టెన్సెస్-కాలాలు

 

gudem

రోజూ గూడెంలో నేను ఎదురు పడినప్పుడల్లా రోషిణి, దీపిక, సుష్మ, ప్రమీల, జయశ్రీ, సౌజన్య నవ్వుతూ నన్ను దాటి వెళ్లిపోతుండేవారు. పదో క్లాసు కావటంతో స్కూలు సమయం దాటాక ప్రత్యేక క్లాసులు మరో రెండు గంటలు పాటు జరుగుతాయి వాళ్లకి. ఎప్పుడైనా క్లాసులు లేనప్పుడు కాస్త తొందరగా వచ్చినా గూడెం లో క్లాసుకి వచ్చేవాళ్లు కాదు. తాము పదో క్లాసు పిల్లలు కనుక తమకో ప్రత్యేక హోదా ఉందన్నట్టు, అక్కడ జరిగే క్లాసుతో తమకు సంబంధం లేదన్నట్టు మసలేవారు. ఒకరోజు ఇంగ్లీషు గ్రామరు హోమ్ వర్క్ ఇచ్చారని, అది చెయ్యాలంటే తమకు అర్థం కావట్లేదని చెప్పించుకుందుకు వచ్చారు.

అది మొదలు వాళ్లకి సమయమున్నప్పుడల్లా రమ్మని చెప్పేను. ముందర్లో మాత్రం ‘ మాకు పనులుంటాయి టీచర్, అవి అయ్యాక హోం వర్క్ చేసుకోవాలి, రావటం కుదరదు’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసేరు.

‘ మీ పనులయ్యాకే రండి, ఈ లోపు మిగిలిన వాళ్ల చదువులు అవుతాయి’ అంటూ రోజూ వాళ్ల వెంట పడటంతో ఇంట్లో వాళ్ల ఒత్తిడి కూడా వాళ్ల మీద పడింది.

రావటం మొదలెట్టేక కూడా కొన్నాళ్ళు కాస్త అసహనంగా కనిపించేవారు, ‘మాకు స్కూల్లో ఇలా చెప్పలేదు టీచర్. మీరు చెప్పేది వేరుగా ఉంది’ అంటూ.

సిలబస్ పూర్తైపోయి వరసగా పరీక్షలు పెడుతుండటంతో అప్పటికి వాళ్లలో ఒక సీరియస్ నెస్ కనిపించింది. తమకు తెలియకుండానే అల్లరి మాని బుధ్ధిగా పాఠాన్ని వినటం మొదలెట్టారు.

చాలావరకు ఆ పిల్లలందరి తల్లిదండ్రులూ వ్యవసాయ పనుల్లోకి వెళ్లే వాళ్లే. కొద్ది మంది మాత్రం అక్కడ పచ్చళ్ల కంపెనీలో షిఫ్టుల్లో పని చేస్తారు.

ప్రమీల తల్లి రోజీ మాత్రం ఒక ఆసుపత్రిలో పనిచేస్తుంది. అక్కడున్న అందరిలోకీ  ఖరీదైన బట్టలు కట్టుకుని, శుభ్రంగా తయారై సాయంకాలం డ్యూటీకి భర్త బండి మీద వెళ్తుంది. దారిలో క్లాసు దగ్గర ఆగి, ‘టీచరుగారూ, మా ప్రమీలని డాక్టర్ ని చెయ్యాల. బాగా చదివించండి.’ అనేది నవ్వుతూ. ఆమె అలా క్షణం పాటు ఆగినప్పుడు, ప్రమీల లేచి తల్లి దగ్గరకి వెళ్లి,

‘అమ్మా, అన్నం వండావా?’ అని అడగటం, ‘ ఈ అన్నం గోలేంటే నీకు? మద్యాన్నం తిన్నదంతా ఏమైపోయింది? మీ అన్నయ్యో, నాన్నో బిర్యానీ ప్యాకెట్టట్టుకొస్తారులే వొచ్చేప్పుడు’ అంటూ వెళ్లిపోయేది. తల్లి మాటలకి విసుగ్గా వచ్చి కూర్చునేది ప్రమీల.

‘ఆళ్ల తిరుగుళ్లన్నీ అయ్యి ఎప్పటికి పట్టుకొస్తారో, ఆపాటికి నేను ఆకలితో చచ్చిపోతాను’ అంటూ గొణుక్కునేది. ఎంత చిన్నాగా అనుకున్నా స్పష్టంగానే వినిపించేవా మాటలు. దాదాపు రోజూ ఇలాటి సంభాషణేదో జరుగుతూనే ఉండేది ప్రమీలకీ ఆమె తల్లికీ.

మిగిలిన వాళ్లకంటే తామొక మెట్టు ఆర్థికంగా పైనున్నామని అందరికీ తెలిసేలా రోజీ ప్రవర్తిస్తుండేది. పెద్ద కలర్ టి.వి. కొన్నప్పుడు నన్ను ప్రత్యేకం ఇంట్లోకి పిలిచి, ‘ బావుందా టీచర్ గారూ, ఇంకా పెద్దది కొనమంటే మా ఆయన వద్దన్నాడు. సర్లే , వచ్చే ఏడు మార్చచ్చు అని ఊరుకున్నాను.’ అంది. ఆ గది ని పరిశీలనగా చూసాను, ఒక ప్రక్క డబుల్ కాట్ మంచం, ఒక ప్రక్క ఎయిర్ కూలరు అన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి.

వంటింట్లోకి తీసుకెళ్లి క్రొత్త గ్యాసుపొయ్యి, మిక్సర్ చూబించింది. క్రొత్త స్టీలు సామాన్లు తళతళ లాడుతూ అక్కడున్న గూళ్లల్లో సర్ది ఉన్నాయి. కానీ వంట గదిలో సాధారణంగా కనిపించే సరుకులు కానీ, వాటిని దాచిపెట్టే డబ్బాల్లాటివి ఏవీ కనిపించలేదు.

నా ఆలోచన చదివినట్టే చెప్పింది, ‘సరుకులు నిలవ పెట్టుకోవటం అలవాటులేదు టీచరుగారూ, ఎప్పటియప్పుడే తాజాగా తెచ్చుకుంటాం. అదీకాక పొయ్యి దగ్గర పనంటే నాకు విసుగు. ఎక్కువగా బయటనుంచే తెప్పించేస్తా టిఫిన్లు, బిర్యానీలు ’ అంది.

అందరిలోకీ ప్రమీల చురుకైనది, అందులోనూ గత మూడేళ్లుగా ఇంగ్లీషు మీడియంలో చదువుతోంది. మిగిలిన వాళ్లకంటే ముందుగా అర్థం చేసుకునేది, కానీ రోజూ ఓ పావుగంట పాఠం అయ్యాక,

‘ నాకు ఆకలేస్తోంది టీచర్, ఏమీ ఎక్కట్లేదు’ అంటూ మొదలెట్టేది. అదో అలవాటైన ధోరణిగా తయారైంది. మిగిలిన వాళ్లు అదేదో నవ్వులాటలా తీసుకుని పాఠం వినటం మాని అల్లరి మొదలెట్టేవారు.

ఒకరోజు రోజీ హడావుడిగా వచ్చి, ‘ టీచరుగారూ, ఈ రోజొక్కరోజుకీ పిల్లని పంపండి, మా ఆయన కొత్తగా కట్టిన సిటీమాల్ లో సినిమాకి తీసుకెళతాడంట.’ అంది.

సమాధానం చెప్పేలోపునే, ‘ నేను కూడా ఆస్పత్రికి రానని ఫోన్ చేసి చెప్పేసేనులే టీచర్. మా ఆయనకి అసలు టైమే దొరకదు, వాళ్ల సార్ గారు ఈ పూట ఊరెళ్ళేరంట. ఖాళీ దొరికిందని మాల్ కి తీసుకెళ్లి, సినిమా చూబిస్తానన్నాడు, టైమైపోతోంది, పంపండి’ అంటూ ఉన్నపళాన పిల్లని తీసుకెళ్లిపోయింది.‘ సిటీ మాల్’ మా ఊళ్లో క్రొత్తగా కట్టిన మాల్.

పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. వీళ్లలో సీరియస్ నెస్ జాగ్రత్తగా కాపాడాలి అనుకుంటూ  రోజూ ఇంటికి కూడా కొంత పని ఇవ్వటం మొదలెట్టాను. సరిగ్గా చేసుకొచ్చినా లేకపోయినా వాళ్ల ప్రయత్నానికి చిన్నగా ప్రశంసలు, ఓ క్రొత్త పెన్నో, నోటు పుస్తకమో బహుమతిగా ఇవ్వటం లాటి వాటితో వాళ్లని చదువు దారిలోకి మరింతగా మళ్లించేందుకు నా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

ఆరోజు టెన్సెస్ గురించి చెబుతున్నాను. ఒకటి, రెండు ఉదాహరణలు ఇచ్చాక అర్థమైనట్టే కనిపించారు. వాళ్ల దైనందిన జీవితంలో కబుర్లని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉదాహరణలుగా చెప్పమని ప్రోత్సహించాను.

సౌజన్య ప్రయత్నం చేసింది, కానీ వాక్య రూపంలో ఎలా చెప్పాలో తెలియక తడబడుతూ, ‘ నేను తెలుగు మీడియం టీచర్’ అంది.

‘ అయితే ఏం, కొంచెం ఆలోచించి చెప్పు. నీకు అర్థమైనది ఏమిటో నువ్వు చెప్పగలగాలి. ఇంకో నాలుగు నెలల్లో కాలేజీ చదువుకొస్తావు.’

సౌజన్య మౌనంగా నిలబడింది. తప్పు చెబుతామేమో అన్నసంశయం మిగిలిన పిల్లల్ని కూడా మౌనంగా కూర్చోబెట్టింది.

ప్రమీల లేచింది, ‘టీచర్, నేను చెబుతాను.’

‘ఐ వజ్ హంగ్రీ, అయామ్ హంగ్రీ, ఐ విల్ బి హంగ్రీ ‘……………….

మిగిలిన పిల్లలు ఆమె మాటలకి నవ్వారు. ప్రమీల చెప్పేది నవ్వులాటకి కాదని నాకు తెలుసు. ఎదుగుతున్న ఈ పిల్లలు సరైన పోషణ లేక ఎంత అవస్థ పడుతున్నారు!

‘ ప్రమీలా, ఇంత కంటే మంచి ఉదాహరణ దొరకలేదా? అసలైనా నువ్వు ఒక్కదానివి రోజూ ఆకలని గోల పెడతావు, నీ స్నేహితులెవరూ ఒక్కసారి కూడా నీలా గొడవ చెయ్యరు. క్లాసుకొచ్చేముందు ఏదైనా తిని రావచ్చు కదా’.

‘ వాళ్లకీ ఆకలేస్తుంది టీచర్, వాళ్ళు చెప్పరు. అయినా ఇంట్లో ఏదైనా ఉంటే కదా  తిని రావటానికి’ ప్రమీల ముఖాన్నిపుస్తకంలో దాచుకుంది.

ఉలిక్కి పడ్డాను. మిగిలిన పిల్లల కంటే ఒక మెట్టు ఆర్థికంగా పైనుందని అనుకుంటున్న ప్రమీల ఇలా చెబుతోంది. అప్రయత్నంగా అందంగా పొందిగ్గా సర్దిన రోజీ వంటిల్లు కళ్లముందు కదిలింది. ఇంటి విషయంలో అంత శ్రధ్ధగా ఉన్నరోజీ కూతురు పడే ఆకలి బాథని అర్థం చేసుకోలేదెందుకో?! ఆ విషయానికి అంతగా ప్రాముఖ్యం లేదామె దృష్టిలో?! సిటీ మాల్ లో సినిమాకి, భోజనానికి ఖర్చు పెట్టగలదు రోజీ.

అంతోఇంతో జరుగుబాటు ఉన్న కుటుంబాలు ఎలాటి జీవితాల వైపు మొగ్గు చూపుతున్నాయో, వాళ్ల ప్రాధాన్యతలు ఏమిటో చూస్తే ఆశ్చర్యం వేసింది.

ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నవారైనా కూడా  తమకేం కావాలో కాక, చుట్టూ సమాజంలో తమ స్థాయిని చూబించుకునేందుకే ఎక్కువగా ఆరాట పడుతు న్నారనిపించింది. సాయంత్రాలు ఇలా ఆకలితో గడపాల్సిన పరిస్థితి ప్రమీలకు ఖచ్చితంగా లేదు. ఆ కుటుంబ స్థాయికి అది సమస్య కానే కాదు. రోజీతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను.

*

 

 

 

 దేవుడు మాస్టారు-మౌనం

gudem

 

క్లాసులు బాగానే జరుగుతున్నాయి. ఎవరమూ ఊహించని సంఖ్యలో పిల్లలు రావడం మొదలు పెట్టేరు. వాళ్ల ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పిల్లల్ని మరికొంతమందిని కూడా తీసుకురావడం మొదలు పెట్టేరు. నా ఆత్మ విశ్వాసం ఆకాశం ఎత్తుకు పెరిగిపోయింది.

