అంటరాని డప్పు కథ 

28f16-free_fall_leaves_shutterstock_61538884_web

 

దసరా పండుగ  కోసం ఊరికి వచ్చేసరికి రాత్రి 12 అయ్యింది .. తెల్లారి  చాయ్ తాగుతుంటే  అవ్వ  ఎసట్ల  బియ్యం వేస్తూ
” నీ కోసం ఈరడు వచ్చి పోయిండు  నువ్వు అప్పుడు లేవలె” అని ఈరన్ని గుర్తు చేసింది .ఈరడు నా దోస్త్ అలా అని నా వయసుగాడు కాడు మా నాయిన వయసు కాని నాతో చనువు ఎక్కువ . చిన్నప్పటి నుంచి నాకు వాడితో చనువు ఎక్కువ. బాయిల కాడికి ఎల్లడం, ఎండ్రికాయలు పట్టడం, కుంట్ల చేపలు పట్టడం, గుట్టకి పోయి సింతపలుకుపండ్లు  తేవడం ఇవి అన్ని నాకు చిన్నప్పుడు వాడితో అబ్బిన విద్య. ఈత కూడా వాడే నాకు నేర్పాడు. ఎవ్వరు లేని మనిసి

అవ్వనే మళ్ళీ నీకు తెలుసా ఈరడు వాడి డప్పు పగలగొట్టిండు అన్నడి ” ఎందుకు అని అడిగేలొపే”  మళ్ళీ తనే “తాగుబోతు సచ్చినోడు  బంగారం లాంటి డప్పు పలగొట్టాడు” అంటూ   వంటింట్లోకి వెళ్ళిపొయింది

బతుకమ్మ కి పూలు  తెద్దామని మళ్ళి బాయిని ఒకసారి చూడొచ్చు కద అని అవ్వకి చెప్పి బాయి కాడికి పొయిన. తంగేడు పూలు కోస్తంతె  ఈరడు వచ్చాడు బాయికాడికి. మునుపటిలా లేదు  పీనుగోలె   అయ్యిండు .. కొద్దిసేపటికి  నోరు విప్పాడు   మంచిగ ఉన్నవ అని అడిగిండు ” ఆ మంచిగనే ఉన్న” అని చెప్పేసరికి పట్నంల నౌఖరి ఎట్ల ఉన్నది అవీ ఇవీ ముచ్చట్లాండిండు .మళ్ళా కొద్దిసెపు గమ్మునుండి   “ఒక వెయ్యి రుపాయలు కావాలి ఇయ్యవ పుణ్యముంటది” అని  బతిమాలుడు మొదలుపెట్టిండు .”పాణం మంచిగా లేద” అని అడిగిన నవ్విండు సరే మరి వెయ్యి ఎందుకు అని అదిగితే పని ఉంది అని చెప్పి పైసల్ తెసుకొని పొయిండు.బాపు నేను ఇద్దరం కలిసి తంగేడుపూలు గునుగు మోపు కట్టి ఇంటిదారి పట్టినం.బాపు నన్ను తిట్టుడు మొదలు పెట్టిండు ” ఈరడు పైసల్ ని తాగి ఒడగొడుతడని”. గుడుంబాకి పది ఇరవై చాలు. వెయ్యి అవసరం లేదు అని బాపుకి చెప్పిన.

పెద్ద బతుకమ్మను కుంట్ల ఏత్తంతే మసక మసక చీకట్ల నా దగ్గరికి ఒచ్చిండు.” ఏంది పండుగ పూట ఎటు పోయినవ్” అని కసిరిచ్చేసరికి నీకొ విషయం చెప్పలె అని గమ్మున నాతో రాబట్టిండు  ఈరడు.   ఇద్దరం  ఊర్లకి నడ్సుకుంట పోతన్నం…  చీకట్ల మనిశిని చూస్తే  కళ్ళు మిలమిల మెరవబట్టినయ్. ఎందుకో వాడు తేడాగా కనిపించసాగాడు గుడుంబా   వాసన రావట్లెదు వాడి దగ్గర.   పైసలు ఏంజేసి ఉంటదా అని లోపల  ఒక ధర్మసండేహం. సరే ఈరడే  చెప్పుతాడు తోచినప్పుడు అని నాకు నేను సర్దిచెఫ్ఫుకుంట నడుస్తున్న….  మామూలుగా  నడుస్తున్నప్పుడు కూనిరాగం తిసెటొడు కిక్కురుమనకుండ నా యెనుక రాబట్టిండు … “సుక్క ఎయ్యలేదా” అని అడిగిన  లేదు అన్నడు .. అనుకుంట చెప్పబట్టిండు ….. “నా దుర్గమ్మని  నా చేతులతో  బొంద పెట్టినప్పటినుంచి రోజు తాగిన దినాం ఇడువలే తాగకుండ ఉన్నది లేదు కని  ఇయ్యాల సుక్క ముట్టలే “అని ముసిముసి నవ్వులు  నవ్వుకుంట  బలంగా ఒక్కొ అడుగు వేస్తు నా వెనకే వస్తున్నాడు

వాడు,వాని యవ్వారం  బాగా తెల్సునాకు.మొండోడు. గుండెధైర్యం ఎక్కువ వాడికి .దుర్గమ్మ వాడి పెళ్ళాం.అయినోళ్ళని సొంత సేతులతో కప్పెట్టడం ఎవరికయినా భాధనే కద. అయినా వీడు అన్ని దాటుకొని వచ్చాడు. ఊరు దగ్గరయ్యింద్. ఏందొ చెప్పాలన్నవ్ అని గుర్తు చేసిన . నువ్వు ఇచ్చిన పైసలతో డప్పు కొన్న  అంటూ బీడీ ముట్టించాడు

“డప్పు ఎందుకు పగలగొట్టవ్ మళ్ళీ  ఎందుకు కొన్నవ్” కోపంగా అడగడం   మొదలుపెట్టిన   ఒహ్ అవ్వ చెప్పిందా అంటూ అవ్వే ముసి ముసి నవ్వులు

“ఈ డప్పు చెయ్యబట్టె నన్ను గుళ్ళోకి  రానిస్తలేరు” అంట …”డప్పు ఒక ఆశుధం” అన్నాడు పంతులు అందుకే డప్పు పగులగొట్టిన అని ఏడ్వబట్టిండు . “మరి మళ్ళీ ఎందుకు కొన్నవ్ “అని  సముదాయించడం మొదలుపెట్టిన .. “డప్పు కొట్టకుండ  ఉండలేను అలవాటు అయిన ప్రాణం  మా తాత నేర్పిన ఇద్య ఇది.  డప్పు లేకుంటే చెయ్యి పడిపొయినట్టయ్యింది. గుడి  నాకు  బువ్వ పెట్టలేదు కాని డప్పు బతుకు  ఇచ్చింది”   అనుకుంట ఊరు అవతలి  వాడకి వెళ్ళిపోయిండు.

జోరుగా తెళ్ళారి  దసరా పండక్కి పొద్దు పొద్దుగాళ్ళనే డప్పు కొట్టుడు మొదలుపెట్టిండు. చిన్నపిల్లలు వాడి చుట్టూ మూగి  ఎగురుతుంటే కొత్త పొద్దు వచ్చింది

డప్పు కి గుళ్ళోకి ప్రవేశం లేదు అంటే డప్పు ని పట్టుకున్న జాతులకు కూడా గుళ్ళోకి  ప్రవేశం లేదు అని అర్థం అంటే డప్పు వలన జాతిని వెలివేసార?? లేదు లేదు.. వెలివేసిన జాతికి చెందిన   కళారూపాలను వెలివేసారు . ఇక్కడ గుళ్ళొని దేవుడికి కూడ డప్పు అంటే నామోషి అందుకే ఈరడు మొదట తెలియని దేవుడి కన్నా తెలిసిన డప్పుని   విడిచి పెట్టలేదు  . దసరా పండక్కి   ఊరు మొత్తం   జమ్మి ఆకు కోసం ఎగబడుతున్నప్పుడు వాడు మాత్రం జమ్మి చెట్టు నుంచి పాండవులు   దించినట్టు ఆయుధాన్ని దించాడు ఇప్పుడు వాడి కళారూపమే వాడి ఆయుధం

*

చిన్న నాటికథ 

srinath-1నేను డా. శ్రీనాథ్ వాడపల్లి.  హైదరాబాద్, బరోడా, ఫ్రాన్స్, లండన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ఆయా దేశాల్లో, చుట్టుపక్కల యూరోపు దేశాల్లో, ఇంకా ఆఫ్రికా దేశాల్లోను అసోసియేట్ ప్రొఫెసర్ గా, చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా, డాక్యుమెంటరీ సినిమాల దర్శకునిగా, ఇంకా గ్రాఫిక్ డిజైనరు గా పనిచేసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. గత సంవత్సరం న్యూ మీడియా స్టడీస్ లో పరిశోధనకు పసిఫిక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్. సాహిత్యం చదువుకోడం, తోచినప్పుడు కొత్త పంథా రచనల గురించి / పోస్ట్ మోడర్నిటీ ల గురించీ నాలో నేను ఆలోచించుకోడం అలవాటు. ఇంకా సమయమున్నప్పుడు వంటిల్లు/శాకాహారం గురించిన శోధనలు, “easy-veg, recipes with nutritional values & ingredient benefits” book with Ros Cutler.

*

 

“The ancient Greeks called love “the madness of the gods.”

Modern psychologists define it as it the strong desire for emotional union with another person.

But what, actually, is love.?

It means so many different things to different people.”

…………

వర్షం వెలిసి ఉదయం తెలుస్తోంది. తడిసిన దిన పత్రిక ఫేస్ పేజీలో ‘ప్రముఖ రచయిత  సముద్రం ఒడ్డున.. ‘ .. మరి చదవలేక పోయాను… ఐనప్పటికీ మొదటి లైన్ అప్రయత్నంగా నా మస్తకంలోకి చొచ్చుకుపోయింది.. ఏదో intuition మెదడులోంచి అప్రయత్నంగా నా ప్రాణ స్నేహితుడి వైపు ఆలోచింపచేస్తుంటే ఈ కల్పన.

…..

{ ఇందులో పాత్రలు ఇద్దరు. ఒక ఆడ ఒక మగ. ఒకరికొకరు పరిచయం లేదు. వయసు ప్రశ్న లేదు. ఇద్దరిదీ రైలు పట్టాల మాదిరి చెరో రహదారి. కానీ వారి స్వప్నాలు చేరువ. ఆమె నిత్య అన్వేషి  – అతను సదా పదాన్వేషకుడు. ప్రకృతి నేపధ్యం }

… …. …..

ఒకానొక శ్రావణంలో
నిండు పున్నమి.
ఎదురుగా సముద్రం.
మేఘాల మాటున ఉన్న అతనిని ఆమె మీటింది.
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం మాటలు.
…. …. ….

ఆమె: మీరేనా ఆ చంద్రుడు?
అతడు: ఎవరు – ఆ ?
ఆమె:  గుర్తులేదా..? సముద్రం..రాత్రి.. ప్రతిబింబం..రంగుల మబ్బులు…నా చంద్రుడివే నువ్వు.. నటించకు.
అతడు: రంగుల మబ్బులు?
ఆమె: అవును. తెల్లని ధనుస్సు
అతడు: నీ మాటలు సొగసు.
ఆమె: ఇన్నాళ్లు ఏమైపోయేవు? వెతుకుతూ ఉన్నాను.
అతడు: నేనిక్కడే. ఎదురుచూపుల్లో.
ఆమె: నన్ను గుర్తు పట్టినట్టు లేదు. సంగీతం కావాలి. ఆకలేస్తోంది. నేను నేల మీదకి రాలేను. కాఫీ తెస్తావా?
అతడు: నా దగ్గిర ముఖేశ్ ఉన్నాడు. సారంగా తేరి యాద్ మే ..
ఆమె: అది ఆ గుడిమెట్ల కింద టీ బడ్డీ వానిది.
అతడు: గుడిలో దేవుడెవరు? ఇదుగో బషీర్.
ఆమె: గోడలు మన మధ్య లేవు
అతడు: జడలో పాయలుండేవి?
ఆమె: ఉండు. నక్షత్రాల్ని చూడాలి.
అతడు: చంద్రుణ్ణి చూడు, వెన్నెల పలకరిస్తుంది.
ఆమె: నేను మాట్లాడను.

Autumn-Fall-Leaves-HD-Wallpaper

……
మౌనం.
పెదవులు మెదలడం లేదు.
మౌనం.
ఆకులు చాపుకొన్న కొబ్బరి నిలువుగా.
అక్కడక్కడా ఎండిన మట్టల రాపిడి శబ్దం.
ఇసక మీద పల్చగా పరుచుకొంటున్న కెరటాల మెత్తని సద్దు.
పదేసి కాళ్ళతో
అటూ ఇటూ హడావిడిగా ఎండ్రపీతల పరుగుల చప్పుడు.
……

ఆమె: బెంగగా ఉంటోంది ఈ మధ్య. చీకటంటే భయం. నన్నంటి ఉంటావు కదూ. చుక్కల నింగి కప్పుకొందాం. పెదాలు అప్పుడైనా కదుపుతావా.
అతడు: ఆల్పనా గుర్తొస్తోంది.
ఆమె: కొబ్బరి మొవ్వులో పడిన వెన్నెల ఆకుల నునుపుల మీంచి జారి
దిగూనున్న పచ్చగడ్డి పై పడి తుళ్లుతోంది.
వెన్నెల నీడలతో కూర్చున్న జాగా అంతా మోడరన్ మొజాయిక్ ఫ్లోరింగ్ డిజైన్ లా ఉంది.
అరిటాకుల ఉగిసలాటతో మా వైపు తిరగబోయిన గాలి –
సంపెంగ గుబురులో ఇరుక్కొని
విరజాజి పొదమీదా
మల్లెమొక్క మీదా
తూలీ సోలీ మరీ మమ్మల్ని తాకుతోంది..
దూరంగా ఇంటి పెరటిగోడ వారనున్న
కూరగాయల మళ్ళలో నీటి వంకాయల మీది నిగారింపులో
వెన్నెల వింతగా మెరుస్తోంది.
పెరటి మధ్యనున్న సాల పైకప్పు
వెన్నెట్లో కిరీటంలా ఉంది.
అతడు: నువ్వు అల్పనావి. నిన్ను అలానే పిలుచుకొంటాను. ప్రేమించొచ్చా?
ఆమె:  ప్రేమించగలవా? ప్రేమించడం వొచ్చా? ప్రేమించేవా?
అతడు: లేఖలు, కథలు, కవిత్వం అన్నింట్లోనూ ఉన్నాను. ప్రేమికులకు నేను ఆదర్శం.
ఆమె:   నీ రాతలంటే నాకు పిచ్చి. నువ్వు ప్రేమికుడివి.
ఇదుగో చూడు నా బంతిపూల జడ.
నా హృదయం నిండా పరిమళం.
నాకు పూలంటే ప్రేమ.
నేను ప్రేమని.
నా ఫలకం సినీవాలి
పాయల వాలుజడ చూడు. కెరటాల నడుము మీంచి ఎలా ప్రవహిస్తోందో.

……
నిశ్శబ్దం
ఆకాశంలో వన్నెల వెన్నెల గూడు కట్టుకొంది.

ఊదా రంగు మబ్బులు నెమ్మదిగా నల్లరంగులోకి మారుతూ నక్షత్రాల్ని కనిపించనీయడం లేదు. మాటలన్నీ మౌనం వైపు పరిగెడుతున్నాయి.
….
ఆమె: నీకు మౌనం నచ్చుతుందా? నిశ్శబ్దం నచ్చుతుందా?

…..
హఠాత్తుగా ఒక చినుకు ఆమె బుగ్గ మీద పడి హృదయంలోకి జారుకొంది. దూరంగా ఆకాశం మధ్యలోకి చీల్చినట్టు మెరుపు.

ఆమె: హత్తుకో నన్ను. ప్రేమించు. ప్రేమను తెలుసుకో. నువ్వు ప్రేమికుడివని నిరూపించుకో.

……

వెలిసిన వర్షంలో పేపర్ని చేతిలో చుట్టగా చుట్టి అటు సముద్రం దిక్కు మనుషులు గుమిగూడిన చోట పోలీసుల మధ్యలోంచి వెళ్లి మిత్రుణ్ణి ఆఖరు సారి చూసుకున్నాను.

అతగాడి మొహం మీద ఒక కొత్త చెదరని చిరునవ్వు.. మరణంలో.

దగ్గర్లోని గుడిసెలో ఒకతను, రాత్రి చీకట్లో తూలుతో వర్షంలో రోడ్ దాటుతోంటే చూసేట్ట .. పంచానామాలో బహుశా అదే ఖరారు కావొచ్చు.

నేను కొండమీది గుడిలో ఏ దేముడున్నాడో చూడ్డానికి ఒక్కొక్కమెట్టూ ఎక్కడం ప్రారంభించేను.

……… …… ….

(కనీ కనిపించని పాత్రల్లో ఉన్న కుమారి కే.పి., శ్రీమాన్ వి.ఎల్.ఎన్ గార్లకు గౌరవంతో)

 

 

చీకటిదే మతం?

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

ఉదయమే ఇంటర్వ్యూ  కి వెళ్ళాలి. వెళ్ళగలనా ? ఈ  చీకటి , ఈ నిద్రలేని  రాత్రులు ఇలా  అలవాటైపోయాక అనుకున్న సమయానికి  నిద్రలేవగలనా ? మళ్ళీ నన్ను వెతుక్కునే పనిలో పడాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అహ అస్సలు చూడకూడదు.

ఎంత  బాగుంటుంది  చీకటి. ప్రశాంతంగా. పొగలూదుతూ కాఫీ తాగే చంద్రున్ని వేల ప్రశ్నలు అడుగుతూ నేను ఓ కాఫీ కలుపుని నాలుగో అంతస్తులో ఉంటున్న మా  ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఆకాశంకేసి చూస్తూ తాగడం. ఇవన్నీ ఇవన్నీ నేను బ్రతికున్నాను, బ్రతుకుతున్నాను అన్న సూచనలే.

ఏదో  ఆలోచిస్తుంటాను. ఏదో రాద్దాం అనుకుంటాను. ఎవరెవరి జీవితాలో కళ్ళముందుకి వచ్చి అసంపూర్ణ కథలు చెప్పి వెళుతుంటే వాళ్ళ వంక దీనంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాను. ఎవరు వీళ్ళంతా . వీళ్ళ మానసిక వేదనలేంటి.

ఏమో ఇవ్వాలెందుకో ఆ పిల్ల బాగా గుర్తొస్తుంది. అందరికన్నా ముందే బైబిల్ పట్టుకుని చక చక చర్చికి వచ్చే పిల్ల. అందరికన్నా ముందే నన్ను సండేస్కూల్ లో పలకరించడానికి వచ్చే పిల్ల. కంఠతా పట్టేసిన ఆ రోజుటి వాక్యాన్ని గబగబా అప్పగించే పిల్ల. బాగా గుర్తొస్తుంది.

పోయినేడే కదూ ఆ అమ్మాయి క్రిస్మస్ కి చర్చ లో స్పెషల్ సాంగ్ పాడింది. అందరూ మెచ్చుకున్నారు. వాళ్ళమ్మ నాన్నలకైతే ఎంత సంతోషమేసేదో ఆ రమ్య  పాడుతూ , బైబుల్ వాక్యం చదువుతుంటే.

చిన్నప్పుడు వాళ్ళను చూస్తే నాకు సందేహం కలిగేది. తెలిసో తెలియకో మా నాన్నను ఒక రోజు అడిగేసా. మన ముక్కుల్లా వాళ్ళ ముక్కులెందుకు లేవు అని. ఏం చెప్పాలి ఈ పిల్లకి అనుకున్నాడో ఏమో  మా నాన్న కొంచెం సేపు తటపటాయించి చెప్పాడు. ఆ అంకుల్ వాళ్ళది ఇక్కడ కాదు వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు. అని అప్పటి వరకు నాకు అందరి ముక్కులూ ఒక్కలా వుండవు అన్న విషయమే తెలియదు. కాని రమ్యకి ఆ ముక్కుతో ఏ సంభంధం లేదు. ఎంత చక్కగా వుండేది. తెల్లగా , బుగ్గలేసుకొని. “స “ మామూలుగా పలకడానికి రాక. పై పల్లకి నాలుక ఆనించి స అన్నప్పుడు సండేస్కూల్ లో పిల్లలు కుళ్ళుతో ఏడ్పించే వాళ్ళు కాని అందరికీ  తెలుసు. బైబుల్ మెమరీ వర్సస్ చెప్పాలంటే అందరూ రమ్య తరవాతే అని . చదువులో కూడా అంతే ఫస్ట్ కదా. అందుకే బాసర ట్రిపుల్ ఐటీ  లో సీట్ సంపాదించింది.

ఇప్పటి వరకూ ఇంటర్వ్యూ గురించి ఎంత ప్రిపేర్ అవ్వాలో అయ్యాను. గూగుల్ ఉంది కాబట్టి సరిపోయింది. ఏ ప్రశ్నైనా అడుగు టపీ మని సమాధానం చెప్పేయదు. రాత్రి ఒంటిగంట అవుతుంది ఇప్పుడు . రాసుకునే అన్ని రాసుకుని, నేర్చుకునే అంత నేర్చుకుని రేపటి కోసం చూస్తున్నా .

నాకే నిద్దర ఎందుకు రాదో అర్ధం కాదు. ఈ రాత్రి పూట బయటకొచ్చి ఖాళీగా ఉన్న ఇంటి ముందు నడుస్తూ రేలింగ్ దగ్గర నిల్చుని చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతున్న ఇళ్ళ మధ్య గుండా ఎన్నో కలలు వీధుల్లో లేసర్ షో వేస్తున్నట్టు కనిపిస్తుంటాయి నాకు. నిద్దర పట్టకపోతే కీబోర్డ్ మీద వేళ్ళు ఊరుకోవు. బుర్రలో ఆలోచనలు ఊరుకోవు. ఎవరెవరో గుర్తొస్తూ ఆలోచనల్లోకి బలవంతంగా ప్రవేశిస్తారు.

ఆ రమ్య సంగతేంటి చెప్పమంటార. ఏముంది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నట్టుంది కదా ఆ పిల్ల రమ్య ఇల్లొదిలి పారిపోయి. అవును ఎనిమిదో తొమ్మిదో నెలలు అవుతుంది. ఆ పిల్ల ఇల్లొదిలి వెళ్ళినప్పుడు చర్చిలోని సంఘస్తులంతా ఒకటే చెవులు కొరుక్కున్నారు. బాగయ్యింది అని. ఎందుకో మరి వాళ్లకు ఆ సంభరం. తను  వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మా నాయన్ని ఎవరెవరు ఎలా మాట్లాడారో తెలుసో లేదో ఆ పిల్లకి . ఎలా తెలుస్తుంది. ఆ పిల్లుండే స్థలానికి వీళ్ళు వెళ్ళలేరు. వెళ్లి చూడడానికేమో వీళ్ళకు ఇష్టం కలగడం లేదు.

ఇంతకు ఎవరైనా మత విశ్వాసాలను అంత తొందరగా ఎలా మార్చుకుంటారు. ఏ నమ్మకాన్నైనా వెంటనే ఎవరం మార్చుకోలెం కదా. ఆ మార్పు వెనక ఎప్పటినుంచో వెంటాడే సమయం వుంటుంది. అది ఒక నెలో , మూడు, నాలుగు, ఆరు నెలలో, లేదా సంవత్సరమో  రెండు సంవత్సరాలో.

రమ్య తన విశ్వాసాన్ని మార్చుకోడానికి ఎన్ని రోజులు పట్టిందో. అందరూ ఆ పిల్ల అమ్మా నాన్నలను పొడవడమే. ఎవడినో ప్రేమించి వుంటుంది. లేకపోతే అలా ఎలా మతం మార్చుకుని , చెప్పా పెట్ట కుండా ఇంట్లోంచి వెళుతుంది అని. ఆ పిల్ల మతం మార్చుకోవడం కన్నా ఎవడినో ప్రేమించే మార్చుకుంది అన్న మాటలు వాళ్ళను ఇంకా బాధించి వుంటాయి.

వాళ్ళు మూడు నెలల వరకు చర్చికి రావడమే మానేశారు. జనాలకు మాట్లాడుకోడానికి ఆ మసాల దొరికింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ రకంగా కుదిరితే అలా కథలు అల్లుకోవడం మొదలు పెట్టారు. నా వరకూ వచ్చాయి. వినే ఓపిక లేదనిపించింది. ఎందుకో నేను సరిగ్గా నా మత విశ్వాసాన్ని ఆ అమ్మాయి వరకు చేరవేయడం లో విఫలమైయ్యానేమో. లేక ఆ అమ్మాయికి నేను అవలంభిస్తున్న మతం, సిద్ధాంతాలకన్నా తాను మారిన మతంలో ఏ విషయం గొప్పదనిపించిందో. ఆ అమ్మాయి తనకు నచ్చిన  విశ్వాసాన్ని స్వీకరించి అనుసరించే హక్కు ఆ పిల్లకి వుంటుంది కదా. వద్దు అంటే ఆ అమ్మాయి వింటుందా ? బలవంతం చేసి మతాన్ని మోయించగలమా?. ఇల్లు వదిలి వెళ్ళేంత నమ్మకం పెంచుకుంది అంటే అంత గొప్పగా తనకి ఏమనిపించిందో.

ఈ విషయం అయ్యాక కొన్ని రోజులు ఇదే ఆలోచించాను. అవును ఆయనెవరో ఫేస్ బుక్ లో మతం మారకండి అని అరిచి రాసేప్పుడు జాలి వేసేది. మా నాన్న మేనత్తలందరూ  హిందువులను పెళ్లి చేసుకుని హిందువులైయ్యారు. మా తాత RCM సిద్ధాంతాలతో ఉన్నప్పుడు మా నాన్నమ్మ ప్రొటెస్ట్ టెంట్ గా వుండి అందరిని అటువైపు తీసుకెళ్ళింది. మేము ఆ విశ్వాసంలో బలపడ్డాo. అయినా బంధుత్వాలేవి పోలేదు.

నిజమే మత విశ్వాసాల జోలికి వెళ్ళకుండా మనుషులు మనుషులుగా స్వీకరిస్తే ఏ గొడవా వుండదు కదా. ఏంటో ఓల్డ్ సిటీలో ఎదో మదరస్సాలో ఇస్లాం స్టడీస్ చేస్తుందంట ఆ పిల్ల. ప్రేమ గీమ లాంటి జోలికి కాకుండా కేవలం మతపరమైన చదువులకోసం వచ్చాను ఇప్పుడు నా పేరు అఫ్రీన్ అని వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళినప్పుడు ఆమె తరపున లాయర్ తో చెప్పించిందట. మా పాస్టర్ గారు నన్నోసారి రమ్మన్నారు.  నువ్వు మాట్లాడుదువు గాని రా అమ్మా అని. నేనేం మాట్లాడతాను. నా దేవుడు తప్పు కాదు అంటే ఆ అమ్మాయి కూడా నేను అనుసరించే దేవుడు తప్పు కాదు అంటుంది. ఆ అమ్మాయికి  ప్రశ్నలు ఉత్పన్నం అయినప్పుడే ఎవరినైనా అడిగి తెలుస్కోవాల్సింది. కాని అలా జరగలేదు. ఇప్పుడు అంతా అయిపోయాక నేను వెళ్లి మాట్లాడినా మార్పు వస్తుందా. రాదు . కాని కాలం అన్నిటికీ పరిష్కారం చూపగలదు. నేను అదే అనుకున్నా. వీలున్నపుడు ఎపుడైనా కుదిరితే ఆ మదరస్సా ఎక్కడో కనుక్కొని వెళ్ళాలని మాత్రం అనిపించింది.

సమయం ఒకటిన్నర అవుతుంది . రేపు ఉదయాన్నే ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఉద్యోగంతో తిరిగి రావాలనే అనుకుంటున్నా. వస్తా కదా.

*

మాయా నది

 

పరిగెత్తుకు వెలుతున్న.. పడిపోతానేమొ అని భయమేసినా, పట్టుకొని లేపేవారు లేరని తెల్సినా, పరిగెత్తుకు వెలుతున్న.

చలం సార్ చెప్పిన మాటలు ఇంకా చెవిలోనే గింగురుమంటున్నయ్

మల్లన్న వాగుల మూడు సార్లు మునిగి లేస్తె మస్తు మార్కులు వస్తయంట!

నేను నమ్మలె…  నమ్మేలా అనిపించలె.

ఎన్ని సార్లు చదివినా గుర్తు పెట్టుకోని నా బుర్రనే నేను నమ్మను, ఇంక వాగుని, ఈ సార్ ని ఎం నమ్ముత ?

కాని ఇవాల కళ్ల ముందు కనిపిస్తుంటే నమ్మాల్సొచ్చింది

 

నాతొపాటు ప్రతిరోజు గొడ కుర్చి వెసే చింటు గాడు ఈరోజు వేయలె,

మోకాలి నొప్పితొ మూలుగుతూ వెల్లి మొదటి బెంచిలొ కూర్చున్న చింటు గాడిని అడిగా ఎరా ఇవాళ నీ హ్యాప్పి బర్త్ డే నా అని ?

కాదు రా నేను అన్ని సబ్జెక్ట్ లు  పాస్ ఐన అన్నడు

ఆ ఏంది ???

అవును రా చూడు అని ప్రొగ్రెస్  కార్డ్ చూపించిండు, నాకు ఒక్క నిమిషం ఎం అర్ధం కాలె

గొంతులొ ఎదొ నొప్పి

స్కూల్ మొత్తం లో నేను ఒక్కడినె మొద్దునేమో అనిపించింది

నా కళ్ళలొ నీల్లు, బెల్లు సౌండ్ ఒకేసరి వచ్చినయి

ఎంత చదివినా గుర్తుండట్లే అంటవ్ కదరా నాలెక్కనే

ఇప్పుడేం మాయరోగం వచ్చింది  అని అడిగితె మెల్లగ మల్లన్న వాగు ముచ్చట చెప్పిండు

ఆరోజు చలం సార్ మనిద్దరికి కలిపి ఒకేసారి చెప్పిండు కదరా  నువు పొలెదా వాగుకాడికి అన్నడు

నేను నమ్మలేదురా అన్న… నేను నమ్మాను రా అని వాడన్నడు…

 

అందరు సార్ లు ఎవేవొ చెప్పి చూసిండ్రు, కొంతమంది కొట్టి మరీ ట్రై చేసిండ్రు

కాని నా బుర్రకి ఎం గుర్తు ఉండదు సార్ నన్ను ఎం చెయమంటరు అని అడిగేటోన్ని

 

మల్లన్న వాగుల కాదు మానస సరొవరం ల మునిగినా నీ మట్టి బుర్రకి చదువు ఎక్కదు నువ్వు పాస్ అవ్వవు అంటున్న నా లోపలి గొంతు నాకు క్లియర్ గా నాకు వినిపిస్తుంటే క్లాస్ రూం బయట ఉన్న ఉసిరి చెట్టు దగ్గర నిలబడ్డ

ఎడుపు ఆపుదాం అని ట్రై చేస్తున్న నన్ను చూసి చలం సారు దగ్గరికి వచ్చిండు

సార్ రాగానె చింటు గాడు ఒక్క నిమిషం కూడ ఆగలె

సార్ వీడు వాగుకాడికి పోలేదంట సార్

అందుకే ఇంకా వీడికి చదివింది గుర్తుండట్లె

మళ్ళీ ఫెయిల్ అయ్యిండు

వాడు నా మీద ప్రేమతొ చెఫ్తుండొ, చాడీలు చెఫ్తుండొ అర్ధం కావట్లె

చలం సార్ నా కళ్ళు తుడిచి

నిన్ను నువ్వు నమ్మాలంటె ముందు నన్ను నమ్మరా అని మొక్కలకి నీల్లు పొయడానికి వెల్లిపోయిండు

 

పరిగెత్తుకు వెలుతున్న, పడిపోతానని భయం లేదు పట్టుకొని లేపాల్సిన అవసరం లేదు

మల్లన్న వాగులొ మునిగిన మళ్ళీ ఓడిపోనని నమ్మిన.

 

అక్కడ వంగిపోతున్న మొక్కలకి కర్రలు ఊతం కడుతున్న సార్ ని చప్రాసి రామయ్య అడిగిండు

సార్ మీరిచ్చిన సపోర్ట్ మీద ఈ మొక్కలు ఎన్ని రోజులు ఆధారపడుతయి?

వాటి సొంత బలం వాటికి తెలిసేవరకు

ఓహో!

మరి వాటికి ఎవరు చెప్తారు సార్

ఏమని ?

మీకు ఏ సపోర్ట్ అవసరం లేదు, మీలో ఉన్న శక్తి మీకు చాలు అని

చలం సార్ పెద్దగా నవ్విండు…….

ఈ వాననిలా కురవనీ..

 

              – రవి బడుగు

                                            ~

టప్…..

టప్..  టప్..

రాత్రంతా కురిసిన వాన వెలిసింది. దాని జ్ఞాపకాలింకా ఇంటి పైనుంచి రాలుతున్నాయి. టప్..

బాల్కనీ నిండా నీళ్లు. తలుపు తెరిచే ఉండడంతో గదిలోపల సగందాకా తడిచి ఉంది. తడిచిన చాపమీదే మునగదీసుకుని పడుకుని ఉన్నాడు భాను. ఒకటే వాన వాసన.

తలుపు చప్పుడైంది. ఒకట్రెండు సార్లు చప్పుడయ్యాక ఆగిపోయింది. భాను పక్కనున్న ఫోన్ మోగడంతో.. వెంటనే లేచి ముందుగదిలోకెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా విహారి. మళ్లీ వచ్చి పడుకున్నాడు.

‘లంజా కొడుకు.. రాత్రి ఆరు ప్యాక్లు కొట్టించాడు డార్లింగ్. అరగంట కూడా పడుకోలేదు.’

విహారి మాట్లాడుతుంటే పడుకునే వింటున్నాడు. చేతిలో ఉన్న క్యారీబ్యాగ్ షెల్ఫ్లో పెట్టాడు విహారి.

అవునూ రాత్రి అడగడం మర్చిపోయా.. ఢిల్లీవాలాకి హైదరాబాద్లో పనేంటబ్బా.?

కొద్ది సేపు గదిలో మౌనం.

ఓ ‘ఫ్రెండ్’ ని కలవాలి.. భాను లేచి బాత్ రూమ్లో దూరాడు.

అటువైపే ఓ క్షణం చూసి.. షెల్ఫ్లో పెట్టిన క్యారీబ్యాగ్ లోంచి ఓ ప్యాకెట్ తీసుకున్నాడు. రెండు నిమిషాల్లో ఇడ్లీ తినడం పూర్తిచేసి.. తడిచిన చాపని చుట్టి ఓ మూలకి ఆనించాడు. ముందు గదిలో బెడ్షీట్ పరుచుకుంటుంటే.. బాత్రూమ్ నుంచి భాను బైటకొచ్చాడు.

‘క్యారీబ్యాగ్ లో టిఫిన్ ఉంది. బైటకెళ్లే పనయితే బండి కీస్ అక్కడే ఉన్నాయి. నన్ను డిస్ట్రబ్ చెయ్యకే..’ విహారి ముసుగు తన్నేశాడు.

అద్దం ముందు నిల్చున్నాడు భాను. రఫ్ గా పెరిగిన గడ్డం తడుముతూ.. తన కళ్లలోకి తనే ఒకసారి చూసుకున్నాడు. వెంటనే తల దువ్వుకుని అద్దంలోంచి బైటపడ్డాడు. టవల్ తీసేసి హ్యాంగర్ పై ఉన్న జీన్స్ పాంట్ తగిలించుకున్నాడు. టీ షర్ట్ మార్చాల్సిన అవసరం లేదనిపించింది. క్యారీ బ్యాగ్ పక్కనే బండి తాళాలు.. తీసుకుందామా.. వద్దా..? ఆఖరిక్షణంలో వాటిని తీసుకుని తలుపు దగ్గరగా వేసి బైటకొచ్చేశాడు. మెట్లు దిగి మొబైల్లో టైమ్ చూసుకుంటే ఏడు దాటింది. గోడ పక్కనున్న బైక్ స్టార్ట్ చేసి రెండు సందులు తిరిగి నేరెడ్మెట్ బస్టాప్ చేరుకున్నాడు.

 

గాల్లో వాన వాసన ఇంకా పోలేదు. గుండెల్నిండా గాలి పీల్చుకుని బస్టాప్ బెంచ్ మీద కూర్చున్నాడు.

కాసేపటికి సిక్స్ టీన్-ఏ వచ్చింది. పదిమంది దిగారు. పాతికమంది ఎక్కారు.

అవతల వైపున్న బస్టాప్ లో థర్టీ సెవెన్-డి ఆగినట్టే ఆగి వెళ్లిపోయింది. కొంతమంది ఎక్కారు. ఇంకొందరు సగమే ఎక్కారు. మెట్లమీద నిలబడలేని కొన్ని కాళ్లు దిగిపోయాయి.

సమ్ ఏంజిల్స్.. సమ్ హార్సెస్..

అటు థర్టీఫోర్.. ఇటు ట్వంటీ ఫోర్-ఈ..

సెకన్లు.. నిమిషాలు.. గంటలు..

వచ్చీపోయే ప్రతి బస్సునీ చూస్తున్నాడు.

“మధు జాడ లేదు.”  తనని ఇక్కడే కలిశానని పావని చెప్పింది.

పన్నెండు దాటింది. బస్సుల రష్ తగ్గిపోయింది. పక్కనున్న కేఫ్లోకి వెళ్లినా బస్టాప్ వైపే చూపు ఉంచాడు. రెండు టీలు తాగి వచ్చి పాత బెంచీపైనే చేరాడు. మళ్లీ సెకన్లు.. నిమిషాలు.. గంటలు.. ‘అనుకుంటాంగానీ కాలం కొన్నిసార్లు మరీ మొండికేస్తుంది. ఆ క్షణాలు నరకం.’ ఏడాదిన్నరగా ఇలాంటి క్షణాలతోనే గడుపుతున్నాడు తను.

 

*       *       *

 

“మూడేళ్ల కిందట ఓ న్యూస్‌చానెల్‌లో జర్నలిస్టుగా చేరాడు భాను. తర్వాత ఏడాదికి మధు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. తనని చూశాక భాను జీవితంలో ఓ కొత్త జోష్.  మధు మౌనం అతన్ని కట్టిపడేసింది. ఆమె చూపుల్లో లోతులు తెలియని లోకాలేవో కనిపించేవి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. అసలెవర్నీ దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరితో అయినా పనివరకే మాట్లాడేది. పావని ఒక్కదానితో అప్పుడప్పుడూ కనిపించేది. చేరిన ఆర్నెళ్లలోనే బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ గా పేరు తెచ్చుకుంది.

మధుని మాటల్లోకి దించేందుకు చాలా కష్టపడ్డాడు. ఆర్నెళ్ల కష్టం తర్వాత… భాను ఓయ్ అంటే, తను ఊ అనేది. క్రమంగా మధులో ఉన్న ఆడపిల్ల బైటపడింది. భానుతో కల్సి ఉన్నంతసేపు తను చిన్నపిల్లలా మారిపోయేది. పావనికి పెళ్లి అయి ఆఫీస్ నుంచి వెళ్లిపోయాక.. ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. మధుతో ఉంటే గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. చివరికి తన ప్రేమ విషయం చెప్పెయ్యాలనుకున్నాడు. ఓ రోజు ఈవెనింగ్ పార్క్కు రమ్మని ఫోన్ చేశాడు. గిఫ్ట్ షాప్‌కెళ్లి గంటసేపు వెదికి ఓ బహుమతి తీసుకున్నాడు. ప్యాక్ మీద తనే స్వయంగా.. ‘విత్ లవ్.. నీ భాను’. అని రాసుకున్నాడు.

దేవతలా వచ్చింది మధు. పార్కులో ముసురుకుంటున్న చీకట్లలోనూ మెరిసిపోతూ కనిపించింది. తనని చూసి మాటలు మర్చిపోయాడు. గిఫ్ట్ ప్యాక్ ని ఎడంచేత్తో వెనుక దాచాడు. పార్కులో ఓ బెంచ్‌పై కూర్చున్నాక.. ఎందుకు పిలిచావో చెప్పమంది. తెలిసిన విషయాన్ని తన నోటి నుంచి వినాలన్న ఆతృత ఆమె మాటల్లో ఉంది. కానీ ఏదో తెలియని భావం కూడా అందులో దాగుంది. భాను వెనకాడుతుంటే తనే అందుకుంది. ఆ స్వరంలో అంతకుముందున్నఅల్లరి స్థానాన్ని ఇప్పుడు ఒకరకమైన గాంభీర్యం ఆక్రమించుకుంది. చల్లటి గాలి చీకటిని కోస్తుంటే… ” నువ్వెప్పుడూ అంటూ ఉంటావే… నా మౌనం నీకు నచ్చుతుందని, ఆ మౌనం వెనుక కారణాలు నీకు తెలియవురా..!” చీకట్లో మధు ముఖం అస్పష్టంగా కనిపించినా… గొంతులో విషాదం స్పష్టంగా తెలుస్తోంది. ఏదో భయం భానులో చేరుతుంటే.. మధు మాట్లాడుతూ పోతోంది. నమ్మిన స్నేహితుడు, మరో ఇద్దరితో కల్సి తనపై చేసిన అత్యాచారాన్ని చెప్తుంటే.. భాను కాళ్లకింద భూమి బద్దలవలేదు కానీ, ఎడమచేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ జారి పడిపోయింది. చీకటి దాన్ని దాచేసింది. చెప్పాల్సినదంతా చెప్పాక కిందికి చూస్తూ ఉండిపోయింది మధు. భాను తలదించుకుని ఆలోచిస్తున్నాడు. చేతిలోంచి జారిపడిన గిఫ్ట్ ప్యాక్ మళ్లీ తీసుకోవాలనుకోలేదు. కాసేపటి తర్వాత వెళ్దాం అన్నట్టు లేచి నిలుచున్నాడు. మధు ఇంకా గతం తాలూకు విషాదంలోనే ఉంది. కొన్ని క్షణాలు అలాగే కూర్చున్నాక లేచింది. మౌనంగా మధు ముందు నడుస్తుంటే.. కొన్ని అడుగులు వెనగ్గా నడుస్తున్నాడు భాను”

 

*       *       *

 

హారన్ మోతతో ఈ లోకంలోకి వచ్చాడు భాను. బస్టాప్ కి కాస్త దూరంలో యాక్సిడెంట్. దెబ్బలు తగిలినా తగలనట్టే నటిస్తున్నారు. కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది భానుకి. చూస్తే విహారి. టీ తాగడానికి వచ్చినట్టున్నాడు.

ఫ్రెండ్ ని కలిశావా..?

‘————–‘  సమాధానం చెప్పకుండా నవ్వుతూ చూశాడు తనవైపు.

రూమ్ కి వెళ్దామా?..  భాను నుంచి సమాధానం లేదు.

‘ఎవరి కోసమో వెదుకుతున్నట్టున్నావ్.?’

‘వెదకడం లేదు.. ఎదురుచూస్తున్నా..’ విహారి కళ్లలోకి చూస్తూ చెప్పాడు భాను.

సరే చావు.. నే వెళ్తున్నా.

వెళ్లిపోయాడు విహారి.

రాత్రి పదయింది. రూమ్ కి చేరుకున్నాడు భాను. తనకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు విహారి. ఎదురుగా టీచర్స్ ని పెట్టుకుని.. అప్పటికే ఒకరౌండ్ వేసినట్టున్నాడు. తను వెళ్లి పక్కనే కూర్చున్నాడు. గ్లాసులోకి బాటిల్ ఒంపి భానుకివ్వబోయాడు. కళ్లతోనే వద్దన్నాడు.

‘నీ కోసమే ఇవాళ వీక్ ఆఫ్ తీసుకున్నా.. ఫాలో ది టీచర్స్ డార్లింగ్. పాత ప్రపంచాలన్నీ బద్దలుకొట్టి.. సరికొత్త జీవితంలోకి దారి చూపిస్తారు’.

‘ఐ హేట్ టీచర్స్’ సూటిగా చూస్తూ చెప్పాడు భాను. నవ్వుతూ ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీచేశాడు విహారి.

‘ప్రేమించుకున్నంత మాత్రాన.. ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండలేకపోవచ్చు. అదే జీవితం.’ మూతికంటిన విస్కీని నాలికతో  తుడుచుకున్నాడు.

‘అఫ్ కోర్స్.. కానీ నేను తనతోనే ఉన్నా… అందుకే ఎదురుచూస్తున్నా..’

అసలు వదిలేయడం ఎందుకు.. ఎదురుచూడటం ఎందుకు..?

‘తనతో కల్సి బతకడం భయమేసింది అప్పుడు.. ఇప్పుడు తను లేకుండా బతకడం భయమేస్తోంది. నేను ఎదురుచూస్తోంది, వెదుకుతోంది నా కోసమే. తనకోసం కాదు’.

ఈ మాటలు చెప్పేటప్పుడు భాను కళ్లలో సన్నటి నీటిపొర. కొంచెం ఆగి అన్నాడు.. అయామ్ ఏ ‘మిడిల్ క్లాస్ లవర్’ విహారీ.

కాసేపటి తర్వాత విహారి నిద్రలోకి జారుకున్నాడు. బాల్కనీలోంచి శూన్యంలోకి చూస్తూ నిల్చున్నాడు భాను..

 

*       *       *

 

“మధు గతం విన్నాక, ఇద్దరూ పార్క్ నుంచి బైటకొచ్చి బైక్ ఎక్కారు. హాస్టల్ దగ్గర మధు దిగాక.. బై చెప్పాడు. తను మాట్లాడలేదు.

రేపు ఆఫీస్ కి వస్తున్నావా అంటే.. ‘తను నవ్వింది. ఏదో చెప్తున్నట్టు’. భానుకి అర్ధం కాలేదు.

వెంటనే హాస్టల్ లోపలికి వెళ్లిపోయింది మధు. రాత్రి పడుకునే ముందు గుడ్‌నైట్ మెసేజ్ పెట్టాడు.  రిప్లయి లేదు. ఆఫీసుకి వెళ్లాక మాట్లాడొచ్చు అనుకున్నాడు. మరుసటిరోజు మధు ఆఫీసుకి రాలేదు. వాళ్ల ఇంచార్జ్‌ని అడిగితే తెలియదన్నాడు. తనూ ఫోన్లో ట్రై చేస్తున్నానని చెప్పాడు. మెయిల్ ఓపెన్ చేసి చూశాడు భాను.. నో మెసేజ్. తన ఆఖరి మెసేజ్.. తనకర్ధం కాని ఆ నవ్వేనని భానుకి తెలిసేసరికి ఆలస్యమయింది.

“ఆ తర్వాత అతనిలో చాలా మార్పొచ్చింది. అప్పుడప్పుడూ నిద్రలో ఉలిక్కిపడి లేచేవాడు. ఎప్పుడూ పరధ్యానంగా.. ఏ పనీ కరెక్టుగా చేయలేకపోయేవాడు. కారణం.. ఓటమి అలాంటిది. మనిషిని కృంగదీస్తుంది. మానసికంగా చంపుతుంటుంది. ఓటమి గురించి భానుకి స్పష్టంగా తెలుసు. కానీ ఎందులో, ఎలా ఓడిపోయానన్నదే అర్ధం కాలేదతనికి. తనని తాను ఎన్నోసార్లు ఈ ప్రశ్న వేసుకున్నాడు. అర్ధరాత్రుల్లో ఉలిక్కిపడి లేచినప్పుడూ, నిద్రపోకుండా గడిపిన సమయాల్లో ఈ ప్రశ్న మరీ బాధించేది. ఒక నిద్రలేని వేకువలో తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ‘తను మనిషిగా ఓడిపోయాడు’. ఆ క్షణం స్వచ్ఛంగా ఏడ్చాడు భాను.”

తర్వాత రోజే హెచ్ఆర్ దగ్గరకెళ్లి మధు వాళ్ల ఊరి అడ్రస్ సంపాదించాడు. ఊరిచివర పాడుబడ్డ బడిలో మధు వాళ్ల నాన్నని కలిశాడు. తనపై అఘాయిత్యం చేసిన రాక్షసుల్ని మధు ఎలా ధైర్యంగా జైల్లో వేయించిందో చెప్పాడు. కానీ ఇంట్లో వదినల వేధింపులు, చుట్టుపక్కలవాళ్ల మాటలు తట్టుకోలేక ఇంట్లోంచి బైటకు వెళ్లిపోతుంటే నిస్సహాయంగా ఉండిపోయానన్నాడు.

తర్వాత ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా వైజాగ్ వెళ్లి వెతికాడు భాను. కానీ మధుని కలుసుకోలేకపోయాడు. తన పరిస్థితి గమనించే ఆరునెలల క్రితం ఢిల్లీ పంపించారు ఆఫీస్ వాళ్లు. అక్కడే అనుకోకుండా పావని కలిసింది. మూడు నెలల క్రితం మధుని.. హైదరాబాద్, నేరెడ్ మెట్ లో కలిశానని పావనే చెప్పింది. అంతకుమించి వివరాలేమీ తెలియదంది.”

*       *       *

 

రోజు మారింది. అదే బస్టాప్. నిన్న ఉన్నంత హుషారు ఇవాళ లేదు భానులో. రేపు ఢిల్లీ వెళ్లిపోవాలి. ఉదయం నుంచీ బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. మధు జాడ లేదు. సాయంత్రమైంది. కేఫ్ లోకి వెళ్లాడు. దో ఛాయ్.. ఆర్డరిచ్చాడు. ఎదురుగా ఉన్న పెద్దాయన నవ్వుతూ చూశాడు. రెండు టీలు తాగినా ఎందుకో నీరసంగా ఉంది. మళ్లీ బెంచీపైకి చేరాడు. మరో గంట గడిచింది. చీకటి పడుతోంది. నిన్నటినుంచి చూసిన వందలకొద్దీ ముఖాలు తనని చూసి నవ్వుతున్నట్టు ఫీలయ్యాడు భాను. ఇందాక నవ్విన పెద్దాయన కూడా గుర్తొచ్చాడు.

ఒక్కసారిగా అలర్టయ్యాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్టుంది. ‘ఎక్కడ చూశాను..?’  పరిగెత్తుకుంటూ కేఫ్ లోకి వెళ్లాడు. అప్పటికే వెళ్లిపోయినట్టున్నాడు. ఎక్కడ చూశాను తనని.. మెదడు పగిలిపోయేలా ఆలోచించాడు. చాలా సేపటి తర్వాత స్ట్రయిక్ అయింది. ఓ సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ కోసం.. మధుతో కల్సి అతనోసారి ఆఫీస్కి వచ్చినట్టు గుర్తొచ్చింది. నేరెడ్మెట్లోనే ఓ అనాధాశ్రమం నడుపుతున్నాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి నిమిషాల్లో ఆశ్రమం చేరాడు. ఇందాకటి పెద్దాయన్ని కలిశాడు. మధు గురించి విన్నాక.. తమకు విరాళాలిచ్చే వాళ్ల రిజిస్టర్‌లు తీసి ఇద్దరూ పరిశీలించారు. పావని చెప్పిన తేదీన మాధవి పేరుతో పదివేలు రాసి ఉంది. అడ్రస్ కాలమ్ మాత్రం వదిలేసి కనిపించింది. తనకీ ఆ అమ్మాయి వివరాలు తెలియదన్న పెద్దాయన… అంతకుముందు కూడా తన పేరుతో ఏవైనా విరాళాలు వచ్చాయేమో చూసే పనిలో పడ్డాడు.

నిలువునా నిరాశ కమ్ముకుంటుండగా బైటకొచ్చి బెంచ్‌పై కూర్చున్నాడు భాను. అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. లేచివస్తుంటే వెనక నుంచి ఎవరో పిలిచారు. బండి కీస్ మర్చిపోలేదు కదా అని జేబులు తడుముకుంటుంటే ఆయనే దగ్గరకొచ్చాడు. ‘ఆ అమ్మాయి గురించి పార్వతమ్మ గారికి తెలిసుండొచ్చేమో.. ఈ విరాళాల వ్యవహారాలు  ఆవిడే చూసుకుంటుంది. హెల్త్ సరిగాలేక నెలరోజుల్నించీ రావడం లేదు’. అంటూ ఆమె అడ్రస్ ఇచ్చాడు. అరగంటలో ఆ అడ్రస్ కు చేరుకున్నాడు భాను. పెద్దగా కష్టపడకుండానే పార్వతమ్మ ఇళ్లు కనుక్కున్నాడు. ఆవిడే తలుపుతెరిచింది. వయస్సు అరవై పైనే ఉండొచ్చు. మధు గురించి చెప్పగానే… ఎవరు, ఏమిటీ అని అడక్కుండానే భానుని లోపలికి రమ్మంటూ తీసుకెళ్లింది. సోఫాలో కూర్చున్నాక మధు గురించి చెప్తూ వెళ్లింది. ‘చాలా మంచి పిల్లయ్యా. తను సంపాదిస్తున్నదాంట్లో ఎంతోకొంత సాయం చేయాలనుకుంటుంది. ఎందుకో మనుషుల మీద పెద్దగా ఆసక్తి చూపించదు. నాలో ఏంచూసిందో కానీ ఆప్యాయంగా మాట్లాడేది. తన గురించిన వివరాలు చెప్పేది కాదు గానీ, చాలా విషయాల గురించి మాట్లాడేది. ఆశ్రమానికి అప్పుడప్పుడూ వచ్చేది. ఇంతకు ముందోసారి నా కార్లోనే దించా తనని’ అని ఆగింది. అప్పటివరకూ శూన్యంలో మధుని ఊహించుకుంటున్న భాను… ఒక్కసారిగా ముందుకు ఒంగాడు. పార్వతమ్మ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మళ్లీ మాట్లాడ్డం మొదలుపెట్టింది. ‘ఇక్కడే మధురానగర్‌, వోరా టవర్స్ పక్క సందులో ఐదో ఇళ్లో, ఆరో ఇళ్లో..  తను అక్కడే అద్దెకుంటున్నానని చెప్పింది.’ లేచి పార్వతమ్మ పాదాల్ని చేత్తో తాకి వస్తానని చెప్పి బయలుదేరాడు భాను. క్షణాల్లో ఆమె చెప్పిన అడ్రస్ పట్టుకున్నాడు. మధు రూమ్ కి తాళం వేసి ఉంది.

‘ఆ అమ్మాయి పదింటికి కానీ రాదు..’ ఇంటి ఓనర్ మాటతో, టైమ్ చూశాడు. రాత్రి తొమ్మిదవుతోంది. ఇంకా గంట..

వర్షం వచ్చేలా ఉంది. మెయిన్ రోడ్ పైకొచ్చి దగ్గర్లో ఉన్న హోటల్ కెళ్లాడు. మూడు రోజుల తర్వాత ప్రశాంతంగా భోజనం చేశాడు. వెయిటర్ ని అడిగి ఓ పేపర్ తీసుకున్నాడు. ఏవేవో రాస్తూ కొట్టేస్తూ పోయాడు. చివరకు నలిపి పడేయబోయి.. ఎందుకో దాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు.

రాత్రి 10:10

బైట సన్నటి జల్లు మొదలైంది. ఆ గది తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగాడు భాను. ఏదో తెలియని అనుభూతి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. తలుపు కొడదామని చెయ్యి వేశాడు. లోపల గడియ పెట్టకపోవడంతో దానంతటదే వెళ్లిపోయింది. ఎదురుగా మధు. నేలమీద కూర్చుని  ఏవో పేపర్స్ చూస్తూ ఉంది. తలుపు చప్పడుకి తలెత్తిచూసింది. ఒక్కక్షణం ఆమె కళ్లలో ఏదో వెలుగు కనిపించినట్టే కనిపించి మాయమైంది. మౌనంగా  లోపలికి వచ్చి కింద కూర్చున్నాడు తను. వర్షం పెద్దదవుతోంది.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత… “ఎలా ఉన్నావు” ప్రశ్నలో ఎలాంటి భావం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించింది మధు. వానకి తోడు గాలి పెరిగింది. తలుపు కొట్టుకుంటుంటే.. కొక్కేన్ని కిందకు దించి కదలకుండా చేసింది. గాలితో పాటు చినుకులూ గది లోపలకు కొడ్తున్నాయి.

సమాధానం చెప్పకుండా చేత్తో నుదురునీ, ముఖాన్నీ రుద్దుకున్నాడు.

ఇంతలో తనే “ఎందుకొచ్చావు భానూ..?

దూరంగా ఎక్కడో పిడుగు పడ్డట్టుంది. భయంకరంగా ఉరిమింది ఆకాశం.

“నేనిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను” లేని కర్కశత్వాన్ని బలవంతంగా గొంతులోకి తెచ్చుకుని పలికింది.

“వెళ్లిపో భాను” అంటూ తనవైపు చూసింది. భాను ముఖంలో ఎలాంటి భావమూ లేదు. గాలివాన హోరు పెరిగింది. ఒకటిన్నర సంవత్సరం నుంచి తనకు చెప్పాలనుకున్న వేలవేల మాటలు మౌనంగా మారిపోయాయి. మధు కళ్లలోకి చూస్తూ మౌనంగా అయినా సంభాషించాలనుకున్నాడు. కానీ చూపుల్ని పక్కకి తప్పించి.. కిటీకీలోంచి వర్షాన్ని చూస్తోంది తను. జేబులో మడిచిపెట్టిన పేపర్ తీసి తన ముందుంచాడు.  తనలో ఏ మార్పూ లేదు. కొన్ని క్షణాల తర్వాత భాను లేచాడు. మరోసారి మధుని చూశాడు. తను నిశ్చలంగా వర్షాన్ని చూస్తోంది. కదల్లేక కదులుతూ గదిలోంచి బైటకు వెళ్లిపోయాడు.

తను వెళ్లిన కొద్ది సేపటి తర్వాత.. పేపరు మడత విప్పింది. దాన్నిండా కొట్టివేతలు.

