  చీపురు పట్టుకుని బాత్రూం  లోపలికెళ్తున్న నన్ను ప్రకాష్ అయోమయంగా  చూస్తున్నాడు.
—-అపర్ణ తోట

వాన వెలిసింది !

ఆ చూపుకి, మాటకీ ఎంత శక్తి! ఎన్నడూ కనీసం ఊహించనైనా లేదు. పిల్లదాని మాటలో నన్ను నిర్బంధించే శక్తి  ఉందని. ఎక్కడికి వెళ్లినా, ఎందరితో మాట్లాడుతున్నా మనసులో ముద్రితమైన దాని మాట మాత్రం నన్ను వొంటరిగా లాక్కుపోతోంది. ఆఫీస్‌ టైమ్‌ అయిన హడావుడిలో దాన్నసలు పట్టించుకోవడం లేదు. తీరా వీధి గుమ్మం దగ్గరికి రాగానే అడ్డుపడి ‘ఇవాళ వెళ్లకమ్మా… నిన్ను పోనీనంతే..!’  అని గట్టిగా కావలించుకుంటుంది. ఇవాళా అంతే. నా హడావుడిలో దాన్ని విడిపించుకుని పట్టుకోమని అమ్మకి చెప్పి బస్సెక్కాను. కానీ ఆ పిచ్చిముండ ఎంత బాధపడుతోందో తెలీకా కాదు. ఈమధ్య ఆఫీసు పని ఎక్కువై దాని సంగతే పట్టించుకోవడం లేదు.

దానికి అమ్మే దగ్గరయింది. ఎప్పుడూ తన దగ్గరే ఎక్కువ ఉండటం, నన్ను చూస్తే కోపం, చిరాకూను.  నేనేం చెయ్యను? ఉద్యోగం చేయడం తప్పడం లేదు. అయినా ఇలాంటి నగరాల్లో బతకాలంటే ఇంటిల్లపాదీ చిన్నా చితకా ఉద్యోగం చేయక తప్పదు. అప్పడే కాస్తంతైనా ఆనందం. ఇదుగో యిలా నాలుగేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే నన్ను నా కూతురికి దూరం చేసింది. దానితో ఆడుకోవాలనుకునే సమయంలో ఉద్యోగం తప్పింది కాదు. ఆయన స్నేహితుల వల్ల మోసపోయి వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు. రెండేళ్లుగా మరీ పిచ్చెత్తినట్టు తిరుగుతున్నారు. ఆయన్నని లాభమేమిటి? అంఆ దురదృష్టం గాక. అప్పటికీ ఓ చిన్న ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉన్నారు… ఆలోచనలు తెగేసరికి ఆఫీస్‌ బస్టాప్‌ వచ్చేసింది.

ఓ పదడుగులు నడిచి ఆఫీస్‌ చేరగానే జయ లాంగ్‌లీవ్‌ అయి చేరినట్టు తెలిసింది. ఇవాళ ఆఫీసర్‌ లేకపోవడంతో పని తగ్గించుకుని జయ కోసం పక్క సెక్షన్‌కి వెళ్లాను. చాలా రోజులకి కలవడంతో ఎంతో ఆనందించింది. ఇద్దరం క్యాంటిన్‌కి వెళ్లి చిన్నపిల్లల్లా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. తను ఏవో చాలా సంగతులు చెప్తోంది. నేను మాటల మధ్యలో ఎందురుగా గోడ మీద వాలిన పిచ్చికని చూస్తుండిపోయాను. అది ఒక్కసారి రెక్కలాడించడం, ముక్కుతో మట్టిని తాకడం తమాషాగా అనిపించింది.  నాకు నా కూతురు గుర్తొచ్చి ఏం చేస్తోందోనని ఆలోచనలో పడ్డాను..

నన్ను నిలదీసి అడిగేంత శక్తి ఎలా వచ్చిందోనని, నన్ను నేను ఆలోచించుకునేట్టు  ఎలా  అనగలిగిందోనని  ఆలోచనలో పడ్డాను. అంతలో బుజం మీద గట్టి దెబ్బ తగిలి ఆలోచనలు తెగాయి.

‘‘ఏమాలోచిస్తున్నావే. ?  ఇందాకట్నించీ పిలుస్తున్నాను. ఏమయింది?’’ నా స్నేహితురాలు అడిగింది.

‘‘ఏం లేదు.  ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను.’’

నీకేమైనా పిచ్చా ?? ఆరేళ్ల తర్వాత గవర్నమెంట్‌ జాబ్‌ వదులుకుంటావా?’’

‘………..’

‘‘ఉద్యోగాల్లేక జనాలు ఛస్తుంటే, ఉన్నది వదులుకుంటానంటావే?!’’

అది నిజమే. కానీ పిల్లదానికి  మరీ దూరమవుతున్నాను. ఈ ఉద్యోగం కంటే దాని ప్రేమే కావాలి. అది కనీసం నా వైపేనా చూడ్డం లేదు. నేనంటే అయిష్టం ఏర్పడింది. కానీ ఇవన్నీ ఎలా ఎవరికి చెప్పుకోను? జయ కూడా అర్థం చేసుకోలే దేమో? నన్ను నేను తర్కించుకుంటున్నాను.

‘‘పిల్లదానితో అమ్మా,  చెల్లెలూ అవస్థలు పడుతున్నారే..’’ అనగలిగాను.

‘‘మరి ఇంటి సంగతి ?’’

‘‘అదే ఆలోచిస్తున్నాను. నేను ఉద్యోగం చేయడం అందరికీ అవసరం. నాకు పిల్ల ఆవసరం’’

పిల్లకి మాత్రం నేనక్కర్లేదట! నాకు దుఖం పెల్లుబికింది. జయను కావలించుకుని ఏడ్చేశాను. నన్ను ఊరుకోబెట్టడానికి తను చాలా సంగతులు చెప్పింది.

సాయంత్రం ఆఫీస్‌ అయి ఇద్దరం చెరో దారాన బస్‌ ఎక్కాం.  ఆలోచన మాత్రం తెగలేదు. నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానిస్తుందో లేదో నన్న భయమూ పట్టుకుంది. నాలో ఎందుకింత మార్పో అర్థం కావడం లేదు. పిల్లకి కోపం ఉండదన్న సంగతి మర్చిపోయి పిల్లది నేను ఆఫీస్‌కి వస్తుంటే చూసిన చూపుకి ఇంకా భయపడుతూనే ఉన్నాను. నాదో చిత్రమైన పరిస్థితి… ఇంతలో కండక్టర్‌ అరిచాడు..

‘‘అమ్మా, నారాయణగూడా వచ్చింది. దిగండి’’.. ఇటూ ఇటూ కంగారుగా చూసి గబగబా దిగాను. అక్కడి నుంచి నిదానంగా ఇల్లు చేరుకునే సరికి టైమ్‌ ఏడయింది.

హాల్లో కుర్చీలో కూచుని హోమ్‌వర్క్‌ చేసుకుంటున్న పిల్ల నా వైపు ఒకసారి తీక్షణంగా చూసింది. మళ్లీ తన రాత పనిలో మునిగింది. నా యింట్లో నేను అపరిచితురాలిలా నిదానంగా చెప్పులు ఓ మూల విడిచి బ్యాగ్‌ టీపాయ్‌ మీద పడేసి అతిధిలా లోపలికి వెళ్లాను. కాఫీతో మళ్లీ వచ్చేసరికి అమ్మలు అమ్మ దగ్గర కథ వింటోంది. అప్పుడు డిస్టర్బ్‌ చేయడం యిష్టంలేక,  తర్వాతనైనా దాన్ని పలకరంచి సారీ చెబుతామని ఎంతో ఆత్రుతతో అటూ యిటూ పచార్లు చేశాను. కానీ గుండెలో భయం మాత్రం పోలేదు. చిన్నప్పుడు లెక్కలు తప్పు చేస్తే నాన్న  కొట్టడం గుర్తొచ్చింది. నాన్నంటే ఎంత భయమో యిప్పుడీ చిన్న ముండంటే అంత భయమూ పట్టుకుంది. కానీ అది దూరమవుతోందన్న  బెంగ పట్టుకు  పీడిస్తోంది.

మా యిద్దరి మధ్యా భూమి బద్దలై అది నాకు కనుమరుగయినట్లనిపిస్తోంది … అబ్బా! తల తిరిగి పెరట్లో మెట్లపై పడ్డాను. ఒక్క పరుగున అమ్మ వచ్చి లేపింది. కానీ కాలు బెణికి విపరీతంగా నొప్పిగా  ఉంది, ఏడుపొస్తోంది. అయినా నేనిలా మరీ పరాధ్యానంగా ఉండటానికి కారణం తనకీ తెలుసు. అందుకే ఏమీ అనలేకపోయింది. కనీసం ఈ క్షణాన్నైనా పిల్లవచ్చి కావలించుకుంటుందని అనుకున్నాను. కానీ అది నా అరుపు విని హాల్లో గుమ్మందగ్గర సగం వేసిన తలుపుకి బుగ్గలు ఆనించి భయం భయంగా చూసి వెళ్లిపోయింది. నాకు ఏడుపు ఆగలేదు.

భోజనాలయ్యాక చిన్నదాన్ని ఎలాగయినా దగ్గరికి చేర్చుకోవాలనుకున్నాను. బెడ్‌ రూమ్‌ కిటికీలోంచి అది వీధిలో వర్షానికి నిలిచిన నీళ్లని చూస్తోంది. వెనగ్గా వెళ్లి పట్టుకున్నాను.

‘‘నా తల్లి గదూ, బంగారం కదూ, రామ్మా…’ అంటూ మీదికి లాక్కోబోయాను. అది నన్ను విదిల్చుకుని లేవబోయింది. దాని కాళ్లు పట్టుకని భోరున ఏడ్చాను.

‘‘నన్ను వొంటరిదాన్ని చెయ్యద్దని’ ఏడుస్తూ దాని వొళ్లో తలవాల్చాను కొంతసేపటికి అది తన చిట్టి చేతులతో నా ముఖాన్ని ఎత్తి  కన్నీళ్లు తుడిచింది.

‘‘నాన్న వెళుతున్నాడుగా నువ్వెందుకు ఆఫీసుకి వెళ్ళడం. అమ్మమ్మ, పిన్నీ యింట్లోనే ఉన్నారుగా?’ అంటూ అదీ ఏడ్చింది.

‘‘లేదమ్మా నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను’’ అంటూ ఎత్తుకున్నాను. ఆ క్షణంలో నా ఆనందానికి అంతేలేదు. పిచ్చిగా అరిచాను. గట్టిగా నవ్వాను. దానితో దొంగా పోలీస్‌ ఆడాను. అంత చలిలోనూ  దానితో వీధి గేటు దగ్గర రోడ్డు మీదా నిలిచిన నీళ్లలో దానికంటే వేగంగా చిందులు వేశాను. ఈ ఆనందాన్ని పోగొట్టుకోకూడదనిపించింది. అలా ఆడుతూనే పిచ్చిదానిలా నవ్వుతూనే పక్కింటికెళ్లి ఫోన్‌ అడిగాను. అప్పటికి రాత్రి తొమ్మిది దాటింది. ఆఫీసర్‌ యింటికి ఫోన్‌ చేసి నేను వారం రోజులు రానని చెప్పాను.

ఆయనేమన్నాడో తెలీదు… వినలేదు… కాదు ఈ ఆనందంలో వినిపించలేదు..

— టి.లలితప్రసాద్‌

 

మారుతోన్న తరం

“ ఒకసారి వచ్చి వెడతారా నాన్నగారూ “ శేఖర్ నుండి ఫోను ….

“ ఏమైందిరా  ?  “ప్రకాశరావుకు  ఆదుర్దా కలిగింది. కొడుకు శేఖర్ కోడలు ప్రభ ల  పట్నపు పరుగుల జీవితంలో ఇమడలేక  పల్లెలో ప్రశాంతంగా వుంటున్నారు ప్రకాశరావు, భారతమ్మలు .

పండగా వారం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు శేఖరం ఇంటికి, సెలవులు, సరదాలు  వచ్చినప్పుడు   కొడుకు , కోడలు మనమడు రాహుల్ తో సహా తల్లిదండ్రుల దగ్గరికి  చేరడం అలవాటు . ఎప్పుడో గాని ఇలా అర్ధాంతరంగా పిలుపులు జరగవు . అలా జరిగినప్పుడు కొంచం గాబరా …అంతే

“ ఏమీలేదు నాన్నా రాహుల్ పుట్టిన రోజుకు కొంచం ముందుగా వస్తారేమోనని “

“ వాడి పుట్టిన రోజు కు ఇంకా నెలరోజుల పైనే వుంది కదా . ఇప్పటినుండి వచ్చినా మీరందరూ మీ పనులపై  ఇంట్లోంచి వెళ్ళిపోతే మేమిద్దరమే బిక్కుమంటూ వుండాలికదా ..అందుకు ఆలోచిస్తున్నా  “

“రండి నాన్నా…సాయంకాలాలైనా  కలసి వుండచ్చు “ అతడి గొంతులో అభ్యర్థన ..

“ సరే ఎప్పుడు బయలుదేరేది చెబుతానులే “ అని ఫోను పెట్టేసింది.

2

“ భారతీ..శేఖర్ ఫోను చేసాడు “ అన్నాడు భార్యతో.

“బాగున్నారా అందరూ ?” అడిగింది భారతమ్మ .

“ ఆ.. బాగున్నారట …మనల్ని ఒకసారి  రమ్మని చెప్పాడు “

“రాహుల్  పుట్టిన రోజుకు వెడతాము కదా “

“కొంచం ముందుగా రమ్మన్నాడు ”

ఎప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదనే తత్త్వం ప్రకాశరావుది ..భార్యకూడా ఎప్పుడో తప్ప అతడిని ఎదురించే రకం కాదు . శేఖర్  మంచి ఉద్యోగం లో వున్నా అతడి పంచన చేరి పోవాలని అనుకోలేదు వాళ్ళు . శేఖర్ కూడా వాళ్ళు ఎక్కడ సుఖంగా వుంటారో ఆలోచించాడు అంతే ..ఆరోగ్యవంతులుగా వుండటం వల్ల  ప్రకాశరావు దంపతులు పల్లెలోనే వుంటామన్నారు .’నీ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తే తప్పక వస్తాం ‘ అనేవాడు. ఆదరించే కొడుకు వున్నప్పుడు ఏ తండ్రి కైనా నిశ్చింతే !

మూడు రొజుల్లో బయలుదేరి వెళ్లారు కొడుకు దగ్గరికి ప్రకాశరావు దంపతులు.

అక్కడ చేరిన రోజు రాత్రే భోజనాల తరువాత  విశ్రాంతిగా లివింగ్ రూం లో కూర్చున్నారు . రాహుల్  ని  నిద్రపుచ్చి  ప్రభ కూడా వచ్చి కూర్చుంది .

 

“ ఒక విషయం మాట్లాడాలి నాన్నా “ ఉపోద్గాతంగా అన్నాడు శేఖర్ .

“ చెప్పు శేఖర్  ఏమి విషయం ?”

ఆర్థిక బాధలు గాని , కుటుంబ కలహాలు కాని లేని  కుటుంబం . చక్కగా భార్య భర్తా ఏడేళ్ళ కొడుకు , సొంత ఇల్లు , కారూ  అన్ని విధాలా సమస్యలు లేవు .మరి ..ఏమై వుంటుంది ? ఇన్ని ఆలోచనలు వచ్చాయి క్షణంలో ప్రకాశరా వుకు .  కుతూహలంగా చూసింది భారతమ్మ .

“ ఇంకో బిడ్డను కావాలనుకుంటున్నాం నాన్నా ..అదీ ఆడపిల్ల ….” ఆగాడు శేఖర్ .

“ప్రొసీడ్ అవ్వండి . ఏమైనా ప్రాబ్లమ్స్ వున్నాయా ? డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చారా ? ప్రభకు ఇంకా ముపై నాలుగేళ్ళే కదా “అదికాదు నాన్నా , ఇంకో బిడ్డ కావాలనుకుంటే  రాహుల్ తరువాతే అనుకొని వుండవచ్చు ..”

“ఇప్పుడేమి కొంచం ఆలస్యం అయ్యింది..చాలామందికి ముప్పై దాటిన తరువాతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ రోజుల్లో

వాళ్ళంతా పిల్లలను కనడం లేదా?..” ప్రకాశరావు సూటి ప్రశ్న.

“ వయసు నిండినదని గాని , గైనిక్ ప్రాబ్లమ్స్ గాని లేవు నాన్నా  ..కాని మేము బిడ్డను కనాలనుకోవడం లేదు . పెంచుకోవాలనుకుంటున్నాం.”

“కనగలిగే పరిస్థితి వున్నప్పుడు పెంచుకోవడం ఏమిటిరా?”

“ మీరు ఎప్పుడూ నా పుట్టిన రోజున బీదపిల్లలకి అన్నం పెట్టేవాళ్ళు .గుర్తుందా?”

“అవును ఏదో లేని వాళ్లకు  సాయం చేద్దామని ఎప్పుడూ అనిపించేది .”

“ అదే నామనసులో నాటుకు పోయింది నాన్నా . ప్రభకు పెళ్లి ఐన వెంటనే చెప్పాను. ఒక బిడ్డ చాలని, మరో బిడ్డను పెంచుకుందామని . దేవుడి దయవల్ల మీరు నొచ్చుకోకుండా మొదటి కానుపు లోనే రాహుల్ పుట్టాడు. వాడు పుట్టగానే వంశం నిలబడింది అని మీరు అమ్మ మురిసిపోయారు . ఇప్పుడు మరో బిడ్డని , అనాధ ని పెంచుకొంటే  బాగుంటుందని అనిపించింది ‘

ప్రకాశరావు మాట్లాడలేదు ఒక క్షణం.

భారతమ్మ మాత్రం “ మా చెల్లెలు కూతురు రత్నకు ముగ్గురూ ఆడపిల్లలే ..ఆరు నెలల క్రితం మళ్ళీ  ఆడపిల్ల పుట్టగానే వాళ్ళ అత్తగారు చాలా సాధించిందట  వంశాంకురం  పుట్టడం లేదని ,అది చాలా బాధపడి౦దిట .  మీరు పెంచుకోవాలను కుంటే దాని బిడ్డను పెంచుకోవచ్చు కదా …” అంది

“ అమ్మా అలా అయితే నేను  ఒక అనాధకు  ఆశ్రయం ఇచ్చినట్టు ..ఎలావుతుంది ?

“దగ్గరి వాళ్ళనుండీ   దత్తత తీసుకుంటే సమస్యలు రావచ్చు “ శేఖర్ అమ్మను ఉద్దేసించి అన్నాడు .

“అంటే మీరు ఎక్కడనుండైనా తెచ్చుకోవాలనే నిర్ణయించు కున్నారా ? “ అంటున్న భారతమ్మకు అడ్డు వస్తూ ప్రకాశరావు “  శేఖర్ ని మాట్లాడనీ “ అన్నాడు .

“ అదే నాన్నా .. నా ఆలోచనకు మీ ఆమోదం  లభిస్తుందనే …”

“ ఆలోచన మంచిదే “ ప్రకాశరావు అంటూంటే భారతమ్మ కోపంగా చూసింది

“ కాని ఎక్కడనుండి తెచ్చుకుంటారు ? దత్తత కూడా పద్దతి ప్రకారమే జరగాలి మళ్ళి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ..”

“ అంటే మీరు కూడా సపోర్టు చేస్తున్నారా ? “ భారతమ్మ గొంతు తీవ్రంగా వుంది

“ భారతీ కొంచం ఆలోచించు. దేశం లో ఎంతోమంది  అనాధలు వున్నారు.ఒకరికి ఆశ్రయం కల్పించడం  మంచిది కాదంటావా ? “

“ దేశం లో వున్నా అనాధలందరిని వుద్దరిస్తారా? ?”

“ వుద్దరించడం కాదు  మన తాహతును బట్టి ఆశ్రయం ఇవ్వటం “

“ వాడి సంసారం లో బాగంగా  ఎవరో వచ్చి అనుభవిస్తారంటే  బాగుంటుందా ?

“ అలా ఆలోచించకు .ఏదైనా ఆక్సిడెంట్ లో ఒక పిల్ల అనాధగా మారితే  ఆశ్రయం ఇస్త్తామని  ఎంతమంది ముందుకు రావటం లేదు ? “ ప్రకాశరావు నచ్చచేప్పబోయాడు .

అప్పటి వరకు వాలా సంభాషణ లో పాలు పంచుకోని ప్రభ నోరు విప్పింది .

“ అత్తయ్యా  ఆ బిడ్డ నాకే పుడితే మన వంశం లోనిదే అని మీరు ఆదరించరా ?

“ నీ కడుపున పుడితే అది వేరే సంగతి  “

“ అత్తయ్యా …నాకే ఒక అమ్మాయి పుట్టిందని  మనసులో అను కొండి . ఎందు కంటే  మేము తెచ్చు కున్నాక పాపను మీరు అనాధగా చూస్తే సహించలేము .”
“ అంటే మీ నిర్ణయాన్ని మేము ఆమోదించాలనే  పిలిపించారు …సరే మీ ఇష్టం ..” అనేసి కాస్త విసురుగానే వెళ్ళింది భారతమ్మ .

శేఖర్ వైపు నిస్సహాయంగా చూసింది ప్రభ .

శేఖర్  నాన్న వైపు చూసాడు . అతను ఆలోచనలో వున్నట్టు అనిపించింది .

‘ రాహుల్ కి తోడు కావాలని కూడా అనుకుంటున్నాము నాన్నా “ మీరు  ఆలోచించి అమ్మతో మాట్లాడండి . ఒక వేళ మాకు పిల్లలు పుట్టే అవకాశమే లేకుంటే మీరు ఒప్పుకునే వారు కాదా ?  “ అని  అభ్యర్తన వినిపించి శేఖర్ లేచాడు .

“ ఒక్క సారి ఆలోచించండి మామయ్యా ..మీ పెంపకం లో శేఖర్ ఎంతో  నేర్చుకున్నాడు .ఒక విధంగా మీ ఆచరణా విధానమే అతని లోనూ వుందనిపిస్తుంది . మేము కూడా చాలా ఆలోచించాము..కాని మీ  నిర్ణయం తరువాతే మా ఆలోచన ఆచరణ… “ ప్రభ అర్తిం పు గా అంది..

“ సరేనమ్మా “ అంటూ లేచాడు ప్రకాశరావు .

ఎవరి గదుల్లోకి వారు వెళ్ళినా ..ఆ రోజు రాత్రి మాత్రం అందరి నిద్రను  పారద్రోలి  ఆలోచనలే రాజ్యం ఏలాయి .

మరు  రోజు శేఖర్, ప్రభలు ఆఫీసులకి , రాహుల్ స్కూలుకి వెళ్లారు.  తాతయ్య నాన్నమ్మలు  వున్నారని ఆ రోజు రాహుల్ కాస్త తొందరగా ఇంటికి వచ్చాడు

“ రాహుల్ నీ కో చెల్లి వుంటే ఎలా వుంటుంది ? “ అనడిగాడు తాతయ్య.

“ నాకు చెల్లి కావాలని అడుగుతూనే వున్నా తాతయ్య. ఆడు కోవడానికి, అన్ని షేర్ చేసుకోవడానికి ఎంతబాగుంటుందో“

కళ్ళల్లో మెరుపుతో చెప్పాడు రాహుల్ .

భారతమ్మ ఏమీ మాట్లాడలేదు.శేఖర్ చేసే పని ఎంత మంచిదో అన్ని విధాలా చెప్పాడు భార్యకు ప్రకాశరావు .ఆవిడ ఎందుకో పూర్తిగా సమాధానం గా లేదు .

4

సాయంకాలం అందరూ కలిసి బయట హోటల్ కెళ్ళి డిన్నర్ చేద్దామని డిసైడ్ అయ్యారు . ఎనిమిది  గంటలకు పెద్ద హోటల్ కు వెడితే కొంచం సేపు లౌంజ్ లో వెయిట్ చెయ్యమన్నారు రష్ ఎక్కువగావుండటంతో . బయట పిల్లలు ఆడుకోవడానికి చాల రకాల గేమ్స్ వున్నాయి . చాలా మంది పిల్లలు అల్లరిగా తిరుగుతూ ఆడుకుంటున్నారు .పిల్లలు చాలా మంది జంటలుగా ఆడు కుంటున్నారు. రాహుల్ ఒక్కడే వాళ్ళతో కలిసి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు . భారతమ్మకు ఎందుకో వాడికి ఒక తోడుంటే…. అనిపించక మానలేదు .

హోటల్ ల్లో తింటున్నప్పుడు కూడా ఇద్దరు పిల్లలున్న కుటుంబాలు  బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు, ఒంటరి పిల్ల వున్నవాళ్ళు తల్ల్లి దండ్రులతో ఏదో వాడు లాడు తున్నట్టు  గమనించింది భారతమ్మ .

ఇంటికి వచ్చాక భర్తతో అనింది భారతమ్మ “ పోనీ పెంచుకోమనండి ..రాహుల్ కి ఒక తోడూ వుంటుంది”

హాయిగా గాలి పీల్చుకున్నాడు ప్రకాశరావు .

మరురోజు సాయంకాలానికి భారతమ్మ ఇంకాస్త ప్రసన్నంగా కనిపించడంతో

“ శేఖర్ , మాకేమి అభ్యంతరం లేదురా .అమ్మకూడా ఒప్పుకున్నట్టే … దత్తత కొరకు ఎవరినైనా చూసారా?

ఇదివిన్న ప్రభకు ఏంటో ఆనందం కలిగింది చటుక్కున సోఫాలో కూర్చున్న అత్తా మామల కాళ్ళకు నమస్కరించింది .

“అమ్మా మీ కోరిక ఫలించనీ ..” అని మనస్పూర్తిగా ఆశీర్వదించాడు  ప్రకాశరావు. ఆప్యాయంగా ప్రభ తలమీద చెయ్యి వేసింది భారతమ్మ .

శేఖర్ కు కళ్ళు చెమర్చాయి.

“ నా ఫ్రెండ్ ఒకరి భార్యకు కొన్ని కారణాల వల్ల గర్భసంచి తీసేసారు అతడు దత్తత కోసం వివరాలు సేకరిస్తున్నాడు . అతని తో మాట్లాడు తాను. మీకు చెబుతాను . “

తల్లిదండ్రులకి ఇవ్వ వలసిన గౌరవం ఇస్తూ వాళ్ళ అనుమతి కోసం శేఖర్ దంపతులు పడ్డ వేదన ఆ తండ్రికి ఏంతో  సంతోషాన్ని ఇచ్చింది .

అంతే  కాదు  పిల్లలని కనగలిగే స్థితి లో వుండీ ఒక అనాధపిల్లకు ఆశ్రయం కల్పించాలన్నది ఎంత గొప్ప ఆశయం! సమాజం మారి పోతూ వున్నదని ఆక్రోశిస్తున్నామే కానీ ఇలాటి ఆలోచనలు యువతరం లో ఉత్పన్నం అవుతూ వున్నాయని వారి ఆలోచనలకు మద్దతు తెలిపి  తమ ఆలోచనలను మార్చుకుని సహకరిస్తే తమ పెద్దరికం నిలబడుతుంది కదా …ఇలా సాగాయి  ప్రకాశరావు ఆలోచనలు .

****

రాహుల్ బర్త్ డే కోసం వచ్చిననప్పుడు  ప్రకాశరావుకు కొడుకు చేసిన ప్రయత్నాలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది .ఎందఱో అనాధలు  వున్న దేశం మనది అనుకున్నమే గాని అనాధ శరణాలయాలు  ఒక క్రమమైన పద్దతిలోనే దత్తత నిస్తాయని , దాని కొరకు ఆరు నెలలనుండి సంవత్చరం వరకు వేచి వుండాలని వింటే ఆశ్చర్యం అయింది .

