ఒక విషాద ప్రదోష  రూపకం!

“చెమటచుక్క నేల రాలకుండా డబ్బులె ట్టొస్తయ్యిరా?”

నమ్ముకొన్న సేద్యం చట్టుబండలై చేసిన అప్పులు మెడకు గుదిబండలై వుమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై తమవాటా పొలం తెగనమ్ముకొని బతుకు తెరువు కోసం పల్లె నుంచి పట్నానికి వలస వచ్చి కొత్త వంచనల వూబిలో కూరుకుపోయిన నిస్సహాయురాలైన వొక  స్త్రీ సంధించిన ప్రశ్న యిది.

సాహిత్యంలో  వాస్తవికత , సామాజిక వాస్తవికత వంటి పదాలు మన నోళ్ళలో బాగా నలిగిన పదాలే అయినప్పటికీ వాటిని లోతుగా అర్థం చేసుకొన్న రచయితల సంఖ్యతక్కువ. చాలామంది సమాజంలో చోటుచేసుకొన్న మార్పుల్ని యథాతథంగా చిత్రించడం దగ్గరే ఆగిపోతున్నారు. సమాజంలో భిన్నసమూహాల మధ్య యేర్పడుతోన్న/మృగ్యమౌతోన్న మానవసంబధాల్నిశాసించే శక్తుల్ని , సమాజ చలన సూత్రాల్ని కొద్దిమంది రచయితలు మాత్రమే సాహిత్యంలో ఆవిష్కరించగల్గుతున్నారు. తమచుట్టూ వేగంగా చోటుచేసుకొనే మార్పుకి కారణాలు తెలుసుకొనే లోపు దిగ్భ్రమకు గురిచేసే మరో మార్పు సంభవిస్తోంది. ఆ దిగ్భ్రమ నుంచి బయటపడవేసి మార్గదర్శనం చేయించగల సమ్యగ్ దృక్పథాలకు రచయితలు ఆమడ దూరంలో నిల్చుంటున్నారు. ఒక దృక్పథం కల్గి వుండటమే  సాహిత్యనేరం అన్న ఆధునికోత్తరవాదాలకు  లోబడి రచయితలు గందరగోళానికి గురౌతున్నారు. దృక్పథరాహిత్యాన్ని స్వేచ్ఛగా భ్రమింపజేయడంలో ఈ వాదాలు కొంత మేరకు సఫలమయ్యాయి. అటువంటి సందర్భంలో ప్రజాస్వామిక సంస్కృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్ధుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి.

ఇన్నాళ్ళూ తానూ నమ్మిన భావజాలాన్ని కవితద్వారా కథద్వారా మనతో పంచుకొన్న మంచికంటి యిదిగో యీ నవలతో రంగమ్మ వేసిన ప్రశ్నగా మనముందు నిలబడ్డాడు. ప్రశ్న చిన్నదే. సమాధానం అంత తేలికయిందేమీ కాదు. అదొక ‘చిదంబర రహస్యం’. రాత్రులకు రాత్రులే కోట్లకు పడగలెత్తే కార్పోరేట్ బడా బాబులకే తెలుసు ( అది అంబానీలు కావొచ్చు; జిందాళ్ళు కావొచ్చు; నిమ్మగడ్డ , రామోజీలు కావొచ్చు ). వీళ్ళే పాలకవర్గ రాజకీయాల్ని శాసిస్తున్నారు. క్విడ్ ప్రో కో లకు వూపిరిపోస్తున్నారు. దేశసంపదని సొంతం చేసుకొని బయటకు తరలిస్తున్నారు. బయట నుంచి  తెచ్చిన రుణాల్ని వుదారంగా పంచుకొంటున్నారు.

పోయిన శతాబ్ది చివరి దశకంలో మొదలైన వుదార ఆర్ధిక విధానం వుత్పత్తితో సంబంధంలేని ఆర్ధిక వ్యవస్థని బలోపేతం చేసింది. గ్లోబలీకరణ పేరుతొ దేశ సార్వభౌమత్వాన్ని వశపర్చుకొన్న సామ్రాజ్యవాదానికి జాతీయ బూర్జువా దళారిగా రూపొందింది. సాంప్రదాయిక పెట్టుబడీదారి వ్యవస్థ స్థానే ‘సేవారంగం’ బహుముఖాలతో ముందుకొచ్చింది.  దోపిడి రూపం మారింది. వ్యవసాయ – పారిశ్రామిక కార్మికుల ప్రత్యక్ష శ్రమతో సంబంధంలేని బ్యాంకింగ్ , ఇన్సూరెన్స్,   షేర్ మా ర్కెట్  వంటి రంగాలే ప్రధాన ఆర్ధిక వ్యవస్థ అని మేధావుల్ని సైతం భ్రమ పెట్టే స్థాయికి దేశీయ పెట్టుబడిదారులు దిగజారారు. వారికి తాబేదార్లైన పాలకులు అంతర్జాతీయ మార్కెట్ కి తలుపులు బార్లా తెరిచారు.ఇదే అదనుగా బహుళ జాతి కంపెనీలు దేశంలోని వుత్పత్తి – వుపాధి రంగాల్ని హస్తగతం చేసుకొన్నాయి. దీని ప్రభావం కేవలం నగరాలకూ పారిశ్రామికోత్పత్తులకూ పరిమితం కాలేదు. పల్లెల్లోకి సైతం పెట్టుబడులు ప్రవేశించాయి. విత్తనాలు, యెరువులు , పురుగు మందులు … అన్నీ యమ్మెన్సీల అధీనంలోనే వుండటంవల్ల వ్యవసాయం పెనుముప్పుని  యెదుర్కొంటుంది.  రైతుకు  సేద్యం బరువైంది.  వ్యవసాయ భూములు వ్యాపారపు సరుకయ్యాయి. భూమి పైనా  లోపలా వున్న ప్రకృతి సంపద పరాధీనమైంది. ఈ వ్యవహారామంతటికీ ముద్దుపేరు అభివృద్ధి. పాలకుల అవినీతి అభివృద్ధి ముసుగు తొడుక్కొంది. సమాజలోని అన్ని రంగాలనీ నాశనం చేసే ఈ విపత్తుని యెదిరించి నిలవరించి పోరాడే శక్తులకు నాయకత్వం వహించాల్సిన కార్మిక వర్గం ట్రేడ్ యూనియనిజానికి పరిమితమైంది. సమస్త అస్తిత్వాల్నీ కోల్పోతున్న బడుగు జీవులు బతికే హాక్కు కోసం చేసే పోరాటాలు పాశవికమైన అణచివేతకు గురవుతున్నాయి.

ఇదంతా వొక విషాద ప్రదోష రూపకం. ఈ విధ్వంసాల చీకటిని చూసి దృశ్యమానం చేయడానికి ముందువరసలో నిలబడ్డ రచయితల్లో మంచికంటి వొకడు. ఈ నవల్లో రంగమ్మ ముఖత: లేవనెత్తిన వొక్క ప్రశ్న ద్వారా రచయిత  దేశంలో పకడ్బందీగా అమలవుతోన్న వ్యవస్థీ కృత దౌష్ట్యం లోతుల్లోకి దృష్టి సారించేలా చేస్తున్నాడు. తన ప్రాంత ప్రజల మధ్య వుంటూ తన పల్లె మూలాల్ని కాపాడుకొంటూ జీవితాల్ని అతలాకుతలం చేస్తోన్న ఆధునిక ఆర్ధిక దోపిడీల స్వభావాన్ని బహిర్గతం చేయడానికి అతను సాహిత్యాన్ని వొక సాధనంగా యెన్నుకొన్నాడు.

ఒంగోలు పల్లె పట్టులు  మంచికంటి సాహిత్య – సామాజిక కార్య క్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు. విచ్ఛిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ , తలకు మించిన మదుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం , అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు , బతుకులు బుగ్గై కొంపా గూడూ వొదులుకొని దగ్గర్లోని పట్టణానికో నగరానికో వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్ర్యం , కొత్త జీవనోపాధుల్లో , పరిసరాల్లో యిమిడే నేర్పు లేక వారనుభవించే మానసిక వేదన , పట్టణారణ్యంలో దారితప్పి క్రూరమృగాల బారిన పడే నిస్సహాయత – వీటన్నిటికీ మంచికంటి ప్రత్యక్ష సాక్షి. తాను విన్న కన్న స్వయంగా అనుభవించిన వాటి ద్వారా యేర్పరచుకొన్న ప్రాపంచిక దృక్పథం నుంచి ఆ కల్లోలాన్ని వొక సృజనాత్మక రచయితగానే గాక వొక సామాజిక శాస్తవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు , విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోంచే చూడాలి. ప్రపచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు , ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకొన్నాడు. కథల్లో కంటే అది నవల్లో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది.

2005 లో అనుకొంటా –  తానా నవలల పోటీకి ‘గబ్బ గీము’ పేరుతొ వచ్చిన యీ నవలని నేను తొలిసారి చదివా. ముందుగా నన్ను కట్టిపడేసింది అందులోని భాష. తర్వాత నవలా నిర్వహణకి రచయిత యెన్నుకొన్నశిల్పం. బహుమతికి అర్హమైన  నవలని యెంపిక చేయడంలో బాధ్యులుగా అంపశయ్య నవీన్ కీ నాకూ మధ్య యీ నవలలోని భాషా శిల్పాలపైనే ప్రధానమైన చర్చ జరిగినట్టు జ్ఞాపకం( ఆ తర్వాత ‘చీకటి వలయాలు’ పేరుతొ యీ నవల చతురలో ప్రచురితమైంది).  ఒంగోలు – కర్నూలు రోడ్డు మీద పట్టణవిస్తరణలో కల్సిపోయిన పల్లె కాని పల్లె పేర్నమిట్టలో పాక హోటలు నడుపుకొనే రంగమ్మ అనే గ్రామీణస్త్రీ జీవితాన్ని బొమ్మకట్టించే క్రమంలో మూడుతరాల సామాజిక చరిత్రని రికార్డు చేయడం మంచికంటి ఈ నవల రాయడంలో ప్రధానలక్ష్యం కావొచ్చు; కానీ ఆ చరిత్ర అంత కష్టభూయిష్టంగానూ దు:ఖభాజనంగానూ వుండటానికి కారణాలేంటని అంతస్సూత్రంగా ప్రశ్నించడం నవల అంతటా  కనిపిస్తుంది. పుట్టినింట మెట్టినింట రంగమ్మ అనుభవించిన సుఖదు:ఖాల  వెనక – ఆమె జీవితాన్ని ఆ విధంగా నడిపించిన దృశ్యాదృశ్య శక్తుల అన్వేషణవైపు ఆలోచించేలా చేయడం మరో ఎత్తుగడగా అనిపించించింది.

రంగమ్మ పుట్టినింటి కంటే మెట్టినిల్లు అన్నివిధాలా మెరుగైందే. కానీ పల్లెల్లో ఎన్నో కుటుంబాల్లగానే ఆమె వుమ్మడికుటుంబం కూడా విచ్ఛిన్నమైంది. అయితే పచ్చికుండలా ఆ కుటుంబం అలా విచ్చిపోడానికి నిర్దిష్టమైన భౌతిక కారణాలున్నాయి. రొయ్యలచెరువులు ‘కమ్మని వొరి పండే పొలాల్ని నాశనం చేసాయి’. పచ్చని కాపురాల్ని కూలదోశాయి.  ఇంటిపట్టునుండి చిన్నదో చితకదో వుద్యోగం చేస్తూ వున్నకమతం చూసుకోనేవాళ్ళు – గ్రానైట్ తవ్వకల్లోకి దిగారు. ఆహార ధాన్యాల పంటలు తగ్గి పొగాకు పత్తి వంటి వ్యాపార పంటలు వ్యవసాయంలో పెట్టుబడుల్ని విపరీతంగా పెంచేశాయి. నకిలీ విత్తనాలూ పురుగుమందులూ కల్తీ యెరువులూ యేదీ రైతు చేతిలో లేకుండా పోయింది.ఆఖరికి నేలలో వేయాల్సిన పంటని కూడా యెవరో యెక్కడనుంచో తెలియకుండానే నిర్దేశిస్తారు. పండిన పంటకి సరైన ధర వుండదు.ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం జూదమయ్యకా – నడ్డి విరిగిన రైతులకు పురుగు మందులు చావుకే వుపయోగపడతాయి. చేసిన అప్పులు పీకలమీదకొచ్చి అయినకాడికి పొలాలమ్ముకొని రైతు రోజువారీ కూలీగా మారతాడు. రంగమ్మ కుటుంబంలో జరిగిన ఈ హింస సమాజం అంతటా చోటుచేసుకొన్నదే.

ఓడిపోయిన జీవితాన్ని గెలవాలనే పట్టుదలతో పట్టణానికి ‘వలస’ పోయి – అక్కడ దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుంది. ‘ఉండూళ్ళో పస్తులుండా నలుగురు మనోళ్ళ మధ్యన ఉండామన్న ధైర్యమన్నా ఉండేది. ఈడ చచ్చేమా బతికేమా అని విచారించేవాళ్ళు కూడా లేకపోతిరి.’   పట్టణ జీవితంలోని సంక్లిష్టతని అర్థం చేసుకొనే లోపే అన్ని విధాలా పతనం కావడం సంభవిస్తుంది.

శ్రమతో సంబంధంలేని డబ్బు చలనం పట్టణంలో ఎక్కువ. విపణి సంస్కృతి , యీజీ మనీ వెంపర్లాట , అవసరంలేని ఆడంబరాలు , కొత్త వ్యసనాలు – వెరసి  నాగరికత మనిషిని పణ్య వస్తువుని చేస్తుంది. అన్ని విలువల్నీ మింగేస్తుంది. అప్పులూ  వడ్డీలపై వడ్డీలు రోజువారీ వడ్డీలూ చిట్టీలూ మైక్రో ఫైనాన్స్ లూ షేర్ బ్యాంక్ లూ పొదుపు సంఘాలూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులూ పుట్టింటి పట్టుచీరా – మా ఇంటికిరా చెల్లీ స్కీం లూ గోల్డ్ గేట్లూ పీర్ లెస్ లూ బాండ్ లూ – ఇదంతా వొక విషవలయం( ఒక్క ఒంగోల్లోనే 500 ఫైనాన్స్ కంపెనీలు వున్నట్లు నవల్లోనే ఒక చోట రచయిత పేర్కొంటాడు ) .  వలపన్నే వేటగాళ్ళ దోపిడీ బహుముఖాలుగా సాగుతుంది. ఒకప్పుడు  ‘ ఫైనాన్సోళ్ళ దెబ్బకి మొగోళ్ళు  ఉరిబెట్టుకున్నట్టు ఇప్పుడు ఆడయ్యి కూడా రాలి ’ పోవడం నిత్య విషాదం. ఇది కొత్త పరిణామం. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీలే యెక్కువ బలయ్యారు. రంగమ్మలా పల్లెనొదిలి వచ్చిన స్త్రీలందరిదీ వొకే హృదయవిదారమైన కథ. రమణమ్మ ,జయమ్మ, శేషమ్మ , పద్మ , సామ్రాజ్యం , సుశీల , నాగమ్మా – అందరూ తెలిసో తెలియకో పోగొట్టుకొన్నదాన్ని పొందాలనే ‘కసి’ తో అన్నివిధాలా వోడిపోయినవాళ్ళే. ఇంటా బయటా స్త్రీలు ‘వొళ్లిరగ దీసుకొని రూపాయి సంపాదించడానికి కష్టపడుతుంటే’ ‘కాలు కదపకుండా కడుపు నిండాలన్నట్టు’ మగవాళ్ళు నిర్వ్యాపారులై దుర్వ్యసనాలకు బానిసలై అనారోగ్యాల పాలై మృత్యుశకటాలవుతున్నారు .

మంచికంటి వర్ణించిన యీ చీకటి జీవితం కేవలం రంగమ్మది మాత్రమే కాదు. ‘ఒక బెట్ట ప్రాంతంనుంచి’ వచ్చిన రచయితగా అతను దీన్ని సాహిత్యీకరించినప్పటికీ – యిది  వొక్క ఒంగోలుకే పరిమితమైన చరిత్రా కాదు. దేశంలో యే మూలకెళ్ళినా యిదే పరిస్థితి.

మార్పు వొక్కసారిగా రాలేదు గానీ 90 ల నుంచి మార్పు త్వరితమైంది. ఆర్ధిక సంస్కరణల అమలు వేగవంతం అయ్యాకా సామాన్యుడు కన్స్యూమరిజం శ్లేష్మంలో ఈగగా మారాడు. విలాసాల్ని  అవసరాలుగా భ్రమింపజేయడంలో మార్కెట్ శక్తులు విజయం సాధించాయి. దేశం పెద్ద సరుకుల సంతయింది. లేని అవసరాల్ని సృష్టించడం – వాటిని తీర్చుకోడానికి ‘రుణ సదుపాయం’ కల్పించడం – దీంతో దేశపౌరుడు వొక వస్తువ్యామోహం వూబిలోకి కూరుకుపోయాడు. ఉన్నది తినడం కాకుండా అప్పు చేసైనా లేనిది కొని అనుభవించడం మధ్యతరగతి జీవిత విధానమైంది. బ్యాంకింగ్ రంగంలోకి డెబిట్ కార్డ్ కన్నా ముందు క్రెడిట్ కార్డ్ ని వినియోగంలోకి తేవడం వెనక పెద్ద మార్కెట్ కుట్ర వుంది. ప్రభుత్వ నూతన విధానాల అండతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలూ చిట్ ఫండ్ లూ వడ్డీ వ్యాపారాలూ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వెంటబడి అప్పులిచ్చేదీ – ‘ బళ్ళేసుకుని ఊళ్ళమీదబడి వొడ్డీలకు వొడ్డీలు వొడ్డీలకు వొడ్డీలు కట్టి బెదిరిచ్చి వొసూలు చేసుకొనేది.’   పల్లె పట్నం తేడా లేకుండా ‘ కూలికి విషం తాగే  మనుషులు’ తయారయ్యారు. మనుషులు అన్ని విలువలకీ దూరమయ్యారు.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్ని  సూక్ష్మదృష్టితో విశ్లేషించడం – గడిచిన కాలంతో పోల్చడం నవల పొడవునా కనిపిస్తుంది.నవల్లో రంగమ్మ ఆలోచనలు గతానికీ – వర్తమానానికీ మధ్య ఆసులో కండెలా తిరుగుతూ వుంటాయి. కావలి – ఒంగోలు మధ్య బొగ్గు బస్సులు నడిచిన రోజుల దగ్గర్నుంచీ – యివ్వాళ కాలేజీ ఆడపిల్లల్ని మోసం చేసి బ్లూ ఫిల్ముల చిత్రీకరణ దశ వరకూ దాదాపు 60 , 70 యేళ్ళ పల్లెల – పట్నాల సామాజిక చరిత్రని రికార్డు చేయడానికి రచయిత యెన్నుకొన్న శిల్పం అపూర్వం కాదు గానీ గత – వర్తమానాల కలనేతలో కథాగమనాన్ని కుంటూ పడనీకుండా , వస్త్వైక్యత దెబ్బతినకుండా నవలని నిర్వహించడం బహుధా ప్రశంసనీయం.

వర్తమాన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడే రంగమ్మ ప్రతి సందర్భంలోనూ గతాన్ని నెమరేసుకొంటుంది – యిప్పటి పరిస్థితుల్నీ మనుషుల్నీ వెనకటి రోజుల్తో మనుషుల్తో బేరీజు వేసుకొంటుంది. గత – వర్తమానాల మధ్య చేసే యీ ప్రయాణంలో సామాజిక – ఆర్ధిక విషయాలే గాక సాంస్కృతిక అంశాలు కూడా అలవోకగా వచ్చి చేరాయి. అది రంగమ్మ బాల్య జ్ఞాపకం సింగరాయకొండ తిరణాల కావొచ్చు ; ఆమె పెద్దమనిషయినప్పటి సమర్త బంతి కావొచ్చు ; వూరంతా వొకటై సంబరంగా జరిపిన పెళ్ళి కావచ్చు – అప్పటికీ యిప్పటికీ సంస్కృతిలో వచ్చిన మార్పులు అద్భుతంగా ఆవిష్కారమయ్యాయి. ఈ టెక్నిక్ ద్వారా నవల ప్రకాశం జిల్లా స్థానీయ సామాజిక చరిత్రతోబాటు సాంస్కృతిక చరిత్రను నిర్వచించుకోడానికి సైతం చక్కగా దోహదపడుతుంది.

ఈ స్థానీయ సామాజిక – ఆర్ధిక – సాంస్కృతిక  చర్రిత్రని మనకందిచడానికి మంచికంటి అక్కడి సమాజంలోకి , ప్రజా సమూహంలోకి మనల్ని చెయ్యి పట్టి లాక్కుపోతాడు. అందుకతను స్థానీయభాషని మాధ్యమం చేసుకొన్నాడు.ఈ ప్రాంతపు జనుల జీవద్భాష యింతకు మునుపు సాహిత్యంలోకి యింతగా యెక్కిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతపు భాషే కాదు – ప్రామాణిక భాష ఆధిపత్యం కింద నలిగి ప్రజల సాంస్కృతిక భాషలు దశాబ్దాలుగా సాహిత్యంలో స్థానం పొందలేకపోయాయి. ఇదొక చారిత్రిక విషాదం. రెండున్నర జిల్లాల భాషా ఆధిపత్యం గురించి తెలంగాణా రాయలసీమ సాహిత్యకారుల ఆందోళన ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కారణంగా వెలికి వచ్చింది గానీ అదే సమయంలో ఆ రెండున్నర జిల్లాల్లోనే అట్టడుగు వర్గాల భాష కూడా సాహిత్యంలో నిరాదరణకే గురైందన్నది గమనించాల్సిన విషయం . తెలంగాణా రాయలసీమా ఉత్తరాంధ్రాల నుంచి రచయితలు  తమ సొంత భాషల్లో గొంతు విప్పుకొన్న కాలంలో కోస్తా ప్రజల సాంస్కృతిక భాషని పలికించడంలో అక్కడి రచయితల గొంతులు మూగవోయాయి . ప్రజల నోటి భాషని యాసతో సహా మాగోఖలేలా శిష్ట సాహిత్యంలోకి వొంపిన వాళ్ళు ఇటీవలి కాలంలో కరువయ్యారు ( కొలకలూరి ఇనాక్ , కళ్యాణ రావు , పాపినేని  లాంటి వొకరిద్దరు యిందుకు కొంతమేరకు మినహాయింపు) . అందువల్ల జరిగిన అనర్థం అంతా యింతా కాదు. భిన్న ప్రజా సమూహాల భాషలకు ప్రామాణిక భాష దూరమైపోయింది. బడిపలుకులు – పలుకుబడులు వేరయిపోయాయి. ఆ కారణంగానే ప్రజల భాష ద్వారా వ్యక్తమయ్యే సాంస్కృతిక వైవిధ్యం కూడా మరుగున పడిపోయింది. అన్ని ప్రాంతాల – వర్గాల భాషల్ని తనలో కలుపుకొని  ఎదగాల్సిన ప్రామాణిక భాష – అందుకు విరుద్ధంగా కుదించుకుపోయింది. ప్రజా వుద్యమాలతో సంబంధం వున్న రచయితలు యీ లోటుని పూడ్చడానికి పూనుకొన్నారు. గ్రామీణ ప్రజా సంబధాలు కాపాడుకొన్న రచయితలు మాత్రమే ఆ యా స్థానీయ భాషల సొబగుల్ని సృజనాత్మక సాహిత్యం ద్వారా తక్కిన ప్రాంతాలకు అందించగలిగారు.

సాహిత్య భాషలో యేర్పడ్డ యీ ఖాళీని పూరించడానికి చొరవ చూపినవాళ్ళలో మంచికంటికి ప్రత్యేక స్థానం వుంది. కాట్రగడ్డ దయానంద్ , మంచికంటి లాంటి రచయితలు తమ కథల్లో వాడిన ప్రకాశం జిల్లా తూర్పు ప్రాంతపు ప్రజల భాష  తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేసింది. మంచికంటి యీ నవల్లో వుపయోగించిన భాష భాషా అస్తిత్వాల గురించి నాలో చాలా కాలంగా గూడు కట్టుకొని వున్న ఆలోచనల్ని మీతో పంచుకొనేలా చేసింది.

మంచికంటి భాష అక్కడి ప్రజల వ్యావసాయిక సంస్కృతిలోని మట్టి పరిమళాన్ని మోసుకొచ్చిన కమ్మ తెమ్మెరలా వుంది. స్వచ్ఛమైన ఆ పరిమళాన్ని గుండె నిండా పీల్చుకొనే అవకాశం యెంతో కాలం కోల్పోయాం గదా అని నవల చదివిన ప్రతిసారీ అనిపించించింది. తన భాషలోని యాసనీ వ్యక్తీకరణ రీతుల్నీ అక్షరీకరించడంలో కూడా మంచికంటి  యెంతో నేర్పు చూపాడు. రచయిత ప్రజల పక్షాన నిలబడ్డాడనడానికి అతని భాష కూడా ప్రమాణమే.

బతుకులో అనునిత్యం సంఘర్షించే ప్రజల ధిక్కారస్వరమే వాళ్ళ భాషలో వినిపిస్తుంది. అది మండే భాస్వరంలా వుంటుంది. తన చుట్టూ వున్న సమాజంలో నిప్పుల మీద నడుస్తూ మొండిగా జీవిస్తోన్న మనుషుల ఆ ధిక్కారస్వరాన్ని గట్టిగా పట్టుకొన్న మంచికంటి దాన్ని సాహిత్య రూపంలోకి తర్జుమా చేసి మనకందిస్తున్నాడు. తాను పుట్టి పెరిగిన నేల రుణం యీ విధంగా తీర్చుకొంటున్నాడు. చల్లారిన సంసారాలూ ఛిద్రమైన బతుకులూ బలవంతపు పడుపు వృత్తులూ డబ్బు ప్రధానమై చిట్లిపోయిన మానవ సంబంధాలూ మార్కెట్ మాయాజాలంలో మాయమపోతున్న మనిషితనం … సమాజం క్రూరంగా దుర్భరంగా తయారయినప్పుడు , ‘విలువిద్యగాళ్ళుసైతం నేల నాలుగు చెరగులా వేయికాళ్ళతో విస్తరించి ఉన్న స్వార్థ భూతం ప్రలోభాలకు లోనైపోతున్నప్పుడు నిజంగా ఒక మనిషి వైపు ఒక   సామాన్యుడి వైపు కదా నిలబడి కల కనాల్సింది’ యే సాహిత్యకారుడైనా! అలా విశ్వసించినందువల్లే మంచికంటి తన నవల్లో బాధితుల పక్షాన వాళ్ళ కడగళ్ళ జీవిత అస్తిత్వాల్ని రూపు కట్టించగలిగాడు. కుటుంబ నిర్వహణలో అనునిత్యం స్త్రీలు శారీరికంగా మానసికంగా  యెదుర్కొంటున్న దుర్భర హింసని గొప్ప ఆర్తితో చిత్రించగలిగాడు. రచయిత ఆర్తి మన గుండెలోకి కూడా పరివ్యాప్తమౌతుంది. ఆ స్త్రీల ఆవేదనలో మనం కూడా  మగ్నమౌతాం.

సుబ్బులమ్మ – రంగమ్మ – సుధారాణి,సుజాత – మూడు తరాల్లో స్త్రీలు తమ చేతుల్లో లేనిదాన్ని దేన్నో పట్టుకోవాలనే ప్రయత్నం చేసారు. కానీ జీవితం అందినట్టే అంది వారి చేజారి పోయింది. సుబ్బులమ్మ గతం, రంగమ్మ వర్తమానం , సుధారాణి,సుజాతల భవిష్యత్తు అంతా అంధకార బంధురమే. అందుకే నవలంతా తీవ్రమైన దు:ఖం పరచుకొని వుంటుంది. అయితే అడుగడుగునా యెన్ని యెదురుదెబ్బలు తగిలినా రంగమ్మ గుండె దిటవు కోల్పోదు. నైరాశ్యానికి గురికాలేదు( నిలవ నీడ కోసం లైంగిక దోపిడీకి గురైంది , భర్త దేశాలు పట్టి పోయాడు , కొడుకు అనారోగ్యంతో బాధపడుతూ వుంటాడు , ముక్కుపచ్చలారని వయస్సులోనే కూతుళ్ళు పురుషుల వంచనా ప్రపంచంలో అభద్రతా అంచుల మీద స్వారీ చేస్తుంటారు ). ఆమె పోరాటానికి అంతం లేదనే నవల ముగింపు చెబుతుంది. నిజానికి కథ పూర్తి  కాలేదు – మళ్ళీ మొదలైంది.

‘ఒక పక్క రైతుల చావులు , ఒక పక్క ఎన్ కౌంటర్లంటూ నక్సలైట్ల చావులు , మరో పక్క ఘోరంగా ఆడ కూతుర్లను చేర్చి శవాలుగా మార్చడాలు’   – వీటన్నిటి మధ్య ‘ తలగుడ్డలు రోడ్డెక్కినయి. పొలంలో ఉండాల్సిన తలగుడ్డల్ని గవర్నమెంటు రోడ్డెక్కేలా  చేసింది’. పల్లె నుంచి వలసపోకుంటే  రంగమ్మ భర్తతోపాటు తలగుడ్డలతో కల్సి నడిచేదేమో! ఎప్పటికైనా రంగమ్మయినా మనమయినా కలవాల్సిన సమూహం అదే. అటువంటి సామూహిక ప్రతిఘటన మాత్రమే రంగమ్మ లాంటి స్ర్తీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు నడవడానికీ , అన్ని చావుల పరిష్కారానికీ తోవ చూపుతుందనీ చిమ్మచీకటిలో వెలుగు రేకల్ని ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం. ఈ నవల చదవడం ద్వారా నాకా నమ్మకాన్నికల్గించినందుకు మంచికంటికి అభినందనలు.

ఒంగోలు పక్కన పేర్నమిట్ట బాట పట్టే ముందు వొక్క మాట –

చీకటికి భయపడేవాళ్ళెవరూ చీకటిని గెలవలేరు. సెలవ్.

తెలంగాణ కథల వెలుగు “అలుగు”

alugu-title-2

 

ఇండియాలో ఏండ్లుగా వేళ్లూనుకున్న జఠిలమైన సమస్యలకు, కొత్తగా ముందుకు వస్తున్న సమస్యలకూ ఇవ్వాళ ప్రజలు అస్తిత్వవాదం/భావజాలం సోయితో పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. ఈ ప్రజల్లో చైతన్యం నింపుతున్న అస్తిత్వవాదులు ఎవరికి వారు ఆత్మగౌరవంతో తమ స్వీయ అస్తిత్వాన్ని నిబెట్టుకుంటూనే తమతోటి వారి పట్ల కన్సర్న్‌తో వ్యవహరిస్తున్నారు. తమ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ‘సమానత్వ’ భావనకు దారులు వేస్తున్నరు. ఇది అంత ఈజీ టాస్క్‌ ఏమీ కాదు. అయినా కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అట్లాంటి ప్రయత్నాల్లో ఒకటి ఈ సంకలనం.

నిజానికి అస్తిత్వ వాదం విజయవంతం కావడానికి స్థూలంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది చట్టబద్ధంగా లేదా రాజ్యాంగ బద్ధంగా అమల్లో ఉన్న చట్టాలను తూ.చ. పాటించడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఈ మార్పును తీసుకురావడానికి అవకాశమున్నది. అయితే ఇది ఫెయిల్యూర్ గా  మిగిలిపోయింది. ఇక రెండోది సామాజిక చైతన్యం ద్వారా కుల, మత, జెండర్‌, పేదరికం, వ్యవసాయం, చేతివృత్తులు, సామాజిక అణచివేత, ప్రభుత్వాల  నిర్లక్ష్య ధోరణి, గ్రామీణ ప్రాంత సంక్షోభం, పట్టణీకరణ లాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం. సామాజిక చైతన్యానికి సాహిత్యం ఒక ప్రధానమైన ఇరుసు. ఆ ఇరుసుకు కందెన పూసే పనిని ఈ సంకలనం ద్వారా చేస్తున్నాం.

అస్తిత్వోద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడడానికి, ప్రచారం చేయడానికి సాహిత్య రంగానికి వెసులుబాటుతో పాటు మంచి అవకాశమున్నది. నిజానికి అస్తిత్వాలకు బలం చేకూర్చేది సాహిత్యం. ఇక్కడ అస్తిత్వమంటే ఒక్క ‘ప్రాంతీయ’ అంశం మాత్రమే కాదు. సమస్య మనిషికి సంబంధించినది. మనిషికి – సమాజానికి ఉండే ఘర్షణకు సంబంధించినది. మనిషికి-మనిషికి మధ్య ఉండే ఆధిపత్యాలకు సంబంధించినది. ఈ ఘర్షణను అర్థం చేసుకొని సాహితీ సృజన చేసినట్లయితే అది అస్తిత్వ సాహిత్యమవుతుంది. అట్లాంటి అస్తిత్వ సాహిత్యానికి ఆనవాలు ఈ అలుగు.

katha-2015-invitation

అరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ తల్లి విముక్తం అయింది. ఆధిపత్యం సంకెళ్లు పటాపంచలయ్యాయి. మన నేల, మన రాష్ట్రం, మన బతుకు, మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ వైపు ఆత్మగౌరవంతో, గర్వంగా అడుగులు వేస్తున్నాం. ఈ అడుగులు మిగిల్చిన పాద ముద్రలు ఏవి అని అవలోకించినపుడు ఈ కథా సంకలనం సమాధానం చెబుతుంది. ప్రతి మట్టి రేణువును పట్టి చూపి స్వరాష్ట్రంలో మనం ఏం సాధించామో, ఇంకా ఏం సాధించాల్సి ఉందో కొన్ని స్పష్టంగా, కొన్ని మౌనంగా చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతు, నేత కార్మికులు, స్వర్ణకారులు ఇతరత్రా వృత్తిదారులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని బాధ పడ్డం. స్వరాష్ట్రంలో కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ప్రపంచమంతా మెతుకు చుట్టూ ప్రదక్షణం చేస్తోన్నా రైతు ప్రయాణం మాత్రం ఆగిపోతోంది.

అప్పు, కరువు, సాగునీటి సమస్య, ఆధిపత్యుల దౌర్జన్యం ముందు రైతు కుప్పకూలి పోతున్నాడు. ఉన్న భూమి అమ్మలేక, దాన్నుండి పంట తీయలేక, అడ్డామీది కూలీగా మారలేక చివరాఖరికి ఉరికొయ్యకు వేలాడుతున్నాడు. కుటుంబ బరువును పిల్లల  లేత భుజాలఫై  వదిలేసి తన దారి తాను చూసుకుంటున్నాడు. అతనితో వెళ్లలేక ఇక్కడే మిగిలిపోయిన రైతు ఆనవాళ్లు దిక్కు, దారి లేక భవిష్యత్తును తల్చుకుంటూ భయం  భయంగానే బతుకుపోరుకు సిద్ధం అవుతున్నారు. (ప్రయాణం ఆగింది) ఒక్కోసారి ఈ పోరాటంలో పూర్తిగా ఓడిపోతున్నారు కూడా. ఎంతగా ఓడిపోతున్నారంటే కనీసం తన తల్లి సమాధికి కాస్త నీడనిచ్చే, పండ్లనిచ్చే తన పొలం గట్టు మీది మామిడిచెట్టును కూడా రక్షించుకో లేనంతగా. అగ్రవర్ణపు దౌర్జన్యానికి జడుసుకొని అశక్తతతో, శాపనార్థాలు పెట్టుకుంటూ ఎవరూ సహాయం చేయలేని దుర్భర స్థితిలో తనలో తానే ముడుచుకు పోతున్నాడు. కాని ఈ దౌర్జన్యాన్ని ఎట్లా దెబ్బతీయాలో లేదా  ఎట్లా  ధిక్కరించాలో ఆ రైతుకు తెలుసు. (ఆకుపచ్చ నెత్తుటి జాడ)

ప్రభుత్వం లేదా ఈ వ్యవస్థ తప్పుడు ప్రవర్తనల  వల్ల అనేక మంది సామాన్యులు బలవుతున్నారు.  వ్యవస్థలోని ఏ వ్యక్తీ తన వల్ల జరిగిన తప్పును ఒప్పుకోడు ఆ తప్పును పక్కవాని మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. మొత్తంగా ఏడుచేపల కథను గుర్తుకు తెస్తారు. రాజ్యం  దృష్టిలో  సామాన్యులెప్పుడూ చీమలే. చీమలన్నీ కలిసి కట్టుగా తిరుగుబాటు చేసేదాకా ఎంతో మంది అనామకంగా చీమల్లా పుడుతుంటారు. గిడుతుంటారు. (‘చీమా చీమాఎందుకు పుట్టావ్‌?)

బహుజనులు  అధికారంలో వున్న వారికి లేదా సాటి మనిషికి ఆపత్కాలములో అప్పు ఇవ్వడం కూడా తప్పే. వాటిని వసూలు చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. అందుకే పందులుగాసుకునే ఎరుకల బక్కని జీవితం పందులు సొచ్చిన ఇల్లులాగా ఆగమవుతుంది. వాని పందులన్నీ అధికార మదానికి బలైపోతాయి. వాడు మాత్రం పోలీసు దోపిడీకి, బలవంతుని పీడనకు ప్రతీకగా బక్క పల్చని మనిషిగా అలా నిబడిపోతాడు. (బక్కడు).

వలస పాలనలో, ప్రపంచీకరణలో తెలంగాణ ఆటలన్నీ పారిపోయి స్వర్గంలో దాక్కున్నాయి. అలాంటి స్వర్గం నుండి మనం మరచిపోయిన ‘పచ్చీసు’ను తీసుకొచ్చి దానికి బాల్యాన్ని అద్ది, జీవితాన్ని ముడివేసి తెలంగాణ సంస్క ృతిని తడిమిన కథ మళ్ళీ మనల్ని ఆరు దశాబ్దా వెనకకు తీసుకెళ్తుంది.

స్వీయ పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ కాస్త సఫల మైనట్టుంది. ప్రజల ముఖాల్లో, జీవితాల్లో నీటి మెగులు, తెలంగాణ నేలలో ఆకుపచ్చని వర్ణం కనిపిస్తోంది. అయితే రియలెస్టేట్‌ రంగం చెరువును కూడా వదలకుండా ఆక్రమణలు, అక్రమంగా భవనాలు నిర్మించి నీటి తల్లికి సమాధులు కడుతున్నారు. అలాంటి కుట్ర మీదికి ‘ఏరువాక’ సాగాలని ఇప్పుడు తెంగాణ ప్రజల ఆకాంక్ష.

మైళ్ల దూరం నుండి నీటినీ, భూమినీ వెతుక్కుంటూ తరలి వచ్చి తెలంగాణ అంతటా కాలువల పక్కన విస్తరించిపోయిన ‘వసపక్షులు’ మనస్తత్వాన్ని, సుతిమెత్తని, నిర్మాణాత్మక దోపిడీని పసిగట్టకపోవడం తెలంగాణ రైతు అమాయకత్వం. కాళ్లకింది నేలను జారవిడుచుకొని, ఎముకల్లోని మూలుగులను కూడా కోల్పోయి తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు ఏ ఆదరణా లేక ఒచ్చొరకు నిల్చుండిపోయారు.

బీజేపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆరెస్సెస్‌ భావజాలం, విపరీత హిందుత్వం తెరమీదికి వచ్చి దేశ లౌకికత్వాన్ని బోనులో నిలబెడుతుంది. మైనార్టీలు అభద్రతలోకి జారుకుంటారు. రాజ్యం పోలీసు విధులను నిర్వర్తించకుండా మనం అడక్కుండానే ప్రజల అవాట్ల, భోజన విషయాల్లోకి కూడా చొరబడి ఈ దేశంలో ఉండాలంటే ఫలానా పదార్థాన్నే తినాలని పరోక్షంగా ఆదేశాలిస్తుంది. పేదవాడు తనకు తోచిన ‘బుక్కెడుబువ్వ’ ను తినే స్వేచ్ఛ ఈ దేశ ప్రజాస్వామ్యం కల్పించలేకపోతోంది. అటు ముస్లిం మైనార్టీలను, ఇటు దళితులను టార్గెట్‌ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి  అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటారు.

ముస్లీం మైనార్టీలు ఒకే సమయంలో అటు హిందుత్వవాదులతో ఇటు పేదరికంతో ‘యుద్ధం’ చేయాలి. హైదరాబాద్‌, ముంబయి ఆ మాట కొస్తే ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ముందుగా కనిపించే అనుమానితులు ముస్లీంలే. ఆ బాంబు దాడుల్లో ముస్లింలు కూడా తమ జీవితాలను కోల్పోతున్నారనే విషయాన్ని బుద్ధిజీవులు ఆలోచించరు. అట్లాంటి ఘర్షణల్లో తండ్రులను కోల్పోయిన కొడుకు  బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో జీవిత పాఠశాలలో అనుభవాల చేదు పాఠాలను వళ్లిస్తూ  కుటుంబ భారాన్ని భుజానికేసుకొని జీవన పోరాటం చేస్తూనే ఉంటారు. బతికినంత కాలం ఎంత నిజాయితీగా బతికినా విధి ఘోరంగా దెబ్బతీస్తూనే ఉంటుంది.

జీవితం ఇంత సంక్లిష్టం అయిపోయిన సందర్భంలో బతుకు ‘ఆవలితీరం’ చేరడం చాలా కష్టం. ఫేస్‌బుక్‌ వేదికగా దోస్తాని చేసే వ్యక్తుల పరిచయాలు చాలా వరకు మోసపూరితంగానే ఉంటాయి. అయితే కొంత పరిణతి చెందిన స్త్రీ, పురుషుల పరిచయాలు నిజ జీవితంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఉపయోగపడవచ్చు. మానవ సంబంధాలు స్వచ్ఛమైన పూ పరిమళాలను వెదజల్లాలి కాని అలంకార ప్రాయంగా మెడలో నిలిచే ‘గంధపు దండ’ కాకూడదు. ఒక తరంలో వివాహం నాన్న స్థానాన్ని రెండో స్థానానికి దిగజార్చుతే, మరో తరంలో కూడా అదే రిపీట్‌ అవుతుంది. కొసకు నాన్న తాలూకు ఫోటోకు కూడా ఇంట్లో స్థలం దొరకని పరిస్థితి. ఇప్పుడు నాన్న స్థానం గుండెలోనే. తరాలు మారినా ఇదే నిఖార్సయిన నిజం.

సంక్షోభ భరితమైన, సంఘర్షణాయుతమైన జీవితాన్ని వ్యాఖ్యానించడానికి ఇన్ని పేజీలు అవసరమా? పది పదిహేను వాక్యాలు సరిపోవా? అసలు పది పదిహేను వాక్యాలైనా ఎందుకు? ఒక పొడవాటి వాక్యం సరిపోదా? కాదు ఇంత పొడవాటి వాక్యం కూడా వద్దు. ‘ఒక్క పదం చాలు’. ఒక్క పదమైనా ఎందుకు? పెళ్లలు పెళ్లలుగా కూలిపోతున్న జీవితపు శిథిలత్వాన్ని మన హృదయంలోకి నిశ్శబ్దంగా చేరవేయడానికి ఎన్నో భావాలను మోస్తున్న అనంతమైన ఒక్క మౌనం చాలు.

* * *

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరినీ కొత్త బంగారు లోకంలోకి తీసుకు వెళ్తామని వాగ్దానం చేసి బంగారు తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంకా ఎన్నో సంస్కరణలను ఆచరణలోకి తేవాల్సి ఉంది. ప్రతి పేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. రైతుకు 12 గంట కరెంటన్నారు. రైతులు, చేనేత కార్మికులు, వృత్తికులాల వాళ్ళ ఆత్మహత్యల్ని ఆపుతామన్నారు. ఇవన్నీ కలగానే మిగిలాయి. పల్లెతో పాటు అనేక వృత్తులు కూడా ధ్వంసమైపోతూనే   ఉన్నాయి. నగరాల్లో యంత్రాలతో చేయించాల్సిన మ్యాన్‌హోల్స్‌ క్లీనింగ్‌ మనుషుతోనే చేయించడం మూలానా 2015లో దాదాపు డజన్‌ మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాత పడ్డారు. తెలంగాణలో కళాశాల విద్య కూడా గందరగోళంగా మారిపోయింది. స్కాలర్‌షిప్‌లు ఎవరికి ఇస్తున్నారో, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఎవరికి కల్పిస్తున్నారో ఏదీ అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష మూడు సార్లు నిర్వహించారు. వీటిలో వేటినీ తెలంగాణ కథకులు పెద్దగా ప్రశ్నించే కథలు రాయలేదు. ప్రపంచ చరిత్రలోనే చారిత్రాత్మకమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై రావాల్సినన్ని కథలు గాని, నవలలు గానీ ఇంకా రాలేదు. అయితే సీనియర్‌ కథకులు (అల్లం  రాజయ్య, తుమ్మేటి రఘోత్తంరెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, నందిని సిధారెడ్డి, జూకంటి జగన్నాథం, డా. నలిమెల భాస్కర్‌…లాంటి వారు) మౌనముద్రలో ఉన్న సందర్భంలో కొత్త కథకులు తెలంగాణ కథా ప్రాంగణంలోకి అడుగుపెట్టడం కొంత ఆశావహ దృక్కోణం.

శిల్ప పరంగా కూడా తెలంగాణ కథకులు ఇంకా రాటుదేలాల్సే ఉంది. కేవలం తెలుపు నలుపు స్టిల్‌ ఫోటోగ్రఫీ లాంటి కథలే కాదు. తెంగాణ ‘సింగిడి’లోని ఏడు రంగుతో మిళితమైన శైలీ, శిల్పాల కథలు రావాలి. ఎలాంటి ప్రయోగాలు లేకుండా, వాఖ్య విన్యాసం లేకుండా ప్లేన్‌ కథలే ఎక్కువ వచ్చాయి. తెలంగాణ తెలుగు మాధుర్యతను కూడా కథల్లో చూపించాల్సి ఉంది.

కథంటే ఏదో మానసిక వికాసం కల్గించాని, కథ సాంతం చదివి మూసేసిన తరువాత ఏదో కదలిక తేవాలని, సంక్షోభిత జీవితాన్ని చిత్రించేదిగా ఉండాలని, తెలంగాణ నేటివిటీని పట్టి చూపేదిగా ఉండాలని, మానవ సంబంధాలను పునర్వ్యాఖ్యానించేదిగా ఉండాలని ఇలాంటి కొన్ని నియమాల్ని పెట్టుకొని ఎంతో సమయాన్ని వెచ్చించి, అనేక కథల్ని జల్లెడ పట్టి ఈ 12 కథల్ని ఎన్నిక చేశాము. ఎంపికలో వస్తు వైవిధ్యం, భాషా వైచిత్రి, శిల్ప నైపుణ్యాన్ని లెక్కలోకి తీసుకున్నం. ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా, కథకుల్ని పట్టించుకోకుండా కేవలం కథలను మాత్రమే పట్టించుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేయడం జరిగింది. మేం పెట్టుకున్న గీత మీద నడవలేక కొన్ని సార్లు జారిపడిపోయాం కావచ్చు. (ఈ విషయం విమర్శకులు, పరిశీలకులు, పాఠకులే చెప్పాలి.) ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కథల భాగస్వామ్యం చాలా పెరిగింది. ప్రతి సంవత్సరం ఉత్తమ కథల్ని(?) పాఠకులకు అందించడానికి అనేక కథా సంకలనాలు

వెలువడుతున్నాయి. ఆ కోవలోనే మేము ఈ సంకలనాలను 2013 నుండి తెస్తున్నాము. మా ప్రయత్నం ఏ మాత్రం సఫలీకృతమైనా మేము విజయవంతం అయినట్లే. ఈ ప్రయత్నాలన్నీ  మరిన్ని  ‘మంచి’ కథల్ని పాఠకులకు చేరవేయడానికి, లేదా రికార్డు చేయడానికి ఉపయోగ పడతాయని భావిస్తున్నాం. ఈ దిశలో సహృదయ పాఠకులు, విమర్శకులు సలహాను, సూచనలను ఆహ్వానిస్తున్నాం. ఎప్పటిలాగే ఈ తెలంగాణ కథ ` 2015ను కూడా ఆదరించి మాకు మరింత బలాన్నందిస్తారని ఆశిస్తున్నాం.

(అలుగు తెలంగాణ కథ -2015 రాసిన ముందుమాట)

 

మంచి చెడ్డలు పట్టించుకోండి!

ఏడాది కోసారి ఆ సంవత్సరం ప్రచురితమైన కథల్లోంచి తెలంగాణ దృక్కోణంతో మెరుగైన కథల్ని ఎంపిక చేయడం శక్తికి మించిన పని అని అనుభవ పూర్వకంగా అర్థమయింది. అయినా ఇది థ్యాంక్‌లెస్‌ జాబ్‌. థ్యాంక్స్‌ కోరుకొని ఈ పని చేయడం లేదు. తెలంగాణ సాహిత్యంఫై ఇష్టంతో ఈ పని జేస్తున్నాం. అయితే ఇంత జేసినా ఎక్కువ మందికి కంటు అయితున్నం. తెలుగు సాహిత్యంలో తెలంగాణ వస్తువు, శిల్పం, భాష ముద్ర ఉన్న 12 కథలను ఈ సంకలనం ద్వారా ఒక్క దగ్గరికి తెస్తున్నం. ఆయా పత్రికలు, అంతర్జాల మాధ్యమాలు వీటిని ప్రచురించే ముందు కొంత వడపోత పోసే వాటిని మలుగులోకి తెచ్చాయి. వాటిల్లోంచి మళ్ళీ వస్త్రగాలం బట్టి ఈ కథలను అందిస్తున్నాం. వివిధ వార్షిక కథా సంకనాల్లో చేరిన కథలను ఈ సంకలనం కోసం పరిశీలించలేదు. ఎక్కువ కథల్ని తెలుగు పాఠకులకు అందించడం ధ్యేయంగా ఈ పని చేయడం జరిగింది. ఇక నుంచి ప్రతి యేటా జూన్‌ నెలలో వార్షిక తెలంగాణ కథా సంపుటాలు తీసుకు రావాలని నిర్ణయించాం. ఈ సంకనలంలోని కథల ఎంపికలోని మంచి చెడ్డలు  పట్టించుకొని మాకు అండగా నిలవాలని మీ అందరినీ కోరుతున్నాం.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

మంచి కథలకు గట్టి హామీ

కోర్టు బెంచీ మీద కూర్చొని తెలంగాణ కథపైన అలవోకగా ఏదో తోచిన తీర్పు చెప్పడం కాదు. ఈ అలుగులో చేరని కథలు మంచి కథలు కావనీ కాదు. నిజానికి ఇందులో చేరని ఎన్నో మంచి కథలు మా దృష్టి నుంచి జారిపోవచ్చు కూడా. ఇవీ ‘మంచి’ కథలు అని తూచడానికి మా దగ్గర ఎలాంటి ‘తరాజు’ లేదు. అయితే సహృదయ పాఠకుల మనసులో ఏదో మార్పు, కథంతా చదివి మూసేసిన తరువాత పాఠకుని గుండెకు ఏదో జ్వరపీడిత భావన, కాస్తయినా పెయిన్ ఫీలవ్వాలని అనుకున్నాము. దానికి శైలీ, శిల్పమా, కథనమా,  భాషా, నేటివిటీనా లేదూ ఇవన్నీ కలిసిన మరో పేరేదేయినా పెడతారేమో కూడా తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలం. తెలంగాణ మట్టి (కథా వస్తువు) చాలా సారవంతమైనది. ఈ మట్టితో చాలా అందమైన, జీవితాన్ని వడగట్టిన శిల్పాలను (కథలను) తయారు చేయవచ్చు. అలాంటి శిల్పాలను మలిచే నాజూకు చేతుల  కోసమే మా తన్లాట. ఆ నాజూకు చేతి వేళ్ల నుండి ఏదో రూపాన్ని సంతరించుకొని మీ ముందు నిల్చున్నవే ఇందులోని కథలు. అన్నీ నచ్చుతాయని కాదు. ఒక్క కథైనా మీకు తప్పకుండా నచ్చుతుందని, తెలంగాణ నుండి మంచి కథలు వస్తున్నాయని, వస్తాయనీ హామీ ఇవ్వగలం. అయితే ఒక సంవత్సరంలో వెలువడిన కొన్ని వేల కథల్లో మంచి కథలను పట్టుకోవడం మాత్రం కొంచెం కష్టమైన పనేనని చెప్తూ మా ప్రయత్నం సఫలం అయిందో, విఫలం అయిందో పాఠకులు కథలన్నీ చదివి తమ విలువైన అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాం.

                                                                                      -వెల్దండి శ్రీధర్

 

కవిత్వం నాకెప్పుడూ మాయా వస్తువే!

prasada2

హిమాలయం ఎక్కుడుంది? అని

బడి బయట గాలిపటం ఎగరేసుకుంటున్న పిల్లాడిని అడిగాను

అదిగో అదే అని వాడు పై పైకి ఎగురుతూ పోతున్న

తన గాలిపటాన్ని చూపించాడు

హిమాలయం ఎక్కడుందో

 నాకు మొదటిసారి తెలిసిందని ఒప్పుకోనా మరి?

అని ప్రముఖ హిందీ కవి దిగ్గజం కేదార్ నాథ్ సింగ్ అంటాడో కవితలో. నిజమే మనకేం తెలుసు? బహుశా కవిత అంటే ఏమిటని ఎవరైనా పిల్లాడిని అడిగితేనే కాని తెలియదనుకుంటా నా మట్టుకు నాకు.

     అనాదిగా అదే సూర్యుడు అదే చంద్రుడు. అదే చీకటి అదే వెలుగు. అదే ఏరు అదే నీరు. అదే చెట్టు అదే నీడ. అదే పిట్ట అదే గాలి. అదే నింగి అదే నేల.  యుగాల పేగుల్లో ఊపిరి పోసుకుని  ఒకరిగా బయటకు రావడం. అనాది మానవ అనంత ఛాయా  ప్రవాహంలో కలిసి వెళ్లిపోవడం అంతా అదే.  రోజూ రాత్రి మరణం..ఉదయమే జననం. బతుకు నిండా పునరుక్తే. ఆలంకారికులు పునరుక్తిని దోషమన్నారు కాని దీన్ని అలంకారంగా మార్చుకోవడమే కవిత్వం అనుకుంటా.

        ఇది నా అయిదో కవితా సంకలనం. నాలుగో కవితా సంపుటి పూలండోయ్ పూలు వచ్చి రెండేళ్ళు దాటింది. ఈ రెండేళ్ళలో దేశంలోను, ప్రపంచంలోను, నాలోనూ చాలానే జరిగాయి. ఏది కవిత్వం..ఏది కాదు? అన్నది నాకెప్పుడూ ఒక పజిలే. నేను రాసేదంతా కవిత్వమేనా అన్నది కూడా ఎప్పుడూ నన్ను నా అక్షరాలే గిచ్చి గిచ్చి అడుగుతున్నట్టు అనుమానమే. అయితే కవులుగా మొనగాళ్ళు అనిపించుకున్న పెద్దల నుండి ఈ తరం యువకవుల వరకూ నా కవితల మీద వ్యక్తం చేసిన అపారమైన ఆత్మీయ రసస్పందన చూస్తే ఎక్కడో లోపల కించిత్తు తృప్తి కలుగుతుంది. అదే నా లోని ఆలోచనలను..స్పందనలను..భావాలను కవితలుగా మలిచే జీవధాతువుగా పనిచేస్తుంది.

           కవిత్వం దేని మీద రాయాలి అన్ని విషయంలో నాకెలాంటి ఊగిసలాటలi లేవు. ఎలాంటి నిషేధాలూ లేవు. అయితే కవి తన సామాజిక బాధ్యతను కలలో కూడా విస్మరించకూడదన్నదే నా వాదన..నా నివేదన. ఈ పుస్తకం మొదటి, చివరి కవితలు ఆ బాధ్యతను గుర్తు చేసేవే. ఇదంతా ఎందుకంటే ఈ మధ్య కవులు సందర్భాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇష్యూస్ వెంట రచయితలు కొట్టుకుపోతున్నారని కొందరు వింత వాదనలు చేస్తున్నారు. ఇది అనాదిగా వున్న విమర్శే. వాళ్ళన్నదే నిజమైతే కవులు రచయితలు సరైన మార్గంలోనే పయనిస్తున్నట్టు లెక్క. కాని వర్తమాన చరిత్రలో కొనసాగుతున్న దుర్మార్గపు పరిణామాలను కవులు కళాకారులు పట్టించుకోవలసినంతగా పట్టించుకోవటంలేదన్నదే నా కంప్లయింట్.

   సాధు జంతువులు జనం మీద విరుచుకుపడుతుంటే కవులే పులల వేషం కట్టి అసహాయుల పక్షాన పంజా విసరాల్సిన  తిరకాసు కాలమొకటి వచ్చింది. నిర్భయ భారతమంతా   అక్షరాల కొవ్వొత్తులు నాటాల్సిన సందర్బం ఏర్పడింది. అక్షర గర్భంలోనే ఆత్మహత్యకు పాల్పడే పెరుమాళ్ మురుగన్ ల చేతుల్లో భరోసా బాంబులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నగరాల్లో కల్బుర్గీలు..అడవుల్లో శ్రుతి రక్తధ్వానాలు.. బుల్ డోజర్లకు వేలాడు తున్న వేలాది నిర్వాసిత గ్రామసమూహాలు..ఎన్నెన్ని తరుముతున్నాయి? కత్తుల రెక్కలతో ఎగురుతున్న క్యాంపస్ లు కనిపించడం లేదా..?  చుక్కల ఆకాశంలోకి ఎగరిపోతున్న రోహిత్ లను కాపాడుకోవడానికి గుండెల్ని పెకలించుకుని అన్ని దిక్కులా కాపలా పెట్టాల్సిన అవరసంలో వున్నాం కదా..! ఒకపక్క శతాబ్దాల నుంచి తరిమేసి తరిమేసిన తిరిగి ఆ  ఇళ్ళల్లోకి.. అదే ఊళ్ళల్లోకి ఆజా..ఆజా వాపస్ అజా ఆజా అంటుంటే ఏది ఆహ్వానమో..ఏది ఆదేశమో..పిలిచేది చేతులో కత్తులో గుర్తెరిగిన కలాలు కావాల్సిన అనివార్య సందర్భాలు కావా ఇవి?  ఎలా? కవులు మరి ఈ అంశాలను కళ్ళెత్తి చూడకుండా ఎలా వుండగలరు?

      కాకపోతే ఆయా అంశాలను కవులు ఎంత కళాత్మకంగా కవిత్వీకరించారన్నదే ముఖ్యం. సామాజిక కళాంశాలను ఏకం చేసే నేర్పరితనం లేకపోతే ఎన్ని ఇష్యూస్ మీద ఎంత కవిత్వం పోగులు పెట్టినా వ్యర్థం. నేను 2016, ఫిబ్రవరి 2న ఆంధ్రజ్యోతిలో రాసిన కవిత ఎప్పుడైనా అన్నది రోహిత్ గురించే. కాని ఎక్కడా పేరు పెట్టలేదు. దాన్ని సరిగానే కన్వే చేశానని వచ్చిన స్పందన చూశాక అర్థమైంది. అరుణ్ సాగర్ మెసేజ్ (అట్టచివర వున్నది) దాన్ని చదివి పెట్టిందే. వాదన కోసం వాదనలాగా కవితో..కథో రాయకూడదన్నది నా అభిప్రాయం కూడా. ఆ అంశాన్ని కళాత్మకంగా పతాక స్థాయికి తీసుకు వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో భాగంగా నేనేమంత పెద్దగా రాణించానా అంటే నాకేమీ అంత నమ్మకం కలగటం లేదు. కడ దాకా ఆ ప్రయత్నం ఒక తపస్సులా సాగుతూనే వుండాలి.  

                   కవిత్వం నాకెప్పుడూ ఒక మాయా వస్తువే. ఏది విశ్వజనీనమో ..ఏది తక్షణ ప్రాధాన్యమో..తత్కాల తాదాత్మ్యాలను కాలాతీతం ఎలా చేయాలో..ఎప్పుడూ గందరగోళమే. కొన్ని వాదనలతోనో ..కొన్ని విశ్వాసాలతోనో..కొందరు కొన్ని కవితల్ని విపరీతంగా ప్రేమిస్తారు. కొందరికి అవి చాలా సామాన్యంగా పేలవంగా కనిపిస్తాయి. వందల ఏళ్ళు   ముందుకుపోయి ఆలోచిస్తే  వర్తమానాన్ని రికార్డు చేయలేవు.. రిప్రజెంట్ చేయలేవు. ఈ కాలంలోనే  ఇరుక్కుపోతే విశ్వాంతరాళంలో ఏ గోళం పైనా నీ చూపుల నీడలు వాల లేవు. అందుకే కవిత్వం నాకో మాయ వంతెన. మాయ దీపం. మాయ రూపం . మాయ చూపు. మాయ నవ్వు. మాయ కౌగిలి. మాయ ఊయల.మాయ శవ పేటిక. ఈ మాయామేయ  చలచ్చల వర్తుల పరిభ్రమణంలో ఎటు నుంచి ఎటో పయనం తెలీని నా గందరగోళం నాది. కాని కవిత్వానికి వస్తే నాకో చూపుంది. దానికెంత స్పష్టత వుందో చెప్పలేను కాని..చూడాల్సిందేదో చెప్పగలను. రాయాల్సిందేదో రాసే తీరుతాను. ఒకరి ప్రాపకం కోసం కాదు అది నా జీవన వ్యాపకం కాబట్టి.

     నా అంతర్ముఖీనత్వం, వయసురీత్యా అనివార్యంగా చోటుచేసుకుంటున్న తాత్త్విక ధోరణులు, శిల్పం మీద  మోజు నన్ను మరో వైపుకు నెడుతూనే వుంటాయి. అయినా నా రక్తంలో కదలాడే నీడలు మనుషులే. వాటి పరిమళాలే..పలకరింపులే..పలవరింతలే ఈ కవితలు.

