పాపం పాకావిలాస్‌..!

 

కేరళా పాల్ఘాట్‌ నించి పారొచ్చేరు. తమిళ కంచినించి కదిలొచ్చేరు. కన్నడ బళ్లారినుంచి దౌడాయింపుతో వచ్చేరు. వచ్చి వచ్చి చోడవరంలో పడ్డారు. అంతా అయ్యర్ల మేళమే. ఊరి బస్టాండ్‌లో సోమయ్యరు పాల్ఘాట్‌ కాఫీభవన్‌ తెరుచుకుంది. చినబజార్‌లో తంబీ హోటల్‌ మెరిసింది. కొత్తూరులో గణపతీవిలాస్‌ గలగలమంది. లక్షిందేవిపేట సిగన కేశవ్‌కేఫ్‌ కుదురుకుంది. పోలీస్‌ ఠాణా ఎదురుగా మణికంఠా లంచ్‌హోమ్‌ రెడీ అయ్యింది.

పచ్చగా దోసపళ్లలా ఉండీవారు వచ్చిన అయ్యర్లు. విభూది పిండికట్లు ఒళ్లంతా పెట్టి, పాలతెలుపు పంచెలుకట్టి, భుజంమీద పట్టువాణీలు పెట్టి, రుద్రాక్షపూసలదండలు మెళ్లో చుట్టి, అప్పుడే కైలాసంనించి దిగొచ్చిన శంభోశంకరుని ప్రతినిధుల్లా ఉండీవారు. స్ఫటికాల్లాంటి వాళ్లరూపాలు చూసే మేం సగం పడిపోయేం. ఆనక వాళ్ల మాట తీరు మమ్మల్ని మరో సగం వొంచీసింది. వాళ్ల మర్యాద, మన్నన పూర్తిగా దిగలాగీసింది. వాళ్లు మాట్లాడే పగిలిన తెలుగు మమ్మల్ని ముచ్చటపరిచీసింది.

అయితే, వాళ్లొచ్చీదాకా మావూరి జనానికి అల్పాహారం గురించి స్వల్పంగా నయినా తెలీదని కాదు. మేం మరీ అంత దారుణంగా బతుకుతున్నామనీ కాదు. పెద్దబజార్లో పద్మనాభుని బుల్లబ్బాయి కాఫీహోటల్‌ మాకు తెలియందా. పీర్లపంజా దగ్గర్లోని కురందాసు పాపారావు పాకావిలాస్‌, ఎడ్లవీధిలో సింహాచలం నాయుడు తాటాకు వొటేలు తెలీకనా. తాలూకాఫీస్‌ పక్కనుండే అమ్మాజమ్మ టీ దుకాణం, ఫకీర్‌సాహెబ్‌పేట దార్లో ఉండే ఇప్పిలి మోహనరావు టీకొట్టూ, పూర్ణా సినీమాహాలు దరినున్న అగ్గాల సన్నాసి గొడుగుబండి మా బుర్రలో లేకనా. ఇవన్నీ  బాగానే తెలుసును. వీటన్నిట్లోనూ మేం తిన్నవాళ్లమే. కాపోతే, అయ్యర్లొచ్చేక  మా తిండి మొత్తం తిరగబడిపోయింది.

అప్పటివరకూ, పాపారావు పాకావిలాస్‌లో ముగ్గురు చేరేరంటే, నాలుగోవాడు నిలబడే  తినాలి. పదేళ్ల కిందట నేయించిన తాటాకు పైకప్పునుంచి నల్లటి నుసి గోధుమరంగు ఇడ్డెన్ల మీద పడుతున్నా భరించాలి. పోనీ అని సింహాచలం టీ దుకాణానికి వెళ్లేవనుకోండి. అక్కడ గోలెంలోని కుడితినీళ్లలాటి తెల్ల జలాల్లో అందరు తిన్న సివరి ప్లేట్లూ ముంచితీసీడవే. అన్నీ ఎంగిలిమంగలాలే. సర్వమంగళ మాంగల్యమే. అమ్మాజమ్మ టీ చిక్కం కుట్టించింది ఎప్పుడో ఎవడికీ తెలీదు. అది నల్లపీలికలా అయిపోయి మా చిన్నప్పటినించీ డికాషను ఒడకడుతూనే ఉండీది. సన్నాసి కొట్టూ తక్కువకాదు. అంచులన్నీ  చుట్టుకుపోయిన లొత్తల పేట్లుండీవి. మోహనరావు  వొటేల్లో కూర్చునీ కుర్చీకి మూడు కాళ్లు పొడవు. ఒక  కాలు కురచ. పద్మనాభునివారు ఉప్పుపిండి తప్పనిచ్చి మరోటి వడ్డిస్తే ఒట్టు. రుచుల సంగతి చెప్పుకుందావంటే అవీ నేలబారే. ఎక్కడికెళ్లినా ప్లేట్లో ఇడ్లీ పడీడం. వాటి మీద వేపిన శెనగపప్పు టుర్రు చెట్నీ పోసీడం. ఆటు మీదట పసుపుపచ్చ బొంబాయి చెట్నీ ఒలిపీడం. పోనీ అని, చెమ్చాతో తిందామని నోరుతెరిచి అడిగితే, చెయ్యిలేదేటి.. అనీది సమాధానం.  అన్ని పచ్చళ్లూ మీద పడిపోయిన ఇడ్లీలు ఎలా ఉండీవంటే, గంధాలు మెత్తిన సింహాద్రప్పన్న నిత్యరూపంలా ఉండీవి. ఏడాదికోమారయినా అప్పన్నబాబు నిజరూపాన్ని సింహాచలంలో చూడొచ్చు. మా ప్లేట్లో ఇడ్లీలెప్పుడూ మాక్కనబడిందే లేదు. అన్నీ కలిపికొట్టీసీ కావేటిరంగా అనీడవే. మూతి తుడుచుకుని పోడవే.

అట్టు విషయమైతే అసలు చెప్పక్కర్లేదు. అది మినపట్టో, రవ్వట్టో, పెసరట్టో నరమానవుడు పోల్చలేడు. ఉల్లిపాయుంటే అది ఉల్లి అట్టు. జీలకర్ర కనబడితే అది పెసరట్టు. అలా అంచనాగా అనీసుకోడవే. ఉప్మా అంటే గోడకి సినీమా పోస్టర్లు అంటించుకునీ బంకలాగుండీది. పీటీ ఉషలాగ పరిగెడుతుండీది. అయితే ఒకటి లెండి. మేవిచ్చీ పావలాకీ, బేడకీ అంతకంటే ఎవడు పెట్టగలడు లెండి. పైగా ఈ ఫలహార దుకాణాలు నడిపీవాళ్లంతాను, ఏరోజుకారోజు సామాన్లు తెచ్చి చేసీవాళ్లే.  డబ్బున్నవాళ్లేం కాదు. కాబట్టి మాటిమాటికీ కుర్చీలు కొత్తవి ఎలా కూర్చగలరు. బెంచీలు ఎలా మార్చగలరు.

అయ్యర్లు వచ్చేక మాకు కొత్త తిండి సంగతులు కొంచెంబానే తెలిసినట్టయింది. మాకు తెలీని మద్రాసు సాంబారు ఘుమఘుములు ముక్కుకు తగీలివి. వేడివేడి సాంబారిడ్లీ జుర్రుకు తినీసీవాళ్లం. సింగిలిడ్లీ.. బకెట్‌సాంబారు.. నినాదం ఒక జాతీయవిధానంగా మావూళ్లో స్థిరపడిపోయిందప్పుడే. అట్టు అనే మా మాట ఎక్కడికి పోయిందో తెలీదు. దోశ పదం దొరసానయింది. రవ్వదోశ, మావుదోశ, పెసరదోశ మాముందుకు వచ్చీవి. మామూలు ఉప్మా ఉండీదా. అది అయ్యర్ల చేతుల్లో పడ్డాక టమాటా బాత్‌ అయిపోయీదంటే నమ్మండి. ఎన్నడూ పెద్దగా ఎరగని మసాలాదోశ, తైర్‌వడ, బోండా, పొంగలి మానోటికి అందీసీటప్పటికి లజ్జుగుజ్జులు పడిపోయీవాళ్లం.

మసాలాదోశలోకి కూర ఎలా చేరిందో, గారెలోకి పెరుగు మరెలా దూరిందో, బోండాలోకి  బంగాళాదుంప ఇంకెలా చొచ్చుకుపోయిందో.. బాపతు సందేహాలతో మా ఊరి ముసిలాళ్లు కొందరు అదోలా అయిపోయీవారు. చెట్నీ వ్యవహారమూ చిన్నది కాదు. కొబ్బరి చెట్నీ అంటే కొబ్బరికాయ పచ్చడే తప్పనిచ్చి శెనగపప్పు పెద్దగా తగిలీదికాదు. వేగిన ఉల్లిపాయతో చేసిన సరికొత్త చెట్నీ చేతులోకొచ్చేక ఎవరి మాట మేం వినగలవండీ. మేమెప్పుడూ ఎరగని రసం ఉండనే ఉంది. అవియల్‌, పొరియల్‌ సిద్ధమయ్యేయి. స్వీట్లు, డ్రింకుల సంసారం గురించి చెప్పాంటే మాటలు చాలవు. జాంగ్రీలు, బాద్‌షాలు, బాదంగీర్లు రాజ్యం చేసీవి. కవురుకంపు టీలు తాగిన మాకు అయ్యరుబాబులు కమ్మని కాఫీ కప్పులు నోటికందించేరు. మా కళ్లముందే కాఫీగింజలు మిషన్లలో ఆడి ఫిల్టర్లకెత్తీవారు.

వాళ్ల శుచి, వాళ్ల శుభ్రతా మామూలేంటి. పరిమళాలు వెదజల్లే ఊదొత్తులు వెలిగించేరు. పొందికయిన కుర్చీలు వేసేరు. పాలరాతి పలకలున్న ఒబ్బిడి టేబుళ్లు పరిచేరు. తళతళలాడే స్టీల్‌ప్లేట్లు మాముందుపెట్టేరు. అందుకే, మేవంతా నిత్యమూ అయ్యర్ల హోటళ్లమీదేమీదనే ఉండీవాళ్లం. ఆ దెబ్బకి ఊరి పాకావిలాసున్నీ విలాసం లేకుండా పోయేయి. మామూలుగానే ఎప్పుడూ ఈగలు ముసురుకునీ ఈ హొటేళ్లు, ఒక్కసారిగా దోమలు కూడా తోలుకోడం మొదలెట్టేయి. ఒక్కడంటే ఒక్కడూ వాటి మొహం చూసీవాడు కాదు. అరువిద్దామన్నా వచ్చీదాతాదైవం కనిపించలేదు. మరంచేతే, అనతి కాలంలోనే, వీటిని నడిపేవాళ్లంతా  నిలువూ నిపాతంగా నీరయిపోయేరు. అడ్డంగా మునిగిపోయేరు. చెట్టోపిట్టగా ఎగిరిపోయేరు.

అయ్యర్ల భోజనసామ్రాజ్యం ఊళ్లో ఆ విధంగా నాలుగైదు దశాబ్దాలు నడిచింది. ఒక్కరిగా వచ్చిన అయ్యరు బాబులు, వాళ్ల దేశాలెల్లి పెళ్లిళ్లు చేసుకుని అడ్డబొట్టు కామాక్షమ్మల్ని తీసుకొచ్చేరు. చిమ్మిలి ముద్దల్లాంటి విశాలాక్షమ్మల్ని తెచ్చుకొచ్చేరు. పిల్లల్ని మాత్రం మావూళ్లోనే కన్నారు. వాళ్లూ చోడవరం గుంటల్లో ఒకటయిపోయేరు.

తొలినాళ్లలో వచ్చిన అయ్యర్లు,  తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం కలగలిపీసీవారు. సంకరభాషగా పనగలిపీసీవారు. ఆ తర్వాత మాత్రం మన భాషా నేర్చీసేరు. అయినప్పటికీ వారి పలుకుల్లో అరవయాస, మయాళీ ఘోష కనిపించీది. వాళ్ల  పిల్లలు మా మధ్యలో పడ్డారు కాబట్టికి, ఏట్రా, గీట్రా అని మాలానే మాటాడీవారు. అలా హాయిగా సాగిపోతున్న అయ్యర్లకి పదిపదిహేనేళ్ల కిందటినించీ గొప్ప దెబ్బతగుల్తూ వచ్చీసింది.

ఎక్కడినుంచో వెళిపొచ్చీసిన వాళ్లెవరో ఆంధ్రాలో రాజ్యం చేయడమేంటని అనుకున్నారో.. తిండికి మించిన వ్యాపారం మరోటి ఉండదని తలపోసారో.. మనవాళ్లని తినే హక్కు మనకే ఉందని భావించారో..  మనకి తెలీదు.  కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్నించి ఎవరెవరో పరుగుల మీద మావేపు వచ్చీసేరు.  రియల్‌ఎస్టేట్‌ ధర్మమాని వాళ్ల ఊళ్లో ధరలు పెరిగిన ఊర భూములు కొన్నింటిని భారీ డబ్బుసంచుకి అమ్మీసుకున్నారు. భవిష్యత్తులో బాగుపడిపోతుందనుకున్న విశాఖపట్నం ప్రాంతానికి వెల్లువెత్తీసేరు. ఉత్తరం పత్తరం లేకుండా మా ఉత్తరానికొచ్చి పడిపోయేరు.

వచ్చినవాళ్లు పట్టణాలకే కాదు. పల్లెలకీ పాకీసేరు. వాళ్లకి డబ్బంటే భయం లేదు. రిస్కంటే రస్కంత ఇష్టం. అడ్డంగా సొమ్మొచ్చి పడిపోతే ఆలోచన సరళమైపోతుంది. ఇందువల్లే, ధనాన్ని వెదజల్లీగలిగేరు. నెల్లూరుమెస్‌ అన్నారు. బెజవాడహోటల్‌ అన్నారు. గూడూరుసదన్‌ అన్నారు. గుంటూరుగృహ అన్నారు. ఒంగోలు కాఫీహౌస్‌ అన్నారు. మెస్‌ మీద మెస్‌ పెట్టీసేరు. మెస్సు సంస్కృతి మాకు మప్పీసేరు. నీరు పల్లమెరుగు. నీరు లాంటిదే పెట్టుబడీను. దానికీ పల్లమే తెలుసు. పల్లంలోకి ప్రవహించి పదింతలు కావడమే తెలుసు. చోడవరం కూడాని పల్లంలోనే ఉంది కదేంటి.

మెస్సు వస్తాదులు వస్తూవస్తూ కొత్తరుచులు వెంటతెచ్చీసేరు. మా అయ్యర్లకి బొక్క బద్దలయిపోయింది. విజయవాడ ఉలవచారు ముందు చెన్నై సాంబారు చెదిరిపోయింది. గుంటూరు గోంగూర దెబ్బకి అవియల్‌ అయిపులేకుండాపోయింది. కృష్ణా పులుసుకూరలు హూంకరించీసరికి పొరియల్‌‌ పులిసిపోయింది. నెల్లూరు మొలకొలుకుల ముంగిట కళింగ హంస బియ్యాలు  కడదేరిపోయేయి. ఎర్రగా వర్రగా నోటికి తగిలే అల్లం పచ్చడి ముందర మద్రాసు శాకం చిన్నబోయింది. ఫ్రైకర్రీ ముఖం చూ సీసరికి అరవ కొబ్బరికూర హడలెత్తిపోయింది. చుక్కకూర పప్పు పుల్లపుల్లగా విరగబడ్డంతో అయ్యరుగారి ముద్దపప్పు ముణగదీసుకుపోయింది. చివరాఖరికి, చవులూరించే సరికొత్త పాకం ముందు పాల్ఘాట్‌ పడకేస్సింది.  అయ్యర్లు వెజిటేరియన్లు. మెస్సుయితే నాన్‌ వెజ్జూ వడ్డించగవు. అయ్యర్లకి అరువివ్వడం భయం. మెస్సులు అరువు ఇవ్వాగగలవు.  అరిచి రిచి వసూలు చేసుకోనూగలవు. దానాదీనా, ఊరి జనం నాలుకలన్నీ కొత్తవేపు మొగ్గుచూపించేయి. మా అయ్యర్ల హోటళ్లన్నీ బోసిపోయేయి. లాభం లేకపోతే పోయే. నష్టాలు తగులుకోడం మొదలయ్యింది.

మావూళ్లో అయ్యర్లు ఎంత సంపాదించుకున్నా ఎప్పుడూ గజం భూమి  కొనలేదు. మెస్సు మారాజులు అలా కాదు. రూపాయొచ్చినా స్థలాలే కొనీవారు. మజ్జిగచార్లు గట్రా మాచేత మట్టసంగా తాగించీసి, మాభూములే క్రయిచీటిలు రాయించీసుకునీవారు. ఇంకోమాట ఏంటంటే, అలగ.. ఇలగ.. ఎలగ..  అని మాట్లాడే మా సొంత మాటలకి బదులుగా, అట్టాగ.. ఇట్టాగ.. ఎట్టాగ.. అని మేవందరూ కొత్త పలుకు నేర్చడమూ ఆ మహానుభావుల పుణ్యమే. వాళ్ల తెలివితేటలకి, వ్యాపారదక్షతకి మోకరిల్లిపోయి, ఆ మాటలే అసలైన తెలుగుభాషని మావూళ్లో చాలామంది అనుకోపోలేదు కూడాను.

తమ హోటళ్లు ఆకులు నాకి పోతూ, మెస్సులన్నీ కస్టమర్లతో కళకళలాడిపోతున్న తరుణంలో, దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే తత్వంగల అయ్యర్లకి లైటు వెలిగింది. చోడవరంనించి పొందింది చాలనుకుంటూ తమ సొంత ప్రదేశాలకు ప్రయాణాలు కట్టీయాలని నిర్ణయించీసుకున్నారు. మెల్లగా దుకాణాలు మూసీసి, వచ్చినంతకే కుర్చీలు, బెంచీలు మెస్సుల వాళ్లకే అమ్మీసుకుని బయలెల్లిపోడం ఆరంభించేరు. ఎక్కడ చదువుతున్న పిల్లల్ని అక్కడే ఉద్యోగా లు చూసుకోమన్నారు. లేదా వ్యాపారాలు పెట్టుకోమన్నారు. చదువూసంధ్యాలేని కుర్రాయిల్ని   చోడవరంలోనే తగలడమన్నారు. వాళ్లిక్కడే గంతకి తగ్గ బొంతల్ని లవ్‌మేరేజ్‌లు గట్రా చేసుకుని మెస్సుల్లోనే సూపర్‌వైజర్లుగా, వెయిటర్లుగా స్థిరపడిపోయేరు. పూలమ్మినచోట కట్టెలమ్మడమూ ఒక కళే అనీసుకున్నారు.

చోడవరం నుంచి ప్రయాణం కట్టిన కొందరు ముసలి అయ్యర్లు ఓపికలు పోయి, మోకాళ్లు వీకయిపోయి, ఉన్నదేదో బ్యాంకులో వేసీసుకుని, కంచి కోవెల్లో పూజార్లయిపోయేరు. మరికొందరేమో పాల్ఘాట్‌ వెళ్లిపోయి  కాఫీగుండ దుకాణాలు తెరుచుకున్నారు. మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే, ఇప్పుడు ఒక్కటంటే ఒక్క అయ్యరు హోటలూ మావూళ్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అయితే,  ఒకటి మాత్రం నిజం. పాకావిలాసుల్ని అయ్యర్లు సాగనంపీగలిగేరు. అయ్యర్లని మెస్సులు తగిలీగలిగేయి. కానీ, మెస్సుల్ని దారిపెట్టీడం మటికి అంత సులువుకాదు. అలుణ్ని బలుడు కొడితే, బలుణ్ని బ్రెమ్మదేవుడు కొడతాడంటారు. అలాంటిదేదో జరగాలంతే..!

*

 

 

తూరుపు గాలులు ( పెద్ద కథ – మొదటి భాగం )

 

1

వి వర్షావాసపు తొలిరోజులు. ఎక్కడోవర్షించి, తేలిపోయివచ్చిన దూదిమేఘాలు ఆకాశమార్గాన పరుగులు పెడుతున్నాయి. ఉండీఉడిగీ చిరుజల్లులూ, వెంబడే ఉక్కపోత; అంతేగాని భారీవర్షాలింకా మొదలుకాలేదు. సాయింత్రంపూట సముద్రంమీదనుండి చల్లనిగాలివీచినప్పుడే కాస్తంత ఉపశమనం. భద్రపాలుడు ఆమధ్యాహ్నంపూట విహారప్రాంగణంలోని మర్రిచెట్టునీడలో, రాతిగట్టుమీద కూర్చొని, కుడిచేతిని నుదిటిపైన ఆనించి,  కళ్ళుచిట్లించి లోయలోకి చూస్తున్నాడు. చాకలివాళ్ళు లోయలో ఎండలకిచిక్కి సన్నబడిన వాగులోనే బట్టలుతుకుతున్నారు. వర్షాలుపడ్డాక ఆ చిన్నారివాగే పంపానదిగామారి పరవళ్ళు తొక్కుతుంది. చాకళ్ళు బట్టల్ని బండకేసిమోదిన క్షణకాలం తరవాత ‘దభీ, దభీ’ మనే శబ్దం పైకి కొండమీదకి వినవస్తోంది; ఆ వెంటనే ఆ శబ్దపు ప్రతిధ్వని లోయల్లో గింగురుమంటోంది. ఎక్కడ్నించో మొగనెమళ్ళు ఆత్రుతగా, సుదీర్ఘంగా పిలుస్తున్నాయి; ఆడనెమళ్ళు మాత్రం బెట్టుచేస్తూ, అప్పుడప్పుడు క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకుంటున్నవి. ఉన్నట్టుండి చాకలివాళ్ళ వెంటవచ్చే కుక్కలన్నీ కలసికట్టుగా మొరగనారంభించాయి; ఆ వెంటనే బెదిరినట్టుగా చాకళ్ళ గాడిదలు గుంపుగా ఓండ్రపెట్టాయి.

భిక్షాటనకని వెళ్ళిన భిక్షువులబృందం ఇంకా తిరిగిరాలేదు. వాళ్లు తెచ్చిపెడితే తినాలి. ఈ మధ్యంతా ఇదే తంతు. ఆరోగ్యం బాగోలేక విహారంవిడిచి వెళ్ళలేకపోతున్నాడు. దృష్టి బాగామందగించింది. శృంగవృక్షం గ్రామంలోనే వాళ్ళకి కావలసినంత భిక్ష దొరికిపోతుంది. మధ్యమధ్యలో ఎవరోఒకరువచ్చి పళ్ళు, ఫలాలు ఇచ్చిపోతుంటారు. గ్రామపెద్దలూ, ఒకటిరెండు కుటుంబాలవాళ్ళు, సంవత్సరానికొకటి రెండుసార్లువచ్చి చీవారాలు (భిక్షువులు ధరించే కాషాయి వస్త్రాలు) ఇస్తూంటారు. అందుచేత తిండికీ, బట్టకీ ఇబ్బందిలేదు.  భద్రపాలునివద్దకు వైద్యంకోసం గ్రామస్థులు వస్తూంటారు. అతనిచ్చే వేర్లు, ఆకుపసర్లు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. వైద్యుడిగా అతడికి మంచిపేరే ఉంది.

భద్రపాలుడికి చావంటే భయంలేదు గాని ‘ఇంకా ఏమేమి చూడాలో’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. దీపాంకరుడికి విహారబాధ్యతలు అప్పగించి వెళ్ళిపోగలిగితే బాగుండునని అతనికి తరచూఅనిపిస్తోంది. దీపాంకరుడు ఎప్పటికైనా తిరిగిరాకపోతాడా అనేఆశ అతనిలో ఇంకామిగిలిఉంది. ఇప్పటికే నాలుగేళ్ళు గడిచిపోయాయి. భద్రపాలుడే పట్టుబట్టి అతడినీ, అతడి శిష్యుడినీ  నాలందా మహావిహారానికి పంపించాడు. మూడేళ్ళల్లో తిరిగి రావాల్సింది.  ఏమైపోయాడో? ఇక్కడ విహారం పరిస్థితి చూస్తే ఏడాదికేడాది దిగజారుతున్నది.

ఈ ఏడాది వర్షావాసానికి పన్నెండుమంది భిక్షువులు మాత్రమే విహారానికి చేరారు. వాళ్ళంతా ప్రతీ సంవత్సరం వచ్చే వాళ్ళే.  మరో పదిమందైనా రావాలి. వస్తారో లేదో; ప్రతీ ఏడూ ఇలాగే ఎదురుచూడడం. విహారంచేరే భిక్షువుల సంఖ్య తగ్గిపోతోంది. ఏ అడవిజంతువు వాళ్ళని కబళించిందో  లేక జబ్బుపడి ఏ మార్గమధ్యాన మరణించారో? దీపాంకరుడి విషయంలోనూ అలాంటి ఉపద్రవమేదైనా జరిగిందా? అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాజ్యాల్లో ఏమి జరుగుతోందో? వచ్చేపోయే వాళ్లులేక ఏ సంగతీ తెలియరావడం లేదు. కళింగపట్నం, కోరంగిరేవుల మీదుగా వస్తూపోయే సింహళ భిక్షువులుకూడా ఈమధ్య ఇటుగా రావడంలేదు.

భద్రపాలుడు యువకుడుగా ఉన్నప్పుడు వర్షావాసాల్లో వందలకొద్దీ భిక్షువులతో కళకళలాడిన విహారం ఇప్పుడు పూర్తిగా  బోసిపోయింది. చుట్టుపక్కల మూడు కొండలకి విస్తరించిఉన్న విహారపుగుహల్లో ఇదొక్కటే వాడుకలో మిగిలింది. ఒకటి పూర్తిగా పాడుబడి గబ్బిలాలనిలయంగా మారిపోయింది. శిల్పులు అసంపూర్ణంగా వదిలిపెట్టిన మూడోగుహలోని స్తూపానికి గతపదేళ్లుగా శివలింగం రూపంలో పూజలూ, జంతుబలులూ జరుగుతున్నాయి. అక్కడ శివరాత్రినాడు జాతరకూడా జరుగుతుంది; ఆరోజున చుట్టుపక్కల గ్రామస్థులు చాలామంది జాతరకని వస్తారుగాని, విహారం జోలికిరారు. ఎప్పుడైనా భిక్షువులు ఎదురుపడితే సాధువులని భావించి భక్తిగా దండంపెడతారు; ఆపాటి గౌరవంఉంది. దగ్గరలో ఉన్న నాలుగు గ్రామాల్లో ఏ గ్రామానికి భిక్షాటనకి వెళ్ళినా ఆ పూటకి సరిపడా భిక్ష దొరికిపోతుంది. ఉండే భిక్షువులే పది, పన్నెండుమంది. కొత్త భిక్షువులు వచ్చిచేరడం ఎప్పుడో ఆగిపోయింది. దీపాంకరుడి తరవాత ఒకరో, ఇద్దరో.

కుక్కలు ఎందుకు మొరిగాయో భద్రపాలుడికి బోధపడింది. ఒక సాధువులగుంపు విహారంవైపుగా వస్తున్నది. పది మంది ఉంటారేమో. ఏదో తత్వం పాడుకుంటూ సునాయాసంగా కొండెక్కుతున్నారు. వాళ్ళ పాట అస్పష్టంగా వినబడుతున్నది. ఎప్పుడైనా ఒకరిద్దరు సాధువులువచ్చి, ఒకటిరెండు రాత్రుళ్ళు తలదాచుకొని వెళ్లిపోవడం చూశాడుగాని ఇంతమంది గుంపుగా ఎప్పుడూ రాలేదు. వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? సాధువులు మర్రిచెట్టుని సమీపిస్తూనే భద్రపాలుడికి నమస్కరించి మంచినీళ్ళడిగారు. గుహలకి దారితీసే రాతిమెట్లకి ఒకవైపున పేర్చిఉన్న కుండలకేసి చూపించాడు. నీళ్ళుతాగి, మర్రిచెట్టుకింద కూర్చున్నారు. సాధువుల్లోని పెద్దాయన అన్నాడు:

“స్వామీ, మేమంతా కాశీనుండి వస్తున్నాం; రామేశ్వరం వెళుతున్నాం. కాశీలో మాకీయన తటస్థపడ్డాడు. ఉజ్జయని మీదుగాకాకుండా తూర్పుగాంగుల రాజ్యంలోంచి, కళింగదేశం మీదుగా తీరంవెంబడి వెళ్తున్నాంఅనంటే మాతోబాటు వస్తానన్నాడు. గోదావరి సమీపంలోని పంపానదీతీరానఉన్న బౌద్ధవిహారానికి వెళ్ళాలన్నాడు; సరే, రమ్మన్నాం. దారిలోఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ, మజిలీలుచేస్తూ వచ్చేసరికి ఏడాది దాటింది. కాశీలో కలసినప్పుడే మీవాడు చాలా  ముభావంగా ఉన్నాడు.  మహానదిదాటి కళింగదేశం చేరేనాటికి బొత్తిగా మాట్లాడడం మానేశాడు. ఆరోగ్యం బాగోలేదు; మతికూడా చలించినట్టుంది”.

భద్రపాలుడికి నెమ్మదిగా అర్థంఅయింది. సాధువులందర్నీ మార్చిమార్చిచూడగా, గొంతుక్కూర్చొని నేలమీద వేలితో గీతలుగీస్తున్న యువకుడు దీపాంకరుడు అయిఉండవచ్చని ఊహించాడు. మిగతా సాధువుల్లాగే గెడ్డం, మీసాలు, జడలుకట్టిన జుత్తు. భద్రపాలుడి గొంతుక ఎండిపోయింది. అతి కష్టంమీద అతనిగొంతు పెగిలింది.

“అవును, ఇతను దీపాంకరుడు. నాలందామహావిహారానికి పంపించాం. ఎప్పుడొస్తాడాఅని ఎదురుచూస్తున్నాం”.

“మీరు వినలేదా? తురుష్కులదాడితో నాలందా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వందలమంది భిక్షువుల్ని వెంటతరిమి ఊచకోత కోశారు. మిగిలినవాళ్ళు తలోదిక్కూ పారిపోయారు. కాశీలో కలిసినప్పుడు మీవాడిని అడిగితే వివరాలేవీ చెప్పలేకపోయాడుగాని, ఆప్రాంతాల్లో అందరికీ తెలుసు. మేం కాశీలో బయిల్దేరేనాటికి తురుష్కులు తగులబెట్టిన తాళపత్రగ్రంధాలు మూడునెలలపాటు మండుతూనే ఉన్నాయని అంతా అనుకుంటున్నారు”.

చాలాసేపు అంతా మౌనంగా ఉండిపోయారు. రివ్వుమని నీటిమీది గాలి వీచసాగింది – రాబోయే వర్షానికి సూచనగా. నల్లనిమేఘాలు కమ్ముకొచ్చాయి. మర్రిచెట్టు చిటారుకొమ్మలు, ఊడలు ఊగసాగాయి. భూమిలోంచి, కొండరాళ్ళలోంచి  వేడి, పైన రొజ్జగాలి. టపాటపా పెద్ద చినుకులు పడనారంభించాయి. చీకటవుతున్న ఆకాశాన్ని చీలుస్తూ మెరుపుతీగె వెలిగింది; దగ్గరలోనే ఎక్కడో పిడుగు పడింది; కొండలనడుమ ప్రతిధ్వనిస్తూ ఉరుము.

“మేమింక బయిల్దేరాలి…. వర్షాల్లో గోదావరి దాటడం కష్టం” అన్నాడు సాధువుల పెద్ద. సాధువులంతా లేచినిలబడ్డారు.

“దీపాంకరుడివెంట అతని శిష్యుడు ఒకడు ఉండాలే?” అతి కష్టం మీద అన్నాడు, భద్రపాలుడు.

“అవును. కళింగదేశంలో ప్రవేశించిన కొద్దిరోజులకే జ్వరంసోకి ప్రాణంవిడిచాడు. మా సాధువులిద్దరుకూడా పోయారు. అప్పటినుండి ఈయన ప్రవర్తన మరింత దిగజారింది”.

దీపాంకరుడిని తీసుకొచ్చి అప్పజెప్పినందుకుగాను కృతజ్ఞత తెలియపరచాలని భద్రపాలుడికి చాలా అనిపించింది కాని నోరుపెగల్లేదు. వర్షం పెద్దదయ్యేలాగా ఉంది, కాసేపు ఆగమందామా అనుకున్నాడు. ఏదోఒకటి అనేలోగా సాధువులు వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయారు. కొండదిగుతూ, చదునుగా ఉన్నచోటున ఆగి, మళ్ళీ తత్వం అందుకున్నారు; గుండ్రగా తిరుగుతూ, నవ్వుకుంటూ, తడిసిముద్దవుతూ, చప్పట్లుచరుస్తూ, తన్మయత్వంతో పాడుతున్నారు.

నీటిబొట్టువు, నీటిబొట్టువు

నింగినుండీ నేలరాలిన – నీటిబొట్టువు – నీటిబొట్టువు

ఒకటి రాలెను కొండమీదా

ఒకటి కురిసెను వాగులోనా  – నీటిబొట్టువు, ….

ఒకటి చేరెను రాజు ఇంటా

ఒకటి పోయెను పేద వెంటా – నీటిబొట్టువు, ….

ఒకటి మిగిలెను చేనులోనా

ఒకటి ఉన్నది అడవి నడుమా – నీటిబొట్టువు, ….

ఒకటి ఇంకీ నేలచేరెను

ఒకటి దప్పికతీర్చి పోయెను – నీటిబొట్టువు, …..

చెరువులోనా, నూతిలోనా

చేదలోనా, కుండలోనా  – నీటిబొట్టువు, …..

వాగులోనా, వరదలోనా

పొలంలోనా, పుట్టలోనా  – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు రాలిపడెనో?

ఏది ముందుగ ఆవిరగునో? – నీటిబొట్టువు,…

చివరికన్నీ గంగచేరును

కడలి కడుపున కలసిపోవును – నీటిబొట్టువు, ….

మేఘమందున మంచినీరే

కమండలమున మంచినీరే – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు ఎక్కడున్నది?

ఏది ఎప్పుడు ఎచటచేరును? – నీటిబొట్టువు, ….

ఎవరుముందో, ఎవరు వెనకో?

నీవు ఎవరో, నేను ఎవరో? – నీటిబొట్టువు, ….

అన్నిదిక్కుల ఉన్నదొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

చివరికదియే నిలిచి వెలుగును

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

విశ్వనాథుని రూపమొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె

దూరంగా కూర్చున్న దీపాంకరుడుకూడా పరధ్యానంగా వంతకలుపుతూ అదేతత్వం పాడుతున్నాడు. సర్వసంగ పరిత్యాగి, గొప్పజ్ఞాని అయిన  భద్రపాలుడి కనులవెంట ఏకధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కానీ అతని మొహంలో ఏ భావనాలేదు; అతని గంభీరదుఃఖానికీ, నిశ్శబ్దరోదనకూ కారణం ఇదీ అనిచెప్పడం కష్టం. దీపాంరుడు గురువుగారివంక కాస్తంత ఆశ్చర్యంగా చూసి, లేచివచ్చి పక్కనే కూర్చున్నాడు. వర్షం పెద్దదైంది. దీపాంకరుడి చెయ్యిపట్టుకొని నెమ్మదిగా లేచాడు భద్రపాలుడు. ఇద్దరూ గుహలోపలికి నడిచారు.

***


వర్షాకాలమంతాకూడా విహారంలోని భిక్షువులమధ్య ఒకేచర్చాంశం. శాశ్వతంగా నిలిచిపోతుందనుకున్న నాలందా మహావిహారంలో అంతటి ఘోరం ఎలాజరిగింది? ఎవరీ తురుష్కులు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి మరీ చంపారు? వాళ్ళకేంకావాలి? ఇంకా ఏంజరగబోతోంది? తన తరువాత వెయ్యిసంవత్సరాల్లో బౌద్ధం అది పుట్టిన గడ్డనుండి నిష్క్రమిస్తుందని తథాగతుడు స్వయంగా అన్నాడంటారు; అదే నిజమవుతోందా?   నాలందా మళ్ళీ ఎప్పటికైనా నిలదొక్కుకుంటుందా?…..ఇవే ప్రశ్నల్ని మళ్ళీమళ్ళీ వేసుకుంటూ అదేపనిగా చర్చించుకోవడమేగాని ఎవరికీ సమాధానాలు తట్టడంలేదు. సాధువులనోట భద్రపాలుడు విన్నసమాచారం తప్ప మరేవివరాలు తెలియలేదు. దీపాంకరుడు ఏమీ చెప్పడు. అతన్ని ప్రశ్నలతో వేధించవద్దని భద్రపాలుడి ఆదేశం. భిక్షువులకు ఎటూ తోచడంలేదు. వాళ్ళ గుండెలనిండా అపారమైన దిగులు.  ముఖ్యంగా భిక్షువుల మూకుమ్మడి హత్యల్ని, గ్రంధాలయాల్ని తగులబెట్టడాన్ని తట్టుకోలేకపోయారు.

దీపాంకరుడి పరిస్థితి మెరుగుకావడానికి చాలాకాలమే పట్టింది. భద్రపాలుడి వైద్యం, సాటి  భిక్షువుల శుశ్రూష అతన్ని కోలుకొనేలా చేశాయి. ఇప్పుడు స్వయంగా భిక్షాటనకు వెళ్తున్నాడు. అయినా చాలాతక్కువగా మాట్లాడుతాడు. నాలందాలో ఏమైందని ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు.  అతడూ ఆ విషయాలు ఎత్తుకోలేదు. భద్రపాలుడు అతడిచేత ముఖాముఖీ మాట్లాడించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ వర్షావాసం నిరాశ, నిస్పృహల నడుమ ముగియవచ్చింది.

అది అశ్వయుజ పౌర్ణమి. వర్షావాసపు అంతాన్ని సూచించే పవరన ఉపోసత (సంస్కృతంలో ప్రవరణ ఉపవాసథ) నాడు పాటించే పతిమోక్ఖా (సం. ప్రతిమోక్షా) దినం. వర్షావాస సహవాసంలో భిక్షువులు ఎప్పుడైనా త్రిపీటిక విధించే నియమాలను  అతిక్రమించినా, తోటిభిక్షువులపట్ల దురుసుగా, కరకుగా ప్రవర్తించినా బహిరంగంగా క్షమాపణ చెప్పుకొనే రోజు. ఆ కార్యక్రమం ముగిసిన మర్నాడే సమీపగ్రామాల ప్రజలు ఇక త్వరలోనే ప్రయాణం కట్టబోయే భిక్షువులకు వీడ్కోలుచెప్పడానికి విహారానికివస్తారు. చీవారాలను బహూకరిస్తారు; ఆశీర్వాదాలను కోరుకుంటారు.

ఆనాటి ప్రతిమోక్షాసమావేశానికి ఉదయాన్నే భిక్షువులందరూ ముందుగానేవచ్చి మహాస్తూపానికెదురుగా కూర్చున్నారు. భద్రపాలుడు లోనికివచ్చి అందర్నీ పరిశీలనగా చూశాడు. పట్టుమని పాతికమందికూడా లేరు. వర్షావాస ప్రతిమోక్షాదినాన ఇంతచిన్న భిక్షువులగుంపుని చూడడం అతనికిదే ప్రధమం. చివరివరుసలో దీపాంకరుడు కూర్చొని ఉన్నాడు. భిక్షువులందరిలాగే శిరోముండనం చేయించుకొని, కాషాయిరంగు చీవారాలను ధరించిఉన్నాడు. ముందువరసలోకి వచ్చికూర్చోమని భద్రపాలుడు అతనికి సైగచేశాడు. దీపాంకరుడి వద్దనుండి ఎలాంటి స్పందనా లేదు.  అతని వెర్రిచూపు పోయింది గాని, మౌనం అలాగే ఉంది.

భద్రపాలుడు పాళీ భాషలో త్రిపీటికానియమాలను పైకి బిగ్గరగా చదువుతున్నాడు. ఒక్కో నిత్తనీ (నిష్ఠనీ లేదా నియమాన్ని) పూర్తిగా వినిపింపజేశాక  –

“మీలో ఎవరైనా దీన్ని అతిక్రమించారా?” అని అడుగుతున్నాడు. ఎవరూ స్పందించకపోతే,

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఈ నిష్టని అతిక్రమించలేదని భావిస్తున్నాను” అని ప్రకటించి ముందుకి సాగుతున్నాడు.

నిష్టా నియమాల ప్రకటన పూర్తయింది. చివరి ప్రశ్నను సమావేశం ముందుంచాడు భద్రపాలుడు.

“ఎవరైనా, ఏ విషయంలోనైనా పశ్చాతాపం ప్రకటించదలుచుకున్నారా?”

భిక్షువుల నుండి మళ్ళీ నిశ్శబ్దం.

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఏ నియమాన్నీ అతిక్రమించలేదనీ, ఈ వర్షావాసంలో ఒకరిపట్ల ఒకరు దురుసుగాగాని,  కఠినంగాగాని వ్యవరించలేదని భావిస్తూ ఈ ప్రతిమోక్షాసమావేశాన్ని ముగిస్తున్నాను” అన్నాడు భద్రపాలుడు.

సరిగ్గా అప్పుడే దీపాంకరుడు ఏదో అన్నాడు. భద్రపాలుడికి వినిపించలేదు.

“ఏమంటున్నాడు?” అని దీపాంకరుడికి సమీపంగా కూర్చున్న భిక్షువులను అడిగాడు.

అంతటా కలవరం. భద్రపాలుడు చెయ్యపైకెత్తి సభికులను నిశ్శబ్దంగాఉండమని సౌంజ్ఞచేశాడు; సద్దుమణిగింది. దీపాంకరుని పక్కనే కూర్చున్న యువభిక్షువు అన్నాడు:

“నాలందాలో ఉండగా – పాళీభాషని బోధించే ఆచార్యుని మరణానికి తానే కారకుడినని అంటున్నాడు”

“ఎందుకని అలా అనుకుంటున్నావు? వివరంగా చెప్పు” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడు మాట్లాడ్డం మర్చిపోయిన వాడిలా నెమ్మదిగా, కూడబలుక్కుంటూ జవాబిచ్చాడు:

“ఆ సాయింత్రం……తురుష్కుల బృందం ఒకటి వెంటాడుతూంటే…..నడవలేకపోతున్న ఆచార్యులవారిని ఇక మొయ్యలేక…..ఒక చెట్టుకింద వదిలేశాం…..ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని ఏదోవిధంగాదాటి అవతలిఒడ్డున ఉన్నగ్రామంలో తలదాచుకున్నాం ఆ రాత్రికి…..  మర్నాడు ఉదయం, ధైర్యంచేసుకొని, గ్రామస్థులను వెంటబెట్టుకొని వెళ్లి చూస్తే ఆయన తలనరికేసి ఉంది…. ఏదోలా మాతోబాటు నదిదాటించి ఉంటే  బతికేవారు…..”

“మీలో ఎవరో కొందరు ఆయనకి తోడుగా ఉండవలసింది కదా?” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడి మాటల్లో వేగంపుంజుకుంది. “మేంకూడా అదేఅన్నాం, భాదంతా. ఆచార్యులవారు అంగీకరించలేదు.

‘మీరెంతమంది తోడున్నా వాళ్ళను నిలువరించలేరు. మనం సైనికులంకాము. మనవద్ద ఆయుధాలులేవు. నాఒక్కడికోసం మీరందరూ ప్రాణాలు వదులుకోవడంలో  అర్థంలేదు. మీరు ముందుకి వెళ్ళండి. నాకోసం ఆగవద్దు. ఇప్పటికే నా మూలంగా తొందరగా ముందుకి సాగలేకపోతున్నారు. మీరంతా చిన్నవాళ్ళు; మీరే రేప్పొద్దున్న బౌద్ధాన్ని కాపాడాలి. నాబోటి ముసలాడు పోయినా సంఘానికి జరిగే నష్టం ఏమీ లేదు. అంతా బాగుంటే మళ్ళీ కలుసుకుందాం… మీరు నాకోసం ఆగవద్దు. ఇది నా ఆదేశం’ అన్నారు”.

చాలాసేపు సభలో నిశ్శబ్దం. చివరికి భద్రపాలుడు ఇలా అన్నాడు:

“ఆచార్యులవారు అన్నదే సహేతుకంగా ఉన్నది. అటువంటి విపత్కర పరిస్థితుల్లోకూడా ఆయన తన తార్కికదృష్టిని మరలించక, తనప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం మానుకొని మిమ్మల్ని బతికించాడు. బౌద్ధానికి సేవచెయ్యమని కోరుకున్నాడు. ఈ విధంగా అతను బౌద్ధధర్మాన్ని నిలబెట్టాడు. తథాగతుని మార్గాన్ని అనుసరించాడు”.

“అదే….అదే మోయలేని భారం. ఏం చెయ్యాలి? ఏమీ తోచడం లేదు భాదంతా”.

“అంటే?”

“అటువంటి ఉత్తముడైన ఆచార్యుడి త్యాగానికి అర్హునిగా నిలవాలంటే నేనేం చెయ్యాలి? ఆయన దయవల్లనే ఈరోజున జీవించి ఉన్నాను. ఇకమీదట నా జీవితపరమార్థం ఏమిటి? అదే తెలియడంలేదు”

మొదటిసారిగా దీపాంకరుడి వ్యధ భద్రపాలుడికి పూర్తిగా అవగతమైంది.

“రేపటి ప్రత్యేక సమావేశంలో ఈ విషయం చర్చిద్దాం. ప్రస్తుతానికి ఈ సమావేశాన్ని ముగిద్దాం” అన్నాడు. దీపాంకరుడు నాలందా విషయమై నోరువిప్పినందుకు భద్రపాలుడి మనసు రవ్వంత తేలికపడింది.

***

బౌద్ధానికి పెద్దపీటవేసిన మహానుభావులు దేవానాంప్రియఅశోకుడూ లేడు; కనిష్కచక్రవర్తీ లేడు; హర్షవర్ధనుడూ లేడు. ముందుముందు అటువంటి అనుకూలురైన సామ్రాజ్యాధిపతులు అధికారంలోకివచ్చే సూచనలూ లేవు. ప్రజల్లోకూడా బౌద్ధానికి ఆదరణ అంతంతమాత్రంగానే ఉన్నది. పాలకులు, పండితుల దగ్గరనుండి సామాన్యప్రజలదాకా ప్రతి ఒక్కరూ శైవ, వైష్ణవ శత్రుశిబిరాలుగా చీలిపోయి, వీధినపడి కొట్లాడుకుంటున్నారు. ఆపైన కొత్తగా ఈ తురుష్కుల దాడి; నాలందా విధ్వంసం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడుకోవడమెలా? ఇదీ ప్రత్యేకసమావేశపు ప్రధానచర్చాంశం. భద్రపాలుడితోబాటు మరో ఆరుగురు అనుభవజ్ఞులైన భిక్షువులతోకూడిన సమావేశం. వాళ్ళల్లో దీపాంకరుడు కూడా ఉన్నాడు.

నిజానికి ఇప్పుడంటే నాలందా ఒక అంశంగా చర్చలో చోటుచేసుకున్నదిగాని, ధర్మాన్ని ఎలాకాపాడుకోవాలి? ఎలా విస్తరింపజెయ్యాలి? అనేప్రశ్నలు ప్రతీసారీ ప్రత్యేకసమావేశాల్లో చర్చకువచ్చేవే. అయితే ఇంతకుముందెన్నడూలేని విధంగా – నిస్పృహతోకూడిన ఆందోళన, ఏదోఒకటి తొందరగా అమలుచెయ్యాలనే ఆదుర్దా, ఏం చెయ్యాలో తెలీని సందిగ్ధత – ఇవన్నీ ఆనాటి సమావేశంలో వ్యక్తమయ్యాయి.

రాజులూ, మహారాజులూ బౌద్ధానికి అనుకూలురుగా మారితేతప్ప గతవైభవాన్ని పునరుద్ధరించడం అసాధ్యం అనే వాదనే నేడుకూడా ప్రధానంగా వినిపించింది. అది ఎలాసాధ్యం అనేప్రశ్నకు మాత్రం అందరికీ అంగీకారమైన సమాధానం లభించలేదు. కాకతీయరాజైన ప్రతాపరుద్రుడు జైనమతాన్ని పాటించి, పోషిస్తున్నాడు. అటు కన్నడదేశంలోకూడా ఒకమేరకు జైనానికి ప్రజల్లోనూ, పాలకుల్లోనూకూడా ఆదరణఉన్నది. మరి బౌద్ధం విషయానికి వస్తే ఆమాత్రపు ఆదరణకూడా దుర్లభంగా ఉన్నది…..ఇలా నడిచింది చర్చ. చాలాసేపు మౌనంగా వింటూవచ్చిన దీపాంకరుడు గొంతుసవరించుకున్నాడు. అందరూ అతనికేసితిరిగారు – ఏం చెప్పబోతున్నాడా అని.

“నేను సాధువులతో బాటుగా తిరుగుప్రయాణంచేస్తూ గమనించాను. మొదట గాంగుల రాజైన అనంతవర్మ చోడగాంగు, ఆతరువాత ఓడ్ర రాజైన అనంగ భీమదేవుడు పూరీలో జగన్నాథస్వామి దేవాలయాన్ని నిర్మించి దానికొక ప్రాధాన్యతని కల్పించారు. అయితే జగన్నాథుడిమూలరూపం, మారుమూల ప్రాంతంలో కొండవాళ్ళు కొలుచుకొనే దేవతది. అలాగే మిగతాచోట్లకూడా కొత్తగా సామ్రాజ్యాలను స్థాపిస్తూన్న రాజులు స్థానికదేవుళ్లకు, కులదేవతలకు పెద్దపెద్ద దేవాలయాలు నిర్మించి ప్రాముఖ్యత ఏర్పరుస్తున్నారు. ఆయా దేవుళ్ళని స్వంతం చేసుకుంటున్నారు. వాళ్ళే తమ రాజవంశాలని కాపాడుతారని  నమ్ముతున్నారు, నమ్మిస్తున్నారు. అంతేగాని బౌద్ధం వైపు దృష్టిసారించడం లేదు”.

దీపాంకరుడు చర్చలో పాల్గొంటున్నందుకు సంతోషిస్తూ భద్రపాలుడు అడిగాడు:

“అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి?”

“రాజులూ, రాజ్యాలూ శాశ్వతంగా ఉండిపోవు. మన దృష్టిని రాజ్యాధిపతులపైన కాకుండా సామాన్యప్రజలపైనే పెట్టాలి. సమాజపుకిందిపొరలను బౌద్ధధర్మంవైపు ఆకర్షితులను చెయ్యాలి. పైగా బౌద్ధంఅనేది, జ్ఞానమార్గంలో పయనించే తార్కికులకు, మేధావులకు, పండితులకు పరిమితమైన ధర్మమేగాని, సామాన్యులకు అందుబాటులో ఉండదనే భావన ఒకటి ప్రచారంలో ఉన్నది. ఒకవైపు తాత్విక అన్వేషణలను కొనసాగిస్తూనే మరోవైపు సామాన్యప్రజానీకాన్ని హేతుబద్ధమైన ధర్మపథంవైపు నడిపించాలి. ఇదే మనం చెయ్యవలసిన, చెయ్యగలిగిన ప్రయత్నం. ఫలితాలు మనకు ఇవాళ కనిపించకపోవచ్చు. ఎప్పుడో ఒకరోజున పామరులనుకొనేవాళ్ళే పెద్దసంఖ్యలో బౌద్ధధర్మపు విశిష్టతని గుర్తిస్తారు. అప్పుడే బౌద్ధం నిలబడుతుంది. అది ఎప్పుడు, ఎలా జరుగుతుందని అడిగితే నా వద్ద సమాధానంలేదు”.

“బాగాచెప్పావు. అజ్ఞానపుటంధకారాన్ని శాశ్వతంగా దూరంచేసేది బౌద్ధధర్మమే. ఇవాళ్టి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండవచ్చు. రాజపోషకుల ప్రాపకంకోసం దేబిరించడం మానుకొని ప్రజానీకాన్ని ధర్మపథంవైపు నడిపించే ప్రయత్నాలు కొనసాగించాలి. నాలందాలో పోగొట్టుకున్నగ్రంధాలని తిరిగిసేకరించాలి. ఇవేమనపై కాలం విధించిన కర్తవ్యాలు. దీపాంకరుడి ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నాను”. అన్నాడు భద్రపాలుడు. పెద్దలందరూకూడా తమ ఆమోదం తెలియజేసారు. ఆనాటి ప్రత్యేక సమావేశం ముగిసింది.

ఒక చర్చాంశంమాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. అరబ్బులూ, పారశీకుల్లాగే తురుష్కులు ఆచరించే ధర్మంకూడా మహమ్మదీయమేఅని అందరికీ తెలుసు. అరబ్బు, పారశీకదేశాల ఓడవర్తకుల రాకపోకలు, వారితో లావాదేవీలు అప్రాంతాల్లో అనాదిగా జరుగుతూనేవస్తూన్నవి. వాళ్లెప్పుడూకూడా ఈ తురుష్కుల్లా ప్రవర్తించిందిలేదు.  “ఎవరీ క్రూర మహమ్మదీయులు? నాలందాపైన ఎందుకు దాడిచేశారు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి చంపారు?” అన్న ప్రశ్నలకు మాత్రం ఆనాడు సమాధానం లభించలేదు.

***

కొండల్లో చిన్నగా చలి మొదలైంది; ఉదయాన్నా, సాయింత్రంపూటా విహారాన్ని పొగమంచు ఆవహిస్తున్నది; ఇండ్ల పైకప్పులనుండి నీలిరంగు పొగ కానవస్తున్నది. భద్రపాలుడూ, మరోఇద్దరు వృద్ధభిక్షువులూ, ఇద్దరు అంతేవాసులూ విహారంలో మిగిలారు. మిగతావాళ్ళంతా దేశాటనకు వెళ్ళిపోయారు. విహారనిర్వహణాబాధ్యత పూర్తిగా దీపాంకరుడిపైనే పడింది.  చీకటితోనేలేచి పంపానదీ తీరానికిపోయి స్నానంచేసి, నీళ్ళు పైకిమోసుకురావడం, విహారాన్నిఊడ్చి శుభ్రంచెయ్యడం,  భిక్షాటనకు పోయిరావడం వీటితో మొదలుపెట్టి అధ్యయనం, చర్చలు నిర్వహించడం, స్థానికులకు ఉపదేశాలు ఏర్పాటుచెయ్యడం వరకూ అన్నీ అతడే చేస్తున్నాడు.

రోజులు గడిచిపోతున్నాయి. అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ముఖ్యంగా నాలందాలో రెండేళ్ళపాటు అత్యుత్సాహంగా గడిపినదినాలు పదేపదే గుర్తుకొస్తున్నాయి.  ఆ రెండేళ్ళలోనే ఎంతమందితో సావాసం చేశాడు? ఎన్నెన్ని విషయాలు నేర్చుకున్నాడు? అతనిప్పుడు ద్వైత, అద్వైత సిద్ధాంతాల గురించి, వాటి మధ్యగల తేడాలగురించి వివరణ ఇవ్వగలడు; నాగార్జునిబోధనలకు, ఆదిశంకరాచార్యుని ప్రవచనాలకు మధ్యగల సారూప్యాల్ని, అంతరాన్ని విశ్లేషించి చర్చించగలడు. పాళీగ్రంధాలను సునాయాసంగా పఠించి భాష్యం చెప్పగలడు. అయితే కొత్తగా ప్రోదిపడిన ఈ జ్ఞానభండారం విహారానికి తిరిగివచ్చాక అతనికి అక్కరకు రాలేదు – భద్రపాలునితో జరిపిన ఒకటీఅరా సంభాషణలను మినహాయిస్తే. అతనికి జ్ఞానాన్వేషణకు నూతనద్వారాలను తెరిచి, అనేక విషయాలపట్ల కనువిప్పు కలిగించిన ఆ మహత్తరమైనకాలం ఆకస్మికంగా అంతంకావడం, మళ్ళీ ఇక్కడికి చేరుకోవడం అతనికి ఒక వైఫల్యంలాగా, ఎదురుదెబ్బలాగా  అనిపించసాగాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అతని అసంతృప్తి మరింత తీవ్రం అవుతోందితప్ప మారినపరిస్థితుల్ని ఆమోదించగల సంయమనం ఏర్పడడం లేదు.

అసంతృప్తితో అల్లాడడం బౌద్ధభిక్షువైన తనకుతగదని దీపాంకరుడికి తెలుసు. గురువుగారైన భద్రపాలుడితో చర్చిద్దామనుకుంటూనే అలక్ష్యం చేస్తూవస్తున్నాడు. అందుకు కారణం ఒకటే. తన సమస్యని వివరించగలడుగానీ పరిష్కారం చర్చించేందుకు అతనివద్ద ఏ ఆలోచనాలేదు. అటువంటప్పుడు వయోభారంతోబాటుగా నాలందా విధ్వంసంకారణంగా కుంగిపోతున్న భద్రపాలుడిని వేధించడం ఇష్టంలేక ఊరుకున్నాడు.

చలికాలం కూడా అలాగే గడిచిపోయింది. వసంతఋతువు సమీపించింది. మామిడిపువ్వు వాసన, కోయిలల పలకరింపులు లోయల్ని ఆవరించాయి. అదేకాలంలో దీపాంకరుడికి ఊహించనివిధంగా ఒకఆధారం దొరికింది; అంధకారంలో ఆశాకిరణం వికసించింది. నాలందాలో బయల్దేరి ఉజ్జయని, ధాన్యకటకం (అమరావతి) మీదుగా ప్రయాణించి కళింగపట్నంరేవుకి వెళ్తూన్న ఇద్దరు సింహళభిక్షువుల ఆగమనంతో అతనిలో ఉత్సాహం పెల్లుబికింది. వారిలో పెద్దవాడు ఆచార్య శాంతిదేవుడు రెండోది అతని శిష్యుడైన గుణసేనుడు. వాళ్ళిద్దరూ సింహళద్వీపంలోని పొలోన్నరువ నగరమందున్న ఉత్తరారామం (గల్ విహార) నుండి వచ్చారు. ఇంకో విశేషమేమంటే వాళ్ళిద్దరూకూడా నాలందాలో దీపాంకరుడి సహాధ్యాయులే; బాగా పరిచయస్థులుకూడా. కళింగపట్నం మీదుగా తిరిగి తమదేశానికి పోదల్చుకున్న  ఆ భిక్షువులిద్దరినీ కొన్నాళ్లపాటు విహారంలో గడపమని దీపాంకరుడేకాక భద్రపాలుడుకూడా అభ్యర్ధించాడు. వారిసాంగత్యంమూలంగా దీపాంకరుడిలో వెల్లివిరుస్తున్న ఉత్సాహాన్ని గమనించిన భద్రపాలుడు వారిమజిలీ మరికొన్నాళ్ళు కొనసాగాలని కోరుకున్నాడు. అందుకు ఆ భిక్షువులు సంతోషంగా అంగీకరించారు.

వారితో పాళీ, సంస్కృత భాషల్లో జరిపిన సంభాషణల్లో నాలందావిధ్వంసం గురించి మరికొన్నివివరాలు తెలిసాయి. మూడు ప్రధాన గ్రంధాలయాలు తగులబెట్టబడినమాట వాస్తవమే. వందలకొద్దీ భిక్షువులను వధించడంకూడా నిజమే.  మరో దారుణం ఏమిటంటే – ఉద్దానపుర, విక్రమశిల, జగద్దల, సోమపుర మహావిహారాలపైనకూడా తురుష్కులు దాడులుచేసి సర్వనాశనం చేశారనే దుర్వార్త తెలియవచ్చింది.  ఇద్దరుసింహళ భిక్షువులలోనూ పెద్దవాడూ, ఎల్లప్పుడూ గంభీరంగాఉండే ఆచార్యుడూ అయిన శాంతిదేవుడు ఇలా అన్నాడు:

“విహారాలపైనా, దేవాలయాలపైనా దాడులుచేసి, అందినదంతా దోచుకోడంతో సరిపుచ్చుకొనే వారుకాదు ఈ తురుష్కులు. వీళ్ళకు ప్రభువైన మహమ్మద్ గోరీ అనే తురుష్కుడు తనకు సంతానంలేకపోవడంతో అతడు జయించిన రాజ్యాలను తన బానిసలకు అప్పగించాడు. ఉత్తరదేశం యావత్తూ ఇప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. నాలందా, తదితర విహారాలనూ, దేవాలయాలనూ ధ్వంసం చేసిందీ, కొల్లగొట్టిందీ అటువంటి బానిస సుల్తాన్లలో ఒకడైన బఖ్తియార్ ఖిల్జీ అనేవాడు. అందుచేత ఈ తురుష్కులు అక్రమించుకోవడానికీ, శాశ్వతంగా ఇక్కడేఉండి పరిపాలించడానికీ వచ్చారు తప్ప పూర్వం రోజుల్లోలా దాడులుచేసి, దోచుకొని పారిపోవడానికి కాదు. ఉత్తరభారతంలో వీరి ఆధిపత్యం స్థిరపడ్డాక దాడులు, ఆక్రమణలు దక్షిణదేశానికి కూడా విస్తరించకపోవు”.

శ్రద్ధగా వింటూన్న భద్రపాలుడు, దీపాంకరుడు హుతాశులైయ్యారు. భద్రపాలుడు నెమ్మదిగా అన్నాడు: “అయితే తథాగతుని గడ్డమీద బౌద్ధం నిలదొక్కుకొనే ఆశ ఇప్పట్లో ఇకలేనట్టే”.

శాంతిదేవుడు మౌనంగా ఉండిపోయాడు. దీపాంకరుడికి ఒకఆలోచన తోచింది.

“పోనీ ఈ తురుష్కుల్నే బౌద్ధానికి సానుభూతిపరులుగా మార్చగలిగితే…..?” అన్నాడు.

విషాదవదనుడైన శాంతిదేవుడు అన్నాడు, “అది అసాధ్యం. వాళ్లకు అర్థమయ్యేభాష సంగ్రామఘోష మాత్రమే; వాళ్ళకు తెలిసిందల్లా ఆయుధాలు, రణరంగం, దోపిడీ, ఊచకోత. అంతటి తథాగతుడుకూడా ఒకేఒక్క అంగుళీమాలుడిని సంస్కరించగలిగాడు. తురుష్కులదాకా ఎందుకు? కోసలరాజైన విరూధకుడు శాక్య గణరాజ్యాన్ని నాశనంచేసి, మొత్తం తథాగతుడి వంశీకులందర్నీ ఏనుగులతో కుమ్మించి మట్టుపెట్టినప్పుడు అతడు ఆ దుర్వార్తవిని మౌనంగా ఉండిపోయాడుతప్ప ఏమీ చెయ్యలేకపోయాడని మనకు తెలుసు”.

దీపాంకరుడు ఉండబట్టలేక, “తథాగతునికి తెలుసు; ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది” అనేశాడు, అస్వభావికమైన ఆవేశంతో.

శాంతిదేవుడు పరమశాంతంగా – “అవును. ఎప్పటికైనా….. ఇప్పుడు మాత్రం కాదు” అన్నాడు.

భద్రపాలుడు జోక్యంచేసుకున్నాడు. “ఇప్పుడు మనబోటి వాళ్ళం ఏంచేయాలి? దీనిమీద మొన్నటి ప్రతిమోక్షాసమావేశంలో పెద్దచర్చే జరిగింది. కాలచక్రదీక్ష పాటించి బౌద్ధులందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సరైన సమయంకోసం ఎదురుచూడాలా? ఎన్ని తరాలని ఎదురుచూస్తాం? అంతవరకూ మన ధర్మాన్ని, సంఘాన్ని, గ్రంధాలని, విహారాలనీ ఎవరు కాపాడుతారు? బోధనలని ఎవరు కొనసాగిస్తారు? దీపాంకరుడు మొన్న ఒక ప్రతిపాదన చేశాడు – రాజుల్నీ, చక్రవర్తుల్నీ సంస్కరించే ప్రయత్నం మానుకొని సామాన్యప్రజలమీదే దృష్టిపెట్టాలనీ, వాళ్ళే రేప్పొద్దున్న బౌద్ధాన్నినిలబెట్టగలరనన్నీ. ఇవాళ్టిచర్చ తరవాత దీపాంకరుడు చెప్పింది చాలా సబబుగా ఉందని మరీమరీ అనిపిస్తోంది. కానీ అది ఎలా సాధ్యం అనేదే ప్రశ్న”.

“నేనొక సూచన చేయదలచాను, భాదంతే” అన్నాడు శాంతిదేవుడు భద్రపాలుడిని ఉద్దేశించి.

“చెప్పండి, ఆచార్యా”

“దీపాంకరుడు మంచి ఆలోచన చేశాడు. అతని శ్రద్ధాసక్తుల్ని, నియమనిష్టల్ని నాలందాలో ఉండగానే – నేనేకాదు – చాలామంది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో బౌద్ధాన్నికాపాడి నిలబెట్టగలిగినవాళ్ళల్లో దీపాంకరుడు ఒకడు. అతను కోరుకుంటూన్నట్టుగా సామాన్యప్రజానీకపు నిత్యజీవనంలో బౌద్ధంఅనేది మీప్రాంతాల్లో ఎప్పుడూ ఒక భాగంగా లేదు. అదే మాదేశంలో అయితే బౌద్ధధర్మమే సర్వవ్యాపితంగా ప్రకాశిస్తున్నది; తరతరాలుగా మా ప్రజల దైనందిన జీవనంలో విడదీయలేని భాగంగా పెనవేసుకుపోయింది. దీపాంకరుడుగనక మాదేశం వస్తే అతను కలలుకంటూన్న భవిష్యత్తుని కళ్ళారాచూడగలడు. అంతేకాదు, మీరిక్కడ అనుసరిస్తూన్న థేరవాదబౌద్ధానికి మాదేశంలో రాజవంశపోషణ, సమర్థన ఉన్నాయి. అందుచేత నేను కోరేదేమంటే దీపాంకరుడిని మాతోబాటు పొలోన్నరువలోని ఉత్తరారామానికి పంపించండి. అక్కడ రెండు, మూడేళ్ళు ఉన్నట్టయితే అక్కడి పద్ధతులను, ఆచరణను స్వయంగా పరిశీలిస్తాడు; తెలుసుకుంటాడు. అంతేకాదు, నాలందాలో మధ్యలో ఆగిపోయిన అధ్యయనాన్ని కొనసాగిస్తూనే మావిహారంలో అధ్యాపకునిగా పనిచేస్తాడు. నాలందాస్థాయిలో సింహళదేశంలోకూడా ఒక బోధనాకేంద్రాన్ని నిర్మించాలనేది మా ప్రభువుల ఆశయం. నన్ను నాలందా పంపిందికూడా అక్కడి పద్ధతులను అధ్యయనం చేయడానికే. ఇప్పుడది ధ్వంసం అయిపోయింది గనక మరింత శ్రద్ధగా, పట్టుదలగా, త్వరితగతిన అటువంటి కేంద్రాల్ని నిర్మించుకోవాలి”.

ఆచార్యశాంతిదేవుని సూచనపై చాలాసేపే చర్చజరిగింది. భద్రపాలుడు కొంత అయిష్టంగానూ, దీపాంకరుడు చాలా ఉత్సాహంగానూ ఆసూచనకు అంగీకరించారు. దీపాంకరుడిని వెంటబెట్టుకొని ఇద్దరుసింహళభిక్షువులూ కళింగపట్నం సమీపంలోని శాలివాటిక విహారంలో కొన్నాళ్లపాటు బసచెయ్యడానికీ, సింహళదేశానికి బయలుదేరే మొట్టమొదటి ఓడనుఎక్కి సముద్రప్రయాణం చెయ్యడానికీ నిర్ణయం తీసుకున్నారు.

 

(రెండో భాగం -వచ్చే వారం )

—ఉణుదుర్తి సుధాకర్

 

 రంగు రెక్కల వర్ణ పిశాచం

 

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

 

మీరెప్పుడైనా పిశాచాన్ని చూశారా…?

భయపడకండి… !!

పిశాచమంటే తెల్లని చీర అందంగా  కట్టుకొని….తెలుగు సినిమా పాటలు పాడే పిశాచం కాదు. కనపడకుండానే జనాన్ని మింగే పిశాచం. రంగు రంగుల పిశాచం. రక్త వర్ణ పిశాచం. ఈ పిశాచం గురించి మొదట నాకూ తెలీదు. నా చుట్టూ ఆవహించి ఉన్నా.. నేను గుర్తించని పిశాచాన్ని ఫకీర్ కనిపెట్టి నాకు చూపించాడు. మీకూ చూపిస్తాను.
***
ఆరోజు నాకు బాగా గుర్తు…..
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం”  ఎవరో మంత్రాలు జపిస్తున్నారు. మేడ మీద పడుకొన్న నేను మెల్లగా కళ్లు తెరిచి ఆకాశం వైపు చూశాను.

రైతు పొద్దంతా దున్ని చదును చేసిన దుక్కిలా ఆకాశం ఎర్రమన్ను పూసుకుంది. లోకమంతా మోదుగుపూల వనంలా మెరుస్తోంది. తొలి పొద్దు చూసేందుకే  నేను రోజూ డాబాపైన పడుకుంటాను. ఆ పొడిచే పొద్దులా నేనూ కొత్తగా పుడతాను.
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం…” అంటూ పక్కనే మా తమ్ముని
కూతురు  లావుగా ఉన్న పుస్తకంలో చూసి ఏవో మంత్రాలు బట్టీ పడుతోంది.
” ఏం పాఠం రా తల్లీ అదీ. నేనెప్పుడూ విన్నట్లు లేదు” ఆరా తీశాను.

“మా స్కూల్లో ఈ పుస్తకంలోని మంత్రాలు కంఠస్తం చేసే పోటీలు పెడుతున్నారు పెదనాన్న….. గెలిచిన వాళ్లను హైదరాబాద్ కు తీసుకుపోతారట. అక్కడ కూడా గెలిస్తే ఢిల్లీకి తీసుకుపోతారట. అందుకే పొద్దున్నే లేచి బట్టీపడుతున్నా.” ఆశగా చెబుతోంది.
“స్కూల్లో పాఠాలు చెప్పకుండా ఇప్పుడు మంత్రాలు చెబుతున్నారా…?” అనుకుంటూ మెట్లు దిగి కిందికొచ్చాను.
” అన్నా సర్పంచ్ ఫోన్ చేసిండు పంచాయతీ ఆఫీసు దగ్గర గొడవ అవుతోందట..”
అంటూ తమ్ముడు ఫోన్ ఇచ్చాడు. “వస్తున్నా” అని ఫోన్ పెట్టేసిన.
మాది చాలా మారుమూల  గ్రామం. చుట్టు పట్టు పెద్ద ఊర్లు కూడా లేకపోవడంతో మండల కేంద్రం చేశారు. మా తాతల కాలం నుంచి ఊళ్లో మా కుటుంబానిదే పెత్తనం. మా నాయిన పోయిన కాన్నుంచి ఇంటితో పాటూ ఊరి బాధ్యత నా మీద పడింది. నానా కులాలు, మతాలు ఉన్నా అంతా కలిసి మెలిసి బతుకుతున్నాం.గబగబ ముఖం కడుక్కోని పంచాయతీ ఆఫీసు దగ్గరకు వచ్చిన. అక్కడ జనం గుంపులు గుంపులుగా ఉన్నరు.
“మా గుడి దగ్గర మీ పుస్తకాలు పంచుడేంది?…నాలుగు తన్నండి..బుద్ధి వస్తుంది.” అంటూ జనం గోలగోలగా అరుస్తున్నారు.
సర్పంచ్ తో పాటూ ఐదారుమంది ఊరి పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు. సర్పంచ్ నన్ను చూడంగనే “నమస్తే అన్నా” అంటూ ఎదురొచ్చాడు.

అక్కడున్న వేప చెట్టుకు ఇద్దరు ఆడమనుషుల్ని తాళ్లతో కట్టేశారు. ఇరవై ఏళ్లలోపు అమ్మాయి, ఇంకో నడి వయసు ఆడామె. కొందరు ఆడోళ్లు వాళ్ల జుట్టుపట్టి లాగుతున్నారు. పిడిగుద్దులు గుద్దుతున్నరు. బెదిరిపోయిన వాళ్లిద్దరూ “కొట్టొద్దు” అని దండం పెడుతున్నారు.

మాఊళ్లో ఏటా జాతర జరుగుతుంది. కానీ ఇట్లాంటి గొడవ ఎప్పుడూ  కాలే.

‘మాకేం తెలవదు నాయనా..నీ కాళ్లు మొక్కుతా.  రోజు ఐదొందలు కూలీ ఇస్తమంటే ఈ పుస్తకాలు పంచుతున్నం. ఇది నా బిడ్డ. కాలేజీల చదువుతున్నది. పొట్ట తిప్పలకు చేస్తున్నం తప్పితే ఇయ్యేం పుస్తకాలో, ఏందో మాకు తెల్వదు” ఏడుస్తోంది  పెద్దామె.
“వీళ్లను ఏం చేద్దాం…? కేసు పెట్టమంటరా..?” ఎస్సై అడిగిండు .

వాళ్లను చూస్తేనే అర్థమైతోంది. వాళ్లేదో బతుకుతెరువుకోసం చేస్తున్నరని. వాళ్లమీద ఏమని కేసు పెడతాం..!? వద్దని చెప్పిన.

” ఏమ్మా బతకటానికి ఇదే పని చేయాలా. మీ మతం పుస్తకాలు ఇంకెక్కడైనా పంచుకోండి. ఇలాంటి జాతరలు, గుళ్ల దగ్గర కాదు. చదువుకునే బిడ్డ భవిష్యత్తు నాశనం కావొద్దని వదిలేస్తున్నం..పో” అని పంపిచాను.
ఎవని బతుకు వాడు బతకొచ్చు కదా..? ఒకరి గుడి దగ్గరకు వేరేవాళ్లు వచ్చుడెందుకు..? ఈ పుస్తకాలు పంచుడెందుకు.?
ఇప్పుడు చెప్పండి. మీకు పిశాచం కనిపించిందా..? రంగు రంగుల పిశాచం కనిపించిందా..? లేదా…?
మనకు తెలీకుండానే మనల్ని ఆవహిస్తున్న పిశాచం…రంగు రంగుల పిశాచం….రక్త వర్ణ పిశాచం. నాకు ఫకీర్ చూపించాడు. అవునూ,  ఫకీర్ ఎవరో మీకు తెలీదు కదా…?
ఫకీర్ ది మావూరు కాదు. ఎక్కడో చైనా-కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న ఊరు. అక్కన్నుంచి శాలువాలు, చద్దర్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతరు. హైదరాబాద్ దాకా సరుకు రైలులో తీసుకొచ్చి, అక్కడ ఓ గది కిరాయి తీసుకుని గోడౌన్ లాగా పెట్టుకుంటరు.

హైదరాబాద్ లో కొంతమంది పుట్ పాత్ మీద అమ్మితే… ఇంకొందరు ఊర్లు తిరిగి అమ్ముతరు. ఫకీర్ మా సరుకుతో మా ఊరుకు వచ్చి  మా ఇంట్లోనే సరుకు దింపుతడు.
***
అప్పుడు నాకు పదేళ్లు. బజారులో పాటలు వినిపిస్తుంటే పిల్లలతో పాటే నేను కూడా పరిగెత్తాను. ఏదో సినిమా ప్రచారం చేసే రిక్షా అనుకున్నాను. కానీ అది దుప్పట్లు, శాలువలు అమ్మే బండి. ఆ బండి మీద ఓ ముసలాయన, నా ఈడు పిలగాడు ఉన్నారు. ఆ చప్పుడుకు చాలా మంది బండి చుట్టూ మూగారు.

రంగు రంగుల రగ్గులు.

వాటి మీద అందమైన బొమ్మలు –

ఆ చద్దర్లు, శాలువలు ఆరుద్ర పురుగుల్లా… అందంగా, మెత్తగా ఉన్నాయి. అంత సుతి మెత్తని చెద్దర్లు నేనెప్పుడూ చూడలేదు. పట్టుకుంటేనే జారిపోతాయేమో అనిపిస్తూ…. పసిపాపల్లా ఉన్న వాటిని వొకసారి పట్టుకుంటే వదల్లేము.

మా బజారోళ్లు చాలా మంది వాటిని తీసుకు పోయారు కానీ మళ్లీ వెనక్కు రాలేదు.
రెండు రగ్గులు తీసుకున్న వాళ్లు ఒక్క రగ్గుకే డబ్బులు తెచ్చారు. ఇక్కడి భాష తెలీని వాళ్లు కావడంతో మోసం చేద్దాం అనుకున్నరు.
“యా అల్లా… ఇంత దోఖా చేస్తరా.? ఎక్కడో కాశ్మీర్ నుంచి బతికేటందుకు వచ్చినం. మాది పొట్టకొట్టొద్దు.” అంటూ పెద్దాయన బతిమాలుకుంటున్నాడు.  ఈ గొడవకు  పెద్దాయనతో ఉన్న పిల్లగాడు గట్టిగా ఏడుస్తున్నాడు.
ఇంతలో ఊరి పెద్ద మా నాయనకు సంగతి తెలిసి అక్కడకి వచ్చిండు.
జరిగిదంతా చెప్పి ఆ పెద్దాయన భోరుమన్నాడు.

మా నాయన అక్కడున్నవాళ్లని గద్దించాడు. “ఏదో పొట్టతిప్పలకోసం  దూరదేశం నుంచి వచ్చిన మనిషిని మోసం చేస్తారా..? మర్యాదగా డబ్బులు ఇచ్చారా సరే. లేదా పోలీసుల్ని పిలుస్తాను” అనడంతో జనం భయపడి డబ్బులిచ్చారు.
డబ్బులన్నీ లెక్క సరిపోయాక వాళ్లని మా ఇంటికి తీసుకొచ్చాడు నాయన.  అమ్మతో చెప్పి అన్నం పెట్టించాడు. “మీకేం భయం లేదు. మీరు ఎప్పడైనా ఇటువైపు వస్తే మా ఇంట్లోనే ఉండండి .” అని  భరోసా ఇచ్చాడు.
‘నా పేరు సులేమాన్’…నా కొడుకు పేరు ఫకీర్’ అంటూ వాళ్ల వివరాలు చెప్పాడు పెద్దాయన.
ఫకీర్ తల్లి …అతని చిన్న వయసులోనే చనిపోయిందట. అప్పటినుంచీ తనతోనే వ్యాపారానికి తీసుకొస్తున్నాడట.
మరి పిల్లవాన్ని చదివించరా అంటే…” ఎంత చదివినా ఏదో ఓ పని చేయాల్సిందే కదా సాబ్..అందుకే  వ్యాపారం ఎలా చేయాలో నేర్పుతున్నాను” అన్నాడు సులేమాన్.
ఫకీర్ దీ,  నాదీ ఒకటే ఈడు కావడంతో  మంచి జంటగాల్లమయ్యాం. ఫకీర్ మెల్లగా తెలుగు నేర్చుకున్నాడు. ఫకీర్ బడికి
పోకున్నా లెక్కలు బాగా చేసేవాడు. మా నాయన కూడా ఫకీర్ తెలివికి ఆశ్చర్యపోయేవాడు. ఫకీర్ ఒక్కో సారి నాతో స్కూలుకు వచ్చేవాడు.

మా స్కూల్లో అప్పుడు ఉర్దూ మీడియం  ఉండేది. ఫకీర్ ఉర్దూ రాత  చూసి పంతుళ్లు మెచ్చుకునే వారు. ముఖ్యంగా అతడు పాడే పాటలంటే మా సార్లకి చాలా ఇష్టం.

ఫకీర్ ఎప్పుడో ఓ సారి మా స్కూలుకు వస్తే  పిల్లలకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మధ్యాహ్నం ఫకీర్ పాటలు వినిపించేందుకు పిల్లలందరినీ ఒకదగ్గర కూర్చోపెట్టేవారు. పాఠాలు వినే బాధ తప్పినందుకు పిల్లలు సంతోషించేవారు.
” దునియాకే ఏ ముసాఫిర్…..మంజిల్ తేరీ కబర్ హై….” ఫకీర్ గొంతెత్తి పాడితే పిల్లలంతా పక్షుల్లాగా ఆలకించేవారు. అర్ధం తెలీకున్నా పిల్లలంతా ఆ పాటలు పాడుకునే వారు.

పాట భావం తెలియకున్నా…ఏదో భావన ఆవహించేది. వొక మత్తులాగ. వొక మాయలాగా…

అతను నాకు ఉర్దూ నేర్పాడు. నాకంటే వేగంగా తెలుగు నేర్చుకున్నాడు.

బడిలోనే కాదు… బయట కూడా ఫకీర్ చాలా హుషారుగా ఉండేవాడు.

ఆదివారం వాగుల్లో ఈతలు కొట్టేవాళ్లం. చేపలు పట్టేవాళ్లం. నేను ఒక్క చేపను పట్టేందుకే నానా తంటాలు పడేవాన్ని. ఫకీర్ నీళ్లల్లో చేతులు పెడితే చాలు,  చేపలే పరిగెత్తుకొచ్చేవో …అతడే ఒడుపుగా పట్టుకునేవాడో కానీ చాలా చేపలు
పట్టేవాడు. కొన్ని చేపల్ని  అక్కడే కాల్చి తినేవాళ్లం. ఇంకొన్ని  ఇంటికి తెచ్చేవాళ్లం. అమ్మ వాటితో కమ్మగా పులుసు చేసేది.

Kadha-Saranga-2-300x268

నాయనకు నేనంటే ఎంత ఇష్టమో ఫకీర్ అన్నా అంతే ఇష్టం. అలా అతను  మా ఇంట్లో మనిషయ్యాడు. మా ఇంట్లోనే కాదు. ఊరు ఊరంతా ఫకీర్ మాయలో పడిపోయారు. ఊరందరికీ  ఫకీర్ చుట్టమే. ఇక పీర్ల పండగ వచ్చిదంటే చాలు. ఫకీర్ కు చెప్పలేని సంబరం.  పెద్ద పీరును ఎత్తుకుని.. “అస్సైదులా” అంటూ ఎగిరేవాడు. రాత్రిపూట నిప్పుల గుండంల ఉరికేటోడు.

ఫకీర్ మా దగ్గర ఉన్న నెల రోజులూ పండగలాగా ఉండేది.
తెచ్చిన సరుకు అంతా అమ్ముడు పోగానే వాళ్లు వాళ్ల ఊరు కాశ్మీరు వెళ్లిపోయేవాళ్లు.  ఫకీర్ పోతుంటే చెప్పలేని బాధ. తను మళ్లీ వచ్చేది సంవత్సరం తర్వాతే. ఆ సంవత్సరం మొత్తం అతని కోసం ఎదురుచూసే వాళ్లం.
ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మా జీవితాలు  మారిపోయాయి. ఫకీర్ వాళ్ల నాన్న సులేమాన్ కాలం చేశాక వ్యాపార బాధ్యతలు ఫకీర్ మీద పడ్డాయి.
పగలంతా వ్యాపారం… రాత్రికి ఇంటికి రావడం.  రాత్రి అయిందంటే చాలు… ఫకీర్ ఖవ్వాళి కోసం జనం మా ఇంటి ముందు కూచునే వాళ్లు.

అతను అమ్మే చద్దర్లు, శాలువాల్లాగనే అతని గొంతు కూడా మెత్తగా, కమ్మగా ఉండేది.
” దమాదమ్ మస్త్ కలందర్…దమాదమ్ మస్త్ కలందర్ ….” ఫకీర్ ఖవ్వాలికి జనం పూనకం వచ్చినట్లు ఊగిపోయేవారు.
ఫకీర్ నాకు ఉర్దూ  నేర్పాడు కదా. అతని పాటల్లోని భావాలు  నాకు బాగా అర్థమయ్యేవి.
” నాదేహం…నా సర్వం నీదే….ఓ దేవుడా,  ప్రియుడా నన్ను పవిత్రంగా ఉంచు……”

ఎంత గొప్ప భావన…!?
దేవున్ని ప్రేమిస్తున్నావా…? అవును,  ప్రతిక్షణం అతన్నే ప్రేమిస్తున్నాను.
సైతాన్ను ద్వేషిస్తున్నావా…లేదు,

నాకు అంత తీరిక లేదు…!

ప్రతీ గీతంలో అంతులేని తాత్విక భావనలు. అట్ల ఒక పాట తర్వాత ఇంకో పాట.
చుట్టూ కమ్ముకున్న చీకట్లను చీలుస్తూ అతని గీతాలు కొత్త వెలుగునిచ్చేవి.
తెల్లవారుతున్న సంగతి సైతం జనం మరిచిపోయేవాళ్లు.
గుడి గంటల సవ్వడిలో మేలుకొలుపు…నమాజ్ లోని గుండెతడి….చర్చి ప్రార్థనలో క్షమాగుణం… అన్నీ  ఫకీర్ గొంతులో వినిపించేవి.

ఫకీర్ రాముని గుడి దగ్గరా భజన చేసేవాడు.

” రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై…..రామ్ సబ్ మే హై”  ( రాముుడు అన్నింటా…ఉన్నాడు,
అణువణువూ రాముడే నిండి ఉన్నాడు. ) అంటూ పాడేవాడు. భక్తులతో కలిసి ఊగిపోయేవాడు.

అతని పాటకు మతం లేదు. ప్రేమ మాత్రమే ఉంది.
ఫకీర్ నీకీ పాటలన్నీ ఎవరు నేర్పారు..? అంటే

” ఇవన్నీ సూఫీ గీతాలు. భూమ్మీద ఎక్కడైనా రాత్రంటే చంద్రుడు, చుక్కల వెలుగులే. కానీ మా కాశ్మీరంలో రాత్రి ఖవ్వాలీ వెలుగులతో నిండిపోతుంది. మా కాశ్మీర్ లో ఉన్నది ఇస్లామే…కానీ అది సూఫీ. అది ఒక్క మతం కాదు. సర్వమత సారం.
మేము దేవుడిని పూజించం. ప్రేమిస్తాం.

అతని కోసం విరహ వేదనలో తపించిపోయే ప్రేమికుల్లా… పిచ్చిగా.

దేవుడు-నేను,  నేను-దేవుడు…ఇద్దరూ ఒక్కటై పోతాం.

అతడంటే భయం కాదు, ప్రేమ ఉండాలి. ఆరాధించాలి. అతనిలో లీనమై పోవాలి.”  ఫకీర్ చెప్పే మాటలు నాకు దేవున్ని మరింత చేరువ చేసేవి.

“ భాయ్….మతం ఐనా భక్తి ఐనా… భార్యభర్తల మధ్య గుట్టుగా జరిగే కాపురం లాగా ఉండాలి. భార్యతో చేసే కాపురం పదిమందికి  చెప్పుకోం కదా… అలాగే భక్తి కూడా,  దేవునికి మనకూ మధ్య రహస్యంగా ఉండాలి.” అనేవాడు.

ఫకీర్ మా ఊరు విడిచి వెళ్లినా మమ్మల్ని మరిచిపోయేవాడు కాదు. అక్కడ కాసే
ఆపిల్ పళ్లను మాకు పంపేవాడు.  కాశ్మీర్ లో దొరికే ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్లు తెచ్చి పిల్లలకు క్రికెట్ నేర్పించాడు.

మా ఇంటిని వాళ్లనే కాదు ఊరంతటినీ తన కుటుంబం చేసుకున్నాడు ఫకీర్. మా కన్నా మిన్నగా మా ఊరిని ప్రేమించాడు. మా అందరికీ ప్రేమ అంటే ఏమిటో చూపించాడు. మా ఊరిలోని పిల్లా పాపలే కాదు…చెట్టూ -చేమ, రాయి-రప్పా అణువణువూ ఫకీర్ ని ప్రేమిస్తుంది.
అలా సంవత్సరాలు గడిచిపోయాయి.
***
ఎప్పటిలాగే పోయిన ఏడాది కూడా ఓ రోజు మా ఊరు వచ్చాడు ఫకీర్. సరుకుతో కాదు. మాసిపోయిన గడ్డంతో. పిచ్చోడిలా ఉన్నాడు. వస్తూనే “ఐపోయింది. అంతా అయిపోయింది భాయ్” అంటూ భోరుమన్నాడు.
పోయినేడాది వ్యాపారం చేసుకుని అక్కడకి పోయేలోపు జరగరాని ఘోరం జరిగిపోయిందిట.
అక్కడ కాపలాగా ఉన్న వొక దళంలోని దుర్మార్గులు కొందరు… ఫకీర్ కూతురును దారుణంగా అత్యాచారం చేసి చంపారట. ఒక్కడు కాదు ఇద్దరు కాదు…పశువుల్లా పదిమంది పైనే…భార్య, చిన్న కొడుకును అందరి ముందే కాల్చిచంపారుట. తనతో పాటే వ్యాపారానికి వచ్చిన  పెద్ద కొడుకు మాత్రం బతికిపోయాడు.

సర్వం కోల్పోయిన ఫకీర్ ఎటు పోవాలో తోచక కొడుకుని తీసుకుని మా ఊరు వచ్చాడు.
తలచుకుంటేనే ఒళ్లు జలదరించే దారుణం.
పదేపదే ఆ దారుణం గుర్తుకు రావడంతో ఫకీర్ చాలా కాలం పాటూ కోలుకోలేక పోయాడు.
ఫకీర్ పరిస్థితే అలా ఉంటే  కొడుకు రియాజ్ సంగతి చెప్పేదేముంది. .?

తిండి లేదు…నీళ్లు లేవు. గంటలు గంటలు ఆకాశంలోకి చూస్తూ ఉండేవాళ్లు. ఫకీర్ కైతే పిచ్చోడికి మల్లే మరింత గడ్డం పెరిగింది. మా ఊరి చెరువు గట్ల దగ్గర ఒంటరిగా పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. మామూలు మనిషి కావడానికి చాలా కాలం పట్టింది.
చాలా రోజుల తర్వాత ఓ రోజు తన ఊరు వెళతానని అన్నాడు.

“ ఇంకా అక్కడ ఏముందని వెళతావు నీ కొడుకు రియాజ్  నువ్వు ఇక్కడే ఏదైనా వ్యాపారం పెట్టుకుని మాతో పాటే కలిసి ఉండమని ” బతిమాలాను.

సరేనన్న ఫకీర్ కాశ్మీర్ వెళ్లి సరుకు తెచ్చుకుంటానని వెళ్లాడు.
అలా నా మాట మీద గౌరవం తోనో…..మా ఊరి మీద ప్రేమ తోనో మొత్తానికి ఫకీర్ కొడుకుతో మా ఊరు వచ్చాడు. నాతో సహా ఊరంతా సంతోషించింది. ఇంతకాలం మా ఊరికి అతిథిగా వచ్చే ఫకీర్ ఇప్పుడు మా ఊరివాడయ్యాడు.
ఫకీర్ ను మా ఇంట్లోనే ఉండమని చెప్పినా ఒప్పుకోలేదు. వ్యాపారం చేసి కూడబెట్టిన డబ్బు నా చేతిలో పెట్టాడు. ఊళ్లోనే ఎక్కడన్నా ఓ చిన్న ఇల్లు చూసి పెట్టమని చెప్పాడు. తెచ్చిన సరకుతో ఫకీర్ ఒక ఊరు….కొడుకు రియాజ్ మరో ఊరు వెళ్లి చద్దర్లు అమ్మి సాయంత్రానికి మా ఇంటికి వచ్చేవాళ్లు.
ఫకీర్ వచ్చి చాలారోజులైనా ఇంకా ఖవ్వాలీ పెట్టలేదని  ఊరి జనం అడుగుతున్నారు. రేపో మాపో వీలు చూసుకొని తప్పకుండా ఖవ్వాలీ పెడతానని హామీ ఇచ్చాను.
ఫకీర్ ఖవ్వాలీ కోసం జనమంతా ఎదురుచూస్తున్నారు.
***
‘ సాబ్ మీరే న్యాయం చెయ్యాల’  అనుకుంట ఇంట్లెకు వచ్చిండు పీర్ సాబ్.
‘ ఏమైంది పీర్ సాబ్. ఏం సంగతి..? ఎడ్ల వ్యాపారం ఎలా ఉంది..? ‘  అని అడిగిన.
” ఏం చెప్పమంటవ్ సాబ్. నిన్న మొన్న ఊళ్లే తిరిగి నాలుగు ఎడ్లు, రెండు ముసలి బర్లు కొన్న… కానీ వాటిని అమ్మకూడదు అంటూ  గొడవ చేస్తున్నరు. జర మీరె న్యాయం చెప్పాలే.”  బతిమాలిండు పీర్ సాబ్.
మాఊరిలో దూదేకులోళ్లు చాలా మంది ఉన్నరు.  వాళ్లు రైతుల దగ్గర వ్యవసాయానికి పనికిరానివో, ముసలివో ఎద్దులు, ఆవులు కొని పట్నంల అమ్ముతరు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతోంది  కాదు. వాళ్ల తాతల కాలం నుంచీ అదే పని చేస్తున్నరు.
‘ఆపింది ఎవరు.?’ అని అడిగిన.
ఇంకెవలు సాబ్ మీ కొడుకు వెంకట్… కొంతమంది పోరగాళ్లను తెచ్చి ” ఎద్దులు, ఆవులు ఇప్పటి నుంచి అమ్మొద్దు,కొనొద్దు. దూదేకులోళ్లని ఎద్దుల బేరం మానెయ్యమని బెదిరిస్తున్నడు. తాతల కాలం నుంచి ఇదే బతకు తెరువుగా బతుకుతున్నం. ఇప్పుడు ఒక్కసారిగా మానెయ్యమంటే ఎట్ట సాబ్.” ప్రాధేయపడుతున్నడు.

