పదిహేడు మంది అమ్మల కథలు!

amma kathalu

 

అమ్మ ను గూర్చి కథలూ కవిత్వాలూ ఇవేవీ కొత్తవి కావు మన సాహిత్యానికి. కొన్ని సంకలనాలు కూడా వచ్చాయి. ఐనా ధైర్యం చేసి ” అమ్మ కథలు” అని పేరున సమ్మెట ఉమా దేవి గారు రాసిన కథల  పుస్తకం ఇటీవలే చదవడం జరిగింది. నిజానికి అమ్మ కథలంటే ఎప్పటిలానే ఉంటాయనుకుని చాలా యధాలాపంగా మొదలుపెట్టిన నేను మొత్తం కథలన్నీ ఆగ కుండా చదివేశాను. ఇది అతిశయోక్తి కాదు ఒక తీయని అనుభూతి.

 

ఒక్కొక్క కథ ఒకో విధంగా వైవిధ్యంగా ఉంది చాలా ఆసక్తిగా చదివించాయి. ఈ సంపుటిలోని 17 కథలు చాలా బాగున్నాయి అనేసి ఊరుకోలేము. ఎందుకు బాగున్నాయో కూడా ఒక రెండు మాటలు మీతో పంచుకుందామని నా తాపత్రయం.

అమ్మ అంటే సెంటిమెంట్ , అమ్మంటే ఒక త్యాగ శీలి , అమ్మంటే అన్నీ వరాలిచ్చేసే దేవత అలాంటిది సమ్మెట ఉమా దేవి అమ్మ మాత్రం నిజమైన సహజమైన రక్త మాంసాలున్న మనిషి. హృదయం , దేహం , ఆలోచన కలిగిన ఒక మేధావి , కరుణామృత మూర్తే కాదు కరుకు నిర్ణయాలను తీసుకుని సమాజాన్ని  ఎదిరించి నిలబడ గల ధీశాలి.

 

పదిహేడు కథల్లోనూ పదిహేడు అమ్మలు కనబడతారు. భర్త చనిపోయే ముందర ఎందుకు విడాకులు తీసుకుందా తల్లి అని పిల్లలందరూ సందేహ పడే ఒక కథ. అందరూ అమ్మని నానా మాటలూ అంటున్నా ఎందుకు భరించిందో ఆ అమ్మ మాటల్లోనే విని హతాశులైన పిల్లలు. త్యాగమంటే కేవలం ఉన్న సంపద ప్రేమ ఇవ్వడమే కాదు బాధ్యత ను నెరవేర్చడం కూడా . భర్త పైన మమకారం  లేక కాదు , కానీ పెళ్లి కావల్సిన ఆడ పిల్లలికి శోభాస్కరంగా పసుపూ కుంకుమలతో సాగనంపాలంటే తాను సుమంగళి గా ఉండాలి అన్న  ధృఢ నిశ్చయం తో అపవాదులకోర్చి ఆడపిల్లల క్షేమాన్ని ఆశించిన , నెరవేర్చిన తల్లిని దర్శింప చేసేరు ఉమా దేవి.

ఈ కథ ఎందుకో చాలా కదిలించింది నన్ను. ఇందులో చాలా విషయాలున్నాయి. ఆడపిల్లకి తల్లి అవసరం ఎంత ఉందో తెలుపుతూనే , ఇంకా మారని మన సమాజం లోని ఈ బోలు సాంప్రదాయాలను ప్రశ్నించే కథ ఇది .

 

అమ్మ కథల్లో కొన్ని కథలు హృదయాన్ని ద్రవింప జేసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా “సహాన” కథలో ఉమా దేవి గారు చూపించిన ప్రతీకాత్మకత పాఠకులను చాలా ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లగా ఉన్న పాప అమ్మా వీధిలో కుక్కలే అంటూ ఝడిసి పరిగెత్తు కొస్తే , కంప్లెయింట్ ఇచ్చి ఆ కుక్కల బారినుండి తప్పించిన తల్లి , అమ్మాయి యుక్త వయస్కురాలైనాక ఎందరో మగ వాళ్ళు ఏదో ఒక సాకుతో ఆమెని తాకడానికి ప్రయత్నించడమూ , అది చెప్పుకోలేక ఆ పాప తల్లికి చెప్పినప్పుడు ఎలా తన బిడ్డని రక్షించుకోవలో తెలియని అయోమయ స్థితి లోని ఆ తల్లి మనసులోని వేదనని ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఒక్కసారిగా మన కళ్ల ముందు ఎన్నో ఘాతుకాలు ఆడపిల్లల పై జరుగుతున్నవి గుర్తొస్తాయి, తల్లి తండ్రులు ఎంత వరకు రక్షణ ఇవ్వగలరు? అన్నది మిల్లీయన్ డాలర్ ప్రశ్న . మొన్న బలై పోయిన నిర్భయ , నిన్నటి ఆయెషా ఇలా ఎందరో పసి మొగ్గలు తుంచబడి రాలిపోవడం గుర్తొస్తుంది.

1239667_473249809449813_888003086_n

 

అమ్మ కథల్లోని మరో ప్రత్యేకత ఏంటంటే అన్నీ అమ్మ ప్రేమనే కాక అమ్మ ప్రేమను ఆశించే పిల్లల మనస్సులు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక కథలో ఒక పాప తన అమ్మ తనతో ఉండాలనే ఆస కొద్దీ ఊరికే కడుపు నొప్పి అని ఏడుస్తూ గాబరా పెడుతుంది. డాక్టర్ ఈ పాప అల్లరి కనిపెట్టి ప్రశ్నించినప్పుడు నాకు బాలేక పోతే అమ్మ నన్నే అంటి పెట్టుకుని ఉంటుంది కదా అని ఇలా చెప్పేను అని చెప్పినప్పుడు , వాస్తవం లో ఎందరో ఉద్యోగస్తులైన తల్లులు, పనుల్లోకి వెళ్లాల్సిన తల్లులు పిల్లలల్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన తల్లుల మనసులు కరిగి నీరౌతాయి. అంతే గాక పిల్లల మనసులను కూడా మనం తెలుసుకునే లా ఉంది ఈ కథ.

 

తాను ఎన్నో కథలు రాసినా అవి సంకలనంగా వెయ్యమని వాటిల్లో అమ్మ ప్రస్తావన ఎక్కువగా వచ్చినందున వాటికి “అమ్మ కథలు” అనే పేరు పెట్టమని సూచించిన మంచి రచయిత నవ్య సంపదకులు జగన్నాధ శర్మ కి ముందుగా కృతజ్ఞతలు చెప్పడం ఉమా దేవి గారి సంస్కారాన్ని తెలియజేస్తుంది.

 

కథ ఒక సహజ సిద్ధంగా చెప్పబడేది కనుక , అలానే ఆమె కథలు ఒక్కో జీవితాన్ని గూర్చి మనతో చెప్పినట్టుగానే సాగుతాయి. ఎక్కడా అసహజంగా , అతిశయోక్తిగా మాట్లాడే ఏ పాత్రా మనకి కనిపించదు. ఎందుకంటే ఇవేవీ పాత్రలు కావు వాస్తవ జీవితాలు . అందుకే అమ్మ కథలు చదివితే మనకి అమ్మ ప్రేమే కాదు చాలా  విషయాలు తెలుస్తాయి . మనసు , మెదడు కదిలించే కథలుగా ఈ మధ్య వచ్చిన కథలలో ఉమాదేవి  కథలు పది కాలాలు నిలబడాలని నిలబడతాయని ఆశిస్తున్నాను.

 

“అమ్మంటే” ఎన్నో రూపాలలో  చూపించారు రచయిత్రి. ప్రాణం రక్షించిన ప్రాణదాత , అమ్మంటే ధైర్యం , అమ్మంటే బహురూపాలలో తన సంతానాన్నే కాదు ఎందరికో సహాయం చేసే దేవత.

అందుకే అమ్మ కావడం గొప్ప విషయమే కానీ అమ్మతనం కలిగి ఉండటం మరింత గొప్ప విషయం. ఈ అమ్మతనాన్ని తన కథల్లోని అమ్మల్లో ఆవిష్కరించారు ఉమా దేవి.

 

కథలన్నిటిని వర్ణించి విసిగించడం నాకు ఇష్టం ఉండదు . ఆమె రాసిన కథల్లోని సారాన్ని చెప్పడం , మృదు మధురమైన సరళమైన ఆ శైలి ఎలాంటి వారినైనా ఆకట్టుకోగల ఆ చెప్పే నేర్పు. వెరసి అన్నీ కలిసి “అమ్మ కథలు” గా మనముందు అక్షరాల రూపం లో పొందు పరిచి అందించిన ఈ స్నేహ మయి కి కృతజ్ఞతలు . మంచి కథలు రావడం లేదు అనే సాహితీ ప్రియులకు ఉన్నాయమ్మా ఉన్నాయి మా మంచి కథలు సమ్మెట ఉమా దేవి గారి “అమ్మ కథలు ” అని చెప్పాలనిపించి ఈ రెండు మాటలూ .

మరిన్ని మంచి కథలు అమెనుండి ఆశిస్తూ ….ప్రేమతో

జగద్ధాత్రి

1231658_539630582777569_2120927918_n

కురూపి భార్య: చిన్న కథలో ఎన్ని కోణాలు!?


KODAVATIGANTI-KUTUMBARAO
కురూపి భార్యలో కథకుడి (అంటే తన కథ చెప్పుకున్నతనే) టోన్ నీ, నాటి సాంఘిక వాస్తవికతని వాచ్యంగా చెప్పిన దాని వెనక ఉన్న వ్యంగ్యాన్నీ అర్థం చేసుకోకపోతే కథ ప్రయోజనం నెరవేరలేదన్నమాటే. మామూలు మనుషుల మనసుల్లో సంఘం చేత ప్రోది చెయ్యబడ్డ (implant చేసి పెంచబడ్డ) కుహనా విలువలూ, మానవ సంబంధాలలో (ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య) ప్రేమరాహిత్యం, డొల్లతనమూవాటి పరిణామంగా హృదయాలు పూర్తిగాఎండిపోయిఅసూయా క్రౌర్యాలతో విరుచుకుపడటమూ (సంఘం ఏర్పాటు చేసినకట్లని ఎవరెపుడు కొంచెం వదులు చేసుకోవాలని ప్రయత్నించినా) – ఇవన్నీ చిన్న కథలో ఇమడ్చగలిగాడు కొ.కు.

నాటి పెళ్ళిళ్ళన్నీరాసిపెట్టినవేస్నేహం, ప్రేమ అనేదాని అర్థంతో కానీ అవగాహనతో కాని సంబంధం లేకుండా (బహుశా నాటికీనేమో!). అలా వచ్చి పడ్డ సంబంధాలలోనే ప్రకృతి సహజమైన సుఖం వెతుక్కునేఅల్పసంతోషిఅయిన కథకుడి మెదడులో అందచందాలకున్న ప్రాముఖ్యాన్ని చొప్పించింది సంఘం. ఆమెతో కాపురం చెయ్యడానికి అతనికి ఉన్న అభ్యంతరంఅతనిలోని సహజ ప్రకృతికీ, సంఘం తయారు చేసిన అతనిఅభిప్రాయానికీజరిగిన సంఘర్షణలోంచి వచ్చిందే. కథకుడు కూడా (మనందరిలాగే) సంఘంలోని మామూలు మనిషి. కురూపి భార్య చనిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకునే వీలు గురించి ఆలోచించడమూ, కురూపి భార్యతో ఎటువంటి స్నేహభావం పనికి రాదన్న తీర్మానమూ, కాటుక రంగుని చర్మం రంగుతో సమానం చేసినోరుజారడమూ” – ఇవన్నీ దీన్నే సూచిస్తాయి. కానీ అతనికి కూడా ఎక్కడో (మనలాగే) చటా్రల నించి బయట పడాలనే జిజ్ఞాసా, స్పందించే హృదయమూ (ఒక్కసారిగా అన్నీ మర్చిపోయిఎందుకు ఏడుస్తున్నావు?” అని అడగడం) ఉన్నాయి. అందువల్లనే అతనిలోని ప్రేమని వెలికి తెచ్చుకోగలిగాడు. “కురూపి అయిన భార్య మీద ప్రేమ చూపించరాదుఅన్న అభ్యంతరాన్ని దాటినాక (ఇక్కడ కూడా కొ.కు అతనిని idealise చేయకుండాకోకిల కంఠస్వరాన్నీ, అందమైన జుట్టునీ ఇంకా అంతకన్నా ముఖ్యం ఆమెలో ఉన్న స్నేహాన్ని, ప్రేమని చిత్రించారు balance tilt అవడానికి) కూడా సంఘం అతన్ని వదల్లేదు. ఇంకో రకం గా చెప్పాలంటే సంఘం చేత ప్రభావితమయ్యే లేత, బలహీనమైన మనసు అతన్ని పట్టుకొని పీడిస్తూనే ఉంది.

దీన్నించి బయట పడటానకి కొంత గడుసుగా ప్రయత్నించినట్లున్నాడు ( నాలుగు రోజులూ ఏదో విధంగా గడిచిపోనివ్వమనికోప్పడటమూ“, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకో అందగత్తె దొరక్కపోతుందా అని భార్యని ఏడిపించడమూ వగైరా) కానీ ఫలితం లేకపోగా చుట్టూ ఉన్న వాళ్ళు భార్య పట్ల స్నేహాన్నీ, ప్రేమనీపశుకామంగా పరిగణించి హేళన చెయ్యడం మొదలుపెట్టారు.

 

సంఘం ఏర్పాటు చేసిన ప్రమాణాలు లేని రూపం ఉన్నవాళ్ళతో (అందునా భార్యతో) స్నేహంగా, ప్రేమగా ఉండటం అనేవి ఆనాటి సాంఘిక పరిస్థితులలో ఊహించడానికి కూడా కష్టమేనేమో చాలా మందికి!

 

ప్రపంచం లోని విషయాలన్నీ తమ అవగాహనకే లోబడి ప్రవర్తించాలనుకునే కుహనా శాస్త్రవాదులు (మేనమామ కొడుకు) చెప్పినది (మరొక స్తీ్రని ఎరుగని కారణం చేతనే పశుకామం కొనసాగుతుందనడం) కథకుడికి సహించరానిదయింది.

 

తన జీవితాన్ని వెలిగిస్తున్న భార్య సాహచర్యమూ, తాము ఎంతో తమకంగా అనుభవిస్తున్న ప్రేమానుభవాలూ (కళ్ళతో మాట్లాడటం, భార్య తన కంటి భాష కోసం వెతకడం, ఒళ్ళు జిల్లుమనడం, ముక్కుతో చక్కిలిగింతలూ); ఇవన్నీ కాక తన అనాకారితనం వల్ల భర్తకు కలుగుతున్న తక్కువతనాన్ని తల్చుకొని ఆమె పడే బాధవీటి వల్ల కథకుడికి తన భార్య మీద ఉన్న ప్రేమ ద్విగుణీకృతం అవుతున్నది ఒక పక్క.

ఇంకో పక్క సంఘం ఇదికేవలం పశుకామమేఅని నిర్థరిస్తున్నది. సమస్యని తెగ్గొట్టడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఇంకో ఆడదాని పొందుని రుచి చూసి తేల్చుకోవడంఅప్పటికీ తన భార్య పట్ల తనకున్న సంబంధం లో మార్పు రాకపోతే అదికేవలం కామంకానట్లే.


కథకుడు ఇంకొక స్త్రీతో  సంబంధం పెట్టుకోకుండా, తనకు భార్యకు మధ్యలో ఉన్న అనురాగం (కథకుడి మాటల్లోనువ్వు కూడా చక్కని దానివేనని“) నిజమేనని తేల్చుకోలేడు. అందుకనే అలా చెయ్యాల్సొచ్చింది.

 

కథకుడిని నవమన్మధుడిగా వర్ణించడం కొ.కు శిల్పం లోని నేర్పు. సంఘటన (ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం అనేది) సులువుగా జరగడానికి వీలుగానే ఇలా కథకుడిని నవమన్మధుడిగా చిత్రించారనిపిస్తుంది.

 – రాధ మండువ

కథకి లింక్  http://ramojifoundation.org/flipbook/201402/magazine.html#/54

అనుభవ చైతన్యం + స్పష్టత = సి. సుజాత కథలు

మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి. సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని గమనిస్తే ఇవాల్టి జీవితంలో అమానవీయ ధోరణి ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థమవుతుంది. వీటిని ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావమనే పేరుతో తేలికగా తీసుకుంటున్నారు.  కానీ అలా తేలికగా తీసికోవాల్సిన అంశం కాదు. అత్యంత వేగవంతమైన, సాంకేతిక పరిఙ్ఞానం అందుబాటులోకి  వచ్చి, మనిషి జీవన ప్రమాణాన్ని పెంచింది. కానీ బుధ్ధి నైశిత్యం సంకుచిత పరుధులకు లోనవుతుంది. దీనిని ఎదుర్కోవడం స్త్రీవాద తాత్విక పరమైన సృజనాత్మక సాహిత్యం ద్వారా కొంతవరకు సాధ్యమవుతుంది. రచయితలు ఈ మాయాజాలానికి అతీతంగా తాత్విక అధ్యయనంతో విశాల దృష్టి కోణాన్ని సంతరించుకోవడం ద్వారానే మంచి సృజనాత్మక  సాహిత్యం లభ్యమయ్యే అవకాశం వుంది.

సామూహిక లేక నిర్థిష్ట సమాజ సంబంధమైన విషయాలను మాత్రమే ప్రతిఫలించటం వలన గత రెండు దశాబ్దాల కాలంలో సాధికారత చేకూరే ప్రక్రియ ప్రారంభమవటంతో స్త్రీవాద సాహిత్యం బలమైన వ్యక్తీకరణకు నోచుకుంది. ఈ తరహా ఆలోచనలు గత రెండు దశాబ్దాల కాలంలో  చాలా వరకు తెలుగు కాల్పనిక సాహిత్యంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు దోహదం చేసిన స్త్రీ రచయితలలో సి. సుజాత ఆలోచనలు ప్రతిబింబించాయి.

sujatha photo

నాలుగు దశాబ్దాలుగా కాల్పనిక సాహిత్యాన్ని సృజిస్తున్న సి. సుజాత, స్త్రీల జీవితాన్ని సమస్త కోణాల్నించి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ పార్శ్వాల నుండి విడివిడిగా రచనలు చేస్తున్న వారి రచనలలో జీవితాన్ని గురించిన అవగాహన సమగ్రంగా వ్యక్తంకాదనే అభిప్రాయం వుంది. అలాంటి సాధారణీకరణల్లోంచి, అవగాహనల్లోంచి, నమ్మకాల్లోంచి సుజాత చాలా బలమైన కాల్పనిక సాహిత్యాన్ని సృజించారు. సుజాత ఇంతవరకు మూడు సంపుటాల కథా సాహిత్యాన్ని రెండు నవలల్ని ప్రచురించారు. సుజాత కథలు, రెప్పచాటు ఉప్పెన, సప్త భుజంగాలు ద్వారా స్త్రీల సాహిత్య ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగినారు. ఇటీవల వచ్చిన ’నెరుసు” కథా సంపుటి, ”రాతిపూలు’ నవల రెండూ సుజాతను సీరియస్ స్త్రీవాద కాల్పనిక సాహిత్య కారిణిగా తన సామర్థ్యాన్ని మరోసారి శక్తివంతంగా ఋజువు చేసుకోగలిగింది. స్త్రీవాదం చర్చకు పెట్టిన పితృ స్వామ్య అణచివేత రూపాలైన ఇంటిచాకిరి, లైంగికత, పునరుత్పత్తి హక్కులు లాంటి అంశాలన్నీ సుజాత సాహిత్యంలో ముఖ్యంగా ‘రెప్పచాటు ఉప్పెన’, ‘నెరుసు’ కథా సంపుటాలలోని కథలు మిగిలిన సాహిత్యం కంటే చాలా బలంగా, గాఢంగా స్త్రీవాద తాత్వికతలోని వ్యక్తరూపాలుగా దర్శనమిస్తాయి. ఉదాహరణకు చాలామటుకు సంక్లిష్ట సంధర్భాల్లో కూడా సుజాత కథల్లోని పాత్రలు నిరాశలో మునిగిపోవు. పరిస్థితులను అర్థం చేసుకుని, తమంతకు తామే స్వీయ చైతన్యంతో ప్రవర్తిస్తాయి. జీవితానికి కావాల్సిన స్వేఛ్ఛా స్వాతంత్ర్యాల స్వరూపం ఎలా వుంటుందో, వాళ్ళు జీవితాన్ని పెంపొందించుకొనే క్రమంలో తెలుస్తుంది . జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తాయో ఆమె కథల్లోని పాత్రలన్నీ నిదర్శనంగా నిలుస్తాయి. . ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు జీవితాన్ని కోల్పోయేంత స్వేఛ్ఛ పొందేవిగా ఉండరు. అలా కోల్పోయేంత స్వేచ్చ ఉండకూడదన్న అవగాహన సుజాతకు వుంది. జీవితంతో మమేకమైన స్వేఛ్ఛను, తమకు కావాల్సిన లేదా పొందాల్సిన స్వేఛ్ఛ గురించి తమ పాత్రల ద్వారా శక్తివంతంగా వ్యక్తం చేసే క్రమంలో సుజాత తాను పొందిన స్వీయ అనుభవ చైతన్యం ఈ కథల్లో పర్యవసించడం వల్లనే ఈ కథలు ఇంత వాస్తవికంగా తయారయ్యాయని చెప్పవచ్చు. స్త్రీవాద సిధ్ధాంతం ప్రతిపాదించిన లైంగికత వైవాహిక వ్యవస్థ పైన చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దికున్న భావనలు (concepts) సహజీవనం (living together) స్వలింగ సంపర్కం (Lesbian) ఒంటరి స్త్రీలుగా (Single women) ప్రత్యామ్నాయ జీవన విధానాలుగా చర్చకు వచ్చాయి.ఈ భావనలన్నింటినీ సి. సుజాత , ‘బీటెన్ ట్రాక్’, ‘చందన’, ‘నా దారిలోనే’ కథల్లో చిత్రించారు.

 

నాలుగు దశాబ్దాలుగా కాల్పనిక సాహిత్యాన్ని సృజిస్తున్న సి. సుజాత,  స్త్రీల జీవితాన్ని సమస్త కోణాల్నించి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ పార్శ్వాల నుండి  విడివిడిగా రచనలు చేస్తున్న వారి రచనలలో  జీవితాన్ని గురించిన అవగాహన  సమగ్రంగా వ్యక్తంకాదనే అభిప్రాయం వుంది.  అలాంటి సాధారణీకరణల్లోంచి,  అవగాహనల్లోంచి, నమ్మకాల్లోంచి సుజాత చాలా  బలమైన కాల్పనిక సాహిత్యాన్ని సృజించారు. సుజాత ఇంతవరకు మూడు సంపుటాల కథా సాహిత్యాన్ని రెండు నవలల్ని ప్రచురించారు. సుజాత కథలు, రెప్పచాటు ఉప్పెన, సప్త భుజంగాలు ద్వారా స్త్రీల సాహిత్య ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని  సంపాదించుకోగలిగినారు. ఇటీవల వచ్చిన ’నెరుసు” కథా సంపుటి,  ”రాతిపూలు’ నవల రెండూ  సుజాతను  సీరియస్ స్త్రీవాద కాల్పనిక సాహిత్య కారిణిగా తన సామర్థ్యాన్ని మరోసారి శక్తివంతంగా ఋజువు చేసుకోగలిగింది.

స్త్రీవాదం చర్చకు పెట్టిన  పితృ స్వామ్య అణచివేత రూపాలైన ఇంటిచాకిరి, లైంగికత, పునరుత్పత్తి హక్కులు లాంటి అంశాలన్నీ సుజాత సాహిత్యంలో ముఖ్యంగా ‘రెప్పచాటు ఉప్పెన’, ‘నెరుసు’ కథా సంపుటాలలోని  కథలు మిగిలిన సాహిత్యం కంటే చాలా బలంగా, గాఢంగా స్త్రీవాద తాత్వికతలోని వ్యక్తరూపాలుగా దర్శనమిస్తాయి. ఉదాహరణకు చాలామటుకు సంక్లిష్ట సంధర్భాల్లో కూడా సుజాత కథల్లోని పాత్రలు నిరాశలో మునిగిపోవు. పరిస్థితులను అర్థం చేసుకుని, తమంతకు తామే స్వీయ చైతన్యంతో ప్రవర్తిస్తాయి. జీవితానికి కావాల్సిన స్వేఛ్ఛా స్వాతంత్ర్యాల స్వరూపం ఎలా వుంటుందో,  వాళ్ళు  జీవితాన్ని పెంపొందించుకొనే క్రమంలో తెలుస్తుంది .  జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తాయో ఆమె కథల్లోని పాత్రలన్నీ నిదర్శనంగా నిలుస్తాయి.  .  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  వాళ్ళు జీవితాన్ని కోల్పోయేంత స్వేఛ్ఛ పొందేవిగా ఉండరు.  అలా కోల్పోయేంత స్వేచ్చ ఉండకూడదన్న అవగాహన  సుజాతకు వుంది. జీవితంతో మమేకమైన స్వేఛ్ఛను, తమకు కావాల్సిన  లేదా పొందాల్సిన  స్వేఛ్ఛ గురించి తమ పాత్రల ద్వారా శక్తివంతంగా వ్యక్తం చేసే క్రమంలో సుజాత తాను పొందిన  స్వీయ అనుభవ చైతన్యం ఈ కథల్లో పర్యవసించడం వల్లనే ఈ కథలు ఇంత వాస్తవికంగా  తయారయ్యాయని చెప్పవచ్చు.

స్త్రీవాద సిధ్ధాంతం  ప్రతిపాదించిన లైంగికత వైవాహిక వ్యవస్థ పైన చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దికున్న భావనలు (concepts) సహజీవనం (living together) స్వలింగ సంపర్కం (Lesbian) ఒంటరి స్త్రీలుగా (Single women) ప్రత్యామ్నాయ జీవన విధానాలుగా చర్చకు వచ్చాయి.ఈ భావనలన్నింటినీ సి. సుజాత , ‘బీటెన్ ట్రాక్’, ‘చందన’, ‘నా దారిలోనే’  కథల్లో చిత్రించారు.

స్త్రీవాద రచయితగా సుజాత మాతృత్వం పట్ల పితృస్వామ్యం  ఏర్పరచిన భావనలను బద్దలుకొట్టి, పునరుత్పత్తి క్రమంలో స్త్రీలు వంటరివాళ్ళుగా మారుతున్న క్రమాన్ని ‘నేనొక్కదాన్నే’, ‘త్రీ ఇన్ ఒన్’  కథల్లో చిత్రించారు.  స్త్రీలు పెళ్ళికాకముందు చేయని పనులన్నింటినీ పెళ్ళయిన తరువాత ఎవరూ చెప్పకుండానే చేసుకుపోయేంత తర్ఫీదు తల్లులు, నాయనమ్మలు, అత్తల ద్వారాగ్రహించడం జరుగుతుంది. అందువలననే అమ్మాయిలు ఈ కథల్లో ఆటోమేటిక్ గా ఆపనుల్ని ఒకరు చెప్పకుండానే చేసుకుపోయే తత్వాన్ని జెండర్ దృక్పథంతో సి. సుజాత చర్చించారు. పుట్టినప్పటి నుంచీ అలవాటు లేని పిల్లల పెంపకం బిడ్డ పుట్టి పెరుగుతున్న కొద్దీ తమ చేతుల స్పర్శ తల్లుల సేవల్లో వాళ్ళెంత హాయిగా, సౌకర్యంగా వుండగలరో తెలుసుకోవటం అంతెందుకు గర్భం ధరించగానే దూకుడు తగ్గించి నడవడం దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమ్మ నాయనమ్మల పర్యవేక్షణలో అమ్మాయిలు తల్లులుగా రూపాంతరం చెందే క్రమాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే చదువుల విషయంలో కూడా చక్కగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించి, వాళ్ళ సంతృప్తిని గెలుచుకోవడం, వాళ్ళందరి దృష్టిలో నమ్రత కలిగిన తెలివైన ఆడపిల్లలుగా ఎలా తీర్చి దిద్దబడతారో అందులోని నియంత్రణ అధికారపూర్వకంగా కాక ప్రేమ పూర్వకంగా సాగడం వలననే ఆ తీవ్రతను,వత్తిడిని స్త్రీలు గుర్తించలేకపోతున్న క్రమాన్ని రేవతి పాత్ర ద్వారా వ్యక్తం అవుతుంది.  ఈ వరుసలోనే, తల్లితండ్రుల పెంపకంలో పెరిగిన  ఆమె చంద్రాన్ని పెళ్ళాడిన దగ్గరి నుంచీ ఏ ఇబ్బందీ కలుగకుండా ఒద్దికైన భార్యగా పేరు తెచ్చుకునే క్రమమంతా కూడా “ ఎవరినీ నొప్పించరాదనే తారకమంత్రాన్ని” పఠించడంతో వచ్చిన  అనిభవంగా గుర్తించడంలోనే రేవతి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. తనకు తెలియకుండా తనను కంట్రోలు  చేయగలిగిన శక్తులన్నింటికి తల వంచింది.  తన జీవితం తన చేతుల్లో కాక మరెవరో గీసిన హద్దుల్లోంచి, ఇంకెవరో డిజైన్ చేసిన జీవితాన్ని ఆ చట్రంలోనే ఆమె జీవితాన్ని ఎవరో పేక్ చేసి ఇస్తున్నారనే భావన కలిగింది. భర్త చంద్రం రేవతీకి ఉద్యోగరీత్యా వచ్చిన ప్రమోషన్ ను వద్దని చెప్పదం వలననే, ఆమె అస్థిత్వం ప్రశ్నార్థకం లేదా సమస్యాత్మకమవుతున్న విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే, రేవతి కంటే పాఠకులే ముందు గ్రహించగలుగుతారు.

ఇన్నాళ్ళు తనని స్వేఛ్ఛా జీవిననే భావంలో  నిలబెట్టిన విశ్వాసం ఎంత బలహీనమైనదో అర్థమవుతుంది. రేవతి పర్సనల్, పబ్లిక్ జీవితాలు రెండూ ఎవరి కంట్రోల్ లో వున్నాయో , చంద్రం ప్రమోషన్ వద్దని చెప్పినప్పుడు మాత్రమే తన స్వతంత్ర పరిథి ఎంతో ఆమెకు తెలుస్తుంది. ఇది కొంచెం సినిమాటిక్ గా అనిపించినప్పటికీ సుజాత తన రచనలో చూపించిన నైపుణ్యం వలన పాఠకులు దీనిని  లోపంగా గుర్తించరు.

“ తన కోసం ఫిల్టర్ చేసిన కాఫీలాగా కాచి –  చల్లార్చి –  సిధ్ధం చేసిన జీవితం తన కోసం ఎవరో షేక్ చేసిన జీవితం …. కంప్యూటర్ లోకి ఎక్కించిన  ప్రోగ్రామ్ లాగా అక్షరం తేడా లేకుండా ఖచ్చితమైన స్టాటిస్టికల్ రిపోర్ట్” (పే-౨౨) లాంటి జీవితం తల్లి నాయనమ్మల చేతుల్లోంచి చంద్రం చేతుల్లోకి మారి పధ్ధతిగా, నిదానంగా చిక్కుడు పొద మీద పాకే గొంగళి పురుగులా నడిచే జీవితం  తనకు వద్దనుకుంటుంది.  తన జీవితాన్ని ’గొంగళి పురుగు”  లాంటిదని రేవతి  Identity అవ్వడంలోనే ఆపాత్ర చైతన్యం వ్యక్తమవుతుంది.  తన సొంత ఆలోచనలకు ఆస్కారం ఇవ్వని జీవితం, పొందికగా తయారయిన జీవితం, ఎలా వుంటే అందరి మన్ననలకు పాత్రమవుతారో అలా తయారైన జీవితం. సమస్త ప్రపంచం ఏమైనాగానీ తాను మాత్రం భద్రంగా గడపాలనే జీవితాన్ని గొంగళి పురుగు నడకతోనే కాదు,  వళ్ళంతా వెంట్రుకలతో, నల్లగా, నింపాదిగా నడిచే గొంగళి పురుగు స్వరూప స్వభావాలన్నింటితో  తనను తాను Identity చేసుకున్న  రేవతి పాత్రతో  భారతదేశంలోని 90శాతం మంది మహిళలు Identity అవుతారు.

ఠంచనుగా గంటకొట్టే గడియారంలా పదిగంటల కంతా తన కాబిన్ లో,  మనుషులతో సంబంధం లేని జమా ఖర్చుల బిల్లులు చూసే వుద్యోగం , మళ్ళీ సాయంత్రానికంతా ఇంట్లో వాలిపోయే భార్య ఉద్యోగం, రాత్రి పదింటికల్లా నైటీ తగిలించుకుని శృంగారం కోసం పనికి వచ్చే ప్రియురాలి ఉద్యోగం ఇలా  పనిముట్టుల్లా  స్త్రీలు మారుతున్న క్రమాన్ని ”కనిపించని నియంత్రణకు కొనసాగింపే స్త్రీల జీవిత” మని గుర్తించడంలోనే సుజాత స్త్రీవాద దృక్పథం స్పష్టమవుతుంది.

స్త్రీవాదం  ప్రతిపాదించిన  లైంగికత (సెక్సువాలిటి) సిధ్ధాంతం ,  వైవాహిక  వ్యవస్థపైన  చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దుకున్న భావనలే సహజీవనం, ఒంటరి స్త్రీగా స్వలింగ సంపర్కులుగా జీవించడం లాంటి భావనలు  ప్రత్యామ్నాయ జీవన విధానాలుగా చర్చకు వచ్చాయి. ఈ భావనలన్నింటినీ సి. సుజాత ‘బీటెన్ ట్రాక్’, ‘నా దారిలోనే’,  ‘చందన’,  కథల్లో చిత్రించారు.

‘బీటెన్ ట్రాక్’. కథలోని విమల ప్రకాష్ తో సహజీవనం చేయడానికి సిధ్ధపడుతుంది. కానీ పెళ్ళికి వ్యతిరేకం. ప్రకాష్  మూడేళ్ళ సహజీవనం తర్వాత సుఖవంతమైన  జీవితం గడపడానికి పెళ్ళి కావాలనుకుంటాడు. కానీ విమల తన తల్లి, అత్త, అక్క జీవితాల్లోని జవజీవాలను కుటుంబం ఎలా లాగేసిందో గ్రహించి, పెళ్ళి వద్దంటుంది.  కానీ పెళ్ళి చేసుకోక తప్పదంటాడు. విమల అందుకు ఇష్టపడకపోతే,మరో అమ్మాయినైనా పెళ్ళాడతానంటాడు. విమలతో జరిగిన సంభాషణను గమనిస్తే ప్రేమించిన స్త్రీ పెళ్ళికి అంగీకరించకపోయినా, ప్రేమించకపోయినా ఎవరినైనా పెళ్ళాడడానికి సిధ్ధపడుతున్న ప్రకాష్ ది ఎలాంటి ప్రేమో, ఇన్నాళ్ళూ అతనితో సహజీవనానికి ఎలా సిధ్ధపడిందో ఆమె చైతన్య స్థాయిని పట్టించే అంశాలు. కాబట్టి ఇక్కడ ప్రకాష్ మాటల్ని ఖచ్చితంగా ఇక్కడ  పరిశీలించాల్సిన అవసరముంది.

“ మనిద్దరి మద్య కాంట్రాక్ట్ కంటే ముందు ప్రేమ కూడా వుంది విమల. మనం మెషీన్లం కాదు, మనుషులం పోనీ ఆ కొత్త మోజులో అర్థం కాలేదు. ఏ లంపటం లేకుండా హాయిగా వుందనిపించింది. ఇందులోని లోటు నాకు ఇప్పటికి తెలిసింది. నువ్వు ఆలోచించుకో. నీకు నచ్చకపోతే నేను ఇంకో అమ్మాయిని పెళ్ళాడతాను.” (పే-89నెరుసు సుజాత కథలు) అంటాడు.

ప్రకాష్ మాటల ద్వారా వాళ్ళిద్దరు కలిసి బ్రతికినా, అలాగే కొనసాగాలంటే   పెళ్ళి తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని అతను పట్టుపట్టడంలోని ఆంతర్యం భోధపడుతుంది.  అంటే,  ఎన్నాళ్ళు కలిసి బ్రతికినా చివరికి పెళ్ళిచేసుకోక తప్పదు.  అనే భావన కలగటం ఏమిటి? అన్న ప్రశ్న కలుగకపోతే సి. సుజాత కథలపై రెంటాల కల్పన రాసిన ‘ తెలుగు కథకులు- కథన రీతులు’  అన్న వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాల  వలన  విమలదే మొత్తం తప్పనిపిస్తుంది. బాధ్యతగా ప్రకాష్ పెళ్ళి చేసుకుంటానంటే విమలెందుకు తిరస్కరిస్తుంది?  అన్న వాదమే నిజమనిపిస్తుంది. విమల స్నేహితురాలు, పెళ్ళి ప్రసక్తి లేకుండా పూర్తికాలం  ఉద్యమ కార్యకర్తగా పనిచేసే నళినీ అభిప్రాయంతో ఏకీభవించాల్సి వస్తుంది. ప్రకాష్ ను ఆమె  విమలకు తిరస్కరించడానికి చూపిన కారణాలు రెండు.

1. విమలకు ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళి వద్దనటం

2. పెళ్ళి వెనుక వున్న అభద్రతను చూసి పెళ్ళి వద్దనటం.

పెళ్ళిని భద్రతగా భావించే వారున్నట్లుగానే, అభద్రతగా భావించే వాళ్ళు కూడా వుండటం గమనించాల్సిన విషయం. కాబట్టి ఆమె అభిప్రాయాల్లో వాస్తవం పాళ్ళెంతుందో మనందరికీ తెల్సిన విషయమే. మరి సి. సుజాత  నళిని పాత్ర చేత ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళి వద్దన్నట్లుగా ఎందుకు చెప్పించింది అంటే, రచయిత సమకాలీన  ఉద్యమ కార్యకర్తల అభిప్రాయాలలోని  దుర్మార్గమైన వ్యాఖ్యల్ని  రికార్డు చేయడం కోసమే తప్ప స్త్రీవాద వుద్యమ చైతన్యాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళెవరికీ ఇలాంటి అభిప్రాయాలు కలుగవని, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటాను.

విమలను నళిని దృష్టితోనో, ప్రకాశం దృష్టితోనో చూస్తే, విమలతో జరిగే సంఘర్షణను  కొంచెం కూడా అర్థం చేసుకోలేం. సమాజంలో ఇంతవరకూ ఎలాంటి విలువలు కొనసాగుతున్నాయో ఆ విలువలకే మళ్ళీ పట్టం కట్టిన  వాళ్ళమవుతాం.  సామాజికుల అభిప్రాయాల కంటే సృజనకారుల దృష్టి, అంతకంటే నిశితంగా విశ్లేషకుల తాత్విక దృక్పథం సునిశితంగా వుంటుంది. వుండాలి. ఈ సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు గారు గుర్తుకొస్తున్నారు.సమాజంలోని సాధారణీకరణాలను చర్చించడం కన్నా సమస్యాత్మకమైన  సంఘర్షణలను, సంక్లిష్టతలను రచయితలు సాహిత్యీకరించినప్పుడే రచయిత సాధించే సాహిత్య ప్రయోజనం ప్రజలకు అవసరమంటాడు. కొ.కు అభిప్రాయంతో ఏకీభవించడానికి ఎలాంటి సందిగ్దాలు వుండవు. కానీ దాన్ని సాహిత్యానికి అనువర్తింపచేయడంలో మాత్రం మళ్ళీ మొదటికే వస్తాం. ధర్నాలు హర్తాళ్ళు నిర్వహించే వుద్యమాల్లో వున్నా నళినీ లాంటి వాళ్ళకు సహజీవనాన్ని వాళ్ళ అవగాహనలోంచి ఇంతకంటే గొప్పగా చెప్పే అవకాశం సందేహాస్పదమే.

అధికార సంబధాలున్న సంప్రదాయ పెళ్ళిని స్త్రీవాదులు వ్యతిరేకిస్తారు. ఎందుకు?  వ్యతిరేకిస్తున్నారో అందులో వున్న సమస్యలేమిటో  మనకందరికీ తెలుసు. వాటిని అధిగమించడానికి ప్రయత్నించే క్రమంలో ఒకే కప్పు కింద జీవించటం  వలన వచ్చే సమస్యల్ని ఆచరణలో అర్థం చేసుకోకుండా గుడ్డిగా మాట్లాడుతున్నారనిపిస్తుంది. పరిణతి చెందిన వ్యక్తిత్వాలతో, సొంత సంపాదన , సొంత ఆలోచనలు కలిగిన స్త్రీ  పురుషుల మధ్య Flexible relations వుండాలిగానీ,   విప్పుకునే అవకాశంలేని పీటముళ్ళు కాదు. ఒక సారి పెళ్ళి అన్న బంధంలోకి వెళ్ళిన తరువాత విడిపోవడం గానీ, కలిసి వుండడంగానీ అంత సులభంగా జరిగే పనులు కావు. ఒక జీవిత కాలానికి సరిపోయే వేదన.   అందుకే అలాంటి సంబంధాన్నుంచి విమల విముక్తమవ్వాలనుకుంటుంది.

సహజీవనంలో ప్రకాష్ పనిని శ్రమ అయినా, ఆ పనిని చేయగలిగింది. అలా చేయలేని రోజు దాన్ని తిరస్కరించే అవకాశం వుంటుంది. పెళ్ళిని కూడా అలా తిరస్కరించవచ్చు కదా అనుకుంటే, ప్రకాశ్ కోరుకునే శాశ్వత బంధంలో ఇంటి చాకిరిని, పెత్తనాన్ని తప్పకుండా ఏదో స్థాయిలో ఎంత వద్దనుకున్నా భరించాల్సే వస్తుంది. అందుకే విమల పెళ్ళిని తిరస్కరించింది. ఇక్కడ విమలను శంకించే అవకాశమే లేదు. ప్రకాష్ తో గడిపిన మధురానుభూతుల్నివదులుకోలేక అతనితో కలసి వుండాలనే కోరుకుంది. అని చెప్పడానికి ఈ క్రింది వాక్యాలే సాక్ష్యం.

“ వేళ్ళ సందుల్లోంచి ఇసుక జారిపోయినట్లుగా చూస్తూచూస్తూ వుండగానేజీవితం మొత్తం చేజార్చుకున్నట్లే వుంది. తెల్లవారే సరికి ఇదంతా ముగిసిపోతుందా? ఇంకేమీ వుండవా? ఏ ఙ్ఞాపకాలు మిగలకుండా, హృదయంపైన ఏ ముద్రలు లేకుండా నేనొక్కదాన్నే ఈ విశాలమైన ఆకాశం నీడలో ఉండిపోతానా? ఆక్టోపస్ లా చేతులు జాస్తున్న ఈ నాలుగు గోడల మధ్య నేనిమిడీపోవడం తప్పేనా?…….. నిర్మానుష్యంగా నిశ్శబ్దంలో, ఒంటరితనంలో……..” ఈ ఆలోచనా క్రమం విమల మానసిక స్థితి, ఆమె గురవుతున్న సంఘర్షణల వైనం చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది.

సమాజం రూపొందించే విలువలకు బలయ్యే వాళ్ళు వున్నట్లే ఆ విలువలను తిరస్కరించి తమకు అవసరమైన జీవితాన్ని తాముగా రూపొందించుకునే వాళ్ళు వుంటారు. సమస్యలకు తక్షణ పరిష్కారాలు లభించనప్పుడు వ్యక్తులు తమ సొంత పరిష్కారాలు వెతుక్కుంటారు. తమకు కావలసిన separate space ని peace ని వెతుక్కుంటారు. విమల వెతుకులాటలోంచే తన వునికికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేసుకోగలిగింది. సాహచర్యం మాత్రమే Ultimate soluation  అని కూడా ఈ కథలో రచయిత ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రకాష్ కు “ ఎప్పటికప్పుడు తానే ఉతికించి, వండీ, అతని మూడ్స్ కనిపెట్టి….. ఏమిటిది? ఎక్కడ తన ఉనికి? అని సంఘర్షించడంలో సహజీవనంలో కూడా పురుషుని ఆధిపత్య ధోరణి కొనసాగటాన్ని సుజాత కథలో స్త్రీవాదులు ప్రతిపాదించిన సహజీవనం పట్ల వున్న భ్రమలకు గండికొట్టే ప్రయత్నం చేశారు. ఈ కథలో సుజాత స్పష్టమైన వైఖరిని తీసుకోకుండా కేవలం చర్చను మాత్రమే కథనంగా చూపించి, పరిష్కారం పాఠకులకే వదిలేస్తుంది. సుజాత ‘బీటెన్ ట్రాక్’  కథాలక్ష్యం పెళ్ళి, సహజీవనాల్లో వున్న డొల్లతనాన్ని బహిర్గతపరచడంలో స్త్రీవాద దృష్టికోణం  ఏమంటే, సహజీవనం, పెళ్ళి నిర్మాణాల్లో వున్న అణచివేత స్వరూపంలో వచ్చే మార్పు కంటే, స్వభావంలో రావాల్సినమార్పు వైపు తన లక్ష్యాన్ని గురిపెట్టడంలోనే ఆమె దృక్పథం వ్యక్తమవుతుంది.

