మార్కెట్ మాయలో నలుగుతున్న మన కథ ‘ఒండ్రుమట్టి’

మనం నడిచొచ్చిన చరిత్రను అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. సామాజిక పరిణామాలను సాహిత్యీకరించడం అన్ని యుగాల రచయితలకూ సవాలే. అయినా నిత్య చలనశీలమైన సమాజ పరిణామాన్ని గురించి పట్టించుకోని, వ్యాఖ్యానించని రచయిత ఉండరు. ఒక చారిత్రక గతిలో ముఖ్యమైన మలుపుల వద్ద ఒక నిర్దిష్ట కాలపు చారిత్రక, రాజకీయార్థిక పరిణామాలను చిత్రించిన మాలపల్లి, ప్రజల మనిషి వంటి గొప్ప నవలలు మన సాహిత్యంలో ఉన్నాయి. ఎన్నో రాజకీయ సంచలనాలకు కేంద్రమైన తెలుగు సమాజం అంతే అద్భుతమైన సాహిత్యాన్ని సృజించింది. అటువంటి సాహిత్యం తిరిగి ఈ చరిత్రకు, సామాజిక పరిశీలనలకు రక్తమాంసాలను అందించింది.

అదే ఒరవడిలో సరుకుల మార్కెట్‌ తీసుకొచ్చిన మార్పులను, రాజకీయ సంచలనాలు కదలబార్చిన సామాజిక సంబంధాలను, అనేక పరిణామాలను ఇమడ్చుకున్న కీలకమైన ఒక అర్ధశతాబ్దపు కాలాన్ని నాలుగు వందల పేజీల్లో రక్తమాంసాలతో మన కళ్ళముందుంచే ప్రయత్నం చేశారు విప్లవ రచయిత నల్లూరి రుక్మిణి. మార్పును గురించి మాట్లాడాలంటే నోస్టాల్జియాలో మునిగితేలుతున్న ఇటీవలి సాహిత్య ధోరణుల్లో ఒక స్పష్టమైన శాస్త్రీయ దృక్పథంతో సమాజాన్ని పరిశీలించిన అరుదైన నవల రుక్మిణి తాజా రచన ‘ఒండ్రుమట్టి’.

సాంకేతిక అభివృద్ధిలోని అన్ని అనుకూలాంశాలను భౌతికంగా అందిపుచ్చుకుని, మానసిక ప్రపంచంలో గతించిన కాలాన్ని గురించి, పల్లెలో ఒకనాడుండిన మానవ సంబంధాల గురించి వలపోసుకునే మధ్యతరగతి సాహిత్య జీవుల మన:స్థితిలోకి రచయిత ఇక్కడ పొరపాటున కూడా జారిపోలేదు. ఆ ఛాయలు ఎంతోకొంత రుక్మిణి కథల్లో అంతకు ముందు ఉండేవేమోగాని ఈ ప్రయత్నంలో అందులో నుంచి పూర్తిగా బైట పడ్డారు. అట్లాగే ఒక ప్రత్యేక పీడిత సమూహపు వేదనను వ్యక్తీకరించే అనుభవవాదమూ ఇందులో లేదు. అటువంటి వాటిల్లో సృజనకారులకు తమదైన ప్రత్యేక అనుభవం గురించి లోతైన అభివ్యక్తీకరణ సాధ్యమవుతుంది కాని చలనాలను, పరిణామాలను పట్టుకోవడం కష్టమే.

ప్రాంతీయ ఉద్యమాల సందర్భంలో కోస్తాఆంధ్ర ఆధిపత్యం, అంతర్గత వలస, వనరుల ఆక్రమణ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ‘అభివృద్ధి’ గురించి మాటలుంటాయి. వాటి వెంట నీటి పారుదల, కాలువల కింది వ్యవసాయం తొట్టతొలిసారి అందిపుచ్చుకున్న ప్రాంతంగా ఆంధ్ర సంపన్నవర్గాలు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయార్థిక, సాంస్కృతిక శాసనకర్తలుగా ఎదిగిన క్రమంమంతా నేపథ్యంగా ఉంటుంది. ఆ అభివృద్ధి వికాస క్రమం ఎటువంటిది? అది సాధించిందేమిటి? ఒండ్రుమట్టి నవల కాప్షన్‌ ‘ఒక తీర గ్రామం` యాభై ఏళ్ళ కథ’.

కాలువల కింద వ్యవసాయం ఆదాయంలో మిగులును సృష్టించడం మొదలు మార్కెట్‌ విస్తరణ సమాజాన్ని కదలబార్చిన మార్పు క్రమం కృష్ణాపురం అనే ఒక గ్రామం కేంద్రంగా ఈ కథ నడుస్తుంది. ప్రవాహానికి పోగుపడ్డ ఒండ్రుమట్టి పొరలు పొరలుగా కాలప్రవాహంలో వేగంగా కదులుతున్న జీవితాలను కనీసం ఓ రెండు మూడు తరాలను దృశ్యమానం చేస్తుంది. బకింగ్‌హాం కాలువ రావడం, బండ్లు ఓడలు కావడం, అదే క్రమంలో ఆ చిన్న గ్రామానికి విశాల ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటాయి. మరోవైపు నుండి జాతీయోద్యమ రాజకీయాలు, కమ్యూనిస్టు చైతన్యమూ ఆ ఊరును తాకుతుంది. పాత భూస్వామ్య కోటలు బీటలువారుతుంటాయి. కొత్త ఆధిపత్య వర్గం తలెత్తి బుసలు కొట్టడం మొదలు పెడుతుంది. తరాలుగా తొక్కిపెట్టబడిన కాలికింద మట్టి పైకెగిసి సవాలు చేస్తుంది. సమాజపు అన్ని పొరల్లోనూ ప్రకంపనలు బయలుదేరుతాయి. ఇవన్నీ 50 ఏళ్ళ విశాలమైన కాలపరిధిలో భిన్న వర్గాల, కులాలకు చెందిన అనేక సజీవ పాత్రలతో రూపగట్టడం చిన్న విషయం కాదు. సామాజిక పరిణామాల వెనకున్న ఉత్పత్తి సంబంధాల సూత్రాన్ని పట్టుకోవడం వల్లనే రచయితకు ఇది సాధ్యమైంది. అందుకే రచయిత తాను పుట్టిపెరిగిన మట్టి అయినప్పటికీ నోస్టాల్జియాలో పడిపోక తన అనుభవ జ్ఞానం పల్లె జీవితాన్ని లోతుగా పట్టివ్వడానికే ఉపయోగించుకున్నారు. ఈ జగ్రత్త వహించకపోతే ఏదో ఒక మూలకు జారిపోయే అవకాశం ఉంది. అనుభవానికి శాస్త్రీయ పరిశీలన తోడైనప్పుడే కనిపించే వాస్తవాల వెనక కదిలించే శక్తులు ఏవో నిగ్గుతేలుతుంది.

‘కాణీలు కనపడని రోజుల్లో’ కృష్ణాపురం వర్షాల మీదే ఆధారపడి ఇరవైనాలుగ్గంటలూ గొడ్డు చాకిరి చేసి జొన్న, కంది, రాగి, ధనియాలు పండిరచేది. ఇంటిక్కావలసిన తిండి, బట్ట కోసం ఇంటిల్లిపాదీ ఇరవైనాలుగ్గంటలూ కష్టపడే రైతు కుటుంబాలు, ఊరిని నమ్ముకుని ఉండే వృత్తి కులాలు, పూటకింత సంకటి ముద్ద కోసం జీవితాంతం నెత్తురు చెమటలుగా ధారపోసే జీతగాళ్ళు, అందరినీ అదుపాజ్ఞల్లో ఉంచే జమిందారు `అంతా కట్టుదిట్టంగా బిగించి ఉన్న ఒక బంధ వ్యవస్థ అది. ఆ ఊరివాళ్ళకు ఊరే ప్రపంచం. భూస్వామ్య వ్యవస్థ తాలూకు ఎన్ని ఎగుడు దిగుడులున్నా, ఎన్ని గాయాలు, బాధలున్నా తమ ప్రపంచాన్ని సమష్టిగా పరిరక్షించుకుంటారు. ఏ ఇంట్లో పెళ్ళైనా ఊరంతా ఒక్కటవుతుంది. మధ్యతరగతి రైతు రాయినీడు కోటయ్య కొడుకు తిరుపతయ్య పెళ్ళికి ఊర్లో అందరూ చుట్టాలను పిలుచుకుంటారు. ప్రతి ఇంటి నుండి పాలు, పెరుగు పెళ్ళింటికి తీసుకుపోతారు. అట్లాగే ఏరువాక పండగ రోజు ఊర్లోని రైతులంతా ఒకేసారి అరకలు వరుసగా పొలాలకు నడిపిస్తారు.

జమిందారు రంగస్వామి అరక ముందుంటే దాని వెంట ఊర్లో వారివారి హోదాని బట్టి వారి అరకల క్రమం నిలబడుతుంది. పల్లె స్వభావాన్ని పట్టిచ్చే ఈ రెండు సాంస్కృతిక విశేషాలను నవల చక్కగా ఉపయోగించుకుంది. యాభై ఏళ్ళు గడిచాక పెళ్ళి రూపురేఖలు ఎలా మారిపోయాయో అనే కాదు, ఏ సందర్భం వచ్చినా సమష్టితత్వం కన్నా సంపద ప్రదర్శన ప్రధానమైపోవడం కూడా ఇక్కడ కనపడుతుంది. అప్పటిదాకా మామూలుగా అనిపించిన ఊరు ఏదో కొత్తదనాననికి నాంది పలుకుతున్నట్టుగా ఏరువాక పండగ రోజు విశేషం కనపడుతుంది. ఏరువాక పండగరోజు అంతా సవ్యంగా నడిచినా ఆ ఏడు కొట్టొచ్చినట్టు కనిపించే మార్పు ఏమిటంటే జమిందారు అరక వెనక దానిని మించి తీర్చిదిద్దినట్టున్న వెంకటాద్రినాయుడి అరక . అది ఎదుగుతున్న కొత్త ఆధిపత్య వర్గానికి సూచిక. రంగస్వామి సడలిపోతున్న జమిందారీ వ్యవస్థకు ప్రతినిధి అయితే వెంకటాద్రినాయుడు మార్కెట్‌ విస్తరణ వల్ల తలెత్తిన కొత్త వ్యాపార వర్గానికి ప్రతినిధి. సంప్రదాయబద్ధుడైన జమిందారు రామస్వామి తండ్రి అతనికి కొన్ని సూత్రాలు చెప్పాడు.

రైతులకు అప్పు ఇవ్వుగాని పత్రం రాయించుకోకు. ఇనుప ముక్కల వ్యాపారం చేయొద్దు. అసలు వ్యాపారమంటేనే అవసరమైన చోట తగ్గి ఉండాలి. అది జమిందార్లు చేసే పని కాదు. అప్పుకు పత్రం రాయించుకోడమంటే తన రైతులు తన విశ్వాసం తప్పుతారని అనుమానం కలగడమే. ఆ భావన కూడా ఎన్నటికీ రాకూడదు. అయితే కాలం తీసు కొచ్చేమార్పులను ఎవరూ ఆపలేరు. కాలానుగుణంగా మారలేని పెద్దరికం, ఆధిపత్యం కూడా నశించక తప్పదు. మార్పును అర్థం చేసుకుని, వచ్చే అవకాశాల్ని పట్టుకుని ఎదిగే నూతన శక్తులు రంగం మీదికి రాక తప్పదు. వెంకటాద్రినాయుడు పిల్లలు మద్రాసు చదువులు చదువుకుని, ఓడల వ్యాపారంలో ఒడుపు తెలుసుకుని, మిగులు సంపాదించి పెట్టడంతో, అతను రైతులకు అప్పులు ఇవ్వడమే కాదు, పాత జమిందారులా కాకుండా కచ్చితంగా నోటు రాయించుకుని ముక్కు పిండి వసూలు చేస్తాడు. జమిందారు రంగస్వామే నయం అని రైతులనుకుంటేనేం, అతను అంతకంతకూ సంపన్నుడై ఊరు మీద పట్టు సంపాదిస్తాడు. ఆనాటి జాతీయోద్యమ రాజకీయాల కాలంలో రంగస్వామి జస్టిస్‌ పార్టీవైపు పోతే, వెంకటాద్రినాయుడు కాంగ్రెస్‌కు దగ్గరవుతాడు. ఇది అత్యంత సహజమే. రాజకీయంగా ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలవి.

వ్యవసాయంలోకి వ్యాపారపంటగా పొగాకు రావడంతో రైతులు కూడా మెదటిసారిగా మిగులు కళ్ళజూస్తారు. చీరాల పట్టణంతో సంబంధం ఏర్పడి జాతీయోద్యమ రాజకీయాలు రైతులనూ తాకుతాయి. చీరాల`పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమం, పుల్లరి వ్యతిరేక ఉద్యమం, జలియన్‌ వాలాబాగ్‌ దేశం నలుమూలలా ప్రతిధ్వనించిన రోజులు అవి. జాతీయోద్యమంతో ప్రభావితులైన మధ్యతరగతి రైతు యువకుల్లో రాయినీడు కోటయ్య రెండో కొడుకు పరమయ్య ఒకడు. పురోగామి రాజకీయాల వైపు నడిచిన మధ్యతరగతికి ప్రతినిధి పరమయ్య. ఇతను తర్వాతి కాలంలో గొప్ప కమ్యూనిస్టు అవుతాడు. ప్రపంచ యుద్ధంతో పొగాకు ధరలు పడిపోవడం, అతివృష్టి రైతుల కష్టార్జితాన్ని నీళ్ళపాలు చేసి అప్పులు మిగిలించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో కృష్ణాపురం రైతులకు తెలంగాణ ప్రాంతంలో నిజాం సాగర్‌ డ్యాం కింద కారుచవగ్గా దొరికే భూమి  ఆశలు కలిగిస్తుంది. సాహసం చేసి వలస పోయే రైతుల బృందంలో పరమయ్య కూడా ఒకడవుతాడు. కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చడం కోసం అతను రాకూరు పయనమై రాత్రింబగళ్ళు గుట్టలు చదునుచేసి కండలు పిండి చేసుకుంటాడు. కుటుంబం ఎదిగివచ్చిన ఫలితం పరమయ్య తమ్ముడు  వెంకయ్యకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది. వెంకయ్య పెద్దకొడుకును విదేశీ చదువులు వరిస్తే, చిన్న కొడుకు భాస్కరం క్రమంగా ధనిక రైతుల ప్రతినిధిగా కొత్త ఆధిపత్యవర్గంలో చేరతాడు. పరమయ్య మాత్రం తెలంగాణ రైతాంగ పోరాటానికి సారధ్యం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో భాగమవుతాడు. రాజ్యహింసను చవిస్తాడు. ప్రజల మనిషిగా రాటుదేలుతాడు. ప్రజల కోసం బతకడంలోని తృప్తిని పూర్తిగా పొందుతాడు. అతని కొడుకు చంద్రం అతని చైతన్యాన్ని అందిపుచ్చుకొని దానిని మరింత ముందుకు తీసుకుపోయే రాడికల్‌ అవుతాడు.

ondrumatti cover

            మొదట బతుకుకోసమే నిజాం పోయిన రైతులు తదనంతరం దొరికినంత భూమీ సంపాదించుకోవడం మొదలు పెడతారు. వ్యవసాయంలోకి యంత్రాలు ప్రవేశించి మార్పుల్ని మరింత వేగవంతం చేస్తాయి. ఎప్పుడూ కళ్ళజూడని డబ్బు పోగవుతుంది. కృష్ణాపురం రైతుల్ని నడమంత్రపు సిరి ముంచేస్తుంది. పాత విలువలు నశిస్తాయి. రైతుల దగ్గర అందిన కాడికి దోచుకునే వ్యాపార వర్గం పుట్టుకొస్తుంది. అప్పు చేయడమే తమ స్థాయిని దిగజార్చుకోవడమని, బాకీ తీర్చమని పదేపదే అడిగించుకోవడం మరింత నామర్దా అని భావించే మధ్యతరగతి రైతు కుటుంబాల నుండే అప్పు ఎగ్గొట్టి తిరిగే దళారీ వ్యాపారులు తయారవుతారు.

అనాయాసంగా పోగుపడుతున్న సంపద ఆధిపత్యపోకడల్లో అరాచకత్వానికి దారితీస్తుంది. తమ ఆధిక్యతను కింది కులాలపై అవకాశం కల్పించుకుని మరీ ప్రదర్శిస్తారు. మార్పు మట్టిమనుషుల్నీ ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు ఆధిపత్య వర్గానికే పట్టణాలతో సంబంధం ఉండేది. కాలక్రమంలో పల్లె ప్రజలందరికీ పట్టణాలతో సంబంధం ఏర్పడుతుంది. కూలీనాలీ జనం పనుల కోసం పట్నాలకు పోవడం బస్సుల రాకతో మరింత సానుకూలమవుతుంది. ఊరిని కాదంటే బతికేదెట్లా అనే భయం ఉండనక్కర్లేని పరిస్థితులొస్తాయి. పీడిత కులాలకూ అంతో ఇంతో చదువులు అందుబాటులోకి వస్తాయి. తమ అవ్వతాతల్లాగా, తల్లిదండ్రుల్లాగా మట్టిముద్దల్లా కాకుండా మనుషుల్లా బతకాలనుకుంటారు. ఒకవైపు కొత్తగా వచ్చిన ఆధిపత్యాన్ని అనుభవించాలని దూకుడుగా ఉన్న నయా భూస్వామ్య వర్గాలు, మార్పును అంగీకరించలేని పాత ఫ్యూడల్‌ శక్తులు (మార్పు తమ జీవితాల్ని సుఖమయం చేయొచ్చుగాని అలగా జనాల్ని అంటకూడదు), మరోవైపు గతంలో మాదిరి అవమానాల్ని సహించి ఊరుకోలేని జ్ఞానం పొందిన పీడిత కులాల కొత్త తరాలు. పరస్పర విరుద్ధ శక్తులు అనివార్యంగా ఘర్షణ పడాల్సిందే.

ఆధితపత్య వర్గాల అసహనం కింది కులాలపై హింసాత్మక అణచివేతను మరింత ఎక్కువ చేస్తుంది. సరుకుల మార్కెట్‌ తీసుకొచ్చిన క్షీణ సంస్కృతి విలువలు ఊర్లో లంపెన్‌ కుర్రకారును తయారు చేస్తాయి. దళిత స్త్రీలపై అత్యాచారాలు చేస్తే కులాధిపత్య భూస్వామ్య సమాజంలో మామూలుగా అడిగేవాళ్ళుండరు. అది మరింత దిగజారుతుంది. అక్కడి నుంచి కనిపించే ఆడపిల్లలనంతా అల్లరిపెట్టే ఆ ఊరి అల్లరి మూక చివరికి పండుగపూట ఊరికోలాహలం మధ్యలో కోమటిశెట్టి భార్యను రేప్‌ చేస్తారు. మంచీ చెడ్డా మాట చెప్పే పెద్దమనుషులు ఊర్లో కరువవుతారు. పాత ఫ్యూడల్‌ విలువలూ పోయి, ఆధునిక సంస్కారమూ అలవడక ఒక విధమైన అరాచక, సంకర సంస్కృతి వృద్ధి అవుతుంది. ఈ నవలలో ఒక్కో సంఘటనకు కార్యాకారణ సంబంధాలు గతితార్కికంగా అల్లుకునిపోయి ఉంటాయి.

కదలబారుతున్న ఆర్థిక పునాదిపై సాంఘిక సంబంధాల పట్టు సడలడంలో ప్రగతిశీల రాజకీయాలు ఉపరితలంలో పోషించిన పాత్ర ఎంతో ఉంది. వర్గపోరాటంలో భాగమైన భూపోరాటాలకు, రైతుకూలీ పోరాటాలకు జమిలిగా సాంఘిక అణచివేతపై పోరాటాలు సాగాయి. కృష్ణాపురంలోనూ కమ్యూనిస్టు రాజకీయాలు ప్రజల్ని సంఘటితం చేసి సన్న కులాలకు అండగా నిలుస్తాయి. జీతగాళ్ళ వ్యవస్థ రద్దవుతుంది. రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారి అట్టడుగు కులాల వాళ్ళు అగ్రకుల అహంభావంపై దెబ్బకొడతారు. దళితులకు భూమి పంచడానికి పార్టీ ముందుకు వస్తుంది. అయితే ప్రజల్ని మహోజ్వల పోరాటాల వైపు కదిలించిన కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో దిగడంతో చైతన్యవంతమవుతున్న పీడిత ప్రజలకు నాయకత్వం లేకుండా పోయింది.

భూమి సమస్య అలా ఉంచితే ఆధునిక కాలంలో దళిత కులాల నుండి కొత్త తరం లేవనెత్తుతున్న ప్రశ్నలకు పోరాట రూపం లేకుండా పోతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన కమ్యూనిస్టు పార్టీ ప్రజాఉద్యమాల క్షేత్రంలోనూ నీరసిస్తుంది. పార్టీ బలహీనపడటం పీడిత ప్రజల్ని ఎంతగానో నిరాశపరుస్తుంది. మనదేశంలో రివిజనిజం మార్పుని దీర్ఘకాలానికి వాయిదావేసింది. అయినా పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఎక్కడో ఒక చోట ఘర్షణ బద్దలు కాక తప్పదు. నక్సల్బరీ శ్రీకాకుళాలు అట్లానే విస్ఫోటనం చెందాయి. కృష్ణాపురంలోనూ రాడికల్‌ ఉద్యమం పొద్దుపొడిసింది. సాల్మన్‌ల, మోషేల ఆరాటాలకు పోరాట వేదికనిచ్చింది. అది ఆత్మగౌరవ చైతన్యమే కాదు, ఆయుధం ధరించే తెగువనూ ఇచ్చింది. ఊర్లలో రాడికల్‌ విద్యార్థులు, యువజనలు, జననాట్యమండలి సాంస్కృతిక కార్యకర్తలు చేసిన ప్రచారం కృష్ణాపురం యువతను ఆకర్షిస్తుంది. నిత్య అవమానాలతో వేగిపోతున్న అత్యంత పీడిత సమూహాల పిల్లలు అన్యాయాన్ని ఎదిరించి దెబ్బకు దెబ్బ సమాధానమిచ్చే చర్యలకు పూనుకుంటారు. అటు బోయవాళ్ళూ తిరగబడి, మాదిగలూ తిరగబడి, ఇట్లా ఊర్లో సన్నకులాలు తిరగబడితే మాటలా? సబ్బండకులాలూ ఏకమైతే ఇంకేమైనా ఉందా? అట్లా జరగకుండా మొగ్గలోనే తుంచెయ్యాలనుకుంటాయి ఆధిపత్యశక్తులు. కులం మంటను ఎగదోస్తాయి. మాదిగపేట బూడిద కుప్పవుతుంది.

ఇది కృష్ణాపురంగా కథగా మన ముందుకొచ్చిన కారంచేడు కథ. కారంచేడు ఏం చెప్పింది? చిట్టచివరిగా చర్చికాంపౌండులో ఏర్పాటు చేసిన శిబిరంలో చంద్రం మాటల్లో అది వ్యక్తమవుతుంది. ‘‘ప్రవాహ సదృశ్యమైన సమాజాన్నీ, కాలాన్నీ వ్యక్తులు ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దానికింద నలిగి పోవడమే! ఇప్పటికి వాడిదే పైచేయి కావచ్చు… భవిష్యత్తు ప్రజలదే.’’

ఆ తర్వాత ఏం జరిగింది? ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలు ఏ మార్పుల్ని వేగవంతం చేశాయి? వర్గపోరాట రాజకీయాలు ఏ విజయాలు సాధించాయి? ఏ ఎదురుదెబ్బలు తిన్నాయి? సమాజం ఏ మార్పు దిశగా పోతోంది? ఈ నవల పరిధిదాటి ఇటువంటి ఆసక్తి కొంతమందికైనా కలుగుతుంది. ‘ఇదంతా యువతరం రచయితలు రాయాలి’ అని సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనంపై ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో ఒండ్రుమట్టి నవలా నేపథ్యాన్ని చర్చిస్తున్నప్పుడు రచయిత అన్నారు. మరి ఈ సవాలును ఎవరు స్వీకరిస్తారో.

 -పి.వరలక్ష్మి

1464695_615025941892480_1810339123_n

 

పెద్దక్క మళ్ళీ పుట్టింది ఈ అక్షరాల్లో!

 

modified-coverpage3

ఈ ప్రపంచం లోకి మనం వచ్చేటప్పుడే మన ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పెట్టి ఉంటుంది. ఐనా మనిషికి అన్నిటి కన్నా భయం మృత్యువంటే . నేను అన్నదే లేకుండా పోతే అన్న భయమే కొందరిని మంచిగా చేస్తుంది , మరి కొందరిని కలచి వేస్తుంది. ఎంత గొప్పగా వేదాంతం చెప్పే వారు కూడా మరణం పట్ల భయాన్ని కలిగి ఉంటారనడం లో సందేహం లేదు. జరా మరణాలు దైవాధీనాలు . దైవం అనే దాని పై మనకి నమ్మకం లేకున్నా మరణం మాత్రం ఎప్పుడూ ఎవరికి చెప్పి రాదు . ఎవరికి చెప్పి తీసుకుపోదు. అందుకేనేమో ఆ మృత్యువంటే  మనిషిలో అంత భయాందోళనలు.

మరణం ఒక కామా అంటాడో కవి , మరణం ఒక కామా  వాకాటి పాండురంగారావు గారి ప్రసిద్ధ పుస్తకం . నిజంగా మరణం ఒక కామా యేనా , మళ్ళీ మనం ఈ మానవ జన్మ ఎత్తుతామా ? ఏమో ఎవరికీ తెలియని ఈ వింత పట్లనే కదా మనిషికి ఇంత ఆకర్షణ వికర్షణలు. పాంచ భౌతిక  దేహం లో ప్రాణ స్పందన ఆగిపోయాక ఇక ఈ దేహం నశించవలసిందే. ఎవరూ తమ మరణాన్ని అనుభూతించి అక్షరీకరించలేరు. శంకరుడు అన్నట్టు మృత్యువు అది వచ్చే వేళకి నేను ఉండను , నేను ఉన్నన్నాళ్లూ అది రాదు, అని ఈ మరణాన్ని ఎదుర్కోవడానికి , మానసిక సంసిద్ధత పొందటానికి ఎన్నో నియమాలు , ప్రయోగాలు , అయినా నిరంతరం ఒక భయం తోనే బతికే మామూలు మనుషులం మనం అనుకుంటే . ఒక మామూలు మనిషి, కవి కాదు , తాత్వికురాలు కాదు , అయినా మరణాన్ని ఎంత ధీశాలి లాగా ఎదుర్కుంది.

ఎవరి గురించి చెప్తున్నానో అనుకుంటున్నారా ఇప్పుడే “పెద్దక్క ప్రయాణం” అని విజ్జి , చిన్నమ్మ , జాజి అనే ముగ్గురు చెల్లెళ్ళు  రాసిన ఒక హృదయ పూర్వకమైన నివాళి చదివాను. నలుగురు అక్క చెల్లెళ్లలో పెద్దది అయిన నాగవల్లి గారి స్మృతిలో వారు అక్షరీకరించిన ఈ నివాళి హృదయాన్ని ఆర్ద్రం చేసింది. జాజి డాక్టర్. కె.ఎన్ మల్లీశ్వరి , ప్రముఖ రచయిత్రి వాళ్ల మిగిలిన అక్కలతో కలిసి రాసిన “పెద్దక్క ప్రయాణం” గురించి ఓ రెండు మాటలు.

ఒక మనిషి చనిపోతే మనం చేసే ఎన్నో రకాల పనులతో వారికి నివాళి ఇవ్వాలనుకుంటాము. ఈ కర్మలన్నిటికీ మించినదే చేసేరు ఈ సోదరీమణులు. తమ పెద్దక్క స్మృతిలో అక్కను గూర్చిన జ్ఞాపకాలను అక్షరీకృతమ్ చేసి అక్కను అక్షరం లో బతికించి పెద్ద కూతురిని కోల్పోయిన  ఆ తల్లి తండ్రులకు అందించే ప్రయత్నం  చేసేరు. ఈ మధ్యన  ఇహ లోకాన్ని వదిలిన తమ సోదరి గురించి ఐదు రోజుల్లోగా ఒక పుస్తకాన్ని రాసి తీసుకొచ్చారు.

పెద్దక్క ను గురించి మిగిలిన ముగ్గురు చిన్నమ్మ , విజ్జి , జాజి కలిపి రాసిన స్మృతి మాత్రమే కాదు ఈ పుస్తకం. ఒక వ్యక్తి మరణం ఏమన్నా గొప్పదా ఎందరు పుట్టడం లేదు ఎందరు పోవడం లేదు , నిజమే కానీ మన అనుకున్న ఓ మనిషి ఈ మరణాన్ని ఎంత యధాతధంగా స్వీకరించిందో ఈ చిన్ని పుస్తకం చదివితే అర్ధం అవుతుంది.

తనకి  కేన్సర్ అని తెలిసినా ఏనాడూ ఊరికే  ఏడ్చి అందరినీ ఏడిపించి బాధించ లేదు నాగవల్లి. జీవితాన్ని ఎలా స్వీకరించిందో  అలాగే మరణాన్ని కూడా స్వీకరించింది. తాను బ్రతికుండగానే ఏయే పనులు చక్కపెట్టుకోవాలో ఆలోచించి చేసింది. కూతురిని మనుమరాలిని చిన్నమ్మ కి అప్ప చెప్పింది. చెల్లెళ్లకు ధైర్యం చెప్పింది . తాను లేని లోకం లో ఎలా బ్రతకాలో అని నిస్తేజులై  మిగిలిపోయిన అందరికీ ఒక ఆత్మీయ ఆదర్శంగా నిలిచింది.

కేవలం ఒక వ్యక్తి స్మృతిలో రాయబడినదే అయినా ఈ పుస్తకం లో జాజి తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాలను చెప్పింది. ఒక కుటుంబం లో స్త్రీకి కనుక ఏదన్నా వ్యాధి వస్తే అది ఎలా మరి కొందరి కుటుంబాలను కూడా కదిలించేస్తుందో చెప్పింది. మరణం అన్నది తప్పదనీ తెలిసిన క్షణం నుండీ జీవితాన్ని ఎంత పరిపక్వతతో అక్క స్వీకరించి అలాంటి ఒక స్తిత ప్రజ్ఞతని తమకి ఒక పాఠంగా చెప్పి వెళ్ళిన వైనం జాజి మాటల్లో మనకు తెలుస్తుంది.

ఇక మీకు మేము ఏకలవ్య శిష్యులమ్ అన్న మాట చదవగానే నా గుండె చెమరించింది. ఎక్కడో దూర లోకాల్లో  ఉన్న అక్క కి ఇక్కడ చెల్లెళ్ళు ఏకలవ్య శిష్యులేగా మరి.

image

అమ్మను, ఆత్మీయతను , అక్షరాన్ని , అక్కను అజరామరం చేయగల ఒక  ప్రయత్నం  ఒక చిన్ని హృదయ నివాళి లో తెలియజేసేరు ఈ చెల్లెళ్ళు.

కరిగిపోతున్న క్షణాలలో తాను చదవగలనో లేనో అనుకుని ఎన్నో పుస్తకాలు చూసి విచారించిన అక్క ఆవేదన గూర్చి , తాను ఉండగానే ఇంటికి చెద మందు కొట్టించేయ్యలి లేకుంటే మీ బావ బాధ పడతారు ఆపైనా అని ఆలోచించే ఒక ఇల్లాలు , తల్లి , అమ్మమ్మ , కూతురు , అక్క ఇక ఒక స్మృతి మాత్రమే కదా. నిజానికి ఇంత ధు:ఖం లో కూడా ఈ చిన్ని పుస్తకాన్ని తీసుకొచ్చిన ఈ చెల్లెళ్ల ను తల్చుకుంటే నిజమే వీరు ఆ పెద్దక్క దగ్గర చాలా నెమ్మది ని నేర్చుకున్నారు అనిపిస్తుంది.

పెద్దక్క ప్రయాణం ఒక స్మృత్యంజలి కాదు ఒక మంచి మనసున్న అక్క చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక . మనసున్న వారు చదువుతారు , ప్రతిస్పందిస్తారు , అన్నిటికి మించి ఆ పెద్దక్క దగ్గర  మనం కూడా కొంత నేర్చుకుంటాము. జీవితాన్ని కాస్త దిద్ది తీర్చుకుంటాము . స్మృతి లో రాసిన పుస్తకాలు కవితలు మనలని మరింత బాధ కి గురి చేస్తాయి , లేదా నైరాశ్యం పాలు చేస్తాయి కానీ ఈ పుస్తకం ఒక ఆత్మీయ స్నేహితునిలా రాబోయే జీవితాన్ని గూర్చి , మరణం గూర్చి ఎంతో సంయమనం  పాటించే విధంగా మనకి మంచి పాఠాన్ని గరుపుతుంది. ఈ ముగ్గురికే కాదు ఈ పెద్దక్కను మనందరికీ ఒక ఆత్మీయురాలిని చేసేరు ఈ చెల్లెళ్ళు. మిత్రులారా చదవండి ఈ చెల్లెళ్ల ప్రేమను వారి ఆత్మీయ అక్షరాల్లో బంధించుకుని మనకి ఆవిష్కరించిన వారి పెద్దక్కను .

చిన్నమ్మ కు , విజ్జి కి ,జాజికి ప్రేమ పూర్వక అభినందనలు మీరు వేసినది పుస్తకం కాదు ఒక మంచి మనసును వ్యక్తిత్వాన్ని మాకు పరిచయం చేసేరు అందుకు మీకు కృతజ్ఞతలు . పెద్దక్కను చిరంజీవిని చేసిన మీ ప్రయత్నం సఫలమైంది .

జగద్ధాత్రి

381778_218808094872758_1009111763_n

కాగితమ్మీద వొలికిన జీవితం ఇది!

Mohan Rushi

“Poetry is the essence of life, life is the truth of I-awareness. Essence is the reflection of the universe in the truth of his individuality” అని ఎవరో అన్నట్టు మోహన్ రుషి కవిత్వమంతా మిర్యాల గూడ గతంలో తెలీని భవిష్యత్తును హైద్రాబాద్ భవిష్యత్తులో మర్చిపోలేని గతాన్ని ఎప్పటికప్పుడు పోల్చుకుని తన అస్తిత్వాన్ని తను తవ్వుకోవడం , ఆ పై చొక్కా పైగుండీ విప్పి గతుకులరోడ్లమీద ఈదడం, చివరగా రెండు కన్నీటిబొట్లు గొంతులోకుక్కుకుని నవ్వుకోవడం..ఒక విధంగా ఈ కవిత్వమంతా కన్ఫెషనల్ కవిత్వమే..(అసలు కవిత్వమంటేనే కన్ఫెషనల్) కానీ తెలుగునాట ఇలాంటి దుఃఖసహిత కన్ఫెషనల్ కవిత్వం రావడం అరుదాతి అరుదు..

దేశభక్తిగీతాలు ప్రకృతిపాటలు పక్కనపెడితే ఆధునికత వికటించినప్పుడల్లా కాందిశీక దేహానికీ నీడకీ జరిగే వైయుక్తిక సంఘర్షణే కవిత్వ కారకమౌతుంది..నగరజీవనం సుఖభరితం ఔతున్నకొద్దీ జీవితం అంత నిర్లిప్తంగా తయారౌతుంది, ఐతే చాలాసార్లు ఈ అంతర్బాహిర్ యుధ్దం కవిత్వానికి అస్పష్టతను ఆపాదిస్తుంటుంది సహజంగా, కానీ మోహన్ రుషి కవిత్వం అలా దారితప్పకుండా నడిచొచ్చిన దార్లూ నడిపించిన వేర్లూ మర్చిపోలేని అమాయకత్వం తోడై అకస్మాత్తుగా పాతమిత్రుడు కనిపించి కౌగిలించుకునే ఒక ప్రేమాస్పద స్పర్శగా చదువరుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది..

1

కవిగా మోహన్ రుషి “తల్లి”ని కన్నాడు.. –అమ్మలంతా ఒకవైపు– రెండుగా విభజించవలె, ఆమె రాత్రి దుఃఖాన్ని, లేదూ, రెండింటా ఉన్నది , కావొచ్చు, ఒకే దుఃఖము, విశ్లేషించడం మన తెలివి/తక్కువతనం-..

డయాబెటిస్ తో అమ్మ వేలిగోళ్ళు వాచి ఊడిపోయే ఒకానొక బాధామయ క్షణాల్ని ఏరుకుని గొంతులో గుచ్చుకుంటూనే ఇలా అంటాడు,

–అమ్మల కన్నీళ్ళు అబధ్దం కాదు– వాళ్ళ గురించి వాళ్ళు అడిగే పాపాన వాళ్ళెన్నడూ పోరు వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం అందుకు ఆనవాలు అమ్మల కన్నీళ్ళు అబధ్దం కాదు అన్నాక

–లెక్కలేదు పత్రం లేదు– ఆమె యుధ్దం చరిత్ర గాలే ఆమె బత్కు లెక్కలకు రాలే ఒక మిశ్నిలెక్క/ ఒక కట్టెలెక్క/ ఒక దండెం లెక్క/ ఉన్నదా అంటె ఉన్నది నామ్ కెవాస్తె బత్కలేక సావురాక ….. అని బహురూప స్త్రీ దుఃఖాన్ని నిర్నిమిత్తంగా మనకు బదిలీ చేస్తాడు..

ఇంట్లో రెండు పెద్దబీరువాల పుస్తకాల్ని పోషిస్తూనే పుట్పాత్ మీది అక్షరాన్ని కళ్ళకద్దుకుంటాడిలా మోసం చేసే మనుషులుండొచ్చేమో కానీ/ మోహం కుదిరాక/ పాతబడిపోయిన పుస్తకాల్లేవ్….

రుషి పదాల వాడకంలో ప్రదర్శించే పీనాసిత్వం తన కవిత్వానికి చాలా పదును తీసుకొస్తుంది.. ఎంతో మంచి శూన్యం/ జీవితం… ప్రేమ లేదని కాదుగానీ/ తేపకోసారి తేమను నిరూపించడం నా వల్ల కాదు…

నువ్వు మొదలూ కాదు/ కథ నేటితో ముగిసేదీ కాదు, ఈ ప్రయాణం / రాత్రి తెల్లారేవరకు కాదు/ నీ బతుకు తెల్లారేవరకూ తప్పదు..

అని ఎలాంటి పదాల ఆర్భాటమూ ( ప్రచారార్భాటం కూడా) లేకుండా అనేసి సభ వెనకకుర్చీలో సాగిలబడి జరుగుతున్న సామాజిక సర్కస్లను చూస్తూ చిర్నవ్వుకోగలడు

మనలో చాలామంది కనీసం గుర్తించడానికైనా ఇష్టపడని మనుషులు రుషి కవిత్వంలో రక్తమాంసాలు నింపుకుంటారు,

–విజేతలు వాళ్ళు– అల్కాపురి వీధుల్లో ఆకుకూరల్తో ఆప్యాయంగా నవ్వుతూ/ ఆమె అడిగింది ఒక్కటే ” గంప కిందికి దించాలి సారూ”..

–నేర్చుకోవాలి– షేరింగ్ ఆటోగుండా ప్రయాణిస్తాం/ అమ్మలు కూర్చున్నారిద్దరు ఎదురుగా/ ప్రేమైకమూర్తులు, సాయిబాబాగుడి దగ్గరి గుంతల్లో ఆటో కిందామీదా/ అయినప్పుడు. ” రోడ్లు సల్లంగుండ” అంటూ, కోపంలోనూ నోరు జారని/ వాళ్ళు, పాఠాలు తెలియనివాళ్ళు, పాటలను మించినవాళ్ళు..

ఇలాగే “బస్ ఇత్నాసా ఖ్వాబ్ హై”, “ఇల్లు సమీపిస్తున్నప్పుడు”, “కమ్యూనిటీ హాల్ మూలమడ్త మీద”, “ఒక్క అమ్మకు పుట్టలేదంతే”, “పునఃదర్శన ప్రాప్తి రాస్తూ”, “దిల్షుక్ నగర్ చౌరస్తా” వంటి కవితల నిర్మాణం మూసని బద్దలుకొడుతూ ఆశ్చర్యానికీ ఆనందానికీ గురిచేస్తాయ్,

ఇదేకవి “మీన్ కాంఫ్” అన్న కవితలో ఏమాటకామాటే చెప్పుకోవాలి/ ఎవరూ పాడని గీతంగా మిగిలిపోవాలి/ అతిథిలా ఆగడం/ ముసాఫిర్ లా ముందుకు సాగడమే ఇష్టం/ బంధం గంధం పూసుకు తిరగలేను/ ఎవరెంత చెప్పినా భవిష్యత్తులో బ్రతకలేను అని,

“ఒక కరుత్తమ్మ కోసం” కవితలో ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన/ వచ్చినంక నాతోటే ఉంటదా పోతదా/ తర్వాత ముచ్చట, ఊరుపేరు తెల్వదుగానీ/ యాడ్నో బరాబర్ ఉంటదని నమ్మకం/ ఇయ్యాల గాకపోతే రేపైనా/ రాకపోద్దా అని ఆశ, ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన/ లేకపోతె ఈడ నాకేం పని, అనడం కాస్త అసంబధ్దంగా అనిపించినా కాలానుగుణంగా కవిలో కలిగే మార్పు తాలూకూ భావచైతన్యంగానే ఊహకందుతుంటుంది.. ..

Mohan Rushi

2

“Tragedy is a joy to the man who suffers”

బాధపడే మనిషికి విషాదం మరింత ఆనందాన్ని కల్గిస్తుందని తెలిసిన ఈ కవి అందుకేనేమో స్వీయ నిరానందాన్నే ఎక్కువగా కవితాంశగా తీసుకుంటాడిలా..

–3.47A.M– బైటకూ వెళ్ళలేక, లోపలికి వెళ్ళే ధైర్యం చెయ్యలేక, నిద్రరాక, మెలకువ/ లేక, ఈ ధాత్రిపై ఇది ఎన్నవ రాత్రి? ఏమి నేర్చుకుని? ఏ అసంబధ్ద/ అల్పానందాల తీవ్ర ఫలితాల్లోంచి నిన్ను నువ్వు పురుడు పోసుకుని? ..

మాండలికాల్లో మాట్లాడ్డమే అవమానకరం అనుకునేంత ఙ్నానం ప్రబలిన గ్లోబలైజేషన్లో తియ్యటి తాటిముంజలాంటి తెలంగాన మాండలికంలో మన “దూప” తీరుస్తాడు మోహన్ రుషి..

ఒక తెల్లార్ గట్ట లేశినోన్ని లేశినట్టు పక్కబట్టల్ గిట్ట మడ్తబెట్టకుండ అసల్ పక్కకే జూడకుండ నడుసుడు మొదల్ బెడ్త నడుస్త…/ ఉరుక్త../ ఎండ గొట్టదు/ వాన దాకదు/ సలి దెల్వదు/ పట్నం మొకమ్మీద కాండ్రిచ్చి ఊంచుకుంట నడుస్త/ ఉరుక్త/ నేను మా మిర్యాలగూడెంల బడ్త…

3

తన జీవితాన్నే ఎలాంటి మొహమాటాల్లేకుండా కవిత్వీకరించుకున్న “రాబర్ట్ లోవెల్” లాగానే ఇది ఉట్టి కవిత్వం కాదు, జీవితం.. మోహన్ రుషి జీవితం ఇదంతానూ.. మిర్యాల్ గూడ టు హైద్రాబాద్ వయా జీరో డిగ్రీ…

 

– వంశీధర్ రెడ్డి

vamshi

అంచులలో జీవితాలు :దేవులపల్లి కృష్ణమూర్తి ‘బయటి గుడిసెలు’

తనలోని ఒక ముఖ్యమైన భాగాన్ని, బహుశా సంఖ్యాత్మకంగా గణనీయమైన అంతర్భాగాన్ని తనలో భాగం కాదన్నట్టుగా చూడడమే, పట్టించుకోకపోవడమే, విస్మరించడమే, దూరం పెట్టడమే భారత సమాజపు ప్రత్యేకతలలో ఒకటి. భారత పాలకవర్గాలు ఆ గణనీయమైన భాగాన్ని శ్రమకూ సేవలకూ మాత్రం వాడుకుని ప్రతిఫలానికీ, వాటాకూ, హక్కుకూ, అధికారానికీ అవతల పెట్టాయి. అంచుల లోకి నెట్టాయి. నిమ్నమనీ, నీచమనీ, అస్పృశ్యమనీ ప్రకటించాయి. హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన, అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యథాస్థితిని సమర్థించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్తమజ్జాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టు కూడ తన కింద మరొక మెట్టు ఉండాలని కోరుకుంటుంది. ఉందని అనుకుంటుంది. ఆ కిందిమెట్టు కన్న తాను అధికురాలిననీ, దానితో తాను అస్పృశ్యత పాటించాలనీ, పాటించవచ్చుననీ భావిస్తుంది. సహచర మానవ సమూహాలతో అంతర్వివాహ, సహపంక్తి భోజన సంప్రదాయం లేకపోవడమే తమ సమూహపు ప్రత్యేకతగా ప్రతి సమూహమూ భావిస్తుంది. అందువల్ల అట్టడుగున అంచులలో ఉన్న సమూహాల మధ్య కూడ ఐక్యత గాని, ఏకశిలా సదృశ సంఘీభావం గాని సాధ్యం కావడంలేదు. ఆ అంచులలోనే మరెన్నో అంచులు, అక్కడా విభజనలు, అక్కడా నిచ్చెనమెట్లు, అక్కడా దూరాలు విస్తరించాయి.

