ఆ హేమంత ఋతు గానం వినిపిస్తోందా?!

konni sephalikalu

 

మార్గశీర్ష మాసం, అందులోంచి కొన్ని రోజులు గడవగానే పుట్టుకొచ్చిన ధనుర్మాసం. ఇప్పటికీ ఆకాశవాణి తెలుగు కేంద్రం వాళ్ళు గోదాదేవి పాశురాల రూపంలో శ్రీరంగనాధునికి చేసుకున్న విన్నపాలను ప్రతీ ఉదయం వినిపిస్తూనే ఉన్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేట తెలుగు మాటల్లో.  ఈ ఉదయం కళ్ళు తెరిచే లోపే రేడియోలోంచి ఆ పాట  మంద్ర మధురంగా చెవులకేకాక శరీరమంతటికీ వినిపించింది.

“చీకాకు పడకు, చిడుముడి పడకూ ! నీ కరుణవినా నాకేమున్నది చెప్పూ” అంటూ మొదలయిన గీతం. కృష్ణుడి మీద ఎందుకు గోదకి అంత పిచ్చి ?! ఒక్క గోదాదేవి కేనా ?

హై స్కూల్ రోజుల్లోనే జయదేవుడు పరిచయమయ్యాడు “యాహి మాధవ, యాహీ కేశవా, మావద కైతవ వాదం” అంటూ అష్టపదుల రూపంలో.  కృష్ణుడు కితవుడే, మోసగాడే. ఓ మాధవా! మోసపు మాటలు లేదా దొంగ మాటలు చెప్పకు అంటుంది రాధ.  ఇలా దొంగమాటల మోసకారిని ప్రేమించి ఆ రాధ ఎందుకు ఎప్పుడూ ‘విరహం’ లోనే వేగుతుంది.  జయదేవుడి గీత గోవిందం నిండా ఈ ‘విరహం’ అన్న పదమే పలుమార్లు వినిపిస్తూ ఉంటుంది. కృష్ణుడితో  ఉన్నదంతా విరహమే. చెప్పిన సమయానికి రాడు, ఎన్నడూ.

“కధిత సమయేపి హరి అహహ న యయౌ వనం, మమ విఫలం ఇదం అమల రూపమపి  యౌవనం” అంటూ గోల పెడుతుంది.  చెప్పిన సమయానికి వనానికి రాలేదు. ఈ అమల సుందరమయిన రూపమూ, యవ్వనమూ కుడా విఫలమయిపోయాయి అని వాపోతుంది. “యదను గమనాయ నిశి  గహన మపి  శీలితుం, తేన మమ హృదయం ఇదం అసమశర కీలితం” అనీ గొడవ పెడుతుంది.  వస్తానని చెప్పిన ఆ సమయం ఏదీ-? అర్ధ రాత్రి.  ఎవడి కోసమయితే ఎంత కష్టమయినా చిమ్మ చీకట్లలో, (నిశి అన్న మాట వాడేడు కవి.)  వెతుక్కుంటూ పోయేనో వాడి వల్లే నా హృదయాన్ని ఇపుడు మన్మధుడు తూట్లు పొడుస్తున్నాడు.  అనీ ఘోష పెడుతుంది.  ఇలాంటి వాక్య నిర్మాణ ప్రయోగం జయ దేవుడి లాంటి సంస్కృత కవుల నించే  ఇప్పటి సినిమా రచయితల దాకా వచ్చింది (ఎవడు కొడితే… ) ఇలా ఇప్పుడు వేధించి, విరహించి, చంపే కృష్ణుడంటే రాధకు ఎందుకంత ఇష్టం ?!

అసలు జయదేవుడే రాధ.  మన గజల్ కవుల్లా జయదేవుడి ప్రతి అష్టపదిలోను చివర అతని పేరు రాసుకుంటాడు. “జయదేవ భణిత మిదం”, “జయదేవ కవి రాజ రాజే” అంటూ.  కాని గీతాలన్నింటా అతనే నిండిపోయాడు.  రాధ పలవరింతలూ, పులకింతలూ అతనివే. ‘యా రమితా వనమాలినా’ ఎవరైతే వనమాలితో ఆనందోన్మాదంలో ఉందో ఆమె సజల జలద సముదాయాలను చూసి  పూర్వంలా తపించడం లేదు అని రాస్తాడు.  “సజల జలద సముదయ రుచిరేణ దహతినసా మనసిజ విశిఖేన “  ఆ రాధ నల్ల మబ్బులు చూసి మన్మధ బాణాల చేత కాల్చబడడం లేదు . ‘న దహతి’  అన్న మాట తెలుగు చెయ్యడం కష్టం.  అతను చెంత ఉంటె ఇక ఏవీ బాధించ లేవు.  ప్రపంచమే తెలియదు.  ఎందుకు జయదేవుడికి మాత్రం ఇంత “లలిత లవంగలతా పరిశీలన కోమల మలయ సమీరాల్లాంటి” పదాల అల్లికలతో ఇన్ని గేయాలు గుండెలోంచి ప్రవహించాయి.  ఆ ‘కందర్ప జ్వరమేదో’ అతనికీ రాధకు లాగే ఒళ్లెరగకుండా కాసింది.  అప్పటికీ ఇప్పటికీ కూడా జయదేవుడిని వింటే అలాంటి జ్వరాన్ని మనమూ ఎంతో కొంత అనుభవించక తప్పదు’ అయితే ఈ కృష్ణుడు నిజంగా దొంగ కృష్ణుడే.

tiru1

పాపం పోతనగారి రుక్మిణి కూడా ఇలాంటి ఎదురు చూపుల సందేహంలోనే పడింది. “ఘనుడా భూసురుడేగెనో”… “విని కృష్ణుండిది తప్పుగా తలచునో, విచ్చేయునో,…. నా భాగ్య మెట్లున్నదో అంటూ,” ఎందుకు వీళ్ళందరూ ఇతని కోసం ఇలా అలమటించేరు – ? అతనిలోని ఆ ఆకర్షణ ఏమిటి ? ఎందుకలా పిచ్చిగా ఆరాధించాలనిపిస్తుంది ?

ఆ అసలు కృష్ణుడు నాకు భారతంలో దొరికాడు.  నిగ్రహమూ ప్రేమా కలగలిసిన కృష్ణుడు అతను.  ఓపిక పట్టడం తెలిసిన వాడు. అదను కోసం ఎదురు చూడడంలో ఏమరుపాటు లేనివాడు.  అలాంటి కృష్ణుడిని తప్ప మరెవరిని ప్రేమిస్తాం అనిపించేలా,పై ప్రశ్నలకి జవాబులా.

అరణ్యవాసం తర్వాత అజ్ఞాత వాసం చివర, సంధికి వెళ్లబోయే ముందు కృష్ణుడు ఒక్కొక్కరి అభిప్రాయమూ అడుగుతాడు.  పాండవులు అయిదుగురూ చెప్పేక ద్రౌపది దగ్గరకొచ్చి ఆమెను అడగ్గానే ఆమె ఆ సమయం  కోసమే చూస్తున్నట్లు పులిలా గర్జిస్తుంది.  ఇంచుమించు అయిదుగురు భర్తల్నీ మాటలతో చీల్చి చెండాడుతుంది.  ఇక మాట్లాడి మాట్లాడి అలిసిపోయి తన అవమానం తల్చుకుని భోరుమని ఏడుస్తుంది.  అంత వరకు కృష్ణుడు పెదవి విప్పడు.  మౌనంగా వింటాడు.  చివరకు “ఎలుగు రాలు పడ నేడ్చిన యాజ్ఞసేనిన్ కృపాయత్త చిత్తుండయి నారాయణుండురార్చి” అని రాస్తారు తిక్కన గారు.  గొంతుకు ఆర్చుకుపోయేలా ఏడ్చేదాకా మాట్లాడకుండా, చెప్పినదంతా విని అప్పుడు మాట్లాడుతాడు.అలా ఆమె బాధ అంతా బయటకు పోవాలి . “మ్రుచ్చిర నేల ఏ గలుగ ముద్దియ” అని మొదలు పెడతాడు. ‘ఏ గలుగ’ అంటే ‘నేను ఉండగా’ అని.  ఇది చిన్నమాటగా కనిపిస్తున్న చాలా పెద్ద మాట.  ఓ అమాయకురాలా! నేను ఉండగా నువ్వు ఎందుకు ఇలా అలజడి చెందుతావు అని.  ప్రతి మనిషీ, ముఖ్యంగా స్త్రీలు ఇలా అనే వాళ్ళ కోసం తమకు తెలీకుండానే ఎదురు చూస్తారు.  అన్ని వేళలా అలాంటి తోడు ఉంటే  ఇంకేం కావాలి ? అలాంటి వాళ్ళని పిచ్చిగా ప్రేమించకుండా ఉండగలమా ?

ఊరికే అనడం కాదు.  తను ఆమె కోరుకున్న విధంగా సాధించబోయే కార్యం గురించి కూడా చెప్తాడు.  నువ్వు భయ పడినట్లుగా కౌరవులతో సంధి జరగదు.  యుద్దమే జరుగుతుంది.  ఈ ధర్మరాజే పంపగా వృకోదరుడు, వివ్వచ్చుడు (నిర్విరామంగా బాణాలు వేయగల అర్జనుడు) తోడురాగా శత్రునాశనం చేసి తిరిగి వస్తాను అలాంటి ‘నేను’ ఉండగా అని చెప్పిన కృష్ణుడు ద్రౌపదికి ఒక్క దానికే చెప్పలేదనిపిస్తుంది.  ఎవరు అతని ముందు తమ దుఃఖమంతా చెప్పుకుని ఏడ్చినా అదంతా శ్రద్ధగా విని ‘ఎందుకీ దుఖం నేనుండగా’ అని అంటూ ఉంటాడనిపిస్తుంది.టాగూర్ లా అతను మన కూడా ఉన్నాడని నమ్మగలగాలే గాని .

దీన్ని ముక్కు తిమ్మన పట్టుకున్నాడు.  పారిజాత పువ్వుకోసం సత్యభామ ఇలాగే ఏడుస్తుంది.  పువ్వు వల్ల  జరిగిన అవమానానికి కూడా. ఆ అవమాన భారం ఆమె గుండెల మీంచి దిగే దాకా ఆమె మాటలూ చేతలూ సహిస్తాడు ఆ మాయదారి కృష్ణుడు.  అంతా అయ్యాక ఆమె వడలిని మొహం మీద కొంగు కప్పుకుని కోకిల కంఠంతో ఏడ్చింది. అప్పుడు మాట్లాడేడు. “ఓ లలితేంద్ర నీల శకలోపమ కైశిక ఇంత వంత నీ కేల లతాంత మాత్రమునకే గలుగ” అంటూ. ఏడ్చి ఏడ్చి మొహం వడిలిపోయింది. ఆభరణాలు లేవు. మాసిన చీర. కాని ఆమె నొక్కుల జుట్టు మాత్రం లలితమయిన ఇంద్ర నీల మణుల మెరుపుతో ఉందట.  అలాంటి అందమయిన కేశ రాశితో వెలుగుతున్నదానా ! నేనుండగా ఒక్క పువ్వు కోసం ఇంత వంత నీకెందుకు ? అని.  ఇక్కడ కూడా మళ్ళీ కృష్ణుడు అదే అన్నాడు ‘నేనుండగా’ అని . అదే భరోసా.  తిక్కన గారి కృష్ణుణ్ణి నంది తిమ్మన బాగా అర్ధం చేసుకున్నాడు.

ఇక్కడ కూడా ఊరికే ‘నేనుండగా ఇంత బాధ ఎందుకు ?” అనడం లేదు.  ఆ  బాధ ఎలా పోగొడతాడో చెప్తున్నాడు. “అనికిన్ బలసూదనుడెత్తి వచ్చినన్… ఇట తెచ్చెద నిచ్చెద పారిజాతమున్” “సాక్షాత్తు ఇంద్రుడే యుద్ధానికొస్తాడు.  ఎందుకంటే ఆ చెట్టు ‘నందనం’ అనే అతని తోట లోది.  అయినా ఇక్కడికి తెచ్చేస్తాను.  మన పెరట్లో ఎక్కడ నాటాలో ఆ చోటు చూసిపెట్టుకో” అంటాడు. చేస్తాడు కూడా.

అభిమానవంతులయిన ఆడవాళ్ళకు వస్తువులు కాదు కావలసినది.  తమ అవమానాల బాధల గాధలు ఓర్పుతో, శ్రద్ధగా వినే పురుషులు కావాలి.  అంతా విన్నాక నేనుండగా నీకెందుకీ బాధ అని ఎవరు చెప్తారో వారే ప్రియతములు.  అందుకే అలాంటి వారిని గురించి “సా విరహే తవ దీనా” అని జయదేవుడు రాస్తాడు.  ఆమె నీ విరహంలో ఉంది కృష్ణా,  అని ఎనిమిది చరణాల నిండా నిండి పోయేలా పాడతాడు. “వ్యాళ నిలయ మిళనేన గరళ మివ కలయతి మలయ సమీరం” అంటాడు.  మలయ పర్వతం మీద ఉన్న గంధపు చెట్లకి పాములు చుట్టుకుని ఉంటాయి.  వాటి గరళం ఆ గాలిలో కలిసినట్టుగా ఆమె మలయ సమీరానికి ఖేద పడుతోంది.  ఇదంతా నీ విరహం వల్లనే అని జయదేవుడు రాస్తే కృష్ణుడంటే ఏమిటో తెలియపోతే ఆమె వ్యధ గానీ, ఆ కవిత్వం గాని ఏం అర్ధమవుతాయి.