ఆఖరి వాక్యం మాత్రం అలాగే ఉంచాడు.

‘ఐ లవ్యూ మధు’.

కాగితంపై మధు కన్నీళ్లు పరుచుకుంటున్నాయి.

కంటి నరం తెగినట్టుంది. కన్నీరు కాలువ కట్టింది. ఏళ్లుగా గుండెళ్లో గూడుకట్టుకుపోయిన బాధంతా కళ్లలోంచి బైటకొస్తోంది. భాను గుర్తొచ్చి వెంటనే లేచింది. వెనుక గదిలోకి వెళ్లి వెంటనే బైటకొచ్చింది. చెప్పులు వేసుకోవడం కూడా మర్చిపోయింది. ఒక్క ఉదుటున బిల్డింగ్ పైనుంచి దిగి వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. వీధి చివరెక్కడో మలుపు తిరుగుతున్నాడు భాను. వర్షంలో మసగ్గా కనిపించాడు. భానూ… వెర్రిగా అరిచింది. వాన హోరులో ఆమె అరుపు కలిసిపోయింది. పరిగెత్తుకుంటూ రోడ్డుపైకొచ్చింది. భాను కనిపించలేదు.

కుంభవృష్టి దెబ్బకు రోడ్డుపై ఎవరూ లేరు. ఒకటీ అరా వాహనాలు తిరుగుతున్నాయి. వీధి లైట్లు ఎప్పుడు ఆరిపోతాయో అన్నట్టు వెలుగుతున్నాయి. కాస్త దూరంలో ఉన్న బస్టాప్ కు పిచ్చిదానిలా పరిగెత్తింది. అక్కడా అతను లేడు. వర్షంలో కన్నీళ్లు కనిపించకున్నా ఎగసిపడుతున్న గుండెలు.. ఆమె దుఃఖాన్ని దాచలేకపోతున్నాయి. హోరున కురుస్తున్న వర్షంలో కొద్దిసేపు అలాగే నిలుచుంది. ఇక తనని కలుసుకోలేనన్న బాధతో వెనక్కి తిరిగింది. కాస్త దూరంలో రోడ్డు పక్కన ఉన్నఓ షెడ్ కింద భాను. వణుకుతూ నిలుచుని ఉన్నాడు. రోడ్డుకీ తనకీ మధ్య గోడ ఉండడంతో.. అంతకుముందు కనిపించలేదు తను.   ఎదురుగా నడిచివస్తున్న మధుని భాను చూశాడు. ఆమె కళ్లలోంచి కన్నీళ్లింకా కారుతున్నాయి. దగ్గర కొచ్చాక నవ్వుతూ కుడిచేయి ముందుకు చాచింది తను. మధు చేతిలో గిఫ్ట్ ప్యాక్. పార్క్ లో భాను చేతినుంచి జారిపడ్డ గిఫ్ట్ ప్యాక్. దానిపై రేపర్ పాతబడినట్టుంది కానీ అక్షరాలు అలాగే ఉన్నాయి. ‘విత్ లవ్.. నీ భాను’.

ఫ్యాక్ తీసుకుని కొద్దిసేపు అలాగే చూశాడు. కళ్లలో నీళ్లు తిరుగుతుంటే.. మధుని దగ్గరకు తీసుకున్నాడు. ఇంకెప్పటికీ విడిచిపెట్టనన్నంత దగ్గరగా..!

వాన ఇంకా కురుస్తోంది.

కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.

పద.. అంటూ కదిలాడు భాను.

వర్షం తగ్గనీ.. గడ్డం మీదుగా కారుతున్న నీటిచుక్కని తుడుచుకుంటూ అంది మధు.

తగ్గేదాకా ఉండాలంటే, ఇక్కడే ఆగిపోతామేమో.. చేయందించాడు భాను.

ఇద్దరూ నడుస్తూ.. హోరున కురుస్తున్న వర్షంలో కలిసిపోయారు.

 

– రవి బడుగు

చెరువు – చింతచెట్టు

 

 

-స్వాతి కుమారి బండ్లమూడి

~

 

మరి- బాగా ఎండల్లో, నడి వేసవిలో ఎండిపోయిన చెరువులో సాయంత్రాలు పిల్లలంతా చేరి ఈలేస్తే అంటుకునే ఆట, చప్పట్లు కొట్టి పరిగెత్తే ఆట ఆడుకుంటారు కదా, ఇంట్లో తిడతారనే భయమున్న పిల్లొకత్తి పీచుపీచుగా మసక రాగానే తొందరగా ఇంటికి బయల్దేరుతుంది కదా, దాదాపు ఆ వేళప్పుడే వచ్చాడు వాడు. దుబ్బు గడ్దం, ఒత్తు జుట్టు, మురికి బట్టలూ, ఆ అవతారమూ; ఏ దిక్కునుండి, ఏ వూరి నుంచి వచ్చాడో ఎవరూ చూడలేదు. పాతగుడ్దతో కట్టిన మూటొకటి చంకన పెట్టుకుని ఆడుకునే పిల్లల మధ్యకి ఈలలేసుకుంటూ చప్పట్లు కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మట్టిదిబ్బ మీద మూట విసిరేసి “రండ్రా! నన్నంటుకోండి చూద్దాం” అని వాళ్ల మధ్య వడగాలిలా అటూ ఇటూ గెంతాడు. “అమ్మో! పిచ్చోడు” అని గట్టుమీదకి పారిపోయారు వాళ్ళు. “పోరా పిచ్చెదవా” అనరిచాడు ఒక పెద్ద పిల్లాడు కాస్త ధైర్యంగా. “ఓయ్, ఉరేయ్… నా పేరెవడు చెప్పాడ్రా నీకు? బలే, బలే” అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు, బయమేసేలా కాదు నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు, కితకితలు పెడితే మెలికలు తిరిగినట్టు వంకర్లు పోతూ ఇహ్హిహ్హి అని. నవ్వితే వాడి కళ్ళ పక్కన వదులుగా ఉన్న చర్మం గీతలుగా ముడతలు  పడుతుంది. “మళ్లీ రేపు రండి. రారూ? హిహి” అనుకుంటూ తలకింద మూట వొత్తుగా పెట్టుకుని కాలిమీద వేసుకున్న కాలు ఊపుతూ ఆ ఎండిన చెరువులో పైకి చూస్తూ పడుకున్నాడు. పిల్లలు బెదిరిపోయి ఎటు వాళ్లటు ఇళ్లకెళ్ళిపోయారు.

అది మొదలు వాడా చెరువుని వదల్లేదు. మిట్టమధ్యాహ్నం రాళ్ళు రాజుకునే ఎండప్పుడు మాత్రం చెరువొడ్డున చింతచెట్టు కిందకి చేరేవాడు. ఎవర్నీ ఏమీ అనడు, పొమ్మంటే పోడు, తిడితే నవ్వుతాడు, గట్టిగా బెదిరించి పొమ్మని కర్ర చూపిస్తే ఇంకా పెద్దగా నవ్వుతాడు. మెల్లగా పిల్లలు అలవాటు పడిపోయారు, నాల్రోజులకి వాళ్ల ఆటల్లో చేర్చుకున్నారు కూడా. పిచ్చోడిది చువ్వలాంటి ఒళ్ళు, చురుకైన నడక, తూనిగలాగా ఎటైనా దూరిపోయి పరిగెడతాడు కానీ చచ్చినా అంటుకోడానికి చిక్కడు. జట్టులుగా ఆడేటప్పుడు వాణ్ణి తమలో చేర్చుకోడానికి రెండు జట్ల పిల్లలూ పోటీ పడేవాళ్ళు. పిల్లలకిష్టంగా ఉన్నాడు కదాని పెద్దాళ్ళు కూడా వాణ్ణేం అనలేదు. ఆ చెట్టుకింద వాడే పడుంటాడులెమ్మని వదిలేశారు.

పిల్లలు లేనంతసేపూ వాడేం చెయ్యడు, అట్లా ఖాళీగా చెరువులోనో చెట్టు కిందో తిరుగుతూనో పడుకునో ఉంటాడు. చింతచెట్టు పక్కన పసుపురాయికి ఎవరైనా బొట్టుపెట్టి ఒక కొబ్బరిముక్కో, అరటి పండో అక్కడ పెట్టెళ్తే తింటాడు. పిల్లలు  ఆటలకొచ్చినప్పుడు అటుకులో, మరమరాలో తెచ్చిస్తే ఆకుల్లో పొట్లాం కట్టుకుని రాత్రికి దాచుకుంటాడు. “పిచ్చోడా! ఏం తిని బతుకుతావురా? పనిస్తా చేస్తావా” అని ఎవరైనా జాలిగా అడిగితే “పోరా! పనికిమాలినోడా, పని చెప్తే తంతా, తంతే నవ్వుతా” అని మళ్లీ కితకితలుగా నవ్వుతాడు.  రాత్రైతే మాత్రం హుషారుగా గొంతెత్తి పాడుకుంటాడు చాలాసేపు. ఏమాటకామాట, వాడిగొంతు భలే సన్నగా, కాస్త ఆడగొంతులా మెత్తగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది కానీ ఆ పదాలకి అర్థం పాడూ ఏముండదు. ఏ మాట గుర్తొస్తే, ఎదురుగా ఏది కనిపిస్తే ఆ పేర్లన్నీ కలిపేసి, ఒక్కోసారి మధ్యలో ఆపి “ఊహుహు,  రాళ్ళురప్పలు కాదు, మొద్దురాచిప్పలు, బాగుంది.”అని కళ్ళు మూసుకుని మళ్ళీ పాడతాడు. అప్పటికి ఊరు సద్దుమణిగి సగంనిద్రలో ఉంటుంది. ఐనా పాటలెవరిక్కావాలి. దొంగలొస్తే కాపలాకుక్క అరుపులాగా, రావిచెట్లూ, వేపచెట్లూ ఊగినప్పుడు అర్దరాత్రి వాడి పాటలు కూడా.

***

Art: Rafi Haque

Art: Rafi Haque

ఆ ఏడాది మొదటి వానొచ్చింది. చెరువునొదిలి పిచ్చోడు అచ్చంగా చింతచెట్టు కిందే ఉంటున్నాడు. మళ్ళీ వానొచ్చింది. చెరువు నిండింది. బిందెలతో, కావిళ్లతో చెరువు నీళ్లకి వచ్చే జనంతో బాగా పొద్దుపోతుంది. వాన వెలిసిన ఒక రాత్రి వాడు ఎప్పటికన్నా ఎక్కువ సరదాగా రాత్రంతా పాడుకుని ఆగి ఆగి నవ్వుకుని ఎప్పటికో నిద్రపోయాడు.

అప్పటికింకా తెల్లారలేదు. ఎక్కడా ఏ చప్పుడూ లేదు. ఆ పొద్దుటి చీకటిలో పిచ్చోడెందుకో చప్పున లేచి చూశాడు. అనుకోకుండానే వాడి పాతబట్టల మూటని గట్టిగా గుండెకి అదుముకున్నాడు. ఎవరదీ అని కర్రపుల్ల తీసీ అటూ ఇటూ గాల్లో ఆడించాడు. కర్రకి మెత్తగా ఏదో తగిలింది. “బ్బా…” అనొక ఆడ గొంతుతో పాటు గజ్జెల చప్పుడూ గబగబా దూరమయ్యింది. అట్లా పోయేటప్పుడు వెళ్తున్న మనిషి బిందెలోంచి నీళ్ళు ఒలికిపోయి వాడు తడిసిపోయాడు. పిచ్చోడు నవ్వాడు. “బిందె వాన, గజ్జెల వాన” అని మళ్లీ మళ్ళీ అనుకుని మూట తలకింద సర్దుకుని మళ్ళీ పడుకున్నాడు.

రోజూ తెల్లారకముందే ఇదే వరస. ఎట్లానో నిద్రాపుకుని ఒకరోజు పట్టుకున్నాడు. “ఎవరే నువ్వు? నీ పేరేంటే?” అన్నాడు. ఆ పిల్ల భయంగా చూసింది. ఎంతడిగినా ఏం చెప్పదు. అది మూగదని తెలిసింది వాడికి. దానికో పేరు కూడా ఏం లేదు. ఐనా మూగదానికి పేరెందుకని ఎవరూ దానికి పేరు పెట్టలేదు. బిందెలో నీళ్ళు వాడి మొహం మీద చల్లి నవ్వేసి పోయింది. ఎవరూ లేవకముందే నీళ్లకోసమో, నీళ్లవంకనో కానీ వచ్చేదా పిల్ల. కాసేపు అక్కడ కూర్చునేది. వాడూ సరిగ్గా ఆ వేళకి ముందే లేచేవాడు. చాలా మాటలు చెప్పేవాడు. కొన్నిసార్లు ఏదైనా పాడేవాడు. ఆ పిల్ల చద్దన్నం తెచ్చి పెడితే పొద్దెక్కాక తినడానికి దాచుకునేవాడు. ఒక్కోసారెందుకో ఇద్దరూ కలిసి బాగా నవ్వుకునేవాళ్ళు, ఒకళ్ల మీదొకళ్ళు నీళ్లు చల్లుకునే వాళ్ళు. రాత్రి పూట చెట్లకింద రాలిన పూలేరి ఆమె రాగానే నీళ్ల బిందెలో వేసేవాడు. మిగతా వాళ్లలా మూగదానా అని పిలవటానికి వాడికి మనసు రాలేదు. “నువ్వు మంజులవి కదూ? “ అనేవాడు. దానికి నోరుంటే మిగతా వాళ్లలా వాడిని పిచ్చోడా అని పిలవదని వాడికి ఎట్లా తెలుసో కానీ తెలుసు.

ఒక్కోసారి మంజుల వాడి మూటని చూపించి అదేంటని సైగ చేసేది. వాడిక్కోపమొచ్చి కర్రపుల్ల తీసుకు విసిరేసేవాడు. నొప్పుట్టి ఏడ్చి వెళ్ళిపోయేది. అలా అలిగితే ఓ రెండ్రోజులు వాడికి కనపడకుండా ఎటునుంచో చెరువుకి వచ్చి వెళ్ళిపోయేది. కానీ ఉండబట్టలేక మళ్ళీ వచ్చేది. అట్లా అలిగి మళ్ళీ వచ్చినప్పుడల్లా పసుపురాయి దగ్గర పళ్ళు, పొట్లాల్లో అటుకులు చీమలు పట్టి ఉండేవి. కళ్లనీళ్ళు పెట్టుకునేది, వాడి భుజం మీద తట్టి నిద్రలేపేది. వాడు “కొట్టన్లే, రాకుండా ఉండకే మంజులా, ఆకలెయ్యట్లేదు” అని నవ్వేవాడు.

తెల్లారుతుంటే బిందెత్తుకుని బయల్దేరేది. ఒక్కోసారి చెయ్యి పట్టుకు ఆపేసేవాడు. “ఇంటికెందుకూ? ఉండిక్కడే” అనడుగుతాడు. ఇంట్లో తాత ఉన్నాడని, తాతకెవరూ లేరని , లేచి నడవలేడని సైగ చేసి చెప్తుంది. “సరే! ఫో, ఛీ, పనికిమాలినదానా, ఫో, మళ్లీ ఇటొచ్చావా కొడతా” అని చెయ్యొదిలేవాడు. అటూఇటూ తిరిగే జనాల్ని చూసి అది గబగబా వెనక్కి తిరక్కుండా వెళ్లిపోయేది. అలా వెళ్ళేప్పుడు కాలిపట్టీలు భలే గలగలమనేవి.

ఎన్నిసార్లో అట్లా. ఇంకెప్పుడూ రావద్దనడం, రాకపోతే కడుపు మాడ్చుకు పడుకోవడం, మళ్ళీ అదొచ్చాకా “ఏమనను, కొట్టను. తాత దగ్గరికే పో, నాతో ఉండొద్దులే, ఏడవకు. చద్దన్నం తినేదాకా ఉండిపో” అని బతిమాలడమూ. వాళ్లకదంతా ఒక ఆటలాగా, అలవాటులాగా అయింది.

ఒకరోజు పిచ్చోడికి హుషారెక్కువైంది. పెంకితనం ముదిరింది. ఎప్పట్లాగే వెళ్లొద్దని చెయ్యి పట్టుకు ఆపాడు. మంజుల ఆగలేదు, చెయ్యి విదిల్చుకుంది. వాడికి పంతం వచ్చింది. బిందె లాక్కుని నీళ్లన్ని దాని మీద కుమ్మరించాడు. దానికెందుకో చాలా ఎడుపొచ్చింది. కోపమొచ్చింది. వాడేమో ఏం చేసినా నవ్వుతాడాయె, వీణ్ణెట్లా ఎడిపించాలా అని అటూ ఇటూ చూసింది. వాడి మూట కనపడింది. గబుక్కున ఆ మూట తీసుకు అటూ ఇటూ పరిగెత్తింది. వాడసలే పరుగులో చురుకుకదా వెంటపడ్దాడు, మీదపడి కలబడ్డాడు. మూట ఊడిపోయింది. అందులోని వస్తువులన్నీ కింద పడిపోయాయి; కొన్ని రంగుల మట్టి గాజులు, ఒక పాత చీర, ఒక పూసల దండా, ఇంకా అట్లాంటివే ఏవో. మంజుల ఏం మాట్లాడలేదు. ఏమడగలేదు. నిదానంగా మళ్లీ    చెరువుకెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. పిచ్చోడూ ఏం మాట్లాడలేదు. ఏం తెలీనట్టు అలా చింతచెట్టుకింద అటు పక్కకి తిరిగి పడుకున్నాడు. చెదిరిపోయిన సామానంతా అలాగే వదిలేశాడు.

గొడవైతే కొన్నిరోజులు రాదుగా ఆ పిల్ల, కానీ ఈసారి వచ్చింది. తెల్లారేదాకా నీళ్లకోసం ఆగలేదు. ఆ రాత్రే, చీకట్లో తడుముకుంటూ చెట్టు వెతుక్కుంటూ వచ్చింది. వాడెప్పట్లాగే నవ్వుకుంటూ, పదాలు మార్చి మార్చి పాడుకుంటూ, చెట్టు మాను మీద దరువేసుకుంటూ ఉన్నాడు. “ఓ మంజులోయ్! దా దా, ఈ పూట బాగా తిన్నా, చుశావా? చీమలకి పస్తే” అని పెద్దగా నవ్వాడు. మళ్ళీ కాస్త ఆగాడు. “ఇదిగో చెప్తున్నా! ఎందుకొచ్చావో వచ్చావు. ఈ పూట వెళ్లావా, ఇక అంతే” అని అరిచాడు. అది కాసేపేం అనలేదు. తర్వాత సైగ చేసింది మణికట్టు చూపించి మెడ చూపించీ, చిరిగిన మూట చూపించీ.. అవన్నీ ఎవరివని అడిగింది. “ఎవరేంటే? పనికిమాలినదానా? ఈ ఊరికి రాకముందు ఎన్ని ఊర్లు తిరాగాను. నీకెందుకే మూగదానా?” అని మళ్ళీ జోరుగా పాటందుకున్నాడు. ఆ పిల్ల వెళ్ళిపోడానికి లేచింది. “ఇదిగో! చెప్పాను. ఈపూట వెళ్లావా! ఇక..” వాడి మాట పూర్తికాలేదు, వాడి రెండు చెంపలమీదా బలం కొద్దీ చాచికొట్టింది. చీకట్లో తడుముకోకుండానే పరిగెత్తి ఇంటికెళ్ళిపోయింది.

ఆ రాత్రి తెల్లారాక నీళ్ళకెళ్ళిన వాళ్ళెవరికీ చింతచెట్టు కింద పిచ్చోడు కనపడలేదు. మూగది నిద్రలేచి చూసుకుంటే దాని  కాలిపట్టీలు కూడా కనపడలేదు. అసలు సంగతేంటంటే- కొట్టినా తిట్టినా ఎప్పుడూ నవ్వే పిచ్చోడు ఆ రాత్రంతా ఎక్కెక్కి ఏడ్చాడనీ, ఆ తర్వాతెప్పుడు నీళ్లకెళ్ళినా మూగది ఒక బిందెడు నీళ్ళు పసుపురాయి మీద కుమ్మరించి పోతుందనీ చింతచెట్టుకీ చెరువుకీ తప్ప ఇంకెవరికీ తెలీదు.

-*-

స్థిర కల్లోలిత

 

 

నిశీధి 

~

 

ప్రాణమా !

ఈ అర్ధరాత్రి నిదుర మరిచిన కళ్ళనిండా నీ జ్ఞాపకాలు నిండుతున్నపుడు మబ్బుల అలజడికి తాళలేని చినుకేదో ఆకాశాన్ని వీడి వెన్నెల్లో ఇంకిపోయినట్టు రెప్పల నిండా ఉలిక్కిపాటు . ఇప్పటికిప్పుడు కలలరెక్కలు తగిలించుకొని నీ కౌగిలి వెచ్చదనంలో గువ్వలా ముడుచుకుపోవాలనుకునేంత ఉద్వేగం . రోజంతా  నీ మృదుహాసం కోసం , మంద్ర స్వరంలో నువ్వందించే ఆ చిగురంత ధైర్యం కోసం , నీ  మాట వినగానే  సంతోషంగా  వెలిగే  నా మోహంలో కాంతికోసం ఎదురుచూస్తూనే ఉంటాను . వచ్చెయ్యి ! గుండె నొప్పులు కళ్ళలో  దాచుకొని ఎంతకాలం ఇలా , నేనున్నానుగా జీవితం పరుస్తాను , మనసు తలుపులు తెరచే ఉంచుతున్నాను అంటావు . సముద్రాల కవతల నీ గూడులో నాకింత చోటిస్తానని ప్రతిరోజూ బ్రతిమిలాడతావు . ఒక్క క్షణం స్వార్ధపు వలయం చుట్టుముడుతుంది , నాకోసమే  ఎదురుచూసే చినుకులలో తడిచి కొత్త సెలయేళ్ళు కట్టుకోవాలనిపిస్తుంది . ఉప్పు నీటి సముద్రాల్ని వదిలి తిమింగలపు హృదయానికో మంచి నీటి కొలను బహుమతిగా  ఇచ్చుకోవాలనిపిస్తుంది .

పక్కగదిలో పండుటాకులేవో ఊపిరిసలపక సతమవుతున్న అలికిడి , ఉలికిపాటులో నిన్ను  నీజ్ఞాపకాలని కలంతో మూతేసి కాసేపు గందరగోళం . రోజు ఉండేదే అయినా  సెకను పాటు వళ్ళంతా ప్రవహించే  భయం , రేపుదయం మా ముగ్గురికీ శుభోదయమేనా లేక ఈ  చీకటి  రాత్రి మరో కాళరాత్రవుతుందా అన్న ఊహ వెన్నులో జలదరిస్తూ గుండె చేరే సన్నని  నొప్పి . మన యవ్వనపు మొదటి పడిలో ఒకర్నొకరం  చేరి ఉంటే , బహుశ ఈ క్షణం నువ్వు ఊహలో కాకుండా  నన్నింకా హత్తుకొని పడుకుంటూ ఏం కాదులే అన్న ధైర్యపు ముద్దు మెడ వంపుకో స్థిరత్వాన్ని ఇచ్చేదేమో ? కాలం  ప్రవాహంలో ఇన్నేళ్ళ  వంటరితనాలు అలవాటయ్యాక , ఇపుడిలా  చుక్కలు కరువయిన  చీకటి ఆకాశాన్ని నెలవంక  వెలుతురులో మురిపిస్తున్నావు . ఎంత దోసిళ్ళు  నింపుకున్నా,  తనివి తీరదు. ఎపుడే మేఘం  ఆ ఆనందాన్ని  తన్నుకుపోతుందోనన్న గగుర్పాటు  కునుకు పడనివ్వదు .

~

నీకు టీం స్పిరిట్ లేదు , అందర్ని కలుపుకుపోవడం రాదు , నువ్వెప్పటికీ ప్రొఫెషనల్ నిర్ణయాలు సమయానికి  తీసుకోలేవు ఇలా అయితే  నీతో  కలిసి పనిచేయడం  కష్టం ముందు ముందు  అధికారపు పింక్ స్లిప్ బెదిరింపులు చివుక్కుమంటాయి . రాత్రింబగళ్ళు శ్రమ ఇంకొకరి చేతిలో  అవార్డుగానో , అతను మెచ్చిన  లలనామణి చేతిలో  రివార్డుగానో కనిపించినపుడు కూడా రాని నిస్పృహ కలుపుకుపోవడం  రాదు  అన్నప్పుడు  కళ్ళ వెంట  కారుతుంది .

ఎలా  చెప్పను పెద్ద సంఖ్య  నిండిన  కుటుంబాలలో మొదటి వారిగా  పుట్టకపోయినా బాధ్యతలెత్తుకొని సిబిలింగ్స్  అందరి జీవితాలకో కేర్ ఆఫ్  అడ్రెస్గా మారి , ఉద్యోగ హింసలు , ఆర్ధిక కష్టాలు , మానసిక వేదనలు వాళ్లై నిలబడి క్రుంగిపోయాక  ఐసియు బెడ్ల మీద మరణపు  అంచులలో లోపల వాళ్ళిద్దరూ , మసక వెలుతుర్ల హాస్పెటల్ కారిడార్లలో బయట వంటరితనపు నిర్ణాయాధికారాలలో మిగిలిన నేను .

మీకు  తెలియంది  ఏముంది  స్టంట్ వేయటం లాంటివి చాలా  ఖర్చుతో  కూడుకున్నవి , తర్వాత  మందులు కాస్ట్లీనే , చాల కాలంగా  డైయాబిటిస్ ఒకో కణాన్ని  తినేయడం  పైకి తెలియకుండా  కళ్ళ తో సహా  చాలా  నష్టం  జరిగింది . బ్రెయిన్ స్కాన్స్ కూడా చిన్న చిన్న క్లాట్స్ చూపిస్తున్నాయి , ఇమిడియట్గా  పెద్ద నష్టం  లేకపోవచ్చుకాని ముందు ముందు పసి పిల్లలని  చూసుకున్నట్టు చూసుకోవాలి . నిర్ణయం  మీదే అని తెల్ల కోట్లు  ఏసీ రూముల్లో కూర్చోబెట్టి  చెమటలు  పట్టించే  మాటలు చెప్పినప్పుడు . ఏడవడానికి కూడా  టైం లేదు . అప్పటి దాక  నవ్వుల్లో  వెంటాడిన చుట్టాలు పక్కాలు  ముఖ్యంగా స్నేహితులు తుఫానేదో మింగేసినట్లు మాయం అయ్యాక  చుట్టూ  మిగిలిన  నిశబ్దంలో నేను ఏ  టీం తో సంప్రదించి నిర్ణయాలు  తీసుకోవాలో అర్ధం కాకా మొదలయిన  ప్రయాణం  ఇప్పటికీ  ఎడేమెంట్ డెసిషన్లా సాగుతుంటే కలుపుకుపోవడం  ఎలానో ఇప్పటికీ  నేర్చుకోలేకపోతున్నాను . దెబ్బ ఒకసారి తగిలితే కదా . పడే పదే తగులుతున్నపుడు ఎలా  లేచి  ఎలా  నడవాలో బలవంతంగా  ప్రాక్టిస్ చేసిన వ్యాయామంగా మారక  . ఇపుడు నిన్ను నువ్వు మార్చుకోకపోతే స్నేహితులు మిగలరు లాంటి వాక్యాలు నిర్లిప్తతే తప్ప  బాధగా  ఏమి ఉండటం  లేదని

ఎవరికీ  చెప్పుకోలేనితనం .

~

ఇదంతా  నీకు  తెలుసుగా , ఎవరికీ  చోటివ్వని  మనసులో నిన్ను  దాచి , అక్కడ అదిమిపెట్టిన  ఎన్ని రహస్యాలు నీతో పంచుకున్నాను ? నువ్వుంటావన్న నమ్మకమేగా  అంత సాహసం నాతో  చేయించింది లేకపోతే పెదవి విప్పి నేనేమిటో  చెప్పిందేవరికి ఈ పదేళ్ళలో . కానిప్పుడు నువ్వో  కొత్త  విపత్తు పాతుకుపోయిన  కాళ్ళని తవ్వుకొని కొండలు దాటుదామంటావు , అలిసిపోయినప్పుడుల్లా  చెయ్యందిస్తానంటావు , ముందుకు వెల్దాం పదమంటూ ముద్దులు పెడతావు . నీకెలా చెప్పడం విత్తనాలు బ్రతుకుతాయి కాని మహావృక్షాలు వేర్లతో పెకిలించి  కొత్త చోట  నాటడం సాధ్యం కాదని , బలవంతంగా సాధించినా మన చేతుల్లో వాటి మరణానికి రోజులు  లెక్కెయ్యాలని  ఎలా  చెప్పడం  నీకు . మనిద్దరిలో  ప్రాక్టికల్  మనిషివి  నువ్వు కదా , అసలలా ఎలా  అడిగావు అని ఎంత మదనో , మళ్ళీ  అదంతా  నా పై ప్రేమగా అన్న ఓదార్పు . నా కలవరం , కల వరం  ఇహ నువ్వేగా .

ప్రవాస బాధల్లో సైతం బంధాలు  మర్చిపోలేని కొడుకు తనకోసం తనకి వండి వార్చి , ముందు పుట్టే వారసులకో ఆయా అవసరాలకి పైసా  ఖర్చులేని అమ్మ తనాన్ని  వాడుకోవడానికో ఏమో ముందు కాళ్ళకి బంధంలా విమానమెక్కబోతున్న తల్లి కోసం  చింత ఎలాగైనా కిటికీ  పక్క సీట్ ఇవ్వమని అక్కడనుండి పాపం  విడియో కాల్  చేసి మరీ ఫ్లైట్ అధికారులనో కోరిక కోరుతున్నాడు . మా అబ్బాయి మీతో మాట్లాడాలంట ఇదుగో  ఒకసారి  ప్లీజ్ అని నవ్వుమొహంతో ఫోన్ అందించిన అమ్మతనం నిండా ఇలాంటివి ఎన్నో చూసిన అనుభవం . కాన్వర్జేషన్ పూర్తి అవ్వగానే చివరగా మల్లెలు అన్ని  కుప్పపోసినట్లు చిరునవ్వుల శబ్దంలో  “ ఐ  నో  ఎవరీథింగ్ , బట్ వాట్ టు డు , మై  సన్ ఐజ్ లైక్  దట్ “ పుత్రోత్సాహపు మెరుపులు .  పదే పదే అదే పాట వినిపించి కనిపించి హిప్నటైజ్ చేసే అడ్వర్టైజ్మెంట్ కనికట్టు,  మనుష్యుల మధ్య  అనుభందాలని ఎత్తి చూపి అలా కనిపించకపోతే , ప్రవర్తించకపోతే అసలు మీ  బ్రతుక్కో అర్ధమేలేదని  మాటికి మాటికి నిరూపించే మాయాజాలం నింపుకున్న ఇడియట్ బాక్స్లో నిన్నో కొత్త యాడ్ , సెల్ ఫోన్ కంపెనీ సూపర్ కొడుకులు నాన్నలు  ఎలా కావాలో నయా మోడల్ సిద్ధం చేసి  జనం మీదకి  వదులుతుంది . మాములుగా  చిరాకే కాని  ప్రస్తుతం  నా మనస్థితి సరిగ్గా అలాగే  ఉండటం వలనో ఏమో మనసుకి హత్తుకుపోయింది అచ్చం  నీ  నవ్వులా .

ఏదో కలుక్కుమంటుంది లోపలెక్కడో . ఇంకొంత వయసు మిగిలే ఉందన్న నమ్మకంలో వదిలేయడం  సులువే . కాని వద్దన్నా  నాకిబ్బంది అని  వొంటిగా దగ్గరలో కూరల మార్కెట్లు వెతుకుతూ ఇల్లెక్కడో మర్చిపోయిన అల్జీమర్స్ ఈగలా ఎవర్ని అడగాలో అసలేమి అడగాలో కొద్ది సెకనుల  తడబాటు సిగ్గులో చితికిపోయే పెద్దరికాలని . ప్రతి రోజు గుర్తు చేస్తే  తప్ప మందులు కూడా  వేసుకోలేని  నిస్సహాయతలని , వివాహ వ్యవస్థ మీద నమ్మకంలేక పోయినా  వయసు వేడిలో  విసిగిపోయి వదిలేల్లిపోతుందేమో అన్న అపనమ్మకంలో చిన్న చిన్న అసహన యుద్ధాలు . టెక్నాలజీ అరచేతిలో  ఇమిడిన రోజుల్లో  సైతం మాకెందుకులే బంగారం నువ్వున్నావుగా , ఆ మెసేజీలు  అవి చూసుకోవడం కుదరదుకాని ల్యాండ్లైన్తోనే మా పని కానిద్దు అంటూ కొత్తగా నేర్చుకోవడాల వెనక నిరాసక్తతతో పాటు నేర్చేసుకుంటే దూరంఅవుతామేమొనన్న అనవసరపు బెంగలు .  నా వర్క్  టైం ముగిసిన  మరుక్షణం  నుండి వాకిళ్ళు నిండిపోయే ఎదురుచూపులు . ఇవన్నీ  వదిలి ఎలా రావడం నిన్ను  హత్తుకోవడం . ఒకవేళ స్వార్ధపు అతిపెద్ద  కుట్రలో సైతం కొన్నాళ్ళు నీ కోసం  ఎగిరొచ్చినా , అక్కడ తృప్తిగా  నీతో గడపగలనా . కలయిక లో మనం  ఏకమయ్యే  క్షణాన సైతం ఏ రింగ్ టోన్ ఏ వార్త మోస్తుందో దిగులేగా .

నిజం చెప్పనా  నువ్వు లేవన్న  దిగులు  తప్ప నిన్ను చేరలేనన్న బెంగ తప్ప నేను బాగున్నాను , చేపలు సముద్రంలో పక్షులు ఆకాశంలో నేను అమ్మ వడిలో భద్రంగా  ఉన్నాము . అప్పటి స్నేహితులు ఎవరన్నా  ఎలా   ఉన్నావు  అని అడిగినప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు  నాకు , ప్రస్తుతం ఎల్కేజీ కొచ్చారు  త్వరలో డైపర్లు మార్చేంత ఎదుగుతారు . నాసాయం లేకుండా హాస్పేటల్ వెంటిలేటర్లు దాటలేరు  ముందు ముందు , అని పెదవుల నిండా  నవ్వుతో కళ్ళు  నిండిన కన్నీటితో గుండె నిండిన భారం దాచడం సులువేం కాదు .

ఎపుడో ఇంకోన్ని శిశిరాల వచ్చిపోయాక ,మనిద్దరిలో ఒకరం మరణపు మంచాల మీద చివరి శ్వాసలు  పీలుస్తూ ఉంటే మాత్రం  ఇంకొకరం బయట దిగులు మొహంతో పాత ఉత్తరాలు  చదువుకుంటూ ఉంటామన్న  నమ్మకం మాత్రమే ఇప్పుడిక మిగిలిన  ధైర్యం .

ఎప్పటికయినా  తిరిగొస్తావన్న ఆశ తో !

 

  • వోడాఫోన్ సూపర్ సన్ యాడ్ లో హుందాగా నవ్వుతూ ఒక్కసారయినా కలిసి  హత్తుకోవాలన్న వ్యక్తిత్వం మోమునిండిన ఓ వెన్నెల తల్లికి . మదర్స్ డే డెడికేషన్ .

జిహ్వ

 

-అల్లం కృష్ణ చైతన్య

~

    Krishna Chaitanya Allam      “ఒక సారి తిని చూడ్రా, బాగుంటది” అడిగిండు రాజు.

“అద్దు రా, నేను తిండి విషయంలో చాలా పెకీ. చూడ చక్కని ప్రేసెంటేశన్, మంచి టెక్స్చర్, సొంపైన వాసన ఉంటె కానీ నాలుక దాకా పోదురా ఏ తిండైనా” పోజు కొట్టిండు కార్తీక్.

“నీ ఇష్టం. నీ కడుపే మాడేది నాకెందుకు”

“రేయ్, నాలుక మనకున్న అవయవాల్ల గొప్పది రా. ఏది పడితే అది తిని దాని విలువని తగ్గించలెం గదా?”

“కడుపు కాల్తే నాలుకేంది, దానమ్మకు కూడా విలువుండది.”

“అది వేర్రా. ఆ రుచి ఆకలి నుండి వస్తది. ఇప్పుడు లేదు కదా ఆకలి”

“సరే నీ ఇష్టం. మాడు. ఎవడెం చేస్తడు నీలాంటోల్లతోని. నీది కూడా నేనే తింటున్న”

“పండగ చేస్కో”

“నువ్ పోయి ఈ పళ్ళెం కడుక్కో” కార్తీక్ ప్లేట్ల ఉన్న నీళ్ళ పప్పు, అన్నం తన ప్లేట్ ల ఎస్కుని ఖాళి పళ్ళెం వెనకకు ఇచ్చిండు రాజు.

“సరే కడుగుదాంతీ గనీ, ఈ జైళ్ల వంట మనిషి ఉద్యోగం చేయాలంటే ఎం చేయాల్రా?”

“జైలర్ని అడగాలే” తినుకుంటనే చెప్పిండు రాజు.

ఆలోచనల పడ్డడు కార్తీక్.

***

“కొన్ని దేశాల్ల నీసు లేకుంటే ఆల్లకు ముద్దే దిగదట తెల్సా? అక్కడ జైళ్ళల్ల కూడా నీసు పెడతారంటవారా?” రాజుని అడిగిండు కార్తీక్ పక్క సెల్ ల నుండి.

“ఎవడు పోయి చూసిండ్రా. ఎక్కడి జైలు ఐతేంది? జైలు జైలే. తిండి తిండే. నేరం చేసినోనికి కూసోవెట్టి మేపుతరా ఏంది?” తనకు తెల్సిన విజ్ఞానాన్ని పంచిండు రాజు.

“నిజమేరా. కనీ ఒక్కో సారి బయట దేశాల జైల్లన్నీ తిరిగి అక్కడ తిండి ఎట్లా పెడతారో సూడాలే అనిపిస్తది రా.” కార్తీక్ గోడకు తల ఆనించి సీలింగ్ మీదకు చూస్తా ఆలోచనల పడ్డడు.

“ప్రపంచం మా గమ్మత్ ఉంటదిరా. కొట్లాటలు, కత్తులు, తుపాకులు, విద్వేషాలు, ద్వేషాల మధ్యన నీలాంటోని కలల పరిధులు కూడా జైలుని దాటక పోవుడు ఆశ్చర్యం అనిపిస్తలేదు. కానీ స్వేచ్చని మించిన అనుభూతిని తిండిల వెతుక్కుంటున్నవంటే మొక్కాల్రా బాబు నీకు.” రాజుకు కార్తీక్ మీద జాలి పడాల్నో లేదో కూడా అర్ధం అయితలేదు.

“ఏమోరా, నా ధ్యాస ఎప్పుడూ, రుచి మీదనే ఉంటది. ఊచలు, గోడలు, పల్లాలు అన్ని రుచి చూసిన. వాసన కన్నా ముందు నాకు రుచే మతికస్తది.”

“నువ్వు తెలివున్నోనివో, మెంటలోనివో అర్ధం కాదొక్కోసారి. దేశాలు కాదు, నీ రుచి అనంతలోకాలకు చేరుకోవాల్నని ప్రార్తిస్తున్న. పండుకో ఇగ.”

“వస్తదిరా, మనక్కూడా ఓ రోజు, చలో గుడ్ నైట్”

“గుడ్ నైట్”

***

సూర్యుడు నూనెల గోలిచ్చిన పెద్ద పూరీ లెక్కనే ఉబ్బిపోయి మీదకస్తున్నడు. పూరి పక్కన లేశే నూనె నురగ లెక్కనే విచ్చుకుంటున్నై సూర్య కిరణాలన్నీ. ఊచల మధ్యన విచ్చుకున్న వెచ్చని ప్రభాతం పేర్చి పెట్టిన మైసూరు పాకుల లెక్కనే ఉన్నది.

నిద్ర లేవంగనే గట్టిగ తిత్తుల నిండా గాలి పీల్చిండు కార్తీక్. రుచికరమైన ప్రభాతం కూడా జైలు గోడల మధ్య మురికి కంపు కొడుతున్నది. తుప్పు పట్టిన ఊచలు ఉప్పటి వాసన వేస్తున్నై. చెమట, తుప్పు, దుమ్మూ, ధూళి, మన్నూ, మశానం అన్నీ ఉప్పగనే ఉంటై అనుకున్నడు కార్తీక్.

సున్నం ఉప్పగ ఉండదేమో. ఆ ఆలోచన రాంగానే గోడకున్న సున్నాన్ని నాకిండు. ఏ రుచీ లేదు. ఏ రుచీ లేకుండ ఎట్లుంటది ఇది అనుకున్నడు. ఎదో ఆలోచిస్తూ ఉండిపోయిండు.

స్నానాల టైం అయింది. రాజూ, కార్తీక్ స్నానం చేస్తున్నరు. సబ్బు వాసన ఘుమఘుమలాడుతున్నది.

“రేయ్ అది తినేది కాదు కదరా. సబ్బు వాసన చూస్తానవెం రా మెంటలోడా?”

“సర్వదోష నివారిణి, పరిశుద్ద ఆత్మ పరిరక్షణా కవచం…. “

“రేయ్ తెలుగులో చెప్పురా”

“సబ్బు గురించి రావి శాస్త్రి ఏమన్నడో తెల్సారా?”

“తెల్సు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ.. “

“రేయ్ అది శ్రీ శ్రీ రా. ఆయన మహా కవి. ఈయన మహా కథకుడు”

“ఐతే తెల్వది రా. నువ్వే చెప్పు. వాసన సూడుమన్నడా?”

“కాదు. ఎంత మలినం అంటినా స్వచ్చంగానే ఉండే స్వయం పరిశుద్ధక పదార్థంగా అభివర్నిన్చిండు.”

“ఆహా..”

ఈ సబ్బు రుచి ఎట్లుంటదో .. సబ్బుని నాకి చూసిండు.

“రేయ్ .. ఎం పని రా అది”

ఎవరి మాటలు వినపల్లేదు కార్తీక్ కి. సబ్బు వాసన ఘాటుగా ముక్కుపుటాలని తాకుతున్నది. కళ్ళకు దగ్గర ఉన్న సబ్బు నురగతో కళ్ళు మండుతున్నై. అయినా నాలుగయిదు సార్లు సబ్బుని నాకి చూసిండు. నాలుక మీద ఏ రకమైన ఆచ్చాదనా లేదు. రుచి లేదు. నాలుక్కో పదార్ధం కూడా తాకినట్టు లేదు.

నోరు, ఒళ్ళూ కడుక్కొని ఎం మాట్లాడకుండ అక్కణ్ణించి వెల్లిపోయిండు కార్తీక్. రాజుకి ఎం మాట్లాడాల్నో అర్ధం కాలేదు.

***

మద్యానం నడి ఎండ నెత్తిమీద సుర్రున కొడుతున్నది. రాగి పళ్ళాలు చేతుల పట్టుకుని ఖైదీలందరూ లైన్ల నిల్చున్నరు.

“ఏమైందిరా పొద్దున్న?” అడిగిండు రాజు.

“కాసేపాగు..”

మాడిపోయిన గిన్నెల తేలుతున్న నూనె, పోపు సరిపోకపోవడం వల్ల ఎక్కడా కనిపించని మసాలా పదార్థాలు, తగినంత పసుపు వాడకపోవడం వల్ల రంగు లేకుండా, ఎక్కువగా ఉడకటం వాళ్ళ అది అన్నమో, పప్పో అర్ధం కాకుండ చెమటలు చిందించి మరీ వండుతరు వంటగాళ్ళు. చెమటలెం ఖర్మ, చీమిడీ, సొల్లూ ఏమైనా చిందించి వంటలో ఉప్పు రుచి తీసుకురాగలిగిన వాళ్ళు. లేహ్యం లాంటి ఆ పదార్తమేదో పళ్ళెంల వేసిన్లు.

ఇంకో గిన్నెల నీళ్ళమీద తేలుతున్న నూనె, అక్కడక్కడా మాడిపోయిన మిరపకాయలతో సాంబారు అనబడు ఎర్రటి ద్రావకం ఒకటి గిలాసలో పోయబడ్డది.

పళ్ళెంల పడ్డ ఆ పదార్థాన్ని, గిలాసలో ఉన్న ఆ ద్రావకాన్ని ఎన్నడూ తిండి మొకం సూడని మనిషి లెక్క ఒక్క బుక్కలో తిని, ఒక్క గుక్కలో తాగిండు కార్తీక్.

గత పదేళ్ళలో తన వంటని అంత ఆప్యాయంగా, మురిపెంగా, ఆబగా, ప్రేమగా ఎవరూ తినడం చూడని వంటగాడు ఇంచు మించు కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేసిండు. కార్తీక్ని దగ్గరికి పిల్చి “ఇంకొంచెం కావాల్నా తమ్మీ” అని అడిగిండు.

“అద్దద్దు. ఇది చాలు” కార్తీక్ పళ్ళెం కడుక్కోనీకి పోయిండు.

ముక్కు మూస్కొని తినడం ఎట్లనో తెల్వక కష్టపడి కడుపులో ఆ పదార్థాల్ని పడేస్తున్న రాజు దగ్గరికి వచ్చి కూచున్నడు కార్తీక్.

“ఏమైందిరా నీకియాల?”

“రుచి పోయిందిరా.”

“ఎక్కడ పోయింది? ఎట్ల పోయింది?”

“ఏమోరా. పోయింది అంతే. పోద్దట్నించి ఎన్నింటిని నాకిన్నో, ఏమేం తిన్ననో. గడ్డీ, మట్టీ, గోడలు, చువ్వలు.. ఏదీ రుచి అస్తలేదురా.”

“నువ్వు మొదట్నుండీ అంతే కదరా”

“అట్లా కాదురా. ఇది వేరే. మొత్తానికే పోయింది. ఒక అవశేషం లెక్క, వ్యర్ధ అవయవం లెక్క అయిందిరా  నాల్క.”

“సరిపోయింది. నీ వంకలకు, నాల్కె రోగానికీ మంచిగ సరిపోయింది.”

“రేయ్, నీకర్ధం కాదురా నా బాధ. ఎక్కడున్నా, రుచేరా నా అనుభూతి, మనశ్శాంతి అన్నీ. ఆస్వాదన లేకుంటే ఎందుకురా జీవితం.”

“అట్ల ఎందుకురా అనుకునుడు. ఇట్ల సూడు. ఇక్కడ ఎలాగూ నీకు తిండి సైపదు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండ తినచ్చు.”

“నిజమే.” నిరుత్సాహంగ చెప్పిండు కార్తీక్.

***

లంచ్ టైం అయింది. గంట కొట్టిన్లు. రోజూ లెక్కనే అందరు పళ్ళాలు, లోటాలు పట్టుకుని లైన్ల నిలబడ్డరు.

“ఎం వంట చేసిన్లు రా ఇవాళ?” అడిగిండు కార్తీక్.

“ఆనక్కాయ చేసినట్టున్నర్రా, అయినా నువ్ తెలుసుకొని చేసేదేమున్నది రా?” అన్నడు రాజు.

“నిజమే”

ఆనప కాయ. కార్తీక్ మనసు ఎక్కన్నో ఉన్నది.

“ఎం ఆలోచిస్తానవ్ రా?”

“ఆనప కాయ గురించి. మా ఇంట్ల చిన్నప్పుడు తిండికి సరిగ ఎల్లేది కాదు. మా అవ్వ ఎన్నుంచి తెచ్చేదో కానీ ఇంటి మీద మొత్తం, ఆనప తీగెలు, బీరకాయ తీగలు, గుమ్మడి కాయ తీగలు, బచ్చలాకు అన్ని రకాల తీగల కూరలు పాకిపోయ్ ఉండేటియ్. పిందెలు కాంగనే మా అవ్వ కళ్ళళ్ళ చిన్న సంబురం కనిపించేది. నాలుగు రవ్వలు ఆదా అయితున్నయనో, నాలుగు తిండి గింజలు దొరికినయనో తెల్వది కని.”

“పళ్ళెం పట్టు” పాత జ్ఞాపకాల్ల మునిగిపోయిన కార్తీక్ వడ్డించే వాని పిలుపుతో మళ్ళీ ఈ లోకంలకు వచ్చిండు.

ఇద్దరు కలిసి రోజూ తినే జాగాలకు పోయిన్లు.

“దూది పిందెల లెక్క ఎముంటై రా ఈ ముక్కలు. సారీ రా. ఇందాకటిది కంటిన్యూ చెయ్.” తిండి ఆస్వాదనలో మునిగిపోయి అన్నడు రాజు.

“అన్ని కూరగాయలు చేతికి అందెతట్టు కాశేటియ్. దొంగ ముండ ఆనపకాయకు మాత్రం మాదండి బలుపు. అదొక్కటి మాత్రం ఇంటి మీద కాశేది. అది కోయ్యాల్నంటే ఇల్లెక్కాలే. అది కోయ్యాల్నంటే నా సాయం కావాల్శిందే మా అవ్వకు. ఒక సారి అది కోయ్యబోయి గూన పెంకుల మీదికెల్లి జారి పడ్డ. ఊళ్ళ ఆరెంపీ పెద్దగ పైసలేం తీస్కోడు కని ఇచ్చే ఆ నాలుగు పైసలు కూడా కనాకష్టమే మా ఇంట్ల. పక్కింట్ల చేబదులు పట్కచ్చింది మా అవ్వ.

రెండ్రోజులకు పక్కింటి శీను గాడు మా ఇంటి మీద కనిపిచ్చిండు.

“రేయ్ ఎం చేత్తానావ్ రా ఆడ” అన్న. “మీ అవ్వే ఎక్కమన్నదిరా” అన్నడు వాడు.

నాకు దెబ్బ తాకిందని వాణ్ని ఇల్లు ఎక్కిచ్చిందేమో అనుకున్న. వాడు గంప నిండా ఆనపకాయలు కోస్కోని వాని సందాన వాడు పోయిండు.

“అవ్వా, ఏందే వాడు కాయలు కోస్కోని పోతాంటే సప్పుడు చెయ్యవ్?” అడిగిన.

“రాజవ్వనే అన్నది రా, మొన్న దీస్కున్న చేబదులు వంతు పైసలేం అద్దు కనీ ఆనక్కాయలిమ్మన్నది. సరేతీమన్న. మల్ల కాత్తైతీరా.” చానా సులువుగ చెప్పింది మా అవ్వ. అవి కాశినంక సాంబారు, కూర, అనపకాయ సర్వపిండి ఎన్ని తినచ్చో అని నా మనసుల గుర్రాలు ఉర్కుతుండే. గప్పుడు అన్ని మాయం అయినై ఒక్క సారే.

“అది సరే రుచికీ ఈ కథకీ సంబంధం?”

“అయిదింటికి రావాల్సిన బస్ రాత్రి పన్నెండిటికి అస్తే? అయిదింటికే వస్తే బస్ ఎక్కి పోతవ్. పన్నెండింటికి వచ్చింది కాబట్టి ఆ ప్రయాణం గుర్తుండి పోతది. రెండో కాపు కాసే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. మళ్ళీ కొన్ని నెలలు పట్టింది. లేత ఆనపకాయలు ఎన్నో రోజుల ఎదురు చూపుల తరవాత నాలుకతో నలుగుతుంటే స్వర్గం కనిపించింది.”

“నిజమేరా. ఎక్కడిదో ముచ్చట యాదికి ఉంచుకున్నవ్ బాగనే”

“రుచి అంటే అదే రా. స్మృతులని తడిమే సాధనం. ఒక్కో రుచికీ ఒక్కో కథ. ఎన్నో జ్ఞాపకాలు. నోట్లోకి పోయిన పదార్ధం యధార్ధాన్ని బయటకు తీసి అడుగున పడిన జ్ఞాపకాలని తట్టి లేపుతది”

***

మూడు నెల్ల శిక్షా కాలం అయిపొయింది ఇద్దరికీ.

బయటకు రాంగనే పిల్లగాలోకటి స్వాగతం చెప్పింది.

“ఒక్క నిముషం నిల్చోరా ఇక్కన్నే” కార్తీక్ అడిగిండు.

ఇద్దరు జైలు తలుపు ముందర నిల్చొని స్వేచ్చా లోకాన్ని చూస్తున్నరు.

“ఏముందిరా.. ఈ గాలి” రాజు తిత్తుల నిండా గట్టిగ గాలి పీల్చుకున్నడు. బయట దుర్గంధం కూడా సువాసన లాగనే ఉన్నది.

రెండు చేతులూ పాంటు జేబుల్ల పెట్టుకొని నిలబడ్డడు కార్తీక్. ప్రశాంతంగా లోకం దిక్కు చూస్తున్నడు.

“గాలి కాదురా. స్వేచ్చా వాయువు. సమస్త జీవరాశులకూ సమానంగా పంచబడనిది. ఆటవిక జంతుజాలం, మనిషి మాత్రమె అనుభవించగలిగింది. పదే పదే దుర్వినియోగం చేయపడేది. అవధులు, పరిధుల్ని దాటి రెక్కలు విచ్చుకుని ఎగరాల్నని అనుక్షణం తహతహలాడేది. ఒకళ్ళ చేతుల ప్రేమగా, మరొకళ్ళ చేతిల ఆయుధంగ మారిపోయే కనిపించని మానసిక విశేషం.”

“… ..”

దానికి ఎట్లా ప్రతి సమాధానం ఇయాల్నో అర్ధం కాలే రాజుకు.

“పదా చాయ్ తాగుదాం.” ఎదురుగ ఉన్న చాయ్ స్టాల్ కు పోయిన్లు ఇద్దరు.

ఘాటుగా, తియ్యగా, వెచ్చని పొగ ఆవిరిలో నుంచి అల్లం చాయ్ వాసన వస్తున్నది. చాలా రోజుల తరవాత ముక్కు పుటాలకు సుఖమైన వాసన.

చాయ్ గ్లాస్ నోట్లో పెట్టుకుని ఒక సిప్ చేసిండు కార్తీక్.

తియ్యగా, ఘాటుగా, వెచ్చగా, సుఖంగా అనిపించింది.

రెండు నీటి చుక్కలు బోట బొటామని కారినై కార్తీక్ కుడి కన్ను నుండి.

ఎందుకని అడగలేదు రాజు.

***

ఏడుపు మంచిదే!

చిత్రం: సృజన్ రాజ్

చిత్రం: సృజన్ రాజ్

    -మెరిమి దినేష్ కుమార్

~

varamనవ్వితే 62 కెలోరీలు కష్టపడకుండా కరుగుతాయని నవ్వుకి విలువిచ్చారు అదీ ఘోరంగా గట్టిగా నవ్వితేనే,మామూలుగా ముసి ముసి నవ్వులు నవ్వితే 12 కూడా కరగవనే నిజాన్ని ఎవ్వరూ చెప్పడానికి సాహసించలేదు అదే మామూలుగా ఏడిస్తే 50 కెలోరీలు కరుగుతాయ్.  సొ ఏడుపు మంచిదే!

సినిమా తీద్దామని ఇంట్లో చెప్పకుండా జాబ్ వదిలేసి హైదరబాద్ కి వచ్చి కరెక్ట్ గా 9 నెలలవుతోంది,మొదటి నెలలో అమ్మని బాగా ఏడిపించాను, రెండో నెల నుండి ఎక్కువ సార్లు ఫోన్లు చేస్తూ కొద్దిగా ఏడుపుని తగ్గించాను అలా ఏడుపుని నవ్వు దాకా తీస్కురావడానికి 5 నెలలు పట్టింది. కానీ నేను మాత్రం ఇంకా సినిమా తీయలేదు,

‘ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రా’ అని అమ్మ అడుగుతుంటే-

‘తొందర్లో అవుతుంది మా’ అని నిజమైన అబద్దం చెప్పేవాడిని. నన్ను చూడాలని తెగ ఆరాటం నేనంటే అంత పిచ్చి ప్రేమ మా రమాదేవికి

“కల కనడానికి నిద్రపోతే చాలు, నిద్ర పోడానికి బస్సో రైలో ఎక్కితే చాలు కానీ కలని నిజం చేస్కోవాలంటే నిద్ర పోకుండా కష్టపాడాల్సిందే అదే సినిమా అయితే దారి తెలియకుండా గుడ్డిగా నడవాల్సిందే” అనే గొప్ప తత్వాన్ని మాయమ్మకు ఎలా చెప్పేది. నాలోనే ఓ పెద్ద రాక్షసుడున్నాడు చిన్నప్పటి నుండి ఆమె అనుకున్నట్టు పెరగలేదు ఇంటర్లో సమాజం లోని అన్యాయం,కుల ధూషణ,అసమానత్వం లాంటి గొప్ప లక్షణాలను భరించలేక, ముఖ్యంగా మా శ్రీశ్రీ నల్ల కాకిగా ఉన్న నన్ను తెల్ల కాకిగా మార్చి ఆపై మనుషుల మనస్థత్వాలను చూసి ఎర్ర కాకిగా మారిపోయాను.అభ్యుదయ ఆవేశంతో ఉద్యమంలోకి వెళ్లిపోవాలని అర్థరాత్రి ఇంట్లో నుండి వెళ్లిపోయాను,

చిన్నప్పటి నుండి అల్లరితో ఏడిపిస్తూనే అప్పుడు ఆవేశంతో ఏడ్పించాను.