రోజూ వెళ్లేప్పుడో, వచ్చేప్పుడో దేవుడు మాస్టారు కనిపిస్తూనే ఉన్నారు. నేను నమస్కారం పెట్టంగానే ఆయనా బదులుగా నవ్వుతూ తల ఊపి తన నడక సాగిస్తుంటారు.

సాయంకాలాలు నేను వెళ్లే సరికి గూడెంలో పిల్లలు పనులలోనో, అవి లేనివాళ్లు ఆటలలోనో మునిగి ఉంటారు.  కొన్ని రోజులు ఒక ఆట మరికొన్ని రోజులు మరో క్రొత్త ఆట నడుస్తూ ఉంటుంది అక్కడ.

ఆడే పిల్లల్లో మూడేళ్ల పిల్లల నుండి ఇరవై ఏళ్ల వయసు పిల్లల వరకు ఉంటారు. పెద్ద పిల్లలు చాలామంది చదువులు మానేసిన వాళ్లే, పగలంతా ఏవో పనుల్లోకి వెళ్లి వస్తారు. నన్ను చూస్తూనే మొహమాటంగా నవ్వి, ‘ ఒరేయ్, టీచరుగారొచ్చారు, క్లాసుకెళ్లండి.’ అంటూ వాళ్లకంటే చిన్నపిల్లల మీద పెత్తనం చేస్తుంటారు. క్లాసుకొచ్చే పిల్లలు సాధారణంగా ఆ ఆటల్లో కనిపించరు.

కానీ ఒక ముగ్గురు, నలుగురు మాత్రం మట్టికొట్టుకున్న బట్టలతో, రేగిన జుట్టుతో, అలసిన ముఖాలతో ప్రక్కన అరుగుల మీద పడేసిన పుస్తకాల సంచీలతో నన్ను చూస్తూనే ఆటలు వదిలి క్లాసులోకి వచ్చేస్తారు. ఇంటికెళ్లి స్నానం చేసి రండని చెప్పినా ‘ఇల్లు తాళం వేసి ఉంది టీచర్, మా అమ్మ పనిలోంచి రాలేదు ఇంకా’ అంటూ రోజూలాగే చెబుతారు. ప్రతిరోజూ శుభ్రత గురించి, ఆరోగ్యం గురించి క్లాసు మొదట్లో చెప్పటం ఆనవాయితీగా మారింది. ఫలితం కొంతవరకు కనిపిస్తున్నా ఇంకా మార్పు రావాల్సి ఉంది.

ఆరోజు నల్లబాలు ( అసలు పేర్లు కాకుండా వాళ్లు పెట్టుకునే ఫ్యాన్సీ ఫేర్లు) నేను క్లాసుకి వెళ్లేసరికి సీరియస్ గా కర్ర,బిళ్ల ఆటలో మునిగి ఉన్నాడు. క్లాసు మొదలైందన్నసంగతి గమనించికూడా వాడు ఆట కొనసాగించటం చూసి, పిలిచాను.

వాడు నిస్సంకోచంగా చెప్పేసాడు, ‘ ఇప్పుడే ఆట మాని రాలేను టీచర్, లేటవుతుంది’ అని.

వాడికి తొమ్మిదేళ్లుంటాయి. నాలుగో క్లాసు చదువుతున్నాడు. వాడి ధోరణి ఆరోజు కొంచెం వింతగానే ఉంది.

‘ఏం, ఎందుకు మానలేవు?’

‘ఐదు రూపాయలు బెట్ కట్టాను టీచర్, ఆట గెలిచి, అవి గెలుచుకుంటే కానీ రాలేను.’ వాడి మాటలకి ఉలికి పడ్డాను.

‘బెట్ ఏమిటి, నీకు డబ్బులు ఎక్కడివి అసలు?’

‘నా దగ్గర మూడు రూపాయలున్నాయి టీచర్, మా మామ్మ నిన్న కొనుక్కోమని ఇచ్చిన డబ్బుల్లో మిగిలేయి. ఒక రెండు రూపాయలు అప్పు తీసుకున్నాను’

వాడి మాటలకి నాకు నోట మాట రాలేదు. బెట్ కట్టటం, అప్పు తీసుకోవటం………….ఏమిటిదంతా? మిగిలిన పిల్లలు క్లాసులోంచి బయటకొచ్చి విషయాన్ని గమనిస్తున్నారు. వాళ్లని తీసుకుని లోపలికి నడిచాను.

ఒక్కసారి పిల్లల తల్లిదండ్రుల్నికూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నాను. శనివారం సాయంత్రం పెద్దవాళ్లకి మీటింగ్ ఉందని కబురు పంపేను.

సాయంత్రం ఆరింటికి మీటింగంటే అయిదారు మంది మాత్రమే ఆ సమయానికి రాగలిగేరు. చీకటి పడుతోంది. పనులుకి వెళ్లిన ఆడవాళ్లు చాలామంది షేర్ ఆటోల్లోంచి, మినీ వ్యానుల్లోంచి దిగుతున్నారు. వాళ్లల్లో కొందరు ఇంటి దగ్గర చంటిపిల్లలో, వృద్దులో ఉన్నారంటూ ,‘మీటింగ్ కి మా మగోళ్లొస్తారు’ అంటూ చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్లలో కొందరు మీటింగ్ ఏమిటో వినాలన్న కుతూహలంతో అక్కడే కూర్చుండిపోయారు. వాళ్ల ముఖాలు అలసటతో, ఆకలితో చిన్నబోయి ఉన్నాయి.

దేవుడు మాస్టారు మాట్లాడుతున్నారు.

‘ టీచరమ్మ మన పిల్లల కోసం వస్తోంది. మీరందరూ పిల్లల్ని ఇళ్లల్లో ఎట్టానూ చదివించుకోలేరు. సాయంకాలం స్కూలు నుంచి వచ్చిన వాళ్ళని రోడ్డుమీదకి వదిలేయకుండా ఇక్కడికి పంపండి. మీ పిల్లలు చదువుకోవాలంటే ఈ మాత్రం మీరు చెయ్యాలి. రోజూ క్లాసుకి వస్తున్నారో లేదో గమనించుకోవాలి. రోజూ వచ్చి కూర్చుంటే నాలుగు ముక్కలు నేర్చుకుంటారు. టీచరమ్మ మీతో మాట్లాడాలంది, ఆమె గారు చెప్పేది వినండి………’

ఆయన మాటలు పూర్తికాలేదు…………..ఇంతలో లోపల ఆ ఇరుకైన వీధుల్లోంచి గట్టిగట్టిగా అరుపులు, కేకలు, వాటివెంటే జనం పరుగెడుతున్న అలికిడి. వాళ్లు మాముందుకు రానే వచ్చేరు. ఒకరిద్దరి చేతుల్లో విరిగిన ప్లాస్టిక్ బకెట్లు, సింటెక్స్ డ్రమ్ములు, చిన్నపాటి కర్రలూ ఉన్నాయి. ముందు పరుగెడుతున్న వాళ్లు వినడానికి అభ్యంతరకరంగా ఉన్న భాషలో గట్టిగా అరుస్తూ పరుగెడుతున్నారు. వెనక ఉన్న వాళ్లు చేతిలో వస్తువుల్ని అదను చూసి ముందు వెళ్తున్నవాళ్ల  మీద విసిరే ప్రయత్నం చేస్తున్నారు.

క్లాసులో కూర్చున్న పెద్దపిల్లలు ఇద్దరుముగ్గురు లేచి వెళ్లబోతూంటే …….

‘ మీరు ఎక్కడికి’ అన్న నా ప్రశ్నకి

‘నిన్న రాత్రి మా మామయ్య క్రికెట్ గురించి బెట్ కట్టేడు, దాని గురించి మధ్యాహ్నం నుంచీ ఏదో తగువు జరుగుతోంది, చూసొస్తాను టీచర్ ’ జవాబు చెబుతూనే వెళ్లిపోయేడు రమేష్, వాడి వెనుకే వాడి నేస్తాలు. వాళ్ల వెనుకే మరి కొంతమంది లేచి వెళ్లిపోతుంటే చూస్తూ నిలబడిపోయాను.

ఆ గుంపంతా దూరంగా వెళ్లిపోయాక వాళ్ల వెనుకే వచ్చిన కొందరు మీటింగ్ దగ్గర నిలబడిపోయారు. మేష్టారు వాళ్లను ఏదో అడుగుతూంటే జవాబు చెబుతున్నారు.

నేనైతే ఏదో సినిమాలో దృశ్యాన్ని చూస్తున్నట్లుండిపోయాను.

కూర్చున్న ఆడవాళ్లల్లోంచి ఒకావిడ లేచి , ‘ఇదిగో చూడమ్మా టీచరమ్మా, మా పిల్లలు పెద్దయ్యాక మాకు సంపాదించి పెట్టక్కర్లేదు, కాని ఇలా రోడ్లమీద పడి కొట్టుకోకుండా కాస్త బుద్ధులు నేర్పు’ అంటూ ఇంటిదారి పట్టింది. మిగిలిన ఆడవాళ్లు ఆవిడని అనుసరించారు.

మాష్టారు విచారంగా కనిపించారు. మరింక సంభాషణ పొడిగించకుండా మౌనంగా కూర్చుండిపోయారు.

*

  మహేష్ బాబు

 

 

ఆరోజు సాయంకాలం క్లాసుకి వెళ్ళేసరికి రోజూ కంటే క్లాసు ఎక్కువ సందడిగా ఉంది. నాకు అర్థం అయింది, క్లాసులోకి మరో క్రొత్త విద్యార్థి వచ్చిచేరినట్టు. అది మామూలే. ఎవరైనా క్రొత్తగా క్లాసుకి రావటం మొదలుపెడితే అప్పటికే క్లాసుకి వస్తున్న వాళ్లు క్రొత్త వాళ్లని తమలోకి ఆహ్వానిస్తూ, వాళ్లని అనేక ప్రశ్నలతో ఊదరగొట్టేస్తారు. తమ సీనియారిటీని వాళ్లకి అర్థం అయ్యేలా చేసే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా మన ప్రొఫెషనల్ కాలేజీల్లో ‘ర్యాగింగ్’ హడావుడి లాటిదే. కాకపోతే అది ప్రమాదకరమూ, ఇబ్బందికరమూ కాకుండా అమాయకమైన అల్లరే ఎక్కువ కనిపిస్తుంది వాళ్ల వయసుకు తగినట్టుగా.

అటెండెన్స్ తీసుకుంటూ, క్రొత్త కుర్రాడిని ‘ నీ పేరేమిటి?’ అని అడిగాను. ఆ పిల్లవాడు చెప్పేలోపు మిగిలిన వాళ్లు ఒక గుంపుగా కలిసి చెప్పేసారు,’ మహేష్ బాబు టీచర్’ అంటూ. ఆ పిల్లవాడు నవ్వుతూ నిలబడ్డాడు. నాకూ నవ్వొచ్చింది.

తెలుగు సినిమా హీరోల పేర్లు చాలానే వినిపిస్తున్నాయి ఈ పిల్లల్లో. కొందరైతే ఒక్కోసారి , ‘టీచర్ , నేను పేరు మార్చుకున్నాను’ అంటూ ఒక హీరో పేరు చెబుతుంటారు.

‘ అలా ఎప్పుడుపడితే అప్పుడు మార్చుకోకూడాదు. స్కూల్లో ఒక పేరు ఉంది కదా’ అంటే ‘అయితే ఇంటి దగ్గర, ట్యూషన్ లోనూ ఈ పేరు పెట్టుకుంటాను టీచర్ ‘ అంటుంటారు.

ఆ పిల్లవాడికి ఒక పదమూడేళ్లు ఉంటాయేమో! ‘ ఏం చదువుతున్నావ్?’ నాప్రశ్నకి,

‘ ఐదు’ అన్నాడు వాడు. వాడి ముఖకవళికలు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి. కళ్లు విశాలంగా ఉండి, ఆ ముఖానికి నోరు, ముక్కు, చెవులూ కూడా పెద్దగానే ఉన్నట్టున్నాయి. మహేష్ బాబుకి  రెండుచేతులకీ ఆరు, ఆరు వేళ్లు ఉన్నాయని అప్పటికే అందరూ నాకు చెప్పేసారు.

వాడు స్కూల్లో ఈ మధ్యే కొత్తగా చేరిన పిల్లాడని గుర్తుపట్టాను. స్కూల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆటల పోటీల్లో అన్నింటిలోనూ వాడే ముందున్నాడు. స్టాఫ్ రూమ్ లో వాడి గురించిన చర్చ జరిగింది కూడాను నిన్న లంచ్ సమయంలో. ఈ సంవత్సరం జిల్లాలో జరిగే అన్ని ఆటల్లోనూ స్కూల్ తరఫున వాడు బోలెడు బహుమతులు గెలవటం ఖాయమని అందరూ అన్నారు.

ఒకరిద్దరు టీచర్లు చెబుతున్నారు వాడు నిరంతరం నవ్వుతూనే ఉంటాడని. వాడిదొక ప్రత్యేక లోకం అన్నట్టు , అందులో ఏదో ఒక ఆనందం అనుభవిస్తున్నవాడిలా నవ్వు కుంటూనే ఉంటాడనీ. ఎక్కడో మారుమూల పల్లె నుంచి వచ్చాడని తెలిసింది.