ఆయా నిమ్నవర్గాలకు తమ జీవితాలను చిత్రించే, సమాజాన్ని తాము అర్థం చేసుకునే పద్ధతిని చిత్రించే సాహిత్య కళా సంస్కృతులు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ లిఖిత రూపం పొందక పోవడం వల్ల కొంత, అగ్రవర్ణ ఆధిపత్యం కింద, పాలక భావజాలపు ప్రభావం వల్ల కొంత నలిగిపోయాయి. ఒకటి రెండు శతాబ్దాలుగా ఆయా వర్గాల నుంచి పుట్టుకు వచ్చిన రచయితల వల్ల, వారితో సహానుభాతి ప్రదర్శించే ప్రగతిశీల భావధోరణులవల్ల, సామాజిక శాస్త్ర పరిశోధనల వల్ల ఆయా అంచుల జీవితం కొంతయినా బయట పడుతున్నది. కాని బయటపడని అపార జీవితంతో పోలిస్తే బయట పడుతున్నది చాల తక్కువ. అందులోనూ ఆ అంచులలో కూడ కొన్ని సమూహాల గురించి వచ్చిన దానితో పోలిస్తే ఇంకా సమాచారం బయటికి రాని సమూహాలు ఎన్నో ఉన్నాయి. సమాచారం ఎంతో ఉంది.

bayatigudiselu.jpg.1b3c128e7e.999x600x600

అటువంటి అనేకానేక అనామక అవ్యక్త అలిఖిత అంచుల జీవితాలలోనుంచి ఒక వర్గాన్ని ఎంచుకుని, ‘బయటి గుడిసెలు’ రూపంలో దానికి కళారూపం ఇవ్వడానికి ప్రయత్నించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారి కృషి ప్రశంసనీయమైనది. ఈ చిత్రణలో మొండి, బుడగ జంగాలు, దాసరి, బైండ్ల వంటి నాలుగైదు కులాలు వాచ్యంగానూ, దొమ్మరి, ఎరుకల వంటి మరికొన్ని కులాలు సూచనప్రాయంగానూ ఉన్నాయి. అవన్నీ దళితుల కన్న కిందివీ, ఆదివాసి, గిరిజన తెగల కన్న పైవీ కావచ్చు. నిజానికి వాటిని కులాలు అనవచ్చునా లేదా అనేది కూడ సందేహమే. అధికారిక, సామాజిక శాస్త్ర అధ్యయనాలన్నీ వాటిని కులాలుగా గుర్తిస్తున్నాయి గాని, సాధారణంగా కులాలు స్థావర ప్రవృత్తితో, స్థిర ఉత్పత్తి విధానాలతో కలిసి ఏర్పడి గడ్డకట్టాయి. మరి ఇక్కడ చిత్రణ పొందిన సమూహాలన్నీ స్థావర ప్రవృత్తికీ, స్థిర ఉత్పత్తి విధానానికీ కూడ చేరనివి. కొంత ఆహారసేకరణ, కొంత పశుపోషణ దశల్లో ఉండి, జనావాసాల అంచులలో భిక్షుక వృత్తిలో ఉన్నవి. మరో మాటల్లో చెప్పాలంటే జంగమ ప్రవృత్తికి చెందినవి.

కాని ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ సమూహాలలో కొన్నిటికి గొప్ప సంస్కృతి ఉంది. సంగీత నృత్య గానాల సంప్రదాయాలున్నాయి. సాధారణంగా ఒక సమూహానికి తగినంత స్థిరత్వం ఉంటేనే సంస్కృతి రూపొంది, విస్తరిస్తుంది గాని, బహుశా ఈ సమూహాలలో జంగమ ప్రవృత్తి వల్లనే సంస్కృతి వర్ధిల్లినట్టుంది. పెద్దగా చలనం లేని పాత సమాజాల స్థితితో పోల్చి చూసినప్పుడు, నిరంతర చలనంలో ఉన్న ఈ సమూహాలు తాము వెళ్లిన ప్రతిచోటి నుంచీ ఎంతో కొంత స్వీకరించాయి, పంచుకున్నాయి. అటువంటి గొప్ప ఆదాన ప్రదానాల వల్ల వీరిలో సంస్కృతీ వికాసం జరిగినట్టుంది. కాలక్రమంలో, సామాజిక పరిణామాలలో ఈ జంగమ సమూహాలు కూడ అక్కడక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోక తప్పలేదు. సమాజం అంచులలో ఉన్నారనడానికి భౌతిక నిదర్శనంగా వారివి ‘బయటి గుడిసెలు’ అయిపోయాయి. దళితుల కన్న, ఆదివాసుల కన్న మరింత ఆవల అంచులలో కూడ అంచులలో ఉన్న మనుషులుగా వాళ్లు మిగిలిపోయారు.

సొంత ఆస్తి భావన తక్కువగానో, అసలు లేకుండానో ఉన్న ఈ ‘బయటి గుడిసెల’ వారిమీద  నేరస్త జాతులుగా ముద్ర వేసే అలవాటు వలస పాలన కాలం నుంచి ఇవాళ్టిదాకా సాగుతూనే ఉంది. సంభాషణలలో మొరటుదనం, బూతులు, అతిగానే మద్యపానం, మార్కెట్ కు లోబడకుండా తమ మద్యాన్ని తామే తయారు చేసుకోవడం, స్త్రీపురుష సంబంధాలలో భేషజాలు, విధినిషేధాలు తక్కువగా ఉండే సహజత్వం వంటి కారణాల వల్ల ఈ జాతులను “సంస్కృతి” లేనివి గానో,   అధోజగత్తుగానో చూసే అలవాటు కూడ పెరిగింది.

కాని ఆ లక్షణాలు సంస్కృతి లేకపోవడానికి చిహ్నాలు కావు, అవే ఒక సంస్కృతి. సరిగ్గా ఆ లక్షణాలు గల మనుషులే ఒక కళారూపానికి, ముఖ్యంగా కథ, నవల వంటి కాల్పనిక ప్రక్రియకు విలువైన ముడిసరుకులవుతారు. అటువంటి అద్భుతమైన నిర్దిష్ట చారిత్రక సామాజిక శకలపు ముడిసరుకును తీసుకుని కృష్ణమూర్తి గారు ఈ కథో, నవలికో, జీవన దృశ్యమో చిత్రించారు. రచయిత అక్కడక్కడ కనబడినా, ఆ జీవితాలతో, వారి జీవన్మరణ ఘర్షణలతో, కష్టాలతో, కడగండ్లతో రచయిత ఆద్యంతమూ సాధించిన మమేకత్వం పాఠకులను అబ్బురపరుస్తుంది. మాటతీరు, స్పందనలు, హావభావాలు, అలవాట్లు, జీవనగమనం, దారుణమైన విషాదాలు, జీవన బీభత్సం, సమాజంలో ఆధునికత ప్రవేశించినకొద్దీ వారి జీవితాలలో వస్తున్న మార్పులు – సమస్తమూ ఎంత వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రణ పొందాయంటే రచయిత తన పాత్రలతో సంపూర్ణంగా తాదాత్మ్యం చెంది ఉండకపోతే అది సాధ్యమయ్యేదే కాదు. నిజానికి చాల సందర్భాలలో అవి పాత్రలు కాదేమోనని, నిజజీవిత వ్యక్తులే తమంత తాముగా, తమ గుణదోషాలన్నిటితో, లక్షణాలన్నిటితో ఈ పుటలమీదికి నడిచివచ్చారేమోనని అనిపిస్తుంది.

ఆ జీవితాలలో ఉండే నిస్సహాయత వల్ల, ఎవరిమీద తీర్చుకోవలసి ఉందో తెలియకుండా పేరుకుపోయే అసంతృప్తి ఆగ్రహాల వల్ల మనుషులు ఒకరికొకరు కనబడితేనే తిట్టుకుంటారు. తిట్టే ఒక పలకరింపు అవుతుంది. సాదాసీదా సంభాషణలు కూడ పోట్లాట స్థాయిలో జరుగుతాయి. బిచ్చమెత్తడానికి ఉదయాన బైటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన భర్తతో “పొద్దున పోతివి, బతికితివా చస్తివా, జాడ తెల్వకపాయె, సావనన్న సావకపోతివి. నాపానాన బడ్తివి’ అంటూ తగులుకుంటుంది పెళ్లం” అని రాసిన వాక్యాలు రచయిత సృష్టించినవి కావు, నిత్యజీవితానుభవం లోనివే. అలాగే ఆ అసహన వాతావరణంలో మంచి మాట, ఆర్ద్రమైన పలకరింపు కూడ ఎట్లా అపార్థానికి, పరస్పర దూషణలకు, నిందారోపణలకు, ఎడతెగని వివాదాలకు, చివరికి భౌతిక హింసకు దారితీస్తాయో రచయిత ఎన్నో చోట్ల చిత్రించారు. ఈ లక్షణాలను దోషాలనుకుంటే అవి ఆ పాత్రల దోషాలు కావు, వారిని అటువంటి అమానవీయ స్థితిలోకి దిగజార్చిన వ్యవస్థ దుర్మార్గాలు. రచయిత చిత్రణ వాచ్యంగా ఆ మాట చెప్పకపోయినా సత్యజిత్ రాయ్ పేదరికపు చిత్రణ లాగ, ఆ అమానవీయ స్థితికి కారణమైన వారి మీద ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

“అరె, భూమి వుంటె ఎన్ని బాధలురా, దాని బాధలు దానికుంటయి కొడకా. అట్లె, సొంత ఇల్లుందనుకో, దాన్ని బాగు చేసుకోవాలె. ఎక్కడికి పోయినా, పానం ఇంటి మీదనే గుంజుద్ది. అందుకే భూమి, ఇల్లు జోలికి పోలేదురా” అని దాసరి రామచంద్రం అన్నమాట పని చేయడానికి ఇష్టపడని, అడుక్కతినడానికి అలవాటు పడిన ఒక సోమరి వృద్ధుడి మాటల్లా అనిపిస్తాయి గాని అట్టడుగున అవి సొంత ఆస్తి అనే బంధం లేని ఒక నైసర్గిక సామూహిక సహజ సంస్కృతి చిహ్నాలు. వేల సంవత్సరాలుగా ఆస్తి, అంతరాల భావనలు ఆ సహజత్వం మీద అభేద్యమైన మకిలి చిమ్మాయి. ఆ మకిలిని వదలగొట్టి మనిషికి మనిషితనాన్ని తిరిగి అందించే మహాపోరాటానికి సిద్ధపడే శక్తి మళ్లీ ఆ బయటి గుడిసెల మనుషులకే ఉంది. వారికి ఒక శాస్త్రీయ, సామాజిక, చారిత్రక భావజాల పరికరం దొరికితే ఆ పోరాటం విజయం సాధిస్తుంది. భారత సమాజానికే బయటి గుడిసెలుగా ఉండిన దండకారణ్యంలోని ఆదివాసులు ఇవాళ చేస్తున్న పని అదే. కృష్ణమూర్తి గారి పాత్రలు ఆ చైతన్యాన్ని అందుకోవడానికి ఇంకా చాల సమయమూ కాలమూ పట్టవచ్చు. కాని అటువంటి అధోజగత్ పాత్రలలో ఆ దందహ్యమాన పదార్థం ఉన్నదని గుర్తించి, ఆ పాత్రలను వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రించడమే విప్లవ పూర్వ రష్యన్ సమాజంలో అటువంటి జీవితాలను చిత్రించిన దాస్తొవిస్కీ, తుర్గేనెవ్, కుప్రిన్ వంటి రచయితలు చేసిన పని. ఆ పనిని మన సమాజపు నిర్దిష్టతతో, వాస్తవికంగా చేసినందుకు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

  ఎన్ వేణుగోపాల్

( ఈ పుస్తకాన్ని ఆన్ లైన్ లో ఇక్కడ కొనుక్కోవచ్చు.)

http://www.logili.com/books/devulapalli-krishnamurthy/p-7488847-26370821871-cat.html#variant_id=7488847-26370821871

పైసా వసూల్ పుస్తకం – “రామ్@శృతి.కామ్.”

Ram@Shuruthi.comCoverPage(1)

 

కాల్పనిక సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి కాల్పనికేతర సాహిత్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న కాలంలో ఓ వర్థమాన రచయిత తన తొలి నవలనే ‘బెస్ట్ సెల్లర్’గా మార్చుకోగలడం అరుదు, అందునా తెలుగులో మరీ అరుదు!

ఆ నవల రామ్@శృతి.కామ్. రచయిత అద్దంకి అనంతరామ్. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన రామ్ తనకు తెలిసిన నేపధ్యానికి, ప్రేమ కథని జోడించి యువ పాఠకులకు చేరువయ్యే ప్రయత్నంలో విజయవంతమయ్యారనే చెప్పాలి.

ఒకే కంపెనీలో పనిచేసే యువతీయువకుల మధ్య ప్రేమ జనించడం అనే సింగిల్ పాయింట్ థీమ్‌తో నవల రాయడం అంటే చాలా కష్టం. అయితే ఆ వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడానికి దారి తీసే సంఘటనల చుట్టూ అల్లిన సన్నివేశాలు, కథని ముందుకు తీసుకువెడతాయి. సన్నివేశాలను ఒకదానికొకటి జోడించి కథని ముగింపుకి తేవడం చాలా బాగా కుదిరింది. చక్కని స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాని చూస్తున్నట్లుంది ఈ పుస్తకం చదువుతుంటే. విద్యార్థి దశలో చదువుని తేలికగా తీసుకుని సరదాగా కాలం గడిపే వారు, బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టాక ఎదుర్కునే సమస్యలను హాస్య ధోరణిలోనే ప్రస్తావించినా, అందులో అంతర్లీనంగా ఓ హెచ్చరిక కూడా ఉంది.

ఈ నవలని కథానాయకుడు రామ్ ప్రథమ పురుషలో చెబుతాడు. బిటెక్ పాసయి హైదరాబాద్‌లో ఉద్యోగానికి వచ్చి, ఇక్కడో అమ్మాయి ప్రేమలో పడి, కెరీర్ ముఖ్యమో, ప్రేమ ముఖ్యమో తేల్చుకోడంలో ఇబ్బంది పడతాడు.  ఒక దశలో అసలు తనది ప్రేమా, ఇష్టమా అని తికమకకి గురి అవుతాడు. చివరికి కెరీర్ వైపే మొగ్గు చూపి, తన జీవితాశయమైన అమెరికా ప్రయాణాన్ని సాధిస్తాడు. వృత్తిలో విజయం సాధించాక, జీవితంలోకి వెనక్కి తిరిగి చూస్తే ఏదో వెలితి. ఆ వెలితి పేరే శృతి.

శృతి కూడా తను ఎంతో ఇష్టపడి, ప్రేమించిన రామ్‌ని తన ఆశయం కోసం వద్దనుకుంటుంది. ప్రేమికుల మధ్య అపోహలు, అలకలు సహజమే అయినా, స్వాభిమానం ఎక్కువగా ఉన్న వీరిద్దరూ, తమ తమ లక్ష్యాలను సాధించుకునేందుకు తన ప్రేమని పణంగా పెడతారు. దాదాపుగా రెండేళ్ళ తర్వాత పెళ్ళి చూపులలో తారసపడతారు మళ్ళీ. కానీ అప్పుడు కూడా ఒకరినొకరు వద్దనుకుంటారు. కాని చివరకు ఒక్కటవుతారు. అందుకు దారితీసిన సంఘటనలేవి, కారకులెవరు… వంటివి ఆసక్తిగా ఉంటాయి.

ఈ నవల ఆన్‌లైన్ పాఠకులలో అత్యంత ఆదరణ పొందడానికి గల కారణాలలో మొదటిది, ఐటి రంగంలోని యువత ఈ పాత్రలతో తమని తాము ఐడెంటిఫై చేసుకోడం; రెండు రచయిత హాస్య చతురత. ప్రతీ సంభాషణలోనూ చదువరుల పెదాలపై చిరునవ్వులు పూయించడంలో రచయిత సఫలీకృతుడయ్యారు. బయట ప్రపంచంలో సాధారణ యువతీ యువకులు మాట్లాడుకునే మాటలని పాత్రలతో పలికించడం వల్ల తమ కథ చదువుతున్న అనుభూతి కలుగుతుంది చాలా మందికి. రచయిత టార్గెటెడ్ రీడర్స్ యూతే కాబట్టి సన్నివేశాలు సరదాగాను, సంభాషణలు కొండొకచో చిలిపిగాను ఉండి నవలని హాయిగా చదివింపజేస్తాయి. అలా అని ఈ నవల మిగతా వాళ్ళకి నచ్చదు అని అనడానికి లేదు. హాస్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, సరళ వచనాన్ని ఇష్టపడే వాళ్ళు, జీవితాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలనుకునేవాళ్ళు, నిజమైన ప్రేమంటే తెలుసుకోవాలనుకునేవాళ్ళు…. ఇలా ఎవరైనా ఈ పుస్తకాన్ని ఇష్టపడతారు.

ఏదో లొల్లాయి పదాలు రాసేసి పేరు తెచ్చేసుకుందామని రచయిత భావించలేదు. సందర్భాన్ని బట్టి భావుకత్వాన్ని, భావ శబలతని నవలలో వ్యక్తం చేసారు. శృతి అందాన్ని వర్ణించడానికి సరదా సంభాషణలు రాసినా, కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమ ముందు తను ప్రేమ అనుకుంటున్నది ప్రేమేనా అని రామ్ సంశయానికి గురయ్యే సందర్భంలో రచయిత వ్రాసిన సంభాషణలు ఆయా సన్నివేశాలకి జీవం పోసాయి. అలాగే కష్టాలని ఎదుర్కొనలేక, ఆత్మహత్యకు పాల్పడిన ఓ మిత్రుడిని తలచుకుంటూ రామ్ పడిన బాధలో జీవితానికి అసలైన అర్థం చెప్పే ప్రయత్నం చేసారు రచయిత.

ఈ నవలలో స్పష్టంగా విదితమయ్యేది రచయిత నిజాయితీ. తనకు తెలిసిన ప్రపంచాన్ని తనదైన భావాలతో తన సొంత పదాలతో పాఠకులకు అందించారు. భావాడంబరం, పదాడంబరం లేకుండా హాయిగా, సరళంగా సాగిపోయే వచనం అద్దంకి రామ్‌ది. బహుశా తొలి రచన కావడం వలననేమో, నేల విడిచి సాము చేయకుండా, ఓ చక్కని కథని, ఆసక్తికరమైన కథనంతో పాఠకుల ముందుంచారు అద్దంకి రామ్. నవల చదవడం పూర్తి చేసాక, ఓ ప్రామిసింగ్ రైటర్‌ అనిపిస్తారు అద్దంకి అనంతరామ్. మరింత కృషి చేసి తన సృజనాత్మకతకి మెరుగులు దిద్దుకుంటే మంచి రచయితగా రాణించే అవకాశం ఉంది.

134 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 80/-. పాఠకుల డబ్బు, సమయం ఏ మాత్రం వృధా కాని పుస్తకం రామ్@శృతి.కామ్. అని చెప్పవచ్చు. డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి పొందవచ్చు. ఇంకా అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభ్యమవుతుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

 

<a href= “http://kinige.com/kbook.php?id=1671&name=Ram+at+Shruthi+Dot+com” > రామ్@శృతి.కామ్ On Kinige <br /> <img border=0 src= “http://images.kinige.com/thumb/Ram@Shruthi.com.jpg” ></a>

– కొల్లూరి సోమ శంకర్

“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

మంచి రచన ప్రథాన లక్షణం హాయిగా చదివించగలగడం; ఆ పై ఆలోచింపజేయడం. కాలానికి తట్టుకుని నిలిచేది ఉత్తమ రచన అని కొంతమంది అంటూంటారు. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని రికార్డు చేయడం, ఆయా అనుభూతులను, అనుభవాలను, స్మృతులను, ఆనందాల్ని, బాధల్ని అక్షరబద్ధం చేయడాన్ని డైరీఅనవచ్చు. మరి డైరీలూ, ఉత్తమ రచనలేనా అని కొందరు ప్రశ్నించవచ్చు. అన్ని డైరీలు కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖుల డైరీలు సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసాయని చెప్పక తప్పదు. పూడూరి రాజిరెడ్డి పలక పెన్సిల్అనే పుస్తకం ఉప శీర్షిక ఒక మగవాడి డైరీమనకి ఇదే చెబుతుంది.
మనిషి జీవితంలోని ఒక్కోదశలో అతని ప్రవర్తన, భావాలూ, ఆలోచనలు, జ్ఞాపకాలు, సంశయాలు, సందిగ్ధాలు, సమస్యలు, విజయాల గురించి చెప్పింది. పుస్తకంలోని ఆర్టికల్స్ (ఇవన్నీ గతంలో సాక్షి ఫండేలోనూ, ఈనాడు ఆదివారం అనుబంధంలోనూ ప్రచురితమైనవే) మనిషి జీవితంలో ఒక క్రమంలో ఎదగడాన్ని సూచిస్తాయి. రచయిత ఉద్దేశానికి తగినట్టే ముఖచిత్రం మీద అన్వర్ వేసిన బొమ్మలు వ్యక్తి జీవితంలోని శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, ముదిమిలను ప్రతిబింబిస్తున్నాయి. పుస్తకంలోని ఆర్టికల్స్‌ని బలపం, పెన్సిల్, పెన్ను విభాగాలుగా విభజించడం బాల్యం, కౌమారం, యవ్వనాలకు ప్రతీకగా పరిగణించవచ్చు. సాధారణంగా డైరీ అంటే ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం అని భావిస్తాం. కానీ ఈ డైరీ వ్యక్తిగతం కాదు, ఓ వ్యక్తి గతాన్ని, వర్తమానాన్ని మిళితం చేస్తూ, ఆ వ్యక్తిలాంటి ఎందరో వ్యక్తుల అనుభవాలు, అనుభూతులను, భావాలను వెల్లడించింది. శిశువుగా ఓ కుటుంబంలో జన్మించి, ఎదుగుతూ బంధాలను కలుపుకుంటాడు మనిషి. యవ్వనంలోకి వచ్చేసరికి కుటుంబం పరిధి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతూంది కూడా. కొత్తబంధాలు ఏర్పడుతాయి. అయితే చాలామంది చేసే పొరపాటు పాతవాటిని వదిలేసుకోడం అని అవ్యక్తంగా చెబుతారు రచయిత. తన ఊరు, పొలం జ్ఞాపకాలు, తమ్ముడి స్మృతులు, తను చూసిన సినిమాలు, తన చదువు ముచ్చట్లు – “బలపంవిభాగంలోని ఆర్టికల్స్ చెబుతాయి. ఈ విభాగంలోని ఆర్టికల్స్ చదువుతుంటే ఎప్పుడో బాపుగారి దర్శకత్వంలో వచ్చిన స్నేహంసినిమాలోని ఓ పాట ఎగరేసిన గాలిపటాలు….” పాటలోని కొన్ని వాక్యాలు …. “చిన్ననాటి ఆనవాళ్ళుస్నేహంలో మైలురాళ్ళుచిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు….” మనసు పొరల్లో దోబూచులాడాయి. పెన్సిల్ విభాగం కౌమారంతో ప్రారంభం అవుతుంది. కలం స్నేహం చేయాలనే అభిలాషతో గోవాలోని ఓ అమ్మాయికి మొదటి లేఖలోనే…. తన గురించిమొత్తం చెప్పేయడం…. కానీ ఆ లేఖకి జవాబు రాకపోవడం…. తను చేసిన తప్పేంటో తర్వాతర్వాత తెలుసుకుంటారు రాజిరెడ్డి.

చిన్నచిన్న పదాలతో కోనసీమ కొబ్బరిచెట్లని మనోజ్ఞంగా వర్ణించారు రచయిత. అదే భావ శబలతతో తన సొంతూరుని వర్ణించిన తీరు, ఎవరికైనా తమ స్వంత ఊరుని గుర్తు చేయకమానదు.

మనిషికి తోడు ఎందుకు కావాలో తెలుసా? అందరూ తమ దుఃఖాన్ని పంచుకోడానికి మరొకరు కావాలనుకుంటారు. కాని రాజిరెడ్డికి మాత్రం అలా అనిపించదు. హృదయంలో పొంగి పొరలుతున్న సంతోషాన్ని ఒక్కడే అనుభవించక, తోడు కావాలని కోరుకుంటారతను. అంతలోనే బంధం ఎన్నాళ్ళని ప్రశ్నిస్తూ, తనే సమాధనం చెబుతారు జీవితకాలం అని. “రూపం లేని, ఇదీ అని చెప్పలేని ప్రేమకి రూపం వస్తేఅదిగోఅది మీ ఇంట్లో ఉండే మీ మనిషిగా ఉంటుంది…” అంటూ జీవితభాగస్వామి గురించి అద్భుతంగా చెప్పారు.

PalakaPencilFrontCover

భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయబేధాల గురించి ఇలా అంటారు – “నేను కాదంటాను. నువ్వు చేసే రాచకార్యమేమిటి? అని హోమ్ పాయింట్ ఎదురవుతుంది. నేను చెప్పబోయేవేవీ వాదనకు నిలబడవని నాకు తెలుసు. అందులో కొన్నింటిని చెప్పుకోలేమనీ తెలుసు. అందుకని అసహనాన్ని ఆశ్రయిస్తాను. వాళ్ళు నిరసనని ఆయుధంగా చేసుకుంటారు. ఆ నిరసనని నిరసిస్తూ నేను మౌనం పాటిస్తాను. ఆ మౌనాన్ని ఛేదించడానికి మాటల ఈటెలు విసరబడతాయి. వంద విసుగులు, వెయ్యి నిట్టూర్పులు శవాలుగా నేల కూలుతాయి. చేస్తున్నది ధర్మయుద్ధం కాబట్టి, చీకటి పడగానే దాన్ని అలా అక్కడికి ఆపేస్తాం“. ఈ వాక్యాలు చదివాక, ఇది తమకి సంబంధించినది కాదని పాఠకులు అనుకోగలరా? తమ గురించే రచయిత రాసేసినట్లు భావించరూ?

పిల్లల్ని ఎలా పెంచాలో మరో చోట చెబుతూ.. “బతకడం ఎలాగో మనమే నేర్చుకుంటున్నప్పుడు, పిల్లలకు జీవితం అంటే ఏం చెప్పగలం?” అని ప్రశ్నిస్తారు. బహుశా, ఇది ప్రతీ తల్లీ తండ్రీ తమకి తాము వేసుకోవాల్సిన ప్రశ్నేమో

“మనకి మనమే ఎందుకు ఇంతగా నచ్చకుండా పోతాం? మన అలవాట్లను ఎందుకు ఇంత తీవ్రంగా నిరసిస్తున్నాం? మనం ఉన్న స్థితే కరెక్టు అని తెలియాలంటే, దీనికంటే భిన్నస్థితిలోకి ఒకసారి వెళ్ళిరావాలి…” అంటారు. వ్యక్తిత్వ వికాస రచయితలు పెద్ద పెద్ద పదాలతో చెప్పే విషయాన్ని సూక్ష్మంగా, సునిశితంగా చెప్పేసారు రాజిరెడ్డి.

భోగిమంటల్లో ఏమేమి వెయ్యాలో హృద్యంగా చెప్పారు ఈ పుస్తకంలో. మోసం, కపటం, అసూయ, అపరాధ భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్వీటిని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలట. “రక్తప్రసరణ పెంచుకుని, జుట్టుని రాల్చుకుని, ముఖాన్ని మాడ్చుకుని…. వాటిల్లో మనం దహించుకుపోడమా, వాటినే మనం దగ్ధం చేయడమా?” అని అడగడంలో ఆనందంగా జీవించడమెలా అనే కళని చెప్పకనే చెప్పారు రచయిత.

ఎవరినో ఎందుకు మార్చాలి? ఇతరులలో తప్పులెందుకు పట్టాలి? జీవితాంతం జీవించడం నేర్చుకుంటూనే ఉండాలనే సెనెకా మాటలని ఉదహరిస్తూ ఈ ప్రపంచం పర్ఫెక్ట్ కాదంటారు. “నేనేమిటోఅన్న వ్యాసం పూర్తిగా రచయితకి సంబంధించినదే అయినా, ఇందులోని చాలా పాయింట్లతో చదువరులు తమని తాము ఐడింటిఫై చేసుకుంటారు.

పెన్ను విభాగంలోని రచనలు క్లుప్తంగా ఉన్నా, వాటిలో విస్తృతమైన, విశాలమైన భావాలున్నాయి. తాత్త్వికత జోడించిన అంశాలివి. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం పిల్లలకి మాత్రమే ఎందుకు సాధ్యమవుతుందో, ఆటతో పోలుస్తూ చెప్పడం బాగుంది. ప్రేమ, బాధ, ఆప్యాయత, అసూయ…. ఏ గుంపుకైనా సహజ లక్షణాలు అనుకున్నప్పుడు సంసారానికి, సన్యాసానికి పెద్దగా తేడా ఉండదంటారు రాజిరెడ్డి. “చెట్టు కదలకుండానే పెరుగుతుంది చూడు; మనిషి కూడా అలా లోలోపల పెరగలేడంటావా?” అని అడిగిన మల్లయ్య ప్రశ్న మనల్నీ ఆలోచనల్లో పడేస్తుంది.

ఇదే పుస్తకంలో మరోచోట అంటారు – “ఆడవాళ్ళతో సమస్యలుంటాయేమో గాని అమ్మతో పేచీ ఎప్పుడూ ఉండదుఅని. అమ్మల గురించి చెప్పినా, అందం అంటే ఏమిటో వివరించినా, స్త్రీలు అంటే ఎవరో నిర్వచించినా కుటుంబాన్ని, సమాజాన్ని దగ్గర్నించి చూసి, గ్రహించి, నిర్వచించినట్లు తెలుస్తుంది ఆయా వాక్యాలు చదువుతూంటే.

పుస్తకం కవర్ పేజి మీద ఉన్న పలక బొమ్మ మీద రాసిన అక్షరాలు – “: అతడు; : ఆమెమనకెన్నో సంగతులు చెబుతాయి. మనం మన గురించి కాక, ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. వాళ్ళిలా…. వీళ్ళిలా అంటూ వేరేవారి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఆపాదిస్తాం. కాని అసలు మనకి కావల్సింది ఎవరిని వారు తెలుసుకోడం అంటారు రాజిరెడ్డి.

ఈ పుస్తకం ఒక నాస్టాల్జియా! గతాన్ని నెమరువేసుకునే జ్ఞాపకం!! భవిష్యత్తులోకి భవ్యంగా నడిపే మార్గదర్శి!!! చదవడం పూర్తయ్యాక, ఈ పుస్తకం ఉపశీర్షిక ఒక మగవాడి డైరీఅనికాకుండా, “ఒక మనిషి డైరీఅని ఉండుంటే సరీగ్గా ఉండేదని అనిపిస్తుంది.

ఈ పుస్తకం గురించి అఫ్సర్ గారు తన ముందుమాటలో చెప్పిన వాక్యాలతో వ్యాసం ముగిస్తాను. “జీవితం ఒక వొత్తిడి. మనసుకీ, చేతకీ మధ్య, ఆలోచనకీ, సిరాకీ మధ్య – మనసు తీసే కూని రాగాలన్నీ వరుసబెట్టి కాయితమ్మీద తుమ్మెద బారులాగా చూసుకుంటే… అదిగో… అలాంటి పని రాజిరెడ్డి “పెన్ను” చేసింది. అనేక రకాల వొత్తిళ్ళ మధ్య మాట క్లుప్తం అవుతుంది. కానీ, మాటకి వొక పొందిక వస్తుంది. వొక జెన్ యోగి నిశ్శబ్దంలోంచి రాలిన హైకూలాంటి అరుదైన ఆకులాంటి భాష.”

సరళ వచనం, నమ్మశక్యంగాని సులభమైన శైలి ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివేలా చేస్తాయి. సారంగ బుక్స్ ప్రచురించి 113 పేజీల ఈ పుస్తకం వెల రూ. 75/- నవోదయ బుక్ హౌస్‌లో లభిస్తుంది. భారతదేశం బయట తెలుగువారికి అమెజాన్, సారంగ బుక్స్, ఎవికెఎఫ్ లోనూ లభిస్తుంది.

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ

 

ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి, చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలూ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువూ పరిశీలకుడూ సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లెయొనార్దొ చిత్రాలన్నీ కళాఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించీ మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్ఫోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలనీ, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్థాలు అన్వేషిస్తూ ఉండాలనీ అనిపించేలా చేస్తాయి.

ప్రపంచానికంతా తెలిసిన మహానుభావులమీద ఉద్వేగభరితమైన నవలలు రాసిన ఇర్వింగ్ స్టోన్ తన కథానాయకుల జీవితం సమస్తాన్నీ కళ్లకు కట్టే పదబంధాలను సృష్టించి ఆ నవలల శీర్షికలుగా మలిచాడు. ఆ నవలలో ఒకటి పదహారో శతాబ్దపు చిత్రకారుడు మైకెలాంజెలో జీవితకథ అగొనీ అండ్ ఎక్ స్టసీ. ఆ పదబంధం ఆ నవలానాయకుడు మైకెలాంజెలోకు ఎంతగా సరిపోతుందో గాని, ఆయన కన్న ఇరవై ఏళ్లు పెద్దవాడు, చిత్రకళలో ఆయనకు ప్రత్యర్థి, డా విన్సీ అనే పొరపాటు పిలుపుతో ప్రఖ్యాతుడైన లెయొనార్దొ ద వించి కి అక్షరాలా సరిపోతుంది. లెయొనార్దొ జీవితమంతా అంతులేని వేదన, అద్భుత సంరంభం.

వివాహేతర సంబంధపు సంతానంగా, దాదాపు అనాథగా, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం తోసుకువచ్చి ఎక్కడా నిలకడగా ఉండనివ్వని నిరంతర జీవన అస్థిరత. చిన్నచిన్న రాజ్యాల మధ్య యుద్ధాలతో ఆ ప్రభువులను నమ్ముకున్న కళాకారుడిగా ఉత్థాన పతనాలు. బాల్యంలో కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, సోదరుల ప్రేమను పొందడానికేమో శిష్యులతో మెలగిన తీరుకు తప్పుడు వ్యాఖ్యానాలతో స్వలింగ సంపర్క నేరారోపణలు, విచారణలు, ఖైదు. తనకందిన పనుల్లో అనేకం బద్దకం వల్లనో, పరిపూర్ణతా భావనతోనో పూర్తి చేయలేకపోయిన అసంపూర్ణ ప్రజ్ఞ,…. ఆయన జీవితమంతా అంతులేని వేదనే.

మరొకపక్క చిన్ననాటి నుంచే ఆయన వేళ్లకొసలనుంచి జాలువారిన అద్భుత కళానైపుణ్యం. దేశదేశాల రాజుల, మతాధిపతుల, కళాభిమానుల, కళా విమర్శకుల ఆదరణ చూరగొన్న ప్రతిభా వికాసం, ఎప్పుడూ చుట్టూరా ఎంతో మంది శిష్యులు, అభిమానులు, ఒక్క చిత్రకళ మాత్రమే కాదు, దాదాపు ఆధునిక విజ్ఞానశాస్త్ర అన్వేషణలెన్నిటికో బీజరూప వ్యక్తీకరణలు – ఆయన జీవితమే అద్భుత సంరంభానికి ఎత్తిపట్టిన పతాక.

ఏదో ఒక శాస్త్రంలో, ఒక రంగంలో, ఒక చిన్న శాఖలో నైపుణ్యంతో మహా మేధావులుగా పేరు తెచ్చుకోగలుగుతున్న వర్తమాన స్థితితో పోల్చినప్పుడు యూరప్ లో భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారీ విధానానికి సమాజం పరివర్తన పొందుతున్న యుగంలో మేధావులు ఎన్ని శాస్త్రాలలో, ఎన్ని రంగాలలో, ఎంత లోతయిన కృషి చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లెయొనార్దొ ఆ నాటికి శాస్త్రవేత్త, కళావేత్త. ఇవాళ్టి శాస్త్రాల, కళల పరిభాషలో చెప్పాలంటే గణితశాస్త్రజ్ఞుడు, నిర్మాణశాస్త్ర నిపుణుడు, మానవ శరీరశాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త, భూ పటాల చిత్రకారుడు, వృక్షశాస్త్రవేత్త, చిత్రకారుడు, శిల్పి, వాస్తుశిల్పి, నీటిపారుదల వ్యవహారాల నిపుణుడు, సంగీతకారుడు, రచయిత. పునరుజ్జీవన యుగపు మానవుడికి మూర్తీభవ రూపం అని, అతనిది తీరని కుతూహల దాహం అనీ, అతనంత సర్వవ్యాపిత బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞా కలవారు లేరనీ ఎన్నెన్నో విశేషణాలున్నాయి. లెయొనార్దొను అర్థం చేసుకోవాలంటే ఆయన జీవించిన స్థల కాలాలను అర్థం చేసుకోవాలి.

Da Vinci

పద్నాలుగో, పదిహేనో శతాబ్దపు ఇటలీ తొలి పునరుజ్జీవన సంస్కృతికి వేదిక. అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పెట్టుబడిదారీ విధానం భూస్వామ్యపు కరడుగట్టిన విలువలను తోసి రాజంటూ, రాజకీయ స్వాతంత్ర్యం, పట్టణ జీవితం, కళారాధన వంటి వ్యక్తి ప్రధాన, హేతుబద్ధ జీవిత విధానాలను ప్రవేశపెడుతోంది. రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన ఐదో శతాబ్ది నుంచీ ఈ కదలికలు మొదలయిన పద్నాలుగో శతాబ్దం దాకా దాదాపు ఒక సహస్రాబ్ది యూరప్ చీకటిలో మగ్గిపోయిందని ఆ నాటి మేధావులు భావించారు. వాటిని మధ్యయుగాలు అని పిలిచారు. రోమన్ సామ్రాజ్యంలో గొప్ప కళా వికాసం పరిఢవిల్లిందని, అది మళ్లీ తలెత్తుతోందని, అది పునరుజ్జీవనమని వాళ్లు భావించారు. ఇదంతా సంప్రదాయం నుంచి ఆధునికతకు, బర్బరత్వం నుంచి నాగరికతకు ప్రయాణమని అనుకున్నారు. రోమన్, గ్రీక్ నాగరికతలలో లాగ మళ్లీ ఒకసారి పట్టణాలకు ప్రాధాన్యత వస్తున్నదని వాళ్లు వాదించారు. పూర్వీకులు వించి అనే గ్రామం నుంచి వచ్చినప్పటికీ, లెయొనార్దొ పుట్టినదీ, ఎక్కువకాలం గడిపినదీ ఫ్లారెన్స్ నగరంలోనే. ఆ నగరం 1460 నాటికే వర్తక కేంద్రం. అప్పటికే అక్కడ ముప్పై మూడు బ్యాంకులు ఉండేవి. బట్టల వ్యాపారం జోరుగా సాగేది. 270 ఉన్ని దుకాణాలు, ఎనబై ఎనిమిది వడ్రంగి దుకాణాలు, ఎనబై మూడు పట్టుబట్టల అంగళ్లతో యాభైవేల జనాభాతో అలరారుతుండిన నగరం అది.

ఈ చారిత్రక నేపథ్యమే లెయొనార్దొ జీవితాన్ని నిగూఢమూ చేసింది, సుసంపన్నమూ చేసింది. అప్పుడప్పుడే ఒక పెట్టుబడిదారీ వర్గం తలెత్తుతూ, అంతకు ముందరి భూస్వామిక రాచరిక మత కట్టుబాట్ల స్థానంలో లిఖితపూర్వక ఒప్పందాలు, ఆస్తి ఘర్షణలు మొదలవుతున్నప్పుడు పుట్టుకొచ్చిన నోటరీల, న్యాయవాదుల కుటుంబానికి చెందినవాడు లెయొనార్దొ. ఆయన తాత వ్యవసాయంలోకి దిగాడు గాని అంతకు ముందు మూడు తరాలు నోటరీలే. ఆయన తండ్రీ నోటరీయే, అలా ఆయన ఇంట్లోనే కొత్తవిలువల బతుకుకు పునాది ఉంది.

ఇక బైట సమాజంలో, కనీసం ఆలోచనాపర వర్గాలలో ఒక గొప్ప మేధో మథనం, సామాజిక సంచలనం సాగుతున్నది. అదంతా పునరుజ్జీవనమని ఆ నాటి మేధావులు భావించారు గాని మోహన్ అన్నట్టు “నిజానికి సామాన్య మానవుల విషయంలో మధ్యయుగాలకు, పునరుజ్జీవనానికి మధ్య ఎలాంటి తేడా లేదు. కేవలం కవులు, కళాకారులు, మేధావులకు మాత్రమే ఈ విభజన రేఖ పనికొస్తుంది. …పునరుజ్జీవన భావన కేవలం గుప్పెడు మంది కళాకారులకు, ధనిక వ్యాపార, కులీన, పాలక వర్గాలకు సంబంధించిన ఒక తాత్విక లోకం మాత్రమే.”

అయితే పునరుజ్జీవన భావన శిష్ట వర్గాలదే అయినా, పునాదిలో వస్తున్న మార్పులు గాలిలో కొత్త భావాలను వీచాయి. తూర్పు భళ్లున తెల్లవారింది, పాతలోకం కదలబారింది. వ్యక్తి వికాసం మొదలయింది. మానవచరిత్రలో ఇదివరకెన్నడూ లేనట్టుగా, వ్యక్తికి తన సామర్థ్యంపై తనకు అపార విశ్వాసం మొదలయింది. తన శక్తి సామర్థ్యాలు భగవద్దత్తమో, విధిలిఖితమో కాదని, తాను తలచుకుంటే తన భవిష్యత్తును తానే రూపుదిద్దుకోగలనని మనిషికి ఆత్మవిశ్వాసం మొదలయింది. సకల కళల్లో ఆరితేరిన విశ్వనరులు రూపొందాలని మనుషులు తలపోశారు. భూస్వామ్యం, మతం, సంప్రదాయం విధించిన బంధనాలను కూలదోసే వ్యక్తి స్వేచ్ఛా భావనలు తలెత్తాయి. లెయొనార్దొ చనిపోయినాక యాభై ఏళ్లకు పుట్టిన ఇంగ్లిష్ తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ “సమస్త జ్ఞానాన్నీ నా అధీనంలోకి తీసుకున్నాను” అని వ్యక్తీకరించిన ఆత్మవిశ్వాస ప్రకటన ఈ పునరుజ్జీవన భావనకు, ఆ భావన విస్తరణకు సూచికే.

సామాజిక పరివర్తన జరుగుతున్న ఆ పునరుజ్జీవన యుగం గొప్ప సంచలనాలకు, ఉద్వేగాలకు, అన్వేషణలకు ఆలవాలమైన కాలం. ఈ పునరుజ్జీవనం పారిశ్రామిక విప్లవానికి మూలమూ విస్తరణా కూడ. ఆ ప్రవాహంలో నుంచే ఆధునికత, వ్యక్తి ప్రాధాన్యత, హేతుదృష్టి, శాస్త్రవిజ్ఞానం, కాల్పనికత, ప్రకృతి సౌందర్యారాధన, మనిషి కూడ యంత్రమేననే ఆలోచన వంటి ఎన్నో కొత్త భావనలు, ధోరణులు పుట్టుకొచ్చాయి. పారిశ్రామిక విప్లవం యంత్రంలో చలనాన్ని సాధించింది. సమాజంలో చలనానికి కారణమైంది. ఆ కొత్తగాలులు వీచడం చూసిన మనుషులు తమ చుట్టూ చలనంతో పాటు తమ లోలోపలి చలనాల్ని కూడ గుర్తించారు. ఈ మూడు స్థాయిల చలనాలు పరస్పర అన్యోన్య ప్రభావాలతో మరింత విస్తృతమయ్యాయి. అందువల్లనే యూరప్ లో ఆ యుగం అత్యంత ప్రతిభావంతులైన, బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞలు కలిగిన మేధావులెందరినో సృష్టించింది. ఆ మేధావుల సుదీర్ఘ జాబితాలో తొలి తరం నాయకులలో ఒకరు లెయొనార్దొ.