చాలా పై స్థాయి ఎగ్జిక్యుటివ్ లాగ కృష్ణుడు ‘సమయానికి తగు మాటలాడును, మాటలాడకుండును’అన్నట్టు ఉంటాడు.  పోలిక బావులేదు గానీ మన కళ్ళ ముందు ఉండే  ఉపమానం అదే కదా ?శిశుపాల వధ దగ్గర సరే  చివరి దాకా మాట్లాడడు.అది అందరికీ తెలిసిన కథే. అంతకు ముందే  ద్రౌపదీ స్వయంవరానికి బ్రాహ్మణ వేషాల్లో వచ్చిన పాండవులను చాలా ముందుగా గుర్తుపట్టినవాడు కృష్ణుడొక్కడే.  వీళ్ళు ఈ వేషాల్లో నివురు కప్పిన అగ్నికణాల్లా ఉన్నారనుకుంటాడు.  పక్కనే ఉన్న అన్న బలరాముడితో కూడా అనడు. కృష్ణుడు భగవదవతారం అన్న మాట పక్కన పెడదాం.  చనిపోయిన అయిదుగురు ఆప్తులు ఒక్కసారిగా బతికి ఉండి  కనిపిస్తే ఎవరితోనూ పైకి అనకుండా ఉండడం ఎంత కష్టం.  కానీ అది పైకి మాట్లాడే సందర్భం కాదు.  మాట్లాడితే రసాభాస అవుతుంది.  స్వయంవరం పూర్తయ్యాక అక్కడొక యుద్ధం జరిగే పరిస్థితిలో బలరాముణ్ణి ఆపడానికి అప్పుడు నోరు విప్పి చెప్తాడు.  ఒక్కసారిగా అంతా తెలిసి కూడా ఆ సందర్భంలో అలా మౌనంగా కూర్చున్న కృష్ణుడి నిగ్రహం చూస్తే, దాని వెనక ఉన్న పాండవుల మీది ప్రేమ చూస్తే మనకి కృష్ణుడు ఎంత ఆరాధ్యుడవుతాడు!!

tiru2

చివరి గా ఎస్ .ఎల్.భైరప్ప అనే ప్రసిద్ధ కన్నడ నవలా రచయిత తన పర్వ నవల లో కృష్ణుడి విజయ రహస్యానికి చెందిన ఒక సంఘటన ను ఎంతో వివరంగా రాస్తాడు .అది చెప్పేది కాదు.చదివి తీరవలసిందే. జరాసంధుడి బాధలు పడలేక, వాడిని జయించ లేకా కృష్ణుడు యాదవులందరినీ తీసుకుని రాజ్యం వదిలి పారిపోతాడు .అంతమందిని రక్షించడం కోసం పారిపోవడం అవమానం అనుకోడు. ఎక్కడో సముద్ర తీరాన ద్వారకానగరం కట్టుకుని దాక్కుంటారు. హాయిగా ఉన్నారు గనక అందరూ పాత ఓటమి తాలూకు అవమానం మరచిపోయారు .కానీ కృష్ణుడు మరచిపోడు.ఓర్పు గా ఉండి అదను కోసం వేచి ఉంటాడు .తగిన సమయం రావడానికి చాలా కాలం పడుతుంది అప్పటిదాకా వ్యూహ రచన చెస్తూ ఉంటాడు .చివరకు జరాసంధుడి వధ మనకు తెలిసినదే . భైరప్ప గారు ఈ అధ్యాయమంతా సవివరంగంగా రాసి కృష్ణుణ్ణి ప్రేమించకుండా ఉండడం సాధ్యం కాదని తేల్చేసారు .

భాగవత కృష్ణుడు ప్రేమికుడు . జయదేవుడు ఆ కృష్ణుడి నే తెచ్చుకున్నాడు .”యది హరి స్మరణే సరసం మనో, యది విలాస కలాసు కుతూహలం ,మధుర కోమల కాంత పదావలీం ,శృణు తదా జయదేవ సరస్వతీం”.అని ముందే చెప్పుకున్నాడు.హరిస్మరణనీ ,విలాసకళనీ మధుర, కోమల, సుందర పదాలో కలిపి అందిస్తున్నాను . ఈ మధువు తాగండి అన్నాడు. ఇక భారత కృష్ణుడు బహుముఖీన చతురుడు,అసామాన్య మానవుడు

ఇతడే ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు .పన్నెండు నెలల లోనూ నేను ఈ మార్గశిరమాసాన్ని అన్నాడు.దీని తాత్వికార్ధం పెద్దలూ చెప్పాలి .నేను భావుకతార్ధం చెప్తాను .ఈ నెలలో వచ్చే చలికాలం మనుషులకు శరీర స్పృహను, తద్వారా త్వగింద్రియ స్పర్శను సున్నితం చేస్తుంది. అలా సన్నిహితం కూడా చేస్తుంది.ప్రేమికుడైన కృష్ణుడు ఈ నెలంతా వారిని ఆవహించి , విరహితం చెయ్యకుండా అత్యంత సన్నిహితమే చేస్తాడు .

ఇలా జయ దేవ కృష్ణుడు ,భారత కృష్ణుడు కలగలిసి చేసే హేమంత ఋతు గానం ప్రతీసారీ నిత్య నూతనమే,వినగలిగితే.

*

 

 

నీవూ నేనూ వలచితిమీ…

konni sephalikalu

 

బాల మురళీ గారు ‘దివిజ సంగీతవరు గుండియల్ దిగ్గురనగ’ అన్నట్టుగా అమరపురిని చేరగానే సంగీత ప్రియులందరూ ఆయన పాటల్ని అవిరామంగా పంచుకున్నారు. అలాగ వాట్సాప్ లో నన్ను చేరిన పాట  వింటుండగా రకరకాల ‘జాలి గాధలు, విషాద గాధలు’ గుర్తొచ్చాయి.  “నీవూ నేనూ వలచితిమీ, నందనమే ఎదురుగ చూచితిమీ’’ అన్నఆ పాట భీష్మ సినీమా లో సుశీలమ్మ గారితో అనుకుంటాను కలిసి పాడిన పాట.  బాల మురళీ గొంతులో మిగిలిన అన్నింటితో పాటు ‘రసం’ కూడా నిర్భరంగా నిండి జాలుగా ప్రవహించి మననీ అందులోకి లాక్కెళ్ళి ‘పరవశం’ అనే మత్తు కలిగిస్తుంది, అది అనురాగరసం అయితే ఇంకా తొందరగా.

అందుకే ‘నీవూ నేనూ వలచితిమీ’ అని ఆయన నోటి వెంట గాత్ర సమ్మిళితంగా రాగానే ఆ స్వరంలోంచి ఆ పరస్పర అనురాగ మాధుర్యం సాంబ్రాణి పొగలా కమ్ముకుంది. సాధారణమైన ప్రేమికుల భాష ‘ఐ లవ్ యు’ అనగానే వెంటనే ‘ఐ టూ’ అన్నది ఎంత వికారంగానేనా ఉంటుంది వెంటనే అప్పు తీర్చేసుకున్నట్టు.  అలాంటి కృతక వాతావరణంలో ఒక్కసారి ప్రణయ మాధ్వీ రసం జాలువారే స్వరంతో ఆయన ‘నీవూ నేనూ వలచితిమీ’ అనగానే ఎన్నో ప్రణయ హృదయాల సంవేదనలు మదిలో కదిలేయి.

ఈ విషాద ప్రపంచంలో ఏ ఇద్దరేనా సమాన హృదయం ఉన్న స్త్రీ పురుషులు ‘నీవూ నేనూ వలచితిమీ’ అనుకోగలిగితే అది ఎంత గొప్ప అనుభవం. అది కొద్ది కాలమే అగుగాక.  ఎల్ల కాలమూ ఎలాగూ నిలవదు నూరు శాతం.  కాని ఎంత కొద్ది కాలమయినా పరస్పరానురాగం ఆ జీవితాలను గొప్పగా కాంతివంతం చేసి తీరుతుంది.

అలా కానివాళ్ళు, ఒకవేపే ప్రేమించి ఎదుటివారి ప్రేమ కోసం అలమటించే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు పాపం ఆశోపహతులు, ఎప్పటికీ ఆ ప్రేమ పొందలేని వాళ్ళు , నీవూ నేనూ వలచితిమీ అనుకోలేని వాళ్ళు గుర్తొచ్చారు. అందులో మొదటి వ్యక్తి మహా భారత కథలో దేవయాని.

దేవయాని రాక్షస గురువు శుక్రాచార్యుడి గారాల కూతురు. తల్లి లేని పిల్ల.  స్వంత వ్యక్తిత్వంతో ఠీవిగా జీవిస్తున్న స్త్రీ.  తన ఇంటికి వచ్చి, తన తండ్రికి శిష్యుడై, ఆయన కనుసన్నల్లో ఉంటూ తన పట్ల ‘అటెన్షన్’ తో ఉండే  బృహస్పతి కొడుకు కచుణ్ణి ప్రేమించింది.  కచుడిదంతా అవసరం.  కానీ అందులో స్వార్ధం లేదు.  అది పూర్తిగా దేవకార్యం.  కాని దేవయాని తన యవ్వనపు ప్రధమ ప్రణయంలో కచుడిని గాఢతరం గా ప్రేమించింది.  ఆ తన ప్రేమ మాట మాట తండ్రి తో ఎంతో ధైర్యంగా చెప్పింది .ఆ మాటల్ని నన్నయ గారు పద్యాలలోకి ఎలా పట్టి తెచ్చారో చూద్దాం.

అడవికి గోవుల వెంట వెళ్ళిన కచుడు ఇంకా రాలేదు. సాయంత్రం అయినప్పటినుంచీ ఆమె ప్రతి క్షణమూ ఎదురు చూస్తూనే ఉంది.  చీకటి పడి చిక్కబడింది.  అయినా రాకపోతే సరాసరి తండ్రి దగ్గరకే వెళ్లి ఇలా అడిగింది.

వాడి మయూఖముల్ కలుగువాడ పరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ నిష్టమెయిన్ భవదగ్నిహోత్రముల్

పోడిగ వెల్వగా బడియె ప్రొద్దును పోయె కచుండు నేనియున్

రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నందెనో

భారతీయ సాహిత్యంలోనే ఇది అరుదయిన పద్యం. తన ప్రియుడి కోసం ఎదురుచూసి ఆ ఎదురు చూపు గురించి కన్న తండ్రికే చెప్తూ ప్రశ్నించిన నాయిక దేవయాని .  వెంటనే ఏ తండ్రి అయినా” నీకేమిటి అతని మీద అంత శ్రద్ధ?” అని అడిగి తీరుతాడు . ఎందుకంటే పై పద్యంలోని  ఆమె ఎదురు చూపులో కాలమానం ఉంది. క్షణక్షణమూ ఆమె పడుతున్న ఆందోళన ఉంది. ఆమె ఇలా అంటోంది. “సూర్యుడు అస్త మించాడు.  రోజూ ఆలోపే కచుడు ధేనువులతో ఇంటికొస్తున్నాడు.  కానీ ఆ సమయం దాటి పోయింది.  పైగా ధేనువులు వంటరిగా వచ్చేశాయి.  అయినా నీ అగ్నిహోత్రాన్ని వెలిగించుకుని నువ్వు నీ నిష్టలోనే ఉన్నావు తప్ప పట్టించుకోలేదు. చివరికి పొద్దు పోయింది కూడా.  అతనికేదయినా ఆపద రాలేదు కదా?” అని అడిగింది.”నీ శిష్యులు ఏమీ చెయ్యలేదు కదా ?”అని కూడా. నిజానికి వాళ్ళే చంపేశారు అతన్ని.

తర్వాత తండ్రి అడగబోయే ప్రశ్నకు కూడా ఆమె వద్ద సమాధానం ఉంది.  ఆమె దుఖం చూసి తండ్రి అన్నాడు కదా” రాక్షసులు అతన్ని చంపేసి ఉండవచ్చు. నీకెందుకు దుఃఖం” అని.  అపుడు ఆమె సాక్షాత్తు తండ్రితో ఇలా చెప్పింది. “ నాన్నా కచుడంటే ఎవరనుకున్నావు.

మతి లోకోత్తరుడైన అంగిరసు మన్మండు, ఆశ్రితుండు, ఆ బృహ

స్పతికిం పుత్రుడు, నీకు శిష్యుడు, సురూప బ్రహ్మచర్యాశ్రమ

వ్రత సంపన్నుడు, అకారణంబ దనుజువ్యాపాదితుండైన, న

చ్యుత, ధర్మజ్ఞ, మహాత్మఅక్కచున కే శోకింపకెట్లుండుదున్ .

లోకోత్తరుడైన ఒకే ఒక వ్యక్తి అంగీరసుడు.అంతటి వాడి మనుమడు ఇతడు. దేవగురువూ, బుద్దిమంతుడు అయిన బృహస్పతి పుత్రుడు, నీలాంటి వాడికి శిష్యుడు, సుందరుడు, ఇవన్నీ జన్మ వల్ల వచ్చిన అర్హతలు.  నడవడిక వల్ల వచ్చిన అర్హత బ్రహ్మచర్యాశ్రమం,అది వ్రతంగా గలవాడు.  అలాంటి వాడి కోసం కాకపోతే ఇక ఎవరికోసం దుఃఖించాలి అని అంది. ఇంత కన్నా నీకు వివరంగా చెప్పాలా ? నువ్వు అచ్యుతుడివి, ధర్మజ్నుడివి,మహాత్ముడివి కూడా అనీ అంది.