అర్థరాత్రిలో తిరుపతి వీధులు అంత భయంకరంగా ఉంటాయని అప్పటి దాకా తెలీదు,చీకట్లో చంద్రుడున్నట్టు దొంగలు పోలీసులు అన్నదమ్ములని ఆ రోజే తెల్సింది.అలా ఓ రోడ్డు పక్కన పనుకొనుంటే ఆవు దూడను ఎలా పట్టుకుంటుందో అలా మాయమ్మ నన్ను పట్టేసుకుంది ఏడిస్తే నేను మాట విననని, ఏడుపుని ఆపుకుని

‘రారా ఇంటికి’ అంది

తడబడుతూ వచ్చే మాటలే గద్గద స్వరం అని పరిచయమైన రాత్రి. మా నాన్నేమో తాగేసి నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు అది నిజమైన ప్రేమైనా నేను నమ్మకుండా చేస్తోంది ఆయన చర్య. ఇంజనీరింగ్ లో చదువు బాగా లేదని మానేస్తానని ఫోన్లో చెప్పినపుడు అదే ఏడుపు నన్ను ఆపేసింది ఆరోజే మాటిచ్చాను ఎన్ని బాధలైన ఇబ్బందులైనా పడతానుగాని ఇంజనీరింగ్ మాత్రం పూర్తి చేసే వస్తానని. ఒక్క ఏడుపు నన్ను ఎంత ప్రభావితం చేసిందో,కన్నీళ్లు ఎప్పుడూ నన్ను మార్చలేదు ఏడుపే మారుస్తోంది ప్రపంచపు భాదను పట్టించుకున్నపుడైనా నాలోని రాక్షసుడి ఏడుపుని విన్నా మారిపోతాను ఏడుపుతోనే మారుతూ ఉన్నాను.

జీవితంలో ఏడుపే ప్రారంభం ఏడుపే ముగింపు కదా.

ఒక పరమహంస ఏడిస్తే కాళికమ్మే కదిలింది మా అమ్మ ఏడిస్తే నేను కదలనా ఆగనా. ఇంతలో రైలు రేణిగుంట లో ఆగింది టైం 3:30 ఇపుడు కాళాస్తి కి బస్సులుంటాయా అని ఒకటే డౌటు ఎందుకంటే నేనెపుడు ఇంత పొద్దున వెళ్లలేదు,సర్లే అని రోడ్లో నడుచుకుంటూ చూస్తున్నాను కొందరు నాలాగే బస్సు కోసం ఉన్నారు అరె ప్రపంచం నాలాగే ఉందే అనుకుని చూస్తున్నా,ఏదో బెంగుళూరి బండి కాళాస్తికి పోతోంది. కాళహస్తికి బెంగుళూరి నుండి బస్సుందా అని ఆశ్చర్యపడ్డాను ఇదే కదా మొదటిసారి.

ఏడుపు వల్లే మనిషి ఇంకో మనిషిని చూడగలడు మనిషిలా బ్రతకగలడు.

‘బహుశా త్యాగయ్య, అన్నమయ్య, రామయ్యలు దేవుడి కోసం ఏడ్చారు ఆ ఎడుపులే ప్రపంచానికి గొప్ప కృతులు కీర్తనలు జీవితాలయ్యాయి ఈ నిజం తెల్సుకోడమే జీవితం కాబోలు’

ఎందుకంటే నవ్వుతూ పలకరించమని చెప్తారు నవ్వుతూ ఫోటోలు దిగమని చెప్తారు నవ్వుతూ బ్రతకాలిరా అని పాటలు కూడా పాడి ఏడ్చేవాళ్లు లోకువ అని మనుషులు ఆలోచించని బావిలోకి తోసేస్తున్నారు అందుకే సమాజం లో ఇన్ని అసమానతలున్నాయని నాకనిపిస్తుంది.

అలా నవ్వి నవ్వి ఇంజనీరింగు అయిపోయింది మా నాన్న తరుపున ఓ ఉద్యోగం ఇప్పించాడు అదీ సినిమా స్టైల్లో నాకే తెలియకుండా నన్ను కారు ఎక్కించి 4 గంటలే అని చెప్పి చేతిలో ఓ 10 వేలు పెట్టి సరే ఉంటా జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు. నిద్రలో 12 గంటలైనా 1 గంటలాగే తెలుస్తుంది ఈ నిజం తెల్సుంటే డబ్బు పిచ్చోళ్ళు గంట గంట కు అలారం పెట్టుకుంటారేమో.అలా 4 గంటల నిద్రలో ఆంధ్రా దాటి ఎక్కడో తమిళనాడు చివర బెంగుళూరికి 30కి.మీ ల దగ్గరున్న హోసూర్ లో దిగుతానని కలలో కూడా అనుకోలేదు. ఆ ఉద్యోగం ఆ ప్రపంచం నావల్ల అస్సలు కాలేదు.

అప్పుడే అర్థమైంది మనిషికి ఎక్కడా స్వాతంత్ర్యం ఉండదని.

‘కడుపులో ఇరుకిరిగ్గా  ఉందని కష్టపడి బయటకొస్తే గాలి పీల్చుకునే లోపు బల్లో  చేర్పించి ,తర్వాత కాలేజీ, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు….చావు, రొటీన్ సినిమా నే జీవితమని’ ఇక తప్పదని ఎలాగోల నాలోని రాక్షసుడికి స్వాతంత్ర్యం ఇప్పించాలని సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యి ఛాలెంజ్ లో చిరు లా కాకపోయిన ఓ మోస్తరులో గొడవేస్కుని ఆటో ఎక్కి హైదరబాదు వెళ్తున్నా అని అంటే అదే ఏడుపు అవే చెమ్మగిల్లిన కళ్ళు ఈ సారి మాత్రం నాలో చలనాన్ని తీస్కురాలేదు గమనాన్నే చూస్తూ కూర్చుండిపోయాను.

ఆ క్షణం నాలో రాక్షసుడు లేడు నేనే రాక్షసుడినని అనిపించింది.

బస్సు కాళహస్తి వచ్చింది మా ఊరికి 4:30కి బస్సులుండవ్ అసలు పల్లెలకి బస్సులే ఉండవ్ ఇక నాకోసం ఇప్పుడు రావు అపుడే నాలో ఓ తాత్వికుడు,రాక్షసుడి మాట వినకుండా మా కన్నప్ప దేవున్ని కళ్ళారా చూడు చాలా రోజులైందని చెప్తే ఎలాగూ ఇపుడు చేసేదేమీ లేదు 6 గంటలకి గాని మా బస్సు రాదు అని గుడికి వెళ్ళాలని వీధిలోకి అడుగేశాను

“సార్ బాత్రూం లు సార్ రూములు సార్” అని నస పెట్టేశారు సర్లే వీళ్ళు ఇంతే అనుకుని పరుగెట్టుకుని వెళ్లకపోయినా అదే మోతాదులో పారిపోయాను గుడి మొదట్లో బిక్షగాళ్ళు లేరు కొద్దిగా ముందుకెళ్ళగానే

లాకర్లు సార్, చెప్పులు ఇక్కడే పెట్టండి సార్ అంటున్నారు పట్టించుకోకుండా వెళ్తుంటే

సార్ దేవస్థానం స్టాండ్ ఇందులో పెట్టండి అనే మాటకు విలువిచ్చి అలా వాడిని చూస్తే వాడూ  వ్యాపార  సూత్రాలను వల్లించాడనే నిజం తెల్సి కోపం వచ్చి పో అన్నాను వాడేమో నన్ను దొంగతనం చేసి పారిపోయే వాడి లాగా తిడుతున్నాడు ఏంటి శివయ్యా ఇదంతా అనుకుని ముందుకు నడిచాను అప్పుడొచ్చింది నిజమైన దేవస్థానం ఉచిత పాద రక్షలు బ్యాగ్ లు ఉంచు స్థలం అది  చూసి వెళ్ళాను చెప్పులు 2రూ అయ్యింది బ్యాగ్ 10రూ అయ్యింది ఫోన్ 5రూ అయింది

10 రూ లాకర్ ఇస్తానని చెప్పిన వాడే మేలనిపించింది

నాకేమో అడుక్కునే వాళ్ళు మోసం చేసే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కునే వాళ్ళు నచ్చరు ఇ .ఓ కి కంప్లైంట్ చేద్దామని ఉంది ఊడ్చేవాళ్లే ఇంకా రాలేదు ఇ.ఓ ఎందుకొస్తాడు అనుకుని తిట్టుకుంటూ లోపలికి నడిచాను. నా చిన్నతనం లో కాళహస్తి గుడికి వెళ్ళేవాడిని కాదు అప్పుడు దేవున్ని నమ్మలేదు ఇప్పుడూ నమ్మను కానీ నాకు ఆనందం దొరికితే అడుక్కోడానికైనా వెనకాడను.నేను దేవున్ని నమ్మను నుండి నమ్మాను ఆశ్వాదించాను ఇప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయానికి వచ్చేశాను.గుడి తలుపులు మూసున్నారు రాహు కేతు పూజ కోసం జనాలు సినిమా హాలు కాడ వెయిట్ చేసినట్టు గోలగోలగా ఉంది 750రూల టికెట్టు 1000రూల టికెట్టు,1500రూ టికెట్టు అని పూజ చేసేవాళ్ళు నిజంగా పూజలు చేస్తారా? వాళ్ళ వెర్రి ఇంతలా ఉంటే ఏంచేస్తాను ఆ కొంచం ఆలోచించలేరు?,అయినా పాపాలు చేసేసి డబ్బులు హుండీల్లో,పాపాలు పూజల్లో వేసేయొచ్చని కొన్ని యుగాలుగా నిరూపిస్తున్న పెట్టుబడిలేని వ్యాపారం.లక్షల కుంభకోణాలు కోట్ల అక్రమాలు అంటే జనాలు ర్యాలీలు,ధర్నాలు చేస్తారు,దేవుడి దగ్గరికి వెళ్లాలంటే 100ల రూపాయలు, పూజలకి 1000రూ, పాలు పోస్తే 100రూ, ఇంకా ఏవేవో అక్కడ దర్జాగా దొంగతనం చేస్తుంటే పద్దతిగా 4 గంటలకే పంచ కట్టుకునిమరి క్యూ లో నిల్చుని కడతారు.

ఒకానొక దశలో దేవున్ని ప్రశ్నిస్తున్న నాకు దొరకిని సమాధానాలలో దేవాలాయాలు ఎందుకు కట్టారు అంటే తిండి కోసం, వైద్యం కోసం, న్యాయం కోసం అన్నిటి కోసం  ప్రభుత్వం ఏమేం చేస్తుందో అన్నిటి కోసం, ప్రభుత్వానికి గుళ్ళకి తేడా ఒక్కటే జ్ఞానం,

దేవుడు జ్ఞానం కోసమే అని గట్టిగా నమ్ముతాను నేను

అలా ద్వజస్థంబం చూస్తుంటే ఓ ఆవు వచ్చింది వెనకనే ఇద్దరు దాన్ని పట్టుకుని వచ్చారు పూలతో మనకు నచ్చేలా అలంకరించారు బహుశా అది ఆకలికి వచ్చుంటుంది అరటి పండ్లు పెడుతుంటే తింటూనే ఉంది,

అరటి పండు పెట్టాలంటే 5రూ అంట

అదే ఆవుకి గుడి బయట అరటి తొక్క కూడా వేయరు, ఆవుకి ప్రదక్షిణ చేసేవాళ్ళు పోటీలు పడి మరి చేస్తున్నారు.

chinnakatha

ప్రదక్షిణలు వాకింగ్ కి హెల్ప్ అయితే వాళ్ళు బాగానే చేశారు.నేనేమొ ఇవన్నీ చూడలేకపోతున్నా అక్కడ తలుపులేమో ఇంకా తీయలేదు,ఉచిత దర్శనం చేస్కునే వాళ్ళు చివర్లో అంట దేవుడు కూడా ఉదయాన్నే కళ్ళు తెరవంగానే ముందు 200రు,100రు వాళ్ళని  మాత్రమే చూస్తాడు తర్వాతనే మిగిలిన వాళ్ళని చూస్తాడన్నమాట, మన న్యాయస్థానాల్లో దొంగతనం చేస్తే 1000రూ, లంచమిస్తూ దొరికితే 2000రూ ఇచ్చి ఎలా బయట పడతారో అలా అన్నమాట.

‘ఏ జ్ఞానం కోసం గుళ్ళు, దేవుళ్ళు వచ్చారో అవే గుళ్ళు ఇపుడు అజ్ఞానులకు కేంద్రాలయ్యాయి’

టైమ్ 5:30 అయింది ఇక నావల్ల కాక ఎప్పుడు తెరుస్తారు అని అడిగా 6 గంటలకి అని ముందున్నామె అంది. వెంటనే ద్వజస్థంభాన్ని చూశాను, గోపురాన్ని చూశాను గుడి మొత్తం చూశాను ప్రారంభ మేలుకొలుపు నాదస్వరం, డోలు విన్నాను, నీళ్ళు తాగి ఓం:నమశ్శివాయ అనుకుని బస్సు కోసం బయల్దేరాను నందిని చూసి

‘మా అమ్మని చూడ్డం నాకు ఆనందం సారీ ఇంకోసారి అందరూ చూస్తున్న ఆ చీకటి మూలకొచ్చి చూస్తా ఈ సారికి సర్వాంతర్యామిలా దర్శించినందుకు క్షమించు’ అని చెప్పుకుని వడి వడిగా బస్టాండుకి బయల్దేరాను,ఇంకా బస్సు రాలేదు పేపర్ చదువుతోంటే ఎవరో ఒకాయన వచ్చి మిగిలిన పేపర్ టక్కున తీస్కున్నాడు సర్లే టీ అంగడి దగ్గర ఇలాంటివి కామనే అనుకుని చదువుతోంటే ఆయన జాలిగా మొహం పెట్టి టీ తీసివ్వు బాబు పుణ్యముంటుంది అన్నాడు

‘నేను తీసివ్వను నాకు పాపమే కావాలి’

అని టక్కున నాలోని రాక్షసుడు బయటకొచ్చి చెప్పాడు. అడిగుంటే లేదు అని చెప్పేవాడిని తీసివ్వు పుణ్యమోస్తుంది అంటే ఇలానే నాలోని రాక్షసుడు బయటొస్తాడు, బస్సొచ్చింది ఎక్కాను 5నిమి తర్వాత బయల్దేరింది నేను,కండక్టరు డ్రైవరు అంతే ఎవ్వరూ ఎక్కలేదు ఏదో ప్రీమియర్ షో చూసినట్టుంది పోయినేడాద్దాకా మా బస్సుకోసం ఎదురు చూపులు సీట్ల కోసం పోటీలుండేవి ఎప్పుడైతే ఆటోలు ఇంటిదాకా దిగిపెట్టడం మొదలయ్యిందో అప్పుడే బస్సులు బుస్సాయ్యాయి కానీ జనాలు మాత్రం బస్సు రాకపోయినా టైముకి ఉండకపోయినా డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికెళ్లి దర్నాలు చేస్తారు.

అసలు అమ్మకు తెలియదు నేనోస్తోంది ఊర్లోకి అడుగు పెట్టగానే నవ్వొచ్చేసింది ఎందుకంటే ఇదే స్థలంలో నేను మాయమ్మని ఏడిపిస్తూ వెళ్ళానని గుర్తొచ్చి. ఇంటి గేటు తీసి

“ఏమ్మా ఇలా చూస్తావా అన్నాను”

బట్టలుతుకుతోంది ఆ మాటకి వెనక్కు తిరిగి అలానే సర్రున చిరు నవ్వుతో వచ్చి

“అరె ఎన్ని రోజులయిందిరా వెళ్ళి”

అంటూ వీపుని తడిమింది ఎన్ని కోట్లు సంపాదించినా అలాంటి స్పర్శను,జ్ఞాపకాన్ని పొందలేను

సినిమాలోలా కొడుకు చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఏడుస్తుందని అనుకుంటే ఇలా నవ్వి నా సినిమాలో ఓ గొప్ప జ్ఞాపకం అయిపోయింది.

నవ్వు మంచిది కాదనను ఎందుకంటే ఎక్కువసేపు నవ్వినా వచ్చేది ఏడుపే కాబట్టి

ఏడుపు చాలా మంచిది మనసుకి చేరే భాష మనిషిని చేసే భాష .

*

 

ఫుట్‌పాత్

ARIF6

-రమా సరస్వతి

~

 

rama‘డిస్గస్టింగ్’ స్మార్ట్‌ఫోన్‌లో న్యూస్ అప్‌డేట్స్ చూసుకుంటూ!

‘వాట్ హ్యాపెండ్’ నిర్వికారంగా ఫోన్‌లోంచి తలెత్తకుండానే ఆమె కొలీగ్.

‘నిన్న రాత్రి ఒంటిగంటకు గాంధీ వే ఫుట్‌పాత్ ఓ ఆడీకార్‌ను ఢీకొట్టిందట.. అందులో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు సివియర్ ఇంజ్యూర్డ్ అట.. కండిషన్ క్రిటికల్‌గా ఉందట’..

‘వాట్?’ ఆ ఆశ్చర్యం ఫోన్‌లోంచి తలెత్తి పక్కనే ఉన్న కొలీగ్ మొహంలోకి చూసేలా చేసింది

‘ఊ..’ నిజం అన్నట్టుగా తలడించింది.

‘కాంట్ బిలీవ్ ఇట్.. ఫుట్‌పాత్ కారును హిట్ చేయడమేంటి?’ ఇంకా ఆశ్చర్యం వీడలేదు.

‘అదే కదా!’

‘డీటేల్స్ ఏంటో..?’ ఆశ్చర్యం కుతూహంలా మారింది.

‘ఏంటోలే… క్లయింట్ కాల్ వస్తోంది అటెండ్ చేయాలి’ అంటూ చైర్‌ని సర్రున సిస్టమ్ ముందుకు లాక్కుని ఫోన్ కాల్ అటెండ్ అయ్యే పనిలో పడపోయింది.

కుతూహలం నిరాశ చెంది తనకేమన్నా  డీటేల్స్ దొరుకుతాయేమోనని ఫోన్‌లో వెదికే ప్రయత్నం మొదలుపెట్టింది.

మూడు రోజులయింది

‘గుడ్ మార్నింగ్‌సర్’ ఫోన్‌లో ఆన్సర్ చేశాడు గాంధీవే ఏరియా ఎస్‌ఐ.

‘ఊ…అప్‌డేట్స్ ఏంటీ?’ అవతలి నుంచి సీఐ.

‘ఆ ఇద్దరూ ఇంకా కోమాలోనే ఉన్నారు సర్.. బహుశా బయటపడక పోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు’

‘ఆ.. నా.. కొడుకుల అయ్యలు..  మన ప్రాణాలను బయటకు తోలేటట్టున్నారు… బిగ్ షాట్స్ వ్యవహారం.. పెద్దోళ్ల ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్‌చేస్తున్నారు. ప్రెషర్  ఉంది బాగా. మళ్లీ ఒకసారి ఐ విట్నెసెస్ గురించి ట్రై చెయ్’ స్వరం స్థిరంగా వచ్చింది.అది  ‘ఎం చేసైనా సరే అరెస్ట్ కావాలి’ అన్న సంకేతంగా ఎస్‌ఐకి అర్థమైంది.

‘యెస్.. స..’ అంటుంటేనే అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం. ‘దీనమ్మ బతుకు’ పళ్లు కొరుక్కుంటూ ఇన్నోవా ఎక్కాడు ఎస్‌ఐ.

————————-

మధ్యాహ్నం పదకొండు గంటలు..  గాంధీవే… టీవీ 101 ఛానల్ వ్యాన్ వచ్చి ఆగింది. బిలబిలమంటూ చిన్నా, పెద్దా అంతా గుంపుగా అక్కడికి చేరారు. బ్లూ జీన్స్, రెడ్ కుర్తా, కర్లీ హెయిర్‌ను బలవంతంగా పోనీగా మలచిన ఓ 22 ఏళ్ల యంగ్ రిపోర్టర్ సెల్ ఫోన్ చూసుకుంటూ వ్యాన్‌లోంచి దిగింది. ఆ వెనకే కెమెరా మేన్, అసిస్టెంటూ దిగారు. యేం మాట్లాడకుండా ఇన్‌స్ట్రక్షన్స్ కోసం వేచి కూడా చేడకుండా కెమెరా యాంగిల్‌ను సెట్ చేసుకోసాగాడు కెమెరా మేన్. లోగో మైక్‌కున్న వైర్‌ను వృత్తాకారంలో చుడుతూ మైక్ తెచ్చి రిపోర్టర్‌కిచ్చాడు అసిస్టెంట్.  ఓ చేత్తో మైక్ పట్టుకొని, ఇంకో చేత్తో సెల్‌చూసుకుంటూ అక్కడ చేరిన గుంపు దగ్గరకు వెళ్లింది. ‘గోపాల్ ఎవరు?’ అడిగింది వాళ్లను ఉద్దేశించి.

‘గోపాల్ లేడు మేడం.. మీరు ఫోన్ చేసిన విషయం చెప్పిండు. నేను చూసుకుంటా… మీకేం కావాల్నో వీళ్లనెవర్ని అడిగినా చెప్తరు’ అన్నాడు ఆ గుంపులోని ఓ పాతికేళ్ల వ్యక్తి. ‘వీళ్లందరూ డిసెంబర్ 31 రాత్రి ఇక్కడే ఉన్నారా?’ అడిగింది.

‘అందరూ ఉన్నారు మేడం..’ అంటూ ‘అరేయ్ సాయి ముందుకు రారా.. ఆ రోజు రాత్రి చూసింది చూసినట్టు మేడంతో చెప్పుడు’అన్నాడు గుంపులో వెనకలా ఉన్న సాయిని పిలుస్తూ.

సాయి ముందుకొచ్చాడు.. సాయితోపాటే ఓ నలుగురు కూడా!

సెల్‌ఫోన్‌ను బ్యాక్‌పాకెట్లో పెట్టుకొని మైక్ సరిచూసుకుంది. కెమెరా మేన్‌కి యాంగిల్ మార్చుకొమ్మని సైగ చేసింది. అతనికి ‘రోలింగ్’ అని చెప్పి ‘యాక్సిడెంట్ జరిగినప్పడు మీరు ఇక్కడే.. ఐ మీన్ ఈ గాంధీ వే ఫుట్‌పాత్ దగ్గరే ఉన్నారా?’ అడిగింది సాయి మూతి ముందు  లోగో మైక్ పెడుతూ.

‘ఆ..’ అని ఆ అబ్బాయి సమాధానం ఇస్తున్నప్పుడే ఈ గుంపుకి చాలా దూరంగా గాంధీవే స్టేషన్ ఎస్‌ఐ  ఇన్నోవా వెహికిల్ ఆగింది.

‘సర్.. మీడియా వాళ్లు. న్యూసెన్స్ చేసి న్యూ న్యూస్ స్ప్రెడ్‌చేయడానికే వచ్చి ఉంటారు’ కోపంగా హెడ్ కానిస్టేబుల్.

‘ఊ.. చెయనియ్ ఏదో ఒకటి’ అంటూ నెమ్మదిగా ఆ గుంపు దగ్గరకి నడిచాడు ఎస్‌ఐ తన వాళ్లను అక్కడే ఆగిపొమ్మని సైగచేస్తూ!

‘ఆ యాక్సిడెంట్ అయినప్పడు టైమెంత?’ రిపోర్టర్

‘రాత్రి ఒకటి అయినట్టుంది మేడం!’

‘మీరెంత మంది ఉన్నారిక్కడ?’

‘పదిపన్నెండు మందిమి!’

‘అంత రాత్రిపూట మీకేం పని ఇక్కడ?’ రిపోర్టర్

‘అరే… మేమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉన్నం మేడం!’

ARIF6

‘ఏదీ ఈ రోడ్డు మీద చేసుకుంటున్నారా సెలబ్రేషన్స్’

‘రోడ్డేంది మేడం.. దీన్ని ఆనుకునే గదా.. మా ఇండ్లు.. గాంధీ వే స్లమ్ ఈ సిటీల ఎంత ఫేమసో మీకు తెల్వదనకుంటా..’ గాంధీవే స్లమ్ గొప్పతనాన్ని చెప్పలేకపోతున్నాననే ఫీలింగ్‌తో ఆ అబ్బాయి.

‘కరెక్ట్‌గా సంజయ్ ఆడీకారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు’

‘ రోడ్డు మీద నిప్పురవ్వలు తేలుతయా అన్నంత స్పీడ్‌తో వచ్చింది మేడం కార్. ఆ సౌండ్‌కి అందరం ఆ కారు దిక్కు చూసినం. సరిగ్గా అప్పుడే అగో రోడ్డుకి అటు సైడ్ ఉన్న ఆ ఫుట్‌పాత్  ఈ కారు కన్నా స్పీడ్‌గా రోడ్డు నడిమధ్యలకొచ్చి కారును ఒక్క గుద్దు గుద్ది అంతే స్పీడ్‌గా మళ్లీ దాని జాగలకు అది వెళ్లిపోయింది మేడం!’ తాను చూసిన వింతను అంతే విస్మయంగా వివరిస్తూ చెప్పాడు.

‘మీరు అప్పుడు తాగి ఉన్నారా?’

‘మేడం… మా ఎవరికీ తాగే అలవాటు లేదు. ఆ రోజు పోలీసోళ్లు కూడా చెక్ చేసిండ్రు’ మమ్మల్ని అవమానపరుస్తున్నారు అన్న భావంతో సమాధానం వచ్చింది.

‘మరి లేకపోతే ఫుట్‌పాత్ వచ్చి కారును ఢీకొట్టడమేంటి?’

‘మాకు కనిపిచ్చింది.. మేం చూసింది గదే మేడం.. మేమే కాదు ఆ సౌండ్‌కి ఇండ్లలల్ల ఉన్న మా పెద్దోళ్లు కూడా ఉరికొచ్చిండ్రు కావాలంటే వాళ్లను కూడా అడుగుండ్రి…’  అన్నాడు మైక్ ఉన్న అబ్బాయి పక్క కుర్రాడు.

వీళ్ల ఉత్సాహం వెనకనే ఉన్న ఎస్‌ఐ టీమ్‌ను గ్రహించే పరిస్థితిలో లేదు.

‘ఫుట్‌పాత్ వచ్చి కారుని ఢీకొట్టగానే మీ రియాక్షన్ ఎలా ఉండింది?’ మైక్‌ను ఇందాక జవాబు చెప్పిన అబ్బాయి నోటి ముందుకు మారుస్తూ రిపోర్టర్.

‘షాక్ అయినం. అసలేం జరుగుతుందో అర్థంకాలే. చిన్న పోరలైతే ఫ్రీజ్ అయిండ్రు. పెద్దోళ్లకు మాటరాలే’

‘కార్లో ఉన్న సంజయ్, ఆయన ఫ్రెండ్ సిట్యుయేషన్  ఎలా ఉంది?’

‘బ్యానెట్ తుక్కు తక్కు అయింది.  డ్రైవింగ్ సైడ్ ఉన్న డోర్ ఊడిపోయి ఒకాయన కిందపడ్డడు. మరి ఆయన సంజయో ఇంకెవరో తెల్వదు. తలకు పగిలింది. ఫ్రంట్ సీట్ల బెలూన్లు ఓపెన్ అయినయో లేదో కూడా  తెల్వదు. పక్క సీట్ల ఉన్నాయన డాష్ బోర్డ్ మీదకు వొంగినట్టుంది. ఆయక్కూడ తలకు బాగా దెబ్బ తగిలింది. కింద పడ్డాయనను చూసి మా అమ్మకు చెక్కరొచ్చింది. ఆయన దాహం.. దాహం అని అడిగిండు. అగో మురళిగాడి దగ్గర బాటిల్ ఉండే తాగించడానికి ట్రై చేసిండు కానీ తాగలే… స్పృహ తప్పిపోయిండు’ కళ్లకు కట్టినట్లు చెప్పాడు ఆ అబ్బాయి.

‘104కి ఫోన్‌చేయలేదా?’

‘చేసినం.. అదొచ్చే సరికి అద్దగంట అయింది. పోలీస్‌లకు కూడా కాల్ చేసినం’

‘వాళ్ల ఫ్రెండ్స్‌కి ఎలా తెలిసింది?’

‘పోలీసోలొచ్చిన తర్వాత కిందపడ్డాయన జేబుల్నించి సెల్ దీసి అందులనుంచి ఎవరెవరికో కాల్ చేసిండ్రు. అండ్ల వాళ్ల ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు’

‘కావచ్చు.. ఎందుకంటే ఓ అయిదారుగురు బుల్లెట్ బండ్లేసుకొని వచ్చిండ్రు గాంధీవేలనే ఉన్న లూథర్‌కింగ్ పబ్‌కెంచి’ గుంపులోని ఇంకో అతను చెప్పాడు.

‘నీకెలా తెలుసు వాళ్లు లూథర్‌కింగ్ పబ్‌నుంచే వచ్చారని.. వాళ్లు సంజయ్ ఫ్రెండ్సే అని!’ రిపోర్టర్ కొనసాగించింది.

‘ఆ వచ్చినోళ్లు పోలీసోళ్లతో చెప్తుంటే విన్నా..  ఇప్పటిదాకా మాతోనే ఉన్నాడు సర్.. లూథర్‌కింగ్ పబ్‌లో! ఇందాకనే ఏదో ఫోన్ వచ్చిందని బయలుదేరాడు అనిల్‌తో కలిసి’ అని’’ చెప్పాడు.

ఇంచుమించు అలాంటి ప్రశ్నలనే తిరగేసి.. మరగేసి ఇంకో అయిదుగుర్ని అడిగింది. అందులో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. పెద్ద శబ్దం వస్తే బయటకు వచ్చి చూశామని అప్పటికే అతను కిందపడిపోయి ఉన్నాడని… అంతకుమించి తమకేం తెలియదని చెప్పారు.. మైక్ పెట్టనీయకుండా.. కెమెరా వైపు చూడకుండా!

రిపోర్టర్  మైక్ తీసుకొని వెంటనే కెమెరా వైపు తిరిగి ‘డిసెంబర్ థర్టీఫస్ట్ ఒంటి గంట రాత్రి గాంధీవే ఫుట్‌పాత్ దగ్గర జరిగిన యాక్సిడెంట్‌కి వీళ్లు ప్రత్యక్ష్య సాక్షులు. ఈ సాక్షులు చెప్తున్నది వింటుంటే ఆ రాత్రేదో మాయా జరిగినట్టు.. ఫుట్‌పాత్‌కి కాళ్లు.. ఆ కాళ్లకు చక్రాలు మొలిచినట్టు.. అదే సంజయ్ కారును ఢీకొట్టినట్టు తేలుతోంది. ఆ రాత్రి వీళ్లు తప్ప ఇంకెవరూ అక్కడ లేరు.. న్యూ ఇయర్‌సెలబ్రేషన్స్ జరిగే సమయం.. కుర్రకారుకు హుషారు ఎక్కువై ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నా పోలీస్ పెట్రోలింగ్ లేదు. దాంతో ఈ యాక్సిడెంట్‌కి ఇంకో విట్నెస్ లేకుండా పోయింది. ఏమైనా ఈ యాక్సిడెంట్ మిస్టరీ వీడే ఛాన్సే లేక ఈ ‘హిట్ అండ్ కిల్’ కేసు ఎక్కడ మొదలైన ఫుట్‌పాత్ అక్కడే ఆగిపోయిన చందంగా ఉండేట్టుంది. టీవీ 101 కోసం కెమెరామేన్ రాంబాబుతో గంగాభవాని’ అంటూ గబగబా పీస్ టు కెమెరా ప్రెజెంటేషన్ ఇచ్చేసింది   రిపోర్టర్.

‘మనం ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు సర్’ అని ఎస్‌ఐతో హెడ్ అంటుంటే టీవీ 101 ఛానల్ వ్యాన్ రేజ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. అది వదిలిన పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ఎస్‌ఐ అండ్ టీమ్.

———————————————————

ARIF6‘చనిపోయారు కదా.. .. గొడవ పెద్దగానే ఉంటది’ లాయర్ అంటున్నాడు.

‘బలిసినోళ్ల ప్రాణం కదా సర్ తీపిగానే ఉంటది. ఆ రోజు ఈ నా కొడుకులే తప్పతాగి ఫుట్‌పాత్ మీదున్న మా వాళ్ల మీదకు కార్‌ను తోలినప్పుడు   వాళ్ల అయ్యలకు తెల్సుంటే బాగుండేది సర్ మాలాంటోళ్ల ప్రాణాలు కూడా అంతే తీపిగా ఉంటాయని’ గోపాల్ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.. పూడుకుపోయిన దుఃఖంతో గొంతు పెగలట్లేదు.

తెల్లవారి… ఏడు గంటలకు  కాలనీ పార్క్‌లో … రిటైర్డ్ పర్సన్స్ ఇద్దరూ మార్నింగ్ వాక్ చేస్తూ…

‘ఫుట్‌పాత్ మనుషుల్ని చంపడమేంటి? అందులో ఏ ఫుట్‌పాత్‌కి సంబంధించి హిట్ అండ్ రన్‌లో నిర్దోషులుగా తేలారో వాళ్లను’ ఆశ్చర్యం, అనుమానంతో అన్నాడు.

‘ఆశ్చర్యమేముంది సర్.. చుండూరు కేసులో దళితులే వాళ్లను వాళ్లు చంపుకొని గోతాముల్లో కుట్టుకుని చెరువులోకి దూకగలిగినప్పుడు,  హిట్ అండ్ రన్ కేసులో ఫుట్‌పాత్ మీద పడుకున్న వాళ్లను ఫుట్‌పాతే పొట్టనపెట్టుకోగలిగినప్పుడు.. హిట్ అండ్ కిల్ కేసులో ఫుట్‌పాతే యాక్సిడెంట్ చేయడంలో ఆశ్చర్యమేముంది? వింతేముంది సర్!’ తేలిగ్గా చెప్పేశాడు ఇంకోతను.

అయోమయంగా చూస్తూ  అతన్ని  అనుసరించాడు మొదటి వ్యక్తి!

*

 

 

 

 

అసంపూర్ణం….

 

-మేడి చైతన్య

~

chaitanya mediనేను ఏదైన విషయం చెబితే అది వెంటనే దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. అదే విషయాన్ని రాస్తే అప్పుడు కూడా అలాగే జరుగుతుంది, కాని కొన్ని వేళలలో దానికి కొత్త అర్ధం  విలువస్తుంది .

నిశ్శబ్దం రాజ్యమేలుతుండడంతో మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి.

ఒసే ఎక్కడున్నావే….వినిపిస్తుందా…ఏం చేస్తున్నావే?

అన్నంపెట్టవే…ఏయ్…నిన్నే?

ఎవరమ్మా?

ఇంకెవరురా…మీ పెదనాన్నే!

మంచంలో వెల్లకిలా పడుకొని అరుస్తున్నాడు. పెద్దమ్మేమో ఏమి పట్టనట్టుగా పొయ్యి రాజేసి ఆవెలుగులో తన చీకటిని కలిపివేస్తునట్టుంది.

ఎందాకని చేస్తుంది అది మాత్రం, ఈ రోజుల్లో మంచంలో ఏరుక్కుంటే శుభ్రంచేసే పెళ్ళాం లంజముండ ఎవత్తుంది చెప్పు? అన్నంపెడితే మళ్ళీ ఏమయ్యిద్దోని దాని భయం. ఐనా పెట్టింది తిని ఉండొచ్చు కదా,ఎందుకు ఊకే గొణగటం?

అమ్మమాటల్లో పెద్దమ్మ నిశ్చల ముఖమవతలి పార్శ్వం కనిపించింది.

మంచిగున్నప్పుడు రోజు కుల్లబొడిచేవాడు ఇప్పుడు తెలుస్తుంది అయ్యగారికి ఆమే విలువేంటో? మంచంలో నవిసి నవిసి చావొద్దూ! కోపంగా అనేసి నాన్న ఏమయిందో చూడ్డానికి వెళ్ళాడు.

“ముసలితనానికి అందరు ఇష్టమే నాన్న,నీవు కుడా దాని ప్రేమనుంచి తప్పించుకోలేవు.”

అయినా ఏముందిరా చిన్నోడా, డబ్బా?….పొలమా? రెక్కల మీద బతికేటోళ్ళు. పాపం పెద్దోడికి ఇద్దరు ఆడపిళ్ళలేనా, నడిపోడేమో లారీక్లీనరాయా (ఏదేశాలుతిరుగుతున్నాడో ఏంటో), ఆఖరోడేమో పని,పాట లేకుండా చెడు సావాసాలు.ఉన్న ఒక్కదాన్ని ఈయనే ఒక అయ్యచేతిలో పెట్టిండు. వాళ్ళడొక్కే నిండట్లేదు, ఇంకేవరు ఈయన్ని దవఖనకు తీస్కపోతరు చెప్పు?

కళ్ళ ముందు మనిషి చనిపోతుంటే ఏం చేయలేమా అమ్మ?

అందరం ఎలాగోలా బ్రతకాలనే కోరుకుంటం.మరణమే దిక్కయినపుడు,అదే తొందరగా రావాలని ఎదురుచూస్తున్నాం!

‘బతుకులోనే కాదు చావులో కుడా బాగుకోరవచ్చునేమో!’

చిన్నోడా ఎప్పుడొచ్చావురా, రెండు రుపాయిలుంటే ఇవ్వరా, బీడీలు కొనుక్కుంటా అని అడుగుతుంటే, చిన్నప్పుడు బొందలగడ్డల దగ్గర బొంగుపేలాలు ఇంకొన్ని పెట్టు పెదనాన్న అని బేలగానే పెట్టిన మొహమే నాకు ఇప్పుడు కనిపించింది.

ఐనా నేను కొనిచ్చే ఈ రెండు బీడీల వల్ల పెదనాన్న బాధతీరుతుందా?

నేనేం చేయలేనా? మనిషి పుట్టుకపుట్టినాక ఇంకొకమనిషికి సాయం చేయలేనా? అసలు నా జీవితానికి ఏమైనా అర్దం ఉందా? ఏమి చేయాలో తెలియని సందిగ్ధస్థితి?

తర్వాత చాల రోజులకు పెదనాన్న చనిపోయాడని చెప్తే, కాదు మీరే చంపేశారన్నా!నన్నెందుకు ఆ క్షణం మినహాయించుకున్నానో తెలీదు, బహుశా బీడీలు కొనిచ్చాననే భరోసా ఏమో?

ఆలోచనలలో పడి ఎప్పటిలాగే ఏమిపట్టనట్టుగా ఎటో చూస్తూ వర్షం వస్తోందనే సంగతే గమనించలేదు! కోపంగా నన్ను తిట్టుకొని కిటికి వేసేంతవరకు నా పక్కన ఒకతను కూర్చున్నాడనే గుర్తించలేదు.

చలికాలంలో వానేంటనే చెత్తప్రశ్నలడగకుండా, కిటీకిలోంచి ఆవల బస్టాండు వైపు చుశా.మూలగా బొంతేదో కదులుతున్నట్టుగా ఉంది. వానలో తడవకూడదని చాలా మంది బస్షెడ్డులోకి వస్తుంటే, తనుమాత్రం తలదాచుకుంటుదక్కడే అనుకుంటా!

రెండు మూడు రోజులు గమనించినా తనెవరో తెలియలేదు. తీరా ఒక రోజు తన మొహం కనిపించింది. ఆనందం, బాధ ఎరుగని అవ్యక్తభావమేదో ముఖంలో దాచుకున్నట్టుంది తను. బొంతే తన సర్వస్వమన్నట్టు దానిని విడిచిపెట్టదెప్పుడూ, అయినా వాళ్ళ కొడుకులని ఎలా విడిచిపెట్టిందో మరి!

ట్యూషన్డబ్బులొస్తే తనకేమయినా ఇవ్వాలనుకొని రెండు  నెలలు గడిచాయి.ఈ రోజు డబ్బులొస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొనిపోవాలని నిశ్చయించుకున్నా.

అరటిపళ్ళు తీసుకొని బస్సెక్కా. ఎలా ఇవ్వాలనే ఆలోచనలలో మునిగిపోయి, వేరే బస్టాప్లో దిగి, తను ఉన్న బస్టాండ్వరకు నడుచుకుంటూ వెళ్ళా!

ఎవరో ఇద్దరు ఏదో బస్కోసం ఎదురుచుస్తున్నారు. వాళ్ళుండగా ఇవ్వడానికి నాకెందుకో ధైర్యం సరిపోలేదు(ఎక్కడ చూసేస్తారేమోనని భయమనుకుంటనేమో!)

ఒక పావుగంట నా దేహాన్ని దోమలకు వదిలేసి, ఆకాశంలో నక్షత్రాలను లెక్కెట్టం మొదలెట్టా!

నేను తనే మిగిలాం! లోకమేమీ పట్టనట్టుగా నిద్రపోతూనే ఉందితను. ధైర్యం చేసుకొని సంచీ తన కాళ్ళ దగ్గర పెట్టేసి వెనక్కి తిరగకుండా వచ్చేశా!

అనందం ఏంటో తెలియకపోయినా, గుండెల్లో బరువేదో తగ్గినట్టుంది.

మర్నాడే తనేం చేస్తుందోనని ఆ బస్టాప్లో దిగి ఒక పక్కగా నిశ్శబ్దంగా కూర్చున్నా. పక్కన కూర్చున్న వాళ్ళెవ్వరు తననేమి పట్టించుకోకపోయినా ఏదో చెప్పుకుంటూ పోతూంది. రాత్రి క్రిస్మస్తాత తన దగ్గర కొచ్చి ఆకలి తీర్చాడని, తన్ను కంటికి రెప్పలా తనే కాపాడతాడని, ఇంకా అర్ధము కాని మాటలేవో చెప్పుకుంటూ పోతూంది.

ఇరవై  ఏళ్ళ నిన్ను అప్పుడే తాతని చేసేసిందని తన బొంత నన్ను వెక్కిరిస్తునట్టు చూస్తోంది. కన్నీటి చుక్కొకటి సమధానమయిందిదానికి………

తన బొంత బస్టాండు మీద వేలాడుతూ కనిపించింది తర్వాతిరోజు. వచ్చేటప్పుడు కుడా తను కనిపించలేదు. చాలా రోజుల వరకు తను కనిపించలేదు. చాలా సార్లు ఆ బొంతతో మాట్లాడాలని ప్రయత్నించా, తనెక్కడికి వెళ్ళిందో తెలుస్తుందేమోనని! బొంతకున్న చిరుగు నా ఆరాటాన్ని చూసి బహుశా నవ్వుకుందేమో!

ఇవాళ బస్సెక్కిన దగ్గరనుంచి ఆ చిరుగుల పడిన బొంతే కనిపిస్తుంది. తను ఏమైయుంటుందబ్బా అని ఆలోచించా. ఆశగా ఎదురుచూస్తున్న ఆబొంతను చూసి ఒక కథ రాసేద్దామనుకున్నా. మరుక్షణమే తన గురించి పట్టించుకోకుండా కథలు రాయాలన్న నా కమర్షియల్బుద్ధిని తిట్టుకొన్నా.

ఒకవేళ తను చనిపోయిందేమో?

నేను ఇంకేమైనా చేసి ఉండాల్సిందేమో?

పెదనాన్న చావుని ఏమి చేయలేని స్థితి అనే సాకుతో నన్ను దోషిగా ఊహించుకోలేదు ఇప్పుడు మాత్రం నేను తప్ప దోషిగా ఆ చిరుగుకి ఎవరూ కనిపించరేమో! బహుశా నా వల్లే తను చనిపోయిందేమో! అరడజను అరటికాయలిచ్చి నా జీవితానికి అర్ధం దొరికిందని సంబరపడ్డానేమో! నే చేసిన పనులన్ని అసంపూర్ణంగా ఇప్పుడనిపిస్తున్నాయి. నా జీవితమే అసంపూర్ణంగా తోస్తుంది నాకు.

మనిషికంటూ ఒక విలువుందని నమ్మేలోపు, ఆ విలువేదో ఈ జీవితంలో తనకు తానుగా తెలుసుకోలేడనే చేదు నిజం ఎదురవుతుంది. పరిపూర్ణతను ఎప్పుడు కాంక్షిస్తామో అప్పుడే జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. మనిషే అసంపూర్ణమేమో!

చేతనమున్న దేని విలువయినా దాని ఆంతర్యంలో దాగదు. దాని శరీరం, ఆలోచనలు చేరుకోలేనంత దూరంగా దాని విలువ దాగుంటుంది. జీవితానికే ఏదయినా విలువుంటే అది ఈ లోకపు సరిహద్దుల ఆవల ఉంటుంది. లోకపు ఎల్లల అవల గురించి మాట్లాడాలంటే మనం భాషా పరిమితులను దాటిపోవాల్సిందే! నిర్దిష్టమైన ఆధారమేది లేని ఆ భావన కోసం వెదుకులాడకుండా, ఎల్లల లోపలున్న జీవితాన్ని అంతర్ముఖంగా పరిశీలన చేసుకుంటే, జీవితం పట్ల విరక్తి పోతుందేమో!

దూరంగా మబ్బుల మీద చిరుగులబడిన బొంతేదో నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది.

అకస్మాత్తుగా బస్సెందుకో ఆగింది. కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా టికెట్ చెకింగ్ స్క్వాడ్ ఉంది.

అప్పుడు గుర్తొచ్చింది, నేను బస్సెక్కి చాలా సేపయిందని, జేబులో టికెట్టుకి సరిపడా చిల్లర తప్ప మరేమిలేవని!

 సగంమనిషి

 

-రవి బడుగు

~

photo2630‘సగంమనిషి’ నా రెండో కథ. మొదటికథ ‘వరదగూడు’ వంగూరి ఫౌండేషన్ ఉగాది కథలపోటీల్లో మొట్టమొదటి రచన విభాగంలో బహుమతి అందుకుంది. సినిమాల్లో చించేద్దామని వచ్చి.. ప్రస్తుతం సీనియర్ సబ్ ఎడిటర్ గా టీవీ 9లో పనిచేస్తున్నా. హెచ్ఎంటీవీ, జీ 24గంటలులో గతంలో పనిచేశా. సొంతూరు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం మూలవారిపల్లె. త్రిపుర, తిలక్, కేశవరెడ్డి అభిమానరచయితలు. 

*

టీకప్పులోంచి పొగలు. సాసర్ లోకి వంచా. మూసీలో మురికినీళ్లు గుర్తొచ్చాయి. తాగాలనిపించలేదు. సాసర్ ని పక్కకి నెట్టి బేరర్ ని పిలిచా. డబ్బులిచ్చేసి బ్యాగ్ తీసుకుని బైటకొస్తుంటే.. ప్రొప్రయిటర్ డెస్క్ లోంచి రెండు కలువలు. ఐ లైనర్ మధ్యలోంచి నవ్వుతున్నాయి. టీ తాగినట్టనిపించింది.

ఎటెళ్లాలి..?

హాస్టల్ కి వెళ్లే మూడ్ లేదు. మూసీ వైపు తీసుకెళ్లాయి కాళ్లు. బ్రిడ్జి అంచునకూర్చుని వచ్చీపోయే వాహనాలు చూస్తున్నా. మధ్యమధ్యలో కేఫ్ వైపు కూడా.

ఇంకెంత సేపు ఎదురుచూడాలో.?

తనొచ్చేదాకా తప్పదా..

అసలొస్తాడా.. ఆల్రెడీ వచ్చేశాడా.. మనుషుల మొఖాలన్నీ ఒకేలా ఉన్నాయి. వచ్చినా గుర్తు పట్టేదెలా..?

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బైట కొన్న పర్స్ తీసి చూసుకున్నా. ఐదొందల నోటు.. కొన్ని పదులు.. చిల్లర. సీన్ చివరికొచ్చేసింది. మళ్లీ జేబులో పెట్టుకున్నా.

కేఫ్ కి కాస్త దూరంలో ఉన్న హాస్టల్ వైపు చూశా. సిటీకొచ్చి వారం దాటింది. నిజానికి వచ్చినరోజే నరేంద్రని కలవాలి. వారం తర్వాత కలుస్తానన్నాడు.

బ్యాగ్ లోంచి సర్టిఫికెట్లు తీశా. మాస్టర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్. మాట్లాడ్డం రాకపోయినా డిగ్రీ వచ్చేసింది. జైలు నా జీవితాన్ని తినేసినా.. మాస్టర్ డిగ్రీ ఇచ్చింది.

ఫోన్ మోగడంతో సర్టిఫికెట్లు అలాగే బ్యాగ్ లోకి తోసి.. ఠక్కున పైకి లేచి కాల్ రిసీవ్ చేసుకున్నా. ఐదు నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. ‘ఒకే సార్’ అని చెప్పి.. కాసేపు అటూ ఇటూ రోమింగ్ చేశా. మళ్లీ వచ్చి బ్రిడ్జి అంచునే జారబడ్డా. టైమ్ పది దాటినా పెద్దగా ఎండ లేదు.. వానొచ్చేంత మబ్బుల్లేవు. వాతావరణం చిరాకులో ఉన్నట్టుంది.

కాసేపట్లో కేఫ్ దగ్గర హోండా సిటీ ఆగింది. లేచి వెళ్లా. విండో ఓపెన్ చేసి అటూ ఇటూ చూస్తున్నాడతను. నన్ను చూసి ఆగాడు. నా వైపు వేలు చూపించి..శివ.. అని అడిగాడు.

అవును సర్…

బ్యాక్ డోర్ ఓపెన్ చేయడంతో.. లోపలికెక్కి కూర్చున్నా.

తనేం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. నా కంటే రెండు మూడేళ్లు ఎక్కువ వయసుండొచ్చు. కానీ అంతకంటే తక్కువగా కనిపిస్తున్నాడు. ఆ వయసుకే ఓ టీవీ చానల్ ఎండీ.

రేర్ వ్యూ మిర్రర్ లో నన్ను నేను చూసుకున్నా. ‘శిరీష’ గుర్తొచ్చింది. కారు వీండోలోంచి వెళ్లిపోతున్న దృశ్యాల్లా.. ఒంగోలులో ఉన్నరోజులు కళ్లముందుకొచ్చాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా శిరీషతో పరిచయం. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే ఒంగోలులో ఓ ప్రైవేట్ జాబ్ లో చేరా. శిరీష వాళ్ల నాన్నని కలిస్తే.. పెళ్లి కుదరదన్నాడు. నిజం చెప్పాలంటే కులం కుదరలేదు. తనని నాతో తీసుకెళ్లిపోవాలనుకుని.. ఒకరోజు రాత్రి తనని కలవడానికి వెళ్లా. అంతకుముందు ఎన్నో సార్లు అలాగే కలుసుకున్నా తనని. ఆ రోజు అంతా రివర్సైంది. గోడ దూకేటప్పుడు.. పక్కింట్లోంచి ఒకాయన చూశాడు. దొంగా దొంగా అంటూ పట్టుకోబోతుంటే.. పక్కనే దొరికిన కర్రతో ఒక్కటిచ్చి పారిపోయాను.

మరుసటి రోజు సాయంత్రం పోలీసులు నేరుగా మా ఆఫీస్ కొచ్చారు. రాత్రి నేను కొట్టిన వ్యక్తి చనిపోయాడంట. ఒక్కరోజులో అంతా తల్లకిందులైపోయింది. దొంగతనానికొచ్చి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశానని కేసు. శిరీష వాళ్ల నాన్నే సాక్ష్యం చెప్పాడు. తను నన్ను చూశానని. ఆ కాలనీలోని వాళ్ల కులపోళ్లంతా నా కేసుని ఓ ఉద్యమంగా మార్చారు. వాళ్ల చేతిలోని మీడియా నన్నో నరరూపరాక్షసుడిగా రాసింది. కోర్టులో నేనేం మాట్లాడలేకపోయాను. కావాలని తనని చంపలేదని.. తప్పించుకోడానికి మాత్రమే కొట్టి పారిపోయానని మాత్రమే చెప్పగలిగాను. ఓ మనిషి ప్రాణం తీశానన్న బాధో, పోలీసులు కొట్టిన దెబ్బల భయమో అంతకుమించి నన్ను మాట్లాడనివ్వలేదు. వీటన్నిటి కంటే మా అమ్మ కన్నీళ్లు నన్ను మరింత మౌనంగా మార్చాయి.

కులపంచాయతీ ముగిసి చివరికి తీర్పొచ్చింది.

ఏడేళ్లు.. ఏడు యుగాలు..

జైల్లో నేరస్తుల మధ్య నన్నో హాఫ్ క్రిమినల్ గా చూసుకునేవాణ్ని. అక్కడున్నవాళ్లు చేసిన నేరాలు, వాళ్లనుభవిస్తున్న శిక్షలు విన్నప్పుడల్లా.. నేను చేసిన పని పదేపదే గుర్తొచ్చేది. కొన్ని సార్లు నాకు సరైన శిక్షే పడిందనిపించేది. మరికొన్ని సమయాల్లో అసలు నేను తప్పు చేశానా అనిపించేది. కోర్టులకు అసలు నేరస్తుల్ని శిక్షించేంత అర్హత ఉందా.. ఎలాంటి ప్రభావాలకూ లొంగకుండాతీర్పులిచ్చే న్యాయమూర్తులుంటారా.. జవాబుల్లేని ఇలాంటి ప్రశ్నలెన్నో..! నిద్రలో ఉలిక్కిపడి లేచేవాణ్ని. ఒక్కోసారి నా కేసులో తీర్పు మార్చేసి ఉరితీస్తున్నట్లు కలొచ్చేది. మరోసారి కేసు రద్దుచేసి విడుదల చేస్తున్నట్టు. రెండిట్లో ఏది జరిగినా బాగుండనిపించేది. రెండూ జరగలేదు.

‘పోరాడేశక్తి ఉన్నవాళ్లు పైకోర్టుల్లో బేరమాడుతున్నారు. బేరమాడే శక్తి ఉన్నవాళ్లు నాణ్యమైన తీర్పు, నచ్చిన తీర్పు వచ్చేవరకూ పోరాడుతున్నారు. కోర్టుల్నే కొనేవాళ్లు తీర్పుని జీవితకాలం వాయిదావేయించుకుంటున్నారు. నాలాంటి ఏ కొందరో తీర్పుకి తలొంచుతున్నారు’.

జైల్లో పరిచయం అయిన చాలామంది.. వాళ్లు విడుదలయ్యేటప్పుడు, బైటకొచ్చాక కలవమని అడ్రస్ లు, ఫోన్ నంబర్ లు ఇచ్చేవాళ్లు. తెలిసో తెలియకో ఓసారి ఈ ప్రపంచంలోకి వచ్చా.. మళ్లీ ఇటు రాకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నా. జైలు నుంచే డిస్టెన్స్ లో పీజీ చేశా. విడుదలవడానికి కొద్దిరోజుల ముందు యాదగిరితో పరిచయమైంది. స్మగ్లింగ్ కేసులో జైలుకొచ్చాడు. తనే నరేంద్ర గురించి చెప్పాడు. హైదరాబాద్లో ఓ టీవీ చానల్ నడుపుతున్నాడని.. వెళ్లి కలవమని ఫోన్ నంబర్ ఇచ్చాడు.

‘హలో..’ అన్న పిలుపుతో నేనెక్కడున్నానో గుర్తొచ్చింది.

చేతులతో ఏదో మాట్లాడుతున్నాడు.. దిగమన్నట్టు.

కారు ఓ ఫామ్ హౌస్ ముందు ఆగి ఉంది. తను ముందు వెళ్తుంటే ఫాలో అయ్యా. లోపలకెళ్లాక కూర్చోమని సోఫా చూపించాడు. కేఫ్ దగ్గర్నుంచి చూస్తున్నా.. తను నాతో నోటితో మాట్లాడ్డం లేదు. చేతులతోనే సైగలు చేస్తున్నాడు. నాస్థాయి చూపించాలనో.. తన హోదా చూపించుకోవాలనో తాపత్రయం. నన్ను ఆఫీస్ కు కాకుండా ఇంతదూరం ఎందుకు తీసుకొచ్చాడో అర్ధం కావడం లేదు. బ్యాగ్ తీసి ముందుపెట్టుకున్నా. సర్టిఫికెట్స్ కోసం జిప్ తీయబోతుంటే..

నరేంద్ర మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ‘యాదగిరితో మాట్లాడాను. నీ గురించి చెప్పాడు. అసలిది.. తనే చేయాల్సిన పని..’

బ్యాగ్ జిప్ తీయడం ఆపేశా.

‘నీకు తెలిసిన పనే’. ఒక్కక్షణం ఆగాడు.

‘కాకపోతే అప్పుడు ఒక్కరు.. ఇప్పుడు ఇద్దరు.. నిజానికి ఒకటిన్నరే..’ వేళ్లతో మళ్లీ సైగ.

తనని తొలిసారి స్పష్టంగా చూశా. ముఖంలో తోడేలు పోలికలు. నవ్వుతున్నాడు కానీ అదేదో వికృతంగా అనిపించింది.

నాలో ఏ భావమూ లేదు. అలా చూస్తుండిపోయా.

తనే మళ్లీ.. ‘పెద్ద కష్టమేం కాదు’. టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకున్నాడు.

‘డర్టీ బిచ్.. నన్నే మోసం చేస్తుందా..’ వాటర్ తాగి నావైపు చూశాడు. తన కళ్లలో ఎరుపుజీరలు. వెంటనే నవ్వు. లేచి అటూ ఇటూ రెండడుగులేసి.. ఓ స్లిప్ నాముందు పెట్టాడు.

‘నా ఇంటి అడ్రస్. కింద పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ బెడ్ రూమ్’.

నా కళ్లలోకి సూటిగా చూస్తూ.. ‘దొంగతనానికి వచ్చినట్టుండాలి.. పని జరిగిపోవాలి’.

అంటూ వేగంగా లోపలికెళ్లి వెంటనే తిరిగొచ్చాడు.

నా ముందున్న అడ్రస్ స్టిప్ పై.. రెండు ఐదువందల నోట్ల కట్టలు పెట్టాడు. లక్ష రూపాయలు.

‘అంతా ఓకే అయ్యాక మళ్లీ కనిపించు’.

ఒక్కసారి నరేంద్రవైపు చూశా. వెంటనే స్లిప్ తో పాటు నోట్లకట్టలు తీసుకున్నా.. బ్యాగు జిప్ తీసి సర్టిఫికెట్ల పక్కనే సర్దేశా.

ఏదో విరిగిపోతున్న చప్పుడు.. మనస్సు అనుకుంటా..!

తను మళ్లీ మాట్లాడలేదు. రెండు నిమిషాల తర్వాత మళ్లీ కారులో బయల్దేరాం. అరగంట తర్వాత కేఫ్ దగ్గర దించేశాడు. తనవైపు చూడకుండానే దిగేశా. వెంటనే కారెళ్లిపోయింది నామీదకి పొగచిమ్ముతూ..

