లోతు తక్కువ.. వైశాల్యం ఎక్కువ!

 

“మాళవిక” నవలా రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారితో వారి ప్రియ మిత్రులు, సాహితీవేత్త, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు ‘ఛాయ’ సంస్థ కోసం జరిపిన సంభాషణల రెండవ, చివరి భాగం.

 సాహిత్య దర్శనం అంటే ఏమిటి? సాహిత్యానుభవం రచయితలకు కొరవడినదని నేను అనుకుంటున్నాను.

జ: ‘దర్శనం’ అంటే శాస్త్ర పరి భాషలో ‘నిశితమైన చూపు’ అని అర్ధం.  ఒక తాత్విక ప్రతిపాదన గాని, కళా సాహిత్య ప్రతిపాదనగాని – స్వతంత్ర బుద్ధితో – ఏ రంగమ్ముందుకైనా తీసుకురావడం ‘దర్శనం’ ప్రాధమిక ధర్మం.  సాహిత్య విషయకమైన నిర్వచనాలూ, కొందరు విశిస్ట రచయితల గురించి సమర్ధులైన  విమర్శకులు చేసిన విశ్లేషణలు స్థూలంగా ‘సాహిత్య దర్శనం’ గా చెప్పుకోవచ్చు.  ప్రతి దర్శనం, చర్చకు అవకాశం ఇచ్చేదే – ఇక – సాహిత్యానుభవం సంగతి. ఇది కవిత్వ విషయంలో ఒక అంతరువులోనూ, వచన ప్రక్రియల విషయంలో మరొక అంతరువులోనూ ఉండే అవకాశం ఉంది.  కవిత్వ పాఠకుడుకి instant గా intuitive గా కవిత్వానుభవం కలిగే అవకాశం ఉంటుంది.   వచన ప్రక్రియల విషయంలో సమాజం, వ్యక్తుల స్వభావాలు, బాహ్య ఆంతరిక పరిస్థితులు, వంటి యితర విషయాల ప్రమేయం కూడా అవసరం అవుతాయి. సూటిగా చెప్పాలంటే కవిత్వానుభవం చాలా సబ్జెక్టివ్.  వచన ప్రక్రియ ఆస్వాదన అనండి, అర్ధం కావటం అనండి,  చాలా భాగం ఆబ్జెక్టివ్ – అదలా ఉంచండి – తెలుగు రచయితలకు సాహిత్యానుభవం లేక పోవడానికి ప్రధాన కారణం అధ్యయన లోపం.  రచయిత ఎప్పుడూ చదువుతూ ఉండాలి.  కేవలం జీవితాన్ని జల్లెడ పట్టేశాను అనుకుంటే చాలదు.  సాహిత్యం ఒక క్రాఫ్ట్.    చూడాలి.  చూసింది బలంగా చెప్పగలగాలి.  ఇది కేవలం అధ్యయనం వల్ల మాత్రమే సాధ్యం.

 1. మనకి లిటరరీ ఇంటిగ్రటి పలచబడిపోతున్నదని నా అభిప్రాయము. మీకెలా అనిపిస్తుంది?

జ: లిటరరీ ఇంటిగ్రటి అనేది వ్యక్తి  స్వభావాన్ని చెపుతుంది.  ప్రాణం పోయినా సరే, ఆ వ్యక్తి తన భావ ప్రకటనా స్వేచ్ఛ, అందు మూలంగా అబ్బిన స్వతంత్ర వ్యక్తిత్వం వదులు కోడు.  చలం, విశ్వనాథ, శ్రీపాద, కుటుంబ రావు, అజంతా, రా.వి.శాస్త్రి, త్రిపుర వంటి వాళ్ళు నాకు వెంటనే గుర్తుకొస్తున్నారు.   అది ప్రాధమిక  అవసరం.  ముసిలోణ్ణయి పోయానని మీరు అనుకోరని నాకు తెల్సు.  సుమారు పదేళ్ళుగా ఇది సరిగా లేదని – మీతో ఏకీభవిస్తున్నాను.

 1. మీ రచనల మీద మీకు సంతృప్తి ఉందా?

జ: నేను నా రచనలలో రకరకాల ప్రక్రియలు వాడ గలిగా ననుకుంటున్నాను.  అయితే నేను ఏ ఒక్క సిద్ధాంతానికో, మత  ధార్మిక అంశాలకో చెందిన వాణ్ని కాను.  నాకు జీవన లాలస ఎక్కువ.  గోదావరిలో పడవ నడుపుకునే వాళ్ళ మొదలు రకరకాల స్థాయి లో మనుషులు నాకు పరిచయం.  మన తెలుగు వాళ్ళ అహంకారాలు, భేషజాలు, టెక్కులు, వెటకారాలు, లౌఖ్యాలు, దొంగ ప్రేమలు, సదాచారాలు, వ్యభిచారాలు చాలా వరకు నా అనుభవాల ద్వారా సుపరిచితాలు.  నేచర్, ఋతువుల పరిణామం – తెల్సి జీవించటం చాలా ఇష్టం.  ఎరమరికలు లేకుండా ప్రపంచ సాహిత్యం చదవడం నాకు ఇష్టం.  దరిద్రం ఎరుగుదును గనుక డబ్బున్న వాడిగా ఉండడం ఇష్టం.  చాలా వరకు నా రచనలకు నా జీవితానుభవాలు, బలమైన ఇష్టానిష్టాలే  మూలం.  సాహిత్య వ్యాసంగంలో మొగమాటాలు, అబద్ధాలు, జీవన వక్రీకరణలు నాకు సమ్మతం కావు.  అపరిచిత విషయాల్ని ఊహించి వ్రాయలేదని చెప్పగలను.  ఈ మాత్రపు నిజాయితీ నా కున్నదని చెప్పగలను.  తృప్తికి అంతం ఎక్కడా?

 1. అసలు ఆధునిక కళ అనేదే సకృత్తుగా ఉన్నప్పుడు మనకి ‘ఆధునికోత్తర దశ ‘ ఏమిటని ఒక అభిప్రాయం ఉంది . మీరేమంటారు?

జ: అసలు ‘ఆధునికత’ అనే మాటే వివాద గ్రస్తం.  సమకాలీన మైనదంతా ఆధునిక కాజాలదు.  ఆధునికత అనే భావన వ్యక్తి నిష్ఠమా? గుంపు నిష్ఠమా? కళా సాహిత్య విషయాలలో ఆధునికత అనే భావన పూర్తిగా వ్యక్తి నిష్ఠమని నా నమ్మిక.  ‘ఆధునికోత్తర’ అనే పద బంధం గాని, దాని భావ విస్తృతి గాని నా కేమీ తెలియవు.  నేనెప్పుడూ దృష్టి పెట్టలేదు.

 1. ఆదివాసుల గాథలు, పంచతంత్రం, మిత్ర భేదం, మిత్ర లాభం వంటివి చదివితే రచయితలు బాగు పడతారనిపిస్తుంది నాకు. ఆ కథల నిర్మాణం, వాటిలో ప్రతీకలు అత్యంత ఆధునీకంగా ఉంటాయి కదా? దక్షిణ అమెరికన్ రచయితలు ఇదే చేశారు. అవునా?

జ: మీరు పేర్కొన్న జాపితాకి మరి రెండు కలుపుతాను.  బౌధ్ధ జాతక కథలు, హంస వింశతి.  ముఖ్యంగా హంస వింశతిలో ఎంత జీవితం, ఎన్ని స్వభావాలు, చెప్పాడో కదా!  మళ్ళీ అదే మాట!  మన రచయితలకు అధ్యయన గుణం లేదు.  వేతన శర్మ కథ, సృష్టిలో, పిపీలికం వంటి కథల్ని రా.వి.శాస్త్రి వ్రాసాడన్నా, ‘బకాసుర’ వంటి కథ, దిబ్బ కథలు వంటివి కుటుంబ రావు వ్రాసారన్నా, – వాళ్ళ కథన చాతురికి వాళ్ళ అధ్యయనం ఎంతగా ఉపయోగ పడిందో బోధ పడుతుంది.  స్థానాపతి రుక్మిణమ్మ ‘దెయ్యాలు’ అని కథా సంకలనం కూర్చింది.  పల్లెటూళ్లలో చెప్పుకునే కథలు.  ఎంత బావుంటాయో.  కథలో, కథలో కథ గా కథలు అల్లే పద్ధతిని భారతీయులకు నేర్పింది పైశాచి ప్రాకృతంలో ఉన్న బృహత్ కథే.  కాశీ మజిలీ కథలకు ఈ విధానమే ప్రేరణ.  ముళ్ళపూడి గారి ‘రాజకీయ బేతాళ పంచ వింశతి’ ఈ పద్ధతి పుత్రికే – ఒకటే కర్తవ్యమండీ, సాహిత్య ప్రేమికులు ఎల్లలు లేని అధ్యయన వేత్తలు కావాలి.

 1. మీరు కథలు బాగా రాస్తారు. విరివిగా కథలు రాయాలని అనిపిస్తోందా? కొంతమంది రచయితలు సృజనాత్మకమైన సంతృప్తి కోసం ఒక దానికంటే ఎక్కువ సాహిత్య ప్రక్రియల్నిఆశ్రయిస్తూ ఉంటారు. సరదా కోసం వారు.  ప్రతిభ వల్ల మీరు?

జ: నా కేరీర్ తొలి రోజుల్లో – అంటే 1962-1967 నడుమ – ఎక్కువగా కథలే వ్రాసాను.  వ్యాసాలు కూడా.  ఒక సారి నేను వ్రాసిన ‘తెరలు’ అనే కథ ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చింది.  మా నాన్నగారు దానిని చదివి (1964 లో) నన్ను వెటకారం చేశారు.  “రమణీమణుల్ని దింపకుండా కథ వ్రాయ రాదా? లేవా? “ అని.  ఆ మూడో నాల్గో కథలు వ్రాసానేమో!  – (1967) – ఆ తర్వాత పూర్తిగా మానేశాను.  ఎంతదాకా? –  2000 సంవత్సరం అనుకుంటాను.  “ఏమైందంటే…” అనే కథను ‘రచన’ సాయిగారు ప్రచురించే పర్యంతం.  అప్పుడు నుంచి మళ్ళీ – కొంచమే – కథలు వ్రాయడం ప్రారంభించాను.  కథా  రచనని  చా.సో. గారు ‘A lyric in prose’ అన్నారు.  నాకా ప్రక్రియ చాలా ఇష్టం.  ఇంకో సంగతి చెప్పనా?  నేను ఇంగ్లీష్ లో ఆస్కార్ వైల్డ్, గోర్కీ, కాఫ్కా, చెహోవ్, ఓ హెన్రీ, మపాసా వంటి రచయితల కథలు చదివి కవిత్వం వైపు మళ్లిన వాడిని.  నా ఊదేశ్యంలో రచయిత అయినవాడికి అన్ని ప్రక్రియలు కరతలామలకంగా ఉండాలి.  ఏ పరికరం అవసరమో గుర్తెరిగి ఆ వృత్తంతో అనుసంధించ గలగాలి.  ‘కలిపి కొట్టరా కావేటి రంగా ‘ అన్న సామెతగా సర్వం కవిత్వం పేరిట ఊరదొక్క కూడదు.  నేను చేసిన వృత్తుల కారణంగా వివిధ ప్రక్రియలలో రచనలు చేయవలసిన అవసరం నా కేర్పడింది.   నాకా ప్రక్రియలు లొంగడానికి కారకులు – గాయకులు, నర్తకులు, నాటక ప్రయోక్తలు – యక్ష గాన కళాకారులు – నేనెరిగిన మూడు తరాల రచయితలూను.  సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం నాకు చాలా ఇష్టమైన  అంశం.

 1. గత పాతిక సంవత్సరాలలో వచ్చిన కవిత్వం గురించి మీ అభిప్రాయం, కంప్లైంట్లు? పేర్లు, ధోరణులు అవసరం లేదు.

జ: గత పాతికేళ్ళంటే: సుమారు 1985 నుంచి అనుకుందాం. అంటే ఫెమినిస్ట్ లు, దళిత కవులు, ప్రముఖంగా రచనలు చేయడం నడుస్తున్న కాలం – నిష్కర్షగా చెప్పాలంటే:

_ most of the complaints were accusative.  భౌతికం, సామాజిక ప్రశ్నలు, ఫిర్యాదులు, సాధారణమయ్యాయి.

_ ఊహాశాలిత, లాలిత్యం, సున్నితత్వం స్థానే వెటకారం, ఎత్తిపొడుపు, తాత్త్వి కంగా బాకీ తీర్చుకునే ధోరణీ,  నాకు కంపించాయి.  లోతు తక్కువ.  వైశాల్యం ఎక్కువ, and frequently offensive.

 1. ఒక జీవత్ భాషగా తెలుగు ప్రమాదంలో పడిందనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు?

జ: ప్రమాదంలో పడిందంటే:  మన మధ్య తరగతి, ఉన్న తరగతి మహాను భావులే పడేశారు.  బహుశ ఏ యితర భాషల వాళ్ళకీ లేని భాషా దారిద్రయం మన వాళ్ళ నొసటనే పొడిచింది.  నేనెరిగినంతలో నలభై యేళ్ళ క్రితం ఈ విధ్వంసనాలు ఏ తెలుగు జాతి మహానుభావులు చేశారో వారే ఇవాళ పంచలు, కండువాలు ధరించి తెలుగు భాషోధ్ధారణ ప్రసంగాలు చేస్తున్నారు.  నాకు తెలియని, బోధపడని అంశం;  భాషా విషయం ఎవరికి వారు అనుసరించదగిన అంశం.  వీరంతా ఎదుటివారికి ఉపదేశిస్తారేమిటీ?  జరగాల్సిన చోట నిశ్శబ్దంగా, నిస్సంశయంగా, ధృఢంగా ఆచరణ జరగాలి.  అది లేదు.  జీవద్భాష అన్న తర్వాత అది అంతరిస్తుందనటం సరికాదు.  అంతా బూతులతో  సహా సుఖంగా తెలుగు భాష మాట్లాడుకుంటున్నారు.  భాషకేమీ ఢోకా లేదు.  Convent generation percentage చాలా స్వల్పం.  జరుగుతున్న హంగు, నాటకం అంతా నీడలను చూసి భయపడటమంతే!

 1. తెలుగు వాళ్ళకి అతి సున్నితమైన కవిత్వం, వచనం, ఇతర లలిత కళల పట్ల ఆసక్తి లేదేమో అనిపిస్తూ ఉంటుంది ప్రశ్న. ఏదైనా కొంచం ఎక్కువ మోతాదులో ఉండాలి. నిజమేనా?

జ: పూర్వం మనం కాలేజీలలో చదువుకునే రోజుల్లో ఇద్దరు ముగ్గురు లెక్చరర్లో – హై స్కూళ్ళలో తెలుగు పండితులో – కళాసాహిత్యాల పట్ల కొందరినైనా యువ విధ్యార్ధుల్ని ఇన్స్పైర్  చేసేవారుండేవారు.  నాటకాలు, పాటలు, ఆటలు, సందడి బాగా ఉండేది.  బోధకులు, విద్యార్ధులు కూడా ఇవాళ తీరిక లేని వాళ్ళు అవుతున్నారు.  తల్లిదండ్రులు కూడా పిల్లల అభిరుచుల మీద కంటే కెరీర్ మీదనే ఎక్కువ వత్తిడి పెంచుతున్నారు.  కవులూ, కళాకారుల ఆవశ్యం పెరగాలి.  నాకు పెరగగలరనే ఆశ ఉంది.

 1. నిజమైన intellectual రచయితలు తెలుగులో అతి తక్కువ మంది ఉన్నారని అభియోగం విన్నాను. అంటే అనేక విషయాల పట్ల ఆసక్తి, వాటి గురించి ఆలోచించడం, కనీసం ఇతర లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళన్న మాట. ఇది అంతరిస్తున్న జాతి అంటున్నారు.

జ: మళ్ళీ నాది పాత పాట:  అధ్యయనం, పరిశోధనా శక్తి లేక పోవటమే కారణం.   చరిత్ర, సామాజిక అంశాలు, కళలు, సాహిత్యం పట్ల గాఢమైన, ఏకీకృతమైన దీక్ష intellectual flair అనిపించుకుంటుంది.  ఒక జాతిగా అటువంటి వైవిధ్యం గల ‘యావ’ మన వాళ్ళలో లేకపోవడం మన దురదృష్టం.

 1. మంచి సినిమా, సంగీతం, నాటకం వంటి వాటి మీద తెలుగు వాళ్ళకి కక్ష వంటిది ఉందంటారా? మరి పొరుగు రాష్ట్రాలలో ఈ పరిస్థితి కనిపించదు గదా?

జ: దీనికి కారణాలు చాలా లోతైనవి.  ప్రాధమికంగా మన తెలుగు జాతికి కెరీర్, డబ్బు సంపాదన, ఏదో రకంగా జీవితంలో సక్సెస్ మీద ఉన్న యావ, కళలు, సాహిత్యం మీద లేవుగాక లేవు.  మతం, సాహిత్యం, రాజకీయాలు అన్నీ నాసిరకంగా పరిణమించినట్టే కళలు, సాహిత్యం కూడా నాసిరకంగా పరిణమించాయి.  సినిమా, సంగీతం పరిస్థితి అంతే.  ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దు.  మీడియోక్రిటీ అనేది మన జాతి జీవనంలో మెజారిటీ జనానికి లైఫ్ లైన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం.  తెలుగు తనపు నాసి తనాన్ని యేళ్ళ తరబడి వదుల్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.

 1. మీరెన్నో సంవత్సరాలు అధ్యయనం చేస్తూ వచ్చిన ఉపనిషత్తులకు వివరణ వంటిది రాశారు గదా, పూర్తి అయిందా?

జ: ఉపనిషత్తుల అనువాదం త్వరలో పుస్తకరూపంలో వస్తోంది.  అవి 11.  పూర్వ తాత్త్వికులు  ఆచార్య త్రయం వారి వ్యాఖ్యలు, వివాదాలలోకి వెళ్లకుండా – ఉపనిషత్తుల తాత్త్విక చింతన, ఆసక్తి గల చదువరులకు వ్యావహారిక సరళ వచనంలో అనువదించి ప్రతి సూక్తం చూపడం, కొద్దిగా అవసరమైన పరిభాషల్ని వివరించడం నా ప్రధమ సంకల్పం.   ఉభయ వేదాంత పండితులు, నా మిత్రులు, శ్రీమాన్ సముద్రాల రంగ రామానుజాచార్య ముందు మాటతో ముద్రణ జరుగుతోంది.

 1. మీ అనుభవాలు, జ్ఞాపకాలు ఎప్పుడు విడుదల చేస్తారు? పుస్తకం రాస్తున్నప్పుడు తాటస్త్యమ్ సాధ్య పడింది? అసాధారణ ప్రజాదరణ లభిస్తుందనుకుంటున్నాను.

జ: ‘నేను ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరిట ఆత్మకథ వ్రాయడానికి కారణం:  గత యాభై యేళ్లలో నేనెరిగిన సాహిత్య జీవితం రికార్డు చేయాలని.  మా పూర్వుల కథ కొంత, మా నాన్నగారి అనుభవాలు, ఆశా భంగాలు, రచనా వ్యాసంగ విశేషాలు కొంత, నా తరంలో నేను ప్రత్యక్షంగా పత్రికా రచయితగా, రేడియో కార్యక్రమ ప్రయోక్తగా, రచయితగా పొందిన అనుభవ పరంపర కొంత – కలిపి ఈ రచన చేస్తున్నాను.  1968 నుంచి 2016 వరకు నేను వ్రాసిపెట్టుకున్న డైరీలు, నేనెరిగిన మూడు తరాల రచయితలతో సన్నిహిత పరిచయాలు, ఈ రచనకు ప్రేరణ.  త్వరలో పూర్తి చేస్తాను.

 1. తెలుగు కథా రచయితలు ఫోరంని ఎక్కువ డిస్టర్బ్ చేయ లేదని అభియోగం ఉంది. మీరేమంటారు?

జ: నేనెరిగినంతలో – ఆచంట సాంఖ్యాయనశర్మ  గారి దగ్గర 1909 నాటి నుంచి ప్రారంభించి చూస్తే – ఒక కథాంశం, లేదా ఘటన నుంచి చెప్పిన కథలే ఎక్కువ.  కథా రచనలలో సాంప్రదాయితంగా నడిచే ఈ ఫ్రేం ని ఆధునిక కథా రచయితలలో  డిష్టర్బ్ చేసిన రచయితలు నలుగురు.  పద్మరాజు, బుచ్చిబాబు, రా.వి.శాస్త్రి, త్రిపుర.  వీరి కథలలో కేవలం కథనం మాత్రమేకాక, పైకి కనపడని తాత్త్విక ప్రశ్నలు, ప్రతి పాదనలు ఉంటాయి.  దాని ద్వారా కథకు గల విశేష శక్తి బహిర్గతమైనదనే  నా విశ్వాసం.

 1. బాల సాహిత్య రచయిత, మేధావి కాడనీ, వ్యాస రచన ఉత్తమ సాహిత్య స్థాయికి చెందదని ఒక అభిప్రాయం ఉంది. నాటకాన్ని సాహిత్యంగా అంగీకరించడం లేదు – ‘కన్యాశుల్కం’ తప్ప. వ్యాసం అంటే ఏదో ఇన్ఫర్మేటివ్ గా తప్ప దానిని సాహిత్య ప్రక్రియ గా మనం గౌరవించం  అనుకుంటాను. 

జ: మీరంతదాకా వెళ్లారు నయం.  అసలు పద్య కావ్యం వ్రాయని వాడు రచయిత ఏమిటీ? అనే ప్రబుద్ధులు మన జాతిలో ఉన్నారు.  సైజు, బరువే క్రైటీరియా.  బాల సాహిత్యం అనే ఊహే మన వాళ్ళకి అర్ధం అయిందనుకోను.  బాల గేయాలంటూ ప్రౌఢులు పాటలు వ్రాయడంతో సరిపెట్టారు.  పిల్లలకు అద్భుతాలు, fairy tales, బొమ్మలతో చెబితే చాలా ఇష్టం.  ఆ పని రష్యా రచయితలు, ఇంగ్లీష్ రచయితలు గొప్పగా చేశారు.  మళ్ళీ మళ్ళీ భారత కథలు, రామాయణ కథలు, పంచ తంత్రం, జాతక కథలు, చెప్పినవే చెప్పడమే తప్ప – లేదా ఉపదేశాలు కుక్కడం తప్ప, ఆహ్లాద కరమైన, కంటికింపైన, బాలల కథా సాహిత్యం తెలుగులో కొత్త ఆలోచనలతో, పాత్రల కల్పనతో జరగలేదనే నా అభిప్రాయం.

ఇక – వ్యాస రచనలో పరిశోధన, విశ్లేషణ, ప్రతిపాదన – ఈ త్రయి నెరవేర్చడానికి ఎంతో సహనం, సహృదయత, విస్తారమైన పఠనానుభవం కావాలి.  ఇంతా చేసి ఇదంతా పత్తి పని.  Thankless job అని మన వాళ్ళలో చాలా మందికి గల ధృఢభిప్రాయం.  ఉంటే పొగడ్త. లేకపోతే తెగడ్త.  శాస్త్రీయత ఎక్కడ ఉందీ? మన తెలుగులో సాహిత్య విమర్శ చాలా భాగం కవులకు, రచయితలకు ఉపాహారం.  Main course  కాలేదనుకుంటాను.

నాటక రచన విషయానికి వస్తే – తొలి రోజుల్లో పురాణం సూరి శాస్త్రిగారొక్కరు నాటక రచనల్ని, నటుల సమర్ధతని, నిష్కర్షగా అంచనా వేసిన వారిగా కనిపిస్తున్నారు.  అదీగాక, పరిషత్తు నాటకాల హవా తెలుగు నాటకాన్ని, ఒక మూస లోకి తోసేసిందని నాకు ఏర్పడిన ధృఢభిప్రాయం.  తెలుగులో చాలా మంది వచనం వ్రాయగల మంచి రచయితలు నాటకం వైపు రాలేదు.  చదువుకున్నా, ప్రదర్శన చూసినా, సరిసమానంగా మనకు ఆదరణ కలిగించ గల నాటకాలు – కన్యాశుల్కం తో సహా – చాలా తక్కువ.  నేను చాలా ప్రదర్శనలు చూసి –  41 తెలుగు నాటకాలు సమీక్షిస్తూ ‘అలనాటి నాటకాలు’ అనే పుస్తకం వ్రాసి – అనుభవంతో చెపుతున్నాను.

హాస్యాన్ని కూడా ప్రత్యేక సాహిత్యాంసంగా మన వాళ్ళు గుర్తించ లేదు.  ఆహ్లాదకరమైన హాస్య నాటకాలకు పరిషత్తుల్లో బహుమతులిచ్చిన దాఖలాలు నాకు కనపడలేదు.  ఎమెట్యూర్ ధియేటర్ లో కృషి చేసిన చాలా మంది ప్రయోక్తలు, రచయితలూ కూడా main stream సాహిత్యవేత్తలుగా కృషి చేసిన వారు కారు. నవలల్ని “సీరియల్ నవల” పేరిట ఒక ప్రక్రియగా చేసినట్టే నాటకాన్ని కూడా “పరిషత్తు నాటకం” పేరిట మూసలో పోశారని నా అభియోగం.  రచయిత ఒక ఉద్దేశ్యంతో నిర్వహించదలచిన నాటకాన్ని కొందరు ప్రముఖ నటులు తమ రంగస్థల అవసరాల కోసం మార్చేసి, కుదేలు పరచిన (సాహిత్య పరంగా) నాటకాలుగా పద్మరాజుగారి ‘రక్త కన్నీరు’, కాళ్ళ కూరి వారి ‘చింతామణి’ చెప్పుకుంటే చాలు.  సాహిత్య గౌరవం, తాహతు ఏమి మిగిల్చారు?

31. ఇన్నేళ్ళ సాహిత్య జీవితం, రచన, గొప్ప వాళ్ళతో స్నేహ పరిచయాలు – ఇప్పుడు మీకేవనిపిస్తోంది?

జ: విజయవాడ, విశాఖపట్నం, మద్రాసు, తెనాలి, బందరు, కాకినాడ, రాజమండ్రీలలో నేనెరిగిన సాహిత్య సభలు, ఎందరో సాహిత్య బంధువులు, ఆత్మీయ మిత్రులు, ఇప్పుడు గతించిపోయారు.  నేనెరిగిన ప్రముఖ రచయితలు నా కంటే వయస్సులో, అనుభవంలో, రచనా సామర్ధ్యంలో అధికులు.  వాళ్ళు ఏనాడూ రచయిత మిత్రులుగా వయస్సు అంతరాన్ని పాటించే వారు కారు.  సమాన స్కంధులుగానే స్నేహం నేర్పే వారు.  నా జీవితంలో విజయవాడ, మద్రాసు అలాంటి గొప్ప స్నేహాల్ని ఇచ్చాయి.  రేడియో, పత్రికలు ఎంత వైబ్రంట్ గానో ఉండేవి కదా! – ‘కహా గయే ఓ దిన్’, అని అనుకుంటూ ఉంటాను.  వారందరూ ఎక్కడికి వెళ్ళి పోయారు? అని జ్ఞాపకాలు బాధిస్తాయి.  వాళ్ళంతా వివిధ సంధర్భాలలో నాకు అర్ధ శతాబ్ధిగా వ్రాసిన సుమారు 200 ల ఉత్తరాలు భద్రంగా దాచాను.  వాళ్ళ దస్తూరీలోంచి వాళ్ళు  నన్ను పలకరిస్తూనే ఉంటారు. కొత్త మిత్రులు యిటీవల చాలా మంది కలిశారు.

The show goes on forever – అజంతా అంటూ ఉండేవారు: “మన వెనక నుంచి పలకరించి వెళ్ళి పోయినట్లుగానే మనం అలా పొగలాగ వెళ్లిపోవాలి” అని – నిజం కదా!

నన్ను గురించి నే ననుకునేది ఒకటే – నేను కోరుకున్న చదువు చదివాను.  ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.  మనసుకు నచ్చిన ఉద్యోగాలు చేశాను.  నిజాయితీగా నేను దగ్గరగా ఎరిగినవీ, నా అనుభవాలుగా ఎదురైన సుఖదుఖాలు, ఉద్రిక్తతలు, బెంగలూ, సంయోగవియోగాల గురించీ వ్రాశాను.

ఇంతకంటే ఏం కావాలీ?

 

కావ్య వ్యామోహం వచనానికి శాపం!

కాళిదాస మహా కవి ‘మాళవికాగ్నిమిత్రం’ ఆధారంగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నవల, ‘మాళవిక’ ఆవిష్కరణ సంద ర్భంగా వారి ఆప్త మిత్రులు, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు “ఛాయ” సంస్థ కోసం ప్రత్యేకంగా జరిపిన సంభాషణలని రెండు భాగాలుగా మీ కందిస్తున్నాం.

 

 1. మీరు విశ్వనాథ నుంచి ఈ నాటి వరకు అర్థ శతాబ్ది తెలుగు సాహిత్య పరిణామాన్ని చూశారు. కవిత్వంలో, వచనంలో ఈ కాలంలో మీరు అనుకునే మూడు ముఖ్యమైన మార్పులు ఏమిటి?

జ: వెంటనే గుర్తుకు వచ్చేవి :

ఒకటి : గ్రాంధిక భాషా  పధ్ధతి నుంచి రచయితలు క్రమంగా శక్తిమంత మైన వ్యావహారిక వచనం వైపు ప్రయాణించడం. ఇందుకు యిద్దరు వచన శైలీ నిర్మాతల్ని ఉదహరిస్తాను. ఒకరు – చలం. రెండోవారు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.

రెండు: కవిత్వంలో పద్య పాదాల సంఖ్య భావాన్ని బట్టి పెంచటం, తగ్గించటం.

మూడు: మహా కావ్య రచనా వ్యామోహం వెనకబట్టి – ఖండ కావ్య ప్రక్రియ, గేయ రచనా గౌరవం పెరగడం!

 1. భావకవులు అనేక మంది అనేక భాషా పండితులు. వారంతా స్వాతంత్రోద్యమంలో, హరిజనోధ్యమంతో పాటు బ్రహ్మ సామాజికులు కూడా అయి, తద్వారా సమకాలీన సామాజిక జీవితంతో, పరివర్తనతో సంబంధం ఉన్నవారు. వారి అధ్యయన విస్తృతి, సామాజిక ధృక్పధం వారి కవిత్వంలో కనిపించదంటే ఏమంటారు మీరు?

జ: నా ఉద్దేశ్యం – మీరు మొదటి తరం ఆధునిక రచయితలను గురించి ప్రస్తావించారు.  స్వాతంత్రోద్యమం, బ్రహ్మ సమాజ ఉద్యమం, మానవోద్యమం, కాల్పనికోద్యమం, సంస్కరణోద్యమం కూడా కల్పండి.  సాహిత్య పరులలో అప్పట్లో ఏ కొడాలి ఆంజనేయులు, శివశంకర శాస్త్రి వంటి బహు కొద్ది మంది నేరుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉండవచ్చు.  కానీ, అలనాటి తొలి తరం కవులు చాలా మందికి ఉద్యమ దృష్టి కంటే కాల్పనిక ఆవేశమే ప్రధానంగా ఉన్నట్లు తోస్తుంది.  ఆంధ్రోద్యమ కవిత్వం చెప్పినా, ప్రణయ కవిత్వం చెప్పినా, అలనాటి మహా నాయకుల్ని కీర్తిస్తూ రాసినా – దాదాపు అందరూ కవిత్వ “కల్పన”, స్మృతి పూర్వక చారిత్రక అభినందనల దగ్గరే ఆగిపోయారు.  కార్య కర్తల గా ఉద్యమాలలో కవిత్వం పేరిట గీతాలు, పద్యాలు రాసిన వారు కవులు కాలేక పోయారు.  కేవలం ఉద్యమ ఆవేశం వెళ్లబోసిన వారు అయ్యారు.  ఈ తేడాను మీరు విశ్వనాధ, రాయప్రోలు వంటి వారి ఉద్యమ కవిత్వాన్ని, గరిమెళ్ళ సత్యనారాయణ, గురజాడ రాఘవ శర్మ వంటి వారి కవిత్వాన్ని పోల్చి చూస్తే బాగా గ్రహించగలరు.  ఇది హృదయ ధర్మాలలో తేడా – వారి అధ్యయనం వేరు, కాల్పనిక సామర్ధ్యం వేరు.

3.మన ఆధ్యాత్మిక సాంప్రదాయం, రవీంద్రుడి మిస్టిసిసమ్ ప్రభావంతో భావకవులు తలమునకలయినారా? వారంతా శాంతినికేతనాన్ని తిరుపతిగా భావించారు కదా?

జ: మన ఆధ్యాత్మిక సాంప్రదాయమంటే : దాని మూలం ఉపనిషత్తులు.  బ్రహ్మ సామాజికులకు ప్రామాణికత వాటి మీదనే.  రవీంద్రుడు బ్రహ్మ సామాజికుడే కదా! అయితే నా కర్ధమైనంతలో రాయప్రోలు, అబ్బూరి,మల్లవరపు విశ్వేశ్వర రావు మాత్రమే నేరుగా శాంతినికేతనం నుంచి వచ్చిన వారు. వేంకట పార్వతీశ కవులు, కృష్ణ శాస్త్రి, చలం వంటి వాళ్ళు రవీంద్రుడి సాహిత్య మార్గాన్ని (అంటే కాల్పనిక వైభవాన్ని) మోహించిన వాళ్ళు.  అందువల్ల నేరుగా మన ఆధ్యాత్మిక సంప్రదాయం నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కారు.  రవీంద్రుడు సూఫీ సంప్రదాయం, కొంత బెంగాలీ స్థానికత నుంచి తెచ్చిన జానపద వాసన గల కాల్పనికత, దైవానికి సంబంధించిన ‘నైరూప్య ’ భావన, కలిపితొరిపిన టాగోరియన్ కాల్పనిక రీతి నుంచి ప్రేరణ పొందిన వారు మన భావ కవులు.

4. భావకవుల్ని ఉతికారేసిన ‘నేటి కాలపు కవిత్వం’ అనార్ద్ర విమర్శ!

జ: ‘నేటి కాలపు కవిత్వం’ అంటూ అక్కిరాజు ఉమాకాంతం గారు చేసిన విమర్శ మొత్తం ‘పూర్వ పక్ష సిద్ధాంత’ ప్రతిపాదన పధ్ధతిలో చేసిన కరుకైన పండిత విమర్శ.  ఆయన ప్రధానంగా ఆక్షేపించిన విషయాలు రెండు. ఒకటి : కవిత్వం పేరిట అస్పష్టత. రెండవది : పాండిత్య లోపం. ఇంకా చెప్పాలంటే అది కృష్ణ శాస్త్రి గారి కాల్పనిక ధోరణి మీద విమర్శ. నిజమే – అనార్ధ్ర విమర్సే.  ఆయన విమర్సే నిజమై ఉంటే, కాల్పనిక సౌకుమార్యాన్ని కొత్త పద బంధాలతో తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన కృష్ణ శాస్త్రి బతికి బట్ట కట్ట కూడదు. అలా జరగ లేదే! నానాటికీ ఆయన కాల్పనిక వైభవం కవిత్వాభిమానుల్ని సమ్మోహ పరిచింది.

5. విశ్వనాధ క్రియేటివిటీకి క్లాసికల్ పరిమితులున్నాయని పిస్తుంది. ‘కల్పవృక్షం’ అట్లా ఉంచి, ఆయన ఖండ కావ్యాలలో ఆ లక్షణాలున్నాయా? భావకవుల ‘ఆధునీకత’ ఆయన కవిత్వంలో ఉన్నదా? వస్తువు కాదు, అభివ్యక్తి విషయంలో?

జ: తప్పకుండా.  విశ్వనాధ వ్యక్తిత్వంలో కవిగా క్లాసిసిసమ్, కాల్పనికత రెండూ కలగలిసిపోయిన స్రోతస్సులు. భావ కవుల ఆధునీకత ఆయన “గిరి కుమారుని ప్రేమ గీతాల”లోనూ, “కిన్నెరసాని” గీతాలలోనూ ప్రముఖంగా కనిపిస్తుంది.  ఆయన లోని క్లాసిసిసమ్ వైభవం ‘శృంగార వీధి’ పద్య ఖండికలలోనూ, తెలుగు ఋతువుల పద్యాలలోనూ- కడకు రామాయణ కల్ప వృక్షం కొన్ని ఘట్టాలలోనూ అద్భుతంగా కనిపిస్తుంది.  మరీ తొలి నాటి కవితల సంపుటి “భ్రష్టయోగి” చూడండి.  కాల్పనిక కవిగా ఆయన మనస్సు ఎంత లలిత సుందరమో తప్పక తెలుస్తుంది.

6. విశ్వనాధ వాడుక భాష తుఫాన్నుంచి ఎట్లా తప్పించు కున్నాడు?

జ: విశ్వనాధ   వాడుక భాష తుఫాన్నుంచి తప్పించుకోలేదు.  ఆయన గ్రాంధికంగా రాసిన దంతా, గ్రాంధికపు ముసుగులో దాగిన ఆయన సొంత వ్యావహారికమే!  (బలమైన పానుగంటి వారి గ్రాంధికమూ ఇంతే) క్రియా పదాలు, పదాంతాలు గ్రాంధికపు తొడుగు తొడుక్కున్నా, భాష హృదయం మాత్రం వ్యావహారికపు కాకువు తోడిదే.  అందుకే జీవవంతంగా ఉంటుంది.  విశ్వనాధ, తెలుగు వచన రచయితలలో అరుదైన శైలీ నిర్మాత.

 1. శ్రీశ్రీ లౌక్యుడు. నారాయణబాబు అంత కాదు. లౌక్యం లేకపోవడం వలనా, లేదా నారాయణబాబుని కమ్యూనిష్ట్ల పల్లకీ ఎక్కించక పోవటం వలనా? ఎందువలన ఆయనకి గుర్తింపు లేదు? ఆయన కవిత్వంలో గొప్ప’ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ఉంది కదా.