ఆమె వల్ల కచుడు బతికాడు, దేవకార్యం నెరవేర్చాడు. కానీ ఆమె భగ్న మనోరధ అయింది. పై రెండు పద్యాలు దృఢమైన వ్యక్తిత్వం ఉన్న దేవయానిని చూపిస్తాయి.  అలాంటి స్త్రీ కచుడు లాంటి పురుషుడ్ని చూసాక, ప్రేమించాక, అది విఫలమైతే ఇక ఎవరితోనైనా జీవించగలదా? ఎవరైనా ఇష్టమవుతారా ? సాక్షాత్తూ పురూరవ వంశ చక్రవర్తి యయాతే ఆమె భర్త అయ్యాడు.  కానీ ఆమె అతనితో ‘నీవూ నేనూ వలచితిమీ’ అనలేక పోయింది.  జీవితాన్ని అలాగే శుష్క హృదయంతో, దాహంతో ఎండ బెట్టుకుంది.  ఇంకెలాగూ సమాధాన పడలేకపోయింది.

windఎక్కడి భారతం, ఎక్కడి ‘గాన్ విత్ ద విండ్’ నవల. దూరాలు కాలాల తాలూకు ఎంత వ్యవధి . కానీ గాన్ విత్ ద విండ్ లో స్కార్లెట్ అనే అందగత్తె అయిన అమ్మాయి కూడా ఇలా తను అమితంగా ప్రేమించిన వ్యక్తి తనకు దక్కకపొతే  జీవితంతో  పెనుగులాడుతూ, రాజీపడలేక, జీవితాన్ని అనుభావించాలనే తపనతో ఎక్కడికక్కడ చేజార్చుకుంటూ నవల పొడుగునా ప్రయాణిస్తుంది.

మనకి కోపమూ, జాలీ, ఏవగింపు, ఆశ్చర్యమూ, ఒకానొకచో ఆరాధనా అన్నీ కలుగుతాయి. యాష్లీ  ని ప్రేమించిన ఆమె అతను దక్కకపోవడంతో జీవితమంతా ఆ దాహంతోనే బతికింది.  ఆ పెనుగులాటలో ఆమెలో ఉన్న సామర్ద్యాలు బయటికీ వచ్చాయి. మోస ప్రవృత్తి పెరుగుతూనూ వచ్చింది.  దాంతోపాటు దేవయానిలాగే ఆమెలో నిర్భీతి, రాజీపడని తత్వమూను.

చివరకు మరెంతో సమర్ధుడైన, తనలాంటి వ్యక్తిత్వమే ఉన్న ‘రెట్ బట్లర్’ అనే మహారాజు లాంటి వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చి ఆమెను అందలం మీద కుర్చోబెట్టినా, యాష్లీని మరవలేకపోయింది. అటు దేవయాని సవతి శర్మిష్ట గానీ, యాష్లీ భార్య మెలనీ గానీ పురుషుల్ని రెచ్చగొట్టే అందాలూ, విలాసాలు ఉన్న స్త్రీలు కారు. శాంతి, సహనాలకు ప్రతీకలు.  అలాంటి వారిని చూస్తే దేవయానికీ, స్కార్లెట్ కీ ఇష్టం లేదు.  వాళ్ళ మీద వారికి చిన్న చూపు.

ఇవాళ స్త్రీ వాదులు ఆడవాళ్ళ నిటారయిన వెన్నుముక యొక్క అవసరం గురించి మాట్లాడిన సందర్భంలో అలాంటి వెన్నుదన్ను ఉన్న ఈ నాయికలిద్దరూ పాపం జీవితం నుంచి ఏం పొందారనిపిస్తుంది. పైగా బాలమురళీ గారు పాడిన లాంటి పాట విన్నపుడు మరీనూ.

అయితే జీవితానికి ప్రణయ సాఫల్యత ఒక్కటే అర్ధాన్నిస్తుందా ? జీవితం అర్ధవంతం కావడానికి ఇలా స్త్రీల వలె పురుషులు కూడా మిధున జీవనమే ఫలప్రదమని భావిస్తారా? అంటే కాదేమో అనిపిస్తుంది. ఒక్క శరత్ దేవదాసు లాంటి మినహాయింపులు తప్పిస్తే.

కచుడు తర్వాత జీవితంలో ప్రేమకోసం వెతకలేదు. తాత్వికుడయ్యాడు. యాష్లీ కుడా మెలనీ లాంటి ప్రశాంత హృదయమున్న స్త్రీతో సరళ జీవనం గడిపాడు. ఈ స్త్రీలు మాత్రమే తమ జీవితాలల్లో తాము కోరుకున్న వ్యక్తులు లభించకపోవడం వల్ల జీవన యుద్ధం చేస్తూనే వచ్చారు.

ఇలాంటప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే స్త్రీలకు, ముఖ్యంగా సొంత వ్యక్తిత్వం ఉన్న స్త్రీలకు తప్పనిసరిగా తాము ఎంచుకున్న పురుషుడితో గడిపే ప్రణయ జీవనం, లేదా కుటుంబ జీవనం మాత్రమే ప్రధానమా? మిగిలిన ఎన్ని సామర్ద్యాలు సంపాదించినా ఆ లోటును మర్చిపోలేరా? అన్నది ఆ ప్రశ్న.

వీళ్ళ ఇద్దరి నమునాల్లోంచి కాస్త దగ్గరగా కాలాతీత వ్యక్తులు నవలలోని ఇందిర కనిపిస్తుంది. అదే ధైర్యం, అదే చొరవ, అదే గాఢమయిన జీవితేచ్ఛ.  ఇందిర కుడా దేవయాని లాగే తల్లిలేని పిల్లే.

ఆమెకు ప్రేమ గురించి పెళ్లి గురించి ఖచ్చితమయిన అభిప్రాయాలున్నాయి. ఈ సంక్లిష్ట సమాజంలో బతక నేర్వడం గురించి కూడా. ధైర్యమయిన వాడు, అన్నివేళలా అండగా నిలబడ గలవాడు విశాలమయిన చాతీ ఉన్నవాడు (ఇది ప్రతీక) దొరికితే తప్ప పెళ్లి చేసుకోనంటుంది. ఆమెకు తారసపడిన వాళ్ళు పిరికివాళ్ళే.  వాళ్ళను ఏవగించు కుంటుంది. చివరకు తనలాగే స్వేచ్చ కోరుకొంటూ, తన స్వేచ్చను గౌరవించగలిగే కృష్ణమూర్తి తో సమాధానపడుతుంది తప్ప దేవయాని, స్కార్లెట్ లలాగా వేసారిపోదు. కానీ ఆమె కూడా కృష్ణమూర్తి తో కలిసి ‘నీవూ నేనూ వలచితిమీ, నందనమే ఎదురుగా చూచితిమీ ’ అని పాడుకుంటుందనుకోను.

ఏది ఏమయినా దేవయాని తండ్రితో మాట్లాడిన మాటలతో నింపిన నన్నయ భారతం లోని ఆ రెండు పద్యాలు నన్ను ఎప్పుడూ కదిలిస్తో ఉంటాయి.  కచుడి కోసం ఒక సంధ్యా సమయాన ఆశ్రమంలో చెట్ల కింద నిలబడి మాయమవుతున్న సూర్య కిరణాల్ని, మూగుతున్న చీకట్లనీ బెంగతో చూస్తూ, ఆశ్రమంలో వెలుగుతున్న హోమాగ్ని లాగ మండుతున్న గుండెతో వెళ్లి, తండ్రిని ప్రశ్నిస్తూ ఆందోళన పడుతున్న దేవయాని,సౌందర్యవతి అయిన ఆ యువతి, కళ్ళముందు మెదులుతూ ఉంటుంది.

ప్రణయ జీవన సాఫల్యం కన్నా విరహ వ్యధే ఒక్కొక్క సారి జీవితాన్ని ఎక్కువ వెలిగిస్తుందేమో, దాన్ని వెలుగు అనుకోవాలే గానీ.కానీ ఈ స్త్రీలది విరహ వ్యధ కూడా కాదు.వాళ్ళ కోసం మనం ఏం చెయ్యగలం . తలచుకోవడమూ ఆ తర్వాత  మరువలేక పోవడమూ  తప్ప.

*

ఇరుసంధ్యల ఇరుసు కృ.శా.కి తెలుసు!

konni sephalikalu

ఈ నెలలో కృష్ణ శాస్త్రి గారి పుట్టిన రోజు ఒకటో తారీకని కొంతమంది, పదిహేనో తారీకని కొంతమంది వివాదిస్తున్నారు.మనం ఒకటవ తేదీనే  నిర్ధారిద్దాం. కృష్ణ శాస్త్రి గారు పుట్టిన ఊరు పిఠాపురం దగ్గరున్న   చంద్రంపాలెంలో యువతీ యువకులు ఇప్పటికీ ఆయన పుట్టిన రోజు చేస్తున్నారు.ఇది నూట ఇరవయ్యో పుట్టిన రోజు.

నా చిన్నప్పుడు ఎనిమిదో క్లాసు చదువుతున్నప్పుడు ఆయన పేరు తెలీకుండా ఆయన పాట ప్రార్ధనా గీతంగా నేర్చుకుని ఎన్నో చోట్ల పాడేదాన్ని. ‘ జయ జయ ప్రియ భారత ‘ అనే పాట కేవలం దేశభక్తి గీతం కానే కాదు.  అదొక సముజ్వలమైన భావగీతం.  నాకు తెలీకుండా ఆ పాటచరణాల్లోని దీర్ఘ సమాసాలు పాడుతుంటే ఎత్తైన పర్వతం మీద పతాకాలు ఎగరేస్తున్నట్టనిపించేది.  చూడండి “ జయ వసంత కుసుమలతా చలితలలిత చూర్ణ కుంతల” భారత జనయిత్రి చూర్ణ కుంతలాలకు జయ జయ ధ్వానం అలాంటి కవి తప్ప మరెవరు చెయ్యగలరు. “జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ” అన్నప్పుడు ఆయన మదిలో కాళిదాసు ,రవీంద్రుడు వంటి వాళ్ళు మెదిలి ఉంటారు .కానీ నేను ఆ దిశాంతం వరకు వెళ్ళిన శకుంత గానంలో కృష్ణ శాస్త్రి గొంతు కూడా గుర్తు పట్టాను.  ఆ చిన్న వయసులో ఆ పాట  వేదికల మీంచి పాడుతుంటే ఒక పులకింతతో కూడిన గర్వం అనుభవించడం నిన్నటి మొన్నటి కథలా ఉంది.

నిన్న మొన్నటి సభలో కుడా మరెవరో గాయకుడు అదే పాటను వేదిక మీద పాడితే నాతో పాటు సభలో వారందరూ భావుక శ్రోతలుగా మారిపోయి పులకించారు.  అది కృష్ణ శాస్త్రి పాట మాధుర్యం. పాటలోని పదాల మాధుర్యం.  వజ్రాన్ని సానబట్టినట్టు ప్రతి పదాన్ని ఏరుకుని ఎంచుకుని ఒకదాని పక్కన ఒకటి పొదుగుతూ తయారు చేసే స్వర్ణకారుడు కృష్ణ శాస్త్రి అని అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలుస్తోంది.

డిగ్రీ చదివే రోజుల్లో మా తెలుగు మేడం సావిత్రి గారి దగ్గర విని నేర్చుకోకుండా ఉండలేకపోయిన గీతం “మ్రోయింపకోయ్ మురళి”. అసలు ఎత్తుగడే వినూతనం.’ మ్రోయింపవోయ్’ కాకుండా ‘మ్రోయింపకోయ్’ అంటూ ఇలా రాయగలిగేవాడే కవి.  వేటూరి సుందర రామ్మూర్తి ఎంతో అందమూ,మరింత హొయలూ ఒక దానితో ఒకటి పోటీ పడుతున్న అమ్మాయిచేత “అందంగా లేనా? అసలేం బాలేనా?” అని అనిపిస్తూ పాట రాస్తాడు.  ఈ పాట  ఎంతగా మారు మోగిందో.  అలా రాయడం ఆ కవి పొగరు.  రాయగలగడం అతని ప్రతిభ.  అలాంటి కవి పొగరుకు కృష్ణ శాస్త్రి గురువు.  కృష్ణా నీ మురళి మోయించకు, వద్దు, వద్దు అంటూ గేయం మొదలు పెట్టారు.  ఎందుకూ ? అంటే కారణాలు తరవాత చరణాల్లో రాసుకొస్తాడు.

ఎందుకంటె “మురళి పాటకు రగిలి మరుగు ఈ వెన్నెలలు, సొగయు నా ఎదకేల తగని సౌఖ్య జ్వాల”అందుకు. రగిలి, మరుగు, సొగయు ఏం పదాలివి? వెన్నెలలు మరిగిపోతాయట.  మండడం కాదు, మరగడం.  ఏం క్రియా పదం?! నా హృదయానికి ఎందుకు ఇంతటి సౌఖ్య జ్వాల. ప్రశంశ అంతా ఆ ‘సౌఖ్య జ్వాల’ దగ్గర ఉంది.  ఇలాంటి పదం తర్వాత ఈ నూట ఇరవై ఏళ్ళ లోను మరే కవి అయినా రాయ గలిగాడా ?