‘తెలుగు అక్షరాలు చదువుతావా?’ అని అడిగితే ‘చదువుతాను ‘ అన్నాడు.

‘ ఇంగ్లీషు అక్షరాలు చదువుతావా” అంటే ‘చదువుతాను’ అన్నాడు. వాడు జవాబు చెబుతున్నప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. వాడి నవ్వులో అమాయకత్వం చూస్తున్నాను. వాడి నవ్వు చూసి పిల్లలందరూ నవ్వటం మొదలు పెట్టారు.

అక్కడికొచ్చే పిల్లల్లో చాలామంది తెలుగు అక్షరాలు గుర్తు పట్టలేరు. వాళ్లు చదువు తున్నది  ఎనిమిదో తరగతి అయినా, తొమ్మిదో తరగతి అయినా ఇదే పరిస్థితి. ఇంగ్లీషు అంటే చాలా భయం అని ముందే చెప్పేస్తారు. రోజూ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అని చెప్పి అచ్చుపుస్తకంలోంచి నోట్ పుస్తకంలోకి ఒకటి, రెండు పేజీలు రాస్తుంటారు. రాసేది చదవ మంటే చదవలేమని స్పష్టంగా చెప్పేస్తారు.

అందుకే ముందు వాళ్లకి అక్షరాలు, గుణింతాలు నేర్పే పని పెట్టుకున్నాను. వాళ్లని తప్పులు లేకుండా తెలుగు, ఇంగ్లీషు చదివేలా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

రోజూ క్లాసు మొదలు పెడుతూనే కొన్ని తెలుగు మాటలు, ఇంగ్లీషు మాటలు డిక్టేషను ఇచ్చి రాయించే అలవాటు చేసేను. ఆ తర్వాతే క్రొత్త పాఠం, ఎక్కాలు, కొన్ని బేసిక్ లెక్కలు చెప్పి చేయిస్తుంటాను.

‘ డిక్టేషన్ రాద్దురుగాని, పుస్తకాలు తియ్యండి ‘అన్నాను.

‘ మహేష్ బాబూ, నువ్వు కూడా డిక్టేషన్ రాయాలి. పుస్తకం తియ్యి’ అంటూ మిగిలిన పిల్లలు వాడిని తొందర చేసేరు.

అందరూ పుస్తకాలు తీసేరు.

గుమ్మం బయట ఎవరో నిలబడినట్టు కనిపించి బయటకొచ్చి ‘ ఎవరంటూ’ వివరం అడిగాను. ఆమె ని చూస్తుంటేనే అర్థమైంది మహేష్ బాబు తల్లి అయిఉంటుందని.

ఆమె చెబుతోంది, ‘క్రొత్తగా గూడెం లోకి వచ్చామనీ, మహేష్ బాబు చదువులో వెనక పడ్డాడనీ, ఆ పిల్లవాడిని కాస్త శ్రధ్ధ తీసుకుని చదివించమని’ చెప్పింది. ‘ అమ్మా, తండ్రి లేని పిల్లడమ్మా. ఆయన లారీ ప్రమాదంలో చనిపోయిన తర్వాత చాలా బెంగ పెట్టుకున్నాడు. అయితే హుషారుగానే ఉంటాడు. ఏదీ బుర్రకి ఎక్కనట్టు ఉంటాడు. బెంగ చెప్పుకోలేక ఇలా తయారయాడని అనిపిస్తాంది. అందుకే ఆ ఊరొదిలి ఇక్కడికి తీసుకుని వచ్చేసాను’. ఆమె దీనగాథ మనసుని చెమర్చింది.

నేను ‘ సరే’ అనటంతో, ‘నమస్కారం అమ్మా’ అంటూ వెనక్కి తిరిగింది.

క్లాసులోకి వచ్చి డిక్టేషన్ ఇవ్వటం మొదలు పెట్టేను. ముందు కొన్ని తేలిక మాటలు చెప్పి , ఆఖరున నాలుగైదు కొంచెం కష్టమైన పదాలు ఇస్తుంటాను. క్లాసు మొత్తం తిరుగుతూ చూస్తున్నాను. అందరూ రాస్తున్నట్టే కనిపించారు. కాని ఎంతవరకూ తప్పుల్లేకుండా రాస్తారనేది చెప్పటం కష్టమే. ఇదివరకటి కంటే కాస్త మెరుగైన ఫలితం కనిపిస్తోంది కాని అది కొద్ది మందిలో మాత్రమే చూస్తున్నాను. ఇంకా చాలా కష్టపడాలి పిల్లలు, నేను కూడా.

ఇంకా ఒకటి, రెండు పదాలు చెబితే పూర్తవుతుంది. మహేష్ బాబు వైపు చూస్తున్నాను. వాడు ఏమీ రాస్తున్నట్టు లేదు. వాడి పక్కనున్న పిల్లలు ‘ఏదీ రాస్తున్నావా? చూబించు’ అంటూ వాడి మీద పెత్తనం చేస్తూ, వాడి పుస్తకంలోకి చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాడు మాత్రం అదే నవ్వు ముఖంతో ఉన్నాడు, కాని తన పుస్తకాన్ని వాళ్లెవరికీ అందనియ్యటం లేదు.

నాకు అనుమానం వచ్చింది వాడు రాస్తున్నాడా లేదా అని. ఏదో చెప్పటం అయితే చెప్పేసాడు, చదవటం వచ్చనీ, రాయటం వచ్చనీ. డిక్టేషను పూర్తి చేస్తూనే,

‘ మహేష్ బాబూ, నువ్వు రాసేవా? ఇలా పట్రా నీ పుస్తకం’ అన్నాను

వాడు నవ్వుతూ లేచి నిలబడి ‘ లేదు టీచర్. నాకు రాయటం రాదుగా ‘ అన్నాడు.

నాకు కాస్త అసహనం కలిగిన మాట నిజమే కాని అతని గురించి తల్లి చెప్పిన వివరం మనసులో మెదులుతోంది. అడిగితే చదవటం వచ్చని చక్కగా చెప్పాడు, ఇప్పుడేమో రాయటం రాదని చెబుతున్నాడు.

ఒక్క అక్షరం రాయలేదు. అతని పక్కన కూర్చున్న కిషోర్ చెబుతున్నాడు, ‘ నేను చూసేను టీచర్, వాడు ఏం రాయలేదు’ కిషోర్ని ఆగమని చెప్పాను.

నిరీష పెద్దగా చెప్పింది, ‘చూడండి టీచర్ , ఏమీ రాయకపోయినా ఎలా నవ్వుతున్నాడో ‘

మహేష్ బాబు నిరీష కేసి చూస్తున్నాడు. ఏమీ రాయకపోతే నవ్వకూడదా? అన్నట్టు న్నాయి వాడి చూపులు.

నిరీష మాటలకి, అప్పుడనిపించింది నా అసహనం న్యాయమైనది కాదని. వాడి అమాయకమైన ముఖం చూస్తే నాకే ఎందుకో తప్పు చేసినట్టనిపించింది. వాడు రాయలేకపోవటానికి, వాడి నవ్వుకీ సంబంధం ఏమిటి?

ప్రపంచంలోని ఏ సమస్యా అంటనట్టు వాడుంటే నిరీషకి కానీ, నాకు కానీ సమస్య ఏమిటి? ఆ నవ్వు వాడి చుట్టూ ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తోంది. అశాంతి, అరాచ కాల మధ్య జీవిస్తున్నఈ ప్రపంచానికి ఒక సానుకూల వైఖరిని నేర్పిస్తున్నట్టున్న వాడికి కృతజ్ఞత చెప్పద్దూ?

వాడిలో ఘనీభవించిన దుఃఖం నుండి వాడిని ముందు బయట పడెయ్యాలి. ఆ నవ్వు

పూసే వెలుగు దారులతోనే ప్రపంచాన్ని గెలిచేందుకు వాడిని సిధ్ధం చెయ్యాలి అనుకున్నాను.

 

***************

 

 

 

 

బ్యూటీషియన్

 

ఆరోజు క్లాసులో అశోక్ అల్లరి శ్రుతిమించడంతో వాడిని గట్టిగా మందలించేను. ప్రక్క బెంచీలో కూర్చున్న మాలతి తన పుస్తకాలు పదేపదే తీసి దాస్తున్నాడని ఫిర్యాదు చేసింది. చదువులో చురుగ్గా ఉంటాడని వాడి అల్లరిని ఇష్టంగానే భరిస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి అది హద్దులు దాటుతోందనిపిస్తోంది.

‘ చదువుకుందుకు స్కూలుకి రండి, ఇలాటి పిచ్చిపనులు కోసం అయితే స్కూలుకి రావడం అనవసరం. ఇంట్లో అమ్మానాన్నలు మంచి చెడు ఏమీ చెప్పరా మీకు’ కోపంగా అన్నాను. ఏమనుకున్నాడో వాడు తలవంచుకుని నిలబడ్డాడు కాని మాట్లాడలేదు. తెలివైన వాడు, వాడిని సరైన దారిలోకి మళ్లించాలి.

స్టాఫ్ రూమ్లో అశోక్ ప్రస్తావన తెస్తే, వాడి గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది అని చెప్పేరు. వాడికి ఇంట్లో చెప్పేవాళ్లు ఎవరూ లేరు, వాడు చేసే అల్లరికి హద్దూ లేదు. వాడిని ఎవ్వరూ బాగు చెయ్యలేరని, ఏడాదిగా వాడు ఆ స్కూల్లో జేరిందగ్గర నుంచి వాడి ఇంటినుండి ఇప్పటి వరకూ ఎవ్వరూ వచ్చి వాడి మంచిచెడ్డలు అడగలేదని అందరూ ఏకగ్రీవంగా చెప్పేసేరు. వాడంతట వాడే ఎలాగూ స్కూలు మానేసేరోజు ఒకటి వస్తుందని తేల్చేసేరు. వాడి ఇంటికి వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడాలని అనుకున్నాను .

సాయంకాలం గూడెంలో క్లాసు ముగించి వస్తుంటే మేరీ ఎదురైంది. పలకరింపుగా నవ్వాను. ఆమెను అప్పుడప్పుడు అక్కడ చూస్తూనే ఉంటాను. నాతో ఏదో మాట్లాడాలన్నట్టు గబగబా నాదగ్గరకి వచ్చింది.

‘ టీచరుగారూ, కొన్ని ప్రత్యేక కులాలలోని ఆడవాళ్లకి ప్రభుత్వం బ్యూటీషియన్ కోర్సు ఉచితంగా నేర్పిస్తోంది. పదోక్లాసు ప్యాసైనా, ఫెయిలైనా అర్హత ఉంది. బస్సుపాస్ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఒక్క ఆరువారాలు కోర్సు నేర్పి ఒక ఉద్యోగం కూడా చూబెడుతుంది. ఒక్కో గ్రామం నుంచీ ముగ్గురుకి అవకాశం ఇస్తున్నారు. ప్రొద్దున్నుంచీ గూడెంలో తిరుగుతున్నాను. ఒక్కరు కూడా నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఇక ఈ రోజుకి వెళ్లిపోతున్నాను. రేపు మళ్లీ రావాలి. ఈ గూడెంలో అలాటి వారెవరైనా మీకు తెలుసా టీచరుగారూ?’ అంది అలసటతో ముఖం అద్దుకుంటూ.

గూడెంలో ముగ్గురు నలుగురు అమ్మాయిలు పదోక్లాసు వరకు చదివి మానేసిన వాళ్లున్నారు. వాళ్ల పేర్లు చెప్పాను.

మేరీ నిస్పృహగా చూసింది, ‘వాళ్లని కలిసేను టీచరుగారూ, ‘మావోళ్లు పెళ్ళి చేస్తారు’ అంటూ సిగ్గుపడి పోయారు ఆ పిల్లలు, తాము ఏమీ నేర్చుకోవలసిన అవసరం లేదని చెప్పేసేరు. పెళ్ళిళ్లైనా, ఎక్కడున్నా చేతిలో పని ఉంటుంది, అవసరానికి కుటుంబాన్ని ఆదుకుంటుంది అని చెప్పినా వినలేదు. మీరు కూడా చెప్పిచూడండి కాస్త. పేర్లు ఇచ్చేందుకు టైమెంతో లేదు.’ అంటూ ఆలస్యమవుతోందని వెళ్లిపోయింది.

మేరీ మాటలకి ఆశ్చర్యం వేసింది. తమకంటూ ఒక వృత్తి ఉచితంగా నేర్పిస్తామంటే వద్దంటున్నారే. వీధిలో అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే ఆ అమ్మాయిలు కళ్లముందు కదిలారు. నేను చెప్పి చూస్తాను అని మేరీ కి మాట ఇచ్చాను.

మర్నాడు క్లాసుకి కాస్త ముందుగానే బయలు దేరేను. భవాని, సుజాత, లావణ్య ….అందరినీ కలిసాను. ఎవ్వరూ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఎవరి కారణాలు వారికున్నాయి. ముఖ్య కారణం మాత్రం పెళ్ళి! ఎప్పుడు కుదురుతుందో తెలియదు, కుదిరినా ఒక విద్య నేర్చుకుందుకు ఏవిధంగా అది అడ్డమో నాకు అర్థం కాలేదు. కానీ నలుగురూ చక్కగా వాళ్లకు వచ్చినంతలో తమ అందాలకి మెరుగులు దిద్దుకున్నారు.