స్త్రీలు తమ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను గానీ తారసపడే సమస్యల పట్ల స్త్రీలుగా వర్తించాల్సిన లేదా అవలంబించాల్సిన వైఖరిని  తన కథల్లో ప్రదర్శించారనిపిస్తుంది. ఏవి చర్చించాల్సిన విషయాలో, ఏవి ఉదారంగా ప్రవర్తించాల్సిన విషయాలో కూడా సి. సుజాతకు అవగాహన వుంది అనే విషయం ఆమె కథలు నిర్వహించిన విధానంలో వ్యక్తమవుతుంది.  ఇందుకు నిదర్శనంగా ‘చందన కథ’  నిలబెడుతుంది. పాశ్చాత్య స్త్రీవాదులు  చర్చించిన స్వలింగ సంపర్కం (లెస్బియన్)  సమస్య వున్న వారిని సానుభూతితో అర్థం చేసుకోవాలనే అభివ్యక్తిని, లక్ష్యాన్ని ఆమె కథా సంవిధానమే తెలుపుతుంది.  ఈ కథలో చర్చకు  అవకాశం ఎంతమాత్రం లేదు. కానీ త్రీ-ఇన్ వన్ కథను  బీటెన్ ట్రాక్ కథను నిర్వహించిన తీరులో వ్యత్యాసం వుంది. వీటిని నిర్వహించడంలో  అవలంబించిన ఎత్తుగడ ప్రత్యేకమైందే కాదు ప్రశంసనీయమైనది కూడా.

మధ్యతరగతి జీవితాన్ని గురించి తెలుగులో చాలా విస్తృతంగా స్త్రీల కథలు వచ్చాయి. అయితే మధ్య తరగతి జీవితాన్ని చిత్రించిన కథల్లోని పాత్రలు ఆ మధ్య తరగతి చట్రంలో ఇమడలేక, దాన్నుంచీ బయటపడలేక ఒకానొక సంక్షోభంలో కొట్టుమిట్టాడడం కనిపిస్తుంది. ఈ విలువల చట్రాన్ని కొన్ని పాత్రలు అధిగమించి బయటపడగలిగినా ఆ తరువాత ఆ పాత్రలు ఒక నాస్టాల్జియాలో (ఙ్ఞాపకాల్లో) మిగలటం లేక మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనడం కనిపిస్తుంది. పాత్రల ఈ స్థితికి మౌలికంగా రచయితల మధ్యతరగతి మనస్తత్వం నుంచి బయటపడలేకపోవటం ఒక కారణమైతే, స్త్రీ రచయితలకు మధ్య తరగతి విలువల చట్రాన్ని అధిగమించే దైర్యం లేకపోవటం కూడా మరో కారణం. అయితే స్త్రీ రచయితలు అలా అధిగమించలేకపోవడాన్ని వాస్తవాన్ని విమర్శించటంలో భాగంగా చూడటం సరికాదు. వాస్తవ సమస్యలకు వ్యూహాత్మక పరిష్కారాలు సూచించటం అనేది కాల్పనిక సాహిత్యంలో భాగం. ఆ పని చేయటం వలననే వర్తమాన ప్రపంచంలో తాత్విక అవగాహన కన్నా సాహిత్య అవగాహనకు ప్రాముఖ్యం ఇవ్వటం జరుగుతుంది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో స్త్రీ రచయితలు తాము ముందు మధ్య తరగతి మనస్తత్వం నుండి బయటపడగలిగి నట్లైతే, మధ్యతరగతి వెలుపల వున్న జీవితాన్ని గురించి సాహిత్య వ్యక్తీకరణలు చేసి వుండేవారు. అందువలన వాళ్ళ రచనలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఈ పరిమితుల్నిఅవలీలగా అధిగమించి సి.సుజాత రంగుల ప్రపంచం వెనుక స్త్రీల అనుభవంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను మన ముందు ఆవిష్కరించారు. మధ్యతరగతి ప్రపంచంలో ఏ విలువలైతే మనిషి సహజ ప్రవృత్తికి అడ్డుగా నిలుస్తాయో, ఆ విలువల్ని చాలా సునాయాసంగా వ్యక్తీకరించటాన్ని ‘రాతిపూలు’ నవలలో చూస్తాం. ఏ విలువల అతిక్రమణ జరిగినప్పుడు మధ్యతరగతి వర్గం గుండెలు బాదుకుంటుందో ఆ విలువల్ని Corporate Culture చాలా సునాయాసంగా తృణీకరించింది. ఆ తృణీకరించడంలో కూడా డబ్బు చుట్టూ తిరిగే మాయా ప్రపంచాన్ని అది పెంచి పోషించే కుహనా విలువల్ని తన రచనల్లో ప్రతిపాదించగలిగారు. తొలి నవలతోనే రచయిత తన దార్శనుకతను, రచనా పటిమను సౌందర్యాత్మకతను, వ్యాకులతను, వాస్తవికత తాలూకు స్వాభావికతను ప్రస్పుటంగా చాటడం చాలా అరుదైన విశేషమైన సన్నివేశం. దోపిడీ పీడనల మధ్య వుండే అవిభాజ్యతను లోతుగా మన ముందుంచింది. ఈ నవల. ‘రాతిపూలు’ నవలలోని పాత్రల యథార్థ జీవితాన్ని అంతర్ బాహిర్ వాతావరణాన్ని, సంక్లిష్ట మానసిక సంఘర్షణలను, సంక్షోభాలను వ్యక్తం చేస్తుంది. టాలెంట్ వుండి కూడా అవసరాల కోసం వాళ్ళ చుట్టూ తిరిగే మహిళా కళాకారుల జీవితాల్లోని వివృత హింసా తత్వాన్ని ఆ క్రమంలో వ్యక్తమయ్యే అనివార్యతను ఈ నవల దృశ్యమానం చేస్తుంది. ఇంతవరకూ media రంగంలో స్త్రీలు పడే హింస పట్ల వున్న అమూర్తతను సి. సుజాత ఈ నవలలో బద్దలు కొట్టగలిగారు. ఆశ్చర్యం, అసహ్యం. అమానవీయ అంశాల సమ్మేళనం పాఠకుని చేయి పట్టుకుని దృశ్య మాధ్యమ రంగభూమికి నడిపిస్తుంది. ప్రపంచీకరణ నేపధ్యంతో సాంస్కృతిక విధ్వంసాన్ని ఈ నవలలో ప్రతిభావంతంగా చర్చకు పెట్టగలిగింది. వర్తమాన సమాజంలో స్త్రీ శరీరం డబ్బు ఆర్జించి పెట్టే సరుకుగా (Commodity) మారుతున్న క్రమాన్నిఇంతకు ముందు కథాప్రక్రియలో వోల్గా, కుప్పిలి పద్మ లాంటి స్త్రీవాదకథకులు చర్చించారు. కానీ సి.సుజాత ప్రత్యేకంగా దృశ్య మాధ్యమాన్ని వస్తువుగా ఎంచుకోవడం వలన మరింత సూక్ష్మ పరిశీలనాక్రమాన్ని ఈ నవల అందిపుచ్చుకోగలిగింది.

మధ్యతరగతి జీవితాన్ని గురించి తెలుగులో చాలా విస్తృతంగా స్త్రీల కథలు వచ్చాయి. అయితే  మధ్య తరగతి జీవితాన్ని చిత్రించిన  కథల్లోని పాత్రలు ఆ మధ్య తరగతి చట్రంలో ఇమడలేక, దాన్నుంచీ బయటపడలేక ఒకానొక సంక్షోభంలో కొట్టుమిట్టాడడం కనిపిస్తుంది. ఈ విలువల చట్రాన్ని కొన్ని పాత్రలు అధిగమించి బయటపడగలిగినా ఆ తరువాత  ఆ పాత్రలు ఒక నాస్టాల్జియాలో (ఙ్ఞాపకాల్లో) మిగలటం  లేక మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనడం కనిపిస్తుంది. పాత్రల ఈ స్థితికి మౌలికంగా రచయితల మధ్యతరగతి మనస్తత్వం నుంచి బయటపడలేకపోవటం ఒక కారణమైతే, స్త్రీ రచయితలకు మధ్య తరగతి విలువల చట్రాన్ని  అధిగమించే దైర్యం లేకపోవటం కూడా మరో కారణం. అయితే స్త్రీ రచయితలు అలా అధిగమించలేకపోవడాన్ని వాస్తవాన్ని విమర్శించటంలో భాగంగా చూడటం సరికాదు. వాస్తవ సమస్యలకు వ్యూహాత్మక పరిష్కారాలు సూచించటం అనేది కాల్పనిక సాహిత్యంలో భాగం. ఆ పని చేయటం  వలననే వర్తమాన ప్రపంచంలో తాత్విక అవగాహన కన్నా సాహిత్య అవగాహనకు ప్రాముఖ్యం ఇవ్వటం జరుగుతుంది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో స్త్రీ రచయితలు తాము ముందు మధ్య తరగతి మనస్తత్వం నుండి బయటపడగలిగి నట్లైతే, మధ్యతరగతి వెలుపల వున్న జీవితాన్ని గురించి సాహిత్య వ్యక్తీకరణలు చేసి వుండేవారు. అందువలన వాళ్ళ రచనలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఈ పరిమితుల్నిఅవలీలగా అధిగమించి సి.సుజాత రంగుల ప్రపంచం వెనుక స్త్రీల అనుభవంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను మన ముందు ఆవిష్కరించారు. మధ్యతరగతి ప్రపంచంలో ఏ విలువలైతే మనిషి సహజ ప్రవృత్తికి అడ్డుగా నిలుస్తాయో, ఆ విలువల్ని చాలా సునాయాసంగా వ్యక్తీకరించటాన్ని ‘రాతిపూలు’ నవలలో చూస్తాం. ఏ విలువల అతిక్రమణ జరిగినప్పుడు మధ్యతరగతి వర్గం గుండెలు బాదుకుంటుందో ఆ విలువల్ని Corporate Culture చాలా సునాయాసంగా తృణీకరించింది. ఆ తృణీకరించడంలో కూడా డబ్బు చుట్టూ తిరిగే మాయా ప్రపంచాన్ని అది పెంచి పోషించే కుహనా విలువల్ని తన రచనల్లో ప్రతిపాదించగలిగారు.

తొలి నవలతోనే రచయిత తన దార్శనుకతను, రచనా పటిమను సౌందర్యాత్మకతను, వ్యాకులతను, వాస్తవికత తాలూకు స్వాభావికతను ప్రస్పుటంగా చాటడం చాలా అరుదైన విశేషమైన సన్నివేశం. దోపిడీ పీడనల మధ్య వుండే అవిభాజ్యతను లోతుగా మన ముందుంచింది. ఈ నవల. ‘రాతిపూలు’ నవలలోని పాత్రల యథార్థ జీవితాన్ని అంతర్ బాహిర్ వాతావరణాన్ని, సంక్లిష్ట మానసిక సంఘర్షణలను, సంక్షోభాలను వ్యక్తం చేస్తుంది. టాలెంట్ వుండి కూడా అవసరాల కోసం వాళ్ళ చుట్టూ తిరిగే మహిళా కళాకారుల జీవితాల్లోని వివృత హింసా తత్వాన్ని ఆ క్రమంలో వ్యక్తమయ్యే అనివార్యతను ఈ నవల దృశ్యమానం చేస్తుంది. ఇంతవరకూ media రంగంలో స్త్రీలు పడే హింస పట్ల వున్న అమూర్తతను సి. సుజాత ఈ నవలలో బద్దలు కొట్టగలిగారు. ఆశ్చర్యం, అసహ్యం. అమానవీయ అంశాల సమ్మేళనం పాఠకుని చేయి పట్టుకుని దృశ్య మాధ్యమ రంగభూమికి నడిపిస్తుంది.

ప్రపంచీకరణ నేపధ్యంతో సాంస్కృతిక విధ్వంసాన్ని ఈ నవలలో ప్రతిభావంతంగా చర్చకు పెట్టగలిగింది. వర్తమాన సమాజంలో స్త్రీ శరీరం డబ్బు ఆర్జించి పెట్టే సరుకుగా (Commodity) మారుతున్న క్రమాన్నిఇంతకు ముందు కథాప్రక్రియలో వోల్గా, కుప్పిలి పద్మ లాంటి స్త్రీవాదకథకులు చర్చించారు. కానీ సి.సుజాత  ప్రత్యేకంగా దృశ్య మాధ్యమాన్ని వస్తువుగా ఎంచుకోవడం వలన మరింత సూక్ష్మ పరిశీలనాక్రమాన్ని ఈ నవల అందిపుచ్చుకోగలిగింది.

స్త్రీలు పురుషులు Career కోసం వెంపర్లాడే క్రమంలో లైంగిక సంబంధాల్లోకి వెళుతున్న క్రమాన్ని సి. సుజాత ఈ నవలలో చర్చించారు. శమంత పాత్ర తన అవసరాల కోసం సురేంద్రతో తనకు గల పరిచయాన్ని వ్యామోహంలోకి  మార్చే క్రమంలో తను నిర్వహించిన పాత్ర ఒకవైపు వుండగా మరోవైపు  సురేంద్రకు గల కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు పెంచుకునే అవసరం సురేంద్ర  శమంతలు పరస్పరం తమ మధ్యగల సంబంధాన్నిఅవసరాల సంబంధంగానే భావిస్తారు. కానీ  శమంతా కుటుంబ సభ్యుల ధనదాహం కోసం సురేంద్రతో relation ను కోరుకుంటున్నట్లుగా ఒక సందర్భంలోచిత్రించారు. మరో సంధర్భంలో శమంత తన career సెటిల్  అయినప్పటికి అతనితోగల సంబంధాన్ని వదులుకోలేనేమో అని తన కన్ సిస్టెన్సీ పట్ల అపనమ్మకాన్ని ప్రకటిస్తుంది. సురేంద్ర శమంత కిన్నెర లాంటి వాళ్ళ career ను develop చేస్తున్నానన్న భ్రమలో ఆస్త్రీలు అనుకునేట్లుగా చేసి వాళ్ళద్వారా తన finance వ్యాపారాన్ని కొనసాగిస్తూ పైగా అందరి అవసరాలను సమర్ధించే వాడుగా వాళ్ళు అతన్ని ఆత్మీయునిగా భావించేటట్లు అన్ని హంగుల్ని వాళ్ళ కోసం సమకూర్చగలుగుతాడు. ఈ వాస్తవాన్ని శమంత మాత్రమే  గ్రహించగలుగుతుంది.   అంతేకాదు సురేంద్ర సృష్టించిన విషవలయం నుండి తనని  తాను రక్షించుకునే క్రమంలో తన Identity ని నిలబెట్టుకోవడంలో అతన్నే పావుగా మలచుకుంటుంది.

సుజాత ఈ ఎత్తుగడను సాధిఉంచడానికి, శమంత జీవితాన్ని పరాయీకరణ నుండి అధిగమించే క్రమంలో మీనాక్షి పాత్ర ఎంతగా ఉపయోగపడిందో, చంద్రశేఖర్ పాత్ర కూడా అంతే ఉపయోగపడింది. కళ పట్ల గొప్ప భావుకత కలిగిన చంద్రశేఖర్ వాస్తవ జీవితంలో అవసరాల వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం లేనితనాన్ని ఆచరణాత్మకంగా అతని కుటుంబం నిర్వహించే పాత్రను శమంత అర్థం చేసుకోగలిగింది.దృశ్య మాధ్యమ రంగం కోసం తనలోని కళా తృష్ణను ఫణంగా పెట్టలేక తల్లి నిర్వహించే నర్సరీ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా తన కళను వ్యాపారం కాకుండా కాపాడుకోగలుగుతాడు.  కళను వ్యాపారంగా చూడటం, చేయటం కంటే వ్యాపారాన్ని వ్యాపారంగానే  నిర్వహించేందుకు చంద్రశేఖర్ సిధ్ధపడటం ద్వారా శమంత జీవితాన్ని దృశ్య మాధ్యమరంగంలో  కోల్పోవడంలో  తన పాత్ర ఏ మాత్రం లేకుండానే శమంతను ప్రభావితం చేయగలుగుతాడు. ఆ చైతన్యం లోంచే భాను జీవితాన్ని శమంత తీర్చిదిద్దగలిగింది అని  అనడం కన్నా పరోక్షంగా తన జీవిత లక్ష్యాన్ని నిర్ధేశించుకోగలిగింది అనడం సమంజసంగా  వుంటుంది.

పెట్టుబడిరూపాలు మారుతూ వస్తున్నాయి. మూడు నాలుగు దశాబ్దాల ముందు సాహిత్య సృజనలో దోచుకునేవాడు, దోపిడీకి గురయిన వాడు చాలా స్పష్టంగా కనిపించేవాడు. కానీ వర్తమాన సంక్లిష్ట జీవన వ్యవస్థలోకి పరిణమించిన ఆధునికత వ్యక్తులు తమకు తాముగానే దోపిడీకి గురవడానికి అనుగుణంగా  సిధ్ధపడటం అనేది పరిణితి చెందిన ప్రపంచీకరణ స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది.శమంత పాత్రను శక్తివంతంగా మలచడంలో రచయిత స్త్రీవాద దృక్పథం ఆవిష్కరింపబడుతుంది.

శమంత ఏ అవసరాల కోసం తనను తాను Commodity గా మలుచుకుందో, ఆ చట్రంలో నుంచీ అంతే జాగ్రత్తగా బయటపడినట్లుగా చిత్రించడం వలన దృశ్య మాధ్యమ రంగంలో(media) చిద్రమవుతున్న వాళ్ళు ప్రత్యామ్నాయ జీవన శైలుల్ని వెతుక్కోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరాన్ని రచయిత  అందించగలిగారు.

ఎక్కడా సిధ్ధాంత రాధ్ధాంతంగానీ, ఉపన్యాస ధోరణి గానీ కనిపించకుండా వున్నది వున్నట్లుగా తన అనుభవాలను మన ముందుంచడం ద్వారా తన దృక్పథాన్ని ప్రత్యేకంగా ఇది అని సుజాత వ్యక్తీకరించాల్సిన అవసరం కలుగదు. తనకు పరిచయం వున్న పరిసరాలను కథా వాతావరణంగా మార్చుకోవడంలో సుజాతకు గల నిశిత పరిశీలనాశక్తి, నైపుణ్యం ఆమె సాహిత్యంలో ఆవిష్కృతమవుతుంది. తను చెప్పదలుచుకున్న విషయాల్ని ప్రతిపాదించడంలో ఈమెకు బలమైన (Conviction) వుంది.

శరీరానికి మనస్సుకు వున్న సంబంధాన్ని గురించి గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో మౌలిక భావనలు ముందుకు వచ్చాయి.  టెరిడా, పుకోవ్ లాంటి తాత్వికులు సంప్రదాయికంగా వస్తున్నకాట్రిషియన్ ద్వంద్వాన్ని తిరస్కరించి శరీర కేంద్రకంగా అలవడిన సంబంధాలు ఎలా రూపొందుతున్నాయో, ప్రతిఘటించబడుతున్నాయో చర్చించారు. వీళ్ళిద్దరు తమ తాత్విక దృక్పథంలో  శరీరం.(Body), మనస్సు(mind)   మధ్య  వున్న ద్వంద్వాన్నితిరస్కరించారు. పితృస్వామిక సమాజం  నిరంతరం పురుషుడ్ని మనస్సుతోనూ, స్త్రీని శరీరంతోనూ గుర్తిస్తూ జత చేస్తూ వచ్చింది. అందువల్ల స్త్రీవాదులు పితృస్వామిక వ్యవస్థలో స్త్రీ శరీరాల మీద కొనసాగుతున్న నియంత్రణ అణచివేతలను గురించే ప్రధానంగా చర్చించారు.

1990  ల నుంచి తెలుగు సాహిత్యంలో స్త్రీవాద భావజాలం వాస్తవికతా పునాది మీద నిలబడడానికి, Second thought of feminist out look అభివృద్ధి చెందడానికి సి. సుజాత Contribution ని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వుంటుంది. రెండు దశాబ్దాల తెలుగు స్త్రీవాద సాహిత్యానికి,  ఒక స్త్రీవాద కాల్పనిక రచయితగా ఆమె చేసిన దోహదం  చాలానే వుంది.

సాహిత్యం నవల, కథానిక ఇలా ఏరూపంలో వున్నా వ్యక్తి జీవితానికి భరోసా ఇవ్వగలగడమే కాక, వ్యక్తి భావుకతను, విశ్లేషణాశక్తిని పెంచగలగాలి. అలాగే వ్యక్తి తన Identity ని assert  చేసుకోగలిగే ధీమా కూడా ఇవ్వగలగాలి. ఈ మూడింటిని కూడా మనం సుజాత కథల్లో చూడగలం.

రెండు దశాబ్దాల కాలం నుంచి ఆర్థిక సరళీకృత విధానాల నేపథ్యంలో డబ్బు సంపాదన గురించి గర్వంగా చెప్పుకున్నారు. డబ్బే సంబంధాలను నిర్ణయించే స్థితిని ఏ వ్యతిరేకతకు,   సంఘర్షణకు అవకాశం లేకుండా అమోదిస్తున్నారు. ఈ క్రమం గత తరానికి మింగుడు పడడం లేదు. మారుతున్న విలువల్ని అంగీకరించడం కష్టం.  అందుకే శమంత,  ఆమె స్నేహితురాలు కుమారి జీవితాల్లోని Extra Marital relations ని ఆమె  మిత్ర బృందం అంగీకరించినట్లుగా శకుంతల తల్లి జీర్ణం చేసుకోలేకపోయింది. కానీ అదే తరానికి చెందిన శమంత  అత్త, మామ మాత్రం తమ తరానికి అతీతంగా వ్యవహరిస్తారు. ఈ కథల్లోని పాత్రలు తమ నిరసనను ప్రకటిస్తాయి.’క్రోటన్స” కథలో సౌమ్యలోని భావుకత డబ్బు సంపాదనలో Burden గా అనిపిస్తుంది. స్వాతి burden మాత్రం  relevant గా అనిపిస్తుంది. Hero  Self Centered, career oriented Generationలో  merge అయిన క్రమాన్ని ఈ కథల్లో సి. సుజాత నిరూపించడం  జరిగింది.

సుజాత సాహిత్యంలో వస్తు శిల్పాల ఐక్యత ప్రశంసించాల్సిన విషయం. అభివృధ్ధికరమైన భావాలతో కూడిన వస్తువు ఎంత అవసరమో ఆ భావాలను ప్రకటించడానికి రచయిత అనుసరించే ప్రక్రియా, రచనా శిల్పం లోప రహితంగా వుండటం అంతే అవసరం. చిన్న కథకు సరిపోయే యితివృత్తంలో నవల రాయటం, నవల రాయటానికి సరిపోయే విశేషాలను చిన్న కథలో ఇరికించడం. ఈ రెండూ ప్రక్రియల్లో రచయితలు  చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. కానీ సుజాత కథల్లో వస్తు పరిథిని, ప్రయోజనాన్ని కూడా ఆమె గమనంలో వున్నాయని ఆమె సాహిత్యాన్ని అధ్యయనం చేసుకున్నప్పుడు  తెలిసే విషయం. రచయిత ముందుగా తాను తన రచనల వల్ల  సాధించదల్చిన ప్రయోజనాన్ని  గురించి స్పష్టంగా తెలిసినపుడే దాన్ని సాధించడానికి ఏ ప్రక్రియా నిర్మాణం ఆ ఆలోచనకు సరిపోతుందన్న అవగాహన కలిగి వుంటారు. వర్తమాన కథా రచయితలు చాలా మంది ఈ విషయంలో పొరపాట్లు చేస్తూనే వున్నారు.

సుజాత తాను చూసిన జీవితాన్ని ఆవిష్కరించటానికి ఆమె ఎన్నుకున్న పాత్రలు, ఆ పాత్రల భావాలు, సన్నివేశ కల్పనలు, సంభాషణలు ఆమె సాహిత్య శిల్పాన్ని సమర్థవంతంగా మలచగలిగాయి. పాత్రల భావాలకు, పాఠకులకు మధ్య  అడ్డుగోడగా నిలిచే వారెవరూ వుండరు. ఎలాంటి గందరగోళం,   అస్పష్టతా లేకుండా పాత్రల స్వభావాలు పాఠకులకు అర్థమవుతాయి.  స్త్రీవాద ప్రాపంచిక ధృక్పథం లేకుండా  స్త్రీల సమస్యలను ఆవిష్కరించలేరు. పాత్రల అనుభూతులతో ఆమె దృష్టికోణం కలసి వుండటం వలననే పాఠకులలో నవల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎక్కడా ఈమె శైలిలో కఠినమైన, కృత్రిమమైన పదాలకు గానీ భావాలకు గానీ ఆస్కారం లేకుండా చాలా సహజంగా అలవోకగా రచన చేయటం ఈమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వలననే ఈమె సాహిత్యం తెలుగు స్త్రీవాద సాహిత్య గమనం ఉదారవాద దశ నుంచీ సోషలిస్టు స్త్రీవాద భావజాల ఆవిష్కరణతో తన గమ్యాన్ని నిర్దేశించుకోవడం వలన స్త్రీవాద సాహిత్య సృజనలో విశిష్ట  స్త్రీవాద రచయితగా తన స్థానాన్ని పదిలంగా పొందగలిగారు.

                – డాక్టర్ కె. శ్రీదేవి

మాయజలతారు వలల్ని తెంపే కథ!

p-satyavathi

“కధల్ని,గొప్ప కధల్ని తిరిగి చెప్పుకోవడమంత రోతపని మరొకటి లేదు.డిసెక్షన్ అందాన్ని చంపుతుంది” అంటాడు శివారెడ్డి సత్యవతి గారి కధల పుస్తకం ’మెలకువ’ కి ముందుమాటలో.

అయినా అలాంటిపనే చేయకుండా ఉండలేని అశక్తత లోకి ఈ పుస్తకం లోని ప్రతి కధా నెట్టివేస్తోంది. మరీ మరీ డిస్టర్బ్ చేసి,కలవరపరిచి,అవసరమైన లోచూపు కు పురిగొల్పి,ఏ అగాధాల్లోకి ఎంత గమనింపు లేకుండా జారిపోతున్నామో చెప్పి, ఒకానొక మెలకువ లోకి నను నడిపించిన ఓ కధనిక్కడ కృతజ్ఞత తో తల్చుకోవాలనిపిస్తున్నది.

కధ పేరు “నేనొస్తున్నాను”.

ఈ కధ లో ఒక సఖి ఉంది. ఎలాంటిదామె?ముద్దొచ్చే మొహమున్నది.సమస్త జీవన కాంక్షలతో ఎగిసిపడే మనసున్నది.ఉత్సాహం తో ఉరకలు వేసే వయసులో ప్రపంచమంతా తనదేనన్న ధీమాతో వెలుగు దారాలతో రంగురంగుల పూలు కుట్టిన మూడు సంచులను(స్నేహాల,అభిరుచుల,జ్ఞాపకాల సంచులవి)భుజాన వేసుకుని,తన పాటనేస్తాన్నెప్పుడూ పెదాలపైనే ఉండేలా ఒప్పించుకుని జీవితం నది ని దాటడానికి బయలుదేరి ఈ ఒడ్డున నిలబడి ఉన్నది.

ఒక సఖుడున్నాడు.అందమైన పడవేసుకుని అలా వచ్చాడు.ఎలా ఉన్నాడు?ముసిముసినవ్వులతో ఉన్నాడు.ముచ్చటగా ఉన్నాడు.పడవెక్కమని చెయ్యందించాడు.ఆశల దీపాలు వెలిగే కళ్ళతో స్వాగతం చెప్పాడు.తన పాటనీ తన సంచుల్నీ తనతోపాటూ తెచ్చుకోమన్నాడు.

మొదలైంది ప్రయాణం. పచ్చదనం. నీలాకాశం. ఈలలు పాటలు మాటలు ఆశయాలు అభిప్రాయాలు కోరికలు చతుర్లు…ఈ ప్రయాణమిలా సాగిపోనీ ఎంతకాలమైనా అనుకుంటూ తన సహ ప్రయాణీకుడ్ని,పడవ నడిపే ఆ చిన్నవాడ్ని తన ఆంతరంగిక ప్రపంచం లోకి మనసు చాచి స్వాగతించింది.

ఆవలి ఒడ్డుకు కలసిమెలసి ప్రయాణం చేద్దామని పండువెన్నెల్లో మనశ్శరీరాల సాక్షిగా ప్రమాణం చేసుకున్నారు.చెరి కాసేపు తెడ్డు వేశారా.. “బాగా అలసిపోయావు,విశ్రమించు ప్రియా..నీ కళ్లలో మెరుపు తగ్గేను” అన్నాడు.ఎంత అపురూపమో ఆమె తనకు!

-క్రమంగా దృశ్యం మారింది.సుఖవంతమైన జీవితం కోసమంటూ,నాణ్యమైన జీవనం గడపాలి గదా అంటూ పడవ నడిపే యంత్రం తయారీ తో మొదలుపెట్టి చెట్టులెంటా పుట్టలెంటా తిరిగి ఏవేవో తెచ్చి పోగేసే పనిలో పడిపోయాడతను.ఇప్పుడతనికి ఆమె పాట వినే తీరిక లేదు.ఆరాధన గా చూసే సమయం లేదు.

ఎంతలో ఎంత మార్పు!ఎంత బాధ పెట్టే మార్పు..ఎంత భయపెట్టే మార్పు.వర్తమాన జీవన సౌరభాల్ని విస్మరించి..భవిష్యత్ భద్రజీవనం కోసమంటూ,  “వస్తువు” కిందపడి మరణిస్తూ అసలా స్పృహే లేకుండా నిశ్శబ్దంగా అతను ఏ లోయల్లోకి ఎప్పుడు జారిపోయాడో!

అయితే ఆమె దీన్నెలా తీసుకున్నది?అతని కార్యదీక్షకి,సమర్ధత కి అబ్బురపడి మరింత ఆరాధనతో  అన్నీ అమర్చిపెడుతూ ఇష్టం గా,సంతోషం గా సేవలు చేస్తూ అతనితో పాటు ఆమె కూడా తనను తాను మర్చిపోయింది.

కొంతకాలానికి ఒకరోజు ఉలిక్కిపడి చూసుకుంటే పాట ఏదీ?హోరు భరించలేక పారిపోయింది.గట్టిగా పిలిస్తే వచ్చింది గానీ,ఎప్పుడూ ఆ హోరులో ఆమెను వెన్నంటి ఉండడం తనవల్ల కాదంది.అతనేమో తిండివేళ తప్ప కనిపించడమే లేదు.నవ్వుల్లేవు.ముచ్చట్లు లేవు.

ఇక అతనితో కాదని తన పూర్వ స్నేహాలు,అభిరుచులు,సరదాలతో కొనసాగాలనుకుని తన వెలుగుపూలసంచులకోసం చూస్తే ..ఎక్కడున్నాయవి? “మనం సేకరించిన సంపదనంతా నింపే క్రమం లో అడ్డమొచ్చి ఉంటాయి.గిరాటేసి ఉంటాం ఎటో” తేలిగ్గా జవాబిచ్చాడతను.

పడవ బరువెక్కుతోంది.శబ్దాల హోరు ఎక్కువైపోయింది.పాటమ్మ ఏమయిందో అయిపు లేదు.సఖుని దర్శనమే అపురూపమై పోయింది.-“అసలు నేనెక్కడికి బయల్దేరాను? ఏ గమ్యం కోరుకున్నాను?ఇతను పిలిచీ పిలవగానే సమ్మోహితురాలినై ఈ పడవలో ఎందుకు ప్రవేశించాను?తామిద్దరూ కలిసిపంచుకున్న అనుభవాలు,చెప్పుకున్న ఊసులు ఇప్పుడేవీ?ఎక్కడకు అదృశ్యమైపోయాయి? అసలు అతనేడీ?తను ఆత్మను,శరీరాన్ని అర్పించుకున్న వాడు,తనకోసం ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తానన్నవాడు ఇప్పుడెక్కడ?

అబ్బా,ఏం ప్రశ్నలివి?ఎలాంటి ప్రశ్నలివి?ఎంత కలవరపెట్టే ప్రశ్నలివి? మనల్ని గురించి మన వాళ్ళు వేసుకునేవో,మన వాళ్ళగురించి మనం వేసుకునేవో..బోలెడు వూసులు చెప్పుకుని,బోలెడు వాగ్దానాలు చేసుకుని ప్రయాణం మొదలుపెట్టి సహజీవనచారుల్నే కాదు,మనల్ని మనమే మర్చిపోయి ఎంతమందిమి ఎలా ఎడారులమైపోతున్నామో!

కధలోని సఖుని పాత్రలాగా వస్తువ్యామోహం కావచ్చు,లేక పదవి,కీర్తి మరొకటీ,మరొకటీ లాంటి నెగటివ్ వ్యామోహాలు కావచ్చు…ఫేస్ బుక్ లాంటి కాలక్షేపం కావచ్చు..చదువుకోవడం,రాసుకోవడం,కొత్తస్నేహాలు,కొత్త అభిరుచులు లాంటి పాజిటివ్ వ్యామోహాలైనా కావచ్చు.మనల్ని స్నేహిస్తూ,మోహిస్తూ,ప్రేమిస్తూ,మనతో కలిసి నడుస్తోన్న సహచరుల్నే కాదు,మనల్ని మనమే పట్టించుకునే తీరిక సైతం లేకుండా..మనమీదెక్కి కూర్చుని మనల్ని పరుగులు పెట్టిస్తున్న సవాలక్షబరువుల్ని స్పృహకు తెచ్చి దిగులు పుట్టిస్తుంది ఈ కధ.మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి కావలసిన దినుసులేవో అందిస్తుంది.

ఇలాంటి ఇతివృత్తం తో.. సంపాదనలోనో,వృత్తిలోనో,వ్యాపారం లోనో,ఉద్యోగం లోనో మరెందులోనో కూరుకుపోయి జీవనం తాలూకు ఆనందాన్ని చేజార్చుకోవడం వస్తువుగా చాలా కధలు,అపుడపుడు సినిమాలు కూడా చూసుంటామేమో.

కానీ ఈ కధ అలా పైపైన తాకి వెళ్ళిపోయేది కాదు.ఇలా చూసి అలా పక్కనపెట్టేది అంతకంటే కాదు.ఆలోచింపజేసేది.అంతర్నేత్రాలను తెరిపించేది,ఒక ఉలికిపాటుకు గురి చేసేది,ఒక మెలకువ లోకి నడిపించేది,మాయజలతారు వలల్ని తెంపిపారేయాలనే కృత నిశ్చయాన్ని ప్రోది చేసేది,’వస్తువు’ కిందపడి మరణిస్తోన్న మనిషిని ఒక ఆత్మీయస్పర్శతో బతికించేది .అమ్మా!సత్యవతీ!మా చల్లని తల్లీ! ఇంత మంచి సాహిత్యాన్నిచ్చినందుకు, ఇస్తున్నందుకు ఎలా నీకు కృతజ్ఞతలు చెప్పడం?

 – రాఘవ రెడ్డి

1044912_497904126944760_602611104_n

 

 

ఒంటెద్దు బండి – ఓ పాతకాలపు జ్ఞాపకం

ఈ రోజుల్లో సర్ప్రయజ్ పార్టీలు చాల కామన్. బేబి షోవర్ లంటూ మరింక పుట్టిన రోజులకి మేమో ముప్పయి నుండి యాబై  వరకు ఓ హాల్లో చేరి… లైట్లన్నీ ఆర్పేసి …. ఉష్!  ఉష్!  అంటూ సైగలు చేసుకుంటూ – ఆ ఒక్క మనిషి లోపలికి రాగానే ‘సర్ప్రయజ్’ అంటూ గావుకేకలు వేసి నానా హడావిడి చేస్తాం.

కాని నా చిన్నతనంలో ఇలాంటివి చాలా సహజంగా జరిగేవి. ఒకే ఒక వ్యక్తి ఓ పెట్టో బుట్టో పట్టుకుని చెప్పాపెట్టకుండా ఇంటి ముందు ప్రత్యక్షమై ఇంటిల్లిపాదిని సర్ప్రయజ్ చేసేవారు. ఓ వేళ కార్డ్ ముక్క వ్రాసి పడేసిన అది వాళ్లోచ్చాకే చేరేది. అదిగో అలాగే అడుగు పెడుతుంది మక్కిపాలెం శేషమ్మ నిశాపతి గారి “ఒంటెద్దు బండి” కథలో. ఈ కథ నవ్య 2012 దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చింది.

“అమ్మమ్మొచ్చింది, అమ్మమ్మొచ్చింది” అంటూ మొహం చాటంత చేసుకుని ఎగురుకుంటూ వెళ్లి చెప్తాడు కథ చెబుతున్న అబ్బాయి. “ఏ అమ్మమ్మరా?” అంది అమ్మ. “మాకు అమ్మమ్మలు చాల మంది వుండేవారు” అంటాడా అబ్బాయి.

అదిగో అదే “మాకు అమ్మమ్మలు చాల మంది వుండేవారు” అన్న ఆ వాక్యం – సూదంటు రాయిలా ఆకర్షించి చిన్నతనం జ్ఞాపకాల తెనేతుట్టని కదిపి కుదిపేసింది. ఏ వరసన అమ్మమ్మలవుతారో మరింక ఏ వరసన పిన్నులే అవుతారో, తాతయ్యలే అవుతారో తెలియని ఎంతోమంది ఆత్మీయ బంధువులు అలా కళ్ళముందు ప్రత్యక్షమైపోయి, ఆప్యాయంగా వచ్చి పలకరిస్తే వచ్చే పులకరింపులా ఈ కథ నా మనసులో నిలిచిపోయింది.

ఆ తరువాత “అసలింటికి చుట్టం రావడమే మాకానందం, ఎవరొచ్చినా మేం అంటే పిల్లలం, ఒకేలా ఆనందించేవాళ్ళం” అంటాడా అబ్బాయి. మేము అంతే. అంతెందుకు ఊర్లో ఎవరింటికి ఎవరొచ్చినా… ఏ గాలి పటాలు ఎగరేసుకునే వాళ్ళకో, వీధిలో గోలీలు ఆడుకునే వాళ్ళకో… ఎవరికి ముందు కనిపిస్తే వాళ్ళు ‘ఫలానా వచ్చారో!’ అంటూ దండోరా వేస్తూ పరిగెడితే, వాళ్ళని ఫాలో అయిపోయి ఆ వచ్చిన అతిధిని వాళ్ళ ఇంటిదాకా సాగనంపేవాళ్ళం. ఆహ్వానించే ఆ ఇంటివాళ్ళ హావభావాలను చూడడం మాకు సరదా.

అసలు శేషమ్మమ్మ మాకు ఏ రకంగా బంధువో తెలియదంటాడు కథ చెబుతున్న ఆ కుర్రాడు. అలా బంధుత్వానికి వస్తే బహుదూరమయినా అనుబంధానికి వస్తే అతి చేరువయి నా జ్ఞాపకాల్లో నిలిచి పోయిన వ్యక్తి  మా పిలక తాతయ్య. తాతయ్యంటే మళ్లీ మా అమ్మ నాన్నో నాన్న నాన్నో కాదు. మా రాజమండ్రి బాబాయి అత్తగారు మావగార్లె ఉహ తెలిసాక మాకు తెలిసిన అమ్మమ్మా తాతగార్లు. మా పిన్ని వాళ్లకి ఒక్కతే కూతురవటంతో వాళ్ళు మా బాబయి ఇంట్లోనే వుండేవారు.

చిన్నప్పుడు వేసవి సెలవలకి మా వూర్లో రైలెక్కి హైద్రాబాద్ వెళ్లి – అక్కడ మా పిన్నీ వాళ్ళని సర్ప్రయజ్ చేసేసి – మళ్లీ ట్రైనెక్కి రాజమండ్రి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏ వరసలో మనవలవుతారో తెలియని మాలాంటి గ్యాంగ్ చాలా మందే వుండేవాళ్ళు. మా అందరికి అమ్మమ్మ కమ్మగా వండి  భోజనాలు పెడితే తాతయ్య నూనెలు రాసి జడలు వేయడం నుండి జోల పాడి నిద్రపుచ్చే వరకు అన్ని పనులు మహా ఉషారుగా చేసేవారు. పెట్టె నిండా స్వీట్లతో, మనసు నిండా  జ్ఞాపకాలతో… మరింక ఒంటి నిండా సెగ్గడ్డలతో మేము వెనక్కి  తిరిగి వచ్చేవాళ్ళం.

 

Page128

ఆ తరువాత చాల ఏళ్ల తరువాత నా పదహారో ఏట తాతగారిని కలిసినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని “తండ్రి లేని పిల్లవయిపోయావమ్మా!” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అప్పటికి మా నాన్నగారు పోయి ఆరు నెలలవుతోంది. ఆ తరువాత కూడా తన ఆల్లుడి అన్నగారయిన మా నాన్నని తలచుకుని తలుచుకొని అయన చిన్న పిల్లాడిలా ఏడ్చారు.

ఇలా ఈ కథలో ప్రతి వాక్యం నన్ను చెయ్యి పట్టుకుని గతంలోకి లాక్కుపోతుంటే (ఈ కథ పరమార్థం అదేనా అనుకుంటే) నా ఈ సమీక్ష ఓ నవలంత అయ్యేలా వుందని నా కిప్పుడే అర్థమయింది (ఇంక ఇది నా మొదటి  సమీక్ష అని మీకేప్పుడో అర్థమయే వుంటుంది). అందుకే సంక్షిప్త సమీక్షకి ప్రయత్నిస్తూ కథలోకి తొంగి చూస్తే.

నిశాపతిగారి శేషమ్మమ్మ ఓ సజీవమైన పాత్ర. ఆనాటి జీవితాలనుండి నడచి వచ్చిన పాత్ర. ఒంటెద్దు బండిలాంటి జీవితం సాగిస్తూ అందరూ తనవాళ్ళే అనుకుంటూ ఆప్యాయతలకోసం ఆరాటపడే అలాంటి వ్యక్తులు ఆ రోజుల్లో చాలా మందికి చిరపరిచితులు. అలాగే ఎప్పుడూ తెరిచివుండే వీధి వాకిల్లతో వాళ్ళని మనస్పూర్తిగా ఆహ్వానించే కుటుంబాలు కూడా.

 

ఆ తరువాత అతి చిన్న చిన్న సంఘటనలతో రచయిత శేషమ్మమ్మని పరిచయం చేస్తూ – ఒకొక్క కోణంలో ఆవిడని ఆవిష్కరిస్తూ మనకి ఎంతో దగ్గర చేస్తారు. ఆవిడ వచ్చీ రాగానే చేతిలో వున్న మూట పడమటింట్లో జాగ్రత్తగా దాచిపెడుతుంది (ఏముందో మరి ఆ మూటలో).  ఇక మనిషి వర్ణన కొస్తే ఆ కాలంలో ఆమె స్థితిని గతిని కళ్ళ ముందు నిలపెట్టేస్తూ అయ్యబాబోయ్ అనిపించేస్తుంది. అదెలాగంటే… నములుతున్న వక్కలు నోటికోసల్లోంచి బైటకి వచ్చి చాల అసహ్యంగా కనిపించేది. ముక్కుపొడి పీల్చేది. బోడితల మీద పంచకి నశ్యం మరకలు. చూపు ఆనక గుచ్చి గుచ్చి చూసేది లాంటి వర్ణనలతో.

డబ్బు విషయంలో ఆమె అమాయకత్వం ఓ పక్కన తెగ నవ్వించేస్తే మరో పక్కన “నా తరువాత అదంతా నీకేగదుటే” అంటూ ఎవరికి వాళ్లకి భరోసా ఇచ్చేస్తూ అమ్మో మహా గడుసుదే అనిపిస్తుంది.

శేషమ్మమ్మ ‘మడి మడి యనియెదవు మనసా!’ అంటూ తత్త్వం పాడితే కాయ టక్కున పగుల కొట్టి వక్క చేతిలో పెట్టినట్లే. కాని ఆ తత్వాలు అందరూ వినడం కూడా ఆవిడకి ఇష్టం లేదుట. ఇక ఆవిడ ఊర్మిళాదేవి నిద్ర లాంటి పాటందుకుంటే ఆవిడ గొంతు మంచు కొండల్లో మందాకినిలా వంపులు తిరుగుతూ ప్రవహించేదిట. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మరచి ఆ రసమయ జగత్తులో అమ్మా , పిన్ని, బామ్మా… అంతా తమని తాము కోల్పోయేవాళ్లుట.

