రాచకురుపు

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

ఇరవై రెండేళ్ల ప్రాయంలో, అమెరికాలో గాలన్ పెట్రోలు పాతిక సెంట్లు ఉన్న రోజునుంచి అది మూడు డాలర్లుకి పెరిగే రోజులొచ్చేసరికి, నలభై ఐదేళ్ళు పనిచేసి రిటైరైపోయాడు విశ్వం. ముగ్గురు పిల్లల్ని కని, పెంచి ఓ ఇల్లు కొని తీరిగ్గా నడుం వాలుద్దామనుకునేసరికి రిటైర్మెంటు ఎదురుగా వెక్కిరిస్తూంది. పిల్లల్లో ఒకడు డాక్టర్ అవగలిగేడు గానీ మిగతా ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పిల్లలందరూ ఏవో ఉద్యోగాల్లో కుదురుకున్నారు వాళ్ళ ఓపికా, కోరికల ప్రకారం. విశ్వం రిటైరయ్యేనాటికి యామినికి ఇంకో ఐదేళ్ళు పనిచేసే జవసత్వాలు ఉన్నా మరో రెండేళ్ళకి ఆవిడా రిటైర్మెంట్ తీసుకుంది, రిటైరైన అందర్లాగానే ఇద్దరూ కలిసి ప్రపంచం చూసిరావడానికి.  ప్రపంచం అంతా కాకపోయినా ఇలా ఓ మూలకీ అలా రెండో మూలకీ తిరిగొచ్చేసరికి మొహం మొత్తింది ప్రయాణాలంటే. అప్పట్నుండీ టి.వి చూసుకోవడం, అప్పుడో సారీ, ఇప్పుడో సారీ దగ్గిర్లో గుడికెళ్ళడం, మరెప్పుడైనా పిల్లల్తో ఫోన్లూ, రాకపోకలూ, హితులూ, స్నేహితులూ హలో అంటే హలో అనుకోవడం; వంకాయ, కాకరకాయ, దొండకాయ, బెండకాయల్తో రెగ్యులర్  గా గడిచిపోతున్న జీవితంలో ఒక్కసారి విశ్వానికి ఎప్పుడూ తగలని ఎదురుదెబ్బ తగిలింది. ఓ రాజు రాత్రి లేచి లఘుశంకకి వెళ్ళినప్పుడు రక్తం పడడం గమనించాడు. ఏదో వేడి చేసిందేమో అనుకోవడానికి లేదు జనవరి నెలలో. ఇంతటి చలిలో కూడా రక్తం పడేంత వేడి చేయడం తన వయసుకి అసంభవం కాకపోయినా విశ్వానికి అర్ధంకాలేదు ఎందుకలా అయిందో. తాను తినే శాకాహార భోజనానికి రక్తం పడే అవకాశం లేదే?

అర్ధరాత్రి యామినిని లేపి ఆవిడ బుర్ర తినేయకుండా మర్నాడు చెప్పాడు రక్తం సంగతి. మొదటగా ఆవిడ చేసిన పని డాక్టర్ కొడుక్కి ఫోన్ చేయడం.

బిజీగా ఉన్న కొడుకు ఫోన్ ఎత్తలేదు కానీ మరో గంటలోపున వెనక్కి ఫోన్ చేసాడు. విషయం అంతా విన్నాక చెప్పాడు. “దీన్ని హిమాటూరియా అంటారు. దానికి కారణాలు అనేకం. ఇన్ ఫెక్షన్ కావొచ్చు, బ్లేడర్, కిడ్నీలలో రాళ్లవల్ల కావొచ్చు. ప్రోస్టేట్ గ్రంధి వల్ల కూడా కావొచ్చు,” కేన్సర్ అనే పదం నోట్లోంచి రాకుండా జాగ్రత్తపడుతూ.

యామిని ఫోన్ చేతికిస్తే వేరే గదిలోకి ఫోన్ తీసుకెళ్ళి విశ్వం అడిగాడు, “ఒరే దీని మూలాన నాకు యూరిన్ బ్లాక్ అవుతుందా, దానికో గొట్టం, ఓ బ్యాగూ తగిలిస్తే దాన్ని నేను జీవితాంతం మోస్తూ తీసుకెళ్ళాలా?”

తండ్రి గొంతుకలో ఆదుర్దా గమనించి చెప్పాడు, “డాడ్, మరీ అంత కంగారు పడకండి. ఉత్తి ఇన్ ఫెక్షన్ అవ్వొచ్చు. చిన్న మందుతో పోతుంది. డాక్టర్ దగ్గిరకి అంటే యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళండి వెంఠనే.”

ఫోన్ పెట్టేసేముందు విశ్వం “ఇది కేన్సర్ అవొచ్చా?” అనే ప్రశ్నకి డాక్టర్ కొడుకు సమాధానం చెప్పకుండా, “ముందు యూరాలజిస్టుని కలవండి, తర్వాత చూద్దాం” అన్నాడు.

ఫోన్ పెట్టేసిన విశ్వం కొడుకు డాక్టర్ సురేష్ ఆలోచనలు పరిపరి విధాలా పోయేయి. తనకి తెల్సినంతలో విశ్వం తల్లి బ్రెస్ట్ కేన్సర్ పోయింది. ఆవిడ రోజుల్లో ఇంతమంది డాక్టర్లూ లేరు, ఇన్ని మందులూ లేవు. పోయే రోజుకి రెండు మూడు నెలలముందు మాత్రం ఆవిడకి తెలిసింది కేన్సర్ అని. ఏవో ఆయుర్వేదం మందులూ, తాయెత్తులూ కట్టారు గానీ అప్పటికే పూర్తిగా ఆలస్యమైంది. ఆవిడ పోయేనాటికి కేన్సర్ మెటాస్టసైజ్ అయ్యి అంగాంగాలకీ పాకిపోయి ఉండొచ్చు. ఆ పరిస్థితిల్లో ఎవరేం చేయగలరు? లింఫ్ నోడ్స్ లోకి చాపకింద నీరులా పాకిపోయే కేన్సర్ ని ఆ మృత్యుంజయుడైనా బాగుచేయగలడా? ఏవో కొన్ని చోట్ల నోడ్స్ ని సర్జరీతో తీసేసినా అది పాకుతూనే ఉంటుంది…” తల విదిల్చి ఆలోచనలు తప్పించడానికి రెసెప్షనిస్టు తో చెప్పి ఆఫీసులోంచి బయటకొచ్చి మెల్లిగా రోడ్డుమీద నడవడం సాగించాడు. ఎవరో ఒక్కసారి షాక్ లాగా కుదిపినట్టూ ఓ ఆలోచన బుర్రలో చొరబడింది, “తన తండ్రి విశ్వం వేసిన ప్రశ్నే తన పేషెంట్ వేసి ఉంటే ఏమి సమాధానం చెప్పి ఉండేవాడు? అసలు ఏది చెప్పాలో, చెప్పకూడదో నిర్ణయించుకోవడం ఎలా? పేషెంట్ తో అబద్ధం ఆడకూడదు సరే మరి నిజం చెప్తే పేషెంట్ తట్టుకోగలడా?” ఎటూ తేల్చుకోలేక కాసేపు అలా తిరిగి మళ్ళీ ఆఫీసులోకి వచ్చి పేషెంట్లని చూడ్డం మొదలుపెట్టాడు.

* * * * * * * * *

విశ్వానికి యూరాలజిస్టు దగ్గిర అపాయింట్ మెంట్ దొరకడానికి మరో మూడు రోజులు పట్టింది. అప్పటికి ఓ సాంపిల్ లేబ్ కి తీసుకెళ్ళడంతో యూరాలజిస్టు రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పేడు, “ముందీ మందు ట్రై చేయండి. తర్వాత ఓ ఎం.ఆర్. ఐ, ఓ సి.టి స్కాన్ తీయించండి. అన్నట్టు మీరు గతంలో ఎప్పుడైనా పి.ఎస్.ఏ టెస్టు చేయించుకున్నారా? వాటి తాలూకు రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? కాలనోస్కోపీ చేయించారా ఈ మధ్య?”

యామిని చెప్పింది సమాధానం, “పి.ఎస్.ఏ టెస్ట్ చేయించి రెండేళ్ళవుతోంది. అప్పట్లో మామూలుగానే ఉందన్నారు ఈయన డాక్టర్. కాలనోస్కోపీ తీయించి అయిదేళ్ళు అవుతోంది.”

“అయితే మరో సారి చేయించండి. ప్రోస్టేట్ సంబంధించినది అయితే చిన్న వాపు అయినా, ఇన్ ఫెక్షన్ అయినా కావొచ్చు.”

“ఇది కేన్సర్ కావొచ్చా?” విశ్వం అడిగేడు మొహం పాలిపోతుంటే.

కాసేపు సాలోచనగా చూసి యూరాలజిస్ట్ అడిగేడు, “మీ వంశంలో ఎవరికైనా కేన్సర్ ఉందా?”

“మా అమ్మగారు బ్రెస్ట్ కేన్సర్ తో పోయారు దాదాపు ముఫ్ఫై ఏళ్ల క్రితం. మరెవరికీ లేదు.”

తల పంకించేడు యూరాలజిస్టు, “సరే అయితే, ఇది కేన్సరా కాదా అనేది ముందు ముందు తెలుస్తుంది ఈ టెస్టులన్నీ చేసాక. అప్పటిదాకా ఏమీ నిర్ధారించలేం. మందు వాడి చూడండి, ఏమైనా గుణం కనిపించవచ్చు.”

మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాతి వారంలో అన్ని స్కాన్ లూ తీయించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటిగా చూసుకోవాల్సింది ఇన్స్యూరెన్స్. డాక్టర్ రోగ నిర్ధారణ ఇంకా చేయలేదు కనక ఈ స్కాన్ లన్నింటికీ చాలా మటుక్కి ఇన్స్యూరెన్స్ ఇచ్చింది డబ్బులు. అయినా సరే విశ్వం జేబులోంచి మరో అయిదారు వేల డాలర్లు పడ్డాయి కో-పే అనే పేరుతోటీ, కో- ఇన్స్యూరెన్స్ అనే పేరుతోటీను. ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రజల బాగు కోసమా వాటి బిజినెస్సు బాగు పడ్డానికా? ఏదైనా ప్రశ్నలడిగితే “అరే, మీరు కట్టిన ప్రీమియం డబ్బులకీ మేము ఇచ్చిన ట్రీట్ మెంటు డబ్బులకీ ఓ సారి పోలిక చూసుకోండి” అనే దెప్పడం ఎప్పుడూ ఉన్నదే.

స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చి మరోసారి యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళవల్సి వచ్చేసరికి విశ్వానికి మందు గుణం ఇస్తున్నట్టు కనిపించింది. రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. ఈ సారి యూరాలజిస్ట్ దగ్గిరకెళ్ళేసరికి కొడుకు సురేష్ కూడా వచ్చేడు.

రిజల్ట్స్ అన్నీ చూసి చెప్పాడు యూరాలజిస్ట్, “పి. ఎస్. ఏ టెస్టులో 7.5 అని వచ్చింది. మందు వాడుతున్నారు కదా ఏదైనా గుణం కనిపించిందా?”

సురేష్ తండ్రికేసి చూస్తే విశ్వం చెప్పాడు సమాధానం “రక్తం పడడం తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. మరో కొన్ని రోజులు వాడమంటారా?”

“వాడి చూడండి. మీ స్కాన్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. వాటిలో మీ ప్రోస్టేట్ వాచినట్టు ఉంది. దానికి బయాప్సీ చేస్తే తెలియవచ్చు. కానీ ఒక్కోసారి మందులతో కూడా తగ్గడానికి ఆస్కారం ఉండొచ్చు. బయాప్సీ చేస్తే మరిన్ని తెలుస్తాయి.”

యూరాలజిస్టు చెప్తున్నది విశ్వం విన్నాడో లేదో కానీ “డాక్టర్, అర్జెంట్ గా బాత్రూం కి వెళ్ళాలనిపిస్తోంది. ఈ లోపుల మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారా?”

“వెళ్ళిరండి, ఏం ఫర్వా లేదు”

విశ్వం లేస్తుంటే డాక్టర్ అన్నాడు యామినితో, “మీరు కూడా వెళ్ళండి ఆయనికి తోడుగా”

వాళ్ళటు వెళ్ళగానే సురేష్ అడిగాడు యూరాలజిస్టుని, “స్కాన్ లలో కేన్సర్లాగా ఏదైనా కనబడిందా?”

“క్రిస్ట్ మస్ లైట్స్”

“అంటే?”

“మీ నాన్నగారికి కేన్సర్ లాంటి కణితి ప్రతీ అవయవంలోనూ ఉన్నట్టు రేడియాలజిస్ట్ రాసారు.” స్కాన్ లో కేన్సర్ కణితిలు క్రిస్ట్ మస్ లైట్లలాగా ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి.”

“మై గాడ్”

యూరాలజిస్ట్ ఏమి చెప్పాలో తెలియక తల పంకించాడు.

మరో కొద్ది క్షణాలు ఆగి సురేష్ నోరు ఎండిపోతూండగా అడిగేడు, “సర్జరీతో తీసేయవచ్చు కదా?”

“అది నేను చెప్పలేను. ఇప్పుడు మీకు చెప్పేదొక్కటే. అర్జెంట్ గా ఆంకాలజిస్ట్ ని కలవండి. ఎంత తొందరగా అయితే అంత మంచిది.”

కాసేపటికి వచ్చిన విశ్వాన్నీ తల్లినీ తీసుకుని ఇంటికొచ్చాడు సురేష్. ఆ పై వారంలో ఆంకాలజిస్ట్ ని కలిసాక మరిన్ని టెస్టులూ, ప్రోస్టేట్ బయాప్సీ చూసి చెప్పేడు ఆంకాలజిస్ట్, “మీ నాన్నగారికి మూడో స్టేజ్ కేన్సర్. ఇది ప్రస్తుతానికి లివర్ లో, కిడ్నీలలో, ప్రోస్టేట్ లో ఉందని గుర్తించాం. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళి ఉంటుందని నా అనుమానం. పెద్ద, చిన్న పేగుల్లోకి వెళ్ళిందా అనేదానికి ఇంకా రకరకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది.

విశ్వం మొహం పాలిపోయింది. ఆ తర్వాత సురేష్, అంకాలజిస్ట్ మాట్లాడుకున్న మెడికల్ పదాలు విశ్వానికి, యామినికీ అక్కడక్కడా అర్ధమయ్యాయి కానీ ఇంకా గజిబిజిగా ఉంది. తానింకా చాలా కాలం బతుకుతాడనీ మరో డాక్టర్ దగ్గిరకో, మరో హాస్పిటల్ కో వెళ్తే బాగుండొచ్చనీ లేకపోతే హోమియోపతీయో, ఆయుర్వేదమో పనిచేస్తుందనీ పేషంట్ ఎప్పుడూ డాక్టర్ కన్నా పాజిటివ్ గా ఉంటాడా?

ఇంటికొస్తూంటే విశ్వం కారులో కళ్ళుమూసుకున్నాడు. మందు ప్రభావమో మరొకటో గానీ నిద్ర పట్టినట్టుంది. యామిని దార్లో సురేష్ ని అడిగింది, ” సురేష్, అంకాలజిస్ట్ చాలా సార్లు మెటాస్టసైజ్ అనే మాట అన్నారు. అంటే ఏమిట్రా?”

కొరడా దెబ్బ మొహం మీద ఛెళ్ళున తగిలిన భావన. డ్రైవ్ చేస్తోన్న కారు స్టీరింగ్ కంట్రోల్ తప్పి పక్క లేన్ లోకి వెళ్ళబోతూంటే అక్కడొచ్చే కారు అదే పనిగా హార్న్ కొట్టడంతో సురేష్ తెలివి తెచ్చుకుని సరిగ్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. తల్లి మళ్ళీ అడిగింది, “మెటాస్టసైజ్ అనేది కేన్సర్ కి సంబంధించినదేనా?”

“ఇంటికెళ్ళాక చెపుతానమ్మా, ఇప్పుడు డ్రైవ్ చేయాలి. ఇప్పుడే పక్క లేన్ లోకి వెళ్ళిపోబోయాను చూసావా?”

* * * * * * * * *

రాత్రి విశ్వం పడుకున్నాక ఆలోచనలు బుర్ర తినేస్తూంటే మనసు మరల్చడానికి టి.వి చూస్తూ కూర్చున్నాడు సురేష్. యామిని వంటపని పూర్తయ్యాక వచ్చి కూర్చున్నప్పుడు చిన్న గొంతుకతో చెప్పాడు “మెటాస్టసైజ్ అంటే కేన్సర్ వేరే అంగాలకి పాకుతోందని అర్ధం. ఎంతవరకూ ఎన్ని చోట్లకి పాకింది అనేది పూర్తిగా టెస్టులు చేస్తే గానీ చెప్పరు. కానీ మందులూ కీమో థెరపీ వాడి చూడొచ్చు.” మాట్లాడుతూంటే తన గొంతులో తనకీ, అమ్మకీ నమ్మశక్యంగా ఏమీ చెప్పలోకపోతున్నాడనే ధ్వని గమించాడు సురేష్. లోపల మాత్రం మూడో స్టేజ్ కేన్సర్ అంటే తండ్రి మహా అయితే మరో రెండేళ్ళు బతుకుతాడేమో అనిపించింది.

ఓ వారం అక్కడే ఉండి తండ్రిని కీమో థెరపీకి, అమ్మని వీటన్నింటినీ చూడడానికి కుదుర్చిపెట్టాక ఇంటికి బయల్దేరాడు. ఇవి అలా జరుగుతూండగానే రోజులు పరుగెడుతూ ధేంక్స్ గివింగ్ దగ్గిరకొచ్చింది. శెలవులకి పిల్లలందరూ కుటుంబాలతో ఓ చోట చేరారు తల్లినీ తండ్రినీ చూడ్డ్డానికి.

తల్లీ తండ్రీ పడుకున్నారనుకున్నాక సురేష్ మిగతా అందరితో చర్చించేడు తండ్రికొచ్చిన కేన్సర్ విషయం. అంతకు ముందు ఫోన్ లో విన్నదే అయినా ఇప్పుడు తండ్రిని చూసేసరికి తెలుస్తూన్న విషయం – ఆయనింకెంతో కాలం బతకడు. నిర్జీవమైన కళ్ళూ, కీమో థెరపీ వల్ల ఊడిపోయే జుట్టూ, బయాప్సీల వల్ల నిరంతరం పడే నెప్పీ, వాటికి మందులూ ఇవన్నీ ఓ ప్రహసనం. ఎంత మనసు వేరే దానిమీద పెడదామన్నా నిరంతరం మనసుల్లో కదిలే ఒకే ఒక పదం  “కే-న్స-ర్.” మనిషి జీవితాన్ని అత్యల్పంగా చేసి తోలుబొమ్మలాగా నిరంతరం ఆడించే ఒకే ఒక వదుల్చుకోలేని దారుణమైన జాడ్యం. అదృష్టవంతులైన వాళ్ళలో రిమిషన్ ఉండొచ్చేమో కానీ నూటికెంతమంది రిమిషన్ కి నోచుకునేది? అయినా ఈ వయసులో తండ్రికి రిమిషన్ వచ్చేనా? అందరికన్నా ఎక్కువ కంగారు పడినది మొదటి సంతానం అయిన కూతురు. సురేష్ ఇంతకుముందు డాక్టర్లతో మాట్లాడాడు కనక కాస్త కుదురుగానే ఉన్నాడు. మూడో సంతానం వినీత్ కి ఏమి చేయాలో తెలియక అలాగే స్తబ్దుగా కూర్చున్నాడు. మొదటగా నోరు విప్పినది వాడే. “సురేష్, ఇప్పుడు నాన్నకి వచ్చిన కేన్సర్ కి అన్ని టెస్టులూ చేయించి, అంతమందికి చూపించాలి కదా మరి ఆయన ఇస్యూరెన్సూ, మెడికేర్ ఇవన్నీ కవర్ చేస్తాయా?”

“కొన్ని చేస్తాయి, కొన్ని చేయొచ్చు చేయకపోవచ్చు. చివరిదాకా ఈ పోరాటం కేన్సర్ మీదా, ఇన్స్యూరెన్స్ కంపెనీల మీదాను.”

“మరి ఇన్స్యూరెన్స్ కవర్ చేయకపోతే ఎలా?”

“జేబులోంచి పెట్టుకోవాలి. కొంత నేను సర్దగలను. అందరూ తలో చేయి వేస్తే సులభం.”

వెంఠనే కూతురు అంది, “నేను ఒక్క సెంటు కూడా సర్దలేను. పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉద్యోగం మానేసి రెండు నెలలైంది; మరో రెండేళ్ళు ఆగి మరో ఉద్యోగం చూడాలి. మా ఆయన్ని అడిగితే మహా అయితే ఐదువేలు సర్దొచ్చు.”

చివరి కొడుకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు మాట్లాడకుండా కూర్చున్నాడు. ఓ పావుగంట గడిచాక సురేష్ అడిగాడు వినీత్ ని, “ఏరా, నువ్వు ఎంత డబ్బులు సర్దగలవు?”

“మహా అయితే పదో, పదిహేనో.”

“మీరిచ్చే ఇరవై, కేన్సర్ ట్రీట్ మెంటుకి ఈ మూలకి? కనీసం యాభై సర్దుతారేమో అనుకున్నాను.”

“…”

సమాధానం లేకపోవడం చూసి కూర్చున్న సురేష్ లేచి చెప్పాడు గోడకేసి తిరిగి ఎవరికో చెప్తున్నట్టూ, “నేను ఇంటిమీద రెండో అప్పు తీసుకుని ఈ కేన్సర్ పని పట్టాలి అయితే; కని పెంచిన నాన్నకి ఇలా అయిందని తెల్సినా మీరిద్దరూ ఇలా అన్నారంటే …”

ఈ మాటలన్నీ నిద్రపోకుండా పై గదిలోంచి పడుకున్నాడనుకున్న విశ్వం, యామినీ విన్నారని పిల్లలకి తెలియలేదు.

* * * * * * * * *

శెలవులు అయిపోయాక ఇంటికెళ్ళబోయే ముందు అందర్నీ కూచోపెట్టి చెప్పాడు విశ్వం, “నాకు డభ్భై దాటుతున్నాయి. ఈ వయసులో వచ్చే రోగాలు మందులకి తగ్గడం కష్టం. ఈ కేన్సర్ మందులతో, కీమోథెరపీతో నా వళ్ళు హూనం అవుతోంది. నాకిప్పటికి అర్ధమైనదేమిటంటే, నేను మూడో స్టేజ్ లో ఉన్నాను. ఇక్కడ్నుంచి ఆంకాలజిస్టూ, యూరాలజిస్టూ మిగతా డాక్టర్లూ ఎంత నన్ను నమ్మించడానికి  ప్రయత్నం చేస్తున్నా ఇది వన్ వే ట్రాఫిక్కే. ఎందుకంటే కేన్సర్ లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిందని చెప్పారు. లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిన కేన్సర్ తగ్గడం దాదాపు అసంభవం. ఈ కేన్సర్ పాకిన ఒక్కో అవవయం తీసేసి నన్ను మరో రెండేళ్ళు బతికించవచ్చేమో. అప్పుడు నేను జీవఛ్ఛవాన్నే కదా? దీనిమీద ఖర్చులు చూడబోతే కోతిపుండు బ్రహ్మరాక్షసి లాగా తయారౌతున్నై. ఇలా ఒక్కో స్టేజ్ దాటుకుంటూ చావడం కంటే అన్ని ట్రీట్ మెంట్లూ మానేసి మూడు నాలుగు నెలల్లో పోవడమే మంచిది. ఇప్పుడు అద్దంలో నా మొహం చూసుకోవడానికీ నాకే భయం వేస్తోంది. దీనికి డబ్బులు తగలేయడం శుద్ధ దండుగ. యామినితో చెప్పాను కూడా. నేను పోయాక లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయి. అవి యామినికి సరిపోతాయి సోషల్ సెక్యూరిటీ డబ్బులతోటి. అందువల్ల మీరందరూ కంగారు పడి డబ్బులు వేస్ట్ చేయకండి. అందరం ఎప్పుడో ఒకసారి పోవాల్సినవాళ్ళమే. ఇప్పుడు నాదీ వంతు.”

సురేష్ చెప్పేడు వెంఠనే, “అలాక్కాదు, మీకు కేన్సర్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. అయినా ఈ కేన్సర్ ని ధైర్యం గా ఎదుర్కోవాలి గానీ అలా డీలా పడిపోకూడాదు. నాకు తెల్సున్న కొంతమంది డాక్టర్లు ఉన్నారు. నేను కనుక్కుంటా. డబ్బులదేవుంది; కుక్కని కొడితే రాల్తాయి. అప్పు తీసుకున్నా తర్వాత కట్టేయవచ్చు.”

విశ్వం కళ్ళలో కాస్త మెరుపు కనిపించింది. అది కొడుకు తనని బాగా చూసుకుంటున్నాడనా లేకపోతే కేన్సర్ నిజంగా తగ్గిపోయి తన ఆరోగ్యం బాగై పోతుందనా?

వెంఠనే అందరూ ఏక కంఠంతో అన్నారు, “అవునవును కేన్సర్ కి అలా లొంగిపోకూడదు. పోరాడవల్సిందే.”

అంతా విన్న విశ్వానికి ఇంక తప్పలేదు. సురేష్ తనకున్న ఇంటిమీద హోం ఇంప్రూవ్ మెంట్ లోన్ తీసుకోడానికీ, కేన్సర్ మీద పోరాటానికీ నిశ్చయం అయిపోయింది. విశ్వం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితి.

* * * * * * * * *

మూణ్ణెల్లు గడిచాయి. సురేష్ తీసుకున్న అప్పు అలా పెరుగుతోందే కానీ విశ్వానికేమీ తేడా కనిపించినట్టు లేదు. దీనికితోడు అటూ ఇటూ రాకపోకలవల్ల సురేష్ ప్రాక్టీస్ కుంటుబడడం, రాబడి తగ్గడం మొదలైంది. చాప కింద నీరులా కేన్సర్ అలా పెరుగుతూనే ఉంది. కొంతమందికి కేన్సర్ ఖర్చులు మొదట్లో ఎక్కువగా ఉన్నా అవి మెల్లిగా తగ్గిపోతాయి కేన్సర్ తగ్గే కొద్దీ. వీళ్ళు మొదటి జాతి అదృష్టవంతులు అనుకోకుండానో, తెలిసో తమకి కేన్సర్ వచ్చినట్టు అతి చిన్న స్టేజ్ లో పట్టుకున్న వాళ్ళు. వీళ్ళు మరో ఇరవై ఏళ్ళదాకా బతకొచ్చు రోగం తిరగబెట్టకపోతే. తిరగబెడితే వీరి అదృష్టం తీరిపోయి రెండో కోవలోకి వస్తారు. ఈ రెండో కోవలో మొదట ఖర్చులు తడిసిమోపెడయ్యాక, కేన్సర్ మెల్లిగా తగ్గినట్టు అనిపించేసరికి ఖర్చులు తగ్గుతూ వస్తాయి. కానీ కొంతకాలాని కేన్సర్ మళ్ళీ వంటిమీదకి పాకడం మొదలుతుంది అప్పుడు ఖర్చులు పుంజుకుంటాయి. ఆ పుంజుకోవడం ఆకాశమే హద్దా అన్నట్టూ ఉండడంతో పేషంట్ కీ, అతనికి తెల్సిన చుట్టాలకీ స్నేహితులకీ అందరికీ అదో మానసిక పోరాటం. మొదటి అదృష్టవంతులకి ఖర్చు ఎక్కువగా మొదలై రోజులు గడిచే కొద్దీ టేపర్ అవుతాయి. రెండో దురదృష్టవంతులకి టేపర్ అయినట్టు కనిపించి ఖర్చు యు అక్షరం ఆకారంలో పడగ చాస్తుంది. ఎప్పుడైతే ఆ కోడె తాచు పడగ విప్పడం  మొదలైందో అప్పుడే ఆశలన్నీ వదులుకోవటం మొదలౌతుంది. కానీ మానవ జీవితంలో ఆశకీ కోరికకీ అంతులేదు కదా? పడగ నీడన ఏదీ మొలవదని తెలిసీ, ఆ ట్రీట్ మెంటు మింగలేకా, కక్కలేకా కొనసాగించాల్సిన పరిస్థితి.

మరో మూడు వారాలు పోయాక అంకాలజిస్ట్ విశ్వానికి చెప్పాడు, ” ఈమధ్య ఒక ఎక్స్ పెరిమెంటల్ మందు మా దగ్గిరకి వచ్చింది. అది కంపెనీలు ఇంకా టెస్ట్ చేస్తున్నారు. మీకున్న లక్షణాలవల్ల ఈ రీసెర్చ్ కి సరిపోతారు. ట్రై చేస్తారా?”

“ఇది మీరు కవర్ చేస్తారా లేకపోతే ఇన్స్యూరన్స్ ని అడగాలా?” అప్పటికీ పూర్తిగా జవసత్వాలు పోయిన విశ్వం అడిగాడు, కనీసం ఆర్ధికంగానైనా దెబ్బతినకుండా ఉండడానికి.

“మందు పూర్తిగా మేము కవర్ చేస్తాం. కానీ హాస్పిటల్ లో ఉండడానికీ డాక్టర్లకీ అలా కొంత చొప్పున ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.”

“ఆ ఖర్చు ఎంతవరకూ ఉండొచ్చు?”

“చెప్పలేమండి. మందు పనిచేస్తే తక్కువకాలం హాస్పిటల్లో ఉండడం. చేయకపోతే ఎక్కువ రోజులుండడం. ఏ ఒక్కరి కేసూ ఒక్కలా ఉండదు కదా?”

“సరే అయితే నేను ఇన్స్యూరెన్స్ కి ఫోన్ చేసి కనుక్కుని చెప్తాను.”

“అలాగే, మీ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు.”

* * * * * * * * *

ఇంటికొచ్చిన యామిని ఓ గంటపాటు ఇన్స్యూరెన్స్ కంపెనీతో ఫోన్ మీద కుస్తీ పట్టాక వాళ్ళు చెప్పారు, “మీ డిటైల్స్ అన్నీ రాసుకున్నాము. ఎక్స్ పెరిమెంటల్ అన్నారు కనక అది మా మేనేజర్ ని అడిగి మీకు ఉత్తరం రాయాలి. దానికి మూడు నుంచి అయిదు రోజులు పడుతుంది….”

“మరి ఇది కేన్సర్ కదా, వెంఠనే ట్రీట్ మెంట్ మొదలు పెడితే గుణం కనిపించవచ్చు. అంతకన్నా ముందు చెప్పలేరా?”

“… అసాధ్యం. ఈ కేన్సర్ కేసులన్నీ ఒక్కొక్కటీ ఒకో టైపు. దేనికదే విడివిడిగా చూస్తాం. మాకున్న రూల్స్ ప్రకారం ఇలాంటివి అప్పుడప్పుడూ తొందరగానే ఆమోదించినా ఫోన్ మీద ఆమోదించరు. కానీ మీకు మరీ అంతగా కావాలంటే మరోసారి మంగళవారం ఫోన్ చేయండి.”

ఇన్స్యూరెన్స్ ఎలాగా ఒప్పుకుంటారనుకునీ, తర్వాత వారితో మాట్లాడొచ్చుఅనుకునీ యామిని విశ్వాన్ని ఎక్స్ పెరిమెంటల్ మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ డాక్టర్ ఆఫీసుకి చెప్పేసింది. ఆ వారం నుంచే మందు వాడడం మొదలైపోయింది. అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా త్వరలోనే తలనెప్పిగా తయారవబోతోందని ఇద్దరికీ తెలియలేదు. బేంకుల్లో డబ్బులు దాచుకుంటే మనకి మంచిదా బేంకుకి మంచిదా? బేంకులు బిజినెస్సు చేసుకుంటాయి గానీ మనగురించి నిజంగా పట్టించుకున్నదెప్పుడు? అలాగే ఇస్యూరెన్స్ కంపెనీలూను.

* * * * * * * * *

ఆ పై వారంలో సోమవారం విశ్వం బాత్రూంలో పడి ఉంటే కొంచెం లేటుగా లేచిన యామిని కంగారుగా వెళ్ళి చూసింది. బాత్రూం నేలంతా రక్తం; నోట్లోంచి వచ్చిందే అని తెలుస్తోంది. ఓ 911 ఫోన్ కాల్ తర్వాత ఆఘమేఘాల మీద విశ్వం ఎమర్జన్సీలో ఎడ్మిట్ చేయబడ్డాడు. తర్వాత విషయాలు అన్నీ అందరి కేన్సర్ పేషంట్లకీ తెలిసొచ్చినట్టే విశ్వానికీ, యామినికీ కూడా పూర్తిగా తెలిసొచ్చాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలన్, ఇలా కేన్సర్ లేని అవయవం లేదు విశ్వానికి. మరో పెద్ద న్యూస్ ఏమిటంటే ఇప్పుడు కేన్సర్ అయిదో స్టేజ్ లో ఉంది. విశ్వాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి డాక్టర్ ఒప్పుకునేసరికి మరో మూడ్రోజులు పట్టింది. ఈ కంగార్లో హాస్పిటల్లో మంచం మీద తెలివి లేకుండా పడి ఉన్న విశ్వాన్ని చూసుకుంటూ మంగళవారం ఇన్స్యూరెన్స్ ఫోన్ చేయమన్నారన్న సంగతి యామినికి ఏ మాత్రం గుర్తు రాలేదు.

ఇంటికెళ్ళేసరికి ఇన్స్యూరెన్స్ దగ్గిర్నించొచ్చిన ఉత్తరం రడీగా ఉంది, “మీరు మాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలు మా మానేజర్ చూసారు. మీరు చెప్పిన మందులూ అవీ ఇంకా ఎక్స్ పెరిమెంటల్ అన్నారు. అవి పనిచేస్తాయో లేదో ఝూడీగా తెలియదు. మందులు మీ డాక్టర్ ఆఫీసు కానీ మందుల కంపెనీలు కానీ ఇచ్చినా మిగతా ఖర్చులన్నీ తడిసి మోపెడు అవుతాయి. ఇంతా చేస్తే ఈ మందు ఎఫ్. డి. ఏ అప్రూవ్ చేసినట్టు లేదు. అందువల్ల మేము ఈ ఖర్చులు భరిండానికి ఒప్పుకోము. మీకు ఈ విషయంలో మేము ఏమీ సహాయం చేయలేము. మీకు కలిగిన పరిస్థితికి మేము విచారిస్తున్నాము.”

విశ్వాన్నీ ఎలాగా మందు వాడడానికి ఒప్పుకున్నట్టూ చెప్పేసారు కనుక ఇన్స్యూరెన్స్ కంపెనీ డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా, ఇంక వెనక్కి చూసుకోకుండా కొడుకు సలహా తో మందు కంటిన్యూ చేయడానికి నిశ్చయం అయిపోయింది. ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు ముందూ వెనకా చూసుకోవడం అనవసరం. ఇన్ని రోజుల్లోనూ అమ్మాయీ, రెండో కొడుకూ అప్పుడప్పుడూ వచ్చి చూస్తున్నా, ఫోనులు చేస్తున్నా డాక్టరైన సురేష్ దగ్గిర ఉన్నాడని ఏదో భరోసా కాబోలు, వాళ్ళిద్దరికీ అంత పట్టలేదు తండ్రి గురించి. ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ ఒకేలాగ ఉండాలని ఎక్కడుంది?

 

* * * * * * * * *

ఫోన్ మీద తల్లి చెప్పినవన్నీ విన్నాక సురేష్ తండ్రి దగ్గిరకి బయల్దేరాడు. ఈ సారి అంతా ఖాయం అయినట్టే. అయిదో స్టేజ్ లోంచి కేన్సర్ పేషెంట్ ని బాగుచేసి మామూలుగా చేయడం భగవంతుడిక్కుడా సాధ్యం కాకపోవచ్చు. బయల్దేరేముందు రోడ్డుమీద అలా నడుస్తూంటే అదే బ్లాకులో ఉంటున్న డేవిడ్ కనిపించాడు. డేవిడ్ ఏదో బిజినెస్ చేస్తూంటాడు. వాళ్ళావిడకి కూడా కేన్సర్ అని తెలుసు కానీ ఎప్పుడూ దాని గురించి మాట్లాడ లేదు. తన తండ్రికి కేన్సర్ వచ్చినప్పటునుండీ అసలు ఈ మధ్య ఎవరినీ కలవడం కానీ చూడ్డం కానీ కుదరనే లేదు. ఈ సారి డేవిడ్ పలకరించాడు, “హలో డాక్టర్ ఎలా ఉన్నారు?”

“ఏదో, అలాగే ఉంది. మీరో?”

“ఏం బాగు లెండి జీవితంలో ఢక్కా మొక్కీలు తప్పడం లేదు. మా ఆవిడ జెన్నీకి కేన్సర్ అని తెలుసు కదా? తనకి ఇంక తగ్గదనీ ట్రీట్ మెంట్ వద్దనీ చెప్పేసింది. ఈ కేన్సర్ డాక్టర్లు ఏదో చేస్తామన్నారు కానీ, ఒక్కో అవయవం తీసేసి జీవితాన్ని ముందుకి లాగుదామని చూస్తారు. వాళ్లు మాత్రం ఏం చేస్తారు? అలా బతకడం కంటే పోవడమే మంచిదని జెన్నీ వాదన. కొన్ని రోజులు ఈ డాక్టర్ల చుట్టూ తిరిగే సరికి నాక్కూడా అదే నిజం అనిపించింది. మూడు వారాల క్రితం జెన్నీని ఫ్లోరిడా తీసుకెళ్ళాను ఆఖరుసారిగా వెకేషన్ పేరుమీద. అక్కడే హాస్పిటల్లో పోయింది. పోనీ లెండి అంత నొప్పితో, నరకం అనుభవించడం కన్నా అదే మంచిది. జెన్నీని బతికించుకోవడం బాగానే ఉండుండేది కానీ ఇలా అవయవాలు ఒక్కోటి తీసేసాక ఏమిటి బతికి ప్రయోజనం? రొమ్ము కేన్సర్ వచ్చాక సర్జరీ చేయించుకున్న మహిళలు మానసికంగా నరకం అనుభవిస్తారని ఎక్కడో చదివాను. అస్తమానూ నా స్వార్ధం చూస్కోవడం ఎలా? పోనీ లెండి, చివరికి ఎలగైతేనేం అయాం హేపీ ఫర్ హర్.”

సురేష్ చెప్పిన సారీ విని సురేష్ తండ్రికి కూడా కేన్సర్ అని విన్నాక మెకానికల్ గా ఓ సారీ చెప్పేసి ముందుకి సాగిపోయేడు డేవిడ్. వీళ్ళెంత ఈజీ మనుషులు? స్వంత భార్య పోయినందుకు మనసు ఎంత కష్టపెట్టుకున్నాడో పెద్దగా తెలియదు కానీ జెన్నీ చివరి రోజుల్లో కోరుకున్నట్టూ చేసి అయాం హేపీ ఫర్ హర్ అనగలిగేడు. మరి తానో? బుర్ర విదిల్చి చిన్నగా గొణుక్కుంటూ ముందుకి నడిచేడు.

* * * * * * * * *

తండ్రిని చూడ్డానికొచ్చిన సురేష్ కి చూడగానే మైన విషయం – తన తండ్రి మరో రెండు వారాలు బతికితే గొప్పే. సురేష్ వచ్చిన మూడో రోజు విశ్వానికి తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో చేయగలిగింది అంతా చేసాక ఎమర్జన్సీ డాక్టర్ చెప్పాడు బయటకొచ్చి, “రక్తంలో తయారైన క్లాట్ ఊపిరితిత్తుల్లోకి ఒకటీ, బ్రైన్ లోకి ఒకటి వెళ్ళాయి. మేము టి.పీ.ఏ మందు ఇచ్చినా ఏమీ గుణం కనిపించలేదు. ఈ క్లాట్ కేన్సర్ మందుల వల్ల వచ్చిందా, మరోదాని వల్లా అనేది చెప్పడానికి లేదు. ఇప్పుడు హెమొరేజ్ వల్ల వళ్ళు తెలియదు ఆయనకి. కానీ మరి తెలివి వస్తే మీతో మాట్లాడ్డం కానీ, మామూలుగా జీవించడం కానీ అసంభవం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచితే మరో కొన్ని రోజులు బతకొచ్చు. బతికినా ఎవర్నీ గుర్తుపట్టడం గానీ మాట్లాడ్డం కానీ జరగదు అని మా మెడికల్ టీం అభిప్రాయం. ఫీడింగ్ ట్యూబ్ ఉంచమంటారా, తీసేయమంటారా?”

కడుపులో ముఫ్ఫై అంగుళాల కత్తి వెన్నెముకకి అంటుకునేలా గుచ్చి ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగితే ఏమిటి సమాధానం? సురేష్ వెంఠనే చెప్పేడు, “ఓ పది నిముషాలు ఆలోచించుకోవచ్చా?”

“తప్పకుండా” ఎమర్జన్సీ రూం డాక్టర్ లోపలకి నడిచేడు.

యామిని అక్కడే కుర్చీలో నిశ్చేతనంగా కూలబడింది. తల్లిని వదిలేసి బాత్రూంలో దూరేడు కన్నీళ్ళు కనపడకుండా ఉండడానికి. చిన్నప్పుడు సరిగ్గా అన్నం తినకుండా ఇల్లంతా పరిగెడుతూంటే తనని కూర్చోపెట్టి కధలు చెప్తూ ఒక్కొక్క చెంచాతో అన్నం తినిపించిన తండ్రికి ఫీడింగ్ ట్యూబ్ ఉంచమని చెప్పాలా? తీసేయమని చెప్పాలా? నాన్నా, ఇలా సిమ్మింగ్ క్లాస్, అదిగో బేస్ బాల్ ప్రాక్టీస్, ఇక్కడ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని పోరుతుంటే ఎక్కడకి పడితే అక్కడకి తీసుకెళ్ళిన తండ్రిని ఏంచేయాలి? తాను హిందువు కనక ఆ ధర్మం ప్రకారం ఫీడింగ్ ట్యూబ్ తీసేయడం మంచిదా? ఉంచడం మంచిదా? మోరల్ గా అయితే ఏం చేయాలి? తనదొక్కడిదీ కాదు నిర్ణయం. అయినా తల్లిని ఇప్పుడు ఏమని అడగాలి? అమ్మా ట్యూబ్ తీసేయమని చెపుదామా అని చెప్పాలా? లేకపోతే ఉంచుదాం, అప్పుడు తండ్రి బతికితే నువ్వు క్షణం కూడా ఖాళీ లేకుండా ఆయన్ని చూసుకో అని చెప్పాలా? ఇప్పటికే ఈ కేన్సర్ వల్ల తల్లి చితికిపోయింది మానసికంగా, ఆర్ధికంగా, శారీరకంగానూ….. బుర్ర తినేసే ప్రశ్నలన్నీ ఒకదానిమీద ఒకటి సమ్మెట దెబ్బల్లా తగులుకుంతూంటే తల బద్దలౌతోంది. ఒక్కసారి చణ్ణీళ్లతో మొహం కడుక్కున్నాడు. కొంత తెరిపి పడ్డాక బయటకొచ్చాడు అయిదు నిముషాలకి.

యామిని, దగ్గిరకొచ్చిన కొడుకుని తలెత్తి  చూసింది. ఓ క్షణం ఆగి చెప్పింది, “మీ నాన్న ఇష్టం మొదట్నుండీ తెలుస్తూనే ఉంది. ట్రీట్ మెంట్ వద్దని చెప్పినా మనమే కొనసాగించాం. ఇంక ఈ దశలో ఏ మాత్రం ఉపయోగం లేదని డాక్టర్లు చెప్తున్నారు కదా, ట్యూబ్ తీసేయడమే మంచిది.”

తాను ట్యూబ్ తీసేయమంటే తల్లి ఏమంటుందో, అసలెలా చెప్పాలా అనుకుంటున్న సురేష్ కి తలమీదనుంచి పెద్ద బరువు దింపేసినట్టు అయింది. తల్లికేసి కాసేపు చూసి తన చేతిని అమ్మ చేయి మీద వేసి “అలాగే” అన్నాడు.

* * * * * * * * *

ఆ తర్వాత జరగవల్సినవన్నీ జరిగిపోయాయి. అమ్మాయీ, రెండో కొడుకూ వచ్చాక శరీరాన్ని దహనానికి అప్పగించడానికీ, అస్థికలూ అవి తీసుకుని ఇండియా వెళ్ళి గంగలో కలపడానికీ నిశ్చయించుకున్నాక ఎవరి పనుల్లోకి వాళ్ళు తయారయ్యారు. ప్రపంచం ఒక్క మనిషికోసం ఆగదు కదా?

మరో రెండు రోజులు పోయాక అక్కనీ, తమ్ముణ్ణీ ఇంట్లో వదిలి యామినితో అస్థికలు తీసుకురావడానికి బయల్దేరాడు సురేష్. ఫ్యూనరల్ హోం లో వాటికోసం చూస్తూంటే ఎక్కడలేని నీరసం, నిస్సత్తువా ఆవరించాయి. వెనక్కి తిరిగి ఓ సారి చూసుకుంటే తనకి కొండచిలువలా తాడి ఎత్తున వికట్టహాసం చేస్తూ పెరిగిన అప్పు. ఇంత ఖర్చు పెట్టినా తన తండ్రి పడ్డ నిరంతర నరకం తప్పలేదు. ఏనాడూ తనని ఏదీ అడగని తండ్రి చివర్లో కూడా తమ శ్రేయోభిలాషే. తానెలాగా పోతాననీ దానికోసం ఇంత డబ్బు వేస్టు చేయొద్దనీ అడిగితే తానేమన్నాడు? తనకి తల్లీ తండ్రి తప్ప మరెవరూ బంధువులు లేరనీ, ఆయనపోతే తాము ఏకాకి అయిపోతారనీ తెలిసి తండ్రిని బతించుకోవడానికి – మిగతా ఇద్దరికీ పట్టకపోయినా – అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఇదంతా చూస్తే తానో పూర్తి స్వార్ధపరుడు. డేవిడ్ చెప్పినట్టూ తాను కూడా నిస్వార్ధంగా తండ్రిని ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్తే చివరకి మనశ్శాంతితో హాయిగా పోయి ఉండేవాడా? ఇదంతా తన స్వార్ధం వల్లేనా? తలెత్త లేక అలా నేల చూపులు చూస్తూంటే పక్కనే ఉన్న తల్లి చేయి తన భుజం మీద పడటం గమనించాడు. ఒక్కసారి శోకం ముంచుకొచ్చింది. చటుక్కున బాత్రూములోకి దూరి వెక్కి వెక్కి ఏడిచాడు హృదయం పగిలేలా.

ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టాడా, ఖర్చుపెట్టిన డబ్బులకి ఎంత ఫలితం ఉందా అనేమాట పక్కన పెడితే, డాక్టరై ఉండీ ఏం సాధించాడు తాను? ఇన్నాళ్లూ తాను పోరిన పోరాటం శుద్ధ దండుగ. ఎంత నిబ్బరంగా ఉండి కేన్సర్ తో పోరాడి విజయం పొందుదామనుకున్నా, ఆఖరికి ఆ రాచకురుపే గెల్చింది. తమ పోరాటం ఆషామాషీ రోగంతో కాదు. నిరంతరం అనేక లక్షలమంది చేస్తున్నదే. తన తండ్రి బతుకుతాడా పోతాడా అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీలకి గానీ, ప్రతి రోజూ ఇటువంటి కేసులని చూసే హాస్పిటళ్లకి గానీ పట్టలేదు. వాళ్ల ఉద్యోగాలు వాళ్ళు చేసారు. ఫలానా ఎక్స్ పెరిమెంటల్ మందు పనిచేస్తే అది పనిచేసినట్టు కేన్సర్ మీద ఓ పేపర్ రాసుకునేవారేమో. అయినా వాళ్ల తప్పేం ఉంది ఇందులో? తన తండ్రి అనగా ఎంత? ఈ జన సముద్రంలో ఆయన కూడా ఓ నీటి బొట్టు…. మనసు మరల్చుకోవడానికి ఓ సారి తండ్రి చదివే భగవద్గీతలో శ్లోకం గుర్తు తెచ్చుకున్నాడు సురేష్, “జాతస్య హిధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్యచ, తస్మాద పరిహార్యే ర్ధే నత్వం శోచితు మర్హసి”

విశ్వం అస్థికలూ, చితాభస్మం ఉన్న డబ్బా పట్టుకుని ఫ్యూనరల్ హోం నుంచి తల్లి యామినితో వెనక్కి వస్తూంటే సురేష్ మదిలో ఎందుకో ఒక్కసారి మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్ పాఠం చెప్తూ అన్న మాట గుర్తొచ్చింది “కేన్సర్ అనేదో రాచకురుపు. అది మనిషి జీవితాన్నే కాదు, మనసులనీ, మనుషుల మనఃస్తత్వాన్నీ, మన మధ్య బాంధవ్యాలనీ మన బేంక్ ఎకౌంట్లనీ, ముందు రాబోయే రోజులనీ అన్నింటినీ పూర్తిగా మార్చి వేయగల అసాధారణ శతృవు. కేన్సర్ వచ్చిన మనిషి ఒకేసారి ఛస్తాడు, కానీ ఆ తర్వాత పేషంట్ తాలూకు చావు దెబ్బ తగిలిన మృతశేషులు అంటే సర్వైవర్స్, ప్రతీ రోజూ ఛస్తూనే ఉంటారు చాలా కాలం వరకూ.”

కళ్ళలో నీళ్ళు చిమ్ముతూంటే పక్క సీట్లో కూర్చున్న తల్లికి కనబడకుండా వాటిని అదిమిపెట్టి కాలు బలంగా ఏక్సిలెరేటర్ మీద నొక్కాడు. ఏక్యురా కారు కీచుమంటూ ఇంటివేపు దూసుకుపోయింది.

* * * * * * * * *

 

నాకు మ‌న‌స్సు ఉంటుంది                   

Pablo_Picasso,_1910,_Girl_with_a_Mandolin_(Fanny_Tellier),_oil_on_canvas,_100.3_x_73.6_cm,_Museum_of_Modern_Art_New_York.

ఉద‌యం 9 అయ్యింది విశాఖ వ‌చ్చే పాటికి..స‌త్య అప్పటికే రిసీవ్ చెసుకోడానికి రెడీగా ఉన్నాడు.. హోట‌ల్  రూం తీసుకోని కాస్త ఫ్రెష్‌ అయి.. ఇద్దరం ఆఫీస్‌ దగ్గరకు వెళ్లాము.. మధ్యాహ్నం  లంచ్ కి విశాఖలో నేను అమితంగా ఇష్టపడే  అల‌కాపురికి వెళ్లి చెరొక బిరియానీ తిని బైక్ మీద బ‌య‌లు దేరాము..ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర సిగ‌రెట్స్ కోసం అగాము..ఎవరో బిచ్చగత్తె 29 నుంచి 35 సంవ‌త్పకాల మధ్య ఉంటాయేమో.. ఎముకల గూడులా ఉంది.. అడుక్కోవ‌డానికి వ‌చ్చింది..గ‌తంలో ఆమెను ఎక్కడో చూసినట్లు గుర్తు..కానీ ఎంత అలోచించినా ఎక్కడ చూశానో  గుర్తుకు రావ‌డం లేదు..స‌త్యా బాస్ ఇంట‌ర్యూకు వ‌చ్చిన వాళ్లను సాయంత్రం ఇంట‌ర్యూ చెయ్యాలీ అని గుర్తు చేసిన త‌రువాత గానీ అక్కడ నుంచి బ‌య‌లుదేర‌లేదు..ఇంట‌ర్వ్యూలు చేస్తున్నాం.. అయినా ఆ బిచ్చగత్తె మాత్రం కళ్లలోనే మెదులుతూ ఉంది..రాత్రి స‌త్యతో పాటుగా నా పీజీ క్లాస్ మెట్స్ మ‌రో ఇద్దరు, నేను వ‌చ్చాన‌ని క‌ల‌వ‌డానికి రూంకి వ‌చ్చారు..ఫార్మల్‌గా త‌లా రెండు పెగ్గులు తీసుకున్న త‌రువాత ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు..పాత మిత్రుల‌ను  క‌ల‌వ‌డంతో విశాఖ‌తో నా ప‌రిచ‌యం , పీజీ చ‌దువు అంతా కళ్లముందు క‌దిలింది..మిత్రులు వెళ్లిపోయాక  హోట‌ల్ బాయ్  రూంను శుభ్రం చేసి భోజ‌నం వ‌డ్డించాడు..భోజ‌నం త‌రువాత  ఫ్రెష్‌గా మ‌రో రెడ్‌విల్స్ వెలిగించ‌గానే అప్పుడు గుర్తుకు వ‌చ్చిన పొద్దున చూసిన బిచ్చగత్తె..నా జీవితంలో ఒక అద్భుత‌మైన పాఠం నేర్పిన వ్యక్తి..