ఆ విషయం గురించి వాళ్లని అభినందించి,  ‘అదే పని మరింత నైపుణ్యంతో చెయ్యచ్చు. అది జీవనోపాధిని కూడా ఇస్తుంది’ అని చెప్పినా ససేమిరా అన్నారు.

సుజాత ఇంటి దగ్గర మాత్రం ఆమె మేనమామ భార్య ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్పింది,

‘ టీచరుగారూ, నిన్న ఒకామె వచ్చి ఇయన్నీ చెప్పింది. మీరు కూడా ఇట్టాంటియన్నీ చెప్పబోకండి. ఇప్పటికే మేం చాలా బాథలు పడ్డాం. మా వోళ్ళ పిల్ల ఇలాగే ఏదో నేర్సుకుంటానంటూ మొదలెట్టి, ఆనక ఎవరినో ప్రేమించానంటూ చెప్పాపెట్టకుండా ఇల్లిడిచి పోయింది. పరువుతక్కువ పనులు……ఇదిగో ఈ సుజాత, దీని తమ్ముడు అశోకు మా ఆడపడుచు బిడ్డలు. ఈళ్ల బాధ్యత మామీద ఉంది. అశోకు మీ బళ్ళో చదువు కుంటున్నాడు లెండి. ఈ పిల్లకి పెళ్ళి చేసి పంపేస్తే మా బరువు తగ్గుతుంది. ఇప్పుడీ పిల్ల సంపాదించి మాకు పెట్టక్కర్లేదు. మీరెళ్లిపొండి టీచరుగారూ, మా ఇంటాయనొస్తే గొడవ చేస్తాడు, ఇట్టాంటియన్నీ ఆయనకి గిట్టవ్.’ అంది.

ఎంత చెప్పినా వాళ్ల తీరు వాళ్లదే. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు ఇలా వృధా అయిపోతున్నాయని బాథనిపించినా, చేసేదేమీలేక వెనక్కి తిరిగాను. అశోక్ గుర్తొచ్చాడు. వాడు తల్లిదండ్రుల దగ్గర ఉండడన్న విషయం ఇప్పటిదాకా తెలియదే. వాడి విషయం మాట్లాడేందుకు ఇది సమయం కాదనిపించింది.

దసరా శెలవులు ముగిసి స్కూలు మొదలైంది. అటెండెన్స్ తీసుకుంటుంటే అశోక్ రాలేదని గమనించాను. వాడే కాదు చాలామంది శెలవులు అయిపోయాక కూడా నాలుగురోజులు వరకూ గైర్హాజరు అవటం మామూలే. మెల్లిగా ఒక్కక్కరే వస్తున్నారు. వాడి గురించి అడిగితే ‘స్కూలుకి రానన్నా’డని కబురు చెప్పేరు తోటి పిల్లలు. మరునాడు తప్పక రమ్మన్నానని చెప్పి పంపినా వాడు రానేలేదు. ఆ నాలుగు రోజులూ గూడెంలోనూ కనపడలేదు వాడు. విషయం ఏమిటో కనుక్కోవాలి.

ఆరోజు ప్రొద్దున్నే స్కూల్ కి బయలుదేరుతుంటే మా వీధిలో క్రొత్తగా కడుతున్న ఇంటి దగ్గర తాపీ పనివాళ్లతో అశోక్ కనిపించాడు. గబగబా దగ్గరకి వెళ్లి, ‘స్కూలు మానేసి ఇదేం పని అశోక్’ అన్నాను.

‘ మా మామయ్య కి రోడ్ ప్రమాదంలో కాళ్లకి బాగా దెబ్బలు తగిలేయి టీచర్. నిన్ననే హాస్పటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేం. ఆయన ఇంక పనిలోకి వెళ్లలేడు. అందుకే నేను పనిలోకి వచ్చేను.’ సీరియస్ గా చెప్పేడు.

అశోక్ ప్రక్కన ఉన్న అతను చెబుతున్నాడు,

‘ ఏడాది క్రితం వీడి అమ్మానాన్న లారీ ప్రమాదంలో చనిపోయారు. మేనమామ వీడినీ, వీడి అక్కనీ తీసుకొచ్చేడు. కానీ ఇంతలో ఇట్టాంటి పరిస్థితి దాపురించింది.’ అశోక్ తలమీద ఇటుకల బరువుతో పనుల్లోకి జొరబడుతున్నాడు. వాడి వెనకే పని అందుకుంటున్న సుజాత………….

అశోక్ కి తల్లిదండ్రులు లేరన్న విషయం జీర్ణించుకోలేక పోయాను. వాడూ ఎన్నడూ చెప్పనే లేదు. మేన మామ కుటుంబం బాధ్యత ఇక వీడిదేనా? అప్రయత్నంగా కళ్లు తడి బారాయి. ఆరోజు నేను కోప్పడి నప్పుడు వాడి తల్లిదండ్రుల ప్రస్తావన తెచ్చేను. ఆనాటి వాడి మౌనం ఇప్పుడు అర్థమవుతోంది. వాడి అల్లరి, చిలిపితనం వెనుక ఇంత వేదన!

క్లాసులో చెప్పిన పాఠాలు అల్లరి మధ్య కూడా విని జవాబులు చెప్పే అశోక్ కళ్లముందు కదిలేడు. ఇంక పైన ఆ దృశ్యం కనిపించదా? వాడి చదువు సంగతి ఏమవుతుంది?

నెల క్రితం మేరీ చెప్పిన ప్రభుత్వ పథకంలో ఇప్పుడు సుజాతకి అవకాశం దొరికేలా చూడాలి. ఆ అమ్మాయి నీడ పట్టున పని చేసుకుని ఆర్థికంగా తన కాళ్లపైన తను నిలబడే అవకాశం అని అప్పుడు ఒప్పించ లేకపోయాను. ఇంటి జరుగుబాటుకి, తమ్ముడి చదువుకి ఆధారమవుతుందన్నవిషయం ఇప్పుడైనా నచ్చ జెప్పాలి అనుకుంటూ స్కూలు వైపు దారితీశాను.

 

వాడు ఆకలిని జయించాడు    

 

 

ఆ రోజు సాయంకాలం క్లాసులో వెనుక కూర్చున్న పెద్దపిల్లల దగ్గర ఏదో హడావుడి కనిపిస్తోంది. ముందు కూర్చున్న పిల్లల హోమ్ వర్క్ చూస్తున్నాను.

చేతిలో పని ముగించి వెనుక వైపు వరసల్లో ఉన్నసునీల్ని, వాడి చుట్టూ చేరిన గుంపుని విషయం ఏమిటని అడిగేను. జాన్బాబు వెంటనే చెప్పేడు,

‘ టీచర్, సునీల్ సెల్ ఫోన్ పట్టుకొచ్చేడు. అందులో బోలెడన్ని పాటలున్నాయి’. నా అనుమానం నిజమే. ఇందాకటినుండి ఎక్కడో సన్నగా విన్పిస్తున్న సినిమా పాటలు ఇక్కణ్ణుంచే అన్నమాట.

‘సునీల్, ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు’

‘ ఆపేసేనులే టీచర్. ఇంక పాటలు వెయ్యను’ అన్నాడు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ని జేబులోకి తోస్తూ.

‘ నీకు సెల్ ఫోనెక్కడిది?’

‘ నేనే కొనుక్కున్నాను టీచర్’. అర్థం కానట్లు చూసేను.

‘టీచర్, వాడు పొద్దున్నే లేచి తాడిగడప సెంటర్లో కాఫీ హోటల్లో మూడు గంటలు పనిచేసి స్కూలుకి వస్తాడు. వాడి డబ్బులతోనే కొన్నాడు’ జాన్ నా సంశయం తీర్చేడు.

పన్నెండేళ్ల పసివాడు పనికి వెళ్లి సంపాదించటాన్ని ఊహించేందుకే కష్టంగా తోచింది.

‘ నిజమే టీచర్, మా పిన్ని పనిలో పెట్టింది. నాకు డబ్బు విలువ తెలియాలని, సంపాదించడం ఇప్పటినుండే నేర్చుకోవాలని చెప్పింది టీచర్.’ వాడి మాటల్లో ఒక నిర్లక్ష్యం!

‘ నువ్వు మీ అమ్మానాన్నల దగ్గర వుండవా?’

‘ వాడికి అమ్మ చిన్నప్పుడే చనిపోయింది టీచర్.  వాళ్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడుగా.  ఆవిణ్నిఅమ్మ అనకుండా పిన్నిఅంటాడు వీడు’ జాన్ చెబుతున్నాడు.

ఊహించని పరిస్థితి! నాకు బాధగా ఉంది ఇలాటి ప్రశ్న వేసినందుకు.

‘కష్టపడి సంపాదించి, ఇలాటి అనవసరమైన ఖర్చులు పెడుతున్నావా సునీల్? ఇంట్లో తెలిస్తే కోప్పడరూ?’

‘ఏం అనరు టీచర్. నేను సంపాదించే దానిలో కొంత డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటాను. అలా అయితేనే పనిలోకి వెళ్తానని మా పిన్నికి చెప్పేను.’ అంత ఖచ్చితంగా వాడు ఇంట్లో చెప్పడాన్ని ఆశ్చర్యంగా విన్నాను.

‘ నీ ఖర్చులు అంటే ఇలా సెల్ ఫోన్ కొనుక్కోవటమేనా? ‘

‘టీచర్, ఫోన్ అంటే నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. మా బాబాయ్ ఎప్పుడూ కొత్తకొత్త ఫోన్లు వాడుతుంటాడు. అందుకే డబ్బులు పోగేసుకుని కొనుక్కున్నాను. అయినా ఇది కొత్త ఫోన్ కాదు టిచర్. నా ఫ్రెండు నాగు కొత్త ఫోన్  కొనుక్కుని వాడి పాత ఫోన్ నాకు మూడొందలకి అమ్మేడు. టీచర్, ఈ మూడొందలు పోగుచేసుకుందుకు నేను నెల రోజులుగా సాయంకాలం టిఫిన్ తినడం మానేసేను.’ గర్వంగా చెబుతున్నాడు.

ఉలిక్కిపడ్డాను. వాడి ముఖం వాడిపోయి ఉంది.

కొన్నాళ్ల క్రితం ఒకసారి సాయంకాలం క్లాసులో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

కార్తీక్ ఆరోజు కూడా క్లాసుకి ఆలస్యంగా రావడంతో నేను కోప్పడ్డాను. ‘ టీచరుగారూ, మా అమ్మ పనిలోంచి ఇప్పుడే వచ్చింది. అన్నం తిని వచ్చేసరికి ఇంత సేపయ్యింది.’ అన్నాడు కార్తీక్.

‘ మిగిలిన పిల్లలు అందరూ సమయానికి వస్తున్నారు, నువ్వు వారానికి నాలుగు రోజులు ఆలస్యంగా వస్తావు. సునీల్ చూడు. ఒక్కసారి కూడా ఆలస్యం చెయ్యడు. అందరికంటే ముందుగా వస్తాడు.’

‘ సాయంకాలంపూట వాడు అన్నం తిని రాడు టీచర్. అందుకే అందరికంటే తొందరగా వచ్చేస్తాడు.’

కార్తీక మాటలకి పౌరుషంగా చెప్పాడు సునీల్,

‘నేను స్కూలు నుండి వచ్చేప్పుడే సెంటర్లో టిఫిన్ తినేసి వస్తాను.’

‘మీ పిన్ని నీకు సరిగా అన్నం పెట్టదంట కదా, అందుకే నువ్వు బయట టిఫిన్ తింటావు. మా అమ్మ చెప్పింది’ కార్తీక్ మాటలకి పెద్ద గొడవే జరిగింది ఆరోజు.

సునీల్ కార్తీక్ మీద కలియబడబోతే వాళ్లిద్దర్నీ నేను విడదీయవలసి వచ్చింది.

‘ నాకు ఎవరూ పెట్టక్కర్లేదురా. నేనే సంపాదించి అందరికీ పెడతాను’ కోపంగా చెబుతున్నసునీల్ ముఖం ఎఱ్ర బడింది. ఆ గొడవతో సడన్ గా లేచి, ‘వెళ్లిపోతాను టీచర్’ అని చెప్పి ఆరోజు క్లాసులోంచి వెళ్లిపోయేడు.

సునీల్ ఫోన్ కొనుక్కుందుకు సాయంకాలాలు ఆకలితో గడుపుకున్నాడని వింటే గుండె పట్టేసినట్లైంది.

‘సునీల్, ఫోన్ కొనుక్కోవటం కోసం టిఫిన్ మానేసి, ఆకలితో క్లాసుకొస్తే నువ్వు చదువుకోగలిగావా? ముందు బాగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు‘

నా మాటలు పూర్తి కాకుండానే వాడు చెబుతున్నాడు,

‘చదువుకుంటాలెండి టీచర్. ముందు డబ్బు సంపాదించాలి. మా పిన్నికి నా సత్తా ఏమిటో చూబించాలి ’ వాడి మనసులో గాయం నాకు అర్థం అవుతోంది.