చిన్నతనంలో లాటిన్, రేఖాగణితం, గణితం నేర్చుకున్న లెయొనార్దొ పద్నాలుగో ఏట చిత్రకళను అభ్యసించడానికి వెరాకియో స్టుడియోలో చేరాడు. అక్కడ సైద్ధాంతిక శిక్షణతో పాటు ఆచరణాత్మకంగా వైవిధ్యభరితమైన కళానైపుణ్యాలు నేర్చుకుని ఉంటాడని, ఆ సాంకేతిక నైపుణ్యాలలో రచన, రసాయనశాస్త్రం, లోహశాస్త్రం, లోహ వస్తువుల తయారీ, నమూనాల తయారీ, తోలు పని, యంత్రశాస్త్రం, వడ్రంగం, చిత్రకళ, శిల్పకళ వంటివి ఉండి ఉంటాయని చరిత్రకారులు రాస్తున్నారు. అలా ఇరవయో ఏట లెయొనార్దొ ఆనాటి వైద్యుల, కళాకారుల గిల్డ్ అయిన గిల్డ్ ఆఫ్ సేంట్ లూక్ లో సభ్యుడయ్యాడు. ఇటువంటి కళాకారుల, చేతివృత్తిదారుల గిల్డ్ లే  భూస్వామ్య బందిఖానా నుంచి శ్రామికులను విడుదల చేసి, పట్టణాలలో వారికి పని కల్పించాయి. నవనవోన్మేష అన్వేషణకూ, ఇతోధిక ఉత్పాదకతకూ మార్గం సుగమం చేసి చరిత్ర గమనానికి గొప్ప చోదకశక్తిగా అత్యద్భుతమైన పాత్ర నిర్వహించాయి.

అలా ఇటు సొంత ఇల్లు, పట్టణం కల్పించిన వాతావరణం, అటు సమాజంలో చెలరేగుతున్న సంచలనాలు కలిసి లెయొనార్దొ అనే వ్యక్తి వికాసానికి తగిన వనరులను సృష్టించిపెట్టాయి. అయితే, లెయొనార్దొ వంటి అపురూప వ్యక్తి రూపు దిద్దుకోవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు ఆనాటి సామాజిక జీవనం పునాది అయితే, ప్రత్యేకించి కళా ప్రతిభకు కారణమేమై ఉంటుందని ఈ నాలుగు శతాబ్దాలలో చాల అన్వేషణ జరిగింది. కళా చరిత్రకారుల నుంచి కాల్పనిక రచయితల దాకా, రసాయన శాస్త్రవేత్తల నుంచి నేరపరిశోధనా శాస్త్రవేత్తల దాకా, మనస్తత్వశాస్త్రవేత్తల నుంచి సామాజిక శాస్త్రవేత్తల దాకా ఎందరెందరో ఇటు తొంగిచూశారు. లెయొనార్దొ ఫలానా చిత్రంలోని ఫలానా రేఖ, రంగు ఇందుకు సూచన అన్న దగ్గరి నుంచి, ఆయన బాల్యంలో అనుభవించిన ఫలానా సంఘటన, ఆయన బాల్యం నుంచి గుర్తున్న ఫలానా సన్నివేశం, ఆయన రచనలోని ఒక ఖండం ఆయనను ఎలా తీర్చిదిద్దాయో చాల వివరణలు వచ్చాయి.

ఆయన “…బాల్యం సంక్లిష్ట, సంఘర్షణాత్మక అనుభవాలతో గడిచింది. పల్లెలో తల్లి పెంపకం, వించీలో పెంపుడు తల్లి ఆలనా పాలనా, ఏ లోటూ రానివ్వకుండా చూసుకునే తండ్రి, అన్ని కష్టాలతో సతమతమయ్యే తల్లి, సవతి తండ్రి, సమాజంలో అక్రమ సంతానమనే ముద్ర, మరోపక్క గుండెలపై ఆనించుకునీ, భుజాలపై కూర్చోబెట్టుకునీ ముద్దుచేసే చిన్నాన్న. పెరిగి పెద్దయ్యే వయసులో కారుమబ్బులా ఆవరించిన ఒంటరితనం. ఈ అనుభవాలే అతని భావి జీవితానికి, కళకు ధాతువులయ్యాయి. అతని వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలు పరిచాయి” అని మోహన్ అంటాడు.

నానమ్మ లూసియా వైపు కుండలు తయారు చేసేవాళ్లు. ఆ కుండల మీద చక్కని లతలు, జ్యామితీయ ఆకృతులు ఉండేవి. లెయొనార్దొకు ఆ కళావారసత్వం వచ్చి ఉంటుందనీ మోహన్ అంటాడు. “డావిన్సీది పక్కా జానపదుడి హృదయం. ప్రకృతి అతని ఆరాధ్య దేవత” అని బాల్యంలో వించీ చుట్టుపక్కల చూసిన జీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వడ్రంగులు, పశువుల కాపర్లు ఎట్లా లెయొనార్దొ చిత్రాలలోకి ఎక్కారో వివరిస్తాడు. పల్లెల్లోని నూనె గానుగలను బాల్య కుతూహలంతో కళ్లింత చేసుకుని చూసిన లెయొనార్దొలో ఆ యంత్రాలే బీజం వేశాయనీ అతని నోటు పుస్తకాల్లో వందలకొద్దీ మొక్కలు, చెట్లు, పళ్లు కనిపిస్తాయనీ లెయొనార్దొ అనే అద్భుత వ్యక్తి తయారయిన మూల కారణాల సంక్లిష్టతను అర్థం చేయించడానికి మోహన్ ప్రయత్నిస్తాడు.

“దేన్నయినా సరే చూసి, విని, తాకి, శోధించి నిర్ధారణకు రావడం డావిన్సీ సిద్ధాంతం” అటాడు మోహన్. ఇది మొత్తంగానే పునరుజ్జీవన యుగపు సిద్ధాంతం. పెట్టుబడిదారీ అన్వేషణలకు మూలమైన సిద్దాంతం. బైబిల్ చెప్పిందనో, చర్చి చెప్పిందనో దేన్నీ అంగీకరించకు. పంచేంద్రియాలు ఉపయోగించి, హేతుబుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకో అని మనిషి మీద మనిషికి విశ్వాసం కలిగించిన విలువలు అవి. మనిషిని విధి చేతిలోని కీలుబొమ్మలా కాక క్రియాశీల, సృజనాత్మక  ఉత్పత్తి శక్తిగా చూడకపోతే పెట్టుబడిదారీ విధానం లేచి నిలవడమే సాధ్యమయ్యేది కాదు. ఆ తొలిరోజుల, విప్లవాత్మక పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదించాయి. కాని అతి త్వరలోనే ఆ ప్రగతిశీల, ఉదాత్త, సర్వమానవ సౌభ్రాతృత్వ ధోరణి అంతా మణగిపోయింది. పెట్టుబడిదారీ విధానం మనిషిని విడుదల చేయదని, మనిషిని మనిషి దోపిడీ చేసే, పీడించే సాంఘికధర్మాన్ని బలోపేతం చేస్తుందని అర్థమయింది. పెట్టుబడిదారీ విధానం, పునరుజ్జీవన ఆధునికత ఈ వైరుధ్యాల పుట్ట.

పెట్టుబడిదారీ విధానం ఎదుగుతున్న క్రమంలో ఈ వైరుధ్యాలు అంతకంతకూ ఎక్కువగా బహిర్గతం కావడం మొదలయింది గాని ఒక సున్నిత సునిశిత మేధావిగా లెయొనార్దొ జీవితంలోనే ఈ వైరుధ్యాల బీజాలు గోచరిస్తాయి. “…యుద్ధంలో సైనికులను ఊచకోత కోయడానికి చరిత్ర ఎరుగని మారణ యంత్రాలను కూడా ఊహించి వాటికి కాగితాలపై రూపమిచ్చాడు. గుర్రాల వెన్నుతట్టి వాటి హృదయంతో సంభాషించిన డావిన్సీ, వాటిని పొడవాటి పదునైన కత్తుల రథానికి పూన్చి బొమ్మ వేయడానికి వెనుకాడలేదు. రంగుల్లో ప్రేమ జీవననాదాన్ని హృద్యంగా పలికించిన అతడు మనుషుల ఉసురు తీసే రోమాంచిత ఊహల్లోనూ తేలిపోయాడు….” అనీ, “పూలను, గడ్డిపోచలను ముగ్ధమనోహరంగా చూపిన డావిన్సీ ఈ కుత్తుకలు తరిగే మారణ యంత్రాలకు ఊపిరిపోయడం పెద్ద వైచిత్రి” అనీ అంటూనే “ఈ వైరుధ్యం, వైచిత్రి డావిన్సీ వైయక్తికమైంది మాత్రమే కాదు, నాటి సమాజం, రాజకీయాలు సృష్టించిన పరిస్థితులది కూడా” అంటాడు మోహన్.

అయితే లెయొనార్దొ జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాఢమైన అన్వేషణ. అది ప్రకృతి గురించీ కావచ్చు, జంతువుల గురించీ కావచ్చు. నీటి ప్రవాహాల గురించీ కావచ్చు.  కొత్త యంత్రాల గురించీ కావచ్చు, మానవ శరీరం గురించీ కావచ్చు, సమూహంలో వైవిధ్య భరితమైన మానవ ప్రవర్తన గురించీ కావచ్చు. మత భావనల చిత్రీకరణలలోనూ, మనుషుల చిత్రీకరణలోనూ ఆయన ఆ అన్వేషణా ఫలితాలన్నీ రంగరించాడు, రంగుల్లోకి దించాడు. రంగుల్లో కుదించాడు. ఆరు దశాబ్దాలు దాటిన ఆ మహాద్భుత వర్ణమయ జీవితాన్ని మోహన్ ఈ పుస్తకంలో అంతే వర్ణమయంగా అక్షరాలకెక్కించాడు.

నిజానికి ఇది ముందుమాట గనుక, దీనికి నిడివి పరిమితి ఉంది గనుక ఇంక ఎక్కువ రాయను, ఎన్నెన్నో భాగాలను యథాతథంగా ఉటంకించాలనే కోరికను అణచుకుంటున్నాను.

మిలాన్ పాలకుడు లుడొవికో దగ్గర కొలువు కోసం తనకు ఏయే కళలు వచ్చునో లెయొనార్దొ రాసిన లేఖ, లెయొనార్దొ మిగిల్చి పోయిన దాదాపు ఆరువేల పేజీల నోట్స్, లెయొనార్దొ వేసిన చిత్రాలలో చాల భాగం చెడిపోవడంలో కాలం పాత్ర, మనిషి పాత్ర, మిలాన్ సమీపంలో ఆల్ప్స్ పర్వతాలలో నదుల గురించి లెయొనార్దొ చేసిన అన్వేషణలు, లెయొనార్దొ రాసిన చిత్రకళా బోధిని, చేసిన యంత్రాలు, యంత్ర భాగాలు, మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి మృతదేహాలపై లెయొనార్దొ చేసిన ప్రయోగాలు, ప్రకృతి, ఖగోళ శాస్త్ర అన్వేషణలు, అద్దాలపై, కటకాలపై అన్వేషణలు, మతభావనలు, వృద్ధాప్యపు కల వంటి అనేక సందర్భాలలో మోహన్ రచన పాఠకులను సమ్మోహితులను చేస్తుంది, ఐదువందల ఏళ్ల వెనక్కి, ఆ నాటి సామాజిక సాంస్కృతిక వాతావరణంలోకి తీసుకుపోతుంది. ఇక చిత్రాల గురించి – మరీ ముఖ్యంగా జినిర్వా, జెరోమ్, సెయింట్ ఆన్, ఆంగియారి, మోనాలిసా, సెయింట్ జాన్, సిసిలియా, లుక్రీజియా వంటి ఎన్నో చిత్రాల – వివరణలైతే ఒక వచన రచయిత, కళా విమర్శకుడు మాత్రమే చేయగలిగేవి కావు. స్వయంగా చిత్రకారుడు, రంగుల, రేఖల స్వభావ స్వరూపాలు కూలంకషంగా తెలిసిన కళా మర్మజ్ఞుడు మాత్రమే రాయగలిగినవి.

“డావిన్సీ చిత్రకళా సృజనను పక్కనపెడితే అతడు ఇంజనీరింగ్, వాస్తు వగైరా రంగాల్లో కంటే అనాటమీలోనే ఘన విజయాలు సాధించాడు. సుతిమెత్తని కుంచెలు పట్టుకున్న చేతుల్తోనే కరకు కత్తులు పట్టుకుని మృత మానవ దేహాలను రక్తమంటిన చేతులతో శోధించాడు. మానవ గుండెను కుడిచేత్తో పట్టుకుని రక్తపు మరకలంటిన కాగితంపై ఎడమ చేత్తో దాని రూపాన్ని చిత్రించాడు… మనిషి బయటి, లోపలి నిర్మాణాన్ని స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, నిర్దుష్టంగానే కాకుండా కళాత్మకంగా కూడా చూపిన తొలి అనాటమీ కళాకారుడు డావిన్సీనే. అతడు తన అనాటమీ చిత్రాలతో కళాకారుడికి, శాస్త్రవేత్తకు మధ్య ఉన్న తేడాను చెరిపేశాడు…. అతని జ్ఞానపిపాసను మతం అడ్డుకోలేకపోయింది” అనీ, “కళ్ల కదలికలకు కారణమేంటి? కనుబొమలు ఎలా ముడిపడతాయి? కనురెప్పలు ఎందుకు మూతపడతాయి? ముక్కుపుటాలు, నోరు, పెదవులు తెరచుకోవడం, మూసుకోవడం వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఉమ్మడం వెనుక మతలబేంటి? ఎందువల్ల నవ్వుతున్నాం, ఆశ్చర్యపోతున్నాం అని డావిన్సీ ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నలను ఓ పుర్రెబొమ్మ వేసిన కాగితం వెనక రాసుకున్నాడు. చీదడం, ఆకలి, నిద్ర, మైథునం, చెమట, కండరాల కదలికలకు కారణమేంటో తెలుసుకోవాలని రాసుకున్నాడు” అనీ అంటాడు మోహన్.

నిజానికి మోహన్ రచనలో ఇటువంటి ఆర్ద్ర, సున్నిత, కాల్పనిక, కళాత్మక వ్యక్తీకరణలను ప్రేరేపించగల శక్తి లెయొనార్దొ జీవితంలోనే ఉంది. స్వయంగా లెయొనార్దొ మనకోసం వదిలిపెట్టిపోయిన రచనలలో కూడ ఉంది. ఉదాహరణకు, “ఆత్మికోద్వేగాలను భంగిమల ద్వారా చెప్పగలిగితేనే చిత్రానికి విలువ ఉంటుంది”, “నా శ్రమతో ప్రకృతిలోని రహస్యాలు బట్టబయలవుతాయి”, “ఒకసారి అధ్యయనం చేసిన వాటి గురించి రాత్రిపూట ఆలోచిస్తే మంచిదని స్వానుభవంతో చెబుతున్నా. మనం పడుకున్నప్పుడు రాత్రి నిశ్శబం వల్ల ఆలోచన పదునెక్కుతుంది. దాంతో మనం సృజించిన వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దగలం”, “పోషకులు మొదట్లో నిన్ను ఆకాశానికెత్తేస్తారు. తర్వాత కష్టమైన పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత విశ్వాసహీనంగా ప్రవర్తిస్తారు. ఆపై నిన్ను నిందిస్తారు”, “అచ్చేసిన పుస్తకాల మాదిరి చిత్రాలకు పెద్దసంఖ్యలో నమూనాలు ఉండకూడదు. ఒక చిత్రం ఒక చిత్రంగానే ఉండాలి. పిల్లల్ని పుట్టించగూడదు. అప్పుడే అది ప్రత్యేకంగా, మిగతా వాటికంటే గొప్పగా భాసిల్లుతుంది”, “పక్షి గణిత సూత్రాల ఆధారంగా పనిచేసే యంత్రం. ఆ యంత్రాన్ని మనిషి తయారు చేయగలడు. అయితే అతని యంత్రానికి పక్షికున్నంత శక్తి ఉండదు. పక్షి హృదయమూ ఉండదు. కనుక మనిషి ఆ లోపాన్ని యంత్రానికి తన హృదయాన్ని అందించి అధిగమించాలి” వంటి ఆణిముత్యాలెన్నో లెయొనార్దొ రచనల్లో ఉన్నాయి.

“చిత్రకారుడు సమస్త జీవజాలపు, ప్రకృతి సారాంశం. జంతువులు, మొక్కలు, పళ్లు, మైదానాలు, శిఖరాలు, భయం గొల్పే ఆవరణలతో పాటు ఆహ్లాదకర ప్రాంతాలు, గాలి వాలుకు తూలిపోయే రంగురంగుల పూలతో కూడిన పొదలు, ఎత్తయిన పర్వతాల నుంచి బలంగా కిందికి దూకే నదులు, వాటిలో కొట్టుకుపోయే రాళ్లు, చెట్ల వేళ్లు, మన్ను, నురగ, ఝంఝామారుతంతో ఎదురొడ్డి పోరాడే తుపాను కడలి సారాంశం… చిత్రకారుడు… మానవుల్లోని సౌందర్యం నశిస్తుంది. కాని కళలోని సౌందర్యం నశించదు” అన్నాడు లెయొనార్దొ ద వించి.

ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలు గడిచింది. ఆయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహన గానం ఈ పుస్తకం. చదవండి.

Da Vinci – 1/8 demy, 264+8 pages, Rs. 150, Kaki Prachuranalu

For copies: All leading book shops/
Kaki Prachuranalu, Plot No. 304, H.No. 3-5-118/15, Second Floor, GPR Nilayam, Krishnanagar, Hyderguda, Rajendranagar, Hyderabad 500048, Ph: 9949052916

–          ఎన్ వేణుగోపాల్

రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి…!

మీ చేతుల్లో ఉన్న మూడు కథలకీ ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఫోను కథలు. అది కూడా మొబైలు ఫోను. ఒక విధంగా చెప్పాలంటే ఇవి సాహిత్యాన్ని రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి తీసుకువెళ్తున్నాయని కూడా చెప్పవచ్చు. అంతేనా? అంత మాత్రమే అయితే వీటి గురించి మాట్లాడడానికి నాకేమంత ఉత్సాహముండేది కాదు. పైకి పూర్తిగా ఇప్పటి కథల్లా కనిపిస్తున్నప్పటికీ, వీటిలో కాలానికి అతీతమైన కొన్ని మూల్యాల ప్రతిపాదన వుందనిపించింది. అదేమిటో నాకు నేను అర్థం చేసుకునే ప్రయత్నంలోంచే ఈ నాలుగు మాటలూ.

2
స్కైబాబ గురించి నాకట్టే తెలియదు. ఆయన రచనలు కూడా నేనేమంత పెద్దగా చదవలేదు. ఈ కథలు చదవమని ఇచ్చినప్పుడు ఆయన తక్కిన రచనలు కూడా ఇమ్మని అడిగాను. ‘జగనే కీ రాత్: ముస్లిం కవిత్వం’ (2005), ‘అధూరె: ముస్లిం కథలు’ (2011)తో పాటు అతడు సంకలనం చేసిన ‘వతన్ : ముస్లిం కథలు’ (2004) పుస్తకాలు ఇచ్చాడు. అతడి కవిత్వం, కథలతో పాటు వాటిమీద నేటికాలపు తెలుగు కవులూ, రచయితలూ, విమర్శకులూ రాసిన అభిప్రాయాలన్నీ చదివాను. ముఖ్యంగా వతన్ సంకలనానికి రాసిన విపులమైన సంపాదకీయం కూడా చదివాను. ఇవన్నీ ఆయన ఆవేదననూ, అభిప్రాయాల్నీ చాలా సూటిగా వివరిస్తున్నవే. అయితే ఈ సంకలనంలో ఉన్న మూడు కథల్నీ అర్థం చేసుకోవడానికి ఇవేవీ నాకు చాలవనిపించింది.
నాకు స్కైబాబ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. జగనే కీ రాత్ సంపుటిలో ఖదీర్‌బాబు రాసిన ఒక వ్యాసముంది. అందులో ఖదీర్ ఇలా రాసాడు:
”స్కైబాబది నల్గొండ. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కేశరాజుపల్లి. దారుణమైన పేదరికం. ఏదైనా పని చేసి ఇంటికి సాయపడదామనుకుని స్నేహితుడితో కలిసి బట్టల వ్యాపారం చేసాడు. కిరాయి సైకిళ్లు తిప్పాడు. సోడాలు కొట్టాడు. పీర్‌లెస్ ఏజెంట్ అయ్యాడు. అద్దె పుస్తకాల షాపు నడిపాడు. పాన్‌లు కట్టాడు… ఎక్కడా ఆదాయం రాలేదు. పైగా ఎదురు నష్టం, అప్పులోళ్ళకు మొఖం చూపించలేక దాక్కుని తిరగడం, ఇంటికెళ్ళడానికి మొఖం చెల్లకపోవడం.
ఈ పేదరికం కంటే కూడా స్కైబాబను ఎక్కువ బేచైనీకి గురి చేసింది తమ ఇళ్ళల్లో ఉండే ఆడబిడ్డలు. వీళ్ళందరూ చదువుల్లేక జ్ఞానం లేక తినడానికి తిండి లేక చేయడానికి కుదురైన పనిలేక పెళ్ళిళ్ళు లేక ఈసురోమంటూ ఉండేవాళ్ళు. వాళ్ళను చూసే కొద్దీ స్కైబాబలో దుఃఖం సుడి తిరిగేది. దానిని బలంగా వ్యక్త పరచాలని అనిపించేది..”
ఈ నేపథ్యం స్కైబాబమీద నాకెంతో గౌరవాన్ని కలగచేసింది. ఇటువంటి నేపథ్యాలు ఎంతోమందికి ఉన్నా అందరూ రచయితలు కాలేరు. కొద్దిమంది మాత్రమే గోర్కీలూ, భరద్వాజలూ, స్కైబాబలూ కాగలుగుతారు.
ఇటువంటి నేపథ్యం ఉన్న రచయిత రాసిన కథలు కావడంతో ఈ మూడు కథలూ నాకెంతో విలువైన కథలనిపించాయి. ఆ విలువ కేవలం సాహిత్య విలువ కాదు, లేదా అతడి కథలమీదా, కవిత్వం మీదా అభిప్రాయాలు రాసిన రచయితలు భావిస్తున్నట్టుగా సమకాలీన ముస్లిం జీవిత సందర్భాన్ని చిత్రించడంలోని వాస్తవికత వల్ల మాత్రమే కాదు.
అసలు ఏ రచయిత అయినా తనకు తెలిసిందీ, తన అనుభవంలోకి వచ్చిందీ రాసినప్పుడు మాత్రమే విశ్వసనీయంగా ఉంటాడు. అది రచయిత ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి అటువంటి వాస్తవికతకి నేనెటువంటి అదనపు విలువనూ ఆపాదించలేను. మన సమాజంలో అల్పసంఖ్యాకులుగా, బీదరికంలో, సామాజికంగా అప్రధానీకరణకు లోనవుతున్న తెలుగు ముస్లిం జీవితాల్ని ఆ సమాజం నుంచే వచ్చిన ఒక రచయిత స్వానుభవంతో చిత్రించడం మనం రెండు చేతుల్తోనూ స్వాగతించదగ్గ విషయమే కానీ, ఆ ఒక్క కారణం వల్లనే ఆ సాహిత్యం ప్రీతిపాత్రం కానేరదు.
రచయిత ఏదైనా చెప్పనివ్వు. ఏదైనా చిత్రించనివ్వు. కాని ఒక కథ వార్తా కథన స్థాయిని దాటి సాహిత్య స్థాయిని అందుకోవడానికి నిలబడవలసిన ప్రమాణాలు వేరే ఉన్నాయి. ఆ ప్రమాణాల్లో అందరూ మాట్లాడేది శిల్పం గురించి. శిల్పమంటే, ఒక కథలో ఉండే వివిధ అంశాలు ఒకదానికొకటి ఎంత సౌష్టవంగా అమరాయన్నది. సాంకేతికంగా ఆ కథ ఎంత శక్తివంతంగా ఉందనేది. నిస్సందేహంగా తక్కిన కథల్నుంచి గొప్ప కథకుల్ని వేరు చేసేది, ఈ శిల్ప సామర్థ్యమే, సందేహం లేదు. కాని గొప్ప కథలన్నీ మనల్ని ముగ్ధుల్ని చేయాలని లేదు. మంచి కథలన్నీ మనని వెంటాడే కథలు కాలేవు. ఒక కథ మనల్ని మరీ మరీ మరీ వెన్నాడుతోందంటే అందులో ఏముందన్నట్టు?
ఒక కథ మనల్ని వెంటాడుతోందంటే, ఆ కథ చదివినప్పుడు మనలో ఏదో జరిగినట్టు. అది మనలో ఏదో సున్నితమైన రసాయనాల్ని విడుదల చేస్తుంది. దాన్నే జాయిస్ ‘ఎపిఫనీ’ అన్నాడు. ఎపిఫనీ యథార్థానికి మతపరమైన, ఆధ్యాత్మికమైన అర్థంలో వాడబడే పదం. దానికి జాయిస్ ఒక లౌకిక, సాహిత్యార్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ‘..అది మనిషిలో అకస్మాత్తుగా సంభవించే ఆత్మిక పరివర్తన’ అన్నాడతడు.
మరో విధంగా చెప్పాలంటే దాన్ని సాక్షాత్కారం అనవచ్చు. మానవ సంబంధాల్లోనో, జీవిత గమనంలోనో ఒక సంఘటన లేదా ఒక సంభాషణ మనల్ని అకస్మాత్తుగా జీవిత మూలాలకు చేరువగా తీసుకుపోతుంది. దాన్నే జాయిస్ The whatness of a thing  అన్నాడు. అతడిట్లా రాసాడు:
This is the moment which I call epiphany.. when the relation of the parts (of an art object) is exquisite…its soul, its whatness leaps to us from the vestment of its appearance. The soul of the commonest object, the structure of which is so adjusted, seems to us radiant. The object achieves its epiphany.
ek kahaani ke theen rang
స్కైబాబ మనముందుంచిన మూడు కథల్లోనూ ఇటువంటి ఎపిఫనీనే మనం పొందుతున్నామని అర్థమవుతుంది. ‘మౌసమీ’ లో కథకుడు ఆఫ్రీన్‌ను చూసినప్పుడూ ‘జమీలా’ లో జమీలా కథకుడితో తన జీవితం మళ్ళా చిగురిస్తోందని చెప్పినప్పుడూ, ‘మిస్ వహీదా’లో వహీదా కూతురు ఫొటోలో ఉన్నామె తన తల్లి వహీదా అని చెప్పినప్పుడూ కథకుడు ఏ సాక్షాత్కారానికి లోనయ్యాడో ఆ సాక్షాత్కారానికి మనం కూడా లోనవుతాం.
కథల్లో ప్రధానంగా ఉండవలసింది ఇది. తక్కిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించిన చర్చ, ఆవేదన కథకి అదనపు బలాన్నివ్వగలవు తప్ప నేరుగా మనలో అటువంటి హృదయ పరివర్తనను తేలేవు.
3
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పవలసిన విషయమొకటి ఉంది. అది ఈ కథల్లో కనవచ్చే ఆదర్శలక్షణం. ఈ కథలు చదవగానే నాకు వెంటనే ప్రేమ్‌చంద్ రాసిన ‘సాల్ట్ ఇన్సపెక్టర్’ (1910) గుర్తొచ్చింది. దుర్భరమైన జీవిత వాస్తవం ఎదట దాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించవలసిన బాధ్యత తెలిసినవాడై కూడా ప్రేమ్‌చంద్ ఆ కథని ఎంతో ఆదర్శవంతంగా ముగించాడు. ఎందుకని? బహుశా అది రచయిత జీవస్వభావం వల్ల అనుకోవలసి ఉంటుంది. మానవుడి పట్ల అపారమైన ప్రేమ, దయ ఉన్నందుకు వాళ్ళు ఆ కథల్ని మరోలా రాయలేదు.
గోర్కీ రాసిన ‘ఇరవయ్యారు మంది పనివాళ్ళూ, ఒక స్త్రీ’ (1899) కథ చూడండి, అది భయంకరమైన జీవిత వాస్తవం మనుషుల్నెట్లా మృగాలుగా మారుస్తుందో చెప్పిన కథ. కాని ప్రేమ్‌చంద్ అట్లా రాయలేకపోయాడు. ఎందుకని? గోర్కీకి మనుషుల పట్ల ప్రేమ, దయ తక్కువేమీ కాదే! నేనేమనుకుంటానంటే, గోర్కీ వ్యక్తుల్ని ద్వేషించకుండా వ్యవస్థని ద్వేషిండమెట్లానో నేర్చుకున్నాడు. ప్రేమ్‌చంద్ వ్యక్తుల్ని ద్వేషించలేక పోతున్నాడు కాబట్టి వ్యవస్థను సంస్కరించడమెట్లా అని ఆలోచిస్తున్నాడు.
ఈ కథల్లో స్కైబాబ చేసింది కూడా ఇదే. ఇప్పటి సమాజంలో మొబైల్ ఫోను మనుషుల్లోని అతృప్త ఆకాంక్షలను చల్లార్చే ఒక కన్స్యూమరిస్టు సాధనం. కాని చాలామందికి అది విముక్తి సాధనం కూడా. అది నువ్వున్నచోటే, నీ పరిమితుల్ని దాటి విశాల ప్రపంచంతో కనెక్ట్ కాగలిగే అవకాశాన్నిస్తుంది. అటువంటి అవకాశాల్లో రిస్క్ కూడా ఉంటుంది. మౌసమీ, జమీలా, వహీదాలతో మాట్లాడే అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ ఈ కథల్లో కథకుడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తారన్న హామీ ఏమీ లేదు. కాని కథకుడు ఆయా అభాగ్య స్త్రీల పట్ల తన ప్రవర్తనలో అపారమైన ఆదర్శభావాన్ని చూపడమే ఈ కథల్లోని అత్యంత విలువైన అంశం. శతాబ్దం కిందట ప్రేమ్‌చంద్ కనపరచిన ఆదర్శవాదమే ఇప్పటి సమాజంలో ఎదట కూడా కథకుడు కనపర్చడం నన్నెంతో విస్మయపరిచిన మాట నిజమే కాని అంతకన్నా ఎక్కువ సంతోషమే కలిగించిందనాలి.
                                    వాడ్రేవు చినవీరభద్రుడు

అలసట లేని కొన్ని అలల స్వగతం!

Palaka-Pencil Cover (2)

పూడూరి రాజిరెడ్డి సాహిత్యపు దారిలో తనదైన ప్రకాశాన్ని ముద్రిస్తూ సహస్ర తేజంగా వెలగాలి అని ముందుకు వెళుతున్న ఒక సంతకం .

 ఈ పుస్తకం ”పలక -పెన్సిల్ ”ముందు మాటలో కృతజ్ఞతలు చెపుతూ  ”నా అక్షరం చూడగానే బై లైన్ వైపు చూడగలిగే   ఆత్మీయులు ”అన్నారు .  బహుశా నేను ఈ కోవలో ఉండవచ్చు . ఎండలో వెళుతున్న వారికి అక్కడక్కడా ఇంగ్లీష్ పొడ కనపడుతున్నా తన చల్లని ,చక్కని తెలుగు వచనం తో సేద తీర్చే  మర్రిచెట్టులాగా  కనపడతారు ‘ఈయన’ నాకు.

కొత్తగా మా బడి  ఐదో తరగతిలో చేరిన పిల్లలు మిగిలిన వాళ్ళతో కలవకుండా తమ  జ్ఞాపకాలు, వస్తువులు  ఒక పెట్టెలో పెట్టుకొని బిడియంగా ఎవరినీ తాకకుండా ఎలా  కూర్చుంటారో ….. తన బంధాలు, ఊరి జ్ఞాపకాలు, చదివిన పుస్తకాల దుమ్ము,  చివరికి ఆశ్చర్యార్ధాకాలు, అరసున్నాలతో సహా తన పెట్టెలో దాచుకొని, బరువైనా దించని ఒక అమాయకపు ప్రేమతో, రెటమతంతో ఆ పిల్లలులాగే కనిపిస్తారు ఈ రచయిత కూడా .

”ఏమున్నాయి అందులో ?”

”పూలు, ఆకులు, పుస్తకాల నుండి సేకరించిన దుమ్ము ”

”అదీ కారణం….. బరువుకి కారణం దుమ్మే”  విదిలించమని చెప్పిన అపరిచితుడితో ….

”బరువైతే బిడ్డను చంక మార్చుకుంటాము కాని, వదిలేసి చక్కగా పోతామా?” (పెన్ను విభాగం లోనిది బరువు ) తన సేకరించుకున్న జ్ఞానం పై ” కన్నతల్లి కంటి కోలుకులో ముత్యమై  తన బిడ్డపై మెరిసిన ప్రేమలా ”కనిపిస్తుంది .

రెండో వైపు  ”నా ఆలోచనలలోనే నాకు సుఖం ఉందని ఎందుకు అనుకోరు ” అంటూనే అనిజ మనుషుల్లో ఆప్యాయతని వెతుక్కుంటూ ”జీవితం ముగిస్తేనే కాని సరైన దారి ఏమిటో తెలియదు కదా …. ముగిసాక చెప్పడానికి ఏముంది ?” అని తన ప్రశ్నలకు తానే సమాధానం దొరకని తాత్వికునిలా నిలబడినపుడు …..

(పెన్ను విభాగం, సరైన తోవ)

కనపడని అమ్మ ప్రేమకోసం  దిండులో గుబులుగా మొహం పెట్టి కన్నీళ్ళ కలల్లో  వెతుక్కుంటూ, అమ్మానాన్నలను వదిలిపెట్టి మరీ ఇంతగా చదువుతున్న చదువు అవసరం  ఏమిటి? అని మదనపడే హాస్ట ల్ పిల్లవాడు గుర్తుకు వస్తాడు

దీనిలోని విషయానికి వస్తే దినపత్రిక తోటలో తిరుగాడే పక్షిగా ఈయన వ్రాసిన ‘ఆర్టికల్స్ పూలు’ దారిలో అక్కడక్కడా తగిలినా దాని పేరు ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించలేదు . ఒక్క సారి ఆ పూల పరిమళం ”పదాలు – పెదాలు” గా గుప్పుమన్నప్పుడు అరె ‘ఇలాంటి పూలు’ ఇంకా చూసామే! అని వెనక్కి తిరిగి అవలోకిస్తే వీటన్నిటి వెనుక గల సిరా వర్ణం ”పూడూరి రాజిరెడ్డి ”గారిది అని తెలిసింది . అన్నిటికి లేని ప్రత్యేక  పరిమళం ఈ పదాలు పెదాలికి ఎక్కడిది అనే నా ప్రశ్నకు ఈయన ముందుమాటలో సమాధానం దొరికింది . ”అవన్నీ నేను ఇష్టంతో వ్రాసినప్పటికి అవి వ్రాయడానికి ఏదో కారణమో, సందర్భమో ఉన్నాయి . అలా కాకుండా ఏ అవసరం, కారణంతో పని లేకుండా కేవలం వ్రాయడం కోసం వ్రాసిన ఖండికలు ఈ పదాలు – పెదాలు ”

అదీ సంగతి హృదయవనంలో ప్రకృతికి పరవశించి తమకు తామే విరిసిన స్వచ్చమైన అడివి పూలు ఇవి . అందుకే అంత పరిమళం. సాహిత్య ప్రియుల హృదయాలు కట్టేసెంత పరిమళం . తాత్వికులు ఆగి ఏమి ఉందా అని చూసేంత  ఏదో ….. ఏదో ఏమిటి ?ఆ ఫీలింగ్ కి పేరు లేదా అంటే …. కొన్నిటికి ఉండవు . కావాలంటే దీనిలోని ”నేనేమిటి ?” చదవండి.  మీరు కూడా ఒప్పుకుంటారు తెలుగు బాషలో పదాల కొరత ఉందని …. ఇలాటి వర్ధమాన రచయితలు రావాలి అని .”

అలా నా సాహిత్య ప్రయాణంలో చదివిన ఈయన ఆర్టికల్స్ దీనిలో  ఉన్నప్పటికీ చిరు అలల పై సాయంసంధ్య వేళ సేద తీర్చేతెప్ప ప్రయాణం లాంటి ఈయన అక్షర ప్రయాణం వీటికి  ‘రీరీడింగ్’ అర్హతను మనకు తెలీకుండానే కల్పిస్తుంది .

పుస్తకం గూర్చి ఇంకో మూడు మాటలు .

జీవితం ఎలా అయితే ఉభయ సంధ్యలతో  మధ్యందిన బాలుడ్ని కలుపుకొని ఒక వలయం గా మారిపోతుందో ….. బాల్యాన్ని, యవ్వనాన్ని, ఇప్పటి పెద్దరికాన్ని కలుపుతూ చేసిన తన సాహిత్య ప్రయాణాన్ని బలపం, పెన్సిల్, పెన్ను అనే ‘మూడు’ విభాగాలుగా చేసి ఈనాడులో, సాక్షిలో జర్నలిస్ట్ గా తాను వ్రాసిన ఆర్టికల్స్ తో పాటు …. ‘నేనేమిటి ‘? అనే ఒక భావాల డైరీని (దీనికి ఏ పేరు పెట్టాలో తోచక చాలా సేపు కీ బోర్డ్ మీద వేళ్ళు ఆపే ఉంచాను. ఈ పేరుతో కూడా నాకు తృప్తి లేదు . కాకుంటే నా వ్రాతలు ఏదో ఒక పేరులో ఎందుకు ఉంచాలి …. వాటి కధ వాటిదే అని వ్రాసిన రచయిత మాటలే కొంత ఓదార్పు) కూడా ఇందులో కలిపారు . కాకుంటే మూడు పేజీ లు తిప్పగానే చూసిన ‘ నలుగురు చిన్న పిల్లల ఫోటో ‘ దాని కింద వ్రాసిన మాటలు మనసులో టన్నుల బరువును పెట్టేసి చదవడమే ఆపేసింది.  ఒక అన్నకి తన తమ్ముడి పై ఆ తమ్ముడికి కూడా తెలీని పెద్దరికంతో కూడిన ప్రేమ ఉంటుంది. ఎంత అంటే తాను హీరో కావాలి అని చెప్పుకొని తమ్ముడిని సైకిల్ పై తీసుకొని వెళ్ళేంత , తాను హీరో కావాలి అని మాత్రమే వాడికి చలి తగలకుండా తన నీలపు అంగీని వానలో కప్పాను అని చెప్పేంత ….. అలాంటి తమ్ముడు  తిరిగి రాని  లోకాలకి వెళ్ళినపుడు అక్షరాల వానలో తన దుఃఖాన్ని తుడుచుకోవడం తప్ప రచయిత ఏమి చేయగలడు .

బలపంలో తన చిన్నప్పటి ముచ్చట్లు, ఊరితో గల అనుబంధాలు, హాస్టల్ ప్రయాణాలు, చదువుల బరువులు చర్చిస్తూ మెల్లిగా మనలను కూడా కాలేజ్ జీవితపు పెన్సిల్ ప్రయాణానికి లాక్కోస్తారు .  ఆ వయసు మాయలో వెతుక్కున్న ప్రేమని, కలం స్నేహాలని, ఆవేశాలని అశ్లీలం లేకుండా ముచ్చటైన తన వచనంతో ఎంతో మంది ఆ అనుభవాలను ఓన్ చేసుకునేలా ”పెన్సిల్” విభాగం లో కనపరిచి …… వామనుడు అంతై ఇంతై అని పెరిగినట్లు తనలోని ప్రశ్నలని నేల విడిచి సాము చేసే ఆలోచన రూపాలుగా మార్చి అక్షర మధనం చేస్తూ తాత్విక భావాలను మనలో కూడా ప్రవేశ పెట్టి మనం కూడా మన అస్తిత్వపు లోతుల్లోకి తొంగిచూసుకోనేలా ‘పెన్ను’ లో  మంత్రిస్తాడు . ఇంతా వ్రాసి ”నేను ఈ జీవితం లో స్వేచ్ఛగా బ్రతుకలేను. ఇలా కాలి బూడిద కావాల్సిందే ”అంటూనే పుస్తక ప్రియుల ర్యాక్ లో బందీ అయిపోతాడు .

అఫ్సర్ గారి మాటల్లో  ”రాజి రెడ్డి వచనం ఆకు మీద నీటి బిందువు జారుతున్నంత మెత్తగా ,చలికాలపు బవిరి గడ్డాన్ని కోస్తూ మొండి బ్లేడు రాల్చిన నెత్తుటి గీరలా ”

భగవంతం గారి మాటల్లో  ”వీరిది ప్రత్యేకమైనమైన అభివ్యక్తి ”

ఇక’ నా’ మాటల్లో

విసుగుచెంధక విరుచుకు పడే ఈయన ఆలోచనల అలలు దాటి చూస్తే సుదూర తీరాలలో నింగితో కలిసి కనిపిస్తూ తనలోకి లాక్కొనిపోయి మన అస్థిత్వాన్నే ప్రశ్నార్ధకం చేసే సముద్ర నీలపు శక్తి వీరి వచనం .

”ఒక మగవాడి డైరీ ”అని పెట్టడంలో ఔచిత్యం నాకు కనిపించలేదు . డైరీ అంటే క్రమం లేని రాతలు అని చెప్పొచ్చు అని రచయిత చెప్పినా ఈ మాట వ్రాయకపోతే బాగుండును అనిపించింది . చక్కటి రచయిత అక్షరాలకు ఆసరాగా నిలిచి పుస్తకాన్ని పందిరిపై అల్లించి నీడలో  సేద తీర్చిన  ”సారంగా పబ్లికేషన్స్ ” వారి మంచి అభిరుచి అభినందనీయం

ముగింపుకు ముందు ఇంకో ఆలోచన ఈయన ”రియాల్టీ చెక్ ”కింద వ్రాసిన ”అనిజ మనుషులు’ ‘దీనిలో చేర్చడం రాబోతున్న ”రియాల్టీ చెక్” బుక్ కి సంకేతమా అని ఒక సందేహం . నిజం అయితే బాగుండును అనే ఆశ . జరగాలి అనే ఆకాంక్ష . ఎందుకంటే ఒక్క అడుగు వేసేవరకే ప్రయాణం లో గుంజాటన. అడుగు పడిన తరువాత ఒక పుస్తకం నుండి ఇంకో పుస్తకానికి సాహిత్య పుటలలో తన పుటను ఏర్పరుచుకుంటూ ముందుకు సాగడమే రచయిత చేయగలిగింది .

 

***

 

పుస్తకాలు నవోదయ , విశాలాంధ్ర తో సహా  రాష్ట్రం లోని ఆన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తాయి.

 

హైదరాబాద్ లోని నవోదయ బుక్ హౌస్ వారి అడ్రెస్ :

Navodaya Book House

Opposite Arya Samaj Mandir,

Near Kachiguda crossroads, Hyderabad 500027

Phone No: 040 24652387

 

ఒక్కో పుస్తకం వెల రూ. 75 /- మాత్రమే.

-వాయుగుండ్ల శశికళ

sasi

ఇదిగిదిగో లోపలి మనిషి చిరునామా!

KuberanatharaoIyalaCover

కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని తపించే శ్రీ శాఖమూరు రామగోపాల్ వెలువరించిన ఎనిమిదవ పుస్తకం “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ”.

ఈ అనువాద కథాసంకలనంలో మొదటి అయిదు పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు కాగా మిగతా పది కథలు వివిధ రచయిత(త్రు)లు రాసినవి.