ఎలాగో ఒక శర ణా లయం వాళ్ళు ఆరు నెలల తరువాత దత్తత ఇవ్వగలమని తెలిపారు. కానీవారికి కొన్ని నిభందనలు వున్నాయి ముందుగా మనం అప్లికేషన్ పెట్టు కోవాలి .దత్తత తీసుకునేవారి ఆర్థిక స్తోమత  { financial status}  గురించిన ప్రూఫ్  కావాలి. కుటుంబ నేపధ్యం  పరిశీలించి . వారు సక్రమంగా బిడ్డను పెంచగలరు అన్న నమ్మకం కలగాలి . దత్త త  తీసుకునే వారికి ముందే ఒక బిడ్డ వుంటే ఈ బిడ్డను సక్రమంగా పెంచగలరని వారికి ఇచ్చిన ఇంటర్వూ లో సంతృప్తి కలగాలి .ఇవన్ని పూర్తీ అయ్యాక  వారినుండి పిలుపు వస్తుంది .. అప్పుడు available  వున్నపిల్లలో వీరికి నచ్చిన వారిని లీగల్ గా దత్తత ఇస్తారు.

ఇవన్నీ విన్న భారతమ్మకు మరీ కోపం వచ్చింది .

“ మీరేమో అనాధ కి జీవనం ఇస్తాము అని ముందుకు వస్తే  దానికి ఇంత  తతంగమా . మీ కు పిల్ల నచ్చాలి కాని వాళ్ళకు మీరు నచ్చడం ఏమిటి ? మీరు దత్తత తీసుకుంటా మంటే మనవాళ్ళల్లో లేరా?  తెలిసిన కుటుంబాలు గా  వుంటాయి పిల్ల బుద్దులు ఎలావుంటుందో తెలుస్తుంది “ భారతమ్మ మళ్ళీ  మొదటికి వచ్చింది .

ఆవిడలా అనుకోవడం లో నిజం లేకపోలేదు . భారత దేశమంతా ఎంతోమంది అనాధలే అన్నమాట ఎంత నిజం ?  ఒక మంచి ఉద్దేశం తో ఒక్క అనాధ బిడ్డ కావాలంటే ఇంత తతంగం కావాలా ?

శేఖర్ , ప్రభలు ఏమీ మాట్లాడలేదు . ప్రకాశరావు భార్యను వురుకోమన్నట్టు సైగ చేసాడు .

దత్తత వ్యవహారం కొన్ని నెలలు పడుతుందనగానే వూరికి ప్రయాణం అయ్యారు ఇద్దరూ. వెళ్ళే రోజున భారతమ్మ ప్రభతో అంది

“ చూడు ప్రభా.. ఇంత ప్రయాసలేందుకు ? మా రత్న కూతురిని దత్తత తీసుకో . వాళ్ళను నేను ఒప్పిస్తాను . మనపిల్ల మనవా ళ్ళ ల్ల్లో బతుకుతుంది “

ప్రభ మాట్లాడలేదు.

ప్రకాశరావు   ముందుకు వచ్చి

“ అమ్మా ప్రభా  మీరు బిడ్డను ఎప్పుడు తెచ్చుకుంటారో తెలపండి మళ్ళీ  వస్తాము .” అన్నాడు

అలా అన్న మామ గారిని  సంతృప్తిగా చూసింది ప్రభ . అన్ని విధాలా అర్థం చేసుకునే మామగారు ఎందరికి దొరుకుతారు. ?

అనాధ శరణాలయం లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తీ చేసుకుని ఇంటికి పాపను తెచ్చుకునే వరకు అన్ని వివరాలూ తండ్రికి తెలియ చేస్తూనే వున్నాడు శేఖర్ .

భారతమ్మ మనసు బాధపడ కుండా నెమ్మ నెమ్మదిగా వివరాలు చెబుతూ సమాధాన పరుస్తూన్నాడు ప్రకాశరావు .పాప ఇంట్లో అలవాటైనాకే వస్తామని చెప్పాడు కొడుకుకు .

పాపను ఇంటికి తెచ్చిన రెండు నెలలు గడిచాయి . ప్రభ లీవు పెట్టి ఇంట్లోనే వుంది. ఎందుకంటే అనాధ శరణాలయం లో మరీ నెలల పాప కాకుండా రెండేళ్ళ పాప వీరి సొంతమైంది . కొద్దిగా మాటలు కూడా వస్తున్నాయి. కాబట్టి అందరిని అలవాటు చేసుకునేలా చెయ్యడం ముఖ్యం . ప్రభ అనుక్షణం  పాప ను అంటిపెట్టుకుని వుంటూ  ‘అమ్మా ‘ అనిపించుకుంది. రాహుల్ని  గుర్తుపట్టి ‘అన్నా’ అని, శేఖర్ని’ డాడి  ‘ అని అనేంత వరకు వచ్చాక ప్రకాశరావు కు తెలియ చేసారు.

మరో పది రోజుల్లో ప్రకాశరావు దంపతులు వస్తారని తెలియడంతో  వారి ఫోటో చూపుతూ మాటలు నేర్పే  ప్రయత్నం చేసింది ప్రభ .

అనుకున్న రోజు రానే వచ్చింది . ఇంట్లోకి వస్తున్న భారతమ్మను చూసి పాపా ముందుకు చేతులు చాపి ‘ నాన్నమ్మా ‘ అంది .

“ అమ్మా  నాన్నమ్మను గుర్తుపట్టేసావే ‘ అని సంబరంగా ఎత్తుకుంది భారతమ్మ . తాతయ్య దగ్గరికి కూడా కొత్త లేకుండా వెళ్ళింది పాప.

ప్రభ , శేఖర్ ఏంతో  సంతోషించారు .

“ నల్లగా వున్నా పాప ను తీసుకున్నరేమి? తెల్లగా వున్నా వాళ్ళు లేరా ?” అడగనే అడిగింది  భారతమ్మ .

“తెల్లగా వుంటే ఎవరైనా దత్తత తీసు కుంటారు .నాకు పాప నచ్చింది అత్తయ్యా  .ఒక సారి చూడండి ఎంత కళగావుందో..పేరు కుడా మీరే  పెట్టాలి  అత్తయ్యా ‘ అన్న ప్రభ మాటలకు  కోడలు ఎంత ఇదిగా ఆలోచిస్తూ వుందో అని ముచ్చటేసింది అంతే  కాదు  ఆడ పిల్లను పెంచుకోవడం కోసం కొడుకు , కోడలు ఎంత తాపత్రయ పడ్డారో తెలిసిన భారతమ్మ కూడా భారత దేశంలో పోషించగల శక్తి వున్నా ప్రతి ఒక్కరు ఒక ఆడ పిల్లను పెంచుకోవడానికి ఉచ్చాహం  చూపితే ఎంత బాగుంటుందో అనిపించింది .

ఇంతలో బుడి బుడి నడకలతో నాన్నమ్మ చీర పట్టుకుంది పాప ముద్దుగా ..

ఆనందం ఆ ఇంటిలో నాట్యం చేసింది …

—లక్ష్మీ రాఘవ

 

 

అరుణ పూర్ణిమ

“కొండగాలి తిరిగిందీ   గుండె ఊసులాడిందీ      గోదావరి వరద లాగా  కోరిక చెలరేగింది  …ఆ”

రేడియోలో పాట మొదలు కాగానే ఎప్పటి లానే గతం నా కళ్ల ముందుకు వచ్చింది. అక్షరాల్లో వెలువరించలేని  అనుభవాలు గుర్తుకు రాగానే  ఒంట్లో వెచ్చదనం ప్రవహించడం మొదలయ్యింది.
పది  సంవత్సరాలు గడచినా  ఆ అనుభవాల తాలూకు జ్ఞాపకాలు నాలో ఎప్పుడూ తాజాగా  ఉండటం నాకే ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. “పడుచుదనం పరువానికి  తాంబూల మిచ్చింది “
అనివార్యంగా గతంలోకి వెళ్లి పోతున్నాను.
                అమ్మా నాన్నా  లేని ఇల్లు. భరించలేని ఒంటరితనం .బాధ్యతంటే ఏమిటో తెలియని వయస్సు లో ఇంటి  భారం   తన భుజాల మీదికెక్కడం. అనాలోచితంగా రోజులు గడుస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత  ఆలోచనా శక్తి లేని వాణ్ని.ఏమీ తోచక ఎక్కువగా ఆనంద్ వాళ్ళింట్లో గడపటం అలవాటయ్యింది. ఆనంద్ నాకు ఆప్తమిత్రుడు ,క్లాస్ మేట్.అమ్మా నాన్నా  ఒకేసారి యాక్సిడెంట్ లో  పోవడంతో ఆ ఇంటి వాళ్లందరికీ నాపై సానుభూతి కలిగి  ఆ ఇంటి  వాళ్లలో  ఒకడిగా తిరిగే  చనువు పెరిగింది.ఆనంద్ వాళ్ల నాన్నకు  వ్యవసాయం,వ్యాపారం  రాజకీయాల్తో  పరోక్ష సంబంధం. ఇంకా ఎన్నో లావాదేవీలు ఉన్నాయి.ఆయన ఇంట్లో ఉండేది తక్కువ. ఉన్నా ఎప్పుడూ వసారాలో ఎవరో ఒకరితో బిజీ. వార్తాపత్రికలు, వారపత్రికలు  వస్తుంటాయి గనక ఆనంద్ ఉన్నా లేకున్నా ఎక్కడో ఓ చోట కూర్చొని  పత్రికలు    చదవటం అలవాటయ్యింది.
                  “అన్నయ్య లేడు  అర్జెంటుగా బజారు కెళ్లాలి తీసికెళ్తావా-అన్నయ్య సైకిలుంది ఇంట్లో” అంటూ ఆనంద్ చెల్లెలు  అరుణ ప్రాధేయపడింది  ఓరోజు.కొంచెం బెరుకుగానే అనిపించినా  కాదనలేక  సరేనని సైకిలి వెనుక కూర్చోబెట్టుకుని  బజారుకెళ్లాను. సైకిలు తొక్కుతున్నంతసేపూ  అందరూ నన్నే చూస్తున్నట్లుగా ,నేనేదో తప్పు చేస్తున్నానేమోననే  ఫీలింగుతో సతమవుతూంటే, ఇవేమీ పట్టనట్లుగా  వెనుక కూచుని వసపిట్టలాగా వాగుతోంది అరుణ  “ఆ సీరియల్ చదివావా “,”ఈ కథ బావుందికదూ” అంటూ వారపత్రికల్లో వచ్చే సీరియల్స్ గురించీ కథల గురించీ  మాట్లాడుతోంది మా ఇద్దరికీ కామన్ ఇంటరెస్టు అదొక్కటే గనక. ఊc..ఆc… అంటూ నేను మాత్రం పొడిపొడిగానే అడిగిందానికి జవాబిస్తున్నాను.బజార్లో ఏదో కొనుక్కుంది.ఇంటికి తిరిగి వెళ్లే సరికి  ఆనంద్ ఉన్నాడు. ఏమంటాడో అనుకుంటుంటే “ఒరే కామేశ్ !  ఏమీ అనుకోకురా.మా చెల్లాయికి ఎప్పుడు ఏది కావాల్సి వస్తే అప్పుడది వెంటనే తెచ్చుకోవాల్సిందే. నేను వచ్చేలోగానే నిన్ను తీసికెళ్లింది. పద కాసేపలా తిరిగి వద్దాం “అనగానే నాలో గిల్టీ ఫీలింగు మెల్లిగా తగ్గింది. అలా అరుణతో కూడా చనువేర్పడింది. అరుణకు  పదిహేడేళ్లేమో. అప్పుడప్పుడూ ఏదైనా నోట్సు  కాపీ చేసివ్వటం,కాలేజీకి దింపిరావడం, ఆనంద్ కిష్టం లేని సినిమా ఆమెకిష్టమయితే తీసికొని మ్యాట్నీకి వెళ్లటం  చాలా క్యాజువల్ గా జరిగి పోతుండేవి.
                         ఓ రోజు  ఆనంద్ పనిమీద హైదరాబాదు వెళ్లాడు.ఆనంద్ వాళ్ల  అమ్మా నాన్నా  ఏదో పెళ్లికి  వెళ్లారు .నేను వెళ్లే సరికి అరుణ ఒక్కర్తే ఉంది ఇంట్లో.ఎవరూ లేరనగానే  వెళ్లొస్తానని  వెను తిరగబోతుంటే  “అదేంటి  ..పోతావేంటి ..రా.కూర్చో “అని మొహమాట పెట్టింది.సరే అని ఓ పత్రిక తీసుకుని  తిరగేస్తున్నా. ఇంతలో  అరుణ సడెన్ గా  లేచి వంటింట్లోకి వెళ్లి స్వీటు తెచ్చింది.  వాళ్లింట్లో నాకిదేమీ కొత్తగాక పోయినా  తను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ  మర్యాద ఎందుకో  ఎబ్బెట్టుగా అనిపించింది. వద్దని మొహమాట పడ్తూంటే  “ఫర్లేదు ..తీసుకో “అంది .అది చనువో ఆజ్ఞో  తెలీలేదు.తీసుకున్నాను.మంచి నీళ్లందించింది  చాలా దగ్గరగా వచ్చి.కొంచం వెనక్కి వాలి తాగాను.నా కెందుకో  చాలా గిల్టీగా ఉంది.వెళ్దామని లేచాను. అరుణ కూడా లేచి నిలబడి  తటపటాయిస్తూ “కామేశ్.. ఒక సారి  మేడ మీదికి రా ..చిన్న పనుంది” అంది .నాకెందుకో  ఒక్కసారి  ఒళ్లు జలదరించింది.మాట గొంతులో ఆగి పోతుంటే “ఏం పని” అన్నాను. “ఏం లేదు అటక మీద పెట్టె ఒకటి కిందకు దించాలి”అని తనను అనుసరించమని దారి తీసింది. సంకోచిస్తూనే ఆమె వెనుకే ఆమె తీసుకెళ్లిన గదిలోకివెళ్లాను. లోనికి వెళ్లగానే గిరుక్కున వెనుకకు తిరిగి తలుపు మూసేసి  నన్ను  బిగ్గరగా  తన రెండు చేతుల్తో బంధించింది. దడ దడలాడుతున్న  గుండెతో ఉక్కిరిబిక్కిరవుతున్న  నన్ను ఏం చేసిందో ఏమో.”యూ..ఆర్ …..”మైకం లో  ఆమె  ఏదో మాట్లాడుతుంటే  ఇహ లోకం లోకి వచ్చిన  నాకు జరిగినదంతా ఓ  కలలాగా  పొందిన  మధురానుభూతితోపాటు  తప్పు  చేశానన్నఆత్మన్యూనతాభావం  పెనవేసుకుని ఎలా రెస్పాన్సు  ఇవ్వాలో తోచక ” వస్తాను “అని చెప్పి  ఇంట్లో వచ్చి పడ్డాను.
   “ఏరా ఉన్నావా .ఎంతకీ రాక పోయే సరికి ఊళ్లో వున్నావో లేదో తెలుసుకుందామని నేనే వచ్చాను. “అంటూ  మరునాడు  ఆనంద్ వచ్చేసరికి  నాలో ఉన్న  సంకోచం ,బెరుకు అడుగునపడి వాడితోబయటికి నడిచాను.
  ” మా చెల్లాయి పెళ్లి కుదిరిందిరా.నిన్న నాన్న వెళ్లిన పెళ్లిలో  అనుకోకుండా ఓ సంబంధం గురించితెలిసిందట. అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు. వారం రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్లి పోతాడట. వాళ్లు మా బంధువులే.అందుకే చెల్లాయిని  చూడాల్సిన పని కూడా లేకపోవడంతో  అన్ని విషయాలుమాట్లాడివచ్చారు నాన్న.”అన్న ఆనంద్ మాటలు వినగానే అసంకల్పితంగా అడిగాను  “అరుణకిష్టమేనా మరి”  అని.
“ఓ దాని కేం .రాత్రి  ఈ విషయం దానితో చెప్పగానే ఎగిరి గంతేసింది.అప్పుడే అమెరికా వెళ్లినట్టు ఊహల్లో తేలిపోతుంది. హైదరాబాదులో పెళ్లి. అన్ని ఏర్పాట్లు చేసి వచ్చారు నాన్న.”
“అలాగా వెరీ గుడ్ “అన్నానే కానీ నా మనస్సు మాత్రం  నిన్నటి అనుభవాన్నే  నెమరు వేస్తుంది.
       మాటల్లో  ఆనంద్ వాళ్లింటికి చేరాము. ఎదురుగానే అరుణ తారస పడింది. అరుణ ముఖంలో ఆనందం కొట్టవచ్చినట్లుగా  కన్పిస్తుంది. కంగ్రాట్స్  అనగానే థాంక్స్  అంది మెరిసే కళ్లతో మురిసే మనసుతో. కొన్ని భావాలకు  భాష చాలదు. అప్పటి మా ఇద్దరి పరిస్థితి  అంతే.
               “ఇప్పుడే వస్తానురా .మీరు మాట్లాడుతూ ఉండండి “అంటూ ఆనంద్ లోనికెళ్లాడు. అరుణ గొంతు తగ్గించి  “కొన్ని స్వీట్ మెమొరీస్ గా  మనసులో దాచుకోవాలి.బాగా అప్సెట్  అయ్యావు కదూ!చలం సాహిత్యం చదివిన వాడివి. ఆడదాని మనసు అర్థం చేసుకుంటావనుకుంటాను.ఎనీహౌ  వన్సగెయిన్ థాంక్స్. ఇంతకంటే ఏం చెప్పలేను”నువ్వు చాలా ఎదిగి పొయ్యావు  అరుణా , థాంక్స్  నేనే నీకు చెప్పాలి .మనసులో అనుకున్నా.
          ఇంతవరకూ  మీరు విన్న పాట ఉయ్యాల జంపాల చిత్రం కోసం  అంటూ రేడియోలోఅనౌన్స్ మెంట్  వినిపించటంతో  గతం తాలూకు జ్ఞాపకాలకు  బ్రేక్  పడింది.తొలి అనుభవం గుర్తొచ్చినప్పుడల్లా  మలి  అనుభవం గుర్తుకు రావడం జరిగిందంటే  అవి జీవితాంతం జ్ఞాపకాలుగా మిగిలి పోతాయేమో.వారంలోగానే అరుణ పెళ్లి హైదరాబాదులో అంగ రంగ వైభవంగా జరిగింది.ఆనంద్ వాళ్లతో నేనూ  వెళ్లి వచ్చాను.తిరిగి వచ్చేప్పుడు  అరుణ చూసిన చూపులో ” యూ ఆర్ గ్రేట్  కామూ “అన్న భావం  తొణికిసలాడినట్లనిపించి అనిర్వచనీయ భావంతో తల తిప్పుకుని  వచ్చాను.
    తరువాత  ఆనంద్  పై  చదువులకు  సిటీకి  వెళ్లిపోయాడు.వాళ్ల నాన్న పలుకుబడితోనేను మావూళ్లో వున్న ఫ్యాక్టరీలో    చిన్న ఉద్యోగంలో చేరిపోయాను.ఫ్యాక్టరీ ఇంటికి చాలా దూరంలో ఉంది.షిఫ్టు డ్యూటీలు. సైకిలు పై వెళ్ళితే అరగంట పడుతుంది.ఒక్కొక్కప్పుడు  రాత్రి  పది గంటలకు డ్యూటీ నుండి దిగి  మళ్లీ ఉదయం ఆరు గంటలకే  వెళ్లాల్సి
వస్తుంది.అలాంటప్పుడు  కొంచెం ఇబ్బందిగా ఉండేది .
        నేను పని చేసే  డిపార్టుమెంటులోనే పని చేస్తున్న  వెంకటరత్నంతో స్నేహం కుదిరింది.అతని షిఫ్టు లోనే పని నేర్చుకున్నాను.చేరిన కొత్తలో వెంకట రత్నమే  దగ్గరుండి అన్ని మెళుకువలు  నేర్పించాడు.ఆయన చాలా గడబిడ మనిషి. ఎప్పుడు నలుగుర్ని పోగేసుకుని  కబుర్లు చెప్పడం ఆయనకలవాటు.క్యాంటీన్ టైములో పదిమందీ ఆయన చుట్టూ చేరి ఆయన చెప్పే కబుర్లు వింటూ పని లోని టెన్షన్  మరచి పోవడం  మామూలుగా జరిగిపోయ్యేది.ఏ కారణం వల్లనో  అతడు అవివాహితుడిగా మిగిలిపోయాడు. సీనియరు  కాబట్టి స్టాఫ్ కాలనీలో  చాలా రోజుల క్రితమే  ఆయనకు క్వార్టర్  దొరికింది.అదికాలనీ చివర్లో ఉండేది .హోటల్ భోజనం క్వార్టర్లో మకాం.డ్యూటీ లేని వేళల్లో ఆ ఇల్లో  చిన్న పేకాట క్లబ్బు.
              అప్పుడప్పుడూ  రెండో షిఫ్టు చేసి వెంకటరత్నం క్వార్టర్లో పడుకుని మరునాటి ఉదయం లేచి  ఫస్టు షిఫ్టుకి  వెళ్లేవాడిని. అదీ ఆయన సలహా నే. అలా వెంకట రత్నం క్వార్టర్లో  తరచుగా ఉండి పోవటం అలవాటయ్యింది.తరువాత్తరువాత  మా షిఫ్టులు మారినా అక్కడే మకాం వేయటం మాత్రం అలానే కొనసాగుతోంది .    బ్రహ్మచారి కొంప .పైగా  పేకాట క్లబ్బు.ఇల్లంతా సిగరెట్టు పీకలతో ,హోటల్ నుండి తెప్పించుకున్న  ఫలహారప్పొట్లాలతో నిండిపోవటం  ,క్వార్టర్ క్లీన్ చేసుకోవాలంటే బద్దకం ప్లస్ డిగ్నిటీ తోడవ్వటం తో  వెంకటరత్నం ఓ పనిమనిషిని కుదుర్చుకున్నాడు. పున్నమ్మ రోజూ ఉదయం ఐదు గంటలకే వచ్చి,ఇల్లు ఊడ్చి ,మంచినీళ్ళు నింపి టీ కప్పులు,ప్లేట్లూ కడిగి వెళ్లేది.పున్నమ్మకు మహా ఉంటే ఇరవైరెండు ఇరవై మూడేళ్లుంటాయేమో. మనిషి నలుపే అయినా సౌష్టవమైన ఒళ్లు. శుభ్రంగా కూడా వుండేది .క్వార్టర్ల వెనుకగా ఉండే గుడిసెల్లోంచి వచ్చేది. తల్లిదండ్రులు  పందుల పెంపకంతో  జీవనం సాగిస్తుంటే, తను మాత్రం నాలుగిళ్లలో పనీపాటా చేసుకుంటు బతుకుతుంది.తెలిసిన వాళ్లకు  తప్ప  ఫలానా పిల్ల అని అనిపించేది   కాదు.కట్టు బొట్టూ చక్కగా ఉండేది.
     చిన్నతనం లోనే రోగిష్టి బావతో పెళ్లి జరిగి  ఇరవై ఏళ్లకే  వాడు చనిపోవడంతో  మళ్లీ పెళ్లి చేసుకోకుండా  అలాగే ఉంది పోయింది.నిజం చెప్పాలంటే  మా వెంకటరత్నం లాంటి వాళ్లకు పెళ్లి చేసుకోని లోటు  తీరుస్తుందని  తరువాత్తరువాత  అర్థమయ్యింది.
             పున్నమ్మ పాటలు బాగా పాడుతుందని ఓ రోజు ఊడుస్తూ కూని రాగాలు  తీస్తుంటే తెలిసింది. కానీ ఆ పాటలన్నీ  ఎవరో  నేర్పించిన పాటలు. తనుండే కాలనీకి  అర్ధ రాత్రి  అన్నలు వస్తారని వినేవాణ్ని. పున్నమ్మ పాడేవన్నీ ఆ పాటలే .
             దాదాపు  అయిదారు నెలలనుండి  ఆ ఇంట్లో  తరచుగా  ఉంటున్నప్పటికీ  పున్నమ్మపై నాకెలాంటి వూహా కలుగలేదు. అప్పుడప్పుడు  అరుణతో గడపిన  అనుభవం గుర్తొచ్చినా  నాలో ఎలాంటి వికారమూ  కలుగలేదు.ఓసారి  వారం రోజుల సెలవు పై ళ్లాడు.వెళ్తూ వెళ్తూ  క్వార్టర్ కీ నాకిచ్చి వెళ్లాడు.ఎప్పటి లానే  రెండో షిఫ్టు  చేసి వచ్చి పడుకున్నాను క్వార్టర్లో.ఎప్పటిలాగానే  ఉదయం పనికి వచ్చింది పున్నమ్మ.తన పని పూర్తి చేసుకుని వెళ్లి పోకుండా  అలాగే నిల్చుంది.
ఏమిటన్నట్లు చూశాను.
              “ఏం ల్లేదు దొరా. మిమ్ముల్ని  జూత్తంటే నాకు ఇసిత్రంగున్నది. గిన్నోద్దులాయే పనికస్తన్నగద ఒక్కసారి సుత  కన్నెత్తి  జూళ్లేదు నాకెయ్యి .అదే తొవ్వొంటి బోతుంటె   అందరు నన్ను కొరికినట్టు జూత్తరు.గమ్మతనిపిస్తది మిమ్ముల్ని జూత్తె .ఎల్లత్త దొర “అంటూ వెళ్లిపోయింది.ఆమె  మాటలు నావయస్సుని గందరగోళంలో  పడేశాయి.
            రెండు  మూడు రోజుల తర్వాత యధావిధిగా పనికి వచ్చిన పున్నమ్మ”ఏం దొర మొన్న గట్లన్నందుకు  ఆలోచిత్తన్రా .నూట్లకొక్కరు   మీలాంటొల్లు కన్పిస్తరు .అందుకె మీరంటే ఇట్టం.ఎం నేను అందంగా లేనా ”  అంది గడుసుగా.”మిమ్ముల్ని సిగ్గిడ్చి  గిట్లడుగుతున్నదేందని  అనుకుంటున్రా  “ఆడని మనసు  మీకు తెల్వదేమొ దొరా  ”  కొంచేందగ్గరికి వచ్చి  చనువు చూపింది.వయసు నన్ను ఊర్కోనివ్వ లేదు.
                ఆ తర్వాత  ఇక పనిలోకి రాలేదు పున్నమ్మ. ఎందుకో నాకు అర్థం కాలేదు.ఈ లోగా వెంకట రత్నం రావటం అచూకీ తీయటం,పున్నమ్మ ఎటో వెళ్లి పోయిందని తెలియటంతో బహుశా ఉద్యమంలో  చేరి పోయిందేమో ననిపించి  గుండెల్లో  గుబులనిపించినా మెల్లమెల్లగా ఆ సంగతి మరచిపోయాను .
            “ఏమండీ  వంటయింది  వడ్డించమంటారా”అనూరాధ వచ్చి  భోజనానికి లేపింది.లేచి కాళ్లు కడుక్కుని వచ్చి  భోజనం మీద  కూర్చున్నాను.ఇందాకటి  మూడ్  అనూరాధవైపు మళ్లింది.ఆమెతో నా పెళ్లి జరిగిన విషయం గుర్తుకువచ్చింది. తింటూ మళ్లీ ఆలోచనల్లోకూరుకుపోయాను.
                      …………ఉద్యోగంలో స్థిర పడ్డ తరువాత అయిన వాళ్లు నా పెళ్లి గురించి వాకబు చెయ్యడానికి వచ్చారు.దూరపు బంధువులమ్మాయి  అనూరాధను   చూపించారు.నాకు ఏ అభ్యంతరం లేకపోవడంతో మిగతా విషయాలన్నీ వాళ్లే మాట్లాడి మరీ ఆడంబరం లేకుండా మా పెళ్లి జరిపించారు.అనుకూలవతియైన అనూరాధ సాహచర్యంలో కొత్త జీవితం ప్రారంభించాను. చిన్న మోపెడ్ కొనుక్కున్నాను.క్వార్టర్ అలాట్ అయ్యే అవకాశం వున్నా,స్వంత ఇల్లే బాగు చేయిం చుకుని
ఉంటున్నాను.ఆనంద్ హైదరాబాదులో సెటిలయ్యాడు. చూస్తుండగానే పదేళ్లు ఎలా గడిచాయో.
    “ఏవిటండీ ఆ పరధ్యానం.ఏమయ్యిందివ్వాళ మీకు,సరిగ్గా తినటం  లేదు. “
          ఏమని చెప్పాలి ఆమెకు “ఏం లేదు “అన్నాను ముక్తసరిగా.
     ***
ఇలా ఉండగా  ఓ రోజు  మామిత్రుడికి సీరియస్ గా ఉందని తెలిసింది.వాళ్లింటికి వెళ్లే సరికి  అతన్ని వార్ధా హాస్పిటల్ ( సేవాగ్రాం)  కు తీసుకెళ్లుతున్నారు. తోడుగా నేనూ వెళ్లాను.హాస్పిటల్ లో జాయిన్ చేసి వెంట వెళ్లిన వాళ్లకు  వసతి గది వగైరా చూపించి తిరిగి మంచిరాల బయలుదేరాను.ట్రైన్ లో ప్రయాణిస్తూండగా  అర్ధరాత్రి ఓ స్టేషన్ లో గబా గబా నేనున్న కంపార్టుమెంటులోకి  ప్యాంటు షర్టు ధరించి ఒంటినిండా నల్లటి రగ్గు కప్పుకున్న ఓ స్త్రీ చొచ్చుకుంటూ వచ్చింది.అది ప్యాసింజర్ ట్రెయిను  కావడంతో  నేను కూర్చున్న పెట్టెలో  బల్బు వెలుగక చీకటిగా ఉంది .ఆమె నాకెదురు సీట్లో కూర్చుంది. నేను కూర్చున్న చోట ప్రయాణీకులెవరూ లేరు.నిద్ర పట్టీ పట్టని స్థితిలో  కాస్త ఒరిగి పడుకున్న నాకు  హడావుడిగా వచ్చిన ఆమెను చూడగానే అనుమానం కలిగింది.ఏ విప్లవకారిణో అయ్యుంటుందనుకున్నాను.ఈ  లోగా ఆమె కూడా నన్ను పరిశీలించి  చూడటం,  వెంటనే నన్ను పోల్చుకుని  చిన్న స్వరం తో కొంచం కరుకుగానే అయినా  పలకరింపు ధోరణిలో  “ఏం దొరా బాగున్నవ “అంది .వెంటనే పోల్చుకున్నాను .పున్నమ్మ. అవును పున్నమ్మే. మనిషిలో చాలా మార్పు వచ్చింది. దొర అని పిలవటం తప్పనిసరిగా అంటే అదే నాపేరన్నంత సహజంగా  పిలిచింది.ఆశ్చర్యంలోనుండి తేరుకుని కొంచం తటపటాయిస్తూనే  “ఎందుకిలా మారి పోయ్యావు.అని అడిగాను.
         “అదంతా నీకేమీ  చెప్పలేనుగానీ నిన్ను దొరా అని పిలవటం బాగనిపించటం లా. నీ పేరు తెలుసుకోవలసిన అవసరం  అప్పుడు లేకపోవచ్చు గానీ  ఇప్పుడు చెప్పు “
       ఎందుకూ అని అడుగుదామనుకుని ఎందుకో అడుగ లేక “కామేశ్వర్రావు “అన్నాను.
                “ఇదిగో కామేశ్ నువ్వు నాకిష్టమైన మగాడివయ్యా.నేను చాలా చిత్రమైన పరిస్థితుల్లో ఈ ఉద్యమం లో చేరిపోయాను.నా జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశాను. కానీ అనుక్షణం టెన్షన్  అనుభవించే నా జీవితంలో  నువ్వొక  మరపురాని మనిషివయ్యా!ఏ అర్ధరాత్రోనువ్వు గుర్తుకొచ్చి ఊరటకలిగిస్తుంటావు  అంటూ ఏదో అలికిడి విని గబుక్కున  లేచి తూనీగలా నడ్స్తున్న ట్రెయిన్ లో నుండే బయటకు దూకి చీకట్లో కలిసి పోవటం  చూసి అవాక్కయ్యాను. కొద్ది క్షణాల్లో అటూ ఇటూ పరుగెడుతున్న పోలీసుల్ని చూసి భయం కూడా కలిగింది. నిద్రపోతున్నట్లు పడుకున్నాను చేసేదేమీ లేక.
              జీవితంలో కొన్ని సంఘటనలు ఎన్నటికీ  మరచి పోలేనివిగా ఉంటాయి అవి గుర్తొచ్చినప్పుడల్లా కళ్లకు కట్టినట్టు కన్పిస్తాయి.పదేళ్ల క్రిందటి అనుభవాలు కూడా నాలో అలాగే ఉన్నాయి. ఈ రోజు పున్నమ్మ కనిపించగానే నా గతం మళ్లొక్కసారి  కళ్ల ముందుకు వచ్చి నన్ను ఏదో తెలియని  అనుభూతికి  గురి చేసింది.ఎవరికీ చెప్పుకోలేని  ఈ విషయం అలాగే గుండె గూట్లో దాచి పెట్టాను.
***
           ఆ రోజు ఆదివారం  నాకు వీక్లీ ఆఫ్ .అనూ సరుకులు తెమ్మంటే  బజారు వెళ్తున్నాను.మోపెడ్  ఖాతా కొట్టు ముందుంచి  సరుకుల లిస్టు షాపు  యజమాని కిచ్చి ,త్వరగా సరుకులు సిద్ధం చేయమని చెప్పాను. ఈ లోగా దగ్గరలో వున్నా కూరగాయల  మార్కెటుకు వెళ్లి  కూరగాయలు తెద్దామని నడుచుకుంటూ  వెళ్తున్నాను.ఇంతలో ఓ పాతికేళ్ళ యువకుడు సైకిలుపై నాకెదురుగా వస్తూ ,నా దగ్గరగా ఆగి గుస గుసలాడినట్లు  “మీరు  కామేశ్వరరావు కదా! ఇదిగో పూర్ణక్క  ఈ ఉత్తరం మీ కిమ్మంది. “అంటూ చేతిలో పెట్టి  ఆగకుండా  వెళ్లి పోయాడు.
                        ఉత్తరం తెరచి చూస్తే  “డియర్ కామేశ్.ఎల్లుండి మంగళవారం  హైదరాబాదు హోటల్  పింగళ  రూం నంబరు 13లో వచ్చి వుండు. నీ పేరు మీద రూం బుక్ అయి వుంటుంది.నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. భయపడాల్సిన అవసరం లేదు.నీకు ఏ ఇబ్బందీ కలుగదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చి తీరాలి. ఉత్తరం చించి పారెయ్యి. “అది ఆజ్ఞో అభ్యర్థనో అర్థం కాలేదు. ఎందుకో అర్థం కాలేదు.పోవాలా వద్దా అనే సంకట పరిస్థితి.ఏ చిక్కుల్లో  ఇరుక్కుంటానో అన్న సంశయం.కానీ నావిషయం లో  పున్నమ్మ నాకు ఎలాంటి అపాయం కలుగకుండా చూసుకుంటుందన్న నమ్మకం.ఏం చేయాలో తోచలేదు.అన్య మనస్కంగానే కూరగాయలు సరుకులూ  తీసుకుని  ఇంటికి చేరాను. రాత్రంతా హైదరాబాదు వెళ్లాలా వద్దా అని సతమతమయిన నాకు ఉదయమే వచ్చిన టెలిగ్రామ్ చూసే సరికి హైదరాబాదు వెళ్లటం తప్పని సరయింది.  ఆనంద్ వాళ్ల నాన్న పోయాడు. తప్పకుండా వెళ్లాలి.సరే అక్కడికి వెళ్లింతరువాత ఆలోచించుకోవచ్చు అనుకోగానే టెన్షన్  తగ్గింది.
            టెలిగ్రాం  సంగతి అనూరాధకు చెప్పి హైదరాబాదుకు వెళ్లాను.ఆనంద్ వాళ్లింటికి  వెళ్లేసరికిశవాన్ని తీసికెళ్లే ప్రయత్నంలో  ఉన్నారు.ఆనంద్ నూ  అరుణను ఓదార్చి అంత్యక్రియల ఏర్పాట్లలో  పాలు పంచుకున్నాను.వారు నాకు చేసిన సహాయం నా జన్మలో మరువ లేనిది. ఆ రోజు విచార వదనంతో  ఓ మూల  వాళ్లమ్మాయికి జడ వేస్తూ అరుణ కనిపించింది. నన్ను చూడగానే  ఉదాసీనంగానే అయినా కొంచం తేట పడ్డ మనస్సుతో “రా కామేశ్ .చాలా రోజులయింది నిన్ను చూచి.నాన్నకు బాగా లేదని తెలిసి మొన్ననే వచ్చాను.ఆయనకు రావడానికి  వీలు కాలేదు. నేనూ అమ్మాయి వచ్చాం. అమ్మాయిని చూడ లేదుగా  పేరు కామిని అంటూ ఓ సారి నా కళ్ళల్లోకి  చూసింది. ఆ చూపుల్తో ఆమె ఏం చెప్పదలచు కుందో అది నాకు అర్థమైంది.గుండెలో ఏదో చెప్పలేని భావం  గూడు కట్టుకుపోయింది.అప్పుడే జడ వేయటం కూడా పూర్తి కావడం తో  “గో  ..గో టు  అంకుల్ .కామేశ్ అంకుల్” అని నా వైపు చూపింది.కాసేపు ఆ అమ్మాయితో ముచ్చట్లాడి  అరుణతో”ఆనంద్ తో చెప్పి వెళతాను అరుణా ! కొంచం  పనుంది. మళ్లీ కలుస్తాను.”అంటూ లేచాను .బయటకు వచ్చి ఆనంద్ తో చెప్పి  ఆటోలో  హోటల్ కి బయలుదేరాను.
           ఏమవుతే అదవుతుందని పున్నమ్మను కలవాలనే నిర్ణయం తీసుకున్నాను.మొండి ధైర్యంతో హోటల్ కి చేరాను. కౌంటర్లో నా  పేరు చెప్పగానే రూము కి తీసుకెళ్లాడు రూం బాయ్.రూంలోకి వెళ్లి రిలాక్సయ్యాను.
              తెల్లవారి ఉదయం పది గంటలకు వచ్చింది పున్నమ్మ. అప్పటికే నేను లేచి తయారయ్యి  టిఫిన్ పూర్తి చేసుకుని  టీవీ  చూస్తూ  ఆమెకి ఎదురు చూస్తున్నాను.మామూలు చీరకట్టులో డిగ్నిఫైడ్ గెటప్ లో తనో విప్లవకారిణి  అన్న అనుమానం ఎవరికీ కలుగకుండా వుంది.
              వస్తూనే “నాకు నీ మీద ఉన్న నమ్మకం నిజం చేశావు.నువ్వు తప్పక వస్తావనుకున్నాను.థాంక్స్ .నాకెక్కువ టైము  లేదు.అతి కష్టం మీద నిన్నిక్కడ  కలుసుకునే ఏర్పాటు చేశాను.”అంది మెల్లగా  పున్నమ్మ.
           “చూడు కామేశ్ ఓ ముఖ్యమైన  విషయం నీతో చెప్పాలని పిలిపించాను. నా గురించి వివరంగా తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వు. నేను ఇష్టపడే వ్యక్తివి కూడా నువ్వే. నేను ఉద్యమం లో ఎందుకు దిగానో ఏమైపోతానో నీకనవసరం.కానీ నా వ్యక్తిగత  జీవితంలోనువ్వొక ముఖ్య పాత్రధారివి.ఉద్యమ పూర్వ జీవితం లో  నేనెలాంటి దాన్నో నీకు తెలుసు.
పావలాకి సుఖం కొనుక్కోవాలనుకునే చాలామంది నాకు పీడ కలలు.నిజం చెప్పాలంటే  ఎడారి లాంటి నా జీవితం లో  నువ్వో ఒయాసిస్సువి.నీకు తెలియని రహస్యం ఒకటి ఇప్పుడు చెప్పబోతున్నాను.ఎందుకంటే నా జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో  నాకే తెలియదు.ఇన్ని రోజులు దాచిన రహస్యం ఎందుకు చెప్పాలనిపించిందో కూడా నాకు  అర్థం కావడం లేదు.
                           ” ఉద్యమం లోకి చేరాలనే నిర్ణయం తీసుకున్న తర్వాతనే  నాకు నీపై ఆసక్తి కలిగింది.జీవితంలో చివరి సారిగా ఒక మంచి మనిషితో గడపాలనిపించింది. చిన్నతనంలోనే తల్లీదండ్రీ పోయినా  బాధ్యతగా కుటుంబ భారాన్ని స్వీకరించి తమ్ముడూ చెల్లెళ్ళ చదువు సంధ్యలు  పట్టించుకుని ,ఉద్యోగం సంపాదించుకుని  ఆత్మ స్థైర్యంతో  వున్న నీకు దగ్గర కావాలనిపించింది.నిన్ను చూచిన  నాకు  వెగటు  మనుషులతో  వెగటు  ప్రవర్తనలతో  విసిగిన  నాకు  నీ సత్ప్రవర్తన  తెలియ కుండానే  నీ పై ఆకర్షణ కలిగించింది.దాన్ని ప్రేమంటారో ,ఆరాధనంటారో  మీ భాషలో కాని  నేను మాత్రం ఇష్టం  అంటాను. నాలోని స్త్రీత్వం  నీ బిడ్డకు తల్లిని కావాలనుకుంది.మన కలయిక తరువాత వెంటనే  వెళ్లి పోయాను. ఉద్యమంలో చేరిన  కొన్ని నాళ్లకే  నాలో నీ రూపం  పోతపోసుకుంటుందనే విషయం అర్థమైంది.అది ఉద్యమానికి ఆటంకం.అయినా గుర్తు కళ్ల చూసుకోవాలనే ఆరాటం.ఈ విషయం లో మా నాయకుల్ని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.అడవి లోని ఓ మారు మూల పల్లెలో  బిడ్డకు జీవమిచ్చాను. పుట్టిన కొన్ని నాళ్లకే  నా నీడ పడకుండా  ఓ మిషనరీ  లో చేర్పించాను.తనకు తల్లిని నేనని ఆని గాని  తండ్రివి నీవని గానీ తెలియదు.అనాథ బాలికగాసలక్షణంగాచదువుకుంటుంది.వీలయినప్పుడు  తనలో నిన్ను చూసుకుంటూ వస్తున్నాను.
                          చాలా ఉద్వేగానికి గురయింది పున్నమ్మ. తేరుకుని తనే  “ఇదిగో  ఇందులో పాప అడ్రసు ఉంది.నీకు  వీలయితే చూడాలనిపిస్తే  వెళ్లి చూడవచ్చు .నిర్బంధం ఏమీ లేదు . తన బాధ్యతా వహించమని  అడగటం లేదు.ఇంత ఉద్యమం లో  తిరుగుతూ రాటు దేలిన నాకు  ఈ విషయం నీకు చెప్పాలనిపించడమే  ఆశ్చర్యంగా ఉంది.ఇప్పుడు నాకెందుకో తృప్తిగా ఉంది. “అంటూ  ఒక్క నిమిషం కన్రెప్పలు బిగించి తెరచింది.
   అరుణ మయిన కన్నులు ప్రేమ పూర్ణిమను  వెలువరిస్తున్నాయి. ఇక నువ్వెళ్ళు .మళ్లీ కలువక పోవచ్చు. వెళ్లు  త్వరగా.”  అంటూ పక్క రూం లోకి వెళ్లి పోయింది.నిశ్చేష్టుడనై   భారమయిన హృదయంతో బయటకు నడిచాను.
     ”   ఆయుధాలు పట్టి అడవుల్లో తిరిగినా  నీ లోని ఆడ మనసు చెక్కు చెదరలేదంటె  నువ్వు మామూలు స్త్రీవి కాదు పున్నమ్మా! నిష్కల్మషమైన  ప్రేమ తత్వానికి  గొప్ప ఉదాహరణ గా నిలిచావు. “మనస్సు ఒక అద్వితీయ  సంస్పందనకు గురయ్యింది.
       వెంటనే బస్టాండ్  చేరుకుని  బస్సెక్కి తెల్లారే సరికల్లా  ఇంటికి చేరుకున్నాను.
          బాగా పొద్దెక్కిన తరువాత లేచి  ఫ్రెష్ అయ్యి  అనూ తెచ్చిన టీ తాగుతూ పేపరు తిరగెయ్యబోతుంటే  మొదటి పేజీలో నే తాటి కాయలంత అక్షరాలతో  “ఎన్ కౌంటర్   లో మహిళా నాయకురాలు పూర్ణక్క మృతి”  ఫోటోతో సహా చూసే సరికి  టీ గొంతులోకి  దిగలేదు.మనస్సులోనే శ్రద్ధాంజలి ఘటించాను.లేచి నిన్న  పూర్ణిమ ఇచ్చిన అడ్రసు చీటీ  చూశాను.త్వరలో వెళ్లి పాపను చూసి రావాలి.పూర్ణ ఆత్మ శాంతికి  నేను ఘటించ గల శ్రద్ధాంజలి అదొక్కటే.అడ్రసు చీటీలో పాప పేరు అందంగా కనిపించింది.’అరుణ పూర్ణిమ ‘అని  .
  –వాధూలస