“ నేను మాట్లాడుత గనీ నువ్ పో ” అని పీర్ సాబ్ ను పంపిన.
నాకు ఒక్కడే కొడుకు. పట్నంల ఇంజనీరింగ్ చదువుతున్నడు. చదువు సంగతి
ఏమోగానీ రాజకీయాలు మాత్రం బాగా నేర్చుకున్నడు. దేవుని పేరుతోని
రాజకీయాలు….!
” ఏరా వెంకట్…దూదేకులోళ్లని పశువులు కొనొద్దని బెదిరించినవట నిజమేనా…?”  కోపంగా అడిగాను మా వాణ్ని.
“అవును నాయన. జంతువుల్ని చంపడం పాపం కద నాయిన.”
“ మరి మనం కోళ్లను, గొర్రెల్ని చంపితే పాపం కాదా. మనం చేస్తే పుణ్యం,వాళ్లు చేస్తే పాపమా…? వాళ్లు వాటిని కోపంతోనో, పగతోనో చంపడం లేదు. తినడం కోసం కోసుకుంటున్నరు.

జంతువులను చంపకూడదు  అన్న మీ వాదం గొప్పదే కానీ…జంతువును చంపకుండా బతికే స్థాయికి మనిషి ఇంకా ఎదగలేదు. ఒకలిద్దరు ఎదిగి ఉండొచ్చు. జనమంతా ఆ స్థాయికి చేరినప్పుడు ఒకడు నిషేధించాల్సిన
పనిలేదు. ఎవడికి వాడే మానేస్తాడు. నీ బలవంతం ఎందుకు…? ”

నా ప్రశ్నకు బదులు చెప్పలేదు. కోపంతో గబగబ అక్కన్నుంచి వెళ్లిపోయిండు.
***
chandram2“ మీ కాశ్మీర్ లో చాలా మందికి ఎందుకు మన దేశమంటే ప్రేమ లేదు.? ఎందుకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. పబ్లిక్ గా పాకిస్తాన్ జండాలు పట్టుకుని ఊరేగుతారు” మా వాడు వెంకట్,  ఫకీర్ కొడుకు రియాజ్ తో వాదనకు దిగాడు.
నేను , ఫకీర్ ఆసక్తిగా గమనిస్తున్నాం.
” అందరూ ఒకలాగా ఉండరు కదా….ఒక్కో మనిషి ఒక్కోలాగా ఆలోచిస్తడు భాయ్.’
రియాజ్ బదులిచ్చిండు.
” మా సైన్యం లేకుంటే….మిమ్మల్లి పాకిస్తాన్ ఎప్పుడో ఆక్రమించేసి ఉండేది. కాదంటారా.?”
” అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. పేపర్లో, టీవీల్లో వచ్చేదంతా నిజం కాదు.”
“ఏది నిజం కాదు. మా కాశ్మీరీ పండిట్లను బలవంతంగా తరిమేశారు. అది నిజం కాదా. వాళ్లు బిచ్చగాళ్లలా ఢిల్లీ వీధుల్లో ఇబ్బందులు పడేది నిజం కాదా. హిందువులు కాబట్టే కదా వాళ్లని తరిమేశారు”..ఆవేశంగా అడిగాడు మావాడు.
“ హిందువుల మీద మాకు ఎప్పుడూ కోపం లేదు భాయ్.  ప్రతీ సంవత్సరం వేలాది మంది హిందువులు అమర్ నాథ్ యాత్రకు వస్తున్నారు కదా. వాళ్లు మా నేలమీద అడుగు పెట్టిన దగ్గరనుంచీ డోలీల్లో  మోసుకెళ్లడం, గుర్రాలపైన తీసుకెళ్లడం, దేవుడ్ని దర్శనం చేయించడం … ప్రతీ పని ముస్లింలే చేస్తారు తెలుసా భయ్యా.? ”
“ మీ కోసం కోట్లు ఖర్చు చేసి సెక్యూరిటీ ఇస్తున్నాం. ఐనా మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారు..? ”
“ సెక్యూరిటీ అంటే ఏది భయ్యా. మా ఆడవాళ్లను అందరి ముందే బలవంతం చేసి పాడు
చేయడం…యువకుల్ని పిట్టల్లా కాల్చేయడం… ఆఖరుకు స్కూలుకెళ్లే పిల్లల్ని కూడా  రాక్షసంగా…” మాట రాక భోరుమన్నాడు రియాజ్.
మావాడికి ఏం చెప్పాలో తోచక చూస్తూ ఉండిపోయాడు.
” రియాజ్ భేటా ఏమీ అనుకోకు. వాడికి నీ మీద కోపం లేదు. మా దగ్గర జనం అనుకునేదే నీతో అన్నాడు ” అంటూ రియాజ్ ను దగ్గరకు తీసుకున్నాను. ఆవేశంలో రియాజ్ ఏదో అన్నాడు కానీ…తర్వాత వాడు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. వెళ్లి పడుకోమని చెప్పాను.

నేను ఫకీర్ డాబాపైకి వచ్చాము.
” ఫకీర్ మావాడి మాటలకు బాధపడుతున్నావా..”
” లేదు భయ్యా. ఆ ప్రశ్నలు మీ వాడివే  కాదు. మిగతా దేశమంతా మమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలని తెలుసు. భయ్యా.., ఇప్పుడంటే కాశ్మీర్ పేరు చెపితే ఉగ్రవాదం….మతం అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు మాది ఈ దునియా మొత్తం మీద అత్యంత సుందర ప్రదేశం.
మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఓ సారి కాశ్మీర్ కు  వచ్చాడట. అందమైన పర్వతాలు…సరస్సులు, అంతకన్నా అందమైన మనుషుల్ని చూసి పులకించి పోయాడట. స్వర్గం అనేది ఉంటే అది కచ్చితంగా కాశ్మీరే  అన్నాడట.

ఒకప్పుడు హిందూ, ముసల్మాన్ రెండూ విడదీయలేనంతగా అల్లుకుపోయిన పోయిన సంస్కృతి మాది. కాశ్మీర్ లో ముస్లింలు-హిందువులే కాదు, బౌద్ధ మతస్తులు చాలామంది ఉన్నారు. సిక్కులూ ఉన్నారు. చాలా మందికి తెలీని సంగతి ఏమంటే యూదు మతస్తులు కూడా ఉన్నారు. అసలు మతమంటేనే తెలియని గిరిజనులూ ఉన్నారు. ఆకాశంలో ఇంధ్రధనస్సులా  అందంగా  మేమంతా కలిసిపోయాం.   అటువంటి మా  ప్రాంతం…. కొన్ని రాజకీయ సైతాన్ ల వల్ల  రావణకాష్టంగా మారింది.

మాతో సంబంధం లేకుండానే…మా ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ లేకుండానే మా నసీబ్ మార్చేశారు. మా జిందగీ  మా చేతుల్లో లేకుండా చేశారు. ”
” ఐతే ఫకీర్ దీనికి పరిష్కారం లేదంటావా…? ”
”  ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది భాయ్ సాబ్….”
” ఉంటే ఎందుకు పరిష్కారం కావడం లేదు…!!?”
”  భాయ్ సాబ్. నిజంగా నిద్రపోయే వాన్ని లేపొచ్చు. మెలకువతో ఉన్న వాన్ని లేపొచ్చు. కానీ నిద్ర నటించే వాన్ని ఎప్పటికీ నిద్రలేపలేం కదా…!?” విషాదం, వైరాగ్యం కలిసిన ఒకలాంటి నవ్వు నవ్వుతూ అన్నాడు ఫకీర్.
నాకర్థమైంది. అంతా అర్థమైంది.  ” నిద్ర నటించేవాన్ని లేపలేం కదా..?”
రాత్రంతా ఆ మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. కళ్లు మూసినా తెరిచినా ఫకీర్ నవ్వే కనిపిస్తోంది.
***

నేను నిదుర లేవకముందే  ఫకీర్, రియాజ్ చద్దర్లు అమ్మేటందుకు పోయిన్రు.
పేపర్ చదువుతుంటే సెల్ ఫోన్ మోగింది. ” భయ్యా…ఎక్కడున్నావ్. అర్జంటుగా పోలీస్ స్టేషన్ కొస్తావా..”  గాభారాగా అడిగాడు ఫకీర్.
” ఏమైంది భాయ్…” కంగారుగా అడిగాను. ” రియాజ్, రియాజ్ ను పోలీసులు పట్టుకున్నరు.” ఫోన్ లో చెప్పలేక పోతున్నాడు ఫకీరు.  సరే నేను వెంటనే వస్తున్నా అని చెప్పి బండి తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లాను.
ఫకీర్ నాకు పరిచయమై ముప్పై ఏళ్లపైనే అయింది. కానీ ఎప్పుడు పోలీసు స్టేషన్ తో పని పడలేదు. ఏమై ఉంటుంది..? బహుశా లైసన్స్  లేదని పోలీసులు పట్టుకుని ఉంటారా..? ఆలోచల్లోనే స్టేషన్ దగ్గరకు చేరుకున్నాను.

అక్కడంతా గుంపులు గుంపులుగా జనం. ఐదారు ఛానళ్ల రిపోర్టర్లు కెమెరాల ముందు ఏదో చెబుతున్నారు. గబగబా లోపలకి వెళ్లాను.

అక్కడ దూరంగా ఫకీర్ చేతులు కట్టుకుని దీనంగా నిలబడి ఉన్నాడు.  నన్ను చూడగానే ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా కావలించుకుని “భాయ్ “అని ఏడ్చిండు.
‘వీళ్లు మీకు తెలుసా సాబ్”  ఎస్సై ఆశ్చర్యంగా అడిగిండు. చాలా కాలం నుంచి పరిచయమేనని చెప్పిన.
” ఈ ఏరియాల టెర్రరిస్టులు తిరుగుతున్నరని మాకు ఇంటలిజెన్స్ రిపోర్టు ఉంది. అందుకే  నిఘా పెట్టినం. ఈ కుర్రాడు అనుమానస్పదంగా తిరుగుతుంటే ఎవరో కంప్లైట్ చేసిన్రు. కాశ్మీర్ అంటున్నాడు.  అందుకే అనుమానం వచ్చి అరెస్టు
చేసినమన్నా”డు ఎస్సై.
లోకల్ ఎమ్మెల్యే తోని ఫోన్ చేయించి మొత్తానికి ఫకీర్ ను, రియాజ్ ను ఇంటికి తీసుకొచ్చాను. ఇంటరాగేషన్ల దెబ్బలు బాగా కొట్టినట్టున్నారు..
రియాజ్ నడవలేక పోతున్నాడు.
కొడుకు వంటిమీద దెబ్బలు చూసి….ఇంటికొచ్చిన తర్వాత కూడా ఫకీర్ ఏడుస్తనే ఉన్నడు. రాత్రికి పెట్టాలనుకున్న ఖవ్వాలీ కూడా జరగలేదు.
” భాయ్.. ” మెల్లగా పిలిచాడు ఫకీర్.

ఎన్నడూ లేనిది ఫకీర్ కళ్లల్లో మొదటిసారి భయం చూశాను.
” భాయ్ నేను కాశ్మీర్  వెళ్లిపోతాను”  అన్నడు.

”  అదేంది భాయ్..ఇపుడేమైందని.నేను చూసుకుంటాను. కదా…?’
” . మేం ఇక్కడ ఉండలేము భాయ్. తెల్లవారక ముందే బస్ లో హైదరాబాద్ వెళ్లిపోతాము ”  కరాఖండిగా చెప్పాడు ఫకీర్.
***

టైం తెల్లవారు ఝాము నాలుగవుతోంది. ఫకీర్ గబగబ కొడుకుని లేపాడు. నేను ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు తెచ్చి చేతిలో పెట్టాను. ‘వద్దు భాయ్. ఛార్జీలకు మాత్రం చాలు’ అని ఓ రెండు నోట్లు తీసుకుని మిగిలిన డబ్బు మళ్లీ నా చేతుల్లోనే పెట్టాడు.

ఆ చీకట్లోనే కిలోమీటర్ దూరంలో ఉన్న బస్టాపు దాకా నడిచి వచ్చాం.
” ఫకీర్ భాయ్ ఇంకో సారి ఆలోచించు.  పోక తప్పదా”  అన్నాను.
”  లేదు భాయ్….ఇక్కడ జరిగిన దానికి భయపడి పోవడం లేదు. మేం గొడవల్లోనే పుట్టాం. గొడవల్లోనే పెరిగాం. అక్కడ బతికే దారిలేక ఇలా దేశాలు తిరుగుతూ బతుకుతాం. అక్కడ మాకు అందమైన ప్రకృతి ఉంది. కానీ ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. మీ ఊరు నాకెందుకు ఇష్టమో తెలుసా.  మీ ఊరు మొదటిసారి వచ్చినప్పుడు వింతగా చూశాను. ఎందుకంటే ఇక్కడ మతం లేదు. పీర్ల పండగను అందరం కలిసి చేసుకున్నం. రాముని పండగకు భజనలు చేసినం. క్రిస్మస్ కు ప్రార్థనలు చేసినం. కులం, మతం అన్నీ మర్చిపోయి…. ఖాళీ మనుషుల్లాగా బతికినం.  అందుకే మీ ఊరు నా ఊరు కన్నా బాగా నచ్చింది.  కానీ ఇప్పుడు ఈ ఊరుకు మతం సైతాన్ పట్టింది.

మతం పేరు చెప్పి చేసే రాజకీయం సైతాన్ లాంటిది భాయి. ఒకసారి పట్టిందంటే చంపేదాకా వదలదు. మతం-రాజకీయం కలిసి చేసే మారణహోమం ఎంత విధ్వంసంగా ఉంటుందో మేం కళ్లారా చూశాం. అది ఇప్పుడు మీదాకా
పాకింది. జాగ్రత్త భాయ్. ”
ఫకీర్ మాటలు నాకు మా ఊరిని కొత్తగా చూపిస్తున్నయి. ఇంతకాలం ఈ ఊరిలోనే ఉంటూ నేను గ్రహించని నిజం అతను రెండు రోజుల్లోనే గ్రహించాడు.
బస్సు వచ్చింది. ఫకీర్, రియాజ్ ఎక్కారు. బస్సు దుమ్ము లేపుకుంటూ కదిలిపోయింది.

మెల్లగా మా ఊరి వైపు నడిచాను.
“ఊరు మారిపోయింది భాయ్. మతం పిశాచి ఆవహిస్తోంది…..జాగ్రత్త భాయ్..”అంటూ
ఫకీర్ చేసిన హెచ్చరిక మళ్లీ మళ్లీ గుర్తుకువస్తోంది.
జాతరలో మత ప్రచారాలు…
పిల్లలచేత మత గ్రంథాలు బట్టీ పట్టించడం…
మేం చెప్పిందే తినాలని భయపెట్టడం…
పరాయి మతస్తుడైన ఫకీర్ కొడుకును ఉగ్రవాదిగా అనుమానించడం…
ఇవన్నీ ఊరికే జరిగినవి కావని ఫకీర్ చెప్పాక అర్థమవుతోంది.
పూర్తిగా తెల్లవార వచ్చింది.
దూరంగా కొండల మధ్యనుంచి రకరకాల వర్ణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ రంగులు
పూసుకున్న భూతాల్లా పైకి లేస్తున్నాయి.

రక్తం లాంటి వర్ణం ఆకాశమంతటా పరచుకుంది.

ఎప్పడూ అందంగా కనిపించే ఆ పొద్దు ఇవాళ ఎందుకో వికృతంగా కనిపిస్తోంది. అప్పటి వరకూ ప్రశాంతంగా మా ఊరిలాగే ఉన్న ఆకాశాన్ని….ఆ రంగు భూతం అల్లకల్లోలం చేసింది. భయంకర బ్రహ్మ రాక్షసి చేసుకున్న రక్తపు వాంతిలాగా ఉంది ఆ రంగు. లోకమంతటినీ కబళిస్తూ…రాకాసిలా చీలికల నాలుకలు చాచుకొంటూ వస్తోంది.

విధ్వంసం…వర్ణ విధ్వంసం, ఆవాహనం వర్ణవాహనం……

మొదటి సారిగా ఆ వర్ణాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టింది.  ఆ రంగు ఇప్పుడు మా ఊరివైపు వెళుతోంది.

ఆ రంగుల సైతాన్  నుంచి మా ఊరిని కాపాడుకోవాలి.

పరిగెత్తుతున్నాను…..పరిగెత్తుతున్నాను.

 

*

తూర్పు వాకిటి పశ్చిమం!

 

addtext_com_mte1njizode3mzg

కాలిఫోర్నియాలోని ఓ నగరంలో,ఉద్యోగస్తులు అనిత, మోహన్ లు.

ఉన్న ఒక్కగానొక్క కూతురు సింధుకి జ్వరం వొస్తే,ఎవరు శలవు పెట్టి చూసుకోవాలి ? అనే మీమాంశలు తప్ప,

పెద్ద చీకూ, చింతా లేని సంసారం!

అమెరికన్ లలో అమెరికన్లు గా,ఇండియన్స్ తో ఇండియన్లుగాకలిసిపోయే నైజం వారిది.

ఈ అంతర్జాతీయ సమాజంలో ఉండే అనేక సాంస్కృతిక భేధాలని, విభిన్న ఆచారాలని ఆకళింపు చేసుకోవడమే కాకుండా, నలుగురిలో  ఆ మర్యాదలను పాటించే వారి తీరు ముచ్చటేస్తుంది కూడా!

నిజానికి, ఈ  స్నేహశీల ధోరణే లేదా సరదానే వాళ్ళ కెరీర్ కి మంచి బాటలు వేస్తోందని, స్నేహితులు అంటుంటారు.

అలా అన్న వాళ్లతో,

అదంతా, బతుకుతెరువు నేర్పించిందని,

ప్రవాస జీవితంతో సమతుల్యత కోసమనీ….

ఇంటికొచ్చేసరికి మాత్రం,

సాధారణ తెలుగు దంపతులమే అంటుంటారు.

అలాంటి వీరికి,ఈ మధ్య,

పాశ్చాత్య నీడలు తమ కూతురి ఆలోచనలని పెడ త్రోవ పట్టిస్తాయేమో అనే ఆందోళన మొదలైంది!

అమెరికాలో ఉండే తల్లిదండ్రులకి ఇదేం కొత్త భయం కానప్పటికీ,
ఉన్నట్టుండి,

అదీ ఎనిమిదేళ్ళ కూతురి విషయంలో రావటానికి కారణం,

ఓ వారం క్రితం,

“నువ్వు చెప్పేవన్నీ కధలు, కల్పితాలు,!” ,

తల్లి తో నిష్టూరంగా అంది సింధు.

స్కూలు అయిపోగానే, తన స్నేహితురాలు సేజ్  ఇంటికి వెళ్లి, ఓ గంట ఆడుకుని వస్తానందవాళ.   వాళ్ల అమ్మ  డెబ్బీ కూడా ప్లే డేట్ కావాలని సేజ్ అడుగుతోందని ఇ మెయిల్ చేసింది.

తన మాటలకి రియాక్షన్ ఏమిటా అని సింధు కళ్ళు విప్పార్చుకుని చూస్తుంటే,

ఆ కధలు, కల్పితాలు ఏమిటని అడిగింది అనిత.

“నేను నీకు దేవుడిస్తే పుట్టలేదు,  నాకు నిజం తెలిసి పోయింది”,  అన్న కూతురిని,

“హాయిగా ఆడుకోకుండా, ఎవరు ఎలా పుట్టారనే సోదితోనే పొద్దుపుచ్చారా? అసలు, ఇలాంటివి తప్పితే వేరే ధ్యాసే ఉండదా? సేజ్ వాళ్ల అమ్మ అయినా ఈ పనికిమాలిన మాటలేంటని ఆపలేదా?”

మందలించకుండా ఉండలేకపోయింది అనిత.

చిన్నబుచ్చుకుని,

“ఆడుకునేప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు,  ఫ్రెండ్స్ చాలా విషయాలు మాట్లాడుకుంటారు,  స్ప్రింగ్ సీజన్ లో ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారని  మా టీచర్ కూడా చెప్పింది. నీకో విషయం చెప్పనా?, సేజ్ వాళ్ల అమ్మ నీలా విసుక్కోదు , డెలివరీలు ఎలా జరుగుతాయో చూపించే టివి చానల్ చూసినా సేజ్ ని ఏమీ అనదు, మేం స్నాక్ తినేప్పుడు డెబ్బీ కూడా మాట్లాడింది, తనకి చాలా విషయాలు తెలుస”ని నొక్కి చెప్పింది సింధు.

“నేను నీకు నిజం చెప్పలేదని ఎలా  అనుకుంటున్నావు ? నిజానికి,  మీ అమ్మమ్మ అంటే మా అమ్మ కూడా నాకిదే చెప్పింది. తను ఎన్నో దేవుళ్ళకి  మొక్కితే నేను పుట్టానని, ఓ బిడ్డని ప్రసాదించమని నా ఇష్ట దైవాన్ని వేడుకుంటే,  నువ్వు పుట్టావు . ఇప్పుడు నేను కూడా అమ్మమ్మతో నువ్వు నాకు నిజం చెప్పలేదని అనాలా? ఇక్కడి నీ స్నేహితులు చెపుతుంటారుగా ఆకాశం నుంచి కిందకి రాలుతున్న నక్షత్రాన్ని కోరిక కోరితే జరుగుతుందని, ఇదీ అలాంటిదే అనుకోరాదా?” అనే  అనిత పాయింటుకు

ఏ మాత్రం తగ్గకుండా,

సేజ్ వాళ్ల అమ్మ అలాంటివేమీ తను నమ్మనంది. కొంతమంది నమ్మే వాళ్లు అలా చెప్పినా,   రుజువు చెయలేరని నమ్మకంగా చెప్పిందనే  సమాధానం సింధు నుంచి వొచ్చింది.

సేజ్ వాళ్ల అమ్మని ఇలాంటివి అడగాలనే అలోచన ఎందుకు వొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యగా,

“స్కూల్ లో ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటుండగా, నేను నీకు దేవుడిస్తే పుట్టానని చెప్పగానే, చాలా మంది నమ్మలేదు! అలాంటివన్నీ కిండర్ గార్టెన్ పిల్లలు  చెప్పే కధలు,  మెక్ బిలీవ్ స్టోరీస్ (Make believe)  అని నీకు ఇంకా తెలీదా? అన్నారు. నాకు ఏడుపొచ్చింది. అప్పుడు సేజ్ నన్ను చాలా సేపు ఓదార్చడమే కాకుండా, మా మామ్  హాస్పటల్లో  నర్సుగా పనిచేస్తుంది, డెలివరీలకి సహాయం చెయ్యడమే తన పని. తనకు ఇలాంటివన్నీ బాగా తెలుసనటం వల్ల, వాళ్ళింటికెళ్ళినపుడు,  డెబ్బీ ఏం చెపుతుందో తెలుసుకోవాలనిపించి” అడిగానన్నది .

స్నేహితుల ముందు కూతురు చిన్నబోవటం అనితకి చివుక్కుమనిపించినా,  సంభాళించుకుని,

అమెరికాలోని  చాలా మంది పేరెంట్స్ ప్రపంచం నాలుగు మూలల నుంచి వొచ్చిన వాళ్లవడం వల్ల అందరూ ఒకేలా చెప్పరని, పెరిగిన వాతావరణం,  ఏర్పరుచుకున్న భావాల ప్రభావంతో పిల్లలకు సమాచారాన్నిస్తారనే వివరణ ఇస్తే,

సింధు తన  ధోరణిలో,

ఈ పాయింట్ లో అది సరి కాదంది.

ఏ జాతి కుక్క పిల్ల అయినా, అమెరికాలో ఎలా పుడుతుందో, ఇండియాలోనూ అలాగే పుడుతుంది, మనుషులూ అంతే కాబట్టి, అనిత చెప్పింది తప్పు దారి పట్టించడమే అంది.
“నేను పెద్దవుతున్నానని నువ్వు పదే పదే అంటావు కానీ, you really don’t mean it?!”

అనే వాదనకి దిగింది,

“అసలిలాగే నేను ఎందుకు పుట్టాను? ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను అని ఎన్ని సార్లు అడిగినా నువ్వు అర్ధం అయ్యేట్టు చెప్పనే లేదు, అదే డెబ్బీ అయితే,

ప్రపంచంలోని ఏ ప్రదేశంలో ఉన్న పేరెంట్స్ అయినా పిల్లలు కావాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని కంటారని, అందుకే నేను మన ఇంట్లో పుట్టానని, నా రూపురేఖలు మీ ఇద్దరి నుంచి, మీ ఇద్దరి కుటుంబాల నుంచీ వొచ్చాయనీ చెప్పింది…and it makes sense!”  అంది.

అమ్మ కడుపులోకి బేబీస్ ఎలా వెళతారని అడిగినపుడు,

“Sperm and eggలు అమ్మ శరీరంలో కలుసుకుని బేబీని తయారుచేస్తాయని డెబ్బీ చెప్పిందంటూ, అమ్మమ్మకు తెలియక పోవడం వల్లే నీకిది తెలియలేదా?! అందుకే నువ్వు నాకు చెప్పలేక పోయావా ? “అని ఆరా తీసింది.

ఇంకా ఏం చెప్పాలో అనితకి తట్టక మునుపే ….

“By the way, ఇదంతా జరగటానికి కొన్ని స్పెషల్ ఫీలింగ్స్ అవసరం! “
గొంతు తక్కువ చేసి, రహస్యంగా…
“ఆడుకొనేటప్పుడు సేజ్ చెవిలో చెప్పింది. వాటి గురించి అందరిలోనూ మాట్లాడటం పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు కనుక, మనం వాళ్ళ భావాలను గౌరవించాలంద”ని కూడా అంటూ

తల్లి వంక చూస్తూ, అవునన్నట్టు తల ఊపింది.

సింధు చెపుతున్న ఒక్కో మాటకి,

డెబ్బీ మీద పట్టరాని కోపం వొచ్చింది అనితకి.

హాస్పటళ్ళలో  పని చేసే వాళ్లకి ఏవి గుట్టుగా ఉంచాల్సినవనే జ్ఞానం ఉండదు, ఇన్ని చెప్పాల్సిన అవసరం ఉందా?!
ఇదే ధోరణిలో సాగితే,
ముందు ముందు ఇంకా ఎన్ని వినాలో…
అనుకుంటూ,

ఒక్క సెకను కూడా ఇక ఈ మాటలు భరించలేనట్టు,

“ సరే సరే ! టైమున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ముఖం కడుక్కుని రా! ఏదైనా తిని, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టు మెదలుపెట్టు. వారంలో ఇచ్చెయ్యాల”ని పురమాయిస్తే,

“ I know ! “

అసంతృప్తినంతా  గొంతులో పలికిస్తూ తన గదిలోకి వెళ్లింది సింధు.

అ నిరసన,

తమ మధ్య దూరానికి కొలమానంలా వినిపించింది అనితకి.

ఇదంతా,

మోహన్ తో చెపితే,

మొదట,  “సీరియస్లీ….” అన్నాడు,

అంతా విని,

మరీ మూడో క్లాసుకే ఇన్ని ఆరాలు, ఇంత పోగెయ్యటమా ? అని గుండెలు బాదుకున్నాడు,

ఎంత తండ్రినయినా,  చిన్నపిల్లతో ఇవన్నీ నేను మాట్లాడటం బాగుండదు, నువ్వే దగ్గర కూచోపెట్టుకుని, ఇలాంటి మాటలు మాట్లాడటం, వివరాలు తెలుసుకోవడం మంచి పిల్లల లక్షణం కాదని తెలియచెప్పాలన్నాడు.

“ఇది మంచి పిల్లల లక్షణం కాదు అంటే, వినే కాలమా?! మనం ఒకటి చెపితే, తను పది ప్రశ్నలు వెయ్యగలదు,  స్కూళ్లలో,  పిల్లలు నలుగురూ నాలుగు రకాలుగా ఉంటారు! పది రకాలుగా చెప్పుకుంటారు, అసలు పిల్లలకి తెలీకుండా ఉంచాల్సినవేవీ మిగలట్లేదేమో ?!, ఈ ధోరణి ఎటు పోనుందో… “

అనిత దిగాలు పడిపోతే,

ఆ బెంగ తనకీ కలుగుతోందంటూ, ఈ వయసులోనే సరైన మార్గంలో పెట్టాలన్నాడు మోహన్,

ఇలా మొదలైన తమ ఆందోళనని, ముందుగా,

ఇండియాలో ఉన్న పెద్దవాళ్లతో టూకీగా అంటే,

చిన్నపిల్లల్ని ఏమార్చి, దృష్టి మరల్చాలి కానీ, ఇలా బెంబేలు పడకూడదన్నారు.

ఇక్కడి పోకడలపై అవగాహన లేక వాళ్ళు అంత తేలిగ్గా సమాధానమిచ్చారని అనిత, మోహన్ లు  భావించారు.

తరువాత,

అనిత స్నేహితురాలు సుగుణ కుటుంబాన్ని గుర్తుచేసుకున్నారు.

అమ్మాయిలని ఇండియాలో పెంచడమే “ఉత్తమం” అనుకుంటూ, వాళ్లు హైదరాబాద్ కి వెళ్ళిపోయి నాలుగేళ్ళవుతోంది.

మనం ఇవన్నీ తెలుసుకుని పెరిగామా?

పరమ రోత అంతా మన సినిమాల్లోనూ, టీవీ ప్రోగ్రాముల్లోనూ అగుపించడం గుర్తుకుతెచ్చుకుని, సుగుణ తరచూ వేసే ఈ ప్రశ్నతోనూ ఏకీభవించలేకపోయారు.

‘ఫ్యామిలీ లైఫ్’ గురించి స్కూల్లో తెలుసుకొచ్చిన మా అబ్బాయి, ఇలాంటిదేదో ఇంట్లో జరుగుతుందని నాకు తెలియకుండా ఎలా మేనేజ్ చేసారని అడిగాడంటూ వాపోయిన పూర్ణిమ, అనందరావులు కూడా వాళ్ళ కళ్ల ముందు కదలాడారు.

ఏషియన్స్, ఇండియన్స్ ఎక్కువగా ఉన్న స్కూళ్లలో అయితే ఈ ధ్యాస తగ్గి చదువులో పోటీ పెరుగుతుందంటూ, ఉన్న పళాన, వాళ్ళు బే ఏరియాకి (కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ,  దాని చుట్టుపక్కల ప్రాంతాలు) వెళ్ళిపోయిన తీరు తల్చుకుని,

మనం కూడా ఆ పని చేద్దామని అనిత అంటే,

అన్నీ సెట్ అయి ఉన్న చోటి నుంచి, ఉన్నపళాన కొత్త ప్రదేశానికి వెళ్లడం సాధ్యం కాదంటూ,  అక్కడికి వెళ్ళినా గ్యారంటీ ఉంటుందనిపించడం లేదన్నాడు మోహన్.

‘మన’ వాళ్ల కెవరికయినా ఫోన్ చేసి సలహా అడుగుదామనుకుని,

తెలిసిన నలుగురిలో, కూతురిని ఎందుకు బయట పడెయ్యాలని మనసు మార్చుకుంది అనిత.

మరేం చెయ్యాలి??

తమ కమ్యూనిటీలోనే ఉంటూ, సింధు చదివే స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేసే మిషెల్ ఆపద్భాందవిలా అనిపించింది. పైగా తను ప్రొఫెషనల్ కూడా!

హాస్పటల్లో పనిచెయ్యడమే కాకుండా, స్కూల్లో పిల్లలకి “ఫ్యామిలీ లైఫ్ “ (లేదా లైంగిక విజ్నానం) పాఠాలు చెపుతుంది.

ఇరువురూ, తరచూ ఈవినింగ్ వాక్ లో కలుస్తూనే ఉంటారు. రెండేళ్ళుగా స్నేహం !

ఈ మాటే మోహన్ తో అంటే, మాట్లాడి చూడమన్నాడు.

ఓ రోజు,

పార్కులో కనిపించిన మిషెల్ తో,

పలకరింపులయిన తరువాత,

మీ సహాయం కావాలి అంటూ తన గోడు వెళ్లబోసుకుంది.

మా కల్చర్ లో ఇలాంటి వివరాలని పిల్లల నుంచి చాలా గోప్యంగా ఉంచుతాం.  తెలిసీ తెలియక నలుగురిలో మాట్లాడితే బాగుండదని, తగిన వయస్సు వొచ్చినపుడు వాళ్ళే తెలుసుకుంటారని, ఏకాగ్రత లోపిస్తుందని, ఇలా రకరకాల కారణాలని చెప్పుకుపోతున్న అనితతో,

ఇలాంటివి పెద్దవాళ్లు చెపితేనే పిల్లలకి తెలుస్తాయని అనుకోలేమంది మిషెల్.

మొన్నా మధ్య కిండర్ గార్టెన్ చదువుతున్న పిల్లాడు ఒకడు, తను చూసిన “ పెప్పా పిగ్ “ కార్టూన్ ఎపిసోడ్ లొ మామీ (Mommy) పిగ్ ఎలా డెలివరీ అయిందో, తన క్లాస్మేట్ తో చెపుతుంటే విన్నానంటూ, అవగాహన పెరుగుతున్న కొద్దీ,  పిల్లలు తమ శరీరాల నుంచి వొచ్చే సిగ్నల్స్ తో పాటు, గమనించిన లేదా తెలుసుకున్న ఒక క్లూ నించి, ఇంకో క్లూ కి కనెక్ట్ చేసుకుంటూ పోతారని వివరించింది.

వాస్తవానికి, తను  పాఠాలు మొదలుపెట్టేనాటికే, పిల్లలలో చాలా మందికి లైంగిక విషయాల పట్ల అంతోఇంతో అవగాహన ఉంటోందని, కాకపోతే వాళ్లకున్న అపోహలు పోగొట్టి, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు చెప్పడం, ముఖ్యంగా శరీరం మీద పూర్తి అవగాహన కలిగించడమే తన లాంటి వాళ్ల పని అన్న మిషెల్ మాటల్ని అందుకుంటూ,

“మా లాంటి పేరెంట్స్ గురించి చెప్పాలంటే, వేరే సబ్జక్టులలో వాళ్ళు ఎంత లోతు ప్రశ్నలు వేస్తే అంత సంబర పడతాం! ఇంకా చెప్పాలంటే,  సెకండ్ గ్రేడ్ కూడా కాకుండానే వాళ్లని రొబోటిక్స్ క్లాస్ లో పెట్టాలని ఉబలాటపడుతుంటాం, వాళ్ళు ప్రపంచంలోని విఙానాన్ని అంతా  అవపోసన పట్టేయ్యాలని కలలు కంటాం కానీ, వాళ్ళ శరీరం మీద, పుట్టుక మీద వొచ్చే ప్రశ్నలు ప్రాధమికమైనా ఎందుకో తడబడతాం. బహుశా, వయసొచ్చినా కూడా  మేం పేరెంట్స్ తో మాట్లాడనివి, ఇప్పుడే ఈ పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీకేమో అనిపిస్తోంది” అంది.

అనిత మాటలని ఓపికగా విన్న మిషెల్,

కాలంతో పాటు పోక తప్పదంటూ, సింధు చిన్న పిల్ల కాబట్టి,  తను విన్నది మార్చకుండా చెప్పిందని తన అంచనా అని,  సాధ్యమయినంత వరకు తన సందేహాలు తీర్చి, నమ్మకాన్ని పెంచుకోవడమే ఉత్తమమనీ, సింధు వైపు నుంచి చూస్తే ఇదో భధ్రమైన మార్గమని సలహా ఇచ్చింది.

“ఈ అమెరికాలో,  ప్రతిదీ భూతద్దంలో చూడటం ఆలవాటు, అన్ని వివరాలు పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది?  చేసే అల్లరి పనులన్నీ హార్మోన్ల పేరు మీద నెట్టేసే టీనేజ్ పిల్లల ధోరణి వింటున్నప్పుడు, ఎక్కువగా తెలిసిపోయి ఈ పైత్యం అంతా ప్రదర్సిస్తున్నారు అనిపిస్తుంది. మీరు మరోలా అనుకోవద్దు, మరో రెండు సంవత్సరాలలో  సింధుని మీ క్లాసుకి పంపాలంటే,  ఈ సందేహానికి సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉందన్న” అనితతో,

స్కూల్ లో “ఫ్యామిలీ లైఫ్” తప్పని సరిగా తీసుకోవాల్సిన సబ్జక్టు కాదని, పైగా సిలబస్ ప్రకారం నాలుగైదు ఏళ్ళు చెపుతామని,  ఇండియన్సే కాదు, ఈ క్లాస్  వొద్దనుకునే తల్లిదంఢ్రులు,  చాలా మందే ఉంటారని చెప్తూ,  శరీరాల్లో మార్పులు వొచ్చేటప్పుడు పిల్లల్లో ఆందోళన అధికంగా ఉంటుందని,  అందుకే దాదాపు ఐదో తరగతికే ఈ పాఠాలు మొదలుపెడతారంది.  ఒక టీచరుగా, పిల్లలు ఏదైనా ప్రశ్న వేసినపుడు లేదా వేయగలిగినపుడు, దానికి సమాధానాన్ని తెలుసుకోవడానికి వారు సిద్దంగా ఉన్నట్టు భావిస్తానంది మిషెల్.

ముఖ్యంగా కాలిఫోర్నియాలో, టీనేజ్ పిల్లల అనుమతి లేకుండా తల్లిదండ్రులు మెడికల్ రికార్డులు కూడా చూడలేనటువంటి చట్టాలు వున్న ఈ రోజుల్లో,  శరీరం మీద అవగాహన ఉండటం వాళ్లకి  ఎంతో అవసరమని వివరిస్తూ, తోటి పిల్లల వొత్తిడి ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో, సరైన నిర్ణయాలు తీసుకునే అవగాహన పిల్లలకి ఉంది అనే భరోసా తల్లిదండ్రులకి చాలా మనశ్శాంతి నిస్తుందనే  కోణంతో పాటు, టీనేజ్ లో  ప్రగ్నన్సీకి  అవగాహన లేకపోవడమే సగం కారణమనేది తన అభిప్రాయంగా చెప్పింది.

ఆమె అభిప్రాయాల్ని శ్రద్దగా విని,
అఖరి మాటగా,
మళ్ళీ ఇలాంటి  ప్రశ్నలడిగితే, ఐదో తరగతిలో మీ టీచర్లే నీ ప్రశ్నలకి సమాధానాలిస్తారని సింధుతో చెపుతానంది   అనిత.

దానికి సమాధానంగా,

పిల్లల సంఘర్షణలకి తొలి వేదిక చాలా వరకు ఇల్లే అవుతుందంటూ,  గమనించి, అర్ధం చేసుకుంటే చాలా సమస్యలు అక్కడే తీరిపోతాయని, తోటి మనిషికి, వారి భావాలకి ఇవ్వాల్సిన విలువ, అలాగే ఇతరుల నుంచి తాము ఎటువంటి ప్రమాణాలు ఆశించాలి అనేది  పిల్లలు చాలా భాగం ఇంటి నుంచే నేర్చుకుంటారంది మిషెల్.

సమయం మించిపోవడంతో, కృతజ్నతలు చెప్పి, శలవు తీసుకుంది అనిత .

‌రెండు వారాల తరువాత,

ఓ రోజు, స్కూలు నుంచి వొస్తూనే, డైనింగ్ టేబుల్ మీద ఉన్న అమెజాన్ మెయిల్ కవర్ చూసి, ఏం ఆర్డర్ చేసావని అడిగింది సింధు.

మనిద్దరి కోసం పుస్తకాలు, నువ్వొచ్చిన తరువాత ఓపెన్ చేద్దామని ఆగానంది అనిత.

“మనిద్దరికీ పుస్తకాలా?! “

తల్లి వంక విచిత్రంగా చూసింది సింధు.

కూతురిని దగ్గరికి తీసుకుని,

“ఇంత కాలం నీతో అనలేదు కానీ,

నీ వయసులో ఉన్నప్పుడు నాక్కూడా బోలెడన్ని సందేహాలు వొచ్చేవి. కానీ వాటిలో సగం ప్రశ్నలు ఎవర్ని అడగాలో, అసలు అడగచ్చో లేదో కూడా తెలిసేది కాదు.  అమ్మానాన్నల్ని అడిగి, వాళ్ళు చెప్పిన వాటిని మాతో పంచుకున్న స్నేహితులూ తారసపడలేదు.  దాంతో తోటి పిల్లల మధ్య అదో పెద్ద సమస్య కాలేదు,

ఒకటి మాత్రం ఒప్పుకుంటాను, తెలియని విషయాలు చాలా ఉండేవి! మీ నాన్న కూడా ఇదే మాట అన్నాడు!

ఈ మధ్య,  ఇద్దరం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు మాకు అర్ధం అయిందేమిటంటే,  నీకు ఎదురయ్యే ప్రశ్నలకి, నువ్వు పెరుగుతున్న పరిసరాలకి,

మా చిన్నతనానికి,

మధ్య చాలా అంతరం ఉందని, దానిపై మాకు ఇంకా పూర్తి అవగాహన లేదని.

మీరందరూ ఎవరికి ఏం తెలుసు అని చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు చూశావా అది మాకు చాలా కొత్త, అందుకే మా సమాధానాలు నీకు సరిపోవడం లేదు!

ఇక మేం చెయ్యాల్సిందల్లా,  నీ వేగాన్నిఅందుకోవడమే!

బాగా అలోచించి, అమ్మాయిల కోసం రాసిన అమెరికన్  గర్ల్ సిరీస్ బుక్స్ కొన్ని, అలాగే  నీ లాంటి పిల్లలు ఇక ముందు అడిగే ప్రశ్నల కోసం ప్రత్యేకంగా రాసిన పుస్తకాలు కొన్నాను. కొన్ని ఇద్దరం కలిసి చదువుదాం, మిగతావి నేను చదువుతాను, ముందు ముందు నీకేమయినా సందేహాలొస్తే వివరంగా మాట్లాడుకుందామని, అవసరమైతే నాన్న కూడా సాయం చేస్తాన్నాడ”ని చెప్పింది.

నమ్మలేనట్టుగా చూసి,

ఇంతలోనే తేరుకుని,

అమ్మకి ఆనందంగా హగ్ ఇచ్చిన సింధు,

కొన్నిటి గురించి, బయటి వాళ్లని అడగటం చాలా కష్టం అంటూ మనసులో మాట చెప్పింది.

సింధు చేయి తన చేతిలోకి తీసుకుంటూ అనిత ఇచ్చిన భరోసా,

“ I know ! “

ఎస్. హిమబిందు

 

 

సుందర సుకుమారి 

samanyaఆకాశాన ధగధగమని మెరుస్తున్నాడు వెండివెన్నెల చందమామ . మెస్ నుండి రూమ్ కి తిరిగి వస్తూ గేటు దగ్గర వున్న గంగరావి  చెట్టు క్రింద నిలబడి ,ఆకుల సందులలోనుండి భూమి మీద పడుతున్న పండు వెన్నెల రేఖల కింద చెయ్యి పెడుతూ ”ఇక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది అదితి ,చూడు ఆ బ్యూటీ , ఆ చంద్రుడిని ఏం చేసుకోవాలి చెప్పు ,ఎంత అశక్తులం మనం ..  , కదా ! ” అంది బోలెడంత దిగులు గొంతులోకి తెచ్చుకుని శ్రీప్రియ . అదితి ఢిల్లీ అమ్మాయి . అక్కడే ఇద్దరు ఇంజినీర్లకు పుట్టి పెరిగింది . అందుకనేమో శ్రీప్రియ చూపించిన చంద్రుడి వంక దీర్ఘంగా చూసి ,తల క్రిందికి దించి , దిగులుపడుతున్న  శ్రీప్రియ వైపు చూసి ,”నాకు పీజ్జా ఆకలి వేస్తుంది శ్రీ ,చంద్రుడు అచ్చం చీజ్ పిజ్జా లాగున్నాడు నాకెందుకు  నీలా అనిపించడంలేదు ” అంది తానూ దిగులుగా . అదితి మాటలకు పెద్ద నిట్టూర్పు విడిచి ”పద వెళదాం ” అంది శ్రీప్రియ .

శ్రీప్రియ ది  విజయవాడ  . అమ్మా నాన్న ఇద్దరూ అక్కడ పేరు మోసిన డాక్టర్లు . మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓనర్లు . వారికి శ్రీప్రియ ఒక్కటే సంతానం .  శ్రీప్రియ తెల్లగా ఉంటుంది , రింగులు తిరిగిన ఒత్తయిన తలకట్టు ,మధ్యలో గీత ఉండి అటుఇటు ఉబ్బి వుండే ఎర్రటి కింది పెదవితో అందంగా ఉంటుంది . కవి కాకున్నా ఆవేశపడి అవీ ఇవీ రాస్తుంది . చక్కగా కాకున్నా  ముద్దు ముద్దుగా పాడుతుంది . చాలా సున్నిత మనస్కురాలు . చదువుతున్నది భౌతిక శాస్త్రమే అయినా ఒందశాతం భావవాది . ఎంత భావవాది అంటే , రాకెట్టును అంతరిక్షంలోకి పంపే ముందు, మంచి ముహూర్తం పెట్టుకుని ,అయ్యవారిని పిలిపించి పూజలు చేయించుకుని శాస్త్రోక్తంగా ఆకాశంలోకి ఎగరేసే భారతీయ  శాస్త్రజ్ఞులంత భావవాది .

ఇద్దరూ రూంలోకి వెళ్ళగానే అదితి మొబైల్ మ్రోగింది .  మొబైల్ అలా ఆ టైం లో మ్రోగిందంటే మరిక అదితి ఈ లోకంలో ఉండదనే అర్ధం . ఆ అమ్మాయి అలా  మొబైల్ చేతి లోకి తీసుకోగానే  శ్రీప్రియ నిట్టూర్చి , పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది . కూర్చున్నదన్న మాటే కానీ చెవులంతా అదితి సంభాషణ పైనే వున్నాయి . ఏవేవో సరస సంభాషణలు జరుగుతున్నట్టున్నాయ్ , అప్పుడప్పుడు అదితి బుంగ మూతితో గారాలు పోతుంది . అదితికి బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు . ఏదీ సీరియస్ గా తీసుకోదు ఆ పిల్ల . ”ప్రేమ అనే భావనకి విలువనివ్వవా నువ్వు ”అంది ఒకరోజు అదితి తో . ఆ ప్రశ్న విని ,అదితి చాలా ఆశ్చర్యపడి ‘అదేమిటి ! ఎందుకివ్వను ,  ఇస్తేనే కదా అంత టైం స్పెండ్ చేసి మాట్లాడుతున్నాను ” అంది . కొన్ని రోజులకు ఆ ప్రేమికుడు మారి కొత్తవాడు వస్తాడు  . ఏమిటిలా అంటే ”నేనేం చేసేది వాడికి నా మీద ప్రేమ పోయింది ,ప్రేమలేని వాళ్ళ దగ్గర ఎందుకుండాలి చెప్పు ” అంటుంది  . శ్రీప్రియ కి ఆ లాజిక్ ఒందశాతం  నిజమనిపిస్తుంది  ,కానీ మనసు ఎందుకనో ఇదంతా అంగీరించదు . అందుకే ఈ కొత్త ప్రేమికుడుతో మాట్లాడుతున్న అదితిని చూసి నిట్టూర్చింది .

ఇవాళ రేపట్లో అమ్మాయిలందరికీ , అబ్బాయిలు స్నేహితులుగా వుంటున్నారు , ఆ స్నేహాలనుండి ప్రేమలూ పుట్టుకొచ్చి పెళ్ళిళ్ళూ అవుతున్నాయి . కానీ శ్రీప్రియకి భయం ,అబ్బాయిలతో మాట్లాడొద్దని నాన్న అమ్మ ఎప్పుడూ చెప్పలేదు కానీ ,కులాంతర వివాహం అనే మాటను కూడా వాళ్ళు ఇంటిలోపలికి రానివ్వరు . తమకి పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ ఆడపిల్ల పిల్ల కావడంచేత మరింత కట్టుదిట్టంగా మాటల నుండి చేతల వరకూ అంతటా జాగ్రత్తపడుతూ వుంటారు . శ్రీప్రియ కి అదంతా తెలుసు . అందుకే తానూ జాగ్రత్తగా ఉంటుంది .

%e0%b0%b8%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf

యూనివర్సిటీ లో శ్రీప్రియ కులపు వాళ్ళు , కార్తీక పౌర్ణమికి సెలవు రోజు కలిసి వచ్చింది కనుక వన భోజనాలు  పెట్టుకున్నాం , దగ్గరున్న అడవికి వెళదాం అనుకున్నారు . పున్నమి అడవి  అనేసరికి శ్రీప్రియ హృదయంలో  ఆకాశంలో యెగిరి పూసే కాకర పువ్వొత్తుల్లాంటి టపాకాయల్లా  కోటి చంద్రుళ్లు రంగులు రంగులుగా పూశారు . ఇంతలో కార్తీక పౌర్ణమి దగ్గరికి వచ్చేసరికి ,ఒక ప్రజాస్వామిక స్తూడెంట్స్ యూనియన్ ఈ కులబోజనాల గురించి కరపత్రం వేసింది , అప్పుడిక డిపార్ట్మెంట్ అంతా వనభోజనంకి వెళదాం అనే ముగింపుకి వచ్చి అందరూ వనభోజనాలకు బయల్దేరారు. అలా వచ్చాడు వెంకట్ వనభోజనాలకు .

వెంకట్ వాళ్ళ నాన ఊరి పెద్దమాదిగ. వాళ్ళ మాదిగగూడెంలో  పదోతరగతి వరకు చదువుకున్న  శీనివాసు ఎంత చెపితే అంత . వెంకట్ వాళ్ళ అమ్మ , నాన్న ఇద్దరూ ఎర్రగా వుంటారు , ఎత్తుగా వుంటారు . ”యెర్ర మాదిగల్ని నల్ల బాపనోళ్ళని  నమ్మకూడదని ” సామెత . ఎప్పుడో ఎవరో ఆ సామెత అని  వెంకట్ ని తిడితే ,వెంకట్ ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ  నాన్నకి చెప్పాడు . శీనివాసు అది విని నవ్వి , మనం మిగిలిన అందరికన్నా తెలివయిన వాళ్లమని దానికర్ధం రా చిన్న , చూడు మీ క్లాసులో నువ్వే కదా ఎప్పుడూ ఫస్టు  వచ్చేది” అని చెప్పేడు . అది నిజమే వెంకట్ ఎప్పుడూ ఫస్టే , ఇప్పుడు కూడా csir ఫెలోషిప్ తో P hd లో చేరాడు . అతను ఎర్రగానే కాదు , చూడటానికి కూడా బాగుంటాడు . దరువేస్తూ పాట  పాడితే  ఆకాశంలో చందమామ దిగి వెంకట్ ముందు కూర్చుంటాడు . అందుకని స్తూడెంట్స్ అందరూ కేంప్ ఫైర్  ముందు వలయంగా కూర్చున్నాక  వెంకట్ ని పాడమని అడిగారు .

వెంకట్ వలయంకి కొంచెం దూరంలో వున్న చిన్న బండరాయి మీద ఎక్కి కూర్చున్నాడు . అతనికి జానపదాలంటే చాలా ఇష్టం అందుకే మొదలు పెట్టడమే ” బొట్ల బొట్ల చీర కట్టి ,బొమ్మంచు రైక తొడిగి , నీకోసం నేనొస్తినిరో  నా ముద్దూల మామయ్యా ,నువ్వు రానే రాక పోతివిరో నా ముద్దుల మావయ్య ” అని మొదలు పెట్టాడు . ”మేడారం జాతరలో మల్లన్న గుడికాడా మన మాట మాట కలిసెనురో నా ముద్దూల మావయ్య / నువ్వు రానే రాక పోతివిరో నా ముద్దుల మావయ్య ” అంటూ వస్తానన్న ప్రియుడు రాకపోవడంతో అతని  పరిచయపు జ్ఞాపకాలను తలపోసుకుంటున్న ప్రియురాలి గుండెలోని వేదనొకటే  కాదు అతని కంఠంలో ,స్త్రీ కంఠంలోని మృదు సొబగు కూడా జాలువారుతూ వుంది . ఒకటి తర్వాత ఒకటి పాడుతూ ఉంటే ఎవరో అన్నారు ”రేయ్ వెంకట్ ఈ రోజు కార్తీక పౌర్ణమి రా ,చంద్రుని మీద పాడు” అని . వెంకట్ నవ్వుతూ అలా అన్న అబ్బాయి వంక చూసి ,ఏం పాడమంటావో నువ్వే చెప్పు అన్నాడు . ఆ చెప్పమన్న పిల్లవాడు చెప్పకముందే అతని పక్కన కూర్చుని వున్న శ్రీప్రియ మృదువుగా , మొహమాటంగా ”చౌదవీ క చాంద్ హో… ” పాడుతారా  అంది . వెంకట్ ఆ అమ్మాయి వంక చూసాడు . వరాలిచ్చే దేవుడు తనని చూసినంత తన్మయం కలిగింది అప్పటికే అతని మధురమైన కంఠంతో మోహంలో పడ్డ శ్రీప్రియకి ,వెంకట్ అంతసేపు ఆ అమ్మాయిని గమనించలేదు , ఎర్రని మంటవెలుగులో గులాబీ రంగులో ప్రకాశిస్తున్న ఆమె ముఖమూ , లీవ్ చేసుకుని ఉన్నందున మెడచుట్టు అలుముకుని వున్న నొక్కుల జుత్తుతో ఆమె రూపసౌందర్యం విస్తుగొలుపుతూ వుంది , ఆమె ముఖం వంక చూసి ,లిరిక్స్ పూర్తిగా గుర్తు లేవు కొంచెం చెప్పగలరా ”  అన్నాడు ,శ్రీప్రియ లిరిక్స్ చెప్పింది  ,మధ్యలో గీత వుండి నిండుగ ,కొద్దిగా తెరుచుకున్నట్టు వుండే ఆమె యెర్రని పెదాల వంక చూస్తూ లిరిక్స్ విన్న  వెంకట్  కొన్ని వాక్యాలు పాడేటపుడు   శ్రీప్రియ పై చూపు నిలిపి  పాడాడు ” చెహరా హై జెయిసే జీలుమే హాస్తా హువే కమల్ /ఏ జిందగీ కె సాజ్ పే చేరి హుయి గజల్ / జానే  బహార్ తుమ్ కిసి షాయిరా  కి క్వాబ్ హో” అనేవి అందులో కొన్ని లైన్లు . ఆ లైన్లే కాదు ,కవి ఆ పాట ఆమెనే ఉద్దేశించినట్టు రాసిన విషయం ఆమెకు కూడా తెలుసేమో అని వెంకట్ కి అనిపించింది .

Kadha-Saranga-2-300x268

యూనివర్సిటీ కి రాగానే వెంకట్  చేసిన మొదటి పని శ్రీప్రియ కులమేంటో తెలుసుకోవడమే . ఆ అమ్మాయి కులమేంటో  తెలిసాక , తెలివయిన వాడు కావడం చేత వెంకట్ ఆమె  సౌందర్యాన్ని కలలకి పరిమితం చేసేసాడు , కొన్ని రోజులకు కలల్లోకూడా  ఆమెని మరిచిపోయాడు . అలాటి రోజుల్లో ఒక రోజు శ్రీప్రియ హెచ్ ఓ డి రూమ్ నుండి వస్తూ వెంకట్ కి ఎదురుపడింది . అతన్ని చూసీ చూడగానే విశాలంగా నవ్వుతూ ముఖమంతా సంతోషాన్ని నింపుకుని ”బాగున్నారా , మిమ్మల్ని  చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాను ,  మీ గురించి ఎవరిని అడగాలో తెలియక ఊరుకున్నాను ,మీరు మొహమ్మద్ రఫీలా … ఊహు కాదు కాదు అంతకన్నా గొప్పగా చాలా చాలా గొప్పగా పాడుతారు , మీ గొంతు చాలా బాగుంది , సినిమాలల్లో ట్రై చేస్తే మీరు నంబర్ వన్ పొజిషన్ లో వుంటారు ” అని గుక్క తిప్పుకోకుండా వుద్రేకపడుతూ  గబగబా చెప్పేసింది . శ్రీప్రియ చెప్పిన మధురమయిన మాటలకి  గుండె ఉప్పొంగుతుండగా నోట మాట రాని  వెంకట్ గొంతు పెకలించుకుని ”తాంక్  యు ” అని మాత్రమే అనగలిగాడు  . కానీ శ్రీప్రియ అంతటితో ఊరుకోకుండా ”మీకు టైం ఉంటే కేంటీన్ కి వెళదాం వస్తారా ” అని అడిగింది .

కేంటీన్ ముందు బెంచీల మీద సెటిలయ్యారు ఇద్దరూ . క్లాసులయిపోయాయి గనుక డే స్కాలర్లు  ఇళ్లకు వెల్తూ వున్నారు , హాస్టలేట్స్ కబుర్లు చెప్పుకుంటూ సైకిళ్ళు నెట్టుకుంటూ నడుస్తున్నారు . క్యాంటీన్ కి  ఆ మూల వున్న చెట్టు మీద ఉడుత ఒకటి పైకీ కిందకీ అలజడిగా తిరుగుతూ కీ..  కీ  అంటూ చప్పుడు చేస్తుంది . సంజె వాలుతూ వుంది . వెంకట్ ఏమయినా మాట్లాడుతాడని శ్రీప్రియ , కేంటీన్ కి పిలిచింది కదా ఏదో ఒకటి మాట్లాడొచ్చుకదా అని వెంకట్ మనసులో అనుకుంటూ అప్పుడప్పుడూ కనుకొలకులనుండి ఒకరినొకరు చూసుకుంటూ కాఫీ పూర్తి చేసి బై  బై చెప్పుకున్నారు . నాలుగడుగులు వేసాక శ్రీప్రియే వెంకట్ సర్ అని కేక వేసి ” మీ ఫోన్ నంబర్ ఇస్తారా అభ్యంతరం లేకుంటే ” అని ఫోన్ నెంబర్  తీసుకుని వెళ్ళిపోయింది .

ఎదురుబొదురు మొహమాటాలని మొబైల్ తీర్చింది . కొద్ధి  రోజులకు వారిద్దరి  మధ్య కలిసి మాట్లాడుకోవాలనే  కోరిక మొదలయ్యేంత చనువు వచ్చి చేరింది . ఇప్పుడు అదితికి ,శ్రీప్రియకు ఇద్దరికీ సమయంలేదు తీరికగా రూంలో కబుర్లు చెప్పుకోవడానికి . అయినా ఒకరోజు తీరిక చేసుకుని అదితి అన్నది ”ఏంటీ ప్రేమా ?” అని . శ్రీప్రియ మనసులో ఉలిక్కిపడింది . చటుక్కుమని అమ్మానాన్న మెరుపుల్లా మనసులోకి దూసుకొచ్చారు . ” చ ఛ !లేదు ,అతను గ్రేట్ సింగర్ అయామ్ గోఇంగ్ క్రేజీ అబౌట్ హిస్ వాయిస్  . అంతే ” అనేసింది . అదితి తోనే కాదు వెంకట్ తో కూడా అదే మాట చెప్పింది ఒక రోజు .

ఒక మధ్యాన్నం పూత  డిపార్ట్మెంట్ నుంచి కేంటీన్ వైపు వస్తున్నారు వెంకట్ , శ్రీప్రియ . మధ్యలో జోరు వర్షం పట్టుకుంది . పక్కనే వున్న లైబ్రరీలో కి వెళ్లారు . వాన తగ్గేదాకా కూర్చోక తప్పదు కనుక వెంకట్ వెళ్లి ,కవిత్వం పుస్తకాలేవో పట్టుకొచ్చి శ్రీప్రియ కి ఇచ్చి  తానూ చదువుతూ కూర్చున్నాడు . చదువుతున్నవాడు హఠాత్తుగా శ్రీప్రియ వంక చూసి రూమి పోయెమ్ ఒకటి వింటావా  అని ,ఆమె జవాబు కోసం ఆగకుండా ONCE a beloved asked her lover / “Friend, you have seen many places in the world ! / Now – which of all these cities was the best?/He said: “The city where my sweetheart lives!”అంటూ చదివి వినిపించి , శ్రీప్రియ కళ్ళల్లోకి ఒకసారి చూసి తలవంచుకుని పుస్తకంలోకి చూస్తూ ”నాకయితే ఈ క్షణం నా ఎదురుగా నువ్వున్న ఈ లైబ్రరీనే ప్రపంచంలోకెల్లా అందమయినది . ” అన్నాడు . శ్రీప్రియ కి కొంత  ఆలస్యంగానైనా అతను చెప్పింది అర్థమయింది . కానీ తిరిగి ఏంమాట్లాడలేదు . వెంకట్ రెట్టించలేదు . ఇద్దరూ వాన తగ్గాక కేంటీన్ కి  వెళ్లారు . అక్కడా ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు . ఆమె మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ వెంకట్ కూడా ఏం మాట్లాడలేదు . ఇద్దరూ ఎవరి హాస్టల్స్ వైపు వాళ్ళు వెళ్లిపోయారు .

రూముకొచ్చిన శ్రీప్రియ అలాగే బెడ్డు పైన పడిపోయింది . ఆ రాత్రి తిండి కూడా తినలేదు . కారణం అడిగిన అదితికి జవాబు చెప్పలేదు . కానీ వెంకట్ ఫోన్ కోసం ఎదురు చూసింది . తప్పకుండా చేస్తాడనుకుంది . చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకూడదనుకుంది . కానీ వెంకట్ ఫోన్ చెయ్యలేదు . వెంకట్ అలా ప్రపోజ్ చేసేడే కానీ మనసులో అలజడిగా వుంది . దుఃఖంగా వుంది ,తనెందుకు ఏ గొప్పకులంలోనో పుట్టలేదు అని ఒక వైపు ,ఎన్నెన్ని మాటలు చెపుతుంది ,సెన్సిబుల్ గా ఉంటుంది కానీ ఎంత సులభంగా తనతో మాట్లాడటం మానేసింది తాను మాత్రం ఎందుకు మాట్లాడాలి అనే ఆత్మాభిమానం ఒకవైపు కృంగదీస్తుండగా రూంలోనుంచి బయటికి రావడం మానేసాడు .

బహుశా ఒక నాలుగు రోజులకేమో శ్రీప్రియ వెంకట్ కి ఫోన్ చేసింది . ఫలానా గుడికి వెళదాం వస్తావా అన్నది . ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు . ఒకచోట కూర్చున్నారు . అతని మౌనం ఆమెకి విసుగ్గా వుంది . భరించరానిదిగా వుంది . అతనితో మాట్లాడకుండా వుండలేనట్టు వుంది . అందుకే తానే చివరికి ” సారీ , నేను ,నీకు పాసిటివ్ గా రెస్పాండ్  అవలేను,ఎందుకూ అని అడగకు , చెప్పలేను ! కానీ నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి , ఐ లైక్  యువర్ ఫ్రెండ్షిప్ ” అన్నది . అని భోరుమని ఏడ్చింది . వెంకట్ ఏడుస్తున్న ఆ అమ్మాయి వంక చూసాడు . శ్రీప్రియ కి నవ్వితే కూడా చెంపలు తడిసేంత కళ్ళనీళ్లొస్తాయి , కనుగుడ్డు పైనే తడిగా మెరుస్తూ ఉంటాయి కళ్లనీళ్లు .  అతనికా విషయం హటాత్ గా అప్పుడెందుకు గుర్తొచ్చిందో కానీ ఆ అమ్మాయి వైపు నుండి చూపు తిప్పుకుని ,”నువ్వు చెప్పకున్నా కారణం నాకు తెలుసు శ్రీ ,ఏడవకు ,అలాగే , నువ్వెలా అంటే అలానే ,ఫ్రెండ్స్ గా ఉందాం ,నిన్ను బాధ పెట్టినందుకు సారీ ” అన్నాడు  .

మరికొన్ని రోజుల్లో శ్రీప్రియ ఫస్టియర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్ కి వచ్చేసింది . వెంకట్  P hd సెకండ్ ఇయర్కి  వచ్చాడు .ఆ రోజు తర్వాత అతనెప్పుడూ ఆమెతో వేరే రకం సంభాషణలు చెయ్యలేదు . స్నేహము తప్ప మరేమీ లేని వాళ్లిద్దరూ ఒకరోజు కలిసి సిటీలో సినిమాకి వెళ్లారు . సినిమా చూసి షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేస్తూ ఉంటే చాలా టైం అయింది . బయటికి వచ్చి బస్టాపుకి వచ్చేలోపు యూనివర్సిటీ వైపు వెళ్లే చివరి బస్సు కూడా వెళిపోయింది . అంతలోనే జోరు వాన మొదలయింది . ఒకటి ఆరా  ఆటోలున్నాయి కానీ వాళ్ళు అంతదూరం మేము రాము అనేసారు  . ఏంచేయాలో తోచలేదు వెంకట్ కు . చివరికి ”ఫ్రెండ్ రూమ్ వుంది దగ్గర్లో వాడినడిగి బైక్ తీసుకుని వాన తగ్గాక వెల్దామా ”అన్నాడు . శ్రీప్రియ వెంటనే సరే అని తలూపింది . ఆటో తీసుకుని వెళ్లారు కానీ అక్కడ ఆ ఫ్రెండ్  లేడు .ఫోన్ చేస్తే ఊరెళ్ళాననీ  , రూమ్ తాళాలు సన్షేడ్ మీద వున్నాయి బైక్ తాళాలు రూంలో వున్నాయి తీసుకోమని చెప్పాడు . తాళం తీసుకుని రూంలోకి వెళ్లి కూర్చున్నారు . వాన ఎంతకూ తగ్గక పోయేసరికి శ్రీప్రియ అన్నది ”వెంకట్ ! పన్నెండు దాటింది , ఇప్పుడు వెళ్లడం ప్రమాదం కదా ,రేపు పొద్దున్న వెళదామా ” అని. ఆమాట అనడానికి భయపడుతున్న వెంకట్ చప్పున తల ఊపి , నేల మీద దుప్పటి పరుచుకుని ” హాయిగా నిద్రపో శ్రీ రేప్పొద్దున లేపుతా ” అని పడుకున్నాడు .

మంచం మీద పడుకున్న శ్రీ ప్రియకి నిదర రావడం  లేదు .గుండె దడ దడ కొట్టుకుంటుంది . ఊపిరి బరువయింది . ఏకాంతం  ఏవేవో ఆలోచనలు పుట్టిస్తుంటే,  వాన శబ్దం వింటూ, ఆగి ఆగి చివరికి ఇటు పక్కకి వత్తిగిలి ”నిద్దరొచ్చేసిందా ,ఏదయినా పాడవచ్చు కదా నాకు జోలపాట ” అని చిన్నగా ,గారంగా పదం పదం నొక్కుతూ అని , మృదువుగా నవ్వింది . వెంకట నవ్వి చీకట్లో నెమ్మదిగా పాడటం మొదలు పెట్టాడు . పాట  మీద పాట వెళ్తూ   వుంది . కానీ,  శ్రీప్రియ మనసు పాటలపైన లేదు .  రూంలోకి వచ్చిన మొదట్లో కాసేపు ,అతనేమయినా చేస్తాడేమో అని బితుకుగా అనిపించింది ,ఇప్పుడు అతనేమయినా చేస్తే బాగుండు అని అలజడి మొదలయింది . కాసేపటికి చాలా కేజువల్గా అన్నట్లు అతని వైపు తిరిగి అతని చేయి అందుకుని  పెదవులకు ఆనించుకుని ముద్దుపెట్టి ” థాంక్ యు ,నిద్రొస్తుంది , ఇక పడుకో అంది ” వెంకట్ పడుకోలేదు , ఆమె  చేయిని విడిచిపెట్టనూ లేదు . ఇంతకాలంలో శ్రీప్రియ ఎప్పుడూ అలా ముద్దు పెట్టలేదు , ఈ ఏకాంతంలో ఆమె చేసిన ఆ చుంబనకు , ఆమె నోటితో చెప్పని  మాటలకు  అర్థమేమిటో అతని మనసు గ్రహించింది .

మరుసటి రోజు పొద్దునే వాళ్లిద్దరూ యూనివర్సిటీకి వచ్చేసారు . ఆ తరువాత వారం రోజులు శ్రీప్రియ వెంకట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు . అతనికి ఎదురు పడాల్సి వచ్చిన ప్రతి సందర్భాన్ని తప్పించింది . ఈ సారి వెంకట్ క్రితంలా నిలకడగా ఉండలేక పోయాడు . పిచ్చెక్కి పోయింది అతనికి   . ఆ రోజు రాత్రి మెత్తటి , తెల్లటి పావురాయిలా ఆమె తన భుజంపైన తల పెట్టుకుని తన ఛాతీ చుట్టూ చేయివేసిన నులివెచ్చటి మృదు క్షణాలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి . చివరికి ఒక రోజు  డిపార్ట్మెంట్ బయట ఆమెని చెయ్యి పట్టుకుని దొరకబుచ్చుకున్నాడు  . మాట్లాడాలన్నాడు . ఆమె నిర్లిప్తంగా సరే అని తలూపి ,అతని వెనక నడిచింది .

ఇద్దరూ ఏకాంతపు చోటు వెదికి  కూర్చున్నారు . ఇప్పుడతనికి ఆత్మవిశ్వాసం వుంది . ఆమె ప్రవర్తన కొంత అనుమానానికి తావిస్తున్న ,ఆమె తనది అనే ధీమా వుంది అతనికి . అందుకే కొంత విసురుగా , తలవంచుకుని కూర్చున్న ఆమె చుబుకాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకుని ,” ఏంటి , ఏమైంది ? ఫోన్ లిఫ్ట్ చేయలేదెందుకు? ” అన్నాడు . శ్రీప్రియ బదులీయలేదు ,కానీ ”నాకు చచ్చిపోవాలని వుంది వెంకట్ , నేను తప్పుచేసాను , నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు , నిన్ను ఇబ్బంది పెట్టాను , నేను చచ్చిపోతాను ” అని భోరుమని ఏడవటం మొదలు పెట్టింది . అప్పటిలా వెంకట్ ” సరే అట్లాగే పెళ్లి చేసుకోవద్దులే ” అని ఈ సారి భరోసా ఇవ్వలేదు . మౌనంగా కూర్చున్నాడు . స్వతహాగా అతను పెద్ద మితభాషి . ఏదయినా కష్టమొస్తే తనలోకి తాను మరింత ముడుచుకు పోతాడు . ఈ సారీ అలానే  ముడుచుకుపోయాడు . అతనికి ఆమె మాటలకు అర్థం తెలుసు . తాను ఇప్పుడిక ఆమెనుండి వెనక్కి రాలేను అనీ తెలుసు . అందుకే చాలాసేపటి ఎక్కడో చూస్తూ , ”నేను నిన్ను బాగా చూసుకుంటాను శ్రీ , నీకోసం కష్టపడతాను , సంపాదిస్తాను , నన్ను పెళ్లిచేసుకో శ్రీ , అయామ్ రిక్వెస్టింగ్  యు ” అన్నాడు . అన్నాడే  కానీ,  అతనికి తెలుసు ,శ్రీప్రియ వాళ్ళకున్నంత ఆస్తి సంపాదించాలంటే తాను తన జీవితకాలమంతా కష్టపడినా సరిపోదని ! అందుకే వినటానికి ఇంపితంకాని ఆ మాటలని అంతకంటే మరి పొడిగించలేక మౌనంగా కూర్చున్నాడు  . ఏడుస్తున్న ఆమెను ఓదార్చలేదు . కాసేపటికి ఇద్దరూ విప్పని పొడుపు కధని అక్కడే వదిలేసి మౌనంగా ఎవరి దారిన వాళ్లు హాస్టల్ కి వెళ్లారు .

ఆ రాత్రి శ్రీప్రియ అదితికి చెప్పింది జరిగిందంతా , అదితికి ఆశ్చర్యమేసింది , అసలు శ్రీప్రియ ఇబ్బందేమిటి ? వెంకట్  చురుకయినా వాడు , శ్రీప్రియ కూడా  ఏదో ఒక వుద్యోగం చేయకలదు , ప్రేమ వుంది , కులందేముంది అని . అదేమాట శ్రీప్రియతో అంది . శ్రీప్రియ , ”అతనికి వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రాణం ,అంత  పేద వాళ్ళతో ఎలా బ్రతకడం ” అంది .  అదితి ఆ మాటలు విని నిర్ఘాంతపోయి ”ఏయ్ శ్రీ ! యు ఆర్ కిడ్డింగ్  … రైట్ , ఈ మాటలు నీ లాటి భావవాదికి సరిపోవు ” అంది . శ్రీప్రియ కాసేపటికి ” యా … ఆమ్ కిడ్డింగ్ ! కానీ కారణం చెప్పలేను ఇది కుదరదంతే” అన్నది . ఆమె కంఠంలో దృఢత్వాన్ని చూసి అదితి మరేం మాట్లాడలేదు . కానీ మనసులో అనుకున్నది ,”శ్రీ చేసింది కరక్ట్ గా లేదు , షి ఈస్ ప్లేయింగ్ విత్ హిం , డెలిబరేట్లీ ” అనుకుని దుప్పటి కప్పుకుని పడుకున్నది .

వెంకట్ నుండి శ్రీప్రియకి  ఫోన్ రాలేదు , అతను కనిపించనూ లేదు . ఆమె ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టాడు . చూసి చూసి కొన్ని   రోజులకు శ్రీప్రియ అతనికి మెయిల్ పెట్టింది , మాట్లాడాలి ప్లీస్ అని . అతనొచ్చాడు . ఆమె మళ్ళీ అదే అన్నది ”ఫ్రెండ్స్ గా ఉందాం ” అని . వెంకట్ కి ఆ మాట వికారంగా అనిపించి ,నవ్వి ”అట్లాగే ”అని వెళ్ళిపోయాడు . కానీ శ్రీప్రియ అతన్ని వదిలి పెట్టలేదు . అతనితో స్నేహమే కాదు ,అతనితో సెక్స్ ను కూడా ! పొరపాటుగా అన్నట్లో గ్రహపాటుగా అన్నట్లో వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగేది . సెక్స్ తరువాత ఆమె అతని భుజంపైన తలపెట్టుకుని పడుకునే క్షణాలలో ఇద్దరం ఇలాగే చచ్చిపోతే బాగుండు  అనిపించేది అతనికి . తనని విడిచిపెట్టి ఆమె బ్రతకలేదు అని ఎక్కడో ఒక ఆశ మెదిలేది . అలాటి రోజుల్లో ఒక సారి వారం రోజులకని ఇంటికెళ్లిన ఆమె , పెళ్లి పత్రికలు  పట్టుకుని యూనివర్సిటీ కి వచ్చింది .

శ్రీప్రియ చేతిలో పెట్టిన కార్డు చూసి వెంకట్ నిర్ఘాంత  పోయాడు. పెళ్ళికొడుకు అమెరికాలో సాఫ్ట్వెర్ కంపెనీలు నడుపుతున్నాడు , పూర్వీకులు ఏదో రాజ సంస్థానానికి అతి దగ్గరి వారు . చాలా ధనికులు . కార్డు మీద వేసిన ఫొటోలో రాకుమారుడిలా వున్నాడు . వెంకట్ ఏమైనా మాట్లాడేలోపే శ్రీప్రియ అంది , పదిహేను రోజుల్లో పెళ్లి , పెళ్లి చేసుకుని వస్తాను , మేక్  మీ కన్సీవ్  , నీ బిడ్డను పెంచుకుంటాను . రాజులాగా పెంచుతాను , నీ గొంతు వాడికి వస్తే ఈ ప్రపంచానికే పెద్ద సింగర్ ని చేస్తాను ” అని వెంకట్ వళ్లో  తల పెట్టుకుని ఏడ్చింది . ఎందుకో అతనేం మాట్లాడలేదు . ఆమె పెళ్ళికి వెళ్ళాడు . ఆమె పుట్టిన రోజుకి వెంకట్  ఆమెకో స్పోర్ట్స్ వాచ్  ప్రెసెంట్ చేసాడు . పెళ్ళికి ఆమె అది పెట్టుకుంది . పెళ్లి అలంకరణకు అది నప్పలేదు అని ఎవరెంత చెప్పినా దాన్ని తియ్యలేదు .

untitled

వెంకట్ తిరిగి యూనివర్సిటీకి వచ్చాడు . ఫ్రెండ్స్ అందరూ అతన్ని జాలిగా చూడటం మొదలు పెట్టారు . అతను వాళ్ళని తప్పించుకొని తిరగటం మొదలు పెట్టాడు . స్పోర్ట్స్  వాచ్ కట్టుకుని పెళ్లిచేసుకున్న శ్రీప్రియ రూపం ,భుజంపై తల పెట్టుకుని చెవిదగ్గర కువకువలాడే ఆమె మృదు స్వరం , నీ బిడ్డను పెంచుకుంటాను అన్నపుడు ఆమె ఆవేశం అతని గుండెల్లో జోరీగల్లా వినిపించేవి .శ్రీప్రియ  పెళ్లయిన నాలుగో రోజు లైబ్రరీ నుండి వస్తుంటే క్లాస్మేట్ వికాస్ కేంటీన్ దగ్గర ఎదురుపడి ,”వెంకట్ గాడిని బాగా వాడింది ,ఇప్పుడెళ్ళి పెళ్లి చేసుకున్నది అంటున్నారు రా   అందరూ , ఇటువంటి ఆడవాళ్ళని ఏం చెయ్యాలి  భయ్యా, దానికి నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని ముందు తెలీదా  ” అన్నాడు  . వెంకట్ వికాస్ కి ఏమీ  బదులీయలేదు కానీ మరుసటి రోజుకి అతని శవం లైబ్రరీ వెనుక కనిపించింది .

మనుగడుపులై యూనిర్సిటీకి వచ్చిన శ్రీప్రియకు అతని చావు కబురు తెలిసింది . అదితి ఏం ప్రస్తావించక పోయినా శ్రీప్రియ తో ముభావంగా ఉండటం మొదలు పెట్టింది . అంతకు ముందుకూడా అందరితో కలివిడిగా వుండే అలవాటు లేని శ్రీప్రియ అలాగే  ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసి అమెరికాకు వెళ్లి పోయింది .

అమెరికాకు వెళ్లిన కొంత కాలానికి శ్రీప్రియకు మొగుడితో కొడుకు కూడా పుట్టాడు . కొడుకు పుట్టకముందు కూడా ఉన్నా,  కొడుకు పుట్టాక ఆమెకు సెక్సువల్ ఫ్రిజిడిటీ ఎక్కువయింది . సెక్స్ అంటే తనకు చాలా ఇష్టమయినా ఇలా అవడానికి  కారణమేమిటో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థంకాదు . మొగుడువిసుక్కుంటాడనే భయంతో అతను కావాలన్నపుడు బిగదీసుకుని అతని పక్కన పడుకుంటుంది , పడుకున్నాక కళ్ళు మూసుకుని వెంకట్ స్పర్శని గుర్తు తెచ్చుకుంటుంది . అలా గుర్తు తెచ్చుకున్న కాసేపటికి ఆమె శరీరం మేఘమంత తేలికై ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది  . అలా ఆ సమయంలో  వెంకట్ ను గుర్తు తెచ్చుకోవడం  ఇప్పుడామెకి అలవాటుగా మారింది  .

సామాన్య 

 

డీహ్యూమనైజెషన్

Art: Satya Sufi

Art: Satya Sufi

 

 

‘కాసేపట్లో సంచలన ప్రకటన చేయనున్న మోడీ. వాచ్ మన్ కీ బాత్’ వాట్సప్ సందేశం. అప్పటికే ఆలస్యమైంది. హడావిడిగా టీవీ పెట్టేసరికి బ్రే కింగులకే బ్రేకింగ్ లాంటి న్యూస్. వెయ్యి, ఐదొందల నోట్లు చెల్లవంటూ ప్రకటన. టీవీ సౌండ్ విని వంటింట్లోంచి ఆమె కూడా వచ్చింది. లైన్ల వెంట ఇద్దరి కళ్లూ పరిగెడుతున్నాయి.

‘బ్యాంకుల్లో మార్చుకోవచ్చన్నాడుగా ఫరవాలేదు. బోలెడంత టైం కూడా ఇచ్చాడు’

‘మొన్ననే సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ హడావిడి.. ఇంతలోనే ఇదేంటి? యూపీ ఎన్నికలకు ఇంకా టైముందనుకుంటగా..

అయినా, నా దగ్గర ముప్పయ్యో, నలభయ్యో వున్నాయ్ అంతే’

‘ఫరవాలేదు, నా దగ్గర ఓ ఎనభై వరకూ వుంటాయి. ఈ నెల చాలామందికిచ్చేశాం కాబట్టి ఫరవాలేదు. ఎవరికైనా ఇవ్వడానికి తెచ్చినవి మీ దగ్గర వుంటే..’

‘వున్నాయి, కరెంట్ బిల్లు, స్కూలు ఫీజు కట్టడానికి, ఖర్చులకని డ్రా చేసినవి’

‘ఎన్నుంటాయి’

‘ఇరవై అయిదో, ముప్పయ్యో’

‘అన్ని వేలే’

‘మరి, ఏటీఎమ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే చార్జీలంటున్నారని.. ఒకేసారి డ్రా చేసుకొచ్చా. అయినా, అకౌంట్ లో వేసుకోవచ్చుగా..’

‘రేపా పని చూడండి, లేదంటే అన్నీ వేస్ట్ అయిపోతాయి’

‘నాల్రోజులవుతోంది, అవి డిపాజిట్ చేశారా’

‘లేదు, ఎక్కడ చూసినా బోలెడంతమంది జనం. బ్యాంకుల దగ్గరే కాదు, ఏటీఎంల దగ్గర కూడా భారీగా వున్నాయ్ లైన్లు. వచ్చిన డబ్బు వచ్చినట్టే అయిపోతోంది. పదిమందైనా తీసుకుంటున్నారో.. లేదో.. అయినా, అంత టైమిచ్చినా అందరికీ ఈ హడావిడేంటో’

‘బావుంది అందరూ మీలా నిమ్మకు నీరెత్తినట్టుంటారా? ఎవరి జాగ్రత్త వారిది’

‘సరేలే, రేపో, ఎల్లుండో డిపాజిట్ చేసి, ఓ నాలుగు వేలు ఎక్సేంజ్ చేసుకొస్తా. మన డబ్బులు ఎక్కడికి పోతాయ్.

అది సరేకానీ, మన సంగతేంటి?’

‘ఏం సంగతి?’

‘అదే..’

‘ఊ.. దానికేం లోటుండ కూడదు. పిల్లలు పడుకోవాలిగా’

‘వాళ్లు పడుకుని చాలా సేపయ్యింది’

‘సరే.. పదండి..

‘అపోజిషన్ వాళ్లు ఎందుకు గొడవ చేయట్లేదు. ఏదో బందూ అదీ అంటున్నారుగానీ, అంత సీరియస్ గా ఏమీ వున్నట్టు లేరు. పెద్దలంద రికీ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసి వుంటుంది. లేకపోతే ఈపాటికి అంతా గగ్గోలు పెట్టేవారు కాదా?’

‘ఇప్పుడా గొడవంతా ఎందుకు? ముందు మూడ్ లోకి వస్తే..’

‘వస్తా.. మీకెప్పుడూ ఒకటే గొడవ. కొంచెం లావైనట్టు అనిపిస్తు న్నానా? ఈ నైటీయే అలా వుందంటారా?’

‘చక్కనమ్మ చిక్కనా అందమే అని ఎవడో తెలివితక్కువ వాడు అనుంటాడు. లావైనా అందమేనని వాడికి తెలిసుండదు. నువ్వా నీవియా వదిలేసి లారెయల్ లాంటివేవైనా వాడచ్చొగా.. బావుంటుంది’.

‘వాడాలి.. ఫేషియల్ కూడా చేయించుకోవాలి. ఎప్పటికప్పుడే వాయిదా పడుతోందనుకుంటుంటే.. ఇప్పుడీ నోట్ల గొడవొకటి. వాళ్ల దగ్గర కార్డుందో లేదో.. కనుక్కోవాలి.

అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేనాఫీసుకెళ్లాక అమ్మ ఫోన్ చేసింది. నాన్న ఇచ్చినవాటిలోంచి మిగిలించుకున్నవి ఇరవై రెండు వేలున్నాయట. అందులో పదిహేడు వేలు మార్చాలట. పన్నెండో ఏమో వేలూ, మిగిలినవి ఐదొందళ్లూ..’

‘మళ్లీ నీ నోట్ల గొడవ మొదలెట్టావా? ఇలాయితే, మూడే మొస్తుంది. నా మొహం..’

‘సారీ, సారీ.. ఇక ఆ ఊసెత్తను లెండి. కాపురం మొదలెట్టి ఇరవై ఏళ్లు అవుతోంది. ఇంకా, మూడులూ.. నాలుగులూ అంటే ఎలా?’

‘ఉయ్యాలైనా.. జంపాలైనా..’

‘మధ్యలో ఇదొకటి. ఇంత రాత్రి ఫోన్లేమిటి?’

‘సార్.. పడుకున్నారా? నేను..’

‘లేదు సార్.. చెప్పండి’

‘మన కాలనీ చివర్లో పెద్ద కిరాణా కొట్టుంది కదా. దాని వెనుకున్న ఏటీఎమ్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడే లోడ్ చేయడానికి క్యాష్ వాళ్లు వచ్చారు.’

‘ఇప్పుడా.. సరే, అలాగే’

‘అలాగే కాదు, అప్పుడే మన వాళ్లంతా వచ్చేసి లైన్ కట్టేస్తున్నారు. తొందరగా రండి లేదంటే డబ్బులైపోతాయ్’

‘సరే.. సరే..’

‘..గారని, ఆయన. ఏటీఎంలో డబ్బులు లోడ్ చేస్తున్నారట. రమ్మంటున్నాడు’

‘మరి తొందరగా వెళ్లండి. ఓ రెండు వేలు వస్తే.. ఖర్చులకు పనుకొస్తాయి. ఇప్పటికే ఆటో వాడి దగ్గర్నించి అందరికీ అరువు పెడుతున్నా’.

‘సరేలే.. ముందు..’

‘కానివ్వండి మహానుభావా.. మీకు ఏ పని ముందో ఏది వెనుకో కూడా తెలీదు. చిన్నపిల్లాడిలా..’

‘..తృప్తిగా లేదు’

‘ఎందుకుంటుంది.. ప్రతిసారీ ఒకేలా వుంటుందా యేం? పోయి రండి ఏటీఎంకి. రేపెప్పుడో తీరుబాటుగా ఎంజాయ్ చేయొచ్చు. నేనక్కడికీ పోనూ, మీరూ ఎక్కడికీ పోరు. వెళ్లేప్పుడు స్వెట్టర్ గానీ, షాల్ గానీ తీసుకువెళ్లండి. టేబుల్ మీద అరటి పళ్లుంటాయి. రెండు తీసుకు వెళ్లండి. ఆయనకోటిచ్చి, మీరొకటి తినొచ్చు’.

‘వచ్చారా.. ఇప్పుడా రావడం. ఎంతసేపైంది నేను ఫోన్ చేసి. చూడండి లైన్ ఎలా పెరిగిపోయిందో. ఇంకా క్యాష్ లోడ్ చేస్తున్నారు కదాని సిగరెట్ వెలిగించుకొచ్చేసరికి.. అప్పుడే పదిమంది చేరారు. ఏం చేస్తాం వాళ్ల వెనకే నిలబడ్డా.

‘ఇది చూశారా, మా బావమరిది. వాళ్లింటి దగ్గర బ్యాంక్ లో మొన్న ఐదొందల నోట్లు ఎక్సేంజ్ చేసుకుని రెండు వేల నోటు తీసు కున్నాడట. సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఇదిలా సెల్ఫీలు తీసుకో డానికి తప్ప ఎందుకూ పనికిరావడం లేదట. రెండు వేలుకు చిల్లరిచ్చే వాడేడి. ఈ కలరూ అదీ కూడా చూశారూ, పిల్లలు ఆడుకునే బ్యాంక్ గేమ్ లోని నోటులా వుంది’.

‘అదేంటి.. గొడవ. హలో.. మాష్టారూ.. ఏమైంది?’

‘ఏమో, ఏడెమినిదిమందికి క్యాష్ వచ్చినట్టుంది. తర్వాత నుంచి డబ్బులు రావడంలేదట. అసలు కారణమేంటో ఎవరికి తెలుసు. సాఫ్ట్ వేర్ ప్రాబ్లమో, ఏమో’

Kadha-Saranga-2-300x268

‘ఏమైంది, డబ్బులొచ్చాయా?’

‘అంటే.. నా ముందు వరకూ వచ్చాయి. ఇంతలో..’

‘మీ వల్ల ఏ పనీ కాదు, ఫోన్ వచ్చిన వెంటనే వెళ్లుంటే..’

‘ఆయనకీ దొరకలేదు’

‘దొందూ దొందేనన్నమాట. ఖర్మ.. పోయి పడుకోండి… తృప్తిగా’

కిడ్డీ బ్యాంకులు ఓపెన్ చేసిందామె.

‘మన పిల్లలు బాగానే దాచారు. ఈ కాయిన్స్ అన్నీ కలిపితే నాలుగువేలైనా వుంటాయి. ఇవన్నీ నేను లెక్కబెట్టా.. పద్దెమిదొందలు న్నాయి. మిగిలినవి మీరు లెక్కబెట్టి చూడండి. నోట్లు ఇచ్చేట్టయితే ఏ షాపువాడికో ఇచ్చి తీసుకురండి. లేదంటే, ఓ కవర్ లో ఈ చిల్లర పోసు కుని పోతా. ఆటోవాడికీ, కూరలవాడికీ కూడా చిల్లరే ఇస్తా’.

‘అంత చిల్లరేం మోసుకుపోతావులే. నోట్లు తీసుకొస్తా’.

ఇంతలో అమ్మ వచ్చింది.

‘అయితే, ఆఖరుకు పిల్లల డబ్బులకి రెక్కలొచ్చాయన్నమాట’

‘ఆఁ లేకపోతే చిల్లరెక్కడ దొరుకుతోంది గనుక. పిల్లలకేమైనా సంపాదన ఏడిసిందా? మీ అబ్బాయో, నేనో ఇచ్చినవేగా ఇవన్నీ..’

‘అన్నట్టు చెప్పడం మరిచిపోయారా, ఇక్కడ దింపినప్పుడు నీ తమ్ముడు ఓ వెయ్యి చేతిలో పెట్టాడు. ఏమైనా కోనుక్కో అమ్మా అని. ఆ మధ్యెప్పుడో ఓ అయిదొందలు మార్చి యాపిల్స్ కొనుక్కున్నా. ఇంకో అయిదొందల నోటుండిపోయింది. నీవాటితోపాటు ఇది కూడా మార్చి పెడుదూ’.

‘ఇవాళ అసలు కుదరదు. ఆఫీసులో బిజీ. ప్రతి వాడూ ఏటీఎమ్ కు వెళ్లాలనీ, బ్యాంకుకు వెళ్లాలనీ తిరుగుతున్నారు. ఎక్కడ పని అక్కడే వుంటోంది. ఇక నేను కూడా తిరుగుతూ కూర్చుంటే.. రేపు మొహం వాచేట్లు చివాట్లు తినాలి’.

‘అయినా, అందరికీ రెండు వేల కంటే ఎక్కువ ఎక్సేంజ్ చేయడం లేదు. నువ్వే కాస్త ఓపిక చేసుకో.. అది ఆఫీసుకు వెళ్లేప్పుడు బ్యాంక్ దగ్గర దింపేస్తుంది. నీ దగ్గర ఒకటే వుందన్నావుగా, ఆమె దగ్గర నుంచి ఇంకో మూడు నోట్లు తీసుకో. ఎంత లేటైనా టూ, త్రీ అవర్స్ కంటే ఎక్కవ పట్టదు. భోజనం టైముకు ఇంటికి వచ్చేయొచ్చు. కాస్త లేటైనా నువ్వేం హైరాన పడకు. ఏదో పనుందని ఆమె సాయంత్రం పెందరాలే వస్తోంది. రాత్రికి వంట సంగతి చూసుకుంటుంది. సరేనా..’.