పూర్ణచంద్ర తేజస్వి గారు రచించిన “కుబి మత్తు ఇయాళ”, “అవనతి”, “అబచూరిన పోస్టాఫీసు”, “తుక్కోజి”, “డేర్‌డెవిల్ ముస్తఫా” అనే ఈ అయిదు కథలు కన్నడ కథామాలలో మణిపూసలనడం అతిశయోక్తి కాదు. ఈ అయిదు కథల తెలుగు అనువాదాలను ఈ వ్యాసంలో పరిచయం చేసుకుందాం.

***

ఆస్పత్రి లోపల్నుంచి ఫినాయిల్, స్పిరిట్, డెట్టాల్‌ల విశిష్టమైన వాసన ఒకటి గుప్పంటూ బయటకు వస్సుంది. బెంచీల మీద ఎంతో మంది రోగులు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఖళ్ ఖళ్‌నే దగ్గుతున్నారు. కొంత మంది తమ రోగంలోని కారణాల్ని దాని గుణ లక్షణాల్ని ఇతరులకు వివరిస్తున్నారు. జ్వరపీడితడైన ముసలోడొకడు అస్ ఉస్ అని వదుల్తూ పీలుస్తూ అప్పుడప్పుడు సంకటం సంకటం అని గొణుగుతున్నాడు. వారి మనమడొకడు వారి ఊతకర్రను తీసుకొని అరచేతి మీద నిలువుగా నిల్పే సర్కస్ చేస్తున్నాడు. ప్రతిసారి ఓడిపోయి ఊతకర్ర క్రిందపడినప్పుడు ‘’మరోమారు చూడు తాతా’’ అంటూ తన సర్కస్‌ను పునరారంభిస్తున్నాడు.

గ్రామీణులు దేన్నైనా ఒక సారి నమ్మితే, వారి విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ” కథ చెబుతుంది. సైన్యంలో డాక్టరుగా చేరి, అక్కడ తను చేసేది పెద్దగా ఏముండదని గ్రహించిన డా. కుబేరనాథరావ్ భైరవపురంలోని ధర్మాసుపత్రిలో వైద్యుడిగా చేరుతారు. ఆయన హేతువాది. వైద్యంతో పాటుగా గ్రామంలోని ప్రజలను చైతన్యవంతులని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన ఆ ఊర్లో సాక్షాత్ దైవం వంటి వారు. ఎటువంటి రోగాన్నైనా చిటికెలో నయం చేయగలరని ప్రఖ్యాతి పొందారు. ఆయన హస్తవాసి మంచిదనే నమ్మకం ప్రజలలో పాతుకుపోయింది. ఇయాళ అనే బాలికకి కడుపు నొప్పి వస్తే, వాళ్ళ అమ్మ బాయమ్మ డాక్టర్ గారికి అన్ని రోగ లక్షణాలు వివరించి, మందు రాయించుకుంటుంది. వాళ్ళ నాన్న హసన్‌లో మా మందు సీసా కొనుక్కొని వస్తాడు. ఆ మందు సీసాను ఆయన ముట్టుకుని, మూత తీసి పెట్టి ఇస్తే రోగం ఇట్టే తగ్గిపోతుందని చెప్పి, ఇయాళను డాక్టరు గారి దగ్గరికి పంపుతుంది బాయమ్మ. డాక్టరు గారు అందులోని అసంబద్ధతని చెప్పి, ఇయాళని వెనక్కి పంపబోతారు. చిన్నబోయిన ఇయాళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అది చూసి కాంపౌండర్ రామారావ్ – ఆ సీసాని ముట్టుకుని ఆ పిల్లకిస్తే తప్పేంటి అని అడుగుతాడు. బదులుగా అశాస్త్రీయంగా మాట్లాడవద్దని, తాము జీతభత్యాలు పుచ్చుకునేది మూఢనమ్మకాలను వ్యాప్తి చేసేందుకు కాదని అంటారు డాక్టరు. కానీ రామారావు వాదనలోని తర్కాన్ని కాదనలేక చివరికి ఇయాళని పిలిచి, ఆ మందు సీసా తీసుకుని, మూత విప్పి, మళ్ళీ పెట్టి ఇస్తారు. ఇయాళ సంతోషంతో ఇంటికి బయల్దేరుతుంది. అయితే, ఆమె ఇంటికి చేరదు. ఎవరో ఆమెని కర్పూర వృక్షం దగ్గర ఓ పెద్ద బండ దగ్గర హత్య చేసి పడేసారు. ఆ హత్య చేసింది ఎవరో తెలియదు. రాజకీయాలు తెలెత్తుతాయి. చనిపోయిన ఆ పిల్లను ఉపయోగించుకుని ఎవరి ప్రయోజనాలను వారు సాధించాలని ప్రయత్నిస్తూంటారు. హత్యకి కారణం తెలియదు. పోలీసులు చేతులెస్తేస్తారు. చివరికి అనుకోకుండా, డాక్టరు కుబేరనాథరావ్ ఆ కారణాన్ని తెలుసుకుంటారు. హంతకుడెవరో వెల్లడి చేస్తారు. తన వృత్తి ధర్మం పరిధి నుంచి బయటపడి, మానవత్వం ఉన్న మనిషిగా ప్రవర్తించినందుకు డాక్టరుగారికి సంతోషమవుతుంది. కానీ జనాలు మాత్రం కుబేరనాథరావ్ ప్రేతాత్మలను లొంగదీసి, నిజాలు వెల్లడి చేయించాడని నమ్మసాగారు. ఆయన ఏ విధానాన్ని నమ్మక తిరస్కరిస్తూ వచ్చారో, అదే సిద్ధాంతాన్ని జనాలు రహస్యంగా ప్రతిపాదించడం కాలపురుషుడిలోని అపహాస్యమేనంటారు రచయిత. ధర్మాసుపత్రి వర్ణన, వైద్యం కోసం అక్కడ ఎదురుచూస్తున్న వ్యక్తుల హావభావాలు, ప్రవర్తన కళ్ళకు కట్టినట్టు చిత్రించారీ 31 పేజీల ఈ పెద్ద కథలో.

ఆ పల్లెలలోని జనమంతా ఒక రకమైన విచిత్రంగా ఉండే వ్యవహరాలలో మునిగి తేలుతుండేవారు. ఉత్తిగనే కాలాన్ని గడుపుకొనే వ్యవహరాలులాగ ఉంటుండేవి వారి పనులు. వెళ్ళేది, వచ్చేది, కూలబడేది నిలుచుండేది… ఈ తరహలో ఉండే ఈ పల్లెజనంకు… ఎలెక్షన్ల కాలంలో వీళ్ళకు ఏమి ప్రలోభాల్ని చూపించి, వీళ్ళనుంచి ఓట్లు గుంజుకొనేది ఎలాగబ్బా అనేది ఒక సమస్యగా ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులకు అంతుచిక్కని సవాల్ అన్నట్టుగా ఉంటుండేది.

అవనతి కథ ఇస్లాపుర, ఇత్తావర, నస్లాపుర, సంగాపుర, మల్లినమడుగు అనే అయిదు గ్రామాల వర్ణనతో మొదలవుతుంది. ఈ అయిదు పల్లెలు విశిష్టమైనవి. అక్కడ మిగతా గ్రామాల్లో ఉండే కక్ష్యలూ, కార్పణ్యాలు లేవు. మత కలహాలు లేవు.. పేద గొప్ప తేడాల్లేవు. ప్రస్తుత ద్వేషమయ రాజకీయ దొమ్మరాటలకు ఈ పల్లెలు పెను సవాలుగా ఉన్నాయి అంటారు రచయిత. ఈ పల్లెల్లో ఉన్న ఇద్దరు గొప్ప వ్యక్తులలో ఒకరైన సూరాచారి, ఈరేగౌడతో కలిసి ఇస్లాపుర నుంచి ఇత్తావరకు వెడుతుండంతో కథ ప్రారంభం అవుతుంది. సూరాచారి నిజానికో శిల్పి. దేవాలయం నిర్మాణానికి ఇస్లాపుర వచ్చిన సూరాచారి అనుకోని పరిస్థితులలో ఇక్కడే ఇల్లరికం ఉండిపోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు దేవుడి విగ్రహాలు, మందిరాలు తయారు చేసి ఇచ్చినా, సూరాచారికి పెద్దగా పని ఉండేది కాదు. కొన్నాళ్ళకి రుబ్బురాళ్ళు, తిరగళ్ళకి గాట్లు పెట్టే పని తప్ప మరొకటి దొరకదు. ఏం చేయాలో తోచదు. చివరికి జనాల కోరిక మీద టేకు చెక్కల నుంచి గ్రామ దేవత బొమ్మలను తయారు చేయడం మొదలుపెడతాడు. కానీ జనాలకి ఆ బొమ్మలు నచ్చేవి కావు. ఆ బొమ్మలలో వాళ్ళకి దెయ్యం కనపడేది గాదు. ఆ బొమ్మలని అంత అందంగా ఎందుకు చేస్తారని ఆక్షేపించేవారు. అనాకారితనం కొట్టొచ్చినట్లు కనపడే బొమ్మలి తయారుచేస్తే వాళ్లెంతో సంతోషిస్తారు. ఈ పనులు చాలవన్నట్లు… మంత్ర తంత్రాలతో తాయెత్తులను ఇవ్వడం, మందుమాకు ఇవ్వడం, విభూది పెట్టడం వంటి ఇతర పనులు చేపట్టాడు. కాలం గడపడం కోసం ఇంకా అనేకానేక పనులు చేసేవాడు. బాకీవసూళ్ళు, ఎడ్ల అమ్మకంలో మధ్యవర్తిగా ఉండడం, పెళ్ళిళ్ళు కుదర్చడం ఇలాంటివన్న మాట. ఉబుసుపోని జనాల మధ్య ఓ పనిలేని తెలివైన వ్యక్తి కూడా ఎలా పతనమవుతాడో చెబుతుందీ కథ. ముప్ఫై నలభై సంవత్సరాల క్రితం గ్రామీణ భారతంలోని జీవనాన్ని అత్యంత సుందరంగా చిత్రించిన కథల్లో ఇది ఒకటి.

పోస్టాఫీసు ఆత్మకూరులో కొత్తగా తెరవబడినప్పుడు బొబణ్ణ ఉదయంలో ఒక గంట, సాయంకాలంలో ఒక గంట టెంపరరీగా పోష్ట్‌మాష్టర్ డ్యూటి చేసేందుకు ఒప్పుకొన్నాడు. బోబణ్ణ ఒప్పకొన్న మీదట అతనుండే ఇల్లరికం ఇల్లే టెంపరరీ పోస్టాఫీసుగా రూపాంతరం చెందింది. అందరూ బోబణ్ణను పోస్టమాష్టరుగారు అని గౌరవంగా సంభోధిస్తుండేవారు. బోబణ్ణలో తానొకడే ఢిల్లి సర్కారు (కేంద్రప్రభుత్వం)తో సంపర్కాన్ని పొందిన ఇండియన్ అనే గర్వం తొణకిసలాడుతుండేది.

ఓ బలహీనమైన క్షణంలో చేసిన తప్పు ఎలా వెంటాడి వేధిస్తుందో, “ఆత్మకూరులోని పోస్టాఫీసు” కథ చెబుతుంది. కొత్తగా పెట్టిన పోస్టాఫీసుకి, ఆత్మకూరులో ఎస్. ఎస్. ఎల్. సి. దాకా చదువుకున్న బోబణ్ణని పోస్ట్ మాస్టర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు కావడంతో, వారికొచ్చిన ఉత్తరాలను చదివి పెట్టడం, వారు రాయాల్సిన ఉత్తరాలను రాసిపెట్టడం వంటి పనులు చేస్తూంటాడు బోబణ్ణ. ఊర్లో పోస్ట్‌మాన్ సౌకర్యం లేకపోవడం వల్ల వచ్చిన ఉత్తరాలన్నీ జాయికాయ పెట్టెలో పడేస్తుండేవాడు. జనాలు వచ్చి ఆ పెట్టెలో వెతుక్కుని తమ ఉత్తరాలు తీసుకువెళ్ళేవారు. అదే సమయంలో ఇతరుల ఉత్తరాలు కూడా చదివేస్తూండేవారు. ప్రస్తుతం బోబణ్ణ ఎంతో దిగులుగా ఉన్నాడు. ఆ దిగులుకి కారణం అతను చేసిన ఓ దొంగతనం. ఆ ఊర్లో ఓ కుర్రాడికి వచ్చిన ఓ కవర్‌ని ప్రేమలేఖగా భావించి దొంగతనంగా చించి తెరుస్తాడు. కానీ అందులో ఓ అర్థనగ్న సుందరి బొమ్మ ఉంటుంది. ఆ క్షణం నుంచి అతనిలో మనో వికారం మొదలవుతుంది. అప్పట్నించి అతను ఆ ఊరికొచ్చే ప్రతీ కవర్‌నీ తెరచి చూసి, వాటిల్లో సుందరాంగుల బొమ్మలేమయినా ఉన్నాయేమోనని వెతికేవాడు. పనిపాట లేని జనాలు పోస్టాఫీసు దగ్గర చేరి ఆయా ఉత్తరాల్లోని విషయాల్ని చర్చించుకుంటూంటారు. ఈ ప్రక్రియలో ఎన్నో పుకార్లు రేగుతాయి. జనాలు బోబణ్ణని కొట్టడానికి వస్తారు. అంతా గందరగోళమై పోతుంది. చివరికి పోస్టాఫీసు, ఇల్లు వదిలి పారిపోతాడు బోబణ్ణ. ప్రతీ వ్యక్తిలోనూ ఉండే చీకటి కోణాలని బహిర్గతం చేస్తూందీ కథ. ఈ కథ చలనచిత్రంగా నిర్మించబడి, జాతీయ స్థాయిలో “ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా” బహుమతి పొందింది.

అతను మరియు అతని భార్యైన సరోజ…ఆ ఇద్దరే కూర్చుని ఎంత పనినైనా చేస్తుండేవారు. భార్యకు మొట్టమొదలు కాజాల్ని కుట్టేది , గుండీల్ని కుట్టేది మొదలైన చిల్లర పనుల్ని ఇస్తుండేవాడు. సరోజకు కొద్దికొద్దగా బట్టల్ని కుట్టే పనితనం పరిచయం అవుతూ రాసాగగా ఇక ఇప్పుడు బట్టల్ని కత్తిరించే పనిని ఇస్తుండేవాడు. ఇతను రంగు సబ్బుముక్క(బిళ్ళ) నుంచి బట్టమీద కొలతల గీట్లును గీసి ఇస్తుండేవాడు. ఆ గీతలకు అనుగుణంగా సరోజ ఆ బట్టల ముక్కల్ని కత్తిరించి ఇస్తుండేది.

ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళిచేసుకున్న వాళ్ళు తమ మధ్య ప్రేమని చివరి దాక ఒకేలా ఎందుకుంచుకోవాలో చెబుతుంది “టైలర్ తుక్కోజీరావ్” కథ. తుక్కోజీరావ్ వంశమే బట్టలకు ప్రసిద్ధి. అతని తండ్రి హసన్ పట్టణంలో పేరుమోసిన కట్ పీసెస్ వ్యాపారి. అయితే తుక్కోజీ సామ్యవాద భావాలవైపు మొగ్గుచూపి, తండ్రి అభిమతానికి విరుద్ధంగా ఓ పేద విధవరాలి కూతురు సరోజని పెళ్ళి చేసుకుంటాడు. తండ్రి ఆస్తిలోంచి ఒక చిల్లిగవ్వ కూడా ఆశించకుండా, తన చేతి విద్యని నమ్ముకుని అప్పుడే పెరుగుతున్న గురుగళ్ళికి మకాం మారుస్తాడు. బట్టలు కుట్టడంలో తుక్కోజీకి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఎవరినైనా ఒకసారి తేరిపార చూస్తే వారి శరీరపు కొలతలు అతని మనసుకో ముద్రితమైపోతాయి. అప్పటి దాక రెడీమేడ్ దుస్తులు ధరించే గురుగళ్ళి జనాలు తుక్కోజీ నైపుణ్యం పుణ్యమా అని కట్ పీసెస్ కొనుక్కుని తమ శరీరాకృతికి తగ్గట్టుగా చక్కని దుస్తులు కుట్టించుకుని తిరుగుతున్నారు. భర్తకి సహాయంగా సరోజ మొదట కాజాలు గుండీలు కుట్టడం ప్రారంభించి, క్రమంగా తను బట్టలు కుట్టగలిగే స్థితికి వస్తుంది. కొన్నాళ్ళకి వారికి ఓ కొడుకు పుడతాడు. కృష్ణోజీ అని పేరు పెట్టి కిట్టూ అని పిలుస్తూంటారు. కిట్టూ పుట్టిన తర్వాత సరోజ భర్తకి సాయం చేయడం తగ్గుతుంది. పిల్లవాడు నడక నేర్చే సమయానికి తుక్కోజికి పని ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది. సరోజకి బిడ్డతో తీరిక దొరకదు. ఫలితంగా బట్టలు కుట్టడంలో తేడాలొస్తాయి. ఖాతాదారులు గొడవ చేయడం మొదలుపెడతారు. మొదట్లో అన్యోన్యంగా ఉన్న భార్యభర్తల మధ్య తగువులు మొదలవుతాయి. తనని అర్థం చేసుకోవడం లేదని ఇద్దరూ అనుకుంటూంటారు. కొన్నాళ్ళకి బేరాలు తగ్గుతాయి. ఇంట్లో చిరాకులు పరాకులు పెరుగుతాయి. కిట్టు అల్లరి పెరిగిపోతుంటూంది. ఆ ఊర్లో రైలు వంతెన నిర్మాణం కోసం ఓ క్రాలర్ వస్తుంది. కిట్టూ ఆ క్రాలర్‌కి అడ్డంగా వెళ్ళి, దాని అద్దం పగలగొడతాడు. క్రాలర్ డ్రైవర్ వచ్చి తుక్కోజీని మందలిస్తాడు. ఇంకా అల్లరి మానకపోతే, కిట్టూని తాను తీసుకెళ్ళిపోతానని అంటాడా డ్రైవర్. ఒకరి మీద మరొకరు విసిగిపోయి ఉన్న అ భార్యాభర్తలు, “తీసుకుపొండి.. మాకు హాయిగా ఉంటుంది” అని అంటారు. నిజంగానే ఆ డ్రైవర్ పిల్లాడిని ఎత్తుకుని క్రాలర్‌లో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతాడు. అరగంట అవుతుంది, గంట అవుతుంది, క్రాలర్ జాడ లేదు. భార్యాభర్తలలో అలజడి మొదలవుతుంది. కిట్టూని అడ్డం పెట్టుకుని ఒకరి మీద మరొకరు ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన తీరు గుర్తొచ్చి ఇద్దరూ పశ్చాతాప్తం చెందుతారు. క్రాలర్ డ్రైవర్ గురించి ఫిర్యాదు చేద్దామని బయల్దేరుతుండగా డ్రైవర్ తిరిగొచ్చి కిట్టూని అప్పగించడంతో కథ ముగుస్తుంది. ఒక టైలర్ దుకాణం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు చూపిన కథ ఇది.

 ఇక ఇప్పడు ముస్తాఫాలోని టోపి మా క్లాసులో కష్టాల్ని కలిగించసాగింది. ‘టోపి గీపి తీసేదిలేదు. నన్ను కోరేది మానండి. నేను డేర్ డెవిల్ మనుషిని’ అంటూ ముస్తాఫా మొండికేసి కూర్చున్నాడు. ఏమేమి చెప్పినా వినలేదు. మేము సైతం అతను టోపి తీయాల్సిందేనని పట్టుపట్టాము.మొత్తం మా క్లాసులో ముస్తాఫా పరంగా మాట్లాడేందుకు ఏ విద్యార్థి సిద్దమైలేడు. అయినా ముస్తాఫా మాత్రం, ‘’నన్ను వదిలేయండి; నేను డేర్ డెవిల్ లాంటోడ్ని’’ అని అంటూ ఎవరి మాటకు విలువ ఇవ్వకనే కూర్చున్నాడు స్థిరంగా.

హిందూమతానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఓ జూనియర్ కాలేజిలో “జమాల్ అబ్దుల్ ముస్తఫా హుసేన్” అనే కుర్రవాడు చేరతాడు. అయితే ఏ రోజూ కాలేజీకి రాడు. లెక్చరర్ హాజరు పిలిచినప్పుడల్లా మిగతా విద్యార్థులు ఆ కుర్రాడు ఎవరో చూడాలని ఎదురుచూస్తారు. కానీ వాళ్ళకి ముస్తఫా కనబడడు. ప్రతీ రోజూ లెక్చర్ హాజరు పిలవడం, ముస్తఫా పేరు పలికినప్పుడు ఎవరూ జవాబు చెప్పకపోవడంతో మిగతా విద్యార్థులకు చాలా కుతూహలంగా ఉంటుంది. ఎవరితను, ఎందుకు కాలేజీకి రావడం లేదు? అని అనుకుంటూ వాళ్ళ మనసుకి తోచిన కారణాలు ఊహించుకుంటూండేవారు. ఒక రోజు హఠాత్తుగా, ముస్తఫా తరగతికి హాజరవుతాడు. అతన్ని చూసిన విద్యార్థులు విస్తుపోతారు. భిన్న మతాలలోని ఆచార వ్యవహారాలు మనుషుల మధ్య విభేదాలు సృష్టించినట్లే, విద్యార్థుల మధ్య కూడా సృష్టిస్తాయి. మొదట్లో అతన్ని ఆటలలో చేర్చుకోరు. దూరంగా ఉంచుతారు. అయితే వినాయక చవితి సందర్భంగా ముస్తఫా చేసిన మేలు అతడిని మిగతా పిల్లలు ఆమోదించేలా చేస్తుంది. ముస్తఫాలో తుంటరితనం ఉన్నా, అంతకు మించిన సంస్కారం ఉందని, అతను బాగా చదువుకుని భారత ప్రభుత్వం వారి రక్షణ పరిశోధనా విభాగంలో ఉన్నత పదవి సాధిస్తాడు. ముస్తఫా డేర్ డెవిల్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

సాహిత్య స్వరూపం ఏదైనా, అది రాణించాలంటే రచయితకి రచనావస్తువు పట్ల నిబద్ధత అవసరం. కథా వస్తువుని తన నిజ జీవితంలోంచి తీసుకున్నా, సమాజం నుంచి గ్రహించినా, ఆయా వ్యక్తులను అత్యంత సన్నిహితంగా గమనిస్తే తప్పితే రచనను అత్యద్భుతంగా తీర్చిదిద్దలేరు. పూర్ణచంద్రతేజస్వి గారు ఆయన అన్ని రచనలలోనూ ఇదే పని చేసారు. తన చుట్టూ ఉండే వ్యక్తులను అత్యంత సమీపం నుంచి గమనించి, వారి స్వభావాలను, నైజాన్ని అక్షరబద్ధం చేసారు. కథలో తారసపడే ప్రదేశమైనా, సంఘటన అయినా చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుంది. తోటివారితోనూ, పరిసరాలతోనూ ఎంతో సాన్నిహిత్యం ఉంటేగాని ఇదంతా సాధ్యం కాదు. ఒకప్పటి గ్రామీణులలోని అమాయకత్వం, సంస్కారం, సానుభూతి, కుళ్ళు, కుత్రలు, కుతంత్రాలు…. ఇలా మంచీ చెడూ అన్నింటిని ఆయా పాత్రల ద్వారా సమగ్రంగా వ్యక్తీకరించారు రచయిత. మనుషుల మనస్తత్వాలు, ద్వంద్వప్రవృత్తులు, మూఢ విశ్వాసాలు వారి జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలలో చూడచ్చు.

పూర్ణచంద్ర తేజస్వి గారి ఈ అయిదు కథలు మన లోపలి వ్యక్తులను మనకి పరిచయం చేస్తాయనడంలో అనుమానం లేదు.

***

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే మరో ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు. ఈ పుస్తకంలోని మిగతా కథలని గురించి మరోసారి ముచ్చటించుకుందాం.

 

“డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావు మరియు ఇయాళ”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 198 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in
kolluri–కొల్లూరి సోమ శంకర్

దళిత కవిత్వపు వెలుగు రవ్వ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ !

మాకు ఒక భాష కావాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్న సుధాకర్ !

గాడిద పేడతో
డిటర్జెంట్లు చేసే రజకుల మేధస్సునీ
గొడ్డుటావుల చర్మాన్ని
గంటలో ఒలిచే చర్మకారుల నైపుణ్యాన్నీ
వాంతి చేసుకోకుండా
దేశీయుల మలాన్ని చేతులతో పట్టుకెళ్ళే
దౌర్భాగ్యుల సహనాన్నీ
గుర్తించని ఈ భాషాజాతులు
ఎవరికి ట్రోజన్‌ హార్సులు!

జాతిలో సమైక్యం కాలేనప్పుడూ
నీతిలో సమతుల్యం లేనప్పుడూ
వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ
దళితుల గౌరవం కోసం రాయనప్పుడూ
సమానత్వం ఫ్లాట్‌ఫారాల మీద
సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని
సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!

                                                                          –తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

‘చిలిపి కళ్లతో నవ్వుతా భూమి ఆకాశాల మజ్జన ఎవరి పాట వాళ్లు రాసుకోవాలంటాడు’ త్రిపురనేని శ్రీనివాస్. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటాడు కలేకూరి. ఇప్పుడు సుధాకర్ కి  భాష కావాలంట. ఇన్నాళ్లకన్నా ఆ దళిత భాష. ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి స్పృహ వచ్చింది. నిజానికి అంటరాని కవిత్వాన్ని, దళిత జీవితాలని, సాహితీ ఆకాశంలోకి ప్రవేశపెట్టి, బతుకు ఆలోచనల మకిలిని , అహంకారపు మాడుని  పచ్చడి బండతో కొట్టి, నా దారి నేనే ఏసుకుంటా అని ఎగరేసుకున్న జండా సుధాకర్.

ధిక్కారిగానూ, ఒకసారి యోధుడుగానూ, ఒకసారి జపాన్‌లోని పార్కు గురించీ, మరోసారి నొసలు ముడవద్దంటూ విశ్వభాష అయిన నవ్వు గురించి, ఒకటా రెండా, రిజర్వేషన్లు, దళిత క్రైస్తవం, ఇవాంజులికల్ చర్చి పెద్దలు , కామ్రేడ్లపైన చురకలు, వర్గీకరణలు అంగీకరించకుండా ధిక్కరించి, ఏ విభజననీ ఎవ్వరేమనుకున్నా ఒప్పుకోకుండా తుఫానులో లైటు హౌస్‌లాగా నిలబడ్డాడు. చెవిలో సీసం పోసిన వాళ్లని, మురిగిన కషాయాల కాషాయలని, ఉత్తుత్తి ప్రజాస్వామ్యాన్నీ, ప్రజల ప్రాణాలతో ఆడుకునే పాలకుల నిర్ణయాలని, వ్యతిరేక వ్యక్తులనీ, శక్తులనీ, తన కవిత్వంతో, ప్రతి కణాన్ని ఒణికించాడు. గుండెల్ని చీల్చే మాటలతో, విషయాన్ని మూడోకంటితో చూస్తా. ఎప్పటికప్పుడు మారే వాసనలని కలంతో పీల్చుతా, అందరికీ కొంచెం పూశాడు. వర్గీకరణలూ లేని కవిత్వాన్ని ఎంతో కొంత (ఇది సరిపోదు) అందించాడు. దళిత కవిత్వాన్ని అందించాడు. ఇంకొక్కసారి చెపుతున్నా. నిర్బంధ మానవ జీవితాల వ్యధల్ని, ఆంక్షల కట్టడాలని కూల్చిన సరికొత్త కవితా గ్రామ నిర్మాణ శిల్పి. ‘రావణాసురు’డి కాలుతున్న కాష్టపు కంపు ఆరని చితిమంటలని కథలుగా చెప్పుకుంటా, బొట్టూ, పూవులు ఉన్న మండోదరి పతివ్రత అని దణ్ణం పెట్టుకునే లోకంలోనే బతుకులు ఈడుస్తున్నాం. ఆ కవురు కంపుని కాష్టపు పొగలనీ కూడా కవిత్వం చేసినవాడు. తరతరాలుగా దళిత జాతి మనస్సులో, జీవితాల్లో, మాటల్లో చితి ఆరటంలేదు. వాళ్ల మాటల్ని, వాళ్ల బాధల్ని మనం భాషగా ఒప్పుకోం. ఇక్కడ భాషంటే రెండు తోలు పెదాల్లోనించీ స్వరపేటికతో కలిపి వచ్చే శబ్దాలు, అరుపులు. నాలిక మడతలు కాదు. భాష అంటే  పాట్లు, భాష అంటే బతుకు, భాష అంటే జీవితం. కత్తికన్నా కలం పదునయినదన్నది పాత బూజు సిద్ధాంతం. కాదు ఈ రెండింటికన్నా భాష పదునయినదనీ, దానిలో కూడా మళ్లీ ఎన్నో తేడాలు. Power of Languageకి Language of Powerకీ ఉన్నంత తేడా.. దీన్ని చర్చిస్తే  ఒక గ్రంధమే రాయాలి.

maakuOkaBhashaKaavaaliByWilsonSudhakar

సాల్వెడార్ ఆలెండీ మృతివార్త విని ప్లాబో నెరుడా మరణించాడు. విచిత్రం… కవిగా మరణించినా మెదడు మాత్రం ఆఖరి నిముషం వరకు పని చేసిందంట. బహుశా నెరుడా మెదడులోని ఒక కణం ఈ కవి చేతిలో దూరిందేమో. ఎన్నెన్ని సంఘటనలు. కష్టాలు ఎవరివయినా ఒకటే. ఎన్నెన్ని సంఘటనలని రూపం కట్టాడు. నిజానికి పారే నెత్తురికీ, ఊడదీసిన బట్టలకీ, భర్తాబిడ్డల ముందు మానభంగాలకీ, ఓపికలేని కుత్తుకలకీ, పిల్లికూతల స్వరల తరఫున నరాలు తెగిపడేలాగ అరిచాడు. అసలు ఈ సంఘటనలు కవితలుగా మలచటానికి ఇంత ఓపికా, శక్తి ఉండటం కూడా ఆశ్చర్యమే. మట్టిలో పడే పాదముద్రలకి శాశ్వత్వం మళ్లీ వాన కురిసేదాకానే. బాటగా బతుకుపాటగా, పాటుగ మారతయ్యనుకోటం మన ఆశ. అయినా ఎలుగెత్తటం మానకూడదు. ఎలుతురిని ఎతకటంలో తప్పులేదు.

కారంచేడు, చుండూరు, నీరుకొండ, కందమాల్,  భైర్లాంజీ, నిర్భయ, దళితక్రైస్తవం, అంబేద్కర్ , బుద్ధుడు, పూర్తి రిజర్వేషన్లు, అన్నీ చెపుతా ముల్లు కఱ్ఱతో తన వాళ్లని తనే పొడుస్తున్నాడు, పొడిచే పొద్దువైపు చూపుతా.

మరిప్పుడూ భాషెందుకు కావాలి. ఇప్పుడు మాట్టాడే భాష కాదు? మరి అందరూ ఆ భాషే మాట్టాడతంటే వీళ్లెందుకు ఆ భాషని కక్కిన కూడులాగా అసహ్యించుకుంటన్నారు.

వాళ్ల పదాలనీ, జీవితాలనీ, వృత్తులనీ, గుండెనీ, గుడిసెనీ, ఆటనీ, పాటనీ, బువ్వనీ, అవ్వనీ, నవ్వునీ, ఏడుపునీ మనం గుర్తించనప్పుడు అసలు ఈళ్ళు ఉనికే వద్దన్నప్పుడు, బతుకే దినదినగండం నూరేళ్ళ ఆయుస్సు అయినప్పుడు అది ఆనందపు మాటగా, మాట బాసగా మారుద్దా. వాళ్ల పాటకి సరిగమలు లేవంటే అది శ్రమది, ఇది ఇంకోటి. వాపుకీ, బలుపుకీ ఉన్న తేడా.

సంగీతం అంటే సరిగమపదనిసలు. తిరగా బోర్లా ఎనిమిదక్షరాలు. ఆరోహణా, అవరోహణా అనే అర్ధం కాని పదాలా అంటే అవ్వొచ్చు. కాకపోవచ్చు. ఒక సినిమా” ద కలర్ కాల్డ్ పర్పుల్” లో స్పీల్‌బర్గ్ ఇలా అంటాడు. సంగీతం అంటే ఆఫ్రికన్ ఎడారుల్లో రైలు మార్గాలు వెయ్యటానికి, గడ్డపారల్లో పట్టాలు దొర్లించేటప్పుడు ఒదిలే ఊపిరి, కడుపు నింపుకునే ఆహారాన్వేషణలో భయాన్ని పోగొట్టుకోటానికి చేసే ధైర్యపు శబ్దాల పాట. ఆకలేసి, ఏసి ఏడ్చి సొమ్మసిల్లిన నిస్సత్తు రాగం. బహుశా ఇదే నా మెదడులో కూడా ఉందేమో.

ఏది ఏమైనా తెలంగాణా ఉద్యమానికి పునాది వాళ్ల మహోన్నతమయిన సాంస్కృతిక వాదమే. గొప్ప భాష వాళ్ల సొంతం. ఎంతో సొగసైన మాండలికం, కట్టె పుల్లలు, కట్టెల పొయ్యి, దుడ్డు, బిడ్డ, యాట లాంటి అసలయిన పదాలు ఆళ్ల సొంతం. ఎంతెంత సాహితీ సంపన్నులు. మాండలీకాలనే గవ్వలనీ, రవ్వలనీ పోగేసుకున్నవాళ్లు. గద్దర్, గోరేటి లాంటి సంస్కృతీ వారసత్వంతో అదీ ఒద్దీకరించబడి (రికార్డెడ్) ఉండాలి. అక్కడా అంతా గొప్పా అంటే అదేమీ లేదు. పట్టు చీరల గరగరల బతుకమ్మల్లో పాపం మన దళిత సోదరులకి  సోటుందా. సరే మళ్లీ విషయంలోకి వద్దాం. నేను “క” గుణింతాన్ని ఎన్ని రకాలుగా నేర్చుకున్నానో.

1. ‘క’కార అకారముల ‘క’, ‘క’కార ఆకారముల ‘కా’, ‘క’కార ఇకారముల “కి’

2. ‘క’కు దీర్ఘమిస్తే కా, ‘క’కు గుడిత్తే ‘కి’, ‘కి’కు పొల్లిత్తే ‘కీ’

3. క, కా, కి, కీ, కు, కూ,కృ, కౄ

ఇక్కడే మూడు మూడు వర్గాలయ్యాయి. ఒకటి బ్రాహ్మణులది, ఒకటి ధనగ్రవర్ణాలది, ఒకటి బీదలది. అయినా అన్నీ సదివినా, బతుకులో ఈ కాకిగోల ఎంతకి ఉపయోగపడుద్దో అర్ధమే కాదు.

అసలు దళిత వాదానికి పునాది ఏంటి? ఎవరో కొద్దిగా ఆలోచిత్తే చాలు. ఎవరికయినా తెలుత్తుంది. హైందవ అమానవీయ సంస్కృతిని ధిక్కరించే పోరాటమే. ధర్మశాస్త్రాల ఆధిపత్యాన్ని తిరస్కరించిన చార్వాకులు, బౌద్ధులు, అంబేత్కర్, పూలే, పెరియా ఉద్యమాలే కదా మూలం. కుల నిర్మూలన జరగాలనే వాదమే కదా వాస్తవానికి దళితవాదం. ప్రవాహపు నదిలా ఉండి ఉపనదులని కలుపుకుంటా సంపన్నం కావాలి. కానీ కాన్షీరాం అన్నట్టు కడుపు నిండినవాడు ఎవరంటే దళిత బ్రాహ్మణుడు అంటాడు కవి.

వాళ్లలోని ఈ ఆకారం లేని పోకడల పట్ల పెన్నం మీద గింజల్లా పేలతాం కానీ భూమిలోని విత్తులా మొలవరేం. దళితోద్యమాలు చైతన్యపూరితం అయ్యి తీవ్రమయిన అగ్రహాన్ని వ్యక్తం చేసే స్త్రీలని గాయపరిచే భాషలని  వాడటం నివారించగలిగాయి. ఎన్నో సంకలనాలు కూడా వచ్చాయి. ఎంతోమంది కవులు ఎన్నోరకాలుగా రాశారు. కొందరయితే పేరొచ్చినాక దళిత కవిత్వం, దళిత అనే మాటలకే దూరంగా జరిగిపోయారు. (ఇక్కడ  పేర్లు అవసరం లేదు) ఒకరకంగా అన్యాయాల పైన  కూడా . అంటే వాళ్ల మీద వాళ్లే  పోరాటాలు చేసుకోవాలేమో. అయినా ఎంత చెప్పినా దళితవాదం గురించి తక్కువే. అదొక పోరాటం, ఉద్యమం  స్థాయిలో ఇంకా పెరుగుతూనే ఉండాలి.

కొందరికి నదులు, కొండలు, పర్వతాలు, జలపాతాలు, కిటికీలోంచి లోకం, ఉదయాలు, సాయంత్రాలు.. ఇవే కవిత్వం. ఇక్కడి కవికి అణిచివేత, అణగదొక్కటం, నోటితో మాట్లాడి నొసలుతో ఎక్కిరించటం లాంటి వాటిపైన పశృతలతో పడ్డాడు. ఇది నిజంగా కొంతలో కొంత ఆధునిక ధిక్కారం. ఊకబస్తాలాంటి మెదళ్లని కదిలిచ్చటం. అంబరానికి ఎగిరిన పొలికేక, తెగిపడ్డాక కంఠాల అరుపు. మనుషులుగా గుర్తించాల్సిందే అనే హెచ్చరిక. మీద పడయినా మావాటా లాక్కుంటాం. పరిగె గింజలకి కాదు, పాలికుప్పలకోసం, కల్లాల కోసం పోరాటం. ఆమోదాలకోసమో, అలంకారాల కవిత్వం కాదు. ఆకలికేకలు. అణిచివేత అరుపులు, కులాల కుంఠాటల్ని జాడిచాడు.

మాకు ఒక భాష కావాలి. అది దళిత భాష కావాలి. కోరికయితే కోరాడు కానీ నిజానికి సుధాకర్ కవిత్వంలో ఎంత దళిత భాష ఉంది? ఉంటే ఎంత? లేకపోతే ఎంత. కొంచెం ఎనక్కి వెళితే నేను తన ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాను. కోస్తాలో మాంచి మోతుబరి కమ్మగ్రామం ఆయన ఊరు. తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు. తండ్రి ఊరికి మంచి చెడులు చెప్పే పాస్టరు, పోస్టు మాస్టరు, హెడ్ మాస్టరు. తల్లిగారు కూడా ఉపాధ్యాయురాలే. ఒక రకంగా మాస్టారి అబ్బాయిగా మంచి జీవితమే. అందరికన్నా మెరుగయిన బతుకే. అందుకే ఎక్కువగా నాగరిక భాషే ఉంటది.. మరి విషయం దళితులది. విధానం స్థానిక, దేశ, విదేశ పదాల కలగలుపు. అయినా సమస్యనే తీసుకున్నాడు కనక ఈలోపాన్ని వదిలేద్దాం. మరి ఇపుడు మాట్టాడేది భాష కాదా? శ్రమ చేసి వాడి పాదాలు మనతో మాట్టాడాలి. డప్పు కొట్టె చెయ్యి గుండెల దడ కావాలి. కవికి ఒళ్ళంతా కళ్లయి ప్రపంచలోని ప్రాపంచాన్ని చూడాలి. ఎమ్మటే కంటిలో పాపలా లలితంగా మారిపోవాలి. మళ్లీ ఇట్టా అంటాడు. భూమినాది కాదు. భూమిపయిన హక్కు నాది కాదు. ఏ రూపంలోనయినా మమ్మల్ని కలుపుకోనప్పుడు మీ బతుకు కతల్లో మాకు గారవమే లేనప్పుడు, మాకు మీ చెడిన చరిత్రలో చిరుగుల పేజీ అయినా లేనప్పుడు ఈ భాష మాకెందుకు? అప్పుడప్పుడు అనిపిచ్చుది. సమాజం చేసిన గాయం ఎంత లోతయినదో కదా.. ఇంకా గేదె మానాన్ని పొడిచే కాకుల జీవితమే కదా. చిరుగుపాతల గోనెపట్టయినా కప్పట్లేదు. కాకులకి వదిలేశామిది చూడండి.

 

కులపిచ్చిగాళ్లకి దేశమొక ఎలమావితోట

జాతికి జవ్వనాశ్వంలా మేమూ శ్రమదానం చేస్తున్నా

కుల ఓంకారాన్ని ప్రణవాక్షరం చేసుకున్న

దేశపౌరుల గుండెలోతుల్ని తెలుసుకోగలమా!

కాలేజీ రోజులు ఇంకా పచ్చగా, పచ్చిగా కళ్లముందే కదలటల్లా. ఆడు ఒకటా, రెండా అని మీ చెవుల్లో మోగటల్లా.. అన్నియ్యా, అక్కియ్యా, ఒచ్చేడు, ఎల్లేడు అనే ఎకిలి మంత్రాలు ఇంకా వాగి మోగుతున్నాయి.

రామా “అడ్‌కాప్” చెప్పులకన్నా

నీ పావుకోళ్ళ జత గొప్పవైతే

రా! బహుజన సామ్రాజ్యంలో గద పట్టుకు నిలబడ్డ అంబేత్కర్ని దాటి’

ఎంత ధైర్యం, నిబ్బరం, మేము దళితులం అని సగర్వంగా తలెత్తిన క్షణం, బతుకుల్ని బాగుచేసి, చేత్తన్న, చేసే వైనాన్ని కనుక్కొన్నారు. మీకొక మనిషున్నాడు. అతని ఆత్మ అంతరవలయమై ప్రతి దళితవాడని ఇనపకంచెలా, తిరగబడే పిడికిలిలా, కన్నీటిని తుడిచే అమృత హస్తంలా కావలి కాత్తానే ఉంది.  ఏ తలకాయ లేదనుకున్న గొఱ్ఱె తలకాయలకి ఓ సమాధానం ఈ తల. ఏ ధనం లేదనుకున్నవాళ్లకి జై భీమ్ పిడికిలే సంపద. తలే కొన్ని కోట్ల తలల తిరుగుబాటు. తలలకే తల అది. అసలు ప్రతి కులంలోనూ ఓ అంబేత్కర్ ఉండాలంటాడు కవి. అంబేత్కర్ వల్ల కడుపులు నిండినవాళ్ల మానం పైనా చురకలేశాడు. నిజానికి అంబేత్కర్ ఆశయాలు ఎంతగా ప్రచారం పొందాయో, అంతకన్నా త్వరగా దుష్ప్రచారాలని సాగించటంలో కూడా కొన్ని శక్తులు విజయం సాధించాయి. అసలు దళితులే అంబేత్కర్‌ని ఆరాధించాలని ఏమీ లేదు. వ్యక్తిగా ఎవరమయినా అతని గొప్పతనాన్ని సంఘం పయిన ఉండే ముందు చూపుకీ జై భీమ్. రామాలయాలు వద్దు. కాలే కడుపుకి గంజే ముద్దంటాడు.

మాంసం తినే హిందువంటే

మాంసం తినని హిందువు ఇంటిదాకా రానిస్తాడా…..

ఇంటిదాకా కాదు ఒంటికి తగిలినా మునుగుతారు. మన సిగ్గులేని  సమత్వం సిగ్గుతో దాక్కోటాన్ని చూత్తాం.