పాడని పాట

kurma

మేరి భీగి భీగిసి , పల్కోన్ పే రెహ్గయీ

జైసే మేరే సప్నే బిఖర్ కె

కిశోర్ కుమార్ పాడుతున్నాడు గొప్పగా, ముక్కలైపోయిన సుందర స్వప్నం గురించి. శోకంలో తడిసిన హృదయం కారుస్తున్న కన్నీళ్లు అతడి గొంతులోంచి పాటలా అనువాదం అవుతున్నాయి.

 జలే మన్ తెరాభీ, కిసీ కె మిలాన్ కొ

అనామికా, తు భీ తర్సే

తుఝే బిన్ జానే, బిన్ పెహ్ చానే

మైనే హృదయ్ సే లాగాయా

 గుర్తుచేస్తున్నాడు, తననెట్లా ప్రేమించిందీ. ఎంత గొప్పగా ఊహించుకున్నదీ.

కానీ నేను వింటున్నది అది కాదు. కిశోర్ కుమార్ గొంతులో పలికిస్తున్న వేదనని పలికించడానికి హీరో తంటాలు పడుతున్నాడు. నేను చూస్తున్నది అదికాదు. ఆయన పాటకి విలవిలా కొట్టుకుంటున్న కథానాయికని చూస్తున్నాను. బాణం గుండెల్ని నిలువునా చీలిస్తే అమాంతం విరుచుకు పడిపోయిన లేడిలా వుంది ఆమె. తప్పు చేసిన దానిలాగానో, అపరాధభావం కుంగదేస్తుంటే నోట మాట రానిదైన లాగానో ఆమె అతడిని తప్పించుకో చూస్తోంది.

కానీ, అతడు వెంట పడుతున్నాడు. దొరికింది ఇక నలుగురిలో, ముక్కలు ముక్కలు చేద్దామన్నట్టు వున్నాయతడి చూపులు. గుర్తు చేసి మరీ కొడుతున్నాడు. లేడి ఇంకా ప్రాణాలతోనే వుండగా చర్మాన్ని కొంచెం చీరి, కొంచెం వుప్పు కారం వేసి చూస్తున్నట్టు చూస్తున్నాడు.

నాకు హిందీ పూర్తిగా రాదు. కానీ కిశోర్ కుమార్ మీద అభిమానం తో ఈ పాటని వందల సార్లు చూసివుంటాను. నాకు తెలిసిన పదాల అర్ధాలతో కిశోర్ పాటకి అర్ధాన్ని వెతుక్కున్నాను. భాషది ఏముంది. కిశోర్ శోకాన్ని, వేదనని పలికిస్తుంటే ఇక ఆ భాష రాకపోతే ఏం? కవి హృదయాన్ని మాత్రమే కాదు, పాత్ర హృదయాన్ని పూర్తిగా ఆవాహన చేసుకుని కిశోర్ పాడుతున్నాడు.

 

పర్ మేరే ప్యార్ కె బద్లేమే తూనే

ముఝ్కో యే దీన్ దిఖ్ లాయా

 

కానీ, నా ప్రేమకు బదులుగా నువ్వేమిచ్చేవు. ఎడబాటు. నరకం, అని సాధిస్తున్నాడు. ఇక తప్పించుకోలేవు నువ్వు. ఇంతమందిలో, ఈ వేడుకలో నువ్వు నాకు అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తావు, అంటున్నట్టు నిలదీస్తున్నాడు.

 

ఆడదానితో స్నేహం నిప్పుతో సావాసం లాటిది

ఈ విషయాన్ని నేను ఎందుకు అర్ధం చేసుకోలేకపోయాను?

నాకేమైంది అసలు. ఒక విశ్వాస ఘాతుకురాలితో

ఎందుకు పడ్డాను ప్రేమలో……

అంటూ, ఆమెను చూపుల, పదాల పిడిబాకులతో గుచ్చుతూ వున్నాడు. ఆమె పారిపోలేక, కాళ్ళు పాతాళంలో పాతుకుపోయినట్టయి ఒక పల్చటి పరదా వెనుక దాగుంటుంది. ఛిద్రమైన గుండెని బయటికి కనిపించనీయకుండా అన్నట్టు కొంగుని భుజాలమీద నుంచి తీసి వడిసి పట్టుకుంది. కత్తులవాన నుంచి, శాపాల వెల్లువనుంచి ఆ పరదా కాపాడలేదని తనకి తెలుసు. కానీ, ఈ పెను వరదలోంచి ఆ చిన్న గడ్డిపోచ కాపాడక పోదా అని కావచ్చు. లేకపోతే, కొంచెం కనికరించి కొన్ని శూలాల్ని వదలకుండా వుంటాడని, కొన్ని ఆరోపణల్ని చేయకుండా వదిలేస్తాడని ఆమె ఆశ.

కానీ, ఆ కథానాయకుడికి జాలి లేదు. మనిషి లాగా కనిపించడం లేదు. ఆ గడ్డిపోచని కూడా కసితో లాగేసి, కొరికి నమిలేసి ఇలా అంటున్నాడు, ఆమెను హేళన చేస్తూ.

….తేరీ బేవాఫాయిపే, హసే జగ్ సారా

గలిగలీ గుజరే జీధార్సే

జలే మన్ తేరా

(నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని చూసి లోకం నవ్వుతోంది

ఇక, నువ్వెళ్లే చోటల్లా అది వింటావు

నీ హృదయం కూడా మండుతుంది, అవి విని)

తన ప్రేమకు ప్రతిగా ప్రేమనందించనందుకు నిందిస్తున్నాడు. శాపనార్ధాలు పెడుతున్నాడు. ఇక ఈ శిలువ వేసుకుని ఇక నీ జీవితమంతా తిరగాల్సిందేనని, లోకం తీర్పు కూడా ఇదేనని ప్రకటించేస్తున్నాడు. నేలదిగిన చూపుల్తో ఆమె ఏమైనా చెప్తామనుకుంటున్నట్టు చూస్తోంది. బెరుకు కళ్ళతో భయాన్నో, అశక్తతనో ప్రకటిస్తూ వుంటుంది. అసహాయారాల్నని అందామనుకుంటుంది. (లేదా, నాకు అలా అర్ధమయ్యింది.)

తన నిర్ణయం వెనుక ఏదైనా కారణం వుంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు అతడు. వున్న ఆయుధాలన్నీ గుక్కతిప్పుకోకుండా వదులుతున్నాడు. గురితప్పకుండా, కళ్లలోకి చూసి పాడుతున్నాడు.

నేరారోపణా తానే చేసి, విచారణా తనేచేసి, తీర్పూ తానే ప్రకటించి, శిక్షనూ తానే అమలుపరుస్తున్నాడు. పాట అయిపోయింది. పాట’ అయితే అయిపోయింది కానీ, ఆ పాట దెబ్బకి ఆమె అపరాధభావంతోనో లేకపోతే అవమాన భారంతోనో చితికిపోయింది. ఆమె బహుశా ఆమె వున్నచోటనే కుంగి పోయివుంటుంది. బహుశా ఎన్నటికీ చెప్పలేని వేదనను కంటి రెప్పలవెనుక దాచుకుని వున్నది. ఆ మానసిక పరిస్థితిని ఆ నటి గొప్పగా అనువదించి చూపిస్తోంది.

పాట ముగియగానే చప్పట్లు కొట్టారంతా, అన్నిటికీ తమ మద్దతు వుందన్నట్టుగా — నీ బాధ సబబైంది, తన విశ్వాసఘాతుకం నిజమే, నీ తీర్పూ సహేతుకమే అన్నట్టు.

ఇప్పటికి ఈ పాటని వందల సార్లు విని వుంటాను. లేదా చూసి వుంటాను. మిగతా అన్ని పాటల్లాగా కేవలం కిశోర్ కుమార్ కోసమేనా? కాదేమో.

***

     అకారణంగా నేను కాదన్నపుడు, కనీసం మాట్లాడడానికి నిరాకరించినపుడు, లేదా సమయం లేదన్నపుడు  తను కూడా అప్పుడు ఇలాగే మదనపడి వుంటుందా? వేటగాడి దెబ్బకు దొరికిపోయిన లేడిలాగా తల్లడిల్లిపోయి వుంటుందా? ఏదో వత్తిడితోనే తప్ప, నీకు ద్రోహం తలపెట్టే వుద్దేశం లేదని చెప్దామనుకుంటుందా? ఆరోపణా నేనే చేసి, విచారణా నేనే చేసి, తీర్పు నేనే ఇచ్చేసి వుంటానా?

ఇది జరిగిన ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఏళ్ళు గడుస్తాయి జీవితంలో భారంగానూ, సులభంగానూ. కానీ ఆ తోవల వెంబడి గుచ్చుకున్న ముళ్ళు కొన్ని సలుపుతూ వుంటాయి ఎన్నటికీ. ఆ తలపుల బరువు మౌనంగా మోస్తూనే వుండాలి ఎవరైనా. మోసేవాళ్ళకి తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు.

ఇక ఎవరి తోవలు వాళ్ళు చూసుకున్నాక, తన సంగతి చెప్పాను విష్ణుకి. “అసలు ఈ విషయం తేల్చకముందే చూశావా ఎలా చేసిందో,” అని. సాధ్యమైనంత సానుభూతిని సంపాదించుకునే ప్రయత్నం నాకు స్పష్టం కనిపిస్తూనే వుంది. కానీ విష్ణు కొట్టిపడేసింది.

“అమ్మాయిల పరిస్థితి నీకెపుడు అర్ధం కావాలి? ఎన్ని వత్తిళ్ళు ఎంతలా పనిచేస్తాయో నీకేం తెలుస్తుంది. నువ్వే అంటున్నావు కదా కొద్దిపాటి పరిచయమేనని. నీకు చెప్పే అవతలి వాళ్ళతో మాట్లాడి వుండాల్సిందని ఎందుకు అనుకున్నావు” అన్నది, నాకు అసలు benefit of doubt అస్సలే ఇవ్వకుండా.

“అసలు సంభాషణే పూర్తిగా మొదలు కాలేదంటున్నావు. ఎలా అనుకున్నావు నువ్వు తను నీకు అన్నీ చెప్పే చేయాలని,” అని అంది.

ఆ మాటలతో గూబగుయ్యి మన్నట్టయింది. కూడబెట్టుకున్న self-pity కుప్పకూలిపోయింది రెండు క్షణాల్లో. ఆ రోజు విష్ణు అంత కటువుగా చెప్పి వుండకపోతే ఆ self-pity బరువుకింద ఏనాడో అణిగిపోయి వుండేవాడిని. ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడే, తన వైపు నుంచి.

ఇప్పుడు ఇలా ఇన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అనిపిస్తుంది, ఎంత తక్కువగా ఆలోచించానా అపుడు, అని.

***

   బహుశా అప్పటినుంచే ఈ పాటలోని హీరో వంకర సంభాషణలు చికాకు పెట్టడం మొదలుపెట్టాయి నాకు. ఆ రోత  మాటలు నేనే అన్నట్టు, నేనే నిలదీసి కుంగదీసినట్టు అనిపించేది. ఇక ఆరోజంతా సోంపకుండా అయిపోయేది.