                                               —————————

                                                                                       prasada1

విభిన్న వస్తు, కోణాల సమాహారం


Katha-15 Cover

పాతికేళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కథాసాహితి వారి కథాసంకలనాల్లో నేను కూడా ఈ రకంగా ఓ స్థానం సంపాదించుకున్నందుకు కొంత సంతోషంగానూ, కొంత గర్వంగానూ అనిపించినా- ఆ తర్వాత ఆ బాధ్యతని నెత్తిన వేసుకున్న బరువు మాత్రమే తెలిసివచ్చింది. కథల ఎంపిక అనేది అత్యంత సున్నితమైన ప్రక్రియ. మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే ఎంపిక జరిగినా- అవి చదువరులని చేరి, వాళ్ల ఆలోచనల్లో రేపవలసిన అవసరమైన కల్లోలాలని ఊహించి మరీ కథలని ఎంపిక చేయడం చాలా కష్టమైన పని. అందరూ చర్చించుకున్న కొన్ని కథలని- ఈ ప్రక్రియలో అదనంగా ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా- పక్కన పెట్టేయాల్సి రావడం కూడా బాధాకరమైన పనే!

ఈ కథాసంపుటాన్ని తయారుచేయడంలో, 2015 సంవత్సరంలో 42 పత్రికలలో వచ్చిన 1780 కథలని పరిశీలించాం. వచ్చిన కథలని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండటం వల్ల, ప్రతి కథకీ దానికి తగినంత సమయం కేటాయించడం జరిగింది. ఇంత ప్రక్రియ తరువాత, చివరి వడపోతలో కేవలం 12 కథలు మాత్రమే మిగలడం కొంత నిరాశని కలిగించడం మాత్రం వాస్తవం.

****

కథకి వస్తువు ఎంత ముఖ్యమో- ఆ కథని ఏ స్వరంతో చెబుతున్నామనేదీ అంతే ముఖ్యం. కథని రచయిత తను అనుకున్న పద్ధతిలో పాఠకుడికి చేర్చగలిగింది ఈ కంఠస్వరమే. ఆ స్వరం వైరుధ్యాలు లేకుండా ఉంటే, ఆ సూటితనాన్ని పాఠకుడు అప్రయత్నంగానే పసిగట్టగలుగుతాడు. అలాంటి సూటితనం, నిజాయితీ పాఠకుడి మేధస్సుకి సంబంధించిన అన్ని భద్రతా వలయాలనూ ఛేదించుకుని వెళ్లి, తాకవలసిన చోటుని తాకుతుంది. ఈ సంకలనంలో ఉన్న కథల్లో ఆ స్వరరచన ఎలా జరిగింది?

ప్రథమపురుష కథనంలో, ఆ తర్వాత వివిధ పాత్రల దృష్టికోణంలో నడిచిన చివరి చర్మకారుడూ లేడు… కథలో పాత్రలని బట్టి స్వరం మారడం గమనించవచ్చు. కథలో రచయిత వీలైనంత తక్కువ జోక్యం చేసుకుని, కథని మొత్తం నేపథ్యంలో ఉన్న డాక్యుమెంటరీలాగా నడుపుతారు. రచయిత పాటిస్తున్న ఈ దూరం వల్ల పాఠకుడు కథలో మరింత శ్రద్ధగా లీనమవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఇలాంటి ముక్తసరి కథనమే సావిత్రి కథలో కూడా గమనించవచ్చు. క్లుప్తమైన కథనం, సన్నివేశాల్లో మరింత బరువుని నింపుతుంది. చిత్తూరు మాండలీకంలో ఓ హోరుగా సాగే రాతిమిద్దాయన చిన్న కుమార్తె కథన ప్రవాహం, చివర్లో ఓ ఆశ్చర్యకరమైన క్షణంలో ఆగిపోతుంది. అక్కడ ఆ పాత్రకి లభించిన ఎపిఫనీ తాలూకు నిశ్శబ్దాన్ని, అంతవరకూ సాగిన హోరు వల్ల పాఠకుడు మరింత ఆస్వాదించగలుగుతాడు.

తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో కథకురాలి స్వరం ఇప్పటి తరం తాలూకు తాజా స్వరం. ఆ స్వరం వల్ల ఆ పాత్రని గుర్తించడానికీ, ఆ పాత్ర భావావేశాలపట్ల అవగాహనని ఏర్పరచుకోవడానికీ పాఠకుడికి ఎక్కువ సమయం పట్టదు. చివరివరకూ సాధికారికంగా, అద్భుతంగా సాగే ఆ స్వరమే ఈ కథకి ప్రత్యేకత. శతపత్ర సుందరి కథ చెప్పే నీలవేణి మానసిక, బౌద్ధిక స్థితి కథ మొదట్లో రెండుమూడు పేరాల్లోనే ఆవిష్కరించబడుతుంది. పాఠకుడిని అలా సిద్ధం చేయడం వల్లా, కథకురాలి స్వరం అదే ప్రశాంతోత్పాత స్థితిలో కొనసాగడం వల్లా ఆ పాత్ర తాలూకు జీవనవిధానం, దానిలో అంతర్గతంగా ఇమిడివున్న సంఘర్షణ పట్ల పాఠకుడి కుతూహలం చివరివరకూ కొనసాగుతుంది. చరిత్రకి సంబంధించిన మూడు కోణాలు కథలో ఉత్సుకతని ఎక్కడా చెదరనివ్వకుండా నడపడానికి కారణం కూడా, కథలో కథకుడు ఉపయోగించిన అధిక జోక్యం లేని కంఠస్వరమే!

నెల్లూరు మాండలీకంలో సాగే నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో కథకుడు (narrator) ప్రధానపాత్ర భాషలోనే కథని చెప్పడం వల్ల, ఆ పాత్ర పరిస్థితుల పట్ల పాఠకుడు ఆసక్తి చూపగలుగుతాడు. ‘కడగొట్టోళ్ల లోకి కడగొట్టుది ఆడదే,’ అన్న అర్థవంతమైన ఆవేదన కూడా ఆ పాత్ర భాషలోంచి రావడం వల్ల ఆ ఆవేదన మరింత భారవంతంగా ఆవిష్కారమౌతుంది. ఈ స్వరాలన్నీ ఒక ఎత్తైతే, క్రైస్తవ పద్ధతిలో జరిగే వివాహాల గురించీ, ఆ వివరాల గురించీ చెప్పే పరిశుద్ధ వివాహము: మూడో ప్రకటన కథలోని స్వరం విభిన్నమైనది. అన్ని వివరాలను వాస్తవిక స్వరంతో చెబితే ఆ కథ ఒక వ్యాసంలా తయారవుతుంది కాబట్టి, ఈ కథలోని కథకుడి స్వరానికి వ్యంగ్యాన్ని అద్దారు రచయిత. కథలో తను నిరసించదలచుకున్న అంశాన్ని ఎద్దేవా చేయడానికే కాకుండా, కథ మొత్తాన్నీ ఆపకుండా చదివేలా చేయడానికి ఈ వ్యంగ్యం చాలా కీలకమయింది.

తాతిల్‌ కథనంలో ఉపయోగించిన స్వరంలో ఉండే తెలంగాణ మాండలీకపు అమాయకపు స్వచ్చత- కథాంశంలో అంతర్లీనంగా ఉన్న ఆప్యాయతాస్పూర్తిని రెండింతలు చేసి చూపించడానికి సహాయం చేస్తుంది!

****

ఈ సంకలనంలో చర్మకారుల కథలు రెండు ఉన్నాయి. రెండు కథలూ, రెండు విభిన్న వాస్తవాలను చూపిన కథలు. చివరి చర్మకారుడూ లేడు… కథ-సమాజంలో వచ్చిన మార్పుల వల్ల చర్మకారులు ఇప్పుడు కనిపించకపోయినా, ఆ తరువాతి తరాలు ఒక్కొక్క మెట్టూ ఎక్కి సమాజంలో స్థిరపడటాన్ని చూపిస్తుంది. కులవృత్తులు నశించిపోతున్నాయి అనే అర్ధసత్యానికి సమాధానం ఈ కథ. కానీ, నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్న మారయ్య పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. మార్పేదైనా ఉంటే అది అదనంగా వచ్చి చేరే సమస్యల జాబితానే. అతను ఇంకా సమాధానాలు వెతుక్కుంటూనే ఉన్నాడు. ఈ రెండు కథలూ వాస్తవాన్ని చిత్రీకరించేవే. వాస్తవం అనేది భిన్న పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఎలా ఉండగలదో నిరూపిస్తాయి ఈ రెండు కథలూ.
చరిత్ర ఆధారంగా రాయబడిన రెండు కథలు ఈ సంకలనంలో చోటుచేసు కున్నాయి. ఆంగ్లేయుల పాలనలో సర్వే పనుల నేపథ్యంలో రాయబడ్డ మూడు కోణాలు మంచి సమగ్రమైన కథ. కథలో అన్ని పాత్రల అన్ని కోణాలనూ అవసరమైనంతమేరకు స్పృశించే ఈ కథ- ముగింపులో భారతీయుల గురించి ఒక వాస్తవికమైన పరిశీలన చేస్తుంది. ‘నైపుణ్యం ఉన్నచోట శాస్త్రం లేదు; శాస్త్రం ఉన్నచోట నైపుణ్యం లేదు…’ అని. ఆ పరిస్థితిలో ఇప్పటికీ చెప్పుకోదగిన మార్పు లేకపోవడమే ఈ కథ తాలూకు వర్తమానత. అందుకే డుంబ్రిలాంటి వాళ్లు, తోలు మల్లయ్య కొడుకు మారయ్యలాంటి వాళ్లు అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుబడి పోయి వుంటారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో జరిగిన చెరువుల అభివృద్ధి, దాని వెనక ఉన్న సాంకేతికమైన శాస్త్రీయతా అంతా కాలగర్భంలో కలిసిపోయి, నీరెటుకాడి కల కథలో పెద్దయ్యలాంటి వాళ్లని జీవన్మృతులుగా మిగిల్చింది. వాళ్ల ఆశ తీరదు, కోరిక చావదు, కలలు నిలవనీయవు, జీవితం బతకనీయదు! తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మల నేపథ్యంలో వచ్చిన అంటరాని బతుకమ్మ మరో మంచి కథ. ఉద్యమాలనాడు బతుకమ్మలు ఆడటానికి అడ్డురాని కులాలు, ఆ ఉద్యమం కాస్తా దాటుకుని ఇప్పుడు జీవితాలు స్థిరపడ్డాక, మళ్లీ యథాప్రకారం కొనసాగుతున్నాయి. రాజకీయాల అవకాశవాదాన్ని, వ్యక్తిగత భావావేశాల నేపథ్యంలో విమర్శించిన కథ ఇది.

రైతుల కథలు ఎన్ని వచ్చినా ఇంకా రాయబడని కథలు మిగిలే ఉంటాయి. ప్రకృతీ, ప్రభుత్వాలూ, పీడకులూ- అందరివల్లా దగా పడుతున్న రైతు క్షోభకి ఎన్ని కోణాలున్నాయి? ఆత్మహత్యే శరణ్యం అని పరిస్థితులు సూచిస్తున్నా, లేచి నిలబడి చుట్టూ చూసి స్థైర్యం తెచ్చుకున్న నారాయణ కథ ఊరవతల ఊడలమర్రి.
కుటుంబ నేపథ్యంలో వచ్చిన కథలు రెండు ఉన్నాయి ఈ సంకలనంలో. అభద్రతతో, అశాంతితో బతకడం కంటే, కొంత త్యాగం చేసైనా సరే (ఆ త్యాగమైనా తన తోబుట్టువు కోసమే కదా!) వాటిని వదిలించుకోవడం మంచిదన్న తాత్వికస్థితికి చేరుకోవడానికి ముందు రాతిమిద్దాయన చిన్నకుమార్తె కథలో నాగేస్పరి చాలా ప్రయాణమే చేసింది. చివరికి- వొళ్లు దెలవకుండా నిద్రపోగల సులువుని తెలుసుకోగలిగింది. అలాగే, మనుషుల్లోనూ, సమాజంలోనూ ఉండే నెగటివ్‌ ధోరణుల నేపథ్యంలో ఎక్కువగా సాగే కథల మధ్య తాతిల్‌ కథ కుటుంబంలో ఉండే అనురాగాలకి సంబంధించిన ఆహ్లాదకరమైన కథ. ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఈ సంకలనంలో స్త్రీవాదం పునాదిగా మూడు మంచి కథలు ఉన్నాయి. ఉపరితలంలో పొసెసివ్‌నెస్‌గా కనిపించే సదాశివ ప్రేమ వెనకాల నిజాయితే ఉందో, ముందరికాళ్లకు బంధం వేసే తెలివితేటలే ఉన్నాయో నీలవేణికి తెలీదు శతపత్ర సుందరి కథలో. బహుశా, ఆమెకి స్త్రీ సహజమైన ఓర్పు, క్షమ, ప్రేమలాంటి ‘బలహీనతలు’ ఉన్నంతకాలం, సదాశివకి తన ఆధిక్యం ప్రదర్శించడానికి అవకాశం దొరుకుతూనే ఉంటుంది. ఈ  ఆటలో  తెలిసో,  తెలీకుండానో  ఓడిపోతూనే ఉండే నీలవేణిలాంటి స్త్రీలకి ఉన్న ఏకైక బలం- మారాకులు వేయగలగడం. అందుకే ఆమె శతపత్ర సుందరి. వచనానికీ, కవిత్వానికీ మధ్య హద్దులు చెరిపేసి, అతి క్లుప్తమైన కథనంతో, స్త్రీపురుష సంబంధాల గురించి పలు ప్రశ్నలు రేపి ఆలోచింపజేసే కథ ఇది. ఈ తరానికి చెందిన మోహిత, తన అస్తిత్వాన్ని తను సంపూర్ణంగా ప్రేమించుకుంటూ, తనని తను ప్రేమించుకోవడంలోనే తన అస్తిత్వం దాగివుందన్న నిజాన్ని గ్రహిస్తుంది తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో. పోగొట్టుకోవడం అంటే ఓడిపోవడం కాదన్న నిజాన్ని కూడా గ్రహిస్తుంది, అందుకే ముగింపులో ధైర్యంగా అందర్నీ పక్కకి తోసేసి నడుస్తుంది. నిడివి విషయంలో కొంచెం పెద్దదే అనిపించినా, రాసిన ప్రతి వాక్యం చదివించగల శక్తి ఉన్నదవ డంతో కథనం చురుగ్గా సాగిపోతుంది. ఉద్యమాల నేపథ్యంలో రాసిన సావిత్రి కథలోని ఆ పాత్ర జీవితం ఏమిటో తెలుసుకునేలోపలే తన ప్రమేయం లేకుండానే అది తన చేతిలోంచి జారిపోయింది. భర్త పోరాటాలని కొంతవరకూ అర్థం చేసుకోగలిగినా, జీవితం తాలూకు వాస్తవికత సృష్టించే అవరోధాలను అధిగమించడం తన వయసుకీ, శక్తికీ మించిన పనైంది. ‘నువ్వు ఉండటానికి, చనిపోవటానికి మధ్య తేడా కనపడటం లేదయ్యా నాకు…’ అన్న సావిత్రి మాటల్లో ఆమె ఆవేదన వ్యక్తమవుతుంది. జీవితంలో కోరుకున్నది దొరకకపోగా, దొరికింది కూడా చేజార్చుకోవలసి వచ్చిన దైన్యమైన స్థితి. మూడు కథల్లోనూ స్త్రీ జీవితం తాలూకు వివిధ పార్శ్వాలు కనిపిస్తాయి.

****

ఈ సంకలనంలో ఉన్న పన్నెండుగురు కథారచయితలలో ఆరుగురు రచయిత/త్రులు మొదటిసారిగా ఈ కథాసాహితి వార్షిక సంకలనాలలో చోటుచేసుకోవడం విశేషం! ఈ ఆరుగురిలోనూ, ముగ్గురికి ఇదే తొలికథ. అది మరో విశేషం!
ఇలా విభిన్న వస్తు, కథన విశేషాలతో- అట్టడుగు జీవితాల నుంచి ఆధునిక జీవనశైలుల వరకూ ప్రయాణించిన ఈ కథలు మిమ్మల్ని కూడా ఆకట్టుకోవాలని మా ఆకాంక్ష!

హైదరాబాద్‌, 22 ఆగస్ట్‌ 2016

ఉదయాన్నే వెలిసిన వర్షం

ఉదయ్యాన్నే

 

రాత్రంతా కురుస్తూ ఉదయాన్నే వర్షం వెలసిన అనంతరం  ఎలా వుంటుంది?  అచ్చం తన అంతరంగ లోతుల్నుండి భావోద్వేగాలను తోడుతూ కవిత రాసిన అనంతరం కవి మనస్తితిలా వుంటుంది.  నిజాయితీగా తనదైన ఒక కవితని  రాయాలంటే కవి బాధో ఆనందమో ఎంత హోరుని అనుభవించాలి? వికాసమో విలాపమో జ్ఞాపకాల్లో ఎంతగా ఉక్కిరిబిక్కిరైపోవాలి?  దుఖం నుండో ఆనందం నుండో వచ్చిన కన్నీటిలో ఎంత తడిసిపోవాలి?

కిటికీగుండా చూస్తేనో లేక తలుపు తెరిచి గుమ్మం బైట తల పెడితేనో ఒక నిండైన దృశ్యం కనబడితే రామానుజరావుగారిలాంటి కవి ఊరుకోగలడా?  అందుకేనేమో ఆయన కవిత్వం నిండా దృశ్యాలు పరుచుకుంటాయి.

***

కవిత్వం గురించి ఆలోచించేప్పుడు చాలా ఆలోచనలొస్తాయి.  అసలు కవిత్వం అంటే ఏమిటి, ఏది కవిత్వం అని సందేహాలొస్తాయి.  కవిత్వం అంటే ఎదైనా కావొచ్చు. అది లిఖితం కావొచ్చు. మౌఖికం కూడా కావొచ్చు. నిర్వచనీయం కావొచ్చు లేదా అనిర్వచనీయం కావొచ్చు.   అయితే ఈ సందేహాల్ని దృష్థిలో పెట్టుకొని, ఒక నిర్వచన స్పృహతో కవిత్వం రాస్తే మాత్రం కవి దారుణంగా విఫలమౌతాడు.  ఒక కవిత్వ విమర్శకుడో లేదా ఒక మంచి పాఠకుడో నిర్వచనాల జోలికి పోవాలి కానీ “ఒక మంచి కవితకి ఇవిగో ఇవీ లక్షణాలు, ఇంకా ఈ లక్షణాలు నేనిప్పుడు రాయబోయే కవితలో ప్రతిఫలించాలి” అని కవి అనుకుంటే కవి ఊహాశక్తికి క్రోటన్ కత్తెర్లు పడతాయి.  ఒక గొప్ప కవి రాసిన కవిత్వంలో ఫలానా లక్షణాలు ప్రస్ఫుటమయ్యాయి కాబట్టి తాను కూడా అలాగే వస్తువు పరంగా, ఎత్తుగడ పరంగా, నడక పరంగా కవిత్వం రాస్తే అది ఎట్టి పరిస్తితుల్లోనూ మంచి కవిత్వం కాబోదు.

 

ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వర్తమాన తెలుగు కవుల్లో అనేకమంది ఎవరో ఒకరి కవిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవటం జరుగుతున్నది.  కవిత్వం రాయటానికి మరో గొప్ప కవిని ఆదర్శంగా తీసుకోవటం మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు.  అందుకే వారిలో ఒక స్వంత గొంతుక లోపిస్తున్నది.  తనదైన ఊహ, డిక్షన్ చాలామందిలో కనిపించటం లేదు.  ఒక గొప్ప కవిత్వం చదివాక కవి మనసులో ఒక గాఢమైన కవిత్వ వాతావరణం ఏర్పడాలి.  ప్రభావం వేరు, అనుసరణ వేరు.  కవిత్వంలోకి స్వంత రక్తాన్నెక్కించి పరుగులు తీయించటానికి ప్రభావం అడ్డుకాబోదు.  కానీ కలంలోకి పరాయి రక్తాన్నెక్కించుకొని రాస్తున్నట్లుంటుంది అనుసరణ కవిత్వం.

*****

రామానుజరావు గారు ఎంతోమంది అంతర్జాతీయ కవుల్ని చదివారు.  కానీ ఆయన ఎవర్నీ అనుసరించ లేదు.  ఆయన అనువాదాలు కూడా చేసారు.  ఆయన అనువాద కవితలకి, తెలుగులో స్వంతంగా రాసిన కవితలకి ఎక్కడా పోలిక లేదు.

 

కవి రాజకీయ, ప్రాపంచిక దృక్పధం ఏదైనా కావొచ్చు.  ఒకరి కవిత్వం ప్రధానంగా దృశ్య వర్ణనగా వుంటుంది.  మరొకరి కవిత్వం జీవితం గురించి, సమాజం గురించి వ్యాఖ్యానంగా వుంటుంది.  ఎలాగైనా వుండొచ్చు.  ఇలా రాస్తేనే కవిత్వం అంటే అదో రకపు మూర్ఖత్వం, నిరంకుశత్వం.  రాసే పద్ధతిని చర్చించొచ్చు.  కానీ నిర్దేశించటం సరైంది కాదు.

 

తనదైన శైలిలో వర్ణన ప్రధానమైన కవిత్వం రామానుజరావు గారిది.  కొన్ని చోట్ల భావుకమైన ఊహలు చేసినప్పటికీ  జీవన గాఢతని పట్టించే దృశ్య వర్ణన ఈ కవిలో ప్రధానంగా కనిపిస్తుంది.  ఆయనెంచుకున్న దృశ్యాలు భిన్న వర్ణ సముదాయం.  భిన్న భావోద్వేగాల సమ్మేళనం.  భిన్న సందర్భాల మాగమం.  అది భర్తని కోల్పోయిన స్త్రీ కావొచ్చు. అంధ భిక్షువు కావొచ్చు, అమ్మ కావొచ్చు.  తూర్పు దిక్కుగా దిగులుగా చూస్తూ పార్కు చీకటి దుప్పటి కప్పుకునే ముందటి సందడి కావొచ్చు. మోటార్ సైకిల్ మీద జాంఝామ్మని హుషారుగా షికారు చేసే  జంట కావొచ్చు.

 

కేవలం దృశ్య వర్ణనే కవిత్వం అయిపోదు  ఆ దృశ్యంలో తనను ఇముడ్చుకుంటేనే కదా కవిత్వం అయ్యేది.  తానెంచుకున్న దృశ్యం తాలూకు ఆనందంలో, దుఖంలో,  ప్రేమలో, పరవశంలో తాను మానసికంగా భాగం కాగలిగినప్పుడు,  ఆ దృశ్యాన్ని తన హృదయంలోకి ఆవాహన చేసి తనదైన అవగాహనతో మన ముందు పెట్టినప్పుడే కదా ఆ వర్ణన కవిత్వం కాగలిగేది.  చూడగానే మనసుని తడిమే ఒక దృశ్యం మీదుగా కవి జీవితాల్లోకి తొంగి చూడగలగాలి.  జీవితాల్లోని బాధలకి, ఆనందాలకి హేతువుని, మనుషుల్ని నియంత్రించే ఆర్ధిక, సాంస్కృతిక శక్తుల్ని పట్టించుకోకుండా కేవలం ఒక రసాత్మక స్పందన మంచి కవిత్వం కాజాలదు.  అయితే ఇదంతా ఒక్క కవితలో జరగక పోవచ్చు.  కానీ ఒక కవి రాసిన మొత్తం కవిత్వంలో ఆ అంశ ప్రతిఫలించాలి.  ఈ కవి సరిగ్గా అదే పని చేసారు.  కవి తన ఒక కవితలో ఇలా అంటారు:

“హృదయాన్ని తాకిన రూపమేదైనా

నా నరాల తీగెలను మీటే

ఆర్ద్రతే నా రస దృష్టి”.

కవిత్వ ప్రధాన లక్షణాల్లో ఒకటైన ఆర్ద్రతని తన రసదృష్టిగా  చేసుకున్నారు.

****

 

ప్రకృతి ప్రేమ, మానవసంబంధాలు, రొమాన్సు, ప్రాంతీయ అసహనాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, స్త్రీ సౌందర్యం, కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీ, పార్కులలో వ్యాహ్యాళి, నాన్న, డాబాపై కురులార పోసుకునే అమ్మాయి, అమ్మ…ఇలా జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, జీవితాన్ని ఆవరించి వుండే వాతావరణం, జీవితాన్ని సుసంపన్నం చేసే అనుభవాలు, జీవితం మీద ప్రేమని పెంచే భావోద్వేగాలు, సౌందర్య దృష్టి…అన్నింటినీ కవిత్వంగా స్వీకరించారు కవి.

 

 

“ఇంద్ర ధనుస్సు రంగుల్లో స్నానించిన పాలపిట్టొకటి

కారు బానెట్ పై వాలి ముక్కుతో పొడుస్తూ

మధ్యమధ్య తలెత్తి చూస్తూ మోగిన హారను శబ్దాన్ని

రెక్కలతో అదిలించి ఎగిరిపోతుంది”

 

“వాన చినుకుల్ని తాగి మత్తెక్కినట్లున్న రోడ్డుపై

మట్టి వాసన మోసుకొస్తున్న గాలితో పోటీ పడుతూ

సైకిల్ పై గడ్డి మోసుకొస్తున్న యువకుడు”

 

“అసహనం దుమ్మ్ పట్టిన కారు అద్దాల వెనక

నా పట్నవాసపు మితృడు

అకస్మాత్తుగా గొడ్లకాపరిగా మారి పిల్లనగ్రోవి ఊదుతూ

తన్మయత్వపు జడివానలో తడిసిపోతూ నేను” (“ఓరుగల్లుకు ఒక రోజు”)

 

“ఓరుగల్లుకు ఒక రోజు” ప్రకృతిలో జీవన సౌరభాన్ని వెతుక్కున్న కవిత.  ప్రకృతి ఎంత అందంగా వుంటుందో అంత అందంగానూ జీవితాన్ని చెక్కిన కవిత ఇది.  ప్రకృతిని ఇంత నాజూగ్గా పట్టుకొన్న మరో కవిత “ఉదయాన్నే వెలసిన వర్షం”.  ఇక్కడి దృశ్యవర్ణనలో మానవాంశని కవి హైలైట్ చేసిన తీరు బాగుంటుంది.  ఉదయాన్నే వెలసిన వర్షం ఏ దృశ్యాన్ని మంజూరు చేస్తుంది?

 

“వేకువనే వెలుగులిచ్చి వెళ్ళిపోతుంది

తూర్పు సముద్రంలో స్నానించి సూరీడు తేలి వస్తున్నాడు

ఇంటిముందు పారిజాతం చెట్టు

పులకరించి పూల దోసిళ్ళు విప్పార్చింది

ప్రేమ పావురాలు రెండు సన్ షేడ్ పై వాలి

క్రీనీడలో కువకువలాడుతున్నాయి”

 

“మా ఇంద్రపురి వీధిలో బాల గంధర్వుడొకడు

తలెత్తి అమృతం చినుకుల్ని ఆస్వాదిస్తున్నడు”

 

ఆయనొక ప్రాపంచిక దృక్పధానికి చెందిన కవి కారు.  కానీ అయన కవిత్వంలో హేతువు కనబడుతుంది.  ఆరోగ్యకరమైన ప్రతిస్పందన కనబడుతుంది.  ఆయన కవిత్వంలో ప్రశ్నలు లేకపోయినా పాఠకుల్లో అనివార్యంగా ప్రశ్నలు రేకెత్తుతాయి.  ఉదాహరణకి “గుజరాత్ గాయం” అన్న కవితలో ఇలా అంటారు.

 

“హింస ఒక వ్యసనమైతే

బోధివృక్షాల వేళ్ళు తెగుతాయి

చంపడమొక నాగరికత అయితే

ఏ సబర్మతీ తీరాన స్వాతంత్ర్యాలు అనర్హమౌతాయి

 

శతాబ్దాల యుద్ధాలు, భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు”

 

నిజమే “శతాబ్దాల యుద్ధాలు భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు” అన్నప్పుడు ప్రశ్నలు రేకెత్తకుండా వుంటాయా?

 

“నేనొక్కడినే” అన్న కవితలో “ఆ రాత్రి చెట్ల ఆకులు / ప్రసవ వేదనతో అల్లల్లాడుతూ” అంటారు.  ప్రసవ వేదనతో అల్లల్లాడే రాత్రి చెట్ల ఆకులు నిజానికి ఏదో నిగూఢ అంతరంగ అశాంతికి సంకేతం.  కవిత్వం రాస్తున్నప్పుడు తోచిన ఏ ప్రతీకైనా నిజానికి నిష్కారణంగా బైటికొచ్చేదీ కాదు, నిర్వ్యాపకంగా వుండదు.  చాలాసార్లు తన ప్రతీకలు ఏ కవికైనా ఆశ్చర్యం కలిగిస్తాయి.  కవిత్వం రాసే సమయం కవి జీవితంలో చాలా ప్రత్యేకమైనది.  తనను తాను కొత్తగా, మరింత లోతుగా పరిచయం చేసుకునే సందర్భం అది.  అటువంటి కొన్ని సందర్భాల్లో “వీధి కుక్కల వంతపాటలో స్రవించే విషాదాన్ని” అంచనా వేయటానికి అధివాస్తవిక ప్రతీకలతో “అంధ బిక్షువు” లాంటి కవిత పలుకుతుంది.

 

“రాత్రి

చీకటి దేహావృతమై

నక్షత్రాల వంకీ కర్ర ఆధారంగా

ఒక దయార్ద్ర హృదయ అన్వేషణలో

వీధి అంతా గిరికీలు కొడుతుంది

మూసిన తలుపుల ముందు కీచురాయి గొంతుతో

దీనంగా వేడుకుంటుంది”

 

అమెరికా లోని యూసమైట్ కొండల్లో సెలయేటిని చూసి అక్కడి ప్రశాంతతకి ఉక్కిరిబిక్కిరయిన కవి “ఇక్కడ అలలు లేవు”కవితలో అనుభూతుల జుగల్బందీని వినిపిస్తారు.

“చేతి పట్టు దాటి నీట తప తప తన్నే

ఆనందం

పిల్లల చుట్టూ ప్రవహిస్తుంది

ఇసుకలో కట్టిన గుజ్జన గూళ్ళు

కదిలి వస్తున్న పసితనాల పావురాలు

నిశ్శబ్దం నీట మునిగి కోలాహాలం”

 

ఇక్కడ నేను ప్రస్తావించని కొన్ని మంచి కవితలు ఇంకా వున్నాయి.  ద్రవ్యోల్బణం మీద రాసిన “రూపాయి”,  జంట ప్రయాణ ప్రణయాన్ని వర్ణించే “వాళ్ళిద్దరూ”, నోస్టాల్జియా మీద రాసిన “నాన్న” కవితలు చదవాల్సిన కవితలు.

కవిత్వంతో చాలా కాలం నుండి ప్రయాణం చేస్తున్నా చాలా తక్కువగా కనిపించిన రామానుజరావు గారు తన నడక వేగాన్ని పెంచాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళగల సత్తా ఆయనకుందని ఉదయాన్నే వెలసిన వర్షం సాక్ష్యం చెబుతుంది.

 

*

 

అవధూత గీత

dhyanam

ఆప్త చైతన్య గా ప్రసిద్ధి చెందిన దొడ్లంకి వెంకటరావు కవి, చిత్రకారుడు, పిల్లల ప్రేమికుడు, అన్నిటికన్నా మెహెర్ చరణాలముందు మోకరిల్లినవాడు. సహజంగానే ఉపాధ్యాయుల హృదయాలు చాలా విశాలంగా ఉంటాయి. ఇక ఆ ఉపాధ్యాయుడు కళాకారుడు కూడా అయితే చెప్పవలసిందేముంది? ఆ కళాకారుడు ‘ధూళిగా మారే’ ‘ప్రేమ పథికుడు ‘అయితే ఆ జీవితం నిత్యం దీపం వెలిగే కోవెలనే కదా.

ఇప్పుడు ఈ ‘కవితాధ్యానం ‘ చేతుల్లోకి తీసుకోగానే మనమట్లాంటి ఒక మందిరంలో అడుగుపెట్టినట్టు అనుభూతి చెందుతాం. అసలు కవిత, ధ్యానం రెండూ ఒకటే, ‘కవితా ధ్యానం ‘ ఒకరకంగా పునరుక్తి పదమే. కాని అర్థవంతం కాకపోతే కవి ప్రయోగించడు కదా. పుస్తకం ఒక పఠనం ముగించేటప్పటికి నాకేమనిపించిందంటే, ఇది కవిత ద్వారా చేసిన ధ్యానమని.

ధ్యానమంటేనే, మరే విషయం మీదా మనసు పోకుండా ఒకే అంశం మీద మనసుని లగ్నం చెయ్యడం కదా. అది నేరుగా జరగవలసిందే కదా. మధ్యలో కవిత్వమెందుకు?

ఇది చాలా సూక్ష్మమైన విషయమనిపించింది. దీని వెనక ఎంతో యోగశాస్త్రముందేమో కూడా. కాని, అనాది కాలంనుంచీ భక్తి కవులు చేస్తూ వచ్చింది ఇదే కదా. ఒక చోట తుకారాముడిట్లా అంటాడు:

‘తుకా అడిగేదొక్కటే, ఏదో ఒకటి మాటాడు నాతో
అప్పుడు ఈ కవిత కూడా ఏదో ఒకటి మాటాడుతుంది.’

కవిత మనకి అద్దం లాంటిది. అద్దం నిశ్చయాత్మకతకు చిహ్నం. మనమున్నామని మనకు ధైర్యం చెప్తుంది. కవిత కూడా అంతే. మన అంతరంగ ప్రయాణానికి అదొక అక్షరసంకేతం.

నిజమైన సాధకుడికి జీవితమంతా తనకీ దేవుడికీ మధ్య ఎడతెగని ఒక సంభాషణ. కొందరు సాధకులు తాము నిత్యం దేవుడి ముందు ప్రసంగిస్తూ, సంకీర్తన చేస్తూ ఉంటారు. అన్నమయ్య లాగా. కొందరు దేవుడి ప్రసంగాన్ని మౌనంగా వింటూ ఉంటారు, రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షి లాగా. కాని చాలామంది సాధకులకి అది తమకీ దేవుడికీ మధ్య సంభాషణ. తమ మాటలు దేవుడు వింటున్నాడనీ,తాము దేవుడి మాటలు వింటున్నామనీ తమని తాము గిల్లి చూసుకున్నట్టుగా వాళ్ళు అప్పుడప్పుడు కవిత్వం చెప్తుంటారు.
ఈ కవితా ధ్యానం కూడా అట్లాంటి సంభాషణ. అన్ని సంభాషణల్లోలానే ఇందులో కూడా కొంత కలకలం, కొంత కలవరం, చివరికి ఆ కల వరంగా మారేదాకా-

‘నీవు చెప్పేదంతా గందరగోళంగా కనిపిస్తాది నాకు
పరీక్ష పెట్టేవాడే తట్టుకునే శక్తినిస్తాడంటావు
పరీక్ష ఎందుకో, తట్టుకుని నిలబడ్డవెందుకో
నేనెంత తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు
కల గనడమెందుకొ,ఆ కలను బాధల ఒత్తులతో చెరపటమెందుకో ‘ (పే.7)

మామూలుగా ధ్యానం మౌన వ్యాసంగం. కాని కవితాధ్యానం కాబట్టి నాదమూ,రాగమూ, అనురాగమూ తప్పనిసరి. కాని ఆ ప్రయాణం దారితీసేది చివరికి మౌనానికే.

మౌనం నుంచి మౌనానికి చేసే ఈ ప్రయాణంలో సాధకుల మానసికావస్థలన్నీ గోచరమవుతున్నాయి కాబట్టి ఈ కవిత్వం మనకొక సాధకుడు అయాచితంగా తన ఆత్మరహస్యాన్ని విప్పి చెప్పినట్టుంది.

ఒక సూఫీకీ ఈశ్వరుడికీ మధ్య అనుబంధం మూడు దశల్లో బలపడుతుందని ఒక సూఫీ సాధువు చెప్పాడు. అందులో మొదటిదశలో సూఫీకీ, ఈశ్వరుడికీ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన ఒక క్లయింటుకీ, అతడి లాయరుకీమధ్య ఉండే సంబంధంతో పోల్చాడు. ఆ క్లయింటు తన లాయరుతో మొత్తం మొరపెట్టుకుంటాడు. ఏ చిన్న వివరం, రహస్యం, విశేషం ఏదీ అతణ్ణుంచి దాచడు.

‘ప్రీయమైన తండ్రికి,
ఆ ఒక్కటీ నీకు చెప్పేశాక
ఇంక నా దగ్గర ఏవీ మిగల్లేదు
నావన్నీ నువ్వు లాక్కుంటావని
ముందస్తుగా నన్ను హెచ్చరించిన నీకు
నా కృతజ్ఞతలనెలా తెలుపుకోవాలో నాకు తెలీదు.’ (పే.21)

అనే మాటలు ఆ దశకి చెందినవే.

రెండవ దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య అనుబంధం పసిపాపకీ, తల్లికీ మధ్య ఉండే హృదయబంధం. పసిపాప ఒక క్లయింటులాగా ఏదీ చెప్పుకోలేదు. అసలు మాట్లాడనే లేదు. తన సంతోషం, దు:ఖం ఏదైనా సరే, గుక్క పట్టి ఏడుస్తుంది. ఆ బాధ ఏమిటో ఆ తల్లికే తెలుస్తుంది, ఆ రోదన వినగానే, ఆ తల్లి పరుగు పరుగున వచ్చి ఆ బిడ్డను ఎదకు హత్తుకుంటుంది.

‘నేనెవరిమీద కేకలేస్తున్నాను?
నీ మీదేకదా!
నేనెవరిని కావలించుకుంటున్నాను?
నిన్నే కదా!
నా చుట్టూ నువ్వు తప్ప
వేరే ఎవరున్నారు?
నువ్వు కోపించడం చూసాను
నువ్వు ద్వేసించడం చూసాను
నువ్వు లాలించడం చూసాను
నువ్వు ప్రేమించడం చూసాను
నువ్వు మథన పడటం చూసాను
నువ్వు దు:ఖించడమూ చూసాను
నువ్వు పీకలు కోయడమూ చూసాను
నువ్వు నీ కుత్తుకను కత్తికి బలివ్వడమూ చూశాను
నువ్వు మోసగించడం చూసాను
నువ్వు మేల్కొల్పటమూ చూసాను ‘ (పే.86)

అట్లాంటి రోదన.

ఇక చివరి దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య ఉండే అనుబంధం ఒక మాసిన వస్త్రానికీ, ఒక రజకస్త్రీకీ మధ్య ఉండే సంబంధం లాంటిదట. ఆ మాసిన గుడ్డ కనీసం ఏడవను కూడా ఏడవదు. తనని తాను ఆ రజకస్త్రీ హస్తాలకు మౌనంగా సమర్పించుకుంటుంది. తన మురికి వదిలేదాకా, ఆ హస్తాలు తనని బండకేసి బాదుతుంటే, వళ్ళప్పగించేస్తుంది.

‘కొట్టేది నువ్వే!
కౌగలించుకునేది నువ్వే!’ (పే.6)

అనే మాటలు అప్పుడే వస్తాయి.

ఆప్త చైతన్య ఈ మూడు దశలూ దాటాడు అనటానికి, ఈ కవిత్వం ఒక ఆనవాలు. కనుకనే ఇట్లా అంటున్నాడు:

‘నా దృష్టి ఇప్పుడు దేనిమీదా లేదు
సూర్యుని మీదా లేదు
సుందరమైన ప్రకృతిమీదా లేదు.
భ్రమర ఝుంకారానికీ, ఝుమ్మన్న ఈగల శబ్దానికీ
తేడా నాకు తెలియడం లేదు
స్త్రీ వక్షానికీ, శరాఘాతానికీ తేడా నాకు తెలియడం లేదు.’

ఎట్లాంటి కవిత ఇది! నేను చదివిన అత్యున్నత ఆధ్యాత్మిక సాహిత్యానికి సరితూగే వాక్యాలివి, ఇంకా వినండి:

‘నా దృష్టి ఇప్పుడు సంతోషం మీదా లేదు
సంకట స్థితి మీద లేదు
మలయమారుతానికీ, మండే జ్వాలకీ
తేడా నాకు తెలియడం లేదు
వలపులు విసిరే నవ్వుకీ, వల విసిరే జాలరికీ
తేడా నాకు తెలియడం లేదు.
నా దృష్టి ఇప్పుడు కలమీదా, వాస్తవం మీదా లేదు
పగటికీ, రాత్రికీ తేడా నాకు తెలియడం లేదు
వగలకీ, పగలకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు నవ్వుల పడవ మీదా లేదు
కెవ్వుమన్న ఏడ్పుల పాడె మీదా లేదు
పకలరింపులకీ, పరనిందలకీ తేడా నాకు తెలియడం లేదు
తీయని మాటలకి, తేనె పూసిన కత్తులకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు సముద్రం మీద గాని, అలలమీదగానీ
నురుగుమీదగానీ, బుడగమీద గానీ లేదు
నీ మీదే ఉంది!
ఒక్క నీ మీదే ఉంది! (పే.28)

మన కాలంలో మన మధ్య సంచరిస్తున్న మన మిత్రుడొకరు రాసిన అవధూత గీత ఇది. ఇతడూ, నేనూ కలిసి కొన్నాళ్ళు ఒకచోట పనిచేసామని తలచుకుంటే నన్ను నేను అభినందించుకోకుండా ఉండలేకపోతున్నాను.

*

ప్రకృతి – మనుషులు – అండమాన్లు!

 

Andaman Diary Front Page

 

-కొల్లూరి సోమశంకర్

~

వాక్యాల వెంట పాఠకులను పరుగులు తీయించే రాయడం ఫిక్షన్‌ని విజయవంతం చేస్తే, రచయిత చేసే యాత్రలలో పాఠకులను తన వెంటే తీసుకువెళ్ళి వాళ్ళు కూడా మానసికంగా ఆయా ప్రాంతాలలో తిరుగాడినట్లుగా వ్రాయడం – యాత్రారచనలు ఎక్కువమందిని ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది. ఈ కోవలోకొచ్చే యాత్రా కథనం – దాసరి అమరేంద్ర గారి “అండమాన్ డైరీ”.

అమరేంద్ర గారికన్నా ముందు ఎంతో మంది అండమాన్ దీవులను చూసుంటారు, ఎంతో కొంత రాసుంటారు. భవిష్యత్తులో కూడా మరెందరో అక్కడికి వెడతారు, వాటి గురించి రాస్తారు కూడా. దర్శనీయ స్థలాలు మారవు… ఏం చూసాం, ఎలా చూసాం, ఎలా తిరిగాం అన్నవి వ్యక్తుల దృక్కోణాన్ని బట్టి మారుతాయి. అందువల్ల యాత్రాకథనాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అండమాన్ యాత్రల గురించి గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా చదివినా, ఈ పుస్తకం మళ్ళీ చదివిస్తుంది.

ఎవరైనా యాత్రలెందుకు చేస్తారు? ప్రదేశాలని, మనుషులనీ తెలుసుకోడానికి! తెలుసుకుని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కొంతమందికి కేవలం సందర్శనా స్థలాలను దర్శించితేనే తృప్తి కలుగుతుంది. మరికొందరికి ఆయా ప్రాంతాలలోని స్థానికుల జీవితాలను తెలుసుకోడంలో ఆసక్తి ఉంటుంది. తెలుసుకోడం – నేర్చుకోవడం – జీవితాన్ని మెరుగుపరిచే అంశాలు! జాగ్రత్తగా వింటే ప్రకృతి మౌనంగానే ఎంతో చెబుతుంది; ఆసక్తిగా వింటే మనుషులు తమ జీవితాల్ని వివరిస్తారు. వాళ్ళకుండి మనకి లేనివేవిటో లేదా మనకు ఉండీ వాళ్ళకి లేనివేవిటో అర్థమవుతుంది. పై పై మెరుగుల కోసం జీవితాన్ని సంక్లిష్టం చేసుకునే బదులు… జీవితాన్ని సరళంగా ఉంచుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుంది.

ఈ పుస్తకంలో – సముద్రం ఉంది, దీవులున్నాయి, కోరల్స్ ఉన్నాయి, అందమైన ప్రకృతి ఉంది. వీటన్నిటిని మించి మంచి మనుషులు ఉన్నారు. మెయిన్‌లాండర్స్‌ జీవన విధానాలకూ ఐలాండర్ల బతుకుతీరుకి ఉండే వ్యత్యాసంపై స్పష్టమైన అవగాహన ఉన్న మనుషులు వీళ్ళు. స్థానికులుంటారు; దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉంటారు.

ఇక ప్రకృతి విషయానికొస్తే, పుస్తకం ఉపశీర్షికలోనే చెప్పేసారు రచయిత – పచ్చల ద్వీపాలూ.. పగడాల సంద్రాలూ.. అని. రాస్ ద్వీపం గురించి,  సీతానగర్ బీచి రచయిత చేసిన వర్ణన – పాఠకుల మనస్సుల్లో కూడా అండమాన్స్ వెళ్ళిరావాలనే కోరికని నాటుతుంది. ఎలిఫెంట్ బీచ్‌లో స్నోర్‌కెలింగ్ చేసిన సందర్భంగా సముద్రం లోపల విహరించడం ఎలా ఉంటుందో చెబుతారు రచయిత. మనం కూడా స్నోర్‌కెలింగ్‌లో పాల్గొన్నట్లుగా అనిపిస్తుంది చదువుతూంటే. నీల్ ద్వీపం గురించి, బారాటాంగ్‌లోని మాన్‌గ్రోవ్‌ కెనోపీ వాక్‌ గురించి చదువుతుంటే ఉన్నపళాన అక్కడ వాలిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. మానసిక విహారం చేసి, అక్కడి అందాల్ని ఆస్వాదిస్తాం.

ఈ పుస్తకం మరో విశేషం… సంతృప్తికరమైన జీవితాన్ని గడిపే వ్యక్తులను పరిచయం చేయడం.. వీళ్ళ గురించి చదివినప్పుడు మనం అబ్బురపడతాం. వారి ఆలోచనా విధానానికీ, మానసిక పరిపక్వతకీ జోహార్లంటాం. కాస్తో కూస్తో వారి నుంచి నేర్చుకుంటాం.

తనకంటూ ఒక ఉనికి లేకపోవడమే మంచిదని భావించే ఓ గెస్ట్‌హౌస్ యజమానురాలు తన ఇంటినీ, జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం పాఠకులకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వీళ్ళే నావాళ్ళు అనుకోకుండా ఎవరైనా నా మనుషులే అనుకునే ఆవిడ పట్ల గౌరవభావం కలుగుతుంది.

తాగుడికి బానిసై భర్త చనిపోతే, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తూ చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉన్నంతలో గొప్పగా బ్రతుకుతున్న ఓ మహిళది స్ఫూర్తిదాయక గాథ. ప్రపంచం మీద భరోసా ఉన్న వ్యక్తి. బతుకు భయం లేని మనిషావిడ..

లక్ష్మణపూర్ అనే ఊరిలో రెండో బీచ్‌కి సమీపంలో ఓ కొబ్బరిబోండాల దుకాణం నడుపుతున్న పెద్దావిడది బంగ్లాదేశ్ మూలాలున్న కుటుంబం. భారత ప్రభుత్వం పునరావాసంపై వీళ్ళని ఇక్కడకి తరలించింది. ఈవిడ కొడుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్‌ పీజీ చేస్తున్నాడు. కూతురు బెంగుళూరులో ఐ.టి. ఉద్యోగం.. ‘ఇంకా ఈ కొట్టెందుకూ. మూసెయ్యి’ అంటారట పిల్లలు. ఆవిడేమో ‘ఇది నాకు అలవాటయిన జీవన రీతి. ఎలా వదిలిపెట్టాలీ! అసలు ఎందుకు వదిలిపెట్టాలీ’ అని బదులిస్తారు. ఎంత మానసిక దృఢత్వం కావాలి ఈ నిర్ణయం తీసుకోడానికి?

కాలాపత్థర్ అనే చోట బంగ్లాదేశీ మూలాలున్న మొండల్ అనే వ్యక్తితో మాటలు కలిపిన రచయిత అతని కుటుంబపు జీవన సరళి, ఆర్థిక వనరులు, స్నేహితులు, బంధువులు… గురించి ఎంతో తెలుసుకుంటారు.

కర్తవ్యపాలనని మించిన ఆర్తి కనబరుస్తాడో డ్రైవర్. అండమాన్ దీవుల జాతీయ పక్షులను యాత్రికులకు చూపిస్తూ వాటి సంఖ్య తగ్గిపోతోందని బాధ పడతాడు. ఇదే డ్రైవర్ తన వాహనంలో వచ్చిన యాత్రికులకిచ్చే బ్రేక్‌ఫాస్ట్ పాడయిపోయిందని తెలుసుకున్నాక స్పందించిన తీరు అతని నిబద్ధతని చాటుతుంది.

కొత్త జవసత్వాలతో నిండిన గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీకగా కనిపించే ఓ కుర్రాడు – రచయితకి ఆతిథ్యం ఇస్తాడు. ప్రపంచమంటే పట్టలేని ఆసక్తి అతనికి. చదువుకోవాలన్న తపన… ముంబయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మహా నగరాలు చూడాలన్న అభిలాష అతని మాటల్లో వ్యక్తమవుతుంది. సంస్కారవంతమైన వ్యక్తిత్వం!

రచయితకి ఆతిథ్యం ఇచ్చిన నౌకాదళం అధికారి ప్రకాష్‌ గారిది మరో కథ. డెహ్రాడూన్ మిలటరీ కాలేజి, నేషనల్ డిఫెన్స్ అకాడెమీలలో చదివి – కావాలానే నేవీని ఎంచుకున్నారాయన. పోటీ విపరీతంగా ఉండే రక్షణ రంగంలో వడపోత ఎక్కువనీ, ఎన్నికైన మెరికలంతా పదవీకాలమంతా పోటీ పడుతూనే ఉంటారని; ఒక్కోసారి మంచి ప్రతిభావంతులైనా వెనుకబడిపోక తప్పదనీ, అది జీవనసూత్రమని చెబుతారాయన. భవిష్యత్తుపై భయమూ, బెంగ లేకుండా – వ్యవస్థని గౌరవించే వ్యక్తి ఆయన. భావి జీవితం గురించి ఉద్వేగం లేకుండా ఆయన చెప్పిన తీరు బావుంది.

ఇంకా ఎందరెందరో మనుషులు… అందమైన వాతావరణంలో జీవిస్తూ… బ్రతుకుని శోభాయమానం చేసుకుంటున్న తీరు మనకీ జీవితంపై కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. జీవన సరళిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుందో అర్థమవుతుంది.

అండమాన్ దీవుల గురించి, స్థానిక తెగల గురించి, సెల్యులర్ జైలు గురించి, పురాతన సామిల్ గురించి, మ్యూజియంల గురించి, ఇతర దర్శనీయ స్థలాల గురించి తగినంత వివరణ ఉందీ పుస్తకంలో.

ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, కినిగెలోను లబిస్తుంది. 104 పేజీల ఈ పుస్తకం వెల రూ. 100/-.

InvitationAD1

 

ఒక పాఠక దృక్కోణంలో… కథా రచన!

Book

 – కె.వి.కరుణా కుమార్

~

 

ఈ పుస్తకం మార్చి 20, ఆదివారం నా చేతికొచ్చింది. పూర్తి పుస్తకాన్ని నాలుగు పనిదినాల ఒత్తిడి మధ్య పూర్తి చేశాను. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ప్రయాణంలో, ఎవరి కోసమైనా వేచి చూస్తున్నప్పుడు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. ఇది ఏకబిగిన చదవగలిగే పుస్తకం కాదని ఖదీర్‌బాబు అన్నారు. కానీ అలా అనిపించలేదు. ఈ పుస్తకాన్ని ఏకబికిన చదవొచ్చు. అల్మైరాలో దాచుకుని ప్రతీ పదిరోజులకూ ఓసారి మొత్తం చదువుతూ ఉండొచ్చు. లేదా పోటీ పరీక్షలకు తయారయ్యేవారిలా ఒక్కో అధ్యాయాన్ని చదువుతూ ఆకళింపు చేసుకుంటూ అవసరమైనపుడు మననం చేసుకుంటూ చదవొచ్చు.

అంతగా పదిలపరుచుకోదగిన అపురూప రచన ఇది.

అయితే ఇదంతా కథలు రాసేవాళ్లకేనా? నాలాంటి పాఠకుడికి ఇందులో ఏమీ లేదా? ఉంది.  ఖచ్చితంగా ఇది పాఠకుడి కోసం కూడా. ప్రతి మనిషీ కథకుడే. కనీసం తన స్వంత కథనైనా అతడు రాయగలడు.  దానిని నలుగురూ చదువుకునేలా రాయించడానికి అవసరమైన తర్ఫీదు కోసమే ఈ పుస్తకం రాశారేమో అని కూడా అన్పిస్తుంది. ఒక సాధారణ పాఠకుడిగా ఈ పుస్తకం  పూర్తి చెయ్యగానే నాకు బలంగా అన్పించిన విషయాలు మూడు.

మొదటిది:

ఎప్పుడో రాయటం ఆపేసిన చెయ్యికీ, రాయించే బుర్రకూ మళ్లీ ఏదైనా రాయాలని బలంగా అన్పించేలా ఈ పుస్తకం చేస్తుందని. ఉదాహరణకు నా సంగతే చూడండి. నేనేమీ రచయితను కాను. ఎప్పుడూ రచనలు చేయలేదు. బ్రతుకు బండిని లాగటానికి గుండెల్లో ఉన్న కాస్త చెమ్మనీ, భావుకత్వాన్ని కప్పిపెట్టి నిరంతరం అమ్ముతూ…. కొంటూ.. తాకట్టు పెడుతూ… తాకట్టుగా ఉంటూ నలిగిపోయే కాంక్రీటు జీవిని. నాలాంటి వాడికి కూడా ఏదైనా రాయాలనిపించేలా చేయటం ఈ పుస్తకపు మొదటి గొప్పతనం. అందుకే ఆలస్యం చేయకుండా ఇది రాయటం మొదలుపెట్టాను. ప్రారంభం ఏదైనా మంచిదే కదా!

రెండవది:

ఇది మన తల్లినో తండ్రినో ఒక గొప్ప శ్రేయోభిలాషినో గుర్తు చేస్తుందని కూడా అనిపించింది. నా వరకైతే ఈ పుస్తకం ఆద్యంతమూ నా తండ్రిని గుర్తుచేసింది. ఖదీర్‌బాబు ఈ పుస్తకాన్ని రాసిన విధానం ఒక తండ్రి- కొడుకు వేలు పట్టుకుని నడుస్తూ మంచీ చెడ్డలు మాట్లాడుతున్నట్లుంది. మా నాన్న కూడా ఇలాగే. కొన్ని వెన్నెల రాత్రులు… కొన్ని చీకటి రాత్రులు… ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ పక్కపక్కనే పడుకుని ఇద్దరం మాట్లాడుతూ ఉండేవాళ్లం. ఆయన కథలు, పద్యాలు చెప్పేవారు. ఊ… కొట్టుకుంటూ ఆయన చెమట వాసనను పీలుస్తూ, గట్టిగా వాటేసుకుని నిద్రపోయిన ఆ రోజుల్ని పుస్తకాన్ని చదువుతున్నంతసేపు గుర్తుచేశాడు ఖదీర్‌బాబుగారు. పుస్తకం అంతా ఒక తండ్రి కొడుకునో కూతుర్నో వేలు పట్టుకుని నడిపిస్తూ ఓర్పుగా వివరిస్తూ ఉన్నట్లుంది. స్థిరంగా మన అడుగు పడేవరకు నేర్పించటమే అతని ఉద్దేశ్యం. ఆ నడకతో నువ్వు శిఖరాన్ని అధిరోహిస్తావో, పాదయాత్ర చేస్తావో, తాగి బజారులో తూలుతూ నడుస్తావో అతడికనవసరం. నడకను నేర్పించటమే అతని పని.

ఇక మూడవది:

దాహం… అన్యాయమైన దాహం. వెంటనే తీర్చుకోలేని దాహం. ఈ దాహం అందరికీ కలిగేలా చేస్తుందని ఈ పుస్తకం చదివితే బలంగా అనిపించింది. ముఖ్యంగా  ‘కథలెందుకు రాస్తారు’, ‘మంచి ప్రారంభాలు – గొప్ప ముగింపులు’, ‘కథలెప్పుడు రాస్తారు’, ‘థీమ్-ప్లాట్’ ఇలాంటి అధ్యాయాల్లో ఇంతవరకు నేనెరుగని, చదువని సాహిత్యకారుల్నీ, కథలనూ పరిచయం చేస్తూ, ఆ కథలను అసలు కథలంత బలంగా తిరిగి చెప్తూ, ఊరిస్తూ ఉంటే వాటన్నింటినీ ఇప్పటికప్పుడు చదివేయాలనీ అన్ని పనులనూ ఒక సంవత్సరం పాటు ఆపేసి, ఆ పుస్తకాలన్నీ కొనుక్కుని, దొరకనివి ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని ఏకబిగిన దీక్షగా చదువుతూ ఆ ప్రపంచంలో మునిగిపోవాలన్నంత దాహం వేయటం ఈ పుస్తకం చదువుతుండగా కలిగిన ఇంకో భావన.

saranga6

ఖదీర్‌బాబు ఈ పుస్తకం రాసి నాలాంటోడికి చాలా మేలు చేశాడు. మిడిమిడి జ్ఞానం, ఉడికీ ఉడకని అవగాహన ఉన్న నాలాంటి పాఠకుడికి ప్రపంచ కథాసాహిత్యం వైపు కుతూహలం రేకెత్తించాడు. అట్టను చూసి పుస్తకాలను నిర్లక్ష్యం చేసిన నా చవుకబారు తెలివితేటలను అపహాస్యం చేశాడు. రాసేవాళ్లకు సరే… కానీ చదివేవాడికి కూడా బోలెడు తాయిలాలు ఈ పుస్తకంలో…

 

 మచ్చుకు… మెచ్చుకు… కొన్ని. నేను ఇష్టపడినవి!

* ‘కథలెవరు రాస్తారు?’ అధ్యాయంలో ‘ప్రతీదానికి చిలువలు, పలువలుగా ఊహించుకుంటూ ఉండాలి’ అని మొదలుపెట్టి ‘తర్వాతి పేరా అప్పటికే సిద్ధమైపోయి ఉంటుంది’ అని ముగించే ఓ పేరా ఉంటుంది. అది చదువుతూ ఉంటే పెదవులు మెల్లగా విచ్చుకుని మందహాసంగా మొదలై, ఫక్కున నవ్వటం మీరు చేయకపోతే నన్నడగండి.

* అదే అధ్యాయంలో ‘రాత్రి శ్వాస సోకితే చాలు ఆయువు వదిలేసి రాలిపోయే పూల మృత సౌందర్యాన్ని పరికిస్తూ’అని మనలో భావుకత్వం ఏ స్థాయిలో ఉండాలో వివరిస్తాడు రచయిత. మృత సౌందర్యం అనే ఆ పదాన్ని వాడినందుకు ఖదీర్‌బాబు వేళ్లను ముద్దాడాలనిపిస్తుంది.

* ‘అవంతీపుర రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పాలిస్తున్న రోజులవి’ అని మొదలెట్టి ‘వక్కాకు ఊంచి అరుగు మీద కూర్చున్నాడు గోవిందప్పా’ అని పాతకథలను గుర్తు చేస్తూ ఏకబిగిన నోస్టాల్జియాను కళ్ల ముందు మెరిపిస్తాడు. ఒక్క క్షణం గిర్రున కాలం వెనక్కు వెళ్తుంది.  పక్కింట్లో, ఎదురింట్లో, రెండు వీధుల తర్వాత ఉన్న మేనత్తగారి ఇంట్లో, షావుకారు కొట్టు ముందుర, మంగలిషాపులో వేచి ఉన్నప్పుడు, ముత్యాల చెరువు గట్టుమీద గ్రంథాలయంలో దీక్షగా బాసింపట్టు వేసుకుని మర్రిచెట్టు గాలికీ, చెరువు పైనుంచి వచ్చే వింత వాసననూ పీలుస్తూ చదువుకున్న అన్ని పుస్తకాలు, రచయితలు వచ్చి పలకరించి వెళ్తారు. స్థలం మారొచ్చు. పాత్రలు మారొచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కో నోస్టాల్జియా మాత్రం నిశ్చయం.

* ‘కథలెందుకు రాస్తారు?’ అధ్యాయంలో రచయిత మానసిక పరిస్థితినీ, కథా రచయితకుండే అవగాహనను, సమాజం పట్ల చిత్తశుద్ధినీ నిజాయితీగా ఆవిష్కరించాడు రచయిత. ‘అదొక పిచ్చి… సైకలాజికల్ ప్రాబ్లమ్’ అన్న పేరాను చదువుతూ ఉంటే దుఃఖం కలుగుతుంది. కళ్లల్లో నీటి పొర ఏర్పడుతుంది. ‘ఆలోచన… ఆలోచన… ఆలోచన’ అని ఒక వాక్యం ఉంటుంది. అదే పేరా కూడాను. ఆలోచనకు ఆలోచనకు మధ్యన పెట్టిన చుక్కల్లో మనస్సు చిక్కుబడిపోతుంది. ఆ చుక్కల్లో రచయిత పడే మానసిక ప్రసవ వేదన ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంటుంది.

* ఒకే జానర్ లేదా ఒకే కాన్‌ఫ్లిక్ట్‌ను ముగ్గురు రచయితలు ఎలా రాశారో ‘పోత్తి చోరు’, ‘ఎస్తర్’, ‘సావుకూడు’ కథలను ఉదహరించినపుడు కరూర్ నీలికంఠ పిళ్లైకు, వణ్ణనిలవన్‌కు, బండి నారాయణ స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆ కథలు మనలోకి విసిరికొట్టే కథావస్తువు అలాంటిది.

ఇక ఎంత చెప్పినా తక్కువే అన్న విభాగం ఒకటుంది ఈ పుస్తకంలో. అది ‘ఫుట్ నోట్స్’.

ఎందరో రచయితలు, ఇంకెన్నో కథలు, మరిన్నో ప్రదేశాలు, చాలా జ్ఞాపకాలు, కాలంతో నిలబడిన, ఎదురొడ్డిన సాహిత్యం అన్నింటినీ సమగ్రంగా అధ్యాయం వారీగా ఆ వివరాలను ఫుట్‌నోట్స్‌లో పొందుపరిచిన ఖదీర్‌బాబు ఎలా రుణం తీర్చుకోగలం. ఎంత సాహిత్యం… ఎంతమంది కథకులు… ఎంత అదృష్టం. అంతా ఒకేచోట. ఒకే పుస్తకంలో. కథకుడికైనా, పాఠకుడికైనా ఈ పుస్తకం అదృష్టం. గొప్ప అదృష్టం. ఇది మామూలు విషయం కాదు. చాలా ఓపిక, తను చెప్పాలనుకున్నది చెప్పే తీరాలి అన్న పట్టుదల లేకపోతే అంత సమాచారం అంత పొందిగ్గా పొందుపరచటం దుర్లభం.

karmikulu

పుస్తకం అంతా ఒకటే తపన.