చిన్నతనంలో, మరీ చిన్నతనం కాదు గానీ ఇంత కవిత్వావగాహన లేని వయసులో రెండో చరణం “కాలు చల్లదనాలో, కనలు తియ్యదనాలో” అంటే ఏమీ అర్ధం అయేది కాదు.  అచ్చ తెలుగు పదాలే కాని, పదాల వెనుక ఉన్న తియ్యని బాధ అర్ధం కావాలి కదా.  చల్లదనాలు కాలుస్తాయని, తియ్యదనాలు కనలిపోయేలా చేస్తాయని, ఎందుకూ అంటే “వలపు పిల్లన గ్రోవి – వలపులో, సొలపులో” అంటాడు.  ఈ పిల్లన గ్రోవి మామూలు ది కాదు. ‘వలపు పిల్లన గ్రోవి’. వలపు ప్రియరాలు మీదో, ప్రియుడు మీదో ఉండాలి. కాని పిల్లన గ్రోవి మీద ఉంది.  ఇక్కడ ‘మురళి’ అనలేదు. అంటే ఈ అందం రాదు ‘వలపు మురళి’ అంటే చూడండి, ఏమీ బాగా లేదు. వలపు పిల్లన గ్రోవి, పిలుపులోనూ, సొలపులోనూ కాలు చల్లదనాలు, కనలు తియ్యదనాలూ ఉండి బాధిస్తాయట. అందుకని మ్రోయింపకోయ్ అంటున్నాడు కవి. ఇక్కడ కృష్ణ శాస్త్రి అనే వ్యక్తి లేడు. పూర్తిగా ఆయనను ఆక్రమించుకున్న కవే ఉన్నాడు.

చివరికి ‘భరమోయి నీ ప్రేమ’ అంటాడు. భారమోయి అనడు.  ఎందుకంటే అది భరమయినా తనకు వరమే కాబట్టి. “వరమే నేటి రేయి” అని పూర్తి చేస్తాడు.  పాట పాడుకున్నా, విన్నా ‘సౌఖ్య జ్వాల’ మనని వదలదు. దాని అనురాగంలో దగ్దమేనా అవ్వాలి.  ప్రకాశమానమేనా అవ్వాలి.  ఈ పాట యాభై ఏళ్ళుగా పూవులో పూవునై అన్నట్టుగా నాలో కలిసిపోయింది.  అప్పుడప్పుడు మోగుతూ ఉంటుంది. మ్రోయింపకోయ్ అంటూ.

ఇప్పుడు  టాగూర్ కవిత్వం గురించి కృష్ణ శాస్త్రి గారు చెప్పిన కొన్ని మాటలు తల్చుకోవాలి. ఇక్కడ కవిత్వం అంటే గేయ రూప కవిత్వం. అది రాయడం మరింత కష్టం.

“కళలన్నింటి లోకీ ఒక దృష్టితో చూస్తే సంగీతం గొప్పది. మానవానుభవాలలో ఇది అందుకోని ఎత్తులూ, లోతులూ లేవు.  మాటకు లొంగని ఆవేశాలనూ, అనుభవాలనూ సంగీతం అందుకుంటుంది. అందిస్తుంది.  అందుకనే ఋషులు ఛందములను గానం చేసారు. భక్తులు పాటల రెక్కల మీద పరమపదం అందుకున్నారు.

సుదూరమైనవీ, సూక్ష్మమైనవీ అయిన ఒక మహా కవి ఆత్మానుభూతులు వ్యక్త పరచడానికి శబ్దాలు సామాన్య రీతిలో ఉపయోగిస్తే చాలదు.వాటిని అవసరాన్ని బట్టి ఏరి, చేరదీసి, ఒకమూస లో పోసి అక్కడ ఆ గానానికి ఉండే శక్తిని పొందించాలి. కవికి పర్యాయపదాలు లేవు. ప్రతిదానికీ ప్రత్యేకమైన రంగూ, రుచీ ఉన్నాయి. ఛందస్సులూ, గణాలు ఒప్పుకున్నా కవికి ఏదో’ ఒక్కటే’ తప్పకుండా ప్రయోగించి తీరవలసిన శబ్దం ‘ఒకే ఒకటి ఉంటుంది’. ఆ విధమైన కూర్పు లిరిక్ – గేయం – గీతి అవుతుంది” అంటారు ఆయన.

krushaa

కవిత్వానికి, ముఖ్యంగా గేయానికి కావలసిన పదం ఆ కవి ఆత్మకి స్ఫురించాలి అంటారు.  ఈ స్ఫురణ ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక ధ్యాన స్థితిలో. కవికి ఆ ధ్యానం అవసరం, అందుకే కృష్ణ శాస్త్రి గారి శిష్యుడు ఇస్మాయిల్ కూడా ఈ ధ్యానం గురించే పదే పదే చెప్తారు.అందరూ ఆయన్ని చెట్టు కవి అంటారు, గానీ నిజానికి ఆయన ధ్యాన కవి

మరో పాటలో పదాలు చూద్దాం. “ముందు తెలిసెనా ప్రభూ ! ఈ మందిరమిటులుంచేనా” ఇక్కడ ఇల్లు, గృహం అనవచ్చు, కానీ మందిరం అనే రాస్తారు.  అందులో ఉన్న పద వైభవం, మన మనసు స్నిగ్ధంగా ఉండి ఉంటే దానికి అంది తీరుతుంది.  “నీవు వచ్చు మధురక్షణమేదో” అని “కాస్త ముందు తెలిసెనా” అంటారు.  మరీ ముందక్కర్లేదు.  ‘కాస్త’ ముందు తెలిసినా చాలు అంటూ.

ఈ పాట కాస్త ప్రేమించే హృదయమున్న ప్రతీ ఒక్కరికీ అనుభవంలోకి వస్తుంది “వాకిటనే సుందర మందార కుంద  సుమ దళములు పరువనా” ఈ పదాలు ఎలా ఉన్నాయంటే వాకిట్లో పరిచిన ఆ మందార కుంద పూల రేకుల్లా ఉన్నాయి.  మొదటి చరణంలో ఏరిన పూల లాంటి పదాలతో పూల దారి వేసి వాటి మీద అడుగుల గురుతులు ఇవ్వు చాలు అంటాడు.

ఇక రెండవ చరణంలో ఆయన గురుదేవుడు టాగూర్ పలవరిస్తాడు ఆయన గొంతులో. “బతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు” పూర్తి వచనం ఇది.  కానీ ఇందులో ‘పట్టున’ అనే పదంలోనూ “రానే రావు” అనే మాటలోనే అంతా ఇమిడ్చాడు.  కానీ ఇందులో అందమేమిటంటే “ఎదురు చూసినప్పుడే రావు, అంతే గాని అసలు రావని కాదు”.

“ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు” ఇది ఎంత సార్వ జనీనమైన అనుభవం. ఎంతగా మన అనుభవాలని మనం ఈ మాటల్లో చూసుకుంటాం.  పదాలు ఎలా మెరుస్తున్నాయి. ఛిజిల్ చేసిన వజ్రాల్లా.  ఎదురు – అరయని వేళ, ‘ఇట్టే’ మాయమవడం ఇక్కడ “అంతలోనే’ అనొచ్చు, కానీ ‘ఇట్టే’ అన్నప్పటి ‘తక్షణత’ వస్తుందా?

ఇక ఆ చివరి వాక్యం చూద్దాం “కదలనీక నిముషము నను వదలి పోక, నిలుపగా, నీ పదముల బంధించలేను హృదయము సంకెల చేసి” ఎంత పొడుగు వాక్యం. సంకెల లాంటి వాక్యం. వాక్యంలో అతని లేదా ఆమె యొక్క కాళ్ళను కట్టేస్తోన్నట్లు ఉంది ఈ వాక్యం. హృదయము సంకెల చెయ్యడం అన్న మాటలోనే ఉంది అనురాగం తాలూకు అర్ధమూ, పరమార్ధమూను.  ఈ పాట ఆయన ఒక గేయంగా రాసుకున్నది. దీన్ని తరవాత కాలంలో మేఘ సందేశం సినిమాలో పెట్టుకున్నారట.

అంటే కేవలం తన అనుభూతిని, తన విన్నపాన్ని అలా గేయంలో, ఆ మాటలలోఅమర్చుకుని  సమర్పించుకున్న కానుక కావడం వల్ల అది ఎవరికివారం మన హృదయాన్ని కుడా ఆ మాటల ద్వారా మీటుకుంటున్నాం.

టాగూర్ గురించి ఎవరో మహానుభావుడు చెప్పిన మాటల్ని కృష్ణ శాస్త్రి గారు ఆయన నోటితో ఇలా చెప్తారు. “టాగూర్ కవిత్వంలో కవిత్వం కాక మరేదో ఉంది, అతని కవిత్వంలో లిరిసిజం – అంటే గేయత్వాన్ని మించిన దేదో ఉంది.  అతని కవిత్వం అతని పెర్సనాలిటీని, అంటే అతని అంతరమూర్తిని వ్యక్త పరిచేదే గాక, దాన్ని అంతకంతకు సుందరంగా వికసింపజేసే సాధనం కూడా.  అతడు రుషి.  అతని అనుభూతులు ఇహపరాలకు నిచ్చెనలు.  అతని ప్రతి దిన సంభాషణమే శ్రోతల మనస్సులలో ఒక వింత కాంతి నింపేది.”

ఇవి కృష్ణ శాస్త్రి గారికి కుడా సరిపోయే మాటలు.  ఆయన కవిత్వం అలా ఉంచి కేవలం పాటలు చూసినా ఈ మాటలు ఆయనకీ చెందుతాయని అనిపిస్తాయి. “నీవలె సుకుమారములు, నీవలెనే సుందరములూ పూవు లేరి తేవే చెలి  పోవలె కోవెలకు” అన్నప్పుడు ఆయన దృష్టి కోవెల మీద తో పాటు చెలి  మీద కుడా గట్టిగానే ఉంది.  కానీ “అనరాదా! నీ కృపయే అనరాదా” అంటూ భగవంతుడి దయని అర్ధం చేసుకోడానికి ఎవ్వరూ రాయలేని మాట రాస్తారు. “నడిచే దారి ఒంటరియై, గడిచే సీమ ఎడారియై, అడుగే పడనపుడనరాదా ! నీ కృపయే అని అనరాదా!” అంటూ ఇంకా “కేలేత్తీ మరి అనరాదా! నీ కృపయే అనీ అనరాదా” అంటారు.  మనిషి లోపలి మూర్తిని అంతకంతకూ సుందరంగా వికసింప చేసే సాధనం అతని కవిత్వం అన్న మాట ఇలాంటి పాటలు విన్నప్పుడు మరీ మరీ గుర్తొస్తుంది.

ఎడ్గార్ ఎలెన్ పో గురించి చెప్తూ “జాగ్రత్తగా దారి బత్తెం ఉపయోగించు కుంటూ నడిచే యాత్రికుడు కాదు ‘పో’.  కళ్ళు మూసుకుని జీవితాన్ని రెండు చేతులతో ఖర్చు పెట్టినట్టుంటాడు.  తనకు సంబంధం లేని లోకంలోకి వచ్చినట్టుంటాడు” అంటారు.  సుఖ దు:ఖాలు వెలుగు చీకట్లలా అందరి జీవితాల్లోను కలగలిసి ఉన్నా కొందరి జీవితం ఉదయసంధ్యలా ఉంటే, మరి కొందరి జీవితం సాయంసంధ్యలా ఉంటుంది. ఉదయ సంధ్య లో చీకట్లు తక్కువ, సాయం సంధ్యలో చీకట్లు ఎక్కువా అంటారు ఆయన, పో జీవితం సాయం సంధ్య అని చెప్తూ. కానీ కృష్ణశాస్త్రి గారి కవిత్వం లాగే  జీవితం కూడా ఉదయ సాయం సంధ్యలు రెండూ కలగలిసి పోయినట్లుంటుంది.

అందుకే ఎర్రటి కాడలు ,తెల్లటి రేకులు ఉన్న పారిజాత పూలలాంటి కవిత్వం రాయగలిగేరు

*

 

చల్లని వేళా…చలించే జ్ఞాపకం!

konni sephalikalu

అవును , రచయిత చెప్పినట్టు చల్లని వేళ తలుచుకోవలసిన జ్ఞాపకమే ఈ కథ.  ఇంకోలా చెప్పాలంటే ఈ కథ గుర్తొచ్చినప్పుడల్లా ఆ సమయం చల్లగానే కాక గుప్పున  పరిమళభరితమవుతుంది. ఎన్.ఆర్.చందూర్ గారి

కథ  అది. ఆ కథ నేను కుడా లేత కొమ్మగా ఉన్నపుడే చదివాను.  చలించిపోయాను, చాలా…  మాటల్లో చెప్పలేను.

తర్వాత కథ పోగొట్టుకున్నా, జవ్వాది అలుముకున్న జేబురుమాలు బీరువాలో మారుమూల ఉండిపోయినట్లు కథా పరిమళాలు ఈ నలభయి ఏళ్ళుగా నా వెంట వస్తూనే ఉన్నాయి.  మళ్ళీ ఇన్నాళ్ళకు కథ దొరికింది.  ఒక మహానుభావుడు అందించాడు.  కాని లేత కొమ్మ ఇప్పుడు బాగా ముదిరి ఆ లేతదనం మళ్ళీ రాదని కథ చదువుతుంటే అర్ధం అయింది.  ఇంకొక విషయం ఏమిటంటే ఇంతటి సున్నితత్వం ఇవాళ సమాజంలో కూడా లోపించిందని ,మనం మళ్ళీ అలా మారడానికి ఇలాంటి కథలు ఎంతో  అవసరం అనీ అనిపించింది

ఇందులో రచయితే ఉత్తమ పురుషలో కథ చెప్తాడు.ఆ ఉత్తమపురుష  ‘అతను’ ఇంకా టీన్స్ ఉన్నాడు.  సాహిత్యం బాగా చదువుతాడు.  చదవడమేమిటి డాస్టవిస్కీ ‘క్రైం అండ్ పనిష్మెంట్” చదివి ఒక రోజల్లా అన్నం మానేసాడు. టర్నీవ్ ‘జ్యూ’ లోని కథా భాగం చదివి కన్నీళ్లు కార్చాడు.  అతను కథలు రాస్తాడు. ఒక హోటల్లో మూడో అంతస్తులో తొమ్మిదో నెంబరు గదిలో పర్మనెంటుగా అంటే ఒక ఏడాది కాలంగా ఉంటూఉంటాడు.  డబ్బు కోసం తడుముకోవలసిన అవసరం లేని ఆర్దిక స్థితి అతనిది.  హోటల్ యజమాని, నౌకర్లు అతనితో స్నేహంగా ఉంటారు.