 

పీజీ చదవడానికి తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చాను..పీజీ చదువు..ప్రఖ్యాత అంధ్రా యూనివర్సిటీలో నాకు ఇష్టమైన జ‌ర్నలిజం ప్రొఫెషనల్‌ కోర్సు..అప్పటి దాకా పేపర్ల లోనూ టీవీలలోనూ విశాఖ గురించి విన‌డం, చదవడం,  చూడటం తప్ప మ్యాప్‌లో విశాఖ నగరం ఇలా ఉంటుందా అని అనుకోవడం  తప్ప ఎప్పుడూ విశాఖ వ‌చ్చిందీ లేదూ చూసింది లేదు.. పీజీ చ‌దువుతో ప్రారంభమైన నా విశాఖ పరిచయం, క్రమ క్రమంగా అంతులేని మోజులా మారిపోయింది..ఎన్నిరోజులు బీచ్‌లో మిత్రుల‌తో భ‌విష్యత్‌ గురించి క‌ల‌లు క‌న్నాన్నో..ఎన్ని రాత్రులు స‌ముద్ర కెర‌టాల‌పై పాల నురుగులా ప‌డుతున్న వెన్నెల‌ను స్వాదించానో..వ‌ర్షంలో కెర‌టాల‌తో అడుకున్నానో..అమావాస్య నిశీ చీక‌టిలో అల‌కూ అల‌కూ మ‌ధ్య నిశ‌బ్దాన్ని వింటూ గ‌డిపానో ముఖ్యంగా బీచ్‌లో కూర్చోని హాప్రస్థానం చ‌దువుతుంటే శ్రీశ్రీ స్వయంగా మ‌హా ప్రస్థానన క‌విత‌ల్ని చ‌దివి వినిపిస్తున్నారు అనే భ్రాంతి క‌లిగేది నాకు.. పీజీ త‌రువాత ఉద్యోగం కోసం విశాఖ వీడి వెళ్లిన త‌రువాత కూడా ఎప్పుడైనా బోర్ అనిపిస్తే విశాఖ వ‌చ్చే వాడిని..ఆ త‌రువాత విశాఖ‌లో రెండు సార్లు ప‌నిచేసినా ట్రాన్స్‌ఫర్‌ వ‌ల్ల ఎప్పుటి క‌ప్పుడూ చుట్టపుచూపుగానే వ‌చ్చి వెళ్తూ ఉండేవాడిని..జీవితంలో స్థిరపడితే విశాఖలోనే స్థిరపడాలనేదీ నా భ‌ల‌మైన కోరిక‌.

 

మ‌న‌కు జీవితంలో తార‌స ప‌డే ప్రతి జీవీ మ‌న‌తో బ‌ల‌మైన రుణ‌బంధం క‌లిగి వుంటుందనీ ఏదో తత్త్వవేత్త పుస్తకంలో చ‌దివాను అలాంటి ప‌రిచ‌య‌మే నాకు వాసుతో క‌లిగింది..వాసు నాతో పాటు జర్నలిజం చ‌దివిన స‌హాద్యాయి..ఇద్దరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే కావ‌డంతో స్వతహాగా దగ్గరయ్యాము..దానికి తోడు ఇద్దరం పుస్తకాలు, సామాజిక ఆలోచ‌న‌లు చుకునే వాళ్లము… కొన్ని విష‌యాల‌పై ఇద్దరిలో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నా చాలా విషయాలలో మాత్రం ఒకే మాట ఒకే బాట‌గా ఉండే వాళ్లము ..ఒక ర‌కంగా నా ఆవేశ‌పు అగ్నికి వాడి లోచ‌న గాలీ తోడ‌య్యేదీ..పీజీ రోజుల‌లోనే ఇద్దరం చెరొక పత్రికలో ప‌నిచెసే వాళ్లం.. యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న అక్రమాలపై పోటీపడీ మరి వార్తలు రాసేవాళ్లం..మా వార్తలకు కొంత మంది డైలీ వైజ్ వ‌ర్కర్‌కు  యూనివ‌ర్సిటీ ప‌ర్మినెంట్ చేయడంతో మా సంతోషానికి అవ‌దులు లేవు..జ‌ర్నలిజం వ‌ల్ల ప్రజలకు మంచి జ‌రుగుతంద‌నీ ఎలాగైనా ఇద్దరం రిపోర్టింగ్‌ ఫీల్డ్‌లోనే ఉండాలని డిసైడ్‌ అయ్యాము..నాలుగు గోడ‌ల మ‌ద్య చ‌దివే చ‌దువులో కంటే నాలుగు రోడ్ల మ‌ద్య నేర్చుకునే ప్రాక్టిక‌ల్ చ‌దువే కావాల‌నుకున్నాం ఇద్దరం.. స‌మాజంలో మ‌న చుట్టూ నిత్యం జ‌రిగే వాటిపై స్టోరీ చెయ్యాల‌ని నిర్ణయం తీసుకొని..ఆ క్రమంలో జీవీఎంసీ ఎన్నిక‌ల‌లో డ‌బ్బు ప్రవాహం..యూనివ‌ర్సిటీలో కుల‌గ‌జ్జీ, ర్యాగింగ్ వంటి అనేక అంశాల‌పై స్టోరీలు రాసేవాళ్లం..ఇంకేదైనా డిఫ‌రెంట్‌గా చేద్దాం అనుకుంటుండ‌గా వాసు నైట్ స్వీప‌ర్స్ పై అద్భుత‌మైన ఐటెం రాశాడు..వాడి వార్త దెబ్బకు పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌నీస స‌దుపాయాలు అయినా మాస్కులు వంటి స‌దుపాయాలు క‌ల్పించింది యాజ‌మాన్యం..వాడికి పోటీగా ఏజ‌న్సీ విద్యా వ్యవస్థ మీద నేను ఐటెం రాశాను..ఇంకా ఎదైనా రాయాలి కాస్తా డిఫ‌రెంట్ గా స‌మాజం తీరుపై కొర‌కాసుతో కాల్చీ వాత పెట్టేదీ గా ఉండాలి ఆ స్టోరీ… అలాంటి దానికోసం వెతికే క్రమంలో పొట్టకూటికోసం ఒల్లంమ్ముకునే వేశ్యలపై  స్టోరీ చేద్దాం అనుకున్నాం.. కానీ ఎలా..వారు ఎక్కడ ఉంటారు..? కాంటాక్టు చేయడం ఎలా..? ఒక మిత్రుడు చెప్పాడు..రాత్రులు రైల్వే స్టేష‌న్ దగ్గరా, బ‌స్టాండ్ ద‌గ్గరా ఉంటార‌నీ..ఇక వాళ్లని క‌లిసి మాట్లాడాలి..అలాంటి వాళ్ల కోసం చాలా రోజులు విశాఖ బ‌స్టాండ్ లో గ‌డిపేవాళ్లం..

 

ద‌స‌రా సెల‌వ‌ల‌కూ అంద‌రూ మిత్రులు వెళ్లిపోయినా నేనూ వాసు ఇద్దరం యూనివ‌ర్సిటీలో ఉండిపోయాము..రాత్రి సెకండ్ షో జ‌గ‌దాంబలో చూసిన త‌రువాత  సిగ‌రెట్ల కోసం ఆర్టీసీ బ‌స్టాండ్‌కు వెళ్లాము..సెడ‌న్‌గా ఒక అమ్మాయి క్యాంటిన్‌లో టిఫిన్ చేస్తుంది..కాస్తా ర‌ఫ్‌గా సాధార‌ణ అమ్మాయిల‌తో పోల్చితే క‌నిపించే సున్నిత‌త్వం కనిపించడం లేదు..నిదానంగా వాసు గాడు మాట‌లు క‌లిపాడు..బుల్లేట్ లా దూసుకు వ‌చ్చింది ఆమె దగ్గర నుంచి ఇద్దరం ఉన్నారా రెండు వేలు ఇవ్వండీ అని.. అంత కాదు ఇంతిస్తాం అని కాదు నేను అడిగినంత ఇవ్వాలీ అని తనూ.. బేరం ఎంతకీ తెగడం లేదు.. ఈ లోగా అర‌గంట‌కు అంతివ్వాలా అన్నాడు వాసు..ఇష్టం ఉంటే రండీ లేక పోతే పోండీ..ప్రతి పోటుగాడూ బేరాలాడే వాడే అని ఎట‌కారంగా మాట్లాడీ వెళ్లడానికి అడుగు ముందుకు వేసింది త‌నూ..ఒక్క సారిగా నేను మగాడ్నీ అనే అహంతో రెచ్చిపోయిన నేనూ ఒల్లమ్ముకునే దానివి ఎందుకే నీకంత పొగ‌రూ అన్నా…తోక తొక్కిన తాచులా చుర్రున చూసిందీ క‌ళ్లల్లో నీరుతో ఒళ్లు కొవ్వెక్కీ ఒళ్లమ్ముకోవ‌డం లేదు బతకడానికి ఒళ్లమ్ముకుంటున్నాను..నాకు మ‌న‌స్సుంటుందీ..అంద‌రిలాగా ఉండాలనీ ఉందీ అంటూ వేగంగా వెళ్లి పోయింది..తొంద‌ర ప‌డ్డావురా బావా అన‌వ‌స‌రంగా ఆడ పిల్లను మాట అన్నావు అన్నాడు వాసు..నిజ‌మే నాకు అర్ధమవుతుంది చేసిన త‌ప్పు..కానీ స‌రిదిద్దుకోలేను..భారంగా బీచ్ కు య‌లుదేరాం..

 

ఆ సంఘ‌ట‌న త‌రువాత మ‌రో రెండు రోజులు ఆ అమ్మాయి కోసం వెతికాము కానీ ఫ‌లితం లేదు..ఆ అమ్మాయి గురించి .అలోచించ‌డం మానేసి  ఎగ్జామ్స్ హ‌డావుడిలో ప‌డ్డాము..చ‌దువు పూర్తయింది..వాసుకు నాకు వేరు వేరు ఛాన‌ల్స్ లో  ఉద్యోగాలు వ‌చ్చాయి..అయితే రెండు సంవత్సరాల‌కు విశాఖ ట్రాన్స్ ఫ‌ర్ అయింది..ఓ రోజు సాయంత్రం  6.30 స‌మ‌యంలో బస్టాండ్ ద‌గ్గరే క‌నిపించింది..ఎవరి కోసం అయినా ఎదురు చూస్తుందో తెలియ‌దూ..వెంట‌నే వెళ్లను..అదే రెక్ లేస్ ఎంత మంది ఉన్నారు అందీ .. ఒక్కడినే అన్నాను. రెండు వేలు అందీ..ప‌దా అని లాడ్డికి తీసుకు వెళ్లాను..త‌న డ‌బ్బులు దారిలోనే ఇచ్చేశాను..

భోజ‌నం చెశావా అన్నాను..లేదు అందీ..భోజ‌నం తిన్న త‌రువాత న‌న్ను గుర్తు ప‌ట్టావా అన్నాను..ఎంతో మందిని చూశాను నువ్వేల గుర్తుంటావు అని ఎదురు ప్రశ్న వేసింది….అదీ నిజ‌మే ప్రవహించే న‌దీ ఎన్ని మ‌జిలీల‌ల‌ను గుర్తు కు పెట్టుకుంటుంది అనిపించింది.. రెండు సంవ‌త్సరాల క్రితం జ‌రిగిన విష‌యం గుర్తు చేశాను..త‌న మోహం ఎర్రగా కందిపోయింది..కోపంతో ముక్కు పుటాలు అదురుతున్నాయి..వెళ్లిపోతాను నేను అంటూ లేచింది..కాదు కూర్చో నీతో మాట్లాడాలీ, అని బ‌ల‌వంతంగా కూర్చో బెట్టాను..చెప్పు ఏంటీ నీ స్టోరీ అన్నాను..విజ‌యన‌గ‌రం ద‌గ్గన ఊరు నాదీ..అమ్మానాన్నలు కూలీలు..టెన్త్ వ‌ర‌కూ చ‌దివాను..అమ్మానాన్న చనిపోయారు.. నా అశ‌లు కూలిపోయాయి..ప‌ని ఉంద‌నీ చెబితే ఇక్కడ‌కు వ‌చ్చాను..ఇక్కడ‌కు వ‌చ్చిన త‌రువాత ఈ ప‌ని అని తెలిసింది.. ఆక‌లికి త‌ట్టుకోలేక పోట్టకూటి కోసం ఈ ఫీల్డ్‌లోకి వ‌చ్చాను అందీ..మ‌రీ ఎక్కడ ఉంటావు అన్నాను..ఇక్కడే ఓ మ‌రో ముగ్గురు ఇదే వృత్తి చేసే వారితో ఉంటాను..అంద‌రిలోనూ చిన్నదాన్ని నేనూ..వాళ్లకు అంత బేరాలు ఉండ‌వూ..నాకు వ‌చ్చే డ‌బ్బుల‌తో వారి పిల్లల‌ను స్కూల్లో చ‌దివిస్తున్నాను అందీ..ఇలా ఎంత కాలం ఉంటావు ఏదైనా ఉద్యోగం చెసుకోవ‌చ్చు క‌ధా అంటే నువ్వు ఇప్పిస్తావా  ఉద్యోగం..ఈ ఫీల్డ్ వ‌దిలేసి ప‌నిచేసుకుంటాను అందీ..నేను సైలెంట్ అయ్యాను..చూశావా ఇన్ని అద‌ర్శాలు చెప్పిన నువ్వు కూడా  మౌనంగా మారావు.. చెప్పినంత ఈజీకాదు ఆచ‌రించ‌డం..నువ్వు ఆరోజు అన్న మాట అప్పడ‌ప్పుడు గుర్తుకు వ‌స్తుంటుంది..చాలా బాధగా అనిపిస్తుంది..ఒక్కటి గుర్తుంచుకో మ‌నిషిని మ‌నిషిగా చూడ‌నీ ఆద‌ర్శాలు పాటించ‌కూ..జీవితం అంద‌రికి అన్నీ ఇవ్వవూ..ఏదో పొందుతూ ఉంటాం ఇంకేదో కోల్పోతూ ఉంటాం..నువ్వనుకుంటావేమో ఒళ్లమ్ముకునే దానివి వేదాంతం మాట్లాడుతున్నావే అని, నేను ఎంతో మంది మ‌నుషుల‌ను చ‌దివాను..ఒక్కటి గుర్తుంచుకో..ఒళ్లమ్ముకునే వాళ్లకూ మ‌న‌సు ఉంటుందీ ..చేసే ప‌నుల‌ను బ‌ట్టీ మ‌నుషుల‌ను అంచనా ఎప్పుడూ వేయకు అనీ అంటూ లేచిందినేను బ‌య‌లుదేరుతాను..నీ డ‌బ్బు నాకు వ‌ద్దూ నేనూ ఏ ప‌నీ చేయలేదు ఇక్కడ అంటూ వెళ్లిపోబోయింది..స‌రే నీ ప‌నికోసం కాక‌పోయినా నీ ద‌గ్గర ఉన్న పిల్లల కోసం అయినా డ‌బ్బు తీసుకో అన్నాను..నీతో ఇప్పటి వ‌ర‌కూ మాట్లాడిన దానికి స‌గం చార్జీ  తీసుకుంటాను అని వెళ్లిపోయింది..వాసు గాడికి ఈ సంగతి చెప్పాను..

 

కాల‌గ‌ర్భంలో సంవ‌త్సరాలు గ‌డిచిపోయాయి..నాకు హైద్రాబాద్ ట్రాన్స్ ఫ‌ర్ అయింది..దాదాపు 8 సంవ‌త్సరాల త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ ట్రాన్స్‌ఫ‌ర్ పై విశాఖ‌కు వ‌చ్చాను..నాకు అద్భుత‌మైన జీవిత పాఠం నేర్పిన వ్యక్తి క‌లిస్తే ఇప్పుడైనా ఏదో ఒక‌టి చెయ్యాలీ అనిపించింది..ఇప్పుడు నాకంటూ ఒక హోదా ఉంది కాబ‌ట్టి ఆ ర‌క‌మైన ప్రయత్నం చేయాలని అనుకున్నాను .. ఉద‌యాన్నే అక్కడికి వెళ్దామ‌నుకున్నాను..కానీ వేరే ప‌నుల‌లో రెండు రోజులు గ‌డిచిపోయింది..మూడో రోజు ఎలా గైనా కల‌వాలనుకొని నిన్న స‌త్యకు నాకు త‌ను క‌నిపించిన ప్రాంతానికి వెళ్లాము..అక్కడ‌కు వెళ్లే పాటికి జీవీఎంసీ వాళ్లు అడావుడీ చేస్తున్నారు..స‌త్యాని ఏం జ‌రిగిందో క‌నుక్కో అని పురమాయించి సిగ‌రెట్ వెలిగించాను..అన్నా ఎవ్వరో బిచ్చగ‌త్తే చ‌నిపోయింది అని చెప్పాడు..నాకు ఎందుకో ఆ శ‌వాన్ని చూడాల‌ని అనిపించింది..స‌త్యా నేనూ ఇద్దరం వెళ్లాము..నా అనుమాన‌మే నిజం అయింది.. త‌నే..శవాన్ని ఎక్కడ‌కు తీసుకుళ్తారు అని అడిగానూ అనాధ శ‌వం క‌ధా సార్..ఎక్కడైనా పూడ్చి పెడతాం అని చెప్పారు మున్సిపాలిటీ వారు..స‌రే ఖ‌ర్చులు నేను బ‌రిస్తాను..సాంప్రదాయంగా ద‌హ‌నం చేయండి నేనూ వ‌స్తాను అని చెప్పాను..స‌త్యా కూడా నాతో శ్మశానానికి వ‌చ్చాడు..క‌పాల మోక్షం జ‌రిగిన త‌రువాత శ్మశానం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాము..

నేను నేర్చుకున్న అద్భుత పాఠం..నాకు పాఠం నేర్పిన గురువు రుణం ఆ విధంగా తీర్చుకున్నాను..కాని త‌ను అన్న మాట‌లు నాకు ఎప్పుడూ గుర్తు ఉంటుంది..అంద‌రినీ మ‌నుషులుగా చూడూ..అంద‌రికి మ‌న‌స్సు ఉంటుందీ అనీ….హెట్స్ ఆఫ్ హ‌ర్……..అమే కోసం..

 

………….ఆమే………………..

 

మెర్క్యూరి లైట్ల దగదగల క్రింద..

పిలుస్తున్న అస్పష్ట ఆకారం..

దగ్గరకు వెళ్లితే మత్తెక్కించే చౌకరకం సెంటు గుబాలింపు..

చుట్టూ పరకిస్తూనే రావాలా అంటూ ప్రశ్న..

కొంచెం లేటయిందో..

త్వరగా తేల్చుకో..

ఇంకో బేరం ఉందంటూ గదమాయింపులు..

…………………………………….

ఆ చూపులో కోరిక లేదు..

దోరికి పోతామన్న భయం లేదూ..

కొత్త అనుభవాలను ఓడిసి పట్టుకోవాలన్నా అత్రుత లేదు..

నన్ను నమ్ముకున్నోళ్ల కడుపు నింపాలన్న తపనే కనిపిస్తుంది..

ఆ చూపుల్లో..

ఆకలే కనిపిస్తుంది ఆ చూపుల్లో..

…………………………………………..

ప్రేమించిన వాడు మోసం చెసి కొందరూ..

మొగుడు వదిలేసిన వారు మరికొందరూ..

నా అనే వాడు పట్టించుకోక ఇలా ఎందరో..

అప్పులు తాళలేక..

బిడ్డలను పస్తులుంచలేక..

తన శరీరాన్నే వ్యాపార పాన్పుగా మారుస్తుందా పడతీ..

……………………………………………………

ఆమెను కదిలిస్తే ఎన్నో కధలు…

మరెన్నో వ్యధలు..

రాత్రంతా జడలో నలిగిన మల్లెపువ్వులా వాడిపోయింది అంధం..

తన శరీరాన్ని కాక మనస్సున్న మనిషిగా గుర్తించమని పోరాడుతుంది ఆమె

 

ఆయువు..

నడుస్తున్న కాలానికి బ్రతుకుతున్న జీవితానికి ఏర్పడిన కాళీని పూర్తిస్తుంది ఆమె..

శూన్యమైన మనస్సాక్షితో…….

కాలం రోగాల సర్పాలై ఆమె అయుష్షుని మింగేసింది..

కవ్వించే ఆ శరీరం ఇప్పుడు ఎముకల గూడైంది..

చీకటి పరదాలలో కూరుకుపోయిన..

హృదయాన్ని క్షమించి ఇంకా ఎంతకాలం వెలుగు నటించగలని ప్రశ్నిస్తుంది ఆమె..

నిజమే…

ఆమె కౌగిలి పాన్పు తప్ప మనస్సుకు అంటుకున్న గాయాల వాసన ఎవరికి..

ప‌డుతుంది చెప్పూ…

క్రొవ్వొత్తీ వెలుగే కాని ..

ఆరిపోయిన కొవ్వొత్తి పొగ రింగులుగా అనంత వాయువుల్లో కలిసే ఆయువు ఎవ్వరికి

కావాలి..

*

అసంతృప్తి  

satya2

art: satya sufi

 

అతనంటే నాకిష్టం లేదు, నాకతన్ని చూసినప్పుడు భగభగమండే ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తున్నంత మంటగా వుంటుంది. అతనంటే నాకిష్టం లేదు, అతను నా పక్కనుంటే, నాకు – పులి పక్కన వినయంగా నడుస్తున్న దొంగనక్కలా, మంత్రిగారికి ఒంగొంగి నమస్కారాలు పెడుతున్న అవినీతి ఆఫీసర్లా, ఎస్పీ దొరగారికి సెల్యూట్ చేస్తున్న సస్పెండైన ఎస్సైలాగా, అమెరికా సూటుబాబు పక్కన సిగ్గుతో చితికిపోతూ నించున్న ఆఫ్రికా గోచిగాళ్ళా చిన్నతనంగా వుంటుంది. యెందుకు? అతను నాకన్నా చదువుకున్నాడా? లేదు. నాకన్నా ధనవంతుడా? కాదు. నాకన్నా పైస్థాయిలో ఉన్నాడా? కాదు.. కాదా? లేదు.. లేదా? ఏమో!

అతను నా చిన్ననాటి స్నేహితుడు. మా ఇద్దరిదీ వొకే వీధి, వొకే స్కూలు. ఆ వీధిలోకెల్లా మా ఇల్లే అతిపెద్ద ఇల్లు, ఆ వీధిలోకెల్లా అతన్దే అతిచిన్న ఇల్లు. మేం ధనవంతులం, నా తండ్రి నగరంలో టాప్ క్రిమినల్ లాయర్. అతని తండ్రి వారానికోసారి మాత్రమే అన్నం తినేవాళ్ళా బక్కగా, బలహీనంగా వుండేవాడు. ఆయనకేదో చిన్నఉద్యోగంట, జీతం కూడా సరీగ్గా ఇవ్వర్ట. ఆయన అస్తమానం దగ్గుతూ, మూలుగుతూ ఉండేవాడు. నీరసంగా కూడా ఉండేవాడు.. ఆయనకేదో జబ్బుట!

స్కూలు లేనప్పుడు విశాలమైన మా ఇంటి ఆవరణలో ఆడుకునేవాళ్ళం. అతను బిడియస్తుడు, భయస్తుడు, తనదికాని ఈ ప్రపంచంలో టిక్కెట్టులేని రైలు ప్రయాణికుళ్ళా బెరుగ్గా వుండేవాడు. నేనెక్కువగా నాకిష్టమైన క్రికెట్ ఆట ఆడేవాణ్ని, అతను నేను షాట్లు కొట్టేందుకు వీలుగా బౌలింగ్ చేసేవాడు. అతను నాతో క్రికెట్ ఆడటమే గొప్ప ఎచీవ్మెంట్లా భావించేవాడు. అతను నేనడక్కుండానే నాకో ఉన్నత స్థానం ఇచ్చేశాడు.

అతను మా ఇంటిని కలలో కనబడే ఇంద్రభవనంలా ఆశ్చర్యంగా చూసేవాడు. ‘భౌ’మనే మా టామీని చూసి భయపడ్డాడు, కయ్యిమంటూ మోగే మర్ఫీ రేడియో చూసి ఆనందపడ్డాడు. భొయ్యిమని చల్లగాలి వెదజల్లే ఎయిర్ కూలర్ చూసి ముచ్చటపడ్డాడు. ఫోన్ ‘ట్రింగ్ ట్రింగ్’ మన్నప్పుడు సంబరపడ్డాడు. ఇలా – నన్నూ, నా ఐశ్వర్యాన్నీ అతను ఎడ్మైరింగ్గా చూడ్డం నాకు చాలా ఆనందం కలిగించేది.

కానీ – నా ఆనందం, నా ఈగో అంతలోనే ఆవిరైపొయ్యేవి. అందుక్కారణం – చదువులో అతని ప్రతిభ. మునిసిపాలిటీ కుళాయి నీళ్ళుపట్టి మోసుకెళ్ళడం, వంట చెయ్యడం, బట్టలుతకడం.. ఇలా అన్నిపనుల్లో తల్లికి సాయం చెయ్యడంలో అతను బిజీగా వుండేవాడు. పరీక్షల్లో మార్కులు మాత్రం అన్నీ ఫస్ట్ మార్కులే. నేను కష్టపడి ఒక్కోమార్కు సంపాదిస్తే, అతను అలవోకగా పుంజీడు మార్కులు తెచ్చేసుకునేవాడు – యెలా సాధ్యం!

అతను మంచివాడు. అతని మాట నిదానం, మనిషి నిదానం. చదువు తప్ప మిగిలిన విషయాల్ని పట్టించుకునేవాడు కాదు. నాకు కష్టంగా అనిపించిన పాఠాల్ని అర్ధమయ్యేలా చక్కగా వివరించేవాడు. ఆ రకంగా అతని వల్ల నేను చాలా లాభపడ్డాను. కష్టమైన పాఠ్యాంశాల్ని కూడా సులువుగా అర్ధం చేసుకునే అతని ప్రతిభకి ఆశ్చర్యపొయ్యేవాణ్ని, లోలోపల రగిలిపొయ్యేవాణ్ని. అతను నాతో యెంత స్నేహంగా వున్నా, అతని చదువు మాత్రం నాకు ముల్లులా గుచ్చుకుంటూనే వుండేది.

మన్చేతిలో ఏదీ ఉండదు. అరిచేత్తో సూర్యకాంతిని ఆపలేం, నదీప్రవాహాన్నీ ఆపలేం. జనన మరణాలు ఆగవు, అన్యాయాలు ఆగవు, మానభంగాలు ఆగవు, రాజకీయ నాయకుల అవినీతీ ఆగదు. ఇవేవీ ఆగకపోయినా, కుటుంబ సమస్యల్తో చదువు మాత్రం ఆగిపోతుంది. ఈ విషయం నాకతని తండ్రి మరణంతో అర్ధమైంది. కుటుంబాన్ని పోషించడం కోసం అతను స్కూల్ ఫైనల్తో చదువాపేసి ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతున్న నా జీవితానికి అతని గూర్చి పట్టించుకునే తీరిక లేకపోయింది.

ఆ తరవాత నా చదువు చక్కగా ‘కొన’సాగింది. ఈ ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొన్లేమంటారు గానీ చదువుని మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. కేవలం డబ్బువల్లే ఉన్నత చదువులకి గోడమీద బల్లిలా ఎగబాకాను. నా ఉన్నత చదువులకి, ఉన్నత సిఫార్సులు కూడా జతవడం చేత, ఉన్నత ఉద్యోగం కూడా వచ్చింది. ఇన్ని ఉన్నతమైన అర్హతలున్నందున, ఉన్నతమైన కుటుంబం నుండి ఉన్నతమైన ఆస్తిపాస్తుల్తో భార్య కూడా వచ్చి చేరింది.

ఇప్పుడు నాకేం తక్కువ? ఏదీ తక్కువ కాదు, అన్నీ ఎక్కువే! పెద్దకంపెనీలో పెద్దకొలువు, తెల్లటి మొహం మీద ఎర్రటి లిప్స్టిక్తో అందమైన భార్య, కాంప్లాన్ బాయ్ల్లాంటి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆడుకోడానికి రెండు బొచ్చుకుక్కలు. మూడు కార్లు, నాలుగు బిల్డింగులు, పెద్దవ్యాపారాల్లో భారీపెట్టుబళ్ళు, ఏడాదికి రెండు ఫారిన్ ట్రిప్పులు, పెద్దవాళ్ళ స్నేహాలు.. నా జీవితం వడ్డించిన విస్తరి.. కాదు కాదు.. బంగారు పళ్ళెంలో పోసిన వజ్రాలరాశి. కానీ – అతను నాకు గుర్తొస్తూనే ఉంటాడు. అతని జ్ఞాపకాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

మా ఊళ్ళో మా కుటుంబానికున్న పొలాలు, స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపొయ్యాయి. కొన్నికోట్ల విలువైన ఒక స్థలం రిజిస్ట్రేషన్ కోసం నేను యెన్నో యేళ్ళ తరవాత మా ఊరికి వెళ్ళాల్సివచ్చింది. వెళ్ళేప్పుడు అతన్ని పలకరించడం కూడా ఒక పనిగా పెట్టుకున్నాను. రిజిస్ట్రేషన్ పని లంచ్ సమయానికి పూర్తైపోయింది. కారు వెనుక సీట్లో కూలబడి డ్రైవర్కి అతని ఇంటి ఎడ్రెస్ చెప్పాను.

మా ఊరు ఒకవైపు అందంగా సుందరంగా పొడవాటి బిల్డింగుల్తో ‘అభివృద్ధి’ చెంది కుర్రకళతో తళతళల్లాడుతున్నా, పాత ఊరు మాత్రం ముసలి పేదరాశి పెద్దమ్మలా అలాగే వుండిపోయింది. అతనా ముసలి ప్రాంతంలో వొక ఇరుకు వీధిలో అద్దెకున్నాడు. ఇంతకీ నే వెళ్తుంది అతన్ని పలకరిద్దామనేనా? కాకపోవచ్చు, ఇన్నేళ్ళ తరవాత అతని యోగక్షేమాలు కనుక్కోవడం ద్వారా నేను సాధించేదేమీ లేదు. అతన్ని చూడటం ద్వారా నాలో గూడు కట్టుకున్న అసంతృప్తి కొంతైనా తగ్గచ్చొనే ఆశతో వెళ్తున్నాను.

ఆ వీధి ఇరుగ్గా వుంది, మురిగ్గా వుంది. అమెరికావాడి అప్పుకోసం ఇండియావాడు షోకేస్ చేసే దరిద్రపుగొట్టు వీధిలా వుంది. అంతర్జాతీయ అవార్డు కోసం ఆర్ట్ సినిమాల డైరక్టర్ వేసిన అందమైన పేదవాడి వీధిలా వుంది. నా లక్జరీ కారు ఆ ఇరుకువీధిని ముప్పాతిక భాగం ఆక్రమించింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఖరీదైన కారుని అందమైన దయ్యప్పిల్లని చూసినట్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అది రెండుగదుల పెంకుటిల్లు. రోడ్డువైపుకు ఓ చిన్నగది, లోపల ఇంకో చిన్నగది. ఆ ఇంటి గోడల వయసు షుమారు వందేళ్ళుండొచ్చు, ఆ గోడలకి సున్నం వేసి ఓ అరవయ్యేళ్ళు అయ్యుండొచ్చు. కింద నాపరాళ్ళ ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా అసహ్యంగా ఉంది. ఆ మూల దండెంమీద నలిగిన, మాసిన బట్టలు పడేసి ఉన్నాయి. ఆ గదిలో వొక పాతకుర్చీ, మూలగా ఒక చింకిచాప. మై గాడ్! వొక ఇల్లు ఇంత పేదగా కూడా వుండగలదా! ఈ కొంప కన్నా ఆ వీధే కొద్దిగా అందంగా, రిచ్చిగా ఉంది!

ఆ కుర్చీలో ఎవరో పెద్దాయన కూర్చునున్నాడు. పాత కళ్ళజోడూ, మాసిన గడ్డం, నెత్తిన నాలుగు తెల్ల వెంట్రుకలు.. వార్ధక్యంలో, పేదరికంలో ఆ గదికి అతికినట్లు సరిపోయ్యాడు. ఆయన బక్కగా ఉన్నాడు, ముందుకు ఒంగిపోయున్నాడు. పొట్ట లోపలకి, బాగా లోపలకి పోయుంది. ఎప్పుడో ఏదో జబ్బు చేస్తే డాక్టర్లు పొట్టకోసి పేగులన్నీ తీసేసి ఖాళీపొట్టని మళ్ళీ కుట్టేసినట్లున్నారు. ఆయన వాలకం చూస్తుంటే చాలాకాలంగా ఈ ప్రపంచాన్ని పట్టించుకోటం మానేసినట్లుంది.

ఆయన.. ఆయనకాదు.. అతను! అతను.. నా స్నేహితుడు! ఇలా అయిపొయ్యాడేంటి! నా అలికిడి విని నిదానంగా తలెత్తి నావైపు చూశాడు. నన్ను పోల్చుకున్నట్లుగా లేదు. మళ్ళీ తల దించుకుని మౌనంగా, శూన్యంలోకి చూస్తున్నట్లుగా అలా వుండిపొయ్యాడు. యేంచెయ్యాలో తెలీక పొడిగా దగ్గాను. తలెత్తి మళ్ళీ నావైపు చూశాడు. అతనికి నేనెవరో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నట్లు లేదు.

“నేనెవరో గుర్తు పట్టావా?” ముందుకు వొంగి అడిగాను.

“క్షమించాలి, నాకు చూపు సరీగ్గా ఆనదు.” నెమ్మదిగా అన్నాడు.

“నేను.. నీ చిన్ననాటి స్నేహితుణ్ణి.” అన్నాను.

కళ్ళు చిలికించి చూస్తూ నన్ను పోల్చుకున్నాడు. అతని కళ్ళల్లో కనీసం వొక చిన్నమెరుపైనా కనిపిస్తుందని ఆశించాను, కానీ – అతని చూపులో జీవం లేదు. నెమ్మదిగా లేచి యెదురుగానున్న చాపమీద కూర్చున్నాడు. నేనా డొక్కుకుర్చీలో కూలబడ్డాను. నా ప్రశ్నలకి అతను నెమ్మదిగా, అతిచిన్నగా సమాధానం చెప్పాడు. కొద్దిసేపు మాట్లాడాక అతని గూర్చి కొద్దివివరాలు తెలిశాయి.

తండ్రి చనిపొయేప్పటికి అప్పులు తప్పితే ఆస్తులేమి లేవు. అతని కొద్దిపాటి జీతంతోనే అప్పుల్ని నిదానంగా తీరుస్తూ, అప్పులకి మళ్ళీ అప్పులు చేసి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి చేశాడు. కొన్నాళ్ళకి తల్లి చనిపోయింది. అతనికి జీతం తప్ప వేరే ఆధారం లేదు, దరిద్రం తప్ప వేరే సంతోషాల్లేవు. అతని జీతం అప్పుల మాయం, జీవితం దుఃఖమయం. అంచేత భార్య అతన్ని అతని పేదరికానికి వదిలేసి కొడుకుని తీసుకుని పుట్టింటికెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక్కడే ఇలా జీవితాన్ని వెళ్ళబుచ్చేస్తున్నాడు. నాకతను దిగాలుగా భారంగా జీవిస్తూ, చావు కోసం ఆశగా ఎదురుచూసే నిరాశాజీవిలా కనిపించాడు.

నాకు ఆ వాతావరణం చాలా ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించసాగింది.

ఒక్కక్షణం ఆలోచించి అడిగాను – “నీకిన్ని ఇబ్బందులున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు?”

సమాధానం లేదు.

“నీకు తెలుసా? ఇప్పుడు నేను నీకు యే సహాయమైనా చెయ్యగల స్థాయిలో వున్నాను.” అన్నాను.

అతనొక క్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చిన్నప్పుడు నాకర్ధం కాని పాఠాలు చెప్పేప్పుడు కూడా నన్నలాగే చూసేవాడు. నాకు సిగ్గుగా అనిపించి తల దించుకున్నాను. ఆ తరవాత కూడా అతనేమీ మాట్లాడలేదు. అతనికి నాతో మాట్లాడే ఆసక్తి లేదని గ్రహించాను. ఆ గదిలో ఆ డొక్కుకుర్చీకీ, అతనికి పెద్ద తేడాలేదు. ఇక అక్కడ వుండటం అనవసరం అనిపించి లేచి బయటకి వచ్చేశాను.

నన్ను గమనించిన డ్రైవర్ హడావుడిగా కారు వెనుక డోర్ తీసి వినయంగా నించున్నాడు, నిట్టూరుస్తూ కార్లో కూలబడ్డాను. ఇప్పుడు నాకు మరింత అసంతృప్తిగా వుంది. నాదికాని రాజ్యంలో ముసలి రాజుని చంపి ఆ సింహాసనంపై అక్రమంగా కూర్చున్న కుట్రదారుగా.. సింహం తినగా మిగిలిన వేటలో ఎముకలు కొరికే నక్కలాగా.. ఆకలితో ఏడుస్తున్న పాపడి పాలు తాగేసిన దొంగపిల్లిలాగా.. యాజమాన్యంతో కుమ్ముక్కై కార్మికుల పొట్టగొట్టిన కార్మిక నాయకుళ్ళాగా.. తీవ్రమైన అసంతృప్తి.

నా అసంతృప్తి క్రమేపి కోపంగా మారింది. అతని పరిస్థితి బొత్తిగా బాలేదు, నేను చాలా ఉన్నత స్థానంలో వున్నాను. నాగూర్చి అతనికి తెలీకుండా యెలా వుంటుంది? అతనికి నా ఎడ్రెస్ తెలుసుకోవడం క్షణం పని. నా దగ్గరకొచ్చి – ‘మిత్రమా! నా పరిస్థితేం బాలేదు, సాయం చెయ్యి.’ అని అడగొచ్చుగా? అతనికి యేదోక కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించడం నాకెంతసేపు పని! కానీ.. అతను నన్నడగడు. అతనిది మొహమాటం కాదు – పొగరు, నా పొజిషన్ చూసి ఈర్ష్య! శ్రీకృష్ణుణ్ణి కలవడానికి కుచేలుడికి అహం అడ్డు రాలేదు, తన స్నేహితుడి ఉన్నతిని కుచేలుడు మనస్పూర్తిగా కొనియాడాడు. మరి అతనో? శ్రీకృష్ణుణ్ణే తిరస్కరించాడు!

నేనెంత స్థాయిలో వున్నాను? యెంతో బిజీగా వుంటాను? అయినా కూడా నా చిన్ననాటి స్నేహితుడి పట్ల అభిమానంతో వెతుక్కుంటూ వచ్చాను, కానీ అతను నా ఉనికినే గుర్తించకుండా పోజు కొట్టాడు! ఇంతకీ అసలతను తెలివైనవాడేనా? అయితే ఆ జానాబెత్తెడు జీవితంతో యెందుకు మిగిలిపొయ్యాడు? చిన్నప్పుడు యేవో నాలుగు పాఠాలు గుర్తుంచుకున్నంత మాత్రాన నాకన్నా తెలివైనవాడైపోతాడా?

యుద్ధరంగంలో యుద్ధం కడదాకా చేస్తేనే గెలుపోటములు తెలిసొచ్చేవి. కానీ – అతను మధ్యలోనే తప్పుకున్నాడు. కడదాకా యుద్ధం చేసినట్లైతే నేనతన్ని ఓడించేవాణ్నేమో! యేమో కాదు.. ఖచ్చితంగా ఓడించేవాణ్ని. శత్రువుని యుద్ధరంగంలో ఓడిస్తే ఆ గెలుపు సంతృప్తినిస్తుంది, కానీ – శత్రువుకి ఏదో రోగమొచ్చి ఆస్పత్రిలో రోగిష్టివాడిలా మిగిలిపోతే యెంత అసంతృప్తి!

జీవితంలో గెలుపోటములు నిర్ణయించేది చదువు, తెలివితేటలే కాదు.. అదృష్టం, అవకాశాలు కూడా. అక్కరకు రాని తెలివి అడవి గాచిన వెన్నెల వంటిది. నేను అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నాను. నేనిలా ఆలోచించడం నాలోని మంచితనానికి మాత్రమే నిదర్శనం. నన్నిలా ఇబ్బంది పెడుతున్న నా సున్నితత్వాన్నీ, ఉదారగుణాన్నీ తగ్గించుకోవాలి.

ఇలా నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నంలో యేదో వొకరోజు విజయం సాధిస్తానని నాకు తెలుసు.. కానీ – ఆ రోజేదో త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు!

*

హ్యాపీ బర్త్ డే !

Artwork: Mandira Bhaduri

Artwork: Mandira Bhaduri

1

 

నాకు పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదు ! శ్రీరామనవమి, కృష్ణాష్టమి జరుపుకున్నట్టు మన జయంతి ఉత్సవాలు మనమే జరుపుకోవడానికి ఏమి సాధించామని? “నేను పుట్టానహో !” అని గొంతెత్తి అరవడానికి చేసిన ఘనకార్యమేమిటని? లోకానికి వెలుగునిచ్చే మహా మహా సూర్యుడే రోజూ సైలంటుగా వచ్చి వెళ్ళిపోతుంటాడు ! మనమెంత?

“నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తావోయ్ ! ఆనందంగా ఓ రోజు సెలబ్రేట్ చేసుకోడానికి మనం పెట్టుకున్నవే ఈ పుట్టినరోజులూ పండగలూ వగైరా . పెద్ద కారణం ఉంటేనే తప్ప నేను నవ్వను అని తీర్మనించుకు కూర్చోకుండా ముందు నవ్వడం మొదలుపెడితే కారణాలు అవే పుట్టుకొస్తాయి . కాబట్టి నీ పుట్టినరోజు జరుపుకోవడంలో తప్పేమీ లేదు !” అని నాకు లెక్చర్లు పీకిన వాళ్ళు లేకపోలేదు.

వాళ్ళకి నేనిచ్చే సమాధానం ఒకటే –  “అయ్యా, నేను నవ్వననీ అనట్లేదు, ఏడుస్తూ కూర్చుంటాననీ అనట్లేదు. నా పుట్టినరోజు నేను జరుపుకోను అంటున్నానంతే . ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నారు . నా ఆనందానికి నన్ను వదిలెయ్యొచ్చు కదా ! మీ ఆనందాలన్నీ నాపై రుద్దాలనే దుగ్ధ మీకెందుకు?”.

దాంతో “వీడికి చెప్పడం మన బుద్ధి తక్కువ !” అనుకుని జనాలు నన్ను వదిలేశారు . మా ఇంట్లో వాళ్ళతో సహా !

చిన్నప్పుడయితే పుట్టినరోజు కోసం చాలా ఆత్రంగా వేచి చూసే వాడిని . పుట్టినరోజుకి నెల రోజుల ముందే అమ్మ కొత్తబట్టలు కుట్టించడానికి టైలర్ దగ్గరకి తీసుకెళ్ళడం, పుట్టినరోజున నాన్న షాపుకి తీసుకెళ్ళి నీకు నచ్చినది కొనుక్కో అనడం, క్లాసులో చాక్లెట్లు పంచడం, స్నేహితులు (ముఖ్యంగా క్లాసులో అమ్మాయిలు!) నన్ను విష్ చెయ్యడం వగైరా విషయాలు ఎంతో థ్రిల్లింగ్ గా ఉండేవి . కానీ పెద్దవుతున్న కొద్దీ ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది . పాతికేళ్ళొచ్చాక కూడా ఇంకా పిల్లాడిలా కేక్ కట్ చేసి, కొవ్వెత్తులు ఊదుతూ ఉండడం చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇవేమీ చెయ్యను . గుడికెళ్ళి దేవుడికి –  “నన్ను పుట్టించి నువ్వు చేసిన తప్పుని మహాపరాధంగా మార్చకుండా ఉంచడానికి నా వంతు నేను చేస్తున్న ప్రయత్నానికి నీ సాయం అందించు స్వామీ!” అని ఓ దణ్ణం పెట్టుకుంటాను . తర్వాత ఓ మూల కూర్చుని, “నేను ఇన్నేళ్ళ జీవితంలో సాధించినదేమిటి, ఇక ముందు జీవితంలో అధిరోహించాల్సిన శిఖరాలేవిటి?” అని ఆలోచిస్తాను . కొంతసేపటికే తల వేడెక్కిపోతుంది ! ఇంత క్లిష్టమైన ప్రశ్నలు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిశ్చయించుకుని ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని రిలాక్స్ అవుతాను !

2

“మన పుట్టినరోజుని ఎంత మంది గుర్తుపెట్టుకుని విష్ చేస్తే మనకి అంత మంది నిజమైన స్నేహితులు ఉన్నట్టనీ, అది అదృష్టమనీ” ఓ అమ్మాయి చెప్పింది . ఈ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ రోజుల్లో గుర్తుపెట్టుకోవడం లాంటి కష్టమైన పనులని ఎవ్వరూ చెయ్యట్లేదనీ, ఫోన్లే “టింగ్” అని మెసేజ్ ఇచ్చి మరీ బర్త్ డేలు గుర్తుచేస్తున్నాయనీ ఆ అమ్మాయికి చెబుదామనుకుని ఆగిపోయాను, మరీ “అన్ రొమాంటిక్” గా ఉంటుందేమోనని ! ఎంతైనా ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. పేరు హాసినీ!  మొన్నామధ్యే మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది . పెద్దలు కుదిర్చిన సంబంధమే . తనూ నాలాగ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఓ వీకెండ్ నాడు మేము కలిసినప్పుడు ఆమె అన్న మాటలవి. “అవును, అదృష్టమే. నువ్వు నాకు దొరికినట్టు” అన్నాను. ఇలా లింకు ఉన్నా లేకున్నా పొగిడినట్టు మాట్లాడితే అమ్మాయిలకి నచ్చుతుందని నా ఫ్లాట్ మేట్ రవి సలహా ఇచ్చాడు. వాడు అమ్మాయిలని హ్యాండిల్ చెయ్యడంలో ఎక్స్పర్ట్, నేను నా ఎంగేజ్మెంట్ కి ముందు అమ్మాయిలని దూరం నుంచి చూసి ఆనందించడంతో సరిపెట్టుకున్నవాడిని !”

“హేయ్! వచ్చే నెల్లో నీ పుట్టినరోజు కదా!  సూపర్ గా పార్టీ ప్లాన్ చెయ్యాలి! రాత్రి పన్నెండింటికి నేనే  ఫస్ట్ విష్ చెయ్యాలి! రోజూలా నిద్రపోకు!“ – తను చాలా ఉత్సాహంగా చెప్పింది.

నాకసలే రాత్రి పదింటికల్లా పడుకోవడం అలవాటు. ఎవరైనా నిద్రలేపితే పరమ చిరాకు. అయినా చక్కగా సుప్రభాతం అయ్యి వెలుగొచ్చాక విష్ చెయ్యొచ్చు కదా! రాత్రికి రాత్రే, గడియారం పన్నెండు కొట్టిన వెంటనే విష్ చెయ్యాలనే వెర్రి తాపత్రయం నాకు అర్థం కాదు. ఇలా అర్థరాత్రీ అపరాత్రీ కాల్ చేసి ప్రేమాప్యాయతలూ, శుభాకాంక్షలు తెలియజేసే వాళ్ళకి వద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. అందుకే నన్ను ఎవడూ పుట్టినరోజు ముందురాత్రి కెలకడు. ఇక పార్టీలు పెట్టుకుని మరీ ఈ తంతు అంతా చెయ్యడం అంటే “బిగ్ నో!” నాకు!

కానీ ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య అయిపోయింది. ఇప్పుడే ఇలాటి హెచ్చరికలు జారీ చేస్తే బెంబేలెత్తిపోతుంది. పోనీ తగ్గుదామా, ఎంతైనా కాబోయే భార్యే కదా? నో నో! పెళ్ళి అయ్యాక ఎలాగూ పెళ్ళాం ముందు హస్బెండ్  బెండ్ అవ్వక తప్పదు! కనీసం మిగిలిన ఈ కొద్ది రోజులైనా స్వేచ్ఛావాయువులు పీల్చుకోకపోతే ఎలా? ఇలా పరిపరి విధాల ఆలోచించి ప్రస్తుతానికి ఏదో దాటవేసే సమాధానంతో సరిపెడదామని నిశ్చయించాను.

“నిద్రపోవడమా! నో నో నో! అయినా నీ తలపుల్లో పడిమునకలేస్తున్న నాకు నిద్రేం పడుతుంది చెప్పు?”

హాసినీ మొహం వెలిగిపోయింది. అయినా వెంటనే –

“మరందుకేనా? రోజూ రాత్రి పదింటికే గుడ్ నైట్ చెప్పి పడుకుంటావ్. పెళ్ళి చేసుకోబోతున్న జంటలు రాత్రంతా ఫోన్‌లో కబుర్లు చెప్పుకుంటూ చందమామతో కలిసి జాగారం చెయ్యడం ఎంత బావుంటుందని?”

అమ్మో! బయటపడదు కానీ సరసురాలే! నేను తగ్గుతానా?

“అవునవును! మనలాంటి పెళ్ళి కాబోతున్న జంటలు కుదిరినప్పుడల్లా చాటుమాటుగా కలుసుకుని ముద్దులూ కౌగిలింతల్లో తేలిపోతుంటే సిగ్గుపడి చందమామ మబ్బుచాటుకి వెళ్ళిపోతున్నాడనీ విన్నాను.”

“ఓయ్! ఆగు! ఏమో అనుకున్నాను కానీ అబ్బాయిగారిలో రసికత బానే ఉందే.”

“అమ్మాయిలో రమణీయత ఉంటే అబ్బాయిలో రసికత అదే పుడుతుంది”

“ఆహా! చూస్తా చూస్తా. పెళ్ళయ్యి రెండు మూడేళ్ళు అయ్యాకా కూడా నువ్వీ మాటంటావో లేదో చూస్తా”

“చిత్తం, కాబోయే శ్రీమతి గారు!”

3

తెలివిగా నా బర్త్ డే సంగతి దాటవేశాను అనుకున్నాను కానీ హాసినీ ఏ మాత్రం మరిచిపోలేదు! ఆ రోజు తరువాత జరిగిన మా ప్రతి సంభాషణలో నా పుట్టినరోజు చోటు చేసుకునే ఉంది.  ఎంగేజ్మెంట్ అయిన మిగతా జంటలు ఏమి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారో తెలీదు కానీ, మేము మాత్రం నా పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అని ప్రణాళిక వేస్తూ చాలా గంటలు గడిపాం. అసలు పుట్టినరోజు గురించి జనాలు అంతగా ఆలోచిస్తారని నాకు అప్పుడే తెలిసింది. కేక్ ఎక్కడ కొనాలి, ఎలాంటి కేక్ కొనాలి, కేండిల్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా ఆర్పాలి, ఎలా కేక్ కట్ చెయ్యాలి… ఇలా ప్రతి విషయంలో ఇన్ని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయని నాకు అసలు తెలీదు. పుట్టినరోజు పేరు  మీద చాలా అందమైన వ్యాపారం జరుగుతోందని అర్థమైంది.