ఈ పాటలో కధానాయికలాగా, మౌనంగా ఎవరికీ అర్ధం కాని, వినబడని పాట ఏదో తను పాడి వుంటుందా? నేను వినడానికి నిరాకరించి వుంటానా? ఇక, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వినబడని పాటేదో వెంటాడుతోంది. బహుశా, వెంటాడుతుందేమో ఎన్నటికీ — మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా తనని కలిసి ఒక కరచాలనం చేసి కడిగేసుకునేవరకూ. లేదా కళ్ళతోనే చెప్పుకునే వరకూ.

(ఎన్ ఆర్ అనుభవం విని)

–కూర్మనాథ్

 

 

 

 

 

దేవుడమ్మ

jhansi papudesiనన్ను మావూర్లో అందురూ దేవుడమ్మంటారు.మామూలుగా పూజబెట్టి పిలిస్తే వొచ్చే దేముడు నా పైనికి రాడు. నాకెప్పుడు దేముడొస్తిందో నాకు తప్ప ఇంగెవురికీ తెల్దు. దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొంగ దేవుడమ్మని ఎక్కిరిస్తారు. వోల్లు నన్నట్టా ఎక్కిరిస్తే నాకు భయింగా వుంటుంది. మాయత్త ఇనేస్తిందేమో అని.యాలంటే నాకు దేముడొచ్చింది ఆమెవల్లే. మాయత్త పేరు యెంగట లచ్చిం. నేను ఆమి రెండో కొడుకుని పెల్లిజేసుకోని ఈవూరికొచ్చినా. మాయమ్మోల్లు రోజూ కూలికి బోతేనే రోజూ అంత సంగటి తినేది. మాయత్తోల్లు బాగా వున్నోల్లు.ఈడైతే కూట్నీల్లకు కరువుండదని మాయత్త గయ్యాలిగంపైనా నన్నీఇంట్లో ఇచ్చేసింది మాయమ్మ.

పెల్లి గాక  ముందు  ఆడతా పాడతా  వుంటి మాయమ్మోల్ల  ఇంట్లో .. తెల్లార్తో  లేసి  కళ్ళాపి  జల్లి  ముగ్గేసి, బోకులు కడిగేసి అంత  సద్దాగేసి కూలికి  బొయ్యేది… మాయిటాల  వొచ్చి  వుడుకుడుగ్గా  రెణ్ణీల్లు  బోసుకోని  కడుపుకింత  తినేసి అరుగుమింద కుచ్చోని అరుట్లు  కొడ్తా  నిద్దరబొయ్యేది .

ఆదినం  నేను  కూలికి పక్కింటి సుబ్బులత్త  దెగ్గిరికి బొయ్యింటి . నేను సింతకాయి  బొప్పిదీసి ఇసుర్రాయి  మింద బెట్టుకోని సుత్తితో  కొట్టి కొట్టి కిందేస్తా వుంటే సుబ్బులత్త  పండు  వొలస్తా వుండాది . అర్రోజు  పని జేసేసి ఇంటికి రమ్మని మాయమ్మ జెప్పింది . నన్ను చూసేదానికి పెల్లోల్లు వొస్తావుండారంట.

మద్దేనం మూడు గొడ్తా వుండగానే పల్లి బస్సుకు పెల్లోల్లు వొచ్చేసినారు. మాయత్త , ఆడబిడ్డి , ఆడబిడ్డి  మొగుడు , పెండ్లికొడుకు  వొచ్చినారు  నన్ను జూసేదానికి . నన్ను అట్టా ఇట్టా నడవమని, మాట్టాడమనిజెప్పి నాకు అయిటి లేదని దెల్సుకున్నారు. నాకు వొంటజేశేది వొస్తిందని మాయమ్మ జెప్పింది. వుత్త  జల్లి గదా  అది..  సద్దినీల్లకే సచ్చిబతకతా వుంటే ఇంగ వొంటేం వొండేది…మాయమ్మ నాగురించి ఏందేందో జెప్పి ఎచ్చులుబోతావుంది. నాకు మాత్తరం వోల్లకు కయ్యలుండాయని,రెండుమూడు జీవాలుండాయని,ఇంట్లో టీవీ గూడా వుందని భలే కులుగ్గా ఉండాది. బొట్టుగట్టిచ్చుకోని ఆయిగా ఆడికి పూడిస్తే సిన్మాల్లో మాదిరి వుండచ్చని కాస్కో నుండా. నాఈడుదే ఎగవీధిలో వుండే సుబ్బక్క.

12

టీవీ జూద్దారని వోల్లింటికిబోతే పెగ్గిజేస్తా వుంటింది. మిసిను ఆపుజేసేసి దాయాలు ఆడేదానికి రమ్మంటింది.నాకు దాయాలు ఆడేదానికన్నా టీవీ జూసేదే బాగిస్టం.  ఎట్టోకట్ట ఈ సమందం కుదిరిపోతే దినామూ టీవీ జూడచ్చు. ఇట్టనుకోని మాయత్తకు కొంచిం నోరని జెప్తే కూడా పెల్లికి వొప్పుకునేసినా. నామొగుడు బాగనే వుండాడు…కొంచిం మనిసి కుర్స. అయితేబొయ్యినాడు…కొరుక్కోనేమన్నా తింటామా…కడుపులో సల్లగుంటే సాలు. కాణిపాకులో పెల్లిజేసుకోని వొచ్చేసినా. బంగారు బొంతాడు,మాయమ్మ గుండ్లకమ్మలు, ఒక రాగి అండా బెట్టించికోని మరేదగా వొచ్చినా ఈడికి.

వొచ్చినాకగదా దెల్సింది నాకు…మాయత్త నోట్లో నోరు బెట్టేంత బుద్దిలేనిపని ఇంగోటి లేదని. మాఇంట్లో తాగేది సద్దినీల్లే ఐనా తిండికోసం ఎప్పుడూ తిట్లుదిన్లా. మాయత్త నోరంటే నోరుగాదది. నామొగుడు వోల్లమ్మ ముందర నోరుగూడా దెరవడు. ఎప్పుడన్నా తెర్సినా నన్ను దిట్టేదానికే. వుత్త దద్దమ్మ. మూడురాత్తుర్లు జరక్కముందే నాకుదెల్సిపొయ్యింది… పెద్దగాండ్లపొయ్యిలోకొచ్చి పడ్నానని.

పెండ్లయ్యిన మర్రోజే మాయత్త మా మొగుడూపెళ్ళాలు పొణుకోనుండారని గూడా సూడకుండా పొరకతో దెమదెమా తలుపును గొడ్తా సెత్తదోస్తా వుండాది. పంజేసుకుంటా కొడ్తావుండాదేమో అనుకోని మల్లా ముడుక్కోని పొణుకున్నా. నేను లేశి బైటికొచ్చేదాకా ఆడ్నే తోస్తా వుండాది. లేశొస్తానే  “అప్పుడే లేసేస్తివా…బాయికాడికి బొయ్యి రెండు బిందెలు నీల్లుదెచ్చి అండాలోబోసి నీల్లకిందట్ట మంటెయ్యి..బిన్నిగా నీల్లుబోసుకోని దీప్ము బెట్టెయ్యి. మల్లి మనిద్దురూ అన్నం జేసుకుందారని’’….నవ్వతా నవ్వతా పనంతా నాతోనే జేపిచ్చేసింది మాయత్త.

మెట్నిల్లుగదా… పనిజేస్తే తప్పేవుండాదిలే అని జుట్టు ముడేసుకోని మాయత్త దగ్గిర పొరక దీసుకున్నా. పనంతా అయిపొయ్యినాక వంటింట్లోకి బొయ్యి ఏంజేద్దామత్తా టిపనుకి అంటె సద్దుండాది తాగెయ్యి..కూరేమన్నా జేసుకుందారి మద్దేనానికి అనింది. కొత్తపెల్లికూతురికిఎవురన్నా సద్దిబోస్తారా…? నా నోరట్టా తెరసక పొయ్యింది. ఇంగేం జేసేది…అత్తయ్యి పొయ్యె..వొచ్చి వొకరోజైనా కాలా…  ఏంటికి జగడాలేసుకునేదని గొమ్మునైపొయ్నా. ఏదో వొగిటి తినేసి..కూరజేద్దారని పప్పేడుందో ఎతకతా వుండా.. నేందెచ్చిస్తా వుండని చాటెత్తుకోని వొంటిల్లుకానుకోనుండే రూము బీగాలు దీసుకోని లోపలికి బొయ్యింది. నేంగూడా యనకమ్మిడి పొయ్యినా..

లోపలంతా దొంతులు పేర్శి పెట్టిండాది. వొగొయిటే దించి కొంచుం పప్పు, లెక్కేశి నాలుగు మిరక్కాయిలు, తెలగెడ్డ వొల్చి రొండు రెబ్బలు, కొంచుం తిరగబాత సామాను వొక శిబ్బిడిలో యేశి ఇచ్చింది. గొమ్మునే తీస్కోని బైటికొచ్చినా.. నా యెనకాలే వొచ్చేసి మల్లీ బీగాలేసేసింది. బొంతాడుకి బీగాలు తగిలిచ్చుకోనుండాది. అప్పుట్నుంచి ఒక పదేండ్లు ఆ గడపలో  సంసారం జెయ్యాలంటే సావే నాకు.

కూల్ది మాదిరి తెల్లారి లేస్తే నడిజాము దాకా పనిజేస్తానే వుండాల. యెప్పుడన్నా యేమారి కుచ్చున్నానంటే లంజల మాటే మాటాడ్తాది మాయత్త. పొరకతో గొట్తా..ఛాటతో గొట్తా…చెప్తో గొట్తా … అంటా కుక్కమింద పిల్లి మింద సాకు బెట్టుకోని తిడ్తానే వుంటాది.

ఇంతాజేసి ఇంట్లో యామన్నా సొంతముందా అంటె అదీలే..నూనెసుక్క, శెనిగ్గింజె గూడా బొంతాడుకుండే బీగాలు దీసి ఇస్తేనే గెతి. ఒకసుక్క నూని జాస్తిబోసి యేవన్నా జేసేస్తే ఇంగంతే. ఈదాట్లు ఆడేస్తాది. జుట్టుబట్టుకోని ఈపుమింద గుద్దిగుద్ది నడుములు ఇరగ్గొటేస్తింది. పనంతా ఐపొయ్యినాక ఎప్పుడన్నా టీవీ ముందర కుచ్చుంటే సాలు…వొచ్చి టీవీ ఆపుజేసేసి యాదోవొగ పనిజెప్తింది. నేనెప్పుడు యేం జెయ్యాలనేది ఐవోరి మాదిరి ఒగదానియెనకాల వొగిటి జెప్తానే వుంటింది. బొట్టుగట్నోడన్నా అన్ని నీల్లు బోస్తాడంటే ..అయ్యోరామ! యెప్పుడూ అమ్మకొంగు బట్టుకోని తిరగతావుంటాడు. సావుకో, దినాలకో వూరికి బొయ్యిందంటే  నన్నెట్ట మెడ్తోగొట్టాలో జెప్పిచ్చేసి బోతాది. థూ.. ఈ బతుకు బతికేదానికంటే వడిశాకు మింగి సస్తేనే మేలు. వొగిటికి నలుగురు బిడ్లుండారు..అందురూ అవ్వ సుట్లానే తిరగతా వుంటారు.వీల్లకు నేనో కూలిది…అంతే..

ఆడికో అమాసకో మొగునిపక్కన పొనుకుంటే ఆడాణ్ణే తిరగతా  వుంటింది. ఎందురు బిడ్లను కనాలనేది గూడా మాయత్తే జెప్పింది. నెలదప్పినప్పిట్నించి ఒగ మాత్తర మింగింది లేదు… ఆసుపత్రికి బొయ్యింది లేదు. అన్నీ ఇంట్లోనే. నెలదప్పినప్పుడు గానిగాడే పన్లు వొచ్చేస్తే పచ్చి పరిందికాయి తినిపిచ్చేసి కడుపు తీసేస్తింది. కనిండేది నలుగుర్నయితే..పొయ్యిండేది మూడు. వొద్దంటె ఇనేది యొవురు??

పిండాకాపుగ్గూడా …ఎవురు జస్తారా…యాడ దినాలకాడికి పొయ్యి తిందామా అని కాస్కోనుంటావుండా…ఈ ముసిల్ది అట్టగూడా నన్ను తిన్నీకుండా ఆడిగ్గూడా ఎలబారి పూడస్తాది. ఎట్టజచ్చేది??

పంచాయితీలు బెట్టి మాట్టాడిస్తే గూడా లాభంలా…ఇట్టగాదని నేనే నోరు అడ్డమేసుకోని ఎంతమాటోస్తే అంత మాట అనేసేది మొదులుబెట్నా..అట్ట అత్తదగ్గిరా…ఇట్ట మొగుడి దెగ్గిరా ఈపు పగిలిపొయ్యేది. బొట్టుగట్టిన ముండాకొడుకు నలుగురు బిడ్లను కనిచ్చినానన్న అరువు గూడా లేకుండా కుక్కకంటే ఈనంగా ఇదిలిచ్చి కొడ్తా అమ్మను యెనకేస్కోని వొచ్చి ఇంట్లో నుండి పోవయ్ అనె..

యాడికి బొయ్యేది  నేను ? మొగుడ్ని వొదిలేసి పుట్టింటికి బోతే పొరకదెబ్బలే… కస్టంవొచ్చిందని  మాయమ్మోల్లు కడుపులో బెట్టుకుంటే గూడా వూల్లోల్లు గొమ్మునే వుంటారా ? వయసుకొచ్చిన ఆడది వొంటిగా వుంటే వూర్లో యెదవల కండ్లన్నీ దానిమీదే గదా ? అమ్మగారింట్లో బాగుంటే నేనీడ యెందుకు ఇట్ట సస్తా?

ముసిల్దానికి యాదన్నా మందు బెట్టాల అని, మాయమ్మతో జెప్తే ఎవురో ఐవోరి దెగ్గిర మందు దెచ్చిచ్చింది. మంతరమేసిన  ఎండు  నిమ్మకాయ  పొట్టు .. అత్తకు దెలీకుండా అన్నం లో, కూర్లో కలిపి నలభై ఐదు దినాలు తినిపిచ్చేసినా.అదిగూడా పనిజెయ్యలా..

కాపురానికొచ్చిన పదేండ్లలో నాకు దెల్సిందొగిటే…మాయత్త ఎవురికీ బైపడ్దు. దేవుడొచ్చినోల్లకు…దెయ్యమొచ్చినోల్లకు తప్ప. యింట్లోకి దెయ్యాలు రాకుండా రాగిరేకులు బెట్టిచ్చేది , నిమ్మకాయిలు కట్టిచ్చేది జాస్తి . పిలకాయిలికి వొల్లు  బాగలేకపోతే గాలి బట్టుకునేసిందని మెళ్ళో మంత్రించిన దండేసి , దిస్టిదీసి ఎర్నీల్లు మూడు దోవల మద్దెలో బొయిపిస్తింది .

అట్నే వూర్లో  యాడ ఎవురికి దేముడు వొంటి మీదికి వొచ్చినా మాయత్త ఆడికి పూడిస్తింది . పూజబెట్టి , కర్పూరం దిగదీసి దేముడు దిగిపోయ్యేదాకా ఆడ్నే వుండేసి  వొస్తింది . ఆమికి ఏందన్నా బాదుంటే  చెప్పుకోని జవాబులు దీసుకుంటింది . రావుకాలం ,అమావాస్య పూజలు  జెయిపిస్తింది . పడవ పడిపొయ్నా ఈపన్లు మాత్రం సచ్చినా నిలపదు . నేను మాయత్తను బైపడిచ్చాలంటే నన్ను దేవుడన్నా పూనాల…లాకపోతే దయ్యమన్నా పట్టుకోవాల.

 ***

  ఆదినం మావూర్లో కొన్నిండ్లు అంటుకునేసినాయి..ఎవురో బీడీ తాగేశి పూరింటిపైన పారేశింటారు…వూరికేదో ఐపొయ్యిందని అందురూ ఎవురికొచ్చిన కతలు వాల్లు  చెప్పుకునేస్తావుండారు…మాఇల్లు మిద్దిల్లే …ముందరే ఇంగో సుట్టిల్లుంది…బోదిల్లు. మాయత్త ఫానేసుకోని మిద్దింట్లో పొనుకుంటే నేను నడ్జాము దాకా పంజేసి ఆ సుట్టింట్లో పొనుకోవాల. ఈఇల్లు అంటుకోని కాలిపూల్లేదే అని అనిపిచ్చింది. మాయత్తను బయిపడిచ్చల్లంటే ఇప్పుడైతేనే సరిగ్గా వుంటింది అనుకోని..కాపీబెట్టుకోని వొస్తావొస్తా పొరకపుల్ల వొగిటి అంటిచ్చి బోదలో గుచ్చేసి వొచ్చేసినా. మాయత్త కాపీదాగతా…ఎవురన్నా శాతబడి జేస్తేనే దెయ్యాలొచ్చి అట్ట ఇండ్లంటిచ్చేస్తాయని జెప్తావుంది. నేనా సుట్టిల్లుని జూస్తా ఇంటావుండా…అంటుకునేసింది. మాయత్త భయిపడింది ఆదినం జూసినా నేను.. నాకప్పుడొచ్చింది పదేండ్లు నాకు గెవనం లేని నొవ్వు. పొండ్లు బిగబట్టుకుంటే కూడా నోరు టకటకా కొట్టుకుంటాండాది. మాయత్త ఈసారి నన్ను జూశేశింది. ఏంటికి మేయ్ అట్ట నవ్వతా వుండావు..మూస్కో ఇంగ అనింది. ఇంకొంచుం గెట్టిగా నొవ్వినా.. ఆదినం కొంపలో గూడా ఎవురూ లేరు. చెయ్యెత్తుకోని కొట్టేదానికి నాదెగ్గిరికి వొచ్చింది. చెయ్యట్నే పట్టుకోని ఇంగా గెట్టిగా నొవ్వినా…నాకు దెయ్యం బట్టేసిందని అరస్తా పరిగెత్తింది బైటికి. నొవ్వినొవ్వి దొక్కనొప్పొచ్చేసి అట్నే పడిపొయ్యి నిద్దరబొయ్యినా. లేసినాక భయిం భయింగా వొచ్చి ఏమైందే నీకు?? గాలేమన్న సోకిందా అనింది. ఏం తెలీనట్టు బిత్తర సూపులు జూసినా..మల్లొక వారం దినాలు….నామీదకు చెయ్యెత్తలా..

ఇంటికెవురన్నా వొస్తే నాకు దెయ్యంబట్టిందని గుసగుసగా జెప్పేది నేను ఇనిండా. వారం దినాలికి మల్లీ పెత్తనం జేసేదానికి జూస్తే నాకింకోసారి దెయ్యమొచ్చి తిక్క కుదిరిచ్చింది. ఇట్టగాదని మాయత్త దయ్యాలొదిలిచ్చే వోల్లను పిల్చుకోనొచ్చి నన్ను సావగొట్టించే పనిబట్టింది. ఆ దెబ్బలు బరించేదానికి నావల్ల గాలా. ఆనాబట్లొచ్చి ఇది మొండిదెయ్యం…బాగా దెబ్బలుబడ్తేగానీ వొదల్దు అని యాపాకులు, యాప సులగ దెచ్చి నేను యాడస్తా, పరిగిత్తా వుంటేగూడా వొదలకుండా యాడివాడ ఇరగ్గొటేస్తా వుండ్రి. నాకు బట్టిండేది శానా మొండిదెయ్యం. మాయత్త దెయ్యం కొంపలోనుండిబోతేనే నాగ్గూడా దెయ్యం వొదిలేది. కొన్నిదినాలు దెబ్బలు వోర్సుకున్నా…ఇంగ నావల్ల గాలా .

దెయ్యాన్ని పంపించేసి మల్లీ కూలి పని మొదులుబెట్నా..దెయ్యాన్ని నావొంట్లోనించి తరిమేసినాక మాయత్త కొంపలో పూజ్జేసేది ఎక్కువైపోయ..నాపని మల్లీ మొదిటికొచ్చేసింది.

ఈతూరి ఇట్టగాదని మాయత్త పూజ్జేసే రెండ్రోజులూ సాయంకాలమైతే వూగడం మొదులుబెట్నా… మల్లీ  దయ్యాన్ని తరిమేసే  మంత్రగాల్లు వొచ్చేసినారు . యాపమండ తో  ఒకదెబ్బ పడిందో లేదో ‘దేముడో  దెయ్యమో  తెల్దారా నా బట్టల్లారా … అమ్మోరిమిందనే సెయ్యెత్తినారా … మీ బతుకులు అగ్గయ్యి పోతాయిరా ‘ అని ఉరిమి చూసినా . దెబ్బకు నాకాల్లు బట్టుకోని తిరిగి  మల్లి  సూడకుండా  పరిగెత్తినారు  నాకొడుకులు. ఈసారి నాకు దేముడొచ్చింది…అమ్మోరు…అంకాలమ్మ. “సేయ్ ఎంగిటీ “అంటే మాయత్త  పరిగెత్తుకోనొస్తింది. నాకిప్పుడు కోడ్నికోసి వొండిపెట్టంటే గెంటగొట్టే లోపల గిన్నె నా ముందరుంటింది. నాకిప్పుడు పట్టుకోక గట్టి , బీరువలో బంగారు బొంతాడు తెచ్చి యెయ్మంటే, తెచ్చిచ్చి పూజ గూడా జేస్తింది. నాక్కోప్మొస్తే కర్పూరం చెయ్యిపైన ఎలిగిచ్చేసి దిగదీస్తింది. నేనిప్పుడు మాయత్తకు, నా మొగుడికి దేముడు.

మొన్నీమద్దె మాయత్త పెళ్ళో ఇరగబడి తుంటి ఇరగ్గొట్టుకునింది. మాయత్త బొంతాడు బీగాలు ఇప్పుడు నా తిత్తిలో ఉండాయి. మొగుడు, పిలకాయిలు నాతో బాగనే మాట్టాడ్తా వుండారు. నా ఇంట్లో పెత్తనమంతా నాదే.  నాకిప్పుడు పెండ్లయ్యి మల్లీ కొత్తపెల్లికూతురైనట్టు వుండాది. ఇప్పుడీ కొంపంతా నాదే..నన్ను కొట్టేవోల్లు, తిట్టేవోల్లు ఎవురూలేరు. ఇప్పుటికి నెమ్మతైపొయ్యింది నాకు. నా పని నేంజేసుకుంటా..నాకు ఇస్టమొచ్చింది వొండుకోని తింటా..దేముడొచ్చినట్టు నాటకాలు ఎయ్లేక ఇంగ నిలిపేద్దారా అనిపిస్తింది.గానీ నాబతుకు నాగ్గావాలంటే నేనీ పని  జెయ్యాల్సిందే.

మా ఇంటికొచ్చిన డాకట్రు జెప్పినాడు…వొల్లు నీరసించిపోతే ఇట్టాంటి దయ్యాలు, దేవుల్లు వొచ్చినట్టు అనిపిస్తిందంట. నేను వీల్ల దెగ్గిర తన్నులు తప్పించుకునేదానికి దేవుడమ్మ అయిపొయ్యినా..

దొంగ దేవుడమ్మనే నేను. కానీ ఈ ఇసయం మన మద్దెనే వుండాల. మాకొంపలో వోల్లకు తెలీగూడ్దు. కస్టమొస్తే వురేసుకునేవోల్లను నేను శానామందినే జూసిండా. నేనుగూడా యాడస్తా నా బతుకింగ ఇంతే అనుకొనింటే ఆరోజుకి యెత్తేసి నామొగుడికి ఇంగో పెల్లాన్ని తెచ్చేసింటాది మాయత్త. ఏదోవొగ యాసమేసి దేవుడిచ్చిన బతుకుని ముగిసిపొయ్యేదాక ఈదల్ల.

 

  పాపుదేశి ఝాన్సీ

ఫోటో కర్టెసీ : కందుకూరి రమేష్ బాబు

 

 

 

రంగు రాయి

hrk photo

తెలుసు. ఇది కల. మొదటి సారి కాదు, వెయ్యిన్నొకటో సారి కంటున్న కల. చిన్నప్పట్నుంచి ఎన్నో సార్లు కన్న కల, కొంచెం కూరుకు పట్టగానే ఎట్నించి వస్తుందో తెలియదు, వచ్చి నన్ను ఎత్తుకుపోతుంది. ఇదిగొ అదే మళ్లీ ఇప్పుడు. తెలియదని కాదు. తెలుసు.

ప్రతి సారీ ఎవరో దీన్ని నా కళ్ల మీద కప్పి వెళ్తారు. నన్నొక మసక వెలుగులో వదిలి వెళ్తారు. నేనొక విహ్వలమైన కనుగుడ్డునై తిరుగుతుంటాను. అణువణువు ఆర్తిగా కదుల్తుంది. ఆసరా కోరుతుంది. ఆసరా అందక గింజుకుంటుంది. కల కదా, కాసేపట్లో అయిపోతుందని అనిపించదు. క్షణాన్ని అనంతంగా సాగదీసినట్లుంటుంది.

కలలో పడిపోయిన ఒక ఇంటి గోడలు. చిందరవందరగా పడి వున్న రాళ్లు. కొన్ని, ఏ రాయికి ఆ రాయి. ఇంకొన్ని, ఎగుడు దిగుడుగా ఒక దాని మీదొకటి. ఒకదానితో ఒకటి అమరడానికి వీలుగా ఎప్పుడో గడేకారి చేతిలో ఉలి దెబ్బలు తిన్న రాళ్లు.

ఆ రాయి వంటింట్లో ఒక మూలన గోడ లోపల్నించి ముందుకు పొడుచుకొచ్చినట్లుండేది. అన్నం తింటూ ప్రతి సారీ కాసేపయినా ఎందుకో ఆ రాయి వైపు చూసే వాన్ని.  ‘ఎందుకట్టా వుండడం’ ఆని నేను అడిగినట్టు, ‘ఏమో, వున్నానంతే’ అని అది నాలుక చాచి నన్ను వెక్కిరించినట్టు మా మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది.  ‘ఏందిరా, బువ్వ దినుకుంట అట్టా దిక్కులు జూచ్చొంటావు. ద్యానాలు సాలిచ్చి తిను. తల్లెలొ ఈగెలు వడ్తాయి. యాన్నాన్నో సూసుకుంట మెతుకులు తల్లె సుట్టు పోచ్చావు. బండలు తుడ్స ల్యాక నా రెట్టలు గుంజుతొండాయి…’ అని అమ్మ నన్ను కోప్పడేది.

అదిగో, ఒక రాళ్ల గుట్ట కింది నుంచి పాం పిల్లలా నిక్కి చూస్తున్నది, ఐమూలగా విరిగిపోయిన కిటికీ ఊచల చట్రం. వంటింటి వెనుక-గోడకు ఏడడుగుల మనుషులు చెయ్యెత్తినా అందనంత ఎత్తున వుండేది కిటికీ. దాని మీదికి ఎక్కి కూర్చోవాలని, అటు వైపు ఏముందో చూడాలని అనిపించేది. అవతల ఏమున్నాయని అడిగితే, ‘ఏముంటాయిరా తిక్కోడా, మనొల్లదే సేను, ఇంటెన్క మన జాలాడి (స్నానాల గది) నీల్లు పార్తాయి. బుర్ద బుర్ద’ అని పెద్దవాళ్లు నవ్వే వాళ్లు. కిటికీ బాగా కిందికి వుంటే ఎక్కి కూర్చోవచ్చని ఆశ పడే వాడిని. ఆ మాట అనే వాడిని కూడా. ‘ఆఁ, బలె జెప్పినావులేరా, నువ్వు కూకోనీకి కిట్కి కిందికి పెట్టియ్యాల్నా? పిల్లకాకి, నీకేం దెల్సు. కిందికి వుంటే దొంగోల్లు దాన్ని ఊడ బెరికి ఇంట్లొ దూరనీకెనా?’ అని నా నెత్తిన చిన్ని మొట్టి కాయ వేసే వాళ్లు. ‘ఒరేయ్, గదురోన్ని నెత్తిన కొట్ట గుడ్దు (కొట్ట గూడదు), గాశారం సాలక ఆయం పాట్న తగిల్తె ఎవుని పండ్లు పట్టుకోని సూడాల…’ అని మా జేజి వాళ్లను గదమాయించేది.