టైమ్ మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది. నేరుగా హాస్టల్ కెళ్లి నా గదిలో పడుకున్నా. రూమ్ మేట్స్ పేకాడుతున్నారు. ఒకతను మాత్రం స్క్రూడ్రైవర్ తీసుకుని సీపీయూతో కుస్తీ పడుతున్నాడు. కాసేపు పడుకుందామంటే నిద్రపట్టడం లేదు. అమ్మ గుర్తొచ్చింది.

‘జైలు నుంచి రిలీజయ్యాక నేరుగా ఇంటికెళ్లా. నెలకోసారి జైలుకొచ్చి చూసే అమ్మకి నేనేం కొత్తకాదు. నాకు మాత్రం ఆ వాతావరణం కొత్తగా అనిపించింది. రెండు రోజులు కూడా ఉండలేకపోయా. ఒకప్పుడు నాకు బాగా తెలిసిన మనుషులే.. నన్ను వింతగా చూస్తున్నారు. వాళ్లు నన్ను దూరం పెడ్తున్నారో.. నేనే దూరంగా ఉంటున్నానో అర్ధం కాలేదు. అక్కడ ఉండలేనని స్పష్టంగా అర్ధమయ్యాక.. హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నా. జాబ్ చూసుకున్నాక తననీ తీసుకెళ్తానని చెప్పా. నమ్మకం కనిపించలేదు అమ్మలో. ముభావంగానే వెళ్లిరమ్మంది. ఇక్కడికొచ్చాక తొలి ఫోన్ నరేంద్రకు చేశా. తను లేటవుతుందని చెప్పాక.. డిగ్రీలో నాక్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నారని తెలిసి, వాళ్లని కలవడానికి ప్రయత్నించా. ఒకడు ఫోన్లో నా పేరు విన్నవింటనే కట్ చేశాడు. మరొకడు చాలాసేపటి తర్వాత గుర్తుపట్టాడు. ఆరోజే తనని కలిశా. జాబ్ అన్నమాట విన్నతర్వాత వాడి మాటతీరులో మార్పొచ్చింది. సరే చూస్తానన్నాడు కానీ, మరుసటిరోజే నంబర్ మార్చేశాడు’.

chinnakatha

నరేంద్ర ఇచ్చిన అడ్రస్ స్లిప్ చేతిలోకి తీసుకున్నా. ‘మనిషిని చంపగలనా నేను. అందులోనూ స్త్రీని. అసలు డబ్బుతో పారిపోతే. ఏం జరుగుతుందో తెలుసు. మళ్లీ జైలుకే’. ఇక నిద్ర రాదనిపించింది.

స్లిప్ పర్స్ లో పెట్టుకుని హాస్టల్ నుంచి బైటకొచ్చా. మరో రెండు గంటల్లో అడ్రస్ పట్టుకున్నా. తను చెప్పిన ఆనవాళ్లున్న బిల్డింగ్ చుట్టూ రెండు రౌండ్లు కొట్టా. మనుషులెవరూ కనిపించలేదు. తిరిగి హాస్టల్ కొచ్చా.

రాత్రి పదకొండుదాటింది. గదిలో కంటే నాలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుంది. సీపీయూ పార్ట్స్ పక్కనే ఉన్న స్క్రూడ్రైవర్ తీసుకున్నా. మరో గంటలో నరేంద్ర ఇంటిముందున్నా. వర్షం వస్తుందేమో అన్నట్టున్నవాతావరణం చీకటిని మరింత చిక్కగా చేస్తోంది.

మెయిన్ గేట్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లా. ఫస్ట్ ఫ్లోర్ లో అడుగుపెట్టా. ఎడమవైపున్న గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. డోర్ తీసే ఉంది. చప్పుడు చేయకుండా లోపలకు అడుగుపెట్టా. ఇద్దరూ నిద్రపోతున్నారు. మొదట నా చూపు బెడ్ మీద నిద్రపోతున్న పాపపై పడింది. ఆరేళ్ల వయసుంటుందేమో. మసక వెలుతురులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకో దగ్గరనుంచి చూడాలనిపించి కిందికివంగా. అద్దంలో నన్ను చూసుకున్నట్టు అనిపించింది. రెండు క్షణాల తర్వాత తల పక్కకి తిప్పా. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతున్న సెన్సేషన్.

”శిరీష”

నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. కళ్లు తిరుగుతున్న భావం. వెంటనే వెనక్కి తిరిగా. గదిలోంచి వేగంగా బైటకొచ్చేశా. మరో ఆలోచన లేకుండా దూరంగా పారిపోవాలి. మెట్ల వైపు వెళ్లేంతలో.. ఎదురుగా నరేంద్ర. ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు. మరుక్షణం నా చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ నరేంద్ర కణతలోకి దూసుకుపోయింది. అంతే వేగంతో స్క్రూడ్రైవర్ బైటకు లాగి పరుగులాంటి నడకతో మెట్లుదిగి బైటకొచ్చా. క్షణాల్లో చీకట్లో కలిసిపోయా. లోపల్నించి అరుపులు వినిపిస్తున్నాయి. బైట వర్షం మొదలైంది.

 

రెండునెలల తర్వాత మూసీనది పక్కనే ఉన్న ఓ పార్క్ లో..

దూరంగా బెంచ్ పై కూర్చునుంది శిరీష. ప్రపంచంతో సంబంధం లేకుండా పాప ఆడుకుంటోంది. తననే చూస్తుండిపోయా. చిన్నప్పుడు నేనెలా ఉండేవాడినో అమ్మ చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి..!

 

*స్టోరీ నెవర్ ఎండ్స్*

చీకటి నీడలు

 

-మధు పెమ్మరాజు

~

Madhuగడియారం చప్పుడు తప్ప వేరే అలికిడి లేదు, ఫ్లోర్లో అక్కడక్కడా వెలుతురు ఉండడంతో అంతా అస్పష్టంగా ఉంది. నా క్యూబ్ పైన బల్బు మొహమాటంగా వెలుగుతోంది. కదలికని బట్టి వెలగడాన్ని కంపెనీ ఆటోమేషన్ ఇన్నోవేషన్ అంటుంది, ఊపిరి తీసుకోవడం కదలిక కాబట్టి బల్బు వెలుగుతోందని నేను అనుకుంటాను. గత కొన్ని నెలలుగా అలసిన మొహాలు ఒక్కొక్కటీ మాయమయి, బెదురుగా చూసే లేత మొహాలు వస్తున్నాయి – కంపెనీ అవుట్సోర్చింగ్ అంటోంది. ఈ వెలుగు నీడల పరదాలో నేను అనామకుడిగా మారిపోయాను. అనేక భయాలకి ఇంకో కొత్త భయం జత చేరింది – టిక్..టిక్…మంటూ ముల్లు వేగం పెరిగే కొద్దీ బల్బు ఆరుతుందని భయమేస్తుంది, అప్పుడు ఓ రెండడుగులు వేసి కూర్చుంటాను.

రోజూ తలెత్తకుండా పని చేసేవాడిని ఏదో వెలితిగా అనిపించి కీబోర్డ్ పక్కన పెట్టాను, కాసేపటకి కంప్యూటర్ స్క్రీన్ సేవర్ కూడా కదలడం మానేసింది. పక్క క్యూబ్లపై ఆండ్రూ, జాక్, షెల్లీ, ఆలన్ పేర్లు ఇంకా అలానే ఉన్నాయి, వారి నేమ్ ప్లేట్లని ఆప్యాయంగా తడిమాను. నా పలకరింపు వారి దాకా చేరుతుందని భ్రమ. ముప్పై ఏళ్ళ స్నేహాలు వెంట, వెంటనే విడిపోయాకా మా ఫ్లోర్ పక్షులు లేని చెట్టుగా మారింది.

ఒకప్పుడు నా ఈ స్థావరం విశాలంగా, గుండెల నిండా ఊపిరి పీల్చుకునేలా ఉండేది. ఏళ్ళు గడిచిన కొద్దీ ఇరుకుతనం పెరిగింది, ఉద్యోగం నా అస్తిత్వం నుండి జీతం కోసం పని చేస్తున్నాను అనేదాకా చేరుకుంది. క్యూబ్ గోడలపై వెలిసిన నీలం రంగు గుడ్డ, టేబుల్ పై బరువైన నల్లటి ఫోను, పక్కన జెన్నీ పెళ్లినాటి ఫోటో.. జెన్నీ అన్నీ చూస్తున్నట్టుగా నవ్వుతోంది….నా పిచ్చి గానీ అంత దూరం నుంచి ఎలా చూస్తుంది? పక్కన బేస్బాల్ బాట్ పట్టుకుని రిచ్చీ, ఎంత ముద్దుగా ఉన్నాడో – చదువులు ముగించుకుని కాన్సస్ వెళ్ళిపోయాడు.

“బాబూ! నీ పాత ఫోటోలు చూసి, చూసి విసుగొస్తోంది. కాస్త మార్చు” అంటూ షెల్లీ ఆట పట్టించేది. షెల్లీకి చెప్పినా అర్ధం కాదు…జెన్నీ నవ్వు ఎన్ని సార్లు చూసినా మొదటిసారి చూసినట్టే ఉంటుంది. గోడ చుట్టూ ఫ్రేముల్లో కంపెనీ ఇచ్చిన సర్టిఫికేట్లు – ఓ రోజు జాక్ సర్టిఫికేట్లు లాక్కునంత పని చేసాడు, సొంత ఖర్చుతో అందమైన ఫ్రేములు కట్టించి – “విలువైన ప్రశంశా పత్రాలని గాలికి, ధూళికి వదిలేయకూడదు, అందంగా బంధించాలి” అన్నాడు.

chinnakatha
షెల్లీ ఒక్క సంపాదనతో పెద్ద సంసారాన్ని నెట్టుకొచ్చేది, వెళ్ళిపోతున్న రోజు “జో..పని ఒక గౌరవంగా, పరువుగా భావించాను, కంపనీ మరో కుటుంబం అనుకుని పనిచేసాను. ఈ రోజు వాళ్ళు నన్ను నగ్నంగా నిలబెట్టారు..” అని వెక్కి, వెక్కి ఏడ్చింది. ఓ రెండు పేపర్ టిష్యూలు ఇవ్వడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను, వాచీ కేసి చూడబోతూ ఆగిపోయాను, గతం తలుచుకుంటే ముల్లు వేగం పెరుగుతుందా?

ప్రతి ప్రోడక్ట్ రిలీజ్ ఒక పండుగలా ఉండేది. అర్ధరాత్రి, అపరాత్రి అని చూసుకోకుండా నెలల తరబడి ఆఫీసులో మకాం వేసే వాళ్ళం- పిజ్జాలు, కాఫీలతో పాటు లెక్కలేనన్ని జోకులు భోంచేసేవాళ్ళం. రిలీజ్ ముగిసి, మా కాడ్ డ్రాయింగ్లకి రెక్కలొచ్చి ఎగురుతుంటే పిల్లాడు పుట్టినంత ఆనందంగా ఉండేది. ఆండ్రూ పదేళ్ళ పిల్లవాడిలా వచ్చి “జో.. చూడు.. టీవీలో చూడు..ఆ ఎగిరే విమానంపై మన సంతకం ఉంది” అని గోల చేసేవాడు. వెళ్ళే రోజు గోడపై ఇష్టంగా అతికించిన విమానాల పోస్టర్లని కోపంగా లాగి ముక్కలు, ముక్కలుగా చింపి చెత్త డబ్బాలో పడేసాడు. ఆ క్షణం మాట్లాడాలంటే భయం వేసింది.

ఆలన్ స్వతహాగా కవి, ప్రపంచ కవిత్వం చదివినవాడు. నిరాశ, విషాదం నిండిన కవిత్వమంటే ఆసక్తి చూపేవాడు. “ఆల్! నిత్యం మనని వేధించే సమస్యలు సరిపోవా? అవేవో అరువు తెచ్చుకుని మరీ ఏడవాలా?” అని విరగబడి నవ్వితే, జవాబుగా చిరునవ్వు నవ్వేవాడు. వెళ్ళే రోజు హౌస్మన్ కవిత చదివి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు.

చింత రువ్వ చెయ్యి చుర్రుమనిపించిందని
చేతిని పదిసార్లు దులుపుకున్నాను
కాని ఒకటి మాత్రం నిజం, అది తీవ్రంగా బాధించినా
విషాదం ముంగిట నిలిచిన క్షణం
రంగు, రంగుల లోకం చూపక
చేదు సత్యాల్ని చూపి మేలే చేస్తుంది.
నువ్వు నా స్థితిలో ఉన్నప్పుడు
నీ మనసుకి సాంత్వననిస్తుంది.
ఆ ఉరుములు మెరుపుల కాళరాత్రి
నీకొక స్నేహహస్తాన్ని అందిస్తుంది

ఎవరి పాత్రలు వారు సక్రమంగా పోషించి నిష్క్రమించారు, నేను అవసరాల బరువు మోస్తూ ఇంకా తెర ఎదుట ఉన్నాను.

ఆ మధ్యన ఆండ్రూ ఆరోగ్యం బాగోలేదని షెల్లీ చెబితే క్షేమ సమాచారం తెలుసుకుందామని ఫోన్ చేసాను. ఆండ్రూ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, మాటలు నీరసంగా ఉన్నాయి. కాస్త తేలిక పరుద్దామని ““ఆండీ! మీ అందరి పుణ్యమా అని నా పూర్తి పేరు మర్చిపోయాను. ఈ మధ్యన కంపనీ పంపే ప్రతీ ఈమెయిలులో నా పూర్తి పేరు ప్రస్తావిస్తున్నారు. నీకు కారణం తెలుసా?” అని నవ్వుతూ అడిగాను. ఆండ్రూ ఏదో చెప్పబోతుంటే నా పక్కగా ఏదో కదలికలా అనిపించింది. చీకటి నీడల్లో పాత పరిచయస్తుడు, సెక్యూరిటీ ఆఫీసులో పని చేసే కీత్ నిలబడ్డాడు. అతని వాలకం చూస్తుంటే కొన్ని క్షణాల నుండి వేచి ఉన్నట్టు అనిపించింది.

ఫోన్ కింద పెట్టి “కీత్! ఏమిటి విషయం?” అని అడిగాను.

“ప్లీజ్ నాతో రండి” అన్నాడు.

విషయం అర్ధమయి జెన్నీ, రిచ్చీల ఫోటోలు బాగ్లో సర్దుకుని నిలబడ్డాను.

“దయ చేసి అవి టేబుల్ పై పెట్టేయండి” అని కాస్త కటవుగా అన్నాడు. మారు మాట్లాడకుండా ఫోటోలు టేబుల్ పై పెట్టి, అతని వెనకాల నడిచాను. కొన్ని అడుగులు దాటగానే క్యూబ్ పైనున్న బల్బు ఆరిపోయింది.

(To Jonathan)

భోక్త 

~ ఇంద్రగంటి మాధవి 
 
*

Madhavi indragantiఅసలు తను కిందటేడాదే అనుకుంది ఇలా చేద్దామని. సౌదీ అరేబియా కొడుకు దగ్గరకి వెళ్లి,  పిల్లల బలవంతం మీద మరో రెండు నెలలు వైశాఖం వరకూ వుండిపోయినపుడు. దేశమంతా ముస్లిమ్లైనప్పుడు, తెలుగువాళ్ళే  కష్టం, అందులో ఇంకా మనవాళ్లే తద్దినానికి దొరకాలంటే మాటలా…   పాపం వాడు కూడా తన ప్రయత్నం తానూ చేసాడుగా.. జెద్దా నుంచి రియాదుకి ఫ్రెండ్ ని పిలిపిద్దామని టిక్కట్టు కూడా కొన్నాడుగా … ఆఖరి నిముషంలో అతను దుబాయిలో మీటింగుందని రానంటే వీడు మాత్రం ఏం చేస్తాడు… కోడలూ మనవలూ తామేదో తప్పు చేసేసినట్లు ఎంత ఇదయి పోయేరు…

వదినా, రేపు అన్నయ్య తిథికి మొన్నటి మాటు వొచ్చారే, వాళ్లని పంపిస్తాను. మంత్రం కానిచ్చి, భోంచేసి పోతారు. సరేనా ?
నువ్వు ముందు కూరలు తే… పొద్దెక్కి పొతే ఎండ…
తొందరగా చెప్పకపోతే వాడు వేరెక్కడైనా వొప్పుకుంటాడు మరి…

భోజనం చేసి బాంకుకీ వెళ్లాలి. ముందు మార్కెట్టుకెళ్లి రా…

లేటైతే మనిషి దొరకడం కష్టం. ఆనక మీ ఇష్టం…
భోక్తల సంగతి తరవాత చూద్దాం…
సరే. నేవచ్చే సరికి తయారు గా వుండండి. బాంకుకెళ్లచ్చు…
కదలక పొతే వొదిలేట్లు లేదని అయిష్టంగానే కదిలేడు. అరవై అయిదేళ్లు వుంటాయేమో. వెడల్పాటి జరీ అంచు గోధుమరంగు పంచె. కుంకుడు గింజంత బొట్టు. మెడలో బంగారంతో చుట్టిన రుద్రాక్షలు. ఎర్ర రాయి చెవిపోగులు. చిన్న పిలక. ధృడంగా చేపాటి మనిషి. నాలుగిళ్ల అవతలుంటాడు.
వంట చేస్తూ కూర తరుగుతోంది. మొన్నపొలం కొలతలు తీయించాలని కరణం రమ్మంటే తను వెళ్లింది. రైతు ముంజెలు దించి ఇస్తూ  చెప్పేడు. ఈ ఏడాదీ మక్తా సగంలో సగవే ఇయ్యగలనని. మూడేళ్ళ బట్టీ వానలు లేవు మరి. బోరు నీళ్లు సగానికే వొస్తున్నట్లున్నాయి, మిగతా చెక్క ఎండిపోయి నెర్రెలు తీసింది. బొంబాయికి డైరక్టు బస్సు పడిందిగా, కొడుకులిద్దరూ కూలికి పోయేరు. వొస్తే ఏడాదికోమాటు వొస్తారేమో. ఆఖరు కొడుకునీ  టౌన్లో ఇంటరు మానేసి బొంబాయి పొమ్మంటే పోనంటున్నాడు… డాక్టరీ చదువుతాట్ట…  తిండికే కష్టంగా వుంటే, ఇంట్లో ఆడదాని కళ్లజబ్బు సంగతెవరిక్కావాలి… తన కొడుకుల వయసు వాడు… డొక్కలెండి పోయి శవంలా వున్నాడు…ముక్క సంగతి దేవుడెరుగు. ఇంత పప్పు ముద్ద కూడా రోజూ పడుతున్నట్లు లేదు.
టౌన్ మార్కెట్ నించి  తెచ్చిన కూరలన్నీ కుప్ప పోసేడు.
కాళ్లు కడుక్కో, భోం చేద్దువు గాని…
వదినా, భోజనం తరవాత, ముందు బాంకుకి పదండి…
—-
మానేజరుతో నేను మాట్లాడతాను. నువ్విక్కడే కూర్చునుండు…
వయసు మళ్లినా మనిషి సన్నగా నిటారుగా ధీమాగా వుంది. జేగురు రంగు జరీ చీరలో నిండుగా కప్పుకుని. మెడలో సన్నపాటి గొలుసు, చేతులకి ఓ జత గాజులు, చెవులకి చిన్న కమ్మలు. కూడా పూలు కుట్టిన చిన్న గుడ్డ సంచీ.
అతనికి కొంచం ఆశ్చ్యర్యం.
నాకిపుడు అయిదు లక్షలు కావాలి. మిగతా ఎఫ్ డీ లు మార్చి ఆర్నెల్లకోసారి లక్ష వొచ్చేటట్లుగా తిప్పి వెయ్యండి…
అంత కాష్ ఒకేసారంటే కష్టం. రెండు రోజులవుతుంది. తెప్పిస్తాను. ఎందుకంత కాష్?
చెప్పిందావిడ.
ఇప్పుడో లక్ష కాష్ తీసుకోండి. మిగతాది డీడీ ఇయ్యచ్చు…
అంత డబ్బెందుకు? రేపటి కార్యానికి కిందటి మాటొచ్చిన కుర్రాళ్లని రమ్మంటానొదినా…
పట్టు పంచె కట్టి భోజనానికి కూర్చుని అపోశన పడుతున్నవాడల్లా ఆగి ఫోనందుకుని.
ముందు భోంచెయ్యి. నీకిష్టమని దుంపలు వేయించేను. ఉట్టిపప్పూ, పులుసూ…
ఈవిడకి అర్ధం అవదేంటి..  తనకేమో అవతల బోల్డన్ని పనులు. అసలే మినిస్టరు గారింటికి కూడా పోవాలి. ఏడాది పాటు వాళ్ల పౌరోహిత్యం గుత్తకి దొరికేలా వుంది. భూమి పూజనుంచీ బారసాలల వరకూ, అన్ని కార్యాలూ. అధమం అయిదు పది లక్షలైనా వొస్తాయి, దానాలవీ పోనూ. వొదినగారు ఎంతకీ తేల్చదు…
కూరలో ఉప్పు సరిపోయినా చప్పగా అనిపించింది.
అవతల వాళ్ళందరూ వేరే కర్మో కార్యవో దొరికి పోతే, మరోణ్ణి వెతకలేక మనకే ఇబ్బంది వదినా…
మన రైతుకీ, అతని తమ్ముడికీ  చెప్పేను. రేపు రమ్మనమని …
వాళ్లెలాగో వచ్చి సాయంత్రం తినిపోతారుగానీ, భోక్తలకింద ఆ కుర్రాళ్లని పిలుస్తున్నాను …
ఇంకెవరూ అక్కర్లేదు. వాళ్లే భోక్తలు…
ఏవిటీ???
శూద్రాళ్లు భోక్తలేంటి? మీకేవైనా మతిపోయిందా? మజ్జిగాన్నం తినకుండానే ఉత్తరాపోశన పట్టేస్తూ.
నేను కిందటేడాదే అనుకున్నాను…
అసలీవిడ రియాదునించి రాగానే అడగ వలసింది. అన్నయ్య తిథి ఎలాచేసేరని? టీ వీ ఛానెల్లో  కొత్తగా కుదిరిన ప్రవచనం పనుల్లో పడి.. వాడున్నాడుగదా చూసుకుంటాడనుకుంటే… ఈ ముసల్దాని వాలకం చూస్తోంటే ఆ తురక దేశంలో ఏ దారేపోయ్యే దానయ్యకో తిండి పెట్టి అదే తిథనిపించి వుంటుంది.  గద్దించేడు. స్వరం మారుతోంది-
ఏమని? ఏం చేసేరక్కడ??
డ్రైవర్నీ, ఇంట్లో పనివాణ్ణీ రమ్మన్నాను. సుష్టుగా తిని వెళ్లేరు. చెరో అయిదొందల రియాళ్లు దక్షిణా, తాంబూలం… ఇది జరిగి ఏడాదయింది. నేనేం జిర్రున చీదలేదు…పైనున్న మీఅన్నగారి సంగతి మనకి తెలీదు…
తను ఎప్పటిలానే కిందటేడాదీ చేసింది నాలుగు కూరలూ, పచ్చళ్లూ, పిండివంటలూ.  పాపం రోజూ వాళ్లకి టైమెక్కడిది. లేచింది మొదలు రాత్రి నడుం వాల్చే వరకు పనే పని. ఒకళ్లకి ఇళ్లల్లో చాకిరీ. ఇంకోళ్లకి ఊరంతా కార్లో తిప్పే తిరుగుడు. గుక్కెడు కాఫీ నీళ్లు తాగే సందు లేదు. పొద్దున్న ఇంత తిని బయలుదేరితే ఇంక రాత్రి పదకొండు దాటేకే నాలుగు వేళ్లూ లోపలికి వెళ్లడం. తిథి సెలవురోజు శుక్రవారం పడింది కాబట్టి సరిపోయింది. పెట్టినవన్నీ ఓపిగ్గా తిన్నారు. తననుకున్నది ఒకటే. ఎవరైతేనేం కడుపు నిండా తినడం కావాలి. ఆయన పేరు మీద. మనవాళ్లెవరు, పరాయివాళ్లెవరు…
హవ్వ! ఇంతా బతుకు బతికి మీ కిదేం పాడుబుద్ధొదినా? మీ  కొడుకుల వల్ల కాకపొతే నాతో చెప్పచ్చుగా?
నాకు ఎనభైయేళ్లు. కొడుకులు నలుగురు డాక్టర్లు, నలుగురు ప్రొఫెసర్లు! ఎనిమిది దేశాల్లో. నాకు నీ దయేం అక్కరలేదు…
ఎందుకు నువ్విలా నానా జాతుల్నీ శ్రార్ధానికి పిలిచేడవడం? ఎంత ధర్మభ్రష్టత్వం? ఈ మాత్రం తద్దినం నేను పెట్టలేనా?
కళ్లు ఎరుపెక్కేయి. ఆవేశం ఆగ్రహమైనప్పుడు ఏకవచనం లోకి దిగడానికి వయసూ వావీ వరసా అడ్డం రాలేదు. ఈవిషయం నలుగురిలోకీ వెళితే ఎంత సిగ్గుచేటు… తను టీవీల్లో, కొడుకులు పెద్ద మీటింగుల్లో ఉపన్యాసాల్లో కుదురుకుంటోంటే…  తనింట్లో వాళ్లకే వైదీకం మీద నమ్మకం లేదని జనానికి తెలిస్తే ఇంకేవైనా ఉందా? సందు చిక్కితే పెద్దింటి పౌరోహిత్యాలు  తన్నుకు పోవడానికి వందమంది రెడీ గా వున్నారు… ఇంట్లో పెట్టిన దేవీ పీఠం గతేంగాను? జాతకాలూ, ప్రశ్నలూ, కుంకం పూజలూ… ఎంతాదాయం?  తన కొడుకుల్నీ, ఇంటిదాన్నీ వెంటనే రమ్మనాలి. ముసలమ్మ తలకెక్కట్లేదు…  వెలుతురుగా వున్న వసారాలోనే కూర్చున్నా చీకటి చీకటి గా అనిపిస్తోంది.
ఫోనందుకున్న వెంటనే పెళ్లాం కొడుకులూ పరిగెత్తుకొచ్చేరు.
ఎవరిది ధర్మభ్రష్టత్వం? కిందటిమాటు తద్దినానికి పంపేవే, వాళ్లేం చేసేరో నాకు తెలీదనుకోకు! డబ్బులెక్కువొస్తున్నాయని, కరణం గారింట్లో తద్దినం భోజనం  చేసొచ్చి మనింట్లో తూతూ మంత్రంగా కానిచ్చేరు! కడుపునిండినవాడికి పెట్టేం ఫలితం?  అవతల వాడ్ని చూడు. నీ కొడుకుల యీడు వాడు. కంకాళం లా వున్నాడు…
వాడేదో నాలుగురాళ్లకాశ పడితే, ఏంటిట? వాళ్ల బావని పంపిస్తాను…
వాడి బావ సంగతెత్తకు. బళ్లో పంతులు గారింట్లో అపరానికి పోయి దానాలకి డబ్బులైపోతే రెండు గంటల కర్మ ఇరవై నిముషాల్లో ముగించేసేడు…
అయితే? అడ్డమైన వాళ్లనా పిలవడం??
అంతెందుకు? మొన్న నీ బామ్మర్ది  కొడుకులేం చేసేరో నీకు తెలీదా? చినకాపింట్లో పెళ్లికి గణపతి పూజ చేయించి సరిపెట్టేరు. కాపుకి తెలీదనేగా? ఇదంతా శిష్టాచారమా?
వొదినా! నువ్విలా చేస్తే పుట్టగతులుండవు, చెప్తున్నాను!
మళ్లీ పుట్టినప్పటి సంగతి దేవుడెరుగు. రైతు ఆ మందు చేలోకి బదులు గొంతులోకి పోసుకొంటే, నీకూ నాకూ ఇప్పుడే గింజలకి గతుండదు. పుట్టగతుల్ట… హు…
 ఆఖరిసారి చెప్తున్నానొదినా! నీ కొడుకులు దేశాంతరాలు పోయేరు. అలగాజనం తో అంటగాగితే .. ముసిల్దానివి. రేపొద్దున్న హరీ మంటే తీసుకుపోవడానిక్కూడా ఆ నలుగురు రారు!
ఎపుడూ చల్లగా వుండే పదిగదుల పాతకాలం రాతి మిద్దైనా ఇపుడతనికి ఉడికి పోతోంది.
పరవాలేదు. నేను పొతేనంటావా, టౌన్లో మెడికల్ కాలేజీలో ఇయ్యమని నా పిల్లలకి చెప్పేను. నీక్కూడా చివరిసారి చెప్తున్నాను. ఆ షావుకారుతో కల్సి మిత్తి మీద మిత్తి కట్టమనీ, శిస్తుగట్టమనీ మీ వతందార్ని పీక్కు తినడం ఆపు. వాడే బొంబాయో, బావో చూసుకుంటే నీ అయిదెకరాలూ నిన్ను పాతిపెట్టడానికి తప్ప ఎందుకూ కొరగావు…
పెద్దమ్మా, మీరిలా కులద్రోహం చేస్తే మా గతేంగాను?
ఇంకా ఊరుకుంటే లాభం లేదని కొడుకందుకున్నాడు.
పొండిరా! గిరాకీ తగ్గితే వేరే పని చేసుకోండి! ఆ వడ్డెరాళ్లు పోలా, ఊళ్లూ పూళ్లూ పట్టి… ఆచారం పేర్నఈ వెర్రిబాగుల్ని వందేళ్లు వెనక్కి తోలకండి…
భ్రష్టుదానా….
గొణుక్కుంటూ గుమ్మం కేసి నడిచేడు. వెనకాలే పెళ్ళాం పిల్లలూ.
తలుపులు దగ్గరగా జరిపి డబ్బు కట్టలుగా పెట్టుకుంటోందావిడ మర్నాటి కార్యం కోసం.
చెరో ముప్ఫై వేలూ సంభావన. వాళ్ల పొలం ఖర్చులకుంటాయి. నలభై వేలు రైతు కొడుక్కి మొదటేడాది డాక్టరీ సామాన్లకి. నాలుగు లక్షలు వాడి కాలేజీ ఫీజు. దరిమిలా పైచదువులకీ ఆస్పటలు పెట్టుకోడానికీ మిగతా ఎఫ్ డీ లు. కుర్రాడు నా దగ్గరుండి చదువు కుంటాడు… వాడి కోసం రాతి గోడకి పెద్దకిటికీ పెట్టడానికి వడ్డెరతన్ని వెతకాలి…

స్న్యాప్ అవుట్

-మమత కొడిదెల 

~

Mamata K.మనసంతా అల్లుకుపోయిన సాలేగూళ్ళతో కుస్తీ పడుతూ ఇంటి పనులు చేసుకుంటోంది అమ్మ.

“ఆడుకోడానికి వెళ్తున్నా” అని ఒక అరుపు అమ్మ వైపు విసిరేసి బయటకు ఎగిరిపోయింది పాప. ఇక పనులు తొందరగా తెముల్తాయిలే అని అమ్మ ఊపిరి పీల్చుకునేంతలో తలుపు నెమ్మదిగా తరచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి అమ్మ పక్కన నిలుచుంది.

“వచ్చేశావేం? నీ స్నేహితులెవరూ లేరా?” విసుగును దాచేసి పాప వైపు చూసింది అమ్మ.

మొఖంలో ఏ భావమూ లేకపోయినా అమ్మ లోపలికి చూస్తున్నాయి ఆ పసి కళ్ళు, తనేం చెబితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో బేరీజు వేసుకుంటున్నట్లు. అప్పుడే ఇంత కాలెక్యులేటేడ్ గా వుండాల్సొస్తోందే పిల్లలకు.

“ఏరా తల్లీ?”

ఆ నెమ్మది పిలుపుతో పాప ముఖంలోకి దుఃఖం వెల్లువెత్తింది. చేతులు చాపిన అమ్మ వొడిలోకి దూకింది. అమ్మ మెడను కావలించుకుని పూడుకుపోయిన గొంతుతో అంది, “నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ గరాజ్ లో ఏదో పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరో వచ్చారట. కానీ నేను ఇన్వైటెడ్ కాదట. నేను కూడా వాళ్ళను నా పార్టీకి ఇన్వైట్ చెయ్యను.”

పాపను హత్తుకుని కూర్చుంది అమ్మ. పక్కింటి గరాజ్ లోంచి పిల్లల కేరింతలు తేలివచ్చి కొన్ని రోజులుగా అమ్మలో బాధపెడుతున్న ఆలోచనలను తట్టి లేపాయి. శాశ్వతమనుకున్న పాత స్నేహాలు కొన్ని, మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ పరవళ్లెత్తిన కొత్త స్నేహాలు కొన్ని హఠాత్తుగా మౌనం దాల్చడం వల్ల  బాధగా ఉంది అమ్మకు. ఎవరి జీవితాల్లో వాళ్లు అని ఎంత సర్దిచెప్పుకున్నా కొన్ని రోజులుగా బాధ తగ్గట్లేదు.

పాప కన్నీళ్ళతో అమ్మ భుజం తడిసిపోయింది. “ఎందుకు వాళ్ళు నాతో ఆడట్లేదు? నేను ఏమన్న మిస్టేక్ చేస్తే నాకు చెప్పొచ్చు కదా?”

ఆత్మావలోకనం మంచిదే, కానీ ఆత్మను ముంచెత్తేది కాకూడదు. పాపను ఎలా సముదాయించాలో అర్థం కాలేదు అమ్మకు. అట్లా ఉక్కిరిబిక్కిరైనప్పుడు అమ్మ పాఠాల్లోకి దిగిపోతుంది.

“అమ్మను చూడు తల్లీ.” పాప ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అంది అమ్మ. కన్నీళ్ళతో తడిసిన ఆ మొఖాన్ని చూసి అమ్మ గుండె కలుక్కుమంది. కళ్ళు చికిలిస్తూ అమ్మ వైపు చూసింది పాప.

“ఒక్కదానివే ఆడుకోవడం అలవాటు చేసుకోవాలి నువ్వు. నీతో ఆడకపోవడానికి వాళ్ళకేదో రీజన్ వుండే వుంటుంది. దాన్ని రెస్పెక్ట్ చెయ్యాలి నువ్వు. నీకు బాధగా వుందని అమ్మకు అర్థం అయింది కన్నా. కానీ, జస్ట్ స్న్యాప్ అవుట్ ఆఫ్ ఇట్. వెళ్లి నీ బొమ్మలతో ఆడుకో. పోనీ, అమ్మను డిస్టర్బ్ చెయ్యకుండా ఇక్కడే ఆడుకో. ఈ పని తొందరగా పూర్తి చేసేస్తా. మనిద్దరం చా..లా… సేపు ఆడుకుందాం. సరేనా తల్లీ?”

కాసేపు ఏం మాట్లాడకుండా అమ్మ వళ్లోనే కూర్చుంది పాప. మెల్లగా ఏడుపు ఆపి, బెక్కుతూ అమ్మ షర్టుతో మొఖం తుడుచుకుంది.

“తాతను ప్లే ఏరియాకు తీసుకెళ్ళమని అడగనా?” ఒక్క క్షణం కూడా ఒక్కతే ఆడుకోవడం ఇష్టం లేదు పాపకు. అంతగా బాధ పడుతున్న పిల్లను ఒంటరిగా ఆడుకొమ్మని పట్టుపట్టడం అమ్మకూ ఇష్టం లేదు.

Mandira Bhaduri

Mandira Bhaduri

 

*

రెండు గంటల తరువాత ఆడుకుని వచ్చింది పాప. స్నానం చేయించి బట్టలేస్తున్న అమ్మకు ఇంకో స్నేహితుల గుంపుతో ఎలా ఆడుకుందో గుక్క తిప్పుకోకుండా చెప్తోంది పాప. ఆ మాటలు వింటూ పాప మొఖంలోకి చూసింది అమ్మ. అలసటతో, అంతకంటే ఎక్కువ సంతోషంతో ఎరుపెక్కిన పాప బుగ్గలను ముద్దు పెట్టుకుంది.

అమ్మ బుగ్గలను తన చిట్టి చేతుల్లోకి తీసుకుని అంది పాప, “అమ్మా, నా ఫ్రెండ్స్ కు ఏదో రీజన్ వుంది. ఐ రెస్పెక్ట్ దైర్ రీజన్. నేను అలా అనుకోగానే హ్యాపీగా అనిపించింది. అందుకే ప్లే ఏరియాలో మిగతా ఫ్రెండ్స్ తో అంత బాగా ఆడుకున్నా.”

తనను బాధ పెట్టిన స్నేహితులను ఆటల్లో పడి మర్చిపొయ్యిందని అనుకుంది అమ్మ. ఒక గుంపు స్నేహితులను మరో గుంపు స్నేహితులతో రిప్లేస్ చేస్తున్నట్లు కాక ఆటల్లో పడకముందే పాప తన మనసును సర్దుకుంది. అప్పుడు ఇంకా సంతోషంగా ఆడుకోగలిగిందని అర్థం అయ్యింది అమ్మకు.

అప్పుడే గరాజ్ నుంచి ఇంటి బయటకు వచ్చినట్లున్నారు పక్కింటి పిల్లలు. ఇంటి ముందు కేకలు ఎక్కువయ్యాయి. నైట్ డ్రెస్ ను సర్దుకుంటూనే కిటికీ దగ్గరికి పరిగెత్తి ‘హాయ్’ అని అరిచింది పాప.

“హాయ్, ఆడుకుందాం రా!!” వాళ్ళూ గోల గోలగా ఆహ్వానించారు పాపను.

“ఇప్పుడే స్నానం చేసేసా. మీరు ఆడుకుంటుంటే చూస్తా.” అంటూ లాన్ చైర్ ను గరాజ్ నుంచి బయటకు లాక్కెళ్లింది పాప.

 

*

ఆరోజు రాత్రి నిద్రలో ఆటల కలలొచ్చి ఉలిక్కిపడుతూ సర్దుకుంటున్న చిన్నారి మొఖంలో చెరగని చిరునవ్వును చూస్తూ గడిపింది అమ్మ. ఎన్నో రోజుల తరువాత ప్రశాంతత అమ్మలో.

*

నెర్లిచ్చిన అద్దం…

-మేడి చైతన్య

~

chaitanya medi

 

జీవితంలో చాలా విషయాలు అబ్సర్డ్ గా అనిపిస్తాయి.చాలాసంఘటనలకి ఒక నిర్దిష్ట క్రమమంటూ ఏది ఉండదనిపిస్తుంది.

బహుశా జీవితమంటేనే అంతేనేమో!!!

వాడిచూపులో అంతులేని ప్రశ్నలు,ఏడుపులో అర్ధం చేసుకోలేని భావాలు,కంట్లో దాచుకున్న వాడి రూపాన్ని కన్నీరు దరిచేరి, నాకందనంత దూరాలకు తీసుకెల్తున్నట్టుంది.

తనతో నేనెందుకు రావట్లేదని వాడి చిట్టి గుండె ఎంత తల్లడిల్లిపోతుందో. అడుగులచప్పుడు వినిపించిందనుకుంటా పాలు తాగుతూ గట్టిగా రొమ్ము పట్టుకున్నాడు. మౌనం గారోదిస్తున్న నన్ను చూసి అసలు నేనేనా తన తల్లి అని సందేహిస్తున్నాడేమో?

ఈ లంజముండకి మదమెక్కిందిరా, ఎప్పుడోకప్పుడు నన్నువదిలేసినా వదిలేస్తది. ఎక్కడ ఉంచాలో  అక్కడ ఉంచితేగాని దీని పొగరు అణగదురా. అరే ఎన్ని సిత్రాలు చేయించింది దీన్ని పెళ్ళి చేసుకున్న పాపానికి. కష్టాలుపోవాలంటే ఏసుపెబువట ఆ గుడికి తీసుకెల్లింది, పెద్దఆరిందాల్లా నాకు హద్దులు పెట్టింది. చివరకు దీని ఇంట్లో వాళ్ళు తినే తిండే తినాల్సొచ్చిందిరా….

నేను వినాలనే కాబోలు గట్టిగా మాట్లాడుతున్నాడు.

మెడలో ఈ సిలువదండేమిటి? ఎందుకు పిచ్చివన్నీ వీడికి కూడా అంటగడుతావ్? ఈడ్ని అమ్మ,నాన్న తీసుకురమ్మన్నారు. నీకు ఇంకా టైం కాలేదా,తెమలరే మేడంగారు.

దగ్గరకు వస్తున్న వాడి నాన్నను చూసి, చిన్నిగోళ్ళతో నా గుండెల మీద గిచ్చుతున్నాడు. వాడికి తెలియదు కదా అమ్మకు అత్త,మామలేరు కాని వాడికి మాత్రం తాత,నానమ్మ ఉన్నారని! దా…దా…అని నేను పలికే వరకు చేయి ఊపుతూనే ఉన్నాడు.

నా అసహాయతను తిట్టుకొని, రెండులోటాలు నీళ్ళు గుమ్మరించుకొని, నాలుగు మెతుకులు తిని బయల్దేరా. ఎందుకురా తల్లి నీకే ఇన్నికష్టాలన్నట్టుగా నా వైపే చూస్తూ నిలబడ్డాడు నాన్న.

రోడ్డుమూల వంకరతిరిగిన తుమ్మమోడు నాలానే బాధపడుతుందనుకుంటా! బయట శబ్దాలేవి వినిపించనంతగా లోపలి కేకలేవో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జడగంటొకటి దొరికిందనే సాకుతో మాటలు కలపాలనుకున్నాడు. ధైర్యంలేక నా నోట్సే దొంగతనంచేసి, ఎక్కడో దొరికిందనిచెప్పి, సూటిగా మాట్లడలేక చిన్నలెటరొకటి నోట్సులో పెట్టాడు. పరీక్షలప్పుడు ఎరుపెక్కిన కళ్ళతో వచ్చి ప్రేమిస్తున్నాడని చెప్పాడు, ఉబికొచ్చిన వేడి కన్నిటి చుక్కొకటి నా పాదంపై పడింది.

పది ఐన తర్వాత పెళ్ళి చేసేద్దామనే నాన్న నిర్ణయానికి గొడవెట్టుకొని ,తానే చదివిస్తానని హస్టల్లో చేర్పించిండు అన్న. శెలవుల్లో నాతో మాట్లడడానికి మా ఇంటి కంచె దగ్గర చీకట్లో చాలా సేపుండేవాడు తను. డిగ్రీ నర్సింగ్ కోర్స్ లో చేరిన తర్వాత మాటల కలయిక ఎక్కువైంది. అప్పట్లో ప్రేమో ఏమో తెలియదు కానీ పెళ్ళి చెసేసుకుందామనుకున్నాం ఎవరకిచెప్పకుండా! ఎందుకు ‘గుడిలోనే’ పెళ్ళిచేసుకోవాలని తను పట్టుపట్టిండో నాకర్ధం కాలేదప్పుడు!

పెళ్ళైన రెండు రోజులకు నా కోసం ఎవరో వచ్చారంటే కాలేజి బయటకెళ్ళా.

ఎదురుగా అమ్మ నా వైపే చూస్తుంది. కట్టుబాట్లను ఎదురించి చదివించినందుకు బాగానే బదులిచ్చావమ్మా,చెపితే ఆ మాత్రం అర్ధంచేసుకోలేని మోటోడనుకున్నావా అని కోపంతో అన్నకొట్టడానికి వచ్చాడు.

ఫోను చేసి మా అమ్మ,నాన్న వచ్చారంటే తనొచ్చాడు. నాన్న కోపంగా తనని కొట్టడానికెళ్ళాడు. ఏమైందో తెలియదు కానీ వాళ్ళిద్దరి ఆవేశానికి నవ్వుకొని ఇంటికి పంపిచేశాడుఅన్న. దగ్గరుండి మళ్ళా రిజిస్టర్మ్యారేజి చేయించి ఊళ్ళోకి రావొద్దని చెప్పి వెళ్ళిపోయాడు.

chinnakatha

రెండు రోజుల తర్వాత తెలిసింది అన్న,వదిన పట్నం పని వెదుక్కుంటూ వెళ్ళారని. పని కోసం వెళ్ళారట, పరువు పోతుందనే భయంతో కాదు! రాజిగాడు,రోషిని గుర్తొచ్చారు.

నలుగురు పట్టేంత చిన్న గది. సూర్యుడు కూడా జయించలేనంత చీకటాయింట్లో! లోకాన్నే మర్చిపోయి ఆడుకోవాల్సిన వయసులో పిల్లలిద్దరూ పడుకోవడానికి చోటులేక కూర్చొని కునికి పాట్లుపడుతున్నారు, పొలంపనులు చేయాల్సిన వదిన ఎవరింట్లోనో పాచిపనికి కుదిరింది, పొద్దున్న నాల్గంటలకు వెళ్ళి రాత్రి పదైన తర్వాత వస్తుంటే ఎక్కడ పిల్లలు తనని మర్చిపోతారనే భయం అన్న మోహంలో ఎప్పుడూ కనిపిస్తుటుంది. కష్టాలన్నీ గుండెల్లో దాచుకొని, అక్కడ మేమున్న రెండు రోజులు కడుపు నిండా అన్నం పెట్టారు వాళ్ళు. ఊర్లో నాన్నేమో బయటకు రావడం మానేసాడు. అమ్మ మాట్లడటమే మానేసింది, ఎక్కడ వినరాని మాటలు వినాల్సి వస్తోందేమోనని! 10 నెలలు మోసి,20 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడినందుకు తగిన బహుమతే ఇచ్చానేమో అందరికి!

మామామగారు ఇంట్లోకేకాదు, ఊర్లోకి కూడా రావొద్దన్నాడు. అప్పట్లో తను మావాళ్ళందరితో బాగానే ఉన్నాడు. అన్నపిల్లలతో కొట్లాడేవాడు అల్లరిగా. ఆదివారం ప్రార్ధనకు కూడా వచ్చేవాడు. ఆస్తి ఉందనే ధీమాతో సరిగ్గ చదవలేదు తను. గ్రానైట్పనికెళ్ళేవాడు. అప్పట్లో నాకొచ్చే స్టైఫండ్తోనే ఎలాగోలా నెట్టుకొచ్చాం.

చిన్నిగాడు పుట్టిన తర్వాత ఏదో మార్పు కనిపించిందితనలో. దగ్గరకెల్తే కసురుకునేవాడు. ఆదివారం వస్తే చాలు ఏదో పనుందని ఎటో వెళ్ళి రాత్రి తప్ప తాగివచ్చేవాడు. ఏమిటిదంతా అంటే నా ఇష్టం, నీకెందుకని కేకలేసేవాడు అందరిముందు. తర్వాత తెల్సింది మామయ్య తనను ఇంటికి రానిస్తున్నాడని.

ఊరికి దగ్గరగా ఉద్యోగంవస్తే చిన్నిగాడితో పాటు మా ఇంటికొచ్చేసాం.

చిన్నిగాడు పుట్టిన తర్వాత వాడ్ని, వాళ్ళ నాన్నను రానిస్తున్నారే తప్ప నన్ను రానివ్వడంలేదు. ఒకే ఊరిలో ఉండికుడా చిన్నిగాడు, నేను కలుసుకోలేంతగా వెలివేయబడ్డాం. వాడు ఎర్రగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కాని నాలాగా ఉంటే రానిచ్చేవారేనా? లేక ‘అబ్బాయేనని’ రానిస్తున్నారా?

ప్రేమ గుడ్డిది, గొప్పది కావోచ్చేమోగానీ, ప్రేమించే వ్యక్తులకు మాత్రం కులముంది, మతముంది. ఒకే క్షణంలో భిన్న అస్థిత్వాలకు వారధి మనిషి. ప్రేమికుడు మొగుడుగా రూపాంతరం చెంది నా శ్వాస, నిశ్వాసలను శాసించే నియంతగా మారుతున్నా, ప్రేమ భావావేశంలో ఊగిసలాడుతున్నానేమో ఇన్ని రోజులు! వాంఛకి,వాత్సల్యానికి తేడా ఎరుగక ప్రేమికుడగా తనకి కులం ఒక అడ్డుకాలేదు. కామం తీరిన తర్వాత కులం,పెళ్ళిఇచ్చిన శక్తితో నా స్వేచ్ఛకు సంకెళ్ళేయాలని చూస్తున్నాడు.

తనొచ్చేవేళయింది.మరుక్షణపు ఊహను భరించలేక గట్టిగా గుండెలకద్దుకున్నా వాడ్ని. కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు చిన్నిగాడు, ఏమర్ధమయిందో తెలీదు కానీ నోరారా నవ్వుతున్నాడు.

ఎవరో బలంగా ఆ నవ్వును నా నుంచి దూరం చెయ్యాలని చూస్తున్నారు. వణుకుతున్న నా చేతులు వాడ్ని గట్టిగా పట్టుకోవాలని చూస్తున్నాయి. ఈ సారి వాడి చేతులు నా వైపు ఊగడంలేదు. నాన్న తెచ్చిన కారు బొమ్మ మీదే వాడి చూపూలన్నీ! దా..దా..అని బలహీనస్వరంతో ఎన్ని సార్లు పిలిచినా పలకట్లేదు వాడు.

మా ఆయన మొహం మీద రాక్షసి నవ్వు సంతరించుకొంది.వాడ్నిభూజానేసుకొనివెళ్ళిపోయాడు.’ఏముందనిమీఇంటికిరావాలే,చూడు నాకొడుకుని “నాఇంట్లో” మీకు దూరంగా పెంచుతానన్న మాఆయన మాటలు నన్నావరించాయి.

ఈ అమ్మను వాడు కుడా అంటరాని దానిగానే చూస్తాడా? రక్తం పంచుకొని పుట్టినవాడే నువ్వు తక్కువ కులానిదానివని అంటాడా?

వాళ్ళ కాలనీకి, మాగూడేనికి మధ్య దూరం తనకేమో రెండు నిముషాలంత! మాగూడేనికి, వాళ్ళ కాలనీకి మధ్య దూరం నే చేరుకోలేనంత అనంతమైనదని ఇప్పుడర్ధమయింది నాకు!!!

ప్రేమ అనే భావనలో అబ్సెసివ్ అయిపోయి, అమ్మయివని సమాజమేసిన సంకెళ్ళను గుర్తించక, పుట్టుకతో వచ్చిన కుల అస్థిత్వపు పరిధులను అర్ధంచేసుకోలేక, ఆశల రెక్కలతో ఊహల పంజరాల వెంట పరుగెత్తి నా మూలాలను మరచానేమో?

తను,కుల పరిమితులు దాటి నాతో ప్రవర్తించాడా, లేక నేనే తనను తప్పుగా అర్ధం చేసుకున్నానా!

అసలెందుకు మామయ్య నన్నే ‘వాళ్ళ ‘ఇంటికి రానివ్వడంలేదు?

చేతిలో చెయ్యేసి, ఏడు అడుగులు తన ఇష్టదైవం సాక్షిగా నాతో నడచి, ఆ చేయిని వదిలేసి కొడుకు నొక్కడినే తీసుకొని ఎందుకువెళ్తున్నాడు?

నా మాటలు వినడానికి  ఎన్నోగంటలు నిశీధిలో నిరీక్షించినతను, నేను మాట్లాడాలంటే కూడా ఒక క్షణం నా దగ్గర ఎందుకు ఉండట్లేదు?

నాకే చదువులేక, ఉద్యోగమే లేకపోతే, కన్న కొడుక్కి పాలిచ్చేటువంటి వారుకల్పించిన ‘సదావకాశన్ని ‘పొందగలిగేదానినా?

మొగుడ్నొదిలేస్తే నా చదువు, ఉద్యోగం నన్ను సమాజపు ఈసడింపుల నుండి,విషకౌగిళ్ళ నుండి నన్ను రక్షిస్తాయా?

తండ్రి వదిలేసిన కొడుకుగా వాడ్నిచూస్తుందా లేక తల్లి కష్టపడి పెంచిన వ్యక్తిగా గౌరవిస్తుందా?

నాకు, నా బిడ్డకు మధ్య మొలుస్తున్న గోడలు కూల్చాలంటే చదువొక్కటే సరిపోదేమో?

అద్దంలో నెర్లిచ్చిన నా రూపం చూసి,ఆ చీలిక అద్దంలోనా, లేక నా జీవితంలోనా అని సందేహంలో పడిపోయా!

 

బంధనాల ఆవల ఏదో ఉందని ఊహించలేనంతగా అణచబడిన జీవితాలలొ, ఏళ్ళుగా స్తబ్దుగా మరణిస్తున్న చైతన్యమేదో విస్పోటనం చెందే సమయమొచ్చింది!

*

 

 

 

 

 

 

 

  పిడికిట్లో పూలు

– వనజ తాతినేని

vanajaబస్ దిగి రేడియో స్టేషన్ వైపు అడుగులు వేసాను . గేట్ ప్రక్కనే  కొబ్బరి బొండాల బండి.   దాహంగా ఉందని అటువైపు అడుగులు వేసాను

ప్రక్కనే  కమలాలు అమ్ముతున్న సైకిలిస్ట్.

లోపలినుంచి  ఇద్దరు మహిళలు వచ్చి  “కమలాలు  ధర ఎంత ?” అడిగారు

” కేజి నలబై రూపాయలండీ”

” అంతకన్నా తక్కువకి రావా ?”

“ముప్పై తొమ్మిదికి కూడా రావండీ ! ”

“చూడు..  జనం ఎంత డిమాండ్ గా ఉన్నారో ! ఛీ .. మనకే  ఏమి చేతకాక చస్తున్నాం . తెల్లవారుఝామునే లేచి  రోడ్డున పడొచ్చి డ్యూటీలు చేసినా నాలుగైదునెలలకి కూడా  జీతాలు పడవు. అందులో పది శాతం కటింగ్” నిసృహగా అంది పచ్చ చీరామె

అలా వెళ్ళి క్యాంటిన్లో కూర్చుందాం పద .. అంటూ అటువైపు అడుగులేసారు. నేను కలవాల్సిన వ్యక్తి  కూడా అక్కడికే వచ్చి కలుస్తానని చెప్పడంతో   నేను వారి వెనుకనే క్యాంటిన్ లోకి వెళ్ళాను. వాళ్ళు  మూలగా ఉన్న ఓ టేబుల్ ని వెదుక్కుని కూర్చున్నారు

వినాలని కాకపోయినా కాలక్షేపం కోసం వారి మాటల్ని వినడంపై దృష్టి పెట్టాను .

“అవును మరి ! తోటోడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాలన్నట్టు..  ప్రెవేట్ చానల్స్ తో పోటీ పడి ఈ 04:53 కి ప్రసారం మొదలెట్టినా వారితో దీటుగా విషయాన్ని అందించే విషయంలో వెనుకబడే ఉన్నామన్నది  మనవాళ్ళకెప్పుడర్ధం అవుతుందో ! వార్తలు తప్ప రెండు గంటలు పాటు భక్తి గీతాలు వినలేక చస్తున్నామని శ్రోతలు చెప్పే అభిప్రాయం  ఎవరికి కావాలి ? ఎయిర్ లోకి ఏదో ఒకటి వెళ్ళిందే లెక్క ” అంది ఎల్లో చుడీదార్ వేసుకున్నామె

“ఆ రజని చూడు… ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ మీద ఎంత దైర్యంగా కంప్లైంట్  చేసిందో  గుర్తుకొస్తే ముచ్చటేస్తుంది. మనకంత దైర్యం ఎక్కడ చచ్చింది ? ”  ” మనం కంప్లైంట్ చేస్తే  విచారణ చేస్తున్నామంటూనే ద్యూటీలకి దూరం చేస్తారు, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు వారి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తారు . చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆధారంగా ఉన్న ఉద్యోగం పోతుందని వాడి చేష్టలని తప్పని సరై భరించేవారిలో మనమూ  ఉన్నాం ”

“అవును పైకి చెప్పుకోవడమూ సిగ్గు చేటు కూడా అన్నట్లు “

“ఆ పోగ్రాం ఎగ్జిక్యూటివ్  రిటైర్ అయ్యే వయసులో కూతురి వయస్సు ఉన్న వారితో కూడా అసభ్యంగా ప్రవరిస్తాడు. స్టేషన్ డైరెక్టర్ మేడమ్ కూడా అన్నీ తెలిసి మౌనం వహిస్తారు. తోటి  ఆడవాళ్ళ బాధలని ఆమె కూడా అర్ధం చేసుకున్నట్లు ఉండదు, రజని ఎంత బాధపడిందో . ఆఖరికి వేరే సెక్షన్ కి మార్చమని కూడా రిక్వెస్ట్ చేసింది  అయినా ప్రయోజనం లేదు .  ఆఖరికి ఉద్యోగం మానేసి వేరే ఊరుకి మారిపోయింది  ప్చ్ పాపం .”

“ఎంతైనా అక్కడ స్కిల్స్ పేరిట అగ్రకులాల వారికి పెద్ద పీట వేయడం, తతిమా వారిని అణగద్రొక్కడం ఇప్పటిదా ఏమిటీ ? అరవై ఏళ్ళకి పైగా జరుగుతున్నదే! అది ఇప్పుడూ జరుగుతుంది అందులో కొత్తేముందే? ”

” అవును .. పేరెన్నిక గల కార్యక్రమాల నిర్వహణంతా వాళ్ళ వాళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది. ఎక్కడన్నా చూడు.. ఆ కులం వాళ్ళకే పట్టం కడతారు   ఇవి  మనలాంటి  కాజువల్ ఉద్యోగస్తుల కష్టాలు మాత్రమే కాదు. డైరక్ట్ గా రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకి కూడా ఈ బాధ తప్పడం లేదు  కులం పేరిట, మతం పేరిట వాళ్ళని వెనక్కి వెనక్కి నెడతారు కదా !”

chinnakatha

“అసలు ఆ కృష్ణ  ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాడు . డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ! కమర్షియల్స్ కూడా వెళ్ళవు ఒకోసారి.  వరుసలో పాటలు పెట్టేసి క్యాంటీన్ లోనూ, గేటు వెలుపల ముచ్చట్లు పెడతాడు  అతని మీద ఎలాంటి యాక్షన్ ఉండదు  ”

ప్రసారమయ్యే  కార్యక్రమాలలో ఉన్నంత  ఉన్నత భాషా సంస్కారం  వారి మాటల్లో కాగడా పెట్టి వెతికినా కనబడదు , వారి క్రింది ఉద్యోగాల చేసే వారిపై అశ్లీల పదజాలం తో చేసే కామెంట్స్.. వినకూడదనే అనుకుంటాం కానీ వినక తప్పదు ఏం చేస్తాం ఖర్మ కాకపొతే !