నువ్వు కథకుడివా, పాఠకుడివా నాకనవసరం. నాకు తెల్సిందీ తెలుసుకున్నదీ నీకు చెప్తున్నా… నిజాయితీగా ప్రయత్నిస్తున్నా.. బదులుకు నువ్వొక కథ రాయి, అది నీ కథైనా కావచ్చు. కుదరకపోతే ఒక మంచి ఉత్తరమైనా రాసి ప్రారంభించు.., కథ రాయాలని తాపత్రయపడేవాడికి ఈ పుస్తకమివ్వు… ఓనమాలు దిద్దటం నుంచి కాగితంపై గొలుసుకట్టు రాతను ధారగా రాయటం వరకూ ప్రస్తావించాను… నేర్చుకో… అని ఖదీర్‌బాబు మనల్ని సుతారంగా అభ్యర్థించాడని నాకనిపిస్తూ ఉంది.

‘విమర్శను ఎదుర్కోవటం అంటే ఇంకా మంచి కథ రాయటానికి ప్రయత్నించటమే’ అని చెప్తుందీ పుస్తకం. దానికి  సద్విమర్శను స్వీకరించకపోతే నువ్వూ, నీ కథ సంకనాకి పోతాయి అని కూడా హెచ్చరిస్తుందీ పుస్తకం.

ఇన్ని సంగతులు, జాగ్రత్తలు విపులంగా మనకెవరు చెప్తారు? తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడమని ఎవరు బోధచేస్తారు? ఈ పుస్తకం ఇప్పుడేమవుతుందో తెలీదు. భవిష్యత్ రచయితలకు మాత్రం పాఠ్య గ్రంథంగా పనికొస్తుందని గట్టిగా అనిపిస్తోంది నాకు. చదివితే మీకూ అన్పిస్తుంది. నిజం.

*

ఒకపరి జననం ఒకపరి మరణం

001

   –సి.ఉమాదేవి 

~

 

నిబద్ధతతో విశ్లేషణాత్మకంగా పరిశీలించి,  పరిశోధించి పాఠకులను తన రచనాపఠిమతో ఆయస్కాంతంలా ఆకర్షించేలా రచనచేయగలగడం రామా చంద్రమౌళిగారి ఒరవడి.పైగా రచనలోని లోతైన భావాలను వెలికి తీయించే పనిని మనకు తెలియకుండానే మనకే అప్పగిస్తారు.అక్కడక్కడా తటిల్లున మెరిసే పద మెరుపుల చురకలు ఒకొక్కసారి ఉరుములై గర్జిస్తాయి.

మనిషి జీవితంలో జననం చలనం,మరణం నిశ్చలనం.ఈ రెండు స్థితులనడుమ పయనం మనిషి మనుగడకై చేసే సంగ్రామం.

లోకానికి మనిషి పుట్టుకను తెలుపుతూ తొణికిన తొలి భాష్పం రాగరంజితం.అదే మనిషి మరణాంతరం  నలుగురి తలబోతలో ఒదిగినప్పుడు ‘ నీవు మరణించలేదు, అందరి గుండెల్లో పదిలమై శాశ్వతంగా జీవించే ఉంటావు’ అని ఆనాటి భాష్పానికి భాష్యం చెప్తుంది. నిజమే! మనిషిగా జన్మించాక మరణించక తప్పదు.అయితే మరణించాక కూడా జీవించాలి.అయితే ఆ జీవనంలో  లక్ష్యమనేది లేకపోతే అది మరణమే.అందుకే నేటి యువతకు దిశానిర్దేశం చేసి ప్రోద్బలం అందించాలి.గురిపెట్టిన లక్ష్యానికి చేరువకావాలంటే మార్గం సుగమం కావాలంటారు రచయిత.ఆలోచనలను చదవాలంటారు.నిజమే కదా!

‘ ది వాకర్ బ్రాండ్’ పాదరక్షల వ్యాపారంలో అగ్రగామిగా నిలవడానికి చోదకశక్తినందించిన వ్యక్తి లోల.ఆమే ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విభిన్నఆలోచనలతో కంపెనీని ఊర్ధ్వపథంలో నిలిపింది.డబ్బు,పదవులు, అధికారాలు, ఆధిపత్యాలు కొందరికి ఆనందాన్నిస్తాయి.కాని కొందరికి తమ నైపుణ్యం అందించిన విజయాలు ఆనందంకన్నా అమితమైన తృప్తిని కలిగిస్తాయి.పరిమళకు అర్థమైన లోల మనసు ఇదే.సర్చ్,రిసెర్చ్ రామా చంద్రమౌళి గారి మంత్రాక్షరాలు.రచయిత తనకు నిర్దేశించిన బాటలో తన అడుగులను బలంగా ముద్రించుకోగలిగిన సదాశివ, జాతిని ప్రభావితం చేయగలిగే ఆవిష్కరణల దిశగా పయనిస్తాడు.అయితే విజయవ్యూహాల్లో మానవీయ స్పర్శను దర్శించాలనడం మానవతను ఆరాధించేవారికి దైవదర్శనమే!సౌరశక్తిని వినియోగంలోకి తెచ్చుకుని సోలార్ సిటీ రూపకల్పన,బ్యాటరీతో నాలుగు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే మూడువందల కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగే  ‘ లోల మోటర్ బైక్ ’

రూపకల్పనపై  ఉదహరించిన దృశ్యం(పవర్ పాయింట్ ప్రజంటేషన్ ) నవల ముగింపులో ఉత్సుకత కలిగించిన అంశం. ప్రజాప్రతినిధుల అండ దొరకడం అతడిని లక్ష్యదిశగా నడిపింది. “ జాగ్రత్తగా విను లోలా!” అని సదాశివ చెప్తున్న మాటలను మనము కూడా  చెవి ఒగ్గి వింటాము.ఘంటసాల,ముఖేష్ ఈనాడు లేరు.అయినా చిరస్మరణీయులే అని చెప్పే సదాశివ చరిత్రలో మిగిలిపోవాలన్న ఆకాంక్షపై దృష్టి కేంద్రీకరిస్తాడు.తను  రూపొందించాలనుకునే పరిశ్రమలకు ప్రభుత్వ వెన్నుదన్నేకాదు లోల తోడ్పాటును కోరుకుంటాడు.  తన పదవికి రాజీనామా చేసి లోల అతడి ఆహ్వానం మేరకు కలిసి పనిచేయడమేకాదు,కలిసి జీవించాలనుకుని తీసుకున్న నిర్ణయంతో మనము కళ్యాణమస్తు అని నవల ముగిస్తాము.అయితే వెంటాడే ఆలోచనలు తలుపులు మూయవు.అదే నవలకున్న సుగుణం.చదివిన పుస్తకంనుండి ఏదైనా కాస్త నేర్చుకోవాలనుకునే శ్రద్ధ ఉన్నవారికి  ఈ పుస్తకం కరదీపిక అనడంలో అతిశయోక్తి లేదు.

*

 

రోహిత్ యిప్పుడు రెక్క విప్పిన ఉప్పెన !

 

 

We want solid words
that resist in the middle of the night

rock-hard
unyielding words.

-Roque Dalton

 

1

 

బహుశా వొక లాటిన్ అమెరికా కవో, యింకో ఆఫ్రికన్ కవో, మరింకో  ఇరాక్  కవో, మన దాకా వస్తే కచ్చితంగా ఏ దళిత ముస్లిం కవో యీ మాట యింతగా తెగేసి చెప్పగలరు. మనం వూహించినట్టే Roque Dalton లాటిన్ అమెరికన్  కవి. ఇవాళ రోహిత్ గురించి వెల్లువైన యీ కవిత్వ వుప్పెన మధ్య నిలబడితే, నన్ను Roque Dalton ఆవహిస్తున్నాడు. విప్లవోద్యమ రణక్షేత్రం మధ్యలో నాలుగు పదుల వయసులో రాజ్యానుకూల శత్రువుల చేతుల్లో దారుణ హత్యకి గురైన వాడు Roque Dalton.

మనం యిప్పుడు తలచుకుంటున్న రోహిత్ అతనిలాంటి కవి కాకపోవచ్చు, కాని- అందమైన కల చూస్తూ చూస్తూ బలవంతాన కళ్ళు మూసుకున్న స్వాప్నికుడు. ప్రతి స్వాప్నికుడూ తనదైన వొక కవిత్వ సీమలో జీవిస్తూ వుంటాడు. ప్రతి మాటా, ప్రతి చర్యా కవిత్వ ఉద్విగ్నంగా బతుకుతాడు.

కవిత్వ భాషలోనే చెప్పాలంటే- యీ లాటిన్ అమెరికన్ కవి అన్నట్టు- solid words- లో యీ కాలపు ఉద్యమకారుడూ, ఉద్యమ కవీ బతుకుతాడు. మాటలు సర్రు సర్రున జారిపోతున్న విష సర్పాలు  మాత్రమే అవుతున్నప్పుడు, చలి చీమల్లాంటి చురుక్కున కరిచే పదాలు కావాలి, బలవంతమైన సర్పాన్ని బంధించడానికి! లేని నిశ్శబ్దాన్ని వూహించుకొని, లోపలి labyrinth అడవుల్లో  తెలుగు కవులు అదృశ్యమై పోతున్న కాలం ఇది. ఉద్యమం అనేది బహిష్కృత భావన అయిపోతున్న దశ. కవి అంటే కేవలం కవి మాత్రమే అనే archaic ఆలోచన చుట్టుముడుతున్న స్థితి. సోషల్ మీడియా మాయలో భాష స్పృహ తప్పిన అకాలం,  విపరీత బలవంతపు “ఇష్టాల”, ఇచ్చి పుచ్చుకునే కామెంట్ల negotiation మాత్రమే మిగిలి ఉంటున్న వ్యాపార కాలం. ఇది కవుల మీద ఫిర్యాదు కాదు, మొత్తంగా మన మధ్య మాటలు వొట్టిపోయిన స్థితి మీద ఎలిజీ. సాహిత్యం తన పాత్రని సరిగ్గానే పోషిస్తోందా అన్న ప్రశ్న వొకటికి పది సార్లు ఆలోచనల్లో తూట్లు పొడుస్తున్న గాయాల మధ్య వెతుకులాట.

ఇదిగో- యీ కృత్రిమ తగరపు మెరుపుల మధ్య రోహిత్ నిష్క్రమణ వొక విస్ఫోటనం!

 

 

2

రోహిత్ యిప్పుడు వొక phenomenon. రోజూ చస్తూ బతికే రొటీన్ గుండెల మీద పిడుగుపాటు లాంటి phenomenon. దీనికి వొక కులమో యింకో మతమో అక్కర్లేదు. మన వునికి రాహిత్యాన్ని చెరిపేయాల్సిన అవసరాన్ని చెప్పడం కోసం తనని తానే వొక erasure గా మార్చుకున్నాడు రోహిత్. యిలా అనడం అంటే అతని మరణాన్ని కీర్తించడం కాదు. వొక అధ్యాపకుడిగా నేను అలా నా విద్యార్థిని చూడలేను, లేదూ, వొక స్నేహితుడిగా అతని చివరి చర్యని యెట్లా అయినా సమర్ధించే పని  చేయలేను, లేదూ వొక ఉద్యమ ప్రేమికుడిగా అతని ఆ చివరి నిర్ణయంలో కారణాన్ని వెతకలేను. కాని, ఎన్నింటికి కారణాలు వెతికే శక్తి మనలో వుంది?!

యీ పుస్తకంలోని కవితల్లో కవులు ఏకరువు పెట్టిన అనేక “ఎందుకు” ల వరస క్రమం ఇదీ:

  1. ఎందుకో ఏకాగ్రత శిబిరాలు అని పిలవరుగానీ

మన పెరట్లో పూసిన భావజాల పువ్వులే వధ్యశిలమీద రాలిపోతుంటాయి (విల్సన్ సుధాకర్)

  1. ఏందోగాని అబయా !

మన పాలిటనే ఫిర్యాదులన్నీ ఫిరంగులౌతయ్

ఉత్తరాలన్నీ ఉత్తరించే కత్తులౌతయ్

వివక్షరాలే వెలివాడలూ , ఉరితాడులూ

ఇనుప గోరీలుగా మారిపోతయ్ (కృపాకర్)

  1. ఎందుకనుకున్నావ్ ?

నీ రాజీనామా తర్వాత నువ్వుండవని! (మిథిల్)

యిలా యింకా కొన్ని ఎందుకు అన్న శోధనలన్నీ వెతకవచ్చు.

 

ఇలాంటివి జరిగినప్పుడు శుభ్ర స్థిమితంగా, శుద్ధ నిబద్దంగా  కవిత్వం రాయాలనుకునే మనస్తత్వం వున్నవాళ్ళు సందిగ్ధంలో పడిపోతారు. ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో  ఆదర్శంగా నిలబెట్టుకున్న స్థిమిత సందర్భం ఇది కాబట్టి! కళ్ళ ముందు కదులుతున్న వాస్తవికత వాళ్ళని కలవరపరుస్తుందో లేదో కాని, అది వాళ్ళ కవిత్వంలో మాత్రం ప్రతిఫలించదు. కవిత్వ స్వచ్చ స్ఫటికత గురించి ముందే ఏర్పరచుకున్న నిర్వచన నియామాలూ, నిబంధనలూ వాళ్ళ వ్యక్తీకరణని అటకాయిస్తాయి. “ఎందుకు” అన్న ప్రశ్న యిక్కడ నిష్ఫల యాగమై పోతుంది. ఈ సంకలనంలో పలకరిస్తున్న కవులకి అలాంటి సంశయాలు లేవు, తాము రాస్తున్నది కవిత్వమేనా కాదా అన్న విచికిత్సా లేదు. కళ్ళ ముందు జరిగిన వొక  దారుణానికి వాళ్ళ ముఖాల్లోకి పొంగిన నెత్తుటి యేరుని దాచుకోకుండా దాన్ని వాక్యాలలోకి మళ్ళించే restless ప్రయత్నం వీళ్ళది.

అసలు ఇంత Restlessness – అశాంతి- అనేది వుందా అని naïve గా అడిగే వాళ్ళని ఏమీ అనలేం, జాలి పడడం తప్ప! కాసినీ పూలూ రెమ్మలూ ఆకాశాలూ పచ్చని నేలా వూరికే  సోమరిగా తిరిగే మబ్బు తునకలే కవిత్వం అనుకుంటే చేయగలిగేదీ లేదు. అంతకంటే ముఖ్యంగా ఏదో అంటీ ముట్టనట్టుగా నాలుగు వాక్యాలు “శుద్ధం”గా రాసుకొని, జీవితం ఎంత  హాయిగా వుందీ అనుకునే మాయదనమూ వుంది. కాసేపు ఏ యోగినో, మహర్షినో తలచుకొని, కళ్ళు మూసుకునే అంతర్జాల మార్జాల కవులూ వున్నారు. నిజానికి వీళ్ళ లౌకిక జీవితం మూడు సత్కారాలూ ఆరు అవార్డులుగా వర్ధిల్లుతూ వుంటుంది. వీళ్ళ చుట్టూ కవి సమూహాలు మోకరిల్లి వుంటాయి. వొక అబద్దాన్ని శుద్ధ కవిత్వంగా మోసుకుంటూ తిరుగుతూ వుంటారు.  ఇలాంటి వాళ్ళని రోహిత్ చాలా ఇబ్బందిలో పెట్టాడు.

హెచ్చార్కె అన్నట్టు:

బుద్ధి కేంద్రాలలో కాదు, ఆత్మ క్షేత్రాలలో పోరు

తప్పుడు తర్కాలు, వంచన వ్యూహాలు చాలవు

మనస్సులే ఆయుధాలు. ఒకడు నిలబడింది

ఫెన్సింగ్ కి ఎటు వైపని కాదు, వాడి రొమ్ముల్లో

ఏమైనా కొట్టుకుంటూ వుంటే అది నీ పక్షాననే

అవుతుంది, లేదా వాడొక నడుస్తున్న శవమని

రుజువవుతుంది

ఇవాళ్టి వుద్యమజీవుల కంటే కూడా  సాహిత్య జీవులకి ఇలాంటి “తప్పుడు తర్కాలూ, వంచన వ్యూహాలూ” పెద్ద సవాల్ అవుతున్నాయి. వీళ్ళు ఎంత దూరం వెళ్తారంటే రోహిత్ మరణం మీద కవిత్వం ఏమిటీ అని అసింటా వెళ్ళిపోతారు. మనకి తెలియకుండానే పాత సాహిత్య వాదాలన్నీ మళ్ళీ కొత్త చొక్కా వేసుకొని వస్తున్నాయి. అందులో వొకటి: సాహిత్యం సాహిత్యం కోసం మాత్రమే అన్నది! సాహిత్యానికి సామాజిక సందర్భం వుందనడం వీళ్ళ దృష్టిలో విపరీత వాదం అవుతోంది. అలాంటి వాళ్లకి రోహిత్ లాంటి వాళ్ళు ఎంత మంది చనిపోయినా, లేదా, ఎంత మంది అన్యాయంగా చనిపోతూ వున్నా మనసు చలించదు. లేకపోగా, వెంటనే వాళ్ళు చాలా సుఖంగా సాహిత్య శుభ్ర యాగంలో తలమునకలై పోతారు.

యీ బాధల సందర్భంలో యిలాంటి సంపుటిలో భాగమైన ప్రతి కవినీ మనం అభినందించాలి. ఇందులో ఎంత కవిత్వం వుందనే తూనికలూ కొలతలూ అక్కర్లేదు. యీ బాధలో యెంత నిజాయితీ వుందన్నదే ముఖ్యం. యిందులో కొన్ని కవితలు చదివి, కవిత్వ రూపం యెంత మరకలు పడిందీ అని క్షోభించే కవి హృదయాలకు నా దగ్గిర సమాధానం లేదు, వాటినలా క్షోభిస్తూ వుంటే చూసి జాలిపడడం తప్ప!

సుబ్బాచారి అన్నట్టు:

ఇక్కడ ఒక జింక కూలిపోతే మాత్రం

చుట్టూ ఉన్న జింకలు కొద్దిగానే ఉన్నాయి.

కాని అక్కడ పులులు, సింహాలదే పెద్దసంఖ్య

సహానుభూతి అనేది కవిత్వ లక్షణం కాకుండా పోతున్న సందర్భం ఇది. సహానుభూతికి బదులు సాహిత్య రాజకీయాలు పెత్తనం చేస్తున్నసందర్భం కూడా- సహానుభూతిని వ్యక్తం చేయడానికి అర్హతల్ని, ప్రవేశ రుసుముల్ని నిర్ణయించి పెట్టిన కాలం ఇది. కొంత మంది మాత్రమే కొన్నీటి గురించి మాట్లాడాలీ అన్నది యిందులో వొకటి. యీ గిరి గీసిన వాళ్ళు కూడా శుద్ధ సాహిత్య వాదులే! మళ్ళీ అదే గిరుల మధ్య మనం విలువల్ని వురేస్తున్నాం, యిన్ని చర్చలూ ఉద్యమ సాహిత్య అనుభవాల తరవాత కూడా! కొత్త ప్రశ్నల్ని కొత్త తలలెత్తకుండా యెప్పటికప్పుడు వుత్తరించడం అనేది శుద్ధ వాదపు అబద్ధపు పునాది. ఆ పునాదిని యిప్పటికీ బలపరిచే వాదాలు ప్రత్యామ్నాయ శిబిరాల్లోనూ వినిపించడం అసంబద్ధంగా కనిపిస్తుంది నా మటుకు నాకు!

3

 

అరుణ్ బవేరా అన్నట్టు:

త‌ప్పు చేయ‌నివాడినే కాదు..

చెమ్మగిల్లనివాడినీ గురి చూద్దాం

అక్కడ ఈ వాక్యాన్ని ఉరి తీద్దాం..

కవిత్వ నరాల్లో నెత్తురు ఎక్కించాల్సిన కాలం మళ్ళీ వచ్చింది. వాక్యాలకు వాక్యాలనే తిరగరాసుకోవాల్సిన కాలమిది. రోహిత్ మరణం అలాంటి కొత్త కాలానికి వొక ప్రవేశ ద్వారం- ఈ సంకలనంలో అనేక కవితల్ని అనేక ధోరణులకు ప్రతిరూపంగా ఉదాహరించుకుంటూ వెళ్ళవచ్చు. ప్రతి కవినీ ఆత్మీయంగా పలకరించి, ఆ వాక్యాల్ని మళ్ళీ వినిపించమని పదే పదే వినవచ్చు. ఆ వాక్యాల లోతుల్లో ఆరిపోని నిప్పు సెగల్ని తాకి రావచ్చు.

ఇది రోహిత్ సందర్భం కాబట్టి, యీ మరణం నన్నింకా కలవరపెట్టే చేదు పీడకలగానే వుంది కాబట్టి- అతనిలాంటి మరణాన్ని అనుభవించిన  Roque Dalton వాక్యాలతోనే ముగిస్తాను.

The dead are getting more restless each day.

But not anymore
the dead
have changed.

They get all ironic
they ask questions.

It seems to me they’ve started to realise
they’re becoming the majority!

(A Warrior’s Resting Place)

రోహిత్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు యింకా దొరకలేదు. కాని, అనేక మంది రోహిత్ లు మనలో వున్నారు. వాళ్ళందరిలోనూ నిర్జీవ రక్తం గడ్డకట్టక ముందే మనం పలకరిద్దాం. ఆ పలకరింతల్లోంచి కొత్త వాక్యాలు రాద్దాం.

 

కవి నిద్రపోయే అవకాశమే లేదు!

 

సిద్ధార్థ

సిద్ధార్థ

ఇది నేను బతికిన ఇరవై సంవత్సరాల కవిత్వం. రాజకీయ, సామాజిక వైయక్తిక ఆధ్యాత్మిక సృజనాత్మక… సుడులతో.. దిగులుతో, పొగిలిపోతూ ప్రత్యేక అస్తిత్వం కోసం అంగలారుస్తూ పొటెత్తుతూ… నన్ను క్షణవరతం ముంచేసిన కవిత్వం. రెండు దశాబ్దాల / నిద్ర పోనివ్వని రాత్రుల / జంగమ జాతరల / రంది రగడల కవిత్వం. ఈ వాక్యాలతో, ముచ్చట్లతో నాకు నాతో నాలోని మన నేనుతో తొట్టెలూగాను. ఈ తొట్టెలకు భూమి కేంద్రం నా ఊరు నా తెలంగాణ నా హైదరాబాద్. ఈ పదాల ప్రస్తారవలయం మాయమ్మ బొడ్డుతాడును మెడకు చుట్టుకుని వలయించింది. నా ఇంటి చుట్టూ గల్లీల చుట్టూ రాళ్ళ గుట్టల మొహలాల్ల చుట్టూ కూలిపోవడానికి సిద్ధంగా లేని కట్టడాల చుట్టూ దరువులేసుకుంటూ తిరిగింది నా ప్రదర్శన కవిత్వంగా. 

 
ఈ వాక్యాల కట్టడాల అంతస్సుల్లో మల్లా కొత్త జన్మనెత్తాలన్న ప్రాకృతిక వాంఛను నేను అనుభవిస్తున్నాను. ఔటర్ ఇన్నర్ రింగురోడ్ల కింద కుమిలే / మసలే పంట పొలాల ఆకుపచ్చని రక్తాల వాసనను నేను అనుభవిస్తున్నాను. 
 
రూపం … రూపం రాని తనం … రూప విధ్వంసం … రూప మోహం … రూపసార జంగమం నా కిష్టం. నేను నాకిష్టమై నచ్చిన బతుకే… నా కవిత్వంలో వర్తిస్తూ వచ్చింది. అసహనం, రాయకుండా ఉండలేని తనంతో లోపలి బొక్కల్ని, నరాల్నీ, బొక్కల్లోన్ని మూల్గునీ నుజ్జు నుజ్జు చేస్తున్న కవిత్వం ఇది. ఎక్కడివరకు తీసుకుపోతుందో తెలియదు. ఇది ఎక్కడిదాకా తీసుకోచ్చిందో అర్థం కాలేదు. ఇక్కడ  కనిపిస్తున్న కవితల్లో … సందర్భం పూర్తిగా తెలిసే అవకాశం పాఠకుడికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాని వాటిని చదువుతూ… తనకంటూ ఏర్పరుచుకున్న అనుభవ విభాగాల్లోకి ప్రాంతాల్లోకి పార్శ్వాల్లోకి ఇంటి మలుపుల గుమ్మాల కిటికీల సాయవానుల్లోకి పోయి కూర్చుంటాడు. అతనికి అర్థమైందంతా అతని అనుభవం తాలూకు ప్రతిఫలనమే. 
 
పుస్తకాల్లో – నాకు నచ్చిన వాక్యాలు తగిలినపుడు జ్వరమొచ్చి నీరసపడిపోయి వాటి మత్తులో  గంటల తరబడి tranceలో ఊగిపోయిన సందర్భాలు చాలా  వున్నాయి. 
 
నేను ప్రాధమికంగా పాఠకుడిని-పాఠకత్వంలో ఉన్న ఆనందం నాకు  దేంట్లోనూ దొరకలేదు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడిగా ఊగిపోవడం తప్ప ఏమీ చెయలేనివాన్ని. అందుకే కవిత్వం పాఠకుడిని మత్తులోకి జీవనలాలసలోకి, దైన్య ధైర్యంలోకి, తెగింపులోకి తీసుకుపోతుంది. అదే దాని శక్తి. అది మనలో రేపే తిరుగుబాటు అంతరిక భౌతిక సరిహద్దుల్ని దాటేస్తుంది. కొత్త మరణాల్లోకి అటు నుంచి కొత్త పుట్టుకల్లోకి జీవిని తీసుకుపోతుంది. కవిత్వం ద్వారా నేను చూసిన వాన మబ్బుల సౌందర్యంతో పాటు పంట సాళ్ళ పగుళ్ళ బతుకు భయ బీభత్స సౌందర్యం కూడా వుంది. తెలుపు నలుపులోని పలు వర్ణ సమ్మేళనాల రసాయనిక చిత్ చర్య వుంది. శబ్దభూమిలోని నిశ్శబ్ద రుద్రభూమి ఆనవాలు వుంది. ఏ కవినైనా కాలమే పుట్టించి అన్నం తినిపించి సేదతీర్చి తిట్టి కొట్టి గాయపరిచి గారంచేసి కేకపెట్టించి ముందుకు ఎగదోసి perform చేయిస్తూ తుదకు మృత్యువుపాలు చేస్తుంది. కవిగా నా విషయంలో కూడా కాలం అదే పనిలో గాడంగా పని చేస్తూనే వుంటుంది. 
 
Siddharta Book Coverకవిత్వం రాసేటోడికి వాని వునికి వానికి తెలిసిరావాలె కదా. మన ఇల్లు వాకిలి మన ఇంటోళ్ళ బతుకూ, బరువూ బలుపు, ఎతచిత, కులం/పొలం/జలం, పొయ్యికాడి దేవతా, తలపోతలోని గ్రామదేవుడూ, దయ్యం దాని శిగమూ తెలిసిరావాలె కదా, మన అమ్మలక్కల చీకటి గదుల అర్రల, చెప్పుకోలేని చింతల, వారి మాటల పనిముట్ల మాటలు మనం మోయాలె కదా. మనలో ఎప్పటికి పోరగాని తనమే తలనూపాలె కదా… 
 
గడిచిన రెండు దశాబ్దాలూ పూర్తిగా కల్లోల దశాబ్దాలు… ముఖ్యంగా కవికి. ఎటు జరిగినా వొక మూలనుంచి ముసురునుంచి ఏదో ఒక రాయి వచ్చి తగులుతుంది. రక్తస్రావం తప్పనిసరి. ఆధిపత్య పాలనకింద నలుగుతూ ధిక్కరిస్తూ పోటెత్తి, పోరెత్తిన కాలం. తెలంగాణ అస్తిత్వమే రుద్రభూమి. కొన్ని దశాబ్దాలుగా ఈ భూమి వలసాధిపత్య హింసలో భాగంగా సామాజిక హింసకు రాజకీయ హింసకు వైయక్తిక ఆధ్యాత్మిక హింసకు సృజనాత్మక హింసకూ చిక్కి నలిగిపోయింది. ఆ గ్నాపక కతా గానమే ఈ కవిత్వం. ఇది ఎన్నో శక్తుల చెండాట. గతం కాళ్ళకింద చిక్కుకుపోయిన వర్తమానాన్ని ఎగతన్ని తల ముందుకు తీసుకురావాల్సిన చెండాట. 
 
చుట్టూవున్న ప్రపంచంతో నన్ను నేను sync చేసుకోవడానికి ప్రయత్నించాను. 
ఇందులోని ఏ  వస్తువులకవే నాతో మాట్లాడినయ్, సర్వజీవ నిర్జీవ చేతనల చింత నాలోనుంచి అవతలకు ప్రసరించి తిరిగి పునర్గమనం చేసింది నాలోకి, నేను వుండని నాలోకి. కవిత్వం వ్యాపకం కాదు … ప్రకృతి. ప్రతి ఒక్క పదమూ మెటఫరే. ప్రతి కదలికా సింబలే. ఈ లోకంలో చెట్టూ పుట్టా రాయీ రప్పా వాగూ గుట్టా ఎన్నెన్నో వాటి పనులు నిర్వహిస్తున్నట్టే నేను నా పనిని నిర్వహిస్తున్నాను. 
 
ఇదింకా అంతంకాలేదు. కంపన కొనసాగుతూనేవుంది. వాస్తవ యుద్ధం ఇంకా మొదలే కాలేదు. కవి నిద్రపోయే అవకాశమే లేదు. 
 
మార్గశిర మాసం, 2015

మనింటికి వుడ్‌హౌస్ వచ్చిన వేళా…

 

-దాసరి అమరేంద్ర

~

 

Dasari Amarendraవుడ్‌హౌస్  ఎవరూ?

రావుబహదూర్  సోమేశ్వరరావు  ఎవరూ?

మధ్యలో గబ్బిట కృష్ణమోహన్ ఎవరూ?

ఏవిటీ వీరి సంబంధం?

***

తొంభైమూడేళ్ళు జీవించి, అందులో డైబ్భైరెండేళ్ళపాటు రచనా వ్యాసంగం సాగించి 1975లో వెళ్ళిపోయిన  మహానుభావుడు  పి.జి. వుడ్‌హౌస్.

ఇంగ్లాండు మనిషి. అమెరికా అంటే అభిమానం.  “పన్ను” బాధల  పుణ్యమా  అని ఫ్రాన్సులో ఓ పదేళ్ళు  వున్నాడు.  రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్లకు చిక్కడిపోయి ఓ ఏడాదిపాటు వారి ఆతిధ్యం స్వీకరించాడు. పొరపాటునో, గ్రహపాటునో ఆ జర్మనీవారి రేడియోలో తన బాణీ ప్రసంగాలు  ఓ అరడజను చేసి తన స్వదేశీయల  అసహనానికీ, ఆగ్రహానికీ గురి అయ్యూడు. దాని పుణ్యమా  అని మళ్ళీ ఇంగ్లాడులో అడుగు పెట్టకుండా ఓ ముప్ఫై ఏళ్ళపాటు అమెరికాలో నివసించి, పౌరసత్వం పొంది  అక్కడే  తనువు చాలించాడు.  ఆగ్రహాలు సద్దుమణిగాక  మరణానికి కొద్దినెలలు వందు ఆంగ్లప్రభుత్వంవారి నైట్‌హుడ్ పొంది సర్ వుడ్‌హౌస్ అయ్యాడు.

***

వుడ్‌హౌస్ ఏమి రాశాడూ?

చాలా  రాశాడు. పుంఖానుపుంఖాలుగా రాశాడు. జబ్బసత్తువ వున్న రోజుల్లో మూడు నెలలకో  నవల రాశాడు. ఆ సత్తువ తగ్గినపుడు ఆరునెలలకో  నవల.

నవలలు, కథాసంకలనాలు కలిసి తొంభై రెండు పుస్తకాలు. నలభై మ్యూజికల్ కామెడీల లిరిక్సుకి సహరచయిత. ఇవికాక ఉత్తరాలు, జ్ఞాపకాలు, వ్యాసాలు .. ఎన్నో రాశాడు. కానీ ఏది రాసినా – ఎంత వేగంగా రాసినా – కృషి చేసి రాశాడు. నాణ్యతను వదలలేదు. విజయవంతంగా రాశాడు. “మనకాలపు ఉత్తమ రచయిత’ అన్నాడో సమకాలీన రచయిత – 1930లో.

నిజానికి ఆయన ఏమి రాశాడూ?

సీరియస్ సాహిత్యం రాయలేదు. సామాజిక అంశాలతో రాయలేదు. వ్యంగ్య విమర్శకూ పూను కోలేదు. పోనీ హాస్యరచనలు అందామా – అదీకాదు. “ఫార్సు’ రాశాడు అని తేల్చారు విశ్లేషకులు. నా వరకూ నాకు ఆయన రాసినది రేలంగి, పద్మనాభంల బాణీల మేలు కలయిక అనిపిస్తుంది.

***

వుడ్‌హౌస్ రచనలు పాఠకులను ఆకట్టుకొన్నాయన్నది నిజం, వాస్తవం. రాసి వందేళ్ళు దాటినా, రాసినాయన వెళ్ళిపోయి  నలభై ఏళ్ళు దాటినా అతనిని చదివేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నారు. ఇంగ్లీషులోనే  గాకుండా తమతమ సొంత భాషలలో అనువదించుకుని చదివేవాళ్ళూ వేలకొద్దీ ఉన్నారు. మన తెలుగులో బాపూరమణల  దగ్గిర్నించి గబ్బిట కృష్ణమోహన్ వరకూ ఆయన అభిమానులు అసంఖ్యాకం.

ఊరికే అభిమానించి ఊరుకోకుండా వుడ్‌హౌస్‌ను అనుసృజించి పెడుతున్నారు గబ్బిట.

***

gabbita1

సరదాగా మరికొంతసేపు అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో “సినిమారంగం’కు చెందినవి నాలుగు.

వుడ్‌హౌస్  అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకొన్న “అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై’ అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో “సోంబాబాయి వలస కాపురం” గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా “అవతారం” ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్ళి ఇరవై పేజీలూ, ఒక గంటా వ్యవధిలో “తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని” అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.

మొదటి భాగంలోని ఏడు కథల్లో నాలుగింట శశిరేఖ ముఖ్యపాత్ర ధారి. ఆమె తల్లి మహారచయిత్రి ప్రసూనాంబ  విస్మరించలేని కథావ్యక్తి. పెరిగి పెద్దయ్యాక సోంబాబాయి అంత గొప్పమనిషిగా రూపొందగల ప్రామిస్ వున్న శశిరేఖ  తాను  ఇష్టపడే  నరహరిని  కాకుండా తల్లి  సూచించి బాధించే వర్ధమాన రాజకీయు నాయుకుడు ప్రసాద్, రచయితగా అపుడపుడే నిలదొక్కుకొంటున్న గంపా శేఖర్, ఏకపక్ష  ఆరాధకుడు దూడల దివాకర్, అవ్యాజ వ్యామోహి శేషగిరులను ఎంతో చాకచక్యంతో “తెల్లవారుఝాము పాలబండి”లు ఎక్కించిన వైనం కనిపిస్తుంది ఈ నాలుగు కధల్లో.

“విధి, “అదృష్టం” అన్న కథల్లో పాత్రలు వేరైనా వాటిల్లోని అనూరాధ, సరిత – శశిరేఖకు కజిన్లే. తండ్రి గోవర్ధనరావూ, జమీందారు నీలకంఠం – ఒకే తాను ముక్కలే. వెరసి ఈ రెండు కథలూ “తాత్విక దృష్టితో’ చూస్తే మిగిలిన నాలుగు కథలకు దగ్గరి బంధువులే.

సినిమారంగపు నాలుగు కథల్లో రెండింట నరసరాజు, రాగిణిల  ఉదంతాలు  కనిపిస్తాయి. మరో కథ “కోతిచేష్టలు’లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగోకథ “మీనా దేశ్‌పాండే తారాపథం’ మొట్టమొదటి సోంబాబాయి కథలాగా మిగిలినవాటికి వేటికీ చెందని విలక్షణత గలది.

***

పరిమితుల దృష్ట్యా చూస్తే  అనువాదం సొంత రచన కన్న కష్టమైనది.

అనుసృజన అనువాదం కన్న మరింత మరింత కష్టమైన పని.

వుడ్‌హౌస్  కథల నేపధ్యం ఇంగ్లీషు గ్రామసీమలకూ, పట్టణాలకూ చెందినది. ఆయా రచనలను ఆంగ్లంలోనే చదువుకునేవాళ్ళకి అది అవరోధం కాకపోవచ్చు. ఇంగ్లీషు రానివాళ్ళ కోసమే ఈ తెలుగు ప్రయత్నం అనుకుంటే – అలాంటి పాఠకులు ఆయా పేర్లూ, ప్రాంతాలూ, ఆచార వ్యవహారాలతో మమైకం అయ్యే అవకాశం దాదాపు పూజ్యం. అందులోనూ ఆయా రచనలు హాస్యమూ, ఫార్సూ, శబ్ద అర్థాలంకారమయం అయినపుడు వాటిల్ని చదివే వాళ్ళకు అవి ఆకాశ పంచాంగాలు అయితీరుతాయి.

మరి వాటిల్ని అభిమానించి, వాటిల్ని తెలుగు మాత్రమే వచ్చినవాళ్ళకు తెలియజెయ్యాలని తపించే వారికి ఏమన్నా మార్గాంతరం ఉందా?! ఉంది!!

అనుసృజన.

గబ్బిట కృష్ణమోహన్ గత ఐదారేళ్ళుగా ఈ మార్గాన వెడుతున్నారు. విజయయాత్ర చేస్తున్నారు. ఈ పరంపరలో సరికొత్త మైలురాయి “సరదాగా మరికొంతసేపు’.

సోమేశ్వరరావు, గోవర్ధనరావు, గంపా శేఖర్, దూడల దివాకర్, శశిరేఖ, బండారు ప్రసూనాంబ, శేషగిరి, బాబ్జీ, అనూరాధ, శ్రీహరి, సరిత, జమీందార్ నీలకంఠం, నరసరాజు, కనకరాజు,రాగిణి, సుభాషిణి, రాజమాణిక్యం-ఉరఫ్-మీనా దేశ్‌పాండే – వీళ్ళ మాతృపాత్రలు ఆంగ్లదేశపు నేలకు చెందినవి అయినా, వీళ్ళంతా పదహారణాలు  తెలుగు  మనుషులు. గబ్బిటగారు ప్రాణప్రతిష్ట చేసిన మన మనషులు.

కథల్లోని  “పానకుటీరాలు” మన సంస్కృతికి చెందినవి కాకపోయినా అనుసృజన నైపుణ్యమా అని పానకంలో యాలక పలుకుల్లానే ఉంటాయి.

“పెరట్లో హాయిగా కూర్చున్న  కోడిపెట్టల్ని అదిలిస్తే రెక్కలు టపటపలాడిస్తూ పరిగెత్తినట్టు ఆడ వాళ్ళంతా బయటకి నడిచారు” (బుసబుసలు); “గుండెకు గాట్లుపడి ఆ గాట్లలోంచి గాలి బయట కొస్తున్నట్టుగా ప్రసూనాంబగారు నిట్టూర్చారు” (విశ్రాంతి చికిత్స); “అప్పుడే గుడ్డులోంచి బయటపడి వృత్తిలో ఓనమాలు దిద్దుకొంటోన్న వడ్రంగిపిట్ట చేసే చప్పుడులా ఉందది” (తల్లిగారి ఘనసత్కారం); “అది విని దివాకర్ చెట్లలోంచి దూసుకుపోయే గాలిలా మూలిగాడు” (తల్లిగారి ఘనసత్కారం) – ఇలాంటి అనే కానేక పదబంధాలూ, వాక్యాలూ అపురూపమైన దేశవాళీతనంతో గుబాళిస్తాయి. అనుసృజనకు అర్థాలు చెపుతాయి.

మూలభాషలో వుడ్‌హౌస్‌గారు ఏమని ఉంటారా అన్న కుతూహలం కలిగిస్తాయి.

ఇవన్నీ ఒక ఎత్తు – కృష్ణమోహన్ “తలాడించేవాడి కథ”లోనూ, “మిస్ మీనా దేశ్‌పాండే తారా పథం”లోనూ చూపించిన ప్రతిభ అమోఘం; అద్వితీయం.

తలాడించే భాగోతుల నరసరాజుకు ప్రేమాయణం గుంటదారుల్లో పడ్డప్పుడు మంచి కిక్కిచ్చే దానికోసం మనసు వెంపర్లాడినపుడు – అవి మద్యపాన నిషేధపు మంచిరోజులు – తనకు తెలిసిన ప్రదేశానికి వెళ్ళి తలుపు తట్టి “ఎవరికి ఎవరూ  కాపలా  బంధాలన్నీ  నీకేలా” అంటూ కోడ్ పాట పాడతాడు. తలుపు తీసిన మనిషి “ఏం సినిమా?” అని అడిగితే “ఇంటికి దీపం ఇల్లాలే” అని, “దాహమేస్తోంది” అంటాడు. ఇది చదివాక మన మనసుకు కిక్కూ  ఎక్కుతుంది. ఇంకా కావాలని దాహమూ వేస్తుంది.

ఏకచిత్ర అగ్రతార మీనా దేశ్‌పాండేగారి మాతృపాత్ర ఆంగ్లభాషలో ఏవేం పాటలు గానించిందో తెలియదుగానీ  మన  రాజమాణిక్యం (ఉరఫ్ మీనా దేశ్‌పాండే) – “పులకించని మది పులకించు” దగ్గర మొదలుపెట్టి  “కల నిజమాయెగా కోరిక తీరెగా” దాకా ఓప్పదీ ఇరవై పాటలు పాడేసి “భళిరా గబ్బిటా!” అని పాఠకులు వీరతాడు వేసేలా చేస్తుంది.

***

gabbita1వుడ్‌హౌస్ రాసినది సీరియుస్ సాహిత్యం గాకపోయినా దశాబ్దాల తరబడి, తరతరాల తరబడి పాఠకులను ఆకట్టుకొందన్న మాట నిజం.

ఏవిటా కారణం? ఏవిటా రహస్యం?

ఖచ్చితంగా చెప్పడం కష్టం.

ఎడ్వర్డియన్ యాసా, కవుల కొటేషన్లూ, అనేకానేక సాహితీ చమక్కులూ కలగలిపి తనదైన ఓ ప్రత్యేక భాషాశైలిని సృష్టించాడు వుడ్‌హౌస్. దాన్ని  కామిక్ పొయెట్రీ అన్న వాళ్ళున్నారు. మ్యూజికల్ ప్రోజ్ అన్న వాళ్ళున్నారు. ఏదేమైనా భాష విషయుంలో వుడ్‌హౌస్ రచనలు భాష పరిధుల్ని దాటుకుని వెళ్ళి కొత్త మైలురాళ్ళను పాతాయి అన్న విషయం దాదాపు అందరూ అంగీకరిస్తారు.

అయినా మూలప్రశ్న మరోరూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

హాస్య, వ్యంగ్య, ఫార్సు రచనలకు  కాలక్షేపమూ, ఉల్లాసమూ  గలిగించడాన్ని మించిన పరమావధి ఉంటుందా?

దానికి రేలంగి సమాధానం చెప్పగలడు – పద్మనాభం చెప్పలేకపోయినా.

ఛార్లీ చాప్లినయితే ఢంకా బజాయించి, గుండెలు బద్దలుకొట్టి చెపుతాడు.

కానీ ఒక్కమాట.

వుడ్‌హౌస్ గురించి మాట్లాడుతూ “సాహితీ ప్రయోజనం” అంటూ వెళ్ళడం చాదస్తపు చర్చ అయి తీరుతుంది.

అయిర పుస్తకపు శీర్షికే ఆహ్వానిస్తోంది గదా:

“సరదాగా మరికొంతసేపు” వుడ్‌హౌస్‌తో గడపమని …

ఇక ఆలస్యం ఎందుకూ – గబ్బిట వుడ్‌హౌస్ దగ్గరికి వెళదాం ..

*

ఒక యుద్ధస్వరం కొనకంచి “మంత్రలిపి”

 

-ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

రాజ్యం ఉనికిలోనుంచే,సమాజం ఉనికిలోనుంచే కొన్ని అపసవ్యదిశలున్నాయి.కాని ప్రపంచీకరణ తరువాత దీని భీకర రూపం ప్రభావం ఎక్కువ.ఈ పరిణామాలతరువాత మనిషి కేవలం ఆర్థికమానవుడుగా ఇంకాచెబితే, కేవలం సాంకేతికమానవుడుగా తయారయాడు.ఈ పరిణామాలు,పరిణామాలఫలితాలు ఈకాలపు కవిత్వంలో ప్రతిఫలిస్తున్నాయి.వస్తుగతంగా “కొనకంచి”-మంత్రలిపి”కూడా దీనికి మినహాయింపుకాదు.కాని కవిత్వంలో కనిపించే సంవేదనాంశానికి,అస్తిత్వజిజ్ఞాసకు,ఈకవిత్వంలోఉండే భావావేశతీవ్రతకు మధ్య చెప్పుకోదగ్గ వైరుధ్యాలున్నాయి.వాక్యాల్లో ప్రస్ఫుటంగా వర్గస్పృహకాకుండా విశ్వాత్మలో చెల్లుబాటయ్యే సార్వజనీన తిరస్కరణనుచూడొచ్చు.

రాజ్యం యొక్క పట్టించుకోని తనాన్ని,లంచగొండితనాన్ని,స్వార్థంలాంటి అంశాలపై కవిత్వం రాసినా ఈవాక్యాలవెనుక ఉనికిసంబంధమైన పోరాటం ఉంది. రాజ్యపులక్షణాలను,రాజ్యం,ప్రపంచీకరణ రెండూ ప్రసారం చేస్తూ మానవీయమూలాలుదెబ్బతీసే ప్రతివ్యక్తీ,అంశం ఈకవిత్వంలో తిరస్కరింపబడుతాయి.అందులోనూ రాజ్యాన్ని ప్రథమశత్రువుగా చూడడం ఇందులో గమనించవచ్చు.అనేక కవితలు అందుకు నిదర్శనం కూడా.కొన్ని కవితల్లో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలనుగురించి మాట్లాడటమూ గమనించవచ్చు.జీవితం పోరటమైన సందర్భాలలో మానవుని అస్తిత్వాన్ని గురించి” మంత్రలిపి” ఆలోచిస్తుంది.

అంశాత్మకంగాచూస్తే మానవీయలక్షణాల అణ్వేషణ,దానికి కారణాలను,కారకులను తిరస్కరించడం,క్షేమాన్ని కనిపెట్టాల్సిన రాజ్యపు స్వభావాన్ని,అందులోని దుర్నీతిని తిరస్కరించడం ప్రధానంగా ఎక్కువకవితల్లో కనిపిస్తుంది.

 

ప్రియురాలి హృదయంలో ప్రేమలేదు

ఉన్నదంతా ఒక అవసరం

ప్రియునిమనసులో ప్రేమలేదు

ఉన్నదంతా పచ్చిదేహభాష

 

నెచ్చెలిని కౌగిట్లోనిద్రపుచ్చే

మంత్రగాడిలా మారాలనుకున్నప్పుడల్లా

చీకటి పడీపడకముందే

తొలికోళ్ళు కూస్తున్నాయి

 

స్నేహాన్నినటిస్తూనే

నాకుతెలియకుండా నన్ను ప్లాస్టిక్ పువ్వును చేసి

బతుకు పుస్తకంలో ఉన్న ఆఖరి రక్తమాంసాలని

ఎవరో ఎత్తుకుపోయారు“–(మంత్రలిపిపే.21/22)

 

ఈవాక్యాలన్నీ జీవితవిలువల్లోని చరమస్థాయిని చిత్రిస్తున్నాయి.మొదటివాక్యం జీవన సంబంధాలను ,రెండవవాక్యం బంధాలు దూరమవుతున్న క్రమాన్ని,మూడవభాగం మోసపోతున్న జీవితాలను వ్యక్తం చేస్తాయి.ఇవన్నీ జీవితపు విలువలను వ్యక్తం చేసినా వీటివెనుక ప్రపంచీకరణప్రభావాలను పరోక్షంగాప్రస్తావిస్తాయి.కేవలం అవసరంగామారడాన్ని,సమయంలేకపోవడాన్ని,మేలుచేస్తున్నట్టుగా కీడుచేయడాన్ని ఈవాక్యాలు గుర్తించాయి.నిర్మాణగతంగా ఇవి వస్తువుయొక్క సంవిధానస్థాయిని(the proairetic code) చెబుతాయి.ప్రపంచీకరణ నీడను గుర్తించడానికి ఈవాక్యాలు దోహదం చేస్తాయి.నిర్మాణగతంగా పూర్తిసమాజాన్ని చిత్రించే సంపూర్ణత్వం(Wholeness)దాన్ని అర్థంచేసుకోడానికి గతవర్తమానాలను పరిచయం చేసే పరిణామశీలం(Transformation)ఈ కవితల్లో కనిపిస్తాయి.వీటన్నిటి వెనుక రాజకీయస్పృహ గమనించదగింది.కొనకంచి వాక్యాలన్నీ రాజ్యాన్ని దాన్నీఅనుకొని ఉన్న స్వార్థాన్ని,దోపిడీని ఎక్కు పెట్టేవే.

ఉన్మాదుల..పాలకులచేతుల్లో/మనుషులజీవితాలన్నీ/రాళ్ళు రప్పలపాలయినప్పుడు/అధికారమే మారణాయుధాలతో/తనమనుషులను తానే చంపటానికి దండెత్తినప్పుడు/

మనుషులంతా నీళ్లలో తిరిగే చేపలవుతారు/తమప్రాణాలను కాపాడుకునేందుకు/తామేవెళ్ళి కనపడుతున్న/నైలాన్దారాల్లో దాక్కుంటారు

 చుట్టూ ఉన్న ప్రపంచంలో/మనుషులంతా నడిచే నల్లనాగులుగా మారినప్పుడు/గుడ్డుగుడ్డులాగే ఉంటుంది/గుడ్డులో పచ్చసొనమాయమవుతుంది/మనిషి మనిషిలాగే ఉంటాడు/మనిషిలో మనిషి మాయమవుతాడు/రాజ్యాంగం రాజ్యాంగం లాగే ఉంటుంది/రాజ్యాంగంలో అన్నీ తెల్లకాగితాలే మిగులుతాయి. -(మంత్రలిపిపే.23/24)

చట్టబద్ధంగా రాజ్యంచేసే హత్యలకు/అసలుహంతకులు/రాజ్యాంగం పేజీల్లోనే/అక్షరాలయి దాక్కున్నారు“-(పే.41.ఇది హత్యాత్మహత్య)

kona1

మొదటివాక్యం ప్రజలు తమకు తాముగానే (విధిలేని పరిస్థితుల్లో) బలి అవడాన్ని,రెండవ వాక్యం ప్రజలను బలితీసుకుంటున్న విధానాన్ని చెబుతుంది.ఇందులో రాజ్యం యొక్కప్రవర్తన గుర్తించడంలో కొనకంచిలో విప్లవచాయలున్నాయి.రాజ్యాంగంపైన దేశంలోని రాజకీయపార్టీలు సైద్ధాంతికంగాకానీ,ఆచరణరీత్యాకానీ,మానసిక ప్రవృత్తులవలనకానీ కట్టుబడిఉన్నాయన్న దాఖలాలు లేవు.అంతేకాక ప్రపంచీకరణలోని ప్రధానాంశం ప్రత్యామ్నాయ ఆర్థికవిధానాల అభివృద్ధి(Development group for attentive policies)కి ప్రధానవాహికగా ఉన్నాయి.చిల్లరవర్తకాలపై పెట్టుబడులనాహ్వానించిన మొన్నటి కాంగ్రెస్ నుంచి,ఇప్పటివరకు ఉన్న రాజ్యాలన్నీ దీనికి మినహాయింపుకాదు.స్వాతంత్రాన్ని సంపాదించుకున్న చైతన్యం ఇలా వట్టిపోయిందనే అనాలి.కాడ్వెల్-ఒకమాటంటాడు.

 Consciousness is generated by men’s Active struggle with nature and perishes in a blind formalism once that grapple ceases

 (చైతన్యం ప్రకృతితో జరిగే మనిషిక్రియాశీలపోరాటం నుంచి పుడుతుంది.ఒకసారి అనుకున్నది సాధించాక ఆచైతన్యం ఒక గుడ్డి వ్యవస్థగా మారి నశిస్తుంది-(Illusion and Reality-పే 63).

వర్తమానస్థితిని చెబుతున్న కొనకంచివాక్యాలసారాంశమూ ఇదే.ప్రాచీనభారతీయ రాజనీతిశాస్త్రం రాజును రాజ్యాన్ని ఆరాధించే ప్రజలగురించి ప్రస్తావించింది.

 

ధార్మికం పాలనపరం సమ్యక్పరపురజ్ఞయః

రాజానామభిమన్యంతే ప్రజాపతిమివప్రజాః

 ఈలక్షణాలు లేని ధార్మికత్వం,ప్రజాగతపాలన లేనిరాజ్యాన్నే మంత్రలిపి నిలదీస్తున్నది..వస్తుగతంగా ఉద్వేగమున్నా కవిత్వీకరణలో హృదయాన్ని హత్తుకోగల కళాంశాలనేకంగా ఉన్నాయి.

 కాలం నల్లలాంతరుపట్టుకొని/చీకట్లో చీకటిని వెతుక్కుంటూ/బయల్దేరినప్పుడు“-(పే.37.అప్పుడు ఎప్పుడో ఒకసారి)

 తనకంటే ముందుగా/తనచావే పుట్టిందని

ఇప్పటివరకు/ రైతూ గుర్తించలేదు“-(పే.42.ఇది హత్యాత్మహత్య)

 ఇలాంటివాక్యాల్లోని సంకేతాలు కళాదృష్టిని ప్రసారం చేయడమేకాకుండా వాస్తవికతను బలపరుస్తాయి.ఈ సంపుటిలో ఇలాంటివాక్యాలను అనేకంగా ఎత్తిరాయొచ్చు.ఇవన్నీ వాస్తవాన్ని ప్రతిఫలిస్తాయి.వర్తమాన రాజకీయ,సామాజిక పరిస్థితులపై  గొంతెత్తిన యుద్ధస్వరం కొనకంచి మంత్రలిపి.

                                                                   ___________  

అమాయకత్వం కోల్పోతున్న కొత్త జీవితాల కథలు

ఎన్‌. వేణుగోపాల్‌

~

Loss of Innocense Cover (1)కుప్పిలి పద్మ కథలను ఇరవై సంవత్సరాలకు పైగానే చూస్తున్నాను. పదిహేను సంవత్సరాల కింద తాను రాసిన సాలభంజిక కథ చదివి, సమాజంలోకి వస్తున్న కొత్త జీవితాలను, కొత్త జీవన విధానాలను అర్థం చేసుకుని రాయగలిగిన రచయితగా గుర్తించి, అటువంటి రచయితలకు ప్రోత్సాహం అవసరమని అప్పుడు నేను రాస్తున్న ఒక వారం వారం శీర్షికలో ఆ కథ గురించి రాశాను. అప్పటి నుంచి అడపాదడపా తన కథల గురించి నా అభిప్రాయాలు చెపుతున్నాను.

ఈ కథలలోకి వెళ్లేముందు అసలు ఇటువంటి కొత్త జీవితాల పట్ల, ఆ జీవిత సమస్యల పట్ల సమాజపు దృక్పథాన్ని, ప్రత్యేకించి ఆలోచనా పరుల దృక్పథాన్ని, జాగ్రత్తగా పరిశీలించవలసి ఉందనుకుంటాను. ఈ కొత్త జీవితం ఇప్పటికింకా రెండు మూడు దశాబ్దాలు గడిచి నప్పటికీ సార్వత్రికం కాలేదు. దాని స్వభావం వల్లనే అది సార్వత్రికం కాజాలదు కూడ. ఎక్కువలో ఎక్కువ అది ఎగువ మధ్యతరగతిని తాకి, ఆ కింది వర్గాల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం వేయగలుగుతున్నది. అది అల్పసంఖ్యాకుల జీవితాల్లోకి మాత్రమే ప్రవేశించి ఉండవచ్చుగాని అంచులలో ఉన్నదని కూడ అనలేం. ప్రచార సాధనాల హడావిడి వల్ల ఒక రకంగా అదే ప్రధానస్రవంతి అనే అపోహ కలగడానికి కూడ అవకాశం ఏర్పడుతున్నది.

ఇళ్లు, ఇళ్లలో వస్తువులు, అలంకరణలు, వాహనాలు, దుస్తులు, తిను బండారాలు, సంబంధాలు, మాటతీరు, వ్యక్తీకరణలు వంటి ఎన్నో వ్యక్తిగత అంశాల మీద ఈ ప్రభావం ఉంటున్నది. సినిమాలో, టెలి విజన్‌లో, పత్రికలలో ఇదే ప్రామాణిక జీవనస్రవంతి అన్నట్టుగా చూపు తుండడం వల్ల రెండు ప్రమాదకరమైన పరిణామాలు కూడ చాప కింది నీటిలా సమాజమంతా విస్తరిస్తున్నాయి. జిలుగువెలుగులతో ఆకర్షణీయంగా చూపడం వల్ల అదే అనుసరణీయమైన జీవన ప్రమాణం అనుకుని, అనుకరించడానికి ఎక్కువమంది ప్రయత్నిం చడం ఒక పరిణామం కాగా, ఆ జీవన ప్రమాణాన్ని అందుకోలేమని తెలిసి, అందువల్ల తమ జీవితమే వ్యర్థమనే న్యూనతా భావనకు మరింతమంది గురికావడం మరొక పరిణామం. అటు అనుకరణ సంస్కృతి అయినా ఇటు ఆత్మన్యూనతా సంస్కృతి అయినా మనిషిని తన నుంచి తనను దూరం చేసేవే. అంటే మనిషిని సంఘం నుంచి, సమష్టితత్వం నుంచి దూరం చేసేవే. అలా మన సమాజంలో ఈ కొత్త జీవితాల ప్రవేశం అంతకు ముందు ఉన్న అంతరాలకు మరొక కొత్త అంతరాన్ని కలుపుతున్నది. ఒక కొత్త ఘర్షణనూ వేదననూ సృష్టిస్తున్నది. ఒక కొత్త పరాయీ కరణను ప్రవేశపెడుతున్నది.
ఈ నేపథ్యంలో ఈ కొత్త జీవనరంగాల గురించీ, వాటిలోపలా, వాటి వల్లా సమాజంలో తలెత్తుతున్న ఘర్షణల గురించీ, వాటి ప్రభావం గురించీ మరింత ఎక్కువగా అర్థం చేసుకోవలసిన, మాట్లాడుకో వలసిన అవసరం పెరుగుతున్నది. ఈ జీవితాల గురించి సాను కూలంగా, ఆకర్షణతో, మోజుతో, సమ్మోహకంగా చెపుతున్న ధోరణి పెరుగుతున్నందువల్ల, వాస్తవికంగా వాటిలోని గుణదోషాలను, సమస్య లను, ఆందోళనలను అర్థం చేసుకోవలసి ఉన్నది. ఆ జీవితాలలోని మంచిగాని, చెడుగాని సమాజంలోని ఇతర వర్గాల జీవితాల మీద ఎటువంటి ప్రభావం వేయగలవో తెలుసుకోవడానికి ఆ జీవితాల గురించీ తెలుసుకోవాలి, ఆ ప్రభావాల గురించీ తెలుసుకోవాలి. ఇంత బలమైన జీవన ప్రభావం సహజంగానే కళకూ కథకూ వస్తువు కాకతప్పదు. ఆ అత్యవసరమైన పనిని పద్మ తన కథల ద్వారా గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నదని నాకనిపిస్తున్నది. ఇప్పుడిక్కడ సంకలనం చేసిన పదకొండు కథలు కూడ ఆ పనిలో భాగమే అనుకుంటాను.

 

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌ అనే పుస్తక శీర్షిక ఈ పుస్తకంలో భాగమైన ఒకానొక కథ శీర్షిక మాత్రమే కాదు. ఈ కథలన్నిటికీ ఆధారభూమిక అయిన సార్వత్రిక ఇతివృత్తంగా అర్థవంతమైనది. మరోమాటలో చెప్పా లంటే అది మన సమాజపు ఒకానొక స్థితి. నైసర్గికమైన, సహజమైన అమాయకత్వాన్ని కోల్పోతున్న స్థితిలో ఇవాళ సమాజంలో గణనీయ మైన భాగం ఉంది. ఈ అమాయకత్వం కోల్పోతే దాని స్థానంలో వచ్చేది ఏమిటనేది చర్చనీయాంశం కావచ్చు. కాని వలసవాద మార్కెట్‌ ప్రవేశించిన నాటి నుంచీ భారతీయ సామాజిక జీవితం అమాయ కత్వాన్ని కోల్పోతూనే ఉంది. ఆ మూడు వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ అవసరంలేదు గాని గత రెండు మూడు దశాబ్దాలలో ఈ అమాయకత్వాన్ని కోల్పోయే ప్రక్రియ వేగవంతంగానూ, విస్తారం గానూ, లోతుగానూ జరుగుతున్నది. ఒక మనిషయినా సమాజ మయినా అమాయకత్వం కోల్పోతే, ఆ స్థానంలో జ్ఞానమో, వివేకమో రావచ్చు. లేదా, తెంపరితనమో, తుంటరితనమో రావచ్చు. అజ్ఞానమూ అవివేకమూ కూడ ఆకర్షణీయమైన ముసుగులు వేసుకుని రావచ్చు. ఈ పరిణామం ఎలా జరిగినప్పటికీ, సామాజిక అమాయకత్వం కోల్పోయే క్రమం ఆసక్తి కరమైనది. అది వ్యక్తిగత జీవితాలలో ప్రతి ఫలిస్తూ వ్యక్తులు తమ అమాయకత్వం కోల్పోయే క్రమాన్ని ఒక కళారూపంలో చిత్రించడం మరింత ఆసక్తికరమైనది. ఒకరకంగా చూస్తే ఈ పదకొండు కథలూ కూడ ఒక సమాజం అమాయకత్వాన్ని కోల్పోయే క్రమానికి వ్యక్తిగతస్థాయి ప్రతిఫలనాల చిత్రణలే.