తర్వాత విషయం గిఫ్ట్! తను నాకిచ్చే మొదటి గిఫ్ట్ కాబట్టి, నాకు చాలా స్పెషల్‌గా ఉండాలి కాబట్టి ఏం ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తున్నానని చెప్పింది. “అబ్బే! మరీ అంత ఇదైపోకు. ఒక చిన్న ముద్దు ఇచ్చుకో చాలు” అని చెప్తే, “యూ నాటీ!” అని జోక్‌గా తీసుకుందే తప్ప పట్టించుకోలేదు!

అసలు ఇంత మంచి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు. పెళ్ళికి ముందు ఏ చిన్న చిలిపిపని చెయ్యడానికి చాన్స్ ఇవ్వదాయె! అసలు మేం ఇద్దరం ఏకాంతంగా కలవకుండా జాగ్రత్త పడుతుంది. ఎప్పుడూ మేం కలిసేది కాఫీ షాప్స్, మాల్స్ ఇలా పబ్లిక్ ప్లేసుల్లోనే. ఓ సారెప్పుడో మా ఫ్లాట్ కి వచ్చినప్పుడు కూడా తన ఫ్రెండ్ ఇంకో అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చింది. ఆ అమ్మాయిని చూసి రవిగాడు ఫ్లాట్ అయ్యాడు కూడా. ఇప్పుడు నా ఫ్లాట్లో జరిగే నా బర్త్‌డే సెలబ్రేషన్‌లో ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందన్న ఆనందంలో వాడున్నాడు! ఇలా నా పుట్టినరోజు పేరు చెప్పుకుని లోకం సమస్తం ఉత్సవాలు చేసుకుంటూ ఉంటే నేను శిలైన దేవుడిలా మిగిలాను!

హాసినీ నా పుట్టినరోజు గురించి చెప్పే విషయాలకి నేను శ్రోతగా ఉంటూ, “ఊ”, “అవునా” వంటి ఏకపదాలతో సమాధానం ఇస్తూ గడుపుతున్నాను. కానీ నేను చెప్పాల్సింది చెప్పక తప్పదు కదా! అప్పటికే ఏం చెప్పాలో ఆలోచించాను.  అది అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లూ, తమ ప్రియురాలి ముందు, పెళ్ళాం ముందు, ఇంకా చెప్పాలంటే జీవితం ముందు వాడేదే – “ప్రాజెక్ట్ డెడ్లైన్”. జీవితం ఎంత డెడ్ అయిపోతున్నా ప్రాజెక్ట్ డెడ్లైన్ మీట్ అవ్వడం తక్షణావసరం మరి! దాని కోసం తమ జీవితాన్ని ధారపోయడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే గొప్ప త్యాగం! ఈ త్యాగం వల్ల లోకానికి ఉపయోగం ఏమిటన్న ప్రశ్న పక్కనపెడితే, త్యాగం త్యాగమే!  తిట్టుకుంటూ, తప్పదంటూ చేసే ఆ పనిని మొట్టమొదటిసారి ప్రియమైన అబద్ధంగా చెయ్యాలి నేను.

నా పుట్టినరోజుకు రెండు వారాల ముందు మొదటిసారిగా చెప్పాను తనకి.

“హనీ, (పరిచయం పెరిగాక ఇలా పేర్లు కుదిస్తే, ప్రేమ సాగదీయబడి కలకాలం వర్ధిల్లుతుందని రవిగాడి సలహా!), ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువ ఉంది. ఒక డెడ్ లైన్ కూడా ఉంది. ఆ రోజు ఎంత లేట్ అవుతుందో తెలీదు. ఎలాగూ నా పుట్టినరోజు వీకెండ్ రోజైన శనివారం వచ్చింది కాబట్టి శుక్రవారం రాత్రి కుదరకపోయినా, పక్కరోజు ఉదయం సెలబ్రేట్ చేసుకోవచ్చు!” అన్నాను, “ఉదయం” అన్న పదాన్ని నొక్కిపలుకుతూ!

“అదేంటి, అలా అంటావ్! ఎప్పుడు పన్నెండవుతుందా అని ఎదురుచూస్తూ, కదులుతున్న సెకండ్లని గుండె సవ్వళ్ళతో లెక్కెడుతూ, గడియారం ముల్లు వెంటే ప్రాణం పరిగెడుతున్నప్పుడు….ఆ ఎదురుచూపులు…ఆ థ్రిల్…అది వేరు! “

“నువ్వు కవిత్వం కూడా రాస్తావా? ముందే చెప్పుంటే నీ సంబంధం ఒప్పుకోకుండా జాగ్రత్త పడేవాణ్ణే!

“అబ్బా! విషయం అది కాదు! నువ్వు తెలివిగా తప్పించుకోకు! రాత్రే నీ బర్త్‌డే పార్టీ చెయ్యాలంతే! నైటవుట్లు చేసైనా సరే నీ ఆఫీస్ పని పూర్తిచేసుకో అప్పటికి!”

చచ్చాన్రా దేవుడా! ఈ అమ్మాయి చాలా సీరియస్‌గా తీసుకున్నట్టే ఉందే!  అయితే ఈ సారికి నా పట్టు సడలించక తప్పదా?

4

సోమవారం వచ్చేసింది! ఆ శనివారమే నా పుట్టినరోజు. ఆ శుక్రవారం రాత్రే మా ఫ్లాట్ లో బర్త్‌డే పార్టీ! నాకోసం మరీ ఎక్కువ మందిని పిలవకుండా మినహాయింపు ఇచ్చింది. నేనూ రవీ, హాసినీ, వాళ్ళ ఫ్రెండ్ మేం నలుగురమే! నా పుట్టినరోజు వాడి ప్రేమకి పుట్టినరోజు కావాలని రవిగాడు తెగ ప్రార్థనలు చేస్తున్నాడు.

నేనూ హాసినీ తాపత్రయం చూసి మెత్తబడ్డాననే చెప్పాలి! నాకు నచ్చని కేక్ కటింగ్లకీ, సెలబ్రేషన్స్ కీ  సిద్ధపడే ఉన్నాను.  తనని ఆనందపెట్టడం నా పట్టుదల కన్నా ముఖ్యం కావడం నాకే కొంత ఆశ్చర్యంగా ఉంది. ఇది నాలో మార్పో, ప్రేమో, ఏదో తెలీదు కానీ, ఏదేమైనా బావుంది!

ఇంతలో హఠాత్తుగా ఆఫీసులో అనుకోని అవాంతరం వచ్చింది – డెడ్ లైన్! కష్టమర్ కి కొత్త రిక్వయిర్మెంట్ రావడం వల్ల  కొన్ని ఫీచర్లు  తీసేసి ఈ వారమే డెలివరీ కావాలి అన్నాడు. మా కంపెనీ బిజినస్ కి క్రిటికల్ కష్టమర్ కాబట్టి, అది దాదాపు అసంభవమైన టార్గెట్ అయినా మా బాస్ సరే అనేశాడు. నేను లీడ్ కావడంతో మొత్తం బాధ్యత నాపైనే పడింది. ఇక ఆ వారం క్షణం తీరిక ఉండదని అర్థమైపోయింది.

నిజంగా తథాస్తు దేవతలు ఉంటారని తెలిసుంటే ఇంతకంటే మంచి కోరికలు కోరుకునేవాణ్ణి! కానీ నేనీ డెడ్ లైన్ కోరుకోవడంతో ఆ వారం అంతా నిద్ర మానుకుని మరీ పనిచెయ్యాల్సి వచ్చింది. హాసినీతో నా రోజూవారీ ముచ్చట్లూ కుదర్లేదు. పాపం తనూ అర్థం చేసుకుంది. ఎలాగోలా శుక్రవారం సాయంత్రానికల్లా మా రిలీజ్ అయిపోతుందన్న ఆశాభావంతో ఉంది. కానీ నాకు నిజం తెలుసు – ఎంత చెప్పుకున్నా ప్రేమికుల ఊసులూ, ఎంత పనిచేసినా ప్రాజెక్ట్ టాస్కులూ తరగవు!

శుక్రవారం ఉదయం వచ్చేసింది. అప్పటికి పరిస్థితి అంత గొప్పగా లేదు. డెవలప్మెంట్ దాదాపు అయిపోయినా ఇంకా కొన్ని బగ్స్ ఉన్నాయి. బగ్గులూ దగ్గులూ ఓ పట్టాన పోవు! నేను, మా టీంతో కలిసి ఎంత కష్టపడినా సాయంత్రం ఆరింటికి ఇంకా ఒక మేజర్ బగ్ మిగిలిపోయింది. అదొక్కటి ఫిక్స్ చేసేస్తే రిలీజ్ చేసేయ్యొచ్చు. కానీ అది “చిక్కదు దొరకదు” మోడ్ లో ఉంది. హాసినీ కి కాల్ చేసి పరిస్థితి చెప్పాను. రాత్రి పార్టీ సంగతి దేవుడెరుగు, మొత్తం వీకెండే గోవిందా అయిపోవచ్చు అని కూడా చెప్పాను!

తను చాలా నిరుత్సాహపడింది! అయినా పని సాధించే మార్గాలు వెతుకుతూనే ఉంది!

“పోనీ నేనే మీ ఆఫీస్ కి వచ్చి, కాంఫరెన్స్ రూంలో నీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తే? మీ టీం కూడా రిలాక్స్ అయ్యినట్టు ఉంటుంది!”

“అసలే మా మేనేజర్ టెన్షన్‌తో చచ్చిపోతున్నాడు. మనం “హేపీబర్త్ డే” పాట పాడుకుని, కేకులు తింటూ సెలబ్రేట్ చేసుకుంటే చిర్రెత్తుకొస్తుంది ఆయనకి!”

తన వైపు నుంచి మౌనం! కొంత నెమ్మదిగా చెప్పాను –

“హనీ సారీ! మన మిడ్నైట్ సెలబ్రేషన్స్ ఇంక కుదరవులే. ఈ రాత్రి రిలీజ్ అయిపోతే వీకెండ్ జరుపుకుందాం నా పుట్టినరోజుని! సరేనా?”

“ఊ!” అంది, వినీ వినబడనట్టు. అంతలోనే గొంతెత్తి –

“కానీ రాత్రి 12 కి నేనే కాల్ చేసి విష్ చేస్తాను. నాదే మొదటి విష్ అవ్వాలి నీకు!”

నేను చిరునవ్వుతో – “సరే! సరే!” అన్నాను. నా చికాకు ఎక్కడికి పోయింది?

5

మేం అర్థరాత్రి నైట్ అవుట్ చెయ్యాల్సిన అవసరం లేకుండానే బగ్ దొరికి రాత్రి 11.30 కి రిలీజ్ పూర్తి చేశాం.  హాసినీకి చెబితే ఉత్సాహంగా ఎగిరి గంతేసి ఎక్కడో చోట నా బర్త్ డే సెలబ్రేషన్ చేద్దాం అంది కానీ, నేనే వద్దని కన్విన్స్ చేశాను. తను చాలా దూరంలో ఉంటుంది, టైం కూడా లేదు.  నా ఫ్లాట్ ఆఫీస్ కి దగ్గరే కావడంతో 11.45 కి ఇంట్లో ఉన్నాను. వెంటనే ఓ ఐదు నిమిషాల్లో షవర్ చేసి, మంచంపై నడుంవాల్చి హాసినీ కాల్ కోసం వైట్ చేస్తున్నాను. ఆ వారం అంత బాగా అలిసిపోయి ఉన్నానేమో, మొదటిసారిగా ప్రశాంతంగా అనిపించింది.

11:55…ఇంకా ఐదు నిమిషాల్లో తను కాల్ చేస్తుంది…

ప్రతి ఏడూ ఫోన్ ఆఫ్ చేసి పడుకునే నేను, చిత్రంగా తన ఫోన్ కోసం వైట్ చేస్తున్నాను! పెళ్ళి మనుషులని మార్చేస్తుంది అంటారు, అది ఎంత నిజమో తెలిసొచ్చింది. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కోసం ఒకరు సర్దుకుపోతూ ఉంటే, ఆ ఆనందం వేరు!

రింగ్ వినిపిస్తే నా ఆలోచనలనుంచీ బయటపడ్డాను. 12:00 అయినట్టుంది!

కానీ ఆశ్చర్యం! మోగింది ఫోన్ కాదు. టైం కూడా 6:15 చూపిస్తోంది. బయట తెల్లారినట్టుంది!

నాకేమయ్యిందో అర్థం కాలేదు! అంటే నిన్న రాత్రి నేను నిద్రపోయానా? బాగా అలిసిపోవడం వల్ల నిద్ర పట్టేసినట్టుంది. వెంటనే ఫోన్ లో మిస్డ్ కాల్స్ చూశాను, హాసినీ పాపం ఎన్ని సార్లు కాల్ చేసిందో అనుకుంటూ! మళ్ళీ ఆశ్చర్యం!

హాసినీ కనీసం ఒక్కసారి కూడా కాల్ చెయ్యలేదు. అదేంటి? ఇదంతా కలా నిజమా? ఈ రోజు నా పుట్టినరోజేనా? తేదీ కరెక్టుగానే చూపిస్తోందే ఫోన్‌లో!

ఇలా నేను ఆశ్చర్యపోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఇందాక నాకు మెలకువ వచ్చింది ఆ కాలింగ్ బెల్ కే అని అప్పుడు అర్థమైంది. ఇంత ఉదయాన్నే ఎవరు వచ్చారబ్బా అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను.

ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నా హాసినీ! ఓ పూల బొకేతో! జీవితంలో అంత అందమైన ఉదయం ఎప్పుడూ ఎదురుకాలేదు నాకు!

“హ్యాపీ బర్త్‌డే! కాబోయే శ్రీవారూ!”

“హేయ్! హాసినీ! వాట్ ఏ సప్రైజ్! సారీ, నిన్న రాత్రి నిద్రపట్టేసింది, అయినా నువ్వు కాల్ చెయ్యలేదేంటి?”

“ఎందుకంటే నీకు రాత్రి 12 గంటలకి బర్త్డే విషస్ చెప్పడం నచ్చదు కాబట్టి!  చక్కగా తెల్లారి వెలుగొచ్చాక చెప్పొచ్చు కదా!  ఐనా చిన్నపిల్లల్లా ఇంకా కేకులు కట్ చెయ్యడం పార్టీలు చేసుకోవడం ఏంటి?” – కొంటెగా నవ్వుతూ, నన్ను అనుకరిస్తూ చెప్పింది!

చాలా ఆశ్చర్యపోయాను నేను! తనకు ఎలా తెలిసిపోయిందబ్బా!

“రెండు నెలల క్రితం నీ పుట్టినరోజు ప్లాన్ చేద్దాం అని రవిని అడిగితే, “ఆ పని అస్సలు చెయ్యకు! వాడికి నచ్చదు” అని నీ కథంతా చెప్పాడు. నాకు నీ పుట్టినరోజు సెలబ్రేట్ చెయ్యాలని చాలా ఉన్నా,  మంచి అమ్మాయిని కాబట్టి నీ ఇష్టమే నా భాగ్యం అనుకుని అడ్జస్ట్ అయిపోయాను”

నిజమే అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టమే కదా!

“కానీ నిన్ను టీజ్ చెయ్యాలనిపించింది! అందుకే కావాలని నీ బర్త్ డే సెలబ్రేషన్ చేద్దామని నిన్నడిగా. నువ్వు వద్దంటావనే అనుకున్నా!  కానీ నువ్వు నా కోసం నీ పట్టుదలని వదులుకుని మరీ ఒప్పుకున్నావ్!  ఆఫీసులో పీకలదాకా పనున్నా నా కోసం నిన్న ఎర్లీగా రావడానికి ప్రయత్నించావ్! ఎంత ఆనందం వేసిందో! అయామ్ సో లక్కీ!”

హమ్మయ్య! “డెడ్ లైన్ బతికించిందిగా!” అనుకున్నాను మనసులో! ఏదేమైనా కాబోయే పెళ్ళాం మనసు దోచుకోవడం, తనని ఆనందపెట్టడం నాకూ ఆనందమే! ఇంత చక్కని సరదా అమ్మాయి ఎంత మందికి దొరుకుతుంది?

“హనీ! నేను అసలు లక్కీ, నువ్వు కాదు! పార్టీలేవీ చెయ్యకుండానే నా జీవితంలో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్న పుట్టినరోజు ఇదే! నాకు వచ్చిన బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ కూడా నువ్వే! ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? మరీ మొదటిముద్దు పాచిమొహంతో పెడితే ఏం బావుంటుందని ఆగాను కానీ…”

“ఏయ్!” అంటూ తను నా గుండెలపై ఒదిగిపోయింది ప్రేమగా!

*

 

 

 

 

 

 

 

 

 

 

ఆకలి (1973 – 1991)

 

 

తొలిసూరి  కానుపని మా అవ్వను వాళ్ల పెద్ద మేనమామ నర్సయ్యచ్చి వాళ్ళ తల్లిగారింటికి కాన్పుకు తీస్కపోయిండట. అప్పుడు నేను మా అవ్వ కడుపులున్న. మా అవ్వ తల్లిగారూరు కాజీపేట జంక్షన్ పక్కన శిన్న పల్లెటూరు. మా అవ్వకు ముగ్గురు మేనమామలు. మా అవ్వ చిన్నగున్నప్పుడే మా అవ్వోళ్ళ తల్లి సచ్చిపోయిందట. అయ్యో  తల్లి లేని పిల్లాయే అందునా అక్క బిడ్డాయె అని మా అవ్వను మేనమామలు, వాళ్ళ భార్యలు మస్తు గార్వంగ సూసుకునేదట. మా అవ్వోళ్ళ పెద్ద మేనమామ నర్సయ్య ఇంట్ల 1973ల మా అవ్వ పసిద్దకాంగనె (డెలివరి) నేను పుట్టిన్నట. వెంటనే బాపనాయినను పిలుస్తే ఆయనచ్చి పిలగాడు పుట్టిన గడియ మంచిదిగాదు. మూడొద్దులు (3 రోజులు ) తల్లి మొఖం పిలగాడు, పిలగాని మొఖం తల్లి సూడద్దు, సూత్తె మంచి జరుగదన్నడట. మావోళ్ళు భయపడి నన్నో అర్రల, మా అవ్వనో అర్రలపండుకోబెట్టిండ్లట. నేను ఆకలయి పాలకోసం మస్తు ఏడిషేదట. ఎంత ఊకుంచిన ఊకోకపోయేదట. ఏడిషి ఏడిషి ఊపిరి పట్టేటోన్నట. మా అవ్వోళ్ల మేనమామలు వాళ్ల భార్యలు ఊళ్ళెకు బోయి ఆవుపాలు, మేకపాలు, బర్రె పాలు ఏవ్వి దొరికితే అవ్వి తెచ్చి నాకు తాపిచ్చెటోళ్ళట. అగో.. అప్పడిసంది నా ఎంటబడ్డది ఈ ఆకలి…

మాది తాలుకా హెడ్‌క్వాటర్‌కు ఓ ఐదు కిలోమీటర్ల దూరంల వుండే చిన్న పల్లెటూరు. మేము కుమ్మరోళ్ళం. కూటికి గతిలేనోళ్ళం. మూడు పూటల కడుపునిండ బువ్వ తినే ఔషత్ లేనోళ్ళం. మాకు రాగడి మట్టిగోడల్తోని కట్టిన ఒక గడ్డి గుడిసె ఒక కుమ్మరి గూనపెంక ఇండ్లుండేటియి. నాకు ఏడెనమిది సంవత్సరాల వయసచ్చి కొంచెం తెలివచ్చేసరికి మా తాత మా ఇంటిముందు సాయబాన్ల కూసోని కుండలు జేస్తుండెటోడు. మా ఇంటి ముందు చిన్న “కుంట” వుండేది. ఎడ్లబండి కట్టుకోని కుంట్లకుబోయి తట్టతోని రాగడి మట్టి ఎత్తి బండి నింపుకోనచ్చి, మట్టిపెళ్ళలను ఎండల  ఎండబెట్టి, ఎండినక్క ఆ పెళ్ళలను పలుగగొట్టిమెత్తగ పొశిపొశి జేసి తరువాత నీళ్ళు బోసి నానబెట్టి, తొక్కి తొక్కి మెత్తగ గ్రీస్ లెక్క జేసి మట్టిముద్దను “సారె”మీద బెట్టి కోలకట్టెతోని సారెను తిప్పి , పేర్పులు, అటికెలు, ఎసులలు, మంచి నీళ్ల కుండలు, ఐరేని కుండలు, కూర కంచుల్లు, కూరాడు కుండలు, ముంతలు, దొంతులు, బోనం కుండలు, పటువలు, గురుగులు, దీపంతలు జేసి “వాము”ల కాలబెట్టి అమ్మెటోడు. పెయ్యంత మట్టి బూసుకొని కాయకష్టం జేషినా ఈ కులం పనిల అర్కత్ లేదు, బర్కత్ లేదని ఒక్క శిత్తం జేసుకోని కుండలు వానుడు ఇడిషిబెట్టి వున్న రెండెకరాల బూమిల వ్యవసాయం జేసుడు షురువు జేషిండు.

మా నాయినను ఊళ్ళె ఓ పటేలుకు  జీతముంచిండు. ఆ పటేళోళ్లు మా నాయినకు జీతం కింద మక్కజొన్నలు కుంచాలతోని కొలిశి ఇచ్చెటోళ్ళు. అప్పుడు మా ఇంట్ల పొద్దున, రాత్రి గడుక వండెటోళ్ళు. పండుగలప్పుడు యాటపోగు తెచ్చుకున్నప్పుడు లేకపోతే ఇంటికి ఎవ్వలన్న సుట్టాలచ్చినప్పుడు బువ్వ వండేది. ఆ పూట నేను మస్తు కడుపునిండ తినెటోణ్ణి. తతిమ్మరోజులు సగం సగం తిండే. మస్తు ఆకలయ్యేది. ఆ మక్కజొన్న గడుక పాడుగాను మూడుపూటల అదే తినేవరకు అరుగక శెంబడుక (విరేచనాలు) పెట్టేది. గడుక పెద్దగ రుశుండకపోయేది కాని తినక తప్పకపోయేది. తినకపోతే ముడ్డెండుతది. ఆకలిగదా ఆకలి.. అందుకే పెద్దోళ్ళు అన్నట్టున్నది “ఆకలి రుశెరుగది, నిద్ర సుఖమెరుగది” అని.

మక్కజొన్న గడుకల ఇంతంత పెరుగు బోసుకొని పల్చగ పిసుక్కోని పక్కకింత మామిడికాయ తొక్కేసుకోని తింటే మంచిగనె అరిగేది కని పెరుగు కొందమంటే పైసలుండకపోయేది. పైసలున్నప్పుడు పెరుగు దొరుకకపోయేది. ఎందుకంటే ఏగిలిబారంగనె లేసి పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు గంపలల్ల పెట్టుకోని మండలంకు బోయి అన్ని అమ్ముకొని వచ్చేటోళ్ళు మా ఊరోళ్ళందరు. బారతదేశంల పల్లెల పరిస్థితి గమ్మతిగుంటది. ఒంట్లె బొక్కలరిగెదాక, మాంసం కరిగెదాక కాయకష్టం జేసి పండిచ్చిన పంటలను అన్నిటిని తీస్కపోయి అడ్డికి పావుశేరు పట్నపోల్ల దినాలకు పెట్టత్తరు కని పండిచ్చినవాళ్లు కూడా తినాలె. వాళ్లది కూడ పానమే, వాళ్లు గూడ ఆరోగ్యంగా వుండాలే అని అస్సలే ఆలోసించరు. మళ్ల రోగమత్తె హాస్పటలల్ల శెరీకయ్యి బాగు శేయించుకోనికి అప్పులు మస్తు జేస్తరు. మంచి తిండి తినండ్లయ్యా నాయిన అసలు రోగమే రాదు అంటే అరికీస్ ఇనరు..

యాభై సంవత్సరాలకె అస్థిపంజరాల లెక్క అయితాండ్లుపల్లెజనం కని అదే అరవై ఏండ్ల చిరంజీవి తెల్లబూరుకు కర్రె రంగేసుకోని 150వ సిన్మా సురువు జేషిండు. పల్లెటూరోళ్ళు పండిచ్చుడు బాగనే నేర్సుకున్నరు. ఇగ పండిచ్చినదాన్ని తినుడు కూడ అలవాటు శేస్కోవాలె.

అట్ల మూడు, నాలుగు ఏండ్లు మక్కజొన్న గడుక అరిగోసబెట్టి నన్ను ఆకలితోని సంపింది. తరువాత మా ఇంట్ల పొద్దున మక్కజొన్న గడుక, రాత్రి బువ్వ వండుడు సురువు జేషిండ్లు. మా నాయినమ్మ ఒక పెద్ద కురాడు కుండ బెట్టి దాంట్లె గంజిని బోషి పులుసబెట్టి “కలి” తయారుజేశేది. పెద్ద బువ్వ కుండల బియ్యంబోసి ఆ “కలి”ని బొశి బువ్వ వండేది. ఎసరు వచ్చి బియ్యం కుతకుత వుడుకుతాంటె పలుకు మీద వున్నప్పుడే సన్నటి, గుండ్రటి శిల్లులు శిల్లులున్న వెదురుబద్దల “శిబ్బి”ని కొంచెం వంచి బువ్వకుండ మూతిలకెళ్లి లోపలికి సొర్రిచ్చి బువ్వకుండను తలకిందులు జేశి గంజి వారబెట్టేది. కొంచెంశేపు వుంచంగనే గంజి కిందబెట్టిన గిన్నెలకు కారేది. ఈ కారిన గంజి వేడి ఆవిరితోని బువ్వ  “ఉమ్మగిల్లేది” కారిన గంజిని మళ్ళా తీస్కపోయి కొంత కలిల కలిపేది. మిగిలిన గంజిల మేము ఉప్పు ఏసుకోని తాగేది. అట్ల కలితోని వండిన బువ్వ పుల్లగ గుమగుమ వాసనచ్చేది. అదో శిత్రమైన పుల్లని పరిమళం. ఆ పరిమళాన్ని నా జిందగీబర్ నేను మల్లెక్కడ పీల్చలే. అది ప్రపంచ వింతలల్ల ఎనమిదో వింత. సచ్చి ఏ సర్గంల వున్నదో  మా ముసల్ది ( నాయినమ్మ). ఆ వాసనతోని సంపేది. ఆ వాసన పీల్వంగనే ఆకలి కొరివి దయ్యమై అదాట్న మీద దునికేది. జెల్ది బువ్వెయ్యె ముసల్దాన అంటె “ఎహె పులిగండు గుంజిగ బువ్వ ఉమగిల్లద్దారా అగడుబడ్డ పోచమ్మ మొగుణ్ణి మింగినట్టు” శేత్తవేందిరా అరుగుడు పేగు వున్నదా నీకు అని తిట్టేది నవ్వుకుంట. రొండు మూడు రోజులున్నా గూడ ఆ బువ్వ పాశిపోయేది గాదు. మళ్ళా మస్తు పుల్లలు, పుల్లలుండేది. ఈ హీరోయిన్ సుహాసిని రోజు T.V. యాడ్‌ల  శెప్పుతాంటదిగదా.. లలిత బ్రాండ్ రైస్ .. సన్నగా సమానంగా 48 గంటలపాటు ఫ్రెష్‌గా వుంటది అని. కని మా ముసల్ది కుండల వండిన కలిబువ్వ ముందు ఈ లలిత బ్రాండ్ రైస్ బలాదూరె. బల్లగుద్ది శెప్తా. పొద్దుందాక మక్కజొన్న గడుక తినలేక ఆకలికి సచ్చినాగాని రాత్రికి బువ్వ మాత్రం కమ్ముగ తినేది.

మా ఊరిబళ్ళె నాలుగో తరగతిదాకనే వుండేది. నాలుగు ప్యాసై అయిదో క్లాసు సదువనీకి మండలం హెడ్‌క్వార్టర్ స్కూళ్ళ శేరికయిన. రోజు పొద్దుగాల లేశి పిడిక బొగ్గుతోనన్న, యాపపుల్లతోనన్న లేకపోతే ఇటుకపొడి పరంతోనన్న పండ్లు తోముకొని,  ఒత్తుల వేడినీళ్లతోని పెయ్యి కడుక్కోని గడుకుంటె గడుక, బువ్వుంటె బువ్వా ఇంతంత తిని పగటికి సద్దిబెట్టుకొని పోను ఐదు, రాను ఐదు మొత్తం పది కిలోమీటర్లు నడుసుకుంట బోయచ్చి సదువుకునెటోణ్ణి. గడుక వండిన నాడు పగటికి సద్దిపెట్టుకపోయెటోణ్ణిగాదు. ఎందుకంటె బళ్ళె అందరం పగటీలి ఒక్కదగ్గర్నే కూసోని తినేటోళ్ళం. అప్పుడు కడుమ పోరగాండ్లు నా గడుక సూత్తె నా ఇజ్జత్ పోతదని పొద్దటిబడి ఇడిషిబెట్టినంక అరేయ్ నువ్వు సద్ది తెచ్చుకోలేదార అని ఎవ్వలన్న దోస్తుగాండ్లు నన్నడిగితె నేనత్తానప్పటికి మా అవ్వ ఇంకా బువ్వ వండలే. రాత్తిర్ది సలిబువ్వుంటె ఇంత తినచ్చిన అని నేను అబద్ధమాడెటోణ్ణి. దోస్తుగాండ్లు వాళ్ల సద్దిగిన్నె మూతల న పరింత బువ్వేశి ఇంతంత కూర ఏత్తె నేను తినేటోణ్ణి. అట్ల రోజు ఒగలుపెట్టేది. తినాల్నంటె తలకాయ తీశినంత పనయ్యేది. పొద్దటిబడి ఇడిషిబెట్టంగనె ఆ గంటశేపు అటుఇటు తిరిగచ్చెటోణ్ణి. మా కింది కులాలోళ్ళ బతుకులల్ల ఇదో పెద్ద పరేషానున్నది. మా ఇండ్లళ్లకు చెప్పు ఇసిరేత్తె కుండ తలుగకపోవచ్చు కని మాకు రేషం ఎక్కువ. జేబుల శిల్లిగవ్వ లేకపోయిన పెయ్యి మీద అయిమనంగ బట్టలేకపోయిన, ఆత్మాభిమానాన్ని మాత్రం అరికీస్ సంపుకోం. ఒకల మోశేతికింది నీళ్ళు తాగి బతుకం.

బొండిగల పాణం పోయెదాక కొట్లాడతనే వుంటం. కిందబడ్డా, మీదబడ్డా పిడికిలి పైకే లేపుతం. శరం దప్పిన రండ బతుకు మేం బతుకం. మా తాతల తండ్రుల జీన్స్‌లల్లకెళ్ళి ఆ గుణం తబాదాలవుకుంట (ట్రాన్స్‌ఫర్) వస్తాంది. అందుకే మేం ఆర్ధికంగా బలపడుతలేమో ఏమో అనిపిస్తది. మా బడి పక్కనే ఒక సౌండ్‌సెంటర్ వుండేది. అప్పుడు రికాడ్లు వుండేటియి. అవి నల్లగ గుండ్రగ పెద్ద పెద్ద జొన్నరొట్టేలున్నట్టుండేటియి. బయిటికి ఇనబడేటట్టు అక్కడ పాటలేశేటోళ్ళు.  నేను రోజు పగటీలి అక్కడ పాటలు ఇనుకుంట ఆకలి మర్శిపోయెటోణ్ణి. పాటలల్ల శానా బలముంటది, ఎగిరిపిస్తది, దునికిపిస్తది, ఏడిపిస్తది, నవ్విపిస్తది, ఉరికిపిస్తది, ఉద్యమాలు చేపిస్తది, నరాలల్ల రకుతాన్ని మరిగిపిస్తది, ఆకలిని మరిపిస్తది, ఆకలి ఎందుకయితాందో ఎరుక కలిగిపిస్తది. సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనేనేను ఐదు కిలోమీటర్ల చిల్లర నడుసుకుంట బోయెటోణ్ణి. అసలే ఆకలి, అంత దూరం నడువాల్నంటె ఏడుపచ్చేది. మా ఊరి సడుగు (రోడ్డు ) పెద్ద పెద్ద కంకర్రాల్లతోని ఏశిండ్లు. నా కాళ్ళకేమో చెప్పులుండకపోయేది. నడుత్తాంటె నడుత్తాంటె పోట్రవుతు నా కాలు ఏల్లకు ఊకె తాకి గోర్లు లేశిపొయ్యేటియి. రక్తం కారుతాంటె మట్టి సన్నగ శెరిగి మట్టి పరాన్ని దెబ్బమీద పోస్తే దెబ్బకే రక్తం కారుడు ఆగేది. ఎండకాలంల్నయితే మస్తు దూప అయ్యేది. వాగుకాడికి పోంగనే వయ్యిలు పక్కనబెట్టి శెలిమెతోడి నీళ్లూరంగనే వంగి మూతితోని కడుపునిండ తాగేది. ఆ నీళ్లు తేటగ సల్లగ పిర్జిల పెట్టినట్టుండేటియి కని ఇప్పుడు మా వాగుల నీళ్లు తాగుతే మారుమాట్లాడకుంట సచ్చుడే.. ఎందుకంటే సుట్టు పొలాలల్ల శితం ఫెస్టిసైడ్ మందులు కొడుతాండ్లు. అడ్డగోలుగా యూరియా పిండి బస్తాలు సల్లుతాండ్లు. ఆ పొలాలల్ల నీళ్లు వాగులకి వచ్చి కలుత్తాంటయ్.అప్పుడు మందులు వాడుకమే లేకుండె ఏదో అడపాదడపా తప్ప.

ARIF6

ఇగ రోజు ఈ ఆకలి, ఈ నడుసుడు నావల్లగాక మా నాయిన బుష్కోట్ కీస(అంగిజేబు)ల కెల్లి పైసలు ఎత్తుకపోయి పావులబెట్టి హాస్టల్ ఫాం, ఆటాన బెట్టి కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు, ఇంకో రూపాయిబెట్టి రెవెన్యూ టిక్కట్లు కొని అన్ని ఫాముల మీద నా వివరాలు నింపి తహసిల్దారుతోని సంతకాలు బెట్టిచ్చి, సోషల్ వెల్ఫర్ ఆఫీసుల ఫాంస్ ఇత్తే మేము కుమ్మరోళ్ళమని నాకు B.C. హాస్టల్ల సీటిచ్చిండ్లు. మా ఇంట్ల “గుమ్మి”ల ఓ పాత ఇనుప సందూగ వుండేది. దాన్ని బయటికి దీసి దాని లోపలున్న “పాశిట్టు” దులిపి ఓ తడిగుడ్డతోని తుడిశి దాంట్లె నా వయ్యిలు, అంగిలాగులు, పండుకునెటప్పుడు కప్పుకునెదానికి ఓ చెద్దరి కిందేసుకునె దానికి ఓ తట్టు పెట్టుకోని B.C  హాస్టల్‌కు పోయిన. హాస్టల్ల పొద్దటి8.30కు , రాత్రి బువ్వ5.30 కు పెడుతరు. సొట్లుబోయిన పల్లాలు బట్టుకోని లైనుకు నిలబడి బువ్వ పట్టుకోని సకిలమ్ముకిలం బెట్టుకోని తినేది. రోజు పొద్దున కందిపప్పన్న, పెసరపప్పన్న, శెనిగెపప్పన్న, మైసూరుపప్పన్న పెట్టేది. పప్పంత నీళ్ళు నీళ్ళు పలుచగ వుండేది. పొద్దున మాపున పచ్చిపులుసు గూడ శేశేది. పచ్చిపులుసు నల్ల శింతపండుతోని శేశేది. కర్రెగ పాడయేది. సూడంగనే “ఒకారం” వచ్చేది. అడిగెటోడులేడు, నుడిగెటోడు లేకుండె.

మా బతుకులు “ఎవ్వనికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తాంది” అన్న బాలగంగాధర్ తిలక్ కవిత లెక్కుండేది. మాకు పొద్దటిబడి మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడిషిబెట్టంగనే నా తోటోళ్ళందరు పోరగాండ్లు వాళ్ళ వాళ్ల ఇండ్లళ్ళకు ఉరికి బువ్వ తినచ్చేది. నాకేమో పగటీలి హాస్టల్ల బువ్వ పెట్టకపోయేది. నాకు మస్తు ఆకలయ్యేది. హాస్టల్ల కొంచెంసేపు కూసోని, లైఫ్‌బాయ్ సబ్బుతోని మొఖం కడుక్కునేది. అప్పుడు నాకు వేరే సబ్బులు తెల్వయి. ఎర్ర లైఫ్‌బాయ్ సబ్బు తప్ప. మళ్లా నాలుగున్నరకు సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనే దనదనా ఆకలితోని హాస్టల్‌కు ఉరికచ్చేది. ఓ గంట అటు ఇటు టైమెల్లదీయ్యంగనే 5.30 కు రాత్రి బువ్వ కూరగాయల్తోటి పెట్టేది. పచ్చిపులుసు సాయంత్రం గూడ పోశేది. ఒక స్టీలు “రికాబు”తోని హెడ్ కుక్ పెద్ద అండ ముందటబెట్టుకోని మాకు బువ్వ పెట్టేది. ఆకలిమీద మంటర మంటర దనాదనా తిని సరిపోక “మారు”కు మల్లబోతె బువ్వ పెట్టకపోయేది. సరిపోలే అన్న ఆకలయితాంది ఇంకొంచెం బువ్వ ఎయ్యి అంటే ఏంచెల్లి తెచ్చిపెట్టాలె  మా ఇండ్లల్లకెళ్లి తెచ్చిపెట్టాల్న అని వంటమనిషి మొఖమంత ఖండిచ్చుకుంట గదిరిచ్చిపెట్టేది. అవాజ్ ఎత్తుతే ఏదో వంకతోని వార్డన్‌తోని కొట్టిపిచ్చేది. రాత్రి ఎనమిది గంటలకల్లా సాయంత్రం 5.30 కు తిన్న బువ్వ అరిగిపోయి ఆకలయి రాత్రి నిద్ర పట్టకపోయేది.

రూంలల్ల ఫ్యాన్లులేక దోమలు కుట్టి సంపేటియి. వానకాలం వస్తెనయితె ఆ దోమల బాధ శెప్పవశంగాదు. ఆ గోస శెపుకుంటబోతె ఓ రామాయణం ఓ మహాభారతమె అయితది. మాకు హాస్టల్ల సరైన పోషక విలువలున్న బలమైన తిండి లేక రకరకాల రోగాలచ్చేటియి. అవి తిండిలోపం వల్ల వస్తానయని అప్పుడు మాకు తెల్వది. నోరు,నాలుక, పెదవులు, పెదవుల శెలిమెలల్ల తెల్లగ పూశేది. పలిగేది పుండ్లయేటియి. ఒంట్లె చెటాక్ మాంసం వుండకపోయేది. మాకు ప్రొటీన్ ఫుడ్డు సరిగ్గ దొరకకపోయేది. ఎవన్ని సూశిన బక్కపలుసగ, ఎండుకపోయి, బరిబాతబొక్కల్లెల్లి వాయిలు చెట్ల బరిగెల లెక్క, చిన్నపాటి జామాయిలు చెట్ల లెక్కుండేది. శానామందికి నెత్తి ఎంటికలు వూడిపోయేటియి. మేము నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకోకపోయేది. మంచినూనె పెట్టుకునేది. చలికాలంల కాళ్లు రెక్కలు పలుగుతె మంచి నూనెనే రాసుకునెటోళ్ళం. మాయిశ్చరైజర్లా మన్నా. పోరగాండ్లందరు మంచినూనెకు ఎగబడుతాండ్లని కూరలల్ల పోశెదానికి తక్కువబడుతాందని మా వంటమనుషులు మంచినూనెల పసుపు కలిపి ఆ నూనె నెత్తికి రాసుకుంటె పెయ్యికి పూసుకుంటె తెల్ల ఎంటికలు వత్తయని బెదిరిచ్చేది. ఇగ మంచినూనె జోలికి ఒక్కడు పోకపొయ్యేది.

సర్కారు హాస్టల్లల్ల వుండి సదువుకునే పోరగాండ్లమంటే అందరికీ అలుసే. బువ్వ సరిపోతలేదంటె వంటమనుషులు వార్డన్లు బెదిరిచ్చేది. బళ్ళెకుపోతె మాతోనిపాటుగ సదువుకునె బాగ పైసబలుపు వున్న పోరగాండ్లు మమ్ముల అంటిముట్టనట్టు వుండుకుంట చిన్న సూపు సూశేది. ఆఖరికి పంతుళ్ళుగూడ మమ్ముల జిల్లపురుగుల సూశినట్టు సూశేది. “సర్కారు బువ్వ తింటాంటె బాగ బలుపులచ్చినాయిరా” అనుకుంట కొట్టేది, తొడపాశం బెట్టేది. నాకయితే “అసలు బువ్వే సరిపోత లేదురా నాయినా” అని అనాల్ననిపిచ్చేది కని ఎందుకచ్చిన లొల్లి అట్లంటె ఇంక నాలుగు ఎక్కువ సప్పరిత్తడని కుక్కినపేనులెక్క కూసునేది.

హాస్టల్ల వుండి సదువుకునే పోరగాండ్లం మాతోని మేమే దోస్తాన్ జేశేటోళ్ళం. S.C హాస్టల్ల వుండే మాదిగోల్ల సామ్రాట్‌గాడు, సంపత్‌గాడు, మాలోల్ల సురేందర్‌గాడు, B.Cహాస్టల్లవుండే నేను, ముత్రాశోల్ల శీనుగాడు, బెస్తోల్ల రమేశ్‌గాడు, గౌలోళ్ల అశోక్‌గాడు, గొల్లోల్ల బిక్షపతిగాడు, కాపోల్ల భాస్కర్‌గాడు మేమంతా ఒక గ్యాంగ్‌గ వుండెటోళ్ళం. హైస్కూళ్ళ మాజోలికి ఎవడన్న రావాల్నంటె “కాకి నెక్కర్ల” వుచ్చ పోసుకునేది.

 

ఆదివారం వచ్చిందంటె మాశిపోయిన అంగి లాగులు, స్కూలు డ్రెస్సులు పట్టుకోని పొద్దుగాల్నే లేశిపెద్ద కాలువకు పోయెటోళ్ళం. అక్కణ్ణే “బర్రెంక” పుల్లతోణి పండ్లు తోముకోని బట్టలు పిండుకోని తానాలు జేసి వచ్చేటోళ్ళం. అప్పుడు మాకు సబ్బులు కొనుక్కునెదానికి హాస్టల్ల నెలకు 10 రూపాయలు సర్కారు ఇచ్చెది. ఆ పైసలు దాసుకోని ఆదివారం సిన్మాకు పోయెటోళ్ళం. నా శిన్నతనంల సూశిన  సిన్మాలల్ల కమల్‌హాసన్ సత్య (1988), నాయకుడు (1987), నాకు మస్తు నచ్చినయ్. నేనొక్కణ్ణే మళ్లా మళ్ళా బోయి ఆ సిన్మాలు సూశెటోణ్ణి. శనివారం నాడు పొద్దుగూకంగనె చిత్రలహరి సూశేదానికి పోయెటోళ్లం. అంగడి రోడ్డు పక్కన గ్రందాలయం ముందట, దీపక్ ఫోటో స్టూడియోల్లకు ఒక్కలకే అప్పుడు “డిష్ ఆంటేనా” T.V  వుండేది. T.V.ల వారానికో సిన్మాగూడ వచ్చేది. “కోకిలమ్మ” సిన్మా నేను T.Vల సూసుకుంట హీరోగాడు హీరోయిన్ సరితను మోసం జేసినప్పుడు నేను దుఃఖం ఆగక ఏడిసిన.

మేము హాస్టల్ల ఏం తక్కువ 200 మందిమి వుండెటోళ్ళం. అందరం ఒక్క దగ్గర్నె తానాలు జేసుడు, మొఖాలు కడుగుడు. తిన్న పిలేట్లు కడుక్కునేవరకు అక్కడ పెద్ద బురద మడుగు తయారయ్యేది. దాంట్లెకు పందులచ్చి బొర్రేటియి. పందుల పక్కనుంచెల్లి మేము మా పక్కనుంచెల్లి పందులు పొయ్యేటియి. వాటిని మేము మమ్ముల అవ్వి పట్టిచ్చుకోకపోయేటియి.నాకు ఇప్పుడు ఆలోసిస్తే నవ్వస్తది. మమ్ముల సర్కారోల్లు మనుసుల లెక్క గుర్తించకపోతే గుర్తించకపోనీయి. కాని ఆఖరికి పందులు కూడ మమ్ముల మనుషుల లెక్క గుర్తించలె.

ఇట్ల హాస్టల్ల ఆకలి నన్ను ఐదు సంవత్సరాలు సంపింది. ఇంటికాడ వుంటెనేమో నడుసుడు బాధ, ఆ మక్కజొన్న గడుక తినలేక ఆకలి బాధ, హాస్టల్ల వుంటెనేమో మద్యాహ్నం, రాత్రి ఆకలి బాధ, నిద్రబాధలు. ఎనుకకుబోతె నుయ్యి ముందుకుబోతె గొయ్యి లెక్కుండేది బతుకు. కాని హాస్టలే నయ్యమని హాస్టల్లనే వుండేది. బాధాకరమైన విషయమేందంటె ఈ దళిత బహుజనుల బతుకులల్ల కష్టాలకు, కన్నీళ్లకు రొండు రకాల పరిష్కారాలుంటయ్. మళ్లా రొండీట్లల్ల దు:ఖమే వుంటది. కాకపోతె ఒకదాంట్లె ఎక్కువ, ఒకదాంట్లె తక్కువ. ఎటుబడి ఏడుస్తానే వుండాలె.నలుభై ఏండ్ల బతుకును ఎనుకకెనుకకు తవ్వుకుంట తవ్వుకుంట పోతాంటె అడుగడుగునా అన్నీ ఆకలి గాయాలే. ఆకలి జ్ఞాపకాలే. ముడ్డి మీద సరిగ్గ లాగు ఏసుకునుడు శాతగాని పసిపోరగాణ్ణి గంత ఆకలిని ఎట్ల బరించిన్నో తలుసుకుంటాంటే అఫ్సోస్ అయితాంది.

*

అతనొచ్చాడు!

 

chinnakatha

 

 

ఉద్యోగులతో సమావేశంలో ఉండగా, రిసెప్షన్‌ నుంచి ఫోను.

”సార్‌, మిమ్మల్ని కలవడానికి దాచేపల్లి నుంచి ఒకామె వచ్చింది. మీ ఆఫీసుకు పంపమంటారా?”

హైదరాబాదులోని రాజ్‌భవన్‌ రోడ్డులో మా హెడ్డాఫీసు ఉంటుంది. పక్కనే ఉన్న సందులో మెరక మీద మహిళా కళాశాల పక్కనున్న అద్దె భవనంలో నేను పనిచేసే ఫౌండేషన్‌ ఆఫీసు ఉంటుంది.

ఎవరు, ఏమిటి, ఎందుకు లాంటి ప్రశ్నలు అడక్కుండా ”పంపించండి” అన్నాను, మీటింగ్‌ సీరియస్‌గా నడుస్తుండటంతో.

పది నిమిషాల తర్వాత బాయ్‌ చెప్పాడు, ఆమె వచ్చినట్లు. కాసేపు బయటే కూచోబెట్టమన్నాను.

అరగంట తర్వాత నా క్యాబిన్‌ ఖాళీ అయింది. వచ్చినవాళ్లను లోపలికి పంపమన్నాను.

ముందుగా మస్తాన్‌ లోపలికొచ్చాడు. అతనో జర్నలిస్టు నాయకుడు. గుంటూరు జిల్లా. కొద్దిగా పరిచయం.

”మీరా? ఎవరో మహిళ వచ్చిందన్నారు…” నవ్వుతూ అడిగాను, సందేహాస్పద చూపుల్తో.

”అవును సార్‌. ఆమెను నేనే తీసుకొచ్చా”.

”అవునా! దేని గురించి?”

”కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే గారి ద్వారా మీకో అర్జీ పంపించాం. దాని గురించి మీకు నాలుగైదు సార్లు ఫోన్‌జేశాను. మీరు తర్వాత చూద్దాం అన్నారు. కానీ అతని పరిస్థితి…”

ఆ అర్జీ గుర్తొచ్చింది. దాచేపల్లిలో ఓ పత్రికకు విలేకరిగా పనిచేసే వ్యక్తికి ఏదో జబ్బు చేసింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఆపరేషన్‌ చేయాలంటే అయిదు లక్షల ఖర్చు. ఫౌండేషన్‌ సాయం కోసం ఎమ్మెల్యే సిఫారసుతో కూడిన లేఖను మస్తాన్‌ నాకు కొరియర్లో పంపాడు.

”మస్తాన్‌ భాయ్‌, ఈ సంవత్సరం ఫౌండేషన్‌కు రావల్సిన బడ్జెట్‌ పూర్తిగా విడుదల కాలేదు. తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమాలే డబ్బుల్లేక ఆగిపోయాయి. ఇలాంటి రిక్వెస్టులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఫైల్‌ చూపించమంటావా?”

”సార్‌ సార్‌, అలా అనకండి. మీరు ఒక్కసారి అతన్ని చూడండి. వాళ్ల ఆవిడ కూడా వచ్చింది” నా అనుమతి కోసం చూడకుండా బయటికి నడిచాడు.

రెండు నిమిషాల తర్వాత నా క్యాబిన్‌ తలుపులు తెరుచుకున్నాయి. ముందుగా మస్తాన్‌… అతని వెనక ఓ మహిళ… ఆమె వీపు మీద ఎవరో ఉన్నారు, పిల్లాడు కాదు, యువకుడే. పసిపిల్లల ‘ఉప్పు ఆట’ గుర్తొచ్చింది.

ఆమె అతన్ని తీసుకొచ్చి, నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూచోబెట్టింది. అతను రెండు చేతులూ జోడించి, నమస్కారం పెట్టాడు. నడుం దగ్గరనుంచి పైభాగం బొద్దుగా, చూడ్డానికి యాక్టివ్‌గానే ఉన్నాడు. కింది భాగం మాత్రం చచ్చుబడిపోయినట్లు అర్థమైంది.

”కూర్చోమ్మా” ఆమెకు చెప్పాను.

”పర్లేదు సార్‌” అంటూ అతని పక్కనే నిలబడింది. మస్తాన్‌ నాకెదురుగా కుర్చీలో కూచున్నాడు. అప్పటికర్థమైంది అతను ఆమె భర్తేనని.

ఆ పరిస్థితి చూశాక, నాలో ఏదో కదలిక.

గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి ఎంతో ప్రయాణం… తీరా ఇక్కడికొచ్చాక, బాగా మెరక మీద ఉన్న ఆఫీసు దాకా అతన్ని వీపుమీద మోసుకురావడం… గుండె ద్రవించిపోయింది.

నిజానికి అతని అర్జీ వచ్చినప్పుడు, మస్తాన్‌తో ఉన్న పరిచయం కారణంగా రెండురోజులపాటు నా టేబుల్‌ మీద ఉంచుకుని, ఆ తర్వాత ‘రిజెక్ట్‌డ్‌’ ఫైల్లో కుక్కేశాను.

‘బైలేటరల్‌ ఆస్టియో ఆర్థరైటిస్‌’. నడవలేడు. కదల్లేడు. మనిషి మంచానికే పరిమితం. ఒకే ఒక్క పరిష్కారం… ఆపరేషన్‌ చేయాలి. కనీసం 6 లక్షలవుతుంది. అతను రూపాయి కూడా భరించగలిగే స్థితిలో లేడు.

”మస్తాన్‌…” సందేహనివృత్తి కోసం ప్రయత్నించాలనుకున్నాను.

”చెప్పండి సార్‌” ముందుకు వంగుతూ అన్నాడు మస్తాన్‌.

”ఎలాగో కష్టపడి అన్ని లక్షలు ఖర్చు పెడతారు సరే, అనిల్‌ మామూలు మనిషవుతాడా? అంతకుముందులాగే లేచి తిరగ్గలడా? తన పనులు తాను చేసుకోగలడా?”

”కచ్చితంగా నయమవుతుందని, తిరగ్గలడని కిమ్స్‌ డాక్టర్లు చెప్పారు. ఓ డాక్టరుగారైతే ఈ కెేసు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన సహకారం వల్లే అంత తక్కువలో అయిపోతుంది. లేదంటే ఇంకో రెండుమూడు లక్షలు ఎక్కువవుతుంది” నమ్మకంగా చెప్పాడు మస్తాన్‌.