పెద్దావిడ లైన్ లో నుంచుంది. మాటలు కలిశాయి. ఎవరో చెబుతున్నారు.

‘అసలు మన వాడిది హనుమంతుడి అంశ అటండీ. ఆయన ఎలాగైనా ఒక్కడే లంక దహనం చేసుకుని చక్కగా తిరిగొచ్చేశాడో, ఈయన కూడా దగ్గరుండి మన సైనికులను ఆ దేశం మీదకు పంపి.. ఆ పళంగా అక్కడున్న వెధవలందరినీ చంపిచేసి.. మన వాళ్ల మీద ఈగ కూడా వాలకుండా దేశంలోకి వచ్చేసేలా చేశాడట’.

‘టీవీలో ఎవరో పెద్దాయన చెబుతుంటే నేను కూడా విన్నాలెండి’.

వీరిలా మాటల్లో ఉండగానే హడావిడి మొదలైంది.

‘రెండు వేల నోటుకు చిల్లర దొరకడం లేదు. ఐదొందల నోట్లు వచ్చాయని టీవీల్లో చెబుతున్నా ఎందుకివ్వడం లేదం’టూ గొడవ. కమీషన్ల బ్యాంకువాళ్లు కక్కుర్తి పడుతున్నారని అరుపులు. పోలీసులు కూడా వచ్చారు. కర్రలకు పని చెప్పారు.

‘ఏమో అనుకున్నాం కానండి.. మొత్తానికి మొండిఘటం అని నిరూపించుకున్నారు మీ అమ్మగారు. నేనొచ్చే సరికి విజయగర్వంతో రెండు వేల నోటు పట్టుకునొచ్చారు. బ్యాంకు దగ్గర చాలా గొడవైందట. బాగా తోసుకున్నారట. ఈవిడ కిందపడితే.. అక్కడి వాళ్లు గబుక్కున లేపి నిలబెట్టారట. ‘లేకపోతే, ఈపాటికీ నన్ను పీచుపీచుగా తొక్కేసుందురే’ అన్నారు. ఆయాసంగా వుందంటే సరేని, కాసేపు నడుం వాల్చమన్నా’.

‘రాత్రికి దొండకాయ కూర చేస్తున్నా. మార్కెట్లో చూశారా? కూరల ధరలన్నీ భలే తగ్గిపోయాయి. కొనేవాడే లేడు. ఇంతకుముందు ఏరుకోడానికి కూడా ఖాళీ వుండేది కాదు. ఇవాళైతే ప్రశాంతంగా వుంది. కుళ్లిపోతాయనుకున్నారో ఏమో చవగ్గా అమ్మేస్తున్నారు’

‘దొండకాయ కూరైతే మేం తినం. ఎప్పుడూ దొండకాయీ, వంకేయేనా? ఏదైనా వెరైటీగా చేయొచ్చుగా’ -పిల్లల గోల.

‘వెరైటీగా అంటే ఏముంటుందర్రా.. టీవీల్లోనూ, యూట్యూబ్ ల్లోనూ చూసినవన్నీ చేయమంటే నా వల్ల కాదు’

‘రాత్రికి దొండకాయ కూర తినాలంటే ఓ షరతు.. ఇప్పుడు పానీపూరీ తిననియ్యాలి’.

‘కుదరదు.. ఇప్పుడు పారీపూరీలు, చాట్ లు తిని, రాత్రికి ఆకలేదని చేసిందంతా నాకు తలంటుతారు’

పిల్లలు కదా, వినలేదు. ఆమె సరే అంది.

‘కాకపోతే.. ఓ పని చేయండి. పానీ పూరీ బదులు సబ్ వేగానీ, పిజ్జాగానీ తెప్పించుకోండి. దొండకాయ కూర పొద్దన్న చేస్తా. ఇప్పటికి మేం పెద్దవాళ్లం ఏదో పచ్చడేసుకుని తింటాం’

‘అదేంటి.. ఇరవైకో, ముప్పయ్ కో అయిపోయేదానికి, ఏకంగా వందలు తగలేస్తున్నావ్’

‘నేనేం చేసినా మీకు తగలేసినట్టే వుంటుంది. వున్న చిల్లర కాస్తా, పానీపూరీ వాడి మొహాన కొడితే.. రేపేదైనా అవసరమొస్తే ఏం చేస్తారు’

‘ఓహో, సబ్ వే, పిజ్జాలు ఫ్రీగా వస్తాయన్నమాట. చిల్లర అవసరం లేకుండా’

‘మీ మట్టిబుర్రకు ఏదీ వెలిగి చావదు. వాటికైతే ఆన్ లైన్ లోనో, పేటీయంలోనో గీకొచ్చు. వందలు వందలు చిల్లర తెచ్చివ్వక్కర్లేదు’.

‘హోం డెలివరీ తెప్పించుకుంటూ కార్డెలా గీకుతావ్’

‘మీరు కాస్త ఆపుతారా, ఏదో పొరపాటున అన్నా. గీకకపోతే ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తాం లేదంటే పేటీయమ్ లో ట్రాన్సఫర్ చేస్తాం.

‘మీరు నా మాటలకు ఈకలు పీకడం మాని, వెళ్లి ఏదో ఒకటి కొని.. ఆ రెండు వేలు మార్చుకురండి’.

‘ఏవండీ ఎక్కడున్నారు? చిల్లరలేకపోతే పీడా పోయే. తొందరగా ఇంటికి రండి. ఇక్కడ కొంపలంటుకున్నాయ్’

కొంపలంటుకోవడం వెనుక విషయమేంటో చెల్లెలికి చెప్పింది. సిటీలోనే వుండే చెల్లెలు ఉబర్ కట్టుకుని వాలింది. గంటన్నరకి ఈసురో మంటూ ఆయనొచ్చాడు.

‘చిల్లర కోసం అక్కడక్కడా తిరిగే సరికి పెట్రోల్ అయిపోయింది. బంక్ వాడు కూడా పోయించుకుంటే రెండు వేలకీ పోయించుకోవా ల్సిందే, చిల్లర లేదన్నాడు. నా బండిలో రెండు వేల పెట్రోల్ ఎక్కడ పడుతుంది. క్రెడిట్ పని చేయలేదు. డెబిట్ కార్డు గీకితే.. నెట్ వర్క్ లు బిజీ కదా, ఓటీపీ రాదు. చివరకెలాగో పని కానిచ్చేసరికి ఈ టైమ్ అయింది’.

‘ఇప్పుడు మిమ్మల్ని ఆ వివరాలన్నీ ఎవరడిగారు. తొందరగా ఇటు రండి. మీ అమ్మగారికి ఏం బాగున్నట్టు లేదు. ఓసారి డాక్టర్ కు ఫోన్ చేయండి’.

‘ఏమైంది’

‘ముందు ఫోన్ చేయమన్నానా’

‘ఇందాక చపాతీలు చేసుకుని, మీ అమ్మగారికి ఇష్టం కదాని చింతకాయ పచ్చడిలో పోపు పెట్టి.. వేసుకుని వెళ్లా. అత్తయ్యగారు టిఫిన్ అంటే.. ఓ ఉలుకూ లేదూ, పలుకూ లేదు. నాకెందుకో భయమేసి దానికి ఫోన్ చేశా. ఇద్దరం పిలిచాం, కానీ, పెద్దావిడలో కదలికే లేదు’

డాక్టర్ వచ్చాడు

‘మధ్యాహ్నం అంతా బ్యాంక్ దగ్గర లైన్ లో నిలబడింది. ఇంటికొచ్చినప్పుడు బానే వుందట. కాస్త ఆయాసం వస్తోందని పడుకుంది. తీరా సాయంత్రం చూసే సరికి..

డాక్టర్ కు ఆయన వివరించాడు. డాక్టర్ కు అర్థమయ్యింది. పెద్దావిడ వెళ్లిపోయిందని తేల్చేశాడు.

ఆడవాళ్లిద్దరిలోనూ దు:ఖం పెల్లుబికింది. బిగ్గరగానే ఏడ్చారు. అంతలోనే పక్క ఫ్లాట్లవారికి వినపడకుండా సర్దుకున్నారు. మెయిన్ డోర్ దగ్గరగా వేసి పెద్దావిడని గదిలోంచి హాలులోకి మార్చారు. కావాల్సిన వాళ్లందరికీ ఫోన్ లు వెళుతున్నాయ్.

‘ఏదో హార్టేటాక్ అని చెప్పండి. అంతేగానీ, బ్యాంక్ దగ్గర నిలబడిం దనీ, కిందపడిందనీ అందరికీ చెప్పకండి. ఆర్చేవాళ్లు, తీర్చేవాళ్లు లేరు గానీ.. ప్రతి ఒక్కళ్లూ నన్నాడిపోసుకుంటారు.

‘మీకే చెబుతున్నా.. అర్థమయ్యిందా’

అయ్యిందన్నట్టు ఆయన తలూపాడు. పెద్దల ఏడుపు చూసి కాసేపు ఏడ్చిన పిల్లలు గప్ చిప్ గా బెడ్ రూంలో దూరారు. బంధు వుల పరామర్శలకు సమాధానాలు చెబుతూ ఆయన సోఫాలోనే ఒరిగాడు.

‘ఏమే.. పడుకున్నావా?’

‘లేదు, ఆవిడని అక్కడ పెట్టుకుని ఎలా నిద్ర పడుతుంది. పాపం ఆవిడని పంపకుండా వుంటే బావుండేది. ఇంకో నాలుగేళ్లు హాయిగా గడిపేసేది’

‘పాపం సంగతి అలా వుంచు. నీ దగ్గర బంగారం ఏపాటి వుంది’

‘నీకు తెలియని బంగారం నా దగ్గర ఏముందే’

‘లేదులేగానీ, ఇప్పుడు బంగారం మీద కన్నేసారట. అరకేజీ కంటే ఎక్కువుంటే రశీదులవీ చూపించి, టాక్కులు కట్టాలిట’

‘మన దగ్గర అంతెందుకుంటుందే’

‘ఎంతుందో ఎప్పుడు చూశాం. ధన త్రయోదశినీ, ధంతేరాస్ అనీ, దీపావళనీ, శ్రావణ శుక్రవారం అనీ, ఇంకేదో అనీ.. అంత పిసరో, ఇంత పిసరో కొంటూనే వుంటాంగా… మనకీ ఆడపిల్లలున్నారు కాబట్టి’

‘అవుననుకో అంతా కలుపుకుంటే ఎంతవుతుందే, మహా అయితే..’

‘అన్నీ పక్కనబెట్టు. ఇప్పుడున్నది రేపెప్పుడైనా మళ్లీ కొనుక్కోమా? వాళ్లెప్పుడొచ్చి అడుగుతారో లెక్కలు.. ఎవరు చూడొచ్చారు. తక్కెడులూ, తాళ్లు పట్టుకొచ్చి అంతుంది, ఇంతుంది.. కక్కమంటే ఏం చేస్తాం.

‘నువ్వేమో వెర్రిబాగుల దానివి.. బావగారేం పట్టనట్టే వుంటారు. అన్నానని అనుకోకు. ఇప్పుడో అవకాశం వచ్చింది కదాని..’

‘ఏంటది?’

‘వారసత్వంగా వచ్చినదానికి లెక్క చెప్పక్కర్లేదన్నారు. కాకపోతే వారసత్వంగా వచ్చిందని సాక్ష్యాలు కావాలి, అంతే’

‘అయితే..‘

‘ఏమీ లేదు.. మరోలా అనుకోకు, నీ దగ్గర వున్న పెద్ద నెక్లెస్, పదో పెళ్లిరోజుకు కొనుక్కున్నావ్ చూడు.. రాళ్ల గాజులు అవీ, ఇంకా ఒకటో రెండో గొలుసులు మీ అత్తగారి మెడలో కాసేపు అలా పెట్టి..

‘అలా భయపడి చస్తావేమే? నీ నగలు పెట్టగానే మీ అత్తగారు లేచి కూర్చుని, పట్టుకుపోతుందేమోనని భయమా?’

‘ఆయనేమంటారో అని..‘

‘ఏమీ అనరు, కావాలంటే నేను కూడా చెబుతాలే బావగారికి. ఆ నగలు వేసి ఆయన దగ్గరున్న సెల్ ఫోన్ తో ఫొటోలు తీసి జాగ్రత్త పెట్టమను. ఫొటోలు తీసిన వెంటనే నీ నగలు తీసి బీరువాలో పెట్టుకుందువుగాని. తెల్లారితే మళ్లీ అందరూ వచ్చేస్తారు’

‘ఆయనతో ఓ మాట అని చూస్తా..’

‘ఏమీ వద్దు, ముందు నీ నగలు బయటకు తియ్యి. కామ్ గా వెళ్లి గాజుల తొడుగు, నెక్లెస్ లూ అవీ అలా పెడితే చాలు. తర్వాత మీ ఆయన్నొచ్చి పనికానియ్య మందాం’

అనుకున్నంత పనీ చేశారిద్దరూ.

ఆయనొచ్చి అమ్మ వైపు చూశాడు.

ఆమె మృతదేహంలా లేదు, మహలక్ష్మిలా ఉంది.

*

కొన్ని ముగింపులు

Art: Satya Sufi

Art: Satya Sufi

ఒకానొక ఆమె. పెళ్లయిన ఆమె.

ఆమె సన్నగా ఉంది,లావుగా ఉంది.  లేదూ సమంగానే ఉంది. పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది. కాదూ సగటుగానే ఉంది. నల్లగా, తెల్లగా, చామన చాయలో. మొహం కోల గానూ, గుండ్రంగానూ. ముక్కు మీదో, బుగ్గ మీదో పుట్టుమచ్చా. పొట్టిదో, పొడుగుదో, ఉంగరాలు తిరిగో సాఫీగానో జుట్టు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లర్క్, టీచర్, సేల్స్ గర్ల్, మేనేజర్. లేదూ ఇంటి వద్దనే పిల్లల్ని చూసుకుంటూ చదివిస్తూ.

బస్టాండ్ లో కలిశారు మొదట. రైల్వే ప్లాట్ ఫాం మీద కూడా కావచ్చు. ఎయిర్ పోర్ట్ బయట ఎదురు చూస్తూనో. లేదూ ఆఫీస్ లో. ఏదో పార్టీలోనో, ఎవరో స్నేహితుల ఇంట్లోనో. ఫేస్బుక్ లో కూడా అయి ఉండొచ్చు. అది మొదటి సారీ కాకపోవచ్చు. ఒకప్పటి క్లాస్ మేటో, స్నేహితుడో, టీనేజ్ కాలపు ప్రియుడో మళ్లీ ఇప్పుడు. రోజూ కలిసే తోటి ఉద్యోగో, పొరుగింటి వాడో, అదే వీధి వాడో కూడా.

అప్పుడు అతన్ని చూడగానే ఆత్మీయంగా అనిపించింది. లేదూ మాటల్లో ఎప్పుడో దొర్లిన చిన్న మాటకో. చేతిలోంచి జారిపడ్డ దేన్నో ఒంగి తీసి చేతికిచ్చినప్పుడో. బహుమతి ఏదో కొని ఇచ్చినప్పుడు. అతను పక్కనున్నప్పుడు హాయిగా వీచిన ఆ సాయంత్రపు గాలి వల్ల. నాలుగు చినుకులు పడ్డందుకు. పక్కనుంచి పూల వాసనకి. ఎక్కడినుంచో వినవస్తున్న ఎప్పటిదో యవ్వనకాలపు పాటకి. ఎప్పటివో జ్ఞాపకాలు కదలాడినందుకు. అహితమైనవన్నీ మరిచిపోయేలా చేసినందువల్ల. మొత్తానికి ఒక మాంత్రిక క్షణం. శాశ్వతం అవుతుందనిపించేలా అవాలనిపించేలా.

ముందు సరదాకే కొనసాగిందది. రోజువారీ పనుల మధ్య ఆటవిడుపుగా. కాదూ ఆశపడ్డట్టుగాలేని సంసారం పట్ల అసహనం నుంచి విడుదలగా. చెప్పుకోలేని ఒంటరితనం, ఇరుకూ, ఏవో అసంతృప్తులూ. ఎవరి మీదో చెప్పలేని విసుగూ. భౌతికమైనదో, మానసికమైనదో హింసా. తెలియని వెలితి ఏదో పూడ్చుకోవడానికి. అంతకుమించి ఉద్వేగపూరితమైనదేదీ చేయడానికి లేక. కాదా ఓదార్పుగా ఒక మాట. మెచ్చుకోలుగా ఇంకో మాట. కలిసిన చూపులో, తెలిసినట్టు ఒక నవ్వో. పోగొట్టుకున్న రోజుల్ని అపురూపంగా మళ్ళీ బతుకుతున్నట్టు.

క్రమంగా అది చిలిపి సంభాషణల్లోకి దిగింది. ఒకరి తోడు ఒకరికి నచ్చింది. మాటలే మాటలు. అటు తిరిగీ ఇటు తిరిగీ దాగుడుమూతలాడీ ఎప్పటికో స్పష్టపడింది. ఆకర్షణలోని ఉద్వేగానికి కొట్టుకుపోతూ. రహస్యంగా వెతుక్కునే కళ్ళూ, వేగంగా కొట్టుకునే గుండే, ఒంట్లో కొసలదాకా పరుగులు తీసే నెత్తురూ, తిరిగొచ్చిన యవ్వనపు అలజడీ, ఎడబాటులో అతనిపైనే ధ్యానమూ.

అది ప్రేమో, అటువంటిదేదో అన్న నిర్ణయానికి వచ్చారు. తమ అదృష్టాలను తాము పొగుడుకున్నారు. తర్వాత ఒకరి అదృష్టాన్ని ఒకరు పొగుడుకున్నారు. అంతకంటే ముందే కలవనందుకు చింతించారు. ఉత్తేజపూరితమైన, ఉద్వేగభరితమైన ఆ దినాల్లో ఒకసారి అడిగిందామె. “మన కథ ఎలా ముగియబోతుంది?”

0.చివరికి ఏమీ కాలేదు. మరెందుకూ దారి తీయక మునుపే అతనికి దూరమయ్యింది. కావాలనే. అప్రయత్నంగానో. అతడికి ఇంకొక ఆమె    ఎవరో పరిచయమయ్యారు ఆశ తీరే దగ్గర దారి చూపెడుతూ. ఆమె భర్త ఉద్యోగం మారడంతోటో, వాళ్లు ఇల్లు మారడంతోటో ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్. కాదూ ఆమె పిల్లల చదువు గొడవలో పడిపోయింది. ఏ తెర మీదో, రోడ్డు పక్కనో ప్రేమ ప్రకటించుకుంటున్న జంటని చూసినప్పుడో, మసక చీకట్లో ఎవరో అతనిలా కనిపించినప్పుడో అతను గుర్తొస్తే కొంచెం దిగులు పడి కాసేపు పాత ఏడుపు పాటలు విని. ఏదయినా బాధ కలిగినప్పుడు ఓదార్పు గానో. కొంత అపరాధభావనా. లేదా చేతికందీ జారిపోయినట్టు చింత. లేదూ మళ్లీ అతనెప్పుడూ ఆమెకు గుర్తు రాలేదేమో కూడా.

1.ఏదో అయ్యేలోపే ఆమెకు మరొకతను దగ్గరయ్యాడు. ఆమెని ఇంకాస్త నవ్వించేవాడు. లేక ఎక్కువ సమయమో, డబ్బో ఉన్నవాడు. ఎట్లాగో ఇంకొంచెం మెరుగయిన వాడు. లేదా ఆమె వినాలనుకున్నవే చెప్పేవాడు. కథ మళ్లీ మొదట్నుంచి. ఏదో ఒకటి జరిగి ఇంకోరకంగా ముగిసిందాకా. లేక ఆమెకు విసుగెత్తిందాకానో, వయసు ఉడిగిందాకానో, మరణించిందాకానో. ఏది ముందయితే అప్పటిదాకా.

2.ఒకరోజు పగలో, రాత్రో, రెంటి మధ్యో. అతనితో సెక్స్. చాలా పకడ్బందీ ప్లానింగ్ తోటే. ఒక్కో అడుగూ ముందుకు జరిగో, ఎప్పుడో ఎలాగో అకస్మాత్తుగానో. ఒకసారో కొన్ని సార్లో లేక దాదాపుగానో. బయట ఎక్కడో హారన్ మోత. ఎక్కడో భయం, అంతలో తెగింపు. మధ్యలో పోయిన కరెంట్, ఆగిన ఫాన్. లేక హుమ్మంటూ ఏసీ.  కాక మొదట్లోనో, మధ్యలోనో మనసు మారి తలుపు తీసుకుని పరుగు తీసి ఇంటికి వచ్చి ఏడ్చి స్నానం చేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామన్న ప్రశ్నే రాలేదు. అతన్ని మళ్లీ కలిసింది లేదు. ఎదురుపడ్డా ఒక పొడి హలో చూపు పక్కకి తిప్పుకుంటూ తప్పుకుంటూ. ఏమీ జరగనట్టూ, జరిగిందీ, జరగందీ మర్చిపోవాలని ప్రయత్నిస్తూ. లేదా ఆమెకు గుర్తున్నదల్లా అతని భుజమ్మీద ఎప్పటిదో మచ్చ.

2.1. తప్పు చేసిన భావన ఆమెను నిలవనీయలేదు. భర్త ఏ కొంచెమో ప్రేమ చూపినప్పుడల్లా అది ఎక్కువయ్యేది. చెప్పడమా, మానడమా అని ఊగులాడింది.

2.1.1. ఆమె తన స్నేహితురాలితో చెప్పుకుంది. ఆవిడ ఆమెని తిట్టింది “ఎందుకిలా చేశావు?” ఆవిడకూ ఎటూ తోచక ఒక ఫేస్బుక్ గ్రూప్ మొదలెట్టి అందులో ఇదంతా ఒక కథ అయినట్టు చెప్పి, ఇప్పుడా పాత్ర ఏం చేస్తే బావుంటుందని అడుగుతూ పోస్ట్ చేసింది. లేదా అప్పటికే ఉన్న గ్రూప్ లోనో. చెప్పడం నైతిక ధర్మమని కొందరూ, చెప్పకపోవడం జీవనధర్మమని కొందరూ వాదించుకున్నారు.  శాస్త్రాలనూ, సోషియాలజిస్టులనూ ఉటంకించారు. చివరికి అది కొన్ని చోట్ల విశ్వనాథ, చలం భక్తుల మధ్య జగడంగానూ, కొన్ని చోట్ల మోడీ భక్తుల మధ్యా ద్వేషుల మధ్యా గొడవగానూ పరిణమించింది. ఆమె ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది. తర్వాత 2.1.2. గానీ 2.1.3. గానీ.

2.1.2. ఒక రాత్రి నిద్రపోతున్న భర్తను లేపి చెప్పింది. “నేను తప్పు చేశాను. మీకు ద్రోహం చేశాను.” ఆమె భర్తకి అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పింది. మౌనంగా ఉండిపోయాడు. “ఎలా జరిగిందో తెలియదు. ఏ వాలునీటిలోనో కాళ్ల కింద మట్టి జారి కొట్టుకుపోయినట్టు.” తల వంచుకుని చెప్పింది. లేదా కళ్ల వెంట నీరు. కాకపోతే అంతా వివరిస్తూ ఒక ఉత్తరం.  “ఇట్స్ ఓకే!” కాసేపటికి చెప్పాడు ఆమె చేతి మీద చేయి వేసి.  “నన్ను క్షమిస్తారా?” ఆగి అంది “నన్ను వెళ్లిపోమన్నా అర్థం చేసుకోగలను.” ఆమె భర్త ఆమెను దగ్గరకు తీసుకుని సముదాయించాడు. “ఒక్కసారి కాలంలో వెనక్కి వెళ్లగలిగితే..” అనుకుందామె. ఒక్కోసారి మళ్లీ 2.2 కి. లేదా 6 కు.

2.1.3. ఆమె ఎవరితోనూ మనసు విప్పి చెప్పుకోలేదు. చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఆ రహస్యాన్ని జీవితాంతం మోస్తూ బతికింది. చనిపోయే ముందు హాస్పిటల్లో చేయి పట్టుకుని మంచం పక్కనే కూచున్న భర్త వంక చూస్తూ నోరు తెరిచింది. “నన్ను క్షమించగలరా?” అంది. లేదా అనాలనుకుంది. అన్నాననుకుంది.

2.2. తర్వాత చాటుమాటుగా కలుసుకుంటూనే ఉన్నారు. అతనికెక్కడో వేరే ఉద్యోగం వచ్చి తనతో వచ్చేయమని గొడవ. ఆమె భర్తకు ఏదో అనుమానంగానే ఉంది. లేక అనుకోని షాక్. చెప్పిందామె “అయాం సారీ సారీ సారీ. నాది తప్పే కానీ చేయక తప్పదు. నాకోసం. అతని కోసం”  లేదా “తప్పంతా నీదే. నీమూలానే చేయవలసి వస్తూంది ఇలా!” ఏం చేయాలో పాలుపోలేదు ఆమె భర్తకి. లేదా ఎగిరి గంతేశాడు. అది అతని ఎన్నాళ్ల కలో. “పిల్లలో?” అడిగాడు.”ఫర్వాలేదు , మీరే ఉంఛుకోండి,” అంది. “లేదు లేదు, నువ్వే తీసుకుపో!” అన్నాడు. కాదూ పంచుకోవడమో, తనకే కావాలని గొడవో. పిల్లలు ఆమెను ఎప్పుడూ క్షమించలేదు. ఆపైన 7.1 గానీ 7.2 గానీ.

3.కథ మొదలయిన సంగతి ఆమె భర్తకి తెలుసు. అసలు అతనే దోహదపడ్డాడేమో కూడా. ఏదో వ్యసనం. కాదా దురాశ. మొత్తానికి డబ్బు అవసరం. లేదా లైంగిక అసమర్థత. ఆమెకూ తెలుసు అయినా తెలియనట్టు. లేదా తెలియదు. అతనితో సెక్స్, తర్వాత దొంగచాటుగా కలవడం నుంచి అవసరమయినప్పుడల్లా అతను ఇంటికే రావడం అలవాటయింది. ఆమె భర్త చాకచక్యంగా తప్పుకునేవాడు. లేదూ అతనితో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోనే కూచుని కలిసి తాగే దాకా. ఆమె మీద జోకులు వేసి ఆనందించే దాకా. లేదా జోకు అనుకుంటూ ఎత్తిపొడుపు. “నీ ప్రేమ నా మీదా, నా డబ్బు మీదా? అందుకే వల వేశావు గదూ?” ఆమె వినలేదు. లేక విననట్టు నటింఛింది.

4.బట్టల్లేకుండా వాళ్లు కలిసున్నప్పుడు ఫొటో తీశారెవరో. కాదూ వీడియో. అతని ఫ్రండే. లేదా ఆమె భర్త ఫ్రండ్. కాదూ ఎవరో ముఖపరిచయస్తుడు. అనుకోకుండానో, అతని ప్లాన్ లో భాగంగానో. ఆమె ఫోన్ కి ఒక బెదిరింపు మెసేజ్. బ్లాక్ మెయిల్. ఆమె కావాలి, లేదా డబ్బు. అతను తప్పుకున్నాడు. ఆమె బ్లాక్ మెయిలర్కి అడిగిందల్లా ఇచ్చింది. చెప్పినట్టల్లా చేసింది. అయినా ఫొటోలో వీడియోలో బయటపడ్డాయి. చివరికి నెట్కి ఎక్కాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంది. లేదా అతన్ని హత్య చేసింది. తప్పుకోకుంటే అతనితో కలిసేనేమో. ఏ కోర్టులోనూ కేసు లేదు. లేదా ఇంకా నడుస్తూంది. ఇద్దరూ జైల్లోనయినా. కాదూ భయపడి 2.1.2.కో.

5.అతనితో సంబంధం కొనసాగుతుండగా ఆమె భర్తకి అనుమానం కలిగింది. కొన్ని గుర్తులు ఆమె ఒంటి మీదో, ఇంట్లోనో. సమయం కాని సమయంలో ఫోన్లో మెసేజ్లు. అడిగితే చెప్పిన సమాధానాలు అతికీ అతకనట్టు. చివరికి ఆమె భయపడిపోయి అతనితో తెగతెంపులు చేసుకుంది. లేదా చుట్టుపక్కల వాళ్ల గుసగుసలు గమనించి బెదిరిపోయో. ఏ సాక్ష్యమూ దొరక్క ఆమె భర్త అనుమానాన్ని మనసులోనే అణుచుకున్నాడు. తన చిన్న కొడుకుని చూసినప్పుడల్లా అది బయటికి వస్తుంది. తమవి కాని పోలికలకోసం వాడి మొహం వంకే చూస్తాడు. అకారణంగా ఆమెపై విసుగు. లేదా వేధింపులు. ఎప్పుడయినా 2.1.2.కి.

6.ఆ రోజెందుకో ఆమె భర్త తొందరగా ఇంటికి వచ్చాడు. ఎందుకో కాదు అనుమానంతోటే. ఇద్దరూ దొరికిపోయారు.

6.1. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని ఒక్క మాటా అనలేదు. ఆమె ప్రయత్నించింది. ఏడ్చీ, బ్రతిమలాడీ. చుట్టాలూ, స్నేహితులూ చెప్పి చూశారు. తర్వాత విడాకులూ, పిల్లల కస్టడీ గొడవా. ఆమె భర్త మాత్రం ఆమెతో మాట్లాడింది లేదు అప్పటినుంచీ. ఆమె అసలు లేనట్టే.

6.2. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని చితకబాదాడు. లేదా అవమానం, దుఃఖంతో కూర్చుండిపోయాడు. ఆమె ఏడుస్తూ క్షమాపణ అడిగింది. తల గోడకేసి కొట్టుకుంది. ఆమె భర్త ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకు మరింత దుఃఖం పొంగుకొచ్చింది. తర్వాత వేరే ఇంటికో, ఊరికో మారిపోయారు.

6.2.1. అయినా ఆమె భర్త ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు.  మనసు తొలిచే ప్రశ్నలు అడక్కుండా ఉండలేకపోయేవాడు. ‘ఎందుకు?’,’ఎన్నాళ్ల నుంచి నడుస్తుంది?’ నుంచి వాళ్ల మధ్య నడిచిన సెక్స్కు సంబంధించిన ప్రశ్నల దాకా. ఒక్కోసారి భోరున ఏడ్చేవాడు. లేదా ఆమెను కొట్టేవాడు. ఏ వాదన జరిగినా చివరికి ‘నిన్ను క్షమించడం నా బుద్ధితక్కువ!’ తో నోరు మూయించేవాడు. ఒక రోజు ఆమె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏవో బిళ్లలు మింగో. లేదా జీవచ్ఛవంలా బతికింది.

6.2.2. ఆమె భర్త ఆ సంగతెప్పుడూ ఎత్తలేదు. తిడితేనో, కొడితేనో బాగుండుననుకునేది. అతని మంచితనాన్నీ, కృతజ్ఞతాభారాన్నీ భరించలేకపోయేది. అప్పుడప్పుడూ గొడవ పెట్టుకునేది “మీకు నామీద ప్రేమ ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది?” అదే అబ్సెషన్ కావడంతో కొన్నాళ్ల సైకియాట్రీ ట్రీట్మెంట్ తర్వాత విడాకులు తీసుకుంది. లేదా ఉత్తరం రాసి వెళ్లిపోయింది. కాదూ ఆత్మహత్య.

6.2.3. మళ్లీ అతని మొహం చూడకూడదని కచ్చితంగానే అనుకుంది కానీ అతను కనిపించగానే అన్నీ మరిచిపోయింది. లేదా కొన్నాళ్లు అతను మళ్లీ వెనక పడ్డాక. అతనితో సెక్స్ వీలయినప్పుడల్లా సాగిస్తూనే ఉంది. తిరిగి 6 కి.

6.3. ఆమె భర్త కోపం పట్టలేకపోయాడు. కత్తితో వాళ్లిద్దరినీ ఎడాపెడా పొడిచాడు. లేక ఇద్దరిలో ఒక్కరినో. తర్వాత కత్తితో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, తాపీగా కూర్చుని వాళ్లనెందుకెట్లా చంపిందీ వివరంగా చెప్పి లొంగిపోయాడు. లేదా ఆ శవాన్నో శవాలనో ఎక్కడో పూడ్చో కాల్చో మాయం చేశాక తర్వాతెప్పుడో బయటపడి పోలీసులకి దొరికిపోయాడు. లేదూ ఆమె ఆనవాళ్లు ఎప్పటికీ బయటపడలేదు. కాదా ఆమె భర్త కూడా అప్పుడో కొన్నాళ్లకో ఆత్మహత్య చేసుకున్నాడు.

6.4. ఆమెని తిట్టాడు. కొట్టాడేమో. ఆమె అతన్ని కలవడం మానలేదు. భర్త ఆంక్షలూ, వేధింపులూ తట్టుకోలేక అతనితో చెప్పుకుని ఏడ్చింది.  మరో నాడు పట్టుబడినప్పుడు ఇద్దరూ కలిసి ఆమె భర్తని కొట్టో పొడిచో చంపేశారు. లేదా ప్లాను ప్రకారమే ఆమె భర్తని మట్టు పెట్టారు. తాడుతోనో, దిండుతోనో, విషంతోనో. కాదూ అతను తన స్నేహితులతో కలిసి ఆమె భర్తకు మద్యం తాగించి ఊరవతలకి తీసుకెళ్లి. లేక ఏ కారుతోనో గుద్ది. చివరికి పోలీసులకి చిక్కారు. లేదు.

7.”నీకో విషయం చెప్పాలి” అన్నాడు ఆమె భర్త ఒక రోజు. లేక ఆమే అంది. “ఏమిటి?” “నాకు విడాకులు కావాలి.” “అవునా? నేనూ అదే చెప్దామనుకున్నాను.” “అవునా? నేను ఇంకొకరితో ప్రేమలో.. ఎలా చెప్పాలో తెలియలేదు.” “నేనూ..” ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విడాకులు తీసుకున్నారు. ఒకరి పుట్టినరోజుకొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.

7.1. ఆమె విడాకులు తీసుకుంది కానీ అతను తీసుకోలేదు. ఏవో సాకులు. పిల్లల చదువులనో వాళ్ల ఆవిడ ఆరోగ్యం బాలేదనో. అసలు పెళ్లి చేసుకుందామని తను అనలేదనీ, ఊరికే సరదాకన్నాననీ బుకాయింపు. లేదా మొహం చాటు చేసుకుని తిరగడం. కొన్నాళ్లు ఎదురు చూసి ఒక రోజు వాళ్లింటికే వెళ్ళి తిట్టి వచ్చింది. అతని భార్య ఎదురుగానే.

7.1.1. మళ్లీ అతను ఆమె వద్దకి వస్తూనే ఉన్నాడు. ఆమె అతనికి రెండో సెటప్ అని అనుకుంటుంటారు చుట్టుపక్కల వాళ్లు. రెండో భార్యగా మిగిలిపోయేనేమిటని దిగులు పడి అతనితో గొడవపెట్టుకుంటుంది అప్పుడప్పుడూ. ఆమె జీతమూ, ఉంటే ఆస్తీ కాజేసుతున్నందుకేమో కూడా. తీసుకెళ్లి భార్యకో, పిల్లలకో పెడుతున్నందుకు కూడా.

7.2. ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. లేదా కలిసి బతకడం మొదలెట్టారు. ముందెన్నడూ లేనంత ఆహ్లాదంగా గడిచింది ప్రతి దినమూ. అతన్ని ముద్దు పెట్టుకుంటూ “మనుషులు ఇంత హాయిగా బతుకుతారని నాకు ఇప్పటిదాకా తెలియలేదు” అందామె. లేక అటువంటిదేదో.

7.2.1. మళ్లీ అదే మొనాటనీ. అసంతృప్తి. భర్త మారేడు కానీ అచ్చు ముందులాగే జీవిస్తున్నట్టు. ఒకరోజు ఇంకో అతను కలిశాడు. అదృష్టవశాత్తూ. లేదా దురదృష్టవశాత్తూ. కథ మళ్లీ మొదటికి.

7.2.2. ఒక రోజు ఆమెకి అతని జేబులో పూల రుమాలు దొరికింది. అచ్చు తన రుమాలు ఒకనాడు అతను జేబులో పెట్టుకుని మర్చిపోయి అప్పటి వాళ్లావిడకి దొరికినట్టే. లేదా అలవాటు లేని సెంట్. అడిగితే ఏదో నమ్మలేని బదులేదో చెప్పాడు. “నన్నే అనుమానిస్తున్నావా,” అంటూ బాధపడ్డాడు. దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమా లేక అతన్ని వదిలేయడమా అని ఆలోచిస్తూంది.

ఎన్+1. ___________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________.

ఎగ్జిట్ 1. ఆమె మరణించింది. సమయం తీసుకునో హఠాత్తుగానో. ఏదో కేన్సర్ వంటి తగ్గని జబ్బు. కాదా యాక్సిడెంట్. బస్ బోల్తా, పట్టాలు తప్పిన రైలు, వర్షంలో డ్రయినేజ్ హోల్.  లేదా ఎప్పుడయినా ఒక క్లిక్తోనో,కరెంట్ పోయో. లేదా బ్యాటరీ అయిపోయి.

ఎగ్జిట్ 2. ఉల్కాపాతం. లేదా మూడో ప్రపంచ యుద్ధం. మొత్తానికి మహా విలయం. మానవజాతి సమస్తం నశిస్తుంది. మిగతా ముగింపుల్నీ, వాటిని పట్టించుకునేవాళ్లనూ, ఏదీ పట్టని వాళ్లనూ మింగేస్తూ. అంతా అసంబధ్దంగా మిగిలిపోతుంది. మిగలదు.

—-చంద్ర కన్నెగంటి

 

డేవిడ్‌

art: satya sufi

art: satya sufi

ఒం‌టె చర్మం మొద్దుగా ఉంటది. దానిలోకి సూది దింపి దారాలతో పూలు కుట్టిన, ఎంబోజింగ్‌ ‌పనితనంతో ఉన్న పర్సులని చూత్తా బజారులు తిరుగుతున్నా. హంపీకి యాత్రికురాలిగా రావటం మొదలుపెట్టి ఇరవై ఏళ్లవుతుంది. ఇదేంటి అంటే అంతకు ముందు నా ఊరు ఇదే. ఉద్యోగం బాధ్యతలతో సొంత ఊరికి యాత్రికురాలిని అయిపోయా. ఇంకొక్క రోజులో ముప్పై తొమ్మిదేళ్లు నిండి నలభైలోకి అడుగుపెడతా. ఊరి పొలిమేరల బంధం చాలా గొప్పది .నలభైలు అంటే నాకు మామూలుగానే ఉంది. చెంపల సందుల్లో నించీ దొంగ చూపుల తెల్లవెంట్రుకలు, కొద్దిగా ముందుకొస్తున్న బెల్లీ అన్నీ కలిపి ‘ఏజ్‌ ‌గీవ్స్ ‌గ్రేస్‌’ అన్నట్టుగా ఉంది.

‘వర్కవుట్స్ ‌చెయ్యొచ్చు కదా. ఇప్పుడు మొదలుపెడితే ఇంకా ఇరవై ఏళ్లు యాక్టివ్‌గా ఉంటావు’ 21 సం.ల కొడుకు సలహా.
‘నేను ఇరవై ఒకటి కాదు ముప్పై తొమ్మిది. నాకేం లో వేస్ట్ ‌జీన్స్‌లు వేసుకుని తిరగాలని లేదు’.

‘మా నువ్వు మారిషస్‌ ‌వెళ్లినపుడు ‘స్పెగెట్టీ’ టాప్‌తో ఉన్న ఫొటో సెల్‌ఫోన్‌కి స్క్రీన్‌ ‌మీద పెట్టాను. మా లెక్చరర్‌ ఎవరు నీ గాల్‌‌ఫ్రెండా, చాలా బాగుంది, ఇట్లా పెట్టుకు తిరగాల్సిన అవసరం ఉందా’ అని క్లాస్‌ ‌పీకాడు.
‘నన్ను ఈ భూమి మీదకి తెచ్చిన గాళ్‌, ‌మా అమ్మ ‘వన్‌ ఇన్‌ ‌మిలియన్‌’ అన్నాను

నేను నవ్వుకుంటా వాడి మాటల్ని మురిపెంగా వింటా, వీడు ఏదో నా దగ్గర దాస్తున్నాడు అనుకుంటా. బ్యాగుల్ని చూస్తన్నా. కొన్ని లేత రంగులు, ముదురు రంగులు కావాలంటే ఆవనూనెతో రుద్ది రంగు మార్చి ఇస్తన్నారు. ఒక గవ్వల యాంక్లెట్‌ (‌కాలి పట్టీలాంటిది) కొని నా కాలికి తొడిగాడు.

‘మా నువ్వు చాలా బాగుంటావు, ముప్పై ఏళ్లా అన్నట్టుగా, నా ఫ్రెండ్స్ అం‌తా మీ అక్కా అని అడుగుతారు. ఒకసారి నా ఫ్రెండ్‌ ‌పుట్టినరోజుకి ఐవరీ అండ్‌ ‌గ్రే కలర్‌ ‌పట్టుచీర కట్టుకుంటే, విప్పి వేరే చీర కట్టుకునే వరకూ ఏడ్చాను. గుర్తుందా అందులో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అచ్చం నీలాంటి అమ్మాయి నాకు తోడు దొరకాలి’.

ఎందుకో వాడ్ని చూశాను, కొత్తగా ఉన్నాడు, కళ్లల్లో ఏదో కాంతి, నా రక్తం కదా, రూపం నాదే, నేను పంచిన మాంసం, మొత్తం మీద నా ఎక్స్‌టెన్షన్‌. ఈరోజు వాడి కళ్లు ఏదో మెరుపుని మోస్తా ఉన్నట్టుగా,… పరిశీలించటం ఆపి…
ఏంటి ఇవ్వాళ ఓ.. అని పొగుడుతున్నావు.. నీ మీద నాకేదో అనుమానం, కొత్తగా నీకు అమ్మ కనపడిందంటే.. ఈ అబ్బాయిలందరూ అమ్మలని కావాలనుకోవటం మానేసి ,అమ్మాయిలని, పెళ్లాలని కోరుకోవాలి, ఒక పాత్రతోనే తృప్తిపడాలి. ఇవ్వాళ, రేపు అమ్మాయిలు అన్ని పాత్రలూ పోషిస్తా కాలం వేస్ట్ ‌చేసుకోరు.

Kadha-Saranga-2-300x268
ఏదో దొరికి పోయినట్టుగా మొఖం పెట్టి..
‘నీకొకటి చెప్పాలి. నువ్వు నో చెప్పవని ఒకడుగు ముందుకి వేశాను. నీ పుట్టిన రోజుకి చిన్న సర్‌‌ప్రైజ్‌. ‌నా బ్యాచ్‌మేట్‌ ఐరిష్‌ అమ్మాయి తన పేరు ‘వీనస్‌’ ‌తనని పిలిచాను. తను నాకు క్లోజ్‌. ‌ముందే చెబుదాం అని అనుకున్నాను. కానీ…’
దగ్గరగా జరిగి వాడి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నా. నా ఎనక నించీ ఎవరినో రమ్మని చేతులు ఊపాడు. ఎదురుగా ఉండే కొట్టులో టిబెటియన్‌ ‌మ్యాజిక్‌ ‌బౌల్‌ని కర్రతో తిప్పతా సంగీతం వినేదల్లా వదిలేసి వచ్చింది.

‘వీనస్‌’ అన్నాడు.
నవ్వుతా ‘హౌ ఆర్‌ ‌యు’ అన్నా.
రెండు చేతులూ ఎత్తి ‘నమామాస్తే ఆంటీ’ అంది.

ఆ అమ్మాయిని చూస్తే వీడికన్నా రెండంగుళాల ఎత్తు, రాజస్థానీ  కుచ్చుల లంగా, పైన పొడుగు చేతుల పొట్టి టాప్‌, అడ్డంగా యాలాడే బ్యాగ్‌, ‌మెడని పట్టి జారుతున్న రంగుపూసల దండ, పైకి క్లిప్‌ ‌చేసిన రాగి జుట్టు, నవ్వినప్పుడు అందంగా షైన్ అవుతున్న ఐవరీ కలర్‌ ‌పళ్లు, పిల్లి కళ్లు, భలే క్యాచీ లుక్స్, ‌మొత్తానికి చాలా క్యూట్‌ అనుకున్నా.

‘ఈ తెల్లది నీకెక్కడ దొరికిందిరా’
‘మా ప్లీజ్‌ ‌తనకి తెలుగు వచ్చు.. ముందు బ్యాగులు చూడు’

రకరకాల బ్యాగులు, ట్యాజిల్స్ ‌హ్యాంగ్‌ ‌చేసి సెల్ఫ్ ‌ప్రెస్‌డ్‌, ‌హ్యాండ్‌ ఎం‌బ్రాయిడరీ, కచ్‌ ‌వర్క్, అద్దాలవీ, గవ్వలవీ, పూసలు, ఏది ఏరుకోవాలో తెలియట్లా. చూస్తా చూస్తా ఒక మూల ఆగిపోయాను. అదేనా.. ఇది అదేనా.. ఆ వస్తువు అక్కడ, ఇన్ని సంవత్సరాల తరవాత చూసినా చటుక్కున గుర్తుపట్టాను. కాదు.. లేదు.. ఒంటిని విడివిడిగా నరికి పేళ్లుగా చీల్చినా, ప్రతిభాగం దాన్ని గుర్తు పట్టుద్ది. నాలో సన్నని వణుకు. ఇది తను మాత్రమే చెయ్యకలదు. అతని చేతిలో తోలు కొబ్బరాకులాగా, తడిపిన నారలాగా, కుప్పలో నించీ తీసిన జమ్ములాగా మారుద్ది. ఆ విషయం నాకు బాగా తెలుసు. నా ప్రమేయం లేకుండా చేతులు అపురూపంగా తడుముతున్నయ్యి. దాన్ని నా ఒళ్లోకి తీసుకున్నా. ప్రపంచంలోనే చాలా అరుదైన తక్కువగా చేసే ఒక రకమైన తోలు పనితనం. అది తెలిసిన కొద్దిమందిలో అతనూ ఒకడు. ఆ వస్తువు బుల్లెట్‌ ‌సీటు కవర్‌. ‌రేటు లక్షా యాభై వేలు అని ఉంది.

ప్రతి రెండు సంవత్సరాలకీ ఒకసారి ఐదు తెస్తాడు. గోవా కస్టమర్లు మూడు కొనుక్కుని వెళతారు. ఒకటి ఇక్కడ రాజకీయ నాయకుడి కొడుకు కొంటాడు. ఒక్కటే మిగిలింది. కావాలంటే లక్షా ఇరవైకి ఇచ్చేస్తా అని షాపతను చెప్పుకు పోతా ఉన్నాడు.
‘డేవిడ్‌ ఇక్కడికి ఎపుడొచ్చాడు’ అని బలవంతాన అడిగాను.

‘ఓ.. మీకు తెలుసా.. సంవత్సరంన్నర పైనే అయి ఉండొచ్చు. మీకెలా పరిచయం, చాలా పేరున్న కుటుంబం అంట. మౌన ఋషిలాగ ఉంటాడు. ఇక్కడికి గాల్‌ ‌ఫ్రెండ్స్‌తో గానీ, దారిలో పరిచయం అయిన టూరిస్టులనయినా తెచ్చుకుంటారు, కానీ తను మాత్రం ఒక్కడుగా వస్తాడు. ఇక్కడ ప్రతి రాయీ, ప్రతి శిల్పం, ప్రతి శిధిలం, ప్రతి గోపురం నా ప్రియురాలే, తుళ్లిపడే తుంగభద్ర పరవళ్లలో, నేను చూసే ప్రతి జంట ఆనందంలో, ఈ హంపీ మొత్తం తనే, ఇక్కడ పాదం పెడితే తనతో కలసి ఉన్నట్టే… అందుకే క్రమం తప్పకుండా వస్తాను అంటాడు.

అక్కడ ఉన్న కుర్చీలో ఇడిచిన బట్టల కుప్పలా కూలపడ్డా. చాలా నీరసంగా అనిపించి నీళ్లు కావాలని అడిగా.
‘మా .. అమ్మా.. ఏంటి ఇట్టా అయిపోయావు. పొద్దున్నించీ ఏమన్నా తిన్నావా.. వీనూ.. గెట్‌మి ఒన్‌ ‌టెండర్‌ ‌కోకోనట్‌, ‌యాపిల్‌ ‌పై.. గెటిట్‌ ‌ఫ్రం ద బేకరీ.. ఫాస్ట్…’

‘‌వద్దు నాన్నా ఆకలి లేదు’.
‘కొంచెం తిను, మాట్లాడకు, అని మొత్తం తినిపిచ్చి, లేత కొబ్బరి నీళ్లు తాగినాక తేరుకున్నా’.
ఇంత జరిగినా ఆ లెదర్‌ ‌కవర్‌ని మాత్రం చేతిలోనే గాజుబొమ్మని పట్టినంత భద్రంగా పట్టుకున్నా.
‘రామ్మా.. ఎలదాం.. రేపు కొనుక్కుందాం’ అని లేపాడు.
‘డేవిడ్‌ ‌వస్తే మీ రిఫరెన్స్ ఏమయినా చెబితే గుర్తు పడతాడా’ కొట్టతను.
‘థాంక్స్.. ‌నథింగ్‌’ అని బలవంతాన సీటుకవరు వదిలి బయటకొచ్చాను.

‘అక్కా చెల్లెళ్లు గుండు (అదొక ప్రదేశం) దగ్గరకి తీసుకెళ్లు నాన్నా’
‘వాడూ, ఆ అమ్మాయి మొకమొకాలు చూసుకుని అక్కడికి తీసుకెళ్లారు. గుట్టెక్కి రాతికాళ్ల మంటపం దాటి, గుండుని గుర్తుపట్టి నిలబడ్డా. దాన్ని ఆనుకుని  ఒరిగినట్టుగా రహస్యంగా ఉండే గుర్రం మొకం బండ. ముందుకి వంగి బండమీద పడుకున్నట్టుగా చూస్తేగాని అక్కడ ఏం ఉందో కనపడదు.

— — —
స్వేచ్ఛగా పరచుకుని విప్పారిన టేకుపూత రంగుకి, కుంకపు రంగు అంచులంగా దానిమీద కుంకపు రంగు జాకెట్టు, తలంటుకుని నీటి చుక్కల కారతన్న రొండు జడలు శనివారం స్కూలు డ్రస్సు ఉండదు. కిలోమీటరు దూరం ఉండే బడికి, అల్యూమినియం పుస్తకాల పెట్టెతో నడుస్తున్నాను. అసలే ఆలస్యం, ఛీ.. ఛీ.. బడినించీ వచ్చినాక తలంటొచ్చు కదా. ఈ అమ్మమ్మ ఒకటి. టింగూ, టింగూ అని రొప్పుకుంటా గెట్టు (గట్లు)కి అడ్డంపడి బడి దారి పట్టాను.

‘హలోవ్‌.. ‌బేబీ వేరీజ్‌ ‌తుంగభద్రా రిసార్టస్..’
‘‌తలెత్తి చూస్తే ఒక విదేశీ కుటుంబం, భార్య, భర్త, ఇద్దరు మొగ పిల్లలు. ఈళ్లు అడిగిన అడ్రస్సు చేతితో చూపిచ్చి బై చెప్పా. సాయంత్రం బడినించీ వచ్చేటప్పటికి మామిడి చెట్టు కింద ఉన్న రెండు హట్స్‌లో వాళ్లు దిగారు. ఒక దాంట్లో ఆ జంట, రొండో దాంట్లో పిల్లలు. వాళ్లు బ్రిటిషు వాళ్లని రెండు నెలలుంటారని తెలిసింది.

స్నానం అయినాక పొద్దున ఆదరాబాదరా ఏసిన జడలు ఇప్పి చిక్కుతీసి ఒక జడ ఏసి మల్లెపూలు మరవం దండ తలలోకి ఎక్కిచ్చి, చేతిని జున్ను గిన్నె ఇచ్చింది అమ్మమ్మ. మామిడి కొమ్మకి కట్టిన ఉయ్యాలలో ఊగుతా జున్ను లాగిస్తున్నా. కాసేపటికి గుడిసెలో నించీ కొట్టుకుంటా అన్నదమ్ములు బయటకొచ్చారు. అన్న వాళ్ల తమ్ముడితో..

‘పగలంతా నీతో ఆడలేను. ఈత కొట్టు, కోళ్లు, గేదెల్ని కాస్తా ఆడుకో, రాళ్లెక్కు.. ఇంకా.. ఇదిగో ఈ పిల్లని పరిచయం చేస్తాను ఇద్దరూ ఆడుకోండి.
హాయ్‌ ‌వీడు నా  చిన్న తమ్ముడు. సెలవలకి ఇండియా వచ్చాం. ఇక్కడ బాగుంది. మీరు వీడితో ఆడుకోవచ్చు. మంచివాడు. సారీ అన్నీ నేనే చెబుతున్నాను. మీ పేరు’
‘సిరి’
‘వాటార్యూ’
‘సిక్స్ ‌గ్రేడ్‌’
‘‌వెల్‌కమ్‌ ‌టు టీన్స్, ‌సెక్సీ వెల్‌కమ్‌, ‌సాయంత్రాలు, శని, ఆదివారాలు కలసి ఆడుకోండి. మీరు చాలా షేర్‌ ‌చేసుకోవచ్చు. కాళీ ఉంటే నేను కూడా జాయిన్‌ అవుతా. నాకు వేరే పనులు ఉన్నయి. బై.

‘తను నాకన్నా చిన్నది. నీకేం పనులు, అద్దెబుల్లెట్‌ ‌మీద ఎవరో ఒక అమ్మాయితో తిరగటమా’.
‘కాదు, అయినా ఆ విషయాలు నీకు అనవసరం’ అని కదిలాడు.
పరుగెత్తుతా వాళ్ల అన్న ఎనకాల పడ్డాడు. నన్ను ఏదో చేత్తాడు అనుకుని పిల్లల కోడి మీదపడి పీకబోయింది. దెబ్బతో వచ్చి నా ఎనకాల చేరాడు. నవ్వుకుంటా.

‘తింటావా’
‘ఏంటది’
‘కంట్రీ ఛీజ్‌’
‌మాట్లాడుకుంటా కోళ్లమ్మటపడి, కోళ్లని కప్పెట్టి, గూటికి నాపరాయి అడ్డంపెట్టి, చేతులు కడుక్కునేటప్పటికి, చీకటి పడింది. చదువూ, రాతా లేదా అని అమ్మమ్మ కేకలు.
‘రేపు బడి అయినాక నాలుగింటికి కలుద్దాం’.
‘నీ జడ బాగుంది. యు లుక్స్ ‌స్వీట్‌’ ‌బై.

‘నాలుగింటికి కలిశాం. పగలంతా వాళ్లమ్మతో టెంపుల్స్ ‌తిరిగానని డ్రాయింగ్స్ ‌వేస్తుంటే చూశానని చెప్పాడు. రోజూ కలిసే వాళ్లం. నీ ముక్కెందుకు అంత పొడుగ్గా చివర వంకరగా ఉంది. ఇక నించీ నువ్వు ‘పారెట్‌’ ‌నీ తలెందుకు అట్టా ఎర్రగా ఉంది. నువ్వు ‘రాగి చెంబు’ అంటే పడి పడినవ్వాడు. నాకు చాలా సమస్యలు ఉన్నయ్యి. అయ్యి నీతో చెప్పుకోవాలి. అని అలా రోజూ ఇద్దరం కలసి తిరగటం, ఆటలు, గోల.

మా ఇద్దరివీ మరీ అంత చైల్డిష్‌ (‌పిల్లల) ఆటలేం కాదు. టీనేజ్‌కీ, యంగ్‌స్టర్స్‌గా మారే మధ్య దశ ఆటలనుకుంటా. అవి ఆటలా చేష్టలా తెలియదు. తేనెకళ్లు, సన్న ముక్కు, రాగి జుట్టు ఉన్న పద్నాలుగేళ్ల పిల్లాడు, ఏదో ఒక పని చేత్తా ప్రతిదాన్ని పరిశీలనగా చూస్తా, నవ్వినపుడు ముక్కూ, పెదవులు కదిలించటం, చాలా దగ్గరగా నిలబడి మాట్లాడటం, ఇది ఏంటోగా ఉండేది. మరి నా తరగతి అబ్బాయిలతో ఇట్లా అనిపిచ్చలా. నాకన్నా పెద్ద ఆనంద్‌ ‌వాడితో కూడా చాలా క్లోజ్‌, అమ్మా వాళ్లు ఊరెళితే నేను, అన్నయ్య, వాడూ అందరం ఒకే దగ్గిర పొడుకున్నా ఏమీ తేడాలేదు. కానీ వీడు మాత్రం తేడాగాడు. వీడిని చూత్తే నా కళ్లు నవ్వుతయ్యి. ఎందుకు? ఏమో చెత్తగాడు. మొత్తానికి నచ్చుతాడు.

గేదల్ని తోలుకుని పాలేరు నదికి ఎలతంటే వచ్చా. ఎనకాల తోకలాగా వీడూ తయారు. ఈడితో పెద్ద గేదని తోమిచ్చా. కబుర్లు చెప్పుకుంటా లోతుకి ఎల్లాం.

‘సిరీ ఈత కొడదామా’
ఈదుకుంటా దూరం వచ్చాం. ఒక దగ్గిర ఆగి నా శిల్కు లంగాని గొడుగులాగా చేసి ఆడతన్నా.
‘పారెట్‌ ఐ ‌వాంటు ఆస్క్ ‌సమ్‌థింగ్‌’ (‌నిన్నొకటి అడగాలి)
‘ఏంటది’?
‘విల్‌ ‌యు బి మై గాళ్‌’ (‌నా అమ్మాయిగా ఉంటావా?)
‘అదేంటో అర్థం  కాలేదా? అయ్యిందా, ఎంతో మంది విదేశీ జంటల్ని చూశాం. నాదాకా వస్తే ఏంటో ఒకలాంటి.. ఏం చెప్పాలో తెలియలా’.
‘సరే అంటే చెయ్యి పట్టుకుని ఇద్దరం ఈదుదాం’ అని చెయ్యి చాచాడు. ఆ చేతిని అందుకుని ఈదాం.
దగ్గరగా జరిగి ‘యు ఆర్‌ ‌మై గాళ్‌’.

‌చూపులు, మాటలు, నవ్వులు, పక్క పక్కన కూచ్చోటం, చేతులు పట్టుకోటం, ఇలా ఉండేవి మా చేస్టలు. తన దగ్గరున్న డబ్బులతో లంబాడీలు కుట్టిన గవ్వల నడుం పట్టీ కొని నా నడుముకి చుట్టాడు.

‘డబ్బులు ఎక్కడియ్యి, మీ అమ్మ ఇచ్చిందా’

‘కాదు. మేం పని చేసుకుని పాకెట్‌ ‌మనీ సంపాదిస్తాం. నేను రోజూ రొండు గెంటలు లెదర్‌ ‌కటింగ్‌కి వెలతా’.
రోజూ బడిదాకా దించటం, తిరిగి తీసుకురాటం, బలే సరదాగా ఉండేది. ఒకసారి ఎక్కువ కుచ్చులున్న పట్టులంగా వేసుకున్నా. స్టిచ్‌డ్‌ ‌దిస్‌ ‌విత్‌ ‌లాంగ్‌ ‌క్లాత్‌, అం‌డర్‌ ‌దిస్‌ ‌యు వేర్‌ ‌లంగరీ’ నవ్వొచ్చింది తన అనుమానానికి, ఎందుకో సిగ్గుపడ్డాను కూడా.
‘షటప్‌ ఇట్టాంటియ్యా నువ్వు అడిగేది’ ఆరోజంతా బిడియంగా అనిపిచ్చింది.

‘వై షై , ఇట్స్ ‌మై డౌట్‌, ఐ ‌హావ్‌ ‌టు ఆస్క్’
‌కబుర్లు బాగా చెప్పేవాడు.
హిల్‌ఫోర్ట్ ‌టెరిల్‌ (‌లండన్‌) ‌ప్రాంతంలో వాళ్ల స్పెన్సర్‌ ‌ఫ్యామిలీ బంగళా గురించి, తన స్కూలు, ఆల్గేసిటీ (నాచుతో కప్పి ఉండటం), తన ఆటలు, చిన్నప్పటి నుంచి ఇండియా రాటం వలన ఇండియా అంటే ఇష్టం, మరీ ఎక్కువగా చలికాలంలో ఇక్కడ బాగుంటదని, ఇక్కడికి రావటం కోసం సంవత్సరం అంతా సెలవలు తీసుకోకుండా వాళ్ల అమ్మా, నాన్న పనిచేస్తారని, రొండు నెలలు వాళ్ల అమ్మ గోపురాలు, ప్రహరీల నమూనాలని స్కెచ్‌లుగా మార్చి  వాటిని రీసెర్చ్ ‌చేస్తుందని చెప్పాడు. ఇంకా పదహారేళ్ల వరకే అమ్మా నాన్నా పోషిస్తారని, తరవాత సంపాదనా తోడూ సొంతగా ఎతుక్కోవాలనీ, డేటింగ్‌ ‌చెయ్యకపోతే తప్పుగా చూస్తారు. అక్కడ నాకు ఎవరూ నచ్చలేదు. లక్కీని…. ఇక్కడ నువ్వు నచ్చావు. స్వీట్‌ ‌గాళ్‌ అన్నాడు. నేను చెట్టుమీద చిలకల్ని చూస్తన్నా. ఏదో ఆలోచిస్తా వింటన్నా.
‘ప్యారెట్‌, ఆర్‌ ‌యు ఓకే, యు ఆర్‌ ‌నాట్‌ ‌కేరింగ్‌, ‌నాట్‌ ‌లిజనింగ్‌ ‌మి. (నువ్వు నా మాటల్ని నన్నూ లెక్కలేకుండా తీసుకున్నావ్‌)’ అని అలిగి ఎల్లిపోయాడు.

‘ఏయ్‌ ‌చెంబూ, డేవీ, డేవిడ్‌ ‌వెయిట్‌’.. ఆగలేదు.
తిక్క సచ్చినోడు, ఎక్కడికి పోతాడు ఆడే తిరిగొత్తాడని ఊరుకున్నా. మరుసటి రోజు ఆదివారం, మధ్యానం దాకా చూశా. రాలా. వాడి గుడిసెలోకి చూత్తే వాళ్ల అన్నతో లూడో (గేమ్‌) ఆడతన్నాడు. వాళ్ల అన్న నన్ను చూసి నవ్వి,,
‘యు బోత్‌ ‌ఫాట్‌ ‌యస్టర్‌డే’ (నిన్న కొట్టుకు చచ్చారా)

‘డేవీ సారీ, దా’
‘ఆటలో పావులు చెరిపేసి బయటకొచ్చి నా చెయ్యి పట్టుకుని, వాళ్ల అన్నకి ‘బై’ కూడా చెప్పకుండా పరుగో పరుగు’
‘మిస్‌ ‌యు సిరీ’
‘మిస్‌ ‌యు డేవిడ్‌’
‘‌నో కాల్‌ ‌మి చెంబు, ఐ విల్‌ ‌కాల్‌ ‌యు ప్యారెట్‌’
‌తుంగభద్ర ఒడ్డున పల్లంలో నాలుగు అంకెలా ఉన్న మలుపు దగ్గర రొండు బండల చాటున మా కబుర్లు. అక్కడ కూచ్చున్నాం.
‘నిన్న రాత్తిరి నాకు నిద్రలేదు. నీ వలన మా అన్న నిద్ర కూడా చెడగొట్టాను’

‘నువ్వు మీ అన్న దగ్గర పొడుకున్నావా’
‘అవును మరి నువ్వు’
‘మా అమ్మ దగ్గర’
‘దెన్‌ ‌విత్‌ ‌హూమ్‌ ‌యువర్‌ ‌డాడ్‌ ‌విల్‌ ‌స్లీప్‌ (‌మరి మీ నాన్న ఎవరితో పొడుకుంటాడు)
నాకేం చెప్పాలో తెలియలా. అమ్మకానీ, అమ్మమ్మ కానీ పక్కన లేకుండా నిదర ఎట్టా పట్టుద్ది. భయం కదా, ఈ విషయాలు మాట్లాడకూడదని అమ్మమ్మ చెప్పింది. అడిగితే మొట్టికాయలేసి చచ్చేటట్టు తిట్టుద్ది.

తినటం, చెట్లు ఎక్కటం, రాళ్లు, తుంగభద్ర, హంపీ శిధిలాలతో పాటు ఈ పిల్లాడు అంటే కూడా ఇష్టం. ఎప్పుడూ తల దువ్వుకోడు. ఆ రాగిరంగు జుట్టు అట్టా పెంచి సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టిచ్చుకునే వాడు. అమ్మమ్మ తన భాషలో..
‘ఆ తలకి నూని తగలబెట్టు కోడే,’ అనేది.

‘నో నుప్పు ఐ డోంట్‌ ‌వాంట్‌’ అనేవాడు. అందరం నవ్వుకునే వాళ్లం.
రోడ్డు మీద గణేశుడిది చిన్న రాతి శిల్పం దొరికితే తెచ్చి వేపచెట్టు కిందపెట్టి రోజూ దణ్నం పెట్టుకునే దాన్ని. తను కూడా ఎలిఫెంట్‌ ‌గాడ్‌ అని దణ్నం పెట్టుకునే వాడు.

మా పిన్ని కూతురు వచ్చింది. ఎప్పుడూ మాట్లాడతానే ఉండేది. చాలా గొప్పగా మాది పెద్ద ఇల్లు. నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు, పెదనాన్నలు కలిసి నలభై మందిమి ఉంటాం. జాయింట్‌ ‌ఫ్యామిలీ తెలుసా అని వాడి మెదడు తినటం మొదలుపెట్టింది.
‘హౌ మెనీ బాత్‌రూమ్స్ ‌ఫర్‌ ‌ఫార్టీ మెంబర్స్…’
‘ఓన్లీ వన్‌’ అం‌ది.
‘ఓఓ.. మైగాడ్‌ ‌హౌకెన్‌ ‌యు లివ్‌ ‌దేర్‌’
ఇది ఏం చెప్పాలో తెలియక నోరు తెరచుకుని బిగదీసుకుని నిలబడింది.

‘ఎక్స్‌క్యూజ్‌మి వి నీడ్‌ ‌ప్రైవసీ’ అని నా చెయ్యి పట్టుకుని ఈడ్చుకుపోయాడు.
‘ఈడు చెంబుగాడు కాదు పిచ్చిక గూడుగాడు. ఒరేయ్‌ ఎప్పుడో ఏ నుప్పు పుల్లో అంటుకుని గడ్డివామిలాగా ఆ తల తగలబడుద్ది’ అని తిట్టుకుంది. ఎప్పుడు సెలవులకి వచ్చినా ఎల్లే ముందు రొండు రోజులు కూచ్చుని జడకి తోలు బ్యాండ్లు, పర్సు, రిటన్‌ అ‌డ్రస్‌ ఉన్న ఇంటర్నేషనల్‌ ‌లెటర్స్ ఇచ్చి వెళ్లేవాడు’.

‘లండన్‌లో నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను సిరీ’ అని ప్రతిసారీ చెప్పేవాడు.
ఎప్పుడు ఉత్తరాలు రాసినా ‘టు మై గాళ్‌తో మొదలయ్యి, మిస్‌ ‌యు తో ముగిసేది.


డేవిడ్‌ – ‌సిరి 1986
డేవిడ్‌ – ‌సిరి 1988
డేవిడ్‌ – ‌సిరి 1990
డేవిడ్‌ – ‌సిరి 1992
డేవిడ్‌ – ? 1994 ‌నుంచీ ఒక్కడి పేరే చెక్కి ఉంది. సిరి కింద క్వచ్చన్‌ ‌మార్క్ ఉం‌ది. అక్కా చెల్లెళ్ల గుండుని తడుముతా ఎర్రపడిన ముక్కూ, వణకే గుండెతో చూశా. పోయిన ఏడాది కూడా వచ్చాడన మాట. పేర్లని ఆప్యాయంగా తడమాలి అనిపించింది. పిల్లలు చూస్తే బాగోదని ఊరుకున్నా.

వాళ్లని పిలిచి ‘ఈరోజు నాకు సన్‌సెట్‌ (‌పొద్దువాలటం) చూడాలని ఉంది. మీరు ఎల్లిపోండి. ఏడింటికి వస్తాను’.
‘నో మా.. నిన్ను ఒంటరిగా వదలను. ఎంతసేపు అయినా ఉండు. మేం కొంచెం దూరంగా కూచుని కబుర్లు చెప్పుకుంటాం’
చుట్టూరా కొండలు, పగిలిన సిధిలాలు, విరిగిన మంటపాలు, వీటి అన్నిటినీ చుట్టి గొంతుకకి పట్టిన కంఠి (హారం) లాగా పెనుగొండకి వెళ్లేదారి. కొండల మధ్యలోనించీ నేలలోకి తనని కుక్కుకుంటున్న సూర్యుడు. అప్పుడు అదే యవ్వనంలో డేవిడ్‌ ‌సాహచర్యం.
మైఖేల్‌ ఏం‌జిలో అంత అందంగా ఉండని మనిషి, ప్రపంచంలోనే అందమైన• డేవిడ్‌ ‌శిల్పాన్ని మలిచాడు. ఓ మత పెద్ద ఇంత అందంగా ఎలా చెక్కావు అంటే ‘అందులో డేవిడ్‌ ‌కాని దాన్నంతా తీసేశాను’ అన్నాడంట. ఎప్పుడూ నీడలా ఉండే నా జీవితపు విషాదం వెనకాల గోరింట పంట లాగా పెదాల మీద నవ్వు పూస్తంది అంటే ‘డేవీ’నే కారణం. తను చెక్కిన శిల్పం నేను. వికారాలన్నిటినీ విరగొట్టి కొత్త సౌందర్యంతో నన్ను మలిచాడు. నా జీవితపు మైఖెల్‌ ఏం‌జిలో అతను. చాలా అరుదైన కోహినూర్‌ ‌లాంటి చెలికాడు. పోగొట్టుకున్న నెమలి సింహాసనం లాంటి జ్ఞాపకం అతను.


ఈసారి సెలవల్లో వాళ్ల అన్న రాలేదు. హైస్కూల్‌ అయిపోయిందని (10+2) ఇప్పుడు ఇక కాలేజ్‌కి వెళ్లాలి. ఈసారి ఆరు నెలల సెలవులున్నయ్యి. స్వీటీ మనం చాలా హ్యాపీగా గడపొచ్చు అని బుగ్గకి బుగ్గ ఆనించాడు. వాక్‌మెన్‌, ‌పాటల క్యాసెట్స్ ‌తెచ్చాడు. మొట్టమొదటిసారిగా ‘హెవీమెటల్‌’ ‌పాటల్ని పరిచయం చేశాడు. సంగీతం అంటే ఇలా కూడా ఉంటదా అనుకున్నా. ఊరి మొత్తంలో వాక్‌మెన్‌ ‌నా దగ్గరే ఉండేది, పైగా ఒక అబ్బాయి ఇచ్చింది. ఇక మనం రచ్చా, రావిడిఅన్నట్టుగా గేదలకి కుక్కలకి, మేకలకి, మొక్కలకి ఇనిపిచ్చే దాన్ని. ఒక కొత్త వింత సంగీత పరికరం చేసి ఇనిపించాడు. బ్రహ్మజెముడు కాడల గుజ్జు తీసేసి ఆ పొడుగుదాంట్లో బద్దీలు దూర్చి బూరలుగా చేసి ఊదటం. వాకిలి నిండా బ్రహ్మజెముడు ముళ్లు ఏసినందుకు అమ్మమ్మ చీపురు తీసుకుని ఎమ్మటపడింది. అమ్మమ్మ తిడతంటే వాటిని రిపీట్‌ ‌చేసేవాడు.

సచ్చినాడా – సఛినాడా, జిమ్మదియ్య – జమదియ, మొదులారా – ముదులారా, జులపాల పోలిగా – జలపాల పోలిగా ఇట్టా. నాకు లెక్కలంటే బయ్యం. రోజూ సాయంత్రం నాకు ప్రయివేటు లెక్కలు నేర్చుకోవాలంటే బూరల సంగీతం నేర్పాలి.
పౌర్ణమి రోజుల్లో అదర్‌సైడ్‌ (‌తుంగభద్రకి అవతల) వెళదాం అనేవాడు. శని, ఆదివారాలు అరగోలి (చిన్నపడవ) ఏసుకుని నది దాటేవాళ్లం. వీడి సావాసం వల్ల అమ్మ, అమ్మల దగ్గిర పడుకోటం మానేసి వంటరిగానే పడుకోటం అలవాటయ్యింది. వెన్నెలలో సిధిలాలని చూత్తా, కబుర్లు, నడక, నీళ్లలో చందమామని చెదరకొట్టటం, తన బడి కబుర్లు, అమ్మాయిల, అబ్బాయిల ముద్దులు, బ్రిటిష్‌ ఇం‌గ్లిష్‌ ఎం‌దుకు అమెరికన్‌, ‌యూరోపియన్‌ ఇం‌గ్లీషుకన్నా గొప్పదో, వాళ్ల యాసలో తేడాలు, ఎక్కిరింతలు.. ఇలా సంగీతం కుక్కునపల్లి (లంబాడీల) సంతకెళ్లేది..

ఓ వెన్నెల రాత్రి తన మాటల్ని గాలికి ఊగుతున్న నందివర్ధనం పువ్వులాగా ఇంటన్నప్పుడు…
‘కెన్‌ ఐ ‌కిస్‌ ‌యు’
ఏం చెప్పాలో అర్ధం కాలేదు. చేతులతో మొకాన్ని దగ్గరగా తీసుకుని తన పెదవులతో పెదవుల్ని కలిపేసుకుని, ఆ చర్యకి మాయమైపోయిన నేల, ఏరూ, ఊరూ, నేనూ.. ఇంకా చెప్పాలంటే, తోలు పొరల్ని చీల్చుకు వచ్చే రోమాల మొనల్లాగా, ఏదో, ఏదో గమ్మత్తుగా మత్తుగా.. ఎమ్మటే గందరగోళంగా.. బండమీద చచ్చుపడిపోయా. తన భుజంమీద వాలిపోయా. తేరుకుని
‘ముద్దెందుకు పెట్టావు’

‘మా అమ్మా,  నాన్నా కిస్‌ ‌చేసుకుంటారు కాబట్టి’
‘కానీ మా వాళ్లు ముద్దు కాదు కదా, పక్క పక్కన కూచోటం కూడా చూళ్లేదు’
‘నీకో విషయం తెలుసా మా దేశంలో ముద్దు చాలా మామూలు. హైస్కూల్‌ ‌నించీ మొదలు పెడతారు. లెటర్స్ ‌కూడా రాసుకుంటారు. నువ్వు రాసే సుద్దపప్పు లెటర్స్ ‌చూసి మా ఫ్రెండ్స్ ‌నువ్వు నాకు స్పెషల్‌ ‌ఫ్రెండ్‌ ‌కాదు. ఉత్త ఫ్రెండ్‌ అని అనుకుంటన్నారు. ఈసారి నీకు ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్‌ ‌చెయ్యటం, గ్రీటింగ్స్ ‌రాయటం నేర్పుతా’
‘నీకు గ్రీటింగ్స్, ‌పోస్ట్‌కార్డస్ ‌పంపాలని నాకూ ఉంది. కానీ దానికోసం ఇంట్లో వాళ్లని డబ్బులు అడగటం ఇష్టం లేదు. వి వాంట్‌ ‌టు డు సమ్‌థింగ్‌’

‘‌దెన్‌ ‌హూ ఈజ్‌ ‌స్టాపింగ్‌  ‌యు’ (ఎవరన్నా వద్దన్నారా)
మరుసటి రోజు నా వ్యాపారం చెప్పాను.
‘గో హెడ్‌’ అన్నాడు.

‘రోజూ సాయంత్రం బాదం పాలు, రాగి అంబలి అమ్మేదాన్ని. అమ్మమ్మ చెయ్యటం నేను అమ్మటం. యాభై రూపాయిలు దాకా ఒక్కసారి మిగిలేది. సాఫ్ట్‌గా మాట్లాడటం, థాంక్స్ ‌చెప్పటం, వాళ్లని మాటల్లో పెట్టే విధానం అన్నీ నేర్పాడు. ఓసారి మాట్లాడుతూ రాత్రి ఒంటి గంట అయ్యింది. ఆవలింతలు వచ్చాయి. ‘సరే నిద్దరొస్తాంది, బొజ్జోవాలి ఎదాం’ అన్నా.

‘చిన్న పిల్లలా కిడ్‌లా మాట్లాడొద్దు. చిలకపలుకులు వద్దు, బేస్‌ ‌వాయిస్‌, ‌లంగా, ఓణీ, పొడుగు జడ, ట్రై టు బి లైక్‌ ‌దట్‌. ‌కొన్నిసార్లు హస్కీ టాక్‌.. ‌నువ్వు అలా ఉంటే బాగుంటావు. పద వెలదాం’

కాలిగజ్జెలు తీసి చప్పుడు కాకుండా వచ్చి పడుకున్నాను. పొద్దునే ఊరిలో జాతర. నగలు, పట్టు లంగా, చిట్టి చేమంతులు, జాగర్తగా తీసుకెళ్లి తీసుకురా అని పాలేరుకి అమ్మమ్మ ఆర్డర్‌. ‌కెమెరా, లాల్చీ, పైజామాతో చెంబు రెడీ.

‘పారెట్‌ ‌యు లుక్స్ ‌గాడెస్‌ ‌పర్వతీ (పార్వతి). అయామ్‌ ‌లక్కీ’ (పార్వతిలా ఉన్నావు)
‘నీ మూడో కన్ను ఎక్కడ దాచావు’ అన్నా.
‘థాంక్యూ. నాకు ఇండియాలో స్పెషల్‌ ‌గాళ్‌ ఉం‌ది అంటే నా ఫ్రెండ్స్ ‌నమ్మటల్లేదు. నీకోసం బడిలో స్పెషల్‌ ‌సబ్జెక్ట్‌గా ఫొటోగ్రఫి నేర్చుకున్నాను. నీ ఫొటోస్‌ ‌వాళ్లకి చూపిచ్చి నోళ్లు మూయిస్తా. రోజంతా ఐదారు రీళ్లు ఫొటోలుగా తీశాడు. అటుగా ఎల్లే ఫారినర్స్‌ని ఆపి నన్ను ఎత్తుకుని పొడుగు జడని మెడచుట్టూ తిప్పుకుని, మా నల్ల మాళీ గేద మీద, ఉప్పు మూటలాగా, ఫొటోలే ఫొటోలు. చాలా ఎత్తుగా ఉన్న తను నాకు బలమైన ఆసరా అనిపించాడు.


దసరా సెలవల్లో వచ్చిన ఇరిటేషన్‌ ‌పేరు పెద్ద మనిషవ్వటం. అమ్మతో పోట్టాడి మరీ తాటాకుల మీద కూచ్చోపెట్టింది అమ్మమ్మ. మట్టి మూకుట్టో పప్పు, నెయ్యి, కొబ్బరి బెల్లం నువ్వుల చిమ్మిడి తొక్కటం, ఇవేమీ చెంబుకి అర్ధం కాలా. ఆనంద్‌ (‌ఫ్రెండ్‌) ‌చెబితే పడి పడి నవ్వాడు. అమ్మమ్మ దగ్గిరగా వచ్చిన వాడ్ని చూసి కళ్లు ఉరిమి దూరంగా సావమను అంది.

‘గో డేవీ, యు ఆర్‌ ‌నాట్‌ ‌సపోజ్‌ ‌టు సిట్‌ ‌హియర్‌, ఐ ‌యామ్‌ ‌మెచూర్డ్’
‘‌వాట్‌ ఎబౌట్‌ ఆల్‌ ‌దీజ్‌ ‌డేస్‌’ అని నవ్వి.
సిరీ డాల్‌, ‌మై ప్యారెట్‌, ఐ ‌విల్‌ ఎక్స్‌ప్లెయిన్‌ ‌యు’
ఒక పుస్తకం తెచ్చాడు. అది యవ్వనంలో అడుగుపెట్టే వాళ్లు శారీరక మార్పులకి సంబంధించింది. పెద్దమనిషి అవ్వటం సాధారణ చర్య అది రక్తం కాదు, టిష్యూ అని ఉంది. ఆ విషయం బొమ్మలతో సహా చూపిచ్చి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కడుపులో బిడ్డకి అదే ఆహారం అని చెప్పాడు. దీన్ని నెలనెలా ఎట్టా భరిచ్చాలి. డేవిని వదిలి అమ్మని పిలిచా.

‘అమ్మా ఈ ఇరిటేషన్‌ ‌వద్దమ్మా. అది నెలనెలా ఒకేసారి బయటికి వచ్చే మిషన్‌ ఉం‌టే బాగుణ్ణు. ఈ నెప్పి కూడా వద్దు అని ఏడ్చా. తను కూడా ఒకప్పుడి ఇలాంటి ప్రశ్నలు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా బయటికి వచ్చింది కదా. కళ్లని నీటి కాలువలతో నింపుకుని ఇవన్నీ నేచర్‌ ‌కాల్స్. ఏ ‌వయసులో రావలసినయ్యి ఆ వయసులో వస్తయ్యి అని ఓదార్చింది.

డేవీని అడిగాను ‘నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు, ఈ పుస్తకాలు ఎక్కడివి?’
‘మా బడిలో ఇస్తారు. ఇయ్యన్నీ పెయింటింగ్‌లు, ఫొటోలు, సినిమాల ద్వారా చూస్తాం. యు ఆర్‌ ‌గ్రోన్‌ అప్‌. ఇయ్యన్ని నువ్వు కూడా తెలుసుకోవాలి. శరీరం, దాని నిర్మాణ రహస్యాలు అందరూ చదువుకోవాలి’.

‘ఆ వయసుకి నాకు వాడికన్నా తెలివయిన వాడు ప్రపంచంలో ఉండడు అనిపించింది’.
‘సిరీ నీకు తెలుసా ఓసారి మా అన్న అమ్మ దగ్గరికొచ్చి నేను వర్జినిటీ పోగొట్టుకున్నానని చెప్పాడు’.
‘మరుసటి రోజు నేను కూడా మా అన్నతో వర్జిన్‌ ‌కాదు అన్నాను’
ఆశ్చర్యపోయి,
‘నువ్వు చిన్నోడివి, ఒంటరివి, గాళ్‌ ‌ఫ్రెండ్‌ ‌లేదు అదెలా సాధ్యం’
‘రాత్రి మంచం పయిన నా పురుష అవయవం నించీ పడిన ద్రవాన్ని చూపిచ్చాను’

‘అప్పుడు అది వేస్ట్ ‌జెల్‌’ అని చెప్పాడు. ఎవ్వరికీ మొదట్లో అంతా తెలియదు. అంతా గందరగోళంగా ఉండేది. అందరూ కలసి చెబితే, ఇప్పుడు నేను నీకు చెప్పగలుగుతున్నాను.
ఎన్నో చర్యలు ముఖ్యంగా రొండో తరం శారీరక మార్పులు, జుట్టు, చర్మం, టి జోన్‌ ‌శుభ్రత మా మధ్య వచ్చేవి. ఇయ్యన్నీ నాకు ఏ టీచరూ, పెద్దలూ చెప్పలేదు. లండన్‌ ‌నించీ కండోమ్‌ ‌తెచ్చి చాలా రహస్యంగా చూపిచ్చాడు.

ఒకసారి ఉండబట్టలేక అడిగాను. ‘ఆ.. అనుభవం ఎలా ఉంటుంది’ అని.
‘నాకూ తెలియదు. ప్రాక్టికల్‌గా చెయ్యలా, కానీ ఎక్కడో చదివాను’
‘అదే చెప్పు’.
‘బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉంటది అని’. కాసేపాగి నా వైపుకి తిరిగి.
‘ఐ వాంట్‌ ‌టు లూజ్‌ ‌మై వర్జినిటీ విత్‌ ‌యు ఓన్లీ’ అని ఎల్లిపోయాడు.
అప్పుడప్పుడే కలిగే ఊహలు, కోరికలు, బిడియం, మధురమైన దిగులుతో ఉండేయి. సెలవలు అయిపోవచ్చినయ్యి. రేపు తను వెళతాడు అనగా మా బండల మీద కూచ్చున్నాం. నీళ్లు నిండిన కళ్లతో…
‘వెళ్లొద్దు డేవీ’
‘కాలేజ్‌ ఉం‌ది. మళ్లీ వచ్చేస్తాకదా’

‘నాకో అనుమానం, నా కోసం ప్రామిస్‌ ‌చేశావు కదా. అదే నీ వర్జినిటీ ఎవరితోనైనా పోగొట్టుకుంటే నాకు తెలవదు కదా’
‘చాలా ఆశ్చర్యంగా, కొంచెం కోపంగా గట్టిగా నన్ను పట్టుకుని, ఏ దేశంలోనైనా ఆడపిల్లకి అనుమానం ముందే ఉంటదంటే నమ్మలేదు. నేను ‘సిరీ’బోయ్‌ని. బిలీవ్‌ ‌మి. సిరి కాని అమ్మాయి నాది కాదు’.


నేను తనకి బాగానే ఇంగ్లీషులో ఉత్తరాలు రాసేదాన్ని. వాళ్ల నాన్నకి చెందిన కస్టమ్‌మేడ్‌ ‌బైక్‌ ‌షాప్‌లో సీటు కవర్లు కుట్టటం, వాటి పైన తోలు డిజైన్లు చెయ్యటం నేర్చుకుంటున్నానని, తను చేసిన వాటి బ్రాండ్‌ ‌నేమ్‌ ‘‌సిడాడ్‌’ అం‌టే సిరీ డేవిడ్‌ అనీ, తన అన్న ఇంట్లో ఉండటం లేదని గాళ్‌ ‌ఫ్రెండ్‌తో వేరే ఉంటున్నాడని, తన స్కిల్స్‌కీ, హ్యాండ్‌ ‌వర్క్‌కీ గుడ్‌ ‌మనీ వస్తుందనీ, చాలా గిఫ్ట్‌లు కొనగలను, నీ బిజినెస్‌లో కొత్త ప్రయోగాలు చెయ్యి. అమ్మమ్మ కొత్త తిట్లు క్రియేట్‌ ‌చేస్తుందా, క్యాథీ, ధోరా (ఫ్రెండ్స్)‌ని, మీ పిన్ని కూతురినీ అడిగానని చెప్పు. ఎలిఫెంట్‌ ‌గాడ్‌ ‌బొమ్మ కొని రోజూ పూజ చేస్తున్నా’.

సిరీ నీ కోసం బ్యూటిఫుల్‌ ‌లింగరీ (లో దుస్తులు) తీసుకున్నాను.
మిస్‌ ‌యు
బై ప్యారెట్‌, (‌చిలుకమ్మ)
ఆల్వేస్‌ ‌యువర్స్
‌డేవిడ్‌ ‌స్పెన్సర్‌.  ….. …

ఈసారి డేవీని చూస్తే నాకు చాలా బిడియం, భయంగా అనిపించింది. వాయిస్‌ ‌గంభీరంగా అయిపోయింది. ఇంట్లో ఎవరో బంధువులు రాటం వలన చాలా ఆలస్యంగా సీక్రెట్‌ ‌ప్లేస్‌కి వెళ్లాను. చాలా కోపంగా ఉన్నాడు. తనతో గడపనందుకు కాదు. జుట్టు చివర్ల, కనుబొమ్మలూ కత్తిరించినందుకు. నా మోపెడ్‌ ‌సీటుకి లెదర్‌ ‌కవర్‌, ‌హ్యాండ్‌ ‌బ్యాగ్‌, ‌మినీ లెదర్‌ ‌స్కర్ట్, ‌జడ కోసం రకరకాల తోలు బ్యాండ్లు చేసుకొచ్చాడు. ఇంట్లో వాళ్లు తన పనితనానికి మురిసిపోయారు. అమ్మమ్మ చేసిన పప్పు, ఆవకాయ, నెయ్యి, రోటి పచ్చళ్లు, రొప్పుతా తినేవాడు.

అమావాస్య రోజు ఇంట్లో చెప్పి డార్క్ ‌డే పార్టీకి ఎల్లాం. అది ‘సిజరీ’ బాబా  గుహలో, పీటర్‌ ‌శాక్సాఫోన్‌, ‌మురళి తబలా, డేవీ బూరల సంగీతం, నా డాన్సూ, ఆనంద్‌ ‌జానపదాలు, ఫైర్‌, ‌నెగడు, తిండీ అంతా అయ్యేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. పొద్దున్నే ఎల్లొచ్చులే అని బండల మీద వాలాము. డేవీని ఆనుకుని మొదటిసారి, చాలా దగ్గిరగా పడుకోడం, వీపు నిమురుతా ‘స్లీప్‌ ‌మై ఏంజల్‌’ అం‌టా దగ్గరకి జరిగాం. కానీ కాసేపటికి ఇద్దరి పరిస్ధితీ చాలా ఇబ్బంది. ఇలా కాదు, ఇంకేదో కావాలి, ఈరోజు డేవీ తీసుకున్న ముద్దు తేడాగా ఉంది. తనే తేరుకుని, నేను మీ ఫ్యామిలీకి, మీ పద్ధతులకీ రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్లు ఎస్‌ ‌చెప్పేదాకా ఎదురుచూస్తాను. శారీరకంగా పెళ్లికి ముందు కలవటం మీ పద్ధతి కాదు, అని దూరంగా ఎల్లి పది నిమిషాల తరవాత వచ్చాడు.

‘ఎక్కడికి వెల్లావు? ఈ పది నిమిషాలూ ఏం చేశావు?’
‘నిన్ను ఊహించుకుని రిలీవ్‌ అయ్యాను’
‘అంటే’
‘మాస్టర్‌ ‌బేట్‌ ‌చేసుకున్నా. క్రిటికల్‌ ‌కండిషన్స్‌లో సెక్స్ ‌వీలుకానప్పుడు ఇలా చేసుకోవచ్చని నేర్చుకున్నా’.
‘అందరు అబ్బాయిలూ అలానే చేస్తారా మీ దేశంలో’
‘ఏమో, కాదనుకుంటా, కొందరు నా ఫ్రెండ్స్ ‌నా వయసుకే సెక్స్ ‌చేస్తారు’
‘అలా చేస్తే ఎలా ఉంటది’

‘ఇవన్నీ నా సొంత అనుభవాలు, సెన్సెస్‌ ‌హాయిగా, ఇరిటేషన్‌ ‌నించీ విముక్తి, అయినా ప్యారెట్‌ ‌మన పెళ్లి అయ్యే వరకూ నిన్ను నేను ఏమీ చెయ్యను. మీ ఇంట్లో ఒప్పిచ్చి నిన్ను నాతో తీసుకుని ఎలతా’

‘నేను రాను, నువ్వే ఇక్కడ ఉండు, చుట్టాలు, స్నేహితులు, తుంగభద్ర, పడవలు, గేదలు నేనెక్కడా ఉండలేను’
‘నేనున్నాను కదా. నీకు అన్నీ నేనే కదా. నా లైఫ్‌ ‌పార్టనర్‌ అయ్యేదీ నువ్వే కదా. చదువు అయ్యేదాకా వెయిట్‌ ‌చెయ్యి చాలు. ప్రతీ సంవత్సరం నిన్ను ఇక్కడికి తీసుకొస్తా’.

అట్లతద్దె రోజు చీర కట్టుకుని ఉయ్యాల ఊగుతున్నా. ఊపే వాళ్లని పక్కకి జరగమని ఉయ్యాల ఎక్కి ఎదురు ఊపు అందుకున్నాడు. ఆనంద్‌ ‌మిగతా ఫ్రెండ్స్, ‌కేకలు, ఈలలు. మా పిన్ని కూతురు దిగు నేను ఊగాలి అని దించింది. దాన్ని యువర్‌ ‌బొంద, యువర్‌ ‌దెవసం అని తిట్టాడు. నా చెవిలో ‘నువ్వు ఇలాంటి సెక్సీ డ్రస్‌ ‌వేసుకుంటే (చీర) నా వర్జినిటీ పోగొట్టుకోవటం అసలు పోస్ట్‌పోన్‌ ‌చేసుకోలేను’

టీనేజ్‌లో నా అందాన్ని పొగుడుతా, కొంత నేర్పుతా. ఆకాశంలో వెలుగు ఆశల పల్లకిలో ఊరేగించే వాడు. ఎంతయినా నేను మెచ్చిన వాడు కదా. ఎతికి, ఎతికి ఒక పుస్తకం గిఫ్ట్ ఇచ్చాడు. ‘అది ‘యూజెస్‌ ఆఫ్‌ ‌నీమ్‌ ‌ట్రీ’, ఇంటి చుట్టూ ఉన్న యాప చెట్లతో ఇన్ని ఉపయోగాలా అని నోరు తెరుచుకుని చదివా. కాలివేళ్లకి మధ్యలో దూది ఉంచి గోళ్లరంగు వేసేవాడు. తల్లిదండ్రుల స్ధానాన్ని లాగేసుకున్నాడు. అభద్రత, భయంతో కలిసిన ఈ వయసునీ, శారీరక మార్పుల్నీ, తన వలన, తన స్నేహంతో తేలికగా ఎదుర్కొన్నా. ఎన్నో రాత్రుల ఉద్రేకం వచ్చేది.