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌లో విహాన్‌ – దర్శనల మధ్య ఉన్న సంబంధానికి పాత పద్ధతిలో పరస్పర నమ్మకం పునాది కాదు. బహుశా పరస్పర అపనమ్మకమే, అవతలి వాళ్లు అబద్ధం చెపుతున్నారన్న నమ్మకమే పునాది కావచ్చు. అమాయకత్వం కోల్పోవడం అంటే అదే. కాకపోతే దానికి లాంగ్‌ కమిట్‌మెంట్స్‌ యివ్వలేకపోవడం అనీ, బ్యాగేజ్‌ వద్దను కోవడం అనీ, కెరీర్‌లో సెటిల్‌ కావడం అనీ కొత్త అర్థాలు చెప్పుకునే తెలివితేటలు ఇప్పుడు వచ్చాయి. ‘యే ఫీల్డ్‌ అయితేనేం కేట్‌ రేస్‌లో అందరం… యేదో రకంగా భాగస్తులమే…’ అనడం అలా అమాయ కత్వం కోల్పోతున్నవాళ్ల అంతరంగానికీ, బహిరంగ సమర్థనకీ ఒక సూచిక. అసలు ఆ కేట్‌ రేస్‌ ఎవరు సృష్టించారు, ఎవరి ప్రయోజనాల కోసం సృష్టించారు, ఆ కేట్‌ రేస్‌లోకి వెళ్లేవాళ్లు ఇష్టపూర్వకంగా వెళుతున్నారా, సామాజిక స్థితి వాళ్లను అటు నెట్టి, వాళ్ల నుంచి అమాయకత్వాన్ని కొల్లగొడుతున్నదా, అలా వెళ్లినందువల్ల వాళ్లేమి సాధిస్తున్నారు అని ఆలోచించడానికి పురికొల్పడమే కథ సాధించదలచిన ప్రయోజనం.

ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవడాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్థం చేసుకోవలసి ఉంది. అది సంఘ పరివార్‌, ఖాప్‌ పంచాయతీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురు షాధిపత్య అర్థంలో మాత్రమే జరగడం లేదు. సంక్లిష్టమైన, అసాధారణమైన రూపాల్లో జరుగుతున్నది. నైతిక పోలీసులు చెపుతున్న సద్యోలైంగిక సంబంధం, కాజువల్‌ సెక్స్‌, వైవాహికేతర సంబంధం, స్వేచ్చాయుతమైన ప్రవర్తన వంటి పాత నైతిక అర్థాలు మాత్రమే ఈ అమాయకత్వ విచ్చేద పరిణామాన్ని పూర్తిగా వివరించజాలవు. అసలు ఆ ప్రక్రియకు ప్రతిసారీ ప్రతికూల అర్థం మాత్రమే ఉంటుం దని కూడ అనుకోలేం. ఒక్కోసారి అధ్యయనం వల్ల, స్పందనల వల్ల, భావుకత వల్ల ప్రపంచానికి కొత్త కిటికీలు తెరుచుకుని, వ్యక్తిత్వం వికసించి, జీవన సార్థకతకు వినూత్న అర్థాలు స్పురించి కూడ అమాయకత్వం కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఆ సానుకూల అర్థాలలో కూడ అమాయకత్వ విచ్చేదాన్ని అర్థం చేసుకోవలసి ఉంది.

మెరుగైన ఆర్థికస్థితి ఉన్న మధ్యతరగతి కుటుంబాలలో అంతర్లీనంగా ఎంత పితృస్వామిక భావజాలం ఉన్నప్పటికీ, అమ్మాయిల పట్ల ప్రేమాభిమానాలు కనబరచడం, ముద్దు చేయడం, వాళ్ల ఇష్టాయిష్టాలు తీర్చడం కొంత మెరుగ్గానే ఉన్నాయి. కాని కూతురికి ఉండే ఆ హోదా అదే వయసులో ఉండే కోడలికి లేకపోవడంలోనే పితృస్వామ్యం బయటపడు తుంది. ‘నీకున్న ఫ్రీడవ్‌ు నాకు కూడా మా యింట్లో వుండేది. యిది నా యిల్లు అంటారు. కానీ కాదు. యిది నేను పెళ్లి చేసుకొన్న అబ్బాయి, అంటే నా భర్త యిల్లు. అదీ తేడా… నీకున్నలాంటి ఫ్రీడమ్  నాకు రాదు. పైకి కనిపించని రూల్స్‌ చాలా ఉంటాయి. మ్యారేజి అయ్యాకే నాకు యివన్నీ యెక్స్‌పీరియెన్స్‌లోకి వచ్చాయి,’ అని ‘ఫ్రంట్‌ సీట్‌’లో గ్రీష్మ తన ఆడబిడ్డ ధాన్యతో అనే మాటలు పితృస్వామిక నిర్బంధానికీ, కొత్త తరం యువతుల గ్రహింపుకూ నిదర్శనం. ఇది కూడ మరొకస్థాయిలో అమాయకత్వ విధ్వంసమే.

కొత్తతరం పోగొట్టుకుంటున్న అమాయకత్వంలో, తెచ్చుకుంటున్న కొత్త అలవాట్లలో, విలువల్లో అధికారాన్ని, సంప్రదాయాన్ని ప్రశ్నించడం అనే సానుకూల లక్షణంతో పాటే అనారోగ్యానికీ, అసాంఫిుకత్వానికీ దారితీసే అలవాట్లు కూడ ఉంటున్నాయి. మద్యపానాన్నీ, మాదక ద్రవ్యాల వాడకాన్నీ నైతిక కారణాలవల్ల వ్యతిరేకించనక్కరలేదు గాని అవి మరొకరు మప్పుతున్నందువల్ల, మరొకరి వ్యాపారం కోసం, యువతరాన్ని జోకొట్టడం కోసం వస్తున్నాయా ఆలోచించవలసి వుంది. ‘గాల్లో తేలి నట్టుందే’ కథ ఈ విలువల ఘర్షణను చిత్రిస్తుంది. ‘వో మైగాడ్‌… మమ్మీ నిజంగా నువ్వు యిన్నోసెంట్‌. క్రైమ్  యేంటి? నీకు తెలుసా 21 ఏళ్లు నిండని వాళ్లకీ డ్రింక్స్‌ యిస్తారు పబ్స్‌లో. హుక్కా క్లబ్స్‌లో, పబ్స్‌లో రకరకాల పేర్లతో గంజాయే కాదు, కొన్ని రకాల డ్రగ్స్‌ దొరుకు తాయి. యిదంతా కామన్‌. క్రైమ్ కాదు.  వీటికొచ్చే వాళ్లంతా యెలీట్‌ రిచ్‌ సెక్షన్స్‌ నుంచే. వీటిని రన్‌ చేసేది పవర్‌ఫుల్‌ పీపుల్‌. అలా వాళ్లు సర్వ్‌ చేయటం క్రైమ్  కానప్పుడు మేం తీసుకోవటం క్రైమ్ ఏలా అవుతుంది…’ అన్న సుస్మిత మాటలు కొత్త మార్పులను మాత్రమే కాదు, ఆ మార్పుల వెనుక ఉన్న, లాభ పడుతున్న శక్తులను కూడ చూపుతున్నాయి. ‘యీ జనరేషన్‌ చాలా అందమయినది. తెలివైనది. యెన్నెన్నో విషయాలని సునాయాసంగా కనిపెడ్తూ ఉంది. యిదే జనరేషన్‌లో కొంతమంది యిలాంటి అలవాట్లకి బానిసలవుతూ యిదంతా ఫన్‌ అంటారు. యిలాంటి వాళ్లు యెక్కువగా డిస్ట్రక్షన్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. వాళ్లకసలు భయం లేదు. ప్రాణాల మీద మమకారం లేదు…. నువ్వంటున్నావు రూల్స్‌ బ్రేక్‌ చేయడాన్ని యిష్టపడుతున్నారని. అన్ని జనరేషన్స్‌లో రూల్స్‌ని బ్రేక్‌ చేయటం వుంది. కాకపోతే అప్పుడు యెక్కువగా వొక వికాసం కోసం చేసేవారు. యిప్పుడు అదంతా వొక విధ్వంసం. అదే మానసికానందం…’’ అని నందినికి వివరిస్తారు మాస్టారు.

పద్మ భాషలో సమ్మోహకమైన, ఆకర్షణీయమైన లక్షణమూ ఉంది. ఒక్కొక్కసారి అది సహజత్వానికి దూరమైందని అనుమానించడానికి ఆస్కారం ఇచ్చే లక్షణమూ ఉంది. ఆమె సృష్టించే సన్నివేశాలు, సంభా షణలు, చివరికి పాత్రల పేర్లు కూడ అసహజమైనవని అనుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కచోట పాత్రల, సంభాషణల, ప్రవర్తనల ఔచిత్యం మీద కూడ సందేహం కలుగుతుంది. కళారూపానికి విశ్వ సనీయత, సంభావ్యత పునాది అంశాలు. అవి లేవని లేశమాత్రం అనిపించినా ఆ కళారూపం ఇవ్వదలచిన సందేశం కూడ దెబ్బ తింటుంది.

ఈ చిన్న లోపాలు అలా ఉంచి ఈ కథల గురించి మొత్తంగా ఆలో చిస్తే, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో మార్క్స్‌, ఎంగెల్స్‌లు బూర్జువా వర్గ ప్రాబల్యం, మార్కెట్‌ ప్రవేశించిన చోట ఏం జరిగిందని చెప్పారో గుర్తుకొచ్చింది: ‘బూర్జువావర్గం… మత, రాజకీయ భ్రమల ముసుగులు కప్పిన దోపిడీ స్థానంలో నగ్నమైన, సిగ్గులేని, ప్రత్యక్షమైన, అమాను షమైన దోపిడీని ప్రవేశపెట్టింది. ఇంతవరకూ గౌరవనీయంగానూ, భక్తిపూర్వక మైన భయంతోనూ పరిగణించిన ప్రతి వృత్తి మీది ఆచ్చాదననూ బూర్జువావర్గం పీకి పారేసింది. వైద్యుడినీ, న్యాయవాదినీ, మతగురువునీ, కవినీ, శాస్త్రవేత్తనూ డబ్బుకోసం తనకు ఊడిగంచేసే కిరాయి కూలీలుగా మార్చివేసింది. బూర్జువావర్గం కుటుంబం నుంచి దాని రాగబంధురమైన మేలిముసుగును చించి పారవేసి కుటుంబ బంధాన్ని కేవలం డబ్బుతో కూడిన సంబంధంగా దిగజార్చింది… సమస్త సామాజిక స్థితులను ఎడ తెగకుండా కలతపెట్టడం, అనిశ్చి తత్వాన్నీ, ఆందోళననూ నిరంతర పరిణామాలుగా మార్చడం బూర్జువాశకపు ప్రత్యేకతలు… గడ్డ కట్టుకుని, తుప్పుపట్టిపోయిన సంబంధాలూ, వాటితో పాటు సనాతమైన, పూజనీయంగా చూసిన దురభిమానాలూ తుడిచిపెట్టుకుపోతాయి. కొత్తగా ఏర్పడిన సంబంధాలు గట్టిపడక ముందే పాతబడిపోతాయి. ఘనీభ వించిన ప్రతీదీ కరిగి గాలిలో బాష్పమైపోతుంది. పవిత్రమైన ప్రతిదీ మలినమై పోతుంది…’

ఈ మాటలు రాసింది 1848లో. ఆ తర్వాత గడిచిన నూట అరవై సంవత్సరాలలో ఆ స్థితి మరింత తీవ్రతరమైంది. ఆ బూర్జువావర్గం తన తొలినాటి ప్రగతిశీల స్వభావాన్నీ, సమాజాన్ని ఇలా సమూలంగా మార్చే బాధ్యతనూ వదులుకుంది. భారత సమాజం వంటి సమాజా లలో పాత, అభివృద్ధి నిరోధక వ్యవస్థలలో తనకు పనికి వస్తాయనుకునే చెడుగులతో మిలాఖత్తు పెట్టుకుంది. ఇప్పుడిది పాతనంతా ఊడ్చి పారేసే కొత్త కాదు. పాత కొత్తల మేలు కలయిక కూడ కాదు. పాత కొత్తల కీడు కలయిక. ఇక్కడ డాలర్ల వేట, ఇంగ్లిష్‌ చదువులు, అపార ప్రపంచజ్ఞానం, అందరాని జీవనశౖలివంటి అత్యాధునిక అంశాలూ, స్త్రీపురుష అసమానత, కులవివక్ష, మతోన్మాదం, మూఢనమ్మకాల వంటి ప్రాచీన అంశాలూ సామరస్యంగా సహజీవనం చేస్తుంటాయి. ఆ పాతకొత్తల కీడు కలయిక స్థితికి సూచికలు ఈ కథలు.

*

 

 

“వెతికాను నిన్ను వెతలో /వెతుకుతాను వెతను నీలో!”

Mahadevi Varma Geethalu_18th Book_Title Text.p65

– జగద్ధాత్రి 

~

 

Jagathiబాధ నా సృజనకు మూలం అన్నాడు చలం. వేదన, విరహం , ఒంటరితనం , ధు:ఖం ఇవన్నీ బాధకి పర్యాయ పదాలే. ఈ బాధ ఆమె అక్షరాల్లో వేదనా గీతికలై అలపిస్తుంది మహా కవయిత్రి మహాదేవి వర్మ. ఇటీవల ఆమె గీతాలు  “మహాకవయిత్రీ మహాదేవి వర్మ గీతాలు” పేరిట తెలుగు లో కి అనువదించారు తెలుగు సుప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ చాగంటి తులసి. ప్రఖ్యాత రచయిత చాసో కుమార్తె గానే కాక తనకంటూ ఒక విశిష్టమైన స్థానం తెలుగు సాహిత్యం లో తన కథలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు, కవిత్వం తో సంపాదించుకున్నారు తులసి గారు. ప్రగతి శీలక ధృక్పధం తో సాగే ఈమె రచనల్లో అంతటా అభ్యుదయ భావాలు , ఆచరణీయ మార్గాలే అగుపిస్తాయి. ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన కథలు “ఏష్ట్రే”, “ బామ్మ రూపాయి “ లాంటి కథల్లో తులసి వ్యక్తిత్వ గంభీరత మనకు అవగాహన అవుతుంది.

మహా కవయిత్రి మహాదేవి వర్మ గారి సాహిత్యం లో సౌందర్య భావన అనే అంశం మీద డాక్టర్ ఆదేశ్వర రావు గారి వద్ద తన పి హెచ్ డి చేశారు హింది లో తులసి. అభ్యుదయ భావాలు ఉన్న తులసి జీవితం లో ప్రగతి శీలక పాత్ర పోషించిన మహాదేవి వర్మ గురించి పరిశోధన చేయడం ముదావహం గానే అనిపిస్తుంది. అయితే వచన రచనలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే తులసి , అందునా కథ పట్ల చాలా మక్కువ గల తులసి మహాదేవి వర్మ కవితాత్మక సౌందర్య భావన పై పరిశోధన చేయడానికి కారణం వారి గురువైన ఆచార్య ఆదేశ్వర రావు గారు కూడా కవి కావడమే అని ఇటీవలే ఈ పుస్తక ఆవిష్కరణ నందు తులసి పేర్కున్నారు. అక్టోబర్ 15 న ఆంధ్ర విశ్వవిద్యాలయం హింది విభాగం లో లోక్ నాయక్ ఫౌండేషన్ వారి నిర్వహణ లో ఈ పుస్తకాన్ని ఆచార్య ఆదేశ్వర రావు గారు ఆవిష్కరించారు. సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఇటీవలే పరమపదించిన ఆచార్య బలశౌరి రెడ్డి గారు ఈ పుస్తకానికి అవతారిక నందించారు. ప్రముఖ సాహితీవేత్త కవి , చిత్రకారుడు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ముందుమాట రాసారు. తాను కవయిత్రి గా కాక కథయిత్రిగానే ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానని , ఐనా మహాదేవి వర్మ గీతాల భావనాలోకం కూడా తన భావ జాలం కాదని ఐనప్పటికీ  , ఆనాటి రోజుల్లో అంత చదువుకున్న , అంత ప్రఖ్యాత స్థాయి కెదిగిన , ప్రతిభావంతురాలు మహదేవి వర్మ గనుక ఆమె గీతాలు నేటి తెలుగు పాఠకులకు అందించడం అవసరమని భావించి అనువాదం చేశానని తులసి చెప్పేరు సభలో. తెలుగులో తులసి గారు చేసిన అనువాద గీతాలను కొన్ని స్వీయ సంగీత నిర్వహణ లో శ్రీమతి శశిరాణి ఆలపించి అలరించారు. ఇవి సభా వివరాలు.

చాగంటి తులసి –మహాదేవి వర్మ :  రచయిత్రిగా తెలుగు పాఠకులకు చిర పరిచితమైన తులసి గారు , వ్యక్తిగత పరిచయం ఉన్నవారు మన అందరికీ. ఆమె స్వభావం బట్టీ ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఏ రచనైనా తనని బాగా ఆకర్షిస్తేనే తప్ప , అందులో తాను  మమేకవగలిగితేనే తప్ప అనువాదం చెయ్యను అంటారు. మహాదేవి వర్మ గీతాలను ఆకళింపు చేసుకున్నాక వాటిని తెలుగు పాఠకులు , భవిష్యత్ తరాలు చదువుకోవాలి అని భావించి అదే ఆశయం తో వీటిని అనువదించారు. ఏ పని ఐనా మనస్ఫూర్తిగా చేసే తులసి ఈ అనువాదానికి పూనుకోవడం ముదావహం. ముప్పై మహాదేవి గీతాలను ఎంచుకుని వాటిని తెనిగించారు. వాస్తవానికి అనువాదం అనే కంటే అనుసృజన అనొచ్చు . ఎందుకంటే రాసినది మహా కవయిత్రి , మరొక భాష లో అందిస్తున్నది మరో రచయిత్రి కనుక అనువాదకురాలిగా కాక అనుసృజన కర్త గా తులసి ఈ గీతాలను ప్రతిభావంతంగానే కాదు హృద్యంగా అందించారు. ఎక్కడా మహాదేవి కవితాత్మ దెబ్బ తిన కుండా ఆమె రచించిన పద మాధుర్యాన్నీ, భావ మాధుర్యాన్నీ ఎక్కడా చెదర నివ్వకుండా అనువదించారు. మహాదేవి కేవలం కవయిత్రి మాత్రమే కాదు అద్భుతమైన చిత్రకారిణి కూడా. ఆమె చిత్రాలను కొన్నిటిని కూడా ఈ పుస్తకం లో తెలుగు పాఠకులకు అందించడం తులసి గారు  చేసిన మహత్కార్యం. అక్షరీకరించలేని భావనోద్విగ్నత కలిగినప్పుడు ఆ భావావేశం చిత్రంగా రూపు దిద్దుకునేది మహాదేవి చేతుల్లో. అలాంటి అపురూప చిత్రాలను ఈ పుస్తకం లో పొందు పరచడం లోని భావం మహాదేవి సమగ్రంగా అవగాహన పాఠకులకు కలగాలని అని తులసి చెప్పారు.

మహాదేవి వర్మ కవితా తత్వం: “ ప్రతి కవి రచన గతిశీలమైనది అవాలి. మరణించేది కాకూడదు. పాతబడిపోకూడదు. నదీ తీరాలు భిన్నమవ గలవు గాని నదిని గతిశీలమైన దానిగా చేయడానికి అన్ని  తీరాల దగ్గరా లోతు ఉంటుంది. అలా లేకపోతే అది నది కాలేదు.” అని చెప్పిన మహీయసి మహాదేవి వర్మ గారు కవిత్వం లో ఎంతో లోలోతుల స్థాయిలను చేరుకున్న రహస్య వాద (మార్మిక వాద) మహా కవయిత్రి.

“వెతికాను నిన్ను వెతలో /వెతుకుతాను వెతను నీలో!”

అని పాడే వెతల సామ్రాజ్ఞి మహాదేవి గారు అని తులసి గారు ముoదు మాటలోనే పరిచయం చేస్తారు. ఆమె కవిత్వమంతటా ఒక ఆర్తి తీరని వేదన పరుచుకునుంటుంది. వాస్తవానికి ఈ ఆవేదన ప్రతి సృజన కారునిలోనూ ఉంటుంది. ఈమె గీతాలలోని విషాదం , విరహం అమూర్తమైనవి. ఆమెను ఆధునిక మీరా అని పోల్చే వారట.  మీరా ఆరాధనకు కేంద్ర బిందువు సాక్షాత్ గోపాల మూర్తి . కానీ మహాదేవి ఆవేదన అమూర్తమైనది. నిజమే టాగోర్ గీతాంజలి  లో కనిపించే మధుర భక్తి , అదృశ్య అమూర్త ప్రేమమయుడైన ఆ ప్రియుడు దైవం , తాను ప్రేయసి అతని సహచరి , దాసి. ఇవి మనకి టాగోర్ భవాల్లో కనిపిస్తే , మహాదేవి లో అగుపించేది ఒక దివ్యానుభూతి. ఒక తాదాత్మ్యత , అపరిమితమైన ఆరాధనా, విరహం, అద్వైతం.

మహాదేవి భావ సౌందర్యానికి భాషా పటిమ తోడైన ఆమె గీతాలను తులసి గారు పుస్తకం లో ఒక పక్క హింది మూలం లోనూ , తెలుగు అనువాదాన్ని రెంటినీ ప్రచురించారు. ఇది చాలా మంచి విద్యాత్మకంగా ఉంది. ఎందుకంటే హిందీ సాహిత్య విద్యార్ధులకు, సాహిత్య పాఠకులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆమె గీతాన్ని హిందీ లో ను తెలుగు లోనూ ఒకేసారి చదవడానికి అవకాశం కల్పించారు తులసి.

అనువాదం అంటే కేవలం ఒక భాష నుండి మరో భాష లోకి పదాలను మార్చడం కాదు. అనువాదం ఎప్పుడు సఫలీకృతమవుతుందంటే అది అనువాదం అని అనిపించక పోవడమే. దీనికి ఎంతో కృషి చేస్తారు అనువాదకులు. ఈ క్రమం లో ఒక్కో చోట అనువాదకురాలి ప్రతిభా, ఆమె స్వేచ్ఛ కూడా కనిపిస్తాయి. అయితే ఇవి ఎలా ఉండాలంటే అసలు మూలం లోని భావం దెబ్బ తినకుండా ఉండాలి అలాంటి ప్రతిభా స్వేచ్ఛ తులసి గారు ఈ అనుసృజన లో కనబరిచారు. అది ప్రశంసనీయంగా కూడా ఉంది అనడంలో సందేహం లేదు. ఉదాహరణకి :

పాథోయ్-హీన్ జబ్ ఛోడ్ గయే సబ్ సప్నే , ఆఖ్యాంశేష్ రెహ్ గయే అంక్ హీ అప్నే / తబ్ ఉస్ అంచల్ల్ నే దే సంకేత్ బులాయా (ఇది హిందీ మూలం )

దీనికి అనువాదం : దారి బత్తెం లేకుండా వదిలేసాయి అన్ని కలలు/ కంచికి వెళ్లకుండా నా ఒడి లోనే ఉండిపోయాయి అన్ని కథలు / అదిగో అప్పుడు సైగ తో పిలిచాయి ఆ చేలాంచలాలు.

ఇక్కడ ‘దారి బత్తెం’, ‘కంచికి’  అనే పదాలు అనువాదకురాలు నేటివిటీ కో సం స్వేచ్ఛగా వాడారు. ఆ నానుడి హింది భాష లో ఉండదు. అయినా తెలుగు పాఠకులకు కవి భావాన్ని సరిగ్గా అందిస్తాయి మన తెలుగు నుడికారపు ఈ మాటలు. రచయిత కు తాను రాసిన భాష పై పట్టు ఉంటే చాలు కానీ అనువాదకులు రెండు పడవల మీదా సరిగా సమతౌల్యం తో పయనించాలి. అలాంటి సమతౌల్యత తులసి అనువాదం లో మనం చాలా  చోట్ల ద్యోతకమౌతుంది. రెండు భాషల నుడి కారాన్ని పట్టుకోగలగటమే ఆమె సాధించిన విజయం.

“ఆత్మకు ఆత్మదీపం అనురాగం” అంటాడు రూమి. దీపాన్ని ప్రతీకగా ఎక్కువగా ఉపయోగిస్తారు మహాదేవి.

ఎందరో కవుల కవిత్వం లో అగుపించే దీపం ప్రతీక మహాదేవి లో మరింత విలక్షణంగా దర్శన మిస్తుంది మనకు.

దీపం ఆమె దృష్టిలో ఆత్మ సమర్పణకు, అద్వైత భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆత్మ సంవేదనకు రూపంగా కనిపిస్తుంది , నడిపిస్తుంది.

మహాదేవి వర్మ గీతాల్లో అత్యంత పేరు పొందిన గీతం : “ మై నీర్ భరీ ధుఖ్ కీ బద్లీ!” దీని అనువాదం తెలుగు లో “నీరు నిండిన ధు:ఖ నీరదాన్ని నేను!” అంటూ సాగుతుంది ఈ గీతం ఇందులో ఒక మేఘంగా తన ధు:ఖాన్ని వేదనని వర్షిస్తుంది కవయిత్రి. ఈ కవిత షెల్లీ “క్లౌడ్” కవితను తలపింప చేస్తుంది.

 

I am the daughter of the earth and the sky

And the nursling of the sky

I pass through the pours of the ocean and shores

I change but I cannot die

Like a child from the womb

Like a ghost from the tomb

I arise and unbuild it again (from the poem Cloud by Shelley)

“ఏనాడూ ఏ అంతర్దిశా విస్తృత గగనాన / నాదిగా అవక పోవడం / పరిచయం నాది మరి ఇంతే , చరిత్ర మరి నాది ఇదే / పొంగిపొరలి ముసురుకు వచ్చా గత దినాన / రాలి నశించి పోయా ఈ దినాన!” (మహాదేవి గీతానికి తెలుగు అనువాదం)

ఛాయావాదీ, కవిత్వం హిందీలో , భావ వాద కవిత్వం తెలుగు లో ఇలా అప్పటి ఆంగ్ల రొమాంటిసిసం అన్నీ భాషల కవిత్వాలలో మనకు ప్రతిబింబిస్తుంది. ఈ కవిత్వాన్ని కేవలం వైయక్తిక కవిత్వమని కూడా విమర్శకులు విమర్శించారు. కానీ భావ కవిత్వం మొట్ట మొదటి సారిగా మనిషిని కేంద్ర బిందువుగా చేసుకుని , సకల మానవ భావనలకు అక్షరాన్నిచ్చింది . ఇది ఒక వ్యక్తి వేదన కాదు , సర్వ మానవ వేదననూ ఒక వ్యక్తి స్వరం లో గళం లో వినిపించడంగా అనిపిస్తుంది నాకు.  ఇందులోని తాత్వికత సాహిత్య పరిధులు దాటి పోతుంది. కాల్పనిక సాహిత్యం కాదిది , అనూహ్యమైన అందమైన ప్రతీకలతో ఆ పరాత్పరునికి నివేదించే జీవుని అనంత ఆవేదన. అందుకే ఎన్ని అన్నా ఇప్పటికీ  భావ కవిత్వ మెరుగు మాసి పోదు. ఎవరు ఆ కవిత చదివినా అది తన వేదనే అని తాధాత్మ్యం చెందించేదే భావ కవిత్వం.

మహాదేవి కేవలం భావ కావయిత్రి మాత్రమే కాదు ఆమె స్వాతంత్ర్య పోరాటం లో భాగస్వామి, ఒక మహిళా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి , అన్నిటికీ మించి మంచి వక్త. ఆమె సాహిత్యోపన్యాసం వినడానికి జనం తండోపాతండాలుగా వచ్చేవారట. ఉన్నత విద్యావంతుల కుటుంబం లో జన్మించిన ఈమె పేరు ప్రఖ్యాతుల కోసం ఎప్పుడూ ఆలోచించని ఆచార పరాయణురాలు.  జ్ఞాన పీఠాన్ని ఆమె తిరస్కరిస్తే , అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆమెను పురస్కారాన్ని గ్రహించమని ఎంతో ప్రయాస తో ఒప్పించి ,ఆమెకు మార్గరేట్ థాచర్ చేత ఆ పురస్కారాన్ని ఇప్పించారు. ఇదీ ఆమె వ్యక్తిత్వ విశిష్టత.

సంపూర్ణ స్త్రీత్వం , భారతీయ సంస్కృతి నిండిన ఆమె కవిత్వం కేవలం స్త్రీని ఒక అబలగా నిస్సహాయురాలిగా చూపించదు. స్త్రీ వ్యక్తిత్వ విస్తృతిని  విశద పరుస్తుంది. ఆమె ఒక పరిశోధనాత్మక , పరిశీలనాత్మక , ఆత్మ గౌరవం నిండిన మహిళా మూర్తి. ఉత్కృష్టమైన తన సాధనతో ఇహ పరాలను శోధించిన తాత్విక మూర్తి.

“పునః వ్యాకులం నా ప్రాణం!/ బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని అవలోకిస్తాను నేనూ అవతల వేపు ఏముందో!/ యుగాలు కల్పాలు నడిచి వెళ్ళే / ఆ శూన్యమార్గపు ఆఖరి హద్దు ఏమిటో ?” అంటుందీ ధీశాలి వనిత.

ఇటువంటి కవయిత్రీమణి కవిత్వాన్ని అచ్చంగా మన తెలుగు లో మనకు అందించిన తులసి గారికి సకల సాహితీ జగతి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతోంది మనసారా. ఈ కవిత్వ గీతాలు నేటి రేపటి తరాల చదువరులకు సాహిత్య ప్రియులకు అందించాలన్న  తులసి గారి సంకల్పం నెరవేరినట్టే అనడం లో సందేహించక్కర్లేదు.

“రూపు రేఖల కట్టడుల యందు , /కఠిన హద్దుల బంధనముల యందు/ నిర్దయ ఘడియలందు బంధించబడింది జగత్తు;/ ఓ కన్నీటి కోమలీ ఎచ్చటకు వచ్చావు నీవు ఓ పరదేశినీ !” (మేలుకో మేలుకో ఓ సుకేశినీ గీతం నుండి)

ఇలా మనందరి మనసులు రంజింప జేసేందుకు మనందరి ఆవేదనకు అక్షర అద్దం పట్టేందుకు హిందీ నుండి తెలుగు లోనికి విచ్చేసేలా చేసేరు తులసి. చిరస్మరణీయంగా తెలుగు సాహిత్యం లో మిగిలే అనువాద రచన ఇది. ఇలాగే తన అనుభవం తోనూ, ఆదర్శ భావ జాలం తో అభ్యుదయ పథాన మనకు దారి దీపమై తులసి లాంటి సాహితీ వేత్తలు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

మరణానికి ముందు “అంతర్జ్వలనం”

-వేలూరి వెంకటేశ్వర రావు
~
మిత్రుడు బ్రహ్మానందం  నన్ను ముందుమాట రాయమని అడగటం అతనికి నాపై ఉన్న అభిమానం తప్ప వేరే కారణం కాదని నేను ఘంటా పథంగా చెప్పగలను. కథలకు, కథాసంకలనాలకు, నవలికలకు, కవిత లకు ముందుమాటలు, వెనుకమాటలు, ఉపోద్ఘాతాలూ, వగైరా- కనీసం పరిచయ వాక్యాలయినా రాయగల సమర్థత నాకు లేదు. అయినా,  సాహసించి ఈ నవల గురించి నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను.
ఇంతకు ముందు బ్రహ్మానందం రాసిన కథలు, వ్యాసాలు అన్నీ  చదివాను. అతనికి చక్కని కథావస్తువు ఎంపిక చేసుకోవటం తెలుసు. అంతేకాదు; చిక్కగా  కథ చెప్పటం కూడా తెలుసు. వాస్తవ జీవితంలో ఒకటో, రెండో సంఘటనలు  కథలకు పునాదులయితే, ఒక జీవితంలో ఒడిదుడుకులన్నీ స్పృశించిన రచన నవల అవుతుంది. సాంప్రదాయకంగా నవలలో చాలా పాత్రలు వస్తాయి. అయితే, అన్ని పాత్రలనీ సమానంగా పోషించడం అవసరమా కాదా అన్నది కథానేపథ్యం, భౌతిక పరిస్థితుల పై ఆధారపడుతుంది.
Gorti
అంతర్జ్వలన నేపథ్యం అమెరికా. పై చదువుల పేరుతో అమెరికాకి వలస కొచ్చి, ఇక్కడి జీవితంలోని ఒడిదుడుకులని తట్టుకొని, మరణానికి కూత వేటు దూరంలో ఉన్న ‘నందు’ తన జీవితకథ చెబుతున్నాడు. ఉత్తమ పురుషలో చెప్పిన కథ. బహుశా, ఇరవై సంవత్సరాల క్రితం అమెరికాకి  వలసకొచ్చిన వారి అనుభవాలు  కొన్ని ఈ నవలలో ప్రతిబింబిస్తాయి.  కాలపరిమితి పరంగా చూస్తే, ఈ నవల అమెరికా వలస జీవనవ్యవస్థకి  నిజమయిన  ప్రతిబింబం అని భావించకూడదు. కారణం; కథ జరిగిన కాలవ్యవధి చాలా పరిమితం కావటమేనని నా అభిప్రాయం.
నందు- మన కథానాయకుడు ఉపోద్ఘాతం ఇలా చెబుతాడు: ‘‘అందరినీ వదిలిపోతున్నానన్న బాధ; ఏదో సాధించాలన్న కోరిక, జీవితం వైపు ఎగ్నురుతున్న ఆశ, ఈ రెంటినీ విమానం అమెరికా చేర్చింది.’’ వలసకి పోతున్న ప్రతి ఒక్కరికీ ఇది సహజమైన అనుభవం. ఈ అనుభవానికి  కాలపరిమితి లేదు.
‘‘పూర్తి కాని నాస్వప్నం ఇలా అర్థంతరంగా ముగిసిపోతుందా?’’ అని చావు బ్రతుకుల మధ్య ఉన్న వాడి ఆవేదన ఈ నవలకి ఊపిరి. అయితే వెంటనే నైరాశ్యం వెన్నుతట్టి పలకరిస్తుంది.
‘‘ఏముంది? రేపు నేను పోతాను. ఇంట్లోవాళ్ళు కొంతకాలం ఏడుస్తారు. బంధువులు బాధపడతారు. స్నేహితులు పరామర్శిస్తారు. బ్రతికుండగా పైకి అనడానికి మనసొప్పకపోయినా, పోయిన తర్వాత నేనెంత మంచి వాణ్ణో అంటూ నా గుణగణాలని పెద్దవిచేసి పైకి గట్టిగా చెప్పుకుంటారు. నేనంటే గిట్టనివాళ్ళు దేముడు నాకు మంచి శాస్తి చేశాడని లోలోపల అనుకుంటూ వారిని వారు సంతృప్తి పరుచుకుంటారు.’’
ఈ నవలలో భాష సులువుగా ఉంది. నవలని ఒక్కబిగిన చదవటానికి అనువుగా ఉన్నది. ప్రతి పాత్ర  కథనానికి అవసరమయినా, పాఠకుడు, వెనక్కి వెళ్ళి, ‘ఇతనెవరు? ఈవిడ ఎక్కడ తటస్థించింది?’ అని వెదుకు లాడే అవసరంలేదు.
‘‘…నా ధ్యేయం ఒక్కటే! ఎలాగయినా డబ్బు సంపాదించాలి. ఇక్కడే స్థిరపడిపోవాలి. ఇండియా చచ్చినా వెళ్ళను…’’ వలస వచ్చిన కొత్తల్లో కొంతమంది సంభాషణల్లో తరచు దొర్లే మాటలివి. కాస్త నిలదొక్కు కున్నాక- ‘‘…ఉద్యోగ్నం వచ్చాక పిసినారితనం ఎక్కువయ్యింది. ప్రతీ డాలరూ నాకు లెక్కే! ఇంట్లో ఫోన్‌ ఉన్నా తరచు ఫోన్‌ చేసేవాణ్ణి కాదు. చేసినా ముక్తసరిగా మూడంటే మూడు మాటలు…’’ వంటి ఆలోచనా ధోరణిలో వచ్చే మార్పులూ చాలామందిలో చూస్తూనే ఉంటాం.
ఇంకా- ‘‘…మంచిపిల్లలాగానే వుంది. చచ్చేటంత డబ్బుంది. కానీ అమ్మకీ సంబంధం నచ్చుతుందో లేదో? వాళ్ళ కులం వేరు. ఆలోచిం చగా ఈ ప్రతిపాదనా బాగానే ఉందనిపిస్తోంది…’’ అన్నవీ వింటూనే ఉంటాం. డబ్బు కులాన్ని తోసి రాజంటుంది. అంతగా కాకపోతే కాదన డానికి కులం అడ్డు ఎలాగూ  ఉంది. ఆ నెపాన్ని నెట్టేయడానికి పెద్ద వాళ్ళు ఎలాగూ ఉంటారు. కొన్నివేల మైళ్ళు దాటొచ్చినా కులం నీడలు వెంటాడూనే ఉంటాయి.
పైన చెప్పిన మాటలు కొంతమందికి చురుక్కుమనిపించవచ్చు. భుజాలు తడుముకోవచ్చు. బ్రహ్మానందం ఉద్దేశ్యం అది కాదని చెప్పడానికి నేను ఏమాత్రమూ సందేహించను. ఎందుకంటే నవలలో ఒక పాత్ర తాలూకు ఆలోచన అది.
అవసాన దశలో ఉన్న వ్యక్తి, స్వీయకథ చెప్పుకునేటప్పుడు, తన ఒప్పులన్నీ ఏకబిగిని చెప్పుకుంటాడు, కానీ తన తప్పులన్నీ ఒప్పుకుంటాడా? అంటే నిజాయితీగా ఆత్మకథ చెప్పటం సాధ్యమేనా? ఆంతరంగిక విషయాలు అన్నీ పూసగుచ్చినట్టు, దాయకుండా ఎవరైనా చెప్పగలరా?  ఈ ప్రశ్నకి సమాధానం బ్రహ్మానందం తన అంతర్జ్వలన నవలలో సమర్థ వంతంగా నిర్వహించాడు. అందుకు అతన్ని అభినందించి తీరాలి.
Antarjwalana Cover
* * * 

 ఆకస్మిక అభివృద్ధి పై ఒక వెలుగు

చంద్ర కన్నెగంటి 
దశాబ్దాలుగా తెలుగ్నువారు మెరుగైన జీవితాలకై అమెరికాకు వలస వస్తూ ఉన్నారు. గత శతాబ్దపు ఆరూ ఏడూ దశకాల్లో వైద్యులు అధిక సంఖ్యలో తరలిరాగా చివరి దశకంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వలస ఎక్కువ యింది. చదువుకొని, ఆ విద్యార్హతలతో ఇక్కడ ఉద్యోగ్నం సంపాదించుకునే విద్యార్థుల సంఖ్య మొదట్లో తక్కువగానే ఉన్నా క్రమేపీ అనేక రెట్లు పెరుగుతూ వస్తోంది. విద్యార్హతతో పని లేకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం  సంపాదించడానికి ఇప్పుడది డొంక తిరుడుగుడు దారిగానూ, అడ్డదారి గానూ పరిణమిస్తోంది. తెలుగువారి దృష్టి ఉద్యోగాల మీద నుంచి వ్యాపారాలకు విస్తరిస్తూ ఉంది.
తొలినాళ్లలో ప్రవాస జీవితంలో వీరు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇక్కడి తిండికీ, సంస్కృతికీ అలవాటుపడడంలో తోవచూపే ముందు తరం వాళ్లు లేనప్పుడు ఎట్లా కుదురుకోగలిగారు? అప్పటి కాలపు వర్ణవివక్ష స్పష్టంగా కనిపించేదా? వీటికీ, ఇటువంటి ప్రశ్నలకి జవాబులూ, వారి అనుభవాలూ మనకు తెలిసే దారిలేదు. ఒక దారీ, తెన్నూ దొరికాక, కొంచెం వేళ్లు నిలదొక్కుకున్నాక అప్పుడు తమ సమస్యలు కథలుగా చెప్పుకోవడం మొదలెట్టారు. కథలు కనక వారి జీవితాలపై అవి ప్రసరించే వెలుతురు పరిమితంగానే ఉంటుంది.
ఇన్నేళ్లుగా క్రమంగా కలుగుతున్న  మార్పులూ, ఇక్కడి తెలుగుజాతి ప్రస్థానమూ చరిత్రగా నమోదు కావాలంటే నవల వల్లో, జీవిత చరిత్ర వల్లో తప్ప సాధ్యం కాదు. ఒకటో రెండో నవలలూ, జీవిత చరిత్రలూ రాకపోలేదు. అయితే ఎక్కువమంది ఇక్కడికి చేరుకున్న రోజులనీ, విద్యార్థి జీవితాన్నీ, సాఫ్ట్‌వేర్‌ రంగంలో పెనుమార్పుల వల్ల కొంతమంది జీవితాల్లో కలిగిన ఆకస్మిక అభివృద్ధినీ పట్టుకున్న నవలలు లేవు. మిత్రుడు గొర్తి బ్రహ్మానందం రాసిన ఈ అంతర్జ్వలన నవల ఆ పని చేస్తుంది.
మృత్యుముఖంలోని మనిషి తలపోత ఇది. విద్యార్థిగా ఈ దేశంలో అడుగు పెట్టి స్నేహితుల, ఇక్కడి తెలుగు  కుటుంబాల సాయంతో ప్రవాస జీవితంలో ఇముడుతూ, అవకాశాల్ని అంది పుచ్చుకుని పైస్థాయికి  చేరుకున్న వ్యక్తి జీవితంలోని ముఖ్యభాగాలు ఇవి. నవల నేపథ్యం చరిత్రగా కళ్లకు కడుతుంది. ఆ కాలంలో ఇక్కడ అడుగుపెట్టిన వాళ్లను గడచిన దినాల నెమరువేతలో పడవేస్తుంది.
చేయి తిరిగిన రచయిత కనుక వాక్యం సరళంగా ఉండి సాఫీగా నడుస్తూ ఆసక్తిగా చదివిస్తుంది. అతిసాధారణమూ కాని, అసాధారణమూ కాని సంఘటనలు సహజమే అనిపిస్తాయి. మానవ సహజమైన బలహీనత లను ఎత్తి చూపుతూ చివరి ఘట్టం పాఠకుడి దృక్కోణం మారుస్తుంది.
ఈ నవల మరిన్ని నవలలను ఇక్కడి రచయితలచే రాయిస్తుందనీ, ఇక్కడి జీవితాల అన్ని కోణాల్నీ తడుముతూ మరింత విస్తృతమైన కాన్వాస్‌తో నవలలు వస్తాయనీ ఆశిద్దాం.
*

బహుజన బంధమే “అలాయి బలాయి”!

ఖాజా

1

తన కవిత్వంతో తెలుగు సాహిత్యంలో బలమైన ముద్రవేసిన స్కైబాబ, కథకుడిగా అట్టడుగు వర్గాల జీవితాన్ని  శక్తివంతంగా వినిపిస్తున్నాడు.  ఇప్పటికే అధూరే పేరిట తన కథల సంపుటి ప్రచురించి కథా సాహిత్యంలో ముస్లిం జీవితాల వెతలను ఆవిష్కరించాడు. ఇప్పుడు అలాయి బలాయి పేరుతొ బహుజన కథలు ప్రచురిస్తున్నాడు. బీసీ, ఎస్ సీలను కలిపి చెప్పడానికి స్కైబాబ ‘బహుజనుల’నే మాటను ఉపయోగించాడు. అలాయి బలాయి అంటే హృదయానికి హృదయాన్ని చేర్చి హత్తుకొని అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసే ముస్లిం సాంప్రదాయం. స్కై బాబ ఈ కథా సంపుటి ద్వారా బహుజన సమాజాన్ని తన గుండెలకు హత్తుకుంటున్నాడు… ఇక్కడి గ్రామీణ సమాజంతో, బహుజన సమూహంతో, తనలాంటి ముస్లిములకు వున్న బలమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాడు.

భారతీయ గ్రామీణ సమాజాన్ని తరచి చూస్తె  ప్రతి గ్రామం భారత దేశపు మినియేచర్ లా కనిపిస్తుంది..  వూరి పాలనను, సంపదను అనుభవిస్తూ పెత్తనం చెలాయించే అగ్రకుల వర్గం ఒక పక్క, వూరి విసర్జితాలని నెత్తిమీద మోస్తూ, వూరికి వూడిగం చేస్తూ, నిచ్చెన మెట్ల వ్యవస్థకి మరింత కింద, వూరి జనానికి మరింత దూరంగా, అంటరానితనంలో, పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్న దళిత సమాజం ఊరికి దూరంగా మరొక పక్క! ఈ రెండిటి మధ్య అటు అగ్రకుల సమాజాన్ని అందుకోలేక, ఇటు తన కన్నా కింద వున్న దళిత సమాజాన్ని హత్తుకోలేక నడుమన ఊగిసలాడుతూ BC సమూహం. హిందూత్వం హీనంగా చూసి, ఎదగనీయకుండా తోక్కేసిన  దళిత, బిసి కులాల సమాహారమే బహుజన సమాజం.

ఇది మన గ్రామీణ సామాజిక చిత్రం. ఈ గ్రామీణ సామాజిక చిత్రం అస్తిత్వ సాహిత్యం కన్నా ముందు తరం  కథల్లో, కవిత్వంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రవాహం పైకి ఎంత తేటగా కనిపించినా దీని అంతర్లీన ప్రవాహం అత్యంత మురుగు. అది అప్పుడప్పుడూ పైకి తేలుతూ తన స్వభావాన్ని ప్రదర్శించి మళ్ళీ మరుగై పోతుంది. మురుగై పోయిన పైన ప్రవాహం మళ్ళీ కుదురుకొని తేటగా మారడానికి చాలా కాలం పడుతుంది.  అస్తిత్వ సాహిత్యం ఈ సమాజపు లోపలి పొరలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. గ్రామీణ సమాజపు లోపలి పొరల్లోని కుళ్ళిన ఈ భావజాల అవశేషాల్ని బహిరంగ పరచడం మనం ఇప్పుడు స్కైబాబ బహుజన కథల్లో చూడవచ్చు.

*

skyఈ సంపుటి లోని పదకొండు కథల్లో సోయి కథ ఒకటి.. గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే ఈ కథలో సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి పర్స్పెక్టివ్ నుంచి కథ నడుస్తుంది. శేకర్ రెడ్డి ని స్కై బాబ బహుజన గుంపులోనుంచి తప్పి పోయిన వాడిగా చూసాడు. నిజానికి ఈ దేశంలో రెడ్డి, చౌదరి వంటి కొన్ని శూద్ర కులాలు పాలక వర్గ స్థాయికి ఎదిగి నిజంగానే తమను తాము శూద్రత్వం నుంచి తప్పించేసుకున్నాయి. మంచిదే! ఆర్థికంగా, పాలన పరంగా  శాశించె స్థాయికి చేరుకున్నాయి. సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి భద్ర జీవితంలోకి వెళ్ళిపోయాడు. గ్రామీణ జీవితంలోని ఆర్ధిక, సామాజిక సంఘర్షణ నుండి కొంత మేరకు బయట పడ్డాడు.   ఈ కథలో యాదగిరి గ్రామీణ బహుజన సమాజానికి ప్రతినిధి. ఎదుగూ బొదుగూ లేని జీవితం. భద్రత, భరోసా లేని ఉపాధి తో కష్టంగా సాగే బతుకు. తాగుడు కారణంగా విచ్చిన్నమవుతున్న కుటుంబాలు. సాధారణ గ్రామీణ బహుజనుల జీవితం ఈ కథలో అంతర్లీనంగా ప్రతిబింబిస్తుంది.

ఐతే సాధారణ  సమాజం కన్నా భిన్నంగా  తర్వాత తరాల పట్ల ఒక బాధ్యత గా యాదగిరి కొడుకు చైతన్యవంతుల ప్రతినిధిగా నిలబడటం ద్వారా భవిష్యత్తులో అయినా బహుజన సమాజం చైతన్యవంతమై స్వయం గుర్తింపు సాధిస్తుందని ఆశను రచయిత ప్రకటించాడు.

‘జమ్మి’, ‘అంటు’ కథలు రెండూ కూడా మానవ సంబంధాలన్నీ కుల సంబంధాలే అని చెప్పిన కథలు. దళిత కులాల మధ్య వున్న అసంబద్ధ అనైక్యతను ‘జమ్మి’ కథ ప్రతిబింబించింది. ‘అంటు’ కథ ముస్లిం సమాజానికి దళిత సమాజానికి మధ్య వున్న ఘర్షణను ఎత్తి చూపింది. కుల నిర్మూలన జరగాలంటే  కులాంతర వివాహాలు జరగాలన్నది అంబేద్కర్ ఆలోచన. కానీ ఏ కులం అందుకు సిద్ధపడి లేదు. గ్రామీణ సమాజంలో వున్న పిలుపుల్లోని బంధం ఏ అవసరానికైనా ఉపయోగ పడవచ్చేమో గాని సామాజిక మార్పుకు, ఉపయోగపడవు.  మొత్తానికి  అన్ని బంధాల్లో కుల, మత  బంధాలే  అత్యంత  బలమైనవి అని చెప్పె కథలు ఇవి.

‘జవాబ్’, ‘అంటు’ కథలు ముస్లిం సమాజానికి బహుజన సమాజానికి వున్న  ఘర్షణను ప్రతిబింబించిన కథలు. జవాబ్ కథ గుజరాత్ లో ముస్లిముల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యం తో రాసిన కథ. ఇందులో సైదులు పాత్ర బీసీ పాత్ర. ఈ సైదులు చేసిన ఒక పనికి వూరు ఊరంతా కలిసి పంచాయితీ పెడుతుంది.   అప్పుడు సైదులు తన లోపలి దుఖాన్ని మనిషిగా తన ఘర్షణని వ్యక్తీకరిస్తాడు. కొందరు స్నేహితులతో   కలిసి గుజరాత్ వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన సైదులు పంచాయితీలో అక్కడి ముస్లిముల స్థితి గురించి  ఆవేదన చెందుతాడు

*

గ్రామీణ బహుజన సమాజంతో ముస్లిం సమాజానికున్న బంధాన్ని, ఇబ్బందినీ కూడా చెప్పిన ఈ కథలలో అంతర్లీనంగా వున్న ముస్లిం ఆవేదన బహుజన సమాజానికి అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. స్కై బాబ ప్రచురిస్తున్న ఈ 11 కథలు, బహుజన సమాజానికి మైనారిటీ సమాజానికీ మధ్య ఒక చర్చకు తావిచ్చే సందర్భానికి అవకాశం కల్పిస్తాయని అనుకుంటున్నాను. ఈ కథల్లోని అన్ని అంశాలు సుదీర్ఘ చర్చనీయాలే అయినా నేను కొన్ని కథల్ని మాత్రమె ఉదాహరించాను. ఈ ముందు మాటను స్కై బాబ కథల రివ్యూ లాగా కాక, ఈ కథల సందర్భం చుట్టూ వున్న సామాజిక చారిత్రిక తాత్విక పరిణామాల పరిశీలన కోసం కొన్ని అంశాలను ప్రస్తావనకు తెచ్చాను. ఇంకా ఈ కథల నేపథ్యంగానే చర్చించాల్సిన అంశాలు చాలా వున్నాయి. బహుశా ఈ పుస్తకం బయటికి వచ్చాక ఉద్యమ, పరిశోధక మిత్రులు ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి చర్చకు సందర్భాన్నిచ్చిన మిత్రుడు స్కైబాబ కు అభినందనలు.

*

 

సగం ఆకాశంపై ఇంకో సంతకం!

 

 

  (ఆగస్టు 23 మెర్సీ మార్గరెట్ తొలి కవిత్వ సంపుటి “మాటల మడుగు” ఆవిష్కరణ సందర్భంగా)

 

నేను వెతుక్కుంటున్న ప్రపంచం దొరకడం లేదు

కొత్త నేలా, కొత్త ఆకాశమూ దొరకడం లేదు

సర్లే, కొత్త నేలా కొత్త ఆకాశమూ దొరికాయి కదా అనుకుంటే

కొత్త మానవుడి ఆచూకీ దొరకడం లేదు ఎక్కడా!

-చాలా కాలం కిందట యేదో ఆడియో క్యాసెట్ లో విన్న కైఫీ ఆజ్మీ ఘజల్ గుర్తొస్తోంది, ఇవాళ మెర్సీ కవిత్వం రెండో సారి చదవడం పూర్తి చేసాక! ఆ వెంటనే, రెండు ప్రశ్నలు నా ఆలోచనల నిండా అలముకున్నాయి.

కవిత్వం రాయడం అనే ప్రక్రియ కవికి ఎందుకు అంతగా అవసరం? నాలుగు కవిత్వ వాక్యాల తరవాత ఆ కవి ప్రపంచం గానీ, అది  చదివిన చదువరి ప్రపంచం గానీ కొంచెమైనా మారుతాయా? ఈ రెండు ప్రశ్నలు అడగడం తేలిక; వాటి సమాధానాలు అంత తేలిక కాదు.

కాని, కవిత్వాన్ని తన సంభాషణకి సాధనంగా ప్రకటించుకున్నాక, ఆ కవి ప్రపంచం చాలా మారిపోతుంది. తన అనుభవాన్నీ, చెప్పాలనుకున్న విషయాన్ని ఆవిష్కరించడంలో ఆ కవి వెతుక్కునే దారులు అప్పటిదాకా మనకి అపరిచితంగా వున్నా, కొద్దిసేపట్లో అవి పరిచితమై, వొక ఆత్మీయమైన బంధం కవికీ, చదువరికీ మధ్య మొలకలెత్తుతుంది.

అంటే, వొక ఆత్మీయ నేస్తం లేని లోటుని ఆ కవిత్వం నెమ్మదిగా భర్తీ చేయడం మొదలెడుతుంది. అలాంటప్పుడు ఆ కవి ఎవరు, అతను/ ఆమె భౌతిక ఉనికి ఏమిటీ అన్న ప్రశ్నలు అర్థరహితంగా కనిపిస్తాయి. వాక్యాలతో మొదలైన ఆ బంధం జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలలో కూడా ఆ వాక్యాల ఆసరా వెతుక్కునేట్టు చేస్తుంది.

అలాంటప్పుడు, చాలా సంక్లిష్టంగా అనిపించే జీవన ప్రహేళికలో వొక నేలా, ఆకాశమే కాదు, కొత్త మానవత్వపు చిరునామా కూడా దొరికినట్టే! అలాంటి అనుబంధాన్ని అల్లుకునే కవిత్వపు వంతెన – మెర్సీ మార్గరెట్ కవిత్వం.

1

సాధారణ స్త్రీవాద కవిత్వం దాదాపూ తగ్గుముఖం పట్టి, దళిత, ముస్లిం, తెలంగాణా  స్త్రీవాదాల నిర్దిష్టత (local –specific feminism) ముందుకొస్తున్న దశలో మెర్సీ కవిత్వం మనం చదువుతున్నాం. అలాగే, భావప్రకటనకి సంబంధించి వ్యక్తిగత ధోరణి యింకో రూపం ఎత్తుతున్న దశలో కూడా మనం వున్నాం. ప్రపంచీకరణ తరవాతి extreme individualism తెలిసో తెలియకో ప్రతి కవిలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. ఇది క్రమంగా  సామాజిక నిరాకరణగా మారిపోతోందా అన్న సంశయమూ వొక్కోసారి వస్తోంది. ఆ సంశయాలని తుడిచేస్తూ, ఈ రెండీటినీ బ్యాలెన్స్ చేసే స్వరాల్లో మెర్సీ వొకటి.

mercy

మెర్సీని కవిత్వ లోకంలో బలంగా పరిచయం చేసిన కవిత “ప్రశ్నలగది.” ఈ కవితలో మెర్సీ అన్వేషణకి ఎన్ని రూపాలున్నాయో అవన్నీ అద్దంలో ప్రతిఫలించినట్టు కనిపిస్తాయి. వొకే వొక కవితలో కవి వ్యక్తిత్వాన్ని చూపించాలనుకోవడం దురాశే కాని, ఎందుకో నాకు నమ్మకం- అలా చెయ్యచ్చు అని! కవి ఏదో వొక కవితలో తన మొత్తం ప్రాణం పొదుగుతాడు; తన ప్రయాణానికి ఆ కవిత తెలియకుండానే benchmark అవుతుంది. అది ఎలా అన్నది అర్థం కావాలంటే “ప్రశ్నలగది” కవిత మొత్తం ఇక్కడ quote చేయాలి.

అప్పుడప్పుడు

ఆ గదిలోకెళ్ళడం అవసరం

అంటూ వొక అనివార్యత(inevitability)ని మన ముందు సృష్టించి అప్పుడు కవితలోకి తీసుకెళ్తుంది మెర్సీ. ఇది మంచి శిల్పం అయితే, అక్కడితోనే ఈ కవిత ఆగిపోదు.  ఇందులో మెర్సీ నిబద్ధతని చెప్పే వాక్యాలు చాలా వున్నాయి. ప్రశ్నల గదిలోకి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న వెనక మెర్సీ చూపించిన rationalization  ఈ కవితకి మూల బిందువు.

కవి వ్యక్తిత్వాన్ని- అది సొంతమైనా, కవిత్వమైనా- ఆమె వెతుకులాటతో మాత్రమే సరిగా measure చేయగలమని అనుకుంటాను. అన్నట్టూ, వెతుకులాట అంటే మళ్ళీ ఇప్పటికీ ఇస్మాయిల్ గారి కవితే గుర్తొస్తుంది.

నింగి దేనికోసం
వంగి వెతుక్కుంటుంది?
నేల దేనికోసం
నీలంగా సాగుతుంది?
కాసార మెవరికోసం
కన్నార్పక చూస్తుంది?
ఆకలి దప్పులు లేని గాలి
వాకిళ్ళనెందుకు తెరుస్తుంది?
బొడ్డులో కన్ను తాపుకుని
బావి ఏమి గాలిస్తుంది?
ఒక్క చోటనే చెట్టు నిత్య
మెక్కడికి ప్రయాణిస్తుంది?

ఇస్మాయిల్ గారు ఈ కవితలో చెప్పిన భిన్న స్తితులకు కవి గానీ, కవిత్వ సృజన గానీ  ఏ మాత్రం భిన్నం కాదు. ఇందుకవితని లో ఇస్మాయిల్ గారు అడుగుతూ వెళ్ళిన ప్రశ్నలకి ఈ కాలంలో ఈ క్షణంలో నేను మెర్సీ “ప్రశ్నల గది” కవితని వొక సమాధానంగా చూస్తున్నా.

అన్ని సమాధానాలూ  దొరుకుతాయన్న హామీ లేదు జీవితంలోనూ, కవిత్వంలోనూ!

వెతుకులాట ఎక్కడో వొక చోట ఆగిపోతుందన్న హామీ అంతకంటే లేదు. అయితే, కవిత్వం వొక హామీ ఇస్తుంది. జీవితంతో ఉద్వేగ బంధాన్నిస్తుంది. ఎడరతెరపి లేకుండా ప్రశ్నించే సహనాన్నిస్తుంది. ఈ  మూడింటి కోసమే మనం కవిత్వాన్ని ఇంతగా ప్రేమిస్తాం. నమ్ముకుంటాం. చాలా కవితల్లో మెర్సీ కవిత్వ పుట్టుక గురించీ, నడక గురించీ ఆలోచించడం కనిపిస్తుంది. కవిత్వాన్ని  వొక savior గా నమ్మినప్పుడు మాత్రమే ఈ ఆలోచన ఇన్ని రూపాల్లో కనిపిస్తుంది. ఇలాంటి నాకు బాగా నచ్చిన సందర్భం- “కవులు-కాగితం” అనే కవిత. చాలా తేలికగా వుండే కవిత ఇది. కాని, బరువైన ఆలోచనని దాచుకున్న కవిత.

అవును,

కవులు కాగితాలపై కలుస్తారు

సగం దూరం ప్రయాణించిన తరువాత

బాటసారుల్లా కొందరు

 

నదుల్లా వెంటాడుతూ, మనతో

మన ఆలోచనల్లో

ఇంకొందరు

కవిత్వాన్ని గురించి ప్రతి కవీ తనదైన వూహ చేయకుండా ఉండడు. ఆ ఊహని చదువరి కోణం నించి చేయడం ఈ కవితలో విశేషం. కవీ, చదువరీ వొకే దారిలో వెళ్తూ కూడా రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతారు. అంటే రెండు  వాక్యం చదువుతూ కూడా భిన్నమైన వూహల్లో తమని తాము నిలబెట్టుకుంటారు. ఆ రెండు వూహలూ నిజమే. వాటిని ఇద్దరూ సమానంగా value చేయగలిగినప్పుడే కవిత ఇద్దరి మనసుల్లోనూ బతుకుతుంది, లేదా నిలిచి వుంటుంది. కొన్ని సార్లు అంతకు ముందు అనుకున్న వాటిని కొట్టివేసే సహనమూ వున్నప్పుడే ఇది అర్థవంతమైన ప్రయాణం అవుతుంది.

మెర్సీ అంటుంది:

పునర్లిఖించుకోవాలి

నన్ను నేను

పాత మాటలకు నిర్దాక్షిణ్యంగా కత్తెర వేసి

ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి

పాత పాళీకి కొత్త మాటలు అభ్యాసం చేయించి…

ఇదంతా ఆ  అర్థవంతమైన ప్రయాణంలో భాగమే. ఈ ప్రయాణానికి అర్థం వుంది అనుకున్న తరవాత మెర్సీ యెన్ని కవిత్వ దూరాలు వెళ్లిందో అక్కడల్లా తన footprints లాంటి వాక్యాల్ని ముద్రించి సాగిపోయింది.

 

2

వెతుకులాటే కవిత్వం ఉనికి అనుకుంటే, వెతికి సాధించేది కాదు, వెతుక్కుంటూ వుండడమే కవిత్వం.

ఈ కవితా సంపుటి చదువుతున్నప్పుడు మెర్సీ ఎన్ని వ్యక్తిగత, సామూహిక అనుభవాలు తన కవిత్వంలో రికార్డు చేసిందో చూస్తే, కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె తన ఏకాంతపు గాఢమైన అనుభూతిని ఎంత చెప్పిందో, సామూహికంగా తన అస్తిత్వాన్ని అంతే వివరంగా చెప్పుకుంటూ వెళ్ళింది.