”అవునా?!”

”ఒక్క నిమిషం సార్‌, ఆ డాక్టరు గారికి ఫోన్‌ కలుపుతాను. మీరు మాట్లాడండి.”

”అక్కర్లేదు. ఆయన బిజీగా ఉంటారు…” నేను వారిస్తున్నా వినకుండా రింగ్‌ చేశాడు మస్తాన్‌.

”హలో, డాక్టరుగారూ, నేను దాచేపల్లి మస్తాన్‌ని. అనిల్‌కు ఆర్థికసాయం కోసం ఓ ఫౌండేషన్‌ మిత్రుడి దగ్గరకు వచ్చాం. ఆయన మీతో మాట్లాడతారట..” ఫోన్‌ నాకందించాడు.

డాక్టరు గారు ఓపిగ్గా ఫోన్లోనే అన్నీ వివరంగా చెప్పారు.

ఆపరేషన్‌తో అనిల్‌ మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్పారు.

థాంక్స్‌ చెప్పి, ఫోన్‌ మస్తాన్‌ చేతికిచ్చాను.

నాలో ఆలోచన హోరు…

ఏమీ చేయలేమా! ఏదో ఒకటి చేయాలి. ఎంతో కొంత ఆదుకోవాలి.

నా మదిలో ఉదయకుమారి మేడమ్‌ కదిలారు. కలిసినప్పుడల్లా తనక్కూడా ఫౌండేషన్‌ పనుల్లో ఎక్కడో ఒకచోట భాగస్వామ్యం కల్పించమని అడుగుతుంటారు.

‘డైరెక్టర్‌ హోదాలో ఉన్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలకు రావడం, మా కార్యక్రమాల్లో పాల్గొనడం మీకెక్కడ కుదురుతుందండీ’ అనేవాణ్ని నవ్వుతూ.

‘పోనీ, నా నుంచి డొనేషన్‌ తీసుకుని, ఓ విద్యార్థికి స్కాలర్‌షిప్పయినా ఇవ్వండి’ అనేవారామె.

ఆమె సహకారం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను.

ఉదయకుమారి గారికి వెంటనే ఫోన్‌చేసి ”ఓ మంచిపనిలో మిమ్మల్ని భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నాను. ఒకసారి మా ఆఫీసుకు రాగలరా?” అడిగాను.

ఆమె అయిదు నిమిషాల్లో మా ఆఫీసులో ఉన్నారు. అనిల్‌ను చూపించి, అతని గురించి చెప్పాను.

ఉదయకుమారి గారు అనిల్‌ భార్యను దగ్గరకు పిలిచి, పక్కనే కూచోబెట్టుకుని ధైర్యం చెబుతూ ”ఎంతమంది పిల్లలు” అనడిగారు.

”ఇద్దరమ్మా..”

”ఏం చదువుతున్నారు?”

”బాబు రెండో తరగతి. పాపకు మూడో ఏడు. ఇంకా స్కూలుకు పోవడం లేదు.”

”ఇప్పుడు వాళ్లను ఎక్కడుంచి వచ్చారు?”

”మా అమ్మగారింట్లో..”

ఆ తర్వాత వాళ్లను బయటికి పంపించి, నాతో మాట్లాడారు.

”ఓ పనిచెయ్యండి. ఇతని గురించి ఓ కేస్‌స్టడీ రాసి, మన గ్రూపు ఉద్యోగులందరికీ మెయిల్‌ చేస్తూ, ఎవరికి తోచిన సాయం వారిని అందించమని అడగండి. ఫౌండేషన్‌ అకౌంటు నంబరిచ్చి, దానికి ట్రాన్స్‌ఫర్‌ చేయమనండి. ఎంత వస్తుందో చూద్దాం. ఫౌండేషన్‌ తరఫున ఏం చెయ్యాలో అప్పుడు చూద్దాం” ఫౌండేషన్‌ ట్రస్టీ కూడా అయిన ఆమె అలా సలహా ఇచ్చారు. నాకు కొండంత ధైర్యమొచ్చింది.

”ఇదిగో, నావంతుగా ఇరవై వేలు” అప్పటికప్పుడు హ్యాండ్‌బ్యాగ్‌లోంచి చెక్‌బుక్‌ తీసి, సంతకం చేసి, నా చేతికిచ్చారామె.

మెయిల్‌ రాయడానికి సృజనాత్మకతకు కాస్తంత పదును పెట్టాను.

‘మీ కుటుంబంతో ఓసారి సినిమా మానెయ్యండి. లేదా ఒక్క వారాంతపు హోటల్‌ సరదాకు స్వస్తి చెప్పండి. లేదా మీరు కొత్త దుస్తులు కొనుక్కోవలసిన అవసరాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకోండి. ఆ కాస్త మొత్తాన్ని ఫౌండేషన్‌కు విరాళంగా అందిస్తే, అనిల్‌ అనే జర్నలిస్టుకు కొత్త జీవితం ప్రసాదించిన వారవుతారు…’ అంటూ అతని సమస్యను వివరిస్తూ మెయిల్‌ పంపాను.

 

అద్భుతమైన స్పందన వచ్చింది. తలా ఒక చెయ్యి వేశారు. డైరెక్టర్‌ స్థాయి నుంచి స్వీపర్‌ దాకా ఎవరి స్థాయిలో వారు ఉదారంగా స్పందించారు.

ఎక్కడో గుజరాత్‌లో మా కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్న కుర్రాడు రెండొందలు ఫౌండేషన్‌ అకౌంటుకు పంపుతూ, ”మరోలా అనుకోకండి, చాలా తక్కువ మొత్తం విరాళంగా పంపుతున్నాను. నా వంతుగా ఎంతోకొంత సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా పేరు ప్రకటించకండి” అంటూ లెటరు రాశాడు.

వారం రోజుల వ్యవధిలో మూడు లక్షల రూపాయలకు పైగా విరాళాలందాయి.

అతని ఆపరేషన్‌కు ఆరు లక్షల దాకా కావాలి.

 

++++++

 

హైదరాబాద్‌. ప్రెస్‌క్లబ్‌. ఉదయం పది గంటలు.

వేదిక మీద మా ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దాక్షాయణి, అనిల్‌, మస్తాన్‌ కూచొని ఉన్నారు. ఎదురుగా దాదాపు అన్ని పత్రికల నుంచీ వచ్చిన విలేకరులు.

నేను మైకందుకుని, పూర్వాపరాలు వివరించి, ”అలా మా ఉద్యోగుల నుంచి మూడు లక్షలకు పైగా వసూలైంది. మిగతా మొత్తం కోసం మరెవరినైనా సంప్రదిస్తామని మస్తాన్‌ చెప్పారు. మరి ఫౌండేషన్‌ నుంచి ఎలాంటి సహకారం అందించబోతున్నామో ప్రకటించి, ఆ చెక్కును అనిల్‌కు అందించాల్సిందిగా మా మేనేజింగ్‌ ట్రస్టీ గారిని కోరుతున్నాను” అని చెప్పి, నేను పక్కకు తప్పుకొన్నాను.

అనిల్‌ కుర్చీ వెనక నిలబడిన అతడి భార్య ఆసక్తిగా కళ్లు పెద్దవి చేసి చూస్తోంది. మాసిన పంచె, నెరిసిన గడ్డం, తలగుడ్డతో ఆమె పక్కనే నిలబడి ఉన్న అనిల్‌ తండ్రి మొహంలో మాత్రం ఎలాంటి భావమూలేదు.

మేడమ్‌ లేచి, ”అందరికీ నమస్కారం. ఈ సహాయం చేయడం ఏదో గొప్ప కార్యంగా నేను భావించడం లేదు. నిజానికి ప్రెస్‌మీట్‌ వద్దన్నాను. మరొక సంస్థకు స్ఫూర్తిగా ఉంటుందని మస్తాన్‌ ఏర్పాటు చేశాడు. మా ఉద్యోగుల విరాళం పోను, అనిల్‌ ఆపరేషన్‌ పూర్తి చేసుకుని, ఇంటికి వెళ్లేదాకా ఎంత ఖర్చయితే అంత మా ఫౌండేషన్‌ నుంచి భరిస్తాం” అని ప్రకటించారు.

ఆరు లక్షల రూపాయల చెక్కును అనిల్‌కు అందజేస్తుండగా, వాళ్ల నాన్న తలగుడ్డ విప్పి కళ్లకు అడ్డుగా పెట్టుకుని, ఒక్కపెట్టున ఏడ్చేశారు.

మేడమ్‌ ఆయన్ని ఓదార్చారు. గభాల్న ఆమె కాళ్లమీద పడబోగా, పట్టుకుని పైకిలేపారు.

”బాధ పడకండి. మేమున్నాం. అతను మళ్లీ తన కాళ్ల మీద తాను నడుచుకుంటూ మా ఆఫీసుకు రావాలి. అదే మా కోరిక” అన్నారు.

ఒకవైపు ఎంత నిగ్రహించుకున్నా కన్నీటిని ఆపుకోలేక… మరోవైపు తన భర్త మామూలు మనిషి అయ్యే అవకాశం వచ్చిందన్న ఆనందం పట్టలేక… అనిల్‌ భార్య చిత్రమైన స్థితిలో గడిపింది.

 

++++++

 

కిమ్స్‌ ఆసుపత్రి…

నేను అనిల్‌ను చూడ్డానికి వెళ్లాను. భార్య సహకారంతో నడక ప్రాక్టీస్‌ చేస్తున్నాడు అనిల్‌.

మమ్మల్ని చూడగానే వాళ్ల నాన్న నమస్కారం పెట్టాడు.

కాసేపు కూచొని, డాక్టరుతో మాట్లాడి, ఫైనల్‌ బిల్లు సెటిల్‌ చేశాం. వాళ్లు కారులో ఇంటికి బయల్దేరారు.

 

++++++

 

నాలుగు నెలల తర్వాత…

నేను లంచ్‌కు వెళుతుండగా ”సార్‌, అటు చూడండి” అన్నాడు నా కొలీగ్‌ ఆశ్చర్యంగా.

కారిడార్‌ ఆ చివరి నుంచి ఓ జంట మావైపు నడిచివస్తోంది.

అతను ‘అనిల్‌’ అని గుర్తు పట్టగానే, నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. భార్య సాయం లేకుండా మామూలుగా నడుస్తున్నాడు. కళ్లు పెద్దవిచేసి, మరింత ఆశ్చర్యంగా చూశాను.

నాకు దగ్గరగా వచ్చి, ఇద్దరూ చేతులు జోడించి, నమస్కరించారు. నా క్యాబిన్‌లోకి తీసుకెళ్లాను.

”లోకల్‌ టీవీ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాను సార్‌. ఇప్పుడంతా బాగానే ఉంది. మెల్లగా నడుస్తున్నాను. మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను” చెప్పాడు అనిల్‌ సరికొత్త స్వరంతో.

నాకా మాటలేవీ వినబడటం లేదు.

‘మీరందించిన సాయం ఓ వ్యక్తికి జీవితాన్నిచ్చింది. అతని కుటుంబాన్ని ఆదుకుంది. మంచానికే పరిమితమనుకున్న ఓ జర్నలిస్టు మళ్లీ అక్షరపావురాల్ని ఎగరేస్తున్నాడు’ అనే సారాంశంతో గ్రూపు ఉద్యోగులందరికీ పంపబోయే మెయిల్‌ గురించే ఆలోచిస్తున్నాను, ఆనందంగా!

 

—0—

 

 

బొట్టు గుర్తు

chinnakatha

 

~

“అమ్మా! మనం ఎవరు?”

అప్పుడే బడి నుంచీ వచ్చిన నా కూతురు దివ్య అడిగిన ప్రశ్నకు నేను ఆశ్చర్యపోలేదు. ఎప్పుడోకప్పుడు ఈ ప్రశ్న వేస్తుందని నాకు తెలుసు. కానీ ఇంత త్వరగా అడుగుతుందని అనుకోలేదు.

పదో తరగతిలో నా కాస్ట్ సర్టిఫికేట్ చూసి హతాశురాలినై అనుమానాలతో ప్రశ్నలతో గజిబిజితో మా నాన్నని ఉక్కిరిబిక్కిరి చేశాను. అప్పుడు ఆయన పూర్తిగా చెప్పలేదు. బహుశా చెప్పలేకపోయారు. ఇప్పుడు నేనూ నా కూతురి ముందు నాన్న లాగే నిలబడ్డాను. ఏం సమాధానం చెప్పాలి? దానికి చెప్పుకునే కులమూ లేదు నాలా కులం సర్టిఫికెట్టూ లేదు.

మౌనం.

ఇదే మౌనం నేను క్రిస్టియన్ విమిన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఎన్నో సార్లు పాటించాను…

మా హాస్టల్ రూమ్ లో ఆరుగురం ఉండేవాళ్ళం. ఓ ఆదివారాన స్నేహిత ఏమీ తోచక మంచం మీద పడుకుని కాళ్ళూ చేతులూ గాల్లో ఆడిస్తూ జంధ్యాల సినిమాలో సుత్తి వీరబద్ధర్రావులా మా పేర్లన్నీ రాగాలు తీయడం మొదలు పెట్టింది.

“లక్ష్మీ రెడ్డి…

మాధవీ వర్మ…

విజయా నాయుడు…

స్నేహితా చౌదరి…

పూజితా వెలమ…

మౌనికా మౌ? మౌనికా వెనుక ఏంటే?” అనడిగింది నన్ను చూస్తూ.

అదే మౌనం. అలవాటైన అవమానాల మౌనం.

“నా వెనుక ఏమీ లేదే. ఉన్నదల్లా నా ముందే” అన్నాను.

నేను ఎవర్నో నా నుదురే చెబుతుంది. అదే నా గుర్తు! అయినా ప్రశ్నలు వేయడం నా ముఖాన్ని ప్రశ్నార్ధకంగా చేయడం ఒక తమాషా.

“మాలోళ్ళంటే ఎవరమ్మా?” నా కొంగు లాగుతూ అడిగిన దివ్య వైపు చూశాను.

‘ఏయ్ ఎవరు చెబుతున్నారే నీకివన్నీ’ అనబోయి ఆగాను.

అది చెప్పిందేమీ బూతుమాట కాదే! ఎందుకు నాకింత భయం? మాలోళ్ళు అన్నప్పుడు చప్పున తలుపు వైపు ఎందుకు కంగారుగా చూశాను? కిటికీలు మూసే ఉన్నాయా అని ఎందుకు నిర్ధారించుకున్నాను?

‘నీ బానిసత్వాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. అందుకోసం ఏ దేవుడి మీదా ఏ మహానుభావుడి మీదా నువ్వు ఆధారపడొద్దు- అంబేద్కర్’ అని నా కొత్త పుస్తకం మొదటి పేజీలో రాసుకుంటున్నప్పుడు అడిగింది పూజిత-

“అసలు మాల మాదిగోళ్ళు రెల్లోళ్ళoటే ఎవరే?” అని.

విజయ, మాధవీ ‘ష్!’ అన్నారు ఒకేసారి. నేను విన్నానేమో అని కంగారుపడుతూ.

“కాదే మా నాన్న కోపమొస్తే ‘మాదిగ్గూడెం పో!’ అని తిడుతుంటాడే. అందుకే అడుగుతున్నా” అంది అమాయకంగా.

“ఈ వెలమ కమ్మ కాపు రెడ్డి వీళ్ళందరూ ఎవరు?” అని అడిగాను.

“అవన్నీ మా కులాలు. మేమే” అంది పూజిత హుషారుగా.

“మీరు బ్రామ్మిన్స్ కంటే తక్కువ. మీకంటే మాలమాదిగోళ్ళు తక్కువ” అన్నాను శాంతంగా.

“మేం తక్కువేంటి? ఎవడికీ మేం తక్కువ కాదు” అంది విజయ.

నవ్వొచ్చింది నాకు.

“మేం అనేదీ అదే!” అన్నాను.

“చెప్పమ్మా! మాలోళ్ళంటే ఎవరు? మనం బొట్టెందుకు పెట్టుకోవట్లేదు?”

దివ్య వైపు చూశాను. చిట్టి కళ్ళల్లో బోలెడన్ని సందేహాలు.

“ఎవరడిగారు నిన్ను?” దాని స్కూల్ డ్రెస్ తీస్తూ అడిగాను.

“బొట్టు లేకపోతే మాలోళ్ళని గౌతమ్ వాళ్ళ మమ్మీ అన్నారంట” అంది.

రోజులు మారుతున్నాయనే అనుకున్నాను. ఈ మాట వినేంత వరకూ.

“నువ్వు మాల్దానివి కాకపోతే అమ్మోరు తల్లంత బొట్టు పెట్టుకోవే! నలకంత బొట్టు పెట్టుకోడం కాదు” లక్ష్మీ బాయ్ ఫ్రెండ్ ఫోనులో అంటున్నాడు. ఆమె ఒక మగవాడితో మాట్లాడుతుందని లౌడ్ స్పీకర్ పెడితేనేగా అందరికీ తెలిసేది.

లక్ష్మీ అతని మాటలకి మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంది.

“మదిగ్గూడెం తోలుకేల్తానని చెప్పవే” అంటూ మిగతా వాళ్ళు చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నారు.

“మమ్మీ! ఎప్పుడూ ఏదోకటి అలోచిస్తున్నావేంటి?” కోపంగా వచ్చిన దివ్య మాటలకి వాళ్ళ కుల చిలిపి కబుర్లలోంచి బయటపడ్డాను.

“ఆలోచిస్తున్నావు కాదు. అలోచిస్తుoటావు” దివ్య గడ్డం పట్టుకుని గారంగా ఊపుతూ అన్నాను.

“పో మా…నీకు తెలుసా! నెక్స్ట్ సాటర్ డే మా స్కూల్లో సైన్స్ డే. ఈ వీక్ అంతా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి”.

“ఈ సంవత్సరం కాలేజ్ డే అంబేద్కర్ జయంతి రోజు చేస్తున్నారు. కల్చరల్ ఇవెంట్స్ లో పాల్గొనాలనుకునే వారు పేర్లివ్వండి” అసెంబ్లీ హాల్లో అనౌన్స్ చేసింది మా కాలేజ్ ప్రెసిడెంట్.

మా కాలేజి వాళ్ళు ఎప్పుడూ అంబేద్కర్ జయంతి జరపలేదు. కొత్తగా వచ్చిన మా ప్రిన్సిపల్ సిస్టర్ కి కాలేజీలో ఏ చిన్న విశేషం జరిగినా స్థానిక పత్రికల్లోనూ జిల్లా పత్రికల్లోనూ పడాల్సిందే. అలా ఈ ఏడాది కాలేజ్ డే ఫంక్షన్ ని అంబేద్కర్ జయంతితో కలిపి చేస్తే అన్ని విధాలుగా పేరొస్తుందని ఆమె ఆశ.

ఇవెంట్స్ లో పాల్గోడానికి నేనూ పేరిచ్చాను. దేశంలోని ప్రతి రాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహ జంటల్ని చూపించే ప్రోగ్రాంలో క్రిస్టియన్ బ్రైడ్ గెటప్ వెయ్యాలని నా ఆలోచన. ఎలాగూ మా అక్క పెళ్లి గౌన్ ఉంది కాబట్టి డ్రెస్ కోసం కష్ట పడక్కరలేదు కూడా.

కానీ ఫంక్షన్ రోజు వచ్చే సరికి అన్నీ తారుమారయ్యాయి. క్రిస్టియన్ బ్రైడ్ గా పూజిత ముస్తాబయింది. మా అక్క గౌన్ లో. నేను బాల అంబేద్కర్ తల్లి పాత్రలో ముతక చీరలో ఉన్నాను.

క్రైస్తవ పెళ్లికూతురంటే తెల్లని వస్త్రాలలో దేవతలా ఉండాలి. నిజజీవితంలో కాదు. మా కాలేజీ వేదిక మీద. పూజిత నాలా నల్లగా ఉండదు. ఆమె ముక్కు నా ముక్కులా చిన్నగా బండగా ఉండదు. పెళ్లి కూతురిలా తయారవడానికి కావాల్సింది గౌన్ కాదు. మరింకేదో అని తెలుస్తూనే ఉంది నాకు. మొత్తానికి నా మతానికి సంబంధించిన వేషం వెయ్యడానికి నేను సరిపోలేదు. కులానికి తగ్గ వేషమే దొరికింది.

పూజిత స్టేజి మీద అందంగా నడిచి కిందకి దిగగానే తన ఫ్రెండ్స్ వెంటనే పర్స్ లోంచి బొట్టు బిళ్ళ తీసి పెట్టారు “మాల మొకం చూడలేకపోతున్నామే బాబు” అని నవ్వుకుంటూ. బొట్టే వాళ్ళ గుర్తు.

“నీది విధవరాలి పాత్రా?” అని అడిగింది మా డ్రామా చేయించే సీనియర్ నా నుదుటని చూస్తూ.

“కాదక్కా! బాబా సాహెబ్ తల్లి పాత్ర” అన్నాను.

“బాబా సాహెబ్ ఏంటి? అంబేద్కర్ అమ్మగా కదా చేయమన్నాను” అంది హైరానా పడుతూ.

‘కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెద పురుగులు కూడా పుస్తకాన్ని నమిలేస్తాయి. అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా?’ మా నాటకంలో అంబేద్కర్ వేషమేసే అమ్మాయి అంబేద్కర్ చెప్పిన మాటల్ని డైలాగుల రూపంలో బట్టీ పడుతోంది.

“చెప్పు మమ్మీ! ఎన్ని సార్లు అడగాలి. స్పీచ్ కి ఒక టాపిక్ ఇవ్వు” విసిగిపోతూ అంది దివ్య.

“నువ్వే ఆలోచించు. సైన్స్ డే అన్నావు కదా. టెక్నాలేజీ గురించి కూడా ఆలోచించు”

“ఆ…నాకు రాకెట్స్ అంటే ఇష్టం కదా! దాని గురించి రాయనా? మా టీచర్ నేషనల్ డెవలప్మెంట్ కి సంబంధినవే చెప్పమన్నారు”

“అలాగే చేద్దాం. కానీ రాకెట్స్ గురించి మీ స్కూల్ లో అందరికీ తెలిసే ఉంటుంది కదా! కొత్తగా ఆలోచించ రా దివ్యా. మనుషులకు బదులు కంప్యూటర్స్, మేషిన్స్ ని పెట్టి పని తగ్గించవచ్చని  మొన్న మీ టీచర్ చెప్పారన్నావు కదా! దాని గురించి ఆలోచించు. ఆ మధ్యలో ఒకరోజు స్కూల్ బస్సు లోంచి ఏదో చూసి భయపడ్డావ్ గుర్తుందా?”

“ఆ! ఒక ఆయన డ్రైనేజీలో దిగి మొత్తం మునిగిపోయి క్లీన్ చేస్తూ ఒక్కసారిగా పైకి లేచాడు. నల్లగా ఒళ్లంతా డర్టీ” అంది మొహం చీదరించుకుంటూ.

“నిజానికి అతను ఆ రోజు అదే డ్రైనేజీలో పడి చనిపోయాడు తెలుసా? మరి ఆ పని చేయడానికి మెషీన్స్ ఉన్నాయా?”

“చనిపోయాడా! మెషీన్స్ లేవు కదా మమ్మీ. ఉంటే వాడేవాళ్ళు కదా”

“ఆ టాపిక్ మీదే ప్రిపేర్ అవ్వు. ఇంకేం?”

“మరి వాళ్ళకి డబ్బులు? మెషీన్స్ ఉంటే ఇక వాళ్ళకి పనుండదు కదా”

“ఆ పని ఉండదు. ఇంకేదైనా ప్రాణాలు నిలబడే పని చేసుకుంటారు. ఆ పని కంటే న్యాయంగా చేసే ఏ పనైనా ఆత్మ గౌరవంతో చేసే పనే అవుతుంది. అసలు ఆ పని ఎవరు చేస్తారో తెలుసా?”

“తెలుసు మమ్మీ! హోం వర్క్ చేయని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. బాగా చదువుకోకపోతే అలాంటి పనులు చేసే వాళ్ళవుతామని అంటారు కదా అందరు”

“హిహి కాదమ్మా! తక్కువ కులం వాళ్ళే ఇంకా ఆ పనిని కుల వృత్తిగా చేస్తూనే ఉన్నారు. మనం బాగా చదువుకుని ఎవరికీ అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేకుండా మెషీన్స్ తయారు చేయలేకపోతేనే ఫెయిల్ అవుతాం! మన స్వచ్ఛ భారత దేశంలో ఏవేవో కనిపెడుతున్నా ఇంకా డ్రైనేజీ శుభ్రం చేసే మెషీన్స్ రాకపోవడం మన ఫెయిల్యూరేగా!”

“అవును. తక్కువ కులం వాళ్ళంటే ఎవరు? ఒకవేళ అలాంటి టెక్నాలజీ వస్తే  మరి మన దేశం డెవలప్ అయినట్టేనా మమ్మీ?”

“దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు రంగుల గోడలూ కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. అర్ధమయిందా! ఇది ఎవరు చెప్పారో తెలుసా?”

“ఎవరు?”

“డా. బి. ఆర్. అంబేద్కర్!”

“ఆయనెవరు?”

దాని మొదటి ప్రశ్న ముందు నా కులం ఓడిపోయింది. దాని చివరి ప్రశ్న ముందు నేనే ఓడిపోయాను..!

 

 

ఎర్ర పూల గౌను

 

 

                     -మన్నె ఏలియా

~

      డ్రెస్సింగ్ టేబుల్ నిలువుటద్దం  ముందు నిల్చొని  తన రెండు జడలను వింతగా చూసుకొంటుంది . తలను కుడి ఎడమలకు తిప్పి  జడలను   చూసుకొంది .  జడలకు కట్టిన తెల్లని రిబ్బన్లు ఫ్యాన్ గాలికి రెపరెప లాడుతున్నాయి . తలను పైకి కిందికి కదిలించినప్పుడు రిబ్బన్ల విన్యాసం చూసి సంబరపడిపోతోంది. రెండు చేతులతో జడలను  పైకెత్తి పట్టుకొని సంతోషంతో గంతులేస్తుంది . తైల సంస్కారం లేక ఎండిపోయిన గడ్డిపోసల్లాంటి వెంట్రుకలు తలమీద నాట్యం చేస్తున్నాయి .  వేళ్ళతో దువ్వుకొంది . అరచేతితో అదిమి పట్టిచూసింది . చేయి తీయగానే ఎప్పటిలాగానే లేచి నిల్చున్నాయి . కొన్ని ఎగిరి నొసటి  మీద పడుతున్నాయి . చింపిరి జుట్టుకు నూనె రాసుకుందామనుకుంది . ఏదో అలోచించి విరమించుకొంది . అద్దం ముందు నుండి కదలాలనిపించడంలేదు. ఇదే మొదటి సారికావడంతో ఎన్నడు పొందని అనుభూతితో  అద్దంలో చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది  .

పాలపిట్ట రంగు గౌను మీదున్న ఎర్రని పువ్వులను, చిన్న చిన్న ఆకులను , లేత మొగ్గలను తడిమి చూసుకుంది .  బర్తడే గౌనది . పుట్టిన రోజు నాడు  కొత్తబట్టలేసుకొనే వాళ్ళను చూసినప్పుడల్లా , తనకు పుట్టిన రోజు లేదేమో అనుకునేది . ఎన్నడు రాని పుట్టినరోజు కోసం  ఇన్ని రోజులుగా  ఎదిరి చూసింది .

రోజు తిట్లతో , అరుపులతో , కేకలతో దద్దరిల్లే ఇల్లు  ఇప్పుడు ప్రశాంతంగా , నిశబ్దంగా  ఉండడంతో…

నిన్న రాత్రి తనే ఉతికి తీగ మీద ఆరేసిన  గౌను దగ్గరికెళ్ళి నిల్చుంది . అటు ఇటు చూసి చేతితితో తాకింది . పూర్తిగా  తడి ఆరలేదు . సబ్బు వాసన వస్తోంది . అక్కడక్కడ కుచ్చుల మడతలు , తేమగా ఉన్నాయి .  అయిన వేసుకోవాలనే కోరిక ఆపుకోలేక , మళ్ళి అవకాశం వస్తుందో లేదోనని  తెచ్చి వేసుకొంది . వొంటికి చల్లగా తగులుతోంది . పండుగనాడు కొత్త బట్టలేసుకొన్నంత ఉత్సాహంగా ఉంది . నడుము తిప్పి వెనుకకు ముందుకు తిరుగుతూ చూసుకొని ముర్సిపోతుంది . రోజు  పొడవైన లూజ్ లూజ్  గౌన్లేసుకోవడం వాళ్ళ , ఈ గౌను పొట్టిగుందనిపించింది . కాని బాగా నచ్చింది .

మధ్యమధ్య  కిటికి గుండా వాకిలిగేటు వైపు చూస్తుంది .    డ్రెస్సింగ్ టేబుల్ డ్రా తెర్చింది . పౌడర్ డబ్బా తీసి పౌడర్ చేతులతో ముఖంకు రుద్దుకుంది . తెల్లగా మెరుస్తుంటే గమ్మతనిపించింది . “ హీ… హీ ”  అని తనను తనే వెక్కిరించుకుంది . ముఖం బోసిపోయినట్టన్పిచ్చి నొసలు తడిమి చూసుకొంది . అటు ఇటు  చూసింది బొట్టు బిళ్ళలు కనిపించలేదు . “ పోనిలే ” అనుకుంది .

ముందుకు  వెనకకు నడచుకుంటూ కన్నార్పకుండా అద్దంలో  చూసుకుంటుంది . ఈ సామ్రాజ్యానికి నేనే వారసురాలినన్నంత ధీమగానిపించింది గౌను వేసుకొన్నందుకు . సాక్సు , బూట్లు కూడా వేసుకోవాలనిపించింది . కాని అప్పటికే సమయ మెక్కువైంది . తొందర తొందరగ విప్పేయడం కష్టమని వేసుకోలేదు . ఇంకెపుడైన వేసుకుందామనుకొంది .  ఇక గౌను విప్పేద్దామనుకుంది కాని మనసొప్పడం లేదు   .  మళ్ళి కిటికి వైపు చూసింది . ఇంకొద్ది సేపాగి విప్పేద్దామనుకొని  మళ్లోసారి అద్దంలో చూసుకుంది .   కాళ్ళను చూసుకుంది. కాళ్ళకు గజ్జెలు పెట్టుకోవాలనే  కోరిక మిగిలిపోయింది .

తలవంచి కిందకి చూసింది .  మైలబట్టి , అక్కడక్కడ చినిగిపోయి రంగు వెలసిన పొడవైన గౌను కుప్పగా పడేసి ఉంది . ‘ నాకు నువ్వద్దు పో ’ అన్నట్టు ! కాళ్ళతో కసపిస తొక్కి , ఎడమ కాలితో  పక్కకు నెట్టెసింది ఎనిమిదేండ్ల లక్ష్మి .                     *****

బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది .  కిటికిలకెళ్ళి చూసింది . గుండె జల్లుమంది . గబగబా  రెండు చేతులతో  రిబ్బన్లను లాగేసింది . జడలను విప్పేసి ఎప్పటిలాగానే వెంట్రుకలని వదిలేసింది . గౌనుతో పౌడర్ తుడ్చేసుకుంది .  హమ్మయ్య ! బతికిపోయాననుకుంది . ఇదంత క్షణాల్లో జరిగిపోయింది. తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది  . “ అమ్మగారు వస్తున్నానండి ”  అంటూ వెళ్లి తలుపు తెరచి పక్కకు  నిల్చుంది .  పట్టు చీరెలో గుడికెల్లోస్తున్న శైలజ చేతిలో  స్టీలు బుట్టలో  సగం పగలగొట్టిన కొబ్బరికాయుంది. “ ఏమిచేస్తున్నవే…జల్ది తలుపు తెరుస్తలేవు? ’’  అని కండ్లు పెద్దవి చేసి ప్రశ్నించింది .  “ ఏమి లేదమ్మగారు ” అంది .  లక్ష్మిని చూసిన శైలజ కండ్లు ఎర్రని నిప్పులై భగ్గున మండిపోయాయి . బుట్ట పక్కన బెట్టింది . లక్ష్మి చెంపలు చెల్లుమన్నాయి . కరెంటు షాక్ తగిలినట్టు గిర్రున తిరిగి కింద పడింది లక్ష్మి .  చెంప ఎర్రగా  బూరేలాగా పొంగిపోయింది . చేతి అచ్చులు స్పష్టంగా  కనిపిస్తున్నాయి . చీర కొంగు విసురుగా బొడ్లో దోపుకొని వంగి లక్ష్మి వెంట్రుకలు పట్టి లేపి , ఇంకో చెంప చెల్లు మనిపించింది .  “ ఏమే దరిద్రపు ముండ ! ఎక్కడి పనులు అక్కడే వదిలేసి , సోకులు పడ్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? … నా బిడ్డ గౌనేసుకుంటావా?. ఎవని దగ్గరికి పోయి కులుకుదామనే .. ఈ సోకులు .  బద్మాష్ ముండా ఎవడేసుకోమన్నాడే ? నీ అయ్యేసుకోమ్మన్నాడే ? ….నీ అవ్వ కొన్నదనుకున్నవా ?.. దొంగ ముండా !అది నేనుకొన్న”     గయ్యి మని ఒంటి కాలుమీద లేచింది .  లక్ష్మి ఎండుటాకుల కంపించి గజగజ వణుకుతుంది . నోట మాట లేదు ఏడ్పు తప్ప.  రెండు చేతులు జోడించి,  “ అమ్మగారు తప్పయిపోయింది . గౌనిప్పేస్తాను కొట్టకండి . ఇంకెపుడేసుకోను . నీ కాళ్ళు మొక్కుతా !”  అని కాళ్ళు పట్టుకొంది . “ నువ్వేసుకున్నది మల్ల నా బిడ్డెట్లేసుకుంటదే ” అని   కాలుతో కెక్కున తన్నింది , సోలిపోయి లక్ష్మి  తల గోడకు బలంగా  తాకింది .  “ అమ్మా …!  అమ్మా…! ”    కండ్లు నులుముకుంటూ దీనంగా  ఏడుస్తుంది .  “ నోర్  ముయ్..! అవాజ్ బయటకు రావద్దు . అమ్మట అమ్మా! ఎవ్వతే నీకు అమ్మ! నాకు పుట్టినవా? ’’   పండ్లు పట పట కొరుకుతూ అరుస్తుంది   .   బలవంతంగా రెండు చేతులతో  నోరు మూసుకోని వెక్కి వెక్కి ఏడుస్తోంది  లక్ష్మి .  “  అమ్మ కావాల్నా ? పోవే పో… నీ అమ్మ పోయినకాడికే పో . అది సచ్చి నా గండానికి నిన్ను అంటగట్టి పోయింది . నువ్వు నాకెన్నేండ్ల  శనో …  నువ్వుగూడ దాని దగ్గరికే పో ..  పీడా… బోతది ”  ఆవేశంగా తిడ్తోంది .  ఏడ్పు ఎంత  దూరం వినిపించిన , శైలజ నోటికి భయపడి ఎవరు ఇటువైపు తొంగి  చూడలేదు, చూడరు  కూడా.

************

ఇంటిముందు   కారు పార్క్ చేస్తుంటే కనిపించిన  పక్కింటాయనను పలకరించి , కూతురు ప్రిన్సి చేయి పట్టుకొని లోపలికి వచ్చిండు విజయ్ .

“ ఏమైంది శైలు !  ”  అలవాటు ప్రకారం అడ్గిండు . “ దాన్నే అడ్గు …నంగ నాచి ఏడ్పులు …. సుట్టుపక్కలొల్లు విని  నేనేదో సచ్చెటట్టు కొడ్తున్నాననుకోవాలని…. ”  అంటూ కండ్లు చిట్లించుకొని   వంటగదిలోకి వెళ్ళింది శైలజ . ఒక్కసారి లక్ష్మిని జాలిగా చూసి బాత్రూమ్ లోకి వెళ్ళిండు . ప్రిన్సి టీవీ ఆన్  చేసుకొని ఛిప్స్ తినుకుంటూ సోఫాలో కూర్చొని కార్టున్ చానల్ చూస్తుంది ఇదేమి కొత్తది కాదు కాబట్టి .

గోడకు ఆనుకోని  కండ్లు మూసుకొన్న విజయ్ కు గతం గుర్తొచ్చి , మూసిన కనురెప్పల సంధుల్లోంచి  నీళ్ళ ధారలు ఉభికివస్తున్నాయి  .

లక్ష్మి ఈ కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు .  లక్ష్మి తాత మిలటరిలో  పనిచేసేవాడు . గీత ఏకైక పుత్రిక  .  పెద్ద కండ్లు , సన్నని ముక్కు , గుండ్రని ముఖం , గులాబిరంగు పెదాలు , ఆకర్షనీయమైన నవ్వు  .  తెల్లగా పొడుగ్గా అందంగా ఉండేది . మొఖంలో లక్ష్మికళ ఉట్టిపడేది . మగపిల్లలు లేనికారణంగా  ఉద్యోగం లేని విజయ్ ను ఇల్లరికం తెచ్చుకున్నారు . విజయ్ చామనచాయ ఎత్తుకు తగ్గ బరువు . వీళ్ళ ఈడు జోడు చూడ ముచ్చటగా ఉండేది .

పెళ్ళైన రెండేండ్లకు లక్ష్మి పుట్టింది .  దురదృష్టం వెంటాడడం మొదలు పెట్టింది . లక్ష్మిని ఈ భూమి మీద పడేసి ధనుర్వాతంతో కన్నుమూసింది గీత . అచ్చం గీత నోట్లోంచి ఊడిపడ్డట్టుంది లక్ష్మి . అదే రంగు అదే రూపం  .  కాని  విజయ్ జీవితంలో చీకటి అలుముకుంది . గీత అమ్మనాన్న పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిండ్రు .  గీత పోయిన దుఃఖం నుండి కోలుకోకముందే, కార్గిల్ యుద్ధం కారణంగా అందరి సెలవులు రద్దు చేయబడడంతో  లక్ష్మి తాత యుద్దంలోపాల్గొని , భీకర పోరులో  అమరుడైనాడు .  చిన్నారి లక్ష్మిఆలనా పాలన  అంత అమ్మమ్మే .                            ఏడ్చి ఏడ్చి మంచం పట్టిన లక్ష్మి అమ్మమ్మ గుండే ఒకనాటి దుర్ముహుర్తాన ఆగి పోయింది .  పసిగుడ్డు లక్ష్మి పాలు లేక, తల్లి తోడులేక చూసుకొనే వాళ్ళు లేక, తల్లడిల్లి  గుక్కపట్టి ఏడుస్తోంది . గూడు చెదరిన పక్షయ్యింది .  వొంటరి వాడైన విజయ్ ఎటు చూసిన అయోమయం .

*******

అదే కాలనీలో నివాసముండే శైలజ నల్లగుండడం వల్ల పెళ్లి సంబంధాలు రాకనో ,  వచ్చినవి నచ్చకనో ఇంటి మీదనే ఉండిపోయింది .  శైలజ మేనమామ విజయ్ కు పాత  పరిచయం  , ఒకటే కులం  కావడం వల్ల ఆ చనువుతో లక్ష్మిని చూసుకొంటుందని విజయ్ ను ఒప్పించి శైలజ నిచ్చి పెళ్లి చేసారు . అసలు కారణం విజయ్ మామ మిలటరీ లో చనిపోవడంతో , విజయ్ కు  ఉద్యోగం వచ్చింది .   వచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు కొన్నాడు .

రెండు సంవత్సరాలకు ప్రిన్సి పుట్టింది . ప్రిన్సి నల్లగా పుట్టడం ,లక్ష్మిలాగ అందంగా లేకపోవడంతో ఎప్పుడు బాధ పడుతుండేది శైలజ . అప్పటి వరకు లక్ష్మిని చూసుకొనే శైలజ లో శాడిజం మొదలైంది . ఈ ఆస్తి అంత నా ప్రిన్సీకే  చెందాలని పోరు పెట్టేది శైలజ .                             ******

కాల చక్రంలో ఎనిమిదేండ్లు గడ్చి పోయాయి .  ఎనిమిదేండ్ల లక్ష్మి జీవితంలో కొత్తబట్టలు వేసుకొందంటే ప్రిన్సి పుట్టనంత వరకే . ఆ తర్వాత శైలజ వాళ్ళ అక్క పిల్లలవి  కలర్ వెలిసిపోయి , చినిగినవి , పొట్టిగైనవే లక్ష్మివేసుకునేది . ప్రేమ , ఆప్యాయత, భద్రతా అన్ని  కరువే . ప్రిన్సిని  స్కూల్లో చేర్చేటప్పుడు  లక్ష్మిని కూడా చేరుద్దామన్నందుకు ,“ ఇంట్లో పని నువ్వు చేస్తవా? నీ తాత చేస్తడా?  అదేమన్నా చదివి కలెక్టరైతదనుకుంటున్నవా ?  ఇంకోసారిగిట అన్నావనుకో దాన్ని నిన్ను  చంపేస్తా ” నని బెదిరించింది  శైలజ . నిస్సహయంగా చూడడం తప్ప నోరెత్తే దైర్యం లేదు . నోరు తెరిస్తే తన పరిస్తితేంటో బాగా తెల్సు విజయ్ కు.

****

అందరి కన్నా ముందే లేచి ఇంటి పని , వంటపని చేయడం , బట్టలుతకడం , గిన్నెలు తోమడం  . లక్ష్మితొ  పుట్టెడు చాకిరి చేయిస్తుంది సవతి తల్లి .  బానిసల కంటే అధ్వాన్నంగా, జీతంలేని పనిపిల్లలాగున్నది లక్ష్మి జీవితం .  ఇంత చేసిన రాత్రిమిగిలిన అన్నం పెట్టేది శైలజ . అలసి పోయి చెప్పిన పని చేయకపోతే  తన్నులతో పాటు ఆ రోజు తిండి కూడా పెట్టేది కాదు .  ప్రిన్సి  , లక్ష్మి ల మద్య రెండేండ్ల వయసు తేడ . కల్సి ఆడుకోవాలని ఉండేది  ,కానీ కలవనిచ్చేది కాదు  శైలజ .

ప్రొద్దుట ఆలస్యంగా లేచే  ప్రిన్సి కి  స్కూల్ కు వెళ్ళేటప్పుడు తొందర తొందరగా  సాక్సులు , బూట్లు తొడగడం . స్కూల్ బ్యాగ్ , లంచ్ బాక్స్ , నీళ్ళ సీస మోసుకెళ్ళి ఆటోలో పెట్టి రావడం , స్కూల్ నుండి వచ్చిన తర్వాత అవన్నీ  సర్దిపెట్టడం  కూడా లక్ష్మి పనే . ఏ కొంచెం తేడా వచ్చిన , కొద్దిగ  ఆలస్యమైనా వీపు చిట్లి పోవడం ఖాయం . ఆటో కనబడకుండా పోయేంతవరకు కండ్లల్ల నీళ్ళతో నిల్చొని చూడడం , ఇంట్లో నుండి కేక వినబడగానే  కండ్లు తుడ్చుకొని పరుగెత్తుకొని రావడం  రోజు జరిగేదే .

నూనె రాసుకొని , శుభ్రంగా తల దువ్వుకొని , యూనిఫాం వేసుకొని స్కూల్ కు వెళ్ళాలనుకొనేది  లక్ష్మి . కాని ఎవరున్నారు చెప్పుకోడానికి . వినే అమ్మే వినబడనంత దూరంగా కనబడకుండా ఈ రాక్షసుల చేతుల కప్పగించి వెళ్లిపోయింది .

ఇదంతా  గుర్తుచేసుకొంటున్న విజయ్ కండ్లల్ల నీళ్ళు  జలజల కారిపోతున్నాయి. తన చేతగాని తనానికి  తనకే సిగ్గనిపిస్తోంది .

****

“ ఏడ  సచ్చిండే దీనయ్యా ! ఒర్రి ఒర్రి నా నోరే  బద్నాం కావట్టే !  ఉలుకడు పలుకడు… దీని పీడా ఎన్నడు విరుగడ చేస్తాడో  రమ్మను ” . ఉగ్ర రూపమెత్తిన శైలజ ఘర్జించింది . ఉలిక్కిపడి  కండ్లు తెర్చాడు . కండ్లు తుడ్చుకొని మెల్లగా బయటకొచ్చిండు విజయ్ .

“ ఏమైంది శైలు !ఎక్కడో పేగు కాలుతున్న వాసనస్తోంది చూడు ’’.  అమాయకంగా అన్నాడు.  “ కాల్తుంది  పేగుకాదు , నా కడుపు మండుతుంది ”  చేతిలో అగ్గి పెట్టెతో వాకింట్ల నుండి ఇంట్లోకి వస్తూ, మింగేసేల చూస్తూ కోపంతో అన్నది శైలజ .

పొగ వాసన రావడంతో వాకిట్ల  కెళ్ళిండు .  వాకిట్ల  మంటల్లో తగలబడి పోతున్న గౌనును  చూస్తూ శిలాప్రతిమలా గడ్డకట్టి నిల్చుండి  పోయాడు .  కొద్ది  దూరంలో… రెండు చిట్టి  చేతులతో గుండెలను దాచుకొని ,  ఎముకలగూడుల నగ్నంగా ముడ్చుకొని కూర్చోన్న లక్ష్మి , గోడవైపు ముఖం పెట్టి  చప్పుడు వినబడకుండా  వెక్కి వెక్కి  ఏడుస్తున్నది  . తెల్లని   వీపు మీది నల్లగా కమిలిపోయిన వాతలు తండ్రిని   వెక్కిరిస్తూ , మౌనంగా ప్రశ్నిస్తున్నాయి ..

గాలికి మంట ఎక్కువైంది . ఆ మంటల్లో లక్ష్మి జీవితం శిథిలమై , దగ్దమై,  బూడిదైపోతున్నట్టనిపించింది తండ్రి విజయ్ కు .  ఏ కన్నీళ్లు ఆర్పలేని మంటలవి .

*

తబస్సుం

 

-రెహానా

~

 

సమయం సాయంత్రం పది తక్కువ అయిదు.
రెండు గదుల రేకుల ఇల్లు. ఆ రేకులే ముందుకు వచ్చిన చిన్నపాటి వసారా. వసారాకు ఒక వైపున పుస్తకాల సంచి ముందేసుకుని వాళ్లిద్దరు కూర్చుని ఉన్నారు. ఇద్దరిదీ ఒకటే వయస్సు. 12, 13 ఏళ్లుంటాయి. బ్లూ కలర్ గౌను కింద క్రీమ్ కలర్ పైజమా వేసుకుని ఉన్న పాప తాయారు. మిలమిల మెరిసే చెమ్కీలు ఉన్న ఎర్రటి చుడీదార్, తలకు నల్లటి హిజాబ్ చుట్టుకుని కడిగిన ముత్యంలా ఉందే తను తబస్సుం.

తబస్సుం అంటే అరబిక్ భాషలో నవ్వు అని అర్ధం. వాళ్లమ్మా నాన్నకు అర్ధం తెలిసి పేరు పెట్టడం వంటిది జరక్కపోయినా తబస్సుం మోము పై చిరునవ్వు సహజ ఆభరణం.

“ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు…ఆ…ఉండుండె…నేనే చెప్తా…ఆ…
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ…పొల్లు పోకుంటా చెప్పినా గందా?”….ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది తబస్సుం.

“నీకేందేమ్మా…నీది హుషారు బుర్ర. ” ముఖం చిన్నది చేసుకుంది తాయారు.
“తబస్సుం ఇస్కూలుకు పోతినే లేదు అయినా మళ్లా ఎట్టా సదుతాదో సూడు. దిమాగ్ పుస్తకంలో పెట్టాలా…ఆటల్న కాదు. సూసి నేర్సుకో..” రెండు గిన్నెల్లో ఇద్దరికీ మురమురాలు పట్టుకొస్తూ కూతుర్ని మందలించింది తాయారు వాళ్ళమ్మ.
“తాయారు తిరిగి వప్పచెప్పలేదు కాని…పాఠం మంచిగా వివరిస్తాది. లేకుంటే నాకేడ వచ్చే ఆంటీ…ఇస్కూలుకు పోయినానా…టీచర్ పాఠం విన్నానా…” కిలకిల నవ్వుతూ స్నేహితురాలి గొప్పదానాన్ని వాళ్లమ్మకు వివరించింది తబస్సుం. తాయారు మనసు తేలికపడింది. ఆ అమ్మ కూడా తన కూతురు తక్కువ కాదు అని నమ్మకం కలిగి మురిసిపోయింది.

హైదరాబాద్ పాత బస్తీలోని సుల్తాన్ షాహిలో పక్కపక్క ఇళ్లు తాయారు, తబస్సుం లవి. తాయారు వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. ముగ్గురు పిల్లలు.వారిలో తాయారు చిన్నది. ఉన్నంతలో నెట్టుకొచ్చే సంసారం.
తబస్సుం వాళ్ళ నాన్నది సైకిల్ రిపేర్ షాపు. పేరు ఇస్మాయిల్. ఇద్దరన్నలు, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు . ఏడుగురు సంతానంలో తబస్సుంది నాలుగో నెంబర్. బండెడు సంసారం పైగా ఆరేడేళ్ళ క్రితం చిన్న యాక్సిడెంట్ అయితే పక్క వీధిలో ఉండే ఆర్ఎమ్పీ డాక్టర్ దగ్గర పట్టీ వేసుకున్నాడు. అది కాస్త వికటించటంతో కుడి కాలు మోకాలు వరకు తీసేయాల్సి వచ్చింది. అందుకే ఇస్మాయిల్ ఇద్దరు మగ పిల్లల్ని పదేళ్లు నిండీ నిండకుండానే పనుల్లో పెట్టేశాడు. ఒకడు హోటల్ లో బాసన్లు తోమటం, బల్లలు తుడవటం వంటి పనులు చేస్తాడు. రోజూ ఇంటికి పదో పరకో పట్టుకొస్తాడు. రెండో వాడు నాన్న దగ్గరే చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏడాది క్రితం తబస్సుం వాళ్ళక్క పెళ్లయ్యింది. కట్న కానుకలకు డబ్బులేక ఇస్మాయిల్ ఉన్న ఇంటిని అమ్మేశాడు.

ఇప్పుడు అదే ఇంట్లో వారు కిరాయికి ఉంటున్నారు. ఇక తబస్సుం ఆరోక్లాసు పూర్తి చేసి ఏడులోకి అడుగు పెట్టిన మొదటి నెలల్లోనే పెద్ద మనిషయ్యింది.
ఆ ఘడియ నుంచి తబస్సుంకు బురఖా కొత్త యూనిఫాం అయ్యింది. ఆ లేత బుగ్గలకు పెద్దరికాన్ని ఆపాదించి బడికి పంపటం బంద్ చేశారు.
తబస్సుంకు పుస్తకాలంటే పిచ్చి. చదువుంటే ప్రేమ. బడి అంటే ఆనందం, ఓ అద్భుతం. పలకా బలపం పట్టుకుని బుడి బుడి అడుగులు వెసుకుంటూ గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లిన తొలి రోజు నుంచి బడికి పోతానంటూ గుక్కపట్టి ఏడ్చినా వినకుండా మాన్పించిన తుది రోజు వరకు క్లాస్ ఫస్ట తనే. టీచర్లకు తబస్సుం అంటే వల్లమాలిన అభిమానం. అమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన తెల్లని మేనిఛాయ, కోమలమైన అందం, మెరుపులతో కొత్త అందాన్ని తెచ్చే కళ్లు, చదువులో చురుకుదనం అన్నీ కలిసి తబస్సుం అంటేనే ఆ బళ్లో ప్రత్యేకం అనిపించాయి.