 

రక్త సంబంధమో మరో దగ్గరి అనుబంధమో లేని చోట ఏ చిన్న లోటోచ్చిన అది భూతద్దంలో కనిపిస్తుంది. అలాగే ఓ చిన్న అపార్ధం చోటు చేసుకుని సహజంగానే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఒకటై శేషమ్మమ్మ తప్పుపట్టినప్పుడు ఆవిడని సమర్ధించే కుర్రాడి ఆలోచన రీతి చాలా న్యాయంగా వుంటుంది. దాన్ని ఆవిడ తీసుకున్న తీరు ఆ కుటుంబం పట్ల ముఖ్యంగా ఆ పిల్లల పట్ల ఆవిడ కనబరిచే అప్యాయత శేషమ్మమ్మగారి పట్ల మనకో ప్రత్యేక అభిమాన్నాన్ని ఏర్పరుస్తుంది.

 

ఇక కథలో చెప్పినట్లు – బంధాలూ, అనుబంధాలు లేకపోతే సమాజం లేదు. వరసలు కలిపి మాట్లాడుకోవటానికి మంచి మనసే కావాలి. ఆప్యాయత అనుబంధాలని వెతుక్కుంటూ ఊళ్లు తిరిగే  శేషమ్మమ్మ, అందరు నావాళ్ళే అనుకునే మా రాజమండ్రి తాతగారు లాంటి వ్యక్తులు కాలంతో పాటు మరుగయి పోయిన తీపి జ్ఞాపకాలు.

 

మంచి  కొసమెరుపుతో ముగిసే ఈ కథలో నేనింకా పరిచయం చేయని… చేయలేని కోణాలేన్నో. చదివాక మరుపురాని జ్ఞాపకామై మిగిలిపోయే ఓ చక్కని కథ నిశాపతిగారి “ఒంటెద్దు బండి”.

 

http://www.navyaweekly.com/2012/dipawali/page130.asp

 

– విజయ కర్రా

VK1

తనదైన స్పృహతో రాసిన కథలు!

రండి బాబూ రండి!

[మోసం లేదు, మాయా లేదు!
ద్రోహం లేదు, దగా లేదు!

రండి బాబూ రండి!
రండీ, కొనండీ, చదవండీ, ఆనందించండీ, ఆలోచించండీ, ఆశీర్వదించండి….
ఆంధ్రుల అభిమాన యువ రచయిత అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం”
కథాసంకలనం! నేడే మీ కాపీ రిజర్వ్ చేసుకోండి ! ఆలసించిన ఆశాభంగం-
త్వరపడితే తపోభంగం!]

*    *    *

Cover

అఫ్సర్ గారినుంచి వినతి లాంటి ఆజ్ఞ రావడంతో మొహమాటానికి పోయానుగాని, పుస్తకాన్ని సమీక్షించడం అంటే తల మాసినవాడు తలకి పోసుకోవడం లాంటిదని కాసేపటికి యిట్టే తెలిసిపోయింది!

ఈ మాట ఎందుకంటే అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం” పుస్తకం లోని 18 కథలు వెంట వెంటనే చదివేసి వాటి సమాచారాన్ని అరల్లో భద్రపరచే మెకానిజం, మెమరీ పవరూ నాకుందని నేననుకోను. అయితే కొన్నిసార్లు సన్యాసికైనా విన్యాసాలు తప్పవుకదా!:-)

కథలు రాయడం అనే ప్రక్రియని సత్యప్రసాద్ ఒక యోగవిద్యలాగానో, యుద్దవిద్యలాగానో భావించి తగినంత స్వయంశిక్షణతో రాశాడనేది అర్ధమయ్యాక తనమీద గౌరవం మరింత పెరిగింది. తెలుగు సినిమాల్లో పేదరికం కమ్ముకున్న హీరో రకరకాల వృత్తులు చేసినట్టుగా, తనకథలకి భిన్నమైన సబ్జెక్టులు యెన్నుకుని తననితను బాగా కష్టపెట్టుకున్నాడు రచయిత.

ఈ సంకలనం లోని కథల్లో మొదటి కథ “స్వప్నశేషం”, చివరికథ “భూదేవతమ్మ” నాకు బాగా నచ్చాయి. స్వప్నశేషం కథలో ఒక చోట అన్నట్టు, “ఫైన్ ఆర్ట్స్ మర్చిపోయి ఎకనామిక్స్ మాత్రమే బోధించే జీవితపు విశ్వవిద్యాలయంలో భావుకత్వం ఇక భ్రమ”– అన్నప్రకారం ప్రతి తల్లీ, తండ్రీ, స్కూలు కలిసి భావి తరాలను యంత్రాలుగా మార్చే దశలో మనమందరం జీవిస్తున్నాం. ఈ పరిస్తితులను వివరిస్తున్నట్టు పచ్చి రియాలిటీతో సాగే “ఓపన్ టైప్” అనే కథను రాశాడు రచయిత. దీనికి పుర్తి భిన్నంగా, యిదే రచయిత రాశాడంటే నమ్మలేని విధంగా “చినుకులా రాలి” అనే కథని కూడా రాశాడు. ప్రతి కధా దేనికదే ప్రత్యేకంగా అనిపించే 18 కథల్లో 3 కథలు పట్టించుకోదగినవి కాదనేది నా అభిప్రాయమైనా, మిగతా కథలన్నీ మటుకు మనకొక టూర్ ప్రోగ్రాం చేసొచ్చిన అనుభుతిని కలిగిస్తాయి.

ఈ సంకలనంలో భిన్న నేపథ్యాలున్న కథలవల్ల రచయితకొక తాత్వికత లేనట్లుగా పైకి కనిపిస్తుంది గానీ, అంతర్లీనంగా అలోచిస్తే ‘భౌతిక ప్రపంచం వేగంగా మారిపోతున్న వర్తమాన సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న *దూరం* దాదాపు అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. వీలైననంతవరకు ఈ దూరాన్ని దగ్గర చేసే ప్రయత్నంలోనే రచయిత ఈ కథలు రాశాడని చెప్పవచ్చు.

ఇందులోని కథల్లో రచయిత మార్క్సిజం, బుద్దిజం, అంబేద్కరిజం ఇంకా వివిధ అస్తిత్వవాదాలు వంటి సిద్దాంతాల జోలికి పోకపోవడం  ఒక రిలీఫ్. వివిధ సిద్దాంతాలే వైరుధ్యాలతో సంఘర్షిస్తున్న వేళ –  మానవ విలువలే తన దృక్పధంగా ఈ కథల ద్వారా రచయిత తనదైన స్పృహని ప్రకటించుకోవడం కూడా ఆహ్వానించ దగ్గ పరిణామం.

అయితే రచయిత చాలా కథల ముగింపు విషయంలో తగినంత శ్రద్ద తీసుకోలేదని మాత్రం నాకు అనిపించింది. ఇది రచనపై అశ్రద్ద అనేకన్నా మన అవగాహనపై అశ్రద్ద అనవచ్చేమో.  పదిమందికి చేసే కూరలో ఒక ఇల్లాలు ఉప్పు అవసరానికన్నా తక్కువే వేసి గిన్నె దించుతుంది. ఈ తగ్గించి వేయడంలోని జాగ్రత్త గమనిస్తే, తదుపరి కథలు మనల్ని  రచయితకి మరింత దగ్గర చేస్తాయి.

–దగ్గుమాటి పద్మాకర్

daggumati

ఒక altruistic కథకుడు- ముందొక ముళ్లకిరీటం!

 daalappa1

కవి/ రచయిత నాకు తెలుసు అని చెప్పేవాళ్లని- ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారని- అప్పుడెప్పుడో 80 ఏళ్ల క్రితమే చలం గారు (యోగ్యతాపత్రంలో) వెక్కిరింపు, చీత్కరింపు గుర్తుకొస్తున్నా, దాలప్పతీర్థం కథారచయిత చింతకింది శ్రీనివాసరావుతో నా వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రస్తావించడానికి వెనుకాడటం లేదు. ఐతే, అతని కథలకి Motive springs చూపడానికైతే కాదు. అతను నాకు వ్యక్తిగతంగా తెలియక పోతే, ‘దాలప్పతీర్థం’ కథలు మరోలా అర్థమయ్యేవి (లేదా అపార్థానికి గురయ్యేవి). నిర్మమత్వంతో చూడాల్సిన కథలకి నాకు అతనితో ఉన్న పరిచయం అడ్డు కాలేదు సరికదా, నాకు ఆ దిశలో మరింత తోడ్పడింది.

కథల్లోకి వెళ్లే ముందు, కథా రచయిత రాతలకి సంబంధం లేదనిపించే కొన్ని సంగతులు:

ఆంధ్రప్రభ అనే ఒకానొక బుల్లి దినపత్రికని సామ్రాజ్యంగా భావిస్తూ, దానికి తానో చక్రవర్తినని విర్రవీగుతూ, తన భ్రమకి కించిత్ భంగం వాటిల్లినా అందుకు కారణమైన ఉధ్యోగులు అనే కీటకాల్ని కఠినంగా శిక్షిస్తూ- ఓ వేయి విషపడగల వాసుకి! ఆయన ఫ్యూడల్ హయాంలో రకరకాల శిక్షలకి గురైన వాళ్లలో ‘అవిధేయతా’ నేరం కింద అక్కడెక్కడో రూర్కేలా అనే శంకరగిరి మాన్యాలు పట్టిపోయిన వాడు చింతకింది శ్రీనివాసరావు. ఆంధ్రప్రభకి మంచిరోజులు తెచ్చి, దాన్ని భూమార్గం పట్టించిన ఎడిటర్ నిజం శ్రీరామ్మూర్తి గారు- ఆయన టైమ్‌లో తిరిగి తన విశాఖపట్నం గూటికి చేరే ముందు, ఒక నెల రోజులు పాటు హైద్రాబాదులో ఉన్నాడు చింతకింది. వాసుకి బాధితులు సాధారణంగా సెల్ఫ్ పిటీతో కుంగిపోతుంటే, వారి పట్ల సానుభూతి చూపించడంలో మిగతా సహోద్యోగులకి గొప్ప తృప్తి, ఒక మెట్టు ఎగువన ఉన్నామన్న ఆనందం కలిగేవి. కానీ, అటువంటి వారందరికీ చింతకింది ఒక చెంపపెట్టులా కనిపించాడు. సానుభూతి కాదుకదా, ఏ మాత్రం నంగిరితనాన్ని సహించనితనం ముఖాన కుంకుమ బొట్టులా మెరిసేది (ఇంటర్వ్యూలో తొలి ప్రశ్నగా శాఖ ఏమిటని నన్నడిగిన మా వాసుకి నెలకొల్పిన వాతావరణం వల్లనేమో, కొలీగ్స్ కులం సదరు కొలీగ్ కంటే ముందే తెలిసిపోతుండేది. కాబట్టి మెడలో నళినాక్షితాల మాల, స్పటిక పూసల హారం, ఆ పక్కన జంధ్యం, ముఖాన కుంకుమతో, మెడ ఎత్తి చూడాల్సిన చెయ్యెత్తు మనిషి- చింతకింది బ్రాహ్మడని మాకు ముందే తెలుసు). అలాగని ధూంధాంలాడుతుంటాడా అంటే, భారతీయ స్వభావాత్మ వంటి సత్-చిత్-ఆనంద తత్వానికి ప్రతినిధిలా ముఖాన చెదరని నవ్వు. 1990ల ద్వితీయార్థంలో నాతో చిన్నపాటి పరిచయం, తదనంతరం వీడ్కోలు- అంతే.

నేను వైజాగ్ బదిలీఐ వెళ్లాక చింతకింది నాకు నిజంగా పరిచయమయ్యాడు.

పన్నెండేళ్ల క్రితం నా కళ్ల ముందు నిలిచిన ఒక దృశ్యాన్ని చెప్పక పోతే, నేనిక్కడ రాసేదంతా అసంపూర్ణం. బాబ్జీ అనే సహద్యోగి. చిన్న వయసువాడే. రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా చనిపోయాడు. పోస్టుమార్టం అయ్యాక, దగ్గరి బంధువులు, కొలీగ్స్ ఎవ్వరూ కూడా శవం దగ్గరకి వెళ్లడానికి తటపటాయిస్తున్న సందర్భం. ఒక్కడే ఒక్కడు చింతకింది బాబ్జీ శవాన్ని భుజాన మోసుకుంటే బైటకి వచ్చినప్పటి దృశ్యం. శనిదానం. మృత్యుంజయ దానాలు పట్టే బ్రాహ్మడు, శవాన్ని మోసే బెస్త, పాడెగట్టే కాష్ఠమల్లడు, కాటిలో ప్రేతగోపుడు… అన్నీ అతడే. అసందర్భమే గానీ, సతిని మోస్తూ ప్రళయ తాండవం చేసిన రుద్రుడు గుర్తొచ్చాడు. శివుడితో పోలిక లేకపోలేదు, ఆయన గరళాన్ని గొంతులో దాచుకుంటే, చింతకింది దుఃఖాన్ని దాచుకున్నాడు. ఎవరు అతని నోట పలికించే వారోగానీ, చనిపోక ముందు తరుచూ అనేవాడు బాబ్జీ- ‘ నవ్విన నాప చేనే పండుతుందిలే. నన్ను చూసి నవ్విన నువ్వే ఓ రోజు నన్ను భుజాన ఎక్కించుకొని ఊరేగిస్తావు చూడ్రా బావా’. ఆ మాట మరోలా నిజం కావడం వల్ల పొర్లుతున్న, పొగులుతున్న దుఃఖాన్ని గొంతులోనే దాచుకున్న చింతకింది – అగ్ని పర్వతంలా గుంభనంగా కనిపించే మంచుకొండ – అప్పటి నుంచి ఆత్మబంధువు అనుకుంటాను. ఇంకా తరిచి చూసుకుంటే అతను నాకొక subject matter, ఒక phenomenon!

బతుకు కోరేవాడు బావమరిది అంటారు, అలా కోరడానికి చుట్టరికాలు కలవనక్కరలేదు, చింతకిందిలా కలేసుకోవచ్చనుకుంటా. ఒక్క బాబ్జీ యే కాదు, అందరూ ఆయన బావలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు, వదినెలే. పిఆర్ వ్యవహారంలా నీళ్లమీద నూనె తెట్టెలా urbanized పైపై పలకరింపులు కావు. ఎంతవాడ్నైనా ‘ఒరే’ అంటూ పలకరించే చింతకిందిలో సామాజికంగా బ్రాహ్మణ్యం అందించే దాష్టీకం లేదు. ఆ మాటకొస్తే అనూచానంగా వచ్చే అలవాట్లే తప్ప ఆయన కులాన్ని పట్టించే లక్షణాలు మచ్చుకి కూడా లేవు. దాచుకోవడం తెలియని, ఇవ్వడానికే ఉన్నట్టు సాగిన ఆజానుబాహుత్వం ఉన్న ఇటువంటి వారికి, తమ దగ్గర లేనప్పుడు, మోకాళ్ల వరకూ వేళ్లాడే ఆ నిడద చేతులతోనే తీసుకోవడం, లేదా లాక్కోవడం అనే లక్షణాలు కూడా ఉంటాయి. కానీ, అడగటం, తన చేయి కింద కావడం చింతకింది స్వభావంలో లేదు. “….. శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,/ బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ/ ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్/ గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?” అని బలి చక్రవర్తిలా తనది పైచేయి అనిపించుకోవాలన్న మెహర్బాణీ కూడా లేదు. తన చుట్టూ ఉన్న లోకం అంతా ఆయనకి ఒక కుటుంబం, ఒకే కుటుంబం. చింతకిందిలో మరో ముఖ్యమైన లక్షణం నైతికత. అది మర్యాదస్తుల దొంగ ముసుగు కాదు. ఒక పల్లెటూరి నిసర్గమైన నీతి. ఆరడుగుల పైనుండే చింతకింది సమక్షంలో చెట్టు నీడన సేదతీరుతున్నట్టుండే ఆడవాళ్లని గమనిస్తుంటే ఆశ్చర్యమేసేది. జింక- పులి సంబంధానికి సమాంతరంగా ఉండే ఆడ-మగ లోకంలో మానంత మనిషిలా కనబడేవాడు చింతకింది. అతని సమక్షంలో ఏ స్త్రీ కూడా తన పరిమితులు గుర్తొచ్చి న్యూనత పడటం, తన ఉనికి గురించి ఉక్రోషపడటం, తన భద్రత గురించి భయపడటం మచ్చుకైనా ఉండేవి కావు (అతనిని అందరూ అన్నగా భావించడం, నేను తనతో ముందే బావగా వరసలు కలిపేయడం వల్ల, నా వరకైతే భలే బాగుండేదనుకోండి).

ఇక వృత్తి పరంగా కూడా నికార్సైన జర్నలిస్టు. సాధారణంగా చలామణిలో ఉన్న పాత్రికేయం, ముఖ్యంగా ప్రాంతీయ పాత్రికేయం అంటే ఓ పవర్, ఒక దబాయింపు, పరోక్ష (ప్రత్యక్ష) బ్లాక్‌మెయిలింగ్, ఇంకా పైరవీకి synonym. కానీ, ఈనాడులో రిపోర్టరుగా చేరింది మొదలు, ఈరోజు ‘పబ్లిక్’ అనే దినపత్రిక ఎడిటర్‌గా ఎదిగినంత దశ వరకూ చింతకిందికి జర్నలిజం అతని ప్రవృత్తికి కొనసాగింపు. సొంతలాభమనే ప్రయోజనాన్ని ఆశించి, బెదరింపు లాంటి, ఎత్తుగడలాంటి, గూడుపుఠాణీ లాంటి, పోనీ భజనలాంటి రిపోర్టులు ఇతని నుంచి వచ్చే అవకాశమే లేదు. రాజకీయ నాయకుల మొదలు, సెలబ్రిటీస్ అందరితోనే విస్తారమైన పరిచయాలు ఇతనికి. పడవతో నీటికుండే తగుమాత్ర సంబంధంలాంటివే అవన్నీ.

కవులతో, రచయితలతో, కళాకారులతో మాత్రం ప్రగాఢమైన అనుబంధం. స్వతహాగా మంచి గాయకుడు. చాలా తక్కువ మందికి వంటబట్టే పద్య పఠనం అబ్బింది. పీసపాటి వారి నుంచి ఎందరో నాటకరంగ కళాకారులతో పాత్రికేయేతర బాంధవ్యం. మూర్తీభవించిన నియంతృత్వ నియతిలా కనిపిస్తాడు గానీ, పైపై నియమనిబంధనలకి అతీతంగా కళాకారుల్లో ఉన్న artistic moralityకే ఎక్కువ విలువిస్తాడు. చీమకుర్తి నాగేశ్వర్రావు గారికి వైజాగ్ రైల్వే స్టేషనులో చింతకింది పాదాభి వందనం చెసినప్పుడు చుట్టూ ఉన్న సభ్య సమాజం బిత్తరపోయింది. చీమకుర్తి అంతటి కళాకారుడని తెలియక పోవడం వల్లే కాదు, ఆ పచ్చి తాగుబోతు ఒక విసిరేసిన చింకిపాతలా ఉండటం కూడ బహుశా ఒక కారణం.

ఇంత సజ్జన సాంగత్యం, పురా- నవ సాహిత్య పరిచయం, భాషాభినివేశం, నిబద్ధత, కార్యశూరత్వం ఉన్న చింతకింది, 2010 వరకూ, అంటే తన 46 ఏట వరకూ సాహిత్య రంగ ప్రవేశం చేయలేదు, సాహిత్యానికి పాఠకుడిగా ఉన్నాడే గానీ. అదేదో నేరారోపణగా చెప్పడం లేదు. తొలి కథ ‘నిదర్శనం’ 2010 మధ్యలో రాస్తే, దాన్ని 25 జూలై, 2010 ‘ది సండే ఇండియన్’ పత్రికలో ప్రచురించే గౌరవం, ఆ పత్రిక ఎడిటర్‌గా నాకే దక్కింది. చింతకింది కథ రాయడం నాకేమంత ఆశ్చర్యం కాదుగానీ, ‘నిదర్శనం’ వంటి కథ రాయడం నాకు గొప్ప అబ్బురం. దాని కథాకాలంలో ఒక గమ్మత్తుంది. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల సమీపంలోని మొయిదా గ్రామ పొలిమేర్లలో గాలులు ప్రచారం చేసే శతాబ్దం నాటి గాథల్ని 21వ శతాబ్దం తొలి దశకం తర్వాత విన్నాడు రచయిత. విని, దాన్ని కథగా మార్చి, రెండు కాలాలకి గడుసుగా ముడి వేశాడు చింతకింది. జ్యోతిష్య, ఆగమాది శాస్త్రాల్లో నిష్ణాతుడైన ఓ పండితుని నిన్నటి తరాల కథే- నిదర్శనం. గత (మృత) బ్రాహ్మణీయ సమాజాల పునరుద్ధరణ ప్రీతిని ప్రతిఫలించినట్టుండే ఈ కథని తొలికథగా రాయడమే నా విస్మయానికి కారణం. అనుభవాల మీద (అరువు) ఆలోచనలు పెత్తనం చేస్తూ, అవి కథల, లేదా ఇతర సాహిత్య ప్రక్రియల రూపంలో ప్రతిపాదనల స్థాయికి దిగజారి రాజ్యమేలుతున్న వర్తమాన సాహిత్య వాతావరణం, రాజకీయాలూ తెలిసి తెలిసీ, ‘నిదర్శనం’ వంటి కథని రాయడం నా దృష్టిలో సాహసమే. ప్రగతి నిరోధకమనో, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలమనో, పాతచింతకాయ పచ్చడనో పక్కకి తోసేసే వీలున్న కథ.

ఆధునికత అందించిన అత్తెసరు జ్ఞానంతో నిర్లక్షించిన, పక్కకి తోసివేయబడ్డ అంశాల్ని ఆధునికోత్తర టార్చిలైట్లతో వెదికి, వెలితీయాలని ఊదరగొడుతున్న వర్తమానంలో, ఆధునిక పూర్వ సమాజాల బహుముఖీనతని ప్రదర్శించే ఏ కథనైనా తల మీద పెట్టుకోవల్సిందే. కానీ, అది అగ్రవర్ణ బ్రాహ్మణ సమాజాలదైతే ‘మార్కెటింగ్’ చాలా కష్టమే గాక, ఎదురు నిందలు మోయాల్సి ఉంటుందని తెలిసి కూడా ‘నిదర్శనం’ రాశాడు చింతకింది.

రెండవ కథ, ఈ సంకలన శీర్షికగా నిలిచిన- దాలప్ప తీర్థం. ‘నిదర్శనం’లా దీనిని పుక్కిటి కథ అని తేల్చేయడానికి వీల్లేని, స్థల పురాణానికీ- వీరగాధకి మధ్యన నిల్చే ఆధునిక కాలానికి చెందిన కథ. ఈ వైవిధ్యం చూపించిన తర్వాత, సాధారణంగా రచయితకి ఒక అలసట ఉంటుంది. కానీ, ఈ సగటుతనాలు తనకి ఆపాదించడం కుదరదన్నట్టు నిండా మూడేళ్లు తిరక్కుండా 14 కథలతో ఒక కథాసంకలనంగా ముందుకొచ్చాడు (ఇంకొన్ని కథలు పక్కన పెట్టాడనుకుంటా). ఇదంతా గోళ్లు గిల్లుకుంటూ బోల్డు తీరుబడి దొరికి చేయలేదు; ఒక పక్క ‘సాక్షి’లో పని ఒత్తిడి, మరో పక్క తన పీహెచ్‌డీ థీసెస్.

ఇక ఈ కథల్లో సూత్రపాత్రల విషయానికొస్తే, దాదాపు అందరూ ‘పరోపకారమిధం శరీరం..’ అన్న సుభాషితం గురించి చదివే జ్ఞానం, వినే తీరుబడి లేని బొటాబొటీ బతుకుల వాళ్లే; అయినా ఆ సూక్తిని మనసా, కర్మణా ఆచరించిన వారే. ‘పిండిమిల్లు’ హుస్సేనయ్య (అనబడే షేక్ మక్బూల్ హుస్సేన్), ‘గుడ్డముక్కలు’లో సిలపరశెట్టి తాతయ్యలు, ‘పాలమ్మ’, ‘చెరుకుపెనం’ తెప్పగా ఏరు దాటించే రాపర్తి భూషణం, ‘జలగల డాక్టర్’ – సివ్వాల రామునాయుడు….

అందరూ రచయిత పుట్టి పెరిగిన చౌడవరం వాళ్లే, లేదా కాస్త ఇరుగూ పొరుగూ ఊళ్లోళ్లు. అతని చిన్ననాటి జ్ఞాపకాల్లోంచి, నోస్టాల్జియాలోంచీ మేల్కొని, కాగితాల మీదకి నడిచొచ్చిన వాళ్లే.

‘వసుధైక కుటుంబ’మనే అమూర్త భావాలకీ, అతిసాహస, వీరపరాక్రమ యోధానుయోధుల, దీరోదాత్తుల మహాకథనాలకీ వీడ్కోలుగా petits récits అనబడే స్థానీయ కథనాలకి Jean-François Lyotard దారులు వేశాక, ప్రపంచంలో, ముఖ్యంగా మూడో ప్రపంచంలో, ఆ ప్రపంచంలోని తెలుగు లోకంలో అటువంటి కథలు వెల్లువెత్తాయి. కాబట్టి, చింతకింది శ్రీనివాస్ ‘దాలప్పతీర్థం’ ఆ ఒరవడిలో కొత్తదేమీ కాదు. ఆ మాటకొస్తే, చింతకింది కాకుండా (నాకు వ్యక్తిగతంగా తెలియని) ఏ రచయితైనా ఇవే కథలు రాసి ఉన్నట్టైతే నాకు కచ్చితంగా విసుగొచ్చేది, ఈ మీదుమిక్కిలి మంచితనం, పరహితత్వం సరిపడక వెగటేసేది. అదేదో మహాభారత కాలం నాటి ద్వాపర యుగంలో ధర్మరాజుకి ఒక్క చెడ్డవాడు, దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కనబడలేదన్న పిట్ట కథ గుర్తొచ్చేది. మల్లాది రామకృష్ణశాస్త్రి వారంతటి విద్వన్మణి రాసిన ‘తేజోమూర్తులు’లో చిత్రించిన సమాజం, పల్లె, ప్రజ… అందరూ మరీ ఆదర్శప్రాయమై అదేదో రచయిత కలల ప్రపంచం లెమ్మనుకున్నట్టే మరోసారి అనిపించేది.

కానీ,  చింతకింది గురించి ఆసాంతం తెలుసు కాబట్టి ఈ కథాస్థలం కల్పితం కాదనీ, రచయిత పుట్టి, తనకంటే ముందే పుట్టేసిన పలు చింతకింది శ్రీనివాసరావుల్ని చూస్తూ పెరిగి, వారిని తలుచుకుంటూ ఈ కథాశ్రేణికి కారణమయ్యాడనీ, మున్ముందు ఇంకా మరింత అవుతాడనీ అర్థమయ్యింది. ఒక సామాజిక న్యాయం కోసం, తనదైన అస్థిత్వం కోసం స్థానికత పడరానిపాట్లు పడుతూ, తనదైన చరిత్రని ఈ చిన్ని చిన్ని కథల ద్వారా పునర్నిర్మించుకుంటోంది. ఆ పునర్నిర్మాణ ప్రక్రియకి తన కథల ద్వారా చింతకింది చేసిన (చేస్తున్న) కాంట్రిబ్యూషన్ అధికం. ఈ కథల్లో ఇంటిపేర్లతో సహా తను అలవోకగా ప్రస్తావించిన పేర్ల వరకూ చాలు, ఒక ఉత్తరాంధ్ర గ్రామ సామాజిక జీవన వైవిధ్యాన్ని సమగ్రంగా గ్రంథస్థం చేయడానికి. ఆకెళ్ల సోమిదేవమ్మ, కాకరపర్తి సీతాలక్ష్మి, చింతలపాటి సత్యమాంబదేవి, పాలఘాట్ కృష్ణయ్యర్, అగ్గాల సన్నాసి, గరిమెళ్ల సూర్యకాంతమ్మ, అబ్బరాజు సూర్యారావు, మండా రామ సోమయాజులు, భమిడిపాటి యజ్ఞేశ్వరరావు, సచ్చరి పైడయ్య, నడుపూరి ఓబలేసు, జక్కవరం పైడితల్లి, బళ్ల కనకారావు, చుక్కా సీతయ్య, కర్రి పార్వతీశం, పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు, రాళ్లపల్లి కామేశ్వరరావు, పెన్మత్స కృష్ణభూపతి, పిప్పల నారాయణ, కొమ్మిరెడ్డి రాంబాబు, ఈతలపాక వెంకటేశం, గూనూరు గణేషుడు, బుద్ధ నాగజగదీషు, గండి గౌరునాయుడు, ధన్యంరాజు నరసయ్య, బోయిన గౌరీసు, నేమాని పార్వతీశం, యర్రంశెట్టి వీర్రాజు, కోయిలాడ వెంకట్, సుగ్గు వరాలు, మంత్రిప్రగడ గోపాల కృష్ణ, చుండూరు కామేశ్వరరావు, గాటూరి అప్పన్న, బయిన పాపారావు…. ఇంకా ఎందరో…. శారదా నది, బొడ్డేరు, తాచేరు, మానేరుల మధ్య చోడవరం, వడ్డాది, కొత్తకోట, మేడివాడ, అర్జాపురం, దొండపూడి వగైరా ఊళ్లలో ఎదురయ్యే పాత్రలు. వీటితోపాటు, ఉత్సవ సమయాలు, పొర్లు దండాలు, ఏకాకితనాలు, సామూహికత్వాలు, కుడి ఎడమలు, చీకటి వెలుగులు, ద్వంద్వాలు… వెరసి, “To see the world in a grain of sand, and to see heaven in a wild flower, hold infinity in the palm of your hands, and eternity in an hour”అన్న William Blakeని గుర్తుకు తెస్తాయి.

మళ్లీ మొదటిగడి (square one) దగ్గరకే వస్తే, పఠితకి రచయిత (వ్యక్తిగతంగా) తెలియడం అన్న కాన్సెప్ట్ మీద నిర్మించబడ్డ వ్యాసం ఓ పేకమేడ. ‘దాలప్పతీర్థం’ బాగోగులు ఎటువంటి ఊతకర్రల సాయంలేకుండా, దాని textకే పరిమితమై చూస్తే, ఒక అనుభవాన్ని అందించే ముందే రచయిత ఉద్దేశ్యాల మీద ఒకానొక అనుమానాన్ని రేకెత్తించే అవకాశముంది. కథాంశంలోని మానవీయతని సాకుగా చూపించి, కథన రీతి మీద నోరు మెదపకుండా చదువరిని emotionalగా కట్టడి చేసే ఎత్తుగడకి రచయిత పాల్పడుతున్నాడా అన్న అనుమానం. ‘నిదర్శనం’ కథతో తనమీద దాడికి కవ్వించిన తెగువ, లేదా ఆ కథాంశాన్ని మిషగా తనని మొగ్గగానే తుంచేసే అవకాశాన్ని తానే చేజేతులా అందించిన తెంపరితనం మరే కథల్లోనూ కనిపించదు. కథాంశం, దాని నేపథ్యం, దాని వెనుక చిత్తశుద్ధి, తత్పరతలు మాత్రమే కథకి సాహిత్య గౌరవాన్ని చెచ్చిపెట్టవు. వాటి దన్నుతో, take-it-for-granted దిలాసాతో, అభ్యాసం కూసువిద్యలా మూడేళ్లలో 14 కథలు రాసిపారేసినట్టు పాఠకుడికి తోచిందా- ఇక ఆ రచయిత (రచన మీద కూడా) గౌరవం తగ్గుతుంది, నమ్మకం సడలుతుంది. నిజానికి రచయిత నిబద్ధతంటే కమ్యూనిస్టులు చెప్పే మూసల్లోకి రంగూ, రుచీ లేకుండా ఒదిగిపోవడం కాదు, పాఠకుడికి రచన ద్వారా గతంలో ఇచ్చిన భరోసాని, కలిగించిన క్రెడిబిలిటీనీ నిలబెట్టుకోవడం. అటువంటి నిబద్ధత కోసం చింతకింది ఇంకా అక్షర దాస్యం, ధ్యానం చేయాలి. ‘శిఖండిగాడు’, ‘చిదిమిన మిఠాయి’ వంటి కథల్లో శైలీగతమైన లోపాలు కొన్ని కనిపిస్తున్నాయి. రచయిత సర్వజ్ఞుడేమీ కాదు కాబట్టి, కొన్ని ఖాళీల్ని (సహజంగా) వదిలేయడం కూడా రచనా సంవిధానంలో భాగమే. ఈ విషయం సాహిత్య అకాడమీ అవార్డులు సొంతం చేసుకొని, జ్ఞానపీఠాల మీద గురిపెట్టిన తెలుగు మహామహోపాధ్యాయులకే ఎక్కడం లేదు కాబట్టి, చింతకింది వంటి వారిని కార్నర్ చేయడం సబబు కాదేమో. అయినా, అక్షరలోకంలో చిన్నా పెద్దా ఉండవు కాబట్టి అటువంటి excuses, concessions దొరకవని చింతకింది శ్రీనివాస్ గ్రహించాలి. ‘కళింగాంధ్ర వారసుడు’ అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు అంతటి సాహితీవేత్త అనడం ఒక ప్రశంసగా కాకుండా, దాన్నొక ముళ్లకిరీటంగా చూడాలి, దాన్ని ధరించడానికైనా, విడనాడటానికైనా-

నరేష్ నున్నా

 ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది.

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన ” న్యూయార్కు కథలు”

పారుపల్లి శ్రీధర్

పారుపల్లి శ్రీధర్

 

పశ్చిమ తీరంలో మనకు తెలిసిందనుకున్న ప్రపంచంలో తెలియని లోకాలను చూపించే యత్నం కూనపరాజు కుమార్ కథా సంపుటం ‘న్యూయార్కు కథలు’.   పన్నెండు కథలతో గుదిగుచ్చిన ముత్యాలహారమిది. అమెరికా కలల సౌధాలను కూల్చిన టెర్రరిస్టుల ఘాతుకానికి  ఎందరో బలయ్యారు. సెప్టెంబర్  తొమ్మిది  కి నివాళే మొదటి కథ ఊదారంగు తులిప్ పూలు.

లవ్ కెమిస్ర్టీ తోటే రంగుల కెమిస్ర్టీని ఆవిష్కరించారు రచయిత. బూడిదైన బతుకుల్లో ఒక పాత్ర జూలీ. ఆమె విషాదాంత గాధను ఒక ప్రత్యేక టెక్నిక్ తో చెప్పటం ఈ కథలోకొసమెరుపు. చంద్రమండలానికి వెళ్లినా మనవాళ్ల ప్రవర్తన మారదంటూ సునిశిత హాస్యంతో జాలువారిన కథనం గెస్ట్ హౌస్. ఉన్నత శిఖరాలను చేరటానికి రెక్కలు కట్టుకుని డాలర్ల దేశంలో వాలిన ఆశాజీవులు పడే పాట్లను, గెస్టు హౌస్ లో వీరి జీవన శైలిని చక్కగా చెప్పారు కుమార్. బ్రాడ్ వే నాటకాలను చూసి  భీమేశ్వర తీర్ధంలో నాటకాల నాటి నాస్టాలజియాలోకి వెళ్లిపోయారు రచయిత. వియత్నాం యుద్ధం రేపిన కలకలం నుంచి బయటపడిన మిత్రులు కొందరు ఎలా తమ జీవితాలను పునరుద్ధరించుకున్నారో వివిరించే మూవ్ ఇన్ నాటకాన్ని పరిచయం చేశారు.కళ కళకోసం కాదని, సామాజిక ప్రయోజనం కోసమేనని జాన్ పాత్ర ద్వారా చెప్పారు. జీవన వైవిధ్యాన్ని వివరించిన తీరు బాగుంది. పరిశోధనలంటే ప్రాణమిస్తూ, కొత్త కొత్త ఆవిష్కారాల కోసం తపించే అమ్మాయి  దీప. టచ్ మి నాట్ మొక్కతో ఆమె కనుగొన్న అద్భుతం వైజ్ఞానిక లోకాన్ని ఆకట్టుకుంది.  ప్రకృతిలోనే మనిషికి కావలసినవి అన్నీ ఉన్నాయన్న సందేశంతో రిసెర్చ్ చేసి, తనఆవిష్కారాలతో  ప్రతిష్ఠాత్మక ఇంటెల్ ప్రైజ్ సాధించింది దీప. రాబోయే కాలంలో కాబోయే యువ సైంటిస్టులకు ఎంతో స్ఫూర్త్తినిచ్చే కథ మిమోసా పుదీకా.

 

న్యూయార్క్ కథల్లో కదిలించే కథ..మంచు కురిసిన ఆదివారం.  ఘనీభవించిన హృదయాలను కరిగించే హృద్య గాధతో కుమార్ అద్భుతంగా రాసిన కథాకథనమిది. ఓ కవి మిత్రుడన్నట్లు.. కంటికి తడి అంటకుండా జీవితాన్ని దాటిందెవరు? ఘనీభవించిన మంచు వెనుక ద్రవీభవించిన ఒకానొక అరవిందు అంతరంగ ఆవిష్కరణ ఇది. ఆ మధ్య ఓ సినామాలో మన్ హాటన్ పై ఓ పాట వినే వుంటారు. నిజానికి ఆ పాటలో మన్ హాటన్ ఆత్మ కనపడదు. మన్ హాటన్ లో మానవతాపరిమళాలను, సేవా సదనాల్లో ప్రేమానురాగాల్లోబందీలైన కొందరి గాధలు ఈ కథలో కదిలించే శైలిలో రాశారు రచయిత కుమార్ కూనపరాజు. బౌరి స్ర్టీట్ లో ప్రవహించిన ఎన్నారై మిత్రుల ప్రేమను కొలవటానికి ఏ పదాలు సరిపోతాయి? గోడవారగా చేగగిలబడి పిచ్చి చూపులు చూస్తున్న అతడిని చూశాక అరవింద్ హృదయ స్పందన తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. పేజీలన్నీ తిరగేశాక కళ్లు చెమర్చని వారెవరైనా వుంటే దయచేసి వారి అడ్రస్ చెప్పండి. పరిశోధన సాగిద్దాం కరకు హృదయాల మీద.

కొంచెం ఛీజ్ వేస్తావా అని అడిగిన ఆ వ్యక్తి చరిత్ర ఏమిటి? ఈ  ఆశ్రమాల ఆశ్రయించిన (చేరిన) నేపథ్యమేమిటో చదివి తీరాలి. మానసిక చురుకుదనంతో మతి కోల్పోయిన  నల్లజాతి  పాటల రచయిత మైకేల్ రాబర్ట్ అండర్సన్ ను వీరి సేవలు ఎంతగా కదిలించాయో చెప్పటానికి మాటలక్కరలేదు. అరవిందుకు ఆస్తిని రాసేయటం, మైకేల్ చివరి చూపుదక్కకపోవటం,ఇటువంటి మరికొందరు అభాగ్యులను ఆదుకోవటానికి అరవిందు దంపతులు ముందుకు రావటాన్ని హృద్యంగా చిత్రించారు రచయిత. ఎంత సేపటికీ మనీ కల్చర్ లో, మన ప్రపంచంలో బతికే మనం ఇటువంటి లోకాలను చూసి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. పరమార్ధం గ్రహించాలి. ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? ప్రేమించే హృదయమే వుండాలి.  ఆ హృదయ స్పందనకు సరిహద్దులతో పనేముంది అంటే మైకేల్ తనవీలునామా లేఖలో రాయటం గొప్ప సందేశం.

NY Book Title 3 copy copy

గడ్డ కట్టిన మంచులో ఎర్ర పిచుకలు ఏమైపోయాయోఅంటూ అరవింద్ స్పందించటం అతడి సున్నితత్వాన్ని, స్వభావానికి నిదర్శనం. మన్ హాటన్ కాంక్రీట్ జంగిల్ సొరచేప కింది దవడలా వుందంటూ రచయిత చెప్పటం ఆయనలో అంతర్లీనంగా అలజడి చేసే వామపక్ష వాదిని మనముందుంచుతాయి. డాలర్ల దేశంలో రెక్కలు కట్టుకుని వాలిన ఆశాజీవుల కష్టాలను ఆవిష్కరించే యత్నం వెంకోజీ ..కథ. ఉద్యోగం కోసం వెంకోజీ పడిన పాట్లు.. చివరికి  ఎలాగో స్థిరపడి ఇంటికి డబ్బు పంపిస్తే..  ఏం మిగిలింది? వెంకోజీ ట్రాజెడీని న్యూయార్క్ బ్యాటరీ పార్క్ లో శిల్పంతో పోల్చటం బాగుంది. మాన్యుమెంట్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ తో సాపత్యం చక్కగా వుంది. న్యూయార్క్ కథల సంపుటిలో గుర్తుండిపోయే మరో కథ లిటిల్ బుద్ధాస్. బుద్ధుడి జీవిత క్రమం, జ్ఞానోపదేశాల ఆధారంగా బాలవికాస్ పిల్లలు వేసిన బుద్ధా నాటకం…వారి జీవితాలనెలా మార్చిందన్నది ఈ కథ సారాంశం. నాటకంలో ఒక పాత్ర ధరించిన దీక్షిత, శిష్యుడి రోల్ లో కన్పించిన రాబర్ట్ లు బుద్ధుని బోధనలతో ఎలా మారిపోయారు?  నాటకాన్ని డైరెక్ట్ చేసిన సుధీర్ మనోభావాలేమిటి? తదితర అంశాలను  ఆకట్టుకునే శైలిలో చెప్పారు రచయిత కుమార్.

మసక లాడుకుంటున్నాయి లాంటి పదాలు కొన్ని మనం మరచిపోతున్న తెలుగును గుర్తు చేస్తాయి. స్వేచ్ఛా, సౌభాతృత్వాల ప్రతీక..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ కథ వాల్డ్ ట్రేడ్ సెంటర్.. జంట శిఖరాలను కూల్చకముందు మనసులో వుంచుకుని తర్వాత రాసినది. స్టీమర్ లో స్టాచ్యూ ఉన్న ఐలెండ్ కు వెళుతుంటే మన్హాటన్ అందాలను అభివర్ణించారు. మన్హాటన్  నీళ్లలోంచి వచ్చిన కాంక్రీట్ జంగిల్లా ఉంది. ఆ భవనాల మధ్యలో ఉన్న ఎత్తయిన ట్విన్ టవర్స్ గుమ్మం ముందు నిలబడ్డ నవదంపతుల్లా ఉన్నాయంటూ వర్ణించారు రచయిత.

న్యూయార్క్ కథల సంపుటిలో మరో విశిష్ట కథ గురు పౌర్ణమి.  గురువు జీవన విషాదానికి చలించిన ఓ శిష్యుడి అంతరంగ ఆవిష్కరణం, మోదం, ఖేదం, సందేశాల సమాహారం కథనం. మేక్ బెత్ నాటకాన్ని విశ్లేషించిన గురువు గారు ఇంత చిన్న పల్లెటూరులో ఎందుకు ఉండిపోయారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం. ప్రపంచాన్ని బాగుచేసే గురువులు తమ జీవితాన్ని బాగుచేసుకోలేరు. ఊరంతా ప్రేమించి,అంతటి శిష్యగణం ఉన్నా.. మాస్టారు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగలేదు. అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకమన్న సినీ కవి వాక్కులు గుర్తుకొస్తాయి. ఆషాఢభూతుల్లాంటి శిష్యులు కొందరి నైజం లోకం పోకడకు దర్పణం పడుతోంది. సున్నిత మనస్కుడైన కథానాయకుడు..మనిషి అమెరికాలో ఉన్నా..మనసంతా తను పుట్టి పెరిగిన ఊరిమీదనే ఉంటుంది. మాస్టారి కూతురి ఉత్తరంతో కదిలిపోయి..ఇండియా వచ్చి వారి కుటుంబ దురవస్థకు చలించి పోతాడు. బుద్ధుడి బోధనలనే మాస్టారు ఆదర్శంగా తీసుకున్నారేమో అన్పిస్తుంది.  బుద్ధ భగవానుడి పుట్టిన రోజు, నిర్యాణం చెందిన రోజూ పౌర్ణమే. గురువు గారు ప్రైవేటు పాఠశాలలో శిష్యులకు వీడ్కోలు సందేశం లో బుద్ధుని బోధనలను గుర్తుచేయటం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. కథకు గురుపౌర్ణమి అని పేరుపెట్టడం సందర్భోచితంగా ఉంది. పూర్వం పల్లెల్లో  ప్రైవేటు బడులు, బడి ఎగ్గొట్టే పిల్లలను మాస్టారు పంపించిన భటులు (క్లాసులీడర్లు) వచ్చి తీసుకెళ్లటం..లాంటి స్మృతుల్ను రచయిత సునిశిత హాస్యంతో రాశారు. చంద్ర మండలం వెళ్లినా మన వాళ్లకు హూందాగా ప్రవర్తించరేమో! కథా సంపుటిలోని మనమింతేనా..అనే కథ ఇదే అర్ధంలో సాగిన సెటైర్. మువ్వల సవ్వడి వినిపిస్తోంది రచయిత కళాభిరుచికి నిదర్శనం.