విత్తమూ నీది కాదు. విత్తనమూ నీది కాదు. విన్నాణమూ నీది కాదు. పుల్ల మామిడి దొరకని పురజనులకి, ఓడలు దిగిన చైనా యాపిళ్లలో గుట్టు, కిమయా డేట్సు, ఓట్సు, Ives(ఏవీస్) మాహిశ్చరైజర్లు, ఈ దేశం నీదయినా, ఈ రాజ్యం నీది కానప్పుడు , ఈ గింజ నీ చేతిలో ఉన్నా భూమి లేనప్పుడు అవి ప్రపంచీకరణ దుష్ప్రభావాలని దుయ్యబట్టి, ఎండేశాడు. ఈ పద్యాలన్నీ చదివితే ఇవి దళిత, బహుజన, క్రైస్తవ సమాజం కోసమే  అనుకుంటే పొరపాటు. ఆలోచిస్తే పుడమిని చీల్చుకుని వచ్చే ప్రతి ప్రాణి బాధ దిగులు. ఉనికిని కోల్పోయే జీవితాన్ని గుర్తు చేస్తా భయంతో చేసే హెచ్చరిక.

sindhumadhuri-మన్నెం సింధు మాధురి

 

(రెండో భాగం వచ్చే వారం)

ఏడు రంగుల ఇంద్రధనస్సు “ సప్తపర్ణి”

Saptaparni cover page చిత్రలేఖనం, ఛాయాగ్రహణం , ఇంకా చలనచిత్రాల పై అనేక  వ్యాసాలున్న  ‘సప్తపర్ణిపుస్తకావిష్కరణ సభ ఇటీవల  హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ దూర దర్శన్ మాజీ అధికారి, ప్రయోక్త  వోలేటి పార్వతీశం సభ ను నిర్వహించారు.  మాజీ పోలీసు అధికారి చెన్నూరి ఆంజనేయరెడ్డి  అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంజనేయరెడ్డి పుస్తకావిష్కరణ చేసాక మాట్లాడుతూమిసిమి, భూమి పత్రికలలో ప్రచురించబడిన కాండ్రేగుల నాగేశ్వరరావు వ్యాసాలు ఇప్పుడు పుస్తకరూపంలో సప్తపర్ణిగా మనముందున్నాయి. కళలను బోధించే ఉపాధ్యాయులకు   పుస్తకం విజ్ఞానదాయినిగా ఉండగలదు. కళ మీద వ్యాసాలు రాయడం  మొదలెట్టింది సంజీవదేవ్. తరువాత నాగేశ్వరరావు ప్రభృతులు. నిజానికి  మాజిక్ రియలిజమ్  గురించి సరళంగా వ్రాయటం ఒక కళ. హైదరాబాదు నగర ప్రభావంతో ఇక్కడివారికి కళ, శిల్పాలపై ఆసక్తి కలుగుతోంది. కష్ట నష్టాలకోర్చి, కళాజ్యోతి బాపన్న మిసిమి మాస పత్రిక, ఇంకా ఇతర పుస్తకాలు వెలువరిస్తున్నందుకు నా అభినందనలుఅంటూ తమ అధ్యక్షోపన్యాసం చేసారు.

వోలేటి పార్వతీశం మాట్లాడుతూ సప్తపర్ణి అంటే ఏడు ఆకులని ,ఏడు అంశాల కలయికే సప్తపర్ణి అని చెప్పారు. సృజన, కళారాధన, కళా సమీక్ష, చిత్రకళ, శిల్పకళ, చలనచిత్ర కళ, వ్యాస రచనల కలయికే ఈ సప్తపర్ణి అని వివరించారు.

శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వాణీ దేవి మాట్లాడుతూ ” కళలపై ఆంగ్లంలో చాలా పుస్తకాలుంటాయి కాని తెలుగు లో బహు తక్కువ. లలిత కళలపై  చక్కటి పుస్తకాన్ని వ్రాసి, ఒక చిత్రకారుడు చేయలేని పనిని  నాగేశ్వరరావు చేసి చూపారు. లలిత కళలపై అవగాహనకు, ఈ పుస్తకం విద్యార్థిలోకానికి దోహదపడకలదు. చిత్రకారుల జీవితం, వారు చిత్రాలను గీయటానికి ప్రేరకమేది, డాడాయిజం వగైరాలను సులభ శైలిలో నాగేశ్వరరావు చెప్పారు. హిట్లర్ ఆధునిక కళలపై ఏహ్యభావం కలిగున్నవాడై, అటువంటి చిత్రాలను వెంటాడి, వాటిని తగులబెట్టించిన విషయం, హిట్లర్ గురించిన వ్యాసం లో మనము చదవవొచ్చు. కొందరి చిత్రాకారుల చిత్రాలు అమ్ముడుపోని స్థితి నుంచి మరికొందరి చిత్రాలు లక్షలు, కోట్ల రూపాయలలో అమ్ముడుపోవటం దాకా మనము గమనించవచ్చు. లెయొనార్డొ విన్సి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను ఫ్లూట్ చక్కగా ఊదుతాడు. గాలిలో ఎగరటం వగైరా శాస్త్రీయ విషయాలపై చిత్రాలు గీసాడు. ఛాయాగ్రహణం, సాలార్ జంగ్ సంగ్రహాలయం , వంగ చిత్రకళారీతులు వగైర అంశాలపై పెక్కు వ్యాసాలున్నాయి సప్తపర్ణి లో ” అని చెప్పారు.

  చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా  కాండ్రేగుల నాగేశ్వరరావు


చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా కాండ్రేగుల నాగేశ్వరరావు

రచయిత నాగేశ్వరరావు మాట్లాడుతూ ” లలిత కళలపై రెండు వ్యాసాలు మిసిమి సంపాదకులకిస్తే, వారికవి నచ్చి మిసిమికి క్రమంగా వ్రాయమని ప్రోత్సాహించారు. సాంస్కృతిక అధ్యయనం మన పాఠకులలో తక్కువగా ఉంది. మిసిమి లాంటి మంచి సాహిత్య పత్రికలు  ఆ లోటు తీరుస్తాయి. నేను అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు వాణి (కీ.శే. పి.వి.నరసింహారావు కూతురు)  గారిని లేపాక్షి తీసుకెళ్ళి చూపించే బాధ్యత నా పై ఉంచారు.  లేపాక్షిలో వారి లైన్ డ్రాయింగ్స్  చూసాను. 17 సంవత్సరాల వయసు నుంచే పత్రికలకు వ్రాయటం ప్రారంభించాను. మా నాన్న గారు వైద్యులు. కాకతీయ రాజ్యపతనం కథాంశంగా  మల్లాది వసుంధర రచన  సప్తపర్ణి అనే చారిత్రక నవల ఈ పుస్తకానికి ఈ పేరుంచటానికి ప్రేరకం. మహర్షి ఇచ్చిన మొక్కకు స్వర్ణం రంగులో ఏడు ఆకులు వస్తాయి. అవే సప్తపర్ణి. కళలకు సంబంధించిన ఈ పుస్తకం లో, చలనచిత్రాలపై  నేను వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. సినిమాలు కదిలే చిత్రాలు. నిజమైన కళాత్మక చిత్రం సత్యజిత్ రే చిత్రం తోనే మొదలయ్యింది. సత్యజిత్ రే చిత్రకారుడు కూడా. బి.నర్సింగరావు, కె.వి.రెడ్డి ఇంకా బాపు దర్శకులు మాత్రమే కాక చిత్రకారులు కూడాను. ప్రపంచ విఖ్యాతుడైన దర్శకుడు Alfred Hitchcock చిత్రకారుడు కూడా. తన సినిమా కు కావల్సిన సెట్టింగ్స్ బొమ్మలు  అన్నీ తనే చిత్రించే వాడు. చిత్రకళకు సినిమాకు చాల దగ్గరి సంబంధం ఉంది. చిత్రాలకు న్యాయం జరిగేందుకై, సప్తపర్ణి ప్రమాణము 9″X9″ గా నిశ్చయించాను. సప్తపర్ణి మూడు భాగాలుగా తీసుకురావాలని ప్రణాళిక. మూడవ భాగంలో పరిశోధనాత్మక వ్యాసాలుంటాయి “ అని చెప్పారు.

సభాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ “1920-26 ల లో అజంతా-ఎల్లొరా ల చిత్రాలకు సుమారు 250  నకళ్ళు గీయించారు. వీటిలో కొన్నింటిని నాగార్జున సాగర్ సంగ్రహాలయం లో ఉంచబోతున్నారు” అని తెలిపారు. సభ ఆద్యంతం ఆసక్తికరంగా, చక్కటి జ్ఞాన, భావ వీచికలతో, వోలేటి పార్వతీశం నిర్వహించారు.

Text and Photographs : సి.బి.రావు

Link for డాడాయిజం = http://en.wikipedia.org/wiki/Dada

 

 

 

 

మొహమాటం లేకుండా…ఇప్పటి కథల గురించి కొన్ని ఫిర్యాదులు!

 972368_1415799075312585_947027319_n

సాహిత్య సృజనకూ సమకాలీన సామాజిక సందర్భానికీ అన్యోన్య సంబంధం ఉంది. ఈ సంబంధాల సరళమైనవి కావు. అత్యంత క్లిష్టమైనవి. గత రెండు మూడు శతాబ్దాల చరిత్ర చలనంలో భిన్న పార్శ్వాలున్నాయి. అనేకానేక వైరుధ్యాలున్నాయి. గతిశీలత ఉంది. వీటిని అవగాహన చేసుకోవడానికీ, తమ అనుభవంలోకి ఇంకింపజేసుకోడానికీ తమ కథల ద్వారా వ్యక్తీకరించడానికీ రచయితలు మునుపటికంటే ఎక్కువగా ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. ఇతివృత్తాలను ఎన్నుకోవడంలో, పాత్రచిత్రణలో, కథన రీతుల్లో, నేపథ్య చిత్రణలో, ప్రాంతాలకు-వర్గాలకు సంబంధించిన భాషాభేదాల వాడకంలో రచయితలు ఈ కాలంలో ఎంతో వైవిధ్యాన్ని సాధించారు. ఈ ప్రయత్నాన్నీ, ఈ సాధననూ ఆహ్వానిస్తూ, అర్థంచేసుకొంటూ కథలిచ్చే నాగరిక సంస్కారాన్ని ముందుకు తీసుకొనిపోయే పాఠకుడు ఎప్పుడూ అవసరమే.

అయితే మంచి పాఠకుడైన విమర్శకుడు-విస్తార సాహిత్య పరిచయమున్న విమర్శకుడు-కేవలం కథా నిర్మాణ రీతుల మీద మాత్రమే దృష్టి పెట్టడు. ఆ నిర్మాణానికి మూలమైన చరిత్ర, సంస్కృతి, ఇతరేతర సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశాల వెలుగులో కథని విశ్లేషించి కొత్త ద్వారాలను తెరవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు-రచనల ద్వారా అందే స్పందనలను, రచనల వస్తు శిల్పాలను, రచయితల ప్రాపంచిక దృక్పథాన్నీ చర్చిస్తూ పాఠకులకు ఒక చూపునివ్వగలిగిన వివేచనా శక్తిని అందిస్తాడు. ఇది గమనించినపుడు సమకాలీన కథా రచయితల ముందున్న సవాళ్ళకంటే ఈనాటి కథా విమర్శకుల ముందున్న సవాళ్ళూ బాధ్యత ఎక్కువే.

కథా విమర్శ అంటున్నప్పుడు సాధారణంగా చాలామంది సమీక్షకులూ విమర్శకులూ వస్తు పరిచయానికి మాత్రమే పరిమితమై ఉంటారు. ఇది దోషం కాకపోవచ్చు; కానీ వస్తువు వెనక ఉండే సామాజిక శక్తులను పరిశీలించడం గానీ  ఆ వస్తువును వాహికగా చేసుకొన్న రూపానికి గానీ ప్రాధాన్యమివ్వరు. వస్తు-శిల్పాలను అనుభూతం చేసే భాషా శైలులను అసలు పట్టించుకోరు. అవి పట్టించుకోకపోవడం వల్లనే నిర్హేతుకమైన పరస్పర విరుద్ధ భావాలు కాకపోతే దుర్భ్రమలు చెలామణిలోకి వచ్చాయి.

కథా విమర్శకు సంబంధించిన ఈ మథన, ఈ చింతన ఎ.కె. ప్రభాకర్‌కు ఉండడం వలనే ఈ వ్యాసాల్లో కథా విమర్శ స్థాయిని అతను పెంచాడు. ఈ స్థాయి ఈ సంపుటిలోని ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది. సమకాలీన రచయిత చుట్టూ పెరుగుతూ పోతున్న సామాజిక సంక్షోభాలను ప్రభాకర్‌ ఈ వ్యాసాల్లో గుర్తించాడు. గుర్తించడమే కాదు, రచయితల అస్తిత్వ వేదనలూ, ఆకాంక్షలూ, ఆశయాలూ-వాటికి  కారణమైన భిన్న వాదాలూ, ఉద్యమాలు కథల్లో ఏ విధంగా ప్రతిఫలనం చెందాయో లోతుగా తరచి చూశాడు. ఉదాహరణకు-తెలంగాణ రచయితల భాష విషయంలో, శిల్పి విషయంలో కొందరికున్న అపోహలను ప్రస్తావిస్తూ ‘అదంతా బతుకు పోరునీ-వేదనా భరితమైన తండ్లాటనీ, మొత్తం సమాజంలోని కల్లోలాన్నీ తమ రచనల్లో ప్రతిఫలిస్తున్న యీ రచయితల్ని రూపవాదులు ఒక మూసలోకి ఇమడ్చాలని ప్రయత్నించడం తప్ప మరేంకాదు’ అని ప్రభాకర్‌ నిర్మొహమాటంగా చెబుతాడు. వస్తువు-రూపం పడుగుపేకల్లా కలసిపోయిన ఆడెపు లక్ష్మీపతి కథల్ని మనముందుంచుతాడు.

అట్లాగే స్త్రీవాదానికి చెందిన పదజాలం లేకుండా కథ నడపడం కుప్పిలి పద్మ కథల్లో ఒక సుగుణమని ప్రభాకర్‌ పేర్కొంటాడు. ఉద్యమాలు పగిలిన అద్దంలాగా ఎట్లా ఉంటాయో ఎస్‌. జయ ప్రతీకాత్మకంగా చెప్పిన కథను ఉదహరిస్తాడు. అయితే ఈ సందర్భంలోనే బలమైన సామాజిక వాస్తవాలైన కులాన్నీ, మతాన్నీ విస్మరించిన విషయాన్ని కూడా మనముందుంచుతాడు. ఓల్గా గొంతులోని కాఠిన్యాన్ని గుర్తిస్తూనే  దానిలోని స్థెర్యాన్ని మెచ్చుకొంటాడు. లోపలి వ్యక్తిగా బి.ఎస్‌. రాములు, బయటి వ్యక్తి గీతాంజలి వంటి రచయితలు ప్రకటించిన దృక్పథాల్ని చర్చకు పెడతాడు.

‘సమకాలీనం’ ముప్పై కథా విమర్శ వ్యాసాల సమాలోచనం. మహాశ్వేతాదేవి కథలు, భారతీయకథలు, లోకేశ్వర్‌ చేసిన అనువాద కథల మీదా చేసిన పరామర్శ తప్ప మిగతా ఇరవైయేడు వ్యాసాలూ సమకాలీన తెలుగు కథల సామాజిక మూలాలను, రచనా సంవిధానాలనూ చర్చించినవే.

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

వర్తమాన కథపై ఎంతో ప్రేమతో రాసిన వ్యాసాలివి.వ్యాసాల్లో ఆయా రచయితల మీద అభిమానం కనిపిస్తే కనిపించవచ్చు గానీ అతిశయోక్తులతో కూడిన పొగడ్తలూ, వీరారాధనలూ లేవు. ఒక ప్రజాస్వామిక లక్షణం ఈ వ్యాసాలకు గీటురాయి. అందుకే వివిధ కథా రచయితల రచనల స్వరూప-స్వభావాలను ఒక వైపు విశ్లేషిస్తూనే కొన్ని రచనల్లోని సంకలనాల్లోని లోపాలను ఖండించడంలో ప్రభాకర్‌ వెనుకాడలేదు. తీరం తాకని కథా తరంగాలు ఒక పద్ధతీ పాడు లేకుండా కూర్చిన 300 పేజీల కలగూరగంప అనీ, కథా తరంగాల్లో ఏ మాత్రం సంచలనం లేనివీ ఎగసిపడి పాఠకుడిని తాకనివీ ఎక్కువనీ నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. అలాగే కర్నూలు కథా సంకలనంలో నిర్దిష్ట ప్రణాళిక లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు.

‘కథావసంతం’ పోటీ కథలను పరిశీలిస్తూ వర్తమాన కథకులు గమనించవలసిన అంశాలను ప్రభాకర్‌ నిర్ద్వంద్వంగా పాఠకుడి ముందుంచుతాడు. పోటీల్లో నిలబడ్డ కథల్లో ప్రభాకర్‌ గమనించిన అంశాలు కొన్ని :

– గ్రామీణ నేపథ్యానికీ, ప్రాంతీయతకూ పోటీ రచయితలు ఆమడ దూరంలో ఉన్నారు.

– అస్తిత్వ చైతన్యం తాకలేదు, వస్తు విస్తృతి లేదు, శిల్ప వైవిధ్యమూ లేదు- కొన్ని రచనలు వ్యాఖ్యానాలు-స్కెచ్‌లుగా మిగిలిపోయాయి.

– సంవిధానం పట్ల రచయితలు శ్రద్ధ చూపలేదు.

– జీవితం లోతుల్లోకి చూపు మందగించింది, సామాజిక సంక్లిష్టత కథల్లోకి ఎక్కలేదు.

– సంఘటన ప్రధానంగా నడవలేదు, సంఘర్షణ లేదు.

– దృక్పథ లోపం ఉంది.

విమర్శనాత్మకమైన ఈ అంశాలను పరిశీలిస్తే కొత్త వారివైనా, పాతవారివైనా ప్రసిద్ధులవైనా, అప్రసిద్ధులవైనా కథలను ఏయే కోణాల్లోంచి మనం చూడాలో స్పష్టమవుతుంది.

పాపినేని శివశంకర్‌ కథల మీద చేసిన అనుశీలన ఒక్కటే ఈ ముప్పై వ్యాసాల్లో పెద్దది. మిగతావన్నీ చిన్నవే కానీ మనసు పెట్టి రాసినవి. అందుకే ఈ వ్యాసాల్లో విస్పష్టమైన చింతనాబలం ఉంది. వాదనాపటిమ ఉంది. వ్యాసరూప నిర్మాణ శ్రద్ధ ఉంది. నిజాయితీ ఉంది. ఆలోచనాత్మకమైన సరళశైలి ఉంది. మన ఆలోచనలకు కొత్త చూపునూ, కొత్త సంస్కారాన్నీ ఇచ్చే శక్తి కూడా ఈ వ్యాసాలు అన్నిటికీ ఉంది.

నిజానికి ఈ ముప్పై వ్యాసాల మీద పెద్ద చర్చ చేసే అవకాశం ఉంది. అయితే-ఒక ఆత్మీయుడిగా చేస్తున్న పరిచయమే ఇది. ఈ వ్యాసాలన్నీ చదివాకా సాహిత్య పాఠకులకు సంపుటిలో ప్రస్తావించిన రచయితల రచనలతోపాటు కథా సాహిత్యాన్ని విరివిగా చదవాలనే ఆసక్తి పెరిగితే మంచిదే. సమకాలీన కథా సాహిత్యం మీద ప్రభాకర్‌ పంచుకొంటున్న ఈ ఆలోచనలను పాఠకులు మాత్రమే కాకుండా కథకులు, విమర్శకులు కూడా పట్టించుకొంటే మరీ మంచిది. కథా సాహిత్యం, కథా విమర్శ మరింత దిటవుగా వర్థిల్లడానికి ‘సమకాలీనం’ వ్యాసాలు మనోచలనంగా తప్పక పని చేస్తాయని గట్టిగా నమ్ముతున్నాను.

కేతు విశ్వనాథరెడ్డి

Kethu Viswanatha Reddy

 

 

 

 

సెప్టెంబర్ 6 న ‘సమకాలీనం’ విమర్శ వ్యాసాల సంపుటి ఆవిష్కరణ
కథా విమర్శకుడు ఎ.కే ప్రభాకర్ ‘సమకాలీనం’ విమర్శ వ్యాసాల సంపుటి ఆవిష్కరణ ఈ శుక్రవారం హైదరాబాద్ లో  జరుగుతుంది.  వివరాలు ఈ ఆహ్వాన లేఖలో….

533246_10153204953790385_1512291172_n

నిదురించే తోటలోకి ఒక సూఫీ కెరటం!

ప్రసిద్ధ మలయాళీ రచయిత రామనున్ని నవల “సూఫీ చెప్పిన కథ” శీర్షికతో ఎల్. ఆర్. స్వామి అనువాదంలో ఈ నెల సారంగ బుక్స్ ప్రచురణగా వెలువడుతుంది. ఈ పుస్తకం  ఆగస్ట్ 30 వ తేదీ నుంచి  హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది. ఈ నవల విడుదల సందర్భంగా కల్పనా రెంటాల ఈ నవలకి రాసిన ముందు మాటని ‘సారంగ’ పాఠకులకు అందిస్తున్నాం. 

 

సూఫీ పరంజ కథ సినిమా నించి ఒక దృశ్యం

సూఫీ పరంజ కథ సినిమా నించి ఒక దృశ్యం

‘సూఫీ పరాంజే కథ’ సినిమాకు అవార్డ్‌ వచ్చినప్పుడు నేను మొదటిసారిగా కె.పి.రామనున్ని  పేరు విన్నాను. సూఫీ సంప్రదాయం, సూఫీ యోగులు, వారి బోధనలు, వారి జీవిత విధానం గురించి అప్పటికే  కొంత తెలిసి ఉన్న నాకు ‘సూఫీ చెప్పిన కథ’ అన్న  పేరు వినగానే ఏవేవో పుర్వస్మతులు మేల్కొన్నాయి.  ఎలాగైనా  ఆ సినిమా చూడాలని, ఆ నవల చదవాలని ఎంతో ప్రయత్నించాను. అమెరికాలో నాకు ఏ మలయాళీ సాహిత్యాభిమాని కనిపించినా  ఈ నవల గురించి అడిగేదాన్ని. అందరూ మంచి నవల అని చెప్పిన వాళ్ళే కానీ ఇంగ్లీష్‌ అనువాదం ఎవరి దగ్గరా దొరకలేదు. ఒక దశలో మలయాళ సాహిత్యం చదవటానికి ఆ భాష నేర్చుకుందామన్న అత్యుత్సాహంలోకి కూడా వెళ్లకపోలేదు. ఏమైతేనేం ఇవేవీ జరగలేదు. తాత్కాలికంగా సూఫీ చెప్పిన కథ కోసం నా అన్వేషణ సగంలో అలా అక్కడ ఆగిపోయింది.

సూఫీ చెప్పిన ఆ కథ ఏమిటో చదవాలని ఒళ్ళంత కళ్ళు చేసుకొని నేను చూసిన ఎదురుచూపులు ఓ రోజు ఫలించాయి. అది కూడా ఓ కలలా జరిగింది. మలయాళ సాహిత్యాన్ని  మూలభాష నుంచి నేరుగా అందమైన తెలుగుభాషలోకి అనువాదం చేసే ప్రముఖ అనువాదకుడు, స్వయంగా కథకుడు ఎల్‌. ఆర్‌. స్వామి. ఆయన ఇటీవల అనువాదం చేసిన ‘పాండవపురం’ నవల తెలుగువారిని మలయాళ సాహిత్యానికి మరింత దగ్గర చేసింది.

ఆ పుస్తకం గురించి పత్రికల్లో చదివి ఎల్‌.ఆర్‌. స్వామిగారికి ఫోన్‌ చేశాను. మాటల సందర్భంలో ఆయన చేసిన అనువాదాలు ఇంకేమైన  ప్రచురణకు సిద్ధంగా వున్నాయా? అని అడిగినప్పుడు ఆయన నోటి నుంచి ‘సూఫీ చెప్పిన కథ’  పేరు విన్నాను. ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లుమంది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఆ పుస్తకాన్ని‘సారంగ పబ్లికేషన్స్‌’  ప్రచురిస్తుందని, వెంటనే ఆ అనువాదం పంపించమని కోరాను. ఎల్‌. ఆర్‌.  స్వామి  చేసిన ‘సూఫీ చెప్పిన కథ’  అనువాదం కంపోజ్‌ అయి నా  దగ్గరకు వచ్చేసరికి  రెండు నెలలు పట్టింది. కానీ ఈలోగా నాకు ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ లైబ్రరీలో రూపా అండ్‌ కో వారు ప్రచురించిన “What the Sufi said” పుస్తకం దొరికింది. ఎన్‌. గోపాలకృష్ణన్‌, ప్రొ. ఈషర్‌ సహాయంతో చేసిన ఆ అనువాదం చదివాక నా  మనసు కుదుటపడ్డది. కానీ ఇంగ్లీష్‌లో కంటే మూలభాష నుంచి నేరుగా వచ్చిన తెలుగు అనువాదం చదవాలని ఎంతగానో ఆరాటపడ్డాను. తెలుగులో ఆ నవల చదువుతున్నప్పుడు ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోయేదాన్ని. ఒక్కో వాక్యంలోనూ ఎంతో గూఢార్థంతో నిండి  ఉన్న కవిత్వం కనిపించింది. రామసున్ని రాసిన  కవిత్వ వచనం చదువుతూ నన్ను నేను మర్చిపోయాను. ఇంగ్లీష్‌ అనువాదం చదివినప్పుడు కథలోనూ, కథనంలోనూ ఎన్నో సందేహాలు. ఏదో అర్థం కాలేదనిపించింది. అది భాషాపరమైన సమస్య కాబోలు అనుకున్నాను. కానీ తెలుగు అనువాదం చదివాక కానీ నవల గొప్పతనం పూర్తిగా అర్థంకాలేదు.

SufiBookFrontCover

2

జీవితం అంటే ఇది అని ఎవరైనా  చెపితే అర్థమయ్యేది కాదు. జీవితాన్ని ఎవరికి వారు జీవించాల్సిందే. అయినా  కొన్ని పుస్తకాలు జీవితమంటే ఏమిటో,  ఎలా జీవిస్తే ఆ జీవితానికి ఓ సార్థకత కలుగుతుందో వివరిస్తాయి. ‘సూఫీ చెప్పిన కథ’ అలాంటి నవల. మొదలుపెట్టిన క్షణం నుంచి నవల ఎక్కడా ఆపకుండా చదివించింది. నవల పూర్తయ్యాక ఎంతో అర్థమయిందన్న అనుభూతితో పాటు,  మరెంతో  అర్థం కావాల్సి ఉందనిపించింది. జీవితం గూఢార్థాన్ని ఒక్కో పొర వొలిచి చూపించిన అనుభూతి పుస్తకం చదువుతున్నంత సేపూ మనకి కలుగుతుంది. సముద్రపుటోడ్డున అమ్మవారు, లేదా ఓ బీవి  వెలిసిందన్న వార్త విని అది చూడటానికి వెళ్ళిన ఒక హిందువు చేయి పట్టుకొని సముద్రతీరం దగ్గరకు తీసుకొని వెళ్ళి సూఫీ చెప్పిన కథ ఇది. ఈ నవల ఇతివృత్తం ఇది అని చెప్పటం కన్నా చదవటం మంచిది. ఇదొక మామూలు నవల కాకుండా ఒక మంచి నవల ఎందుకయిందో తెలియాలంటే నవలను ఎవరికి వారు చదివి తెలుసుకోవాల్సిందే. నవలలో చర్చించిన ముఖ్య అంశాలను రేఖా మాత్రంగా సృశిస్తే నవల గొప్పతనం అర్థం చేసుకోవటం సులువవుతుందన్న ఉద్దేశ్యంతో ఒకటి రెండు విషయాలు మాత్రం ప్రస్తావిస్తాను. తర్కం,  వాస్తవికత ఈ రెండింటి మీద మాత్రమే ఆధారపడితే సత్యాన్వేషణ సాధ్యం కాదు. హృదయంలో  ప్రేమ, కరుణ లాంటి గుణాలున్నప్పుడే సత్యాన్వేషణ సార్ధకమవుతుంది. వాస్తవికతను అర్థంచేసుకునే క్రమంలో హేతువు అన్నది ఎప్పుడూ ద్వితీయాంశమే అవుతుంది అన్నది ప్రధానంగా రామనున్ని ఈ నవలలో చర్చించారు. సృష్టిలోని ప్రతి ఒక్కటి కేవలం తర్కం, వాస్తవికతల మీద మాత్రమే ఆధారపడి  ఉండవని,  ప్రతి ఒక్కదాన్ని ఆ రెండింటితో మాత్రమే ముడి పెట్టి చూడలేమని, అలా చేయటం కూడా ఒక రకమైన మూఢ విశ్వాసమే నంటారు నవలలో రచయిత ఒకచోట.

కే. పి. రామనున్ని

కే. పి. రామనున్ని

*    *   *

స్తీ, పురుష దేహాల మధ్య కేవలం ఆకర్షణ, లైంగిక సంబంధం ఒక అనుబంధాన్ని నిర్వచించలేవు. అంతకుమించిన అనురాగం, ఒక ఆత్నీయానుబంధం లేకపోతే అది కేవలం దేహ సంబంధంగా మాత్రమే మిగిలిపోతుంది. కార్తి, మమ్ముటిల మధ్య ఒక ఆకర్షణ వుంది. ఒక తెగింపుతో కూడిన సాహసం ఇద్దరి మధ్యా వుంది. కార్తీ కోసం ఏమైనా  చేయటానికి సిద్ధపడ్డాడు మమ్ముటి. చివరకు  ఆమె కోసం తన ఇంట్లో అమ్మవారి గుడిని కూడా కట్టించి ఇచ్చాడు. మతం మారిన కార్తికి ఆ మతమార్పిడి  కేవలం ఒక సాంప్రదాయిక తంతుగా మాత్రమే మిగిలింది. ఆమెలో తాను చిన్ననాటి నుంచి వింటూ, చూస్తూ, అనుభవిస్తూ వచ్చిన  అమ్మవారు భగవతి మీద  ప్రేమ లేశమాత్రమైనా  తగ్గలేదు. అమ్మవారు కేవలం రాతి విగ్రహం కాదు, అది రక్తాన్ని స్రవించే ఒక హృదయమున్న  దేవత అని కార్తి స్వానుభవంతో తెలుసుకుంది. తల్లి కరుణాంతరంగాన్ని తన హృదయంలో నిలుపుకుంది. కార్తి మొదటిసారి ఋతుమతి అయినప్పుడు తనలోంచి ఓ వెల్లువలా సాగుతున్న రక్తస్రావాన్ని చేపపిల్లలు ఆనందంతో  తాగుతుంటే మైమర్చిపోయింది. మరో సందర్భంలో అమ్మవారి గదిలోకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా తనలోని  స్త్రీత్వాన్ని అమ్మవారి సమక్షంలో కార్తి అర్థం చేసుకుంది. తనను తాను అమ్మవారిలో చూసుకుంటూ ఇద్దరి మధ్యా ఓ అభేదాన్ని అనుభవించింది.

తన శరీరం ఏమిటో,  అందులో కలిగే స్పందనలు ఏమిటో తెలుసుకున్న  తర్వాత  శారీరక అనుభవం అనేది ఒక పశ్చాత్తాపమో, తప్పో కాదని, అది రెండు ఆత్మల సంయోజనం అని కార్తికి అర్థమయింది. తననొక దేవతలాగా కాకుండా ఒక  స్తీగా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి, నిర్భయంగా, నిర్భీతిగా తన శరీరం లోపలి అణువులను కూడా స్పర్శించగలిగిన మమ్ముటితో అందుకే కార్తి అలా నడిచి వెళ్లిపోగలిగింది. తన మేనమామకు తనమీద  ప్రేమతో పాటు తన శరీరం పట్ల ఉన్న ఒక కాంక్షను కూడా కార్తి గుర్తించగలగింది. అయినా ఆమెకు అతని మీద కోపం లేదు  ప్రేమ తప్ప. అతన్ని తన వక్షాలకు ఓ తల్లిలా అదుముకొని సాంత్వన పరచాలని కోరుకుంది. అందరూ తననొక దేవతగా చూడటాన్ని అర్థం చేసుకొని తనలో ఆ దేవీ తత్త్వమైన కరుణను,  ప్రేమను తనకు తాను దర్శించుకోగలిగింది. అందుకే ఆమె చేయి తాకితే నొప్పులు మాయమైపోయేవి. ఆమె సమక్షంలో అందరికీ ఒక ప్రశాంతత అనుభవమయ్యేది. అయితే అప్పటివరకూ ఆమెను ఒక అందమైన స్తీగా మాత్రమే చూసిన మమ్ముటికి ఈ మార్పు అర్థం కాలేదు. ఆమె సమక్షంలో అతనిలోని పురుషసంబంధమైన కోర్కెలు తిరోగమించాయి. తనకు భౌతికంగా, మానసికంగా మమ్ముటి దూరం అవటాన్ని గమనించింది కార్తి.  అతను మరో చిన్న కుర్రాడితో లైంగిక సంబంధం ఏర్పర్చుకోవటాన్ని కూడా ఆమె తెలుసుకుంది. అమ్మవారు కరుణిస్తే  అనుగ్రహం.  ఆగ్రహిస్తే విధ్వంసం అన్నట్లు తనను మోసం చేసిన పిల్లవాడిని తనే ఒక కాళిక అయి హతమార్చింది. చివరకు సముద్రంలో కలిసిపోయింది కార్తి. జాలర్లకు ప్రాణదానం చేసి వారి దృష్టిలో ఓ అమ్మవారిగా నిలిచింది. మేలేప్పురంతరవాడలో అమ్మవారిగా ఉండాల్సిన కార్తి,  పొన్నని  గ్రామంలోని హిందూ, ముస్లింలిద్దరికీ ఓ అమ్మవారిగా,  ఒక బీవిగా వారి హృదయాల్లో కలకాలం నిలిచిపోయింది.

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

నవల మొత్తంలో కార్తి పాత్ర పాఠకుల మనసులో ఓ ప్రత్యేక స్థానంలో నిలిచిపోతుంది. కార్తి పాత్ర అంత సులువుగా అర్థమయ్యే పాత్ర కాదు. ఆమె మనందరి లాగా ఓ మామూలు వ్యక్తా?  లేక అసాధారణ శక్తులున్నాయా? అనే సందేహం నవల చదువుతున్నంత సేపూ మనల్ని వెన్నాడుతూ ఉంటుంది. అందరూ ఆమెను దైవాంశ సంభూతురాలిగా చూస్తుంటారు. కానీ మమ్ముటికి మాత్రం ఆమె సౌందర్యం తెలిసినట్లుగా ఆమె హృదయం, అందులోని  ప్రేమ అర్థంకావు. కార్తి ప్రవర్తన, కొన్ని సంఘటనల్లో ఆమె ప్రవర్తించిన తీరు, మరీ ముఖ్యంగా అమీర్‌ని ఆమె చంపేయటానికి గల కారణం, అలాగే చివర్లో జాలర్లకు ఆమె ప్రాణదానం చేయటం … ఇలా ఎన్నో విషయాల్లో కార్తి మనకు అర్థంకాని ఓ చిత్తరువుగా మిగిలిపోతుంది. నవల చదువుతుంటే ఎన్నో చిక్కుముడులు విడిపోయిన అనుభూతి, కానీ అంతలోనే మరెన్నో చిక్కు ముడులు కళ్ళ ముందు కనిపిస్తాయి.

నవల పూర్తయ్యాక కూడా  అనేకానేక  సందేహాలు మనల్ని వెంటాడతాయి. కొత్త కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. కొన్ని కొత్త సందేహాలతో కూడిన ఆలోచనలు మనల్ని అస్థిమితపరుస్తాయి.అనేక కొత్త దారుల్లోకి మన ఆలోచనలు ప్రయాణిస్తాయి. ఈ నవలలో రామనున్ని ఎక్కడా కూడా ఏ సందేహాలకు, ఏ సంశయాలకు సమాధానాలు ఇచ్చే పని చేయలేదు. మన మనసుల్లో రేకెత్తే ప్రతి ప్రశ్న వెనుక ఉండే అసంబద్ధతను అలవోకగా, ఎంతో సహజంగా, నేర్పుగా చిత్రించారు. నవల ముగిసిన తర్వాత కూడా మన మనసు స్థిమితపడదు. ఎన్నో చిక్కుముడులు మన ముందు నిలిచి ఉంటాయి. తర్కంతో ఈ నవలను అర్థం చేసుకోవాలనుకోవటం వృధా ప్రయత్నమే అవుతుంది. నవలలోని చాలా సంఘటనల వెనుక ఉన్న  హేతువు మన మామూలు అవగాహనకు అందదు. సులభంగా విడివడలేని ఆ చిక్కుముడులే నవలకు కొత్త అందాన్ని ఇచ్చాయి. విభిన్నమైన కథ, చిక్కనైన కథనం రెండూ కూడా  నవల చదువుతున్నంత  సేపూ పాఠకులను మరో ఊహాత్మక లోకంలో విహరింపచేస్తాయి. వారి మనసులను, ఆలోచనల్ని పదును పెడతాయి. జీవితమనేది రెండు రెళ్ళ నాలుగు అన్నంత సులభమైన లెక్క కాదని మనసుకు పడుతుంది.  ప్రేమ, కరుణ లేని మతవిశ్వాసం మూఢవిశ్వాసంతో సమానమని అర్థమవుతుంది.

*   *   *

తెలుగు సాహిత్యాభిమానులకు మలయాళ సాహిత్యం అంటే ఒక విధమైన ఆరాధన, అభిమానం. మలయాళ సమాజం, అక్కడ  అందమైన ప్రకృతి, అక్కడ కులవ్యవస్థ, ఎన్నో శతాబ్దాలుగా బలంగా ఉన్న మాతృ స్వామ్య వ్యవస్థ, వీటినన్నింటిని ప్రతిబింబించే అద్భుతమైన సాహిత్యం తెలుగు సాహిత్యాభిమానులకు ప్రాణప్రదాలు. దక్షిణాది భాషల సాహిత్యం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం ఒకదానికొకటి ఎంతో సన్నిహితంగా ఉంటూనే వైవిధ్యంగా కూడా ఉంటాయి. మలయాళ సాహిత్యం అనగానే తెలుగువారికి తగళి శివశంకర్‌పిళ్లై, కమలాదాస్‌, అయ్యప్ప ఫణిక్కర్‌, కురూప్‌, ఎం.టి.వా సుదేవ నాయర్‌, లలితాంబికా అంతర్జనం, వైకవు మహమ్మద్‌ బషీర్‌ వీళ్ళందరూ గుర్తుకు వస్తారు. వీళ్ళ సాహిత్యం గురించి తెలుగు పాఠకులు ఎంతో అభిమానంతో మాట్లాడుకుంటారు. ఇప్పుడు వారి అభిమాన రచయితల కోవలోకి  కె.పి.రామనున్ని కూడా చేరుతున్నారు. ఈ ‘సూఫీ చెప్పిన కథ’ నవలతో రామనున్ని తెలుగు పాఠకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్నో భాషల్లోకి ఈ నవల అనువాదమయ్యాక ఆలస్యంగా ఇప్పుడు తెలుగులోకి కూడా వస్తోంది. ఇంత ఆలస్యంగా తెలుగులోకి రావటం కొంత విచారకరమే అయినా ఇప్పటికైనా  ఎల్‌.ఆర్‌. స్వామి అనువాదం చేయటం వల్ల తెలుగువారికి ఒక కొత్త మలయాళ రచయిత పరిచయం కావటం నిజంగా శుభవార్త.

కల్పనా రెంటాల

12-12-12.