దేవుడు మాస్టారు వాకింగ్ ముగించి మా క్లాసు మీదుగా ఇంటికెళ్తున్నారు. ఆయన అక్కడ జరుగుతున్న విషయం గమనించినట్లున్నారు. క్షణం ఆగి అన్నారు,

‘ టీచరమ్మా, నువ్వేదో వీళ్లందర్నీ బాగు చేద్దామని అనుకుంటున్నావు కాబోలు. నీ తరం కాదు. వీడి సంగతి సరే, వీడిలాటి వాళ్లు సంపాదించిన దాంట్లో కొంత ఇంట్లో ఇస్తారు. ఏ కోడి కూరో చెయ్యమని పురమాయిస్తారు. అక్కడికి తామూ ఇంట్లో సంపాదించే మగాళ్లయ్యేరని అనుకుంటారు. ఇంటిల్లిపాదీ వీళ్లని అందలం ఎక్కిస్తారు. అంతేకాని తమ బ్రతుకులో పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదని, వాళ్లని చదివించుకోవాలని ఎప్పుడూ అనుకోరు. దశాబ్దాలుగా చూస్తున్నా వీళ్లని. నాకు చేతనైనంత చెప్పి చూసేను. ఉహు, వీళ్లు మారరు.’

ఆయన మాటలు నాకు కష్టంగా తోచేయి. ’అలా అనకండి మాస్టారూ, మనం వీళ్లని మార్చే ప్రయత్నం చేద్దాం. చదువుకుంటే భవిష్యత్తు బావుంటుందని అర్థం అయ్యేలా చెబితే………’

నామాటలు పూర్తి కాకుండానే, ‘నీ ఓపిక తల్లీ, ఏం చేస్తానంటావో చేసుకో. నాకు మాత్రం ఓపిక లేదు’ చేతులెత్తి దండం పెట్టి మెల్లిగా ఇంటి వైపు వెళ్ళిపోయేరాయన.

అంత అనుభవం ఉన్న మాస్టారు అంత నిస్పృహగా ఎందుకు మాట్లాడేరు? ఈ పిల్లలకి నిజంగా ఎవరం ఏమీ చెయ్యలేమా?

మరునాడు కాస్త ముందుగా బయలుదేరి సునీల్ ఇంటికి వెళ్లేను. ఇంటి ముందు బియ్యం బాగు చేస్తున్న ఆమె బహుశా సునీల్ పిన్ని అయివుంటుంది. ఆమె తలెత్తి ఏమిటన్నట్టు చూసింది.

‘అమ్మా, మీరు పిల్లవాణ్ణి ఇప్పటినుండి పనిలోకి పంపుతున్నారు. చదువుకునే వయసు కదా. తెలివైన పిల్లవాడు. శ్రద్ధగా చదువుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. మీ ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. కొన్నాళ్లు మీరు వాడి చదువు బాధ్యత పూర్తిగా తీసుకోవాలి’ ఆమె ముఖం అప్రసన్నంగా మారింది.

అక్కడే ఉన్న నులక మంచం మీద చుట్ట కాల్చుకుంటూ కూర్చున్న వృద్ధుడు మాత్రం సమాధానంగా మాట్లాడాడు.

‘ నా అల్లుడేమైనా ఆఫీసరుద్యోగం చేస్తున్నాడా టీచరమ్మా? పిల్లోడూ ఓ చెయ్యి సాయం చేస్తేనే సంసారం నడిచేది. నాకూతురు సవితి కొడుకని ఆణ్ణి పనిలోకి పంపట్లేదు. ఇంట్లో కూర ఆకుకి వస్తాయని పంపుతోంది.’ మనవడి సంపాదనలోనే తన చుట్టల ఖర్చునడుస్తోందన్న విషయాన్ని మాత్రం అతను చెప్పలేదు.

‘ అలా కాదండీ. చదువుతో పాటు పనిచేసే శక్తి, సమయం పిల్లలకుండదు. వాళ్లు చదువుమీద పూర్తిగా ధ్యాస పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అయినా చిన్నపిల్లల్ని పనిలోకి పంపటం నేరం అవుతుంది, మీకు తెలుసా?’

‘అంటే ఏంటి, మామీద కేసెడతారా? ‘ అసహనంగా అడిగిందామె. ఇంతలో సునీల్ రానే వచ్చాడు.

‘ ఏరా, పని ఎగేసేందుకు టీచరుగార్ని మామీదకి ఉసిగొల్పుతున్నావా?’ వాడిమీద చెయ్యెత్తిందామె. వాడు దెబ్బ తప్పించుకుంటూ లోపలికి పరుగెత్తాడు. తెల్లబోయాను. ఏం చెప్పాలని వచ్చాను, ఏం జరుగుతోంది?!

‘ టీచరమ్మా, మా ఇంటి విషయాల్లో, పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకు. చదువు చెప్పడానికొచ్చేవు. అంతవరకే’ విసురుగా బియ్యం చేటతో సహా లోపలికి వెళ్లిపోయిందామె.

 

ఇక్కడ…….. రాళ్లు కూడా మాట్లాడతాయి!

 

గూడెం పరిసరాలు అలవాటు అవుతున్నాయి . మొదట్లో కుతుహలంగా , ఆరాగా , సంశయంగా నన్ను , నారాకని వెంటాడే  చూపులు మెల్లి మెల్లిగా స్నేహంగా, ఎదురుచూస్తున్నట్లుగా ఉంటున్నాయి. నాకు కూడా ఇప్పుడు ఆ పరిసరాలు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాయి . ఆ పిల్లలు చదువుకోవటం కోసం ఏదైనా చెయ్యాలని ఇష్టంగానే మొదలు పెట్టినా నా రాకని అక్కడ ఎంతవరకూ ఆహ్వానిస్తారో అన్న కొద్దిపాటి జంకు మాత్రం మొదట్లో ఉండేది .

ఇప్పుడైతే అది నా సామ్రాజ్యం అన్నంత ధీమా ! దారి పొడవునా పలకరింపులు కి సమాధానాలు చెబుతూ వెళ్లటం అలవాటైపోయింది .

‘ టీచరమ్మా, అప్పుడే వస్తున్నావూ? ఇంటికెళ్ళి కాస్త టీ నీళ్ళన్నా తాగొస్తున్నావా లేదా?’ చేటలో బియ్యం చెరుగుతూ ఆ పెద్దావిడ ఎప్పటిలాగే పలకరించింది. సమాధానంగా తలూపేను.

స్కూలు నుండి వస్తూనే పుస్తకాల సంచీలు గుమ్మాల్లోకి విసిరి, రోడ్డు మీద ఆటల్లో మునిగిపోయిన పిల్లలు మాత్రం ‘టీచర్, ఇప్పుడే వస్తాం ‘ అని ఓ కేక పెట్టేరు అయిష్టంగానే. తనకు తెలుసు వాళ్లకి ఆటలు ఎంత ఇష్టమో! అసలు ఆటలు వాళ్ల హక్కు కాదూ? కానీ… చదువుకోవద్దూ !

వీధి కుళాయిల దగ్గర స్కూలు యూని ఫారాల్లో ఉన్న ఏడెనిమిదిమంది ఆడపిల్లలు, ఒకరిద్దరు మగ పిల్లలు నీళ్లు పడుతూ ఇబ్బందిగానే  నవ్వు ముఖాలు పెట్టేరు .

ఆ రోజు కమల నాకు గూడెం పరిచయం చేస్తూ చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి.’టీచరుగారు, ఇక్కడ ఆడవాళ్లు, మగవాళ్ళు పెద్దవాళ్లంతా రోజూవారి పనుల్లోకి వెళ్లిపోతారు. పిల్లలు స్కూలు నుండి వచ్చి ఇంటిపని, వంట పని చేసిన తర్వాతే క్లాసుకి రాగలుగుతారు.’

నిజమే, నేను వెళ్లిన కాస్సేపటికి ఒక్కొక్కరూ తమ పనులు ముగించుకుని పుస్తకాలతో వచ్చి కూర్చుంటారు. ఆ ముఖాల్లో అలసట చూస్తే మనసు చివుక్కు మంటుంది. ఆ అలసటని మాయంచేసే మంత్రదండమేదైనా నాచేతిలో ఉంటే ఎంత బావుణ్ణు !

వీళ్ళకి ఇంకో అరగంట పడుతుంది పనులు తెముల్చుకు వచ్చేందుకు. ఈలోగా చిన్న పిల్లల చేత అక్షరాలు దిద్దించి వాళ్లని పంపెయ్యాలి . క్లాసుకోసం కేటాయించిన వరండాలోకి చేరేను . నన్ను చూస్తూనే సుమజ పరుగెత్తుకెళ్లి కుర్చీ తెచ్చివేసింది . పాస్టర్ గారింట్లో దాచి పెట్టిన చాపలు తెచ్చి పరిచింది . మైఖేల్ పరుగెత్తుకుంటూ వెళ్లి బోర్డ్ తెచ్చి గోడకి తగిలించాడు.

ఎవరూ చెప్పకుండానే ఎంతో సహజంగా వాళ్లు అవన్నీ అమర్చేసేరు . ఈ పిల్లలు ఏదైనా సాయం చెయ్యాలంటే ఎవరికోసమైనా సరే ముందు ఉంటారు . బహుశా పెద్దలనుండి చూసి నేర్చుకుంటున్నారేమో ! సహజీవనం అనే మాటకి సరి అయిన అర్థం ఇస్తున్నాయి గూడెంలో నేను చూస్తున్న జీవితాలు. బయటి నాగరిక ప్రపంచం కంటే ఇక్కడ మనుషుల మనసులు విశాలమనిపిస్తూంది.

అరగంట గడిచి, మెల్లిగా పెద్ద పిల్లలు రావటం మొదలైంది . అటెండెన్స్ తీసుకుంటూంటే రాజు క్లాసులో లేకపోవటం గమనించేను . నిన్నా రాలేదు . ఏమైంది? అడుగుదామని తలెత్తితే వరండా ప్రక్కనుంచి సైకిల్ నడిపించుకుంటూ  వెళ్తున్నాడు .

‘ రాజూ, క్లాసుకి టైమైంది , పుస్తకాలు తెచ్చుకో’  క్రితం రోజు విషయం మాట్లాడకుండా పిలిచేను.

‘రేపొస్తాను టీచర్,  సెంటర్ దాకా వెళ్లాలి, సైకిల్ పంక్చర్ పడింది. ‘

‘క్లాసు అయ్యేక బాగు చేయించుకో . నిన్న కూడా నువ్వు రాలేదు’ సీరియస్ గానే చెప్పేను.

‘ఈ రోజు రాను టీచర్ ‘ అంటూనే వాడు సైకిల్ పట్టుకుని ముందుకెళ్లిపోతున్నాడు. క్లాసులో పిల్లలంతా పుస్తకాల్లోంచి తలలు పైకెత్తి చూస్తున్నారు . జాన్ చెబుతున్నాడు,

‘ టీచర్, నిన్న రాత్రి రాజుని వాళ్ల నాన్న బాగా కొట్టేడు సైకిల్ బాగు చేయించలేదని.’

పిల్లల్ని పిల్లల్లా చూడరే ఇక్కడ.  వాళ్లు కూడా పెద్దల్లాఉండాలి. ఇంటి జరుగుబాటులో పెద్దలతో సమంగా బాధ్యత తీసుకోవాలి. వాళ్లకి పిల్లలుగా హక్కులు ఏవీ లేవు. పుడుతూనే బాధ్యతలతో పుడతారు. పైగా ఇంటికి కనీసం ముగ్గురు లేదా నలుగురు పిల్లలు. ఆలోచనల్లోంచి ఉలిక్కిపడ్డాను……………………………..

వెనుక నుంచి పెద్ద కేక ! వెనకింటి వరండాలో ఉన్న ఒక వ్యక్తి బయటకొచ్చాడు,

‘ మేష్టరమ్మా, నువ్వు ఉండు. నేను చెబుతా వాడికి ‘ ,అంటూనే ‘అరేయ్, మేష్టరమ్మ పిలుస్తూంటే వినబడ్డంలా?’ అంటూనే వంగి నేల మీద దేనికోసమో వెదికేడు, మరు క్షణం అతని చేతిలో ఒక పెద్ద రాయి ! ఏం జరుగుతోందో నాకు అర్థం అయ్యేలోపు అతను ఆ రాయిని రాజు మీదకి విసిరి ముందుకు పరుగెత్తాడు. సైకిల్ ప్రక్కన పడేసి, నేల మీద మరో రాయి అందుకుని రాజు అంతే వేగంగా దాన్ని వెనక్కి విసరడం, వెంటనే పరుగున వీధి మలుపు తిరగడం జరిగిపోయేయి .

నేను ఏంచూసేను ?! క్షణ కాలం మనసు మొద్దుబారింది.

*

 అప్పు తీసివేత-చిన్నారి విన్నీ

gudem

 

గూడెంలో క్లాసులు మొదలుపెట్టిన తొలి రోజులు.