వొక కవితలో తనే చెప్పుకున్నట్టు:

తడిమే ప్రతి చూపులో

వినే ప్రతిమాటలో నూత్న వెలుగుతో

నన్ను నేను కాల్చుకోవాలి

కాల్చుకోవడం అనేది ఇక్కడ తపనకి పరాకాష్ట. స్త్రీవాదం ఎక్కడో వొక చోట ఆగిపోవాలని ఎదురుచూస్తున్న వాళ్లకి నిరాశా, వొక షాక్ ఇచ్చేట్టుగా మెర్సీ తనలోని స్త్రీచైతన్యంతో రాసిన కవితలు ఇందులో చాలా వున్నాయి. Feminine sensibility,  gendered identity అనేవి సిద్ధాంతపు గోడలు దాటి అనుదిన జీవితంలోంచి నేరుగా కవిత్వంలోకి ప్రవేశిస్తే ఎలా వుంటుందో చెప్పే ఉదాహరణలు ఈ కవిత్వంలో కనిపిస్తాయి. “విత్తనపు వీర్యం ఆడా? మగా?” లాంటి కవితలు వొకానొక ఉదాహరణ మాత్రమే.

సామూహక అస్తిత్వం అనేది గట్టిగా వినిపించే ప్రతి వర్తమాన సందర్భాన్నీ మెర్సీ కవిత్వం చేసింది. “అమానత్ స్వరం” కవిత చూడండి –ఈ కవిత కొంత వాచ్యం అయిన మాట నిజమే కాని, ఇందులో వినిపిస్తున్న ఘోష మన గుండెల్ని పిండేస్తుంది.

ఇప్పుడు

కన్నీరు కార్చి అయ్యో అనకండి

మా అక్కో చెల్లో తల్లో కాదని

తప్పుకుపోకండి

తల్లిదండ్రులారా,

వీలయితే మీ కొడుకులను స్త్రీలను గౌరవించడం

నేర్పండని

ఎలుగెత్తి ఏడుస్తూ ఘోషిస్తుంది

అమానత్ స్వరం!

ఇందులో కవిత్వం ఏముందన్న ప్రశ్నకి ముందే ఈ వాక్యాలలోని విసురూ, ఆవేశం మనల్ని చుట్టుముడ్తాయి. దీన్ని ఇంగ్లీషులో అయితే attitudinal poetry అనవచ్చేమో! కేవలం వొక attitude చెప్పడం వరకే ఆ కవిత పని. ఇవి మెర్సీ మామూలుగా రాసే కవితలకి భిన్నంగా వుంటాయి. మామూలుగా మెర్సీ కవిత్వంలో వుండే సాంద్రతా, imaginary coherence, symbolic integrity వంటివి వీటిలో కనిపించవు. “కాల్చుకోవాలి” అన్న క్రియని మెర్సీ ఇంతకు ముందు వొక కవితలో వాడింది. అలాంటి అత్మదహన ప్రక్రియ ఈ attitudinal poetry లో కనిపిస్తుంది. తనలోని వొక ఆవేశాన్ని తక్షణమే చెప్పాలన్న తపన నిలవనీయనప్పుడు కవి అసలు తన లోపల సాగుతున్న అంతర్యుద్ధాన్ని యింకా విడమరచి చెప్పలేని వూపిరాడనివ్వని స్థితిలో రాసిన కవితలు ఇవి.

3

కవిత్వంలో ఇది మెర్సీ తొలి అడుగు.

కాని, ఇందులో చాలా కవితలు ఆమె ఆలోచనా పరిపక్వతనీ, కవిత్వ శిల్ప పరిణతినీ చెప్తాయి. కొన్ని కవితలు తొందరలో రాసినట్టనిపించి కొంచెం అసంతృప్తి కలిగిస్తాయి కూడా – బలమైన కవితలు ఎక్కువ వుండడం వల్ల అలాంటి బలహీనమైన కవితలు తేలికగా మన మనః ఫలకమ్మీంచి జారిపోతాయి.

వస్తుపరంగా మెర్సీ ఇంకా విస్తృతిని సాధించవచ్చు అనిపిస్తుంది. తెలుగుసాహిత్యంలో క్రైస్తవ జీవన అస్తిత్వం అంతగా ప్రతిబింబించిన దాఖాలాలు లేవు. ఈ దిశగా కవిత్వంలో విల్సన్ సుధాకర్, కథల్లో వినోదిని చేస్తున్నలాంటి కృషికి తగినంత కొనసాగింపు లేకపోవడం పెద్ద లోపం. మెర్సీ కొన్ని కవితల్లో ఆ ప్రయత్నం చేసింది కాని అది ఇంకా బలపడాల్సిన అవసరం వుంది. తనదైన జీవితం నించి తెచ్చే ఏ అనుభవమైనా – అది కొంత వాచ్యం అనిపించినా కూడా- ఇప్పుడు చాలా అవసరం.

మెర్సీ మలి అడుగు అటు వేపు పడాలని కోరుకుంటున్నా.

-అఫ్సర్

ఆగస్టు 17, 2014.

 

 

 

 

 

వర్తమాన సమాజానికి రోల్‌మోడల్‌ ‘వికర్ణ’

విహారి

‘వికర్ణ’ నవల ఒక చారిత్రక అవసరాన్ని తీరుస్తూ వచ్చింది.  ఈ నాటి సామాజిక అస్తవ్యస్థ వ్యవస్థా సందర్భంలో ` మహిళల పట్ల జరుగుతున్న దౌష్ట్యాన్ని, దుర్మార్గపు దాడిని ఎదుర్కొని, తప్పుని తప్పుగా నిరసించి, తిరస్కరించి, సరిదిద్దే ` సద్భావననీ, సదాచరణనీ నేటి యువతరంలో ప్రోది చేయటానికి తన రచన చోదకశక్తి కావాలని ఈ మహాత్తరమైన నవలని రాశారు డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు. ఆయనలోని ‘జీవునివేదన’ పాఠకులలోనికి ప్రవహించి, ఆయన  శుభ్రకాంక్ష సఫలమయ్యే సూచనలు ఇప్పటికే సాహితీలోకానికి అందేయి. ఇదొక వాంఛిత విజయం! 
మహాభారతంలో వికర్ణుడు చాలా చిన్నవాడు. కర్ణుని మాటల్లో ‘చిరుతవాడు’. అలాంటి వాడు పాంచాలీ పరాభవఘట్టంలో చిత్తశుద్ధితో, లక్ష్యనిర్దేశంతో, యౌవనోత్తేజంతో ధర్మాధర్మ విచక్షణని గణగణమనిపించాడు. అది కూడా కురువృద్ధుల్‌, గురువృద్ధ బాంధవులనేకుల్‌ చూచుచుండగ.. సభలో చర్చకు పెట్టాడు. తాను కేవలం ధర్మ పక్షపాతినని ఒంటరిగా ` ఎక్కటిపోరుకు సిద్ధపడతాడు. వికర్ణుడు ` అలా ఒక మహిళ (ద్రౌపది) పట్ల జరుగుతున్న దారుణాన్ని ఖండిరచే తీరుకి ఎందరో లోలోపల హర్షించారు. అయితే, స్వామి భక్తి పరాయణుడుగా కర్ణుడు ` ఆ ధర్మ పన్నాల్ని ‘వృద్ధజనములున్న చోట తరుసంటి పలుకులు’ అని ఈ సడిస్తాడు!  అయినా వికర్ణుడు కుండబద్దలు కొట్టిమరీ వస్త్రాపహరణాన్ని దుయ్యబట్టాడు.
ఇదిగో, ఈ ఘట్టం శ్రీనివాసరావు మనసుకు పట్టింది. సామాజికబాధ్యతా, సాహిత్యారాధనా, మానవతాకర్తవ్యం` ముందుకు నడిపాయి. ఆ సభాపర్వసన్నివేశంలో యువ వికర్ణుని చిత్తదారుఢ్యం, వర్తన నైర్మల్యం, ధర్మ నిబద్ధతా ` ఈయన మనసుని మెలిపెట్టాయి. బుద్ధిని రాపాడాయి. ‘నాటి వికర్ణని వలె నేటి వారునూ’  ధర్మాచరణ పట్ల జాగరూకతనీ శ్రద్ధాభక్తుల్ని పెంపొందించుకోవాలని ప్రబోధాన్ని యివ్వాలనుకున్నారు. ఇచ్చారు!
cover page and back page quark4.qxd
సహజంగానే ‘వికర్ణ’ నవల ఇతివృత్తం` ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆయన జన్మవృత్తాంతం మొదలు ‘మహాభినిష్క్రమణం’ వరకూ ` వివిధ సమయ పరిచ్ఛేదాల్లో వికర్ణుని వృత్తి ప్రవృత్తుల వింగడిరపుని అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత. కథాగమన చోదకంగానూ, ప్రసక్తానుప్రసక్తంగానూ, పాత్రచిత్రణ ప్రేరకంగానూ ` మహాభారత ఘట్టాలు చాలా వస్తాయి. ధీరగంభీరమైన వికర్ణపాత్రని పరిపుష్టం చేయటానికి ఎడనెడ కల్పనల్నిజోడించారు  శ్రీనివాసరావు. ఒక్క ముఖ్యవిషయం.. ఈ కల్పనల్లో రచయిత ` కావ్య సంభావ్యతనీ, సమయజ్ఞతనీ, ఉచితజ్ఞతనీ, మీదు మిక్కిలి విజ్ఞతనీ పాటించారు.  గాంధారీ పుత్ర సంతతి ` నూర్గురిలో తానూ ఒక్కడే అయినా, వికర్ణుడు తన భిన్నత్వాన్ని పిండదశలోనే ఎలా వ్యక్తం చేశాడో చూపారు రచయిత. అలాగే కుమారాస్త్రవిద్యా ప్రదర్శనం నుంచీ ప్రతిఘట్టంలోనూ వికర్ణపాత్ర విలక్షణతనీ, ధర్మజ్ఞతనీ, వ్యక్తిత్వశోభనీ ` తన ఊహపోహలతో వేదికలకెక్కించి మూర్తిమంతం చేశారు శ్రీనివాసరావు.
ఆయన ఎంతో చదివి కొంచెం రాశారనే  వాస్తవం సాహిత్య సంప్రదాయాల ఎరుకగల వారికి తెలుస్తుంది.  వికర్ణ నవలా రచన ఒక కఠోర పరిశ్రమ. పరిశోధన! ఆ శ్రమని తాను ఆనందంగా స్వీకరించి, ఫలితాంశాన్ని చదువరులకు అందించారు శ్రీనివాసరావు. అందుకు ఆయన అన్ని కైమోడ్పులకూ అర్హులు!
ఇక, నవలాకథనం నిరాడంబరంగా సెలయేటిజాలులా సాగిపోయింది. ఆ కథనంలో రెండు అసాధారణ గుణవిశేషాల్ని మీతో ప్రస్తావించాలి. ఒకటి కథా నేపథ్యంలో సందర్భాన్నీ, సంఘటననీ మిళితం చేస్తూ ప్రస్తుత సన్నివేశాన్ని చదువరి కళ్లముందు నిలిపే దృశ్య చిత్రీకరణ. ఇది డాక్యుమెంటరీ టెక్నిక్‌లోని  ‘క్వాలిటీ’లో ‘సూపర్‌ క్వాలిటీ’! దీన్ని శ్రీనివాసరావు ఎంతో నైపుణ్యంతో మెళకువతో నిర్వహించి, తనదైన నవలా సంవిధాన ముద్రని సాధించుకున్నారు. రెండవ అంశం ` శైలి. ‘శ్రీనివాసరావు శైలీ మాధుర్యం ఆయన అక్షర రమ్యతలో వుంది. అభివ్యక్తి సాంద్రతలో వున్నది. పదునుదేరిన వాక్య నిర్మాణంలో వున్నది. ఎలా అంటే? మూడు నాలుగు పదాలను కూర్చుకున్న చిన్న వాక్యం మన అంతఃకరణని పట్టిలాగుతుంది. బాలవికర్ణుడు తల్లిముందు అన్న అన్యాయం గురించి చెప్పిన ఘట్టం చదవండి.
‘‘గాంధారీ దేవికి  ఏమీ పాలు పోదు. జ్యేష్టకుమారుని చేష్టలను సమర్థించలేదు. అలాగని వికర్ణుని ముందు సుయోధనుని తక్కువ చేసి మాట్లాడలేదు..’’
అలాగే, ‘తప్పిన శిక్ష’ అధ్యాయంలో కర్ణసుయోధనుల చర్చని  చదవండి. ఉదాహరించవలసిన నవలాశిల్పవిశేషాలు చాలా ఉన్నాయి. గమనిస్తూ, గమనం (పఠనం) సాగించండి. ‘వికర్ణ’ నవల ఒక సత్‌హృదయ రచయిత ఆర్తి. ఈ జాతి మహిళల గౌరవ పరిరక్షణకు చేకొనవలసిన ఒక సదాశయదీప్తి!  ప్రతి మనిషీ రోల్ మోడల్   చేసుకు తీరవలసిన ఒక తేజఃస్ఫూర్తి. జాతినాడిలో ప్రవహింపవలసిన  సామాజికవసర విద్యుచ్ఛక్తి!
 అంతేకాదు. ‘వికర్ణ’ నవల ఒక పురాణ పాత్రకి దుష్టమైన, భ్రష్టమైన పునర్మూల్యాంకనం’ కాదు. అది వర్తమాన సమాజానికి ఆనాటి ఒక ధర్మపరుని ‘రోల్‌మోడల్‌’గా పునర్‌నిర్వచించిన సాహితీ వైజయంతిక ! ఇదీ ఈ నవలా రచన అంతస్సారం ! 

*

 

కోసంబి అన్వేషణలో వెలుగు దివ్వె…

దామోదర్ ధర్మానంద్ కోసంబి రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ ఇంగ్లిషులో వెలువడిన ఆరు దశాబ్దాలకు తెలుగులోకి వస్తున్నది. తెలుగు సమాజానికీ, తెలుగు మేధో ప్రపంచానికీ అత్యంత అవసరమైన ఈ పుస్తకాన్ని ఇంత ఆలస్యంగానైనా తెలుగు చేసే అవకాశం రావడం వ్యక్తిగతంగా నాకు గొప్ప సంతోషం. ఈ పుస్తకాన్ని మాత్రమే కాక, ఎన్నో ప్రామాణిక గ్రంథాలను భారతీయ భాషలన్నిటిలోకీ అనువదింపజేసే మహత్తర బాధ్యతను తలకెత్తుకున్న నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్, ఆ బాధ్యతను తెలుగులో పంచుకుంటున్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ గ్రంథానువాదానికి నన్ను ఎంపిక చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

భారత చరిత్రకు సంబంధించి నిశితమైన ఆలోచనలు చేసి, మూడు పుస్తకాలు, దాదాపు వంద వ్యాసాలు రాసినప్పటికీ దామోదర్ ధర్మానంద్ కోసంబి (31 జూలై 1907 – 29 జూన్ 1966) ప్రాథమికంగా చరిత్రకారుడు కాదు. ఆయన అనేక శాస్త్రశాఖలతో సంబంధం ఉన్న అరుదైన మేధావి. గణితశాస్త్ర అధ్యయనం దగ్గర ప్రారంభించి ఆయన ఎన్ని శాస్త్రాలలో ప్రవేశించారో, ఎన్ని శాస్త్రాలలో మౌలిక ఆలోచనలు చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గణిత శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, జన్యుశాస్త్రం, రేఖాగణితం, నాణాల్ని బట్టి చరిత్రను కనుకొనే పణశాస్త్రం, సాహిత్య విమర్శ, పురాతత్వశాస్త్రం, భారత అధ్యయన శాస్త్రం, రాజకీయార్థిక శాస్త్రం,  చరిత్ర వంటి అనేక శాస్త్రాలలో ఆయన చెరగని ముద్ర వేశారు. మాతృభాష కొంకణితో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, పాళీ, ప్రాకృతం, లాటిన్, గ్రీకు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ భాషల్లో మూల రచనలు చదివేంత, రచనలు చేసేంత ప్రావీణ్యం సంపాదించారు.

ఆయన తండ్రి ఆచార్య ధర్మానంద్ దామోదర్ కోసంబి బౌద్ధ అధ్యయనాలలో, పాళీ భాషలో నిష్ణాతుడుగా పూనాలోని ఫెర్గూసన్ కాలేజిలో అధ్యాపకుడిగా ఉండేవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను అతిథి అధ్యాపకుడిగా, ప్రత్యేక ప్రణాళికల సభ్యుడిగా మూడు వేరువేరు సందర్భాలలో ఆహ్వానించింది. అలా తండ్రి రెండవసారి హార్వర్డ్ వెళ్లినప్పుడు ఆయన వెంట దామోదర్ కోసంబి తన పదకొండో ఏట హార్వర్డ్ కు వెళ్లి ఉన్నత పాఠశాల విద్య అక్కడే అభ్యసించారు. తర్వాత తండ్రి భారతదేశానికి వచ్చినప్పటికీ దామోదర్ కోసంబి కళాశాల విద్య కోసం అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. గణితశాస్త్రంలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని 1929లో భారతదేశానికి తిరిగివచ్చి మొదట బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు, తర్వాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు అధ్యాపకుడిగా పని చేశారు. తన తండ్రి పనిచేసిన పూనా ఫెర్గూసన్ కాలేజిలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా 1933లో చేరి, పద్నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఆతర్వాత, 1946లో అప్పుడే ప్రారంభించిన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమి భాభా ఆహ్వానంతో అక్కడ శాస్త్రవేత్తగా చేరారు గాని అణుశక్తి వంటి శాస్త్ర విషయాలలోనూ, నెహ్రూ విధానాల వంటి రాజకీయాంశాలలోనూ భాభాతో విభేదాల వల్ల 1962లో ఆ పదవి వదులుకున్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ 1964లో ఇచ్చిన సైంటిస్ట్ ఎమెరిటస్ గుర్తింపుతో పూనాలో తానే స్వయంగా మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రారంభించారు. ఖడక్ వస్లా లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందే విద్యార్థుల కోసం ఆర్కియలాజికల్ సొసైటీ స్థాపించారు. యాభైతొమ్మిదో ఏట, 1966 జూన్ 29న హఠాత్తుగా మరణించారు. దాదాపు 1920ల నుంచీ రచనలు చేస్తూ అనేక రంగాలలో వందలాది వ్యాసాలు రాసినప్పటికీ ఆయన జీవితకాలంలో ప్రచురితమైనవి చరిత్ర మీద రెండు పుస్తకాలు మాత్రమే.

కోసంబి మేధో పరిణామం, ఆయన ఒక్కొక్క శాస్త్రంలోకీ విస్తరించిన తీరు, చివరిదాకా ఆయనలో సాగిన అన్వేషణా తపన ఆశ్చర్యపరుస్తాయి. స్టెప్స్ ఇన్ సైన్స్ అనే పాక్షిక ఆత్మకథాత్మక వ్యాసంలో తాను ఏయే శాస్త్ర రంగాలలోకి ఎలా ప్రవేశించవలసి వచ్చిందో ఆయనే చెప్పుకున్నారు. అది చూస్తే యూరప్ లో పునరుజ్జీవన యుగంలో సకల శాస్త్రాలలో ప్రవేశించిన వ్యక్తులు, ‘సమస్త జ్ఞానాన్నీ నా పరిధిలోకి తీసుకున్నాను’ అని ఫ్రాన్సిస్ బేకన్ అన్నట్టు అనగల వ్యక్తులు గుర్తుకొస్తారు. “కోసంబిని చాల తరచుగా మహామేధావిగా, ‘పునరుజ్జీవన యుగపు వ్యక్తి’ గా, అసాధారణమైన మేధో మూర్తిగా వర్ణిస్తూ ఉంటారు. ఆయనను సన్నిహితంగా చూసి ఉండకపోతే అటువంటి మనిషి ఉండగలడని నేను నమ్మేదాన్ని కాదు” అని ఆయన కూతురు మీరా కోసంబి ఆయన శతజయంతి సందర్భంగా ఆయన వ్యక్తిగత, సామాజిక, మేధో జీవితం గురించి రాసిన వివరమైన వ్యాసంలో అన్నారు.

గణితశాస్త్రం కచ్చితమైన శాస్త్రమనీ, అది ప్రకృతి భాష అనీ, తనను అది సమ్మోహపరిచిందనీ ఆయనే చెప్పుకున్నారు. ఆయన తొలి ఆలోచనలు, పరిశోధనలు, రచనలు గణితశాస్త్రంలో, ప్రత్యేకించి టెన్సర్ అనాలిసిస్ పాథ్ జామెట్రీ వంటి రంగాలలో సాగాయి. ఆ క్రమంలోనే ఆయన 1943లో జన్యు శాస్త్రంలో ప్రవేశించి క్రోమోజోమ్ మాపింగ్ మీద ఒక రచన చేసి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘కోసంబి సూత్రం’ అనేదాన్ని తయారుచేశారు. గణితశాస్త్రం నుంచి సహజమైన కొనసాగింపుగా సంఖ్యాశాస్త్రంలో ప్రవేశించి 1944లో ప్రాపర్ ఆర్థోగొనల్ డికాంపోజిషన్ అనే విశిష్ట సాంకేతిక పద్ధతిని కనిపెట్టారు. ఆ క్రమంలో నాణాల పరిశోధన ప్రారంభించారు. ఏడువేల నాణాలను తాను స్వయంగా తూచానని ఆయనే చెప్పుకున్నారు. ఆ నాణాల తూకం మార్పుల గురించి చేసిన ఆలోచనలతో ఆయన పణశాస్త్రానికి శాస్త్రీయమైన పునాది వేశారు. నాణాలను అవి ముద్రించిన రాజుల కోసమో, వాటి లోహాల కోసమో కాక, వాటి మీద సంతకం చేసిన సమకాలీన సమాజం కోసం అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. ఈ నాణాల అధ్యయన క్రమంలోనే ఆయనకు ప్రాచీన చరిత్ర పట్ల, మొత్తంగా చరిత్ర పట్ల ఆసక్తి కలిగింది. అదే మరొకవైపు ప్రాచీన సంస్కృత, పాళీ సాహిత్య అధ్యయనానికీ, పరిష్కరణకూ, సాహిత్య విమర్శకూ దారి తీసింది. చరిత్ర రచనకు గతకాలపు ఆధారాలు ఎంత కీలకమో, ‘భారతదేశం అనేది ఒక సుదీర్ఘ అవశేషాల దేశం’ అనే అవగాహనతో వర్తమానంలో జీవిస్తున్న గతాన్ని అధ్యయనం చేయడమూ అంతే ముఖ్యమని ఆయన అనుకున్నారు. అందువల్ల పురాతత్వ శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఇంకా ఆదిమ తెగ జీవితం గడుపుతున్న సమూహాలకూ, ఆధునికులమనుకుంటున్నవారిలోని ఆదిమ ఆచారాలకూ అంతే ప్రాధాన్యమిచ్చారు. ఆ రకంగా కోసంబి అసాధారణమైన చరిత్రకారుడిగా, పురాతత్వవేత్తగా ఎదిగారు.

కోసంబి మరణం తర్వాత అర్ధశతాబ్ది గడిచాక ఆయన మేధో జీవితం నుంచి మాత్రమే కాదు, సామాజిక జీవితం నుంచి కూడ గ్రహించవలసినవి ఉన్నాయి. ఆయన తనది చారిత్రక భౌతికవాద దృక్పథమని, అంటే మార్క్సిజమని స్పష్టంగానే ప్రకటించుకున్నారు. అయితే తాను చూస్తున్న భారత కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కొందరు అనుసరిస్తున్న మార్క్సిజం నుంచి తనను తాను వేరు చేసి కూడ చూపుకున్నారు. వారికి అధికార మార్క్సిస్టులు (అఫీషియల్ మార్క్సిస్టులు) అని పేరు పెట్టి, ఆ ఇంగ్లిషు మాట పొడి అక్షరాలలో ఒ ఎం – ఓం – అవుతుంది గనుక అలా వ్యంగ్యంగా కూడ పిలిచారు.

“రాజకీయ అనివార్యతో కోసమో, పార్టీ సంఘీభావం కోసమో అయినా సరే, మార్క్సిజాన్ని ణితశాస్త్రం లాగ మొరటు రూపవాదానికి కుదించగూడదు. అలాగే దాన్ని ఒక ఆటోమాటిక్ కోతయంత్రం మీద పని వంటి ప్రామాణిక సాంకేతిక పరిజ్ఞానంగానూ చూడడానికి వీలులేదు. మానవసమాజం అనే దానిలో ఉన్న పదార్థానికి అనంతమైన వైవిధ్యం ఉంది. పరిశీలకుడు తాను కూడ పరిశోధిస్తున్న జనాభాలో భాగమే. పరిశీలకుడు పరిశీలిస్తున్న జనాభాతో బలంగానూ, పరస్పరంగానూ చర్య-ప్రతిచర్యలో ఉంటాడు. అంటే అర్థం సిద్ధాంతాన్ని విజయవంతంగా అన్వయించాలంటే విశ్లేషణాశక్తి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఒక నిర్దిష్ట స్థితిలో కీలక అంశాలేవో వెలికితీయగల సామర్థ్యం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇది కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునే విషయం కాదు. దాన్ని నేర్చుకోవాలంటే ప్రజానీకంలోని ప్రధాన భాగాలతో నిరంతర సంబంధంలో ఉండాలి. ఒక మేధావి విషయంలో, దాని అర్థం, కొన్ని నెలలైనా శారీరక శ్రమలో గడపడం, శ్రామిక వర్గంలో ఒకరిగా తన జీవనోపాధి సంపాదించుకోవడం. ఏదో ఉన్నతవ్యక్తిలాగనో, సంస్కరణవాదిలాగనో, మురికివాడలను సందర్శించే సున్నితమనస్కుడైన “ప్రగతిశీల” వ్యక్తిగానో కాదు” అని ఆయన రాసిన మాటలు గుర్తుంచుకోదగ్గవి.

ఈ దృక్పథంతోనే ఆయన శాంతి ఉద్యమంలో పనిచేశారు. యన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీని భారత – సోవియట్ మైత్రికి అంకితం చేశారు. చైనా ప్రభుత్వానికి ప్రణాళికా రచనలో సలహాదారుగా పనిచేశారు. భారత ప్రభుత్వం కొత్తొక వింత అన్నట్టుగా ప్రమాదకరమైన అణుశక్తి వైపు చూస్తున్నదనీ, నిజానికి భారత దేశం సౌరశక్తి అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టాలనీ అన్నారు.

10933839_10152645132701700_7940360244292075573_n

“…యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ని మళ్లీ చదవడం ఒక గొప్ప అనుభవమని రుజువవుతుంది. అది అపారమైన ప్రతిభతో మాత్రమే కాదు, హేతువాదపు బలోపేతమైన నిర్ధారణతో ముఖాముఖీ కూడ…. ఆ అధ్యయనంలో పాథకులు కోసంబిలోని మరొక మౌలికమైన అంశాన్ని కూడ గుర్తించగలరు. అది నిజమైన మార్క్సిస్టు చరిత్ర అధ్యయనం ప్రయత్నాలన్నిటికీ ఉమ్మడి అంశం. అదేమంటే గతాన్ని వర్తమానంతోనూ, (భవిష్యత్తు తోనూ) కూడ అనుసంధానించడం. అణచివేతకూ దోపిడీకీ గురవుతున్నవారి విముక్తి సాధించాలనే మౌలిక నిబద్ధత” అని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.

సరిగ్గా అరవై సంవత్సరాల కింద 1954లో, న్యూయార్క్ నుంచి వెలువడే మాసపత్రిక ‘మంత్లీ రివ్యూ’ లో ‘ఆన్ ది క్లాస్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా’ అనే వ్యాసంలో “భారత దేశానికి పరిష్కారం సోషలిజమే. అది మాత్రమే పెరుగుతున్న సరఫరాకు తగిన గిరాకీని సృష్టించగలదు. అటువంటి పరిష్కారాన్ని ఉపయోగించుకోగలిగినది అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాదనీ, వెనుబడిన దేశాలు కూడ ఉపయోగించుకోగలవనీ చైనా చూపుతున్నది. అటువంటిది లేకపోతే ప్రణాళికా విధానం నిష్ప్రయోజకమవుతుంది. అయితే, భారత బూర్జువావర్గం ఉత్పత్తి కోసం ఆధునిక విదేశీ యంత్రాలను దిగుమతి చేసుకున్నట్టే, మిగిలిన పరిష్కారాలన్నీ విఫలమైనప్పుడు, రాజకీయాలలో తాజా పెట్టుబడిదారీ పరిణామాలను కూడ దిగుమతి చేసుకుంటుంది. అంటే సోషలిజానికి దీర్ఘకాలికంగా ఏకైక ప్రత్యామ్నాయమైన ఫాసిజాన్ని దిగుమతి చేసుకోవడం అని అర్థం. ఇప్పటికే ‘ఉక్కు మనిషి’ కావాలి అనే మాట అభిజ్ఞవర్గాలలో వినబడుతున్నది. అందుకు నమూనాలు కూడ అందుబాటులో ఉన్నాయి” అని డి డి కోసంబి రాశారు.

ఆ మాటలకు ప్రాధాన్యత పెరిగిన రోజుల్లో ఈ తెలుగు అనువాదం వెలుగు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది.

**

డి డి కోసంబి రచనలతో నా పరిచయం 1978 మొదట్లో జరిగిందని గుర్తు. ‘సంస్కృత సాహిత్యం – వర్గ పరిణామాల ప్రతిబింబం’ అనే కోసంబి వ్యాసాన్ని సృజన మార్చ్ 1978 సంచికలో అచ్చువేశాం. ఆ వ్యాసానికి రచయితగా కోసంబి పేరు ఉంది గాని అది కోసంబి రాసిన వ్యాసానికి పరిచయ వ్యాసమే. పరిచయకర్త పేరు అచ్చు కాలేదు గాని బహుశా అంతకుముందు ఎమర్జెన్సీ సమయంలో జైలులో నడిపిన లిఖిత పత్రికలలో కె వి రమణారెడ్డి రాసిన వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసం చదివిన నాటి నుంచీ కోసంబి గురించి వింటూ ఆయన రాసిన పుస్తకాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉండగా మూడు నాలుగేళ్ల తర్వాత బెజవాడలో ఈ పుస్తకం నాచేతికి దొరికింది. ఏలూరు రోడ్డులో నవోదయ బుక్ హౌజ్ లో ముందు రెండు పెద్ద గదుల్లో పుస్తకాలు కాక రామమోహనరావు గారు కూచునే వెనుక గదిలో చరిత్ర, అర్థశాస్త్రం పుస్తకాల బీరువా ఉండేది. అక్కడ ఈ యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకం మొదటిసారి చూశాను. ఇప్పటికి ఎన్నోసార్లు చదివి తోలులా మారిపోయిన ఆ పుస్తకం మీద సంతకాన్ని బట్టి దాన్ని 1982 ఏప్రిల్ 17న కొన్నాను. అప్పుడది ఇరవై ఎనిమిది రూపాయల పుస్తకం. ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ పుస్తకం నా కాపీ 1984 ఏప్రిల్ 19న మద్రాస్ మూర్ మార్కెట్ లో కొన్నానని సంతకం ఉంది. అలాగే మిగిలిన పుస్తకాలన్నీ సంపాదించి చదవడం, కోసంబికి అభిమానిగా మారడం జరిగాయి. కోసంబి ఆలోచనల్లో, సూత్రీకరణల్లో కొన్ని మారవలసిన అవసరం ఉన్నదని తెలిసినా ఆయన తీసుకున్న మౌలిక దృక్పథం వల్ల, విస్తారమైన పరిజ్ఞానాన్ని అలవోకగా అందించే ఆయన పద్ధతి వల్ల ఆ అభిమానం తగ్గలేదు. ఇరవై సంవత్సరాల కింద ఒక ఔత్సాహిక ప్రచురణకర్త ఈ పుస్తకాన్ని అనువదించమని అడిగితే వెంటనే అంగీకరించాను, కారణాంతరాలవల్ల ఆ ప్రచురణ ప్రతిపాదనే వెనక్కిపోయి, ఇప్పుడిది మాత్రం వెలుగు చూస్తోంది.

పుస్తకావిష్కరణ సభలో ఉమా చక్రవర్తితో వేణు

పుస్తకావిష్కరణ సభలో ఉమా చక్రవర్తితో వేణు

కోసంబి రచనల ప్రభావం తెలుగు మేధోప్రపంచం మీద గత ఆరు దశాబ్దాలుగా విస్తృతంగానే ఉన్నప్పటికీ, ఆయన రచనలలో ప్రధానమైన ఈ పుస్తకం ఇంతవరకూ తెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తంగా కొశాంబి భారత చరిత్ర రచనలో ప్రవేశపెట్టిన కొత్తచూపును పరిచయం చేస్తూ కె. బాలగోపాల్ ‘భారత చరిత్ర – డి డి కోసంబి పరిచయం’ (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986) అనే స్వతంత్ర గ్రంథం రాశారు. దానికన్నముందే కోసంబి రచనలలో ‘భగవద్గీత – చారిత్రక పరిణామం’ ఒక్క వ్యాసమే ఒక పుస్తకంగా (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1985) వెలువడింది. ఆ తర్వాత కోసంబి వ్యాసాల సంపుటాలు రెండు – ‘భారత చరిత్ర – పరిచయ వ్యాసాలు’ (అనువాదం: హెచ్చార్కె, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986); ‘ఆచరణలో గతితర్కం’ (ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ కు గొర్రెపాటి మాధవరావు అనువాదం, జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ప్రచురణ, 1991) వెలువడ్డాయి. తర్వాత ‘ప్రాచీన భారతదేశ సంస్కృతి, నాగరికత’ (కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇన్ ఏన్షియెంట్ ఇండియాకు ఆర్ వెంకటేశ్వర రావు అనువాదం, తెలుగు అకాడమి ప్రచురణ, 1998) కూడ తెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో కోసంబి శతజయంతి కూడ రావడంతో ఇంగ్లిషులో ఆయన గురించీ, ఆయన కృషి గురించీ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి.

నిజానికి ఇతర పుస్తకాల కన్న, వ్యాసాల కన్న యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకంలోనే కోసంబి ఆలోచనలు లోతుగా, విస్తృతంగా పరిచయం అవుతాయి. ఈ పుస్తకం దాదాపు మూడువేల సంవత్సరాల భారత చరిత్ర మీద స్థూల అవగాహన ఇవ్వడం మాత్రమే కాదు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది గనుక ఇది ఎప్పుడో తెలుగులోకి రావలసి ఉండింది. ఎందువల్లనో గతంలో జరిగిన ప్రయత్నాలు ఫలించక, చివరికి ఇది నాకోసం మిగిలిపోయింది.

దాదాపు ముప్పై సంవత్సరాలకింద రాస్తూనే కోసంబి గురించి ఇప్పుడెందుకు అనే ప్రశ్న వస్తుందని బాలగోపాల్ అనుమానించారు. నిజంగానే ఈ ఆరు దశాబ్దాలలో కోసంబి ఆలోచనలను సమర్థించే, బలపరిచే అధ్యయనాలు, పరిశోధనలు ఎన్ని జరిగాయో, ఆయన ఆలోచనల్లో కొన్నిటిని విమర్శించే, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసే, పూర్వపక్షం చేసే అధ్యయనాలు అన్ని జరిగాయి.

ఈ పుస్తక అనువాదంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, అవరోధాలు, నేను ప్రయత్నించిన పరిష్కారాలు పాఠకులకు తెలియజేయడం నా బాధ్యత. కోసంబి రచనాశైలిలో అనువాదానికి లొంగని, అనువాదంలో ఇబ్బందికరంగా కనబడే అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ పుస్తక రచనలో ఆయన అధ్యాయాల విభజన, ప్రతి అధ్యాయంలోనూ ఉప అధ్యాయాల విభజన సరిగానే చేశారు గాని పేరాగ్రాఫుల విభజన అంత సరిగా చేయలేదు. ఒక ఆలోచన, ఒక వాదన ఒక పేరాగ్రాఫులో ఉండాలనే సాధారణ ఆనవాయితీకి భిన్నంగా ఆయన ఒకే పేరాలో అనేక ఆలోచనలు, వాదనలు గుదిగుచ్చారు. అందువల్ల ఒక ఆలోచన ముగించే వాక్యం తర్వాత అదే పేరాగ్రాఫులో మరొక ఆలోచన సాగుతుంది. ఒక్కోసారి ఆ ఒక్క వాక్యమే ఒక ఆలోచన కూడ కావచ్చు. ఒక్కోసారి హఠాత్తుగా ఒక ఆలోచన ఆగిపోయి ఏదో సుదూరమైన అంశంలోకి వెళ్లడం కూడ జరుగుతుంది. రచయితకు ఉండిన విస్తారమైన భాషా పరిజ్ఞానం, విభిన్న దేశాల, చరిత్రల పరిచయం వల్ల హఠాత్తుగా ఎక్కడో సుదూరపు ఉదాహరణ, పోలిక కూడ ప్రవేశిస్తాయి. లోతుగా, మననం చేసుకుంటూ, రచయితతో పాటు ఆలోచిస్తూ చదవని పాఠకులను ఈ పద్ధతి ఇబ్బంది పెడుతుంది. ఆ సంగతి పూర్తిగా తెలిసినా నేను ఆయన రచనా శైలిని మార్చే, పేరాగ్రాఫులను మార్చే సాహసం చేయలేదు. ఇటువంటి సైద్ధాంతిక రచనలో అనువాదకులు వీలైనంత తక్కువ చేయి చేసుకోవాలనే ధోరణి నాది.

గతంలో కోసంబి గురించి తెలుగులో రాసినవారు, రచనలను అనువాదం చేసినవారు కోసంబి వాడిన పైనుంచి భూస్వామ్యం అనే మాటకు సామంత భూస్వామ్యం అనీ, కింది నుంచి భూస్వామ్యం అనే మాటకు గ్రామీణ భూస్వామ్యం అనీ వాడారు. ఆ పదప్రయోగాలు వివరణాత్మకంగా సరిపోయేవే గాని, సంపూర్ణంగా కోసంబి అవగాహనను తెలిపేవి కావని నేననుకున్నాను. అందువల్ల కోసంబి వాడినట్టుగా పైనుంచి భూస్వామ్యం, కింది నుంచి భూస్వామ్యం అనే మాటలే వాడాను.  ఒక భాషా పదానికి మరొక భాషలో నిర్దిష్టమైన అర్థం ఇచ్చే పదం ఉండడం ఎంత వాస్తవమో, అనువాదంలో అటువంటి సమానార్థక పదాలను వాడాలనడం ఎంత సరైన అనువాద పద్ధతో తెలిసి కూడ, నేను ఏ పదానికైనా అది వాడిన సందర్భం ఒక అర్థం ఇస్తుందనీ, కనుక ఒక పదానికి ఒక అర్థం అనే సూత్రం ఎల్లవేళలా సరిపోదనీ భావిస్తాను. అందువల్ల పారిభాషిక పదాలు మినహా మిగిలిన పదాలకు భిన్న అర్థాలు వాడిన సందర్భాలు ఉండవచ్చు.

అనువాద పద్ధతికి సంబంధించిన  నా ఈ అవగాహనతో పాటు ఈ అనువాదం గురించి చెప్పవలసిన మరొక అంశం కూడ ఉంది. నామవాచకం విశిష్టమైనదనీ, పరభాషా నామవాచకాలను మార్చగూడదనే ఆలోచనా ధోరణి నాది. ఆయా భాషల ఉచ్చారణ ఏమిటో తెలియని రోజుల్లో మనకు తోచినట్టుగా, లేదా ఆ భాషా సంప్రదాయంతో సంబంధం లేకుండా, కేవలం వర్ణక్రమాన్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో నామవాచకాలను తెలుగీకరించి ఉన్నాం. అది తప్పు అని నా అభిప్రాయం. మరీ ముఖ్యంగా సంస్కృత నామవాచకాలను కూడ తెలుగీకరించి చివర డు, ము, వు, లు చేర్చిన సంప్రదాయం మనది. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరిగిపోయింది గనుక ఇప్పుడు దాన్ని సవరించడమూ ఎబ్బెట్టుగానే ఉంటుందని యథాతథంగా ఉంచాను.

కోసంబి తాను ఉటంకించిన వనరులన్నిటికీ – అవి పుస్తకాల పేర్లయినా, రచయితల పేర్లయినా – అబ్రివియేషన్స్ (పొడి అక్షరాలు) వాడారు. తెలుగులో అటువంటి పొడి అక్షరాలు పంటికింద రాళ్ల లాగ ఉంటాయి గనుక నేను పూర్తి పేరు, సంక్షిప్తం చేసిన పేరు వాడాను. ఉపయుక్త గ్రంథసూచి ఇంగ్లిషులోనే ఇచ్చాను. అలాగే ఇంగ్లిషులో ఒక్క పేజీ నుంచి ఉటంకిస్తే పి. అనీ, ఒకటి కన్న ఎక్కువ పేజీల నుంచి ఉటంకిస్తే పిపి. అనీ రాసే సంప్రదాయం ఉంది. తెలుగులో అది లేదు గనుక అన్నిటికీ పే. అనే వాడాను. ఒక ఉటంకింపు తర్వాత మరొక ఉటంకింపు అదే వనరు నుంచి అయితే ఇంగ్లిషులో ఇబిడ్ అనే సంప్రదాయం ఉంది. తెలుగులో పై.ఉ. (పైన ఉదహరించినది), అ.పు. (అదే పుస్తకం) అని వాడుతున్నారు గాని, మరొకసారి పుస్తకం పేరో, రచయిత పేరో రాయడమే మంచిదని నాకనిపించింది. ఇంగ్లిషులో వేరువేరుగా గుర్తించదగిన అనేక రకాల ఖతులు (ఫాంట్లు), ప్రతి ఫాంట్ లోనూ మళ్లీ పెద్ద అక్షరాలు (కాపిటల్స్) ముద్ద (బోల్డ్), ఏటవాలు (ఇటాలిక్) అక్షరాల సంప్రదాయం ఉండగా, తెలుగులో అన్ని రకాల అచ్చు అక్షరాలూ లేవు, వాలిన అక్షరాలు స్పష్టంగా, పోల్చుకునేటట్టుగానూ ఉండవు. అందువల్ల మూలంలో అట్లా ప్రత్యేకంగా చూపిన అంశాలను తెలుగు అనువాదంలో చూపించలేకపోతున్నాం. అలాగే ఇంగ్లిష్ మూలంలో కోసంబి ప్రచురించిన ఫొటోలను కూడ, వాటి నాణ్యత దృష్ట్యా తెలుగులో పునర్ముద్రించడం సాధ్యం కాలేదు. వాటి వివరణలు మాత్రం యథాతథంగా ఉంచాం.

నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్ మాజీ డైరెక్టర్ ప్రొ. అదితి ముఖర్జీ, ప్రస్తుత డైరెక్టర్ ప్రొ. వి. శరత్ చంద్రన్ నాయర్, అక్కడ తెలుగు విభాగపు బాధ్యుడు డా. ప్రత్తిపాటి మాథ్యూ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకురాలు గీతా రామస్వామి, మొదట ఈ అనువాదపు నమూనా పేజీలనూ, ఆ తర్వాత మొత్తం అనువాదాన్నీ పరిశీలించి విలువైన సూచనలు చేసిన అజ్ఞాత పరిశీలకులు, మొత్తం అనువాదాన్ని జాగ్రత్తగా చదివి, ఎన్నో సూచనలు చేసిన మోతుకూరి నరహరి, ఈ అనువాదాన్ని చెపుతుండగా టైప్ చేసిన రాజశేఖర్ చిమ్మన్, కట్టా కవిత, అనువాదానికి మామూలు కన్న ఎక్కువ సమయం పట్టినా ఆ కాలమంతా నా పనులను పంచుకుని, చికాకు భరించిన వై రామచంద్రం, సి వెంకటేశ్, ఎ మల్లేష్ లకు కృతజ్ఞతలు. నా జీవితంలో అవిభాజ్య భాగాలైన వనజ, విభాతలు ఈ కృషిలో కూడ భాగం పంచుకున్నట్టే.

(కోసంబి పుస్తకానికి అనువాదకుడిగా వేణు ముందు మాట ఇది)

– ఎన్ వేణుగోపాల్

venu

కిటికీ బయటి ఆకాశం – వెన్నెలలోని వికాసం

veeralakshmi (2)వాడ్రేవు వీరలక్ష్మి గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసిన ప్రతిభాశాలి. ప్రకృతిని, సంగీతాన్నీ ప్రేమించే భావుకురాలు. అంతేకాదు లలిత గీతాల్ని మధురంగా పాడతారు. ఒక అధ్యాపకురాలిగా రెండు తరాల విద్యార్ధుల్ని ప్రభావితం చేసిన చక్కటి ఉపన్యాసకురాలు.

ఇప్పటికే వీరలక్ష్మిగారి కధలు ఉత్సవ సౌరభం, కొండ ఫలం అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. వెల్లువ అనే నవల రాసారు. పత్రికల్లో ఆవిడ రాసిన కాలమ్స్‌ ఆకులో ఆకునై, మా ఊర్లో కురిసిన వాన గా వెలువడ్డాయి. ఆవిడ రాసిన సాహిత్యానుభవం వ్యాస సంకలనం, సత్యాన్వేషి చలం పరిశోధనా గ్రంథం అనేక ప్రశంసలనీ, పురస్కారాలని అందుకున్నాయి. భారతీయ నవలల్లోని ఉత్తమ నవలల్ని వరుసగా పరిచయం చేస్తూ ఒక కాలమ్‌ని ఆవిడ నిర్వహించారు.

ఇటీవల ఆవిష్కరించిన ‘‘ కిటికీ బయటి వెన్నెల’’ ఆవిడ మూడో కధా సంకలనం. వీరలక్ష్మి గారు ఈ కధా సంకలనం గురించి సభలో మాట్లాడ మన్నప్పుడు ఇష్టంగా ఒప్పుకున్నాను. ఆవిడ రచనల్లోని భావుకత, మెరుపు మెరిసినట్టు తటాలున చమక్కుమనే జీవిత సత్యాలు బావుంటాయి నాకు. నదీ మూలాలు ఎప్పుడూ ఒక సన్నటి జలధారగా ప్రారంభమయి క్రమంగా విస్తరించి, అనంత జలరాశి అయి నిత్యం ప్రవహిస్తాయి. చాలా కాలం క్రితం ఒక సారి ప్రళయకావేరి నది నుండి మొదలై, దాని మూలాల్ని వెతుక్కుంటూ వెళ్ళి చూసినప్పుడు, నా కెందుకో విచిత్ర భావన కలిగింది. మనిషి జీవితం కూడా అట్లాంటిదే కదా! మూలాల్ని గుర్తుంచుకుని, నడిచి వచ్చిన దారుల్ని, నిలబడ్డ నేలనీ మరిచిపోకుండా విస్తరించటం తెలియాలి. వీరలక్ష్మి గారి రచనల్ని చదివినప్పుడు, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా అలాంటి వారేనేమో అనిపించింది. తన బాల్యం గడిచిన ఆదివాసీ పల్లెల పచ్చదనాన్నీ, ప్రేమల్నీ, సంఘర్షణలను, జీవన కాంక్షల్నీ, తనలో నింపుకుంటూ, రకరకాల అస్ధిత్వ వేదనల్నీ, మారుతున్న ప్రపంచం పోకడల్నీ, విలువల్నీ, మానవ సంబంధాల్నీ అర్ధం చేసుకుంటూ, తన సాహితీ ప్రస్ధానాన్ని కొనసాగిస్తున్న ప్రవహిస్తున్న, నిత్య నూతన నదిలాంటి వారు ఆమె.

వీరలక్ష్మి గారి కధల గురించి మాట్లాడు కోవడమంటే, మన రోజువారీ జీవితాల్లో, నిత్యం తారసపడే అనేకానేక మంది మనుష్యుల గురించి మాట్లాడుకోవడమే. మానవత్వం, దయ, మనుష్యుల పట్ల అపారమైన ప్రేమ వున్న, సరళంగా, సూటిగా, గుండె నిబ్బరంతో బతికే మనుష్యుల గురించి మాట్లాడు కోవడమే. మనలో వుండే ఉక్రోషాలు, కోపాలు, నిస్సహాయతలు, నిర్భీతులు, లెక్కలేని తెంపరితనాలు, ఈర్ష్య, అసూయలు, ఆనందాల గురించి మాట్లాడు కోవడమే. ఎదురు దెబ్బలు తగిలినా, పడితేచే కెరటాల్లా, జీవితంపైన గొప్ప ఆశతో, కాంక్షతో ఎలా బతకొచ్చో తెలుసుకోవడమే. ఇవి సహజ కధలు.

kitike-196x300

మంచికో చెడుకో రచనలకి ప్రేరణ మనిషి జీవితం. మనిషి లోపల, బయటా జరిగే విధ్వంసం, అందుకుగల కారణాలను అన్వేషించేపని సాహిత్యం చేస్తుంది. జీవితాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు అతి సాధారణమైన మనుష్యులు పడే పెనుగులాటలు, ప్రయత్నాలు, సమాజపు అంచులకు నెట్టి వేయబడ్డ వివిధ సమూహాలు ఎదుర్కొంటున్న వివక్షత, హింస, అణిచివేతలు, జీవితంలోని అస్థవ్యస్థలు, ఆశ నిరాశలు, కలలు ఈ నేపధ్యమంతా, కధలుగా, కవిత్వంగా రూపుదిద్దుకుంటాయి. వీరలక్ష్మి గారి కొత్త కధల సంకలనం కిటికీ బయటి వెన్నెలలోనూ, మనిషి తాలూకు వేదనలు, కలలు, ఆశలు వున్నాయి. ఆవిడ కధలన్నీ స్త్రీలను కేంద్రంగా చేసుకొని, బహుముఖ రూపాల్లో పితృస్వామ్యం ఎలా ఆపరేట్‌ అవుతుందో చెబుతాయి. జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా జీవించగలిగితే మనిషి జీవితం మరింత సరళంగా, మానవీయంగా వుంటుందో చెబుతాయి. ఈ కధల్లోని పాత్రలు గొప్ప జీవకాంక్షతో, భవిష్యత్తు పట్ల చెదరని విశ్వాసంతో మనల్ని పలకరిస్తాయి.

పునరుద్ధానం కధలో ఆదిలక్ష్మి, ఈ విషాదానికి ఈ తేనె చాలులో వింధ్య, అనురాధ, తన్మయిలో సంగీతాన్ని ప్రేమించే తాయారు, భువన, తన్మయి, బరువు భారాల్లో రాజ్యం, ఆరాత్రిలో విశాల, రజని .. ఇటాంటి వాళ్ళంతా, తమ జీవితాల్లో ఎదురైన సవాళ్ళను ఎంతో నిబ్బరంగా, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు. ఏ హంగులు, ఆర్భాటాలు, తీర్పులు, బోధలు లేకుండా తాము నిజమని, మంచి అని నమ్మిన పద్దతుల్లో జీవించిన, జీవితాల్ని తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నించిన స్త్రీలు వీళ్ళు.

పునరుద్ధానం కధలో వ్యసనపరుడై ఆస్తులన్నింటినీ పోగొట్టడమే కాకుండా, నిత్యం హింసించే భర్తని, తన ముగ్గురు పిల్లల్ని , పేదరికాన్ని భరిస్తూ కూడా తన ఇంటి చుట్టూ, పచ్చటి మొక్కల్ని పెంచుకుటుంది ఆదిలక్ష్మి. ఇంటి అరుగులపై ముగ్న్గులేస్తుంది. తనలోని చిరునవ్వుని, ఉత్సాహాన్ని ఎన్నడూ కోల్పోకుండా, జీవితంలో తనకెదురైన ప్రతికూలతలను ఎదుర్కొంటుంది. పిల్లల్ని పెంపకానికిచ్చి, పొట్టచేత బట్టుకుని వలస పోయిన ఆదిలక్ష్మి తిరిగి తన ఊరికి తిరిగి వచ్చి, గొప్ప ఆశతో జీవితాన్ని ప్రారంభిస్తుంది.

‘‘ బతుకు బరువైనప్పుడల్లా, ఎవరో ఒక ఆదిలక్ష్మి శిధిలాలలోనుంచి, కొత్త జీవితాన్ని నిర్మించుకుంటూ, దారిచూపుతూనే వుంటుందన్న’’ ఆశావాహ దృక్పధంతో ఈ కధని ముగిస్తారు వీరలక్ష్మి.

బరువు భారాలు కధలో రాజ్యంలా కాలాన్ని అదుపు చేయగల విద్యని ఎవరైనా మనకి నేర్పితే బావుండనిపిస్తుంది. వారసత్వంగా తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ ఆస్తుల్నే కాదు,జ్నాపకాల్ని కూడా మిగిల్చి వెడతారు. అలా పెద్దవాళ్ళు వదిలి వెళ్ళిన ఆ పాత వస్తువుల చుట్టూ అనేక జ్నాపకాలున్నా, మళ్ళీ ఎవరికి వారు కొత్త వస్తువుల్ని పోగుచేసుకుంటూ, వాటి చుట్టూ తమవైన జ్నాపకాల్ని అల్లుకుంటూ వుంటారు. ఈ పరంపర అలా కొనపాగుతూనే వుంటుంది. ఒక తరం నుండి మరో తరానికి వచ్చే సరికి ఆ ఆస్తులు, వస్తువులతో వున్న అనుబంధం సహజంగా తగ్గిపోతూ వుంటుంది. ఉతికి మడత పెట్టడానికి ఎదురు చూస్తున్న చీరెల్ని, ఇంట్లో ఎక్కడి వస్తువుల్ని ఎక్కడిక్కడే అర్ధాంతరంగా వదిలేసి సీతమ్మ జీవితం నుండి శాశ్వితంగా నిష్క్రమిస్తుంది. అట్లా వదిలేసిన ఆ ఇంటిని వీరలక్ష్మి వర్ణించిన తీరు మనల్ని చాలా కలవర పరుస్తుంది. ‘‘ రాజ్యం అంటే ఎవరు, ఒక వ్యక్తని ఎందు కనుకుంటున్నావ్‌. పోగు చేయటం నుండి పంచి పెట్టడం దాకా చేసే ప్రయాణానికి తను ఒక రోల్‌ మోడల్‌’’ అన్న గొప్ప తాత్విక సత్యాన్ని చెబుతారు రచయిత్రి. నిజానికి మనుష్యులకి పోగేసుకోవడం అలవాటైనంతగా పంచి పెట్టడం అలవాటు కాలేదు. అది అలవాటైతే పోగేసుకునే కాంక్ష మెల్లిగా కనుమరుగవుతుందన్న ఆశ కలుగుతుంది.

కిటికీ బయటి వెన్నెల కధలో మనం వుండే ఇరుకు గదుల అపార్ట్‌మెంట్‌లలోనూ, ఆకాశాన్ని, పచ్చటి చెట్లనీ, పక్షుల్నీ, కనపడటమే తప్పా వినపడని మనుష్యుల్నీ గమనిస్తూ, మనలో ఒక భాగం చేసుకుంటూ ఎలా ఉత్సాహంగా జీవించవచ్చో రాసారు. ఈ కధలోని నేను పక్కింటి వాళ్ళని ఆమె చూస్తూ వుంటుందన్న విషయాన్ని గమనించారని పనిమనిషి చెప్పాక కూడా ఆమె తన పడక గది కిటికీని మూసేయాలనుకోదు. చుట్టూ వున్న ప్రకృతిలానే ఆ తెలియని మనుష్యులు ఆమె రోజువారీ జీవితంలో భాగమైపోయారు.

‘‘ ఈ మనుష్యుల గురించి నాకు ఎంత తక్కువ తెలిస్తే, అంత మంచిది. ఎందుకంటే, వాళ్ళు నాకు కావాలి గనుక.’’ అనుకుంటుందామె. ఈ తూర్పు వేపు నిమ్మచెట్టులాగే, ఉత్తర దిక్కునున్న వేపచెట్టు గలగలలోంచి కదిలే ఆకాశపు నీలిమల్లాగే వాళ్లూనూ అని ఆ అపరిచిత మనుష్యుల గురించి అనుకుంటుంది. వాళ్ళని వాళ్ళలాగే ఇప్టపడగల సంస్కారం ఆమెది.

తన్మయి కధలో పాట తనకు తెలియకుండానే తన ఊపిరిలోకి వచ్చేసిన, కడుపు నిండా పాటల్ని దాచుకున్న తాయారు బడిలో, వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాటల్ని పాడేది. అలాంటి తాయారుకి బావతో పెళ్ళయ్యాక ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ బరువు బాధ్యతలు, పెద్దవాళ్ళ ధాష్టికాల మధ్య గొంతు దాటి వచ్చేందుకే భయపడిన పాట అమె అంతరంగం లోని పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది. పాడమని అడిగే వాళ్ళు లేక, అవకాశంలేక మూగవోయిన ఆమె గొంతు అనేక ఏళ్ళు గడిచాక, చివరికి మేనకోడలు భువన పాడమని అడిగినప్పుడు పలుకుతుంది. విశాఖ సముద్రం ఎదుట నిలబడి ఆమె పాటపాడినప్పుడు, ‘‘ చిన్నప్పుడు పిల్లల కోసం పాలు చేపుకు వచ్చిన అనుభవం లాంటి అనుభవం ’’ కలుగుతుంది తాయారుకు. అమెకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు, కంఠం లోంచి పాట కూడా బయటకు ప్రవహిస్తాయి. తాయారు తరువాతి తరానికి చెందిన భువన తన కెంతో ఇష్టమైన సంగీతాన్ని తనలో నిలుపుకున క్రమంలో, భర్త నుండి సహాయనిరాకరణను, కుటుంబంలో అశాంతిని భరించాల్సి వస్తుంది. తాయారు, భువన పొందలేని, స్వేచ్ఛని, గాయినిగా పేరు ప్రఖ్యాత్తులను ఆ తదుపరి తరానికి చెందిన తాయారు మనవరాలు తన్మయి తన జీవితపు తొలి యవ్వన కాలంలోనే సాధిస్తుంది. స్త్రీల స్వరాలను, స్వప్నాలను బంధించే పురుషాధిపత్యం, కుటుంబంలో కనబడని హింస ఎలా వుంటాయో ఎంతో ఆర్ధ్రంగా చెబుతుంది తన్మయి కధ.

ధైర్యంగా, ఆదర్శవంతంగా జీవించే ఆడవాళ్ళు కూడా ఒక్కో సారి జీవితంలో ఆకస్మికంగా ఎదురయ్యే కష్టాలకి కుంగి పోయి, బాబాలు, స్వాములవార్ల మూఢత్వంలోకి ఎలా పడతారో, చెబుతుంది ఈ విషానికి ఈ తేనె చాలు కధ. భర్తను కోల్పోయి, ఆ దు:ఖం నుండి బయట పడేందుకు, స్వాంతనను పొందేందుకు వింధ్య చేసిన ప్రయత్నంలో అది దొరక్క పోగా, అక్కడా హిందుత్వ మనుధర్మం ఆమె స్థితిని అవమాన పరచటంతో చివరికి మేల్కొని బయట పడుతుంది వింధ్య.

నీడ కధలో   కష్టాల్లో వున్న స్త్రీలని ఆదుకునేందుకు చేసే ప్రయత్నాలు చిత్తశుద్దితో ఉండాలని, ఒకరికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఎమోషనల్‌గా, హృదయంతో చేయాలి తప్పా, అన్నింటికీ లాజిక్‌ను అప్లయ్‌ చేయాలనుకుంటే సాధ్యం కాదని, నలుగురు కలిస్తేనే అది సాధ్యమవుతుందని చెపుతుంది.

ఆ రాత్రి కధలో ఒక మారు రాత్రి దాడికి గురైన విశాలని ఆమె తల్లి ‘‘ లోకపు ముళ్ళు గుచ్చుకున్నా, గాయాల పాలవకుండా ’’ కాపాడుకో గలిగింది. భర్త ప్రవర్తన వల్ల కలిగిన గాయాలు విశాల తల్లికి లోకజ్నానాన్నిచ్చాయి. పెద్దగా చదువుకోని ఆ తల్లి, కాస్త చదువుకున్న విశాల సామాజిక దౌష్ట్యం కిందపడి నలిగి పోకుండా తమని తాము కాపాడుకోగలిగారు. నగరాల్లో, ఆధునికంగా జీవిస్తున్నామనుకునే ఆడపిల్లలూ మగ్నవాళ్ళ అసభ్యప్రవర్తననీ, దౌర్జన్యాన్నీ ఎదుర్కోక తప్పటంలేదు. వ్యవస్థ విఫలమైన చోట ఎవరి రక్షణని వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది అంటూనే స్వేచ్ఛతో పాటూ విచక్షణ లేక పోవడం పట్ల ఆందోళన పడుతుంది రజని. గీతల్ని చెరుపుకోవచ్చు కధ ప్రాంతాల మధ్య, మనుష్యుల మధ్య వుండే సంబంధాల గురించి చెబుతుంది. తెలియనప్పుడు, అర్ధం కానప్పుడు అపార్ధాలు మిగులుతాయి. కానీ ఒక సమయమొస్తే అందరూ మనుష్యులుగా మారతారు. అపార్దాలు కరుగుతాయి. విభజన రేఖలు, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడూ వాటిని చెరిపేసి మనుష్యుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది. వ్యక్తులకీ, ప్రాంతాలకి కూడా వర్తించే మంచి కధ ఇది.

మెత్తంమీద ఈ సంకలనంలోని కధలు క్లుప్తంగా, సరళంగా, సూటిగా వున్నాయి. వీరలక్ష్మిగారు భావుకురాలు కాబట్టి కధనానికి అడ్డుపడని కవిత్వపు జల్లులు చాలా చోట్ల కనిపిస్తాయి.

‘‘ఇల్లంటే మనకి స్థిమితాన్నీ, శాంతిని, ఇవ్వవలసిన చోటు. అది దొరక్కపోతే, ఆ ఇంటి గురించి ఆలోచించటం అనవసరం. అదసలు ఇల్లేకాదు’’ ‘‘ సౌకర్యాలు, సుఖాల ముందు జ్నాపకాలేపాటివి’’

(పునరుద్ధానం). ‘‘ నీ గురించి మితంగానూ, ప్రపంచ క్షేమం గురించి అతిగానూ ఆలోచించక పోతే, ఎందుకిలాంటి గేదరింగ్స్‌’’ (నీడ) వంటి జీవిత సత్యాలను ఈ కధల్లో చాలా అలవోకగా చెబుతుంది ఆవిడ.

కుటుంబరావు రచనల గురించి కాళీపట్న రామారావు మాష్టారు చెప్పిన మాటలు వీరక్ష్మిగారి కధలకు కూడా వర్తిస్తాయనిపించింది నాకు.