: శ్రీశ్రీకీ  , నారాయణ బాబుకీ  పోలికబెట్టటం సరికాదు.  శ్రీశ్రీ లో ఉన్న రూప స్పష్టత, భావ స్పష్టత నారాయణ బాబులో లేవు.  క్లుప్తత గుణమే; కాదనం -. అయితే అది నారాయణ బాబులో అస్పష్టతకు కొంత వరకు హేతువైంది.  శ్రీశ్రీ లో ఉండే భాషా  నైశిత్యం సాటిలేనిది.  అంతటి స్థితి నారాయణ బాబుకి లేదు.  ‘రుధిర జ్యోతి’ సంపుటి చదవండి. భావ సైధిల్యం జాస్తి, ఆయన ఆవేశపరుడు. ఆ ఆవేశంలో ఏదో కన్ఫ్యూసన్ ఉంది.  నా వరకు చాలా తక్కువ కవితలు మనసును తాకాయి.  శ్రీశ్రీ కవిత్వ పాండిత్యం ఘాఢమైనది.  నారాయణ బాబుకి అంత లేదు.  కమ్యూనిష్ట్ లు శ్రీశ్రీ ని పల్లకీ ఎక్కించటానికి కారణం వాళ్ళ చారిత్రక అవసరం.  శ్రీశ్రీ లౌక్యం కాదు.

 1. భావ కవిత్వానికి పీహెచ్ డీలు, పొగడ్తలు, తిట్లు మినహా సరైన విమర్శ లేదనిపిస్తుంది.

జ: భావ కవిత్వం మీద సరైన విమర్శ లేక పోవడానికి కారణాలున్నాయి.  కృష్ణ శాస్త్రి ప్రణయ కవిత్వం పుణ్యమాని అటు సంప్రదాయ కవి పండితుల నుంచి, ఇటు ఆధునిక సామ్యవాద నైష్ఠికుల నుంచి మొట్టి కాయలు, తిట్లు, వెటకారాలు పుష్కలంగా దక్కాయి.  మీరు నన్ను తిట్టకపోతే  ఒక మాట చెపుతా.  మన తెలుగు వాళ్ళకి తొందరగా  ఎక్కువ భావుకత్వ ప్రధానమైన కవిత్వం అర్ధం కాదు.  తెలిసినా, తెలియక పోయినా ఆధ్యాత్మిక చాపల్యం ఎక్కువ.  వాస్తవికత పేరిట వార్తా కధనాలు తొందరగా మనసు కెక్కుతాయి.  అదీ బలహీనత.  కవిత్వ మూలాలూ, ప్రేరణల పట్ల హృదయ ధర్మ లోపం ఉంటే, విశ్లేషణ కి, విమర్శకి తావేదీ?  నేనెరిగినంతలో డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి  గారు ఎంచదగిన విమర్శ చేశారు.  చాలా తక్కువే అయినా, విశ్వనాధ, శ్రీశ్రీ చాలా మంచి వ్యాసాలు రాశారు.  ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అనే పుస్తకం రాసిన నిశిత విమర్శకులు, వెల్చేరు నారాయణ రావుగారు భావ కవిత్వం గురించి చేసిన విమర్శ నా ఉద్దేశ్యం పాక్షికమైనదనే.

 1. పూర్వపు తెలుగు కవులు తెలుగుని చంపి సంస్కృతాన్ని బతికించారా, లేదా తెలుగుని, కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారా?

జ: పూర్వ కవులు తెలుగుని చంపి, సంస్కృతాన్ని బతికించారని, తెలుగు కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారని, – ఆరోపించే రెండభిప్రాయాలూ తప్పే. ఆ రెండు భాషల స్వభావాలు, ఆయా సాహిత్య స్వభావాలూ తెలియని వాళ్ళనే మాట.

ఎందుకో చెపుతాను.  చారిత్రకంగా ఒక స్వభావంగా తెలుగు భాష మీద సంస్కృత ప్రభావం ఎక్కువ.  దక్షిణాది భాషలలో మళయాళం మీద కూడా ఎక్కువ.  అదలా ఉంచండి. వ్యాకరణం, ఛందస్సు, అలంకారం అనేవి సాహిత్య శాస్త్రం, సాధకుడికి ఉద్దేశించిన రచనా పరికరాలు మాత్రమే.  ప్రాచీన కవులలో  ప్రముఖులెవరూ వీటిని అర్ధ రహితంగా వాడ లేదు.  పద్య రచనలో గొప్ప శిల్ప నిర్మాణానికే వాడారు.  తెలుగు కవిత్వం తమాషా ఏమిటంటే నూరింట తొంభై మంది సంప్రదాయ కవులు వాళ్ళంతట వాళ్ళు ప్రేరణ కలిగి కావ్యాలు రాసిన వాళ్ళు కారు.  కృతి భర్తగారిని వెతుక్కుని, వారి ఇష్టం మేరకు, వారి అభిరుచులకు కిత కితలు పెట్టడానికి రాసినవే.  సభల్లో పండితుల మెప్పు కోసమో, తమ పాండిత్య ప్రగల్భాలు చాటడం ధ్యేయంగా రాసినావీ ఉన్నాయి.  వెయ్యేళ్ళ సంప్రదాయ పద్య కావ్యాలలో కసరత్తులతో ముగిసిపోయినవి  మనకు ప్రమాణాలు కానక్కరలేదు.  మీరు పేర్కొన్న రెండు ఫిర్యాదులూ నిజమైన  సంప్రదాయ సత్కవుల్ని బాధించవు.

 1. ఎకరాల కొద్దీ కావ్య విమర్శ, వ్యాఖ్యానాలు రాశారు కదా, త్యాగరాజ కీర్తనలకు ఆ స్థాయిలో విమర్శ, వ్యాఖ్యానం ఉన్నాయా?

జ: త్యాగరాజ స్వామి కీర్తనలను గురించి కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి వివరణాత్మక వ్యాఖ్య  చాలా ప్రసిద్ధం.  క్షేత్రయ్య పద సాహిత్యం గురించి విస్సా అప్పారావు గారి వివరణలూ, సారంగపాణి పద  వైశిష్ట్యం గురించి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు, అన్నమయ్య పద సాహిత్యం గురించి వేటూరి ఆనంద మూర్తి, ముట్నూరి సంగమేశం ప్రబృతులు ఎన్న దగిన విమర్శలు ప్రచురించారు.  ప్రముఖ సంగీత విద్వాంసులు త్యాగరాజ కీర్తన సర్వస్వం పేరిట ఎంచదగిన విశ్లేషణలు చేశారు.

 1. అవధాన కవులలో శిఖరాయమానులైన తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటి? ఎండు గడ్డిలాంటి అవధాన పద్యాలు కాక, వారి సారస్వత సేవల ప్రత్యేకత?

జ: అవధానాలనేవి సాహిత్య ప్రదర్శనలు.  శ్రోతలకు వినోదం, ఉత్కంఠ కలిగించటం ప్రధాన్నోద్దేశ్యం.  తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటంటే వారికి పూర్వం అరుదుగా మిగిలిన ప్రక్రియని వారు రాజుల దివాణాలలోకి, సభా ప్రాంగణాలలోకి తెచ్చి – అసాధారణమైన ధారణా శక్తి, పద్య రచనా ధార కలిగిన వారు కావడంచేత రకరకాల ప్రాపంచిక, నిత్య కృత్యాలు ఇతి వృత్తాలుగా ఆశువుగా పద్యాలు చెప్పి – వేల కొద్దీ శ్రోతల్ని ఆశ్చర్య చకితుల్ని చేశారు.  సాధారణంగా అవధాన పద్యాలలో చమత్కారాలు, ఛాలెంజ్ లే ఉంటాయి.  మెజారిటీ శ్రోతల్ని మెప్పించటమే ధ్యేయం.  తిరుపతి వేంకట కవులకు అవధానాల పరిమితులు బాగా తెల్సు.  వాటిని వాడుకుంటూ – మరో పక్క సమర్ధమైన కావ్య, నాటక రచనలూ చేశారు.  కావ్యాలలో బుద్ధ చరిత్ర ప్రశస్తం.  పాణి గ్రహీత, శ్రవణానందం, సరదా సరదా చిన్న కావ్యాలు.  ‘శతావధాన సారం’, ‘నానా రాజ సందర్శనం’ సంపుటాలలో వారి పద్య రచనా ధార, పాండిత్యం, ఝటితి స్పూర్తి పుష్కలంగా కనిపిస్తాయి.  చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి ‘కథలు – గాధలు’ వ్యాస సంపుటాలు ఒక విధంగా ఆంధ్ర దేశపు సంస్కృతి, సాహిత్య, సభ్యతలకు నిధులని నా యెరుక.

 1. వివాదాస్పదమైన వ్యక్తిగత జీవితం వల్లనా, ఆయన సాహిత్యం వల్లనా చలం ఎందుకు గొప్ప వాడయ్యాడంటారు?

జ: మొట్ట మొదట గ్రహించ వలసిన సత్యం: చలానికి సాహిత్యం, జీవితం వేర్వరు కాదు.  ఈ విషయం ఆయన వ్రాసుకున్న ఆత్మకథ (చలం) చదివితే తెలుస్తుంది.  చలం సామాజిక పరిశీలన, అధ్యయనం వంటి గంభీరమైన మాటలతో పుట్టిన రచయిత కాడు. ఇంట్యూటివ్ రైటర్. మైదానం, దైవమిచ్చిన భార్య, అరుణ, జీవితాదర్శం, బ్రాహ్మణీకం, వివాహం – అనే ఆరు నవలలు – మ్యూజింగ్సు, ప్రేమ లేఖలు, స్త్రీ, బిడ్డల శిక్షణ, ఆనందం, విషాదం – ఆరు వ్యాసాలంటారో, ఆత్మ ఘోషలంటారో ఆ పుస్తకాలు చలం ఆలోచనా సర్వస్వాలు.  ఆయన ఆలోచనా విధానమే ఆ కాలంలో ఆయన్ని విలక్షణ వ్యక్తిగా, రచయితగా నిలబెట్టింది.

 1. అసలు తెలుగు వాళ్ళకి సాహిత్యం, ఇతర లలిత కళల విషయంలో మీడియోక్రిటి అంటే ఎందుకంత ఇష్టం?

జ: మీడియోక్రిటి అంటే ఇష్టం కాదు;  అది స్వభావం.  చెరువు ఒడ్డున కూర్చుని, చిల్ల పెంకు ముక్కని నీటి మీదకు విసిరితే అది లోతుకి మునగకుండా, తేలుకుంటూ పరిగెడుతుంది.  మీడియోక్రిటి ఆ బాపతుది.  ప్రతీ జాతికి ఒక స్వభావం ఉంటుంది.  వల్గారిటీని హాస్యంగా భావించటం, పోర్నో తరహా స్త్రీపురుషుల కదలికల్ని శృంగారంగా భావించటం, సంగీతంలో శాస్త్రీయమైన మెలకువల్ని, మెలోడీని గ్రహించలేక పోవడం, చిత్ర లేఖనం, శిల్పం, నృత్యం వంటి కళల పట్ల బొత్తిగా దృష్టి లేక పోవడం, తెలియని విషయాల పట్ల తెల్సినట్లు మాట్లాడడం, నిత్యం పాక్టీసు చేసేస్తే ఏదైనా సాధించగలమనే అజ్ఞానపు టెక్కు, ప్రతీ విషయం మీద జడ్జిమెంట్ ఇచ్చే ఉత్సాహం – ఈ లక్షణాలు మీడియోకృటీ పునాదులు.  ఇదే తెలుగు వాళ్ళలో మెజారిటీ మనుషుల జీవ లక్షణం.

 1. ఆధునిక తెలుగు సాహిత్యానికి సరియైన విమర్శ లేదనిపిస్తోంది. వామ పక్ష విమర్శ చాలా పాక్షికమైంది. మీరు ఒప్పుకుంటారా?

జ: వెల్చేరు నారాయణ రావు గారి ఫిర్యాదు ఇదే.  ప్రాచీన సాహిత్యం విషయంలో సాంకేతికంగా విమర్శకు పనికి వచ్చే సాధనాల మీద ఆలంకారీకులు గొప్ప చర్చను లేపారు.  ఈ చర్చలు సుమారుగా శతాబ్దాల పాటు వివిధ మేధావులు సవిస్తారంగా నడిపారు.  అన్ని ప్రక్రియలతో సహా ఆధునిక సాహిత్యం అవతరించి గట్టిగా నూటయాభై యేళ్ళు కాలేదు.  ముఖ్యంగా వచన సాహిత్యం విషయంలో చాలా మంది తమ ఇష్టానిష్టాల ప్రాతిపదిక మీద మాట్లాడారు కాని, objective literary perspective కనపడదు.  మార్క్సిష్టు లకి (ప్రాచీన ఆలంకారీకులకు లాగే) కొన్ని కొలతలున్నాయి.  ఆ కొలతలకు ఆగక పోతే, తిరస్కరిస్తారు.   ప్రాచీన భారతీయాలంకారీకులూ ఇదే పని చేశారు.  శాస్త్రం, నియమాలు యేర్పరచి, క్రియేటివిటీకి గల విస్తారావకాశాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ వచ్చారు.  అది వ్యాకరణం కావచ్చు, ఛందస్సు కావచ్చు, అలంకారం కావచ్చు, తాత్విక ధృక్పధం కావచ్చు.  ప్రామాణికత్వం నిర్ణయించే వారికి గొప్ప హృదయ ధర్మం ఉండడం అరుదు.  సారాంశం : తెలుగులో ప్రామాణికమైన ఆధునిక విమర్శ చాలా విరళం అయిపోవడానికి కారణం గాఢమైన అధ్యయన లోపం.

 1. పూర్వపు తెలుగు కవులు వస్తువు కోసం సంస్కృత సాహిత్యాన్ని ఆశ్రయించారు – వారంతా గొప్ప సంస్కృత పండితులు. మరి సంస్కృతంలో ఉన్న వచన సాహిత్యం గాని, భాసుడి వంటి నాటక రచయితలు గాని వారికి ప్రేరణ కాలేదు. ప్రభంధాలు రచించినట్టుగా వచనం, నాటకం జోలికి పోలేదు.  కారణం ఏమయి ఉంటుంది?  అసలు సంస్కృత సాహిత్యం లోని సృజనాత్మక వైవిధ్యం ప్రభంధ కవుల్ని ఎందుకు ఆకర్షించ లేదు?

జ: దీని గురించి మా నాన్నగారు, హనుమఛ్ఛాస్త్రి గారు ఒక కారణం చెపుతూ ఉండేవారు.  ముఖ్యంగా నాటకాల విషయం: సంస్కృత నాటకాలలో కచ్చితంగా పాత్రోచిత భాషను పాటించారు.  నాటక కథలో వచ్చే వివిధ పాత్రలలో ఏ తరహా పాత్రకి సంస్కృతం వాడాలి? ప్రాకృతం వాడాలి? అనే నియమాలున్నాయి.  భరతుడు పదిహేడు రకాల ప్రాకృతాల్ని నిర్దేశించాడు.  తెలుగులో సంస్కృత నాటకాల అనువాదాల జోలికి పోతే పండిత కవులకి వ్యావహారిక భాష మింగుడు పడలేదు.  వాళ్ళకి ఆ విషయం ఇష్టం లేదు.  గ్రామ్యం అని లోకువ.   అందుకేంచేసారూ? నాటక కథని తీసుకుని పద్య కావ్యాలు రాయడానికే ఇష్ట పడ్డారు.  చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి , వడ్డాది సుబ్బారాయ కవి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వీరేశలింగం వంటి వాళ్ళు అనువాదాలు చేసినా, సొంతంగా రాసినా (పానుగంటి వారితో సహా) గ్రాంధికంలోనే చేశారు.  సంస్కృతంలో శ్లోకాల మాదిరే తెలుగు నాటకాలు, సంస్కృత నాటకాల పంపిణీ మీదనే నడిపించారు.  ఒక్క వేదం వేంకటరాయ శాస్త్రి గారు మాత్రం (గురజాడకు ముందు) తమ ప్రతాప రుద్రీయం నాటకంలో ప్రశస్తమైన పాత్రోచిత భాషగా – తొలిసారి – వ్యావహారిక భాష వాడారు.  వచన రచనలుగా సంస్కృతంలో ప్రసిద్ధమైన దశ కుమార చరిత్ర, విక్రమాంక దేవ చరిత్ర, హర్ష చరిత్ర, కాదంబరి, కృష్ణ చరిత్ర వంటి వాటిని అనువదించినప్పుడు సైతం సరళ గ్రాంధికాన్నే అనుసరించారు.  అన్నిటికంటే ముఖ్యం….ప్రాచీన కాలం నుంచీ కూడా సమకాలీన జన జీవితం సాహిత్య సృజనకు పనికి వస్తుందనే స్పృహే తెలుగు రచయితలకు లేదు.  సంస్కృత రచయితలు ఈ విషయంలో చాలా మెరుగు.  ప్రహసనాలు, భాణ సాహిత్యంలో నాటి సామాజిక విషయాల్ని దుమ్ము దులిపారు.  మన వాళ్ళు “కావ్య రచన ఘనమైందనే” వ్యామోహంలో ఇరుక్కుని ఉండి పోవడం వల్ల తెలుగులో శక్తి వంతమైన వచన సాహిత్యం వృద్ధి కాలేదు.

                                                                           …… to be continued

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రజల కష్టాలే కొలబద్ద: పి. చంద్

chandగత ముప్పై ఏండ్ల నుంచి సింగరేణి కార్మికుల కష్టాలను, ఆశలను, ఆకాంక్షలను అక్షరీకరిస్తున్న, తెలుగులో మొట్ట మొదటి ఏకైక కార్మిక వర్గ రచయిత పి.చంద్ గారు… శేషగిరి, అంతర్జాతీయ శ్రామిక యోధుడు కే.ఎల్ మహేంద్ర, శ్రామిక యోధుడు, ఒక కన్నీరు, నెత్తుటి ధార, విప్లవాగ్ని, హక్కుల యోధుడు బాల గోపాల్, తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు బండ్రు నర్సింహులు, తెలంగాణ, నల్లమల, మేరా సఫర్(జి.వెంకట స్వామి జీవిత చరిత్ర) వంటి నవలలు మరియు భూనిర్వాసితులు, సమ్మె, జులుం, గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు వంటి కథా సంపుటాలు ప్రచురించి ప్రచారార్భాటాలకు దూరంగా ఉండి పోయారు. సింగరేణి ఉద్యోగానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి, గోదావరిఖని యైట్ ఇంక్లైన్ కాలనీలో తన క్వాటర్ లో ఉండి, సైకిల్ తొక్కుతూ సింగరేణి జీవితాల్ని నిశ్శబ్దంగా గమనించి రచనా ప్రస్థానం కొనసాగిస్తున్న పి.చంద్ ఉరఫ్ యాదగిరి ఈ మధ్య తన జన్మస్థలం వరంగల్ కు మారినారు. వారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ఇంటర్వ్యూ….

ప్ర…చంద్ సార్ మీ సాహిత్యానికి ప్రేరణ ఎక్కడ మొదలైంది?

జ…సాహిత్యానికి గాని దేనికి గాని మనిషి జీవితమే పునాది. మనం బతికిన జీవితం మనం చూసిన రచనలకు ప్రేరణ కలిగిస్తది, ముఖ్యంగ ఏందంటే, కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గాబట్టి, మా నాయిన ఆజంజాహి మిల్లు లోపట పనిజేసిండు గాబట్టి, చిన్నప్పట్నుంచి గూడ కార్మిక కుటుంబాల్లో ఉండే సాధక బాధకాలు ఏందో తెలుసు, రెండోది ఏందంటే ఒక చారిత్రిక దశలోపట మనం బతికినం, డెబ్బై ఎనబై దశకం లోపట సమాజంలో ఒక చలనం మొదలైంది. ఎక్కడో ఒక సామాన్యునికి ఏదో జరిగితే వీథులల్లోకి వచ్చి కొట్లాడే రోజులు. ఇయ్యాల్ల పక్కింటోడు చచ్చిపోతాండంటే గూడ పట్టిచ్చుకొని పరిస్థితి. సమాజం ఒక అలజడికి గురవుతున్న తరంలో పుట్టినం, ఈ సమాజాన్ని అధ్యయనం చేయడమనేది జీవితంలో భాగమైంది. అదిగాకుంట ఆ రోజులల్లోనే ఈ సమాజం మార్పు కోసం ఎంతో మంది యువకులు వచ్చినట్టు మేం గూడ వచ్చినం, ఎమర్జన్సీలో ఎంతోమంది లాకప్ లకు, జైళ్ళకు పోయి వచ్చిన సంఘటనలు గూడ ఉన్నయ్.

ఈ నేపథ్యమేదైతే ఉన్నదో, అంటే కార్మిక వర్గ జీవితం, మనం బతికిన కాలం, దానికి తోడు నిరంతర అధ్యయనం ఇవన్నీ ప్రేరణే. వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి సైకిలేసుకొని పొయ్యేది. ఇప్పటిగ్గూడ సైకిలే తొక్కుతున్న, బండి జీవితంల వాడలే!. అప్పుడున్న అన్ని లైబ్రరీలల్ల నాకు మెంబర్ షిప్ ఉండేది. మన అభిరుచికి అనుగుణంగ తత్త్వ శాస్త్రం, ఆ తర్వాత జీవితానికి సంబంధించిన సాహిత్యాన్ని, ప్రామాణికంగా వచ్చిన ‘గోర్కీ’ కావచ్చు , రష్యన్ నవలలు, చైనీస్ నవలలు గూడ వచ్చినయ్. ఇట్లా అనేక పుస్తకాలు చదివే వాణ్ణి.

తర్వాతేమయిందంటే, పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టైంది నా పరిస్థితి. నేనచ్చి మల్ల సింగరేణి ప్రాంతంల ఉన్న, అప్పుడే సింగరేణిల ఎమర్జెన్సీ ఎత్తేసిండ్లు అయితే ఆ అణచివేత నుంచి, తిరుగుబాటు ఉద్యమ రూపం సంతరించుకున్న క్రమంల నేనిక్కడ ఉన్న, అందువల్ల సింగరేణిల విప్లవోద్యమానికి ఒక ప్రత్యక్ష సాక్షిని, ఐ విట్నెస్ అన్నట్టు. దానితోనేమయిందంటే మనం మరింత పదునుదేరడానికి మన ఆలోచన పదునుదేరడానికి సాధ్యమైంది. ఒక విప్లవకారుని గురించి రాయాల్నంటే ఎప్పుడు గూడ ఊహల్లో రాయలేం!, ఒక రిక్షా కార్మికుని గురించి రాయాలంటే వాని సాధక బాధకాలు, వాని కష్టం సుఖం అన్ని గూడ ప్రత్యక్షంగ చూసన్న ఉండాలె, పరిశీలించన్న ఉండాలె, అనుభవించన్న ఉండాలె. అట్ల ఉంటే మాత్రమే లైవ్లీగ వస్తది. లేకుంటే వాళ్ళ జీవితం వేరుంటది, మన బుర్రలో పుట్టినట్టత్తది, ప్రామాణికంగా నిలబడలేదు. యాబై ఏండ్ల కింద నేను పుట్టక ముందు సమయంలోపట ఉన్న శేషగిరిరావు అనే ఒక విప్లవకారుని గురించి నేను లైవ్ లీ గ రాయగలిగిన అంటే, విప్లవకారుల స్వభావం ఏం ఉంటది, వాళ్ళ త్యాగ నిరతి ఎట్ల ఉంటది, ప్రజలకోసం ఎంత అంకిత భావంతో పనిజేస్తరు, ఎటువంటి కష్టాల్నేదురుకుంటరు. అనే దృశ్యాల్ని నేను చూసిన, కాబట్టి నాకు తేలికైపోయింది, శేషగిరిరావు ప్లేస్ లోపట నేను చూసిన ఏదో ఒక విప్లవకారున్ని పెట్టిన కాబట్టి లైవ్లీ గ రాయగలిగిన.

ప్రశ్న… చంద్ సార్! మీరు కార్మికుల  హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి శేషగిరి రావు, కే.ఎల్.మహేంద్ర, బాలగోపాల్, బండ్రు నర్సింహులు మొదలైన వారి జీవితాలను నవలలుగా రాసిండ్రు గద, మీ ఈ కృషి వెనుక నేపథ్యం  గురించి చెప్పుతరా?

జవాబు….. తెలంగాణ సాయుధ పోరాటం మీద చాలా మంది గొప్ప రచయితలు సుమారు ఇరువై రెండు నవలల దాకా రాస్తే, అందులోపట మొట్ట మొదటి సారిగా తె.సా.పోరాటం నేపథ్యం లోపట కార్మిక వర్గ లిటరేచరచ్చింది. అది పందొమ్మిది వందల నలబై లోపట స్టార్టయ్యింది. వాస్తవానికి ఏమైందంటే, పద్దెనిమిది వందల ఎనబై లోపట సింగరేణి స్టార్టయినప్పటికి గూడ పందొమ్మిది వందల నలుబై వరకు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. అంటే, ఒక యాబై సంవత్సరాలు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. ఎందుకంటే, ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ, బ్రిటీష్ యాజమాన్యం, ఒకటి వలసవాద పాలన రెండోది ఫ్యూడల్ దోపిడీ, ఇవి రెండు ఎటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ లేకుండా అణచివేసినయ్.

అటువంటి నేపథ్యం లోపట, ఎప్పుడైతే ఆంద్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చిందో వాళ్లు కార్మిక రంగం మీద కాన్ సన్ ట్రేట్ చేసి పని చెయ్యడం మొదలైంది. ఆ నేపథ్యంలోపట మగ్దూమ్ మొహియుద్దీనేమో హైద్రాబాదులోపట పరిశ్రమించిండ్రు. వరంగల్ జిల్లా ఆజం జాహిమిల్ ప్రాంతం లోపట సర్వదేవ భట్ట రామనాథం,  శేషగిరిరావు అనేటాయినేమో సింగరేణి లోపట మొట్ట మొదటి సారి యూనియన్ స్థాపకుడైండు. అయితే అప్పుడు నలబై ఆ ప్రాంతం లోపట  చరిత్రలో దాదాపు ఒక వందమంది ఆనాటి సాయుధ పోరాటం లోపల కార్మికులు పార్టిసిపేషన్ చేసి చనిపోయిండ్రు. కని, వాళ్లకు సంబంధించి రికార్డు ఎక్కడా చరిత్రలో నమోదుగాలే. ఒక సుందరయ్య రాసిన తెలంగాణా సాయుధ పోరాటం గుణపాఠాలు లో మాత్రం శేషగిరిరావు గురించి ఒక పేజీ, పేజీన్నర మ్యాటరున్నది. అంతకుమించి సమాచారం ఎక్కడా చరిత్రలో రికార్డు కాలేదు. ఆ తరం వాళ్ళలోపట శేషగిరిరావు సార్ కు కార్మిక వర్గం లోపట పెద్ద పేరున్నది. ఇప్పటికీ, ఆయన అట్ల చేసిండు, ఇట్ల చేసిండు అని చెప్పుకుంటరు. చనిపోయే నాటికి ఆయన వయసు  ముప్పై ఏండ్ల లోపట్నే. ఆ నేపథ్యం లోపట విప్లవోద్యమం ఏం చేసిందంటే పాత చరిత్రను తవ్వి తీసే క్రమం లోపట కొమురం భీం చరిత్రను తీసుకచ్చింది. అట్లాగే ఇక్కడ గూడ సింగరేణిలో విప్లవోద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో పాత చరిత్రను తవ్వి తీసుకునే క్రమం లోపట శేషగిరిరావు గురించి ఈ కార్మికుల్లో ఉన్న బహుళ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అన్వేషణ చెయ్యడం జరిగింది. దాదాపు ఒక నూరు నూట యాబై మంది ఆ తరం వాళ్ళను ఇంటర్వ్యూ చేసిన. అసలు ఏంజేశిండు ఆయన, ఎట్ల జేశిండు, ఏ సమస్య మీద ఎట్ల కొట్లాడిండు, అప్పటి పరిస్థితులు ఎట్ల ఉండేది అని సమగ్రంగ, ఒక ఐదారు సంవత్సరాలు ఇదే పనైపోయింది. అంటే, ఒక రిసెర్చ్ వర్క్ లాగ ఐపోయింది. ఆ తర్వాత దాన్ని తీసుకొన్న, అది రిపోర్ట్ గ రాస్తే దానికి విలువ ఉండది.

ఫిక్షన్ మనిషి హృదయానికి సంబంధించిన విషయం మనిషి హృదయం లోపట ఒక ముద్ర వేస్తదన్నమాట. అంటే, అది డాక్యుమెంటేషన్ కు పరిమితం చెయ్యలేదన్న మాట. అట్లగాకుంట ఏం జేసిన్నంటే దీన్ని విశ్లేషణ జెయ్యాల్నని జెప్పి వందలాది పాత్రల తోటి అప్పటి పరిస్థితులు, అప్పటి బొగ్గుబాయి పరిస్థితులు, అప్పటి భౌతిక పరిస్థితులు, అప్పటి కార్మికుల కష్టాలు, వాళ్ళ ఆరాటాలు, వాళ్ళ పోరాటాలు, ఆ నిర్బంధాలు ఇవన్నీ మొత్తం గలిపి శేషగిరి నవల రాసిన. అందుకోసం ఏందంటే తెలుగు సాహిత్యం లోపట వచ్చిన సాహిత్యం లోపల “శేషగిరి” నవల అంత విస్తృత క్యాన్వాస్ తోని, ఒక ఉద్యమం ఎట్ల నిర్మించబడుతుంది, ఉద్యమ కారులు ఎట్లా ఉద్యమాల్ని నిర్మిస్తరనిజెప్పి ఇంత బ్రాడ్ కాన్షియస్ తోని వేరే నవల లేదని చెప్పి విమర్శకులు అంటరు.

ప్ర… “హక్కుల యోధుడు బాల గోపాల్”  ఏ నేపథ్యంతోని రాసిండ్రు?

జ… బాల గోపాల్ ను ఒక ఆలంబనగ చేసుకొని సింగరేణి ప్రాంతంలో స్టేట్ చేసిన రిప్రెషన్ ను రాసిన, రాజ్యం కార్మిక వర్గం మీద చేసిన దాడిని రాసిన, ఆయనను ధారలాగ పెట్టుకొని రాసిన. ఆయనతో వ్యక్తిగతంగా తిరిగిన కాబట్టి ఆయన ఎట్లా విషయాల్లో అప్రోచవుతడనడానికి లైవ్లీనెస్ రావడానికి అది దోహదపడ్డది. ప్రమాదాలు, ఎన్ కౌంటర్లు, ప్రభుత్వ నెగ్లిజెన్స్ ఆధారంగా చేసుకొని రాసిన. ప్రతి విషయాన్ని గూడ ప్రజల పక్షాన తీసుకొని రాసిన.

ఇయ్యాలటి రోజుల్ల సాహిత్యంలో ఉన్న ఈ గ్యాప్ ను పూర్తి చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగ లేరు. బాలగోపాల్ పై స్టేట్ రిప్రెషన్ గురించి రాయాలనుకో అసలు స్టేట్ రిప్రెషన్ ఏం జేసిందో తెల్సి ఉండాలె గద!, తెలిసినా దాన్ని ఆ ఫామ్ లో పెట్టాలె! పాఠకునికి హృదయానికి నాటుకునేలాగ, చొచ్చుకుపొయేలాగ, అయ్యో! గింత ఘోరం జరిగిందా! అని అనిపించేలాగ రాసిన. నేనేదైతే ఫీలయ్యిన్నో , అది పాఠకులకు కన్వేజెయ్యటం కోసం ఈ మాధ్యమాన్ని ఎన్నుకొన్న. స్టేట్ లో ఫలానప్పుడు ఎన్ కౌంటర్ జరిగింది, బాలగోపాల్ సార్ అచ్చి మాట్లాడిండు అన్న విషయం కంటె గూడ, ఆ ఎన్ కౌంటర్, ఆ భీభత్సం, ఆ దుక్కాన్ని పాఠకునికి అందియ్యదల్సుకున్న, అందుకోసం ఈ ఫిక్షన్ ఫామ్ అనేది ఆలంబన చేసుకొని రాయడం జరిగింది.

ప్ర…మీరు కార్మిక వర్గ చరిత్ర నిర్మాణం కోసం కథ, నవల ప్రక్రియలను తీసుకున్నరు, కానీ కార్మికులంటే సామాన్య ప్రజలు వాళ్ళెప్పుడు పనిలోనే నిమగ్నమై ఉంటరు. చదివే అంత తీరిక ఉండదు కదా! పాట దిక్కు మొగ్గు చూపుతరు అనుకుంట – మీరు ఎన్నుకున్న ప్రక్రియ ఎటువంటి ప్రయోజనాల్ని నెరవేర్చింది?

జ…పాటకుండే పరిమితి పాటకుంటది. పాట ఇమిడియేట్ గా మనిషి హృదయంలోకి చొచ్చుక పోతది. కానీ, దాని ప్రయోజనం తాత్కాలికం. నేను కేవలం ఫిక్షనే రాయలే, చరిత్రను కూడ రికార్డు చేసిన. దాదాపు పదిహేను ఇరువై పుస్తకాలు నేను సింగరేణి కార్మికుల జీవితాల మీద రాసిన, ఉదాహరణకు తరతరాల పోరు, సంస్కరణలు ఒక పరిశీలన, వేజ్ బోర్డులు మొ.. వాటిమీద రాసిన. వనరుల తరలింపు క్రమంలోపట, సింగరేణి ప్రాంతంలోపట  ఆంధ్రా వలసవాద దోపిడీ ఏవిధంగా జరుగుతంది, ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి, ఓపెన్ కాస్ట్ వల్ల జరిగే బీభత్సమేమిటి ఇట్లా చాలా పుస్తకాలు రాసిన. అయితే గమ్మతైన విషయమేందంటే సింగరేణి ఎంప్లాయ్ గ ఉండటం వలన వాటిని నాపేరు మీద వేసుకునుటానికి అవకాశం లేకుంట పోయింది. మారుపేర్లతో వచ్చినయ్. ఇంకో గమ్మతేందంటే సంస్కరణలనేవి భారతదేశం మొత్తం మీద పందొమ్మిది వందల తొంబై ఒకటి తర్వాత జరిగినయ్. వీటిని ఒక కేస్ స్టడీ లాగ సింగరేణిలో ఎలాంటి పరిణామాలు వచ్చినాయని ఎవరూ రాయలేదు. సంస్కరణలు ఒక పరిశీలన అని పుస్తకంగ రాసిన. దాన్ని పిట్టల రవీందర్ పేరు మీద ఒక పుస్తకంగ వేస్తె దానిమీద కంపెని బాగ షేకయ్యింది. భావజాల పరంగా ఒక ఆందోళన మనిషికి రావాల్నంటే ముందు మానసికంగా ఆందోళనకు సిద్దం కావాలె . అందుకే జయ శంకర్ సార్ “భావజాల ప్రచారం”, “ఆచరణ” అన్నడు. ముందు మనం చేస్తున్నది న్యాయమైంది, చెయ్యాలనుకునే ఒక ఆకాంక్ష పుట్టినప్పుడు, నువ్వు చేయడానికి సిద్ధపడితే మార్గం అదే దొరుకుతుంది. భావజాల పరమైన మార్పు రాకుంట ఆచరణకు పొయ్యే అవకాశం ఉండదు.

మళ్ళీ మొదటికి వస్తే రచయితకు ఉన్న అభిరుచిని బట్టి కావచ్చు, కాపెబులిటీ కావచ్చు, పాట రాయాల్నంటే పాటగాడై ఉండాలె. పాటగాడై ఉంటే ఆ పాటకు ట్యూన్ దొరుకుతది. చాలా వరకు పాటగాళ్ళు మాత్రమే పాటలు బాగా రాయగలిగిండ్రు. ఎవలన్న ఒకలిద్దరు రాసినప్పటికి గూడ వాళ్ళంత బలంగ రాయలేకపోయిండ్రు. తెచ్చిపెట్టుకున్నట్టై పోయింది. కాబట్టి కథా, నవలా రచన మేధోపరమైనది. ఉద్యమాలు ఆకాశం నుండి ఊడిపడయి, ఉద్యమాలు ఎందుకు పుట్టినయ్, దాని భౌతిక పరిస్థితులేమిటి, సమస్యకు దారితీసిన పరిస్థితులేమిటి దాని నేపథ్యమేమిటి, దాన్ని మార్చుకోవడం కోసం వాళ్ళెటువంటి పోరాటం చేసిండ్రు, వాళ్ళ వైఫల్యాలేమిటి, సక్సెస్ లేమిటి, అంతిమంగ ఏం జరిగింది. ఇట్లాంటి విషయాలను ఎంత లోతుగా అధ్యయనం జేస్తే అంత బాగ చెప్పగలం. ఇలా ప్రతి పుస్తకం వెనుక ఇటువంటి మేధోపరమైన శ్రమ ఉన్నది.

ప్ర… సార్!  ఊరుగొండ యాదగిరి గా ఉండే మీరు పి.చంద్ గా మారడానికి, కార్మిక, వీరమల్లు, కే.రమాదేవి, ఉదయగిరి, ఏ.చంద్ర శేఖర్, వి.హరి, గోపి, వినీల్ చైతన్య మొ..ఇరవై దాకా కలం పెర్లతోని రాయడానికి కారణమేంది?

జ…ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగ లేకుంటే దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగ ఉన్నటువంటి భావజాలాన్ని గూడ వాళ్ళు సహించలేని పరిస్థితి, తీవ్రంగ అణచివేసే పరిస్థితి, చిన్న కాయిదం ముక్క దొరుకుతే గూడ చంపేసిన సంఘటనలున్నయ్ సింగరేణి ప్రాంతంలోపట, దేశ వ్యాప్తంగ గూడ… అటువంటి పరిస్థితిలోపట మనం చూస్తున్న జీవితం, మనం అనుభవిస్తున్న జీవితం, మన చుట్టూ జరుగుతున్న వాతావరణం ఒక రచయితగా నన్ను ఖాళీగా ఉంచలేకపోయింది.