దొంగలను నేను ఎప్పుడూ చూళ్లేదు. చూసినంత బాగా తెలుసు. పెద్ద వాళ్ల మాటల్లో చాల సార్లు విన్నాను. ఇంకో పక్కన ముక్కలు ముక్కలుగా పడి వున్న ఆ పల్చని బండలు మా ఇంటి గరిసెలవి. గరిసె బండలను చూస్తే ఎన్నెన్నో దొంగల కథలు గుర్తుకొస్తాయి. గరిసెల్లో జొన్నలు, కొర్రలు పోసే వాళ్లు. గరిసెలు నిండుగా వున్నప్పుడు, అంటే ధాన్యం బాగా పైకి వున్నప్పుడు అమ్మ నన్ను దింపి చిన్న తట్టగంపలో జొన్నలు పైకి తెప్పించేది. పిండి చేసి రొట్టెలు చేసేది. దంచి సంకటి చేసేది. గరిసెలో చీకటి చీకటిగా చిత్రంగా ఉండేది. గుండ్రం గుండ్రంగా చేతికి చల్లగా తగిలే జొన్నలతో ఇంకాసేపు ఆడుకోవాలనిపించేది.

ఒక సారి అమ్మ పొద్దున్నే వంటింట్లోకి వెళ్లి పెద్దగా కేకలు వేయడం మొదలెట్టింది. ‘జాలాడి తూము లోంచి యా పామన్న దూర్న్యాదేమోరా, సూడు పో’ అని జేజి మా నాన్నను లేపి పంపింది. నాన్న వెనుక నేను, మా తమ్ముడు. ‘మీరు యాడికి రా’ అని జేజి అరుపులు. లోపలికి వెళ్లి చూస్తే ఏముంది?! ఆ కిటికీకి బాగా కింద వంటింటి వెనుక గోడకు పెద్ద కన్నం. దాని లోంచి చూస్తే అవతల చేని లోని నల్లమట్టి బెడ్డలు బెడ్డలుగా, మా జాలాడి నీళ్లతో కలిసి బురద బురదగా కనిపిస్తోంది. గరిసెల దగ్గర్నించి కన్నం వరకు జొన్నలు చెదరు మదురుగా పడి వున్నాయి. హడావిడిగా మోస్తున్నప్పుడు పడిపోయిన గింజలు. ఇంట్లో దొంగలు పడడం, కన్నం వేయడం అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. తరువాత ఎన్ని కథలు విన్నానో. ఎప్పుడెప్పుడు ఎట్టెట్టా ఇంట్లో దొంగలు పడ్డారో జేజి వైనవైనాలుగా చెప్పేది. ఇప్పుడా కిటికీ విరిగి పడి రాళ్ల మధ్య నుంచి దొంగ చూపులు చూస్తోంది.

గరిసె బండలను చూస్తే, పెద్దవాళ్లు చెప్పిన మరో ఘటన మనసులో కదిలి భయపెడుతుంది. గరిసెలో దిగేప్పుడు బయట అమ్మ కాకుండా ఇంకెవరైనా వున్నారేమోనని భయంగా చూసుకునే వాన్ని. మా మామ అన్న ఒకాయన వాళ్లింటి గరిసెలో ఊపిరాడక చచ్చిపోయినాడంట. మా మామకూ ఆయన అన్నకు ఆస్తి పంపకాలలో తగాదా వచ్చింది. తమ్ముడు గరిసెలో ఏదో మూలన బంగారం దాచిపెట్టాడని అన్నకు అనుమానం. అన్న గరిసెలో దిగి బంగారం కోసం వెదకడం మొదలెట్టాడు. మా మామ గరిసె మీద బండ మూసి కూర్చున్నాడు. గాలి పోవడానికి సందు లేని బండ. అన్న ఎంత అరిచినా తమ్ముడు బండ తీయలేదట. ఊపిరాడక ప్రాణం వదిలాక బయటికి తీసి ఏవో కతలు అల్లి చెప్పినాడంట మా మామ. వాళ్లు బాగా ఉన్నోళ్లు. అంత ఆస్తికి మా మామ ఒక్కడే. ఇక, నోరు తెరిచే దెవరు? ఈ కథ విన్నాక, మా ఇంటికొచ్చినప్పుడు మామను చాల సార్లు చూశాను. నెమ్మది మాట, నెమ్మది నడక. ఆయన మాట మీద మా నాన్నకు మంచి గురి. అలాంటాయన ఆ పని చేసుంటాడని ఎలా అనుకుంటాం. అదేదో పుకారు. అయినా, కథ చెప్పుకోడానికి, వింటానికి బాగుండేది. పెద్ద వాళ్లు ఆ కథ చెప్పుకుని పగలబడి నవ్వుకునే వాళ్లు. చివరాఖర్న ‘గరిసెలో దిగేటప్పుడు బామ్మర్దిని నమ్ముకోవాల గాని తమ్మున్ని నమ్మకో గుడ్దు రోయ్’ అని నీతి కూడా చెప్పుకునే వాళ్లు.

రాళ్ల గుట్టల్లో ఇంకో పక్కన బాగా పొడుగు, వెడల్పు, మందం వున్న కొన్ని బండలు సగం వరకు మట్టిలో కూరుకుపోయి వున్నాయి. అన్నిటి కంటె పెద్ద బండ మా ఇంటి ముందు పెద్దరుగుది. మిగిలిన చిన్న ముక్కలు అక్కడే ఎడమ వైపు అరుగువి. తలవాకిలి దాటి ఇంట్లోకి వెళ్లాలంటే ముందుగా ఆ రెండరుగుల మధ్య బండ-చట్టం మీద నడవాలి. పెద్దరుగు మీద గోడ వారగా ఎప్పుడూ ఒక రంగుల సిరిచాప చుట్ట వుండేది. చాప కొసన దారాలు అరుగు మీంచి కొద్దిగా వేలాడుతుండేవి. నేను కింద నిలబడి సిరిచాప ముట్టుకోడానికి చెయ్యెత్తే వాన్ని, ఎంత పొడుగు వున్నానో చూసుకోడానికి. మొదట్లో అందేది కాదు. చాప నాకు అందేంత దగ్గరయ్యే కొద్దీ పెద్ద వాన్ని అవుతున్నానని మురిసిపోయే వాన్ని.

పూర్తిగా చేతికి అందాక కూడా నాకు చాప మీద ఆసక్తి పోలేదు. అదొక సంకేతం.

అరుగు మీద చాప విప్పి పరిచారంటే, బయటి నుంచి బంధువులెవరో వచ్చారన్న మాట. ఆ రోజు ఇంట్లో వరి బువ్వ. మిగిలిన రోజుల్లో కొర్రన్నం లేదా జొన్న సంకటి. విసుగొచ్చేది. బంధువులొస్తే ఒక్కోసారి మాంసం కూడా వుంటుంది. వచ్చిన వాళ్లు చిన్న వాడినని నన్ను ముద్దు చేస్తారు. అందరు కాదు గాని మా మామ లాంటి వాళ్లు తియ్య-కారాలు కొనుక్కోడానికి ఒక బొట్టో, అర్ధణానో ఇస్తారు. సిరిచాప మీద కూర్చుని వాళ్లు మాట్లాడుకునే మాటలు అర్థం కాకపోయినా వింటానికి భాగుంటాయి. వాళ్లకు కనపడేట్టు, రెండరుగుల మధ్యన చేరి; నేనూ మా తమ్ముడు జొన్న-దంటు బెండ్లు, ఈనెల బండికి చిన్ని రాతి ఎద్దులు కట్టి ఆడుకునే వాళ్లం. నేను మా కళ్లం లోంచి బంక మట్టి తెచ్చి బస్సు చేసి ‘పాం పాం’ అంటూ నడిపే వాన్ని. అది చూసి అరుగు మీది వాళ్లు ‘ఈడు సేద్ద్యానికి పన్కి రాడు. తెల్లపుల్లగ బట్టలేస్కోని బస్సుల్లో తిరుగుతాడు, యా పట్నంల బతుకుతాడు’ అనే వాళ్లు.  ‘ఏమో ఎవుని నొస్ట ఏం రాసి పెట్న్యాదో. పిల్లొల్లు గుడ్క మన లెక్క ఎద్దు గుద్ద పొడ్సుకుంటా పల్లె కొంపలో పడుండాల్నా?’ అనే వాడు మా నాన్న కలలు కనే కళ్లతో.

చిన్నప్పుడు నాన్న మాటలు అంతగా అర్థమయ్యేవి కాదు. ఏదో మెచ్చికోలు మాటలు అనిపించేదంతే.

పెద్దయ్యే కొద్దీ అవి బాగా అనుభవానికి వచ్చాయి. ఊళ్లో ఒకేలా మార్పు లేకుండా దొర్లే రోజులు; తెల్లారు ఝామున లేచి ఇంటి పనులన్నీ చేసుకుని, అన్నం ఎక్కడుందో మాకు చెప్పి ‘పెద్దోడా బయిటికి వొయ్యెటప్పుడు వాకి లెయ్యి, కుక్కలు వడ్తే రాత్రికి బువ్వ వుండద’ని అరిచి చెప్పి వెళ్లి మునిమాపుకు గాని రాని అమ్మ. పుస్తకాల్లోని అమ్మల్లా నన్నూ తమ్మున్ని లాలించడానికి, ప్రేమగా దగ్గరికి తీసుకోడానికి తీరిక లేని అమ్మ. అప్పుల ఊబిలో కూరుకు పోయి దిక్కు తోచక, మరెక్కడా కసి తీరక మా వీపుల మీద ములుగర్ర విరగ్గొట్టే నాన్న; ‘ఈళ్ల కేముంది, కొట్టం మింద సెత్త లేని నాయాండ్లు, పిల్లనిచ్చేటోడు గుడ్క దొర్కడు’ అని తిరస్కారంగా చూసే కలిగినోళ్లు; పట్నంలో చిన్న ఉద్యోగమైనా నీడ పట్టున బతకొచ్చునని, ఫ్యాను గాలి కింద పడుకోవచ్చని, వారానికి ఒక సారి సెలవుల్లో సినిమాలకు షికార్లకు వెళ్లొచ్చని అందరూ అనుకునే మాటలు…. వూళ్లో వుండడం నాకు ఒక మజిలీ మాత్రమే, ఎప్పటికీ వుండబోయేది లేదనే బాధ; అలా జరగదు, బతుకంతా ఆ ఇరుకులోనే గడపాలనే దిగులు… రెండూ ఒకే సారి కదుల్తుండేవి.

ఈ రాళ్లన్నీ కాదు, నాకు చాల ముఖ్యమైనవి రాళ్లు వేరే ఉన్నాయి. దుమ్ము పడినా ఎండకు మెరుస్తున్నఎర్ర రంగుపట్టెల రాళ్లు. వాటిని చూస్తే ఏడుపొస్తుంది. తల వాకిలికి రెండు పక్కల.,  కింద గడప దగ్గర్నుంచి పైన సుంచు-బండ (అటక) వరకు స్కేలు పెట్టి దిద్దినట్లుండేవి రంగుపట్టెలు. అవంటే నాకు చాల ఇష్టం. ఎర్ర రంగుపట్టెలు వూళ్లో అన్ని ఇళ్లకూ ఉంటాయి. మావి అన్నిటి లాంటివి కావు. మిగతా ఇళ్ల వాకిళ్లకు ఎర్రమన్నుతో పూసిన మొరటు పట్టెలుంటాయి. ఇంటి వాళ్లకు ఓపిక కుదిరి, బండి కట్టుకెళ్లి ఎక్కడి నుంచో ఎర్రమన్ను తెచ్చి పూస్తే కొన్ని రోజులు కొత్తగా ఉంటాయి. లేకుంటే మాసిపోయి, వెలిసిపోయి ఉంటాయి. మా ఇంటి పట్టెలు అట్టాంటి ఎర్రమన్నువి కావు. నూనె రంగులతో తీర్చినవి. మాసిపోకుండా నిగనిగలాడుతుండేవి. అవి మా ఇంటి ప్రత్యేకత. ఒక్కో ఇంటికి ఒక ప్రత్యేకత. ఇపుడు దుమ్ములో అడ్డదిడ్డంగా పడిన రంగుపట్టెల రాళ్లను చూస్తుంటే ఏదో లోయ లోనికి కొద్ది కొద్దిగా జారిపోతున్నట్లు దిగులు.

ఇదంతా కల. తెలుసు. ఇది భయం కాదు. దిగులు.

దిగులేనా? నిజంగా నేను దిగులు పడతున్నానా? కలను ఎంజాయ్ చేస్తున్నానా? ఏమో!

ఉన్నట్టుండి నాకు మా వంటింట్లోని చిన్నరుగు గుర్తొచ్చింది. రాళ్ల గుట్టల్లో ఆ పొడుగాటి పల్చని బండ కోసం కనుగుడ్డు వెదుక్కుంది. నేను, తమ్ముడు చాల చిన్నప్పట్నించి సునాయాసంగా ఎక్కి కూర్చుని అన్నాలు తిన్న చిన్నరుగు. దాని మీద ఆ స్తంభానికొకరం ఈ స్తంభానికొకరం కూర్చుని లేనిపోని కబుర్లన్నీ చెప్పుకున్న, కొట్లాడుకున్న చిన్నరుగు.

ఉన్నట్టుండి, తమ్ముడు చొక్కా జేబు లోంచి చిన్న గులక రాయి తీసి చేత్తో పట్టుకుని, ‘అనా, నేను సిన్నోన్నని ఊకూకె కొడుతొండావు. రాయితొ కొడ్తె నెత్తిన బొర్ర పడ్తాది సూడు’ అని బెదిరిస్తున్నాడు. వాడు నిజంగానే రాయి విసురుతాడనిపించింది. ‘అమా, ఈడు జూడే’ అని నేను అరుస్తున్నాను. ‘ఏందిరా ఇద్దరు ఎప్పుడు జూసినా? వాదు ల్యాక వల్లూరికి వోతొండ ఇరుగు పొరుగు నా సవుతులార ఇల్లు బద్రమే అన్నెట్టూ…..” అని అమ్మ కోప్పడుతోంది, పొయ్యి దగ్గర పొగ చూరిన వెలుగు లోంచి.

అంతలోనే గుర్తొచ్చింది. ‘ఇప్పుడు తమ్ముడు లేడు కదా?. అమ్మ… అమ్మ… మాత్రం ఎక్కడుంది? మరి ఈమె, వీడు… ఎవరు వీళ్లు? ఏమిటిదంతా’ అని మనసు గింజుకుంది.  లోతు నీళ్లల్లోంచి పైకి వస్తున్నప్పుడు, ఇంకా ఊపిరి తీసుకోడానికి వీల్లేనప్పటి మంచు తెర లాంటి స్థితి

‘ఇగో అనుమంత్రెడ్డీ’ ఎవరో పిలుస్తున్నారు. కలలోని వాళ్లు కాదు. భుజం మీద ఎవరిదో చెయ్యి. అది కూడా కలలోని మనుషులది కాదు. కళ్లు తెరిచా‍ను. మా పొట్టి వేపమాను కొమ్మల్లోంచి ఎండ పొడ మంచం మీద పడుతోంది. మంచం పక్కన రాజేశ్వరమ్మ పిన్ని నవ్వు మొహంతో చూస్తోంది. ‘ఏం సిన్నా! ఏమన్న కల వడింద్యా? ఏందేందో అంటొండావు. ఎవురితో మాట్లాడుతొండావూ?” అడిగింది దీర్ఘాలు తీస్తూ. ఒక్క క్షణం నేనెక్కడున్నానో తెలియలేదు. “నేను ఎక్కడున్నాను?” అడిగాను, పిచ్చి చూపులు చూస్తూ.  “యాడొండావు. మన ఇంటి కాడొండావు. ఇట్టా పదేండ్ల కొగ సారి వూరి మొగం జూచ్చె ఎట్ట తెలుచ్చాది నాయ్నా! మీకేం పట్నం బొయి హాయిగ వుండారు. ఈడ మనొల్లు ఎట్టా బతుకుతొండారొ అని ఎప్పుడన్నా అనుకుంటావా? సర్లె సర్లె, లేసి మొగం గడుక్కో. కాపి సల్లారిపోతాది”, ఈసారి పిన్ని నవ్వులో కొంచెం నిష్ఠూరం. నాకు లేవాలని లేదు. “కొంచెం వుండు పిన్నీ, అయిదు నిమిషాలు’ అని మళ్లీ కళ్లు మూసుకున్నాను.

మనసు చాల గజిబిజిగా వుంది. నా చుట్టూ అసహజమైనదేదో వుంది. నాకు ఇష్టం లేనిది ఏదో వుంది. తెలిసీ తెలియక కెలుకుతోంది. అదేమిటో తెలియడం లేదు. ఇల్లు… పడిపోయిన ఇంటి గోడలు, రాళ్లు… మగత మెలకువలో దొర్లుతున్నాయి. బాగా మందుకొట్టిన రాత్రి తెలవారు ఝాము మెలకువలో కలిగే పశ్చాత్తాపం లాంటి నొప్పి.

నన్ను బాధ పెట్టేది ఏమిటో వెంటనే గుర్తొచ్చేదే గాని, పిన్ని నిష్ఠూరం మాటలతో మనసు అటు వైపు పోయింది. మా చిన్నాన్నకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు.  రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు పనుల్లో తిరుగుతుంటారు. చిన్నాన్న, పిన్ని వ్యవసాయం చూసుకుంటూ వూళ్లో వుంటారు. అందరూ పట్నం పోదామని ఆలోచిస్తుంటారు. పట్నంలో ఏం చేయాలో తోచక ఊళ్లో వుండిపోయారు. నా మాదిరి తన కొడుకులకు పట్నంలో ఉద్యోగం లేదని పిన్ని దిగులు. వాళ్ల ఉద్యోగాల గురించి నేను పట్టించుకోడం లేదని నిష్ఠూరం. ఉద్యోగాలు ఏమంత గొప్ప కాదని వ్యాపారాలే మేలని చెప్పినా వినదు.

ఈ అపార్థాల వైకల్యంతో కలగలిసిన కల. ఇప్పటిది కాదు. మొదటి సారి, కలకు నిజానికి తేడా తెలియని వయసులో కలత పెట్టిన కల. తరువాత నేను ఎక్కడ ఎలా ఉన్నా చెప్పా పెట్టకుండా వచ్చి కళ్ళ మీద వాలుతుంటుంది. అదే కల, అవే దృశ్యాలు.

కలలో రంగుపట్టెల రాళ్ల ముక్కలు చూస్తుంటే, అవి ఇక వుండవనే స్పృహతో పాటు, అవి కూడా లేకపోతే వూరిలో మా ఇంటికి ఏ ప్రత్యేకత వుండదనే బాధ. ఏ గుర్తింపు లేకుండా పిండిలో రేణువుల్లా ఎందుకు వున్నామని విచికిత్స, చదువుకుని పట్నం వెళ్లి ప్రత్యేకత సంపాదించాలని కోరిక, అదంత సులభం కాదు, ఎన్నో పరీక్షలు పాసు కావాలి అని నిరాశ.. ఉప్మా ప్లేటులో కాఫీ ఒలికి, తడిసిపోయినట్టు, దాన్ని తీసుకెళ్లి సింకులో పారబోయాలన్నంత చికాకు.

ఆ భయాలు, విచికిత్సలు ఇప్పుడుంటానికి వీల్లేదు. ఊరు వదిలేసి హైదరాబాదు చేరి చాల కాలమయ్యింది. నేనే కాదు, తమ్ముడు, అమ్మ చాల మంది బావలు, బా‍మ్మర్దులు హైదరాబాదుకు చేరారు. అర్ధాంతరంగా తమ్ముడు, ఆ తరువాత అమ్మ చనిపోయారు. తమ్ముడు వుండినా వూరికి వెళ్లి చిన్నరుగు మీద కబుర్లు చెప్పుకుంటామా? ఊరికి వెళ్లాలని వుంటుంది. మా ఇల్లు కళ్లారా చూసుకోవాలని వుంటుంది. వెళ్తే ఎక్కడ వుండటం? తమ్ముడు వున్నప్పుడే ఇంటిని చిన్నాన్న వాళ్లకు అమ్మేశాం. మాది కాని ఇంట్లో ఒకటి రెండు రోజులకు మించి వుండలేను. నేను హైదరాబాదులో హాయిగా వుంటే తాము, తమ పిల్లలు పల్లె కొంపలో వుండిపోయారని, దానికి నేను ఏమైనా చెయ్యొచ్చు కదా అని, చెయ్యడం లేదని దాయాదుల కళ్లల్లో అప్రకటిత ఫిర్యాదు. ఊరికి వెళ్లడం కుదరదు. కల వదలదు. వదలడానికి అది వట్ఠి జ్ఙాపకం కాదు. భవిష్యత్తు కూడా.

ఆ రోజు ఊళ్లో, మాఅఅ పొట్టి వేపచెట్టు నీడ కింద పడుకుని వున్నప్పుడు, మళ్లీ అదే కల. ఇదేమిటని అనుకుంటుండగా, అక్కడి అసహజమేమిటో చటుక్కున తోచింది. ఎవరో వీపున చరిచినట్లయ్యింది. కళ్లు తెరిచి మంచం మీద కూర్చున్నాను.

పొట్టి వేపచెట్టు కింద పడుకుంటే, దాని నీడ పక్కకు పోయే సరికి మా ఇంటి నీడ నా మీద పడా‍లి. పడడం లేదు. అక్కడ మా ఇల్లు లేదు. ఇల్లు వుండిన చోట, ఆ స్థలం మధ్యలో, తడి తడి ప్లాస్టరింగ్ వాసన వేస్తున్న కాంక్రీటు ఇల్లు. చిన్నాన్న వాళ్లు ఇంటిని మా నుంచి కొన్నాక, కొన్నాళ్లు అందులోనే కాపురం చేశారు. కొడుకులు వ్యాపారాల్లో గడించిన డబ్బుతో, పాత ఇల్లు పడగొట్టి కొత్తగా కట్టారు. ఇప్పుడు నేను వచ్చింది కొత్తింటి గృహప్రవేశానికి. కొత్తింటికి ఒక పక్కన, ఇంకా బయటికి తీసుకెళ్లి పడేయని పాత ఇంటి రాళ్లు, కిటికీ చట్రాలు, పగిలిన బండలు. అన్నీ మా ఇంటివే. కల కాదు. నిజం.

‘ఏం వోయ్. పల్లెటూల్లో ఫ్యాను ల్యాక పొయినా బాగ నిద్ర పట్టి నట్టుందే? ఏందో శాన దీర్గాలోశన్లో వుండావబ్భా!”

పలకరింపు విని, ముఖం మీది చెమట తుడుచుకుంటూ తల పైకెత్తి చూశాను. వీరా రెడ్డి మామ. వాళ్ల కల్లానికి వెళ్లాలంటే మా ఇంటి మీదుగానే వెళ్లాలి. మామ ధోవతి చుంగులు పైకి సర్దుకుని నాకు కొంచెం దూరంగా మంచం మీద కూర్చున్నాడు. తనది ఎప్పుడూ నవ్వుతున్నట్టుండే మొహం. మాట కూడా అంతే. ప్రతి దాన్నీ తేలిగ్గా‍ తీసుకుని మాట్లాడుతున్నట్టు వుంటుంది. కాని, అవి అనుభవాలతో పండిన మాటలు. అనుభవం పండితే అన్నీ తేలికే.

“ఎక్కడికి మామా! కల్లానికా?” అని ఎదురు పలకరించి, జవాబు కోసం చూడకుండా, “పాత రాతి మిద్దెలు ఎత్తుగా, చల్లగా వుండేవి కదా!? అవి పడగొట్టి పట్నంలో మాదిరి ఈ పొట్టి ఇళ్లు ఎందుకు మామా? ఈ ఖర్చులెందుకు? అర్థం కావడం ల్యా” అన్నాను, నా దీర్ఘాలోచనకు ఒక నెపం కల్పిస్తూ.

“అంటె, ఏమంటావ్వొయ్య్, మీరంతా పట్నంల ఫ్యాన్లేసుకోని, ఏసీలేసుకోని సల్లగ పండుకాల. మేము ఇట్నె యాపసెట్ల కింది సింత సెట్ల కింద బతకాల్నా?”, అని నవ్వేశాడాయన. “అట్ట గాదు గాని అల్లుడా! రాతి మిద్దెలయితే, పైన మట్టి మెత్తు ఏస్కో వాల్య. యాడాదికి ఒగ సారి బండి గట్క పొయ్యి, సౌడు మన్ను తోల్కోని రావాల్య. ల్యాకుంటే పైన బొక్కలు వడి పొట్కు వెడ్తాది. వానకు గోడలు వుబ్బిపొయ్యి, రాల్లు పక్కకు జరుగుతాయి. వుశారుగుండి సగేసుకోక పోతె గోడ పడిపోతాది. ఇప్పుడయ్యన్ని ఎవుడు జేచ్చాడు? ఆ ఓపిక ఎవుడికుంది? అన్ని సిటికెల పందిరి లెక్క అయిపొవ్వాల.”

ఆయన చెప్పింది కూడా నిజమే కదా అనుకుంటూ మౌనంగా వుండిపోయాన్నేను.

“అయిన గాని, ఇయ్యాల్రేపు పల్లె అని పట్నమని తేడా యాడ కాలవడింది లే. మీ కాడ వుండేటివన్ని మా కాడి గ్గూడ వచ్చొండాయి. అగో, ఈ బజారు దాటి పోతె బస్టాండు. నీ సిన్నప్పుడు మనూల్లొ బయిట కాపి నీల్లు దొర్కుతొండెనా. ఇప్పుడు బస్టాండు కాడికి వొయ్యి సూడు. ఐదు టీ హోటళ్లు, ఆడ పట్టకుండ పిల్లోల్లు. అప్పుడు ఒక బస్సు రెండు టిప్పులు తిర్గు తొండె. ఇప్పుడు రెండు బస్సులు కల్సి ఎనిమిది సార్లు తిర్గినా సీటు దొర్కదు. ఎవునికి వూర్లొ కాలు నిలవడదు. ఏం శాతగా‍నోనికి సేద్దెం. శాతనైనోడెవుడు పల్లెకొంపల్లొ వుందామనుకోడం ల్యా. ఈడ ఏందో కారిపోతోందని, ఏందో పొగొట్టుకున్న్యామని వూకె నోటి మాటకు అంటొంటారు నీ లెక్కటొల్లు. అదే నిజమైతె మీరు ఈడికి ఒచ్చి వుండొచ్చు గదా. రిటైరయినోల్లన్న రావొచ్చు గదా? యా రారు! ఈడ యా టీచరుద్యోగమో వున్నోల్లు గుడ్క ఈడ వుండరు. కర్నూల్లొ కాపిరం. ఈడికి ఏందదీ… అప్పండౌన్. అన్ని వుత్త మాటలు. ఆడ మీకు బోరు గొట్టినప్పుడు, ఏందన్న కస్టమొచ్చినప్పుడు అట్టా అంటొంటారు. ఈడ వుండెటోల్లు గుడ్క ఎవురు ఈన్నే వుండాలని అనుకోడం ల్యా. సదువు ఒంట బట్టినోల్లు, శాతనైనోల్లు యాదో ఒగ పని జూస్కోని పట్నం జేరుతొండారు. ల్యాకుంటే, ఈడ్నె ఉండి సుట్టుపట్ల యా బూముల యాపారమో సూసుకుంటొండారు. అది గుడ్క కుదరనోల్లు శాన కమ్మి. ఈడ వుండెటోల్లు గుడ్క, మరీ బాతిగానోల్లు దప్ప, పాత ఇండ్లు ఎవురుంచుకుంటారు? ప్యాదోల్లు గుడ్క వుంచుకోడం ల్యా. ఇందిరమ్మ ఇండ్లో ఇంగొగటో… సిమెంటు ఇండ్లు ల్యాకుంటే ఎవురు ఒప్పుకోడం ల్యా.”