‘‘ భాషేకాక, ఆ కధ కట్టే తీరు కూడా చాలా సరళంగా, వుండేది. వాటిలోని పాత్రలు, ఆ పాత్రల తాలూకు సమస్యలు, వాటిని వారు ఎదుర్కొనే తీరు, అన్నీ నేనెరిగిన మనుష్యులకూ, జీవితాలకూ, చాలా దగ్గరగా కనిపించేవి. కధ మధ్య వారు చేసే వ్యాఖ్యలు నా అవగాహనకు చాలా అవసరంగా వుండేవి. చివరికి కధ ముగించే సరికి, నా అనుభవమో, జ్నానమో, లేక రెండూనో, ఎంతో కొంత మేరకి పెరిగినట్లుండేవి’’

వీరలక్ష్మిగారి కధల్ని చదువుతున్నప్పుడు మనకి సరిగ్గా అలానే అనిపిస్తుంది. అంచేత ఈ కధలు కాలానికి నిలుస్తాయి. ఆవిడ జీవితపు దృక్పధం మనుష్యులు సుఖంగా, మంచిగా, ప్రకృతికి దగ్గరగా, నిరాడంబరంగా, ఆత్మ గౌరవంతో జీవించాలని. మానవ సంబంధాల్లో వున్న సకల అమానవీయతలూ పోవాలనీ, మంచి సమాజం రావాలనీ. ఏ సమాజంలోనైనా జరగాల్సింది ఇదే. వీరలక్ష్మి గారి కిటికీ బయటి వెన్నెల కధల పుస్తకం అందరూ చదవాల్సిన పుస్తకం. ఆవిడ మరిన్ని మంచి కధలు రాయాలనీ, ఆమె మాత్రమే చేయాల్సిన, అసంపూర్ణం గా మిగిలిపోయిన రచనలను ఆమె పూర్తిచేసేందుకు పూనుకోవాలనే చిన వీరభద్రుడు ఆకాంక్ష , అవిడని అభిమానించే పాఠకులందరిదీనని ఆవిడ గుర్తిస్తారని ఆశిద్దాం.

-ఎం. విమల

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

pasunuru cover 2
రవి కథలు ఊరూ-వాడ వాతావరణంలోంచి నడిచి.. పట్టణ శివారులోంచి పయనించి మహానగరం లోని మైలను కూడా పట్టి చూపిస్తున్నాయి. ఊర్లలోని అంటరానితనం నగరంలో పది తలలు వేయడాన్ని ఈ కథల్లో చూడొచ్చు. కొత్తదారుల్లో నడిచిన ఈ కథలు రవిని ఆధునిక దళిత కథకుడిగా నిలబెడుతున్నాయి.
రవి కవి హృదయుడు. మంచి కథకుడు. గట్టి విమర్శ కుడు. వాగ్గేయకారుడు. యాక్టివిస్టు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఎందుకు రూపుదిద్దుకుంటై?! సామాజిక అవసరం అలా మూవ్‌ చేయిస్తుంది. ఒత్తిడి చేస్తుంది. సొంత సామాజిక వర్గం అణచివేతల అట్టడుగున తొక్కబడి విలవిల్లాడు తుంటే ఒక క్రియేటివ్‌ పర్సన్‌ ఎంతగా తల్లడిల్లిపోతుం టాడు.. ఎంతగా కాలునిలువని స్థితిని అనుభవిస్తుం టాడు! అలాంటి స్థితే మాలాంటివారిని అన్ని ప్రక్రియల్లో రచనలు చేయిస్తుంది. ఒక్కోసారి ఆ రచనలు వాటి సోకాల్డు ప్రామాణికతల్లో ఒదగవు. ఆ ఒదగనితనమే వాటికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఆ ఒదగని తనమే మూస సరిహద్దుల్ని చెరిపేసి, హద్దులు గీస్తున్న వారి చెంప ఛెళ్లు మనిపిస్తుంది. అలా ఏ చట్రాల్లోనూ ఒదగని వీరుడు రవి. సానపట్టుకున్నా కొద్దీ మరింతగా మెరిసే పదును రవి సొంతం.
ఈ కథల వెనుక దాగిన తాత్వికపునాది గురించి కొంత చర్చించాలి. ఆ కోణంలో లోతుల్లోకి దిగితే` ముగిసిపోయిందనుకున్నదేది ముగిసిపోవడం లేదు.. మళ్ళీ మళ్ళీ బిగుసు కుంటున్నది. ఈ బిగింపు మళ్ళీ మొదటికొస్తున్నది. పోరాటం చేస్తున్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తున్నది. దాటి వచ్చినామనుకుంటున్న చైతన్యాన్ని అనుభవిస్తున్నది పై వర్గాలవాళ్ళే ` బ్రాహ్మణీయవాదులే. లేదంటే వాళ్ల కనుసన్నల్లో మెలిగే, వాళ్ల మార్గంలో పయనిస్తున్న ఇతర వర్గాలు మాత్రమే. ఈ దౌర్భాగ్యస్థితికి ఎంతగా కుంగదీసే బల ముంటుందో అనుభవిస్తున్న వాళ్లకు ఎరుక. ఎప్పటికప్పుడు అలాంటి స్థితిని జయిస్తూ వస్తున్న వాళ్లల్లోంచి ఒకడు మా రవి.
మార్గదర్శులు వేసుకొస్తున్న ప్రతి కొత్త దారి కొన్నాళ్లకే పాతబడిపోతుండటం, కొత్త సిద్ధాంతాలు కొద్ది కాలంలోనే గానుగలుగా మారిపోతుండడం.. చుట్టూ వలయాలు వలయాలుగా సరికొత్త చట్రాలు బిగుసు కుంటుండడం.. ఒక్క కష్టం కాదు ` ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ రచనలు కొనసాగించడం ఆధిపత్య వర్గాలకున్నంత సులువు కాదు. వాళ్లు రాస్తే ఆహా ఓహో అనడానికి అండదండలెన్నో ఉన్నాయి. రవిలాంటివాళ్లు రాస్తే అంత ఈజీగా ప్రచారం లభించదు. దళితవాదం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. అప్పుడున్న మద్దతుదారులూ ఇప్పుడు లేరు. ఎప్పటికప్పుడు మళ్లీ మద్దతుదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి అట్టడుగువర్గాలది. బ్రాహ్మణుల నుంచి అప్పర్‌ శూద్ర వరకు వచ్చిన సామాజిక ఎదుగుదల బీసీ, ఎస్సీ, మైనారిటీల వరకు రావాలంటే ఇంకా చాలాకాలం పట్టేలా ఉంది. ఈ లోపు సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తల పోరాటం ఎడతెరిపి లేకుండా నడుస్తూ ఉండాల్సిందే. అలాంటి పోరాటం చేయగల శక్తి పుష్కలంగా ఉన్నవాడు రవి.
హిందూత్వ, బ్రాహ్మణీయ భావజాలం పర్సెంటేజీల తేడాలతో ఎటూ చాలా మందిలో ఉంటుంది. దాంతో మనకు సీరియస్‌ అనిపించేవి, వారికి క్యాజువల్‌గా కనిపిస్తుంటాయి. మనకు గాయాలుగా తగిలేవి, వారిని తాకనైనా తాకవు. వారు ప్రోగ్రెసివ్‌ మొఖంతోనే లోలోన మనకు ఎంతో హానికరమైన పనులు చాలా అలవోకగా చేసేస్తుంటారు. మరి మొత్తంగా బ్రాహ్మణిజపు ప్రభావంలో ఉన్న వారికన్నా వీరు తక్కువా ఎక్కువా అంటే తేల్చుకోవడం కష్టమే. ఎందుకంటే ఎక్కువ మొత్తంగా సమాజం బ్రాహ్మణిజపు ప్రభావంలోనే ఉన్నప్పుడు ఆ కాస్త వెసులుబాటుతో మనల్ని దరిచేరనిచ్చే ఆ కొందరు ఏ మేరకు బహుజనులకు ఉపయోగపడుతుంటారో అంచనా వేసుపౖగా ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య ఉంది.

ఒక్కో కులం, ఒక్కో మత సమూహానికి కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. ఒక సమూహం సమాజం పట్ల, రాజ్యంపట్ల తీసుకునే స్టాండ్‌ మరొక సమూహం తీసుకోలేకపోవచ్చు. ఒక సమూహానికి ఉండే దీర్ఘకాలిక లక్ష్యం మరో సమూహానికి ఆ సమయానికి అడ్డంకిగా మారొచ్చు. పైగా పోరాట పంథాలు వేరు కావొచ్చు. ఒకరికి అసలైన శత్రువు మరొకరికి ఇమిడి యేట్‌ శత్రువు కాకపోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఉద్యమ కార్యాచరణలో పట్టూ విడుపు లుండాలి. అంతిమ లక్ష్యంపట్ల అందరికీ స్పష్టత ఉండాలి. లక్ష్యం సుదూరంగా  ఉన్నప్పుడు తక్షణ ఫలితాల మెట్లనూ ఎక్కుతూ పోవాలి. అలా కాదని కొండపైనే దృష్టి నిలిపి పరుగెడుతుంటే లోయలూ అగాధాలు మనల్ని కబళించవచ్చు.
ఒక మెజారిటీ భావజాలం మనల్ని లోబరుచుకుంటుంది. బాధితస్పృహ ఉన్నవాడికి కనిపించిన గాయం, మెజారిటీ భావజాలానికి లోనవుతున్న అణగారిన జాతివాడికి ` బహుజనుడికి లేకపోవచ్చు. స్పృహ కలిగినవాడు ప్రశ్నించే దాకా వీడు ఆ స్పృహలోకి రాడు. ఒక రకంగా స్పర్శాజ్ఞానం కోల్పోవడంలాంటి ప్రక్రియ అది. అట్లా మన చుట్టూ ఉన్న దళితులు, బీసీలు, ఆదివాసీలూ, ముస్లింలు, మహిళలూ ఇతర మైనారిటీల నుంచి ఎదిగొచ్చినవారు కూడా మెజారిటీ భావజాలానికి లోనై శత్రు శిబిరంలో చేరిపోతున్నారు. వాళ్లను ముల్లుగర్రతో అదిలించి మలుపుకోవడం పెద్ద శ్రమైపోయింది బహుజన చైతున్యులకు. అది నిరంతరం జరగాల్సిందే. పెద్ద ఎత్తున జరగాల్సిందే.
ఇవేకాక మన మీద మావోయిస్టు, మార్క్సిస్టు ప్రభావాలు ఆవరించి ఉన్నాయి. ఈ ప్రభావాలు ఒక్కోసారి అస్తిత్వ ఉద్యమకారులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఒక్కో విజయాన్ని అందుకొని ముందుకెళ్లడానికి ఏ మాత్రం అంగీకరించని ఆ ప్రభావాలు మొత్తంగా మన లక్ష్యాన్ని మరింత దూరంగా నెట్టేస్తున్నాయి. నిజానికి ఆ ప్రభావితుల్లోని క్రమశిక్షణ, నిబద్ధత, అధ్యయనశీలత, త్యాగం లాంటి మంచి లక్షణాలను స్వీకరిస్తూనే, వారిలోని వ్యక్తి ఆరాధన, మతంగా మారేతత్వం, మూస ధోరణి, వదలని కుల జాఢ్యంలాంటి చెడును విసర్జించాల్సిన అవసరముంది. ఇలా జరగకుండా అణగారినతనంలోంచి వచ్చే కసి, ఆకలి, పైసాను ` హోదాను చూడనితనం కొందరు అస్తిత్వ ఉద్యమకారులను చాలా తొందరగా లంగదీసు కుంటున్నాయి. వాటికి ఏ కాస్త లంగినట్టు కనిపించినా మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాలు దాడి చేస్తున్నాయి. దాంతో అతలాకుతలమైన అస్తిత్వ భావజాలకుల చరిష్మా మసకబారిపోతున్నది. ఇలా లేకుండా నిక్కచ్చిగా కనిపించే కొంతమంది అస్తిత్వవాదులు మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాల ప్రభావంవల్ల రిజిడ్‌గా బిగదీసుకుపోతున్నారు. తాము చేయలేకపోతున్న పనులు చేస్తున్న వాళ్ల మీద రాళ్లేస్తున్నారు. ప్రతీ పనిలో తప్పులు మాత్రమే వెతికే వీర విప్లవవాదుల్లాగే వీర దళితవాదులు, వీర బహుజనవాదులు తయారవుతున్నారు. వీటన్నింటి గ్రహింపుతో ఈ జాఢ్యాలన్నింటినీ వదులుకొని ముందుకెళ్లినప్పుడే అస్తిత్వ వాదుల చైతన్యం లక్ష్యాన్ని చేరుకునే అవకాశముంది. రవిలో ఈ వెసులుబాటు కనిపిస్తున్నది. ఆ దిశగా రవి తన రచనలో, కార్యాచరణలో కేంద్రబిందువయ్యే అవకాశముందని ఆశపడుతున్నాను.

ఆధిపత్య భావజాలాలే కాక ముఖ్యంగా మీడియా రచయితల్ని నియంత్రిస్తూ వస్తోంది. యాజమాన్యాల కులం, ప్రాంతం కొత్త రచయితల్ని చెప్పకనే నియం త్రిస్తున్నాయి. రవి, నేను రాస్తున్నది తెలంగాణ మధ్యతరగతి భాషే అయినప్పటికీ ఆంధ్రా పత్రికలవారికి అది తెలంగాణ మాండలికంలా కనిపిస్తోంది. ఆ విషయంలో మాకే ఆవేశం ఆగదు. మరి తెలంగాణ మాదిగ భాషలో రచనలు చేస్తున్న వేముల ఎల్లయ్య లాంటి వారు ఎలా తమ ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ వస్తున్నారో తెలియదు. ఈ మధ్య జూపాక సుభద్ర, గోగు శ్యామల కథల సంపుటాలు వచ్చాయి. ఆ కథల్ని వేసుకునే మనసు, ఉద్దేశం ఆంధ్ర పత్రికలకు లేదు. అలాంటి పత్రికలు తెలంగాణ వారికి ఏ మేరకు అవసరం? తెలంగాణ పత్రికలు మరికొన్ని రావలసిన అవసరం  ఉంది. అందులోనూ అట్టడుగు జాతుల నుంచి మీడియా ఎదిగొచ్చిన రోజునే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది.
ఇప్పటిదాకా రవి, నేను చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నాం. ఆంధ్రా పత్రికకు కథ ఇవ్వాలంటే ఒక భాషలో, నమస్తే తెలంగాణ పత్రికకు ఇవ్వాలంటే ఒక భాషలో కథలు రాస్తున్నాం. ఇదొక యాతన. కథ రాయడమే చాలా ఓపికతో కూడుకున్న పని. అలాంటిది మళ్లీ అందులో ఇట్లాంటి ప్రయోగాలు, ప్రయాసలు మరెంతగా మమ్మల్ని పరేశాన్‌ చేస్తున్నాయో చూడండ్రి.
ఇన్నాళ్లు మా మీద రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక (కో.ప్రా) భాష మమ్మల్ని నరక యాతన పెట్టింది. కథా సమయంలో ఉన్నప్పుడు విషయం, భావం, ఫ్లో ఎక్కడ పోతాయోనని స్పీడ్‌గా రాసేస్తుంటాం. అలా రాస్తున్నప్పుడు మాదైన తెలంగాణ భాష రాకుండా కో.ప్రా భాష వచ్చేస్తుంటుంది. ఏదో ఒకటి అని ముందు రాసేసి తర్వాత మళ్లీ మళ్లీ మా భాషలోకి అనువాదం చేసుకోవడం పెద్ద ప్రయాసై పోయింది. నిజానికి మా భాషలోనే ముందుగా రాసుకుంటే వచ్చే వాక్యనిర్మాణం, కో.ప్రా. భాషలో రాసేసినంక రావడం కష్టమే. ఆ ఎరుకతోనూ మా అనువాదాలు కొనసాగుతున్నై. జరిగే నష్టమేమిటంటే, ఒక్కోసారి కో.ప్రా.భాషలోని వాక్యనిర్మాణంలోనే తెలంగాణ భాష వాడడం జరిగిపోతుంటుంది. ఆ ఎరుకలోంచి మా భాషలోనే ముందుగా రాసి అవసరమైనప్పుడు మాత్రమే కో.ప్రా. భాషలోకి మార్చి ఇవ్వడమే సరైందనినిర్ణయించుకున్నాం. ఇలా భాష విషయంలో రవికి, నాకు చాలానే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ ప్రామాణిక భాష అవసరం గురించి అందులోనూ బహుజనులకు ఆ భాష విషయంలో వచ్చే ఇబ్బందుల గురించి చర్చ జరగవలసే     ఉంది.
రవి కథా సంపుటి వేసుకోవాలనుకున్నంక మా ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో మొత్తంగా కథలను తన భాషలోకి మార్చుకోవాల్సిందేనని నిర్ణయించాం. ఆ పనిలో ఇంకా ఎక్కువ కష్టం పడాల్సివచ్చింది రవి. మరెంతో సమయం వెచ్చించాల్సి వచ్చింది. కథ అచ్చయింది అచ్చయినట్టే వెయ్యాలి కాని మళ్లీ మార్చుకోవడమేమిటి అని కొందరు దోస్తులు అన్నప్పటికీ మా కొత్తతరం క్రియేటివ్‌ రైటర్స్‌ జెన్యూనిటీ మీకు అర్థం కాదులే అని మేమనుకున్నాం.
మా యీ సంఘర్షణల్లోంచి ‘తెలంగాణ బహుజన కథకుల కచ్చీరు’ అని రెండు రోజుల సదస్సు పెట్టుకొని అనేక చర్చలు, గొడవలు పడ్డాం. కొమురం భీం నేలకొరిగిన జోడేఘాట్‌లో రెండో సమావేశం నిర్వహించుకొని తాలూ, గట్టీ, అగ్రవర్ణ ప్రామాణికతల ఆధిపత్యాలను చర్చించుకున్నాం. అలా బహుజన కొత్త తొవ్వలు వెతుక్కున్నాం. ఇంకా ఆ దారిలోనే మరింత గట్టి పడటానికి తాలును బహుజన చాటలతో చెరుగుతున్నాం. అగ్రవర్ణ విమర్శకులు మా కథలను శైలీ, శిల్పాల కళ్లద్దాల లోంచి మాత్రమే చూసే ప్రయత్నం చేయబోతే అవన్నీ కుదరవని చెప్పకనే చెబుతూ వస్తున్నాం. మా ప్రత్యేక రాతలే మాకు శైలీ,శిల్పాలను ఏర్పరచగలవనే ఆత్మవిశ్వాసం మాకుంది.
ఆ మధ్య ‘ఇప్పపూలు’ ‘గిరిజన సంచార తెగల కథలు’ పేర ఒక సంకలనం వచ్చింది. అందులో ఓ నలుగురు తప్ప మిగితా వారంతా గిరిజనేతరులే. ‘వతన్‌’ముస్లిం కథా సంకలనం లాగా, ‘నల్లపొద్దు’ దళిత రచయిత్రుల సంకలనం లాగా అచ్చంగా ఆ జాతుల రచనల తొలి సంకలనాలు రావాలి. కాని ఇతర రచయితలతో తొలి సంకనాలు వేయడం వల్ల వారి మూసలో విషయం, జీవితం, ప్రతీకలు రికార్డు చేయబడతాయి. వారి మూసలోకే ఆయా సమూహాల కొత్త రచయితల్ని డ్రైవ్‌ చేసినట్లవుతుంది. వారి వారి ప్రత్యేక శైలిలో వ్యక్తీకరణలో వారి జీవితంలోని ప్రతీకలతో, ద్ణుఖంతో, పరిష్కార మార్గాలతో రచనలు రావాలి. కాని ఆధిపత్య వర్గాల, భావజాలాల వారు నడిపిస్తే నడిచే రచనలు తీవ్ర నష్టం చేస్తాయి. ఈ జ్ఞానం బహుజన రచయితలకు అత్యంత అవసరం. ఇతర రచయితలు వేసేవి సంఫీుభావ సంకలనాలు అవుతాయి. వాటి అవసరమూ చాలా ఉంది. అయితే ఈ స్పష్టత మాత్రం ఉండాల్సిందే.
విమర్శకులంటే అధ్యయనశీలురై మాత్రమే ఉండాలనే ఒక గుడ్డి నమ్మిక మన మధ్య సంచరిస్తున్నది. తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్నవారే గట్టి విమర్శకులని భావించే వాతావరణమున్నది. వీరు కొన్ని తప్పుడు సూత్రీకరణలు చేస్తూ అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని అవమానపరుస్తున్నారు. ఇది సరైంది కాదు. కాళ్లకింది నేలను వదిలి పరాయి నేల నుంచి అరువు తెచ్చుకున్న చైతన్యం మా మీద రుద్దాలనే విమర్శకుల ధోరణి మా రచనలకు ఆటంకంగా తయారయింది. ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపులే టెక్నిక్‌ అనే గొడవ. చెత్త విషయాన్నైనా కొత్త టెక్నిక్‌తో చెబితే చాలు, ఆహా ఓహో అంటున్నారు సంకలనకర్తలు, అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల విమర్శకులు. వెనుకబడేయబడ్డ జీవితంలోంచి కళ్ళు ధారలు కట్టి రచనలు వచ్చినా వీరి కరడుగట్టిన మనసులు కరగవు. అలాగని టెక్నిక్‌ని పూర్తిగా పక్కన పెట్టమని అనడం లేదు. అంతస్సూత్రాన్ని పట్టుకునే విమర్శకుల్ని లెక్కచేయని వాతావరణం ఇంకా మన మధ్య ఉంది. అందుకే బహుజనులు తమ బతుకుల్లోని కొత్త టెక్నిక్స్‌ని పట్టి ఇవ్వాలి. వాటికోసం తమ జీవనాన్ని జల్లెడ పట్టాలి.
నిజానికి కేవలం అధ్యయనంలోంచి కాక జీవితంలోంచి వచ్చే రచనలు స్వచ్ఛంగా సహజంగా ఉంటున్నాయి. మనసు మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. ఒక అంతర్‌ జ్వలనాన్ని రేపుతున్నాయి. వీటిలో ఎన్నో ప్రత్యేకతలు, సోకాల్డు నాగరిక సమాజానికి ఆశ్చర్యం కలిగించే వ్యక్తీకరణలు ఉంటున్నాయి. బహుజన కథకుల్ని ఆవరించి ఉన్న సోకాల్డు ప్రామాణిక వాతావరణం కొందరిని అసలు రచనలే చేయకుండా చేస్తున్నది. చేసిన రచనలను సోకాల్డ్‌ సంకలనకర్తలు పట్టించుకోనట్లు నటించడంతో ఎందరో రచయితలుగా హత్య చేయబడ్డారు. భాష విషయంలో, వ్యక్తీకరణ విషయంలో, కథా వస్తువు విషయంలో ఆధిపత్య భావజాల విమర్శకులు, సంకలనకర్తల ప్రభావాల్ని ఛేదించుకొని రాయాలంటే పురిటినొప్పులు పడాల్సి వస్తున్నది. వారు ఎప్పటికప్పుడు బహుజన రచయితల్ని కంట్రోల్‌ చేస్తున్నారు. వారి మెప్పుకోసం తంటాలు పడడంలో బహుజనతనం మాయమవుతున్నది. ఆ ఎరుక ఉన్న రచయితలుగా మేమిప్పుడు ఆ ప్రభావాలు మా మీద పడకుండా, మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ ప్రయత్నంలో మా మధ్య ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సందిగ్ధాలో…ఎన్నెన్ని చర్చలో.
ఈ కోణాలన్నింటిలోంచి ఆలోచించినప్పుడు రవి కథల్లో ఈ కొత్త పార్శ్వాలు చూడొచ్చు. రవి ముందు ముందు మరిన్ని మంచి కథల్ని, నవలల్ని అందిస్తాడన్న నమ్మకంతో.. అందుకు ఇంకా ఇంకా శ్రమిస్తాడన్న భరోసాతో… రవికి అలాయి బలాయి. గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి.

-స్కైబాబ

(ఈ ఆదివారం విడుదల కానున్న డా.పసునూరి రవీందర్‌ కథా సంపుటి ‘‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’’కు రాసిన ముందుమాట)

చిరిగిన ఆకాశాన్ని కుట్టే కవి ఇదిగో!

 

బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

 

[ఈ నెలలో విడుదల అయిన బాల సుధాకర్ మౌళి కవిత్వ సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ ముందు మాట ఇది]

 

చిన్న విషయం చెప్పాలి, బాల సుధాకర్ కవిత్వంలోకి వెళ్ళే ముందు-

ఫ్రెంచ్ ప్రతీకవాదపు ఆఖరి కిరణం Paul Valery ని ఎవరో అడిగారట – “అసలు దేన్ని మంచి రచన అనాలి?” – అని.

ప్రతీకలలో మాట్లాడడానికి ఏ మాత్రం తడుముకోని Valery అన్నాడట: “వొక రచన చదివాక ఎవరైనా I am a page of literature అనుకుంటే అదీ మంచి రచన.”

నిజమే అనిపిస్తుంది చాలా సార్లు; వొకప్పుడు రావిశాస్త్రి, యింకోప్పుడు శ్రీశ్రీ, యిప్పుడు ఉత్తరాంధ్ర నించి వీస్తున్న ఉత్తమ సాహిత్య పవనాలు కొంచెమైనా తాకినప్పుడు – మరీ ముఖ్యంగా – యెక్కడో వున్న నెల్లిమర్ల నించి వొక స్వరం గట్టిగా వినిపిస్తున్నపుడు literary pages ఎంత వేగంగా మారిపోతున్నాయో కదా అనిపిస్తుంది.

మారుమూల ఏ అంతర్జాల మాయాప్రపంచపు మరీచికలూ తాకీ తాకని చోట, కరెంటు వుండే వేళల కంటే లేని వేళలే యెక్కువగా వుండే చోట జీవితం వీధి లాంతరు గుడ్డి దీపం కన్నా బలహీనమైన వెలుగు ప్రసరిస్తున్న చోట – ఈ బాలసుధాకర్ మౌళి అనే కవి ఈ సాహిత్య పుటలు ఎలా తిప్పేస్తూ వుంటాడా అనే వూహ నన్ను యెప్పుడూ లోపల్నించి బాధగా మెలిపెడుతూ వుంటుంది.

చాలా కష్టం, అనేక మార్పులు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నప్పుడు వొక చిన్న వూరి నించి ప్రయాణం మొదలెట్టడం! ప్రపంచ పటం మీద తన వూరినీ తననీ కనీసం చిన్ని చుక్కగా చూసుకోడానికైనా ఆ కవికి చాలా భరోసా కావాలి. “నేను ఈ ప్రపంచంలోనే వున్నానా?” అన్న ఉనికి వేదన అతన్ని వూపిరాడనివ్వదు. “I am a page of literature,” అనుకోడానికి కావాల్సిన ambience దొరకదు.

అలాంటప్పుడు Paul Valery చెప్పింది కొంత వరకే నిజం! ఎందుకంటే, ప్రపంచ పటం మీద వుండే వాళ్లు చాలా మంది వొకే పేజీ మీద వుండరు. సాంకేతికంగా సరే, మానసికంగా అది అంతగా సాధ్యపడదు. అలాంటప్పుడు నెల్లిమర్ల కవి వొక్కడూ – వొక మూల ఎదో బడిలో పాఠాలు చెప్పుకుంటూ బతికే కవి – ఏం చేస్తాడు ఈ ప్రపంచ పటం మీద?!

ఈ ప్రశ్నకి కనీసం వొక సమాధానం దొరికితే చాలు, బాలసుధాకర్ కవిత్వంలోకి మనకి వొక ఎంట్రీ దొరికినట్టే.  నాకు దొరికిన సమాధానం ఏమిటంటే ముఖ్యంగా అతను తాను సాహిత్యంలో పేజీని అనుకోవడం లేదు. కేవలం సాహిత్యమే పేజీ అనుకోవడమూ లేదు. అతనికీ యీ లోకానికీ యింకా పెద్ద పేచీనే వుంది. అసలు అతని కవిత్వానికీ, కథలకీ, వ్యాసాలకీ, అతని క్షణచర్యల్ని రికార్డు చేస్తున్న ముఖపుస్తకపు అనుదిన క్షతగాత్ర వదనంమీద అతను విసిరే శకలాలకీ ఈ పేచీలోనే key వుంది.

అతన్ని సింబాలిస్ట్ Paul Valery కాదు, అతనికి తెలీకుండానే Rolland Barthes అనే విప్లవోన్మాది ఆవహించి వున్నాడు. వొక్క బాలసుధాకర్ ని మాత్రమే కాదు, 1968 మే లో ఫ్రాన్సులో పెట్టుబడిని గజగజ వణికించిన ప్రజా వుద్యమ పంథాలో నిలబడి, Rolland Barthes సాహిత్యం కేవలం సాహిత్యం కాదు అని సింహగర్జన చేయడం ప్రపంచమంతా వినిపించింది. అతను అన్న మాట: I am not a page of literature. ఆ వాక్యం ప్రపంచ సాహిత్య చరిత్రలో historical discourse అన్న భావనకి తొలి పునాది. సాహిత్యంలోని విపరీత కాల్పనికతని ధిక్కరించిన భావన.

సరే, I am not a page of literature అన్న రచయితలూ కవులూ ఏం చేస్తారు? వాళ్ళు యింకో చరిత్ర కోసం కలలు కంటారు, కళల్ని కంటారు. బాలసుధాకర్ కవి కాబట్టి, అతని కలలన్నీ కవిత్వంలో వుంటాయి. అతను కల కంటున్న కొత్త చరిత్ర సమస్తం కవిత్వ వాక్యాల్లోకి బట్వాడా అవుతుంది.

1968 ని బాల సుధాకర్ చూసి వుండడు. కాని, అతను పుట్టిన వూరూ, ఆ చుట్టుపక్కల యింకా మిగిలి వున్న శ్రీకాకుళం విప్లవాగ్నుల కొలిమి సెగల్ని దాచుకునే వుంది. ఆ చరిత్ర లేకుండా బాలసుధాకర్ లేడు. అతని ప్రతి కలవరింతా పలవరింతా ఆ అనుభవం చుట్టూనే కాబట్టి, అతని కవిత్వం – historical discourse- అని నా ప్రతిపాదన. అతను రాస్తున్న పేజీలు  కేవలం సాహిత్య పుటలు కావు. Rolland Barthes చెప్పిన reality effect ని పొదువుకున్న సామాన్యుడి దస్తావేజులు. పీడితుల కైఫియత్తులు.

Paul Valery మాదిరిగా ప్రతీకల మీద బతికే కవి తన కవిత్వాన్ని పీడితుల కైఫియత్తుగా మార్చగలడా? తన దగ్గిర వున్న అరకొర సాధనాలని చరిత్రకారుడిలాగా చాకిరీ చేయించగలడా?చేయగలడా?

అవును, ముమ్మాటికీ చేయగలడు అని నిరూపిస్తూ వెళ్తున్నాడు బాలసుధాకర్.

Layout 1

1

బాలసుధాకర్ కవిత్వం చదివేటప్పుడు నన్ను బాగా ఆకట్టుకునేది అతను కవిత్వాన్నీ, వాస్తవికతనీ juxtapose చేసే పధ్ధతి. ఈ “ఎగరాల్సిన సమయం” సంపుటిలో మొదటి కవితలోనే సుధాకర్ ఆ రెండీటి మధ్యా వంతెన కట్టుకునే పనికి దిగుతాడు ఈ వాక్యంలో-

కల్లోల దేశాన్ని

కవిత్వం చేస్తున్నప్పుడు

కవిత్వం పసిపిల్లలా వుండాలనుకోవడంలో

                               తప్పేముంది?

అంటూ-

 

కాని, ఆ కవిత అసలు రహస్యం ఆ తరవాతి పంక్తిలో వుంది.

పసిపిల్లలాంటి నిర్మలమైన, నిర్భయమైన

పద్యాన్ని సృజించే వరకూ

       రాత్రుళ్ళు యిలానే-

అటు ప్రపంచ సాహిత్యంలోనూ ఇటు భారతీయ సాహిత్యంలోనూ యుద్ధానంతర వాస్తవికతని చెప్పిన కవులూ రచయితలూ పసిపిల్లల కళ్ళతో వాటిని దృశ్యం చేయడం కనిపిస్తుంది, యుద్ధ కల్లోలంలోని కరకుదనం, పసి కళ్ళ నిర్మలత్వాన్ని ఎదురెదురుగా చూపిస్తూ-

బాలసుధాకర్ కి ఆ నిర్మలత్వమే కాదు, నిర్భయమూ కావాలి. వొక మంచి పద్యం ఎంత నిర్మలంగా వుంటుందో, అంత నిర్భయంగానూ వుంటుంది. మొదటి కవితలోనే తన కవిత్వమార్గానికి తానే అలా నిర్వచనం చెప్పుకున్నాడా సుధాకర్?!

ఆ తరవాతి కవితలో అవును నిజమే అని ఖాయం చేస్తున్నాడు ఇలా –

కవులూ

పిల్లలూ

ఏ దేశానికైనా ప్రాణ వీచికలు.

ఆ తరవాత ఎన్ని కవితల్లో పిల్లలు ఎగురుకుంటూ వస్తారో మీరే చూడండి. నిజానికి, ఈ కవిత్వ సంపుటి శీర్షిక “ఎగరాల్సిన సమయం” అలా పిల్లల్లా ఎగిరే నిర్మల నిర్భయ సమయ సందర్భాల్ని సూచిస్తోందేమో!

కాని, అవి కేవలం నైరూప్య సమయ సందర్భాలు కావు.

బాలసుధాకర్ కేవలం కవి మాత్రమే అయి వుంటే, అతనికి నైరూప్యత చాలా అవసరమయ్యేది. కవి మాత్రమే కాకుండా, భవిష్యత్తుని రోజూ కళ్ళారా చూస్తూ వుండే ఉపాధ్యాయుడు కూడా అవడం వల్ల అతని నైరూప్య వూహలూ, కవిసమయాలూ రోజూ కొంత కొంత విచ్చిన్నమైపోతూ వుంటాయి. తరగతి గది అతని సమయసందర్భాల్ని redefine చేస్తూ వుంటుంది. అతని బలాల్నీ, బలహీనతల్నీ రోజూ కొంత కొంత ఎండగడుతూ వుంటుంది. అతను గతమ్మీద బతికే వీలు లేకుండా భవిష్యత్తుని దర్శించి తీరాల్సిన చరిత్రభారాన్ని అతని మీద పెడుతూ వుంటుంది. ఆ భారాన్ని మోసుకుంటూ ఎలా కలల్లోకి ఎగురుతున్నాడన్నదే బలసుధాకర్ కవిత్వ ప్రయాణం. అనేక ప్రతికూలతల మధ్య తన సమయాన్ని తను నిర్దిష్టంగా reinvent చేసుకోవడం ద్వారా ఈ ప్రయాణానికి వొక తాత్విక సారాంశాన్ని జోడిస్తున్నాడని నేను అనుకుంటున్నా.

2

సమయసందర్భాలు చరిత్రకారుడికి అక్కరకొచ్చే పనిముట్లు. కవి సుధాకర్ కి కూడా!

కవికి భాష ముఖ్యమైన సాధనం. తన సందర్భాన్ని reinvent చేసుకునే కవి- భాషనీ reinvent చేసుకోవాలి. అంటే, భాషకి అంతకు ముందు వున్న నిర్మాణ వ్యవస్థని కవి ప్రశ్నించాలి, వీలయితే అందులో ధ్వంస రచనకి దిగాలి. అంటే, Writing అనే ప్రక్రియ ఏదైతే వుందో దాన్ని కొత్తగా నిర్మించుకోవాలి.   మళ్ళీ Rolland Barthes దగ్గిరకే వద్దాం. కొత్త చారిత్రక సందర్భంలో Writing ని నిర్వచిస్తూ ఇలా అంటాడు:

Writing is integrally “what is to be invented,” the dizzying break with the old symbolic system, the mutation of a whole range of language.

ఈ రెండేళ్ళ తెలుగు కవిత్వ సందర్భంలో సుధాకర్ ప్రవేశం వొక ఆశ్చర్యం చాలా మందికి! మొదటి కొన్ని కవితలతోనే సుధాకర్ వొక విస్మయ వలయాన్ని తన చుట్టూ నిర్మించుకున్నాడు. ఇతని భాష, ఇతని వాక్యం కొత్తగా వుందన్న talk వచ్చేసింది. దానికి ప్రదాన కారణం: సుధాకర్ కవిత్వ భాషలో తెచ్చుకున్న మార్పులు. కవిత్వ భాష అనగానే అందులోని ప్రతీకలు, పదచిత్రాలూ. సుధాకర్ కవిత్వంలో అవేవీ పాత వాసన వేయవు. ఆ పాతదనాన్ని వదిలించుకోవాలన్న బలమైన ప్రయత్నం సుధాకర్ కవిత్వ భాషలో కనిపిస్తుంది. అయితే, ప్రయోగం పేరుతో యెక్కడికో పలాయనం చిత్తగించకపోవడం అతని శిల్ప ఆరోగ్యానికి, వస్తు నిబద్ధతకీ సంకేతం. శిల్పంలో సుధాకర్ ఎన్ని కొత్త పోకడలు పోతాడంటే, ఆ పోకడ చాలా subtle గా వుంటుంది. ఈ సంపుటిలోని ప్రతి కవితా దీనికి వేర్వేరు కోణాల నించి వొక ఉదాహరణగా నిలుస్తుంది.

అయితే, శిల్పం కంటే కూడా సుధాకర్ వస్తు విస్తృతి నాకు ప్రత్యేక ఆకర్షణ. బహుశా, అతికొద్ది కాలంలో సుధాకర్ ఎక్కువ మంది అభిమానుల్నీ, నిరంతర చదువరుల్నీ సంపాదించుకోడానికి ఈ వస్తు వైశాల్యమే ముఖ్య కారణం అని అనుకుంటున్నాను. సుధాకర్ ఎన్ని రకాల కవిత్వ వస్తువుల్ని తడుముకుంటూ వెళ్ళాడో! స్త్రీలూ, పిల్లలూ, ఊళ్ళూ, బళ్ళూ, నీళ్ళూ, క్యూబాలూ, నియంతలూ, నిరాశలూ, ఆశలూ – ఇలా ఈ వరస ఎక్కడ అంతమవుతుందో తెలీదు. కాని, వీటన్నిటి వెనకా సుధాకర్ ని నడిపించే శక్తి వుందే, అది బలవత్తరమైంది.

సుధాకర్ ఉత్తమ చదువరి. వొక రచయిత పేరు వింటే, అది వెంటనే అతని మనసుని వెంటాడడం మొదలెడుతుంది. అతని చేతులు ఆ పుస్తకాన్ని చేరుకునే దాకా నిద్రపోవు. కారణాలేమైనప్పటికీ, ఈ మధ్య కాలంలో చదువు పట్ల ఇంత దాహం వున్నవాణ్ని నేను చూడలేదు. తన కవిత్వం మీద తనకి శ్రద్ధ ఉండడంలో ఎవరికైనా ఆశ్చర్యం లేదు. కాని, సుధాకర్ ఇతరుల కవిత్వాల్ని కూడా అంతే ప్రేమగా చదువుకుంటాడు. బహుశా, వొక ఉత్తమ అధ్యాపకుడికి వుండాల్సిన ప్రేమ అది. కాని, అదే ప్రేమ వొక కవికి కూడా వుంటే, ఆ కవి దిగంతం ఎప్పుడూ కొత్తగా వొక హరివిల్లుని పూస్తుంది. ఈ సంపుటిలోని కవితలూ, వాటి ప్రేరణలూ, ప్రభావాలూ గమనిస్తే, సుధాకర్ ఎక్కడెక్కడి నించి పరిగెత్తుకుంటూ వస్తున్నాడా అనిపిస్తుంది. “ప్రేమతో ఆలింగనం చేసుకోడానికి/ సరిహద్దులు అడ్డం కావు” అని వొక కవితలో అన్న వాక్యం సుధాకర్ వ్యక్తిత్వానికి tagline లాంటిదే.

అంటే, వొక కవి తన సమయాన్నీ, సందర్భాన్నీ పునర్నిర్మించుకునే బలాన్ని ఎక్కడి నించి తీసుకుంటాడో చెప్పడం కోసం సుధాకర్ లోని ఈ వ్యక్తిత్వ విశేషాన్ని వివరించాను. ఇలా చెప్తున్నప్పుడు కూడా సుధాకర్ లో వున్న ఆ చరిత్ర కోణమే నేను నొక్కి చెప్తున్నాను. ఆ చరిత్ర కూడా వొక subjective slant వున్న వర్తమాన కోణం. ఇలాంటిది మనకి తెలుగు కవిత్వంలో వొక వరవరరావులోనో, శివసాగర్ లోనో మాత్రమే కనిపిస్తుంది. మనకి తెలిసిన black poets – Langston Hughes, Amiri Baraka లోనూ, మనకి అంతగా తెలియని కాశ్మీరీ దీప కళిక Agha Shahid Ali లోనూ బలంగా కనిపిస్తుంది. వ్యక్తులూ దేశ చరిత్రలూ జాతుల చరిత్రలూ ఎప్పుడూ విడివిడి ద్వీపాలు కావనీ, అవి కలిపి కుట్టిన బొంత దుప్పటి వంటివనీ వీళ్ళ కవిత్వం వల్ల అర్థమవుతుంది. సమకాలీన తెలుగు కవిత్వంలో సుధాకర్ లో ఈ అంతర్జాతీయ ప్రగతిశీల సాహిత్య దృక్కోణ వారసత్వం నెల్లిమర్ల నేల భాషలో localize అవ్వడం ఈ సంపుటిలో చూస్తాం.

కచ్చితంగా ఇదే సమయంలో నేను మన సుధాకర్ లాంటి ఇంకో అమెరికన్ black poet ని చదువుతున్నాను. అతని పేరు Jamaal May. ఇతనూ సుధాకర్ వొకే ఈడు వాళ్ళు అయి వుండాలి. వొకే ఈడులో వున్న కవులూ రచయితలూ ప్రపంచ పటంమీద భిన్న బిందువుల మీద నిలబడి ఏం మాట్లాడుతూ వుంటారా అని మనసు రిక్కించి చదువుతూ వుంటాను. వొకరు నెల్లిమర్లలో యింకొకరు డిట్రాయిట్ యంత్ర నగరిలో! కాని, ఇద్దరి కవిత్వ వాక్యాలూ వొకే రకమైన mechanization ని సవాల్ చేస్తున్నాయి. Jamaal గురించి నాకు ఇష్టమైన మరో కవి Natasha Trethewey అంటోంది: Jamaal has a fine ear, acutely attuned to the sonic textures of everyday experience. ఇవే మాటలు సుధాకర్ కి కూడా చక్కగా వొదుగుతాయి.

వొక కవితలో అతను అంటున్నాడు:

I have come

to stitch all

this torn sky back together.

ఈ పూట సుధాకర్ కవిత్వాన్ని పరిచయం చేయడానికి అంత కంటే ఇంకో మంచి వాక్యం దొరకడం లేదు నాకు! మీలోపలా బయటా చీలిపోతున్న ఆకాశపు పోగులు అతికించి ఈ చలి రాతిరి మీ కోసం వెచ్చని దుప్పటి కుట్టే కవిత్వం ఇదిగో!

  • -అఫ్సర్

ఆస్టిన్,

ఆగస్టు 15, 2014.

 

 

 

 

 

‘అపరిచితం’ చదివాక…నాలుగు మాటలు!

10665717_10202781489839700_1209189682660945809_n

మొదటి పుటలలో కనబడిన స్ఫటికపు వాన రంగు అక్కడే చాలా సేపు ఆపేసింది. 1993 నుంచీ 1999 వరకూ మీరు రాసిన ఏవీ చదవలేని కారణాన, ఆ అబ్బురం. ‘ సమకాలీన సాహిత్యం ‘ నాకు ఆ రోజులలో దగ్గరగా లేదు, ఇప్పటిదాకా పశ్చాత్తాపమూ లేదు.
సగటు పాఠకురాలిగా , ఒక రచన వాస్తవాధారం అని తోచేటప్పుడు – నిజమెంత, కల్పనెంత అని ఎంచే చాపల్యం నాకూ ఉంటుంది. ‘ తేరా నాం ‘ చదివేప్పుడూ ఉండింది, ఆశ్చర్యకరంగా, ఇప్పుడు లేదు. మీ తాండవనృత్యపు పాట కి ఏ చిరుగీతి కారణం అన్నది అప్రధానం అనే తెలివిడి వచ్చింది. :) మీరు అంతగా ఊరించినా ‘ ఆమె ‘ ని వెదికే పని పెట్టుకోలేదు.
అవయవాలు దానం చేయటం పట్లనా మీ అసహనం, దాన్ని ప్రకటించటం పట్లనా ? ‘ సామాజిక స్పృహ ‘ డాగు  అంటని వైయక్తికపు స్వచ్ఛత కి – మరి పనికిరానిదాన్ని తగలబెట్టేయటమే సరైనదనిపిస్తుందా ? ఎలాగ ?
ఎవరెవరో తెలియని మనుషులు, వారిలో తెలుసుకోవలసిన కోణాలు. మీ ఆరాధ్య కవి కి మీరు చెప్పుకోలేనివి, ఆ వైపునుంచి అందుకోలేనివి – ” అట్లా అని పెద్ద బాధా లేదు ” ?
దారి తల ఎత్తునింత సౌందర్యలవము వదలిపోలేదు చంపెడువరకు మిమ్ము !!! ఏమి బాధ పడతారండీ, నా వంటిదానికి చీవాట్లు పెట్టలనిపిస్తుంది, ఆ తర్వాత ఎందుకు పాపం, ఇంత … అని జాలి కానిదేదో.
” ఈ భ్రష్టశాంతిని, బాధామయకాంతిని భరించలేదు కాబట్టే నా అస్తిత్వం వర్షాన్ని నిరాకరించిందేమో ” నాకు తెలిసి ఎవరూ చెప్పని పద్ధతి. నాకొకప్పుడు [బహుశా ఇప్పటికీ ] సంగీతాన్నీ, వెన్నెలనూ అందుకూ భరించే  శక్తి లేదు, నా సాంత్వన వర్షం లో, పుస్తకాలలో.
ఈ రాజ్ బీర్ ఉదంతమంతా , పాయల్ హడావిడి అంతా…వ్యాఖ్య లేదు.
” ఉన్న పడవల్ని ఒక్కొక్కటే ముంచేస్తే ఒడ్డుకు చేర్చేదేది ? ” తెలిసీ ఎందుకిలా ? లేదేమో, మీ నావ భద్రమేనేమో – నా ఆశా, ఆశీస్సూ.
ఒక పసి కూతురు దొరకటమన్న వరాన్ని వైన వైనాలుగా వర్ణించుకున్నది ఆయన కాదనీ మీరేననీ నమ్మకం.
భానుమతి గారి పాట ని దగ్గరగా వినేందుకు కాళ్ళకు అడ్డం వచ్చినవన్నీ తొక్కేసుకుంటూ అడ్డగోలుగా పరుగెట్టి మోకాలి చిప్ప బద్దలు కొట్టుకున్నది…అదీ మీరే.
అయ్యేదీ కాదు, పెట్టేదీ కాదు, ఆ ప్రయత్నం ఉన్నట్లే లేదు, మీ పిచ్చి వరసలూ మీరూనూ. :)
శాకాహారం- అమ్మయ్య !
” జగత్ కల్యాణం అంటే మాదిగాక ఇంకేదనిపించింది ” వాహ్ !
గచ్చకాయ రంగు మస్లిన్ చీర తో మొదలెట్టిన వివరం, మీరు అనుకొనో, అనుకోకో- అచ్చంగా చండీదాస్ ది నాకు. [లేకపోతే మస్లిన్ చీరలు ఇప్పుడెవరు కడతారు, కట్టినా ఆ పేరుతో ఎవరు పిలుస్తారు ? ] టేకు మాను రంగు పూలు…:) టేకు పూలకీ ఒక వింతైన రంగు ఉంటుందని ఈ మధ్యే చూశాను.  మా అమ్మాయికి ఆ వాక్యాలు చదివి వినిపించాను. చివరి వాక్యం మటుకు అచ్చంగా మీ సృష్టే… ” చెస్ట్ నట్స్ ని రెండుగా చీల్చిన పావుకోళ్ళు ” – కళ్ళముందు కనబడిన కందిన పాదాలు.
అవును -బావుంది, ఆమె ప్రేమలో పడినప్పుడు.
చలం గారు వెతుక్కున్న ఐడియల్ షీ ఎక్కడా ఉండదని, ఉండనక్కర్లేదని, అర్థమైపోతే బావుండును. లత  గారు వంశీమోహనుడి గురించి వెతుక్కున్నారు, ఈ ప్లేన్ లో కాదు దొరికేది. అందుకు అశాంతి పడరాదు, పోగు చేసిన కాసినిపూలతో చిన్న ఇల్లు కట్టుకోగలిగితే, ఈ జన్మకి , చాలు.
తండ్రి పోయిన బాధ…ఒక్కతే కూతురికి, ఎంతో- తెలుసు అని చెప్పటం ఇష్టం కానంత పవిత్రం నాకు.
ఏమంత వయసు మీరింది మహా ప్రభో , పింకీ ని ఆ స్థితిలో ఊహించుకుందుకు, తానెంత నొచ్చుకొని ఉండాలి ఆ రాత చదివి. లేదా ? ఈ ఉన్మత్త పితృపాదులు వాళ్ళిద్దరినీ షాక్ చేయటం మానేశారా ? అయితే మంచిదే.
” అస్థిసంచయనమంటే …” ఇక నా వల్ల కాదు. ఏమరుపాటుగా చదివిన పాపానికి ఆయన మాటలు నిద్ర లో కూడా వీడవు ” అంతె, పేరునకంతె …” – ఒద్దు. ఇంకనీయను.
ఈ వేదనలేవీ తాకని లోలోపలి ఆనందంతో తృప్తితో మీ   ముగ్గురు ‘ ష ‘ లతో నూరేళ్ళు వర్ధిల్లండి.

 

Published by Facebook Friends & Folks.

for copies- All leading book stores.

బాలసుధాకర్ మౌళి: ఉత్తరాంధ్ర నుంచి ఒక కొత్త కవిత్వ కెరటం!

siva_reddy

I write in grief.
Do the Rivers overflow
No, Only my cheeks are moist.
I write in anger.
Do the volcanoes explode
No, Only My eyes grow red.

I write in love.
Birds roost on my shoulders.
Trees bend with flowers and fruits.
Warring Men hug each other
Language reveals its bottom
Like a crystal stream
&
Scream, from the Cross. ”

– K.Satchidanandan

నేటి కాలానికి ఒక్కడు దొరికాడు ; అమితమయిన జ్ఞాన దాహంతోతపించిపోయేవాడు ; మహా కవిత్వ ప్రేమికుడు ; కవిత్వాన్ని జీవనవిధానంచేసుకునే సూచనలు పుష్కలంగా ఉన్నవాడు ; ఏదో వ్యాసం చదివేటప్పుడు తారసపడిన ‘పుస్తకం పేరును’ బట్టి ; ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో, సంపాయించిచదివిందాకా నిద్రపోనివాడు ; తిలక్ అన్నట్టు కలల పట్టుకుచ్చులు ధరించితిరిగేవాడు – ఒక కవిత్వ తమకంతో, మోహంతో, తనివితీరని తనంతో నిత్యాన్వేషణలో ఉన్నవాడు – తేనె నిండుగా ఉండి, జవజవలాడుతున్న తేనెతుట్టెలాంటివాడు -‘వీడు కవిగదా, కనలిపోయే వాడి కళ్ళు చూడండి – సమస్త జ్ఞానాన్నిపుడిసిలిబట్టాలనే ఆరాటం కనబడుతుంది. నడుస్తున్న కవితలా కనపడేవాడు – వాడు బాలసుధాకర్ మౌళి అనే ఉత్తరాంధ్ర నెల్లిమర్ల కవి.

దుర్భిణి వేసి గాలిస్తూ వుంటా ; అరచేతిలో అంజన రాసుకునివెదుకుతూ వుంటా – ఒక స్వాప్నికుణ్ణి ; ఒక గొప్ప సృజనశీలిని ; గతవర్తమానభవిష్యత్తుల మధ్య వారధి నిర్మించే వాణ్ణి కనుగొంటానికి – వాడి కలల కన్నుల్లోకి తొంగిచూడటానికి – నేటి కాలానికి ఒక పోరాటశీలి ; పోరాటచైతన్యాన్నే కవిత్వంఅంతర్వాహిని చేసుకున్నవాడు – ఒక ప్రాంతపు భౌగోళిక, నైసర్గికప్రాణవీచికల్ని అందుకునేవాడు – కవిత్వం తర్వాతే వేరే ఏదయినా అనిఅనుకునేవాడు – బాలసుధాకర్ మౌళి అనే అతను సమస్త ఉత్తరాంధ్రాపోరాటశీలాన్ని, చైతన్యాన్ని తన రక్తంలో నింపుకుని కదలటానికి సిద్ధపడినవాడు ; కవిత్వం వినా ‘ఏమీ లేనట్టుండేవాడు’ ; కవిత్వాన్ని ఆవాహనచేసుకుని ‘శివాలూగిపోయేవాడు’ – గణాచారిలా శరీరం మొత్తాన్ని కవితలాసంచలింపచేయదల్చుకున్నవాడు – వస్తువు అన్వేషణతో పాటు – రూప అన్వేషణచేసేవాడు – కవిత్వ శర సంధానం చేయటానికి సిద్ధపడ్డవాడు – నిర్దిష్ట సమస్యలఆవశ్యకతని, ప్రాంతాల వేదనల్ని గమనంలో ఉంచుకుని మూలాల్ని మరవకుండాసమస్తాన్ని కౌగిలించుకుంటానికి సిద్ధపడినవాడు –

బహుశ రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ఒక పోరాటప్రాంతంగా మారబోతోంది.ఇక గొప్ప సృజన ఉత్తరాంధ్ర నుంచే జరగబోతుందనిపిస్తుంది. ఇక అన్నింటికిఉత్తరాంధ్ర కేంద్రమౌతుంది. ఉత్తరాంధ్రకి యుద్ధవిద్యలు కొత్తగాదు – నక్జల్ బరీ నేపధ్యం నుంచి వళ్ళు విరిచి లేచి నిలబడిన చరిత్ర దానిది. ఇక ఉత్తరాంధ్రకేంధ్రంగా సమస్త దోపిడీలు జరగబోతున్నాయి. ఆ ఛాయలుఇప్పుడే కనబడుతున్నాయి. గత చరిత్రని, పోరాట చరిత్రని వర్తమానం చేయటానికి ఒక తరంసిద్ధమయ్యింది. అరణ్యానికి, ఆరుబయలుకు ఒక అనుసంధానమేర్పడింది. అరణ్యంమైదానంలో ప్రతిఫలిస్తూ, ప్రతిధ్వనిస్తుంది.

ఆ ప్రతిఫలనాల్ని, ప్రతిధ్వనుల్ని అందుకునే ఒక తరంముందుకొచ్చింది. వాళ్ళలో చాలా స్పష్పంగా, చేవదేరిన కర్రలా కనబడేవాడుసుధాకర్ మౌళి. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బలిష్టంగానూ, పరిష్థంగానూ ఉన్నాడు. కవిత్వం కర్రసాము బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నవాడు –

ఉత్తరాంధ్రా నుంచి వచ్చిన తొలితరం, మలితరం సృజనశీలుల్ని పక్కనబెడితే కొత్తగా ముప్పై యేళ్ళు నిండీ, నిండక నలభైల్లో ప్రవేశించిన, ప్రవేశిస్తున్న ఒక తరం – గొప్ప ఆశను వాగ్దానం చేస్తుంది –

సిరికి స్వామినాయుడు, పాయల మురళీకృష్ణ, మొయిద శ్రీనివాసరావు, మానాపురం చంద్రశేఖర్, చింతా అప్పల్నాయుడు, రెడ్డి శంకర్రావు, మల్లిపురంజగదీష్, అరుణ్ బవేరా యిత్యాదులు. నేను గమనించని యింకా యితర promising poets ఉండవచ్చు. వీళ్ళందరికీ ఒక రకంగా కవిత్వంలో గురుతుల్యులు గంటేడగౌరునాయుడు, కథా రచయితలకి అప్పల్నాయుడు ; అంతకు ముందు తరం రచయితల్ని, కథకుల్ని ఈ తరం చాలా స్పష్టంగానే సొంతం చేసుకుంది. వాళ్ళిచ్చినవారసత్వాన్ని అంది పుచ్చుకుంది. వీళ్ళందరూ దగ్గర దగ్గర సమవయస్కులయినా- ఐదారేళ్ళు తేడా ఉన్నా -ఒక సందిగ్ధ సమర సందర్భంలో జీవిస్తున్నారు. గొప్ప ఆశనురేకెత్తిస్తున్నారు. ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి శైలి వారిదే – ఎవరిజీవన దృక్పధం, తాత్వికతా వారిదే. అయితే వీళ్ళందరిలో ఒక సమాన లక్షణం -సామాన్య గుణం – వర్తమానాన్ని, వర్తమానంలో జరుగుతున్న మార్పుల్ని, సంక్షోభాల్ని, సంక్లిష్టతల్ని సొంతం చేసుకుని – దాని గర్భం నుంచి పలకటం – ఉత్తరాంధ్ర సాహిత్యానికి ఒక్కొక్కళ్ళు, వారిదయిన ఒక అంశాన్ని -ప్రత్యేకతని అందించారు.

వీళ్ళందరూ ఒక సమస్యని, ఒక క్లిష్ట సందర్భాన్ని కథ చేయటమెలా, కవిత్వం చేయటమెలా – అనే ఒక అన్వేషణ కొనసాగిస్తున్నవాళ్ళు.. సమస్యలుజీవితాలవుతాయి. జీవితాలు, ప్రాంతమంతటా సమాజమంతటా పరుచుకుంటాయి. అది కథ గానీ, కవిత గానీ, ఒక suggestion ద్వారా కళ చేయటమెలానోతెలుసుకునే ప్రయత్నంలో ఆరాటంలో ఉన్నారు. యితరుల రచనల్నివిశ్లేషణాపూర్వకంగా, నేర్చుకునే దృష్టితో చదువుతున్నవాళ్ళు. సిరికి స్వామినాయుడిది ఒక పద్ధతి, పాయల మురళిది ఒక పద్ధతి -మొయిద శ్రీనివాసరావు, మానాపురంలది మరో పద్ధతి ; కొంచెం పెద్దవాడయినాఅరుణ్ బవేరాది మరో ప్రత్యేకమయిన పద్ధతి. వీళ్ళందరూ – ఎవరికి వారుగా – ఒక వర్తమానంలో జీవిస్తున్నా – ఒక వాతావరణంలో సమాజచలనాల్ని, సక్షోభాల్నిఅనుభవిస్తున్నా – కవిత్వం చేసేటప్పుడో ; కథ చేసేటప్పుడో – ఎవరికి వారుప్రత్యేకంగా వారిదయిన ప్రత్యేక వ్యక్తిత్వంతో – సాహిత్య వ్యక్తిత్వంతో దర్శనమిస్తారు. వీళ్ళ వెనుక – వీళ్ళని ప్రభావితం చేసే వ్యక్తులుండొచ్చు, సంస్థలుండొచ్చు – కానీ ఒక సమూహపు చేతనని అందుకునే విషయంలో వీరందరూ ఒకటే – ఉత్తరోత్తరా, తర్వాత కాలంలో ఎవరేమవుతారు, ఎవరు ఆగిపోతారు, ఎవరుప్రయాణం కొనసాగిస్తారు – అనేది వారి వారి అంకితభావం మీదా, సాహిత్య మగ్నతమీదా, అన్నింటినీ సమన్వయం చేసుకుని సాగిపోయే లక్ష్యం మీద ఆధారపడివుంటుంది. అయితే వీళ్ళందరిలో గొప్ప కవులుకాగల, కథకులు కాగల మూలదినుసులున్నాయి – కాంక్షలున్నాయి.

సమాజాన్ని – దాని చలనాల్తో, దానివైరుధ్యాలతో, దాని గతితర్కపు పురోగమనంతో – తమలోకి పీల్చుకునే శక్తి మీదఆధారపడి వుంటుంది వీరి ఎదుగుదల – వైరుధ్యాలమయమయిన జీవితాన్ని, సమాజాన్ని అర్థం చేసుకుంటూ, ఆత్మగతం చేసుకుంటూ – అధ్యయనం చేసుకుంటూ సృజన నిర్మాణంజరగాలి.
ఈ కొత్తతరం కవుల్లో, ఎవరి ప్రత్యేకత వారిదయినా, ఎవరిదయిన స్వరంవారిదయినా – బాలసుధాకర్ మౌళి గొంతు మరీ భిన్నమయింది. అతనికున్న మగ్నత, నిబద్ధతని బట్టి – ఒక తీవ్రతని, ఒక విసురును అతని భాష అందుకుంది. అతనికవిత్వమంతటా ‘అడవి’ ఒక Metaphor లా పరుచుకుని వుంటుంది. అదెంతగా అంటే అదేఅతని లోపలిస్వరం అన్నంతగా – అడవి బిడ్డల పోరాటాలు – అడవిని ఆక్రమించిదాని సంపదను, ఖనిజాల్ని దోచుకుపోయే పెట్టుబడిదారులు – వారికి భారతప్రభుత్వం వత్తాసు – అడవి ప్రశాంత జీవితం చిందరవందరగావటం – వాళ్ళ పోరాటాలు – యివన్నీ మైదాన ప్రాంతపు జీవితాన్ని తాకినయి –
అరణ్యం – దాని పోరాటాలు మైదానంలోకి చొచ్చుకొచ్చినయి – బహుసునిశితజీవి అయిన కవి ; అమోఘమయిన స్పందనాశీలం కలిగిన కవి ; విచలితుడయి -‘చర్య – ప్రతిచర్యల మధ్య’ జీవిస్తూ – కవిత్వ సృజన చేస్తున్నాడు.