అప్పటికి రోజువారి దాదాపు ఒక ముప్ఫై మంది పిల్లలు క్లాసులకి వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం పిల్లలు అప్పుతీసుకునే తీసివేతలు చెప్పమని అడిగేరని బోర్డ్ మీద చెబుతున్నాను.

‘అప్పు తీసుకోవడం అంటే ఏంటి టీచర్ ?’ విన్నీ అడుగుతోంది.

‘అప్పు తీసుకోవడం అంటే నువ్వు పెన్సిలు కొనుక్కుందుకు నీ దగ్గర డబ్బులు లేవనుకో  ప్రక్కింటి వాళ్లనో , తెలిసున్న వాళ్లనో అడిగి తీసుకోవడం , ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి వాళ్ల డబ్బులు వాళ్లకి ఇచ్చేయడం .’

‘ మరి, నాలుగు లోంచి ఐదు తియ్యలేనప్పుడు పక్కనున్న అంకె నుంచి ఒకటి అప్పు తీసుకోమన్నారు కదా. మళ్లీ ఆ ఒకటి అప్పుని ఎలా తీర్చాలి టీచర్?’ విన్నీ ముఖంలో సీరియస్ గా కనిపిస్తున్న ప్రశ్న.ఆ అమ్మాయి ప్రశ్నకి నవ్వొచ్చింది. నిజమే కదూ, అప్పు ఎలా తీర్చాలి?……………………….

‘ టీచరమ్మా!’ అన్న పిలుపుకి తలత్రిప్పేను.

నలుగురు పెద్దవాళ్లు, వాళ్ల వెనుక నలుగురు ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. ‘చెప్పండి’

‘ టీచరమ్మా, మా పిల్లలకి ఇంగ్లీషు నేర్పుతావా? పదో క్లాసు పరీక్షకి వెళ్తున్నారు. ‘ వాళ్లని వివరంగా చూసాను. పదో క్లాసు పిల్లలంటే నమ్మబుధ్ధికాలేదు. స్కూల్లో చూసినట్లే అనిపించింది. అవును, కానీ వాళ్ల క్లాసుకి నేను వెళ్లను.

‘ అందరూ రావచ్చు ఇక్కడికి. రోజూ రండమ్మా.’ ఆ మాటలకి కృతజ్ఙతగా చూసి వెనక్కి తిరిగేరు.

పదో క్లాసు పిల్లలు నలుగురు కాస్తా ఏడెనిమిది మంది దాకా రావటం మొదలు పెట్టేరు . చదువుకోవాలనే ఆశ ఉన్న పిల్లలే. మంజూష క్రమం తప్పకుండా వస్తుంది. సన్నగా , బలహీనంగా కనిపిస్తుంది. కాని చదువులో చురుకైనదే . మనసు పెట్టి వింటుంది, చక్కగా అర్థం చేసుకుంటుంది.

ఆరోజు మంజు తనతో మరొక అమ్మాయిని తీసుకొచ్చింది,

‘టీచర్, మా మామయ్య కూతురు విద్య. తనకి చదువుకోవాలని చాలా ఇష్టం. పది దాకా చదివింది. కాని పరీక్షలు రాయలేదు. వాళ్లనాన్న అప్పులుపడి,  డబ్బుకి ఇబ్బందిగా ఉందని ఇక్కడ పచ్చళ్ల కంపెనీలో పనికి కుదిర్చేడు . పరీక్ష తర్వాత రాద్దువులే అన్నాడు . కానీ ఇబ్బందులు తీరక రెండేళ్లు అయినా ఇప్పటికీ పనిలోకి వెళ్తూనే ఉంది.  అయినా అప్పులు, వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయంటాడంట వాళ్ల నాన్న .

వాళ్ల అమ్మని అడిగితే ఇప్పుడు వాళ్ల అక్క ప్రసవానికి వచ్చింది కనుక ఇంకొక్క ఆరు నెలలు పనికి వెళ్లమని, చేతిలో పైసలు అస్సలే లేవని  చెప్పిందంట. ఆ తర్వాత మాత్రం విద్య  ప్రైవేటుగా చదువుకుంటుందంట. మీరు చదువు చెబుతారా టీచర్ ?’

పెద్ద పెద్ద కళ్లతో విద్య ఆశగా చూస్తోంది నావైపు. ‘ తప్పకుండా విద్యా. నేను చెబుతాను’ నా మాటలకి ఆ అమ్మాయి కళ్లు తళుక్కుమన్నాయి .

మోటారు సైకిల్ విసురుగా వచ్చి మా దగ్గర ఆగింది.   ‘ఏమే విద్దే, నీకు సదువు పిచ్చి ఇంకా ఇన్నేళ్లైనా  తగ్గలేదే? ముందు మన అప్పులుతీరనీ. నీ బావనిచ్చి పెళ్లిసేసి పంపిస్తా, అప్పుడు సదూకుందువులే , పద’ తండ్రి కళ్లల్లో పడినందుకు ఆ పిల్ల వణికిపోయింది.

‘ టీచరమ్మా, నా కూతురు రెండేళ్లై సంపాయిస్తోంది. ఇప్పుడింక కొత్తగా సదివితే మాత్రం పెద్ద ఉజ్జోగాలు వస్తయ్యా?’ నాకు ఒక ప్రశ్న సంధించి కూతుర్ని తీసుకుని వెళ్లిపోయాడు. అప్పులు చెయ్యడం వరకే ఇంటి పెద్ద బాధ్యత కాబోలు.  వాటిని తీర్చడానికి పిల్లల జీవితాల్నేపణంగా పెడుతున్నారు.

పిల్లల జీవితాలమీద పెద్దవాళ్లకిలాటి హక్కు ఎవరిచ్చారు ? పిల్లలు ‘పనుల్లోకి వెళ్లం’ అని ఎదురు తిరిగితే ఈ అప్పులు ఎలా తీరుస్తారో ‘విన్ని’ అడిగినట్లు.

 

 

కరుణా టీచర్ చెప్పిన ఉపాయం

 

 

సాయంకాలం క్లాసులకి పెద్ద పిల్లలు క్రమంగా మళ్లీ రావడంమొదలు పెట్టేరు. నాకు సంతోషంగా అనిపించింది. ఇంకా కొందరు రావలసి ఉంది. నాకు తెలుసు. రోజూ అటెండెన్స్ తీసుకుంటూ వాళ్లరాక కోసం ఎదురుచూస్తున్నాను.

ఒక వారం తరువాత క్లాసు అయి ఇంటికి బయలు దేరుతుంటే ఒకతను, ’మేష్టరమ్మగారూ , మీతో మాట్లాడాలి’ అన్నాడు. మిగిలిన పిల్లలు ఆసక్తిగా చూస్తుంటే , వాళ్లని పంపించేసి, చెప్పమన్నాను. ఇతన్ని ముందెప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు.

‘ మేష్టరమ్మగారూ, నేను ఇక్కడే గూడెంలోనే ఉండేది. లారీ మీద పని,దేశం మొత్తం తిరుగుతూంటాను. నెలకి ఒకటీ రెండు సార్లు ఇంటికి వస్తావుంటాను. మొన్న మీకు దెబ్బలు తగిలేయంటగా, తెలిసింది. ఎవరో పెద్ద క్లాసు సదూతున్న పిలగాళ్లు ఈ పని సేసేరని సెప్పుకుంటున్నారు. మా ఇంట్లో కూడా ఎన్మిది సదూతున్న పిల్లోడున్నాడు. ఈ పని సేసింది వోడు కానీ అయితే సెప్పండి. మా వోడు మాట వినడం లేదని, అల్లరి ఎక్కువైందని మా ఇంటామె సెబుతోందీ మద్దెన.’

‘ మనం ఇంక ఆ సంగతి మర్చిపోదామండి,’అన్నాను ముందుకు కదులుతూ.

‘ నాకు ఒక్క అవకాశమివ్వండి. మీకు మళ్లీ ఇట్టాటి ఇబ్బంది రాకుండా నేను సూసుకుంటాను.’ అతను రెట్టించాడు.

అతని మాటలు వింటున్నప్పుడు ఆ మాట తీరు ఎవరినో స్ఫురింపచేసింది.

‘ నాకు ఇబ్బంది ఏమీ లేదులెండి. మళ్లీ ఇలాటి విషయం జరగదని నా నమ్మకం’ అని నడక మొదలు పెట్టేను. అతను కొంచెం దూరం వెనుకే రావడం తెలుస్తోంది.

‘ సరే మేష్టరమ్మగారూ, మావోడు అనీలు, మీకు తెలిసే ఉంటుంది, ఎనిమిది సదువుతున్నాడు. ఆణ్ని మీ దగ్గర కూర్సోబెట్టుకుని రోజూ సదివించండి…….’ అతను వెనక్కి మళ్లాడు.

అవును. నా సంశయం నిజమే.! ఆ పిల్లవాడి తండ్రే ఇతను.ఆ విషయాన్ని ఎంత ప్రక్కకి తోసేస్తున్నా మళ్లీ మళ్లీ గూడెంవాళ్లు తిరగ తోడుతూనే ఉన్నారు.

ఆ రాత్రి భోజనం చేసి, స్కూలు పని ఉందని చేసుకుంటూ కూర్చున్నాను. పని పూర్తై నిద్ర పోబోతే నిద్ర రాదు. ఏదో దిగులుగా అనిపించింది. అమ్మ వచ్చి వెళ్లటం బావుంది. కానీ ఆ పదిరోజులూ అమ్మ ఇంట్లో తిరిగిన అలికిడి జ్ఞాపకం వస్తే……మనసు బలహీనమవుతోంది. కాని వెళ్లేప్పుడు నామీద కోపంతో వెళ్లింది. అమ్మకి గూడెం అంటే కూడా కోపంగా ఉందని నాకు అర్థమైంది.

అసలు అమ్మ కాదూ నాకు రోల్ మోడల్! ఆవిడ తన ఉద్యోగంతో పాటు ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకోవటం తను చూస్తూనే ఉంది చిన్నప్పటినుండి. అమ్మకి గూడేన్ని పూర్తిగా పరిచయం చెయ్యనేలేదు. ప్చ్….అమ్మకి వివరంగా ఇప్పుడు పరిచయం చేస్తాను…అవును, నిద్ర ఎలాగూ రావటం లేదు. మంచంమీద నుండి లేచి ల్యాప్ టాప్  తెచ్చుకుని అమ్మకి ఉత్తరం టైపు చెయ్యటం మొదలుపెట్టేను………………

************

‘ అమ్మా, నా మీద అలకతో ఉన్నావు కదూ. నాకథ పూర్తిగా విను , అప్పుడు నువ్వు నన్నూ, నా గూడేన్ని, నాపిల్లలని చూసేందుకు పరుగెత్తుకువస్తావు………………….

ఇక్కడి గవర్నమెంటు బడికి ఉద్యోగ రీత్యా వచ్చినప్పుడు పిల్లలని చూసి ఆశ్చర్యపోయాను . సమాజంలో అడుగువర్గాలనుండి వచ్చిన పిల్లలే ఇక్కడంతా. చదువు అవసరం వీళ్లకి ఎక్కువగా ఉంది.

కాని చదువు పట్ల వాళ్ల అనాసక్తి…..అనాసక్తి కూడా కాదేమో, ఉదాశీనత! ఎందుకో నాకు అర్ధం కాలేదు.

ఇన్నాళ్ళుగా కార్పొరేట్ స్కూలులో పాఠాలు చెప్పిన అనుభవం! అక్కడి డిసిప్లిన్ మాత్రమే చూసేను. చదువుకున్న తల్లిదండ్రులు తీసుకునే శ్రధ్ధ స్పష్టంగా చూసేను.

ఇక్కడ కనీసం పదిశాతం మంది పిల్లలు కూడా చదువు పట్ల శ్రద్ధ చూపకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. పుస్తకాల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలన్న ఆలోచన లేకపోవటం చూస్తే, చదువుని తేలిగ్గా తీసుకుంటున్నారనిపిస్తుంది.క్లాసులో చెప్పినప్పుడు శ్రధ్దగా వినేవాళ్లు తక్కువే . ఒకటికి నాలుగుసార్లు చెప్పి, ఇంట్లో చదవమని కొద్దిపాటి హోంవర్క్ ఇచ్చినా ఏనాడూ పూర్తిగా చేసుకొచ్చిన వాళ్లు లేనే లేరు .

కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల నిరంకుశత్వం నుండి బయటపడి సంతోషంగా వచ్చి గవర్నమెంటు బడిలో చేరేను కాని  ఇక్కడ పిల్లల వైఖరికి అసంతృప్తి మొదలైంది. నా  బాధ్యత సరిగా నెరవేర్చటంలేదేమో అని నా మీద నాకే అపనమ్మకం మొదలైంది.

వీళ్లని ఎలా మలుచుకోవాలి, అదీ ఒక్కరో , ఇద్దరో కాదు. అందరూ కాకపోయినా చాలా మంది పిల్లలు చదువులో బాగా వెనకబడే ఉన్నారు.  పిల్లలు మాత్రం ఎంతో చురుగ్గా ఉన్నారు. ఏ కార్పొరేట్ స్కూల్ పిల్లలకీ తీసిపోరు.