మామ మాటలు వింటుంటే నాకెందుకో ఎమ్మేలో నా క్లాసుమేటు, నక్సలైటు నాగేశ్వర రావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాళ్ల పార్టీ ముందుగా పల్లెల్లో అధికారం సంపాదించి, పల్లెలతో పట్టణాలను ముట్టడిస్తుందని అనే వాడు. ఆ సంగతేమో గాని, ఇప్పుడు పట్నాలు పల్లెలను ముట్టడిస్తున్నాయి.

ఇది మంచికా చెడుకా?

ఏది మంచి ఏది చెడు?

చిన్నా‍న్న వాళ్ల గృహ ప్రవేశం చూసుకుని హైదరాబాదు వచ్ఛాక ఇంత వరకు మళ్లీ మా వూరికి వెళ్ల లేదు. అక్కడి నుంచి బయల్దేరే ముందు మా ఇంటి రాళ్ల దగ్గరికి వెళ్లి కాసేపు నుంచున్నాను. టేబుల్‍ మీద పెట్టుకుందామని, రంగుపట్టెల రాళ్ల ముక్కల్లో ఒకటి చేతిలోకి తీసుకున్నాను. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. రంగు రాయిని గుట్ట మధ్యకు విసిరి వచ్చేశాను.

— హెచ్చార్కే

 

 

నెక్స్ట్ కేస్

ismail

సారూ! నన్ను బ్రతికించు… సారూ!” అంటూ కన్నీళ్లు పెట్టుకొంటోంది చెన్నవ్వ.

ఎక్కిళ్లతో ఎగిసెగిసి గస పోసుకుంటూ మాట్లాడుతోంది. రాత్రి ఒంటి గంట కావస్తూంది.

బయట హోరున వర్షం. అప్పుడే కరెంటు పోయింది.

మిణుకు మిణుకుమనే కొవ్వొత్తి కాంతిలో ఆ చిన్న గదిలో, సగం తుప్పు పట్టిన మంచం మీద చెన్నవ్వ, పక్కన నేను.

“ఇట్టాంటి పని మళ్లా ఎన్నడూ చేయను సారూ! యెంత కస్టమొచ్చినా కడుపులో పెట్టుకొనేదాన్ని, కానీ ఉన్న ఒక్క మగోడు పోయినాక, ఆ దుక్కం తట్టుకోలేక ఈ పని చేసినా సారూ!” ఏడుస్తూనే చెప్పింది.

“ఊరుకోమ్మా! నీకేం కాదులే…నేనున్నానులే.. అంతా బయటకు వచ్చేసింది. కాసేపు ఈ మందు ఇస్తే ప్రాణం అదే  కుదుటపడుతుంది”

ఏదో ఓదార్పుగా నాలుగు మాటలు చెప్తున్నా కానీ నా కళ్లన్నీ సూదిమొనంత అయిపోయిన ఆమె కనుపాపల మీదే ఉన్నాయి.

ఈ సారి కొంచెం మోతాదు పెంచి, సిరెంజిలో కాస్త ఎక్కువ మొత్తంలో ‘అట్రోపిన్’ తీసుకొని ఆమె నరంలోకి మెల్లగా పోనిచ్చాను. అంతకు ముందే ఇచ్చిన ‘ప్రాలిడాక్సైం’ విరుగుడు మహత్యమో, లేక వరుసగా ఇస్తూన్న అట్రోపిన్ చలవో, అప్పుడే తెరుచుకొన్న బిలంలా తన కనుపాపలు కాస్త పెద్దవవడం మొదలైంది.

తన కనుపాపనైతే చూడగలిగాను కానీ ఆ కన్నుల్లోంచి ‘ఆమె’ను చూడలేకపోయాను. ఎంత బాధ ఉంటే ఓ మనిషి ఆత్మహత్య అనే ఆఖరి మెట్టుకు చేరుకొంటాడు? ఆ బాధ తీర్చే శక్తి నాకుందా? ఇప్పుడు ఈ ప్రాణాన్ని బయటపడవేయగలను, కానీ ఆ బాధను తీసివేయడం నా చేతుల్లో లేదు కదా అని ఒక్క క్షణం అనిపించింది.

***

ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి అవడానికి ఆసుపత్రే అయినా ఓ పెద్ద సైజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. వైద్యవిధానపరిషత్ కిందకు వచ్చే సామాజిక ఆరోగ్య కేంద్రం.
24 గంటల వైద్యసేవ కోసం ప్రభుత్వం కాంట్రాక్టు వైద్యునలయితే నియమించింది కానీ, అక్కడ ఆ సేవలందించడానికి కావాల్సిన పరికరాలు, సాధనా సంపత్తికి ఎప్పుడూ కొరతే.

నేను పని చేసేది గుంతకల్లు ప్రభుత్వసుపత్రే అయిన డిప్యుటేషన్ పై ఓ వారం రోజుల నుంచి ఉరవకొండలో ఉన్నాను.

సాయంత్రం పని అయిపోగానే అనంతపురం బయలుదేరేవాన్నే, కానీ ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టరు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వరుసగా రెండో రోజూ నేనే నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. శనివారం కావడం వల్ల, సాయంత్రం పెద్దగా ఓ.పి. లేదు. ఈ రోజు కాస్త ప్రశాంతంగా గడచిపోతుంది అనుకొనేటప్పటికి సన్నగా
జల్లు పడడం ప్రారంభించింది.

పక్కనే ఉన్న టీకొట్టు నుంచి అటెండరు మల్లన్న మంచి మసాల టీ పట్టుకొచ్చాడు.

ఉన్న ఒక్క నర్సు సునంద, మల్లన్న, నేను ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటూ ఉండగా  హడావుడిగా ఓ ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి నురగలు కక్కుకూంటూన్న  బక్కపలుచటి మనిషిని ఓ ఇద్దరు చేతుల్లో మోస్తూ తెచ్చి రూంలో పడుకోబెట్టారు.

“సార్! దాని మొగుడు, పోయిన వారమే పురుగుల మందు తాగి పాణాలు తీసుకొన్నాడు. అబ్బుటి నుంచి ఏడ్చి, ఏడ్చి గుడిసెలోనే ఉన్నాది, ఈ పొద్దు పలకరిద్దామని వాళ్లింటికి పోతే కిందపడి కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటాంది. ఆ పక్కన తాగి పడేసిన ఎండ్రిన్ డబ్బా ఉంది. అబ్బుడే ఊర్లోకి వచ్చిన షేర్ ఆటోలో ఈయమ్మని ఏసుకొచ్చినాం” అని ఒక్క గుక్కలో జరిగిందంతా చెప్పేసారు చిన్నహోతూరు
నుంచి ఆటో వేసుకొని ఆమెని తీసుకొచ్చిన ఊరివాళ్లు.

వాళ్లతో ఓ పక్క మాట్లాడుతూనే సిస్టర్ తెచ్చిన ఓ చిన్న ప్లాస్టిక్ గొట్టాన్ని తీసుకొని మెల్లగా ముక్కు ద్వారా పొట్టలొకి పంపి, స్టెతస్కోపుతో దాని చివర కడుపులోనే ఉందని నిర్దారించుకొని, ఓ పెద్ద సిరెంజితో రెండు బాటిళ్ల ‘నార్మల్ సెలైన్’ పంపి మళ్ళీ అదే సిరెంజితోనే తిరిగి ఆ సైలైనంతా బయటకు లాగి ‘గాస్ట్రిక్ లావాజ్’ చేయడం మొదలుపెట్టాను.

ఇది నేనిలా ఓ వైపు చేస్తూంటే, ముంజేతి నరానికి వదులు కాకుండా ఓ ఐ.వి.కాథటర్ని పెట్టి మెల్లగా తన రక్తనాళాల్లోకి సైలెను బాటిల్లోని మందును పంపసాగింది సిస్టర్ సునంద. మల్లన్న దగ్గర్లో ఉన్న కుర్చీని జరిపి
‘కూర్చోండి సార్’ అన్నాడు.

అప్పటి నుంచి ప్రతి పదిహేను నిముషాలకు ఒకసారి నేను, మరొకసారి సిస్టరు ఆమె కనుపాప తీరుని, మణికట్టు దగ్గర నాడీవేగాన్ని గమనిస్తూ తగిన మోతాదులో ‘అట్రోపిన్’ ఇస్తూ వచ్చాం. ఎప్పుడో అర్ధరాత్రికి  ఆమెకు కాస్త తెలివి వచ్చింది.

***

“నీ పేరేంటి? మీదే ఊరు? ఏం జరిగింది?” అంటూ ఒక్క ప్రశ్న తర్వాత ఇంకొక్కటి వేస్తూ పోయాను.

సగం తెరిచిన కనులతో మెల్లగా ఏదో గొణుగుతూ ఉంది.
అలా కొద్దిసేపయ్యాక నోట్లో ఊరుతూన్న లాలాజలం అంతా ‘అట్రోపిన్’ ఎఫెక్టుతో ఆగడం మొదలుపెట్టాక ఆమె మాటతీరు కాస్త మెరుగైంది.

“నా పేరు చెన్నమ్మ సారూ. ఊర్లో అంతా చెన్నవ్వ అని పిలుస్తారు. ఏదో ఇంత యవసాయం చేసుకొని బతుకుతాన్నాం. ఈ సారి అప్పుసప్పూ చేసి ఏసిన చెనిక్కాయంతా వానకు కొట్టుకుపోయింది. ఇన్నాళ్యూ వొర్సం లేక పంట ఎండిపోయె. ఊరంతా ఎడారి ఐపొయె.ఇప్పుడేమో ఈ పాడు వానలకు చేతికొచ్చిన పంట పోయింది. అది చూసి తట్టుకోలేక నా పెనిమిటి పోయినారమే ఎండ్రిన్ తాగి పాణాలిడిచినాడు. నన్నిట్లా వొదిలేసి ఆయప్ప దారి ఆయప్ప సూసుకొన్నాడు. అనంతపురం కూడా కొండబోయినాం కానీ ఏమీ పయోజనంలేకపాయ ఉన్న అప్పు సాలక నెత్తి మీద ఇంకో అయిదువేలు పడినాయి. నేనెక్కణ్నుంచి
తెత్తును సారూ! ఉండేకి ఓ గుడిసె, తినేకి ఇంత సంగటి కూడా కస్టమైపాయె ఈ అప్పులోళ్లతో. ఆ వడ్డీ అంతా యాడ నుంచి తెచ్చి కట్టేది సారూ. అందుకే ఈ పని చేస్తి..”

ఆగకుండా చెప్తునే పోతోంది చెన్నవ్వ.

“అట్లంటే ఎట్ల చెన్నవ్వ, మీ ఊరోళ్ళకు నీ గురించి తెలియదా? సర్పంచితో నేను మాట్లాడుతాలే, అప్పులోళ్లు సతాయిస్తే పోలీసోళ్లకు చెప్పాలి. నీవున్న పరిస్థితిలో ఎవరైనా నీకు సాయమే చేస్తారు. ఆ క్రాపు లోనో ఇంకోటో ఏదో ఒక దారి ఉండకపోదు” అని తనకి ఆత్మస్థైర్యం కలిగించే ప్రయత్నం చేశాను.

“లేదు సారూ, నేను చానా ధైర్న్యంగా బతికిందాన్నే. ఈ ఒక్కసారికీ నన్ను గడ్డకేయండి సారూ! ఇన్నాళ్యూ యాదో ఒకటి… తినో తాగో బతికినాం. కానీ ఆ పెనిమిటే పోయినంక ఆ బాధ తట్టుకోలేక ఈ పాడుపని చేసినాను కానీ బతికే ధైర్న్యంలాక కాదు” ఇంకిపోయిన కన్నీళ్లతో చెప్తోంది చెన్నవ్వ.

అలా ఆ రాత్రంతా మాటల్లో పడి తన గురించి, తన సంసారం గురించి,వాళ్ల దగ్గరి బంధువుల గురించి మాట్లాడుతూంటే తెల్లవారిపోయింది.

తన పెనిమిటంటే ఎంత ప్రేమో ఆ మాటల్లో ప్రతి వాక్యమూ  పట్టించింది.  ఒక మనిషిపై మరో మనిషి చూపే ప్రేమ, ఆప్యాయతలన్నా నాకు తగని ఆపేక్ష.

అందుకేనేమో నాకు తెలియకుండానే ఆ కొద్ది గంటల్లోనే ఎదో తెలియని సాన్నిహిత్యం ఏర్పడిపోయింది చెన్నవ్వతో.

ఉదయం ఎనిమిది గంటలయ్యేసరికి నా రిలీవర్ వచ్చాడు. చెన్నవ్వ పరిస్థితి బాగా మెరుగుపడింది.

అప్పటికే గుంతకల్లు ఏరియా ఆసుపత్రికి ఫోన్ చేసి ఈ విషయం కబురు చేయగానే, వాళ్ళు పంపిన అంబులెన్స్ కూడా సిధ్దంగా ఉంది.

చెన్నవ్వతో “గుంతకల్లులో ఇంకా మంచి వైద్యం దొరుకుతుంది, ఇంకా రెండు, మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ బాగా చూసుకొంటారు. సోమవారం నా డ్యూటీ గుంతకల్లులోనే, అక్కడ కలుస్తాను” అని ధైర్యం చెప్పి నేను అనంతపురం బస్సెక్కాను.

***

ఊరు చేరినా, పడుతూన్న వర్షం ఆగలేదు. సన్నగా అలా కురుస్తూనే ఉంది మూడు రోజులుగా.

ఇల్లు చేరగానే స్నానం చేసి అమ్మ పెట్టింది తిని వెంటనే పరుపు పై పడిపోయాను. ఒళ్లు తెలియని నిద్ర పట్టినా, కలలో ఎక్కడో లీలగా చెన్నవ్వ మాటలే వినపడుతున్నాయి.

“ఈ దేశంలో వ్యవసాయం దండుగ, ఐ.టి.యే సర్వరోగనివారణి” అని రాజకీయనాయకులు లెక్చర్లిచ్చే కాలం అది. అప్పటికి నేను పని చేసిన రెండు, మూడేళ్లలో దాదాపు యాభై, అరవై ఇలాంటి కేసులే చూసిన అనుభవం. చాలా కేసుల్లో, కొంత మందిని కాపాడగలిగినా, మరి కొంత మంది మరణం అంచుకు వెళ్లి తిరిగొచ్చినా… ఉన్న అప్పులకు మళ్ళీ ఇంకొన్ని తోడయ్యి వీళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలు సుళ్లు తిరిగేవి.

మళ్లీ సోమవారం పొద్దున కానీ కళ్లు తెరవలేదు. ఆ రోజు గుంతకల్లులో డ్యూటీ. ఉరవకొండకు డిప్యూటేషన్ పై వచ్చిన వారం రోజులు అయిపోయాయి. ఏడింటికల్లా అనంతపురం-గుంతకల్లు ప్యాసింజరు పట్టుకోవాలని రైన్ కోటు వేసుకొని, తలపై ఓ క్యాప్ పెట్టుకొని నా బైకుని రయ్యిమని స్టేషన్ వైపు పరుగులెత్తించాను.

***

గుంతకల్లు చేరగానే, అలా ఆస్పత్రిలో అడుగు పెట్టానో లేదో, గేటు దగ్గర ఏడుస్తూ ఓ పదిహేనేళ్ల కుర్రాడు, వర్షంలో తడుస్తూ నిలబడ్డాడు.

భుజం మీది తువ్వాలునైనా నెత్తిమీద పెట్టుకోకుండా తలో దిక్కూ చూస్తున్నాడు. లోపలికి రమ్మని చెప్పి “ఏమయ్యా! ఏమయ్యింది ?” అంటే “మా అత్త సచ్చిపోయింది సార్. ఆయమ్మ శవాన్ని ఇచ్చేదానికి పోలీసోల్లు లెక్క అడుగుతాండారు. ఓ పక్క అది పోయి మేమేడుస్తాంటే ఈల్లు లెక్కీలేదని సతాయిస్తాన్నారు. చేతిలో ఒక్క పైసా లేదు. ఏం జేయాల్నో దిక్కు తెల్డం లేదు సార్” అని దిగులుగా అన్నాడు.
మనస్సు చివుక్కుమంది. జేబులో చేయి పెట్టి దొరికిన ఓ వంద అతని చేతికిచ్చాను.

ఈ పోలీసు మామూళ్లు మామూలే అయినా పోస్ట్ మార్టం దగ్గర కూడా ఈ కక్కుర్తి ఏంటో అర్థం కాక చివ్వుమని కోపం వచ్చింది.

వీళ్ల సంగతేందో తేల్చాలని పోలిసు కానిస్టేబులు ఉండే మార్చురీ వైపు వెళ్ళాను. అక్కడ గుమ్మం దగ్గర ఎవ్వరూ లేరు. ఆ వర్షంలో కూడా పక్కనే ఓ తడిక కింద కానిస్టేబుల్ రమణ, మార్చురీ ‘తోటీ’ నంజయ్య దమ్ము కొడుతూ కనిపించారు.

“ఏం రమణా ఈ పిల్లోన్ని పైసలు అడిగావంట?” అని కాస్త కోపంగా అన్నాను. “ఏదో పేపర్లకి, మిగతా సరంజామాకి వాళ్లనే ఖర్చు పెట్టుకోమని చెప్పాను సార్, మాకిమ్మని కాదు” అంటూ ఏదో నసిగాడు రమణ .

అంతలో నంజయ్య తాగుతూన్న సిగరెట్ ముక్క పక్కన పారేసి “కరెక్టు టైంకి వచ్చారు సార్. పదండి నెక్స్టు కేసు మీదే” అంటూ నెత్తిన తుండుగుడ్డ వేసుకొని ఆ తడిక నుంచి బయటకు వచ్చాడు.

“సరే పద” అని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాను.

ఆ చీకట్లో, మార్చురీ బల్ల మీద ఏ కదలిక లేకుండా, చల్లగా చెన్నవ్వ శరీరం.

బయట…

వర్షం ఆగిపోయింది.

 

 

 

మృగతృష్ణ

200px-Ranthambore_Tigerసరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు బందిపూర్ టైగర్ రిసర్వుకు చేరుకున్నాం.

కాటేజ్ తీసుకోవడానికి రిసెప్షన్ కు వస్తే — “ఇదిగో చూడండి.  భోజనాలు త్వరగా ముగించుకొని మళ్ళీ ఇక్కడికి 3.30కి చేరుకుంటే, టీ, కాఫీలు తీసుకుని 4.00 గంటలకు బయల్దెరుతాం. 6.30కి సఫారీ పూర్తవుతుంది.  స్నాక్స్ తీసుకున్న తర్వాత స్లైడ్ షో మొదలవుతుంది.  8.00 గంటలకి డిన్నర్,” అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్తున్నాడు రిసెప్షనిస్ట్.

గబగబా కాటేజ్ కు వెళ్ళి, సామానంతా పడేసి భోజనాలకెళ్లి వచ్చేసరికి 3.00 గంటలయ్యింది.  అటు నడుంవాల్చామో లేదో మూడున్నర కావస్తుంది.  కెమెరాలు, బైనాకులర్లు వగైరా సర్దుకుని పరుగో పరుగు. మా గ్రూప్ లో ఆరునుంచి, అరవై వరకూ వయసు వాళ్లు ఉన్నా ఉత్సాహంలో ఎవ్వరూ ఒకరికొకరు తీసిపోలేదు.

ఓపన్ టాప్ జీప్ లో పులివేటకు బయల్దేరాం.  దారిలో రకరకాల జింకలు, లేళ్ళు, దుప్పులు, ఆడ నెమళ్ళు, మగ నెమళ్ళు, అడవి పందులు, అడవి కోళ్ళు, ఏనుగులు, అనేక పక్షి జాతులు, నిరంతరంగా కనిపిస్తున్నాయి. కెమెరాలో బంధించే వాళ్ళు శక్తివంతమైన కెమెరాల్తో, మూవీ తీసుకునేవాళ్ళు రకరకాల మూవీ కెమెరాల్తో, బైనాకులర్లతో చూసేవాళ్ళు వివిధ సైజుల్లో ఉన్న బైనాకులర్లతో, కళ్ళతో చూసేవాళ్ళు సహజమైన ఆనందంతో పరవశించిపోతున్నారు.  ఇన్ని జంతువులు, పక్షి జాతులు కనిపిస్తున్నా అందరి చూపులూ కనిపించని పులిపైనే.

ఎంత వెతికినా దాని జాడైనా కనిపించదే! అంతులేని దాహం.  జంతువులు డిస్టర్బ్ కాకూడదని, సఫారీ సమయంలో మాట్లాడకూడదనే నిబంధనవల్ల ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు.  అలాగే కెమెరాలు ఫ్లాష్ కాకూడదు.   సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉంచాలి.  ప్రతి ఒక్కరూ పులి తమకే కనిపించాలని రహస్యంగా అనుకుంటున్నారు.  మా గ్రూప్ లోని డ్రైవర్, ఫోటోగ్రాఫర్ లకు, మిగతా గ్రూప్ ల డ్రైవర్, ఫోటోగ్రాఫర్ లకు ప్రకటించని పోటీ.  అయినా పులులు మాత్రం అందరి కళ్ళు కప్పి యధేచ్ఛగా తిరుగుతున్నాయి.

చీకటి పడబోతుంది.  అయినా వీళ్ళ పట్టుదల సడలడం లేదు.  అక్కడక్కడా, ముఖ్యంగా నీటి మడుగుల దగ్గర మరింత వెతుకులాట.  మీకు కనిపించిందా అంటే, మీకు కనిపించిందా అని ఒకరినొకరు డ్రైవర్లు, ఫోటోగ్రాఫర్లు పలకరించుకుంటున్నారేగానీ, తమకు కనిపించకపోయినా పరవాలేదు, మరెవ్వరికీ కనిపించకూడదనే దుర్బుద్ధి అందరిలో.

ఎడతెగని వేట.  చీకట్లు కమ్ముకొస్తున్నాయి.  అయినా స్పష్టమైన మృగతృష్ణ. తీరని దాహం.  “ఈ రోజుకు మిమ్మల్ని వదిలేస్తున్నా.  రేపు రండి.  చూసుకుందాం“ అని పులి సవాలు చేస్తున్నట్లనిపించింది.  పులివేట మరుసటిరోజుకు వాయిదా.

డిన్నర్ తర్వాత ప్రకటన: “రేప్పొద్దున 5.30 కు wakeup call. 6.00 గంటలకు కాఫీ, టీలు.  6.30 కు సఫారీ.“  రెండో రోజు. సరిగ్గా 5.30కే అందర్నీ తట్టి లేపారు.  కాలకృత్యాలు త్వరగా ముగించుకుని 6.00 గంటలకు రిసెప్షన్ వద్ద హాజరయ్యాం అందరం.  కాఫీ, టీల తర్వాత మృగయావినోదానికీ అంతా రెడీ.  ఉదయకాంతి ఇచ్చే అదనపు శక్తితో.  పట్టువీడని నూతనోత్సాహంతో.  ఎలాగైనా పులి ఫోటో నా screen saver  కావాలనే విక్రమార్కుని పట్టుదల.

మళ్ళీ అదే జీప్ లు, అదే గ్రూప్ లు, అదే డ్రైవర్ – ఫోటోగ్రాఫర్ జంటలు.  మా గ్రూప్ ఫోటోగ్రాఫర్ ను నేనడిగాను “మీరు పులిని చూచి ఇప్పటికెన్నిరోజులైంది“ అని.  సూటిగా సమాధానం చెప్పకుండా, మరో గ్రూప్ లోని ఫోటోగ్రాఫర్ ను చూపించి “అతనికి రెండ్రోజుల క్రితం కనిపించింది, నోటీస్ బోర్డులో అతను తీసిన ఫోటో కూడ ఉంది“ అన్నాడు.  ఆకాశంలో నిన్నటి రాత్రి చీకట్లను చీల్చుకుంటూ కొత్త వెలుగు సూర్యుడు.

కొత్త ఆశలు మాలో చిగురించాయి. దాదాపు అవే తోవలు.  అవే తావులు.  జంతువులు.  పక్షి జాతులు. పులుల జాడలు మాత్రం మృగ్యం.  ఇది పట్టుదలకు, కార్యదీక్షకు అగ్నిపరీక్ష.  రెండు గంటల బలపరీక్ష తర్వాత వట్టిచేతుల్తో ఎలా వెళ్ళడం!  ఇంతలో మట్టిలో పులి నడిచి వెళ్ళిన గుర్తులు. మళ్ళీ కొత్త ఆశలు.

కొంతదూరం తర్వాత అడుగులు మాయం.  వెంటాడే మృగతృష్ణ.  ఓడిపోయి యుద్ధంనుండి నిష్క్రమిస్తున్న యోధుల్లా మానవ బృందాలు.  వెళ్ళిపోయేముందు మళ్ళీ ప్రకటన.  స్విచ్ ఆఫ్ చేసుకున్న మొబైల్ ఫోన్లను ఆన్ చేసుకోవచ్చునని.  అందరి ఫోన్లలో ఒకటే SMS  వచ్చి ఉంది పులిరాజు వద్దనుంచి:

 

It’s time up for now.

Next time better luck!

 

స్వాతి వాళ్ళ అమ్మ

క్రొత్తగా పెళ్లి చేసుకుని  విదేశానికి వచ్చి  బయటకి  కదలకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల్సివచ్చినందుకు  విసుగ్గా ఉంది  స్వాతికి.   అనుకోకుండా  ఒక ఆహ్వానం అందింది. ఆటవిడుపుగా ఆ కార్యక్రమానికి  హాజరైంది. అక్కడ అనేకమంది తెలుగు వారిని చూసి సంతోష పడింది. అందరినీ పరిచయం చేసుకుంది.  అంతా తెలుగు వారే కావడంతో అది  ఆంధ్రదేశంలో ఒక  ఊరులాగా తోచింది.
అదొక కమ్యూనిటీ హాలు.   ఆ రోజు అక్కడ ఒక కార్యక్రమం జరగబోతోంది. ప్రత్యేకించి స్త్రీలకి సంబంధించిన కార్యక్రమం. పరాయిభావనలో మూలాలు గుర్తుకు రావడం మూలంగానేమో దేశంలో జరిగే ప్రతి చిన్నవిషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి  అలవాటు పడిపోయిన వారికి అదొక అవకాశమే!

వారానికి అయిదు రోజులు యంత్రాలలా పనిచేసి ఆటవిడుపు కోసం వెతుక్కుని నలుగురూ కలిసే సందర్భం  కోసం ఎదురు చూస్తున్న  వారికి కందుకూరి జయంతి గుర్తుకు వచ్చింది.  స్త్రీల పునర్వివాహాలు జరిపించడానికి విశేషంగా కృషి చేసిన విధం గుర్తుకు వచ్చింది.   వెంటనే  ఒక కార్యక్రమం వారి ఆలోచనలలో రూపుదాల్చింది. నాటి కాలానికి నేటి కాలానికి వచ్చిన మార్పులు గమనిస్తూ పునర్వివాహాల  వల్ల  కలిగే మంచీచెడుల పరిణామం గురించి ఒక చర్చా కార్యక్రమం నిర్వహించదలిచారు.