ఉదాహరణకు మన రోడ్డు మీద ఎవరో పిల్ల అడుక్కుంటున్నదనుకో చూసే వరకు జాలి అనిపిస్తది. అయ్యో! చిన్నపిల్ల ఆకలితోటి ఉన్నట్టున్నదని రూపాయో రెండో ఇయ్యాలనిపిస్తది ఎందుకు? మానవత్వంతోనే కదా!, అట్లనే మన చుట్టూ జరుగుతున్న జీవితాల్ని చిత్రించే క్రమంలోపట మనం రచనలు చేస్తం. ఉదాహరణకు ఒక వేశ్య గురించి ఒక రచయిత రాసిండు. రాసినంత మాత్రాన ఆ రచయిత వేశ్య కాలేడు గద, ఆమె జీవితం దుర్భరంగ ఉందని ఏదో జాలిపడిపోయి, అరె ఒక ఆడామె ఇంత అధ్వాన్నంగ బతుకుతంది అని, ఆ బాధను తనకు తెలిసిన ఫాం లోపట వ్యక్తీకరిస్తడు… అట్ల వేశ్య గురించి రాస్తే నిన్నెవరు పట్టించుకోరు. కని మార్పు కోసం కొట్లాడుతున్న ఒక కార్మికుని గురించో, ఉద్యమ కారుని గురించో రాస్తే ప్రభుత్వం పట్టించుకుంటది. దీన్ని ఏవిధంగ అర్థం జేసుకోవాలె? అటువంటి పరిస్థితిలోపట ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఈ స్టేట్ కు వ్యతిరేకంగ రాస్తున్న క్రమంలోపట, మన ఒళ్ళు మనం కాపాడుకోవడానికి ఈ మారుపేర్లు వాడుకోవాల్సి వచ్చింది. కొన్ని త్యాగాలు చెయ్యాల్సి వచ్చింది. ఎవ్వరూ రాయనంతగా విప్లవోద్యమం మీద రాసి గూడ, ఎవరికీ తెలియకుంట ఉన్న పరిస్థితి కొన్నేండ్ల వరకు ఉండిపోయింది. ఈ మధ్య “గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు” కథా సంపుటి వచ్చిన తర్వాతనే ఓహో ఈయనే ఇవన్నీ రాసిండని తెలిసి వచ్చింది.

ప్ర…సరే! అప్పటి అలజడి నుండి, కార్మికోద్యమాల నుండి, అనుభవించిన జీవితం నుండి ఇన్ని రచనలు వచ్చినయ్ గదా! ఇప్పుడు గూడ విధ్వంసం కొనసాగుతనే ఉన్నది? ఓపెన్ కాస్ట్ ల రూపంలో మరింత జీవన విధ్వంసం జరుగుతున్నది. దీనిమీద ఏమన్నా రాసిండ్ర మీరు?

జ…. అసలు ఓపెన్ కాస్ట్ ల మీద జరుగుతున్న విధ్వంసం గురించి మొట్ట మొదట రాసింది నేను. ఇయ్యాల్ల ఓపెన్ కాస్ట్ ల గురించి ఎవరు మాట్లాడుతున్నా, అది చంద్ రాసిన విషయాలను తప్ప అదనంగా ఏం మాట్లాడుతలేరు, ఓపెన్ కాస్ట్ ల విషయంలోపట నేను రాసిన పుస్తకాలే, అంటే రూట్ లెవల్లోపట అధ్యయనం జేసిన చెప్పిన విషయాలే…. “భూ నిర్వాసితులు” అనే కథల సంపుటి నా మొట్టమొదటి కథల సంపుటి. అది మొత్తంగ గూడ ఓపెన్ కాస్ట్ ల వల్ల నిర్వాసితులైన ప్రజల యొక్క జీవితాలను చిత్రించింది. అక్కణ్ణుంచి మొదలుకొని “భూదేవి” అనే నవల (ఇంకా ప్రింట్ కాలేదు) ఏందంటే ఓపెన్ కాస్ట్ వల్ల నిర్వాసితురాలైన ఒక గ్రామాన్ని కేంద్రంగా తీస్కొని, ఒక మధ్య వయస్కురాలైన భూదేవిని పాత్రగా పెట్టుకొని, ఆ మొత్తం భూమికి ఈమెను ఒక రిప్రజెంటేటివ్ గ పెట్టుకొని, ఆమె జీవితాన్ని తీసుకొని రాసిన… అంటే సామాన్యుల జీవితాలు ఎట్లుంటయ్… కొడుకు పిల్లలు మంచిగా బతుకాలనుకుంటరు… కానీ అవన్నీ వీళ్ళ ప్రమేయం లేకుంట, ఉన్న భూములు కోల్పోయి, కూలీ నాలీ జేసుకొని బ్రతికే పరిస్థితులు.. యిట్లైతే మాజీవితం అన్యాయమైపోతది గదా అని, దానికి వ్యతిరేకంగ వాళ్ళు జేసే పోరాటాలు, అవి ఎట్లా నిష్ప్రయోజనమైతున్నయ్, ఎట్లా నిర్బంధాలకు గురైతుండ్రు, ఎట్లా నలిగి పోయిండ్రు అనే విషయాన్ని… అంటే సామాన్యులు భూములు కోల్పోవడం వలన, ఓపెన్ కాస్ట్ ల వల్ల బతుకు కోల్పోవడం వలన ప్రజలు పడే బాధల్ని “భూదేవి” నవలగ రాసిన…

అట్లనే “దేవుని గుట్ట” అనే నవల కరీంనగర్ జిల్లలోని గ్రానైట్ క్వారీస్ గురించి రాసిన. ఇవన్నిట్ల ఉద్యమంల పనిచేసిన వాళ్ళ ప్రత్యక్ష అనుభవాల్నే రాసిన. అందుకే ఇవన్నీ ఎక్కడో ఒకచోట విన్నట్టు, చూసినట్టు  అనిపిస్తయ్. ఇవన్నీ శకలాలు శకలాలుగ ఉన్నయ్… నేను వాటన్నిటినిదీసుకచ్చి ఒక కుర్చీగానో, బెంచీగానో తయారు చేసిన, ఒక కర్ర అక్కడ పడి ఉందంటే, అరె! ఇది వంక కర్ర చెయ్యికి బాగ పనిజేస్తదని తీసుకచ్చుకొని వాడుకున్న… నాకు ఇటువంటి రచనలు చేయడమంటేనే ఇంట్రెస్ట్ అనిపిస్తది… నా మనుసుకు  సంతృప్తి అనిపిస్తది…

ప్ర… అభివృద్దిలో భాగంగా గ్రానైట్ క్వారీస్, సింగరేణి కాలరీస్ ఇట్లా సహజ వనరులను వెలికి తీసి అభివృద్ధి చేస్తున్నమని ప్రభుత్వాలు చెప్తున్నయ్! సింగరేణి ఎట్లనో గ్రానైట్ ను గూడ అట్లనే చూడవలసి వస్తే అది ఎంత వరకు సబబు? అభివృద్ధికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

జ… ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరు అభివృద్ధి గావాలె అభివృద్ధి గావాలె అంటున్నరు. బొగ్గు కావాల్నంటే ఓపెన్ కాస్ట్ లు జేస్తే అభివృద్ధి ఐతది.. అవసరాలు తీరుతయ్ అంటున్నరు. కానీ, ఒక విషయం ఫండమెంటల్ గ గుర్తుంచుకోవల్సిందేందంటే రెండు అంశాలున్నయ్. ఇండ్ల ఒకటేమో అభివృద్ధి గురించి… ఎవరికి అభివృద్ధి? కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు కొద్దిమంది అభివృద్ధి ఒక పక్కకు… ఏదైన అభివృద్దే గాబట్టి, తలసరి ఆదాయం విషయంలో వానికొక లక్షరూపాయలస్తే నీకు పది రూపాయలచ్చినగానీ  ఇద్దరికీ యాభైవేలైతయనేది ఒక అభివృద్ధి సూత్రం.. అదొక అంశం… రెండోది ఏందంటే అభివృద్దంటే ఏంటి… అసలీ ప్రాంతంలోపట వేల సంవత్సరాలుగా మనుషులు బతికిన ప్రాంతాన్ని భవిష్యత్తులోపట మనుషులు బతుకకుండా ఒక ఎడారిగా మార్చేది ఎట్లా అభివృద్ది ఐతది?.. ఒక విధ్వంసాన్ని సృష్టించి, తాత్కాలిక లాభాలకు, గోరంత లాభం కోసం కొండంత నష్టం జేసేది అభివృద్ధి ఐతదా?.. నిజంగా… మనిషి బతుకాల్నంటే వనరులు గావాలె, భూమి ఉండాలె, భూమ్మీద ఫార్మేషన్ ఏర్పడుతా ఉంటది, మానవులు గాని, జంతుజాలం జీవించడానిగ్గాని, వృక్షాలు పెరగటానిగ్గాని, కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంల ఆవిర్భవించింది భూమి… అటువంటి భూమిని తలకిందులు జేసి, మనుషులు, జంతువులు,వృక్షాలు బతుకకుండజేసేదాన్ని ఎట్లా అభివృద్ధి అంటం?..తల్లకిందుల అభివృద్ధి అభివృద్ధి గాదు…

ప్ర…మీరు సింగరేణి కార్మికుల గురించి, సంఘాల గురించి ఎన్నో కథలు రాసిండ్రు గద, ఒకప్పుడు చాలా బలంగా ఉండి ఉమ్మడిగా పోరాటాలు చేసిన కార్మిక సంఘాలు  ఇప్పుడు ఎట్ల పనిజేస్తున్నయ్?

జ.. ప్రధానంగ ఏందంటే… మనకు ఒక వంద సంవత్సరాల పైచిలుకు కార్మికోద్యమ చరిత్ర ఉంది. ఒకప్పుడు ప్రభుత్వరంగ పరిశ్రమల్నే గాని, ఇతర పరిశ్రమల్నే గాని కార్మిక వర్గం డిమాండ్ జేసే పరిస్థితి ఉండే.. ఇయ్యాల్ల శాసించే పరిస్థితి నుంచి యాచించే పరిస్థితికచ్చింది.. ఎందుకచ్చిందంటే కార్మిక వర్గ సంఘాలు బలంగా పనిజేయ్యలేకపోవటం వల్ల, ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టడంలో నాయకత్వం వైఫల్యంజెందటం వల్ల ఇది జరిగింది.. వాస్తవానికి ఇట్లా జరగడానికి ప్రధాన కారణం ఏందంటే గ్లోబలైజేషన్… ఈ గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే లాభాలకోసం పరిశ్రమల స్థాపన దోపిడీ ఒకటేగాక మానసికమైన దాడి గూడ మొదలువెట్టింది. కార్మిక సంఘాలను వీక్ జెయ్యడమనేదాన్ని గూడ ఒక ప్రణాళిక ప్రకారం చొప్పించింది. ఒక ఉదాహరణ చెప్తే.. మా తరం లోపట సామాజిక సమస్యలస్తే మేమంతగూడ వాటికి రెస్పాన్డైనం యువకులంతా సమాజం లోని అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినం.. ఆ తరం వాళ్ళే ఇవ్వాళ భారతదేశం మొత్తం మీద విప్లవోద్యమాలు నడిపించే పరిస్థితచ్చింది. కాబట్టి దీన్నుంచి గుణపాఠం నేర్చుకొని, సామాజికాంశాల నుంచి విద్యార్థులను దూరం చెయ్యాలె కాబట్టి, ఒక ప్లాన్ ప్రకారం ఎజుకేషన్ అంత గూడ సెల్ఫ్ సెంటర్డ్ విధానంజేసిండ్రు.. నువ్వు చదువుకో నువ్వు బాగుపడు.. చదువుకున్నా బాగుపడుతడా అంటే బాగుపడడు.. అది అర్థం అయ్యే వరకు జీవితం వృథా ఐపోతది… అంటే సమాజం నుంచి ఐసోలేట్ జేసేసి విద్యనేంజేసిండ్రంటే…సెల్ఫ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చేసిండ్రు… ఎవడెట్లనన్న సావనియ్ మనం బాగుపడాలే… ఇది ఎందుకు జెప్పిండ్రంటే, హార్డ్ కోర్ గా ఉన్న విద్యార్థి రంగాన్ని కరప్ట్ జెయ్యడం కోసం, డైవర్ట్ జెయ్యడం కోసం… గ్లోబలైజేషన్, చేతిలో ఉన్న సాధనాలైన విద్యా విధానం లోపట మార్పుజేసుకున్నది.. ఏ వ్యవస్తైతే అధికారంలో ఉందొ ఆ వ్యవస్థకు అనుకూలమైన భావజాలాన్ని సమాజంలోపట చొప్పిస్తున్నరు.. ఉదాహరణకు క్రికెట్… క్రికెట్ లేకుంటే ఖాళీ సమయం దొరుకుతది.. ఎండాకాలం ఏదో నాలుగు బ్యాట్లిస్తరు… వాడు వీణ్ణి, వీడు వాణ్ణి ఓడిస్తడు.. వీడు ఖాలిగ ఉంటే ఎంజేస్తడు….ఇంకో దిక్కు ఆలోచన పోతది.. అంటే ఒక వ్యవస్థ అధికారంలో ఉన్నప్పుడు, రాజు అధికారంలో ఉన్నప్పుడు రాజే గొప్ప వ్యక్తి, రాజే బాగ చేస్తడు అన్న భావజాలమే ప్రచారంల ఉండాలె… అట్లైతేనే వాళ్ళు నిలబడగలుగుతరు…

అట్లాగే గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే ప్రపంచ వ్యాప్తంగ వచ్చిన పరిణామాల్లోపట… కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్యూనిస్టుల చేతుల్లోపట ఉన్న తర్వాత ఏర్పడ్డ అంతర్గత పోరులోపట పెట్టుబడి ఆధిపత్యం సంపాయించింది.. పెట్టుబడి ఏంజేసిందంటే అది తన అస్తిత్వం  కొనసాగించడం కోసం.. ఒక వ్యాపారం మీదనే కాదు, మనుషుల మీద, వాళ్ళ ఆలోచనలను గూడ నియంత్రించే ఒక పరిస్థితిని తీసుకచ్చింది… ఆ నేపథ్యంలోపట కార్మిక సంఘాలను గూడ నిర్వీర్యం జేసింది. వ్యాపార దృక్పథంలో ఉండు, నువ్వు సంపాయించుకో అన్నది. సింగరేణి ల సికాస ఏంజేసింది… నువ్వు ఒప్పుకున్న అంశాలు అమలుజేయి అన్నది. పర్మనెంట్ జేస్తా అంటే నూటాటొంబై మస్టర్ల తర్వాత పర్మనెంట్ జెయ్యమన్నది.. నాలుగేండ్లకొకసారి  వేజ్ బోర్డు పరిష్కరిస్త అంటే… నాలుగేండ్లు పోయి రెండేండ్లు గడిచింది నువ్వు ఎందుకు చెయ్యలేదు అన్నది… అట్ల అంటే రాజీలేని పోరాట శక్తులను నిర్దాక్షిణ్యంగ చంపేసింది… రాజీపడ్డ వాళ్ళను మాత్రమే అస్తిత్వంల కొనసాగించింది… ఆవిధంగ నాయకత్వ లేమితోని అవి నిర్వీర్యమైపోయినయ్.. మరి ఏం జేస్తరు ప్రజలు.. ఎన్నిరోజులు ఇట్ల సర్దుకొని బతుకుతరు… సర్దుకొని బతుకలేరుగాబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి నేపథ్యమున్నది.  గ్లోబలైజేషన్ సృష్టించిన ఈ విధ్వంసకర జీవన విధానమే రేపు ఉద్యమాలకు వనరుగ పనిజేస్తది. తాత్కాలికంగ నువ్వు అణిచిపెట్టవచ్చు, నాయకత్వం లేకుంట జేయ్యవచ్చు . ఇయ్యాల్ల ఎందుకు విప్లవోద్యమ నాయకుల మీద టార్గెట్ జేస్తుండ్రు. ఎందుకంటే ఇయ్యాల్ల యాబై రెండు శాతం బీసీలున్నరు. వాళ్లకు సమాజంల ఒక న్యాయం రాలేదు. కని పన్నెండు శాతం ఉన్న ఎస్సీ,ఎస్టీ లకు ఎంతో కొంత న్యాయం జరగడానికి వాళ్ళ తరపున అంబేద్కర్ అనే ఒక నాయకుడున్నడు. అంబేద్కర్ ఏమన్నడు. రాజ్యాధికారం లోపట మా పాత్ర లేకుంట మాకు న్యాయం జరగదు, ప్రభుత్వం లోపట మా వాటా మాకుంటే న్యాయం జరుగుతదని చెప్పిండు. బీసీ కులాలకు నాయకత్వం లేక ఉత్పత్తి కులాలు బతకలేని పరిస్థితి వచ్చింది. అట్లాగే నాయకత్వాన్ని నిర్వీర్యం జేస్తే మొత్తం వ్యవస్థంత కుప్పకూలిపోతుంది. ఇవాళ కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడుండడం వల్లగదా కల సాకారమైంది…

ప్ర… కేసీఆర్ ప్రస్తావన వచ్చింది గదా! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి, భవిష్యత్తు గురించి మీ అభిప్రాయం ఏంది?

జ… తెలంగాణ కోసం వేలాదిమంది, కోట్లాది మంది సామాన్యులు గూడ ఉద్యమంల పార్టిసిపేట్ జేసిండ్రు. కేసీఆర్ తో పాటు సామాన్యులు గూడ ఇదే ఆకాంక్షను కలిగి ఉన్నరు. తెలంగాణ వస్తే మన బతుకు బాగుపడుతుందనుకున్నరు. వాళ్ళ కనీస జీవితం… కొంత తిండి, కొన్ని మందులో, ఉండుటానికి ఇల్లో, కనీస వసతులు, అవసరాలు తీరేలాగ ఉండాలనుకున్నరు. ఐతే దాన్ని ఎట్లా ఫుల్ ఫిల్ జేస్తరనే విషయం ఒకటి ముందున్నది. ఎందుకున్నదంటే… ఆంధ్రా వాళ్ళచ్చేసి మన వనరులనుగాని, మన భూములను గాని, నీళ్ళను గాని దోసుకున్నరు. ఈ దోసుకునుడనేది ఒకటి ఉండటం వల్లనే ఈ ఆందోళన మొదలైంది. రేపు ఈ సమాజంలో దోపిడీ స్వరూపం మారి ఇంకో రూపంల కొనసాగుతే ప్రజలకు న్యాయం జరుగది. దోపిడీ స్వభావం లేని సమాజం గావాలె తప్పితే బాగుపడే అవకాశం లేదు. అటువంటి పనేమన్న కేసీఆర్ జేసేదుంటే ప్రజల ఆకాంక్షలు తీరుతయ్. ప్రజలకు ఉపయోగపడే విషయం లోపట ఒక నిర్దిష్టమైన విధానం ఉండాలె. దాన్నే పాలసీ అంటరు. ఏం పాలసీ అనుసరిస్తున్నరు అన్నదాన్ని బట్టి ఉంటది. బూమికి నీళ్ళిత్త అంటున్నడు. కాని బూమిలేని వాళ్లకు నీళ్ళెం పనిజేస్తయ్. ముందు సమస్య బూమి ఉండాలె, బూమికి నీళ్ళు గావాలె. బూమంత ఎవని చేతుల్నో ఉంటే ఈ నీళ్ళిచ్చి ఎవన్ని పెంచి పోషిస్తవు.

తర్వాత ఉద్యమంలోపట ఇయ్యాళ్ళ పదేండ్ల కాన్నుంచి దెబ్బలుదిని అన్నిట్ల పార్టిసిపేట్ జేసినోల్లంత వెనుకకుబోయి, నాలుగు పైసలున్నోళ్ళు, పైసలు కర్చు పెట్టేవాళ్ళు, ఎన్నికల రాజకీయాల్ల్లో ముందుకచ్చిన వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం జేసిన వాళ్ళు గూడ ఇవాళ్ళ ప్రజా ప్రతినిధులుగ న్యాయం జేస్తరా, రాత్రికి రాత్రి ఉద్యమకారులైనోళ్ళు ఏ మేరకు న్యాయంజేస్తరన్న దాన్ని బట్టి కేసీఆర్ గారు సక్సెసైతరు…

ప్ర… మీ దృష్టిలో బంగారు తెలంగాణ ఎట్లుండాలె?

జ…  ప్రజలకు ఉపయోగపడే విధంగ ఉండాలె. ప్రజల్ని మెరుగు పరిచే విధంగ ఉండాలె. బ్రాడ్ సెన్స్ ల జెప్పాల్నంటే…. పాలసీల పరంగా వీళ్ళేం భిన్నంగ పోయే పరిస్థితి అగుపిస్తలేదు. కాకుంటే ఏందంటే గతంలో కంటె మరింత మెరుగైన సంస్కరణలు చేపట్టాలె. ఇప్పుడీ వనరుల దోపిడీ, సింగరేణి సంపద మన దగ్గర నుండి అక్కడికి పోకుంట ఇక్కడ మన వనరులు మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తే కొంత అభివృద్ధి జరుగుతది. కాని మౌలికమైన మార్పు సమాజంలో వస్తదని నేననుకోను. కేసీఆర్ ఏమన్నజేసేదుంటే సంతోషం. ఎంతవరకైతే ప్రజలకు న్యాయం జరగదో అంతవరదాక వాళ్ళు ఈ రూపంలో కాకపొతే ఇంకో రూపంలో కొట్లాడుతనే ఉంటరు. ఎందుకంటే వాళ్ళు బతుకాలె. వాళ్ళు బతుకాల్నంటే తప్పనిసరిగ ఐతేనేమో ఆకలికి సావడం, లేకుంటే బతుకడం కోసం పోరాటం జెయ్యడమో మిగిలిపోతుంది. అసమానతలు ఉన్నంత సేపు ఉద్యమాలు పుడుతనే ఉంటయ్. ఉద్యమకారులు పుడుతనే ఉంటరు.

ప్ర… తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సంస్కృతి పునర్నిర్మాణం జరుగాలంటున్నరు గదా! ఇది ఎట్లుండాలే?

జ.. సాహిత్యకారులు గాని, సామాజిక వేత్తలుగాని, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవారు గాని, ముందుగా చేయాల్సిందేందంటే, అసలు రోగమేందో తెలుసుకొవాలె, ప్రజల సమస్యలేందో తెలుసుకొవాలె, లోతుగా అధ్యయనం చేయాలె, చేసి, అవి వెలుగులోకి తీసుకస్తే అది ఒక ఎజెండాగా మారుతె దాన్ని పరిష్కరించే మార్గం దొరుకుతది. దాన్ల గూడ రెండు రకాలు! ఒకటి మౌలికంగ మొత్తంగ మార్చడమనేది ఈ వ్యవస్థల సాధ్యం గాదు. వితిన్ ద ఫోల్డ్ లోపటనే చేయగల అంశాలు చాల ఉన్నాయ్. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా లోపట మలేరియా వచ్చి వేలాది మంది చచ్చిపోతండ్రు. మలేరియా క్యూరేబుల్, చాలా ప్రైమరీగ చెయ్యచ్చు. అటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీస్కపోతే ఇంకొన్ని పి.హెచ్.సి లు పెంచడం వల్లనో ఆ చావులను ఆపగలుగుతం… వేలకోట్ల రూపాయలు పెట్టి రోడ్లేస్తండ్రు కని, రైతు పంట పండిచ్చుకొని వస్తే మార్కెట్ల పెట్టుకుందామంటే షెడ్లు లెవ్వు. అట్లాంటి వాళ్లకు మేలు చెయ్యాలె. ప్రజలకోసం ఆలోచించే వాళ్ళు ప్రజలు బతికే మార్గం ఆలోచించాలే. ప్రజల కష్టాలే కొలబద్ద కావాలె..

ప్ర… మీరు ఒక సామాజిక మార్పును ఆశించి చేసిన రచనలు మీరు అనుకున్న పాఠకులకు చేరినయా? మీ పాఠకులు ఎవరు?

జ… సమాజం గురించి ఆలోచించే వారు, సమాజంలో మార్పుకోసం తాపత్రయపడే వాళ్ళే నా రచనలు ఎక్కువగా చదువుతరు. సమాజాన్ని అర్థం చేసుకోవడం, అందులో ఉండే లోటుపాట్లు, కష్టాలు, నష్టాలు తెలుసుకోవాలనుకునే వాళ్లు, నా రచనలు వెతుక్కొని చదువుకుంటండ్రు. ఫలానా పుస్తకం వచ్చిందట చంద్ గారిది, ఏడ దొరుకుతదని తెప్పిచ్చుకొని చదివిండ్రు. నేను ఎంత మంచిగ రాసినప్పటికి గూడ, ఒక వ్యాపార పత్రికో, ఒక సినిమా స్టైల్ సాహిత్యాన్ని చదివే వాళ్ళను ఆకర్షించలేను. నా పాఠకులు నాకున్నరు.

ప్ర… ఏ అవార్డులను ఆశించి మీరు రాయకపోయినప్పటికీ… మీకు సరియైన గుర్తింపు రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

జ… ఆర్నెల్లు కష్టపడి పంట పండిచ్చిన వాడు పంట రాకుంటే ఏం జేస్తడు… జీవితమంత బొగ్గు బాయిల పనిజేసి ముసలితనానికి వచ్చినంక అడుక్కుంటున్నోని సంగతేంది? ముప్పై ఏండ్లు బొగ్గుబాయిల కాలం తోటి పోటీ పడి అననుకూలమైన  పరిస్థితిలో సచ్చి పుట్టినోని సంగతేగట్లుంటే నాకు గుర్తింపు గావాల్నని నేననుకోను.. నాకు గుర్తింపునియ్యడానికి వాళ్ళ ప్రమాణాలు వేరు. అట్ల ఆశించడం అర్థం లేని విషయం. ఏ సాహిత్యమైనా మంచిగుంటే నిలబడుతది. లేకుంటే కొట్టుకపోతది. ప్రజల హృదయాల్లో ఉండుడే అసలైన గుర్తింపు…

*

…ఇక ఇది మా ఫ్యామిలీ మిషన్!

1-5

ప్రముఖ రచయిత జాన్సన్ చోరగుడితో…ముఖాముఖి 

 

 1. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిగా, అంతకు మించి అభివృద్ది- సామాజిక అంశాల వ్యాఖ్యాత గా అరవై వద్ద ఆగి, వెనక్కి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తున్నది ?

ఈ ప్రశ్న ఇప్పుడు మీరు అడిగారు, కాని ఎవరూ అడక్క ముందే నాకు నేనుగా దీన్ని – స్థల కాలాల మధ్య నేను అంటూ నా ‘సొంత సంతకం’ వ్యాస సంకలనంలో ముందు మాటగా ప్రకటించాను. “గత మూడు తరాల్లో – తొలి దశలో చర్చి, తర్వాత దశలో రాజ్యం నా కుటుంబాన్ని ఆదుకుంది. చరిత్ర (కాలం) ఒక తరంగంలా మా కుటుంబంలోకి ప్రవేశించి, ఇంటిల్లిపాదినీ అది తన మీద ఉంచుకుని మరీ వర్తమాన పౌరసమాజ ప్రధాన స్రవంతి లో మమ్మల్ని కలిపిందని అన్నాను.”

అయితే ఇప్పటి  నా ఈస్థితి – ఇది నేను నిరంతర అధ్యయనం, కృషి, త్యాగం తో సాధించుకున్నవి. మీరు అడగొచ్చు ఏమి త్యాగం చేశారని ? ప్రభుత్వ సర్వీస్ లో – ఆర్డర్ ఆఫ్ ది డే గా మారిన అపసవ్యాలు చాలా వున్నాయి. ఇప్పుడున్న ప్రమాణాల్లో – వాటికి దూరంగా వుండటం కూడా త్యాగమే!

 1. సుదీర్ఘ కాలం, 34 ఏళ్ళు పాటు ప్రభుత్వ ప్రచార శాఖలో పనిచేశారు. మీ వ్యక్థిగత స్థాయిలో ఇప్పటికీ మీ సర్వీసులు ప్రజలకు ప్రయోజనకరమని మీరు నమ్ముతున్నారా ?

నిజానికి క్లిష్టమైన ప్రశ్న ఇది. కాని జవాబు చెబుతాను. విషయం ఏదైనా కాలము – ప్రాంతము కొలమానాన్ని నేను ప్రామాణికంగా పాటిస్తాను. ప్రభుత్వాలు మారుతుంటాయి గాని, రాజ్యము –  ప్రజలు రెండూ స్థిరంగా వుంటాయి. ఆ రెండింటి మధ్య నిరంతరంగా వుండే ఘర్షణ లో ప్రభుత్వాలు ‘కెటాలిస్ట్‘ పాత్ర పోషిస్తుంటాయి. ఒకప్పుడు ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడ్డ సమాచార – ప్రసార శాఖలు, ఇప్పుడు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాయి. ఎవరు ‘రిస్క్’ లో వుంటే వాళ్ళ పక్షంగా పనిచేయాల్సిన పరిస్థితి అయింది. అర్ధమయింది కదా, ఇప్పుడు బలంగా వున్నది ఎవరో.  ‘యాస్పిరేషనల్ సొసైటీస ’ మధ్య పనిచేసే ప్రభుత్వాల మనుగడ ఇంతకంటే బలంగా వుండే అవకాశం తక్కువ. నిజానికి మేము నాలుగు వైపుల వీటిని 24 / 7 గార్డ్ చేయాలి. అయినా, మా పని ఫలితాలు పాక్షికమే!

ఇలావుందా, మళ్ళీ రేపు ఇవి తలకు మించిన వాగ్దానాలతో జనం ముందుకెళ్ళి మళ్ళీ ఇదే ‘రిస్క్’ తో కొనసాగుతాయి. మాకు మళ్ళీ ఇదే గార్డు పని. ఇలా ప్రజలకోసం పని చేయాల్సిన ఓ శాఖ నిరంతరాయంగా ప్రభుత్వం కోసం పనిచేయడం ఏ భౌగోళిక ప్రాంతంలో వున్నదో – అక్కడి ప్రజలు నిత్యం సమాచార చైతన్య స్థితిలో వున్నారని, మనం అర్ధం చేసుకోవాలి.

 1. అంటే తెలిసి కూడా సెల్ఫ్ రిస్క్ తోనే ఇప్పటి ప్రభుత్వ నాయకత్వాలు ఈ ధోరణి తో పనిచేస్తున్నాయని అంటున్నారా?

 అందులో అనుమానం ఏముంది? ఒకే సమయంలో అందరూ నాయకత్వ స్థానాల్లో వుండడం కుదరదు కదా. ఎవరి స్థానాలు నుంచి వాళ్ళు ‘ఆపరేట్’ చేస్తారు. అందరూ కల్సి ‘కాలాన్ని’ ఇప్పటి స్థితి నుంచి తదుపరి స్తితికి తీసుకెళతారు. కాకపొతే,  ‘వర్చువల్’ స్థానాల్లో వున్నవారు ఆ గెలుపును క్లెం చేయరు. ‘రియల్’ స్థానాల్లో వున్ వారు ఆ పని చేస్తారు.

అధికార స్థానలో వుండీ కూడా రిస్క్ ఎదుర్కోవడం అంటున్నారు, అది ఎటువంటిది?

నేను అంటున్నది నేరుగా వచ్చే ‘రిస్క్’ గురించి కాదు. మన కారణంగా మనo ప్రాతినిధ్యం వహించే సమాజానికి ఎదురయ్యే ‘రిస్క్’ గురించి. చూడండి –  శ్రీ వి.పి సింగ్ 1989-90 మధ్య కేవలం ఒక ఏడాది ప్రధానిగా వున్నారు. కాని, ఆ ఏడాదిలోనే మన దేశానికి అతి కీలకమైన – మండల్ కమీషన్ నివేదిక పార్లమెంట్లో చట్టమై, ఇప్పుడు అది అమలవుతూ వుంది. 1978 లో మురార్జీ దేశాయ్ కమీషన్ వేస్తే, 1980 చివర అది – 27% వెనుకబడిన తరగతులకు అన్ని రాజ్యాంగపరమైన రాయితీలు ఇవ్వాలని నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత  అది అమలు కావడానికి పదేళ్ళు పట్టింది!

1992-95 మధ్య నేను గోదావరి జిల్లాల్లో డిపీఅర్వో గా వున్నాను. ఒక అధికారిక  లంచ్ ఇష్టాగోస్టిలో (వి పి సింగ్ – స్థానిక సమాంతర సామాజిక వర్గ) ఓ మాజీ మంత్రి నాతో ఇలా వాపోయారు – ‘ఇప్పుడు గొడ్ల దగ్గర పాలు పితకడం రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఐపోయిందండీ!’ అని. అప్పట్ని0చీ ఇప్పటివరకు జరిగింది మనం చూస్తూనే వున్నాం.

దీనికి ముగింపు ఏమంటే –  ‘పోలిటీ’ నిరంతరం ‘లిటరేచర్’ కు దారులు తెరుచుకుంటూ వెళుతుంది అనే ఓ విశ్వజనీన సత్యానికి ఇది మనకాలపు ఉదాహరణ.  ఆ తర్వాత, మొదట మాకు వద్దే వద్దని ;  కాలక్రమంలో తలొగ్గిన – ఆర్ధిక సంస్కరణలు ఈ దశను ఎక్కణ్ణించి ఎక్కడికి తీసుకెళ్ళాయో కూడా చూశాం. దీనివల్ల లాభమా నష్టమా అనే మాట అటుంచితే, ఇవేవి కూడా  తర్వాత కాలంలో ఇలా అవుతుందని తెలిసి చేసినవి కాదు.

అంటే మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ?

 సింపుల్. నడుస్తున్న కాలక్రమంలో ఎవరి సమయంలో వాళ్ళు  – తమ పాత్ర  పోషించి నిష్క్రమిస్తారని. ఉనికి కోసం మనం మన ‘బ్రాండ్లు’ వేసుకోవడానికి  ప్రయత్నిస్తుంటాము గాని,  కాలం మీద అటువంటివేమీ శాశ్వితంగా వుండవని.

ఎందుకంటే,  జరుగుతున్న‘ప్రాసెస్’ మన కంటే పెద్దది. అయితే, మనం మైలురాళ్ళు అంటుంటాము కదా – అవి మాత్రం చరిత్ర లో ‘రికార్డ్’ అవుతాయి. వాటిలో కూడా ముందు వెనుకలు వుంటాయి కాని,  చివరికి దాచగలిగింది మాత్రం ఏమీ వుండదు. వెనకున్నవి కూడా ముందుకు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న కొత్త చరిత్రలు అవే! గత పాతికేళ్ళ ఈ ‘ర్యాలీ’ లో –  చివరన  ‘టైల్ ఎండర్స్’ గా ఉన్న మనకు కూడా ఇప్పుడు ప్రతిదీ స్పస్టంగానే కనిపిస్తున్నది. అయితే మనం ఎటు చూస్తున్నాం ? అనేది ఎవరికి వాళ్ళం వేసుకోవలసిన ప్రశ్న.

అంటే ఇప్పటి వర్ధమాన సమూహాల ప్రస్థానం పట్ల మీకు అనుమానాలు ఉన్నాయా?

వీరి సమస్య – లక్ష్యాల నిర్ణయంలో ఉందనిపిస్తున్నది. జరగాల్సి వున్న ‘ప్రాసెస్’ లో లోతుల్లోకి వెళ్ళగలిగే గమనం కంటే, విస్తరణకే అధిక ప్రాధాన్యత వుంటున్నది.  అందుకు వాళ్ళనూ నేరుగా తప్పు పట్టలేము. సామాజిక – ఆర్ధిక నేపధ్యం అందుకు కారణం అని ఒక పక్క తెలుస్తూనే వుంటుంది. అలాగే మరో పక్క కంటి ముందు కర్రకు కట్టిన ‘రాజ్యధికారం’ క్యారెట్ ఎటూ టెంప్ట్ చేస్తూనే వుంటుంది. సరిగ్గా ఇదే కాలంలో క్రియాశీలమైన ‘మార్కెట్ ఎకానమీ’ వీళ్లను ఏదోపక్కకు తనతో ఈడ్చుకుపోతున్నది. తర్వాత ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఆగి, వెనక్కి తిరిగి చూసుకునేసరికి జీవితకాలం చరమాంకానికి వస్తున్నది. అక్కడ లెక్కలు వేసుకుంటే,  పొందిన వాటికి పోగొట్టుకున్న వాటికి మధ్య – ఎక్కడా పొంతన కుదరడం లేదు! అలాగని, పోగొట్టుకున్న వాటి ఖరీదు(కాస్ట్) తో పొందినవి ఆనందం కలిగిస్తున్నవా? అంటే అదీ లేదు!

 ఈ మీ ధోరణి మీ టార్గెట్ గ్రూప్ కు ఎప్పటికి చేరుతుందంటారు?

నేను అడ్రెస్ చేస్తున్నది, మొదటినుంచీ కూడా అందరినీ. ప్రతి ఒక్కరినీ మనం అడ్రెస్ చేస్తున్నప్పుడు, ‘టార్గెట్ గ్రూప్’ అని గీతలు గీయడం ఎంతవరకు కరెక్టో తెలియదు. అయినా ఈ పనిలో వున్నది నేను ఒక్కణ్ణే కాదు, నాలా చాలా మంది వున్నారు,  వుంటారు.  కొత్త తరాల్లో ఇంకా వచ్చే వాళ్ళ సంఖ్య రెట్టింపు అవుతుంది.