అలాంటి తన లేత గుండె వయస్సులో జరిగిన తన ఉహాతీతమైన అనుభవాన్ని గురించి దాదాపు పద్నాలుగేళ్ళు తరవాత గుర్తుచేసుకుంటూ మనకి చెప్తాడు.  ఆ లేతదనం తన గుండెకి ఇప్పుడు లేదని, ఇప్పుడు స్పందించడం కంటే తర్కించడం ఎక్కువ చేస్తోందని, రసాస్వాదన లోనే బోలెడంత తేడా వచ్చిందని చెప్తాడు.

ఎందుకంటే ఆ లేత ప్రధమ యవ్వన దినాలనాటి స్పందన, ఉద్వేగమూ, తీవ్రతతో కూడిన నిజాయితీ – వాటి నుంచి ఎలాంటి ‘మిరకిల్స్’ జరుగుతాయో స్వయంగా తను అనుభవించాడు కనుక,ఆ తేడా అతనికి బాగా తెలిసింది.

ఆ హోటల్ కి తనకోసం వెంకటపతి అనే మిత్రుడొక్కడే వస్తుండేవాడు.  హోటల్ యజమాని ‘సేట్ జీ’ కూడా రొజూ వచ్చి కాసేపు కష్టసుఖాలు మాట్లాడి వెళ్ళేవాడు. వాళ్ళ మాటల ద్వారా అయిదవ నెంబరు గదిలో ఒక అమ్మాయి ఉందని, ఆమె భర్త వారం రోజులుగా ఆ గది అద్దెకు తీసుకుని మూడు రోజుల క్రితమే ఆమెను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి రూంలో ఉంచాడని మూడు రోజులుగా డబ్బు పే చెయ్యడం లేదని, మనిషి కూడా ఎప్పుడో అర్థరాత్రి గాని రావడం లేదని తెలిసి, సేట్ జీ అభ్యర్ధన వల్ల  అతను కనుక్కుంటానన్నాడు.

రోజూలాగే రాత్రి చాలా సేపు చదువుకుంటూ మేలుకుని ఉన్న అతనికి ఆ రామ్ నాధ రావడమూ, ఆ అమ్మాయీ  అతనూ భోజనం చేస్తూ చాలా సేపు వాదించుకోవడమూ ఓరగా వేసి ఉన్న తలుపులోంచి కనిపించింది.భాష తెలియకపోయినా.  భోజనం కాగానే సిగరట్ ముట్టించి ఇవతలికి వచ్చిన రామ్ నాధ అతనికి దొరికాడు.  మాటలు కలిసేక అతన్ని లోపలి తీసుకెళ్ళి వారిద్దరి కథ రామ్ నాధ గంటసేపు చెప్పాడు.  ఆమె కూడా పడుకునే వింటూ ఉండింది. వాళ్ళు మలయాళీలు, ఆమె పేరు మంజులత. ప్రేమించి పెద్దవాళ్ళని  కాదని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ళు హాయిగా గడిచేయి. ఇంతలో మంజు జబ్బు పడింది. వైద్యానికి చాలా ఖర్చయింది. ఊరు మారారు.ఉద్యోగం పోయింది . మరో ఉద్యోగం దొరకలేదు.  ఆమె ఆపరేషన్ అయి హాస్పిటల్ నించి వచ్చి ఈ హోటల్ లో ఉంది. డబ్బు ఇబ్బందుల్లో ములిగి ఉన్నారు.పెద్దవాళ్ళు రానివ్వరు.అయినవాళ్ళు లేరు.

‘అతను’ చాలా సున్నితమే కాక సంస్కారం ఉన్నవాడు. స్నేహితుడు వెంకటపతి సాయింత్రం  ఆమెను ‘రంగుల చిలక’ అంటే చివాట్లు పెట్టాడు.  ఇప్పుడు ఆమె జబ్బుపడి పీలగా ఉంది కానీ చక్కనిదే.  ఆమె వంటిమీద మరే నగా లేకపోవడం వల్ల చెవులకి ఉన్న ఎర్ర రాళ్ళ దుద్దులు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. సిల్కు లాంటి జుట్టు.ఆ జుట్టు లోంచి ఎర్ర రాళ్ళు ప్రత్యేకంగా మెరుస్తున్నాయ్   జబ్బు కోసం వంటిమీద బంగారం అంతా అమ్మేసుకున్నారుట.

‘అతను’ లోపలికి వచ్చి పడుకున్నా, వాళ్ళ నిస్సహాయత గురించే ఎంతగానో దిగులు పడ్డాడు.  ఎన్నో వెర్రి ఆలోచనలు చేసాడు. ఎంతో గాఢత తో ప్రేమించుకున్న వారి మనుగడ గురించి మధన పడ్డాడు.

తెల్లవారి సేట్ జీ ఒక పొట్లం తెచ్చి ఇచ్చి “ఆ రామ్ నాధ ఈ దుద్దులు ఇచ్చి పోయాడు.  డబ్బులు లేవన్నాడు” అని చెప్పి వాపోతే ఆ పొట్లం తీసుకుని అతనికి పాతిక రూపాయల చెక్ ఇచ్చి పంపేసాడు.ఆ దుద్దులు చూడగానే అతని మనసంతా కలగిపోయింది . సేట్ జీకి అతని మంచితనం తెలుసు కనుక, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకుని అందుకోసం ఇంత సాయం చేసే లాంటి మనిషి కాదని అతని గురించి తెలుసు కనుక,  మారు మాట్లాడలేదు గానీ – ఆ ఉదయం వేళ అతనికి లోకమంతా అగమ్యంగా తోచి ఉంటుందని’ రాస్తాడు రచయిత.  ‘అతను’ ఆ దుద్దుల పొట్లం నౌకరు ద్వారా ఆమెకు పంపబోయి, తానే ఇవ్వాలనే ఒక బాల్య చాపల్యంతో తానే ఆ గదికి వెళ్ళడమే ఒక అద్భుతమైన అనుభవానికి కారణమయిందని చెప్తాడు

అతను వెళ్లేసరికి ఆమె విపరీతమైన భాధతో పొట్ట పట్టుకుని లుంగలు చుట్టుకుపోతూ ఉంది.తెల్లవారుఝాము నుంచి నౌకరు కూడా ఇటు రాలేదట.  ఆమె చెప్పిన మాటలను బట్టి రామ్ నాధ బయటకు వెళ్ళక తప్పలేదని,ఉదయం నుంచి తన ప్రాణం పోయేలా ఉందని అంత బాధలోనూ చెప్పింది.

కాఫీ తెప్పించి పట్టిస్తే తాగి, గబా గబా వాంతులు చేసుకుంది.  అతను ఆమెను పట్టుకుని పడుకోబెట్టి డాక్టరును పిలిపించి ఇంజక్షన్ చేయించాడు.

విషయమేమిటంటే ఆమెకు వచ్చిన జబ్బుకి ఆమె సంసారం చెయ్యకూడదు.  అలా జరిగితే ఆమె ఏ క్షణమైనా చనిపోవచ్చు.  ఆ రాత్రి ఆ తప్పు చేసాడు రామ్ నాధ. ఆమెకు తాను బతకనని తెలుసు, డాక్టరూ అదే చెప్పాడు.

ఆమె అతనికి ఆ మరణ వేదనలో అత్యంత ప్రియమైనదైపోయింది.అతని గుండె జాలితో, వేదనతో కరిగిపోయింది   ఆమె కోసం ఎంతయినా ఇస్తాను బ్రతికించ మన్నాడు.  డాక్టరు నవ్వి బతకడం అసంభవం, ఈ రాత్రి పన్నెండు దాటడం కష్టం అన్నాడు. ఏవో నాలుగు పొట్లాలిచ్చి వెళ్ళాడు.

ఆమె అతని చెయ్యి వదల్లేదు. తన పక్కనే కూర్చోపెట్టుకుంది.  మరణ భయంతో ఆమె కళ్ళ ముందు నల్లటి నీడలు. అతను ఆమె సిల్కు జుట్టు నిమురుతూ ధైర్యం చెబుతూ ఉండిపోయాడు.

ఆమె బాధతో తాదాత్మ్యం చెందడం లో అతని మనసంతా ఆమె పట్ల  గొప్ప ప్రేమతో నిండిపోయింది.  రామ్ నాధ  ఇక రాకపోతే ఈ పెన్నిధి నాదే. ఈమె బతకాలి అని అతని ప్రాణం అపరిమితంగా కొట్టుకు పోయింది. ఆమె కడుపు పట్టుకుని మెలికలు తిరుగుతూ నరకబాధ పడింది.  కానీ అతని చెయ్యి వదల లేదు.

అతనికి ఆమె తన చెయ్యి పట్టుకున్నపుడు ఆ రోగి స్త్రీ అనే భావన కలిగిందట.  ఏదో విద్యుత్ నాలో ప్రవహించిందంటాడు.  అది మామూలు విద్యుత్ కాదు, మంత్ర మయమయిన విద్యుత్.  మీ చేతుల్లో ప్రాణాలు వదలనివ్వరూ ? నన్ను వదిలి వెళ్లి పోవద్దే అని ఆమె ఏడుస్తుంటే,  ఎవరూ దిక్కులేకుండా ఈ చిన్ని పుష్పం నేల కలుస్తుందా ! అనే అతని ఆవేదన ఆమెకు ధైర్యాన్నిస్తూ వచ్చింది.

గంటలు గడిచాయి “ఎందుకో తెలియదు, నువ్వు నా కోసం బతకాలి, బతికి తీరాలి” అనే అతని కంఠంలోకి ఏడుపు కూడా వచ్చింది.  ఆమె ఆ ప్రేమను గ్రహించింది.  అంత బాధలోనూ తన బాధ మరిచి అతన్ని లాలించింది.  అతని కంఠంలోని రోదన ఆమెను కొత్త లోకాలలోకి వెలిగించింది.అటువంటి స్త్రీ లాలన అతనికి కొత్త.

పగలంతా గడిచింది.  ఇద్దరి మధ్య వాళ్లకు మాత్రమె తెలిసే చనువు ఏర్పడింది.  బాధ కాస్త తగ్గగానే మొహానికీ చేతులకీ పౌడర్ వేసుకుంది.  అతన్ని అడిగి లవండర్ కూడా రాసుకుంది.  ఇంత తెలివిగా ఉన్న మనిషి అర్థ రాత్రి లోపు చనిపోతుంది.  ఆమెకూ తెలుసు.  అతనికీ తెలుసు.  ఆ చావు అమాంతం వస్తుంది.  బహుశా మాట్లాడుతూ మాట్లాడుతూ కొలాప్స్ కావచ్చు.

రామ్ నాధ వచ్చినా ఫరవాలేదనీ, తన పక్కన అలా కూర్చునే ఉండాలనీ నిష్కర్షగా చెప్పింది.  రాత్రి గడిచే కొద్దీ ఆమెకు భయం పెరుగుతూ వచ్చింది.  గ్లూకోజ్ నీళ్ళు పట్టాడు.  కిటికీలు ముసేసాడు.  అతనికీ భయంగానే ఉంది.  ఆమె భయం ఏదో విధంగా పోగొట్టాలి.  ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వెన్నుముక మీద చేతివేళ్ళతో నిమిరేడు. నిద్రపోయింది.

పన్నెండింటికి ఉలిక్కిపడి లేచి అతని వళ్ళో తలపెట్టుకుని పడుకుంది. మళ్ళీ కునుకుపట్టిన అరగంటలో కెవ్వుమని కేక పెట్టింది. మరణయాతన పడింది. నువ్వు నా మంజువి, నాకోసం బతికించు కుంటాను. ప్రేమలో అమృతానికున్న గుణం ఉందన్నారు.  నువ్వు బతక్క తప్పదు అన్నాడు.  ఇక ఇక్కడ రచయిత మాటలే రాయాలి.

“ఆమె బతికింది. సులువుగా ఒక్క మాటలో ఆ సంగతి ఈనాడు చెబుతున్నానే గాని, ఆనాడు తెల్లవారుఝాము మూడు గంటల దాక ఎంత బాధపడింది మంజు. విలవిలా తన్నుకునే ఆమె పాంచ భౌతిక శరీరాన్ని చూసి నేనెంత ఏడ్చాను.  బాధలూ, కన్నీళ్లు కాలమనే మహార్ణవంలో కలిసిపోతాయి కదా!  నా మంజూ నాకోసం మృత్యువుతో హోరా హోరీ పోరాడింది. ఎంత అహం – నా మంజు, నా కోసం:  మంజూ నేనూ జీవితంలో కలుసుకోము – కలుసుకోక పోయినప్పటికీ ఎంత అహం”

మర్నాడు డాక్టరు మంజులత బతకడం మిరకిల్ అన్నాడు.  ఆమెకింక ప్రాణ భయం లేదన్నాడు ఆ స్థితి దాటాక.డాక్టర్ వెళ్ళాక అతను ఆ ‘ఎర్ర రాళ్ళ’ దుద్దులు ఆమె చేతిలో పెట్టాడు.  అవి ఇవ్వడానికే కదా ఆ ఉదయం ‘అతడు’ ఆమె గదికి వెళ్లి ఆమె బాధ చూసింది.