Layout 1

” బాసగూడ
గాయపడ్డ ఆదివాసీ ఆత్మస్థైర్యం
అడవి గుండెలపై పగిలిన నెత్తుటి కడవ
రాజ్యం రాకాసి వేటకి
బలైన
పుట్టెడు పిల్లల తల్లి
నా దేశంలో ఏ గిరిజన గుమ్మాన్నడిగినా
చెబుతుంది –
వర్తమాన చరిత్ర ఎంత రక్తసిక్తవర్ణమో ”

‘మనిషి అరణ్యం’ అనే కవితలో –
” మనిషి లోపల అరణ్యం విస్తరిస్తుంటుంది
అరణ్య సౌందర్యాలూ విస్తరిస్తుంటాయి
ఈ నేల మీద వొకేవొక్క అరణ్య కళాత్మక సౌందర్యజీవి
మనిషి మాత్రమే
మనిషి అరణ్యం
అరణ్యం మనిషి
దేశమేదయినా సరే
మనిషి అరణ్యాన్ని ఆలంబనగా చేసుకున్నాడు
అరణ్యం ఒడిలో నుంచే ఆయుధంగా మొలకెత్తాడు
మనిషి గొప్ప తిరుగుబాటు యోధుడు
మనిషి యుద్ధానికి కేంద్రబిందువు మనిషే
మనిషి యుద్ధమూ మనిషిపైనే
అరణ్యం నుంచి దూరమయిన మనిషి ఓడిపోతాడు
అరణ్యాన్ని ధరించిన మనిషే గెలుస్తాడు ”

‘ ఎగరాల్సిన సమయం ‘ ఈ కవితా సంపుటికి శీర్షికయిన కవితలో –
” అరణ్యం
వొక అలజడిని
వొక యుద్ధాన్ని పరమధైర్యంగా ప్రేమిస్తుంటుంది
నువ్వొచ్చావని తెలియగానే
నిన్నూ ప్రేమించడం మొదలుపెడుతుంది
అరణ్యం
నీకొక గమ్యం
నీ ఊపిరి

నీక్కావలసింది
అరణ్యం కదా
వెళ్ళు
అరణ్యానికి నీ చేతులను ఇవ్వు
అరణ్యానికి నీ కళ్ళని ఇవ్వు
అరణ్యానికి
నీ అణువణువునూ సమర్పించు
నువ్వెళ్ళే నీ అరణ్యానికి దారి
నీ లోపలి నుంచే మొదలు ” –

‘అరణ్య స్వప్నం’ అనే ఒకపాటి దీర్ఘకవిత వుంది. ‘అరణ్యం’ మీద చిన్నకావ్యమది.

‘ ఒక వసంతకాలపు సాయంత్రాన
అడవి లోగిళ్ళలోనున్న చెట్టు
పురుడోసుకుంది
వొక ఎర్రని స్వప్నాన్ని కనింది ‘

.. అని మొదలై – ఏడు భాగాలుగా సాగి – అరణ్యపు యుద్ధాన్ని, నెత్తుటి మడుగుల్ని, త్యాగాల్ని ; ఎదురుకాల్పుల్ని వర్ణిస్తూ సాగి..

‘తూరుపు కనుమల శ్రామిక మెదళ్ళలో
స్వప్నం పువ్వై విచ్చుకుంది
సికాకుళమై
జగిత్యాలై
దండకారణ్యం గుండె తారై
అడవి అడవంతా
ఎర్రదళమై పరుచుకుంది ‘ –

.. చరిత్రనంతా చెప్పుకుంటూ..
‘ యుద్ధం మొదలయ్యింది
రక్తం, రక్తం
అడవంతా ఏరులై పారిన రక్తం
వీరుల త్యాగాల రక్తం
కెరటాలు కెరటాలుగా పోటెత్తుతున్న రక్తం ‘

‘ కొన్ని పక్షులు మాత్రం
చెట్టు స్వప్నాన్ని నిజం చేస్తూ
ఇప్పటికీ యుద్ధం కొనసాగిస్తూనే వున్నాయి ‘

ముక్తాయింపుగా –
‘ మైదానం
అడవివైపు చూడాల్సిన
సమయమాసన్నమయింది ‘

***

‘ బాసగూడ, సోంపేట, కోటిపాం, పరవాడ, లక్షింపేట ‘ లాంటి కవితలు ; ‘ తీహార్ మరకలు, గాజాకు నా రక్తలేఖ, నిర్బంధం నుంచి ఆ కళ్ళు, ఛావెజ్ కవితలురెండు ‘ లాంటి కవితలు – ఏం చెబుతాయి. బాలసుధాకర్ మౌళి ఒక రకంగా ఉద్యమకవి. పోరాటశీలాన్ని దట్టించే కవి. పోరాటాలు – ఏ దేశంలో జరిగినా తనూ కదిలివాటికి వత్తాసు పలికి ; స్ఫూర్తి పొంది – కవిత్వంగా మొలకెత్తుతాడు -యితడు ప్రజాపక్షవాది. ప్రజా పోరాటాలకు గొంతునమర్చేవాడు.
డెబ్భై ఐదు కవితలున్న ఈ కవితా సంపుటి చదివాక – గుండెల్నిండుగాకొత్త గాలి పీల్చుకున్నట్టు – ఒక ధైర్యపు వచనమేదో మనల్ని తాకుతున్నట్టు -ఒక జ్వాలగా మన ముందు ఒకడు నడచి వెడుతుంటే వాడి వెనక మనం నడుస్తున్నట్టు – ఎంత ఉద్వేగభరితమయిన కవిత – ఎంత మృదువైన కవిత్వం – ఎంత
స్వయంచాలిత కవిత్వం –

‘ కర్ఫ్యూ రాత్రిలో ‘ అనే కవితలో..

” పసిపిల్లలు నిద్రలోనూ ఉలిక్కిపడుతున్న
వ్యవస్థ నడుస్తున్నంత కాలం
నిజంగానే
ప్రతి ఒక్కరూ ఎవరికి వారు
వొక్కో ఉయ్యాల కట్టుకోవాలేమో ”

” కల్లోల దేశాన్ని
కవిత్వం చేస్తున్నప్పుడు
కవిత్వం పసిపిల్లలా వుండాలనుకోవడంలో
తప్పేముంది ;
పసిపిల్లలాంటి నిర్మలమయిన నిర్భయమయిన
పద్యాన్ని సృజించే వరకూ
రాత్రుళ్ళు యిలానే ” – మరో పద్యం ఇలా ముగుస్తుంది.

‘చంపావతి’ని చూసి దుఃఖంతో రాసిన ‘నదిపాట’ గానీ, ‘అలలచేతివేళ్ళతో’ పద్యం గానీ, ‘నగ్నపాదాల కన్నీళ్ళదే రంగు ?’, ‘గాయపడ్డప్రాంతం మీద’, ‘చీకటి రంగు’ లాంటి ఏ కవితని తీసుకున్నా – ముఖ్యంగా’దొప్ప’, ‘యిప్పటికీ’, ‘నువ్వింకా అక్కడే – ఆ దూరం నుంచే’ లాంటి కవితలుతీసుకున్నా బాలసుధాకర్ మౌళి – వస్తువును – కవిత్వం – చేసే నైపుణ్యం ఏమిటోఅర్థమౌతుంది. మహా మృదువుగానూ, వడుపుగానూ, లాఘవంగానూ, తీవ్రంగానూ – కవితని conceive చేయగలడు. ఎత్తుగడ నుంచి ముగింపు దాకా – కవిత నడిపే తీరు అతనిపనితనాన్ని, రూపశ్రద్ధనీ చూయిస్తుంది.

‘యిప్పటికీ’, ‘నువ్వింకా అక్కడే – ఆ దూరం నుంచే’ లాంటి కవితలపద్య నిర్వహణ ఆశ్చర్యం గొలుపుతుంది. ‘గూడు’, ‘దొప్ప’ లాంటి కవితలు కూడాయిదే రుజువుచేస్తాయి. Object ముడిసరుకు అందాం ; Content వస్తువందాం గావటానికి. తద్వారా అద్భుతమయిన కవిత గావటానికి – కవి Perception – ప్రాపంచిక దృక్పధమందామా – ప్రధాన పాత్ర వహిస్తుంది. పాఠకుడి మీద ఒక ముద్రవేసేది, అతని చూపు mould చేసేది యిదేననుకుంటా – ఆ perception – ఆపోరాటతత్వం – ఆ ఎడతెగని ఆకాంక్ష సుధాకర్ మౌళిలో పుష్కలంగా వున్నాయి.

కవిని రక్షించేది అతని బతుకు – అతను నిజంగా బతికుంటే అతనిలోనికవి బతుకుతాడు – చుట్టూ వున్న దుర్మార్గమయిన హింసోన్మాదమయినరాజకీయవ్యవస్థ మనిషిని హతమార్చటానికి పనికొస్తుంది. వీటన్నింటి మధ్య – సంకులసమరం మధ్య కవి కవిగా మనగలగాలి – తన్ను తనే బతికించుకోవాలి, నిలబెట్టుకోవాలి. పున:పున: సృజించుకోవాలి ; శోధించుకోవాలి – సమస్తాన్నిజీర్ణించుకుని ‘కవి ఫీనిక్స్’ లేవాలి.

*

ఇది బాలసుధాకర్ మౌళి – తొలి కవితా సంపుటి.

ఇందులోని కవితలన్నీమూడు నాలుగేళ్ళలో రాసినవే. చాలా తాజాగానూ, ఉద్వేగభరితంగానూ ఉన్నాయి.అయితే కొన్ని కవితలు కావాల్సిన దాని కంటే ఎక్కువవిస్తరించాయేమోనన్పించింది. కవితని దానంతట దాన్నే ముగియనివ్వాలి.యిలాంటివన్నీ అధ్యయనంలోనూ, సాధనలోనో అనుభవపూర్వకంగా తెలుస్తాయి.నేర్చుకోవటమనేది జీవితాంతం చేసేది. ఒక కవితకి ఒక కోణంగాక అనేకకోణాలుంటాయి. ఏ కోణం నుంచి ఎత్తుకుంటే మంచి కవితగా రూపుదిద్దుకుంటుందోగమనించాలి – తొందరపాటు పనికి రాదు.; మాగనివ్వండి ; మాగితే వస్తువుమధురఫలపు సువాసన వీస్తుంది.

ఇతర కవుల కవిత్వం నుంచి నేర్చుకోవాల్సిందిదే.
తన్ను తాను repeat చేసుకోగూడదు. Monotony రాకుండా చూసుకోవాలి.
యిదొక దీర్ఘకాలిక యుద్ధం.

యుద్ధరంగంలో వున్న బాలసుధాకర్ మౌళికి అభినందనలు –

-శివారెడ్డి

invite bala

చరిత్రకి దర్పణం “కొల్లేటి జాడలు”

kolletiకొల్లేరు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొల్లేటి సమస్య మెడకి చుట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో నివసించేవారికి “కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించి.. మిగిలిన భూముల్లో మీకే పట్టాలు ఇస్తాం” అని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయ్యేలా ఉంది.

ఎందుకంటే… కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సుప్రీం కోర్టు నుంచి రాష్ట్ర పెద్దలకు నోటీసులు అందాయి. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే సావధానంగా ఆలోచిస్తే, చిత్తశుద్ధి ఉంటే ఎంచక్కా దొరుకుతుంది. కానీ అంత ఓపిక, తీరిక, సహనం పాలకులకు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూస్తే అక్కినేని కుటుంబరావు తాజా నవల “కొల్లేటి జాడలు”కి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నవల గురించి మాట్లాడుకోవడం సందర్భోచితం కూడా..!

ప్రకృతిని నమ్ముకుంటే మనిషికి మనుగడ సమస్య రాదు. కానీ, అదే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే, విధ్వంస పోకడలతో పర్యావరణాన్ని నాశనం చేస్తే మాత్రం కష్టాలు తప్పవు. అక్కినేని కుటుంబరావు “కొల్లేటి జాడలు” నవల సారాంశం ఇదే. పైకి సింపుల్‌గా అనిపిస్తున్న ఈ విషయాన్ని అర్థంచేయించడం అంత తేలిక కాదు. క్లిష్టమైన ఈ కసరత్తుని సునాయాసంగా చేస్తూ పాఠకులకు ఈ ఎరుక కలిగించగలిగారు రచయిత.

ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉన్న ఆ సరస్సు చుట్టూ వందలాది లంక గ్రామాలు.. అందులో నివసించే లక్షలాది ప్రజలు.. ఇదీ కొల్లేటి సరస్సు నిజ స్వరూపం! మరి, ఆరు దశాబ్దాల క్రితపు రోజుల్లో కొల్లేరు ఎలా ఉండేది..? అక్కడి జీవకళ ఏ తీరుగా ఉట్టిపడేది..? లంకగ్రామాల ప్రజలు ఎలా బతికారు..? వారి వృత్తులు, జీవనాధారాలు ఏమిటి? కొల్లేటితో, అక్కడి ప్రజలు ఎలాంటి సాంగత్యం కలిగి ఉండేవారు? ఆ జీవనచిత్రం ఇచ్చిన సందేశం ఏమిటి..? అన్న విషయాలు విపులంగా తెలుసుకోవాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొల్లేటి జాడలు నవల చదువుకోవడం ఉత్తమం. ఈ నవల చదువుతున్నంతసేపు పాఠకులు కొల్లేటి యాత్ర చేస్తారు. అక్కడి గతంలోకి జారుకుంటారు. తలమున్కలవుతారు. నవల ముగిసే సరికి చిక్కిశల్యమవుతున్న కొల్లేటి సరస్సు వర్తమానస్థితిని తలుచుకుని నిట్టూర్పు విడుస్తారు. ఇదీ ఈ నవల ద్వారా అక్కినేని కుటుంబరావు సాధించిన పరమార్థం.

akkineni kutumba rao

శ్రీనివాసరావు, రాధాకృష్ణలనే రెండు పాత్రల ద్వారా పాఠకులను కొల్లేటి తీరంలోకి ప్రవేశపెడతారు కుటుంబరావు. వారిద్దరూ అరవయ్యేళ్లు పైబడినవారు. చిన్నప్పుడు అక్కడి లంకల్లో పెరిగి పెద్దయి వేరే ప్రాంతాలలో స్థిరపడిన వారిద్దరూ తిరిగి కొల్లేటి ఒడ్డును దర్శించుకుని… అక్కడి పరిస్థితిని చూసి చిన్నబోతారు… బాధపడతారు. తమ బాల్యస్మృతులలోకి జారుకుంటారు. ఆ స్పందనల పరంపరే ఆసాంతం నవలలో ప్రతిఫలిస్తుంది.. ఒక్కసారి ఆ లోకంలోకి ప్రవేశించాక.. ఒక తేరుకోవడం సులువు కాదు. సహజసిద్ధమైన పరవళ్లతో అలరించే కొల్లేరు… అందులోని జీవరాశి…అక్కడి జీవన సరాగాలు… వలస పక్షుల గానాలు.. కొల్లేటి లంకల్లోని బతుకు లయలు నిలువెల్లా అల్లుకుపోతాయి. ఎంతగా ఈ నవల మనల్ని సంలీనం చేసుకుంటుందంటే.. చదువుతున్నంత సేపు కొల్లేటి తరంగాలు మనసు నిండా ముసురుకుంటాయి.

శ్రీనివాసరావు, రాధాకృష్ణలతో మొదలైన ఈ కథలో తర్వాత్తర్వాత పదులకొలదీ పాత్రలు పలుకరిస్తాయి. వాటి ద్వారా వందలాది తలపోతలు సంగమిస్తాయి.  అందులో కులమతాల రంగులంటాయి. కలుపుగోరు కబుర్లుంటాయి. వెలివేతల గాయాలుంటాయి. ఊరుమ్మడి కథలుంటాయి. అమాయక పిల్లల ఆటపాటలుంటాయి. పెత్తనాలు చేసే పెత్తందారులు, ఔదార్యం చూపే పెద్దమనుషులు ఉంటారు. కష్టాలు ఇష్టాల కలనేతగా వారి బతుకులు సాగిపోతుంటాయి. ఇలా రకరకాల పాయలుగా ఉన్నవారికి, భిన్న సమూహాలుగా ఉన్నవారికి సాగరాన్ని తలపించే కొల్లేరే పెన్నిధి. అదే వారి భుక్తికి ఆధారం. అక్కడే పంటలు పండిస్తారు. అక్కడే చేపలు పడతారు. అక్కడ మేత మేసి పశువులు జీవిస్తాయి. సాగినంతకాలం ఆ చల్లని తల్లిని నమ్ముకుని సుఖంగా, సంతుష్టిగా బతికేస్తారు. సాధరణ రోజుల్లో ఇదీ కొల్లేటి వాసుల ఆనాటి బతుకు చిత్రం.

అబ్బు! ఎంత హాయో కదా ఇలాంటి జీవితం అనుకుని సంబరపడకనక్కర లేదు. ఎందుకంటే… అప్పుడప్పుడూ కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తుంది. వానలు, వరదలు ముంచుకొచ్చి… కొల్లేటి లంకలు జలదిగ్బంధానికి గురవుతాయి. అలాంటి సమయంలో అక్కడి ప్రజల కడగండ్లు చెప్పతరం కాదు. చేతికి అంది వస్తుందనుకున్న పంటని కొల్లేరు తన గర్భంలో కలిపేసుకుంటుంది. ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. బతుకు తెరువుకి భరోసా దొరకదు. అయినా సరే కొల్లేటి వాసులు నిబ్బరం కోల్పోరు. ఆ విపత్తు తగ్గుముఖం పట్టగానే ఆ కొల్లేటి తల్లికి ఓ దండం పెట్టి మళ్లీ దైనందిన జీవితంలోకి అడుగుపెడతారు. ఇదీ సాధారణంగా అక్కడి ప్రజల అనుభవంలో మరో పార్వ్శం.

మనిషి ప్రకృతిశక్తి ఎదుర్కొంటూ సహజీవనం చేసే అద్భుత సాహస కృత్యమే కొల్లేటి లంకల్లోని జీవితమని ఈ నవల ద్వారా చెప్పుకొచ్చారు అక్కినేని కుటుంబరావు. ఇచ్చే శక్తితోపాటు తీసుకునే శక్తి కూడా ఒక సహజ వనరుకి ఉంటుందన్న ప్రకృతి ధర్మాన్ని సుబోధకంగా తెలియజేశారు. ఈ సహజ సూత్రంలో ఎక్కడ సమతౌల్యం లోపించినా అది మొదట ప్రకృతి మీద… ఆ తర్వాత మనిషి మనుగడ మీద ప్రభావం చూపుతుంది. ఈ చారిత్రక దృక్పథం లోపించిన స్వార్థపర శక్తుల చర్యలు కొల్లేటి జీవలయని ఎలా ధ్వంసం చేస్తూవచ్చాయో ఈ నవల చివరి అంకంలో ఆవిష్కరించారు రచయిత. తొలినాళ్లలో తమకు ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరునే నమ్ముకుని బతుకు తెరువు సాగించారు అక్కడి లంకగ్రామాల ప్రజలు. అయితే అదంతా గతం. ప్రస్తుత పరిస్థితి వేరు. వర్తమాన సందర్భంలో మనుషులకి నిగ్రహం లేదు.

సొంత లాభం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చెట్టూ పుట్టా చెరువులు సరస్సులు అనే విచక్షణ లేకుండా ధ్వంసం చేస్తున్నారు. వ్యాపార, లాభాపేక్షల కోసం పచ్చని కొల్లేటిలో చేపల చెరువుల పేరిట చిచ్చుపెట్టారు. సహజ మత్స్య సంపదకి నిలయమైన కొల్లేటి ఒడ్డునే చెరువులు తవ్వి… చేపల పెంపకం చేపట్టడం అనే వికృత చర్యలను ఏమనాలి చెప్పండి..? ఏది జరగకూడదో అదే జరిగింది. చేపల అధిక దిగుబడుల కోసం మందులు- మాకులు వాడి నీటిని కలుషితం చేశారు. సహజ మంచినీటి సరస్సు అయిన కొల్లేటికే చేటు తెచ్చారు. ఈ విపరిణామానికి తోడు మరోవైపు కొల్లేటి అభయారణ్యం చాలా మేరకు ఆక్రమణలకు గురైంది. ఫలితంగా సరస్సు పరిధి కుంచించుకుపోయింది. ఈ మొత్తం పరిస్థితికి కొల్లేటి జాడలు నవల అద్దంపట్టింది. ఇక ప్రస్తుతంలోకి వస్తే ఇప్పుడు కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించి.. ఆక్రమణలకు గురైన ప్రాంతంలో ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌ స్థానికుల నుంచి వినిపిస్తోంది. రాజకీయలబ్ది కోసం కొందరు నాయకులు ఆ డిమాండ్‌ని సమర్థించడంతో సమస్య మరీ జటిలంగా మారింది. ఇదీ ప్రస్తుతం కొల్లేటి తాజా చిక్కుముడి.

ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కొంత కష్టమే కావచ్చు కానీ… అక్కినేని కుటుంబరావు తన నవలలో ఓ ప్రతిపాదన చేశారు. ప్రకృతి ప్రసాదితమైన కొల్లేరుకి ఏ హాని కలుగకుండానే… దానిపై ఆధారపడి ఎలా బతకవచ్చునో వివరించారు. అట్లూరి పిచ్చేశ్వరరావు పాత్ర ద్వారా చెప్పించిన అంశం అదే. కొల్లేటిలో సమష్టి వ్యవసాయం చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునన్నదే ఆ ప్రతిపాదన. నిజంగా జరిగిందో…. కల్పనో తెలీదు కానీ…అది నిజంగానే కొల్లేటి కాపురాలను నిలబెట్టగలిగే గొప్ప ఆలోచన.

దానికి అధికారికమైన ఒక కట్టడి లేకపోబట్టి… కొనసాగలేదేమో అనిపించేలా నవలలో ఆ ప్రయోగం ముగిసింది. కానీ ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుని చూస్తే కొల్లేటి సమస్యని తీర్చగలిగే ఉపాయం మాత్రం తప్పక దొరుకుతుందని ఈ నవల ద్వారా అక్కినేని కుటుంబరావు సూచించారు. అంటే అదే తరహా ప్రయోగం ఇప్పుడు చేపట్టమని అర్థం కాదు. ఉభయ కుశలోపరిగా ఉండే ఆలోచన చేస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందన్నదే రచయిత ఉద్దేశం కావచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. అక్కినేని కుటుంబరావు రాసిన కొల్లేటి జాడలు నవల… ఆ ప్రక్రియా పరిధిని అధిగమించి ఒక హిస్టారికల్‌ డాక్యుమెంట్‌గా కూడా కనిపిస్తోంది.

(నవల: కొల్లేటి జాడలు
రచయిత: అక్కినేని కుటుంబరావు
వెల: 100 రూపాయలు
నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, కినిగె
పుస్తకాల షాపులలో ప్రతులు లభిస్తాయి)

– ఒమ్మి రమేష్‌బాబు

 

నిశ్శబ్దంపై యుద్ధం ఈ “ఆశాదీపం”!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

ఇది ప్రపంచ ఆరోగ్య అవగాహనలో నవకేతనం !
దేశ వైద్య చరిత్రలోనే అపూర్వం !
ఆరోగ్య రంగాల్లోనే ప్రథమం !
అంతేకాదు, తెలుగు సాహితీ ప్రస్థానంలోనే ఓ మహాప్రయోగం !!!
బహుశా భారతీయ సాహిత్య యాత్రలోనే నవ్య గమనం !!!

“ఆశాదీపం” కథల సంపుటి ముందుమాటలోని  సి. పార్ధసారధి గారన్న పై  మాటలు అక్షర సత్యం.  ప్రపంచ భూతం, మహమ్మారి అంటూ వణికిపోయే HIV/AIDS పై 59 మంది రచయిత్రుల అక్షర దీపాలు వెలిగించడం సామాన్య విషయం కాదు.  ఒకే సమస్యపై అంత మంది రచయిత్రులు ఏకకాలంలో  స్పందించడం,  కలం ఝుళిపించడం అద్వితీయ సంఘటన, అప్పుర్వ ఘట్టం.  ఆ సంఘటన పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం  APSACS.  Break the silence అన్న NACO స్పూర్తితో APSACS వారు ప్రపంచ సాహితీ చరిత్రలోనే గొప్ప ప్రయత్నానికి నాంది పలికారు.   సి. పార్ధసారధి, IAS గారి నేతృత్వంలో APSACS  తెలుగు రచయిత్రులందరికీ సాహితీ సమారోహణం పేరుతో అవగాహనా సదస్సు నిర్వహించింది.   ఈ సంకల్పం,  అంటే ఒక సామాజిక ప్రయోజనం కోసం సాహిత్యాన్ని సాధనంగా చేసుకోవడం,  సాహితీ ప్రపంచంలో విన్నూత్న ఒరవడికి శ్రీకారం చుట్టినట్లే .. రచయిత్రుల్ని, కవయిత్రుల్ని ఓ సామాజిక కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తూ వారి సామాజిక బాధ్యతని పెంచినట్లే కదా !

ఒక యజ్ఞంలా సాగిన ఈ పుస్తక ప్రస్థానంలో మొదట ఏర్పాటు చేసిన కార్యక్రమం సాహితీ  సమారోహాణం. సమాజ సుస్థితికి ఆధారం మహిళలు.  అందుకే ప్రత్యేకంగా రచయిత్రులు, కవయిత్రుల కోసం ఓ అవగాహన కార్యక్రమాన్ని  రూపొందించారు. అదే సాహితీసమారోహణం.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి పేరెన్నికగన్న రచయిత్రులని , కవయిత్రుల్ని ఆహ్వానించి, 26 అక్టోబర్, 2013న జూబ్లీ హాల్ లో హెచ్ఐ వి /ఎయిడ్స్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు.  ఆ సదస్సులో పొందిన అవగాహన ఆసరాతో కథలు, కవితలు ఆహ్వానించారు. వాటిని బాగా అనుభవం ఉన్న కథకులు, కవులు జల్లెడ పట్టి 59 కథలు , 70 కవితలు ఎంపిక చేశారు.  వాటిని రెండు పుస్తకాలుగా వేశారు. కథల పుస్తకం ‘ఆశాదీపం‘ గాను, కవితల పుస్తకం ‘చిగురంత ఆశ‘ గాను రూపుదిద్దుకున్నాయి.   ఎంపిక అయిన కథలలో నుండి ఉత్తమ కథలను, కవితలను ఎంపికచేశారు. ఉత్తమ కథలకు, కవితలకు పుస్తకావిష్కరణ సభలో బహుమతులు అందించారు.

ప్రస్తుతం మనమిక్కడ కథా సంకలనం ఆశాదీపం గురించి ముచ్చటించుకుందాం. మామిడి హరికృష్ణ కుంచెనుండి అర్ధవంతమైన చిత్రం ఆశాదీపం ముఖచిత్రంగా అలరించింది. ఈ కథా సంకలనంలో మొత్తం 59 కథలున్నాయని ముందే చెప్పుకున్నాం కదా.. . 59 మంది కథకులకు  ఇచ్చిన అంశం ఒకటే అయినా అన్నీ విభిన్నమైన కథలు. వైవిధ్యమైన కథలు.  ఒక్కో మస్తిష్కం నుండి ఒక్కోలా. ఒక్కొక్కరి ఆలోచనా తీరు ఒక్కో విధంగా.  ఒక్కొక్కరి రచనా  శైలి ఒక్కో రకంగా. వెరసి కథలన్నీ దేనికది భిన్నంగా.  ఆశ్చర్యంగా రెండు మూడు కథలు మినహా మిగతా కథలన్నీ మహిళల జీవితం చుట్టూనే.. వారి జీవన వ్యధలకి కారణమైన హెచ్ఐవి/ఎయిడ్స్ రావడానికి కారణాలు, సమస్యని ఎదుర్కొనే క్రమం, మానసిక బలాన్ని పెంచుకుంటూ, ప్రభుత్వం అందించే మందులు వాడుతూ అవగహనతో పాటు చైతన్యవంతం కావడం,  మార్గంలో ఎదురైన ముళ్ళను ఎరివేస్తూ తమలాంటి వారికి స్పూర్తినిస్తూ చైతన్య పరచడం ఈ కథలలో ప్రవహిస్తూ ఉంది.

20140602_183348

ఇక మనం కొన్ని కథల్లోకి తొంగి చూద్దాం.
గురజాడ శోభా పేరిందేవి రాసిన  ‘అంతం కాదిది ఆరంభం’  మూగ పిల్ల నీలపై జరిగిన అత్యాచారం , తత్ఫలితంగా గర్భంతో పాటు హెచ్ఐవి/ఎయిడ్స్ కి గురికావడం ఆమె మనసునీ, శరీరాన్ని  మొద్దుపరిస్తే,  ఆమె తల్లిని  భయాందోళనకు గురిచేసి పెద్ద కూతురికి పెళ్లి కావాలంటే ఈ పిల్లను వదలాల్సిందేనని, కూతురిని ఇంటికి రాకు చనిపోమ్మని చెప్పేలా చేస్తుంది. తనెందుకు చావాలని నీల హెచ్.ఐ.వి . కేంద్రానికి వెళ్లి  సైగలతో తన విషయం చెప్పుకొని మందులు తీసుకోవడంతో పాటు తనలాంటి వాళ్ళని బతికించే విధంగా కృషి చేస్తూ తన జీవితానికి ఒక అర్ధం కల్పించుకోవడంతో ముగుస్తుంది కథ.

‘వంద చేతుల తోడు ‘ కన్నెగంటి అనసూయ కలం నుండి జాలువారిన కథ ఇది.  బిసి వెల్ఫేర్ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న బాలిక నర్మదపై హాస్టల్ వార్డెన్ చేసిన ఆత్యాచారం, చేసిన మోసం వల్ల ఆమె గర్బవతి కావడం, హెచ్ఐవి సోకడం తాను మందులు వాడుతూ స్వచ్చంద సంస్థల సహకారంతో తనలాంటి వారికి చేయూతనిస్తూ హెచ్ఐవిపై అవగాహన కల్పిస్తూ, బతుకుపై ఆశతో,  ఆమె ఆత్మా విశ్వాసంతో ముందుకు సాగే కథ ఇది.

డా. త్రివేణి రాసిన కథ ‘పల్లవించిన పాట’ . పదవతరగతి వరకూ చదువులోనే కాకుండా ఇతర కార్యక్రమాలలోనూ ముందువరసలో ఉండే పల్లవికి పెళ్లి జరగడం, భర్తతో హైదరాబాదులో కాపురం పెట్టిన రెండేళ్లకే అతను హెచ్ఐవి ఎయిడ్స్ తో చనిపోవడం ఆ విషయం తెల్సి ఆమెకు ఆదరణ లభించకపోవడంతో ఆశ్రమంలో ఉంటుంది. మూడేళ్ళ తర్వాత ఆమె ఊళ్ళోకి వచ్చినప్పుడు  కుటుంబ సభ్యులలోను, గ్రామస్తులలోను ఆమెను ఊర్లోకి రానివ్వడానికి , తమతో కలుపుకోవడానికి భయపడిన వైనం ఆ గ్రామ అంగన్వాడి టీచర్ పద్మ వారి భయాల్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం హృద్యంగా చూపుతుంది ఈ కథ.

‘కాంతిరేఖ’ కథలో దుబాయ్ లో ఉండే వ్యక్తి పెళ్ళికి ముందే సెక్స్ అనుభవం కోసం మిత్రులసలహా మేరకు వెళ్ళడం, పెళ్ళైన కొద్దిరోజులకే హెచ్ఐవి బయటపడడం ఆ తర్వాత అతను చనిపోవడం , కోడలు కరుణకు అత్తింటివాళ్ళు వాళ్ళ ఆరళ్ళు, గర్భవతిగా ఉన్నా ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, డాక్టర్ దంపతుల చెంత చేరడం, అప్పటికే  కొడుకు హెచ్ఐవి/ఎయిడ్స్ తో మరణించడంతో వారు హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల కోసం హాస్పిటల్ నడపే  ఆ డాక్టర్ దంపతులు కరుణని ఆదరించి ధైర్యం చెప్పడం, కూతురిని కన్న  కరుణ ఆరోగ్యకరమైన జీవన విధానంతో తన జీవితాన్ని పొడిగించుకుంటూ కూతురిని పెద్ద చేయడమే కాక చివరికి అత్తామమలకు ఆమె ఆధారమవుతుంది. ఈ కథా రచయిత్రి నెల్లుట్ల రమాదేవి

‘భయం .. పెద్ద జబ్బు ‘ తాయమ్మ కరుణ రాసిన కథ. ఈ కథలోనూ భర్త ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ సోకిన భార్య విజయని దూరంగా పెట్టి అత్తింటివారు చూసే చిన్న చూపు తెలిసీ భర్త మౌనంగా బాధపడడం, తర్వాత విజయ నిలదీయడంతో తల్లికి విష్యం చెప్పిన భర్త సంతోష్.  షుగర్ , బి.పి ల్లాగే మందులతో జీవిత కాలం పోడిగించ వచ్చని వైద్యులు చెప్పిన విషయాలు చెప్పినా వినిపించుకోకుండా పిల్లలని తన దగ్గరకి రానివ్వని అత్త, దూరమవుతున్న పిల్లలు, చదువుకున్నతనే మానసికంగా నలిగిపోతుంటే .. మరింత అనారోగ్యానికి గురవుతుంటే మరి ఏమీ తెలియని వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచించిన విజయ తను న్యూనత నుండి బయటపడి హెచ్ఐవి/ఎయిడ్స్పై ఉన్న అపోహల్ని తొలగించాలనుకోవడంతో కథ ముగుస్తుంది.

హెచ్ఐవి ఎయిడ్స్ఉన్న వ్యక్తి విషయం దాచి పెట్టి పెళ్లి చేసుకుంటే అది చెల్లదని చెప్తుంది వారణాసి నాగలక్ష్మి కథ ‘శుభరాత్రి’. ఈ కథలో మనోజ్ఞ పెళ్లి అయ్యి వెంటనే విడాకులు తీసుకున్న విషయం చెల్లి ద్వారా తెలుసుకుంటాడు రాజీవ్ .  మనోజ్ఞ పట్ల ప్రత్యేక అభిమానం ఉన్న అతను ఆమె విడాకులకు కారణం హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తితో పెళ్లి కావడమేనని, ఆ విషయం పెళ్ళైన మూడో నాడే  అతని మిత్రుడి ద్వారా తెలుసుకుని ఆ బంధం నుండి విడివడిందని, ఆమెకి హెచ్ఐవి సోకలేదని తెలిసి ఆమెను మనసులోనే అభినందించడంతో కథ ముగుస్తుంది

బయటి ప్రపంచం ఎరుగని విలాసాలు, సౌఖ్యాలు, వస్తువులు, వారి ఆహారం ఎప్పుడో చూసిన పుట్టమ్మ అనే యువతి తమ ఊరు వచ్చే విదేశీ టూరిస్టులని చూసి విదేశీ మోజుతో ఉండేది. వారిలాగే ఇంగ్లిషు మాట్లాడుతూ తమ ఇంట్లో అద్దెకు ఉండే విదేశీ యువకుడితో స్నేహం చేసింది. అతను మరోసారి వచ్చినప్పుడు సన్నిహితమైంది.  మరుసటి ఏడాది వస్తే పెళ్లి చేసుకుందాం అని చెప్పి వెళ్ళే ముందు తన వస్తువులన్నీ ఆమె కిస్తూ ఒక పాకెట్ ఇచ్చి తను వెళ్ళాక చూడమంటాడు.  అతను వెళ్ళాక చూస్తే నీకు బహుమతిగా ఎయిడ్స్ ఇచ్చాను అనే లేఖ. తెలిసీ తెలియని వారితో శారీరక సంబంధాలు ఎంత అనర్ధమో చెప్పిన కథ మన్నెం సింధుమాధురి రాసిన ‘బహుమతి ‘.

ఓ యువకుడు  విలువలకు వలువలు ఒలుస్తున్న సమయంలో భార్య, తల్లి, అక్క, బాల్యమిత్రుడు, చిన్ననాడు చదువు నేర్పిన పంతులు తగిన విధంగా స్పందించక పోవడంతో ఆ  యువకుడు అప్పటివరకూ తెచ్చుకున్న పేరుని, జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అతని ప్రవర్తనకి తమ బాధ్యతారహిత్యమేనని బాధపడే కథ చంద్రలత రాసిన ‘ఆ ఆరుగురు ‘ ఆ ఆరో వాళ్ళెవరో కథ చదివి తెలుసుకోవాల్సిందే ..

భర్త ద్వారా సంక్రమించిన హెచ్ఐవి తో అతని కంటే ముందు భార్య చావు బతుకుల్లో ఉండడానికి కారణం జండర్ వివక్ష అని చెప్పే కథ దర్భలక్ష్మి సుహాసిని రాసిన కథ ‘గిరిజ’ .  భర్త విచ్చలవిడి తనం వల్ల హెచ్ఐవిసోకిన ఉద్యోగస్తురాలైన మహిళ తనను తాను కాపాడుకుంటూ తన పిల్లలిద్దరినీ పెంచి పెద్దచేస్తూ హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు మనోధైర్యం అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంచే తల్లి సేవలకు తామూ తోడవుతాం అనే పిల్లల కథ సమ్మెట ఉమాదేవి కధ ‘తిమిర సంహరణ సమయాన ..!’ .

రక్తమార్పిడి  వల్ల హెచ్ఐవి సోకినట్లు వచ్చిన కథలు కొండవీటి సత్యవతి గారి ‘పాలపుంత ‘ డా . సి. భవానిదేవి గారి ఈతరం దూతలు , గంటి సుజలామూర్తి గారి మార్గదర్శి . స్వాతి శ్రీపాద రాసిన ‘వెలిగించనా చిన్న దీపం ‘  ఇంజక్షన్సు ద్వారా హెచ్ఐవి వైరస్ సోకడం వాళ్ళ కుటుంబ అనాదరణకు గురై చావాలనుకున్న వ్యక్తీ ఆ తర్వాత ఓ సంస్థ లో తన లాంటి వాళ్లకి సేవలందించే కథ ‘గమ్యం ‘. దాదాపు ఇలాంటి కథే

ఉపాధివేటలో భార్యాబిడ్డల్ని వదిలి గల్ఫ్ బాట పట్టిన వ్యక్తీ అక్కడ అంటుకున్న హెచ్ఐవి భార్యకి అంటించడం .. ఆ బాధ వ్యధ చిత్రించిన కథ అడువాల సుజాత రాసిన ‘ఆలోచించండి’ .
కొత్త అనుభవం కోసం ఒకసారి చేసిన తప్పుకు కుంచించుకుపోతూ శిక్ష అనుభవిస్తున్నాననే కథ ‘నీకు .. నా మొదటి ప్రేమలేఖ’. ఎంతో భావుకంగా ఉన్న ఈ కథ ఝాన్సీ కెవి కుమారి రాశారు.
సినిమాలు, టివి సీరియళ్ళ మోజులో ఇల్లువదిలి ట్రాఫికర్లకు చిక్కి కొంతకాలానికి ఆ ఊబి నుండి బయటపడి హెచ్ఐవి బాదితులకు సహాయం చేస్తూ జీవించే యువతీ కథ అల్లూరి గౌరీ లక్ష్మి గారి ‘చిరుదీపాలు.  సమస్యకు మందేయడం కాదు ఆ సమస్యకు మూలం ఎక్కడుందో తెలుసుకొని సమూలంగా మానవతా విలువలతో చెప్పాలనే కథ గరిమెళ్ళ సుబ్బలక్ష్మి రాసిన ‘మీరే నేర్పాలి ‘ , ప్రేమపేరుతో మోసపోయి వొళ్ళు అమ్ముకునేవాళ్ళు తమకు తెలియకుండా తమ దరి చేరిన హెచ్ఐవి వంటి వ్యాదుల్ని ఇతరులకు అంటించాలానే కాసిని, ఆ తర్వాత మారిన వైనాన్ని చూపిన కథ డి. కామేశ్వరి రాసిన ‘మానవత్వం మరువకు. దా. ఆలూరి విజయలక్ష్మి రాసిన ‘కల్లోల కడలి’ కథ కన్నా బిడ్డలా ఆకలి తీర్చడం కోసం , ఆకలి గొన్న మగవాళ్ళ ఆకలి తీర్చే ఆ తల్లి హెచ్ఐవిబారిన పడడాన్ని చిత్రించింది.  అశ్రద్ద , చిన్న నిర్లక్ష్యం వాళ్ళ హెచ్ఐవికి గురి అవడం, మరికొన్ని బతుకులు ఇలా కాకుండా చూస్తాననే యువకుడి ఆత్మవిశ్వాసాన్ని మన ముందుంచిన అయినంపుడి శ్రీలక్ష్మికథ   ‘అమ్మ నవ్వింది ‘ . హెచ్ఐవి/ఎయిడ్స్ తో చనిపోయిన వారి పిల్లల్ని చేరదీసి అక్కున చేర్చుకున్న యువతీ నిశాంత సమాజం నుండి తాను వెలివేతకు గురయినా స్థైర్యంతో ముందుకు సాగిన కథ ‘నిశాంత పెళ్లి ‘ అనిశెట్టి రజిత రాశారు.   కలసి మెలసి ఉన్నా, ముట్టుకున్న హెచ్ఐవిమరొకరికి సక్రమించాడు అనిచేప్పే అమృతలత కథ ‘ఆత్మీయ స్పర్శ’.

హెచ్ఐవి బాధితులు వారిలో ఓ చిన్నారిని డాక్టరును చేసి ప్రతిఫలంగా హెచ్ఐవిపై అవగాహన సమాజంలో పెంచమని చెప్పే కథగంటి భానుమతి రాసిన  ‘ వాళ్ళు కోరిన కోరిక ‘
మిత్రురాలి కొడుకుకి హెచ్ఐవి సోకినట్లు తెలుసుకున్న ఓ తల్లి తన కొడుకుకి  హెచ్ఐవి పరీక్షలు చేయించి అతను పక్కదారులు పట్టకుండా అవగాహన పెంచే కథ గోలేటి లలితాశేఖర్ రాసిన ‘పెనేసియా’ హెచ్ఐవిపై అవగాహన పెంచే మరో కథ ఇంద్రగంటి జానకీబాల రాసిన ‘బ్రతుకు పోరాటం’,

పెళ్ళికి ముందే హెచ్ఐవిపరీక్షలు , ఎలీసా పరీక్షా చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని ప్రేమికులు చెప్పే కిరణ్ బాల కథ ‘అదిగో నవలోకం ‘ .   రెడ్ రిబ్బన్ క్లబ్స్ అవసరాన్ని గురించి రాసిన కథలు కె . ప్రవీణారెడ్డి రాసిన ‘ది రెడ్ రిబ్బన్ క్లబ్’ వి. శాంతి ప్రబోధ రాసిన ‘ఆ యువత ముందు తరం దూతలు’ .

డా అనంత లక్ష్మి  రాసిన చెల్లని నోటు, భావరాజు పద్మిని రాసిన పులిరాజు, జీవితం – గద్వాల కిరణ్ కుమారి, మీరే  నేర్పాలి – జిఎస్ సుజాత, జవాబు – కస్తూరి భారతి రామం,  కె.బి. లక్ష్మి ‘ఆకాశామల్లి’ , కె వాసవదత్త రమణ కథ ఎనిమిదొఅడుగు’ , నండూరి సుందరీ నాగమణి కథ ఆశాదీపం, నామాని సుజనా దేవి కథ ‘దొరికిన జవాబు ‘,  పోడూరి కృష్ణకుమారి కథ ‘ఓడిపోలేదోయ్ ‘ , పి.వి.శేషారత్నం కథ ‘అమ్మమనసు , పరిమలా సోమేశ్వర్ ‘ఒక్కసారి ‘ పొత్తూరి విజయలక్ష్మి కథ ‘అసాధ్యం కాదు సుసాధ్యమే ‘ పోల్కంపల్లి శాంతాదేవి కథ ‘నవ్వులు పూయించండి’, పాలంకి సత్య కథ వెలుగురేఖ’, పెండ్యాల గాయత్రి కథ ‘కథ మారింది’ , పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి కథ వేలివేయొద్దు’ , పుటల హేమలత కథ ‘కొత్తఆశ ‘, రాజీవ రాసిన హాయ్ ప్రేమ ‘ , ఆర్ . రమాదేవి కథ ‘తీరం చేరే కెరటం ‘ , శైలజా మిత్ర ‘ కర్తవ్యం’ ,   శ్రీలలిత ‘తమసోమా జ్యోతిర్గమయ ‘, సింగరాజు రమాదేవి ‘ఒక ప్రేమకథ ‘, తమిరిశ జానకి ‘ నీ జీవితం నీ చేతిలో ‘, తుర్లపాటి లక్ష్మి ‘ప్రతిమ’, తురగా ఉషారమణి ‘కెరటం ‘ డా. తెన్నేటి సుధాదేవి ‘నా తప్పులేదు’, టి . నళిని ‘బ్రతకాలి -బ్రతికించాలి ‘ డా . వాసా ప్రభావతి  ‘ఉషోదయం ‘ , డా . వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘పడవలు రేవు చేరాయి ‘ వంటి ఎన్నో కథలు వాటి గూర్చి చెప్పటం కాదు చదివి తీరాల్సిందే.

హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాప్తికి కారణాలు  అత్యాచారాలు, రక్తమార్పిడి, భర్త ద్వారా భార్యకి సంక్రమించడం, ట్రాఫికింగ్, వ్యభిచారం, నిర్లక్ష్యం , మానవతావిలువలు నశించడం, ప్రేమ పేరుతో మోసపోవడం… ఎన్ని కథలో .. ఎన్ని వ్యధలో .. భిన్న దృక్పథాల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో కుల, మత , ప్రాంత, లింగ బేధం లేకుండా అన్ని వర్గాల వారూ పడే బాధ.  ఒక్కో కథ ఒక్కో తీరులో తీసుకున్న సమస్య పై అవగాహన కలిగిస్తూ, మనో ధైర్యాన్ని , బతుకుపై విశ్వాసాన్ని ప్రోది చేస్తూ.. తమ లాంటి బ్రతుకు మరొకరికి రాకూడదని కోరుకుంటూ .. తమకు చేతనైన సహాయం అందిస్తూ .. సాగిన కథలే అన్నీ . కథా రచన శైలిలో వైవిధ్యంతో సాగిన కథలు ఇవి.  కథలో పటుత్వం కొన్నింటిలో తగ్గినప్పటికీ అన్ని కథలూ అవసరం అయినవే.   చైతన్యవంతం అయినవే. పరిమిత సమయంలో ఇంత మంచి కథలు ఆవిష్కరించిన కథకులందరికి అభినందనలు చెప్పాలిసిందే.

రచయితల్ని ఆయా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళి వారికి మరింత ప్రత్యక్షానుభావాన్ని కలుగ చేస్తే ఇంకా ఎంతో అవసరమైన అంశాలతో , వివరాలతో ఇంకా మాంచి కథలు వస్తాయని ఈ కథలు వాగ్దానం చేస్తున్నాయి అని జ్యూరీ మాటలో డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారన్నారు. నిజమే, నాలుగు గోడల మధ్య కూర్చొని ఊహించి రాసినదానికి కంటే, ప్రత్యక్షంగా చూసి లోతుగా అధ్యయనం చేసి రాసే సాహిత్యం మరింత  శక్తివంతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి అన్ని కథల్నీ చదివి ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు.  ఆ పని చేశారు కథా రచనలో అపార అనుభవం ఉన్న కథకులు విహారి, డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి,  తుమ్మేటి రఘోత్తమరెడ్డి వ్యవహరించారు.

తెలుగునేల నలుమూలలా ఉన్న రచయిత్రులందరినీ సమీకరించి, వారి రచనలు సేకరించి ఒక కార్యాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన సంపాదకులు అయినంపుడి శ్రీలక్ష్మి, మామిడిహరికృష్ణ, మమతారఘువీర్ ల కృషికి నిదర్శనం అద్భతంగా ఉన్న ఆశాదీపం.  అక్టోబరులో సాహితీ సమారోహణం గురించి చెప్పినప్పుడు ఊహించలేదు ఇంత చక్కటి పుస్తకం అందుకుంటామని. అందుకోసం సంపాదకులు పడిన శ్రమ, ఇబ్బందులు తక్కువేమీ కాదు.  అనుకోని అవాంతరాల వల్ల అనుకున్న సమయానికి డిసెంబరు ఒకటవ తేదీన పుస్తకం రాకపోయినప్పటికీ వారు పడిన  ప్రయాస అంతా తుడిచిపెట్టుకుపోయి ఉంటుంది.

హెచ్ ఐ వి/ఎయిడ్స్పై ప్రజలలో  అవగాహన పెంచడం  కోసం, చైతన్యవంతం చేయడం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అందులో ఈ పుస్తకం కోసం చేసింది సముద్రంలో నీటి బొట్టంతే.  కానీ, వచ్చే ఫలితం ఊహకందనంత.

-వల్లూరిపల్లి శాంతి ప్రబోధ

రచనలో వినిపించే స్వరం ఎవరిది?!

 10565093_10152677529194683_7972848941163645770_n

పసునూరు రవీందర్ కథలు చదువుతున్న సమయంలోనే యింకో వేపు సమకాలీన అమెరికన్ కథ మీద జరుగుతున్న వొక చర్చ నన్ను అమితంగా ఆకట్టుకుంది – రవీందర్ తన కథల్లో సాగిస్తున్న అన్వేషణకీ, ఈ చర్చకి చాలా దగ్గరి చుట్టరికం వుందికాబట్టి. ఈ చర్చలోంచి మూడు విషయాలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాలి:

ఒకటి – వొక సమకాలీన సందర్భం లేదా సంఘటన అది ఇంకా జరుగుతూ వుండగానే దాన్ని కథ చేయగలమా? అంటే- ఇంకో రకంగా చెప్పాలంటే, జీవితంలోని immediacy (తక్షణికత)ని కథా లక్షణంగా మార్చగలమా?

రెండు: కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు?

మూడు: భిన్నకులాలూ మతాలూ వున్న సమూహాల్లో భిన్నస్వరాలు ఎలాంటి ప్రాతినిధ్యాన్ని (representation) కోరుకుంటాయి?

రవీందర్ కథల్లో ఈ మూడు విషయాలూ వొక బలమైన వాదాన్ని వినిపిస్తాయి. రవీందర్ తన కథల్ని “తెలంగాణా దళిత కథలు” అంటున్నాడు. ఆ విధంగా తన కథల్ని భిన్నంగా చదవడానికి తనే వొక తలుపు తీసి మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు.

అయితే, అలాంటి వొక “తెలంగాణా దళిత” తలుపు తెరచి, తన చదువరిని ఆ తలుపులోంచే తనని చదివి తీరాలని అతనేమీ మంకు పట్టు పట్టడం లేదు. నేను చదివినంత వరకూ, నాకు అర్థమైనంత వరకూ కథని discourse గా మార్చి, ఆ కథలోంచి వొక చర్చని సహనంతో తీసుకువచ్చి, అంతే సహనంతో మిగిలిన గొంతులు వినడానికి కూడా సిద్ధంగా వుండే కొద్దిమంది రచయితల్లో రవీందర్ వొకడని కచ్చితంగా చెప్పగలను.

అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సంపుటిలో కథకుడిగా రవీందర్ మనం తెలిసీ తెలిసీ దాచిపెట్టే కొన్ని కీలకమైన విషయాలను uncover చేస్తున్నాడు.

Uncover అనే మాటని నేను “to allow (something) to be seen by removing a covering” అనే కచ్చితమైన అర్థంలో వాడుతున్నాను, ఎందుకంటే రవీందర్ ఈ సంపుటికి ఇచ్చిన శీర్షిక ద్వారానే కాకుండా, పుస్తకం లోపలి కథల్లో కూడా ఖాయంగా చేస్తున్న పనే అదే కాబట్టి! ఈ uncovering కీ, పైన ప్రస్తావించిన మూడు విషయాలకూ –immediacy, authorial voice, representation కీ చుట్టరికం వుంది. రవీందర్ కథల్లో ఇతరేతర అంశాలు చాలా వున్నప్పటికీ, అతను అతనుగా ఈ కథల్లో అచ్చంగా ఏం చేస్తున్నాడో చెప్పడం మాత్రమే యిక్కడ నా ప్రయత్నం.

1

ఇప్పటికి అరవయ్యేడు ఏళ్ల కిందట అమెరికా కథానిక వొక రూపాన్ని వెతుక్కుంటున్న సమయంలో Martha Foley అనే విమర్శకురాలు ఇలా రాసింది : It is a literary truism that there must be a period of distillation before the real impact of some tremendous event, either historical or personal, can emerge in writing.

ఆమె ప్రధానంగా కథలో సమకాలీనత గురించి మాట్లాడుతోంది. వొక సంఘటన జరిగిన వెంటనే లేదా, వొక సందర్భం కొనసాగుతూ వుండగానో దాన్ని కథగా మలచలేమన్నది ఆమె వాదం. కొంత కాలం గడిస్తే తప్ప ఆ సంఘటనా, సందర్భం నిజమైన ప్రభావం ఏమిటో తెలీదనీ, అది తెలిస్తే గాని దాన్ని కథగా మలచలేమనీ ఆమె అభిప్రాయం. అంటే, ఆ అనుభవం పక్వమయ్యే దాకా ఎదురుచూడాలని ఆమె అనేది.

ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచనాలు చెప్పినా, కవిత్వం ఉద్వేగ కళ. వొక వుద్వేగాన్ని వ్యక్తీకరించగలిగితే కవిత్వం పని చాలా మటుకు అయిపోయినట్టే. దానికి భిన్నంగా కథ అనేది ప్రధానంగా ఆలోచనకి సంబంధించిన ప్రక్రియ. కేవలం వుద్వేగానికే పరిమితమయిపోతానంటే ఆ కథని అంత తేలికగా వొప్పుకోలేం. అనుభవ సారం ఎంతో కొంత కథలో ఇమడాలి. కథ చదివాక కొంత నిగ్రహమైన ఆలోచనని కూడా చదువరి కోరుకుంటాడు. ఆ మేరకు Martha Foley వాదంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. కాని, అది కొంత మాత్రమే!

కాని, 9/11 తరవాత వచ్చిన అమెరికన్ కథకులూ, విమర్శకులూ ఈ వాదాన్ని పడనివ్వడం లేదు. వొక ఏదో సందర్భంలో శ్రీశ్రీ అన్నారట: దినదినాభివృద్ది కాదు, క్షణ క్షణాభివృద్ది కోరుకుంటున్నానని! అభివృద్ధి వేగాన్ని క్షణాలతో కొలుస్తున్న కాలం ఇది. ముఖ్యంగా సాంకేతిక విప్లవం వచ్చాక ప్రపంచం చాలా మారిపోయింది. భౌతిక సాంకేతికత, వ్యక్తి మానసికతా రెండూ వొక విధమైన అంతుపట్టని యుద్ధంలో కూరుకుపోతున్న దశ ఇది. ఈ రెండీటికి మధ్యా వుండే దూరాన్ని ఇప్పుడిప్పుడే తెలుగు కథా రచయితలు పట్టించుకుంటున్నారు. కథల్లో అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలూ, సోషల్ మీడియా నెట్ వర్కుల ప్రస్తావనా, వాటి పర్యవసానాలూ కథల్లోకి అనివార్యంగా ప్రవేశిస్తున్నాయి. అంటే, గ్లోబలైజేషన్ కి సంబంధించి రెండో దశలోకి తెలుగుకథ ప్రవేశించిందనే చెప్పాలి. రవీందర్ ఈ కథా సంపుటికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని పేరు పెట్టడం ఈ దశకి బలమైన సంకేతం. అలా పేరు పెట్టడం ద్వారా జీవితంలోని immediacy (తక్షణికత)ని తన కథా లక్షణంగా చెప్పక చెప్తున్నాడు రవీందర్.

రవీందర్ వ్యక్తీకరణలో ఈ తక్షణికత ఎలాంటి కథలుగా మారుతోంది? కాలానికి అతీతమైన నిర్జీవ విషయాల్నితన కథకి వస్తువుగా ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోలేడు రవీందర్. తన కాలంలో తన స్థలంలో నిలబడి మాట్లాడడం అతని కథకి జీవలక్షణం. ఈ సంపుటిలోని మొదటి కథ –వెరేవర్ యు గో -అనే కథలోనే రవీందర్ ఈ లక్షణానికి నాంది పలుకుతాడు. ఇప్పటికీ మనలోని కొంత మంది “లౌకికులు” మనకే కులాలూ మతాలూ ప్రాంతాలూ లేవని వొక అమూర్త మానవ ముఖాన్ని(abstract human face) తొడుక్కొని వుంటారు. వాళ్ళు తొడుక్కుంటే పర్లేదు కాని, ఇతరులు కూడా అలాంటిదేదో ముసుగు తొడుక్కోకపోతే అనుమానంగా చూస్తారు. కాని, కులాలూ మతాలూ ప్రాంతాలూ ఇంకా ఇంకా బలంగా మన ఉనికిని నిర్ణయిస్తూనే వున్నాయని, అవి వేరే రూపం దాల్చి మన మధ్యనే   వున్నాయని గుర్తించడానికి నిరాకరిస్తారు. ఇది తెలిసీ తెలిసీ నిరాకరించడం! “ఎహె గీ కాలంల …క్యాస్ట్ గీస్ట్ ఎక్కడిది సార్?!” అనే పెద్దమనిషి తరహా ముసుగు uncover చేసే కథ ఇది.

రవీందర్ కథల్లో చాలా మటుకు కులం ముఖ్యమైన విషయంగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు. పది నిజాల కంటే వొక అబద్దం ఎక్కువ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. పైగా, ఆ అబద్ధం ఆ పది నిజాల్ని కప్పిపుచ్చేది అయితే కోపం ఇంకా కట్టలు తెచ్చుకుంటుంది. రవీందర్ కథల్లో ఈ సామాజిక అధర్మం మీద ధర్మాగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, వొక్కో కథనీ దగ్గిరగా చదువుకుంటూ వెళ్తే, అతనిలో కేవలం కోపం మాత్రమే లేదనీ, ఆ కోపాన్ని నిగ్రహించుకొని మాట్లాడే శక్తి కూడా చాలానే ఉందనీ అర్థమవుతుంది. ఆ నిగ్రహం తన చుట్టూ వున్న అధర్మాన్ని ఆలోచనతో చూడడం వల్ల సాధ్యపడిందనీ అర్థమవుతుంది. ఉదాహరణకు: గోవర్ణం కథ. మొదటి సారి ఈ కథ చదివినప్పుడు ఇందులోని కథాంశాన్ని నేను నమ్మలేకపోయాను. అంటే, నాగరికుల మీద నాకూ కొన్ని భ్రమలున్నాయని, ఆ భ్రమ వల్లనే ఈ కథని నేను మొదట నమ్మలేకపోయాననీ తరవాత నన్ను నేను తర్కించుకుంటే అర్థమైంది. ఈ కథలోని విషయం నా కవరేజీ పరిధిలో లేకపోవడం కూడా ఇంకో కారణం కావచ్చు.

రవీందర్ కథలు ఎలాంటి కనువిప్పు కలిగిస్తాయో అదొక ఉదాహరణ మాత్రమే. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలో వొక పాత్ర చేత అనిపిస్తాడు రవీందర్. “పట్నంల కూడా కులముంటదే. కాకుంటే బయిటికి కనిపించకుంట దాని పని అది చేస్తుంటది. దానితో దెబ్బతిన్నోల్లకే అది కనిపిస్తది దాన్ని పాటిస్తూ, ఆదిపత్యం చెలాయించే పెద్దకులపోళ్ళకి అది లేనట్టుగా భ్రమింప జేస్తది. గందుకే, ఇగ బాధపదేటోళ్ళు బాధపడుతుంటే, బాధపెడ్తున్నోల్లు మాత్రం కులమెక్కడిదని నీతులు చెబ్తుంటరే!” ఇది వొక పాత్రలోంచి రవీందర్ ఆవేదన, ఆగ్రహం!

సమకాలీనం అన్న మాటని తెలుగు సాహిత్యంలో చాలా అన్యాయంగా వాడేస్తున్నారు. నిజానికి సమకాలీనం అనదగ్గ రచనలు చాలా తక్కువగా వస్తున్నాయి. రచయితలు వొక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని, అదే సమకాలీనం అనుకుంటూ ఆ లోకంలోనే అందరూ ఉండాలన్న అందంగా నిర్మిస్తున్న కాలం ఇది. ముఖ్యంగా చాలా మంది కథకులకు (ఇక కవుల సంగతి చెప్పక్కరలేదు!) సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకునే శక్తి లేదు. వాళ్ళ చదువూ అవగాహనా అందుకు సరిపోవడం లేదన్నది నా అభిప్రాయం. తమ చుట్టూ వున్న లోకం రాజకీయ అతీతంగా, పరిశుద్ధంగా ఉండాలన్న భ్రమ ఇంకా చాలా మందిలో వుంది. కార్పోరేట్ జమానాలో కులాలు లేవనడం ఎంత అబద్దమో దానికి పది రెట్లు అబద్దం ఈ రాజకీయాతీత కలవరింత. అయితే, రాజకీయ లోకంలో ఇంకా వేరే భ్రమలు కొన్ని వున్నాయి. అలాంటి భ్రమల నిలువుటద్దం ఊగి..ఊగి ఉయ్యాల కథ.

రవీందర్ కథలు అచ్చంగా సమకాలీన కథలు- నాకు అర్థమైనంత వరకూ ఆ సమకాలీనత ఎంత సమకాలీనం అంటే అవి ఈ క్షణపు వేగాన్ని అందుకుంటున్న కథలు. ప్రతి కథలోనూ వొక పట్టి పీడిస్తున్న ఇప్పటి సమస్యా, దాని ఆనుపానులు తెలుసుకోవాలనుకునే తపనా, అన్నిటికీ మించి రవీందర్ పరాయీ స్వరాల మీద ఆధారపడకుండా తన గొంతుకతో మాట్లాడాలన్న వెతుకులాటా ఈ కథల లక్షణం.

ఈ కథల్లోంచి రవీందర్ స్వరాన్ని ఎలా వినాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. కథలో రచయిత అసలు స్వరం (authorial voice) ఎంతవరకూ వినిపించవచ్చు? అన్న రెండో విషయానికి వద్దాం.

1545666_10152155164074683_826845966_n

 

2

 

“What do you have to say?”

“This. I have this to say, and I want you to listen to my voice, to the tone of my voice, because that will tell you what I have to say.”

–          Elizabeth Strout, 2013.

కథలో గానీ కథనంలోగానీ రచయిత కనిపించకూడదనీ, రచయిత స్వరం వినిపించకూడదనీ చాలా కాలంగా వొక సాహిత్య సౌందర్య భ్రాంతిని మనం నమ్ముతూ వచ్చాం; ఇప్పటికీ నమ్ముతున్నాం. అలాంటి స్వరాన్ని సవరించుకునే నెపం మీద చాలా మంది కథకులు సాహిత్యంలో సమకాలీన లేదా తక్షణ వాస్తవికతని వాయిదా వేస్తూ వెళ్తారు. ఆ అనుభవం పరిపక్వమైన తరవాతనే మాట్లాడుకుందామనుకునే ధోరణి తక్షణ జీవితాన్ని గురించి ఏమీ అనలేని స్థితికి రచయితని నెట్టేస్తుంది. అంటే, తక్షణ జీవితం మొత్తంగానే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయిపోతుంది మన సాహిత్యంలో!