అయినా, గతంలో మనం చూసిన చాలా వాటి మాదిరిగానే – సరళీకరణ రెండవ దశ మొదటి దానికంటే మరింత మార్ధవంగా వుంటుంది. ఇకముందు ఘర్షణ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ‘ఇంక్లూజివ్ గ్రోత్’ స్థానంలోకి, ఇప్పుడిక ‘ఇంక్లూజివ్ గవర్నెస్’ వస్తుంది. అప్పుడు ఈ గమనాన్ని ‘డైజెస్ట్’ చేసుకుని, దానికి ‘ట్యూన్’ అయ్యి రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.

అయినా ఈ క్రమం మొత్తాన్ని స్థూలంగా మనం అర్ధం చేసుకోవడానికి, ఒకసారి చరిత్రలోకి వెళ్ళి – ఖడ్గాన్ని పక్కన పడేసి, మొక్కల్ని నాటించడం మొదలెట్టిన  అశోకుణ్ని ఒకసారి గుర్తు చేసుకోగలిగితే, మన పని చాలావరకు సుళువు అవుతుంది.

యు.పి.ఎ-2 లో –  ‘కళింగ రాష్ట్రాల్లో’ అప్పటి దాకా వున్న తుపాకుల స్థానంలోకి ఫుట్ బాల్ మైదానాలు రావడం ఇప్పటికే చూశాం. అదక్కడ ఆగలేదు. ఎన్.డి.ఎ ఆ క్రమాన్ని మరింత విస్తరిస్తూ, ఏకంగా నాగాలాండ్ లో పడిన పీటముడిని వదులుచేయడం చూశాం! సరిహద్దున ఉన్న బంగ్లాదేష్ తో పశ్చమ బెంగాల్ కు ఉన్న ఇష్యూస్ సంప్రదింపులకు ప్రధాని మోడి మమతా బెనర్జీ ని తనతో డాఖా తీసుకెళ్ళడం చూశాం.  మారుతున్న కాలానికి తగినట్టుగా మారి, రాజ్యం ప్రయోజనం కోసం ప్రభుత్వాలు తమకు తాముగా విస్తరించుకుంటున్న ‘కాంటూర్స్’ ఇవి.  ఇంతకు ముందు నేను – ‘యాస్పిరేషనల్ సొసైటీస్’ కోసం ప్రభుత్వాలు తలకు మించిన వాగ్దానాలు చేస్తాయని  అన్నాను  , సూక్ష్మ స్థాయిలో చూసినప్పుడు – ఇదంతా పెంచుకుంటూ వెళుతున్నఆ ‘కాంటూర్ల’ లో భాగమే!

ఇంతకు ముందు మీ సొంత సంతకం’’ ముందు మాటలో కూడా కాంటూర్ల వద్ద నేను పని చేస్తున్నాను, బౌండరీలు దాటి వచ్చేశాను అన్నారు. ఏమిటవి మీరంటున్న కాంటూర్లు?

 నిజమే ‘సొంత సంతకం’ లో నేను ఆ మాట  అన్నాను. అయితే – ‘స్థల కాలాదుల మధ్య నేను…’ అంటూ అలా చెప్పాను. అప్పుడు ఇప్పుడు కూడా స్థల-కాలాలే నాకు  ప్రామాణికం. చూడండి – గడచిన పాతికేళ్ళలో మనం చూస్తూ వుండగానే భూమి (ప్రపంచం) ఇంత చిన్నది అయింది కదా, మరి ఇంకా ఉనికిలోకే రాని మనం చూడని మరో తరం – మనం ఇప్పుడున్న ఈస్థలంలో ఎలా వుండబోతున్నదీ ఒక్కసారి మనం ‘విజులైజ్’ చేస్తే, మనకు ఏమి కనిపిస్తుంది? మరి మనకు ఉండాల్సిన చూపు – మన మధ్య మనమే గీసుకున్న ‘బౌండరీలా’ మధ్యా లేక అంతకు మించిన ‘కాంటూర్ల’ కావలా?

అయినా ఇక్కడ ఓ మాట చెప్పాలి. ఇదంతా నా యాభైల తర్వాత మొదలయిది. 2006 తర్వాత విశాఖలో ఉన్నప్పుడు, మరోసారి బైబిల్ చదవడం మొదలెట్టాను. అప్పుడది పూర్తిగా మునుపటికి భిన్నంగా అర్ధంకావడం మొదలయింది. అదే కొన్ని వ్యాసాలుగా అప్పట్లో రాశాను. స్థల-కాలాల మధ్య నిలబడి చూడవలసిన అంతిమ అవసరం అప్పుడే స్పష్టమైంది. ఇప్పుడు నా స్టాండ్ ఏమిటో నాకు తెలుసు.   దాంతో కనిపిస్తున్న ప్రతిదీ (కనీసం) అర్ధమవుతున్నది. అది ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా,  అవసరం మేరకు తీసుకోవడం అనేది మనకుండే విచక్షణ.

మరి మనవద్ద మిమ్మల్ని అర్ధం చేసుకునేవారు ఉన్నారని మీరు అనుకుంటున్నారా?

అది మనకు సంబంధం లేని ప్రశ్న.

‘రాయడం’ నాకు తెలుసు. అయినా మన పని మనం చేసుకువెళుతూవుంటే… ఆ క్రమంలో అటువంటి వారు ఎప్పుడో ఒకసారి తారసపడతారేమో. ఆ కంటెంట్ జనానికి చేరే క్రమంలో మనం అర్ధమైన వాళ్ళు కూడా వుంటే వుండొచ్చు. అయినా ఒకటి రెండు స్వీయ అనుభవాలు చెప్పాలి.

విశాఖలో ఉండగా 2008 లో ఒకరోజు ఉదయం 10 గం. లకు ఆఫీస్ కు బయలుదేరి వెళుతుండగా కాళీపట్నం రామారావు గారు ఫోన్ చేసి ‘రామాటాకీస్ జంక్షన్లో ఉన్నాను, మీతో మాట్లాడాలి ‘అన్నారు. నేను అయన్నికలిసి పెద్దాయనతో రోడ్డు మీద ఏమి మాట్లాడతాం అని ;

‘మీ తర్వాత పని ఏమిటి?’  అడిగాను.

జగదాంబ వద్ద ఏదో పని వుందన్నారు, దానికి దగ్గర్లో జిల్లా కోర్టుల ముందు వున్న మా డిపీఅర్వో ఆఫీస్ కు తీసుకెళ్ళా. ఇద్దరం డిపీఅర్వో గదిలో కూర్చున్నాం.మమ్మల్ని చూసి ప్రెస్ లాంజ్ లో వున్న జగదీశ్వరరావు గారు (హిందూ) వచ్చారు. కాఫీలు అయ్యాక, ‘కారా’ – నేను ఇద్దరమే మిగిలాం.

‘ఒక విషయం మీతో చెప్పాలని వచ్చాను’ అని మొదలెట్టారు. ‘కన్ను సహకరించక అన్నీ చదవడంలేదు, కాని చదివే కొద్దివాటిలో మీవి వుంటాయి’ అన్నారు.

కాస్సేపు ఆగి – ‘ మీ చూపుకు పాదాభివందనం చేస్తున్నాను ’ అన్నారు. దానికి ముందు గాని దాని తర్వాత గాని ఇంకేమీ లేదు.

నేను నమస్కారం  చేశాను.

వస్తానని లేచారు. డ్రైవర్ ను ఇచ్చి దింపి రమ్మన్నాను.

ఎవరితో అన్లేదు.

అర్ధం కాలా.  వయస్సు సమస్య కావచ్చు అనుకుని, చానాళ్ళ తర్వాత  ‘కారా’ తో సాన్నిహిత్యం వున్న మిత్రుడు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారిని జరిగింది చెప్పకుండా అడిగాను,

‘….అది గాని  ఆయనకు ఊత పదమా? ’ అని. ‘ ఆయన అలాంటి మాటలు అనరు ’ అన్నారు తుమ్మేటి.  ఇది జరిగిన ఏడెనిమిది ఏళ్ల తర్వాత ఈ మధ్యనే నా భార్య కృష్ణవేణి కి జరిగింది  చెప్పాను.

మరో సంఘటన  –

విశాఖలోనే చలసాని ప్రసాద్ గారు పరిచయం. ఇద్దరి ఊళ్ళ మధ్య చుట్టరికం కలిసింది. 2014 చివర ఒక రోజు ఫోన్. ‘ఇప్పుడే ఈ షాపులో మీ ‘ సొంత సంతకం ’ పుస్తకం చూశాను. నాకు ఒక కాపీ పంపండి, ఫలానా మిత్రుడి ఇంట్లో దిగాను’ అని. పంపాను.

కొన్నాళ్ళకు బెజవాడ ఐ ఎం ఏ హల్లో జరిగిన ఓ సాహిత్య సభలో కలిసి పలకరించుకుంటూ టీ తాగాం, సభలో కూర్చున్నాం. ఇంతలో వర్షం.  మధ్యలో, అనుకోకుండా టాయ్ లెట్స్ వద్ద ఇద్దరమే కలిశాం. నా పుస్తకం గురించి ఆయన అక్కడ ప్రస్తావించారు! “చదివాను, వూ…రాయాలి… రాస్తేనేగా… తర్వాత వాళ్లకు తెలిసేది… “ అనుకుంటూ అక్కణ్ణించి నిష్క్రమించారు.

చిన్న నవ్వుతో జవాబు ఇచ్చాను.

johnson

మిమ్మల్ని ఎలా చూడాలని లేదా ఎలా అర్ధం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు?

 నన్ను వదిలేయండి.

నేను రాసిన నా రచనలు చూడండి. 2001 జనవరిలో విడుదల అయిన నా – ‘మన విజయవాడ లో (పేజి:48) –‘మన విజయవాడ కధను ఎక్కడ ముగించాలి?’ అంటూ… ‘ఈ నగర ఆత్మకధకు ఫుల్ స్టాప్ పెట్టడం కుదిరే పని కాదు, అంటూ ఇది 24X7 నగరం, ఇది ఒక రైల్వే ఫ్లాట్ ఫారం వంటిది, వూరంతా మత్తుగా జోగుతున్నప్పుడు ఏ నిశి రాత్రి లోనో – ఓ కొత్త రైలు రావొచ్చు, మళ్ళీ అప్పుడు యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటూ మరో కొత్త అధ్యాయం రాస్తాను. అయితే…రాబోయే కొత్త రైలు రాజధాని ఎక్స్ ప్రెస్సా?’  అని ముగించాను. మీకూ తెలుసు, అప్పటికి ‘టీఅరెస్స్’ ఇంకా పుట్టలేదు.

2001  నుంచి  రాసిన నా ‘సొంత సంతకం’ వ్యాసాలు చూడండి. అందులో – ప్రజలు,  ప్రాంతము, అని  ఏకంగా  రెండు అధ్యాయాలే వున్నాయి. 2010 తర్వాత విభజన జరిగే వరకు అటు వున్నాను, జరిగాక ఇటు వున్నాను. జరిగిన  వెంటనే – దేశం చూపు ఇప్పుడు ఎపి వైపు!’ అని రాశాను. మన విశాఖను అమెరికా స్మార్ట్ నగరం అంది! భారత్ – తన ఆగ్నేయ ఆసియా దేశాల సంబంధాల విస్తరణ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ‘షోకేస్’ చేస్తున్నది. ఆగ్నేయ ఆసియా దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు వచ్చి ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాయి.

మమతా బెనర్జీని ప్రధాని బంగ్లాదేష్ తీసుకు వెళ్ళడమైనా, శివరామ క్రిష్టన్ కమిటీ నివేదిక స్పూర్తి దెబ్బ తినకుండా, రాజధాని విషయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవను  కేంద్రం అనుమతించడమైనా – మునుపటి ఎల్లలు చెరుగుతున్న ‘ప్రాసెస్’ లో భాగం గానే చూడాలి.  అలా కాకుండా, మొదటినుంచీ మనకు తెలిసిన – ‘ఐదేళ్ళ ఎపిసోడ్ గా చూస్తే కన్ ప్యూజన్ తప్ప మరేమీ మిగలదు.

ఇప్పుడు కూడా  ‘ఆ… సి ఎం కోసమా ఇదంతా?’ అంటే , ఇంక చెప్పడానికేముంది.

ప్రభుత్వాలు వచ్చి పోతుంటాయి. కాని, రాజ్యం నికరం అనే ఎరుక కలిగివుండే స్థాయికి – ఇప్పటికీ మన మధ్య తరగతి కూడా రాకపోవడం ఇంక ఎంత మాత్రం మంచిది కాదు. అయితే, రాజ్యం పట్ల వారికి ఆ ఎరుక రాకుండా నిరంతరం నిఘాతో చూసే ప్రభుత్వ చతురతను అర్ధం చేసుకోలేకపోవడమే – ఇప్పటి విషాదమంతా. వాస్తవానికి, రాజ్యం అంతరిస్తుంది అనేది మనం చదివిన శాస్త్రం!

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్ల ప్రాసెస్ ను విస్మరించడం ఎలా కుదురుతుంది?

2016  నాటికి మన దేశంలో సంస్కరణలు మొదలై 25 ఏళ్ళు అయింది. ఇక్కడ్నించి ఒక పదేళ్ళు వెనక్కి వెళదాం. పోనీ మీ సౌలభ్యం కోసం 2004 నుంచి చూద్దాం, దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఎపి కి 22 సెజ్ (ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు)ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వాటిలో వరసగా పారిశ్రామిక వాడలు వస్తున్నాయి. వాటి రవాణా కోసం ఇప్పుడు ఇక అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి – విత్తనం చెడ్డదా లేక నేటి మొక్క, రేపటి చెట్టు చెడ్డవా? దీన్నే నేను కాలము-ప్రాంతము అంటున్నది. ఇప్పుడు మీరు మీ ఐదేళ్ళను ఎక్కడని వెతుకుతారు? దాన్ని ట్రేస్ చేయడం మీ వల్ల అవుతుందా?

 రిటైర్ అవుతున్నారు కనుక అవుట్ ఆఫ్ ఆఫీస్ ఇవన్నీ చెప్పారు, ఇక ముందు మీ ప్లాన్స్ ఏమిటి?

కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేశాను. చేస్తూనే సమాంతరంగా నాదంటూ ఒక చూపును స్వంతం చేసుకోగలిగాను. దాన్ని ఇప్పుడు మరింత స్వేచ్చగా అది తాకినంత మేర దిగంతాలకు సారించడానికి ప్రయత్నిస్తాను.

నా ఆలోచనలను రేపటి తరం గీటురాయి మీద చూసుకోవడానికి ఇంట్లోనే నాకు ఒక లగ్జరీ కుదిరింది! కూతురు అల్లుడు ఆర్ధిక శాస్త్రవేత్తలు. కొడుకు సామాజిక శాస్త్రవేత్త. రేపు కోడలుగా ఏదో ఒక సామాజిక రంగ నిపుణురాలే రావచ్చు. మా అందరికీ ఆక్సిజన్ మా హోం మేకర్ కృష్ణవేణి. విస్తృత  ఎరీనా లో ఇకముందు ఇది ఫ్యామిలీ మిషన్!!

*

 

 

 

సరళత్వమే మహాస్వప్నం: మైథిలి

Mythili1

ఒక వాక్యం వెంట మరొక వాక్యం…  ఆర్ద్ర మేఘాల వలె కమ్ముకుంటాయి. చదువుతూ ఉండగానే ఎప్పటి నుంచో స్పందన లేని గుండెల లోపల చిన్న తుంపర మొదలవుతుంది. ఆ పై మనసారా తడిసి ముద్దయ్యి చినుకు చినుకునీ ఆస్వాదించి ఆ సంతోషాన్నీ, ఆ సంతోషాన్నిచ్చిన సాహిత్యాన్నీ ప్రపంచానికి పంచే పనిలో ‘నిమగ్న‘మైపోతాం, ఉప్పొంగే మనసులమైపోతాం! కాస్త చదివాక ఆ మాధుర్యం అర్ధమైపోతుంది, ఇక ఆ వాక్యాన్ని అలా కాక మరొకలా ఊహించలేము,  ఇది ఇలానే పలుకుతుందని తెలిసిపోతుంది. ఇన్నాళ్ళూ అతి సహజంగా మన ముందు నుంచీ దాటిపోయిన విషయాలే .. ఒక ప్రత్యేకమైన శైలిలో, ఆసాంతం కనుబొమ్మలెత్తుకొని చదివేలా వ్రాస్తారు ఈమె! 

    తెలుసుకున్నదీ, చదివినదీ, విన్నదీ అలానే కాగితం మీద కుమ్మరించేయరు .. పూర్తిగా తనలోకి తీసుకున్నాక తాను అనుభూతి చెంది గీసిన  పెయింటింగ్ తెచ్చి వ్యాసంగానో  అనువాదంగానో  కథగానో మన ముందు ఉంచుతారు.  మన లోపల ఉండిన మునుపటి జ్ఞానమేదో అందంగా ఇప్పుడు ఈ అక్షరాల భావంలోకి, ఈ భాషలోకి, తర్జుమా అయి  తెలుస్తుంది… లో లోనే !!

mythili2

   ఏమిటి పట్టి లాగుతుంది ముందుగా దూరం నుంచే.. అక్కడ మెరిసే ‘టైటిల్స్’ ! అదేమిటి … ‘గాజుకెరటాల’ మీద ప్రతిఫలించే వెన్నెలేమిటి? ‘నక్షత్రధూళి’ మీద నీరెండ అందమేమిటి? ‘ఈ లోకపు పొలిమేరలు ‘ .. ‘కొంచం విచ్చిన కిటికీ ‘, ‘పన్నెండు రూపాల ప్రేమ’, ‘నీలిపూల రహస్యం’ ఇలా ఈ టైటిల్స్ చూడగానే  మోహన మేలుకుంటుంది పెదవులపై చిరునవ్వై !  ‘క్షీర సాగరం’, ‘పత్రహరితం ‘ , ‘మహా శ్వేత’, ‘నియతి’ వంటి కథలూ..  అందులోని పాత్రలు, పరిసరాలూ ఎప్పటికైనా మరచిపోగలమా ! ఈ మధ్య వచ్చిన ‘రాజహంస’ , ‘ద్వారబంధం’, ‘సంజీవరాయడు’ కథలు పరిమళం వీడని పూర్వజన్మపు అత్తరులలోనో  లేక నిజానికీ, ఊహకీ మధ్య కనబడని సన్నటి గీత మీదనో  నిలబడిపోయిన నేపథ్యాల నడుమ సాగుతాయి. 

    గడిచిన మూడేళ్ళలో వచ్చిన సాహిత్య వ్యాసాలనూ ఫేస్ బుక్ నోట్స్ నూ కలిపి ఇటీవలే చినుకు పబ్లికేషన్స్ వారు ‘నిమగ్న’ సంకలనాన్ని తీసుకువచ్చారు. ‘సారంగ’ సాహిత్య వారపత్రిక, ‘వాకిలి’ సాహిత్య మాసపత్రికలకు తరచుగా రాస్తూ, అంతర్జాలం గ్రూపు ‘సాహిత్యం’ అడ్మిన్ గా వ్యవహరిస్తూ, బాధ్యతగల డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ జీవనోత్సాహానికి ఉదాహరణగా విరగబూస్తున్న ఈ వయొలెట్ పూల తోటతో ముఖాముఖి ..

peepal-leaves-2013

 1. 2013 కి ముందు మీరు దాదాపుగా ఎవరికీ తెలియదు. ఎందుకని రాయటం మొదలు పెట్టారు?  రాసి ఉండకపోయినా కూడా comfortable  గానే ఉండి ఉండేవారా ?

ప్రాథమికంగానూ ప్రధానంగానూ నేను చదువరిని. వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ప్రశ్న ఒకటి నా చేత మొదటి కథ ‘నియతి’ ని రాయించింది, 2001 లో. ఆవిడే ఫెయిర్ చేసి పంపారు. [ నియతి తెలుగు యూనివర్సిటీ వాళ్ళ ‘ తెలుగు కథ 2001’ లో కూడా వచ్చింది.]  తర్వాత 2003 లో ‘పత్రహరితం’. రెండూ వార్త ఆదివారం సంచికలలో వచ్చాయి. అప్పటి ఎడిటర్ గుడిపాటి గారు చాలా సార్లు రాయమని అడిగినా, చెప్పవలసినది ఉందనిపించక రాయలేదు. పిల్లలు పై చదువులకి వెళ్ళాక దిగులేసి ఫేస్ బుక్ లో చేరాను. 2013  లో శ్రీవల్లీ రాధిక గారు అంతర్జాలంలోని  సాహిత్య సమూహాలకి నన్ను పరిచయం చేశారు. అప్పుడే ‘ నిమగ్న’ అనే బ్లాగ్ తెరిచి చిన్న వ్యాసం రాశాను అందులో. రెండో రోజుకి అఫ్సర్ గారు నాకు మేసేజ్ ఇచ్చారు – సారంగ కి ఏమైనా రాయమని. ‘కౌమారపు పూల తోట’ నా మొదటి వ్యాసం అందులో. ఆ రకంగా  పత్రికలకు  రాయటం మొదలుపెట్టించినదీ అఫ్సర్ గారే. వాకిలి ఎడిటర్ లలో ఒకరైన  రవి వీరెల్లి గారు బోలెడంత స్వేచ్ఛని ఇచ్చారు. ఫేస్ బుక్ లో – అనిపించేవి మిత్రులతో పంచుకోవటం లోని ఆనందం గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చేది, ఇప్పటికీ ఇస్తోంది.

రాయకపోయినా కూడా హాయిగానే ఉండి ఉండేదాన్నేమో , అన్నాళ్ళూ ఉన్నానుగా [నవ్వు] మరిన్ని పుస్తకాలు చదువుకునేదాన్ని.

 1. మీ నేపథ్యం ఏమిటి? చదవటాన్ని ఎవరు ప్రోత్సహించారు?

మా నాన్నగారు గవర్న్ మెంట్ డాక్టర్. తీరిక ఉన్నప్పుడు హాయిగా తెలుగు నవలలు చదువుతుండేవారు. అమ్మ తెలుగు మెయిన్ గా బి.ఏ చేశారు . ఆవిడ బాగా ఎక్కువగా, వేగంగా చదివేవారు. మా అత్త కథలు చదివి చెప్తుండేది. ఉన్న కథలని ఇంకాస్త పొడిగించి, మార్చి చెప్పేది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు – పిల్లల పత్రికలన్నీ కొనేవారు. టాగూర్ నవలల అనువాదాలన్నీ జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు వేసేవారు అప్పుడు – అవన్నీ అమ్మమ్మ సంతోషంగా కొనిపెట్టేవారు. పన్నెండేళ్ళు నిండేప్పటికి అవన్నీ అయిపోయాయి, అర్థమైనా కాకపోయినా.  తర్వాతి రోజుల్లో ఏది దొరికితే అది చదివాను – ఎవరూ అడ్డు పెట్టేవారు కారు. విద్యాగంధం ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అప్పుడు అలాగే ఉండేవి.

 1. వ్యాసం, అనువాదం, కథ – మూడిట్లో ఏది ఎక్కువ ఇష్టం? ఏది ఎక్కువ కష్టం? భవిష్యత్తులో నవలేదైనా రాస్తారా?

అన్నీ ఇష్టంగానే రాస్తాను. అనువాదం తేలిక. నోట్స్ అలవోకగా వస్తాయి గాని వ్యాసాలకి చాలా చదవాలి. ముందు తెలిసిన సమాచారాన్నే అయినా కొత్తగా చదవకపోతే ఒక పద్ధతిలో పెట్టలేము. వాకిలి లో పెద్ద వ్యాసాలు రాసేప్పుడు శ్రమ పడి  చదవవలసి వచ్చేది… మొదటి వారం అవుతూనే తర్వాతి నెల కోసం. కథని వీలైనంతగా చెక్కుకోవాలి కనుక అది మరొకలాగా కష్టం. అయితే  – ఇవాళ్టికీ కథ వల్ల వచ్చే ప్రతిష్టే ఎక్కువ. It is the most rewarding of the three.

చిన్నప్పుడంతా చాలా నవలలకి plots ఉండేవి బుర్రలో – మెడిసిన్ చదివేప్పుడు కూడా. ఇప్పటికైతే నవల రాసే శక్తి లేదు.

 1. కుందమాలలో రాముడు, అభిజ్ఞాన శాకుంతలంలో ‘దుష్యంతుడు’, నర్తనశాల వ్యాసంలో ‘కీచకుడు ‘ .. ఇలా కథా[ప్రతి] నాయకులు కన్నీరు పెట్టుకొని పశ్చాత్తాప పడే అరుదైన అంశాల పై మిమ్మల్ని వ్యాసాలు వ్రాసేందుకు ప్రేరేపించినవి ఏవి ?

ఏటవాలు చూపు ఒకటి ఉంటుందని మొదట చెప్పినవారు జలంధర గారు. ఆ దృష్టిని అతి సమగ్రంగా దర్శించినది విశ్వనాథ లో.

 1. విశ్వనాథ రచనల్లో మిమ్మల్ని బాగా కదిలించినది యేది? నేటి సమాజానికి ఆయన రచనలు ఎలా relevant అవుతాయో చెబుతారా?   

ఆయన రాసిన అన్ని నవలలూ నాటకాలూ గొప్పగానే ఉంటాయి. చదవకపోతే ఎంత నష్టపోతామన్న దానికి కొలత లేదు నిజంగా. ఆ భాష మొదట్లో కొంచెం బెదరగొట్టేమాట నిజమే, కాని ఆయన ఏ మాత్రం భయపడవలసిన వారు కారు. ఒక రచన లోనే మూడు నాలుగు perspectives చూపిస్తారు – ఒకటే ఒప్పుకు తీరాలని అన్నదెప్పుడని, పాపం?  దేన్నీ ఒప్పుకోకుండానే ఆయన శతధా దర్శించిన ప్రపంచాన్ని మనమూ  దర్శించి రావచ్చు, ఇంకాస్త అర్థవంతంగా జీవించవచ్చు.

mythili1

 1. మీరు విశ్వనాథతో పాటు చలాన్నీ బాగా చదివారు కదా? ఆయన రచనలకి relevance ఉందా ఇప్పుడు ? మీ పైన ఆయన ప్రభావం ఉందా?

ఎప్పటికీ ఉంటుంది.  నిజాయితీ, నాగరికమైన ప్రవర్తన, సౌందర్యదృష్టి – ఎప్పటికీ ఆయన నుంచి నేర్చుకోవచ్చు.   నన్ను చలం ఎంత మలిచారంటే ఆ మధ్యన మా అబ్బాయి మ్యూజింగ్స్ చదువుతూ ఆ thought process  లో చాలా చోట్ల నన్ను గుర్తు పట్టాడు.

 1. తెలుగులో మిమ్మల్ని ప్రభావితులను చేసిన వేరే రచయితలు ఎవరు ?

కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన విశ్లేషణ అద్భుతం గా ఉంటుంది. ”మనిషి కష్టాలు పడచ్చు గాని రొష్టు పడకూడదు” – అంటారు ఒక చోట. ఊరికే verbal contrast  కోసం అన్న మాటలు కావు – అవి  అర్థమైతే జీవితం  తేలికయిపోతుంది. మునిపల్లె రాజు గారు, ఇచ్ఛాపురపు జగన్నాథ రావు గారు, కల్యాణ సుందరీ జగన్నాథ్ గారు , మాలతీ చందూర్ గారు,  ఇష్టం. – ఇంకొంచెం పక్కకి వస్తే భరాగో, జ్యేష్ట, అవసరాల రామకృష్ణారావు గారు  – వీళ్ళ కథలూ  నచ్చుతాయి.  చాలా ముఖ్యంగా యద్దనపూడి సులోచనారాణి గారు. ఎందుకో సరిగా తెలియకుండానే పదే పదే చదివినవారు లత, చండీదాస్.

 1. ఆంగ్ల రచయితల జీవిత దృక్పథానికీ, మన తెలుగు లేదా భారతీయ రచయితల జీవిత దృక్పథానికీ యేదైనా తేడా మీరు గమనించారా? మీకు బాగా నచ్చిన ఆంగ్ల రచయిత లు ఎవరు?

దేశ కాలాల హద్దులని మినహాయిస్తే అక్కడ నాకు మన సాహిత్యంతో వైరుధ్యాలు తట్టలేదు. George Eliot చాలా సంపన్నమైన రచన చేశారు. ఆమెని చదువుతుంటే చాలాసార్లు విశ్వనాథ గుర్తొస్తారు. Late Victorian యుగం వరకూ వచ్చిన ఆంగ్ల సాహిత్యాన్నే ఎక్కువ చదివాను,  అందువల్ల కూడా నాకు ఎక్కువ తేడా కనిపించకపోయి ఉండవచ్చు.   Wilkie Collins, F.H.Burnett,  Jules Verne , Henrik Ibsen , Oscar Wilde,  Ayn Rand,  Agatha Christie   –  అలా ఒకరితో ఒకరికి పొంతన లేని రచయితలుంటారు నా జాబితా లో. [నవ్వు]  Jane Austen  గురించి పెద్ద వ్యాసమే రాసుకున్నాను కదా .  L.M.Montgomery నుంచి ఎంతో నేర్చుకున్నాను .  British horror , Gothic  genres చాలా ఆకర్షిస్తాయి . Fantasy  ఎక్కువ చదువుతున్నాను ఇప్పుడు- వారిలో Patricia A Mckillip అతి రమ్యంగా రాస్తారు….

 1. . మీ శైలి ఆపకుండా చదివిస్తుంది, దాని వెనక రహస్యం ఏమిటి? మీ వచనంకవిత్వానికి అతి దగ్గరగా – ఉంటుంది, మీకు టక్కున గుర్తొచ్చే కవి – కవిత గురించి .. ?

అవునా – పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేదాన్ని – అందుకేమో మరి. జేన్ ఆస్టిన్ ఒకచోట అన్నారు, ఉత్తరాలకీ వచనం రాయటానికీ సంబంధం ఉందని. నిజానికి నేను మరీ ఎక్కువ కవిత్వం చదువుకోలేదు. వెంటనే స్ఫురించే వాక్యాలు ఇవి.”Charm’d magic casements, opening on the foam Of perilous seas, in faery lands forlorn’’  కృష్ణశాస్త్రి గారు నాకు కవిత్వంలో గొప్ప. లిరిక్ శిల్పం అని ఒక వ్యాసం లో ఆ Keats మాటలని పరిచయం చేస్తే వెతుక్కుని చదివాను. గాజు కెరటాల వెన్నెలా జాజిపువ్వుల అత్తరు దీపాలూ – తిలక్ పదబంధాలు నోట్లో ఆడుతుంటాయి. టాగూర్ మాటలు-  Much have you given to me, Yet I ask for more …. not for the gift of love, but for the lover himself.

 1. మీ అనువాదాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అనువాదాల్లా కాక స్వతంత్ర రచనల్లాగా అనిపిస్తాయి.ఎలా వీలయింది అది ?

మాటకి మాట గా అనువదించకుండా భావాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాను. తెలుగులో సమానార్థకాలు ఉన్నాయేమో వెతుక్కుంటాను, కొద్దిగా స్వేచ్ఛ తీసుకుంటాను. నండూరి రామమోహనరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు చేసిన అనువాదాలు నాకు ప్రేరణ. పిల్లల కథలని అనువదించేప్పుడైతే రష్యన్ అనువాదాలు స్ఫురిస్తుండేవి. చందమామ లో కొకు వాడిన పదాలు – చావడి, వసారా – ఇలాంటివి గుర్తొచ్చేవి. ఆయన ఎన్నో జానపద కథలని తిరగరాశారు – కొన్ని రోజుల కిందట, Irish folk and fairy tales omnibus  తిరగేస్తుంటే కొకు వాటిలో కొన్నిటిని  adapt  చేశారని అర్థమై గొప్ప ఆశ్చర్యం వేసింది.

 1. . పిల్లల సాహిత్యం పెద్దవారికి కూడా అవసరమేనా ?

ఆ మధ్య చదివాను – ఎవరో అమ్మాయి research చేస్తూన్న అంశం ఇది – ‘’ పిల్లల సాహిత్యాన్ని చదవటం వల్ల పెద్దవారిలో depression తగ్గుతోంది.  చాలా సంక్లిష్టతలలో చిక్కుబడిపోతున్నాం – సరళంగా ఎలా ఆలోచించాలో బాల సాహిత్యం చెప్తుంది అని నేను అనుకుంటాను. అందుకు నిదర్శనం ఎదురుగానే ఉంది – ‘గ్రీన్ గేబుల్స్ లో ఆన్’ అంటే ఫేస్ బుక్ లో అందరికీ ప్రేమే కదా!  Young  adult fiction నే కాదు, 9-11 ఏళ్ళ పిల్లల పుస్తకాలు కూడా చదువుతూనే ఉంటాను.

 1. మీ కథల్లోని వ్యక్తులకు క్షమించడం లేదా పూర్తిగా ( unconditional గా) ప్రేమించడం మాత్రమే తెలుసు, అలా నిజ జీవితంలో సాధ్యమేనా?  మీ కథల్లో పాత్రలకీ మీకూ ముడులేమైనా ఉన్నాయా ?

క్షమించటం, ప్రేమించటం అవతలివారి కోసం కాదు, మన కోసమే. ఎందుకు సాధ్యం కాదు – నేను రాసినవారి కన్నా గొప్పమనుషులు ఉన్నారు, నేను చూశాను. వాళ్ళు  ఉత్తినే, ఉట్టుట్టి – త్యాగాలు చేయరు – ఏది ఎందుకో తెలిసే చేస్తారు… నిజమైన తెలివి అది. ఉత్తమమైనదానినే ప్రతిపాదించే ప్రయత్నం సాహిత్యపు బాధ్యత అని నేను నమ్ముతాను.

కొన్ని కొన్ని ముడులు తప్పకుండా ఉంటాయి, రచయిత తన ప్రాణంలో ఒక భాగాన్ని రాసేదానిలో తప్పకుండా నిక్షేపిస్తారు. కాని మొత్తంగా నిజం ఏదీ ఉండదు, వేర్వేరు నిజాలు ఒక ధారగా కలుస్తుంటాయి కూడా.

 1. మూడుదశలు గా వచ్చాయి మీ ఏడు కథలూ. మీలో మీరు గమనించినదేమిటి ? ఆఖరి మూడింటిలోsupernatural elements ని ఎందుకు తీసుకున్నారు? ఇక మీదటా అటువంటివే రాస్తారా?

మొదటి రెండు కథలూ రాశాక తర్వాతి రెండూ పదేళ్ళ తర్వాత వచ్చాయి – ఆ లోపు ఖచ్చితంగా నాకు చాలా సందేహాలకి జవాబులు దొరికాయి. ఇటీవలి మూడు – బహుశా ప్రశ్నలు అంతమవటం వల్ల వాస్తవాన్ని దాటి వెళ్ళాలనిపించిందేమో. ఇక ముందు – చెప్పలేను. తెలుగులో కూడా genre fiction రావలసిన అవసరమైతే ఉంది.

 1. రచయిత తన రచనల్లో తప్పనిసరిగా ఏదైనా సందేశాన్ని ఇవ్వాలని మీరు భావిస్తారా? రచన సూటిగా చదువరులపైకి దూసుకురావాలా? లేక ఆలోచించి సారాన్ని తెలుసుకునేలా ఉండాలా?

అదంతా రచయిత ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. చదువరులంతా కూడా ఒకేలాగా ఉండరు – కొందరు పాఠకులకి గోరు ముద్దలు రుచిస్తాయి, ఇంకొందరికి విద్వదౌషధాలు కావాలి. ఏమైనా, ఎలాగైనా చెప్పండి – అయోమయపు చీకట్లో వదలకూడదు. రచయిత బుర్రకి ప్రపంచం అంత కల్లోలంగా తోస్తోంది కనుక, దాన్నంతా,  అలాగే – రాసేసే హక్కు ఉంటుందనుకోను.

at-home

15 . మీ దృక్పథం ఏమిటి? దేన్ని సమర్థిస్తారు?

నేను ఆశావాదిని, స్వాప్నికురాలిని.  కుటుంబానికి సంబంధించి సంప్రదాయవాదిని. కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని నమ్ముతాను.సామాజికంగానో , స్త్రీ ని అవటం వల్లనో  నేను వ్యక్తిగతంగా వివక్షకి గురి కాలేదు –  బ్రహ్మ సమాజపు, వైష్ణవపు నేపథ్యాలు చాలా కల్మషాలను మా ఇంటికి దూరానే ఆపేశాయి. కాని ఎన్నెన్ని అపరాధాలు జరిగిపోయాయో నాకు  అవగాహన ఉంది.

ఏ అస్తిత్వ వాదాల పైనా నాకు ద్వేషం గానీ అయిష్టం గానీ లేదు. అన్ని వైపులా నాకు స్నేహితులు ఉన్నారు.  పడినవారికి అడిగే హక్కు ఉంది- కాని ఎవరి తప్పులకి ఎవరిని నిందిస్తామో కూడా ఆలోచించుకోవాలి… మన దేశంలో ప్రతి సామాజిక వర్గానికీ తన సొంత సంస్కృతి ఉంటుంది, దాన్ని గర్వంగానే తలచుకోవాలని నేను అనుకుంటాను. ఒకరి పట్ల ఒకరు కొత్త తప్పులు చేసుకోకూడదనిపిస్తుంది. మనిషికీ మనిషికీ మధ్యన వైవాహిక బంధుత్వాలే కాదు, ఇంకా చాలా ఉంటాయి-  ఉండచ్చు, నాకు తెలిసి.

 1. ‘పాఠకుడుఅంత లోతైన భాష చదివేందుకు సిద్ధంగా ఉండడు, కనుక వాడుక భాషలోనే రచన చేయాలి’ ఈ అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తారా? మీ రచనలు చదవడానికి పాఠకుడికి కాస్త లోతైన భాష తెలిసి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని మీరెలా స్వీకరిస్తారు?