“వాడి ప్రవర్తన రోజురోజుకి శృతి మించిపోతుంది.  ఏం చేయాలి ? డ్యూటీ చేసేటప్పుడు వచ్చి ఎదురుగా కూర్చుంటాడు, ఈవెనింగ్ డ్యూటీ అయిన తర్వాత పైన ఆఫీస్ గదిలోకి రా ! నేను అక్కడే ఉంటాను అంటాడు నేను ఏదైతే అదవుతుందని  వెళ్ళకుండానే వెళ్ళిపోయాను  మొన్నటికి మొన్న కాంట్రాక్ట్  పెట్టడానికి వెళ్ళినప్పుడు  పై నుంచి  క్రింది దాకా చూసి  ” బాగున్నావ్ ” అన్నాడు.

ఈ రోజు  ఎదురుగా వచ్చి కూర్చుని  గంట సేపు  కూర్చుని ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెపుతూ  తినేసేటట్లు చూస్తూ ..”మన పరిచయమయ్యి ఏడాదయ్యింది నా అప్లికేషన్ సంగతి పట్టించుకోవడం లేదు” అంటూన్నాడు. ఇంతకన్నా అడ్వాన్స్ అయితే చూస్తూ ఊరుకోను . తగిన బుద్ధి చెపుతాను అంటున్న చుడీదార్ అమ్మాయిని వారిస్తూ   “కూల్  కూల్ . ఆ పని చేయడం వల్ల నువ్వు అల్లరి పడటం తప్ప ఏమి ఉండదు . ఉద్యోగం చాలా అవసరం కదా ! ” పచ్చచీరామె.

“ఇది కళలకి నిలయమే కాదు ఈర్ష్యా ద్వేషాలకి, కుతంత్రాలకి, కుయుక్తులకి, ఆడవాళ్ళని చెరబట్టే  వేదిక  కూడా అనుకుంటే సబబుగా ఉంటుంది ”

ఇలా  వేదన కలబోసుకున్న వాళ్ళ మాటలు వినడంలో మునిగి పోయాను . తర్వాత తేరుకుని   ” అబ్బో .. ఇక్కడ కూడా ఇలాంటివి  చాలానే ఉన్నాయే ! ” అనుకున్నాను. కాసేపటి  తర్వాత వారిద్దరూ  బై  చెప్పుకుని వెళ్ళిపోయారు . నేను ఎదురుచూస్తున్న మనిషి రానే లేదు.  రిసెప్షన్ లోకి వెళ్లి కనుక్కుంటే .. ఆ రోజు రికార్డింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని రేపు రమ్మని చెప్పారు .

ఆ రోజు వెళ్ళిపోయి .. మరుసటి రోజు తొమ్మిదింటికల్లా రేడియో స్టేషన్ కి వెళ్ళి రిసెప్షన్ లో కూర్చున్నాను . నిన్న నేను చూసిన అమ్మాయిలలో చుడీదార్ వేసుకున్న   అమ్మాయి .. అటు ఇటు తిరుగుతూ రెండు సార్లు కనబడింది . ఎవరామె ? అని అక్కడే కూర్చున్న ఇంకొకామెని అడిగాను  “ఇప్పుడు FM లో డ్యూటీ చేస్తున్నారు కదా ! రీతూ అంటే ఆమే ! వండర్ఫుల్ వాయిస్ ” అని అడ్మైరింగ్ గా చెప్పింది .

“ఓహ్.. ఆమె ఈమేనా ? మనిషికి వాయిస్ కి సంబంధమే లేదు ”  అన్నాను .

కొత్త ఆర్జేస్ ఎంపిక జరుగుతుందంటే  నేను  అప్లై చేసాను  ఆడిషన్ టెస్ట్ కి వచ్చాను  ఎవరెవరో వస్తున్నారు .. రికార్డింగ్ రూమ్ లోకి వెళుతున్నారు, వస్తున్నారు. ఇంకా నా వంతు రావడం లేదు  విసుగ్గా ఉంది . అయినా సరే వేచి ఉండక  తప్పదు . చిన్నప్పటి నుండి కలలు కన్న  ఉద్యోగం . ఒక్క  ఆడిషన్ టెస్ట్ లో  సెలెక్ట్ అయితే  చాలు ..తనకున్న మాటల చాతుర్యం,  ఆంధ్రాంగ్ల  జాతీయ భాషల్లో ఉన్న పాండిత్యంతో  ఆర్జే సీట్ లో కూర్చుంటే చాలు  దున్నేయనూ … అనుకుంటూ ఓపికగా కూర్చున్నాను. పదకొండు గంటలయింది .

రీతూ …స్టూడియో లో నుండి బయటకి వస్తున్నారు . వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకున్నాను . మళ్ళీ మనసు మార్చుకుని నేను కూడా ఆర్జే  అయిన తర్వాతనే కో ఆర్జే గా  గర్వంగా పరిచయం చేసుకోవాలని ఆగిపోయాను.

అనుకున్నట్టుగానే .. నేను ఆడిషన్ టెస్ట్ లో పాస్ అయ్యాను . మూడు నెలల ట్రైనింగ్ పిరియడ్ అయిపోయిన తర్వాత  నేను కలగన్నట్టు ఆర్జే అయ్యాను .

రీతూ తో నాకు బాగానే పరిచయం పెరిగింది. అప్పుడప్పుడూ ఆమె రిలీవ్ ఆయే టైం నేను డ్యూటీ లో కి వెళ్ళేసమయాలప్పుడు  ఓ అరగంట సేపైనా మాట్లాడుకునేవాళ్ళం , ఆర్జే గా  పదేళ్ళ  అనుభవం ఉన్న ఆమె ఎన్నో మెలుకువలు , తెలియని విషయాలు చెప్పేవారు . ఎంతో నిబద్దతతో పని చేస్తున్న ఆమె నాకు బాగా నచ్చేసింది కూడా .  ఒక రోజు చెప్పులు లేకుండా స్టూడియోలో అటు ఇటు తిరుగుతున్న ఆమెని చూసి” రీతూ గారు  “…. అని పిలిచాను. దగ్గరకి రాకుండానే .. చెయ్యి ఊపి హాయ్ చెప్పింది . నేనే దగ్గరకి వెళ్ళి.. ఏంటీ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు ? అన్నాను .

“చెప్పు తెగింది” అంది నవ్వుతూ

ఎవరినయినా పంపి కొత్త చెప్పులు తెప్పించుకోకూడదా ?

ఏమైందిలే! ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా ! కొనుక్కుంటాను అంది .

“ఏమో బాబు! మీకేం నామోషీ అనిపించడంలేదా? నేనైతే  చెప్పుల్లేకుండా ఒక్కడుగు కూడా బయట పెట్టను. అదీ ఇలా ఆఫీస్ లో అయితే అసలు తిరగను ” అన్నాను .

“అచ్చాదిత శరీరాన్ని అనచ్చాదితం చేసి చూసే చూపుల తాకిడికన్నా  అనచ్చాదిత పాదాలు భూమిని తాకడటంలో  ఉండే ఇబ్బంది చాలా తక్కువ.  ఇందులో  ఎంతో  ఆనందం,  ఈ   స్పర్శ చాలా  బావుంది  తెలుసా ? ”  నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అనుభవమవుతుంది “అంది.

ఆమె మాటల్లో ఏదో విషయం స్పురించింది .

“ఇంతకీ చెప్పు ఒకటే తెగిందా రెండు తెగాయా? వివరంగా చెప్పాలి ” ఉత్సాహం అడిగాను

“ఒక చెప్పు తెగిందా… రెండు చెప్పులు తెగాయా అన్నది ప్రశ్న కాదు . ఏ చెప్పు తెగినా నడకకి ఇబ్బందే కదా ! ” అంటూ  స్టూడియోలోకి వెళ్ళిపోయింది.

ప్రోమోస్ చేస్తూ ఉన్నప్పుడూ దొరికిన గాప్ లో .. ఏం జరిగిందో చెప్పకూడదా .. అంటూ ఆసక్తిగా అడిగాను .

ఆమె నవ్వేసి ఊరుకుంది కాని చెప్పలేదు

ఈ లోపు  అసలేం జరిగి ఉంటుందో  అన్నది ఊహించుకుంటూ  ఉన్నాను.  ఆ  ముసలి నక్క పోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఈ రోజు కూడా FM సెక్షన్ లోకి వెళ్ళి కూర్చుని వాడి పైత్యం అంతా వెళ్ళగ్రక్కిందే  కాకుండా అడ్వాన్స్ అయి ఉంటాడు . అప్పుడు రీతూ అతనిని కాలికున్న చెప్పు తీసుకుని ఎడా పెడా బాదేసి ఉంటుంది. అందుకే చెప్పు తెగి ఉంటుంది .. ఇలా ఊహించుకుంటేనే కానీ నాకు  మనసు శాంతించలేదు .

ప్రోమోస్ రికార్డింగ్ పూర్తయ్యాక “రండి నా బండి  మీద చప్పల్ షాప్ కి వెళదాం , తర్వాత  బసేక్కి వెళ్ళిపోదురుగాని ” అంటూ పిలిచాను.

“మనం పుట్టినప్పుడు చెప్పుల్లేవ్, నడక నేర్చినప్పుడూ చెప్పులు లేకుండానే నడక మొదలెట్టాం . మన కాళ్ళకి రాళ్ళు , ముళ్ళు గుచ్చుకోకూడదని అమ్మ,నాన్న చెప్పులేసి రక్షణ ఇస్తారు కానీ  చెప్పులు లేకుండా నడవడం కూడా నేర్పి ఉంటే ఆ నడకలో ఉన్న విలువ నీకీపాటికి తెలిసి ఉండేది . నాకు అలా నడవడం అలవాటేలే ! ” అని నవ్వి ముందుకు నడిచింది. నా కర్ధమయింది  ఇక ఆమె తన ఆర్జే జాబ్ కి బై చెప్పేసిందని.

మరుసటి రోజు పేపర్లో అనధికార మహిళా ఉద్యోగులని వేధిస్తున్న అధికారి, లైంగిక వేధింపులు భరించలేక ఆర్జే ఆత్మహత్యా ప్రయత్నం.

త్వర త్వరగా ఆ హెడ్డింగ్ క్రింద ఉన్న వార్తా వివరాలన్నీ చదివాను. ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి రీతూ ఏమో అనుకున్న నాకు  ఆవార్త మా కేంద్రంలో పని చేస్తున్న అమ్మాయికి సంబంధించినది కాదని తెలియడం కొంత రిలీఫ్ నిచ్చింది కానీ ఆలోచిస్తూనే ఉన్నాను. ఆరోజు  సీనియర్ ఆర్జేల మాటల్లో  ఇలాంటి వేదింపుల మాటలు చాలానే విన్నాను. ఇక్కడ ఒక్క చోటనే కాదు  అన్ని చోట్లా అంతే ! కనబడని హింస. అభద్రత మధ్య ఉద్యోగం చేయాల్సిందే !   ఎందుకు ఆడపుట్టుకనిచ్చావ్ భగవంతుడా ?  మగవాడి చేతుల్లో నలిగి పొమ్మనా ?  ” కౌంట్ లెస్ ప్లవర్స్ క్రషుడ్ ఫరెవర్”

డ్యూటీ చార్ట్ చూసుకోవడానికి వెళ్ళాను. అక్కడ అందరూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆర్జే గురించే మాట్లాడుకుంటున్నారు

“ఈ నిమ్న కులాలు వాళ్ళున్నారు చూడండి! … వారికి మనపై ఎప్పుడూ ఏడుపే ! ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వార్తలలోకి వెళతారు . తర్వాత డబ్బు పుచ్చుకుని కేస్ విత్ డ్రా చేసుకుంటారు . నా సర్వీస్ లో ఎన్ని చూడలేదు ఇలాంటివి ..  అంటూ ఒక సీనియర్ అనౌన్సర్ అసహ్య వ్యాఖ్య వింటుంటే ఒళ్ళు మండిపోయింది

వాళ్ళు పొతే పోయారండి. ముందు వీళ్ళకి వస్తుందిగా తిప్పలు .. తీసుకెళ్ళి ఎక్కడో మూలాన వేసేస్తారు . అర్ధాంతరంగా మారిన దానికి ఫ్యామిలీ ఎంత సఫర్ అవ్వాలి పిల్లల  చదువులు అన్నీ డిస్ట్రబ్ అవుతాయి ..అని ఇంకొకరు

ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటే అలా చేసుంటుంది? బ్రతకడం కష్టం అంటున్నారు. తన డైరీ లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు  ఎన్నో వ్రాసి ఉన్నాయట. ఆమె తమ్ముడు ఆ డైరీని చానల్ వారికి చూపుతున్నాడు… సాక్ష్యం అంత బలంగా ఉంటే.. కాదంటారేమిటండి.. అని ఇంకొకరు.

ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ  ప్రక్కకి వెళ్లాను “వూస్తున్న ఉరికొయ్యల సాక్షిగా …ఈ దేశంలో ఆడదాని భయం మగవాడి అహంకారం రెండు చిరంజీవులే ! ” ఒక కవి వాక్యం గుర్తుకొచ్చింది.  ఇలా ఆత్మహత్య చేసుకోవడం  కంటే   వేధించేవాడిని  దైర్యంగా  కొట్టి  రోజుకొక  చెప్పు తెగ కొట్టుకున్నా తప్పు లేదు  కసిగా  అనుకున్నాను .

పదకొండింటికి జరిగిన స్టాఫ్ సమావేశంలో మా ఎస్ డి  పేపర్లలో న్యూస్ చూపించి ఆ పేపర్ ని విసిరి కొడ్తూ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగినిల వల్ల మన స్టేషన్  పరువు గంగలో కలసి పోతుంది. అన్నీ తప్పడు ఆరోపణలే ! ”

ఆమె అలా  వెనకేసుకుని రావడం చూస్తే అసహ్యం కల్గింది. “స్టూడియోలో ఉన్న అన్ని గదుల్లోనూ  సి సి కెమారాలేర్పాటు చేయిస్తే ఎవరు నిజం చెపుతున్నారో, ఎవరు అబద్దం చెపుతున్నారో తెలిపోతుంది కదా..మేడమ్” అన్నాను  నేను .

ఆవిడ చురుక్కున నా వంక చూసింది.

“కొందరికి అంతరాత్మనే కళ్ళు మూసుకుపోయినా కెమెరా  మాత్రం కన్ను కప్పుకోదు మేడమ్! రీతూ గారు  ఇక్కడెందుకు జాబ్ చేయడం మానేసారో , విరిజ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అలాంటి వాటన్నింటికి సాక్ష్యాలు  అవే చూపుతాయి కదా  “.. నాకెంతో ఇష్టమైన  ఉద్యోగం  ఉంటుందో లేదోనని కూడా ఆలోచించకుండా అడగాల్సిన నాలుగు మాటలడిగి బయటకి  వచ్చేసాను.

 

*

 

అదే ప్రేమ!

 

-ఎండ్లూరి మానస

manasa endluri‘ఇది తీయని వెన్నెల రేయి…మది వెన్నెల కన్నా హాయి…నీ ఊహల జాబిలి రేఖలు మురిపించెను ప్రేమ లేఖలు…’

నేనూ అర్జున్, ఒకే ఇయర్ ఫోన్స్ లో ఏ వెయ్యో సారో వింటున్నాం ఈ పాట! మా తోట ఊయలలో…నా ఒళ్ళో అర్జున్!అతని గుండెల మీద నా చేతిని తన చేత్తో పెనవేసుకున్నాడు. తను కళ్ళు మూసుకుని పాటని ఆశ్వాదిస్తున్నాడు..నేను అర్జున్ స్పర్శలో కరిగిపోతున్నాను…ఊయలకి అల్లుకున్న సన్నజాజులు నా చెక్కిలిని ముద్దాడుతున్నాయి. ఈ రేయి…ఈ సన్నజాజులు పెట్టే గిలిగింతలు…ఈ ఊయల…ఈ పాట…నా అర్జున్!అబ్బ! ఎంత అదృష్టం! ఈ రాత్రి ఇంకా ఉండాలి.సూర్యుడు కాస్త మెల్లగా ఉదయిస్తే ఎంత బావుణ్ణు!ప్చ్!

అర్జున్ ని ఈ పాట ఎన్ని సార్లు పాడమన్నా నా కోసం పాడడు.ఇప్పుడైనా అడగాలి! చల్లగాలికి మల్లె రేకలు సీతాకోకచిలుక రెక్కల్లా రెపరెపలాడుతున్నాయి..కాస్తంత దూరంగా మరువం సువాసన వాతావరణాన్ని ఇంకాస్త మత్తెక్కిస్తోంది..వెన్నెల కాంతిలో అర్జున్ ముఖం మరింత మెరిసిపోతోంది!కోటేరు ముక్కు..చిన్ని నుదురు..అందమైన పెదవులు..వాటిపై తన మగసిరి చూపించే మీసం…అసలు అర్జున్ అందమంతా ఆ మీసంలోనే ఉంది!

మెల్లగా ఒంగి పెదాల చివరన ముత్యమంత ముద్దు పెట్టాను తన మీసానికి తగిలీ తగలకుండా!చిత్రం!!అర్జున్ లెగలేదే?!నిద్రలోకి జారుకున్నాడా ఏంటి?!అరె!పాట పాడమని అడుగుదామనుకున్నాను కదా!మీసం చివర నుంచి తన చెంపను స్ప్రుసిస్తూ చెవి వెనుక మృదువైన ఒక ముద్దు!కిందకి జారుతూ మెడ మీద ఒక ముద్దు!నా కోసం కట్టిన గుడిని పదిలపరిచిన తన గుండెకి ఒక చిన్న ముద్దు!నా ప్రేమనంతా కలబోసి తన అరచేతిలో ఒక సున్నితమైన ముద్దు!నా ప్రేమను అంగీకరించినందుకు నుదుటి మీద మరో ముద్దు! మూతలు పడ్డ కనురెప్పల మీద లేలేత ముద్దు!

అర్జున్ కి ఇంకా మెలకువ రావడం లేదే?నా తాకిడిలో జీవం లేదా?లేక ఆట పట్టిస్తున్నాడా?!

“అర్జున్!అర్జున్!” పిలుస్తున్నా లేవడం లేదే! ఇక లాభం లేదు!గట్టిగా తట్టాల్సిందే!

“అర్జున్ లే!” గట్టిగా ఊపుతూ కిందపద్దను!!

“డార్లింగ్!”

‘నడి రాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు…’

ఇయర్ ఫోన్స్ లో పాట…మంచం కింద నడ్డి విరిగి నేను!!

“ఛ!ఇదంతా కలా!?ఆఖర్లో ‘డార్లింగ్’ అని అర్జున్ నన్ను పిలిచినట్టు కూడా అనిపించిందే! దెబ్బకి మత్తు వదిలిపోయింది” అనుకుంటూ పైకి లేచాను.

ఫోన్ లో పాట ఆపేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి నీళ్ళు గొంతులో పోస్కోబోయి ఒళ్ళంతా తడుపుకున్నాను! స్వయక్రుతాపరాధానికి

తిట్టుకుంటూ తడంతా తుడుచుకుని వచ్చి బట్టలు మార్చుకుని ఈ సారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచినీళ్ళు తాగి మళ్ళీ మంచమెక్కాను.కళ్ళు మూసుకోగానే అర్జున్!ఎందుకు ఈ అబ్బాయి ఇలా నన్ను చిత్రవధ చేస్తున్నాడు!మనసులో మాట చెప్తే ఎలా తీసుకుంటాడో!ఏమనుకుంటాడో!ఆఫీస్ లో తన కంటే సీనియర్ ని!పైగా టీం లీడర్ ని!!చులకనై పోతానేమో అని ఒక బాధ!ఒక వేళ తనకీ నా లాంటి ఉద్దేశమే ఉంటే?!

అర్జున్ ఆఫీస్ లో చేరి పదకుండు నెలలవుతుంది.అంటే దాదాపు ఏడాది కాలంగా నా ప్రేమను నా లోనే దాచుకొని మధన పడుతున్నాను!రేపు ఎలాగోలా చెప్పేస్తాను!అసలే అందగాడు అందులోనూ మంచివాడు!ఇంకెవరైనా ఎగరేసుకుపోతారు! నిద్రపోదామని కళ్ళు మూశాను.కొంటెగా కన్ను గీటుతూ అర్జున్!చప్పున లేచి కూర్చుని సెల్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్ పిన్ కొట్టి అర్జున్ కి తెలియకుండా తీసిన తన ఫొటోస్ చూసుకున్నాను.

“ఎంత ముద్దుగా ఉన్నావు రా!కల్లో కూడా అచ్చం ఇలాగే ఉన్నావే!” నా పిచ్చి చేష్టలకి నేనే నవ్వుకుని ఫోన్ ఆఫ్ చేసి అర్జున్ తలపులతోనే నిద్రపోయాను.

రోజు పొద్దున్నే నిద్రలేచి తయారయి ఆఫీసుకి వెళ్ళడమంటే మహా విసుగ్గా ఉండేది అర్జున్ రాకముందు. కానీ ఇప్పుడు? పొద్దెప్పుడెక్కుతుందా అని, అప్పుడే అస్తమిస్తున్నవా అని సూర్యున్ని రోజుకి రెండు సార్లు తిట్టుకోవాల్సి వస్తుంది! ఆఫీసు టైం అయిపోతుంది అంటే నేను పడే బాధ స్కూల్ పిల్లలు కూడా పడరేమో!

***           ***             ***

ఆఫీసు పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేసి దిగుతూనే ఎదురయ్యాడు అర్జున్!వంగపండు రంగు చొక్కా, గోధుమ రంగు పాంటు…ఆ ఐదడుగుల పదంగుళాల ఎత్తూ…ఆ అందం ఆ మీసం…కొత్తావకాయ పచ్చడి లా ఊరించేస్తున్నాడు! అప్రయత్నంగా పలకరించేశాను!

“హాయ్ అర్జున్!వాట్సప్?”

“హాయ్ టీ యల్!కళ్ళెర్రగా ఉన్నాయండి!నిద్రపోలేదా సరిగ్గా?

‘నీ విరహాగ్నిలో నిద్రెక్కడ పడుతుంది?’ లోపల అనుకుని

“హా!లైట్ గా” అన్నాను పైకి

“ఓ ఐ సీ!ప్లీజ్ టేక్ కేర్ అఫ్ యువర్సెల్ఫ్”

“ష్యూర్” నా వలపులు పైకి కనబడకుండా జాగ్రత్త పడుతూ అన్నాను

“హేయ్!నైస్ గ్లాసెస్!ఎక్కడ తీస్కున్నారు?” అడిగాడు నా కొత్త కళ్ళజోడు చూస్తూ

“నచ్చాయా?ఉంచేసుకోండి!” అనేసాను మనసులోని మాట

“అరెరే!వద్దండి.నేనూ ఇలాంటి వాటి కోసమే వెతుకుతున్నాను.అందుకే అడిగాను.అయినా  మీవి పెట్టుకోడం బాగోదు!”

“ప్లీజ్!తీసుకోండి. మొహమాట పడొద్దు!నా గిఫ్ట్ అనుకోండి అర్జున్” బలవంతంగా అతని చేతిలో పెట్టేశాను.

“అదేంటండీ!అసలే నాకు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. టీం లీడర్ అయ్యుండి నా పనంతా మీరే చేసేస్తారు. పైగా ఇదొకటి!” చాలా సిగ్గుపడుతూ అన్నాడు. ఎంత ముద్దొచ్చేశాడో!

“నిన్న మీకు ‘బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అండి.నిన్నే చెప్దామనుకున్నా కానీ అందరూ మీ చుట్టే ఉండడం వల్ల చెప్పలేకపోయా!సారీ!రెండేళ్ళ

నుంచీ ఆ అవార్డు మీకే వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయా! మీ టీం మెంబెర్ అయినందుకు చాలా గర్వంగా ఉంది!”

అర్జున్ కళ్ళు మెరిసిపోతున్నాయి!తన మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. తన చూపులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు.

“సరె సరే!ఎక్కువ పొగిడేయకండి!థ్యాంక్ యు!మళ్ళీ కలుద్దాం!”

షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మనసు సిద్ధంగా ఉంది కానీ ధైర్యం సరిపోలేదు!

‘ఏమనుకుంటాడో?’ అనే ఒక్క ప్రశ్న అన్నిటికీ అడ్డం పడుతోంది ముందుకి సాగనివ్వక!

***           ***             ***

మరుసటి రోజు కేఫటేరియాలో బాదంపాలు తాగుతూ కనిపించాడు అర్జున్. నా మనసంతా నిర్లిప్తంగా ఉంది. అర్జున్ని చూస్తుంటే నా మీద నాకే జాలి!సానుభూతి!చెప్పాలనుకున్న మాటలన్నీ పెదవి వెనుకే ఆగిపోతున్నాయి. ఈ జన్మకి చెప్పగలనా?చెప్పడానికి భయం కాదు!మొహమాటం లేదు!సంకోచం మాత్రమే.తరువాత జరిగేది ఊహకి అందడం లేదు!ఔనంటే నా అంత సంతోషించేవారు లేరు.కాదంటే?అదొక ఘోర అవమానం! కళ్ళల్లో నీళ్ళు రానివ్వకుండా ప్రయత్నిస్తున్నాను.

“మీ పెర్ ఫ్యూమ్ చాలా బావుంది టీ యల్!” చక్కటి చిరునవ్వుతో అన్నాడు అర్జున్.

“ఎందుకు విచిత్రంగా టీ యల్ అని పిలుస్తారు? అందరిలా పేరు పెట్టి ‘నువ్వూ’ అని మాట్లాడొచ్చుగా!నేనూ ఎవరితో ఇంత ఫార్మల్ గా మాట్లాడను. మీతోనే!”

“అంటే ఈ ‘గార్లు’, ‘బూర్లు’ మనిద్దరికే ప్రత్యేకం అన్నమాట!మంచిదేకదండీ!ఇందాక నేను మీకొక కంప్లిమెంట్ ఇచ్చాను!బదులు చెప్పనే లేదు!”

‘నాకు తెలుసు నీకిష్టమైన బ్రాండ్ అని!అందుకే కొనుకున్నాను’ మనసులో అనుకుని

“థ్యాంక్ యు!మీకు నచ్చినందుకు” ఏ ఆర్భాటం లేకుండా అన్నాను అర్జున్ తో

“మీకు ఏం ఆర్డర్ చెయ్యమంటారు?

“టీ”

“ఓ గుడ్.నేనైతే అస్సలు టీ కాఫీ తాగను టీ యల్” అంటూ లేచి వెళ్ళాడు.

ఏంటి?టీ కాఫీ తాగడా?అన్నీ తెలుసుకున్నాను కానీ ఈ విషయం తెలీదే నాకు!ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే అంత సులువా?!ఎన్నో ఏళ్ళు కాపురం చేసిన మొగుడూ పెళ్ళాలకే ఒకరి పట్ల ఒకరికి సరిగ్గా అవగాహన ఉండదు!నేనెంత!అర్జున్ తో మాట్లాడడానికి ఇదే అనువైన సమయం!అడిగేస్తాను!నేనంటే ఇష్టమో లేదో!

అర్జున్ టీ తీసుకువస్తున్నాడు.బ్లూ జీన్స్,బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ లో అదిరిపోయాడు ఇవ్వాళ!టీ తెచ్చి ఎంతసేపైనా తాగలేదు నేను.

“అదేంటి ఇంకా టీ తాగలేదు మీరు?” కప్పు లోకి తొంగి చూస్తూ అడిగాడు అర్జున్

“మీకిష్టo లేదుగా!” తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాను

“అదేంటి?నాకిష్టం లేకపోతే ఏం?” తటపటాయించాడు

“హహ్హహ!టీ బాలేదు అందుకే”

“అయ్యో!పోనీ కాఫీ తీసుకురానా?

“వద్దు బాదం పాలు ట్రై చేద్దామనుకుంటున్నా!”

“తెస్తాను టీ యల్!ఒక్క నిమిషం” లేవబోయాడు

“ఎందుకు?మీ చేతిలో ఉందిగా బాదంపాల టిన్!” ఎంత ఆపుకున్నా ముఖం లో సిగ్గు తొణికిసలాడుతూనే ఉంది నాకు.

“అదీ…అంటే నేను కొంచెం తాగాను.మీకు వేరేది తెస్తాను!”

“పర్లేదు!మీరు తాగాక ఆఖరిలో జస్ట్ టేస్ట్ చేస్తానంతే!”

అతడి ముఖంలో మార్పులు!కానీ స్పష్టత లేదు!!

***           ***             ***

“హ్యాపీ బర్త్ డే అర్జున్!”

“థ్యాంక్ యు టీ యల్.నాకు తెలుసు మొదటి కాల్ మీరే చేస్తారని!”

“అదెలా?”

“అదంతే!ఎలాగూ సండే కాబట్టి మీకో చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నాను.మీరు తప్పకుండా రావాలి!”

“అదేం వద్దు కానీ, మీ బర్త్ డే మా ఇంట్లోనే చేసుకోవచ్చు!మీరే రండి!పదకుండు గంటల కల్లా!”

“ఇంట్లో అంటే…మీ పేరెంట్స్ ఉంటారు కదా?పర్వాలేదా…?”

“ఏంటి మీకు తెలీదా?వాళ్ళు అమెరికాలో మా అక్క దగ్గర ఉంటున్నారు.ఇంట్లో నేను మాత్రమే ఉంటాను.వచ్చేయండి!బై”

ధైర్యం చేసి అర్జున్ ని పిలిచేశాను!అతనికి ఇష్టమైన కేక్ ఆర్డర్ చేశాను. ఇల్లంతా డెకరేట్ చేశాను. తనకి నచ్చే వంటలన్నీ స్వయంగా చేశాను.అన్నీ సిద్ధం చేసి స్నానానికి వెళ్ళిన ఐదు నిమిషాలకి బెల్ మోగుతోంది!అయ్యో! అర్జున్ వచ్చేశాడే!ఇలాగే టవల్ లో వెళ్లి దర్శనమిస్తే?చిలిపిగా నవ్వుకుని క్షణాల్లో రెడీ అయి తలుపు తీశాను.

తలారా స్నానం,కొత్త బట్టలు,కొత్త సెంట్,కొత్త వాచ్…సరికొత్త అర్జున్!లోపలికి వస్తూనే డెకరేషన్ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు.

“ఎందుకు ఇదంతా?”గోముగా అన్నాడు అర్జున్

“ముందు ఇది కట్ చేయండి!” చాకు అందిస్తూ అన్నాను

“నాకు చాక్లెట్ కేక్ ఇష్టమని మీకెలా తెలుసు?” ప్రేమగా అడిగినట్టు అనిపించింది

“ఇంకా చాలా తెలుసు!” ఓరనవ్వు తో సమాధానమిచ్చాను

అర్జున్ కేక్ కట్ చేశాడు.ఆ తర్వాత కట్ చేసిన కేక్ నాకు తినిపిస్తాడనే తలపే నాకు ఊపిరాడకుండా చేస్తుంది!అతని ముని  వేళ్ళు నా పెదాలకి, మునిపంటికి తగిలాయి!గుండె ఝల్లుమంది!!చిరు చెమటలు పడుతున్నాయి ఒళ్ళంతా.అరచేతులు సన్నగా వణుకుతున్నాయి.తనకివ్వాల్సిన కానుక నా గుప్పిట్లో ఊపిరాడక అవస్థ పడుతోంది!అర్జున్ ఎదురుగా నిలబడి ఒక్కొక్క వేలూ తెరిచి కానుక చూపించాను.అతడి కళ్ళు చెమర్చాయి!అమితాశ్చర్యంగా దాన్ని అందుకున్నాడు.

“నాకా?” ఉవ్వెత్తున ఎగిసే ఆనందం నిండిన కళ్ళతో అడిగాడు అర్జున్.

అవునన్నట్లు తలూపాను.

“మీరే పెట్టండి”

ఆ బంగారపుటుంగరం మా బంగారు భవిష్యత్తుకి పునాది అని నా ఆలోచన. కానీ ఆ మాట బయటకు చెప్తేగా తనకీ తెలిసేది!అర్జున్ చేతుల్లోంచి ఉంగరం తీసుకుని తన కుడి చేతి ఉంగరపు వేలికి తొడిగాను. నా చేతులు చల్లగా, తడిగా…వణికిపోతున్నాయి!అర్జున్ చేతికి చాలా అందంగా ఉందా ఉంగరం. నాకు మాటలు రావడం కష్టంగా ఉంది.

“భోం చేద్దాం పదండి” అన్నాను. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ.

డైనింగ్ టేబుల్ మీద పన్నీర్ కోఫ్తా,మటన్ ఫ్రై,చికెన్ బిర్యానీ,డబల్ కా మీఠా,అన్నం, పప్పు, గోంగూర పచ్చడి,ములక్కాడ జీడిపప్పు కూరలు చూసి అవాక్కయాడు!

“ఏంటండీ ఇవన్ని ఎవరితో చేయించారు?”

“ఎవరు చేస్తారు?నేనే” దొంగ కోపంతో అన్నాను.

“మీరా టీ యల్!నా కోసం మీరు చేశారా?నాకిష్టమైనవన్నీ నాకు తెలియకుండా కనుక్కుని ఇంత సర్ప్రైస్ ఇచ్చారు!నా జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు ఇది!మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. బహుశా బ్యాచిలర్ గా ఇదే నా ఆఖరి పుట్టినరోజు అనుకుంటా!”

కళ్ళకింద భూమి కంపించినట్టైంది నాకు! పెళ్ళా??అంటే అర్జున్ కి నా మీద ప్రత్యేకాభిమానం లేదనమాట! ఇంత తేలిగ్గా చెప్పేశాడేంటి?ఎంత దిగమింగడానికి ప్రయత్నించినా దుఃఖం,బాధ బొట్టు బొట్టుగా కళ్ళ వెంబడి కారుతూనే ఉన్నాయి…నా ఆవేదన దాచుకోడంలో విఫలమై అర్జున్ ముందు కన్నీటి పర్యంతమయ్యాను.అర్జున్ ఆందోళన పడుతున్నాడు.

“అరెరే!ఇప్పుడేమైందని?కళ్ళు తుడుచుకోండి ప్లీజ్!” తన జేబులోంచి రుమాలు తీసి నా కళ్ళు తుడవబోయాడు.

“ఏం లేదు సారీ!ఏదో గుర్తొచ్చి…సడన్ గా…అలా ఇమోషనల్ అయ్యాను.ఏం అనుకోకండి” ఏడుస్తూనే చెప్పాను.

అర్జున్ తన చేతుల్లోకి నా ముఖాన్ని తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను నమ్మలేని ప్రశ్న సూటిగా అడిగాడు!

“ఇంత పెద్ద అబద్ధం చెప్పినా నా మీదున్న ప్రేమని వ్యక్తపరచారా?”

నేను విన్నది నిజమేనా?కల కాదు కదా?వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అర్జున్ నోరు తెరిచి నన్ను అడిగాడా?!నిర్ధారించుకోడానికి మళ్ళీ చెప్పమని అడిగాను.

“మీరు విన్నది నిజమే!నేనంటే మీకిష్టం లేదూ?”

“అదీ…” నీళ్ళు నమిలాను

“నాకు మాత్రం మీరంటే చాలా ఇష్టం!కానీ పైకి చెప్పాలంటే సిగ్గు!మీరేమనుకుంటారోనని భయం!ఈ రోజు ఎలాగైనా చెప్పేద్దామని కంకణం కట్టుకున్నా!చెప్పేశా!అయినా మీ మనసులో ఏముందో తెలీదే!”

అర్జున్ ఆ మాటలు చెప్తున్నంత సేపూ నా గుండె వేగం పెరిగిపోయింది.నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.నా కల,నా ఆశ, నా అర్జున్…నిజమైన వేళ అది!

“నాకూ మీరంటే చాలా ఇష్టం!పిచ్చి!!” నిర్భయంగా చెప్పేశాను.

“ఈ మాట కోసం ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో తెలుసా?” అంటూ నాకు తెలియకుండానే నన్ను కౌగలించుకున్నాడు!అలాగే బెడ్ రూమ్ లోకి తీస్కెళ్ళాను.కౌగిలి బిగుసుకుంది.వచ్చీరాని ధైర్యం కూడగట్టుకుని తన బుగ్గ మీద నా మొదటి ముద్దు పెట్టాను!

‘అర్జున్…”

“మ్!చెప్పండి”

“ఇంకా అండి ఏంటి?పేరు పెట్టి పిలిచి మనస్పూర్తిగా ఏదైనా చెప్పొచ్చుగా!”

“గోపాల్…ఐ లవ్ యూ!”

“ఐ లవ్ యూ టూ అర్జున్!”

*

 

 

 

 

 

 

 

 

 

నా హీరో కోసం…

Naa hero ..

-కత్తి మహేష్

mahesh“హేయ్ విక్టర్ ! మెయిల్ చెక్ చేశావా?” అంటూ పక్క క్యూబికల్ నుంచీ మిస్టర్ వాస్ అనబడే కామినేని వసంత్ ఎగ్జయిటింగ్ గా అరిచినంత పని చేశాడు. మళ్ళీ ఒక్కసారి అటూ ఇటూ చూసి, తనవైపు చూస్తున్న చూపుల్ని పట్టించుకోనట్టు దర్జాగా నా దగ్గరకొచ్చి, మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు…రెట్టిస్తూ.
“లేదే” అన్నాను క్యాజువల్గా. “ఎనీ థింగ్ స్పెషల్?” అంటూ పనిచేస్తున్న విండో క్లోజ్ చేసి మెయిల్ ఓపన్ చేశా. హెచ్.ఆర్ నుంచీ ఏదో అర్జంట్ అని మార్క్ చేసిన మెయిల్. వాస్ వైపు కొంచెం ఖంగారుగా చూసేసరికీ, భుజం మీద క్యాజువల్ గా చెయ్యేసి నవ్వుతూ, “నథింగ్ టు వర్రీ…జస్ట్ చెక్” అన్నాడు.

ఓపన్ చేస్తే, ఎదో ఈవెంట్ ఇన్విటేషన్. సినిమా విత్ టీం. కాదు కాదు, ఎంటైర్ ఆఫీస్.
“హౌ ఎగ్జయిటింగ్ కదా !” అన్నాడు పొంగిపోతూ.
“సినిమానా!” అన్నాను, పొంగివస్తున్న చికాకుని కనిపించనీకుండా.
“అలాంటి ఇలాంటి సినిమా కాదు బాస్. బాహుబలి. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్. టికెట్లు దొరక్క జనాలు కొట్టుకు ఛస్తున్నారు. మనకేమో కార్పొరేట్ బుకింగ్. ‘ఎస్’ అని మెయిల్ కొట్టెయ్. ఆరువందల రూపాయలకి అందరూ కొట్టేసుకుంటున్న కొత్త సినిమా టికెట్ తోపాటూ పాప్ కార్న్, కూల్ డ్రింక్ కాంప్లిమెంటరీ.” అని లొడలొడా ఒక రన్నింగ్ కామెంట్రీ చెప్పేసాడు.
అతని ఎక్సయిట్మెంటు చూస్తూ పక్కనున్న క్యుబికల్స్ లోవాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతూ, మెయిల్ పంపడంలో బిజీ అయిపోయారు. కీబోర్డ్ టకటకలు తప్ప మరేమీ వినిపించడం లేదు.
మిస్టర్ వాస్ నావైపు, నా కంప్యూటర్ స్క్రీన్ వైపు, నా కీబోర్డ్ వైపు మార్చిమార్చి అంతే క్యూరియస్గా చూస్తున్నాడు.

“నేను తెలుగు సినిమాలు చూడను వాస్ గారూ” అన్నాను మెల్లగా.
నేను ఎంత మెల్లగా అన్నా, నాకే పెద్దగా వినిపించింది. అప్పటివరకూ టక్కుటక్కు మన్న కీబోర్డులు ఒక్కసారిగా ఆగిపోవడం నాకు క్లియర్గా తెలుస్తోంది.
“వాట్!!!” హార్ట్ అటాక్ వచ్చిన పేషెంటులా గుండెపట్టుకుంటూ వాస్ అంటుంటే, కొన్ని తలల క్యూరియస్గా క్యూబికల్స్ నుంచీ తాబేటి తలల్లా బయటికి వచ్చాయ్.
“ఇది తెలుగు సినిమా కాదండీ! ఇండియన్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా. అని నేను చెప్పడం కాదు. కరణ్ జొహర్ చెప్పాడు. అర్థమయ్యిందా?” అని కొంచెం సీరియస్ టోన్లో అన్నాడు వాస్.
“ఫరవాలేదు వాస్ గారూ. తెలుగులోనే సినిమా ఉంటుందిగా, తెలుగువాళ్ళే తీశారుగా. వద్దులెండి.” అని పొలైట్ గా అనేసి నా పని నేను చూసుకోవడానికి అటుతిరిగాను.
“స్ట్రేంజ్ మ్యాన్ యార్ ! బాహుబలికి రమ్మంటే, తెలుగు సినిమానే చూడనంటున్నాడు. వాటె పిటీ.” అనుకుంటూ వాస్ తన క్యాబిన్ వైపు నడుస్తూ గొణుక్కోవడం నాకు తెలుస్తూనే ఉంది. వెనకనుంచీ కొన్ని జతలకళ్ళు నా వీపుకి గుచ్చుకోవడం అనుభవంలోకి వస్తూనే ఉంది.

దాదాపు ఇరవై  సంవత్సరాలయ్యింది తెలుగు సినిమా చూసి.
ఒకప్పుడు…సినిమా అంటే పిచ్చి.

***

సినిమా అంటే ఒక పండగ.
వారంవారం వచ్చే పండగ.
ఇల్లంతా సినిమా పోస్టర్లే.
ఇల్లంటే ఇల్లుకాదు. షెడ్ లాంటిది. ఆస్ బెస్టాస్ రేకులతో కట్టిన చిన్న ఇల్లు.
అమ్మ. నేను. ఇళ్ళలో పాచిపని చేస్తే వచ్చే అంతో ఇంతతో సంసారం, నాచదువులూ.
పోస్టర్ పడిన రోజే తడిఆరని పోస్టర్లని జాగ్రత్తగా చించితీసుకొచ్చి ఇల్లంతా అంటిస్తే, ఏమీ అనకుండా నవ్వేది అమ్మ. రాత్రి నిద్రపట్టనప్పుడు కప్పువైపు చూస్తూ, కనిపించే చిరంజీవినీ, బాలకృష్ణనీ చూసి డిషుండిష్షుం అంటుంటే మెత్తగా కసురుకునేదీ అమ్మే. రాంజేంద్ర ప్రసాద్ పోస్టర్ చూసి ఫక్కున నాక్కూడా తెలీకుండా నేను ఏదో తెరమీది జ్ఞాపకాన్ని తెరలుతెరలుగా గుర్తుతెచ్చుకుని నవ్వితే, పిచ్చోడ్ని చూసినట్టు చూసేదీ అమ్మే.
అమ్మే నాకు లోకం.
సినిమా నాకు ప్రాణం.

***

ఏ సినిమా రిలీజ్ అయినా, రిలీజ్ రోజు హడావిడి మొత్తంనాదే.
ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమా అంటే ఏటమాంసం తెగే పెద్దపండగతో సమానం.
సిటీ నుంచీ వచ్చే కటౌట్, రిలీజ్ రోజు ముందరే థియేటర్ ముందు నిలబెడుతుంటే, నా జతోళ్ళతో కలిసి డప్పు కొట్టించేది నేనే. రాత్రంతా మేలుకుని రంగుకాయితాల సరాలు కట్టించేది నేనే. వారంరోజులు ఎండబెట్టిన టపాకాయలకి కావిలి నేనే. ఎగరెయ్యడానికి న్యూస్ పేర్లు చించి బస్తాల్లో నింపేదీ నేనే. జనాల్ని తోసుకుని టికెట్ తెచ్చేది నేనే.

షర్ట్ చిరిగినా, చెయ్యి ఒరుసుకుపోయి రక్తం కారినా, అప్పుడప్పుడూ పోలీసుల లాఠీలు వీపు విమానం మోత మోగినా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటంలోని ఆనందమే ఆనందం.

ఈలలూ గోలలూ థియేటర్ మారుమ్రోగిస్తుంటే. కర్పూర హారతులు హీరోలకు నీరాజనాలందిస్తుంటే. ఐదు,పది,పావలా బిళ్ళలూ ఉత్సాహంగా గాల్లో ఎగురుతుంటే. అప్పుడు సరిగ్గా తెరపై కనిపించని హీరోకూడా సూపర్ మ్యాన్ లాగే ఉండేవాడు. వినిపించని డైలాగ్ కూడా విజిల్ వేసే రేంజ్ లో అనిపించేలా ఉండేది. సినిమా చూడ్డంకాదు. అలా సినిమా చూడ్డమే, అసలైన సినిమా చూడటం.

సినిమా చూసేంత డబ్బుండేది కాదు.
మా క్లాసు లో ఉండే మిగతావాళ్లకి డబ్బుండేది.
సినిమా అంటే అభిమానమూ ఉండేది. కొందరు హీరోలంటే ప్రత్యేకమైన అభిమానమూ ఉండేది.
కొన్ని గ్రూపులు కొన్ని సినిమాలకే పొయ్యేవి. కానీ నేను మాత్రం అందరికీ కావాలి.నాకు అన్ని సినిమాలూ కావాలి. తెర మీద బొమ్మ పడితే చాలు, అన్ని కష్టాలూ తీరిపోయి, కొత్తలోకాలకు కనపడేవి.

***

ఒక రోజు ఉదయమే స్కూలు పిట్టగోడ మీద మీటింగ్ జరిగింది.
ఒకరి సినిమాకు మరొకరు పోని రెండు గ్రూపులూ కలిసి నన్ను పిలిపించాయి.
“చెప్పరా…నీకు చిరంజీవి ఇష్టమా ! బాలకృష్ణ ఇష్టమా?” అంటూ సూటిగా పాయింట్ కి వచ్చేశాడు. కొంచెం లావుగా, పొడవుగా ఉన్న ఒక కుర్రాడు. చాలా సార్లు, రంగుకాయితాలకూ, గమ్ముకూ డబ్బులిస్తుంటే చూసాను అతన్ని. అప్పుడప్పుడూ నోట్లిచ్చి చిల్లర తెమ్మనేదీ అతనే.
“ఇద్దరూ ఇష్టమే అన్నా..వాళ్లతో పాటూ రాజేంద్ర ప్రసాద్ కూడా” అంటూ నసిగాను.
పెద్దగా నవ్వుతూ, ఆ మాట అడిగినోడు వాళ్ళ గ్రూప్ వైపుకి తిరిగి, “రాజేంద్ర ప్రసాద్ ని కలుపుతాడేందిరా వీడూ ! ” అంటూ పెద్దగా నవ్వి, నావైపు తిరిగి, “ఇష్యూ అది కాదు. బాలకృష్ణనా…చిరంజీవా!” రెట్టించి తను.
“ఇద్దరూ ఇష్టమే” అని బింకంగా నేను.

chinnakatha
“నీకిట్లా చెప్తే అర్థం కాదుగానీ, చూడూ…బాలకృష్ణ మావోడు. చిరంజీవి వాళ్ళోడు. ఈరోజు నువ్వు ఎవరి వైపు వెళ్తే వాళ్ళ సినిమాకే పనిచెయ్యాల. వాళ్ల సినిమానే చూడాల. అర్థమయ్యిందా.” అంటూ గోడ మీద కూర్చున్న మరో గ్రూపుకేసి చూశాడు. ‘అంతేకదా!’ అన్నట్టు అక్కడి తలలు ఊగాయి.
నాకు ఏమీ అర్థంకాక, మౌనంగా చూస్తూ ఉండిపోయాను.
నన్ను దగ్గరగా లాక్కుని, తీక్షణంగా చూస్తూ… “చెప్పు. చిరంజీవా…బాలకృష్ణనా!”
“అందరి సినిమా కావాలన్నా” అన్నాను బలహీనంగా.
ఇంతలో ఆ గ్రూప్ నుంచీ ఒకరు ఒక్క గెంతుతో నాదగ్గరకొచ్చి, “ఏయ్, డిసైడ్ చేసుకోమంటే పోజుకొడతావేందిబే? అయినా, చిరంజీవి, బాలకృష్ణా ఇద్దరూ మీవోళ్ళు కాదు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొమ్మంటే పొగరారా నీకు!” అని చిరాగ్గా నన్ను చూసి, అప్పటి వరకూ నన్ను బెదిరించిన కుర్రాడితో, “చూడు సాగర్. వీడు మీవోడూ కాదు. మావోడూ కాదు. ఇద్దరికీ పనికొస్తాడు అంతే. వీడు కాకపోతే ఇంకొకడు. వదిలెయ్.” అని మొత్తం గ్రూప్ ని అక్కడ్నించీ తీసుకెళ్ళిపోయాడు.

సాగర్ నావైపు తీక్షణంగా చూస్తూ, “ఇంకెప్పుడైనా థియేటర్ దగ్గర కనిపించావో…” అంటూ నన్ను కిందకి తోసేసి గ్రూప్ వైపు వెళ్ళి పిట్టగోడ మీద కూచున్నాడు. నేను ఒంటరిగా ఇటువైపు మిగిలాను. నేల మీద నుంచీ లేస్తూ, మట్టిని విదుల్చుకుంటూ, వాళ్లవోళ్ళేమిటీ, వీళ్ళవోళ్ళేమిటో నాకు అర్థంకాక గుండెల మీద చెయ్యిపెడితే, సిలువ తగిలింది. వాళ్ళూ వీళ్ళూ మాట్లాడింది కులమని అప్పుడే అర్థమయ్యింది.

గుండెల్లో భగ్గుమన్న బాధ. ఆడుతున్న సినిమా మధ్యలో కార్బన్ సెగ ఎక్కువై, రీలు కాలిపోతున్న వాసన. తెరమీది మంటలు తెరనే కాల్చేస్తున్నట్టు భ్రమ. కలలో వచ్చినట్టు, ఇంటికొచ్చేసా. చుట్టూ ఉన్న పోస్టర్లలోని గన్నులు, నామీదే ఎక్కుపెట్టినట్టు ఫీలింగ్. ఒంటికాలి మీద ఎగిరిన హీరో, నా మీదకే దూకుతున్నట్టు భయం. వెక్కిరిస్తున్నట్టు. వెర్రిగా చూస్తున్నట్టు. కళ్ళు మసకబారి, పోస్టర్లోని ఫోజులన్నీ కెలికేసినట్టు భయంకరంగా…చాలా భయంకరంగా.

భయం. ఉన్మాదం. కోపం. ఉక్రోషం. ఒక్కో పోస్టర్నీ బలంగా లాగేస్తుంటే, అప్పటిదాకా ఆస్ బెస్టస్ రేకులమీద కనిపించకుండా ఉన్న ఎన్నో బొక్కలు ప్రత్యక్షం అవుతున్నాయి. వెయ్యి ముక్కలుగా చించేస్తుంటే, మనసు వంద ముక్కలుగా విడిపోయింది.

పడిపోయాను. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి స్పృహ లేకుండా నిద్రపోయాను. లేచేసరికీ మూడవుతోంది. కాళ్ళీడ్చుకుంటూ, ఇల్లూడ్చేశాను. సినిమా ఆనవళ్ళు లేకుండా తుడిచేశాను. ఏంచెయ్యాలో తోచక మళ్ళీ ఊర్లోకి వచ్చాను.

***

సుజాతా టాకీసులో, ఏదో సినిమా ఆడుతోంది.
డబ్బింగ్ సినిమా. సగం సినిమా అయిపోయిందేమో. పెద్దపెద్దగా శబ్దాలు వినిపిస్తున్నాయి.
జేబులో పావలా ఉంది. గేటు దగ్గర సౌదులన్న బీడీ తాగుతున్నాడు.
చేతిలో పావలా పెట్టి నవ్వితే, చల్లగా గేటు తీశాడు. మెల్లగా లోపలికి నేను.
తెర మీద హీరో అర్జున్ కనిపిస్తున్నాడు. సూట్ కేస్ తీసుకుని రైల్వేస్టేషన్ దగ్గరికి హడావిడిగా వస్తున్నాడు. వెనకాలే హీరోయిన్. రోజా సినిమాలో చేసిన అమ్మాయి. హఠాత్తుగా పాట మొదలయ్యింది. విచిత్రమైన బీటు. ఒక చిన్నపిల్లాడెవడో బుల్లిబుల్లి అడుగులు వేస్తూ, కాస్తపాడేసరికీ మైకేల్ జాక్సన్ లాంటి గొంతేసుకుని, ఒకతను గెంతుతూ తెరమీద ప్రత్యక్షం అయ్యాడు. అతని మెడలో సిలువ, చెవిపోగులకున్న సిలువా నా కళ్లను జిగేలుమనిపించాయి.
ఏదో ఆలోచన వచ్చింది. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూశాను. ఎవరూ లేరు.
ముందున్న సీట్లోవాళ్ళని బలంగా తడుతూ అడిగాను, “ఎవరతను?”
“ప్రభుదేవా” అని సమాధానం.
“ప్రభు…దేవా పేరు. మెడలో సిలువ. చిరంజీవి-బాలకృష్ణకన్నా మంచి డ్యాన్సర్. నా హీరో…మావాళ్ల హీరో” అనుకుంటూ, స్పీడుగా బయటొచ్చి, డిస్ల్పేలో ఉన్న ఒక ఫోటో కార్డ్ రహస్యంగా దొంగిలించి, సైదులికి తెలీకుండా గేటు దాటి రయ్యిమని స్కూల్ దగ్గరికి వచ్చాను.

పిట్టగోడ దగ్గర తన గ్యాంగ్ తో సాగర్ ఇంకా కూర్చునే ఉన్నాడు. గర్వంగా అడుగులేసుకుంటూ వెళ్ళాను. “ఏమిటన్నట్టు” చిరాగ్గా ముఖం పెట్టాడు.
చేతిలో ఉన్న ప్రభుదేవా ఫోటో కార్డ్ దగ్గరగా పెట్టి “ఇదిగో మా హీరో..ప్రభుదేవా” అన్నాను.
ఫోటోనీ నన్నూ మార్చిమార్చి చూస్తూ, కసిగా నవ్వి, “పేరు ప్రభుదేవానే, డ్యాన్స్ మాస్టర్ సుందరం కొడుకు. బహుశా బ్రాహ్మలై ఉంటారు. మీ వాళ్ళు కాదు.” అని నలిపి నా ముఖాన కొట్టాడు.

ఆ తరువాత నాకు ఏమీ వినిపించలేదు. అప్పటి నుంచీ నాకు తెలుగు సినిమా కూడా కనిపించలేదు.

****
టైం ఐదయ్యింది.
కంప్యూటర్ క్లోజ్ చేసి బయటకొస్తుంటే, క్యాంటిన్ దగ్గర మిస్టర్ వాస్ అనబడే కామినేని వసంత్ కనిపించాడు. కళ్ళు కలవగానే ఏదో సైగ చేస్తూ ఆగిపోయి, బై అన్నట్టు చెయ్యి ఊపాడు. వెళుతుంటే, నాకు వినిపిస్తూనే ఉంది, పక్కనున్న వాళ్లతో “హి ఈజ్ నాట్ కమింగ్ టు బాహుబలి యార్…హౌ సాడ్ ! హి ఈజ్ మిస్సింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్” అనడం.
కిందకొచ్చేసరికీ, రిసెప్షనిస్ట్ “సర్… మార్నింగ్ పేపర్ అడిగారు కదసర్. ఇదిగోండి.” అంటూ పొద్దున అడిగిన పేపర్ ఇప్పుడిచ్చింది. చేతిలో పట్టుకుని కార్ ఎక్కాను. పక్క సీట్లో పేపర్ పడేసి, కార్ స్టార్ట్ చేసేసరికీ, న్యుస్ పేపర్ పేజీలు విడిపడ్డాయి.
ఒక న్యూస్ ఐటం ఆకర్షించింది.
“బాహుబలి రిలీజ్ సందర్భంగా భీమవరంలో రాజుల సందండి – పర్మిషన్ కి పోలీసుల నిరాకరణ”
బాధగా అనిపించింది.
సినిమాని సినిమాగా చూశాను ఒకప్పుడు.
ఇప్పుడు కులంగా తప్ప మరేరకంగానూ చూడలేకపోతున్నాను.
మాకులపోడు కూడా టాప్ హీరో అయితేతప్ప తెలుగు సినిమా చూడకూడదనుకున్నాను.
నా హీరో కోసం…ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను.
తప్పు నాదా ! సినిమాదా! ! లేక, ఇలా సినిమాని కులంగా మార్చేసిన కులాలదా !!!
ఒక లాంగ్ డ్రైవ్ తప్పదనిపించింది.
కార్ ని ముందుకు పోనించాను.

*

 ప్రయాణం ఆగింది

మేడి చైతన్య 

 

scan0033నా ఏడుపు నాకే వినిపించనంతంగా డపుక్కుల మోత. నిశబ్దంగా నడుస్తున్నట్లున్న గుంపులోని గుసగుసలన్నీ తనలో కలిపేసుకుంటున్న టపాసుల శబ్దం. దింపుడు కళ్ళెం ఆత్రంగా మొఖం వైపు చూశా ఏమైనా కదలిక ఉందోనని! మూడుసార్లు గుండ్రంగా తిరిగేటపుడు అడుగడుక్కీ దూరం అనంతంగా పెరుగుతున్నట్టుంది. చెవి దగ్గరకెళ్ళి తడి ఆరిన పెదాలను గట్టిగా కూడబలుక్కున్నా.