తబస్సుం చేత బడి మాన్పించగలిగారు గాని చదువుని కాదు. నాలుగు కాగానే తాయారు బడి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఇంట్లో నుంచి గుమ్మంలోకి , గుమ్మంలోంచి ఇంట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంటుంది తబస్సుం. తాయారు రాగానే వాళ్లింట్లోకి వాలి పోతుంది. ఇవేళ పాఠాలు ఏం చెప్పారే అంటూ. ఇక అంతే ఇంట్లోకి కూడా వెళ్లకుండానే తాయారు ఆ రోజు స్కూల్ లో జరిగిన ముచ్చట్లన్నీ జోషుగా చెప్పుకుంటూ వస్తుంది. స్కూల్ కు పోక పోయినా తాయారు మాటలు వింటూ తానూ స్కూల్ లో ఉన్నట్లు ఊహించుకుంటూ ఆనందాన్ని జుర్రుకుంటుంది తబస్సుం. స్నేహితుల కబుర్లు, టీచర్ల విషయాలు చెప్పిన తర్వాత ఇక పాఠాల్లో పడతారు. తాయారు గతంలో పాఠాలు అంత శ్రద్ధగా వినేది కాదు. పరీక్షల్లో తబస్సుమే దొంగ చాటుగా సమాధానాలు చెప్పేది. కాని తబస్సుం స్కూల్ కు రావటం మానేసినప్పటి నుంచి తనకు పాఠాలు చెప్పటం కోసం శ్రద్ధగా వినటం మొదలు పెట్టింది. స్కూల్ లో టీచరు ఎలా చెప్పారో ఇంటికి వచ్చి వారిని అనుకరిస్తూ తబస్సుంకు పాఠాలు చెప్పటం తాయారుకు గొప్ప ఆనందాన్ని ఇస్తోంది.

“కిత్తె బార్ బులానా రీ…వస్తాద్నీ ఆయే బోలేతో సునేజాతా నేహే…టీచరమ్మ వచ్చిందని పిలుస్తుంటే ఈ పిల్ల కదుల్తానే లేదు…రేపు షాదీలా బచ్చీ ఖురాన్ చదివిందా, దీన్ గురించి తెలుస్నా అని అడుగ్ తారు గాని ఈ దునియా పాఠాలు అడుగ్ తారు…?! “గోడ మీద నుంచి తల్లి పురాణం ఎత్తగానే తబస్సుం వెంటనే ఇంట్లోకి పరుగెత్తింది. మోగ్రీబ్ కా నమాజ్ అయిన తర్వాత అంటే ఆరున్నర ఏడు గంటల సమయంలో తబస్సుంకు అరబ్బీ సురాలు, ఖురాన్ చదివించటానికి వస్తాద్నీ వస్తారు.

…………………..

“తబస్సుం…తబస్సుం…నీకో విషం చెప్తా…నాకేమిస్తావ్…”
ఈ వేళ తాయారే స్కూల్ అయిన వెంటనే ఆటలకు పోకుండా పరుగెత్తుకుంటూ తబస్సుం
వాళ్లింట్లోకి జొరబడింది.
” అబ్బా తెచ్చిన బిస్కెట్ల నీకు రెండిస్తాలే…చెప్పు ఎందుకంత హుషారుగున్నావ్…చెప్పే…”స్నేహితురాలి ఆనందానికి కారణం ఏమిటా అని ఓ వైపు నుంచి ఆలోచిస్తూనే తాయారుని పట్టుకుని తెగ ఊపేస్తూ అడిగింది.
తబస్సుం. ఒక నిమిషం పాటు ఊరడించి అసలు విషయం చెప్పింది తాయారు కళ్లు విప్పార్చి.

“మన క్లాస్ టీచర్ కమల టీచర్ లా…పొద్దొస్తూ నీ గురించి అడుగ్ తా ఉంటాదని చెప్పా కదా. మీ అబ్బాని సానా మార్లు అడిగిందట నిన్ను బడ్లోకి పంపమని. నే చెప్పా నువ్వు ఈడికి రాకపోయినా ఏడాది సదువుంతా సదివినావని. క్వశ్చన్ పేపర్లు ఇంటికాడ నువ్ రాస్తే నేను దిద్దినానని. గప్పుడు టీచరమ్మ అంది కదా…అయితే ఎలాగో అలాగ హాజరీ సంగతి నేను సూసుకుంటాను , యాన్యువల్ ఎగ్జామ్స వచ్చి రాయమను అని.”

” నిజంగనే…తాయారు… నువ్ నిజంగనే చెబుతుండావా…? నేను పరీక్ష రాయొచ్చా…పాసైతే నీతో బాటు హైస్కూల్ కి పోతానా..”తబస్సుంకు నమ్మశక్యంగానే లేదు. పరీక్షలకు ఇద్దరు కలిసి బాగా చదవాలని, తబస్సుం వాళ్ల నాన్నను ఒప్పించి పరీక్షలకు ఎలాగైనా హాజరు కావాలని…బురఖా వేసుకుని వెళ్తానంటే నాన్న కాదనడని …ఇలా …ఈ ఇద్దరు చిన్నారుల కబుర్లు సాగిపోతానే ఉన్నాయి. తాను బాగా చదివి ఉద్యోగం చేసి ఇంటి ఖర్చంతా తానే చూసుకుంటానని తబస్సు చెబుతూ తెగ ఆనంద పడిపోయింది. ఈ ముచ్చట్లు తబస్సుం వాళ్ల అమ్మ ఎలాంటి భావం లేకుండా వింటూనే ఉంది.

……………………….

పరీక్షలకు ఇంకా నాలుగు దినాలో ఉన్నాయి. అమ్మను ప్రసన్నం చేసుకోవటానికి తబస్సుం ఇంటి పని అంతా గబగబా చక్కబెట్టేస్తోంది. అంట్లు తోమటం, వంట సహాయం చేయటం నుంచి తమ్ముడ్ని, చెల్లళ్లను చూసుకోవటం వరకు అన్నింట్లోను ముందు ఉంటోంది. అమ్మ కొంగు పట్టుకుని గారాబం చేస్తే అబ్బాను ఒప్పించటం తేలిక అనేది తబస్సుం ఆలోచన.

“తబస్సూమ్….”
ఆ….ఆఈ అమ్మీ…..” అమ్మ పిలుపుతో వీధి అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్లను చూస్తున్న తబస్సుం లోపలికి పరుగెత్తింది.
తబస్సుం వాళ్ల అమ్మ పాత సూట్ కేసు ముందేసుకుని కూర్చుని ఉంది. “క్యావ్ అమ్మీ…ఏ సందూక్ కైకు నికాలే…?”
“దేఖో…ఈ చుడీదార్ కైసా హై…? ఆపా కే వలీమేకా ..పెహెన్ లో…” తబస్సుం వాళ్ళ అక్క వలీమా అంటే రిసెప్షన్ నాటి డ్రస్ అది. ఆకుపచ్చ మఖమల్ గుడ్డ పై గులాబీ రంగు చమ్కీలు, పూసలు, అద్దాలతో ఝిగేల్ మంటున్న చుడీదార్.

గులాబీ రంగు ధుపట్టా పై ఆకు పచ్చ కారీగరీ చేసి ఉంది. గతంలో ఎప్పుడు అడిగినా పెళ్లి సెంటిమెంట్ పేరు చెప్పి ఇవ్వని అమ్మ…ఇవాళ ఎందుకు బయటకు తీసిందో అర్ధం కాలేదు తబస్సుంకు.
“అబ్ కైకు అమ్మీ…?” దారిలో చెబుతాన్లే వేసుకో అనటంతో ఐదు నిమిషాల్లో హుషారుగా రెడీ అయ్యింది
తబస్సుం. మరో పది, పదిహేను నిమిషాలకు తబస్సుం వాళ్ల నాన్న ఇస్మాయిల్ కూడా ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ ఆటో తెచ్చాడు.

“ఆటో లాయ్..పైసే భోత్ హోతే ఫిర్…”ఆటో కిరాయి ఎక్కువ అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేసింది తబస్సుం వాళ్ల అమ్మ.
“తూ చుప్ రీ…దునియాకు మాలూమ్ హోనా క్యావ్. ఆటోమే చుప్ చాప్ బైఠో…” ఆటోలో మాట్లాడకుండా కూర్చోమంటూ ఆదేశాలు జారీ చేశాడు ఇస్మాయిల్. రెండు బురఖాలు ఎక్కిన తర్వాత ఇస్మాయిల్ కూర్చున్నాడు. ఆటో ముందుకు ఉరికింది.

……………………

“సలామ్ అలేకుం…”
రెండు పోర్షన్ల చిన్నపాటి డాబా ఇల్లు. ఇంటి ముందటి గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే వసారాలో పొడవాటి చెక్కబల్ల పై పాన్ నములుతో కూర్చుని ఉంది ఒకావిడ. ఆవిడ ముందు ఒక ల్యాండ్ ఫోన్. ఆ పక్కనే పాన్ ఉమ్మివేసి ఒక రేకు డబ్బా. చేతిలో ఫోన్ నెంబర్లు రాసుకునే చిన్నపాటి పుస్తకం ఉన్నాయి.
వయస్సు 45-50 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. భారీ దేహం, ముఖంలో కరుకుదనం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. పేరు నజీరున్ బీ.

“వాలేకుమ్ అస్సలామ్…”
ఆవిడ గుర్తు పట్టడానికి వీలుగా తబస్సుం వాళ్లమ్మ ముఖానికి ఉన్న నఖాబ్ తీసింది. ఇస్మాయిల్ కూడా సలామ్ చేసి ఇక మీరు చూసుకోండి అంటూ వెళ్లిపోయాడు. నజీరున్ బీ ఇద్దరిని వసారాను ఆనుకుని ఉన్న గదిలోకి తీసుకువెళ్లింది. మీ అమ్మాయేనా అని అడిగింది. అవునంది తబస్సుం వాళ్ళమ్మ.

“కా బచ్చీ…నఖాబ్ ఉతారో…పెహలే మైతో దేఖూ…బచ్చీ ఖూబ్ సూరత్ హై కీ నై…”
ఏం చేయాలో అర్ధం కాక అమ్మకేసి చూసింది తబస్సుం. ఆమె కూడా తీయమనటంతో ముఖాన్ని కప్పి ఉన్న నఖాబ్ తీసింది. అందంగా, అమాయకంగా ఉన్న తబస్సుంను చూడగానే ఆవిడ కళ్లు విప్పారాయి.
“మా షాల్లా…ఇత్తీ ఖూబ్ సూరత్ బేటీ హై ఆప్ కో…సమఝో సబ్ కుచ్ తై హోగయా…ఆప్ బే ఫికర్ రహ సక్తే. “అని భరోసా ఇచ్చింది నజీరున్ బీ. మళ్లీ అంతలోనే అనుమానం వచ్చి ఇది మొదటి సారే కదా అని ఒకటికి నాలుగు సార్లు అడిగి రూఢీ చేసుకుంది.

తబస్సుం అన్నీ నిశితంగా గమనిస్తోంది కాని ఏం జరుగుతుందో ఒక అంచనాకు రాలేకపోతోంది. అమ్మ ముఖంలో భావాలను చదివే ప్రయత్నం చేస్తున్నా ఆనందమో, బాధో తేల్చుకోలేకపోతోంది. నజీరున్ బీ తబస్సుంను వారున్న గదికి ఆనుకుని ఉన్న మరో గదిలోకి వెళ్ళమని చెప్పింది. ఆమె చూపుడు వేలు చూపిస్తున్న దిక్కుకు వెళ్ళి గుమ్మానికి ఉన్న కర్టెన్ ను కొంచెం జరిపి లోపలికి తొంగి చూసింది తబస్సుం. అక్కడ తన వయస్సుకు కాస్త అటూ ఇటూగా మరో ఐదారుగురు అమ్మాయిలు ఉన్నారు.

“జావ్…అందర్ జావ్…’ నజీరున్ బీ కంఠం వెనుక నుంచి వినిపించటంతో బెరుగ్గా ఆ గదిలోకి అడుగు పెట్టింది తబస్సుం. కొందరు అమ్మాయిల ముఖంలో నవ్వు ఉంటే కొందరు తనకు మల్లే ఆందోళనగా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు దట్టంగా పౌడర్ రాసుకుని పెదాలకు ఎర్రటి లిప్ స్టిక్, కళ్ళకు కాటుక, కను రెప్పలు, బుగ్గల పై కాస్త గులాబీ రంగూ పులిమారు. తలలో జడ పొడవుగా వేళ్లాడుతూ మల్లెపూలు. దాదాపు అందరూ కళ్ళకు ఛక్ ఛక్ మనిపించే మెరుపుల చుడీదార్లే వేసుకున్నారు. అందరూ ఒకరిని ఒకరూ
కళ్ళతోనే పరికించుకుంటున్నారు కాని…మాట కలపటం లేదు. వారందరిలో కాస్త సీనియర్ గా, ఇదంతా బాగా తెలిసిన వ్యవహారమే అన్నట్లున్న ఒక అమ్మాయి మాత్రం తబస్సుం దగ్గరికి వచ్చి అడిగింది..

“పహెలీ బార్…?”
దేనికి మొదటి సారో అర్ధం కాలేదు తబస్సుంకు. ఇక్కడికి రావటం మొదటి సారే కదా అని అవునంది. మొదటిసారి వచ్చినప్పుడు నేను కూడా నీకు లానే ఉండేదాన్నని చెప్పి నిట్టూర్చింది ఆ అమ్మాయి. నజీరున్ బీ రావటంతో మాటలు ఆగాయి. ఆయన వచ్చేశారు అంటూ హడావిడి మొదలుపెట్టింది. అడిగిన ప్రశ్నలన్నింటికి చక్కగా, నిజాయితీగా సమాధానాలు చెప్పాలంది. అబద్దాలు
చెబితే దొరికిపోతారు అని బెదిరించింది. ఆమె ఆదేశాలతో ఒకరి తర్వాత ఒకరిగా అమ్మాయిలు వేరే గదిలోకి వెళుతున్నారు నాలుగైదు నిమిషాల్లో బయటకు వస్తున్నారు. మరో మాట మాట్లాడకుండా తమ స్థానాల్లో బొమ్మల్లే నిలబడుతున్నారు. తబస్సుంతో మాట కలపటానికి ప్రయత్నించిన సీనియర్ అమ్మాయిని నీకు నేను తర్వాత చెబుతాన్లే అని చివరిగా తబస్సుంను తన వెంట రమ్మంది.

అమ్మ కోసం వెదికింది తబస్సుం. కనిపించలేదు. ఆందోళనతోనే నజీరున్ బీ వెంట నడించింది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఏసీ తాలూకు చల్లదనం మృదువుగా తాకింది. మూసివేసిన కిటికీలకు కర్టెన్లు వేలాడుతున్నాయి. ఆ ఇంట్లో మిగిలిన గదులకు ఈ గదికి అస్సలు పోలిక లేదు.గది చిన్నదే కాని విలాశవంతమైన అలంకరణలతో ఉంది. ఒక వైపు ఉన్న విశాల మైన సోఫాలో డెబ్భై ఏళ్లు పైబడిన
ముసలాయన కాలు మీద కాలు వేసికుని దర్పాన్ని చూపిస్తూ కూర్చుని ఉన్నాడు. మెడ నుంచి కాళ్ళ వరకు తెల్లటి పొడవాటి డ్రెస్ వేసుకుని ఉన్నాడు. దాన్ని థోబ్ అంటారు తల మీద కప్పుకున్న గుడ్డను ఘుత్రా అంటారు. చూడగానే ఎవరికైనా ఇట్టే అర్ధం అయిపోతుంది ఇతని అరబ్ దేశాలకు చెందిన వాడని.

“సలాం కరో…” హూంకరించింది నజీరున్ బీ.
తనను ఎందుకు ఇక్కడికి తెచ్చారో మెల్లగా అర్ధం కాసాగింది తబస్సుంకు.
కళ్ళల్లో నీటి పొర కదలాడుతోంది. అమ్మా నాన్న , పుస్తకాలు , తాయారు, పరీక్షలు అన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా కళ్ల ముందుకు వచ్చి వెళుతున్నాయి.

” బురఖా నికాలో “…మరో ఆదేశం
అక్షరాలకు రెక్కలు తొడిగి అనంత ఆకాశంలోకి ఎగిరి వెళ్లాలనే కలలు ఆ కళ్లవి. అవిటి నాన్నకు అండగా నిలబడాలనుకున్న ఆశలు ఆ చిట్టి తల్లివి.

కన్న పెగే కాసుల కోసం కాటు వేస్తుందని ఊహించని అమాయకత్వం ఆమెది. కల్లోనూ ఊహించని దెబ్బకు మనసు బీటలు వారుతోంది. తబస్సుం గుండె గొంతుకలో ఆర్తనాదాల హోరు. అమ్మీ, అబ్బా…నన్ను ఇలా అమ్మేస్తారా…? నేను మీ బిడ్డనే కదా. మీ కడుపునే పుట్టినా కదా. మేరీ బేటీ అని అమ్మీ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేది కదా. అన్నీ మరిచి పోయారా…? ఇంత మందిని సాకలేకపోతే ఎందుకు కన్నావ్ నాన్న. ఏమంటే మజహబ్ అంటావ్. పిల్లలను అల్లా ఇస్తాడంటావ్. ఆపరేషన్లు చేసుకోకూడదంటావ్. మరి ఏ ఖురాన్ లో ఉంది నాన్న ఇట్టా ఆడబిడ్డల్ని పసువుల మాదిరిగా అమ్మేయాలని. ఆడిపిల్ల దేహంతో వ్యాపారం చేయాలని. నా ఆడపిల్లతనమే అడ్డు అనుకుంటే భయ్యాల్లాగా ప్యాంట్ , షర్టూ వేసుకుని క్రాప్ కొట్టించుకుని ఏ హోటల్ కో పోయి బాసన్లు కడిగిదాన్ని కదా నాన్న. లేదంటే నేనేవరో కనిపించకుండా నిండా బురఖా వేసుకుని రోడ్ల పై అడుక్కుని అయినా నాలుగు పైసలు తెస్తిని కదా అబ్బా. అమ్మీ..నీకేమి చెప్పాలా అమ్మీ. సందఖ్ లో నుంచి బట్టలు తీస్తుంటే నా కోసం ముచ్చట పడుతున్నావ్ అనుకున్నా కాని పైసల కోసం అని అనుకోలే అమ్మీ. నన్నెంత సింగారిస్తే అన్ని పైసలు వస్తాయని లెక్కల పుస్తకంల నేర్చుకోలేదమ్మీ. అబ్బా ఇంకో అమ్మీని పెళ్లి చేసుకున్నాడని ఆ నాడు వీధిలో పడి గొడవ చేస్తివే…మరి నన్ను ఈ ముసలోడితో నాల్గు దినాల షాది ఎలాగ చేయిస్తున్నావ్ అమ్మీ. మీ నిస్సహాయతకు, మీ మూర్ఖత్వాలకు, మీ మత విశ్వాసాలకు, మీ కష్టాలకు, మీ బాధలకు, మీ అవసరాలకు నన్ను పణంగా పెట్టాలనుకున్నారా? అల్లా కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాడా..?ఇది అన్యాయం కాదా? తాయారు సానా మంది దేవుళ్ల గురించి చెబుతూ ఉండేది. వాళ్లూ అంతేనా? ఏ దేవుడూ ఏమీ చేయడా?
ఎవరూ ఏమీ చేయలేదు. ఆమె ఆర్తనాదాలు, ఆక్రందన బురఖా దాటి బయటకు పోలేదు. కూతుర్ని అమ్మిన డబ్బుల్లో మధ్యవర్తి వాటా పోగా వచ్చి సొమ్ములు తీసుకుని తబస్సుం అమ్మానాన్న ఇంటి దారి పట్టారు. అటు ముసలాడు తీసిన ఓ హోటల్ గదిలో తబస్సుం పంటిగాట్లు, అర్ధం కాని వికృత చేష్టలకు అలవాటు పడింది. సరిగ్గా ఇరవై రోజుల తర్వాత బహ్రెయిన్ ముసలాడు, తబస్సుం భర్త మళ్ళీ వస్తానంటూ ఫ్లైట్ ఎక్కేశాడు. నల్లటి బురఖాలో ఇంటి ముందు ఆటో దిగింది తబస్సుం.
*

చీకటి మరకల ఉదయం

 

 -ఫణీంద్ర

~

 

1

 

కుక్కర్ మూడో కూత వేసింది! అప్పటికే టిఫిన్ చెయ్యడం పూర్తి చేసి, ఆఫీసుకి వెళ్ళే శ్రీవారికీ, స్కూలుకి వెళ్ళే కూతురుకీ ఆ రోజు వేసుకోవాల్సిన బట్టలు తీసిపెడుతున్న సుభద్ర వెంటనే బెడ్రూంలోంచి వంటింట్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది. ఏ పనిలో ఉన్నా చెవిని కుక్కర్ కూతలపై వేసి లెక్కతప్పకుండా మూడో కూత తరువాత ఠక్కున కట్టేసే ప్రజ్ఞ ఆమె సొంతం! కూతురూ, భర్తా హడావిడిగా రెడీ అయ్యే లోపు ఆమె వేడి వేడి టిఫిన్ టేబుల్ మీద సిద్ధంగా పెట్టి, లంచ్ బాక్సులు కూడా కట్టి ఉంచింది. ఏ రోజూ టైముకి రెడీ అవ్వని భర్తనీ, ఆ లక్షణమే పుణికిపుచ్చుకుని పుట్టిన పదేళ్ళ కూతురునీ చూసి ఆమె రోజూలానే ఓ చిరునవ్వు నవ్వుకుంది! భర్తనీ, కూతురునీ సాగనంపాక ఆమె చిక్కటి కాఫీ పెట్టుకుని వరండాలోకి వచ్చి, కుర్చీలో కూర్చుని, తాను మురిపెంగా కుండీల్లో పెంచుకుంటున్న పూలమొక్కల్ని చూస్తూ వేడి కాఫీని ఆస్వాదిస్తోంది. ఇలా రోజూ తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని రిలాక్స్ అవ్వడం ఆమెకి అలవాటు.

అది పూణే నగరంలో మూడంతస్తుల ఇల్లు. కింద ఇంటి ఓనర్లూ, రెండో అంతస్తులో అద్దెకి సుభద్రా వాళ్ళూ ఉంటున్నారు. ఇల్లు పాతదే కానీ, ఇంటి చుట్టూ పచ్చదనం, రెండో అంతస్తులో పెద్ద వరండా ఉండడంతో ముచ్చటపడి ఈ ఇల్లే అద్దెకి తీసుకోమంది, భర్తకి ఇంకో కొత్త అపార్ట్‌మెంటు నచ్చినా.  వరండాలో ఓ మూలకి ఉన్న మెట్లెక్కి వెళితే మూడో అంతస్తులో ఒక చిన్న సింగిల్ రూం ఉంటుంది, మిగతా అంతా ఖాళీ జాగా.  ఓ నెల క్రితం వరకూ ఓ తమిళ అమ్మాయి ఉండేది అక్కడ. సుభద్ర తరచూ రాత్రివేళ మేడ పైకి వెళ్ళి వెన్నెలని ఆస్వాదిస్తూ ఆ అమ్మాయితో కబుర్లు చెప్పేది. ఆ అమ్మాయి ఖాళీ చేశాక ఎవరో కుర్రాడు వచ్చాడు.

కాఫీ తాగుతూ పూలమొక్కల కేసి చూస్తున్న సుభద్రకి మేడ మెట్ల దగ్గరగా ఉన్న పూలకుండీల మధ్య ఓ మడత పెట్టిన కాయితం కనిపించింది. తీసుకుని చదివితే ఏదో కవిత –

నీకు పడ్డ మూడు ముళ్ళు

మన ప్రేమకి పడ్డ శాశ్వత సంకెళ్ళు

నీ పెళ్ళిమంటపాన ఆ అగ్నిహోత్రం

చితిమంటలపాలైన మన ప్రేమకి సాక్ష్యం

నీపై వాలే అక్షింతలు

మన ప్రేమసమాధిపై రాలే పూలు

చెలీ తెలుసుకో

నీ కళ్యాణ వైభవం

మన కన్నీటి తోరణం

ఆ మంగళ వాద్యం

మన గుండెల ఆర్తనాదం

 

ప్రేమ వైఫల్యపు బాధ నిండిన ఈ కవిత కొత్తగా వచ్చిన కుర్రాడు రాసిందే అయ్యి ఉండాలి అనుకుంది సుభద్ర. అతను తెలుగు వాడే అన్నమాట! కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలానే ఉంటాడు. ఉదయం రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళడం చాలా సార్లు చూసింది కానీ ఎప్పుడూ పలకరించలేదు. అతని వాలకం ఏదో తేడాగా అనిపించేది. ఓ నవ్వూ, ప్రశాంతత లేకుండా ఎప్పుడూ నిర్లిప్తంగా కనిపిస్తాడు. ఈ నెలరోజుల్లో ఒక ఫ్రెండు రావడం కానీ, ఓ పార్టీ చేసుకోవడం కానీ చూడలేదు. ఎవరితో కలవకుండా, మౌనంగా తనపని తాను చేసుకునే రకం కాబోలు! ఆ కవిత చదివాక అతని తీరుకి కారణాన్ని కొంత ఊహించగలిగింది. అతన్ని కలిసి మాట్లాడాలనిపించింది ఒక్కసారిగా సుభద్రకి. ఆఫీసుకి లేటుగా వెళతాడు కాబట్టి రూంలోనే ఉండి ఉంటాడు.

 

 

2

 

ఉదయ్‌కి మనసంతా చికాగ్గా ఉంది. అతనిలో నిత్యం రగిలే బాధకి సంకేతంగా నిప్పుల కొలిమిలాంటి సూర్యుడు ఆ రోజూ ఉదయించాడు. అతని భారమైన జీవితానికి ఇంకో రోజు జతకలిసింది. బతకడానికి డబ్బు కావాలి కాబట్టి ఓ ఉద్యోగం, ఆ ఉద్యోగానికి వెళ్ళడం కోసం ఓ మామూలు మనిషిలా కనిపించాలి కాబట్టి అలా ఉంటాడు కానీ తను ప్రాణంగా ప్రేమించిన వర్ష దూరమయ్యాక అతను మామూలుగా లేడు, ఎప్పటికీ కాలేడు. నిన్న వర్ష పెళ్ళిరోజు, అతని గుండె పగిలిన రోజు! సంవత్సరం క్రితం మనసుకైన ఆ శాశ్వత గాయానికి రోదనగా అతను రాసుకున్న కవిత ఒకసారి మళ్ళీ బయటకి తీసి చదువుకున్నాడు. కవిత అతనికి అక్షరం అక్షరం గుర్తుంది కానీ ఆ పాత కాయితం ఓ సజీవ స్మృతి. అందుకే ఆ కవితను బైటకి తీసి, కాయితాన్ని తాకి చూసి, మళ్ళీ జ్ఞాపకాల్లో మునిగాడు. అతనికి కన్నీళ్ళు రాలేదు, ఆ స్థితి ఎప్పుడో దాటిపోయాడు. చెమ్మంటూ ఉండడానికి ముందు మనిషై ఉండాలి, అతనిలో మనిషితనం ఎప్పుడో చచ్చిపోయింది. కాదు ఈ సంఘమే చంపేసింది అంటాడు అతను. కవిత చదివాక జేబులో పెట్టుకుని ఆఫీసుకెళ్ళాడు. రోజంతా కుదిరినప్పుడల్లా తీసి చదువుకుంటూ ఉన్నాడు. కానీ రాత్రి రూంకి వచ్చి చూసుకుంటే లేదు, ఎంత వెతికినా కనిపించలేదు.

బాధపడుతూ, తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ రాత్రంతా గడిపాడు. తనకి ప్రియమైనవి ఎందుకు దూరమైపోతాయో అతనికి అర్థం కాలేదు. తీవ్రమైన నిరాశ అతన్ని ఆవహించింది. జీవితం నరకమే, మళ్ళీ రోజుకో కొత్తశిక్షా? ఇలా చస్తూ  బ్రతికే కంటే చావడమే మేలని చాలా సార్లు అనిపించింది. కానీ ధైర్యం చాలలేదు. ఆ ధైర్యమే ఉండుంటే పెద్దలనీ సంఘాన్నీ ఎదిరించి వర్షని దక్కించుకునే వాడేమో.

అతను ఈ ఆలోచనల్లో ఉండగా ఎవరో తలుపు తట్టారు. తన రూంకి ఎవరొచ్చుంటారా అని ఆశ్చర్యపడుతూ తలుపు తీశాడు. ఎదురుగా కింద పోర్షన్‌లో ఉండే ఆవిడ కనిపించింది. రెండు మూడు సార్లు చూశాడు ఆమెని. తన జీవితాన్ని అపహాస్యం చేస్తూ విరబూసినట్టుండే పూలమొక్కల్ని పెంచేది ఆవిడే కదా! “ఎందుకొచ్చారు” అన్నట్టుగా చూశాడు.

“మేము కిందే ఉంటాం. నా పేరు సుభద్ర. ఊరికే పలకరిద్దామని వచ్చాను, నిన్ను చూస్తే మా తమ్ముడిలా అనిపించావ్…”

ఈ పూసుకున్న నవ్వులూ, పలకరింతల ఫార్మాలిటీస్ అతన్ని మభ్యపెట్టలేవు. ప్రస్తుతం ఎవరితోను మాట్లాడే మూడ్ కూడా లేదు.

“మీరు తమ్ముడూ అని వరస కలిపారని, నేను మిమ్మల్ని అక్కా అని పిలవలేను. నాకు వరసల మీదే కాదు, మనుషుల మీద కూడా నమ్మకం లేదు! క్షమించండి!”  – సాధ్యమైనంత మర్యాదగా చెప్పే ప్రయత్నం చేశాడు.

సుభద్ర అతని ముక్కుసూటి సమాధానానికి కొంత ఆశ్చర్య పడుతూనే ఏ మాత్రం తొణక్కుండా –

“నాకూ మనుషుల మీద నమ్మకం లేదు! కానీ నేను మనిషినన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే  పలకరిద్దామని వచ్చాను. ఇరుగుపొరుగు వాళ్ళం కదా, చేదోడువాదోడుగా ఉండడానికి నమ్మకాలూ అవీ అవసరమా?”

ఓ మామూలు గృహిణిలా కనిపించే సుభద్ర నుంచి అలాంటి సమాధానం ఊహించలేదు అతను. అతని అహం కొంచెం దెబ్బతింది. అది తెలియనివ్వకుండా –

“అవసరాల మీద ఏర్పడే సంబంధాలు నాకు అవసరం లేదు. మీ ఆప్యాయతకు థాంక్స్!” అన్నాడు.

సుభద్ర చిరునవ్వు నవ్వుతూ  –

“చాలా చదువుకున్న వాడివిలా ఉన్నావయ్యా! ఏవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నాకవన్నీ తెలియవు. కానీ తెలిసిన ఒక విషయం ఏమిటంటే కోరుకున్నది పారేసుకోకూడదు, పారేసుకున్నదాన్ని కోరుకోకూడదు”

అతను అర్థం కానట్టు చూశాడు. సుభద్ర అంతవరకూ అతనికి కనిపించకుండా చేతిలో మడతపెట్టి పట్టుకున్న కవిత ఉన్న కాయితాన్ని తీసి ఇస్తూ –

“వెళ్ళొస్తాను. ఏదైనా కావాలంటే మొహమాటపడకు. నన్ను అక్కా అని పిలవక్కరలేదులే!” అని కిందకి దిగివెళ్ళిపోయింది.

అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే తేరుకుని ఆనందంగా కాయితం కేసి చూసుకున్నాడు. ఎప్పటిలానే వర్ష స్మృతుల్లో గడిపాడు మిగిలిన రోజంతా.

 

3

 

ఈ సంఘటన జరిగాక, ఆ కుర్రాడి కథ ఏమయ్యుంటుందా అని సుభద్ర చాలా సార్లు ఆలోచించింది. కొద్ది రోజుల తరువాత ఓ ఉదయం సమాధానం సుభద్ర ఇంటి తలపు తట్టింది. ఆ రోజు సుభద్ర ఇంటి పనుల్లో ఉండగా మేడపై నుంచి ఏదో వాగ్వివాదం వినిపించింది. ఎవరొచ్చారో ఏమయ్యుంటుందో అని సుభద్ర అనుకుంటూ ఉండగానే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఎవరో పెద్దాయన, అరవై ఏళ్ళ వయసుంటుందేమో. నీరసంగా, ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టు భారంగా ఉన్నాడు.

“అమ్మా! కొంచెం మంచినీళ్ళు ఇస్తావా?”

“అయ్యో! తప్పకుండా! లోపలికి రండి” అంటూ సుభద్ర ఆహ్వానించింది.

మంచినీళ్ళు తాగి ఆయన కొద్ది సేపు ఏమీ మాట్లాడలేదు. సుభద్రా ఆయన్ని కదపలేదు. ఎదుట మనిషి మనస్థితిని గుర్తించి మసలడం ఆమెకి ఉన్న సుగుణాల్లో ఒకటి. కొద్దిసేపటికి కన్నీళ్ళని దిగమింగుకుంటూ ఓ నిట్టూర్పు విడిచి గొంతువిప్పాడాయన –

“చాలా థాంక్సమ్మా! మీ ఇంటి తలుపు మీద తెలుగు అక్షరాలు కనిపించి మీరు తెలుగువాళ్ళే అయ్యుంటారనిపించింది. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. బాగా అలిసిపోయాను. కాస్త సేదతీరాలనిపించి మీ తలుపు తట్టాను. ఏమీ అనుకోకు. వెళ్ళొస్తానమ్మా!”

“పెద్దవారు మీరు అంతలా చెప్పాలా? మనుషులమన్నాక గ్లాసెడు మంచినీళ్ళూ, కాసింత కన్నీళ్ళూ పంచుకోవడం కూడా పెద్ద సాయమేనా? కాస్త నడుం వాల్చి భోజనం చేసి వెళ్ళండి”

సుభద్ర ఆదరణకి ఆయన కరిగిపోతూ  –

“లేదమ్మా నేను వెళ్ళాలి. నీది మంచి మనసు. పరిచయం లేకపోయినా ఆత్మీయురాల్లా ఆదరిస్తున్నావు. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు, నీతో నా బాధ చెప్పుకోవాలనిపిస్తోంది. మీ మేడపైన ఉన్నవాడు నా కొడుకమ్మా! ఏకైక సంతానం. పేరు ఉదయ్. మాది మునగపాక అని వైజాగ్ దగ్గరలో ఉన్న చిన్న ఊరు. మాపైన కోపంతో సంవత్సరం క్రితం నుంచీ దూరమయ్యాడు. ఎంతో కష్టపడి ప్రయత్నిస్తే ఈ పూణే నగరంలో వాడు ఉండొచ్చని తెలిసి వచ్చాను. ఈ ఇంటి అడ్రస్సు పట్టుకోవడానికి రెండు రోజులు పట్టింది.

మేము కలిగిన వాళ్ళం, మా ఊర్లో మాకు చాలా పరపతి ఉంది. వాడికెప్పుడూ లోటు చెయ్యలేదు. అయితే చిన్నప్పటి నుంచీ వాడి లోకంలో వాడు ఉండేవాడు. అదో రకం మనిషి, ఎవరితోనూ కలిసేవాడు కాదు, ఒక్క స్నేహితుడూ లేడు. ఇంట్లోనూ మాటలు తక్కువ. ఎప్పుడూ వాడి రూములో వాడు ఏవో పుస్తకాలు చదువుకుంటూ, ఏదో రాసుకుంటూ ఉండేవాడు. పోనిలే అందరి కుర్రాళ్ళలాగ అల్లరిచిల్లరగా తిరక్కుండా ఇంటిపట్టునే బుద్ధిగా ఉంటున్నాడు అనుకున్నాను. అనకాపల్లిలో ఇంటర్మీడియట్ వరకూ చదివాక ఇంజనీరింగ్ చదువుతానని బిట్స్ పిలానీకి వెళ్ళాడు. అది చాలా మంచి కాలేజీ అట! నాకు ఈ చదువుల గురించీ కాలేజీల గురించీ పెద్ద తెలీదు. నాకు తెలిసిందల్లా మా చిన్న ఊరు, అక్కడి మా కులగౌరవం, ధనగర్వం ఇవే! పెద్దరికం పేరుతో మా పాతతరం వెంటతెచ్చుకున్న బరువులు ఇవేగా! మా ఊరునుంచి వాడు దూరంగా వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే అన్నాను.

ఆ కాలేజీలో చేరాక వాడిలో మార్పు కనిపించసాగింది. సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు కాస్త నవ్వుతూ కబుర్లు చెప్పేవాడు మాతో. వాడు మామూలు మనిషౌతున్నందుకు మేము ఆనందించాం, ముఖ్యంగా వాడి అమ్మ. దానికి వాడు ఎలా బతుకుతాడో అని ఎప్పుడూ బెంగ ఉండేది.  నాలుగేళ్ళ తరువాత చదివి పూర్తయ్యి మంచి ఉద్యోగం వచ్చింది వాడికి బెంగళూరులో. ఇంకేముంది త్వరలో గొప్ప కట్నంతో మా కులానికి చెందిన అమ్మాయితో ఘనంగా పెళ్ళిచేసేద్దాం అనుకున్నా! కాని వాడొచ్చి ఎవరో అమ్మాయిని ప్రేమించాను అన్నాడో రోజు. ఆ అమ్మాయి మా కులం కాదు, వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులూ లేవు. దాంతో నేను పెళ్ళి కుదరదని ధిక్కరించా. అహంకారంతో ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి నానామాటలు అన్నా. వాళ్ళకీ ఈ ప్రేమ విషయం తెలీదు, వాళ్ళూ నాలా ఉడుకుతనం ఉన్న వాళ్ళే. నన్ను ఎదురు తిట్టి ఆ అమ్మాయికి ఎవరితోనో వెంటనే పెళ్ళిచేసి అమెరికా పంపించేశారు. నేను విషయం తెలిసి మీసం మెలేశాను!”

సుభద్రకి విషయం అర్థమైంది ఇప్పుడు. మొగ్గలా ముడుచుకున్న వాడు ప్రేమలో పువ్వులా వికసిస్తే ముల్లై లోకం గుచ్చింది. అదే పాత కథ, అదే వ్యథ.

“కానీ నా తెలివితక్కువ పనివల్ల వీడు మళ్ళీ తన చీకటి గుహలోకి వెళ్ళిపోతాడని, ఈసారి తల్లితండ్రులమైన మాక్కూడా ప్రవేశం ఉండదని ఊహించలేదు. అప్పటినుంచీ వాడు మా మొహం చూడలేదు,  కనీసం ఫోన్ చేసి పలకరించలేదు. బెంగళూరు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియలేదు. తన తప్పు లేకపోయినా నా భార్యకి నావల్ల శోకం మిగిలింది. కొడుకుపై బెంగపెట్టుకుని చిక్కిశల్యమైంది. మా ఇంటిలో ఆనందం మాయమైంది”

ఒక భారమైన నిశ్శబ్దం గదంతా పరుచుకుంది. మాటల్లో చెప్పలేని విషయాలెన్నో మౌనం విశదీకరిస్తోంది. మళ్ళీ ఆయనే మాట్లాడాడు –

“ఇన్నాళ్ళకి వాడి ఆచూకీ దొరికి వచ్చానమ్మా. కాని వాడు నన్ను చూసి రగిలిన అగ్నిపర్వతమే అయ్యాడు. కొన్ని మంటలు చల్లారేవి కావేమో! నా తప్పు ఒప్పుకుని నన్ను క్షమించమన్నాను. అమ్మ కోసమైనా ఒక్కసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాను. కానీ వాడు ఏమాత్రం కరగలేదు. తనకెవరూ లేరన్నాడు. నన్ను పొమ్మన్నాడు. వాడిక ఎప్పటికీ ఇంటికి రాడేమో అని భయమేస్తోందమ్మా.”

“మీరు అధైర్య పడకండి. ఏదో కోపంలో అలా అన్నాడు కానీ, మిమ్మల్ని చూశాక ఇల్లూ అమ్మా గుర్తురాకుండా ఉంటాయా? మీ అబ్బాయి తప్పకుండా తిరిగివస్తాడు”

“నీ నోటిచలవ వల్లైనా అలా జరిగితే అదే చాలమ్మా! నీకు నా ఆశీస్సులు. ఉంటాను” అని ఆయన వెళ్ళిపోయాడు.

 

4

 

ఆయన వెళ్ళాక సుభద్ర ఏం చెయ్యాలా అన్న ఆలోచనలో పడింది. ఓ నిశ్చయానికి వచ్చి ఉదయ్ రూంకి వెళ్ళింది. ఈసారి తలుపులు తెరిచే ఉన్నాయి. రూంలో కళ్ళు మూసుకున్న ఏదో ఆలోచనలో ఉన్న ఉదయ్, కళ్ళు తెరిచి తీక్షణంగా సుభద్రకేసి చూశాడు.

“మళ్ళీ ఎందుకొచ్చారు? మా నాన్న నా గురించి చెప్పిన కథంతా విని నాకు నీతిబోధ చెయ్యడానికా?”

“లేదు. సానుభూతి తెలపడానికి వచ్చాను. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైపోతే కలిగే బాధ నేను అర్థం చేసుకోగలను”

“దూరం కాలేదండి! దూరం చేశారు. ద్రోహం చేశారు. నా బాధ మీకు తెలుసు అనడం తేలికే, కానీ నా బాధ మీరు పడగలరా? ఆత్మీయమైన పలకరింపులూ, పులుముకున్న నవ్వులూ వెనుక దాగున్న మనుషుల అసలు స్వరూపాలు మీకు తెలుసా? కులగౌరవాలూ, ధనమదాలూ, సంఘమర్యాదలూ తప్ప మనిషిని మనిషిగా చూడలేని సమాజం మీకు తెలుసా? అలాంటి మా ఊరి వాతావరణంలో ఇమడలేక, అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా ఏకాకిగా పెరిగిన నాకు స్నేహమాధుర్యాన్ని పంచి, జీవితాన్ని నేర్పి, సరికొత్త ప్రాణాన్ని పోసిన నా “వర్ష”ని నాకు కాకుండా చేశారు. మీకు తెలీదండీ, మీకు తెలీదు. అప్పుడే ప్రేమతో విరబూస్తున్న జంటపువ్వులని కర్కశంగా నలిపేసిన ఈ లోకపు కాఠిన్యం మీకు తెలీదు! జీవితంలో ఎప్పుడూ ఏడవని నేను వెక్కివెక్కి ఏడ్చిన రాత్రులు మీకు తెలీదు. నా వర్ష లేని ఒంటరితనంలో నేను పెట్టిన గావుకేక మీకు తెలీదు.

ఇవన్నీ తెలియని మీరు, మనిషినన్న నమ్మకం ఉండాలి, పారేసుకున్న దాన్ని కోరుకోకూడదు అంటూ డైలాగులు మాత్రం తేలిగ్గా చెప్పగలరు. ఎందుకుండాలండీ? నాకు మనుషులపైనే కాదు, నేను మనిషినన్న నమ్మకం కూడా లేదు. నేను జీవచ్చవంలా, ఓ రాయిలా బ్రతుకుతున్నాను. చచ్చే ధైర్యం లేక బ్రతుకుతున్నాను. నాలో మనిషిని చంపేసిన సంఘానికి నేను మాత్రం నవ్వుతో స్వాగతం పలకాలా? నేను మోయలేనంత శోకాన్ని శిక్షగా విధించిన లోకాన్ని నేను క్షమించేసి గుండెకి హత్తుకోవాలా? బాధా నేనే పడి, జాలీ నేనే పడి, మార్పూ నేనే చెందాలి కానీ ఈ సంఘం మాత్రం ఎప్పటిలాగే తన పాత పద్ధతుల్లో కొనసాగుతూ ఉంటుందా? ఇదెక్కడి న్యాయం అండీ? పారేసుకున్నది జీవితం కన్నా గొప్పదైనప్పుడు, అది లేని నిస్సారమైన జీవితంలో బ్రతకడంకంటే అది ఉందనుకున్న భ్రమలోనో, లేదా దాన్ని కోల్పోయిన బాధలోనో బ్రతకడమే మంచిది. కాదంటారా?”

అతను ఆవేశంగా వర్షిస్తున్నాడు. అతని ఆవేశాన్ని చూసి సుభద్ర ఏమీ మాట్లాడలేకపోయింది. లోలోపలి బాధ ఉబికి వచ్చి అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, కానీ అతను ఏడుపు ఆపుకుంటున్నాడు. సుభద్ర అతని భుజాన్ని ఆప్యాయంగా నిమిరి మౌనంగా వెనుదిరిగి వెళ్ళిపోయింది. అతను రూం బయటకి వచ్చి ఆకాశం కేసి చూస్తూ ఉండిపోయాడు.

 

5

 

ఓ రెండుగంటల తరువాత అతను తేరుకున్నాడు. ఆవిణ్ణి అనవసరంగా మాటలు అన్నానే అనుకున్నాడు! పాపం ఆవిడ తప్పేముంది? ఓదార్చడానికి వచ్చింది. అయినా వదిలెయ్యండని చెప్పినా ఎందుకు కలగజేసుకుంటుంది?  వద్దన్నా ఆప్యాయత చూపిస్తుంది. తాను లోకాన్ని పట్టించుకోవడం మానేస్తే లోకంలో ఎవ్వరూ తనని పట్టించుకున్న పాపాన పోలేదు, ఈవిడ తప్ప.

నాన్నకి తన ఆచూకి తెలిసిపోయింది కాబట్టి తను ఇక రూం వదిలి, ఊరు వదిలి, బహుశా ధైర్యంచేసి ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి. ఈ రోజు మళ్ళీ ఆవేశం కట్టెలు తెంచుకుంది. ఈ ఆవేశం పూర్తిగా చల్లారేలోగానే తాను ఆత్మహత్య చేసుకోవాలి. అవును తప్పదు. వెళ్ళిపోవాలి. ఒంటరితనాన్ని వదిలి, జ్ఞాపకాలని వదిలి, పిరికితనాన్ని వదిలి. ఈ ఆవేశమనే నావపై ప్రయాణించి లోతు తెలియని అగాధంలోకి.  జీవితమనే నరకాన్ని వదిలి మరణమనే ప్రేయసి కౌగిలిలోకి.

వెళ్ళిపోయే ముందు ఆవిడని ఒకసారి కలిసి “సారీ” చెప్పాలి అనుకున్నాడు. కిందకి దిగి సుభద్ర ఇంటి తలుపు తట్టాడు.

“రావయ్యా! మొత్తానికి మేడ దిగొచ్చావన్న మాట” ఆశ్చర్యానందాలతో పలకరించింది సుభద్ర.

“నేను కూర్చోడానికి రాలేదు. మీతో ఓ మాట చెప్పి వెళ్ళిపోతాను”

“చెబుదువుగానులే! ముందు లోపలికి రా. నిలబెట్టి మాట్లాడితే ఏం మర్యాదయ్యా!”

సుభద్ర ఆహ్వానాన్ని కాదనలేక అయిష్టంగానే హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. పొందిగ్గా అమర్చిన ఇల్లు.

“కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా?”

“వద్దండీ. నేను వెళ్ళాలి. ఇందాకా ఆవేశపడి ఏవో మాటలన్నాను, క్షమించండి. మీకు నాపై ఈ అభిమానం ఎందుకో తెలియదు కానీ, మీ అభిమానాన్ని నేను స్వీకరించలేను. దయచేసి నన్ను పట్టించుకోవడం మానెయ్యండి! నేనెవరికీ చెందను, నాకెవరూ అక్కర్లేదు. నా దారిలో నేను దూరంగా ఎక్కడికో వెళిపోతాను, నాకే పిలుపులు వినిపించవు. మీరూ పిలవకండి. ప్లీజ్!”

ఆ మాటల్లో దాగున్న అర్థాలకి సుభద్ర మనసు కీడు శంకించింది.

“వెళిపోతాను అన్నవాణ్ణి ఆపలేనయ్యా. నీ ఇష్టం నీది. నిన్నింక ఇబ్బంది పెట్టను. చివరగా ఓ మాట చెప్పొచ్చా?”

“చెప్పండి”

“నువ్వు చాలా సున్నిత మనస్కుడివని నీ కవిత చదివినప్పుడే అర్థమైంది. సున్నితమైన మనసూ, స్పందించే గుండె లేనివాడు కవిత్వం రాయలేడు. నువ్వు ఒంటరివాడివి కూడా అని ఈ రోజే తెలిసింది. ఎవ్వరూ చొరబడని నీ మనసనే చీకటిగదిలోకి ఓ వెలుగురేఖ వచ్చింది. నువ్వు మేలుకుని తలుపు తెరిచేలోపు ఆ వెలుగుని లోకం మింగేసింది. నువ్వు లోకాన్ని ద్వేషిస్తూ చీకట్లోనే మిగిలిపోయావు. అసలు వెలుగన్నదే భ్రాంతన్నావు!

ద్వేషం దహిస్తుందయ్యా. ద్వేషించే వాళ్ళనీ, లోకాన్నీ కూడా. దానివల్ల ఎవరికీ లాభం లేదు. నీకు తీవ్రమైన అన్యాయం జరిగింది నిజమే. దానివల్ల నీకు తీరని నష్టం బాధా కలిగాయి. సహజంగానే నీకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని ద్వేషంగా మార్చుకోకు. మనసు పిచ్చిది, బాధొస్తే ఓ గోల పెట్టి ఊరుకుంటుంది. కానీ తెలివి చాలా టక్కరిది. అది దేన్నీ వదిలిపెట్టదు, బాధ కలిగించిన వాళ్ళని జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటుంది. దాని వలలో పడకు!

నేను నీలా బోలెడు పుస్తకాలు చదవలేదు. కానీ బోలెడు జీవితాన్ని చూశాను. కష్టాలూ, ఆనందాలూ, అనుబంధాలూ, స్వార్థాలూ, అపార్ధాలూ ఇవన్నీ జీవితాన్ని నిర్మించే ముడిసరుకులే. ఇలా అన్ని రకాల అనుభవాలతో, మనుషులతో నిండిన లోకాన్ని కాదని తమతమ ఊహాలోకాల్లో విహరిస్తూ, ఓ ముల్లు గుచ్చుకుంటే ఈ లోకంలోకి వచ్చి, “ఛీ! పాడు లోకం” అని ఓ మాట అనేసి మళ్ళీ తమ ఊహాలోకంలోకి జారుకునే వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకోలేరు. అనుభవించలేరు. కాలికి ఇసుక అంటకూడదు అనుకునేవాడు జీవితమనే సముద్రంలో స్నానం చెయ్యలేడు.

నీలో సంస్కారంతో కూడిన ఓ మంచి మనిషిని నేను చూస్తున్నాను. నీ గుండె గాయపడింది కానీ నువ్వింకా రాయివైపోలేదు అనుకుంటున్నాను. నీలో ఏ మూలో మిగిలిన మనసుని తట్టి చూడు. నీకు నువ్వే దట్టంగా పరుచుకున్న చీకటి తెరలు దాటిచూడు. ఆలోచనా సామ్రాజ్యాన్ని వదిలి మౌనసరస్సులో స్నానించు. అప్పుడు వినిపించే పిలుపు ఎటు పిలిస్తే అటే వెళ్ళు!”

సుభద్ర ఇంకేమి చెప్పడానికి లేదన్నట్టు చూసింది. అతను ఇంకేమీ మాట్లాడలేనన్నట్టు లేచి వెళ్ళిపోసాగాడు. అప్పుడు కనిపించింది అతనికి గోడకున్న ఆ ఫోటో. నవ్వులు చిందిస్తున్న ఓ యువకుడిది. దండేసి ఉంది. చూసి ఓ క్షణం ఆగాడు.

సుభద్ర అతని భావం గ్రహిస్తూ –

“వాడు నా తమ్ముడు. నీ వయసే ఉంటుంది, మెడిసిన్ చదివేవాడు. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. వాడు నాకన్నీ చెప్పేవాడనే అనుకునే దాన్ని. కానీ కాదని తెలిసింది. ఆరు నెలల క్రితం సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు డల్‌గా కనిపించాడు. ఏమిట్రా అంటే ఏం లేదక్కా అన్నాడు. వాడు తిరిగి కాలేజీకి వెళ్ళిన కొన్ని రోజులకి సూసైడ్ చేసుకున్నాడని మాకు కబురొచ్చింది. వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని కాదందట. అమ్మానాన్నా ఇంకా తేరుకోలేదు. నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను – “జీవితం గొప్పదా, జీవితాన్ని కాదనుకునే పంతం గొప్పదా?” అని.