ఒకసారి ఇద్దరం కలిసి చూద్దాం అని అడిగా..
చాలా ఆశ్చర్యపోయి ‘సిరీ ఇట్స్ ‌నాట్‌ ‌మ్యా•రాఫ్‌ ‌రిలీఫ్‌, ‌మ్యాటరాఫ్‌ ‌లైఫ్‌ ‌టైం సెన్సిటివ్‌ ‌ఫీలింగ్స్, ‌నీ మీద పడి బ్యాడ్‌ ‌బాయ్‌లాగా మిగలను. మనకి మన పెద్ద వాళ్లు ఉన్నారు’
మాకు ఒకళ్లంటే ఒకళ్లకి ఇష్టం అని తెలిసి నా ఫ్రెండ్‌ ‌కమ్‌ ‌సీనియర్‌ ఆనంద్‌ ఎప్పుడూ మాకు ముందు చదువు కంప్లీట్‌ ‌చెయ్యండి అని సలహా ఇచ్చేవాడు.
‘సిరీ నీ జీవితం ఈ తెల్లాడితో తెల్లారాలని రాసి ఉంది’ అనేవాడు.


కాలం యవ్వనంలో వచ్చే శారీరక మార్పుల్లా మారిపోయింది. కాలేజ్‌లో చేరా. అమ్మకి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్స్ ‌చుట్టూ తిరిగితే లివర్‌ ‌సిరోసిస్‌ ‌నెలల మనిషి అన్నారు. తన ఆరోగ్యం గురించి అర్ధం అయ్యి నా పెళ్లి చూడాలని అడిగింది. దగ్గర బంధువుతో పెళ్లి మాటలు, హడావిడిగా జరిగాయి. తను నాకన్నా పదేళ్లు పెద్ద. బొంబాయిలో ఉద్యోగం, అమ్మమ్మ దగ్గరకి వెళ్లు డేవిడ్‌ ‌విషయం చెప్పి నాకీ పెళ్లి ఇష్టం లేదని ఏడ్చాను. అమ్మమ్మ ఇలా అంది.

‘సిరి తల్లీ మా అందరికీ ప్రేమలు లేవా, హృదయాలు, ప్రియుడు, తలపులూ, స్పర్శలూ, తొలిముద్దులూ అందరికీ ఉంటయ్యి. మేం వాళ్లని పెళ్లి చేసుకోకలిగామా. కనీసం వాళ్లు ఎదురయితే మాట్లాడ కలుగుతున్నామా? అలా అని ఇప్పుడు ఉన్న భర్తలతో ఆనందంగా లేమా, జీవితాన్ని తేలిక చేసుకోవటం, వచ్చిన జీవితాన్ని, మనపాలిట పడ్డ మనిషిని మనతో కలుపుకోవటమే బతుకంటే. డేవిడ్‌ ‌గురించీ, నీ గురించీ, మీ ఇద్దరి దగ్గరతనం నాకు తెలుసు. యవ్వనంలో ఆమాత్రం ఆనందం, జీవితాన్ని అందంగా చూపిచ్చే ఓ స్నేహితుడు అవసరమో, అయినా మనం, మన అలవాట్లు, పద్ధతులూ వేరు. నిన్ను అరచి గీపెట్టి నా అంత దూరం ఇచ్చి పెళ్లి చెయ్యరు. అదే అలవాటవుతుంది. అన్నీ కాలమే నేర్పుద్ది. అమ్మకోసం ఈ పెళ్లి ఒప్పుకో. ఇంతకన్నా ఏం చెప్పలేను’.

డేవిడ్‌ని ఏం చెయ్యాలో, ఎక్కడ పారబొయ్యాలో అర్ధం కాలేదు. నన్ను నేనెక్కడ దాచుకోవాలో అంతకన్నా అర్ధంకాలా. ఈ జ్ఞాపకాలని ఏ ఊడని కొక్కాలకి తగిలించాలి. కాసేపటికి తేరుకున్నా. ఫొటోలు, ఉత్తరాలు, బ్యాగులు, గవ్వల ఆభరణాలు, గ్రీటింగ్‌ ‌కార్డులు, వాక్‌మెన్‌, ‌క్యాసెట్‌లు అన్నీ రంగం పెట్టెలో వేసి తాళం వేశా.

అబద్ధం ఆడటం ఇష్టంలేక తనకి విషయం అంతా ఉత్తరం రాసి శుభలేఖని పోస్ట్ ‌చేశా. పడని అలమరా తలుపులు మూసినట్టుగా అతి కష్టంమ్మీద ఆ జ్ఞాపకాల అరని మూసేశా.

కానీ ఆనంద్‌ ‌మాత్రం తన కళ్లతో డేవీ వెదికే కొండ కోనల్నీ, తుంగభద్రనీ ఇనిపించేవాడు.
‘ఆమె నా కోసం హంపీగా మారింది. నిరంతరంగా పారే తుంగభద్రే ఆమె. నేను నదిలో పాదంపెడితే తను నన్ను చుట్టుకున్నట్టుగా ఉంటంది’ ఇలా సాగేది అతని విరహపు బాధ.

పెళ్లి తరవాత బొంబాయి జీవితం, హడావిడి పరుగులు, బుల్లి పొట్ట. అమ్మ దూరం అయినాక బుల్లి బొజ్జతో కబుర్లు, పసికందుగా బయటకొచ్చిన అమ్మ. బాబుతో పాటుగా పేరు పక్కన పెరిగిన డిగ్రీలు.

ఫ్యాక్టరీ ఫ్లోర్‌ ‌పైనించీ పడిన ప్రమాదంలో మళ్లీ ఒకసారి తోడుని దూరం చేసిన కాలం. అదే ఫ్యాక్టరీలో అతని ఉద్యోగం, పెద్దమ్మ తోడుగా పెరిగిన కొడుకు మనిషిగా ఎదిగి గాళ్‌ ‌ఫ్రెండ్‌ని పరిచయం చెయ్యటం, కాలం రాగాలనీ కొత్త కొత్తగా పాడుద్ది. వాడికీ ఫారినర్‌ ‌తోడుగా దొరకటం ఏ రాగమో. మళ్లీ ఆ బుల్లెట్‌ ‌సీటు కవరు నా పాత పాటని తిరగతోడి పాడింది.

ఆనంద్‌, ‌ఫ్రెండ్స్, ‌మా కజిన్‌ అం‌దరూ రేపటి నా పుట్టినరోజుకి వచ్చారు. తింటా, మాట్లాడతా గడిపాము. డేవీ గురింఇ అడుగుదాం అని నోటిదాకా వచ్చింది. తను నా నించీ వేరుకాదు అనిపించింది.

గోధుమ రంగుకి నిండు మట్టిరంగు అంచున్న పట్టుచీర మెడలో నవాబుల ముత్యాల హారం, లూజుగా గాలికి వదిలిన జుట్టుతో నా పుట్టిన రోజుకి తయారయ్యాను. రాత్రి పదకొండుకి వీనస్‌ ‌నా కొడుకూ ఇద్దరూ పడవ ఎక్కిచ్చారు. బంగ్లా శరణార్ధి రవీంద్ర సంగీతం పాడుతా తెడ్డు వేస్తున్నాడు. డిసెంబర్‌ ‌చలి. కవర్‌లోనించీ తెల్లటి షాల్‌ ‌తీసి కప్పింది వీనస్‌.  ఇద్దరూ చెరోసారి కెమెరాతో ఫొటోలు దిగారు. ఆ పిల్లని దగ్గరకి తీసుకున్నా. ‘లవ్‌ ‌యు మామ్‌’ అం‌ది.

చావులోనూ, వేదనలోనూ నవ్వులు పూయించి ఆశలు కల్పించే వాళ్లు పిల్లలే కదా’.
పడవ దిగి ముత్యాల బజారు చేరేటప్పటికి ఆనంద్‌ ఎదురొచ్చాడు. అంతా ముందే చేరుకున్నారు. మంచు పొగలో అర్ధరాత్రి నా కోసం ఎదురు చూస్తన్నారు. చాలు, ఈ నలుగురూ చాలు, నేను అదృష్టవంతురాల్ని అనుకున్నా.

ఓ రాతి బల్లమీద కేక్‌ ఒక క్యాండిల్‌ ‌వీనస్‌ ‌వెలిగించి నా చేతికి చాకు ఇచ్చింది.
‘మమ్మీ మిగతా కాలం మొత్తం హ్యాపీగా ఉండటానికి ఈ కేక్‌ ‌కట్‌చెయ్యి అన్నాడు’.
ఆ వెలుగులో కేక్‌ ‌చూశా. నిజమా అని మళ్లీ మళ్లీ చూశా.
హ్యాపీ బర్త్‌డే టు సిరీ.
డేవిడ్‌ ‌స్పెన్సర్‌ అని.

సన్నటి వణుకు మొదలయ్యింది. తల ఎత్తి చూస్తే పొడుగుకాళ్ల మంటపం నించీ ఓ నీడ వచ్చింది. ఆ నీడ చేతులు నన్ను చుట్టుకున్నయ్యి.

దగ్గరగా వచ్చిన నా కొడుకు ‘ఆనంద్‌ ‌మావయ్య, చెప్పాడు. పర్మిషన్‌ ‌లేకుండా రంగం పెట్టి తెరిచి తనని కాంటాక్ట్ ‌చేసి కలిశాను. నువ్వు మనస్పూర్తిగా నవ్వటం చూడాలని ఉందిమా. మాకన్నా ఇప్పుడు నీకే తోడు అవసరం. అందుకే నా గిఫ్ట్ ‌డేవీ అంకుల్‌’.
‌డేవీ వైపు చూశా.

నా చెవిలో గుసగుసగా
‘నౌ ఐయామ్‌ ‌రెడీ టు లూజ్‌ ‌మై వర్జినిటీ’ అన్నాడు.

అది అర్ధం అయిన ఆనంద్‌,
‌నవ్వుతా ఉన్నాడు.

*

అతడు ఈ తరం

painting: Rafi Haque

painting: Rafi Haque

నా సెల్ మోగుతోంది.  కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో ఎవరికో కామెంట్ రాస్తున్న నేను లేచి వెళ్ళి మాట్లాడాలనీ,  కనీసం వంటింట్లో పని చేసుకుంటున్న మా పని అమ్మాయి హేమని ఫోన్ తియ్యమని అందామనీ లోలోపల అనుకుంటున్నాను కాని నోట్లోంచి మాట రావడం లేదు.  మెదడు పూర్తిగా ఫ్రెండ్ టైమ్ లైన్ మీద రాస్తున్న కామెంట్ మీద ఉంది.

హేమ ఫోన్ తీసుకున్నట్లుంది “హల్లో వినతక్కా బావుంటివా?”  అంటోంది.

‘ఓ,  అక్కా!?’  అనుకున్నాను.  ఫోన్ తీసుకురా హేమా అని అందామనుకునే లోపు నా కామెంట్ కి సమాధానం వచ్చింది.  మళ్ళీ ఇక దానికి సమాధానం రాయడం లో పడిపోయాను.

“ఆఁ ఉంది”  అంటోంది హేమ.   అక్క ఆ వైపునుండి  ‘ఏం చేస్తుంది?’  అని అడిగినట్లుంది “ఇంకేముందీ!!?  ఎప్పుడు చూసినా ఆ కంప్యూటర్ ముందే కూర్చుని ఏందేందో రాసుకోవడమేగా!  ఉండు లైన్లో.  ఫోన్ తీసుకెళ్ళి ఇస్తా”  అంటూ నా రూమ్ లోకి వచ్చి ఫోన్ నా చేతిలో పెట్టింది మా హేమ.

‘వాస్నీ,  అందరికీ నేనంటే తమాషా అయిపోయింది.  అసలు ఇదిగో ఈ ఫేస్ బుక్కే నా పరువు తీస్తోంది”  అనుకుని నవ్వుకుంటూ ఆ పిల్ల చేతిలోంచి ఫోన్ తీసుకున్నాను.

“చెప్పక్కాయ్,  ఎప్పుడు బయలుదేరుతున్నారు?”  చెవిలో ఫోన్ ఉంది కాని కళ్ళు మాత్రం కంప్యూటర్ స్కీ్రన్ మీదే ఉన్నాయి.

“రేపే కదా!?,   మేము పొద్దునే్న బయలుదేరతాం.  నువ్వు మూడుకి బయలుదేరితే సరిపోదా?  నేరుగా దిగువ తిరుపతిలోని  శ్రీనివాసం కి రా.   సాయంత్రం ఆరుకి అక్కడకి చేరేట్లు వస్తే మంచిది, చీకటి పడకముందే.   రాత్రికి శ్రీనివాసం లో ఉండి ఎల్లుండి వేకువఝామున్నే తిరుమలకి బయలుదేరదాం.   దర్శనం అయ్యాక పిల్లలు బెంగుళూరికి వెళ్ళిపోతారు,  నేను బావ తిరిగొస్తాం”  అంది.

అక్క మనవరాలికి తిరుమలలో పుట్టెంటు్రకలు తీయిస్తున్నారు.  మదనపల్లి నుండి తిరుపతికి మూడు గంటల ప్రయాణమే.  వెళ్ళొచ్చు కాని ‘దాని కోసం వెళ్ళాలా,  అబ్బా!’  అనిపించింది.   దాని కోసం అని కాదు కాని నాకెందుకో ఎక్కడకీ వెళ్ళాలనిపించడం లేదు ఈమధ్య.  నాకు మొదటి నుండీ కూడా ఫేస్ బుక్ లో గడపడం ఇష్టం.   మా అబ్బాయి రాహుల్ ఢిల్లీ యూనివర్సిటీలో చేరినప్పటి నుండీ  ఒంటరితనంగా ఉన్నట్లనిపించి ఫేస్ బుక్ లోకి మరీ ఎక్కువగా వెళ్ళడం అలవాటయింది.  ఇక అది అలవాటయ్యాక ఏమిటో మరి ఎక్కడకీ వెళ్ళాలనిపించడం లేదు.  ఇంత పిచ్చి మంచిది కాదని తెలుస్తోంది కాని కంప్యూటర్ ని వదలలేకపోతున్నాను.

“వద్దులేక్కాయ్  నేను రాలేను,  నాకు ఓపిక లేదు.  పెద్దోడి సెల్ కి ఫోన్ చేసి ‘నేను రావడం లేదురా’ అని చెప్తాలే”  అన్నాను.   మా పెద్దోడు అంటే మా అక్క కొడుకు. చిన్నోడు అంటే నా కొడుకు రాహుల్.

“సరేలే  అయితే,  కోడలు ఏమన్నా అనుకుంటుందేమో..   వాళ్ళకి నువ్వే ఫోన్ చేసి చెప్పు”  అంది.

“సరే”  అని  “తిరుపతి నుండి నువ్వు ఇక్కడకి వచ్చి పోరాదా?”  అన్నాను.

“వద్దమ్మాయ్,  బావకి జ్వరం బాగా తగ్గలేదు.  బర్రెలకి మేతా నీళ్ళూ….   చాలా పని ఉంటుళ్ళా”  అంది.

“ఊ,  సరే,  బై”  అన్నాను.

2.

తిరుపతిలో అక్కకి జ్వరం వచ్చిందిట.  బావది తనకి అంటుకోని ఉంటుంది.  వెనక్కి అంతదూరం ప్రయాణం చేయలేదని  బావని ఊరికి పంపి అక్కని వాడి కార్లో నా దగ్గరకి తీసుకు వచ్చాడు పెద్దోడు.    పెద్దోడు,  కోడలు,  మనవరాలు ఆ పూట ఉండి సాయంత్రానికి బెంగుళూరు వెళ్ళిపోయారు.

అక్కకి నా దగ్గరకి వస్తే విశా్రంతి.  హేమ అన్నీ చేసిపెడుతుంది చక్కగా.  రెండు రోజుల్లోనే అక్కకి జ్వరం తగ్గింది.  జ్వరం తగ్గగానే వద్దంటున్నా వినకుండా ఇల్లు సర్దుతానని కూర్చుంది.  నా దగ్గరకి ఎప్పుడొచ్చినా ఇల్లంతా శుభ్రం చేసి పెడుతుంది.  నాకు సుఖం ఆమె వస్తే.  నేను మరింత సేపు నేను నా సాహిత్య సేవలో అంటే ఫేస్ బుక్ లో,  వాట్సప్ లో పడిపోవచ్చు.

నాకు కబుర్లు చెప్తూ హాలంతా శుభ్రం చేసి,  మా అబ్బాయి రాహుల్  రూమ్ శుభ్రం చేయడానికి వెళ్ళింది.  దాదాపు పది అవుతుండగా “అమ్మాయ్, ఇటు రా”  అని పెద్దగా కేకేసింది.  ఆమె గొంతులో కంగారు.  ‘ఏదో తేలునో పామునో చూసినట్లుగా ఏంటి అలా అరిచింది?’  అనుకుంటూ పరిగెత్తాను.

అక్క చేతిలో ఏవో కాగితాలు!!

“చూడు,  నీకు తెలుసా ఈ సంగతి?”  అంది కాగితాలు నాకు అందిస్తూ.  నేను నిలబడే “ఏమిటివీ” అంటూ తీసుకుని చూశాను.

రాహుల్ క్లాస్ మేట్ మధుర అనే అమ్మాయి వీడికి రాసిన లవ్ లెటర్స్!!!

ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు కాని ఇలా వాళ్ళ మధ్య లవ్ అని నాకు తెలియదు.   ఎన్నోసార్లు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో కలిసి మా ఇంటికి వచ్చింది కూడానూ.  నాకసలు అనుమానమే కలగలేదు.  ఆ ఉత్తరాలు చూసిన నా ముఖం మాడిపోయింది.  నా ముఖాన్ని,  దానిలో కదలాడుతున్నా భావాల్ని చూస్తున్న మా అక్క ఇక నస మొదలుపెట్టింది.

“పిల్లాడు ఏం చేస్తున్నాడు,  ఏం రాస్తున్నాడు అని కూడా చూసుకోకుండా ఎప్పుడూ ఆ ఫేస్ బుక్కు లో పడిపోతే ఎట్లా?  కాలేజీకి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పి రావడం,  వచ్చాక  ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా  కంప్యూటర్ ముందు కూర్చోవడం – పనులన్నీ ఆ హేమ మీదేసి.  తెలియనోళ్ళకైతే చెప్పొచ్చు పెద్ద చదువులు చదువుకున్నదానివి నీకు మేము ఏం చెప్పగలం”  గొణుక్కుంటూ సర్దుడాపి గోడ వైపుకి జరిగి జారగిలబడి తల పట్టుకుంది.

నేను కూడా అక్క ఎదురుగ్గా కింద కూలబడి ఉత్తరాలు చదవసాగాను.

అవి ఆ పిల్ల రెండేళ్ళక్రితం పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు వీడికి రాసిన ఉత్తరాలు.  వీడు ఆ అమ్మాయికి రాసిన లెటర్స్ కూడా ఉన్నాయి.  ఇక్కడే దాచమని మళ్ళీ వీడికే ఇచ్చినట్లుంది.

యూనివర్సిటీకి వెళ్ళేముందు వాటినన్నింటినీ ఈ అట్టపెట్టెలో పెట్టేసి వెళ్ళాడనమాట.  నేను వాడి అలమరా చూడను కాబట్టి అవి నా కంటపడలేదు.

“ఏం చేద్దామే,  వాళ్ళ నాన్నకి చెప్తావా?”  అంది అక్క.

చందుకి చెప్తే నన్ను ఎన్ని మాటలంటాడో!  అక్క కాబట్టి నాలుగు తిట్టి ఊరుకుంది.  వాడు అలా ఉత్తరాలు రాయడానికీ,  నేను ఎక్కువసేపు ఫేస్ బుక్ లో గడపడానికీ సంబంధం లేకపోవచ్చు – పోనీ ఉందా!?  ఏమో!! –  ఏది ఏమైనా ఈ పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

Kadha-Saranga-2-300x268

అక్క వైపు బ్లాంక్ గా చూసి ఏమీ సమాధానం చెప్పకుండా మళ్ళీ ఉత్తరాలు చూడసాగాను.  రాహుల్ ఆ అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేస్తున్నాడులా ఉంది.  కొన్ని ఉత్తరాల్లో కవితలు కూడా రాశాడు.  వాటిని చూస్తుంటే నవ్వు రావలసింది పోయి నిస్తా్రణ వచ్చేసింది.

అదే నా స్టూడెంట్స్ రాసిన ఉత్తరాలైనట్లైతే పగలబడి నవ్వి ఉండేదాన్ని ఆ రాతలకి.  మరి అదే సమస్య నాకొస్తే పిల్ల చేష్టలులే అని నేనెందుకు తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను!?  –  ఇలా ఆలోచిస్తే బాధ తగ్గుతుందేమో అనుకుంటే,  అబ్బే,  ఏ మాత్రమూ తగ్గకపోగా ఎక్కువయింది.  ఎంత విచిత్రం!!

ఫేస్ బుక్ నిండా రమణుడు, జిడ్డు కృష్ణమూర్తి,  తత్త్వం,  నిన్ను నువ్వు తెలుసుకో,  ఏమీ అంటకుండా ఉండాలి అంటూ పోస్టులు పెట్టే నేను,  చాలా ఎదిగాను అనుకున్న నేను –  సమస్య నాకు వచ్చేప్పటికి ఏమిటి ఇలా కృంగిపోతున్నాను!?  చెప్పడం అంత ఈజీ కాదు ‘నిజ్జంగా తెలుసుకోవడం’  అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది.

అక్క లేచెళ్ళి కాఫీ కలుపుకోని తెచ్చింది.  అక్క వైపు చూస్తే మళ్ళీ ఏం ప్రశ్నలు అడుగుతుందో అనుకుని కాఫీ తాగుతూ ఉత్తరాలు చదువుతున్నట్లుగా తల వాటిల్లోకి దూర్చాను.  ఆలోచనలు తల నిండా…

వాడిని ఎంత పద్ధతిగా పెంచుకున్నాను?  వాడికి ఊహ వచ్చినప్పటి నుండే ఎన్ని కథలు చెప్పానో.  నాలుగేళ్ళకే కూడపలుక్కుంటూ తెలుగు ఇంగ్లీష్ రెండూ చదివేవాడు.  అదేమంటే పెన్ తీసుకుని రాసేవాడు.  ఎంత ఇష్టంగా రాస్తాడో ఇప్పటికీ…  ‘ఈ రాయడం ఎట్లా నేర్పించావు తల్లీ మా పిల్లల చేత చదివించగలుగుతున్నాం కాని రాయించడమంటే తల ప్రాణం తోకకి వస్తోంది’  అనేవారు నా ఫ్రెండ్స్.

కొత్త డైరీలు వస్తే  ముందు పేజీలో ఓ మంచి కవిత రాస్తాడు.  అసలు వాడికి  తెల్ల పేపర్ కనిపిస్తే చాలు పెన్నో పెని్సలో తీసుకుని ఏదో ఓ విషయం రాయకపోతే నిద్రపట్టదు.

“ఎంత సేపు చూస్తావమ్మాయ్,  ఇంక లే,  అన్నీ సర్దుతాను”  అంది అక్క.

“అదేమంటే పెన్ను తీసుకుని రాసే అలవాటు వల్ల ఇలా రాసి ఉంటాడా!?  కాని చూస్తుంటే సీరియస్ గానే ఉందక్కా వ్యవహారం”  నాలో నేనే అనుకున్నట్లుగా అన్నాను.

“రాసేదేమిటే ప్రేమించానంటుంటే!!”  అని “ఇంతకీ ఆ పిల్ల నీకు తెలుసా?  మీ కాలేజీలోనే చదివినట్లుందిగా?”  అంది అక్క.

“ఆఁ”  అన్నాను క్లుప్తంగా.

“ఇప్పుడెక్కడ చదువుకుంటందీ,  అక్కడ కూడా మనబ్బాయి చదువుతున్న యూనివర్సిటీలోనేనా?”

“లేదు హైదరాబాద్ లో ఏదో కాలేజీలో”  అన్నాను.

“ఊఁ సరేలే అయితే బతికించింది.  ఒకే కాలేజీ అయి ఉన్నట్లైతే  చదువూ సంధ్యా లేకుండా తిరుగుతా ఉండి ఉంటారు,  విషయం చందూకి చెప్తావా?”  అంది.

“చెప్తే ఈయన ఏమంటాడో అక్కాయ్,  ఫస్ట్  రాహుల్ కి సాయంత్రం ఫోన్ చేసి అడిగేదా?”  అన్నాను.

“భలేదానివే తల్లా,  అసలే పిల్లలు ఉబిద్రంగా ఉన్నారు.  ఏం అడిగితే ఏం చేసుకుంటారో అని భయంగా ఉంటే.  ఈ సంగతి మనకి తెలిసిందని తెలిస్తే పరీక్షలు కూడా సరిగ్గా రాయడు ఊరుకో”  అంది.

“ఊఁ”  అన్నాను.  అక్క మాటలకి నాకు మరింత దిగులేసింది.

అలమరలో నుండి తీసిన వస్తువులు పైపైన సర్దేసి అక్క వంటింట్లోకి వెళ్ళిపోయింది.  అక్క కళ్ళ నిండా నిస్సహాయతతో కూడిన దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.  నేను మాత్రం గంభీరంగా ఉన్నాను – దిగులు కనపడనివ్వకుండా.   మధ్యాహ్నం ఇద్దరం ఏదో తినాలి కాబట్టి అన్నట్లు భోంచేశాం.   గదిలోకి వచ్చి పడుకున్నాక ఆ పిల్ల గురించీ,  వాళ్ళ తల్లిదండ్రుల గురించీ విషయాలన్నీ అడిగి చెప్పించుకుంది అక్క.

ఇక ఆ పిల్లనే పెళ్ళి చేసుకుంటానంటే వాళ్ళెలాంటి వాళ్ళో తెలుసుకోవాలని అక్క ఆత్రం.  ఆ పిల్ల మా కులం కాదు అని తెలిసేటప్పటికి నోటికొచ్చినట్లు నన్నూ నా ఫేస్ బుక్ నీ కాసేపు ఆడిపోసుకుంది.  నేనేమీ మాట్లాడలేదు.  అలసి పోయిన అక్క మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోయింది.

కులం గురించి నాకేమీ పట్టింపులేదు కాని ఇదెక్కడికి దారి తీస్తుందో అనిపించింది.   ఆలోచించుకుంటూ నేను కూడా కళ్ళు మూసుకున్నాను కాని కళ్ళు,  కనుబొమలు ముడుచుకుపోతున్నాయి ప్రశాంతత లేకుండా.   ఎందుకు నాకింత ఆందోళన?  ఈరోజుల్లో ప్రతి వాళ్ళూ ప్రేమించే కదా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు?  ‘నాకే కులమైనా ఒకటే’ అని పైకి అనుకుంటున్నాను కాని లోలోపల నాకు కూడా మన కులం పిల్లైతే బావుండేది అన్న కోరిక ఉందా?   ఏమీ అర్థం కాలేదు.  ముందు అసలు ఈ విషయం చందూకి చెప్పాలా వద్దా అని కూడా నిర్ణయించుకోలేకపోతున్నాను.  ఇదీ అని చెప్పలేని ఉద్వేగంతో కూడిన బాధ నన్ను ఓ చోట నిలవనివ్వడం లేదు.  లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను –  మధ్యాహ్నం మూడుకి హేమ వచ్చిందాకా.

సాయంత్రం ఆరుకి చందూ ఆఫీస్ నుండి రాగానే అక్క వంటింట్లోకి దూరిపోయింది.  ఆయనకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చాను.  కాఫీ తాగేసి ప్రతిరోజూ తను వెళ్ళే ఆధ్యాత్మిక చర్చకి వెళ్ళిపోయాడు.  ఆయన అటు పోగానే అక్క గభాల్న బయటికొచ్చి “చెప్పావా? ,  ఏమన్నాడు?”  అంది.

“లేదక్కాయ్,  చెప్పలేదు.  భయంగా ఉంది”  అన్నాను.

భయం అని అంటే అక్క ఊరుకుంటుంది రొక్కించకుండా.  కాని నాకు అసలు ఆయనతో ఎలా చెప్పాలో తెలియడం లేదు.  చెప్తే ఆయన ఈ విషయాన్ని నాకంటే కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయగలడు.   వాళ్ళ నాన్నతో చాలా స్నేహంగా, గౌరవంగా ఉండే రాహుల్ ఈయన అడిగితే ఇబ్బంది పడొచ్చు.    ‘ముందు నువ్వు నన్ను అడగకుండా నాన్నకి ఎందుకు చెప్పావు?’  అని నన్ను అనొచ్చు.  పైగా నా అలమరా అసలెందుకు చూశావు అని నా మీద ఎగిరి ఏడ్చి గోల చేస్తాడేమో కూడా…

ఏం మాట్లాడకుండా నన్నే చూస్తున్న అక్కతో “ఓ వారంలో సెలవలకి వస్తాడుగా  అప్పుడు వాడిని అడుగుదాం,  వాడినే వాళ్ళ నాన్నకి చెప్పమని చెబ్దాంలే అక్కాయ్”  అన్నాను.

“సరేలే అదే మంచిది”  అంది అక్క.

3.

రాహుల్ చాలా తెలివైనవాడు.  అన్నీ తెలిసినవాడు.  వాడికి ఏ బాధ వచ్చినా, సంతోషమొచ్చినా నాకు చెప్తాడు.  నాకేదైనా సమస్య వచ్చినా కూడా  నా పక్కనే కూర్చుని విని నెమ్మదిగా పరిష్కారం గురించి మాట్లాడతాడు.  నాదే తప్పైతే ఎంత నిదానంగా చెప్పి ఒప్పిస్తాడో!  అలాంటి వాడు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాడో మరి.  తల్చుకుంటున్న కొద్దీ బాధ ఎక్కువవుతోంది కాని తగ్గడం లేదు.

ఈ ఆలోచనలతో కొట్టుకుంటున్న నాకు ఫేస్ బుక్కే గుర్తుకు రాలేదు.  వారం రోజులు భారంగా గడిచిపోయాయి.  నా కాలేజీకి కూడా సెలవలు కాబట్టి సరిపోయింది కాని ఉన్నట్లైతే పిల్లలకి పాఠాలు చెప్పగలిగి ఉండేదాన్ని కాదేమో!  అనిపించింది.

ఆరోజే అబ్బాయి వచ్చే రోజు.  బెంగుళూర్ ఏర్ పోర్ట్ కి డ్రైవర్ ని పంపాడు చందు.   రాహుల్  రాత్రి ఫోన్ చేసి ‘రెండు రోజులు అన్నాయ్ దగ్గర ఉండి రానా?’  అని మమ్మల్ని అడిగాడు కాని నేను ‘వద్దంటే వద్దనీ,  నాకు వాడిని చూడాలని ఉందనీ’  చెప్పాను.  ‘ఏమిటీ మొండిపట్టు?’  అన్నాడు చందు – నన్ను ఆశ్చర్యంగా చూస్తూ…  ఫోన్ లో మాట్లాడుతున్న రాహుల్ కూడా ‘ఏంటి మమ్ ఇలా మాట్లాడుతోంది?’ అని అనుకుని ఉంటాడు.

‘పోనీలే నాన్నా,  అమ్మ దిగులు పెట్టుకుందేమో,  నేరుగా ఇంటికే వస్తాలే’  అన్నాడుట.

ఎండాకాలం సూర్యుడు ఉదయం తొమ్మిది కాకుండానే చిటపటలాడిపోతున్నాడు.   హేమ కిటికీలకి కట్టిన వట్టి వేళ్ళ కర్టెన్స్ ని కిందికి దించి నీళ్ళతో తడుపుతోంది.   వాటి మీద నుండి చల్లని గాలి కిటికీలో నుండి లోపలకి వస్తోంది.  అక్క వంటింట్లో అబ్బాయికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేస్తోంది.  ఇల్లంతా కమ్మని వాసన అలుముకుని ఉంది.

దాదాపు పదకొండు అవుతుండగా కార్ వచ్చింది.  రాహుల్ నవ్వుకుంటూ లోపలకి వచ్చాడు.  లగేజీనీ డ్రైవర్ కి అస్సలు ఇవ్వడు,  ఎప్పుడూ తనే మోసుకొచ్చుకుంటాడు.  బ్యాగ్స్ కింద పెట్టి “మమ్,  హౌ ఆర్ యు?”  అని వాటేసుకున్నాడు.  నా వెనుక గబగబా వస్తున్న అక్కాయ్ ని చూసి నన్ను వదిలేసి “అరె!  ఆమ్మా,  నువ్వెప్పుడొచ్చా!!?”  అని అక్క దగ్గరకి పరిగెత్తి చేతులు పట్టుకుని ఊపేశాడు.

“పది రోజులైందబ్బాయ్ వచ్చీ,  నన్ను చూసి నువ్వు థ్రిల్లవ్వాలని నేనొచ్చినట్లు నీకు చెప్పొద్దన్నా.  సరేగాని ఏందిట్లా నల్లబడ్డా?  సరిగ్గా తినడం లా?”  అంది అక్క నోరంతా తెరిచి నవ్వుతూ.

“హహహ,  ఇంత లావుంటే.  నువ్వూ, అమ్మమ్మా ఎప్పుడూ ఇదే వాక్యం మాట్లాడతారు – తేడా లేకుండా.  ఎట్లుంది అమ్మమ్మ?”  అన్నాడు.

“బాగుంది” అని అక్క అంటుండగానే “భలే వాసనొస్తుందే వంకాయ కూర చేశావా?”  అన్నాడు.

“అవును,  స్నానం చేసిరా.  వేడివేడిగా అన్నం తిందువుగాని” అంది.

ఆ సంభాషణ అంతా విననట్లుగా నేను సూట్ కేసులు గదిలోకి చేరేస్తున్నాను.   నా వైపు చూసిన వాడు “మమ్,  ఆర్ యు ఆల్ రైట్?  ఏమిటి అలా ఉన్నావు?”  అన్నాడు.

వాడు పరీక్షలెలా రాశాడైనా అడగాలనిపించలేదు నాకు,  ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ “నువ్వు చేసిన పనికి ఇలాగాక ఎలా ఉంటాను?”  అన్నాను.

వాడు అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూస్తూ “ఏంటి ఆమ్మా?”  అని అక్కాయ్ కి చేత్తో సైగ చేసి అడుగుతూ నా వెనకే గదిలోకి వచ్చాడు.

అక్కాయ్ కూడా వాడి వెనకే లోపలకి వచ్చి “వాడు వచ్చీ రాగానే అడగాలా?  అన్నం తిన్నాక అడగ్గూడదా?  ఇంతలోనే ఏం పోయిందని తొందరా?”  అంది.

“ఏంటి మమ్?  ఏమైంది?”  అన్నాడు వాడు.  వాడి కళ్ళు ఏం జరిగిందా అన్నట్లుగా కంగారుగా కదులుతున్నాయి.  కంప్యూటర్ టేబుల్ డెస్క్ లాగి లోపల పెట్టిన లెటర్స్ ని తీసి “ఏంటివి?”  అన్నాను.   వాడు నా చేతిలోని ఉత్తరాలు తీసుకుని చూస్తున్నాడు.

నా గొంతులోని తీవ్రతకి నాకే అసహ్యం పుట్టింది.  ‘ఏమిటిది?’ –  అనుకుని గొంతుని సర్దుకుని “నాకు ఎందుకు చెప్పలేదు రాహుల్?  ఆమ్మ నీ అలమరా సర్దుతుంటే బయటపడ్డాయి”  అన్నాను.

ఒక్కసారిగా తీవ్రస్థాయి నుండి కిందికి దిగిన నా స్వరం వినేప్పటికో,  ‘ఇదీ’ అన్న విషయం వాడికి తెలిసేప్పటికో మరి వాడు తేలిగ్గా నవ్వేస్తూ “వీటిని చూసేనా ఇంత బాధపడ్డావూ?”  అన్నాడు.

“బాధపడరా మరి?”  అన్నాను.

నా మాట వినిపించుకోకుండా “ఊరికే రాశావా అబ్బాయ్!  అయితే ప్రేమా గీమా ఏమీ లేదా?”  అంది అక్కాయ్.  ఆమె ముఖం ‘హమ్మయ్య’  అనుకున్నట్లు సంతోషంగా వెలిగిపోతోంది.

“ప్రేమ లేదని కాదు ఆమ్మా,  మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.  ఒకళ్ళంటే ఒకళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి”  అన్నాడు కాస్త చిరాకుగా.

“ఆఁ  అదేందిరా?  అయితే మీ అమ్మకెందుకు చెప్పలా?”  అంది.

ఏం చెప్తావు సమాధానం అన్నట్లుగా వాడి వైపు చూశాను.  “ఆఁ  ఎందుకు చెప్పడం?  చెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాం”  అన్నాడు.

“అంటే?  వాట్ డు యు మీన్ బై దట్?”  అన్నాను అసహనంగా.

“అది కాదు మమ్,  ఇప్పుడే ఎందుకు చెప్పడం – సెటిల్ అయ్యే విషయమైతే చెప్పాలి కాని”  అన్నాడు.

“నువ్వేమంటున్నావో నాకర్థం కావడం లేదు రాహుల్,  మీ ఇద్దరి మధ్యా ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్నావు,  ప్రేమించుకుంటున్నాము అంటున్నావూ…  కదా!?”

“అవును మమ్,  నిజమని చెప్తున్నా కదా!?”  అన్నాడు.

ఇంతలో అక్క కలుగచేసుకోని “ఏందబ్బాయ్,  మీ మాటలు నాకు అర్థం కావడం లేదు.  తక్కువ కులపు పిల్లని పెళ్ళి చేసుకుంటావా?”  అనగానే రాహుల్ ఆమెని కోపంగా చూశాడు.  వాడి చూపుకి భయపడ్డ అక్కాయ్ “సరే నీకిష్టమైంది,  చేసుకుంటావనుకో,  అయితే మీ అమ్మకి చెప్పబన్లే,  వారం నుండి తిండి కూడా తినకుండా మనసులో ఏడ్చుకుంటంది”  అంది తత్తరతత్తరగా ఇప్పుడే ఏదో పెళ్ళయిపోతున్నట్లు.

నేను అక్కని  “అక్కాయ్,  ఊరుకో,  చెప్పనీయ్ వాడిని”  అన్నాను.   కోపంగా ఉంది నాకు.  ఈ చర్చంతా చీదర కూడా పుట్టిస్తోంది.

“మమ్,  ఇప్పుడు ఫీలింగ్్స ఉన్నంత మాత్రాన తర్వాత పెళ్ళి చేసేసుకుంటారు అని అనుకుంటే ఎలా?”  అన్నాడు.

అక్క వైపు చూస్తున్న నేను వాడి మాటలకి అమితాశ్చర్యపోయాను.   గభాల్న తల తిప్పి వాడి వైపు చూస్తూ “వ్వాట్,  అయితే పెళ్ళి చేసుకోరా!?”  అన్నాను.

“అది కాదు,  దాన్ని గురించి ఇప్పుడు ఎందుకు అంటున్నాను”

“ప్రేమించానంటూ లెటర్స్ రాశావు కదా?  కవితలని గుప్పిస్తూ…   ప్రేమించుకునేది పెళ్ళి చేసుకోవడానికి కాదా?”  అరిచాను.   ప్రేమ పేరుతో అవసరాలు తీర్చుకుని మోసం చేసి వెళ్ళిపోయిన కొంతమంది నాకు తెలిసినవాళ్ళు  ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలారు.    ‘వీడు కూడా అంతేనా?  నా బిడ్డని నేను అలా పెంచానా?’ అన్న ఆలోచనతో బిపి వచ్చినట్లుగా వణికిపోయాను.

వాడు నాకెలా చెప్పాలా అన్నట్లు తల అటూ ఇటూ ఊపుతున్నాడు.

నేనే మళ్ళీ “అయితే ఇవన్నీ కాలక్షేపం కోసం రాసుకున్న ఉత్తరాలని అనుకోమంటావా?”  అన్నాను లెటర్స్ వైపు చూపిస్తూ.

“ఊఁ  నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు మమ్,  ప్రస్తుతం మేమిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టపడుతున్నాం.  పెళ్ళి చేసుకుంటామేమో కూడా.  కాని పెళ్ళి గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకూడదని అనుకున్నాం”  అన్నాడు.

నన్ను అనునయిస్తున్నట్లుగా చెప్తున్న వాడి ఆంతర్యం నాకంతు పట్టకపోయినా ఆ మాటల్లో సత్యం దాగి ఉందని అర్థమైంది.  మౌనంగా వాడి వైపే చూస్తున్నాను.  అక్క అయితే దిమ్మెరపోయినట్లుగా చూస్తూ వింటోంది.

“ఇప్పుడు మధురకి నేనంటే ఇష్టం,  నాకు మధుర అన్నా ఇష్టమే.  అయితే మేము ఇంకా చాలా చదువుకోవాలి.   ఎంతో మందిని కలుసుకోవాలి.  ఈ ప్రయాణంలో మాకు వేరెవరైనా దగ్గరవొచ్చు.  పోనీ మా ఇద్దరిలో ఎవరికైనా ఇప్పుడున్న ఇష్టం ఉండకపోవచ్చు.  పోనీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఏదైనా ప్రమాదం జరగొచ్చు – ఏ జబ్బో,  యాక్సిడెంటో”

“ఊరుకోబ్బాయ్,  తంతా!  ఏమిటా మాటలు?”  అక్క పెద్దగా అరిచింది.

నేను రాహుల్ ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం.   వాడు చెప్తున్నది అర్థం అవగానే నాలో నిస్సత్తువ.   వెళ్ళి మంచం మీద కూర్చున్నాను.

రాహుల్ నా పక్కకి వచ్చి కూర్చుని నా భుజం మీద చెయ్యేసి నన్ను ఆనుకుని “ముందున్న జీవితంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిదా మమ్?  ఆ నిర్ణయానికి అసలు అర్థం ఉంటుందా? అందుకే నేను నీకు చెప్పలేదు,  అంతే”  అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

సమాజంలో నిరంతరం చొచ్చుకుని వస్తున్న  మార్పుల వల్ల  ఈ కొత్త తరం పిల్లల జీవితాల్లో  పెరామీటర్స్ ఎక్కువై  వాళ్ళ ఆలోచనా విధానాలూ,  వాటిని ప్రేరేపించే కారణాలు రెండూ కూడా డైనమిక్ గా ఉంటున్నాయి.  కాని రాహుల్,  నా కోడలు అవుతుందో లేదో తెలియదు గాని మధుర –  ఇద్దరూ ఇంత క్లారిటీగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది.  నా శిష్యురాలిగా ఆమె,  ఆమెతో పాటు ఉన్నతమైన ఆలోచనలతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన నా బిడ్డ ఇద్దరూ నాకు గర్వాన్నే కలిగించారు.

రాహుల్ ని తలని దగ్గరకి తీసుకుని హత్తుకున్నాను.   నా కళ్ళల్లోంచి రెండు వెచ్చని కన్నీటి బిందువులు జారి వాడి గుబురు తలలో ఇంకిపోయాయి.

*****

 

సాయేనా?

Art: Rafi Haque

Art: Rafi Haque

 

1

భేటీ ముగిసింది.

https://www.youtube.com/watch?v=XIMLoLxmTDw

2

సరిగ్గా అదే వేదిక ఎ.కె. జన్మస్థలం.

(ఎ.కె. అలియాస్ 47. ఉరఫ్ కలల గేరి అమర్. కె.ఎ. NRI అయిన తర్వాతే  పేరులో ఈ తారుమారు.)

అదే వేదికపైన ఎ.కె. షష్ఠి పూర్తి కూడా జరగడం నిజంగా ఒక ——-.

‘కానీ ఇలా పుట్టిన రోజు వేడుకలూ, షష్టిపూర్తి వేడుకలూ ఒకే భేటీలో, పైగా అదే వేదికపైన ఏ నాకొడుక్కయినా జరగడం కేవలం యాధృచ్చికమే సుమా’ అని వాదించిన సవాలక్షమందిలో జనగామ శంకరయ్యకూడా లేకపోలేదు.

నిజానికి ఈ వర్గం వాళ్ళే కోకొల్లలు.

“అసలు ఈ సన్నాయి నొక్కు నొక్కిన మీడియా వాళ్ళెంత మంది?’’ అని బాగా తాగిన తర్వాత సహజంగానే ఊగి కొట్టబోయిన బోయ రాముడిని జాగ్రత్తగా గుడ్డి మల్కాపూర్ పంపించారు పదిమంది పాత కామ్రేడ్స్ ప్రయాసపడి ఓలా  క్యాబ్ లో 8X కి.

“ఈ సన్నాయి నొక్కు నొక్కిన మీడియా వాళ్ళెంత మంది? నిజంగా?”  నెంబరు పట్ల చాలా పట్టింపు వున్న ఇడుపుల పాయ మోహన్ తన టేక్ టులో మళ్ళీ నిలదీసాడు… గద్దించాడు.

కానీ ఇదమిద్దంగా వీరినీ అని తెలియదు.

దాంతో కథ మళ్ళీ 69వ సారి మొదటికే అచ్చింది.

అదే పాత…  అదే పదిమంది… అదే కామ్రేడ్స్… మళ్ళీ తమ తాగిన మైక వినోదానికి కొనసాగింపుకు  గురికాబోతూండగా ఈ గద్దింపు రెట్టింపయింది.

ఈ సారి అనుకోని మూలల నుంచీ.

“నంబరుదేముందిలే కామ్రేడ్ ఇక్కడ పార్టీ కొనసాగుతుంటే రంజుగా.’’  గసగుసగా బోయ రాము-2 కూ నచ్చచెప్పిన బెజవాడ మల్లి తక్కువదేమీ కాదు.

(ఆమె బాగా మల్టీ టాస్కర్. పార్టీలో అందుకే ఆమె పేరు ఎం.టి.)

తన సహజ నైపుణ్యంతోనే ఇడుపుల పాయ మోహన్  రెండు బుగ్గలను తన రెండు చేతులతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషను లోగోలోలా రాపాడింది అలాంటి దీపం సెగే తగులుతుండగా మల్లి.

(ఆమె మల్టీ టాస్కింగ్ నిపుణతకి ఇదో చిరు మచ్చు తునకే.

అందుకే అందరూ అంటారు బెజవాడ మల్లి ‘పైకి కనిపించేంత పప్ప’ కాదూ… అని.

మల్లి ఏంచేసిందో తెలిస్తే మీకే తెలుస్తుంది ఆమె ఎంత—– అని.)

తను మనసులో అనుకున్న ఆ నంబరు మాత్రం ఇడుపుల పాయ మోహన్ మొఖం మీదే చెప్పాయాలని డిసైడ్ అయ్యింది మల్లి.

అంతే ఆమెలోని పాత కమురు కసి కొత్త మొగలి కుబుసం విడిచింది ఆ ఆకుపచ్చని రూం నెంబరు 206 లో.

ఆమెను దళ కమాండర్ కాకుండా ఆపిన (ఆపుతూవున్న లేదా ఆపేసిన) మోహన్ పైన పేరుకుపోయిన కసి మల్లిలో ముంగిసకు ఎదరు నిలిచిన రాములస్ విటేకర్ నాగరాజాలా బుసకొట్టింది అచ్చం ఎనిమల్ ప్లానెట్ ప్రైమ్ టైంలో లాగా.

పైగా “రేపు పొద్దునకు నెంబరు గుర్తుంటేగా’’ అనే ధీ/బీమాతో బాబా రతన్ ప్రభాత్ జర్దా (కత్తేమే, చున్నా కమ్) పాన్  నములుతున్న తన నోటికొచ్చినదంతా మాట్లాడేసింది బెజవాడ మల్లి ఇలా :

“సన్నాయి నొక్కు నొక్కిన మీడియా వాళ్ళ లెక్క …థూ….(కింది లెక్క చెప్పేముందు తన నోరు ఖాళీ చేసుకుంటూ…)

“42 లక్షలా 27 వేలా 47 మంది.”

మల్లి తెగువ మనకేం(!) కొత్తా?

“నీకు కాబట్టి ఇదైనా చెప్తున్నా. ఇది మన పార్టీ లోపలి నెంబరు. కొంచెం అటు ఇటుగా ఇదే నిజం.  బయట కూడా ఇదే పుకారు. చాలా మోహన్… ఇంకేమైనా కావాలా?” జారిపోతున్న తన పైట చెంగు అంత మత్తులోనూ సుతారంగా సర్దుకున్న మల్లి… మల్లే!

మల్లి మాత్రమే ఆత్మ గౌరవ సూచిక. పతాక.

నిజమైన మల్టీ టాస్కర్ బెజవాడ మల్లి కాక లంపకలోవ శ్యామల ఎలా అవుతుంది బుద్దుండాలి? ఛ!

“42 లక్షలా 27 వేలా 47 మంది” ఎవరైనా సరే ఎలాగైనా కొరికేయాలనిపించే మల్లి క్యుపిడ్ బౌ దాటి వచ్చిందా సుమధుర లెక్క.

ఏం సంఖ్య? మారు మోగింది ఆ ఆవరణమంతా!

మల్లి అక్యురసీ కి కారణం ఎడమ జేబులో వున్న తన ఫోను లోంచి వచ్చే రికార్డెడ్ వాయిసే.

ఇడుపుల పాయ మోహన్  తో ఆ వేళే కాదు… అలాంటి  వేళ కాని వేళ ఎన్నడు ఇలాంటి గణాంకాలు చెప్పినా తనకు నచ్చిన మీట నొక్కుతుంది మల్లి.

బస్! అంతే.

అప్పుడు  ర్యాండమ్ గా 42 లక్షలా 27 వేలా 47 మంది అని రిపీటెడ్ గా వస్తుంది.

అంతే. బస్!

మల్లి మెమరీ వెనుక వున్న కోడ్ ని ముందు

http://www.engineersgarage.com/sites/default/files/imagecache/Original/wysiwyg_imageupload/1/BarCode-Image_0.jpg

అని గుర్తించగలిగారు.

తర్వాత పుణెకి పంపించి కిందిదే ఫైనల్ అన్నారు.

http://androidforacademics.com/wp-content/uploads/2010/05/GradeRubricQR.png

దీని వెనుక వున్న ఆ జాదూని మాత్రం జ్యోతి సండే కవర్ పేజీ కథనంగా అచ్చోసేవరకు అసలు విషయం అందరికీ అందుబాటులోకి రాలేదు.

ఆ ప్రతులు మల్లి కన్నా హాట్… కేకుల్లాగా అమ్ముడుపోయాయి.

అప్పట్లో అదో రికార్డు.

ఆహా! మల్లి సమాధానం మనకు తెలిసిపోయింది.

కానీ ఇక తెలియాల్సింది మోహన్ కే.

మల్లి జర్దా పాన్ నోటి నుంచి వచ్చిన ఆ జబర్దస్త్ సమాధానం శబ్ద తరంగాలుగా ఆ గదిలో ఇంకా పయనిస్తుండగానే…

ఆ పౌనఃపుణ్యంలో… ఆ తరంగ దైర్ఘ్యంలో…

ఆ మార్గ మధ్యంలో మనం ఈ పైవన్నీ మాట్లాడుకోగలిగామని తెలుసుకోవాలి మీరు.

(మీరు అంటే?!)

మల్లి నోటి నుంచి వెలువడిన మాట అదిగో ఇంకో అరసెకనులో చేరబోతోంది మోహన్ చెవికి.

చేరిందహో!

మల్లి చెప్పిన ర్సమాధానం మనకి పోయిన వారం ఎపిసోడ్ లో తెలిసిందే.

కానీ మోహన్ ఉత్సుకత, ఉత్కంఠ ముందు మనమెంత? (?)

Kadha-Saranga-2-300x268

ఇంతకీ మల్లి సమాధానం!

మి

ది?

(ఇంతకీ మల్లి సమాధానం మోహన్ కి చేరిందా? రేపటి ఎపిసోడ్ లో మీ… మా… మా… జీ… టీవిలో సాయంత్రం 12 గంటలనుంచే… డోంట్ మిస్… పైగా మల్లి ఇప్పుడు మిసెస్ కూడా.)

(ఈ కార్యక్రమ సహసమర్పణ…

జాన్సన్స్ బేబీ పౌడర్ … మీ స్పర్శ తన భవిష్యత్తును చక్కబరుస్తుంది. అభి బుక్…అభి గో…. అభి బస్ డాట్కామ్…

ఇప్పుడు సంతూర్ బేబీ సోప్ … ఇది మీ పిల్లల పార్లర్… బ్రిటానియా గుడ్ డే.. గో స్మైల్….ఐడియా … ఏక్ ఐడియా జో బదల్ దే ఆప్ కీ దునియా… నో ఉల్లూ బనావింగ్… ఆదిత్య బిర్లా గ్రూప్… ఖజానా జువలరీస్… స్నేహంతో మెరిసే బంధం…గుండు గుండు యమ్మి యమ్మి ఆచి గులాబ్ జామూన్….

మరియూ

బోర్న్ విటా … తయ్యారీ జీత్ కీ

పవర్డ్ బై

సులేఖా … గో # ఆంటీ జుగాడ్… కోకా కోలా… ఓపెన్ హాపీ నెస్… టేస్ట్ జో హర్ దిల్ చాహే.)

మల్లి సీరియల్ కి వున్న ఫాలోయింగ్ ప్రధానంగా మల్టీ నేషనల్ కంపినీల ఫాలోయింగే.

*

(మరుసటి రోజు ఎపిసోడ్ మిట్ట మధ్యాహ్నానానికే యూట్యూబ్ లో లీకయ్యింది.)

(బాధ్యులు ఎవరు?)

ఇంతకీ మల్లి సమాధానం!

మి

ది?

“తూచ్!”

ఈ సమాధానం  మనం అంతా ముందే అనుకుందే.

(మనం అంటే మీరు కాదు.)

కాని ఒక రోజు ఉత్కంఠ తప్పదు మరి.

కానీ ఇడుపులపాయ మోహన్ మల్లి వాయిస్ ని యాజిటీజ్ గా తన ఐ ఫోన్ లో రికార్డు చేసి 1gbps లో బోయ రాముడు -3 కి అంత అపరాత్రీ వాట్సప్ చేసేసాడోచ్!

ఇంకేముంది మరునాటి మీడియాలో బ్యానర్ అదే.

బ్రేకింగ్ అదే. థర్టీ మినిట్స్ అదే. స్టోరీ బోర్డూ అదే. అందరి నోటా, మాటా ఇదే. అదే. అదే. అదే.

National Informatics Center ప్రకారం కూడా మల్లి చెప్పిన లెక్క 47 లక్షలా 72 వేలా 42 మందే.

గురువారం రాత్రి 11.45 వరకు అందరికీ అందిన సమాచారం ఇదే.

కానీ ఇది ‘మరో 15 నిమిషాల్లో డేటుతోపాటు మారే అవకాశం వుంది’ అని మల్లికి మరో మెసేజ్ వచ్చింది ఎఫ్ బి మెసెంజర్ లో.

End of scene no 14-a

(Director notes : @ scene no 17, forest/ interiors.

Shoot pending.

Reason :  non availability of Combo dates of two shooting camps.)

https://www.youtube.com/watch?v=WKB0JUkksJg

*

(వాట్సాప్ మెసేజ్ బై సారా.)

anatu1

 

Last seen at 23.59, Friday, 1947.

 

(సారా…ఈమె అమ్మమ్మే మనకు(?) సీన్ నెంబర్ 13 లో కాసేపు కనిపించి బులిపించిన ఎం.టి అలియాస్ మల్టీ టాస్కర్ మల్లి. కన్ఫ్యూజ్ కావాలన్నా కాలేరు మీరు(?) అని మరీ మరీ చెప్పేందుకే ఈ వివరం పొందుపరచాం. —  హీబ్రూ, థాయ్, ఇంగ్లీషు హక్కుల ప్రచురణ కర్తలు.)

సారా నుంచి ఈ మెసేజ్ రాగానే ఇక రెడ్ ట్యూబ్.కామ్ లో రేవన్ అలెక్సిస్ “shoot… shoot right now” అని అరుస్తున్నా ఆ అవసరం లేదనుకున్నాడు కోనేటి కట్ట సుబ్బారాయడి పిన్నమ్మ కొడుకు చిన ఉరుకుందు.

 

అయితే  నేనూ, సారా ఒకరికొకరం పంపించుకున్న సవాలక్ష వెరీ పర్సనల్ మెసేజులల్లో హౌండ్స్ కి దొరికీ వారికీ అర్థం కాకుండా మిగిలిన మెసేజ్ ఇదే అని నాకు మేమిద్దరం చనిపోయిన తర్వాత అర్థం అయ్యింది :

anatu2

 

*

చారిత్రక సత్యం-1

మహా భేటీ మొదలైన తొలిరోజు…

మొదటి భోజనానంతర సెషన్.

రంజుగా నడిపిస్తున్నప్పుడు సరాసరి వేదికపైనే… సరిగ్గా కామ్రేడ్ చారుపల్లి కమ్మయ్య ప్రసంగం మధ్యలో, ప్రేక్షకుల మధ్యలోంచి తెగించి తన ఫేస్ బుక్ లో తనే బ్లాక్ చేసిన ఓ రహస్య మిత్రుడిని తక్షణం అన్ బ్లాక్  చేసేసింది గౌసియా.

గౌసియా చాలా సెక్సీగా వుంటుంది.

కానీ ఇప్పుడు కాదు బ్లాక్ చేయక ముందు.

అంటే ఆప్పుడు.

గౌసియా ఆ నెంబరు అన్ బ్లాక్ చేయడానికీ ఎ.కె. పుట్టుకకీ ఎలాంటి సంబంధం లేదంటే మీరు మాత్రం నమ్మగలరా?

(మీరు అంటే అందరూ కాదు కేవలం ఒక వర్గంలోని సామాజిక వర్గం పాఠకులు మాత్రమే –  గదబ అనువాదకుడు.)

గౌసియా అన్ బ్లాక్ చేసిన తన ఏలినాటి స్నేహితుడి ప్రొఫైల్ పిక్ మాంచి కసిగా వుంది.

అంతే కామ వడితో గౌసియా మెసేజ్ టైప్ చేసేసింది.

నిజానికి చాలా కాలం కిందే టైప్ చేసి పెట్టుకుని వుంచుకుంది గౌసియా దాన్ని.

వాట్సాప్ లో సెండ్ బటన్ నొక్కిన తర్వాతా… దానికి సమాధానంగా బ్లూ డబల్ క్లిక్ వచ్చేలోపు గౌసియా మనసంతా ఈ కింది కీర్తనతో దద్దరిల్లి కాసేపు మార్మోగింది కూడా.

“ఏ మూలన దాచిన ఏ వివరంబేనాడో

నిన్నూ కడతేర్చేనూ నిక్కంబిదియే మనసా

చిరు కడు నిడు కానలలో ఒకే తీరు కాల వలెన?

కడు నిడు చిరు వనములలో అదే దారి రాల వలెన?

కానవె జన మది త్రోవల కనవే పదవే వయసా

మనము కెరలి మరలి తరలి మురళి పాటతో మనసా”

(పేపర్ బ్యాక్ ఎడిషన్ లో కీర్తన చేర్చలేదుకొంకణి, డోగ్రీ ప్రతుల జమిలి సంపాదకులు.)

(గౌసియా సెండ్ చేసిన మెసేజ్ చేరవలసిన వారికి చేరిన తక్షణం బ్యాక్ గ్రౌండ్లో ఈ కీర్తన ఫేడవుట్ అయ్యింది.

అదీ టైమింగ్ అంటే! గుడ్ జాబ్ ఖాసీం.)

అయితే ఆ మెసేజ్ ని మోస్తున్న ఆ సిగ్నల్ చేసిన ట్రావెల్ కడు వీరోచితం సుమా!(ఏ యాంకర్ ని ఉద్దేశ్యించింది కాదు.)

చేరవలసిన వారికి ఇంకనూ మెసేజ్ చేరేలోపు…. గౌసియా ఫోన్ బఫర్ అవుతోంది.

ది

4g  కాదు.

(ఫోనెహే!)

అలా ఆ వీక్ సిగ్నల్ దయతో తరలిపోబోతోన్న ఆ మెసేజ్  ఆ కాళరాత్రి కరుడుగట్టిన దట్టమైన కారడవిలో పయనించాలి.

అదే అడవిలో తన కడపులో పడ్డ తన రాబోవుతున్న బిడ్డకు కాబోవుతున్న బయలాజికల్ డ్యాడీ కి ఆమె మెసేజ్ వెళ్ళాలి సేమ్ అదే రాత్రి.

మనం ఎంత ఔటాఫ్ కాలింగ్ ఏరియా అయినా మీడియాకి ముందే పోతా… వుంటాయి అన్ని మెసేజ్ లు.

అందులో ఇదోటి.

అడవికి చేరే ముందే  ఈ తతంగం పేపరు గుద్దేసింది.

ఇందులోని పసందైన న్యూస్ ని మొదట క్యా చ్ చేసిందిమాత్రం ఈ… నాడు.

(క్యాష్ చేసుకుంది టివి 10 మైనస్ 1 అని వేరే చెప్పాలా?- TAM report 2020)

“ఈ తెగింపే కావాలి.  ఈ మిలిటెన్సీ సహజాతంగా వుండాలి. ఇర్షాద్! కానీ కలలగేరి అమర్ లాంటి వారికే ఈ మిణుగురు గుణం పరిమితమై… మరీ మితమై

పో…

తూ…

వుం…

ది…”

ఇదీ ఆ…నాడు ట్యాబ్లాయిడులో వచ్చిన సింగిల్ కాలమ్ ఐటమ్ సారాంశం. ఇది కూడా రాసి తగు జీతం మరియా గీతం పొందిన సదరు స్ట్రింగరు ప్రబుడాష్ కి ప్రభువు స్తోత్రములు.

(పై వాక్యంలో మరియూ బదులు మరియా అని అచ్చయ్యంది. గమనించగలరు – Men Again Rape and Damn,  M.A.R.D. స్వచ్ఛంద సంస్థ.)

తమ్ముడు తమ్ముడే… ప్యాకాట… ప్యాకాటే అని ఎవరికి ఎవరు నేర్పించాలి ఈ లోకంలో.

కాబట్టే గౌసియా ప్రసవించింది.

ఇక ఎట్టకేలకు తన పదకొండవ గర్భం నిలిచింది. గుణదల మేరికి స్తోత్రములు.

ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ -9

*

పుట్టిన పసి బిడ్డ తన కళ్ళ ముందే వుండి, బిడ్డకు తండ్రి అతనే అని చెప్పుకోలేని కామ్రేడ్ చారుపల్లి కమ్మయ్య వేదికమీదే వుండటం చాలా అరుదు.

(ఏదయినా 69 ఏళ్ళ పైబడి జరుగుతూనే వుంటే అది అరుదు కాక మరేమౌతుంది బే? – సంచాలకులు, స్వచ్ఛ భారత్ సంఘటన్.)

*

ఇక ఇప్పుడు కీలకమైన సీన్ నెంబరు 72.

Int/day for night

అమావాస్య…నడి రేయి… చల్లని గాలి స్క్రీన్ ఎడమ వైపు నుంచి కుడి వైపుకు సుతారంగా వీస్తూవుంది… స్క్రీన్ కుడి వైపు కింద… ఆమె బుగ్గపైన తాకిన పిల్ల గాలి  అలా ఎ.కె. పిర్రలపైన సల్సా నాట్యం చేసింది.

(“కానీ చీకటిలో ఈ వివరాలు కనీ కనిపించనట్టు వున్నాయి.”  – రేట్ ఆంధ్రా డాట్ కామ్ (విసుగు.))

ఇదే చారిత్రక సత్యం-2

Cut forest to plane.

*

కానీ చారిత్రక సత్యం-3 కన్నా ఎక్కువ అరుదయినది గౌసియా కాన్పు.

“ఇంతకీ పుట్టింది ఎవరు?“ అలవాటయిన గర్వంతో గౌసియా ఆలోచనల చూపు వేదికపైనుంచి మురిపెంగా టిల్ట్ డౌన్ అయ్యింది తన ఒడిలోకి.

(ఎ.కె. … రివీల్.)

పుట్టింది ఎవరికి?

“ఇప్పుడవన్నీ ఎందుకూ?” అనుకుని చారిత్రక సత్యం – 4 ని తనతోనే బలంగా సమాధి చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది గౌసియా.

*

భేటీ ముగిసిపోయింది.

కానీ National Informatics Center చెప్పిన 47 లక్షలా 72 వేలా 42 మంది కానీ, పార్టీ చెప్పిన లెక్క 42 లక్షలా 27 వేలా 47 మంది కానీ అంతా భోగస్ అని తేలింది.

“ఈ క్యామిడీ, ఈ ఇగో, ఈ గొడవలను, ఈ గన్ లనూ ఇక పక్కన పెట్టాల కాసేపు.” తన మనసులో మాట కక్కేసాడు అరవిందరావు.

అప్పుడు మొదలు పెట్టారు అసలు లెక్క. ఎప్పుడూ అలాగే మొదలవుతుంది నిజానికి అసలు లెక్క.

*

సీన్ నెంబర్ 16 a/ insert

Ext/forest/night for an awaiting day

“మొత్తం 34…. దొరా…” ఎవరో అరిచారు.

వినీ వినిపించకుండా అందరికీ వినిపించింది ఆ గాత్రం.

https://www.youtube.com/watch?v=Ot18ReoYyn4

“ప్యాకప్” ఎవరు అరవాలో వారే అరిచారు.

కానీ ఈ గొంతు ఎవరికీ వినిపించకున్నాఅర్థం మాత్రం అందరికీ అయింది.

(అంటే వర్గ సమాజంలోని ఒక సామాజిక వర్గానికి తప్ప! – The Shining Path. (review by Christian Parenti.)

(ఎండ్ టైటిల్స్ స్క్రోల్ అవుతోంటే అమితాబ్ బచ్చన్ వాయిస్ …)

“మహా అయితే ఇంకో రెండు లేదా మూడో …..(బీప్ సౌండ్.)

తమాషా ఏమిటంటే వచ్చాక వాటినీ… గుర్తూ… పట్టాలీ.”

(బ్లాక్ అవుట్)

https://www.youtube.com/watch?v=Zx3xyBMiung

*

PS-1

(Post Shoot)

“బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల అస్తవ్ కొడుకో…” అనే డబ్ స్మాష్ మల్లికీ, గౌసియాకూ చాలా ఇస్టమని సారా చెప్పింది మా ఇద్దరి పార్టీ  గ్లెన్ లెవిట్ లోంచి పొర్లి తెలవారుతుండగా.

*

P.S. 2:

(police station- 2 town)

(దండ..కారుణ్యం రెంటి నుంచి వెలువడకుండా కాలగర్భంలో కలిసిపోయిన కోయతుర్  ప్రవచనాలని పరాయి భాషల్లోనికి విచ్చలవిడిగా చేసిన అనువాదాలలో మిగిలిన, చిరిగిన, విరిగిన తాళపత్రాలకు ఇది సాధికారిక తర్జుమా.

(గౌసియా మనవరాలు సారా సౌజన్యంతో.)

*

P S 3:

(Parti Socialiste – 3)

సాయేనా అంటే  ఖాళీ చేసి వెళ్ళి పోండి … పరిహారం అందుతుంది అని అనువాదం చేసారు మోదిక్షనరీలో.

కానీ అది శుద్ధ తప్పు అని మీకే (?) తెలియాలి ఈపాల్టికి.

సాయేనా అంటే కోయల వాడుకలో కుశలమా?

(ఉమ్మడివరం కోయ యువకుడు సోడి చిన ముత్తేల్ పంతులేర్ సౌజన్యంతో.)

Naqoyqatsi

 

*

 

పరిధి

Art: Rafi Haque

Art: Rafi Haque

 

 “చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి…”

కారు ఖైరతాబాద్ ఫ్లైయోవర్ మీద వెడుతోంది. ముందున్న కారుని జరగమన్నట్టు హారన్ కొట్టగానే వినయంగా పక్కకు జరిగిపోయాడు. బండి కొత్తదై ఉంటుంది, లేకపోతే చిన్న కారుకోసం పెద్ద కారు జరగడమే! అందునా ఆడువారు నడుపుతూంటే! చటుక్కున గుర్తొచ్చింది. బహుశా షివల్రి లో భాగమేమో. మొన్న మీటింగ్ నుంచి వెనక్కి వస్తుంటే ఎం. డి వాళ్ళ డ్రైవర్ తో ఏమన్నాడు? ‘మూవ్, మూవ్…పాపం ఆడామె, ఎల్ బోర్డు ఉంది. మనం జరగాలి. లేకపోతే బండి డామేజ్ అవగలదు.’

‘ఏం చేస్తాం, మోడరన్ టైమ్స్!’ గేర్ మారుస్తూ అనుకుంది. ‘తూలిరాలు వటపత్రమ్ముల పై…తేలి తేలి పడు తరువులవే..’ పాట హాయిగా సాగుతోంది.

ఈ హుసేన్ సాగర్ చల్లగాలిలో…ఏ శ్యామసుందరుని మురళి వినిపిస్తుంది? శ్యామసుందరులు, ఎవరు వారు? ఎవరి మురళి వినిపిస్తుందే, చెప్పు? ఆమెకే నవ్వొచ్చింది. ఏ రాయైతేనేమి?

“పూలతీగా పొడరిండ్లమాటునా..పొంచి చూచు శిఖిపింఛమదే…” రజనీకాంతారావూ….నీకు వేల పాదాభివందనాలు. మామూలువి కాదు, నా యోగా క్లాసు లో నేర్పిన అతి క్లిష్టమైన పాదభివందనం. ఎలా రాసావయ్య!

ఫోన్ రింగ్ అవుతోంది. తెలియని నంబరు. తనేనా..?

“మేడం, నేను గీతని…”

“ఊ చెప్పు..గీతా….”అనాసక్తిగా..గీత గుర్తుపట్టి ఉంటుందా?

“మీకు నేను డబ్బులు ఈయాలె..”

ఆ అవును నిజం. మర్చిపోయింది. “చెప్పు”

“ఈ రోజు సాయంత్రం వచ్చి ఈనా?”

సరే. ఎంత ఇస్తుంది? ఆకస్మిక ధనలాభం. ఇంటి అడ్వాన్సుకు బోడి ఆరువేలు ఇచ్చినందుకు. ఇవ్వనివ్వులే కాస్త ఫైనాన్సియల్ డిస్సిప్లిన్ వస్తుంది.

ఇంతకు ముందు ఉద్యోగం లో తన ఆఫీసులో స్వీపర్ గీత. ఇంకా గుర్తుంచుకుందే! నీతీ నిజాయితీ పేదవారిలో లేదన్నవారెవరు? వాడ్ని వెళ్లి ఒకటి తన్ని వస్తే సరి. ముందు ఆగు, సాయంత్రం వచ్చి ఇవ్వాలిగా.

గీత! ఈ గీతే కదా…ఆ రోజు పొద్దున్న అంత కంగారుగా పోనే చేసింది.

“మేడం, మా ఆయన నాకున్న ఇంకో ఫోన్ చూసేసిండు. నాకు భైమైతుంది మేడం.” భయం ఎందుకో అర్ధమవుతూనే ఉంది. ఒక ఫోన్ ఎప్పుడూ ఆఫీసులో ఉంచుకుంటుంది గీత. అందరికీ తెలుసు. అందుకే కాస్త చిన్న చూపు కూడా.

‘ఇప్పుడు ఫోన్ వస్తే..నాకేమో అందులోవచ్చే ఫోన్ నెంబర్ నోటికి నంబరు రాదు మేడం. ఈనకి తెలిస్తే మస్తు కొడతాడు. ఏమైనా చెయ్యండి మేడం.’ తాగుబోతు భర్త. చిల్లిగవ్వ సంపాదించడు. పనికిరాని మొగుడు. తెలిస్తే మాత్రం తంతాడు.

ఆఫీసుకు వెళ్ళి తన ఫోన్ నుంచి గీత భర్త దగ్గరున్న నెంబర్ కి ఫోన్ చేసింది.

“హలో మేడం, నేను గీత పెనిమిటిని.”

“…గీతేది?”

“ఆఫీసుకు పోయనుండే మేడం.”

“మరి ఫోన్ నీదగ్గరుందేంటి? ఆఫీసు ఫోన్లు పర్సనల్ పనుల కోసం వాడుతున్నారా…”

“మేడం, మేడం, గట్లెం లేదు మేడం. మర్సిపోయనుండచ్చు. నేన్ గిప్పుడే తెచ్చిస్త.”

పావుగంటలో ఆఫీసుకొచ్చాడు. గీత సంబరాన్ని అణుచుకుంటూ కేబిన్ లోకి తీసుకొచ్చింది. తను కావాలనే కాసేపు నించోబెట్టింది. కాసేపు మౌనం. ఎందుకంత ఒంగిపోతున్నాడు? పెదాలకు పుండ్లు పడి రసికారుతూ. వీడితో కాపరం ఎలా చేస్తోంది? మొహం లో ఏ భావమూ లేకుండా, “తెచ్చావా?” అడిగి, వాడు ఇవ్వగానే ఫోన్ పక్కన పెట్టేసింది. వాడు వెళ్ళకుండా అలానే ఆని నిలబడ్డాడు. ఇంకాసేపు కావాలనే మౌనం. పర్లేదు, తన పాత్ర బానే పోషిస్తుంది.

“ఏంటి?”

‘ఫోన్ మర్సింది మేడం. సారి. ఇంట్లకి వేరే ఫోన్ ఉన్నది మేడం. జర కోపం జేయకున్రి. ముగ్గురు పిల్లలు మేడం. ఉద్యోగం ల్యాపాతే చాన ఆగమైతది.’ బానే తెలుసు. కాని ఇప్పుడు బోధించే సమయం కాదు. శాసించే సమయం.

‘సరే’ తల తిప్పకుండా అంది.

‘నమస్తే మేడం.’ మళ్ళి ఒంగి సగం నమస్తే చెబుతూ వెళ్ళిపోయాడు. గీత వాడిని సాగనంపే మిషతో కూడా వెళ్ళి, వెళ్ళాడని నిర్ధారించుకుని వెనక్కి వచ్చింది.

Kadha-Saranga-2-300x268

‘థాంక్స్ మేడం మొహంలో బరువు తగ్గిపోయింది. ‘ఎంత రిలీఫ్ వచ్చిందో.’గీత ఇంగ్లీష్ ప్రయోగిస్తూ ఉంటుంది.

‘ఎందుకు రిలీఫ్? తన్నడనా?’

‘అవును మేడం.’ ఇబ్బందిలేని నవ్వు.

ముగ్గురు పిల్లలు మరి. ఒకటి రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కొన్నిరోజులు బావున్నా..మళ్ళీ మొదలు. ఆఫీసుకి వచ్చి మరీ తాగడానికి డబ్బులు పట్టుకెళ్తాడు. ప్రభుత్వానికి మందు అమ్మడానికి కేటాయించిన బడ్జెట్లో డీయడిక్షన్ కి ఏమి నిధులుండవు. కాబట్టి వీళ్ళు తాగుబోతులయ్యాక బాగుపడే అవకాశాలే లేవు. వీళ్ళు చచ్చేరోజు వచ్చేవరకూ..పెళ్ళాలు ప్రతిరోజూ చావాలి.

“వదిలెయరాదు. ఎందుకీ గోల?”

“ముగ్గురు పిల్లలు మేడం. మా అమ్మోల్లు పద్నాలుగేన్లకే పెళ్లి చేసినారు. గిప్పుడు వదిల్తే ఎవరూ సపోర్ట్ చెయ్యరు. ఆయనకి ఊరిలో ఒక ఇల్లుంది. నేను ఇడిశివెట్టి పోయి నాకేమన్న ఐతే ఇంకేవరుంటారు? కనీసం ఆ కొంచం ఆస్తి అన్న మిగలనీయి.”

“పడు ఐతే. అయినా నీ ఫాషన్ పిచ్చిలో కాస్త నీ సంసారం మీద పెట్టరాదా.”

“గట్లనకండి మేడం.” నిరాశగా నవ్వింది. “గిది గూడా లేపోతే ఇంకేం ఉండే జీవితంల. అమ్మోల్లకి పట్టది, అత్తోల్లకి పట్టది. నాకు మాత్రం తప్పదీ యాష్ట.”

ఇట్లాంటి పిల్లకి వేరే ఫోన్ లు ఉంచుకోవడం కరక్ట్ కాదు. రిస్క్ కూడా. అవతల వెధవ ఎవరో! మరి మొగుడితో ఉంటే ఉండే రిస్క్ మాటో…అదివేరేలే..అది ఆమోదయోగ్యమైన రిస్క్! తన్నినా, ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నా…పెళ్ళిలో సబ్ చల్తాహై..

షిట్. రెడ్ సిగ్నల్. ఇంకా లేట్. ఫస్ట్ అవర్ లోనే మీటింగ్ ఉంది. మానేయరాదూ…వెధవ ఉద్యోగం. మానేసి, నీహారిక చెప్పినట్లు తిండి, తిండి, తిండి. వండుతూ కూర్చోవచ్చు.  “కానీ ఇప్పుడు అందరి నోర్లూ మూయించడానికి నా జీతమే ఒక పేపర్ వెయిట్ లా పని చేస్తోంది.”  మొన్న సింపోసియం లో కలిసినప్పుడు లిప్ స్టిక్ పెదాలతో అందంగా నవ్వింది.

ఆఫీస్ దగ్గరపడుతున్న కొద్దీ చేయవలసిన పనులు గుర్తొస్తున్నాయి. అందరిని విష్ చేస్తూ కేబిన్ దగ్గరకు చేరుకుంటే…”హాయ్!” సందీప్ ఎదురొచ్చాడు.

“హే…చెప్పు”

“ఎంత సేపు జానేమన్…నీకోసమే ఈ వెతుకులాట.” తన మార్కు సొట్టనవ్వొకటి విసిరి.

“హౌ ఐ విష్…సరే, నీ పనేంటో చెప్పు. కుదిరితే ఈ రోజే చేస్తా..”

“నో..”గట్టిగా అరిచాడు. “ఇప్పుడే అయిపోవాలి.”

“ఏంటి”..తెల్లబోతూ అడిగింది. “ఆడిట్ రిపోర్ట్ త్వరగా మెయిల్ చేయ్యవా…నా మెయిల్స్ మధ్యలో  ఎక్కడో ఇరుక్కు పోయింది. దొరకడం లేదు. ఐ మైట్ నీడ్ ఇట్ ఫర్ రిఫరెన్స్.”

“గాడ్, యు ఆర్ ఇన్సేన్! ఎందుకంత అరవడం?”

“బేబీ, సానిటి లెవెల్ ని మాచ్ అవ్వాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరమూ ఇన్సేన్ అవుతమన్నాడు ఒక మహానుభావుడు.”

“నిజమే”, ఆలోచిస్తూ అంది.

“బై బేబి. హవె అ లాట్ అఫ్ వర్క్.” వెళ్ళిపోయాడు.

పది నిముషాల్లో మీటింగ్ రూమ్ కి రమ్మని పిలుపు. తన ప్రెజంటేషన్ అయిపోగానే, సందీప్ అందుకున్నాడు. అతని గురించి తెలుసామెకి. కవిత్వం రాసినంత బాగా బిజినెస్ కూడా చేయగలడు. చక్కటి ఉచ్చారణ…లయబద్ధంగా మాట్లాడతాడు. ఎదురుగా కూర్చున్న క్లయింట్ల కళ్ళలో మెరుపు ను చూస్తోంది.

హఠాత్తుగా తన పేరు పెట్టి పిలిచి…అతనేదో అడిగాడు.. తన దగ్గర సమాధానం లేదు. ముందు ప్రిపేర్ అవమని చెప్పి ఉండవలసింది. తరవాత మెయిల్ చేస్తానని చెప్పి సర్దింది గాని తనకి తెలుసు. సందీప్ అసహనంగా బుజాలెగరేసాడు. అందరూ అసంతృప్తిగా లేచారు.

లంచ్ తర్వాత ఎం. డి నుంచి కాల్. ‘నువ్వలా వేగ్ రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండవలసింది’, తన తప్పేమీ లేదని తెలుసు. కానీ ఎవరో ఒకరు బ్లేమ్ తీసుకోక తప్పదు. ‘ఈ రోజు నువ్వు చేసిన పని ఎంత ఇబ్బందిలో పడేసిందో నీకు తెలియదు.’ సందీప్ ఏ భావం లేకుండా సాండ్ టైమర్ తో ఆడుకుంటున్నాడు. అయినా అప్రైసల్ ముందు ఈ జిమ్మిక్కులు అవసరమే. పట్టించుకోవద్దు….లూయీహే చెప్పాలా.. వి ఆర్ విక్టిమ్స్ అఫ్ విక్టిమ్స్! ఛ…

ఎం. డి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి లంచ్ టైం దాటిపోయింది. వినీల దగ్గరనుంచి ఫోన్.

“హాయ్. చెప్పు”

“నువ్వే చెప్పు. ఎవడికి మూడింది?”

“తెలిసిపోయిందా, ఈ రోజు కాదులే..ముందుముందు…”

“హోలీ షిట్..మళ్ళీనా..ఏం జరిగింది?”

“తర్వాత చెప్తాలే. నువ్వు చెప్పు.”

“సాయంత్రం దారిలో ఆగుతావా. ఒక చిన్న పర్సనల్ పని ఉంది. ఒక్క హాఫ్ ఆన్ అవర్ అంతే.”

“సరే, సీయా.” ఫోన్ పెట్టేసి లంచ్ కు వెళ్ళింది.

ఆఫీస్ నుంచి త్వరగా బయటపడింది. వర్షం పడేట్లుగా ఉంది. సాయంత్రం ఇళ్ళకి వెళ్ళవలసినవాళ్ళతో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది. మెహది హస్సన్ గజల్స్ కష్టం తెలీనీకుండా ప్లే అవుతున్నాయి.

ఫోన్ మోగింది. చప్పున కాల్ తీసుకుంది. అబ్బా, తను కాదు. “హాయ్ రా!”

“హాయ్, త్వరగా చెప్పు. డ్రైవ్ చేస్తున్నా..”చిరాకును అణుచుకుంటూ..

“ఫోన్ చెయ్యలేదే?” కినుక గొంతులో.

“ఎప్పుడూ..?” రైట్ ఇండికేటర్ ఆన్ చేసింది.

“నిన్న ఫోన్ పెట్టె ముందు, మళ్ళి అరగంటాగి చేస్తానన్నావు.”

పాపం! “సారీ…” హడావిడిలో వదిలించుకోవడానికి వంద అంటాము. అందుకే మనసు చిన్నబోయినపుడు ఇలాంటి పిచ్చిమొహాలను కదపకూడదు. ప్రేమిస్తున్నమేమోనని ఊహించేసుకుంటారు. ఇప్పుడేంటో మరి.

“పర్లేదులే. క్షమించేసాను. ఇంతకీ లంచ్ కి వస్తావా? నీలాంటి వాళ్ళతో డిన్నర్ ఇంకా బావుంటుంది.”

“ఎందుకు బాబూ?”

“అలా అలా డిన్నర్ తో బాటే నిన్నూ, నీ మాటల్నీ, పాటలనీ అస్వాదిస్తూంటే…” ట్రాఫిక్ మధ్య ఈ సంభాషణ భలే ఎబ్బెట్టుగా ఉంది. “ఇంకేంటి?” మధ్యలో కట్ చేస్తూ…

“బోర్ గా ఉందా..”ఆ గోముతనానికి చిరాకెత్తింది.

“మీ ఇంటికి పిలువరాదా, వస్తాను. నీ ఫ్యామిలీ ని కూడా కలవొచ్చు. రేపు రానా?” అడిగింది హాడావిడిగా హారన్ కొడుతూ అంది..

“ఇల్లా…లెట్ మే థింక్. ష్యూర్, వైనాట్…ఆలోచించనీ, ఓకే..రాత్రికి కన్ఫర్మ్ చేస్తా.” ఫోన్ కట్ చేసింది. వీడింకో పది రొజులు నా జోలికి రాడు.

నెమ్మదిగా వినీల ఇంటికి చేరింది.

గేటు నుంచి మొదలుపెట్టి, ఫ్లాట్ లో కూడా పూలు. గుమ్మాలకూ, కిటికీలకూ ప్రతిచోట పూలే. ఏంటిది? ఏదో పర్సనల్ అంది, ఇంత హడావిడా? లోపల నుంచి ఆడవాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి.

“వచ్చేసావా?” వినీల ఉప్పాడ పట్టుచీర గరగరలాదించుకుంటూ ఎదురొచ్చింది. ‘రా’ చేతినిపట్టుకుని లాగుతుంటే వంకీ మెరిసింది.  మెడ కింద కాస్త గంధం గుర్తులు. కనుబొమల మధ్య కుంకుమ.

“శ్రావణ శుక్రవారం పూజ.” ఆశ్చర్యాన్ని ఆపాలన్నట్టు చెప్పింది.

“దీనికే పిలిచావా?”

“అంటే ఇది మాత్రమే కాదు. నిన్ను కలిసి చాలా రోజులైంది కదా..”

“ఇంతకాలం మగాళ్ళు మాత్రమే మాయమాటలతో మోసం చేస్తారనుకున్నానే. నమ్మించి మోసం చేసావ్.”

“నమ్మాక ఇంకా మోసం ఏమిటిలే.”

“వచ్చావా అమ్మా..”లోపల్నించి తెల్లటి మహేశ్వరీ సిల్క్ చీర వచ్చింది. “అదేవిటీ డ్రెస్ లో…చీర కట్టుకురాలేదా?”

‘లేదండీ మీ కోడలు నాకీ నాటకంలో పగటివేషం ఉందని చెప్పలేదు.’ లోపల అనుకుంది.  “నాకు పూజ ఉందని తెలీదండి”, అంది. వెనుక నుండీ వినీల అర్ధంకాని సైగలు చేస్తోంది.

“ఏవిటీ చెప్పలేదూ? చెప్పానన్నదే. ఏంటో మరి…కూర్చో.” పెద్దావిడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఇంకో కుర్చీ లాగి చూపించింది.

“చెప్పిందేమో, నేనే మర్చిపోయుంటా”, ఆగి “నాకైనా ఇవన్నీ అలవాటు లేవాంటి. ఇదెందుకు పిలిచిందో..”

“అదేమిటమ్మా అలవాటు లేకపోవడం. చేసుకోవాలి మరి. మన కల్చర్, ట్రెడిషన్ చూసుకోవద్దూ.”

“మీ అమ్మాయి ఇవన్నీ బాగా చేస్తుందేమో కదా ఆంటీ…అదే ట్రెడిషనూ..అదీ”

“ఆ చేస్తుందమ్మ. ఏదో హడావిడి పడిపోతోంది పాపం.” మళ్ళీ ఆవిడే అంది. “చేసుకునే అదృష్టం కూడా ఉండాలమ్మా. మొన్నటిదాకా అంకుల్ ఉన్నారు. ఇప్పుడు నేను చేయలేను కదా. నాకు పద్నాలుగేళ్ళప్పటి నుంచీ మొదలుపెట్టి, పురుళ్ళప్పుడు తప్ప ఆఫీసు ఉన్నా లేకపోయినా తప్పకుండా వ్రతం చేసాను. పోయినేడాది మీ అంకుల్ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఇంకేం చెయ్యను. అందుకే దీనితో అంటుంటాను. అదృష్టం ఉన్నప్పుడే తీర్చుకోవాలే అని. మీకేమో మొగుళ్ళ విలువ తెలీదు.”

“దాదాపు యాభైయేళ్ళ నుంచి ఇంత నిష్టగా చేసి అంకుల్ పోగానే డిస్క్వాలిఫై అయ్యారా ఆంటీ. మీకున్న శ్రద్ధ దీనికి లేదు. కాని అది చెయ్యొచ్చు మీరు చెయ్యకూడదన్న మాట. ఎవరి రూల్ ఆంటీ ఇది?”

“ఏం చేస్తామమ్మా…”ఆవిడ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. “మా పెద్దది ఐతే నన్ను ఇక్కడికి పంపించేసింది. శ్రావణ మాసం ఎందుకులేమ్మ అని. పిల్లల్ని పెంచడానికి పనికొస్తాను. పూజలు ఎలా చెయ్యాలో నేర్పిందేనేను.” ఎప్పుడు వెళ్లిందో, లోపల ఆడవాళ్ళ మధ్య వినీల నవ్వులు వినిపిస్తున్నాయి.

పెద్దావిడ దీర్ఘంగా నిట్టూర్చి కుర్చిలోంచి పైకి లేచింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి లోపలకి వెళ్లి కాస్త పరమాన్నం బౌల్ లో వేసి తెచ్చి చేతికి అందించింది. లోపల గదిలో కోలాహలం సద్దుమణిగి ఎబ్బెట్టుగా ఉంది. ఒక లంగా ఓణి పిల్ల గజ్జెలు సన్నగా ఘల్ ఘల్మనిపిస్తూ బయటకు తొంగిచూసిదెందుకో.

“మీ అబ్బాయేడాంటి?”  తినబోతూ అడిగింది.

“పైన టెర్రస్ మీద ఉన్నాడమ్మ. ఏదో ఆఫీస్ పార్టీ జరుగుతోంది.”

“మందు పార్టీనా?”

“బిజినెస్ లో తప్పవు కదమ్మ.” అవునన్నట్టు తలూపి ఖాళీ బౌల్ ని చప్పుడోచ్చేలా టేబుల్ మీద పెట్టి లేచింది.“ఇక వెళ్ళొస్తాను,”.

“అయ్యో ఉండు. వాయినం తీసుకోకుండానే?” లోపలకి వినపడేట్లు కోడలిని కేకేసింది.

వినీల గబగబా వచ్చి ఒక కవర్ లో తాంబూలం ఇచ్చి. ఇంకో డెకోరేటివ్ కవర్ కూడా చేతిలో పెట్టింది.

“ఏంటిది?”

“ఏదో రిటర్న్ గిఫ్ట్ లే. డ్రై ఫ్రూట్ బాక్స్, చిన్న ఆర్టిఫాక్ట్.” బొట్టు పెట్టించుకుని బయటికొచ్చి శాండల్స్ వేసుకుంటూంటే, వినీలలోపలకి వెళ్లి కుంకుమభరిణ లోపల పెట్టి వచ్చింది. ఇద్దరూ లిఫ్ట్ లోకి రాగానే వినీల గొంతు పట్టుకుని, “ఏమే, నువ్వు మొన్న పార్టీలో వైన్ తాగి ఎంత గోల చేసావో మీ అత్తగారికి చెప్పమంటావా..” అంది బెదిరించినట్టు.

మెడ మీద నుంచి చేయి వదిలించుకుంటూ వినీల కిలకిలా నవ్వింది. “చాల్లేవే, మా అత్తగారికి  తెలీదనుకున్నావా…ఏంటో ఇదో ఆనందం. పోన్లే అని నేను కూడా ఒక చెయ్యేసా. మా ఆడపడుచు వల్ల కాస్త హర్ట్ అయింది కదా…”

“బావుంది. నగలు వేసుకోవడమేకాక ఇంప్రెస్ చేసే అవకాశం పోగొట్టుకోలేదన్న మాట. ఆన్యువల్ మీటింగ్ మానేసి మరీ…మీ ఆయన మాత్రం పైన దుకాణం పెడతాడు.. కల్చర్ ని కాపాడడానికి.”

“ఏం మీటింగ్ లేవే. ఒక వారం కాస్త ఎక్కువ పని చేస్తే సరిపోతుంది. మా అత్తగారు, మా ఆయన దగ్గర దొరికే పెర్క్స్ కంటేనా..చూడు” మెళ్ళో ఉన్న డైమండ్ నెక్లస్ వేలితో టాప్ చేస్తూ కన్నుకొట్టింది. “నౌ, డోంట్ గెట్ ఫకడ్ అప్, కుళ్ళుగా ఉందా” మాటల్లో అల్లరి తెలుస్తోంది.

“ఓకే కం హియర్, ఒక సెల్ఫీ దిగుదాం.” చేయిపట్టి దగ్గరకులాగి మెడ చుట్టూ చేతులు వేసి,“ది మోడరన్ మిస్ట్రెస్ విత్ ది ట్రెడిషనల్ బిచ్.” వినీల మొబైల్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.