నా… న్నా!…..

 

***

చద్దన్నం తినడం, తెల్లారుతుండగానే సైకిల్మీద పొలానికెళ్ళడం, తెల్లటి మేఘాల్లా మెరిసిపోతున్న పత్తి గుబ్బలను అక్కతో పోటి పడి తీయడం, కొద్దిసేపటికే రెండు మూడు చెట్లను పందిరిలా అల్లి ఆకులోంచి వస్తున్న నీరెండను తప్పించుకోవాలనుకోవడం, పచ్చడితో సల్లబువ్వ తాగడం, సాయంత్రమయ్యేసరికి ముందు వెనుక బస్తాలేసి నాన్న నడిపిస్తుంటే సైకిల్ సీటు పైనే కూర్చోని నడిచొస్తున్న అక్కని చూసి వెక్కిరించడం, పొద్దుగూకినాకే నీళ్ళుపోసుకోవడం, తెచ్చిన పత్తిమీదే పడుకోవడం…. చిన్నప్పటి నాజీవితం.

ఇద్దరూ వళ్ళు హూనం చేసుకోని పత్తిమీద వచ్చిన డబ్బుతో వరిపొలమొకటి కొన్నారు. అరెకరం నుండి ఎకరన్నర ఆసామిగా నాన్న కూలి నుంచీ రైతుగా తన అస్తిత్వాన్ని రూపాంతరీకరణ చేసుకున్నాడు! అమ్మ కూలికెల్తానన్నా ‘రైతు భార్య వేరే వాళ్ళ పొలంలో పనిచేయొచ్చా?’ అనంటే ఉన్న పొలంలోనే పని చేసేది. రెడ్డిగారి పొలం కౌలుకి తీసుకుందామని నాన్నంటే, పెట్టుబడికి అమ్మ చెవికమ్మలను తాకత్తు పెట్టమని ఇచ్చింది.

***

గాలి వీచినప్పుడల్లా బరువుతో తల నేలకి గిరాటేసి వెర్రిగా నృత్యం చేస్తున్నాయి వరికంకులు! వరిపొట్టు ముదరటానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు! వరికోతకు అప్పుడే కొడవళ్ళు చేయించి, ఏళ్ళుగా వెలుతురు చూడని వరిగుమ్మిని బూజుదులిపింది అమ్మ. ఎన్నో రోజుల తర్వాత నాన్న కంటినిండా నిద్ర పోయాడు.

పొద్దున్నేకాలు బయటపెట్టానో లేదో కర్రిమబ్బొకటి మింగేయడానికొచ్చినట్లు వచ్చింది. చూట్టూ ముసురు కమ్ముకుంది. చలనం లేకుండా నిల్చున్న నన్ను చూసి నాన్న లోపలనుంచి వచ్చాడు.

“ఏమైందబ్బాయ్?” అని అడుగుతూ నా భుజంపై వేసిన ఆయన చేయి మీద రుపాయిబిళ్ళంత వాన చినుకొకటి పడింది. తలెత్తిన మరుక్షణమే ఎడతెరపి లేకుండా వస్తున్న వాననీ, నోట మాట రాక నిస్సహాయంగా చూస్తున్న నాన్న చూపుల్నీ చూసి బిత్తరకపోయాను.

“వామ్మో! వర్షపు చాయలు మరో నెల రోజుల వరకు కనిపించవని చెప్పాడు కదే ఆ వార్తలు చెప్పేవాడూ!!?” అని నుదురుమీద చేతులేసుకోని కొట్టుకుంటా అమ్మ ఏడుస్తోంది.

అక్క మౌనంగా పైకప్పు కన్నాల్లోంచి పడుతున్న వాన చుక్కలకి ఇల్లంతా మట్టి రొచ్చు కాకుండా కూరసట్టెలు, చెంబులు పెడుతుంది.

నాన్న వడి వడిగా గోనెపట్టా కొప్పెర వేసుకోని బయటకెళ్ళిపోయాడు.

“మీ నాన్న ఉలుకు పలుకు లేకుండా కుర్చున్నాడు వెళ్ళి తీసుకురారా చిన్నోడా” అని చుట్టింటి తాత చెప్పేసరికి పొలం దగ్గరకెళ్ళా. వరంతా నేలరాలింది. మడి మధ్యలో కూర్చోని వాన నీటిలో తేలియాడుతున్న వరికంకులను ఏరుతున్నాడు నాన్న. రెక్కపట్టి లేపితే నా భుజం మీద పడి బావురుమన్నాడు. చేతికందొచ్చిన కొడుకు కళ్ళముందే చనిపోతే ఎలా ఉంటుందో నాన్న కన్నీళ్ళలో కనిపించింది. స్పృహ లేనట్లున్న నాన్నని కష్టం మీద నడిపించుకుంటా ఇంటికి తీసుకొచ్చాను.

 

***

‘ప్రభుత్వం నష్టపోయిన పంటలకు డబ్బులిస్తుందని, పంచాయితి ఆఫీసుకి రేపు పాసుపుస్తకాలు తీసుకురావాలని’ దండోరా వేయించాడు సర్పంచ్. రెడ్దిగారి జీతగాడొచ్చి ఇంటికి రమ్మంటున్నాడంటే ఇద్దరం వెళ్ళాం. ‘రెండెకరాల కౌలు డబ్బులెప్పుడిస్తావ’ని అడిగాడు రెడ్డి నాన్నని.

‘పంటంతా పోయింది, ఇంట్లో జరుగుబాటుకే కష్టంగా ఉంద’నేసరికి పడక కుర్చీలోంచి లేచి లోపలకెళ్ళి ఓ వంద రూపాయిలు తెచ్చి నాన్న చేతిలో పెట్టి మళ్ళీ లోపలకెళ్ళాడు. ‘ఏందబ్బా ఇంత దాతృత్వం!?’ అనుకుంటుండగానే గుమస్తా మా దగ్గరకొచ్చి “రేపు ప్రభుత్వం వాళ్ళు అడిగినపుడు కౌలుపొలం లెక్కలోకి చెప్పొద్దన్నాడు రెడ్డి. కౌలుకట్టలేకపోయినోడు కట్టలేనట్లే ఉండాలని చెప్పమన్నాడు” అన్నాడు.

నిల్చున్న నేల బద్దలవుతున్నట్టుంది. ఆ డబ్బులొస్తే ఇంట్లోకి జరుగుబాటు అన్నా అవుద్దనుకున్న మాకు ఏడుపు తన్నుకొస్తుంటే సన్నగా వెకిలి నవ్వొకటి నవ్వుతూ రెడ్డి బయటకొచ్చాడు. 5 సం.లకు కౌలు కుదుర్చుకున్న ఒప్పందపత్రం చించేశాడు.

నవ్వంతా మీసాల చాటున దాచిపెట్టి గవర్నమెంట్ ఇచ్చిన పంటనష్టాన్ని “విషణ్ణవదనంతో” అందుకున్నాడు రెడ్డి.

 

***

అమ్మ మంగళసూత్రాలు మా కడుపుల్ని ఆదుకున్నాయి.

ఈ ఏడాదంత వర్షపు జాడ లేదు. నేల నోరు తెరిచి ఆత్రంగా నీటి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పొలాలకని పక్క రాష్ట్రం నుండి తెచ్చిన నీళ్ళను ఎగువకాల్వలోకి వదులుతామని ప్రభుత్వం వార్తల్లో చెప్పిందంట. ఆ నీళ్ళ కోసం మేము కూడా నేలతల్లి లాగా ఆత్రంగా చూస్తున్నాం.

సందేళే ఒక ముద్ద తిని, నాన్న నేను పొలానికి బయల్దేరాం. “చిన్నోడా! ఈ ఏడు ఎలాగైనా అక్కను ఒక మంచి ఇంటికి పంపిస్తే నా బరువు తీరిపోతుందిరా! అమ్మ సూత్రాలు కమ్మలు తెచ్చివ్వలేనేమో గాని ఒక రెండు చీరలన్నా కొనాలి. నన్ను చేసుకున్న పాపానికి ఏరోజూ నోరెత్తి నాకిదికావాలి అడిగిన పాపాన పోలేదు.

నీళ్ళొస్తాయనీ పంట పండుతుందనే ఆనందంలో కడుపునిండా తినడానికే లేదన్న సంగతి మర్చిపోయాడు. నీళ్ళు వచ్చేలోగా ఒక కునుకేద్దామని రగ్గు తీసి పక్కేసాం. నాకు ఒళ్ళు తెలియనంత నిద్ర కమ్మేసింది.

గాలి వీస్తున్న దిశలో ఏటవాలుగా వడ్లు తూర్పారపడుత్తున్నారు. మానికలతో కొలచి బస్తాల్లో పోసి వాటిని దబ్బనంతో కుడుతున్నారు. గడ్డంతా తీసి వామేస్తున్నారు. చీకటి పడుతుండగా పోల్చుకోలేని

ఆకారమొకటి మా దగ్గరకొచ్చింది. పనిచేస్తున్న వారంతా, ఆ ఆకారం చెప్పిందే తడవుగా

బస్తాలని ఎడ్ల బండ్లోకి మోసుకెళుతున్నారు. నాన్న ధాన్యం ఇవ్వనని అరుస్తున్నాడు. అలా అంటున్న నాన్న రెక్కలు మడిచి వెనక్కి పట్టుకున్నారు. ‘మా నాన్నని విడవండి – మా నాన్నని విడవండి’ అని అరుస్తూ పరిగెత్తుతూ బోర్లా పడ్డాను. నుదురు రాయికి కొట్టుకుని ముఖం అంతా రక్తం.

“చిన్నోడా! నీళ్ళొస్తన్నాయ్” అని అమ్మపెట్టిన కేకకు ఉలిక్కిపడి లేచేసరికి, నీళ్ళ శబ్దం కాలవలో.

వచ్చిన కలని తల్చుకుంటున్నకొద్దీ భయంగా ఉంది. ఆందోళనగా నాన్నవైపు చూశాను. కాలవకి గండిపెట్టి పొలాన్ని తడుపుకోవడానికి అమ్మనాన్న వంగి సాళ్ళని గట్టి చేసుకుంటున్నారు.

క్షణక్షణానికి దగ్గరవుతున్న నీళ్ళ శబ్దానికి నాన్న ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.

శబ్దం తప్ప నీళ్ళు రావేందీ!? ఏదో స్పురణకి వచ్చినవాడిలా దిగ్గున లేచాడు. నేను కూడా కాలవ మీదకి పరిగెత్తి నాన్నతో నడిచాను. ముందుకెళ్ళి చూస్తే, రెడ్డి జీతగాడు కాలవకి అడ్డకట్టు వేసి రెడ్డి పొలమును తడుపుతున్నాడు.

‘నీళ్ళు మీరే మళ్ళిస్తుంటే మా పొలాలెలా తడవాలి?’ అని అడుగుతుంటే పొగ వదులుకుంటూ రెడ్డి మెల్లగా వచ్చాడు.

“నోటి కాడ కూడు లాక్కెళ్ళడడం మీకు ధర్మం కాదు బాబయ్యా, ప్రాణాలన్నీ పంటమీదే పెట్టుకున్నాం, మీరు దయతలస్తే మా భూమి కూడా తడుపుకుంటాం” అని నాన్న అంటుంటే ఏమి విననట్టు చూస్తా నిలబడ్డాడు.

“మా పొలం తడవనియ్ ముందు తర్వాత చూద్దాం” అని “ఒరే మన పొలమంతా తడిసేదాకా చుక్క కూడా కిందకొదలొద్దు” అని ఇంకొక చుట్ట వెలిగించాడు.

“నీవు దౌర్జ్యనంగా దోచుకుతింటుంటే, నీ కాళ్ళ కింద బానిసల్లాగా బతికేటోళ్ళెవ్వరు లేరు” అని

అడ్డకట్టు కొట్టడానికి ముందుకెళ్ళా. జీతగాడు ముళ్ళుగర్ర తీస్కోని నా మీద కొస్తుంటే చేతికి దొరికిన

రాయితీసుకోని వేశా. వాడి తల పగిలింది. ముందుకి అడుగేసేలోపు కర్రొకటి నావీపు మీదా బలంగా

పడింది. వెనక్కి తిరిగి చూద్దామనుకునేసరికి తలమీద ఇంకో దెబ్బ. నీరంతా ఎరుపెక్కి రెడ్డి పొలంవైపే పారుతున్నాయి. స్పృహ తప్పింది.

లేచి చూసేసరికి అక్క దిగాలుగా ‘రెడ్డిని కొట్టినందుకు పోలీసులు నాన్నను తీసుకెళ్ళారం’ది ఏడుస్తా. అమ్మేమో రెడ్డి కాళ్ళ మీద పడైనా నాన్నను విడిపించుకొని రావడానికి వెళ్ళిందట. మూడు రోజులవుతున్నా నాన్న ఇంటికి రాలేదు.

ఈ మూడు రోజులూ నీళ్ళు రెడ్డి పొలాన్ని తడుపుతూనే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు పంటలన్నింటికీ నీళ్ళందించినందువల్ల కాలువ మూసేస్తున్నామని చెప్పారు.

కాలువ నీళ్ళు ఆగిపోయిన తెల్లారే నాన్న ఇంటికొచ్చాడు.

 

***

కడుపులు నింపుకోవడానికి జనం కూలీలుగా వలసలు వెళుతున్నారు. చాలా ఇళ్ళు మనుషుల్లేక శిధిలాలుగా మారిపోతున్నాయి.

నాన్న వచ్చే ఏడు పెట్టుబడి కోసం ఎవరెవరినో అప్పు అడుగుతున్నాడు. అప్పులొద్దు మనం కూడా కూలీకి వెళ్దామంటే “రైతనేవాడు ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా మట్టిని నమ్ముతూనే ఉండాలిరా, నా ఒంట్లో సత్తువ ఉన్నంతవరకూ నా పొలంలోనే రైతుగానే పని చేస్తానురా, నా పొలాన్నే నమ్ముకుంటా, అది నన్ను అన్యాయం చేయదు” అన్నాడు.

‘ఆ పొలమే తాకట్టులో ఉంది. ఇంకదేం సాయం చేసిద్దయ్యో’ అని అమ్మ అంటానే ఉంది. నాన్న విననట్లుగా అప్పు కోసం తిరుగుతానే ఉన్నాడు.

రోజులు గడుస్తున్నాయి. అక్కకు మంచి సంబంధం వచ్చింది. అక్క వాళ్ళకి నచ్చింది. వారం రోజుల్లో పెళ్ళి. ఎంత మంది చుట్టో అప్పు కోసం తిరుగుతున్నాడు నాన్న. ఈసారి అప్పు పొలం పెట్టుబడి కోసం కాదు. కట్నం డబ్బుల కోసం.

నాన్న ఇంటికి రాగానే ఆయన ముఖం వైపు కాకుండా చేతులవైపే చూస్తున్నాం ఇంట్లో అందరం. ఉత్తచేతులే.

అప్పుడే పొలం మీద తీసుకున్న అప్పు పది రోజుల్లో తీర్చాలని, లేకపొతే పొలం జప్తు చేస్తామని బ్యాంకు నోటీసు వచ్చింది.

దారులన్ని ఒకొక్కటే మూసుకుపోతున్నాయనిపించింది. “భూమికూడా పోతే ,ఇంకెలాగురా మనం బతికేది? బతుకంతా ఇంకొకరికి ఊడిగం చేయాల్సిందేనా?” అని పిల్లాడిలా నాన్న రాత్రి నా మంచం పక్కన కూర్చోని తల మీద చేతులేసుకోని ఏడ్చాడు.

ఆయన కళ్ళలో నిస్సహాయత కన్నా తప్పు చేస్తున్నాననే భావన ఎక్కువగా కనిపించింది. గడ్డికని తెల్లారెళ్ళిన నాన్న ఎంతకూ రాకపోయేసరికి పొలం వైపు వెళ్ళాను. చెట్టుకి సుఖ దుఃఖాల నడుమ ఉరితాడుతో నాన్న ఉయ్యాలూగుతున్నాడు.

రైతుగానే చనిపోతానన్న నాన్న మాటాలు గుర్తొచ్చాయి. కష్టాలన్నీ తీరిపోయి తేలికవుతానని అనుకున్నడేమో కాని ఇప్పుడే నాన్న బరువుగా అనిపించాడు. కిందకి దించలేక చుట్టింటి తాతదగ్గరకెళ్తే ‘ఇంకెవరికీ చెప్పొద్దనీ, ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్సు డబ్బు రాకపోగా, ఊళ్ళో వాళ్ళందరూ హేళనగా చూస్తార’ని చెప్పాడు.

దు:ఖాన్ని తాత భుజం మీద పడి కాస్త దించుకున్నాను. ఇద్దరం కలిసి నాన్నని చెట్టు నుంచి దించాం. ఎవరూ చూడకుండా నాన్నని భుజాలపై మోసుకెళ్ళి పాకలో పడుకోబెట్టి ఏమీ తెలియనట్టుగా తాతతో బయటకెళ్ళిపోయాను.

అబద్ధపు అస్తిత్వపు చుట్టూ బతికిన నాన్న అబద్ధంగానే చనిపోయాడు. సమాజం రైతు చుట్టూ అల్లిన ఒక విషవలయంలో నాన్న చిక్కుకున్నాడు. రైతనే ఉనికి కంటే జీవితం గొప్పదని తెలుసుకోలేకపొయాడు. రైతనే అస్తిత్వం కోసం ప్రాణలనే విడిచాడు.

నువ్వు చనిపోలేదు నాన్నా! ఆత్మహత్య చేయబడ్డావు! అని గట్టిగా అరవాలనిపించింది కాని పొలం మీదున్న అప్పు నా నోటిని మూసేసింది.

 

***

రోడ్డు మీద గతుకులు ఇప్పుడు ఇబ్బందిగా అనిపించట్లేదు. నాతో పాటు చాల మంది కూలీలుగా

తెల్లారిగట్టే వెళ్ళి, నడిరేతిరికి ఇదే బస్సులో వస్తున్నారు. ఎవరైనా ‘నీవెవర’ని అడిగితే ఎండిపొయిన ఎకరన్నర ఆసామినని చెప్పుకోవాలా లేక పలుగు, పార పట్టి మురుక్కాల్వలు తవ్వే రోజువారీ కూలి అని చెప్పాలా అనే సంకట స్థితిలో నేను లేను. నిస్పృహ లోంచి వెలుగు పంచే చిన్న చిరునవ్వొక్కటే నా దగ్గర సమాధానంగా మిగుల్చుకున్నాను కనుక.

చీరకన్నా చిరుగులెక్కువున్న గుడ్డపీలికలనే అమ్మ మళ్ళీ మళ్ళీ కుడుతోంది కూలికెళ్ళే

సమయమైందని. యవ్వనమంతా గుప్పెడన్ని గింజలు సంపాదించడానికే సరిపోయిందని పాకలో అక్క వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుంది – చూడలేక ఆకాశం నల్లముసుగు కప్పుకుంటోంది.

*****

 

 

 

పతి-పత్ని ఔర్ జస్ట్ నథింగ్!

 

యం.యస్.కె.కృష్ణ జ్యోతి

 

krishnajyothiఅలారం మోగింది.  ఐదు గంటలు, పక్కకి చూసింది రమ.  భర్త అప్పుడే లేచి ప్రాణాయామం చేస్తున్నాడు.  వీడు ఇంత త్వరగా ఎలా లేస్తాడో అర్ధం కాదు-మనసులో అనుకుంది.  తనకీ త్వరగా లేవాలని వుంటది.  లేచినా, పరుగులు మొదలు పెడుతుంది  కానీ, ముక్కు మూసుకొని ప్రాణాయమాలు చెయ్య లేదు.  ఐదు గంటలు అవ్వడానికి ఇంకో గంట వుంటే బాగుండు అనిపిస్తుంది.  కానీ కాలం ఒకరు చెప్పినట్టు వింటదా?  కాలం దాక ఎందుకు, తను వింటదా ఎవరి మాటైనా?  అమ్మ చెప్పింది, నీలో ఏదో తేడా కనబడుతుంది, గమనించుకోమని-తను విన్నదా?  కానీ ఈ రోజు ఆలోచించాలి.

పరుగు మొదలు.  తనతో పాటు ఇంట్లో అందరూ  పరిగేట్టాలని ఆశ.  చాలా వరకూ పరిగెట్టిస్తుంది.  భర్త గానీ, ఇద్దరు పిల్లలు గాని ఎవరైనా పొద్దుట నిమిషం ఖాళీగా కనబడకూడదు, కసిరేస్తది.  ఉదయం ఎక్కువ సమయం వంటింట్లో వుంటది.  భర్త ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు.  పని చేసేప్పుడు మాట్టాడదు-కాన్సంట్రేషన్ దెబ్బతింటదని.  పనికి సంబంధించిన ఆర్డర్లు మాత్రం వేస్తుంది.

“కరివేపాకు”కేకేస్తుంది.

పెరట్లోకి పరిగేడతాడు.

“కేరేజి గిన్నెలు”

కడిగిన కేరేజి గిన్నెలు ఓ సారి తొలిపి పెడతాడు

“కాఫీ”

గబగబా వచ్చి తాగి పెడతాడు

“టైం చెప్పు”

ఎప్పుడూ ఓ పది నిమిషాలు ఎక్కువ చెబుతాడు.  టెన్షన్ పెరిగిపోతుంది.  ఒక్కోసారి అనుమానం వస్తుంది.  బయటకొచ్చి చూస్తుంది.  వంటింట్లోకి ఒక గడియారం తేవాలి.  ప్రతిరొజూ ఉదయం ఇలాగే అనుకుంటుంది.  సాయంత్రం మరచిపోతుంది.

“తప్పు టైం ఎందుకు చెబుతావు?”  అరుస్తుంది.

“ఇంచుమించు అయిందిగా”

అన్నాలు, కూరలు, పెరుగులు, పచ్చళ్ళు, మధ్యలో  తినడానికి తాయిలాలు-ప్రతి రొజూ ఇరవై గిన్నెలకు పైగా సర్దాలి. ఒకోసారి అనిపిస్తది, ఇన్ని రకాలు అలవాటు చెయ్య కూడదని.  కానీ ఎవరికోసం?  ఇప్పుడు పోషణ బాగుంటేనే రేపు పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.

పరిగెత్తండి.  టైం దాటితే తిట్లు పెద్దవాళ్ళకి బాస్లతో, పిల్లలికి వాళ్ళ హెడ్ మాస్టర్లతో.

chinnakatha

ఉదయం పది గంటలు.  క్లియర్ కావలసిన ఫైళ్ల సంఖ్య అంతకన్నా ఎక్కువ!  చేస్తూనే వుంటుంది.  ఆఫీస్ కి వచ్చేదాక ఉరుకుల పరుగుల జీవితం.  రాగానే పని.  మధ్య మధ్య మగత వచ్చేస్తుంది.   హెమోగ్లోబిన్ తగ్గిందేమో.  సాయంత్రం రక్త పరీక్ష చేయించాలి.  చుట్టూ చూసింది.  అందరూ పని చేస్తూనే వున్నారు.  తనే అలా అలసి పోతుందా?  అందరు అంతేనా?

ఒంటిగంట – భోజనం బ్రేక్.  తనకిష్టమైన సమయం ఇదే!  అందరితో కలిసి కూచుంటుంది.  కానీ పది నిమిషాల్లో గబ గబ తినేస్తుంది. తర్వాత ఫోన్ తీస్తుంది.  ముఖ్యమైన కాల్స్ మాట్టాడుతుంది.  పొద్దున్నే కుదరదు.

 

సాయంత్రం ఎలా ఉంటుందో!  అమ్మ మళ్లీ చెప్పింది,పాలిపోయినట్టు  కనబడుతున్నావు, ఓ సారి చుబించుకొమ్మని.  సరేనంది.  తర్వాత ఫేస్బుక్ గానీ వాట్సుప్ గాని ఆన్ చేస్తుంది.  సతీష్ పేరు పక్కన పచ్చ చుక్క, ఆన్లైన్ లో వున్నాడు.  రొజూ ఈ టైం లో వుంటాడు.  రమకి సంతోషం.  సినిమా హెరోయిన్ పోస్ట్ పెట్టాడు. లైక్  కొట్టింది.  ఇన్బాక్స్ లోకి వచ్చాడు.

“హలో”

“హాయ్”

“ఏం చేస్తున్నావు”

“నీతో చాటింగ్ చేస్తున్నా”

“కాల్  చేయనా?”

“ఒద్దు, ఇలానే బావుంది”

“తర్వాత”

“రొటీన్”

“సర్లే.  రొటీన్ సంగతి కాకుండా వేరేది చెప్పు”

నీ పోస్ట్ బాగుంది”

“మరి నాకు నచ్చె హీరొయిన్ కదా”.  నీకూ ఈర్ష్య గా ఉందా?”

“షటాప్”

అవతలి నుంచి నవ్వుతున్న సింబల్.  వెంట మహేష్ బాబు పోస్ట్ పెట్టింది.  సతీష్ లైక్ కొట్టలేదు.

“మహేష్ కొత్త సినిమా.  ట్రైలర్స్ చూశాను.  భలే వున్నాడు తెలుసా.  కళ్ళు తిప్పుకోలేనట్టు మెరిసిపోతున్నాడు.”

“నీ మొహానికి మహేష్ కావాలా?”

“మరి నీ మొహానికి సమంత ఎందుకో”

“చంపేస్తా”

“చంపేసెయి.  సర్లే, మహేష్ సినిమాకి వెళదామా?”

“కుదరదు, వదిలేయ్ ”

“జేల్సినా”

“పోవే”

“పోరా”

ఇద్దరూ మళ్ళీ నవ్వారు.

“నాకు నలతగా ఉంటోంది.  సాయంత్రం గంట పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాలి”

“నేను కూడా రానా?”

“వచ్చేయ్.  నాలుగుంపావు కల్ల, కమల హాస్పిటల్”

“నువ్వంటే నాకు చాలా ఇష్టం”

“నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం”

ఇద్దరు సెల్ఫిలు పంపుకున్నారు.  చిరునవ్వు నవ్వుకున్నారు.  తర్వాత చాట్  హిస్టరీ క్లియర్ చేశారు.  పనిలో పడిపోయారు.

రమ హాస్పిటల్ చేరే లోగా సతీష్ వెయిట్ చేస్తున్నాడు.  లోపలి వెళ్లారు.

సతీష్ వెయిటింగ్ సోఫాలో కూలబడ్డాడు.

“రా, కూర్చో”పిలిచాడు.  పక్కన కూచుంది.  ఇదివరకూ చాల సార్లు అతని పక్కన కూచుంది.  అతని భుజాలు, మోచేతులు తనకి తగులుతాయి.  కానీ ప్రతిసారి కొత్తగా, ప్రతిసారి సరదాగానే అనిపిస్తుందామెకి.

డాక్టర్ రమకి ఫ్రెండే. కాసేపట్లో పని అయిపోయింది.

“నేను ఇంటికి వెళతాను.”రమ బండి తీసింది.  ఇద్దరూ చెరో దారి పట్టారు.

ఇంటికొచ్చి తాళం తీసింది.  పొద్దున్న చిందర వందరగా వదిలేసి వెళ్ళిన ఇల్లు సర్దింది.  ఇంతలో భర్త, పిల్లలూ వచ్చారు.  వాతావరణం చల్లగా వుంది.  ఫ్రిజ్ లోంచి సెనగ పిండి తీసి బజ్జీలు వేపింది.   చపాతీ, కూర చేసింది.  రాత్రి పూట పిల్లలు అన్నం సరిగా తినరు.  టిఫిన్ తయారు చేస్తే ఇష్టంగా తింటారు.  పని చేసేటప్పుడు మాట్టాడదు-కాన్సంట్రేషన్  దెబ్బతింటుందని.

తన పనులు పూర్తి చేసేలోగా పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని హోంవర్క్ చేశారు.  గీజర్ ఆన్ చేసింది.  అందరూ మల్లె పువ్వుల్లా తయారయ్యారు.  కలసి  కూర్చుని భోజనం చేశారు.  కానీ భోజనం చేసేప్పుడు మాటాడకూడదని మావగారి రూల్.  మావ పోయినా రూల్ పోలేదు.

పిల్లల దగ్గర కాసేపు సమయం గడిపింది.  వాళ్ళు చెప్పేది వింది.  వాళ్ళ పుస్తకాలు చెక్ చేసింది.  పరీక్షలు  జరుగుతున్నాయి.  చిన్నది లెక్కల్లో తప్పులు చేసిందట.  ఓదార్చింది.  తొమ్మిది దాటింది.  భర్త లాప్టాప్ తీశాడు.  రమ కూడా ముఖ్యమైన ఫైల్స్ ముందేసుకుంది.  గంట గడిచింది.  అలసిపోయారు.  మొహాలు చూసుకున్నారు.  నవ్వుకున్నారు.  మంచం మీదికి చేరారు.  అప్పటికీ మొత్తంగా అలసి పోయారు.  రమ చేతిని తన చేతిలోకి తీసుకుని భుజానికి దగ్గరగా ఆనించుకుని ఆమె భర్త నిద్రలోకి జారిపోబోతున్నాడు.

“సతీష్, నీతో ఓ సంగతి చెప్పాలనుకున్నాను”

“రేపు మధ్యాహ్నం మాటాడుకుందాం”

“సరే”

అలసిపోయిన శ్రామికులు,ఒక్క నిమిషం లోపుగానే నిద్రపోయారు!!

*

 

 

 

 

“చింటూ.. అమ్మెక్కడ?”

వినోద్ అనంతోజు 

 

Vinod Anantojuఇల్లు దగ్గరపడుతున్నా కొద్దీ సౌజన్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. కారు వాళ్ళింటి మట్టిరోడ్డులోకి ప్రవేశించింది. రోడ్డు మీది గతుకులకి కారులోని సామానంతా కదిలిపోతోంది. వాటిలో సగానికి పైగా చింటూగాడి కోసం తెచ్చిన బొమ్మలే. వాడికిప్పుడు రెండు నెలలు తక్కువ రెండేళ్ళు.

ఆ రోజు Airport లో వాడి ఏడుపు ఆపడం దాదాపు అసాధ్యమయ్యింది. ఆకలేస్తోందేమో అని సౌజన్య పాలు కూడా పట్టింది. శ్రీధర్ వాణ్ని ఎత్తుకుని అటూ ఇటూ ఒక అరగంట నడిచాడు. ఇమ్మిగ్రేషన్ అనౌన్సుమెంటు వస్తోంది. వాడింకా ఏడుపు ఆపలేదు. చేసేది లేక ఏడుస్తున్న వాడినే అమ్మ చేతికి అప్పగించి ట్రాలీ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరూ. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది.  ఇప్పుడు వాడు నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, బోలెడు మాటలు చెపుతున్నాడు.

గేటు తెరుచుకున్న చప్పుడు అవ్వగానే ఇంట్లోంచి హైమావతి గబగబా బయటికొచ్చింది. తడి చేతులు కొంగుతో తుడుచుకుంటూ కూతురిని కౌగిలించుకుంది. శ్రీనివాసరావు అల్లుడికి సామాను దించడంలో సాయం పట్టడానికి కారు దగ్గరికి వెళ్ళాడు. సంవత్సరం తరవాత వచ్చారు కూతురు అల్లుడు. హైమావతి కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని కూతురుని తేరిపార చూస్తోంది. ఆవిడ సంతోషానికి అవధుల్లేవు. సౌజన్య కళ్ళు మాత్రం చింటూ గాడి కోసం వెతుకుతున్నాయి.

“ఏడి వాడు? నిద్రపోతున్నాడా?” అడిగింది సౌజన్య.

“లేదమ్మా.. లేచే ఉన్నాడే.. దొడ్లో ఆడుకుంటున్నాడు అనుకుంటా. చింటూ…!!” కేకేసింది హైమావతి.

దొడ్డి గుమ్మంలోంచి కర్రపుల్ల ఒకటి పట్టుకుని ఊపుతూ వచ్చాడు చింటూ. తనని చూడగానే “అమ్మా” అని ఎగిరి గంతేసి వాటేసుకుంటాడు అనుకుంది సౌజన్య. కాని వాడి కళ్ళలో ఎవరో కొత్త మనుషులని చుసిన బెరుకు కనపడింది. దగ్గరికి రాకుండా అమ్మమ్మ కాళ్ళ వెనకాలే దాక్కున్నాడు. సౌజన్య గుండె కలుక్కుమంది.

“ఛీ.. ఎంత సినిమాటిక్ గా ఉహించుకున్నాను.” అని తనలో తాను సిగ్గుపడింది.

వాణ్ని దగ్గరికి తీసుకుని “నేను చింటూ… అమ్మని” అని పరిచయం చేసుకునేటప్పుడు ఎందుకో ఆమె గొంతు వణికింది. శ్రీధర్ కూడా దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించాడు. చింటూ ఇబ్బందిగా మూలుగుతూ వాళ్ళ చేతులు విడిపించుకుని అమ్మమ్మ వెనక పరిగెత్తాడు.

“అమ్మా నాన్నా వచ్చారమ్మా.. దగ్గరికెళ్ళూ..” హైమావతి అల్లుడికి కుర్చీ వెయ్యాలి, ఫ్యాన్ స్విచ్ వెయ్యాలి, మంచి నీళ్ళివ్వాలి అనే హడావిడిలో ఉంది. చింటూ దూరంగా నిలబడి పుల్ల నోట్లో పెట్టుకుని బెరుకుగా చూస్తున్నాడు.

“ఏమయ్యింది వీడికి? రోజు Skype లో బాగానే మాట్లాడుతాడు కదా!” సౌజన్యకి దుఃఖం కలుగుతోంది.

chinnakatha

నడవడం కూడా రాని బిడ్డని వదిలి అమెరికా వెళ్ళడం సౌజన్యకి అంతగా ఇష్టంలేదు. కానీ తప్పలేదు. శ్రీధర్, సౌజన్య ఇద్దరూ ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకేసారి Onsite కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. ఎంత అదృష్టం ! ఈ అవకాశాన్ని వదులుకోవడం శ్రీధర్ కి ఎంతమాత్రం ఇష్టం లేదు. “ఒక్క సంవత్సరం ఓపిక పడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎంత కాదనుకున్నా ఇద్దరి మీదా కలిపి యాభై లక్షలు అయినా మిగుల్చుకుని రావొచ్చు.” అన్నాడు శ్రీధర్. సౌజన్యకి కూడా అమెరికా వెళ్లాలని డ్రీమ్. కాకపొతే బాబు గురించి ఆలోచిస్తోంది.

“బాబుని ఇక్కడే ఉంచుదాం. అక్కడ మనిద్దరం ఆఫీసు కి వెళితే బాబు నెవరు చూసుకుంటారు?” అన్నాడు శ్రీధర్.

“మంచి Babysitter ని పెడదాం. ఏమంటావ్?” అడిగింది సౌజన్య.

“వద్దు టీవీల్లో చూస్తున్నాం కదా. Babysitter లు పసి పిల్లల మీద ఎలాంటి అకృత్యాలు చేస్తారో. అయినా మన బిడ్డని పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎందుకు? మీ అమ్మా నాన్నా ఉన్నారు కదా !”

“ఉన్నారులే కానీ….”

“ఒక్క సంవత్సరమేగా… కావాలంటే నేను అడుగుతాను మీ అమ్మానాన్నలని“

అమ్మానాన్నా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇంట్లోకి ఒక కంప్యూటర్ పెట్టించి, నాన్నకి Skype Call ఎలా మాట్లాడాలో నేర్పించింది సౌజన్య.

అమెరికాలో ఎంత ఉరుకులు పరుగులు ఉద్యోగమయినా కనీసం రెండు మూడు రోజులకి ఒకసారయినా Skype Call మాట్లాడేది సౌజన్య. మొదట్లో అమ్మానాన్న మాత్రమే మాట్లాడేవారు.

“ఈరోజు చింటూ నన్ను ‘అమ్మా’ అన్నాడమ్మా!”, “లేచి కాళ్ళమీద నిలబడ్డాడమ్మా”, “పడిపోకుండా అంత దూరం నడిచేశాడమ్మా!”, “వాళ్ళ తాతయ్య చెప్పులేసుకుని డింగ్ డింగ్ అని పరిగెత్తాడమ్మా!” అని హైమావతి చెపుతుంటే సౌజన్యకి ఆనందంతో కళ్ళు చెమర్చేవి. అదే సమయంలో ఇవన్నీ చూడటానికి తను చింటూ దగ్గర లేనే అని బాధ కలిగేది. తన ప్రమేయం లేకుండానే తన బిడ్డ పెరిగిపోతున్నాడనే భావన ఆమెని చాలా కాలం వెంటాడింది.

రాను రాను Call లో అమ్మానాన్నల మాటలు తగ్గిపోయి చింటూ గాడి కిలకిలలు పెరిగిపోయాయి. ఎన్ని కబుర్లు చెప్తున్నాడో వాడు! Skype Call లో సౌజన్య తో మాట్లాడకపోతే అన్నం తినేవాడు కాదు. అందుకని సౌజన్య ప్రతిరోజూ తప్పకుండా Call మాట్లాడేది.

ఇండియా కి వచ్చెయ్యడానికి ఇంకా నెల ఉండగానే సౌజన్యలో చింటూ గాడిని కలవబోతున్నాననే ఆత్రుత మొదలయ్యింది. ఎన్నెన్నో ఉహించుకుంది. ఎన్నో రకాల ఖరీదైన బొమ్మలు, చాక్లెట్లు కొనింది. వాటన్నిటినీ వాడికిచ్చి సంవత్సర కాలంగా పెరిగిన దూరాన్ని ఒక్క క్షణంలో చెరిపెయ్యాలనుకుంది.

ఆరోజు సాయంత్రానికి గానీ చింటూ దగ్గరికి రాలేదు. నలుగురూ చెప్పగా సౌజన్యని అమ్మా అని పిలిచాడు. బొమ్మలు, చాక్లెట్లు అన్నీ ఇచ్చి నవ్వించారు. వాడి నవ్వు సౌజన్యకి వర్షంలో తడిసిన అనుభూతినిచ్చింది. వాణ్ని గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకుంది.

“చింటూ.. ఆం తిందూరామ్మా!” హైమావతి పిలిచింది.

చింటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కంప్యూటర్ ముందు కూచున్నాడు.

“ఏంటి నాన్నా అక్కడ కూచున్నావు… ఇక్కడికి రా”

చింటూ కంప్యూటర్ మౌస్ ని ఆడిస్తూ “అమ్మని చూపిచ్చూ…” అన్నాడు.

సౌజన్యకి ఏమి అర్థం కాలేదు. చింటూని ఎత్తుకుంది. హైమావతి దగ్గరికొచ్చి వాడి బుగ్గ పట్టుకుని “అమ్మని చూపించేదేంట్రా వెర్రి నాగన్నా ! ఇదిగో అమ్మా!”

“ఉహు.. ఈ అమ్మ కాదు కంప్యూటర్ లో అమ్మ చూపిచ్చూ!” అన్నాడు సౌజన్య చేతుల్లోంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ.

“నేనే నాన్నా ఆ అమ్మని… ఇటూ చూడు…” అంటూ సౌజన్య చింటూని వదలకుండా వాడి తల తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది.

“ఉహు.. ఊహు… ఊ…..హు…” చింటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఆ తల్లి మౌనంగా ఉండిపోయింది.

 

****

వారిజాక్షులందు…

 

పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింట్లోకి ప్రవేశించేటప్పటికి అమ్మ సింకు దగ్గర నిలబడి అంట్లు తోముతూ “అబద్ధాలు… అన్నీ అబద్ధాలే… అన్ని అబద్ధాలు చెప్పడానికి అసలు నోరెట్లా వస్తుందో…” అని గొణుక్కుంటోంది.

“అబ్బ! నాకావలసిన విషయం నీ కెట్లా తెలిసిందమ్మా?” అడిగాను ఆశ్చర్యంగా.

“ఎంతసేపైంది వచ్చి? నాన్న స్టేషన్ కి వచ్చారు. కనిపించారా, చూసుకోకుండా నీ అంతట నువ్వే వచ్చేశావా?” విసుగ్గా అడిగింది అమ్మ నా మాటలు పట్టించుకోకుండా.

“నేను తోముతాలేమ్మా” అంటూ రంగి గొంతు వినిపించడంతో అమ్మ వెనక్కి తిరిగి రంగివైపు కోపంగా ఒక చూపు చూసి విసురుగా చేతిలో ఉన్న గిన్నెని సింకులోకి విసిరేసి చేతులుకూడా కడుక్కోకుండానే వంటింట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. రంగి తలవంచుకుని సింకుదగ్గరికి వచ్చి అంట్లు దొడ్లో వేసుకుని తోమడానికి కూర్చుంది. రంగి దొడ్లోకి వెళ్ళగానే అమ్మ వంటింట్లోకి వచ్చింది. స్థాణువులా నిలబడిపోయిన నేను తేరుకుని “నాన్నే తీసుకొచ్చారు. బయట వరండాలో కూర్చుని పేపరు చూస్తున్నారు” అన్నాను ఇందాకెప్పుడో అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానంగా.

“మొహం కడుక్కురా, కాఫీ కలుపుతాను” అంది అమ్మ సీరియస్ గా.

నేను మొహం కడుక్కుని వచ్చేటప్పటికి అమ్మ కాఫీ కలిపి నాలుగు గ్లాసుల్లో పోసింది. నన్ను చూడగానే ఒక గ్లాసు ఎత్తి ఠప్ మని గట్టుమీద పెట్టి “అది తీసుకెళ్ళి రంగికిచ్చి నువ్వొకటి తీసుకో” అని చెప్పి మిగతా రెండు గ్లాసులు తీసుకుని వంటింట్లోంచి బయటికి వెళ్ళింది.

నేను దొడ్లో కెళ్ళి “ఇదుగో రంగీ కాఫీ” అన్నాను.

రంగి తలెత్తి నావైపు చూసి, నా చేతిలోంచి కాఫీ గ్లాసు తీసుకుని ఠక్కున తల వంచేసుకుంది.

నేను నా కాఫీగ్లాసు తీసుకుని వెళ్ళేటప్పటికి అమ్మ నాన్నకి కాఫీ ఇచ్చి వచ్చి హాల్లో కూర్చుంది.

“ఏంటమ్మా, ఎవరిమీద అంత కోపం?” అడిగాను అమ్మ పక్కనే కూర్చుంటూ.

“ఆ రంగి… చెప్పేవన్నీ అబద్ధాలే…” ఉక్రోషంగా అని ఆయాసపడుతూ ఆగింది అమ్మ.

“అంత ఆవేశ పడకమ్మా! అసలేం జరిగిందో చెప్పు” అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అడిగాను.

chinnakatha

“నిన్నా మొన్నా రాలేదు. అంతకు ముందురోజు మధ్యాహ్నం తొందరగా వచ్చి గబగబా పని చేస్తుంటే ‘ఏంటే అంత తొందర ‘ అని అడిగాను. ‘పిల్లాడికి జ్వరమొచ్చింది, ఒళ్ళు పేలిపోతోంది. డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి ‘ అని హడావిడి పడింది. అప్పటికీ నా కనుమానమొచ్చి అడగనే అడిగాను ‘రేప్పొద్దున్న వస్తావా, ఎగర గొడతావా?’ అని. ‘ఎందుకు రానమ్మా! డాక్టరుకు చూపించి బిళ్ళలేస్తే పొద్దుటికి జ్వరం తగ్గదా ఏంటి?’ అంటూ నమ్మబలికింది. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరి వెళ్ళు ‘ అంటే ‘డాక్టరు వెళ్ళిపోతే కష్టమమ్మా, పొద్దున్నే చీకటితోటే వచ్చేస్తాగా’ అంటూ నన్నింకో మాట మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోయింది. గవర్నమెంటు హాస్పిటలుకు వెళ్తారు కాబోలు” చివరి మాటలో వెటకారం రంగరించి అంది అమ్మ.

ఇందాక రంగి కళ్ళలో కనిపించిన సన్నటి నీటిపొర గుర్తుకొచ్చి “పాపం, పిల్లాడి కెట్లా ఉందో. ఆ మాటైనా అడక్కుండా నువ్వు దానిమీద చిరాకు పడ్డావు” సానుభూతిగా అన్నాను.

“జ్వరమూ కాదు పాడూ కాదు. అన్నీ అబద్ధాలే. ఎప్పుడూ ఇట్లాంటి అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. తెలిసీ నేనే పిచ్చిమొహంలా ప్రతిసారీ నమ్మి మోసపోతుంటాను” అక్కసుగా అంది అమ్మ.

‘ఊ! అబద్ధం దగ్గరి కొచ్చింది అమ్మ. ఇంక నేను మొదలుపెట్టాలి ‘ అనుకుంటుండగానే అమ్మే అడిగింది “ఇందాక ‘నా క్కావలసిన విషయం నీ కెట్లా తెలిసింది ‘ అన్నావు, ఏంటది?” అని.

“నేను యూనివర్సిటీలో ‘మానవ జీవితంలో అబద్ధం పా త్ర ‘ అన్న విషయం మీద పత్రం సమర్పించాలి. రంగి చెప్పేవన్నీ అబద్ధాలే అని నువ్వెప్పుడూ చెప్తుంటావు కదా! అందుకే నిన్ను, రంగిని ఇంటర్వ్యూ చెయ్యాలని వచ్చాను.”

“నన్నేం ఇంటర్వ్యూ చేస్తావులే! నాకేం చేతనవుతుంది దానిలా గోడకట్టినట్టు అబద్ధాలు చెప్పడం. దాన్ని చెయ్యి ఇంటర్వ్యూ… ఇప్పుడే పలకరించకు. పని మానేసి నీతో కబుర్లు పెట్టుక్కూచుంటుంది. ఇంటికెళ్ళేముందు మాట్లాడు” అంది అమ్మ.

రంగి పని పూర్తిచేసుకుని వెళ్ళే సమయానికి గేటుదగ్గర కాపలాకాసి పలకరించాను “ఏం రంగీ! పిల్లాడి కెట్లా ఉంది?” అంటూ.

“సుమారుగా ఉందమ్మా. ఇప్పుడెల్లి గంజి కాచి పొయ్యాలి” అని చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

“అదంతే, దొరకదు” అంది అమ్మ నా వెనక నిలబడి.

“సరే! వాళ్ళింటికే వెళ్ళి మాట్లాడి వస్తాను. నాక్కావలసిన సమాచారం నేను సేకరించుకోవాలి కదా” అన్నాను.

“నాన్న మిల్లు కెళ్ళాక ఇద్దరం వెళదాంలే. ఒక్కదానివే ఏం వెళ్తావు” అంది అమ్మ.

“నువ్వొస్తే చెప్పే విషయాలు కూడా చెప్పదు. ఈ ఊరేం నాకు కొత్తా? ఏం ఫర్వాలేదు. వెళ్తాన్లే” అని అమ్మకి సమాధానం చెప్పి తయారవడం మొదలుపెట్టాను.

పనులన్నీ పూర్తి చేసుకుని, టిఫిను చేసి, రంగివాళ్ళ ఇంటికి దారి అమ్మనడిగి సరిగ్గా తెలుసుకున్నాను.

“చీటికిమాటికి అబద్ధాలు చెప్పకుండా దాన్ని కాస్త సంస్కరించు” నిరసనగా అంది అమ్మ నేను బయలుదేరుతుంటే.

“ప్రయత్నిస్తాను” అన్నాను అమ్మ చెప్పేదాంట్లో ఎంత నిజముందో అని ఆలోచిస్తూ.

నన్నంత దూరంలో చూస్తూనే ఎదురొచ్చింది రంగి “ఏంటమ్మాయిగారూ, ఇటొచ్చారు?” అంటూ.

“నీతో మాట్లాడాలని, మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను” అన్నాను.

రంగి నన్ను వాళ్ళ గుడిసె దగ్గరికి తీసుకెళ్ళి పీట వేసి కూర్చోమని తనూ నా ఎదురుగా నేలమీద కూర్చుంది.”వీడేనా నీ కొడుకు?” అన్నాను గుడిసెముందు చిన్న కారుబొమ్మని నెట్టుకుంటూ ఆడుకుంటున్న పిల్లాణ్ణి చూస్తూ.

“అవునమ్మా” అంది రంగి తల దించుకుని.

అంతలో వాడు నా దగ్గరికొచ్చి కారుబొమ్మని నా మొహమ్మీదికి పట్టుకుని “మా అత్త కొనిచ్చింది” అన్నాడు.

“మట్టిలో ఆడుతున్నావేంటి? జ్వరం తగ్గిందా?” అనడిగాను వాణ్ణి.

“నాకు జొరమేంటి? మా అత్తోళ్ళ ఊరెళ్ళొచ్చాం” అన్నాడు వాడు నావైపు, రంగివైపు మార్చి మార్చి చూస్తూ.

“ఫోరా! నువ్వవతలికి ఫో” అంటూ వాణ్ణి కసిరికొట్టింది రంగి. వాడు దూరంగా వెళ్ళి మళ్ళీ తన ఆట మొదలుపెట్టాడు.

‘రంగి అబద్ధం చెప్పింది ‘ అని అమ్మ అన్న మాట మీద నాకు అప్పటిదాకా ఉన్న అనుమానం తొలగిపోయింది.

“అబద్ధం ఎందుకు చెప్పావు?” సూటిగా రంగిని అడిగాను. ఏం మాట్లాడకుండా కూర్చుంది రంగి.

“నిజం చెప్పు రంగీ! నేను నిన్నేమీ అనను. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పడానికి నీకు మనసెట్లా ఒప్పింది?” బాధగా అడిగాను.

“ఏం చెప్పమంటారమ్మా? మా ఆడబిడ్డ కూతురు పెద్దపిల్లైతే పంక్చను కెళ్ళాం…”

“పిల్లాడికి జ్వరమని చెప్పావు. పొద్దున్నే చీకటితో వస్తానని చెప్పావు. అన్ని అబద్ధాలు చెప్పే బదులు ‘ఊరెళ్ళాలి, రెండు రోజులు రాను ‘ అని చెప్తే అమ్మ కాదంటుందా?” రంగి మాట పూర్తి కాకుండానే అడ్డుపడ్డాను.

రంగి నావైపు విచిత్రంగా చూసింది. “ఎందు క్కాదనరమ్మా? మా అక్క కూతురు పెద్దదైనప్పుడు మీ రన్నట్టే అంతా నిజమే సెప్పాను. ‘రెండురోజులెల్లి ఏంసేత్తావు? ఓపూటెల్లి ఎంటనే వచ్చెయ్’ అన్నారమ్మా అమ్మగారు. ‘పంక్చను, పంక్చను అంటూ అందరూ అట్టహాసాలు నేర్సుకున్నారు ‘ అంటూ తీసిపారేసి మాట్టాడారమ్మా. ఏమ్మా! మాకు మాత్రం సరదా లుండవా? ఆళ్ళు రెండురోజు లుండేట్టు రమ్మని పిలిత్తే ఓ పూటుండి దులిపేసుకుని ఎట్టా వచ్చేత్తామమ్మా?”

“రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని.రెండు రోజులు ఎందుకున్నావు అని కాదు.”

“అమ్మగా రేం తక్కువ కాదమ్మా. పసిగట్టేశారు. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరేసి ఎల్లు’ అన్నారు. ఏడేల్లబట్టి సేత్తున్నాను మీ ఇంట్లో పని. పనికి మాట్టాడుకున్నప్పుడు పొట్టుపొయ్యికి పొట్టుకూరేపని సెప్పలేదు అమ్మగారు. అయినా పెతిరోజూ ఆ పనికూడా సేత్తూనే ఉన్నాను. నాకు తెలీకడుగుతాను, ఈ రోజుల్లో పొట్టుపొయ్యి వాడేదెవరమ్మా? మిల్లునించి పొట్టు ఊరికే వస్తుంది, కూరడానికి నేనున్నానని కాకపోతే. అప్పటికీ అమ్మగారు ఇబ్బంది పడతారు, ఒకడుగు ముందొచ్చి పొయ్యిపని సేసేద్దామనే అనుకున్నానమ్మా. నాకు ఇంట్లో పని తెమలకపాయె.”

 

“అబ్బా, రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని. పొట్టుపొయ్యిలో పొట్టెందుకు కూరలేదు అని కాదు” కాస్త విసుగ్గా అన్నాను.

“రేప్పొద్దున్న రాను అని సెప్పాననుకోమ్మా, పొట్టుకూరేసిపో అనడమే కాదు, రేప్పొద్దున్నవార ఇప్పుడే ఇల్లు తడిగుడ్డ పెట్టెల్లు అంటారమ్మా. ఎవరైనా ఒకేరోజు రెండుపూటలా ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటారామ్మా?”

“రంగీ, ఇల్లు తడిగుడ్డ ఎందుకు పెట్టలేదు అని కాదు నేనడిగింది, అబద్ధమెందుకు చెప్పావు?” కాస్త కోపంగా అన్నాను.

“పోనీ అమ్మగారి మాటెందుకు తీసిపారెయ్యాలి, అన్నిపనులూ సేసిపెట్టే ఎల్దామంటే ఆలెస్సమైపోద్ది. రైలెల్లిపోద్ది.”

“పిల్లాడికి జ్వరమని అబద్ధమెందుకు చెప్పావు?” అసహనంగా అరిచాను.

“డాక్టరెల్లిపోతారు, తొరగా ఎల్లాలి అని సెప్పబట్టే రైలందుకున్నామమ్మా. రైలెల్లిపోద్ది, తొరగా ఎల్లాలి అని సెప్తే అమ్మగారు ‘రైలెల్లిపోతే బస్సులో ఎల్లండి ‘ అంటారమ్మా. రైలు చార్జీ లెక్కడ? బస్సు చార్జీ లెక్కడ? రైలు టేసను మాకు దగ్గర. బస్టాండుకు పోవాలంటే ఆటో ఎక్కాల. మా ఆడబిడ్డోల్లూల్లో కూడా టేసనే దగ్గరమ్మా. బస్సులో ఎల్తే మల్లీ అక్కడకూడా ఆటో ఎక్కాల. ఉన్న డబ్బంతా బస్సులకి, ఆటోలకే పోస్తే… పిల్లచేతిలో ఏదేనా పెట్టాల గదమ్మా. మాకు మాత్రం ప్రేమలు, అబిమానాలు ఉండవా?”

‘తనని అబద్ధం చెప్పే పరిస్థితుల్లోకి అమ్మే నెడుతోంది’ అని చాలా తెలివిగా తెలియజేస్తోంది రంగి  అనిపించింది నాకు. ఏది ఏమైనా ‘అబద్ధం చెప్పడం తప్పు ‘ అన్న పాఠం రంగికి నేర్పాలన్న పట్టుదలతో “అబద్ధమెందుకు చెప్పావు అని అడిగినందుకు చాలా చాలా చెప్పావు రంగీ. కానీ అబద్ధం చెప్పడం తప్పని నీకు తెలీదా? ఇప్పటిదాకా అబద్ధా లాడకూడదు అని ఎవరూ నీకు చెప్పలేదా?” అని అడిగాను.

“మా ఇళ్ళకాడ గుళ్ళో పురానకాలచ్చేపం సెప్పే పంతులుగారు సెప్తూనే ఉంటారమ్మా ‘అబద్దమాడ్డం తప్పు, పాపం’ అని. ఆ పంతులుగారే ఇత్త… పేన… మాన… ఇంకేందో… అప్పుడంతా అబద్దమాడితే తప్పులేదని కూడా సెప్పారమ్మా.”

‘బాబోయ్! భాగవతాన్ని తీసుకొచ్చేసింది. ఇది సామాన్యురాలు కాదు ‘ అనుకున్నాను. ఏం మాట్లాడాలో అర్థంకాక దిక్కులు చూస్తుంటే తనే చెప్పడం మొదలుపెట్టింది రంగి.

“నేను అబద్దమాడితే అబద్దమెందుకాడావ్, అబద్దమెందుకాడావ్ అని ఇన్ని సార్లు అంటున్నారు గానమ్మా… నేను అంట్లు తోమడం పూర్తిచేసి, తోమినచోటంతా కడిగేసి ‘అమ్మయ్య, పనైపోయింది, ఇంక ఇంటి కెల్లొచ్చు ‘ అనుకుంటుంటే అమ్మగారు ‘ఒక్క గిన్నుంది, అదొక్కటీ తోమిచ్చేసెల్లవే’ అంటారమ్మా. గిన్నె ఒక్కటే గానమ్మా, దాంతోబాటు పళ్ళేలు, గెంటెలు, గలాసులు కూడా ఏత్తారమ్మా. మరప్పుడు అమ్మగారు నిజం సెప్పినట్టా? అబద్దం సెప్పినట్టా?”

కాస్త ఆగి దీర్ఘంగా ఊపిరి తీసుకుని మళ్ళీ ఎత్తుకుంది రంగి. “పనంతా పూర్తి సేసుకుని గేటుదాకా ఎల్లిపోయాక ఎనక్కి పిలుత్తారమ్మా అమ్మగారు. ‘ఉల్లిపాయలు అయిపోయాయి. కాస్త తెచ్చిపెట్టి ఎల్లవే’ అంటారమ్మా. లోపలికెల్లి సంచి, డబ్బులతోబాటు పది సరుకులు రాసిన పట్టీ తెచ్చి చేతిలో పెడతారమ్మా. అప్పు డమ్మగారు అబద్దం ఆడినట్టు కాదామ్మా?”

రంగి లాజిక్ చూసి బిత్తర పోయాన్నేను. ఆ షాక్ లోంచి నేను బయటపడేలోపే చివరి అస్త్రాన్ని ప్రయోగించింది.

“ఏం బంగమైందని అమ్మగారు ఆ అబద్దాలాడతన్నారమ్మా?” సూటిగా నన్నే చూస్తూ ప్రశ్నించింది రంగి.

రంగిని నేను చేసిన ఇంటర్వ్యూతో నా పేపరు ఎటో ఎగిరిపోయింది.