ఎప్పటిలాగే స్కూల్లో పాఠంచెప్పటం అయిపోయేక , ఇంటికి వెళ్లి చదవమని చెప్పి, కొంత హోమ్ వర్క్ ఇచ్చేను .

నీరజ లేచి చెప్పింది, ‘టీచర్ , ఇంటికెళ్లేక చదవటానికి మామూలుగానే చాలా తక్కువ సమయం ఉంటుంది, కానీ ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బావులేదు , ఇంట్లో పని మొత్తం నా బాధ్యతే. …………….అదికాకుండా………..’ఒక్కక్షణం ఆగింది. అంతలోనే మెల్లిగా నావైపు నడిచి వచ్చి రహస్యంగా చెప్పింది, ‘టీచర్, మా అమ్మ పని చేసే ఇళ్లకి వెళ్లి పని చేసిరావాలి. అమ్మ లేవటం లేదు, ఒక్కరోజు, రెండు రోజులకంటే ఎక్కువ మానేస్తే జీతం కోత పెడతారు……’

తలవాల్చుకుని చెబుతున్న నీరజని వింటుంటే ఆశ్చర్యం….. మిగతా పిల్లలు వింటే ఏడిపిస్తారేమో అన్న దిగులు ఆ గొంతులో. అయినా ఎవరికి తెలియనిదనీ, వెంటనే భవాని అంటోంది, ‘ నీరజ స్కూలు నుండి వెళ్లేక ,పనికెళ్లాలి టీచర్, ఆమెకి టైమే ఉండదు’ భవాని మాటలకి క్లాసు మొత్తం నీరజ వైపు తిరిగేరు.

నీరజని వెళ్లి కూర్చోమని చెప్పి ఆ విషయాన్ని అంతటితో ముగించాను. ఇలాటి ఒక విషయం ఉంటుందని ఎప్పుడైనా తెలుసా నాకు?ఈ పిల్లలని ఇంకొంచెం శ్రధ్ధగా పట్టించుకోవలసిన అవసరం ఉందని మాత్రం అర్థమైంది.

స్కూలు వదిలేక పిల్లలంతా ఎవరిదారిన వాళ్లు ఇళ్ల దారి పట్టేరు . భవాని నా వైపుగా నడుస్తూ మాటలు కలిపింది.

‘ టీచర్, నీరజకి ఇంట్లో బోలెడు పని ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ల అమ్మ కూడా లేవట్లేదు, ఇప్పుడు ఆ  పనులూ నీరజవే. వాళ్ల నాన్న ఇంటిని అస్సలు పట్టించుకోడు.  ఇంట్లోకి ఒక్క పైసా ఇవ్వడంట . సంపాదించటం వరకూ సంపాదిస్తాడు,కానీ డబ్బంతా తాగుడికే ఖర్చు పెడతాడంట. ‘

పన్నెండేళ్ల భవాని ఆరిందాలా చెబుతోంది. ఇంకా ఏమి చెబుతుందో కానీ, ‘ఆలస్యం అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్లు’ అంటూ ఇంటి దారి పట్టేను.

ఆ తర్వాత నాలుగైదు రోజులు నీరజ స్కూలుకి రాలేదు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో , ఒక్కసారి వెళ్లి చూసి వస్తే…….ఏమో , ఏమనుకుంటారో………..  వాళ్ళ విషయాల్లో నేను ఎక్కువగా తలదూరుస్తున్నానని అనుకుంటే…………ఎవరిని అడగాలి, భవాని ని అడిగితే చెబుతుంది , కానీ వేరొకరి విషయాలు ఆమె దగ్గర ప్రస్తావించటం సరి అయిన పని కాదు.

స్టాఫ్ రూమ్ లో మిగిలిన టీచర్లతో అదేమాట చెబితే,

‘ క్రొత్తగా చేరేవు కదూ, నువ్వు కొన్నాళ్లపాటు పిల్లలు, చదువులు అంటు దిగులు పడటం సహజమేలే. మేమూ నీలాగే ఉండేవాళ్లం. రానురాను అదే అలవాటైపోతుందిలే. వాళ్లంతే. వాళ్లకి చదువులక్కర్లేదు. స్కూలుకి రావడం, వెళ్లడం ….అంతవరకే. అదీ వచ్చినన్నాళ్లే ’ శ్యామల మాటలు బాధనిపించాయి.

కరుణా టీచర్ మాత్రం కొంచెం సానుభూతితో చెప్పింది.

‘ దీపికా, వాళ్ల గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్లందరూ రోజువారీ కూలి పనులకి వెళ్లే వాళ్ల పిల్లలే చాలావరకూ. తెల్లవారి లేస్తే పనికోసం పరుగెత్తాలి. పని దొరికితే సరే. ఇల్లు చేరేసరికి చీకటి పడిపోతుంది. ఆ పూటకి కావలసిన సరుకులు తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం …అంతే ఆ రోజు గడిచిపోయినట్లే. ఇక పిల్లల చదువులు పట్టించుకునే తీరికెక్కడిది? పిల్లలు ఏం చదువుతున్నారో అర్థం చేసుకునే చదువులు వాళ్లకి లేనేలేవు’

‘ మరి వీళ్లు చదువుకోకపోతే వీళ్ల భవిష్యత్తు ఏంకావాలి కరుణగారూ?’ నా ప్రశ్నకి ఆవిడ నవ్వింది. కరుణ టీచర్ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉంది. ఎంతో ఓర్పుగా నా ప్రశ్నకి జవాబు చెప్పింది.

‘ ఆసక్తి ఉన్నవాళ్లని సాయంత్రం మీ ఇంటికి రమ్మని నువ్వు కొంత ప్రోత్సాహం ఇవ్వచ్చు. అదైనా ఎంత మంది వస్తారో చెప్పడం కష్టమే.’

ఆవిడ చెప్పిన ఆలోచన నచ్చింది నాకు.

‘అర్థం కాని పాఠాలు చెప్పించుకుందుకు సాయంత్రం ఇంటికి రండమ్మా ‘ అంటే, సంబరపడుతూ అయిదారు మంది పిల్లలు రావడం మొదలు పెట్టేరు. అది ఒక్క నాల్గు రోజులే. ఆ తర్వాత రావడం మానేసేరు. ఏమైందంటే….

‘ ఇంటికెళ్లేసరికి ఆలస్యం అయిపోతోంది టీచర్. మా అమ్మ పనిలోంచి వచ్చేసరికి ఇంటి పనంతా చెయ్యాలి. వంట కూడా చెయ్యాలి. నిన్న, మొన్న కూడా పనులు అవక వంట ఆలస్యం అయింది. తమ్ముడు, చెల్లెలు ఏడుపు. మా నాన్న నన్ను పది దాకా చదివిస్తా అనేవాడు . కాని ఇప్పుడు చదువు వద్దు, స్కూలు మానేసి ఇంటిపట్టున ఉండు’ అంటున్నాడు టీచర్’ నందిని బావురుమంది.

సుగుణ చెబుతోంది,’ మా అమ్మకి గుండె జబ్బు టీచర్. నాలుగు రోజులు పనిలోకి వెళ్తే నాలుగు రోజులు ఇంట్లోనే ఉండిపోతుంది. నేను బాగా చదువుకుని , మంచి ఉద్యోగం చెయ్యాలని చెబుతుంది. నేను చదువుకోవాలని అమ్మకి ఆశ’ కళ్లనీళ్లు తిరుగుతుంటే ముఖం తిప్పుకుంది.

 

తలలు పగలగొట్టుకునే జనాల మధ్య…

    

  అనూరాధ నాదెళ్ళ 

~

62పిల్లల పట్ల ఉన్న ప్రేమ నన్ను టీచర్ని చేసింది.  ప్రస్తుతం మా పోరంకి (విజయవాడ)లో  చదువు అవసరం ఉన్న ఒక గూడెంలో పిల్లలకి సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఇది కాకుండా  ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్చంద సంస్థకు  ఈ మధ్య సభ్యురాలిని అయ్యాను. కథలు, కవితలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను . రెండు మూడేళ్ల క్రితం ఒక కథల పుస్తకాన్ని అచ్చువేసుకున్నాను . పుస్తకాలు , పిల్లలు ,సంగీతం , చుట్టూ ఉన్న ప్రపంచం … ఇలా ఇష్టమైన జాబితా చాలా ఉంది . 
~

ఆరోజు గూడెంలో క్లాసు ముగించి ఇంటికి బయల్దేరేను. చీకటి రాత్రులు. వీధి దీపాలు ఎక్కడా వెలగడం లేదు. చేతిలో టార్చ్ లైటు దారి చూపిస్తూంటే గబగబా నడుస్తున్నాను. వీధిలో పెద్దగా అలికిడి లేదు. రోడ్డుకి రెండువైపులా ఉన్న ఇళ్ళల్లోంచి పలుచని వెలుతురు మాత్రం బయటకు పాకుతోంది.గూడెం పొడవునా ఉన్న చర్చిల్లోంచి రికార్డులు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ దగ్గరకొస్తోంది. ఇంకపైన గూడెమంతా బోలెడు సందడి మొదలవుతుంది.

ప్రక్కన ఏదో అలికిడి అనిపించి తల త్రిప్పబోయేసరికి తలమీద దెబ్బ పడింది. తలమీద చేత్తో తడుముకుంటూ,’ఎవరది?’ అంటూ వెనక్కి తిరగబోయేంతలోమరో దెబ్బ. చేతిలో టార్చి జారిపోయింది.

‘అబ్బా!.’అంటూ రెండు చేతులతో తల పట్టుకున్నాను. ఎవరో వెనుక పరుగెడుతున్న చప్పుడుతో పాటు ‘గట్టిగా కొట్టలేదుగా ’ గుసగుసగా ఎవరిదో పరిచయమున్న గొంతులాగే ఉంది.

ఎదురుగా ఆటో వస్తున్న శబ్దం విని రోడ్డుకి అడ్డంగా నిలబడి కేక వేసేను. తలమీంచి రక్తం కారుతూంటే చెయ్యి నొక్కి పెట్టి బాధని అణుచుకుంటూ, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి దెబ్బకి కట్టుకట్టించుకున్నాను. రెండు , మూడు కుట్లు పడ్డాయి.

ఏమైంది? ఎవరు చేసి ఉంటారీపని? ఆలోచించే శక్తి లేదు. ఇంటికెళ్లి వండిపెట్టుకున్న భోజనం ముగించి నొప్పి తెలియకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన మాత్ర వేసుకుని పడుకున్నాను.

ఆ పడక పడక వారం రోజులు జ్వరంతో మంచానికి అతుక్కుపోయాను. అమ్మ వచ్చింది. ‘ ఈ మారుమూల నీకు ఈ ఉద్యోగం అవసరమా? పైగా గూడెంలో సాయంత్రం క్లాసులు ! చేసిన దేశసేవ చాలు, ఉద్యోగానికి రిజైన్ చెయ్యి. మన ఊరు వెళ్లి పోదాం. ‘ అంది.

‘ అమ్మా, ప్లీజ్ అలా మాట్లాడకు. నాకు ఇక్కడ ఏ సమస్యా లేదు’

‘ లేకపోతే ఆ రోజు నీమీద దాడి ఎందుకు చేసేరు? ఎవరు చేసేరు? ఆ సమయానికి ఆటో అటుగా రాకపోతే ఏమయ్యేది?  నిన్ను కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? నువ్వు చెప్పు పోనీ , వింటాను.’ అమ్మ సవాలు చేసింది.  నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరిమీదో చెయ్యబోయిన దాడి చీకట్లో నామీద చేసేరని అనుకుంటున్నాను. అమ్మతో అదే అంటే , ‘ అలా అయితే అసలు నువ్వు అలాటి పరిసరాల్లోకి వెళ్లనే వెళ్లొద్దు. తలలు పగలు కొట్టుకునే జనాల మధ్య కోరికోరి నువ్వు వెళ్లనవసరం లేదు, చెప్పింది విను’ ఇంకేం మాట్లాడకు అన్నట్లు చూసి వంటింట్లోకి వెళ్లి పోయింది అమ్మ.

జ్వరం ఎంత తీవ్రంగా వచ్చిందంటే అసలు నేను ఎన్నాళ్లై మంచం మీదున్నానో అర్థంకాలేదు.ఆలోచనలు సాగడం లేదు. తలనొప్పిగా ఉంది. నీరసం అనిపించి కళ్లు మూసుకున్నాను. అమ్మ వుందన్న ధైర్యం.

స్కూల్ స్టాఫ్ వచ్చి చూసి వెళ్లేరు. స్కూల్లో పనిచేసే ఆయా కమల మాత్రం ఆవేశంగా అంది, ‘ఆ మూర్ఖులకి మీరేం చెయ్యలేరు మేడం. వాళ్లకి చదువులు రావు. దేవుడు మాస్టారు చెప్పిందే రైటు. అసలు మీకెవరిమీదైనా అనుమానం ఉంటే చెప్పండి. వాళ్లని నడిరోడ్డుమీద కి ఈడ్పించి పోలీసులకి పట్టిస్తాం.పిల్లలవరకూ ఈ విషయం వెళ్లనీయలేదు మేమెవ్వరం. టీచరుగార్కి జ్వరం అని మాత్రం చెప్పేం.’ ఒక నిముషం ఆగి,

‘ ఎవరు చేసేరో చెప్పండి టీచర్, మేం చూసుకుంటాం వాళ్ల పని’ అంది మళ్లీ.