Kalpana profile2

దృష్టిలోపంతో దారితప్పిన కథలు

beyond kaafee

ఖదీర్‌ వాక్యం డ్రైవింగ్‌ తెలిసినవాడు పద్దతిగా వాహనం నడుపుతున్నట్టు ఉంటుంది అంటాడు పూడూరి రాజిరెడ్డి. గేర్‌ ఎక్కడ మార్చాలో ఖదీర్‌కు బాగా తెలుసు. ఇపుడు బియాండ్‌ కాఫీతో అతను చేసిందదే. ఇంతకుముందే కింద నేల ఉందితో అతను హైజంప్‌ చేశాడు. ఇపుడు ఏకంగా పోల్‌వాల్ట్‌. అందులో ఎంత సఫలీకృతుడయ్యాడనేది తర్వాత చూద్దాం. పాతను వదిలేసుకుని కొత్త ముఖమైతే తొడుక్కున్నాడు. బహుశా దర్గామిట్ట నాటి పాత అభిమానులకు కూడా వదిలేసుకునేందుకు సిద్ధపడ్డాడని అర్థమవుతోంది. రచయితతో పాటు ప్రయాణం చేసే వారి కథ వేరే.
దర్గామిట్ట కథలను చాలామంది ప్రేమించారు. బహుశా నామినిని మించి ప్రేమించారేమో కూడా. ఆ కథల్లోనూ ఆ ప్రేమలోనూ చిన్న ఇబ్బంది ఉంది. పచ్చనాకు సాక్షిగా అయినా, సినబ్బ కథలైనా, మిట్టూరోడి కథలైనా నామిని కథల్లో పెయిన్‌ ఉంటుంది. పైకి తమాస మాటల్లాగే కనిపిస్తాయి. లోపలికి పోయే కొద్దీ అంతులేని దుఖ్ఖం పొంగుకొస్తుంది.  ” మా కన్నెబావ రామభక్తి” గుర్తొచ్చినా, “నా రెక్కలున్నంత కాలం” గుర్తొచ్చినా ఇప్పటికీ లోలోపల మెలిపెడుతుంది.  అవి నీడ కరవైన వారి ఏడుపు పాటలు. నామినిలో ఉన్న సొగసు చాలావరకు ఖదీర్‌ కథల్లో ఉంటుంది కానీ ఈ పెయిన్‌ తక్కువ.  పేదరికాన్ని సెలబ్రేట్‌ చేసినట్టుంటాయి దర్గామిట్ట కథలు. తమకు తెలీని జీవితాన్ని  కులీనులు నోరెళ్లబెట్టి చూసి అరె, భలే రాశాడే అనిపించేట్టు ఉంటాయి. హైదరాబాద్‌లో శిల్పారామం పోయి అక్కడ గుడిసెలు, రోకళ్లు, రోళ్లు, ఎద్దుల బండ్లు చూసి ముచ్చడపడతారే, అలా! కందిపచ్చడి, గుమ్మడిపులుసుతో పాటు ఆ కథలను కూడా ఇష్టపడడంలో ఇబ్బంది ఉండదు.  ఆ జీవితంతో సంబంధంలేని కులీనులకు, దాటి వచ్చిన దారిద్ర్యాన్ని మురిపెంగా మాత్రమే గుర్తుచేసుకునేవారికి ఆ కథలు మంచి వినోదాన్ని కలిగించగలవు. మనల్ని ప్రశ్నించని ఇబ్బంది పెట్టని వినోదం అలాంటివారికి బాగానే ఉంటుంది. నామినిని ఖదీర్‌ను విభజించే ప్రధానమైన రేఖ ఇదే. పాపులర్‌ ఫేమస్‌ రెండూ ఒకేలా కనిపించినంత మాత్రాన తేడా లేదనగలమా!
అయితే దర్గామిట్ట నుంచి చాలా ప్రయాణమే చేశాడు ఖదీర్‌. పెండెం సోడా సెంటర్‌ లాంటి ప్రాపగాండా కథలను దాటుకుని చాలాకాలం క్రితమే కిందనేల ఉంది అని భూమార్గం పట్టాడు. ఈ ప్రయాణం పొడవునా జీవితంలోనూ అధ్యయనంలోనూ కొత్త ఎక్స్‌పోజర్‌ చాలానే వచ్చి ఉండాలి. అదంతా ఇపుడు బియాండ్‌ కాఫీ రూపంలో మన ముందుకొచ్చింది. ఏ లాట్‌ కెన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ కాఫీ అంటుంది కాఫీడే. నువ్వు తీసుకునే పదార్థం కంటే దాని చుట్టూ ఉన్న వాతావరణం ఇతరత్రా నీకు ‘ఉపయోగపడే’ పద్ధతుల గురించి చెపుతుందా స్లోగన్‌. దటీజ్‌ బియాండ్ కాఫీ. మీరు హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దాటాక పైన సింపుల్‌గా కనిపించి లోపల అడుగుపెడితే విస్తుపోయే ప్రపంచాన్ని చూపించే బియాండ్‌ కాఫీ షాప్‌ ఎలాంటిదో ఈ కథలూ అలాంటివే. ఇది మనబోటి వాళ్లకు పరిచయంలేని ప్రపంచం అని రాస్తే ఆత్మవంచన అవుతుంది. ముఖ్యంగా మనం పట్టణజీవులమైతే! మనం చూడదల్చుకోకుండా మొకం తిప్పేసుకుని పోతే తప్ప ఈ జీవితం పట్టణవాసులకు తెలీకుండా పోయే అవకాశం లేదు. మానవజీవితంలో సెక్స్‌ లేమి లేదా దాని యావ సృష్టించగల విలయాన్ని ప్రధానంగా తీసుకుని రాసిన కథలు అనిపిస్తుంది. అందులోనూ స్ర్తీ కేంద్రకంగా రాసిన కథలు. బహుశా కొంతమంది అర్బన్‌ మహిళల వల్నర్‌బిలిటీని కూడా చిత్రించిన కథలు. డబ్బూదస్కానికి లోటు లేని వారి జీవితాల్లో ఇతరత్రా ఉండే సంక్షోభాలు.  “అన్నీ ఉండడం కూడా శిక్షేనే” అనుకునే వారి జీవితాలు. ఏది రాసినా దానికి సంబంధించిన ఆవరణాన్ని, భాషను పట్టుకోవడంలో ఖదీర్‌ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అంతేకాదు. అక్షరాలను దృశ్యాలుగా మార్చగలిగిన శక్తి గలిగిన కొద్దిమంది రచయితల్లో ఖదీర్‌ ఒకడు.
“తీరుబడికి స్ర్తీత్వం తోడైతే ఆ శాపం రెట్టింపై అది ఆ పాత్రనే కాకుండా ఇతరులను కూడా ఎలా పీడిస్తుందో ఖదీర్‌బాబు పసికట్టాడు” అని ముందుమాటలో అంచనావేశారు అన్నపనేని గాంధీగారు. మూలుగుతున్న కోట్లరూపాయలు కొడుకు మగతనాన్ని దొంగిలిస్తే డ్రైవర్‌నో మరొకర్నో ‘తగులుకుని’ ఎవర్నీ పూచికపుల్ల చేయకుండా చులకనగా చూసే కోడలి ‘పొగరు’ను మంత్రతంత్రాలతో అణచివేయాలని చూసే తల్లి తాపత్రయం, భర్త తాగుడుకు బానిసై తనను పట్టించుకోకపోవడమే కాకుండా పదే పదే చికాకులు తెస్తూ ఉంటే ఆ ఫ్రస్ర్టేషన్‌ని మోసుకుంటూ తిరిగే ఒక ఇల్లాలి వేదన, భర్త ఆఫీసుకు అంకితమైపోగా  చిన్నపుడు ప్రతి చిన్నదానికి తనమీదే ఆధారపడే పిల్లలు ఇపుడు నీకేం తెలీదు పోమ్మా అని దులిపేసుకుని పోతుంటే  లోలోపల రగిలి రగిలి వాళ్లనూ వీళ్లనూ ఫోన్‌లో వేపుకు తినే ఇల్లాలు…ఇదిగో ఇలాంటి వారి కథలివి. కోడలు అలా చేయడంలో తప్పేముంది, ఆమెనెందుకు విలన్‌ చేయాలి అనే ప్లేన్‌లోకి వెళ్లి పొలిటికల్లీ కరెక్ట్‌నెస్‌ కొలబద్దతో వీటిని చర్చించకుండా కేవలం రచయిత చెప్పదల్చుకున్న కోణానికే పరిమితమవుదాము.
తొలి మూడు కథలు కథలే. అందులోనూ టాక్‌ టైమ్‌ మంచి కథ. ఆ తర్వాత అవి ఎటోటో వెళ్లిపోయాయి. ‘మచ్చ’ మంచిదే కానీ చివర్లో రచయిత అలవోకగా  విసిరేసిన ఒక వాక్యం కథను దెబ్బతీసింది. భర్త నిర్లక్ష్యానికి తోడు తీరుబడి ఎక్కువైన మహిళ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరో పొరబాటున తగిలినా రచ్చరచ్చ చేసేస్తుంది. చివర్లో ఆమె ఉద్యోగంలో చేరడంతో కథ సుఖాంతమవుతుంది. అంతకుముందు వచ్చే మచ్చలు ఇపుడు రావు. అంత వరకు బాగా ఉంది. కానీ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరైనా నిజంగానే రాసుకున్నా ఇపుడు ఆమెకేమీ అనిపించడం లేదు అని రచయిత ముక్తాయిస్తాడు. సెన్సిబిల్‌ పాఠకులు గాయపడే ఎక్స్‌ప్రెషన్‌.  ఏకాభిప్రాయం తీసుకుందాం. అది కథ అవుతుందా? రచయిత ఏం చెప్పదల్చుకున్నాడు?  వివాహ బంధం బయట కూడా సెక్స్‌ సంబంధాలు నార్మల్‌ అని చెప్పదల్చుకున్నాడా? మగవాడు వల్నర్‌బుల్‌గా ఉండే ఆడవాళ్లని లోబరుచుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు అనేది చెప్పదల్చుకున్నాడా? ఇంకోవైపు కథ కథేనా! పట్టాయ ఉంది. ఏముంది అందులో? ఏఏ వీధిలో ఏఏ రూపాల్లో సెక్స్‌ దొరుకుతుంది అని చెప్పాడు. ఆ కథ చదివిన తర్వాత మనకందేదేమిటి?  “పోయే బోడిముండా అన్నాడు నాయుడు ముద్దుముద్దుగా, తాంకూ తాంకూ అంటూ నవ్విందది” అనే వాక్యాలతో మొదలవుతుంది కధ. నవ్విందది అని రచయిత స్వరంతోనే ఆబ్జెక్టిఫై చేశాక ఇక పాఠకుడు ఏ ఫీల్‌తో కథను కొనసాగిస్తాడు? రచయిత స్వరం మాత్రం రచయితదేనా అని సిద్ధాంతాలను లాగొచ్చు కానీ అవి ఈ కథకు అతకవని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. కథంతా ఆ బండది, ఈ షార్ట్‌స్కర్ట్‌ది అని శరీరాలను ఆబ్జెక్టిఫై చేస్తూ ఒక చీకటి మూడ్‌ని క్రియేట్‌ చేసి మధ్యలో సడన్‌గా “వీళ్లు కూడా అందరు ఆడపిల్లల్లా పుట్టినవాళ్లే ….మన అమ్మల్లాగా అక్కల్లాగా చెల్లెళ్లలాగా ఈ ప్రపంచం నుంచి వేరే ఏమీ ఆశించకపోయినా కాసింత మంచిని ఆశించినవాళ్లే” అని ధర్మోపన్యాసం ఇచ్చినంత మాత్రాన పాఠకుడిలో ఉదాత్తభావం వచ్చేయదు. ఖదీర్‌లో స్కీమింగ్‌ ఎక్కువ. అన్ని సందర్భాల్లో అది ఫలితాలనిస్తుందని ఆశించకూడదు. మధ్యలో అక్కడక్కడా ఒకట్రెండు మానవీయ దినుసులు వేశానులే అని సంతృప్తిపడితే కుదరదు. పదార్థ స్వరూపం మారదు. రచయిత హృదయం ఎక్కడ ఉందో తెలియాలి. ఎక్కడ కోపం రావాలో అక్కడ రావాలి. ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలి. అవి మిస్‌ప్లేస్‌ అయితే కథ దెబ్బతింటుంది. ఇక్కడదే జరిగింది.
పుస్తకానికి టైటిల్‌ బియాండ్ కాఫీ కథ తీసుకుందాం. ప్రతి మగనాబట్ట ఛాతీ మీద పచ్చబొట్టు పొడవాల్సిన నీతి కథ చెప్పిన మరికాసేపటికే ఆ పొందికలోకి ఇమడని డీటైల్స్‌ ఎక్కువైపోయి, చివర్లో క్రైం థ్రిల్లర్‌ అయిపోయి కథ ఎటో పోయింది. తాను కొత్తగా తెలుసుకున్న విషయాలు ఎక్కువగా చెప్పాలన్న  ఆత్రం ఈ కథను దెబ్బతీసిందేమో అనిపిస్తుంది. ఇక  చిన్నపుట్టుమచ్చ లాంటి బొట్టు ఉన్న అమ్మాయి కథ చూద్దాం. కథ నుంచి మనకు అందుతున్నదేమిటి? టీ బండి నడుపుకునే  చిన్న అమ్మాయి ఇలాంటి వ్యవహారాల్లో రాటుతేలి ఉంటుందని ఊహించలేదనే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది. అంతే! వాళ్లు అలా రాటుతేలడానికి కారణమైన పాత్రపై సానుభూతి వచ్చేలా కథ నడిపించాక, పన్నెండేళ్ల పాపని అబ్యూజ్‌ చేసిన మనిషి మీద సానుభూతి కలిగేలా కథ నడిపించాక ఇక ఎలాంటి స్పందన ఆశిస్తాం. ఇలాంటి అంశాలు కథాంశంగా తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు. చెప్పొచ్చు. కానీ పద్ధతి ఏమిటనేది ప్రశ్న. ఖదీర్‌ పుట్టమచ్చ లాంటి బొట్టున్న అమ్మాయి లాగే నామిని మెడకింద గీతలున్న అమ్మాయి గురించి రాస్తారు. గొడ్లకాసుకునే అమ్మాయి గురించి రాస్తారు. ఊర్లో బొడ్డుతెగిన ప్రతి మగోడు ఆ అమ్మాయి మీద పడడం గురించి రాస్తారు. కానీ చదివాక మనలో కలిగే స్పందన వేరే. ఆ పాప బాధ పాఠకుడి బాధగా మారుతుంది.
మన దగ్గర చాలామంది రచయితలు ఏం చెప్పదల్చుకున్నారన్నదానిమీద పెట్టినంత దృష్టి దానికి సాహిత్య రూపం ఇవ్వడం మీద పెట్టరు. ఖదీర్‌ కథ వేరు. ఎలా చెప్పాలన్నదానిమీద అతను విపరీతమైన శ్రద్ధ పెడతాడు. కానీ ఏం చెప్పదల్చుకున్నామనేదానిమీద అంత శ్రధ్ధ ఉన్నదా అనేది సందేహం. కొంచెం బరువైన భాషలో చెప్పుకుంటే దృక్పథాన్ని  సరిచూసుకోవాల్సి ఉన్నదేమో అనిపిస్తుంది.
లైంగిక వాంఛకు సంబంధించిన వివిధ సందర్భాలను వివరించడంలో  నైపుణ్యాన్ని చూపాడు. ఒక కథలో “పురుషుడు స్ర్తీని పట్టుకున్నట్టు అని రాసి ఆ తర్వాత వాళ్లు ఇంటినుంచి బయటపడడానికి మరికొంత సమయం పట్టింది” అంటాడు. ఇంకో కథలో ఆమె కాళ్లు పట్టేది అంటాడు. అతను  నిద్రపోకుండానే మెళకువగానే ఉండి వెళ్లేవాడు, ఇపుడు అదేమీ లేదు” అని చెప్తాడు.  “కాసేపు రెస్ట్‌ తీసుకుని వెళ్దామా మేడమ్‌” అని గడుసుగా చెప్పిస్తాడు. వహీద్‌ అనే కథలో  ఆపా అని అంటూనే “చప్టామీద చేపలు పడేసి, ఊగిఊగి తోముతూ ఉండే ఎగిరిపడే అంచును గుర్తుచేసుకునే చిన్నోడి స్థితిని వర్ణిస్తాడు. ఇలా ప్రతికథలోనూ వొడుపు చూపుతాడు.  ఇటువంటి  కథాంశాలని ఎంచుకోవడం కచ్చితంగా అభినందించాల్సిన విషయం. మానవజీవితంలో చాలాప్రాధాన్యమున్న ఈ విషయాన్ని, మన శారీరక మేధో వికాసాలమీద, మన వ్యక్తిత్వంమీద చాలా రకాలుగా ప్రభావం చూపే ఈ విషయాన్ని అసుంట ఉంచడం సరైంది కాదు. కాకపోతే ఎలా చర్చిస్తున్నామనేదే ప్రశ్న.
తనకు అలవాటైన స్ర్తీ ఎంత ప్రేరేపించినా ఒక సర్దార్జీకి ఒంట్లో వేడిపుట్టకపోవడాన్ని  నేపథ్యంగా తీసుకుని మంటో రాశాడు. దాని పేరు థండా ఘోష్‌. అది చదివితే చల్లగా ఒణికిపోతాం. ఖోల్‌దో అయినా ఇంకోటయినా ఆయన కథలన్నింటా లైంగిక అంశాలే. కానీ అన్నీ మనిషి జంతువుగా మారే క్రమాన్ని బీభత్సంగా చిత్రిస్తాయి. ఎలాంటి స్థితిలో అయినా మనిషితనాన్ని నిలుపుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. ఫెలిని, గొడార్డ్‌ సినిమాల్లోనూ నగ్నదేహాలు కనిపిస్తాయి. కిస్లోవిస్కీ త్రీకలర్స్‌ ట్రయాలజీలో అయితే చెప్పడానికి లేదు. క్యూబా సినిమాల్లోనూ అంతే. కానీ అంతిమంగా అవి మనలో కలిగించే స్పందన వేరే.  ఖదీర్‌ తొలి మూడు కథలను మినహాయిస్తే  మిగిలిన కథలు అలాంటి చైతన్యాన్ని మనలో కలిగించడం లేదు. సున్నితమైన అంశాలను కథలుగా మలిచేపుడు ఎక్కువ జాగ్రత్త అవసరం. ఒడుపు తెలుసుకదా అని తొందరపడితే నోరు కాలుతుంది, చేయి కాలుతుంది. మొదటి కథల్లో మనకు బాధితులెవరో తెలుస్తుంది. వారిపట్ల ఎంతో కొంత ఆర్తి కలుగుతుంది. తాగుబోతు భర్త పట్టించుకోక ఏ ముచ్చటా తీరక విసుగ్గా ఉన్న మహిళ యాక్సిడెంటల్‌గా కలిసిన, తనపై ఆసక్తి కనపరిచిన కుర్రాడితో సెక్స్‌ తర్వాత స్థిమితపడే స్థితిని అర్థం చేసుకోగలము. ఆ మహిళ ఎర్రేటిక్‌ బిహేవియర్‌ని కూడా అర్థం చేసుకోగలం. చివరకు రచయితలకు ఫోన్లు చేసి భయంకరంగా వేధించే స్ర్తీ పైన కూడా కోపం రాదు.  ఆ తర్వాతి కథల్లోనే బ్యాలెన్స్‌ కుదరలేదు. అందులో చర్చించినవి కూడా అవాస్తవాలేం కాదు. కొంతమంది స్ర్తీలకు సంబంధించినవే అయినా అవి వాస్తవాలే. ‘మైనారిటీ’ కథలు రాయకూడదని రూలేం లేదు.  భర్త వేళ్లు కోసేసిన భార్య సంగతి పక్కనబెడితే చాలావరకు ఇందులో ఉన్న పాత్రలన్నీ నిజమైనవే. మనకు కనిపించేవే. కాకపోతే ఊరకే సంచలన వాస్తవాలను వెల్లడించడం దానికదే కథ కాదు కదా! ఆ వాస్తవాలకు సాహిత్య రూపమిచ్చేదేదో ఉంటుంది కదా! అది ఆ కథల్లో లోపించింది. కొన్ని కథల్లో వక్రీకరించింది కూడా. ఇంకో విషయం కూడా చెప్పక తప్పదు.  కొద్దిమందికే పరిమితమైన కథలు రాయడం వరకూ ఇబ్బంది లేకపోయినా సమాజంలో  ఒక సమూహం గురించి ఇంకో సమూహంలో ప్రచారంలో ఉండే స్టీరియోటైప్స్‌ని యథాతథంగా సమర్థిస్తున్నామేమో అనేది కూడా రచయిత ఆలోచించుకోవాలి.
ముందు మాట రాసిన ఇద్దరూ పెద్దమనసుతో రచయితను సానుభూతిగా చూసి ఆశీర్వదించారేమో అనిపిస్తుంది. ముక్తవరం పార్థసారధిగారు “సింగింగ్‌ ఇన్‌ ది పెయిన్‌” అన్నారు. కానీ రచయితతో ఉన్న అనుబంధం వల్ల అతను ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించి ఉంటాడు అని అర్థం చేసుకుని పని గట్టుకుని మళ్లీ మళ్లీ అతని కళ్లలోంచి చదివితే తప్ప అందులో నొప్పి ఉందని అనిపించడం లేదు. కథ దానికదిగా అలాంటి స్పందన కలిగించడం లేదు. తొలి మూడు కథలు మినహాయింపు.
“లోకంలో ఎవరు దేనిమీదైనా కథ రాయొచ్చు. కానీ ఎంత మేరకు సాహిత్యం చేశారనేది మీరు శ్రద్ధగా గమనిస్తారు” అని తనమాటగా ఖదీర్‌ రాశాడు. దీన్నే కొంచెం మార్చి చెప్పుకోవచ్చు. వొడుపు తెలిస్తే లోకంలో ఎవరు దేన్నైనా సాహిత్యం చేయొచ్చు. కానీ మంచి సాహిత్యం చేయడానికి ఒడుపుతో పాటు మరికొన్ని తెలియాలేమో!

జి ఎస్‌ రామ్మోహన్‌

తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అద్దం ‘జిగర్‌’

jigar title
ఆగస్టు పదో తేదిన హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తులో ‘జిగర్‌’`తెలంగాణ విశిష్ట కవితా సంకలనం ఆవిష్కరణ సందర్భంగా ఆ సంకలనం ప్రధాన సంపాదకులు -అనిశెట్టి రజిత గారితో ఇంటర్వ్యూ.
* ‘జిగర్‌’ తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
రజిత:  తెలంగాణ ఉద్యమ సందర్భంగా వస్తున్న కవిత్వంలో జై తెలంగాణ, తెలంగాణ తల్లి, సకల జనుల సమ్మె లాంటి వాటి మీద ఎక్కువ కవిత్వం వచ్చింది. అయితే తెలంగాణ విశిష్టతల్ని, చారిత్రక కట్టడాలు, నదులు, పండుగలు, ఆచారాలు, సంస్కృతి, వైతాళికులు, జిల్లాల ప్రాశస్త్యం, చార్మినార్‌, గన్‌పార్క్‌ లాంటి ఘన వైభవ చరిత్రను రికార్డు చెయ్యాలనుకున్నాం. దానిలో భాగంగానే ఈ సంకలనాన్ని తీసుకువచ్చాం. ఇది తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం.
* కవిత్వ సేకరణలో మీరు నిర్దేశించుకున్న ప్రామాణికాలు ఏంటి?
రజిత: ముందు చెప్పినట్లుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోని విశిష్టతలు, వైతాళికులు, చారిత్రక ప్రదేశాలు, వాటి ప్రాశస్త్యం అన్నింటిని రికార్డు చేయాలని అనుకున్నాం. దానికి అనుగుణంగానే ఆ యా జిల్లాలకు చెందిన కవులను వాళ్ల జిల్లాలోని ప్రత్యేకతల మీద రాయమన్నాం. ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, వరంగల్‌ రామప్ప ఇలా ప్రతి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు, కట్టడాల మీద కవితలు కావాలని కోరాం. అలాగే కొమరం భీమ్‌, షేక్‌ బందగీ, పండుగ శాయన్న, చాకలి ఐలమ్మ, పోతన లాంటి తెలంగాణ వెలుగుల మీద కూడా కవిత్వముండాలని నిర్ణయించుకొని వాటికి అనుగుణంగా సంకలనం చేశాం.
* కవిత్వ సేకరణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు?
రజిత: చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘జిగర్‌’ను నేను ఒంటరిగానే మొదలుపెట్టాను. ఈ పని చేస్తున్న క్రమంలో నలుగురు మిత్రులు కలిశారు. రెండు వందలమందికి పైగా కవుల నుండి కవిత్వాన్ని సేకరించడం కోసం ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం వేరే ఆలోచన, వేరే పని చేయకుండా అందరమూ కలిసి చాలా శ్రమ చేశాం. తెలంగాణ ఉద్యమం గురించే రెండు వందలకు పైగా కవితలు అందాయి. ‘విశిష్ట’ కవిత్వం తీసుకురావాలనుకున్నాం కాబట్టి ఒక్కొక్క రచయితతో మాట్లాడి మా ఉద్దేశ్యాన్ని వివరంగా చెప్పి కవిత్వాన్ని రాయించాం. ఈ సంకలనంలో సీనియర్‌ కవులతో పాటుగా ఇప్పుడిప్పుడే కవిత్వం రాస్తున్నవారూ ఉన్నారు. కొన్ని మొట్టమొదటి కవితలు కూడా ఉన్నాయి.
*మహిళా సంపాదకురాలిగా మీ అనుభవం ఎలా ఉంది?
రజిత: మహిళల సంపాదకత్వంలో కథా సంకలనాలు వచ్చాయి. కాని కవితా సంకలనం మహిళా సంపాదకత్వంలో రావడం ఇదే ప్రథమం. (ఫెమినిస్టు కవిత్వం మినహా) ఈ పుస్తకానికి నేను (అనిశెట్టి రజిత) ప్రధాన సంపాదకురాలిగా, కొమర్రాజు రామలక్ష్మి, కరిమిళ్ళ లావణ్య, భండారు విజయగ, గడ్డం పద్మాగౌడ్‌లు సంపాదకవర్గంగా కలిసి పనిచేశాం. మహిళల ఆధ్వర్యంలో ఈ సంకలనం రావడం మహిళా రచయితలకు స్ఫూర్తిని ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నాను. ఒకనాడు మహిళలు రాసిన సాహిత్యానికి అంతగా ప్రాధాన్యత లేదు. అలాంటిది సంకలనాలు తీసుకొచ్చే స్థాయికి ఎదిగాం.
jigar back
* ‘జిగర్‌’ ముందుమాటలో ‘lamenting’/మర్సియా అనే పదాన్ని వాడుతూ రాసిన ముందు మాట గురించి చెప్పండి
రజిత: సంగిశెట్టి శ్రీనివాస్‌గారు మంచి మిత్రులు. ముందుమాటను త్వరగా సమగ్రంగా రాసిండ్రు. ‘రుద్రమ’ ప్రచురణలు పేరు పెట్టమని సూచించింది కూడా తనే. ఈ సూచన మహిళా సంపాదకులుగా మేం తీసుకు వస్తున్న రచనలకు ఈ పేరు సూచించడం స్త్రీలకు మనోబలాన్నిస్తుంది. lamenting  సాహిత్యం అనేది  ఎప్పటికీ ఉంటుంది. సమాజంలో వెతలు, బాధలు, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణకు సీమాంధ్ర ఆధిపత్యం అన్న అదనపు దోపిడి రాష్ట్ర పునర్నిర్మాణం తర్వాత పోతుంది. కాని సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి. సమ సమజాం వచ్చేవరకు సామాజిక ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. సాహిత్యం నిరంతరం వస్తూనే ఉంటుంది.
చివరగా… రుద్రమ ప్రచురణలు తరపున మరో పుస్తకం ‘ఉద్విగ్నాలు’ తీసుకువస్తున్నాం. పన్నెండు మంది మహిళల ఆధ్వర్యంలో దీన్ని తెస్తున్నాం. ఇందులో ఐదుగురు సంపాదక వర్గంలో ఉంటారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ తర్వాత దాని ఫలాలు అందరికీ అందాలని ఆశిస్తూ… ధన్యవాదాలు.
ఇంటర్వ్యూ: ఏశాల శ్రీనివాస్‌

కళింగాంధ్ర వారసుడు

daalappa1

రెండు జీవిత దృశ్యాల మధ్య పోలిక చూడటం కవిత్వమైతే, వైరుధ్యాన్ని చూడటం కథగా రూపొందుతుంది. కొన్నిసార్లు దు:ఖమయంగానూ, కొన్నిసార్లు హాస్యాస్పదంగానూ ఉండే ఈ వైరుధ్యాల్ని చూసి మౌనంగా ఉండటం కష్టం. అనాదికాలం నుంచీ కథనకుతూహలానికి  ప్రేరణ మొదలయ్యేదిక్కణ్ణుంచే..

ఈ జీవిత వైరుధ్యాలు బహుశా కళిగాంధ్రలో మరీ స్పష్టంగా కనబడతాయేమో. లేదా కళింగాంధ్ర దృక్పథంలోనే ఈ వైరుధ్యాల్ని పసిగట్టే స్వభావం అంతర్లీనంగా ఉందో తెలియదు గానీ, అక్కడ పుట్టిన కథలు కంచికి వెళ్లవు. అవి అక్కడే తచ్చాడుతూ ఉంటాయి. కన్యాశుల్కం చూడండి . సమాజాన్ని కాపాడవలసిన పోలీసు కానిస్టేబుల్ లోకంపోకడ అర్థం కాక తెల్లమొహం వేస్తాడు. లోకం దృష్టిలో ఏగాణీ విలువ చెయ్యని అసిరిగాడు అగ్రవర్ణ సమాజపు టక్కుటమారాలన్నీ అపోశన పట్టినట్టు కనిపిస్తాడు. కనకనే లోకంలో అన్ని చోట్లా కథలు పుడుతూనే వుంటాయి గానీ, ఒక చాసో, ఒక రావిశాస్త్రి, ఒక పతంజలి కళింగాంధ్రలో మాత్రమే పుడతారు. ఇదిగో ఇప్పుడీ కథలది కూడా అదే దారి. చింతకింది  శ్రీనివాసరావు చెబుతున్న ఈ కథలు చోడవరానికి నెల్లిమర్లకీ మధ్యలో కళింగాంధ్ర నడ బొడ్డులో జనం చెప్పుకుంటూ వస్తున్న కథలు. ఈ కథలకి కులం, మతం, వర్గం, వర్ణం లేవు. ఇందులో వాస్తు సిద్ధాంతి పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు మొదలుకొని పాయఖానాలు శుభ్రం చేసే పెంటపాలెం దాలప్ప దాకా అందరూ ఉన్నారు. ఈ కథల్లో కనిపించే జీవితం ఎవరో ఒక సోషియాలజీకి తలుపులు తెరుస్తుంది. మేమంతా గురూజీ అని పిల్చుకునే రవీంద్ర కుమారశర్మ, అదిలాబాద్‌లో చేతివృత్తుల వాళ్ల కోసం అహర్నిశలూ తపించే కళాకారుడు, సంస్కర్త. ఒకసారి నాతో ఒక మాట అన్నారు. ‘మన సమాజంలో రెండు రకాల వ్యవస్థలున్నాయి. ఒకటి కలెక్టర్ల వ్యవస్థ. మరొకటి ప్రజలు తమకోసం తాము స్వయంగా ఖాయం చేసుకుని నడిపే వ్యవస్థ. మొదటిది చూడండి . దానికో బడ్జెట్‌ ఉంటుంది. మందీమార్బలం ఉంటారు. అయినా అది ఏ ఒక్క పని కూడా సక్రమంగా చెయ్యలేదు. ఆ వ్యవస్థకెప్పుడూ మీటింగులతోనే సరిపోతుంది. కాని ప్రజలు నడుపుకునే వ్యవస్థ చూడండి . పండుగల్లో, పురస్కారాల్లో కొన్ని లక్షల మంది జమవుతారు. కొన్ని కోట్ల లావాదేవీలు జరుగుతాయి. కాని ప్రజలు ఏ మీటింగులు పెట్టుకుంటారు? ఏం రూల్స్‌ రాసుకుంటారు? అయినా ఆ సంతలూ, జాతరలూ ఎంత బాగా జరుగుతాయో చూడండి అని ఆయనే ఇంకో మాట కూడా అన్నారు. అలాంటి జాతరల్లో కూడా ఒకటీ రెండు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? ప్రజల వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోకుండా కలెక్టర్ల వ్యవస్థ అడ్డుపడటం వల్ల!

dalapppa

ఈ కథల్లో కనిపించే జీవిత దృశ్యాలు మనకు చెప్తున్నదిదే. బస్టాండులో సీట్లు రిజర్వు చేసే  తాతయ్యలు, ఊళ్లో పసిపిల్లలకు పాలుకుడిపే పాలమ్మలూ చూపించిన మానత్వం పాఠశాలల్లో చదివింది కాదు. చట్టసభల్లో చేర్చించి ఆమోదించిందీ కాదు. కాని జీవితానికి పనికివచ్చే చదువుకి, అనుశాసనానికీ వాళ్లదే ఒరవడి  అవుతుంది. జీవిత వైరుధ్యాల్ని పట్టుకోవడం తోటే ఒక మనిషి కథకుడుగా మారినా, అతడి ప్రయాణం అక్కడతో ఆగిపోదు. వైరుధ్యాల్ని దాటిన ఒక సుందర దృశ్యాన్ని మనతో పంచుకోవాలన్న కవి కూడా ప్రతి కథకుడిలోనూ దాగి ఉండదు. దీనికి కూడా గురజాడదే అడుగుజాడ. చాసో ‘మాత ధర్మం’ కథ చూడండి. అది ఒక అపురూప కావ్య గీతిక. రావిశాస్త్రి కథలన్నిటా ఒక ఆకుపచ్చని పార్శ్వం కనిపిస్తూనే ఉంటుంది. కార్నర్‌ సీటు, మామిడి  చెట్టు. ఎన్ని కథలయినా గుర్తు చేసుకోవచ్చు. చింతకింది శ్రీనివాసరావు కథల్లో కూడా ఆ అమాయకమైన కవిత స్వప్నం కనిపిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

 

వాడ్రేవు చినవీరభద్రుడు

తెలుగులో కన్నడ కథల పరిమళాలు

matateeru

కన్నడనాట ఉత్తమ రచయితల్లో ఒకరైన శ్రీ పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథలకు తెలుగు అనువాదం “మాటతీరు”. తెలుగు సేత  శాఖమూరు రామగోపాల్.

ఈ అనువాద కథాసంకలనంలో ఎనిమిది పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు మాత్రమే కాకుండా, వర్తమాన కన్నడ సాహిత్యంలో విశేష కృషి సలుపుతున్న శ్రీ ఎస్. తమ్మాజీరావ్ నంగ్లీ గారి కథలు రెండు, బి. ఎల్. వేణుగోపాల్ గారి కథలు రెండు, కె. సత్యనారాయణ గారి ఒక కథ ఉన్నాయి. అదనంగా, అనువాదకులు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో తన పర్యటన వివరాలను ఆసక్తికరంగా అందించారు. పూర్ణచంద్ర తేజస్వి గారి కథల్లో ఎక్కువగా గ్రామీణ భారతం నిండి ఉంటుంది. ప్రకృతి వర్ణన కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది. ఆయా వర్ణనలను తెలుగులో కూడా సమర్థవంతంగా వ్యక్తీకరించారు శాఖమూరు రామగోపాల్ గారు. ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

సహ్యాద్రి పర్వత శిఖరాల మీద గంభీరమైన చీకటి అదేదే గొంగడ్ని కప్పుకొన్నట్లు ముసుగేసి కప్పుకుని ఉంది.

బాల్యం అంటే కుతూహలం, బాల్యం అంటే భయం, బాల్యం అంటే ప్రశ్నలు, బాల్యం అంటే భరోసా! చదువుకుంటున్న పదేళ్ళ శివ తన తండ్రి మంజప్ప గౌడ పిలవడంతో చదువాపి వరండాలోకి వస్తాడు. బయట వాన కుండపోతగా కురుస్తూంటుంది. కొత్తనీరులోని రుచి కోసం పంటకాలువలో ఎదురీది వచ్చే బురదమట్టల్ని, కొర్రమీనల్ని పట్టుకోడానికి మంజప్ప గౌడ, పనివాడు లింగడితో కలిసి ఆ రాత్రి వేళ బయల్దేరుతూంటాడు. జాగ్రత్తగా తలుపు వేసుకోమని చెప్పి, వాళ్ళిద్దరూ బయల్దేరుతారు. శివ సగం తలుపు తీసి ఉంచి, బయటి వానని; తండ్రి, లింగడు ముందుకు సాగడాన్ని చూస్తూంటాడు. జోరుగాలికి తలుపులు కొట్టుకోవడంతో లోపలిగదిలో ఉయ్యాలలో నిద్రపోతున్న శివ తమ్ముడు సదానంద ఏడుపు మొదలుపెడతాడు. వాడిని ఊరడించమని తల్లి లోపలినుంచి కేక పెడుతుంది. వాన ఆగదు. ఆ రాత్రి గడిచిపోతుంది. మళ్ళీ చీకటి పడుతుంది.

తండ్రీ, లింగడూ రారు. శివ చెల్లెలు ఓ వసపిట్ట. ఆమెకి ఎన్నో సందేహాలు… వాటన్నింటిని శివ ముందుంచుతుంది. శివ వాటికి జవాబులు చెప్పలేడు. చివరికి అలా ప్రశ్నలు వేయకూడదంటూ…. తనకు లింగడు చెప్పిన కథ చెబుతాడు. ఆ కథ విని చెల్లి బాగా భయపడిపోతుంది. తాను లింగడి నుంచి కథ విన్నప్పుడు భయపడినదానికంటే, చెల్లి ఎక్కువగా జడుసుకున్నందుకు శివకి కాస్త ఆనందం కలుగుతుంది. వాన కురుస్తునే ఉంటుంది. ఊగుతున్న గుడ్డి దీపం వెలుగులో తమ్ముడి ఉయ్యాల నీడ గోడమీద పడి నాట్యం చేస్తుంది. మెల్లగా శివకి తన కథపై తనకే భయం కలుగుతుంది. బెదిరిపోతాడు. ఇంతలో తలుపు చప్పుడై, తండ్రి, లింగడు లోపలికి రావడంతో కథ ముగుస్తుంది. బాల్యంలోని అమాయకత్వాన్ని, కథలలోని కల్పనలని తెలుసుకోలేని ఉద్విగ్నతనీ అద్భుతంగా చిత్రిస్తుంది “లింగడొచ్చిండు” కథ.

తన కాళ్ళ అడుగుభాగాన జరుగుతున్న ఈ దుర్బల మానవుల నడవడిక మరియు తన తల మీద నడుస్తున్న మేఘమాలికల సయ్యాట…. ఈ సర్వవ్యాపారానికీ సాక్షిభూతంగా ఆ పర్వత శిఖరం గాంభీర్యంగా నిల్చి ఉంది!

లక్కడు, సోముడు అనే ఇద్దరు నిష్ప్రయోజకులూ, స్వార్థపరుల కథ “ఉరుము చెప్పిందేంటి?”. పని చేయడాన్ని ప్రాణసంకటంగా భావించే వీరిద్దరూ తమ ముసలి అవ్వని రోడ్డు మీద వచ్చే వాహనానికి అడ్డంగా పడేసి, ఆమె మరణించాక, రాబట్టుకునే నష్టపరిహారంతో మజా చేసుకోవాలనుకుంటారు. వేరే ఊర్లో పని వెతుక్కోడానికి వెడుతున్నట్లుగా ప్రయాణమై, అనుకున్నట్లుగానే దారిలో ముసలామెను ఓ వాహనానికి అడ్డంగా తోసేస్తారు, ఆమె మరణిస్తుంది. ఆ కారు యజమాని దగ్గర వందరూపాయలు (కథాకాలం 1957 వ సంవత్సరం, ఆ కాలంలో వంద రూపాయాలు చాలా పెద్ద మొత్తం) తీసుకోబోతుంటే ఓ తమాషా జరుగుతుంది. ఆ వాహనం యజమాని వంద రూపాయలు ఇవ్వకుండానే చిన్నగా మందహాసం చేస్తాడు. మనిషిలోని కుత్సిత స్వభావానికి అద్దం పడుతుందీ కథ.

హులియూరు అనే ఊరిలో నివసించే రంగప్ప గౌడకీ, అతని కొడుకు సోమూకి ఒక్క క్షణం కూడా పడదు. తండ్రి ప్రతీ దాంట్లోను కొడుకును నియంత్రించాలనుకుంటాడు, కొడుకేమో స్వతంత్రంగా ఉండాలని తండ్రి అదుపాజ్ఞలకి దూరంగా పోవాలని ప్రయత్నిస్తూంటాడు. సీత అనే అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని రంగప్ప గౌడ పంతం. ఆ సంబంధం కాకుండా తను ప్రేమించిన నళినాక్షిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. వీరి ప్రాంతంలో గద్దలెక్కువ. కోడిపిల్లలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు చటుక్కున క్రిందకి దిగి నోట కరుచుకుపోతుంటాయి. రంగప్ప గౌడ గద్దల్ని చంపాలనంటాడు. సోమూ దానికి నిరాకరిస్తాడు. కారణం, మల్లినమడుగు గ్రామంలోని పూజారి చేసిన బోధ. గద్దలు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి ప్రతిరూపమని, దానిని చంపిన వారు తిన్నగా నరకానికి పోతారని పూజారి చెబుతాడు. ఆ మాటలను బలంగా విశ్వసిస్తాడు సోమూ. ఒక గద్ద వీళ్ళింట్లో కోడి పిల్లలని ఎత్తుకుపోడానికి దిగుతుంది, వీళ్ళ పెంపుడుకుక్క ఆ గద్ద నోట కరుచుకుంటుంది, కుక్క నుంచి గద్దని కాపాడేందుకు సోమూ ప్రయత్నిస్తే, అది భీతిల్లి తన వాడైన గోళ్ళతో సోమూ చేతులను గీరి అతని ముంజేతిని పట్టుకొంటుంది. పైకి ఎగరలేక, గోళ్ళను సోమూ ముంజేతిలోకి బలంగా తెంచుతూంటూంది. పని వాడి అరుపులకి తండ్రి బయటకి వస్తే గద్దని తప్పించేందుకు, ఒక కత్తి తెమ్మని అరుస్తాడు సోమూ. కత్తి తేవడం ఆలస్యం అయితే, చివరికి దాని మెడ కొరికి చంపుతాడు సోమూ. “నువ్వూ నరకానికి పోతావా?” అని పనివాడు అడిగితే, “స్వర్గం నరకం అనేవి లేని లేవు, అంతా పూజారుల ఒత్తి మాటలు” అంటూ కసితీరా ఉమ్ముతాడు. ఇదొక ప్రతీకాత్మక కథ.

సోమూ సుభద్రని ప్రేమిస్తూంటాడు లేదా ప్రేమిస్తున్నానని అనుకుంటూంటాడు. ఓ మైదానంలో కూర్చుని పల్లీలు తింటూంటాడు. అతని పక్కనే ఓ నల్లకుక్క నిల్చుని పల్లీల కేసి ఆశగా చూస్తూంటుంది. ఒక్కో పల్లీగింజ నోట్లో వేసుకుంటూ, నెల రోజుల క్రితం జరిగిన సంఘటనని గుర్తుచేసుకుంటాడు సోము. ఆ రోజు – చీకటి పడుతోంది, వెళ్ళాలంటూ సుభద్ర తొందరపెడుతుంది. ఇంకాసేపు ఉండమంటాడు. ఆమె వినకుండా ఏదో చీటీ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆమె మీది కోపంతో అందులో ఏం రాసుందో కూడా చదవడు. ఆ కాగితాన్ని జేబులో కుక్కేసుకుంటాడు. – ఈ నెల రోజులలో ఆమె మళ్ళీ కనబడదు. సగం నమిలిన పల్లీగింజ గొంతుకు అడ్డం పడడంతో వర్తమానంలోకి వస్తాడు. దాన్ని బయటకు రప్పించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూండగా, పక్కనే ఉన్న ఆ నల్లకుక్క చటుక్కున అతని కాలు కొరికి పారిపోతుంది. అది పిచ్చికుక్కేమో ననే సందేహం కలుగుతుంది. అక్కడ్నించి మొదలవుతుంది అతని కష్టకాలం. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు పొడిపించుకోవాల్సివస్తుంది, ఆ కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవాలి. ఈ హడావుడిలో ప్రియురాలి సంగతి, ఆమె రాసిన చీటి సంగతి మరిచిపోయి, ఆ కుక్క క్షేమ సమాచారం కోసం తెగ తిరుగుతాడు. ఈ క్రమంలో అతను చిత్రభ్రమకి గురవుతాడు. తనని తాను పురూరవుడిగా భావించుకుని, తన ప్రేయని “ఊర్వశి”గా ఊహించుకుంటాడు. మనుష్యుల లోని చంచల స్వభావాన్ని, భావసంచలనాన్ని చిత్రించిన కథ “ఊర్వశి”.

జోరు వానకు తడి ముద్దై నానిన కొండ శిఖరమొకటి విరిగిపడి కడలి తీరంలో కల్సే ఒక నదీ ప్రవాహంలో మేట వేసి, లంకలా మారినట్లుగా….

మోహన్‌దాస్ కె.జి. (మోని) అనే పేరున్న ఓ బాలుడి కథ “గాంధీజీ దశ నుంచి”. తండ్రికి అనారోగ్యం కలిగితే, మందు తేవడానికి మోని బయల్దేరుతాడు. గాంధీజీ కథ చదువుకుంటూంటాడు మోని. తల్లి అకారణంగా తిట్టి, తండ్రికి మందులు తెమ్మని పంపిస్తుంది. తండ్రికి ఉన్న అనారోగ్యాల పేర్లు రాసుకునేందుకు చెల్లిని పెన్సిల్ అడుగుతాడు మోని. ‘నీ పెన్సిల్ ఏది?’ అని తల్లి అడిగితే, క్లాసులో ఎవరో దొంగిలించారని చెప్పి, మరిన్ని తిట్లు తింటాడు. తండ్రి జబ్బుల జాబితాని తల్లి రాసిస్తుంది. దిగులుగా బయల్దేరుతాడు మోని. వైద్యుదు ఉండే ఊరు నాలుగు మైళ్ళ దూరం. ఏవో ఆలోచనల్లో పడి తల్లి రాసిచ్చిన కాగితాన్ని ఎక్కడో పోగొట్టుకుంటాడు. చివరకి, జబ్బుల పేర్లు గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తూ, తను చేసిన తప్పులని తండ్రికి ఉత్తరంగా రాస్తాడు గాంధీగారిలా. తర్వాత ఏమవుతుందనేది ఆసక్తిగా ఉంటుంది. పిల్లలు గాంధీగారిలా నిజాలను నిర్భయంగా రాయాలనుకున్నా, గాంధీజీ తండ్రిలా వాటిని ఆమోదించలేని తండ్రులెందరో. 1960లలో రాయబడిన ఈ కథ నేటికీ వర్తిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

గంభీరమైన కథల మధ్య హాస్యం చిలకరించే కథ “పంజ్రోళ్ళి పిశాచి”. హాస్టల్‌లో ఉండే కుర్రాళ్ళు ఇంట్లోంచి పాత్రలు తీసుకొచ్చి చక్కని ఫిల్టర్ కాఫీ తాగాలనుకుంటారు. అర్థరాత్రి తమలో ఒకడైన మిత్రుడింటికి వెళ్ళి పాత్రలు, డికాక్షన్ తెచ్చుకుని, కాఫీ తాగి ఆనందిస్తారు. అయితే తెల్లారాక వారికో నిజం తెలుస్తుంది. గిలగిలాడిపోతారు.

ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని, రోడ్లన్నీ బురదమయమై దూరానున్న రమణీయ దృశ్యాలన్నీ తొలగిపోయి స్తబ్దుగా నిలబడియుంది వాతావరణం.

ఈ పుస్తకానికి మకుట కథ “మాటతీరు”. ఓ రచయిత అంతర్మథనాన్ని అందంగా చిత్రిస్తుందీ కథ. వేదాంత సత్యాలను మిళితం చేస్తూ, గ్రామీణుల భోళాతనాన్ని, తుంటరి పిల్లల అల్లరి చేష్టలని చక్కగా చూపిస్తుందీ కథ. ఇరుకిరుకైన బతుకుని మాటల తీరుతో మళ్ళీ మళ్ళీ చికాకు పెడుతున్న జగత్తు మీద, జనం మీద అసహనం వ్యక్తం చేస్తుందీ కథ.

కొత్త మన్నుతో కరిగి కలగలసిన ఆ నీళ్ళు కుంకుమరంగుతో ఉన్నట్లుగా కనపడుతుంది. అటు ఇటు ఉన్న దట్టడవి వాగులోని ప్రవాహం మ్రోతకు ప్రతిధ్వనించి ఒకటి రెండు ఎక్కువైనట్లు మ్రోత పెట్తుంది. తేలుతూ కొట్టుకొచ్చిన గడ్డిగాసం మొదలైనవన్నీ ఆ ఎర్రనీళ్ళ ప్రవాహం మధ్యన తలెత్తి నిలబడ్డ వృక్షాల తలలలో ఇరుక్కుపోయి, ఇక ఆ చెట్లు తలపాగాలు చుట్టుకొన్నట్లుగా నిలబడియున్నవి.

“నిగూఢ మనుషులు” ఈ సంకలనంలో కెల్లా పెద్ద కథ. దాదాపు 56 పేజీల కథ ఇది. మనుషుల నిజస్వరూపాలను, జాతిబేధాలను, అసూయా ద్వేషాలను, అహంకారాలను, కృత్రిమత్వాన్ని ఈ కథ ప్రదర్శిస్తుంది. ప్రకృతి ప్రకోపాన్ని, వరద విలయాన్ని, భూపంకం వల్ల కొండ చరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామలు నాశనమవడాన్ని ఈ కథ చెబుతుంది. బీభత్సకరమైన ఘటనలున్నా, భయోత్పాతాన్ని కల్పించదీ కథ. దీన్ని చదువుతుంటే ఒక ప్రాంతపు చరిత్ర చదివినట్లుంటుంది.