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన కథలు. ఒక మధ్యతరగతి మానవుడు అమెరికా వెళ్లి గుండెల నిండా నింపుకొన్న అనుభూతులను, అద్దుకున్న పరిమళాలను హృద్యంగా ఆవిష్కరించారు రచయిత కుమార్. తొలి ప్ర యత్నంలోనే ఇంత మంచి కథా సంపుటి వెలువరించటం అభినందనీయం. ఎక్కడా భాషా భేషజాలు లేకుండా..అందరికీ అర్ధమయ్యే సరళ శైలిలో రాశారు.

-పారుపల్లి శ్రీధర్

బియాండ్ కావలి… బియాండ్ ఖదీర్!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

 

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?

ఈ రెండు ప్రశ్నలకి సరైన జవాబు తెలుసుకోగలిగినవాడే గొప్ప రచయిత అవుతాడు. ముఖ్యంగా కథల విషయంలో ఈ ప్రశ్నల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనకన్నా ఇంకాస్త ఎక్కువ చదువుకున్నవాళ్ళు ఈ ప్రశ్నలనే మరో రకంగా “వస్తువు, శిల్పం/శైలి” అంటారు. అనేదేదైనా కథకుడు ఆలోచించి తీరాల్సిన రెండు ప్రశ్నలు అవే – ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్పాలనుకున్న వస్తువును ఆధారం చేసుకోని శైలి వుండాలనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఈ రెండింటి సమన్వయం కుదిరితే ఆ కథ గొప్ప కథ అయ్యే అవకాశాలు మెండుగా వుంటాయి.

పై విషయాలు మనందరికీ తెలిసిన విషయాలైనా మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఖదీర్ బాబు కొత్త పుస్తకం “బియాండ్ కాఫీ” గురించి చెప్పడానికి. ఈ పుస్తకంలో వున్న చాలా వరకు కథలను విశ్లేషించే ముందు వస్తువు, శిల్పం గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవడం అవసరం. సరే అదలా పక్కన పెడదాం.

కథకుడు ఖదీర్ బాబు పేరు చెప్పగానే నెల్లూరు జిల్లా కావలిలోని పేద కుటుంబాలు, మరీ ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు గుర్తుకొస్తాయి. పేదరికం ముఖం మీదకి ఆత్మవిశ్వాసాన్నో, చిరునవ్వునో అయుధంగా విసిరి గెలిచిన వీరుల కథలు ఆయన “దర్గామిట్ట కతలు”, “న్యూ బాంబే టైలర్స్” సంపుటాలలో కనిపిస్తాయి. నామిని కథల స్పూర్తిగా ఆత్మకథల కథలు విరివిగా వస్తున్న సంగతి మనకి తెలుసు. అలాంటి కథలే “దర్గామిట్ట కతల”ని ఖదీర్ స్వయంగా చెప్పుకున్నాడు కూడా.

  ఇలాంటి కథలు రాయడంలో ఒక సౌకర్యం వుంటుంది. తాము (ముఖ్యంగా చిన్నప్పుడు) చూసిన జీవితాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోని రాయడం వల్ల ఎక్కువగా ఊహించాల్సిన పని వుండదు. చెప్పే విధానం (శైలి/శిల్పం) మీద మాత్రమే దృష్టి నిలిపితే స్వతాహాగా వున్న వస్తు బలం వల్ల కథలకి మంచి పేరొస్తుంది. అందువల్ల ఇలాంటి కథలు రాయడం సుళువని నా ఉద్దేశ్యం. ఇదే విషయాన్ని ఖదీర్ బాబు కూడా ఒక చోట ప్రస్తావించారు – “రాయగా రాయగా మంచినీళ్ళు తాగడం కన్నా ఈ కతలు రాయడమే సులువుగా అనిపించింది నాకు” అని.

ఇలాంటి కథలు పాఠకులని మెప్పించే విషయంలో కూడా కొంత సౌలభ్యం వుంది. వీటిల్లో nostalgic effect వుండటం వల్ల “ఒకసారి మనూరు వెళ్ళి చూసొద్దాం” అన్నంత చనువుగా పుస్తకంలోకి వెళ్ళిపోతాం. అక్కడికి ఈయన రాసిన కథలు గొప్పవి కాదని నేను అనటంలేదు. ఈ సౌలభ్యాలని దాటి, ఇంతకంటే కష్టమైన ప్రయోగం చేశాడు కాబట్టి post facto  చూస్తే పెద్ద గీత ముందు చిన్న గీతలా ఈ కథలు ఆయన సులభంగానే రాసేసివుంటాడు అనిపిస్తుంది. అలా అనిపించడానికి దోహదం చేసిన కథల సంపుటి – “బియాండ్ కాఫీ”

***

beyond kaafee

ఖదీర్ బాబు ఈ పుస్తకం కోసం కావలి దాటి వచ్చేశాడు. ఇప్పటి దాకా మనకి పరిచయమున్న ఖదీర్ ని కూడా దాటి వచ్చేశాడు. కథా వస్తువును ఎన్నుకోవడంలోనే ఇప్పటి కథకులను దాటి నాలుగడుగులు ముందుకేసేశాడు.

ప్రస్తుతం మనం బతుకుతున్న ప్రపంచం ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను మన ముందు ముళ్ళలా పేరుస్తోంది. పారిశ్రామీకరణలు, ప్రపంచీకరణలు దాటి సాంకేతిక విప్లవాలు, సమాచార విప్లవాల మీదుగా ద్రవాధునికతలోకి (liquid modernity) ప్రయాణిస్తున్నాం. మార్పు అనివార్యమైపోతోంది. మార్పుకి మార్పుకి మధ్య సమయం కుచించుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో పుట్టుకొస్తున్న కొత్త ధోరణులను కథా వస్తువుగా కథలు రావాల్సిన అవసరం చాలావుంది. ఆ కథాంశాలతో కథలు రాసే సాహసం ఖదిర్ బాబు చేశాడు.

సాహసం ఎందుకంటే – ఇప్పటిదాకా ఖదీర్ బాబు అంటే వున్న ఇమేజ్ వేరు. ఆయన “సులభంగా” రాసేసినా బాగా పేరుపడ్డ కథలలా ఈ కథాంశాలకు ఆ ఎట్రాక్షన్ లేదు. పైగా ఈ కథలు మన ఉరుకుల పరుగుల జీవితాన్ని, మంచి చేడుల మధ్య లోలకంలా ఊగిసలాడే మన విలువలని నిర్లజ్జగా నగ్నంగా నిలబెడతాయి. ఇది చదివి కొంతమంది ఇలాంటి జీవితం జీవిస్తున్నామా అని అనుకోవచ్చు. ఇదంతా ట్రాష్… మన జీవితాలేం ఇంత దారుణంగా లేవని ఇసకలో తల పెట్టుకు బతికేయచ్చు. నిక్కచ్చిగా చెప్పే నిజాన్ని నిజం అని ఒప్పుకునే ధైర్యం అందరిలో వుండకపోవచ్చు. అయినా సరే ఇలాంటి కథలను రాసి, (ఏ పత్రికలోనో కాకుండా) నేరుగా పుస్తకంగా వెయ్యగలగడం సాహసం అని కాక ఇంకేమనగలం?

సరే, కథాంశాలు ఇలా వుంటే దానికి తగ్గ శైలి వుండాలని ముందే అనుకున్నాం కదా? ఖదీర్ బాబు అదే చేశాడు. ఇప్పటిదాకా సొగసుగా పలికిన నెల్లూరు జిల్లా యాసని వదిలిపెట్టాడు. ఆ వాక్య నిర్మాణ పద్ధతిని విడిచిపెట్టాడు. కొత్తగా కలం పట్టినంత సుళువుగా కొత్త వాక్యాలని నిర్మించాడు. ప్రపంచీకరణ, సమాచార విప్లవాల అనంతరం ఏర్పడిన “నియో రిచ్” మానసిక స్థితిని చెప్పడానికి ఒక కొత్త పరిభాషని అందుకున్నాడు. ఇది చూడండి –

నలుగురు వచ్చారు.

ఆగింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ ఆ సమస్యకు –

ముందుకు వచ్చారు.

భయపడింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ –

చుట్టుముట్టారు.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ –

అబ్బ.. అబ్బ… ఏముందిరా.

ముప్పయ్ రెండేళ్ళ –

ఆత్రపడ్డారు (ఇంకోవైపు)

(ఇలాంటి వాక్యాలు ఈయనతోనే మొదలు అనేంత దుస్సాహసం నేను చెయ్యడం లేదు. ఇలాంటి వాక్యాలు ఖదీర్ బాబుకి కొత్త అని మాత్రమే నేను అంటున్నాను.)

దాదాపు అన్ని కథలలోనూ స్త్రీలను ముఖ్యపాత్ర చేశాడీయన. నేను పైన ప్రస్తావించిన పోస్ట్ గ్లోబలైజేషన్ – ద్రవాధునిక జమానాలో అన్ని కోణాలనుంచి ఒత్తిడికి లోనౌతున్నది స్త్రీ. ఉరుకుల పరుగుల మధ్య భర్తకి ఉదయాన్నే కారియర్ అందించే వంటమనిషిగానో, వారాంతంలో శృంగారావసరాలకి మాత్రమే పనికొచ్చే ఆటబొమ్మగానో మిగిలిన భార్యలు ఇప్పుడు మనకి కొత్తకాదు. అయితే పేరుకు కుటుంబం వున్నా ఒంటరైపోయిన ఇలాంటి వాళ్ళ జీవితంలోంచి కథలు తీసుకురావడంలో రచయిత సఫలీకృతులయ్యాడు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ జీవితాలలో వున్న స్తబ్దతని, అనిశ్చితిని, నైరాశ్యాన్ని వాక్యాలతో నిర్మించిన తీరు చాలా గొప్పగా వుంది. (టాక్ టైమ్, మచ్చ, బియాండ్ కాఫీ). ఇది శైలి గురించి

మొత్తం మీద చెప్పేదేమిటంటే – ఈ పుస్తకంలో కొత్త వస్తువుతో, కొత్త శైలితో ఖదీర్ కొత్తగా పుట్టాడు.

***

ఇందులో పది డైరెక్ట్ కథలు (ఏ పత్రికలోనూ అచ్చు కానివి) వున్నాయి. అందులో “వహీద్” కథ ఒక్కటే Odd man out గా వుండిపోతుంది. మిగిలిన కథలన్నీ పోస్ట్ మోడరన్ సిటీలలో జరిగితే ఈ కథ ఒక్కటే నోస్టాల్జిక్‍గా వెనక్కి వెళ్తుంది. కథలో కొంత లిబరల్ అంశం వున్నా అది చాలా పల్చగా వుండటం వల్ల బహుశా ఈ సంకలనంలో వుండదగినది కాదేమో అనిపిస్తుంది. ఆ ఒక్క కారణం తప్పితే కథ బాగానే వుంది. మిగిలిన కథలన్నీ చదవాల్సినంత బాగున్నాయి. మనం బతుకున్న సమాజాన్ని ఒకసారి మనం అద్దంలో చూసుకోవాల్సిన అవసరం వల్ల చదవాలి.

అయితే ఈ కథలు చదివిన తరువాత కొంత అసహ్యం కలగవచ్చు, కొంత అసహనం కలగవచ్చు. నిక్కచ్చిగా నిజం తగిలిన చోట కోపం రావచ్చు. బహుశా రచయిత కోరుకుంది కూడా అదేనేమో..??

– అరిపిరాల సత్యప్రసాద్

(ఖదీర్ పుస్తకం కినిగె లో దొరుకుతోంది)

ముస్లిం అస్తిత్వవాదం వైపు ఖదీర్ ‘న్యూ బాంబే టైలర్స్’

dani

 దాదాపు పధ్నాలుగేళ్ల క్రితం ‘దర్గామిట్ట’ కథలతో ఖదీర్‌ బాబు సాహిత్యరంగ ప్రవేశం చేశాడు. గడిచిన పన్నెండేళ్ళ కాలంలో రాసిన మరో  పన్నెండు కథల్ని  ‘న్యూబాంబే టైలర్స్‌’ శీర్షికతో ఇప్పుడు మరో  సంకలనం తెచ్చాడు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ ముస్లిం పిలగాడి అల్లరి, చిల్లరి, గడుసు, గడుగ్గాయి యవ్వారం దర్గామిట్ట కతలు. వాటిల్లో, అక్కడక్కడ చూచాయిగా కొన్ని పోకడలు   వున్నప్పటికీ,  దర్గామిట్ట కతల లక్ష్యం ముస్లిం అస్తిత్వవాదం కాదు. ఒకవిధంగా అవి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు’పచ్చనాకు సాక్షి’కి ‘మతాంతీకరణ’ కతలు అనంటే ఖదీర్‌ బాబుకు కూడా అభ్యంతరం వుండకపోవచ్చు. నామిని తనకు గురువని ఖదీరే స్వయంగానూ, వినయంగానూ ప్రకటించుకున్న సందర్భాలున్నాయి.

 

ఖదీర్- నామిని ఒక తలకోన జ్ఞాపకం!

ఖదీర్- నామిని ఒక తలకోన జ్ఞాపకం!

‘న్యూబాంబే టైలర్స్‌’ కథా సంపుటి కతే వేరు. కథా వస్తువు, కథాంశం,  కథనం, శిల్పం, టెక్నిక్‌, మానవ సంఘర్షణ అలా ఏవిధంగా చూసినా’న్యూబాంబే టైలర్స్‌’ లోని కథలు ‘దర్గామిట్ట కథల’కన్నా ఒక తరం ముందుంటాయి. దర్గామిట్ట కథల్లాగ కేవలం తెలుగు-ముస్లిం సమాజపు సాంస్కృతిక వాతావరణాన్ని పరిచయం చేయడంతోనే ఇవి సంతృప్తి చెందవు. ముస్లిం అస్తిత్వవాదం వైపు అడుగులేస్తాయి. అంతేకాదు, ‘కింద నేల ఉంది’ కథలో హిందూ ఆణగారిన కులాలు, స్త్రీల, అస్థిత్వవాద ఛాయలు కూడా  కనిపిస్తాయి. సంకలనంలో చివరి కథ ‘గెట్‌ పబ్లిష్డ్‌’కు  వచ్చే సమయానికి రచయిత తన ఐడెంటిటీని మరింత బాహాటంగా ప్రకటిస్తాడు. తన కథనశిల్ప నైపుణ్యాన్ని మరింత సమర్ధంగా ప్రదర్శిస్తాడు.

విభిన్న మతసమూహాల మధ్య సాంస్కృతిక వైవిధ్యం వుంటుందిగానీ,  సాంస్కృతిక విబేధం వుండదు. హిందువు గుడికి వెళితే ముస్లింలకు వచ్చే ఇబ్బందిగానీ, ముస్లింలు నమాజు చేసుకుంటే హిందువులకు కలిగే అభ్యంతరంగానీ, తనంతటతానుగా, ఏవిూవుండదు. అయితే, రాజకీయార్ధిక  అంశాలు ప్రవేశించాక, పోటీ పెరిగి, సమూహాల ఉనికే సమస్యగా మారుతుంది. అప్పుడు, రాజకీయార్ధిక విబేధాలన్నీ సాంస్కృతిక విబేధాలనే భ్రమను కల్పిస్తాయి. అలాంటి సందర్భాల్లో  రెండు సమూహాలూ, ప్రాణప్రదమైన, రాజకీయార్ధిక  అంశాల్ని పక్కన పెట్టి, బొట్టు, బుర్ఖా, లుంగి, పంచె వంటివాటి గురించి అసంబధ్ధంగా  తలపడుతుంటాయి.

భారత సాంస్కృతికరంగాన్ని, మరీ ముఖ్యంగా, భారతముస్లింల సాంస్కృతిక వికాసాన్ని, 1992కు ముందు, ఆ తరువాత అని విడగొట్టి,అధ్యయనం చేయాల్సి వుంటుంది.        ఎందుకంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, భారత సమాజంలోని రెండు ప్రధాన ప్రజాసమూహాలని సాంస్కృతిక పునాది విూద విడగొట్టాలనే కుట్రతో కొందరు బాబ్రీమస్జిద్‌ ను కూల్చివేసింది ఆ సంవత్సరమే!

‘జవిూన్‌’ కథలో కసాబ్‌  గల్లీ, మాలపాళెం గొడవ కూడా అలాంటిదే. కొట్లాటల్లో సత్తా కోసం కొందరు గాడిద పాలు తాగేవారని ఖదీర్‌ రాశాడుగానీ. నిజానికి వాళ్లకు ఆ అవసరంలేదు!. ఎందుకంటే, రాజకీయ గాడిదలే అలాంటి పనులు చేస్తాయి!!. కనుక, వాళ్ళు ప్రత్యేకంగా గాడిద పాలు తాగాల్సిన పనిలేదు.

బాబ్రీమస్జిద్‌ – రామ్‌ మందిర్‌ వివాదంలో సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు పక్షాన కేసు వేసిన, మొహమ్మద్‌ హాషిమ్‌ అన్సారీ, దిగంబర్‌ అఖార నిర్వాహకుడు రామచంద్ర పరమహంస దాస్‌, నిజజీవితంలో, ‘జవిూన్‌’ కథలో హుస్సేన్‌, బ్రహ్మయ్య లాంటివాళ్ళే. మసీదులో నమాజ్‌ జరగడంలేదనే బెంగతో ఒకరు,రామమందిరంలో దీపంపెట్టే దిక్కు కూడా లేకపోయిందనే ఆవేదనతో మరొకరు  1961లో ఫైజాబాద్‌ కోర్టులో కేసు వేశారు.

అన్సారీ, పరమహంస ఇద్దరూ, భక్తులు. మంచి స్నేహితులు. వాజ్యం  నడుస్తున్న కాలంలోనూ ఒకరినొకరు కలవకుండా ఒక్కరోజు కూడా వుండేవారుకాదు. రోజూ సాయంత్రం పూట పరమహంస ఇంటి దగ్గర కలిసి పేకాడుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. వాయిదావున్న రోజుల్లో ఇద్దరూ కలిసి ఒకే సైకిల్‌ పై కోర్టుకు వెళ్ళొచ్చేవాళ్ళు.  వయసులో పరమహంస పెద్ద, అన్సారీ చిన్న. పరమహంసని వెనక క్యారియర్‌ పై కూర్చోబెట్టుకుని  అన్సారీ సైకిల్‌ తొక్కేవాడు. కోర్టు ఫీజులకు డబ్బులు సరిపోకపోతే ఒకరికొకరు సర్దుకునేవాళ్ళు. కేసు కాగితాలు మర్చిపోతే, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. అవసరమైనప్పుడు ఒకరి కొకరు జావిూను ఇచ్చుకునేవాళ్ళు. చివరకు ఒక సందర్భంలో (బహుశ ఎమెర్జెన్సీ  రోజులు కావచ్చు)  ఇద్దరూ ఒకే జైల్లో ఒకే సెల్లో  వున్నారు. (బహుశ, ఆ సెల్లోనే, ఎవరి దిక్కుకు వాళ్ళు తిరిగి, నమాజ్‌, పూజలు జరుపుకునివుంటారు.)  వయసు మళ్ళి పరమహంస చనిపోయాక,  నిర్మోహీ అఖారా అధ్యక్షుడయిన మహంత్  భాస్కర దాస్‌ తో కూడా అన్సారీ అదే స్నేహబంధాన్ని కొనసాగించాడు.

బాబ్రీమసీదు వివాదంలో, హిందూ-ముస్లిం స్నేహబంధం మీద ఇప్పటికీ నమ్మకం కుదరనివాళ్ళు వుండొచ్చు. వాళ్లు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి“V Hashim Ansari — A Long Wait’   అని కొట్టి నివృత్తి చేసుకోవచ్చు. అప్పట్లో, ’ద హిందూ’, ’ఫ్రంట్ లైన్’ పత్రికల్లో కూడా అన్సారీ, పరమహంసల మిత్రబంధంపై చాలా వార్తలొచ్చాయి.

అన్సారీ,  ఓ ఇంటర్వ్యూలో, అప్పుడు వాతావరణం ఏమాత్రం చెడిపోలేదు”  (“కోయీ మహోల్ నహీ బిగడా తబ్”)   అన్నాడు. అప్పుడు ….  అంటే, మత ప్రాతిపదికపై జనాన్ని చీలిస్తేనేగానీ, తమకు అధికారం దక్కదని సంఘ్‌ పరివారం భావించడానికి ముందు;  రాజకీయాల్లోనికి భారతీయ జనతా అనే ఒక పార్టి పుట్టక ముందు; లాల్‌ కిషన్‌ అద్వానీ అనే ఒక రాజకీయ నాయకుడు అశ్వమేధ యాగాలుచేసి, యాగాశ్వాన్ని దేశం విూదికి సవాలుగా వదలడానికి ముందు అని అర్ధం. ఖదీర్  జవిూన్‌ కథలో అయితే, బ్రహ్మయ్య కొడుకు రవణ ”తెల్లారిలేచి, యింతెత్తు బొట్టుపెట్టుకుని, యింతెత్తు కర్రపట్టుకుని” పోవడం మొదలెట్టక ముందు (పేజీ 38) అని అర్ధం. మతతత్వ రాజకీయ నాయకులు భక్తినీ, స్నేహాన్నీ కూడా ఇంతగా కలుషితం చేసేస్తారని వాస్తవ జీవితంలో అన్సారీ, పరమహంసలకు తెలీదు. ఖదీర్‌ కథలో హుస్సేన్‌, బ్రహ్మయ్యలకూ తెలీదు.

ఖాళీ స్థలాన్ని చూస్తే చాలా మందికి ఖాళీ స్థలమే కనిపిస్తుంది. కానీ, ఓ తాపీ మేస్త్రికి అందులో ఒక అందమైన ఇల్లు కనిపిస్తుంది. ‘ద థింగ్‌ ఇన్‌ ఇట్‌ సెల్ఫ్‌’!. దక్షణ దిక్కున మొదలెట్టి, నైరుతీ మూలన ఎత్తుపెంచి, ఆగ్నేయాన మంటపెట్టి, వాయువ్యాన్ని గాలికి వదిలి, ఈశాన్య మూలన పల్లంచేసి,నిర్మాణాన్ని ముగించడం ఎట్లాగో తోస్తుంది. ఇసక, కంకర, సిమెంటు, ఇటుకలు, లావుకడ్డీలు, సన్న కడ్డీలు, బైండింగ్‌ వైరు ఏవి ఎంతెంత కావాలో టకటకా బుర్రలోకి వచ్చేస్తాయి. కథా శిల్పంలో, ఖదీర్‌ అలాంటి ఓ మంచి తాపీమేస్త్రి. కథా నమూనా (పారాడిజిమ్‌)  తనకు బాగా తెలుసు. పైగా అతనికి ఈ వాస్తు గొడవ లేదు. నిర్మాణం కచ్చితంగా  తెలుసు గాబట్టి, కథను ఏ మూల మొదలెట్టినా, అనుకున్న రూపంలో దాన్ని సమర్పించవచ్చనే, రచయిత, ధీమా  ప్రతి కథలోనూ కనిపిస్తుంది.

కథకు మానవ సంఘర్షణే ప్రాణం. దాన్ని ఏ నమునాలో చెప్పాలన్నది రెండో అంశం. ఈ రెండు పనులు పూర్తి అయ్యాక, కథకు కండ పుష్టిని అందించడానికి, సజీవంగా మార్చడానికి, ఆయా పాత్రల గురించీ, వాటి వృత్తుల గురించి, అవి తిరుగాడిన పర్యావరణాన్ని గురించి, రచయితలు, వాస్తవ జీవితంలో విస్తృతంగా పరిశోధన సాగించాలి.

కొంతమంది రచయితలు ఈ క్రమాన్ని తలకిందులుగా చేస్తుంటారు. వాస్తవ జీవితంలో దొరికిన కొన్ని పాత్రల్ని  తీసుకొచ్చి, అక్షరాల్లో పొదిగితే దానికదే కథ అయిపోతుందనుకుంటారు. చాలాచాలా అరుదుగా మాత్రమే అలా కుదరవచ్చు! ఎందుకంటే,  వాస్తవ జీవిత పాత్రలకు ఒక పరిమితి వుంటుంది.  ఒక దశలో అందరికీ ఎంతో ఉత్తేజాన్నిచ్చిన వ్యక్తులు కూడా ఆ తరువాతి కాలంలో చచ్చుబడి పోతుంటారు. నాలుగున్నర దశాబ్దాలుగా, భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయ స్రవంతిగా కొనసాగుతున్న నక్సల్‌ బరీ ఉద్యమానికి ‘తొలి హీరో’ జంగల్‌ సంథాల్‌ జీవిత చరమాంకం ఏమిటీ? అందువల్ల, వాస్తవ జీవితం నుండి దేన్నీ స్వీకరించాలో, ఏ మోతాదులో స్వీకరించాలో, దేన్ని వదిలెయ్యాలో, దేన్ని సవరించాలో, దేన్ని కల్పన చేయాలో రచయితలకు కచ్చితంగా తెలియాలి.  అలాంటి సృజనాత్మక సాహిత్య విచక్షణా జ్ఞానంలో ఖదీర్‌ సిధ్ధహస్తుడు.

పాత్రల పర్యావరణాన్ని గురించి ఖదీర్‌ పరిశోధన ఎంత విస్తృతంగా సాగుతుందంటే, అతను చిత్రించే కల్పిత పాత్రలు సహితం నిజజీవిత పాత్రలేనేమో అని భ్రమను కల్పిస్తాయి. ‘న్యూబాంబే టైలర్స్‌’  కథలో పీరూభాయి మద్రాసు వెళ్ళి, హార్బర్లో బిల్లులు లేకుండా రెండు సింగర్‌ మిషిన్లు కొంటాడు. మూర్‌ మార్కెట్‌ అంతా  తిరిగి కత్తేర్లు, స్కేళ్ళు, టేపులు కొంటాడు. (పేజీ-9) ఇలాంటి సూక్ష్మ వివరాలు కథని దాదాపు వాస్తవ  జీవితంగా మార్చేస్తాయి.

ఖదీర్‌ పరిశోధన ఫలితాలు, ఆయా వృత్తుల వారికి, వాస్తవ జీవితంతంలో ఒక కొత్త అర్ధాన్నీ, ఉత్తేజాన్ని కల్పిస్తాయి. ‘న్యూబాంబే టైలర్స్‌’  కథలో, ”గుడ్డలు కుట్టడమంటే, కొలతల్నిబట్టి కుట్టడంకాదు. మనిషినిబట్టి కుట్టడం” (పేజీ-11) అంటాడు పీరూభాయి. ఉత్పత్తిరంగంలో,  మాస్‌ కస్టోమైజేషన్‌ కు,ఇండివిడ్యువల్‌  కస్టోమెరైజేషన్‌ కు ఎప్పుడూ ఒక ఘర్షణ వుంటుంది. ఒకటి సాధారణమైనది. మరొకటి ప్రత్యేకమైనది. పీరూభాయి మాటల ద్వారా  సాంప్రదాయ దర్జీ వృత్తికారులకు ఒక ఉత్తేజకర నినాదాన్ని ఇస్తాడు ఖదీర్‌!

సృజనాత్మక రచయితల సమర్ధత అక్షరాల్లో వుండదు; అక్షరాలు మాయమైపోవడంలో వుంటుంది. కథ చదవడం  మొదలెట్టిన కొద్దిసేపటికే,పేజీల్లోంచి అక్షరాలు మాయమైపోవాలి.    పాఠకుల వ్యక్తిగత అనుభవం మేరకు, ఊహాశక్తి మేరకు, ఆ కాగితాల్లోంచి, కొన్ని పాత్రలు పుట్టుకొచ్చి, ఒక కొత్త పర్యావరణంలోనికి పాఠకుల్ని తమవెంట లాక్కుపోవాలి. చదువుతున్నారో, చూస్తున్నారో తెలీని ఒక  చిత్తభ్రమకు పాఠకుల్ని లోనుచేయాలి. రచనల్లో మనం చూస్తున్నది సజీవ వ్యక్తుల్ని అనుకున్నప్పుడే పాఠకులు పాత్రల ఉద్వేగాల్లో లీనమైపోయి, ఆనందించడమో, బాధపడ్దమో, నవ్వడమో,ఏడ్వడమో చేస్తారు.  సాహిత్య ఆస్వాదన అనేది రచయిత, పాఠకులు , పాత్రలు ముగ్గురూ  కలిసిచేసే జుగల్‌ బందీ! కొంచెం శాస్త్రబధ్ధంగా చెప్పుకోవాల్సివస్తే,  ‘గతితార్కిక సంబంధం’ అనుకోవచ్చు! అయితే, పాఠకులకు అలాంటి ఉద్వేగానికి గురిచేయగల దినుసుల్ని, ప్రణాళికాబధ్ధంగా,అందించగల సమర్ధత రచయితలకు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

కొన్ని కథలు చదువుతున్నప్పుడు ఆద్యంతం అక్షరాలే కనిపిస్తుంటాయి. అంటే, ఉద్వేగాన్ని కల్పించగల దినుసులు వాటిల్లో పడలేదని అర్ధం. మరి కొన్ని కథలు చదువుతున్నప్పుడు, అక్కడక్కడైనా, అక్షరాలు మానవావతారం ఎత్తి మనల్ని ఒక ఉద్వేగానికి గురిచేస్తాయి. అంటే, ఉద్వేగాన్ని కల్పించగల దినుసులు వాటిల్లో పడ్డాయని అర్ధం. ఇలాంటి అనుభూతి ‘న్యూబాంబే టైలర్స్‌’ కథల్లో తరచుగా కలుగుతుంది.

పాఠకుల్లో భావోద్వేగాల్ని మేల్కొలిపే అనేకానేక దినుసుల గురించి ఖదీర్‌ కు బాగా తెలుసు. వాటిని అతను సమయానుకూలంగా వాడడమేగాక,అత్యంత ఆధునిక పధ్ధతుల్లో వాడుతాడు. ‘కింద నేల వుంది’ కథలో ”దార” అని ఒకే ఒక పదంతో ఒక పేరా వుంటుంది. (పేజీ – 60). అంటే ”కాస్సేపు వర్షాన్ని ఆస్వాదించి రండి” అంటూ పాఠకులకు ఒక రిలీఫ్‌ ఇస్తాడు రచయిత! అలాగే, కొన్ని చోట్ల పాఠకులు  నవ్వుకోడానికీ,  ఏడ్వడానికీ కొంత జాగా వుంచుతాడు.  దీని అర్ధం ఇతరుల రచనల్లో, ఇలాంటి సందర్భాలు ఉండవనికాదు. దాన్ని ఒక విధానంగా, ఒక శైలిగా అలవర్చుకున్నాడు ఖదీర్.

సృజనాత్మక సాహిత్యంలో మరో విశేషం వుంటుంది. రచయిత ఒక అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే, ఆ ఉత్తేజంతో, పాఠకులు దానికి తమ సృజనాత్మకతను కూడా జోడించి, రచయిత కూడా ఊహించని కొత్త భావోద్వేగాలకు గురవుతారు. ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది.  తెర విూద హీరో, హీరోయిన్లే కనిపిస్తే  ప్రేక్షకులు సినిమాలో లీనంకారు. నిజజీవితంలో తమకు తెలిసిన పాత్రలు మదిలో మెదలాలి. రచనల్లో అలాంటి చిన్న కొక్కేన్నీ  రచయిత పెడుతూ వుండాలి.

రెడీమేడ్‌ అపెరల్‌  ఫ్యాక్టరీలు వచ్చి, ఊర్లోని సాంప్రదాయ దర్జీలందర్ని, బకాసురుడిలా వరసపెట్టి మింగేశాక, పీరూభాయి వంతు వస్తుంది. ఆరోజు ….. ”తెల్లారి అజాన్‌  వినిపించడంతోనే తాళాలు తీసుకుని రైల్వే రోడ్డుకు వచ్చాడు. తలెత్తి బాంబే టైలర్స్‌ బోర్డు చూసుకున్నాడు. షాపు తెరచి ఒకసారి మిషన్లనీ, బల్లనీ చూసుకున్నాడు.  బయట కుర్చీ వేసుకుని బుగ్గ కింద పాన్‌ అదిమి పెట్టి ఆ చల్లటి గాలిలో మౌనంగా కూర్చున్నాడు. పదకొండు గంటలకు వచ్చాడు కొడుకు” అంటాడు రచయిత.

ఈ సన్నివేశంలో,  దాదాపు ఐదు గంటలపాటూ పీరూభాయి ఒంటరిగా దుకాణంలో కూర్చున్నాడు అని  గమనించిన పాఠకులు తప్పనిసరిగా ఒక ఉద్వేగానికి గురవుతారు. ఇన్నాళ్ళూ  జీవనభృతినీ, జీవితాన్నీ, గౌరవాన్నీ, వ్యక్తిత్వాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఉనికినీ ఇచ్చిన ఆ కత్తెర, ఆ బల్ల,  ఆ కుట్టుమిషన్లను వదిలేయాల్సి వచ్చినపుడు పీరూభాయి విలపించకుండా వుండగలడా?జీవితకాలం తన కుడిచేతికి కొనసాగింపుగా మసిలిన ఆ కత్తెరని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకుని వుంటాడు?  ఆ కుట్టుమిషన్ని ఎన్నిసార్లు ఆలింగనం చేసుకునివుంటాడూ? ఆ బల్ల ఒడిలో తలపెట్టి ఎంతసేపు ఏడ్చి వుంటాడూ?.

మనుషులు ప్రకృతితో మాట్లాడడం  జానపద సాహిత్యంలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరైనా, చెట్లు, జంతువులు, రాళ్ళు, యంత్రాలతో మాట్లాడుతుంటే వాళ్ళను మన వైద్యనిపుణులు మానసికరోగులు అంటారు. మాట్లాడడానికి సాటి మనిషి దొరకనపుడు మనుషులు నిజంగానే యంత్రాలతో ముచ్చటించుకుంటారు. అది యంత్రయుగపు విషాదం మాత్రమే కాదు; కొందరికి అనివార్యమైన నిట్టూర్పు కూడా!

ఆ ఐదు గంటల్లో పీరూభాయి అవేదన గురించి  పాఠకుల్లో కలిగే ఉద్వేగాల్ని కాగితం విూద పెడితే  ‘దర్జీవిలాపం’ అని ఒక ఖండకావ్యం అవుతుంది. ఇది రచయిత రాసిందికాదు. పాఠకులు తమ సృజనాత్మకతతో కొనసాగించింది. ఇలాంటి కొనసాగింపులు ఎంత విస్తృతంగా జరిగితే, ఆ రచన అంతగా సార్ధకం అయినట్టు.  నిపుణులైన రచయితలు తాము సృజనాత్మకంగా రాయడమేగాక, పాఠకుల్లోని సృజనాత్మకతను కూడా మేల్కొల్పగలుగుతారు. ఖదీర్‌ కూడా అలాంటి కోవలోకే వస్తాడు.

క్రిష్టోఫర్ నోలన్ సినిమా ’ఇన్సెప్షన్’ (2010) చూసినప్పుడు ఒక విస్మయ అనుభవం కలుగుతుంది. ఒకే సమయంలో, ఒకే పాత్రలు, మూడు భిన్నమైన ప్రదేశాల్లో, మూడు భిన్నమైన చలన వేగాలతో ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి కథన ఎత్తుగడ మనకు  మహాభారత రచనలో, పిండ రూపంలో,  కనిపిస్తుంది. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెపుతున్న కథను, వేరే కాలంలో వేరే చోట, శౌనకాది మహా మునులకు సూతుడు చెపుతుంటాడు. భీష్మపర్వం మొదలయ్యాక ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర యుధ్ధ విశేషాలు చెపుతుంటాడు. అంటే, ఒకేసారి మూడుచోట్ల, మూడు కాలాల్లో ’కథ చెప్పడం’ కొనసాగుతూవుంటుంది. పోతనామాత్యుని భాగవతంలో గజేంద్రమోక్షం సన్నివేశంలో ఒక్కొక్క పద్యానికీ సంఘటన స్థలం మారిపోతుంటుంది. ఒక పద్యం భూలోకంలో గజేంద్రుని దీనావస్తను వివరిస్తుంటే, ఆ వెంటనే మరో పద్యం వైకుంఠంలో విష్ణమూర్తి కదలివస్తున్న తీరును వివరిస్తుంటుంది,  1980వ దశకం చివర్లో, క్వెంటిన్ టారంటినో ప్రవేశం తరువాత, హాలివుడ్ సినిమాల్లో ఆధునిక నాన్-లీనియర్ కథనాలు ఊపందుకున్నాయి. ఆడియో-విజువల్ మీడియాలో కొత్తగా వస్తున్న అనేక ఆధునిక టెక్నిక్కుల్ని ప్రింట్ మీడియాకు వర్తింపచేయడానికి ఖదీర్ గట్టిగా కృషిచేస్తున్నాడు. తద్వార కథాంశాలతోపాటూ, కథన శైలిలో కూడా  కొత్తదనాన్ని తీసుకురావడం అతనికి సాధ్యం అవుతోంది. అందుకు ’గెట్ పబ్లిష్డ్’  కథ మంచి ఉదాహరణ.

ఒక జటిలమైన కథాంశాన్ని, గాడితప్పకుండా  చెప్పడం అంత సులభంకాదు. ఇందులో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు టూ లోని మసీద్‌ సెంటర్‌ లో మొదలైన కథ, చార్మినార్‌ చుడీ బజార్‌, లుంబినీపార్క్‌ గోకుల్‌ ఛాట్‌ పేలుళ్ళు, ముస్లిం యువకులపై తప్పుడు కేసులు, ఢిల్లీ జామియానగర్‌ షూట్‌ అవుట్‌,  సిడ్నీలో డాక్టర్‌ హనీఫ్‌, బెంగళూరులో హనీఫ్‌ భార్య, గుల్బర్గా గొడవలు, సమాచారశాఖామంత్రి నష్టపరిహార ప్రకటన, పోలీసు చిత్రహింసలు వగయిరాల చుట్టూ తిరుగుతుంది. పైగా, ఒకే సమయంలో కథ రెండు మూడు చోట్ల జరుగుతూ వుంటుంది. మరీ ఇంత పెద్ద కాన్వాస్‌ తీసుకున్నప్పుడు రచయితగానీ, పాఠకులుగానీ గందరగోళపడే ప్రమాదం వుంటుంది. కానీ అలా జరక్కుండా  చాలా సమర్ధంగా ముగింపుకు తీసుకుపోతాడు ఖదీర్‌. డ్రైవర్‌ నయాబ్‌, ఫకీర్‌  ఫాతిమా, వాళ్లబ్బాయి ముష్టాక్‌ పాత్రలు కథ ముగిశాక కూడా పాఠకుల్ని వెంటాడుతాయి. అవి నిజజీవిత పాత్రలన్నట్టుగా సాగుతుంది ఖదీర్‌ శిల్పనైపుణ్యం. అతని పరిశోధనా విస్తృతి అలాంటిది.

ఇల్లు తగలబడిపోతుంటే ఫొటో కాలిపోయిందని ఏడ్చేవాళ్లను చూస్తే వింతగా వుంటుంది. ఘోర విపత్తులో చిక్కుకున్నప్పుడు నిస్సహాయులూ, దిక్కులేనివాళ్ళు  అలా నిస్పృహతో వింతగానే ప్రవర్తిస్తారు. ప్రధాన సమస్య నుండి బయట పడే మార్గాలు తెలీనపుడు, తెలిసినా సాధించలేమని తెలిసినపుడు, వాళ్ళే ఓ చిన్న సమస్యను వెతుక్కుని వెక్కివెక్కి ఏడుస్తారు. తనను టెర్రరిస్టని అనుమానించి, అవమానించి, ఎత్తుకుపోతున్న పోలీసుల్ని ఏవిూచేయలేని, ఏవిూ అనలేని  డ్రైవర్‌ నయాబ్‌, అత్తరు సీసాకోసం పెనుగులాడే సన్నివేశం నిస్సహాయుల  నిస్పృహ ప్రవర్తనకు  మంచి ఉదాహరణ.

ఆర్ధిక విధానాల్లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వచ్చాక ముందుగా నాశనం అయిపోయింది చేతివృత్తి కార్మికులు. అభివృధ్ధి పేరిట సాగిన విధ్వంసం వెయ్యి ప్రకృతి వైపరిత్యాలకన్నా భయానకమైనది.  మార్కెట్‌ పై విదేశీ సంస్థల దాడులకు వ్యతిరేకంగా చేతివృత్తి కార్మికులు చేసే పోరాటాలకు,సూత్రప్రాయంగా అయితే,  దేశీయ (జాతీయ) పెట్టుబడిదారులు  నాయకత్వం వహించాలి. కానీ అలా జరగడంలేదు. కనీసం, అత్యధిక సందర్భాల్లో అలా జరగడంలేదు. దేశీయ పెట్టుబడిదారులు దళారీ పెట్టుబడీదారులుగా మారిపోయి విదేశీ సంస్థలకు స్థానిక ప్రతినిధులుగా మారిపోతున్నారు.

ఈ అభివృధ్ధి వైపరీత్యాలపై  చేతివృత్తి కార్మికులు, ఇతర ప్రజాసమూహాలతో కలిసి ఎలాంటి పోరాటాన్ని చేయాలి? పీరూభాయి వంటివాళ్ల సంక్షోభాలకు పరిష్కారం ఏమిటీ? వంటి సందేహాలకు జవాబు కోసం ఆర్‌. ఎస్‌. రావ్‌ నో, జాన్‌ మిర్డాల్‌ నో ఆశ్రయించాల్సి వుంటుంది. ”భారత దేశపు ఖనిజ సంపదని దోచుకుపోవడానికి  సామ్రాజ్యవాదులు కుట్ర చేశారు. దీన్ని అడ్డుకోడానికి అడవిలో యుధ్ధం మొదలైంది. ఈ యుధ్ధంలో విూరు ఎటువైపు?”అని ప్రశ్నించాడు జాన్‌ మిర్డాల్‌; ఇటీవల హైదరాబాద్‌ వచ్చినపుడు.

ఉగ్రవాదానికి మతంలేదు. లేదా, ఉగ్రవాదులులేని మతంలేదు. నిజానికి, కొందరు నిస్పృహతో చేసే ఒంటరి చర్యలేతప్పా,  ఏ మతసమాజంలోనూ ఉగ్రవాదానికి ఎన్నడూ ఆమోదాంశంలేదు.     బలహీనదేశాల్లో సహజ వనరుల దోపిడీకీ, సామ్రాజ్యవాదానికీ, దాని స్థానిక దళారులకూ, విశాల ప్రజానీకానికీ, తీవ్రవాదానికీ, ఉగ్రవాదానికీ, మతతత్వానికీ మధ్యనున్న సంబంధాన్ని వివరించే రచనలు విస్తృతంగా రావల్సిన అవసరం ఈనాడు ఎంతో వుంది.

చట్టసభల సభ్యులు, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ, విూడియా కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయని చెప్పే సాహసం ఇప్పడు ఎవరికీలేదు.  ఈ నాలుగు వ్యవస్థలు కలిసి కార్పొరేట్‌ సంస్థల్ని నడుపుతున్నాయన్నది నేటి నిజం.  ఈ మాట విూద అభ్యంతరం ఉన్న  వాళ్ళు, దీన్ని తిరగేసి కూడా చెప్పుకోవచ్చు.   కార్పొరేట్‌ సంస్థలే  ఈ నాలుగు వ్యవస్థల్ని నడుపుతున్నాయి అనుకోవచ్చు!

హంతకులకన్నా ఆర్ధిక నేరస్తులు దేశానికి ప్రమాదకారులని ఇటీవల ఓబుళాపురం మైనింగ్‌ లీజు  కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్‌ హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఒక కోటి నలభై లక్షల టన్నుల ఇనప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించేసి, 4,310 కోట్ల రూపాయల దేశసంపదని దోచేసిన కేసు ఇది. ఒప్పందంలో, కేవలం ‘క్యాప్టీవ్‌’ అనే ఒకేఒక్క పదాన్ని తొలగించివేయడంతో, ఇంతటి అక్రమం అంతా బాజాప్తగా రాజమార్గంలోనే సాగిందంటే  మన ప్రభువులు ఎంత తెలివి విూరిపోయారో తెలుసుకోవచ్చు. దేశభద్రతకు ముప్పుగా, ప్రధానమంత్రి తరచుగా హెచ్చరించే సీమాంతర ఉగ్రవాదం, అంతర్గత తీవ్రవాదాలకన్నా ఇది పెద్ద ముప్పుగా కనిపించకపోతే, మన మెదళ్ళు మొద్దుబారిపోయాయని  భావించవచ్చు. ఇదీ  ఈనాడు మన దేశానికివాటిల్లిన ప్రధాన ముప్పు; ప్రజాసంపదని, దేశసంపదని ప్రైవేటుపరం చేయడం.  దేశాన్ని విదేశాలకు చట్టబధ్ధంగా అమ్మేయడం!   ఇంతటి పెద్ద వ్యవహారాన్ని పక్కనపెట్టి, ఎక్కడో ఏదో ఒక పేలుళ్ల కేసులో పదిమంది ముస్లింలని అరెస్టు చేసినట్టు వార్తలొస్తే, ”ప్రభుత్వం పనిచేస్తోంది. మన భద్రతకు ముప్పులేదని” అనుకుని, ధీమాగా నిద్రపోవడం మనకు అలవాటయిపోయింది.! మనకు అలాంటి ధీమాను తరచుగా కలిగించడానికి ప్రభువులు మరికొందరు అమాయకుల్ని కూడా అరెస్టు చేస్తూవుంటారు.  గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో అయితే, ఎన్‌ కౌంటర్లు కూడా చేస్తుంటారు!