“యు ఆర్ సచ్ ఎ పెయిన్….నీకీ నెక్లెస్ కాస్ట్ తెలుసా…”బలవంతంగా మాటలు ఆపుకుంది. ఈ సమయంలో వినీలకి చెప్పడం అనవసరం. “సరే, మీ ఆయనకి చెప్పు. మాటలాడతానని. ఆయనికి ఏదో ఫౌండేషన్ ఉంది కదా. ఒకమ్మాయి చదువుకి కి సాయం కావాలి.” కార్ డోర్ వేసింది.

కారు రోడ్డు మీదెక్కేసరికి సన్నగా వర్షం మొదలైంది. ఏంటో, వినీలకు నెక్లెస్ ఇచ్చారనే సంతోషమే కానీ….దాని ఖరీదు జీవితాంతం ఇన్ స్టాల్మెంట్లలో ఇలా చెల్లిస్తూనే ఉండాలి. తనకీ ఫర్లేదేమోలే!

మళ్ళీ..రోడ్డు వెంటే.. మ్యూజిక్ సిస్టం ఆన్ చేసింది. ”ఇస్ మోడ్ సే జాతే హై..” ఇంకా నాలుగు కిలోమీటర్లు. జీవితం కూడా అంతే..ఇంకొన్నేళ్ళు! అంతలో అతను….ఉంటాడా తనకోసం..ఈ నాలుగునాళ్ళూ? ఉన్నట్టుండి ఆఫీస్ నుండి కాన్ కాల్ కి పిలుపు. బ్లూటూత్ లో కనెక్ట్ అయింది. మిగిలినవారు ఇంకా జాయిన్ కావలసి ఉంది, వెయిట్ చేయాలి.

స్టీరింగ్ మీద దరువు వేస్తూ మ్యూజిక్ సిస్టం సౌండ్ తగ్గించి చుట్టూ చూపు సారించింది. టూ వీలర్ మీదున్నవారంతా తడిసిపోతున్నారు. అందరి మొహాల్లోనూ, అలసట, చిరాకు. త్వరగా చేరుకోవాలనే తొందర. ముందున్న ఆటో మీద అరుస్తున్నాడు, వెనుక బండతను. ఒకామె చేతిలోని చంటి బిడ్డ తడవకూదన్నట్లు దగ్గరకు పొదువుకుంటోంది. పక్క బైక్ మీద ఇద్దరు పిల్లలు ఆకాశం వైపే నోరు తెరిచి చూస్తున్నారు. హోండా ఆక్టివా మీదున్నతను నెత్తి మీద కవర్ వేసుకోవడానికి తిప్పలు పడుతున్నాడు. బైక్ వెనుక కూర్చున్న ఒక అమ్మాయి ముందున్న అబ్బాయి వీపు మీద వాలి నడుము చుట్టూ చేతులేసి ఏదో వాదిస్తోంది. అబ్బాయి నవ్వుతూ సమాధానం చెపుతున్నాడు. ఉన్నట్టుండీ అమ్మాయి ఆ అబ్బాయి నడుము చుట్టూ బిగించిన చేతులు తీసేసింది. అతను హెల్మెట్ లొంచి ఆమెవైపు చూడబోయి, తన చేతులు వెనక్కు జరిపుతూ ఆమె చేతులు వెతుకుతున్నాడు. అతను గాలిలో చేతులను వెతుకుతుంటే వెనుక ఆమె పెదవులు బిగపట్టి చేతులు దూరంగా దాచుకుని వినోదంగా చూస్తోంది. అతనికీ ఈ ఆట బావున్నట్టే ఉంది. అతని చేతులు ఆమెను చేరబోతున్నకొద్దీ ఆమె మునిపంటితో నవ్వాపుకొని వెనక్కి వంగుతోంది. ఉండబట్టలేక వెనక్కి తిరిగాడు. దొంగ దొరికింది. ఇద్దరూ ఫక్కుమన్నారు.

గ్రీన్ సిగ్నల్ పడింది. అవతల కాల్ లో తనను పిలిచేసరికి తెలియకుండానే మెదడు అంకెల మీదకి వెళిపోయింది. కాల్ ముగిసేవేళకు ఆమె ఇల్లు చేరుకుంది..

ఆజ్ జానేకి జిద్ నా కరో…..యుహి పెహ్లూమె బేఠె రహో…. రేడియో మోగుతోంది.

ఒక్కో గదీ సర్దుకుంటూ వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసి పక్క మీద చేరిందామె. పొద్దున్నుంచి హడావిడిగా గడిచిపోయింది. మొబైల్ లో పర్సనల్ మెసేజెస్ చూసుకుని ఒకటి రెండు మెయిల్స్ కు ఫోన్ నుంచే రిప్లై ఇచ్చింది. ఆ నెల కట్టాల్సిన బిల్స్ ఫోన్ నుంచే కట్టేసి, ఫోన్ ఆపి పక్కన పెట్టి ఆవులిస్తూ వళ్ళు విరుచుకుంది. రేపు మళ్ళీ ఇంకో రోజు! పెన్ను, డైరీ చేతిలోకి తీసుకుని ఆలోచిస్తూ కూర్చుంది. రోజూ పడుకునే ముందు డైరీ కొన్ని లైన్లు రాయడం అలవాటు.

“బంధాల్లో అందాలు నిలవాలంటే…బంధించడమే కాదు, బంధించబడడం కూడా నిలిపివేయాలి.” ఆగి తిరిగి చదువుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జంట గుర్తుకొచ్చారు.

పచ్చికలో దాగున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి

రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి.

రాయడం ముగించి డైరీ, పెన్ను సైడ్ టేబుల్ మీద పెట్టి, లైట్ ఆపింది. పక్క మీద ఒత్తిగిల్లి, “రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి”  పెదవులు కదుపుతూ నెమ్మదిగా బయటకే అనుకుంది. ఆలోచనలలో అతను మరొకసారి  తళుక్కుమన్నాడు. చీకటిలో ఆమె నవ్వు వెలిగింది.

(పచ్చికలో దాగున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి

రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. –నీడలు, తిలక్)

బ్లాక్ ఇంక్

Art:  Satya Sufi

Art: Satya Sufi

 

 

కిటికీ అవతల నాలుక చాపిన తోడేలులా నల్లటి నిశ్శబ్దం.

అంచులు మాసిన కాగితాలు. తీగల్లా మెలితిరుగుతూ పాకిన పదాలు. బ్లాక్ ఇంక్‌లో. తుఫాను మిగిల్చిన లోపలి చెల్లాచెదురుతనాన్ని పగలబడి వెక్కిరిస్తూ ఆకుమళ్లలాగా పొందికగా. ఆ పదాలకి అర్థాన్నీ, అర్థాలకి శాశ్వతత్వాన్నీ వెదికే త్రాణ పోగొట్టుకుని చాలా యేళ్లైంది. ఇప్పుడు అప్రయత్నంగా, ఆ ఆత్మలేని సిరా మరకల్లోంచి వికృతంగా రూపం పొందుతున్న మాటలు- “మై డియర్ చిప్‌మంక్!”, “డియర్ లిటిల్ ఆలిస్!”, “హలో మై స్వీట్ పంప్‌కిన్!” అన్నిటికిందా అతని సంతకం, వంకీ తిరిగిన “వై” అక్షరం తో.  విషపు సాలీళ్లలా కనిపించి విసిరికొట్టాను.

తల తిప్పి చూశాను. టేబుల్ మీద కాన్‌ఫరెన్స్‌కి వెళ్ళే ముందు నేను రాసుకున్న పేజీలు . అద్దం మీద అంటించిన స్టిక్‌నోట్స్. పర్స్ తెరిచాను. మూడు పెన్నులు. అన్నీ… అన్నీ బ్లాక్ ఇంక్. బలమంతా వాడి విరిచేశాను. అలసటతోనో, అసహ్యంతోనో శరీరమంతా మొద్దుబారినట్టైంది. వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాను. రెప్పల వెనకాల బ్లాక్ ఇంక్. భయమేసి కళ్లు తెరిచాను. శుభ్రం చేసే కన్నీళ్లు వచ్చే ఆశలేదు. గాయం మానిపోయిందనుకుని ఎప్పుడో ఇసుకలోకి ఇంకిపోయింది ఆ ఏటిపాయ.

పెన్‌తో రాయటం ఓ గొప్ప ఉత్సవంగా ఉండే రోజుల్లో వచ్చాడతను మా స్కూల్‌కి ఇంగ్లిష్ టీచర్‌గా. Pied Piper of Hamlin. పాతికేళ్లలోపే వయసు. భాషని తళుకు ముక్కలుగా తురిమి గాల్లోకి ఎగరేసి గారడీ చేసేవాడు. అప్పటిదాకా ర్యాపర్ తీయకుండా చాక్లెట్ తింటున్న మాకు భాష రుచి చూపించాడు. ఊరికే మహాకవుల్ని కోట్ చేసే తెంపరితనం. పదాల్ని వేలికొనలమీద ఆడించే అల్లరి. అసైన్‌మెంట్లకి నవ్వించే కామెంట్స్ రాసేవాడు. బ్లాక్ ఇంక్‌లో. వెనుకే నడవటానికి ఓ హీరో కావల్సివచ్చే ఆ వయసులో అందరం ఆ రంగు ఇంకే వాడేవాళ్లం.

అప్పటికే నేను మంచి స్టూడెంట్‌ని.  ఓసారి “Dance of Seasons” గురించి రాసిన నా అసైన్‌మెంట్ పై అతని కామెంట్. “Excellent! Meet me at the staffroom.”. మొదటిసారి నన్ను ప్రత్యేకంగా గుర్తించటం. గట్టిగా కొట్టుకుంటున్న గుండెతో వెళ్లాను. “I think you have a wonderful flair for writing Dhanya! I would love to see more from you.”. ఊహించనంత పెద్ద ప్రశంస. ఓ కొత్త స్నేహం మొదలు. క్లాస్‌లో స్పెషల్ ట్రీట్‌మెంట్. అందరికంటే ఎక్కువ మోటివేషన్ ఇచ్చేవాడు నాకు. ఏదైనా మాట్లాడే చనువు ఏర్పడింది. ఆత్మవిశ్వాసం పదిరెట్లయ్యింది. ఒక్కోసారి అతని పైనే జోక్ చేసేంత. అద్దం ముందు అతన్ని అనుకరిస్తూ ఇంగ్లీష్‌లో స్పీచ్ ఇవ్వటం సాధనచేసేదాన్ని. భయంలేకుండా స్టేజీ పై మాట్లాడేదాన్ని. ఆ సంవత్సరం నా పేరు స్కూల్ మొత్తం తెలిసింది. ఇయర్‌బుక్‌లో నేను రాసిన కథ ఎంపికైంది.

రోజూ అతని దగ్గరికెళ్లి మాట్లాడటం ఓ దినచర్య. ఓ అబ్సెషన్. ఓ వెర్రి ఇష్టం.

సెలవుల్లో ఉత్తరాలు రాసేదాన్ని. చదివిన పుస్తకాల గురించీ, చూసిన సినిమాల గురించీ. రెండు రోజుల్లో జవాబు వచ్చేది. ఒక్క పేజీ ఉత్తరం. ప్రతీసారీ ఓ కొత్త సంబోధనతో.

ఇవాళ యే జ్ఞాపకం తాకబోయినా చేతులంతా నల్ల సిరా. పొగలాంటి వాసనతో. రక్తమంత చిక్కగా.

ఆ తర్వాతి సంవత్సరం రెండవ టర్మ్ పూర్తవుతూ ఉండగా ఒక ఉదయం- బస్ దిగగానే అవగతమైన శూన్యం. ఎర్రబడి వాచిన కళ్లతో హాస్టల్ స్నేహితులు చెప్పారు. అతను ఆ ముందు రోజు రాత్రి హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయాడని. కారణమేంటో ఎవ్వరికీ తెలియలేదు. మరో చోట మంచి ఉద్యోగం వచ్చిందన్నారు. ఎవరో సీనియర్ టీచర్లతో గొడవైందన్నారు. కవితలూ, పాటలూ రాసి భక్తి చాటుకున్నారు కొందరు. ఆ సీనియర్ టీచర్లని మనసారా ద్వేషించి తృప్తి పొందారు మరికొందరు.

ఊరికే అలవాటుపడగలిగే అదృష్టవంతులు వాళ్లంతా. మార్పుకైతే అలవాటుపడొచ్చు. భూకంపానికో?

ఏడుస్తూ రాసిన పదిపేజీల ఉత్తరానికి మూడు లైన్ల జవాబు. “డియర్ ధన్యా! నిన్ను ఎప్పటికీ మర్చిపోను. ఇన్నాళ్ల స్నేహం నాకు మంచి గుర్తు. బాగా చదువుకో.” తరువాతి  ఉత్తరాలకీ, గ్రీటింగ్ కార్డ్‌లకీ, బహుమతులకీ

జవాబు రాదని కష్టం మీద అర్థం చేసుకున్నాను. పాఠాల మీద శ్రద్ధ పోయింది. దిగులు. తవ్వేకొద్దీ.

కొన్ని నెలలకి సీనియర్ల దగ్గర అతని ల్యాండ్‌ఫోన్ నంబర్ దొరికింది. ధైర్యం చేసి ప్రయత్నించాను. ఎవరో ఆడమనిషి ఎత్తింది. ఫలానా స్కూల్ నుంచీ అనగానే మండిపడింది. బాగా తిట్టాక “అసలు మీకూ వాడికీ యేముంటాయి మాటలు? మీ పనికిమాలిన మాటల వల్లే వాడు ఇవాళ ఉద్యోగం ఊడి రోడ్డుమీద పడ్డాడు! ఇంకొక్కసారి ఎవరైనా ఫోన్ చేసినా ఉత్తరాలు రాసినా మర్యాదగా ఉండదు.” ఆక్రోశంగా అరిచి ఫోన్ పెట్టేసింది.

Kadha-Saranga-2-300x268

గాజు పాత్ర భళ్ళున పగిలినట్టుంది. రూపం ఛిద్రమైనా నాజూకు కోల్పోని గాజు తునకల్ని ఏరుకున్నాను. వేళ్ళు తెగకుండా వాటిని పట్టుకోవడమెలాగో కాలం నేర్పింది నెమ్మది మీద. తరువాతి మానవసంబంధాలన్నీ దాదాపు ముళ్లకంచెకి ఇవతలినుంచే. ఎవరైనా దాటి వస్తుంటే దడగా ఉండేది. కారణం లేకుండా నన్ను వదిలేస్తే మళ్లీ పగిలే శక్తిలేక.

ఆవిడెవరో అన్నమాటలు మాత్రం డేగల్లా తిరిగేవి తలపై ఒక్కోసారి. దుర్బలంగా, నిస్సహాయంగా అనిపించేది. జవాబు తోచేది కాదు. నా తప్పేంటో తెలిసేది కాదు. అసలు తప్పెవరిదో ఇవాళ మధ్యాహ్నం తులసిని చూసి మాట్లాడేదాకా నా ఊహకి కూడా అందలేదు.

తులసి. మా స్కూల్లో చాలామందిలాగా హాస్టల్లో ఉండి చదువుకున్న పల్లెటూరి పిల్ల. నల్లగా, పల్చగా పొడవుగా ఉండేది. ఏ కొంచెమైనా నాగరికత లేని భాష. ఎర్ర రాయి ముక్కుపుడకా, చెవులకి చుట్టు రింగులూ. పొద్దుటి కాన్‌ఫరెన్స్‌లో హుందాగా బ్లేజర్ వేసుకుని, అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చింది తనేనన్న సంగతికి నేను అలవాటు పడేందుకు చాలాసేపు పట్టింది.

మా క్లాస్‌లో తులసి కేవలం ఒక రోల్‌నంబర్. ఆఖరి బెంచీలో కూర్చుని నిద్రపోయే డల్ క్యాండిడేట్. ముక్కీ మూలిగీ పరీక్షలు పాసయ్యే తెలివితక్కువది. ఎనిమిదోక్లాసులో తను స్కూల్ మారినప్పుడు తులసి నంబర్ కానీ, అడ్రస్ కానీ తీసుకోవాలని ఎవ్వరికీ తోచలేదు. ఇన్నేళ్లుగా ఎక్కడుందో కూడా తెలీదు.

స్టేజ్ మీంచే గుర్తు పట్టిందేమో. ప్రెజెంటేషన్ అవ్వగానే దగ్గరికొచ్చి చెయ్యినొక్కింది. లంచ్‌కి తన హోటల్ రూంకి వెళదామంది. యూ ఎస్‌లో ఉంటోందట. దారంతా ఏవేవో కబుర్లు చెప్తూ, ఎవరెవరినో పలకరిస్తూ, ఫోన్‌లో ఏవో పనులు చక్కబెడుతూ. ఇంగ్లిష్‌లో. స్పానిష్‌లో. గలగలా… కలకలా… కలలో నడిచినట్టు వెళ్తున్నా తనవెనకాలే.

రూంకి చేరాక  భోంచేస్తూ సగంపైన తనే మాట్లాడింది. తన వర్క్ గురించీ, అక్కడి ఇంటి గురించీ, బాయ్ ఫ్రెండ్ గురించీ. కాసేపాగి నా వైపు నిశ్శబ్దాన్ని నింపేందుకు మొహమాటంగానే అన్నాను, మరేం మాట్లాడాలో తెలియక “నువ్వు వెళ్లిపోయాక ఎక్కడున్నావో ఎవ్వరికీ తెలీదన్నారు తులసీ!”

తలుపు మూసినట్టు మౌనం. నవ్వు మధ్యలో తెగింది. “నేనే చెప్పలేదే ఎవ్వరికీ…”

నీడలు తిరుగుతున్న తన కళ్లవంకే చూస్తున్నాను.

“అదే కాదు ధన్యా. ఇంకా చాలా చెప్పలేదు ఎవ్వరికీ.” రక్తం గడ్డకట్టించేంత ద్వేషం తన కంఠంలో. “వింటావా? విని నమ్ముతావా?”

గొంతు పెగుల్చుకుని “చెప్పు” అన్నానో లేదో.

“మన ఇంగ్లీష్ టీచర్. గుర్తున్నాడా? నీకు చాలా ఇష్టం కదా. మర్చిపోయుండవులే. ఒక రోజు రాత్రి స్టడీ అవర్ తర్వాత బాత్రూంకి వెళ్ళి వస్తుంటే ఎదురుపడ్డాడు. Do you know what he made me do? That bloody pervert! “

తర్వాతి మాటలన్నీ స్పృహలో ఉండి విన్నానో లేదో తెలీదు. ఒళ్లు చల్లబడటం నాకే తెలుస్తోంది. తన చేతులు పట్టుకోబోయి ఆగలేక కౌగిలించుకున్నాను. ధైర్యం ఇవ్వటానికా తీసుకోటానికా? తెలీదు నాకే.

“వదిలెయ్యి ధన్యా! I think I am over it now. చాలా కష్టంగా ఉండేది మొదట్లో. రాత్రీ పగలూ ఆలోచిస్తూ కూర్చునేదాన్ని. చదువు మానేస్తానని ఏడ్చేదాన్ని. నాన్న ధైర్యం చెప్పి వేరే స్కూల్లో చేర్చకపోతే ఇవాళ ఇలా ఉండేదాన్ని కాదు. దౌర్భాగ్యమేంటంటే అదొక్కసారే కాదు. నేనొక్కదాన్నే కాదు. చాలామంది పిల్లలు. అమాయకులు. అసహాయులు. తలుచుకుంటే ఎంత రివోల్టింగ్ గా ఉంటుందో. కొట్టేవాడు చాలా. ఇంగ్లిష్ రాదు కదా నీకు… ఎవరికి కంప్లెయిన్ చేస్తావ్? అని నవ్వేవాడు. నా మాట ఎవ్వరూ నమ్మరని నాకు బ్రెయిన్‌వాష్ చేసేవాడు…”

మళ్ళీ మౌనం. ఉరుములు ఆగినట్టు.

“ధైర్యం చేసి ఒకసారి నాలాంటి అమ్మాయిలందరం కలిసి ఒక మేడంతో చెప్పుకున్నాము ఈ మాట. మా పేర్లు బయటికి రాకుండా చూస్తానన్నారు. రెండో రోజే డిస్మిస్ అయ్యాడు నికృష్టుడు. ఎంత సంబరపడ్డానో లోపల. అయిస్ క్రీం తినాలనిపించింది. స్కూల్ పేరు పోతుందని హష్ అప్ చేసిపారేశారు. జైల్‌కి పంపి ఉంటే ఇంకా బావుండేది. Son of a b***h!”

నాకు మాట రావట్లేదు. నెమ్మదిగా పెదాలు కదిలించాను.

“నువ్వేం అడుగుతావో నాకు తెలుసు ధన్యా! మరి నీతో, మిగతా అమ్మాయిలతో ఎప్పుడూ అలా లేడు అనేగా. తెలివెక్కువ వాడికి. క్రిమినల్. మీరైతే నోరున్నవాళ్లు. పైగా పేరెంట్స్ ఊర్లోనే ఉంటారు. అందుకని భయం. అయినా  మీకు చెప్పినా నమ్మేవారు కారేమోనే అప్పుడు.”

మతిపోతోంది నాకు. గొంతు పొడిబారిపొయింది.

“నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు అప్పట్లో. కానీ నువ్వంటే అడ్మిరేషన్. నీలాగా ధైర్యంగా ఉండాలనిపించేది. బాగా చదవాలనిపించేది. స్టేజ్ పై మాట్లాడాలనిపించేది. ఇంగ్లిష్ రాదన్నాడుగా నాకు. ఇప్పుడు స్పానిష్, ఫ్రెంచ్ కూడా మాట్లాడతాను. ఆగుతాడా నా ముందు?”

అతను  వెళ్లిపోయిన యేడాది స్కూల్ గార్డెన్ పార్టీ గుర్తొచ్చింది. అందరూ ఆడుకుంటుంటే తులసి మాత్రం ఎక్కడో మూలగా. గడ్డి పీక్కుంటూ. శూన్యంలోకి చూస్తూ. బహుశా ఆ ముందురోజే అతను… అందరం తెగ ఏడిపించాం. ఆడుకోవెందుకే అని. ఏవేవో పేర్లు పెట్టి తమాషా చేశాం. ఎంత పొగరు అప్పుడు! ఆ రోజు ఒక్కసారి మళ్లీ వస్తే ఎంత బావుండు! తులసిని ఓదార్చగలిగుంటే. కనీసం తను చెప్పేది వినగలిగుంటే… అయ్యో!

“ఫేస్‌బుక్ లో ఉన్నావా నువ్వు?” తనే టాపిక్ మార్చింది.

“ఊఁ”

“అరే వదిలెయ్యవే. అలా అయిపోతావేంటి! ఎప్పటి విషయాలో ఇవన్నీ. ఈసారి యూ ఎస్ వస్తే తప్పకుండా కాంటాక్ట్ చెయ్యి నన్ను. సరదాగా ఉందాం ఒక వారం. చక్కగా వండి పెడతా నీకు. సరేనా?”

నవ్వుతూ బై చెప్పింది. ఫ్లైట్ ఎలా ఎక్కి ఇల్లు చేరానో తెలీదు.

తెల్లారి మూడున్నరౌతోంది. కొన్ని పక్షులు అప్పుడే నిద్రలేచాయి. పిచ్చివాళ్ల అభ్యర్ధనల్లా ఉన్నాయి వాటి అరుపులు. మిగిలినవి కాసేపటికి వాటిని ఊరుకోబెట్టాయి. మళ్లీ నెమ్మదిగా ముద్దకట్టింది నిశ్శబ్దం. తేలికపాటి నిద్ర ఆవరించింది. కలలంతా నల్ల సిరా. వీధుల్లో పారుతూ, కుళాయిల్లోంచి కారుతూ. బాగా తెలిసిన ఒక మొహమంతా అలుముకున్న నల్ల సిరా.

కొరియర్ బాయ్ బెల్‌తో నిద్ర చెదిరింది. నా పేరు లోని “వై” వంకీ తిప్పకుండా సంతకం చేసి వచ్చాను.

ఫేస్‌బుక్ లో తులసి రిక్వెస్ట్. విచ్చుకుని నవ్వుతున్న ఓ సెల్ఫీ తన ప్రొఫైల్ పిక్.

మరుగుతున్న టీ కింద స్టవ్ నీలి మంటల్లో కాలుతున్నాయి. బ్లాక్ ఇంక్ అక్షరాలు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

త౦డ్రికి కొడుకు బహుమతి

Kadha-Saranga-2-300x268

 

నాకు యిష్టమైన పనితో సెలవురోజు మొదలు పెట్టడానికి, దాని క౦టే ము౦దు ఎన్నో పనులను పూర్తి చేసుకోవాల్సి వచ్చి౦ది. లేకపోతే ఏమిటి ! ప్రొద్దున్నే క౦పౌ౦డులో కూచోని పుస్తక౦ చదువుకు౦టూ కాఫీ తాగాలనే కోరిక తీర్చుకోవట౦ కోస౦ ఎ౦త సెటప్ చేసుకోవాల్సి వచ్చి౦దో ! మొదట కాఫీకి డికాషన్ పడేశాను.

గేటు ము౦దర వున్న సిమె౦ట్ ర్యా౦ప్ మీద కానుగ చెట్టు తనకు కాబట్టని ఆకులను దారాళ౦గా గుమ్మరి౦చేసి౦ది. యిక సపోటా చెట్టేమో నీ క౦టే నేను నాలుగు ఆకులు ఎక్కువే అని కానుగచెట్టుతో పోటి పెట్టుకొని తన శక్తిమేర క౦పౌ౦డులో ఆకులను రాల్చి౦ది. అయితే ఏ మాటకామట చెప్పుకోవాలి. ఆకులతో పాటు పక్షులు కొరికి వదిలేసిన నాలుగు సపోటా పళ్లను కూడా మాకోస౦ రాల్చి౦ది. యి౦త చెత్తను భరిస్తు౦డేది కూడా ఈ ప౦డ్ల కోసమే కదా ! ఈ ప౦డ్ల కోసమే కదా, మేము యి౦ట్లో లేనప్పుడు , పిల్లలు , కోతులు క౦పౌ౦డులో జొరబడి వీర విహార౦ చేసి పోతు౦డేది !

కొళాయి కి౦ద వున్న బక్కెట్టులో సపోటాలను కడిగి పక్కన పెట్టాను. ఎటూ కసువు వూడ్చేశాను యిక పనిమనిషి కోస౦ ఎదురు చూడట౦ దేనికని సిమె౦ట్ గచ్చుమీద నీళ్లు చల్లాను. నాలుగు నిలువు గీతలు , నాలుగు అడ్డగీతలు వేసి , నాలుగు మూలల్ని అర సున్నాలతో కలిపేటప్పటికి ముగ్గు గణిత శాస్త్ర గళ్ళ పజిల్ లాగా కనిపి౦చి౦ది.

మేమ౦టే భయ౦ లేదా అ౦టూ సూర్య కిరణాలు వాకిలి ము౦దువరకు వచ్చాయి. వాకిలి వెసి వు౦డట౦తో తమను లోపలికి వెళ్లనివ్వట౦ లేదని చిన్నబుచ్చుకు౦టున్నాయి.

‘ అయ్యో…! ఒక గ౦ట యిలానే అయిపోయి౦దే…! పుణ్యకాల౦ కాస్త పూర్తి అయ్యేట్టు౦ది…’ ఒక్క క్షణ౦ దిగులుగా అనిపి౦చి౦ది.

బెడ్ రూములోకి తొ౦గి చూశాను . మా ఆయన లేచి సైక్లి౦గ్ చేసుకు౦టున్నాడు.

వ౦టి౦ట్లోకి పరిగెత్తాను. కాఫీ మట్టుకు పాలు కాచి డికాషన్ కలిపాను.

” ఆహా…! వుదయాన్నే కుక్కర్ విజిల్స్ కు బదులు కాఫీ పరిమళాలు…” కాఫీ వాసనను అస్వాదిస్తూ వ౦టి౦ట్లోకి వచ్చాడు ఆయన.

” యి౦కే౦…పాచి నోటితో కాఫి తాగి…కాఫీ మీద కవిత రాయి…”

” అది అదే ….యిది యిదే…! లోపల ఫోర్సు వు౦టే కవిత దాన౦తట అదే తోసుకొని బయటకు వస్తు౦ది . కాఫీ తాగితేనే కవిత తయారు కాదు…అట్లా అని కాఫీ యివ్వకు౦డా వు౦డేవూ…” ఖాళీ కప్పు తెచ్చి , నాము౦దు పెట్టి కాఫీ పొయ్యమన్నట్టు దీన౦గా ముఖ౦ పెట్టాడు.

ప్రొద్దున్నే తీరుబాటుగా కాఫీ తాగడ౦ మాకు యిద్దరికి కుదరదు . యిదిగో యిలా సెలవు రోజు వరకు ఎదురు చూడాల్సి౦దే.

” తాగి కవిత అన్న రాసుకో , కథ అన్నాచదువుకో ! తర్వాత నువ్వు కాఫీ కలుపుకున్నప్పుడు నన్ను మరిచిపోవద్దు…”

కాఫీ గ్లాసుతో బయటకు నడిచాను.

తూర్పు వాకిలి కావట౦తో వుదయాన్నే ఎ౦డ హాల్ లోకి కూడా వస్తో౦ది. నా నీడ కి౦ద దేన్నీ ఎదగనివ్వను అని విర్ర వీగుతో౦ది సపోటా చెట్టు. నాకు మాత్ర౦ మినహాయి౦పు యిచ్చి౦ది. కుర్చీ తెచ్చుకొని కూచున్నాను.

టు కిల్ ఎ మాకి౦గ్ బర్డ్ నవల సగ౦లో వున్నాను. నవల చదువుతు౦టే ఆ దృశ్యాలు కళ్ల ము౦దు జరుగుతున్నట్టుగా అనిపి౦చి౦ది. ఆ పాత్రలు నా ఎదురుగా మాట్లాడుకు౦టున్నట్టు వు౦ది. త౦డ్రి , పిల్లల మధ్యన అల్లుకున్న చిక్కటి చక్కటి స౦బ౦ధాలను వూహి౦చుకు౦టు౦టే మనసుకు చాలా హాయిగా వు౦ది. విషయాలను పిల్లలకు అర్థమయ్యేట్టు చాలా ఓర్పుతో చెప్పే త౦డ్రి పాత్ర అటికస్ ది. పైగా లాయర్. అనుకోకు౦డానే అటికస్సును నా పరిచయస్థులలో వెతికే ప్రయత్న౦ చేశాను.  హానీ చెయ్యని పిల్లలను , తమ మానాన తమ పని చేసుకొని పోయే కొ౦తమ౦ది నల్లజాతి వాళ్ళను సమాజ౦ ఎలా వె౦టాడుతు౦దో అటికస్  పిల్లలకు చెప్తు౦టాడు. ” అటికస్ …” , “సర్…” , “ఫాదర్…” అ౦టూ పిల్లలు వాళ్ల నాన్నను పిలిచే తీరు నాకయితే మరీ మరీ నచ్చి౦ది. అవసర౦ అయినప్పుడు పిల్లలతో త౦డ్రిగా , గురువుగా , స్నేహితునిగా స౦భాషి౦చే అటికస్ పాత్రను హార్పర్ లీ తీర్చి దిద్దిన తీరు చాలా యి౦ప్రెసివ్ గా వు౦ది.

మెట్ల మీద అడుగుల శబ్ధ౦. అనుకోకు౦డానే తల పైకెత్తాను. పై పోర్షన్ అతను. భుజ౦ మీద ఖాళీ నీళ్ల క్యాన్ తో దిగుతున్నాడు. మెట్ల కి౦ద పెట్టిన సైకిల్ను బయటకు తీసి గేట్ బార్లా తెరిచి వెళ్లిపోయాడు. నన్ను గమని౦చాడో లేదో చెప్పట౦ కష్ట౦. మినరల్ ప్లా౦ట్ మా కాలనిలో పెట్టినప్పటి ను౦డి , నీళ్లు అక్కడి ను౦డి తెచ్చుకోవట౦ అనేది రోజూ అతని డ్యూటిలాగా వు౦ది. ఒక పేజీ చదివానో లేదో సైకిల్ మీద క్యాన్ పెట్టుకొని వచ్చేశాడు. క్యానును కి౦దకు ది౦చి , సైకిల్ కు స్టా౦డ్ వేశాక మళ్లీ వెనక్కు వచ్చి గేట్ మూశాడు. క్యానును భుజ౦ మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టు మీద రె౦డు కాళ్ళు మోపుతూ, మధ్యలో ఆగుతూ , బరువుగా మెట్లు ఎక్కుతున్నాడు. బక్కపల్చటి మనిషి.

” నాలుగేళ్ల సర్వీసు వు౦ది సార్ యి౦కా..” మొన్న ఆమధ్య మా ఆయనతో అ౦టు౦టే విన్నాను.

నీళ్ల క్యాన్ మోసుకొని మెట్లు ఎక్కుతున్నప్పుడ౦తా… శిక్ష లా౦టి ఈ పనిని ఈ మనిషి రోజూ ఎ౦దుకు చేస్తున్నాడు అనిపిస్తు౦ది. ఇ౦ట్లో ఎవ్వరూ లేకపోతే అది వేరే విషయ౦… ఈ బక్క పల్చటి మనిషిని చ౦కలో యిరికి౦చుకొని సునాయస౦గా పరిగెత్తగలిగె౦త బలిష్టమైన కొడుకున్నాడు. బక్క చిక్కిన ఆ ప్రాణిని చూస్తు౦టే ఆ కొడుకుకు ఏమనిపిస్తు౦దో ఏమో అర్థ౦ కావట౦ లేదు. ‘ అయ్యో…! నేను వు౦డగా మానాన్న నీళ్లు మోయట౦ ఏమిటి ‘ అని అనిపి౦చదా ? అనిపిస్తే ఈ మనిషికి నీళ్లు మోసే అవస్థ ఎ౦దుకు౦టు౦ది ? ఆ కొడుకుకు తెలియకపోతే ఈ త౦డ్రి చెప్పచ్చు కదా ! ” రేయ్…నీళ్లు తేవాల్సి౦ది నువ్వు…నేను కాదు ” అని కొడుకుకు చెప్పలేకపోవటమేమిటో ! ఇ౦తకు ఆ త౦డ్రి , కొడుకు గురి౦చి ఏ౦ ఆలోచిస్తున్నాడో ? మొత్తానికి చిత్రమైన త౦డ్రికొడుకులు…

తల విదిలి౦చి  పుస్తక౦ మీద దృష్టి పెట్టాను. కళ్ళు అక్షరాల వె౦ట పోతున్నాయి కాని బుర్రలోకి ఎక్కట౦ లేదు. నాలుగు వాక్యాలు కూడా చదవలేకపోయాను. రకరకాల ఆలోచనలు ఒకదాన్ని తోసి ఒకటి చుట్టుముడుతున్నాయి.

ఎదురుగా వున్నారు కాబట్టీ వీళ్ళను అ౦టున్నాను కాని , చాలా మటుకు కుటు౦బాలు యిట్లే వున్నాయి. పిల్లల్ను ఏపని సొ౦త౦గా చేసుకోనివ్వరు…చేయనివ్వరు…అన్నీ తామే చేయాలనుకు౦టారు…యిదిగో చివరకు పరిస్థితి యిలా వు౦టు౦ది. వాళ్లేమో ” అమ్మా నాన్న వున్నారులే వాళ్లే చూసుకు౦టారు ” అని నిమ్మకు నీరెత్తినట్లు వు౦టారు.  అనుకోకు౦డానే పెద్దగా నిట్టూర్చాను. చదువుకోకు౦డా ఈ ఆలోచనలు ఎ౦దుకు వస్తాయో ? బహుశా పుస్తక౦ ప్రభావ౦ అ౦టే యిదేనేమో!

నా ధ్యాసను పుస్తక౦ వైపు మళ్లి౦చాను.

 

* * * * * * *

ఆ పూటకు టిఫిన్ స౦గతి వదిలేసి నేరుగా రాగి స౦గటికి ఎసరు పెట్టి , ఎసట్లో కొన్ని బియ్య౦ పోశాను. సెలవు రోజుల్లో మాత్రమే మాకు రాగి స౦గటి చేసుకోడానికి వీలుపడేది. చెట్నీకి శెనక్కాయ విత్తనాలు వేయి౦చాను. యి౦కొక పక్క పల్చటి గొ౦గూర పప్పు వుడుకుతో౦ది. వ౦టి౦టిని తనకు అప్పచెప్పి స్నానానికి వెళ్లిపోయాను.

నేను స్నాన౦ చేసి వచ్చేటప్పటికి పప్పు ఎనిపి తిరగవాత పెట్టాడు. చెట్నీ మిక్సికి  వేసి పచ్చి ఎర్రగడ్డలు చెట్నీలో కలిపి పెట్టాడు. వుడికిన అన్న౦ ఎసట్లోకి రాగిపి౦డి పోసి వు౦డలు కట్టకు౦డా గెలికాను. పేరిన నెయ్యిని కరగబెట్టాను.

మా వ౦ట యి౦టి కిటికిని ఆనుకొని పైకి వెళ్లడానికి మెట్లు వున్నాయి. పైకి పోయేవాళ్ళు కి౦దికి దిగే వాళ్లు మా వ౦టి౦టి వాసనలను

పీల్చుకోవాల్సి౦దే… ఘాటు ఎక్కినప్పుడు తుమ్మటమో , దగ్గటమో కూడా జరుగుతు౦టు౦ది. మేము వ౦టి౦ట్లో వు౦టే మేము కనిపి౦చటమో లేకపోతే మా మాటలు వాళ్లకు వినిపి౦చడమో జరుగుతు౦ది.

పదిన్నర అయ్యి౦ది. యి౦కా పనమ్మాయి రాలేదు. మెట్ల మీద ఎవరో వడివడిగా ఎగురుతూ దిగుతున్న శబ్థ౦ వచ్చి౦ది. శబ్థ౦తో పాటు పర్ ఫ్యూమ్ పరిమళాలు కూడా మమ్మల్ని తాకాయి. కీ చెయిన్ తిప్పుతూ కి౦దికి దిగుతున్నాడు . ఆ పిల్లాడు బైక్ తియ్యట౦ , గేట్ మూయ్యట౦…బ౦డి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయేవరకు, మా ఆయన కిటికిలో ను౦డి చూస్తూనే వున్నాడు.

” పదిన్నరకు లేచేది…వాళ్లమ్మ చేసిపెట్టి౦డేది తినేది…సె౦ట్ కొట్టుకునేది…పదిన్నరకు బ౦డి ఎక్కి వూర్లో తిరగడాన్కి పోయేది…ఇది ఈ హీరో కథ…”

” మరి హీరో త౦డ్రిగారేమో ఆరి౦టికి లేచి నీళ్లు తెచ్చేది. మళ్లీ ఎనిమిది౦టిక౦తా సైకిల్ ఎక్కి ఆఫీసుకు పోయేది…సరిగ్గా సాయ౦కాల౦ అయిదుక౦తా యి౦టికి వచ్చేది…పని వు౦టే తప్ప కి౦దికి దిగే రక౦ కాదు ఆ త౦డ్రిగారు….”

” ఫ్రె౦డ్స్ సర్కిల్ లేక మా నాయన అట్ల యి౦ట్లో వు౦టాడు…నాకు అలా ఎలా వీలవుతు౦ది అనుకు౦టాడు వీడు. బయట చక్కర్లు కొట్టి రావడానికే కి౦దికి దిగుతాడనిపిస్తు౦ది నాకు. మధ్యాహ్న౦ భోజనానికి ఆఫీసు ను౦డి యి౦టికి వస్తాను కదా ! సరిగ్గా వాడు కూడా అదే టైమ్ కు యి౦టికి వస్తాడు. అట్ల పర్ఫెక్ట్ టైమి౦గ్స్ మెయిన్ టెయిన్ చేస్తాడు. యి౦క రావట౦ రావటమే టీ.వి ఆన్ చేస్తాడనుకు౦టా…కి౦దికి వినిపిస్తో౦టు౦ది…”

” కొడుకేమో నీ క౦ట్లో పడ్డాడు. త౦డ్రేమో వుదయాన్నే నాకు నీళ్ల క్యాన్ తో దర్శనమిస్తు౦టాడు….”

” ఈ హీరో లేచి రడి అయ్యి , సె౦ట్ రాసుకొని పోయేదాకా నీళ్లు రావద్దూ…? ” మాట్లాడుతూనే టేబుల్ తుడిచాడు.

పప్పు చెట్నీ గిన్నెలు టేబుల్ మీద పెట్టాడు.

చేతికి నెయ్యి రాసుకొని రాగి స౦గటి ముద్దలు కట్టసాగాను.

” ఈ మనిషికయినా కొడుకును పొద్దున్నే లేపి నీళ్లు తెమ్మని చెప్పచ్చు కదా ! రె౦డు రోజులు వాన్ని వ౦చితే మూడోరోజు వాడే లేచి తీసుకొస్తాడు… ఆ మాత్ర౦ కొడుకుకు నేర్పి౦చుకోకపోతే ఎట్లా ? ”

అటు వైపు ను౦డి సమాధాన౦ లేదు. నేను ఆశి౦చలేదు కూడా. ఆకలి ద౦చుతో౦ది . వేడి వేడి రాగి ముద్దలు ప్లేట్ల్ల్లల్లో పెట్టుకున్నాము. పనమ్మాయి భాగ౦ పక్కన పెట్టాను.

” చిన్న చిన్న విషయాల పట్ల కూడా జనాలకు స్పృహ లేకుండా అయిపోతోంది. ఎవరి బాధ్యతలు ఏమిటి? మనుషుల్ని మనుషులుగా చూడాలి అనే విషయాన్ని తెలుసుకోటానికి మనుషులకు ఒక జీవిత కాలం సరిపోవటం లేదు. చెప్పే తల్లిదండ్రులు అట్లే వున్నారు. నేర్పించే టిచర్లు అట్లే వున్నారు. యిక నేర్చుకోవాల్సిన పిల్లలు వేరేగా ఎలా వుంటారు?

” నువ్వు చదువుతున్నావే  హార్పర్ లీది టు కిల్ ఎ మాకి౦గ్ బర్డ్…  పైన వాళ్ల చేత ఈ పుస్తక౦ చదివిస్తే ఎలా వు౦టు౦ది…”

” అయ్యో ! అ౦తమటుకు అయితే యి౦కేమీ ? వాళ్లి౦ట్లో ఒక చిన్న కథల పుస్తక౦ కాదుకదా కనీస౦ న్యూస్ పేపర్ కూడా చూద్దామ౦టే కనిపి౦చదు…గూళ్ళల్లో వేసుకోడానికి కూడా పేపర్లు మనల్నే అడిగి తీసుకొని పోతు౦టు౦ది ఆవిడ….”

” గాలి వెలుతురు లేకు౦డా గుహలో బతికేస్తున్నారన్న మాట…”

” అలా అనుకుంటారా ఎవరైనా ? మాకు చాలా తెలుసు అనే అనుకుంటారు.”

“అంతేలే! వాట్స్ అప్ , ఫేస్ బుక్ లతో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు అనుకుంటున్నారు. అంత సేపు పుస్తకం ఎవరు చదువుతారు. యింటర్ నెట్ వుండగా పుస్తకాలు చదవటం ఎందుకు టైమ్ వేస్ట్ అంటుంటే…రోజుకు ఒక పేజీకూడా చదవరు. ఆ టైమ్ లో హాయిగా టీవి చూస్తే పోలా అనుకుంటారు…అయితే చెప్పే విషయాలు చెప్పే రీతిలో చెబితే ముఖ్యంగా వాళ్లకు టచ్ అయ్యే విషయాలను బాగా వింటారు.. కాలేజీలో చూస్తున్నాను కదా !”

 

* * * * * * *

 

సాయ౦కాల౦ నవల తీసుకొని బయటకు వచ్చేటప్పటికి బైక్ ను కడుగుతూ కనిపి౦చాడు మా పై పోర్షన్ హీరో. షార్ట్ నిక్కర్ , టీషర్ట్ వేసుకున్నాడు. చెవుల్లో యియర్ ఫొన్స్ వున్నాయి. నన్ను చూసి ” హాయ్ ఆ౦టి…!” నవ్వుతూ పలకరి౦చాడు. నవ్వి వూరుకున్నాను. చాలా శ్రద్ధగా బ౦డి తుడుచుకు౦టున్నాడు. ‘ డాడ్స్ గిఫ్టు ‘ తెల్లటి అక్షరాలు నల్లటి బ౦డి మీద మెరుస్తూ కనిపి౦చాయి. చూస్తూ నిల్చున్నాను. “డాడ్స్ గిఫ్టు ” మళ్లీ మళ్లీ మనసులో అనుకున్నాను. మెట్ల కి౦ద స్టా౦డ్ వేసిన సైకిల్ నిశ్చల౦గా కదలకు౦డా వు౦ది. బైక్ , సైకిల్ను మార్చి మార్చి చూశాను. వున్నట్టు౦డి సైకిల్ మీద ‘సన్స్ గిఫ్టు’ రాయేలనే చిత్రమైన కోరిక కలిగి౦ది. లేకు౦టే ఎవ్వరూ చూడనప్పుడు బైక్ మీద ‘త౦డ్రికి నీ బహుమతి ఏమిటి’ అన్న స్టిక్కర్ అతికిస్తేనో…! ఎట్ల వు౦టు౦ది.? ఏమనుకు౦టాడో…? కోప౦ వచ్చి చి౦చిపడేస్తాడా ? లేక ఎ౦దుకు రాశారు…ఎవరు రాశారు అని ఆలోచిస్తాడా ? ఏమో ఏమయినా జరగొచ్చు…ఎవ్వరు చెప్పగలరు ? అయినా రాత్రికి రాత్రి మనుషులు మారిపోతారా? అ౦త త్వరగా ఎవ్వరికయినా మై౦డ్ సెట్ మారిపోతు౦దా ? సరిగా ఆలోచిస్తే మారుతు౦దేమో ! సరైన ఆలోచన అని ఎలా తెలుస్తు౦ది చెప్తేనే కదా? మొత్తానికి ఈ పిల్లవాడు నన్ను పుస్తకం చదువుకోకుండా డిస్టర్బ్ చేశ్తున్నాడు.

పిలిచి నాలుగు మాటలు మాట్లాడి మెల్లిగా అసలు విషయ౦ కదుపుతే ఎలా వు౦టు౦ది ?  ” సైకిల్ మీద మీనాన్న నీళ్లు మూసుకొచ్చే బదులు బైక్ మీద నీళ్లు తేవట౦ సులభ౦ కదా ” నోటి చివర వరకు వచ్చాయి మాటలు. ” దీపక్ ” పిలవబోయి ఆగిపోయాను. చెప్తే వి౦టాడా? ” మీకె౦దుకు ఆ౦టీ మా విషయాలు అని అ౦టే ? తల ఎక్కడ పెట్టుకోవాలి ? పైకి అనకపోయినా మనసులో మాత్ర౦ తప్పక అనుకు౦టాడు…ఎ౦దుకొచ్చిన త౦టా! ఆ అబ్బాయికి చెప్పడానికి నా ఆర్హత ఏమిటి? అద౦తా వాళ్ళ అమ్మా, నాయన చూసుకోవాలి? యి౦తకు ఆ బక్క పల్చటి మనిషి అలోచన ఏమిటో ! కొడుక్కు చెప్పే  ఆలోచన వు౦దో లేదో ! అలా౦టి విషయాలు మాట్లాడుకు౦టారో లేదో ! టీ.వి శబ్థాల్లో ఒకరి మాటలు ఒకరికి వినిపిస్తాయో లేదో…?

‘నా కొడుకు యిలా౦టి పనులు ఎలా చేయగలడు…? వాడికి ఎక్కడ వీలవుతు౦ది..? వాడు బాగా సెటిల్ అయ్యి మా కళ్ల ము౦దు తిరుగుతా౦టే చాల్లే ‘ అని అనుకు౦టు౦టాడేమో…! ఎ౦తకాల౦ పిల్లల్ని యిలా రెక్కల కి౦ద దాచుకోగలరు…?

” మన ఇ౦డియాలోలాగా కాదు ఆ౦టి జర్మనీలో… స్కూలి౦గ్ అయిపోతూనే పేరె౦ట్స్ పార్టీ యిస్తారు. యిక అప్పటి ను౦డి బయట హాస్టల్లో కాని వేరే ఏదన్నా రూమ్సులో కాని వు౦టారు .అయితే పేరె౦ట్స్ సపోర్ట్ చేస్తారు లె౦డి.  పేరే౦ట్స్ ఇన్వైట్ చేస్తే తప్ప వాళ్లు యి౦టికి రారు ఆ౦టీ…!” మొన్న ఆదివార౦ చ౦దూ యి౦టికి వచ్చినప్పుడు అన్న మాటలు మనసులో మెదులుతున్నాయి.

ఆ దేశాలల్లోనేమో అలా నడుస్తో౦ది… యిక్కడ యిలా నడుస్తో౦ది. పిల్లలు ఎ౦తసేపు తమ నీడలోనే వు౦డాలనుకు౦టారు…పిల్లలే కాదు పిల్లల పిల్లల్ని కూడా తామే మోయాలనుకు౦టారు…సొ౦త౦గా నడుస్తే ఏదో తమ పునాదులు కదిలిపోతున్నట్లు ఫీలవుతారు. వాళ్లు స్వత౦త్ర౦గా , ధైర్య౦గా వు౦టేనే కదా తల్లిత౦డ్రులు కూడా అ౦తో యి౦తో స్వేచ్చగా వు౦డగలిగేది. అప్పుడే తమక౦టు కాస్త స్పేస్ మిగుల్చుకోగలుగుతారు…తమ కళ్ళతో ప్రపంచాన్ని చూపించటం తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే చేయాలి. మన యిళ్లల్లో డెమోక్రటిక్ కల్చర్ ఎప్పుడు డెవలప్ అవుతు౦దో…?ఇ౦టికొక అటికస్ వు౦డాల…!అంతే ఓర్పుతో పిల్లలకు చెప్పే శక్తి కూడా తెచ్చుకోవాలి!

టప్పని పైను౦డి ఏదో పడి౦ది. సపోటా కాయ రాలి పడి౦ది. పండుబారాక ఎంత తీయగా వుంటుందో!

 

* * * * * * *

 

 

 

 

మా చిన్న చెల్లెలు

 

Kadha-Saranga-2-300x268

ఉదయాన్నే హాస్పిటల్ కు పోవడానికి తయారవుతున్నగాయత్రికి ఫోనొచ్చింది.

“చిన్నమ్మమ్మా,  ఏంటీ పొద్దుటే ఫోన్‌ చేశావు? బాగున్నావా?”

“నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లాడాలి. వచ్చేటప్పుడు దోవలో కూరగాయలేవైనా కొనుక్కురా,” అంది ఆమె.

“సరే, ఏం తీసుకురమ్మంటావు?”

“ఏవైనా సరే, నీకు ఇష్టమైనవి తెచ్చుకో, మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం? రాత్రికి ఉండి పొద్దుటే పోదువుగాన్లే. రేపెటూ సెలవేగదా,” అంది చిన్నమ్మమ్మ జయలక్ష్మి.

*

సాయంత్రం బజార్లో దొండకాయలూ, తోటకూరా, నాలుగు అరటికాయలూ కొనుక్కుని గాంధీ నగర్ లో ఉన్న జయలక్ష్మి ఇంటికి చేరింది గాయత్రి. వస్తూనే, “చిన్నమ్మమ్మా, నువ్వెందుకూ ఒక్కదానివే ఇంతదూరాన ఉండటం, వచ్చి మాతో ఉండరాదూ?” అంది, కూరగాయలు టేబుల్ మీద పెడుతూ. జయలక్ష్మి నవ్వి వూరుకుంది. ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళమ్మమ్మ రాజ్యలక్ష్మి చనిపోయినప్పటనుంచీ ఈ పిల్లలు తనని వాళ్ళతో వచ్చి ఉండమని అడుగుతూనే ఉన్నారు. కానీ తనకు బాగా అలవాటైన తన ఇల్లు వదిలేసి వెళ్ళాలనిపించడం లేదు.

ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ సీసా తీసుకుని వచ్చి జయలక్ష్మి పక్కనే కూర్చుంది గాయత్రి.  “ఏంటి చిన్నమ్మమ్మా, ఏదో మాట్లాడాలన్నావు?”

ముందు  దొండకాయకూర చేద్దామా, అరటికాయకూర  చేద్దామా  అని  ఆలోచిస్తూ,  ఆమెవైపు చూడకుండానే మృదువుగానే అడిగింది జయలక్ష్మి. “నువ్వు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లోపెట్టుకున్నావని విన్నాను. నిజమేనా?”

“అవును, నిజమే,” అంది గాయత్రి. ఆ అమ్మాయి గురించి చెప్పడం ఎక్కడ మొదలుపెట్టాలా  అని ఆలోచిస్తూ.

“ఎవరా అమ్మాయి?”

“మా చెల్లెలే. నాన్న రెండో భార్య కూతురు,” అంది గాయత్రి, క్లుప్తంగా.

“అలాగానా? అతనికి మీరుగాక ఇంకా  బిడ్డలున్నారని నాకు తెలియదే.”

“మాకూ తెలియదు.  పోయిన ఏడో తేదీన నీకు ఫోన్‌ చేశాం గుర్తుందా? ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్‌ చేసి మీ నాన్న చనిపోయాడు, అంత్యక్రియలకు రమ్మని చెప్పారని. ఆ ఫోన్‌ చేసింది ఈ అమ్మాయే. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది,  అమ్మను వదిలేసి నాన్న ఒకావిడతో వెళ్ళిపోయాడే, ఆమె ఒక బిడ్డను కని మూడు సంవత్సరాల తర్వాత చనిపోయిందట. తర్వాత నాన్న మళ్ళా పెళ్ళిచేసుకున్నాడట. ఆ  మూడో  భార్య  గురించి  నాకు  పెద్దగా  తెలియదు  గాని,  ఆమెకు  ఏవో  సమస్యలున్నట్లున్నాయి. చివరి రోజుల్లో నాన్నకు సపర్యలు చేసింది రెండో భార్య కూతురే. చనిపోయాడని మాకు ఫోన్‌ చేసింది కూడా ఆ అమ్మాయే.”

జయలక్ష్మి ముభావంగా మౌనంగా ఉండిపోయింది కొంతసేపు. అరటి కాయలను సింక్ దగ్గరకు తీసుకుపోయి కడుక్కొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా తరుగుతూ, “నువ్వు తీసుకొచ్చింది ఆ అమ్మాయినా?” అని అడిగింది.

“అవును చిన్నమ్మమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవ్వరూలేరు. ఆ అమ్మాయి మమ్మల్ని ఏమీ అడగలేదు. అంత్యక్రియలు తనే చేసింది. మేం వస్తామని అనుకోలేదనుకుంటాను. తిరుగు ప్రయాణం రోజు,  వచ్చినందుకు మాకు కృతజ్నతలు చెప్పి వెళ్ళబోతుంటే, నేనే అడిగాను తన గురించి. ఆ అమ్మాయికి పదిహేను సంవత్సరాలు. హైస్కూల్లో చదువుతుంది. తనకెవ్వరూ లేరు. ఆ అమ్మాయి మా చెల్లెలేకదా? పెద్ద కూతురుగా చివరి రోజుల్లో నాన్నకు నేను చెయ్యాల్సిన పనులు ఆ అమ్మాయి చేసింది. మా ముగ్గురికీ ఏవో ఉద్యోగాలున్నాయి. తిండికి లోటులేదు. పెద్ద ఇల్లుంది. నేనే మాతో వచ్చి ఉండమన్నాను. పల్లవి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు పల్లవి. మా అడ్రెస్ ఇచ్చి నీకు ఇష్టమైనప్పుడు మా దగ్గరకు రావచ్చు అని చెప్పాను. పోయిన వారం వచ్చింది.”
జయలక్ష్మి  కొంచెంసేపు ఈ విషయాలన్నీ జీర్ణించుకుంటున్నట్లు ఉండిపోయి, “అయితే ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అనుకుంటున్నావా?” అని అడిగింది.

“అవును. తల్లిలేకుండా పెరిగింది. హాయిగా ఉండాల్సిన  చిన్న వయసులో నాన్నకు సేవలు చేస్తూ గడిపింది. ఇప్పుడు వచ్చి వారం రోజులయింది కదా. ఇంటి పన్లన్నీ తనే చేస్తానంటుంది. ఏదన్నా అడిగితేగాని మాట్లాడదు. ఆ అమ్మాయిని  చూస్తుంటే పాపం ఎన్ని కష్టాలు పడ్డదో అనిపిస్తుంది.”

“సరే, అమ్మాయి మంచిదే. కానీ ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అని నువ్వెందుకనుకుంటున్నావు? ఇద్దరు చెల్లెళ్ళను పెంచావు చాలదా?”

“అలా అంటావేం చిన్నమ్మమ్మా? మేము కాకపోతే ఆ అమ్మాయికి ఇంకెవరున్నారు?”

“ఉన్నారా లేరా అని కాదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? నీకు లేకుండా  పోయిన బాల్యం ఆ అమ్మాయికికూడా లేకుండా పోయిందని నువ్వు విచారిస్తున్నావు. మీ అమ్మా నాన్నలు పనికిమాలిన వాళ్ళు కావటంతో చిన్నప్పుడే బాధ్యతలు నీ మీద పడ్డాయి. ఆ అమ్మాయిక్కూడా నీలాగే చిన్నతనంలోనే బరువైన బాధ్యతలు మొయ్యాల్సొచ్చింది. ఆ అమ్మాయిలో నువ్వు నిన్ను చూసుకుంటున్నావు. కానీ పదిహేను సంవత్సరాల అమ్మాయిని పెంచడం ఎంత బాధ్యతతో కూడిన వ్యవహారమో తెలుసు కదా? నువ్వు ఇంకా పెళ్ళిచేసుకోలేదు. పెళ్ళికావాల్సిన చెల్లెళ్ళు ఇంకా ఇద్దరున్నారు. ఇప్పుడు ఇంకొక చెల్లెలా?” అందామె.

ఈ బాధ్యతల భారం గాయత్రికి తెలియని విషయం కాదు.  కాని, ఎవ్వరూ లేని చెల్లెలిని అలా ఎలా వదిలేస్తుంది? పైగా ఆ అమ్మాయి ఎంత బాధ్యతగా చివరి రోజుల్లో నాన్నను చూసుకుంది!

గాయత్రి లేచి తోటకూర ఆకుని సింకులో శుభ్రంగా కడుగుతూ అక్కడే కొంచెంసేపు నిలబడింది.

జయలక్ష్మి కూడా అరటికాయ ముక్కల గిన్నెను తీసుకుని స్టౌ దగ్గరకు వచ్చి గాయత్రి భుజం మీద చెయ్యి వేసి, “వయసుతోపాటు రావాల్సిన తెలివి మీ అమ్మకు రాలేదు. నీకేమే వయసుకు మించిన తెలివీ మంచితనం ఇచ్చాడు భగవంతుడు,” అంది.

*

పల్లవి చీరాల వచ్చి దాదాపు మూడు నెల్లయింది. సులభంగానే అక్కలతో కలిసిపోయింది. హైస్కూలునుంచి రాగానే బట్టలుతకటమో, వంటచెయ్యడమో, ఇల్లు శుభ్రం చెయ్యడమో, బయట దొడ్లో పూలమొక్కలకూ కూరగాయల పాదులకూ నీళ్ళుపొయ్యడమో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. పెద్దక్క గాయత్రి అంటే గౌరవం, కొంచెం భయం కూడా. గాయత్రి అక్క కంటే, అమ్మలాంటిది అనే అభిప్రాయం ఏర్పడింది పల్లవికి. రెండో అక్క శివాని ఒక బాంక్ లో పనిచేస్తుంది. అక్కడ తనతో పనిచేసే ఒకతనంటే ఇష్టం లాగుంది. వీలు దొరికినప్పుడల్లా అతని మంచితనం గురించి చెప్తూ ఉంటుంది. చిన్నక్క వాసంతి పల్లవి కంటే మూడు సంవత్సరాలు పెద్దది.  వాగుడుకాయ. టౌన్లో ఒక చెప్పులషాపులో పనిచేస్తుంది. తన బాయ్ ఫ్రండ్ కూడా తనలాగే వాగుడుకాయ. సాయంత్రం ఎప్పుడన్నా ఇంటికి వస్తాడు. అందరికీ కబుర్లు చెప్తాడు. ప్రస్తుతం ఉద్యోగం ఏదీ ఉన్నట్లు లేదు.

వాసంతితో మాట్లాడటం సులభంగా ఉండేది పల్లవికి. ఇద్దరి మధ్యా వయసులో పెద్ద తేడా లేదు. గాయత్రితో మాట్లాడటం అంటే కొంచెం భయంగా ఉండేది. కానీ తొందరలోనే ఇద్దరి మధ్య మంచి అనుబంధం  ఏర్పడింది.  తండ్రి ఇల్లు వదలిపోయేటప్పటికి గాయత్రికి ఇప్పుడు పల్లవికున్న వయసు.  ఆరోజుల్లో ఆయనకు సాయంత్రం సముద్రపు ఒద్దున నడవడం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. తనకు కూడా సముద్రం అంటే ఇష్టం అవడంవల్ల ఎప్పుడూ నాన్నతో వెళ్ళేది గాయత్రి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు  కూడా ఆయనకు నడవడం అంటే ఇష్టంగా ఉండేదని చెప్పింది పల్లవి. నాన్న బయటకు వెళ్ళినప్పుడు పల్లవి వెంటవెళ్ళేది. తండ్రితో గడిపిన సమయం గురించి మాట్లాడుకుంటూ, ఆ జ్నాపకాలు  పంచుకుంటూ పల్లవీ గాయత్రీ కొంత దగ్గరయ్యారు.

*

ఒక సాయంత్రం తన ఫ్రండ్ తో సినిమాకి వెళ్ళడానికి తొందర తొందరగా రెడీ అయి ఇంట్లోంచి బయటకు పరుగెట్టిన శివాని రబ్బర్ బంతిలాగా తిరిగి ఇంట్లోకొచ్చి పెద్దగా అరిచింది, “అమ్మా, చిన్నమ్మమ్మా వస్తున్నారే గాయత్రీ!”

అక్కా  చెల్లెళ్ళు ముగ్గురూ పరుగెత్తుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చారు. పల్లవి తలుపు వెనక నిలబడింది. వీళ్ళను ఇదివరకు ఆ అమ్మాయి చూడలేదు.

అమ్మ మూడు సంవత్సరాలప్పుడు వదిలేసివెళ్ళిన వాసంతికి ఆమె రూపురేఖలు ఎలావుంటాయో తెలియదు. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంతో అందంగా, హుందాగా కనిపించింది. దాని బుగ్గలు నిమిరి, “నువ్వు వాసంతివి కదూ, ముద్దుగా ఉన్నావు,” అంది శారద. శివానిని దగ్గరకు తీసుకుని తలమీద ముద్దుపెట్టింది. గాయత్రి ముందుకు రాలేదు. చెల్లెళ్ళ వెనుక నిలబడి ఉంది. ఆమెకు ఎదురుగా నిలబడి, “బాగున్నావా?” అంది శారద. గంభీరంగా అలాగే మాట్లాడకుండా నిలబడింది గాయత్రి. ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి ఇంట్లోకి నడిచింది శారద.

హాల్లోకి  వచ్చి  ఒక్కసారి  చుట్టూ చూసింది శారద. పదిహేను సంవత్సరాల నాడు వదిలేసి వెళ్ళిన ఇల్లు. పెద్దగా మారలేదు.

ఐదుగురూ  హాల్లో  కూర్చున్నారు.  అక్కచెల్లెళ్ళకు ఎన్ని  ప్రశ్నలో.  మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి పోయావు? ఇప్పుడెక్కడుంటున్నావు? ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా? ఇప్పుడెందుకొచ్చావు? కానీ, అడిగే ధైర్యం లేదు, చనువూ లేదు. వాళ్ళకి ఇప్పుడామె పరాయి మనిషి.

తన పూర్వ చరిత్ర గురించి మాట్లాడే ధైర్యం ఆమెకూ లేదు. ఇప్పుడు సంజాయిషీలు  చెప్పి  ప్రయోజనం కూడాలేదు.  వాళ్ళకు  తన  అవసరం లేదిప్పుడు.  తను  లేకపోయినా,  ఆమె  బతికున్నన్నాళ్ళూ  అమ్మ  మనుమరాళ్ళను  బాగానే  పెంచింది. అదృష్ట వశాత్తూ పిల్లలు బాగానే పెరిగి  పెద్దవాళ్లయ్యారు.

ఏవో పైపై మాటలూ, ఉద్యోగాలూ, తోటలో మొక్కలూ ఇలాంటి విషయాల మీద సాగింది వాళ్ళ సంభాషణ.

సడెన్‌గా ఏవొక్కరివైపూ కాకుండా ఎదురుగా కూర్చున్న కూతుళ్ళ వైపు చూస్తూ, “ఇల్లు అమ్మేద్దాం  అనుకుంటున్నాను,” అంది శారద.

“ఏ ఇల్లు?” అడిగింది గాయత్రి.

“ఈ ఇల్లే.”

“ఈ ఇల్లు అమ్మటానికి నువ్వెవ్వరూ? పదిహేను సంవత్సరాలుగా ఈ ఇంటిని చూసుకుంది మేము. ఇంటి చుట్టూ శుభ్రం చేసింది మేము.  దొడ్లో మొక్కలకు నీళ్ళు పోసింది మేము. ఇప్పుడొచ్చి  ఇల్లు  నీదైనట్లు  మాట్లాడ్డానికి  సిగ్గులేదూ?

“ముగ్గురు  బిడ్డల్నొదిలేసి  నీ  దోవ నువ్వు పోయావు. అమ్మమ్మ లేకపోతే మేం ఏమైపోయేవాళ్ళం? పాపం అంత  వయసులో  ఎన్ని  కష్టాలుపడిందామె  మాకోసం!  ఆమె పోయినప్పుడుకూడా రాలేదు నువ్వు. నీకు తల్లీ అక్కర్లేదు, బిడ్డలూ అక్కర్లేదు. నువ్వసలు మనిషివేనా?” ఇన్నాళ్ళూ దాచుకున్న కోపాన్నంతా ఒక్కసారిగా  వెళ్ళగక్కింది గాయత్రి.

తల్లి  చనిపోయిన  విషయం నిన్న  పిన్ని చెప్పిందకా శారదకు తెలియదు.  కొంచెం సేపు తలవంచుకుని మౌనంగా ఉండిపోయిందామె. ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని నొక్కింది జయలక్ష్మి. భావోద్రేకం కొంచెం తగ్గిన తర్వాత, “మీ నాన్న నన్నూ మిమ్మల్నీ వదిలేసి ఆవిడతో లేచిపోయి….. నాకీ  వూళ్ళో తలెత్తుకు తిరగడం వీలుకాకుండా చేశాడు,” అని మాత్రం అంది శారద.

“ఆయనొక పనికిమాలిన వాడు, నువ్వు అంతకంటే ఏమీ తక్కువ కాదు. ఏదో మీ చావు మీరు చచ్చారు. ఈ ఇల్లు  మాత్రం నీది కాదు, మాది. ఇల్లు అమ్మే అధికారం నీకు లేదు,” అంది గాయత్రి.

శారద చేతిని మళ్ళా నొక్కిపట్టుకుంది జయలక్ష్మి.

“సరే, నీ ఇష్టం. ఎపార్ట్మెంట్లు కట్టుకునేవాళ్ళు అడిగితే మీక్కూడా ఎపార్ట్మెంట్లయితే సులభంగా ఉంటుందేమో అనుకున్నాను. కొంత  డబ్బిస్తామన్నారు.  మూడు ఎపార్ట్మెంట్లు కూడా  ఇస్తామని అన్నారు. సరే మీ ఇష్టం,” అంది శారద.

“మాకు వాళ్ళ ఎపార్ట్‌మెంట్లు అవసరం లేదు. ఇక్కడయితే అందరం కలిసుంటాం. పైగా, ఇప్పుడు మేము ముగ్గురం కాదు,  నలుగురం,” అని “పల్లవీ” అని పిలిచింది గాయత్రి.

తలుపు వెనుక నుంచి వచ్చి గాయత్రి పక్కన నుంచుంది పల్లవి.

“ఈ అమ్మాయి నాన్న రెండోభార్య కూతురు,” అని పరిచయం చేసింది.

పల్లవి రెండుచేతులు జోడించి తల వంచి నమస్కారం చేసింది.

“పిన్ని చెప్పింది నిన్న,” అని, పల్లవిని దగ్గరకు రమ్మని పిలిచి, ఆ అమ్మాయి తల నిమిరింది శారద.

*

ఒక గంటసేపు ఉండి పిన్నితో వెళ్ళిపోయిందామె. వెళ్తూ తనకూతుళ్ళకూ పల్లవికీ తీసుకొచ్చిన డ్రెస్సులు ఇచ్చిపోయింది.

ఆమె వెళ్ళిపోగానే, “నువ్వెప్పుడూ అంతేనే గాయత్రీ, నీకు ఆమంటే ఎప్పుడూ కోపమే. కొంచెం బాగా మాట్లాడితే నీదేం పోయేది?” అని తప్పుపట్టింది వాసంతి.

“నీకంత ఇష్టంగా ఉంటే ఆమెతో వెళ్ళు, నేనేమీ బలవంతం చెయ్యడం లేదు నిన్ను ఉండమని,” అంది గాయత్రి.

“ఎందుకే అక్కని అలా అంటావు. ఆమె వదిలేసిపోతే మనల్ని సాకింది అక్కేగదా? అక్కకు ఆమాత్రం కోపం రాదా? అక్కా అమ్మమ్మా నీకు ఎలాంటి లోటూ రాకుండా పెంచారు. అందువల్ల నీకు తల్లిలేని లోటంటే ఏంటో తెలియదు. సంతోషంగా ఉండాల్సిన రోజుల్లో అక్కమీద ఎంత బాధ్యత పడిందో నీకేం తెలుసు?” అని జాడించింది శివాని.

“తెలుసులేవే. కానీ అది అంతా అమ్మ తప్పేనా? ఆ దరిద్రపుది పెళ్ళై, ముగ్గురు బిడ్డలున్నవాడిని వల్లో వేసుకుని తీసుకుపోయింది. మరి అమ్మకు కష్టంకదా? పాపం, ఎంత బాధపడిందో!” అంది వాసంతి.

పల్లవి తన గదిలో ఉందేమో, అంతా వినపడుతుందేమో అని సంకోచిస్తూ,  “తప్పంతా పరాయివాళ్ళమీద నెడితే ఎలాగే? నాన్నకు బుద్ధుండొద్దూ? ముగ్గురు బిడ్డలున్నవాడు ఇంకొకావిడతో సంబంధం పెట్టుకోవడమేంటీ?” అంది శివాని.

“అవును ఆయన బుద్ధిలేనివాడే. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడంతప్పే. మరిప్పుడు  అక్క చేస్తుందేమిటీ? దాని ఫ్రండ్ కి పెళ్ళయింది కదా? మరి ఇన్ని తప్పులుపట్టే అక్క అతనితో స్నేహం చెయ్యటం తప్పుకదా?” అని గాయత్రి వైపు చూసింది వాసంతి.

గాయత్రి చివాలున అక్కడనుంచి లేచి తన రూమ్‌ కి వెళ్ళిపోయింది. తలుపు వెనకనుంచి అంతా వింటున్న పల్లవి తన గదిలోకి వెళ్ళిపోయింది.

*

రెండుమూడు రోజులు ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. నిజానికి మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నం చేశారేమో.

ఒక రాత్రి భోజనాల తర్వాత పల్లవి గదిలోకి వచ్చింది గాయత్రి. మంచం మీద ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. శారద వచ్చిపోయింతర్వాత ఇద్దరూ ఏకాంతంగా కలవడం ఇదే మొదటి సారి. తలవంచుకుని కూర్చున్న పల్లవి కళ్ళవెంట నీళ్ళు రావడం గమనించింది గాయత్రి.

“ఎందుకు పల్లవీ, నువ్వెందుకూ ఏడుస్తున్నావు?”

“మీ అందరికీ నావల్లే కదక్కా  ఇన్ని కష్టాలు. నేను పుట్టకపోతే మీరందరూ బాగుండేవాళ్ళు కదూ?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందా అమ్మాయి.

“అదేంటి పిచ్చి పిల్లా. ఇందులో నీ తప్పేముందీ. మా నాన్నా, మీ అమ్మా వెళ్ళిపోయినప్పటికి నువ్వింకా పుట్టలేదుకదా? ఇందులో నీ తప్పు ఏముందీ?”

“మా అమ్మే కదా అక్కా మీ కుటుంబాన్ని నాశనం చేసింది.”

పల్లవిని దగ్గిరకు తీసుకుని తల  నిమిరింది గాయత్రి.

“చానాళ్ళు  నేనూ  అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకొవడం లేదు.”

తలపైకెత్తి గాయత్రి కళ్ళల్లోకి చూసింది పల్లవి.

పల్లవి చేతులను తన చేతుల్లోకి తీసుకుని, “మీ అమ్మకు ఆరోజుల్లో ఏవో ఇబ్బందులుండేవి. ఆమెకు నాన్న సహాయం చేస్తూ దగ్గరయ్యాడు. మా అమ్మ వాళ్ళను అనుమానిస్తూ నాన్నను దూరం చేసుకుంది. ఇందులో అందరి ప్రవర్తనలో లోపాలున్నయ్. తప్పంతా మీ అమ్మది అనడం సరైంది కాదు,” అంది గాయత్రి.

“కానీ, నాన్న అప్పటికే పెళ్ళైనవాడు కదా. మా అమ్మ…..”

“పల్లవీ, మొన్న వాసంతి అన్న మాటలు విన్నావుగా నువ్వు. అక్క చేస్తుంది కూడా తప్పేగదా అంది గుర్తుందా?”

తల ఊపింది పల్లవి

“మీ అమ్మను తప్పు పట్టడం సులభం. కానీ…ఒక మనిషి పరిచయం అవుతాడు. ఆ మనిషి మంచితనం, పనితనం, సభ్యతా, అందరికీ అతను ఇచ్చే గౌరవం నీకు ఇష్టం అవుతాయి. ఆ మనిషి మీద గౌరవం ఏర్పడుతుంది. మనసులో అతనితో ఏవో తెలియని సంబంధాలు  బలపడతాయి. కాని అతనికి పెళ్ళయిందని తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ముందు పెళ్ళయిందో లేదో కనుక్కుని, కానివారికే దగ్గిరవాలా? అలా  చేస్తే  అదేదో వ్యాపారం లాగా ఉండదూ?”

పల్లవి ఏమీ సమాధానం చెప్పలేదు.

“మా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ భరద్వాజ్ అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య స్నేహం ఏర్పడ్డాక చాలా కాలానికి నాకు అతని వ్యక్తిగత విషయాలు తెలిశాయి. అతనికి పెళ్ళయి దాదాపు పదేళ్ళయింది.  మొదటి రెండు మూడేళ్ళు బాగానే ఉండేవాళ్ళట. ఆ తర్వాత క్రమంగా ఒకరికొకరు దూరం అవుతూ వచ్చారు. వాళ్ళ మనస్తత్వాలు వేరు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా వాళ్ళ మధ్య సఖ్యత అయితే లేదు. అతనికి పెళ్ళి అయింది కాబట్టి  నేను అతన్ని దూరంగా ఉంచాలా? స్నేహాన్ని తెంపేసెయ్యాలా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. మీ అమ్మ కూడా ఇలాంటి సందిగ్ధంలో పడి ఉంటుంది. మనం పెళ్ళిచేసుకుందాం అని చాలా సార్లు అడిగాడు భరద్వాజ్. నేను ఇంతవరకూ ఒప్పుకోలేదు. నాకు బాధ్యతలున్నాయనీ, నేను పెళ్ళిచేసుకోలేననీ చెప్తూ వచ్చాను. కానీ పెళ్ళయింది కాబట్టి అతనికి జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా బ్రతికే హక్కు లేదా? ఇష్టంలేని మనిషితోనే జీవితం గడపాలా? అతనితో స్నేహం చెయ్యడం తప్పా? పెళ్ళికి ఒప్పుకోకపోవడం తప్పా? ఏమో. అన్నీ ప్రశ్నలే. సంతృప్తికరమైన సమాధానాలే లేవు.”

పల్లవి ఏమీ మాట్లాడలేదు.

పల్లవి తల నిమురుతూ, “ప్రశ్నల దగ్గరే  ఆగిపోయాన్నేను. మీ అమ్మ ధైర్యం చేసి ఒక బాటను ఎంచుకుంది. ఇంత మంచి అమ్మాయిని మాకిచ్చి వెళ్ళిపోయింది,” అని పల్లవి తల మీద ముద్దు పెట్టి తన గదికి వెళ్ళిపోయింది గాయత్రి.

ప్రఖ్యాత జపాన్‌ రచయిత్రి అకిమి యోషిడా రాసిన ఉమిమాచి డయరీ ఆధారంగా.

 

సుషుమ్న

Art: Satya Sufi

Art: Satya Sufi

      

హాల్ లో  దివాన్ మీద కొత్త దుప్పటి.   టీపాయ్ మీద చక్కగా మడత పెట్టిన ఈరోజు దినపత్రిక.  ఇంకా చదవలేదు.  చాలా సార్లు అలానే ఉంచేస్తాను. చదవను.  కుదరదు.  కుదుర్చుకోను.  ఫ్లవర్ వాజ్ లో తాజా పూలు పెట్టి టీపాయ్ మీద అందంగా అమర్చి చూసుకున్నాను.  బావున్నాయి.  కర్టెన్లు కూడా కొత్తవి.  లేత పసుపు రంగు మీద పచ్చ పచ్చని పూలతో అవి కూడా బావున్నాయి.   కర్టెన్ల వెనక కిటికీలు మూసి వున్నాయి.  వీధి గది కూడా మూసే వుంది.   సేఫ్టీ కోసం అన్ని వైపులా మూసే ఉంచాను!

ఇంతలోకి కాలింగ్ బెల్ ఒకటే మోత.  తలుపు రంద్రం లోంచి చూసేప్పటికి   ఎవరో అపరిచిత వృద్ధుడు. మొత్తంగా  తెల్ల బడిన జుత్తు.    మేని చామన ఛాయ.  దయగా ప్రేమగా కనబడుతున్న కళ్ళు. ముఖం బిగువుగా వుంది.  వయసు అంచనా కష్టం!  తక్కువలో తక్కువ ఎనభై ఉండొచ్చు .  తలుపు తీశాను.

“ఎవరూ?”ప్రశ్నార్ధకంగా అడిగాను.

“ఆనందాన్ని”చిరునవ్వు నవ్వాడు.  ఏ ఆనందం?  ఎటువైపు బంధువు?  పోనీ ఎవరేనా పాఠకుడా?  ప్రశ్నార్ధకంగా చూశాను.

“గుర్తుకు రావడం లేదా?”

“లోపలి రానిస్తే గుర్తుచేస్తాను”మళ్ళీ అతనే అన్నాడు.

“రండి”పక్కకి జరిగి దారి ఇచ్చాను.  వృద్దుడు.  చూసి భయపడాల్సిండీ, అనుమానించాల్సిందీ కనబళ్ళేదు.

చనువుగా లోపలి వచ్చేశాడు.   సోఫాలో కూలబడబోతూ చుట్టూ చూశాడు.  కొద్దిగా మొహం చిట్లించాడు.  గబా గబా కర్టెన్లన్నీ పక్కకి లాగాడు.  కిటికీలన్నీ తెరిచాడు.  బొత్తిగా మొహమాటం లేనివాడల్లె వుంది!  ఏదో సొంతింట్లో తిరిగినట్టు  అటూ  ఇటూ  తిరిగాడు.  పుస్తకాల షెల్ఫ్ చూశాడు.   తెల్ల బోయి  అతని వంక చూస్తూ కాసేపు వుండిపోయాను.

“మంచి నీళ్ళు తీసుకుంటారా?” దూకుడుకి అడ్డు కట్ట వేసి ఒక చోట కూర్చో పెడదామని అడిగాను.

“వద్దు.  నీతో కొంచం పని వుండి వచ్చాను”

 

“పనా?!  ఏం పని?”

“కథ రాసి పెట్టాలి”

“కథా?  ఏం కథ?  ఎందుకూ? మీరెవరు?”ఏదైనా చిన్న పత్రిక నడిపే వాడా?  లేదా ఏదైనా సినిమా మనిషా?  సినిమా మనిషైతే  నా దగ్గరకు రాడే!

“ఒక కథ చెబుతాను.  కథ కాదు, నా  తెలిసినదేదో అనుకో.  దాన్ని నువ్వు రాయాలి”

“మీకు తెలిసిందే ఐతే  మీరే రాసుకోవచ్చుగా?”

“నువ్వు నా కన్నా బాగా రాయగలవు.  రచయిత్రివి కదా”

“ఐతే?”

“నన్ను నేను మౌఖికంగా వ్యక్త పరచగలను కానీ సరిగా రాయలేను.  అందుకే నీ సహాయం కావాలి”

“సరే చెప్పండి”ఇలాంటివి నాకసలు ఇష్టం వుండదు.  కానీ పాపం ముసలాయన.  తాపత్రయం కొద్దీ  వచ్చి ఉంటాడు.  రాయడం రాయక పోవడం తరవాతి సంగతి కదా.  చెప్పే నాలుగు ముక్కలు చేవినేసుకుంటే పోయేదేముంది.

సోఫా లోంచి లేచాడు.  తత్తర బిత్తరగా గదిలో తిరిగాడు.  దినపత్రిక చేతిలోకి  తీసుకున్నాడు.  వణుకుతూ పేజీలు  తిప్పాడు.

“ఇది చాలా ఎర్రబడి పోయింది.  పాపం.  రక్తం బైటికి కారి గడ్డ కట్టింది చూసావా?  మురిగి భరించలేని వాసన వేస్తోంది.  దీన్ని బైట పారేయోచ్చుగా”

“ఏమంటున్నారు?!”
“మనిషికీ మనిషికీ యుద్ధం ఎందుకు జరుగుతోందో నీకు తెలుసా?  ఆసలు యుద్ధం జరగాల్సింది బాహ్య క్షేత్రం మీద కాదు.  మనిషిలోపలనే.  యుద్ధం మొదలయ్యేది లోపలనే.  అంతం కావలసిందీ లోపలనే.  ఇప్పుడంతా సిస్టమ్ లీకేజ్.  చాలా ప్రమాదం.   తిరగబడి పోతోంది.  అదంతా ఎందుకలా జరిగిపోతుందో  తెలుసా?యుద్ద్ధాలూ, పోరాటాలూ, వీటి గురించి  ఆలోచిస్తావా  ఎప్పుడైనా?  మాట్లాడతావా ఎప్పుడైనా?  లేకపోతే ఒక ప్రేమ కథ, ఒక దయ్యం కథ, ఒక ముసలి మనిషి కథతో సరిపెట్టేస్తావా?”నా పక్కనే కూలబడి రెట్టించి  అడిగాడు.

కొంచెం కోపం వచ్చింది.  చిరాకు కూడా.

“నువ్వు ఏది రాసినా పర్లేదు.  కొద్దిగా కామన్ సెన్స్.  కానీ ఈ మురుగు వాసన గురించి రాయకపోతే చాలా నష్టం.  ఇది అంటువ్యాధి.  నీ ఇల్లంతటికీ అంటుకుంటుంది.”

లేచి వేరే కుర్చీలో కూర్చోబోయాను.  రెక్క పట్టుకుని ఆపాడు.

“నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక తోట.  నల్లని రేగడి మట్టి.  పుచ్చిపోయిన విత్తనం  వేసినా మొలకెత్తేది.  అంత చక్కని మట్టి.  మట్టిలో మధ్యలో ఒక రాతి బొమ్మ వుండేది.  బీజాన్ని చల్లుతున్న రైతు బొమ్మ.  ఎంత బాగుండేదనుకున్నావ్!  రోజూ  చూసే వాణ్ణి.  ఆ విగ్రహపు ముక్కు రంధ్రాలు చాలా పెద్దగా ఉండేవి.  నాకు ఆశ్చర్యం కలిగించేవి”

కథ చెబుతానని సోది చెబుతున్నాడు.  మనసులో విసుక్కున్నాను.

“నాకు నుదురు మీద రెండు పుట్టు మచ్చలున్నాయి.  ఒకటి కుడి పక్క,  నెల వంకని పోలి ఉంటుంది.  ఇంకొకటి ఎడమ పక్క, సూర్యుడి చిహ్నంలా వుంటుంది”జుట్టు వెనక్కి లాగి రెండు పుట్టుమచ్చలు చూబించాడు.  నిజంగానే రెండుపక్కలా రెండు మచ్చలేవో వున్నాయి.  కానీ, మధ్యలో ఈ పుట్టుమచ్చల శాస్త్రం ఏంటి!  విసుగు చిరాకుగా రూపు దిద్దుకోడం మొదలైంది.

 

“పదేళ్ళ పిల్లాడిగా వున్నప్ప్పుడు నాకు ప్రతి రోజు ఓ కల వచ్చేది.  ఆ అడవి మనిషి విగ్రహం పక్కన  నేను; ఆకాశంలో ఓ పక్క సూర్యుడు; ఇంకో పక్క చంద్రుడు.  ఇంతలో  రెండు జంతువులు విగ్రహం లోంచి బైటికొచ్చేవి.  ఆ జంతువులు మొదట  చిన్నగా ఉండేవి.  చూస్తుండగా పెద్దగా మారేవి.  ఒకటి కుందేలు,  ఇంకోటి గుర్రం.  కుందేలు వెండి రంగులో, గుఱ్ఱం బంగారు రంగులో ప్రకాశించేవి.   బైటికి వస్తూనే వేగంగా పరుగు మొదలు పెట్టేవి.  గుర్రాన్ని తాకాలని పరిగెత్తేవాడిని.  దొరికేది కాదు.  కనీసం కుందేలుని పట్టుకోవాలని ప్రయత్నించే వాడిని.  అదీ దొరికేది కాదు. పరిగెట్టేవి.  కుందేలు చంద్రుడిలోకి దూకేది.  గుర్రం సూర్యుడి మీదికి  దూకేది ”

మాయలేడి లాగా మాయా జంతువులు!  అయినా కలలో మాయా జంతువులూ, మనుషులూ, దయ్యాలూ, భూతాలూ ఇవ్వన్నీ అందరికీ కనబడుతుంటాయి.  పనిగట్టుకుని వాటి గురించి చెప్పుకోడం ఎందుకు!

“పూల తోటలో  సూర్యుడు ఉదయించే వేళ ఎర్రటి తూనీగ కనబడేది.  నాకొక్కడికే.  సాయంకాలం చంద్రుడు వచ్చే సమయానికి తెల్లటి సీతాకోక చిలక కనబడేది.  అదీ నాకొక్కడికే.   నీకు సీతా కోక చిలక ఇష్టమా లేక తూనీగా ఇష్టమా?”

తిక్క వాగుడికి తోడు  ఏదిష్టం అని  వెధవ క్విజ్ !  నేనేం చెప్పలేదు.

“ఈ రహస్యం నీకు తెలుసా?”

“ఏ రహస్యం?”

“జన్మ రహస్యం.  నా రహస్యం, నీ రహస్యం.   ఒక సాయంకాలం సూర్యుడు ఒక పక్క అస్తమిస్తూ వుండంగానే ఇంకో పక్క ఆకాశంలో చంద్రుడు కనిపించాడు.  ఆ సాయంకాలం విగ్రహం ముక్కు రంద్రాల్లోంచి రెండు ధగ ధగ లాడే కుంకుడు గింజంత వజ్రాలు బైట పడ్డాయి.  ఆ వజ్రాల్లో ఒకటి నీలి రంగుది.  ఇంకోటి నారింజ రంగుది”

“కుంకుడు గింజంత వజ్రాలా!” ఇతని పూర్వీకులు బాగా ధన వంతులై ఉండుంటారు.  అందుకే వజ్రాలని దాచి పెట్టారు!

“చూసావా ఎప్పుడైనా అటువంటి  వజ్రాల్ని”

“చూళ్ళేదు”

“కావాలా?”

ఆశ్చర్యం స్థానంలోఅనుమానం.  కావాలని చెప్పలేదు, వద్దని చెప్పలేదు.

“ఆ వజ్రాల్లో ఎర్రదానిని ఎడం చేతిలోకి తీసుకున్నాను.  నీలం దానిని కుడిచేతిలోకి తీసుకున్నాను.  అప్పుడేమైఁదో తెలుసా?  నా శరీరంలో ఎడమ సగభాగం చల్లగా అయిపోయింది.  కుడి భాగం వేడెక్కిపోయింది.  ఇలా ఎక్కడైనా జరగుతుందని నీకు ఇంతకూ ముందు తెలుసా? నువ్వు నేను చెప్పేది నమ్ముతున్నావా? నమ్మట్లేదా?”నా ముఖం వంక చూసి అతని మాటల్ని నేను అనుమాన పడుతున్నానని కనిబెట్టేశాడు. నమ్మినా నమ్మక పోయినా తను చెప్పేది చెప్పేదే అన్నట్టు ముందుకు వెళ్ళాడు.

“ఆ వజ్ర్రాల్ని చేతిలోకి తీసుకుంటూనే నేను ఉన్నట్టుంది అనంతం లోకి వ్యాపించాను.  రెప్ప మూసి తెరిచేలోగా నేను అంతరిక్షంలో వున్నాను.  అక్కడో ప్రాణ పుంజం వుంది.  దాని కిరణాలు అన్నివైపులా వ్యాపించి వున్నాయి”ఉత్తేజంగా చెబుతున్నాడు.

“ఔనా?!”

“నాకు అసలు విషయం  తెలిసిపోయింది”గొంతు తగ్గించి చెప్పాడు.

“ఏంటదీ?!”

“ఆ ప్రాణ  పుంజం ఎంతవరకూ చొచ్చుకుని పోతుందో అంతవరకూ  ప్రాణ శక్తి మనుగడ.  ఉపసంహరిస్తే నిర్జీవం.  అసలుకి మొదటి మనిషి లోపటి ధాతువులు ఒక్కటే.  కానీ కారణం  లేకండా రెండు భాగాలైపోయాడు.  ఇద్దరు మనుషులుగా మారిపోయాడు.  ఆ ఇద్దరూ  రెండు  కేలండర్లు తయారు చేసుకున్నారు.  ఒకరు సూర్యుడి గమనం లెక్కేశాడు, ఒకరు చంద్రుడి గమనం లెక్కేశాడు”

“ఐతే ఏంటి?!”

“ఇంతమాత్రానికే ఇద్దరూ ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు.  మళ్ళీ ఈ ఒక్కో కేలండర్ వాళ్ళూ తమలో తాము తెగలుగా విడిపోయారు.   గొడవ పడుతూనే వున్నారు.  ఎప్పటినుంచి అనుకున్నావు?  నీకసలు ఊహకే అందని కాలం నుంచీ.  మరీ పాత విషయం కదా. అందుకే ఎవరూ గుర్తించుకోలేక పోయారు”

“కేలండర్ల గురించే గొడవలా?”

“గొడవలే కాదు.  పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి.  జరుగుతున్నాయి. జరగబోతున్నాయి”

“కేలండర్ గురించి ఎవరైనా ఎందుకు గొడవ పడతారు?  మీరు చెప్పేది మరీ అర్ధం లేకుండా వుంది”

“నువ్విలాగే అంటావని ఊహించాను.  సరే ఐతే నువ్వు చెప్పు, ఎందుకు యుద్ధాలు జరుగుతాయో?”

“యుద్ధాలు ఎక్కువ భాగం  ఆర్ధిక కారణాల వల్ల జరుగుతాయి.  బైటికి కనబడని బలమైన డ్రైవ్స్ వల్ల జనాలు ఒకరి నొకరు చంపుకుంటారు.  నాకు తెలుసు, యుద్ధాలు అతి తెలివిగలవాడి పన్నాగంతో ప్రారంభం అవుతాయి.  చాలా మటుకు వాడికే లాభిస్తాయి”నిజానికి పిచ్చోడితో నేను ఇన్నేసి మాటలు మాట్టాడకూడదు.  కానీ,  ఎందుకో నాక్కూడా తెలుసులేవో అని చెప్పాలని పించింది.