‘ లేదు కమలా, ఎక్కడో పొరపాటు జరిగింది అనుకుంటున్నాను. నన్నెవరూ కావాలని కొట్టలేదులే.’ ఆమెని శాంతింపచేసే ప్రయత్నం చేసేను.

‘ గూడెం నుంచి పెద్దోళ్లెవరైనా వచ్చి అడిగితే, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడిన తర్వాతే ఇంక క్లాసులు పెట్టండి మేడం. మీరింక రాబోకండి’

నేను నవ్వేసేను, ‘ఏం భయం లేదు కమలా, మీరంతా ఉన్నారుగా.’ నా మాటలకి అందరూ తెల్లబోయారు.

అమ్మ తనకి లీవ్ అయిపోతోందని వెళ్లాలంది.  ఊరికి బయలుదేరేముందు నన్ను తనతో పాటు ప్రయాణం చేయించాలని విఫల యత్నం చేసింది.

ఆఖరికి కోపంగా, ‘ ఇలా తల బ్రద్దలైందంటూ కబురొచ్చినా మళ్లీమళ్లీ నేను వచ్చి చెయ్యలేను. పంతానికి పోకుండ ఆలోచించు. నీ చదువుకి ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది. ఇంక నీ ప్రయోగాలు ఆపి ఇంటికి రా ’ అంటూ అమ్మ వెళ్లిపోయింది.

ఏమో, నాకైతే జీవిక నిచ్చిన ఆ ప్రభుత్వోద్యోగం కంటే సాయంకాలం ఆ పిల్లల మధ్య గడిపే సమయమే నచ్చుతుంది. ఈ పిల్లలు నా జీవితంలో ఎంత ముఖ్య భాగమైపోయారో తలుచుకుంటే ఆశ్చర్యం!

అమ్మ వెళ్లిన రెండో రోజు డ్యూటీలో జాయినయ్యాను. ఆ సాయంత్రం నేను స్కూలు నుండి ఇల్లు చేరేసరికి అమ్మ ఫోన్ చేసింది, ’ ఇంక గూడెంలో సాయంకాలం క్లాసులు మళ్లీ మొదలు పెట్టకు’ అంటూ.

‘ అమ్మా, ప్లీజ్, మళ్లీ మళ్లీ అలాంటివేమీ జరగవమ్మా, అక్కడందరికి నేనంటే బోల్డు ప్రేమ. ‘

రుద్ధమవుతున్న గొంతుతో అమ్మ అంది, ‘దీపూ! నాకూ నువ్వంటే బోల్డు ప్రేమ ఉందిరా’

‘ అయితే సరే. ఆ ప్రేమే నాకు రక్ష. ఇంకేం చెప్పకమ్మా’ అంటూ ఫోన్ పెట్టేసేను.

గబగబా వంట ఏర్పాటు చేసుకుని గూడెంలోకి నడుస్తూంటే ఎప్పటిలాగే ఆ పరిసరాలు నాకు ఎంతో ఆత్మీయమైనవే అన్న భావన కలిగింది. కొంతమంది ఆడవాళ్లు గుమ్మాల్లో నిలబడి నన్ను క్రొత్తగా చూస్తూ వుండటం గమనించాను. నేనే అలా వూహించుకుంటున్నానేమో అని కూడా అనిపించింది.

ఆ సాయంత్రం పిల్లలు మధ్య ఉన్న నన్ను దేవుడు మాస్టారు పలకరించారు. …………

‘ పిల్లల్ని ఈ పూటకి పంపించెయ్యమ్మా. మావాళ్లు నీతో మాట్లాడాలనుకుంటున్నారు’అంటూ.

ఏం మాట్లాడుతారబ్బా అని ఆశ్చర్యపోతూనే పిల్లల్ని పంపించేసేను.

ఒక ఇరవై మంది దాకా ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నారు. వచ్చి చాపల మీద కూర్చున్నారు.ప్రక్కనే అరుగుమీద మాస్టారు కూర్చున్నారు.

‘ టీచరమ్మా, మీరిన్నాళ్లూ జ్వరం వచ్చి రాలేదు అనుకుంటున్నాం. కాని గూడెంలోనే ఇలా జరిగిందని తెల్సింది. వాళ్లెవరో చెప్పండి. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం. అసలు ఇలాటి పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి వచ్చింది మాకు తెలవాల’ ముందుగా లేచిన ఆయన కాస్త దూకుడుగానే అడిగాడు.

‘ ఆ సంగతి మనం మర్చిపోదామండి. ఏదో పొరపాటు జరిగింది. ‘ తేలిగ్గా తీసేయబోయాను.

నలుగురైదుగురు లేచేరు మాట్లాడేందుకు.

‘ టీచరుగారూ, ఇది మాగూడేనికి, మా పరువుకి సంబంధించిన విషయం. మా పిల్లల్ని బాగు చెయ్యాలని మీరొస్తావుంటే ఇంత అఘాయిచ్చెం జరిగితే మేము ఎట్టా మరిచిపోతాం?’

‘విషయం మాకు తెలవాల, అంతే’

‘ మీరు మనసులో పెట్టుకు బాధ పడుతున్నారు. తప్పు చేసిన వాళ్లని కాయాలనుకుంటున్నారు.ఎందుకు మేడం? మాలో ఎవరీ పని చేసేరో, అది పిల్లలో, పెద్దలో ,అసలు ఎందుకు చేసేరో మాకు తెలవాల’ ఒకావిడ కాస్త పట్టుదలగానే అంది.

నేను నిశ్శబ్దంగా విన్నాను. అవును, తరచి, తరచి అమ్మ అడిగినప్పుడు, జ్వరం తగ్గి నీరసంతో పడుకున్నప్పుడు కూడా నేను ఆలోచించాను. ఈ విషయం ఎక్కడో ఏదో లింకు క్రమంగా దొరికింది. కాని పైకి చెప్పదలచుకోలేదు.

రెండు నిముషాలు ఆగి ,’టీచరమ్మా, నువ్వు చేసే మంచి పనికి దణ్ణం పెట్టాల్సింది పోయి మా గూడెం ఇట్టాంటి పని చేసిందంటే మాకు సిగ్గుగా ఉంది. నువ్వు ఎట్టైనా చెప్పాల్సిందే. లేదంటె మేమెవ్వురం ఈ పూట భోజనాలు చేసేది లేదు’ మరో వృధ్ధుడు కాస్త ఆపేక్షగా హెచ్చరించాడు.

రోజూ నా క్లాసు జరుగుతున్నంతసేపూ ప్రక్కనున్న రచ్చబండ మీద ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడాయన.

పిల్లలు అల్లరి చేస్తుంటే , ‘గట్టిగా నాలుగు తగిలించమ్మా. చదువులు అట్టా ఇట్టా ఊర్కేనే రావు ఈ సన్నాసులకి’ అంటూ కలుగ చేసుకుంటూ పిల్లల్ని బెదిరిస్తూ ఉంటాడు.

ఏం చెయ్యాలి? వీళ్లకి ఏం చెప్పాలి?

ఒక నిశ్చయానికి వచ్చాను. దీర్ఘంగా శ్వాస తీసుకుని మొదలు పెట్టేను.

‘ ఇక్కడ చదువుకుందుకు చాలా మంది పిల్లలు ఆశగా వస్తున్నారు. ఒక మూడు నాలుగు వారాలుగా ఆడపిల్లలు రావడం తగ్గింది. ‘…….ఒక్క క్షణం ఆగాను. అందరూ నేను చెప్పబోయేదేమిటో అన్నట్లు చూస్తున్నారు.

‘వాళ్లకి ఇళ్లలో ఏవో సమస్యలు ఉండటం వలన రావడం లేదని, ఇది తాత్కాలికమే అనీ, వీలువెంట వస్తారని ఎదురుచూసేను.కాని మానేసిన వాళ్లలో ఒక అమ్మాయి స్కూలు నుంచి వస్తూంటే చెప్పింది, కొందరు మగ పిల్లలు అల్లరి చేస్తున్నారని , తమకు చదువుకుందుకు రావాలంటే సాయంకాలం పూట ఇబ్బందిగా ఉంటోందని…………..’ నా ఎదురుగా వింటున్న వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు…………….

‘ నా వైపు నుండి మీ అందరికీ చెప్పదలచుకున్నది ఒకటి ఉంది .పిల్లలు పెరుగుతున్న వయసులో వాళ్లకి మంచి చెడ్డలు తెలియ చెప్పి, సరైన మార్గం లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిమీదా ఉంది.మీరు ఆలోచిస్తారని చెబుతున్నాను.

మన క్లాసులో కొంతమంది మగ పిల్లలు ఆడపిల్లల్ని ఏడిపిస్తూంటే , తప్పు అని చెప్పేను. ఒకరోజు విన్నారు. మరునాడు అదే ధోరణి. నేను చెబుతున్న విషయం వాళ్లు నవ్వులాట గా తీసుకుంటున్నారని అర్థం అయింది. ఏం చెయ్యాలి. ముందు మెల్లిగా చెప్పి చూసి, ఆ తర్వాత కాస్త గట్టిగానే మందలించాను. మర్నాడు పెద్ద క్లాసు ఆడపిల్లలు తో పాటు మగ పిల్లలు కూడా రాలేదు .క్లాసుకొచ్చిన ఒక పిల్లవాడు నాతో చెప్పేడు,

‘ టీచర్, మీరు నిన్న కోప్పడ్డారు కదా, మీరు ఒక్కరూ ఇంటికెళ్ళేప్పుడు మీసంగతి తేలుస్తామని చెబుతున్నారు’ అంటూ. నాకు ఏం వింటున్నానో ముందు అర్థం కాలేదు. కాని మనం పసిపిల్లలు అనుకుంటున్న వాళ్ళు ఇలాటి ఆలోచనలు చేస్తున్నారంటే కష్టంగా అనిపించింది………..అదే రోజు ఈ హడావుడి జరిగింది. మనమిక ఆ విషయాన్ని తవ్వుకోవద్దు. నేను చెప్పేది ఒక్కటే ,మనమంతా పిల్లల్ని దారిలోకి తెచ్చుకుందుకు కాస్త శ్రమ అయినా ఓర్పుగా ప్రయత్నం చెయ్యాలి…………….’

నా మాటలు పూర్తి అవుతూనే నలుగురు లేచేరు ఆవేశంగా.

‘ఎవరో చెప్పండి మేడం,ఆళ్ల కాళ్ళు చేతులు ఇరగ్గొడతాం’

‘ దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. పిల్లల్ని కేవలం దండించడం వలన మార్పు తీసుకురాలేం. నాకు నమ్మకం ఉంది, పిల్లల్ని బుజ్జగించి మార్పు తీసుకురావచ్చు. ప్రయత్నం చేద్దాం.అలా మార్పు రాని పక్షంలో ఏంచెయ్యాలో ఆలోచిద్దాం.’

‘ కానీ టీచరుగారూ, మా పిల్లలు ఎట్టాటోళ్లో మీరు చెప్పకపోతే మాకు తెలిసేదెట్టా? చదువుకుందుకు ఎళ్ళేడని అనుకుంటాం. పిలగాళ్లు బయటికెళ్లి ఎట్టాటి పనులు చేస్తన్నారో మాకు ఎట్టా తెలుసుద్ది ?మీరు చెబితేనే కదా మాకు తెలిసేది. మేం గట్టి భయం చెబుతానికి వీలవుద్ది.’

నేను నవ్వేను.

‘ మన పిల్లలు ఎలాటి వాళ్లో, ఎంత అల్లరి చేస్తారో మనకు తల్లిదండ్రులుగా ఎటూ తెలుస్తుంది. కాని మన పిల్లలు గురించి ప్రక్కింటి వాళ్లో, ఎదురింటివాళ్లో మనదగ్గర కొచ్చి ‘మీ వాడు అల్లరి చేస్తున్నాడు’ అంటే  మనకి నచ్చదు. వాడు నిజంగా అల్లరివాడే అయినా మనకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు.’

నా మాటలు అర్థమై ఒక్కక్షణం మౌనంగా ఉన్నారు వాళ్లంతా. అంతలోనే మళ్ళీ అన్నారు,

‘ లేదులే టీచరుగారూ, ఇది అట్టా అనుకునేది కాదులే. మీరు మాకు విషయం చెప్పాల’

నేను మాత్రం ఇంక చెప్పేది ఏమీ లేదని, నాకు సమస్య ఏదైనా వస్తే వాళ్లకి చెప్పుకుంటాననీ పదే పదే చెప్పాను.

నామాటలు వాళ్లకి తృప్తి కలిగించలేదు. చాలా సేపు వాళ్లల్లో వాళ్లు తర్జనభర్జన పడ్డారు. నేను సెలవంటూ ఇంటికి బయల్దేరాను.

*