తనను లైంగికంగా వేధించిన ఆఫీసర్‌ని శిక్షించమని ఉన్నతాధికారులను వేడుకొన్న ఓ యువతి వినతి మేరకు ఆ అధికారిని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తారు. అయితే అనూహ్యంగా బాధితురాలు ఉన్నతాధికారిపై తిరగబడుతుంది. తాను అడిగింది ఏమిటి? వాళ్ళు చేసింది ఏమిటి? అని వాపోతుంది. కారణం తెలుసుకోవాలంటే, ఆలోజింపజేసే కథ “చిట్టితల్లి” చదవాల్సిందే.

“కాళ్ళు లేని కవిత”లో అవార్డుల కోసం, బిరుదుల కోసం తాపత్రయపడే సాహితీవేత్తలపై చురకలు వేస్తారు రచయిత. “ముందుగా బతుకును అనుభవించు. అనుభవం అర్థవంతంగా మారి నీ కవిత్వంలోకి వస్తది. అర్థమైన దాన్ని అక్షరాల్లోకి దించు. అలాగున రాస్తుంటే నీ సాహిత్యం అనుభావమౌతుంది” అంటాడో సీనియర్ కవి, తన జూనియర్ కవికి జ్జాన బోధ చేస్తూ. తర్వాత ఏమవుతుంది? కథ పూర్తయ్యాక చదువరుల పెదాలపై నిట్టూర్పు వెలుస్తుంది.

మూడు వందల కోట్ల రూపాయాలకు వారసురాలయ్యే అవకాశం ఉన్న ఓ మహిళ తన కుటుంబీకులు పెడుతున్న బాధలనుంచి తప్పించుకోడానికి రైలెక్కి వేరే ఊరికి బయల్దేరిపోతుంది. విధి ఆడే వింత నాటకం వల్ల చివరికి ఆ డబ్బు ఆమె ఆశ్రయం పొందిన అనాధాశ్రమానికే అందుతుంది. మనుషుల జీవితంలో సంపద సృష్టించే దురాశని, దాని వల్ల మనుషుల మనస్తత్వాలలో వచ్చే మార్పులని “వారసుదార్లు” కథ చక్కగా చెబుతుంది.

జీవించి ఉన్నప్పుడు ఎవరికీ ఒక్క రూపాయి కూడా దానం చేసి ఎరుగని ఓ వృద్ధురాలు తన మరణానంతరం ఆస్తినంతా ఓ అనాధ శరణాలయానికి ఎందుకు రాసేసిందో తెలుసుకోవాలంటే “సొత్తు” కథ చదవాలి. దొంగ బాబాల మీద, అవినీతిపరులైన రాజకీయవేత్తల పైన సంధించిన అస్త్రం “మఠాదిపతి మరియు మెడికల్ కాలేజి” కథ. నేటి వ్యవస్థలోని లోపాలను వ్యంగ్యంగా ఎత్తి చూపిన కథ ఇది.

చివరగా తన యాత్రానుభవాలు వివరిస్తారు రామగోపాల్ గారు. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. కేరళలోని మున్నార్ పర్యటన సందర్భంగా కాలడి వెళ్ళి, ఆదిశంకరుల జన్మస్థలాన్ని, కీర్తిమందిరాన్ని దర్శించారు అనువాదకులు. శంకరుడి జన్మస్థలం దర్శనం కోసం ఆ రోజున వచ్చింది కేవలం పది మందేనని తెలిసి ఎంతో బాధ పడతారు రామగోపాల్ గారు. సినిమా హీరోల ఇళ్ళముందు వందలాది మంది ఎదురుచూస్తుంటే, అఖండ భారతావనిని దర్శించి, నాలుగు దిక్కులా మఠాలు నెలకొల్పి వేదాల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన శంకరుని గృహం వద్ద యాత్రికులు లేకపోడాన్ని సంస్కృతి క్షీణించడంగా భావించారట ఆ రోజు వీరితో పాటు ఆ గృహాన్ని దర్శించిన ఓ మహారాష్ట్రకు చెందిన యాత్రిక కుటుంబం. ఓ కఠోర వాస్తవం!

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. అయితే అనువాదకులు ఉపయోగించిన భాష – మహబూబ్‌నగర్ జిల్లా, కర్నాటక సరిహద్దుల ప్రాంతంలోని తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. కొంచెం ఓపిక చేసుకుని చదివితే కన్నడ కస్తూరి పరిమళాలను అస్వాదించవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు.

kolluri

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్

“మాటతీరు”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 230 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

ఒక మాదిగ ఎగరేసిన బతుకు జెండా : “మా నాయిన బాలయ్య”

  (వై.బి.సత్యనారాయణ రాసిన My Father Balayya పుస్తకానికి సత్యవతి గారి తెలుగు అనువాదం “మా నాయన బాలయ్య” ఆవిష్కరణ సందర్భంగా ….

ఆ పుస్తకానికి    ఎస్ .ఆర్.శంకరన్ రాసిన ముందు మాట)

ఆవిష్కరణ : 22 జూన్ 2013
వేదిక: బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్
సమయం: సాయంత్రం 5:30

 

 ఎస్ .ఆర్.శంకరన్

ఎస్ .ఆర్.శంకరన్

సమాజపు అట్టడుగునుంచీ బయల్దేరి ఉన్నత స్థాయికి చేరుకోడానికి ఒక తెలంగాణా దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటాన్ని విశదంగా కళ్లముందుకు తెచ్చిన జీవిత చరిత్ర ఇది. ఆర్థిక సామాజిక ఆంక్షలనూ, అడ్డంకులనూ వీరోచితంగా ఎదుర్కొని విజయంసాధించిన యెలుకటి కుటుంబ చరిత్ర ఇది.  దాదాపు రెండు శతాబ్దాలపాటు , మూడు తరాల జీవితకాలంలో సమాజంలో వచ్చిన మార్పుల్నీ ఇంకా రాకుండా వుండిపోయిన మార్పులనూ కూడా ఈ పుస్తకం  మన కళ్ళముందుంచుతుంది.ఇది కేవలం ఒక కుటుంబ చరిత్రేకాదు. వివిధ ప్రాంతాల్లొ వివిధ నేపథ్యాలలొ, విభిన్న పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాలపాటు మాదిగ కులస్థుల అనుభవాలనుకూడా వర్ణించిన సామాజిక చరిత్ర ఇది.

“ మా నాయిన బాలయ్య” అస్పృశ్యుల జీవితాలలోని వివిధ దశలచిత్రణ,  సమాజం విధించిన అనుల్లంఘనీయమైన ఆంక్షలమధ్య , జీవితం కొనసాగిస్తున్న వారి సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు, వారిలో వారికున్న పరస్పర అవగాహనా ,సంబంధబాంధవ్యాలూ , జీవన విధానాలూ, వృత్తులూ , ఆశలూ , అడియాశలూ పోరాటాలూ రాజీలూ, ఔన్నత్యాలూ లోపాలూ  మొదలైన అనేక విషయాలను తడిమిన రచన ఇది…అణిచివేతే ధ్యేయంగా నిర్మితమైన ,నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థలో అప్పటి , భూస్వామ్య సమాజంలో  అనేక వివక్షలనూ, అవమానాలనూ అవహేళనలనూ ఎదుర్కుంటూ అస్పృశ్యులుగా పరగణింపబడిన ఒక సామాజిక వర్గం చేసిన అలుపులేని పోరాట చరిత్ర ఇది. అస్పృశ్యతలోని అమానవీయత, కులవ్యవస్థలోని  కౄరత్వం, వాటిని నిస్సహాయంగా జీర్ణించుకుని అంతర్గతంచేసుకోవడం ఆనాటి పరిస్థితి. అయితే అప్పడుకూడా కొంతమంది ఇతర కులస్థులు,ముఖ్యంగా ఉపాధ్యాయులు చూపిన  సహానుభూతి సహకార వాత్సల్యాలను  కూడా రచయిత  ప్రస్తావించారు.

Ma father balaiah cover

నేను ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ (IAS) సర్వీస్ లో ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నప్పుడు నిరుపేదల మధ్య ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల ,తెగలవారి మధ్య పనిచేసే అదృష్టం కలిగింది. చట్టపరంగా నిషేధింపబడినప్పటికీ అస్పృశ్యత ఎంత పాశవికంగా ఇంకా  అమలవుతున్నదో  కళ్ళారా చూశాను. ఒక దళిత స్త్రీ ఒక చెరువుగట్టున బిందె పెట్టకుని, చెరువునుంచీ నీళ్ళు ముంచిపోసే వాళ్లకోసం నిరీక్షిస్తూ కూచున్న దృశ్యం నేనెప్పటికీ మర్చిపోలేను. ఆమె దళిత మహిళ కనుక చెరువులోనించీ నీళ్ళు ముంచుకోరాదు. వాళ్ళ తక్కువతనాన్ని సూచించడానికి వాళ్లపేర్ల చివర ఎంత అవమానకరమైన పదాలు చేరుస్తారో చూసి, విని నేను అవాక్కయ్యాను. వెట్టిచాకిరి లో వున్న వారి పై జరిగే దోపిడీని ప్రత్యక్షంగా చూశాను. భూస్వాములనుంచీ చిన్నచిన్న మొత్తాల్లో అప్పుతీసుకుని అది తీర్చలేక తరాలుగా వెట్టిచేస్తున్నవారిని చూశాను తెలంగాణాలో ’దొర’లని పిలవబడే పెద్ద భూస్వాముల సమక్షంలోవున్నప్పుడు వాళ్లమొహాల్లో కనపడే భయాన్నీ, ,అదితెలియచెప్పే అణిచివేత స్వభావాన్నీ కూడా చూశాను. “నీ బాంచెన్ కాలు మొక్కుత”అనేది అస్పృశ్యులు భూస్వాములకు చేయవలసిన తప్పనిసరి అభివాదం. యెలుకటి కటుంబ చరిత్ర తో పాటు  అస్పృశ్యులు అనుభవించిన క్షోభా , నిరవధిక  అవమానమూ కూడా చిత్రించారు రచయత.

ఈ రచన నాకు మరింత చేరువగా తోచడానికి మరొక కారణం కూడా వుంది. నా బాల్యంలో నేను కూడా రైల్వే కాలనీల్లో నివసించాను. ఇందులో వర్ణించబడిన రైల్వే కాలనీల్లో, వర్ణవివక్ష అసలే లేదనను కానీ కాస్త సడలించబడడాన్ని నేనుకూడా చూశాను. గ్యాంగ్ మెన్ ,పాయింట్స్ మెన్.షంటర్స్ వంటివారిని చిన్నప్పుడు దగ్గరగా పరిశీలించాను. వీళ్ళంతా దాదాపు తక్కువ కులాలనబడే కులాలనించీనూ, స్టేషన్ మాస్టర్లూ రైల్వే గార్డులూ  అగ్రకులాలనబడే కులాలనుంచీనూ  వుండేవాళ్ళు వ్యక్తిగతంగానూ,అధికారపరంగానూ . వాళ్ళ పరస్పరసంబంధాలు ఎట్లావుండేవో కూడా గమనించాను. ప్లాట్ ఫామ్ మీద ఒకరు ఆకుపచ్చజెండా ఊపుతూ నిలబడగా  , అక్కడ ఆగకుండా దూసుకుపోయే రైళ్లను చూసి ఆశ్చర్యపోయేవాడిని అప్పుడప్పుడూ.  ఆరోజుల్లో ఆగివున్న ఇంజెన్లనుంచీ నీళ్ళు పట్టుకుపోయ స్త్రీలను కూడాచూశాను.  రైల్వే ఉద్యోగుల పిల్లలు టికెట్ లేకుండా ప్రయాణించడంకూడా “చట్టసమ్మతంగా”నే వుండేది అప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ కూడా తమ ఉద్యోగులకోసం రైల్వే చౌకగా సరుకులు సరఫరా చేసేది. గ్రామాల్లో భూస్వాములకింద వుండే జీవితానికీ ఇక్కడ జీవితానికీ కల తేడా చూపించడానకి రచయిత ఈ వివరాలన్నీచెప్పారు. తక్కిన సమాజని కన్న రైల్వే  ఒక భిన్న ప్రపంచం సృష్టించింది వాళ్లకోసం.. అంటారు రచయిత. రచయత తండ్రి బాలయ్యకు రైల్వే అవతలి ప్రపంచం తెలియదు.అందుకని ఆయన  ధ్యేయం తనపిల్లలను చదివించి రైల్వేలో ఆఫీసర్లను చెయ్యడమే!

బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంలోనూ , ఓడరేవుల్లోనూ,రైలు మార్గాలలోనూ గనులలోనూ మిల్లులలోనూ కొత్త ఉద్యోగాలను సృష్టించింది.  ఇవి అస్పృశ్యులకు కొత్త అవకాశాలయినాయి..ఈ ఉద్యోగాలు అగ్రవర్ణాలనబడేవారికి నచ్చకపోవడం కూడా వీరికి దక్కడానికి ఒకకారణం. ఎందుకంటే ఈ పన్లు ప్రమాద భరితమైనవి. కష్టసాధ్యమైనవికూడా. అంతకంటే  మైలపడతామన్న భయంకూడా! బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా  మహు అనే స్టేషన్లో  ఒక సైనిక కుటుంబంలో జన్మించాడని చెప్పుకోడం ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటాను. రమాబాయ్ అంబేడ్కర్ కూడా అటువంటి కుటుంబంలోనే జన్మించారు.

రచయిత చెప్పినట్లు గ్రామాలలోని భూస్వామ్య అణచివేతలనుంచీ దళితులకువిముక్తి కలిగించే కొత్త ద్వారాలు తెరిచింది రైల్వేశాఖ.. .ఆ పన్లు కష్టమైనవైనా, ప్రమాదభరితమైనవైనా తక్కువ స్థాయికి చెందినవైనాగాని ! అట్లా వాళ్ళు రైల్వే లో ప్రవేశించారు. రైల్వే క్వార్టర్స్ లో తక్కిన కులాలవారి పక్కన నివసించడం ఒక కొత్త అనుభవం.తమను అంటరాని వాళ్ళుగా చూసి వేరుపెట్టి న గ్రామాలనుంచీ విముక్తి కలిగింది.వీళ్లకు బొగ్గుగనులలో కూడా ఇటువంటి పనులు లభించాయి.

నర్సయ్య జీవితం ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామంలో ప్రారంభమైంది. ఒకసారి హైదరాబాద్ నిజామ్ వంగపల్లి మీదనుంచీ పోతూండగా నర్సయ్య తండ్రి (ఆయన పేరుకూడా నర్సయ్యే) ఆయనకు దూడచర్మం తో  కుట్టిన మృదువైన చెప్పులజత బహూకరించాడు. అవి చూసి ఆయన ఎంతో ముచ్చటపడి అప్పటికప్పుడు నర్సయ్యకి యాభై ఎకరాల పొలం ఈనామ్ గా ప్రకటించాడు. ఆయన ఈ పుస్తక రచయితకు ముత్తాత. అయితే సాక్షాత్తూ నిజామ్ ఇచ్చినా సరే అతను ఆ పొలాన్ని అనుభవించడానికి వీల్లేదు ,అప్పటి దొరల అధికారం అటువంటిది.ఆపొలం అంతా లాక్కుని రెండెకరాలు మాత్రం నర్సయ్యకిచ్చాడు దొర,. అట్లా చేసినందుకు నర్సయ్యకు బాధగానీ కోపంగానీ కలుగకపోగా దొర కోపానికీ దెబ్బలకీ బలికానందుకు సంతోషించాడు అటువంటి పరస్థితులు ఇంకా కొన్ని గ్రామాలలో వున్నాయి ..షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వం భూమి ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుని సాగుచేసుకోనివ్వవు స్థానిక రాజకీయాలు.

రచయిత ఒక గ్రామ నిర్మాణం ఎలావుంటుందో ఈ విధంగా వర్ణిస్తారు

“అప్పటికీ ఇప్పటికీ భారతదేశంలోని గ్రామాల నిర్మాణంలో పెద్ద మార్పు ఏమీ లేదు. గ్రామాలన్నీ దాదాపు మనువు సూత్రీకరించినట్టే నిర్మింపబడి వుంటాయి. గ్రామం వూరుగా(సవర్ణులకు), వాడగా(అవర్ణులకు) చీలి వుంటుంది మధ్యనొక సరిహద్దో లేకపోతే అవసరమైనంత ఖాళీ స్థలమో వుంటుంది.

అవర్ణులు లేక అస్పృశ్యులు అని పిలవబడే వారి మీదనించీ వచ్చే  కలుషిత గాలి  తమమీద వీయకుండా గ్రామంలోని వివిధ కులాల  గృహ నిర్మాణం వుంటుంది..అంటే గాలి బ్రాహ్మణుల ఇళ్లమీదనుంచి ఇతర కులాల ఇళ్లమీదకు వీచే విధంగా గ్రామంలో వివిధ కులాల ఇళ్ళు వుంటాయి. సాధారణంగా గాలి పశ్చిమంనుంచీ తూర్పుకు వీస్తుంది కనుక, ముందు పశ్చిమంలో బ్రాహ్మణుల ఇళ్ళుంటాయి. అస్పృశ్యుల ఇళ్ళు తూర్పున వుంటాయి. గ్రామంలో ప్రధాన వీధులన్నీ పశ్చిమంలో వుంటాయి .నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థ తూర్పునించీ మొదలౌతుంది…శూద్రులు,వైశ్యులు,క్షత్రియులు ,బ్రాహ్మణులు ,అట్లా ….ఉత్పత్తి రంగంలో వుండే శూద్ర వర్ణాలన్నీ ఒక చోట గుంపుగా వుంటాయి. ఆఖరున గ్రామ ముఖ ద్వారంలో బ్రాహ్మణుల ఇళ్ళుంటాయి.”

ఈ వాక్యాలు డాక్టర్ అంబేడ్కర్ మాటల్ని తలపింపచేస్తాయి.ఆయన కూడా భారతదేశంలోని గ్రామాల నిర్మాణాన్ని తీవ్రంగా విమర్శించారు.భారతీయ గ్రామాలను అత్యంత భావుకతతో వర్ణించడాన్ని అంబేడ్కర్ ఖండించారు

“ భారతీయ గ్రామాలు గణతంత్రం రాజ్యం అనే భావాన్ని అభావం చెయ్యడంలా వుంటాయి.అవి నిజంగా గణతంత్ర రాజ్యాలే అయితే అవి సవర్ణులకోసం సవర్ణలచేత పాలింపబడే గణతంత్రాలు . అవర్ణులకు అక్కడే హక్కులూ లేవు.వాళ్ళ సేవచెయ్యడానికీ నిరీక్షించడానికీ, అణిగివుండడానకీ మాత్రమే వున్నారు .అక్కడ స్వేచ్ఛకి తావులేదు.సమానత్వానికి తావులేదు.సహోదరత్వానికి తావులేదు”

అన్ని సామాజిక ,మతపరమైన వ్యతిరేకతల మధ్య యెలుకటి కుటుంబంలోకి విద్య ప్రవేశించింది. కొన్ని శతాబ్దాలుగా,ఆ సామాజిక వర్గానికీ   ఆ కుటుంబానికీ  అందకుండా వుంచిన విద్యా సంపదకు విత్తు నాటింది ఒక ముస్లిమ్ ఉపాధ్యాయుడు .ఆ తొలి గురువైన.ఆలీ సాహెబ్ కు  యెలుకటి కుటుంబంలో భవిషత్తు తరాలన్నీ ఋణపడి వుంటాయని రచయిత ఎంతో గౌరవభావంతోనూ కృతజ్ఞతతోనూ చెప్పినప్పుడు మన మనసు ఆర్థ్రత తో నిండిపోతుంది.

తనకొడుకును గ్రామంలో వెట్టి చాకిరి నుంచీ రక్షించాలనుకున్నాడు నర్సయ్య. అగ్రకులస్థుల నిరంతర వేధింపులు భరించలేక అతను తన పూర్వీకులగ్రామాన్ని వదిలి రావడం నర్సయ్యనే కాక తరువాతి తరాలను కూడా బంధవిముక్తులను చేసింది. ఆత్మగౌరవమూ కృషీ  మనుషులకు శక్తినీ ఆత్మవిశ్వాసాన్నీ గుర్తంపునీ ఇస్తాయనేది బాలయ్య నమ్మకం. ఆనమ్మకమే తన బిడ్దలను విద్యావంతులను  చెయ్యాలనే  జీవిత ధ్యేయాన్ని కలుగచేసింది నగరానికి వలస రావడం రైల్వేలో నౌకరి సంపాదించడం . భూస్వాముల ఆగడాలకు దూరంగా కొంత అజ్ఞాతంగా వుండడానికి కూడా దోహదం  చేసింది. అయితే కుల వ్యవస్థా, దానితో వచ్చిన అవమానమూ దళితులను అన్నిచోట్లా వెంటాడుతూనే వుంటాయని ఈ జీవిత కథ చెబుతుంది. విద్యాలయాల్లోనూ ఇళ్ళు అద్దెకు తీసుకునేటప్పుడూ ఒక్కొక్కసారి కులందాచిపెట్టుకునే అవసరాన్ని కూడా పరిస్థితులు కల్పిస్తాయి. సామాజంలో మార్పుకు విద్యకీలకమైన పాత్ర పోషిస్తుందనీ ,అది ఒక ఆయుధంవలె పని చేస్తుందనీ ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. చదువుకునే క్రమంలో కొన్ని సామాజిక బృందాలలో ప్రత్యేకమైన  చైతన్యం వికసిస్తుందనీ,ఆ సామర్థ్యం విద్యకున్నదని కూడా చెబుతుంది..చదువు కేవలం జీవిక కోసమే కాదనీ దళితుల విముక్తికి అదొక శక్తివంతమైన సాధనం అనీ ,వారిపట్ల అమలయ్యే అన్యాయానికీ అవమానానికీ విరుద్ధంగా పోరాడే శక్తి ఇస్తుందనీ అంబేడ్కర్ కూడా చెప్పి వున్నాడు.

జీవితంలోని అనేక అంశాలలో వచ్చిన మార్పులనూ పరిణామాలనూ కూడా ఈ రచనలో చూడవచ్చు. యెలుకటి కటుంబానికి చెందిన మూడుతరాల వ్యక్తులు రైల్వేలో పనిచేశారు. దశాబ్దాలుగా రైల్వేలో వచ్చిన పరిణామాలకు వారు ప్రత్యక్ష  సాక్షులు. గర్జిస్తూ వచ్చే ఆవిరి ఇంజన్లనుంచీ నిశ్శబ్దంగా వచ్చే ఎలెక్ట్రికల్ ఇంజన్లవరకూ, మనుషులు ఇచ్చే సిగ్నల్స్ నుంచీ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వరకూ ,టెలిగ్రాఫిక్ సందేశాలనుంచీ కంఫ్యూటర్ ప్రోగ్రామింగ్ వరకూ చూశారు.అట్లాగే యెలుకటి కుటుంబపు జీవన విధానంలోనూ ఆహారపు అలవాట్లలోన వచ్చిన పరిణామాలుకూడా చూడొచ్చు.వంటకు మట్టికుండలు పిడతల నంచీ అల్యూమినియం పాత్రలలోకి ,జొన్న రొట్టెనుంచీ గోధుమ చపాతీలోకి ,ఉమ్మడికుటుంబంనుంచీ వ్యష్టి కుటుంబాలలోకి నిరక్షరాశ్యతనుంచీ  ఉత్తమ శ్రేణి సంస్థలలో ఉన్నత విద్యలోకి..,విదేశాలలో సదస్సులలో పాల్గొనడానికి..

కిరోసిన్ లాంతరు మసక వెలుగులో చదువుకుని మెట్రిక్యులేషన్ తరువాత , రైల్వేలో మామూలు సిగ్నలర్ గా ఉద్యోగం ప్రారంభించి ,మళ్ళీ చదువుకుని  ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ అబ్బసాయిలకు ఈ పుస్తకం ఒక ప్రశంస.

ఈ అద్భుతమైన రచనలో కేవలం వర్తమాన పరిస్థితుల ను గురించిన వివరణతోపాటు అన్ని అడ్డంకులనూ ప్రతికూలతలనూ ఎదుర్కునే   శక్తిసామర్థ్యాలు మనుషులలో  స్వాభావికంగా వుంటాయని కూడా అర్థం  చేసుకుంటాం.ఇటువంటి కథనాలు ఆయాసమాజాలలోని ఇతరులనుకూడా ప్రభావితంచేస్తాయి. సామాజిక ఆర్థిక ప్రతిబంధకాలను తొలిగించుకోడానికి విద్యను ఎట్లా ఉపయోగించుకోవాలో అర్థంచేయిస్తాయి. సామాజపు నిచ్చెన మెట్లు అధిరోహించడం సాధ్యమేననే ఆశను ఉద్దీపింపజేస్తాయి.

హక్కులకోసం పోరాడుతున్న దళితులనుద్దేశిస్తూ 1947 ఆగస్టులో డాక్తర్ అంబేడ్కర్ చేసిన ప్రసంగాన్ని ఉదహరిస్తూ ఈ ముందుమాట ముగిస్తాను

“  నేనిచ్చే సందేశం ఇదే… పోరాడాలి, మరింతగా పోరాడాలి..త్యాగాలు చెయ్యాలి, మరన్ని త్యాగాలు చెయ్యాలి. బాధనూ త్యాగాలనూ లెక్కచెయ్యకండా పోరాడడమే వారికి విముక్తినిస్తుంది. తప్ప మరేదీ ఇవ్వదు

దళితులంతా   ఉన్నతి సాధించడంకోసం   ఒక ఉమ్మడి ఆకాంక్ష ను అభివృద్ధి చేసుకోవాలి.తమ ఆశయానికున్న పవిత్రతను విశ్వసించి దాన్ని సాధించాలనే సమష్టి నిర్ణయం తీసుకోవాలి ఈ కార్యం చాలాగొప్పది.దాని లక్ష్యము చాలా ఉదాత్తమైనది..కనుక అస్పృశ్యులంతా కలిసి ఇట్లా ప్రార్థించండి” తాము ఎవరిమధ్యనైతే జన్మించారో వారి ఉన్నతికోసం పనిచెయ్యడమనే తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారు ధన్యులు.బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎవరు తమ కాలాన్నీ, శారీరక ఆత్మిక శక్తుల్ని ధారపోస్తారో వారు ధన్యులు ..మంచి జరిగినా,.చెడు ప్రాప్తించనా, ,సూర్యకిరణాలు ప్రసరించినా తుఫానులు విరుచుకుపడినా గౌరవం దక్కినా , అవమానాల పాలైనా, ,అస్పృశ్యులు తిరిగి తమ మనిషితనాన్ని పొందేవరకూ పోరాటం ఆపేదిలేదనే  ధృడ నిశ్చయంతో వున్నవారు ధన్యులు”

 

అక్టోబర్ 2011                                                                                                                                                                                                                     ఎస్ .ఆర్.శంకరన్

తెలుగు అనువాదం      పి సత్యవతి ( డాక్టర్  వై.బి.సత్యనారాయణగారి సహకారంతో)

 

 

 

ఆవేశం తప్ప సందేశం లేని నల్ల మిరియం చెట్టు !

  డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వారు నల్ల మిరియం చెట్టు నవలపై చర్చాసమీక్ష వ్యాస రూపం ఇది

నవలా రచయిత: డా|| వి. చంద్రశేఖరరావు
ముద్రణ: చరిత ఇంప్రెషన్స్, హైద్రాబాద్
ప్రచురణ తేదీ: జనవరి 2012

చర్చాస్థలం: ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంధాలయం, ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్
తేదీ: మే 12, 2013
చర్చలో పాల్గొన్నవారు: ఆరి సీతారామయ్య, మద్దిపాటి కృష్ణారావు, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, మారంరాజు వెంకటరమణ, బూదరాజు కృష్ణమోహన్, అడుసుమిల్లి శివరామకృష్ణప్రసాద్, పిన్నమనేని శ్రీనివాస్

డా. వి. చంద్రశేఖర రావు రచించిన ” నల్ల మిరియం చెట్టు” నవలను ఆసాంతం చదివి, మళ్ళి చదివితే గోచరించిన కథావస్తువు(లు) మూడు సమాంతర రేఖలుగా సాగాయనిపించింది. స్థూలంగా, ఇది రాజసుందరం అవకాశవాద రాజకీయ ప్రయాణభాగం, ఇది దళిత యువతకు ఆవిష్కృతమౌతున్న రాజకీయ చదరంగం, ఇది దళిత జీవన విధానంలోను, కళల్లోను ఉన్న ఔన్నత్యాన్ని చెప్పడానికి చేసే ప్రయత్నం.

కథాకాలానికి రాజసుందరం ఒక వ్యాపారవేత్త. పుట్టింది మాదిగ కుటుంబంలో. పల్లెల్లోని మాదిగల జీవితానుభవాలు తన కొడుక్కి అంటకూడదని, క్రైస్తవ మిషనరీల సహాయంతో కొడుకుని చదివించింది తల్లి. మాదిగల జీవితానుభవాలతో పాటు, తనవారి జీవితాల్నే అసహ్యించుకునే ఎత్తుకు ఎదిగాడు చదువుకున్న రాజసుందరం. ఉపాధ్యాయ వృత్తిని వదిలి, వ్యాపారవేత్తయై, అవసరానికి తను పుట్టిన కులాన్ని వాడుకుంటూ, రాజకీయ సోపానాలు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో లోపం ఎవరివల్ల కలిగినా సహించలేడు – కొడుకైనా, కూతురైనా, భార్యైనా, తమ్ముడైనా, తల్లైనా, ఆఖరికి తనకు ఉపయోగపడే కుల రాజకీయాన్నైనా. కారాదేదీ తన ఆశలకీ, ‘ఆశయాలకీ’ అడ్డంకి!

పల్లెల్లో ఉన్నంతగా కాకపోయినా, ఎంతో కొంత తను పుట్టిన కులం పేరుతో ఎదురయ్యే అవమానాలను చూసిన యువతి గ్రేస్ కమల – రాజసుందరం కూతురు. రాజసుందరం కొడుకు రూమీకి మాదిగ దండోరా ఒక ఆకర్షణ, వయసుకూ అనుభవానికీ మించిన ఆత్మగౌరవ నినాదం. అలాగే పేర్లతోనే పరిచయమైనా, వెనుక చిన్నదో పెద్దదో కథ ఉన్న యువతీయువకులు ఇంకొందరు. పల్లెల్లో మాదిగల జీవితానుభవాలను చవి చూసి సామ్యవాద ఉద్యమం బాసటగా కుల వివక్షపై పోరాడి, చివరకు మాదిగ దండోరా ఆత్మగౌరవ నినాదంగా స్వీకరించిన రాజసుందరం తమ్ముడు కరుణ కుమార్, మాదిగ యువతకు స్ఫూర్తి, ఆదర్శం. ఒక పక్క రాజసుందరం రాజకీయపుటెత్తులతో మాదిగలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తానని చెప్పినా, రెండవవైపు మాదిగ దండోరాతో ఆత్మగౌరవాన్ని సంపాదించుకునే ప్రయత్నం పైనే ఈ యువత మొగ్గు. ఈ సందిగ్ధంలో ఆత్మగౌరవానికి బదులు ఆత్మనివేదనతో సరిపెట్టుకోవలసి వచ్చింది యువతరం.

కథంతా మనకు చెప్పే కమల ఇంటర్మీడియట్ విద్యార్ధిని. ఇంచుమించుగా పుట్టినప్పట్నించీ పట్టణంలోను, ధనవంతుడి బిడ్డగానూ పెరిగిన కమలకు మాదిగపల్లె జీవనం, వాతావరణం, సంస్కృతి, ఆహార వ్యవహారాలూ ఒక కాల్పనిక ఆకర్షణ. తండ్రి చేతిలో నిత్యమూ కౄర హింసకు గురయ్యే తల్లీ, ఊర్లోకి వచ్చిన కొడుకు పలకరింపుకు కూడా నోచుకోని నాయనమ్మల అన్యోన్యానురాగం కమలకు ఒక మనోహరమైన ప్రపంచం. డొంకల్లో చెయ్యి పట్టుకున్నందుకు కామందు పీచమడచిన మేనత్తలు, పోలీసులయేది, రాజకీయనాయకుడైన బావయేది లెక్క చెయ్యకుండా నిర్భయంగా ఎదురించగలిగే పిన్ని, కమలకు వీరోచిత ఆదర్శ జీవనులు. చివరకు, తండ్రిని లెక్క చేస్తూనే లెక్క చెయ్యని తమ్ముడు రూమీ కూడా కమలకు కలల పంటే.

ఈ మూడు కథలూ ఒకదాన్నొకటి పెనవేసుకుని నడిచేలా చెయ్యాలని రచయిత ఎంత ప్రయత్నించినప్పటికీ, దేనికదే. రాజసుందరాన్ని విడదీసి చూస్తే, అతనో నియంత, అవకాశవాది, కౄరుడు, ఏ లౌకిక భావనకూ లొంగని ఒక కర్మవాది. అతను మాదిగ కావడానికి, మాదిగగా అవమానాలు పడడానికి, వ్యక్తిగా రాజసుందరానికీ ఏమాత్రం సంబంధం లేదు. ఏ కులస్తుడైనా, ఆ కుటుంబంలో ఎవరెవరున్నా లేకపోయినా, రాజసుందరం ఒక psychopathic పాత్ర మాత్రమే.

కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదుగుతున్న రాజసుందరం అవకాశవాదియై, అవసరాన్నిబట్టి మాదిగ దండోరాను వ్యతిరేకించడం ద్వారా తన కుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా తయారయ్యాడని రచయిత చెప్పదలిస్తే అందులో ప్రత్యేకతేమీ లేదు. అలాంటి అవకాశవాదులు ఏ ఒక్క కులానికీ, దేశానికీ, ప్రాంతానికీ, జాతికీ సొంతం కాదు. పైగా అన్ని అవలక్షణాలూ ఒకే పాత్రలో ఇమిడ్చి, రాజసుందరాన్ని ఒక కుల ద్రోహిగా కంటే, ఒక మానసిక రోగిగా మాత్రమే చూపించగలిగారు.

రెండవ కథావస్తువు మాదిగ దండోరా ద్వారా ఆత్మగౌరవ చైతన్యాన్ని కలిగించడం. అక్కడక్కడా సూచన ప్రాయంగా మాదిగలకు కలిగిన/కలుగుతున్న అవమానాలను, వాటిని ఎదుర్కోవడానికి మాదిగ దండోరా ఆవశ్యకతను చెప్పడమే గానీ, తాత్వికంగా, తార్కికంగా లోతుల్లోకి వెళ్ళి విశదీకరించే ప్రయత్నం జరగలేదు. జడ్జి నాగభూషణం ఆత్మహత్య దీనికి చక్కటి ఉదాహరణ. ఎంతో తెలివైనవాడు, చదువుకున్నవాడు, జిల్లా జడ్జి స్థాయికి ఎదిగినవాడు, ఎంతో అనుభవాన్ని కలిగినవాడు, అంత వయసులో ఆత్మహత్య చేసుకున్నాడంటే అంత సామాన్యమైన విషయం కాదు. మాదిగగా అతనికి కలిగిన అవమానాలు ఆ వయసులో కొత్త అనుభవాలు కాజాలవు. ఐనా ఆత్మహత్యకు పాల్పడేంత స్థితికి అతన్ని గెంటిన పరిస్థితులను పాఠకులకు విశదీకరించడంలో రచయిత విఫలమయ్యారు.

కేవలం అవమానాలకు గురయ్యారంటే సరిపోదు. యాసలోనో, భాషలోనో, వేషంలోనో, శరీరపు రంగులోనో, రూపంలోనో ఎప్పుడూ అందరం ఏదో ఒక రకమైన అవమానాన్ని ఎదుర్కుంటూనే ఉంటాం. ఒకరి హాస్యం మరొకరికి అవమానం. కానీ అవమాన భావన సమ ఉజ్జీల మధ్య లేదా సమ ఉజ్జీలనుకునే వారి మధ్యే ఎక్కువగా ఉంటుంది. కోట్లు గడించినవాడు బిక్షగాణ్ణి ‘నువ్వు దరిద్రుడివి’ అంటే ఆ కోటీశ్వరుడి అజ్ఞానికి బిక్షగాడు ‘అలాగా’ అని నవ్వుకుంటాడే తప్ప అభిమానపడితే ఒరిగేదేమీ లేదని తెలుసు. సమ ఉజ్జీలు ఎప్పుడూ స్థిరంగానూ ఉండరు. ఆర్ధిక సాంఘిక స్థితిగతుల్ని బట్టి మారుతూ ఉంటారు. రాజసుందరానికిగాని తన కుటుంబానికిగాని ఇప్పుడు తను పుట్టి పెరిగిన పల్లెలో అభినందనే గానీ అవమానం ఉండదు. కానీ పట్టణంలో తన ఆర్ధిక స్థితిగతులతో తూగే వాళ్ళు అవమానించదలుచుకుంటే కులాన్ని వాడుకుంటారు. కుల చరిత్ర తెలియకపోతే, రంగునో, ఆకారాన్నో, లేదా మరొకటో వాడుకుంటారు. కానీ పల్లెల్లో మాదిగలు ఎదుర్కొనే వివక్షకు, పట్టణంలో రాజసుందరం లాంటి వారికి ఎదురయ్యే అవమానాలకూ మౌలికమైన భేదం ఉంది.

తిండి, గుడ్డ, ఇల్లు లేని వాడికి వివక్ష ఒక జీవన్మరణ సమస్య. ఆర్ధిక స్థితిగతుల్లో రాజసుందరం లాంటి స్థాయిలో ఉన్నవారు ఏ కులంలోని వారైనా ఎవరో ఒకరి వల్ల, ఏదో ఒక రీతిలో వివక్షను ఎదుర్కుంటూనే ఉంటారు. అది డబ్బున్నవాడి జబ్బు లాంటిది, తగ్గకపోతే అది ప్రయత్నలోపం మాత్రం కాదు. మాయావతి చెప్పులు కొనుక్కోవడానికి ముంబాయి విమానంలో వెళ్ళడం, జయలలిత లంచాల రాజకీయాలు, నెహ్రూ కుటుంబం వారసత్వంగా పరిపాలన చేయాలనుకోవడం, అన్నీ మౌలికంగా ఒకటే. కానీ మాయావతి విలాసం కులపుటద్దంలో, జయలలిత లంచగొండితనం నీచ రాజకీయంగాను, నెహ్రూ కుటుంబ అధికారకాంక్ష సహజమైనదిగాను ప్రదర్శించబడుతుంది. వీటివల్ల వాళ్ళ బ్రతుకుదెరువుకేమీ లోపం రాదు. అంతా రాజకీయ చదరంగమే.

అందులో నెగ్గగలిగిన వాడు నెగ్గుతాడు, లేనివాడు ఓడిపోతాడు. వాళ్ళకు కలిగే అవమానాలకు జాలి పడాల్సిన అవసరమూ లేదు, దానికి వాళ్ళు కృంగిపోయేదీ లేదు. కానీ, జడ్జి నాగభూషణానికి కులం పేరుతో జరిగే చిన్నచూపు అతని ఆత్మగౌరవానికి గొడ్డలిపెట్టు, కరుణకైతే అది జీవన్మరణ సమస్య. వీరిద్దరి అనుభవాలు మౌలికంగా మానవతావాదానికి సంబంధించినవి. మాదిగలకు ఆత్మగౌరవ చైతన్యాన్ని కలిగించడం నవల ఉద్దేశమైతే, వీరి జీవితాలను, ముఖ్యంగా నాగభూషణం జీవితాన్ని ఆధారంగా చేసుకుని తాత్విక చర్చ జరగవలసింది. రాజసుందరం లాంటి అవకాశవాదుల వల్ల మాదిగలకు వచ్చే రాజకీయ ముప్పుకంటే, సమాజంలో తమ వ్యక్తిత్వాన్ని అన్ని రకాలుగానూ నిరూపించుకున్నప్పటికీ ఎదురయ్యే వివక్షను జయించడం కష్టమైన పని. చంద్రశేఖరరావు లాంటి మేధావులు దృష్టి సారించవలసినది, ఈ మౌలిక సమస్యలమీద. లేక, ఇది కేవలం దళిత వర్గీకరణ సమస్య మీద మాత్రమే ఐతే, ఇదొక రాజకీయ నవల మాత్రమే అవుతుంది, వర్గీకరణను తిరస్కరించే వారి కథలకూ సిద్ధపడాల్సి ఉంటుంది. ఫలితం రాజకీయ చదరంగమే కానీ, దళితుల బాగోగులు కాదు!

పాత్రలను సృష్టించి, అవే కథను నడిపించేట్టుగా జాగ్రత్త తీసుకుని, తను ప్రేక్షకుడిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు రచయిత చెప్పుకున్నారు. కానీ, కథ చెప్తున్న కమల వయసుకు, అనుభవానికి మించిన వివరణలు రచయిత ఆశయం నెరవేర్చలేకపోయాయి. కమల పుట్టింది పల్లెలో కాదు. ఆ మాటకొస్తే, రాజసుందరం కూడా పల్లెలో కమలకు రెండేళ్ళప్పుడు కొన్ని నెలలు మాత్రమే ఉన్నాడు (పేజి: 77). కానీ పల్లె గురించిన కమల వర్ణనకు, తనకు పల్లెతో ఉన్న సంబంధానికీ పొత్తు కుదరదు. కమల కలల్లో మాదిగలకు ఇతర వర్గాలకు జరిగిన పోరాటాల వర్ణన, కేవలం విన్నంత మాత్రాన వచ్చే కలలు కావు. పెంచుకుంటున్న పావురాలు చచ్చిపోయాయని (ఎవరో చంపేశారని) పదకొండేళ్ళ పిల్ల బడి ఎగ్గొట్టి పిచ్చిపట్టినదానిలా ఊరంతా తిరగడం (అదీ పట్టణంలో) వయసుకు తగ్గ పనేనా (పేజీ: 57)? సాధారణంగా చిన్న వయసులోని అనుభవాలను, అప్పట్లో నచ్చినా నచ్చక పోయినా, వాటికి దూరమైనప్పుడు గుర్తు తెచ్చుకుని గతకాలం గొప్పదనాన్ని ఊహించుకుని ఆనందించడం పరిపాటి. కమల పుట్టింది, పెరిగింది, పట్టణంలోనే. తన చిన్ననాటి అనుభవాలన్ని, పట్టణానికి సంబంధించినవే కానీ పల్లెతో కాదు (చుట్టపు చూపుగా వెళ్ళినప్పుడు తప్ప). అలాంటిది, మట్టి, పేడ, చెమట కలసిన వాసనను రొమాంటిగ్గా ఊహించుకోగలిగే అవకాశం కమలకు లేదు, రచయితకు తప్ప.

ఇక రచనా శైలిలో చాలా ఇబ్బందే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రాకెట్లలో ఇచ్చిన వివరణలు. ఇవి కమల పాత్ర స్వగతాలో, రచయిత వివరణలో, చారిత్రక సత్యాలో తెలియని అయోమయ స్థితి. చాల వరకు, ఇవి నాటకాల్లోని ‘స్వగతముగా’ అని వ్రాసిన మాటలను పాత్ర గొంతెత్తి అరిచినట్లుగా అనిపిస్తాయి. పోనీ ఇవన్నీ కమల స్వగతాలా అనుకుందామంటే, ప్రధమ పురుషలో చెప్పే కథకు వీటి అవసరం కనిపించదు, వాక్యాన్ని తిరిగి రాయడం బద్ధకమైతే తప్ప. చాలా చోట్ల బ్రాకెట్లు తీసేస్తే, చెప్పదలుచుకున్న విషయానికి లోపమూలేదు. ‘గుండ్లకమ్మ (నది కాదు వాగు) …’ అని వివరించడంలో (పేజి: 81) ఒక అపోహను పోగొట్టే ప్రయత్నం ఉంది. కానీ, ‘వేదిక చివరన ఒక మూలన కరుణ బాబాయి (శాపగ్రస్తుడిలా) కూలబడ్డాడు.’ (పేజి: 101) అని వ్రాయాడంలో ఒరిగిందేమిటి? ఇంకొక చోట (పేజి: 170), ‘అందరూ బాలెట్ పేపరుపై దండోరా నినాదాలు రాసి వెళ్ళారు (ఆ విషయం బాలెట్ బాక్స్ లు ఓపెన్ చేసినాక తెలిసింది)’. ఇది రచయితను పాఠకులు ‘నీకెలా తెలుసు?’ అని ప్రశ్నిస్తారేమోననుకుని ఇచ్చుకున్న జవాబులా లేదూ? తొంభై నాల్గవ పేజీలో ఉపన్యాసం వ్రాస్తున్న సందర్భాన్ని గురించి వివరిస్తూ, ‘మొదటి పేరాలో నలభై ఏళ్ళ క్రితం దళితులు (కులం పేరు కావాలనే రాయలేదు) ….’ అని వ్రాయడంలో, బ్రాకెట్లలోని వాక్యం ఎవరినుద్దేశించి? రచయితనా? ఉపన్యాసాన్ని వ్రాస్తున్న వాళ్ళనా? లేక కథ చెప్తున్న కమలనా? ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అక్కడక్కడా కొన్ని వాక్యాలను తిరిగి వ్రాయాల్సి వచ్చినా, మొత్తం మీద బ్రాకెట్లన్నీ ఏరి పారేస్తే వచ్చే నష్టం లేదు సరికదా, ‘దీని భావమేమి తిరుమలేశా?’ అని పాఠకులు బుర్ర గోక్కోవాల్సిన అవసరం తప్పేది. ఇక కథా గమనంలో ముందు వెనుకలు పాఠకుణ్ణి చాలా ఇబ్బందులు పెడతాయి.