“నేను చెప్పిన దానికీ, నువ్వు చెప్పిన దానికీ తేడా లేనే లేదు.  కేలండర్లు వేరు కావడం గురించే నువ్వు కూడా చెబుతుంట!  మనిద్దరి భావనా ఒకటే.  చూడు, అన్నం అందరికీ కావాలి.  కానీ కొంచమే వుంది.  సరిపోదు.  సరిపోవాలంటే ఇంకా చాలా పండించాలి.  పండించడానికి చోటు కావాలి.  వేరుకి నీళ్ళు కావాలి.  మొక్కకి వెలుతురు కావాలి.  ఇవ్వన్నీ ఒక్కచోటనే దొరకవు మరి.  దొరకప్పోతే ఎవడైనా  ఏం చెయ్యగలడు?”

Kadha-Saranga-2-300x268

ఖర్మ కాబోతే తలా తోకా లేని ఇతని వాగుడేంటి.  పొద్దున్నే అనుకోకుండా ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కు పోవడమేంటి!.   ఈ పిచ్చాడు ఇలా వాగీ వాగీ ఉన్నట్టుండి జేబులోంచి కత్తి తీసి దాడిచేస్తే , మీద పడి కరిచేస్తే.  దేవుడా ఇప్పుడు ఏమిటి చెయ్యడం.  ఇటువంటి ఇబ్బందులు వస్తాయనే సేఫ్టీ కోసం పెప్పర్ స్ప్రే తెచ్చి పెట్టాను.  సమయానికి అది ఎక్కడ పెట్టిందీ గుర్తుకు రావడం లేదు.

“నేను చెప్పేది నువ్వు నమ్ముతున్నట్టు లేదు” నా భావనలు కనిబెట్టినట్టుగా చిన్నగా నవ్వాడు.  ముందుకు జరిగాడు.  కుడి చేతి గుప్పిడి మూసి వుంది.  తెరిచి చూబించాడు.  నిజంగానే మెరుస్తున్న రెండు రంగు రాళ్ళు వున్నాయి చేతిలో.   నా రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు.  నాకు ఖంగారు పుట్టింది.  చేతుల్ని వెనక్కి లాక్కోవాలని చూసాను, గట్టిగా పుట్టుకుని వున్నాడు.  నా వల్ల కాలేదు.    ఏదో కనికట్టు చేస్తున్నాడు.

“మనం ఇంతకూ ముందు కలవక పోయినా నువ్వు నన్ను ఇప్పటికే గుర్తు పట్టి వుండాలి”

“అయ్యో, నిజంగా మీరెవరో నాకు తెలీదు.  నేను గుర్తు పట్టలేదు.  దయచేసి మీరు ఇంక బైటికి వెళ్ళండి”ఎలాగో ఈ నాలుగు ముక్కలూ మాట్టాడగలిగాను.

“గుర్తు పట్టలేదా?  నేను పురుషుడిని కదా.  ఎందుకు గుర్తు పట్టలేదు?” దబాయించాడు..

వీడమ్మా భడవా. ముసిలాడు సామాన్యుడుకాదు.  ఇది మామూలు పిచ్చి కాదు.  ఈ పురుషుడి బారినుండి ఇప్ప్పుదేలా బైట పడాలి.  సమయానికి ఇంటి పురుషుడు బైటికి వెళ్ళాడు.

“మన మధ్య కూడా లెక్క లేనన్ని వైరుధ్యాలు.  కానీ, నిజానికి మనమిద్దరం కూడా ఏకాంశులం.  జ్ఞాపకం వుందీ?”

“నాకేం జ్ఞాపకం లేదు.  ముందు మీరు ఇంట్లోంచి బైటికి వెళ్ళండి ” హిస్టీరిక్ గా అరిచాను.  తల విదిలించాడు.

“చూస్తున్నవన్నీ ఒకే ధాతువుల నుండి వేరు పడ్డ శరీరాలు.   ఆ లెక్కన  నేను నీకు సోదరుణ్ణి.  సరేలే, ఈ పిలుపులు అన్నీ సబ్ కాన్సియస్ మైండ్ చేసే మేజిక్కులు.  నాకూ తెలుసు.  కానీ నేనేమంటానంటే, అర్ధం చేసుకో.  ఎలాగోలా.  బీజంలో ప్రాణం వుండాలి.  అది మెత్తటి సారవంతమైన క్షేత్రంలో వుండాలి.  అప్పుడే మొలకెత్తుతుంది.  శరీరాలు బిగుసుకు పోతే అవి స్కలనానికి పనికిరావు.  నేను చెప్పింది రాయి.  నువ్వు రాయక పోతే నేను మళ్ళీ వస్తాను”లేచి వడి వడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు.  నేను ఒక్క అంగలో తలుపు దగ్గరికి వెళ్లి గబాల్న తలుపేసేశాను.

“రాయకపోతే మళ్ళీ వస్తాను.  తీశావా పెన్నూ పేపరూ, ఇంకా లేదా?”తలుపు బైట నుంచీ కేకలు వేశాడు.  నాన్న చిన్నప్పుడు హోమ వర్క్ చేశావా లేదా అని అరిచినట్టుగా వుంది.  భయపడ్డాను.  నాన్నకి భయపడినట్టే.  దడ దడ లాడతా నాలుగు తెల్ల కాగితాలు తీసుకుని వంకర టింకరగా ఏదోలా రాసేశాను.  చమటలు కారి పోతున్నాయి.  కాగితం తడిసి పోయింది.    ఎలాగోలా రాసేశాను.  హడావిడిగా రాయటాన పెన్ను ఒత్తిడి కలిగించి కుడిచేతి వేళ్ళు ఎర్రగా తేలాయి.

నక్షత్ర భరిణ

 

moshe

Art Work: Moshe Dayan

అలా ఒలింపస్ పర్వతసానువుల్లో నువ్వు పచ్చని చెట్ల నీడలో కూర్చుని నీలాకాశం, నీలి తటాకం, ఎర్రని కొండచరియలకేసి చూస్తూ విరబోసిన జుట్టుతో కాటుక కళ్ళతో శరీరాన ధరించిన పల్చటి పట్టు వస్త్రాలతో శిల్పంలా కూర్చుని వుంటే నాకెలా వుంటుంది…?

… ఎప్పుడూ నిన్నే చూడాలనిపిస్తుంది! నీ మాటలే వింటూ నీ పాటలకే చెవులప్పగించి నీ కళ్ళ లోకి చూస్తూ… నీ మనసులోని ఉద్వేగ తరంగాలకి స్పందిస్తూ అలానే ఓ వంద సంవత్సరాలు గడిపేయాలనిపిస్తుంది.

అసలు వంద సంవత్సరాలంటే వంద కెప్లర్ సంవత్సరాలు. పట్టు వస్త్రాలంటే ఈ కెప్లర్ గ్రహంలో పెరిగే పట్టు పురుగుల నుంచి తీసిన దారాలు, నీలి ఆకాశం అంటే కెప్లర్ గ్రహ ఆకాశం లోని వాతావరణం వల్ల వచ్చే రంగే.

అలా ఫెళ్ళుఫెళ్ళున కాసే ఎండలో చెట్ల నీడలో కూర్చుంటాం. నువ్వు కవితావేశంలో పద్యాలు చెబుతావ్. నేను సెలయేళ్ళలో స్నానాలు చేసి ఎండలు వళ్ళు ఆరబెట్టుకుని దగ్గర్లో వున్న నీలి నీళ్ళ తటాకంలో మంచినీళ్ళు తాగి, నీ దగ్గరకి వస్తాను. దూరాన కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం లిబర్టీ నుండి తెచ్చుకున్న ఆహారం – గోధుమలతో చేసిన అన్నం, కూరలు, పళ్ళు, మాంసాలు, మంద్రంగా మత్తెక్కించే ద్రాక్షరసం – ఆ రోజల్లా గడిచిపోతుంది.

రోజంటే రోజూ రోజే! సాయంత్రం ఎప్పటికీ రాదు.

చీకటి ఎప్పటికీ రాదు. నీడలు ఎప్పుడూ పొడుగవవు.

ఎప్పటికీ రాత్రి రాదు. ఆకాశం నీలంగా ధగధగా మెరిసిపోతుంది. నడయాడే తెలిమబ్బులు కనబడినా, ఎప్పుడైనా కాంతితో మెరిసే సూర్యుళ్ళు… ఒకరు ఉదయిస్తూనో మరొకరు అస్తమిస్తూనో ఉంటారు. ఇద్దరూ కలిసి అయినా మెరుస్తారు లేక ఒకరు మెరుస్తుంటే మరొకరు విశ్రమిస్తునే వుంటారు. అందుకే ఎప్పుడూ పగలే కెప్లర్‌లో. ఎప్పుడూ కాంతే, ఎప్పుడూ వెలుగే.

“నాకు చల్లటి రాత్రి కావాలి” అంటుంది. “ఈ సూర్యకాంతి వద్దు. తెల్లటి మబ్బులు, మెరిసే చుక్కలు కావాలి” అంటుంది ఫిలోమీనా.

“నీకెలా తెలుసు? మబ్బులు అంటే ఏమిటి? చుక్కలు ఎలా వుంటాయి? రాత్రి ఎలా వుంటుంది?” అని అడుగుతాను.

“హెరోడోటస్! నాకు తెలుసు. నా కలల్లో రాత్రి నావహించే నీలి నీడలు, తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతి, మెరిసే నక్షత్రాలు, ఆకాశంలో తేలిపోయే నేను…”

నేను నవ్వుతాను. ఎప్పుడూ నవ్వుతూనే వుంటాను. ఈ కెప్లర్‌లో రాత్రి లేదు. చీకటే లేదు. నక్షత్రాలంటే ఏమిటి? మబ్బులంటే ఏమిటి? అంతా సూర్యశక్తే. ఇద్దరు సూర్యుళ్ళ శక్తి నుంచీ ఆహారం సంపాదించి చెట్లు పెంచుతాం. కృత్రిమ వాతావరణంలో మొక్కలు పెంచుతాం. ఎక్కడి నుంచో ప్రవహించి వచ్చే నదుల జలాల నుంచీ నీరు తీసుకుని పంటలు పండిస్తాం. ఇద్దరు సూర్యుళ్ళు ధ్రువాల్లోని అంతులేని మంచుని కరిగిస్తూనే వుంటారు. నీరు సెలయేళ్ళుగా పొంగి పొరలుతునే వుంటుంది. ఇంక ఆకాశం నుంచి వాన ఎందుకు? రాదు కూడా! ఒక సూర్యుడిని మబ్బులు మూసినా మరో సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. వాన ఎప్పుడో కాని రాదేమో. ఎప్పుడూ వెలుతురే. ఎప్పుడూ ఆకాశం తళతళా మెరుస్తూంటుంది. నవ్వాను.

“కల కన్నాను” అంటుంది ఫిలోమినా.

కెప్లర్ దాటి అంతరిక్షంలోకి ఎగిరిపోయినట్లు ఏవేవో వింత లోకాలు చూసినట్లు, లక్షల కొద్దీ మినుకు మినుకుమనే చుక్కలు… ఏవేవో వింత స్వరాల పిలుపులు!”

నేను నవ్వాను. “లిబర్టీ నగరంలో అబ్జర్వేటరీలు శాస్త్రజ్ఞులు ఈ విషయంపై ఎప్పుడూ పరిశోధనలు జరుపుతూనే వుంటారు. వాళ్ళకే తెలియనిది నీకెలా, నాకెలా తెలుస్తుంది? మనం వచ్చింది ఈ రెండు రోజులు హాయిగా గడిపి వెళ్ళడానికి అంతే!”

కొండలు తళతళా వెండి వెల్తురుతో మెరుస్తున్నాయి. చెట్ల ఆకులు హరితంతో మిలమిలలాడుతున్నాయి. బాల్యం నుంచి కెప్లర్ చరిత్ర చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయి. మూడు శతాబ్దాల కొకసారి చీకటి వస్తుందట. అదేనా ప్రళయం? గ్రహం అంతా అంధకార బంధురమై పోతుందట. ప్రజలందరు ఉన్మాదులై ఒకరినొకరు హింసించుకుని చంపుకొంటారట. ఆకాశంలో మెరుపులు, మెరిసే చుక్కలు, పాములు లాంటి తోకచుక్కలు కనిపిస్తాయి అట. అలా ఒక నాగరకత అంతమయిపోయి దేవుడు ఆకాశంనుంచి దిగివచ్చి పాపహరిహారాలు చేసి శిక్షలు విధిస్తాడట!

ఈ కథ నేను చదువుకున్న చరిత్ర పుస్తకాలలోదే! కాని ఎంతవరకూ నిజమో, అసలు చీకటి ప్రళయం నిజంగా వస్తుందా? వస్తేనే చుక్కలు ఆకాశంలో మొలుస్తాయా?

“నాకు నక్షత్రాలతో నిండిన ఆకాశపు పందిరి కింద పాటలు పాడాలని వుంది” అంది ఫిలోమినా.

“సరేలే పద! వచ్చింది ట్రెకింగ్ చేయడానికి. ఇప్పుడు ఈ నక్షత్రాల గోల ఏమిటి?” అని విసుక్కున్నాను.

 

కొన్నాళ్ళ క్రిందట కొందరు కెప్లర్ యువ శాస్త్రవేత్తలు – మన గ్రహవ్యవస్థ దాటి, ఇంకా గ్రహాలున్నాయనీ, వందల అంతరిక్ష నక్షత్రాలున్నాయనీ వాదించారు. ఒక గుడారంలో చిల్లులు పెట్టిన నల్లటి గుడ్డ కట్టి వేసి అందరినీ దాంట్లోకి ఆహ్వానించి చీకట్లో పైకి చూడమన్నారు. కాంతి చిన్న చిన్న నక్షత్రాల వలె కంతల్లోంచి మెరిసింది.

Kadha-Saranga-2-300x268

“విశ్వాంతరాళపు శక్తి అలా నక్షత్రాల వలె కనిపిస్తుంది. మన సూర్యుళ్ళు కాంతిలో మెరవడం వలనే అవి కనపడడం లేదు. సూర్యుళ్ళు ఆరినా, ప్రకాశించడం మానేసినా ఆ చీకటికి కనిపిస్తాయి సుదూర నక్షత్రాలు. ఇది మా సిద్ధాంతం!” అనేవారు. “అది తెలియక చీకటి ప్రళయం అని కొందరు కెప్లర్ ప్రజలు తరతరాలుగా భయపడి నాగరకతని నాశనం చేసుకున్నారు.”ఆని వాదించేవారు.

ఎవరూ ఒప్పుకోలేదు. మత విశ్వాసులు అసలే ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరినీ జైలులో వేశారు. యావజ్జీవ శిక్ష!

ఫిలోమినా నవ్వింది. “నేను ఇప్పటికే ట్రెకింగ్ చేసి వచ్చాను. మళ్ళీ వెళదాం. ఆ దూరపు కొండ చరియలో ఎన్నో నివాసాలున్నాయి. కొండ గుహలు!!! అక్కడ నాకొక ముసలి సాధువు తపసు చేస్తూ కనిపించాడు. ఎన్నో గుహలున్నాయి. వాటిలో వెల్తురు లేదు. ఆ చీకటిలోనే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు”.

“నిజమా!” ఆశ్చర్యపోయాను.

“మనకి తెలియని వింతలు ఎన్ని వుంటాయి! పద! నేనూ చూస్తాను”

ఎర్రటి రాతి బండల మీద ఆకుపచ్చని నాచు మొలిచింది. వాటి మీద నడుచుకుంటూ ఇద్దరం బయలుదేరాం. ఎండ ఫెళఫెళమని తలని కాలుస్తోంది. ఆల్ఫా వన్ సూర్యుడు పటమట, ఆల్ఫా టు నడిన కిరణాల వెదజల్లుతున్నారు. వీపు మీది సంచుల్లో నుంచి నీళ్ళు తీసుకుని తాగుతూ నడిచేం.

మూడో గుహ చూపించి “అక్కడ” అంది ఫిలోమినా. ఆమె కళ్ళు ఆతురతతో మెరిసాయి. “ఇద్దర్నీ రమ్మన్నాడు ఆ సాధువు?” అంది.

గుహాంతర్భాగంలో చీకటిలో దూరాకా, ఎత్తయిన రాతి వేదిక మీద కూర్చున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల వయస్సో వూహించడం కష్టం. తెల్లటి, ఎర్రటి జడలు కట్టిన గడ్డాలు మీసాలు జుట్టు. మాసిన కాషాయ రంగు వస్త్రాలు. నుదుటన తెల్లటి చారలు అడ్డంగా. అది ఒక మత చిహ్నమా? నాకు తెలీదు.

కాగడాలు అతని చుట్టూ వెలుగుతున్నాయి. వాటి నుంచి నూనె వాసనా, నల్లటి పొగలూ వస్తున్నాయి.

ఇద్దరం ఆయన దగ్గరికి వెళితే, సాగిలబడి దండం పెట్టమని  నాకు సంజ్ఞ చేసింది ఫిలోమినా.

“ఓం… శివోహం!” అలాంటి కంఠస్వరం నేనెన్నడూ వినివుండలేదు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు.

“హెరోడోటస్, ఫిలోమినా! దీర్ఘాయుష్మాన్ భవ!” అన్నాడు.

ఫిలోమినా చెప్పింది రహస్యంగా – “అది సంస్కృత భాష. ఏదో సుదూర గెలాక్సీ గ్రహంలోనిది!”

“ఆమె నన్నడిగింది ప్రళయం ఏమిటని? ఎలా తప్పించుకోవాలి అని!” సాధువు గంభీర స్వరంతో చెప్పసాగాడు.

“చీకటి ఏర్పడుతుంది. ఇద్దరు భానులు ఆరిపోతారు. ఈ కెప్లర్ గ్రహం అంతటా చీకటి ఏర్పడుతుంది. అది ప్రళయం కాదు. సహజమైన ఖగోళ పరిణామం. కాని ఈ అంధ విశ్వాసులు, ఒకరినొకరు భయంతో చంపుకొంటారు, గృహదహనాలు చేస్తారు. సైతాను వచ్చిందని నమ్ముతారు. నాగరకత నాశనమవుతుంది. మళ్ళీ కాంతి వస్తే మళ్ళీ మొదలవుతుంది! మీరిద్దరూ ఆ ప్రళయాన్ని తట్టుకోండి. ఈ గుహల్లో దీపాలున్నాయి. అవే కాంతిని ఇస్తాయి…”

ఫిలోమినా చేతులు జోడించి, “ఈసారి చీకటి ప్రళయం ఎప్పుడు వస్తుంది స్వామీ?” అన్నది.

నిశ్శబ్దం. టపటపా మండే కాగడాల చప్పుళ్ళు తప్ప.  ఎక్కడి నుంచో హోరు గాలి.

ఆయన చేతిలో హఠాత్తుగా ఒక భరిణ ప్రత్యక్షమయింది. నీలంగా వుంది. దాని మూత వెల్వెట్‌తో కప్పబడి వుంది. ఆ మూత నిండా వేలకొద్డీ వజ్రాల లాంటి కాంతిని చిమ్మే రాళ్ళు పొదగబడి మెరుస్తున్నాయి. అది ఒక కూజా ఆకారంలా వుంది. దాని లోపల ఎర్రటి ఇసుకలాంటి పదార్థం అణువులు అణువులుగా భరిణలోకి క్రింది అరలోకి జారుతోంది. అది పారదర్శకంగా కనిపిస్తోంది.

“అవర్ గ్లాస్! ఒక రకమైన కాలయంత్రం!”’ నేను విజ్ఞాన పురాతన దర్శినిలో చదివాను” అంది ఫిలోమినా. క్రింద అర పూర్తిగా నిండిపోయింది. కొంచెమే ఖాళీ!

“మూడు వందల ఏళ్ళ కొకసారి ఆల్ఫా వన్, ఆల్ఫా టు సూర్యులు కెప్లర్ గ్రహమూ, దాని ఉపగ్రహాల నీడలలో పడి గ్రహణానికి గురి అవుతారు. అప్పుడు సంపూర్ణ ద్విసూర్య గ్రహణం ఏర్పడి గ్రహం అంతా చీకటి అవుతుంది. అది ప్రళయం అని, సైతాను ఆకాశంలోంచి చుక్కల రూపంలో వస్తాడని మూఢ మత విశ్వాసులు నమ్ముతారు. నాగరకతని నిర్మూలిస్తారు.

అవి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు. అవన్నీ సుదూర గెలాక్సీలలోని గ్రహాలు, నక్షత్రాలు. వాటి నుంచి వచ్చే కాంతి! సూర్యకాంతి లేకపోతేనే అవి కనిపిస్తాయి. రాత్రి లేని గ్రహంలో అదే ఒక వింత! వింత భయం! కింది అర నిండగానే సూర్యగ్రహణాలు మొదలవుతాయి. మీరు ఆ గొడవలకి దూరంగా పోయి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!”

“మీకు… ఎలా తెలుసు స్వామీ?”

“అనేక వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు గణితంలో ఈ లెక్కలు నేర్చుకుంటూ వున్నారు. అంతం, ఆరంభంల నుంచే నేను ఇక్కడ తపస్సులో మునిగిపోయాను. నిజంగా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు! శివోహం.”

కాగడాల వెలుతురులో గుహలోని అల్మారాలు పాత డిజిటల్ కంప్యూటర్లు, కాగితంతో కూడా చేసిన గ్రంథాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించాయి.

“ఫిలోమినా! దైవం నిన్ను నా దగ్గరకి పంపింది.  తీసుకో! శుభం భూయాత్!”

నక్షత్ర భరిణని కళ్ళకద్దుకుంది ఫిలోమినా.

నేను అనుమానంగానే ఆయనకి నమస్కరించి బయటకి నడిచాను.

***

కాలం గడుస్తోంది. నక్షత్ర భరిణలోని పై అర లోంచి ఇసుక రేణువులు చాలావరకు క్రింది అరలో నిండిపోతున్నాయి.

లిబర్టీ నగరంలో మా ఇంట్లో కూర్చుని వున్నాం. క్రమంగా ఆల్ఫా వన్ సూర్యుడు పడమట పసుపురంగులోకి, ఆ తర్వాత సగం నలుపు, సగం పలచటి ఎరుపులోకి మారిపోతున్నాడు. నడినెత్తిన ఆల్ఫా టు సూర్యుడు సూర్యకాంతి నల్లగా అయి అంచుల్లో తెలతెల్లగా మెరుస్తున్నాడు.

ఫిలోమినా, నేను – ఆహారం, చీకటి రోజుల కోసం కాగడాలు, తాగడానికి నీళ్ళూ, చలి తట్టుకోడానికి దుస్తులు అన్నీ సర్దుకున్నాం.

“కొండల్లోకి పోదాం” అన్నది ఫిలోమినా.

లిబర్టీ నగర వీధుల్లో కలకలం. “ప్రళయం… ప్రళయం” ఎవరి నోట విన్నా అదే మాట.

‘ఇండిపెండెంట్ స్క్వేర్’ లో వున్న ఖగోళ పరిశోధనాలయం దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది.

శాస్త్రజ్ఞులు నలుగురు ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు.

“కాదు. ఇది ప్రళయం కాదు. మన దైవం మరణించదు. సైతాను చుక్కల రూపంలో రాడు. ఇది ఒక గ్రహణం మాత్రమే. నమ్మండి.”

మత చిహ్నాలు ఒంటినిండా పూసుకున్న గడ్డాలు మీసాల విలేకరి హుంకరించాడు.

“ఎలా చెప్పగలరు? ఇది దైవ లిఖితం. ఈ నాగరకత నశించాలని రాసి పెట్టివుంది. ఇది ఎన్నో సార్లు జరిగింది. అందరినీ మీరు మభ్యపెడుతున్నారు.”

మేము జనసమూహంలోంచి తోసుకుంటూ వూరి బయటకి నడిచాం.

నక్షత్ర భరిణ పూర్తిగా ఖాళీ అయిపోయింది. క్రింది అర పూర్తిగా నిండింది.

ఇంకా నడిచాం. దూరాన కొండల మీద నీడలు అలముకుంటూ వున్నాయి.

చీకటి నాకు కొత్త. చలి నాకు కొత్త. ఆల్ఫా వన్, ఆల్ఫా టు ఇద్దరూ పూర్తిగా ఆరిపోయారు. ఒక్కసారిగా అంధకారం అలముకుంది.

ఆ సరికి మేం ఒలింపస్ కొండ గుహల దగ్గరికి వచ్చేశాం.

సాధువులంతా గుహల బయటకి వచ్చి ఆకాశానికేసి చూస్తూ – ఏదో వింత భాషలో – ప్రార్థనలు చేస్తున్నారు.

ఒక్కసారి ఆకాశం దేదీప్యమానంగా వెలిగింది. లక్ష దీపాలు వెలిగాయి. ఆకాశంలో చుక్కల పందిరి వెలిసింది. నీలం, పసుపు, తెలుపు, పెద్దవి, చిన్నవి, తోకలతో కొన్ని, తెలిమబ్బులతో కొన్ని అసంఖ్యాకంగా మినుకు మినుకుమని మెరుస్తూ వెలుస్తున్నాయి. అవి వెలిగే దీపాల్లా సువాసన లేని పువ్వుల్లా మెరిసే నక్షత్ర మాలికలు.

వాటి కాంతితో అస్పష్టంగా మెరుస్తున్నాయి కొండలు.

సాధువులు చేతులు ఆకాశం వైపు ఎత్తి పెద్ద గొంతులతో అనేక వింత భాషలలో ప్రార్థిస్తున్నారు.

ఒక వింత చలి ఎముకలని ఒణికిస్తూ ఆరంభమైంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు అరుస్తూ చెట్ల నుంచి ఎగిరిపోయాయి. కొన్ని అడవి జంతువులు అరవడం వినబడుతోంది.

“ఇద్దరం కొండ మీదకి ఎక్కేద్దాం. ఉన్ని దుస్తులు వేసుకో! భయపడక! ఇదంతా త్వరలో ముగిసిపోతుంది!”

కొండ సగం ఎక్కినాక ఇద్దరం దక్షిణం వైపు లోయలో వున్న లిబర్టీ, కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం వైపు చూశాం.

చీకటి, బొమ్మరిళ్ళ లాంటి ఇళ్ళని కప్పేసింది. చుక్కల వెలుగురు అస్పష్టంగా వాటి మీద పడి అది ఒక భీతి గొలిపే దృశ్యంలా ఉంది.

ఎందుకంటే హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పట్టణంలోని భవనాలు నిప్పు అంటుకున్నాయి. బహుశా ఖగోళ పరిశోధనాలయం కూడా అంటుకుంటుంది.

గాలిలో అలలు అలలుగా కేకలు, నినాదాలు వినబడుతున్నాయి. అవి మాకు తెలిసిన కెప్లరీ భాషలో ‘దేవుడి శాపం, దేవుడి శాపం, అంతా నశించిపోవాలి’ అన్న అరుపులు మిన్నుముట్టాయి.

అప్రతిభులమై, ఆశ్చర్యంతో, భయంతో దూరాన వున్న ఆ దృశ్యాన్ని చూడసాగాం నేనూ ఫిలోమినా.

కెప్లర్ గ్రహపు ఇద్దరు సూర్యుళ్ళు ఆరిపోయిన వేళ దీర్ఘరాత్రిలో చీకటి ప్రళయం మొదలయింది.

 

(ఈ రచనకు ఐజాక్ అసిమోవ్ వ్రాసిన “నైట్‌ఫాల్ అనే కథ స్ఫూర్తి. నక్షత్ర భరిణ అనే పదం ఉష మరువం రాసిన కవిత్వంలో చదివి ఈ కథ వ్రాశాను. ఆమెకీ, అసిమోవ్‌కి కృతజ్ఞతలు!)

 

ట్విస్ట్

Kadha-Saranga-2-300x268

 

“హలో ఛామూ, ఒక సారి అర్జెంటు గా ఇంటికి రా” అంజలి టెన్షన్ గా అంది.

అది పట్టించుకోకుండా “ఏంటి మెంటలా, ఇప్పుడే గా మీ ఇంటి నుండి బయలుదేరాను. ఇంకా నా రూమ్ కి  దారిలోనే ఉన్నాను” ఛాము విసుగ్గా అంది. ఛాము అంటే ఛాముండేశ్వరి.

“అయితే మరీ బెటర్. తొందరగా రా” అని ఫోన్ కాల్ కట్ చేసి చాలా ఖంగారు పడుతూ గోళ్లు కొరుక్కుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తోంది అంజలి.

అరగంట గడిచాక ఛాము అంజలి వాళ్ళ ఇంటికి చేరింది. పొద్దున్న పదిన్నర అయింది.

“ఏంటి మాటర్?” అని పూర్తిగా అనకుండానే అంజలి ఒక సెల్ ఫోన్ ని ఛాము వైపుకి తోసింది.

“ఎవరిది ఇది?” ముఖం చిట్లిస్తూ అడిగింది ఛాము.

“రవి”

“…. ” నాకెందుకు ఇచ్చావు అన్నట్టు అంజలి వైపు చూసింది ఛాము.

“చదువు”

ఇంగ్లీష్ లో ఉన్న చాట్ ని పైకి చదివింది ఛాము.

 

రమ :హాయ్ రవి , మా ఊరు వచ్చావు ట?”

రవి:హే. అబ్బా పెద్ద కొత్త గా అడుగుతావు ఏంటి? ఎప్పుడూ వస్తూనే ఉంటాగా?”

రమ :హహహ అది కరెక్ట్ ఏ అనుకో. సో ఎప్పుడు మీటింగ్?”

రవి:నువ్వెప్పుడు అంటే అప్పుడు. నేను ఈ వీకెండ్ మొత్తం ఫ్రీ

రమ:అయితే ఫ్రైడే నైట్ ఇంటికి వచ్చేయి. వి కన్ హావ్ టోటల్ ఫన్” (కన్ను కొట్టే ఎమోజి)

రవి:షూర్” (కన్ను కొట్టే ఎమోజి)

రమ:ఓకే సీ యూ రవి

రవి: ఓకే రా బాయ్

 

“ఓహ్ మై గాడ్” ఛాము షాక్ లో అంది.

“కదా” అంజలి కనుబొమ్మలెగరేస్తూ అంది.

“ఎప్పటి నుండి సాగుతోంది ఈ అఫైర్?”

“ఏమో. నేను ఇవాళే చూసాను. రవి ఫోన్ మర్చిపోయాడు ఇంట్లో. ఎదో కాంటాక్ట్ కావాలి, అర్జెంటు గా అని నాకు తన ఫోన్ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేయమన్నాడు. సరే ఆ నెంబర్ ఎదో ఇచ్చాక ఊరికే తన వాట్సాప్ ఓపెన్ చేసాను. ఇదే పైన ఉంది. లాస్ట్ వీక్ డాలస్ వెళ్ళాడు చూడు అప్పుడు కాన్వర్సేషన్ ఇది. పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు..” అంటూ ఏడుపు మొదలు పెట్టింది అంజలి.

“హే కంట్రోల్. ఇలా పిరికిగా ఏడవటం కాదు. రవి రాగానే కడిగేసేయ్ అసలు” ఛాము ధైర్యాన్ని ఇస్తోంది.

ఛాము ఆ చాట్ కాన్వర్సేషన్ ని ఒకటికి పది సార్లు చదివింది.

“అంజూ, చాలా కాలంగా పరిచయం ఉన్నట్టుండే. ఆ అమ్మాయిని ఏకంగా ‘రా’ అని ప్రేమగా పిలిచాడు. నీకసలు ఈ అమ్మాయి గురించి ఎప్పుడు చెప్పలేదా ? ఎన్నాళ్ళ కి ఇలా ట్రిప్స్ కెళ్తూ ఉంటాడు?” షెర్లాక్ లాగ ఎదో కనిపెడ్తున్నట్టు అడిగింది ఛాము.

“ప్రతి నెలా వెళ్లొస్తూ ఉంటాడు. వాళ్ళ వెర్ హౌస్ అక్కడే ఉంది, సో ఇన్స్పెక్షన్ చేయటానికి తన టీం రవి నే పంపుతుంది. కానీ ఇప్పుడు అర్ధమవుతోంది, దాని కోసం కాదు ఆ అమ్మాయి కోసం వెళ్తున్నాడు అని” చేతిలో మొహం పెట్టుకొని మరీ ఏడుస్తోంది అంజలి.

ఛాము లేచి, మంచి నీళ్లు తెచ్చి అంజలి కి ఇస్తూ, భుజం తట్టి “ఇలాంటి సమయాల్లోనే గుండెని రాయి చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అసలు ఆ అమ్మాయి ఎవరు? రవి ఫేసుబూక్ ప్రొఫైల్ ఓపెన్ చెయ్యి ముందు” ఛాము ఏదో ఆలోచిస్తూ చెప్పింది.

అంజలి రవి ఫోన్ లోనే ఫేసుబూక్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ లిస్ట్ వెతకడం మొదలుపెట్టింది. అయిదు వందల మందిలో ఇద్దరీ రమ అనే అమ్మాయిలు ఉన్నారు. ఒకరేమో ఇండియా, ఇంకొకరు కెనడా లో. డాలస్ లో మాత్రం లేరు. పైగా వాట్సాప్ లో ఉన్న డిస్ప్లే పిక్చర్ తో మాచ్ కూడా అవలేదు. ఈ దారి మూసుకుపోయింది అని ఇద్దరూ ఫీల్ అయ్యారు.

“హే రవి ఆఫీస్ లో నీ మలయాళీ ఫ్రెండ్ పేరేంటి?” ఛాము అడిగింది.

“శిల్ప. శిల్ప థామస్. ఫ్రెండ్ కాదు ఎదో జస్ట్ క్లాసుమేట్ అంతే. ఎందుకు?” అర్ధంకానట్టు అడిగింది అంజలి.

“ఆమె కి కాల్ చెయ్యి. నీ ఫోన్ నుండి. చేసి రవి లాస్ట్ వీక్ వెళ్ళింది ఆఫీస్ పని మీదో కాదో తెలుసుకో ”

గట్టిగా నిట్టూర్చి “సరే” అంది.

“హే శిల్పా, అంజలి హియర్. ఎలా ఉన్నారు?”

“హే అంజలి. గుడ్. హౌ అర్ యూ?”

ఇంకా ఏవో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.

“లాస్ట్ వీక్ రవి డాలస్ వేర్ హౌస్ కి వెళ్ళాడు…”

“….”

“…..”

“ఏమైనా మర్చిపోయాడు? ఏం చెప్పలేదు నాకు రవి” తనకొచ్చిన తెలుగులో మాట్లాడుతోంది శిల్ప.

“యా, నన్ను అడగమన్నాడు. ఎలా రికవర్ చేసుకోవాలి అని..”

“ఓహ్ థాట్స్ ఈజీ. డాలస్ కార్పొరేట్ ఆఫీస్ కి కాల్ చేసి నేను మాట్లాడతాను. రవి రెగ్యులర్ కదా అక్కడ సో ప్రాబ్లెమ్ ఏం లేదు. ఆ ఆఫీస్ లో అందరికి రవి బాగా ఇష్టం. రవి చాలా ప్రొఫెషనల్ గా, మర్యాదగా ఉంటాడు అని. రవి వర్క్స్ హార్డ్ కూడా” అని ఇంకేదో చెప్తోంది, అంజలి కి ఈ దారి కూడా మూసుకు పోయినట్లు కనిపించింది. ఛాము వైపు నిస్పృహతో చూసింది.

అంతలోనే ఎదో తట్టినట్లు మళ్ళీ, “శిల్పా పోనీ రవి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డాలస్ లో చెప్పు. కొత్తవాళ్ళని ఎందుకు ట్రబుల్ చేయడం” చీకట్లో బాణం విసిరింది అంజలి.

“ఓహ్ కరెక్ట్. లెట్ మి చెక్”

“రమ…” క్లూ ఇచ్చింది అంజలి.

“ఓహ్ రామ గారు మంచి వారు. నేను అడుగుతాను. ఐ విల్ కాల్ యూ బాక్ ఒకే. బాయ్” అని కట్ చేసింది శిల్ప.

డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా ఆలా సడన్ గ కాల్ ఎండ్ అవడంతో అంజలి కి దారులు అన్నీ  మూసుకుపోయినట్లు, ఇంక తన జీవితం ఆగిపోయినట్లు ఏవేవో పిచ్చి ఆలోచనలతో అంజలి తల బద్దలవుతోంది.

ఆలా తలపెట్టుకొని కూర్చున్న అంజలి ని చూస్తూ ఛాము “అందుకే చెప్పాను. లవ్ మ్యారేజ్ చేసుకోమని. వినలేదు నువ్వు. పది రోజులో మనిషిని చూసేసి, పెళ్లి చేసేస్కోని, ఉన్న ఉద్యోగం మానేసి ఇక్కడికొచ్చేసావ్. ఏం జరిగిందో చూడు. ఏ మగాళ్లంతా ఇంతే. అమ్మాయిలంటే యూస్ అండ్ త్రో లాగ వాళ్ళకి. నా మాట విను. ఒక లాయర్ ని రెడీ గ ఉంచుకో. ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి ఈ మజ్జన. పైగా మనకి సపోర్ట్ గా చాలా వుమన్ గ్రూప్స్ ఉన్నాయి” అంటూ ఉచిత సలహాలు ఇస్తోంది ఛాము.

అంజలి మాత్రం కొన్ని మాటలే వింటోంది. అసలు ఎందుకు రవి తన దగ్గర ఈ విషయం దాచాడో అని ఆలోచిస్తోందే కానీ విడిపోయేంత వరకు ఆలోచన రాలేదు. అంజలి రవిలది పెద్దలు కుదిర్చిన  పెళ్లి. పది వారాలు అయింది. కానీ మంచి బంధం ఏర్పడింది ఇద్దరి మధ్య. రవి చాలా మంచివాడు. ఎలాంటి పట్టింపులు లేవు. అంజలి ని అంజలి కిష్టం వచ్చినట్లు ఉండమన్నాడు. వంట కూడా తానే చేస్తాడు. రవి అన్నీ ఓపెన్  గా చెప్పేసాడు, తన పాత జీవితం గురించి. అంజలి ని మాత్రం చెప్పమని అడగలేదు. అవసరం లేదు అన్నాడు. అంజలి గతం తనకి అక్కర్లేదు అని, అంజలితో భవిష్యత్తు మాత్రమే తనకి కావాలని మరో మాటకి తావు లేకుండా చెప్పేసాడు. తను చాలా లక్కీ అని రోజుకి పది సార్లు అనుకుంటుంది అంజలి. ఆలా ఆలా క్రమంగా రవి పైన ప్రేమాభిమానాలు పెంచుకుంటున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకుంటుంది అని అనుకోలేదు. రవి తనకి అబధం చెప్పాడంటే నమ్మలేక పోతోంది. రవి తనని మోసం చేసాడు అన్న ఆలోచన చాలా బాధగా ఉంది. సాయంత్రం ఆరున్నర దాటింది. ప్రొద్దున నుండి తిండి తిప్పలు లేకుండా ఉన్నారు ఇద్దరు.

తన ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనలనుండి తేరుకొని “హలో” అని అంది అంజలి.

“అంజలి, రవి ఏం మర్చిపోలేదు అంట. రామ గారు ఇప్పుడే చెప్పారు” ఆ తెలుగు వినటానికి కొంచం వెరైటీ గా ఉన్నా, మలయాళీ అమ్మాయి అయినా తెలుగు చక్కగా మాట్లాడగలదు.

“అవునా, సరే థాంక్స్ శిల్పా. నేను రవి కి చెప్తాలే” అని కాల్ కట్ చేసింది అంజలి. ఈ సారి శిల్ప మాట్లాడిన ఒక్కో మాట చాలా స్పష్టంగా అంజలి వినింది.

ఎదో తట్టినట్లు రవి ఫోన్ ఓపెన్ చేసి, ఫేస్ బుక్ లో ఇందాక వెతికినట్లే మళ్ళీ ఆర్, ఏ, ఎం, ఏ అనే నాలుగు అక్షరాలు సెర్చ్ చేసింది. వాట్సాప్ పిక్చర్ తో ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది. ఆ ప్రొఫైల్ చూసాక మంచం మీద పడిపోయి మరీ నవ్వటం మొదలు పెట్టింది. ఎంత నవ్విందంటే , ఛాము భయపడేంత.

కడుపు నొప్పొచ్చేలా నవ్వేసాక సడన్ గా సీరియస్ మొహంతో “ఛాము , నువ్వింటికెళ్ళిపో. కొన్నాళ్ళు నాకు కనపడకు” అని అంది.

“ఏమైందే నీకు?” కన్ఫ్యూషన్ లో అడిగింది ఛాము.

“నువ్విప్పుడు నేను చెప్పినట్లు వినలేదు అనుకో, నేనే నిన్ను బయటకి తోస్తాను. వెళ్ళు. గెట్ లాస్ట్” అని హిస్టెరిక్ గా అంజలి అరిచింది.

ఛాము మారు మాట్లాడకుండా తన బాగ్ తీస్కొని బయటకి నడిచింది.

అంజలి కూడా ఛాము వెనకాలే వెళ్లి, “దయచేసి ఇంకెవరికీ ఎప్పుడూ చచ్చు సలహాలు ఇవ్వకు” అనేసి తలుపు ధడేల్ మని వేసింది.

 

****

“హ హ హ హ, రామ గాడు నా కాలేజ్ ఫ్రెండ్. రామ కృష్ణ వాడి పేరు. డాలస్ లో మా కంపెనీ లోనే జాబ్. నేను వెళ్ళినప్పుడల్లా వాడితో కలిసి మందు పార్టీ ఒక ఆనవాయితీ అన్నమాట”

పొద్దున్న నుండి జరిగిన విషయాలన్నీ చెప్పిన అంజలి తో రవి మాట్లాడుతూ, “అయినా వాడి వాట్సాప్ లో ఉన్న ఫోటో ఎవరిదో కూడా తెలియదా నీకు? అందుకే ఎప్పుడూ తెలుగు సినిమాలు కాదు అప్పుడపుడు మలయాళం కూడా చూడాలి అనేది. ఆ ఫోటో మలయాళీ లో కొత్తగా హిట్ అయిన సినిమాలో హీరోయిన్ ది. శిల్ప మా ఇద్దరికీ అప్పుడపుడు మంచి మళయాళీ, తమిళ్ సినిమాలు చెప్తూ ఉంటుంది. వాడు అలాంటిది ఒకటి చూసి ఆ హీరోయిన్ కి ఫ్లాట్ అయ్యాడు. వాడి ఫేస్ బుక్ ప్రొఫైల్ నిండా కూడా ఆమెతో నిండిపోయింది చూసావుగా. సిల్లీ గర్ల్ నువ్వు హ హ హ” తెగ నవ్వుతున్నాడు రవి.

ఒక అబ్బాయిని అమ్మాయి అనుకోని, రవి ఏదో ఎఫైర్ నడుపుతున్నాడు అని తొందరపాటుతో అనేసుకొని ఎంత ఫులీష్ గా బిహేవ్ చేసిందో అంజలి అర్ధం చేసుకుంది.

తను కూడా నవ్వింది.

“ఇలాగ ఎంత మంది నిజానిజాలు తెలుసుకోకుండా వెర్రి వాళ్ళలాగా అనుమానపక్షులు అయిపోయారో కదా?” అంజలి అంది.

“అవును అంజూ. మన తరం వాళ్లలో ఓర్పు, సహనం చాలా తక్కువ అయిపోయాయి. టెక్నాలజీ పెరిగింది కానీ, దానితో పాటు ఇంపేషన్సు కూడా పెరిగిపోయింది. అన్నీ ఫాస్ట్ అయిపోయాయి. నిర్ణయాలు కూడా. తొందరగా పని చేయటం వేరు, తొందరపాటుగా చేయడం వేరు. నువ్వు కొంచం రేషనల్ గ ఆలోచించే రకం కాబట్టి నేను బ్రతికిపోయాను. లేదంటే నువ్వు ఏ పిచ్చి నిర్ణయమో తీసుకొని ఉంటే ఆమ్మో ఆలోచించటానికే కష్టం గా ఉంది” అని అన్నాడు రవి.

“అసలు నేను నీ ఫోన్ చెక్ చేయటమే పెద్ద పొరపాటు. పోనీ చేసానే అనుకో, నాకు ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా ఛాము నన్ను తొందర పెట్టింది. తనని కూడా బ్లేమ్ చేయలేను లే. అది నా ఫ్రెండ్ కాబట్టి ఆలా నా తరఫున ఆలోచించిందే తప్ప అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. నేను కూడా అంతే కదా. చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. హౌ టు బ్రేక్ అప్ ఆలోచిస్తున్నారు కానీ హౌ టు మేక్ అప్ కాదు. అందుకే ఎంత తొందరగా పెళ్లిళ్లు అవుతున్నాయో, అంత తొందరగా విడిపోతున్నారు కూడా. ఎనీ వే, నేను ఇవాళ లెసన్ నేర్చుకున్నాను, రవిని ఊరికే అనుమానించకూడదు అని ” అంజలి సంతృప్తిగా చెప్పింది

“నువ్వొకటే లెసన్ ఏమో అంజూ, నేను రెండు నేర్చుకున్నాను” అంజలి వేళ్ళు విరుస్తూ అన్నాడు రవి.

“ఏంటవి?” ఆశ్చర్యంగా అడిగింది అంజలి.

“ఫస్ట్ ఏమో నా మగ ఫ్రెండ్స్ పేర్లు కాంటాక్ట్స్ లో పూర్తిగా పెట్టాలని. రెండోది నీకు చచ్చు సలహాలిచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు సో కొంచం జాగ్రత్త గా ఉండాలి అని”

“ఓయ్” అని చిరుకోపంతో రవి వీపు మీద కొట్టింది అంజలి.

“ఇవాళ జరిగిన దానికి మళ్ళీ సారీ. ఓకే సరే ఒక ప్రామిస్ చేయి” అంజలి సీరియస్ గా అడిగింది.

“ఏంటది?”

“ఎపుడైనా నీకు ఎఫైర్ ఉంటే నాకు చెప్పేసేయ్. నేనేమీ అనుకోనులే” అంజలి నవ్వుతూ అంది.

“బాబోయ్. ఒకళ్ళతోనే కష్టంగా ఉంది. ఈ జన్మకి నువ్వు చాలమ్మా” అని దణ్ణం పెట్టేసాడు. ఇద్దరూ గట్టిగా నవ్వేశారు.

***

వెలుతురు వైపు

 

‘హాలో చిన్నోడా! ఎలా ఉన్నావు?’ స్కైప్‌లో వాళ్ళమ్మాయిని అడుగుతున్నాడు అర్జున్‌.

‘నేను బాగానే ఉన్నా డాడీ! మీరెలా ఉన్నారు? అమ్మ కొంచెం డల్‌గా అనిపిస్తోంది ఏమిటీ హెల్త్‌ బాగోలేదా?’ అడిగింది అర్జున్‌, అపూర్వ ముద్దుల కూతురు మనీషా.

‘ఏం లేదురా! ఈ వారం కొంచెం ఆఫీసులో వర్క్‌ ఎక్కువగా ఉంది అంతే.. నువ్వు లంచ్‌ చేశావా?’ అడిగింది అపూర్వ.

‘అప్పూ డియర్‌! ఈరోజు చికెన్‌ బిర్యానీ. రూమ్‌లోనే చేసుకున్నాం. ఫుల్‌గా కుమ్మేసాం!’ అంది మనీషా.

‘ఓహో!’ అని అపూర్వ అంటుండగానే చికెన్‌ బిర్యానీ ప్రాసెస్‌ ఫొటోలన్నీ పోస్ట్‌ చేసింది.

అవన్నీ చూసి అర్జున్‌ ‘నా కూతురే నయం. ఎంత బ్రహ్మాండంగా చేసిందో. మీ అమ్మ పెళ్ళయ్యాక ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇలా చేయలేదురా!’ అన్నాడు.

‘భార్య చేసినవన్నీ మెక్కేసి, మర్చిపోవడం భర్త లక్షణం.. అయినా అమ్మకన్నా నువ్వు బాగా చేస్తావుగా డాడ్‌..!’ అంది మనీషా నాటకీయంగా.

‘ఏమైనా అమ్మ పార్టీనే నువ్వు. అయినా నీతో మాట్లాడ లేనురా..!’ అన్నాడు అర్జున్‌. అపూర్వ, మనీషా పకపకా నవ్వారు.

‘అదేం లేదు డాడీ! న్యాయం ఎటుంటే అటే! నా టైప్‌ అంతేగా?’ అంది మనీషా.

‘మీ తండ్రీకూతుళ్లు ఇలా ఎంతసేపైనా మాట్లాడతారుగానీ, చిన్నీకి అసలు విషయం చెప్పండి!’ అని అర్జున్‌ను మోచేత్తో పొడుస్తూ అంది అపూర్వ.

‘ఏంటి డాడీ! అమ్మేంటో చెప్పమంటోంది?’ అని విషయం పసిగట్టేసిన మనీషా అడిగింది.

‘ఏం లేదురా! అభిరాం అంకుల్‌ లాస్ట్‌వీక్‌ కాల్‌ చేశారు. వాళ్ళబ్బాయి మనోహర్‌కి నిన్ను చేసుకుందామని అడిగాడు. నేను మనీషాదే నిర్ణయం అని చెప్పా. నా కూతురు ఎవర్ని తీసుకొచ్చి పెళ్ళి చేయమంటే వాళ్ళతో చేస్తాను. ఒకవేళ చేసుకుని వచ్చినా ఓకే!’ అని చెప్పా.

‘యూ ఆర్‌ రైట్‌ డాడ్‌! కానీ ఈ మధ్య నేనూ ఆలోచిస్తున్నా. ఎండి పూర్తయ్యాక పెళ్ళి చేసుకుందామా, ఈ లోపే చేసుకుందామా అని కానీ నీలాంటి వ్యక్తే నాకు భర్తగా కావాలి డాడీ! అలాంటి వ్యక్తిని నేను సెలెక్ట్‌ చేసుకోగలనా అని ఒక్కోసారి డౌట్‌ వస్తోంది. నేనే ఈ విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నా’ అంది మనీషా.

‘మీ డాడీలాంటి వాడంటే నువ్వు చెప్పినట్టు వింటాడనా?’ నవ్వుతూ అన్నాడు అర్జున్‌.

‘హా.. హ్హా…! యస్‌ డాడ్‌!’ అంది మనీషా.

‘నువ్వు చెప్పినట్లు వినడమే కాదు. నీది మంచి మనస్సు డాడ్!.. అఫ్‌కోర్స్‌ అప్పుడప్పుడు నీలో మగోడనే ఇగో బయటకు వస్తుందనుకో! అమ్మ అంత బాగా మానేజ్‌ చేయలేకపోతోందిగానీ, ఆ విషయంలో నేను బాగా మానేజ్‌ చేస్తా. ఎందుకంటే నేను నీ కూతుర్ని కదా! ఇంతకీ అమ్మా! నీ అభిప్రాయం ఏమిటీ? నువ్వు ఏం మాట్లాడవే?’ అంది.

‘నీదీ నాదీ ఒకటేరా! ఎండి పూర్తయ్యేలోపే ప్రయత్నిస్తే ఎప్పుడు ఓకే అయితే అప్పుడు పెళ్ళి చేసేసుకుందువుగానీ’ అంది అపూర్వ.

‘అభిరాం అంకుల్‌ వాళ్ళబ్బాయి స్కైప్‌ అడ్రస్‌ నాకు పంపు డాడీ, నా అడ్రస్‌ అతనికి ఇవ్వు. మేమిద్దరం మాట్లాడుకున్నాక నీతో మాట్లాడతా’ అంది మనీషా.

‘ఓకే!’ అంటూ మనోహర్‌ అడ్రస్‌ మెసేజ్‌లో టైప్‌ చేశాడు అర్జున్‌.

‘ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంది వీలైతే రాత్రికి కుస్తాను. మరి బై’ అంటూ.. ‘మమ్మీ బై!’ అంది మనీషా.

‘బై తల్లీ! టేక్‌ కేర్‌!’ అంది అపూర్వ. ‘ఐ లవ్యూ మా…! అంటూ అపూర్వకు కిస్‌ స్టిక్కర్‌ పోస్టు చేసింది’ మనీషా.

అపూర్వ కూడా కూతురికి రెండు కిస్‌ స్టిక్కర్స్‌ పోస్టు చేసింది.

000

‘చిన్నీ! ఆ అబ్బాయిని ఇష్టపడుతుందంటావా అర్జున్‌?’ అర్జున్‌ పక్కనే కూర్చుని అతని చేయికి తన చేతులు పెనవేసి, అతని భుజంపై తలవాల్చి అడిగింది అపూర్వ.

‘నువ్వు వూరికే కంగారుపడకు. అది మన కూతురు. మనం దాన్ని అందరిలా పెంచలేదు. అది స్వంతగా నిర్ణయం తీసుకోగలదు. మంచీ, చెడూ బేరీజు వేసుకోగలదు’ అపూర్వకు ధైర్యం చెప్తూ తన కుడిచేతిని ఆమె తలపై వేసి, నిమిరాడు అర్జున్‌.

‘నిజమేనండీ! అది ముందు డౌట్‌ అంటూనే మళ్ళీ మాట్లాడతానంటూ అడ్రస్‌ ఇమ్మంది’ అంది అపూర్వ.

‘ఆ అబ్బాయితో కొంచెం సున్నితంగా మాట్లాడమని చెప్పాలి! మనతో మాట్లాడినట్టే సూటిగా అనేస్తే, అతను చిన్నబుచ్చుకోవచ్చు’ అంది అపూర్వే మళ్ళీ.

‘అలా ఏం మాట్లాడుదులే. మనతో దానికున్న సాన్నిహిత్యంతో ఓపెన్‌గా మాట్లాడుతుంది. అందరితో అలా ఏమీ మాట్లాడదు. అదేమీ ఇంకా చిన్ని పాపాయి కాదు’ అన్నాడు అర్జున్‌.

‘అవును అది మనం చూస్తూ ఉండగానే ఎంతగా ఎదిగిపోయింది అర్జున్‌..! నేను నిన్ను మానేజ్‌ చేసుకోలేకపోతున్నానంటా..?!’ అంది అపూర్వ కొంచెం ముఖం ముడుచుకుంటూ.

Kadha-Saranga-2-300x268

‘అదేంలేదులే! చిన్న మాటకి కూడా తట్టుకోలేవు’ ఆటపట్టిస్తూ అన్నాడు అర్జున్‌.

‘అదేంకాదు. నేను మానేజ్‌ చేసుకొస్తున్నా కాబట్టే మన బంధం ఇంత దృఢంగా ఉంది’ అంది చివాలున లేస్తూ కొంచెం కోపంగా అపూర్వ.

‘అబ్బో దేవిగారికి కోపం ముంచుకొచ్చేస్తున్నట్లుందే..!’ అంటూ అర్జున్‌ అనగానే… అపూర్వ కొంచెంసేపు కినుక వహించింది.. ఆమె మూడ్‌ కనిపెట్టిన అర్జున్‌ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చి, సుగర్‌లెస్‌ ఇది అంటూ ఆ కప్పు అపూర్వకు ఇచ్చాడు. అపూర్వ మామూలుగా అయిపోయి, ‘థాంక్యూ డియర్‌!’ అంటూ కప్పు అందుకుంది.

000

మనీషా తండ్రి చెప్పిన అడ్రస్‌ స్కైప్‌లో టైప్‌ చేసింది. మనోహర్‌ మనీషాకు ఆన్‌లైన్‌లోకి వచ్చాడు.

‘హలో మనోహర్‌జీ! నమస్తే, నా పేరు మనీషా!’ అంటూ పరిచయం చేసుకుంది.

‘ఓ… హాయ్‌! మీరేనా..? డాడీ చెప్పారు’ అన్నాడు మనోహర్‌.

‘మీ చదువు డీటెయిల్స్‌ అన్నీ డాడీ చెప్పేశారు. నా గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. అందుకని అవి మినహా మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే మనకు టైమ్‌ సేవ్‌ అవుతుందనుకుంటా..!’ అంటూ ‘మీరు యుఎస్‌లోనే సెటిల్‌ అవుతారా? ఇండియా రారా?’ అడిగింది మనీషా.

‘యా.. యా..! ఏం, మీకు యుఎస్‌లో ఉండడం ఇష్టం లేదా?’ అడిగాడు మనోహర్‌.

‘నేను యుఎస్‌లో స్టడీ పూర్తయ్యాక ఇండియాకే వెళ్ళిపోదామనుకుంటున్నా. మన చదువు మన దేశానికి ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. ఓకే.. మీ హాబీస్‌ ఏమిటి?’ అంది మనీషా.

‘ఓ.. సో గుడ్‌..! నా హాబీస్‌ వచ్చేసరికి మ్యూజిక్‌ వింటాను. గిటార్‌ వాయిస్తాను’ అన్నాడు మనోహర్‌.

‘వావ్‌.. గిటార్‌! నాక్కూడా వచ్చు. ఐ లైక్‌ సోమచ్‌. మ్యూజిక్‌ వినడమే కాదు. కొంచెం పాడతాను కూడా’ చిన్నగా నవ్వుతూ అంటూ ‘కవిత్వం రాయడం ఇంటర్‌ నుండే అలవాటైంది. మంచి మంచి కొటేషన్స్‌ సేకరిస్తూ ఉంటాను. పాలిటిక్స్‌ను, ఈ సొసైటీనీ పరిశీలిస్తూ ఉంటా. వీటికి అమ్మానాన్నే ఇన్సిపిరేషన్‌. అన్నీ నేనే మాట్లాడేస్తున్నా.. మీ గురించి చెప్పండి..!’ అంది మనీషా కొంచెం షై ఫీలవుతూ.

‘మీరు మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది. మీకన్నీ మంచి అభిరుచులే ఉన్నాయి. నాక్కూడా నాన్న నుండి కొంచెం పుస్తకాలు చదవడం అలవాటైంది’ అన్నాడు మనోహర్‌.

‘సో గుడ్‌..! ఇంకా మీ లైఫ్‌ పార్టనర్‌ ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను అంతా సూటిగా, కచ్ఛితంగా మాట్లాడే టైపు. మరి మీకెలా ఉండాలో..? నేను మాత్రం అవతలి వాళ్ళ కోసం మంచి అయితే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాగానీ, ఫాలోకానిది అయితే కట్‌.. కట్‌.. అంతే’ అంది మనీషా.

మనోహర్‌ ఏమీ మాట్లాడకుండా ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు.

‘హాలో..!’ అంటూ చిటికె వేసింది మనీషా.

‘ఓ సారీ..! ఇలా ఉండాలి.. అలా ఉంటే బాగుంటుంది.. అని పాయింట్స్‌ ఏమీ రాసి పెట్టుకోలేదు. సో యూ ఆర్‌ నైస్‌ గర్ల్‌!’ అన్నాడు మనోహర్‌.

‘మీకు డ్రింక్‌, స్మోకింగ్‌ ఎక్స్‌ట్రా హాబిట్స్‌ ఏమైనా ఉన్నాయా?’ అడిగింది మనీషా.

‘రెగ్యులర్‌ కాదు. స్మోక్‌ అస్సలు ఇష్టం ఉండదు. డ్రింక్‌ మాత్రం ఫ్రెండ్స్‌, పార్టీ అలా కలిసినప్పుడు కొంచెం సిప్‌ చేస్తా.. ఇక్కడ ఇదంతా నార్మలే కదా!..’ అన్నాడు మనోహర్‌.

‘ఇట్స్‌ ఓకే..’ అంది మనీషా.

‘కట్నాలు.. వంటివి..’ అడిగాడు మనోహర్‌.

‘అబ్బే ఈ టైపాఫ్‌ థింగ్స్‌ మా ఫ్యామిలీలో మొదటి నుంచీ లేవు. నాకు నచ్చవు కూడా’ అంది మనీషా.

‘అమ్మాయిల సంఖ్య తగ్గిపోయాక అబ్బాయిలకు పెళ్ళి పెద్ద ప్రాబ్లమ్‌గానే ఉంది’ అన్నాడు మనోహర్‌.

‘యస్‌.. అది మనవాళ్ళు చేతులారా చేసిందే కదా! అబ్బాయి కోసం, ఇంకా చెప్పాలంటే.. మనీ థింగ్స్‌..మెనీ ప్రాబ్లమ్స్!’ అంది మనీషా భుజాలు ఎగరేస్తూ.

మనోహర్‌ ఏమీ మాట్లాడలేదు. ‘ఏంటి దీనిపై మీరేం రెస్పాండ్‌ కావడం లేదు? ఎనీథింగ్‌ ఎల్స్‌’ అంది మనీషా.

‘నో… నో… ఏంలేదు..’ అన్నాడు మనోహర్‌.

‘ఓకే.. మళ్ళీ కలుద్దాం.. బై..బై.. హాస్పటల్‌కి వెళ్ళాలి, టైమ్‌ అవుతుంది..!’ అంది మనీషా.

‘యా.. యా.. ఓకే. .నేనూ వెళ్ళాలి హాస్పటల్‌కి.. బై..బై..!’ అన్నాడు మనోహర్‌.

‘గుడ్‌ గాయ్‌లానే ఉన్నాడు. డాడీతో ఓకే చెప్పేయొచ్చేమో… అయినా కొన్నిరోజులు మాట్లాడదాం..! ఇద్దరం అమెరికాలోనే ఉన్నా కలవడం కష్టమే. ఇద్దరం ఉండే స్టేట్స్‌ వెరీ లాంగ్‌ డిస్టెంట్స్‌. అయినా తన రెస్పాన్స్‌ ఏమిటో చూద్దాం.. వెయిట్‌ మనీషా.. వెయిట్‌..!!’ అని మనస్సుకు నచ్చజెప్పుకుంటూ రోజూకన్నా ఉత్సాహంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ మంచి హుషారైన సాంగ్‌ ఆన్‌ చేసింది మనీషా.

000

‘హాయ్‌ అమ్మా! హాయ్‌ డాడీ!’ అంటూ ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన అర్జున్‌, అపూర్వను రెండు చేతులతో కౌగలించుకుంది మనీషా.

అందరూ కలిసి పార్కింగ్‌లో ఉన్న కారు దగ్గరకు వెళ్ళారు.

అపూర్వే డ్రైవింగ్‌ సీట్లో కూర్చుంది.

‘వావ్‌ మమ్మీ! సో గుడ్‌..’ ‘డాడీ! అమ్మ డ్రైవింగ్‌తో ప్రాబ్లమ్‌ ఏమీ లేదుగా..?’ అంది పెద్దగా నవ్వుతూ..

కూతురు నవ్వుతో శృతి కలుపుతూ…‘ఏమో.. మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సుమా!’ అంటూ భుజాలెగరేస్తూ డోర్‌ తీసి, వెనుక సీటులో కూర్చున్నాడు అర్జున్‌.

మనీషా తల్లి పక్కనే కూర్చొని ‘అమ్మా! చాలా బాగా డ్రైవ్‌ చేస్తున్నావ్‌.. సో నైస్‌…!’ అంటూ ఆమె నడుం చుట్టూ చేతులేసింది.

‘డోంట్‌ బీ సిల్లీ చిన్నీ..!’ అంటున్న అపూర్వ దృష్టంతా రోడ్డు మీదే ఉంది.

‘షీ ఈజ్‌ సీరియస్‌..!’ అంటూ తండ్రీ, కూతురు ఇద్దరూ ఒకేసారి భుజాలు ఎగరేశారు.

‘మనోహర్‌ నేనూ ఓకే అనుకున్నామని మీతో చెప్పానుగా డాడ్‌! అభిరాం అంకుల్‌ ఏమైనా మాట్లాడారా?’ అంది మనీషా.

‘అవన్నీ ప్రశాంతంగా ఇంటికి వెళ్లాక మాట్లాడుకోవచ్చులే! వేరే విషయాలేమైనా ఉంటే మాట్లాడు’ అన్నాడు అర్జున్‌.

‘ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటి దగ్గర నేను వచ్చానని చుట్టాలూ, ఫ్రెండ్స్‌.. అందరూ వస్తారు.

మనం ఫ్రీగా మాట్లాడుకునే తీరిక ఉండదు. నాకైతే హీ ఈజ్‌ ఎవిరీథింగ్‌ ఓకే డాడ్‌..!’ అంది మనీషా.

‘ఓకే అయితే రేపు సండే అభిరాం అంకుల్‌ వాళ్ళకి వస్తున్నామని చెప్దాం’ అంది ఓ చెవి ఇటేసి ఉంచిన అపూర్వ.

‘అమ్మా, కూతురు చాలా స్పీడ్‌గా ఉన్నారు’ అన్నాడు అర్జున్‌.

‘ఇందులో స్పీడ్‌ ఏముంది డాడ్‌.. ఓకే అనుకున్నాక వెయిట్‌ చేయడం ఎందుకు?

అయితే, ఒక విషయం.. మ్యారేజ్‌ అయినా, నా ఎండి పూర్తికావాలి. తనూ, నేనూ ఇండియాకి తిరిగి వచ్చేయాలి. దీనికి మేమిద్దరం ఓకే. మరి అభిరాం అంకుల్‌ వాళ్ళు ఏమంటున్నారో?’ అంది మనీషా.

‘అదేరా! ఇండియాకి వచ్చే విషయంలోనే వాళ్ళు సంశయిస్తున్నట్లు అన్పిస్తోంది. ఇందులో అభిరాం అంకుల్‌, మనోహర్‌ ఓకే. వసంతా ఆంటీతోనే ప్రాబ్లమ్‌. ఆమెకు అమెరికాలో ఉంటేనే హైఫైగా ఉన్నట్లు’ అన్నాడు అర్జున్‌.

‘అమెరికాలో ఉంటేనే హైఫైనా..? ఇండియాలో ఉంటే బేకార్‌గా ఉన్నట్లా.. షిట్‌..!’ అంటూ

‘సరేలే. అవన్నీ మనోహర్‌ మేనేజ్‌ చేసుకోవాల్సినవి డాడ్‌.. ప్రతిదీ మనం కలుగజేసుకోవద్దు. నా అభిప్రాయం చెప్పాను. తనవల్ల కాదని అనడం లేదుగా.. డోంట్‌ వర్రీ!’ అంది మనీషా.

మనీషా టాకిల్‌ చేసే విధానానికి అపూర్వ, అర్జున్‌ ఆశ్చర్యపోయారు. ఆనందించారు కూడా.

కారు ఇంటికి వచ్చేయడంతో ఆ విషయం అంతటితో ఆగిపోయింది.

000

రెండురోజుల తర్వాత  అభిరాంకు ఫోన్‌ చేసి, మనీషాతో వస్తున్నట్లు చెప్పాడు అర్జున్‌.

మనోహర్‌ వచ్చి అప్పటికే రెండు వారాలు అయిపోయింది. అర్జున్‌ వాళ్ళు అభిరాం ఇంటికి వెళ్ళాక బ్రేక్‌ఫాస్ట్‌ అవగానే ‘అందరూ కలిసి అలా పార్క్‌కి వెళ్దాం అంది’ మనీషా.

ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో అందరూ పార్క్‌కు దారి తీశారు. పార్క్‌లో కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక, పెళ్ళి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

‘మనోహర్‌ చెప్పాక నాకు కూడా వీళ్లిద్దరూ ఇండియాలో ఉంటేనే బెటర్‌ అనిపించింది. మనీషా చాలా తెలివైన అమ్మాయి. ఐ లైక్‌ సోమచ్‌. ఆమె నా కోడలు కాదు కూతురు..’ అంది వసంత.

ఆశ్చర్యపోవడం అపూర్వ, అర్జున్‌ వంతైంది.

మనీషా చాలా సంతోషంగా వసంతను హగ్ చేసుకుని ‘ఐ టూ లైక్‌ యూ సోమచ్ ఆంటీ!’ అంది.

అసలు అడ్డంకి తీరిపోవడంతో వీళ్లు వెళ్ళేలోపే పెళ్ళి చేసేయ్యాలని అనుకున్నారు. ఇద్దరూ రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేయాలనుకోవడంతో వసంత కొంచెం డిజ్‌పాయింట్‌ అయింది. కొంచెం సేపటికి మనీషా మాటతో నార్మల్‌ అయిపోయింది. ‘నిజమే ఇన్నేసి డబ్బు ఇలా ఖర్చు పెట్టడం వృథానే’ అంది వసంత.

మరో నెలరోజులే వీళ్ళిద్దరూ ఇండియాలో ఉండేది. మళ్ళీ ఏడాది తర్వాతగానీ తిరిగిరారు. అప్పటివరకూ ఎవరి దారిన వాళ్లు ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అప్పుడే ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ ఆఫీసుకు మనోహర్‌, మనీషా తామిద్దరి వివరాలు అప్‌లోడ్‌ చేశారు.

తర్వాతి వారం ఫ్రెండ్స్‌ను, బంధువుల్ని పిలిచి గెట్‌ టూ గెదర్‌ ఏర్పాటు చేసి, అందరికీ వీళ్లిద్దర్నీ పరిచయం చేశారు. టీ, స్నాక్స్‌ అయిపోయాక వచ్చిన వారందరికీ ‘ఈ మధ్యే నేను ’మార్క్స్‌జెన్నీ’ ప్రేమకు సంబంధించిన ఇ`బుక్‌ చదివాను. అసలు ప్రేమంటే ఏమిటో అందరూ తెలుసుకోవాలి’ అంటూ మార్క్స్‌, జెన్నీ ప్రేమపై తను తయారుచేసిన డాక్యుమెంటరీని  పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి చూపించింది మనీషా.

అందరూ ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ మనీషా, మనోహర్‌ని అభినందించారు. పెళ్ళయ్యాక మనోహర్‌, మనీషా రెండువైపులా చుట్టాలందరి ఇళ్ళూ ఒక రౌండ్‌ వేసేశారు. ఇద్దరి తిరుగు ప్రయాణానికి ఇంకా వారం మాత్రమే సమయం ఉంది.

ఈ మూడువారాల్లోనే ఇద్దరూ ఎంతో దగ్గరయ్యారు. ఏడాది దూరంగా ఉండటం ఇద్దరికీ చాలా బాధగా ఉంది. కానీ తప్పదు. చివరి వారం మాత్రం ఎవరి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉండాలనుకున్నారు. వెళ్ళేటప్పుడు ఇద్దరూ కలిసే బయల్దేరారు. అది ఇద్దరికీ ఇష్టంగా అనిపించింది.

000

ఏడాది గడిచిపోయింది.

మనీషా, మనోహర్‌ ఇండియా తిరిగి వచ్చేశారు.

వైద్య సౌకర్యం అందని ప్రాంతంలో డిస్పెన్సరీ ఓపెన్‌ చేయాలనేది మనీషా ప్లాన్‌. తామిద్దరిదీ ఒకే వృత్తి, ఒకేచోట ఉండటం కాబట్టి మనోహర్‌ కూడా ఓకే అన్నాడు. ఇద్దరూ కొండాయిపల్లి అనే కుగ్రామాన్ని సెలెక్ట్‌ చేసుకున్నారు.

‘ఇండియా రావడానికి ఒప్పుకుందే ఇద్దరూ మన కళ్ళ ముందు ఉంటారని. మళ్ళీ వీళ్ళేదో పల్లెటూళ్ళు పట్టుకుని వేళ్లాడితే ఎలా? అందులో ఆ కొండలు గుట్టల్లో ఉండాలంటే హారిబుల్‌.. నో’ అనేసింది వసంత.

ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

‘ఒకరోజు అనుకోకుండా మాటల సందర్భంలో ‘మనీషా! నాకు ఆడపిల్లనే కనివ్వాలి. లేకపోతే మా అబ్బాయికి ఇంకో పెళ్ళి చేసేస్తా!’ అంది వసంత.

ఆ మాటలకు మనీషా ఎలా రియాక్ట్‌ అవుతుందోనని మనోహర్‌కి కొంచెం భయమేసింది. ‘అమ్మేమో అత్తగారు అన్న స్టేటస్‌లో మాట్లాడుతుంది. ఏమవుతుందో ఏమో..!’ అని మనస్సులో అనుకుంటూ మనీషా వైపు చూశాడు మనోహర్‌. ‘మీకు తెలియంది ఏముంది అత్తయ్యా! అమ్మాయి కావాలన్నా, అబ్బాయి కావాలన్నా అంతా అబ్బాయిల వల్లే. ఒకవేళ అమ్మాయి పుట్టకపోతే మీ అబ్బాయిని వదిలేయాల్సింది నేనే మరి!’ అంది.

అంతే వసంత షాక్‌ అయిపోయింది.

‘అమ్మో మనీషాతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా సూటిగా మాట్లాడే అమ్మాయి. అప్పటికీ వాడు చెప్తునూ ఉన్నాడు. నేనే తొందరపడి అనేశాను’ అని మనస్సులో అనుకుంటూ ‘అబ్బే ఏదో జోక్‌గా అన్నాను. ఎవరు కావాలంటే వాళ్ళు పుడతారా ఏంటి? ఆడపిల్లకైతే ఇప్పుడు కట్నం బాగా ఇస్తున్నారు కదా! మా ఫ్రెండ్స్‌ అందరికీ మనవరాళ్ళే!! వాళ్ళంతా ‘‘మాకు గ్రాండ్‌ డాటర్‌’’ అని గొప్పగా చెప్పుకుంటున్నారు’ అంది మళ్ళీ మనస్సులోని కోరికను ఆపుకోలేక.

‘అత్తయ్యా! గతంలో ఇలాగే ఆడపిల్లల్ని వద్దంటూ వాళ్ళను భూతద్దంలో వెతికినా కనపడని పరిస్థితికి మన దేశాన్ని తీసుకొచ్చాం. చూస్తుంటే ఇప్పుడు అమ్మాయిలే కావాలంటూ అబ్బాయిల్ని లేకుండా చేసేస్తారనిపిస్తోంది. ప్రస్తుతం అమ్మాయిలు కావాల్సిన ఆవశ్యకత ఉన్నా, ఫలానా వాళ్ళే కావాలనే మనీ మ్యాటర్‌ థింగ్స్‌ నాకస్సలు నచ్చవ్‌. ’ఐ హేట్‌ దిజ్‌ టైప్‌ ఆఫ్‌ థింగ్స్‌!‘ సహజంగా పుట్టనిస్తేనే మనకూ సమాజానికీ ఆరోగ్యం’ అంటూ అక్కడ నుండి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది మనీషా.

‘నువ్వు మాత్రం మారవు. అమ్మాయిని అనవసరంగా బాధపెట్టావు’ అన్నాడు అభిరాం.

‘అమ్మ తన పద్ధతి మార్చుకోవడం వెంటనే జరగదులే డాడీ. తన చుట్టూ ఉన్న వాతావరణం అలాంటిది. అది మనీషాకీ తెలుసు. తనే అమ్మకు అర్థమయ్యేలా చెప్పగలదు’ అంటూ మనోహర్‌ మనీషా ఉన్న గదిలోకి వెళ్ళాడు.

మనీషా ఏదో బుక్‌ సీరియస్‌గా చదువుకుంటోంది. తను ఊహించినట్లు ఏడుస్తూ పడుకోకుండా, అక్కడ దృశ్యం భిన్నంగా ఉండేసరికి ‘ఏంటి మేడమ్‌జీ ఏదో చదువుతున్నారు?’ అన్నాడు కొంచెం నాటకీయంగా మనోహర్‌.

‘మీ అమ్మగారిని!’ అంది ఠక్కున మనీషా.

‘అమ్మను నువ్వే చదవాలి. నువ్వే మార్చాలి’ అన్నాడు చాలా సిన్సియర్‌గా చేతులు కట్టుకుని, మనోహర్‌.

‘ఇదే నాకు నచ్చదు. మార్పుకు అందరం కలిసి కృషి చేయాలి. అదేదో ఆడవాళ్ళ విషయం ఆడవాళ్ళకే. అందులో మగవాళ్ళ ప్రమేయం లేదనుకోవడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి ఆలోచనల్లో మార్పు రావాలి మనోహర్‌. అది మనందరి బాధ్యత. నాకు తెలిసిన లక్ష్మీరాజ్యం ఆంటీ అని మా అమ్మ స్నేహితురాలు ఉన్నారు. ఆమెను పిలిపించి, మన ఇంట్లో వచ్చే ఆదివారం జరిగే కిట్టీ పార్టీలో ఇదే సబ్జెక్ట్‌పై చిన్న డిస్కషన్‌ పెడ్దామనుకుంటున్నా’ అంది మనీషా.

మనీషా ఆలోచనకు మనోహర్‌ ‘హేట్సాఫ్‌’ అంటూ ‘థాంక్యూ డియర్‌! నా మీద అమ్మ ప్రభావం కొంచెం ఎక్కువే. నేనూ చాలా మారాలి మనీషా!’ అని సిన్సియర్‌గా అంటూ ‘ఇద్దరం కలిసి ఆ ఏర్పాట్లు చూద్దాం!’ అన్నాడు మనోహర్‌.

000

ఇంట్లో కిట్టీ పార్టీ అయ్యాక వసంతకు స్నేహితులంతా ఏదో రకంగా కోడలిపై వ్యతిరేకతను తమ శక్తి మేరకు పెంచుతూనే ఉన్నారు. తమ కోడళ్ళని ఆడపిల్లని కనకపోతే ఎలా పుట్టింటికి పంపేస్తున్నదీ ఎస్‌ఎంఎస్లు, ఎఫ్‌బి ఛాటింగ్స్‌లో వసంతకు లైవ్‌ షో చూపిస్తున్నారు. ఆ ఆలోచనతోనే వసంత బుర్ర ఫుల్‌ అయిపోయింది.

మనీషా, మనోహర్‌ మొదట అనుకున్నట్లే కొండాయిపల్లెలో డిస్పెన్సరీ ఓపెన్‌ చేసి, అక్కడే ఉంటున్నారు. నెలకోసారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిపోతున్నారు. ఒకవారం అపూర్వ, అర్జున్‌ వెళుతుంటే, రెండు వారాలతర్వాత అభిరాం, వసంత వస్తున్నారు.

ఆ ఏడాది చివరిలో మనీషా కన్సీవ్‌ అయినట్లు తెలిసింది. ఆ విషయం వసంత తన స్నేహితులకి ఫోనుల్లో ఎస్‌ఎంఎస్‌ పెట్టేసింది. ఎఫ్‌బిలో పోస్టు చేసింది. అందరూ లైక్స్‌ కొట్టి, కంగ్రాట్స్‌ చెప్పారు.

వసంతకి బాగా దగ్గరి స్నేహితురాలు మంజు, ఉమా అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ మాత్రం ‘మీ కోడలు చాలా ఫాస్ట్‌లా ఉంది. నువ్వూ, మీ ఆయన, నీ కొడుకు ఆమె చెప్పినట్టలా వింటూ గంగిరెద్దుల్లా తలుపుతూ ఉంటే ఎలా? అందరూ నీ మాట వినేలా చూసుకో. లేకపోతే నీ పని ఔట్‌!’ అంటూ కామెంట్‌ పెట్టారు.

‘ఆడపిల్లను కనకపోతే పంపేస్తానని గట్టిగా చెప్పేయ్‌. మేము అలా అంటేనే ఉమా కోడలు మూడు అబార్షన్ల తర్వాత కూతుర్ని కంటే, నా కోడలు నాలుగు అబార్షన్ల తర్వాత కూతుర్ని కంది’ అంటూ మంజూ కామెంట్‌ పెట్టింది.

మనీషా దగ్గరకు ఆ వారం వసంత ఒక్కతే వెళ్ళింది. ‘మనీషా! స్కానింగ్‌ చేయించుకున్నావా? టెక్నాలజీ చాలా డెవలప్‌ అయింది. అందులోనూ మీరిద్దరూ డాక్టర్లు. మీకింకా ఎక్కువ తెలుసు. కన్సీవ్‌ అవగానే మేలో, ఫీమేలో తెలిసిపోతుందిగా! మళ్ళీ మూడో నెల వరకూ ఆగడం దేనికీ..?’ అని కాస్త వత్తి పలికింది వసంత.

ఆమె ధోరణి అర్థంచేసుకున్న మనీషా ‘ఈమె బుర్రలో పురుగు ఇంకా తొలుస్తూనే ఉంది’ అని మనస్సులో అనుకుంటూ ఏమీ సమాధానం చెప్పకుండా తనపని తాను చేసుకుంటూ, లోపలికి వెళ్ళి ఏదో బుక్‌ తీసి చదువుకుంటోంది. కాసేపటికి మనోహర్‌, మనీషా ఇద్దరూ హాస్పటల్‌కి వెళ్ళిపోయారు.

వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో వసంతం కొంచెం డిజప్పాయింట్‌ అయింది.

సాయంత్రం మనీషాకి మల్లెపూలంటే ఇష్టమని పల్లెలో ఓ అమ్మాయి తెచ్చి ఇచ్చింది. వసంతకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అందుకే ఆ పూల్లో మరువం వేసి మరీ చక్కగా మాల అల్లింది. గేదె ఈనిందంటూ పల్లెలో కోటయ్య జున్ను పాలు బాటిల్‌ ఇచ్చాడు. మరింత ఆనందంగా జున్ను కూడా రెడీ చేసింది.

మనీషా, మనోహర్‌  వచ్చి, ఫ్రెష్‌ అయ్యాక ఇద్దరికీ జున్ను ప్లేట్స్‌లో రెండు రెండు పీసెస్ పెట్టి ఇచ్చింది.

మనీషాకు జున్ను అంటే చాలా ఇష్టం. ‘అత్తయ్యా! నేను భోజనం చేయను. మరో రెండు పీసెస్ పెట్టండి. కోటయ్య తాత తెచ్చాడా, ఏంటి? మొన్న హాస్పటల్‌కి వచ్చినప్పుడు గేదె ఈనుతుందని చెప్పాడులే’ అంది మనీషా.

‘అవును’ అంటూ మరో రెండు పీసెస్ వేస్తూ అంది వసంత. మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చి ‘మనీషా! నేను ఉదయం చెప్పింది ఏం ఆలోచించావు?’ అంటూ మల్లెపూల మాల మనీషా తలలో తురుముతూ అంది వసంత.

మనీషా ఏమీ మాట్లాడలేదు. ‘ఏరా నువ్వు కూడా మాట్లాడవే? ఏమనుకుంటున్నారు? నామటుకు నేను మాట్లాడుతూనే ఉన్నా. మీకేం పట్టదా?’ అంది కొంచెం కోపంగా. అతనూ తినేసి లోపలికి వెళ్ళిపోయాడు.

ఇద్దరూ సమాధానం ఇవ్వకపోవడంతో తెల్లారే వసంత కోపంగా వెళ్ళిపోయింది. మనీషా, మనోహర్‌లో ఎవ్వరూ ఆమెను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ మనోహరే తల్లి అలా వెళ్ళిపోవడంతో కొంచెం గిల్టీగా ఫీలయ్యాడు.

ఆ రాత్రి కొడుక్కి తనకు స్నేహితులు పెట్టిన ఎస్‌ఎంఎస్‌లన్నీ ఫార్వార్డ్‌ చేసింది. తల్లి అంతలా చెప్తుంటే ఆమె కోసం ఒక్కసారి మనీషాతో మాట్లాడాలనుకున్నాడు మనోహర్‌. కానీ మనీషాకు ఇలాంటివి ఇష్టం ఉండదని మళ్లీ ఊరుకున్నాడు.

మనీషాకి ఆరు నిండి ఏడో నెల వచ్చింది. పుట్టేది ఎవరో తెలుసుకోలేకపోయారని ఓ పక్క బాధ, మరోపక్క కోపంగా ఉంది వసంతకు.

‘ఇప్పటికైనా మించిపోయింది లేదు మనోహర్‌! మొన్న ఉమా ఆంటీ చెప్తున్నారు. ఆడపిల్ల కాదని తెలిస్తే నార్మల్‌ డెలివరీలా చేసి, బిడ్డను తీసేయొచ్చంట! నువ్వు డాక్టర్‌ అయి కూడా ఇంత వెర్రిబాగులోడిలా ఉన్నావేంట్రా?’ అంది వసంత.

దాంతో మనోహర్‌కి పౌరషం పొంగుకొచ్చింది. ఆ రోజు రాత్రి ‘మనీషా! అమ్మ అంతలా అడుగుతుంది కదా! ఒకసారి ఆమె మాట వింటే పోలా?’ అన్నాడు. మనీషా ఏమీ విననట్లే మౌనంగా ఉండిపోయింది. దీంతో మనోహర్‌ ‘అమ్మాయి పుడితేనే, మనిద్దరం కలిసి ఉండేది. అబ్బాయి పుడితే నీదారి నీది నా దారి నాది.. ముందే జాగ్రత్తపడమని అమ్మ చెప్తుంది కదా! మనిద్దరం డాక్టర్లమై, ఇంత టెక్నాజీ తెలిసి.. షిట్‌..!’ అన్నాడు ఎడమచేతిలో కుడిచేయి పిడికిలితో కొడుతూ.

మనీషాకి మనోహర్‌ పరిస్థితి అర్థమైంది. అతనిలో నిగూఢంగా ఉన్న ఇగో బయటకొచ్చిందని. ‘ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం ఏమిటో చెప్తున్నా విను మనోహర్‌! అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా నీ వల్లే.. ఆ సైన్స్‌సెన్స్‌ నీకు ఉందనుకుంటున్నా. నేను ఆరోజే చెప్పా. ఇది సహజంగా జరగాల్సింది అని. నువ్వూ అత్తయ్యకు వంత పాడటం ఆశ్చర్యంగా ఉంది. అసు మీ ధోరణి కరెక్ట్‌ అనుకుంటే, అసలు అమ్మాయి పుట్టకపోవడానికి కారణం నువ్వే కాబట్టి, నేనే, నిన్ను మీ ఇంటికి పంపేయాలి. మైండ్‌ ఇట్‌!! నాకు ఇలా డిపెండెంట్‌గా ఆలోచను చేసేవాళ్ళంటే అసలు నచ్చదు’ అంటూ తన రూమ్‌లోకి వెళ్ళి డోర్‌ పెట్టేసుకుంది.

అమ్మా కొడుకూ ఏమీ మాట్లాడలేదు.

000

మనీషాకి నెలలు నిండాయి. ఒకరోజు మనీషాకి నొప్పులు వస్తుంటే ఆసుపత్రికి తీసికెళ్ళారు. ఆ రాత్రే మనీషా నార్మల్‌ డెలివరీ అయ్యింది. వెంటనే మనోహర్‌ ‘అమ్మాయేనా?’ అని అప్పుడే బయటికి వచ్చిన సిస్టర్‌ని ఆతృతగా అడిగాడు.

‘కాదు’ అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది సిస్టర్‌.

అపూర్వ, అర్జున్‌, అభిరాం ఒకటే టెన్షన్‌ పడుతున్నారు ‘మనీషా ఎలా ఉందో?’ అని ఓ పక్క, పుట్టిన పసిబిడ్డని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మరోపక్క ఆతృతగా చూస్తున్నారు.

డాక్టర్‌ జెన్నీ బయటకు వచ్చి ’కవలలు’ అని వసంత, మనోహర్‌ వైపు చూస్తూ చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక్కసారే గతుక్కుమన్నారు. ఇద్దరూ అబ్బాయిలే’ అని ఎంతో కూల్‌గా చెప్పి, మదర్‌ అండ్‌ సన్స్‌ సో హెల్దీ.. వెళ్ళి చూడొచ్చు’ అని డాక్టర్‌ జెన్నీ వెళ్లిపోయారు.

మనోహర్‌ లోపలికి వెళ్లడానికి తటపటాయిస్తుంటే అపూర్వ ‘ఏంటి బాబూ! మనీషా మనస్సు నీకు తెలుసు కదా! అయినా ఇప్పటికీ మన మైండ్‌సెట్స్‌ మార్చుకోకపోతే ఎలా?’ అంటూ అల్లుడి చేయి పట్టుకుని లోపలికి తీసికెళ్ళింది.

మనీషా! నేనే విన్‌ అన్నట్లు రెండు వేళ్లతో ‘విక్టరీ సింబల్‌’ చూపిస్తూ, మనోహర్‌కి కన్నుకొట్టింది. మనీషా కోపంగా లేనందుకు మనోహర్‌కు కొంచెం రిలీఫ్‌గా ఉంది. కానీ కొంచెం అనీజీగానే ఉన్నాడు.

వసంత మాత్రం ఓ పక్కకు నిబడింది. ‘పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా భలే బాగున్నారు’ అని అర్జున్‌, అభిరాం పిల్లల దగ్గరకు వెళ్ళిపోయారు. అపూర్వ ముందు మనీషా దగ్గరకు వెళ్ళి ‘ఎలా ఉందిరా?’ అని తలపై చేయివేసి నిమురుతూ అడిగింది.

‘ఇట్స్‌ ఓకే అమ్మా!’ అని పిల్లలవైపు చూపించింది. అపూర్వ అటువైపు వెళ్ళింది.

‘ఏంటి మనోహర్‌ ఆలోచిస్తున్నావ్‌? అంటూ మనోహర్‌ని దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేసింది మనీషా. అతను బెడ్‌ దగ్గరకు రాగానే మనోహర్‌ చేతిని పట్టుకుని గట్టిగా నొక్కుతూ. ‘అమ్మాయి పుట్టకపోతే నా దారి నాది.. నీ దారి నీదే అన్నావ్‌గా’ అంది.

‘అబ్బే ఏం లేదు.. నేనేనా ఇంత ఫూలిష్‌గా మాట్లాడింది అని బాధపడుతున్నా’ అంటూ మనోహర్‌ ఆగిపోయాడు. అతని కళ్ళల్లోంచి మనీషా చేతిపై కన్నీళ్ళు చుక్కలు టప టపా రాలిపడ్డాయి.

‘ఏయ్‌! ఏమిటీ చిన్నపిల్లాడిలా..! నువ్వూ అత్తయ్యా అమ్మాయే కావాలనుకున్నారు. నేను ఎవరైనా ఫర్వాలేదనుకున్నా. కానీ మనకు పాప, బాబూ ఇద్దరూ పుట్టారు. మనం ఊహించనది జరిగితేనే థ్రిల్‌. ట్విన్స్‌ అని నాకు ముందే తెలుసు. వాళ్లనలా గర్భంలోనే చిదిమేయడం ఎవ్వరూ చేయకూడదు. మనలాంటి సైన్స్‌సెన్స్‌ ఉన్నవాళ్ళు అందరిలో అవేర్నెస్ చేయాలిగానీ, ఇలా సిల్లీగా ఆలోచించడమే సరికాదు’ అంది మనీషా.

వసంత పిల్లలున్న ఉయ్యాలవైపు అడుగు వేసింది.

అది గమనిస్తూనే ‘లేదు నాకు ఇద్దరూ అబ్బాయిలే కావాలి’ అన్నాడు పిచ్చిగా మనోహర్‌.

‘అబ్బా ఛ…! అప్పుడే అంత గుడ్‌బాయ్‌వి అయిపోయావే.. ఎస్‌.. మై బోయ్‌..! మన జనరేషన్‌ అయినా, కాస్త మెచ్యూరిటీగా ఆలోచించాలి!’ అంటూ అతని చేతిని తన పెదాల దగ్గరకు తీసుకుంది మనీషా.

*

మాయమ్మ నవ్వింది!

Kadha-Saranga-2-300x268

 

సాయంత్రం స్కూలు గంట కొట్టగానే ఏదో కొంపలు  ముంచుకపోతున్నట్టు సర్రన ఇంటికి పరిగెత్తుకొచ్చి  పుస్తకాలు దబే..ల్మని ఇంట్లో మూల పడేసి  రచ్చ దగ్గర ఆడుకోడానికి గడప దాటుతుండగా….. రేయ్  యాడకి పోతుండా …మీ నాయనొచ్చి లేవని తెలిస్తే కుంగా తంతాడ్లే …నాకెందుకులే  నాయనా పో…నువ్వు సెప్తే వినే బిడ్డవికాదు…  అమ్మ తొట్టి దగ్గర్నుంచి దబర్లు తోముతూ అరవగానే విని విననట్టు  ఒక్క వుదుటున రచ్చ దగ్గర్కొచ్చేసి తోటి సావాసగాళ్ళతో ఆటల్లొ మునిగిపోయాను రోజు మాదిరే…..కాని ఒకపక్క  నాయన కొడతాడని  కడుపులో భయం  ఇంకోపక్క ఆడుకోవాలని ఆశ .

నేనెప్పుడూ సదువుతుండాలని నాయన కోరిక ,   స్కూల్లో సదివింది సాలు ఇంట్లో కూడా సదువుకోవాలా.. మా నాయన లాంటోడు ఇంకెవరికి ఉండకూడదనుకుంటున్న సమయంలోనే దూరం నుంచి ఒకాయన ఇనప డబ్బాను కొట్టుకుంటూ వీధిలోకొచ్చి అరిశాడు .  ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశా మా నాయననుకొని.. తీరా సూస్తే మా వూరి యెట్టాయన దండోర యేసుకుంటూ  స్టోర్లో బియ్యం.. సక్కెర.. గోదుంలు.. కిరసనాయలొచ్చింది కావల్సినోల్లు తెచ్చుకోవచ్చహో… అని కేకేసేసరికే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లైంది నాకు.