‘ఇప్పుడు నేను సంస్కరించవలసింది ఎవర్ని?’ అన్న ప్రశ్న నా ముందు కొండలా నిలబడింది.

బొట్టు

ఎండ్లూరి మానస

 

manasa endluri“ఒక్ఖ రోజు డ్రైవర్ లేని పాపానికి పూజ సామాను తెమ్మంటే ఏదీ సరిగ్ఘ తేలేదు. పటిక బెల్లం తెమ్మంటే తాటి బెల్లం తెచ్చారు. కేజీ నుపప్పు అని రాస్తే పావు కేజీ నే తెచ్చారు. ఏవిటి చేస్కోటానికిట? తెలిసి తెలిసి చేయరాని తప్పు చేసి ఇప్పుడనుకునేం లాభం?నాది బుద్ధి తక్కువ. మళ్ళీ నేనే మార్కెట్ కెళ్ళాలి!”

అసలే కాలేజీ టైం అయిపోతుందని హడావిడిగా తయారవుతున్న కామాక్షికి సరిగ్గా బయల్దేరేటప్పుడే ఇలాంటి ఆటంకాలు ఎదురవుతాయి పాపం! రేపు వరలక్ష్మి వ్రతం. ఈ రోజు  సాయంత్రం ఆమె పని చేసే డిగ్రీ మహిళా కళాశాలలో స్టాఫ్ మీటింగ్ పెట్టాలి. ప్రిన్సిపాల్ ఆమే కాబట్టి తప్పించుకునే ప్రశ్నే లేదు. ఇంటికొచ్చేసరికి ఏ ఏడో ఎనిమిదో అవుతుంది. అలసట! నీరసం! అందులోనూ ఆమె కార్ డ్రైవర్ సెలవు! ఈ కష్టాలన్నీ తలచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది కామాక్షికి!!

“నువ్విచ్చిన లిస్టే కదా కామాక్షి, పట్టుకెళ్ళి ఇచ్చాను. వాడవే ఇచ్చాడు”. జరిగింది పెద్ద సమస్య కాదన్నట్టు కార్ తాళాలు గోడకి తగిలిస్తూ అన్నాడు భర్త సుబ్రహ్మణ్యం.

“ఇస్తాడు!వాడికేం నొప్పిట? రెండు రెట్లు డబ్బులూ నొక్కుతాడు వెధవ ! చూసేవాళ్ళు మిమ్మల్ని ‘దేవుడు’ అని ఇందుకే అంటారు కాబోలు!! కాని కుటుంబానికి కావాల్సింది ‘భర్త’! దేవుడ్ని నేనేం చేస్కోను? ఉన్న కోటిమంది చాలదన్నట్టు! ఇంటికి, ఇల్లాలికేంకావాలి? పిల్లల్ని ఏ బళ్ళో చదివించాలి? ఏం చదివించాలి? ఏ బట్టలు వేయాలి ?ఏం తినిపించాలి?…ఇవన్నీ దేవుళ్ళు చేయరు!పెళ్ళాంతో బాటు మొగుడు కూడా చెయ్యాల్సుంటుంది. నా ఖర్మ కాలి ఈ ఇంట్లో మొగుడున్నా అన్నీ నేనే చేస్కుని ఛావాలి! నా పిల్లలకి, వాళ్ళ ఇంటి పేర్లకి తప్ప దేనికి పనికొచ్చారుట? బ్యాంకు ఉజ్జోగం, ఇల్లు తప్ప మరొక్కటి తెలిస్తే ఒట్టు! ‘మంచోడు మంచోడు’ అంటే మా నాన్నారు  ఒక్క గెంతు గెంతి ఈ పెళ్లి చేసారు. ఎన్నేళ్ళు గడిచినా ‘మంచోడు’ మంచోడి లానే ఉన్నారు గాని భర్తగా, తండ్రిగా మారనేలేదు! ఛ! ఇప్పుడు నే కాలేజీకెళ్ళాలి గా!మళ్ళా తాళాలు తగిలించేస్తారేవిటి? ఇలా తగలబెట్టండి.” మొహం చిట్లిస్తూ విసురుగా సుబ్రహ్మణ్యం చేతిలోంచి తాళాలు లాక్కుంది కామాక్షి.

సుబ్రహ్మణ్యం ఎదో పక్క గ్రహం నుంచి వచ్చిన వాడిలా ఏ స్పందనా లేకుండా తన పని తను చేసుకుపోతున్నాడు.

‘డ్రైవర్ లేడు, పెళ్ళాన్ని కాలేజీలో దింపుదామన్న ఆలోచనే రాదు ఈ మనిషికి!’ మనసులో తిట్టుకుంటూ “హలో!మీ టూ వీలర్ మీద ఎంత దుమ్ముందో చూసారా? అది కూడా నేనే చెప్పాలా?”

భర్త మీద అరుస్తూ కార్లో హ్యాండ్ బాగ్, లంచ్ బాక్స్ పెట్టుకుంది కామాక్షి.

“చూసాను కామాక్షి, ఇప్పుడే తుడిచేస్తాను.పాత గుడ్డ ఎక్కడుందో వెతుకుతున్నా.” ఎప్పటిలా అమాయకంగా సమాధానమిచ్చాడు సుబ్రహ్మణ్యం.

“చాలు! ఇహ మూస్తారా నోరు? నా ఫోన్ మోగుతోంది.” హ్యాండ్ బాగ్లోంచి తన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతుంది కామాక్షి…

“హలో! గరికపాటి గారు ఎలా ఉన్నారు? చాలా రోజులకి ఫోన్ చేసారే?” ఆయన గొంతు కొద్దిగా కామాక్షి కోపాన్ని పక్కన పెట్టింది.

dot1

“ఆ! బావున్నానండి.మీరు, సారు, పిల్లలు బావున్నారా?”

“ఆ! మావులే గా!పిల్లలిద్దరూ అమెరికా లోనే చదువుకుంటున్నారు. మేవిక్కడ! వాళ్ళక్కడ! ఏవిటి మీ లేటెస్ట్ నవల?ఈ మద్జ పెద్దగా రాస్తున్నట్టు లేరు?”

“కాస్త ఇంటి పనుల్లో పడి తీరిక దొరకడం లేదండి! మా ఆవిడ పెద్దగా చదువుకోలేదు. మీకు తెలిసిందే గా! పిల్లల చదువులూ అవీ నేనే చూస్కోవాలి! ఇప్పుడా పని మీదే ఫోన్ చేసాను. పెద్ద పాప ఆశ ఇంటర్ పాసైంది. బిటెక్ లో జాయిన్ చేయమంటుంది కానీ నాకు అంత సంపాదనెక్కడిది?! ఎప్పుడో ఒక్క నవల రాస్తే నాలుగు డబ్బులొస్తాయి గాని చేసే సబ్ ఎడిటర్ ఉద్యోగం చిన్నదేగా! అందుకే అమ్మాయిని మీ కాలేజీలో డిగ్రీ చేర్పిద్దామని..”

“సరే సరే! అంతగా చెప్పాలేవిటండి? ఎంత గొప్ప నవలలు రాసారు మీరు! మర్చిపోగలమా మీ ‘ఆకాంక్ష’, ‘సంధ్య వేళలో ఎదురీత’ ముక్ష్యంగా మీ ‘పది ప్రమాణాలు’! ఇంకా ఎన్నో! మీ వీరాభిమానిని! అమ్మాయిని తీసుకుని వచ్చేయండి. తప్పకుండా తనకిష్టమైన గ్రూప్ లోనే సీట్ చూస్తాను. ప్రముఖ నవలా రచయత కూతురు మా కాలేజీ పిల్ల అంటే మాకు గర్వంగా ఉంటుంది. పైగా కాలేజీ ఫంక్షన్స్ కి మిమ్మల్నే వక్తగా అధితి గా పిలవచ్చును!ఎప్పుడొస్తారు? ఒక గంటలో వచ్చేస్తారా కాలేజీ కి?”

తనకిష్టమైన రచయిత గరికపాటి సుందర్ ని చూడాలని ఉవ్విళ్ళూరుతుంది కామాక్షి. ఆయన నవలలకి ప్రాణం పెడుతుంది. ఎప్పుడో ఎదో సాహిత్య సభ లో పరిచయమైంది తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే మాట్లాడింది. ఎంతో ఆత్మీయంగా, స్త్రీల పట్ల గౌరవంగా మాట్లాడుతాడు. సుబ్రహ్మణ్యం అంత కాకపోయినా కాస్త అందగాడే! అమాయకుడైన చేతగాని అందగాడికంటే; చిన్న జీతగాడై, కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ,అద్భుతమైన నవలలు రాసే తెలివైన సంసారి నయం అన్న అభిప్రాయం కలిగేది సుందర్ తో మాట్లాడిన ప్రతిసారి! పైగా పేరు కూడా మనిషికి తగ్గట్టే వినసొంపుగా ఉంటుంది. ఆయన కూతురు తన కాలేజీ లోనే చేరితే అడపాదడపా ఆయన కనపడతాడన్న చిన్న ఆలోచన.

ఆమె ఆలోచనల్ని చెదిరిస్తూ “లేదండి కామాక్షి గారు క్షమించాలి!ఇవ్వాళ విజయవాడ లో ఒక సాహిత్య సభ కి పిలిచారు. ఎవరిదో కథా సంపుటి ఆవిష్కరించించాలి. ఆ పని మీద వెళుతున్నాను. మళ్ళీ రేపు సెలవు కదా! సీట్లు ఉంటాయో అయిపోతాయో అని మా పాపని, వాళ్ళమ్మని పంపిస్తున్నాను. కొంచెం ఈ సాయం చేసిపెట్టాలి.”

‘హ్! నా మొగుడల్లె రోజూ ఇంటికి ఆఫీసుకి మధ్యలో మాత్రమే కొట్టుమిట్టాడే టెన్నిస్ బంతా ఈయన?ఎన్నో పనులుంటాయి!’ అనుకుని “తప్పకుండా అండి.ఇక గరికపాటి వారి గాలి వీస్తుంది మా కళాశాలలో! ఉంటానండి.కాలేజీ కి బయల్దేరుతున్నాను.” అని ముగించి మెల్లగా కార్ స్టార్ట్ చేసి ముందుకి సాగింది కామాక్షి. సుబ్రహ్మణ్యం కనీసం ఆమె వెళ్లేది గమనించలేదు. ఆమె ‘ వెళ్ళొస్తానని’ చెప్పడం ఎప్పుడో మానేసింది.

కామాక్షి కార్ నడిపి చాలా రోజులైంది.అందువల్ల కాస్త ఆలస్యంగా చేరుకుంది. ఆమె ఆఫీసు రూమ్ కి వెళ్ళే సరికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అడ్మిషన్స్ అవుతుండడంతో కళాశాల విద్యార్దినులతో, వారి తల్లిదండ్రులతో చాలా రద్దీగా ఉంది. కామాక్షి పనులు మొదలు పెట్టేలోపే అటెండర్ ఒక చీటీ ఇచ్చాడు. మడతలు విప్పి చూస్తే ‘గరికపాటి సుందర్’ అని ఉంది. వెంటనే వాళ్ళని లోనికి పంపించమంది .  అటెండర్ బయటకు వెళ్ళగానే తన కళ్ళజోడు , ముంగురులు సర్దుకుని పెదాలు తడిచేసుకుని చేత్తో పెన్ పట్టుకుని అవసరం లేకున్నా ఎదురుగా ఉన్న కాగితాల మీద ఎదో రాస్తున్నట్టు భంగిమ పెట్టింది. గరికపాటి వారి భార్యా కూతురు లోనికి రావడం గమనించి కాగితాలలోంచి ముఖం పైకెత్తి నివ్వెరబోయింది!! వాళ్ళిద్దరూ ఆమె ముందుకొచ్చి నిలబడ్డారు. కూర్చోమని చెప్పడానికి బదులు ఆమే ఆశ్చర్యంతో లేచి నిలబడింది. అర నిమిషం పాటు నిశ్శబ్దం!ఇక చేసేది లేక కామాక్షి తేరుకుని “మీరూ…?” అని అడిగింది అనుమానంగా.

సుందర్ భార్య, కూతురు నమస్కరించారు.

“గుడ్ మార్నింగ్ మేడం!మై నేమ్ ఈజ్ గరికపాటి ఆశాజ్యోతి . డాడీ మిమ్మల్ని కలవమన్నారు. ఈవిడ మా అమ్మగారు కరుణ.నేను ఇంటర్ మీడియట్ యం పి సి నైంటి టు పర్సెంట్ తో పాసైయ్యను మేడం. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ బి యస్ సి కెమిస్ట్రీ. మిగతా గ్రూప్స్ లో ఆల్రెడీ సీట్స్ అయిపోయంట మేడం.

‘ఇక చెప్పాల్సింది మీరే’ అన్నట్టు కామాక్షి సమాధానం కోసం ఎదురు చూస్తుంది ఆశాజ్యోతి. కరుణ ప్రేక్షక ప్రాతకే పరిమితమైంది.

కామాక్షి వాళ్ళని ఎగా దిగా చూసి “ నీ సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వమ్మా” అని అడిగింది.

ఆశా జ్యోతి చాలా ఆశ గా ఫైల్ ఇచ్చింది. కామాక్షి కూర్చోలేదు, వాళ్ళని కుర్చోబెట్టలేదు. సర్టిఫికెట్స్ అన్నీ జాగ్రత్తగా చూస్తుంది… ‘స్కూల్ ,ట్రాన్స్ఫర్,మైగ్రేషన్…ఆ…కాస్ట్! దొరికింది.’

కామాక్షి మనసులోనే నిర్ణయం ధృడంగా తీసుకుంది.

అందంగా నవ్వుతూ “సారీ రా తల్లీ! కెమిస్ట్రీ లో సీట్స్ ఇందాకే అయిపోయాయి. సివిక్స్, హిస్టరీ లో ఆఖరి సీట్స్ ఉన్నాయి. కానీ అవి కూడా ఉంటాయో లేదో చెప్పలేం. నాన్నగారితో నేను మాట్లాడుతాను. వేరే కాలేజీ లో సీట్స్ ఉన్నాయేమో నేనే కనుక్కుని చెప్తాను . ఆల్ ది బెస్ట్ అమ్మా!” అని చెప్పి ఫైల్ వెనక్కి ఇచ్చేసి ‘వెళ్ళండి’ అనే నమస్కారం చేసింది.

ఆశా జ్యోతి ఆశలు అడియాసలై ఆమె నుదుటి మీద లేని కుంకుమ బొట్టు కళ్ళల్లోంచి కన్నీటి బొట్టై రాలింది. వాళ్ళు వెనుతిరగగానే కామాక్షి గబగబా ఫోన్ ఆన్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ తీసి ‘జి’ లో గరికపాటి నెంబర్ డిలీట్ చేసింది. అతన్ని కలిసిన రెండు సార్లు మొహానికి బొట్టెందుకు  లేదో ఇప్పుడు అర్ధమైంది! ఈ గరికపాటి ఆమె అనుకున్న ‘ఘనాపాటి’ కాదని తెలుసుకుంది.

*

 

 

 

మయూఖ

 సెలవు

 

బాల్కనీ తలుపు తెరిచాను, చల్లని గాలి లోపలికి ఆహ్వానించడానికి.
మనస్సు ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ ఉంది. మెదడు అన్నింటిని గుర్తు చేస్తూనే ఉంది. ఇంతలో ఎప్పుడొచ్చిందో తెలీదు. స్నేహితురాలు మాయ రానే వచ్చింది. ఎప్పటిలాగే ఉద్యోగం ముగించుకుని అలసిపోయి వచ్చి పరుపు మీద కాసేపు వాలింది. కొంచెం సేపయ్యాక లేచింది.
“ఎప్పుడొచ్చావే?” అని అడిగాను.
“నువ్వు బాల్కనీలో కూర్చుని ఆ గులాబి పువ్వులను పలకరిస్తూ ఏదో ఆలోచిస్తున్నప్పుడే వచ్చాను. ఏం ఆలోచిస్తున్నావే?’ అడిగింది మాయ.
“ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. నువ్వు ఎప్పుడొచ్చింది కూడా తెలియలేదు” అన్నాను. అంటూ, మళ్లీ బాల్కని దగ్గరకు వచ్చి నిలుచున్నాను.
ఉరుములు…మెరుపులు…చల్లనిగాలి…
ఆ గాలికి నేనే కాక నా కురులు కూడా పులకితులై నాట్యమాడుతున్నాయి.
“క్యాండిల్ ఎక్కడుందే?” అనే మాయ మాటతో మళ్లీ కొత్తగా గదిలోకి అడుగుపెట్టాను.
అసలు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియదు. నా కళ్ల ముందు ఏం జరిగినా నా మెదడు స్పందించదు. ఈ గాలి స్పర్శకి మళ్లీ నా లోకంలోకి వెళ్లి వస్తున్నట్టున్నది. నేను పెయింటింగ్ వేస్తున్నప్పుడు కూడా ఈ లోకంలో ఉండను. అప్పుడప్పుడు ‘నేను కూడా నా పెయింటింగులో ఉన్నానా’ అని అనుకుంటుంటాను. ఏదో ఆలోచనలతో నా మనస్సంతా నిండి ఉంటుంది. పచ్చని పంట పొలాల్లో తిరుగుతూ ఉంటే ఎంతో హాయిగా మా అమ్మ వొళ్లో ఉన్నట్టనిపించేది. అసలు ప్రకృతి అందాలు వర్ణితమైనవి కావు. అందరూ నేను ఎవరి గురించో ఆలోచిస్తున్నాను అనుకుంటారు. కానీ నేను ఎప్పుడూ ప్రకృతి అందానికి ముగ్దురాలినై వాటిని మనస్సులో తలచుకుంటూ ఉంటాను. ఇది చెబితే తెలిసేది ఎంత మాత్రం కాదు.
“ఏమైందే. క్యాండిల్ ఎక్కడుంది?” అనే మాటతో మళ్లీ మనస్సుతో మాట్లాడటం ఆపాను.
ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మళ్లీ ఎప్పటిలాగా మాట్లాడుకుంటాము – నేను, నా మనస్సు.  “ఏంటే? నేను మాట్లాడుతూ ఉంటాను నువ్వేమీ బదులు పలకవు. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు” అంటూ వుంటుంది మాయ.
“మనుషులతో మాట్లాడి ప్రయోజనం లేనప్పుడు మనస్సుతో మాట్లాడు” అంటాను నేను.
ఈ లోకంలో ఎన్నో పక్షులు.. ఎన్నెన్నో రకాల జంతువులు. అవన్నీ ఒక దగ్గరగా ఉంటూనే హాయిగా జీవితం సాగిస్తున్నప్పుడు ఇన్ని తెలివితేటలున్న మనం ఎందుకు ప్రతి దానికీ తగాదా పడతాం. చంపడం, చావడం…ఇవే ఎందుకుంటాయి లోకంలో. ఇలాంటివి లేకుండా ఉండలేమా? అర్థం కాదు నాకు.
కనిపించని గాలి మనని బ్రతికిస్తున్నప్పుడు కనిపించే ఈ ప్రకృతి మనకు జీవం పోస్తుంది. ఈ పచ్చటి చెట్లు నా చెవిలో మ్రోగే పాట, ఈ చల్లని గాలి, దాని పులకరింపు, అందమైన పక్షులు… అహా! ఇవి కదా నన్ను బతికిస్తున్నవి. వీటిని చూడటానికి కదా ఈ జన్మ నాకు లభించింది అన్న భావనతో మనస్సు నాట్యం ఆడుతూ ఉంటుంది. ఈ గాలి ప్రతిసారీ నాకొక కొత్త అనుభూతిని మోసుకొస్తూనే ఉంటుంది. అహ్.. గులాబి ముళ్లు… అవి నన్ను ముద్దుపెట్టుకోవడంతో నా గదిలోకి ప్రవేశించాను.

+++

selavu

“చూసుకోవే. గులాబీ ముళ్లు గుచ్చుకుంటాయని చెప్పాను కదా. అయినా వింటావా నా మాట” అంది మాయ.
“అదేం కాదే. ఏదో ఆలోచిస్తూ…’ అని బదులిచ్చాను.
మళ్లీ ఎన్నో రకాల పువ్వులు, చెట్ల మధ్య మెల్లగా నడుస్తున్నాను. వెనకాల ఎవరో వస్తున్నారనిపించి చూస్తే, నలుగురు అబ్బాయిలు కత్తులు పట్టుకుని నా వైపే నడుస్తున్నారు.
నేను కళ్లు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చి గాలి నాకు ఏం చెయ్యమని చెబుతుందా అని వింటున్నాను.
నా శరీరాన్ని తేలిక చేసుకున్నాను. ఆ నలుగురినే తప్పించుకుని ఉరుకుతూ కొంచెం దూరం దాకా వచ్చాను. మళ్లీ ఒక గాఢ శ్వాస తీసుకుని నా నడక మొదలెట్టాను.
పై నుంచి మంచు. అసలు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నానో తెలీదు. కొంత దూరం వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కన్పించింది. అక్కడినుంచి నా దారి ఆగిపోయింది. ఎటూ వెళ్లలేను. చుట్టూ చెట్లు. దారేదీ కనిపించటం లేదు. కళ్లు మూసుకుని నా మనస్సును  ప్రశ్నించడం మొదలెట్టాను. అదంటుంది…”నీ విశ్వాసము, నీ ధైర్యమే నీకు తోడు. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. మనస్సులో భయాన్ని ఏ నాడు నింపుకోకు. నీకు  కనిపించేదంతా నిజమని ఏనాడూ అనుకోకు. నేను చెప్పే మాట విను. వెళ్లు. నీ ప్రయాణానికి ఏ ఆటంకమూ కలగదు. వెళ్లు” అంది.

విన్నాను. విని, నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా మనస్సులాగే చెట్టు కూడా దారిచ్చింది.
ఆ చెట్ల అందము, పువ్వుల పరిమళం నన్ను ముగ్దురాలిని చేసాయి. ఆలోచిస్తున్నాను. ఎందుకు నేను పువ్వులా, చెట్టులా, పక్షిలా పుట్టలేదు! ఎంత అందమైన జీవితం వాటికి! అహా…వాటిని చూస్తుంటే నా మనస్సు ఆనందంతో పులకిస్తోంది. ఈ అర్థం లేని ఆనందం, పసిపిల్లలా గెంతులేస్తున్న ఈ మనస్సు, నా వశంలో లేని శరీరం అప్పుడే మొదలైన వర్షంలా తడుస్తున్నాయి. ఈ హాయి నేను ఎప్పటికీ మరచిపోలేను.

ఇంతలో “మయూకా” అన్న అమ్మ పిలుపుతో నిజ జీవితంలోకి ప్రవేశించాను.

+++

“మయూఖా” అన్న మా అమ్మ పిలుపును మూట గట్టుకొచ్చిన ఆ గాలి, నన్ను, నా  ఇంటిని గుర్తు చేస్తూ ఉండగా “అబ్బా…ఎక్కడుందో చెప్పవే క్యాండిల్’ అంటూ నా స్పేహితురాలు మాయ నా గదిలోకి ప్రవేశించింది. నా తనువు  “ఆ. వస్తున్నా…” అంటూ నా మనస్సులోని ఆలోచనల తలుపు మూస్తూ బాల్కనీలో నుంచి వస్తున్న గాలిని ఆహ్వానిస్తూ నేల తల్లికి పాదాలతో ముద్దులు పెడుతూ ముందుకు కదిలింది.

కీమాయ  

 

తెల్లవారుఝామున నాలుగింటికే లేచి, శుభ్రంగా తలంటుకుని, ఊదా రంగు షర్టు, తెల్ల ప్యాంటు ధరించి, దేవుడికి దణ్ణం పెట్టుకొని బైక్ స్టార్ట్ చేసి హైవే మీదుగా బయల్దేరాడు శంకర్. సూర్యోదయం అయ్యాక తనకి ఇష్టమయిన టీ స్టాల్ దగ్గర ఆగి, ఆమ్లెట్ తిని, టీ తాగి మళ్లీ బైక్ మీద కదిలాడు. పెట్రోల్ బంక్ లో ఫుల్ టాంక్ చేయించి, మధ్యానం దాకా అలా నడుపుతూ విజయవాడ చేరుకున్నాడు. విజయవాడ కనక దుర్గ దర్శనం చేసుకుని, అక్కడ దగ్గరలోనే ఒక హోటల్ లో భోజనం చేసి, తిరుగు ప్రయాణమయ్యాడు. హైదరాబాద్ చేరుకునేసరికి సూర్యాస్తమం కావొచ్చింది. ‘టైం అయింది’ అనుకొని, అక్కడే ఉన్న ఒక కొండ వైపుకు బైక్ తిప్పాడు. బైక్ పార్క్ చేసి, కొండ అంచుకు వచ్చి, ఒక సారి లోయలోకి చూసి, భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఎలాగో అలా ధైర్యాన్ని పోగుచేసుకొని దేవుడికి గట్టిగా మొక్కుతూ ముందుకి వంగాడు.

 “మాస్టారు” అని ఒక ఆడ గొంతు వినిపించింది. 

‘నిజంగానే ఎవరయినా పిలిచారా’ అని ఒక క్షణం అనుకొని ఒక్క అడుగు వెనక్కి వేసి, ‘అంతా నా భ్రమ’ అని మరుక్షణమే అనుకొని మళ్లీ ముందుకి వంగి దూకబోయాడు.

“మాస్టారు మిమ్మల్నే” అని మళ్లీ అదే గొంతు వినిపించింది. ఎంత మధురంగా ఉంది  వినడానికి. వెనక్కి తిరిగి చూసాడు. లక్నౌ చికెన్ వర్క్ ఉన్న తెల్లటి చుడీదార్ ధరించి ఉన్న ఒక అందమైన యువతి నిలిచుంది.

ఆమె వైపు తిరిగి “నన్నేనా” అని తన చూపుడు వేలుని తన వైపు చూపించుకుంటూ, శంకర్ అడిగాడు.

“యస్ మిమ్మల్నే, ఏంటి మీరు కూడా చచ్చిపోవడానికే వచ్చినట్లున్నారు?” ఎంతో శ్రావ్యంగా ఉంది ఆమె గొంతు.

“అంటే మీరు కూడానా? ఇంత అందంగా ఉన్నారు, మీకేంటి కష్టాలు?” శంకర్ ప్రశ్నించాడు.

“కష్టాలు ఉంటేనే చచ్చిపోవలా? అందంగా ఉంటే చావకూడదా? అందంగా ఉంటే కష్టాలు ఉండవా? మీ లాజిక్ ఏంటి? మీరూ బానే ఉన్నారుగా చుడటానికి?” అని ఎదురు ప్రశ్నలు వేసింది.

తను ఎక్కిన బండరాయి దిగి, ఆమె వైపు నడుచుకుంటూ వచ్చి “అంటే మీకు కష్టాలు లేకుండానే ఆత్మహత్య చేసుకుంటున్నారా?” శంకర్ ఆశ్చర్యంగా అడిగాడు.

“అబ్బే నాకు పెద్దగా కష్టాలు ఏమీ లేవండి, లైఫ్ బోర్ గా ఉంది. నచ్చలేదు ఇలా బ్రతకటం.  అందుకే నిష్క్రమించాలి అని అనుకుంటున్నాను” తాపీగా చెప్పింది ఆ యువతి.

శంకర్ తన బుర్ర గోక్కుంటూ, “నాకేమీ అర్ధం కావట్లేదు. ఇలా కూడా చచ్చిపోతారా అసలు? మీ పేరేంటి?” అయోమయంగా అడిగాడు.

“కూర్చోండి చెప్తాను” అని ఇద్దరూ కూర్చున్నాక, “నా పేరు కీమాయ” అని చెప్పింది.

“కీమాయ నా, భలేగా ఉందే పేరు!” అని అన్నాడు.

“కీమాయ అంటే అద్భుతం, మాయ అని. అదే ఇంగ్లీష్ లో మేజిక్ లేదా మిరాకుల్ అని అర్ధం” అని నవ్వుతూ చెప్పింది.

“బానే ఉంది కానీ,  చావబోయే నన్ను ఎందుకు పిలిచినట్టు?” శంకర్ సూటిగా పాయింట్ కే వచ్చాడు.

“ఎందుకంటే నాకు దూకటం భయం. మనం ఇద్దరం కలిపి దూకేద్దాం. ఏమంటారు?” ఆమె కూడా సూటిగా జవాబు ఇచ్చింది.

“దానిదేముంది. అలాగే. పదండి” అని లేవబోయాడు. ఆమె “ఆగండి. అప్పుడే కాదు. ఒక గంటన్నర అయ్యాక పోదాము, అప్పుడు డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్ళొచ్చు” అని సన్నగా నవ్వుతూ చెప్పింది.

“ఓహో ముహూర్తం చూసుకొని వచ్చారా? బాగుంది. నాకు అలాంటి పట్టింపులు ఏమి లేవు. అయినా చావబోయే ముందు ఇవన్నీ అవసరమా?” అని అడిగాడు.

“ఎలాగో చచ్చిపోతున్నాం. కాసేపు ఓపిక పట్టండి నాకోసం. ఈ లోగా కబుర్లు చెప్పుకుని చచ్చిపోదాము. సరేనా?” మళ్లీ నవ్వుతూ అడిగింది.

ఆ నవ్వులో ఏదో మాయ ఉన్నట్లుంది. వెంటనే సరే అన్నాడు.

“అలాగే, కాని కబుర్లు కాదు. మీరు చావాలనుకోవటానికి కారణం చెప్పండి” శంకర్ అడిగాడు.

“ముందు మీరు”

chinnakatha

 

“మా ఇంట్లో అందరికీ నన్ను కలెక్టర్ గా చూడాలని ఉంది, అందుకే సివిల్ సర్వీసస్ లో జాయిన్ అవ్వమన్నారు. గత ఐదు ఏళ్ల నుండి ప్రయత్నిస్తున్నాను. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యాను. ఎంతో కష్టపడి చదివి ఐదవ సారి రాసాను, నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి. ఈ సారి కూడా పాస్ అవలేదు.  ఎంత కష్టపడినా మా ఇంట్లో వాళ్ళ కల నేను తీర్చలేకపోతున్నాను. నా వల్ల కావడంలేదు. అందుకే చచ్చిపోదామని నిశ్చయించుకున్నాను. ఇంట్లో లెటర్ రాసి పెట్టేసి వచ్చాను” అంటూ శంకర్ బాధగా చెప్పాడు.

“ఓహ్ సారి! చాలా పెద్ద సమస్యే మీది” అని ఆమె సానుభూతి చూపింది.

“ఇప్పుడు మీరు చెప్పండి. మీకు లైఫ్ ఎందుకు నచ్చలేదు? ఎందుకు ఆత్మహత్యకు సిద్ధమయ్యారు?” అని శంకర్ అడిగాడు.

“నాకు మీ లాంటి పెద్ద కష్టాలేమి లేవండి. నా పుట్టుక ఎవరికీ తెలియదు. ఒక తాగుబోతుకి నేను చెత్తకుండీలో దొరికితే, నన్ను గుడిలో వదిలి వెళ్ళాడని అక్కడి పూజారి నాకు చెప్పారు. ఆయనే నాకు ‘కీమాయ’ అన్న పేరు పెట్టి, సొంత మనవరాలిగా పెంచారు. నాకు వేదం నేర్పించారు. నా బాల్యం అంతా గుడిలోనే. ఆయన పోయాక అక్కడే ఒక చిన్న గదిలో ఉంటూ ఉండేదానిని. అప్పుడు ప్రసాదమే నాకు భోజనం. భజనలు, పూజలు నాకు సినిమాలు, స్పోర్ట్స్ అన్నమాట. ఇలా బ్రతుకుతూ ఇంటర్ దాకా చదివాను. చెప్పడం మర్చిపోయాను కదా, గుడికి వచ్చే భక్తుల దగ్గర వేదం చదివి, వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులను ఫీజుగావాడుకునే దానిని. ఇంత సుఖంగా నా జీవితం సాగిపోతుంటే నాకు ఇంటర్ లో స్టేట్ రాంక్ వచ్చింది. దానితో నాకు మెడిసిన్ చెయ్యడానికి గాంధీ మెడికల్ యూనివర్సిటీ లో సీట్ తో పాటు పది లక్షల ప్రభుత్వ స్కాలర్షిప్ లభించింది. కానీ అప్పుడు ఉన్న మినిస్టర్ దానిని గ్రాంట్ చేయలేదు. నేను కేసు వేసాను, నాలుగేళ్ళ నుండి హోల్డ్ లోనే ఉంది ఇంకా.

సో ఇంత ఈజీ గా సాగిపోతున్న నా జీవితంలో మా టీచర్ ప్రోత్సాహంతో బ్యాంకు లోన్ తీసుకుని, వాళ్ళ ఇంటి, వంట పనులు చేస్తూ మెడిసిన్ చదివాను. అదృష్టం కొద్దీ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఎం డి చేసేముందు ఒక ప్రైవేటు హాస్పిటల్ లో ఇంటర్న్ గా ప్రాజెక్ట్ చేస్తే బెటర్ అని మా టీచర్ గారు చెప్తే, అలాగే అని ఒక ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ లో ఒక ఒక పెద్ద డాక్టర్ దగ్గర అప్ప్రేన్టిస్ గా చేరాను. ఆ డాక్టర్ న్యూరోలజీ లో చాలా ప్రావీణ్యుడు. ఆయన దగ్గర చాలా నేర్చుకుంటున్నాను.  ఇవాళ ఆయన ఒక సర్జరీ చెయ్యాల్సుంది. కాని పది నిముషాలు డబ్బులు లేట్ గా కట్టడం వల్ల ఆ సర్జరీ ఆగిపోయింది. దాని వల్లన ఒక చిన్న పిల్లాడి ప్రాణం పోయింది. రెండు నిముషాలు. కేవలం రెండు నిముషాలు. ఆరేళ్ళ ఆ బాబు చావుకి కారణం అయ్యాయి. ఇదేంటి డాక్టర్ గారు, ఇలా చేసారు అని నేను నిలదీసి అడిగేసాను. “ఏడిసావులే, రేపొద్దున నువ్వు కూడా ఇంతే, ఎవడైనా ఇలా తయారు అవ్వాల్సిందే” అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాను, నేను కూడా ఇలాగే అయిపోతానా అని. అలా ఆలోచించిన వెంటనే నా మీద నాకే అసహ్యం వేసింది. నేను అవ్వకూడదు అనుకున్నా కూడా, నన్ను ఈ సమాజం, అదే నన్ను అస్సలు కష్టపెట్టని సమాజం, మార్చేస్తుంది. అంతే, ఆ క్షణమే నిశ్చయించుకున్నాను. నాకు ఈ జీవితం ఒద్దు అని. ఆ చిన్నపిల్లాడి దహనసంస్కారాలు చూసి, ఇలా వచ్చాను” అని వాచ్ చూసుకొని, “ఇంకొక అరగంట” అని నవ్వింది.

శంకర్ కి ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు. కళ్ళలో నుండి ధారాపాతంగా నీళ్ళు కారాయి. ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుండి ఎన్నో చేదు అనుభవాలని, కష్టాలని చూసింది. .. అయినా వాటిని ధైర్యంగా, పాజిటివ్ గా ఎదురుకుంది.  ఆ అమ్మాయి కష్టాలతో పోలిస్తే తన సమస్య ఎంత చిన్నదో, అంత చిన్న సమస్యకి చావుని పరిష్కారంగా ఆలోచించడం ఎంత తప్పో తనకి అప్పుడే బోధపడింది.

“కీమాయా, నువ్వు చావకూడదు. నువ్వు గొప్ప డాక్టర్ వి అవుతావు. మా మావయ్య డాక్టర్. చాలా నిజాయితీగా ఉంటాడు. ఈ లోకంలో చాలా మంది మంచి డాక్టర్లు ఉన్నారు. అలా నువ్వు కూడా మంచి డాక్టర్ అవుతావు.  అతనితో నేను మాట్లాడి, నీకు సహాయం చేయమంటాను. అంతే కాదు, నేను కూడా చావకూడదు” అని కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.

“అదేమిటి సడన్ గా?” కీమాయ అడిగింది.

“చావు అనేది ఒక సిల్లీ రీజన్. మళ్లీ చదువుతాను. రాస్తాను. రాకపోతే ఇంకేదైనా ప్రయత్నిస్తాను.  నువ్వు కూడా ఆలోచించు ఒకసారి. సరేనా?” జ్ఞానోదయం అయిన వాడిలా మొహం వెలిగిపోతూ శంకర్ మాట్లాడాడు.

కన్విన్సు అయినట్టు తల ఊపి “సరే. మీ మామయ్య ఫోన్ నెంబర్ ఇవ్వండి. అండ్ చాలా థాంక్స్. మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి, ఆ లెటర్ చూసి ఇంట్లో ఖంగారు పడుతూ ఉంటారేమో” అని అంది.

ఇంత తొందరగా తన మాట వింటుంది అని శంకర్ ఊహించలేదు. ఎందుకో కారణాలు ఆలోచించకుండా ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న బస్సు స్టాప్ లో దింపేసి, బాయ్ చెప్పేసి, బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు.

అరగంట తరువాత కీమాయ ఫోన్ మోగింది. “హలో, చెప్పవే, ఇంటికి చేరుకున్నాడా మీ అన్న?” అని అంది.

“ఆ ఆ. థాంక్ యు సో మచ్. మేము చాలా భయపడిపోయాము తెలుసా. అసలు ఏం చెప్పావే మా అన్నకి? చాలా హుషారుగా ఇంటికి వచ్చి, అందరిని ఖంగారు పెట్టినందుకు క్షమాపణ అడిగాడు. అంతే కాదు, ఏదో తేడాగా ఉన్నాడు, అంటే ఎంతో ఎగ్జైటేడ్ గా, ఆశావాదిలా… .”

“ఏముంది? రెండు మూడు తెలుగు సినిమాలు కలిపి ఒక కల్పిత స్టొరీ చెప్పాను. ఆ స్టొరీ లో హీరోయిన్ నేనే” అని చాలా శాంతంగా చెప్పింది.

“మా అన్న నమ్మేసాడా? నేను నమ్మలేకపోతున్నాను. ఎలా వేశావ్ ప్లాన్? ఏం చెప్పావ్ ?”

“అందుకే సినిమాలు ఎక్కువగా చూడాలి అనేది. మీ అన్న ఎక్కడో బయట రూం లో ఉండి చదువుకోవడం వల్ల నేను ఎవరో తెలిసే అవకాశం లేదు.  నువ్వు మీ ఇంట్లో నాకు సూసైడ్ లెటర్ చూపించిన వెంటనే ఈ కొండ మీదకి వచ్చేసాను. అప్పుడే నా మైండ్ లో కథని అల్లేసుకున్నాను. పోద్దునేప్పుడో వస్తే, మీ అన్న సావకాశంగా సాయంత్రం వచ్చాడు చావటానికి. ఒక నాలుగు మంచి ముక్కలు చెప్పేసరికి చక్కగా వెంటనే నమ్మేసాడు పిచ్చోడు. అయినా మీ అన్న కూడా ఇన్ డైరెక్ట్ గా హెల్ప్ చేసాడులే, ఎక్కడ దూకబోతున్నాడో ఎవడైనా సూసైడ్ లెటర్ లో రాస్తాడా? అంటే మీలో ఎవరో వచ్చి ‘లేదు బాబు, చావకు. రాంక్ రాకపోయినా పర్లేదు. నువ్వు ప్రాణంతో ఉండు చాలు’ అని అంటారు అని ఒక వెధవ ఆశ అన్నమాట. అతనికి చచ్చే ఉద్దేశమే లేదు. సమస్యని ఎదురించలేక పారిపోవడం అనేది ఈ కాలంలో ఫాషన్ అయిపోయిందిలే. ‘చెట్లను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాండాన్ని కత్తిరించినా పక్కనుండి చిగురేస్తుంది. కాని మనిషి – చిన్న కష్టానికే బెంబేలు పడిపోతాడు’ అని ఒక రచయిత అన్నాడు. మీ అన్న కూడా అంతే. ఏ దిక్కు తోచక  పిరికివాడిలాగా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. నేను చేసిన ఈ చిన్న డ్రామా వల్ల అతనిలో ధైర్యం వచ్చింది అని అనుకుంటున్నాను. అందుకే మీరు ఆశ్చర్యపోయేట్టు అతనిలో ఒక మంచి మార్పు వచ్చుంటుంది. నేను ఇచ్చిన ఎటాక్ తో మీ అన్న ఇంకెప్పుడూ ఇలాంటి పిరికి పనులు చేయడు. బుద్ధిగా చదువుకొని గొప్పవాడు అవుతాడు చూస్కో”

“అబ్బో నీ పేరు కి తగ్గట్టే ఎంత మాయ చేసావే కీమాయా!” అని ఇద్దరూ నవ్వేసుకున్నారు.

 -ప్రజ్ఞ వడ్లమాని 

Prajna_photo

 

 

 

పిచ్చుకలు 

       chinnakatha

దేవి నట్టింట్లో వేసి వున్న కుక్కి మంచం మీద పడుకుని వుంది . . ఆమె చూపు ఇంటి చూరుకి అంటుకుని వుంది . విపరీతమైన  నీరసం వారం నుండీ , దగ్గు .. దగ్గి దగ్గి లుంగ చుట్టుకుని  పోతుంది . ఈ మధ్యనంతా ఆమె చూపు ఇంటి చూరుని అంటుకుని వుంటుంది . దాదాపు నెల నెలన్నర క్రితం వాళ్ళ ఇంటికి వచ్చిందో పిచుకుల జంట . అన్యోన్యంగా పుల్లా పుడకా ఏరుకుని వచ్చి బూజు వేళ్ళాడుతున్న వాళ్ళ ఇంటి చూరులో గూడు కట్టుకున్నాయి . వీళ్ళకే తిండి లేదు  మనమెందుకు భారమనుకున్నాయో ఏమిటో ఎప్పుడూ ఇంట్లో మేత కోసం వెతకవు . ఎప్పుడైనా మగ పిచుక ఏదో పని వున్నట్లు దేవీ వాళ్ళ అమ్మ గెంజి వార్చిన గిన్నె దగ్గర కిచ కిచ మంటూ గెంతుతుంది . 

దేవీకి అవి ఇంటికొచ్చిన కొత్తల్లో ఆరోగ్యం కొంచం మెరుగ్గానే వుండేది . మరీ ఇంత చావు నీరసం ఉండేది కాదు .అందుకని మంచం మీద పడుకుని ఆసక్తిగా వాటినే గమనిస్తూ వుండేది . ఇప్పుడలా  గమనించడానికి కూడా ఆ పిల్లకి ఓపిక లేదు . కానీ చెవులకు మాత్రం మెత్తగా  వాటి పిల్లల కువ కువ వినిపిస్తూ వుంటుంది . ఎన్నిగుడ్లు పెట్టాయో అనుకుంది దేవి . అలా అనుకుంటూ వుండగా దేవీ తమ్ముల్లిద్దరూ బడి నుండి ఇంటికి వచ్చారు  ఒకరు , మూడు ఒకరు ఐదు తరగతులు చదువుతున్నారు . రాగానే అలవాటుగా ”అక్క అక్కా తినడానికేమయినా పెట్టవా”ఆన్నాడు చిన్నవాడు  . దేవి కళ్ళు తెరవలేదు . అది చూసి పెద్దోడు శివ ”రేయ్ అక్క కి బాలేదు కద, అక్క ఏం పెడతదిరా బుద్ధి లేని గాడిద”  అన్నాడు  చిన్నోడి నెత్తి మీద ఒక్క తట్టు తట్టి . అలా అనుకుంటూ అన్నా తమ్ముల్లిద్దరూ చిన్నక్క బుజ్జి దగ్గరకి పరుగు పెట్టారు .
బుజ్జి దేవీ కంటే ఏడేళ్లు  చిన్నది . వీళ్ళు ఉంటున్న వీధికి పై వీధిలో ఒక టీచర్ ఇంట్లో పని చేస్తుంది . మొన్న శుక్రవారం దానికి పదమూడో ఏడు పెట్టింది . అది పని చేస్తున్న ఇంటి వాళ్ళు దానికో చుడీదార్ కొనిచ్చారు . ఇన్నిరోజులూ గౌన్లె వేసుకునేది . ఆ చుడీదార్ వేసుకుని కొన్ని చాక్లెట్లు తీసుకుని పనంతా అయ్యాక ఇంటికొచ్చింది ఆ రోజు . బుజ్జికి ఇక్కడికి రావడం అస్సలు ఇష్టం వుండదు . ఈ మురికి, అక్క రోగం ,ఒకే ఒక గది .. అదంతా దానికి అసయ్యం . ఇప్పుడు బుజ్జి పని చేస్తున్న ఇంట్లో ఇంతకు ముందు వాళ్ల  అమ్మ పని చేసేది . అమ్మతో పాటు టీవీ చూడటానికి వెళ్ళేది అలా అలా వాళ్ల ఇంట్లో వుండి  పోయింది . ఇప్పుడు పనంతా బుజ్జే చేస్తుంది కానీ , వాళ్ళేమీ దానికి జీతం ఇవ్వరు , అన్నీ మేమే జరుపుతున్నాం రేపు పెళ్లి కూడా మేమే చేస్తాం కదా అంటారు . ఆ ఇంటి వాళ్ళు తినడానికి ఏమైనా పెడితే , తనకు నచ్చక పోతేనో , ఎక్కువైతోనో , తమ్ముళ్ళకి ఇష్టం కదా అనిపిస్తేనో తీసి దాస్తుంది బుజ్జి . దానికోసమనే ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు బుజ్జి దగ్గరకి వచ్చింది .
వాళ్లు వెళ్లేసరికి బుజ్జి ,అన్న శీను తో ఫోన్లో మాట్లాడుతూ వుంది . బుజ్జికీ , దేవికీ మధ్యలో వాడు శీను . వాడిప్పుడు మద్రాసులో ఉంటాడు . వాళ్ళ నాన్న పెయింటు పని చేసే వాడు . అక్కడ ఆయనకి ఒకావిడతో  పరిచయమైంది . ఆవిడకి మొగుడు లేడు , బాగా ఎదిగిన కొడుకు ఒకడు వున్నాడు . ఆమె ఇక్కడ పని వదిలేసి మద్రాసుకు పోతుంటే ఆమెని వదిలి ఉండలేక దేవీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని , గంపెడు పిల్లల్నీ వదిలేసి ఆవిడతో ఎలిపోయాడు .మొదట్లో దేవీ వాళ్ళ అమ్మకి అతనెక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు . అప్పుడు దేవీ పన్నెండేండ్ల పిల్ల  , శీను పదేళ్ళ వాడు . మొగుడు ఎక్కడున్నాడో తెలిసాక శీను ని తీసుకుని మద్రాసుకి వెళ్ళింది  . ఆమె ఏడుపులూ ఆరుపులకి అతను  కొంచమైనా  చలించలేదు . నిరాశగా తిరిగి వస్తుంటే అతని ప్రేమికురాలు ”ఆ పిల్లాడిని వదిలేసి పో  , ఒకరి భారం తగ్గినా తగ్గినట్లే కదా ” అన్నది . అందుకు కూడా అతనేం మాట్లాడలేదు కానీ దేవీ వాళ్ళ అమ్మే ” ఏంరా వుంటావా ?” అన్నది శీను తో . శీనుకి ఏం చెప్పాలో తోచలేదు . అప్పుడు ఆ ప్రేమికురాలే శీనుని దగ్గరకి తీసుకుని ”వుంటాడు లే ” అన్నది . ఇప్పుడు శీను ఆవిడని  ” చినమ్మ ” అంటాడు . బాగా చూస్తుందని కూడా చెప్తాడు .అందుకే దేవీ వాళ్ళ అమ్మ ఎప్పుడైనా కష్టం తోచినప్పుడు మొగుడ్ని అనుకుంటుంది  కానీ ఆవిడని మాత్రం ఏమీ అనదు . ఎప్పుడైనా ఫోన్ చెయ్యాలనిపిస్తే శీను బుజ్జి పనిచేసే వాళ్ళ ఇంటికే చేస్తాడు . దేవి కి ఫోన్ వుంది కానీ వాడికెందుకో మొదటి నుండీ అక్కడికి చేయడమే అలవాటయింది .
మొగుడొదిలేసిన తరువాత , దేవికి వయసొచ్చే వరకు  దేవీ వాళ్ళమ్మ బిడ్డల్ని సాకలేక నానా కష్టాలూ పడింది ఇంటి బాడుగ కీ ,తిండీ తిప్పకి కటకటలాడి  పోయేది . వీళ్ళ గుడిసె పక్కన ఇంకో గుడిసెలో వుండేది .  దాంట్లో పవన కుమారి బాడుగకి వుండేది .ఇరవయ్యేల్ల పవన కుమారి ఎక్కడ నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ అక్కడా ఇక్కడా పని చేసేది ,అందంగా అలంకరించుకునేది ,బాగా ఖర్చు చేసేది . దేవీని బాగా దగ్గర తీసేది . పవన కోసం ఏమైనా కొనడానికి దుఖాణం కి వెళితే ఆ వీధి కుర్రకారు దేవీని చుట్టుముట్టే వారు పవన గురించి ఆసక్తిగా ఆరాలు తీసేవారు . అది దేవికి బాగా నచ్చేది . ఆ పిల్లకి శరీరానికి వయసు రాక మునుపే మనసుకు యౌవనం వచ్చేసింది .శరీరమూ,మనసూ పవన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశాయి . దేవీ మరి కొంచెం పెద్దదయ్యేసరికి పవన అక్కడి నుండి వేరే వూరికి వెళ్లి పోయింది
పదిహేనేల్లకి దేవీ ఆ ఊరికొచ్చిన సర్కస్ కంపెనీలో పనికి చేరింది . పవన చేసే పనుల గురించి తెలుసు కానీ అవేట్లా చేయాలో దేవీకి తెలియదు .  దేవీ వాళ్ళమ్మ ఎండు పూచిక పుల్లలాగా గాలి విసురుకి పడిపోయేటట్లు వుంటుంది .ఎవరి వైపు శరీరమో తెలియదు కానీ దేవీకి పెద్ద పెద్ద రోమ్ములోచ్చాయి .ఆ రొమ్ములు పవన లాగా ఉండాలనే ఆ పిల్ల కోరికని బ్రమ్హాండంగా సాధించి పెట్టాయి . మార్కెట్ లో ఆ పిల్లకి బాగా డిమాండ్ వచ్చింది . సాయంత్రమైతే ఆ లేత శేరీరానికి చీర కట్టి , మల్లె పూలు పెట్టుకుని ఇంటి ముందుకొచ్చిన ఆటో ఎక్కి పోయేది . ఎప్పుడూ ఉత్సాహంగా , నవ్వుతూ , చెవి దగ్గర ఫోన్ దించకుండా వుండేది . చిన్నగా ఆ పూరింట్లోకే కలర్ టీవీ , ఫ్రిజ్జూ , బీరువా తీసుకొచ్చింది , వాకిలికి కొత్తగా కర్టెన్ ఒకటి వచ్చి చేరింది .
ఆ పిల్లని చూస్తే చాలు వాళ్ళమ్మకి సగం కడుపు నిండి పోయినట్లు వుండేది . నా బిడ్డ లక్షిం దేవత అనుకునేది . పిల్లకి పెళ్లి చేయడం వంటి మాటలు ఎవరైనా మాట్లాడితే ఆమె చిరాకు పడేది . చేసుకుని నేనేం వుద్దరించా బిడ్డల్ని  కనడం తప్పించి అని తుంచేసేది . కట్టుకున్నోడు కడదాకా మనతోనే ఉంటాడని గేరంటీ ఏందంట  అనేది  .
ఈ విధంగా అంతా బాగానే జరిగి పోతూ ఉండింది . ఇదిగో ఇలా దేవి జబ్బు పడే వరకు . దేవికి మాయదారి జబ్బోచ్చింది . ఒకటే నీరసం ,తల తిరుగుడు, దగ్గు  . ఎలాగో ఒకలా ఓపిక తెచ్చుకుందామంటే ఆ పిల్ల మీద అదేదో జబ్బని పుకారు కూడా పుట్టింది . దేవి అదంతా ఏమీ ఆలోచించదు . త్వరగా జబ్బు నయమై పోవాలి . మళ్ళీ ఆ రంగు రంగుల జీవితం లోకి వెళ్లి పోవాలి అనుకుంటుంది ,మల్లి పూలు , ఘమ ఘమ లాడే సెంటు వాసనలు , చేతిలో రెప రెపలాడే డబ్బులు ఆ పిల్లకి కళ్ళలో మెదులుతూ వుంటాయి . ఆ గూట్లో పిచుకల్లాగా గూడు కట్టుకోవడం , పిల్లల్ని కనడం ఆ అమ్మాయికి ఏమీ నచ్చదు కానీ ఈ మధ్య ఎందుకో ఆ గూట్లో కువకువలు మొదలయినప్పటి నుండీ నాన్న వున్నప్పుడు , సాయంత్రం నాన్న ఇంటికి వస్తూ తెచ్చే చిరు తిళ్లు , అమ్మ ముసి ముసి నవ్వులు సంతోషమూ అన్నీ గుర్తొస్తున్నాయి .నాన్న తమని వదిలి వెళ్ళకుండా ఉండుంటే  బాగుండేదేమో  అని కూడా అనిపిస్తుంది .
ఈ రోజు కూడా మగ పిచుక గెంజి దబర దగ్గర కిచ కిచలాడుతూ వుంది తండలకి అప్పిచ్చిన అబ్బాయి  వచ్చే ఆదివారానికంతా డబ్బు కట్టకపోతే బొచ్చేబోలూ వీధిలో ఉంటాయని చెప్పివెళ్తున్నాడు .  సంపాదించినదంతా డాక్టర్ల ఫీజుగా మారిపోయింది . దేవి ఆ పిల్లాడి మాటలు విని అటు నుండి ఇటు తిరిగి పడుకుంది .
                                                         *******
వచ్చే ఆదివారం వచ్చింది . గూట్లో నుండి ఏ రాత్రి వేళ  కింద పడిపోయిందో ఒక పిచుక పిల్ల కిందపడి చని పోయి వుంది . దాని చుట్టూ చీమలు చుట్టుకుని వున్నాయి . దేవీ వాళ్ళ అమ్మ నట్టింట్లో ఖాళీగా వున్న మంచాన్ని అటు జరిపి చచ్చిపోయిన  పిచుక పిల్లని చేటలోకి చిమ్ముతూ చెట్టుకి కాసిన కాయలన్నీ చెట్టుకే వుండి  పోతాయా  అని గొణుక్కున్నది.
-కణ్ణగి

ప్రశ్నల నిధి

chinnakatha

“ఇప్పటివరకు ఎక్కడికెళ్లారు …”

“దారిలో ఫ్రెం…”

“దారిలో ఫ్రెండ్   కలిశాడు… అదేగా మీరు చెప్పేది…”

“ఆడా ? మగా ?”

“నీకు తెలుసుకదే సతీ…”

“సతీష్ అన్నయ్య కలిశాడంటారు అంతేకదా…”

“నాకు తెలుసు ఒకవేళ ఆడ అయినా మీరు మగనే చెప్తారు…”

“ఇప్పుడు నా అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సతీష్ అన్నయ్యకు ఫోన్ చేయమన్నా చేస్తారు కదూ…!”

“చందు ఫోను చేస్తున్నాడు.”

“వద్దులేండి మనింట్లో గొడవలు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలా ? అయినా ఎంత అన్నయ్యా అని పిలిచినా మీ ఫ్రెండ్ మీవైపే మాట్లాడుతాడు కానీ నావైపు మాట్లాడుతాడా? అయినా నేనడిగే ప్రశ్నలు మీకు ముందుగానే భలే తెలిసిపోతాయే..! తడబడకుండా ఎంత చక్కగా సమాధానం చెప్తారో. కొంచెం కూడా అనుమానం రాకుండా…

“సరేలేండి… ఇంతకీ కాఫీ కావాలా ? టీ కావాలా ?”

“ప్రస్తుతం ఏమీ వద్దు…”

“వద్దా? ఏంపాపం మాచేత్తో ఇస్తే గొంతులోకి దిగదా…”

“సరే , ఏదో ఒకటి తీసుకురా…”

“ఏదో ఒకటి ఏమిటి… మీకు ఏది ఇష్టమో అది చెప్పండి, అదే తీసుకొస్తాను మీ ఇష్టాలకు అనుగుణంగా ఉండటం కోసమే కదా నేను ఉన్నది…. మీరు నా ఇష్టాలకు అనుగుణంగా ఉన్నా లేకపోయినా…”

“టీ… తీసుకురా”

“టీ త్రాగుతూ కూర్చున్నాడు చందు. ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది. ఏం మాట్లాడినా సరే దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది కీర్తన. అలా అని కీర్తన అమాయకుయరాలు కాదు , చదువులేని అమ్మాయి అంతకన్నా కాదు. యం.యస్.సి చేసింది. తెలివిగల అమ్మాయి. మేనమాయ కూతురు. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ. కానీ కీర్తనకు ప్రేమతో పాటూ చందు మీద విపరీతమైన అనుమానం. ఎంత అనుమానమంటే కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తే , అందులో వాయస్ అమ్మాయిదయితే …. వెంటనే పెట్టేశాడా… ఇక ఆరోజు చందు పని అయిపోయినట్టే … ఎవరావిడ…? ఎందుకు వెంటనే ఫోన్ పెట్టేశావ్ …? ఆఫీస్ కి వెళితే నాకు ఫోన్ చేయడం చేతకాదు కానీ అర్ధరాత్రులు అమ్మాయిలు ఫోన్ చేస్తే   రిసీవ్ చేసుకోవడం మాత్రం బాగా తెలుసు. అని ఇక ‘అనుమానపురాణం’ మొదలు పెట్టేస్తుంది. తాను ఎంత చెప్పినా తన కోణంలో నుంచి తప్ప మరో కోణం నుంచి ఆలోచించదు . మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా తరువాత తరువాత అలవాటుచేసుకున్నాడు… కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం ….

సాధారణంగా ఇన్ బాక్స్ ఎప్పుడూ క్లియర్ చేయడు, క్లియర్ చేసిన రోజు పొరపాటున చూసిందా….