వినయం గానే స్వీకరిస్తాను. అయితే ఒక్క మాట చెప్పాలి ఇక్కడ – మనకి తెలిసిన భాష లోనే చదువుతామని భీష్మించుకుంటే కొత్త మాటలూ కొత్త ప్రయోగాలూ తెలియవు. భాష పుష్టిగా అవదు. ఏది వాడుక భాష అనేది మరొక ప్రశ్న-  ఒక జిల్లా వాడుక భాష మరొకరికి కష్టంగా తోస్తుంది – చదవటం మానేయకూడదు కదా? మాది గుంటూరే గాని మా గోఖలే గారు రాసిన గుంటూరు మాండలికం మా ఇంట్లో మాట్లాడము – చదువుకోలేదా ?  నిన్న మొన్నటి  ‘గోపల్లె’ లో తమిళనాటి తెలుగు సొగసు మాట, మరి? తెలంగాణా, రాయల సీమ మాండలికాలు నేను ఇష్టంగా చదువుతాను. ఉత్తరాంధ్ర ది కొంచెం కష్టమనిపిస్తుంది గాని ప్రయత్నిస్తుంటాను. నా వరకూ వస్తువుని బట్టి రాసే భాష అప్రయత్నంగా మారిపోతుంటుంది.

17 .  ఎందరో ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగిన ప్రశ్న  “వృత్తికీ – ప్రవృత్తికీ, కాస్త సొంతానికీ”  సమయాన్ని ఎలా సంతులనం చేయగలుగుతున్నారు?

కాస్త కాదు, అంతా సొంతమే [నవ్వు]. ఇరవై ఏళ్ళకి పైబడి ఇంచుమించు నిర్విరామంగా ప్రాక్టీస్ చేశాను, అప్పుడు కూడా రాత్రి  ఒంటిగంట వరకూ చదువుకుని సర్జరీ పేషెంట్స్ ని మళ్ళీ చూసి నిద్రపోయేదాన్ని.  మా అమ్మ, మా వారు – ఇద్దరూ నాకు చాలా వెసులుబాటు ఇచ్చారు. నా పుస్తకాన్ని అందుకనే ఆ ఇద్దరికీ అంకితం ఇచ్చాను. ఇప్పుడు నేను semi retired, కావలసినంత తీరిక. అంతా కలిసే ఉంటాము,  పిల్లలిద్దరూ బాగా చదువుతారు- కొత్త ఉత్సాహం.

   ( శ్రీ వంకాయల శివరామకృష్ణారావు గారి సహకారంతో)

[ డా. మైథిలి అబ్బరాజు గారి సారస్వత వ్యాసాల సంపుటం ‘ నిమగ్న’ కినిగె లో దొరుకుతుంది.

లింక్ : http://kinige.com/kbook.php?id=7411  ,  విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్ కాచిగూడ లలో కూడా ]

 

 

 

 

 

 

 

 

 

అనిర్దేశిత లక్ష్యమే నా గమ్యం!

geeta2

పసుపులేటి  గీతతో  అక్బర్  మాటామంతీ 

 

అక్బర్: శ్రీకాళహస్తి నుంచి హైదరబాదుకు ఆరువందల మైళ్ళ దూరం ప్రయాణం,పాతికేళ్ళ జర్నలిజం, కవిత్వం, కథారచన,పన్నెండు పుస్తకాల అనువాదం…..,యిప్పుడిక అన్నీ వదిలి బొమ్మల్లోకి యెందుకు అడుగు పెట్టారు?

పసుపులేటి  గీత: కవిత్వం రాయక  ముందే నేను బొమ్మలు గీసాను. ఆరేడేళ్ళ వయసు నుంచే నేను బొమ్మలు గీసేదాన్ని. బొమ్మలంటే నాకు అప్పుడు చాలా యిష్టంగా వేసుకొనేదాన్ని. కాని మా నాన్న గారికి సాహిత్యమంటనేే మక్కువ. నాకు నాన్న అంటే  ప్రాణం. అందుకే ఆయన కోసం నా యిష్టాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత నాన్నగారి యిష్టం ప్రకారమే జర్నలిజంలోకి ప్రవేశించాను. వుద్యోగ జీవితం మొదలయ్యాక నా సమయాన్ని, శక్తిని రచన కొసమే వెచ్చించాను. యీ సంగతి నీకు కూడా తెలుసు కదా!
అసలు మనిద్దరి పరిచయానికి,పెళ్ళికి  యీ యిష్టాలు కలవడమే కదా కారణం.

అక్బర్: నేను పరిచయం అయ్యాక కూడ నీ శ్రధ్ధాశక్తులు సాహిత్యం వైపే యెక్కువగా వుండేవి. నేను బొమ్మలు వేస్తుంటే తూనీగలాగ నా చుట్టూ తిరగడమే కాని కుదురుగా కూర్చొని వొక బొమ్మైనా వేసావా?

గీత: నిజమే, నువ్వు బొమ్మ వేస్తుంటే తపస్సు చేస్తున్నట్టే వుంటుంది. నిన్ను అలా చూడటం నాకు చాలా యిష్టం.
నువ్వు బొమ్మలు వేస్తుంటే నేను వేస్తున్నటే ఫీల్ అయ్యేదాన్ని.

అక్బర్‌ : నీకు చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడమంటే చాల యిష్టం కదా, నిన్ను యెవరు యెంకరేజ్ చేయలేదా?

గీత: ఊఁ ..హు యింట్లో అలాంటి వాతావరణం వుండేది కాదు. పైగా మా వూర్లో చిత్రలేఖనానికి సంబంధించిన సామాగ్రి లభించేది కాదు.వాటి పట్ల అవగాహన కూడా లేదు. పెన్సిళ్ళు, డ్రాయింగ్ షీట్లు మాత్రమే దొరికేవి. చూసిందానినంతా అచ్చుగుద్దినట్టు గీసేయాలన్నంతా ఆతృత. వుదయాన్నే నిద్రలేచినప్పటి నుంచి నిద్దురపోయేంత వరకు అదే పని. సెలవు రోజుల్లో కూడా యెక్కడికి వెళ్లేదాన్ని కాదు. అందుకేనేమో నాన్నగారు నాకు బాగా అరిచేవారు. దాంతో ఆయనకు యీ పని అస్సలు యిష్టం లేదేమోనని నెమ్మదిగా బొమ్మలు గీయటం తగ్గించేసాను. గంటల కొద్ది పుస్తకాలు చదివితే తిట్టని ఆయన బొమ్మలు గీస్తే మాత్రం కోపగించుకొనేవారు.యిదే ఆయన మీద ఫిర్యాదు కాదు.అలా యెందుకు కోప్పడేవారో యిప్పటికి నాకు అర్థం కాక పోవడం బాధగానే వుంది.

అక్బర్:
జర్నలిజం,కవిత్వం,కథ…..యిప్పుడు చిత్రకళ,దీని తరువాత యింకా  యే యే కళారూపాలు నీలో దాగున్నాయో ?

గీత: నేను యెప్పుడూ జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. యేది ముందే అనుకొని చేయలేదు. కవిత్వం రాయలనుకొని రాయలేదు. బాల్యంలో చదివిన రష్యన్,మార్క్సిస్టు లిటరేచరే నన్ను సాహిత్యం వైపు నడిపించింది.యిప్పుడిక బొమ్మలంటావా, ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరు అవుతారట, నువ్వు, నేనవడం లేదు కాబట్టి. నేనే నువ్వవుతున్నాను…అ హ్హా.హా…బొమ్మల తరువాత యేమిటీ అంటే యేమో నాకేం తెలుసు. అన్నీ వదిలేసి చటుక్కున మాయమైపోతానేమో..

geeta3

అక్బర్‌ : వేదాంతం చాలు గాని, యిప్పుడు జంతువులను వేస్తున్నావు కదా, యిదే సబ్జెక్టుగా యెంచుకోవడానికి గల కారణమేమిటి?

గీత: నాకు జంతువులంటే గౌరవం. ప్రకృతి వైవిధ్యాన్ని ప్రసాదించినట్టే, యేకరూపతను కూడా ప్రసాదించింది. యే జంతువు తన జాతిలో మిగతా జంతువుల కంటే భిన్నంగా వుండాలని, కనిపించాలని కోరుకోదు.కాని మనిషి మాత్రమే యిలా కోరుకుంటాడు. జంతువులలోని యీ లక్షణం నాకు గొప్పగా కనిపిస్తుంది. అందుకే నేను యీ సబ్జెక్టును యెంచుకొన్నాను.

అక్బర్ : నీకు అందులో యే ప్రక్రియ, యే మాధ్యమం అంటే యిష్టం?

గీత: నాకు యింక్ డ్రాయింగు అంటే చాలా యిష్టం. చార్కోల్, వాటర్ కలర్స్, ఆక్రిలిక్ రంగులతో పైంట్ చేయడమన్నా యిష్టమే. నేనిప్పుడు వేస్తున్న యానిమల్స్ సీరీస్ లో ఆక్రలిక్ పైంటింగ్ తో పాటు, యింక్ డ్రాయింగ్స్‌ కూడా వేస్తున్నాను.

అక్బర్ : నీకు యిష్టమైన చిత్రకారులెవరూ…..నేను కాకుండా ఆ..హ్హా..హా..?

గీత: ఫ్రాన్సిస్ బెకన్, యిగోన్ షీలే, పియెట్ మాండ్రియన్, వాంగోలతో పాటు యిప్పటి నాడియా టొనాజ్జో, బెక్సిన్ స్కీ, జిస్తావ్, వికం షిలేగల్ లు, మన వడ్డాది పాపయ్య కూడా బాగా యిష్టం.

geeta1

అక్బర్: పెయింటింగ్ లో  ముందు ముందు యింకా యేం యేం చేయాలనుకొంటున్నావు?

గీత: ముఖ్యంగా సోలో షో చేయాలని వుంది. దాని కన్నా ముందు కొన్ని గ్రూప్ షోలు, అందులో క్యాంప్ లలో పాల్గొనాల్సి వుంది.

అక్బర్ : నీ కవిత్వంలో, కథల్లో సామాజిక దృక్కోణం వుంటుంది ,కాని బొమ్మలు అందుకు కొంత భిన్నంగా వున్నాయి, కారణం?

గీత: నేను సీరియస్ గా చెప్పదల్చుకొన్న విషయాన్ని సూటిగా వ్యక్తీకరించేందుకు కవితలు,కథలు రాసాను. బొమ్మల విషయానికి వస్తే అవి నన్ను పాజిటివ్ గా రెజువెనేట్ చేసుకొనేందుకు వొక మార్గం. కాబట్టే యీ తేడా.

అక్బర్:  కవితా సంకలనం, ఆర్ట్ షోలు యెప్పుడు చూడవచ్చు?

గీత: త్వరలో నా రెండో కవితా సంకలనాన్ని తెస్తాను. కథల అచ్చుకు కొంత సమయం పట్టవచ్చును.

*

కాన్వాస్ పై కాంతి పుంజం- అరుణా రావ్

 

                                                        Aruna (2)             

‘సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్య’మన్న కొడవటిగంటి కుటుంబరావు ఆమె మాతామహులు. సాహిత్యం సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో ఉండాలని భావించి అత్యంత సరళమైన భాషలో తన అనువాదాలు సాగిస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా అనేక పురస్కారాలు పొందిన శాంత సుందరి రామ వరపు ఆమె తల్లి. అదే ఒరవడిని కొన సాగిస్తూ మానవ జీవితం గురించి చెప్పే ప్రకృతి దృశ్యాలనెన్నుకుని, ఆ వెలుగు నీడల్లో కెమెరా పట్టుకోలేని రంగుల్ని నేర్పుగా పట్టుకుని, సమ్మోహకంగా కాన్వాస్ మీద ఆవిష్కరిస్తున్న అరుణారావ్ తో ముఖాముఖి, ‘సారంగ’ పాఠకుల కోసం.

* అరుణా! అంతర్జాలం లో తెలుగు సాహిత్యానికి వేదికగా నిలుస్తున్న సారంగ పత్రిక కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఒక గొప్ప సాహిత్య వాతావరణంలో పుట్టి పెరిగిన మీలో చిత్రలేఖనం మీద ఆసక్తి ఎలా వచ్చింది? ఆ ఆసక్తిని మీరే వయసులో గుర్తించారు?

అరుణ: చిన్నతనం నుంచి సహజంగానే బొమ్మలు వెయ్యటం లో ఆసక్తి ఉండేది. కానీ పాశ్చాత్య చిత్రకళ వైపు మొగ్గటానికి ఫ్రెంచ్ ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్స్ గురించిన పుస్తకాలు చదవటమే ముఖ్యమైన కారణం. కాలేజీలో చదువుతున్నప్పుడు వాన్ గో, డేగాస్, మోనే లాంటి గొప్ప చిత్రకారుల జీవితాల గురించి చదివే అవకాశం లభించింది. వాన్ గో జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన ‘లస్ట్ ఫర్  లైఫ్ ‘ అనే నవల అప్పట్లో నామీద గొప్ప ప్రభావాన్ని చూపింది. పాశ్చాత్య కళ పట్ల నాకున్న ఆసక్తికి అది  ఆజ్యం పోసింది. పదో ఏటినుంచే నాకు నచ్చిన ఏ బొమ్మ ఎక్కడ కనిపించినా దాన్ని చిత్రించేదాన్ని.

* Modernism, Impressionism, Expressionism, Cubism, Surrealism ఇలా ఎన్నో రకాల శైలులున్నాయి కదా చిత్రకళా రంగంలో? రియలిస్టిక్ పెయింటింగ్ నే మీరు ఎంచుకోవడానికి కారణం?

అరుణ: ఏదైనా ఒక శైలిని ఎంచుకోవటం అనేది వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుందని నా ఉద్దేశం. చిన్నతనంలో నామీద పడిన ప్రభావాలూ, ప్రస్తుతం నేను చేస్తున్న కోర్స్ లో నేర్చుకుంటున్న కొత్త విషయాలూ నన్ను ‘రెప్రెజెంటేటివ్ పెయింటింగ్ ‘ అంటే కళ్ళకి కనిపించే వాస్తవ దృశ్యాలని చిత్రించటం  వైపు తీసుకెళ్తున్నాయని నా నమ్మకం .

* ఆరుబయట ప్రకృతిని ప్రత్యక్షంగా చూస్తూ చిత్రించే plein air painting  బృందంలో ఉన్నారని విన్నాను. మీ బృందం గురించీ, మీరు చేసే పనుల గురించీ చెప్పండి.

అరుణ: మిషిగన్ లో ఉన్న ఒక ప్లేన్ ఎయిర్ పెయింటర్స్ బృందం లో నేను సభ్యురాలిని. వసంత ఋతువులో మొదలుపెట్టి మంచు కురవటం మొదలుపెట్టే లోపల, అంటే ఆకురాలుకాలం వరకూ మేము వారానికి ఒకసారి కలుసుకుని ఆరుబయట చిత్రాలు వేస్తాం. డిట్రాయిట్ లో పార్క్ లూ, పొలాలూ , తోటలూ, నగర దృశ్యాలూ మొదలైన నగరంలోని విభిన్నమైన ప్రదేశాలని ఎన్నుకుంటాం. ప్లేన్ ఎయిర్ లో నేనింకా ప్రారంభ దశలోనే ఉన్నానని అనాలి. ఇంతవరకూ నాకది ఒక సవాలు లాగే అనిపిస్తోంది.

An evening at the farm (VANGO ART అనే సైట్ లో ఇది అమ్ముడైంది)

An evening at the farm (VANGO ART అనే సైట్ లో ఇది అమ్ముడైంది)

ఇందులో లాభాలేమిటంటే, జీవితం నుంచి దృశ్యాలు చిత్రించవచ్చు. కళ్లెదుట సజీవంగా కనిపిస్తున్నవాటిని పంచేంద్రియాలతోనూ అనుభవిస్తూ చిత్రించగలగటం ఒక అద్భుతమైన అనుభూతి. ప్లేన్ ఎయిర్ పెయింటింగ్ లో ఒక తాజాదనం, సాన్నిహిత్యం అనుభవంలోకి వస్తాయి. అంతే కాకుండా వెలుగు నీడల్లోని రంగులు కళ్ళకి కనిపించినట్టు కెమెరా చూపించలేదు. అందుకే వాటిని ఉన్నదున్నట్టు గమనించటం సాధ్యమౌతుంది.

స్టూడియో పెయింటింగ్ తో పోలిస్తే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. ప్లేన్ ఎయిర్ పెయింటింగ్ లో ఒక కాలపరిధిలో, అంటే 2-3 గంటల్లో, చిత్రాన్ని ముగించాలి. వెలుగు నీడలు మారిపోతూ ఉంటాయి. అందుకే చిన్న కాన్వాస్ లో చిత్రించవలసి వస్తుంది, వేగంగా చూసిన దృశ్యాన్ని రంగుల్లోకి దింపాలి. ఒక్కోసారి ఔట్ లైన్ లాగ వేసుకుని స్టూడియోలో పూర్తి చెయ్యాలి. అప్పుడు కావాలంటే వాటిని పెద్ద కాన్వాస్ మీద కూడా వేసుకోవచ్చు.

* పెయింటింగ్ లో ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్ నే ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కారణం?

అరుణ: ఇతర మాధ్యమాలతో నేను ఎక్కువగా చిత్రాలు వెయ్యలేదు. ఆయిల్ పెయింట్స్ రంగులు లోతుగా, మెరుగ్గా ఉండి చిత్రాలకి ఎక్కువ అందాన్నిస్తాయని నా నమ్మకం. అందుకే వాటిని వాడటం ఇష్టం.

* మీకిష్టమైన ఆర్టిస్ట్?

అరుణ: నాకిష్టమైన చిత్రకారుల్లో ముఖ్యమైన పేర్లు కొన్ని:  డేగాస్, మోనే , Jaoqine Sorolla, ఐసాక్ లెవితాన్, ఎడ్వర్డ్ హోపర్. వర్తమాన చిత్రకారుల్లో సీడబ్ల్యూ ముండీ, టీ అల్లెన్ లాసన్, డేవిడ్ కర్టిస్, జోన్ రెడ్ మాండ్, జెన్నిఫర్ మెక్ క్రిస్టియన్.

1 (3)

* మీకు యూరోపియన్ ఆర్ట్ మీద ఇంత మక్కువ కలగడానికి కారణం?

అరుణ: పాశ్చాత్య కళలో ఆసక్తికి  కారణం చిన్నతనంలో ఆ సాహిత్యానికీ, చిత్రకళకీ పరిచయమవటమే. నా పదో ఏట మా అమ్మా, నాన్నా, అక్కచెల్లెళ్ళం  ఇద్దరం, మూడు వారాలు యూరప్ లో పర్యటించాం. అందులో ఒక వారం మొత్తం ఇటలీ లోనే గడిపాం. అప్పుడు ఎన్ని ఆర్ట్ గాలరీలు చూశామో లెక్కలేదు. నాకు తెలీకుండానే దాని ప్రభావం నామీద పడి  ఉండాలి. అలా అన్ని గొప్ప చిత్రాలూ, శిల్పాలూ చూడటం నాకదే మొదటి సారి.

* మీ చదువు , ఉద్యోగం వివరాలు? అమెరికాకి ఎప్పుడు వెళ్లారు?

అరుణ: పన్నెండో క్లాసు వరకు మద్రాస్ లో కాన్వెంట్ లో. డిగ్రీ , పీజీ ఢిల్లీలో. ఎలెక్ట్రానిక్స్ లో మాస్టర్స్ చేసి 1996 లో అమెరికా వెళ్ళాను. 2015 వరకు IT  లో ఉద్యోగం చేశాను.

* అంటే పదేళ్ల పైగా IT రంగంలో పనిచేసి నలభయ్యోపడిలో చిత్రకళాభ్యాసంలోకి ప్రవేశించారు. ఈ నిర్ణయం ఎలా జరిగింది?

అరుణ: కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల అలాంటి నిర్ణయం తీసుకున్నాను. కొంత గాప్ తర్వాత 2011 లో మళ్ళీ కేవలం ఒక హాబీ గా చిత్రాలు వెయ్యటం మొదలుపెట్టాను. నా భర్త సలహా మేరకు (అతను అమెరికాలో MS చేశారు) శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా లోని  అకాడమీ అఫ్ ఆర్ట్ యూనివర్సిటీ లో MFA  ప్రోగ్రాం కి అప్లై చేశాను. అంతవరకూ హాబీగా వేసిన నా చిత్రాలని వాళ్లకి పంపించాను. వాళ్ళు నా అప్లికేషన్ ని ఆమోదించారు. క్లాసుల్లో మంచి గ్రేడ్లూ, కామెంట్లూ రావటం నాకు  మరింత ప్రోత్సాహాన్ని అందించింది. ఇక ఆ తరవాత ఉద్యోగం వదిలేసి పూర్తి సమయాన్ని చిత్రకళకే కేటాయించాలన్న ప్రేరణ కలిగింది. డిగ్రీలో చదివినది వేరైనా నాకు చిన్నతనం నుంచీ  కళలమీదా, సాహిత్యం మీదా ఎక్కువ అభిరుచి ఉండేది. ఇక జీవితంలో స్థిరపడ్డాక నాకు నా ప్రియమైన చిత్రకళ అభ్యసించేందుకు అవకాశం దొరికింది.

 

* ఒక వ్యక్తిని ప్రేమించడమంటే ఆ వ్యక్తి అభిరుచుల్ని గౌరవించడమంటారు! మీ అభిరుచినే మీ కెరియర్ గా ఎన్నుకోవడం వెనక మీ భర్త పాత్ర?

అరుణ: నా భర్త కూడా నేను చిత్రాలు బాగా వెయ్యాలని ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన చిత్రకళ అభ్యసించి, అందులో ప్రతిభ సాధించి నేను సంతోషించాలని అతని ఆశయం. నేను ఉద్యోగం మానేసి పూర్తి సమయం చిత్రకళకే కేటాయిస్తున్నానంటే, అది అతని ప్రోత్సాహం వల్లే.

* మిమ్మల్ని ఆకట్టుకునే ఇతివృత్తాలు ఎలాంటివి?

అరుణ: నాకు చిత్రకళలో ఆసక్తి కలిగించేవి, వెలుగు నీడలూ, రంగులూ. వస్తువు ఏదైనప్పటికీ దాన్ని  చక్కగా వేస్తే అది చూసేందుకు అందంగానే ఉంటుంది. నామటుకు నాకు మానవ జీవితం గురించి చెప్పే ల్యాండ్ స్కెప్స్, స్టిల్ లైఫ్  చిత్రించటమంటే ఇష్టం.

 

* మీ ఇతర అభిరుచులు? తీరిక సమయంలో ఏం చేస్తుంటారు?

అరుణ: నాకు చిత్రకళ కాకుండా ఉన్న ఇతర అభిరుచులు, సినిమా, సంగీతం (ముఖ్యంగా సినిమా పాటలు), రకరకాల ప్రదేశాలకి ప్రయాణాలు చెయ్యటం.

2 (2)

* ఎలాంటి అడ్వెంచర్స్ ఇష్ట పడతారు?

అరుణ: కాలేజీలో ఉండగా రాణిఖేత్ లాంటి ప్రాంతాలకి మా లెక్చరర్లతో ట్రెకింగ్ కి వెళ్లాను. రాక్ క్లైమ్బింగ్ కూడా ఒకసారి చేశాను. అలా అరుదైన ప్రదేశాలకి వెళ్ళటం, హైకింగ్, కాంపింగ్ లాంటివి చెయ్యటమంటే సరదా.

* ప్రస్తుతం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిస్టులెవరు?

అరుణ: ప్రస్తుతం నాకు ఎక్కువ నచ్చుతున్నది జెన్నిఫర్ మెక్ క్రిస్టియన్ వేసే చిత్రాలు. ఆమె చిత్రాలు  నాకు ముఖ్యమైన ప్రేరణ అని చెప్పవచ్చు. వర్తమాన కాలంలో ఇంప్రెషనిస్టిక్ చిత్రాలు వేసే కళాకారిణి. ఆమె చిత్రాలలో బ్రష్ వర్క్ , మరీ స్పష్టంగా ఉండకపోయినా దృఢంగా కనిపించే  కుంచె విన్యాసాలూ, అంచులని చిత్రించే తీరూ, ఎంచుకునే వస్తువూ నాకు చాలా గొప్పగా కనిపిస్తాయి. సామాన్యమైన దృశ్యాలని అద్భుతమైన చిత్రాలుగా తీర్చిదిద్దగల ఆమె నేర్పును నేను చాలా అభిమానిస్తాను.

* పిల్లల్ని చదువులో అద్భుతాలు చెయ్యాలని ఒత్తిడి చేసే తల్లిదండ్రులు, వాళ్ళకి ఏదో ఒక లలిత కళలో ప్రవేశం ఉండేలా శ్రధ్ధ చూపాల్సిన అవసరం ఉందంటారా?

అరుణ: లలిత కళలపట్ల చిన్నతనంలోనే ఆసక్తి కలిగించటం అవసరమని నా నమ్మకం. ఈ పనికి తలిదండ్రులూ, అధ్యాపకులూ పూనుకోవాలి. వీటివల్ల మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవటం, స్పందించే గుణం పెంపొందుతాయి. చిన్నపిల్లలు కళలను సాధించటంలో ఒకవేళ కృతకృత్యులు కాలేకపోయినా, వాళ్లకి వాటిని  పరిచయం చేయటంవల్ల మంచే జరుగుతుంది.

* మీ ఆసక్తి  వెనక మీ తల్లిదండ్రుల పాత్ర ఉందా?

అరుణ: పెరిగి పెద్దవుతున్న వయసులో సాహిత్యం, కళలకి సంబంధించిన పుస్తకాలని చదవమని సలహా ఇచ్చి వాటిని నాకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి  మా అమ్మ. అందుచేత నా అభిరుచుల్ని ప్రోత్సహించటంలోనూ, వాటిని నేను నేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలలోనూ మా అమ్మ  పాత్ర  ముఖ్యమైనది. ప్రస్తుతం మా అమ్మా, నాన్నా ఇద్దరూ నా చిత్రకళ పట్ల ఆసక్తి కనబరచటమే కాకుండా, నా కృషిని  ప్రోత్సహిస్తున్నారు.

Aruna with parents

* మీరిప్పుడు చేస్తున్న కోర్స్ గురించి కొంచెం వివరిస్తారా?

అరుణ: నేను చేస్తున్న ఈ MFA కోర్స్ ఆన్లైన్ లో చేసేందుకు వీలుంది. ప్రపంచంలో ఏమూల ఉన్నవారైనా దీన్ని చెయ్యచ్చు. ఈ కోర్స్ లో నేను నేర్చుకుంటున్న విషయాలు నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. ఒక్కొక్క క్లాసూ క్షుణ్ణంగా, విద్యార్థి నుంచి చాలా ఎదురుచూసేదిగా ఉంటుంది. ఆషామాషీ గా చేసేందుకు వీల్లేదు. ప్రొఫెసర్లు  చిత్రకళ గురించి మంచి పరిజ్ఞానం గలవారు. పరిమాణాలు (standards )చాలా ఉన్నతమైనవి. రాబోయే సెమెస్టర్లలో నా థీసిస్ మీద కేంద్రీకరించి పనిచేయాలి కాబట్టి నేను దానికోసం చాలా అతృతతో ఎదురుచూస్తున్నాను.

*మీ థీసిస్ స్టడీ కోసం ఎలాంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నారు?

అరుణ: నా థీసిస్ స్టడీ ‘ప్రకృతి దృశ్యాలలో వెలుగు తాలూకు సౌందర్యా’న్ని చిత్రాలలో ప్రతిబింబించేట్టు  చెయ్యడం. దీనికోసం బైటికి వెళ్లి  దృశ్యాలని చిత్రించటం (ఫీల్డ్ స్కెచెస్),ప్లేన్ ఎయిర్ స్టడీస్ , స్వయంగా తీసిన ఫోటోల ఆధారంగా చిత్రాలు వెయ్యటం లాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ల్యాండ్ స్కేప్ చిత్రాలు వెయ్యటంలో నేర్పుని మరింతగా అర్థం చేసుకుని మెరుగుపరచుకోవాలన్నది నా ఆశయం.

* మీ లక్ష్యం?

అరుణ: ప్రస్తుతం నా లక్ష్యం చిత్రకళ నేర్చుకుంటూ నాకున్న నేర్పును మెరుగుపరచుకోవడం.

ఈ డిగ్రీ పూర్తి చేశాక నాకు చిత్రకారిణిగా కళారంగంలో పేరు సంపాదించుకోవాలని ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం అద్భుతమైన చిత్రకారిణి అయితే సరిపోదు. ఇంకా ఎన్నో విషయాలలో కృషి చెయ్యాల్సి ఉంటుంది. వర్తమాన కళాకారులకి గల అవకాశాలు ఎన్నో, అవి ఎటువంటివో నేనింకా తెలుసుకోవలసి ఉంది, వాటిలో దేన్ని ఎంచుకోవాలో కూడా నిర్ణయించుకోవలసి ఉంది. ఒక చిత్రకారిణిగా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలనీ, గొప్ప చిత్రాలని అద్భుతంగా  చిత్రించాలనీ అనుకుంటున్నాను.

7 (2)

* అనువాదరంగంలో శాంతసుందరి గారు తనదైన ఒక ముద్రని గాఢంగా వేయ గలిగారు. సృజనాత్మక రచనలో మీ తాతగారు కొకు గారి శైలి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. చిత్రలేఖనంలో మీరూ అలాంటి విశిష్టతని సాధిస్తారనీ, చిత్రకళా రంగంలో అంతర్జాతీయ వేదిక మీద తెలుగువారికి సమున్నత స్థానాన్ని కల్పిస్తారనీ ఆశిస్తూ ‘సారంగ’ తరఫున అనేక శుభాకాంక్షలు!

 

*****

కులవృత్తుల వేదన బయటికి రావాలి

 

devendar

అన్నవరం దేవేందర్ ప్రముఖ తెలుగు కవి. 2001లో “తొవ్వ” కవితా సంకలనంతో మొదలై, నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, బుడ్డుపర్కలు, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత కవితా సంపుటాలు ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ ఇప్పటికి పది పుస్తకాలు ప్రచురించారు. ఇటీవల “బువ్వకుండ” దీర్ఘ కవితను వెలువరించారు. ప్రధానంగా తెలంగాణ జీవన దృశ్యాన్ని, బహుజన దృక్పథాన్ని, ప్రపంచీకరణ పర్యవసానాలను కవిత్వీకరించారు. తెలంగాణ ప్రజల భాషను కవిత్వ భాషగా తనదైన శైలిలో ప్రయోగిస్తున్న వారిలో ముఖ్యులు అన్నవరం దేవేందర్.

ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్ధిక విధానాలు, సాంకేతిక పురోగతి కుల వృత్తులను కనుమరుగు చేస్తున్నది. ఈ క్రమంలో కుమ్మరి వృత్తికి సంబంధించిన వస్తువును తీసుకుని దీర్ఘ కవితగా వెలువరించిన అన్నవరం దేవేందర్ గారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ముఖాముఖి.

 

 • దేవేందర్ గారూ! కుల వృత్తి మీద దీర్ఘ కవిత వేశారు కదా! ప్రస్తుతం కుల వృత్తుల పరిస్థితి ఏమిటి? కుల వృత్తుల కొనసాగింపు పై మీ అభిప్రాయమేమిటి?

 

 • కుల వృత్తులు కూలిపోవడమనేది ఒక విషాదకర దృశ్యమే ఐనా కులవృత్తులు నిలపాలని ఎవరూ కోరుకోరు కోరుకోవలసిన అవసరం కూడా లేదు. వీటిని అధిగమించి బహుజనులు ఎదిగి రావాలె. ఇవి ప్రాచీన కళా శాస్త్ర సాంకేతిక నైపుణ్య రూపాలు. బహుజన కులాల శ్రమ జీవులంతా సామాజిక శాస్త్రవేత్తలు. కుండను కనిపెట్టడమనేది మెసపుటేమియా నాగరికత నాడే కనిపించింది. నూలు వడకడం, వంట వండడం మొదలైన మానవ నాగరికత పరిణామానికి మూల బీజాలు. ఈ టెక్నాలజీ కి, కళకు వాళ్ళు పేటెంట్ దారులే. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లైనా ఈ వృత్తులు కలవాళ్ళు తొలి నాగరికతకు బీజాలు వేసిన వాళ్ళే. ఈ వృత్తులల్లో కళతో పాటు సమాజోపయోగం కూడా ఉంటది. ఇది పర్యావరణానికి కూడా హాని చేయనిది. ఒక్క మిషన్ వందల చేతులను ఇరగ్గొట్టింది, ఒక కంప్యూటర్ రెండు వందల  టైపు మిషన్ లను లేకుండ చేసింది. ప్రపంచంలో ఏది కొత్తగ కనిపెట్టినా అది అంతకుముందున్న  వ్యవస్థకు విఘాతం కలిగిస్తది. అది అనివార్యమే, దాన్ని ఆపలేం. కాబట్టి దాన్ని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటది. వ్యవసాయ రంగంలో నాగళ్ల స్థానంలో, ఎడ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చినయ్, పొలం కోతలకు హార్వేస్టర్ లు వచ్చినయ్. ఇంకా అన్ని రంగాల్లోకి వస్తయ్. వీళ్ళు కూడా ఇతర ఆధునిక వృత్తులలోకి అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉన్నది.

 

 • బువ్వకుండ దీర్ఘ కవిత రచనకు ప్రేరణ ఏమిటి? గతంలో ఏవైనా దీర్ఘ కవితలు రాశారా?

 

 • మల్ల ప్రపంచీకరణ నుంచే మొదలు పెడితే, ఈ ప్రపంచీకరణతో చాలా వృత్తులు పూర్తిగ అంతరించి పోతయ్. ముందు తరాలకు ఈ వృత్తుల గురించి తెలిసే అవకాశం కూడ లేదు. నేను కుమ్మరి కుల వృత్తి నుంచి రావడం వల్ల దీనిలోని కళాత్మకతను, నైపుణ్యాన్ని, మూలాల్ని సాహిత్యంలో రికార్డు చెయ్యాలను కున్నా. ఐతే, ముఖ్యంగా మిత్రుడు జూలూరు గౌరీ శంకర్ వెంటాడే కలాలు పేరుతో పదిహేనేండ్ల కిందనే చాలా కుల వృత్తుల కవిత్వాన్ని తీసుకచ్చిండు. దాన్ని రివైజ్ చేసే క్రమంలో మళ్ళీ రాయాలనే ప్రేరణ దొరికింది. గతంలో కూడ తెలంగాణ మీద నేలపాట, గుండె పాట అనే పేరుతోని రాసిన, నా బాల్యం గురించి కూడా పెద్ద కవితలు రాసిన కానీ, దీర్ఘ కవితలుగా రాయలేక పోయిన. ఆఖరి ముచ్చట అనే పేరుతోని రైతు చనిపోతూ చెప్పే స్వగతం గురించి దీర్ఘ కవిత రాయాలని తపన ఉండే. ఇవన్నీ ప్రేరణగా ఇప్పుడు “బువ్వకుండ” వచ్చింది.

 

 • తెలంగాణ ఉద్యమ సాహిత్యం  గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిస్థితి గురించి వివరిస్తారా?

 

 • గడిచిన దశాబ్దం అంటే 2014 కు ముందు దశాబ్ద కాలం దాకా తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్యమే ఏలింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం అణచి వేయబడ్డ తెలంగాణ భాష, సామెతలు, పాత్రలను సాహిత్యంలో ప్రతిష్టించింది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కలాలు ఆగిపోయినయ్. తెలంగాణ ఆకాంక్ష కవిత్వం దాదాపుగా నిలిచిపోయింది. కానీ, తెలంగాణ విశిష్టతను తెలిపే తొలిపొద్దు, తంగేడు వనం లాంటి కవితా సంపుటాలు వెలువడ్డాయి. ఐతే, తెలంగాణ ఏర్పడంగనే సమసమాజం ఏర్పడ్డట్టు భావించవల్సిన పనిలేదు. కోస్తా ఆంధ్రా కమ్మ పాలన నుండి చేతులు మారి తెలంగాణ పాలన ఆరంభమైంది. రూపం మారినా పాలక వర్గ స్వభావ సారాంశంలో పెద్దగా ఆశించాల్సిందేమీ ఉండదు. సంస్కృతి, చరిత్ర నిర్మాణంలో పాలనాపరమైన తెలంగాణతనం మాత్రం కనిపిస్తున్నది. కవి తన గొంతును సవరించుకోవల్సిన అవసరం ఉంటది ఎపుడైనా.

 

 • మీరు తెలంగాణ భాషలో గత రెండు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు కదా! తెలంగాణ భాష గురించి ఏమంటారు?

 

 • తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాష అద్భుతంగా ఇమిడి పోయింది. తెలంగాణ భాష స్వభావరీత్యా నాదాత్మకమైన భాష. తెలంగాణ భాషలో ప్రాస, లయాత్మకత సహజంగ ఉండి వినసొంపుగ ఉంటది. ఇది సాహిత్య ప్రామాణికతను సాధించుకున్నది. నిజానికి తెలంగాణ వ్యవహార భాషను సాహిత్యంలోకి రానీయకపోవడం వల్ల దూరమైంది కానీ, దీనిలో ఏ భావాన్నైనా వ్యక్తీకరించే సత్తా ఉన్నది. సోమన , పోతన, సురవరం, వానమామలై, కాళోజీలాంటి వాళ్ళు వాళ్ళ సాహిత్యంలో వాడిండ్రు. 1956 తర్వాత రెండున్నర జిల్లాల భాష ప్రమాణ భాష చేసి, అదే ప్రసార మాధ్యమ భాష చెయ్యడం వల్ల తెలంగాణ భాష నిరాదరణకు గురైంది. నా దృష్టిలో భాషకు ప్రామాణికత ఉండడమే ఆధిపత్య భావజాలం.

 

 • ప్రస్తుత తెలుగు సాహిత్య స్థితి ఎట్లా ఉన్నది? నేటి తరం సాహిత్య స్పృహ ఎట్లా ఉన్నది?