‘న్యూబాంబే టైలర్స్‌’లో, ఛిద్రమై పోతున్న ముస్లింల జీవితాల్ని సృజించడంతో మొదలైన కథా సంకలనం,  చివరి కథ ‘గెట్‌ పబ్లిష్డ్‌’లో,  టెర్రరిస్టుల నెపంతో అమాయక ముస్లింలను వేధిస్తున్న తీరును సృజించడంతో ముగుస్తుంది.  సమస్యను సృజించడమే ఇప్పటికి ఖదీర్‌ లక్ష్యం కావచ్చు.  సమస్యకు పరిష్కారం చూపడం కుదరనప్పుడు, కథకు ఒక అందమైన మలుపు ఇచ్చి ముగించడం మేలు అనే సూత్రం ఒకటుంది.  ఆ సూత్రాన్ని, ఖదీర్‌ సమర్ధంగా వాడుతుంటాడు. బహుశ ఈ కారణంవల్లనే అతని కథల్లో ముక్తాయింపులు, చివరి వాక్యాలు చిన్నగానూ, అందగానూ, శక్తివంతంగానూ వుంటాయి.

రష్యన్‌ మహారచయిత మాక్సిం గోర్కి తన జీవిత అభ్యాసాన్ని  ‘నా బాల్యం’, ‘నా బాల్యసేవ’ (మై అప్రెంటిస్‌ షిప్‌), ‘నా విశ్వవిద్యాలయాలు’ అంటూ మూడు భాగాలుగా రాశాడు. ఖదీర్‌ బాబు ‘దర్గామిట్ట కతలు’ రచయితగా ఖదీర్‌ బాల్యం అనుకుంటే, ‘న్యూబాంబే టైలర్స్‌’ కథా సంపుటి అతని స్నాతకోత్సవంగా భావించవచ్చు. భవిష్యత్తులో ఖదీర్‌ కలం వెంట స్నాతకోత్తర రచనలు కూడా రావాలని  ఆశిద్దాం.

 

(15 ఫిబ్రవరి 2012న పుస్తకావిష్కరణ సభలో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం)

 

 

మనందరి లోపలి అలజడి ‘పరాయి గ్రహం’

kolluri ఏదైనా ఒక కథ చదివాక, దాని గురించిన ఆలోచనలు మన మనసును వదలకపోతే, ఆ కథలోని సంఘటనలు మనకు రోజూవారీ జీవితంలో ఎదురయ్యేవే అయితే, ఈ కథ నా కథలానే ఉందే అనుకుంటూ పాఠకుడు తనని తాను కథలోని పాత్రలతో ఐడెంటిఫై చేసుకుంటే, ఆ కథ నిజంగానే మంచి కథ.
పాలపిట్ట మాసపత్రిక మార్చి 2013 సంచికలో ప్రచురితమైన బెజ్జారపు రవీందర్ కథ “పరాయి గ్రహం” ఈ కోవకే చెందుతుంది. కథాంశం మధ్యతరగతి వాళ్ళు సొంత ఇల్లు అమర్చుకోవాలనే కలని సాకరం చేసుకునే ప్రయత్నం, దానిలోని ఇబ్బందులు! కథనంలో కథావస్తువుని ఇమిడ్చిన తీరు రచయిత నైపుణ్యాన్ని చాటుతుంది.
మనుషుల ఆశలను, నిరాశలను రమ్యంగా ఆవిష్కరించిదీ కథ. మనుషులలోని లౌక్యాన్ని, తుచ్ఛతని ఎత్తి చూపుతుందీ కథ. ఎదగాలనుకునే మధ్యతరగతి వారి సమర్థతని హేళన చేస్తూ… ‘నువ్వింతే… నీ బతుకింతే…’  అంటూ కృంగదీసే సమాజపు కర్కశ వైఖరిని వెల్లడిస్తుందీ కథ.
వైయక్తిక ఆశలను తీర్చుకోడానికి ప్రయత్నించే వేతన జీవులను నియోరిచ్ వర్గం ఎలా పరిహసిస్తుందో, నీతి నిజాయితీల స్థానంలో అవినీతి, అక్రమార్జన సమాజంలో ఎలా వేళ్ళూనుకుపోతున్నాయో ఈ కథ వ్యాఖ్యానిస్తుంది. వర్తమాన సమాజపు ధోరణికి; జీవితపు చిన్న చిన్న కోరికలు తీర్చుకోడాని ప్రయత్నించి భంగపడి, ఉన్నదాంట్లోనే ఆనందం పొందే ఎందరో నిస్సహాయులకు ప్రతీక ఈ కథ.
పాత్రల మనోభావాలను అత్యంత సహజంగా వర్ణించారు రచయిత.  ఆయా పాత్రల ఔచిత్యం ప్రకారం వారి సంభాషణలు, వాళ్ళ ఇళ్ళ పరిసరాలు, వారి ఆహార్యం గురించి చక్కగా వివరించారు రచయిత. నిజజీవితంలో అటువంటి వ్యక్తులను ఎంతో దగ్గర నుంచి పరిశీలిస్తే గాని పాత్రలు అంత సహజంగా ఉండవు. ఈ కథ చదువరులను అంతగా ఆకట్టుకోడానికి ప్రధాన కారణం మనుషుల సహజ సిద్ధ స్వభావాలను యథాతథంగా వెల్లడించడమే. మనుషుల్లోని సున్నిత భావాల్ని, భావుకతని, ఈర్ష్యాసూయల్ని, కుత్సిత భావాల్ని అతి వాస్తవికంగా ప్రకటించడమే.
రియల్ ఎస్టేట్ బూమ్ అనగానే మనకి చాలా కథల్లో చదివిన హైదరాబాద్ రింగ్ రోడ్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు స్ఫురిస్తాయి. కానీ ఈ కథకి నేపథ్యంగా కరీంనగర్, దాని పరిసర ప్రాంతాలను ఎంచుకోడంలో వైవిధ్యం చూపారు రచయిత.
మనలో చాలామంది మర్చిపోతున్న విషయం ఆదివారం ఆటవిడుపు! ఆదివారం కోసం ఎదురుచూడడంతో ప్రారంభమవుతుంది కథ. కెరీర్ల వెంటా, డబ్బు సంపాదన వెంటా పరిగెడుతున్న జనం, ‘ఆదివారాన్ని ఆస్వాదించి ఎన్నిరోజులయ్యిందో’ – అని అనుకోకుండా ఉండలేరు మొదటి మూడు పేరాగ్రాఫులు చదివాక.
కథ దిగువ మధ్య తరగతికి చెందిన ఓ పొందికైన చిన్నకుటుంబానిది.  చందూది ఓ కాంట్రాక్ట్ ఉద్యోగం. భార్య లలిత ఓ ప్రైవేటు స్కూల్లో టీచరు. పదేళ్ళ కొడుకు. కలతలు లేకుండా సాగిపోతూంటుంది వారి సంసారం. చందూకి భావుకత్వం ఎక్కువ. సామాజిక, రాజకీయ అవగాహన కూడా ఉన్నాయి.
లలితకి పిన్ని వరసయ్యే మాధవి భర్త శ్రీనివాస్‌‍కి హఠాత్తుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసొస్తుంది. ఉన్నట్లుండి సంపన్నవర్గంగా మారిపోతారు. తోటివారితో ప్రవర్తించే తీరు కూడా ఎదుటివారి ఆర్థికస్తోమతని బట్టి మార్చుకుంటూంటారు. తమ ధనాన్ని ప్రదర్శించడం వారికి అత్యంత ప్రీతిపాత్రం. “కార్లు, చీరలు, నగలు, పలుకుబడి వల్ల వాళ్ళకు వచ్చే సంతోషం కన్నా, అవి ఎదుటివాళ్లకు లేవనే భావన అమితమైన ఆనందాన్ని కలుగజేస్తూంటుంది. వాటివల్ల తాము సుఖపడిపోతున్నామని ఎదుటివాళ్ళు అనుకోడాన్ని ఎంజాయ్ చేస్తూంటారు. ఇతరుల లేమిని గుర్తు చేయడంలోనే వారి సంతోషం ఇమిడి ఉంది.  పెరుగుతున్న సంపద, ఎదుటివారిపై అప్రత్యక్ష అధికారాన్ని కట్టబెట్టినట్లు అనుభూతి చెందుతుంటారు మాధవి, శ్రీనివాస్‌లు.”

మొదట్లో ఇలాంటి ప్రదర్శనలు లలితను కదిల్చేవి కావు. భర్తతో కలిసి జీవించడమే మహాభాగ్యమని భావించే ఆమెలో కొద్దికొద్దిగా విషాన్ని నింపడంలో మాధవి విజయవంతమవుతుంది.  “మాధవి మొదటి నుంచి లలితను పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే లలిత ముఖంలో తన ప్రదర్శన పట్ల ఒక రకమైన అసూయను రేఖామాత్రంగా దర్శించిందో, ఆ క్షణం నుంచి మాధవి మహత్తరమైన వేడుక అనుభవించడం మొదలుపెట్టింది.”
చివరికి వీరి తాకిడిని తట్టుకోలేక ఎక్కడోక్కడ స్థలం కొనాలని మరో బంధువు కిరణ్‌తో కలిసి  బయల్దేరుతాడు చందూ.
తన తండ్రి చేసిన ఓ పొరపాటువల్ల తనకి లక్షలు పోయాయని వాపోతాడు కిరణ్. “మా అయ్య గనక శీనన్న అయ్య లెక్క జాగ్రత్త పడితే… ఇంత నాదాని బతుకు అయ్యేదా? ఏమీ లేనోళ్ళు సైతం కొంత కొంత భూమి కూడబెట్టి ఎట్లా కోటీశ్వరులైపోయిన్రు….” అంటాడు. ఆ క్షణంలో చందూకీ భయమేస్తుంది, భవిష్యత్తులో తన పిల్లలు కూడా తనని ఇలాగే తిట్టుకుంటారని.
తన బడ్జెట్‌లో సరిపోయే స్థలం ఎక్కడా లభించదు. ప్రతీ ప్లాటు తనను వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది చందూకి. తానొక అసమర్థుడిననే భావన మొదటిసారి కలుగుతుంది అతనికి. మళ్ళీ బస్సెక్కి ఇంటి ముఖం పడతాడు. పంట పొలాలన్నీ ప్లాట్లుగా, చెరువులు సైతం పూడ్చబడి, గుట్టలు కూల్చివేయబడి సమస్త భూమండలం ‘For Sale’ బోర్డు పెట్టబడిన ఓ పెద్ద ప్లాటుగా కనిపిస్తుంది చందూకి.  ప్రకృతిని కబళిస్తూ, నిర్మాణం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న వైనం రేఖామాత్రంగా వ్యక్తం అవుతుందీ కథలో.
చివరగా, కథకి ‘పరాయి గ్రహం’ అనే పేరు పెట్టడంలోని ఔచిత్యం పాఠకులని ఆలోజింపచేస్తుంది. ఎక్కడా ఓ చిన్న స్థలం కొనుక్కోలేని మధ్యతరగతి జీవి – ఇది తనది కాదు అనుకోడం వలన భూగోళం పరాయి గ్రహంగా కనిపించడం ఒక కారణం కావచ్చు; భావుకులు, పర్యావరణ ప్రేమికులు- ఇక ప్రకృతిని ఆస్వాదించాలంటే భూమి మీద అవకాశం లేదని, పరాయి గ్రహానికి వెళ్ళాల్సిందే అని అనుకోడం మరో కారణం కావచ్చు.  ఈ రెండు కారణాలలో ఏది సరైనది అనేది పాఠకుల ఊహకే వదిలేసారు రచయిత.
మొత్తం మీద చదువుతున్నంత సేపూ మానసికంగా అలజడి కలిగిస్తూ, చదివిన తర్వాత చాలా కాలం వెంటాడుతుందీ కథ.

ParayiGraphamStory

 

కొన్ని నక్షత్రాలు…కాసిని కన్నీళ్ళు

ramasundariకొన్ని నక్షత్రాలు.. కాసిన్ని కన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్ని కన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై  ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు. నలభై ఏళ్ళ గోదావరీ లోయా విప్లవ పోరాటం వెనుక మనసు ఆగక పరుగులు పెట్టినట్లు గుర్తు. నాకు తెలిసిన తెలంగాణ పల్లెలు, గరిడీలు సృతిపధంలో నడచినట్లు గుర్తు. చైతన్య గనులైన పి.డి.ఎస్.యు విధ్యార్దులు గుండె గదుల్లో కవాతు చేసినట్లు గుర్తు. ఈ కధ తెలంగాణ, అందులోను కరీంనగర్ విప్లవోద్యమ నేపధ్యంలో రాసింది. రాసింది ఆ ఉద్యమంలో ఊపిరి పోసుకొని ఎదిగిన విమల గారు. మొదట పాలపిట్ట మాసపత్రిక లో ప్రచురించబడి కధ 2012 లో కనిపిచ్చిన ఈ కధ ఒక ఆణిముత్యం.

కధా స్థలం కరీంజిల్లాలోని ఒక పల్లె. కాలం తొంబ్భైవ దశకం ప్రారంభం. ఆ పల్లెలో ప్రధాన భాధ్యతలు వహిస్తున్నది ఒక మహిళ. ఎన్నికల సందర్భంగా వచ్చిన వెసులుబాటును విప్లవ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవాలను కొంటారు. అప్పుడు ఆమె ముందుకు వస్తారు ఇద్దరు నవ యువకులు. ఒకరు పెళ్ళై చంటి బిడ్డకు తండ్రి అయిన తిరుపతి, ఇంకొకరు అనాధ అయి  ప్రేమ తప్ప ఇంక ఏమి లేని మాధవ. యాధృచ్చికంగా మాధవ ప్రేమ కధని వింటుంది ఆమె. ఒక గంట ప్రేమికుడిని కలవటానికి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తన తొలి ప్రేమను జ్ఞాపకం చేసుకొంటుంది. అతను తన చేతి మీద వేయించుకొన్న  వెలుగుతున్న దీపం పచ్చబొట్టు చూసి కదిలి పోతుంది.

” నాకు మొక్కలంటే యిష్టం. ఎప్పటికన్నా పొలంగొంటె ఏటివడ్డున ఒక రెడకరాలనా- అందులో చిన్న గుడిసేసుకొని చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని ఉండాల. మేమిద్దరం గల్సి చిన్న పిల్లల కోసం ఒక మంచి స్కూల్ బెడ్తం. క్లాసులు చెట్ల క్రింత- అదేంది. ఆ(… శాంతి నికేతన్ లెక్క” అంటూ అతడు చెప్పే కలలను వెన్నెల్లో నులక మంచం మీద పడుకొని వింటుంది. అతనికి తప్పక సాయం చేయాలనుకొంటుంది. “ఆ చల్లటి వెన్నెల రాత్రి, ఆ పిల్లవాడి ముఖంలో ఏదో అవ్యక్తపు ఆనందం. నక్షత్రపు కాంతి.  ప్రేమ, అది ఎంత అధ్బుత అనుభవం!”

తెల్లవారి మసక చీకటిలో, మసక కళ్ళతో వారికి వీడ్కోలు పలికి, మధ్యాహ్నానికి ఇద్దరి ఎన్ కౌంటర్ వార్త వింటుంది. ఒకరు తిరుపతి. ఇంకొకరు? ” కట్టెలు చేర్చిన ఆ చితి మధ్య-విగత జీవిగా ఎవరో పిల్లవాడు. వాడికీ కల ఉందా? ఒక ప్రేమ కధ ఉందా? ఒక వెన్నెల రాత్రి వాడూ వాడి జీవకాంక్షని- ఎవరికైనా చెప్పాడా? ఎవరా పిల్లవాడు…మాధవా నువ్వు బతకాలరా” అని రోదిస్తుంది. ఎవరు మరణించారు? ఎవరు బతికారు? ఆ క్షణం నేను కూడ మరణించానా వాళ్ళతో పాటు? అని ప్రశ్న వేసుకొంటుంది. కాని చనిపోయింది మాధవానే. కూంబింగ్ చేసి వస్తున్న పోలిసులను చూసి భయపడిన పారిపోతుంటే ఇద్దర్ని కాల్చి వేసారు. గాయాలతో తూములో దాక్కొన్న నిరాయుధుడైన మాధవాను  చంపబోమని చెప్పి బయటికి పిల్చి కాల్చేసారు.

కధ మొత్తం ఆమె జ్ఞాపకాల ఉద్విఘ్నతలతో సాగుతుంది. మానేరు ఒడ్డున కూర్చొని “మానేరా, మానేరా! నను వీడని మనియాదా” అని పలవరిస్తుంది. “చీకట్లు ముసురుతున్న అసాయంవేళ, నాల్కలు చాచుతున్న ఆ మంటల్ని నిర్ఘాంతపడి చూస్తూ, పెనుగులాడి, పెనుగులాడి నా లోపల నేనే పొడి పొడిగా రాలుతూ…”  అంటూ ఆ నాటి విషాదాన్ని  ధ్యానించుకొంటుంది . రచయిత్రికి  విప్లవం పట్ల నిబద్దత, అది అందుకోలేని బాధ కధ పొడవునా వ్యక్తం అవుతాయి. “ఏదీ ఆ మరో ప్రపంచం, ఎర్ర బావుటా నిగనిగలు, ప్రళయ ఘోషలు, ఝుంజా మారుతాలు, జనన్నాధ రధ చక్రాలు, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా , జాబిల్లు? ఏవి, ఏవి తల్లి నిరుడు కురిసి హిమసమూహలు?”

ఈ కధ ఒక ఎన్ కౌంటర్ దుఃఖాంతాన్ని వర్ణించే కరుణ రస ప్రధానమైన కధగా కనిపిస్తున్నా, కధ వెనుక అప్రకటిత భాష్యం (అన్-టోల్డ్ టెక్స్ట్) చాలా ఉంది. “ఈ కధ నాలో అంతరంతరాలలోఅనేక ఏళ్ళుగా దాగిన దుఃఖం.” అని రచయిత్రి చెప్పుకొన్నారు. ఆ దుఃఖం వైయుక్తమైనది కాదు. అది ఉద్యమాల దుఃఖం.  సమ సమాజం నిజమైన అర్ధంలో స్థాపించటానికి బలై పోయిన వందలాది యువతీ యువకుల మృత్యు కేళి కలిగించిన వగపు.

మాధవా కన్న కలలు భారత దేశంలోని ప్రతి లేబ్రాయపు యువతి యువకుడు కనే ఉంటారు. చిన్న ఇల్లు, చేయటానికి పని; ఇవి ఇచ్చిన భరోసాతో ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన. బహుశ మాధవ లాంటి వాని ఊహలలో ఈ రాజ్యహింస తాలూకూ పీడ కలలు ఉండి ఉండక పోవచ్చు. ఈ ఎన్ కౌంటర్లు అలాంటి  కనీస కోరికలు కోరే, వాటి కోసం పోరాడే వాళ్ళకు ఈ భూభాగంలో చోటు లేదని చెప్పేతీర్పులు. కాలే చితి పై మండుతున్న శవాల తాలూకూ పొగలు అదే సందేశాన్ని మోసుకొని పోయి ఉంటాయి. తన ప్రియుడు మరణం తెలుసుకొని వచ్చి ఏడ్చి వెళ్ళిన జ్యోతి, ఈ మరణాలను ప్రశ్నించలేని, ఎవరినీ తప్పు పట్టలేని అమర వీరుల కుటుంబాల ప్రతినిధి.

ఈ కధలో ఒకప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిన ప్రాంతాలలో మారిన పరిస్థితుల వర్ణన అత్యద్భుతం గా  చేసారు. క్షీణించిన సాంస్కృతిక, ఆర్ధిక జీవనాల గురించి , ముగిసి పోయిన పోయిన జమిందారీ వ్యవస్థ గురించి, కొండెక్కిన ఉద్యమాలు, ప్రపంచీకరణ సునామి ఉధృతిలో పడిపోయిన గ్రామీణ ఉపాధులు ఒక్క వాక్యంలో  దృశ్యీకరించారు.

“శిధిలమైన మట్టి గోడలు, జాజు నీలం రంగులు పూసిన దర్వాజాలు, చెదిరి పోయిన నినాదాలు, రెక్కలు చాచిన రాబందుల్లా యాంటీనాలు, కోకో కోలాలు, బిస్లరీ వాటర్లు, మద్యం సీసాలు, జిల్లెళ్ళు మొలుస్తున్న గరిడీలు, పలకని రాతి దేవుళ్ల గుడులు, చదువు చెప్పని బడులు, విరిగిన మగ్గాలు- ఆకు – తంబాకు చేటలు….”  .

మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులను అందుకొని చేయవలసిన కర్తవ్యాలను మరిచిన ఉద్యమవైఫల్యాలను కూడ ఎత్తి చూపారు. వచ్చిన మార్పులను స్వీకరించి ఉద్యమాలను పునర్నిర్మాణం  చేయని అశక్తతను కూడ పేర్కొన్నారు.  “పెరిగిన మధ్య తరగతి మనుషులు- నీటివసతి- కొత్త వ్యాపారాలు పెరిగి- ఒకప్పటి – కరీంనగర్ కాదది-  జరిగిన మార్పులను అంచనా వేసే వాళ్ళెవరు – ఏ చేయాలో ఎలా చేయాలో – మళ్ళీ కొత్తగా ప్ర్రారంభిచేది ఎవరు?”

ఈ ఘటన జరిగిన పద్దెనిమిదేళ్ళ తరువాత మాధవ ప్రియురాలు జ్యోతిని అనుకోకుండా కలిసిన ఆమె, జ్యోతి చేతిపై మాధవ గుర్తు గా వేయించుకొన్న పచ్చబొట్టును చూస్తుంది. తన రిక్త హస్తాలను చూసుకొంటుంది. ఉద్యమ వైఫల్యాలు, మిగిలిపోయిన కర్యవ్యాలు ఈ చివర వాక్యం ద్వారా మనకు వ్యక్తమౌతాయి. ఎంత ఉదాత్తమైన ముగింపు? కధ నంతటిని ఈ చిన్న వాక్యంలో కుదించి మనకు సందేశమిచ్చినట్లైంది.

***

కొన్ని నక్షత్రాలు –విమల

రాయల్ ‘రహస్యం’ వెనుక రహస్యం!

అనిల్ ఎస్. రాయల్ పరిచయం

అనిల్ ఎస్. రాయల్ పేరుగల పిల్లాడు పల్నాడులో పుట్టాడు, అప్పుడెప్పుడో. కథలున్నది వేరేవాళ్లు రాస్తే తను చదవటానికే తప్ప తానే రాయటానికి కాదన్న నమ్మకంతో పెరిగాడు. రోజులు మారాయి. ఎందుకో మరి చదివే కథలు నచ్చకుండా పోయాయి. జీవితాల్ని కాచి వడపోసే కథలు నచ్చక, వేరే రకంవి దొరక్క అల్లాడిపోయాడు. ఆఖరికి అవేవో తానే రాసుకుని చదువుకుంటే పోద్దని తీర్మానించేసుకుని, కథలు రాయటం మొదలెట్టాడు. కాబట్టి అతను కథలు తన కోసమే రాసుకుంటాడు. తనకో కొత్త కథ చదవాలనిపించినప్పుడే రాస్తాడు. నాలుగేళ్లలో ఆరు సార్లే అలా అనిపించటం అతని దురదృష్టం, అతని పాలబడ్డ పాఠకుల అదృష్టం.

 ‘రహస్యం’ కథానేపథ్యం


future

“సైన్స్ ఫిక్షన్ అనేది అద్భుతమైన ఆలోచనలకి వేదిక మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని మెరుగుపరచేందుకు జరిగే ప్రయత్నాల్లో ఓ ముఖ్యభాగం. సాధారణ ప్రజానీకానికి తెలియని శాస్త్ర విశేషాలు విడమరచి, సైన్స్ తమపై చూపే ప్రభావాన్ని తెలియజెప్పే పనిముట్టు. సైన్స్ ఫిక్షన్ పఠితలకి ఈ విశ్వాన్ని పరిచయం చేస్తుంది; అందులో మనమెంత అల్పజీవులమో తెలియజెబుతుంది. అది వినమ్రత నేర్పుతుంది. బాలబాలికలకి మొదట్నుండే సైన్స్ ఫిక్షన్ చదవటమ్మీద ఆసక్తి కలగజేస్తే అది వాళ్ల మెదళ్లని వికసింపజేస్తుంది. అటువంటి మనుషులున్న సమాజం అనివార్యంగా జాగృతమవుతుంది”

పైవి నా మాటలు కావు. Hugo Gernsback అనే పెద్దాయన అరవయ్యేళ్ల కిందట అన్న మాటలవి. ఎవరీయన? సైన్స్ ఫిక్షన్ సాహిత్యానికి పితామహుడివంటివాడు. రచయిత, దార్శనికుడు, ఇన్వెంటర్. ఆయన పేరుమీద సైన్స్ ఫిక్షన్ మరియు ఫ్యాంటసీ సాహిత్యానికి ఏటేటా ప్రకటించే Hugo Awards సాహితీరంగంలో ప్రపంచప్రఖ్యాతిగాంచిన పురస్కారాలు.

ఇంతకీ సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి? ఆ విషయంలో వాదోపవాదాలున్నాయి, కానీ అటూఇటూగా అందరూ అంగీకరించేది: ‘శాస్త్ర పరిశోధనలు, ఆధునాతన సాంకేతిక ఆవిష్కరణల ఆధారంగా ప్రత్యామ్నాయ ప్రపంచాలని సృష్టించేది సైన్స్ ఫిక్షన్’. కథలో సైన్స్ పేరిట ప్రస్తావించిన విశేషాలు గాలి కబుర్లు కాకుండా వీలైనంతవరకూ శాస్త్రీయంగా ఉంటే అది సైన్స్ ఫిక్షన్; లేకపోతే ఒట్టి ఫ్యాంటసీ.

ప్రధాన స్రవంతి సాహిత్యం నిన్నటి గురించీ, నేటి గురించీ ఐతే; సైన్స్ ఫిక్షన్ రేపటి గురించి. అది మనమెవరమూ అంతవరకూ చూసెరగని ప్రపంచాలని ఊహిస్తుంది. ఆ ఊహలు తదనంతరకాలంలో నిజాలైన సందర్భాలు లెక్కలేనన్ని. ట్రాన్సిస్టర్ల నుండి క్లోనింగ్‌దాకా మొదట సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఊపిరిపోసుకున్నవే. భవిష్యత్తు ఎలా ఉంటుందో/ఉండాలో ఊహించగలిగే శక్తినిచ్చేది సైన్స్ ఫిక్షన్. అంతేకాదు, అది ఎటువంటి భవిష్యత్తులని నిరోధించాలో కూడా తెలియజెబుతుంది. ఇంత శక్తివంతమైన సాహిత్యం దురదృష్టవశాత్తూ తెలుగులో అత్యంత అరుదు. ‘సైన్స్ ఫిక్షన్’ అనేదాన్ని అచ్చతెలుగులో ఏమంటారంటే తడుముకోవాల్సినంత అరుదు. ఏటా వివిధ మాధ్యమాల్లో విడుదలయ్యే పదిహేనొందల పైచిలుకు తెలుగు కథల్లో సైన్స్ ఫిక్షన్ కథలెన్నంటే వేళ్లు చూపించటానికీ వీల్లేనంత అరుదు. అందుకు కారణాలెన్నైనా ఉండొచ్చు. వాస్తవం మాత్రం ఒకటే: గతంలో ఒకరిద్దరు సాధికారికంగా సైన్స్ ఫిక్షన్ రచనలు చేసినవాళ్లున్నా, ప్రస్తుతం ఆ పని చేస్తున్నవారు దాదాపు లేరు.

నేను సైన్స్ ఫిక్షన్ కథలు రాయటానికి నేపధ్యం ఇది. ‘ఎవరూ రాయట్లేదని వాపోయే బదులు ఆ పనేదో మనమే చేస్తే పోలా’ అనుకుని కథన రంగంలోకి దూకాను, నాలుగేళ్ల కిందట. అప్పట్నుండీ ఆ తరహా సాహిత్యానికే పరిమితమయ్యాను. ఆ క్రమంలో రాసిన కథలు నాలుగు: ‘నాగరికథ’, ‘మరో ప్రపంచం’, ‘కల్కి’, ‘రీబూట్’.

సైన్స్ ఫిక్షన్ కథలు రాయటం ఇతర ప్రధానస్రవంతి కథలు రాయటం కన్నా కష్టం అంటాడు ఆర్ధర్ సి. క్లార్క్. ఇది ఇతర తరహా సాహిత్యాన్ని చులకన చేయటానికన్న మాట కాదు. పాఠకులకి అనుభవంలో ఉన్న ప్రపంచానికి చెందిన కథలు రాయటంలో ఉన్న వెసులుబాటేమిటంటే, వాళ్లకి ఆ ప్రపంచాన్ని ప్రత్యేకించి పరిచయం చెయ్యనక్కర్లేదు. ‘సుబ్బారావు ప్రభుత్వాఫీసులో గుమస్తా’ అంటే సరిపోతుంది. ప్రభుత్వాఫీసుల గురించి, గుమస్తాల విధుల గురించి వివరించనక్కర్లేదు. అదే ‘ఐజక్ ఓ బయాట్’ అని ఓ ముక్కలో రాసేస్తే కుదరదు. అధికశాతం పాఠకులకి బయాట్ అంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు కాబట్టి అదేంటో వివరించాలి. కానీ, అది పనిగట్టుకుని పాఠం చెబుతున్నట్లుండకూడదు. ఏ సంభాషణలోనో యధాలాపంగా చెప్పినట్లు కనిపించాలి. మొత్తమ్మీద, పాఠకులకి పరిచయం లేని లోకాన్నొకదాన్ని వీలైనన్ని తక్కువ వాక్యాల్లో నిర్మించాలి, వర్ణించాలి. వర్ణన మరీ ఎక్కువైతే నిడివి సమస్య. అలాగని పొడిపొడిగా వివరిస్తే పాఠకులకి అర్ధంకాకపోయే ప్రమాదం.

ఇవి చాలనట్లు అదనంగా, తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాయాలంటే భాషా సమస్యొకటి. Dark Matter, Causality Paradox, Wick Effect, Many Worlds Interpretation, Cryogenics, Androids vs Biots …. ఇలాంటివి తెలుగులో క్లుప్తంగా వివరించటమంటే కత్తిమీద సామే. ఈ సాముగరిడీలు నా మొదటి నాలుగు కథలకీ చెయ్యాల్సొచ్చింది. ఐదో కథకి మాత్రం అంత కష్టపడకూడదనుకున్నాను. తేలిగ్గా ఐపోయేదేదన్నా రాయాలనుకున్నాను. అలా పుట్టిందే ‘రహస్యం’.

ఈ మధ్య రీడర్స్ డైజస్ట్‌లో కనబడ్డ ఓ వ్యాసం నన్ను అమితంగా ఆకట్టుకుంది. దాని సారాంశం: ‘గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం, అంతర్యుద్ధం, కరువుకాటకాల వల్ల కలిగే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది’. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే ఆర్యోక్తి అన్నిసార్లూ నిజం కాదనిపించింది అది చదివాక. భవిష్యత్తు ఎప్పుడూ భయంకరంగానే ఉండాల్సిన అవసరం లేదనిపించింది. అందులోనుండి ఓ ఆలోచన మొగ్గతొడిగింది.

టీవీల్లోనో, వార్తాపత్రికల్లోనో బాంబు పేలుళ్ల వార్తలు చూసినప్పుడు ఓ క్షణం ఉలిక్కిపడి, ఆ సమయంలో అక్కడ మనం లేనందుకు ఆనందపడతాం. ఆ ఘటన వెనకున్న తీవ్రవాదుల్ని తిట్టిపోస్తాం. దాన్ని అడ్డుకోలేకపోయిన పోలీసు, నిఘా వ్యవస్థల చేతగానితనాన్ని తూర్పారబడతాం. ఆ తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం, మళ్లీ మరో సంఘటన జరిగేవరకూ. అంతే కానీ, ఓ వాస్తవం మాత్రం గమనించం. పేలిన ఒక బాంబు మాత్రమే మన దృష్టికొస్తుంది కానీ, పేలని వేల బాంబుల గురించి మనకెప్పటికీ తెలిసే అవకాశం లేదు. ‘రోజులు దారుణంగా ఉన్నాయి’ అనటమే మనకి తెలుసు. ‘అవి అంతకన్నా దారుణంగా ఉండొచ్చు …. కానీ లేవు’ అన్న నిజాన్ని మనం గుర్తించం. ‘ఎవరి పని వాళ్లు సరిగా చేస్తే ప్రపంచం ఇంతకన్నా భద్రంగా ఉండేది’ అనటమే మనకలవాటు. ‘ఎందరో నిజాయితీపరులు అవిశ్రాంతంగా వృత్తిధర్మం నెరవేరుస్తుండటంవల్లనే ప్రపంచం ఈ మాత్రమన్నా భద్రంగా ఉంది’ అనే విషయాన్ని మనం పట్టించుకోం. మనకి తెలీకుండానే అనుక్షణం మనల్ని ఎవరో ఒకరు కాపాడుతున్నారు. వాళ్లెవరో మనమెరగం. అయినా వాళ్లకి రుణపడి ఉన్నాం. గుర్తింపుకి నోచుకోని ఆ unsung heroes కి నివాళిగా ఓ కథ రాయాలనిపించింది.

నా కథలన్నీ larger than life విషయాల చుట్టూ తిరుగుతుంటాయి. ఈ కథకీ అటువంటి వస్తువే ఎంచుకోవాలనుకున్నాను. కథానాయకుడు హోల్‌సేల్‌గా భూమండలం మొత్తాన్నీ కాపాడటం …. టైపులో అన్న మాట. అంటే ముందు భూమండలానికో పెను ప్రమాదం ముంచుకొచ్చేలా చెయ్యాలి. ఎప్పుడో ఏవో సైన్స్ మేగజైన్స్ తిరగేస్తుంటే కళ్లబడ్డ ఓ విశేషం, తర్వాతెప్పుడన్నా కథగా మలచటానికి బాగుంటుందని గుర్తు పెట్టుకున్నది, ఇప్పుడు అక్కరకొచ్చింది. 1979లో డాక్టర్ బెంజమిన్ లిబెట్ అనే శాస్త్రవేత్త మెదడు పనితీరు గురించి నిరూపించిన ఓ ఆసక్తికరమైన విశేషం అది. (అదేంటో కథలో వివరించా కాబట్టి మళ్లీ ఇక్కడ రాయబోవటం లేదు). ‘భవిష్యత్తుని ముందే చూడగలిగే టెక్నాలజీ అందుబాటులోకొస్తే?’ అన్న ప్రశ్న అందులోంచి పుట్టుకొచ్చింది. దానివల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. ఓ సైంటిస్టు సాధారణంగా తన పరిశోధనా ఫలితాలు కలిగించే లాభాలనే దృష్టిలో పెట్టుకుంటాడు. దీనికి విరుద్ధంగా, ఓ నిఘా నిపుణుడు అటువంటి టెక్నాలజీ వల్ల వచ్చే ప్రమాదాలనే ముందుగా అంచనా వేస్తాడు. ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య ఉన్న వైరుధ్యం, వాళ్ల వృత్తి జీవితాలు వాళ్ల ఆలోచనల్ని , నమ్మకాల్ని ప్రభావితం చేసిన విధానం ఆధారంగా ప్రధాన పాత్రల మధ్య ఘర్షణ పుట్టించి చక్కని ఉత్కంఠతో ఓ కథ రాసే అవకాశం ఉంది. అలా ఈ కథ మొదలయింది. సైంటిఫిక్ సమాచారానికి కొంత కల్పన తాలింపుతో అది ‘రహస్యం’గా మీ ముందుకొచ్చింది. ఇందులో ‘అరక్షణం తర్వాత జరగబోయేది ముందే చూడగలగటం’ మాత్రం శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. మిగిలిందంతా నా ఊహ.

ఇది ఉత్తమ పురుషంలో సాగే కథ. కథానాయకుడే తన కథ చెప్పుకుంటున్నాడు. కథ చివర్లో అతనో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు. అధమం రెండు జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. తాను చేస్తున్నది సరైన పనే అన్న గట్టి నమ్మకం లేనిదే అతనా పని చేయలేడు. కాబట్టి అతనేమాత్రం ఊగిసలాట లేకుండా, మరో ఆలోచనకి తావీయకుండా తన నిర్ణయాన్ని అమలుచేసినట్లు రాయటం జరిగింది. పాఠకులకి అతను చేసిన పని నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇదే కథని ప్రొఫెసర్ కోణం నుండి రాస్తే దీని ముగింపు ఇంకోలా ఉండొచ్చు. రాసింది ఏజంట్ కోణం నుండి కాబట్టి, కథ అతని చర్యల్ని సమర్ధించేలా ఉంటుంది. ఆ తేడా పాఠకులకి అర్ధమవుతుందన్న నమ్మకంతో, ఈ నేపధ్యాన్ని ముగిస్తున్నాను.

రహస్యం

ఈ లోకం – లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.
ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు. కానీ లేదు.
లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.
ఇది అలాంటి ఓ వ్యక్తి గాధ.

* * *

ఆయన్ని ప్రొఫెసర్ అందాం. వయసు అరవై ఐదు.

ప్రొఫెసర్‌కి చాలా పేరుంది. మనిషి మెదడు నిర్మాణమ్మీద ఆయన చేసిన పరిశోధనలకి నోబెల్ బహుమతొచ్చింది. ఆ తర్వాత అతి సహజంగా ఆయనకి మనదేశంలోనూ గుర్తింపొచ్చింది. ప్రభుత్వం ఆయనకి ‘భారతరత్న’ ప్రకటించి గౌరవించింది. ఆయన్ని రాష్ట్రపతిగా చేసి తమని తాము గౌరవించుకోవాలని రాజకీయపక్షాలన్నీ ఉబలాటపడ్డాయి. కానీ ప్రొఫెసర్‌కి ఆసక్తి లేకపోవటంతో ఉసూరుమన్నాయి.

ఆయన ఎక్కువగా బయటికి రాడు. నెలల తరబడి డిఆర్‌డివో లాబొరేటరీలో గడిపేస్తుంటాడు. ఆయనకంటూ ఓ ఇల్లున్నా అక్కడికి వెళ్లేది తక్కువే. ఓ కుటుంబం కూడా లేదు. వృత్తికే అంకితమైన జీవితం. రక్షణశాఖ కోసం రకరకాల పరికరాలు, పద్ధతులు రూపొందించటం ఆయన పని. ఎప్పుడూ ఏదో ఓ రహస్య పరిశోధనలో మునిగుంటాడు. తేలటం తక్కువే.

దేశభద్రత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పరిశోధనలవన్నీ.

ఇదంతా నాకెలా తెలుసు? నేనో ఇంటలిజెన్స్ ఏజెంట్‌ని కాబట్టి. నేను పనిచేసేది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో. ప్రజల భద్రత మా ప్రధాన బాధ్యత. కరడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదుల నుండి నిజాలు కక్కించటం, వాటిని విశ్లేషించి ఎటువంటి ఘోరాలకు ఒడిగట్టబోతున్నారో ముందుగానే కనిపెట్టి వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకి ఉప్పందిచటం ఇతర బాధ్యతల్లో ఒకటి. రెండేళ్ల కిందటివరకూ అదో పెద్ద సవాలుగా ఉండేది. ప్రొఫెసర్ కనిపెట్టి అభివృద్ధిపరచిన మైండ్‌రీడింగ్ ప్రక్రియ ఆ పరిస్థితిలో మార్పు తెచ్చింది. లై డిటెక్టర్, పాలీగ్రఫీ వంటి పాత పద్ధతులు ఇవ్వలేని ఫలితాలు దీనితో సాధ్యపడ్డాయి. మనిషి మెదడు పొరలని స్కాన్ చేసి అందులో ఎక్కడే సమాచారం నిక్షిప్తమై ఉందో చిటికెలో కనిపెట్టే పరికరం అందుబాటులోకి రావటంతో నేరపరిశోధన తేలికయింది. నూటికి తొంభై ఐదుగురి విషయంలో ఈ పరికరం పనిచేస్తుంది. అత్యంత మనోనిబ్బరం కలిగిన ఏ కొందరి విషయంలోనో మాత్రం ఇది ఉపయోగపడదు. ఉపయోగాలతో పోలిస్తే, అదో పెద్ద సమస్య కాదు. సమస్యలు వేరే ఉన్నాయి.

సాంకేతికత అనేది రెండువైపులా పదునున్న కత్తి. దాని ఉపయోగం వాడేవారినిబట్టి మారుతుంది. ఈ వినిమయ యుగంలో మిలటరీ అవసరాల కోసం పుట్టిన సాంకేతికత ఆ హద్దుదాటి కన్స్యూమర్ ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టటానికి ఎంతో కాలం పట్టదు. ఇంటర్‌నెట్ నుండి సెల్‌ఫోన్లదాకా అదే కథ. అనతికాలంలోనే మైండ్ రీడింగ్ పరికరాలు సైతం అదే బాట పట్టాయి. వాటి వినియోగమ్మీద ఎన్ని ఆంక్షలున్నా అవి ఏదోలా బహిరంగ మార్కెట్లలో లభిస్తూనే ఉంటాయి. వాటి వల్ల దేశంలో విడాకుల కేసులెక్కువైపోయాయి. ఇదొక సైడ్ ఎఫెక్ట్. ఇలాంటివి మరిన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ అప్రస్తుతం.

ప్రస్తుతంలోకొస్తే, ఈ సాయంత్రం ఏజెన్సీ అధినేత నుండి నాకో అత్యవసర సందేశమొచ్చింది – ఉన్న పళాన ప్రొఫెసర్ దగ్గరికెళ్లి ఆయనకి కాపలా ఉండమని. ప్రముఖుల భద్రత కూడా మా ఏజెన్సీ పరిధిలోకే వస్తుంది. నేనిలా అత్యవసరంగా వీఐపీల భద్రత చూడాల్సిన అవసరం పడ్డ సందర్భాలు ఇంతకు ముందూ ఉన్నాయి. కాబట్టి ఇది నాకు కొత్తకాదు. కొత్తగా తోచింది వేరే ఉంది. ప్రొఫెసర్ అత్యంత నిరాడంబరజీవి. రక్షణ శాఖలో కీలక సైంటిస్టుగా ఆయన క్షేమం దేశ ప్రయోజనాల రీత్యా అతి ముఖ్యం. ఆ కారణంగా గతంలోనే ప్రభుత్వం ప్రొఫెసర్‌కి కమాండోల సెక్యూరిటీ ఏర్పాటుచెయ్యబోగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. అటువంటిది, ఈ రోజు తనకి రక్షణ కావాలని స్వయానా ప్రొఫెసర్ నుండే అభ్యర్ధన రావటం వింత. ఓ పార్టీలో ఉండగా ఫోనొచ్చింది. వెంటనే బయల్దేరాను.

* * *

డిఆర్‌డీవో కాంప్లెక్స్ నగరం నుండి విసిరేసినట్లుంటుంది. కొండల మధ్యలో లోయలా ఉన్న ప్రాంతంలో, నాలుగువేల ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. నేనక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి పది కావస్తుంది. ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ వాళ్లు ఆపారు. నా గుర్తింపుకార్డు చూశాక తూతూమంత్రంగా తనిఖీ చేసి గౌరవంగా లోపలకి పోనిచ్చారు.

లోపల, అక్కడొకటీ ఇక్కడొకటీ భవనాలు. వాటిని కలుపుతూ నున్నటి తారు రోడ్లు. ఆ రోడ్ల మీద అడపాదడపా తప్ప లేని వాహన సంచారం. మొత్తమ్మీద ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. ప్రొఫెసర్ ఉండే భవనం మిగిలిన భవనాల నుండి మరీ దూరంలో ఉంది. నా వాహనం దాన్ని సమీపిస్తుండగా కళ్లు అప్రయత్నంగా పరిసరాలని క్షుణ్నంగా పరిశీలించటం ప్రారంభించాయి. అనుమానాస్పదమైనదేదీ కనబడలేదు.