నాలుగవ అధ్యాయం మొదలు, ‘జనవరి చివరి వారంలో ….’ తో మొదలవుతుంది. ఒకటిన్నర పేజీ గడిచాక, ‘ఆ జనవరి నెలలో అనుకోకుండా మేము తాతయ్య వాళ్ళ ఊరికి బయలుదేరాము’ తో మొదలై 38 పేజీలు నడుస్తుంది, ఐదవ అధ్యాయం చివరిదాక! అలాగే, 73 వ పేజీలో, మొదటి పంక్తిలో ‘ఐదారేళ్ళ కాలంలో ఎంతో మారిపోయాడు’ అని బాబాయిని వర్ణించి, రెండవ పేరా మొదట్లో ‘పదేళ్ళలోనే ఎంత మారిపోయాడు’ కు వెళ్తుంది! రాజసుందరం తల్లి బ్రతికుండగా చేసిన వర్ణనలోనే ‘మిషన్ స్కూల్లో ఎందుకు వేశానా అని నాయనమ్మ చివరి రోజుల్లో చాలా బాధ పడేది’ అని వ్రాయడం చంద్రశేఖరరావు లాంటి అనుభవజ్ఞులైన రచయితలు చెయ్యాల్సిన పని కాదు. పైగా నవల చివరిలో నాయనమ్మ చావు కమల దగ్గర ఉండగానే జరిగింది, అప్పటివరకు నాయనమ్మతో చాలా సంభాషణలే జరిపింది. ఎక్కడా తండ్రి గురించిన ఫిర్యాదు కమల నాయనమ్మ దగ్గర వినలేదు. ఇవన్నీ రచయిత తను వ్రాసింది తిరిగి చదువుకుంటే వదిలించుకోగలిగే దోషాలే. కానీ చదువుకున్నారా అన్నదే అనుమానం! ఎందుకంటే, తన రచనలో దొర్లిన పరస్పరవైరుధ్యాలను పోల్చుకోలేని రచయిత కాదుగనక. మరొక్క మాట: పుస్తక ప్రచురణలో అచ్చు తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడవలసిన అవసరం గురించి పదే పదే చెప్పడం చెప్పేవారికి, వినేవారికీ విసుగనిపించినా చెప్పక తప్పదు. ఇది ఈ పుస్తకానికి మాత్రమే కాదు, చాలా తెలుగు పుస్తకాలకు వర్తిస్తుంది. ఒకే మాటకు ఎన్నో అర్ధాలున్న తెలుగులో, తెలుగుకు ఒక ప్రామాణిక నిఘంటువు లేని పరిస్థితుల్లో, ఇవి అచ్చు తప్పులో, పాఠకుల పరిమిత జ్ఞానానికి అందని పదాలో తెలియని అయోమయస్థితి ఏర్పడుతుంది. ఈ అయోమయస్థితి నుండి పాఠకుల్ని రక్షించగలిగేది ఒక్క ప్రచురణకర్తలే!

చివరిగా, శివారెడ్డి గారి ముందుమాట మరీ నిరాశ పరిచింది. ఇది ఆషామాషీగా రాసిన ముందుమాట కాదు. చంద్రశేఖరరావు గారిని రచయితగాను, వారి రచనలను బాగా చదివి ఆకళింపు చేసుకున్న కవి శివారెడ్డి గారు. ముందుమాట విశ్లేషించి రాసే విమర్శ కాకపోవచ్చు. కానీ చంద్రశేఖరరావు గారికి పేరు తెచ్చిన రచనలతో పోల్చి చూస్తే, ఈ నవల చాలా నాసి రకమని మా అభిప్రాయం. పైన మేము ఉదహరించిన లోపాలేవీ శివారెడ్డి గారికి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా ఒక పురాగాథను కథనం చేయడంలో కొట్టుకు పోయారంటూ, కళ్యాణరావు గారి ‘అంటరాని వసంతం’ నవలతో పోల్చారు. అంటరాని వసంతం ఒక చరిత్ర గానం, ఒక మాల పురాణం. ఈ నవల మాకు తోచినంత వరకు వర్తమాన రాజకీయం. ఈ రాజకీయ చరిత్రలో ఏ కులం పేరు పెట్టినా, లేదా ప్రాంతాల వివక్షలను గురించి ప్రస్తావించినా కథ మారదు. కథ చెప్పడంలో ఒక ఆవేశానికి రచయిత కొట్టుకుపోయాడనిపిస్తుంది. కానీ అది రాజకీయ ఆవేశంగా పరిణమించిందే తప్ప, మాదిగల చరిత్రను, ఆత్మగౌరవ సందేశాన్ని ఆవిష్కరించినట్లనిపించలేదు.

సమీక్షకుడు: మద్దిపాటి కృష్ణారావు

మాయపొరల్ని ఎప్పటికప్పుడు ఒలుచుకోవాలి!

Kavita 2012 

(మేడే నాడు విజయవాడలో విడుదలయిన ‘కవితా2012’కి ప్రముఖ విమర్శకులు పాపినేని శివశంకర్ రాసిన ముందు మాట)

Every child is an artist, the problem is staying
an artist when you grow up.                                                        Pablo Picasso

 

‘కళ్లుంటే ఉంటే చూసి, వాక్కుంటే వ్రాసీ’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరూ చూడలేనివి చూడగలగటం, ఎవరూ రాయలేనివి రాయగలగటం మనిషిలో సృజనాత్మకతకి సంబంధించినవి. శ్రీజ అనే పాఠశాల చదువరి దేన్ని చూసి, ఏమి వ్రాసిందో చూడండి.

‘అమ్మ తుడుపుతుంది చెడును
పొరపాట్లను తుడుపుతుంది రబ్బరు
నల్లబూడిదను తుడిపి
తెల్లకాంతిని వెలిగిస్తుంది రబ్బరు
రబ్బరు, రబ్బరు, తెల్లని రబ్బరు’

పెద్ద పెద్ద విషయాల మీద గంభీరమైన కవిత్వం వ్రాయటం ఒక రకంగా తేలిక. చిన్న చిన్న సంగతుల మీద రాయటం చాలా కష్టం. ఒకానొక అవధానంలో కలం పాళీ మీద సీసపద్యం చెప్పమన్నప్పుడు తిరుపతి వేంకటకవులంతటి ఆశుకవులే కాస్త ఆలోచించాల్సి వచ్చింది. ఈ చిన్నారి తెల్ల కాగితాన్ని జీవితంతో, దానిమీద తప్పుల నల్లదనాన్ని బ్రతుకులోని చెడుతో అన్వయించింది. ‘మనం చేసే చెడును తుడపడానికి రబ్బరు ఉందా?’ అని ప్రశ్నించుకొని ‘మనం చేసే మంచి పనులే చెడును తుడపడానికి ఉపయోగపడే రబ్బరు’ అని లోతైన చూపుతో ముగించింది. నిసర్గమైన సృజనాత్మకత అది.
ఈ సృజనాత్మకతకి పునాది ఏది? చిరుగాలికి సైతం చిగురుటాకు చలిస్తుంది. కొలను అలలు కూడ మనసులో మల్లెల మాలలూపుతాయి.అదే సహజస్పందన. ప్రకృతి తనలోని చరాచర రూపాల ద్వారా అశేషమైన నమూనాల నిచ్చింది. వాటికి రంగు రూపు, కొలత ఉంటాయి.  కవి  గాని కళాకారుడు గాని ఆ మూలసంపదనుంచే తన మూలకాలు గ్రహిస్తాడు. వాటిని దృశ్యాలుగా, ప్రతీకలుగా, సంకేతాలుగా మలుచుకొంటాడు. అందుకెంతో ఊహాశక్తి ఉండాలి. ఊహే సృజనకి ప్రారంభం అన్నాడు బెర్నార్డ్‌ షా. ఊహని కళగా మలచగలిగే కల్పనాశక్తి కావాలి.  దానికి చక్కని రూపం ఇవ్వటానికి చిక్కని భాష, భావపద చిత్రాలు ఎట్లాగూ అవసరమే.
స్పందనాశీలం ఉన్నప్పుడు రెక్క చిరిగిన సీతాకోక చిలక రాతిమీద  పడినప్పటి ‘నిశ్శబ్ద విషాదధ్వని’ వినగలడు కవి. తనలోని ‘చెట్టు చిగిరింత’ గమనించగలడు. ‘కొండగోగుల రేలపాట’కు చెవియొగ్గగలడు. రామప్ప ‘ఉలి కళ’లోని కళకళ దర్శించగలడు. ఆకలిగొన్న పావురాళ్లకి నాలుగుగింజలు వేస్తున్న పాపలో ఆ స్పందనాశీలమే కదా కదలాడుతున్నది? అదే కదా మగవాళ్ల ‘మృగ ` తృష్ణ’ని ప్రశ్నిస్తున్నది?
సృజనశీలికి ‘కల్లోల కడలిలో అలల కవాతు’ కనపడుతుంది. ‘ఎండ కూడా పండువెన్నెలే’ అవుతుంది. పాట ‘ప్రాణప్రవాహ’మవుతుంది. ‘విరబూసే కలలకు అలసట’ లేదని ఒక ప్రాకృతిక భావుకురాలు భావిస్తే, ‘విత్తనాలవుతున్న మనుషుల్ని, మనుషులవుతున్న విత్తనాల్ని’ ఒక విప్లవ సృజనకారుడు గుర్తిస్తాడు. కలం యోధుడిలో ‘ఉద్యమ నెలరేడు’ను కనుగొంటాడు. ఆ స్పందనకి, సృజనకి ఈ సంకలనం ఒక అద్దం.

ఈ తరళత్వాన్ని, సృజన తత్వాన్ని మొద్దుబార్చే పరిస్థితుల మధ్య ఇవాళ కవి నిలబడి ఉన్నాడు. పికాసో అన్నట్టు శ్రీజ బాల్యంలోని సృజనాత్మకత నిండు జవ్వనంలోను మిగిలిఉంటుందా అన్నదే సమస్య. యాంత్రికమైన చదువులు, ఆందోళన నిండిన ఉద్యోగాలు, ఆర్థికదాహాలు, వ్యక్తులు హోదాలుగా మారిపోవటాలు, అధికార దర్పాలు, అమానవీయతని అలవాటు చేస్తున్న మొరటు దృశ్యమాధ్యమాలు మొదలైనవెన్నో మనిషిలోని సున్నితమైన స్పందనాతంత్రుల్ని తెంచివేస్తున్నాయి. సృజనపుష్పాన్ని చిదిమేస్తున్నాయి. ఆ మాయపొరల్ని ఎప్పటికప్పుడు ఒలుచుకోవాలి. వంచనావిద్యని అవిద్య చెయ్యాలి. కలలతో, కళలతో జీవితమృదుత్వం కాపాడుకోవాలి.

గుంటూరు 25 ఏప్రిల్‌ 2012

తొమ్మిదేళ్ళ అనుబంధం : సాహితీ మిత్రులు

మనిషిని పరిపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే అనివార్యంగా మనం కవిత్వాన్ని ఆశ్రయించవలసి వుంటుంది.

మనిషిలోని మానుషత్వం కవిత్వంలో ప్రకటితమవుతుంది. కవిత్వం ద్వారా పరిపుష్టమవుతుంది. యుగయుగాలు, దేశదేశాల మనుషుల సుఖదుఃఖాలు, జయాపజయాలు, ఆరాట పోరాటాలు, అంతస్సంఘర్షణలు, ఉత్థానపతనాలను కవిత్వం కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తుంది. నిజానికి మనిషిలోని మానుషత్వపు చరిత్రే కవిత్వ చరిత్ర. మానవ జీవన సారాన్నీ, రూపాన్నీ వివిధ స్థాయిల్లో అత్యంత శక్తివంతంగా అభివ్యక్తం చేయగలిగింది ఒక్క కవిత్వం మాత్రమేనని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఏ దేశానికి చెందిన వాడయినా, ఏ కాలానికి చెందిన వాడయినా మానవ సంవేదనని మనం కేవలం కవిత్వం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ప్రపంచంలోని ఏ జాతి జనుల హృదయనాళ స్పందననయినా ఆ జాతి సృష్టించిన కవిత్వంలో మాత్రమే మనం స్పష్టంగా గుర్తించగలం. కవిత్వంతో మనం అనుబంధాన్ని కొనసాగించటమంటే మొత్తంగా మనం మానవత్వంతో అనుబంధాన్ని పెంచుకోవడమే.

మిగిలిన అన్ని సాహితీ రూపాలకన్నా కవిత్వం అత్యంత ప్రాచీనం. ఇది అందరూ ఆమోదిస్తున్న ఒక వాస్తవం. అయితే ఒక్క కథని మాత్రమే కుడీ ఎడంగా కవిత్వమంత ప్రాచీనమయినదిగా భావించవచ్చు. వందల వేల సంవత్సరాలు ఈ రెండు ప్రక్రియలు కలిసి కొనసాగాయి. అయితే కవిత్వం మన మాతృభాష అంత సహజంగా వుంటుంది. అమితమయిన ఆనందంలోనూ, భరింపశక్యం కాని దుఃఖంలోనూ మనిషి తన మాతృభాషనీ, కవిత్వాన్నీ సమీపిస్తాడు. అనగా మానవీయ భావనల అభివ్యక్తికి అత్యంత ఆత్మీయమయిన మాధ్యమం కవిత్వం.

మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తితో రూపం దాల్చిన సాహితీమిత్రులు, విజయవాడ అందుకే ఈ రంగాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకుంది. అవాంతరాలు ఎన్ని ఎదురయినా అవిచ్ఛిన్నంగా ముందుకు సాగిపోతున్నది. క్రమం తప్పకుండా కవితా వార్షికలను ప్రచురిస్తున్నది. ఇది సాహితీమిత్రులు సగౌరవంగా, సవినయంగా సమర్పిస్తున్న తొమ్మిదో కవితా సంపుటం. ఇది ఒక మహా సంకల్పం. సహృదయులయిన మీ అందరి ఆశీస్సులు, చేయూతా నిరంతరం మాకు అవసరం.

కవులకు అధ్యయనం అవసరం. మరీ ముఖ్యంగా ఇతర కవుల రచనల్ని కొనుక్కుని మరీ భద్రపరచుకోవటం కవితాప్రియులందరూ తప్పనిసరిగా ఆచరించవలసిన సత్సంప్రదాయం. ఇది యేదో వ్యాపార ప్రయోజనం కోసం అంటున్నది కాదు. కవిత్వాన్ని కలకాలం కాపాడుకోవటం కోసం, అనుభవ పూర్వకంగా చెబుతూన్న కఠిన వాస్తవం. తెలుగు కవితా సంపుటాల్ని కొనండి ` తెలుగు కవిత్వానికి జీవం పోయండి. ఇది మా నినాదం. మా మనసు లోతుల్లోంచి వస్తూన్న వినతి.

ఎప్పటిలాగే, ఈ యేడాది కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ‘కవిత`2012’ వెలువరించటానికి సహకరించిన సంపాదక ద్వయం డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, దర్భశయనం శ్రీనివాసాచార్యలకు కృతజ్ఞతలు కేవలం లాంఛనం కోసమే. వాళ్ళిద్దరూ వాస్తవానికి సాహితీమిత్రులు, విజయవాడ నుంచి విడదీయలేని విశిష్ట భాగస్వాములు.


అలాగే ఈ ఏడాది ‘కవిత`2012’ కు ఎంపికయిన కవులందరికీ మా కృతజ్ఞతలు..

శుభాకాంక్షలతో…

విశ్వేశ్వర రావు, సాహితీ మిత్రులు

దాచేస్తే దాగదు చరిత్ర

after surrender with Nehru and Chaudhury

లొంగుబాటు తర్వాత నెహ్రూ, జనరల్ చౌదరి తో నిజాం

ప్రజోద్యమం ప్రజ్వరిల్లిన్నప్పుడు సహజంగానే ఉద్యమ సాహిత్యం వెల్లువెత్తుతుంది. ఆ ప్రాంత చరిత్ర, నేపథ్యం ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. గత పది పదిహేనేళ్లుగా సాగుతున్న మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణా అస్తిత్వ ఆకాంక్షను, సంస్కృతీ సంప్రదాయాలను, చారిత్రక విశేషాలను చాటిచెప్పే పుస్తకాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలువడ్డాయి. వాటిలో ఈ ఏప్రిల్‌ 7న ఆవిష్కరించబడ్డ మహమ్మద్‌ హైదర్‌  రచన ”1948: హైదరాబాద్‌ పతనం” ఎంతో విలక్షణమైనది.

నిజానికి ఈ పుస్తకానికీ ఇప్పటి తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికీ సంబంధం లేదు. కానీ ఆనాడు ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మహమ్మద్‌ హైదర్‌ 1947-48లో జరిగిన సంఘటనల గురించి ఎప్పుడో 1952లో రాసిన పుస్తకం ఇన్నాళ్లకి వెలుగు చూడటానికి మాత్రం కచ్చితంగా ఆ ఉద్యమమే కారణమని చెప్పవచ్చు. మొదట్లో భారత ప్రభుత్వంతో తన ఉద్యోగం విషయమై జరుపుతున్న సంప్రదింపులకు విఘాతం కలుగుతుందేమోనన్న భావనతో రచయితే ఈ పుస్తక ప్రచురణను పక్కన పెట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కొంత సాహిత్యం వెలువడింది. 70వ దశకంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి వంటి హేమాహేమీలు ఆనాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట అనుభవాలను వివరిస్తూ పలు పుస్తకాలు ప్రచురించారు.

ఆ సందర్భంగా 1972లో మహమ్మద్‌ హైదర్‌ కూడా తన పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ 1973లో 58 ఏళ్ల వయసులోనే ఆయన హఠాన్మరణం పాలయ్యారు. చివరికి ఆయన కుమారుడు మసూద్‌ హైదర్‌ ”అక్టోబర్‌ కూ – ఎ మెమైర్‌ ఆఫ్‌ ది స్ట్రగుల్‌ ఫర్‌ హైదరాబాద్‌” పేరిట తండ్రి పుస్తకాన్ని 2012లో వెలుగులోకి తెచ్చారు. దాని తెలుగు అనువాదమే 1948: హైదరాబాద్‌ పతనం.

ఈనాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్షిస్తోంది… కాగా ఆనాడు తెలంగాణాతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర దేశంగా కొనసాగాలని ఆశించింది. ఈనాటిది మెజారిటీ ప్రజల ఆకాంక్ష అయితే – ఆనాటిది కేవలం పాలకుల ఆశ. దానివల్లనే హైదరాబాద్‌ సంస్థానానికి పదమూడు నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్యం లభించింది.

razvi

ఖాసీం రజ్వీ

బ్రిటిష్‌ వలస పాలకులు ”స్వాతంత్య్రం ఇచ్చేశాం ఇక తన్నుకు చావండి” అన్న రీతిలో వ్యవహరించడం వల్ల, కావాలని విభజన చిచ్చును రగిలించడం వల్ల ఆనాడు దేశమంతా అల్లకల్లోలంగా తయారయింది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం సుదీర్ఘకాలం అహింసాయుతంగా సాగింది కానీ తీరా స్వాతంత్య్రం సాకారమయ్యే వేళ దేశంలో కనీవిని ఎరుగనిరీతిలో హింస ప్రజ్వరిల్లి రక్తం ఏరులై ప్రవహించింది. బ్రిటిష్‌వాళ్లు తమ ప్రత్యక్ష పాలనలో వున్న ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి పరోక్ష పాలనలో వున్న 565 సంస్థానాలకు ఉద్దేశపూర్వకంగా స్వయం నిర్ణయాధికారాన్ని ప్రసాదించారు. పాకిస్థాన్‌లో చేరతారో, భారతదేశంలో చేరతారో, స్వతంత్రంగా వుంటారో మీ ఇష్టం అని వాళ్లని రెచ్చగొట్టారు. అన్ని సంస్థానాల్లోనూ అతి పెద్దది హైదరాబాద్‌ సంస్థానమే. సొంత సైన్యం, ప్రత్యేక కరెన్సీ వంటి అన్ని హంగులతో కూడిన సుసంపన్నమైన రాజ్యం. (ఆనాడు ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడు నిజాం రాజే అని ప్రతీతి).

రెండువందల ఏళ్లుగా తమ వంశస్థుల ఆధిపత్యంలో వున్న రాజ్యాన్ని వదులుకునేందుకు నైజాం నవాబు ససేమిరా అన్నాడు. కానీ మెజారిటీ ప్రజల ఆకాంక్ష వేరుగా వుంది. రాచరిక వ్యవస్థనుంచి, కరడుగట్టిన భూస్వామ్య విధానాలనుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో హిందువులు 85 శాతమైతే ముస్లింలు 15 శాతం మాత్రమే. వారిలో కూడా అనేకమంది రాచరికాన్ని వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు.  తత్ఫలితంగా సంస్థానమంతటా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఒక పక్క ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అ లీ ఖాన్‌ భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ అగ్రిమెంట్‌)ను 1947 నవంబర్‌లో కుదుర్చుకుని మరో పక్క స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు కోసం ఐక్యరాజ్య సమితికి దరఖాస్తు చేసుకున్నాడు, తన పాలనను ధిక్కరిస్తున్న కమ్యూనిస్టులను, కాంగ్రెస్‌ వాదులను దారుణంగా అణచివేసేందుకు పూనుకున్నాడు. దాంతో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై దండయాత్రకు దిగడం అనివార్యమయింది. ఆ మిలిటరీ దాడిని ఆపరేషన్‌ పోలో లేదా పోలీస్‌ యాక్షన్‌గా పేర్కొంటారు. పోలీసు యాక్షన్‌కు ముందు ఆ తరువాత పాలకవర్గం తీసుకున్న చర్యలను, హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాలను అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుందీ పుస్తకం.

1914లో జన్మించిన మహమ్మద్‌ హైదర్‌ 1937లో సివిల్‌ సర్వీస్‌లో చేరారు. 1942లో అప్పటి ఐజి నవాబ్‌ దీన్‌యార్‌ జంగ్‌ బహదూర్‌ కుమార్తెను వివాహం చేసుకున్నారు. కొంతకాలం నిజామామాద్‌ డిప్యూటీ కలక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1948 జనవరిలో 33 ఏళ్ల వయసులో మామగారు కాదన్నా వినకుండా సమస్యాత్మక జిల్లా అయిన ఉస్మానాబాద్‌కు కలెక్టర్‌గా వెళ్లారు. అది సరిహద్దు జిల్లా. కాంగ్రెస్‌వాదులు, స్వాతంత్య్ర సమరయోధులు, పలు హిందూ సంస్థలు సరిహద్దు వెలుపల శిబిరాలను ఏర్పాటుచేసుకుని ఉస్మానాబాద్‌ జిల్లాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. నిత్యం ఎక్కడో ఒకచోట హత్యలు, దొమ్మీలు, దోపిడీలు చోటుచేసుకుంటుంటాయి.

రజాకార్ల నాయకుడు సయ్యద్‌ ఖాసిం రజ్వీ ఆ ప్రాంతం వాడే. లాతూర్‌ పట్టణంలో అతనో చిన్నపాటి న్యాయవాదిగా వుండేవాడు. మజ్లిస్‌ పార్టీ అధినేత బహదూర్‌ యార్‌జంగ్‌ 1944లో అకాల మరణం చెందడంతో రజ్వీ  పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని, రజాకారు దళాన్ని ఏర్పాటు చేసి క్రమంగా మొత్తం నైజాంలో అత్యంత ప్రముఖ ముస్లిం నాయకుడిగా, మజ్లిస్‌ పార్టీ అధినేతగా ఎదిగాడు. విధినిర్వహణలో భాగంగా మహమ్మద్‌ హైదర్‌కు ఖాసిం రజ్వీతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పుస్తకంలో రజ్వీ ఆలోచనలు, వ్యవహార శైలి, వాగ్థాటి గురించి పలు చోట్ల సవివరంగా ప్రస్తావించారు. ఉస్మానాబాద్‌ను గాడిలో పెట్టేందుకు హైదర్‌ తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలోనే పోలీస్‌ యాక్షన్‌ జరుగుతుంది. పోలీసు యాక్షన్‌కు దారితీసిన పరిస్థితులను కూడా హైదర్‌ ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. 1948 సెప్టెంబర్‌ 13న జనరల్‌ జి.ఎన్‌.చౌదరి నేతృత్వంలో, భారత సైనిక బలగాలు, యుద్ధటాంకులు, వైమానికదళం ఉస్మానాబాద్‌ జిల్లాలో 12 వ్యూహాత్మక ప్రాంతాలగుండా హైదరాబాద్‌ సంస్థానంలో ప్రవేశిస్తాయి. వాటిని ఎదుర్కొనే సత్తాలేని నిజాం సైనికులు, రజాకార్లు ఎక్కడికక్కడ చేతులెత్తేసి పలాయనం చిత్తగిస్తారు. కేవలం ఐదు రోజుల్లోనే నైజాం నవాబు భారత ప్రభుత్వానికి బేషరతుగా లొంగిపోతాడు.

nizam and grandson

మనవడి తో నిజాం

పోలీసు యాక్షన్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంస్థానంలో భయంకరమైన రక్తపాతం జరిగిందనీ, నాలుగువేలకు పైగా కమ్యూనిస్టు తిరుగుబాటుదారులు, యాభైవేలకు పైగా ముస్లింలు హతులయ్యారనీ అంటారు. ఆనాటి దారుణాలన పరిశీలినకు నియమించబడిన పండిట్‌ సుందర్‌లాల్‌ కమిటీ నివేదిక అధికారికంగా వెలుగుచూడకపోవడంతో ఇప్పటికీ ఇంకా ఒక మిస్టరీగానే వుండిపోయింది. అయితే మహమ్మద్‌ హైదర్‌ ఈ పుస్తకంలో ఆ వివరాల జోలికి వెళ్లకుండానే ఇలా అంటారు:

”పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే ఈ విషాద ఘటనలను కచ్చితంగా నివారించవచ్చు. భారత సైన్యం ముందంజవేయడంతో చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయకేతనం ఎగరేసిన భారత సైన్యం ఛిన్నాభిన్నం చేస్తూ దూసుకువచ్చే బదులు స్థానిక పాలనా యంత్రాంగాలను పునరుద్ధరించడమో లేదా మిలిటరీ యంత్రాంగాలను నెలకొల్పడమో చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆ రెండూ చేయలేదు. … హత్యలు, లూటీలు, గృహదహనాలు కొనసాగాయి. రజాకార్లుగా అనుమానించిన వాళ్లను, నైజాం సైన్యంతో కలిసి మెలసి వున్నవారిని దోపిడీ దొంగలు ఊచకోత కోశారు. వేలాది కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. పిల్లల్ని తల్లిదండ్రుల నుంచీ, భార్యలను భర్తల నుంచీ దూరం చేశారు. మహిళలను, బాలికలను వెంటాడి అత్యాచారాలు చేశారు. ఇలాంటి ఎన్నో సిగ్గుమాలిన దారుణాలు జరిగాయి ఆ రోజుల్లో. వాటి గురించి ఇప్పటికీ నేను రాయలేను.” (పే.80)

హైదర్‌ ఒక సివిల్‌ అధికారి. పాలకవర్గంలో అంతర్భాగం. ఆయన విషయం పక్కనపెడితే ఇతరులు కూడా మౌనంగా వుండటం, ఆ దారుణాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యమనిపిస్తుంది.

M.Hyder pic 1

మొహమ్మద్ హైదర్

పోలీసు యాక్షన్‌ జరిగిన తరువాత చాలా మంది మిత్రులు మహమ్మద్‌ హైదర్‌ను హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపొమ్మని  ఒత్తిడి చేస్తారు. అనేకమంది ముస్లిం అధికారులు అప్పుడు పెద్ద ఎత్తున పాకిస్థాన్‌కు తరలిపోయారు. మరెందరో అరబ్‌ దేశాలకు, అమెరికా, బ్రిటన్‌లకు వలస వెళ్లారు. కానీ ఏ తప్పూ చేయని తను పుట్టిపెరిగిన దేశాన్ని వదలి ఎక్కడికో ఎందుకుపారిపోవాలనేని మహమ్మద్‌ హైదర్‌ ఉద్దేశం. అయితే ఆయన నమ్మకాన్ని వమ్ముచేస్తూ  భారత ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైల్లో పెడుతుంది. హత్యలు, బందిపోటు దొంగతనాల వంటి ఎన్నో కేసులను ఆయనపై బనాయిస్తుంది. దిగువ కోర్టు కొన్ని కేసుల్లో ఆయనకు మరణ శిక్ష కూడా విధిస్తుంది. కాగా హైకోర్టు ఆ కేసులన్నింటినీ కొట్టివేస్తుంది. సుప్రీంకోర్టు కూడా 1954లో ఆయనపై పెట్టిన కేసుల విచారణను నిలిపివేస్తుంది. మూడేళ్ల పాటు జైలుజీవితం అనుభవించి 1952 ఫిబ్రవరిలో ఆయన బెయిలుపై విడుదలవుతారు.  తనపై బనాయించిన అక్రమ కేసుల వివరాలను, వాటిపై జరిగిన వాదోపవాదాలను హైదర్‌ ఈ పుస్తకంలో సవివరంగా పేర్కొన్నారు. నిర్దోషిగా రుజువైనప్పటికీ భారత ప్రభుత్వం ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం ఒక విషాదం.

ఈ పుస్తకంలో తెలంగాణేతర హైదరాబాద్‌ సంస్థానం మనముందు ఒక కొత్త కోణంలో ఆవిష్కృతమవుతుంది. ఎక్కడా దేశముఖ్‌లు, దొరలు, కమ్యూనిస్టు తిరుగుబాటుదారులు అగుపించరు. హిందూ ముస్లిం మతోన్మాదం, సరిహద్దుల వెలుపలి శిబిరాల ద్వారా  కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సమరయోధుల, హిందూ మతతత్వ సంస్థల హింసాత్మక దాడులతో కూడిన, మనకు అంతగా పరిచయంలేని దృశ్యాలు దర్శనమిస్తాయి. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మతసామరస్యం ఒకింత ఎక్కువగా వుండటం, మరాఠీ, కన్నడ ప్రాంతాలలో మత ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగడం, అక్కడ కమ్యూనిస్టు చైతన్యం పెద్దగా కనిపించకపోవడం ఆశ్చర్యమనిపిస్తుంది. మొత్తం రెండు వందల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా, హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా (గంగా జమున తహజీబ్‌) సాగిన నైజాం నవాబుల పాలన, వారి ప్రతిష్ట చివరి నాలుగు సంవత్సరాలలో అనుసరించిన విధానాల వల్ల మంటగలసిపోవడం గమనించవచ్చు.

ఈ పుస్తకం ఆనాడు మొత్తం హైదరాబాద్‌ సంస్థానంలోని పరిస్థితులకు అద్దంపట్టదు. నిజానికి ఇది ఉస్మానాబాద్‌ జిల్లాను ప్రాతిపదికగా చేసుకుని ఆపరేషన్‌ పోలో పై చేసిన ఒక పరిమితమైన కేస్‌ స్టడీ వంటిది. అయినప్పటికీ నిజాం రాజు, రజాకార్లు, భారత మిలిటరీ చర్యలకు సంబంధించిన ఎన్నో వివరాలను మనముందుంచుతుంది. అనేక సంక్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది అంతం కాదు ఆరంభమనీ, ఈ పుస్తకం స్ఫూర్తితో ఆనాటి చారిత్రక వాస్తవాలను శోధించే ప్రయత్నాలు మరికొన్ని జరుగుతాయని, దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతుందని ఆశించవచ్చు..

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌వారు సకాలంలో తెలుగులో తీసుకురావడమే కాకుండా రెండువందల ఐదు పేజీలున్న ఈ పుస్తకాన్ని కేవలం వంద రూపాయలకే అందించడం విశేషం. అనంతు చేసిన తెలుగు అనువాదం సరళంగా, చదివించేలా వుంది.

ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది.

– ప్రభాకర్‌ మందార

ఉన్మాది మనస్సినీవాలిలో…

స్పర్శ, చూపు, వినికిడులు అందించే పై పై ఐంద్రియక సమాచారానికి కూడా సవాలక్ష ఇంద్రియ పరిమితులున్న అంథులం, బధిరులం కదా-

……………… ఆధునిక కవనఘృణి విశ్వరూపసాక్షాత్కారం కోసం ‘చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో’ ఉన్న మహాకవి విన్న …. ‘ఉన్మాది మనస్సినీవాలిలో…. ఘూకంకేకా, భేకంబాకా….’

……………. సామాన్యులం మనమెలా వినగలం?

వినగలం!

జీవన వేదన ప్రచ్ఛన్నంగా, ప్రతీకాత్మకంగా వినిపించే వేనవేల ఘోషల్లో అతి సంక్లిష్టమైన ఘూకంకేకా, భేకంబాకా…. లను మనం సైతం వినగలిగే మహదావకాశాన్ని తెలుగులో కలిగించిన అతికొద్ది రచనల్లో రమణజీవి ‘సింహాలపేట’ కథాసంపుటి ముఖ్యమైంది.

రమణజీవి అనే కథోన్మత్తుడు, ఉన్మాది (కథాసంకలనమనే) మనస్సినీవాలిలోని వ్యక్తావ్యక్తాలాపనలు, వెర్రి ప్రేలాపనలే ఆ ఘూకంకేకా, భేకంబాకా! అంటే వాచ్యార్థంలో  గుడ్లగూబ అరుపు, కప్ప బెకబెకానూ.

అంటే, ఇవి పిచ్చి కథలు కావు గానీ, పిచ్చివాళ్ళ కథలు, ‘ఎయిర్స్’ వంటి ఏవేవో మాయపేర్లతో పిచ్చి ఎక్కించే కథలు.

ఉదాహరణకి, సముద్రం కథ –

ఒకానొక పిచ్చివాడు చెప్పిన ఓ fable- సముద్రం. ఈ పిచ్చివాడి కథలో నాయకుడు కూడా కథకుడిలా పిచ్చివాడే. వర్తమాన ప్రపంచంలో కథకుడు ఏ విధంగా ఒంటరో, ఆ కాల్పనిక గాథలో కథానాయకుడు ఏలే రాజ్యం కూడా పొరుగు రాజ్యాల మధ్య ఏకాకి. డబ్బులు చించేయ్యాలని తెగబడిన పిచ్చోడు ఈ నేరేటర్‌. అదే మాదిరిగా, బంగారంలాంటి బంగారాన్ని, అష్టైశ్వర్యాల్ని తెగనమ్మి ఇనుప గునపాలు కొనుక్కునేంత పిచ్చోళ్లు ఆ రాజ్య ప్రజలు. ‘ఒక అనుభూతి కోసం బతకాల’న్న సామూహిక నిర్ణయంతో, ఒక ఉమ్మడి ఆదర్శాన్ని నిజం చేయాలని తమని, తరతరాల్ని కూడా పణంగా ఒడ్డిన పరమపిచ్చోళ్లు. ప్రతిఫలాన్ని కాలానికి, దైవానికి అప్పగించిన నిష్కామయోగులు. వారి మహా సంకల్పానికి, ఏకైక లక్ష్యానికి మూలం వారి రాజు కన్న ఓ కల- సముద్రం!

ఆ మహద్విశ్వ స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చునేమోగానీ, సందేహపడితే మాత్రం కల కరిగిపోతుంది. ‘ఎప్పుడైతే దానికొక పేరు ఖాయం అయ్యిందో అప్పణ్ణించీ ఆ కల రావడం మానేసింది.’ దాని సాక్షాత్కారం ఆగిపోతుంది. జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. పాతబడే కొద్దీ మాసిపోవచ్చు కూడా. అందుకే కలని నిజం చేసే మహోద్యమం ప్రారంభించాడు రాజు. తన కలని తన వాళ్ళందరి ఉమ్మడి కల  చేయడం, కలని నిజం చేసే క్రమంలో సముద్రా న్నే తవ్వి దేశానికి కానుక ఇవ్వడం ఆ రాజు సంకల్పం.

ఇదిలా ఉంటే, ఈ కథలో రెండవ సూత్రపాత్రైన సముద్రానిది మరో రకం ఉన్మాదం.

ఇంతకీ సముద్రం అంటే ఏమిటి? అన్నీ నీళ్ళు అక్కడ ఒలకబోసిందెవరు? కెరటాల్ని ఎంత కాలమలా మెటికలు విరుచుకుంటూ యాష్ట పోతుంటుందది? ఇవేవి సైన్సుకు సంబంధించిన ప్రశ్నలు కావు. ‘లక్షలాది సముద్ర పక్షుల్ని, దట్టని మబ్బుల్ని వెంటేసుకుని జూలు విదిల్చి అది కదిలి వస్తుంటే,’ ప్రచండ మారుతాలు దానికి రెడ్‌ కార్పెట్‌ పరవడాన్ని తర్కంతో చూడలేము. అంటే సముద్రపుటుద్రేకాలు, ఉద్వేగాలు, ఉప్పని కన్నీళ్లు అన్నీ తర్కరహితమని కాదు, తర్కాతీతం! ఇరుకిరుకు మనుషుల్నేకాదు, మనుషుల దేవుళ్లని చూసికూడా సముద్రం ఈసడించుకుంది, తన తొలి ప్రయాణ సంపర్కంలో. ఇంత అందమైన లోకానికి మనిషి ఒక దిష్టిచుక్క అనిపించింది. కాని నిజమైన మనుషుల ముందు మోకరిల్లింది. కాయలు కాసిన వారి అరిచేతుల్లోంచి అగరు పరిమళాల్ని ఆస్వాదించింది. విభ్రాంతితో విచ్చుకున్న వారి కళ్లల్లో తన ఆత్మను దర్శించుకొని ధన్యమైంది.

Fableని తెలుగులో కొంచెం పెడసరిగా చెప్తే కట్టుకథ అని, సున్నితంగా చెప్పుకుంటే కాల్పానిక గాథ అని అనుకోవచ్చు. జంతువులు, చెట్లు, పుట్టలు చిత్రవిచిత్ర జీవులు, ప్రకృతి… అన్నింటికి మానవీయ లక్షాణాల్ని ఆపాదించి చెప్పే కథని fable అనవచ్చు. అలా చూస్తే ఈ నవీన యుగంలో, సాంస్కృతికంగా ఆధునికోత్తరత అని గుర్తింపు పొందిన ఈ యుగంలో తెలుగు సాహిత్యంలో వచ్చిన అత్యద్భుత fable ఇది.

కలగన్న మహాకడలిని ప్రజలకి కాన్క చేసే ఈ ఉటోపీయుడిలా ఇంకొందరో పిచ్చివాళ్ళు ఉన్నారీ  కథాసంపుటిలో.  ఆశపచ్చని లోకంకోసం నిర్జన భూగోళాన్ని (వి)నిర్మించిన హరకిరిస్టుడు, హోలోకాస్టుడు, సృష్టి చిట్టచివరి మనిషి కన్‌ఫెషనల్ కన్నీళ్ళని పుక్కిటపట్టిన ఫ్యూచరిస్టుడు, ‘కారుణ్యం లేక అద్భుత సృష్టికి అనర్హమైన’ మగజాతిని తోడేళ్ళ పాల్జేసిన పేరడాక్సుడు, చీమలపేట మీదుగా వెండిలోకం దాటీ దాటని కాఫ్కీయుడు, ఒకానొక జరతుష్రుడు, ఒక ఐకనోక్లాస్టుడు, మరొక రెబలుడు, వైపరీత్యుడు, ఒడిదుడుకుడు… ఇంకా ఇంకొన్ని పాత్రల, సూత్రపాత్ర (protagonist)ల కథలు; వస్తురూపశైలీగత వ్యథలై బద్దలైన అద్దం ముక్కలు. ‘మానవ సృష్టిలో ఉన్న మూసదనా’న్ని ఈ రచయితలానే వెక్కిరిస్తున్న గాజుపెంకులు.

ఏ ఒక్కటీ మరొకదానితో పొత్తే లేని ఆ శకలాలన్నింటిలో కుడిఎడంగా ప్రతిబింబించే ఏ స్థాయి ఉన్మీల ఉన్మాదమైనా అది రమణజీవే. తనని ఆరాధించిన, ఆదర్శించిన  లక్షలమంది తడికళ్ళలో సముద్రం ప్రతిబింబించినట్టు, అదే ఉద్వేగ స్థాయిలో ప్రతిఫలిస్తున్నాడు రచయిత, ఆ పాదరస బిందు సందోహంలో.

రమణ జీవి ఉన్మత్త తీవ్రత అర్థం కావాలంటే, అతని మనస్సినీవాలిలోని గుడ్లగూబ అరుపులు, కప్ప బెకబెకలూ between the lines బోధపడాలంటే, ప్రళయోధృతితో పోటెత్తుతున్న సముద్ర నీలి బీభత్స సౌందర్యాన్ని ప్రణయావేశంతో చూసి, ‘అడుగో నా కృష్ణుడం’టూ దూకేసిన చైతన్యుడి తాదాత్మ్య ఉన్మాదం అర్థంకావాలి. సన్నమూతి గాజుసీసా పగలగొట్టకుండా, లోన బాతుని చావకుండా బయిటకి తీయడానికి- ‘యోచన’కీ ‘గ్రహించడాని’కీ మధ్య అగాథాన్ని ఏ వంతెనల వైఫల్యంతో కాకుండా, ఒక్క అదాటున దాటేటువంటి తర్కాతీత వివేకస్థాయి కావాలో, దాన్ని అందుకోవాలి.

అవి లేకపోతే ఈ సంకలనమనే పిచ్చివాళ్ళ కథల్ని తెరవడానికి అనర్హులు… అంటున్నానంటే, నేనా ఉన్మాద, వివేక తీవ్రతని అందుకున్నానని ఎంతమాత్రం కాదు. మతిచెడిన వాళ్ళ పట్ల నా వ్యవహారం సగటు స్థాయికి ఎంతమాత్రం ఎక్కువేమీ కాదు. ఏ పిచ్చివాడి విషయంలోనూ నేను, నా చుట్టూ ఉన్న మర్యాదస్తులు చాలామందికి మల్లే, empathetic  కాదు సరికదా sympathetic కూడా కాదు. ఒకడిమీద జాలిపడాలంటే, తనని న్యూనపరిచి, నన్ను గొప్ప చేసుకునే సావకాశం చిక్కాలి కదా. కానీ, మనం వెంపర్లాడే పచ్చనోట్ల కాగితాలు చింపిపోగులు పెడతాడని, మనం అంగలార్చే పరువు ప్రతిష్టల్ని దిసమొలతో వెక్కిరిస్తాడని, మన ఇంటి ఇరుకుతనాలమీద ఉచ్చపోస్తాడని, మన విలువలు, మర్యాదలు,  తొడతొక్కిడి పరుగులు…. ఒకటేమిటి,

మనల్ని మనిషితనం నుంచి దూరం చేస్తున్న ప్రతి పార్శ్వాన్నీ పట్టి పట్టి గేలిచేస్తాడని కదా పిచ్చివాడిమీద మన అక్కసు!

పిచ్చివాడిని దూరంగా నెట్టేయడానికి తన చేతిలో రాయి ఒక నెపమౌతుంది సాధారణంగా. రమణజీవి అనే ఈ జీవనోన్మాది విషయంలో ఈ సంకలనమే రాయి అని నా (నాలో) revelation!