చివరకు రామ్ నాధ విధిలేక ఆమెను వదిలి వెళ్ళిపోయాడు.  ఆమె తన అన్నగారిని పిలిపించుకుని అతనితో వెళ్ళిపోయింది.  ఈ లోగా నాలుగు రోజులు అదే రూమ్ లో ఉంది. ఆ నాలుగు రోజులు అతను ఆమెను తన ప్రాణంగా భావించాడు. వదలలేక వదలలేక మంగళూర్ మెయిల్ ఎక్కించాడు.  ఆమెకూ అంతే.  ఆమె తన గుర్తుగా ఆ ఎర్ర రాళ్ళ దుద్దులు అతనికి ఇచ్చింది.అతని కాబోయే భార్యకు ఇవ్వమని చెప్పింది

ఇదంతా పద్నాలుగేళ్ళ తర్వాత గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అవి నా భార్య చెవులను మెరుస్తూ ఉన్నాయంటాడు.

ఎవరి జీవితాలూ ఆగలేదు.  కానీ ఆగిన చోట ఒక సమయంలో, ఒక సందర్భం ఇద్దరినీ ఎలా దగ్గర చేసింది.  ఆ సమయం ఎలాంటిది ? ! ఆ వ్యక్తులెలాంటి వాళ్ళు ?! వాళ్ళ హృదయాలు ఆ సమయంలో గొప్ప వెలుగులో ఎలా ధగద్దగాయమానం అయ్యాయి – ?!

పూవులో సువాసన కనిపించనట్టే ప్రేమ కూడా కనిపించదు కదా?కేవలం అనుభవానికే తెలుస్తుంది. కానీ ఎంత మందికి ఆ అనుభవం తెలుస్తుంది.  మరణాన్ని సైతం ధిక్కరించగల ఆ అనుభవం, దానిపేరు ఏదయితేనేం.  కామం మాత్రం కాదు.  వారి మధ్య ఆ సంబంధం సాధ్యం కాదుకదా!

మంజు, రామ్ నాధ గాడంగాప్రేమించుకున్నారు.  కొంత జీవితం సుఖంగా గడిపారు. కానీ, మంజు ‘అతని’ నించి పొందిన ప్రేమ అవ్యాజమయినది. ఆమెకు అది ప్రాణాధారం.  ఆపైన ఆమెకు అతను ప్రాణాధికుడు.

లేత యవ్వనం ఎంత మృదువైనది.  దానికితోడు అతను నిరంతరం గొప్ప సాహిత్యం చదువుకుంటూ  దాంతో ఆ సున్నితాన్ని మరింత మృదువుగా, సంస్కారవంతంగా మార్చుకున్నాడు.

అందువల్లనే ఆమె బాధను తనదిగా తీసుకోగలిగాడు.  అలా తీసుకోవడంలో ఆమెతో ఆకస్మికమయిన ప్రణయ బంధానికి లోనయ్యాడు.  మానవతాదృష్టిలోంచి, దయలోంచి, గాఢ ప్రణయంలోకి అతనూ, అతనివెంట ఆమె చేసిన ప్రయాణం అంతా మన కళ్ళముందే నడుస్తుంది.  ఆ పగలూ, రాత్రీ మనం కళ్ళప్పగించి వారిద్దరి వేదనా ఉత్కంఠతో చూస్తూ నిమిష నిమిషం బరువుగా గడుపుతాం.  ఇదంతా చందూరి నాగేశ్వరరావు గారి ప్రతిభ. పైగా ఆయన ఇది కథ కాదంటాడు.  కథ అయితే పాత్రల్ని రచయిత ఇష్టం వచ్చినట్టు నడపచ్చు.  సన్నివేశాలు మార్చవచ్చు.  కానీ ఇది కథ కాదు.  నిజంగా అలా జరిగింది.  ఆ సన్నివేశాలు అలాగే మారాయి. చివరికి ఆశ్చర్యంగా వారిద్దరి భీతి , బాధ కన్నీళ్ల మధ్య ఆ అద్భుతం జరిగింది.  మళ్ళీ కలవకపోతేనేం వారి అనుబంధం మన మనస్సులో కుడా ఎంతో పదిలంగా ఉంటుంది.

స్త్రీ పురుష సంబంధాల గురించి మనం ఎన్ని చర్చలు చేస్తాం?ఇలాగే ఉండి తీరాలని ఎలా శాసిస్తాం!కాని జీవితం వీటన్నిటి కన్న యెంత అగోచరమో ,యెంత ఆశ్చర్యమో,ఎంతటి అద్భుతమో ఇలాంటి కథలు చెప్పకనే చెప్తాయి.ఇక మనం వేరేగా చెప్పేది ఏముంది !!!

%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b0%b3%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae

*

చుక్కల వెలుగులో కాంతి బాట!

konni sephalikalu

దాదాపు పాతికేళ్ళు అయిందనుకుంటాను. అయినా ‘రష్యన్ గాల్యా’ మేజర్ మూర్తిని వదలనట్టే మేజర్ దక్షిణా మూర్తీ నన్ను  వదలలేదు.  ఈ పాతికేళ్ళుగా చాలా సందర్భాల్లో నా వెనకే ఉన్నాడు.  మనుషుల మితిమీరిన స్వార్ధాన్ని, లౌక్యాన్ని, దొంగ వేషాలని చూసి నేను క్రోధంతో ఊగి పోయినప్పుడు ‘గాల్యా’ తో పాటుగా నన్ను సాంత్వన పరచాడు.

అవును. సాహిత్యం, మనం దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా తీసుకోవాలే గాని మనని ఎంతయినా మార్చగలదు.  స్థిమితపరచగలదు.  ఒక్క సాహిత్యమేనా ? ఏ కళారూపమయినా అది నిజమయిన కళారూపమయితే ఆ పని చెయ్యగలదు.  దాన్ని నిరూపించడానికే ఈ రష్యన్ అమ్మాయి గాల్యా కథతో ముడిపడిన మేజర్ మూర్తి కథను మళ్ళీ మళ్ళీ తల్చుకోవాలనుంది.

ఆర్టిలరీ రెజిమెంటు అంటే ఫిరంగి దళం. అక్కడ పెద్ద పెద్ద వృక్షాల మధ్య రాబర్ట్ క్లైవ్ కాలం నాటి సున్నపు స్తంభాలున్న భవనం ఆఫీసర్స్ మెస్.  రకరకాల ఉద్యోగుల రకరకాల హాబీల మధ్య తెల్లటి షర్టు మీద మట్టి మరకలతో ఉన్న మేజర్ మూర్తిని పరిచయం చేస్తాడు రచయిత.  మేజర్ మూర్తి మంచి ఆటగాడు.  మెస్ సెక్రటరీ, రెజిమెంటల్ ఫిల్మ్ క్లబ్ కు సెక్రటరీ, ఇంకా లైబ్రరీ పుస్తకాల పురుగుగా బుక్ వర్మ్.

ఒకనాటి డిన్నర్ తర్వాత జరిగిన ఫిల్మ్ షోలో సబ్ టైటిల్స్ ఉన్న రష్యన్ పిక్చర్ తెప్పించి వేయించాడు కెప్టన్ దేవగుణ్.  ఆర్ట్ ఫిల్మ్ అంటే మూర్తికీ ఇష్టమే.రష్యన్ ఫిల్మ్ అద్భుతంగా ఉంది.  వంద నిముషాల సినిమా.  ‘వేరా పనోవా’ కథ.  కథ, నటన, ఛాయా గ్రహణం అద్భుతం అన్నారందరూ.  అందులో మూర్తి తనను చూసుకున్నాడు.  సినిమాలో ప్రధాన పాత్ర గాల్యా ‘యువతి’ కాకపోతే కథలో చాలా ఘట్టాలు తనవే అనుకున్నాడు.

ఇది మునిపల్లె రాజుగారి ‘సవతి తమ్ముడు’ కథ. జీవితానుభవాల లోంచి తాత్వికపులోతులు చూసి ఆ సారాన్ని పెరుగు చిలికి వెన్న తీసి అందించినంత సులువుగా పాఠకులకు అందించిన కథ.

దక్షిణా మూర్తి కి రేజిమెంట్ లో కొన్ని ముద్దు పేర్లున్నాయి.  వాటికి తోడు మిలటరీ హాస్పిటల్ లో ఇంకో నిక్ నేమ్  ఉంది.  మిలటరీ డాక్టర్లు అతన్ని ‘బబుల్స్’ అని పిలుస్తారు.  అతనికి హిందీలో అన్ని ప్రాంతీయ నుడికారాలూ తెలియడం ఒక కారణమైతే, అలా పిలవడానికి మరో ప్రధాన కారణం అతని కుడి కణత మీద మిల్లీ మీటరు లోతున రెండుగాయాల మచ్చలు ఉండడం. అవి అతన్ని జీవితంలో ఎక్కడా ఓడిపోకుండా పోరాడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిన మచ్చలు.

అతని సవతి తల్లి వంట చేస్తూ చేతిలో ఉన్న పట్టకారును బలంగా విసిరితే కుడి కణతకు తగిలి రక్తం కారింది. మూర్ఛ పోయేడు.  మూర్ఛ పోయేముందు ‘నాన్నా అన్నయ్య చచ్చి పోయాడు’ అన్న తమ్ముడి ఆర్తనాదమే జ్ఞాపకం.  తల్లి చనిపోగానే తండ్రి మళ్ళీ పెళ్లి , సవతి తల్లి పెట్టిన బాధలు.  ఆమెకు పుట్టిన కవలలు వెంటనే పోయిన ఆమె బాధ సవతి పిల్లాడి మీద ద్వేషంగా మారింది.

ఆమె పెట్టిన బాధలతో జీవిత యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కణత మీద దెబ్బ, తరవాత పుట్టిన సవతి తమ్ముడి ఆర్తనాదం కలగాపులగంగా అతని అంతశ్చేతనలో ఉండిపోయి గెలుపుకోసం పోరాటం.

ఇల్లు వదిలి దేశ దిమ్మరి అయ్యాడు.  లెక్కల్లో ఎప్పుడూ ఫస్టే.  జీవితంలో ప్రతి మలుపులోనూ లెక్కల అవసరం తెలుసుకున్నాడు.  అంచెలంచెలు గా ప్రయాణం, ఎక్కడో ఎవరో దయాముర్తుల ఆదరణ.

నారాయణ్ దత్ జోషి ఎందుకు అభిమానించాడో తెలియదు.  చదువు తరవాత జోషి గారి స్నేహితుడి సహాయంతో కంటోన్మెంటు ఆఫీసరుగా ట్రైనింగ్ ఆర్డర్లు, శిక్షణ, ఆరితేరాడు.

“సాహిత్యంతో పరిచయం పెరిగింది.  ఇల్లు లేకపోయినా ఎల్.టి.సి., దేశంతో పరిచయం చేసింది.  కజిరంగా నుంచి కన్యాకుమారి వరకు ప్రకృతి సంపద, శిల్ప సంపద. ఈ భూమిని పురాతన కాలం నుంచీ ప్రభావితం చేసిన చరిత్రనంతా కళ్ళతో చూడడం సైన్యంలో ఉండడం వల్లనే సాధ్యమయింది.

105 ఎం.ఎం. గన్  గాని 130 ఎం.ఎం. భోఫోర్సు గానీ ‘మేజర్ మూర్తి, ఆర్టిలరీ, అతి విశిష్ట సేవా మెడల్ బోర్డు చూడగానే జోహార్లు చేయవలసిందే”  ఇవన్నీ రచయిత మాటలు.  తల్లికి – పద్మాసనంలో ఉండి ప్రాణం వదిలిన తల్లికి- శ్రాద్ధం పెట్టడం కోసం, ఆ అర్హత కోసం జోషీ గారి చేత ఉపనయనం చేయించు కున్నాడు.  అంతే. తండ్రి, సవతి తల్లి, తమ్ముడు ఇల్లూ ఏమీ లేవు.

అంత అందంగా లేని దస్తూరీతో తమ్ముడి నుంచి ఎన్నో ఏళ్ళకి ఉత్తరం.  నాన్న పోయాడని, పొలం వేలం వేసారని, అప్పులు తీరలేదని అమ్మ బాధ పడుతోంది, చెల్లి మళ్ళీ పరీక్ష తప్పిందని, అంతా రాసి తనను యునిఫాం డ్రెస్ లో చూడాలని ఉందని కోరుతూ రాసాడు.

ఆ ఉత్తరం మేజర్ మూర్తిలో ఏ వికారమూ కలిగించ లేదు.  మౌనంగా, ఉత్తరం ముక్క లేకుండా వెయ్యి రూపాయలు డ్రాఫ్ట్ పంపి ఊరుకున్నాడు.  పిన్ని, సవతి తమ్ముడు తను చూడని చెల్లీ ఎవరూ అతని జ్ఞాపంలో లేరు.