తలుపుకున్న గాజుకన్ను ముందు నా బ్యాడ్జ్ కనపడేలా పట్టుకుని బజర్ మోగించాను. రెండు నిమిషాలకి ప్రొఫెసర్ వచ్చి తలుపు తీశాడు, ‘క్షమించండి. ఓ ప్రయోగం చివర్లో ఉన్నా. మధ్యలో వదిలేసి రావటం కుదర్లేదు’ అంటూ.

ఫరవాలేదన్నట్లు నవ్వి ఆయన్ని అనుసరించాను. మా వెనకే తలుపు మూసుకుంది. లాక్ అయినట్లు శబ్దమొచ్చింది.

అదో విశాలమైన గది. ప్రొఫెసర్ దాన్ని లివింగ్ రూమ్‌లా మార్చుకున్నట్టున్నాడు. ఓ మూల చిన్న మంచం. మరో మూల ఆఫీస్ డెస్క్; దాని మీద రెండు ల్యాప్‌టాప్స్, ఏవో పేపర్లు, ఓ కాఫీ మేకర్, పక్కనే ఫ్రూట్‌బౌల్. మరోపక్క గోడవారగా పెద్ద బుక్‌షెల్ఫ్; దాన్నిండా బరువైన సైన్స్ పుస్తకాలు. గది మధ్యలో ఓ సింగిల్ సీటర్ సోఫా, మరో త్రీ సీటర్ సోఫా. వాటికి ఎదురుగా ఉన్న గోడకి వేలాడుతూ పెద్ద ఎల్ఇడి టెలివిజన్. మొత్తమ్మీద పెద్దగా అలంకరణలు, ఆడంబరాలు లేకుండా ఉందా గది.

‘ఇంకొంచెం పని మిగిలుంది. పది నిమిషాల్లో వచ్చేస్తాను. కాఫీ కావాలంటే అక్కడుంది చూడండి’ అంటూ బుక్‌షెల్ఫ్ పక్కనే గోడకున్న తలుపు తెరుచుకుని పక్క గదిలోకి మాయమైపోయాడు ప్రొఫెసర్. అదాయన లాబొరేటరీ కావచ్చు.

నేను గది నలుమూలలా పరికించాను. సోఫాల కింద, అల్మైరా వెనక, ఆఫీస్ డెస్క్ దగ్గర, మంచం కింద .. ఇలా ముఖ్యమైన ప్రదేశాల్లో వెదికి చూశాను. ప్రమాదకరమైనవేమీ కనపడలేదు. ప్రొఫెసర్‌కి ఎవరి నుండి ప్రమాదముందో, ఉన్నపళాన ఆయనకి సెక్యూరిటీ అవసరమెందుకు పడిందో ఆ వివరాలేమీ నాకు తెలీదు. ఎట్నుండి ఏ ప్రమాదమొస్తుందో తర్వాత సంగతి. ప్రమాదం అంటూ వస్తే బ్యాకప్ వచ్చేదాకా ప్రొఫెసర్‌ని కాపాట్టానికి అనువైన ఓ ప్రదేశం అవసరం. అందుకు ఈ లివింగ్ రూమ్ అనుకూలమా కాదా అన్నది తెలుసుకోవటం నా తనిఖీల పరమార్ధం.

అన్నట్లుగానే పది నిమిషాల్లో తిరిగొచ్చాడు ప్రొఫెసర్. ‘అరె. ఇంకా నిలబడే ఉన్నారేం. కూర్చోండి, కూర్చోండి’ అంటూ సింగిల్ సీటర్ సోఫావైపు చూపించాడు, ఆఫీస్ డెస్క్ దగ్గరికి నడిచి ఏవో కాగితాలు ఫైల్లో సర్దుతూ.

‘ఫర్వాలేదు’ అన్నా నేను. గంటల తరబడి అలర్ట్‌గా నిలబడే ఉండటం నాకు అలవాటైపోయిన విషయం.

‘నో, నో. మీరంత ఫార్మల్‌గా ఉండనవసరం లేదు. కూర్చోండి. ఇంతకీ కాఫీ తాగినట్లు లేరే. చల్లారిపోయిందా? మళ్లీ పెడతానుండండి’ అంటూ డెస్క్ మీదనున్న కాఫీమేకర్ అందుకున్నాడు. ‘భయపడకండి. నేను కాఫీ కాయటంలో ఎక్స్‌పర్ట్‌ని’ అంటూ నావైపు చూసి కన్ను గీటాడు.

నేను సోఫాలో కూర్చున్నాను. ఐదు నిమిషాల్లో రెండు కాఫీ కప్పులతో వచ్చాడాయన. ఓ కప్పు నాకిచ్చి ట్రిపుల్ సీటర్‌లో ఆసీనుడయ్యాడు.

కాసేపు గదిలో మౌనం రాజ్యమేలింది. కాఫీ సిప్ చేస్తున్నా నా చూపులు పరిసరాలని పరిశీలిస్తూనే ఉన్నాయి. ప్రొఫెసర్ వెనక గోడకున్న పెద్ద కిటీకీ మీదకి నా దృష్టి పదే పదే మళ్లుతుంది. ఆ కిటికీ రెక్కలకి మరీ అంత మందంగాలేని గాజు పలకలు బిగించి ఉన్నాయి. ప్రమాదం అంటూ వస్తే అట్నుండే రావాలి.

నా చూపుల్ని ప్రొఫెసర్ గమనిస్తూనే ఉన్నాడు. తాగటం పూర్తి చేసి కప్పు కింద పెట్టి చెప్పాడు.

‘మరీ ఆ స్థాయి కాపలా అవసరం లేదు. కొంచెం రిలాక్స్ అవ్వండి. రేపు ఉదయం దాకా మీరు నాకు తోడుగా ఇక్కడుంటే చాలు. జస్ట్, నాకు కంపెనీ ఇవ్వటం అనుకోండి. ఓ కమాండోలా కాకుండా నా గెస్ట్‌లా ఉండండి. దయచేసి, ముందలా మరమనిషిలా చూట్టం మానేయండి’ అన్నాడు నవ్వుతూ.

నేనూ నవ్వి రిలాక్సయ్యాను.

‘ఇంకేమిటి విశేషాలు. బయట ప్రపంచం ఎలా ఉంది?’ అన్నాడాయన. ‘ఈ పరిశోధనల్లో మునిగిపోయి బయటేం జరుగుతోందో పట్టించుకోటం లేదు’ అన్నాడు మళ్లీ తనే సంజాయిషీ ఇస్తున్నట్లు.

‘మానభంగాలు, అరాచకాలు, హత్యలు, దొంగతనాలు, కుంభకోణాలు, ఉగ్రవాదం. అంతా యధాతధంగానే ఉంది. ఆసక్తికరమైన విశేషాలేం లేవు’

‘అంటే మీకు చేతినిండా పనన్న మాట’

‘అవును. నాగరికత పురోగమించేకొద్దీ మనిషి తిరోగమిస్తున్నాడు. అందుకే నేరాలు ఏ ఏటికా ఏడు పెరిగిపోతూనే ఉన్నాయి’

‘నిజమే. మనిషి బుర్రలో ఏం ఆలోచనలున్నాయో తవ్వి తీయగలుగుతున్నాం కానీ అందులో దురాలోచనలు దూరకుండా అడ్డుకోలేకపోతున్నాం’, ప్రొఫెసర్ నిట్టూర్చాడు.
మళ్లీ కాసేపు మౌనరాజ్యం. నా కప్పులో కాఫీ ఐపోయింది. అది కిందపెట్టబోతుంటే ప్రొఫెసర్ వారిస్తూ లేచి కప్పందుకున్నాడు. తన కప్పు కూడా తీస్కెళ్లి డెస్క్ మీద పెట్టేసి అక్కడున్న ఫ్రూట్‌బౌల్ నుండి ఓ అరటిపండు వలుచుకుని తినటం మొదలు పెట్టాడు. తిన్నంతసేపూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లు శూన్యంలోకి చూశాడు. తర్వాత, ఇందాకటి సంభాషణ కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.

‘ఐతే …. మనుషులకి వక్రబుద్ధులు పుట్టకుండా చేయలేకపోవచ్చు కానీ, అవి అమలు జరగకుండా ఆపగలిగే రోజు ఎంతదూరంలోనో లేదు’.

నేను ప్రశ్నార్ధకంగా చూశాను.

‘మైండ్ రీడింగ్ ద్వారా మనుషుల తలపులు గ్రహించి, వాళ్లు తలపెట్టిన ఘోరాలని ఊహించి వాటిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లే విజయవంతమవుతున్నారు. ఎందుకు? ఈ సాంకేతికత మీకు కేవలం జరగబోయే నేరాల గురించి ఓ అంచనా మాత్రమే కల్పిస్తుంది కాబట్టి. ఆ అంచనా కొన్నిసార్లు తప్పూ కావచ్చు. అందుకే, మనకి మైండ్ రీడింగ్‌ని మించిన టెక్నాలజీ అవసరం’, ప్రొఫెసర్ వివరించటం మొదలు పెట్టాడు. ‘దాన్ని సాధించే పరిశోధనల్లోనే నేను రెండేళ్లుగా తలమునకలయ్యున్నాను. అందుకే రాష్ట్రపతి పదవిని సైతం వదులుకున్నాను. ఈ ప్రయోగంలో విజయవంతమైతే దేశానికి ఒనగూడే ప్రయోజనం కన్నా ఆ పదవి ముఖ్యం కాదు’.

నాకాయన మీదున్న గౌరవం అమాంతం రెట్టింపయింది. ‘మీకభ్యంతరం లేకపోతే, ఆ పరిశోధనేంటో చెబుతారా?’, ఆసక్తిగా అడిగాను.

‘అభ్యంతరమేం లేదు. ఎలాగూ రేపీపాటికి ఇది దేశమంతా తెలిసిపోయేదే’

‘అంటే ..?’

‘అవును. పరిశోధన ఫలించింది. అఫ్‌కోర్స్, ఈ ప్రక్రియలో మనమింకా తొలిదశలోనే ఉన్నామనుకోండి. దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మిలటరీకి, మీ ఏజెన్సీకీ అందుబాటులోకి తేవటానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ప్రస్తుతానికైతే, రేపు ఉదయాన్నే ప్రెస్‌మీట్‌లో కొన్ని విశేషాలు వెల్లడిస్తున్నాను. పిఆర్ కోసం చేసే తప్పనిసరి తంతన్నమాట. పైగా, ప్రాజెక్ట్‌లో మిగతా దశలకి ఫండింగ్ కోసం కూడా ఇలాంటివి తప్పదు’

‘ఇంతకీ, ఏంటా పరిశోధన’, ఉత్కంఠ భరించలేక మళ్లీ అడిగాను ఆయన వాక్ప్రవాహానికడ్డొస్తూ.

‘చెబుతాను. దానికి ముందు మీక్కొంచెం నేపధ్యం చెప్పాలి’ అంటూ మొదలుపెట్టాడు ప్రొఫెసర్. ‘చూపు, వినికిడి, స్పర్శ, వాసన, రుచి – మనిషిని పరిసరాలతో అనుసంధానించే పంచేంద్రియాలు. కళ్లు, చెవులు, చర్మం, ముక్కు, నాలుక …. ఇలా శరీరంలో ఒక్కో భాగం ద్వారా ఒక్కో జ్ఞానం మనకి కలుగుతుంది. ఆయా భాగాలు నాడీవ్యవస్థ ద్వారా సదరు సమాచారాన్ని మెదడుకి చేరవేస్తాయి. దాన్ని మెదడు ప్రాసెస్ చేసి శరీరం ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయిస్తుంది. 1979లో డాక్టర్ బెంజమిన్ లిబెట్ అనే శాస్త్రవేత్త దీనికి సంబంధించిన ఓ విశేషాన్ని కనిపెట్టాడు. అదేంటంటే, శరీరం సేకరించిన ఇంద్రియజ్ఞానం మెదడు స్వీకరించి, తిరిగి శరీరం ఎలా ప్రతిస్పందించాలో తెలియజేసేసరికి కనీసం అరక్షణం గడుస్తుంది’

‘అర్ధం కాలేదు’

‘ఐతే మీకు సోదాహరణంగా చెబుతా. ఇది తింటూ వినండి’ అంటూ ఫ్రూట్‌బౌల్ నుండి ఓ ఆపిల్ అందుకుని మెరుపులా నా వైపు విసిరాడు. సూటిగా నా ముఖమ్మీదకి దూసుకొచ్చిందది. మరో లిప్తలో అది నా ముఖాన్ని పచ్చడి చేస్తుందనగా నా చెయ్యి లాఘవంగా దాన్ని ఒడిసిపట్టింది.

‘గుడ్ రిఫ్లెక్సెస్. చాలా చురుగ్గా కదిలారు. కమాండో శిక్షణ ఊరికేపోలేదు’ అంటూ ప్రొఫెసర్ వచ్చి మళ్లీ తన సోఫాలో కూర్చున్నాడు. ‘రెటీనా మీద పడ్డ వెలుతురు అక్కడినుండి మెదడులోకి చేరటానికి, మెదడు దాన్ని దృశ్యంగా మార్చటానికీ మధ్య కనీసం అరక్షణం గడుస్తుంది. మరోలా చెప్పాలంటే, నేను ఆపిల్ విసిరిన అరక్షణానికి కానీ అది మీరు చూడలేరు’ అన్నాడు సోఫాలో సర్దుకుంటూ.

‘అయితే?’

‘నేను విసిరిన వేగానికి, ఆ లోపే ఆపిల్ మీ ముఖానికి తగిలుండాలి. కానీ తగల్లేదు. మీరు సరిగా సమయానికి దాన్ని పట్టేసుకున్నారు. అంటే, నేను ఆపిల్ విసిరిన విషయం తెలీకముందే మీ శరీరం దాన్ని ఎదుర్కోడానికి సిద్ధమైపోయింది’

‘అదెలా సాధ్యం!?!’

‘ఎలాగంటే …. అరక్షణం తర్వాత ఏం జరగబోతుందో మీ మెదడు ముందే గ్రహించింది కాబట్టి. అంటే అది భవిష్యత్తులోకి తొంగిచూసిందన్న మాట. అందుకే మీరు అరక్షణం ఆలస్యంగా కాకుండా, నేను ఆపిల్ విసిరిన వెంటనే రియాక్ట్ కాగలిగారు. ఇది మనందరి మెదళ్లూ చేసే మాయ. మనం దీనికి ఎంతగా అలవాటుపడిపోయామంటే, ఇదిలా జరుగుతుందన్న ఊహే నమ్మశక్యంగా అనిపించదు’

ఈ విషయం ఇంకెవరన్నా చెబితే కొట్టిపారేసేవాడినేమో. కానీ మెదడు పనితీరు గురించి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి వెల్లడించే విశేషం నమ్మకతప్పదు. ఐతే ఒకటి మాత్రం నాకర్ధం కాలేదు. అదే అడిగాను.

‘భవిష్యత్తులోకి చూట్టం ఎలా సాధ్యం? భవిష్యత్తు ఇంకా జరగలేదుగా’

‘అది అందరూ అనుకునేది. నిజానికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలనేవి విడివిడిగా లేవు. అవన్నీ మనుషులు తమ వెసులుబాటు కోసం సృష్టించుకున్న పదాలు మాత్రమే. ఉన్నది ఒకటే కాలం’

‘ఏమిటది?’

‘గతం’

‘??’

‘అవును. జరగాల్సింది, జరిగే అవకాశం ఉన్నది మొత్తం ఇప్పటికే జరిగిపోయింది. అదంతా మన దృష్టిలో ఇంకా పడలేదంతే. మనం ఇప్పటికే గమనించినది గతం. ప్రస్తుతం గమనిస్తున్నది వర్తమానం. ఇంకా గమనించనిది భవిష్యత్తు. దట్సాల్’

‘అంటే …. భవిష్యత్తు కూడా ఇప్పటికే జరిగిపోయింది కానీ అది మనకింకా అనుభవంలోకి రాలేదంటారు’

‘ప్రిసైజ్‌లీ. ఐతే, ఈ భవిష్యత్తనేది ఒకటి కాదు. కొన్ని వందల భవిష్యత్తులుంటాయి. వర్తమానంలో మనం ఏం చేస్తున్నామనేదాన్నిబట్టి ఆ వందలాది భవిష్యత్తుల్లో ఏదో ఒకటి మన అనుభవంలోకొస్తుంది. అదే మన గతంగా మారుతుంది’

‘ఒకటికన్నా ఎక్కువ భవిష్యత్తులంటే …. ముందేం జరగబోతుందో తెలిస్తే దాన్ని మార్చుకునే అవకాశం ఉందన్న మాట’

‘అవును. ఇందాక జరిగిందదే. నేను ఆపిల్ విసరడానికి అరక్షణం ముందే మీ మెదడు దాన్ని చూడగలిగింది. అందువల్లే ఆపిల్ మీ ముఖమ్మీద కాకుండా చేతిలో పడింది. లేకపోతే దానికి వ్యతిరేకంగా జరిగుండేది’

‘బాగానే ఉందిదంతా. ఇంతకీ మెదడు అరక్షణం తర్వాతేం జరుగుతుందో ముందే ఎలా పసిగట్టగలుగుతుంది?’

‘ఆ సమాచారమంతా మెదడులోనే ఉంటుంది. గతం ఎలాగైతే మెదడు పొరల్లో ఓ జ్ఞాపకంగా బంధించబడి ఉంటుందో, మనకున్న వందలాది భవిష్యత్తులు కూడా అలాగే జ్ఞాపకాలుగా మెదడులోనే భద్రంగా ఉంటాయి. కాకపోతే, మనకి గతం మాత్రమే గుర్తుంటుంది. భవిష్యత్తులేవీ గుర్తుండవు. మన వర్తమానానికి తగిన భవిష్యత్తుని ఎంచుకుని ఆ జ్ఞాపకాలని ఓ అరక్షణం ముందే తవ్వి తీసే శక్తి మన మెదళ్లకుంది. అంతకు మించి ముందుకెళ్లగలిగితే ఎలా ఉంటుందనే ఊహ నా పరిశోధనకి పునాది’

‘అంటే?’

‘భవిష్యత్తులోకి మరింత లోతుగా తొంగిచూసే పద్ధతి కనిపెట్టటం ఆ పరిశోధన లక్ష్యం. అందులో నేను విజయం సాధించాను కూడా’

‘కంగ్రాచ్యులేషన్స్’, చెప్పానే కానీ నా గొంతులో నమ్మకం ధ్వనించలేదు. అదాయన గమనించాడు.

‘మీరు నమ్ముతున్నట్లు లేరు. ఉండండి మీకిప్పుడే డెమో ఇస్తాను’ అంటూ నన్ను సోఫాలోంచి లేచి నిలబడమని సైగ చేశాడు. ఆయన చెప్పినట్లే చేశాను.

‘కొంచెం రిలాక్స్ అవండి. కళ్లు మూసుకుని ఓ నిమిషం శ్వాస పీల్చి వదలండి’ అంటూ నన్నో ప్రత్యేకమైన భంగిమలో నిలబెట్టాడు. ఆ తర్వాత నా చెవిలో ఓ పొడుగాటి వాక్యం చెప్పాడు.

‘మీ మెదడు పొరల్లో నిద్రాణంగా ఉన్న భవిష్యత్తు జ్ఞాపకాలని వెలికితీసే ఫార్ములా ఇది. దీన్ని ఏకాగ్రతతో పదేపదే మననం చేసుకోండి. అప్పుడు మీకు మీ భవిష్యత్తు గోచరిస్తుంది’ అన్నాడు.

నాకు నవ్వొచ్చింది. ‘ఇది సైన్స్ ప్రయోగంలా లేదు. ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్నట్లుంది’ అన్నాను నవ్వాపుకుంటూ, కళ్లు తెరవకుండానే.

‘ఓ దశ దాటిపోయాక ఆ రెంటికీ పెద్దగా తేడా లేదులే. చెప్పింది చెయ్యండి’ అన్నాడాయన ఆజ్ఞాపిస్తున్నట్లు.

* * *

నేను మళ్లీ కళ్లు తెరిచేసరికి సోఫాలో కూర్చుని ఉన్నాను. ఆ స్థితిలో ఎంతసేపున్నానో, సోఫాలోకి ఎలా వచ్చానో గుర్తురాలేదు. కళ్లెదురుగా ప్రొఫెసర్ ముఖం కనబడింది.

‘ఎంతసేపయింది?’, అన్నాను అర్ధోక్తిలో.

‘ఎంతో సేపెక్కడ. ఒక్క నిమిషం లోపే. చెప్పాను కదా, ఈ ప్రయోగం ఇంకా తొలిదశలోనే ఉంది. ప్రస్తుతానికి మీరు వెలికితీయగలిగేది మీ …’

‘…. చిట్టచివరి జ్ఞాపకం’ ఆయన వాక్యాన్ని నేను పూర్తి చేశాను.

‘అవును. మీ కళ్లు చూసే చివరి దృశ్యమన్న మాట. మీ జీవితంలో ఆఖరి ఘట్టం. ఇంతకీ ఏం చూశారు?’

‘నన్ను ఉరి తీయటం’, మెల్లిగా చెప్పాను. ఇంకా కళ్లముందే మెదులుతుందా దృశ్యం. నా నేరాన్ని చదివి వినిపించటం, తర్వాత ముఖానికి ముసుగేసి ఉరితాడు బిగించటం, కాళ్ల కింద చెక్క పక్కకి తొలగటం, మెడ విరిగిన శబ్దం. అంతా నిమిషం లోపే.

నా ముఖమ్మీద చెమటలు పట్టాయి. వళ్లంతా వణుకు. అంత ఏసీలో కూడా ఉక్కపోతగా అనిపించింది. మెడలో టై వదులుచేశాను.

‘భయపడకండి. మీరు చూసేశారు కాబట్టి అది జరగకుండా తప్పించుకోవచ్చిక’, అనునయంగా చెప్పాడు ప్రొఫెసర్.

నాకు వణుకింకా తగ్గలేదు. లేచి చిరాగ్గా గదిలో పచార్లు చేయటం మొదలు పెట్టాను. టై మెడనుండి ఊడిపడి చేతిలోకొచ్చి గిరగిరా తిరుగుతుంది. బుర్రలో ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఇంకా ఏ మూలో అపనమ్మకం. నేను చూసింది నిజమేనా?

‘చూశారుగా. ఎలాంటి పరికరాలు అవసరం లేని ప్రక్రియ. పురాతన కాలంలో దీన్నే దివ్యదృష్టి అనేవాళ్లు. దీనిక్కాస్త పదునుబెట్టి భవిష్యత్తుని మరింత వివరంగా చూడగలిగితే, అప్పుడది దేశభద్రతకి పనికొచ్చే అద్భుతమైన ఆయుధమవుతుంది. భవిష్యత్తులో జరగబోయే నేరాలు ముందే సవివరంగా తెలుసుకుని ఆపటం సాధ్యమవుతుంది. ఇంకెంత.. మహా ఐతే రెండు మూడేళ్లు చాలు’, సోఫాలో కూర్చుని ఆనందంగా చెప్పుకుపోతున్నాడు ప్రొఫెసర్.

నేనాయన మాటలకి అడ్డు తగిలాను.

‘ప్రొఫెసర్. ఇంతకీ మీరు మీ భవిష్యత్తులోకి చూశారా?’

‘అఫ్‌కోర్స్. చూడకుండా ఎలా ఉంటా?’

‘ఏం కనబడింది?’

‘నా చివరి క్షణాలు … ఎవరో వెనకనుండి నా గొంతు నులుముతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. గింజుకుంటున్నాను. కళ్ల ముందు ఈ గది గిరగిరా తిరుగుతుంది. నిమిషం పాటు అదే దృశ్యం. ఆ తర్వాత కళ్లలో మెరుపులు మెరిశాయి. అంతా నల్లగా మారిపోయింది. అంతే’

నా కళ్లు పెద్దవయ్యాయి. అపనమ్మకం మటుమాయమయింది. మా ఇద్దరి భవిష్యత్తులూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఐతే ఆ విషయం నాకు మాత్రమే తెలుసు, ప్రొఫెసర్‌కి తెలీదు. ఇద్దరం ఒకే భవిష్యత్తు చూశామంటే – ఇది కచ్చితంగా నిజమే.

తక్షణం నేనేం చెయ్యాలో బోధపడింది. తలతిప్పి ప్రొఫెసర్‌కేసి చూశాను. సోఫాలో అటుతిరిగి కూర్చుని ఉన్నాడాయన. నన్ను గమనించే స్థితిలో లేడు. ఇంకా చెప్పుకుపోతున్నాడు,

‘రేపు ప్రెస్‌మీట్ తర్వాత ఈ ఫార్ములాని భద్రంగా ప్రభుత్వానికి అందజేస్తాను. అందాకా నేను క్షేమంగా ఉండటం అత్యవసరం. అందుకే మిమ్మల్ని పిలిపించాను’.

‘ఈ ఫార్ములా ఇంకెవరికన్నా చెప్పారా?’, ఆత్రుత ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ అడిగాను.

‘లేదు. ఇప్పుడు మీకు చెప్పేవరకూ అసలీ పరిశోధన గురించి కూడా ఎవరికీ తెలీదు’, ప్రొఫెసర్ వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పాడు.

చాలు. నాక్కావలసింది అదే. వెంటనే మెరుపులా ముందుకొంగాను. లిప్తపాటులో నా చేతిలోని టై ప్రొఫెసర్ మెడచుట్టూ బిగుసుకుంది. వణుకుతున్న చేతుల్లోకి బలమంతా తెచ్చుకుంటూ మౌనంగా ఉచ్చు బిగించసాగాను. కాసేపు గింజుకున్నాక, నా బలం ముందు ఆయన వృద్ధదేహం ఓడిపోయింది. మూడే నిమిషాల్లో అంతా ముగిసిపోయింది. ఆయన ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక నోరు విప్పి చెవిలో చెప్పాను, ‘సారీ ప్రొఫెసర్. నా నేరమేమిటో చెప్పలేదు కదూ. అది, దేశద్రోహం. మిమ్మల్ని చంపినందుకు నా మీద మోపిన అభియోగం’.

నా వంట్లో వణుకు తగ్గిపోయింది. గుండె కుదుటపడింది.

* * *

ఆ భవనం అగ్నికీలలకి ఆహుతవుతుంది. నేను దాని ముందున్న బెంచ్ మీద కూర్చుని ఉన్నాను. లోపల ప్రొఫెసర్ దేహం, దానితో పాటే ఆయన పరిశోధనకి సంబంధించిన సాక్షాధారాలన్నీ బూడిదైపోయాయి. దూరంగా సెక్యూరిటీ వాహనం సైరన్ మోగించుకుంటూ ఇటే వస్తుంది. ఫైర్ అలార్మ్ పనిచెయ్యకుండా చేసి భవనంలో ఉన్నవన్నీ తగలబెట్టేశాక నేనే వాళ్లకి ఫోన్ చేశాను.

భవిష్య దర్శన ప్రక్రియ మంచివాళ్ల చేతుల్లోనే ఎల్లకాలమూ రహస్యంగా ఉండే అవకాశం లేదు. అది అందరికీ అందుబాటులోకి వచ్చిననాడు ప్రపంచం ఈ మాత్రం క్షేమంగా కూడా ఉండదు. ఒక మోసకారి స్టాక్‌బ్రోకర్ దీన్ని వాడుకుని ప్రపంచ ఆర్ధికవ్యవస్థలన్నిట్నీ అతలాకుతలం చెయ్యొచ్చు. ఓ దగుల్భాజీ రాజకీయనాయకుడు దీనితో ప్రత్యర్ధుల ప్రాణాలు తీయొచ్చు. ఓ తీవ్రవాది దీని సాయంతో ఎప్పటికీ పట్టుబడకుండా తప్పించుకు తిరగొచ్చు. దీనివల్ల ఒరిగే లాభాలకన్నా జరిగే నష్టాలే మిన్న. అందుకే ఈ ప్రక్రియ వెలుగులోకి రాకూడదు. ఆ సంగతి ప్రొఫెసర్‌కి వివరించినా ఉపయోగం ఉండదు. ఇంత కీలక పరిశోధనా ఫలితాన్ని నావంటి అపరిచితుడికి వెల్లడించిన మనిషిని నమ్మటం ఎలా? అందుకే ఆయన్ని తుదముట్టించటం మినహా దారిలేకపోయింది. ఇప్పుడా ఫార్ములా తెలిసిన వ్యక్తి ఒకడే మిగిలున్నాడు – నేనే. నేను ఎక్కువకాలం బతికుంటే ఆ ఫార్ములా అవసరానికో, స్వార్ధానికో బయటపెట్టొచ్చు. కాబట్టి నేనూ వీలైనంత త్వరగా అంతమైపోవాలి. ఆత్మహత్య అంత తేలిక్కాదు. ఇక మిగిలిన దారి, లొంగిపోవటం. లొంగిపోతే నా భవిష్యత్తేంటో నాకు తెలుసు. అన్నాళ్లూ ఈ రహస్యం నా దగ్గర భద్రంగా ఉంటుందన్న విషయమూ తెలుసు; మైండ్ రీడింగ్ ప్రక్రియతో ఇంటరాగేట్ చేసినా బయటపడనంత భద్రంగా. ఎందుకంటే, మైండ్ రీడింగ్‌కి లొంగని ఐదు శాతం మందిలో నేనూ ఒకడిని.

సెక్యూరిటీ వాహనం ఎదురుగా వచ్చి ఆగింది. గార్డులు తుపాకులు ఎక్కుపెడుతూ నన్ను చుట్టుముట్టారు. ప్రతిఘటించే ఉద్దేశం నాకు లేదు.

ఈ లోకం – లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.

ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు. కానీ లేదు.

లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.

ఇది అలాంటి ఓ వ్యక్తి గాధ.

ఇది, నా కథ.

(The End)

 (All rights on the above  text are reserved. It should not be printed or redistributed without the author’s permission.)

పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు: స.వెం.రమేష్

ramasundari

రమాసుందరి

“కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధ మనమందరం చిన్నప్పుడు అమ్మమ్మల నుండి, నాయనమ్మల నుండి విన్నదే. పిచుకమ్మ “ఆబగూబలు అణిగిపోయేదాక; అక్కులు, చెక్కులు ఎండిపోయేదాక; ఆయిలో ఊపిరి కోయిలోకి వచ్చే దాక” చాకిరి చేసి పండిస్తే; కాకి తనకు కడివడు, పిచుక్కి పిడికెడు పంచింది. “కయ్య నాది, పైరు మీద పెట్టుబడి నాది.” అంది. పిచుకమ్మకు జరిగిన ద్రోహం విని అందరం కళ్ళనీళ్ళు పెట్టుకొన్న వాళ్ళమే. అదే అఘాయిత్యం మన ఇంట్లో జరిగితే ఆ కళ్ళనీళ్ళు రాలుతాయా? స. వెం. రమేష్ కి రాలాయి. కళ్ళనీళ్ళు రాలటమే కాదు, కళ్ళు ఎరుపెక్కి కసిగా “కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధను తిరగ రాసాడు.

తన కుటుంబంలో జరిగిన ఆర్ధిక,కుల దోపిడీ, అణచివేతలను తన భాషాసౌందర్యంతో, తన విశిష్ట కధా కౌశల్యంతో తూర్పార పట్టాడు.  తన అవ్వలు, అమ్మలు చేసిన  పాపాలను వీపు మీద మోస్తూ ఈ కధ రాసాడు. అంటరానితనాన్ని నిర్ధాక్షిణ్యంగా చీల్చి చెండాడిన కర్కశత్వం ఈ కధకుంది. ఆర్ధిక దోపిడి మూలాలు చూయించిన విస్తృతత్వం ఈ కధకుంది. తరాలు మారిన కులం పునాది కదలలేదనే చేదు నిజం ఈ కధ చెబుతుంది. దళితుజనుల స్వీకరణ తమ సౌకర్యానికే  జరిగింది కాని, హృదయ పరివర్తనతో జరగలేదన్న కఠిన వాస్తవం ఈ కధ చెబుతుంది. రూపం మార్చిన అణచివేత, భూతం లాగా దళితులను ఇంకా వేధిస్తుందని చెబుతుంది.

తన ఇంటి మాలితి (పాలేరుకి స్త్రీలింగం) మంగమ్మ జామపండ్లతో బాటు పంచి ఇచ్చిన కమ్మని అమ్మతనాన్ని, నిజాయితీతో కూడిన సేవల సౌకర్యాన్ని బాల్యంలో అనుభవించిన ప్రాణం, ఆమెకు జరిగిన అన్యాయాల పరంపరను కూడ గుర్తెరిగింది. ” నిన్న నేనూ, మీ అవ్వ కొట్టిన దెబ్బలలకు దడుసుకొని జెరం వచ్చింది వాడికి. తగ్గినాక వస్తాడులే” అని కళ్ళు తుడుచుకొన్నమంగమ్మ గుండె కోతను తన గుండెలోతుల్లో గీసి దాచుకొన్నాడు. పిచుకమ్మ కధ చెబుతూ కొతుకు పడిన మంగమ్మ గొంతులో దుఃఖజీరల వెనుక, పిచుకమ్మలో తనను తాను చూసుకొన్న ఆమె అంతరంగాన్ని ఆకళింపు చేసుకొన్నాడు. పెరిగి పెద్దై ఈ కధ రాసి మనల్ని కూడ ఆత్మావలోకనం, ఆత్మ విమర్శ చేసుకోమని చెబుతున్నాడు.

Qప్రళయ కావేరి కధల్లో సామూహిక జీవన సౌందర్యం, పల్లె ప్రజల జీవానానందాలు, మానవతా విలువలు కలగలిసి దృశ్యీకరించారు. కులాల ప్రసక్తి ఉండింది కాని, కుల వివక్షత గురించి లేదు. కధలో మీరు లేవనెత్తిన అంశాల వెనుక మీ మారిన దృక్కోణం ఏమైనా ఉందా?

ప్రళయ కావేరి కధలు నా బాల్యానికి చెందినివి. బాలుడిగా నాకా అనుబంధాలే గుర్తు ఉన్నాయి. కాని ఎదిగిన మనసుతో ఇప్పుడు పరికిస్తే మా కుటుంబం పాటించిన వివక్ష నా జ్ఞానానికి అందింది. సరిదిద్దలేని, క్షమించలేని అణచివేతకి, వివక్షకి కొన్ని తరాలుగా మన పెద్దవాళ్ళు పాల్పడ్డారు. ఈ మధ్య ఒకాయన ఏదో చర్చలో “మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్ని ఎందుకు భాధ్యుల్ని చేస్తారు? ” అని అడిగారు. తప్పక బాద్యత వహించాలి అంటాను నేను . అలా బాధ్యత వహించటానికి మనం సంసిద్ధంగా లేనట్లైతే మనం మారనట్లే. నేను ఎంత సంస్కర్తనైనా ‘బ్రాహ్మిణిజం’ అనే పలుకుకు ఉడుక్కొంటున్ననంటే నాలో ఆ బీజాలు మిగిలి ఉన్నట్లే. ఆధిపత్యానికి పర్యాయపదమే బ్రాహ్మనిజం.

Qప్రళయ కావేరి కధలో ఎంతో ప్రేమించి రాసిన అవ్వ పాత్రను, కధలో తీవ్రంగా తులనాడారు. ప్రళయకావేరి వరదల్లో చనిపోయిన ఆమె చావును, ఆమె పాప ప్రతిఫలంగానే కసిగా తీర్మానించారు. ఇదెలా సాధ్యం?

నా దగ్గర మిత్రులు కూడా దాన్ని ఖండించారు. నేను దేవుడు, దెయ్యాన్ని నమ్మను.  అయితే సహజ ప్రాకృతిక న్యాయం ఒకటి ఉంటుందని నమ్ముతాను. ఈ కధ ప్రధాన ఉద్దేశం తరాలు మారినా కులవివక్ష రూపం మార్చుకొన్నదే కాని, నిర్మూలించబడలేదు అని చెప్పటమే. ఒక దళిత అధికారిని, ఒక పేద అగ్రకులస్థుడిని గ్రామాల్లో స్వీకరించే విధానాన్ని పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్ధం అవుతుంది. దళిత అధికారికి సపర్యలు చేయ వచ్చు. భక్తి శ్రద్ధలు ప్రదర్శించవచ్చు. కాని అగ్రకులాల హృదయపూర్వక స్వీకరణ మాత్రం తమ కులానికి చెందిన పేదవాడికే ఉంటుంది. ఈ దుర్మార్గానికి మా కుటుంబం అతీతం కాదు. కాబట్టి ఈ ఇతివృత్తాన్ని మా కుటుంబం నుండే మొదలు పెట్టాను.

Qనన్ను, మీ పాఠకులందరినీ అబ్బురపరిచేది మీ విశేష భాషా పరిజ్ఞానం. మీరు ప్రళయ కావేరీ సరస్సు ప్రాంతాన్ని వదిలి పెట్టినా ఇప్పటికీ అక్కడి మాండలికం, వాడుక వస్తువులు, అక్కడి శ్రమలు కంఠోపాఠంగా మీ కధల్లో వినిపిస్తారు. ఇది మీ జ్ఞాపకశక్తికి సూచికగా అనుకోవాలా?

అది నాకు ఆ భాష మీద, ప్రాంతం మీద అభిమానం. అమ్మ ప్రేమలో తీపి, అమ్మ భాషలో తీపి మరచిపోగలిగినవి కాదు. అయితే తెలుగు భాషకు సంభంధించి నాకు కొన్ని మనస్థాపాలు ఉన్నాయి. భాషల అభివృద్ధిలో ఆరు మెట్లు ఉన్నాయి. తమిళం ఆరు  మెట్లూ ఎక్కేసింది. తెలుగు మూడో మెట్టు దగ్గర ఆగిపోయింది.  శ్రీపాద, చలం మొదలైన వారి తరువాత తెలుగు వాక్యం ఆగిపోయింది.

ఇక్కడ భాషా సంసృతులని వెన్నంటి కాపాడుకోవాల్సిన  కవులు, మేధావులు ఉదాసీనత వహిస్తున్నారు. మనది కాని దాన్ని మోస్తున్నారు. కవితల్లో కూడ యధేచ్చగా ఆంగ్లాన్ని వాడుతున్నారు. నాకో దళిత స్నేహితుడున్నాడు. అతను బాతిక్, జానపద కళాకారుడు. పేరు పుట్టా పెంచల దాసు. ఎక్కువ చదువుకోలేదు. సాహిత్యం మీద ప్రీతి ఉన్నవాడు. అతను ఈ కవుల కవిత్వాన్ని ఆస్వాదించే అర్హత లేనివాడా? కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు.

భాష స్థాయి పెరగాలంటే స్థానికీకరణకి ప్రాముఖ్యత పెరగాలి. తెలుగు నాట ఎన్నోమాండలికాలు ఉ న్నాయి. ఈ మాండలికాలు అన్నిటినీ నిర్మూలించి ఒక మాండలికాన్నిమాత్రమే ‘ప్రామాణికం’ చేస్తున్నారు. ప్రపంచీకరణను ఎదిరించాలన్నా స్థానికీకరణ అవసరం ఉంది. ( ఆయా ప్రాంతాల వంటలను రక్షించుకోవటం). దళితులు మూలవాసులు కాబట్టి వారి మాండలికం, వారి జీవనవిధానం, వారి ఆహరపు అలవాట్లు సంరక్షిస్తూ, తెలుగు ప్రజలు దళితీకరణ చెందాలంటాను. ఈ కార్యం తమిళనాడులో చాలా వరకు జరిగింది. ద్రవిడ ఉద్యమం వారికి చాలా సహాయ పడింది.

Qకధలో కష్టపెట్టిన కాకి ఓడిపోయినట్లు, కష్టపడిన పిచ్చుక  గెలిచినట్లు రాసారు. అది మీ అభిలాషా? నిజంగా అలా జరిగిందా?

(నవ్వు) ఈ కధ నా జీవితంలో జరిగిందే. ఇక్కడ ఇంతే జరిగింది. కాని కాకమ్మలందరూ ఓడి పోయి, పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు.

Qదళిత అణచివేత, వివక్షతలను మీరు పేర్కొన్నప్పుడు మీ కుటుంబంలో స్త్రీ పాత్రలకే దాన్ని మీరు పరిమితం చేసారు. పురుషులని అతీతంగా ఉంచారు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?

నాకు 14 మంది అమ్మమ్మలు. వాళ్ళ మధ్య పెరిగాను. స్త్రీల బలాలను, బలహీనతలను దగ్గరగా చూసిన వాడిని. కాబట్టే నా కధలన్నీ స్త్రీల చుట్టే ఎక్కువగా తిరుగుతాయి.

చివరికి కవులమ్మ ఏం చేసింది?

rajiమొగుడుపెళ్ళాలన్నంక కొట్టుకుంటరు, తిట్టుకుంటరు…”, “మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి”,  అని పెద్దమనుషులు తలా ఒక మాటా అన్నా నోరు మెదపదు కవులమ్మ. కానీ ఒకాయన  “లోకంల నువ్వొక్కదానివే ఆడిదానివి కాదు. అందరు నీ లెక్క వుంటే లోకం బాగుపడినట్టే. నన్ను వదిలిపెట్టి పోయిన్నాడే సచ్చినట్టు అని మాట్లడ్తవంట. ఆ బొట్టెందుకు పెట్టుకున్నావమ్మా..” అనేసరికీ కవులమ్మ కోపం కట్టలు తెంచుకుంటుంది. అంతదాకా కవులమ్మ మౌనాన్నే తప్ప కోపాన్ని చూడని కొడుకులు,కోడండ్లు బదులియ్యలేక ఉండిపోతారు. కవులమ్మ పెద్దమనుషులకు, కొడుకులకు ఏం సమాధానం చెప్పింది? ఏం నిర్ణయం తీసుకుంది? తెలవాలంటే తాయమ్మ కరుణగారి రాసిన “కవులమ్మ ఆడిదేనా?” కథానిక చదవాల్సినదే!

అరవై ఏండ్లకు దగ్గర వయసు ఉన్న కమలమ్మను అంతా ‘కవులమ్మా’ అంటారు. ఎముకలకి చర్మం ఉన్నట్టుగా సన్నగా ఉంటుంది కవులమ్మ. శుభ్రమైన చీర, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు ఉంటుంది. చేతికి నాలుగైదు రంగుల మట్టి గాజులు, ముక్కుకు ముక్కుపుల్ల తప్ప మరే ఆభరణాలూ ఆమె వంటిపై కనబడవు. తప్పదనుకుంటే తప్ప మాట్టాడదామె. కొత్తవారు ఆమె మూగదనే అనుకుంటారు. ముఖంలో ఏ భావము కనబడనీయక నిర్వికారంగా పనులు చేసుకుంటూ వెళ్పోయే ఆమెకు స్పందనలు కలుగవా? అనుకుంటారందరూ. “మనిషికిక ఎంత పొగరు.. ఊ… అని కూడా అనదు” అని కోడళ్ళిద్దరూ  ఆడిపోసుకున్నా పలుకదామె!ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు కవులమ్మకి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపి, ఓ ఇంటి అక్కాచెల్లెళ్ళతో కొడుకులకు కూడా పెళ్ళిళ్ళు చేసింది. ఎంతో కష్టపడి కట్టుకున్న తొమ్మిది గదుల సొంత ఇంట్లో, ఓ మూలనున్న బావి దగ్గర గది అమెకు మిగిల్చారు కొడుకులు. ఇంటెడు మంది బట్టలు, అంట్ల పని అమెదే. క్షణం తీరుబడిగా కూర్చోదు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రమజీవి ఆమె.

ఒకనాటి ఉదయాన ఎండలో బావి దగ్గర గిన్నెలు తోముతున్న ఆమెకు గేటు తెరుచుకు వస్తున్న ఆడబిడ్డ రంగమ్మ కనబడుతుంది. ఏనాడూ బంధువులను ఇంటికి పిలువని కొడుకులు రంగమ్మనెందుకు పిలిచారో అర్థం చేసుకోవటానికి ఎక్కువసేపు పట్టదామెకు. కన్నీళ్ళు ముసిరిన ఆమె కళ్ళల్లో ఎన్నో పాత సంగతులు కదలాడతాయి. హృదయం భారమయ్యే గాథ ఆమెది. తల్లిని ఉంచుకుని, ఆమె కూతుర్ని(కమలమ్మని) వయోబేధం లేకుండా పెళ్ళాడి, జీవితాంతం అనుమానంతో దారేపోయే ప్రతివాడితో..చివరికి కన్న తండ్రితో కూడా ఆమెకు సంబంధం అంటగట్టి, ఆమెను మాటలతో హింసించి, గుద్దులు గుద్దీ, చావబాది, చివరికు అరవై ఐదేళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకు వెళ్ళిపోయిన  దుర్మార్గుడు ఆమె భర్త. ముసలివయసులో కంటి చూపు పోయాకా ఇప్పుడు సేవలకోసం మళ్ళీ ఇల్లు చేరిన అతడిని క్షమించి మంచాన పడిఉన్న అతనికి కవులమ్మ సపర్యలు చేయగలదా?