“ఏమంత ఇంపార్టెంట్ మెసేజ్ లు ఉన్నాయని ఇన్ బాక్స్ క్లియర్ చేశారు. ఎవరూ చూడకూడని మెసేజ్ లా?! మీరు మాత్రమే చూసి డిలీట్ చేయాల్సిన మెసేజ్ లా?!” …

“నా జీవితం మొత్తం ప్రశ్నలతోనే గడిచిపోతుందా? సమాధానాలు కరువైపోతున్నాయా ? ముందు ముందు మాట్లాడటానికి కూడా నాకు అవకాశం ఉండదా? చిన్నప్పటి నుంచి పరీక్షలలో నేను రాసిన ప్రతి ప్రశ్నకు బై కి బై మార్కులు వచ్చేవి, కానీ జీవిత పరీక్షలో రాస్తున్న ఈ ప్రశ్నలకు కనీసం పాస్ మార్కులు కూడా రావడం లేదు. ఏం చేయాలో తనకు అర్ధం కావడం లేదు . ఎవరికి చెప్పుకోవాలో తనకు అర్ధం కావడం లేదు. ప్రేమించుకునే రోజుల్లో తను ఇలా ఉండేది కాదు. చాలా కోపరేటివ్ గా ఉండేది. ‘సరదాకి నేను నిన్ను కాకుండా ఇంకెవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వేంచేస్తావే?!’ అని అడిగితే నీకు ఏది నచ్చితే అది చెయ్ బావా! నీ ఇష్టమే నా ఇష్టం నా దగ్గర నువ్వు సంతోషంగా, సుఖంగా ఉండలేకపోతే ఏ అమ్మాయితో అయితే నువ్వు సంతోషంగా, సుఖంగా ఉండగలవో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో, నేను మాత్రం అడ్డురాను. అని అన్న కీర్తన, ఈ రోజు నేను పెళ్లి చేసుకున్న కీర్తన ఇద్దరూ ఒకటేనా?! అనే ఒక అనుమానం తనకు కలిగి, ఆ రోజు అలా అన్నదానివి ఈ రోజు ఇలా ఎలా మాట్లాడుతున్నావే అని అడిగితే …”

“ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు నువ్వు లేవు బావా? ఆ రోజులా నువ్వుoటే, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నా నేను పట్టించుకునే దానిని కాను.” కీర్తన మాట్లాడుతుంటే తనకు ఏమీ అర్ధం కావడంలేదు.

“నేను ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు అలానే ఉన్నాను. నాలో మార్పు లేదు” అని చందు ఎంత చెప్తున్నా కీర్తన వినిపించుకోవడం లేదు.

imagesG00LEMPG

“ఇవన్నీ అనవసరమైన మాటలు బావా చివరిగా ఒక మాట చెప్తా విను … ‘చంద్రుడిలో మార్పులు వస్తూనే ఉంటాయి. అవి తనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఆ మార్పులు మాత్రం చూస్తున్న మనకు తెలుస్తుంది. ఆ మార్పును మనం ఆనందించవచ్చు. కానీ తనకు కూడా భార్య ఉంటే తను మాత్రం ఆనందించదు బావా?!’” అని కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్లిపోయింది.

ఆ సంఘటన కళ్ళల్లో కదులుతుండగా… కీర్తన కళ్ళల్లో కన్నీళ్లు అనుక్షణం తనను వెంటాడుతుండగా… ఆలోచనాలోచనల్లో మునిగితేలుతున్న చందు, తనలో ఏం మార్పు వచ్చిందా అని తనను తాను అవలోకనం చేసుకుంటున్న చందు, సైడ్ స్టాండ్ వేసి CBZ XTREME AP 16 B 8963 బండి మీద కూర్చొని వేడివేడి టీ త్రాగుతూ, వేడివేడి గా ఆలోచిస్తున్న  చందు… ఆ అడ్రస్ ను వెతుక్కుంటూ ముందుకుసాగాడు…..

*****

“చందు లోపలికి వెళ్ళాడు… భయం భయంగా….”

“తనకు అద్దం ముందు నిలుచున్నట్టుంది, కాదు కాదు అద్దాల గదిలో నిలుచున్నట్టుంది. తనలాంటి వారు అక్కడ చాలా మంది ఉన్నారు. అందరూ భార్యా బాధితులే ….”

“జుట్టంతా చెదిరిపోయి … షర్టoతా చెరిగిపోయి … పిచ్చోళ్లలా కొందరు …”

“కళ్ళoతా ఎర్రబడి … ముఖమంతా నల్లబడి … ప్రేతకళతో మరికొందరు …”

“విడాకుల కాగితాలతో కొందరు … వింతైన అనుభవాలతో ఇంకొందరు …”

“చావే నయమనుకుంటున్న మరికొందరు … చావలేక బ్రతుకుతున్న వాళ్ళు ఎందరు … ?”

“ఎవర్ని కదిలించినా ఇవే కదలికలు …”

“ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడట ఒకడు” అన్నట్టు … సంసారం లో పడి మేము నిలువెల్లా దహించి     పోతుంటే సరదాకి ప్రశ్నలడగడానికి వచ్చిన వాళ్ళు ఇంకొందరు… పారితోషకం ఉంది కదా!

*****

ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

దగ్గరాదగ్గరగా అరవై సంవత్సరాలుంటాయనుకుంట ఒకావిడ మా ముందుకు వచ్చింది.

తనతో పాటు కొంతమంది యువకులు కూడా వచ్చారు . వాళ్ళంతా మాకు పేపర్స్ ఇచ్చి మీ ప్రశ్నలు , మీ సమస్యలు ఏవైనా సరే ఈ పేపర్ మీద రాయమన్నారు …

అందరం రాశాం… మేము రాసిన పేపర్స్ ని వాళ్ళు తీసుకున్నారు.

నేను ఇవన్నీ చదివి ఒక అరగంట తరువాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీకోసం స్నాక్స్ , టీ   ఎదురుచూస్తున్నాయి తీసుకోమని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

*****

అరగంట గడిచింది…

ఆవిడ మళ్ళీ మాముందుకు వచ్చారు.

“నేను మీ అందరి సమస్యలు చదివాను, నవ్వుతూ… చాలా బావున్నాయి … దాదాపుగా అందరి సమస్యలూ ఒకలానే ఉన్నాయి.” అన్నారు.

“అందరూ భార్యలనే వేలెత్తి చూపారు కానీ నాలుగువేళ్లు మీవైపే చూస్తున్నాయనే సంగతి మాత్రం మరిచిపోయారు.”

అని ఆవిడ అనగానే

అంతలోనే “అంటే మీ ఉద్దేశ్యం … తప్పంతా మాదనా ?” ఆవేశంగా ఒకగొంతు వీరవిహారం చేసింది. వేదన చెందింది. “నా ఉద్దేశ్యం అదికాదు కుమారా…”

“మరి” …     కాస్త ఓపికగా వింటే మీకే అర్ధమవుతుంది.

“నా కోసం ఏడవకండి మీకోసం మీబిడ్డల కోసం ఏడవండి” అని యేసూక్రీస్తు చెప్పిన మాటల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ కులానికి చెందిన వారైనా … ఏ మతానికి చెందిన వారైనా… ఏ ప్రాంతానికి చెందిన వారైనా …,

ఎందుకంటే మీరిప్పుడు నాకోసం వినకండి సావధానంగా…. సాలోచనంగా…. “మీకోసం… మీభార్యలకోసం… మీబిడ్డల కోసం… మీకుటుంబాల కోసం… మీరు నిర్మించబోయే నవభారత నిర్మాణం కోసం… వినండి”    ఆవిడ మాటలు పని చేశాయి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.

“ప్రేమించి పెళ్లిచేసుకున్నా … పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా … భారతీయ వివాహ వ్యవస్థ చాలా ఉన్నత మైనది. దానిని కాపాడుకోవలసిన ఆవశ్యకత మన మీదనే ఆధారపడి ఉంది. మారుతున్న సమాజంలో సహజీవనాల మధ్య బ్రతుకుతున్న మనం మన స0ప్రదాయాలను, సంస్కృతులను విస్మరిస్తున్నాం, మనకు నచ్చిన విధంగా మార్చేసు కుంటున్నాం. ఏవి మారినా ఇబ్బంది లేదు కానీ వివాహం విడాకులుగా మారితే వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఒకరినొకరు అర్ధం చేసుకొని సర్ధుకుపోతే సంసారాలలోని సారాన్ని గ్రహించిన వాళ్లమవుతాం….”

“విపరీత పరిణామాల మధ్య నలిగిపోతున్న మీరు ఈ రోజు ఇక్కడికి రాగలిగారంటే మీకు మీ భార్యలను వదిలేయాలనే కోరిక కాని, వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ ఎంతమాత్రమూ లేవు అనే విషయం స్పష్టంగా అర్ధ మవుతుంది. దానితో పాటే పని ఒత్తిడిలో వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయం కూడా మీరు రాసిన ప్రశ్నలను బట్టి అర్ధమవుతుంది.”

ఆవిడ గొంతు గంభీరంగా ఉంది. కానీ అందులో తీయదనం ఉంది. “చిన్నపిల్లాడు తప్పు చేస్తే తల్లి ఎలా అయి తే తప్పును సరిదిద్దాడానికి ప్రయత్నిస్తుందో అలాంటి ప్రయత్నం ఆమె చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది….” చందు లోలోపల అనుకుంటున్నాడు…..

ఆమె మాట్లాడుతుంది… ఆమె అడుగుతుంది… ఆమె ప్రశ్నిస్తుంది…

“మీరు ఆఫీస్ కి వెళ్ళిన తరువాత ఏరోజైనా మీ భార్యకు ఫోన్ చేసి తిన్నావా ?” అని అడిగారా

“ఒకవేళ మీకు తీరిక లేక పని ఒత్తిడిలో ఫోన్ చేయలేకపోతే , తనే చేసినప్పుడు మీరు హడావుడిగా, చిరాకుగా, కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఎప్పుడైనా మాట్లాడారా?”

“పోనీ పనిలో బిజీగా ఉన్నాననే విషయాన్ని, తరువాత ఫోన్ చేస్తాను లేదా చేయమనే విషయాన్ని మీరు నెమ్మదిగా చెప్పిన సందర్భాలున్నాయా ?”

“బిజీ గా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని భార్య మీద ప్రేమతో మీరు మాట్లాడినా…?! మీరు మీ భార్యకు ‘ఐ లవ్ యు’ అనే పదాన్ని చెప్పగలిగారా ?” “ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు పెళ్లి చేసుకున్న తరువాత ఎన్ని సార్లు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పిఉంటారో … ?!” నాకు చెప్పాల్సిన అవసరం లేదు ? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

“ఇవన్నీ ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రేమించడం గొప్ప విషయం కాదు పెళ్ళైన తరువాత కూడా ప్రేమించడం గొప్ప విషయం. ఆ ప్రేమను వ్యక్తపరచడం ఇంకా గొప్ప విషయం. కానీ ఎవ్వరూ అలా వ్యక్తపరిచే వాళ్ళు లేరు. కారణం పెళ్ళైన తరువాత నువ్వు తిట్టినా, కొట్టినా భార్యలు పడాలి, పడితీరాలి అనే ఒక మూర్ఖపు భావన …”

“భర్త పదివేలు పెట్టి పట్టుచీర తెస్తే ఆడవాళ్ళు ఎంత సంతోషపడతారో…మీ దృష్టిలో అది అంతులేని ఆనందం.. కానీ ఆవిడకు ఆ సంతోషం తాత్కాలికమే… కానీ ‘పదినిముషాలు పక్కన కూర్చొని మాట్లాడితే పరవశించి పోతారు. పది జన్మలకైనా నీకే భార్యగా పుట్టాలనుకుంటున్నాని చెప్పడానికి సిగ్గుల మొగ్గలతో   పులకించిపోతారు.’ శాశ్వితంగా గుర్తుంచుకుంటారు.” పెళ్ళైన దగ్గర నుంచి నా భర్త నాకు ‘ఐ లవ్ యు’ అని చెప్పని రోజు లేదంటే మీరు నమ్ముతారా? చివరకు ఆయన చనిపోయే ముందు కూడా నాతో పలికిన చివరి పలుకులు ఏమిటో తెలుసా ‘ఐ లవ్ యు… బంగారం’

“మీరు ఏరోజైనా భార్యకు మూరెడు మల్లెపూలు తీసుకెళ్ళారా ? సరదాగా సినిమాకు తీసుకెళ్ళారా ?”

“సాయంత్రం షికారుకెళ్లి ఏ కాఫీనో, కూల్ డ్రింకో త్రాగుతూ మనసువిప్పి మాట్లాడుకున్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చే స్థానాన్ని ఏరోజైనా మీ భార్యకివ్వగలిగారా?”

“మీ ప్రేమలేఖల్ని, మీ శుభలేఖల్ని, మీ పెళ్లి ఫోటోలని, మీ పెళ్లి వీడియోలని, మీకున్న గతవైభవ జ్ఞాపకాలని ఏరోజైన మనశ్శాంతిగా కూర్చొని చూడగలిగారా? అంత టైమ్ మీ భార్యకు మీదైనందిన జీవితంలో కేటాయించగలిగా రా ? ఆలోచించండి ”

“పొరపాటున తెలిసో, తెలియకో మాట జారినప్పుడు మూతి పగలగొట్టకుండా నా భార్యే కదా అని మనసుకు హత్తుకున్నారా?”

అన్నిటినీ మించి “అందరినీ వదిలేసి నీ కోసం వచ్చిన నీ భార్యను , నీదైపోయిన నీ భార్యను… తన వాళ్ళు గుర్తుకు రాకుండా గుండెల్లో పెట్టి చూసుకో గలుగుతున్నారా?” ఈ ప్రశ్నలకి సమాధానాలు మీకు తెలిస్తే మీ భార్య మీ పట్ల ఎందుకలా ప్రవర్తిస్తుందో మీకు అర్ధమవుతుంది.

ఇలాంటి ప్రశ్నలు ఆవిడ ఒకదాని తరువాత ఒకటి మామీద సంధిస్తూనే ఉంది. కాదు… కాదు… మా తప్పుల్ని చాలా తెలివిగా మాకే గుర్తుచేసి, తప్పుచేశామనే భావనను మాలో కలిగించి ఆ తప్పులు దిద్దుకునే విధంగా అడుగులు వేయడానికి మార్గాలు చూపుతున్నట్టుగా ఉంది.

అవును… అందరి గురించి నాకు తెలియదు కానీ, ఆవిడ చెప్పిన ప్రతి తప్పూ నేను చేస్తున్నదే … కీర్తన అన్నట్టు నేను మారాను … “ఎంతలా మారానంటే నేను మారానన్న సంగతి నేను గుర్తించడానికి సమయం లేనంతగా మారి పోయాను”. నా మార్పు నాలోనే కాదు కీర్తనలో కూడా మార్పు కలిగించింది. తన స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చే టంతగా నా మార్పు తనలో పరిణామం చెందింది. ‘తనది అనుమానం కాదు బాధ.’ నేను దూరమైపోతున్నాననే బాధ. తనకు దక్కకుండా పోతాననే బాధ. తనను నిర్లక్ష్యం చేస్తున్నాననే బాధ. తనను బాధ పెడుతున్న నేను ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాననే బాధ, తన బాధను గ్రహించకుండా తనే నన్ను తన ప్రవర్తనతో, తన మాటలతో బాధపెడు తుందని ఈ రోజు ఇలా ….

జరిగేదంతా మంచికే అన్నట్టు ఇక్కడికి రావడం మంచిదయ్యింది. నా లోపాల్ని నేను తెలుసుకున్నాను.

చందు తనలో తాను తన ప్రశ్నలకి సమాధానాలను చెప్పుకుంటున్నాడు. తన సమస్యలకు పరిష్కారాలను వెదుక్కుంటున్నాడు.

*****

“మీరు రాసిన అన్ని ప్రశ్నలూ దగ్గరాదగ్గరగా ఒకేలా ఉన్నాయి. అందరి సమస్యా ఒక్కటే… కానీ ఒక్క ప్రశ్న మాత్రం వీటన్నిటికీ భిన్నంగా కనిపిస్తోంది. అయితే నాకు తెలిసి ఆ ప్రశ్న రాసిన వ్యక్తి తనలో అంతర్లీనంగా ఉన్న సమస్యను రాయడానికి సిగ్గుపడి, భయపడి, మొహమాటపడి ఏంరాయాలో అర్ధం కాని స్థితిలో “వయసు మీద పడకుండా….”ఉండాలంటే ఏంచేయాలి..?అని రాసి ఉంటాడని నా అభిప్రాయం. కనుక ఈ ప్రశ్నకి మేము పారితోషికం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.” అనగానే … చందూకేమీ అర్ధం కాలేదు….

ఆ ప్రశ్న రాసిన వారిని పిలుస్తున్నారు…

“ఎవరూ వెళ్ళడం లేదు. ఎందుకంటే చందు అక్కడ ఉండగా ఇంకెవరు వెళతారు…”

అంతలోనే ఎవరో లేచి… “మీరు చెప్పిన వాటికి , ఆ ప్రశ్నకూ ఎలాంటి సంబంధం లేదు కదా ఆ ప్రశ్నకు మీరెలా పారితోషికం ప్రకటించారు” అని అడగ్గానే , ఆవిడ వెంటనే

“నేను చెప్పిన ఇన్ని విషయాలను ప్రక్కన పెట్టి పారితోషికం గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు సమస్యలు ఉండి రాలేదు. సమస్యలు సృష్టించే డబ్బు కోసం వచ్చావు. అయినా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక   చెప్పాలి.”

“లైలా మజ్నూ, రోమియో జూలియట్, దేవదాసు పార్వతి….

సీతారాములు, శివపార్వతులు, రాధాకృష్ణులు …. వీళ్ళంతా ఇంకా మనలో బతికే ఉన్నారు. వయసు మీద పడిన వాళ్ళు ఎవరూ ఇంతకాలం బతికి ఉండరు కదా…! అనిర్వచనీయమైన ప్రేమకు , నిస్వార్ధమైన ప్రేమకు, అది ఉన్న జీవులకు “వయసుమీదపడదు”. అలాంటి ప్రేమను పంచమని, ప్రేమామయులుగా ఉండమని నేను ఇంతసేపూ చెప్పాను. అలాంటి ప్రేమను పంచిన రోజున భార్య గుండెల్లోనే కాదు… ఎక్కడైనా చిరస్థాయిగా నిలిచిపోతారు. తన సమస్యను రాయకుండా, భార్యను నలుగురిలో పెట్టకుండా తన సమస్యకు తానే పరిష్కారాన్ని వెదికేలా సంబంధంలేని ప్రశ్నను సంధించి తన సంబంధాన్ని ధృడంగా మార్చుకున్నాడు కనుకనే ఈ ప్రశ్నకు పారితోషికం ప్రకటించడం జరిగింది.”

“మీలో మార్పు వస్తే … పతనమవుతున్న విలువల్ని, విచ్ఛిన్నమవుతున్న వివాహ వ్యవస్థని, నవభారత నిర్మాణ సారధులుగా మీరు కాపాడగలిగితే నేడో, రేపో పోయే ఈ ప్రాణం మాట్లాడిన మాటలకి విలువ ఉంటుందని, నా బ్రతుకు కి ఒక అర్ధం వస్తుందని ఆశిస్తున్నాను. సెలవు….

*****

అందరూ వెళ్ళిపోయారు

చందు ఒక్కడే మిగిలిపోయాడు

ఆవిడ చందు దగ్గరకు వచ్చి “ఎందుకు నువ్వు వేదిక మీదకు వచ్చి పారితోషికం తీసుకోలేదు” అని అడిగింది.

“నాకు రావాల్సిన పారితోషికం వచ్చేసింది… అయినా, ఆ ప్రశ్న రాసింది నేనే అని మీకెలా తెలుసు” అన్నాడు

“బరువెక్కిన నీ గుండెల్లో పశ్చాత్తాపం కళ్ళల్లో నీళ్లుగా మారుతుంటే తుడుచుకోలేక వేదన పడుతున్న నీ చేతి వేళ్లు , సెలయేళ్లుగా మారిన చెక్కిళ్లు , తడిచి ముద్దైపోయిన నీ పాదాలు …” చెప్పకనే చెబుతున్నాయి నాయనా….

“ఇప్పుడు నీలో నాకు మార్పు కనిపిస్తుంది…”

“నాకు కూడా కనిపిస్తుంది అమ్మ” అనుకుంటూ చందు అక్కడినుంచి వెళ్లిపోయాడు.

*****

“కీర్తన రేపటి నుంచి వారం రోజులు సెలవు పెట్టేశాను… ఎక్కడెక్కడికి వెళ్దాం… ఎలా వెళ్దాం… అన్నీ నువ్వే ప్లాన్ చెయ్యి. ఒక అరగంటలో ఇంటికి వచ్చేస్తా. ఏదైనా సినిమాకు వెళ్ళి, అటునుంచి అటు రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. రెడీ గా ఉండు … ఓకేనా…

“సినిమాకి వద్దండి… ఈ రోజు శుక్రవారం కదా అమ్మవారి గుడికి వెళ్దాం. అక్కడి నుంచి రహీమ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాపను చూసి, ఆ ఏరియాలో చర్చి ప్రారంభోత్సవం ఉందట, ప్రక్కింటి మరియా పిన్ని గారు భోజనానికి అక్కడికి రమ్మన్నారు వెళ్దాం బావా …… ప్లీజ్ … ప్లీజ్ … ప్లీజ్ …”

“అన్నిసార్లు నువ్వు ప్లీజ్ అనాల్సిన అవసరం లేదు బంగారం… నీఇష్టం.”

“లవ్ యు బంగారం…”

బాయ్… బాయ్……

-అప్పారావు పంతంగి

aaa

అనుబంధాల టెక్నాలజీ

chinnakatha
‘ప్చ్’ అన్నాడు అప్రయత్నంగా శేషాచలం.
‘ఏమిటి శేషు అంత నిరాశ గా వున్నావు” పార్కులో పక్కనే కూర్చున్న రామనాధం అన్నాడు శేషాచలం తో.
“ఏమిటో చాలా విషయాలు అర్థం కావటం లేదు”
“రిటైర్ అయినవాళ్ళం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినవాళ్ళం, ఇప్పుడు అర్థం కాని విషయాలు ఏముంటాయి?” నవ్వుతూ అన్నాడు రామనాధం.
“అది మనజీవితం రామూ, సమస్యలు వచ్చాయి…ప్రయత్నం చేసాము, కష్ట పడ్డాము…ఎన్నో ఎదుర్కున్నాము. కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది చిత్రమైన సమస్య….”
“నాకు తెలియకుండా నీకు వచ్చిన చిత్రమైన సమస్య ఏమిటో”
“చిన్నప్పుడు మనమెలా పెరిగామో ఒక సారి గుర్తు చేసుకో.”
“ఎలా పెరిగాము …గవర్నమెంటు స్కూలులో పాఠాలు, రాత్రి పూట నాన్నమ్మ చెప్పే రామాయణ కథలూ, తాతగారితో షికారు వెళ్ళినప్పుడు చెప్పే పులి వేట కథలూ…చెరువులో చేపలు పట్టడం ….. మామిడి చెట్టెక్కి కాయలు కోయడం…ఇంకా గోళీల ఆట, జిల్లకోడి అంటూ కట్టేని ఎగర కొట్టడం….ఓహ్ …ఎంత బాగుండేది కదా”
“అవును కదా ….ఇన్ని విశేషాలతో పెరిగిన మనం ….మన సాంప్రదాయాలు ఎన్నో తెలుసు కున్నాం. మరి ఈతరం వాళ్లకు ఏమి చెప్పబోయినా, ఏది నేర్పబోయినా ఎందుకు నచ్చడం లేదు? పైగా ఈ వయసులో మనవాళ్ళకు దగ్గర కావాలని, వాళ్ళతో ఆడుకోవాలని అనిపిస్తుంది కదా….’
“ఓహ్ ..అదా నీసమస్య…..కాలం మారిందిరా..’
“మారింది కానీ పెద్దమనవడికీ..చిన్న మనవడికీ..మద్య కాలం కూడా చాలా మారింది..”
“ఎలా ?”
“ఇలా ……”

“ఎందుకు విరాజ్ ఇలా ?” అన్నాడు శేషాచలం
“నేనేమీ చెయ్యలేను నాన్నా” చేతులు పైకి ఎత్తేసి అంటూన్న కూతురు భావన ను చూసి నిర్ఘాంతపోయాడు శేషాచలం.
తను చేసింది కంప్లైంటు కాదు…వివరణ మాత్రమె…
ఎంత మార్పు వచ్చింది కాలం లో….
పెద్ద మనవడు తేజ ఆరేళ్ళ ప్పుడు చేపలు పట్టడం నేర్పితే ఎంత సంబర పడ్డాడు!
ఎగిరి గంతేసి తాతయ్యను పట్టుకుని గిరగిరా తిరిగాడు. తిరిగి చేపను వదిలెస్తూ చంపడం మంచిది కాదు అంటే ఎంత ఆసక్తిగా విన్నాడు!
రాత్రిపూట తను చెప్పే హనుమాన్ కథలూ, కృష్ణుడి వెన్న దొంగతనాలు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని ప్రశ్నలు వేసేవాడు…
ఇవన్నీ ఇప్పుడు రెండో మనవడు విరాజ్ కు ఎందుకు నచ్చడం లేదు??
వీడికీ ఇదే వయసు కదా…ఎక్కడ తేడా?…
భావనా వాళ్ళు మూడేళ్ళు అమెరికా వెళ్లి వచ్చాక ఇప్పుడే తన ఇంటికి రావవటం….
తేజా తాతను చూసి సంబరపడ్డా చిన్నవాడు ఆరేళ్ళ విరాజ్ దగ్గర చేరలేదు. కొత్త అనుకున్నా..నెమ్మదిగా చేరువ చేసుకోవాలని చూసాడు శేషాచలం.
దగ్గర కూర్చో బెట్టుకుని “ హనుమాన్ కథలు చెబుతా రారా” అంటే
“వద్దు. నాకు తెలుసు “ అని పారిపోయాడు.
“ తెలుసా అన్నీ?”
“తెలియక పోయినా ఐపాడ్ లో చూసుకో వచ్చు”
“పోనీ ఫిషింగ్ పోదామా “
“వద్దు. ఐ డోంట్ లైక్”
“ఎందుకురా బాగుంటుంది”
“టూ ఈజీ తాతయ్యా”
“టూ ఈజీ నా?”
“ ఎస్ తాతయ్యా, I play in the internet games”
“ఇది real గా నాన్నా”
“నో తాతయ్యా “
అదే చెప్పబోయాడు కూతురితో శేషాచలం “అన్నీ తెలుసనుకుంటే ఎలాగమ్మా, నేర్చుకోవాలి కదా. పెద్దలు చెప్పింది వినాలి కదా….” అని
భావన మాత్రం “ నేనేం చెయ్యలేను నాన్నా” అని చేతులు పైకి ఎత్తేసింది.
ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. మన ఆచారాలూ, సాంప్రదాయాలు…పురాణాలు కథలు కథలుగా నేర్పాలనుకోవడం తప్పేలా అవుతుంది?
మనం చెప్పినది వినే పరిస్థితిలో ఎందుకు లేరు?
ఆలోచిస్తే హనుమాన్ కంటే spiderman …..సూపెర్ గా కనపడతాడే మో.
అలాగే చందమామ కథల కంటే dianosaurus, చెక్క బొమ్మలకంటే బార్బీ బొమ్మలు, బ్యాటరీ తో రయ్ మని పరుగెత్తే ట్రక్కులు, కార్లూ….interesting గా కనబడుతున్నాయి…..
ఇలా అయితే మనవడికి దగ్గర కావడం ఎలా?….
శేషాచలం సమస్య ఏమిటో బాగా అర్థం అయ్యింది.
“ఇలాటివి ఈ రోజుల్లో అందరు బామ్మలూ, తాతలూ ఎదుర్కునేదే. పెరుగుతున్న టెక్నాలజీ తో మనం కూడా ఎదుగుదాం అనుకున్నామంటే సరి…..” రామనాధం సమాధానం నచ్చలేదు శేషాచలం కు.
“ఈ వయసులో మనం ఎదగాలంటావా?”
“ఒక సారి ఆలోచించు…మనం పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు వీళ్ళు పెరుగుతున్న కాలం వేరు..రామాయణ కథలు లాటివి ఆనిమేటెడ్ క్యారెక్టర్స్ తో చక్కగా వివరించే C D లు వున్నాయి లేదా తీరిక వున్నప్పుడు కంప్యూటర్ లో చూసుకునే అవకాసం వుంది. ఏది తెలియక పోయినా google search చేసుకునే కాలం వీరిది.
అంతెందుకు నేను సైకల్ నేర్చుకోవడానికి పదిరోజులు పట్టింది ఆ రోజుల్లో. నా మనమడు పదినిముషాల్లో నేర్చుకున్నాడు ఎలా అంటే వాడి ఆటల్లో శరీరాన్ని బేలెన్స్ చేసుకునేవి చాలా వున్నాయి. అందుకే సైకల్ ఎక్కగానే బాలెన్స్ చేసుకుని తొక్క గలిగాడు.
అంతేకాదు ఇప్పటి పిల్లలకు, టెన్నిస్, పియానో, చదరంగం అని ఎన్నో క్లాసులకు తీసుకెడతారు..స్కూల్ లో కూడా సైన్స్ క్లబ్బులూ, వారానికి ఒక టాపిక్ మీద మాట్లాడ్డం నేర్పిస్త్తారు. అందుకే వాళ్ళు అంత అడ్వాన్సెడ్ గా వున్నారు…వీళ్ళు చూసే హ్యారీపాటర్ సినిమాలు, డిస్కవరీ చానెళ్ళు మనం చూసామా ?
కాబట్టి వాళ్లకు దగ్గరవ్వాలంటే మనమూ కాస్త అడ్వాన్స్ అవ్వాలి….ఇదీ నేను తెలుసుకున్న థియరీ…..
ఎక్కవగా ఆలోచించి బి.పీ. పెంచుకోకు..”అంటూ భుజం తట్టాడు రామనాథం.
తనను పాత చింతకాయ పచ్చడి అనుకోకుండా మనమడికి దగ్గర అవ్వడం ఎలా అని ఆలోచించాడు ఆరాత్రి.
మరురోజు పొద్దున్న టిఫిన్లు అయ్యాక
“విరాజ్ …ఈ రోజు నీవు నాకు నీ ఐపాడ్ మీద గేమ్స్ ఆడటం నేర్పుతావా?” అని అడిగాడు మనవడిని.
“ఓ” అంటూ తాతయ్య చేతులు పట్టుకున్నాడు విరాజ్.
ఆ రోజు రాత్రి పక్కన పడుకున్న విరాజ్ ని అడిగాడు స్పైడర్ మ్యాన్ కథ చెబుతావా అని.
“నో తాతయ్యా నీవు చెప్పు నాన్నమ్మని ఫస్ట్ టైం ఎలా కలిసావో….”
దానికి విసుక్కోకుండా తను నాన్నమ్మని పెళ్ళిచూపుల్లో మొదటిసారి చూసిన ఘట్టం చెప్పసాగాడు శేషాచలం.
అనుబందాల టేక్నాలజీ కూడా మారాలి మరి!!!

రస్టికేషన్

chinnakatha‘రాం’ యూనివర్సిటీ నుంచి ఇంటికొచ్చాడు.చాలా రోజుల తర్వాత మా ఇంట్లో కొత్త కళ విరిసింది.పెద్ద పండగ మళ్ళీ ఓ సారి మా తలుపు తట్టినట్లుంది. మా ఒంటరి జీవితాల్లో సందడి చేయడానికి వసంతం మళ్ళీ ఓ సారి సమాయత్తమైంది.

ఎన్నో యేళ్ళ నిరీక్షణ తర్వాత,మహతికి,నాకు పుట్టిన ముద్దు బిడ్డ,మా ఇంటి మహా దీపం రాం.వాడు మాకు లేక లేక కలిగినందువల్లనూ,ఈ భూభారం మరింత పెంచడం ఇష్టం లేక పోవడం మూలానా,మేము మరో ప్రాణికి జన్మనిచ్చే ప్రయత్నం చేయలేదు.అందువల్ల రాంని ఒకింత గారాబంగా పెంచామనే చెప్పాలి.వాడు చాలా సుతిమెత్తని స్వభావాన్ని స్వంతం చేసుకున్నాడు. వాడు పెరిగి పెద్దవుతున్నకొద్దీ అంతర్ముఖుడిగా మారిపోయాడు.

*

రోజులు హుషారుగా సినిమాలతోనూ,షికార్లతోనూ ఒకింత సంతోషంగా గడుస్తున్నాయి.ముగ్గురం కలిసి ఐనాక్స్ థియేటర్లో ‘మనం’ సినిమా చూశాము.కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు.మా ముగ్గురి గుండెలు ఆర్ధ్రమైనట్లు నాకనిపించింది.ముందుగానే ప్లాన్ చేసిన తిరుమల సందర్శన కూడా దిగ్విజయంగా ముగించాము.రోజులు క్షణాల్లా దొర్లిన తర్వాత,రాం తిరిగి వెళ్ళాల్సిన సమయమాసన్నమయ్యింది.కానీ వాడెందుకో ఉన్నట్లుండి మరింత ముభావంగా మారిపోయాడు.

వాడు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ‘ఆంగ్ల మరియు విదేశీ భాషల’ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా బోధన(ఇఎల్టి) విభాగంలో పరిశోధనా విద్యార్ధి.ఊరెళ్ళాల్సినరోజుదయం తను మాకంటే కొంచెం ముందు లేచి తయారవ్వవలసి ఉంది.నేను నిద్రనాపుకోలేని బలహీనుణ్ణి కాబట్టి,నన్ను తర్వాత లేపమని మహతికి ముందురోజు రాత్రే చెప్పి ఉంచాను.కానీ ఉదయమే నన్ను తను తట్టిలేపింది.”ఏమండీ రాం ఇంకా లేవలేదు.ఐదింటికే లేస్తానన్నాడు.మొబైల్లో అలారం కూడా ఆన్ చేసి ఉంచాడనుకుంటా.నేను వాడి గది తలుపు ఎంత గట్టిగా కొట్టినా లేవలేదు,వాడి మొబైల్ కు చేసినా రెస్పాన్స్ లేదు.నాకేంటో భయంగా ఉందండీ”అంది.నేను దిగ్గున లేచాను.ఇద్దరం వాడి రూం తలుపును “రాం,రాం” అంటూ అరుస్తూ గట్టిగా బాదాం.ఏ విధమైన స్పందనా లేదు.నా అనుమానం మరింత బలం పుంజుకుంది.ఎట్లాగో కష్టపడి తలుపు విరగ్గొట్టాం.లోపల మంచం మీద రాం అచేతనంగా పడి ఉన్నాడు.

“రాం లేవరా ఏమయ్యింది?”అంటూ వాణ్ణి పట్టుకు కుదిపాను.తోటకూర కాడలా పక్కకు వాలిపోయాడు.మహతి రోదించడం మొదలు పెట్టింది.నేను తెప్పరిల్లి,ఇద్దరం కలిసి కార్లో వాణ్ణెక్కించి అదృష్టవశాత్తూ దగ్గర్లోనే ఉన్న ‘కేర్’ ఆసుపత్రికి బయలుదేరాం.రాంను ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి క్షణమొక యుగంగా గడపసాగాం.గంటపోయాక డాక్టర్

“స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా మింగడం వల్ల ఇలా జరిగింది.మీరు తీసుకు రావడం ఇంకొంచెం ఆలశ్యమయ్యుంటే అతను బతికే అవకాశం చాలా తక్కువగా ఉండేది” అన్నాడు.నా మెదడొక్కసారిగా మొద్దుబారిపోయింది.డాక్టర్ ప్రాణాపాయం లేదని చెప్పడం వల్ల కొంత ఉపశమనం లభించింది.మహిత కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.

*

కొన్నిరోజులు పోయాక రాంను ఇంటికి తీసుకు వచ్చాము.వాడు పునర్జన్మ పొందినట్లు నాకనిపించింది.ఐతే ఏదో అపరాధభావం తాలూకు ఛాయలు మా ముగ్గురి మొహాల్లో స్పష్టంగా తాండవిస్తున్నాయి.మహతికి,నాకు అసలు రాంతో ఏం మాట్లాడాలో,ఎలా మాట్లాడాలో అర్ధం కావటం లేదు.వాడు చదువుకునే యూనివర్సిటీలో సమస్యలున్నట్లు మాకెప్పుడూ చెప్పలేదు.వాడికి నాకంటే మహితో కొంచెమెక్కువ చనువుంది.ఆమెక్కూడా వాడేమీ చెప్పినట్లు లేడు.

నా ఆలోచనలు పరి పరి విధాలుగా పరిభ్రమిస్తున్నాయి.నేను పని చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలో కూడా,బోధన,శిక్షణ విషయాల్లో సరైన దృష్టి,శ్రధ్ధ పెట్టలేక పోతున్నాను.మహిత తన ఆఫీసుకు సెలవు పెట్టి రాం దగ్గరే ఎక్కువగా ఉంటోది.వాడు మా ఇద్దరితో ముక్తసరిగా మాట్లాడుతున్నాడే కానీ,మనసు విప్పడం లేదు.ముగ్గురం ఎవరి స్థాయిలో వాళ్ళం విపరీతమైన మానసిక క్షోభననుభవిస్తూ ఉన్నాము.ఎక్కువగా రాంను కదిలిస్తే,అది ఈసారి ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని నేను మౌనంగా బాధపడుతున్నాను.

ఈ సంఘటన మా ఇద్దరి జీవితాల్లో ఓ పెద్ద కుదుపు.నేను మహిత అంత త్వరగా తిరిగి కోలుకోలేని పెద్ద దెబ్బ.మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో,వార్తా పత్రికల్లోనూ,యువకులు,యవతులు చిన్న,చిన్న విషయాలకు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం గురించి తెలుసుకోవడం,చదవడం పరిపాటే,కానీ అది మా ఇంట్లో జరగడం, రాం అందులో ఇన్వాల్వ్ కావడం మింగుడు పడడం లేదు.”మనమేం పాపం చేశామని ఇలా జరిగిందండి? మనవెవరికీ హాని చెసే వాళ్ళం కాదు.అలాంటిది మనకీ పరిస్థితేంటి?” మహిత నాతో అంది.”నాకూ అదే అర్ధం కావడం లేదు మహీ,ఒక వేళ మనిద్దరం మన ఉద్యోగపు బాధ్యతల్లో,కరియర్ నిర్మించుకునే తాపత్రయం వల్లా, వాడికి అత్యంత అవసరమైన లేలేత ప్రాయంలో రాంకు తగినంత సమయం కేటాయించలేదని,మన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదేమోనని నాకనిపిస్తూ ఉంది” అన్నాను.”నాతో కూడా వాడేమీ మాట్లాడడం లేదండి.ఆ విషయం కదిలిస్తే అది ఏ మలుపు తీసుకుంటోనని నాకు భయంగా ఉందండి”అంది.ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా తాండవిస్తూ ఉంది.ఆమె మళ్ళీ

“పిల్లవాణ్ణి చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉందండి.ఎవరో బాగా దిష్టి పెట్టినట్లున్నారు.లేకుంటే యూనివర్సిటీలో వీడంటే గిట్టని వాళ్ళు చాతబడిలాంటిదేమన్నా చేయించారేమో!”అంది.”లేదు మహీ,అక్కడ ఏదో జరిగింది,ఒక వేళ లవ్ ఫెయిల్యూర్ లాంటిదేమైనానా?”అనుమానం వ్యక్తపరిచాను.”సమస్య అది కాదేమోనండి.ఐనా అలాంటి విషయాలను ఎదుర్కోలేని అపరిపక్వత మనవాడిలో ఉందని నేననుకోవడం లేదు” అందామె.”ఐతే ఇప్పుడేం చేద్దాం? మహీ? అడిగాను “మీరోసారి హైద్రాబాద్ వెళ్ళి వస్తే బాగుంటుంది.మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు కదా.అతనికి యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న బంధువున్నట్లు ఇదివరలో మీరు నాతో అన్నారు.ఓ సారి వెళ్ళివస్తే అసలు విషయమేంటో తెలుస్తుంది” అంది.

నాకీ ఆలోచన సమంజసంగానే తోచింది.ముందుగా హైద్రాబాద్లో నా ప్రియ మిత్రుడు ప్రవీణ్ ను కలిశాను.ఇద్దరం కలిసి మా వాడు చదివే యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అతని బంధువైన వనమాలిగారిని కలవడానికి బయలుదేరాము.ప్రవేశ ద్వారం దగ్గర చాలా మంది పోలీసులు హడావిడిగా కనిపించారు.మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.లోపల విద్యార్ధుల ఆందోళన జరుగుతూ ఉందని,ఈ రోజు లోపలికెళ్ళడం కుదరదని చెప్పారు.ప్రవీణ్ వనమాలికి ఫోన్ చేశాడు.ఆయన వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు.మమ్మల్ని ఆయన మేము కూర్చొని మాట్లాడుకోవడానికనువుగా ఉన్న ప్రశాంతమైన చోటికి తీసుకెళ్ళారు.పరిచయ కార్యక్రమం పూర్తయ్యింది.వనమాలి గారికి నలభై ఐదు యాభైకి మధ్యలో వయసుండవచ్చు.ఆయన కళ్ళు స్నేహభావం తొణికిసలాడుతూ చాలా ప్రశాంతంగా ఉన్నాయి.చూడటానికి మేధావిలాగున్నాడు.మా సంభాషణ మొదలయింది.

“మీ అబ్బాయి శ్రీరాం గురించి నాకు కొంతవరకు తెలుసు.తనేదో,తన లోకమేదో! ఐతే ఇక్కడ ఒక సమస్య ఉంది.అతను కలిసి తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది,కాంప్లికేటెడ్ విద్యార్ధులున్నారు.వాళ్ళు క్యాంపస్ లో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఉంటారు.బ్లాక్లిస్టెడ్ కూడా”ప్రొఫెసర్ వనమాలి అన్నాడు.మళ్ళీ “ఈ మధ్యనే మెన్స్ మెస్ లో ఏదో గొడవ సృష్టించారు.నలుగురైదుగురు అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.ఆ సమయంలో అక్కడ మీ అబ్బాయి కూడా ఉన్నట్లున్నాడు.అడ్మినిస్ట్రేషన్ నలుగురైదుగురిని రస్టికేట్ చేసింది.అందులో శ్రీరాం కూడా ఒకడు”అన్నారు.”రస్టికేషన్!”అంటూ నేను నోరు తెరిచాను.రస్టికేషన్ అంటే తీవ్ర అభియోగాల కారణంగా విద్యార్ధుల్ని సస్పెండ్ చేసే చర్య. అంతలో ప్రవీణ్”అదొక్కటే సమస్య అయ్యుండదు.లోతుగా చూస్తే చాలా విషయాలు దాంతో ముడిపడి వుండవచ్చు” అన్నాడు.దానికి బదులుగా ప్రొఫెసర్ “అవును చాలా నాళ్ళుగా ఇక్కడ కుల,వర్గ,సామాజిక ఇంకా రక రకాల ఇతర విభేదాలు,గొడవలు జరుగుతున్నాయి.మరీ ముఖ్యంగా మా ఇన్స్టిట్యూట్ ను యూనివర్సిటీగా మార్చిన తర్వాత అవి ఇంకా ఎక్కువయ్యాయి” అన్నాడు.”మరి వైస్ చాన్స్లర్ ఏమీ యాక్షన్ తీసుకోలేదా?” అడిగాను.అసలు విషయమంతా ఇక్కడే ఉంది.ఈ రస్టికేషన్ ఆయన తీసుకున్న చర్యే.దానికి బదులుగా విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే,విసీనే రస్టికేట్ చేయమని” అన్నాడు.”అది జరిగే పనేనా?” అడిగాను.దానికాయన కాసేపు మౌనంగా ఉండిపోయాడు.తర్వాత “సార్ క్యాంపస్ లో వాతావరణం అంత ఆరోగ్యకరంగా లేదు.మీరు కావలసిన వాళ్ళు కాబట్టి,మీ అబ్బాయి సమస్యలో ఉన్నందున వివరాలు నాకు తెల్సినంతవరకు చెబుతున్నాను.

“ఇక్కడ చాలా రోజులుగా వర్గపోరాటం జరుగుతూ ఉంది.అసలు వివాదం విద్యార్ధుల్లోంచి పుట్టింది కాదు.వీళ్ళ వెనుక కొంతమంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది రెండు మూడు వర్గాలుగా చీలిపోయి,తమ మాట నెగ్గించుకోవడం కోసం,స్వార్ధం కోసం, వాళ్ళ గ్రూప్ కు చెందిన విద్యార్ధులను పావులుగా వాడుకుంటున్నారు”

“ఒక వర్గం వాళ్ళు అన్ని విషయాల్లో,అంటే వారి ఆహారపు అలవాట్ల దగ్గర్నుంచి,లైఫ్ స్టైల్ వరకు, పాశ్చాత్య ధోరణి కలిగి చాలా ఓపన్ గా సోషల్ గా ఉంటారు.మరొక వర్గం వీరికి భిన్నంగా,సాత్వికంగా కొంతవరకూ అంటీ ముట్టనట్లుంటారు.ఇక అటు,ఇటు కాని మూడో వర్గం తటస్థంగా ఉంటారు.ఘర్షణ,విభేదాలన్నీ మొదటి రెండు వర్గాల మధ్యనే.విద్యార్ధులు కూడా ఏదో ఒక వర్గంలో చేరిపోయి,వాళ్ళాడించినట్లు ఆడతారు.తమ భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించరు” అన్నాడు.అంతలో ప్రవీణ్ “స్టూడెంట్సంటే అట్లనే ఉంటరు కదా!”అన్నాడు.వనమాలి మళ్ళీ “ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల ఎప్పుడూ కల్చర్ క్లాష్ నడుస్తూ ఉంటుంది.అదీ కాక కరప్షన్,ఆర్ధికపరమైన అవకతవకలు కూడా,ఈ నాటకంలోని భాగాలే.ఈ అక్రమాలకు పాల్పడే వాళ్ళు,కొందరు విద్యార్ధుల్ని ఎగదోసి,విధ్వంసం సృష్టించి,తద్వారా వీసీని తొలగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు” అన్నాడు.

నాకు కొంత చిక్కుముడి వీడినట్లయ్యింది. “ఐతే ఇప్పుడేం చేద్దాం సార్? మా సమస్యకు పరిష్కారమేంటి?”వమాలిగారినడిగాను.ఆయన సెల్ తీసుకుని రెండు మూడు కాల్స్ చేశారు.ఓ పది నిమిషాల్లో ముగ్గురు విద్యార్ధులు వచ్చారు.నేనెవరో వాళ్ళకు తెలియదు.వాళ్ళతో ఆయన “ఇయల్టీలో రీసర్చ్ చెస్తున్న శ్రీరాం మీకు తెలుసా?”అడిగారు.అందులో ఇద్దరూ ఒకేసారి “అతను మాకు మంచి ఫ్రెండ్ సార్” అన్నారు. మూడో అతను అంగీకారసూచకంగా ఆయనకేసి చూశాడు.”ఐతే మొన్న మెన్స్ హాస్టల్లో జరిగిన సంఘటనలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉందా?”అడిగారు.దానికి బదులుగా ఒకతను “అసలు లేదు సార్.శ్రీరాం చాలా రిజర్వెడ్ పర్సన్.ఎవరితో ఎక్కువ మాట్లాడడు,ఏ గొడవల్లోనూ తల దూర్చడు.ఆ సమయంలో అతనక్కడున్నాడంతే.గొడవ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు.కానీ వాళ్ళకి కొందరు ప్రొఫెసర్ల మద్దతు ఉంది.అందుకే వాళ్ళెవరినీ లెక్క చేయరు”అన్నాడు.అందుకు వనమాలి గారు”ఈ విషయాలు వీసీ గారితోనూ,మరేదైనా ఎంక్వైరీలోనూ అవసరమైతే చెపుతారా?”అన్నారు.అందుకు వాళ్ళు ముగ్గురూ సానుకూలంగా స్పందించారు.ఆయన వాళ్ళను పంపించేసి నాతో “మీరు రేపు రండి సార్.ఈ లోపల నేను మరిన్ని వివరాలు సేకరించి ఏంచెయ్యాలో ఆలోచిస్తాను” అంటూ నా చెయ్యి భరోసా ఇస్తున్నట్లు నొక్కారు. “నువ్వే ఏదో ఒకటి చేసి బాబునిందులోంచి బయటపడేయాలన్నా!” ప్రవీణ్ ఆయనతో అన్నాడు.ప్రొఫెసర్ గారు ధైర్యం చెపుతున్నట్లు చిన్నగా నవ్వారు.

వనమాలిగారికి కృతజ్ఞతలు చెప్పి,నేను,ప్రవీణ్ ఎక్సిట్ గేట్ వైపు నడవటం మొదలుపెట్టాము.గోడల మీద,రోడ్లపైన,స్లోగన్లు రాసున్నాయి.’రస్టికేట్ ది వీసీ అండ్ సేవ్ ది స్టూడెంట్స్ అని కొన్ని చోట్లా,’వెన్ దేర్ ఈజ్ కాస్ట్ దేరీజ్ అవుట్కాస్ట్’ అనీ ఇంకా రకరకాలుగా ఉన్నాయవి. యూనివర్సిటీ ఆవరణమంతా పచ్చటి చెట్లతో పూల మొక్కలతో నిండి ఆశ్రమ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది.లోపల ఉంటే మనం ఉన్నది ఒక మహా నగరంలోనేనా అన్న తలంపు కూడా కలిగింది.ఇలాంటి చోట అంతర్గత వాతావరణం మాత్రం విద్వేషాలతో,వర్గ తారతమ్యాలతో,గొడవలతో నిండి పోవడం అత్యంత విషాదకరమైన వైచిత్ర్యంగా నాకు తోచింది. బయటికొచ్చింతర్వాత మహితకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాను.ఆమె నిట్టూర్చడం నాకు స్పష్టంగా వినిపించింది. నా ఆలోచనలు ఒక్కసారి నా పాతరోజులను గుర్తు చేసుకున్నాయి.

నేను చెన్నైలోని గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు,నాకెదురైన చేదు అనుభవం కళ్ళ ముందు మెదిలింది.నేను హాస్టల్లో ఉండేవాడిని.మేము మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు,వెనుకబడిన కులాల,దళిత విద్యార్ధుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.రాత్రి పూట ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే వాళ్ళు కూడా.ఈ గొడవలనదుపు చేయడానికి,కళాశాల యాజమాన్యం కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది.దానిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు సమ్మెకు దిగారు.అది రోజు రోజుకూ ఉధృతమౌతూ ఉంది.ప్రిన్సిపల్,ఈ సమ్మెకు ముఖ్య కారకులని భావించి,కొంత మంది విద్యార్ధులను కాలేజి నుంచి సస్పెండ్ చేశారు.ఐతే అనూహ్యంగా అందులో నా పేరు కూడా ఉంది.నా పేరు చూసిన మా మిత్రులు నాతోబాటు నిర్ఘాంతపోయారు.నేనీ విషయం ఇంట్లో చెప్పలేదు.నోటీస్ బోర్డ్లోకి నా పేరు యెక్కింది.కొన్నిరోజులుపోయాక ఏమయ్యిందో గానీ సస్పెన్షన్ తొలగించారు.

చాలా రోజుల తర్వాత అసలు విషయం బయటకొచ్చింది.మా బ్యాచ్ లోనే,నా పేరుతో ఉన్న మెకానికల్ బ్రాంచుకు చెందిన ఒక కేరళనుంచి వచ్చిన విద్యార్ధి ఉన్నాడు.అతని మేనమామ మా కళాశాలలోనే ఫిజిక్స్ విభాగానికి అధిపతి.ఆ విద్యార్ధి గురించి మాకు బాగా తెలుసు.వాడు చాలా కోపిష్టి,ఎప్పుడూ గొడవల్లో తలమునకలుగా ఉండే వాడు.వాడు ఇప్పుడు జరుగుతున్న గొడవల్లో ముఖ్యపాత్ర వహించాడు.వాణ్ణి రక్షించడానికి,నన్ను బలి మేకగా చేశారు.ఐతే నన్ను సస్పెండ్ చేసినందుకు కొంచెం బాధ కలిగిందే కానీ,అది నన్ను తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేయలేకపోయింది.నిజానికి మా గిండీ పాత మిత్రులం కలిసినప్పుడు,మేమందరం ఆ విషయాలను గుర్తు చేసుకుని మరీ నవ్వుకుంటాము.అనుభవం చేదుదే ఐనా అది ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది.ఐతే ఇప్పుడు శ్రీరాం స్పందన దానికి విరుధ్ధంగా ఉంది.అలాగే ఈ మధ్యనే,నా మిత్రుడొకరి కొడుకు,బెంగుళూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న వాడి మీద ర్యాగింగ్ అభియోగం మోపబడింది. అతను ఒక సంవత్సరం పాటు కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యాడు.ఆ అబ్బాయి నాకు చిన్నప్పటినుంచి పరిచయం.ఆ ఉదంతంలో నా మిత్రుడు,అతని కుటుంబం చాలా మానసిక వేదనననుభవించారు.ముఖ్యంగా నా మిత్రుని కొడుకు ఎంతో విలువైన ఒక అకడెమిక్ ఇయర్ కోల్పోయాడు.

*

ఆలోచనలు తెగి నేను వర్తమానంలోకొచ్చాను.యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు,శ్రీరాం తన ప్రాణాన్నే తీసుకునేంతగా స్పందిచడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ తరంలో చాలా మంది పిల్లలు చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు సిధ్ధపడుతున్నారు.తరాలు మారుతున్నాయి.వాటితోపాటే వివిధ రకాలైన,అవాంచనీయమైన అంతరాలు బాగా పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు,పిల్లల మధ్యన మానసిక దూరం కూడా ఎక్కువవుతున్నట్లు నాకనిపిస్తూ ఉంది.లోపం వ్యవస్థలోదో,లేక తల్లిదండ్రుల పెంపకంలోని బాధ్యతా రాహిత్యమో,మరేదైనానో,నా కర్ధం కావడం లేదు. అన్నిటికీ మించి శ్రీరాం మాతో ఈ విషయాలేమీ చెప్పకపోవడం అంతులేని నా మానసిక క్షోభకు కారణమయ్యింది.

మరుసటి రోజు నేను,ప్రవీణ్ వనమాలిగారిని కలిశాము.ఓ గంటపోయాక ఆయన నన్ను వీసీ గారి దగ్గరకు తీసుకెళ్ళాడు.నేను ఆయనకు శ్రీరాం ఎలాంటివాడో,వాడి నడవడిక,సున్నితత్వం తదితర విషయాల గురించి వివరించాను.ఆయన నేను చెప్పింది సావధానంగా విన్నారు.తర్వాత నన్ను కొన్ని ప్రశ్నలడిగారు.చివర్లో “మీకు న్యాయం జరుగుతుంది వెళ్ళండి”అన్నారు.నేను ప్రవీణ్ కు బై చెప్పి,ఒకింత ఆశావహ దృక్పధంతో మా వూరికి బయలుదేరాను.వారం రోజులు పోయాక వనమాలిగారు నాకు ఫోన్ చేశారు.శ్రీరాం మీద రస్టికేషన్ తొలగించబడిందనీ,తను రెండు మూడు రోజుల్లో తరగతులకు హాజరు కావచ్చనీ చెప్పాడు.నేనతనికి మెండుగా కృతజ్ఞతలు చెప్పి,త్వరలో శ్రీరాంను వెంటబెట్టుకు వస్తానని తెలియజేశాను.

ఈ సారి నేను,మహిత శ్రీరాంను యూనివర్సిటీలో దింపి రావడానికి కార్లో బయలుదేరాము.అంతకు రెండు రోజుల క్రితం వాడితో మనసు విప్పి మాట్లాడాము.ఇప్పుడు రాం కొంత ఓపన్ అయినట్లున్నాడు.యూనివర్సిటీలో జరిగిన విషయాల్లో తన ప్రమేయం లేదని,తనంటే అసూయ ఉన్న కొంత మంది విద్యార్ధులు తనని సమస్యల్లో నెట్టడానికి ప్రయత్నించారని, కొందరు ప్రొఫెసర్లక్కూడా తనంటే గిట్టదని, దాని పర్యవసానమే తన రస్టికేషన్ అని చెప్పాడు.ఆ విషయం ఇంట్లో చెపితే మేము అప్సెట్ అవుతామని,అందుకే మా నుంచి దాచానని అన్నాడు. మా సంభాషణ,తన ఆత్మహత్యా ప్రయత్నం గురించి మాట్లాడకుండానే ముగిసింది.అప్పటికే వాడి కళ్ళు శ్రావణ మేఘాల్లా ఉన్నాయి.మా వ్యక్తిగత సమస్య పరిష్కారమయ్యింది.కానీ వివిధ విద్యాలయాల్లోని మురికిని ఎలా ఎవరు రస్టికేట్ చేస్తారోనని ఆలోచిస్తూ ఉండిపోయాను.మా కారు యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని సమీపిస్తోంది.కార్లోని రేడియోలోనుంచి సన్నగా ‘విద్యార్ధులు నవ సమాజ నిర్మాతలురా’ పాట వినబడుతోంది.

-శివ్

   shiv photo (1)

 

 విజయవాడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్న శివప్రసాద్ ఇప్పటి వరకూ అయిదు కథలు రాశారు.  సోమేపల్లి హనుమంతరావు గారి స్మృత్యర్ధం నిర్వహించిన చిన్న కధల పోటీలో ‘సాదృశ్యం’ అనే కధకు 2013 వ సంవత్సరంలో పురస్కారం అందుకున్నారు. సంగీతంటెన్నిస్ ఆడటంప్రయాణాలు చేయడం ఆయన అభిరుచులు.