అతనికి ఏమనాలో తెలియలేదు.  “సారీ టు హియర్ దిస్” అని వెళ్ళిపోయాడు.

 

6

 

 

పక్కరోజు తెల్లవారుతూ ఉండగా సుభద్ర లేచి వాకిలి తలుపు తీసింది. తలుపు గడియకి మడిచిపెట్టిన ఓ కాయితం కనిపించింది. కీడు శంకిస్తూ తీసి చదవసాగింది –

అక్కా,

చాలా రోజుల తరువాత నిన్న నిండుగా ఏడ్చాను. అసలు ఏడుపు ఎందుకొచ్చిందో కూడా తెలీదు. ఆపలేకపోయాను, ఆపాలనిపించలేదు కూడా. కొన్నిసార్లు మనసుని శుభ్రపరచడానికి కన్నీటి స్నానం చెయ్యాలేమో! నువ్వన్నది నిజమే, నా గుండె లోతుల్లో ఆరని జ్వాలేదో ఉంది. నా ప్రతి ఆలోచనా ఆ జ్వాలని రగిలిస్తూనే ఉంది. ఈ కన్నీరు ఆ జ్వాలని ఆర్పిందో ఏమో, చాలానాళ్ళ తరువాత కొంత ప్రశాంతత దొరికింది.

నిన్న నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఇన్నాళ్ళూ బాధించిన ఈ లోకాన్ని ఓడిస్తూ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీ మాటలు నన్నాపాయి. నీ మాటలు కాదేమో, నీ మాటలు వెనుక ఉన్న ఏదో ఆత్మీయత. నీ కళ్ళలో కనిపించే అపారమైన కరుణ. మా అమ్మ గుర్తొచ్చింది. తన్నినా అక్కున చేర్చుకునే వాళ్ళు అమ్మ కాక ఎవరుంటారు! అందుకే మా ఊరు వెళ్తున్నాను, అమ్మ ఒళ్ళో తలవాల్చి మళ్ళీ కన్నీళ్ళు కార్చడానికి.

సొంత తమ్ముణ్ణి దక్కించుకోలేకపోయావు కానీ, ఈ తమ్ముణ్ణి కాపాడావు అక్కా! నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఊరినుంచి తిరిగి వచ్చాక మీ కాళ్ళపై పడి ప్రణమిల్లుతాను. క్షమిస్తావు కదూ?

నీ తమ్ముడు,

ఉదయ్

 

సుభద్ర కళ్ళలో ఆనందభాష్పాలు. గోడపైన తన తమ్ముడి ఫొటో కేసి చూసింది ఓ సారి. బయట అప్పుడే చీకట్లు కరిగిస్తూ సూర్యుడు ఉదయిస్తున్నాడు.

*

 

 

 

 

 

 

 

 

 

పెంపుడు జంతువు

 

-అల్లం కృష్ణ చైతన్య

~

 

విపరీతమైన వర్షం..

అర్జునా.. అనుకోడానికి వీలు లేని విధంగా ఉరుములు మెరుపులు..

ఎందుకంటే పైన రాసిన తొమ్మిది పదాలు కూడా ఇంకా కనిపెట్టని రోజులు అవి.

మెరుపు మెరుస్తున్నదనే విషయం మెరుపుకి కాదు కదా దాని కన్నా ముందే వచ్చే ఉరుముకి కూడా అవగాహన లేని రోజులవి.

తిండి తిని మూడు రోజులయింది ఇవాల్టికి.

ముందర ఉరుకుతున్న జింక పిల్ల ని ఛేదింఛే బ్రహుత్కార్యం అనితర సాధ్యం అని తెలుసు. మెదడు వృధా అంటున్నది, మనసు పదా అంటున్నది.

మొత్తానికి జింక పిల్ల తప్పించక పోయింది.

మూడు రోజులక్రితం నిల్వ చేసుకున్న కొద్ది పాటి శక్తి నిల్వలు దేహంలో తరిగిపోయినై.

ఇంకా కొద్దిగా ఉరుకుదాం అనుకున్నడు వాడు.

ఇంచు కూడా కదలడానికి సిద్దంగా లేదు దేహం.

ఉన్న చోటనే నిట్టనిలువునా కూలిపోయిండు.

ఎంత కాలం గడిచిందో..

 

తడి తడిగా ఎదో స్పర్శ.. బంక బంకగా..

ఉన్నంతనే లేచి చూస్తె ఏ ప్రమాదం ముంచుక వస్తదో అని, మెల్లగ ఒక కన్ను తెరిచి చూసిండు.

స్పష్టమైన ఆకారం లేదు.

ఎవరో నాకుతున్నట్టు… తన మొహమంతా ఎదో జిహ్వ తాలూకు ఆచ్చాదన. .

చేతికి ఎదో తగిలింది.

తడిమి చూస్తె అర్ధం అయింది.. గట్టిగా ఉన్న పదార్థమే అని..

ఒక్క అడుగు ముదుకు పడితే తల పగలకోడదామనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు.

మెల్లగ రెండు కళ్ళు తెరిచి చూస్తె, చిన్న కుక్క పిల్ల.

తనలాగే దారితప్పిన జీవితం. మెల్లగ దగ్గర తీసుకున్నాడు వాడు.

గట్టిగ మొత్తుకునే ఓపిక లేదు దానికి, ప్రతిఘటించే శక్తి లేదు, దిక్కరించే తెలివి లేదు.

గుహలో వాడు, తను. చేవలేని రెండు జీవాలు.

 

***

కొన్ని మంచులు, కొన్ని ఆకురాలు కాలాలు గడిచినై. పెద్ద తోడేలు లాంటి ఆకారానికి మారింది అది. ఒకరిది బుద్ది బలం, ఒకరిది నాలుగు కాళ్ళతో వేగంగా వేటాడే కండబలం. ఇద్దరు కలిసి చేసే వేట బాగానే నడుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆకలితో పడుకున్న దాఖలాలు లేవు ఇద్దరికీ.

 

ఊహ తెలిసినప్పటి నుండీ వాడు ఒంటరి వాడే. వాని సమూహం ఉన్నదో లేదో కూడా వానికి తెలవదు. ఇద్దరి మధ్యా భాష లేదు. వల పన్ని సైగలతో వాడేదో చెప్తాడు దానికి. అది తరుముతూ చిన్నా చితకా జంతువులని వలలో పడేటట్టు చేస్తుంది. గుంటలు తవ్వి ఉంచుతాడు. ఒకటి రెండు సార్లు అందులో పడితే వాడు దాన్ని బయటకు తీస్తాడు. తను తప్ప వేరే జంతువేదయినా అందులో పడితే అది వాళ్లకు ఆహారమే. మెల్ల మెల్లగా ఇద్దరూ భాష లేకుండా ఒకరికొకరు సాయపడడం నేర్చుకున్నారు.

 

వేట, తిండి వరకే వానికి దాని మీద ఉన్న దోస్తానా. దానికి మాత్రం వాడే సర్వస్వం. బహూశా వానికి కూడా దాని మీద వాడు అనుకునేదానికన్నా ఎక్కువే అభిమానం ఉండొచ్చు కానీ ఆ విషయం వానికి తెలిసే అవకాశమే రాలేదు.

 

స్వతహాగా వాడు తెలివైన వాడు. జన్యువిశేషం ఉన్నవాడు. అది ఎంత మిత్రపాత్రమైనా వాడు దాన్ని ఒక మూర్ఖ జంతువుగానే చూస్తాడు. తను దానికన్నా ఎక్కువ అనే విషయం ఎప్పుడూ మరచిపోడు. కోపం వస్తే చెయ్యి, కట్టే, బండ కూడా చేసుకుంటాడు దాని మీద. కుయ్ కుయ్ మని తన అపరాధం ఏంటో తెలవకపోయినా వాని కోపాన్ని భరిస్తుంది కానీ అది వాని మీదకు తిరగబడదు. దానికి అదే ఏర్పరుచుకున్న ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అదెప్పుడూ పాటిస్తుంటుంది.

 

***

గత కొన్ని రోజులుగా ఎడతెగని విపరీతమైన వర్షం. ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి నేల మీద దాదాపు రెండు అడుగుల దాకా వర్షపు నీరు ఆగిపోయి ఉంది. ఎండిన ఆకులు నీటి ఉపరితలం మీద తేలుతూ ప్రవాహంతో పాటుగా ప్రయాణిస్తున్నై. ఎత్తుగా పెరిగిపోయిన చెట్ల నీడల వల్లనో, మబ్బు పట్టిన ఆకాశం వల్లనో గానీ కొద్ది పాటి వెలుగు తప్ప రవి కాంచేటందుకు పెద్దగా ఆస్కారం లేదు. పిట్టలు, ఉడతలూ లాంటి చిన్న స్థాయి జీవజాలం దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోయినాయి ఆ వర్షపు హోరుకి. దీంతో ఆహారం గోలుసుకి కొంచెం పైన ఉండే జంతువులన్నీ ఆకలితో అలమటిస్తున్నై. ఇప్పుడు బయటకు పోతే ఎంత ప్రమాదమో తెలిసిన వాడు కాబట్టి వాడు బయటకు పోయేందుకు సాహసించలేదు.

కడుపులో ఆకలి క్రూరంగా దహిస్తుంది. మనసు వద్దంటుంది. మెదడు కుక్కని పంపమని చెప్తుంది. ఉన్న చోట నుండి లేచి కుక్కని ఒక్క తన్ను తన్నిండు.

కుయ్ కుయ్ అన్నది. ఆకలి తో పాటు ఈ శారీరక బాధ కూడా బాధించలేదు దాన్ని. వాని నిస్సహాయత్వం అది అర్ధం చేస్కున్నది.

వాడు ఎడమ చెయ్ నోరు దిక్కు చూపి కుడి చెయ్ గుహ అవతలికి చూపెట్టి దాన్ని ఇకొక్క తన్ను ..

వర్షం, ఆకలి, కడుపులో వాని తన్ను ద్వారా రగులుతున్న నొప్పి అన్నీ మర్చిపోయి బయటకు పోయింది వేట కోసం.

***

ఎన్ని గంటలు గడిచినాయో.. కాలం లెక్క లేదు. బయటికి పోయిన జంతువు జాడ లేదు.

లోపాలున్నా, బయటకు పోయినా చచ్చే పరిస్తితి సమీపించే సరికి తప్పని సరయి బల్లెం తీసుకుని అతి కష్టం మీద చేతకాని ఆ దేహాన్ని లేవదీసుకుని బయటకు పోయిండు వాడు.

దూరంగా ఊళలు, గాండ్రింపులు అక్కడక్కడా వినవస్తున్నై. దాక్కుంటూ, పాక్కుంటూ ఒక్కో చెట్టూ దాటుకుంటూ చిన్నపాటి ఫలమో, జీవమో వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు వాడు.

 

వర్షం ఇంకా భీకరంగానే ఉన్నది. చాలా వరకు ఆ వర్షంలో నాలుగు అడుగుల ముందు ఎం జరుగుతుందో కూడా కనిపించడం లేదు.

ఎంత దూరం పోయినా ఏమీ దొరకలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు మీదకు ఒరిగాడు.

పొదల్లో ఎదో కనిపించింది. చిన్న కుందేలు లాగా ఉంది. దొరికిందిరా అనుకున్నాడు. ఒక్క ఉదుటున దాని మీద పది అందుకునే ప్రయత్నం చేసిండు. ఒక్క సెకన్ లో మొత్తం మారిపోయింది.

అది కుందేలు కాదు. ఆకలితో ఉన్న తోడేలు. గుబురుగా ఉన్న దాని తోకని పట్టుకున్నాడు కుందేలనుకుని. వెతకబోయిన ఆహారం తోకకి తగిలిన తోడేలు కొంచెం కూడా సమయం వృధా చేయలేదు. దాని తోక ఇంకా వాని చేతులో ఉండగానే వెనకకు తిరిగి వాని కాలు అందుకుంది. దాని నుండి తప్పించుకునేందుకు వృధా ప్రయాసలు చేస్తున్నాడు. అడవి పిక్కటిల్లే అరుపులు అరుస్తున్నా వర్షం హోరులో అవి ఎక్కువ దూరాన్ని చేరడం లేదు.

అప్పటికే చాలా రక్తం పోయింది. ఇంక అయిపొయింది నా పని అని వాడు పెనుగులాడడం ఆపెసిండు. స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. ఎదో పెద్ద అరుపు వినిపించింది. నల్లని ఆకారం ఎదో కనిపించింది. తరవాత అంతా చీకటి.

****

ఆ చీకట్లో ఎన్ని రోజులున్నాడో.. అలా ఎన్ని యుగాలు గడిచాయో.

మెల్లగా కళ్ళు తెరిచి చూస్తె పచ్చటి ఆకులు. కొద్ది కొద్దిగా రవి కిరణాలు. చెట్ల పైన, ఎదో అటవీ ఉపరితలం మీద ఉన్నట్టు అర్ధం అయింది వానికి. రాళ్ళూ రప్పలు, చెట్లూ చేమలు ఇదంతా తానెప్పుడూ చూడని అటవీ భాగం. తన దిక్కుగా పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక భారీ కాయం.

గుండె జారి పెద్ద లోయలో పడ్డంత పనయ్యింది వానికి. అదొక పెద్ద కోతి. కాకుంటే నల్లగా గుబురు గుబురుగా ఉంది. తానెప్పుడూ అలాంటి జాతిని చూళ్ళేదు. దాని ఒక్కో చెయ్యి కూడా తన కంటే పెద్దగా ఉంది. గుండె శరవేగంగా కొట్టుకుంటుంది. ప్రాణాలు అరచేతిలో ఉన్నాయ్.

అది దగ్గరకు వచ్చి ఒక వేలుతో తనని మెల్లగా పొడిచింది. బహుశా ఎంత ప్రాణం ఉందొ అని చూస్తుంది కావచ్చు. అసలే సత్తువ లేని ప్రాణానికి ఆ చిన్న పాటి పొడుపు కూడా నొప్పిగా ఉంది. చిన్నగా మూలిగాడు.

తానెప్పుడూ చూడని కొన్ని పళ్ళని ముందుకు తెచ్చి పడేసింది. తినమని చిన్నగా శబ్దం చేసింది.

మరు నిముషంలో అది తెచ్చిన ఆహారం అంతా మాయం చేసాడు వాడు.

పెద్ద బ్రేవ్ తరవాత వాని మెదడు కొంచం లోకం లోకి వచ్చింది. ఎక్కడ ఉన్నది ఏంటనేది అర్ధం అవుతుంది. తిండి పెట్టింది కాబట్టి ఈ కోతి హాని చేయదు అనే నమ్మకం కలిగింది.

మెల్లగా పోదాం అని దాని దిక్కే చూస్తూ చెట్టు కొమ్మ దగ్గరికి పోయే ప్రయత్నం చేసిండు వాడు. అది నిర్దాక్షిణ్యంగా వాడి చెయ్ పట్టుకుని మళ్ళీ వాడున్న దగ్గరికే తీసుకొచ్చి పడేసింది.

****

కొన్ని మంచులు కరిగిపోయినై. కొన్ని ఆకులు రాలినై. ఇద్దరూ కలిసి మెలిసి పండో ఫలమో వెతుక్కుని తింటూ ఉన్నారు.ఆకలి సమస్య లేదు, అది ఏ జంతువునీ చంపదు, వీన్ని చంపనివ్వదు. దయా కారుణ్యం అంటే ఏంటో నేర్చుకున్నాడు. తోటి జీవరాశిని గౌరవించడం నేర్చుకున్నాడు. అవసరం అయితే ఆత్మ రక్షణార్ధం తప్ప మరేతర జంతువుకీ హాని తలపెట్టని ఆ  కోతి స్వభావం నుంచి కొంత విచక్షణ అలవడింది.

ఇప్పుడు కొంత జంతుజాలం తనని చూసి భయపడి పారిపోవడం లేదు. తన జాతి, తన వర్గం, తనతో పాటుగా కలిసి మెలిసిపోయే జాతుల వర్గాల వ్యత్యాసాలు అర్ధం అవుతున్నాయి. ఒక రకమయిన కోడ్ తనతో కానవచ్చే జంతుజాలంతో పరస్పరంగా ఏర్పడింది.

అయినా ఏ జంతువుతో తమ సంబధం ఎలా ఉండాలనే దానికి కోతి గారే డెసిషన్ మేకర్.  పళ్ళు కోసుకోడానికి దాని చేతికి అందని చోట వీని చేతులు పనికి వస్తాయి. వీడు సాయం చేసినా, కలిసి ఆహారం సంపాదిస్తున్నా దాని ఆకారం, బలం ముందట వీడు చిన్న మూర్ఖపు జంతువు మాత్రమె. వేట లేని ఈ కొత్త చోట వీని వేట నైపుణ్యం కూడా వృధా అయింది. ఎక్కువ తక్కువల ఆలోచన వచ్చింది. నేను ఈ కోతికి కుక్కని అనుకున్నాడు వాడు.

అవసరం లేదు కావచ్చు, ప్రాథమిక ఆటవిక స్వభావం, వేట ఎదయితేనేమి. పళ్ళూ , ఫలాలూ .. ఇది జీవితం కాదు అనిపించింది వానికి. నా కుక్క.

మొట్ట మొదటి సారి వానికి నా అనేది అనుభవంలోకి వచ్చింది.

ఇద్దరం కలిసి గడిపిన ఎన్నో సంఘటనల సమాహారం అంతా కాళ్ళ ముందర కదలాడుతుంది. వాగుల్లో, పరుగుల్లో, వేటల్లో, ఆటల్లో .. ఆకలిలో, కష్టాల్లో, నష్టాల్లో..  చివరి సారిగా దాన్ని చూసినప్పుడు నిర్దాక్షిణ్యంగా తన్ని పంపించిన సంఘటన గుర్తుకి వచ్చింది. కళ్ళలో నీళ్ళు తిరుగున్నాయ్. వాటితో ఏం చేయాలో తెలవదు వానికి. మొట్ట మొదటి సారిగా వచ్చినై అవి.

 

కోతికి మనసొప్పలేదు. వాని కన్నీళ్లు దాన్ని కలవరపరిచినై. అది అటూ ఇటూ కొమ్మలు పట్టుకుని ఊగింది. వాడి దగ్గరికి వచ్చి కూచుంది. వాని కంట్లో ఇంకా కన్నీళ్లు కారుతున్నై.

అది కిందకు దిగే కొమ్మ దిక్కుకి చూపిస్తూ వాణ్ని తడిమింది.

వాడు నమ్మలేకుండా ఉన్నాడు. అప్రయత్నంగా దాని చెయ్ పట్టుకుని చిన్నగా ఒత్తిండు.

***

చెట్టు దిగి ఆపకుండా ఉరుకుతున్నాడు.

తనూ, తన కుక్కా , గుహా మాత్రమె మనసుల మెదలుతున్నై…

*

జన్నెకిడిశిన గిత్తగుండెల ప్రేమజనించింది

 

 

-కందికొండ

~

 

ఒక్క తల్లి గర్బంల నా బుజం మీద వాడు వాని బుజం మీద నేను శేతులేసుకోని ఉమ్మనీరులో తేలాడుకుంట, నేను ముందు వాడు ఎనుక అముడాళోళ్ళమై(కవలపిల్లలు) పుట్టినట్టు వాడు నన్ను అన్న.. అన్న… అని మస్తు ప్రేమతోని పిలిశెటోడు. నోట్లె అన్నను బయటికి తీశెటోడు కాదు. గుండెకే గుండె వుంటే ఆ గుండెకే పెదవులుంటే ఆ పెదవులు అన్న.. అని పిలుస్తె ఎంత డెప్త్‌గుంటది. ఎంత ప్రేమగుంటది. ఎంత పావురంగుంటది అట్లుండేది. ఒక్క ముక్కల జెప్పాల్నంటే వాడు అన్న. అనంగనే ఆ మాట నా కర్ణభేరిని తాకంగనే నా చెవులల్ల అమురుతం(అమృతం) పోషినట్టుండేది. వాని పేరు రాజు. వాంది మా పక్కిల్లు. వాడు మా అవ్వోడో, అయ్యోడో గాదు. మా కులపోడో, తలపోడో గాదు కాని మేం ఒకలంటే ఒకలకు మస్తిష్టం. ఎంతిష్టమంటె గుండె కోషి ఇచ్చుకునేంత ఇష్టం. మేము ఈ ఫేసులే తెలువని ఫేస్‌బుక్కు ఫ్రెండ్సు గాదు, మాకు తెలువులచ్చి, ఊహ తెలువకముందు నుంచెల్లే మేము ఒకలకొకలం తెలుసు.

వాళ్ళ అవ్వ, మా అవ్వ మా ఊరి పొలాలల్ల నాటేసెదానికి, కలుపు తీసెదానికి పోయెటప్పుడు మమ్ముల్నిద్దర్ని ఒక ముసలవ్వకు అప్పజెప్పి ఆ ముసలవ్వకు ఎంతో కొంత పైసలిచ్చి మా ఇంటి ముందు యాపశెట్టు కిందనన్నా, వాళ్ళింటి ముందు చింతశెట్టు కిందనన్నా వాకిట్ల ఇడిషిబెట్టి పోయెటోళ్ళట. నేను, రాజుగాడు అంబాడుకుంట (పాకుకుంట), పడి లేసుకుంట, నవ్వుకుంట, తుళ్ళుకుంట పొద్దుగూకెదాక మా అవ్వలు నాటుకు, కలుపుకుబోయి వచ్చెదాక వాకిట్ల ఆడుకునెటోళ్ళమట. అగో… మేము అప్పడిసంది ఫ్రెండ్స్..

మాది వరంగల్ జిల్లాల చిన్న కుగ్రామం. మా ఊళ్లె మాకత్తు పోరగాండ్లం శానామందిమె వుండెటోళ్ళం కని మేం ఇందరమే మంచి సాయితగాండ్లం (ఫ్రెండ్స్) అయినం..మా ఊరి బడిల ఐదో తరగతి వరకే వుండేది. మేము 1978ల బడికి పోవుడు మొదలుబెట్టినం. ఒక పెద్ద తాటాకు కమ్మల కొట్టంల ఏక్లాసోల్లను ఆక్లాసుల లెక్కన కొంచెం దూరం దూరంగా కూసుండబెట్టేటోళ్ళు. రాజుగాడు నేను పక్కపక్క పొంటి కూసునెటోళ్ళం. అప్పుడు షాబద్ బండలా… ఏమన్ననా.. న్యాల(నేల)మీద మట్లె(మట్టి)నె కూసోవాలే. లాగులు రాకిరాకి పిర్రలకాడ శినిగిపోయేటియి. లాగులు షినిగిపోకుంట వుండాల్నని యూరియ పిండి బస్తాల సంచులు తీసుకపోయి ముడ్డికిందేసుకోని కూసునెటోళ్ళం. అట్లా అందరు ఎవ్వల బస్తా వాళ్ళేసుకొని కూసుంటాంటె రాజుగాడు మాత్రం అన్న.. మన రొండు బస్త సంచులు ఒకదానిమీద ఒకటేసుకుని కూసుందమే అనెటోడు. కూసున్నంక నాకు ఎక్కువ జాగిచ్చి  వాడు సగం మట్టిల్నే కూసునెటోడు “ఎహె బత్తమీద కూసోర రాజుగా మట్టంటుతాందికాదుర నీ కాళ్లకు” అని నేనంటే “ఎహే నాకేంగాదు లేవె నువ్వు మంచిగ గూకో”అనెటోడు. పిచ్చి గాడిది రాజుగానికి నేనంటె శాన ప్రేమ.

ఎండకాలంల మా ఊరి చెరువులకు ఈతకు బోయెటోళ్ళం. మాకు ఈత ఎవ్వలు నేర్పలే. మాకు మేమే నేర్చుకున్నం. మేము నీళ్ళల్ల ముంచుకునుడు ఆట ఆడుకునెటోళ్ళం. ఎవ్వల వంతచ్చినప్పుడు వాళ్ళు  తతిమ్మోళ్ళను (మిగతావాళ్లను) ముంచాలె. ముంచుతాంటె తతిమ్మోళ్ళు తప్పిచ్చుకోవాలె. నావంతు వచ్చినప్పుడు రాజుగాడు దొరికినా నేను వాణ్ణి ముంచకపోయేది. వాని వంతచ్చినప్పుడు వాడు నన్ను ముంచకపోయేది.

మేము తాడిచెట్టు అంత ఎత్తునుంచెల్లి చెరువుల దునుకెటోళ్ళం. రాజుగాడైతే డై కొట్టెటోడు. ఇప్పటి పోరగాడ్లను సూతె నవ్వత్తది. స్విమ్మింగు పూల్లకు నడుముమంటి లోతులకు దిగెదానికి కూడా నడుము సుట్టు ట్యూబ్ వుండాలె. అంత నాపగాండ్లు బాయిలర్ కోడీ బతుకులయిపోయినయ్. “జిసం మే తాకత్ నియే దిల్‌మే దమ్ బీ నియే”. మా కత్తు (వయసు) పోరగాండ్లం అందరం గలసి తలా (ఒక్కొక్కరు) పది పైసలు కలేసుకొని టౌన్‌కుబోయి ఒక లబ్బరు  శెండు(బాల్)కొనుకచ్చుకున్నం. పెంకాసులు ఒకదాని మీద ఒకటి పెట్టి పల్లి ఆట ఆడెటోళ్లం.శెండుతోని కొట్టుకునుడు ఆట ఆడుకునెటోళ్లం. నన్ను రాజుగాడు, రాజుగాణ్ని నేను చిన్నగ కొట్టుకునెటోళ్ళం. వేరేటోళ్ళనయితే ఈడిషికొట్టేటోళ్ళం. తతిమ్మా పోరగాండ్లందరూ మమ్ములిద్దరిని తొండి బాడుకావ్‌లు అని తిట్టెటోళ్ళు.

మా ఊళ్ళె ఐదో తరగతి అయిపోంగనే మాకు T.C.లిచ్చిండ్లు. మేము వరంగల్‌కు పోయి U.P.S. బళ్ళె శేరికయినం. దీంట్లె 6th, 7th సదవాలె తరవాత హైస్కూల్ అది వేరే బడి మళ్ళా.

ఏడు గంటలకే ఒత్తుల వేడినీళ్ల తోటి తానం జేసి(స్నానం) రాజుగాడు, నేను తయారయ్యెటోళ్ళం. అప్పుడు మా అవ్వలు కట్టెల పొయ్యి మీద అన్నం, కూర వండతాంటెనే ఓ పక్క(వైపు) ఒత్తుల (కుండ)నీళ్లు కాగేటియి. ఏడుగంటలకే బువ్వ తిని రాతెండి టిపిని గిన్నెల (లంచ్ బాక్స్)అన్నం బెట్టుకొని ఐదు కిలోమీటర్లు కంకరరోడ్డు మీద చెప్పులు లేకుంట వట్టికాళ్లతోటి నడుసుకుంట బోయెటోళ్ళం. సాయంత్రం నాలుగ్గొట్టంగ  బడి ఇడిషిబెట్టేది. నాలుగునుంచెల్లి నాలుగున్నర దాక డ్రిల్లు (ఆటలు) పీరియడ్. బడి ఇడిషిబెడుతరు కాని గేటుదాటి బయటికి పోవద్దు. అక్కణ్ణె ఆడుకోవాలే. రాజుగాడు నేను గోడ దునికి ఇంటిబాట బట్టేది. టౌన్ నుంచెల్లి మా ఊరికి ఐదు కిలోమీటర్లు నడువాలే. అక్కడ ఆటలాడుకుంట కూకుంటే మాకు కుదురది గదా. ఎండకాలంల బుజాలమీద వయ్యిలు(పుస్తకాలు) పెట్టుకొని పోతాంటే చేతుల చెమట వయ్యిలకంటి (బుక్స్‌కు అంటి) చేతుల పదను(తడి)తోటి పుస్తకాలు కరాబయ్యేటియి. అప్పుడు వయ్యిలకు (బుక్స్‌కు) అట్టలేసుకుందామంటే న్యూస్‌పేపర్లు దొరుకకపోయేటియి. ఇట్లయితే కుదరదని మా ఊళ్ళె టైలర్”ఖాదర్” దగ్గర యూరియా పిండి బస్తాల సంచులతోటి చెరో (ఒక్కొక్కరం) వయ్యిల సంచి కుట్టించుకున్నం. ఇగ వయ్యిలు, కాపీలు,ఆ సంచులల్ల ఏసుకోని సంచి బుజానికేసుకోని పోయెటోళ్ళం. ఇప్పటి పొట్టెగాండ్లకు అన్ని సౌలతులు(సౌకర్యాలు) వున్నా సదివి సావరు. “సదువు సారెడు బలుపాలు దొషెడు” అయిపోయింది ఇప్పటి సదువు. యాసంగి సదువులు.

మా అప్పర్ ప్రైమరీ స్కూల్  హెడ్ మాస్టర్ పేరు బాలయ్య సారు. మేం ఆ బడిల శెరీకయ్యినప్పుడే ఆ సారు ఓ కొత్త ఇల్లు కట్టుడు సురువు జేషిండు(మొదలు చేశారు). ఆ కొత్తింటికాడ శానా చిల్లర పనులుండెటియి. మిగిల్న కంకర ఒక దగ్గర నుంచెల్లి ఇంకోదగ్గర కుప్పబోసుడు. ఇంటిముందు పోషిన మొరం కుప్పల  నేర్పుడు (సమాంతరంగ చేయడం), ఇటుకలు ఇరిగిన ముక్కలు ఒక దగ్గర, మంచి ఇటుకలు ఒక దగ్గర పేర్సుడు, గిలాబు కోసం దొడ్డు వుషికెను(లావు ఇసుకను) సన్నగ జల్లెడబట్టుడు, పదను(క్యూరింగు) కోసం గోడలకు, స్లాబ్‌కు నీళ్లుగొట్టుడు, అర్రలల్ల (రూమ్స్) బోసిన మట్టి అణుగాల్నని “దిమ్మీస”గుద్దుడు ఇసొంటియి.

మేం పల్లెటూరోళ్ళం మంచిగ పనిజేత్తమని తెల్లబూరు (White Hair) చెప్రాశి(ప్యూన్) యాకుబ్‌ని పంపిచ్చి మమ్ముల పిలిపిచ్చెటోడు బాలయ్య సారు. మేము సంకలు గుద్దుకుంట సంబురంగ సారు కడుపు సల్లగుండ అనుకొని సారు కొత్తింటి పని జేసెటానికి పోయెటోళ్ళం. మా లెక్కల (మాత్స్) సారు చెయ్యబట్టి మాకు బడంటె బయ్యమయ్యేది. లెక్కలేమో అర్ధం గాకపోయేది. a2+b2=2ab..అని ఏందేందో శెప్పేది. ఇంటి పనిచ్చేది(హోం వర్క్).  చేసుకరాకపోతే మా శేతులు తిర్లమర్ల జేపించ్చి బ్లాక్‌బోర్డ్ తుడిసేటి చెక్క డస్టర్‌తోటి పటపట కొట్టేది. ఒక్కొక్కసారి మాకు మస్తు కోపమచ్చి అరె.. మాకు అర్ధమైతలేవు సారు ఏంజెయ్యాలే అనాల్ననిపిచ్చేది. నోటిదాకచ్చేది కని ఆపుకునేది. అందుకే ఆ దెబ్బలకన్నా ఈ పనే నయ్యమనిపిచ్చేది.

మాకు కష్టం జేసుడంటే సంబురం. మేము పల్లెటూరోళ్లం, ఉత్పత్తి కులాలోళ్లం గదా,మా బతుకుల నిండా కష్టముంటది, కన్నీళ్లుంటయి, ఆకలుంటది, అవమానముంటది, పోరాటముంటది. అందుకే గద్దరన్న పాట రాయలే. “కొండ పగలేసినాం, బండలను పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో” అని.. మేం బిచ్చగాండ్లకు ఎక్కువ, మధ్య తరగతోళ్లకు తక్కువ. దిగువ మధ్య తరగతోళ్లం. బతుకు దినదిన గండమయినోళ్లం, దిగులే బతుకయినోళ్ళం ఇప్పటికి కూడా అట్లనే వున్నయ్ మా బతుకులు. పనిజేసి పగటాల్ల   కాంగనే కాళ్లు రెక్కలు కడుక్కొని మా రాతెండి టిపిని గిన్నెలల్ల తెచ్చుకున్న  అన్నం తినెటోళ్ళం.

తింటాంటె బాలయ్య సారు భార్య మాకు రొండు బొక్క పిలేట్లిచ్చి (పింగాణి ప్లేట్స్) వాళ్ల ఇంట్ల కూరలు తెచ్చిచ్చేది. ఆమె చేతికి మొక్కాలే. ఏమేషి వండేదో ఏమోగాని, మస్తు రుసుండేటియి. అప్పుడప్పుడు ఆమె “సాంబార్” బోశేది. మాకు పప్పుశారు, పచ్చి పులుసు తెలుసుకని ఈ సాంబార్ తెల్వది. మా ఇండ్లళ్ల అప్పుడు సాంబార్ శెయ్యకపొయ్యేది. దాని పేరు సాంబార్ అని కూడా మాకు సరిగ్గ తెల్వది. ఆ సాంబర్ పోసుకొని తింటాంటే శానాసార్ల రాజుగాని తోటీ నేననేది “అరె రాజుగా ఈ సాంబారేందిరా గింత రుశి పాడుబడ్డది” అని వాడనేది అన్న.. ఇంకింత బోసుకోవే…. పోసుకో అని మొత్తం నా పల్లెంల కుమ్మరించెటోడు లంగగాడు. నేనంటె వాణికి సచ్చేంత ఇష్టం. మొత్తం నాకే పోషినవేందిర పిచ్చిగాడిది అని తిడితే నవ్వేది. అన్న నువ్వు పిచ్చిగాడిది అంటె నాకు మంచిగనిపిస్తదన్న అని మళ్ళా తిట్టిపిచ్చుకునేటోడు.

మా ఊరినుండి టౌనుకు పోతాంటే కుడిచెయ్యిరోకు (రైట్ సైడ్)”లంజపుట్నాల” చెట్టుండేది. ఈ చెట్టు ప్రత్యేకతేందాటంటే ఆ చెట్టు పుట్నాలు (పండ్లు) సప్పుడు జెయ్యకుంట, మాట్లాడకుంట, సైలన్స్‌గా, చీమె చిటుక్కుమన్నంత సప్పుడుగూడ జెయ్యకుంట తెంపుకొని తింటె మస్తు తియ్యగ వుంటయంట. తెంపుకుంట మాట్లాడినా, నోట్లెబోసుకొని నమిలేముందు మాట్లాడినా, గుసగుస పెట్టినా, నవ్వినా, దగ్గినా, తుమ్మినా, చేదు అయితయట. అందుకే వాటికి లంజపుట్నాలు అని పేరొచ్చిందట అని ప్రచారంల వుండేది. ఇసొంటి చెట్లు చానా ఊళ్లల్ల వుంటయ్. ఈ ఇత్తునం (విత్తనం) ఇప్పుడు శానా తగ్గింది. ఇప్పటి పొట్టెగాండ్లకు తెల్వకపోవచ్చుకని మా కత్తోళ్ళ (వయసు)కు తెలుసు.

రాజుగాడు నేను ప్రతిరోజు బడికిపోయెటప్పుడు వచ్చెటప్పుడు తప్పకుంట “లంజపుట్నాల” శెట్టు పుట్నాలు(పండ్లు) తెంపుకునెటోళ్లం. రాజుగాడు వుస్తు కోతిగాడు, ఎచ్చిడోడు, వుచ్చిలి మనిషి. తెంపుతానంటెనన్న నవ్వేది, లేకపోతే దగ్గేది, తుమ్మేది. నోట్లెబోసుకోని నవులేముందన్న నవ్వేది, గుసగుసబెట్టేది. ఏదో ఒకటి మాట్లాడేది. రోజులు, నెలలు, సంవత్సరాలు వాంది ఇదే కత. “అరె రాజుగా నీకు దండం బెడుత ఈ రోజన్నా మాట్లాడకురా, ఇగిలియ్యకురా, దగ్గకురా, తుమ్మకురా అని వాణి గదువపట్టుకోని బతిలాడెటోణ్ణి (రిక్వెస్ట్) సరే.. అన్న.. అనేటోడు.. తీరా…పుట్నాలు తినేముందు మళ్లా ఏదో ఒకటి చేశెటోడు.

అప్పుడు మా దగ్గర పైసలు అసలే వుండేటియి కాదు. మాకు మా అవ్వనాయినలు కూడా పైసలిచ్చెటోళ్ళు గాదు. పాపం వాళ్ల దగ్గరకూడా వుండేటియిగాదు. మాయి మస్తు లేమి కుటుంబాలు కని మాకు తొవ్వ ఖర్సులు, శేతి ఖర్చులుంటయిగద, మాకు కోముటోళ్ళ దుకాండ్ల కొబ్బరి శాకిలేట్ళు, ఉప్పు బిస్కీట్లు కొనుక్కోవాల్నని వుండేది. సిన్మాలు సూడాల్నని వుండేది. మేం పైసలు సంపాయించుడు కోసం “పెంట బొందలమీద  సీసవక్కలు ఏరుకునెటోళ్ళం” చెరో యూరియా బస్తసంచి పట్టుకొని మా ఊరంత తిరిగి ఏరుకునెటోళ్ళం. అప్పుడు మా ఊళ్ళె ఖాళీ జాగాలల్ల  ఎక్కువ చిలుక పర్రాకు చెట్లు, ఎంపలిచెట్లు, బోడసరం చెట్లు, జిల్లేడు శెట్లు, శెవుకచెట్లు వుండేటియి.

ఎంపలి చెట్లల్ల ఎక్కువ సీసవక్కలు దొరికేటియి. మా బస్తాలు నిండంగనే తువ్వాలలు  సుట్టబట్ట చేసుకొని నెత్తిన బెట్టుకోని టౌన్‌కు బోయేటోళ్ళం. రాజుగానికి నేనంటె ఎంత ప్రేమంటే పెద్ద సీసవక్కల బస్త వాడెత్తుకొని చిన్న సీసవక్కల బస్త నాకు ఎత్తెటోడు.” అరె… పెద్దది నేనెత్తుకుంటరా అని నేనంటె ఎహె.. ఊకో అన్న.. నీది సుకాశి పాణం(సుకుమారమైన). నువ్వు నా అంత కష్టం జెయ్యలేవే. నేనే పెద్దది ఎత్తుకుంటలే అనెటోడు. అంతంత బరువులు ఎత్తుకొని పోతాంటె కూడా ఆ “లంజపుట్నాల” చెట్టుకాడ మాత్రం ఆగెటోళ్లం. పుట్నాలు తెంపుకొని తినేముందు మళ్లా రాజుగాడు నవ్వుడో, తుమ్ముడో, దగ్గుడో చేసెటోడు. అరెయ్… రాజుగా లుచ్చ బాడుకావ్ గిట్ల జేసేదనికేనార ఆపింది అని నేను తిడితె ఏం జెయ్యాల్నన్నా నవ్వు ఆగుతలేదే అని మళ్లా కిలుక్కున నవ్వెటోడు. టౌన్‌కుబోయి సీసవక్కలు జోకి(తూచి) అమ్మి వచ్చిన పైసలు చెరిసగం పంచుకునెటోళ్లం. కని ఇప్పటి శాతగాని దొంగనాకొడుకులు ఆడోళ్ళ మెడలల్ల బంగారు గొలుసులు తెంపుకపోతాండ్లు. మళ్ళ వాళ్లకు ఈ పోలీసోళ్ళు మస్త్ పోష్(Posh)గా స్టైల్‌గా ఓ పేరు బెట్టిండు చైన్ స్నాచర్లట.. చైన్ స్నాచర్లు.

ప్రతిరోజు ఈ పది పన్నెండు కిలోమీటర్లు బడికి నడువలేక మేం సాంఘిక సంక్షేమ హాస్టల్ల  చేరినం. మాకు పొద్దున 8.30కు పప్పుతోని, మళ్లా సాయంత్రం 5.30 గంటలకు కూరగాయలతోటి అన్నం బెట్టేటోళ్ళు  పొద్దున, సాయంత్రం. పచ్చిపులుసు మాత్రం రొండు పూటల వుండేది. మేము లైన్ల నిలబడి రాతెండి పల్లాలల్ల అన్నం బట్టుకోని తినెటోళ్ళం. అప్పుడప్పుడు అన్నంల పురుగులత్తె పక్కన పారేశి తినేటోళ్ళం. వారానికోసారి మాకు హాస్టల్ల ఉడుకబెట్టిన కోడిగుడ్డు బెట్టేటోళ్ళు. రాజుగాడు వాణి గుడ్డు గూడ నాకేసెటోడూ. అరె లంగగాడిది నీది నువ్వు తినరాదురా అని నేనంటే “అన్న… నువ్వొకటి నేనొకటానే” అనెటోడు. బళ్లెగాని రాజుగాణ్ని ఎవ్వలన్న కొడితె ఉరికచ్చి నాకు శెప్పెటోడు.

రాజుగాడు జెర దైర్నం (ధైర్యం) తక్కువ మనిషి. నా అంత మొండోడుగాదు. నేను మోర్‌దోపోణ్ణి. రాజుగాణ్ణి కొట్టినోణ్ణి రాజుగాడు నాకు సూపియ్యంగనే నాకు సింహాద్రి సిన్మాల NTRకు వత్తదిగదా కోపం BP, BP అని కుడిశెయ్యితోని తలకాయ కొట్టుకుంటడు సూడుండ్లి గట్లచ్చేది కోపం.  వాని గల్లబట్టి తెరి బహెన్ కీ, అని గిప్ప… గిప్ప… గుద్దెటోణ్ణి మళ్లా రాజుగాడే ఏ వద్దు ఇడిషెయన్న ఇడిషెయ్ అని బతిలాడేటోడు నన్ను గుంజుకపొయెటోడు. అరాజుగాడు చానా ప్రేమ మనిషి ఎదుటోళ్లు బాధపడితే సూడలేదు. మేం హాస్టల్ల ఒకటే రూంల పక్కపక్కన ఇనుప సందూగలు పెట్టుకొని ప్యాన్లులేని రూంల పండుకొని సదువుకునెటోళ్ళం… అట్లా.. పదో తరగతికి వచ్చినంక వాణికి సదువు అబ్బలే పది పేలయ్యిండు. ఎవుసం (వ్యవసాయం) పనులల్లబడ్డడు. నేను పది పాసై ఇంటర్‌ల మళ్ళా  ఇంటర్ డిగ్రీల చేరిన. రోజు ఊళ్ళె కలుసుకునుడు, తిరుగుడు… అన్నీ మామూలే…

రాజుగాడు శిన్నప్పుడు కర్రెగ, పొట్టిగ, బక్కగ, మట్టసన్నంగ వుండెటోడు కని ఇరవై సంవత్సరాలు దాటినంక మంచి ఎత్తు పెరిగిండు. మంచి శలీరం(శరీరం) వచ్చింది. మా ఊళ్ళె రాజుగాణికి సుజాత అనే పిల్లతోని జత కుదిరింది. ఆ పిల్లకు ఓ పదిహేడు సంవత్సరాల వయసుంటది. వాళ్ళిద్దరికి ఎట్లా కుదిరిందో ఏమోగాని ఇద్దరు గలిసి బాగ తిరిగెటోళ్ళు. ఒకల్ను సూడకుంట ఒకలు వుండేటోళ్ళుగాదు. రాజుగాడు రోజూ రాత్రి నా దగ్గరికచ్చి ఆ పిల్లతోణీ ఎక్కడెక్కడ తిరిగింది ఏమేం తిన్నది ఏమేం జేసింది అన్ని శెప్పెటోడూ. ఆఖరికి ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నది ఎట్లెట్ల పాల్గొన్నది, ఎక్కడెక్కడ పాల్గొన్నది కూడా శెప్పెటోడు. మా ఇద్దరి మధ్య శిన్నప్పన్నుంచి పెద్ద దాపరికాలుండేటియి కావు. వాడు ఇవ్వన్ని శెప్పంగనే నేను అఫ్సోస్(ఆశ్చర్యం) అయ్యెటోణ్ణి కాదు. అట్లాంటియి వాడు నాకు గతంల శానా జెప్పిండు. వాణి అక్రమ సంబంధాల గురించి.

ఇది ఏడవది. ఈ ఏడుగురిల నలుగురు పెండ్లయినోళ్ళు.. ముగ్గురు పెండ్లిగానోళ్ళు.ఈ సుజాతకు కూడా ఇంకా పెండ్లిగాలే. రాజుగాడు సిన్నప్పుడు మస్తు అమాయకుడు. వాణికి ఈ పాడు గుణం ఎక్కణ్ణుంచి వచ్చిందో ఏమోగాని ఆడోళ్ళను బెండుగాలాలు ఏషి మొట్టపిల్ల( బురుద మట్టలు) చాపల పట్టినట్టు పట్టెటోడు. ఒకరోజు పగటీలి ఎండల వగిరిచ్చుకుంట(ఆయాసపడుకుంటా) ఉరికచ్చి అన్న.. కొంచెం మంచినీళ్ళియ్యె దూపయితాంది అని చెమటలు తుడుసుకుంట నా పక్క పొంటి గాడంచల కూసున్నడు. నేను ఇంట్లకుబోయి శెంబుల నీళ్లు తెచ్చిచ్చిన. ఏందిర రాజుగ మొత్తం చెమటతోని తడిసిపోయినవ్ అంటే ఆ గంగ లేదా అన్న … ఆమెతోని సెక్స్‌ల పాల్గొంటాంటె ఆమె మొగడచ్చిండు. సైకిల్ సప్పుడు ఇనబడంగనే దన.. దన ఎనుక తలుపు తీసుకొని నిమ్మలంగ రౌతుల గోడ దునికి వచ్చిన అని ఒకటే నవ్వుతాండు. “అరె ఒకవేళ వాడు సూత్తె ఏందిరా పరిస్థితి అంటే  ఎహె.. నా జాగర్తల నేనుంటా అన్న.. ఏడుగురిని ఎట్ల మెంటన్ జేత్తాననుకుంటానవ్ అని జెరంత గర్వంగ నవ్వెటోడు.

ఒకరోజు రాజుగాడు నేను మా ఊరి చెరువు కట్టకు పోయినం. అక్కడ కల్లు తాగినం. మాకు మంచిగ కిక్కెంకింది. ఏవేవో ముచ్చట్లు మాట్లాడుకుంట నడుసుకుంట వత్తానం. “అన్న.. గామధ్య ఒక సిత్రం జరిగిందే శెప్పనా” అన్నడు. “నీ గురించి నాకు తెలువని శిత్రమేందిరో అని నేనన్నా. టౌన్‌ల “నవత” లేదా అన్న.. అన్నడు. ఆ పిల్ల ముచ్చట నాకు తెలుసుకదరా అన్నా. ఎహె.. ఇనన్నా శెప్పెదాక అన్నడు. సరె శెప్పరా అన్నా. మొన్న ఆ పిల్ల వాళ్ల అమ్మను లైన్లకు తెచ్చి సెక్స్‌ల పాల్గొన్న అన్నడు.

నాకు ఎంటనే చలం మైదానంల నవలల నాయకుడు అమిర్ గుర్తుకచ్చిండు. ఇంక నయ్యం అమిర్‌కు నచ్చిన  తుర్కోల్ల పిల్లను నాయిక రాజేశ్వరితోనే మాట్లాడించి ఒప్పిచ్చినట్టు, పిల్లను పంపిచ్చి తల్లితోని మాట్లాడిచ్చి ఒప్పియ్యలె అనుకున్న మనసుల. మరి నవతకు తెలుసార అని అడిగిన. అన్న. నేను పిచ్చోనిలెక్క  కనిపిస్తాన్నానె నీకు అన్నడు. నాకు కొంచెం ఇబ్బందిగా బాధగా అనిపిచ్చింది.నేను రాజుగాణి మీద చానా కోపం జేసిన అరెయ్ రాజుగా నువ్వు జన్నెకు ఇడిషిన కొల్యాగవు అయిపోయినవ్‌రా ఊళ్ళె. ఏందిరా ఈ ఆంబోతు చేష్టలు. మనిషివా, పశువువురా అన్న. అరె ఏందన్న కోపంజెత్తవ్ అన్నడు. లేకపోతే ఏందిరా జన్నెకిడిషిన కోడె ఊరిమీద పడి దొరికిన శేను దొరికినట్టు మేసి బాగ బలిసి “మదం”బట్టి కంట్లెబడ్డ ఆవునల్లా ఎక్కినట్టు (సెక్స్ చేసినట్టు) శేత్తాన్నవ్ ఎట్లుండెటోనివి ఎట్లయ్‌నవ్‌ర అన్నా. అరె ఊకో అన్న.. శిన్నశిన్న ముచ్చట్లను పెద్దగజేత్తవ్ సప్పుడుజేకపా అని హ..హ..హ… అని నవ్వుతాండు. అరె! నేనింత సీరియస్‌గా తిడుతాంటె నవ్వుతానవేందిరా అంటె నువ్వు కోపంజెత్తె నాకు నవ్వత్తదన్న అనెటోడు.

అరెయ్ రాజుగా నీకు మాంసం ముద్దల రాపిడిల వున్న మజా తగిలింది. అది నిన్ను మాయజేసింది. ఏదో ఓ రోజు అది నిన్ను మాయంజేసి నీ పేరు మాపుంది. కత్తిపట్టినోడు కత్తితోనే పోతడు. మందు తాగెటోడు మందుతోనె పోతడు. అక్రమ సంబంధాలు పెట్టుకునెటోడు అక్రమ సంబంధాలతోనే పోతర్రా అన్నా.. అన్న..నువ్వు చీమను గూడ బూతద్దములబెట్టి సూత్తవ్. ఏంగాదుకని పావే అన్న.. అని నాలును తిప్పిండు.. లైట్ తీసుకో అన్న .. అన్నట్టుగ..

ఇంటికచ్చినంక ఇంతంత బువ్వతిని మా  యాపశెట్టు కింద గాడంచ వాల్చుకోని పడుకున్నా. కల్లుతాగి ఇంత తింటే మస్తు నిద్రస్తది. పొద్దాటి కల్లయితే ఇంకా మస్తు నిద్రస్తది. ఆ రోజు తాగింది పొద్దాటి కల్లే. బలిమీటికి కండ్లు మూసుకున్న నిద్రత్తలేదు. రాజుగాని మాటలే యాదికత్తానయ్. పిచ్చిగాడిది గిట్ల తయారయ్యిండేంది అని బాదనిపిచ్చింది. శిన్నప్పటినుంచెల్లి వాడంటె నాకు బొచ్చడంత పావురం. మెల్లంగ నా మనసు సెక్స్ గురించి ఆలోసించుడు మొదలుబెట్టింది. అవును సెక్స్‌ల ఏమున్నది. ఆడోళ్ళ యోనిల మాంసం ముద్దలు, మొగోళ్ళ అంగంల మాంసం ముద్దలు ఓ ఐదు నిమిషాలో, పది నిమిషాలో , మా అంటె ఓ అర్ధగంట ఒకదానికోటి రాపిడి చేసుకునుడే గదా. దీనికి రాజుగాడు ఎందుకు ఇంత బరితెగిచ్చిండు.

రాజుగాని తోని పండుకునే ఆడోళ్ళు ఒకలా, ఇద్దరా, ఇయ్యాల కట్టమీద జెప్పిన నవత తల్లితోని గలిపి ఎనమిది మంది వాళ్ళవాళ్ల తల్లితండ్రులను ఆడిపిల్లలు, భార్యలు భర్తలను, తల్లి పిల్లలను ఎందుకు మోసం జేత్తాండ్లు అని ఆలోసిత్తే నా బేజ గరమెక్కి గుండె గాబరయ్యింది. మరి ఈ పెద్దపెద్ద సార్లు, మేధావులు, సిన్మాలల్లా, కథలల్ల, మీటింగులల్ల, ప్రేమే గొప్పది, సెక్స్‌ది ఏముది అని సెక్స్‌ను గంజిల ఈగను తీసి పారేషినట్టు తీసిపారేత్తరేంది అనిపిచ్చింది. ప్రేమ గొప్పదే కాని సెక్స్‌కు జిందగిల ప్రాముఖ్యతే లేదనుడు ఏ గలత్ బాత్‌హై ఎందుకంటె ఇంట్ల ముసలి అత్తమామలుంటె, అమ్మ నాయినలుంటె సెక్సువల్ జీవితానికి ఇబ్బందిగ వుంటాందని “ప్రైవసి” మిస్సయితాందని వృద్ధాశ్రమాలల్లకు  అత్తమామలను, అమ్మనాయినలను తోలిన కోడండ్లను, కొడుకులను నేను జూసిన.