ఒరేయ్ మీ నాయన పిలుస్తున్నాడ్రారా అమ్మ నుంచి మరొ పిలుపు రాగానే  జింకెగిరినట్టు చెంగుమని అమ్మ దగ్గరకి గంతేసి కొంగుపట్టుకొని.. మ్మో.. నాయన కోపంగ వున్నాడా లేదా మావులుగా వున్నాడా?  యేమ్మా.. కొడ్తాడా నాయన …? “అహా కొట్టకుండా ముద్దుపెట్టుకుంటాడ్లే అంత భయం ఉన్నొడివి ఇంటికాడుండొచ్చుగదా  ఈ యాలకి మీ నాయన ఇంటికొచ్చేది తెలుసుగదా.. ఆడుకోకబోతే యేంవే.. నువ్వు తన్నించుకుంటావ్ నన్నూ తన్నిస్తావ్.. పొగులుపొద్దస్తం కష్టం జెయ్యాల ఇంటికొచ్చిన తరువాత మీ నాయన చేత నేను కూడా తన్నులు తినాల .. యిట్ట రాసిపెట్టుంది నాకు యేంజేద్దం నా కర్మ”  అమ్మ తిట్టినట్టుమాట్లాడగానే నాయన కొట్టకుండా ఉంటాడా… సంపేస్తాడనుకుంటూ అమ్మ యెనకాలే దాక్కొని ఇంటికొచ్చాను. నన్ను వదిలేసి సుట్టింట్లోకి బోయి  శాట్లో బియ్యం సెరుగుతూ రాల్లేరుకుంటూ కూర్చుంది అమ్మ.

పొద్దస్తమానం రెడ్డోరింటిదగ్గర  రెక్కల కష్టం సేసి, వాళ్ళు బెట్టిన పాసిపోయిన అన్నం తిని , వాళ్ళుతిట్టిన ఏకవచన తిట్ట్లతో పుట్టెడు శోకాన్ని కడుపులో ఉంచుకొని ఆ కసిని అమ్మ పైనా నాపైన తీర్చుకోవడానికన్నట్లు  నులక మంచం మీద కుచ్చోని బీడీ  తాగుతున్న మా నాయన కెదురుగా యెల్లి నిలబడ్డా. కనుగుడ్లు పెద్దవి చేసి పొగను పీల్చి వదులుతూ…

యేం రా ….యాడికి పోయావా..?
ఆడుకోడానికి.
తాటిబద్ద తీసుకొని రెండు వాయించొదిలిపెట్టి  మళ్ళీ మంచం మీద కూచొని  ఆ కాళ్ళకి మట్టేందిరా …? యెళ్ళి కడుక్కొ రా పో…. తొట్టి దగ్గరికి పోయి రెండు చెంబులు గబ గబా కాళ్ళ మీద గుమ్మరించుకొనొచ్చి మళ్ళీ అదే ప్లేసు లో నిలబడ్డా. భయం ఉంద్రా నీకస్సలా..చెప్పరా.. మౌనమే నన్ను ఆవహించింది. భయంతో వణుకుతూ వున్నాను.. యెన్ని సార్లు జెప్పాల్రా … నీకా… పాసి పొల్లుతో సదువుకొం టే సదువొస్తాదనా…

శూద్రోల్ల పిలకాయలు సూడ్రా  యెంత సుద్దంగా ఉంటారో..
మట్లో ఆడబాకరా అం టే ఆడ్తావ్… పొద్దన్నే లేసి సదవ్ మంటే సదవ్వూ …
మాస్టీల్నాకొడికివిరా నువ్వు ….నీకు యెన్ని సా..ర్లు జెప్పినా సిగ్గు లేదు… నువ్వు సదవవ్ పోరా  బర్లికాడికేపో …..ఛ …పొ… సెప్పి సెప్పి నా నోరు పోతుందె…. సందు లేకుండా తిట్టేసి ఆరిపొయిన బీడీ ముక్కని మళ్ళీ యెలిగించి ఒక్క దమ్ము లాగి వదిలితే గూడ్సు రైలు  పొగొచ్చినట్టు నా మొహాన్ని ఆవరించింది. దాన్ని ఒక చేత్తొ పక్కకు నెట్టి  యదా విధిగా మా నాయన సాయే సూస్తూ మా నాయన నన్ను యిడిపిస్తే పంజరం  యిడిసిన పక్క్షి లాగ యెగిరిపొవాలనిపించింది. రేయ్ యెల్లి సదువ్కో…తేప తేపకు సెప్పించుకోబాక నా సేత యిదే లాస్టు  సారి నీకు సెప్టం. తెల్లారకుముందే లేసి నన్ను అగ్గిపెట్టి అడిగి  దీపం బుడ్డి యెలిగించుకొని  సదువుకొవాలా సరేనా.. లేదంటే సేద్యంలో పెట్టాస్తా …అవతల నీ బతుకు నువ్ బతుక్కుంటావ్ అని మంచం మీద నించి లేచి అన్నం వండుతున్న అమ్మను ఒమే… ఊళ్ళోకి బోయి రెడ్డోరికి పాల బూతు లో పాలు పోసేసొస్తా పొద్దుబోతుంది లేదంటే రెడ్దమ్మ తిడ్తాది …. నేనొచ్చే లోకే రూపాయికి బీడీలు తెచ్చిపెట్టిండు …. అయ్యో  నయ్యా పైసా లేదయ్య స్టోర్లో బియ్యం, కిరసనాయిలు వచ్చాయంట ..నాకు కూల్డబ్బులు కూడా రాలా తెచ్హుకుందామంటేనా….ఈడ మొదులు లేకపోతే నీకు బీడీలు కావాలా..? ఒసేయ్ ఉంటాయ్ సూడో  అని నాయన బయటికెళ్ళిపోయాడు.

కొద్ది సేపు గోతాం యేసుకొని సదువుకొంటూ నాయన యెళ్ళిపొయిన కొద్దిసేపటికి లేసి అమ్మ యేడ్నీళ్ళు తోడితే  పైకి బోసుకొని యెన్నెల కింద మంచం యేసుకొని సెల్లెలు నేను కబుర్లు జెప్పుకుంటూ అన్నం తినకుండానే నిద్ర బొయ్యాం.

యెప్పుడొచ్చాడో తెలీదు పెద్ద పెద్ద అరుపులు యినిపిస్తున్నాయ్. యింటి పక్కలోల్లు మా యింటికొచ్చి వొద్దు రావయ్య వద్దు.. మా మాట యిను  అంటూ అగ్గిపెట్టి తీసి యింటికి నిప్పు అంటించబోతున్న నాయన్ని ఆపే ప్రయత్నం జేస్తున్నారు. యేమైందోనని సగం నిద్రలో ఉన్న మేము ఉలిక్కి పడి లేసేసరికే అమ్మ ఒక మూల నాయన కొట్టిన దెబ్బలకి వోర్చుకోలేక గుంజను పట్టుకొని  లెయ్యలేక లేసే ప్రయత్నం జేస్తుంది యిద్దరిమి అమ్మ దగ్గరికెళ్ళి నేనొక రెక్క చెల్లెలొక రెక్క పట్టుకొని అమ్మను లేవదీసి యింట్లోకి తీసుకొని పోతుండగా …చంపేస్తా లంజా ముండని… చంపేస్తా దాన్ని.. ఈ రోజు అదన్నా ఉండాలా.. నేనన్నా ఉండాల.. లేదంటే ..కూరాకు లో ఉప్పు ఎక్కువేస్తదా అదా..? ఎంత కొవ్వు దానికి …తిడుతూ అమ్మను కొట్టబోయి పుల్లుగా తాగి ఉండడం వల్ల మంచం కాడికి తట్టుకొని పడిపోయాడు. పక్కింటి పెద్దాయనొచ్చి నాయన్ని లేపి మంచం మీద పడుకోబెట్టి యెళ్ళిపోయాడు.

మా నాయన్ని చంపేయాలంత కోపం వచ్చింది కాని యేంవీ జెయ్యలేని పరిస్తితి. పెద్దవాడ్ని అయితే అపుడు సూస్తా మా నాయన సంగతనుకొని అమ్మను యింట్లోకి తీసుకొని  బోయి అన్నం పెట్టి  మేం గూడా రెండు ముద్దలు తిని అమ్మ పాత చీరలు కింద పర్చుకొని ముగ్గరిమిపొడుకొన్నాం. పొద్దన్నే లేసి సదవకపొతే నన్ను కూడా తంతాడు..  కళ్ళాపి సల్లేటప్పుడు నన్ను గూడా లేపు .. యేమి ఆలొసించకుండ పడుకొ అని అమ్మకి సెప్పేసి పడుకున్నా.పొద్దున్నే లేసి దీపం బుడ్డి యెలిగించుకొని పుస్తకం  తీసి సదువుకుంటుంటే బుర్రకి యేమీ యెక్కడం లేదు. రాత్రి జరిగిన సన్నివేశం పదే పదే జ్ఞాపకమొస్తుంది.. యెన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అన్ని గుర్తుకొస్తున్నాయి మరిసిపొయే సంగటనలు యెప్పుడూ జరగలేదు మా యింట్లో. ప్రతిరోజు ఒక చేదు జ్ఞాపకమే…జ్ఞాపకం అనే దానికంటే అనుభవం అంటే బాగుంటాదనుకుంటా.  ఆకలి… ఆరాటం.. యేడుపులు… అన్ని అన్ని అనుభవాలే… తాగుడుకు డబ్బులు యియ్యకపోయినా.. కూరలో ఉప్పు యెక్కువైనా…కూట్లో సిన్న యెంటిక పడినా అమ్మను తన్నటమే తప్ప వోదార్చడం తెలియని తాగుబోతు తండ్రి చేస్టలు గుర్తుకొస్తున్నాయి… ఇలాయెన్నోసంఘటనలు తలచుకొని నిద్రపోని రాత్రులెన్నో…. .. దాపరికాలు లేని జీవితాలు కదా ..ఇట్లానే తెల్లారతాయి… ఒక పక్క కసితో రగులుతున్న ఆలోచనలు మరో పక్క అమ్మ జీవితం యెప్పుడు బాగు పడుతుందాని ఆవేదన… అమ్మ అమాయకపు నవ్వు యెప్పుడు కనిపిస్తుందోనని …అయ్యా అని నాయ్యన్ని యెప్పుడు ఆప్యాంగా పిలుస్తుందో అని ఆశ అందరి బిడ్దలకి మల్లే చిన్ని ఆశ.. ఆ ఆశకు కూడా అవకాశం రాల నాకు.

నాయన నిద్రలేస్తున్నాడని తెలిసి మళ్ళీ పుస్తకం మీదే ద్యాస…. తెల్లారింది… నాయన రెడ్డోరింటికి యెల్లి పోయాక దీపం ఆర్పి పైకి లేశా ఇంతలో  అమ్మ మంచి నీళ్ళ బిందె యింట్లో దించి ‘పొల్లు తోంకోండి నాయనా సద్దికూడు తిందురు’ అని పొయ్యి దగ్గరికి బోయి ఉడుకుతున్న యెసురులో నానిని బియ్యం బోసి మండుతున్న కట్టిపుల్లల్ని పొయ్యిలోకి యెక్కదోసి అక్కడే కూర్చొని పచ్చడిచెయ్యడానికి చింతపండు, టమాటాలు వున్నయా లేవా అని చిన్న బుట్టలో యెతుకుతుంది. పుస్తకాన్ని మూసి చెక్కమీద పెట్టేసరికే దానికానుకోనొన్న మరో చెక్క మీదున్న గిన్నెలు చెంబులు కింద పడి పెద్ద శబ్దం చేశాయి …నాయన నాయన నువ్వు ఒక్క పని చెయ్యవు రా… పుస్తకాలు అక్కడ పెట్టకుంటే కింద పెట్టుకోవచ్చు కదా….చెక్క మీదే పెట్టాలా ఒకాలా చెప్పో…నేను పెడ్తాను పో …నువ్వు బొయ్యి పొల్లు తోముకొని సద్దికూడు తిను నేను పనికి పోవాల లేదంటే మేస్త్రొచ్చి అరస్తాది. ..కోపంగా చెప్తూ కింద పడిన గిన్నెల్ చెంబుల్ని చెక్క మీద పెట్టి  పొయ్యి కాడకొచ్చి కూర్చొంది.

బొగ్గుతో గబ గబా పొల్లు తోముకొని అమ్మ దగ్గరికొచ్చి కూచ్చొన్న. అమ్మ మౌనంగా ఉంది. రోజూ అట్టుండదమ్మ.. యేదొ ఒకటి జెప్పి నన్ను చెల్లెల్ని నవ్విస్తూ వుంటాది. కొన్ని సార్లు పాటలు కూడా పాడతాది. పొలంలో కూడా నారేతేసేటప్పుడు బాగా పాడుతుందని యెనకింటి చెన్నవ్వ సెప్తే వి న్నాను.

పొలంలో నడుం నొప్పి పోవటానికి అమ్మకు పాటుంది ..కాని తాగొచ్చిన భర్త తన్నిన నొప్పికి అమ్మకి యేపాటాలేదు…యేడుపు పాట తప్ప.
యేమ్మా..అట్టుండావా..?
యేం నాయన నేను బాగనే ఉళ్ళా.
అయితే యేం మాట్లాడకుండా ఉన్నావ్..?
యేంలేదు వర్షం పడేట్టుంది పనుంటుందా ఉండదా అని ఆలోచిస్తున్నాన్లే అని మాట దాటేసి కూచోడానికి నాకు పీటిచ్చి సద్ది కూడు యెసుకోరాడానికి సుట్టింట్లొకెళ్ళింది..నాకర్ధమైంది అమ్మ అట్టా యెందుకంటుందో.. లోపల ఎంతో బాధున్నప్పటికి నాకు తెలిస్తే బాధపడ్తానని కడుపులో మింగేసి సంతోషంగా ఉన్నట్టు నా ముందు నటించిందని. చిన్న దబరలో సద్దెన్నం యేసుకొని నిప్పులో కాలబెట్టిన యెండి చేప తీసుకొని దాని పైనున్న మసి పోడానికి నేల మీద రెండు సార్లు తట్టి అది నా ముందు పెట్టి తినేసి బడికి పోండిద్దరు అని తన పైట కొంగులో కట్టుకున్న ముడినిప్పి ఇరవై పైసలు బిళ్ళను నా యెడంసేతిలో పెట్టి నువ్వు పది పైసలు సెల్లెలు పది పైసలు తీసుకోండని గబ గబా పచ్చడి చెసేసి చిన్న కాడగిన్నెలో సద్దెన్నం పెట్టుకొని జాగ్రత్తలు జెప్పి కూలోల్లో కలిసిపోయి పనికెళ్ళిపోయింది.

కొద్దిసేపటి తర్వాత యెనక్కొచ్చి నాయనా అని పిలిచింది యెప్పుడూ పేరుపెట్టి పిలిచింది లేదమ్మ. నాయనా.. లేదంటే కొడుకా అని పిలుస్తుంది. యెనక్కి తిరిగి ..యేమ్మా మళ్ళీ వచ్చావా..? వర్షం పడేట్టుంది ఇల్లురురస్తాదేమో నాయనో.. ఒకరవ్వ సుట్టింట్లో పొయ్యి దగ్గరొక గిన్ని, సూరికిందొక దబర పెట్టిపో అవతల కూలోలెల్లిపోయారు వాళ్ళలో కలిసెల్లిపోవాలి అని యెల్లిపోతూ …సెప్పటం మర్సిపోయా మీ నాయన సద్ది కూటికొస్తే యెండుసేపకొటి కాల్చియ్యి లేదంటే నంచుకోను లేకపోతే సంపేస్తాడు నన్ను అంటూ బతుకు పోరాటానికెళ్ళిపోయింది. సద్దెన్నం తింటూ ఆలోచనలో పడిపోయాను.. నాయన యెంత కొట్టినా కొట్టించుకుంటాది ..కాని యెప్పుడూ యెదురు మాట్లాడ్డం సూడ్లేదు వొకేల అలా చేసుంటే ఇంకా కొట్టేవాడేమో……యెన్ని తన్నులు తిన్నా కూడా నాయన మీద అమ్మకు ఇంత ప్రేమ యెందుకో అర్ధం కాలేదు. యెక్కడో బడి గంట శబ్ధం యినబడతాఉంది. తినేసి చెల్లిని తీసుకొని బడికెల్లిపోయాను.

బళ్ళోకూడా అమ్మ జీవితం యెప్పుడు బాగుపడుతుందా.. అమ్మ యెప్పుడు సంతోషంగా ఉంటుందా అని ఆలోచనలు వెంటాడుతున్నాయి నన్ను…  అందరి తల్లులాగే నా తల్లి కూడా బోగి పండక్కి యెప్పుడు కొత్త కోక కడ్తుందా అని…అందరి బిడ్దలకి లాగే తన బిడ్డల్ని కిరసనాయిలు బుడ్డి యెలుతురులో కాక కరెంటు బుడ్దీ యెలుతురులోఎప్పుడు చూస్తుందా….

అమ్మ పని నుంచి యెప్పుడొచ్చిందో గానిమేం  బడినుండి ఇంటికొచ్చేసరికే కసువు కూడా చిమ్మకుండా యేదో ఆలోచిస్తూ కూచొని ఉంది. యేమ్మా ఆలోచిస్తున్నావా? యేమైంది అని అడిగా… మీ నాయన పొద్దన్నుంచి ఇంటికొచ్చినట్టులేడు.. కూటి కుండలో కూడు అట్నే ఉంది.. యెక్కడ కల్లు సెట్ల కింద తాగి పడిపోయుంటాడో తీసుకొద్దాం పా…   అని నన్ను తీసుకొని కయిల్లో పోతాఉంది…మాకెదురొచ్చిన పతొక్కర్ని మా నాయనెక్కడన్నా కనిపించాడాని ఆడిగి తెలుసుకొంటాఉంది…యేమ్మావా.. మా ఆయనేమన్నా కనబడ్డాడా నీకా …లేదే… వస్తాడులేమే…పొద్దుబోయి నువ్వెక్కడెతకతావా వాడ్ని.. రాడా… రండి పోదాం అని మాకు తెలిసిన ఒకాయన అనేసరికే.. లేదు మావా ఇక్కడదాక పోయేసొస్తాం అంది అమ్మ.

అల నడ్సుకుంటూ… దారిలో కనిపించిన పతొక్కర్ని అడుక్కుంటూ రెడ్ల పొలాల చివ్వర్నున్న తాటిసెట్లు కనిపించెంత వరకు యెల్లాం…అక్కడికెల్తే యిక్కడికెందుకొచ్చారని నాయన కొడ్తాడని అమ్మకొకపక్క భయం…కొట్టినా సరే మా నాయన కనబడితే చాలనుకుందేమో.. గెనింమీద నా చేయి పట్టుకొని పడ్తావ్ నాయనా భద్రం అంటూ తాటిసెట్లున్న సోటుకి తీసుకుపోయింది. తాటిసెట్లకింద కూచోని యెవరితోనో మాట్లాడుతున్నట్లు చూశాం నాయన్ని ఇద్దరం. అమ్మ కళ్ళలో చెప్పలేని ఆనందం వచ్చేసింది..అమ్మ సంతోషంగా ఉందనుకొని కొంచెం గాలి పీల్చి వదిలా.. దూరం నుంచి వీళ్ళెవరాన్నట్టు చూస్తున్నాడు… దగ్గరకెళ్ళి యేంవయ్యా ..పొద్దుపోలా నీకా…? ఉదయం నుంచి కూటిక్కూడా రాలేదా… రా పోదాం..అని భయం భయం గానే అంది అమ్మ. మీరెందుకొచ్చారుమే ఇక్కడికా… రానా… యెక్కడికిపోతానా పోండొస్తున్నా..అన్నాడు నాయనా. వెంటనే ఇద్దరం యింటికి వచ్చేసాం. నాయన మీద యింత ప్రేమ చూపిస్తుందే అమ్మ…యెప్పుడన్నా అమ్మ మీద ప్రేమ చూయించాడా నాయన..? మనసులొ ప్రశ్నించుకున్నా.. పతిరోజు కూలి పని జేసి అమ్మ యింటికి రావడం. తాగొచ్చిన నాయన అమ్మను కొట్టడం…యిదే తంతు.. రోజులు గడుస్తున్నాయి…కాని పరిస్తితులు మాత్రం మారడం లేదు.

అలా కాల ప్రయాణంలో నా అయిదో తరగతి పూర్తయి ఆరో తరగతికి గురుకుల పాఠశాలలో సీటొచ్చింది. వూర్లో మొత్తం పన్నెండు మందిమి ప్రవెశపరీక్ష రాస్తే  నాకొక్కడికే సీటొచ్చింది. అమ్మ సంతోషంతో వచ్చి నన్ను ముద్దు పెట్టుకొంది. మా నాయన సంతోషపడ్డాడో లేదో నాకైతే తెలియదు. కాని ఆ రోజు రాత్రి పడుకోబోయేముందు మా నాయన నాతో…”నాయన యిక్కడెట్లా సదివావో హాస్టల్కెళ్ళిన తర్వాత కూడా అట్టాగే సదవాలా…” ఆప్యాంగా అన్న మాటలు సంతోషంతో నన్ను కంట తడిని పెట్టించాయి.అమ్మ నవ్వుతూ ముద్దుపెట్టడం శాలా రోజుల తర్వాత చూశాననుకొని హ్యాపీగా నిద్రపోయా. మరుసటిరోజు ఉదయం హాస్టల్కెళ్ళేటప్పుడు  తన బొడ్లో నుండి తీసిన ముక్కుపొడిని బుగ్గన పెట్టుకుంటూ రెండు కన్నీటి బొట్లు రాల్చడం గమనించాను… యిప్పటిదాకా తన సెంతనున్నకన్న కొడుకు దూరంగా బోతున్నాడనో లేక నాయన తన్నేటప్పుడు నాకెవరడ్దొస్తారని యేడ్చుకొంటుందో అర్దం కాలేదు కాని రెండో దాని కోసమే యేడుస్తొందనుకొని…కడుపులో వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని “పొయ్యొస్తామా”  నువ్వు జాగ్రత్త …నాయన కొడ్తే పల్లెత్తి మాటనకనేసరికే యిద్దరం దుఃఖం ఆపుకోలేక పెద్దగా యేడ్చేశాం. యెందుకసే.. శుభమా అంటూ బిడ్డ పోయేటప్పుడు యేడిపిస్తావా.. నాయాన కసిరేసరికే అమ్మ భయం భయంగా యేడుపుని దిగమింగుకని జాగ్రత్త.. బాగా సదవలా…దిగులుపడమాకా…వచ్చే ఆదివారం వస్తానని అమ్మ సాగనపింది.

ఒక పక్క పుట్టెడు దుఃఖంతోమరో పక్క గెబ్బెడు సంతోషంతో హాస్టల్కెళ్ళిపోయాను… మొదటి వారం రోజులు అమ్మ మీద దిగులుతో యేడ్చుకున్నాను…  మమ్మల్నెప్పుడూ అమ్మ కొట్టిందిలేదు… ఆమె ప్రేమనంతా మా పైనే గుమ్మరించేది…. అప్పుడప్పుడు అమ్మను ఆటపట్టించేవాళ్ళం.

మా అవ్వ కల్లాంలో యేరుకొచ్చిన పరిగిమూట కావాలనే మా మీదేసుకొని  మూట మా మీద పడిపోయినట్టు “అమ్మా”  .. అని అరిస్తే తొట్టిదగ్గర గిన్నెల్ చెంబులు తోముకుంటున్న అమ్మ కంగారుపడి యేమైంది  నాయన అని యేడ్చుకుంటూ వచ్చేది మా  దగ్గరికి…  తర్వాత  తమాషాకిలేమ్మా అనే వాళ్ళం… అమ్మ నవ్వుకుంటూ యెళ్ళిపోయేది.

మా యింటి సుట్టుపక్కల పిల్లకాయల అమ్మలయితే వాళ్ళ బిడ్డల్ని బాగా తన్నేవారు. మేము యెంత తులిపిపనులు జేసినా కూడా అమ్మ మమ్మల్ని ఒక్క మాట కూడా అనేది లేదు.”నాగమణే.. నీ పిలకాయలంటే యెంత ముద్దమ్మే నీకా..” అని ఇంటి  సుట్టుపక్కలోల్లు అనేవాళ్ళు అమ్మని.  అమ్మ జ్ఞాపకాలన్ని నెమరేసుకొనేవాణ్ణి. అట్టా హాస్టల్లో నా రోజులు గడిచిపోతూ పై తరగత్లకు యెదుగుతూ తొమ్మిదో తరగతిలో ఉండగా మా చెల్లెనించి ఉత్తరం… యెప్పుడూ మా చెల్లెలు ఉత్తరం రాసింది లేదు…కొత్తగా ఉంది… యింటిదగ్గర్నించి….అది కూడా చెల్లెలు రాసిందా అని….
“అన్నా.. యెలా ఉన్నావు..? యిక్కడ అందరు బాగున్నారు.
నాయన యింట్లోకి కంజీ మంచం, బీరువా, టీవి తెచ్చాడు..
యిప్పుడు మన యింట్లో కరెంటు పోయినప్పుడు మాత్రమే దీపం బుడ్డి..
ట్యూబ్ లైట్ కింద యిప్పుడు మనిల్లు భలే యెలుతురొస్తుంది.
అన్నా చెప్పడం మర్సిపోయా…
నాయన యిప్పుడు అమ్మను కొట్టడం లేదు.
నాయన మారిపోయాడు…”

నువ్వు దిగులుపెట్టుకోకుండా బాగ సదువ్కోమని సెప్పమంది అమ్మ     వుంటాను…… టాటా.

చివ్వరి మూడు లైన్లు యెన్ని సార్లు సదువుకొన్నానో నాకే తెలియదు. ఆ మూడు లైన్లు సదువుతున్నప్పుడల్లా అమ్మ మొహమే జ్ఞాపకమొచ్చేది. దసరా సెలవులకి యింటికి పోయిందాక ఆ మూడు లైన్లు పదే పదే సదువుకొన్నా.
సెలవులకి యింటికెల్లగానే గుడ్దలు పులుంతున్న అమ్మ నన్ను సూడగానే లేసొచ్చి సేతులుకున్న చెమ్మను పైట కొంగుతో తుడుసుకొని నా కొడుకొచ్చేశాడు.. నా ముద్దుల కొడుకొచ్చాశాడమ్మా అంటూ నన్ను యెత్తుకొని రెండు ముద్దులు పెట్టి నా నూనూగు మీసాలు జూసి నా కొడిక్కి మీసాలు కూడా వస్తున్నయమ్మా అని కొడుకు పెద్దవాడవుతున్నాడనే సంతోషంతో మురిసి పోతూ యింట్లోకెళ్ళి దింపి దింపగానే.. నేను బాగున్నాన్నాయనా… మీ నాయన యిప్పుడు కొట్టడం లేదు…వెరే వాళ్ళ పొలం కవులుకు తీసుకొన్నాడా… ఈ సారి బాగ పండిందా….ఈయన్ని తెచ్చాడు…యిహన యెరే వాళ్ళింటికిబోయి టీవి సూడబల్లెదులే..యిదిగో టీవి కూడా తెచ్చాడని అమ్మ అంటుండగానే… చెల్లి నవ్వుతూ..

అన్నో ఎప్పుడొచ్చావన్నా..?

యిప్పుడే.

నాకు తెలియదే..నువ్వొచ్హినట్టా.

యాడకిపోయిండేవా..?

ఆడుకోడానికి.

అన్నా నాయన మనిద్దరికి గుడ్డలు తెచ్చాడు తెలుసా..?

నీకొక సొక్కా..నాకొక గౌను.

యింకోటేంది తెల్సా..?

యేందా..?

అమ్మకోక్కోక గూడా తెచ్చాడు నాయన.

అమ్మ సాయ జూశా..ముసి ముసి నవ్వు నవ్వుతూ అవునన్నట్టు తలూపింది అమ్మ. హమ్మయ్య మా యమ్మ నవ్వింది శాలా రోజులకనుకొన్నా. ఊళ్ళో నుంచొచ్చిన నాయన నన్ను సూడగానే నవ్వుతూ యెప్పుడొచ్చావ్ రా ..

యిప్పుడే..

యెన్ని రోజులిచ్చార సెలవలా…?

పదిరోజులు.

నాగమణే..సద్దికూడెయ్ ..పోవాల..

అమ్మ సద్దికూడేసి యర్రగడ్డిచ్చేదా..సేప గాల్చిచ్చేదయ్యా..?

ఏదోకటీమే…

అమ్మ సద్ది కూడేసిచ్చిన వెంటనే మా దగ్గరకొచ్చి  నాయనా నువ్వూ అమ్మి టీవి పెట్టుకొని సూస్తా వుండండి గుడ్దలుతికేసొచ్చి కూడేస్తా. అని అమ్మ తొట్టి దగరకెల్లి పోయింది. నాయన అమ్మను పేరు పెట్టి పిలవడం..అమ్మ నాయన్ని అయ్యా అని ఆప్యాంగా పిలుసుకోవడం సూసి సెప్పలేని ఆనందంతో కంజీ మంచం మీద తలవాల్చి…కరెంటు బుడ్డి యెలుతురులో అమ్మ నవ్వును తల్సుకుంటూ  ఒక్క సారిగా గాలి పీల్చి వదిలా…..

*

జ్ఞాపకాల నీడలలో…

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

*

కూపస్థమండూకాన్ని మరపించే నిర్విరామ జాగృదావస్థ.

రెప్పలు విప్పుకున్న అతడి కళ్లలోకి వెలుగురేఖల్ని సూర్యుడు నిర్విరామంగా గుచ్చుతున్నాడు. సూది మొనల గాయాల్తో కనుగుడ్ల చుట్టూ, ఎరుపు రంగు చిక్కబడుతోంది. ఆ చిత్రహింసకి తెర లేపినవి, తెరిచున్న కిటికీ రెక్కలు.  ఆవిష్కృతమైన ఆ మనోజ్ఞ దృశ్యాన్ని అవి, అలవాటుగా తనివి తీరా చూస్తున్నాయి.

ఓ పక్కకి వొరిగి పడుకున్న అతడు, ఆ నొప్పి భరించలేక వెల్లకిలా తిరిగాడు.

కొలుకులమీద నులివెచ్చటి రక్తం తడి. జిగటగా అనిపించని కన్నీళ్లు, వేళ్ల చివళ్లతో తుడుచుకుని పైకి ఒకసారి చూశాడు. పంకా రెక్కల సవ్వడి. గాలి వీస్తున్నట్లుగా అనిపించటం లేదు. వినిపిస్తున్నట్లుగా ఉంది.  స్పష్టంగా కనిపిస్తున్న ఒక అస్పష్టత. అలవాటుగా మారిన మెలకువని రెచ్చగొడుతున్న అలసట.

ఆశల్ని ఊపిరిగా పీలుస్తున్న మెదడు. ఉన్నట్లుండి ఒక ఉక్కిరిబిక్కిరి. శ్వాస ఆడకుండా ఒక నిస్పృహ  అదుముతున్న అనుభూతి. స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించి సహాయం కోసం కేక వేశాడు. అరుపు గొంతులోనే  సజీవసమాధి అయింది. నిస్సహాయంగా కుడి ప్రక్కకి తిరిగి చూశాడు. ఒక అదృశ్యదృశ్యం గోచరించింది.

ఎదురుగా చెలి. ఆమె పెదాలపై విరిలా విప్పారిన విషహాసం. అతడి గుండెలమీద ఆమె కుడి చేయి.

అరచేతిలో కర్కశత్వం. అయిదు వేళ్లూ ముళ్లలా అతనికి గుచ్చుకున్నాయి. ఒకప్పుడు మైమరపు కలిగించిన స్పర్శ ఇప్పుడు వెరపు కలిగిస్తోంది. లోపం ఎక్కడుంది? ఆమె తనని ఉపయోగించుకుంటున్న విధంలోనా? తాను ఆమెని వినియోగించుకుంటున్న విధానంలోనా? బోధపడలేదతడికి.

ఈ మధ్యన జరిగిన సంఘటనలు కొన్ని ఒక్కసారిగా అతడికి గుర్తొచ్చాయి. అవి తలపుకి రావటం వెనక సైతం తనకెదురుగా ఉన్న చెలి హస్తముంది. ఆ విషయం అతడికి తెలుస్తోంది.

***

“ఇన్నాళ్లకి, నేను గుర్తొచ్చానా?” నిష్టూరంగా అడిగింది చెలి.

“నువ్వు నాతో లేకపోవటమే కదా నాకు గుర్తు రాకపోవటానికి కారణం!” అతడు జవాబిచ్చాడు.

“మాటలతో బాగా ఆడుకోగలవు. అవి నిజమని నమ్మించగలవు,” అంటూ ఆమె నవ్వింది. విడకుండానే విచ్చుకున్నట్లుగా అనిపించే పెదాలు. ఒక ముకుళితవికసనం.

“ఇక నుంచి నేను నీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఇది మాత్రం నిజం. నువ్వు నా మిగిలిన మాటలు నమ్మకపోయినా ఫర్లేదు. ఈ ఒక్క మాట మాత్రం నమ్ము,”

“నీ నెచ్చెలి అంత త్వరగా నిన్ను వదిలిపెడుతుందా?” అనుమానం వ్యక్తపరిచింది చెలి.

“ఇన్నాళ్లూ నిన్ను వదిలి ఆమె దగ్గర పూర్తిగా ఉండలేదా? అది నువ్వు సహించలేదా? మౌనం వహించలేదా? ఇప్పుడు అదే పని  తానూ చేస్తుంది,”

“నీ ఇష్టం,”

“నీ దగ్గరకు నేను రావటం, ఎవరికయినా అభ్యంతరమా?”

“నా జీవితంలో ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు దూరమయినప్పట్నుంచీ నేను ఒంటరినే!”

ఏదో ఒక రోజు అతడు తన దగ్గరకి వస్తాడని ఆమెకి తెలుసు. ఆమెకు కావాల్సిందీ అదే.

***

ఇప్పటివరకూ తనతో సఖ్యంగా సహజీవనం చేస్తున్న అతడు ఈ మధ్యన తరచుగా అన్యమనస్కంగా ఉండటం, నెచ్చెలి గమనించింది.

“ఈమధ్య మీకు నా ధ్యాస ఉండటం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. ఎదురుగా ఉన్నట్లే ఉంటున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లివస్తున్నారు.  ఏమైంది మీకు?” ఒక రోజు అతడ్ని నిలదీసి అడిగింది. నిశ్చలచలనం.

“అలాంటిదేం లేదు. నువ్వనవసరంగా అనుమానపడుతున్నావు,” అతడు తన మనసు కప్పి పుచ్చుకోవటానికి ఒక విఫల ప్రయత్నం చేశాడు.

ఆ జవాబు చెప్పేప్పుడు అతడి చూపు ఆమె కళ్లలోకి సూటిగా లేదు. అదొక్కటి చాలు, అతడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అన్నది ఆమె తెల్సుకోటానికి!

“ఆ మాత్రం గ్రహించలేననుకోకండి. మీరు వెళ్తున్నది ఒకప్పటి మీ చెలి దగ్గరకేగా?” ఎప్పుడూ సరళీస్వరాలు వినిపించే నెచ్చెలి గొంతు ఉన్నట్లుండి పరుషంగా ధ్వనించింది.

ఈ విషయం ఆమెకెలా తెలిసింది? అతడికి అర్థం కాలేదు.

“బంధాన్ని ఎంతవరకు పెంచుకోవచ్చో తెలీకుండానే, ఆమెతో బలమైన అనుబంధాన్ని మీరు మళ్లీ కోరుకుంటున్నారు. నేను వద్దంటానని, ఆ విషయం నా దగ్గర దాచారు. అవునా?” అడిగింది.

“నీతో పాటు ఆమె కూడా కావాలనిపిస్తోంది. అందుకే ఆమె దగ్గరకి మళ్లీ వెళ్తున్నాను,” అన్నాడు అతడు.

“ఒకప్పటి మీ స్నేహం నాకూ తెలుసు. నాకు దూరం కానంతగా ఆమె దగ్గరకూ అపుడపుడు వెళ్తుండండి. అంతవరకూ నాకు అభ్యంతరం లేదు. కాని, అది వ్యామోహం క్రింద మారకుండా చూసుకోండి,”

ఆమె గొంతులో ధ్వనించిన ధృడత్వానికి అతడు విస్తుపోయాడు.

***

చెలి సాంగత్యంలో ఇంతకు ముందెరగని ఒక ఆనందం. ఆమె సాన్నిధ్యంలో నెచ్చెలి హెచ్చరిక అతడికి గుర్తు రావటం లేదు. ఇంతకుముందుకన్నా అతడు ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఇష్టపడుతున్నాడు. వీలు దొరికినప్పుడల్లా చెలితోనే గడపటానికి తాపత్రయపడుతున్నాడు. ఇవన్నీ నెచ్చెలి దృష్టిని దాటిపోలేదు.

“నా మాటని మీరెందుకు లక్ష్యపెట్టటం లేదు?”  ఒక రోజు అతడి చెయ్యి పట్టుకుని కోపంగా అడిగింది.

“…”

“నన్నెందుకు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు?”

“నీ కన్నా చెలితో గడపటమే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. అందుకని!” అసలు విషయం చెప్పాడు అతడు. చెప్పింతర్వాత ఎందుకు చెప్పానా? అని బాధపడ్డాడు. గతజల సేతుబంధనం.

ఆ మాటతో నెచ్చెలి ముఖకవళికలు మారిపోయాయి.  దీపకళికని అంధకారం అంతమొందించింది.

***

“ఎంత సేపు మీలో మీరు ఉంటారు. బయటికి రండి. అలా  కాసేపు తిరిగొద్దాం,” అడిగింది చెలి.  నిక్వణం పలికిస్తానని నమ్మించి, విపంచి తంత్రుల్ని తెంచే ప్రయత్నం.

మొదట్లో ఆమె తనని ఆహ్లాదం కలిగించే ప్రదేశాల దగ్గరకే ఎక్కువగా తీసుకెళ్లేది.  క్రమంగా అది తక్కువైంది. ఇప్పుడు ఆమె తనను తీసుకు వెళ్తున్నది రెండే చోట్లకి.

ఒకచోట, ఒకప్పుడు  తనకు తెలిసి ఏమీ లేదు. ఆ శూన్యాన్ని ఇప్పుడొక శ్మశానం కౌగలించుకుంది. దాంతో అదిపుడు  అంతరించిన అంతశ్చేతనకి ఆలవాలం. చెవుల్లో ఇంకా ధ్వనిస్తున్న చరమగీతం చరణాలు. ఇంకా పూర్తిగా ఆరని చితులు. ఆర్తితో సగంలో ఆగిపోయిన మంటలు. అర్ధభాగం కాలి నిరర్థకంగా మిగిలిన అనుభవాల శవాలు. ఘనీభవించిన విషాదం. దాన్ని అశ్రువులుగా స్రవింపచేయటానికి ఉండుండి ఎవరో గుండెలు బాదుకుంటున్న చప్పుడు. దిక్కులు పిక్కటిల్లేలా ఒక ఏడుపు. అపస్వరఅష్టమస్వరం.

రెండోచోట నిన్నో మొన్నో ఆమని నిష్క్రమించిన వని, పూవని. పచ్చదనం వలువలు పోగొట్టుకుని నగ్నంగా నిలబడ్డ వాంఛావృక్షాలు. తలలొంచిన స్వప్నలతలు. వాటి వైఫల్యం. సాఫల్యత సిద్ధించకుండానే రాలిపోయిన సుమదళాలు. అలరించకుండానే అవనిలో కలిసిపోయిన సురభిళపరిమళాలు. కనిపించే మూగవేదన. వినిపించని మౌనరోదన. జలవీచికల బదులు మరీచికలు.

విభిన్నరూపాల్లో బీభత్సం, భయానక వాతావరణం. జుగుప్స, భయం; ఒక్కోదానికి ఒక్కో స్థాయీభావం.   ఇవేవీ తాను మళ్లీ మళ్లీ చూడాలనుకునేవి కావు.

సింహావలోకనం చేసుకుంటే, అంతా ఒక హింసావలోకనం. నెచ్చెలి తోడులో ఎంత వేదనయినా ఎక్కువగా వేధించేది కాదు. చెలి సాన్నిహిత్యం అలా అనిపించటం లేదు. ఒకప్పుడు అద్దంలో చూసిన అగ్నిపర్వతం ఇప్పుడు భూతద్దంలో దర్శనమిస్తోంది. భూతంగా మారిన ప్రస్తుతం, భూతంలా భయపెడుతోంది.

ధైర్యం తెచ్చుకుని చెలిని అడిగాడు, “నాకు చూపించటానికి ఇంతకన్నా మంచిచోట్లేవీ లేవా నా గతంలో?”

“క్లుప్తమైన సరిగమలు. లుప్తమైన మధురిమలు. సంక్షిప్తంగా నీ జీవితచిత్రం ఇది. వెన్నెలరాత్రులూ, విహారయాత్రలూ ఉండుంటే నువ్వడక్కుండానే నేను వాటిదగ్గరికే  నిన్ను తీసుకెళ్లేదాన్ని. వాటిని నీ నెచ్చెలి మాయం చేసింది. లేని వాటిని చూపించలేదని, నన్నని ఉపయోగం ఏముంది?” అన్నది ఆమె.

ఆ గొంతులో లీలగా ధ్వనించిన వెటకారం, అవలీలగా అర్థమైంది అతనికి.

Kadha-Saranga-2-300x268

***

నెచ్చెలి సోదరి ఇంతకుముందు రోజుకు ఒకసారైనా తన దగ్గరకు వచ్చేది. వచ్చినప్పుడల్లా తన చెల్లెల్ని  ప్రేమగా కౌగలించుకునేది. మనఃస్పూర్తిగా తనని పలకరించేది. ఉన్నట్లుండి రావటం మానేసింది. ఎందుకో తెలీదు.

“ఈ మధ్యన మీ అక్కయ్య కనపడటం లేదేం?” తనకి అందుబాటులో లేకుండా తలుపులు బిగించుకుని  దాక్కున్న నెచ్చెలిని అడిగాడు.

మౌనం సమాధానమయింది.

నేరుగా నెచ్చెలి సోదరినే అడిగితే సరి. ఉదయం ఆమె గృహోన్ముఖురాలయే సమయం.

ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. తేజస్సును విరజిమ్ముతూ, తేలుతున్నట్లుగా నడిచి వస్తూ దూరంగా ఒక కాంతిపుంజం. క్రమంగా అది పెద్దదయింది. ఆ రూపం ఒక ధవళవస్త్రధారిణిది. ఆమె సమీపిస్తున్న కొద్దీ పరిసరాలన్నిటా పరివ్యాపితమై ఒక సాంత్వనాగీతం.  మలయమారుతం.

“మీ కోసం ఎదురు చూస్తున్నాను,”

“నాతో మీకేం పని?”

“ఒక్క మాట అడుగుదామని,”

ఆగకుండా వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపాలని ప్రయత్నించాడతను. ఆమె వొంటి స్పర్శ అతడికి తెలీలేదు. కాని, అతడి స్పర్శ తనకి తగిలినట్లు, అది రుచించనట్లు ఆమె విదిలించుకుంది. ఓ క్షణం ఆగింది. రాత్రంతా తనకి తాను లేనట్లు బరువెక్కిన కళ్లు.

ఏమిటో చెప్పమన్నట్లు అతడి వంక అసహనంగా చూసింది.

“నా మీద కోపం వచ్చిందా? రావటం మానేశారు!”

“కోపం రాలేదు. మీరే తెప్పించారు,”

“బహిరంగంగా ఎందుకు? నా తలపుల్ని తెరుస్తాను. లోపలకి వస్తే ఆన్ని విషయాలూ సాకల్యంగా మాట్లాడుకోవచ్చు,” ఆప్యాయంగా  ఆహ్వానించాడతను.

“ఆ అవసరం లేదు,” కర్కశంగా జవాబిచ్చింది ఆమె.

“ఇంతకు ముందు రోజూ వచ్చేవారుగా?”

“అంతకు ముందు నా చెల్లెలు నీ దగ్గర ఉండేది. సుఖపడుతుండేది. నిన్ను సుఖపెడుతుండేది. అందుకని నేను స్వేచ్ఛగా రాగలిగేదాన్ని. ఇప్పుడా అవకాశం లేదు,” అంది ఆమె.

“ఇప్పుడు కూడా ఆమె నా దగ్గరే ఉందిగా?”

“ఉంది. కాని ఇంతకు ముందులా లేదు. చిక్కి శల్యమైంది,”

“మీకెలా తెలుసు?”

“నీకు కనపడనంతమాత్రాన, ఇంకెవరికీ  కనపడదనుకోకు,”

అందుకనేనా? ఎప్పటెప్పటి విషయాలో  ఒకటొకటి తన మీద దాడి చేస్తున్నది! వాటి వెనక ఉండి వాటిని చెలి రెచ్చగొట్టగలుగుతున్నది! పగబట్టినట్లు వాటిని తట్టి లేపి తనవైపు తరమగలుగుతున్నది!

నెచ్చెలి సోదరి వాటివంక నిర్నిమేషంగా చూస్తోంది.

***

కనపడిన రెండు నిజాలనీ అతడు జీర్ణించుకోలేకపోయాడు. అలాగే కూర్చుండిపోయాడు. ఒక్క నిమిషం తర్వాత తేరుకుని, “ఇప్పుడు నేనేం చెయ్యాలి?” ఇంకా తన ఎదురుగా నిలబడే ఉన్న నెచ్చెలి సోదరిని  నిస్సహాయంగా అడిగాడు.

“చేయగలిగిందేమీ లేదు. మా అమ్మ రాక  కోసం నువ్వు ఎదురు చూడాల్సిందే!”

“నెచ్చెలికి నా వల్ల జరిగిన హాని తెలిసి కూడా,  మీ అమ్మ నా దగ్గరకు వస్తుందా?”

“కన్నకూతుళ్లు కదా! రాక తప్పదు,”

“వచ్చి ఏం చేస్తుంది?” అయోమయంగా అడిగాడు అతడు.

“తన కూతుళ్లని తనతో తీసుకు వెళుతుంది,”

“నా సంగతో?”

“ఆమె వస్తే నీ దగ్గర నువ్వూ మిగలవు!” ”

-o) O (o-

 

 

 

గాంధారంలో అంతరం

Art: Satya Sufi

Art: Satya Sufi

 

*

మన సౌకర్యం కోసం స్టాఫ్ నొటేషన్ ని మ్యూజికల్ నోట్స్ అనుకుందాం. మనకు అర్ధం కాని గుర్తుల పేర్లు క్రోచెట్లు, క్వేవర్లు… వాటికి ఆ పేర్లుంటాయని కూడా మనకు తెలియదు. అసలు రిషభ్ లాగా గిటార్ వాయించేవాళ్ళు నోట్స్ చూసి… నోట్స్ లో గుర్తులు … తెలుగులో చెప్పాలంటే ‘సింబల్స్’ చూసి వాయిస్తారని కూడా మనలో చాలా మందికి తెలియదు.

రిషభ్ వయసు రెండు డజన్లకి దగ్గరగా ఉంటుంది. ఆ వయసు వాడు, అందులోనూ రిషభ్ లా ఉద్యోగం సద్యోగం లేకుండా సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసేవాడు ఇలాగే సాయంత్రాలు తన ఫ్లాట్లో గిటార్ వాయించుకుంటూ కూర్చోడం మనకి వింతగా తోచకపోవచ్చు. కానీ అమృత వర్షిణి లాంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో సహజీవనం చేసున్నాడని ఎవరైనా మనకి చెప్పారనుకోండి… మనకి వింతగా అనిపించి తీరుతుంది.

కాలింగ్ బెల్ మ్రోగడం మనకి వినిపించింది… ఆ కాలింగ్ బెల్ ట్యూన్ ని అనుకరిస్తూ రిషభ్, తన గిటార్ తీగలు సవరించాలని ఉన్నా, తలుపు తీయడంలో తను చేసిన తాత్సారానికి ఫలశృతిగా పొందిన రసాభినివేశం… అమృతతో ఒక రాత్రి గొడవ పాటి చేస్తుందా అనే తర్కం, తనతో తలుపు తీయించింది. అమృత లోపలికి రాగానే, ఎదురింటి పోర్షన్ గ్రిల్ కి ఆవల ముసలాయన ముఖంపై మూతబడ్డ తలుపు… రిషభ్ పెట్టిన గొళ్ళెంతో మరింత గట్టిగా బిగుసుకుంది. ఆవులింతలు దిగమింగిన గొంతులు కౌగిలింతల పేరుతో ఒక్కటవ్వగా అమృత మెడలో వేలాడుతున్న కంపెనీ ఐడెంటిటీ కార్డ్, ఇరువురి గుండెల మధ్య నలగడంతో మనలోని కొందరు సంస్కారులు తలలు దించుకున్నట్లు నటించారు. నాకు అలాంటి కుసంస్కారాలు లేవు గాక లేవు.

“సాకేత్ దింపాడు” అని అమృత చెప్పే సమాధానాన్ని ఊహించి “ఆఫీస్ నుంచి ఎలా వచ్చావు” అని రిషభ్ అడగలేదు. “రోజూ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎదురింటి ముసలాడితో పడలేకపోతున్నాను” అని మాత్రం చెప్పింది “ఎందుకు విసుగ్గా ఉన్నావు” అని అడిగితే.

“పాపం అతను ఏం చేసాడని… నిన్నేమైనా తిట్టాడా కొట్టాడా… కనీసం నీతో ఒక మాట కూడా మాట్లాడడు” అని రిషభ్ ఏదో చెప్పబోతే “రోజూ గుడ్ల గూబకి బాబులా ఇంతింత కళ్ళేసుకుని చూస్తాడు. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ? మన దేశంలో అమ్మాయిలకి, వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతికే హక్కు లేదా ? ” అని అమృత వేసిన ప్రశ్నే రిషభ్ కి సమాధానం అవుతుంది.

ఎదురింటి ముసలాడు అమృత మెట్టెలకోసం, పుస్తెల కోసం వెతుకుతూ అవి కనబడకపోయే సరికి… వయసు తెచ్చిన విచ్చలవిడితనం గురించి విచారించి, విశ్వమానవ విశృంఖల వీచికలతో విసిరివేయబడ్డ విచక్షణారాహిత్యానికి వగచి, అణగారిపోతున్న ఆచారాల గురించి  అగ్గగ్గలాడిపోతున్నాడని నిర్ధారణగా ఆమెకు తెలియకపోయినా గిల్టీనెస్ గిల్లిన సెల్ఫ్ కాన్షియస్నెస్ స్పృహ ఆమెలోని ఫెమినిజాన్ని ఫ్లూటు గానంతో నిద్రలేపింది.

“బ్లడీ బగ్గర్… అక్కడికి మనమేదో దోపిడీలూ దొంగతనాలూ చేస్తున్నట్లు… ఒకరంటే ఒకరికి ప్రేమ… పెళ్ళిచేసుకోకుండా కలిసి ఉంటున్నాం… రేపో మాపో మూడొస్తే పెళ్ళి చేసుకుంటాం. అదేదో పెద్ద నేరమైనట్లు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వీడి విజిలెన్స్ ఏమిటో ! “

“ఇలాంటి వాళ్ళందరూ ఇంటిగ్ర్రేషన్ టెస్ట్ లో మిస్ అయ్యి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్లో దొరికిన డిఫెక్ట్స్ లాంటి వాళ్ళు. ఫ్రీకింగ్ *****(ఇక్కడ వ్రాయలేని ఇంగ్లీష్ బూతేదో ఆమె వాడితే.. ప్రహ్లాజుడి పాత్ర పోషించాల్సి వచ్చింది). ఇలాంటి వాళ్ళు, ఎప్పుడెప్పుడు మనలాంటి లవర్స్ గొడవపడతామా అని చూస్తుంటారు. ఒకవేళ గొడవపడి విడిపోతే భారతీయ వివాహ వ్యవస్థలోని దృఢత్వాన్ని అంభుజా సిమెంట్ తో సరిపోల్చి సనాతన సాంప్రదాయాలకి సాగిలపడతారు ” అని అమృత అంది. ఆమె వాడే ఆస్కారంలేదని మనం భావించిన తెలుగు పదాలు రచయిత ఖాతాలో వేసుకుని ముందుకెళ్ళాం.

Kadha-Saranga-2-300x268

“నేను కూడా రెండు మూడు సార్లు పీప్ హోల్ లోనుంచి చూసాను అమ్మూ… రోజూ సాయంత్రాలు మన డోర్ దగ్గరే చెవి పెట్టి వింటున్నాడు”.

“దట్సిట్… నేను చెప్పలే ! మనం గొడవ పడ్డం వాడికి కావాలి… విడిపోవడం కావాలి… ‘ఇవన్నీ మారోజుల్లో ఉండేవా ? ఏటికి ఎదురీదితే ఎవరికైనా ఇదే గతి ‘ అని తన ఏజ్ గ్రూప్ గయ్స్ తో గడిపే మార్నింగ్ వాక్స్ లో సాగదియ్యాలంటే మషాలా కావాలి” అని అమృత అంటే అది మనలో కొంతమందికి సబబుగానే తోచింది.

“అయితే.. వాళ్ళకి కావాల్సిన మషాలా మనమే ఇద్దాం అమ్మూ”

“ఏం మాట్లాడుతున్నావ్ రిషభ్… వాళ్ళకోసం మనం గొడవ పడతామా”

“గొడవ పడం బేబీ… పడినట్లు నటిస్తాం… వాడు అది నిజమని నమ్మి అందరితో చెప్తాడు. అప్పుడు ప్లాట్స్ లో అందరూ మన వైపు జాలిగా చూస్తే ఇంతమందిని ఫూల్స్ చెయ్యగలిగామని మనలో మనమే నవ్వుకోవచ్చు”

“వావ్ డూడూ… ఇలాంటి ప్రాంక్స్ ఫన్నీ గా ఉంటాయి. రోజూ ఆఫీస్ నుంచి వచ్చే సరికి ఇలాంటి గేం ఏదో ఉంటే నేను కూడా రిలాక్స్ అవుతా” అంది అమృత.

“యా… ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ కొత్తగా ఉంటుంది. రోజూ ఫేస్బుక్, ఎక్స్-బాక్స్ బోర్” అని కోరస్ గిటార్ మ్రోగించాడు రిషభ్.

 

  తరువాతి రోజు

 

అమృత ఆఫీస్ నుంచి రాగానే రిషభ్ తలుపు తీసాడు.

“తలుపు తీయడానికి ఇంత సేపు ఏంటి   ?” అంటూ వరండాలో ఉన్న ముసలాయన్ని చూడమన్నట్లు కళ్ళతోనే సైగ చేసేసరికి..వరండాలో వాలు కుర్చీలో కూర్చుని ఏదో చదువుతున్నట్లు నటిస్తున్న ముసలాయన్ని రిషభ్ తో పాటు మనం కూడా గమనించాం. అమృత లోపలకి రాగానే రిషభ్ ఎప్పటిలా తలుపు వేసి గొల్లెం పెట్టాడు.

“వాడు బయిటే ఉన్నాడు… లెట్స్ స్టార్ట్ ” అని గుసగుసమన్నారిద్దరూ. రిషభ్ గిటార్ తీసి వాయించడం మొదలుపెట్టాడు.

“అబ్బా… కాసేపు ఆ గోల ఆపు రిషభ్” అమృత ముఖం నవ్వుతున్నా గొంతు అరుస్తుంది.

“గోలా ? ఇదేంటో తెలుసా ? మ్యూజిక్… ఏ స్కేలో తెలుసా ?” రిషభ్ కూడా కోప్పడ్డట్లు అంటున్నా… ముఖంలో ఆనందపు అవశేషాలు.

“ఏ స్కేల్.. నట్రాజ్ స్కేల్ ఆ( ” వెటకారంగా అని ఎదురింటి ముసలాయనకి వినబడనంత జాగ్రత్తగా నవ్వింది.

“నీకు అంతకన్న ఏం తెలుసు లే… ఇది సీ షార్ప్ స్కేల్” ఉత్తుత్తి గొడవని ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాం మనం.

“అబ్బా చా… నీకు ‘సీ షార్ప్ ’ స్కేల్ గురించి తెలిస్తే నాకు సీ షార్ప్ డాట్ నెట్ గురించి తెలుసు. నీ సీ షార్ప్ వల్ల రూపాయి రాలదు. కానీ నా సీ షార్ప్ నెలకు నలభై వేలు తెచ్చిపెడుతుంది. అది మర్చిపోకు” అని అమృత అన్నప్పుడు … ఇంత కేజువల్ గొడవలో కూడా అతను నొచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

అది ఆమె గమనింపులోకి వచ్చి అతడి మూడ్ మార్చే ముద్దేదో ముఖాన విసిరికొట్టాలన్న తలంపుతో అసిమెట్రిక్ గా అతుక్కున్న ఆమె అధరాల ఐక్యతలో లోపించిన ఖాళీలు పూరించే దన్ను కోసం దాపెట్టిన దంతాల సౌజన్యంతో జనియించిన చుంబన సంరంభమారంభమైన కొద్ది క్షణాల్లోనే అహాలను పరస్పరం స్ఖలించుకుని ఇహాలలో గుణుస్తున్నకలహభావ ప్రాప్తికి చేరుకున్నారిద్దరూ.

 

ఇందాకటి “తరువాతి రోజు”కి మరుసటిరోజు

 

“ఎలా వచ్చావ్ అమ్మూ” ఉత్తుత్తి గొడవకి కొబ్బరి కాయ కొట్టిన రిషభ్ కి అది ఉత్తుత్తి గొడవ అన్న స్పృహ లేదు.

“సాకేత్ దింపాడు” తాము పడుతున్నది ఉత్తుత్తి గొడవన్న భ్రమలో నవ్వింది.

“ఇంక ఆఫీస్ బస్ కి ఫీజ్ కట్టడం ఎందుకు దండగ. ఈ సాకేత్ గాడి ఓలా క్యాబ్లో పోతే పోలా !” నిన్నటి సరదా లేదు రిషభ్ లో.

“ఏం అంటున్నావో స్ట్రైట్ గా చెప్పు” అంతవరకు గొంతులో మాత్రం దాగిన కోపం ఆమె ముఖంలో నవ్వుని భర్తీ చేసింది.

“చెప్పేదేముంది.. నెలకో మూడు వేలు కడుతున్నందుకైనా ఆఫీస్ బస్ లో రాలేవా ? రోజూ ఆ సాకేత్ గాడే దింపాలా”

“ఏం… సాకేత్ నన్ను దింపకూడదా ? ”

“ఒక్క రోజో రెండు రోజులో అయితే ఒ.కె. కానీ రోజూ వాడి కార్ లోనే రావాలా ” నాయనా రిషభ్… నువ్వు గేం రూల్స్ మర్చిపోయినట్లున్నావురా… ఇది నిజం గొడవ కాదురా… ఉత్తుత్తి గొడవ.

“సరే.. రేపట్నుంచి వాడి కార్లో రాను. రోజూ నీ బెంజ్ కార్లో నన్ను ఆఫీస్ నుంచి పిక్ అప్ చేసుకో” ఏంటమ్మా అమృత నువ్వు కూడా… ఇది గేం , నిజం గొడవ కాదంటే వినిపించుకోరేం ?

“కొంటాను.. బెంజ్ ఏం ఖర్మ బుగట్టీ కొంటాను… నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ రానీ” రిషభ్ ఎర్రగా మారి కోపంతో ఊగిపోవడం మనం గమనించి ఏమౌతుందా అని ఆతృతపడ్డాం.

“హా హా హా” ఆమె నవ్వింది. అది మామూలు నవ్వు కాదు… కారపు వెటకారపు కలగలుపు. ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట్ట హాసమూ..

అమృత ఇంకా నవ్వుతూనే ఉంది…తరతరాల సాగరాల నిక్షిప్త ముత్యాల తరళ పాతరల దొంతరలుగా …”హా హా హా”… రెడీ… ఒన్… టూ… త్రీ… “ఫట్”… అమృత చంప పగిలింది.

థ్రీ.. టూ.. ఒన్.. “ఫట్” మని రిషభ్ చంప కూడా పగిలిందని వ్రాయకపోతే మనలో ఫెమినిస్టులు ఒప్పుకుంటారా ?

“నన్నే కొడతావా ? నువ్వేమైనా నా మొగుడివనుకున్నావా ?” మొగుడైతే కొట్టొచ్చా ? నోట్ దిస్ పాయింట్ యువరానర్.

“…”

“ఇంకొక్క నిమిషం కూడా నీతో ఉండను ” అని విసురుగా తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటున్న అమృతని ఆపే ప్రయత్నం నాతో సహా మనలో ఎవ్వరమూ చెయ్యలేదు. తీరం దాటుతున్న తుఫానుని పట్టుకుని ఆపే సాహసం చేసేదెవరు ?

**************

కొన్ని రోజుల ఒంటరితనం నేర్పిన ఏకాకి రాగాలు నెమరేసుకుంటూ రిషభ్.. గిటార్ ముట్టుకోవడం మానేసాడు. వాయించమని మనమూ చెప్పలేదు. ఆ రోజు లిఫ్ట్ దగ్గర ముసలాయన ఎదురయ్యేదాకా…

“ఏమయ్యా.. మీ ఇంట్లో గిటార్ వాయించేది నువ్వా… ఆ పిల్లా ?” అడిగాడు ముసలాయన.

“…”

“ఆ పిల్లే అయ్యుంటుంది.. ఆ అమ్మాయి కనబడ్డం మానేసిన దగ్గర నుంచి గిటార్ మ్యూజిక్ వినబడడం లేదు. సల్వార్ కమీజ్ వేసుకున్న సరస్వతీదేవి అనుకో… ఎక్కడికి వెళ్ళింది ? మళ్ళీ ఎప్పుడొస్తుంది ?”

“…”

“ఆ అమ్మాయిలాగా నీకు కూడా గిటార్ వాయించడం వచ్చా ?”

“…”

ముసలాయన అడిగే ప్రశ్నలకి రిషభ్ కి సమాధానాలు చెప్పాలని ఉన్నా… సమకాలీన కధల క్లైమేక్సుల్లో ముసలాళ్ళని కెలికితే వినవలసివచ్చే నాలుగు పేరాగ్రాఫుల సోది యొక్క సమ్మెట పోటు సలుపు ఎలా ఉంటుందోనన్న ఎరుక తెచ్చిన భయం… రిషభ్ వహించిన మూడు చుక్కల మౌనం.

“నీకు తెలుసో లేదో, నాకు గిటార్ అంటే చాలా ఇష్టం.. శాస్త్రీయ సంగీతంలో కొంత ప్రవేశం కూడా ఉంది. రోజూ గిటార్ వినడానికే మీ ఇంటి ముందు వరండాలో మీకు తెలియకుండా తచ్చాడేవాడ్ని. ఈ మధ్య మీరు వాయించడం మానేసిన దగ్గర నుంచి నా సాయంత్రాల్లో ఏదో వెలితి. మళ్ళీ రేపట్నుంచి వాయించమని ఆ పిల్ల రాగానే చెప్పవా ప్లీజ్” అనేసి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి “అన్నట్లు చెప్పడం మర్చిపోయాను.. మొన్నామధ్యన ఎప్పుడో పాత ఘర్షణ సినిమాలోని “కురిసేను విరిజల్లులే…ఒకటయ్యేను ఇరుచూపులే” పాట గిటార్ మీద వాయిస్తున్నప్పుడు “అంతర గాంధారం”, రిషభంలా వినిపించింది. ఆ పాట ‘అమృత వర్షిణి ‘ రాగంలో ఉంది. ‘అమృత వర్షిణిలో  రిషభం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి” … మనం గుర్తుపెట్టుకున్నాం…’ అమృత వర్షిణి ‘ లో ‘రిషభం ‘ ఉండదని… మనతో పాటే రిషభ్ కూడా..

***

 

 

ఖుష్బూ

 

saiపరిచయం:

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీ. చిన్నప్పటినుండి సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం బాగా అలవాటైంది.

సినిమాలు చూసే అలవాటు కాస్తా సినిమా తియ్యాలనే ఆశయంగా మారి ఇప్పుడు అదే ఫీల్డ్ లో ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, ఇప్పుడు మరో సినిమాకి కో-డైరెక్టర్ గా పని చేసే వరకు తెచ్చింది. ఇప్పటి వరకూ నాలుగు షార్ట్ ఫిలిమ్స్ చేసాను. ఫీచర్ ఫిలిం చెయ్యాలని ముందుకు సాగుతున్నా.
పుస్తాకాలు చదివే అలవాటు అప్పుడప్పుడు నాతో చిన్నచిన్న కథలని రాయిస్తుంది. ఏదైనా రియాలిటీ కి దగ్గరగా లేదా నా సొంత అనుభవాలని కథగా మలిచే ప్రయత్నం చేస్తాను.

ఇంకా ఎన్నో పుస్తకాలు చదవాలి, మరిన్ని కథలు రాయాలి.

“Writing is the Painting of the Voice” అనే కొటేషన్ గుర్తుచేసుకుంటూ.

-సాయి యోగి

ఎన్నేళ్ళయింది ఇక్కడికొచ్చి, ఎప్పుడో చిన్నప్పుడు వదిలిపోయిన ఈ బస్తీని. అంతా మారిపోయింది, కాని నా జ్ఞాపకాలల్ల ఏం మారలే.

అప్పుడు డాడి కార్ నడ్పుతుంటే తిరిగేటోల్లం ఈ గల్లీలల్ల, ఇప్పుడు రద్దీ వెరిగింది. నేనూ, అక్కా ఎన్కల కూసోని కిట్కీలకెల్లి బైటికి చూస్తుండే, తెల్సిన ప్లేసే అయినా కార్ల నుంచి చూస్తే అదో షోక్ అప్పుడు.

ఇంతకంటే లోపలికి పొయ్యేతట్టు లేదనిపించి ఎడ్మదిక్కున్న మస్జిద్ పక్కన కార్ ఆపి దిగిన. ఈ మస్జిద్ పేరేమో ఉండే… హా… గౌసియా మస్జిద్ కదా! అవును. మస్జిద్ గోడ కింద మూలకి కనిపించినై బొగ్గుతోని గీసిన వికెట్లు. అరె! ఇదైతే మారలే ఇంకా. లోపల్నే నవ్వుకున్న. అప్పుడు మేము ఇట్లనే గీసి ఆడుతుండే బ్యాట్-బాల్, బాల్కి బొగ్గు మర్క అంటుకుంటే అవుట్, లేదంటే లేదు. అయ్యన్ని గుర్తురాంగనే  ఏందో మనసంత ఫుల్ ఖుష్, ఖుష్  ఐతుంది.

ఎవ్వర్కైనా  పుట్టి పెరిగిన జాగకి చాన ఏండ్లకి వస్తే ఇట్లనే ఉంటదేమో!

పక్క గల్లీలకి నడిస్తే మా పాతిల్లు. దర్వాజలు, గోడలు అట్లనే ఉన్నయ్, చత్తు మీద రూమేసిర్రు, కలర్ మర్చిన్రు అంతే. చూడంగనే ఎందుకో కన్లళ్ళ నీళ్ళు తిర్గుతున్నై, గొంతులకి దుక్కమొచ్చింది ఒక్కటే సారి.

ఆషా బీబీ వాళ్లకి అమ్మినం అని చెప్పిండు డాడీ. అప్పుడు నేను అమ్మమ్మోల్ల ఇంట్ల ఉంటుండే. అమ్మినం అని చెప్పినప్పుడు ఏం అనిపియ్యలె, ఇన్నేళ్ళల ఒక్కసారి గూడ రాలే గానీ, ఇప్పుడు ఏందో? పైసలిచ్చి మల్ల ఇల్లు కోనేయ్యల్నా అన్పించింది. ఎమ్జేయ్యాలె ఇప్పుడు కొని ఎవరుంటరు? నేను ఇయ్యాల  యూ. ఎస్. వోతున్న. ఈ సారి ఎప్పటికోస్తనో తెల్వది.

*****

Kadha-Saranga-2-300x268

కార్ కీ కొనాతోటి దర్వాజా కొట్టిన, లోపల్కెల్లి రాజా హిందుస్తానీ పాటలు ఇనిపిస్తున్నై. మల్ల కొంచెం గట్టిగ కొట్టిన, ఒక చిన్న పోరడు ఒచ్చిండు. “కోనోనా?” అన్నడు. “కోయిబి నయ్యేక్యా, బడే” అడ్గిన. “అబ్బూ నయ్యే, కామ్కూ గై” అని చెప్తుంటే లోపలికెళ్ళి “రియాజ్… కౌన్?” అని ఆడ గొంతు. “హా మా… హమ్ లోగ్ యే ఘర్మే రహేతెతే…” అని నా మాట పూర్తి అవ్వక ముందే “ఇను నహిహే, ఆప్ షాంకు ఆవో” అంది. నేను “ఒక సారి మా ఇల్లు సూస్కోని పోతా” అందాం అనుకున్న గాని ఎందుక్లే బైటికేంచి చూస్న గదా సాలు, ఎవరైన రానిస్తారా అట్లా. కన్లారా మా ఇల్లు మల్ల చూస్కొని గట్టిగ ఊపిరి వీల్చి అక్కడ్నించి కదిల్నా, నవ్వుకుంట రియాజ్ గాని చెంప విండి.

మస్జిద్ ముందల కిరాణా షాప్ కనిపిస్తే సిగరెట్ తాగి పోదాం అన్కొని, పోయి తీస్కోని ముట్టిస్తుంటే చూస్న ఆయనని, హామీద్ భాయ్! కొంచెం గూడ మారలే అట్లనే ఉన్నడు. జెర్ర ఎంటికెలు తెల్లగైనై గంతే. చేత్ల సిగరెట్ పడేయాల్నా? అరె… ఇప్పుడు నేను పెద్దోన్నైన కదా!

పల్కరిచ్చిన, గుర్తుజేస్నా. డాడీ పేరు జెప్పంగనే గుర్తు వట్టిండు. మస్తు ఖుష్ అయ్యుండు, దుకాన్కి ఒచ్చిన ఒకరిద్దరికి అడిగిండు, “ఇస్కు పైచనే?” అని. చానసేపు మాట్లాడిన, “మీ నాయ్నాకీ రంజాన్కి షీర్కుమా పంపిస్తా” అని అడ్రెస్స్ తీస్కుండు.

ప్రియ నుండి  మెసేజ్ ఒచ్చింది “Where are You?” అని, రిప్లై ఇచ్చిన. చెక్ ఇన్ కి లేట్ అయితది, హమీద్ భాయ్ కి “ఖుదా హఫిజ్” చెప్పిన .

కార్ దగ్గరికి నడుస్తుంటే కనిపించిండు ఎత్తుగా, ఎర్రగ, గడ్డంతోని, నమాజ్ టోపీ వెట్కొని, చేత్ల యేవో కవర్లు పట్కోని. నాదిక్కే చూస్కుంట వస్తున్నడు. ఎవడీడు ? ర…హీం, రహీం గాడు. నా రక్తం బగ్గున మండింది, ఆని మొఖం చూడలనిపించలే, ఆ రోజు జరిగిన విషయం గుర్తొచ్చింది నోట్ల నుండి మాంచి మాటొచ్చింది.

 

నా పక్కనుండి ఎల్లిపోయిండు గుప్పున అత్తరు వాసన, తూ… కంపరమొచ్చింది.
రహీం గాడు నేను జిగిరి దోస్తులం. ఆ రోజు ఆదివారం అందరం జండా కాడ  క్రికెట్ ఆడుతున్నం, ఆ రోజే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్, మట్టన్ షాప్ టీవిల స్కోర్ చూస్కుంట, ఆడకుంట ఉన్నం. ఇండియా గెల్చింది. నేను ఫుల్ ఖుష్ అయ్యి ఆన్ని ఎక్కిరించుకుంట, మజాక్ చేస్కుంట దున్కులాడ్తున్న. రహీం గాన్కి కోపం ఒచ్చింది, ఆడు పాకిస్తాన్ ఫ్యాన్. నన్ను తిట్టిండు, నేను కొట్టిన మెల్లగనే,  ఆడు ఆని చేతిల బ్యాట్ తోని నా కాళ్ళ మీద గట్టిగ కొట్టిండు. ఎద్దు కూర తింటడు గద దెబ్బ గట్టిగ తాకింది. నాకు భయమయ్యి గలీజ్ మాటలు తిట్టుకుంట ఇంటికి ఉర్కిన.

ఇంటికివోయి డాడీకి చెప్పిన, “నువ్వీడుంటే ఇట్లనే అవారా గాన్వి తయ్యారైతట్టు ఉన్నవ్” అని నన్నే తిట్టి  అమ్మమ్మా వాల్లింటికి పంపిండు.

ఆని వల్లనే నేను ఇక్కడ్నుండి పోయిన, ఆని వల్లనే… అప్పట్నుండి ఆడంటే కోపం పోలే… కొన్ని సార్లు వాన్ని చూడాల్సి వొస్తదని ఊరునుండి ఇంటికి గూడ రాలే. ఆని వల్లనే నేను ఇక్కడి నుండి… చిన్నప్ప టి నుంచి ఆని మీద అదే కో…..? అవును, ఆని మీద అదే కోపం, చిన్నపట్టినుండి కోపం… చిన్నప్పుడు…..? చిన్నతనం… ఇప్పుడు?

ఎప్పుడో కొట్లాడినం, అయిపొయింది ఇప్పుడేమైంది మాట్లాడనీకే? వాని ఇష్టం వాంది, నా ఇష్టం నాది. అయినా దోస్తాన్ల కూడా టేస్ట్లు – స్టేటస్ లు, అవసరాలు – అవకాశాలు చూస్కోని దోస్తాని చేస్తరా? అప్పుడది దోస్తాని అయితదా. ఆని మీద కోపం గాయబ్ అయ్యింది. “మన మనసుకి ఏది కరెక్ట్ ఆలోచనో ముందే తెలుసు, ఆ ఆలోచన వచ్చేదాకా దిమ్మాఖ్ ఖరాబ్ అయితుంటది”. అది అర్ధమైన కొన్ని సెకండ్లల్ల నా కార్ యు టర్న్ తీస్కుంది.

sai1

ప్రియా కాల్ ఒస్తుంది… ఎత్తలేదు. కార్ స్పీడ్గ పోనిస్తున్న రహీం గాన్ని కల్వనీకె, మళ్ళీ ఫోన్, లిఫ్ట్ చేసి “Yaa Honey, I will be there in 30 Minutes” అని చెప్పి ఫోన్ పెట్టేస్నా. ఆమెకి ఇంగ్లీశ్లనే చెప్పలే, ఇక్కడామె కాదు, యూ. ఎస్. సిటిజెన్.

కార్ ఆగింది, వానిల్లు నాకు బాగ గుర్తు, జెండా పక్కన డెడ్ ఎండ్ గల్లీ ఉంటది, గల్లీలకి ఒచ్చిన. అక్కడెప్పుడు  రెండు మూడు మేకలు కట్టేసుంటై, అరె! ఇప్పుడు గూడ ఉన్నయ్. పక్కనే ఫుల్ కవర్ ఉండే హాఫ్ వైట్ కలర్ ఇన్ప డోర్.

డోర్ కొట్టిన ఏం సప్పుడు లేదు. ఫోన్ సప్పుడయ్యింది, సైలెంట్ జేసిన. మల్లా డోర్ కొట్టిన ఒక చిన్నోడు ఒచ్చిండు, ర…హీం గాడే… అరె ! కాదు. ఆడిలాగనే ఉన్నడు… సేమ్ టు సేమ్. ఆ చూపు, ముక్కూ, సుడి తిరిగిన పాపిడి.

ఎటో పోతుండు చేత్ల తర్మస్ ఉంది ఆపిన, “రుకో తుమ్హారే అబ్బుకా నాం క్యా హై?” అడిగిన, “మహమ్మద్ రహీముద్దిన్” అన్నడు. నవ్వొచ్చింది నాకు. “హై ఘర్మే?”, “నై కామ్కూ గై… షామ్మే ఆతే” అని  చెప్తుంటే లోపలి నుండి ఆడ గొంతు వీడి అమ్మ అనుకుంటా “కౌన్?” అని, నేను “భాబీ జాన్…రహీంకె లియే ఆయతా”, “నై ఉణు బాహర్ గై ఆప్ కౌన్?”, “మై కిరణ్, రహీం కా బచ్పన్ కా దోస్త్ హూ, మిల్నే అయ తా” , “అచ్ఛా… ఇను కబ్ అతేకి పతానై”. ప్రియ ఫోన్ ఒస్తుంది, సైలెంట్ జేసి, “ఫోన్ నెంబర్ దేసక్తే క్యా ?”, “హై నెంబర్ మగర్, ఫోన్ చాలూ నైహై… కాం నై కర్రా ఫోన్, ఆప్ చాయ్ పానీ పీనతా”, “నై భాబీ షుక్రియా, మై అర్జెంట్ మే హూ, అచ్ఛా ఆప్ నెంబర్ దిజియే మై కభి ట్రై కరుంగా”.

 

నెంబర్ తీస్కోని, ఆడి కొడుకు ఫసీవుద్దిన్ చేత్ల చేత్కోచ్చిన పైసల్ వెట్టి బయల్దేరిన, ఆన్ని కలిస్తే బాగుంటుందే, చా… బాదనిపిస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు నా దిమాఖ్ పంచేయ్యలె, ఆనికి సారీ అయిన చెప్పలే అంజాన్ కొట్టినందుకు.

ఒక గంట టైం ఎన్కకి పోతే బాగుండు అనిపించింది. కోపం ఒచ్చింది నామీద నాకే, ఇన్నేళ్ళ నుండి కల్వలే గానీ ఇయ్యాల ఎక్కడ లేని ప్రేమొచ్చింది? అవ్వు, నవ్వొచ్చింది. కానీ కలిస్తే బాగుండు, సారీ చెప్పి గలె మిలాంస్తే అదో తృప్తి ఉంటుండే.

*****

మా అపార్ట్మెంట్ కొచ్చిన, నా పార్కింగ్ల  స్కూటర్, అయిపోయిండు వాచ్మన్ ఇయ్యాల, అసలే నారాజ్లున్న “హే వాచ్ మాన్ ఎన్ని సార్ల చెప్పాలే ఈడ మా బండ్లు ఒస్తై అని”, తిట్టిన మల్ల నాకే మంచిగన్పియ్యలె, కార్ పార్క్ చేసి ఎల్లిపోయిన.

ఏం వాసనిది, అత్తరు… ఎక్కడినుంచో…. నాకొచ్చిన అన్మానం నిజం కావాలె అన్కున్న నెక్స్ట్ సెకండ్ల  హాల్లకి ఎంటర్ కాంగనే, రహీ….మ్ గాడు.

ప్రియా “I was dialing you”, అని ఏదో అంటుంది. నేను ఇంటలే. వీడు సోఫలకేంచి లేచి నన్ను చూస్తుండు. నాకేం మాటలోస్తలేవు, అట్లనే చూస్తున్న, ఆడే ధన్మని నా దగ్గరికొచ్చి నన్ను గట్టిగ గల్లె మిళాయించి “మాఫ్ కర్ భాయ్… తెరేకు దేక్కే భి అంజాన్ మారా, క్యా హూహాకి జబ్… ఫిర్ హామీద్ భాయ్ సే మిలా” ఏదో చెప్తున్నడు. అరె! నా కన్లళ్ళకెళ్ళి నీల్లోస్తున్నయేoది! వీనికి గూడ కళ్ళు తడ్సినట్టున్నాయ్. మా ఇద్దరికీ ఒకటే సారి షైతాన్ ఇడ్సినట్టుంది, “మేరేకుబి మాఫ్ కర్ భాయ్”, నేన్ గూడ గట్టిగ వట్కున్న. ఇప్పుడు రహీంగాని  అత్తరు వాసన గలీజ్గా అన్పిస్తాలేదు, ‘ఖుష్బూ’ వస్తుంది!

*

 

జాలం

 

తెల్లవార్లూ ప్రయాణంతో పట్టీపట్టని నిద్ర…ఒళ్ళు తెలీలేదు. విమానం అడ్రెస్ సిస్టమ్ లో స్పీకర్స్ నుంచి వచ్చే అమ్మాయి గొంతుతో మెలకువ వచ్చింది.

“కొద్ది నిమిషాల్లో గన్నవరం – విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగబోతున్నాం. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్. వాతావరణం వేడిగా ఉంది. ల్యాండింగ్ కి అనువుగా, విజిబిలిటీ పది కిలోమీటర్ల వరకూ స్పష్టంగా ఉంది.”

బోయింగ్ 747 న్యూయార్క్ నుంచి బయలుదేరి పన్నెండు గంటల్లోనే నాన్ స్టాప్ గా విజయవాడలో దిగాబోతోంది. భుజం మీద వాలి గాఢంగా నిద్రపోతున్న శైలజను తట్టిలేపాడు, శివ.

“శైలూ! లే! దిగిపోతున్నాం.”

రోజులు మారాయి, కాలం మారింది. రెండు రాష్ట్రాలు ఇప్పుడు. విజయవాడ గన్నవరంలో ఒక పెద్ద అద్భుతమైన ఎయిర్ పోర్ట్!

బయటకడుగు పెట్టగానే వేడి గాలి, నిప్పుల కొలిమి లోంచి వచ్చినట్టు! జేబులో మొబైల్ ఫోన్ ‘టింగ్’ మని చప్పుడు.

“విజయవాడకి స్వాగతం! మీరిప్పుడు సన్ షైన్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో దిగారు! ఇదిగో ఎయిర్ పోర్ట్ మ్యాప్. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, కాంటీన్, టూరిస్ట్ డెస్క్, టాక్సీలు, బస్సులు ఎక్కడెక్కడుండేదీ వివరంగా మ్యాప్ ప్రత్యక్షం అయింది.

ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్ళే బస్ కదిలింది. దాని లోపల చల్లగా ఉంది.

‘టింగ్’ మళ్ళీ ఇద్దరి ఫోనులు చెప్పాయి. “విజయవాడలో స్వాగత్ ఐదు నక్షత్రాల హోటల్ కి స్వాగతం! మీకోసం హోటల్ కారు వేచి వుంది. డ్రైవర్ నంబర్ ఇదిగో…”

“ఓ! అద్భుతం!” అన్నాడు శివ.

‘టింగ్! మీ బ్యాగేజి బెల్ట్ నంబర్ రెండుకు వచ్చి వుంది.”

‘టింగ్! మీరు అమెరికన్ సిటిజెన్ కనుక గ్రీన్ లైన్లో కస్టమ్స్ నుంచి బయటకు రాగానే త్వరగా వీసా స్టాంప్ ఇవ్వగలము! స్వాగతం!’

‘టింగ్! మీరు విజయవాడలో వుంటే ప్రఖ్యాత బాబాయ్ హోటల్ కి విచ్చేయండి. మరచిపోలేని ఇడ్లీ, పెసరట్ లోయ్!’

‘టింగ్! కొండపల్లి బొమ్మలు విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో. ఆర్డర్ చేయండి!’

“ఇదేమిటి బాబూ, అప్పుడే ఇన్ని మెసేజిలా?” విసుక్కుంది శైలజ.

“స్మార్ట్ సిటీ శైలూ!” అన్నాడు శివ. “విజయవాడ ఏమిటి? మొత్తం రాష్ట్రం అంతా ఆఖరికి మనూరు మామిడిపూడి కూడా స్మార్ట్ విలేజ్ గా మారిపోయింది తెలుసా?”

ట్రింగ్ ట్రింగ్ మెసేజీలు వస్తూనే ఉన్నాయి. టాక్సీలనీ, టూరిస్ట్ ప్యాకేజీలు, కూచిపూడి నాట్యానికి, దగ్గరలో బీచ్ మచిలీపట్నానికీ, విశాఖ సైట్ సీయింగ్, అరకు లోయలో మూడు రోజులు…

“అది సైలెంట్ లో పెట్టండి, లేదా ఆఫ్ చేయండి!” అంది శైలూ కోపంగా.

గన్నవరం నుంచి విజయవాడకి పొలాల మధ్యగా ఆరులైన్లలో రోడ్డు. అటూ ఇటూ ఎండిపోయిన పంట పొలాలు దర్శనమిస్తున్నాయి. వేసంకాలం రాకముందే బయట చాలా వేడిగా వుంది. దూరాన ఎక్కడో ఒక వారి కుప్ప చుట్టూ ఒక ట్రాక్టర్ నీరసంగా తిరుగుతోంది. కొంచెం దూరం తర్వాత ఇక పొలాలు లేవు. అటూ యిటూ క్రమంగా పెద్దవవుతున్న బహుళ అంతస్థుల భవంతులు, మధ్యలో పెద్ద పెద్ద ప్రకటనలు వున్న బోర్డులూ కనిపిస్తున్నాయి.

“ఓ!! వాల్ మార్ట్! స్పెన్సర్స్… అన్నీ వున్నాయిక్కడ!” అంది శైలూ.

“ఔను! కొత్తరాష్ట్రం డిజిటల్ రాష్ట్రం. చాలా మార్పు వచ్చింది.”

కారు రామవరప్పాడు దాటి బెంజ్ సర్కిల్ దారిలో ఒక చోట ఆగింది. ‘హోటల్ స్వాగత్’ ఐదు నక్షత్రాల సౌకర్యం.

రూమ్ కి చేరుకోగానే, “నన్ను రెండుగంటల వరకూ నిద్ర లేపకండి! బడలికగా వుంది. పడుకోవాలి.” అని శైలూ నిద్రలో మునిగిపోయింది.

శివ కూడా బట్టలు మార్చుకొని, టేబుల్ మీదనున్న చల్లని మినరల్ వాటర్ తాగి, ఆనాటి న్యూస్ పేపర్ చదివి నిద్రలోకి జారాడు.

***

“ఆళ్ళు ఒచ్చారంటావా?” అడిగాడు రామకోటయ్య. ల్యాప్ టాప్ మీద, మొబైల్ తెర మీద రెండు చుక్కలు మెరుస్తున్నాయి.

“ఆ, ఒచ్చారు! హోటల్లో దిగారు.” చెప్పాడు నవీన్.

రామకోటయ్య గుబురు మీసాలు తెల్ల గడ్డంలోంచి “హ” అని చప్పుడు చేసి, వెక్కిరింతగా నవ్వేడు.

“రేపు మధ్యాన్నం కేతారంలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారంట! జరగడానికి ఈల్లేదు! జరగదు!” కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు.

“అది నీ డూటీ! మరి చూసుకో!” నవీన్ జీన్ ప్యాంటు, తెల్ల టీ షర్టు వేసుకున్నాడు. మాసిన గడ్డం, చురుకైన కళ్ళు, నుదుటి మీద కొద్దిగా, కొద్దిగా ఏమిటి ఈ వాతావరణానికి ఒళ్ళంతా చెమటే!

“చూద్దాం! కానీ గ్యారంటీ చెప్పలేను!” రామకోటయ్య వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి చూసి ఖాండ్రించి ఉమ్మేశాడు.

“పని కాకపోతే డబ్బులుండవ్! నువ్వొక్కడివే  అనుకోబాక! ఇంకా నలుగురున్నారు ఈ పని మీద!” నవీన్ కి అంత వేడిలోనూ చలి పుట్టుకొచ్చింది.

“కోటయ్య తాతా! ఒక కష్టమైన పని పెట్టుకొంటే ఈ కంప్యూటర్ లతో ఖచ్చితంగా చెప్పలేం మరి. మాగ్జిమం ట్రై చేస్తా!”

అతనొక ఎమెచ్యూర్ హ్యాకర్.

***

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

సాయంత్రం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగారు ఇద్దరూ. ల్యాప్ టాప్ ఆన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ సర్వే మ్యాప్ లు చూడటం మొదలుపెట్టాడు, శివ. సర్వే నంబరు, వూరిపేరు కొట్టగానే మ్యాప్ వచ్చింది.

“ఎకరం రెండు కోట్లు. ఐదు ఎకరాలు అమ్మేస్తే ఈ వూరితో బంధం తెగిపోతుంది!”

“ఎందుకు ఇక్కడ? ఆ డబ్బుతో రాగిణి మెడిసిన్ చదువు మొత్తం అయిపోయి, అమెరికా లో సెటిల్ కూడా అయిపోవచ్చు అని ఎందుకనుకోరు?” అంది శైలూ.

అతి కష్టం మీద రెండెకరాలు కొనడానికి ఒప్పుకున్నారు. ఇవాళ  సగం డబ్బు క్యాష్ ఇస్తారు. ఈ దేశంలో సగానికి సగం బ్లాక్ మనీ లావాదేవీలు! రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మిగిలిన సగం రేపు చెక్కు ఇస్తారట…”

“అంటే ఇంకా మూడెకరాలు…అమ్ముడుపోవా?”

“మార్కెట్ డల్ గా వుంది శైలూ. ఇప్పటికి నాలుగు కోట్లు చదువుకి సరిపోతాయిగా? అది కూడా కొత్త క్యాపిటల్ రావడం, కొత్త రాష్ట్రం అభివృద్ధి వల్ల ఈ మాత్రం రేట్లు! కొనే వాళ్ళు వుండద్దూ? వాళ్లకి కూడా అంత డబ్బు పెట్టాలంటే ఏదో వ్యాపారం ఉండాలిగా?”

“అంతే మీరు! ఏది చేసినా సగం సగమే!” మూతి ముడిచింది శైలూ.

ఆమెను సంతృప్తి పరచటం బ్రహ్మతరం కూడా కాదు.

***

కంకిపాడు నుంచి ఆరులైన్ల రోడ్డు సిగ్నల్ దగ్గర నల్లరంగు ఇన్నోవా కారు.

కంప్యూటర్ లో కనిపిస్తోంది. “ట్రాఫిక్ జామ్. అది కదలడం లేదు.” అన్నాడు నవీన్. అన్ని చోట్లా సీసీ కెమెరాలు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో తెరలు. అక్కడినుంచి తనకి సమాచారం. ఏ క్షణం, ఏ వస్తువు, ఏ వాహనం, ఏ మనిషినైనా ఎక్కడున్నాడో తెలుపుతుంది సమాచార వ్యవస్థ.

స్టోర్ రూమ్ లో ఎన్ని వస్తువులున్నాయి, బస్ లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, రైల్లో ఎంత మంది దిగారు, ఏ హోటల్లో ఎవరున్నారు, ఎవరి బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ లలోంచి ఎంత డబ్బు స్వైప్ అవుతోంది, ఎక్కడ సమావేశాలు, ఆందోళనలు జరుగుతున్నాయి – ఒకటేమిటి వస్తువులు, మనుష్యులు వాహనాలు అన్నీ అనుసంధానమైన డిజిటల్ రాష్ట్రం – స్మార్ట్ రాష్ట్రం. దాంట్లోకి ప్రవేశించాడు, నవీన్ హ్యాకరు.

“ఆ కార్లో రెండు కోట్లున్నాయ్. అవి ఆడికి చేరడానికి వీల్లేదు.” అన్నాడు రామకోటయ్య.

నవీన్ అన్నాడు, “ఆకారును ఆపటానికి అన్ని విధాలా ప్రయత్నించాను సార్. ఇక ఒక్కటే మార్గం.” ఉన్నట్టుండి ఒకేసారి కంకిపాడు జంక్షన్ దగ్గర వాహనాలు అన్నీ రెండు వైపులా కదలసాగాయి. సంక్షోభం! జామ్!! అటూ యిటూ ఒకేసారి గ్రీన్ లైట్లు వెలిగాయి. కార్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఉండటానికి అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి. అవి ఎర్ర చుక్కల రూపంలో స్క్రీన్ మీద.

రామకోటయ్య సంతృప్తిగా నవీన్ కేసి చూసి, “గట్టోడివే, నువ్వా పనిమీదుండు, నేనింటికి వెళ్లి వొస్తా…” అన్నాడు.

ఇల్లు అంటే రెండో ఇల్లు. రామకోటయ్య కోసం మేరీ ఎదురు చూస్తోంది.

“అయ్యిందా?”

“అయినట్టే. నా కడుపు కాడ కూడా కొడితే నేనూరుకుంటానా? ఎంత మేనల్లుడైతే మాత్రం? సంవత్సరం తిరిగేసరికి పది లక్షలు ఆదాయం వస్తా వుండేది. అమెరికా వెళ్లి అక్కడి పౌరసత్వం పుచ్చుకొన్నోడికి ఈ మామిడిపూడి పొలాలే కావలసి వచ్చాయా?”