 

 • ఒక పదేండ్ల కిందట తెలుగు సాహిత్యమంటే దిన వార మాస పత్రికలే అనుకున్నం. కానీ, వాటికి పదింతల సాహిత్యం  ఇప్పుడు అంతర్జాలంలో వస్తున్నది. ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్ లాంటి గ్రూప్ లతో పాటు  అంతర్జాల పత్రికల్లో అద్భుతమైన కవిత్వం, సాహిత్యం వెలువడుతున్నది. ఈ పత్రికలు సాహిత్యం కోసమే ప్రత్యేకంగా వేలువడుతున్నయ్. యువతరం దీన్ని పట్టుకున్నది. ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడ కథలు కవిత్వం రాస్తున్నరు. ఫేస్బుక్ లో కవి సంగమం, సాహితీ సేవ, సాహితీ సవ్వడి, ఇట్లా ఎన్నో గ్రూప్ లు వేల మంది సాహిత్యాన్ని దినదినం పోస్ట్ చేస్తున్నయ్. కరీంనగర్ జిల్లాలో కూడా ఎన్నీల ముచ్చట్ల పేరుతో మూడు సంవత్సరాలుగ వెలువడుతున్న కవిత్వం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలుగు సాహిత్యానికి ఇప్పుడు పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు. రాశితో పాటు వాసిని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది.

 

 • చివరగా…. కుండ మీద కుండ పేర్చినట్లుండే మీ కవిత్వ దొంతరలో బువ్వకుండలోని కొన్ని కవిత్వ పాదాల్ని ఉదహరిస్తారా?
 •  “మట్టిని లోహం పురాగ మింగింది/అయినా మన్ను పరిమళం మిగిలే ఉంది/కళాత్మకతలో ఉత్పాదకత దాగి ఉన్న కుల కశ్పి/ చేతి వేళ్ళ నుంచే ఆణి ముత్యాల్లాంటి కుండలు గురుగులు గూనలు రాలిపడుతయి”.

“ చేతి పనులన్నీ కవిత్వం అల్లినట్లే/ అందంగా నులక మంచం నేసుడు/ నూలు పోగుల అల్లికలతో రంగు రంగుల చీర/ పసురం తోలుతో కిర్రు చెప్పులు ముడుసుడు/ తాళ్ళు పగ్గాలు దందెడ్లు వడివడిగా పేనినట్టుగ/ బాడిశతో నాగండ్లు అమిరిచ్చుడు/ కర్రు గడ్డ పారకు మొన పెట్టినట్లుగనే/ వ్యవసాయ దారులు తినే దినుసులు పండిచ్చినట్లుగ/ సకల కుల వృత్తులు ఊరూరి సూర్యులు/ ఊరు పరస్పర సామాజిక సేవల వాకిలి/ ఉత్పత్తి సేవలు ఒక సామాజిక సన్నివేశం/ సమాజానికి బహుజనులు అందించిన బహుమానం/ తరతరాలుగ కొనసాగుతున్న వారసత్వం”.

“మట్టి నుంచే ప్రపంచానికి పట్టెడు ధాన్యం/ మట్టే వస్తుసేవలకు మూల్యాంకనం/ మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం/మట్టి కుండతోనే అగ్గిల మాయం”.

 

ఆత్మని పలికించే గానం

 

 

రేఖా జ్యోతి  – సరస్వతీ ప్రసాద్ 

~

 

“అతని పాడెదను అది వ్రతము” అంటూ అన్నమయ్య సంకీర్తనలను” అన్ని మంత్రములు” గా జపిస్తూ ఆ “షోడశ కళానిధికి షోడశోపచారములు” చేస్తూ “వినరో భాగ్యము విష్ణు కధ” అని మధురానుభూతిని మధురంగా ఆలపిస్తూ, సంగీతాన్ని సాధనంగా మలచి ఎందరినో భక్తి మార్గంలోకి మళ్ళించిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ధన్యజీవులు. అన్నమయ్య పాట  అనగానే మొట్టమొదటగా మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి  శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఎన్నో అన్నమయ్య పదకవితలకు చక్కని బాణీలను కూర్చి అతిసులభంగా శ్రోత యొక్క మనసును, బుద్ధినీ స్వామీ వైపు నడిపించినవారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్య కీర్తనలపై గల మక్కువతోనే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారిని తిరుపతి రప్పించుకొని తన ఆస్థానంలో కొలువిచ్చి తన సేవ చేయించుకుంటున్నారు.

అన్నమయ్య దివ్యాశీస్సులతో ప్రసాద్ గారు ఆణిముత్యాల వంటి పదకవితలకు ప్రాణం పోసి మనకు అందిస్తున్నారు. ఇది ప్రసాద్ గారి పూర్వజన్మ పుణ్యఫలం. మనందరి భాగ్యం.  నిరంతరం అన్నమయ్య సాహిత్యాన్ని చదువుతూ ఆస్వాదిస్తూ అందులోని అతి సూక్ష్మమైన లలితమైన బిందువు నుండి అనంతమైన భక్తి తీరాలకు తీసుకెళ్ళే బాణీలను అందిస్తున్న శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీత సాహిత్య రంగాలతో తన అనుభవాలను అనుభూతులను అభిప్రాయాలనూ ‘సారంగ’ తో ఇలా పంచుకున్నారు.

 

మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మాధుర్యం మీ బాణీదా, గొంతుదా

నా పాటలో ఏముందో ఇంకా నాకే తెలీదు, కానీ ఈ ఆదరాభిమానాలు చూసినప్పుడు మాత్రం ఏదో ఉందేమో అనిపించి ‘పాట’ విషయంలో నా బాధ్యతను మరింత బలపరుచుకుంటూ ఉంటాను. ఈ పాట ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది, ఆయనే శ్రద్ధగా కూర్చొని .. కూర్చిన బాణీలు ఇవి. కానీ వ్యక్తిగా ఒక మాధ్యమంగా నేను కనిపిస్తున్నాను కనుక అందరి మెప్పు నాకు చేరుతోంది.  పదాన్ని పలికే విధానమే శ్రోతకు గాయకుడి యొక్క సందేశం. అన్నమయ్య పాటలోని వెన్నెల ద్వారా సదా ఆ శ్రీనివాసుడనే చందమామ వైపు అందరి చూపు మరల్చే ప్రయత్నం నాది!  ఇరవై యేళ్ళ క్రితం ‘ఇక మీరు మాట్లాడనే కూడదు, మెడలో పలక తగిలించుకోండి’ అని అన్న డాక్టర్లు గెలవలేదు, నాతో ఇంకా పాడించుకుంటున్న ‘స్వామి’ గెలిచారు. ఈ శక్తి  నాది కాదు అని నాకు అనిపించినప్పుడు అది భగవంతుడిదే కదా… నా జీవితం ఈ ‘మిరాకిల్’ కి అంకితం  !!

సంగీత దర్శకుడే గాయకుడు అయినప్పుడు …

సంగీత దర్శకుడి ఒక ఊహకు తన గాన కళతో, సంగీత ప్రజ్ఞతో, మధురమైన కంఠంతో ప్రాణం పోస్తాడు గాయకుడు. సంగీత దర్శకుడి భావాన్ని తానూ అనుభూతి చెంది పూర్తిగా తన performance తో పలికించిన పాటలే ప్రాచుర్యంలోకి నేరుగా వెళ్ళగలుగుతాయి.  లలిత సంగీతం విషయంలో సంగీత దర్శకుడే గాయకుడు అయినప్పుడు ఆ మాధుర్యంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఊహ, కృషి రెండూ ఆ భావం పలికించడంలో సమాన పాత్ర పోషిస్తాయి కనుక. విలువ బాణీకి … ప్రశంసలు గాయకుడికి లభిస్తాయి. పాడేటప్పుడు గాయకుని యొక్క మనసు ఒక ఆనందాన్ని మించి మరొక ఉపశాంతికి చేరుతుంది … అది అతని పాటలో స్పష్టమైపోతుంది. ఈ లక్షణం గాయకుడి దగ్గరున్నప్పుడు శ్రోత అక్కడే కట్టుబడి పోతాడు.

GBK3

ఎలాంటి పాటలు  చిరకాలం నిలిచిపోతాయి ?

కొన్ని  కీర్తనలు సాహిత్యానికి రూపం ఇచ్చే క్రమంలో నిర్మితమైన బాణీలు, కొన్ని స్వరాలని ( Notes) పలికించడానికి నిర్మితమైన బాణీలు,మరికొన్ని భావ నిర్మితమైన బాణీలు.ఒక కీర్తనని స్వరస్థానాల మీద, కట్టుదిట్టమైన నోట్స్ మీద శాస్త్రీయంగా ట్యూన్ చేసినప్పుడు ఎవరు పాడినా అదే నోట్స్ అనుసరిస్తారు కనుక అలాంటి బాణీలు చొరవగా రక్తికట్టే అవకాశం ఉంది. కానీ లలిత సంగీతం అలా కాదు … భావమే మేటిగా పలుకుతూ ఉంటుంది, పెర్ఫార్మన్స్ మీద ఆధారపడుతుంది. పాడేటప్పుడు శ్రుతి, లయ, భావం, స్పష్టత కలిసిన ఒక పూర్ణత్వం ఉంటే ఆ పాట పది కాలాలు నిలిచిపోతుంది ఖచ్చితంగా !

ఘంటసాల పాడిన ఆ ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో – రావణాసురుడు కైలాసాన్ని లేపుతున్నప్పుడు ఆ స్తోత్రం ఎట్లాంటి శక్తితో ఉంటుంది..!  అర్కెష్ట్రా కూడా అంతగా ఉండదు .. కానీ భావం మొత్తం ఆ గొంతులోనే పలుకుతుంది. విన్న ప్రతీసారీ నన్ను రోమాంచితుడిని చేస్తుంది. “శివ శంకరీ …”, “మాణిక్య వీణా ..” లాంటివి వింటుంటే ఆశ్చర్యం. అది ఘంటసాల పాటకు చేసిన అత్యుత్తమ న్యాయం. ట్యూన్ ని మాత్రం ప్రెజెంట్ చేయడం కాకుండా పాడేటప్పుడు ఒక fullness … పరిపూర్ణతను భావంతో జొడించగలిగితేనే ఆ పాట రాణిస్తుంది. అంటే ఆ గొంతులో  రాణించిన అన్ని పాటల్లోనూ ఈ టచ్ ఉందని అర్ధం ! ఈ స్పర్శ లేని పాటలు బాహుళ్యం కాలేదు. గొంతు ఆ గాయకుడిదే .. కానీ ఆత్మ నిండుగా ఉన్న పాటలు రాణించాయి. మనసు – భావం లగ్నం చేసిన బాణీలు స్థిరంగా నిలిచిపోతున్నాయి అని !

గాయకుడికి సంగీత జ్ఞానం అవసరమంటారా?

             ప్రతీ గాయకుడికి కనీస సంగీత జ్ఞానం ఉండి తీరాలి. లేదంటే గాయకుడి యొక్క బాధ్యత పెరుగుతుంది,  పాడగలిగే ఆ వైశాల్యం పరిమితంగా ఉంటుంది. అంటే అన్ని రకాల పాటలు పాడలేడని అర్ధం. సంగీతజ్ఞానం లేకుండా పాడేటప్పుడు ప్రతీ వాక్యంలో, పదంలో, స్వరంలో భావాన్ని పెట్టాల్సి వస్తుంది. అది బాధ్యతతో కూడుకున్న పని కదా? అదే సంగీత జ్ఞానం తోడై ఉంటే 50% భావం చూపించి మిగతా 50% బాణీని నోట్స్ మీద నిలబెడితే చాలు… అది పాటని నడిపిస్తుంది. మూడవ అంశం మాధుర్యం. ఇది ఏమిటంటే సంగీత జ్ఞానం, భావం రెండూ అమరినప్పుడు శ్రోతని ఇక కదలనివ్వని అంశం. ‘గొంతు బాగుండడం’ అనే విషయం ఈ చివార్న సహాయ పడుతుంది అని నా అభిప్రాయం!
మహా మంత్రి తిమ్మరుసు – సినిమాలో యస్. వరలక్ష్మి భావం కంటే కూడా ఒక talented expression తో పాడిన పాట ‘తిరుమల తిరుపతి వెంకటేశ్వరా …. ‘ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆమె సంగీత జ్ఞానం ఒక ఆణిముత్యాన్ని ఆమె ఖాతాలో అలవోకగా వేసినట్టయ్యింది కదా !

GBK-SP-RJ2

అన్నమయ్య సాహిత్యానికి సంగీత బాణీలు కూర్చేటప్పుడు కలిగిన మీ అనుభవాలు… !!

             అన్నమయ్య తన సాహిత్యాన్ని – సంగీతంతో కంటే కూడా ఆత్మతో పలికించే ప్రయత్నం చేశారు. ఆ రచించిన కీర్తనల సంఖ్య ముప్పై రెండు వేలు అంటే సామాన్యం కాదు! ఆయన ఎన్నుకున్న కొన్ని రాగాలు,  సాహిత్యాన్ని తాళానికి వదిలే పధ్ధతి చూసినప్పుడు అన్నమయ్య ఎంత ప్రత్యేకమైన పోకడకి ప్రయత్నించారో తెలుస్తుంది. ఆయన సుసంపన్నమైన జీవితకాలం 95 సంవత్సరాలలో ఆయన సంకీర్తనలే కాక ఎన్నో రచనలు చేశారు, ద్విపదలు, శతకాలు, సంకీర్తనా లక్షణ గ్రంథం మొదలైనవి  రాశారు. నాకు వీలైనంత వరకూ అన్నమయ్య  తన సాహిత్యం వద్ద ప్రస్తావించిన రాగంతోనే బాణీ కట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. బాణీ పూర్తయ్యేటప్పుడు లోపల అనిపిస్తుంది ‘బహుశా అన్నమయ్య ఊహ ఇదేనేమో ‘ అని!

కొన్ని బాణీలు పూర్తి కావడానికి నిమిషాలు తీసుకుంటే, మరికొన్ని బాణీలు పూర్తి అయ్యేందుకు కొన్ని సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి.

త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్ వంటి వాగ్గేయకారుల కృతులకు ఒక పటిష్ఠమైన structure ఉంది. అందుకే అది ఒకరు పాడుచెయ్యగలిగేది కాదు.. వాటి వైభవం వాటి కూర్పే! ఆ కీర్తనల్లోని ఎత్తుగడ, పోకడ, సాహిత్యం, భావం .. దేనికదే!! ఆ సాహిత్యం చదువుతున్నా కూడా బాణీ మన లోపల పలుకుతూనే ఉంటుంది ఒక నీడలాగా …, ఆ involvement వల్ల కలిగేదే  మోక్షము.

కీ. శే. శ్రీ నేదునూరిగారితో మీ అనుబంధం, అన్నమయ్య సంకీర్తనల కూర్పులో ఆయన ప్రభావం 

మా గురువులు కీ.శే. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. ఆయన స్వరపరచిన అన్నమయ్య సంకీర్తనలకు లోతైన శాస్త్రీయ శోభను అద్దారు, అవి వినినంత మాత్రమునే సంగీతం చాలా వరకూ నేర్చుకోవచ్చు. సంగీత జ్ఞానం పెంచుకోవచ్చు. అంటే మిగతా వారి బాణీల్లో సంగీతం లేదని కాదు కానీ, ఇక్కడ ఒక తేలికపాటి అందమైన సంగీతపు పలుకు మా గురువుగారి బాణీల్లో ఉందని నా నమ్మకం. Notation చూస్తే వచ్చే పలుకు కాదు అది. ఆ గొంతులో ఒక్కమారు విని ఉంటే తెలిసే మాధుర్యపు కణిక. ఆయన పోకడ నా కంపోజింగ్ లో కనపడదు కానీ, నా లోపల దీపం వెలిగించింది మాత్రం ఆయనే! ఆయన ఒక టార్చ్ లైట్ వేశారు .. ఆ వెలుగులో నేను నడుస్తున్నందుకే నా సంగీతం ప్రపంచానికి కనబడుతోంది! నా గొంతు కంటే ఎంతోమంది గొంతులో ‘మాధుర్యం’ పాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ  .. రేంజ్ ఎక్కువ ఉన్నప్పటికీ నా పాటలో హృదయానికి, ఆత్మకీ తగిలేది ఏదో ఉందేమో! అందుకే చాలా మంది చాలా సార్లు నా కచేరీ అయిపోయాక ‘మా ఆయుష్షు కూడా పోసుకొని హాయిగా కలకాలం పాడండి’ అని దీవిస్తూ ఉంటారు. నిజానికి పాడగలిగే వయసులో ఇన్ని అవకాశాలు రాలేదు. ఇప్పుడు కంపోజింగ్ తోనూ .. పాడుకోవడం తోనూ … ప్రతి నిమిషాన్ని అపురూపంగా వినియోగించుకోవలసి వస్తోంది. మధ్యలో ఏడెనిమిది సంవత్సరాలు కంఠంలో అసౌకర్యం ఏర్పడింది. నా బాధ చూడలేక తిరిగి ఆ స్వామి ఇచ్చినదే ఇవాళ నా సౌకర్యమైన గొంతు. స్వామి దయ వలనే ఇవాళ ఇంత మందికి చేరువ కాగలిగి అందరి అభిమానం సంపాదించుకోగాలిగాను.

గాయకులుగా ఎదగాలనుకొనే వారికి మీ సూచనలు 

కొత్తగా సంగీతరంగంలోకి గాయకులుగా అడుగు పెట్టలనుకొనే వారికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఒక్కటే .. సరైన వెర్షన్ విని మన శక్తి వంచన లేకుండా, ఒరిజినల్ పాట స్థాయి తగ్గకుండా ‘బాగుంది’ అనుకొనేటట్టుగా పాడగలగాలి. సాహిత్యాన్ని అర్ధం చేసుకొని వినేవారికి కూడా అర్ధమయ్యేలా పాడగలగాలి.  స్వతహాగా సంగీతం మీద గాయకుడికి ఉన్న పట్టు, గొంతులోని లాలిత్యం, కమిట్ మెంట్ శ్రోతల్ని అలా పట్టేసుకుంటాయి. వైవిధ్యభరితమైన పాటలు పాడగలగాలి…. చాలు , ఇక వారి కృషే వారిని నడిపిస్తుంది.

‘అన్నమయ్య వరప్రసాద్’ అనే పుస్తకంలో నా ఈ సుదీర్ఘ సంగీత ప్రయాణాన్ని సవివరంగా పొందుపరచిన సోదరి యన్.సి. శ్రీదేవి కి ఇవాళ మరోసారి కృతజ్ఞతలు.  ఎక్కడో ఖండాంతరాలలో కూడా తెలుగు భాషకు ప్రాణం పోస్తూ, తెలుగు భాష మీద ఎంతో మందికి ఆసక్తిని కలిగిస్తూ, తెలుగు సాహిత్య వృద్ధికి సేవలు అందిస్తున్న ‘సారంగ పత్రిక’ సారధులకు నా అభినందనలు..  ఆశీస్సులు !!

*

నేనెప్పుడూ బాటసారినే: మన్నెం శారద

 

-ఆర్. దమయంతి 

~

 

మెదడు నెమరేసుకునే కథలు   రాయడంలో, మనసున నిలిచిపోయే పాత్రలను సృష్టించడంలో –  తనకు తానే సాటి అన్నట్టు పాఠకుల మన్నన పొందిన రచయిత్రి – శ్రీమతి మన్నెం శారద.

వీరి కథలు చదివించవు. అక్షరాల వెంట చూపుల్ని చకచకా పరుగులు  తీయిస్తాయి.  కథలో కొత్తదనం తప్పని సరి. భాషలో సంస్కారం ఒక సిరి. కథనం లో ఒక ఒత్తైన పట్టు వుంటుంది.  గమ్మత్తైన మలుపుంటుంది. ఒదిగినట్టుంటాయి కానీ, నిలదిసి ప్రశ్నిస్తుంటాయి – పాత్రాలు. రచనలో ఔన్నత్యం ప్రధానాంశం. ఉన్నత భావవ్యక్తీకరణం – వీరి సొంతం. వెరసి మంచి కథకు చిరునామాగా మారారు – మన్నెం శారద గారు.

దరిదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా సాహిత్యాన్ని కొనసాగిస్తున్న సీనియర్ రైటర్. వెయ్యి కి పైగా కథలు రాసి ఒక రికార్డ్ సృష్టించిన సంచలన రచయిత్రి.       

వృత్తి రీత్యా ఇంజినీర్. ప్రవృత్తి రీత్యా – రైటర్.

ఉద్యోగమేమో – రహదారులు, భవన నిర్మాణ శాఖలో. కానీ, అక్షర నిర్మాణమేమో – గుండె గుండెనీ దగ్గర చేస్తూ –  కథావంతెనల కట్టడాలు! – రెండు విభిన్న వైనాల మధ్య ఎలా ఈ సమన్వయం ఎలా కుదురుతుంది ఎవరికైనా?  ఇటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, అటు గృహిణిగా ఇంటి బరువులు మోస్తూ, ఇంటా బయటా  వ్యతిరేకతలను ఎదుర్కొంటూ, మరో వెంపు – రచనా సాహిత్యాన్ని చేపట్టడం ఎంత కష్టం!?.. అయినా ఎంతో ఇష్టం గా చేపట్టి, గొప్ప విజయం సాధించడం ఎంతైనా ప్రశంసనీయం. మరెంతయినా అభినందనీయం. ‘అంతా దైవ కృప ‘ అంటూ నవ్వుతూ చెబుతారు కానీ,  తాను సలిపిన కృషి గురించి మాట మాత్రం గా అయినా పైకి చెప్పుకోరు.  తన రచనా ప్రతిభ కు ఎలాటి పబ్లిసిటీ ఇచ్చుకోని సింప్లిసిటీ – వీరి వ్యక్తి త్వం.

మృదు స్వభావి. చాలా సెన్సిటివ్.  మాట మెత్తన. మనసు చల్లన.

మనకున్న బ్రిలియంట్ రచయిత్రుల్లో ఒకరైన మన్నెం శారద గారితో – సారంగ తరఫున ఇటీవల ముచ్చటించడం, ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ సంగతులేవిటో  – ఈ ఇంటర్వ్యూ చదివి మీరూ తెలుసుకోవచ్చు.

*****

 

మీరు –  దరి దాపు 40  సంవత్సరాలు గా కథలు రాస్తున్నారు కదూ?

* అవును.

మీరు   రాసిన మొదటి కథే ప్రచురణకు నోచుకోవడం జరిగిందా?

* అవును. నా మొదటి కథ – ‘అడవి గులాబి’ ఆంధ్ర జ్యోతి లో పబ్లిష్ అయింది.

 కథ రాయడం వెనక ఒక ఫోర్స్ వుంటుంది.  అది ప్రేరణ కావొచ్చు, ఉప్పొంగిన భావం కావచ్చు.  కథ రాయడం ఎలా జరిగింది?

* మాబావగారు సీలేరులో ఇంజనీర్ గా వున్నప్పుడు నేను మా అక్కతో కలిసి సీలేరు వెళ్లాను.  అంతా ఏజెన్సీ. అడవులు,సెలయేళ్ళు, కొండలు, లోయలు. అద్భుతం ఆ సౌందర్యం. నేను చిన్నతనంనుండి చదివిన సాహిత్య ప్రభావమో లేక నాకు ట్రాజేడీలంటే వున్నఇష్టమో…తెలియదుకానీ కిటికీలోంచి  చూస్తుండగానే ఒక విషాదాంత ప్రేమకధ నామనసులోరూపుదిద్దుకుంది.అంతే రాసేశాను. మరో సంగతి. మాఇంటిదగ్గర ఒకవిషాద ప్రేమకధకి  ఒకఅమ్మాయి బలికావడం కూడా కొంతనాపై ప్రభావంచూపించిందని చెప్పాలి.

 కథని తొలిసారిగా అచ్చులో చూసుకున్నప్పుడు ఏమనిపించింది?

* అప్పుడు నా  వయసు16 .  చాలాత్రిల్  ఫీల్ అయ్యాను. ఎన్నిసార్లుచదువుకున్నానో నాకే తెలియదు. అప్పట్లో ఒక రచనవెలుగు చూడాలంటే చాలాకష్టం.

  ఆ కష్టమేమిటో కాస్త వివరిస్తారా  ఈనాటి  రైటర్స్ తెలుసుకునేందుకు వీలుగా! 

* అప్పటిలో నిష్ణాతులైన ఎడిటర్స్ రచయితలు ..చాలా జల్లెడ పట్టేవారు. రచయితలకి కేవలం పోస్ట్లో  పంపడం, ఎదురుచూడటం అంతే.  ఇంట్లోరచనలు చేయడానికి పెద్దలుఒప్పుకునేవారుకాదు. ఇప్పటిలా పరిచయాలు ఉండేవి కావు. ఇంత విస్తృత అవకాశాలు అప్పట్లో లేవు.  రచయితలంటే   ఇంచుమించు దేవతలే.

 

రచయితలంటే దేవతలని  చాలా చక్కటి నిజం చెప్పారు. అంటే రచయిత లో దైవత్వ  లక్షణాలు వుంటాయని  పాఠకాభిమానులు  భావించే వారేమో?

* అవును .పూర్వ జన్మసుకృతంకొద్దీ సరస్వతీపుత్రులవుతారని భావించే సంస్కృతి మనది.అందుకే ఎంతధనవంతులైనా పండితుల్ని గౌరవించేవారు. అందుకే రచయితలకి అంతటి  ఉన్నత స్థానం ఆరాధనదక్కింది.

 రచనలు చదువుతున్నప్పుడు   రైటర్ పట్ల మనకొక ఇమేజ్ కలుగుతుంది. ఆరాధన కలుగుతుంది.  అలా తెలుగులో మీకనిపించిన అత్యుత్తమ రచన కానీ,  అత్యున్నత రైటర్ కానీ వున్నారా?

* నాకదేమిటో, నేనుచిన్నతనంనుండీ వ్యక్తులని ఆరాధించేదాన్నికాదు. రచనని బట్టే రచయిత. అన్నీచదివేదాన్ని. ఏ అక్షరమూపోనిచ్చేదాన్నికాదు. రంగనాయకమ్మగారి -కృష్ణవేణి, సులోచనారాణిగారి సెక్రెటరీ…అన్నీఆవయసులోఅభిమానించి ఆరాధించిన రచనలే.

 

 ఊహా కల్పిత రచనలమీద కొంత విమర్శ వుంది. స్త్రీ రచనలు  స్వప్న జగత్తున తేలుతుంటాయని. లేదా స్త్రీ పక్షపాతులై వుంటారని!.. ఈ వాదాన్ని మరి మీ రెంతవరకు సమర్ధిస్తారు?

*   ఏదిరాసినా కొంత అవగాహనతో రాస్తే కనీసం చదువరులకి ఆనందాన్నికలిగిస్తుంది. పురుషులంతా గొప్పరచనలు చేసేయలేదు. అంతులేని సమస్యలవలయంలో స్త్రీవున్నప్పుడు   తనగురించి తానుచెప్పుకోక పోతే ఇంకెవరికి స్త్రీ బాధలు అక్కరకొస్తాయి. అయితే కొందరు రచయిత్రులు అసలు సమస్యకానిదాన్ని-  సమస్యగా చూపిస్తూ… ‘మేముకూడాస్త్రీవాదులమే’అని చాటిచెప్పుకోవడానికి కొన్నిఅనారోగ్యకరమైన రచనలు చేస్తున్నారు. వాటికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదు.  స్త్రీ స్వాతంత్రమంటే లైంగికస్వేచ్చేనా? ( రచయిత్రి ప్రశ్నలో ఆవేదన తొంగిచూసింది.)

 

 స్వాతంత్రమంటే లైంగికస్వేచ్చేనా? సూటి అయిన ప్రశ్న! ..నేటి సమాజం లొ మనం చూస్తున్న ‘ లివిన్ రిలేషన్ షిప్’  బాంధవ్యాల పై  మీ అభిప్రాయం?   

* ఎందుకో  స్త్రీ ఈ బంధం లో మరికాస్త కష్టాలనే కొనితెచ్చుకుంటుందని నా ఉద్దేశ్యం. సమాజపు కట్టుబాట్లకే వెరవని  మగాడు.. భర్తగా తన ధర్మాన్ని విస్మరించిన మగాడు.. సహాజీవనంలో స్త్రీని గౌరవించి ప్రేమించగలడా? ఏ సీసాలో పోసినా  అదే సారాయి అయినట్లు, మగవాడి ఆలోచనా విధానం మారుతుందా అనేది పెద్ద సంశయంతో కూడిన ప్రశ్నే!  ఏ బంధం నిలవాలన్నాఅంతర్లీనంగా ప్రేమ, భాద్యత, గుర్తింపు వుండాలి. తిరిగి స్త్రీ చిక్కుల్లో పడి మళ్ళీకష్టాలే కొనితెచ్చుకుంటుందని నా భావన.

ఈ ఇతివృత్తాన్ని ఆధారం గా చేసుకుని కథలేమైనా రాసారా?

* నిజం చెప్పాలంటే – నే రాసిన కథల్లో నా రెండవ కధ  –  ‘దూరపుకొండలు’ ఇలాంటి సబ్జెక్టే .  అప్పటికినాకింకాపెళ్లికాలేదు .   సహజీవనంగురించితెలియదు.  కానీ రాసేసాను. ఆంధ్రప్రభవీక్లీలోవచ్చింది. బాపూగారుబొమ్మవేసారు. మా బావగారు –  ‘నీకిప్పుడే ఇంతింత ఆలోచనలోస్తున్నాయా,’ –  అనిబుర్రమీద ఒకటి కొట్టి, వందరూపాయిలిచ్చారు.

మీరు బహుమతి పొందిన కథలు చాలా రాసినట్టు గుర్తు నాకు! 

* అవునండి. చాలానేరాశాను. తాన కదలపోటీలో బహుమతిపొందిన కధ – ఆ ఒక్కరోజు. బహుమతిపొందిన సీతమ్మతల్లి ,ఛీ మనిషీ….ఇలా చాలానే రాశాను.

ఇన్ని బహుమతి కథలెలా రాయగలిగారు?

* ఎక్కువగా నాకధలు జీవితాల నుండి తీసుకున్నవే. వేదనలేకుండా నాకు రచనలుచేయడంరాదు. బహుశా అదే కారణమై వుండొచ్చు, నా కథలకి అంత ఆదరణ, గుర్తింపు కలగడానికి.

ముఖ్యంగా మరో ప్రశ్న శారద గారు! అప్పట్లో  మీ కథలు ఎంత తరచుగా గా పబ్లిష్ అయ్యేవో అంత త్వరగానూ పాఠకుల మనసుల్లో తిష్ట వేసుకునుండిపోయేవి. ఆ తర్వాత కాలంలో  క్రమక్రమం గా మీరు  కనిపించడం మానేసారు.  దూరం జరిగింది. కాదు, పెరిగింది.  ఈ గాప్ కి కారణం? రాజకీయాలా? లేక మీ వ్యక్తిగతమా?

*( రెండు క్షణాల మౌనం తర్వాత )      – బయట రాజకీయాలని చాలావరకు బాధపడుతూనే ఎదు ర్కొ న్నాను.  వ్యక్తిగతమైన సమస్యలకి …క్రుంగిపోయాను. ఇది వాస్తవం.

…ఈ దూరం ఎం తైనా బాధకరం. కదూ? 

* …  చాలానలిగిపోయాను దమయంతీ! ఇంకా చెప్పాలీ అంటె నన్ను నేను మరచిపోయాను.

 ఇంత కాల వ్యవధి జరిగినా,   మీ రచనల్లో – అదే గ్రిప్ మెయింటైన్ చేయడం ఎంతైనా విశేషం. అందుకు మీరు చేస్తున్న  ప్రత్యేకమైన కృషి ఏమైనా వుందా? 

* కృషిఏమీలేదు, దేవుడు నా కలానికిచ్చిన శక్తీ అంతే. నేను ఏనాడూ రఫ్ రాసి  ఎరుగను, రాయాల్సిందంతా ఒక్కసారే అనుకుని రాసేస్తాను. లేకపోతే నాకసలు టైం అనేదే వుండదు.

*  మీ రచనలు ఏవైనా సినిమా తెరకెక్కాయా?

* ఎక్కేయి .నాపేరుతోకాదు.వాళ్ళతోపోరాడే శతి నాకులేక వదిలేశాను. ‘ మనసునమనసై’ అనే నాకధ తెలుగులోనూ, హిందీ లోనూ హిట్టయిఆడుతుంటే చూస్తూఊరుకున్నాను. అలాగే ఎంతోమంది రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టేరు.  వ్యాపారాల్లో కొచ్చేసరికి ఇదిమామూలే.

? – ‘వాళ్ళతోపోరాడే శక్తీ నాకులేక వదిలేశాను ..’ –  ఇలాటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఎదుర్కోలేని అసహాయతలో   అనిపిస్తుంది కదండీ? కలం బలం కన్నా, అహం బలం బలమైనదనీ, గుండె బలం కన్నా ‘గూండా బలం’  గెలుస్తుందని.. ఎంత ఆవేదన కదూ?   ఇతరులకెవరికీ అర్ధం కాని ఈ బాధ కేవలం రైటర్స్ కి మాత్రమే అనుభవైద్యకం. ఎలా తట్టుకుని నిలబడగలిగారు?

* ఒక్కపోరాటంకాదు. అడుగడుగునా ఎన్నోసమస్యలు ఎదుర్కొన్నాను . అటు వుద్యోగం, ఇటు ఇల్లు.  రచనారంగంలోసమస్యలు.  అప్పటికీఇప్పటికీ ఎన్నో…దైవమే తోడయి నన్నుముందుకు నడిపించింది.

ఒకసారి ఒకసినిమాకి మాటలు రాసేను. దర్శకుడు తనపేరు వేసేసున్నాడు. పోరాడేను. గెలిచే సమయానికి మాలాయర్ అటు జంప్. చాలారోజులు నిర్ఘాంతపోయి వుండిపోయాను.  ఎంతోకాలం ఇది నారచనల మీద ప్రభావంచూపింది. అందుకే తర్వాతఎన్నిసార్లుమోసపోయినా…మౌనంపాటించాను. రచయితని మోసం చేయడం తేలిక. డిస్కషన్స్ అంటూ రైంటర్ని పిలిపిస్తారు. కధవింటారు. మళ్ళీపిలుస్తాం అంటారు. ఇక అంతే. అలా నా కధ వాళ్ళచేతిలోకి వెళ్ళిపోయింది. చేసేదేమీలేదు.  కొన్నికోట్లుపెట్టి సినిమా తీస్తారు. కానీ సినిమాకి మూలమైన కథా రచయితని మాత్రం మోసం చేస్తారు. ( ఎంతో బాధ ధ్వనించింది ఆ మాటల్లో.)

  కొత్తగా పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు.  :-)  నిజంగా అభినందించదగిన కళ. ఎలా అలవడింది?

* అవునుచిన్ననాటి నుండీ నాకు పెయింటింగ్ అంటేచాలాఇష్టం. నన్ను నేను రవీంద్రనాథ్ ఠాగూర్  ,అడవి బాపిరాజుగారి తో పోల్చుకుని మానాన్న గారికిచెప్పేదాన్ని.కానీనేర్చుకునేఅవకాశంరాలేదు.ఇప్పుడు ఫేస్బుక్ లో ఆ సరదా తీర్చుకుంటున్నాను.అందరూ అక్కా అని పిలుస్తుంటే సంతోషంగావుంది.

ఈ ఫేస్ బుక్ మీకు పునర్జన్మ వంటిదంటూ ప్రశంసించారు?    

* అవునండి. నిజంగానే.

. మీ రచనల్ని ఇంకా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?

* త్వరలో కథల సంపుటి వెయ్యాలనుకుంటూన్నాను.  కౌముది వెబ్ మాగజైన్లో నిదురించేతోటలోకి అనే సీరియల్ రాస్తున్నాను.

అనుభవజ్ఞురాలైన రచయిత్రి గా  చెప్పండి. కథ  అంటే ఎలా వుండాలి? ఎలా వుంటే పాఠకులని ఆకట్టుకుంటుంది? ఔత్స్చాహిక రచయితలకి   మీ సూచనలు సలహాలేవైనా  ఇవ్వగలరా?

* నేను ఇతరులకి చెప్పగలిగినదాన్నోఅవునోకాదో కానీ ఒక్కటిమాత్రం నాపరంగాచెప్పగలను.  శైలి అంటే చదివింపచేయగల శక్తి.  భావానికి తగుమాత్రం భాష ,చిన్నకొసమెరుపు. –  పాత సబ్జెక్ట్అయినా ఒక ఇనోవేటివ్ ఆలోచనా విధానం వుంటే చివరి వరకూ చదివేయొచ్చు.కధకి వ్యాసానికి తేడాతేలియాలి – ముందు.

 సమాజం పట్ల రైటర్ కి బాధ్యత వుంటుందా? వుంటే, ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తారు.

*  వుండాలి. బాధ్యత వుండాలి. కొన్నిరచనలు సరదాగా రాసినా, మధ్యమధ్యలో రచయిత తొంగిచూస్తూనేఉంటాడు.

sarada painting

మీ పరిశీలనలో మీరు చదువుతున్న మనుషుల మనస్తత్వాలలో కానీండి..జీవన విధానంలో కానీండి…ఆ కాలానికీ ఈ కాలానికీ తేడా  వుందనుకుంటున్నారా?

* వుంది. ఇప్పుడు అప్పుడు కూడా సమస్యలు వున్నా ఆలోచించేవిధానంలో  చాలామార్పువచ్చింది,పెద్దల అనవసర పెత్తనాలుఇప్పుడులేవు జీవనవిధానాలు చాలా ఇంప్రూవ్ అయ్యేయి.

స్త్రీలు శాంతి గా బ్రతుకుతున్నారంటారా?

* అని చెప్పను. అన్నివైపులా, మరింత బయటకి రావడమంటే మరింత  యుద్ధానికి తలపడటమే. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. – పోటీయుగం ఇది.