పసి పోరగాండ్లను హాస్టలల్ల పారేసిన తల్లితండ్రులను జూసిన, మొగుడు నాపగాడని, ఆడిబట్ల శెకల్ ఎక్కువున్నయని సెక్స్‌గ్యానం (గ్నానం) సరిగ్గలేదని మొగోళ్లనొదిలేసి లేచిపోయిన పెండ్లాలను జూసిన. పెండ్లం పెయ్యిల (ఒంట్లో) చెటాక్ మాంసం లేదని, సెక్స్ సుఖం సరిగ్గా ఇత్తలేదని అమాయకమైన ఆడిపోరగాండ్లకు ఇడుపు కాయితాలిచ్చిన మొగండ్లను జూసిన, కొందరు బీద తల్లితండ్రులయితే అల్లుని కాళ్లమీదపడి ఆడిపొల్ల బతుకుమీద మచ్చపడుతది మళ్ళ ఎవరు పెండ్లి జేసుకోరు అని ఏడిషిన ఇనకపోయేది. నాకయితె మస్తు కోపం, దుఃఖమచ్చి వాణిగల్లబట్టి అరె.. ఓ మాకే.. అర కిల మాంసం అటో ఇటో ఎందుకురా పొల్ల బతుకు ఆగం జేత్తాన్నవ్  అని అడుగాల్ననిపిచ్చేది. “కండకావురం గుండె పావురాన్ని” డామినేట్ చేస్తాంది. చానాదిక్కుల  చానాసార్ల ప్రేమ గొప్పదే, సెక్స్ కూడా గొప్పదే అది మనుషుల బతుకులల్ల బలమైన రోల్‌ను ప్లేజేత్తాంది. నాకనిపిస్తది. పెండ్లం మొగల బతుకు సర్కస్ అయితే సెక్స్ రింగ్ మాస్టర్ అసొంటిది. అది కనిపియ్యది. కనిపించకుంట కథ నడిపిత్తాంటది. రింగ్ మాస్టర్ లేకపోతే సర్కస్ ఆగిపోద్ది. అక్కణ్ణే వున్నది అసలు కథ. “ఏడేడు సముద్రాల అవుతల మర్రిశెట్టు తొర్రల మాయల ఫకీరు పాణం వున్నట్టు” కని బయిటికి ఒప్పుకోరు ఎవలు. పెద్ద పెద్ద సార్లు.

చిన్నగ మెల్లగ రాజుగాడు ఎక్కువ టయిము(టైం) సుజాతతోనే గడుపుతాండు. వాళ్ల బంధం రోజురోజుకు బలపడుతాంది అన్ని విధాలుగా, ఒక దినం వీళ్ల ముచ్చట సుజాతోళ్ళ ఇంట్ల తెలిసింది. ఆ పొల్లోల్ల అవ్వ, అయ్య ఆ పొల్లను బాగ తిట్టి కొట్టిండ్లట ఎందుకంటె సుజాత గర్భవతి అయిందట. ఇంక ఆ ముచ్చట బయటికి పొక్కలే (రాలేదు). సుజాత అవ్వ, అయ్యకె తెలుసు”నా కడుపుల శెడబుట్టినవ్ కదనే, ఇంతంత పురుగుల మందు తాగి సావరాదే” అని సుజాతోల్ల నాయిన అన్నడట.

ఇజ్జతికి సుజాత నిజంగనె పురుగుల మందు తాగింది. టౌన్‌కు  తీసుకపోతే సర్కారు దవాఖాండ్ల సచ్చిపోయింది. సుజాతను కోతకాండ్ల (పోస్ట్‌మార్టం రూం) ఏషిండ్లు. మా ఊరు ఊరంతా దవాఖాన కాన్నే వున్నది. డాక్టర్లచ్చి సుజాతను కోషి పోస్ట్ మార్టం జేషిండ్లు. సుజాత కడుపుల సచ్చిపోయిన ఏడు నెలల పిండం ఎల్లింది. ఆడిపిల్లో, మొగపిలగాడో తెల్వది ఎవలం అడుగలేదు. మళ్లా కడుపుల్నే పెట్టి కుట్లేషిండ్లు. పాపం పదిహేడేండ్ల సుజాత ఇంకా లగ్గం గూడా కాని సుజాత, సూడసక్కని గుండ్రని మొఖపు సుజాత బతుకే సూడని సుజాత మస్త్ బౌషత్(ఫ్యూచర్) వున్న సుజాత సచ్చిపోవుడే భరించలేని బాధ అయితే సుజాత కడుపుల ఇంక కండ్లు తెరిశి లోకమే సూడని ఏడు నెలల పసిగుడ్డు కూడా సచ్చిపోవుడు మా ఊరోళ్ళు తట్టుకోలేకపోయిండ్లు. అందరి గుండెలు అవిషిపోయినయ్. ఆడోళ్ళయితే రొంబొచ్చెలు గుద్దుకుంట ఏడిషిండ్లు. మా ఊరోళ్ళ కండ్లు కట్టలు తెగిన కరిమబ్బులయినయ్. ఒక్కొక్కల ఒక్కొక్క కన్ను ఒక్కొక్క నయగార జలపాతమైంది. మా ఊరు కన్నీటి బంగాళాఖాతమైంది. సుజాత శవాన్ని తీసుకపోయి మా ఊరి చెరువాయకు బొందబెట్టిండ్లు.

సుజాత సచ్చిపోయిందని తెల్వంగనే రాజుగాణ్ణి  ఊళ్ళకు రావద్దని వాళ్ల సుట్టాల(బంధువుల) ఇంటికి వాళ్ళోళ్ళు పంపిచ్చిండ్లు. రొండు రోజుల తరువాత రాజుగాడు మళ్లా ఊళ్ళెకు వచ్చిండు సుట్టాలింట్ల వుండలేక. పాపం సుజాత అవ్వ, అయ్య రాజుగాని మీద కేసుపెట్టలే. రాజుగాని ఇంటిమీదికచ్చి లొల్లిగూడ చెయ్యలే. రాజుగాణ్ణి తిట్టలే, కొట్టలే. నల్లా అండ్లె తెల్లా అండ్లే మా సుజాత అవుసు(ఆయుస్సు)గాడికే వున్నది గాడికే బతికింది. అవుసు గూడి సచ్చిపోయింది అన్నరు ఊకున్నరు.

రాజుగాడు నాదగ్గరకొచ్చి నన్ను అమురుకొని బాగ ఏడిషిండు. ఊకోర రాజుగ ఊకో దైర్నం (ధైర్యం) చెడకు అని ఊకుంచిన. సుజాత కడుపుల ఏడు నెలల పిండం ఎల్లిందట అన్న. అనుకుంట ఒకటే ఏడుసుడు, ఊకోర పిచ్చిగాడిది ఊకో అన్ని తలుసుకోకు, తలుసుకుంటాంటె ఏడుపు ఎక్కువైంది. మరిషిపో అని మళ్ళా ఊకుంచిన. ఏడిషి ఏడిషి ఆగి కొంచెం సేపటికి కడుపుల ఏడు నెలల పిండం ఎల్ల్లిందట అన్న. రొండు పాణాలు తీసినట్టయ్యిందే అని మళ్ళా ఏడిషెటోడు. అట్లా ఐదు రోజులు ఏడిషి ఊకున్నడు. బాయికాడికి బోయి ఎవుసం (వ్యవసాయం) పనులు చేసుకుంటాండు. జెర మామూలు మనిషయ్యిండు.

సుజాతోళ్ళ అవ్వ, అయ్య రాజుగాణ్ణి ఒక్క మాటనకపోవుడు, పోలీస్ కేసుబెట్టి జెయిల్ల ఏపియ్యకపోవుడు,  కండ్లు మొత్తె, కండ్లు తెరిత్తె సుజాత గుండ్రని మొఖం రాజుగానికి గుర్తుకచ్చుడు, తిరిగిన జాగాలు , సూశిన సిన్మాలు, శేషిన షికార్లు, మాట్లాడుకున్న ముచ్చట్లు, ఏసుకున్న జోకులు, చేసుకున్న బాసలు, తిన్న తిండి, తిరిగిన బండి, బరిబాత(నగ్నంగ) కావలిచ్చుకొని (కౌగిలించుకొని) పట్టెమంచం మీద పండుకున్న రాత్రులు అన్నిటికన్నా ముఖ్యంగా సుజాత కడుపుల కండ్లు తెరువకుంటనే కండ్లు మూసిన ఏడునెలల పిండం అన్ని కలెగలిసి రాజుగాణి గుండెను యాక్సా బ్లేడై(Acsa Blade) రప్ప్రరప్ప… రప్పరప్ప.. రప్పరప్ప కోశినయ్.

సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు కోత్తాంటే… కోత్తాంటె… కొత్తాంటె.. ఇనుప పైప్‌ను ఆక్సాబ్లేడ్ కొత్తాంటె నిప్పులెట్ల చిల్లుతయ్ అట్లా.. సుజాత సచ్చిపోయినంక ఏడో రోజున ఆ పిల్ల జ్ఞాపకాల యాక్సాబ్లేడ్ (Acsa Blade) కోతకు, రాపిడికి జన్నెకిడిషిన కోల్యాగ(గిత్త) అసొంటి రాజుగాణి గుండెల ప్రేమాగ్ని జనించింది. అది పశ్చాతాపమై ప్రజ్వరిల్లి వాణి గుండెకు అగ్గంటుకున్నది. ఎండకాలం మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండల రాజుగాడు  వాళ్ళ చెలుకకాడ “నవక్రాన్” పురుగుల మందు డబ్బా మూత తీసి గటగట గటగటా తాగిండు.

అదే సర్కార్ దవాఖాండ్ల సుజాత సచ్చిపోయిన సర్కార్ దవాఖాండ్ల మూడు రోజులు సావుతోని కొట్లాడి, కొట్లాడి, అవస్థ  అవస్థ.. అవస్థయితాంది, కడుపుల మండుతాంది అనుకుంట ఏడిషి, ఏడిషి, ఇనుప మంచం మీద తండ్లాడుకుంట, తండ్లాడుకుంట.. మూడోరోజు తలకాయ కుడిపక్కకు వాల్చి కండ్లల్లకెల్లి కన్నీళ్ళూ కార్సుకుంట సచ్చిపోయిండు. “లంజపుట్నాలల్ల” చేదును నాకు మిగిలిచ్చి తీపిని వాడు తీసుకొని తిరిగిరాని లోకాలకు మా రాజుగాడు పిచ్చిగాడిది నన్ను ఒంటరిని జేసి బయిలెల్లిపోయిండు.

*

అసలు కోణం

 

 

– రాణి శివశంకర శర్మ

~

 

ఆ మహా వ్యాపార దిగ్గజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలని వొక్క దెబ్బతో ఎగరగొట్టేశాడు సిద్ధార్థ. అతనికి అంత శక్తి ఉందని డాక్టర్ కోణార్క్ ‍కు కూడా తెలియదు. డాక్టర్ కోణార్క్ పెద్ద విద్యా వ్యాపారి. కోణార్క్ ఎడ్యుకేషనల్ ఇన్‍స్టిట్యూషన్స్ అనే సంస్థని స్థాపించి శరవేగంతో దూసుక పోతున్న పెద్దమనిషి.

కోణార్కకు ఎదురుగా ప్రిన్సిపాల్ కూర్చొని ఉన్నాడు. “సిద్ధార్థ మంచి లెక్చరర్ కాదు. అతన్ని తీసెయ్యాలి”, అన్నాడు.

“సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి”, అన్నాడు కోణార్క్. బయటకి వెళ్తుండగా మళ్ళీ పిలిచాడు. “చూడండీ, మంచి లెక్చరర్లు చాలా మందే ఉంటారు. సిద్ధార్థ లాంటి బ్రిలియంట్స్ కొంత మందే ఉంటారు. అతడు మనకు కావలసిన వాడు. తన గురించి ఎక్కడా నెగటివ్ కామెంట్ చేయొద్దు. అలా చేస్తే నీ ఉద్యోగం ఊడుతుంది” హెచ్చరించాడు కోణార్క్.

సిద్ధార్థ అంటే అంత అభిమానం ఎందుకు కోణార్కకీ?

కోణార్క గుంటూరు జిల్లాలోని వొక కుగ్రామంలో భూస్వామిగా వెలుగొందుతున్న రోజుల్లో సిద్ధార్థ తండ్రి కోణార్కకి నమ్మిన బంటుగా వుండేవాడు. దాని వల్లే తను విద్యావ్యాపారంలో అడుగు పెట్టిన వెంటనే సిద్ధార్థకి ఉద్యోగం యిచ్చాడు. సిద్ధార్థ తన తండ్రిలాగే కోణార్కకి ఆంతరంగికునిగా మారిపోయాడు.

గిట్టని వాళ్ళ ప్రోద్భలం వల్ల ఇన్‍కంటాక్స్ అధికారులు కోణార్కపై దాడి మొదలు పెట్టారు. అప్పుడు సిద్ధార్థ వెంటనే ఎలర్ట్ అయ్యాడు. నల్ల ధనాన్ని కారులో డంప్ చేసి తరలించేసాడు. దాడులు ముగిసాక భద్రంగా తిరిగి అప్పజెప్పాడు.

అంతేకాదు. వొక కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, కాలేజీ ప్రతిష్టని కాపాడాడు. నిరసన తెలుపుతున్న తల్లితండ్రులనీ, బంధువులనీ బుజ్జగించాడు. విద్యార్థి రాసిన ఉత్తరం మాయం చేసాడు.

సహజంగానే డాక్టర్ కోణార్క్ సిద్ధార్థ ప్రతిభని గుర్తించాడు. నిజానికి సిద్ధార్థ చాలా  ఙ్ఞానం కలిగిన వాడు. కానీ అతని ప్రతిభ క్లాస్ రూమలకు సంబంధించినది కాదు. పౌరులు తరగతి గదుల్లో తయారవుతారు. సమాజాన్ని శాసించేవాళ్ళు క్లాస్ రూం బయట రూపొందుతారు, అనే రహస్యాన్ని గుర్తించిన ప్రతిభాశాలి సిద్ధార్థ.

అతడు పేరుకే లెక్చరర్. రాష్ట్రమంతా వ్యాపించిన కోణార్క్ విద్యా సంస్థలలో యెటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అక్కడ వాలుతాడు. విషయాన్ని బయటకు పొక్కనీయడు. సమస్యని లోపల్లోపలే ఖతం చేస్తాడు. వొక విద్యార్థినిపై లెక్చరర్లే అత్యాచ్వారం చేసారు.  ఆ సంఘటనని బయటకి పొక్కకుండా , చివరకు మీడియాకి కూడా చిక్కకుండా చేయడంలో సిద్ధార్థ చూపిన ప్రతిభకి కోణార్క్ ఆశ్చర్యపోయాడు. అతని భుజాల మీద తడుతూ అన్నాడు, “యు ఆర్ ఇంటిలిజెంట్ దేన్ ఐనిస్టీన్”.

’ఇతనికి ఐనిస్టీన్‍కీ పోలికా?” అని చెవులు కొరుక్కున్నారు ఉత్తమ పౌరులైన ఉపాధ్యాయులు. అలా పోల్చడానికి కారణం ఉంది. సిద్ధార్థ ప్రతీదీ సాపేక్షకం అంటాడు. విలువలేమీ లేవంటాడు. ప్రతీదీ అనేక కోణాలలోంచీ ఆలోచించాలి అంటాడు. విద్యార్థినిపై అత్యాచారం జరిగినప్పుడు, రెండు చేతులూ కలిసినప్పుడే కదా చప్పట్లూ అని వాదించిన ఘనుడు సిద్ధార్థ. యిప్పుడు అమ్మాయిలు వేసుకునే దుస్తులూ, వాళ్ళ ప్రవర్తన కూడా బాగుండడం లేదన్నాడు.

rafi

Art: Rafi Haque

యిలా అనేక కోణాలని దుమ్ములా రేగగొట్టి సమస్యని చల్లార్చేయ్యడంలో అతడు నిపుణుడు.

అతడు చాలా చదివిన వాడు, చాలా విఙ్ఞానం కలవాడు. మంచి అభిరుచులు కలవాడు కూడా. అది కోణార్కకీ బాగా తెలుసు. వొక సారి కోణార్కకీ జపాన్ దర్శకుడు కురసోవా తీసిన రషోమన సినిమాను చూపించాడు సిద్ధార్థ. ఆ సినిమాలో ఒక హత్యని గురించి నలుగురూ నాలుగు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. వారి వారి నేపథ్యాలని బట్టి అలా వ్యాఖానిస్తారు. వొకరి వ్యాఖానానికీ మరొకరి వ్యాఖ్యానానికీ పొంతన ఉండదు. సినిమా అయ్యాక సిద్ధార్థ అన్నాడు. “కోణాలు విభిన్న కోణాలు అంతే. సత్యం అంటూ ఏమీ లేదు. కనుక మనకు కావలసిన సత్యాన్ని మనం సృష్టించుకోవచ్చు. అవసరమైన లాభసాటియైన సత్యాన్ని మనమే క్రియేట్ చెయ్యచ్చు. అల్లచ్చు”.

“సిద్ధార్థా! ఆ అమ్మాయిపై అత్యాచారం సంగతి ……? ”

“ఊరుకోండి సార్, అది నిన్నే సద్దు మణిగి పోయింది”, అన్నాడు సిద్ధార్థ.

“అసలు ఏమి జరిగింది?”

“అసలు ఏమీ జరగలేదు. వట్టి పుకారుగా తేల్చేసాను. మీరు హాయిగా యింటికి వెళ్ళి ఫేమిలీతో గడపండి. యీ రొచ్చంతా మీకెందుకు”, అన్నాడు సిద్ధార్థ.

నిజమే, కోణార్క చాలా స్వచ్చంగా కనిపిస్తాడు. అతనికి యే చిన్న మచ్చయినా అంటగలదా అన్నంత తెల్లగా, తెల్లని దుస్తుల్లో ధవళ హాసంతో తాపీగా ఉంటాడు. తను కోణార్క సూర్యాలయాన్ని దర్శించి వచ్చిన వెంటనే పుట్టాడట. అందుకే అంత అరుదైన పేరును పెట్టారు. ఆయన ఏం చదివాడో యెవరికీ తెలియదు. ప్రపంచాన్ని చదివాను అని చెప్పుకుంటాడు. ఆయన నడుపుతున్న సంస్ఠలన్నీ యింగ్లీషు మీడియంవే.

సిద్ధార్థ సలహాతో తెలుగు భాషా వుద్ధరణ కోసం వొక సంస్థని స్థాపించాడు. పత్రిక నడుపుతున్నాడు. అవార్డులు యిప్పిస్తున్నాడు. అందువల్ల వొక విశ్వవియాలయం వాళ్ళు ఆయన పేరుకి డాక్టర్ తగిలించారు. సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు. ” చూసారా నా సలహా యెంత మేలు చేసిందో. మనం అన్ని కోణాలలో ఆలోచించాలి”.

“మనం డబ్బు కోసం కొన్ని పనులు చెయ్యాలి. అధికారం కోసం మరికొన్ని. దాంతోపాటూ సమాజసేవ, పేరు, కీర్తి ప్రతిష్టలు అన్నీ అవసరమే కదా? అవి మీ అధికారానికీ, డబ్బుకీ మరింత వన్నె తెస్తాయి. మీ తెల్లని దుస్తుల్లాంటివే అవీ”, అన్నాడు సిద్ధార్థ.

మాతృ భాషాదినోత్సవం జరపడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు కోణార్క.  అదే సమయంలో సిద్ధార్థని వొక ప్రశ్న అడిగాడు. “విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. నువ్వెలాగో మేనేజ్ చేస్తున్నావు సరే, అసలు వీటిని ఆపలేమా?”

“ఎందుకు ఆపడం?”

“వీటి వల్ల మనకి ఎప్పుటికైనా చెడ్డపేరే కదా? అని ప్రశ్నించాడు కోణార్క.

“బహుశా పేరెంట్స్ కూడా ఇటువంటి వ్యవస్థనే కోరుకుంటూన్నారేమో. యిది మాసోచిజం కావొచ్చు. అంటే తమని తాము స్వయంగా హింసించుకోవడం. ఆధిపత్యాన్ని ఆరాధిస్తారు వీళ్ళు. తెలియని యే తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచే మనుషులు”, అన్నాడు సిద్ధార్థ తాపీగా.

సిద్ధార్థ అన్న మాటే నిజమైంది. ఆత్మహత్యలే కాదు. విద్యాసంస్థలు కూడా మరింత విస్తరించాయి. బలపడ్డాయి. యితర విద్యా సంస్థలు వీటిలో విలీనమై పోయాయి.

సిద్ధార్థలో గొప్ప దార్శనికుడు కనిపించాడు కోణార్కకి. అనేక కోణాలని ఏక కాలంలో దర్శించగల మేధావి సిద్ధార్థ అనుకున్నాడు ఆయన. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. కోణార్కకి ప్రభుత్వంలో మంచి పరపతి. అతని బంధువులు మంత్రులుగా వున్నారు. ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. యీ క్లిష్ట సమయంలో ప్రతిపక్షం నోరు మూయించగల మేధావి కావాలన్నారు. సిద్ధార్థని పంపించాడు కోణార్క.

సిద్ధార్థ ఒకటే మాట అన్నాడు. “రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అనేక కోణాలని లాగండి. వాళ్లకి గల మానసిక వైకల్యాలు, ప్రేమ సమస్యలు, సెక్స్ సమస్యలు, వాళ్ళ బాల్యం, తల్లితండ్రుల కలహాలు, వాళ్ళ పునర్జన్మ, జాతకం… యిలా అన్ని కోణాల గురించీ రకరకాల నిపుణుల చేతా, నిపుణుల్లా ఫోజు యిచ్చే వారి చేతా  మీడియాలో చర్చలు చేయించండి.  రకరకాల కోణాల్ని దుమ్ము లేపండి. ఆ గందరగోళంలో అసలు కోణాలు కప్పడిపోయేలా చేయండి”.  ఆ ప్రాజెక్టుని సిద్ధార్థకే అప్పగించింది ప్రభుత్వం. దాంతో అతని పరపతి వొక్కసారిగా పెరిగిపోయింది.

రైతుల ఆత్మహత్యల వెనుక గల కారణాలను సర్వే చేయించడం మొదలు పెట్టింది ప్రభుత్వం. చాలా చావులకి వ్యక్తిగత సమస్యలే కారణాలుగా తేల్చేసింది. దాంతో ప్రభుత్వానికి నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత తప్పింది. దానికి బదులుగా, తమకు అనుకూలంగా మాట్లాడినందుకు  సైకాలజిష్టులకీ, ఆధ్యాత్మిక వేత్తలకీ డబ్బు చెల్లించింది.

ఈలోగా గ్లోబలైజేషన్ యుగం విజృంభించింది. వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎవడి బతుక్కీ, ఎవడి చావుకీ వాడే కారణం అన్న భావన బలపడింది. రైతులు వ్యవసాయాన్ని నమ్ముకోవడం మానేసారు. తమ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకున్నారు. కోణార్క్ విద్యా సంస్థల్నే నమ్ముకున్నారు. రియల్ ఎస్టేట్‍ని కూడా విశ్వసించారు. లాభపడిన వాళ్ళు లాభపడ్డారు.

యీ పరిస్థితుల్లో కోణార్కని సిద్ధార్థ కలిసాడు. కోణార్క సిద్ధార్థ ముందు ఒక నివేదిక ఉంచాడు. “యిది చూసారా, యీ నెల రోజుల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వొక విద్యార్థి తోటి విద్యార్థిని హత్య చేసాడు. యిప్పుడు ఆత్మహత్యలకి హత్యలు కూడా తోడయ్యాయి మన సంస్థల్లో.  మనమేమైనా అమెరికాలో ఉన్నామా? అక్కడ తోచుబడి కాక బోర్‍డమ్ వల్ల తోటీ విద్యార్థుల్ని తుపాకితో కాల్చి చంపేసిన వార్తలు చదివి విస్తుపోతుంటాం”, కోపంగా అన్నాడు కోణార్క.

“మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం, అంతే” , అన్నాడు కూల్‍గా సిద్దార్థ.

“ఏమంటున్నావ్ నువ్వు?”, గద్దించాడు కోణార్క.

“నేను అన్నది మీరు సరిగానే విన్నారు. మన విద్యాసంస్థలు తామర తంపరగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచం కూడా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. సెక్సూ, క్రైమూ రంగుల దృశ్యాలుగా ముందుకొస్తున్నాయి. దాంతో పాటూ డబ్బు విలువ, సంపాదన కోసం పరుగు వొక ఐదు సంవత్సరాల కంటే బాగా పెరిగింది. వెలుగు వెనుక నీడ ఉంటుంది. తప్పదు,” అన్నాడు సిద్ధార్థ.

“మరి మనమేమి చేయాలి?”

సమస్యలు ఉంటాయి. ఉండనీండీ. వాటి నుంచీ దృష్టి మరల్చాలి.” అన్నాడు టీవీ ఆన్ చేస్తూ సిద్ధార్థ.

“నిజానికి విద్యార్థులందరినీ  ఉద్ధరించడం మన పని కాదు. యికపైన బాగా చదివే విద్యార్థులని ఏరదాం. వాళ్ళని ఒక గ్రూపుగా చేద్దాం. యిలా వర్గీకరిస్తూ పోదాం. బాగా చదివే వాళ్ళకి మంచి లెక్చరర్లని నియమిద్దాం. మంచి జీతాలనిద్దాం. మిగిలిన వాళ్ళకి తక్కువ జీతాల లెక్చరర్లని నియమిద్దాం. కానీ అందరినీ వొకే రకంగా టెన్షన్లో వుంచుదాం.”

“ఈ  టెన్షన్‍కి పిల్లలు చస్తున్నారు”, అన్నాడూ విసుగ్గా కోణార్క.

“చావనీండీ, ఆసంగతి నేను చూసుకుంటాను”, అంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ.

సిద్ధార్థ రావడంలో గానీ పోవడంలో గానీ ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. అదే కోణార్కకి నచ్చింది. అతడు సమస్యలకి భయపడడు. సమస్యలని పరిష్కరించాలని కూడా అనుకోడు. మానవ జాతి ఉన్నంత వరకూ సమస్యలు ఉంటాయి. యింకా పెరుగుతాయి. వాటిని ఎదుర్కోవడం కాదు. సమర్ధంగా మరుగు పరచడమే తెలివి అంటే. అభివృద్ధి అంటే ఇదే అని సిద్ధార్థ ఫిలాసఫి.

ఈ ఫిలాసఫీ కోణార్కకి కూడా ఇష్టమే. నిజానికి అది ఆయన తత్వమే. అసలు అనుచరులెప్పుడూ నాయకుని  తత్వాన్ని ఆచరించడంలో దూకుడు ప్రదర్శించాలి. రాజుని మించిన రాజభక్తిని ప్రదర్శించాలి.  సరిగ్గా అలాంటి అనుచరుడే దొరికాడు కోణార్కకి.

కోణార్క విద్యా సంస్థలో వొక విద్యార్థి మరో విద్యార్థిని చంపేసాడు. దానికి కారణం గర్ల్ ఫ్రెండ్. ఆమె పుట్టిన రోజుని వొక గొప్ప రెస్టారెంటులో జరపడం కోసం డబ్బు కావలసి వొచ్చి తోటి విద్యార్థిని చంపేసాడు. హంతకుడు చదువులో ఫస్ట్ ర్యాంకర్.

విద్యార్థుల ఆందోళనలు మొదలయ్యాయి. సిద్ధార్థ అన్నాడు.

” యీ విద్యార్థిని కేసుల నుంచీ బయట పడెయ్యాలి. అతడు మన కాలేజీకే మంచి పేరు తెస్తాడు.”

“ఎలా? బయట ఇంత గొడవగావుంటే,” ప్రశ్నించాడు కోణార్క.

డబ్బిచ్చి కొంత మందిని కొనుక్కొచ్చి కౌంటర్ యాజిటేషన్ చేయించాడు సిద్ధార్థ. అవతలి వాళ్ళు చర్చలకి సిద్ధపడ్డారు. నిజానికి ఉద్యమిస్తున్న వాళ్ళని భయభ్రాంతుల్ని చేసారు. గాయపరిచారు. గొడవలు క్రమేపీ చల్లారి పోయాయి. పోలీసులు కూడా డబ్బులు తీసుకొని మిన్నకున్నారు. పేరెంట్స్ కి కూడా కొంత డబ్బు ముట్టజెప్పారు. చనిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు మూసేసారు. హంతక విద్యార్థికి ఫస్ట్ ర్యాక్ వొచ్చింది. టీవీలలో, వొత్తిడిలో కూడా రాణించిన చదువరని అతని పేరూ, విద్యా సంస్థల పేరూ మారు మోగిపోయింది.

“సమస్యలు వుంటాయి. వాటికి అనేక కోణాలు ఉంటాయి. మనకు కావలసిన కోణాన్ని మనం బయటకి లాగి ప్రొజెక్ట్ చెయ్యాలి”, అన్నాడు సిద్ధార్థ మందు తాగుతూ. అభినందనగా భుజం తట్టాడు కోణార్క.

వొక కోణార్క విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది మామూలే. నిజానికి అదొక వార్త కాకుండా పోవును. ఎందుకంటే కోణార్క విద్యా సంస్థలు చాలా బలపడి పోయాయి యెప్పటి కంటే. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలూ యేవీ వార్తలు కాకుండా పోయాయి. అన్ని విద్యా సంస్థల కంటే ర్యాకులు ఎక్కువగా వచ్చేది అక్కడే. ర్యాంకుల స్కోరు టీవీల్లో మారుమోగి పోయేది.

విద్యార్థులకు తిండి సరిగా ఉండదు. సౌకర్యాలు సరిగా ఉండవు. కోళ్ళ ఫారాల్లా ఉంటాయి. అయినా ఆ విద్యా సంస్థలే ముందుకు దూసుక పోతున్నాయి. యింక క్రైము రేటు కూడా ఎక్కువే. ఆత్మహత్యలూ ఎక్కువే.

కానీ ఆ ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. సిద్ధార్థకి కునుకు లేకుండా చేసింది. సిద్ధార్థ కూడా అశక్తుడుగా మారిపోవడం వల్ల డాక్టర్ కోణార్క కుదేలు అయిపోయాడు. అసలు సమస్య ఆత్మహత్య కాదు. ఆత్మహత్యల్ని మేనేజ్ చేయడం చాలా సులభం. కానీ ఆ విద్యార్థి చస్తూ చస్తూ లేఖ రాసి పోయాడు. దాన్ని ఔత్సాహికులైన వార్తాపత్రికల వాళ్ళు ప్రచురించేసారు. కుల వివక్ష వల్లే ఆ విద్యార్థి చనిపోయాడని దేశమంతా మారుమోగిపోయింది. రాజకీయ నాయకులు కూడా దిగి  పోయారు. ఇక ఏం చేయాలి?

“సిద్ధార్థ యిప్పుడేం చెయ్యాలి? నీ అనేక కోణాల ఫిలాసఫీ వొట్టిపోయిందేమీ?”అని అడిగాడు కోణార్క.

“లేదు. అదెప్పటికీ పని చేస్తుంది. కొంచెం ఆలస్యం కావొచ్చు అంతే. సైకాలజీ, ఫిలాసఫీ, వాస్తు శాస్త్రం, న్యూమరాలజీ యిలా అన్ని రంగాలలో నిపుణుల చేత టీవీల్లో చర్చలు ఏర్పాటు చేయండి. ఆ విద్యార్థి చనిపోవడానికి కారణాలను రకరకాలుగా వదరమనండి. మన వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పించండి. ప్రస్తుతం ఇంతే. తర్వాత సంగతి ఆలోచిద్దాం”,  అన్నాడు   సిద్ధార్థ.

సైకాలజిస్టులు, అతడు బాల్యం నుంచీ కుటుంబంలో ఎదుర్కొన్న కష్టాలే చావుకు కారణం అన్నారు. ఆ లేఖలో బాల్యం ప్రసక్తి ఉందన్నారు. ఆధ్యాత్మికవేత్త వొకరు ఆ విద్యార్థి తన లేఖలో దేహం, ఆత్మ వేరు పడి పోయిందని ప్రకటించాడు. కనుక ఆధ్యాత్మిక సమస్యలే కారణమన్నాడు. న్యూమరాలజిస్టు అతనికి పేరులో అక్షరాల సంఖ్య ఆత్మహత్యకు కారణమన్నాడు. జ్యోతీష్యుడు గ్రహబలం సరిగా లేదన్నాడు.  బ్రేకులూ, ఎడ్వర్టయిజ్‍మెంటులూ మధ్య చర్చలు సాగుతున్నాయి. కుల వివక్ష నుండీ దృష్టి మళ్ళించడానికి శాస్త్ర పాండిత్యాలన్నీ భేషుగ్గా ఉపయోగపడుతున్నాయి.

“ప్రపంచం అన్న తరవాత అన్నీ ఉంటాయి. కుల వివక్షో మరో వివక్షో యెలాగూ ఉంటుంది. దాన్ని పెద్ద యిష్యూ కాకుండా యెలా అడుక్కి నెట్టాయలన్నదే మనం ఆలోచించాలి. అదే తెలివి అంటే”, అన్నాడు సిద్ధార్థ.

కానీ తాను స్వారీ చేసే పులి తననే బలి కోరినట్లైంది కోణార్క పరిస్థితి. కోణార్క కూతురునే ప్రేమలో పడేసాడు సిద్ధార్థ. “మీరే సిద్ధార్థ చాలాతెలివైన వాడని మెచ్చుకుంటారు కదా”, అని ఎదురు ప్రశ్న వేసిందా అమ్మాయి.

“యే రకంగా సరి తూగుతాడు మనతో”, అని అడిగాడు కోణార్క. అతనికి ఆస్తులు లేకపోవచ్చు. తెలివి ఉంది. అతని తెలివి వల్లే మన ఆస్తులూ, డబ్బూ ఎదుగుతూ వొచ్చాయి. అతని బుర్ర కన్నా వేరే ఆస్తేం కావాలి?” అని అడిగింది.

“బుర్రలెన్నయినా కొనొచ్చు డబ్బుంటే. కానీ కులాన్ని ఎక్కడ కొంటాం? అతని కులం నీకు తెలుసా?

“కులం అంత ముఖ్యమా?”

“కులమే ఆస్తి”

“నాన్నా, నేను  అతన్నే పెళ్ళాడతాను. నిర్ణయించేసుకున్నాను”,  అని కుండలు  బద్దలు కొట్టింది ఆ అమ్మాయి.

కోణార్క మౌనంగా ఊరుకున్నాడు. సిద్ధార్థ చెప్పినట్లూ సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. యెప్పుడూ ఉంటాయి.

తర్వాతి రోజు సిద్ధార్థ ఉత్సాహంగా కోణార్క ఆఫీసుకొచ్చాడు.

“చాలా ఎదిగి పోయావు నువ్వు. నన్ను మించి పోతున్నావు” , అన్నాడు కోణార్క. సిద్ధార్థ చిరునవ్వు నవ్వాడు. కొద్ది సేపు ముచ్చట్ల తర్వాత బయలు దేరాడు. కోణార్క అన్నాడు, ” నువ్వు చాలా పైకి వెళ్తావు”.

ఆ రోజే సిద్ధార్థ చనిపోయాడు. అది రోడ్డు యాక్సిడెంటా, ఆత్మహత్యా   లేక హత్యా? నల్లుగురూ నాలుగు రకాలుగా చెప్పుకున్నారు.కురసోవా సినిమాలాగే రకరకాల కథలు వ్యాపించాయి.

వొక రోజున కోణార్క తన కొడుక్కి హిత బోధ చేసాడు.

“నేను పెద్దవాన్ని అయిపోయాను. వ్యాపారాలన్నీ ఇక నువ్వే చూసుకోవాలి. అన్ని విషయాలనీ అన్ని కోణాలనుంచీ అర్థం చేసుకోవాలి. కానీ మనకు కావలిసిన కోణాన్నే బయట పెట్టాలి. చూడూ తెలుపులో అన్ని రంగులూ ఉంటాయి. అన్ని రంగులనూ తొక్కేసి తెలుపే తెల్లగా రాజ్యం చేస్తుంది. నలుపుని కూడా తెలుపు చేస్తుంది. ఎరుపుని కూడా తెలుపు చేసేస్తుంది. బుర్ర ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బుర్రల్ని అన్నింటినీ కొని ఆధిపత్యం చెలాయించగల వాడు ఒకడే ఉంటాడు. యీ వొక్క రహస్యం గుర్తుంచుకో. యీ వొక్క కోణాన్ని మరచిపోకు”

*

పిల్లలా…!  నో వే…!

 

 

-రాజ్యలక్ష్మి

~

 

 

హేండ్ బేగ్, లంచ్ బాక్స్ భుజానికి తగిలించుకుని, లిఫ్ట్ కోసం ఆగకుండా దాదాపు పరిగెత్తుతున్నట్టే మూడంతస్తులు ఎక్కి, ఆఫీసులో తన సీట్ దగ్గరకు వెళ్లి లాగిన్ అయి, “అమ్మయ్య!  లేట్ కాలేదు” అనుకుంటూ అనుకుంటూ నీరసంగా కుర్చీలో కూలబడింది సౌమ్య.  లేకపోతే నెలలో రెండు లేట్లకి ఒక లీవ్ కట్.  ఇంకానయం, లాప్‌టాప్ లేదు.  లేకపోతే అది మోస్తూ ఇన్ని అంతస్తులు ఎక్కాలంటే…  అమ్మో!

ఇంతలో “హాయ్…” అంటూ భార్గవి వచ్చింది.  “ఏంటి నిన్న రాలేదు, ఒంట్లో బాలేదా?” సౌమ్యని అడిగింది.

“నేను బాగానే ఉన్నాను. అనన్యకి మొన్నటి నించీ జ్వరం.  ఇంకా తగ్గలేదు.”

“మరెందుకు వచ్చావు?  ఈరోజు కూడా సెలవు పెట్టాల్సింది.”

“నేను అదే అనుకున్నాను.  కానీ మేనేజర్‌కి ఫోన్ చేసి సెలవు అడిగితే, ఫస్ట్ వీక్ కదా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలని రమ్మన్నాడు.  అందుకే దానిని క్రెచ్‌లో దింపి, మందులు జాగ్రత్తగా వేయమని చెప్పి వచ్చాను.  సాయంకాలం మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్ళాలి.  ఈ రిపోర్ట్స్ అవగానే వెళ్లిపోతాను.“

“ఓ.కె.  ఏదైనా సహాయం కావాలంటే చెప్పు” అంటూ భార్గవి తన సీట్ దగ్గరకి వెళ్లిపోయింది.

సౌమ్య పేరుకు తగ్గట్టే చాల సౌమ్యంగా ఉంటుంది.  తన పని చాలా శ్రద్ధగా చేస్తుంది, ఎవరూ వంక పెట్టడానికి వీలు లేకుండా.  తనేమో, తన పనేమో అన్నట్టుగా ఉంటుంది.  ఇల్లు, ఆఫీసు తప్ప వేరే ప్రపంచం లేదు.  ఎవరినీ ఒక మాట అనదు, ఎవరన్నా తనని అన్నా తిరిగి సమాధానం చెప్పడం చేతకాక, తనలో తనే బాధపడుతుంది.

భార్గవి ఇందుకు పూర్తిగా విరుద్ధం.  తను ఎవరిజోలికీ వెళ్ళదు కానీ, ఎవరైనా తన జోలికి వచ్చారంటే మాత్రం ఊరుకోదు.  ఆఫీసులోనూ, బయటకూడా ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటుంది.  అందులోనూ ఆడవాళ్ళంటే ఇంక వెనకా ముందూ చూసుకోదు.  ఒక మహిళాసంస్థలో వాలంటీర్‌గా కూడా పనిచేస్తోంది.

భిన్న ధృవాల్లాగా లాగా ఇద్దరి మనస్తత్వాలలో ఏమాత్రం పోలిక లేకపోయినా ఇద్దరూ మంచి స్నేహితులు.  పక్కవారి మీద అంత దయ, ప్రేమ చూపించే భార్గవి అదే సమయంలో అంతలా ఎలా పోట్లాడగలదనేది సౌమ్యకి ఎప్పుడూ అంతుపట్టని విషయం.  “అందుకే పోట్లాడతా” అని నవ్వుతుంది భార్గవి.

“మా అక్క న్యూరాలజి చేయాలనుకుంది, ముఖ్యంగా సర్జన్ అవుదామనుకుంది.  సీట్ కూడా వచ్చింది.  కానీ వాటిల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పిల్లలతో కష్టమని మా అమ్మానాన్న రేడియాలజి చేయమన్నారు” అని సౌమ్య చెప్తే “మీరు ఏం చదవాలో మీ అమ్మానాన్న నిర్ణయించడమేమిటి, అందులో పి.జి. లెవెల్లో?” అని భార్గవి చాలా ఆశ్చర్యపోయింది.  “ఇలాగే ఈ తల్లిదండ్రులు ప్రేమ, భధ్రత పేరుతో పిల్లలని ఇండివిడ్యుయాలిటి లేకుండా, బలహీనులుగా తయారు చేస్తారు” అని బాధపడింది.  “అలా ఇల్లు, ఆఫీసు అంటూ బావిలో కప్పల్లాగా ఉండద్దు.  కాస్త బయటకొచ్చి ప్రపంచాన్ని చూడండి” అంటుంది ఎప్పుడూ.   భార్గవి స్నేహంతో సౌమ్య కూడా కొంచెం ఆలోచించడం నేర్చుకుంది, ఆమెలాగా ఎదిరించలేకపోయినా.

“నిన్న ఆఫీసులో గొడవ అయిందట కదా!” లంచ్ రూంలో అడిగింది ఉష.

“నిన్న నువ్వు లేవు కదా! ప్రియ మెటర్నిటి లీవ్ అప్లై చేస్తే రాకేష్ అవమానకరంగా మాట్లాడాడుట.  తను పాపం రెస్ట్ రూంలో ఏడుస్తుంటే భార్గవి చూసి కంప్లైంట్ చేయించింది. ఆఫీసులో పెద్ద గొడవ.  ఆడవాళ్ళందరమూ కూడా ప్రియకి సపోర్ట్ చేసాము.  అపాలజీ చెప్పకపోతే వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి కంప్లైంట్ చేస్తామనేటప్పటికి, రాకేష్ ఇక తప్పక అపాలజి చెప్పాడు.  ఈ క్రెడిట్ అంతా భార్గవికే.” అంది సూజన్.  ఇలాంటివాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది సౌమ్య.

“మా అఫీసులో ఒకేసారి ఇద్దరు మెటర్నిటి లీవ్‌లో వెళ్ళారు.  మావాళ్ళేమో రిప్లేస్‌మెంట్ ఇవ్వరు.  చచ్చిపోతున్నాము చాకిరీతో.  ఈ ఆడవాళ్ళు ఎందుకొస్తారో ఉద్యోగాలు చేయడానికి…” అని తన అన్నయ్య ఒకసారి విసుక్కోవడం గుర్తొచ్చింది ఉషకి.

“అసలు ఆడవాళ్ళందరూ ‘పిల్లలని కనం, పెంచం’ అంటే ఏం చేస్తారో ఈ మగవాళ్లు!” కోపంగా అంది సూజన్.   “పిల్లలు లేకుండానా…! అమ్మో…!  అనన్య లేకుండా ఒక్క క్షణమైనా తను ఉండగలదా…” అనుకుంది సౌమ్య

“అయినా హెచ్. ఆర్. లో కొంచెం సెన్సిటివ్ వాళ్ళని తీసుకోవాలి, ఇలాంటివాళ్ళని కాదు.” అంది ఉష.

“అసలు మనుషులని మనుషులలా కాకుండా ఒక్ రిసోర్స్ లాగా చూడడమే ఇన్సెన్సిటివిటి.  మళ్ళీ అందులో సెన్సిటివిటి ఏమిటి”  అంది భార్గవి.   అందరూ నవ్వారు.

కానీ భార్గవి ఈ విషయంలో చాలా సీరియస్.  ఈ ఒక్క విషయంలోనే కాదు భార్గవికి ప్రతి విషయంలో ఒక ఖచ్చితమైన, ధృఢమైన అభిప్రాయం ఉంటుంది.  స్త్రీల పట్ల వివక్ష; ఇంట్లో, ఆఫీసులో వాళ్ళకి జరిగే అన్యాయాలు – ఇలాంటివే కాకుండా పర్యావరణ రక్షణ, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వం రైతులనుండి సారవంతమైన భూమిని వ్యవసాయేతర అవసరాలకోసం సేకరించడం – ఇలాంటివాటి పైన కూడా  ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటుంది.

సౌమ్య రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి అప్రూవల్ కోసం మేనేజర్ కాబిన్‌లోకి వెళ్ళేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. “బ్రాంచ్‌లో అడిషనల్ స్టాఫ్ కావాలి నిజమే, కానీ ఆడవాళ్ళు వద్దు.  ఇప్పటికే మా బ్రాంచ్‌లో ఆడ స్టాఫ్ ఎక్కువైపోయారు.  ఎప్పుడూ సెలవలు, పర్మిషన్లు!  వాటికితోడు గొడవలు!  చచ్చిపోతున్నాననుకో…” అంటూ సౌమ్యని చూసి ఫోన్ కట్ చేసాడు.

‘ప్రతి ఒక్కడూ ఆడవాళ్ళమీద కామెంట్లు చేసేవాడే!  సుత్తిమొహం…’ అనుకుంటూ అప్రూవల్ తీసుకుని “ఈ రిపోర్ట్స్ మెయిల్ చేసేసి నేను వెళ్తాను, పాపని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి” అంది. “ఓ.కె. నో ప్రాబ్లం. మరి లీవ్ అప్లై చేసారా?” అన్నాడు.  “లేదు, హాఫ్‌డే చేస్తాను” అని బయటకొచ్చింది, అంతకంటే ఏమీ అనలేక.

“ఏమంటున్నాడు మన బాసాసురుడు?” సౌమ్య విసురుగా రావడం చూసి అడిగింది ఉష.

“అసలు సెలవు తీసుకుందామనుకుంటే పనైపోగానే వెళ్ళిపోవచ్చని బతిమాలి ఆఫీసుకు రమ్మన్నాడు.  ఇప్పుడేమో తీరా పని పూర్తిచేసి వెళ్తానంటే హాఫ్‌డే లీవ్ పెట్టమంటున్నాడు.“  సౌమ్యకి ఒళ్లు మండిపోతోంది.

“A boss is a boss is a boss is a boss.” నవ్వింది సూజన్.

“ఇప్పుడు లీవెందుకు?  అప్పుడే నాలుగున్నర అయింది కదా!” ఆశ్చర్యపోయింది ఉష.  “నువ్వు అడగకపోయావా?” అంది

“ఉపయోగం లేదు.  నిన్నటి గొడవ తర్వాత ఆడవాళ్ళంటేనే మండిపోతున్నాడు.”  అంది సూజన్

“ఏమీ వద్దు.  లీవ్ అప్లై చేసి దర్జాగా వెళ్లిపో.  లేకపోతే వీళ్ళందరూ ఆడవాళ్ళు ఎప్పుడూ పర్మిషన్లు అడుగుతారని ఏడుస్తారు” అంది భార్గవి.

“నిజమే” అంది సూజన్.

లీవ్ అప్లై చేసి ఆఫీస్‌లోంచి బయటపడింది సౌమ్య.  అనన్యని డాక్టర్‌కి చూపించి ఇంటికి వెళ్ళింది.  అనన్యకి మందు వేసి, బ్రెడ్, పాలు ఇచ్చి పడుకోపెట్టింది.  మందు పనిచేసినట్టుంది, అనన్య ఏడవకుండా నిద్రపోతోంది.   సౌమ్య కూడా పక్కనే పడుకుంది.  ఈ రోజు చాలా అలసటగా ఉంది.  అందులోనూ మధు ఊళ్ళో లేకపోవడంతో మరీ ఒంటరిగా అనిపిస్తోంది.  ఇంతవరకు అనన్య గురించిన దిగులుతో ఆఫీసులో జరిగిన విషయాలు పట్టించుకోలేదు.  ఇప్పుడు అనన్య ప్రశాంతంగా నిద్రపోతూడడంతో పొద్దుననుండి జరిగిన విషయాలు గుర్తుకొస్తున్నాయి.

ఈ మేనేజర్ ఒకడు, మొత్తం పని చేయించుకుని హాఫ్‌డే లీవ్ పెట్టమన్నాడు.  దానికన్నా వాళ్ళు ఆడవాళ్ళ గురించి చేసిన కామెంట్లు మరీ బాధిస్తున్నాయి.  మెటర్నిటి లీవ్ గురించి రాకేష్ అసభ్యంగా మాట్లాడాడుట!  ఏమన్నాడో?  అసలు ఏమైనా అనే అధికారం అతనికేముంది?  మేనేజర్ అయితే ఏకంగా బ్రాంచ్‌లో ఆడస్టాఫునే వద్దంటున్నాడు.  ఏం?  ఆడవాళ్ళు జీనియస్సులు కారా?  వాళ్ళకి ఎఫిషియెన్సి లేదా?

తను చదువుకునే రోజుల్లో ఆడపిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయని మగపిల్లలు గొడవ చేసేవారు.  “మీరేమన్నా క్రికెట్ ఆడుతారా?  ఫ్రెండ్స్‌ తో బయట తిరుగుతారా?  ఊరికే ఇంట్లో కూర్చుని ఏమీ తోచక చదివితే మాకూ వస్తాయి మార్కులు” అని వెక్కిరించేవారు.  ఆడపిల్లలు కూడా స్పోర్టివ్‌గా తీసుకుని “మిమ్మల్ని మేమేమన్నా బయట తిరగమన్నామా?  మీరూ ఇంట్లో కూర్చుని చదవండి” అనేవారు నవ్వుతూ.  అప్పుడు ఏమీ అనిపించేది కాదు, సరదాగా ఉండేది.  కానీ ఇది వేరు!

బయట వాళ్ళననుకుని ఏం లాభం?  “ఆడవాళ్ళు ఎంత చదివినా పొయ్యిలోకే!  బి.యే. చదివినా బియ్యం ఏరాల్సిందే!” – అమ్మ టెంత్ తర్వాత ఇంకా చదువుకుంటానని గొడవ చేస్తే వాళ్ళ తాతయ్య అనేవాడట.  “స్త్రీ స్వాతంత్ర్యం అంటే ఇదే!  ఇంట్లోనూ, బయటా కష్టపడడమే!  కావాలని సాధించుకున్నారుగా! అనుభవించండి…” – అమ్మ ఇంట్లోనూ బయటా చేసుకోలేక సతమతమవుతుంటే తాతయ్య వెక్కిరింతగా అనేవాడు.  “నిన్ను ఉద్యోగం చేయమని ఎవడేడ్చారు?  ఆ వెధవుద్యోగం లేకపోతే గడవదా?  మానిపారెయ్…” – తనకేదైనా ఇబ్బందయితే అమ్మ మీద అరిచేవాడు నాన్న కూడా!  ఆ మాట అనిపించుకోకూడదని అమ్మ నానా హైరానా పడేది.  “నా ఉద్యోగం చిన్నదనీ, మీ నాన్నతో సమానంగా చదువుకోలేదనీ, సంపాదించటంలేదనీ చులకన నేనంటే.  మీరు మాత్రం బాగా చదువుకుని మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయాలి.  అప్పుడే మీకు గౌరవం” అనేది అమ్మ ఎప్పుడూ.  అమ్మ అభిప్రాయం ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తోంది.  వాళ్ళతో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా ఎందుకో అంత చులకన?