రష్యన్ సినిమాలో ‘గాల్యా’ కథ కుడా ఇదే.  సవతి తల్లి బాధల నుంచి స్కూల్ టీచర్ ‘ఎలిజబెత్ ఆండ్రి యేవనా’ అనే దీపం సహాయంతో మాస్కో నగరానికి వచ్చింది.  థియేటర్ స్కూల్ లో చేరి సహజమైన ప్రజ్ఞ, ఉపజ్ఞల సహాయంతో నటిగా ఎదిగింది.  ఉత్తమ పాత్రలు ధరించింది.  పెద్ద జీతం  తీసుకుంటోంది.  ఇష్టం లేకపోయినా వెండి తెరకు కుడా పరిచయమయింది.  స్టేజి ఉత్సవాలలో భాగంగా విదేశాలకు వెళ్లి మూడు నేలల తర్వాత తిరిగి వచ్చి మూడు నెలల క్రిందట  రాసిన చెల్లి ఉత్తరం చూసింది.

దక్షిణా మూర్తి కి అందిన ఉత్తరం లాంటిదే.

గాల్యాకు ఎర్రటి కళ్ళతో భయపెట్టే సవతి తల్లి గుర్తొచ్చింది. తండ్రి మరణం, చివరకు విమానంలో తన ఊరికి బయలుదేరింది.  సవతి తల్లికి, చెల్లెళ్ళకూ చిన్న చిన్న బహుమతులు, తనకు సహాయం చేసిన రిటైరయిన టీచరుకు, ప్రపంచాన్ని చూడడం నేర్పిన పుస్తకాలు అందించిన లైబ్రేరియన్ కు కూడా బహుమతులు తీసుకొంది.

గాల్యా తండ్రిసమాధి ముందు మోకరిల్లింది.  పాత టీచరు ఉంది గాని లైబ్రేరియన్ లేదు.  సవతి తల్లిలో మార్పు లేదు.  బహుమతుల మీదే ఆసక్తి చూపించింది.  చెల్లి తనలాగే అందమైంది.  ఇద్దరూ ఆ రాత్రంతా ఒకే మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకున్నారు. చెల్లి ఎన్నో సంగతులు చెప్పింది.  గాల్యాకు చెల్లెలితో మాటలతో పాత  ద్వేషమంతా కరిగిపోయింది.  కరుడు గట్టిన మొరటు భావాలతో ఉన్న ఈ ఇంట్లో ఆమెను ఉంచకుండా తనతో తీసుకుపోవాలి.  మాస్కోకు తీసుకుపోయి అక్కడే సారస్వతంలో పెద్ద చదువు చదివించి లెక్చరర్ ను చెయ్యాలి.   ఆమె ఇష్టం కుడా అదే కాబట్టి దాన్ని నెరవేర్చాలి.

సినిమా అయిపొయింది గాని మూర్తికి ఆగిపోయిన జీవితం మొదలయింది.  “ఈ రష్యన్ గాల్యా చాలా అసాధ్యురాలు, చాలా ఆలోచనల్ని రేగగొడుతోంది” అనుకున్నాడు.  అంత వరకు జీవితంలో దేశ దిమ్మరిగా మొదలుపెట్టి అనేక సామర్ధ్యాలు  సంపాదించుకుని ఒక ఎత్తైన పీఠం మీద కూర్చున్నాను అనుకున్న మూర్తి జీవితంలో ఓడిపోలేదన్న నినాదంతో ఆత్మవిశ్వాసాన్ని దాని పరిమితినీ, స్థాయినీ దాటి పెరగనిచ్చాడు.  అలాంటి మేజర్ మూర్తి గర్వాన్ని గాల్యా కడిగేసింది.

తన బాల్యాన్ని నలిపి, చిదిమి, చింపి పారేసిన వాళ్ళ మీద ఉన్నకక్ష ఆ ఇంట్లోనే ఉన్న పిల్లల మీద చూపితే ఎలా ?  వాళ్ళు తన చెల్లి, తమ్ముడే కదా అన్న నిష్కల్మష ప్రేమ అతని మనసులో ఉదయించడానికి ‘గాల్యా’ కారణమయింది.

మేజర్ దక్షిణామూర్తి కి ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి.  కానీ అతను చార్జి తీసుకోవడానికి హడావిడి పడలేదు.  సెలవు కావాలని ఎప్పుడూ సెలవడగని మనిషి అడిగేడు.  కల్నల్ జగన్నాధ్ విరగబడి నవ్వుతూ “ఇప్పుడెందుకయ్యా నీకు సెలవు” అన్నాడు – “సార్ మా తమ్ముడ్ని మంచి స్కూల్లో చేర్పించాలి, వాడు అక్కడుంటే చెడిపోతాడు” అన్నాడు మూర్తి.  ఆ చివరి వాక్యంతో కథ పుర్తయిపోతుంది.

ఎవరెవరి మీదో ఉన్న ఎప్పటెప్పటి కోపాలో అనివార్యంగా మోసుకుంటూ తిరుగుతాం.  ఎంతటి సంతోష సమయాల్లో కూడా తీసి పక్కన పెట్టలేం.  కానీ పక్కన పెట్టడం ఇంత సులువుగా చెయ్యవచ్చని ఈ కథ చదివితే నాకు అనిపించింది.  అనిపించడమే కాదు అలా చెయ్యడం ప్రాక్టీసు- సాధన అంటే మరీ పెద్ద మాట అవుతుందేమోనని ఈ ఆంగ్ల పదం వాడేను-  చేసేను.  చేస్తూ ఉన్నాను.  అలా ఈ కథ నా వెంట ప్రయాణిస్తో వస్తోంది.

మూర్తి ఇంకొక మాట అంటాడు.  ఆ మాటకి ముందు “యుద్దంలో పలాయనం చేసిన వాళ్ళున్నారు. ప్రేమలో పలాయనం చేసిన వాళ్ళు ఉండవచ్చు.  ఈ దురంత నిశిత స్మృతుల నించి పారిపోగల శక్తి ఎవరికీ ఉండదేమో అనుకుని లైబ్రరీలో స్విచ్ వేసి పుస్తకం తెచ్చుకున్నాడు.  అప్పుడు ఇలా అనుకున్నాడు.  “గోల్కొండలో ఉండగా కొన్ని తెలుగు పుస్తకాలు, ముద్దు కృష్ణ వైతాళికులు, దువ్వురి రామారెడ్డి మధుశాల, వేదుల వారి పద్యాలు, రాయప్రోలు వారివి కంఠతా కొన్ని, తడుముకొంటే కొన్ని, జాషువా సంగతి సరే సరి.  జయశంకర్ ప్రసాద్, మహా దేవి వర్మ, ద్వివేది, చతుర్వేది, ఎవ్వరూ తనని ఈ రాత్రి నిద్ర పోనిచ్చేటట్లు లేరు.  గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తూఉందని  గుర్తించని వాడు సగం మనిషి అంటున్నారు వాళ్ళు” అంటాడు.

మునిపల్లె రాజు గారు మనిషిలోని సమస్త కల్మషాలూ మాలిన్యాలూ సాహిత్యం వల్ల ప్రక్షాళితం అవుతాయంటున్నారు.  సవతి తమ్ముడు కథలో దక్షిణా మూర్తి క్షమ చూస్తే, అంత కంటే ఎక్కువగా గాల్యా క్షమను చూస్తే మనకి కూడా ఎవరేనా సులువుగా క్షమించేయవచ్చని, అలా చెయ్యాలని అనిపిస్తుంది.  మేజర్ దక్షిణామూర్తి ఒక కథలో సాహిత్య రూపంలో పాత్రగా పాఠకుని అంతరంగాన్ని శుభ్ర పరుస్తాడు.

ఇందులో అంటే ఈ కథలో రాజుగారు చూపిన మరొక శిల్ప నైపుణ్యం ఏమిటంటే గొప్ప ఆర్ట్ సినిమా లాంటి కళా రూపం ద్వారా కూడా వ్యక్తిలో మార్పు వస్తుందని ఆయన ఒక కళా రూపం నుంచి మరో కళా రూపాన్ని చూపిస్తూ వాటి తాలూకు శక్తిని చెప్పకనే చెప్పడం అబ్బుర పరుస్తుంది.

మహాభారతం ఉద్యోగ పర్వంలో ధర్మరాజు కృష్ణుడంతటి వాడితో ఒక మాట చెప్తాడు.  “పగయే కలిగినేని పామున్న ఇంటిలో ఉన్నయట్లు కాక ఊరడిల్లి యుండ నెట్లు చిత్తమొక మాటు – కావున వలవధిక దీర్ఘ వైర వృత్తి” అని.  ఇక్కడ పగ అన్న మాటను కాస్త మార్చి ద్వేషం అన్న అర్ధంలో వాడదాం.  అది ఉంటె పామున్న ఇంట్లో ఉన్నట్టే మనస్సు అస్థిమితంగా ఉంటుంది కావున దీర్ఘ కాలం ఎవరితోనూ వైరం ఉండకూడదు.  ఇంకా ఇలా కూడా అంటాడు “పగ అడగించుట ఎంతయు శుభంబు, అది లెస్స” కానీ “అడంగునె పగన్ పగ “ అనీ అంటాడు.

పగను తీర్చుకోవడం మంచిదే కాని దానివల్ల పగ చల్లారుతుందా ? అన్న ప్రశ్నకు సమాధానం ఈ కథ.  జీవితంలో సౌఖ్యానికి స్థిమితం ఎంత ముఖ్యమో, దానికి దారి ఎటు వైపునుంచి ఉంటుందో చుక్కలవెలుగు లాంటి కాంతి  సహాయంతో ఈ అంధకారంలో దారి చూపించేలాంటి ఇలాంటి కథ ఎవరికైనా ఇష్టమవుతుంది.

*

స్వేచ్ఛకి లోపలి కోణం!

konni sephalikalu

లోగో: భవాని ఫణి

 

 

పదిహేను రోజులు క్రితం హైదరాబాద్ లో ‘రమణీ సె రమణాశ్రమ్ తక్’ అనే పేరుతో హిందీలో రాసిన చలం గారి సంపూర్ణ చరిత్ర 14 వందల పేజీల పుస్తకం తాలుకు ఆవిష్కరణ సభ జరిగింది.  ఆ సభలో మాట్లాడుతూ ఇంతకాలం చలం చెప్పిన బయటి  స్వేచ్ఛ గురించే మాట్లాడాం.  ఇక లోపలి స్వేచ్చ గురించి మాట్లాడాలి.  ఎందుకంటే లోపలి స్వేచ్ఛ లేని బయట స్వేచ్ఛ హాని చేస్తుంది అన్నాను.  సభ పూర్తయ్యాక నన్ను ముగ్గురు నలుగురు ఆ లోపలి స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగారు.  వెంటనే నాకు చలంగారి ‘శశాంక’ నాటకం గుర్తొచ్చింది.  చాలా కాలం నన్ను ఆలోచింపజేసి ఇప్పటికీ నా వెంట ఉండి నడిపించే మార్గదర్శకాల లాంటి పాత్రలున్న నాటకం అంది.  ఆ కథ, దానిలో కలగలిసిన ఆలోచనల గురించి కాస్త చెప్పుకుందాం.

తారాశశాంకమనే పురాణ కథను పెద్దగా మార్చకుండా అసలు అలాంటి కథలో అంతరార్థమేమయి ఉంటుందో చెప్పడానికి చలంగారు చేసిన ప్రయత్నమే ఈ నాటకం, ఇది నిరుపమానం.  రచన అంతా కవితాత్మకంగా ఉంటూనే ఆలోచనాత్మకంగా కూడా ఉంటుంది.

బృహస్పతి దేవ గురువు.  అతని భార్య తార.  బృహస్పతి బుద్ధిశాలి, వివేకి.  తారలోని రసస్నిగ్దత అతనికి తెలుసు.  కానీ అది తనవల్ల స్పందన పొందడం లేదని, దానికి లోపం తనదేనని గ్రహించుకోగల వివేకి.  ఎవరిలోనూ లోపాన్ని ఎంచడానికి ఇష్టపడని వ్యక్తి. వారిద్దరూ కలిసి శశాంకుడనే కుర్రవాడిని పెంచారు.  శశాంకుడు ఇప్పుడు లేప్రాయపు యువకుడయినాడు.  అతని మిత్రురాలు అనూరాధ.  తార అనూరాధను నిందిస్తుంటే బృహస్పతి ఇలా అంటాడు “ఇతరులలో కనపడే మాలిన్యమెప్పుడు హృదయ దర్పణాల ప్రతిబింబితమయిన స్వకీయ కల్మషమే” అని అంటూ ఈర్ష్యాసూయలు వద్దు అంటాడు.  అప్పటికే తార శశాంకుడి పట్ల మోహంతో ఉంది అని ఆయన గుర్తించాడు.  తన ప్రేమకు ఆమె స్పందించకపోవడాన్ని కూడా గుర్తు చేస్తాడు.  దానికి ఆమె “తపసి ప్రపంచము వాంఛాతీతము కదా” అంటుంది.  ఇక్కడ బృహస్పతి నోటి వెంట చలంగారు ఒక గొప్ప మాట అనిపిస్తారు.  “ప్రపంచ రసాస్వాదనమే తపస్సు” అని, రసాస్వాదన చెయ్యగల హృదయ స్పందన కలిగి ఉండడమే, అటువంటి హృదయాన్ని సంపాదించు కోగలగడమే తపస్సు అని ఆయన ఉద్దేశం.  తారలో ఉన్న అపారమయిన ప్రణయ ప్రళయ పాతాళగంగను విజ్రుంబించ జేసి, సాఫల్య పరచుకునే శక్తి తనకు లేదని గ్రహించి ఆ లోపం తనదేనని అర్ధం చేసుకోగల ధీరుడు బృహస్పతి.  అతని ప్రేమకు తనను అర్హురాలిగా అతన్నే మార్చుకోమంటుంది తార.  కాని ‘ప్రేమ ఆత్మసమర్పణ మయినప్పుడే స్వీకరణార్హము’ అనే స్వేచ్చ వల్లనే అది సాధ్యపడాలి గాని ప్రయత్నం వల్ల సాధ్యం కాదంటాడు.  ఈ మాటలు జీర్ణం చేసుకోగలిగితే ఎంత స్థిమితం వస్తుంది మనకి.