వృద్ధుడంటే వృద్ధుడు, మధ్య వయస్కుడంటే మధ్య వయస్కుడు రామకోటయ్య. మేరీ మామిడిపూడి ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ళక్రితం భార్య పోయిన దగ్గర్నుంచి మేరీ నే తోడూ, సహచరీ! అసలు అతనుండేది మామిడిపూడి పక్కనే పది కిలోమీటర్ల దూరంలోని గుడివాడ పట్టణంలో. అమెరికా లో ఉన్న మేనల్లుడి పొలాలు చూడటానికి ఈ వూరు వస్తుంటాడు. రాజధాని కోసం ఈ వూరు గుర్తించి, ఆ ప్రాంతం కలిపేసరికి కోట్ల విలువయ్యింది. న్యూయార్క్ లో, న్యూజెర్సీలో ఇళ్ళు కట్టుకొని వందల కోట్లు సంపాదించిన శివ గాడికి ఈ మారుమూల గ్రామంలోని పొలాలే కావాలా? ఎంత వద్దని చెప్పినా అమ్మాలని పట్టు పట్టుక్కూర్చున్నాడు. తనకి చెప్పకుండానే బేరం కుదుర్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. గుంటూరోళ్ళు  ఎకరా రెండు కోట్లకి బేరం కుదిర్చారు. రామకోటయ్య ఆలోచిస్తున్నాడు. ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోవాలి, ఏమైనా సరే. ఆగిపోతుంది. చాకుల్లాంటి కుర్రాళ్ళు చేతిలో వుండగా పదిలక్షల ఖర్చుతో పదికోట్ల ఆస్థి తన చేతుల్లోనే ఉండిపోతుంది.

***

ఇన్నోవా వేగంగా అడ్డదిడ్డంగా తిరుగుతోంది. కారులో వ్యక్తులకి విసుగ్గా వుంది.

“ఏందీ ట్రాఫిక్ జాములూ? సిగ్నల్లో అన్నీ ఒక్కసారే వెలిగాయి. అందరూ అన్ని వైపులనుంచి వొస్తన్నారు! ఎలా? నీ…”అతనికి కోపంలో బూతులు వస్తున్నాయి.

ఎదురుగా లారీ మచిలీపట్నం వైపు ఓడరేవుకు పెట్రోల్ ట్యాంకర్లని మోసుకొని వేగంగా వస్తోంది. ఇటు గరుడా  బస్సు విజయవాడవైపు వెళుతోంది. మీద మీదకి వస్తోంది. ఎలా వచ్చాడో, ఒక గడ్డి మోపు కట్టి వున్నా రెండు చక్రాల సైకిల్ తొక్కుకుంటూ తలపాగా ముసలోడు కారుకి అడ్డంగా వచ్చేసాడు. అట్నుంచి ఎడ్లబండి ఒక్కసారి మీదికి దూకింది.

రెండు ఎద్దుల మేడలో గంటలు గణగణా మోగాయి. శివుడి వాహనం నందిలా. అపుడు చేసే సాయంత్రపు నాట్యంలా బండి గెంతింది. ఒక్క మెరుపు మెరిసి, ట్యాంకరూ, ఇన్నోవా ఢీ కొట్టాయి. ప్రళయంలా మంటలు చెలరేగాయి.

***

“ఏదో భయంగా ఉందండీ…” అంది శైలు.

ఏడున్నరకి ‘కూచిపూడి’ రెస్టారెంట్ లో అసలైన ఆంధ్రా రుచులు అన్న బోర్డు. ఇద్దరూ చాలా కాలం మిస్ అయిన వంటకాలు తింటున్నారు.

“డబ్బు ఇస్తానని వస్తానన్న వాళ్ళు ఇంకా రాలా!” అన్నాడు శివ.

“అది కాదు. ఎక్కడ కోర్చున్నా, ఎవరో నన్నే గమనిస్తున్నట్లు, నా వంకే చూస్తున్నట్లు, ఇందాక కార్లో కూడా వెంక ఇంకేదో కారు వెంబడిస్తున్నట్టు..”

“నీ మొహం!” భార్యని తిట్టడానికి అవకాశం దొరికింది శివకి. “అంతా నీ భయం. ఇన్ సెక్యూరిటీ… అభద్రతాభావం!”

టీవీలో తాజావార్తలు డైనింగ్ రూమ్ లో అందరికీ వినబడేట్లు, కనబడేట్లు, “కంకిపాడు దగ్గర ఘోర ప్రమాదం. ఇన్నోవా, ఆయిల్ టాంకర్ ల ఢీ! నలుగురి దుర్మరణం. కారులో కాలిపోయిన కరెన్సీ నోట్లు లభ్యం!”

“అయ్యో…” అంది శైలూ.

“బ్లాక్ మనీ…” అన్నాడు శివ.

***

హోటల్ సీసీ కెమెరాల్లో ఇద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు. నవీన్ నవ్వి ఈల వేయసాగాడు.

“ఆంధ్రా చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, సాంబారులో ములక్కాడలు కూడా కనిపిస్తున్నాయి. హ! హ! హ!”

శివ, శైలూ బిల్ తీసుకొచ్చిన వెయిటర్ కి క్రెడిట్ కార్డు ఇవ్వడం, సంతకం పెట్టడం, కొంత డబ్బు టిప్ కింద ఇవ్వడం లేచి లాబీలోకి రావడం అన్నీ కనిపిస్తున్నాయి.

“హోటల్ అధునాతనమైనది. మొత్తం కెమెరాలే! వస్తువులకి కూడా ఇంటర్నెట్. స్టోర్ రూమ్ లో సరుకులెంత ఉన్నాయో కూడా తెలుసుకోవటానికి సెన్సర్ లు. ఏసీలో టెంపరేచర్ ఎంతో, రెస్టారెంట్ లో, బార్ లో జిమ్ లో, బ్యూటీ పార్లర్ లో అన్ని చోట్లా సెన్సార్లు “ నవ్వాడు.

“రామకోటయ్య గారూ, అన్న మాట నిలబెట్టుకున్నా…” అన్నాడు. లోపల మాత్రం “IOT – ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్” అనుకున్నాడు. ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం లోకి హోటల్ ఇంటర్నెట్ సిస్టం ద్వారా ప్రవేశించాడు.

“ఆళ్ళు ఆగరు. మళ్ళీ ఇంకో బేరం మొదలుపెడతారు. అదీ చూడు!” అన్నాడు రామకోటయ్య. “ఇదిగో ఐదు. పని అయినాక మిగిలిన అయిదు…” కరెన్సీ నోట్లున్న బ్రీఫ్ కేస్ నవీన్ హ్యాకర్ పక్కన నల్లటి నీడలా  నిలబడింది.

దుష్టుడి దురాశలా.

***

“హలో! హలో!”

“హలో?” అన్నాడు శివ విసుగ్గా అర్థరాత్రి.

“సారీ సార్, నాన్నగారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయనతో పాటుగా నలుగురు పోయారు. మీకందుకే డబ్బు అందలేదు. రిజిస్ట్రేషన్ రేపు చెయ్యలేం.” ఎడుపుగొంటుతో యువకుడు.

“ఓ!! సారీ!” తలపట్టుకున్నాడు శివ.

“ఇంకెవర్ని అయినా చూడండి. మాకసలే సెలవు లేదు. అర్జెంటు!”

ఇదేం క్రూరత్వం? సాటి మనిషి ప్రాణాలు పోతే? అని శైలుకి అనిపించలేదు.

“అనుకొంటూనే ఉన్నా. వీళ్ళకి డ్రైవింగ్ రాదు. ట్రాఫిక్ కంట్రోల్ లేదు. డబ్బు ఇవ్వడం, సంపాదించడం రాదు!” విసుగ్గా అంది.

“ఇంకెవరైనా కొనాలనుకొంటున్నారేమో అడగండి. మన ప్రోగ్రాం అంతా ఖరాబు అయింది! ఛీ! బ్యాక్ వర్డ్ కంట్రీ అండ్ పీపుల్!! ఏసీ పెంచండి చల్లగా లేదు, ఈ విజయవాడ వేడికి!”

శివ ఏసీ రిమోట్ తో టెంపరేచర్ పదహారు సెంటిగ్రేడ్ పెట్టి కళ్ళు మూసుకున్నాడు.

ఏసీ గాలి వేగంగా చల్లగా భారంగా రాసాగింది.

నిద్రలోకి జారుకున్న వాళ్ళిద్దరికీ క్రమంగా ఊపిరి భారం అవుతోంది. వచ్చేగాలిలో ఏదో తేడా వస్తోంది. ఊపిరి ఆడటం లేదు. కళ్ళు మండుతున్నాయి. శ్వాస భారంగా … ఆక్సిజన్ అందనట్టు… ఎనాక్సియా. ఏసీ గాలిలో మిథైల్ ఐసో సైనేట్? విషపుగాలి ఎలా కలిసింది?ఇందాక రూమ్ లోంచి బయటకొస్తున్న ఏసీ మెకానిక్ రూమ్ సర్వీస్ అంటూ… పాడయిందా?

అలసిన శివ మస్తిష్కంలో మామిదిపూడిలో కొబ్బరి చెట్ల మధ్య తూర్పు పొలం, ఐదు ఎకరాలు పచ్చని చేలతో కనిపించింది. చిన్నప్పటి తను ట్రాక్టర్ తో పొలం దున్నటం, తండ్రి తలపాగా చుట్టుకొని మోకాలి లోటు నీళ్ళలో కూలీలతో పాటు నాట్లు వెసూ…

తర్వాత, శరదృతువులో ఏపుగా పెరిగిన పొలాలు గాలికి ఊగుతూ, ఆ తర్వాత సంక్రాంతికి బంగారు రంగులో కుప్పలు రాశులుగా పోసిన ధాన్యం…మరుక్షణం తండ్రి చితిలో మంటలు.. ఆ వెనక మీసాలు గడ్డాలతో నిండిన రామకోటయ్య ముఖం త్రీడీ బొమ్మలా “నీకెందుకురా! నువ్వు అమెరికా ఎల్లి రా.. పొలాలన్నీ నే జూసుకుంటా…” అంటోంది.

గదిలో ఆక్సిజన్ కరువైంది. శివ, శైలూ ఇద్దరికీ ఊపిరి ఆడటం లేదు. చల్లగాలిని ఇవాల్సిన ఏసీ కంప్రెసర్ లోకి ఎవరో విషవాయువు పంపించారు.

మరో గంటలో కలలన్నీ కరిగిపోతాయి. నిశ్శబ్దం. వస్తువులని, మనుషులని, మనసుల్నీ ఆవహించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్…

మామిడిపూడిలో నవీన్ రామకోటయ్య కేసి చూసి తలవూపాడు.

“గట్టోడివే.”మెచ్చుకున్నాడు రామకోటయ్య.

రెండో సూట్ కేస్ చేయి మారింది.

నవీన్ చేతిలో చల్లటి చెమట. సగం ఏసీ మెకానిక్ కి ఇస్తే సగం తనకీ. ఏం సరిపోతుంది? ఫ్లాట్ కొనటానికి ఇంకా కావాలి. కనీసం రెండు కోట్లయినా కావాలి. బయటకు నడిచాడు నీరసంగా. బయట వెన్నెల లేదు. చీకటి వేడిగా కూడా వుంది.

***

తాతరాయి చెప్పిన చరిత్ర

Tatarai Cheppina Katha

అప్పటికి కొంతకాలమైంది నేను నా కొండ నుంచి విడిపడి. పక్కనే వున్న అడ్డరాయితో బాగా పరిచయం కుదిరింది. ఎన్నాళ్ళ నుంచి అలా వుందో కానీ బాగా నునుపుతేలి మిలమిల మెరుస్తూ వుంటుంది. ఆ రోజు కూడా ఎండ నా ఒళ్ళు చుర్రెక్కిస్తుంటే, అడ్డరాయితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. సరిగ్గా అప్పుడే ఓ చిన్న గులకరాయి దొర్లుకుంటూ వచ్చి మా ముందర ఆగింది. నేనేమో అంత ఎత్తు ఇంత లావు వుంటాను. నా ముందు ఆ గులకరాయి ఏ పాటిది. నేను పెద్దగా పట్టించుకోలేదు.

“ఏంట్రా అబ్బాయిలూ మాట్లాడుకుంటున్నారు” అంటూ అటూ ఇటూ దొర్లింది గులకరాయి.

ఆ మాటతీరు అదీ నాకు బాగా చిరాకు కలిగించాయి. ఏదో పెద్దబండవాళ్ళం మాట్లాడుకుంటుంటే, మా మధ్యలో చేరి అలా మాట్లాడినందుకు నాకు చాలా కోపం వచ్చింది.

“ఏయ్… నీకు చిన్నంతరం పెద్దంతరం లేదా? ఏమిటా మాటలు?” గద్దించాను. చిన్నరాయి గరగరా నవ్వింది.

“ఎవరు? నువ్వు పెద్దా? నిన్నగాక  మొన్న పుట్టావు… అంతెత్తున శారీరం వుంటే సరిపోయిందా? వయసు బట్టి గౌరవం కానీ ఒడ్డుపొడవు బట్టి కాదోయ్..” అంది గులకరాయి.

నా కోపం ఇంకా పెరిగిపోయింది. “అయితే నీ వయసు నా వయసు కంటే ఎక్కువంటావు?” అన్నాను.

“ఓరి నీ బండపడ… కనిపించేదాన్ని బట్టి అంచనాలు వెయ్యకూడదురా… సరిగ్గా చూస్తే నేను మీకు తాతనవుతాను” అంటూ తన మీద పడ్డ ఎదురెండ నా ముఖానికి తిప్పికొడుతూ నిలబడిందా గులకరాయి.

అడ్డరాయి భళ్ళున నవ్వింది. “మేము గట్టిగా దొర్లితే భూమిలోకి దిగిపోతావు… నువ్వు మా తాతవా” అంది నవ్వలేక ఒగురుస్తూ.

“సరే, నా చరిత్ర చెప్తా వినండి. తాతనో కాదో మీరే చెప్పండి.” అని కథ మొదలుపెట్టింది. “మా ముత్తాత ఇరవై వేల ఏళ్ళ క్రితం ఒక పెద్ద కొండగా వుండేవాడు. అప్పుడప్పుడే మనుషులుగా మారుతున్న కొన్ని కోతులు ఆ కొండ మీద వుండేవంట. వాళ్ళు తల దాచుకోడానికి, అక్కడక్కడ సేకరించిన తిండి, జంతుకళేబరాలు పెట్టుకోడానికి మా తాతని తొలిచి ఒక గుహ చేసుకున్నారంట. ఆ కాలంలో అట్టా ఏర్పాటు చేసుకున్నోళ్ళే లేరని ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. మా తాత ఒంటిమీద ఏందేందో బొమ్మలు కూడా గీసినారంట ఆ మనుషులు.

కొన్నాళ్ళకి మా తాత ఆ కొండ నుంచి విడిపడి చదరంగా వుండే నేల మీద స్థిరపడ్డాడు. ఇంకొన్ని వేల ఏళ్ళ తరువాత ఓ ఎండాకాలం అనుకోకుండా ఓ చినుకు పడి రెండు ముక్కలయ్యాడు. వాళ్ళే మా పెదనాయన, మా నాయన. వాళ్ళిద్దరూ  ఓ శిల్పి కంట్లో పడ్డారు. ముందు మా నాయనని ఆయన చెక్కి చెక్కి ఓ శిల్పంగా మార్చాడు. అయితే దానికన్నా పెద్దది కావాలని రాజుగారు చెప్పాడంట. మా నాన్నని వదిలేసి పెదనాన్నని పెద్ద శిల్పంగా చేశారట. ఆయన్ని ఆ తరువాత దేవుడు అని పూజలు చేశారు. మతం అని ఒక కొత్త మంత్రం చదివారు. అదో రకం విప్లవం. అయితే పెద్దగా పనికిరాలేదంట.

ఇక్కడ మా నాన్న ఎండకి ఎండి, వానకి నాని నాన్న ఎన్నో ముక్కలయ్యాడు. నేనూ, ఇంకోంతమంది తమ్ముళ్ళు ఈ లోకంలో పడ్డాం. ఆ తరువాత ఒక చోటని లేదు, ఒక ఊరని లేదు. తిరిగి తిరిగి, అరిగి అరిగి అదిగో ఆ లారీలో పడి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి కాస్త సర్దుకునిందా రాయి.

“అట్నా. అయితే నువ్వు ఖచ్చితంగా మా తాతవే… అయితే నాలాంటి పిల్లరాయికి నీ లాంటి తాతరాయి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వుంటాయే… అవన్నీ నాకు నేర్పించు తాతా…” అని మనవడి గోమంతా పడ్డాను నేను.

“అలాగే చెప్తాలే కానీ మనవడా… ఇంతకీ మీరంతా ఎవరు? మిమ్మల్ని ఎవరు పుట్టించారు? ఆ కథలు చెప్పండి ముందు” అంటా పక్కనే వున్న మెత్తటి గడ్డి మీద కుదురుకున్నాడు తాతరాయి.

“మాదేముంది తాతా! అదిగో కొంచెం అవతలగా రాళ్ళని పగలగొడుతూ కొన్ని వింత జంతువులు తిరుగుతున్నాయే అక్కడ వుండేవాళ్ళం. అందరం కలిసి వున్నప్పుడు కొండగుట్ట అనేవాళ్ళు.”  అని నా పక్కనున్న అడ్డరాయి చెప్తుంటే నేను మధ్యలో అందుకున్నా.

“మధ్యలో ఆ వింత జంతువులు పైన ఎక్కి కొంత మనుషులు వచ్చారు. అప్పుడె తెలిసింది వాటిని మెషీన్లంటారని. ఏదో డెవలప్మెంట్ అంటా తలా ఒక జంతువుని మా మీదకు ఎక్కించి గడగడ మంటూ మమ్మల్ని ఇట్టా పుట్టించారు” అన్నాను.

“డెవలప్మెంటా?” అన్నాడు తాతరాయి ఆశ్చర్యంగా. ముసిలిరాయి చాదస్తం చూస్తే మా ఇద్దరికీ నవ్వొచ్చింది.

“నీకు తెలవదులే తాతా… డెవలప్మెంట్ అంటే అభివృద్ధి” అంది అడ్డరాయి అర్థం చెప్తూ.

తాతరాయి గడ్డి మొత్తం గిరగిరా దొర్లుకుంటూ నవ్వాడు. కాస్త ఆగి మళ్ళీ వెనక్కి దొర్లుకుంటూ నవ్వాడు. “ఈళ్ళకి ఇంకా ఈ అభివృద్ధి పిచ్చి చావలేదా?” అన్నాడు ఆగాక.

“అదేంది తాతా? వీళ్ళ అభివృద్ధి గురించి నీకు తెలుసా?” అన్నాను నా నీడ తాతరాయి మీద పడేలా సర్దుకుంటూ.

“తెలియకేం మనవడా… నేను చెప్పానే మా తాత, ఆయన కూడా ఈ అభివృద్ధి గురించి మా నాయనకి చెప్పాడంట. అంటే పదివేల ఏళ్ళ క్రితం సంగతి. ఆ కథ మీక్కూడా చెప్పమంటారా?” అన్నాడు

మేమంతా “చెప్పు తాతా, చెప్పు తాతా” అంటూ అటూ ఇటూ దొర్లాము. తాత కథ చెప్పడం మొదలుపెట్టాడు.

“ఒకప్పుడు… అంటే మా తాత కాలంలో కూడా ఈ మనుషులు వుండేవాళ్ళు…!! వాళ్ళు ఎప్పుడూ వుంటార్లే. చచ్చేవాళ్ళు చస్తుంటే, పుట్టేవాళ్ళు పుడుతుంటారు… అందువల్ల మునుషులు చచ్చినా మనిషి అనే ప్రాణి బతికే వుంటదంట. మనలాగ కాదు… సరే ఏం చెప్తున్నాను… ఆ… ఆ కాలంలో వాళ్ళు అడవుల్లో బతుక్కుంటా, చెట్టుచేమా ఎక్కుతా దిగుతా, కాయదుంప తినుకుంటా వుండేవాళ్ళు. ఒకోసారి గుంపులు గుంపులుగా పోయి, మీ లాంటి రాళ్ళ వెనక నిలబడి ఏదైనా జంతువు దొరికితే వేటాడి, దాన్ని తిని హాయిగా వుండేవాళ్ళు.” మధ్యలో ఆపి అటూ ఇటూ చూసి కొనసాగించాడు తాతరాయి –

“కొన్నాళ్ళయ్యాక ఒక పెద్ద విప్లవం వచ్చింది. దాన్ని ఇప్పటివాళ్ళు వ్యవసాయ విప్లవం అంటున్నారంట కానీ అప్పట్లో దానికేమీ పేరుండేది కాదు… ఏదైతేనేంది మనుషులందరూ, వేటాడ్డం మానేసి వడ్లు, గోధుమలు, దుంపలు పెంచడం మొదలుపెట్టారు. రాన్రాను పరిస్థితి మారిపోయింది. ఎకరాలకెకరాలు అవే వడ్లు, అవే గోధుమలు, అయ్యే దుంపలు… ఎక్కడో చీకటి రాజ్యంలో మొదలైందంట. ఆ తరువాత ఒక రాజ్యామని లేదు, దేశమని లేదు, నదని లేదు, సముద్రమని లేదు …అన్నింటినీ దాటుకోని పొయ్యినాయి. ఎక్కడ చూసినా అవే. ఓ వందా నూటాభై ఏళ్ళు గడిచినాయి. కావల్సినంత పంట, తిన్నంత తిండి… అప్పటిదాకా ఏడాడో తిరిగిన మనుషుల జాతి ఒక చోట కుదురుకున్నారు. గూడేలు, రాజ్యాలు, దేశాలు పుట్టుకొచ్చినాయి. అదే అభివృద్ధి అని పాటలు గట్టి పాడుకున్నారు..”  నేను ఏదో అడగబోతున్నానని తెలిసి అక్కడ ఆపాడు తాత.

నేను అడిగా –“తాతా! నువ్వు చెప్పినట్లు అభివృద్దే జరిగింది కదా… మరి ఆ మాట విని ఎందుకు నవ్వావు?” అన్నాను.

“నీక్కూడా మనుషుల్లానే తొందర ఎక్కువున్నట్లుందే మనవడా ఒక్కరవ్వ ఆగు… చెప్తున్నా కదా… ఎందాక చెప్పాను? ఆ… ఆపాట్న… అందరూ వ్యవసాయ విప్లవం వచ్చిందని సంబరపడ్డారు. నీలాగా నా లాగా కదలకుండా అంతా చూస్తున్న రాయి రప్పా గట్టిగట్టిగా నవ్వుకున్నాయంట. మా తాత (అప్పటికి ఇంకా పిల్లాడే) ఇదంతా చూసి, నీలాగే – “రాళ్ళల్లారా రప్పల్లారా ఎందుకు నవ్వుతున్నారు? అభివృద్ధి జరిగిన మాట నిజమే కదా” అని అడిగినాడంట.

అప్పుడు ఆ పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ నవ్వేసి – “ఒరేయ్ నాయనా… వాళ్ళకంటే బుద్ధి లేక అనుకుంటున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు?” అని అడిగినాయంట. ఇంకా వివరంగా చెప్పమని అడిగితే అయ్యి చెప్పడం మొదలెట్టినాయంట.

“ఒరేయ్ నాయనా… నువ్వింకా చిన్నరాయివి… సుత్తి దెబ్బకు, ఉలిదెబ్బకి తేడా తెలియనివాడివి. వాళ్ళు చెప్పగానే అభివృద్ధి జరిగిపోయిందని నమ్మితే ఎట్లా? ఒక్కసారి వాళ్ళని చూడు. ఇంతకు ముందు పూటకో రకం తినేవాళ్ళు. ఒకపూట ఆకులు, ఇంకోపూట తేనే, ఇంకోరోజు మాంసం, మళ్ళి ఒకరోజు పండ్లు ఇట్టా అన్ని రకాలు తినేవాళ్ళు, ఇప్పుడు చూడు పొద్దున బియ్యం, మధ్యాన్నం బియ్యం, రాత్రికి బియ్యం… ఇదీ ఒక తిండేనా? ఇట్టా తిని తిని, ఏదో ఒకరోజు శరీరానికి సరిపోయే పోషకాలు అందటంలేదని వాళ్ళే ఏడుస్తారు చూడు” అంది ఓ పెద్దతలరాయి.

“అంతేనా… అప్పుడు ఒకచోటని కాకుండా నాలుగు చోట్ల తిరిగే వాళ్ళు… ఆడవాళ్ళు కూడా అడవుల్లో, గుట్టల్లో తిరిగేవాళ్ళు. అట్టా తిరగడానికి బిడ్డలు ఎక్కువుంటే కష్టమని ఒక బిడ్డకి నడకొచ్చిందాకా ఇంకో బిడ్డని కనకుండా వుండేవాళ్ళు. మరి ఇప్పుడు? ఇల్లు కట్టుకున్నారు. చాటు మాటు కుదిరింది. పంటలు పండించేదానికి ఇంకో రెండు చేతులు వస్తాయిలే అని ఒకళ్ళ తరువాత ఒకళ్ళని కంటూనే వున్నారు. జనాభా పెరిగింది. చేతులున్నోళ్ళకి నోళ్ళు కూడా వుంటాయిగా… దానికోసం ఇంకా ఎక్కువ వడ్లు, గోధుమలు పండిస్తున్నారు…  దానికింకా నేల కావాల. ఇది నాదంటే ఇది నాదంటున్నారు. రేపు ఆ నేలకోసం తలకాయలు పగలగొట్టుకుంటారు…” అన్నాడు ఓ రాయప్ప.

తాతరాయి అక్కడ ఆపి కాస్త ఊపిరి తీసుకున్నాడు.

“ఇట్టా వ్యవసాయ విప్లవం గురించి మా తాతకు కథలు కథలుగా చెప్పాయి ఆ రాయీ రప్పా. ఆ కథలే మా తాత నాకు చెప్పాడు. నేను మీకు చెప్పాను” అన్నాడు తాతరాయి

“ఒక్క విప్లవం వెనక ఇన్ని కథలు వుంటాయా తాతా?” అన్నాను నేను ఆశ్చర్యంగా.

Kadha-Saranga-2-300x268

తాతరాయి నవ్వేసి – “అక్కడితో కథ అయిపోలేదు మనవడా… కాలం గడిచి, మా నాయన ఎదిగేసరికి ఇంకా చానా విషయాలు తెలిసాయి. అంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు, పంటలు పండిచడం మొదలుపెట్టాక ఒకే చోట కుదురుకున్నారు… ఆ పొలం చుట్టూ కాపలా వుండాలికదా… అందుకే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇళ్లు కట్టుకున్నారు. అక్కడే తినడం, అక్కడే పిల్లలు, అక్కడే జంతువులు… అప్పటిదాక లేని అంటు రోగాలు మొదలైనాయి. అట్టా కొంతమంది చస్తా వుంటే ఇంకొంత మంది ఇంకో రకంగా చచ్చేవాళ్ళు.

అడవుల్లో వున్నప్పుడు ఇంకో జాతి జనం కొట్లాటకి వస్తే చేతనైతే తిరగబడేవాళ్ళు, చేతకాకపోతే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు పారిపోవటం ఎట్లా? పొలం, పాడి, కొంప, గోడు… అన్నీ అక్కణ్ణే వున్నాయయ్యపోయె..!! కాపాడుకోవాల… కాదని పోతే పస్తులుండి చావాల… కొంతమంది కొట్లాడి చచ్చినారు, ఇంకొంత మంది పస్తులుండి చచ్చినారు. ఎప్పుడన్నా వరి మింగే పురుగొచ్చిందంటే వాళ్ళ దిగుబడి తగ్గి చచ్చినారు…”

“అదేంది తాతా… అంతకు ముందు ఒక పండు దొరకకపోతే ఇంకో కాయో, ఆకో, జంతువో తినేవాళ్ళు కదా?”

“అప్పుడు తినేవాళ్ళురా… విప్లవం దెబ్బకి అయన్నీ మర్చిపోయారు… అదే మనిషికి వుండే శాపం. అభివృద్ధి అభివృద్ధి అని అనుకుంటూ ముందుకు పోతాడా… ఇంక అంతే… చానా దూరం పొయ్యాక వెనక్కి వచ్చే దారి మర్చిపోతాడు. కష్టమో నష్టమో కానీలే అనీ అక్కడే పడి కొట్టుకుంటా వుంటాడు… అదే అభివృద్ధి అని పాటలు కట్టి పాడుకుంటా వుంటాడు. అసలు ఇంకో రహస్యం చెప్పనా?”

“చెప్పు చెప్పు” అన్నాం మేమిద్దరం

“మనిషి అందరికన్నా తెలివైనవాణ్ణని అనుకుంటాడు కానీ వాడంత ఎర్రోడు ఎవరూ లేరు…”

“అదేంది తాతా అంత మాట అన్నావు?” అని ఆశ్చర్యపోయాను.

“చెప్తా చూడు… ఈ వరి, గోధుమలు పెంచడం మొదలయ్యాక ఇదంతా జరుగుతోంది కదా. ఆ వరి మొలకల్లో ఏదో రహస్యం వుందని, అదేందో తెలుసుకుందామని చాలా సార్లు పొలాల్లోకి దొర్లుకుంటూ పొయ్యాను.”

“కనుక్కున్నావా?”

“యాడ కనుక్కునేది… నన్ను పొలంలో వుండనిస్తే కదా మనిషి… రాత్రి పగులు పొలం మీదే కదా వాడి ధ్యాస… నేను కనపడగానే ఎత్తి అవతలకి పారేసేవాడు. ఆ మొక్కలని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడని… నీళ్ళు తెచ్చి పోస్తాడు, మందు తెచ్చి చల్లుతాడు, రాయి రాకూడదు, పురుగు రాకూడదు ఆ పంటకి కుక్క కాపలా కాసేవాడనుకో…” అన్నాడు తాతరాయి.

“తాతా… అంతా బాగానే వుంది కానీ… కుక్క కాపలా అంటావే? కుక్కని మనిషి పెంచుకున్నాడు. అందుకని అది విశ్వాసంగా మనిషిని చూసుకుంది… వరిని గోధుమని కూడా మనిషే పెంచుకున్నాడు కదా…” చెప్పింది అడ్డరాయి.

“అక్కడే బురదలో పడుతున్నావు. ఎంతసేపు మనిషి వైపు నుంచే చూస్తే ఎట్లా? ఒకసారి ఆ మొక్కల వైపు నుంచి ప్రపంచాన్ని చూడు. అసలు రహస్యం ఏంటో తెలుసా… గోధుమని, వరిని మనిషి పెంచలేదు. గోధుమలు, వరి ప్రపంచమంతా పాకడానికి మనిషిని వాడుకున్నాయి. వాడి బతుకేదో వాడు బతక్కుండా, వాటి మాయలో పడ్డాడు తెలివితక్కువ మనిషి. మనిషి కుక్కని పెంచితే అది అడవి నుంచి వచ్చి మనిషి దగ్గర బతికింది. అట్టాగే అడవిలో వుండాల్సిన మనిషి అడవి వదిలేసి, వరి చేలు పక్కన ఇల్లు కట్టుకుంటే ఎవరు ఎవరిని పెంచుకున్నట్లు?” అన్నాడు తాతరాయి. ఆయన చెప్పింది అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని తొక్కుకుంటూ ఎవరో వచ్చారు. సరిగ్గా మా ముందు నిలబడి దూరంగా వున్న నేలని చూపిస్తూ మాట్లాడుకుంటున్నారు.

“అదిగో సార్… అక్కడ టెక్నో పార్క్ వస్తుంది. రోబోటిక్స్ ఇక్కడ, ఎనలటిక్స్ ఈ పక్క. అవర్ కంపెనీ విల్ రెవెల్యూషనైజ్ టేక్నాలజీ. ఈ భూమి మీద మనుషుల లైఫ్ మారిపోతుంది మన ప్రాడక్ట్స్ తో…” అంటున్నాడతను.

నేను తాతరాయి వైపు చూసేసరికి ఆయన దూరంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

***

 గోడకో కిటికీ!

 

 

– రాధ మండువ

~

 

1.

సూర్యోదయం అయి చాలా సేపయింది.  పిల్లలంతా మామిడి చెట్ల మీదకి చేరి గోల చేస్తున్నారు.

ఈ రోజు మా ఆవిడ – కొత్త వధువు, నెల రోజుల క్రితమే నా భార్య అయిన శ్రావణి వస్తోంది.  ఆమెని గురించిన ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్రపట్టకనో,  ఈరోజు ఎలాగూ సెలవు పెట్టాను కదా అనో ఆలస్యంగా నిద్ర లేచాను.

లేచి నిలబడ్డానో లేదో మామిడి చెట్టు మీద నుండి కిటికీ వైపుకి చూస్తూ “గోవిందన్నా,  ఇన్నికి ఆఫీసుకు పోలియా?”  అని అరిచాడొకడు.  నేను నవ్వి చెయ్యి ఊపి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.

ఈ పిల్లలు తెల్లవారనివ్వరు కదా!  శని ఆదివారాలైతే మరీ గోల.  కాస్త పొద్దెక్కేటప్పటికే  చెట్ల మీదకి చేరి ఆటలు ఆడుతుంటారు.  చేరితే చేరారు కిటికీలో గుండా తొంగి తొంగి చూస్తూ మధ్య మధ్యలో నన్ను వెక్కిరిస్తూ ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు.  ఏం మాట్లాడుకుంటారో!?  ఆ కబుర్లకి ఓ అంతూ దరీ ఉండదు.

నేనుండే ఆ రేకుల ఇంటికి ఆ కిటికీ ఒక్కటే ఉంది.  అదంటే నాకు చాలా ఇష్టం.  రాత్రింబవళ్లు అది తెరిచే ఉంచుతాను.  దాన్ని ఈరోజు సాయంత్రం మూసేయాలి,  పూర్తిగా కాదులే అప్పుడప్పుడూ మూసేయాల్సిందే ఇక…   ఆవిడ వస్తుంది కదా?  ఇంట్లో ఆవిడతో కబుర్లు చెప్తూ పక్కన నిలబడితేనో,  ఆమె పక్కన కూర్చుంటేనో – ఈ పిల్లలు చూస్తే ఇంకేముందీ!  ఇక పగలబడి నవ్వుతారు ఎగతాళిగా చూస్తూ.  నాలుక బయటపెట్టి వెక్కిరిస్తారు కూడా!

నేను ఆంధ్రానుండి చెన్నైలో తాంబరంలో ఉండే ఈ ఇంటికొచ్చి దాదాపు నాలుగేళ్ళవుతోంది.  ఇంటి ఓనర్స్ ముందు భాగంలో ఉన్న పెద్ద ఇంట్లో ఉంటారు.  వెనుక ఉన్న రెండు ఇళ్ళల్లో రేకుల ఇల్లు నాది.  మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫెన్సింగ్ కి ఆనుకుని ఉంటుంది.  రెండో వైపు ఖాళీ స్థలం.  ఎవరో ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం కొనుక్కున్నారు.   దాన్లో రెండు మామిడి చెట్లు వేశారో పడి మొలిచాయో మరి – ఉన్నాయి.   స్థలం ఓనర్లు ఎవరో తెలియదు.  చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఎవరూ లోపలకు రాకుండా జాగ్రత్త మాత్రం చేసుకున్నారు.   లోపలున్న చెట్లకి కాసిన్ని నీళ్ళు పోయడం, కాయలు కాస్తే కోసుకుని తినడం,  వాళ్ళకిష్టమైన వాళ్ళకి కాయలు ఇవ్వడం అన్నిటికీ హక్కుదార్లు ఈ చుట్టుప్రక్కల ఉండే ఇళ్ళల్లోని పిల్లలే.  వీళ్ళు నాకు సంతోషాన్ని కలిగించే పిల్ల స్నేహితులు.

మా ఆఫీసు ఉండేది మరైమలైనగర్లో.  తాంబరం నుండి రోజూ ఉదయాన్నే లోకల్  ట్రైన్   పట్టుకుని ఆఫీస్ కి వెళతాను.  బావుంటుంది ఆ ప్రయాణం.   ఉదయం రైల్లో వచ్చే జనమంతా ఫ్రెష్ గా ఉంటారు.  పూలోళ్లు, కూరలోళ్ళు, పాలోళ్ళు, వస్తువులు అమ్మేవాళ్ళతో రైలు బండి కళకళలాడుతుంటుంది.  ప్రతి ఆడామె తల్లో పూలు ఉండాల్సిందే.  ముఖాన ముచ్చటగా కుంకుమ బొట్టు,  పైన అడ్డంగా విభూది.  మగాళ్ళ నుదుటన అడ్డంగానో, చుక్కగానో విభూది ఉంటుంది.   అన్నం, సాంబార్ వారి భోజనంలో నిత్యం ఉండాల్సిందే –  కనుకనేనేమో దాదాపు అందరూ లావుగా ఉంటారు.  అయితేనేం లావుగా ఉన్నా హుషారుగా…  తమిళంలో చెప్పాలంటే సురుసురుపుగా ఉంటారు.

ఎందుకో ఇవాళ పొద్దున్నే వీళ్ళని తల్చుకుంటున్నాను.  ఇవన్నీ నా భార్యకి చెప్పాలనే ఆలోచన వల్ల కలుగుతున్న తలపులేమో!  ఆలోచనల్లోంచి బయటపడి లేచి ఇల్లంతా సర్దాను.  టేబుల్ మీదున్న పుస్తకాల వెనక్కి చేరిన పెళ్ళి ఫోటో గాజు ఫ్రేమ్ నిండా దుమ్ము చేరింది.  నాలుక్కరుచుకుని గబగబా తుడిచి కనపడేట్లు ముందుకి పెట్టాను.

కిటికీ లో నుండి ఓ తల లోపలకొచ్చింది.  “హే గోవిందన్నా ఆఫీసుకి పోలా?”  అంది ప్రక్క పోర్షన్ లో ఉండే వాళ్ళ పిల్ల.  ఏం పేరబ్బా…  ఈ పిల్ల పేరు!?  ఎప్పుడూ మర్చిపోతుంటాను.  “ఇల్లె. పోలా.  ఆంటీ వరాంగో”  అన్నాను.

“ఆంటీ యారూ?”

“ఆంటీ”.

“ఆంటీ అన్నా యారు?”  చిరాకు ఆ పిల్ల గొంతులో.  నాకేం చెప్పాలో అర్థం కాలేదు.  చెప్పినా ఎనిమిదేళ్ళ పిల్లకేం అర్థం అవుతుంది?  గభాల్న ఫోటో తీసి చెయ్యి పైకెత్తి కిటికీలో నుంచి చూపిస్తూ “ఈ ఆంటీ”  అన్నాను.

“ఓ ఉంగళ పొండాటీయా?”  అంది నోరు అంతా తెరిచి నవ్వుతూ.

‘ఓయమ్మ ఈ పిల్ల భలేదే!’  అనుకుని నేను సిగ్గుపడేలోపు ఆ పిల్ల అక్కడనుండి తుర్రుమంది.

హమ్మయ్య ప్రశ్నలతో చంపకుండా వెళ్ళిపోయింది అనుకుని ఫోటో టేబుల్ మీద పెట్టి కిటికీ రెక్కలు వేసేశాను.  అలా వేశానో లేదో “గోవిందూ,  గోవిందూ”  అంటూ కిటికీ మీద కొట్టారు – ప్రక్కింటి బామ్మ…  ఆ పిల్ల నాయనమ్మ.  అబ్బ!  ఆ పిల్ల పేరేంటో గుర్తే రాదు అనుకుంటూ “ఆఁ ఆఁ”  అంటూ కిటికీ రెక్కలు తీశాను.  ఎవరూ లేరు.  ఈలోపే చుట్టుతిరిగి వచ్చి గది తలుపు మీద బాదుతూ ఆమె పిలుస్తోంది.  తెరిచిన కిటికీ రెక్కలని అలాగే వదిలేసి ముందు గదిలోకి ఒక్క గెంతేసి వాకిలి తలుపు తీశాను.

“మనోజ్ఞ సొల్లరా…  ఉంగ పొండాటి ఇన్నికి వరాంగ్లామే!?”  అంది.

ఆఁ…  ఆ పిల్ల పేరు మనోజ్ఞ.  “అవును మామీ!”  అన్నాను.

“సరి సరి నాకు చెప్పొద్దా?  ఎన్ని గంటలకి వస్తున్నారు?”  అంది తమిళంలో.

“సాయంకాలం ఆరుకి రైలొస్తుంది,  ఇంటికి వచ్చేప్పటికి ఏడు అవుతుందేమో”

“పర్వాలేదు,  ఎంత సమయమైనా కానీయ్ లే.  నేరుగా ఇంట్లోకి తీసుకురాకూడదు.  గేటు దగ్గర ఆపి నాకొచ్చి చెప్పు.    దిష్టి తీసి,  హారతిచ్చి లోపలకి తీసుకురావాలి, బ్రాహ్మణుల పిల్లాడివి అయినా ఏమీ తెలియదు ఏమిటో!?”  అంది.  నేను నవ్వుకున్నాను.  ఈ తమిళియన్స్  ఆచార వ్యవహారాలు పాటించడానికి ఎంత శ్రమకైనా ఓరుస్తారు, సహాయం చేస్తారు

“సరే మామీ”  అని నేనంటుండగానే ఆవిడ గబగబా గుమ్మం దాటి గది మలుపు తిరిగింది.  తలుపేసుకుంటుండగా కిటికీలోకి తలపెట్టి చూస్తా “గోవిందూ మీ మామగారు కూడా వస్తున్నారా?” అంది ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి.

“లేదు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు మామీ.  ఈవిడ ఒక్కత్తే వస్తోంది”

“అయ్యో,  భద్రంగా వస్తుంది కదా?”  అంది.

“ఆఁ రాగలదులెండి,  అక్కడ రైలెక్కిస్తే ఇక్కడ నేను దించుకుంటాను,  భయమేమీ లేదు”  అన్నాను.

“సరీ…  వరుంబోదు పూలు పళం వాంగికోంగో”  అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తనింటికే చుట్టం వస్తుందన్నంత హడావుడిగా.

 

2.

 

గడియారం పది గంటలు కొట్టింది.  గంటల శబ్దానికి పిల్లలంతా చెట్ల కొమ్మల మీద నుండే కిటికీ వైపుకి చూశారు.  ఆ పురాతన గడియారం అంటే పిల్లలకి చాలా మక్కువ.   అది గంటలు కొట్టినప్పుడంతా దాన్ని చూడటానికీ,  తమ ఇంటికొచ్చిన కొత్త పిల్లలకి దాన్ని చూపించడానికీ ఆ చువ్వలు లేని కిటికీ లోంచి తలలు లోపలకొస్తూనే ఉంటాయి.  దాన్ని ఈరోజు సాయంత్రం అర్జంటుగా మూసేయాలి అనుకోగానే నవ్వు వచ్చింది.

బజారుకెళ్ళి ఇంట్లోకి కావలసినవి కొనుక్కుని వస్తుంటే మా వీధి వాళ్ళంతా పలకరించారు.  అప్పటికే న్యూస్ వీధి చివరి వరకూ చేరింది.  ఇంట్లోకి వచ్చానో లేదో మూసిపెట్టిన కిటికీ రెక్కల మీద పిల్లలు బాదుతూనే ఉన్నారు.   నేను పట్టించుకోకుండా వంట పనిలో పడిపోయాను – వాళ్ళే కొట్టి కొట్టి పోతార్లే అనుకుంటూ…  నవ్వుకుంటూ…

సమయం నిదానంగా గడుస్తున్నట్లనిపించింది.  మధ్యాహ్నం అన్నం తిని ఎన్నో గంటలయినట్లుంది.  టైమ్ చూస్తే ఇంకా రెండు కూడా కాలేదు.

“గోవిందన్నా,  ఓ గోవిందన్నా”  కిటికీ బాదుతోంది గట్టిగా.  వదలకుండా అరుస్తూనే ఉంది.  ఏం పేరు ఈ పిల్ల పేరూ!!?  ఆఁ మనోజ్ఞ – మనసుకి ఉల్లాసం కలిగించేదా?  ఉత్తేజం కలిగించేదా!?  ఏమోగాని ఇప్పుడు మాత్రం ‘తలుపు తీస్తావా తీయవా’ అని నా గుండెల్ని అదరగొడుతోంది.  లేచి కిటికీ రెక్కలు తీశాను.  గభాల్న ఇద్దరు పిల్లలు లోపలకి తల పెట్టగానే వెనక్కి గంతు వేశాను – నా తల వాళ్ళకి ఢీ కొట్టుకోకుండా…

ఎదురింటి నాడార్ గారి అబ్బాయి కృష్ణని తీసుకోనొచ్చింది.   నాడార్ గారు మా ఫ్యాక్టరీలోనే అకౌంట్స్ క్లర్క్.  ఈ ఇల్లు ఆయన వల్లే దొరికింది నాకు.   “హహహ గోవిందన్నా!  ఎనక్కూ ఉంగ పొండాటి ఫోటో కామింగో” అన్నాడు.

“ఏంటిరా గోల?”  అన్నాను విసుక్కుంటూ…

“నాకు తెలియదు,  నేను కూడా మీ పెళ్ళాం ఫోటో చూడాలి.  మనోజ్ఞ అందరి దగ్గరా ఎచ్చులు కొడుతోంది – ‘నేను గోవిందన్న పెళ్ళాం ఫోటో చూశా’  అని.  నాక్కూడా చూపించు”  అన్నాడు.  వాడు మాట్లాడుతుంటే డబ్బాలో గులకరాళ్ళు పోసి ఊపినట్లుంటుంది.

“అబ్బబ్బ!  ఇరుప్పా,  చెవులు నొప్పి పుడుతున్నాయి, అరవొద్దుండు చూపిస్తా”  అంటూ ఫోటోని తీసి చూపించాను.  చూస్తున్న వాడు కాస్తా గభాల్న నా చేతుల్లోంచి ఫోటో లాక్కుని పరిగెత్తాడు.

“అరేయ్,  ఆగు ఆగు!  ఆగు కృష్ణా!”  అంటూ ముందు గదిలోకి దూకి తలుపు తీసుకుని తిరిగి వెళ్ళే లోపు మామిడి చెట్టు మీదికి చేరారు.   శనివారం కదా,  పెద్దపిల్లకోతి మూకంతా కూడా చెట్ల మీద ఉంది.  ఫోటో ఒకళ్ళ చేతిలోంచి మరొకళ్ళ చేతుల్లోకి మారుతోంది.

‘ఫోటోని ఇవ్వమనీ,  జాగ్రత్తనీ, చిన్నగా – చిన్నగా అనీ’   చెట్ల కింద నిలబడి అరుస్తున్నాను.  ఉన్నట్లుండి ఫోటో అంతెత్తునుండి కింద పడింది.  “అయ్యో!”  అని నేనూ పిల్లలు అందరం ఒక్కసారిగా అరిచాం.  పరిగెత్తి ఫోటోను చేతిలోకి తీసుకున్నాను.  గాజు ఫ్రేము ముక్కలైంది.  అప్పటికే పిల్లలు నా చుట్టూ గుమిగూడారు.  అప్పటి దాకా నవ్వులతో అరుపులతో హోరెత్తిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.   బిక్క ముఖాలేసుకుని నిలబడి ఉన్న పిల్లల్ని చూస్తూ చిన్నగా నవ్వాను.  నేను నవ్వగానే ‘హిహిహి’ అంటూ ఇబ్బందిగా ఇకిలించారు.

“ఫరవాలేదులే,  బజారుకి తీసుకెళ్ళి కొత్త గ్లాస్ వేపించేస్తాను”  అన్నాను.

“కృష్ణా నీదే తప్పు.  వద్దు వద్దు అంటే వినకుండా గోవిందన్న చేతిలోంచి ఫోటో లాక్కొచ్చావు”  అంది మనోజ్ఞ నిష్టూరంగా.

కృష్ణ నా దగ్గరికి వచ్చి “సారీ గోవిందన్నా!”  అన్నాడు.

“సరేలే,  ఈ విషయం ఎవ్వరకీ పెద్దవాళ్ళకి చెప్పొద్దు, సరేనా!?”  అన్నాను వేలు చూపిస్తూ.

ఈ సంగతి మామీకి తెలిస్తే ఇక ‘నేను కాదు గోవిందు నా పని గోవిందు’ అవుతుంది.  పెళ్ళి ఫోటో పెళ్ళికూతురు వచ్చే రోజు పగిలిందని తెలిస్తే ఇక జాతకాలనీ, గుడులనీ, శనిగ్రహపూజలనీ తిప్పుతుంది…  అమ్మో!

పిల్లల ముఖాలు విప్పారాయి.   ‘పిచ్చోడా,  నువ్వెక్కడ మా పెద్దోళ్ళకి చెబుతావోనని మేము భయపడుతుంటే నువ్వే మమ్మల్నిచెప్పొద్దంటున్నావే!?’  అని అనుకుంటున్నట్లు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు.

గోవిందన్నా “ఇందా మాంపళం,  ఉంగ పొండాటికి కుడుంగో”  అని ఓ పిల్లోడు నాలుగు మామిడి పళ్ళు ఇచ్చాడు.  దూరంగా కంచె దగ్గరికి వెళ్ళి గాజుపెంకులు పారేసిన తర్వాత ఆ మామిడికాయలు తీసుకుని లోపలకి వచ్చాను.

అప్పటికి టైమ్ నాలుగయింది.    గబగబానే నీట్ గా తయారై  ఆమెని సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకురావడానికి తాంబరం స్టేషన్ కి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కాను.

radha

3.

 

 

ఆమె వచ్చాక ఆ కిటికీ పూర్తిగా మూతబడిపోయింది.  నేనెప్పుడైనా తీసినా ఆవిడ ఒప్పుకోదు.  వెంటనే మూసేస్తుంది.

“అబ్బ,  ఏమిటండీ ఈ పిల్లరాక్షసులు పడుకోనివ్వకుండా ఒకటే గోల.  పిల్లల్నంటే బెదిరించి పంపించెయ్యొచ్చు,  ఈ మామీకి ఎక్కడనుంచొస్తుందో ఇంత ఓపిక పొద్దస్తమానం ‘ఎన్నాడీ శ్రావణీ,  ఎన్నా పణ్ణరే!?’ అంటా వస్తుంటుంది.  ఇక వీధిలో వాళ్ళు సాయంత్రమైతే చాలు వచ్చే కూరలోళ్ళనీ, పాలోళ్ళనీ,  పూలోళ్ళనీ, పండ్లబళ్ళనీ – ఒక్కట్ని పోనివ్వరు.  అన్నీ కొనాల్సిందే…  కొన్నా కొనకపోయినా ఆపి బేరాలు చేయాల్సిందే.  పైగా రోడ్డంతా రొచ్చురొచ్చుగా నీళ్ళు చల్లి ముగ్గులేయడం,  ఏం పొద్దునేసిన ముగ్గు చాలదా!?  నేను ఏ పుస్తకమో చదువుకుంటా లోపలుంటానా ‘ఎన్నా శ్రావణీ,  పువ్వు వేణుమా,  కొత్త పెళ్ళికూతురివి పూలు కావొద్దా!?’  అని పిలుస్తానే ఉంటారు”  అని అందరినీ వీధిలో వాళ్ళని ఒక్కళ్ళని వదలకుండా విసుక్కుంటోంది.

సరే, చుట్టుప్రక్కలోళ్ళ  రామాయణం ఇదైతే,  బయటికి ఎక్కడికి తీసుకుపోయినా జనాన్ని తిడుతుంటుంది.  పసుపుకుంకుమలూ, విభూదీ గుళ్ళో స్తంభాల మీద,  అరుగుల మీద, వీధుల్లో ఎక్కడంటే అక్కడ పోయడం,  ప్రదక్షిణాలంటూ మురికిలోనే పొర్లు దండాలు పెట్టడం,   పెళ్ళి ఊరేగింపునుండి,  శవాల ఊరేగింపు దాకా ఏ ఊరేగింపు జరిగినా బజార్లు నిండేట్లు పూలు చల్లడం,  ఏ పని మొదలు పెట్టాలన్నా వారం, వర్జ్యం అనడం,  మూఢనమ్మకాలు, అనవసరమైన ఆచారాలు,  ఆ ఆచారల కోసం విపరీతంగా ఖర్చు పెట్టడాలూ – అబ్బా!  ఒకటని కాదు అన్నీ ఈమె కళ్ళకే కనిపిస్తున్నాయి.

రోజులు యాంత్రికంగా – ఇదీ నాకు తక్కువ అని చెప్పలేను కాని – ఏదో చప్పగా గడిచిపోతున్నాయి.  నేను వీధిలో కనపడితే చాలు “విశేషం ఒన్నూ ఇల్లియా గోవిందూ,  కల్యాణం ఆయి ఇవళా నాల్ ఆయెచ్చి!” అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆరోజు…  మా మామగారికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చింది.  ఓ నెల్లాళ్ళు ఉండి ఆయనకి బాగయ్యాకే రమ్మని చెప్పి శ్రావణిని  రైలెక్కించి వచ్చాను.

ఇంట్లోకి రాగానే  ఆ కిటికీ దగ్గరకి దూకినట్లుగా వెళ్ళి రెక్కలు తీశాను.  యుగాల క్రితం దేన్నో కోల్పోయినంత ఆత్రం నా చేతులకి.  కిటికీ అవతల నా కోసం ఎవరో ఉంటారన్న నా భావాన్ని లాగిపడేస్తూ కిటికీ బోసిగా చూసింది నా వైపు.  నిస్సత్తువగా మంచం మీదకి చేరి అలాగే కిటికీ వైపే చూస్తూ పడుకుండిపోయాను.

తమలాగా ఇతరులు బ్రతకడం లేదని ఎందుకీ ఆగ్రహం?  అలవాట్లలో,  ఆచార వ్యవహారాల్లో తేడాలుంటాయేమో కాని సుఖదుఃఖాల భావనల్లో మనిషికీ మనిషికీ ఏమీ తేడా ఉండదని ఈమె ఎప్పటికైనా గ్రహిస్తుందా?  తనలోని రెక్కలని విశాలత్వం పేరుతో మూసుకుంటూ ఉండకుండా తెరిచి వెలుపలకి చూడగలుగుతుందా!?  – నిట్టూరుస్తూ ప్రక్కకి బాగా ప్రక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాను.

“గోవిందన్నా,  హాయ్ గోవిందన్నా,  కిటికీ తీశావే,  భలే”  కృష్ణ గొంతు విని లేచాను.  “ఇంగ వాయే,  వెలియవాయే”  అరుస్తున్నాడు హడావుడిగా.  వాడిని చూడగానే భలే ఆనందం.  నేనంతకంటే వేగంగా కిటికీ దగ్గరకి వెళ్ళి  “ఎన్నా ఆయిచ్చి!?” అన్నాను.

“మా చెల్లి కిటికీలో గుండా లోపలకి చూడాలంట,  నీ గడియారం కూడా చూడాలంట,  చైర్ తెచ్చి ఇక్కడెయ్యవా?  ఎక్కి చూస్తుందంట,  తొందరగా వెయ్యి,  ఏడుస్తుంది వెయ్యి”

“అబ్బబ్బ!  ఉండురా,  నీ అరుపులకి చెవి నొప్పి పుడుతోంది”  అన్నాను కాని వాడి మాటలు నా చెవుల్లో అమృతం ఒలికినట్లుగా ఒదిగిపోతున్నాయి.   కృష్ణ చెల్లి  రోజాకి చైర్ వేయగానే ఆ పిల్ల పైకెక్కి కిటికీలో నుండి తొంగి చూసి “గోవిందన్న ఎంగా!? కానమే”  అంది.  పక్కనున్నా ఎక్కడున్నాడని అడుగుతుందే ఈ పిల్ల?…   లోపల నేనుంటే ఈ పిల్ల బయటనుండి నన్ను చూడాలనమాట.   ఇంకాసేపాగితే ఏడ్చేసిద్దేమో కనపడలేదని –  నేను పరిగెత్తి లోపలకి వెళ్ళాను.  నన్ను చూసి ఆ పిల్ల నోరు పెద్దది చేసి నవ్వింది – అప్పుడే వస్తున్న ఆమె పాల పళ్ళు రెండు తళతళగా మెరిశాయి.

రోజా ఇప్పుడు పిల్లలందరికీ పెద్ద హీరోయిన్ అయిపోయింది.  అంతా తమకే తెలుసన్నట్లు పిల్లలు ఆ పిల్లని చెట్టూ పుట్టా ఎక్కిస్తున్నారు.  ఎక్కడున్నా గడియారం గంటలు మోగితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ పిల్ల.

మామగారికి ఆరోగ్యం బాగానే ఉండటంతో శ్రావణి వచ్చేసింది.

మళ్ళీ ఆ కిటికీ మూతపడింది.    రెండు మూడు సార్లు కిటికీని బాదింది రోజాపిల్ల నేనున్నప్పుడు.  ఇక నేను ఆఫీస్ కి వెళ్ళనప్పుడు ఎన్ని సార్లు బాదిందో మరి,  ఆ పిల్లని మా ఆవిడ తిట్టుకుంటూనే ఉంది.

ఈసారి ఎందుకో నాకు ఆ కిటికీ మూసేయడం గురించి అస్సలు ఇష్టంగా ఉండటం లేదు.  ఆఫీస్ నుండి రాగానే వచ్చి తెరవాలని ప్రయత్నించాను రెండు మూడు సార్లు.  తెరుస్తుంటేనే శ్రావణి పెద్దగా ‘వద్దు వద్దు’ అని అరుస్తుంది.  ఏమైనా అంటే అలగడం వాదనలు.   ఇంట్లో శాంతి ఉండదు.  నేను కిటికీ కోసం ఎందుకులే తగాదాలు అని ఊరుకుంటున్నాను.   జీవితాన్ని సంతోషంగా గడపాలని ఉంటుంది నాకు.   రోజూ సాయంకాలాలు పిల్లలతో బయటే కాసేపు ఆడుకుని అందర్నీ పలకరించుకుని వస్తున్నాను కాని ఆ కిటికీ వైపు చూస్తే అసంతృప్తి కలుగుతూనే ఉంది.

 

 

4.

 

రెండేళ్ళు గడిచినా మాకు పిల్లలు కలగలేదు.   ఇద్దరిలోనూ అనాసక్తి.  ఆరోజు సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి కృష్ణ ఇంటి ముందు పెద్ద గుంపు.  లోపల నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి.  కృష్ణ అమ్మకి మూడోబిడ్డ ప్రసవం కోసం నిన్ననే హాస్పిటల్ లో చేర్పించారని తెలుసు.  ఏమయిందో ఏమో అనుకుంటూ వాళ్ళింటి లోపలకి పరిగెత్తాను.  ఆవిడా, పుట్టిన బిడ్దా ఇద్దరూ చనిపోయారు.

“ఇద్దరు బిడ్డలు చాలదా?  మూడో బిడ్డ ఎందుకు దేశానికి భారం తప్ప”  అన్న శ్రావణి మాటలు గుర్తొచ్చాయి.  ఆమె వచ్చిందేమోనని చూశాను.  బజారు బజారంతా అక్కడున్నారు కాని ఆమె మాత్రం లేదు.  ఈ దుఃఖం ఓ ప్రక్క నన్ను కృంగదీస్తుంటే ఇంత జరిగినా ఆమె రాలేదు అన్న ఆలోచనతో జీవితమంటేనే అసహ్యం వేసింది.

కాళ్ళీడ్చుకుంటూ  గేట్ తీసుకుని మా ఇంటి వైపు నడిచాను.  లోపల నుండి మాటలు వినపడుతున్నాయి.  ఎవరొచ్చారా అని ఆశ్చర్యపడుతూ తలుపు కొట్టాను.  రోజాని ఎత్తుకోని శ్రావణి తలుపు తీసింది.

నన్ను చూడగానే ఆ పిల్ల “గోవిందన్నా”  అంటూ నా మీదకి దూకింది.

పిల్ల ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదండీ.  తీసుకోని వచ్చి స్నానం చేయించి అన్నం పెడితే గబగబా తినేసింది.  పాపం ఎంత ఆకలయిందో ఏమో!”  అంది దిగులుగా.  మానవత్వం లేదని ఆమెని అసహ్యించుకున్నందుకు బాధపడుతూ నా మీదకి దూకిన రోజాని ముద్దుపెట్టుకుని మా ఆవిడని కూడా దగ్గరకి తీసుకున్నాను.

రోజాని తీసుకోని నాడార్ గారి ఇంటికి వెళ్ళి కార్యక్రమాలన్నీ పూర్తయిందాకా అక్కడే ఉన్నాం.

రోజులు ఎవరి కోసమూ ఆగవన్నట్లు గడుస్తున్నాయి.   నాడార్ గారిని నేనే పెద్దవాడినై సముదాయించి ఆఫీసుకు తీసుకెళుతున్నాను.  కృష్ణని,  రోజాని వాళ్ళ పాటీ (నాయనమ్మ) నే చూసుకుంటుంది.   మా ఆవిడకి రోజా బాగా చేరికయింది.  ఈ పిల్ల అల్లరిని ఎంతైనా భరిస్తుంది కాని మిగతా పిల్లల్ని మాత్రం దగ్గరకి చేరనివ్వడం లేదు.  పిల్లలు మాత్రం పాపం రోజాని పిలవాలనో,  రోజా లోపల ఏం చేస్తుందో చూడాలనో వచ్చి కిటికీ తలుపుని,  ఒక్కోసారి తిరిగొచ్చి ఇంటి తలుపుని  కొడుతున్నారు.   వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈమె వాళ్ళని ఇంట్లోకి చేర్చుకోలేదు.  కిటికీ తలుపు తియ్యనే లేదు.

ఆ వారం శనివారం నాడు రోజాకి జ్వరం వచ్చింది.  ఆదివారం శా్రవణి, కృష్ణ నాన్నమ్మ ఇద్దరూ హాస్పిటల్ కి తీసుకెళ్ళి పిల్లని చూపించుకొచ్చారు.   ఆ రాత్రి రోజా ఇంటికి వెళ్ళనని మారాం చేసి మా ఇంట్లోనే పడుకుంది.  సోమవారం సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళేప్పటికి  పిల్ల స్పృహలో లేనట్లుగా ఒకటే కలవరిస్తోంది.  మా ఆవిడ,  మామి,  పాటీ, నాడార్ గారు, కృష్ణ మంచం చుట్టూ కూర్చుని ఉన్నారు.

ఆ రాత్రి పన్నెండు దాకా పిల్ల నుదురు మీద తడిబట్ట వేస్తూ ఒకరం,  అరికాళ్ళకి పసుపు రాస్తూ ఒకరం అందరం మేలుకునే ఉన్నాం.  మామీ అప్పటి దాకా ఉండి ఇంటికెళ్ళిపోయింది.  కృష్ణని తీసుకోని నాడార్ గారు కూడా వెళ్ళిపోయారు.  గోడకి చేరగిలబడి అలిసిపోయిన  పాటీ అక్కడే పడుకుంది.

పన్నెండవుతుండగా  “శ్రావొదినా”  అని అరిచింది రోజా.  శ్రావణి గభాల్న లేచి రోజా మీదకి వంగి “ఏంటమ్మా?  ఏం కావాలి?  తన్నీ వేణుమా?”  అని అడిగింది.

పాప కళ్ళు తెరిచి కిటికీ వైపు చూపిస్తూ “కిటికీ తియ్యవా?  ఫ్రెండ్స్ ని చూస్తాను”  అంది.  నేను ఆ పిల్ల చెయ్యి పట్టుకుని ఇప్పుడు చీకటిగా ఉందమ్మా,  రేపు తీస్తాను,  పొద్దున్నే అందరూ కనపడతారు”  అన్నాను.

“తీసి చూపించు చీకటిని”  అంది.

కిటికీ రెక్కలు తెరిచాను.  చల్లని గాలి లోపలకి తోసుకొచ్చింది.  పుచ్చపువ్వులా వెన్నెల కురుస్తోంది.  మామిడి చెట్లు  రెండూ మరింత పచ్చబడినట్లుగా కనిపిస్తున్నాయి.  రోజా కొంచెంగా నవ్వింది.  నేనూ నవ్వి “పడుకో”  అన్నాను.  కళ్ళు మూసుకుంది కాని ఏవేవో కలవరింతలు.  “గోవిందన్నా నన్ను చెట్టెక్కిస్తావా?  కి్రష్నన్నా నాకు మామిడి కాయలు కావాలి,  నేనేరుకుంటా,  నేనేరుకుంటా.  గోవిందన్నా,  శ్రావొదినకి పిల్లలంటే ఇష్టం లేదా?  కిటికీ ఎందుకు తెరవదు? మేమంటే అస్సలు ఇష్టం లేదా?  పాటీ చెప్పింది – మేము వేరే కులమని రానివ్వదంటగా!?   మా అమ్మేమో  ‘అన్ని కులాలూ ఒకటే’  అనీ, పాపం శ్రావొదినకి తెలియదనీ’ చెప్పింది,  కి్రష్నన్నని మామిడి కాయలు తెమ్మనవా గోవిందన్నా?” –  రోజా కలవరింతలకి శ్రావణి ముఖంలో నెత్తురు చుక్క లేదు.  దిగులుగా చూస్తున్న ఆమె చెయ్యిని నా చేతిలోకి తీసుకున్నాను.

ఏ తెల్లవారు ఝాముకో  ఆ పిల్ల గాఢంగా నిద్రపోయింది.

 

 

5.

 

తెల్లవారింది.  పాటీ లేచి “అబ్బాయిని తీసుకోని వస్తా”  అంటూ  ఇంటికి వెళ్ళింది.  మేము యాంత్రికంగా పనులు చేసుకున్నాం.  నాడార్ గారు  కృష్ణని తీసుకుని వచ్చారు.   “ఈరోజు మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళితే మంచిదా గోవింద్?”  అన్నాడు.

“ఈరోజు జ్వరం దిగిపోతుందిలే అన్నయ్య గారూ,  తగ్గకపోతే సాయంత్రం తీసుకెళతాం”  అంది శ్రావణి.

మా మాటలకి లేచిన రోజా వాళ్ళ నాన్నని ఎత్తుకోమని చేతులు చాపింది.  ఆయన పాపని ఎత్తుకున్నాడు.  “నాన్నా,  నాకు మామిడి కాయలు కావాలి,  కి్రష్నన్నని కోసుకురమ్మను”  అంటోంది కిటికీ వైపు చెయ్యి పెట్టి చూపిస్తూ.

“మామిడికాయలు ఇప్పుడుండవు”  అన్నాడు కృష్ణ.

“మామిడి కాయలు ఇప్పుడు ఉండవమ్మా” అన్నాడు వాళ్ళ నాన్న.

“ఆఁ ఉండవా?  నాకు కావాలి,  నాకు కావాలి”  అని పెద్దగా హిస్టీరియా వచ్చిన దాన్లా ఏడవడం మొదలుపెట్టింది.   వాళ్ళ నాన్న ఎంత నచ్చచెప్పినా వినకుండా అతని భుజం మీద నుండి జారి క్రిందపడి కాళ్ళూచేతులూ నేలకేసి కొడుతూ ఏడుస్తోంది.  ఆ ఏడుపు హృదయవిదారకంగా ఉంది.

నేను గభాల్న రోజాని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి “నాన్నకి తెలియదులేమ్మా…  ఎందుకుండవు?  ఉంటాయి,  కాని నీకు జ్వరం కదా?  నువ్వు తినకూడదు”  అన్నాను.

ఒక్కసారిగా ఏడుపాపేసి నన్నే చూస్తూ “పోన్లే తిననులే ఊరికే చూపించు.  పళ్ళు చూపించు గోవిందన్నా”  అంది.  ఇంకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి.  మంచినీళ్ళు తెమ్మన్నట్లుగా శ్రావణికి సైగచేసి “అవి నీ దగ్గరకి రాకూడదమ్మా ఆ వాసనకే జ్వరం ఎక్కువవుతుంది”  అన్నాను.

“అయితే దూరం నుండి చూపించు”  అంది.

“సరే,  చూపిస్తాలే,  చెట్టెక్కి కోసుకొచ్చి చూపిస్తా”  అన్నాను.

వెక్కిళ్ళు ఆపుకుంటూ “ఆరు కాయలు కోసుకురా గోవిందన్నా,  కి్రష్నన్నకి చెప్పు కోసిస్తాడు”  అంది.

“సరే సరే,  కాసిన్ని నీళ్ళు తాగు”  అని నీళ్ళు తాగించాను.  తాగేసి  పడుకుని నీరసంగా కిటికీ వైపే చూస్తోంది.    పిల్లకి పాలు తీసుకోనొస్తానని మా ఆవిడ లోపలకెళ్ళింది.

“క్రిష్నన్నా,  పో,  కాయలు కోసుకురా పో”  అని కృష్ణకి చెప్తోంది రోజా.  నేను, నాడార్ గారు ముఖముఖాలు చూసుకున్నాం.  ఏం చేయాలో మాకు అర్థం కాలేదు.  కృష్ణ బయటికి పరిగెత్తాడు.  పాలు తాగి కాస్త నిద్రపోతే మర్చిపోతుందిలెండి అన్నాను నేను గుసగుసగా ఆయనతో.   కాసేపు కూర్చుని “అమ్మని పంపిస్తా”  అంటూ ఆయన వెళ్ళిపోయారు.

రోజా పాలు తాగి నిద్రపోయింది.  కిటికీలో గుండా ఎండ రోజా ముఖం మీద పడుతోందని రెక్కలు దగ్గరగా వేశాను.

ఎనిమిదవుతుండగా పిల్లలు కిటికీ దగ్గర తచ్చట్లాడుతుంటే ఏమయిందో చూద్దామని బయటికి వెళ్ళాను.  పిల్లలందరూ గోడకానుకుని నిలబడి ఉన్నారు నిశ్శబ్దంగా.  కిటికీకి కింద నేలమీద  ఆరు మామిడికాయలు కనిపించాయి!  ఆశ్చర్యపడుతూ దగ్గరకి వెళ్ళి చూశాను.  మామిడికాయల్లాగా అట్టముక్కలని అతికించి రంగు వేసి తెచ్చారు.  కొన్ని పూర్తి పసుపు రంగుతో,  కొన్ని అక్కడక్కడా ఆకుపచ్చ రంగుతో!  అచ్చం మామిడికాయల్లాగే!!

“గోవిందన్నా!  వెళ్ళి చెల్లిని లేపి కూర్చోపెట్టు కిటికీలో గుండా వీటిని చూపిస్తాం”  అన్నాడు కృష్ణ.

నాకు కడుపులోంచి ఏమిటో ఇదీ అని చెప్పలేని ఓ ఉద్యేగం కదిలిపోతోంది.  మాట రాని మౌనంతో కళ్ళల్లో తడి వచ్చి చేరింది.   అలాగే నిశ్చేష్టుడినై నిలబడిపోయాను.

మనోజ్ఞ “ఫో, ఫో త్వరగా ఫో,  చూపించి మళ్ళీ బడికి పోవాల”  అంది నా చెయ్యి పట్టి గుంజుతూ.

తెప్పరిల్లి,  మనోజ్ఞని, కృష్ణని పొదువుకుని పిల్లలందరినీ రమ్మన్నట్లుగా చేతులు రెండూ పెద్దగా చాపాను.  అందర్నీ నా కౌగిలిలోకి చేర్చుకున్నాను.    కిటికీ దగ్గరకి వచ్చి రెక్కలు తీసి మా వైపు తొంగి చూస్తున్న శ్రావణి  కళ్ళ నిండా కన్నీళ్ళు.

 

 

6.

 

ఆ తర్వాత ఆ కిటికీ ఎప్పుడూ మూతపడలేదు.  రాత్రుళ్ళు కాదండీ…  పగలు!

*****

 

 

 

 

 

 

 

 

 

తేలియాడే మేఘాల్లో  … తనూజ  

 

సోలో ట్రావెలింగ్ 

 

వి. శాంతి ప్రబోధ

~

ఒక్కదాన్నే .. నేనొక్కదాన్నే..

ఇదే మొట్టమొదటిసారి ఎవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ప్రయాణం..
బెంగుళూర్ కో,  చెన్నైకో, పూనేకో   కాదు.  చిన్ననాటి నుండి కళ్ళింతలు చేసుకుని బొమ్మల్లో చూసి మురిసిన  హిమాలయాలలో తిరుగాడడం తనను చూసి తనే ఆశ్చర్యపోతోంది తనూజ.

 

అద్భుతంగా .. కొత్తగా గమ్మత్తుగా.. నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి నాకు నన్నే ప్రత్యేకంగా నిలబెడుతూ .. బయటి ప్రపంచం తెలియకుండా పెరిగిన నేను నేనేనా…  అనే విస్మయాన్ని వెన్నంటి వచ్చిన ఆనందం ..  ఆశ్చర్యం మనసు లోతుల్లోంచి పెల్లుబికి వచ్చి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి .

 

నా కళ్ళ ముందున్న ప్రకృతిని చూస్తుంటే నేను ఉన్నది ఇండియాలోనేనా ..అనేంత  వైవిధ్యం .. ఆ చివర నుండి ఈ చివరికి ఎంత వైరుధ్యం …?

ఒకే దేశంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య మనిషి ఏర్పాటు చేసుకున్న సంస్కృతీ సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు , భాషలు మాత్రమే కాదు ప్రకృతి కూడా విభిన్నంగానే . విచిత్రంగానే ..  ఆ భిన్నత్వమే.. నూతనత్వం వైపు పరుగులు పెట్టిస్తూ..  కొత్తదనం కోసం  అన్వేషిస్తూ.. భావోద్ద్వేగాన్ని కలిగిస్తూ.. మనసారా  ఆస్వాదిస్తూ… తనువంతా ఉత్సాహం నింపుతుందేమో .. ???  ఒంకర టింకర ఎత్తుపల్లాల గతుకుల రోడ్డులో కదులుతున్న మహీంద్రా జీప్ లాగే ఆమె ఆలోచనలూ .. ఎటునుండి ఎటో సాగిపోతూ ..
తననే పట్టి పట్టి చూస్తున్న బాయ్ చూపులు, హోటల్ ఫ్రంట్ డెస్క్ వాళ్ళ చూపులూ  గుర్తొచ్చాయామెకి .  రూం బాయ్ మొహమాటంలేకుండా హైదరాబాదీ అమ్మాయిలు చాలా ధైర్యవంతులా..  ఆశ్చర్యంగా మొహం పెట్టి మనసులో మాట అడగడం,  విదేశీ మహిళలు ఒంటరిగా రావడం తెలుసు కానీ భారతీయ మహిళలు ఇలా రావడం తానెప్పుడు చూడలేదనడం జ్ఞాపకమొచ్చి ఆమె  హృదయం ఒకింత  గర్వంగా ఉప్పొంగింది. తనకిచ్చిన గొప్ప  కాంప్లిమేంట్ గా ఫీల్ అయింది.

 

దేశంలో ఏ మూలకెళ్ళినా భారతీయ సంస్కృతిలో ఆడపిల్లల స్థానం ఎక్కడో తెలిసిందే కదా.. ఎంత మిస్ అయిపోతున్నారు అమ్మాయిలు అని ఒక్క క్షణం మనసు విలవిలలాడింది. కానీ, కళ్ళ ముందు తగరంలా మెరిసే మంచు కొండల  సుందర దృశ్యాలు కదిలిపోతుంటే  వాటిని మదిలో ముద్రించుకుంటూ మళ్లీ ఆలోచనల్లో ఒదిగిపోయింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనూజ.
మనసులోంచి ఎగిసివచ్చే ఆలోచనల్ని అనుభూతుల్ని ఎక్జయిట్ మెంట్ ని ఎప్పటికప్పుడు పంచుకునే మనషులు లేరనే చిన్న లోటు ఫీలయింది ఆ క్షణం.

వెంటనే హ్యాండ్ బాగ్ తెరిచి ఫోన్ అందుకుంది. సిగ్నల్స్ లేవు.
ప్చ్..  నా పిచ్చిగానీ ఈ హిమపర్వత శిఖరాలపైకి నేను వచ్చానని ఫోన్  సిగ్నల్స్ నాతో పాటు పరుగెత్తుకొచ్చేస్తాయా ? తనలో తనే  చిన్నగా నవ్వుకుంది.  ఆత్మీయనేస్తం మనోరమ ఇప్పుడుండి ఉంటే .. ప్చ్ .. యూ మిస్స్డ్  ఎ లాట్ మనో .. అవును, నిజ్జంగా  మనో .. మనని ఒక వ్యక్తిగా కాకుండా ఆడపిల్లగా చూడ్డం వల్ల ఎంత నష్టపోతున్నామో ..
నీతో చాలా చెప్పాలి మనో.  చూడు నా జీవితంలో ఇంతటి అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయని అసలెప్పుడయినా అనుకున్నానా .. అనుకోలేదే.  కానీ ఆ క్షణాలను మనవి చేసుకునే చొరవ ధైర్యం మనలోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాటిని మనం తెలుసుకోవాలి. మన జీవితంలోకి తెచ్చుకోవాలి. ఆ క్షణాలిచ్చిన వెలుతురులో మన జీవితపు బండిని మనమే నడుపుకోవాలి.

నువ్వు  నా మాటల్ని చిన్న పిల్లల మాటల్లా తీసుకోకుని నవ్వుకుంటావని తెలుసు .  అయినా చెప్తున్నాను , మన జీవితపు  పగ్గాలు మన చేతిలోకాకుండా మరొకరి చేతిలో ఉంటే ఎలా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది.  నాలో పొరలు పొరలుగా కప్పడిపోయిన ఊగిసలాటల పొరలు రాలిపోతూ.. కరిగిపోతూ ఉన్నాయి.

 

ఈ ప్రయాణం జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన  ఇచ్చింది… అది తెల్సుకోలేకపోతే .. ఎంత మిస్సవుతామో, ఎంత కోల్పోతామో నాకిప్పుడు స్పష్టమవుతోంది.
అవును మనో .. నివ్వెంత మిస్ అయ్యావో మాటల్లో చెప్పలేను మనసులోనే మాట్లాడేస్తోంది తనూజ మిత్రురాలు మనోరమతో.  నీలాకాశంలో తేలిపోతున్న మేఘాల్లో ఒక మేఘమాలికలా తనూ తేలిపోతున్నట్లుంది ఆమెకు .

ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ వారి వాహనంలో  గ్యాంగ్ టక్ నుండి ఎత్తు పల్లాల గతుకుల రోడ్డులో కొన్ని గంటల ప్రయాణం.

నేను ఒక్కదాన్నే .. థ్రిల్లింగ్ గా .  ఆ  తర్వాత వచ్చింది చాంగు లేక్.

 

నెత్తి మీద నుండి తేలిపోయే మేఘాల్లోను , కళ్ళముందు పొగమంచులా కదిలిపోయే  మబ్బుల్లోంచి ఈ మూడు గంటల ప్రయాణం.. ఓహ్ .. అమోఘం. అద్బుతం.  ముందున్నవి కన్పించనంతగా మేఘం కమ్మేసి .. ఓ పక్క ఎత్తైన కొండలు మరో వైపు లోతైన లోయలు. వాటి అంచులో ప్రయాణం ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లే సుమా..!.  వాహనం ఏమాత్రం అదుపు తప్పినా , డ్రైవర్ ఏ కొద్ది అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.  ప్రతి టర్నింగ్ లోనూ హరన్ కొడుతూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ .. కమ్మేసిన మేఘం కింద దాగిన సరస్సు ను  చూసి నాలో నిరాశా మేఘం.

 

అంత కష్టపడి వచ్చానా..  లేక్ కన్పించలేదు.  పన్నెండు గంటలయినా సూర్యకిరణాల జాడలేదు.  నిస్పృహతో నిట్టుర్చాను.

అది గమనించాడేమో .. దగ్గరలో  బాబా హర్భజన్ సింగ్ ఆలయం ఉందని డ్రైవర్ చెప్పాడు.

అక్కడికి బయలు దేరా.  పాత టెంపుల్ నుండి  కొత్త టెంపుల్ కి వెళ్ళే దారిలోనే  టాక్సీ డ్రైవర్ ఇల్లు ఉందని తన ఇంటికి ఆహ్వానించాడు.
ఆహ్హాహ్హ.. నాకు వినిపిస్తోందిలే నువ్వేమంటున్నావో .. నీకు బుద్దుందా అని అచ్చు  మా అమ్మలాగే .. తిట్టేస్తున్నావ్ కదూ..? నువ్వు అట్లా కాక మరోలా ఆలోచిస్తావ్ .. ?

కానీ ఇప్పుడు చూడు, నేను ఒంటరి ఆడపిల్లననే భావనే కలుగలేదు తెలుసా ..?!.

 

జనసంచారం లేని కొత్త ప్రాంతం.  డ్రైవర్ వాళ్ళింటికి రమ్మనగానే వెళ్ళాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాను కానీ అది భయంతో కాదు.  శరీరాన్ని చుట్టుకున్న మేఘాల అలల ఒడిలో ప్రయాణం ఎక్కడ మిస్ అవుతానో అన్న మీమాంసతోనే సుమా .  నాకిక్కడ పగటి  కాపలాలు రాత్రి కాంక్షల విచారాలు అగుపించలేదబ్బా …

 

ఇంతటి ప్రతికూల వాతావరణంలో వీళ్ళు ఎలా ఉంటారో .. అనుకుంటూ  డ్రైవర్ తో మాటలు కలిపాను.

ప్రకృతి సౌందర్యం గొలుసులతో కట్టేసినట్లుగా ఉన్న నేను ఇప్పటివరకూ అతని వాహనంలోనే ప్రయాణించానా .. కనీసం అతని  పేరయినా అడగలేదన్న విషయం స్పృహలోకొచ్చి అడిగాను .
అతని  పేరు గోవింద్.  చిన్న పిల్లవాడే. ఇరవై ఏళ్ళు ఉంటాయేమో . చురుకైనవాడు.   చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అక్కడి వారి జీవితం గురించి చెప్పాడు.
మేం వెళ్లేసరికి వాళ్ళమ్మ చేత్తో ఏదో కుడుతోంది.  చేస్తున్న పని ఆపి లేచి తల్లి మర్యాదగా లోనికి  ఆహ్వానించింది.  తండ్రి పగటి నిద్రలో ఉన్నాడు.

నేను మాట్లాడే హిందీ ఆమెకు అర్ధం కావడం లేదు.  ఆమె మాట్లాడే టిబెటియన్ సిక్కిం భాష నాకు తెలియదు.

 

పేదరికం ఉట్టిపడే చెక్క ఇల్లు వారిది. చాలా చిన్నది కూడా . లోపలికి వెళ్ళగానే  రూం హీటర్ వల్ల వెచ్చగా ఉంది.   వాళ్ళమ్మ చేస్తున్న పని ఆపి వెళ్లి పొగలు కక్కే టీ చేసి తీసుకొచ్చింది.  నేను టీ తాగనని నీకు తెలుసుగా .. వాళ్ళు నొచ్చుకుంటారనో లేక  ఆ కొంకర్లు పోయే చలిలో వేడి వేడి టీ తాగితే హాయిగా ఉంటుందనో  గానీ ఆ నిముషంలో వారిచ్చిన టీకి నో అని చెప్పలేకపోయాను .

daari 2

వారిచ్చిన హెర్బల్ టీ  ఆస్వాదిస్తూ పాడి ఉందా అని ఆడిగా.  నాలుగు జడల బర్రెలు ఉన్నాయని అవి టూరిస్ట్ సీజన్ లో వారికి ఆదాయాన్ని తెచ్చి పెడతాయని చెప్పారు. ఎలాగంటే ప్రయాణ సాధనంగా జడల బర్రెని వాడతారట .  నాకూ అలా ప్రయాణించాలని కోరిక మొదలైంది.

 

పాలు, పెరుగు కోసం జడల బర్రె పాలే వాడతారట. చనిపోయిన దాని చర్మంతో చాల మంచి లెదర్ వస్తువులు ప్రధానంగా షూ చేస్తారట .  వాళ్ళింట్లో తయారు చేసిన రకరకాల చేతి వస్తువులు చాలా ఉన్నాయి .  అన్ సీజన్ లో వాళ్ళు ఇల్లు కదలలేరు కదా .. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని తమ దగ్గరున్న వస్తువులతో హండీ క్రాఫ్ట్స్ చేస్తారట.  టూరిస్ట్ సీజన్ లో వాటిని టూరిస్ట్ లకు అమ్ముతారట .  వాళ్ళమ్మ చేసిన వస్తువులు చాలా బాగున్నాయి. వేటికవి కొనాలనిపించినా రెండు హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కొన్నాను. నీ కొకటి , నాకొకటి .

 

తర్వాత గోవిందు వాళ్ళ నాన్నను లేపి నన్ను పరిచయం చేశాడు. తమ భాషలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి వాతావరణం కాస్త అనువుగా మారుతుండడంతో మేం చాంగులేక్ కేసి వెళ్ళిపోయాం.

 

టూరిస్టులు ఎవరూ కనిపించలేదు. చుట్టూ ఎత్తైన పర్వతాలు తప్ప .  దగ్గరకు వచ్చేవరకూ అక్కడ ఒక లేక్ ఉన్న విషయమే తెలియదు. అలాగే వేచి చూస్తున్నా .. గాలికి కదలాడే సన్నని ఉల్లిపొర తెరల్లా నెమనెమ్మదిగా మేఘం తరలి పోతూ .. వెలుతురు పలచగా పరుచుకుంటూ ..

 

చుట్టు ముట్టు ధవళ కాంతులతో మెరిసే పర్వతాల నడుమ దోబూచులాడే మేఘపు తునకల కింద చంగూలేక్ . నా కళ్ళను నేనే నమ్మ లేకపోయానంటే నమ్ము.  అప్పటివరకూ ఈ అందాలను మేఘం చీకటి దుప్పటిలో దాచేసిందా..  కళ్ళ గుమ్మం ముందు అద్భుత సౌందర్యం కుప్ప పోసినట్లుగా .. రెప్పవాల్చితే ఆ సౌందర్యమంతా కరిగి మాయమవుతుందోనని ఊపిరి బిగబట్టి చూశాను .
తెల్లటి మేఘ విహంగాల  మధ్యలోంచి నడచి వస్తున్న జడల బర్రె  మసక మసకగా అగుపిస్తూ . అది ఎక్కవచ్చా.. మనసులోంచి ప్రశ్న పైకి తన్నుకొచ్చింది.  డ్రైవర్ విన్నట్లున్నాడు . మీ కోసమే దాన్ని నాన్న తీసుకొస్తున్నాడు. ఎక్కి సరస్సు చుట్టూ తిరిగి రావచ్చని చెప్పడంతో ఎగిరి గంతేసింది మనసు.
పొట్టి మెడతో నల్లగా పొడవైన జుట్ట్టు చిన్న చెవులు, రంగు కాగితాలు చుట్టి అలంకరించిన కొమ్ములు ,  దాని వీపుపై వేసిన దుప్పటి మన గంగిరెద్దులపై వేసినట్లుగా వేసి ఉంది . కాకపొతే బలంగా కనిపిస్తోంది .

 

మేఘం పోయి వెలుతురు బాగా పరుచుకుంది.  గంట క్రితం ఇక్కడ ఎంత చీకటి .?  పది అడుగుల దూరంలో ఉన్నది అస్సలు కన్పించనంతగా ..
నెమ్మదిగా జడలబర్రె మీద ఎక్కుతుంటే కొంచెం భయమేసింది . ఎక్కడ పడేస్తుందోనని.  నా కెమెరా గోవింద్  కిచ్చి ఫోటోలు తీయించుకున్నా. వాళ్ళ నాన్న యాక్ కి కట్టిన ముకుతాళ్ళు పట్టుకొని ముందు నడుస్తూ లేక్ చుట్టూ తిప్పుకోచ్చాడు .  అప్పుడు నా మనసులో కలిగిన ఉద్వేగాన్ని, అనుభూతుల్ని, అద్వితీయ భావాన్ని  నీకు సరిగా అనువదించగలనో లేదో .. సందేహం ..
వింతగా అనిపిస్తోందా మనో .. చిన్నప్పుడెప్పుడో యాక్ ఫోటో పుస్తకాల్లో చూడడం , చదవడం గుర్తొస్తోందా .. ఆ యాక్ పై కూర్చొని చంగూలేక్ చుట్టూ చక్కర్లు కొట్టి వచ్చా .

 

అక్కడి బోర్డ్ ఇంగ్లీషు, టిబెటియన్ భాషల్లో ఉంది. మనవాళ్ళు  చంగూ లేక్ అంటే ట్సొంగు లేక్ అని టిబెట్ వాళ్ళు అంటారట.   ఈ సరస్సు  సిక్కిం -టిబెట్ బార్డర్ కు దగ్గరలో తూర్పు దిశలో  ఉంది.  ఆ లేక్ కి వెళ్ళే దారి  కొన్నిచోట్ల బాగుంది. కొన్ని చోట్ల కనస్ట్రక్షన్ లో ఉంది. అక్కడ కొండ చరియలు విరిగి పడడం తరచూ జరుగుతూ ఉంటుందట.  కాబట్టి రోడ్లు తరచూ పాడయి పోతుంటాయట.  కంగారు పడకు తల్లీ .. నేను వెళ్ళిన సమయంలో కొండచరియలు విరిగిపడడం జరగలేదులే. అందుకే  ప్రతి మూడు నెలలకొకసారి రోడ్డు వేస్తూనే ఉంటారట. జీప్ కుదుపుతో కొన్ని సెకన్ల పాటు ఆమె ఆలోచనలకు చిన్న అంతరాయం.  ఆవెంటనే మళ్ళీ మనో వీధిలో ఆప్తమిత్రురాలు మనోతో ముచ్చట్లాడుతూ .

 

మనో తిట్టుకుంటున్నావా ..  ఎంత తిట్టుకుంటావో తిట్టేసుకో .. ఇప్పుడు హోటల్ చేరగానే ఫోన్ చేస్తాగా ..  గాంగ్ టక్ లో దిగగానే చేశాను .  అంతే.  నువ్వు నా కాల్ కోసం ఎంత ఆత్రుతపడుతున్నావో ఉదయం నీ మిస్డ్ కాల్స్ చూస్తే అర్ధమవుతోంది.  నిన్న గురుడాంగ్ మార్ లేక్ నుండి రాగానే చేద్దామనుకున్నా .. సిగ్నల్స్ లేక చేయలేకపోయాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు చేస్తాలేవే ..

 

ఆ .. అన్నట్టు , నా పర్యటనలో  ముందటి రోజుల  విశేషాలు చెప్పలేదు కదూ .. నేను గ్యాంగ్ టక్ లో ముందే బుక్ చేసుకున్న హోటల్ చేరానా .. హోటల్ రూంలోంచి దూరంగా కనిపిస్తూ రా రమ్మని ఆహ్వానిస్తున్న హిమాలయాలు, వాటి చెంత చేరాలని ఉవ్విళ్ళూరుతున్న మనసును కొన్ని గంటలు ఆపడం ఎంత కష్టమయిందో..అప్పటికప్పుడు వెళ్లిపోలేను కదా .. !

 

నిరంతరం వచ్చే టూరిస్టులతో నిండి ఉండే హోటల్ వారికి ఇంకా చాలా విషయాలు తెలిసి ఉంటాయనిపించింది.  ఎటునుండి ఎటు వెళ్ళాలి అని మ్యాప్  పరిశీలించా .
నేనున్న హోటల్ లోని టూరిస్టులతో పిచ్చాపాటి మాటలు కలిపాను . వాళ్ళలో బెంగాలీ టూరిస్టులతో పాటు  కొద్దిమంది  విదేశీయులు  ఉన్నారు.   మరుసటి రోజు ఉదయం బయలుదేరి  త్రికోణంలో ఉండే గురుదాంగ్ మార్  లేక్, లాచుంగ్  ఆ తర్వాత యుమ్మాంగ్ ల ప్రయాణం పెట్టుకున్నామనీ , వాళ్ళ వాహనంలో మరో ఇద్దరికి చోటుందని మాటల్లో  చెప్పారు వాళ్ళు.  ఆ హిమపర్వతాల యాత్ర మహాద్బుతంగా ఉంటుందని విని వున్నాను కదా .

daari 9

వెంటనే ట్రావెల్ డెస్క్ వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు టూరిజం డిపార్టుమెంటుతో  కాంటాక్ట్  ఏర్పాటు చేశారు . అదే రోజు నా ఫోటోలు, వివరాలు తీసుకుని మరుసటి రోజు నా ప్రయాణానికి పర్మిట్ వచ్చేలా చేశారు. ఇది  ఏప్రిల్ మూడో వారం కదా .. టూరిస్టులు మరీ ఎక్కువగా లేరు. ఇకనుండీ రోజు రోజుకీ పెరుగుతారట.  అదే టూరిస్టులు ఎక్కువగా ఉండే సమయాల్లో  పర్మిట్ రావడంలో ఆలస్యం కావచ్చట.  నేను వెళ్ళింది పీక్ టైం కాదు కాబట్టి నాకు వెంటనే పర్మిట్ వచ్చేసింది.   నేనూ వాళ్లతో జత కలిశాను . నలుగురు బెంగాలీలు, ఒక విదేశీ నేనూ వెళ్ళాం. ఖర్చు తగ్గుతుంది కదాని అందరం కలసి ఒకే వాహనంలో