‘ఒంటరి స్రీలు – పునర్వివాహం అనే అంశంపై  ఎవరైనా మాట్లాడవచ్చు  వారి వారి అనుభవాలని చెప్పవచ్చు’ అని ప్రకటించారు. రోజంతా అదే విషయం పై కార్యక్రమం జరుగుతుంది  కాబట్టి చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

స్వాతి కార్యక్రమాన్ని ఆసక్తిగా  చూస్తూ ఉంది.
కొందరు చక్కటి తెలుగులోనూ, మరి కొందరు ఇంగ్లీష్  లోను వారి అనుభవాలనీ, అభిప్రాయాలనీ చెబుతున్నారు.  చాలా మంది పునర్వివాహం చేసుకోవడం  చాలా మంచి ఉద్దేశ్యం అనీ, ఒంటరి జీవితాలకి తోడూ-ప్రేమా దొరుకుతాయని, మనిషి ఆనందంగా బ్రతకడానికి వివాహం చాలా అవసరం అని చెపుతున్నారు. వారి వారి మాటలు వింటున్న స్వాతికి  కోపం ముంచుకొస్తోంది.
ప్రక్కనే ఉన్న భర్త అనిల్ స్వాతి చేయి పట్టుకుని వారిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ భర్త మాటని లక్ష్య పెట్టకుండా లేచి గబా గబా నిర్వాహకుల దగ్గరికి వెళ్లి  తనకీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని కోరింది.  నిర్వాహకులు ఆమె పేరుని నమోదు చేసుకుని వరుస క్రమంలో ఉంచారు.
” స్వాతీ .. ఏం  మాట్లాడ దల్చుకున్నావ్ ? ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నావా ? అలాంటి బుద్ది  తక్కువ ఆలోచన మానుకో ! మన గురించి మనమే చాటింపు వేసుకోవడం అవసరమా ? ” అన్నాడు అనిల్. “మన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే తప్పేమిటి?   ఆ అనుభవం ఇతరులకి మంచి చేయవచ్చు కదా! ” అంది స్వాతి.
“ఇక్కడ ఉన్నంత మాత్రాన స్వేచ్ఛ గా ఎవరికీ తోచింది వారు చేసేయవచ్చు అనుకోకు. మనకి అక్కడ ఉన్నట్లే ఇక్కడ వారిలో కూడా చాలా విషయాలలో మూర్ఖత్వం ఉంది. పై పైకి అందరూ నాగరికులే, చదువుకున్న వారే, సంస్కారం ఉన్నవారే, కాని మన జీవితాలలో ఉన్న చిన్న లోపం కనిపెట్టినా చెవులు కొరుక్కుంటారు. వెలివేసినట్టు చూస్తారు.   ఎవరికీ కూడా  మనం అనుకున్నంత విశాల హృదయం ఉండదు. ముందు ‘అయ్యో ! అలాగా!’అని సానుభూతి చూపించి మన వెనుక మళ్ళీ తాటాకులు కడతారు. ఇతరులు మన గురించి తక్కువగా చూడటం, హీనంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.  నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తావని నేను అనుకోను. ఇకపై నీ ఇష్టం.”అని  చెప్పాడు అనిల్.
స్వాతి మౌనంగా ఉండి పోయింది. “అక్కడొక ఫ్రెండ్ విష్ చేస్తున్నాడు. వెళ్ళి వస్తాను. నువ్వు వస్తావా? “అని అడిగాడు.
“నేను రాను మీరు వెళ్లి రండి” ముభావంగా చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనడానికి  తన వంతు వచ్చేటప్పటికి  స్వాతి లేచి వెళ్ళింది.  వెళ్ళేటప్పుడు భర్త వైపు చూడను కూడా చూడలేదు. చూస్తే మరొక సారి చూపులతో అయినా తనని హెచ్చరిస్తాడని.  స్వాతి వేదికపైకి వెళ్లి మైక్ తీసుకుని గొంతు విప్పింది.  ఒకసారి బలంగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది.
“నేను నా అనుభవాన్ని చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది” అని – అందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. నిర్వాకుల అనుమతి లభిండంతో  స్వాతి చెప్పడం మొదలెట్టింది.
“నా పేరు స్వాతి. నాకు నా  తల్లి అంటే చాలా ఇష్టం. అందరికి అమ్మ అంటే ఇష్టమే, కానీ నాకు  మరీ ఇష్టం. నేను  పుట్టి నాలుగు నెలలైనా కాక ముందే నాన్న చనిపోయాడు. భర్త పోయిన బాధని, తనలో ఉబికే  దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని బిడ్డే ప్రపంచం అన్నట్లు  బతికింది. అత్తమామలకి, కన్నవాళ్ళకి మధ్య తలలో నాలుకలా మెలుగుతూనే ఆగి పొయిన  చదువు కొనసాగించి  లెక్చరర్ అయింది  అమ్మ.
సన్నిహితులు ఎవరైనా  ‘ఎన్నాళ్ళు ఇలా మోడులా ఉంటావమ్మా ! స్వాతిని చూసుకోవడానికి మేమంతా లేమూ ! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో’ అని  చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేవారు.
” స్వాతి కి నాన్న ఎలా ఉంటారో తెలియదు.  నేను  పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయి తనకి అమ్మని దూరం చేయమంటారా?  అప్పుడు నేను అమ్మని కాను మర బొమ్మని అవుతాను. నా బిడ్డ తోడిదే నాకు లోకం. అమ్మని అనిపించుకొవడమే  నాకు గొప్ప కానుక. మరిక ఏ కానుకలూ వద్దు ” అని సున్నితంగా తిరస్కరించేది.
నాన్న గురించి అమ్మ చెప్పేటప్పుడు  చూడాలి ఆమె ముఖం. నవ్వుతో మెరిసిపోయేది.  నాన్న నాకు స్వాతి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక విశేషం ఉందట. స్వాతి సినిమా వచ్చినప్పుడు నేను పుట్టానట. స్వాతి సినిమా నచ్చి నాకు స్వాతి అని పేరు పెట్టారని అమ్మ చెపుతుంటే విని స్వాతి సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటానో !  సినిమా చూసిన ప్రతి సారీ మా అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలి అనిపించేది.  మా నాన్నకి తను చనిపోతానని ముందే తెలుసేమో!  అందుకే నాకు ఈ పేరు పెట్టారేమో! అని తెగ ఆలోచనలు ముంచుకొచ్చేవి. అమ్మని ఆ మాటే అడిగితే   చప్పున పెదవులపై చూపుడు వేలుంచి ‘తప్పు అలా మాట్లాడ కూడదు.  ఎవరు ఎప్పుడు చనిపొతారో ఎవరికీ తెలియదు. చనిపోయేలోగా మంచి పనులు చేయాలని అనుకోవాలి’ అని చెప్పేది.
మరి నీకు పెళ్లి చేయడం మంచి పనే కదా !  నాకు నాన్న కావాలనుకోవడం మంచి పనే కదా అని అమ్మని విసిగించేదాన్ని. నేను, అమ్మ నాయనమ్మ  వాళ్ళింట్లో ఉండేవాళ్ళం. నాయనమ్మ, తాతయ్య అమ్మని కూతురులా చూసేవాళ్ళు. మా ఇంటి ప్రక్కనే రాజేశ్వరి టీచర్ ఉండేవారు. ఆమె భర్త కూడా టీచర్.  కానీ ప్రమోషన్ పై ఆ ఊరి స్కూల్ కి హెడ్మాస్టర్ అయ్యారు.  ఆయన పేరు మోహన కృష్ణ. పేరుకు తగ్గట్టు మోహనంగా ఉండేవారు. ఎప్పుడూ నలగని ఖద్దరు సిల్క్ దుస్తులతో పాటు నలగని నవ్వు, కళ్ళకి  నల్లద్దాల చలువ కళ్ళ జోడుతో  చాలా హుషారుగా కనిపించేవారు.  స్కూల్లో పిల్లలకి ఆయనంటే ఎంత భయమో అంత ఇష్టం కూడా.  భార్యభార్తలిద్దరూ  ఒకే స్కూల్ లో పని చేసేవారు. రాజేశ్వరి టీచర్ మాత్రం లావుగా, నల్లగా ఎత్తు పళ్ళుతో ఉండటమే కాదు ఎప్పుడు దిగులు ముఖంతో కనబడేది.  స్కూల్,  వంట ఇల్లు తప్ప ఆమెకి మరో ప్రపంచం ఉండేది కాదు.
రాజేశ్వరి టీచర్ కి  ఇద్దరు  మగ పిల్లలు.  వాళ్ళు ఇద్దరూ కూడా మా ఊరి హై  స్కూల్ లోనే  చదువుకుంటూ ఉండేవారు. అమ్మ రేడియో వింటూ, పుస్తకాలు చదువుతూ, నాతో ఆడుకుంటూ, నన్ను చదివిస్తూ ఉండేది.  నేనేమో మోహన కృష్ణ మాస్టారు వంక అదేపనిగా చూస్తూ ఉండేదాన్ని.  మా నాన్న ఉంటే అచ్చు ఇలానే ఉండేవారేమో అనుకునే దాన్ని.  మోహన కృష్ణ అంకులేమో  మా అమ్మ వంక దొంగ చూపులు చూస్తూ ఉండేవాడు. ఆ వయసులో అలా ఎందుకు చూస్తున్నాడో అర్ధం కాకపోయినా కూడా ఆ చూపులలో  ఏదో తప్పు ఉందని నాకు తెలిసిపోయేది.
మోహన కృష్ణ మాస్టారి చూపులని గమనించిన అమ్మ బయటకే వచ్చేది కాదు.  నేను సెవెంత్ క్లాస్ కి వచ్చేటప్పటికి తాతయ్య చనిపోయారు. అమ్మకి మా ఊరి నుండి  వేరే చోటకి బదిలీ  అయింది మాతో పాటు నానమ్మ, నానమ్మ వాళ్ళ అమ్మ జేజమ్మ కూడా మాతో వచ్చేసారు.  అలా  ఏడెనిమిది ఏళ్ళు మేము మా ఊరి వైపుకి  రాకుండానే గడిపేశాము.
నేను ఇంజినీరింగ్ చదువుతూ ఉండగా మా జేజమ్మ  చనిపోయింది.  ఆమె అంత్యక్రియల కోసం   మళ్ళీ మా ఊరు రావాల్సి వచ్చింది. నా చిన్నప్పటిలా ఆరాధనగా కాకపోయినా ఆసక్తిగా మోహన కృష్ణ మాస్టారు వంక చూస్తూ ఉండి  పోయాను.  వాళ్ళు మా ఇంటి ప్రక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు. వారి అబ్బాయిలు  ఇద్దరూ  విదేశాలలో స్థిర పడ్డారని, పెళ్ళిళ్ళు కూడా అయిపొయ్యాయని చెప్పారు.  మేము ఒక నెల రోజులు ఉండి తిరిగి అమ్మ వర్క్ చేస్తున్న ఊరికి వచ్చేశాము.
కొన్ని నెలలకి మోహన కృష్ణ మాస్టారు భార్య ఉరి వేసుకుని చనిపోయింది అని నానమ్మ చెప్పింది.  ఎందుకు అంటే ఏమో తెలియదు అని చెప్పింది.  అప్పుడు నాలో ఎక్కడో అణచి ఉంచిన   ఊహలు  మళ్ళీ నిద్ర లేచాయి. నానమ్మ ప్రక్కన చేరి ‘నానమ్మా!  నాకు నాన్న కావాలి’  అని చెప్పాను.
ఇరవై రెండేళ్ళ పిల్ల నాన్న కావాలి అంటే అర్ధం చేసుకోకుండా ఉంటుందా?
‘నీకు నాన్న కావాలని మీ అమ్మకి ఎప్పుడో చెప్పాము తనే వద్దని భీష్మించుకుని కూర్చుంది . తను కావాలంటే నేను వద్దంటానా? మీ అమ్మని ఒప్పించు. అయినా ఈ వయసులో ఎక్కడని మీ నాన్న కోసం వెతుకుతావు వెర్రి మొహం నువ్వూనూ!’  అని చీవాట్లు పెట్టింది.
‘ఎక్కడో వెతకక్కరలేదు. మన ఇంటి ప్రక్కన మోహన కృష్ణ మాస్టారు అమ్మకి తగిన జోడు’  అని చెప్పాను.   నానమ్మ ఆశ్చర్యంగా చూసి  ‘అతనా! అతనైతే పర్వాలేదు.  వ్యక్తి కూడా మంచి వాడే ననుకుంటాను.  పాపం ఎందుకో ఆ రాజేశ్వరి టీచర్ ఆ వయసులో అలా ఉరేసుకుని చనిపోయింది ” అంది.
నాయనమ్మ దగ్గర ఆమోదం లభించడంతో  నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం  కలిగింది.  ఇక అమ్మ దగ్గర నా ఆలోచనలని కార్య రూపంలో పెట్టడానికి ప్రయత్నించాను.  అమ్మ
ససేమిరా ఒప్పుకోలేదు. నేను అలిగాను. తిండి తినకుండా బెట్టు చేసాను. ఆఖరి అస్త్రంగా ‘నాకు పెళ్లి చేసినప్పుడు కన్యాదానం చేయాలి.  నాకు ఆ లోటు లేకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి.  నాకు నాన్న కావాలి’ అని చెప్పాను.
నాన్న లేకపోడం వల్ల  ఆస్తుల వాటాల విషయంలో, అయినవాళ్ళ వైఖరిలతో విసిగి పోయిన అమ్మ  బంధులంటే విముఖత పెంచుకుంది.  అమ్మకి  నా పెళ్లి విషయంలో బంధువుల  అండ దండ వీసమెత్తు అయినా  తీసుకోవడం ఇష్టం లేకపోయింది. పదే  పదే అదే విషయాన్ని నేను అడగడం,  నానమ్మ కూడా నాకు వత్తాసు పలకడం చూసి ఆలోచనలో పడింది.   అమ్మ ఆలోచనలని గ్రహించి నేను కార్యాచరణలోకి దిగాను.
మోహన కృష్ణ మాస్టారుతో మాట్లాడి ఆయనని ఒప్పించాను. ఆయన సులభంగానే ఒప్పుకోవడంతో పాటు వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడాడు. వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు అని చెప్పారు  రెండు నెలలలో పెళ్ళికి తేదీని నిర్ణయించాము.  అమ్మ పెళ్లి రంగ రంగ వైభవంగా చేయాలని అనుకున్నాను. కానీ అమ్మ సున్నితంగా తిరస్కరించి  గుడిలో సింపుల్ గా దండలు మార్చుకుంటే సరిపోతుందని,   అలాగే తనకి ఇష్టమని కూడా  చెప్పింది.  పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు మోహన కృష్ణ మాస్టారు పిల్లలు ఇద్దరూ వచ్చారు. నేను వాళ్ళని అన్నయ్యా అంటూ సంతోషంగా పిలిచాను.  వాళ్ళూ  చెల్లెమ్మా..  అంటూ  ఆప్యాయంగానే ఉన్నారు   అన్నయ్యలగా నాకు ఒక వడ్డాణంని బహుకరించారు. అమ్మకి కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారు  అమ్మ నాన్నల  పెళ్లి అయిన తర్వాత ఒక పది రోజులు వరకు ఉన్నారు. మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది.   ఆనందానికి అవధులు లేకుండా  అంతా నేనై తిరిగాను. మోహన కృష్ణ గారిని  ‘నాన్నా- నాన్నా’  అంటూ వదలకుండా తిరిగాను.
అన్నయ్య లిద్దరూ అమ్మని ‘ఆంటీ’ అంటూ పిలిచారు. అమ్మకి అది కష్టంగా అనిపించింది ‘అదేమిటి బాబూ! స్వాతి నాన్న గారూ అని పిలుస్తుంది మీరు కూడా  నన్ను అమ్మా అని పిలవచ్చు కదా!’  అని అడిగింది.
‘ సారీ అంటీ ! స్వాతికి అంటే వాళ్ళ నాన్న ఎవరో తెలియదు కనుక అలా తేలికగా పిలవగలుగుతుంది.  మాకు మా అమ్మ అంటే ఏమిటో తెలుసు. ఆమె ప్రేమ తెలుసు, అట్లాగే  ఆమె కష్టాలు తెలుసు. మా కోసం మా అమ్మ పెదవి విప్పకుండా ఎన్ని బాధలు భరించిందో మాకు తెలుసు’ అని అన్నారు.  అమ్మే కాదు ఆ మాటలు వింటున్న నేను కూడా స్థాణువులా నిలబడి పోయాను.
అన్నయ్యలు ఇద్దరూ వాళ్ళ అమ్మ కష్టాలు అంటూ చెపుతున్నారు అంటే మోహన కృష్ణ మాస్టారు మంచి వ్యక్తి కాదా! – అనేక అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యలిద్దరూ తిరిగి వెళుతూ నా పెళ్లి బాధ్యత  అంతా వాళ్ళే చూసుకుంటాము అనీ,  నాన్న రిటైర్  అయిన తర్వాత  వచ్చే డబ్బు కాని ఆయన పెన్షన్ డబ్బు  కానీ ఏవి తమకి ఇవ్వనవసరం లేదనీ, అన్నీ మాకే చెందుతాయననీ  చెప్పి వెళ్ళారు.
రోజులు గడుస్తున్న కొద్దీ చాలా విషయాలు నాకు అవగతమయ్యాయి.  నాన్న అట్టే మంచాడు కాదని భార్యని   అనాకారి అని నిత్యం వేధించుకు తినేవాడని,  ఏ వంట చేసినా నచ్చ లేదని పేర్లు పెట్టేవాడని,  స్త్రీ లోలత్వం ఉందని అర్ధమయి పోయింది. నాకు చచ్చేంత దిగులు ముంచుకు వచ్చింది.  హాయిగా పువ్వులా బ్రతుకుతున్న అమ్మని తీసుకు వచ్చి వ్యసన పరుడికి   జత చేసానేమో అని దిగులు కలిగింది.
అమ్మ ఏమి చెప్పేది కాదు. ‘నాన్న మంచి వాడేనా అమ్మా!’ అని అడిగేదాన్ని. ‘మంచివాడు అనేగా బలవంత పెట్టావ్’  అని నవ్వేది.  ఆ నవ్వులో నాకు అనేక అర్ధాలు కనిపించేవి.   ఒక సంవత్సర కాలంలోనే నాన్న  రిటైర్మెంట్.   ఆ ఫంక్షన్  కి వెళ్ళాము. అక్కడ అందరూ  మోహన కృష్ణ మాస్టారు భార్య చాలా అందంగా ఉంది కదూ అని మెచ్చుకుంటూనే  కాసేపటి తర్వాత  గుసగుసలాడుకుంటున్నారు. వీరిద్దరికీ అదివరకే పరిచయం ఉంది అంట. ఇద్దరి ఇళ్ళూ  ప్రక్కనే కదా! వీళ్ళ గ్రంధసాంగం తెలిసే  రాజేశ్వరి టీచర్ ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పుకుంటారంట’ అనే మాటలు నా చెవిన పడ్డాయి. నాకు దు:ఖం ముంచుకు వచ్చింది. ఉన్నత చదువులు చదువుకుని గురువుల  స్థానంలో ఉన్న వీరు కూడా  ఎంత నీచంగా ఆలోచించగలరో ! అనుకున్నాను. నిజాలు ఏవిటో తెలియ కుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు  అనిపించింది,  అసహ్యం వేసింది. నాన్నని  ‘అన్నయ్య వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయింది’ అని  అడిగేశాను .
ఆయన నవ్వుతూ  ‘ఆమెకి అందంగా లేనని ఇన్ఫీరియారిటీ  కాంప్లెక్స్.  వంట  చేయడం సరిగ్గా రాదు. ఇతరులతో  స్నేహాన్ని  అర్ధం చేసుకునేదే  కాదు.  నాపై అనుమానం ఎక్కువ. అందుకే అలా చేసింది’  అని చెప్పారు. నాన్న రిటర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో అమ్మ పేరు మీద  ఉన్న స్థలంలో ఇల్లు కట్టారు. నాన్నతో పాటు నాన్న వాళ్ళ అమ్మ, నాన్నమ్మ నేను. నాన్న, అమ్మ అందరం కలసి ఉండేవాళ్ళం . నానమ్మలిద్దరూ బాగా కలసి పోయారు. వారితో  ఏ ఇబ్బంది ఉండేది కాదు.  ఉదయాన్నే నేను,  అమ్మ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నాన్న ఇంట్లో ఉండేవారు. నాన్నతో పరిచయం ఉన్నఅనేక మంది టీచర్స్ మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు.  అమ్మ వచ్చేసరికి వంట ఇల్లు అంతా  కాఫీలు తయారుచేసుకుని, టిఫిన్స్ తయారుచేసుకుని  తిని వంట వస్తువులు అన్నీ  అడ్డదిడ్డంగా  వాడి పడేసే వారు. డైనింగ్  టేబుల్ పైన తిన్న కంచాలు అలాగే పడి ఉండేవి.  ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం లాంటివి  అన్నీ కనబడుతూ  ఉండేవి. అదేమిటి అని అడిగితే  సరదాగా ఫ్రెండ్స్ మి  కూర్చుని ఆడుకుంటున్నాం అనేవారు నాన్న.
ఆయన చేసే రకరకాల విన్యాసాలని నాకు కనబడకుండా చేయడానికి అమ్మ నాకు మేడపై గది కేటాయించింది . నాన్నమ్మలిద్దరూ ఓ మూల  గదిలో ఉండేవారు. ఒక రోజు నేను నా గదిలో నుండి బయటకి  వచ్చి క్రిందికి చూశాను.  నాన్న తను తినే అన్నం పళ్ళెం ని అమ్మ ముఖం పై విసిరి కొట్టాడు. అన్నం అంతా చెల్లాచెదురు అయిపొయింది  పళ్ళెం విసరడం వల్ల అమ్మ కంటి పైభాగంలో దెబ్బ తగిలి వెంటనే బొప్పి కట్టి పోయింది.
‘నీకు ఎంత దైర్యం ఉంటే  ఉదయం వండిన కూర వేసి  నాకు అన్నం పెడతావు.  సిగ్గు లేదా? మొగుడుకి వేడి వేడిగా చేసి వడ్డించాలని తెలియదా!?’  అంటున్నాడు.
అమ్మ సంజాయిషీగా  ‘ఈ రోజు రావడం ఆలస్యం అయింది. తలనొప్పిగా కూడా ఉంది. అందుకనే ఈ పూట కూరలు  చేయలేకపోయాను’ అని చెపుతోంది .
‘నువ్వు మాత్రమే ఉద్యోగం  చేస్తున్నావా?  రాజేశ్వరి కూడా ఉద్యోగం చేసేది. అయినా నాకు ఏనాడూ  లోటు చేసేది కాదు. ఎలా చేసినా ఏది పడేసినా తిని ఊరుకుంటాడు లే అని అనుకుంటున్నావేమో’ అంటూ  ఇంకా ఏదేదో మాట్లాడబోయి నన్ను చూసి ఆగి పోయాడు.
ఆ రాత్రి అమ్మని పట్టుకుని నేను ఏడ్చేసాను.  అమ్మ మౌనంగా కన్నీరు కార్చింది.
అమ్మ ప్రతి రోజూ  కాలేజ్ కి వెళ్ళాలంటే రాను పోను నూటముఫై  కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.  కనీసం ఇంటి దగ్గర నుండి రెండు గంటల ముందు బయలు దేరితే తప్ప సమయానికి చేరుకోలేదు. తెల్లవారుఝామునే  లేచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసుకుని నాన్నకి అన్నీ హాట్ ప్యాక్ లలో సర్ది  అమ్మ బయటకి వెళ్ళాలి. అమ్మ ఒక్కటే ఒంటరిగా బయటకి వెళ్ళకూడదు. ఆయనతోనే బయటకి వెళ్ళాలి. జనన మరణ పెండ్లి విందు వినోద కార్యక్రామాలు అన్నిటికి ఆయనతో ఠంచనుగా వెళ్లి తీరాలి. అక్కడ అందరికి అమ్మని గర్వంగా చూపాలి. అమ్మ వెళ్ళడం కుదరదంటే, ఆ రోజు ఇంట్లో మరో యుద్ధం జరిగేది.
ఇవన్నీ చూస్తూ బాధ పడుతున్న నన్ను ఎక్కువకాలం అక్కడ ఉంచడం అమ్మకి ఇష్టం లేక పోయింది. అన్నయ్యలతో చెప్పి ఫారిన్ సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్లి జరిపించారు. నాకు ఎలాంటి  భర్త వస్తాడు అనే దానికన్నా అమ్మ జీవితం ఎలా గడుస్తుందో అనే నాకు దిగులుగా ఉండేది. నేను అమ్మకి పెళ్లి చేయాలనుకోవడమే చాలా పొరబాటు పని అనిపించింది. హాయిగా ఉన్న అమ్మ బ్రతుకుని  కష్టాల పాలు చేసినట్లు అయ్యింది.
స్త్రీ కి పునర్వివాహం అనేది అందరికీ  సంతోషాన్ని ఇవ్వదు.  అసలు సంతోషాన్నే ఇవ్వదు అంటాను నేను. మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకుంటే వాడితో ఎందుకు తేడాలు వచ్చాయి?  వాడు నాలా ఉండేవాడు కాదా?  వాడు నీకు నచ్చలేదా? అనో,  లేదా వాడిని ఎందుకు వదిలేశావు? ఎవరినైనా ఉంచుకున్నావా? అనో,  మొదటి  పెళ్ళైన ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి  పెళ్లి అయ్యింది,  ఇన్నాళ్ళు మడి  కట్టుకునే ఉన్నావా?  అనో అవమానకర ప్రశ్నలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.  మళ్ళీ  ఎందుకు పెళ్లి చేసుకున్నామా ? అని పశ్చాత్తాప పడుతూ   పెనం మీద నుండి పొయ్యిలోకి పడేసినట్లుగా తమ పరిస్థితి అయింది అని అనుకునే వాళ్ళు తక్కువ ఏమీ కాదు.
అమ్మ తన బాధలు అన్నింటిని కాకపోయినా కొన్ని అయినా నాతో చెప్పుకుంటుంది. ఆమెకి నేను తప్ప ఎవరున్నారు? ఎవరితో నైనా పంచుకున్నా పలుచన అయిపోతాము అంటుంది . అందరి  దృష్టిలో మోహనకృష్ణ  మంచివాడు.  అమ్మకి జీవితం ఇచ్చాడు. ఇల్లు కట్టాడు  నాకు బోలెడు నగలు చేయించారు. పెళ్లి చేశాడు అని చెప్పుకుంటారు తప్ప.  ఆయన కొడుకులు కూడా ఆయన బాధ్యతని తెలివిగా అమ్మ పై వేసి తప్పుకున్నారు అని అర్ధం కావడం కష్టం.  జీవితం లో అవసరాల కోసమే పెళ్లి అనుకునే వారే ఎక్కువ. ఇలాంటి పెళ్ళిళ్ళలో
ఏ మాత్రం ప్రేమకి, అనుబంధానికి తావే ఉండదు.  అందుకు ఉదాహరణ మా అమ్మ వివాహమే.
మగవాడికి  ఏ వయసులో అయినా వంట వండి  పెట్టడానికి, ఇంటి  అవసరాలు చూడటానికి,  ఇంకా శారీరక అవసరాలు తీర్చుకోవడానికి స్త్రీ అవసరం కావాలి. అందుకు పెళ్ళి అనే అందమైన ముసుగు వేస్తారు.   పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అలాగే ఒంటరి తనంతో బ్రతుకున్న స్త్రీలు ఆర్ధిక అవసరాల కోసమో, అండ కోసమో తోడు కోరుకుంటారన్నమాటే కానీ వారికి ఏ మాత్రం ప్రేమానురాగాలు లభింపక పోగా ఎన్నో అవమానాలు, అనుమానాలు ఎదుర్కోవాల్సి  వస్తుంది. ఆ వివాహాన్ని తెగతెంపులు చేసుకునే ధైర్యం రాదు. ఒకవేళ అలా తెగింపు నిర్ణయం తీసుకున్నా  మరొకసారి  విఫలమైన వివాహంతో సగం చచ్చి ఉన్న వారిని  చుట్టుప్రక్కల వారు వారి మాటలతో పూర్తిగా చంపేస్తారు.  స్త్రీ జీవితం అడుగడుగునా వేదనాభరితమే!  అలాగే అంతకు ముందు వివాహం వల్ల పిల్లలు ఉంటే స్త్రీకి  అనేక సర్దుబాట్లు ఉండాలి. ముందు వివాహం వల్ల కల్గిన  బిడ్డలని  పూర్తిగా  వదులుకోవాలి. పురుషుడికి ఉండే పిల్లలకి  అలాంటి ఒప్పందాలు ఉండవు .  ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లి అనే ముద్ర  ఉండనే ఉంటుంది. ఒక్కో వివాహంలో భర్త మొదటి పిల్లలకి   రెండో భార్యగా వచ్చిన ఆమె పై సదభిప్రాయమే ఉండదు.  కనీస గౌరవానికి అనర్హురాలన్నట్లు చూస్తారు.  ఇలాంటివి అన్నీ ఉన్న చోట పునర్వివాహం విజయవంతం కావడం  కష్టం అని నా అభిప్రాయం. మళ్ళీ మా అమ్మకి మునపటి జీవితం తిరిగి రాదు.  ఇవ్వాలంటే కష్టం కూడా.  సంవత్సరానికి ఆర్నెల్లు అయినా మా అమ్మని నాదగ్గరకి పిలిపించుకుని ఆమెకి విశ్రాంతి ఇవ్వడం తప్ప మరో దారి కనబడటం లేదు.   అలా అమ్మని పిలిపించుకుందామన్నా అతను  తయారవుతాడు”  అంది అతనిని   నాన్న అనడానికి కూడా ఇష్టం లేనట్టుగా.
“ఇది  నా ఇంట్లో జరిగిన విషయం . ప్రపంచానికి ఏమి తెలియకుండా  అమ్మ గుంభనంగా  దాస్తుంది కాబట్టి ఆమె జీవితం హాయిగానే సాగి పోతుంది అనుకుంటారు.  చాలా మంది జీవితాల్లో కూడా ఇలాంటి  సమస్యలు ఉంటాయి.  మళ్ళీ జరిగిన పెళ్లి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు.  మగవారు సాధిస్తారు.  అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కుఅనుకుంటారు.   స్త్రీకి  ప్రేమ, తోడు-నీడ కావాలనుకునే తపన కూడా ఉంటుంది. కానీ అవన్నీ  గుర్తించని స్థితిలో ఇరుకు మనస్తత్వాల మధ్య బతుకు వెళ్ళదీయాలనుకోవడం  నరకం కదా !   ఇప్పుడు చెప్పండి పునర్వివాహాలు మంచివేనంటారా?  ఎంతమంది  నిజమైన తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుంటారంటారు ” అని అడిగింది స్వాతి.
సమాధానంగా  అప్పటివరకు నిశ్శబ్దంగా  ఉన్న హాలంతా  చప్పట్లతో దద్దరిల్లింది
ఆ చప్పట్ల  మధ్యలోనే  “నాలా  ఎవరూ  కూడా ఎవరినైనా  పునర్వివాహం చేసుకోమని బలవంతం చేయకండి.  పెళ్లి అనే బంధంలోకి బలవంతంగా నెట్టకండి. స్వేచ్ఛగా  వారికి నచ్చిన విధంగా వారి బ్రతుకుని వారి చేత బ్రతకనివ్వండి. మీరు అలా ఎవరినైనా బలవంతం  చేయాల్సి వస్తే , అలా చేసేముందు “స్వాతి వాళ్ళ అమ్మ” ని గుర్తుకు తెచ్చుకోండి. తర్వాత నిర్ణయం తీసుకోండి ” అని ముగించి ధన్యవాదములు చెప్పి క్రిందికి దిగి వస్తూ ఉంటే తల్లి  గుర్తుకు  వచ్చింది్ స్వాతికి.  ఆమె పడే అవస్థ  కళ్ళ ముందు మెదిలింది. కన్నీళ్లు ముంచుకొచ్చాయి  బాధ గొంతులో తారట్లాడుతుండగా చేతి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ  వచ్చి తను అంత  క్రితం కూర్చున్న కుర్చీలో కూర్చుంది స్వాతి.