 అవును శారద గారు. స్త్రీలు శాంతి పొందడం కోసం యుధ్ధన్ని చేయాల్సొస్తున్న మాట వాస్తవం. ఆ మాటకొస్తే యుగాల తరబడి నించి  కదూ?

* నిజమేనండి. అందరకీ హాయిగా కడుపులో చల్లకదలకుండా సుఖంగా బ్రతకాలనేవుంటుంది. కానీ,  కొందరికి బ్రతుకంతాపోరాటమే.. పురుషులుస్వార్ధంతో , స్త్రీలు అజ్ఞానంతో స్త్రీ జాతికి అన్యాయం చేస్తూనే వున్నారు. యుద్ధభూమిలో నిలబడి యుద్ధంచేస్తున్నవారి  పరిస్థితి – అంతఃపురంలోకూర్చుని వినోదించే వారికి అర్ధంకాదు.

 

సమస్యల్లో వున్న  స్త్రీని చూసి సాటి ఆడవాళు చులకన చేస్తారు. ఇలా గేలి చేసే  వారిలో పురుషుల కన్నా,  స్త్రీల  శాతమే ఎక్కువేమో కదూ?

* అవును. ఇప్పటకీ ఎప్పటకీ నన్నుతొలిచేసే ప్రశ్న ఒక్కటే. పవిత్రత గురించి ఉపన్యాసాలిచ్చే వారందరూ  స్త్రీని ఇన్నివిధాల అణచివేతకు గురిచేశారెందుకు? ఈ సమాజం లో స్త్రీ ఎక్కడో,  ఏదో ఒక విధంగా స్త్రీమోసపోతూనే వస్తోంది. గాయపడుతూనే వుంది. కన్నీరుపెడుతూనేవుంది.  ఒకచట్రంలో భద్రతగాకూర్చున్నస్త్రీలకి ఇవి అర్ధంకావు.

 

రచయిత్రి గా –   అమితమైన మానసిక  సంఘర్షణకు గురి అయిన  సందర్భం ఏమైనా వుందా? 

* నేను చాలాచిన్నతనంనుండీ ఎదోఒకటిరాస్తూనే వుండేదాన్ని. అప్పటకీఇప్పటకీ ఈమామూలు దైనందిక జీవితచట్రంలో ఇమిడి మనలోని సున్నితత్వాన్ని అలౌకిక భావనా సౌందర్యాన్ని పోగొట్టుకుని బ్రతకాల్సిరావడాన్ని జీర్ణించుకోలేకపోతుంటాను. ఈవిషయంలో నేను  చాలాపరితాపానికి గురయ్యానుకూడా!

 

పాఠకుని కి రైటర్ కి మధ్య గల దూరం పెరిగిందని ఒక అంచనా.  మీరేమనుకుంటున్నారు?

*దూరం అని కాదుగానీ, తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు. పిల్లలు వాళ్ళ పోటీ చదువులలో కాలాన్నంతా చదువుకోడానికే  వెచ్చిస్తున్నారు. ఇక టీవీ  సీరియల్స్ ఉండనేవున్నాయి.  సాహిత్యం పై ఆసక్తి వున్నవారు మాత్రమే పుస్తక సాహిత్యాన్ని చదువుతున్నారు.

  భవిష్యత్తులో  ఇక తెలుగు రచనలుండవన్న వారి జోస్యం పట్ల మీ అభిప్రాయం ?     

* ఉండకపోవడం జరగదుకానీ, ప్రభుత్వం కొంతచొరవ తీసుకుని మన సాహిత్యాన్ని రక్షించాల్సిన అవసరమైతే వుందని నమ్ముతాను.

 

టీవీ  మీడియా ప్రభావం పఠనాసక్తి మీద నీలి మబ్బు పరుచుకుందనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?  

* అవును.హాయిగా ఏమాత్రం శ్రమలేకుండా నోరావలించి చూడొచ్చు.  కధ వున్నాలేకపోయినా తలపట్టేసినా పడీపడీచూస్తునారు, ఊళ్లలో అయితే మరీ!.. పరగడుపునే  టీవీలు మోగిపోతుంటాయి.

 

మరో చిన్న ప్రశ్న. తెలుగు రైటర్స్ మధ్య ఐక్యత వుందనుకుంటున్నారా?

* లేదు ,వుండదు.  ఎవరూ పక్కవారి ప్రతిభ ఒప్పుకోలేరు. దానికి చాలా విశాలహృదయం వుండాలి.

అలసిపోయిన వేళ..విశ్రాంతి అవసరం కదూ? రిటైర్మెంట్ తర్వాత కాలాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? 

* మాఅబ్బాయికిచెప్పాను – మొన్నటిసారి అమెరికావెళ్ళినప్పుడు!  ‘నేను మీకు అమ్మనే. ఒక కూతురిగా, భార్యగా,  తల్లిగా నా పాత్రలకి  నేను ఎక్కువగానే న్యాయంచేశాను.  ఇక ఇప్పుడు నేనునేనుగా బ్రతకాలనుకుంటున్నాను. నామీద ఎలాంటి ఆంక్షలున్నా నేనురానని చెప్పాను.  నవ్వి,  ‘ సరే అమ్మ ‘ అన్నాడు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు.   ఎదుటి వారి  వ్యక్తిత్వాన్ని  గౌరవించి నప్పుడే వ్యక్తుల మధ్య  ఆప్యాయతానుబంధాలు పెరుగుతాయి.

జీవితం అంటే?..

*జీవితం గురించి చెప్ప్పుకోవడానికి ఏమీలేదు. ఇది ఒకబిందువు నుండి మరోబిందువుకి నడిచేఒకచిన్నప్రయాణం. కొందరికి కాలం సాఫీగాజరిగితే,  మరికొందరికి అన్నీ ఒడిదుడుకులే. అన్నీ సుడిగుండాలే. ఎవరైనా చేరేది ఒక్కచోటికే. ‘బ్రతికినన్నాళ్ళూ మనంన్యాయంగానే బ్రతికాం’ అన్నదొకటే గొప్పతృప్తినిస్తుంది మనిషికి. అంతే.  అనుకున్నవి ఏమీజరగ లేదు. జరిగేవి ఆపలేను. కాలాన్ని అనుసరించి సాగుతున్నఒక బాటసారిని నేను. నాదురదృష్టంకొద్దీ నామంచితనమే నాకు అనేక చిక్కులుతెచ్చిపెట్టింది. మనుషుల్ని మనుషులనుకుని నమ్ముతాను. నేను ఆదరించి సహాయపడినవారే నాకు ఎక్కువ హాని చేసారు. ఇదిజీవితం.  అంతే అనుకుంటాను.

చివరిగా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? – సందేశం గా?   

* ‘హాయిగా బ్రతకండి.  పక్కవారిని బ్రతకనివ్వండి.’ –  ఇదే నేను చెప్పదలచుకున్నది దమయంతి!

ఇవీ – మన్నెం శారద గారి మదిలోని మాటలు. మనసు దాచుకోకుండా చెప్పిన సంగతులన్నీ సారంగ పాఠకులతో పంచుకోవాలనే నా  తహ తహ ఇలా నెరవేరింది.

ధన్యవాదాలు శారద గారు!

* మీకూ నా ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని కలగచేసిన  సారంగ పత్రికకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

( పాఠకాభిమానులు శారద గారిని సెల్ ద్వారా కానీ, ఫేస్ బుక్ ద్వారా కానీ కలిసి మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు)

సెల్ :  96189 51250

https://www.facebook.com/profile.php?id=100009804672869

 

***

sarada painting 2

 

రచయిత్రి గురించి :

అసలు పేరు :  పుట్టింటి పేరు మన్నెం. ( పెళ్ళికి ముందునుండే రాస్తున్నాను కాబట్టి, ఇంటిపేరు మార్చలేదు.)

జన్మ స్థలం :   కాకినాడ.

విద్యాభ్యాసం :  engineering graduation.  మానాన్నగారి ఉద్యోగరీత్యా అనేక ఊళ్లలో  చదువుసాగింది.

ఉద్యోగం : రహదారులు  భవనాల శాఖలో ఇంజనీరుగా పనిచేసి స్వచ్చందంగా రిటైర్మెంటు తీసుకున్నాను.

హాబీలు : నాట్యం,చిత్రకళ, రచనావ్యాసంగం – నాకు ఇష్టమయిన హాబీలు. ఇంటీరియర్ డెకొరేషన్ కూడా!

రచయిత్రి గా మీ వయసు :  35 సంవత్సరాలు.  అయితే మధ్యమధ్యలో చాలా బ్రేక్స్ వున్నాయి.

మీరు చదివిన నవలలు :  రంగాయకమ్మగారిబలిపీఠం, రావిశాస్త్రిగారిరచనలు, కొడవటిగంటివారికధలు, శరత్సాహిత్యం, పతంజలిగారి రచనలు..అన్నీఇష్టమే.  మంచి భావుకత వున్న కవిత్వాన్ని కూడా బాగాఇష్టపడి చదువుతాను.

ఆంగ్ల నవలలు? : ఇంగ్లీష్ సాహిత్యాన్ని కొద్దిగాచదివినా, అందులో అంత పెద్ద పట్టులేదు.ఇష్తమైన సినిమా : కన్యాశుల్కం, విజయావారి అన్నిసినిమాలూఇష్టమే. తమిళం.మళయాళసినిమాలుకూడాచూస్తాను. చెమ్మీన్ నవలచాలాసార్లు చదివాను. సినిమా చాలాసార్లుచూశాను.

పబ్లిష్ అయిన  రచనలు : నానవలలు అన్నీమహాలక్ష్మిపబ్లికేషన్స్, కొన్నిఎమెస్కోవారు, మరికొన్నినవభారత్ వారుప్రచురిచారు .

మీకు నచ్చిన మీ రచనలు :  వానకారుకోయిల నవల, ట్వింకిల్   ట్వింకిల్ లిటిల్ స్టార్,  సిస్టర్ సిస్టర్ – నవలలు నాకుబాగానచ్చిన రచనలు.

మొదటినవల : గౌతమి. మొదటిబహుమతి ఆంద్రజ్యోతి డైలీ పేపర్ లో. రెండవ నవల చంద్రోదయం. రెండవబహుమతి  ఆంద్రజ్యోతివీక్లీలో  1984 లో  కధలుచాలావున్నాయి. – ఉరిశిక్ష వుండాలని నేను రాసిన –  ‘ఆగండి ఆలోచించండి’ అన్నకదకి ఆంద్రభూమి వీక్లీ వారు ‘ బెస్ట్ స్టోరీ ఆఫ్ ద  ఇయర్ ‘ గా ప్రకటించి గౌరవించారు.  నానవలలన్నీ కన్నడంలోకి   అనువదింపబడ్డాయి.

మరపురాని సంఘటన : అనంతనాగ్ నారచనలుచదివి అభిమానంతో నన్ను చూడడానికి వచ్చారు.

ఇష్టమైన టూరింగ్ స్పాట్ : సహజసిద్ధమైన అడవులునాకు ఇష్టం. రైల్లో అరకుప్రయాణం  మరచిపోలేనిది

కథల సంఖ్య :  కధలు చిన్నవి, పెద్దవి అన్నీకలిపి 1000 దాకా రాశాను. నవలలు –  43

అవార్డులు : నాపదమూడు కధలు మంజులానాయుడు గారు సీరియల్ గా తీశారు. నేనేమాటలురాశాను. అందుకుగాను  ఉత్తమ రచయిత్రి అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వంనుండి అందుకున్నాను. రెండు నందిఅవార్డులు,  పొట్టిశ్రీరాములు యూనివర్సిటీనుండి  – ఉత్తమరచయిత్రిగా శ్రీ సి.నారాయణరెడ్డి గారిచేతులమీదుగా అందుకున్నాను.

నేనుకధమాటలురాసిన టివి సీరియల్ ప్రేమిస్తే పెళ్లవుతుందా  కి ఆ ఏడు11 నంది అవార్డులువచ్చాయి.

– ‘ఒకే బహుమతి ’ పోటీ   ప్రకటించారు ఆంద్రజ్యోతివీక్లీవారు.  ‘అది నాకే వచ్చింది – ‘పిలుపునీకోసమే ‘అన్న నారచనకి!

కలిసిన రైటర్స్ : సభలకివెళ్ళేఅలవాటుతక్కువ. వాసిరెడ్డిసీతాదేవిగారు ఎక్కువగా పిలిచేవారు.వారిదగ్గరే ఇతర రచయితలని చూశాను. ఒక నవల వారికి అంకితమిచ్చినప్పుడు శ్రీదాశరధిరంగాచార్యగారు నవలగురించిప్రసంగించారు.

ప్రత్యేక కళ : పెయింటింగ్స్. అంతాస్వయంకృషే . జే.పి సింఘాల్ బొమ్మలకి ఏక లవ్య  శిష్యు రాలీని నేను.

ఖాళీ సమయాలలో : ఖాళీఅంటూవుండదు. గార్డెనింగ్ అంటే చాలాఇష్టం. ఎర్ర మంజిలి కాలనీలో  మా ఇంటి  తోట చూసిజనం ఆగిపోయేవారు.

ఆశయం: నవ్వుతూనవ్విస్తూ నిగర్వంగా జీవించడమే నా ఆశ, ఆశయం.

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గ్యాలరీకి దూరంగా కవనం: అనంతు

 

 

అనంతుకి బాగా అతికే ట్యాగ్ లైన్ – “కేవలం కవి కాదు!” అటు వచనం, పత్రికా రచనం, ఇటు కవనం, చిత్ర లేఖనం, చలనచిత్రానుభవం- అనంతు అనేక కోణాల kaleidoscope! మాటలో మంత్రం, విశ్లేషణలో గాఢత్వం, కదలికలలో జీవన తృష్ణ, దూరాల్ని జయించే ప్రేమ, భిన్న ఉద్వేగాల కూటమి! తొంభైల తరవాత తరంలోని సంక్లిష్టతల అంతు తెలిసిన వాడు. ఇప్పటి జీవితపు నుడీ నాడీ వెతికి పట్టుకున్న వాడు. నిశ్శబ్దంగా ఉండలేని వాడు – అనంతు. తక్కువే  రాసినా  ఎక్కువ కాలం  గుండెని బొంగరం తిప్పినట్టు తిప్పే  అనంతు కవిత్వాన్ని “ద్వీప కూటమి” శీర్షికతో  ఈ పన్నెండున హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్నారు “ప్రేమ లేఖ” మిత్రులు. ఈ సందర్భంగా అనంతు లోగుట్టు తెలిసిన నలుగురు – నామాడి శ్రీధర్, అఫ్సర్, ఒమ్మి రమేష్, ఎం. ఎస్. నాయుడు, పెద్ది  రామారావు-  అన్న  నానా  మాటలకు అనంతు సమాధానాలివి:

*

నామాడి శ్రీధర్ : ఎందుకీ కవిత్వం అంటే నువ్వేమంటావ్?

అనంత్: నాకు ఎందుకీ కవిత్వం అంటే నా దగ్గర తయారీ సమాధానం లేదు. బహుశా నేనే నన్ను ఆ ప్రశ్న వేసుకోకపోవడం  వల్లే.

కానీ అసలు ఎందుకీ కవిత్వం అనేది చాలా పొరలున్న ప్రశ్న. అది నాకు మాత్రమే సంధించిన లేదా వర్తించే ప్రశ్న కాదు.

మేలైన, లోతైన, ఘాడమైన, లలితమైన కవిత్వం ఎక్కడ అభివ్యక్తిగా, సృజన ప్రక్రియగా తలెత్తుకుని వుంటుందో ఆ జాతికీ, ఆ భాషకీ ఇంకా ఉద్వేగ, ఆక్రోష, ఆకాంక్ష, సౌందర్య  ప్రకటనలు బహిరంగంలోనూ సజీవంగా వున్నాయని లెక్క. అలాంటి కవిత్వం జలాలుద్దీన్ రూమీదయినా, చీనీ లీపోదయినా; అమెరికన్ జనపద వాగ్గేయకారుడు పీటె సీగర్ దయినా, దళిత విప్లవకారుడు శివసాగర్ దయినా; వీట్ మిన్ స్వాతంత్ర్య ఉద్యమ నేత పో చి మిన్ దయినా, స్ఫటిక కవి ఇస్మాయిల్ దయినా సరే మనసుకు దగ్గరై, అర్థమై, మక్కువా అవుతుంది నా మటుకు నాకు.

మన సకల ఉద్వేగాలను కించిత్ కెరలించేది కవనం. అందుకే కవిత్వం.

అయితే కొద్దిపాటికి చెందిన వ్యాసంగమే ఏ సమాజంలోనయినా కవిత్వం. కొందరి మధ్యే ప్రభవించి, పల్లవించి, ప్రవహించే జల అది ఇంకా ఇక్కడ. కవిత్వం కళ. సృజన వేరు. కళ వేరు. చాలా సార్లు సృజన సహజాతం కావచ్చు. పిచ్చుకలు అల్లే అందమైన గూడు లాగా. కానీ కళ తర్ఫీదు వ్యవహారం. రస ఆస్వాదనకు (appreciation) ఏ ప్రక్రియలోనయినా తర్ఫీదు, సాధన తప్పనిసరి. కవిత్వం మినహాయింపేమీ కాదు.

శ్రీ శ్రీ లాంటి కవి మన కవిత్వానికి  icon (మహాకవి) కాకపోయివుంటే మన వచన కవితానుడి ఇన్ని గడులు, సుడులు దాటుకుని ఇంత పెద్ద గెంతుతో వచ్చేది కాదు. కానీ శ్రీ శ్రీ (తరహా) ది మాత్రమే కవిత్వం అయి తక్కినది కాకుండా (చాలా నాళ్ళు) పోవడంలో శ్రీశ్రీ కి కీడు చేసిన వాళ్ళ వాటానే ఎక్కువ. శ్రీశ్రీ లో tautological అంశ కూడా వుంది. అది ఆ కాలానికి తగింది. దాన్ని సందర్భం నుంచి వేరుచేసి తక్కువచేయలేం. కానీ ఆ tautology ఇప్పుడు redundant.

జాషువా, నారాయణబాబు, పఠాభి, దిగంబర కవులు, బైరాగి, వజీర్, ఇస్మాయిల్, అజంతా, మో లాంటి కవులు శ్రీశ్రీ తరహాని పటాపంచలు చేయగలిగారు. అందుకే తర్వాత తరాలకు శ్రీశ్రీ ఇక emotional baggage కాలేదు అంతగా. అయితే మన గొప్ప కవుల్లో చాలా మంది కార్డ్ హోల్డర్స్, గ్యాలరీ ప్లేయర్స్. లేదా showmen అనవచ్చు. అంటే గ్యాలరీ పట్ల విపరీతమైన స్పృహ వున్న ప్రదర్శకులు (performers/charmers). ఇది నిందార్థంలో కాదు. నిశ్చిత అర్థంలోనే. కానీ కార్డులనుంచి, గ్యాలరీలనుంచి విముక్తం అయి వికసించిన, వినిపించిన నిజ కవిత్వం మనకు చాలా తక్కువ. దానికి  ప్రబలమైన కారణాలు మన అతితార్కిక అభౌతికవాద అకమ్యూనిష్ఠాగరిష్ఠు కుబ్జ విమర్శకుల దుందుడుకుతనం, డాంబికం, జడత్వ కొలమానాలూ, పటాటోప ప్రదర్శనం, దూషణం. ఇది చాన్నాళ్ళు కొనసాగింది. కాబట్టే మన socalled  avant-garde writers’ ensemble ఏనాడో dead poets’ society గా మారిపోయింది. పైగా ఎప్పుడో శివసాగర్ చేసిన ఈ ప్రకటననీ, విశ్లేషణని anti-revelutionary elements పెట్టే శాపనార్థాలుగా ఇప్పటికీ తమ శ్రేణుల్లో చెలామణీ చేసుకుంటూ ఆత్మవంచనకు పాల్పడుతూ డాంబికంగా వుంది ఆ సంఘం.

ఇక కొత్త అని చెప్పలేం కాని, భిన్న మైన విమర్శను రంగం మీదకు తీసుకు వచ్చాయి అస్తిత్వ ఉద్యమాలూ, అదే కాలంలో ప్రవేశించిన post-modernism. అయితే అప్పటి వరకూ మిణుకు ఉనికిలో వున్న విమర్శ వీటి నుంచి వినమ్రంగా నేర్చుకున్నది శూన్యం. ఇంకా విషాదం ఏమిటంటే… అస్తిత్వ వాద ఉద్యమాలు, post-modernist లూ  అప్పటి వరకూ వున్న విమర్శలోని ఓగును తగిలించుకుని బాగును విసర్జించడం.

అందుకే ఇప్పటి కవిత్వం కార్డులనుంచీ, గ్యాలరీ కోసం ప్రదర్శణల నుంచీ విముక్తం అయినట్టు పైకి కని, వినిపించినా సాహిత్య విమర్శ గైర్హాజరీ వల్ల  ఇటీవలి కవిత్వంలో కవిత్వమే మృగ్యం. కవిత్వం ఒంటరిగా మనలేదు. సత్ విమర్శ నిశ్వాసం. అది లేని కవనమే ఇప్పటి చెలామణీ మరి.

 

నామాడి శ్రీధర్: రచనకీ, ఆచరణకీ మధ్య కవిలో ఎంతెంత దూరమని చదువరి కొలుస్తాడంటాను. నువ్వేమంటావు?

అనంతు: రచన ముఖ్యమా, రచయిత ముఖ్యమా అన్న చర్చ ఈ నాటిది  కాదు. అత్యంత ఎక్కువగా కార్ల్ మార్క్స్ మీద ఈ నాటికీ జరుగుతోంది. యంగ్ మార్క్స్ అనీ, లేటర్ మార్క్స్ అనీ. రచయిత ఏ కాలంలో, ఏ సందర్భంలో ఏమన్నాడు, కాలానుగుణంగా రచయిత అభిప్రాయాల పరిణామంలో వైవిధ్యాలనూ, వైరుధ్యాలనూ బేరీజు వేస్తూనే వున్నారు చదువరులు. అలా వేస్తూనే వుంటారు. అయితే రచయిత కన్నా రచన కీలకం అనే వర్గంతో నాకు సమ్మతి వుంది.

ముందు తరం పరిమితుల ఎరుక కల్పించుకోవడమే తరువాతి తరం పరిణతి. ఎరుక అదంతకదే మన దరి చేరి రాదు. మనమే కల్పించుకోవాల్సి వుంటుంది. మన చొరవతో, చైతన్యంతో. ఆ చొరవ, చైతన్యమే ఆచరణ. కార్యాచరణ అంటే అన్నిసార్లూ చౌరస్తాలో నిలబడి నినదించడం, నిరసించడం మాత్రమే కానక్కర్లేదు. ఆయుధాలు పట్టుకుని అడవికి వెళ్ళడమొక్కటే ఆదర్శ ఆచరణకు అన్నిసార్లూ గీటురాయి అని ఎవరైనా బుకాయించి దబాయిస్తే చెల్లదు. కొన్నిసార్లు ఇంటిలో సమాయత్తమయి తలుపు తీయడం కూడా కార్యాచరణే. ఆ తలుపు దాటేలోపే ఎన్ని సంశయాలు, ఎన్ని సందిగ్ధాలు. అవన్నీ తీరకుండా అడుగు కదలదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఆలోచనే ఆచరణ. అట్లాంటి కాలంలో కీలక ఆచరణ ఆలోచన చేయడమే. మన సమ సమాజానికి అనుగుణమయిన నమూనా మనం రచించుకునే వరకూ ఆలోచించడమొక్కటే, చర్చించడమొక్కటే, తర్కించడమొక్కటే, ఆ ఆలోచనల ప్రసారానికి పూనుకోవడం ఒక్కటే ప్రధాన ఆచరణ.

రచన లేదా సృజన కర్తవ్యం అన్ని సందర్భాలలో ఖాళీలను పూరించడం మాత్రమే కాదు. సృజన ఖాళీలను సృష్టిస్తుంది కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని కాలాలలో. అఖాతాలను ఏర్పరస్తుంది సాహిత్యం. ఆ ఖాళీలను, అఖాతాలను పూరించాల్సింది చదువరులే. ఎందుకంటే రచయిత తదుపరి కదా చదువరి. సాహిత్యం అంటే కేవలం తెలుగు సాహిత్యం అనే అర్థంలో కాదు. మన ఆవరణలోకి, అందుబాటులోకి వచ్చిన అన్ని భాషల సారస్వతం అనే స్థూల అర్థంలోనే. కొద్ది మంది రచయితలు ఏనాడో ప్రతిపాదించిన విలువలు, ఆయా పాత్రల ఆదర్శ జీవన శైలులు ఇంకా మన కనుచూపు మేరలో కూడా మన సమాజంలో సాధ్యమా అన్నది నేటికీ ప్రశ్నార్థక మే. ఆ రచయితలు అంతటి ఖాళీ సృష్టించి వెళ్ళిపోయారు. ఇక చదువరుల ఆచరణే దాన్ని భర్తీ చేయాలి కదా. గొప్ప రచనలు ప్రతిపాదించిన విలువలు మన అందమైన బుక్ షెల్ష్ లలో దాచుకుని ప్రదర్శనకు పెట్టుకోడానికి కాదు. ఒక రచయిత, మేధావి ప్రతిపాదించిన ఒక ఆమోదయోగ్యమైన జీవన/సమాజ నమూనా అతని జీవిత కాలంలో ఆచరణలో సాధ్యం కాక పోవచ్చు. అలాంటి sensible value systemsని, ideal societyనీ నిర్మించుకునే బాధ్యత చదువరులదే. అంటే ప్రజలదే. ఆ బాధ్యత రచయితది కాదు. రచనే రచయిత మౌలిక ఆచరణ. రచన బాగోగులను నిలకడగానయినా నిగ్గుతేల్చేది చదువరులే. చదువరులలో ముందు వరస తర్ఫీదు అయిన విమర్శకులదే.

anant

ఒమ్మి రమేశ్ బాబు: ఉద్యమాలకీ – కవిత్వానికీ, కవికీ- ఉద్యమాలకీ ఇప్పుడు ఎలాంటి సంబంధం వుంది? ఎలాంటి సంబంధం వుండాలి?

అసలు సంబంధంవుండి తీరాలా? తెలుగులో ఉద్యమ కవిత్వం అనేది నినాద ప్రాయం అయ్యిందన్న విమర్శ సరైనదేనా? నిజానికి నినాదం అనే పదాన్ని తక్కువ చేసి చూడటం తగునా?

అనంతు: కవిత్వం అనే ఉద్వేగ సృజన ప్రక్రియ లేకుండా ఎలాంటి ఉద్యమాలు నడవడం అయినా పెద్ద వెలితే. ప్రపంచ వ్యాప్తంగా నడిచిన ఉద్యమాలకు కవిత్వం చాలా సార్లు కొత్త ఊపిరిలూదింది. చాలా చోట్ల ఉద్యమాలను కొత్త దారులు పట్టించి ఉర్రూతలూగించింది. ఉత్తేజాన్ని రగిలించింది. మన దగ్గర వచ్చిన పలు ఉద్యమ కవిత్వం స్వభావంలో స్థూలంగా ఆయా ఉద్యమ భావాల ప్రచార, ప్రసార పాత్రనే పోషించిందనే చెప్పకతప్పదు. Broadly it is propagandistic in nature.  నిజానికి ఉద్యమంలో కవిత్వం పాత్ర అది కూడా కానీ, అంతే మాత్రం అయితే కానేకాదు. So called విప్లవోద్యమ కవిత్వంలో ప్రధానంగా కనిపించే దూకుడు లక్షణం కవిత్వాన్ని బ్యాక్ బెంచ్ వేయించింది. Metaphorical గా మాట్లాడితే విప్లవాన్ని కాంక్షించే మన కవిత్వంలో భుజాన గన్ను వుండటం మాత్రమే డామినేట్ చేసింది. కానీ ఒక చేతిలో రొట్టె ముక్కా రెండో చేతిలో రోజా మొగ్గా మిస్ అయ్యింది. అందుకే ఇక్కడి విప్లవ కవిత్వంలో నా మల్లియ రాలెనునీ మొగలి కూడ రాలెనునా మల్లియనీ మొగలీ ఆకాశం చెరెను’( మావో కవితకు శివసాగర్ అనువాదం) లాంటి aesthetics, sensibilities, subtleties వున్న orgoanic metaphors తో కవిత్వం చాలా చాలా అరుదుగా వచ్చింది.

నినాద ప్రాయంగా మారిపోయింది విప్లవ కవిత్వం అన్న మాట ఇది వరకే చాలా మంది అనేసి నిర్ధారించేసారు. కానీ అది వాచ్యంగా, డొల్లగా, రొడ్డ కొట్టుడుగా, tautological గా, redundant గా మారిందనే అర్థంలోనే అనుకుంటా. విప్లవ కవిత్వం నిజంగానే నినాదప్రాయంగా మారి వుంటే అంతకన్నా ఏం కావాలి? నినాద ప్రాయం అన్న పదప్రయోగం నిందార్థంలో ఇక్కడ వాడుతున్నారు. లయాత్మక నినాదంలా వుండే ఉర్దూ గజల్ అయినా, పోర్చుగీసు ఫాదూ (Fado)అయినా, సౌందర్యాత్మక తత్వ ధారలను నినాదాల మల్లే పరిమళించే జపనీయ హైకూ అయినా కవిత్వంలో నేటికీ అద్భుతమే కదా? అందుకే కవిత్వం నినాదంగా మారడం ఒక మంచి కవిత్వ లక్షణమే అని నా అబిప్రాయం. అయితే ఆస్థాయిలో తెలుగులో కవిత్వం కైగట్టింది ఒకరో ఇద్దరో.

ఇక అస్తిత్వ ఉద్యమాల కవిత్వంలోని ascertaining tone మితి మీరి, ధ్వనించి కవిత్వాన్ని మింగేసిన సందర్భాలే ఎక్కువ. Statusquoని negate చేయడం, negationతో తమ identity ని establish చేయడం, ఆధిపత్యాన్ని dismantle చేయడం మేరకు అస్తిత్వ ఉద్యమ కవిత్వం ఒక అదివరకు లేని పరిభాషని, అభివ్యక్తిని తెలుగు కవిత్వానికి జోడించింది. ఇది చాలా మెరుగైన జోడింపే. కానీ అక్కడే ఆగి తనని తాను విపరీతంగా రిపీట్ చేసుకుంటోంది అస్తిత్వ ఉద్యమ అభివ్యక్తి. కవిత్వంలో polimical discourse ఎంత భిన్నంగా, అందంగా, అర్థవంతంగా చేయవచ్చో చెప్పేందుకు ఉద్యమ కవిత్వం నుంచి ఉదాహరణలు ఇచ్చేందుకు చేతి వేళ్ళే మిగిలిపోతున్నాయి. వాదమే, వాదనే దానంతకదే కవిత్వం కానే కాదు అనేందుకు మాత్రం అందులోంచి కోకొల్లల ఉదాహరణలు చూపించవచ్చు. కవిత్వం సాధన చేయవలసిన సృజక ప్రక్రియ. కవిత్వం అన్ని తక్కిన కళల్లాగే తర్ఫీదు అవసరం వున్న కళ. అయితే మనకు కొత్త కొత్త inspirations పొందేందుకు చొరవ, చదువు వుండాలి. కదలికా(mobility) కావాలి. మనకు కొత్త కొత్త influences ఎప్పటికప్పుడు ఏర్పడేదందుకు మన తలుపులూ, తలపులూ ఎల్ల వేళలా బార్లా తెరిచే వుండాలి. కేవలం కవిత్వానికే కాదు ఇంకే సృజన కయినా సరే.

 

అఫ్సర్: నీ కవిత్వంలో మంత్ర వాస్తవికత వినిపిస్తోంది. నిజమేనా?

అనంతు: నిజం కాదు. మంత్రవాస్తవికత అంటే magic(al) realism అయితే అది నా కవిత్వంలో లేదనే చెప్తాను. magic(al) realism ని డీల్ చేయగలిగేంత కవిత్వ రచనా పరిపక్వత నాకింకా  రాలేదనుకుంటా. మన రచనల్లో మంత్రవాస్తవికత అనేది మనకు తెలియకుండా చోటుచేసుకునే యాధృచ్ఛిక అంశ కాదు. అది స్పృహతో కూడిన అభివ్యక్తి. పరిణత రచయిత పట్టు అది. Lautréamont రాసిన మలదరోర్ శ్లోకాల నుంచి, మార్క్వెజ్ కాల్పనిక రచనలు, ఎమ్మా అందెజెవస్కా కవిత్వం వరకు magic(al) realism పలురచనల్లో పలురకాలుగా వ్యక్తమయ్యింది. మంత్రవాస్తవికత అని సగర్వంగా అనదగ్గ తెలుగు రచన పతంజలి ఒక దెయ్యం ఆత్మకథ.  అయితే పతంజలి తన కథ చూపున్న పాటని మార్క్వెజ్ కి అంకితమిచ్చాడు. కానీ అందులో మంత్రవాస్తవికత నాకయితే కనిపించలేదు. వున్నదల్లా మాంతాజ్. గోపిని కరుణాకర్ రాసిన కానుగపూల వాన కూడా మంత్రవాస్తవికత పాళ్ళున్న రచన తెలుగులో.

కవిత్వంలో మంత్రవాస్తవికత సాధ్యం కావాలంటే చాలా సాధనతో పాటు, ఆ రచనకి బలమైన తాత్విక పునాది వుండటం ప్రధానం. అది అంత సులభం కాదు; కనీసం కవిత్వంలో. మంత్రవాస్తవికతని ఎస్టాబ్లిష్ చేసేందుకే కొంచెం పెద్ద కాన్వాస్ అవసరం. అందుకే మంత్రవాస్తవికతకి కవిత చాలా ఇరుకైన చోటే.

నా కవితల్లో నేను వాస్తవ, వాస్తవేతర అంశాల, ఉద్వేగాల, భావనల మధ్య కొల్లాజ్ చేయడానికి అక్కడక్కడా చిన్న ప్రయత్నం చేసానేమో మహా అయితే.

anant1

అఫ్సర్: బైరాగి, వజీర్ రెహ్మాన్ లు నీలో ఎంతెంత వున్నారు?

అనంతు: అస్సలు లేరు. ఆలూరి బైరాగివి నేను ఒక ఏడాది క్రితం వరకూ ఒక్క రచనా చదవలేదు. ఆ పేరు సురేంద్ర రాజు నోట 20 ఏళ్ళ క్రితం విన్న గుర్తు. అంత versatile thinker writer అయిన బైరాగి సారస్వతం అందుబాటులో లేకపోవడం తెలుగు సాహిత్య దుర్మార్గాలలో టాప్ టెన్ లో ఒకటి.

బైరాగి కవిత్వంలో వుండే stoicism ఏమైనా నా కవిత్వంలో కనిపిస్తే (ఇదీ నా పరిశీలనే) అది కేవల యాధృచ్ఛికమే. అంతకన్నా ఒక్క వంతు బైరాగి ప్రభావమూ నా మీద వుండేందుకు భౌతిక ఆస్కారమే లేదు.

నా కవిత్వంపైన ఇద్దరి ప్రభావం వుండేది. అది ఎప్పటికప్పుడు కనిపించకుండా, లేకుండా చేసుకోవడమే నేను సచేతనంగా చేసే ఏకైక ప్రత్నం. ఆ ఇద్దరూ నామాడి శ్రీధర్, ఎం ఎస్ నాయుడు.

వజీర్ రెహ్మాన్ నాకిష్టం. అంతే. ఆ ఇష్టం వల్ల నా కవితల్లో వజీర్ ఛాయలున్నాయంటే మరీ ఇష్టం. ప్రభావితమయ్యానా? ప్రశ్నార్థకమే.

 

ఎం ఎస్ నాయుడు: కవితలు రాయడం ఎలా అలవడింది? కొనసాగించడానికి ఏంటి motivation?

అనంతు: కవిత్వం నాకు ఇష్టంగా మారింది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే(1993).

త్రిపురనేని శ్రీనివాస్, నామాడి శ్రీధర్, ఒమ్మి రమేశ్ బాబు, శశి, సత్య శ్రీనివాస్, సిద్దార్థ, ఎం ఎస్ నాయుడు, ఇంద్ర (ఇది అంబటి సురేంద్ర రాజు కవితా కలం పేరు), అఫ్సర్, యువక(కలేకూరి ప్రసాద్), జ్వాలాసాగర్ (ఇది వెల్చేటి రాజీవ్ కలం పేరు), అలిశెట్టి ప్రభాకర్, సీతారాం, దెంచనాల శ్రీనివాస్, మహెజబీన్, గోరటి వెంకన్న…. వీళ్ళ కవిత్వం నాకు అటీవలి inspiration.

నేను రాసినవి చూసిందీ, చదివింది, నవ్వుకున్నదీ, గేలిచేసిందీ, మెచ్చకున్నదీ, దిద్దిందీ వీళ్ళే. కవిత్వం అంటే నాకు అది వరకు వున్న చిన్న చూపు పోగొట్టిందీ వీళ్ళే.

శివసాగర్ తో వ్యక్తిగత పరిచయం ఏర్పడ్డాక, గంటలకొద్దీ, రోజులకొద్దీ గడిపాకా అతని కవిత్వం పట్ల విపరీతమైన మోహం కలిగింది. నిజ అర్థంలో మన దేశంలో విప్లవకవి దళితుడయిన కామ్రేడ్ శివసాగరే సగర్వంగా.

ఎం ఎస్ నాయుడు: అసలు కవిత్వాన్ని నువ్వు ఎలా చూస్తావు?