పదునైదు రోజుల క్రితం వచ్చిన తండ్రిని బావి దగ్గరి గదిలోనే ఉంచుతారు కొడుకులు. ఆ గది దరిదాపులకు కూడా వెళ్లకుండా ఇంటి వసారాలోనే నిద్రపోయి రోజులు గడుపుకుంటుంటుంది కవులమ్మ. తండ్రి దుర్మార్గుడైనా అతడ్ని భరించాల్సిన బాధ్యత తల్లిదేనంటారు కొడుకులు. ఆ సంగతి తేల్చటానికి ఊళ్ళోని నలుగురు పెద్దమనుషులనూ, తండ్రి తరఫు బంధువుల్లో మిగిలిన ఒకే ఒక మేనత్తనూ పంచాయితీకి పిలుస్తారు. “సాకల్దాన్ని పెట్టుకోకపొయినర్రా..ముసిల్దానితో ఇంకా గంపెడు పని చేయిస్తున్నరు”, “గుండెకాయ కాడ గుండన్న లేదాయె. ఆనాడు మెడలో బంతిపూల మాల, చెవులకు జుంకాలు, ముక్కుని ఇంత ఇంత పెద్ద బేసర్లు, చేతులకు దండకడాలు, నడుముకి వడ్డాణం పెట్టుకుని పార్వద్దేవి లెక్కవుండేది. ఆడపిల్లల పెండిళ్లకు పెట్టగా వున్నాటిని మీరు ఒలుసుకుంటిరి. అషద అయ్యి మీ మావ చేపిచ్చినవన్నా కవాయే. ఆమె తల్లిగారు పెట్టినయి. ఆడికీ ఎవరన్నా అడిగినా ‘ముసల్దాన్ని నాకెందుకు నగలు’ అని అంటదిగని, మీ మీదకి మాట రానీయదు” అంటూ రంగమ్మ వదిన తరఫున మాటాడ్డం చూసి పళ్ళు నూరుకుంటారు కవులమ్మ కోడండ్లు.

“తాయమ్మ” అనే తన ప్రసిధ్ధ కథనే ఇంటిపేరుగా మార్చుకున్న రచయిత్రి కరుణ  కథలో వాడిన భాష సంఘటనలను, కథలోని వాస్తవికతను తాజాగా ఉంచుతుంది. యుగాలు మారినా, సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎందరో స్త్రీల దుస్థితి ఈవిధంగానే ఉందన్న సత్యాన్ని ఈ కథ తెలుపుతుంది. కవులమ్మ లాంటి స్త్రీలు చాలామంది ఉంటారు. ఆమె భర్త చేతిలో పడరాని పాట్లు పడింది. కానీ సమస్యలనేవి భర్త వల్లనే రానక్కర్లేదు.. అత్తగారు, ఆడబిడ్డ, పిల్లలు, సమాజం… ఇలా ఎవరివల్లనైనా సమస్య రావచ్చు. అయితే, పరువు-ప్రతిష్ఠ, జరుగుబాటు ఎలా?.. మొదలైన ప్రశ్నలు, భయాలు వీడి కవులమ్మలా నిలబడి ధైర్యంగా  సమస్యను ఎదుర్కునేంతటి తెగువ ఎందరు స్త్రీలు చూపెట్టగలరన్నది ప్రశ్న! కథలో కవులమ్మ చెప్పిన చివరి మాటలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఉత్తేజపరుస్తాయి. కథని మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి. ఆత్మగౌరవార్థం ఆమె చూపే తెగువకూ, ధైర్యానికీ మనసు సలాము చేస్తుంది. ఉన్నతమైన ఆమె వ్యక్తిత్వం మరెందరికో మార్గదర్శకం కాగలదనిపిస్తుంది.

ఈ కథ “మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ” ప్రచురించిన “కథావార్షిక 2004” కథా సంకలనం లోనిది.

కవులమ్మ ఆడిదేనా?

ఉదయం తొమ్మిది కావస్తుంది. మార్చి నెలే అయినా ఎండ విపరీతంగా కొడుతుంది. ఆ ఎండలోనే కూసుని బాయిమీద గిన్నెలు తోముతుంది కవులమ్మ. గిన్నెలు తోమీ తోమీ కవులమ్మ అరచేతిలోని గీతలు అరిగిపోయినయని అంటుంటరు.

కవులమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అందరి పెండ్లిళ్లు అయినవి. కొడుకులిద్దరు అక్కచెల్లెల్లనే చేసుకున్నరు. కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కో పోర్షన్‌ చొప్పున మూడు మూడు గదులు వచ్చినవి. మధ్యలో కవులమ్మ కొరకే వున్న పోర్షన్‌ను వాళ్ల వాళ్ల గదుల్లోకి తిరగడానికి వదిలిపెట్టి చివరిగది మూడోదాన్ని వంటింటిగా మార్చారు.  తిండిమాత్రం ఇద్దరు కొడుకులు పొత్తులనే తింటరు. గదులన్నింటిని కలుపుతూ బారుగా ముందర వసారా. వసారాలోంచి మధ్య పోర్షన్‌లోంచి వెళితే మూడో గదిలో వంటిల్లు. ఒకమూలకు ఇల్లు వుంటే చుట్టూ కాంపౌండ్‌ వాల్‌. ఇంకో మూలకు బాయి. బాయికి ఒక పక్కన మరోగది. ఇంటిముందరి వేపు గేటు.

ఈ ఇంటి కొరకు కవులమ్మ ఎంత కష్టపడిరదో. అప్పట్లో సిమెంటు వాడకం అప్పుడప్పుడే మొలయింది. నీళ్లు కొట్టడానికి ఇంకొక మనిషిని పెడితే డబ్బులు అయిపోతయని తొమ్మిది గదులకు తనొక్కతే నీళ్లు కొట్టేది. అలాంటిది కొడుకులు పెళ్లిళ్లయి కోడండ్లు ఇంట్లకొచ్చిన తర్వాత కవులమ్మకు ఆ బాయిపక్కన ఒక రూము కట్టించారు. తనను ఆరోజు, బాయిపక్కన రూంలోకి పొమ్మన్నరోజు కవులమ్మ ఎంత బాధపడిరదో. తన రెక్కల కష్టంతో కట్టుకున్న ఇల్లు. ఇయ్యాళ తనది కాకుంట పొయింది. అయినా నేనేడకన్నా పోతున్ననా నా ఇంట్లనే ఇంకో అర్రల వుంటున్న కద. సచ్చిన్నాడు ఏమన్న మీదేసుకుని పోయేదుందా అని తనకు తనే సముదాయించుకుంది.

గిన్నెలు తోముతున్న కవులమ్మ గేటు చప్పుడైతే తలతిప్పి చూసింది. ఆడబిడ్డ రంగమ్మ ఒక చేతిల సంచి ఇంకో చేతిల కర్ర పట్టుకుని గేటు తీసుకుని లోపలకు రావడం కనిపించింది. గిన్నెలు తోమడం ఆపి, చేతులు కడుక్కుని కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ ఆడిబిడ్డకు ఎదురుబోయి చెయ్‌సంచి అందుకుని ‘‘బాగున్నవా వదినా’’ అని మందలించింది.
‘‘ఆ… బానే వున్న వదిన’’ అని, ‘‘నీ ఒంట్ల ఎట్లుంటుంది’’ అడిగింది రంగమ్మ.

‘‘ఇగో… ఇట్ల వున్న’’ అంటూ బాయిదగ్గరికి తీసుకుపొయ్యి బకెట్ల నీళ్లు చెంబుతో ముంచి ఆడిబిడ్డకు ఇచ్చింది.

రంగమ్మ కాళ్లు, చేతులు, మొఖం కడుక్కుంది. అప్పటికే కవులమ్మకొడుకులు, కోడండ్లు ఇంట్ల నుంచి బయటికి వచ్చారు. పలకరించుకుంటూ రంగమ్మను ఇంట్లోకి తీసుకుపోయారు. కవులమ్మ మళ్లా గిన్నెల దగ్గరికి పొయింది.

ఏనాడో మేనత్తలను పిలవడం బందు పెట్టుకున్నరు. కవులమ్మ ఆడబిడ్డలు అందరూ చనిపోంగ ఈమె ఒక్కతీ వుంది. కాటికి కాళ్లు జూపుకుంది. యేడికీ పోదు. తనకంటే చిన్న అయినా కవులమ్మ తన అన్న భార్య కాబట్టి వదినా అని పిలుస్తది రంగమ్మ. తనకంటే వయసులో పెద్దది కాబట్టి కవులమ్మ రంగమ్మను వదినా అని పిలుస్తుంది.

‘‘కూర్చో అక్కా’’ అంటూ  కుర్చీ జరిపాడు కవులమ్మ పెద్దకొడుకు ఆనంద్‌.
(తెలంగాణలో మేనత్తను ‘అక్క’ అని పిలుస్తారు)

‘‘అక్కకు చల్లటి నీళ్లు తెచ్చియ్యి’’ అని భార్య సుశీలకు చెప్పాడు చిన్నకొడుకు నరహరి.
‘‘టైం తొమ్మిది కాట్లేదుగనిఎండలు జమాయించి కొడ్తున్నయేవిరా అప్పుడే’’ అంది రంగమ్మ మొఖం తుడుచుకుంట.
‘‘అవును పెద్దమ్మ ఈ ఎండలకు నువ్వు వస్తవో, రావో అనుకుంటున్నం’’ పెద్ద కోడలు భాగ్య.
‘‘రావద్దనే అనుకున్న. కండ్లు కూడా ఇన్నాటిలెక్క సరిగ కనిపిస్తలెవ్వు. ఇంతకు ముందులెక్క నడక చాతగాట్లే. కని, అన్నను కూడా చూసినట్టు వుంటదని బయలుదేరిన’’
‘‘ఇదిగో పెద్దమ్మ’’ అంటూ గ్లాసుతో నీళ్లు ఇచ్చింది సుశీల.

గ్లాసు పట్టుకుని ‘‘అమ్మో! ఇంత సల్లటియి నేను తాగలేనమ్మ. ప్రిజ్‌ల నీళ్లు అలవాటు లెవ్వు’’ అంది రంగమ్మ.

‘‘ముసలి ముండ మనిషిని ఆడించుకుంటది’’ తిట్టుకుంటూ లోపలికి వెళ్లి బిందెలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. తన పని తనే చేసుకోదు. అలాంటిది ఈ ముసలిదానికి ఒకటికి రెండుసార్లు తిరగాలంటే సుశీలకు కడుపుమండిపొయింది.

రంగమ్మకు రెండుపక్కల, ముందర కుర్చీలు జరుపుకుని కూచున్నరు కవులమ్మకొడుకులు, కోడండ్లు. ముచ్చట ఎప్పుడెప్పుడు మొదలు పెడ్దామా అన్నట్టుగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నరు.

‘‘అవున్‌రా, నాయిన ఏడిరా’’ అడిగింది రంగమ్మ.
‘‘బాయి పక్కన వున్న రూంలో వున్నడు’’
‘‘మీ అమ్మకు కట్టిన అర్రలనారా’’
‘‘ఆ అండ్లనే’’
‘‘మరి మీయమ్మ యాడుంటుందిరా?’’
‘‘ఈ వసారాలోనే పడుకుంటుంది.’’
‘ముసల్దానికి వివరాలన్ని కావాలి’ అనుకుంటూ మాట మార్చడానికి ‘‘ఏమన్న తిన్నవా అక్కా’’ అనడిగిండు కవులమ్మ పెద్దకొడుకు.
‘‘యాడరా? పొద్దున బస్సు ఎక్కిచ్చిండు మీ బావ. ఇగో… బస్సుదిగి, రిక్షా పక్కి ఈడికొచ్చిన’’
‘‘అమ్మా ! అక్కకు టిఫిన్‌ పెడ్దువుగానీ రా ’’ కేకేసాడు చిన్నకొడుకు.
‘‘మీరు తిన్నారురా ?’’ రంగమ్మ.
‘‘ఆ… అయింది పెద్దమ్మ’’ కోడలు.

ఇంకొక రెండు గిన్నెలుంటే అవి కూడా కడిగి తీసుకుని పోదామని గబగబా కడుగుతుంది కవులమ్మ.

కవులమ్మ అసలు పేరు కమలమ్మ. వాడుకలో కవులమ్మ అయింది.  మనిషి అరవై ఏండ్లకు దగ్గర పడింది. ఎముకల మీద చర్మం వున్నట్టుగా వుంటది. ముతక చీరైనా శుభ్రంగా వుంటది. మొఖానికి పెద్ద కుంకుమ బొట్టు. పగిలిపోగా మిగిలిన ఓ… నాలుగైదు రకరకాల రంగుల గాజులు చేతులకు వుంటాయి. కాళ్లకు మెట్టెలుండవు. మెడలో వెలిసిపోయిన నూలు తాడు ఒకటి వుంటది. ముక్కుకు ముక్కుపుల్లతప్ప వీసమెత్తు బంగారం వుండదు  ఒంటిమీద.

కవులమ్మ చిన్నతనంలో బాగా అల్లరి చేసేదట. తండ్రికి చిన్నబిడ్డ కవులమ్మ అంటే ఎక్కడలేని ప్రేమ. చిన్నబిడ్డ ఎదురొస్తే శుభం కలుగుతదని నమ్మకం. ఊరికి జమీందారైనా బిడ్డ ఎంత చెప్తే ఆ తండ్రికి అంత. తను ఎక్కడికి వెళ్లినా తనతోపాటు చిన్నబిడ్డ కవులమ్మ వెంట వుండాల్సిందే. అలాంటి కవులమ్మ పెళ్లయిన తర్వాత మాట్లాడ్డం తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చి, ఇప్పుడు ఎప్పుడో ఓసారి తప్పదు అనుకుంటేనే మాట్లాడ్తది ఎవరితోనైనా.

కొత్తగా చూసినవాళ్ళు మూగదేమో అనుకుంటరు. చాలామంది కవులమ్మను చూసి ఈమెకు ఏమైనా స్పందనలు కలుగుతాయా? అనుకుంటారు. ఆమె నవ్వగా చూసినవాళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. మనిషి అలా నిర్వికారంగా పనులు చేసుకుంటూ పోతది.

‘‘చూడు పెద్దమ్మ. మనిషికి ఎంత పొగరు. ఊఁ… అని కూడా అనదు’’ పెద్దకోడలు. మరిది కేకవేసినా పలకలేదని.
‘‘ఇందాక నువ్వు బాగున్నవా వొదినా అని పలకరిస్తే. ‘ఇగో గిట్ల వున్న’ అని ఎంత పెడసరంగా అంటుంది చూడు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘మీయత్త ఇయ్యాల్నే కాదే, ఎన్నడైన అట్లనే వుంది’’ రంగమ్మ.
కవులమ్మ గిన్నెలన్నీ టబ్‌లో పెట్టుకుని వసారాలోంచి వంటింట్లోకి పొయింది.

టిఫిన్‌ కొరకు ఉప్మా వేయిస్తుండగా పంత వద్దనుకున్నా ఏవేవో రకరకాల ఆలోచనలు. రవ్వ వేయించి పక్కన పెట్టింది. ఉల్లిగడ్డలు కోస్తుండగా రంగమ్మ ఎందుకొచ్చిందో అర్ధమైంది. కన్నీళ్లు టపటపా రాలాయి. ఉల్లిగడ్డ ఘాటుకో లేక మనసులోని బాధకో. ఈనాటికి నా బతుకు ఇట్లా అయింది అనుకుంది.

ఉల్లిగడ్డలు పొయ్యిమీద వేసి, ఉడికినాక నీళ్లు పోసి మూతపెట్టి అక్కడే నిలబడిరది. ఏనాటివో కండ్లల్ల మెదిలనయి.

రోజులెక్కనే కోడి కూయంగనే మెలుకువ వచ్చి చూసింది. పక్కన మనిషి లేడు. బుడ్డోడు నిద్రపోతుండు. లేచి కూచుని వెంట్రుకలను వేళ్లతో వెనక్కు దువ్వుకుని పుచ్చడ వేసుకుని పక్కబట్టలు మడతపెట్టి ముందరి తలుపు తియ్యబోయింది. ఎంతకీ రాలేదు. దొడ్డికి ఆగేటట్టు లేదు. రెండు, మూడుసార్లు కొట్టింది. అయినా అవతలి నుంచి సప్పుడు లేదు. తలుపు దగ్గరే కూలబడిరది కడుపును బిగపట్టుకుని.

ఈ ముదునష్టపు ముండాకొడుకు నా గండాన పడ్డడు. ఏనాడు చేసుకున్న పాపమో. నాకీ జన్మల ఈడు దొరికిండు. కళ్లమ్మట పటపట నీళ్లు కారినయి. నోట్ల నుంచి సప్పుడు వచ్చిందంటే వాడు విన్నడంటే ఇంకేమన్న వుందా ? ‘పొద్దున్నేఎవడు సావాలని ఏడుస్తున్నవే లంజె’ అని తన్నులు గుద్దులు తప్పవు. ఆ తన్నులు తలుసుకుని గబగబా కండ్లు పైటకొంగుతో తుడుచుకుంది.

బయటి నుండి తాళం తీసిన చప్పుడు కొద్దిగా వినిపించడంతో లేచి పక్కకు జరగబోయింది. ఈ లోపలే  రెండు తలుపులు ఒక్కసారిగా బార్లా తెరిచిండు. మోకాళ్ల వరకు లేచిన కవులమ్మను కొట్టుకుని తలుపురెక్క ఆగిపోయింది.

‘‘రంకులంజె, మొగుడు అటుపోంగనే మిండని కొరకు చూస్తున్నానే తలుపు సందుల నుంచి’’ అని కవులమ్మకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడపడితే అక్కడ అందిన చోటల్లా గుద్దుతుండు. కవులమ్మకు దొడ్డికి ఆగుతలేదు. తన్నులూ ఆగుతలేవు. తన్నులు తింటూనే ఏడుస్తూ ‘‘దొడ్డికి పోదామని వచ్చిన’’ చెప్పింది.

‘‘లంజెముండవి దొంగేడుపులు చూడు’’ అని కూచున్న కవులమ్మ డొక్కలో మళ్లో రెండు తన్నులు తన్ని పక్కకు జరిగిండు.

కవులమ్మ చెంబుల నీళ్లు తీసుకుని ఆదరా బాదరాగా దొడ్డి దగ్గరికి పొయింది. వెనకాలే వచ్చి దొడ్డి తాళం తీసిండు. కవులమ్మ దొడ్లోకి వెళ్లగానే మళ్లా బయటి నుంచి తాళం వేసిండు ఎప్పటిలెక్కనే.

వెంటనే సప్పుడు గాకుండ తాళాన్ని తీసి, తలుపులు తెరుచుకుని దొడ్లోకి వచ్చిండు. దొడ్డికి కడుక్కుంటున్నదల్లా మనిషిని చూసి గబుక్కున లేచి నిలబడింది కవులమ్మ. పాణం చివుక్కుమంది. ‘ఈడు మనిషా, పసురమా ? ఈని బుద్ధి పాడుగాను. తల్లికడుపున ఎట్లబుట్టిండో ఈ బాడుకావ్‌’ అనుకుని గబాగబా బయటికి వచ్చింది. ఒకసారి దొడ్డంతా కలెదిరిగి వచ్చి మళ్లా తాళం వేసిండు.

‘‘అమ్మా, ఇంకా కాలేదా?ఎంతసేపూ’’ చిన్నకొడుకు కోపం, అసహనంతో కేకవేసాడు.
కొడుకు కేకతో ఈ లోకంలోకి వచ్చిన కవులమ్మ గబగబా మరుగుతున్న నీళ్లలో రవ్వపోసి కలిపింది. కొడుకు కేకకు బదులుగా కవులమ్మ నుండి ఎపటువంటి సమాధానం లేదు.
‘‘చూడు పెద్దమ్మ, ఏ ఒక్కదానికి బదులియ్యదు. ఏం జూసుకుని మీ వదినకు ఇంత పొగరో అర్ధంకాదు’’ అక్కసునంతా వెళ్లగక్కుతూ పెద్దకోడలు.
‘‘ఏవే, ఇప్పుడే కదనే వంటింట్లకు పొయ్యింది. అప్పుడే అయ్యిందా అని అడిగితే ఎట్లనే’’ అంది రంగమ్మ.
‘వదినను ఇంత మాట అననిస్తలేదు ముసలిముండ’ తిట్టుకున్నరు మనసులో.
‘‘నాయిన ఒంట్ల బాగుంటున్నాదిరా’’ అని మళ్లీ రంగమ్మే అడిగింది.
‘‘కండ్లు పూర్తిగా పొయినయి పెద్దమ్మా’’ అంది చిన్నకోడలు సుశీల ` మనసులో రంగమ్మ మీదఎంత కోపం వస్తున్నా పైకి మామూలుగా మాట్లాడుతూ.
‘‘చేసిన పాపం వూకనే పోతాదే? ఆపైనున్న పరమాత్ముడు అన్నీ చూస్తనే వుంటడు’’ అని రెండు చేతులు ఎత్తి కనిపించని దేవుడికీ దండం పెట్టుకుంది రంగమ్మ.

అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నరు. ఆనంద్‌, నరహరి బయటికి నడిచారు.
‘‘ఏందనా! ఈ ముసల్ది ఇట్ల మాట్లాడ్తుంది. ఇంతకు ముందు ఈ ముసల్దానికి, అమ్మకు అస్సలు పడకపోయేది’’
‘‘ఏమోరా, పిలిపించనయితే పిలిపించినం’’
‘’చూస్తుంటే మనకే అడ్డం తిరిగేటట్టు కనిపిస్తుంది’’
‘‘నువ్వన్నట్టే అడ్డం తిరుగతదేమో. చూద్దాం. పిలిపించినంగదా. వాపస్‌ పంపించలేం’’
‘‘ఏంది పెద్దమ్మా. నువ్వు కూడా అట్లనే మాట్లాడ్తవు’’ పెద్దకోడలు.
‘‘నేనేందే అనేది. మీ మావ గురించి అందరూ అనుకుంటున్నదే’’ రంగమ్మ
‘‘మీ అన్న అని కూడా చూడకుండా, పరమాత్ముడు చూస్తుండు అంటవు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘అన్న అయితేందీ, ఎవరైతేందీ. సీతమ్మ కష్టాలు పెట్టిండు. ఉన్నమాట అన్న. ముసల్దాని మీద అనుమానంతోటి మమ్ముల గూడ గడపదొక్కనిచ్చినాడే. ఇగో, పిల్లలు కొంచెం పెద్దగయినంక మమ్ముల రానిచ్చిండు. అరిగోస పెట్టిండు ముసల్దాన్ని’’ అంది రంగమ్మ.

వాళ్లు అట్లా మాట్లాడుకుంటుండగానే కవులమ్మ వచ్చి, ‘‘ఇగో వదినా’’ అంటూ ఉప్మా ప్లేటు చేతికి అందించి, నీళ్ల గ్లాసు కింద పెట్టింది.
‘‘నువ్వు తిన్నవా వొదినా’’ ప్లేటు తీసుకుంటూ అంది రంగమ్మ.
‘‘తిన్లే వదిన. ఇంక బట్టలు గిన వున్నయ్‌’’ కవులమ్మ.
‘‘బట్టలు తర్వాత వుతుకొచ్చు. ఇంత ముద్ద కడుపులబడితే చాతనయితదిగా’’ ముద్ద కళ్లకు అద్దుకుని నోట్లో పెట్టుకుంటూ అంది రంగమ్మ.
‘‘తిని వుతికితే కడుపుల ముద్ద నోట్ల కొస్తది వదిన’’ అని, ‘‘ఛాయ్‌ పెట్టుకొస్త తింటుండు’’ అని లోపలికి పొయింది కవులమ్మ. ఆనంద్‌, నరహరి వచ్చి కూచున్నరు.

‘‘ఏవిరా, సాకల్దాన్ని పెట్టుకోకపొయిన్రురా. ముసల్దానితో ఇంకా గంపెడు పని చేయిస్తున్నరు’’ టిఫిన్‌ తింటూ రంగమ్మ. కోడండ్లు ఇద్దరు పండ్లు కొరుక్కున్నరు లోపల.
‘‘సాకలోళ్లు యాడున్నరక్కా. పని మనిషిని పెట్టుకుంటే అయిదు వందలన్నా అడుగుతరు’’
‘‘అంత సంపాయిస్తున్నరు. మీకు అయిదు వందలో లెక్కనారా? మీయమ్మ వుసురు తాకుద్దిరా’’ అది ప్లేటు కిందపెడుతూ రంగమ్మ. పెళ్లాలవేపు చూసారు. ‘ముసల్లంజె’ నెమ్మదిగా తిట్టింది సుశీల.
‘‘ఏందే సుశీలా, ఏమో అంటున్నవు. సరిగా యిన్పిస్తలేదు’’
‘‘ఆ… ఏంలే పెద్దమ్మా’’ అని ‘‘గొంతు బాగానే గుర్తు పట్టినవ్‌ పెద్దమ్మా’’ సుశీల.
‘‘గొంతుల కేందే బానే గుర్తుపడ్తగని. మాటలే సరిగ యిన్పించవు’’ అని, అల్లుండ్లను వుద్దేశించి ‘‘మీ నాయినకు పెట్టినార్రా టిపినూ’’ అంది రంగమ్మ.
‘‘ఆ… తిన్నడు’’ పెద్దకొడుకు ఆనంద్‌.
ఇందాకట్నుంచి ఎలా మొదలుపెట్టాలా అని ఎదురుచూస్తున్న సందర్భం రావడంతో ‘‘వచ్చి పదైదు రోజులాయె. మొఖంగూడ జూస్తలేదు పెద్దమ్మ’’ పెద్దకోడలు.
‘‘ఇట్లాంటి ఆడిదాన్ని యాడజూల్లేదు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘అందరు ఈమె లెక్కనే వుంటే లోకం బాగుపడినట్టే’’ చిన్న కొడుకు.
‘‘ఇంత కఠినాత్మురాలిని నేనేడ జూడలేదక్కా’’ పెద్దకొడుకు.
ఛాయ్‌ కొరకు పొయ్యిమీద పాలు పెట్టి, పొంగుతయేమో అని పాలలోకి చూస్తూ నిలబడిరది కవులమ్మ. ఎన్నడు మనసులోకి రావద్దని అణచుకున్న ఆలోచనలు ఈ రోజు ముసురుకుంటున్నయి.

చిన్నోడు తల్లిని చూని నవ్వుతూ కాళ్లూ చేతులు ఆడిస్తుండు. ఏవో ఆలోచనల్లో వున్న కవులమ్మ కొడుకు నవ్వును చూడగానే వాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తను కూడా నవ్వుతూ వాన్ని ఆడిస్తుంది.
మామూలుగానైతే చీకటిపడే టైముకు ఇంటికి వస్తడు. ఆరోజు ముందే వచ్చిండు. చప్పుడు రావద్దని ఎప్పుడూ తలుపు సందుల్లో నూనె పోస్తుంటడు. తాళం తీసిన చప్పుడుగానీ, తలుపుతీసిన చప్పుడుగానీ కాలేదు. తలుపు తీయడంతోనే ఎపదురుగ్గా మూడో అర్రల నవ్వుకుంట కొడుకును ఆడిస్తున్న కవులమ్మ కనిపించింది. చెప్పులు గబగబా విడిచి, మందుల సంచి కిందపడేసి వచ్చి కవులమ్మను గుద్దుతున్నడు, తంతున్నడు. పసిబిడ్డకు దెబ్బలు తగలకుంట వళ్లో పట్టుకుని వంగికూసుంది. ‘‘లంజె, నేను పోంగనే మిండడు వచ్చినట్టున్నడు. లంజెదాని మిడిసిపాటు సూడు నవ్వుతుంది’’ అని తిట్టుడు, కొట్టుడు.

కవులమ్మ ఒక్కటనలే రెండనలే. అక్కడి నుండి లేవలేదు. తను లేస్తే చంటోడి మీద దెబ్బలు పడ్తయేమో అని భయం.
‘‘లంజెది ఏ మిండనికి గన్నదో వీన్ని’’ గుద్దుకుంటనే. కవులమ్మ ఏమీ మాట్లాడకపోయినా కోపం పెరుగుతది ` ఒక్కమాటను లెక్కచేయదని. మాట్లాడితే ఇంకో రెండు గుద్దులు గుద్దడానికి అవకాశం వుండేది.

కోపంగా తలతిప్పి అసహ్యంతో భర్తవేపు చూసింది. వీడొక పసరం (పశువు) అనుకుంది. ఆ చూపును భరించలేకపోయిండు. ‘‘ఏందే లంజదానా, అట్ల సూస్తవు’’ అంటూ వంటింట్లోకి ఉరకి కత్తిపీట పట్టుకుని ‘‘ఎవనికి పుట్టిండో వీడు. నా కండ్ల ముందల వుండొద్దు’’ అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంట వస్తుండు.

కవులమ్మ ఒక్క వుదుటున కొడుకుని పత్తుకుని అవతలి అర్రలకు ఉరికిపొయ్యి తలుపేసుకుంది.

పాలు బుస్సున పొంగడంతో ఆలోచనల్లో నుంచి బయటపడింది. కొడుకులు, కోడండ్లు మాట్లాడే మాటలు వంటింట్లోకి వినిపిస్తున్నయి. వాళ్ల తిట్లు, పత్తిపొడుపులు, యేటిపోటీల మాటలు ఈ పదైదు రోజులుగా వింటూనే వుంది. వాళ్ల గొంతులు వినడానికి కూడా ఇష్టపడట్లేదు కవులమ్మ. ‘‘టిఫిన్‌ తిన్నవా వదినా?’’ వంటింట్లో నుండే కేకవేసింది కవులమ్మ.

‘‘ఆ… తీస్కరా వదినా’’ అని గ్లాసులోని నీళ్లు తాగి, మూతి తడుచుకుంటూ నెమ్మదిగా గ్లాసు కింద పెట్టింది రంగమ్మ.
ఛాయ్‌ గ్లాసు ఇచ్చి వెళుతుంటే ‘‘ఇంత ముద్ద తినుపో ఒదినా’’ మళ్లీ అంది రంగమ్మ.
‘‘తర్వాత తింటలే వదినా’’ అని బకెట్‌ నిండా నానబెట్టిన బట్టలు ఉతకడానికి బాయి దగ్గరికి పొయింది కవులమ్మ.

‘‘వంటిల్లంతా ఆమె చేతులనే పెడ్తున్నం. మేమేమన్నా తినొద్దంటున్నమా పెద్దమ్మా’’ అని పెద్దకోడలు అంటుండంగానే,
‘‘ఎవరన్న చూస్తే కొడుకులు అన్నం కూడా సరిగా పెడ్తలేరమ్మ ముసల్దానికి అనుకునేటట్టు మాట్లాడుతుంది చూడక్కా’’ చిన్న కొడుకు అన్నాడు.
‘వంటిల్లంతా చేతుల పెడ్తున్నరంట. మీ అసుమంటి కొడుకులు, కోడండ్లు అందరికి వుంటే లోకం బాగుపడినట్టే. తల్లులు ఉరిబెట్టుకుని సావాల్సిందే. మీ పెండ్లాలను కూసోబెట్టి ముసల్దానితోటి కన్నకష్టం చేయించుకుంటున్నరు బుక్కెడు బువ్వకోసం’ మనసులో అనుకుని, ‘‘మీయమ్మ అట్లని ఎవరితో చెప్పలేదురా. అయినా మీ అమ్మను యేడకన్న పోనిస్తిరారా’’ అని ‘‘చెప్తనేవుండె గదరా తిని వుతికితే నోట్లకొస్తదని’’ అంది రంగమ్మ.
‘దీన్ని ఎందుకన్నా పిలిస్తిమా’ అనుకున్నరు కసిగా మనసులో.
‘‘మేమేమన్నా కాళ్లూ చేతులు కట్టేసినమా పెద్దమ్మా అట్ల మాట్లాడ్తవు. ఆమెనే ఎక్కడికీ పోదుగానీ…’’దీర్ఘాలు తీసింది సుశీల.
‘‘ఎట్ల పోతదే? గుండెకాయకాడ గుండన్న లేదాయె. ఆనాడు మెడల బంతిపూల హారం, చెవులకు జుంకాలు, ముక్కుకు ఇంతింత పెద్ద బేసర్లు, చేతులకు దండకడాలు, నడుముకు వడ్డాణం పెట్టుకుని పార్వద్దేవిలెక్క వుండేది. ఆడపిల్లల పెండ్లిళ్లకు పెట్టగా వున్నాటిని మీరు ఒలుసుకుంటిరి. అషడ, అయ్యి మీ మావ చేపిచ్చినవన్నా కావాయే. ఆమె తల్లిగారు పెట్టినయి. ఏ సుట్టమింటికి పోయినా, పక్కమింటికి పోయినా అడుగుతరని మీ అత్త భయం. ఆడికీ, ఎవరన్నా అడిగినా ‘ముసల్దాన్ని నాకెందుకు నగలు’ అని అంటదిగని మీ మీదికి మాటరానీయదు’’ అంది రంగమ్మ.

‘‘ఏవండీ, టైం పది దాటింది. ఇంకా పెద్ద మనుషులు రావట్లేరు’’ ముసల్దానితో ఏం మాట్లాడినా లాభం లేదనుకుని, మాట మార్చడానికి సుశీల మొగుడితో అంది.
‘‘ఏమో. నేనదే చూస్తున్న తొమ్మిది గంటల వరకు రావాలె’’ చిన్నకొడుకు.
‘‘పెద్దమనుషుల పిలిచి పంచాతి పెడుతున్నార్రా’’ అడిగింది రంగమ్మ. అప్పటివరకు తననొక్కదాన్నె పిలిచి మాట్లాడిపిస్తరేమో అనుకుంటుంది.
‘‘లేకపోతే, మేం చెప్తే వినే మనిషా? ఆమె’’ పెద్దకొడుకు.
ఆ ముసల్ది ప్రతీదీ అడగడం, ఈయన చెప్పడం బాగానే వుంది అని విసుగ్గా ‘‘ఏవండీ, కిరణ్‌గాన్ని పంపించండి’’ అంది పెద్దకోడలు.
‘‘అరేయ్‌, కిరణ్‌’’ ఇంట్లో నుండే కేకేసాడు.
‘‘ఆ… వస్తున్నా డాడీ’’ అని మళ్లీ ఆటలో మునిగిపోయిండు వాడు. ఆదివారం కావడంతో పిల్లలందరూ ఇంటి దగ్గరే వున్నరు. ఈరోజే ఆడుకోవడానికి బయటకు వదిలారు. హాలిడే అయినా గేటు లోపలే ఆడుకోవాలి ఆడుకుంటే. లేదంటే టీవీ ముందర కూచోవాలి. క్రికెట్‌ ఆడుదామంటే మనుషులూ సరిపోరు. పిల్లలు నలుగురే. అందులో చిన్నదానికి సరిగా పరిగెత్తడమే రాదు. గేటు లోపల ప్లేసూ సరిపోదు. ఈ రోజు బయటకు విడవడంతో స్వేచ్ఛ లభించినట్టుగా వుంది పిల్లలకు.

వాడు రాకపోవడంతో ‘‘అరేయ్‌, కిశోర్‌గా’’ గేటు దగ్గరికి వచ్చి గట్టిగా పిలిచాడు కవులమ్మ చిన్నకొడుకు.
‘‘ఏం… డాడీ…’’ అంటూ దగ్గరికి వచ్చాడు.
‘‘కిరణన్న, నువ్వూ వెళ్లి రాఘవులు తాతని, లింగయ్య తాతని, నర్సయ్య తాతనూ పిలుచుకురండి’’
‘‘సరే డాడీ’’
‘‘ఏయ్‌ పింకీ చెల్లెను తీసుకుని ఇంట్లోకి రావే’’ అని లోపలకి వెళ్లిపోయాడు.
బాయి దగ్గర బట్టలుతుకుతున్న కవులమ్మ వింది. ‘అయితె పెద్దమనుషుల్లో పెడుతుండ్రన్నమాట. పెట్టుకోనియ్యి’ అనుకుంది. అట్లా అనుకుందిగానీ ఎందుకో అంతులేని దుఃఖం పొంగుకొచ్చింది. బట్టలను బలంకొద్దీ నేలకేసి బాదటం మొదలుపెట్టింది. కళ్లమ్మట నీళ్లు కారిపోతున్నయి. ఇంత బతుకు బతికింది. ఏనాడూ నలుగురి ఎదుటపడలే. ఈ ముసలితనాన నల్గుర్ల నిలబెడ్తున్నరు నా కడుపున బుట్టిన కొడుకులు. ఏ జన్మల ఏ పాపం చేసుకున్ననో ఈ మొగుడు, ఇటువంటి కొడుకులు నాపాలపడ్డరు. ఈ ఆడిజన్మ ఎందుకిచ్చినవ్‌ భగవంతుడా. ఎన్నో భరించింది తను. ఈనాడు ఈ అవమానాన్ని భరించలేకపోతుంది. అయ్యో భగవంతుడా! నేనీ దుఃఖాన్ని భరించలేను స్వామీ…

అంత దుఃఖంలో ఉన్నపళాన తను మళ్లీ చిన్నపిల్లయితే ఎంత బాగుండు. ఏ కష్టమూ తెలియని, ఏ బాధలూ తెలియని ఆ చిన్నతనం మళ్లా వస్తే అనిపించింది. తన తండ్రితోపాటు గుర్రం మీద పోతూ, తండ్రి ముచ్చట చెప్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టాలనిపించింది. తనకు చిన్నతనంలో బాగా గుర్తున్న సంఘటన అది. తండ్రి తనను ముందర కూచోబెట్టుకుని, ఒక చేత్తో తనని పట్టుకుని జనాలు కలిసి దండం పెడ్తుంటే వాళ్లను పలకరించడం కోసం గుర్రం ఆపడం, గుర్రం అడుగులేస్తుంటే దాని శరీరంతోపాటు తనూ వూగడం. అలా వూగుతూ వుంటే తనకు ప్రపంచాన్ని జయించినట్టుగా ఎంత సంతోషంగా వుండేదో ఆనాడు. ఏనాడైతే వీనితో పెళ్లయిందో ఆనాటితో తన నవ్వు మాయమైపోయింది. తను నవ్వి ఎన్నాళ్లయిందో. తను నవ్వు మర్చిపోయిందేమో. తన తండ్రి సచ్చి ఏ లోకాన వుండో. ఇప్పుడు నన్ను చూసి ఏమనుకుంటుండో. తన దగ్గరికన్నా పిలిపించుకుంటలేడు నన్ను  అనుకుంది.

దుఃఖం పొర్లిపొర్లి వచ్చింది. కొంగు నోట్లో కుక్కుకుంది. కడుపుల దుఃఖాన్ని తమాయించుకోడానికి బట్టలను దమీ దిమీ బాదుతా వుంది. కవులమ్మకు ఎందుకోగానీ ఇతర్ల ముందు తను ఏడవడం ఇష్టం వుండదు.

‘‘నాయినమ్మా కాళ్లు కడగవా’’ చెల్లెను పట్టుకుని ఐదేండ్ల పింకి నిలబడ్డది.
కళ్లు తుడుచుకుని, ముక్కుల నీళ్లు చీది మనమరాళ్ల కాళ్లు కడిగింది. అయినా కండ్ల నుంచి నీళ్లు కారుతనే వున్నయి.
‘‘నాయినమ్మ, ఏత్తున్నావెందుకు’’ అడిగింది చిన్నది.
మనమరాలినిఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. ‘‘లేదమ్మా సబ్బునీళ్లు కంట్లపడ్డయి’’ అని కింద విడిచి పెడితే పిల్లలు ఇంట్లోకి వెళ్లారు.
‘‘మమ్మీ’’ అంటూ పిల్లలిద్దరూ ఎవరి తల్లి దగ్గరికి   వాళ్లు పోయారు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వళ్లో కూచోపెట్టుకుంది చిన్నదాన్ని సుశీల.
తెల్లగా ముగ్గుబుట్టోదిగా వున్న జుట్టుతో పొట్టిగ, తెల్లగ, ముడతలుపడ్డ శరీరంతో రెప్పలు టపటప కొట్టుకుంటూ కుర్చీలో కూచున్న ముసలమ్మవేపు కొద్దిసేపు చూసి ‘‘ఎవరు మమ్మీ, ఈమే’’ అంది పింకి.
‘‘అమ్మమ్మ నాన్నా. నువ్వు చిన్నగా వున్నప్పుడు వచ్చింది’’ అని భాగ్య కూతురుకు చెప్పింది.
‘‘ఎవరే భాగ్యమ్మ? నీ బిడ్డనా’’ అడిగింది రంగమ్మ.
‘‘అవును పెద్దమ్మ’’
‘‘ఎన్నో ఏడో దానికి’’
‘‘ఆరో ఏడు’’
‘‘ఏం పేరే? బుజ్జిపేరు’’
‘‘పింకీ’’ అంది పింకీ రంగమ్మనే చూస్తూ.
‘‘అదేం పేరురా, కుక్కపిల్లకు లెక్క’’
‘‘లేదక్క, ముద్దుగా అట్లా పిలుస్తాం. అసలు పేరు ఉష’’ పెద్దకొడుకు.
‘‘ఉసనా… ఏం పేర్లో ఏమో నాయినా’’
అబ్బ! ఈ ముసల్దాన్ని ఎందుకు పిలిచామా తలపట్టుకున్నారు. ‘‘తొందరగా పంచాయితీ అయితే వెంటనే బస్సు ఎక్కించి రావచ్చు’’
‘‘అమ్మో! ఈ ముసల్దా అక్కా పొయ్యేది. నేనియ్యాళ పోలేనమ్మా అంటది. ఏదన్న చీరకొని, బస్సు ఛార్జీలు ఇస్తేగానీ రేపైనా కదలదు’’. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటున్నరు.
‘‘ఎవరెవరిని పిలుస్తున్నర్రా’’ అడిగింది రంగమ్మ. చెప్పాడు నరహరి.
‘‘అన్నను మందలించి వస్త. తీస్కపోతావురా నరహరీ’’ అంది రంగమ్మ.
ఈ ముసల్దానికి కడుపుల ఇంత పడితేగానీ అన్న గుర్తుకు రాలేదు. తిట్టుకున్నరు కోడండ్లు.
‘‘పా… అక్కా’’ అని లేచిండు నరహరి. వాళ్లు బయటికి రావడమూ, రూమువేపు పోవడమూ చూసిన కవులమ్మ బట్టలు గబగబా ఆరేసి ఇంట్లోకి వెళ్లింది.
‘‘ఎవరూ’’ కట్టె పట్టుకుని మంచంలో కూచున్న మనిషి దర్వాజ వేపు చూస్తూ కండ్లు మిటకరిస్తూ అడిగిండు.
‘‘బాగున్నవా అన్నా’’ అంటూ లోపలికి పొయింది రంగమ్మ. నరహరి రంగమ్మను వదిలి ఇంట్లోకి పొయ్యిండు.
‘‘నువ్వా రంగమ్మా. బాగున్నవా? ఎప్పుడొచ్చినవు’’
‘‘ఆ బానే వున్నన్న. ఇందాకనే వచ్చిన’’ తడుముకుంటు అన్న పక్కనే మంచం మీద కూచుంది.
‘‘పిల్లలు, మనుమలు, మనుమరాండ్లు బాగున్నరా’’
‘‘ఆళ్లకేందన్న, బానే వున్నరు. ఎవరి సంసారాలు ఆళ్లయి’’
‘‘కవులి బాయి దగ్గరనే వుందా’’ గుసగుసగా అడిగిండు ముసలోడు.
‘‘ఏమో అన్న. నాకు కండ్లు మసకలు. సరిగా కనిపించవు’’ అని ‘‘భాగ్యమ్మ… ఓ భాగ్యమ్మా’’ అని కేకేసింది రంగమ్మ.
‘‘ఏమైంది రంగమ్మా’’ ముసలాయన.
‘‘చీకటితోటి బస్సెక్కినన్న. వచ్చిన కాన్నుంచి మాటలయినవి. కడుపుల నొప్పి లేస్తుంది’’ రంగమ్మ.
‘‘ఈ ముసల్దాన్ని పనిలేక పిలిపించిండ్రు’’ అని విసుక్కుంటూ వెళ్లి ‘‘ఏంది పెద్దమ్మ? పిలిచినవు’’ అంది దర్వాజ బయటే నిలబడి.
‘‘దొడ్డికొస్తుందే’’ రంగమ్మ.
‘‘రా’’ అని బయటే నిలబడి పిలిచింది.
కవులమ్మ వంటింట్లోకి వెళ్లి, బియ్యం కడుగుదామని డబ్బా దగ్గరికి పొయ్యింది. ఎన్ని కడగాల్నో ఎవరెవరెవరు వస్తరో తెలియదు. కోడండ్లు ఇంకా చెప్పలేదు. అందుకని బీరకాయలు ముందేసుకుని కూచుంది. తనని ఆలోచనలు వదిలేటట్టులేవు.