“ఈ మగవాళ్ళు ఇలా ఎందుకు ఉంటారో…” అంటే, “ఆడపిల్లలు పుట్టరు, తయారు చేయపడతారు అంటారు.  కానీ మగపిల్లలు కూడా పుట్టరు, తయారు చేయపడతారు.  మనం వారితో పాటు సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేయటం వారిలో తరతరాలుగా జీర్ణించుకున్న అహంకారం భరించలేదు.  ఆ అసహనంవల్లే ఈ కామెంట్లూ అవీ…  వీళ్ళసలు ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారు, కాని అవన్నీ ప్రేమ, ఆప్యాయతల ముసుగులో ఎవరికీ కనపడవు” అంటుంది భార్గవి.

ఇలాంటివెవరైనా తనని అంటే కాళ్ళూ, చేతులూ బిగిసిపోయి, గుడ్లప్పగించి చూస్తుంది కానీ తిరిగి సమాధానం చెప్పలేదు.  లాభం లేదు.  అలాంటివాళ్ళకి స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి.  రకరకాల అలోచనలతో సౌమ్య నిద్రలోకి జారుకుంది.

 

***

క్రీ.శ. 2040

 

“పెళ్ళి పెళ్ళి అని నన్ను ఊరికే సతాయించకమ్మా.  మీకెన్నిసార్లు చెప్పాలి?  నేను పెళ్ళి చేసుకోను.” సౌమ్యని విసుక్కుంది అనన్య.

అనన్య బయోటెక్నాలజిలో రీసెర్చ్ చేస్తోంది.  కూతురికి ముప్పయ్యేళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా పెళ్ళి కాలేదని సౌమ్య దిగులు.  ఎప్పుడైనా అనన్య ఇంట్లో ఖాళీగా దొరికితే ఇద్దరికీ ఇదే చర్చ.

“అదికాదమ్మా, నీకిష్టమైనవాడినే చేసుకో,   మేమేమీ కాదనం కదా!” అంటున్న సౌమ్యకేసి జాలిగా చూసింది అనన్య.

“అబ్బా!  నీకెలా చెప్తే అర్థమవుతుంది?  పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కదా ఇష్టమైనవాడో, ఇష్టంలేనివాడో!  పెళ్ళి చేసుకుని నా కెరీర్ పాడుచేసుకోలేను.”  అంది అనన్య

“పిన్నీ…!  అనన్యా…!” అంటూ వచ్చింది నవ్య, సౌమ్య అక్క కూతురు.  నవ్యని చూడగానే సౌమ్యకి సంతోషం వేసింది.  కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత “చూడవే… నవ్యా!  అనన్య అసలు పెళ్ళేచేసుకోనంటొంది.  నువ్వయినా చెప్పవే…” అంది సౌమ్య ఆశగా.

నవ్య అనన్యకి షేక్‌హాండ్ ఇచ్చి, “కంగ్రాచ్యులేషన్స్!  నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు.  ఈ మాట మీదే నిలబడు” అంది .
“అదేమిటే, నువ్వు కూడా అలా అంటావు!  పెళ్ళి చేసుకుని నువ్వు ఏం ఇబ్బంది పడుతున్నావు?  ఒకటి రెండేళ్ళల్లో పిల్లలకి కూడా ప్లాన్ చేస్తారనుకుంటుంటే…” ఆశ్చర్యంగా అంది సౌమ్య.

“ఓ, పిన్నీ!  పిల్లలా…! నో వే…!  అసలు పెళ్ళే ఒక బర్డెన్ అనుకుంటుంటే ఇక పిల్లలు కూడానా!”  నవ్య చాలా ధృఢంగా చెప్పింది.  అర్థం కానట్టు చూస్తున్న సౌమ్యతో “మా అమ్మ న్యూరాలజీ చెయాలని ఉన్నా రేడియాలజి ఎందుకు చేసింది, నేను ఉన్నాననే కదా!  నువ్వు ప్రమోషన్లు ఎందుకు వదులుకున్నావు, అనన్య కోసమే కదా!  అంటే మీ కెరీర్‌ని, కోరికలని మాకోసం చంపుకున్నారు.  నేను అలా ఉండాలనుకోవటం లేదు. అందుకే…” అంది నవ్య.

సౌమ్య అయోమయంగా చూసింది.  ఏమైంది వీళ్ళందరికీ!  తన స్నేహితులందరికీ వాళ్ళ పిల్లలతో ఇదే సమస్య.  సగానికి సగం మంది పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.  ఒకవేళ చేసుకున్నా పిల్లలని కనడమే లేదు, కెరీర్ పాడవుతుందని!

“అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది.  నవ్యేమో పిల్లలు వద్దంటోంది.  ఏం చెయాలి వీళ్ళని?” అంటూ మధు దగ్గర బాధపడింది.

“చూడూ!  మా అమ్మమ్మ వాళ్ళు ఏడుగురుట.  మా అమ్మ వాళ్ళు నలుగురు.  మేము ఇద్దరం.  మనకి ఒక్కరే.  మనని ఇంకొకరిని కనమని ఎంత బలవంతం చేసారో మర్చిపోయావా?” అన్నాడు.  “మరీ ఒక్క పిల్లేమిటే!  ఇంకొక్కరు ఉంటే బావుంటుంది.  ఒకరికొకరు తోడుగా ఉంటారు” అని అమ్మ ఎన్నోసార్లు తనతోనూ, అక్కతోనూ అనడం గుర్తొచ్చింది సౌమ్యకి.

“కానీ, ఇద్దర్ని మనం మేనేజ్ చేయలేమని కదా ఒక్కరే చాలనుకున్నాము”

“అదే నేను చెప్పేది.  మనం ఒక్కరు చాలనుకున్నాము.  ఈ తరం ఆ ఒక్కరు కూడా వద్దనుకుంటోంది.”

“పిల్లలు సరే, అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది కదా!  ఇప్పుడు బాగానే ఉంటుంది.  కొంతకాలం పోయిన తర్వాత ఒంటరితనంతో ఎంత బాధపడతారు!”  సౌమ్యకి ఈ పరిస్థితి మింగుడుపడడంలేదు.

“బహుశా బాధపడరేమో!  ఇప్పటికే సింగిల్‌గా ఉండే ఆడపిల్లలూ, మగపిల్లలూ ఎక్కువవుతున్నారు.  అనన్య స్నేహితుల్లో కూడా అలాంటివాళ్ళు చాలామందే ఉన్నారు కదా!  ఇంక ఒంటరితనం అన్న ప్రశ్నే రాదు.”

మధు తీసుకున్నంత తేలికగా సౌమ్య తీసుకోలేకపోతోంది.  “మనమేమీ చేయలేము.  ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్.”  అన్నాడు అనునయంగా మధు.

 

***

 

క్రీ.శ. 2300

 

వెంకట్ బిక్కుబిక్కుమంటూ రోడ్డుమీద నడుస్తున్నాడు.   కనుచూపుమేరలో ఇంకెవరూ లేరు.  దాదాపు రెండొందల సంవత్సరాల క్రితం మనుషులు ఇలా రోడ్డు మీద నడిచేవారట.  ఇల్లు ఇంకో వందగజాలు ఉండగా వెహికల్ ఆగిపోయింది.  దగ్గరే కదా అని నడవడం మొదలుపెట్టాడు.  కానీ మనసులో చాలా భయంగా ఉంది.   ఉన్నట్టుండి అయిదారుగురు ముసలివాళ్ళు చుట్టుముట్టారు.  వెంకట్‌కి ఏమి చేయాలో తెలియలేదు.  వెంకట్ దగ్గరున్న వస్తువులు లాక్కుని వాళ్ళు పారిపోయారు.  ఈమధ్య ఇది మామూలైపోయింది.  పోలీసులకి పట్టుబడతామని భయం కూడా లేదు.  నిజానికి పట్టుబడితే ఇంకా మంచిది.  ఏ రెండు మూడు నెలలో జైల్లో హాయిగా ఉంటారు.  పాపం వాళ్ళననేమీ లాభంలేదు!  స్ట్రగుల్ ఫర్ ఎగ్సిస్టెన్స్, అంతే!  

 

***

బాబి కంప్యూటర్ ముందునుంచి లేచాడు విసుగ్గా.  కంప్యూటర్ గేమ్స్ ఆడీ ఆడీ విసుగొచ్చేసింది.  రోజంతా కంప్యూటర్‌తోనే కాలక్షేపం.  ఆడుకోవడానికి కాదు కదా కనీసం మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు.  చదువు కూడా కంప్యూటర్ సహాయంతోనే.  అంతా ఆటోమేటెడ్!  రెండొందల ఏళ్ళ క్రితం వరకూ పిల్లలందరూ ‘బడి’లో చదువుకునేవారనీ, అక్కడ పాఠాలు చెప్పడానికి ‘టీచర్’ అనేవాళ్లు ఉండేవారనీ, సాయంకాలాలు పిల్లలందరూ కలిసి ఆడుకునేవారనీ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాడు.  వీడియోల్లో చూసాడు.  ఎంత బావుందో!  తనెప్పుడూ అలా ఆడుకోలేదు.  అసలు తన ఈడు పిల్లలని చూసి ఎన్నాళ్ళయిందో!

***

 

ప్రపంచ నేతల సదస్సు జరుగుతోంది.  అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు.

“మన టెక్నాలజి చాలా అభివృద్ధి చెందింది.  మనిషి తన మేధస్సునీ, తెలివి తేటలనీ ఒక్క రీసెర్చ్ కే ఉపయోగిస్తున్నాడు.  మిగిలిన రొటీన్ పనులన్నీ ఆటోమేట్ చేసాము.  అఫీసుల్లో, పొలాల్లో, ఫాక్టరీల్లో  పని అంతా రోబోలే చేస్తున్నాయి. ఈ రోబోలని కంట్రోల్ చేయడానికే మనిషి!

దీనికి ఇంకొక పార్శ్వం గమనిస్తే, ఇరవైయ్యొకటవ శతాబ్దంతో పోలిస్తే ప్రపంచ జనాభా సగానికి పైగా తగ్గిపోయింది.  దానిలో యాభై శాతం పైగా వృద్ధులే!  పిల్లలు పది శాతం కూడా లేరు!

కుటుంబ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవడంతో వృద్ధుల, పిల్లల భారం ప్రభుత్వాల మీద పడింది.  వారి పోషణ, రక్షణ ప్రభుత్వాలకి పెద్ద సవాలైంది.   వృద్ధులలో క్రైం రేటు బాగా పెరిగిపోయింది.  చిన్న చిన్న దొంగతనాలు, వృద్ధులు గుంపులు గుంపులుగా కలిసి ఒంటరివారిపై చేసే దాడులు పెరిగిపోయాయి.  జైళ్ళన్నీ వృద్ధులతో నిండిపోయాయి.  తోటిపిల్లలు లేకపోవడంతో పిల్లలు కూడా స్థబ్దుగా తయారయ్యారు.  అన్ని వర్గాల, వయస్సుల ప్రజలలో రకరకాల సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి.  ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరిగిపోయింది.  ఇదే పరిస్థితి కొనసాగితే తొందరలోనే మానవజాతి అంతరించి పోతుంది.  ఈ సమస్యని అధ్యయనం చేయడానికి సోషియాలజీ ప్రొఫెసర్ పండిట్ అధ్యక్షతలో ఒక కమిటీని నియమిస్తున్నాము.  ఈ కమిటీలో ఆర్థికశాస్త్రం, జీవశాస్త్రం మొదలైన రంగాలలో నిపుణులు మెంబర్లుగా ఉంటారు.” అని ముగించాడు.

ఆ కమిటీ ఒక సంవత్సరం పాటు రకరకాల అంశాలను అధ్యయనం చేసి జనాభా తగ్గడానికి గల కారణాలు, ఇది ఇలాగే ఉంటే ఇక ముందు మానవజాతి ఎదుర్కోబోయే సమస్యలు, అలాగే జనభా పెరుగుదలకు తీసుకోవలసిన చర్యలు సిఫార్సు చేసింది.   ప్రపంచ నేతల సదస్సులో ప్రొఫెసర్ పండిట్ ఆ రిపోర్ట్‌ లోని అంశాలని చెప్పడం మొదలుపెట్టాడు.

“ఇరవయ్యొకటవ శతాబ్దం తర్వాత జనాభా తగ్గడానికి గల ముఖ్యమైన కారణాలు:

  1. పర్యావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో సంతానలేమి పెరిగింది.
  2. ఇరవయ్యొకటవ శతాబ్దం నుంచీ స్త్రీలు పురుషులకి తామేమీ తీసిపోమని వారితో సమానంగా చదువూ, ఉద్యోగాలలో రాణించారు. ఆ క్రమంలో తమ చదువుకి, కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యం వివాహానికీ, సంతనానికీ ఇవ్వలేదు.   వివాహము, సంతానము తమ చదువుకూ, కెరీర్‌కూ ప్రతిబంధకంగా వారు భావించారు.

 

జనాభా తరుగుదలకి ఈ రెండో కారణమే ప్రధానం.  దీనిని అరికట్టాలంటే యువతకు, ముఖ్యంగా స్త్రీలకు వివాహము, సంతానము కారణంగా వారి కెరీర్‌కి ఎలాంటి ఆపద ఉండదని హామీ ఇవ్వాలి.  అంతే కాకుండా ఎక్కువమంది సంతానం ఉన్నవారికి తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది.  కుటుంబవ్యవస్థని తిరిగి పునరుద్ధరించటానికి తగిన చర్యలు తీసుకోవాలి.  ఇంకా…”

***

ఫోన్ మోగుతున్న శబ్దానికి సౌమ్యకి మెలకువ వచ్చింది.  కాసేపు తను ఎక్కడ ఉన్నదో అర్థం కాలేదు. తల తిప్పి చూస్తే పక్కన అనన్య నిద్రపోతోంది.   ఎంతసేపటినించీ ఆ ఫోన్ మోగుతోందో!  మోగీ మోగీ ఆగిపోయింది.   టైము చూస్తే తొమ్మిదే అయింది.  అంటే తను గంటే నిద్రపోయిందన్నమాట.  ఈ గంటలోనే కలా!  లేచి ఎవరు ఫోన్ చేసారా అని చూసింది.  భార్గవి.  ఎందుకు చేసిందా అని అనుకుంటుండగానే మళ్ళీ చేసింది,  అనన్యకి ఎలా ఉందంటూ.

“ఫరవాలేదు.  నిద్రపోతోంది.  అది సరే కానీ, నాకిప్పుడే ఒక చిత్రమైన కల వచ్చింది తెలుసా…”  అంటూ భార్గవికి తనకొచ్చిన కల చెప్పింది సౌమ్య నవ్వుతూ.

“ఇది నవ్వుకునే విషయం కాదు సౌమ్యా! ముందుముందు మానవజాతి ఎదుర్కునే స్థితి.  దీని సూచనలు ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలలో కనిపిస్తున్నాయి.  ఉదాహరణకి జపానులో జనాభా వృద్ధిలో తగ్గుదల ఇప్పటికే మొదలైంది.  దీనికి కారణం, అక్కడ స్త్రీలు కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యత సంతానానికి ఇవ్వకపోవడమే!  దీనివల్ల జపాను ప్రభుత్వం రకరకాల సమస్యలని ఎదుర్కొంటోంది.  ఈ సమాజానికి ఉత్పత్తి ఎంత ముఖ్యమో, పునరుత్పత్తి కూడా అంతే ముఖ్యం.  ఉత్పత్తి చేసే వాళ్ళల్లో ముఖ్యమైన రైతుకి అన్నదాత, రైతే రాజు అనీ, అలాగే కుటుంబవ్యవస్థలో, పునరుత్పత్తిలో ముఖ్యపాత్ర వహించే స్త్రీకి గృహలక్ష్మి, మాతృదేవత అని బిరుదులిస్తున్నామే కానీ, వారి శ్రమకు తగిన విలువ, గుర్తింపు, గౌరవం ఇవ్వడంలేదు.  కుటుంబమా – కెరీరా?  పిల్లలా – ప్రమోషన్లా?  ఇలా ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే పరిస్థితి నేటి స్త్రీది.  కానీ ఈ రెండూ జంటపదాల్లాగా, జుగల్బందీలాగా విడదీయలేనివి.  ఇది అర్థం చేసుకోనంతకాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు.  ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నీకొచ్చిన కల నిజమవడానికి ఎంతో కాలం పట్టదు.” ఆవేశంగా అని, “మా మహిళా సంస్థలో వీటిగురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.  ఇంకా ఎంతో చర్చ జరగాల్సి ఉంది.  ఎంతో అర్థం చేసుకోవాల్సి ఉంది.  రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం.” అంటూ ఫోన్ పెట్టేసింది భార్గవి.

భార్గవి మాటలకు బిత్తరపోయి అలాగే కూర్చుండిపోయింది సౌమ్య.                                                                                                               *

 

[ఉత్పత్తి సమాజ మనుగడకు ఎంత ముఖ్యమో పునరుత్పత్తి అంత ముఖ్యం.  దానిలో కీలక పాత్ర స్త్రీది.  అక్కడ వారి శ్రమకు విలువగుర్తింపు, గౌరవం దొరకాలి.  ప్రస్తుతం అవి లేవు.  మాతృమూర్తి, దేవత అని కితాబునిచ్చి ఊరుకుంటారు.  –  ఓల్గా]

గతమా, మరచిపో నన్ను !!!

మంచం పక్కన సైడ్ టేబిల్ మీద పెట్టిన మొబైల్ ఫోన్- రాత్రి పెట్టిన చేసిన టైముని గౌరవిస్తూ ‘ఇంక లేవాలి సుమా“ అంటూ మోగింది. రొజాయిలోంచి చెయ్యి మాత్రం బయటకి తీసి దాని నోరు నొక్కి “ఒక్క పది నిముషాలే” అనుకుంటూ మళ్ళీ రొజాయిలోకి దూరేను. తిరిగి నిద్రలోకి జారుకోబోతూ “ఇంక లాభం లేదు” అని బద్ధకంగా రొజాయి తొలిగించి, కిందనున్న జోళ్ళలోకి పాదాలు దూర్చేను. పక్కనున్న శాలువ కప్పుకుని లేచి అటువైపు చూస్తే, ఎప్పటిలాగే నిండా ముసుగు పెట్టుకుని మనిషి ఆకారం కనపడ్డమే తప్ప అసలు మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా బిగదీసుకుని పడుక్కున్నాడు మోహన్. తన వైపు తిరిగి తలమీదనున్న రొజాయిని పూర్తిగా తప్పించకుండా, కనిపించిన చెవిమీదే చిన్నగా ముద్దు పెట్టి బాత్రూమోకి దూరి గీసర్ వేసేను.

వంటింట్లోకి వెళ్ళి, ఒక కప్పులో నీళ్ళు పోసి, మైక్రోవేవ్లో పెట్టి, పిల్లల గదిలోకి నడిచేను. డిసెంబర్ చలికి ముడుచుకుని, మొత్తం శరీరం రొజాయిలోకి దూర్చి నిద్రపోతోంది ఎనిమిదేళ్ళ పియా. దానికి వ్యతిరేకంగా సగం పాదాలూ, వేళ్ళ చివర్లూ, కొంచం మొహమూ బయటకి పెట్టి పడుక్కుంది ఆరేళ్ళ రియా. ఇద్దరినీ కనిపించిన చోటల్లా చిన్న చిన్న ముద్దులు పెట్టుకుని, రొజాయి సరిగ్గా సర్ది, బయటకి వచ్చేను. వేడినీళ్ళ కప్పుని బయటకి తీసి దాన్లో ఒక టీ బాగ్ పడేసి, నిమ్మకాయ కోసి రెండు చుక్కలు పిండి, నడవాలో ఉన్న వార్డ్‌రోబ్లో రాత్రే హాంగర్ మీద పెట్టుకున్న యూనిఫార్మ్ తీసి పక్కనున్న కుర్చీ మీద వేసేను.

స్నానం చేసి, తయారయి, బేగ్ భుజానికి తగిలించుకున్నాను. మళ్ళీ రెండు పడకగదుల్లోకీ తొంగి చూసి, ముందు గదిలో పడుక్కున్న 35 ఏళ్ళ పనమ్మాయి ప్రమీల అలార్మ్‌ సరిగ్గా ఉందో లేదో చూసేను. మరి తను ముందు లేచి మిగతా వాళ్ళని లేపకపోతే ఇంకంతే సంగతి. ముందు తలుపు మెల్లిగా తెరిచి బయటకి వచ్చి శబ్దం కాకుండా మూసి, తాళం పడిందని నిర్ధారించుకుని కిందకి నడిచేను. చల్లగా, తడిగా ఉన్న కారు హాండిల్‌ తెరిచి, లోపల కూలబడి ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చేటప్పటికి టైమ్ తెల్లవారున 4. 15. శీతాకాలపు ప్రాతఃకాలం అర్థరాత్రిలా అనిపిస్తోంది. ట్రాఫిక్ కానీ రెడ్ లైట్లు కానీ లేకపోవడంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ కేటాయించిన ఎంప్లోయీస్ పార్కింగ్ లాట్లోకి ప్రవేశించేసరికి, షిఫ్ట్ టైమ్ అయిన 5 గంటలు అవడానికి ఇంకా 20 నిముషాలుంది. వెనక సీట్ మీద నిన్న పడేసిన ఆఫీస్ ఓవర్ కోట్ని తొడుక్కుంటూ, బాగ్ ఒక చేతిలోకి తీసుకుని ఇంకొక చేత్తో కార్ తాళం వేసి బయటకి వచ్చేను. రెండు కార్లవతల ఆదిత్యా సేన్‌గుప్తా తన కార్లోంచి బయటకి వచ్చి కార్ లాక్ చేస్తూ కనపడ్డాడు. వడివడిగా నన్ను చూడనట్టు తల తిప్పుకుని అవతలివైపునుంచి టర్మినల్ గేటువైపు దారి తీస్తున్నాడు.

ఎప్పటి సేన్‌గుప్తా! ఎలాంటి జ్ఞాపకాలు! అతనితో సంబంధం తెగి పదేళ్ళ పైన అయింది. కానీ నా ఈ జ్ఞాపకాలమీద హక్కు నాది కానట్టుగా, ఆ జ్ఞాపకాలు ఇంకెవరివో అన్నట్టు అనిపిస్తోందెందుకో!
********

టర్మినల్ వైపు నడుస్తూ బాగ్‌లోంచి ఐడెంటిటీ కార్డ్ ఉన్న గొలుసు తీసి మెళ్ళో వేసుకుని వాష్ రూమ్లోకి నడిచేను. మేకప్ కిట్ తీసి యాంత్రికంగా అయిదు నిముషాల్లో మేకప్ వేసుకోవడం పూర్తి చేసి, జుట్టు దువ్వుకుని డ్యూటీ అలాట్మెంట్ గదిలోకి నడిచేను. అప్పటికే డ్యూటీకి రిపోర్ట్ చేసిన అసిస్టెంట్ మేనేజర్లు గదిలో ఉన్నారు. డ్యూటీ షీట్ మీద డ్యూటీస్ రాసి, లోడర్ తెచ్చిచ్చిన టీ తాగుతూ ఉంటే, వద్దనుకున్నా మనస్సు గతంలోకి జారిపోయింది. సీట్ దొరకని పాసెంజర్ల రణగొణ ధ్వని మొదలవడానికి ఇంకా గంటైనా పడుతుంది.

ట్రైనింగ్ అయిన తరువాత డైరెక్ట్ రిక్రూటీగా చేరిన కొత్తల్లో నా పోస్టింగ్ -అసిస్టెంట్ మేనేజర్‌గా(కమర్షియల్ డిపార్ట్‌మెంట్‌), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ -1ఏ లో అయింది. ట్రైనింగ్ తరువాత రెగ్యులర్ డ్యూటీస్ చేయడానికి అనుభవం లేకపోవడం వల్ల ఒక వారమో, పది రోజులో ఏ సూపర్వైసర్ పక్కనో ఉండి గమనిస్తూ, ఆ సూపర్వైసర్కి అనధికారమైన సహాయకురాలిగా పని చేస్తే కానీ ట్రైనింగ్లో నేర్చుకున్న విషయాలు ప్రాక్టికల్గా చేయడం కుదరదు. మరి అది నా అదృష్టమో దురదృష్టమో ఈ నాటికీ అర్థం కాలేదు కానీ అప్పుడు ఆ మొదటి రోజు సూపర్వైసర్ ఆదిత్యా సేన్‌గుప్తాయే. అది కూడా ఆరోజుల్లో అంతగా రద్దీ లేని ఎరైవల్ హాల్లో. అప్పటికి నాకు ముఖాలు కొత్త. పేర్లు కొత్త. ఎవరే రేంకో తెలిసేది కాదు. మరీ ముఖ్యంగా స్త్రీలయితే-ఒకే రంగు యూనిఫార్మ్ చీరలు. మగ కొలీగ్స్ అయితే కనీసం వాళ్ళ చొక్కాల భుజాలమీద తగిలించుకునే ఎపలెట్స్ బట్టి వాళ్ళు సీనియర్లో, జూనియర్లో అని ఊహించగలిగేదాన్ని.
అతని వెంబడే ఉండి అతను పాసెంజెర్లతో ఎలా డీల్ చేస్తున్నాడో అని గమనిస్తూ, కొంతసేపటి తరువాత “ అనవసరంగా పనికి అడ్డం పడుతున్నానేమోన్న” సంకోచంతో, అడపాతడపా వినిపిస్తున్న అనౌన్స్‌మెంట్లని వింటూ, కన్వేయర్ బెల్టుల కదలికలని గమనిస్తూ, బిడియంగా, అలవాటు లేని చీరతో తాజ్ కౌంటర్‌కి ఎదురుగా నిలుచున్నాను.

చేతిలో ఉన్న వాకీ టాకీతో నాదగ్గిరకి వచ్చి, నా మెడనుంచి వేలాడుతున్న ఐడెంటిటీ కార్డ్‌ని పరికించి చూసి. “ఇంకొక అరగంట ఎరైవల్ ఏదీ లేదు. టీ తాగుదామా?” అన్న సేన్‌గుప్తాని చూసి “హమ్మయ్యా, ఇలా బొమ్మలా నిలుచోవడం తప్పింది” అనుకుంటూ తలూపేను. టీ తాగుతున్నప్పుడు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్న చూపులని తప్పించుకుందామని అనిపించలేదు. అతన్నే చూస్తుండిపోయేను. వెడల్పాటి భుజాలు. సన్నటి కళ్ళజోడు ఫ్రేముతో, బెంగాలీలకున్న చక్కటి చర్మంతో మృదువుగా మాట్లాడుతున్నాడతను. “మాట్లాడేటప్పుడు చేతులు తిప్పడం అలవాటనుకుంటాను. బెంగాలీ యాస లేదు. ఢిల్లీలోనే చిన్నప్పటినుండీ ఉండడం వల్ల హిందీ అంత బాగా మాట్లాడుతున్నాడా? కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాత్రం భాష ధారాళంగా లేదే! రెయిసీనా బెంగాలీ స్కూల్లో చదువుకుని ఉంటాడు. ” నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. కొంతసేపటి తరువాత అప్పటి ఎరైవల్స్ అయిపోయేయి. ఫ్లైట్ బోర్డ్ చూస్తే గంట టైముంది తరువాత ఫ్లైటుకి. గ్లాస్ తలుపుల అవతలనుంచి అప్పుడే పైకొస్తున్న సూర్యుడు ‘రారమ్మంటూ’ పిలుస్తున్నాడు.
“ఎండ పైకొచ్చింది. టార్మాక్ మీద చిన్న వాక్ చేసి వద్దామా”? అన్న అతని ప్రశ్నకి తలూపి నేనూ అతనితోపాటు బయటకి నడిచేను.

మొత్తం చదువు కో-ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్‌లోనే సాగింది. అయినా అతడంటే ఏదో వింతయిన ఆకర్షణ మొదటి రోజే !

“ఊ, మీ గురించి చెప్పండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఏ కాలేజీలో చదివేరు?-అతను
“నేనూ మా అమ్మగారూ- అంతే. హిందూ కాలేజ్, తరువాత ఐఐఎమ్-అహమెదాబాద్. “-నేను.

“బోయ్ ఫ్రెండెవరూ లేరా? బయటకి వెళ్తూ ఉంటారా? డైరెక్ట్ రిక్రూటీగా చేరేరే! సిఫారసు ఉందా ఏమిటి?
‘ప్రశ్నల పరంపర.’ ఆఖరి ప్రశ్న ఇంకెవరైనా కనుక వేసుంటే “ ఏం?నాకేమైనా చదువు తక్కువా, తెలివి లేదా సిఫారసు కావడానికి “ అంటూ విరుచుకు పడి ఉండేదాన్ని.

అతని గురించి ఏ ప్రశ్నా వేయాలని కూడా తోచలేదు నాకు. అయినా అతనే తన గురించి చెప్పుకుంటూ పోయేడు.

“భార్య తన్ని అర్థం చేసుకోదు( బంధువుల్లో తప్ప పెళ్ళయిన మగవాళ్ళు పరిచయం లేకపోవడంతో ఈ క్లాసిక్ లైన్ నా మట్టి బుర్రకి తట్టలేదప్పుడు). ఆవిడ సెంట్రల్ గవర్న్‌మెంట్ ఉద్యోగి. ఎప్పుడు చూసినా తన పుట్టిల్లూ, తన పిల్లలూ, తన ఉద్యోగం, తన షాపింగ్ అవీ తప్ప ఇతనికోసం సమయం కేటాయించదు. ఇద్దరికీ పడదు. ఎప్పుడూ పోట్లాటలే. ఇద్దరు పిల్లలు. ఇల్లు చిత్తరంజన్ పార్క్ అనబడే ఇపిడిపి (East Pakistan Displaced Persons Colony) కోలొనీలో.”
“ఖాళీ సమయంలో ఏమిటి చేస్తారు?” వింటూ, ఆలోచనల్లో ములిగిపోయిన నేను ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.

“పుస్తకాలు చదువుతాను” –అసంకల్పితంగా.
అదేదో జోక్ అన్నట్టు అతను పగలబడి నవ్వేడు.
“మీరు పుస్తకాలు చదవరా?” అయోమయంగా అడిగిన నేను.
“అంత టైమెక్కడా వేస్ట్ చేసుకోడానికి?”
బెంగాలీ వాళ్ళకి సాహిత్యమన్నా, లలిత కళలన్నా ప్రాణం అన్న లేమాన్ అభిప్రాయం మాత్రం నాకుండేది. దానికి నా బెంగాలీ క్లాస్‌మేట్స్ కూడా దోహదపడ్డారు. ఆటల్లో తప్ప అన్నిట్లో సామాన్యంగా వాళ్ళే ముందుండేవారు. పుస్తకాలు చదవడం అలవాటులేని బెంగాలీయా! సామాన్యంగా అయితే అదొక అనర్హత నా దృష్టిలో. కానీ అతనికి అనర్హత అన్న మాటని ఆపాదించడానికి ఎందుకోకానీ మనసొప్పలేదు.
ఇలా పిచ్చాపాటీ మాట్లాడుతూ తిరిగి టర్మినల్ బిల్డింగ్ వైపు నడుస్తున్నప్పుడు అతను నాకు దగ్గిరగా జరిగేడు. కొద్ది నిముషాల్లో నా కుడి చెయ్యి అతని చేతిలో ఇరుక్కుని ఉంది. అభ్యంతరం అనిపించలేదు. టర్మినల్ బిల్డింగ్ సమీపిస్తుండగా నా చేతిని వదిలి దూరం జరిగేడు.

***

అన్నట్టు ఇంత ఉపోద్ఘాతమూ చెప్తూ, నా గురించి మాత్రం చెప్పలేదు కదూ! నా పేరు మోహన. మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయేరు. అమ్మ బాంక్ ఉద్యోగిని. ఒక్కర్తే నన్ను పెంచింది. తల్లితండ్రులు పెట్టిన నా పేరు తనకి నచ్చలేదని నిరూపించాలనుకున్నాడేమో దేవుడు! చిన్నప్పుడు వచ్చిన చికెన్ పాక్స్ నా ముఖంమీద చిన్న గుంటలని వదిలింది.

వంశపారంపర్యంగా లేని పొట్టితనాన్ని ఎక్కడినుండి కొని తెచ్చుకున్నానో కానీ నా ఎత్తు అయిదడుగులు మాత్రమే. పోనీ సన్నగా, నాజూగ్గా ఉంటానా అంటే గుమ్మటం అనడానికి లేదు కానీ ఆ లెక్కే. దానివల్ల చదువులో అయితే ముందుండేదాన్ని కానీ నాతో చదువుకునేవారితో బయటకి వెళ్ళడాలూ అవీ తక్కువే. నా క్లాస్‌మేట్స్‌కి నా రూపురేఖల గురించి పట్టింపుండేది కాదు. కానీ ఎక్కడికయినా తిరగడానికి వెళ్దామంటే నేనే ఒక విధమైన న్యూనతాభావంతో “ఈ సారికి మీరెళ్ళి రండి. మరోసారి వస్తాను” అనేదాన్ని. నా క్లాస్‌మేట్సయిన అబ్బాయిలు నన్ను తమలో ఒకదానిగా భావించేవారే తప్ప నన్ను ఒక అమ్మాయిగా జమకట్టేవారే కారు. అయితే వాళ్ళ దయవల్ల అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో అని మాత్రం బాగానే నేర్చుకున్నాను. కానీ బోయ్‌ఫ్రెండ్స్‌ ఎక్కడినుంచి వస్తారు?
అది నా మొదటి మార్నింగ్ షిఫ్ట్. ఆదిత్య ఆ షిఫ్ట్ తప్ప వేరేదేదైనా సరే, తప్పించుకునేవాడు. ఆ తరువాత ఏదో మధ్యమధ్యలో తప్ప ఒక సంవత్సరం పొడుగూ నేనూ అర్లీ మార్నింగ్ షిఫ్ట్ తప్ప ఇంకేదీ చేసేదాన్ని కాదు. కొన్నిసార్లు డ్యూటీ పూర్తి అయేక దూరంగా ఉన్న ఏ హొటెల్లోనో గది తీసుకోవడం, తిరిగి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఆ హోటెల్ జ్ఞాపకాలు మధురమైన స్మృతులుగా మాత్రం మారలేకపోయేయి.
న్యూస్ పేపర్లే సరిగ్గా చదవని అతనితో మాట్లాడ్డానికి శ్రమపడవలిసి వచ్చేది. తను చూసే టివి సీరియళ్ళన్నిటి గురించీ మాట్లాడే మాటలు మాత్రం వినేదాన్ని. స్టార్ డస్ట్, ఫిల్మ్ ఫేర్ లాంటి పత్రికల్లో వచ్చే గాసిప్ కాలమ్స్ గురించి మాట్లాడటం నేర్చుకోవడానికి ప్రయత్నించేను. నేను చదివే పుస్తకాల గురించి ఎప్పుడైనా చెప్పబోతే “ అబ్బా అవన్నీ ముసలితనంలో పనికొస్తాయిగా! ఈ వయస్సులో అంత పెద్ద సంగతుల గురించెందుకు?” అని విసుక్కునేవాడు. “ఈ దారి నీ నాశనానికే సుమా” అని హెచ్చరిస్తున్న అంతరాత్మని నేను లక్ష్యపెడితే కదా! ఎలిజిబిల్ బాచిలర్స్ అందరూ అతని ముందు దిగదుడుపే నా దృష్టిలో. కొంతకాలం తరువాత ఆ హోటెలూ అవీ కూడా తగ్గిపోయేయి. కళ్ళకి తొడుక్కున్న రంగుటద్దాలు కాస్తా మెల్లిమెల్లిగా రంగు కోల్పోయి, తేటపడటం మొదలుపెట్టేయి. కానీ అలవాటయిన జాడ్యం ఒక పట్టాన్న వదలదే!

ఒక సాయంత్రం నాకెప్పటిలాగే అతనితో మాట్లాడాలనిపించింది. మొబైళ్ళ కాలం కాదది. గతంలో అతను పదేపదే చెప్పిన జాగ్రత్తలనీ, చేసిన హెచ్చరికలనీ మరిచిపోయి ఒక సాయంత్రం అతనింటికి ఫోన్ చేసేను. ముందెవరో పిల్లల కంఠం ఆ తరువాత ఒక స్త్రీ గొంతూ వినిపించేయి. అతని గొంతు వినిపించేవరకూ ఎవరు ఫోనెత్తినా ఏదీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తూనే ఉన్నాను. ఆఖరికి అతనే ఎత్తేడు కానీ కోపంగా, లోగొంతుతో ‘తనకి ఇష్టం లేకపోయినా భార్య తల్లీ తండ్రీ వచ్చేరని’ చెప్పి “ఇలా ఫోన్ చేయడానికి ముంచుకు పడిపోయిన కారణాలేమైనా ఉన్నాయా?” అని కూడా అడిగేడు.

chinnakatha

ఏదో తప్పు చేసినట్టు తడబడుతూ ఉన్న నా గొంతు పెగిలేలోగానే బాక్‌గ్రౌండ్లో అతని భార్య గొంతు వినిపించింది. భర్తంటే ఇష్టం లేకపోయిన ఆమె అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతోంది. మౌత్ పీస్ అరిచేత్తో మూసినట్టున్నాడు. అంత స్పష్టంగా వినపడలేదు కానీ బెంగాలీలో ఆమెతో గారాబంగా ఏదో అంటున్నాడు. ఫోన్ ఏ చెక్కబల్ల మీదో పెట్టిన శబ్దం అయింది. ఇప్పుడు నవ్వులూ, కేరింతలూ అన్నీ గట్టిగా వినిపిస్తున్నాయి. అతను నాకు చెప్పిన కథకి పూర్తి వ్యతిరేకంగా ఉంది అక్కడి పరిస్థితి. “షోనా”, “ధన్” అన్న పిలుపులతో నా చెవులకి చిల్లులు పడి, కంపరం పుడుతున్నా కానీ కొత్తగా నేర్చుకున్న మిడిమిడి బెంగాలీ జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఫోన్ నా చెవి దగ్గిరే పెట్టుకుని వింటున్నాను. కొంత సేపటి తరువాత అతనికి గుర్తొచ్చింది కాబోలు తను ఫోన్ కింద పెట్టి అవతలికి వెళ్ళిపోయేడని. ఫోనెత్తి “ ఇంకా ఇక్కడే ఉన్నావా” అన్న అర్థం వచ్చే ఛీత్కారంలాంటిది చేసి ఠాక్కుమంటూ పెట్టేసేడు.

మా ఇద్దరి సంగతీ ఎయిర్ పోర్టులో మొదటే బయటపడింది. డెస్క్ జాబ్స్ కావు కాబట్టి ఎవరూ వెనక ఎంత గుసగుసలాడుకున్నా కానీ మా ముందు మాత్రం బయటపడేవారు కాదు.

మర్నాడు అతను సెలవు పెట్టేడు. ఆ మర్నాడు అతను నాకు ముందుగానే డ్యూటీకి రిపోర్ట్ చేసేడు. నేనింక ట్రైనీని కాను కాబట్టి నా డ్యూటీ అలాట్ చేసేదొకరు, అతని డ్యూటీ వేసేదింకొకరు. మా ఇద్దరి సంగతి తెలిసినప్పటినుంచీ వీలయినంతవరకూ మేమిద్దరం ముందే ఆలోచించుకుని ఒక చోటే డ్యూటీ వేయించుకునేవాళ్ళం. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా- నేనిప్పుడు అతనికి సుపీరియర్ని. నేనదంత పట్టించుకోలేదు కానీ అతనికి మాత్రం అది పెద్ద సమస్యగా మారిందని త్వరలోనే అర్థం అవడం మొదలయింది. నాతో పాటు డ్యూటీ పడినప్పుడు అతను తన పనిని కావాలని నిర్లక్ష్యం చేయడం, పేసెంజెర్ల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు మాయం అవడం ప్రారంభించేడు. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పాటించడం నామోషీగా అనిపించేది. కొత్తగా అసిస్టెంట్లుగా చేరిన అమ్మాయిల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం, వాళ్ళతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడటం- అది అతని అసలు స్వభావం అని అర్థం అయితే అయింది కానీ నాకు నేను ఎంత మట్టుకు నచ్చచెప్పుకున్నా, అసూయ మాత్రం పుట్టుకు వచ్చేది.

ఆ రోజు మాత్రం డిపార్చర్ హాల్ కిటకిటలాడుతున్నప్పుడు, అలవాటు కొద్దీ ఆదిత్య తన డ్యూటీ పోయింట్‌ని పట్టించుకోకుండా ఇద్దరమ్మాయిలతో కూర్చుని టీ తాగుతున్నాడు. అది చూసిన ఒక పాసెంజర్ అతన్నేవో వ్యంగ్యమైన మాటలని అని, నాదగ్గిరకి వచ్చి ‘కంప్లైంట్ బుక్ ఇస్తే అతని మీద కంప్లైంట్ రాసిస్తానని’ చెప్పేడు. ఎంత నచ్చచెప్పినా వినకపోతే విధి లేక అతనికి కంప్లైంట్ బుక్ అందించేను. సామాన్యంగా పేసెంజెర్లెవరైనా ఎన్ని మాటలన్నా కానీ లిఖితపూర్వకమైన ఫిర్యాదు వస్తే మాత్రం ఎయిర్‌పోర్ట్ మానేజర్ దానిమీద తప్పక ఏక్షన్ తీసుకుంటారు. అప్పటికే తన ఇంటికి ఫోన్ చేసినందుకు పోట్లాట పెట్టుకోడానికి నెపం వెతుకుతున్న ఆదిత్య ఈ సంఘటనతో నిగ్రహం కోల్పోయి, పేసెంజర్లు లేని ఖాళీ సమయం చూసి నా దగ్గిరకి వచ్చి కొట్టినట్టుగా అరుస్తూ మాట్లాడేడు. ఊహించని ఈ పరిణామానికి నేను ఒక్క మాటా మాట్లాడలేకపోయి వాష్ రూమ్లోకి నడిచేను. వాష్ రూమ్ అటెండెంట్లిద్దరు జరిగినది లోపలనుంచి తొంగి చూసినట్టున్నారు. నేను లోపలకి అడుగు పెట్టగానే మాట్లాడుకుంటున్నవాళ్ళు కాస్తా మౌనంగా పనులు కలిపించుకుని బిసీ అయిపోయేరు.

పట్టుమని ఒక వారం కాలేదు. మధ్య ముప్పైల్లో ఉన్న ‘అందమైనదే’ అనిపించే ఒకావిడ ఒక ఆదివారం విసిటర్స్ పాస్ తీసుకుని నావైపొచ్చింది. పరిచయం ఉన్న మొహంలా కనిపించింది తప్ప ఆదిత్య వాలట్లో ఆమె ఫోటో చూసేనన్న సంగతే గుర్తుకి రాలేదు. ఆమె వచ్చీ రావడంతోనే గొంతు పెద్దది చేసి “నా భర్తే కావలిసి వచ్చేడా నీకు?అంతా చెప్పేడులే నా ప్రియతొమ్. అయినా గంతకి తగ్గ బొంత అని నీలాంటి కురూపినే ఇంకెవడినో పట్టుకోక నా సంసారమే నాశనం చేయాలనిపించిందా? ఇకనుండీ అతని వెనక పడటం మానకపోతే, మీ డైరెక్టర్కి రిపోర్ట్ చేస్తా చూసుకో. ఏమనుకున్నావో! “ అంటూ ఎలా రుసరుసమంటూ వచ్చిందో అలాగే బయటకి నడిచింది. చుట్టూ జాలిగా చూస్తున్న చూపులని, హేళనగా పెట్టిన మొహాలని, లోలోపల నవ్వుకుంటున్నవారినీ తప్పించుకుంటూ ఎర్రపడిన ముఖం( తెల్ల చర్మం ఒక్కటే నాకు వారసత్వంగా వచ్చినది)తో, కళ్ళలోనుంచి ఉబికి వస్తున్న నీటిని అదుపులో పెట్టుకుంటూ మళ్ళీ తిరిగి వాష్ రూమ్లోకి దూరేను.

ఆ రోజునుంచీ నేనే అతని డ్యూటీ ఎక్కడో చూసేక, అతనికి దూరంగా ఎక్కడో డ్యూటీ ఎంచుకునేదాన్ని.

మరుసటి నెల రోస్టర్లో నేను మధ్యాహ్నం షిఫ్ట్‌ కోసమూ దానితోపాటు టర్మినల్ బదిలీ కోసం కూడా అప్లై చేసేను. రెండూ మారేయి.

***

టర్మినల్ 2 లో నా గతాన్ని వెనక్కి నెట్టి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించడం ప్రారంభించినప్పుడు కానీ నా క్రిత ఒకటిన్నర ఏళ్ళనీ ఆదిత్యతో తప్ప మిగతా ఏ స్నేహాలూ, బంధాలూ ఏర్పరచుకోకుండా వ్యర్థం చేసేనని గుర్తించలేకపోయేను. మెల్లిమెల్లిగా స్నేహితులంటూ ఏర్పడటం ప్రారంభించేరు. అప్పుడే నా పరిచయం మోహన్తో అయింది. సాయంత్రం డ్యూటీలో డిపార్చర్స్‌ టర్మినల్లో రాత్రివేళ ఖాళీగా ఉన్న కొంతమందిమి కలిపి భోజనం చేసేవాళ్ళమి. మోహన్ గొంతు బాగుండేది. అడగడమే ఆలస్యం, పాట ఎత్తుకునేవాడు.

అతనికి ఇష్టమైన సింగర్ మొహమ్మద్ రఫీ. పాట పాడేటప్పుడు నావైపు చూస్తూ పాడేవాడు. నన్నే ఉద్దేశ్యించి పాడుతున్నట్టుగా అనిపించేది. అది నిజమేనని తెలియడానికి ఎక్కువకాలం పట్టలేదు. మోహన్ కూడా డైరెక్ట్ రిక్రూటీయే. నాకన్నా కొంచం సీనియర్ . జిమ్‌కి వెళ్ళడం లేకపోతే రోజుకి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడవడం అలవాటు. వత్తైన జుట్టు. కళ్ళజోడు. తల్లి తామిలియన్, తండ్త్రి తెలుగు. తన కన్నా రెండేళ్ళు చిన్నదైన చెల్లెలు సంగీతకి పెళ్ళయిపోయింది. మోహన్‌కి పుస్తకాల పిచ్చి. స్పందన అతనినుండే ప్రారంభం అవడం వల్ల అతనికి చేరువు కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఎయిర్‌పోర్టులో ఎవరి వ్యవహారాలూ రహస్యం కాకపోవడం వల్ల అతనినుండి దాగినదేదీ లేదు. అతనితో పెరుగుతున్న స్నేహంతో కూడిన సాన్నిహిత్యం నన్ను స్థిమితపరుస్తూ, నాకు సాంత్వన కలగజేస్తోంది. కానీ అది ఆదిత్యతో నాకు ముందుండే సంబంధంలో ఉన్న లోపాలనీ, దాని పునాది లేమినీ, మాకిద్దరి మధ్యా ఉన్న అసమానతనీ, అ అర్థరహితమైన సంబంధం ప్రారంభం అవడానికి గల నా బలహీనతకీ కూడా ఎత్తి చూపించడం ప్రారంభించింది.

ఆ తరువాత ఆరు నెల్లకే మోహన్తో నా పెళ్ళి జరిగింది. పెళ్ళికి వచ్చిన కొలీగ్సందరూ సంతోషపడ్డారు. ఆదిత్యని పిలవలేదు. మోహన్ తల్లీ, తండ్రీ ఎయిర్ పోర్టుకి దూరంగా ఉండటం వల్ల మేమిద్దరం అప్లికేషన్ పెట్టి ఎయిర్లైన్స్ కోలొనీలో ముందు రెండేళ్ళూ ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఆ తరువాత లోన్ తీసుకుని ఇప్పుడున్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాం.

ఇప్పుడు నేను తెల్లవారు షిఫ్టూ, తను మధ్యాహ్నం. పిల్లలకి దగ్గిరగా 24 గంటలూ తల్లో తండ్రో ఒకరైనా ఉండాలన్న మోహన్ ప్రతిపాదన నచ్చింది నాకు. నిద్ర లేమి ఇద్దరికీ. కానీ ఒకరికోసం మరొకరం, పిల్లలకోసం తపన పడటం ఆహ్లాదం కలిగిస్తోంది. నాకంటూ ఒక చిన్న లోకం ఏర్పడింది. అదంటే నాకు మక్కువ.

ఆ రోజుల ఉద్రిక్తతా, ఏడుపులూ, మొర్రలూ, అభద్రతాభావం, బెదిరింపులూ ఏవీ లేవిప్పుడు. మోహన్ కోసం తన భార్యతో పోట్లాడాలేమో అనే భయం లేదు. ఎవరో వచ్చి నన్ను బెదిరిస్తారేమో అనుకోనక్కరలేదు. ఈ సంసారం, ఈ మనిషీ నా స్వంతం. అరువు తెచ్చుకున్నదేదీ/ఎవరూ లేరు. నా ఆడపడుచుకీ అత్తమామలకీ నేనంటే ఎంతో అభిమానం. చాటుమాటు వ్యవహారాలు లేవు. ఎక్కడికి వెళ్తే ఎవరు గుర్తు పడతారో అన్న జడుపు లేదు. అప్పటి చీకటి బతుక్కీ దీనికీ ఎంత తేడా!

***
“మాడమ్ లక్నో పాసెంజెర్లు ఫ్లైట్ లేటయిందని గొడవ పెడుతున్నారు” అన్న అసిస్టెంట్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. వెళ్ళి చూస్తే అక్కడ సేన్‌గుప్తా పేసెంజెర్లని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.

“ ఓహో, ఇక్కడ పోస్టింగ్ అయిందా! మరి జాయినింగ్ రిపోర్ట్ ఎక్కడిచ్చేడో! బదిలీల అధ్యాయం మళ్ళీ మొదలయిందన్న మాట!” అనుకుంటూ అటువైపు నడుస్తుండగా, “ ఏమిటయ్యా, పని రాదా? ఫ్లైట్ ఆలస్యం అవడానికి కారణం అడిగితే ఇదా సమాధానం?” అంటూ అరుస్తున్న బిగ్గర గొంతులు వినిపించేయి. అనుకోకుండా అతని వైపు చూస్తే అతని కళ్ళలో ఎర్రజీరలు. మనిషి పొట్టి, దానికి తోడు ముందుకి పొడుచుకుని వచ్చిన పొట్ట మీద నీలం రంగు యూనిఫార్మ్ టై కాస్తా అతను కదిలినప్పుడల్లా పొట్టమీద ఉండనని మారాం చేస్తూ ఇటూ అటూ ఊగిసలాడుతోంది. పదేళ్ళ కింద ఉన్న పలచని జుట్టు నున్నని బట్టతలగా మారినట్టుంది. ఎన్ని మార్పులు! అయిదేళ్ళయి ఉండదూ ఈ మనిషిని చూసి! తనకొక చోట పోస్టింగ్ అయితే నాకు వేరే చోట కావాలని నేనడగడం, అలాగే తనూ-ఇద్దరం ఒకరినొకరు తప్పించుకుంటూ, ఒకే సంస్థలో పని చేస్తున్నా కానీ ఒకరికొకరం ఎదురుపడలేదీ మధ్య.

ఈ మధ్య రతి అన్న ఎవరో కొత్తమ్మాయితో ఈ యాబై ఏళ్ళ మనిషి తిరుగుతున్నాడని విన్నాను. చిన్న నిట్టూర్పు విడిచి పాసెంజెర్ల మధ్యకి నడిచి నన్ను నేను సీనియర్ మేనేజర్గా పరిచయం చేసుకుని, ఫ్లైట్ స్థితిని వివరించడం ప్రారంభించేను. వెనక్కి చూస్తే ఆదిత్య లేడక్కడ.

మొబైల్లో మోహన్ నుంచి ఫోన్ “ రేపు నీకూ సెలవేగా! అమ్మావాళ్ళింటికి పిల్లలని తీసుకుని వెళ్దామా? అమ్మ అడుగుతోంది చాలా రోజలయింది కలుసుకుని- అని. సంగీత కూడా వస్తోందిట తన పిల్లల్ని తీసుకుని.” ‘ హమ్మయ్యా. నా జీవితం, నా సంసారం, నా వర్తమానం నన్ను పిలుస్తున్నాయి. గతమా, నన్ను క్షమించేవు. అది చాలు నాకు. దయచేసి ఇంక గుర్తు రాకు సుమా.’”

-కృష్ణ వేణి