ఇటువంటి వాతావరణంలో బృహస్పతి పట్ల స్పందించని ఆమె హృదయం శశాంకుడి పట్ల కదలడానికి, కరగడానికి కారణం తారలాగే శశాంకుడు రసోన్మత్తుడు కావడమే.

“నా కళ్ళలో జ్వలించే మహారతి దీప్తికి, నా మొహంలో నాట్యమాడే మోహాతురతను చూసి పార్వతమయినా నన్ను  వరించి ఉంటుందనే నా నమ్మకం” అనేటంత నమ్మకం అతని మీద అతనికి.  ఈ ప్రపంచం లోని స్త్రీత్వమంతా అతనికి దాసోహమవ్వాలన్నంత కాంక్ష అతనిది.

అలాంటి శశాంకుడి పట్ల తార స్పందిచండం గమనించిన బృహస్పతి ఆమెను హెచ్చరించాడు.  అతని హృదయాన్ని అతన్ని ప్రేమించే అనూరాధ వైపు తిప్పే ప్రయత్నం చెయ్యమన్నాడు.  కానీ అది తార వశంలో లేదు.  అది కుడా బృహస్పతి గ్రహించాడు.

gudipati_vekata_chalam

తారా శాశంకల సమాగమం జరిగితే దాన్ని ఎంతో సహజమయిన విషయంగా తీసుకోగల మానసిక శక్తి కోసం, తిరిగి తారను తనదానిగా అంగీకరించగల మానసిక నైర్మల్యం సంపాదించడం కోసం అతను మరింత తపశ్శక్తిని సంపాదించుకోవడానికి వెడతాడు.

సమాగమం జరిగి శశాంకుడు భీతితో ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు.  తార దిగులుతో ఉంది.  అది తన మనసుకు తగిలి తపస్సు మధ్యలోంచి లేచి వచ్చాడు బృహస్పతి.  ఏ సహాయం కోరి నన్ను తల్చుకున్నావని అడిగినప్పుడు శశాంకుడిని తీసుకురమ్మన్నది తార.  ఇక్కడ వారి సంభాషణ ఎంతో ఆలోచింపచేస్తుంది.  ఒక స్పష్టత కుడా ఇస్తుంది.

“నువ్వే అతని వద్దకు వెళ్ళు” అంటాడు.  “ఇల్లు వదిలి వెళ్లిపొమ్మంటున్నారా సాధారుణులవలె ? లోకమూర్ఖత్వాన్ని సహించగలనా ?” అంటుంది.

“నీ భీరుత్వానికి చౌర్యాన్ని జతచేసి నన్ను తెరగా నీతి వస్త్రం కప్పి నుంచోమంటున్నావు తెలుసా” అని ఆమెను ప్రశ్నిస్తాడు.

ప్రేమకోసం తార బృహస్పతిని ఆ త్యాగం చేయమంటుంది.  అతను ప్రేమ కోసం చేస్తానని చెప్పినా, తారకు హెచ్చరిక చేస్తాడు.  “ప్రజల తుచ్ఛ అభిప్రాయాలను లక్ష్య పెట్టే నడత సత్యచోదితం కాదు.  కాంతి నుంచి విముఖవు కావద్దు, హృదయ పరీక్ష తెచ్చే పర్యవసానాన్ని విశ్వసించి, అంగీకరించి, అనుష్టించే ధైర్యం విడనాడకు” అంటాడు.  నమ్మినదాన్ని ఆచరించడానికి కావలసిన నిర్భీతి గురించే ఇలా చెప్తారు చలం గారు.

బృహస్పతి వెళ్లి శశాంకుడిని తీసుకొచ్చి తారకు అప్పగించేడు.  తార అతడిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళింది.  కానీ ఈ విధమైన అనుభవం ఆమెను మాతృత్వ భావనలోకి తీసికెళ్ళింది.  శశాంకుడి వల్ల పూర్ణ స్త్రీగా మారిన ఆమె “ఏ దేశమో పోయి వచ్చిన కుమారుణ్ణి కౌగిలించుకున్నట్టుగా ఉంది ఈ రాత్రి నాకు అంటుంది.

ఈ సంఘటన తర్వాత ప్రపంచ సౌందర్యంలోకి దృష్టి వికసించడాన్ని గురించి చెప్తూ “ఇదంతా నాదే అన్న భావం నుంచి ఇదంతా నేనే” అన్న దానిలోకి మనసు ప్రయాణించాలంటారు చలం గారు.

శశాంకుడినీ, తారనూ అంగీకరించగల శక్తితో లోకపు మూర్ఖత్వాన్ని ఎదిరించగల ధీరుడుగా బృహస్పతి కనిపిస్తాడు.

అయితే శశాంకుడి మాటేమిటి? అందుకోసం చలంగారు ఈ ఆశ్రమంలోకి అహల్యను కూడా రప్పించారు. ‘అమితమైన స్త్రీ ప్రేమ కోసం, మోహం కోసం ఆరాటపడే శశాంకుడికి ఆమె ప్రేమ జీవనానికి కావలసిన ఏకాగ్రత గురించి చెప్తుంది.  చంచలత నుంచి నిశ్చలకు రావలసిన ఏకాగ్రత యొక్క అవసరం, ఆ దారీ వివరిస్తుంది.

కళాకారుడు, పిపాసీ అయిన అతని మోహకాంక్ష సంగీత, సాహిత్యం వంటి ఉపకరణాల ద్వారా శమింప జేసుకునే మార్గాన్ని, వాటినే తపస్సుగా మార్చుకునే ఏకాగ్రతా సిద్ధిని, మనో నిశ్చలతను పొందే దారిని సూచిస్తుంది.

తన కొద్దికాలపు సౌఖ్యానుభవం వల్ల కలిగిన లోకనింద భరించలేక, వేల ఏళ్ళు పాషాణంగా మారిపోవడం తన హృదయ స్థితినే సూచిస్తుందనీ, కానీ ఆ కొద్ది ఘడియల ప్రేమానుభవం వల్లనే మిగిలిన జీవితాన్ని జీవించగల శక్తి వచ్చిందని అహల్య అంటుంది.  అయితే ఏ పురుషుడితో ఆ అనుభవం కలిగిందో అతను భీరువు కావడం వల్లనే తనకలాంటి స్థితి వచ్చిందని, అతడు ధీరుడయితే తను లోకాన్ని జయించి ఉండేదాననని అంటుంది. చివరిగా ఒక మాట అంటుంది.  ఇది చలంగారి మాటే “మన హృదయంలోని సౌందర్యాశయం ఉందే! దాన్ని మన హృదయమే కవ్విస్తోంది.  అది దేనివల్లా సఫలం కాదు.  మన హృదయం వల్లనే తప్ప.  మనని  ప్రేమించిన వ్యక్తిలో మనం ఆ ఆదర్శాన్ని కల్పించుకుని సంతుష్టి పడాలి”  అంటుంది.  అంతే కాక అతని అహంకారాతిశయం చూసి, చెంపల నునుపు చూసి భ్రమసి మతిహీనులయ్యే క్షుద్రులనుకోకు – స్త్రీ జనమంతా” అని హెచ్చరిస్తుంది.  ఈ హెచ్చరిక చాలా మంది పురుషులకు కుడా చెంప దెబ్బే.

మోహ జీవనం నుంచి ప్రేమ జీవనం వైపు చేసే ప్రయాణంలోని కఠోరత అంతా ఈ కథలో ఉంది.  ఇంత కన్నా ముఖ్యమయినది మరోటి ఉంది.  అది ఇలాంటి జీవనంలో ఉన్నవారి గురించి మనం ఎలా ఆలోచించాలి,  అసలు లోకం పట్ల మన స్పందన ఎలా ఉండాలి, అన్నది.

విశ్వామిత్రుడితో కలిసి ఋషులు బృహస్పతి ఆశ్రమానికి వచ్చి ఈ అక్రమ సంబంధాన్ని గురించి నిలదీసినప్పుడు బృహస్పతి వారికి చెప్పిన సమాధానాలు, “నీతి, దుర్నీతుల విచక్షణ నీ జీవితాన్ని దిద్దుకునేందుకు ఉపయోగపడాలి తప్ప లోకాన్ని దిద్దేందుకు కాదు.  నీ ధర్మం తప్ప సామాన్యుడు గానీ, ఇంకెవరు గానీ ఇంకొకరి ధర్మం నీవు నిర్ణయించడం మూర్ఖం, సాహసం” ఇంకా గౌతమ మహర్షితో ఇలా అంటాడు.

new doc 10_1

“అజ్ఞానంతో, దుర్బలత్వంతో, మూర్ఖత్వంతో, సమస్త ఈతి బాధలకూ లోనయి కర్మవశాన జరామరణాదులనుంచి విముక్తి గానక అంధకారంలో మునిగే ఈ ప్రాణికోటికి ధర్మ బోధ చేస్తావా గౌతమా? వారికి ఆత్మాభివృద్ధి చెయ్యాలనే సంకల్పం నీకుందా ? ఉంటే ప్రేమించు, సమస్త జీవుల్నీ ప్రేమించు.  ఖండించకు, శిక్షించకు, నీకన్న, నీ తపస్సుకన్నా, నీ భర్య కన్నా, నీ ఈశ్వరుడి కన్నా అధికంగా దుర్గతిలో పెనుగులాడే ఈ లోకాన్నంతా ప్రేమించు.  కల్మషమంతటితోనూ నిండిన ఈ ప్రపంచాన్ని నీ హృదయానికి హత్తుకో” అంటాడు.

కర్మానుసారం మనుషులు నశిస్తారు.  మనమేం చెయ్యగలం -? ప్రేమించి ఎమిటి లాభం” అన్న గౌతముడి ప్రశ్నకు తిరిగి బృహస్పతి ఇచ్చిన జవాబు నన్ను కదిలించి నిరంతరమూ నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ జవాబు “ప్రేమించడం వారి కోసం కాదు.  నీ ఆత్మ పారిశుధ్యం కోసమోయీ” అన్నది.  అనేకానేక ఉద్యమాలు నడిపే అనేకానేకులైన మహానుభావులు ఈ మాట గ్రహిస్తేచాలనిపిస్తుంది.  ఇంతకన్నా లోపలి స్వేచ్ఛ గురించి స్పష్టంగా ఎవరు చెప్పగలరు -???

ప్రకృతి అందాలకి పరవశిస్తూ అందులో లీనమావుతూ ఆ ఆనందాన్ని తన పాటలో పలికించుకునే మరో విశిష్ట పాత్ర అనూరాధ. “ఈ అడవి దాగి పోనా ! ఎటులయిన ఇచటనే ఆగిపోనా” అన్న కృష్ణ శాస్త్రి గారి మాటలో ‘ఎటులయినా’ అన్నమాట ఎంతగానో ఆలోచింపదగ్గది.  ప్రకృతి మనకి ఎంత ఇష్టమయినా జీవితపు మోహాలు అక్కడ ఆగనివ్వవు.  వెనక్కిలాగుతాయి.  కాబట్టి ఎలాగయినా సరే వాటినన్నిటినీ జయించి ఇక్కడే ఆగిపోతాను అని కవి ఆశయం.  అనూరాధ అలాంటి మోహాలు లేని ప్రేమ జీవి. ప్రశాంతంగా ఉంటూ, నిర్మలంగా శశాంకుడిని ప్రేమిస్తూ ఉంటుంది.  శశాంకుడి వంటి మోహోన్మత్తుడికి ఆమె మాత్రమే తరణోపాయం.  ఇది అహల్య మాటల ద్వారా శశాంకుడు గ్రహిస్తాడు గాని అతని జీవన మోహ జ్వరాలు ఎంతో సాధన వల్లగాని శమించవు అని మనం అలాంటి వ్యక్తుల్ని చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నప్పుడు తెలుస్తుంది.

ఈ నాటకం మొత్తం మీద చలంగారు సూచించిన మరొక ప్రధాన అంశం హృదయస్పందనే ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడాలని.  అపుడే ఆ సంబంధం దివ్యం అవుతుంది.  ఇటువంటి హృదయ ప్రధానమయిన స్త్రీ పురుష సంబందాల పట్ల చుట్టూ ఉన్న ప్రపంచమూ, ఆయా సంబంధిత వ్యక్తులూ ఎంతో ఉదారంగా ఉండగలగాలి.  ఏ గొప్ప జ్ఞానమయినా అటువంటి దివ్యానుభవం వల్లనే ఆయా వ్యక్తులకు కలుగుతుంది.  కలగలేదు అంటే ఆ అనుభవంలోని దివ్యత్వంలో ఎక్కడో ఏదో లోపం ఉందని అర్ధం.  ఇటువంటి దివ్యానుభవం పొందిన వ్యక్తులకు  ఉదాహరణగా ఇందులో బృహస్పతి, తార, అహల్య పాత్రలను చూపించారు. ఇందుకోసం కాకుండా కేవల ఆకర్షణే ప్రధానంగా శరీర సంబంధాలు పెట్టుకోవడం పట్ల చలంగారికి పెద్ద ఆసక్తి లేదన్నది తెలుస్తోంది.

ఇదంతా ఆచరణకి ఎంతో దూరంగా ఉన్నా సరే పదే పదే ఆలోచింపజేసి, అనుభూతి ప్రధానంగా జీవించే మనుషులకు లోపలి వెలుగును ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం.

*