తెల్లారే లోపల్నే ముగ్గువెయ్యాలి. అందుకే కవులమ్మ వాకిలి వూడ్చి, ముగ్గు వేస్తుంది. కవులమ్మ ముగ్గు వేస్తున్నంతసేపు పండ్లపుల్లతో పండ్లు తోముకుంటూ అక్కడే నిలబడ్డడు. కవులమ్మకు రోజూ ఇదో నరకం. తను ముగ్గు వేసేటప్పుడు పొరపాటున ఎవరన్న మొగమనిషి అటునుండి పొయిండూ అంటే ‘‘లంజె మిండడు పొద్దున్నె సూడడానికి వచ్చిండా’’ అని గుద్దులు. వీని బుద్ధి తెలుసు గనక ఆ బజారున ఉదయంపూట ఎవరూ పోరు.

కవులమ్మ ముగ్గువేసి లోపలికి రాంగనే పాటకికి (గేటుకు) తాళం వేసి, కవులమ్మ వెనకాలే వచ్చిండు. పిలగాడు లేచి ఏడుస్తా వున్నడు. పాపం. పెద్దోడు వాని పక్కనే వున్నడు వాన్ని వూకిస్తూ. తమ్ముడు ఏడుస్తుండడంతో వానికి ఏంతోచక వాడూ ఏడుస్తుండు. వానికి రెండో ఏడు పడేనాటికి వీడు పుట్టిండు. కవులమ్మకు గబుక్కున వురికి కొడుకుని అందుకోవాలనిపించింది. అట్లా ఉరకిందంటే ఏమన్న వుందా? గబగబా నడిస్తేనే తన్నులు తప్పవు. మనసులో పంత ఆతృతగా వున్నా ముగ్గుబుట్టని గూట్లె పెట్టి పొయ్యి, కొడుకుని వొళ్లోకి తీసుకుని పాలిచ్చింది.

‘‘ఇందాకట్నుంచి పిలుస్తున్నమ్మ’’ అన్నడు వాడు వచ్చీరాని మాటలతో.
‘‘మా నాయినే’’ అని ముద్దు పెట్టుకుని ‘‘నాకు ఇన్పించలేదు నాన్నా’’ అంది. ఆలస్యం అయితే తిడతడని కొడుకుని పండుకోబెట్టి ‘‘తమ్మున్ని చూస్తుండు నాయిన’’ అని చెప్పి వెళ్లి గిన్నెలు కడిగి, పొయ్యి అంటించింది. అన్నం కొంచెం పలుకయినా, కొంచెం మెత్తగయినా, కూరలో కొంచెం ఉప్పు పక్కువయినా, తక్కువయినా తన్నులు గుద్దులు తప్పవు. వళ్లు దగ్గర పెట్టుకుని తొందర తొందరగా వంట చేసింది. అన్నం తింటున్నంతసేపు ఎదురుగా నిలబడి ఏది కావలిస్తే అది అడగకుండానే చూసి వేసింది. సద్దిల అన్నం గట్టి సంచిలో పెట్టి బల్లెపీట మీద పెట్టింది.

కొన్ని వేర్లు, నూరిన మందు పొడులు, చూర్ణాలు, కొన్ని గుళికలున్న సీసాలు అంతకు ముందే వున్న మందుల సంచీలో వేసుకుని, సద్ది సంచి తీసుకుని బయటికి పొయ్యిండు. కవులమ్మ కొడుకు దగ్గరికి పొయ్యింది. బయటి నుంచి తలుపుకు తాళం వేసి, పాటకికి కూడా తాళం వేసుకుని వైద్యం చేయడానికి పక్కవూరికి పొయ్యిండు.

సంటిపిల్లతల్లి కావడంతో బాగ ఆకలి అయితుంటే కొడుకును అడ్డాలమీద పండుకోబెట్టుకుని పాలిస్తూ అన్నం తింటుంది. పెద్దోనికి తట్లె అన్నం పెట్టింది. వాడు కూడా తింటుండు.
పొయినట్టు పొయ్యి తలుపు సప్పుడు కాకుంట తాళం తీసుకుని లోపలికి వచ్చిండు. వచ్చేసరికి గబగబా అన్నం తింటూ కవులమ్మ కనిపించింది.  అంతే ‘‘లంజె, మొగడు ఎప్పుడెప్పుడు బయటపడతడా అని ఎదురుచూస్తది. దొంగ కుక్కలెక్కఎట్ల తింటుందో చూడు’’ అని అన్నం తింటున్నదాన్ని అట్లనే వంగబెట్టి గుద్దడం మొదలుపెట్టిండు.
కవులమ్మ తన్నులు తినడంతప్ప ఎదురు చెప్పడం ఏనాడో మానేసింది. చిన్నోడు బిక్కమొఖం వేసుకుని ఏడుస్తుండు. వాడు అచ్చం అతని పోలికే. నోట్ల నుంచి ఊడిపడ్డట్టు వుంటడు. ఏడుస్తున్న వాన్ని ఒక్కటి వేసిండు.
కవులమ్మ ఇదే సందని లేద్దామని కొడుకుని గట్టిగ పట్టుకుని లేస్తుంది. ‘‘లంజె, నేను ఈడ మాట్లాడుతుంటె ఏడికి పోతున్నవ్‌’’ అంటూ చేతిల వున్న పిలగాన్ని గుంజుకోబోయిండు. కవులమ్మ కొడుకుని గట్టిగ పట్టుకుని గుంజుకోవడానికి ఆయితి కానియ్యకుండ గోడకు మొఖం చేసి బిగదీసుకుని నిలబడింది.

‘‘ఏందొదినా గోడకు ఆనుకుని నిలబడ్డవు’’ అంటూ కర్ర పొడుసుకుంట రంగమ్మ వంటింట్లకు వచ్చింది. రంగమ్మ పలకరింపుతో తిరిగి చూసింది. చేతిల బీరకాయ వుంది. మళ్లీ వచ్చి కూచుని కూరగాయలు కోస్తూ, ‘నాయినా నన్నెందుకు గన్నవే’ అనుకుంది మనసులో. ఇంకా అందులో నుండి తేరుకోలేదు.

‘‘ఏందొదిన బీరకాయ పట్టుకుని గోడకు మొఖం పెట్టి నిలబడ్డవు’’ అంది రంగమ్మ. అయినా కవులమ్మ సమాధానం చెప్పలేదు. అసలు వినలేదు కవులమ్మ.
కవులమ్మ ఏమీ మాట్లాడకపోయేసరికి ‘పాపం, ఈ వయసులో నల్గుర్ల నిలబెడుతున్నరు కొడుకులు. పంత బాధపడుతుందో మనసులో’ అనుకుని ‘‘అన్నం తిన్నవా వదినా’’ అని కొంచెం గట్టిగా మళ్లీ పలకరించింది రంగమ్మ.

‘‘ఆ… ఆ… తినలే వదిన. వంట అయితే తింట’’ అంటూ లేచి వంటింట్లో అటక మీది సామాన్లు తీయడానికి వున్న స్టూలును రంగమ్మవేపు తెచ్చి పెట్టింది కూచొమ్మని.
స్టూలు మీద కూసుంట ‘‘రెండు పూటలే తిండి తిని కొడుకులకు మిగులుస్తున్నవా వొదినా’’ అంది రంగమ్మ.

‘‘చాన్నాళ్ల నుండి అలవాటయిందొదిన’’ అంది కూరగాయలు కోసుకుంట.
‘‘పెద్దమ్మా, ఈడున్నవా? రాఘవులు పెదనాయినోళ్లు వచ్చిండ్రు’’ అంటూ పెద్దకోడలు వచ్చింది.
‘‘వస్తున్న పావే’’ అని ‘‘మళ్ల జల్మల పుడ్తె ఆడపుట్టుక పుట్టొద్దొదినా’’ అని లేచింది రంగమ్మ.
కవులమ్మ మారుమాట్లాడలే.

‘‘ఏమయ్యా రాఘవులు, సీసాలెత్తి తాగుతున్నరు. మీ అల్లుళ్లు రాంగనే బానే మర్యాద చేస్తున్నట్టుంది’’ గోడ పట్టుకుని నెమ్మదిగా వస్తూ అంది రంగమ్మ.
‘‘కూల్‌డ్రిరక్స్‌ అక్క మందు గాదు’’  రంగమ్మకు ఎదురువెళ్లి చెయ్యి అందిస్తూ అన్నడు పెద్దకొడుకు.
‘‘ఊకనే అన్నలేరా. మందైతే వాసనరాదూ’’ అంది రంగమ్మ.

బాగున్నవా అక్కా, బాగున్నవా వదినా అలి పలకరించారు వచ్చిన పెద్దమనుషులు.
కుర్చీలో కూలబడుతూ ‘‘ఆ.. బానే వున్ననయ్య ఇప్పటికీ. ముందు ముందు ఎట్లుంటదో. ఆ పరమాత్ముని దయ’’ రంగమ్మ.

కవులమ్మ కూరగాయలు కోసి, పొయ్యిమీద వేసింది. కూర కలియబెడుతూ నిలబడింది. ఎన్నడూ గతాన్ని గుర్తు చేసుకోదు కవులమ్మ. గతం అంటే అతనే కాబట్టి అతను తన వూహలో కూడా రాకుండా చూసుకునేది. అలాంటిది ఇయ్యాళ ఎడతెగని జ్ఞాపకాలు.

పెద్దోడు ఆనందు పదో తరగతిల చేరిండు. చేరిన రెండో రోజే ఒకటే జరం, వాంతులు. జిస్టి గిన తగిలిందేమో అని జిస్టి తీసింది. అయినా తగ్గలేదు. పదిరోజులాయె మంచంపట్టి, ఏ మందులు వాడినా జరం తగ్గుతలేదు. ఏం తింటలేడు. తాగుతలేడు. ఒకటే వాంతులు. మంచం మీద పడుకున్న కొడుకును లేపి, తలను తనకు ఆనించుకుని సల్లపోసి అన్నం పిసికి పడేసి, గుజ్జును తాపుతుంది. చిన్నోడు, ఇద్దరు ఆడపిల్లలు బడికి పొయిండ్రు. మధ్యాహ్నం అన్నానికి ఇంక రాలేదు.

పిల్లలు పెద్దగయిన కాన్నుంచి తలుపులకు తాళాలేసుడు బందు పెట్టిండు. కొట్టుడు కూడా తగ్గింది. పిల్లలు కూడా ఎదురు తిరుగుతుండ్రు. కానీ ఊర్లనే వైద్యం చేస్తుండు. ఏ వూరుకీ పోతలేడు.
ఒచ్చుడు ఒచ్చుడే చెప్పులు యిడిసి సుట్టు చూస్తుండు ` ఏమన్న దొరుకుతదా అని. కవులమ్మ గుండెల రాయిపడింది. కని, ఆనందు సల్ల తాగుతుండని మంచంమీద కూసుని అట్లనే తాపుతుంది.

ఆ అర్రల చేతికి ఏం దొరకలే. కవులమ్మ రెక్కపట్టి గుంజిండు పండ్లు కొరుక్కుంట. ఆనందు అట్లనే పల్లెల్కల దబీమని పడ్డడు. కవులమ్మ చేతిల పల్లెం కింద పడింది.
‘‘రంకు లంజె. ఎన్నాండ్ల సంది మరిగినవే’’ అని సిగెంటికలు పట్టి వంగబెట్టి గుద్దుతుండు. ఇడిపించుకో ఆయితి గాట్లేదు.
తండ్రి తల్లిని కొడ్తుంటే అప్పుడప్పుడు చూస్తనే వుండు. ఒకటి రెండుసార్లు తండ్రితో గొడవ కూడా అయింది. కని, ఇప్పుడు ఎందుకు కొడుతున్నడో ఏం అర్ధం కాలే. ఆనికి మొన్ననే పద్నాలుగు వెళ్లి పదిహేను పడ్డయి.

‘‘నీతీ, జాతీలేని ముండాకొడుకువి నువ్వు. నీ లెక్క అందరనుకోకు’’ తన్నులు తింటూనే విపరీతమైన కోపంతో అంది కవులమ్మ.
‘‘హమ్మా లంజె.. ఎదురు తిరగనేర్చినవా. ఆన్ని చూసుకునేనా నీకింత పొగరుబట్టిందీ’’
తుపుక్కున మొఖంమీద ఊసింది కవులమ్మ. బండబూతులు తిడుతూ తన కసి తీరిందాంక కొట్టి బయటపడ్డడు.
పిల్లలు బడి నుండి ఇంక రాలేదు. ఆయన బయటపడంగనే ‘‘కొడుకా, నేను అమ్మమ్మోళ్లింటికి పోతున్నరా. తమ్మున్ని, చెల్లెల్లను జర కనిపెట్టుకునుండు నాయిన’’ అని చెప్పి తల్లిగారింటికి పోయింది.

చీకటి పడుతుండగా ఇంటికొచ్చిండు. పిల్లలు ఏడ్చుకుంట కూసున్నరు. విషయం అర్ధమైంది. అమ్మో ఎదురుతిరగ నేర్చింది. ఊకున్నమంటే ఏకు మేకైతది. బిడ్డ పోనియ్యి, ఎన్ని రోజులు పోతదో. చూస్త అనుకున్నడు.
ఇరవై ఏండ్లకు మళ్లా ఈ వూరు మొఖం చూస్తుంది తను. తల్లి సచ్చిపొయ్యి రెండు మూడేండ్లాయె. తల్లి సచ్చినప్పుడూ పంపియ్యలేదు. తనూ పోతానని అడగలేదు. ఏమో, తల్లి శవాన్ని కూడా చూడాలనిపించలేదు తనకి. పెద్దమనిషి అయ్యి ఇంట్లకు రాంగనే కవులమ్మను తన ఇంటికి తీసుకొచ్చుకుండు. తను ఏనాడైతే ఆనింట్లకి పొయ్యిందో, మళ్లా ఈనాడే తల్లిగారింట్ల కాలు పెడ్తుంది.

వైద్యం చేయడానికి ఆ వూరికి వచ్చేటోడు. కవులమ్మోళ్లకు దూరం సుట్టం కూడా. కవులమ్మోళ్ల ఇంట్లనే వుండి వైద్యం చేసేటోడు. పొద్దున వచ్చేటోడు. సాయంత్రానికి వెళ్లిపోయేటోడు. ఆయన చెయ్యి పడితె రోగం మాయమైతదని జనం నమ్మకం. మంచి వైద్యుడు. అట్లా కవులమ్మకు ఐదేండ్లునన్నప్పుడు పెండ్లి అయింది. ఆయనకి ముప్పై యేండ్లు దాటే వుంటయి అప్పటికి.

కవులమ్మను పెళ్లి చేసుకునేనాటికి ఆయనకి పెళ్లి అయ్యి భార్య సచ్చిపోయింది. నీళ్లు చేదడానికి పొయ్యి కాలుజారి బాయిలపడ్డదని ఈన చెప్పిండు. ఆడు పెట్టే బాధలకే బాయిల దుంకిందని జనం అనుకున్నరు. ఓ పిలగాడు కూడా వుండె. తల్లి సచ్చినంక పాలిచ్చేటోళ్లు, సాకేటోళ్లు లేక పిలగాడుకూడా సచ్చిపోయిండు.
రెండు నెల్లాయె. మూడు నెల్లాయె. తీసుకపోను రాట్లేడు. కవులమ్మ తండ్రి తోలొస్తనన్నడు. కవులమ్మ పోనంది. పిల్లలున్నరని సముదాయించి కవులమ్మను యెంటబెట్టుకుని అల్లుని గడప తొక్కిండు పొద్దున పదిగంటలకల్లా. అంతకుముందు బిడ్డను పండగకు తోలియ్యమని ఒకసారి, తొలిసారి ‘నీళ్లు’ పోసుకుందని తోలుకపోవడానికోసారి వచ్చిండు. కని, తోలలే. అత్తనే పిలిపించుకుండు. కవులమ్మ తండ్రి మళ్లా ఈ ఇంట్ల అడుగు పెట్టడం ఇదే.

అల్లుడు ఇంట్లనే వుండు. తండ్రి వెనకాలే కవులమ్మ వచ్చింది. ముందల అర్రల బల్లెపీట మీద కూసుని చూర్ణాలు పొట్లం కడుతుండు. వీళ్లు వచ్చింది గమనించి కూడా వీళ్లవేపు సూల్లె. అల్లుడు పలకరిస్తడేమోనని కొద్దిసేపు చూసిండు. పలకరించకపోయేసరి ‘ఆడపిల్ల తండ్రిని తనకు తప్పదుగా’ అనుకుండు. బల్లెపీట మీద తనూ ఓ పక్కకు కూసుండు. ఇంట్లకు పొమ్మని బిడ్డకు సైగ చేసిండు. కవులమ్మ సంచి పట్టుకుని ఇంట్లకు పోతుంటె, నా ఇంట్ల వుండొద్దని గొడవ పెట్టుకుండు. ఎంత బతిమిలాడినా, సముదాయించినా వినకపోయేసరికి కవులమ్మ తండ్రి కూడా కోపానికి వచ్చిండు. మాటా మాటా పెరిగింది.

‘‘నీకు, దానికి ఏ సంబంధం లేకపోతే నీ ఇంటికి వచ్చిన్నాడే తీసుకొచ్చి తోలిపోయేటోడివి. తీసుకపోయ్యి నువ్వే వుంచుకో’’ అన్నడు కవులమ్మ మొగుడు కవులమ్మతండ్రిని.
నలుగురికి చెప్పినోడు తప్పితే, ఇంకొకరితో ఎన్నడూ మాట పడలేదు. అట్లాండిది అల్లుడు గడ్డితిన్నలెక్క మాట్లాడుతుంటే తట్టుకోలేకపొయిండు.

‘‘తూ. నీ బతుకు పాడుగాను. మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు. ఇంత బుద్ధిజ్ఞానం వుండాలి. పా. ఏ పెద్దమనిషి దగ్గరికి పోదామంటవో పా. నీ గురించి తెల్వనిది ఎవనికో.’’ విపరీతమైన కోపంతో వూగిపోతూ ఇక మాటలు రాక ఆగిపొయిండు కవులమ్మతండ్రి.

కవులమ్మతండ్రి ఎన్నడు కూడా బిడ్డను ఎన్ని కష్టాలు పెట్టినా,ఎందుకు ఇట్ల చేస్తున్నవు అని అడిగి ఎరగడు. అట్లాంటిది అల్లుడు ఇయ్యాళ అంతమాట అనేసరికి మనిషి కోపంతో వణికిపోయిండు. పెద్దమనుషుల్ల పెడితె తనమీద ఊస్తరని తెలుసు కవులమ్మమొగనికి. అందుకె సప్పుడు చెయ్యలె.

ఎట్ల తిట్టాలి వీన్ని. గొడ్డుకైతె ఒక దెబ్బేసి చెప్పొచ్చు. మనిషికి అయితె ఓ మాట చెప్పొచ్చు. వీడు ఆ రెండు కాదాయెనె. కవులమ్మ తను ఈ లోకంలో వుందో లేదో కూడ తెల్వదు. చేతిల సంచి పట్టుకుని, గోడకు ఆనుకుని ఎటో చూస్తూ అట్లనే నిలబడ్డది. కవులమ్మతండ్రికి ఒక్క క్షణం అక్కడ వుండబుద్ధికాలేదు. లేచిండు. గోడకు ఆనుకుని నిలబడ్డ కవులమ్మ దగ్గరికి పొయ్యి రెండుకాళ్లు పట్టుకుండు.
‘‘నాయినా’’ అని పక్కకు జరిగింది కవులమ్మ గోడుగోడున ఏడుసుకుంట.

‘‘భూదేవికున్నంత ఓపిక ఎట్లొచ్చింది బిడ్డ నీకు. ఎట్ల భరిస్తున్నవమ్మ ఈ నరకాన్ని’’ అని భుజం మీద కండువాతోటి కండ్లు తుడుసుకుని ‘‘పిల్లలు జాగ్రత్తమ్మ’’ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుంట చెప్పులేసుకుని వెళ్లిపోయిండు కవులమ్మతండ్రి.

పిల్లలు బడినుంచి వచ్చేవరకు కవులమ్మకు సోయేలేదు. మొగడు ఎప్పుడు బయటపడ్డడో తెల్వదు.
పెద్దమనుషులు కూల్‌డ్రిరక్స్‌ తాగుడు, సరదా కబుర్లు అయిపోయినయి. ‘‘మరి మీ అమ్మను కూడా పిలవండిరా’’ అన్నడు పెద్దమనిషి.
‘‘అమ్మా’’ కేకేసిండు చిన్నకొడుకు.
యాంత్రికంగా కూర కలియబెడుతున్నదల్లా ఆలోచనల్లోంచి బయటపడి ఒకసారి కేక వినవచ్చినవేపు చూసింది. తల్లి పలకదని ఆ కొడుకులకు తెలుసు.
‘‘మీ నాయన్ని కూడా పిలిస్తరా’’ పెద్దమనుషులు.
‘‘ఆయన్ని పిలిస్తె ఈమె అస్సలు రాదు’’ పెద్దకొడుకు.
స్టౌ సిమ్‌లో పెట్టి వచ్చి దర్వాజకు ఆనుకుని నిలబడింది కవులమ్మ ‘‘కూసో అక్కా’’ అన్నడు ఒక పెద్దమనిషి.
‘‘పర్వాలేదు’’ అని అట్లనే నిలబడింది.
వ్హూ… వ్హూ… అని కొంచెం దగ్గి గొంతు సవరించుకుండు పెద్దమనిషి.
‘‘నాయిన వచ్చిఎన్ని రోజులైతుందిరా’’ తెలిసినా తెలియనట్టే అడిగిండు రాఘవులు అనే పెద్దమనిషి.
‘‘పదైదు రోజులయితుంది మావా’’ పెద్దకొడుకు.
‘‘ఒదినా, నువ్వు మాకంటె పెద్దదానివి. నీకు తెల్వందేముంది. ముసలోని ఆంకల్ల పోతలేవట’’ పెద్దమనిషి.
కవులమ్మ తల నేలకేసి అట్లనే నిలబడిరది. ఒక్కటనలే. రె,డనలే. తల్లి అలా మౌనంగా వుండడంతో కొడుకులకు ఇంకా కోపం పెరుగుతుంది. ఎంత మొత్తుకున్నా అట్లనే సడీ సప్పుడు చెయ్యదు. అసలు చెప్తున్నది వింటుందో లేదో తెలియదు. తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తది.

‘‘మొకమన్న జూస్తలే పెదనాయిన’’ చిన్నకొడుకు పెదనాయిన వరుసైన పెద్దమనిషితో.
‘‘మొఖం జూడకపోతే పాయె. ఎడం చేత్తో పచ్చి మంచినీళ్లన్న ఇస్తలేదే మావ’’ పెద్దకోడలు.
‘‘ఈమె మొగని సంగతి ఈమెకె పట్టిలేకపోతే మాకేం గర్జు పట్టిందా?’’ చిన్నకోడలు.
‘‘ఎంత మొత్తుకున్న ఇట్లనే సప్పుడు చెయ్యదు పెదనాయిన’’ పెద్దకొడుకు.
‘‘ఇగో ఆకరికి పోరగాండ్లు పొయ్యి టిఫిన్‌ ఇచ్చొస్తున్నరు’’ పెద్దకోడలు.
‘‘మీకేమయ్యిందే? మీరు ఇచ్చి రావచ్చు గదనె’’ అంది రంగమ్మ.
‘‘మాకేం కర్మ. ఏదో ఇక మాకు తప్పదు కాబట్టి ఇంట్ల వుంచుకుంటున్నం’’ చిన్నకోడలు.
‘‘ఆమెకు పట్టి లేకున్నా రేపు కొడుకులననరా? సూడమ్మ తండ్రికి ఇంత కూడన్న యేస్తలేరని’’ చిన్నకొడుకు.
‘‘మేం వుద్యోగాలకి పోతే ఇంట్ల వుండేది కోడండ్లే గద. ముసలోన్ని ఉచ్చకు గూడ తీస్కపోవాల్నాయె. ఆయన పిలిస్తె ఎవరు పోతరు. చేసుకున్న తనే దగ్గరికి పోదాయె. మొన్నోసారి ముసలోడు పిలిచి పిలిచి రూముల మూత్రం పోసుకునె’’ పెద్దకొడుకు.
‘‘ఇంత మొండిముండని యాడ సూడలే’’ కసినంతా వెళ్లగక్కింది చిన్నకోడలు.
‘‘ఆ…. ఆ… భాగ్యమ్మ. అట్లనకు. నీకంటె పెద్దది’’ పెద్దమనిషి.
‘‘ఏం పెద్దది మావ. ఆడు వుచ్చపోస్తె, ఇగో ఈ కొడుకులు వుద్యోగాల నుంచి వచ్చినాక బట్టలు మార్చిరి. రూమంతా కంపు కంపు. రూము కడగదాయె. ఆఖరికి నేను, సుశీల పొయ్యి కడిగితిమి’’ పెద్దకోడలు.
‘‘ముసలోని అంటు సొంటు పడదాయె’’ చిన్నకొడుకు.
‘‘ఇగో పెదనాయిన ఇట్ల ఎన్ని అన్నా మూగి దయ్యం లెక్క నిలబడ్తది’’ అంది చిన్నకోడలు.
అందరూ అంటున్నవి వింటూ కవులమ్మ అట్లనే నిలబడిరది.
‘‘కాదొదినా మొగుడు పెళ్లాలన్నాంక కొట్టుకుంటరు తిట్టుకుంటరు. మళ్లా కలిసుంటరు’’ పెద్దమనిషి మాట పూర్తికాకముందే, తలయెత్తి ఒకసారి అంటున్న పెద్దమనిషివేపు చూసింది కవులమ్మ ` వాడు మొగుడా అన్నట్టుగా.
‘‘అదేమో మంచిగున్నన్ని రోజులు వాడుకునే. ఈ పదైదు ఏండ్లసంది వైద్యం చేస్తే వచ్చిన డబ్బులన్ని తీసుకునె. కండ్లు కనిపియ్యకపొయేసరికి ఒదిలేసిపాయె. మరి ఏం చేస్తం?’’
‘‘పెద్దదానివి పిల్లలు గలదానివి. ఫలానాయన పెండ్లంఎవరంటె నీ పేరు చెప్తరుగని, దాని పేరు చెప్తరా’’
‘‘మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి’’ అని పెద్దమనుషులు తలా ఓ మాట అన్నరు. అయినా కవులమ్మ సడీసప్పుడు చేయలేదు.
‘‘పెదనాయిన ఈమెనే తన్నులూ గుద్దులూ తిన్నట్టు చెప్తది. లోకంల ఎవరు తన్నులు తిననట్టు’’ పెద్దకోడలు.
‘‘వర్లి వర్లి వాడే పాయె, వండక తిని నేనే పోతిని’ అన్నట్టు వుంటది మావ. మనం ఎన్ని అన్నా బేఫికరుగ తింటది, వుంటది’’ చిన్నకోడలు. ఆగుమన్నట్టు కోడండ్లవేపు కండ్లతోనే సైగచేసి ‘‘ఇక జరిగినయన్ని జరిగిపోయినయి. పాతవి తవ్వుకుంట కూసుంటె ఎట్లక్క’’ పెద్దమనిషి.
‘‘ఆళ్లా కోడండ్లేనాయె. ఉచ్చకు, దొడ్డికి తీస్కపోలేరు. నీ కొడుకులా వుద్యోగస్తులు. నీ కడుపుల ఎన్నన్నా వుండనియ్యి నువ్వే చూసుకోవాలి’’ తేల్చి చెప్పాడు పెద్దమనిషి.
కవులమ్మ చప్పుడు చెయ్యలేదు.
‘‘మరి ఇక మేం పోతమురా’’ అన్నరు పెద్దమనుషులు కొద్దిసేపు చూసి.
‘‘అయ్యో అప్పుడే పోతున్నరు. పంచాతి తెగకముందే’’ అన్నరు కొడుకులు, కోడండ్లు కంగారుగా.
‘‘సప్పుడు చేస్తలేదు. ఒప్పుకున్నట్టేగా’’ పెద్దమనుషులు.
‘‘అట్లగాదు ఈమె సప్పుడు చేస్తలేదంటె చెయ్యదని అర్ధం’’ కోడండ్లు.
‘‘పంచాయితీ తెగ్గొట్టి పోండి’’ కొడుకులు.
‘‘ఏం వదినా సప్పుడు చెయ్యవు’’ లేచినవాళ్లు కూచుంటూ.
అయినా కవులమ్మ నుండి సమాధానం లేదు.
‘‘ఏం రంగమ్మ, నువ్వేమంటవు?’’ పెద్దమనుషులు.
‘‘నేను అనేదేముంది అన్నా, ఒదిన ఏమన్న చిన్నపిల్లా’’ రంగమ్మ.
పెద్దమనుషులకు కోపం వచ్చింది కవులమ్మ మీద. బుజ్జగించినట్టు మాట్లాడితే నెత్తిమీద ఎక్కి కూసుంటుంది. ఉలకదు పలకదు.
‘‘లోకంల నువ్వొక్కదానివె ఆడిదానివి కాదు. అందరు నీ లెక్క వుంటే లోకం బాగుపడినట్టే. నన్ను వదిలిపెట్టి పోయిన్నాడే సచ్చినట్టు అని మాట్లాడ్తవంట. ఆ బొట్టెందుకు పెట్టుకున్నవమ్మ?’’ అని కాళ్లవేపు చూసాడు. మెట్టెలు లేవు. ముక్కుపుల్ల తప్ప పుస్తెతో సహా వీసమెత్తు బంగారం కవులమ్మ ఒంటిమీద లేదని తెలుసు.
కడుపుల కోపం ఎగదన్నుకొచ్చింది. అయినా ఆ మాటలన్న పెద్దమనిషి వేపోసారి చూసి సప్పుడు చెయ్యకుండ నిలబడ్డది కవులమ్మ.
‘‘నువ్వు ఇట్ల నీ మొండితనంతో వుంటే మా ఇంట్ల వుండాల్సిన అవసరం లేదు. మేం మాత్రం నీకెందుకు పెట్టాలి’’ కొడుకు.
అంతే నన్నట్టు కోడండ్లు చూసిండ్రు.
తలతిప్పి రివ్వున కొడుకు మొఖంలోకి సూటిగా చూసింది కవులమ్మ. కోపం కట్టలు తెంచుకుంది.

‘‘ఏంరా లబ్డి కొడ్కా. లెస్స మాట్లాడుతున్నవేందిరా? ఏమోలే అంటె అన్నరు. నా కడుపున పుట్టిన పిల్లలేగా అనుకున్న. వూకుంటావుంటె అలుసైనాదిరా? నాకేమన్న కూసబెట్టి తిండి పెత్తున్నార్రా? ఈ ఇంట్ల వుండొద్దు అంటున్నవు బోషిడీకె. తండ్రిమీద అంత ప్రేమున్నోళ్లు చెయ్యుండ్రి. మీ పెళ్లాలతోటి చేయించుండ్రి.
‘‘పెండ్లామన్నాక మొగుడు ఎన్నన్నా జెయ్యాల్నా? మీరేపాటి జేస్తున్నరే? పొద్దున లేస్తె గుద్ద కదలకుంట కూసుంటరు. మీకు, మీ పిల్లల కాన్నుంచి అందరికి కూసున్నకాడికి టిఫిన్‌లు, ఛాయ్‌లు తెచ్చియ్యాలి. మీరు మీ మొగుండ్లకు ఏపాటి జేస్తున్నరే ? గురివింద గింజ గుద్దకింది నలుపురెగదంట. సూర్యుని మొఖాన మన్ను బోస్తే తిరిగొచ్చి ఆళ్ల మొఖానే పడ్తదితియ్‌ అనుకున్న. ఊకుంటావుంటె నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నరు బద్మాష్‌ ముండలారా. నాకేమన్న పుణ్యానికి తిండి పెడుతున్నారే మీరు?

‘‘ఇంట్ల నుంచి పల్లగొడతరంట, ఇంట్లనుంచి. ఎవనిదిరా ఈ ఇల్లు? నీ     మామోళ్లు కట్నం కింద ఇచ్చినారురా? ఏమె లంజలాలా మీ తల్లిగారింటి నుంచి మూడగట్టుకొచ్చి నాకు పెడ్తున్నారే. నా ఇంట్ల వుండుకుంట, నా రెక్కల కష్టంతోటి వండి పెడ్తుంటె బుక్కెడు బువ్వ యేస్తున్నరు. కట్టుకోటానికి ఇంత బట్ట ఇస్తున్నరు. లెస్స మాట్లాడుతున్నరేమే’’ తననే ఇంట్ల నుంచి వెళ్లమనేసరికి తట్టుకోలేకపోయింది కవులమ్మ. తను ఎంత కష్టపడిరది ఈ ఇంటికొరకు.

కవులమ్మ మౌనమేతప్ప కోపాన్ని చూడని కొడుకులు, కోడండ్లు బదులియ్యలేకపోయిండ్రు.
‘‘ఈ ఇల్లూ… నీ తల్లిగారు కట్టించింది గాదు. ముసలాయన కట్టినది. ఈ ఇంట్ల నువ్వున్నప్పుడు ముసలోనికి చెయ్యాల్సిందే’’ పెద్దమనిషి ఖచ్చితంగా తేల్చి చెప్పిండు.
‘‘బహు జెప్పొచ్చినవ్‌ లేవయ్యా. మీరెవరసలు? నా ఇంటికొచ్చి నన్నడానికి. ఎవరయా మీరు? ఆడు కన్న కష్టాలు పెట్టిన్నాడు కానరారైతిరి? అరవైఐదేండ్లు గుద్దకిందికి ఒచ్చినంక ఎదిగిన బిడ్డల పెండ్లి చెయ్యకుంట మళ్ల పెండ్లి చేసుకుండు. ‘ఇది తప్పన్నా’ అని చెప్పడానికి ఆనాడు ఎవరు రాకపోతిరి? అయినోనివి కానోనివి కాళ్లు పట్టుకుని ఆడపిల్లల పెండ్లిళ్లు చేసిన్నాడు కానరారైతిరి? ఇయ్యాల ఊపుకుంట పెద్దమనుషులమని బయలుదేరిండ్రు.
‘‘ఈ ముదునష్టపు ముండాకొడుకు గురించి తెల్వనిది ఎవరికీ? ఒక్కనాడన్న మాట్లాడకపోతిరి? మా అమ్మనుంచుకుని ఈ లంజకొడుకు, మూడేండ్ల పోరిని ముప్పైయేండ్ల ఈ బాడుకావ్‌ నన్ను జేసుకుండు. ఓ ఇరుగమ్మ తెల్వదు ఓ పొరుగమ్మ తెల్వదు. ఓ సుట్టం తెల్వదు, ఓ పక్కం తెల్వదు. కన్నతండ్రి ఇంటికొస్తె అనరాని మాటలన్నడు ఈ కుక్కల్నాకొడుకు. నెత్తిత్తు నేలరాలినకాన్నుంచి ఏనాడన్న కడుపునిండ నవ్వి పరిగితినా? తిని పరిగితినా? కనిపించినోనితోనల్లా రంకు గట్టె. ఆఖరికి కొడుకులతో కూడానాయె. ఏ మొగోడు రాకపాయె ఆనాడు తప్పని జెప్పడానికి.

‘‘ఈ పెద్దమనిషి బొట్టు దియ్యమని లెస్స మాట్లాడ్తుండు. ఆ లంగనాకొడుకు పెట్టిందా ఈ బొట్టు? ఆడు పెట్టిన మట్టెలు, కట్టిన పుస్తెలు ఆడు మళ్ల పెండ్లి జేసుకున్ననాడే తీసిన. నన్ను ఎన్ని తిప్పలు పెట్టినా నలుగురు పోరగాండ్లు వున్నరని మానానికి, మర్యాదకి భయపడి పడివున్న. బొట్టుదియ్యమని మాలావు జెప్పవొచ్చిండు. బొట్టు తియ్యాలంట, బొట్టు.
‘‘అసలు మీరు నా గడప పందుకు తొక్కిండ్రు? ముందు బయటికి నడువుండ్రి’’ ఆవేశం పట్టలేకపోతుంది కవులమ్మ.
‘‘వాళ్లెందుకు పోతరు? మేం పిలిస్తె వచ్చిండ్రు. ఇది మా ఇల్లు. మా నాయిన గట్టింది. నాయినకు చేసేదానివైతె వుండు లేకపోతే పో’’ కొడుకులు.
‘‘అంతకంటె మా బాగ్యం ఏముందిరా? ఆని కడుపున పుట్టిన మీకు ఇంక వేరే బుద్ధులెట్ల ఒస్తయిరా? నా పాణం పోయినా ఆని మొఖం చూసేది లేదు. మీ ఇంట్ల జేసే కష్టం యాడ జేసుకున్నా బతుకుత. రెక్కలాడినంత కాలం జేసుకు బతుకుత. కాల్జెయ్యి ఆడన్నాడు ఏమన్న ఇంత మందు యేసుక సస్త’’ అంటూ వసారలోనే ఓ మూలకున్న తన బట్టలు మూటగట్టుకుని గేటు తీసుకుని బయటకు నడిచింది కవులమ్మ.

(‘అరుణతార’ ఆగస్టు 2004, ‘కథావార్షిక’ 2004)

ఓ ‘బొంత’ సృష్టించిన తుఫాను

Bhanukiranఇస్మత్ చుగ్తాయి కథలు” తెలుగు లోకి సత్యవతి గారు అనువదించారు. సత్యవతి గారి మాటల్లో చుగ్తాయ్ కథలు సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక, చాలా అత్మీయంగానూ, మన బంధువులవలె అనిపిస్తాయి. తాదాత్మ్యత కలుగుతుంది. పాత్రలన్నీ చాలా కాలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అని అంటారు. కథలు ఉర్దూ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి సత్యవతి గారి అనువాదం చక్కగా తెలుగు రచన లాగే ఉండడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి.

ఈ సంకలనం లో “లిహాఫ్” మొదలుకొని మొత్తం 15 కథలున్నాయి. ఇక్కడ “లిహాఫ్” అనే వివాదాస్పద కథ గురించి మీతో పంచుకుంటా. లిహాఫ్ అంటే రజాయి. దూదితో బాగా దళసరిగా కుట్టిన బొంత-బాగా చలిరోజుల్లో కప్పుకుంటారు. ఈ కథ ఓ స్త్రీ చిన్ననాటి స్మృతుల రూపం లో మనకి చెబుతూ ఉంటుంది. ఆమె స్మృతుల్లో రజాయి లో వెచ్చగా పడుకున్నప్పుడల్లా దాని నీడ గోడ మీద ఒక ఏనుగులా కదులుతూ ఆమెను గత స్మృతుల్లోకి లాక్కెళుతుంటాయి.

నేను అంటూ తన చిన్న నాటి జ్ఞాపకాలు చెప్పిస్తుంది రచయిత్రి. బాగా అల్లరి చేస్తూ అన్నలతో పోట్లాడుతూ వుండే బాలిక ను తల్లి తన సోదరి అయిన “బేగం జాన్” దగ్గర ఓ కొన్ని రోజుల కొరకు వదిలి పోతుంది. పేదింటి పిల్ల అయిన బేగం ని ఓ నవాబ్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ నవాబ్ గారికి తెల్లని మేనిఛాయతో నాజూకు నడుములతో, మిసమిసలాడే పడుచు కుర్రాళ్ళను చేరదీయడం ఓ సరదా. నవాబ్ గారు బేగం జాన్ ని తన గృహం లో అలంకరణ సామగ్రి లాగానే, వాటి పక్కనే ప్రతిష్టిస్తాడు.

నవాబ్ ని పెళ్లి చేసుకొని ఇంట్లో అలంకార ప్రాయంగా ఉంటూ, ఎటువంటి సరదాలు లేకుండా, నిప్పుల్లో పొర్లుతున్నట్లు, వేదన చెంది, ఏ మంత్ర తంత్రాలు ఉపయోగించినా నవాబ్ గారిలో చలనం లేక, నిద్రకు దూరమయి, బ్రతుకు మీద విరక్తి పుట్టి, కాని బ్రతకటం మొదలుపెట్టాక దాన్ని అలాగే కొనసాగించాలి కాబట్టి అలాగే బతుకుతూ ఉంటుంది. ఈ పరిస్థితులలో ఆమె జీవితం లోకి ప్రవేశిస్తుంది రబ్బు అనే పరిచారిక. ఎల్లప్పుడూ బేగం శరీరాన్ని తాకుతూ, గోకుతూ ఉండటం రబ్బు పని. ఈ అమ్మాయేమో బేగం కి దురద వ్యాధి ఉంది అందుకే రబ్బు ఎప్పుడూ గోకుతూ ఉంటుంది అనుకుంటుంది. నవాబ్ గారిలో చలనం లేక, రాతి నుంచి రక్తాన్ని పిండ లేక, బేగం జాన్ పరిచారిక దగ్గర లైంగికంగానూ, ఉద్వేగపరంగానూ ఉపశమనం పొందుతూ ఉంటుంది.

ఓ రాత్రి అదే గదిలో పడుకున్న ఈ అమ్మాయికి తెలివి రావడం, లిహాఫ్ నీడలు గోడమీద కదులుతూ, ఒక ఏనుగు ఆకారం దాని క్రింద దూరి తప్పించుకోవడానికి పెనుగులాడుతున్నట్లు, మరో రోజు రాత్రి బేగం కి రబ్బు కి ఏదో గొడవ సర్దుబాటు అవుతున్నట్టు గమనిస్తుంది. ఓ రోజు రబ్బు పొరుగూరికి పోతుంది. రబ్బు లేని సమమయంలో ఈ పిల్లకి బేగం జాన్ తో వెగటైన అనుభవాలు అనుభవమయితాయి. రబ్బు వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ బేగం లిహాఫ్ మళ్ళీ ఏనుగు ఆకారంలో ఊగుతుంది. కొంత సేపు భయపడి లేచి లైట్ వేస్తుంది. అంతే లిహాఫ్ కింద ఏనుగు ఒక పిల్లి మొగ్గ వేసి పడిపోతుంది. ఆ పిల్లి మొగ్గ లిహాఫ్ ని ఒక అడుగు పైకి లేపుతుంది. “అల్లా! అంటూ నేను నా మంచం మీదకు దూకాను. ఏం చూశానంటారా! చెప్పను గాక చెప్పను,” అంటూ కథ ముగుస్తుంది.

లిహాఫ్స్వలింగ సంపర్కం కథా వస్తువుగా రాయబడ్డ ఈ కథలో ఎక్కడా అశ్లీలత కి తావు లేకుండా రాయడం రచయిత గొప్పదనం. ఇంగ్లీష్ లోకి అనువదించిన “తాహిరా నక్వీ” తన పరిచయం లో” ఈ కథ ఒక తుఫాను సృష్టించింది. చిన్న పిల్ల ఊహల్లో నుంచి వచ్చిన కథ కనుక అమాయకత్వంతో కూడిన దైర్యమూ నిష్కాపట్యమూ కనిపిస్తుంది. బేగం కి ఆమె పరిచారిక కి మధ్య ఉండే స్వలింగ సంబంధాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే, చిన్న పిల్ల ద్వారా చెప్పించడం వలన, కథ చెప్పడంలో ఒక సున్నితత్వం వచ్చింది. ఈ కథ ప్రచరణ అయిన రెండు నెలలకు దాన్ని గురించి పెద్ద వివాదం చెలరేగింది. పాఠకులూ, విమర్శకులూ ఆమెను,  ఆమె కథను తీవ్రంగా విమర్శించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అశ్లీలత కింద లాహోర్ కోర్ట్ లో కేస్ కూడా పెట్టింది. కానీ కోర్ట్ లో కథలో ఎటువంటి అశ్లీల పదాలు దొరకనందున కోర్ట్ కేస్ కొట్టివేశారు. తన చిన్నప్పుడు తమ ఇంట్లో వాళ్ళు ఒక బేగం గురించి ఆమె పరిచారిక గురించి చెప్పుకుని నవ్వుకునే వాళ్ళమని ఆమె చెప్పింది.” లిహాఫ్ కథలో కథనం గూఢంగానూ, సూచ్యంగాను వుంటుంది అంటూ ఆ కథ దృష్టి కోణాన్ని గురించి వివరించింది. ఈ కథ వ్రాసినప్పుడు రచయిత్రికి స్వలింగ సంపర్కం అనే విషయాన్నీ గురించి అవగాహన స్వల్పమని అనిపిస్తుంది అని అంటుంది. కాని సత్యవతి గారు ఏమంటారంటే ఒక చిన్న పిల్ల అవగాహన మేరకు ఈ కథ ముగిసింది అని అంటారు.

ఈ కథ ఆధారంగా ఫైర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఏది ఏమయినప్పటికీ, ఆ రోజుల్లో (1944) స్త్రీలు సంప్రదాయాలను ఎదిరించడం, ధైర్యంగా మాట్లాడటం, అనేది కలలో కూడా ఊహించలేని రోజుల్లో ఇలాంటి కథ రాయడం రచయిత్రి ధైర్యానికి  ఒక నిదర్శనం.