వనజ వనమాలి  (వనజ తాతినేని)

ఈ కర్రే తమ్ముడు నా కొద్దు

prabodha

 

ది పల్లె కాదు.  అట్లాగని పట్నమూ కాని ఊరు.  ఓ చిన్నపాటి ఇంగ్లిష్ మీడియం బడి ఆవరణ.  ఆ బడి లాగే ఆ ఆవరణలో  ఎదుగుతున్న చిన్న చిన్న చెట్లూ .. వాటి నీడనో , స్కూల్ బిల్డింగ్ నీడనో వెతుక్కొని   తమతో తెచ్చుకున్న లంచ్ బాక్స్ లతో కుస్తీ పడుతూ గుంపులు గుంపులుగా పిల్లలు.   కొందరు తల్లులు తాము తెచ్చిన బాక్స్ లు విప్పుతూ.  మరి కొందరు పిల్లలకి తినిపిస్తూ.  తిననని మారాం చేసే పిల్లలని బతిమాలుతూ.. కోప్పడుతూ ..భయపెడుతూ.. అంతా కోలాహలంగా ,  సందడిగా ఉంది అక్కడి వాతావరణం.

కొందరు తమ వారి రాక కోసం ఆకలితో బిక్కమొహాలేసుకొని ఎదురుచూస్తూ .. మరి కొందరు హడావిడిగా లోనికి బాస్కెట్తో  వస్తూ …

ఎండావానా పట్టని  కొందరు  పిల్లలు ఎండలోనే కూర్చొని  తింటూ ఉంటే   నీడలో కూర్చోండి అంటూ వాళ్ళని విజిల్ వేసి లేపుతూ పి.ఇ.టి. ప్రభాకర్.

ఇంకా ఫిబ్రవరి నెల కూడా రాలేదు.   ఎండ మండి పోతోంది మనసులో అనుకోని బాదాం చెట్టు నీడన కూతురిని కూర్చో బెట్టి తెచ్చిన లంచ్ బాక్స్ తెరచింది  రేఖ.   “ఛి ..గిదేందే..గీ కూర గిట్ల కర్రెగున్నది ..? ” ముఖం చిట్లించి అసహనంగా ప్రశ్నించింది ఆరేళ్ళ హానీ.  వాళ్ళమ్మ నీ .. అమ్మ తెచ్చిన లంచ్ బాక్స్ లోని కూరనీ  మార్చి మార్చి చూస్తూ..

“ఏమయింది మంచిగనే  ఉన్నది  కద”  అంది రేఖ తను తెచ్చిన అన్నం, పుంటికూర పప్పు ప్లేట్ లో పెట్టి కలుపుతూ

“హూ..కర్రె..గ.. యాక్, నాకొద్దు” అంటూ పెదాలు బిగించి నోరు రెండు చేతులతో గట్టిగ మూసుకుంది హానీ.

“పుంటికూర  పప్పు ఇట్లనే ఉంటది రా . అయిన ఇది కర్రెగ లేదు .  పచ్చగ ఉన్నది. ఆకులు పచ్చగ ఉంటయి నీకు తెలుసు కదా..! పుంటికూర  ఆకులు ఉడికినయి కదా అందుకే ఇట్లా కనిపిస్తాంది .. దా . తిందువు” కలిపిన అన్నం ముద్ద హానీ నోటి దగ్గరకు తెస్తూ..అనునయిస్తూ చెప్పింది రేఖ.

అమ్మ అనునయిస్తూ చెబుతున్న మాటల్ని ఏ మాత్రం చెవి కెక్కించుకోని హానీ తల్లి చేతిని పక్కకు తోసేసింది.  బడి ఆవరణలో ఉన్న అందరి కేసి అటూ ఇటూ చూసింది. తన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ కుర్చున్నారో కళ్ళతో వెతికింది.  అంతలోనే  దూరంగా కూర్చొన్న మాలతిని కొడతానని చూపుడు వేలితో బెదిరిస్తూ.. చెట్టు మీద ఉన్న కాకిని రా రమ్మని చేతివేళ్ళు ఉపి  ఆహ్వానిస్తూ ..

ఈ పిల్ల ఒక్క క్షణం కుదురుగా ఉండదు మనసులో అనుకున్న రేఖ “మా హానీ గుడ్ గర్ల్ కద! మంచిగ అందరి కంటే ముందు తింటదట ” కూతురిని బుజ్జగిస్తూ .

“ఆ…  నేను తిన.  నీకు తెల్సు గద ..! కర్రెగుంటే నేను తిననని.  ఎర్క లేనట్టు మల్ల  ఈ కూర చేసినవ్?”  తల్లి కేసి కోపంగా చూస్తూ ఆమె చేతిలోని ప్లేట్ ను పక్కకు తోసేసింది హానీ .
“అది కాదురా బేటా, ఈ కూరల మస్తు బలమున్నది.  నువ్వు పెద్దగ ,  అగో ఆ చెట్టు లెక్క పెద్దగ అవుత  అంటవు కద.  అందుకె నువ్వు పెద్దగ కావాల్నని ఈ కూర చేసిన.” వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ రేఖ.

” ఊహు .. కాదు  ..ఈ చెట్టుకంటే చా..న పెద్దగయిత” అని రెండు చేతుల్నీ ఆకాశంకేసి సాగదీసి చూపుతూ చెప్పింది.   ” కానీ గీ కూర ..కర్రే కూర అస్సస్స్ ..లుకే తిన.” ఖచ్చితంగా తల్లి కళ్ళలోకి చూస్తూ అని,   అక్కడి నుండి లేవబోయింది హానీ.

“ఏమయింది రేఖా ,   హానీ తిన్టలే.” కొంచెం ఆవలగా కూర్చున్న స్నేహ వాళ్ళ అమ్మ సరళ.  ఆ దగ్గరలో ఉన్న మిగతా పిల్లలూ, వాళ్ళ వాళ్ళు హానీ కేసి చూస్తూ

“ఈ రోజు పప్పుల కొంచెం ఆకు ఎక్కువ అయింది. కూర నల్లగా ఉందని తినదట.  పేచీ పెట్టింది” చెప్పింది తనేదో తప్పు చేస్తున్నట్లుగా లో గొంతుకతో  రేఖ.

“నల్లగానా..?” ఆశ్చర్యంగా అంది సరళ.

“అవును ..ఈ మధ్య ఇట్లనే  చేస్తాంది. ఏదయినా నల్లగ ఉన్న, ముదురు రంగుల్లో ఉన్న కర్రెగ ఉన్నయ్..  కర్రెగ వున్నయ్.. నా కొద్దు అంటది. ఎట్ల తిన బెట్టల్నో తెలుస్తలేదు ”  బాధగా విషయం చెప్పింది రేఖ.

“అవునా!” మరింత ఆశ్చర్యంగా చూసింది స్నేహ వాళ్ళ అమ్మ సరళ.

లేచి నుంచొని అటు ఇటు చూస్తూ ఉన్న హానీని చేయి పట్టి లాగి కూర్చోపెట్టి ” ఎట్లరా..తినకుంటే .. కొంచెం పెరుగన్నమన్న తిను” కొంచెం కటువుగా  అని పెరుగన్నం తినిపిస్తూ, ” నేరేడు పండు తినది. బీట్రూ ట్ దగ్గరకు రానీయది.  డార్క్ చాక్లెట్ తినది.  వాటి రంగు తనకి అంటుకుంటది అంటది”  కూతురి ప్రవర్తన గురించి బెంగతో చెప్పింది రేఖ.

“అట్లా అనద్దు.  అన్ని తినాలె.  అగొ ఆ నల్ల  కుక్క చూడు నీ కెల్లి చుస్తాంది. నీ అన్నం గుంజుక పోయి  తింటదట .  లేకుంటే అగో అటుజూడు చేట్టుమిది కాకి అన్నం కోసం కావు కావు అనుకుంట దాని దోస్తు లందరినీ పిలుస్తాంది. అవచ్చినయంటే నీ కింత గూడ తిననికి ఉండది ” సరళ

‘ఆ తినని. కర్రెగున్నయ్ తింటే నీ లెక్క, ఆ కాకి లెక్క, కుక్క లెక్క  కర్రేగనే  అయితరు.” సరళకేసి అసహనంగా చూస్తూ అని,

“నువ్వు తినకే.. ఆ .. ”  స్నేహకి  సలహా ఇస్తూ పెరుగన్నం గబగబా మింగేసింది హానీ.

ఆ మాటలకి తలకొట్టేసినట్లయింది రేఖకి.  చిన్నపిల్ల తెలియక అట్లా మాట్లాడింది ఏమనుకోవద్దని సరళకి చెప్పి అక్కడినుండి బయట పడింది రేఖ.  స్నేహితులతో కలసి ఆటల్లో మునిగి పోయింది హానీ

                                                            ***

 పిల్లలకి కాలేజ్ టైం అవుతోంది.  దోశ వేస్తోంది శారద.   ” అన్నయ్యల కంటే నేనే ముందు తయారయిన కదా ఆంటి”  అంటూ వచ్చింది  స్నానం చేసి స్కూల్ కి రెడీ అయిన హానీ.

“ఆ … ఏమి కాదు. మేమే ముందు” అంటూ శారద చిన్న కొడుకు హానీని ఉడికిస్తున్నాడు.

“ఆంటీ నేను ఎట్ల ఉన్న?” శారద చేయి పట్టి లాగుతూ అడిగింది హానీ.

“ఎట్లుంటవ్?  హానీ పాప లెక్క ఉంటవ్ ” తన పనిలో నిమగ్నమైన శారద.

” ఆ.. అట్ల కాదు మంచిగ చెప్పు గద.. ” గోముగా అన్నది హానీ శారద చీర కొంగు పట్టి లాగుతూ .

“ఓ యబ్బో!  చాలా సోగ్గా ఉన్నావ్ ” అన్నది శారద హాని కేసి చూసి నవ్వుతూ

“ఉహూ .. సోగ్గా కాదంటి, చా..నా తెల్ల..గ, అందంగ ఉన్నకద” కిటికీ అద్దంలోంచి తన రూపాన్ని అటు ఇటు తిప్పి చూసుకుంటూ హాని.

” ఆ చాలా అందంగా ఉన్నవ్, తెల్లగా ఉన్నవ్ గనీ దోశ తిన్డువ్ రా “తన పిల్లలకి దోశ పెడుతూ హానీ ముందు కూడా ప్లేట్ పెట్టింది శారద.

“ఛి..చీ గిదేం దోశ?  ఇట్ల.. గింత కర్రెగ.. చీ.. అసలు ఇది దొశనెన ? ఈ కర్రెటిది నాకొద్దు” అంటూ ప్లేట్ ను   తన దగ్గర నుండి అవతలికి తోసేసింది.  అది కాస్తా మంచి నీళ్ళ గ్లాసుకు తగిలి కింద పడింది.

“ఏయ్ దయ్యమా , నీళ్ళు పడేసి మా అమ్మకు డబల్ పని పెడతవ ?” చెయ్యి లేపి కొట్టినట్టు చేశాడు రవీంద్రనాథ్

“ఆ చూడు ఆంటీ, చిన్నన్న ఏమంటున్నడో , నేనేమన్న దెయ్యాన్న, అట్ల కర్రేగున్నన..” కోపంతో మింగేసేలా చూస్తూ

“అరె, ఎందుకుర దాన్ని ఏడిపిస్తరు. చిన్నపిల్ల ” హానికి వత్తాసుగా శారద.

“మా దోశ తెల్ల..గ మాం.. చిగ ఉంటది తెల్సా..”  తినే  వాళ్ళని  కవ్విస్తూ చేతులు ఊపుతూ, కళ్ళు తిప్పుతూ హాని.

“మా దోశ చాల బలం అందుకే నేను ఇంత పెద్దగ అయిన ” అన్నాడు శారద పెద్ద కొడుకు మంజునాథ్ .

“మీ అమ్మకి చెప్తా, మీకు కూడా మా దోశ అసొంటిదే చెయ్యమని” హానీ ని ఉడికిస్తూ చిన్న కొడుకు రవీంద్రనాథ్.

“ఆ.. మాకేమొద్దు.  గా..కర్రే దోశలు నేనసలే ముట్ట. నువ్వే తిను బగ్గ తిను. ఇంకా బగ్గ కర్రెగవ్వు” ఉక్రోషంతో హాని.

మినపపప్పు, రాగులతో చేసే దోశ దానికి కర్రేగా కనిపిస్తోంది. అదే కాదు ఏది నల్లగా ఉండడం ఇష్టపడని హానీ గురించి  స్నేహ వాళ్ళ అమ్మ నిన్న కలిసినప్పుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి శారదకు.  ఆవిడ అన్నట్లు ఇది ఒక డిజార్డరా ..! ఆలోచనలో శారద.

మంజు ఏమన్నాడో గాని..”మీరే బ్లాక్ ..మీ బాయ్స్ అంత బ్లాక్.. చూడు కర్రెగ ఆ గడ్డం”  ఉడికి పోతూన్న హానీ.

నిజానికి మంజునాథ్ తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉంటాడు కాని అది ఒప్పుకోదు ఆలోచన నుంచి బయట పడ్డ శారద.

“గర్ల్స్ వైట్ ..ఇంకా వైట్ కావాల్నని , నేనయితే రోజు పొద్దున్న, సాయంత్రం క్రీం రాసుకుంట తెల్సా..” గొప్పగా టేబుల్ ఎక్కి నుంచుంటూ హానీ .

దాన్ని ఇంకా ఆట పట్టిస్తూ “ఛీ . యాక్ ..పెండ ..  పెండ పుసుకున్నావా ..మేమట్ల పూసుకోం ”  మొహమంతా అసహ్యించుకున్నట్లు పెట్టి రవీంద్రనాథ్

“హూ..నీకేం తెల్వది…టి.వి.ల చూడలేదా? చూడు టి.వి.ల మంచిగ కండ్లు పెట్టి చూడు ఆ క్రీం రాసుకుంటే కర్రేగున్నోల్లు తెల్లగా అయితరని తెలుస్తది నీకు.  ఇంక వైట్ గ కావాల్నని నేను, మా అమ్మ రోజు పూసుకుంటమ్.  కావాల్నంటే చూస్కో..నా కాడ  ఎంత మంచి వాసన అస్తున్నదో ..” గొప్పగా చెప్పి రవీంద్ర దగ్గరికి జరిగింది హాని.

“యాక్.. పెండ కంపు.” ముక్కు మూసుకుని  అన్నాడు మరింత ఏడిపిస్తూ.

“చూడు ఆంటి .. రవి అన్నయ్య ..” కంప్లైంట్ చేస్తుండగా..

“హానీ .. ఎక్కడున్నవ్ .. బడికిపోవ..?  టైం అయితాంది. జల్ది రా ”  తల్లి కేక. బడి నుండి వచ్చాక నీ పని చెప్తానుండు అన్నట్లు మంజునాథ్, రవీంద్రనాథ్ లను చూపుడు వేలుతో బెదిరిస్తూ .. హానీ పరుగెత్తింది .

***

రేఖకి నొప్పులోస్తున్నాయి. హానిని పక్కింటి వాళ్ళ  దగ్గర ఉంచి అంతా హాస్పిటల్ కి బయలు దేరారు.   తనూ వెంట వస్తానని మారం చేసింది హాని.  పుట్టగానే తమ్ముడినో చెల్లినో  ఎత్తుకోవాలని అనుకుంది .   ఇప్పుడు కాదు బుజ్జి తమ్ముడో , చెల్లొ  పుట్టగానే తీసుకు వెళతానని తండ్రి బుజ్జగించడంతో పాటు తల్లి అలా బాధపడటం చూడలేక పోయింది హాని.  అందుకే  సరే నని  ఒప్పుకుంది.   తమ్ముడు పుట్టాడని తెలియగానే హాస్పిటల్ కి వెళ్తానని చాలా గొడవ గొడవ చేసింది.  తెల్లవారే వరకూ చూడకుండా ఉండాలా అని వాపోయింది.  ఆ రాత్రంతా తమ్ముడితో మాట్లాడుతున్నట్లు , ఆడుకుంటున్నట్లు, వాడు తనని అక్కా అని పిలిస్తున్నట్లు, తమ్ముడిని ఎత్తుకున్నట్లు కలలు కంటూ కలత నిద్ర పోయింది.  లేవడంతోనే తమ్ముడి దగ్గరకి బయలుదేరింది.  వాడిని ఎప్పుడెప్పుడు చూడాలా అని తహ తహ లాడింది.  ప్రెండ్ నీలిమతో నీకే కాదు నాకూ తమ్ముడున్నాడని గర్వంగా చెప్పాలనుకుంది.  లేక పోతే తన తమ్ముడిని ఎత్తుకుంట అంటే పడేస్తవ్ వద్దంటదా అనుకుంది.

రేఖ ఉన్న రూం ముందు హాని ని దింపి లోపలి వెళ్ళమని చెప్పి నర్సు చెప్పిన మందులు తేవడం కోసం ఫార్మసీ కి వెళ్ళాడు హాని తండ్రి.   ఎన్నో ఉహలతో, ఆలోచనలతో పరుగు పరుగున తల్లి ఉన్న రూం లోకి వెళ్ళిన హాని అట్లానే స్థాణువై నిలబడిపోయింది.  తల్లి ఒడిలో ఉన్నది తన  తమ్ముడా ..  ఉహు ..కాదు . తన తమ్ముడు టి. వి .  లో హగ్గీస్ యాడ్ లో ఉన్నట్లు లేడు. చ్చీ .. కర్రెగా  .. ఆ మొహం మీద ఇంకా కర్రె మచ్చలు .. ఉహూ వీడు నా తమ్ముడు కానే కాదు అనుకొంది. మరి ఎవరు మదిలో ప్రశ్నలు రేగుతుండగా

‘ వీడు  నాకద్దు..  వీడు నా తమ్ముడా ..  కాదు’  అరుస్తూ  తల్లి ఒడిలోంచి పసివాడిని తోసేసింది. తల్లి వొడిలో హాయిగా, వెచ్చగా నిద్రపోతున్న ఆ పసికందు  క్యార్.. క్యార్ అంటూ  ఏడుపు.    హాని ప్రవర్తనకు షాక్ అయింది రేఖ.  తమ్ముడిని తన వొడిలో చూసి అసూయ పడుతోందేమో అనుకుంది రేఖ .

” ఒరే బేటా !  అట్ల జేస్తవెందిరా ..వీడు నీ తమ్ముడురా.. ద..  దగ్గరకు వచ్చ్చి చూద్దువు’ అంటూ దగ్గరకు తీసుకోబోయింది.  ఆమె చెయ్యి విసురుగా లాగి ‘ ఈ కర్రోడు నాకొద్దు ‘ విసురుగా అంటూ మళ్లీ తల్లి దగ్గర నుండి తోయబోయింది హాని.  కోప్పడింది రేఖ .   వీడు నా తమ్ముడు కాదు.  నా కొద్దు అంటూ  ఏడుస్తూ ఒక్క ఉదుటున బయటకు పరుగెత్తింది.  మందులతో లోపలికి రాబోతున్న ఆమె తండ్రి ఏమైందిర హాని అని పిలుస్తున్నా పలకకుండా పరుగెత్తింది.  మందులు అక్కడ పెట్టి గబగబా బయటికి వెళ్ళాడు కూతురి కోసం.   అప్పుడే టాయిలెట్ నుండి బయటికొచ్చిన హాని అమ్మమ్మకి ఏమి అర్ధం కాలేదు.  మనుమరాలి కోసం కళ్ళతో వెతికింది.  దూరంగా ఏడుస్తూ కనిపిస్తూన్న మనుమరాలికేసి తనూ కదిలింది.

హానికి  ఆశనిపాతంలా తమ్ముని రూపం మెదులుతోంది కళ్ళలో.  అది జీర్ణించుకోలేక పోతోంది. నాకీ కర్రె తమ్ముడు వద్దు.  మచ్చల కుక్కలాగా ఉన్నడు. చ్చీ…  నాకొద్దు .  ఇంటికి తేవద్దు అని గోల గోల చేస్తోంది. ఏడుస్తోంది.   తండ్రి బతిమాలుతున్నా వినడం లేదు.  ఏడుపు ఆపమని  చెప్పి చెప్పి విసిగి ఒక్కటిచ్చాడు.  రెక్కబట్టి లోనికి లాక్కెళ్ళాడు. ఎవరు  ఏమి చెప్పినా  తమ్ముడిని అంగీకరించలేకపోతోంది.   పుట్టిన పిల్లాడినిచూసిన దాని కంటే కర్రే తమ్ముడు వద్దని హానీ చేస్తోన్న  గొడవ అందరినీ ఆందోళన పరుస్తోంది.  అప్పటి వరకు, ఏదయినా సరే బ్లాక్ వద్దు. వైట్ ముద్దు అనే హానీ,  బ్లాక్ వద్దు అంటుంటే సరదాగా తీసుకున్నారు.  దాని మాటలకు నవ్వుకున్నారు. కానీ, ఇప్పుడామె ప్రవర్తన చాలా  బాధ, ఆందోళన కలిగిస్తోంది ఆ తల్లిదండ్రుల్ని.

హానీ, వాళ్ళ అమ్మ, నాన్నఅంతా  చామన ఛాయలో ఉంటారు. కానీ, పుట్టిన తమ్ముడు మాత్రం మంచి నలుపు.  శరీరం పై చాల చోట్ల నల్లటి  చిన్న బిస్కెట్ అంతవి, శనగ బద్ద అంతవి మచ్చలతో చూడడానికి ఇబ్బంది కలిగిస్తూ వికారంగా.   నుదుటి పైన కుడి వైపు, ఎడమ వైపు దవడకు  పావలా బిళ్ళ అంత నల్లటి మచ్చలు  దట్టంగా ఉన్న వెంట్రుకలతో.  మంచి రాక పోయినా ఇవి వచ్చేస్తాయి ఎవరో పిలిచినట్లు అని గొణిగింది హానిని ఎత్తుకుంటూ  అమ్మమ్మ.    మా ముత్తాత లాగ  నలుపు, మచ్చలూ వచ్చాయన్నాడు హాని తండ్రి.  పిల్లాడిని చుసిన క్షణం రేఖ కూడా నివ్వెర పోయింది .  పుట్టిన పిల్లాడి రూపం  చూసి అందరికీ బాధగానే ఉన్నా, మగపిల్లాడు ఫరవాలేదులే అని సరి పెట్టుకున్నారు.  కానీ, హానీ మాత్రం సమాధాన పడలేక పోతోంది.  ఏడుస్తోన్న హానిని తీసుకుని అమ్మమ్మ వంట చేసి తెద్దామని ఇంటికి వెళ్ళింది.

“కర్రెగుంటే ఏమయితది?  నీ తమ్ముడు కాదా ,  నిన్ను అక్కా అంటడు .. నీ ఎనక ఎన్క  తిరుగుతడు. ముచ్చట్లు చెప్తడు.  మంచిగ ఇద్దరు ఆడుకోవచ్చు”  అంటూ నచ్చ జెప్పజుశారు అంతా.

“ఆ..నాకేమొద్దు  ఆ.. కర్రె తమ్ముడు” కోపంగా హానీ

“అట్ల అనోద్దురా..బేటా ..నీ తమ్ముడు నీ దగ్గరకు రాక ఎటువోతడు.    అక్క, అమ్మ, నాన్న అనుకుంట మనతోనే ఉంటడు.  మన ఇంట్లనే ఉంటడు.” అని నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తోంది అమ్మమ్మ.

“ఆ..మరి గప్పుడు మీరే అన్నరు కద… ఆ పిల్ల కర్రెగ కాకి లెక్క ఉన్నది.  వద్దని అన్నారు కద.” అమ్మమ్మని ఎదురు ప్రశ్నించింది హానీ.

“ఎన్నడన్ననే ..నాకేం సమజ్ గాలే.” తల గోక్కుంటూ , గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మమ్మ.

“అవునే ..గా పొద్దు మనం మామ కోసం పిల్లను జూడ బోయినం గద.. అప్పుడు ఇంటికొచ్చినంక నువ్వు అన్లే..” అమ్మమ్మ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ దొంగను పట్టుకున్న పోలీసులా రెట్టించింది హానీ.

బాల్కనీలొ నిల్చొని తల దువ్వుకుంటున్న శారద చెవిన పడ్డాయి ఆ మాటలు.  హాని మాటలకి కారణం బోధపడినట్లనిపించింది శారదకి.  అయినా !  రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు,  అంతా నలుపే. అంటే  వెనుకటి రోజుల్లో నలుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కావచ్చు.  అందుకే దేవుళ్ళు నలుపు రంగులో, దయ్యాలూ -భూతాలూ తెల్లటి రంగులో …  మరి తెలుపుకు ప్రాధాన్యత ఎప్పుడు, ఎలా మొదలయిందో.. శారద ఆలోచనల్ని భంగపరుస్తూ

“ఆ నువ్వయితే నీ ఇంటికి కర్రె కోడల్ని తెచ్చుకోవు గానీ నేను కర్రె తమ్ముడ్ని తేచ్చుకోవాల్నా..” ఏడుస్తూ హానీ అమ్మమ్మ కేసిన సూటి  ప్రశ్న అందర్నీ ఆలోచింపచేస్తూ..

 

వి. శాంతి ప్రబోధ