అస్తిత్వవాద రచనల్లో రచయిత స్వరం మీద ఎలాంటి కట్టుబాట్లూ లేవు. ఇలాంటి రచనల్లో సౌందర్యం కేవలం రూపపరమైన పరిమితుల్లో మాత్రమే వుండిపోదు. రచయిత చెప్పదలచుకున్న విషయమూ దాని సూటిదనం కూడా రచనా సౌందర్యంలో విడదీయలేని భాగమవుతాయి. ఫలానా విషయం కచ్చితంగా మాట్లాడి తీరాలన్న అస్తిత్వ కట్టుబాటు రచనని నడిపిస్తుంది. అయితే, ఆ “ఫలానా” రచయితని బలహీనపరచవచ్చు కూడా- అంటే, వొక విధంగా కథన సౌందర్యం పట్ల ప్రత్యేక దృష్టి వున్న రచయిత కంటే, అస్తిత్వవాద రచయితకి శిల్పం ఎక్కువ కత్తి మీద సాము అవుతుంది, తన స్వరం బలహీనపడకుండా కథనం కుంటుపడకుండా చదువరిని వొకే దృక్కోణంలో ఖైదు చేయకుండా కథ నడిపించాలి కాబట్టి!

రవీందర్ కథనంలో ఇలాంటి సందిగ్ధం కనిపించదు. ఏం చెప్పాలో అతనికి కచ్చితంగా తెలుసు. అంతకంటే ముఖ్యంగా ఎలా చెప్పాలో కూడా తెలుసు. ఉదాహరణకు పెంజీకటి కథ. జీవితంలోని కొన్ని అనుభవాల్ని వొక మహాకావ్యం లేదా మహానవల (శ్రీశ్రీ, రావిశాస్త్రిలు వాడిన అర్థంలోనే) గా వ్యక్తం చేయాలన్న సృజనాత్మక కోరిక మనవాళ్ళలో కొత్త కాదు. కాని, అవి రెండూ సైజుకి సంబంధించిన అంశాలు అనుకున్నప్పుడే సమస్య. సాహిత్య రూపం అనే భావన స్వభావం మారింది అనుకోడానికి సిద్ధంగా వుంటే, చిన్న కవిత చిన్న కథ కూడా వొక మహాకావ్యం, మహానవల చేయగలిగే పని చేస్తుంది. శ్రీశ్రీ ‘ఆహా” కవిత నా దృష్టిలోమహాకావ్యమే, అలాగే, రావిశాస్త్రి ‘పిపీలికం’ మహానవలే! రవీందర్ కథ పెంజీకటి ఇక్కడ అచ్చులో కొన్ని పేజీలే కాని, ఆ కథ ఆవిష్కరించే జీవితం వొక మహానవల పరిమాణంలో వుంది.

ఈ కథని ఊహించడంలో రవీందర్ వెళ్ళిన దూరాలు నాకు ఆసక్తి కలిగించాయి. ఈ కథారూపంలో నాటకానికి సంబంధించిన నిర్మాణ అంశాల్ని చాలా సహజంగా, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. అంతకంటే ఎక్కువగా వొక నవలకి కావలసిన జీవితపు ముడిసరుకు తీసుకొని, దాన్ని కొన్ని పేజీల కథలోకి కుదించడం రవీందర్ శిల్ప విజయం.

అయితే, రవీందర్ కథనస్వరానికి వున్న నిర్దిష్టత వల్లనే ఇది సాధ్యపడిందని నా నమ్మకం. కథావస్తువుని objective గా తీసుకొని, అందులో subjective tone ని కాపాడుకుంటూ వెళ్ళడం ద్వారా రవీందర్ ఈ కథల్లో శిల్పపరంగా కనీసం రెండు మూడు అడుగులు అదనంగా నడుచుకుంటూ వెళ్ళాడని నేను అనుకున్నా. ఈ నడవడంలో అతనిలో వున్న కథకుడు వొక కొత్త ఆత్మవిశ్వాసంతో మెరవడం కూడా నేను చూస్తున్నా.

సాహిత్య వాతావరణం ఆసక్తికరంగా కనిపిస్తున్నప్పటికీ- రచయిత వ్యక్తిగత స్థాయిలో ఎంతో కొంత నిరాశలోకీ, దిగులులోకి నెట్టివేయబడుతున్న కాలం కాని కాలంలో ఆ రచయితస్వరంలో, నడకలో ఈ ఆత్మవిశ్వాసం ఎటు నించి వస్తుంది?

నాకు తెలిసీ అది ఆ రచయిత తనని తాను ధీమాగా ధిక్కారంగా అలాగే కొంచెం open గా తెరుచుకునే representative vision (ప్రాతినిధ్యపు దృష్టి) నించి వస్తుంది. అస్తిత్వ వాద రచయిత ఇతర బహుముఖాలకి ఎంత open గా వుండగలడు? అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది.

 

3

రవీందర్ కథలు రాస్తున్న ప్రస్తుత దశలో కేవలం తెలంగాణా కథలే కాదు, దళిత కథలే కాదు. ఇతర అస్తిత్వాల రచనలూ వస్తున్నాయి. కాని, ఈ కథలకి రవీందర్ “తెలంగాణా దళిత కథలు” అని ఉపశీర్షిక పెట్టుకున్నాడు. అలా బహిరంగంగా తన అస్తిత్వం ప్రకటించుకోవడంలో వొక సౌకర్యమూ అసౌకర్యమూ వున్నాయి. ఆ అస్తిత్వ కోణం నించి మాత్రమే తనని చూడాలన్న కట్టడి అతను చదువరికి పెడ్తున్నాడా? పెడితే, అప్పుడు చదువరి కోరుకునే స్వేచ్చ ఏమవుతుంది?

ముఖ్యంగా సాహిత్య రంగంలో అన్ని వేపులా చదువరి వొక open-endedness ని కోరుకుంటున్న కాలం ఇది. అదే సమయంలో అనేక రకాల ప్రాతినిధ్యాలు రచనలలోకి వస్తున్నాయి. రవీందర్ కథల్ని నేను రవీందర్ చెప్పిన “తెలంగాణా దళిత” కోణం నించి మాత్రమే కాదు, వాటిని నా వైపు నించి – అంటే నాకు వుండే భిన్న అస్తిత్వాల – నించి కూడా చదువుతాను. నా reading ని రవీందర్ కట్టడి చేయలేడు, చేయాలనే వుద్దేశం కూడా అతనికి వుండకపోవచ్చు. కాని, వొక చదువరిగా నేను నా ప్రపంచంలోకి రవీందర్ ని ఎలా పిలుచుకోవాలి?

The other – అన్యత్వం- అన్న భావన ఇప్పుడు సాహిత్య రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ పెద్ద సమస్యే. ఎందుకంటే, సమాజంలోని representations తప్పనిసరిగా సాహిత్యంలోకి వస్తాయి కాబట్టి-

If literature is a “representation of life,” then representation is exactly the place where “life” in all its social and subjective complexity, gets into the literary work. (W.J.T. Mitchell)

ఈ విషయాన్ని ఎలాంటి సంశయాలూ లేకుండా వొప్పుకుంటాను కాబట్టి, రవీందర్ open చేసే “social and subjective complexities” నాకు కావాలి. అయితే, చదువరిగా నాకు వుండే అవే complexities తోనే నేనూ రవీందర్ ప్రపంచంలోకి వెళ్ళాలి. “తెలంగాణా” “దళిత” అన్నప్పుడు రవీందర్ నాకు వొక doubly oppressed identity కేంద్రంగా పనిచేసే ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాడు. అంటే, రెండు ప్రాతినిధ్యాల మధ్యకు తీసుకు వెళ్తున్నాడు. అవి రెండూ కాని నాదైన ప్రాతినిధ్య భూమికతో నేను ఈ కథల్లోకి వెళ్ళాలి. అంటే, మా ఇద్దరి మధ్య వొక dialogic space తెరుచుకోవాలన్నమాట.

మన సాహిత్యంలో ఇలాంటి dialogic space కి ఇంకా అనువైన కాలం రాలేదు. తన సానుకూల క్షేత్రం (comfort zone) నించి విడివడి ఇతర spaces లోకి వెళ్ళే మానసిక సంసిద్ధత లేదా స్వాతంత్రం ఇంకా రాలేదు మనలో చాలా మందికి – అలాంటి మానసిక స్వాతంత్రం లేనప్పుడు రవీందర్ గాని ఇంకో రచయిత కాని, తను ఫలానా అని కచ్చితంగా చెప్పుకున్నప్పుడు అది మొదట్లో చాలా అసౌకర్యంగా, uneasy గా వుంటుంది. కాని, అలా వుండడమే మంచిది. ఆ తరవాతి సంభాషణ హాయిగా వుంటుంది. నా భిన్నమైన అస్తిత్వ కోణం నించి నేను రవీందర్ “తెలంగాణా” “దళిత” కథలు చదువుతున్నప్పుడు యీ కథల్లోని జీవితం, వాతావరణం, పాత్రలు, సంఘర్షణలూ, ఉద్యమాలూ, ఆశలూ నిస్పృహలూ నాకు తెలిసిన లోకంలో నా కవరేజ్ ఏరియాలో లేని సంగతుల్ని, లేదా నేను కవర్ చేయడానికి ఇష్టపడని/ నిరాకరించే విషయాల్నీ రవీందర్ నాకు “ఇదీ” అని pointed గా చూపిస్తున్నాడు. సాహిత్యంలో తన representation గురించి resolute concerns వున్న బుద్ధిజీవి అయిన రచయిత మాత్రమే ఇలాంటి concern తో మనల్ని పలకరిస్తాడు. అయితే, నేను ఇక్కడ resolute అని దాన్ని qualify చేయడాన్ని మీరు గమనించాలి.

రవీందర్ కి తెలంగాణా దళిత వాదం అతని రచనా జీవన విధానం. అతని అనేక సామాజిక సాంస్కృతిక సాహిత్య అంశాలు దాని చుట్టూ తిరుగుతాయి. దాన్నించి అతన్ని విడిగా చూడలేనట్టే, అతని imaginative realm ని కూడా వొక వేరే ద్వీపంగా ఊహించలేం. అదే realmలో వుంటూ వొక కథకుడిగా రవీందర్ చాలా జీవితాన్ని ఈ కథల్లో కవర్ చేస్తున్నాడు. దాన్ని నేను resolute concern అని అంటున్నా. అస్తిత్వవాదం విధించే కనిపించని సంకెలని గౌరవిస్తూనే, జీవితంలోని ఇతర ప్రాతినిధ్య అంశాలని సృజనాత్మకంగా అక్కున చేర్చుకోవడంలో రవీందర్ మూలతత్వం అర్థమవుతుంది. బహుశా, ఆ కారణంగానే రవీందర్ ఆవిష్కరిస్తున్న తెలంగాణా దళిత దృశ్యం ఇక్కడ నిండు కాన్వాస్ మీద convincing గా కనిపిస్తుంది. అయితే, ఇంకాస్త ముందుకు వెళ్లి, రవీందర్ కథలు కేవలం “తెలంగాణా దళిత” కథలు కావనీ, “తెలంగాణా దళిత రాజకీయ” కథలనీ చెప్పడం అతని కథాతత్వానికి అతికినట్టు సరిపోతుంది. అస్తిత్వవాద రాజకీయ కోణం అనేది తెలుగు సాహిత్యంలో ఇంకా సరిగా ఆవిష్కారం కావడం లేదన్నది నిజం. ఎందుకంటే, ఆ విషయాన్ని సవిమర్శతో చూసే సంయమనం ఇంకా మనకి రాలేదు. వాదాలని ఉద్వేగ దశలోనే కాకుండా, వాటి తరవాతి ఆలోచనాత్మక దశని కూడా చూడగలిగే వోర్పు వున్నప్పుడు మాత్రమే రచయితకి రాజకీయ విమర్శ సాధ్యపడుతుంది. “పొద్దయింది” “ఊగి ఊగి ఉయ్యాల..” “అన్నీ తానై..”లాంటి కథల్లో ఈ కోణాన్ని చూడవచ్చు. ఉద్విగ్న రాజకీయ సన్నివేశంలో బతుకుతూ కూడా, రచయితగా ఎలాంటి objectivity ని వ్యక్తం చేయవచ్చో రవీందర్ ఇక్కడ రుజువు చేస్తున్నాడు.

4

నాలుగు ముక్కల్లో ఏ రచన గురించి అయినా ఎంత న్యాయం చేయగలమో ఇంకా నాకు అపనమ్మకమే. మన దగ్గిర వున్న విమర్శ సాధనాలు చాలా చాలా కొద్ది. మన ముందు వున్న జీవితాలు సంక్లిష్టంగా వున్నప్పుడు, కథకులు ఆ సంక్లిష్టతని అందుకొని దానికి తగిన కాన్వాస్ కోసం వెతుక్కునే తపనలో వున్నపుడు, విమర్శ స్థాయిలో మాట్లాడేది అంత తృప్తినివ్వదు. అందుకే, చదువరికి తన spaceలో తను సంచరించే స్వేచ్చనిచ్చే రచనని, విమర్శని నేను ఇష్టపడ్తాను. అలాగే, రచయిత తనకి తానుగా ఇచ్చే స్వేచ్ఛ కూడా నాకు ఇష్టం. రవీందర్ కూడా అలాంటి స్వేచ్చని ఇష్టపడే తాత్వికుడు. ఈ కథల్లో నాకు కొన్ని వర్ణనలు నాకు అసంతృప్తి కలిగించిన మాట వాస్తవం. ఉదాహరణకు : “జాగీరు” కథలో “మా ఇద్దరి మధ్య స్నేహ కుసుమాలు విరబూశాయి.” లాంటి వాక్యాలు చాలా archaic గా అనిపించాయి. ఈ కథల్లో సాధారణంగా కనిపించే రవీందర్ వాక్యాలకు పూర్తి వ్యతిరేకమైన వర్ణనా శైలి అది. అది శైలిని మరింత కమ్ముకోకుండానే వాటికి దూరంగా వుండి రాయాలసిన అవసరం ఇప్పటి రచయితలకి వుంది.

ఆ వొక్క చిన్న లోపం మినహాయించి రవీందర్ కథాభాష చాలా హాయిగా వుంటుంది, కొత్త భాషని నిజమయిన యాసని కథలోకి అద్భుతంగా తీసుకువచ్చాడు రవీందర్. అతను తీసుకువస్తున్న paradigm shift కి ఈ భాషతో సహా అతని వస్తువూ, సంవిధానమూ, కథాకథనమూ బాగా వొదిగాయి. తెలంగాణా దళిత జీవితాల్లో balanced diet పెద్ద కల. కాని, తెలంగాణా దళిత కథల్లో ఆ balanced diet కలగా మిగలకూడదన్న మొండి పట్టుదల రవీందర్ లో కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇలాంటి కథా ధోరణికి చాలా అవసరం.

–          అఫ్సర్

జులై 5, 2014.

 

 

 

 

 

విదూషకుడు పాడిన విషాద గీతం ‘మూలింటామె’

మూలింటామె‘ నవల చదవడం పూర్తి చేసి పుస్తకం మూతపెడుతూ ‘ఏమిటీ రంకు ముండా గోల? నామినికి మతిపోయిందా యేమి?’ అనుకున్నాను. ‘ఎలావుంది పుస్తకం?’ అని అత్యంత కుతూహలంగా అడిగిన మిత్రుడు మోదుగుల రవికృష్ణతో కూడా ఆ మాటే అన్నాను.

ఐతే, ఈ కథను గురించిన ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. కథంతా ముక్కలు ముక్కలుగా గుర్తొస్తూ వెంటాడుతూనే వుంది. ఎందుకో ‘బీభత్సరస ప్రధాన విషాదాంతం’ అని శ్రీశ్రీ కన్యాశుల్క నాటకాన్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటలు ఆ నాటకానికి వర్తిస్తాయో లేదో గానీ, ఈ నవలకు మాత్రం పూర్తిగా వర్తిస్తాయి.

పుస్తకం మరోసారి చదవడం మొదలెట్టాను. ఇది నామిని రాసిన పూర్వపు గ్రంథాల్లా తమాష తమాషగా నడిచే పుస్తకం కాదు. నామిని గొంతులోని చిలిపితనం మాయమయ్యింది. సీరియస్‌ టోన్‌లో ఈ కథ చెప్తాడు. ఈ మార్పు నామిని రెగ్యులర్‌ పాఠకుణ్ణి కొంచెం చకితుణ్ణి చేస్తుంది. హాస్యం తగ్గించినా వ్యంగ్యం అంతర్లీనంగా నడుస్తూనే వుంటుంది. వర్తమాన వ్యవస్థపైన ఆక్రోశంతో కూడిన వ్10521865_10154366304195385_905769971_nయంగ్యం అది.

 

మూలిల్లు అంగిడిల్లుగా మారడం మూలింటామె నవలలోని యితివృత్తం. మూలిల్లు అంగిడిల్లుగా మారే క్రమంలో పూర్వ సంప్రదాయాలు ఎలా అంతరించి పోతాయో, నైతిక విలువలు కొత్త రూపాన్ని ఎలా సంతరించుకుంటాయో, సమాజంలోని అన్ని రకాల విలువలూ ధన దౌర్జన్యాలకు ఎలా ప్రభావితమౌతాయో ఆసక్తికరంగా వివరిస్తుందీ కథ. వెరసి సంప్రదాయ జీవితాన్ని మార్కెట్‌ శక్తులు ఎలా కబళిస్తాయో, మనుషులెలా పరాయీకరణ చెందుతారో వివరిస్తుందీ కథ.

మూలింటోళ్లది ఒద్దికైన యిల్లు. ముగ్గురాడవాళ్లు. ఒక మగవాడు, ఇద్దరు పిల్లలు… ఆ యింట్లో ఉండే మనుషులు. అందరికంటే పెద్దావిడని మొదుటామె అనీ, ఆమె కూతుర్ని నడిపామె అనీ, ఆమె మనవరాల్ని కొనమ్మి అనీ పిలుస్తారు. మొదుటామె కొడుకు పేరు నారాయుడు. అతని చెల్లెలు నడిపామె. ఈ నడిపామె కూతురు కొనమ్మినే నారాయుడు పెళ్లాడాడు. వీళ్లకిద్దరు పిల్లలు.

మూలింటోళ్లు పెరట్లోనూ, చేనిగెనిమల కాడా ఉన్న చెట్లను చక్కగా సాక్కుంటారు. పెంపుడు జంతువుల్ని కూడా కన్నబిడ్డల్లా ప్రేమిస్తారు. ఆకలో తల్లా అని యింటి కొచ్చిన వాళ్లకు ఉన్నదాంట్లోంచి యింత తీసి పెడతారు. ముప్పొద్దులా చాకిరి చేస్తారు, సంతృప్తిగా జీవిస్తారు. సాటి మనుషుల కొచ్చే కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు.

ఇట్లా సుఖంగా జరిగిపోతున్న దశలో ఆ యింటి ఇల్లాలు కొనమ్మి మొగుణ్ణీ పిల్లల్నీ వదిలేసి కళాయి బోస్కునే ఒక అరవ మాదిగోడితో లేచిపొయ్యింది. ఈ విషయం సహజంగానే ముందు ఊళ్లోవాళ్లకు, చివరిగా యింట్లో వాళ్లకు తెలిసింది. ఊళ్లో పెద్దమనుషులు, పతివ్రతలు మూలింటి దగ్గర గుంపుకట్టారు. అనాల్సిన మాటలన్నీ అన్నారు. లేచిపోయిన పిల్లని వెనక్కి తేవాలని తీర్మానం చేశారు. లేచిపోయిందాన్ని వెనక్కి తెచ్చేదెందుకు? రేపు మనగ్గూడా కొంగు పరవక పోతుందా అని పెద్దమనుషులు ఆశ. మనలో మరొకటి చేరుద్దిగదా అని పతివ్రతల కులుకు.

పోయిన పిల్ల మొండిది. ‘నాకు మూదేవి గమ్మి గడప దాటొచ్చేసి తప్పు జేసినా. యింగా గడప తొక్కను. బావ మొకం చూళ్లేను. నేను కర్మురాల్ని. చచ్చిందాంతో సమానమని నన్ను మర్సిపోండి’ అని తలకొట్టుకొని ఏడుస్తూ వెళ్లిన వాళ్లను వెనక్కు పంపేసింది.

ఆడమనిషి ఇలా లేచిపోవడమనేది గుట్టుగా నడుపుకొనే సంసారాల్లో ఎంత కల్లోలం రేపాలో అంతా రేపింది. లేచిపోయిన పిల్ల అత్తకు మనవరాలు మొగుడికి మేనకోడలు. తానులో తాను, ముక్కలో ముక్క. ఆ కుటుంబాన్ని లోకులు పెట్టిన హింసకు పరాకాష్ట రంజకం వొక్కలు ముక్కలుగా మాట్లాడిన మాటలు. ‘ఏమే మొదులా! కొనదానికీ కళాయోడికీ నడిమద్దిన తడిక మాదిర వుండింది నువ్వేనంటనే! కళాయోణ్ణి కోడలితో కులకమని జెప్పి నువ్వు అడ్డాపింటి ముందర కావిలుండే దాని వంటనే! అవరా! అవరా! కొడుకని అన్నా జూసినావా నువ్వు? నీ మనవరాలు జిల్లా పటంగవితే నువ్వు దేశిపటంగివే!’

 

ఎన్ని అవమానాలు జరిగినా మొదలామెకి మనవరాలి మీద మమకారం చావలేదు. ఏదో ఒక రోజుకి తిరిగి ఇంటికి వస్తుందనే ఆశ పోలేదు. అప్పుడు కూతురు (నడిపామె) తల్లికి ఉపదేశం చేసింది. ‘అమా, నీకు పున్నెముంటాది. దాన్ని మర్సిపో. మనం గానీ ఆ యమ్మిని కడుపులోనే పెట్టుకొంటే యింట్లో వుండే లేదర పిలకాయల్ని కూడా సాక్కోలేము, చదివించుకోలేము. అన్నకు మళ్లీ పెండ్లి చేద్దారి’. మొదులామె అంగీకరించలేదు. కానీ ఆమె అంగీకారం కోసం ఎవరూ ఎదురు చూడలేదు.

లేచిపోయిన కొనమ్మికి ఎవరి సానుభూతీ దక్కలేదు. బహిరంగంగా ఆమె చేసిన తప్పును అసహ్యించుకోవడం ద్వారా ఊరు తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంది. కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలబడలేని స్థితి. సమాజం కుటుంబంపైనా వ్యక్తిగత విషయాలపైనా ఎంత దౌర్జన్యం చెయ్యగలదో అంతా చేసింది. అంతటి దుఃఖాన్నీ, అవమానాన్నీ దిగమింగుకుంటూ చెట్టూ చేమల్నీ, కయ్యా గనుమల్నీ, పిల్లీ పిచికనీ ఏమరలకుండా సాక్కుంటూనే ఉన్నారు, నడిమింటోళ్లు.

సమాజం లోకువగా ఉన్న మనుషుల్ని ఊరికే వదిలిపెట్టదు. వాళ్ల ఏడుపు కూడా వాళ్లను ఏడవ నివ్వదు. మరీ ముఖ్యంగా బంధువులైతే సానుభూతి మిషతోనో, మేలు చేసే మిషతోనో వాళ్ల వ్యవహారాల్లో వేలు పెడుతూనే ఉంటారు. మొదుటామె అక్క తన తోటికోడలి మనవరాల్ని నారాయుడికి మారు మనువుకి మాట్లాడుకొచ్చింది. నడిపామె కూడా సహకరించింది. మొదుటామెకి ఇష్టం లేకపోయినా నారాయుడి పెళ్లి పందొసంతతో జరిగిపోయింది.

పందొసంత లేచిపోయిన పిల్ల లాగా నోట్లో నాలుక లేనిది కాదు. తనకు నచ్చినపని, తాను చెయ్యాలనుకున్న పని ఎవరు ఔనన్నా కాదన్నా చేసెయ్యగల తెంపరి. మొదుటామె తనకు సానుకూలంగా లేదని వచ్చిన వెంటనే గ్రహించింది. ఐనా ‘ముసిల్దానా! దేనికెప్పుడూ ముటముటా అంటా మూతి నల్లంగా పెట్టుకోనుంటావు? నవ్వతా పేల్తా వుండలేవా నువ్వు? నవ్వు! మా ముసిల్దిగదా, నవ్వు! నవ్వు! నిన్ను ఆ పక్కట్టితో నాలుగు దొబ్బితే గానీ దోవకు రావా ఎట్ట?” అని చక్కిలిగిలి పెడుతూ ఆసికాలాడింది. మొగుడితో గూడా అంతే. మంచం మింద కుచ్చోనుంటే మెడమింద చేతులెయ్యడం, పక్కన పొనుకోని కాళ్లెయ్యడం – ఆ కులుకు నింక చెప్పలేమసలికి. వూరికొచ్చి పద్దినాలు గాకనే దానికి యిల్లిల్లూ తెలిసిపోయింది. సినమ్మా అనాల్సినోళ్లని సినమ్మా అనీ, అత్తా అనాల్సినోళ్లను అత్తా అనీ బావా అనాల్సినోళ్లను బావా అనీ పిల్సుకుంటా ఊరంతా పోయ్‌ అరట్లు దొబ్బేసి వస్తా వుంటింది. ఇంట్లో కడిగిన చెయ్యి ఆమెకు పరావోళ్ళింట్లో ఆరాల్సిందే. మొలకమ్మ యిల్లు మొదులుకోని, రంజకం యిల్లు మొదులుకోని, చాకలోళ్లిండ్లు మొదులుకోని యాడ జూసినా తిరగతానే వుంటుంది. మొదటామెకి ఆమె తిరుగుళ్లు నచ్చక పోయినా ఒకటంటే నాలుగు వినాల్సొస్తుందని గమ్మునుండేది. వూళ్లో మొగోళ్లకూ ఆడోళ్లకూ మాత్రం ‘పందొసంతకు కొత్తా పాతా లేదు. మనూరికి రావాల్సిన బిడ్డే!’ అని పేరెత్తుకొనింది.

Mulintame600

వ్యాపారానికీ, మార్కెట్‌ సంస్కృతి నిలబడటానికీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా ముఖ్యం. పందొసంతలో ఆ స్కిల్స్‌ కొల్ల. ఐతే మార్కెట్‌లో నిలబడాలంటే కేవలం స్కిల్‌ ఒక్కటే చాలదు. ఒక బలమైన అండ ఉండాలి. ఒక గాడ్‌ఫాదర్‌ కావాలి.

రంగబిళ్ల ఆ చుట్టు పక్కలూళ్లల్లో కొంచెం పేరెత్తుకున్నోడు. అతగాడు నారాయుడికి తమ్ముడొరస. పందొసంత కన్ను మొదట అతని మీదే పడింది. ‘రంగబిళ్లా, ఏం మేనమామ కొడకా! మరదాల్ని చూసేసిపోవా? మరదాల్తో మాట్లాడి పోకూవర్తీ కనుక్కోవా?’ అంటా పైయ్యేస్కోని పిలిచేది. ‘నువ్వేంది బావా బీడీలు తాగేది, సిగిరెట్లు తాగు’ అని చెళ్లబడేది. ఒక రోజు సందేళపూట ‘బావా నన్ను ఉప్పు గుర్రం ఎక్కించుకో’ అని రంగబిళ్ల యీపెనకాన ఉప్పుగుర్రం ఎక్కి మిట్ట మిందంతా ఒకటికి పది చుట్లు తిరిగింది. మొదుటామె మనవరాలు లేచిపోయినప్పుడు వొక్కలు ముక్కలుగా మాట్లాడిన రంజకం యిదంతా యీదిలో నుంచి చూసి పకపకా నవ్వేసింది. ‘బావా మరదాలు బలే కులుకు మిందుండారే!’ అని కండ్లారా చూసింది గానీ ఏం యిచ్చిత్ర పోలా!

రంగబిళ్ల కంటే గుడుగుడు చెంద్రడు మరింత శక్తిమంతుడని, లాభకారి అని, పందొసంతలోని వ్యాపార శక్తి కనిపెట్టేసింది. గుడుగుడు చెంద్రడు పది పన్నెండెకరాల ఆసామి. మూడు టాకట్రలకు యజమాని. యాడ టాకట్రు దున్నకం మిందుంటే ఆడికి గుడుగుడు మోట్రమీద పొయ్‌ ఊళ్లు తిరుగుతాడు. అందుకే అతన్ని ఆ పాయకట్టంతా గుడుగుడు చెంద్రడని పిలుస్తారు. సొంత వూళ్లో మాత్రం అతన్ని కర్రెడ్డి అంటారు మనిసి బొగ్గు వర్నంతో వుంటాడు గాబట్టి. పందొసంత మేని వర్ణాన్ని చూసే మనిషికాదు. డబ్బుకు వర్ణభేదం వుండదని తెలిసిన మనిషి. ఆమె చూపు అతని మింద పడిన మరుక్షణం గుడుగుడు మోటారు మూలింటి ముందు ఆగిపోయింది. మంచి మద్యానం వచ్చిన మనిసి రేత్తిరి ఏడు దాకా పందొసంతతో మాట్లాడిన వాడు మాట్లాడినట్టే ఉన్నాడు. నారాయుడు కూడా గుడుగుడు చెంద్రడికి ఎంతో మరేదిచ్చినాడు.

పందొసంత దూరదృష్టి గల మనిషి. క్రైసిస్‌ మేనేజిమెంటు ఆమెకు బాగా తెలుసు. ముందు ముందు వ్యవహారాలు సజావుగా సాగాలంటే గుడుగుడు చెంద్రడికీ నారాయుడికీ మంచి సఖ్యత ఏర్పడాలని గుర్తించింది. అందుకోసం రకరకాల విద్యలు ప్రయోగించింది. మొగుడి బుజాల మింద చేతులేసి పైపైన పడేది. ఏదో ఒగటి మాట్లాడమని గారాం జేసేది. నారాయుడి ముసిముసి నవ్వులు నవ్వతా ఒకటి రెండు మాటలు మాట్లాడగానే ‘పెండ్లాం మాట అట్ట యినాల’ అని చెప్పి ముద్దులు బెట్టేది. గుడుగుడు చెంద్రడొచ్చినప్పుడు అతగాడి దగ్గర సిగరెట్టు పెరుక్కోని మొగుడి కిచ్చేది. ఆ సిగరెట్టు ముట్టించమని గుడుగుడు చెంద్రడికి ఆర్డరేసేది. గుడుగుడు చెంద్రడు ముట్టిస్తా వుంటే, ‘యిప్పుడు పోటాగాన తీస్తే ఎన్టీరామారావుకు నాగేస్పర్రావు ముట్టించినట్టుగా వుంటాది’ అని చెంద్రడి మింద పడిపడి నవ్వేది.

ఒకానొక రేత్రి గుడుగుడు చెంద్రడికి పెండ్లయి పెళ్లాం బిడ్డలుండినా గాజులమండ్యంలో యిల్లూ వాకిలీ వుండినా మూలింటామె యింటి ముందరుండిన టాకట్రను ఎగజూపెట్టుకోని జాగారం చెయ్యాల్సొచ్చింది. నారాయుడు మంచాన్నీ పెళ్లాన్నీ చెంద్రడి కొదిలేసి ఈతాకు చాపమింద వైబోగంగా నిద్దరబొయ్‌నాడు. ఇట్లాంటి వార్తలు ఊరిమీద వేగంగానే పాకుతాయి. మిట్టూరోళ్లంతా మూతుల మింద చేతులేసుకున్నారు. ‘పందొసంత యీ వూరికి కోడలైన పది పదైద్దినాలల్లోనే వూరి పినపెద్ద కొడుకు రంగబిళ్లను పెట్టుకొనింది. నెలైనా వోడితో సావాసం చేసిందో లేదో అష్టతెలువుల్తో పది పన్నెండెకరాలుండి వొకటికి మూడు టాకట్రలుండే గాజులమండ్యం రెడ్డిని ఒళ్లో యేస్కొనింది. అదే యింట్లో పుట్టి పెరిగిన పెవడముండ ఏమి జేసింది? అరవ మాదిగోడితో పూడిసింది. వొకటి మూలింటోళ్లకు తలొంపులు తెచ్చి దాని దోవ అది చూసుకుంటే, యింకొక పున్నాత్మురాలొచ్చి వాళ్ల నెత్తిన కిరీటం పెట్టింది’. అని మూలింటోళ్ల మింద కుళ్లుకున్నారు కూడా!

వ్యాపార సంస్కృతి ప్రబలమయ్యే కొద్దీ సంప్రదాయవాదుల గొంతులు బలం కోల్పోతాయి. పందొసంత వ్యవహారశైలి గురించి చీమంతమ్మ సుకుమార్‌ లాంటి వాళ్లు గొణిగినా వారి నోళ్లను మొలకమ్మ రంజకం లాంటి వాళ్లు తేలిగ్గానే మూయించగలిగారు.

తన చాకచక్యం ఇంటినీ వీధినీ గెలిచిందని పందొసంతకు అర్ధమైంది. తదుపరి కార్యాచరణకు దిగింది. ఇంటి చుట్టూతా, పొలం గట్ల మీదా ఉన్న చెట్లను సామిల్లు వాడికి మంచి రేటుకు అమ్మేసింది. తరతరాలుగా పిల్లలకు కాయా గసురూ అందిస్తూ నీడనిస్తున్న చెట్లను కొట్టేయొద్దని మూలింటామె అడ్డం రాబోయింది. “అడ్డం వొస్తావా! కావాలంటే అరవ మాదిగోడితో దొబ్బుకొని పూడ్సిన నీ మనవరాల్ని కూడా తొడకరాబో? యిద్దురూ చెట్లకాడ అడ్డంగా పొడుకుందురు. పోపోయే ముసిల్దానా! నాలుగు నాళ్లకంతా యింటికాడా, చేనుకాడా కిలీనుగా యిలాశియంగా వుంటాది. నువ్వు పదే ముసిలీ!’ అంటా పందొసంత పకపకా నవ్వుతా ఎనప దూడను జవురుకొన్నట్టుగా జవురుకోని తెచ్చి ముసల్దాన్ని బండమింద మరేదగా కుచ్చనబెట్టింది.

చెట్ల నమ్మిన డబ్బు పన్నెండు వేలలోంచి పన్నెండు వందలు తీసి బంకొకటి తెప్పించి యింటి ముందర అంగిడి తెరిపించింది పందొసంత. మరసట్రోజే బంకు నిండికీ సామానొచ్చేసినాయి. ఒక వస్తవ ఉండాది ఒక వస్తవ లేదు అనాల్సిన పన్లా. కొనుక్కోడానికి డబ్బుండక్కర్లా. సమయానికి డబ్బు లేకపోతే పందొసంత వివరంగా గుర్తు రాసుకోని అప్పిచ్చేస్తాది. వూరి జనానికి పందొసంత అంగిడి వల్ల ఇంత మేలుగా ఉండాది. ఏడున్నరా ఎనిమిది కంతా అంత చారూకూడూ తినేసి పొనుకునే వూరు తొమ్మిదీ తొమ్మిదిన్నరకు అంగిట్లో లైట్లు ఆరినాకనే పొనుకునేది నేర్చింది.

పందొసంత అంగిడి తెరిచే దాంతో ఆగలేదు. ఆ వెంటనే చీరల వ్యాపారం, దాంతో పాటే తండల వ్యాపారం, పనిలో పనిగా చీటీల వ్యాపారం కూడా మొదలేసింది. యిన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నా మొగుణ్ణి నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆరుగాలం ఎద్దుల్ని మడికాడకి తోలకపోయి సందేళ వాటి కోసం కసవు మోపును నెత్తిన బెట్టుకోని కాళ్లీడ్చుకుంటూ యింటికి వచ్చే మొగుణ్ణి చూస్తావుంటే ఆమెకు కడుపు రగలకపొయ్యేది. గుడుగుడు చెంద్రడి టాకట్రుండగా ఎద్దుల సేద్యం ఎందుకు చెయ్యాలనిపించింది. బండీ ఎద్దుల్ని ఆరువేలకు అమ్మేసి పట్టిన శని యీడేర్చింది. మొగుడికి మోపెడ్‌ కొనిచ్చింది. నారాయుడిప్పుడు మోపెడ్‌ మీద తిరగతా కొట్లోకి సామాన్లు తెస్తుండాడు. పొరుగూరు పోయి బిలేరి కోడి మాంసం కావాలన్నప్పుడల్లా తెస్తుండాడు.

ఇంక భూమి మిగిలిపోయింది. ఆ రెండెకరాల కయ్యనూ అమ్మితే అరవై వేలన్నా వస్తాయి. ఆ డబ్బు కనుక వొడ్డీల మింద తిరిగితే ఇరై ముప్పై ఎకరాలు సేద్యం చేసే దానికంటే ఎక్కువ మిగల బెట్టుకోవచ్చు. మొగుణ్ణి ఎగదోసింది. ‘నేను నిన్ను బతికినంతకాలం కుచ్చనబెట్టి కూడేస్తాను బావా! నువ్వేంది బావా ఆ మడికాడికి బొయ్‌ వొంగివొంగి పనిచేసేది? నువ్వు కుచ్చుంటే నాకు కుశాల. నువ్వు ఎండలోకి పొయ్‌ చేనులో వొంగితే నాకు బాద” అని కండ్ల నిండికి నీళ్లు పెట్టుకొనింది. గుడుగుడుచెంద్రడితో కలిసి జోరుగా మందు తాగుతున్న నారాయుడు “కయ్యమ్మాలనుకున్నాం గదా. మాయమ్మకు కొంచిం మంచిగా ఉండు. మూకుళ్లలో కూడూ, కోడికూరా దండిగా కలుపుకోని పొయ్‌ పిల్లులకు పెట్టు. చిన్నామున్నుల్లాలా, కానాచ్చుల్లాలా, కొండాచ్చుల్లాలా అని మాయమ్మ యినేటట్టుగా పిల్లుల్ని పిల్చి బండకాడ పిల్లులకు కూడూ కూరా పెట్టేసి రాబో’ అనేసి అన్నాడు ఓ అని నవ్వతా! ఆ ఒక్క మాటతో నారాయుడు తాను తల్లి పక్షం కాదనీ భార్య పక్షమేననీ స్పష్టంగా చెప్పినట్టైంది. ఇది పందొసంతకు గొప్ప విజయం.

ఐతే విజేతకు అడుగడుగునా సవాళ్లు ఎదురౌతూనే ఉంటాయనేందుకు నిదర్శనంగా అప్పుడొక సంఘటన జరిగింది. వాళ్లింటి ముందు గుడుగుడు చెంద్రడి పెళ్లాం ఆటో దిగింది. దిగుతూనే నేరుగా మొగుడి దగ్గరికొచ్చి వాడి మొకాన కేకరించి ఎంగిలూంచి, పందొసంత ఎదుర్రొమ్ము మింద అట్టనే ఎగిసి ఎడం కాల్తో తన్ని, ‘నా మొగుళ్ళంజా! మా కొంప మూడు ముక్కలయ్యే దాకా వీణ్ణొదలవాసేయ్‌’ అంటా ఆగిత్తం పట్టించింది. ఈ గోలకు యింటి ముందు పోగైన జనాన్ని చూసి, ‘యీ వూళ్లో యిట్టాంటి పలుబోటి లంజలు కూడా ఉండాయా! యీ మాదిర్తో వూరోళ్ల మొగుళ్లను పక్కలో యేస్కోని యింటికి రానీకుండా చేసే ఆడదాన్ని ఏం చేస్తే కర్మాలు తీరునో మీరే చెప్పండి. యీనా సవితిని పట్టుకోని నలగ్గుమ్మేద్దామనుండాది’ అని కాసుగ్గాకుండా మాట్లాడింది.

పందొసంతకు జరుగుతున్న అవమానం అక్కడి జనం సహించలేకపోయారు. పందొసంత లాంటి తీరైన మనిషికి, పదిమందికి తల్లో నాలుకలా ఉండే మనిషికి జరగాల్సిన అవమానమా అది? వెంటనే మొలకమ్మ అందుకుంది. ‘పందొసంతకు ఎవురూ సపోరట రారని అనుకోబాక. మేమంతా చచ్చినామా! యిది వూరనుకున్నావా అడివను కున్నావా? నీ మొగ్గుణ్ణి అదుపులో పెట్టుకోవాల్నే గాని వొకమ్మ గన్న బిడ్డిమిందికి వొంటికాలి మింద ఎందుకొస్తావు?” అని మూతి మింద కొట్టినట్టుగా మాట్లాడింది. ఆ వెంటనే రంజకం అందుకుంది. ‘యిందాక పందొసంత ఎదుర్రొమ్ముల మింద తన్నినావంట గదే. నీ కాళ్లల్లో గండుమల్లి పుండు బుట్టదా! యింగొక్కసారి వాళ్ల పనిలో వాళ్లుండగా యీ మాదిర బైసాట్లు చేస్తా వొచ్చినావంటే నీ శిండ చించి, బజిని గుడికాడ కట్టేస్తాం. నీ నాయం నీకుంటే మా నాయం మాకుంటాది’ అనింది. చెంద్రడి పెళ్లాం బిత్తరపోయింది. శత్రువు బలం అర్ధమైంది. ‘మీరు పొండి తల్లుల్లారా! నా బంగారం మంచిది కాదు’. అని మళ్లా మొగుడి మొకాన వూంచి వొచ్చిన ఆటో ఎక్కి మళ్లా తిరుక్కోని పూడిసింది. పందొసంత వూరిని గెలిచింది.

అరవై వేలకు భూమిని అమ్మేందుకు ఒప్పందమైపోయింది. పొలం అమ్మాలంటే మొదుటామె వేలిముద్దరెయ్యాల. ముసల్ది బిగుసుకుపోయింది. పందొసంత చాణక్యాలు ఆమె మీద పనిచెయ్యలేదు.

మార్కెట్‌ శక్తులు తమపని సాఫీగా సాగిపోతున్నప్పుడు ఎంత ఉదారంగా ఉంటాయో వ్యతిరేకత వచ్చినప్పుడు అంత కంతా క్రౌర్యం చూపిస్తాయి. మొదులామె ప్రాణప్రదంగా పెంచుకొనే పిల్లల్లో రెంటికి విషం పెట్టి చంపేసింది పందొసంత. వేలిముద్దరెయ్యకపోతే మిగిలిన వాటికి కూడా అదే గతి పడుతుందని మొదుటామెని హెచ్చరించింది. మొదటామె ఒక నిర్ణయానికొచ్చేసింది. తనబోటి వాళ్లకివి రోజులు కావు. వెంటనే లేచి యింత వొడిశాకు పెరుక్కోని తినేసింది. ముసిల్ది వొడిశాకు తినేసిందని వూళ్లో ఎట్ట తెలిసిపొయ్యిందో గానీ అందురూ యీదిలో వుడ్డ జేరి పొయ్‌నారు. చీమంతమ్మ వొచ్చి ముసిల్దాని తలకాయ వొళ్లో బెట్టుకొంది. ముసిల్దానికి వూపిరి పీల్చేదానికి కష్టిమై ఆపసోపాలు పడుతూ కూడా చీమంతమ్మకు ఒక మాట చెప్పి మరీ కన్నుమూసింది.

“నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతే గానీ మియాం మియాం అంటా నీ కాళ్ల కాడా నా కాళ్ల కాడా చుట్టక లాడే పిల్లిని చంపలేదే!”

ఈ నవల్లో పందొసంత ఆధునికతను అభిమానించే వారు కళ్లకద్దుకోవాల్సిన పాత్ర. వ్యక్తిస్వేచ్ఛ, స్వతంత్ర భావజాలం, సంప్రదాయాలపై తిరుగుబాటు, సంఘ నియమాల ధిక్కరణ, ప్రాక్టికాలిటీ యిలాంటి ఆధునిక లక్షణాలు కలిగి వున్న పాత్ర. మరీ ముఖ్యంగా వ్యక్తి ఔన్నత్యాన్ని డబ్బుతో కొలిచే సంస్కృతికి ప్రతిరూపం యీ పాత్ర. సంప్రదాయవాదులు గొంతు చించుకొనే నీతి నియమాలు ఎంత డొల్లవో అడుగడుగునా నిరూపించడమే కాకుండా నీతి నియమాలకు కొత్త భాష్యాలు చెప్పగలిగిన పాత్ర. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, అది సాధించేందుకు ఉన్న మార్గాలను కనుక్కోవడం, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, తగిన స్ట్రేటజీస్‌ని అమలు చేయడం, అంతిమంగా విజయాన్ని అందుకోవడం…. ఆధునిక కాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు బోధించే అనేక పాఠాలు పందొసంత పాత్ర ఆచరణలో చూపుతుంది. పందొసంత వలన మార్కెట్‌ సంస్కృతి పుట్టుకొస్తుందా, మార్కెట్‌ సంస్కృతి పందొసంతల్ని పుట్టిస్తుందా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్న.

ప్రాచీన సంప్రదాయాలతో మనుగడ సాగించే దేశాలన్నిటిలో వ్యక్తులు పరిమిత స్వేచ్ఛ కలిగి ఉంటూ ప్రకృతితోనూ తోటి సమాజంతోనూ మమేకమై జీవించడం కన్పిస్తుంది. వలసవాదులు సంప్రదాయ జీవనానికి ఆలవాలమైన దేశాలను ఆక్రమించి ఆయా దేశాలకు మార్కెట్‌ సంస్కృతిని, అందుకవసరమైన వ్యక్తి స్వేచ్ఛను విస్తృతంగా ప్రచారం చేశారు. క్రమేపీ మార్కెట్‌ సంస్కృతి ప్రపంచీకరణకు దారితీసింది. మార్కెట్‌ సంస్కృతి కోరుకొనేది ఒక్కటే! లాభం. యీ సంస్కృతిలో లాభం కోసం చేసే కార్యకలాపాలకే గౌరవం. యీ మార్కెట్‌ సంస్కృతి 1984 నాటికే దేశం నలుమూలలా వ్యాపించిందని మూలింటామె నవలలో రచయిత సూచన మాత్రంగా చెబుతాడు. తేదీల సంగతి ఎలా ఉన్నా యీ సంస్కృతి నేడు దేశం మారుమూలలకూ వ్యాపించిందనేది నిజం. దీని ఫలితంగానే పర్యావరణం, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు నశిస్తున్నాయనేది నిజం. దీనికి వ్యతిరేకంగా పోరాడే వారు కూడా ఆధునికతను అక్కున చేర్చుకోవడం విచిత్రం. మార్కెట్‌ సంస్కృతి వ్యాప్తిని రచయిత నిస్సహాయంగా, విషాదంగా, క్రోధంగా పరికిస్తున్నట్టు నవలలో మనకు సూచనలందుతాయి. నామినిలోని ఒక తాత్త్విక దృక్పథం మొట్టమొదటిసారిగా మనకు పరిచయమౌతుంది. మునికన్నడి సేద్యం నవలలో కూడా యీ ఛాయలున్నప్పటికీ ఇంతటి స్పష్టత లేదు.

గ్రామీణ జీవితంలోని దారిద్య్రాన్ని, బతుకు పోరాటాన్ని హాస్యంతో రంగరించి ఆత్మకథాత్మకంగా తన రచనల్లో యింతకు పూర్వం చిత్రించిన నామిని ఆ వొరవడిలో అనేక మంది నూతన రచయితలు ఆవిర్భవించేందుకు కారణమయ్యాడు. పిల్ల వసుచరిత్రలనేకం పుట్టుకొచ్చాయి. మూలింటామె నవల ఇతరులు అనుకరించలేనిది. గతంలో నామిని లోని విదూషకత్వాన్ని (పాపం శమించుగాక) ఆస్వాదించిన పాఠకులకు గానీ సాటి రచయితలకు గానీ మూలింటామె నవలలోని కథావస్తువు దాన్ని చెప్పేందుకు అతనెన్నుకున్న స్వరం ఒక పట్టాన రుచించకపోవచ్చు. కానీ ప్రపంచీకరణ దుష్ఫలితాల్ని, ఒకానొక మారుమూల గ్రామంలో అవి ప్రతిఫలించిన విధానాన్ని అత్యంత సహజంగా నామిని చెప్పిన తీరు మాత్రం అత్యద్భుతమనే చెప్పాలి. ఒక అంతర్జాతీయ సమస్యను అదే స్థాయిలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన నవలగా మూలింటామె నవల విమర్శకుల మెప్పును పొందుతుంది. ఎన్నుకున్న నేపథ్యం, పాత్రల చిత్రణ, ఎలాంటి ప్రతిపాదనలు ఉపదేశాలు చెయ్యకపోవడం, చెప్పదలుచుకున్న అంశం వైపుకే పాఠకుడి దృష్టి ఉండేలా అనవసరమైన విషయాల్ని పరిహరించడం, అతి కొద్ది పేజీల్లో ఒక విస్తృతమైన అంశాన్ని ఆలోచనాత్మకంగా మలచడం ఇవన్నీ నామినిని ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన తెలుగు రచయితగా నిలబెడతాయి. మూలింటామె ప్రపంచ సాహిత్యంలో స్థానం పొందగల రచన. ఈ నవల ఆంగ్లానువాదం కోసం ఎదురుచూడాల్సి ఉంది.

-పిన్నమనేని మృత్యుంజయరావు

Mruthyunjaya Rao

జలజల కురిసి తడిపే దళిత కతలు

suma1

‘పొయ్యిగడ్డల కధలు’ రాసిన సుమ వయసు ఇరవై అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ చిట్టి పొట్టి కధల్లో ద్రవిడ దళిత సంస్కృతిని పొయ్యిగడ్డ చుట్టూ పోగు చేసి చూపించింది సుమ. ఈ కధలలో ఉన్న పాత్రల సజీవతను విదిలిస్తే ఆమె బతుకుతున్న సమాజంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్ధిక, కుటుంబ, కుల రీతులు జలజల రాలతాయి. పట్టణ జీవితంలో రెండు మూడు తరాలు పరాయీకరణను చెంది, గ్రామాల్లో తమ అస్తిత్వాన్ని క్రమంగా కోల్పోతున్న వారికి తమ మూలాలకు సంబంధించిన మట్టి వాసనలు భాష రూపంలో, వ్యవహార రూపంలో ఈ కధలు పరిమళిస్తుంటే ఒక పులకరింత కలుగుతుంది.

మర్చిపోతున్నఅనేక తేట తెలుగు పదాలు ఈ పాత్రల ద్వారా చదువుతుంటే పరవశం కలుగుతుంది. యుగ యుగాలుగా మనిషి భూమి మీద శ్రమిస్తూ నేర్చుకొన్న విజ్ఞానం తరం నుండి తరానికి బదిలీ అవుతూ సామెతల రూపంలో ఒక శాస్త్రంగా మార్పు చెంది, మనిషి జీవితానికి ఎంత ఉపయుక్తంగా మారిందో ఈ కధలు వివరిస్తాయి. ఇవన్నీ సుమ కనిపెట్టి మేధోపరంగా విశ్లేషించి రాసిందని కాదు. ఆమె అలవోకగా, నిజాయితీగా తన చుట్టూ ఉన్న బతుకుల్లోనుండి పరిచిన సంగతులు ఈ విషయాలను మనకు తేటతెల్లం చేస్తాయి.

భారతదేశంలో మూడొంతుల బ్రతుకులు సుమ చెప్పిన విధంగానే ఉన్నాయి. అయితే ఎంతమంది పేరెన్నిక కన్న రచయితలు ఈ బ్రతుకుల గురించి కలాలు విదిలించారు? ఎవరి సమూహాల గురించే వాళ్ళే రాసుకోవాల్సిన చారిత్రిక సందర్భం ఇప్పుడు వచ్చింది. నన్నయ్యలు, తిక్కన్నలు తమ గురించి రాస్తారని ఆశిస్తే ఇప్పటి వరకు జరిగినట్లుగానే మెజారిటీ బతుకు చిత్రాలు చరిత్ర గుహల్లో శాశ్వతంగా పూడుకొని పోతాయి.

“మా యమ్మ , మా అబ్బ” అంటూ అమాయకంగా సుమ భారత మూలవాసుల జీవన వైవిధ్యాన్ని మౌఖిక భాషలో గ్రంధస్థం చేసింది. ‘కజ్జాయల’ తయారీ గురించి చెబుతూనే పండగ చేయటానికి మేకను అమ్మాల్సిన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల గురించి చెబుతుంది. శాస్తాలు ఎలా చేయాలో చెబుతూ రాగులు, కాకి జొన్నలు, సాసువులు, యెర్నూగులు, అలసందలు జమిలీగా ఎలా పండిస్తారో కూడా వివరిస్తుంది. ‘జున్నటుకులు’ రామక్క బాల్యవివాహం, బిడ్డలు కోసం పడిన కష్టాన్ని చెబుతాయి. ‘వంచిన చారు’ పేదింటి పత్యాన్నిగురించి చెబితే ‘పెసల బేడల పాయసం’ పల్లెల్లో కులవివక్ష గురించి ఎలుగెత్తి చాటుతుంది. గువ్వ గూడంత ఇంట్లో ఉంటూ శ్రమ ఆధారమైన కుటుంబాలలో పండే ప్రేమా పాశాలను ఈ కధలు వర్ణిస్తాయి. దళితవాడల్లోని సామూహిక ఆనందాలను, డబ్బుఇవ్వలేక పోయినా చెమటను ఇచ్చి పుచ్చుకొని చేసుకొనే సహాయ సహకారాల గురించి చెబుతాయి ఈ కధలు. పిల్లెక్కమ్మ, సప్పలమ్మ, మారెమ్మ, కావేరమ్మ లాంటి అమ్మ తల్లులే ఇంకా పల్లెవాసుల ఆధ్యాత్మిక దైవాలనే వాస్తవాన్ని ఈ కధలు వివరిస్తాయి. దళిత ప్రజలకు గుడి బయట మాత్రమే దేవుడికి దండం పెట్టుకొనే అనుమతి ఉన్న “పబ్బతి” గురించి ఈ కధలు ధైర్యంగా మాట్లాడతాయి. ఒకటేమిటి. ఈ అసమాన ప్రపంచంలో వంకరైనా రీతి, రివాజుల గురించి … వాటిల్లో అయిష్టంగానే ఇమిడి పోతూ తనదైన సమాజం చేస్తున్న ఒడుదుడుకుల ప్రయాణం గురించి సుమ విశదంగా రాసింది.

ఆధిపత్య వర్గాల భావజాలం సమాజాన్ని ఎలాగైతే ఏలుతుందో, వారి భాష కూడా అధికార ప్రతిపత్తి సంపాదించి సాహిత్యాన్ని శాసించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కొంత మంది రచయితలు జీవిత దృశ్యాలను మాండలికాలలో అందించి ఈ భాషా దొరతనంపై తమ ధిక్కారం ప్రకటిస్తున్నారు. సుమకు ఈ భాషా సంబంధమైన చర్చలు తెలియవు. ఆమె తన చుట్టూ అల్లుకొని ఉన్న బ్రతుకులను తనకు తెలిసిన భాషలోనే రాసింది. ఈ అవకాశం గతంలో తీసుకోక ఎంతమంది సాహితీకారులను చరిత్ర కోల్పోయిందో కదా అనే ఆలోచన రాక మానదు. సుమ రాసిన వంటకాలలోనే కాకుండా ఆమె వాడిన మాండలికంలో ఉన్న రుచి కూడా నోరూరిస్తుంది. “మూలిల్లు, తెల, కడి , సంబళం, కొత్త మొరము, బైరొడ్ల బియ్యం, వన్నెలు, తరాతీరులు, పబ్బితి, కొమ్మిరి, సాసువులు, మక్కిరి, సడ్డిగ, ఎట్టము తోలటం, కణజము, దూర్లు” లాంటి పదాలు సంతోష పెడతాయి. “మగోనకి మొలకలు వచ్చి, ఉబ్బోనకి ఉబ్బిబ్బి లేస్తాయట పుటగోగులు” లాంటి సామెతలు మానవుడు ప్రకృతితో నెరిపిన సావాసం నుండి పుట్టినవే. ఎంత గొప్ప అనువాదకులు అయినా ఈ సామెతలను ఇతర భాషలలోకి అనువదించలేరు. తెలుగుభాషతో పాటు మనం ఈ సైన్స్ ను కూడా కోల్పోతున్నామనే తెలుగు భాషావేత్తల ఆవేదన అత్యంత గౌరవించదగింది.

శ్రమ జీవుల్లో ఆహార విధానానికి శ్రమకు వున్న ప్రత్యక్ష సంబంధం గురించి బహు సులువుగా చెప్పింది సుమ. ఆమె చెప్పిన వంటలకు ముడి పదార్ధాలు ఆ తావులో పండుతున్న పంటలే. ఈ ముడి పదార్ధాలు వాళ్ళు శ్రమించిన భూమిలో మొలిచి నేరుగా కడుపులోకి పోయేవి. ఈ ప్రక్రియ మొత్తంలో జరిగే శ్రమలో కుటుంబ సభ్యులందరు పాలు పంచుకొంటారు. వండిన తరువాత వచ్చే గమ్ములను పీలుస్తూ చుట్టాలు, ఇరుగుపొరుగుల వారితో కలిసి ఆ వంటలను పంచుకోవటం వారి సామాజిక ఏకతను సూచిస్తుంది.20140524_225439 - Copy

 

సుమ చూపించిన ప్రపంచం కాల్పనికం కాదు. ఇరవయి ఒకటో శతాభ్ధంలో ఇంకా పలిక తోలి, సడ్డిగను మడకకు కట్టి, చేనంతా సాళ్లు పెట్టుకొని, ఎట్టము తోలి చేసే వ్యవసాయం అమలులో ఉంది. ఇది కృష్ణగిరి జిల్లా హోసూరులోనే కాదు భారతదేశం నలుమూలల ఈ రకమైన వ్యవసాయ పద్దతులు ఉన్నాయి. రాగులు, జొన్నలు, యెర్నూగులు, అలసందలు లాంటి చిరు ధాన్యాల మెట్ట సాగు మీద ఎన్నో కుటుంబాలు జరుగుబాటు అవుతున్న నడుస్తున్న చరిత్ర ఇది. ఉడుకుడుకు సంగటిని ఉలవచారుతోనూ, చల్లి పిండిని పచ్చికొమ్మిరిలో నంజుకొని తినే సమాజం నుండి రాసిన వాస్తవాలు ఇవి. కొడవళ్ళు తట్టుకోవటం, ఆకురాయికి పూజ చేయటం, సప్పలమ్మ పరసకు బోయి మొక్కి రావటం … ఎక్కడో జానపద సినిమాల్లో కాదు, భారతదేశ భూభాగంలో మెజారిటీ ప్రజల జీవిత చిత్రాలు ఇవి.

సుమ రాసిన కధలలో ఎక్కడా అసంబద్ధ విషయాలు లేవు. అవాస్తవాలు లేవు. పెచ్చు చేసి చెప్పటం లేదు. చెప్పదలుచుకొన్న విషయంలో నిజాయితీ, స్పష్టత … బాషలో సరళత .. ముగింపులో గడసరితనం … ఈమె కధల ప్రత్యేకత. “మా నగవులు విని ‘ఓహో ఇక్కడెక్కడో చిలకలు ఉన్నెట్లు ఉండాయే’ అనుకోని గోరటి గువ్వలు ఎగురుకొంటా వచ్చి మా ఇంటి మీద వాలినాయి.”, “ మా లొట్టలు చూసి పొద్దప్పకు కూడా నోరూరినట్లుంది. ఆయప్ప నోటి నీళ్ళు ఉత్తరోనా అయి ఊరి మింద పడినాయి.”, “ఆ పొద్దు నగువుల్తో మా ఇల్లంతా నిండిపోయింది. నగువుల నడుమ మేమంత సందు చేసుకొని ముడుక్కొంటిమి.” … ఇలాంటి చెమక్కులు ప్రతి కధ చివర అలరిస్తాయి.

ఈ రోజు ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువగా కనిపించే నూడీల్స్, శాస్తాల పేరుతో ఉడకబెట్టిన రాగిపిండితో చేసి పానకంతో కలిపి తింటారనే విషయం ఆశ్చర్యం కలిగించక మానదు. ఇక్కడ నుండి ఇంకొద్దిగా ముందుకు పోయి ఆలోచిస్తే సుమ చెప్పిన వంటలు మన దేశ మూల వాసుల ఆహారపు అలవాట్లకు సంబంధించినవి. ఆ అలవాట్లు అక్కడ పండే పంటలు, జీవరాసులు, భౌగోళిక స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు మొదలైన వాటి మీద ఆధార పడి ఉంటాయి. ఈ సహజసిద్ధమైన అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మనకీ నాడు సామ్రాజ్యవాద దేశాల నుండి వస్తుంది. ఆహార పరిశ్రమలలో మనం తినే వేరుశనగ ఉండల దగ్గర నుండి కోడి మాంసాల దాకా మల్టీ నేషనల్ కంపెనీలు ప్రవేశించాయి. నగరాలు, పట్టణాల ప్రజల ఆహారాల్లో మార్కెట్ ప్రవేశం జరిగిపోయింది. ప్రపంచీకరణను ఎదిరించే ప్రయత్నంలో మన స్థానిక వంటలను, స్థానిక దుస్తులను ఒక సృహతో కాపాడుకోవటం నేడు మన ముందు ఉన్న కర్తవ్యం.

మనిషి సాంస్కృతిక, సామాజిక పయనం సహజత్వం వైపు జరిగితేనే అదే అభివృద్ధి అవుతుంది. ఈ రోజు అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న ప్రయాణం ఎండమావుల వైపే. “తెలుగు జాతి దళితైజ్ కావాలని” కోరుకోవటం అంటే మన భాషా సంస్కృత్తుల్లో మూల వాసనలు కాపాడుకొంటూ … ఎక్కడ సహజమైన వ్యవహారాలు, సహజమైన జీవన విధానాలు రాజ్యం ఏలుతున్నాయో వాటిని కాపాడుకొనటమే. వాటిని ఇప్పటికీ మిగుల్చుకొన్న సమూహాలు దళితులు, ఆదివాసీలే. భారతదేశ మూలవాసులైన దళిత సంస్కృతికి దడికట్టి పహరా కాయాల్సిన బాధ్యత సామాజిక సృహను కలిగిన వ్యక్తుల మీద, సమూహాల మీద ఉన్న ఈ సందర్భంలో ఈ పుస్తకాన్ని సుమ రాయటం, కృష్ణగిరి జిల్లా రచయితలు శ్రద్ధగా ప్రచురించటం … ఈ సంధి, సంశయ కాలానికి … రేపటి రోజున మనం చేయబోతున్న యుద్ధాలకు అత్యంత అవసరమైన సంగతి.

 -రమాసుందరి బత్తుల

ramasundari