అనంతు: మోహంగా. ఇష్టంగా గాలించి చదువుతాను మంచి కవిత్వాన్ని. అంతే మోతాదులో ఇతరులు నా కవిత్వాన్ని ఎలా చూస్తున్నారన్న ఉత్సుకత అందరిలాగే నాకూ వుంది. కొందరు నాది భావ కవిత్వం, దుఃఖ గీతిక, ప్రణయ కవిత్వం, అంతఃపుర దుఃఖం…. అనేసారు. నిజంగా 20 ఏళ్ళ క్రితం ఈ మాటలు నా కవిత్వం గురించి  అని వుంటే (నేనప్పుడు రాసి వుండివుంటే)కుమిలి కుమిలి ఏడ్చేవాడినేమో. కానీ ఇప్పుడు అవి నాకు compliments. భుజమే తట్టే తోడు మిగలని జీవన అవశేషానంతర ప్రయాణంలో శిశిరం మాత్రమే మిగిలితే అదే నా మకుటం. ఏటా వచ్చే శిశిరాన్ని రద్దు చేసే ఆత్మ వంచన కాదు నాది. వసంతాన్ని మాత్రమే project చేయడం మోసం. రుతుమయం కదా కవనం, జీవనం.

ఎం ఎస్ నాయుడు: కథలు ఎందుకు రాయలేదు? కథా విమర్శ జోలికి వెళ్ళినట్టుగా కవితా విమర్శకి ఎప్పటికి వస్తావు?

అనంతు: నా అలజడి జీవితంలో దొరికిన తీరికలో కవిత్వం మాత్రమే అమరింది. అంతే.

కథ రాసేందుకు చాలా నిర్మల జీవనం, తీరిక దైనందినం వుండాలి.  లేదా controlled schizophrenia వుండాలి.

ఎందుకంటే “Art is collective obsession and controlled schizophrenia’’ అని Leibniz అన్న మాట వందొంతులా నిజం. అది వీలు లేని కేవల agitated souls కాల్పనిక సాహిత్యం అంత సులభంగా సృష్టించ లేరు. కథ రాయాలని నా ఆశ. అది ఇంకా మిగిలిన కోరికే. కానీ అంత తీరిక లేకే. కానీ నా మది గది నిండా ఎన్నో కథలు సీమ కొడవళ్ళలా వేలాడుతూనే వున్నాయి. వెక్కిరిస్తున్నాయి. ఆ వెక్కిరింతల నుంచి తప్పించుకునేందుకు నేను అప్పుడప్పుడూ కథల అనువాదాలకు పాల్పడి నా low spirits ని boost చేసుకుంటుంటాను. అప్పటికీ నాకు తనివి తీరకపోతే సమకాలీన కథలను “నేను ఫలానా కథ(ల)ని ఎలా అర్థం చేసుకున్నానంటే…‘’ అనే సాకుతో అడపాదడపా కథలపైన నా విశ్లేషణ రాస్తుంటాను. అయితే అదంతా కథా విమర్శ అనేసుకునే భ్రమ లేదు నాకు.

కథా విమర్శ బాధ్యతాయుతమైన సృజన ప్రక్రియ. నాకు కథా విమర్శన కానీ, కవిత్వ విమర్శన కానీ serious గా pursue చేసే జీవని, నిజాయితీ, తీవ్ర ఇష్టం, academic interest లేకుండా పోయాయి.

కానీ అలాంటి విమర్శకుల అవసరం తక్షణం మాత్రం మన సాహిత్యానికి చాలా వుంది. అందుకే నేను మరీ చెప్తున్నాను; సృజన కాదు ఖాళీలను పూరించేది; చదువరుల విమర్శ మాత్రమే.

 పెద్ది రామారావు: నాటకం ఎంత  గొప్ప ప్రక్రియో రుచి చూసిన వాడివి. మళ్ళీ ఈ (బోడి) కవిత్వం ఏంటిరా?

అనంతు: నాటకం నిజంగానే కవిత్వం కన్నా అనంత ఇంతలు గొప్ప శక్తి కలది. కానీ కవిత్వాంశ లేని నాటకం మృతప్రాయం. కవిత్వం అంశ అన్ని కళల్లోనూ ఆకుపచ్చగా వుండితీరాలి.

నా కన్నా ముందే, నా కళ్ళ ముందే కవిత్వం వెలిగించినవాడివి నువ్వు. నువ్వే కవిత్వం బోడి అన్నావంటే, అది నాటకం వత్తాసుతో నీ లోని నాటక పక్షపాతి పలికిన మాటే. ఆ పక్షపాతితో నాకు అనియమ ఏకీభావం వుంది. నిజమే మనం అనుకున్న నాటకం చేయలేకపోయాం. మనం కలగన్న నాటకం అమలుకు అట్లాంటి బృందం తయారు కాకపోవటం, దాన్ని మనమే తయారు చేయలేకపోవడం మన బలహీనతే.

నాటకం (collective performing art form) సజీవంగా లేని జాతి, భాష more and more individualistic mode లోకి పోతోందని అర్థం. జాతి సాంస్కృతిక ముందడుగు మెరుగయిన నాటకంతోనూ వేయాల్సివుంటుది. సజీవ సంభాషణ అయిన ప్రదర్శనా రూపం లేని జాతి statusquoist అయిపోతుంది అలవోకగా.

నేను నాటకంలో అయిన నా తర్ఫీదును కొనసాగించలేకపోయిన మాట నిజమే కానీ, నాటకాలతో సంబంధం ఈ నాటికీ వుంది. గరికపాటి ఉదయభాను సారథ్యంలో నడుస్తున్న భూమిక అనే సంస్థ వేసే నాటకాలలో మూడింటికి సంగీతం నిర్వహించి పాటలూ రాసాను. పరిషత్తు నాటకాలంటే చిన్న చూపు లేదు నాకు. అందుకే కవలసోదరులు Peter Shaffer and Anthony Shaffer రాసిన నాటకం ప్రేరణగా అనుసృజించి ప్రియాప్రియా చంపొద్దే అనే పేరుతో పరిషత్తు కోసం నాటకం రాసాను. దానికి ఎన్ని అవార్డులొచ్చాయో లెక్కేలేదు.

కానీ నామటుకు నాకు లౌకిక విజయం కన్నా ఆత్మిక తృప్తి పరమం.

HCU అధ్యాపకులు భిక్షు అభ్యర్థన మేరకు నేను అనువదించిన గ్రీకు రచయిత సోఫోక్లీజ్ రచన ఆంటిగొనీ చాలా సార్లు పలు దర్శకుల బిడ్డగా ప్రదర్శనకు నోచుకుంది. వాటన్నింటిలో రాజీవ్ వెల్చేటి చేసిన ప్రదర్శన, interpretation నాకు చాలా ఇష్టం. ఇది పుస్తకంగా రావడానికి పురిటిపొప్పులు పడుతూనే వుందని నీకూ తెలుసు చాలా ఏళ్లుగా.

నేను కథ రాయాలా? నాటకం రాయాలా? అన్న మీమాంసకు గురయితే నా ఓటు ముమ్మాటికీ నాటకానికే ఈ నాటికీ. నేను నాటకం రాయకపోతే, సినిమా తీయకపోతే పోయేదేమీ లేదు… కానీ పోయే లోపు నాటకం మాత్రం రాస్తాను; నా తరహా సినిమా కూడా రాస్తాను; తీస్తాను. ఇది నా నిశ్చయం.

*

 

 

తర్జుమా కావాలి: సంగిశెట్టి

 

 

  ఇంటర్వ్యూ : స్కైబాబ 

~

తెలంగాణ  సాహిత్యానికి  చేసిన సేవలకు గుర్తింపుగా సంగిశెట్టి శ్రీనివాస్‌ కి  తెలంగాణ అవతరణ ఉత్సవ పురస్కారం దక్కింది. సంగిశెట్టి 1965లో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గరలోని రఘునాథ పురంలో పుట్టారు. చిన్నప్పుడే  తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌ వచ్చిన శ్రీనివాస్‌ 1990వ దశకం ఆరంభంలో ఉస్మానియాయూనివర్సిటీ కేంద్రంగా  ఏర్పడి, పనిజేసిన తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ స్థాపకుల్లో ఒకరు. 1991 నవంబర్‌ ఒకటిన ఆర్ట్స్‌ కళాశాలపై ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు వ్యతిరేకంగా పెద్ద నల్లజెండాను ఎగరేశారు సంగిశెట్టి.

తొలి  కవయిత్రి కుప్పాంబికను వెలుగులోకి తెచ్చారు. తొలి తెలుగు కథలు  – భండారు అచ్చమాంబ, ఆవుల  పిచ్చయ్య, సురమౌళి కథా సంపుటాలను వెలువరించారు. మరుగునపడ్డ తొలితరం తెలంగాణ కథల  సూచీ ‘దస్త్రమ్‌’ తీసుకొచ్చారు.  ఆంధ్రా కథకులతో పోలుస్తూ తెలంగాణ కథాచరిత్రను ‘కథాత్మ’ పేరిట వెలువరించారు. ‘తొలినాటి తెలంగాణ కథలు’, తెలుగు  యూనివర్సిటీ ‘నూరేండ్ల తెలుగు కథ’ పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం పరిశోధనలో భాగంగా తెలంగాణ పత్రికారంగ చరిత్ర ‘షబ్నవీస్‌’ని చిత్రికగట్టారు. ‘హైదరాబాద్‌ సిర్ఫ్‌హమారా’ పేరిట పుస్తకాన్ని రాశారు. సురవరం సమగ్ర కవిత్వం, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి ‘రామప్ప రభస’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సురమౌళి కథలు వెలుగులోకి తెచ్చారు. 1969-73 ఉద్యమ కవిత్వానికి, వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర ‘సార్థక జీవనం’కు సహసంపాదకత్వం వహించారు. 30కి పైగా పుస్తకాలను ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ తరపున అచ్చేశారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ, సింగిడి, దస్కత్‌, బహుజన కథకుల కచ్చీరు తరపున అనేక కార్యక్రమాల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అభిమాన విషయాలుగా అనేక పరిశోధనా పత్రాల్ని, వ్యాసాల్ని వెలువరించారు. జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రరీ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ దళిత చరిత్ర రాసే పనిలో ఉన్నారు.

1. మీరు కవిత్వం రాశారు. ఉద్యమాలు చేశారు. చివరికి సాహిత్య చరిత్ర పరిశోధనలోకి ఎలా వచ్చారు?

జవాబు: అవును.. 1980-84లో ఆ ప్రాంతంలో చాలా కవిత్వం రాశాను. శ్రీశ్రీని ఇమిటేట్‌ చేస్తూ. ‘స్నిగ్ధశ్రీ’ అనే కలం పేరుతో నేను రాసిన కవితలు పోతుకూచి సాంబశివరావు నడిపిన ‘విశ్వరచన’ పత్రికలో అచ్చయినయి. అందులో శబ్దాల పైనే ఎక్కువగా శ్రద్ధపెట్టిన. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానియంలో జరిగిన కవి సమ్మేళనానికి సీనియర్‌ దాశరథి ముఖ్య అతిథిగా వచ్చి నేను చదివిన కవితను మెచ్చుకోవడం ఓ తీపి జ్ఞాపకం.
ఇక ఉద్యమం – పరిశోధన రెండూ నా విషయంలో విడదీయలేనివి. 1990లో ఉస్మానియా విశ్వవిద్యాయంలో జర్నలిజం విద్యార్థిగా తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వాడిని. నిజానికి యూనివర్సిటీల్లో ఎన్నికలు నిషేధం విధించిన తర్వాత రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ సానుభూతి పరులు స్థాపించారు. ఈ సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఈ దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం (ఇప్పటికీ) బెస్ట్‌ స్టూడెంట్‌కు ‘షోయెబుల్లాఖాన్‌’ స్మారక అవార్డు ఇచ్చేవారు. ఆయనెవరు? అని ప్రొఫెసర్లని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. దాంతో పరిశోధన మొదయ్యింది. మన మూలాలు తెలుసుకోవడం ప్రారంభమయింది.
నేను ఉస్మానియా జర్నలిజంలో ఎంఫిల్‌ మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. ‘తెలంగాణాలో తెలుగు పత్రికలు’ అనే అంశంపై పరిశోధన చేసేందుకు నిర్ణయించుకొని అప్పటి మా గురువు ఇప్పటి మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ని సంప్రదిస్తే ఆయన ‘తెలంగాణలో తెలుగు పత్రికలు ఎక్కడివి? పరిశోధన సాగదు’ అని నిరుత్సాహ పరిచిండు. అయినా నేను పట్టుబట్టడంతో ఒప్పుకున్నడు. ఇది 1992నాటి సంగతి. ఇగ అప్పటి నుంచి హైదరాబాద్‌ల ఎక్కడ పాత లైబ్రరీ ఉన్నా వెళ్ళి అక్కడి పాత పత్రికల జిరాక్స్‌ సేకరించడం. పరిశోధనలో భాగంగా అందులోని విషయాలని నోట్‌ చేసుకునే వాణ్ణి. ఇట్లా పత్రికల నుంచి సాహిత్యంలోకి వచ్చాను.
దాదాపు ఇదే కాలంలో ఆంధ్రా ప్రాంత సాహిత్యకారులు మళ్ళొక్కసారి తెలంగాణ తెలుగు కథ అనే అంశంపై అక్కడక్కడా చర్చలు చేశారు. ఇదే కాలంలో కథ సిరీస్‌ ప్రచురణ ప్రారంభమయింది. ఒక వైపు పాత పత్రికలను అధ్యయనం చేస్తూనే అందులో ఉన్న కథను ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్నాను. ఇట్లా ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్న కథల లిస్టు ‘దస్త్రమ్‌’ పేరిట 2005లో మెవరించాను. అలాగే అంతకుముందు పరిశోధన సమగ్రంగా ఉండాలనే తపనతో సేకరణకు, రచనకు ఎక్కువ సమయం పట్టింది. ఈ లోపు ఎంఫిల్‌ సబ్మిట్‌ చేయాల్సిన టైమ్‌ కూడా అయిపోయింది. దాంతో ఈ పరిశోధనను ‘షబ్నవీస్‌’ పేరిట ప్రచురించాను. ఇది 2004 నాటి సంగతి.
1995-96 ఆ ప్రాంతంలో ‘ఉదయం’ సహోద్యోగి, తెలుగు యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న కె.శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్న అన్ని గ్రంథాయాలను వడపోశాము. అనేక మంది వ్యక్తులను కలిశాము. ఇదే సమయంలో ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశాము. దీని ప్రధానోద్దేశము అటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కావలసిన ముడి సరుకును అందించి, విస్మరణ, వివక్షకు గురైన విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం. ఇప్పటి వరకు ఈ సంస్థ తరపున పది విలువైన సాహిత్య, చారిత్రక పరిశోధక పుస్తకాలు ప్రచురించాము.
అలాగే తెంగాణ సాంస్కృతిక వేదిక, ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిర్వహించిన సభల్లో పాల్గొనడమే గాకుండా ‘సోయి’ పత్రికలో రెగ్యులర్‌ విస్మరణకు గురైన విషయాల్ని చిత్రిక గట్టాను. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తీసుకొచ్చిన ‘మత్తడి’కి కొంత ముడిసరుకునందించాను. ఇది తెలంగాణ సాహిత్య చరిత్రలో కొత్త చూపుకు పునాది వేసింది.

2. మీరొక బీసి.. పద్మశాలి. బీసిల గురించి మీరు చేసింది ఏమిటి?

జవాబు: తెలుగు సాహిత్యంలో నా అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న దశలో సుద్దాల హనుమంతుపై జయధీర్‌ తిరుమలరావు రాసిన చిన్న పుస్తకం దొరికింది. ఆ తర్వాత అలిశెట్టి ప్రభాకర్‌, తర్వాతి కాలంలో కథకు బి.ఎస్‌.రాములు, ఆడెపు లక్ష్మీపతి, పి.చంద్‌ ఇట్లా… అవును, మన వాళ్ళు కూడా సాహిత్య రంగంలో ఉన్నారు కదా.. తెలుగు సాహిత్యంలో చేనేత కార్మికుల వెతల్ని, ఛిధ్రమౌతున్న బతుకుల్ని రికార్డు చేసిన కథల్ని త్వరలోనే మిత్రులతో కలిసి సంకనంగా తీసుకు రానున్నాము. నేను నా మూలాలను మరువలేదు. దాంట్లో భాగంగానే 18వ శతాబ్దంలోనే  దార్ల సుందరమ్మ రాసిన ‘భావలింగ శతకం’ను త్వరలో పుస్తకంగా ఆధునిక దృక్కోణంలో ఆమె స్థానాన్ని ఖరారు చేస్తూ తీసుకు వస్తున్నాం.
ఇక బీసీల గురించి మీరు ఏమి చేసిందేమిటని? నిజానికి తెలంగాణ సమాజం మరిచిపోయిన ‘కృష్ణస్వామి ముదిరాజ్‌’ని ముందుగా పరిచయం చేసింది నేను. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న సాహిత్యకారుడు ఆవుల పిచ్చయ్య కథల్ని అచ్చు రూపంలోకి తెచ్చాను. సోయి, తెలంగాణ టైమ్స్‌ పత్రికల్లో చాకలి ఐమ్మ, దొడ్డి కొమురయ్య, హకీం జనర్దానదాస్‌, సంగె లక్ష్మీబాయమ్మ, సరోజిని రేగాని, మల్యా దేవిప్రసాద్‌ యాదవ్‌, మరిపడగ బలరామాచార్య, గూడూరి సీతారామ్‌, డాక్టర్‌ మల్లన్న ఇట్లా కొన్ని వందలమంది బీసీల జీవిత చరిత్రను పాఠకులకు పరిచయం చేసిన. మేము కూడా చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళమే అని నొక్కి చెప్పిన.
ఫోరం ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌ సంస్థను ఏర్పాటు చేసి బహుజనులకు వివిధ సాహిత్య, సామాజిక రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ పత్రికా ముఖంగా అనేక వ్యాసాలు వెలువరించడమైంది.

3. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించే ఎక్కువ పనిచేశారని బహుజనకారుల విమర్శ… 

–  ఇది కూడా అర్ధసత్యం. నేను నిజానికి ఎక్కువ పనిచేసిందీ, సమాచార సేకరణ కోసం ఎక్కువ కష్టపడ్డదీ దళితుల కోసం. ఎవ్వరికీ తెలియని తొలితరం దళితోద్యమకారుడు ‘వల్తాటి శేషయ్య’ను రంగం మీదికి తీసుకొచ్చాను. 1857-1956 మధ్య కాలంలో వందేండ్లలో తెలంగాణ సమాజంలో దళితుల్లో వచ్చిన మార్పును పుస్తకంగా ప్రచురించాల్సి ఉంది. ఆ పని జరుగుతోంది. భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్‌సుందర్‌, బి.ఎస్‌. వెంకటరావు, సుమిత్రాదేవి, రామారావు, వెం. లక్ష్మయ్య, సదాక్ష్మి, శంకర్‌ దేవ్‌, ‘దళిత పదం’… ఇట్లా అనేక రచనల్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకు రావడమయింది. అట్లనే తుర్రెబాజ్‌ఖాన్‌ పోరాటాలను, మహలఖాబాయి చందాను తెలుగు పాఠకులకు పరిచయం చేసింది కూడా నేనే నని గర్వంగా చెబుతున్నాను. 1857 పోరాటం- దాంట్లో ముస్లింల పాత్ర, రజకార్ల నెదిరించిన ముస్లింలు, షోయెబుల్లాఖాన్‌, ఇట్లా అనేక విషయాలపై రాసిన.
నేను ముస్లింల గురించి ఎక్కువగా రాయడానికి కారణం కళాశాలలో ఉద్యోగ సహచరులు. సంగారెడ్డి జూనియర్‌ కాలేజీలో ఉర్దూ మీడియం కూడా ఉండేది. అక్కడ అహ్మదుల్లా ఖురేషి, మహమూద్‌, నజీర్‌ లాంటి మిత్రులతో ఎప్పుడూ బైస్‌ నడిచేది. హైదరాబాద్‌-ముస్లింలకు సంబంధించిన అనేక విషయాలు మా మధ్య చర్చకు వచ్చేవి. మంచి, చెడూ కూడా. కృష్ణస్వామి ముదిరాజ్‌ ‘పిక్టోరియల్‌ హైదరాబాద్‌’,  షీలారాజ్‌ రాసిన ‘మీడివలిజమ్‌ టూ మాడర్నిజం’, రత్నా నాయుడు రాసిన ‘ఓల్డ్‌ సిటీస్‌ న్యూ ప్రిడక్‌మెంట్స్‌’ చదివిన తరవాత ఆలోచనల్లో మార్పు వచ్చింది. నిజాం పట్ల నిష్పాక్షికంగా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయని అర్థమయింది. దావూద్‌ అష్రఫ్‌ పుస్తకాలు కొత్త నిజాం చరిత్రలో కొత్త వెలుగులో నింపాయి. ఇవన్నీ ముస్లిం పట్ల ప్రేమను మరింతగా పెంచాయి.
ఆళ్వారుస్వామి, సురమౌళిలను కేవలం బ్రాహ్మణులుగా చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు అన్యాయం జరుగుతది. వాళ్ళు తమ జీవితకాలంలోనే ‘డీకాస్టిఫై’ అయ్యిండ్రు. అట్లనే సురమౌళి అయితే కులనిర్మూన సంఘమే పెట్టిండు.
రాయసీమ, ఉత్తరాంధ్ర అంటే కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఉత్తరాంద్ర వాళ్ళు కూడా వలసాధిపత్యంలో వనరులు కోల్పోయారు. దాంతో పాటు సంస్కృతి, భాష కూడా కొల్లగొట్టబడింది. ముఖ్యంగా తాపీ ధర్మారావు లాంటి సాహిత్యకారులకు తగినంత గుర్తింపు రాలేదు. అట్లా రావాలని నేను మాట్లాడాను. అట్లనే రాయలసీమ తొలి కథ గాడిచర్ల హరిసర్వోత్తమరావుది బయటపెట్టి వాళ్ళ కథా చరిత్రను ఇంకొంచెం ముందుకు జరిపాను. ఆ తర్వాత పరిశోధనల్లో అది మరింత ముందుకు వెళ్ళింది. ఈ పరిశోధన చేస్తున్న మిత్రులందరికీ అండగా ఉన్నాను. కథా సాహిత్యంపై పరిశోదన చేస్తున్న వారికి మా ‘కవిలె’ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది.

4. ‘సింగిడి’తో అనుబంధం గురించి చెప్పండి…

– తెలంగాణ రచయిత వేదిక నిష్క్రియా పరత్వంలోకి జారిపోయిన సందర్భమే గాకుండా దళిత, బహుజనులకు ఆ సంస్థలో తగిన గౌరవం, గుర్తింపు దక్కక పోవడం, పుస్తకాల ప్రచురణ, పత్రికా నిర్వహణలోనూ సమాజంలో మెజారిటీగా ఉన్న వారిని విస్మరించడం బాదేసింది. దీంతో కొంత మంది ‘లైక్‌మైండెడ్‌’ మిత్రులము కలిసి ఈ ‘సింగిడి’ తెంగాణ రచయితల సంఘాన్ని 2008లో స్థాపించాము. నాతో పాటుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబ, పసునూరి రవీందర్‌, జిలుకర శ్రీనివాస్‌, సిలువేరు హరినాథ్‌, ఏలేశ్వరం నాగభూషణాచార్య తదితరులున్నారు. శ్రీకృష్ణ కమిటీ ముందు ఏడుగురం సభ్యులము భిన్న సామాజిక వర్గాకు ప్రాతినిధ్యం వహిస్తూ మా వాదనను వినిపించాం. నిజానికి మొత్తం తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల వాణిని వాళ్ళు ఒక్క దగ్గర విన్నది ఆ ఒక్కసారే అంటే అతిశయోక్తి కాదు. ఆ కమిటీ వాళ్ళు అన్యాయం చేస్తే ‘ఛీ కృష్ణ కమిటీ’ పేరిట వారి భంఢారాన్ని, తప్పుడు నిర్ధారణను తిప్పి కొట్టడం జరిగింది.
1969-73 ఉద్యమ కవిత్వాన్ని, విగ్రహాల కూల్చివేతను సమర్ధిస్తూ వ్యాస సంకలనం ‘బర్మార్‌’ ఇట్లా చాలా పుస్తకాలను ‘సింగిడి’ తరపున వెలువరించాం. సాహిత్యకారులకు అంతవరకు తెలియని ఎన్నో చీకటి కోణాలను ఆవిష్కరించడమైంది.. తెలంగాణ ఆవిర్భావ సందర్భంలోనే బహుజనులకు తక్షణం ఏం కావాలో వివరిస్తూ ‘సింగిడి ఎజెండా’ పుస్తకంగా వెలువరించాం. రాజకీయాలకు అతీతంగా నిర్భయంగా, నిష్పాక్షికంగా సమాజంలోని మెజారిటీ వర్గాలైన బహుజనుల అభ్యున్నతి కోసం ఈ సంస్థ పనిచేస్తున్నది.
    5. సాహిత్య చరిత్ర, పరిశోధనల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ?
– ఇన్నేండ్లు తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి ఆంధ్రా సాహితీవేత్తలు సరైన గౌరవం ఇవ్వలేదని వాళ్ళను నిందిస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళని నిందించడం గాకుండా మన చరిత్రను మనం వినిర్మించుకోవాలి. పునాదులతో సహా దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసీ, మహిళా చైతన్యంతో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలను నిర్మించుకోవాలి. విస్మరణకు గురైన వ్యక్తులను, సాహిత్యాన్ని ప్రయత్న పూర్వకంగా వెలుగులోకి తేవాలి. తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన, ప్రచురణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరముంది.
దున్న ఇద్దాసు, దైదవేము దేవేందరన, సుద్దాల హనుమంతు, ఆళ్వారుస్వామి, సురవరం, మహలఖా యిచాందా, ఇట్లా కొన్ని వందల పేర్లు చెప్పొచ్చు. వాళ్ళందరి రచలను పుస్తక రూపంలో సమగ్రంగా రావాలి. అంతేగాకుండా కేవలం పత్రికల్లోనే ఉన్నటువంటి రచనలను కూడా సేకరించి అచ్చువేయాలి. ఈ పనిని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేదంటే అవి కూడా లుప్తమై పోయే అవకాశముంది. అంతేగాకుండా వివిధ విశ్వవిద్యాయాల్లో వివిధ విభాగాల్లో జరిగే పరిశోధనల్లో సమన్వయం ఉండాలి. తెలుగు విభాగం, చరిత్ర విభాగం ఒకే అంశంపై పరిశోధన చేయకుండా చూడాలి. వీటి మధ్యన సహకారం ఉన్నట్లయితే మరింత మెరుగైన పరిశోధనలు వచ్చే అవకాశముంటుంది. అచ్చుకు యోగ్యమైన పరిశోధన ఫలితాలను ఒక కమిటీ ద్వారా పరీక్షింపజేసి ప్రభుత్వమే అచ్చేయాలి. అప్పుడే ప్రజలకు విషయాలు తెలుస్తాయి.
ప్రభుత్వం చరిత్ర నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రాగద్వేషాలకు అతీతంగా ప్రామాణికమైన తెలంగాణ ప్రజల చరిత్రను రచింపజేయాలి. సాహిత్య కారులు వివిధ ప్రక్రియల్లో వెలువరించే పుస్తకాలకు కేరళ రాష్ట్రం మాదిరిగా వాటిని అచ్చేసేందుకు ఆర్థికంగా అండగా నిలవాలి. తెలంగాణలోని తెలుగు, ఉర్దూ భాషల్లోని క్లాసిక్స్‌ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయించాలి.
పుస్తక ప్రచురణకు, ప్రాచుర్యానికి ప్రభుత్వం, గ్రంథాలయాలు  అండగా ఉండేలా చర్యలు చేపట్టాలి.

*

1930 తరవాతనే తెలంగాణా ఆధునికత

 

 

 

(ఛాయ 12 వ సమావేశం 1 మే, ఆదివారం సాయంత్రం 6 గంటలకి హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరబాద్ లో జరగబోతోంది.  ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు, సంపాదకుడు,    కె. శ్రీనివాస్ “సాహిత్య చరిత్రలో ఖాళీలు “ అనే విషయం మీద మాట్లాడుతారు.  ఈ సంధర్భంగా ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు,  సంగిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకి,  కె. శ్రీనివాస్ యిచ్చిన వివరణలు.)

 • తెలంగాణలో ఆధునిక సాహిత్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించేముందు, అనేక అంశాలను స్పష్టం చేసుకోవాలి. ఆధునిక సాహిత్యం అంటే ఏమిటి? ఆధునికత అంటే ఏమిటి? తెలంగాణలోనే కాదు, తెలుగులో ఆధునిక సాహిత్యం ఎప్పటినుంచి మొదలయింది? –  చాలా మాటలను మనం నిర్దిష్ట నిర్వచనాలు లేకుండా ఉపయోగిస్తూ ఉండడం వల్ల కొంత అస్పష్టత  ఉన్నది. పాతవి ముగిసిపోవడం, కొత్తవి మొదలుకావడం- ఇవి కొన్ని తేదీలకో సంవత్సరాలకో ముడిపెట్టగలిగిన సంఘటనలు అనుకోవడం కూడా పొరపాటు. 1900-1940 మధ్య కాలాన్ని నేను నా పుస్తకం( తెలంగాణ సాహిత్య వికాసం)లో ఆధునికతలోకి తెలంగాణ సొంత అడుగులు వేసిన కాలంగా చెప్పాను.  ఆధునికత ప్రవేశించని భౌగోళిక ప్రాంతాలు, భావప్రాంతాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. అయినంత మాత్రాన తెలంగాణ ఇంకా ఆధునిక పూర్వ దశలో ఉన్నదని అనలేము. భారతదేశంలో అయినా, బ్రిటిష్‌ ఆంధ్రలో అయినా ఆధునికతలోకి జరిగింది ప్రయాణమే. ఆ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉన్నది. ముగిసిపోలేదు.

హేతుబద్ధమైన ఆలోచనలు, సంస్కార దృష్టి, సార్వత్రిక విద్యాకాంక్ష,  సార్వజనీన విలువల వక్కాణింపు, వ్యక్తుల స్వేచ్ఛాభావనలు, బృందాల హక్కులు- ఇవన్నీ సమాజంలో కనిపిస్తున్నాయంటే, ఆ సమాజంలో ఆధునికత బలంగానే ఉన్నదన్న మాట. ఆధునికత గుణవాచి. అటువంటి గుణాలు ఒకానొక నిర్దిష్టకాలంలోనే సాధ్యమైనప్పుడు కాలవాచి కూడా. అయితే, అసమాన ప్రపంచంలో ఒక్కొక్క సమాజం ఒక్కో దశలో ఉంటుంది కాబట్టి,  వాస్తవార్థంలో సమకాలికమైనవన్నీ కూడా సమకాలికమైనవి కావు. దశలు అంటున్నామంటే, అనివార్యంగా ఒకదాని తరువాత మరో దశ వచ్చి తీరాలని, పారంపరిక దశలని కాదు. నైజాము పాలనలో ఉన్న తెలంగాణ, బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతాలు 1900-1940 మధ్య కాలంలో ఒకే రకంగా లేవు. ఆధునికత లోకి ప్రవేశించిన తీరు, సమయం ఒకటే కాదు. తెలంగాణ ఆలస్యంగా ఆధునికతలోకి రావడమే కాక, భిన్నంగా కూడా వచ్చింది. ఒక ప్రతిపాదనగా చెబుతున్నది ఏమిటంటే, వలసవాదంతో ముడిపడిన ఆధునికత, దాని బౌద్ధిక చట్రం తెలంగాణలో బలంగా లేదు.

 • స్థూలంగా ఆధునికత తెలంగాణలో ఫలానా కాలంలో ప్రవేశించిందని చెప్పలేమా?

మన సదుపాయం కోసం చెప్పుకోవచ్చు. 1930ల తరువాతనే ఆధునిక సాహిత్యం అని చెప్పదగ్గది తెలంగాణలో వచ్చింది. అంతకు ముందు కాలంలో కొందరు వ్యక్తుల రచనలలో ఆధునిక భావాలు, వ్యక్తీకరణ రీతులు లేవని కాదు. ఆధునికతకు కావలసిన సన్నాహాలలోనే 1940 దాకా తెలంగాణ ఉద్యమసమాజం తలమునకలయింది. 1920లు, 1930లు అందులో క్రియాశీల కాలం.

తెలంగాణ నుంచి వచ్చిన మొదటి పత్రిక  శేద్యచంద్రిక (1887), అది అనువాద పత్రిక, ప్రభుత్వ పత్రిక అయినప్పటికీ, వివిధ రంగాలలో హైదరాబాద్‌ తలపెట్టిన ఆధునిక వ్యవస్థల నిర్మాణాల పురోగతిని నమోదు చేసింది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులను ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ఆ పత్రికలో,  టెలికమ్యూనికేషన్‌, రోడ్లు వంటి ఇతర ఆధునిక వ్యవస్థల గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి.  దానిని సాహిత్యేతర పత్రిక అని పరిగణనలోకి తీసుకోకపోయినా,  సాహిత్యాంశాలు కలిగిన మొదటి తెలంగాణ పత్రిక హితబోధిని (1913) లో కూడా ఆధునిక భావాలను పుష్కలంగా చూడవచ్చు. సంస్థానాధీశులలో నూతన భావాలు కలిగిన సంస్కారిగా నాడు పేరు పొందిన బరోడా రాజు ప్రసంగాలను పునర్ముద్రించింది కూడా ఆ పత్రిక.  తెలంగాణ నుంచి మొదటి మహిళాకవి రచన కూడా ఆ పత్రికలోనే ఉన్నది. ఆధునికమనదగ్గ రీతిలో రాసిన కథనాలున్నాయి.  అయినప్పటికీ, 1915 నాటికి తెలంగాణ సమాజం ఆధునికతలోకి ప్రవేశించిందని చెప్పలేము. వ్యావహారిక భాషా రచనలు 1930లోపే వచ్చాయి. మాండలికంలో కథారచన  1930లలో నే చురుకుగా మొదలయింది. గోలకొండ కవుల సంచిక  లో ఆధునిక సాహిత్యం తక్కువే అయినప్పటికీ, ఆ ప్రయత్నమే ఆధునికమయినది.

1930 దశాబ్దారంభంలో ఆంధ్రమహాసభ ప్రారంభమయింది.  ఆధునిక విద్యావంతుల వర్గం ఒకటి చిన్నగా అయినప్పటికీ ఏర్పడింది. పత్రికల సంఖ్య పెరిగింది. వివిధ సామాజిక, కుల సంఘాలు క్రియాశీలంగా పనిచేయసాగాయి. గ్రంథాలయాలు విస్తృతంగా వ్యాపించి, ఊరూరా మార్పును కోరే యువతరం ఒకటి రూపుదిద్దుకున్నది. ఇవన్నీ సాహిత్యంలో ఆధునికత కు తోడ్పడ్డాయి. తెలంగాణ సమాజ వికాసానికి సాహిత్యంలో ఆ మార్పులు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది.

 • తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు?

తెలంగాణవాద సాహిత్యం లేదా తెలంగాణ అస్తిత్వ ఉద్యమసాహిత్యం 1995 తరువాతనే మొదలయిందని చెప్పాలి. 1969 ఉద్యమ సందర్భంగా వచ్చిన సాహిత్యం తెలంగాణవాద సాహిత్యం కాదా? అన్న సందేహం వస్తుంది.జాషువా కవిత్వాన్ని దళిత వాద కవిత్వం గా అనడం సాంకేతికంగా ఎట్లా పొరపాటు అవుతుందో, 1970ల నాటి కవిత్వాన్ని తెలంగాణ వాద కవిత్వం అని అనడం కూడా పొరపాటు అవుతుంది. 1969 ఉద్యమానికి  కూడా సైద్ధాంతికత లేదని కాదు. చైనా సాంస్కృతిక విప్లవం ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినవారు, భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన దశగా నాటి కాలాన్ని నిర్వచించినవారు ఉన్నారు. లోతుగా నాటి ఆకాంక్షల మూలాన్ని వెదికిన వారున్నారు. కానీ, ఆ సైద్ధాంతికత ఒక బలమైన, సమగ్రమైన రూపం తీసుకోలేదు. ప్రాంతీయ వివక్షను తీవ్రంగా ఖండించడం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఉద్వేగపూరితంగా వ్యక్తం చేయడం, సాంస్కృతిక భేదాలను ప్రస్తావించడం నాటి సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో కనిపిస్తుంది కానీ, దాన్ని 1990ల నాటి తెలంగాణవాదంతో సమానం చేయలేము. నాటి ఉద్యమానికి ఉండిన పరిమితులు సాహిత్యంలోనూ ఉన్నాయి.

మలిదశ తెలంగాణ ఉద్యమం- ఉద్యోగ, విద్యావకాశాలతో పాటు, వనరుల పరిరక్షణ, మనుగడల సంరక్షణలను ప్రధానంగా తీసుకున్నది. సాగునీటి సమస్య, గ్రామీణ సంక్షోభం- నేపథ్యంలో, ప్రజలను ఏకత్రితం చేసేవిధంగా సాగిన సాంస్కృతిక సాహిత్యోద్యమాలు ఉద్యమానికి చోదకాలుగా ఉన్నాయి. మాది మాకు కావాలె- అన్న నినాదం- ప్రపంచీకరణ నేపథ్యంలోనూ, అస్తిత్వవాదాల ప్రభంజనంలోనూ భాగంగా వచ్చినది. ఆ రెండు పరిస్థితులూ 1970 నాటికి లేవు.

 • తెలంగాణలో మధ్యతరగతి ఏర్పడిందా? ఏర్పడితే ఎప్పటినుంచి?

తెలంగాణలో మధ్యతరగతి ఉనికి గురించి గతంలో నేను వ్యాఖ్యానించినప్పుడు మిత్రులు కొందరు సందేహం వ్యక్తం చేశారు. మధ్యతరగతి- ఒక  నిర్దిష్ట ఆర్థికవర్గాన్ని సూచించే వాడుక పదం. పట్టణజీవితంలోని వేతనజీవులు, వృత్తినిపుణులు, చిన్నవ్యాపారులు- వీరితో కూడిన వర్గం అది. గ్రామీణమూలాలతో నామమాత్రపు సంబంధాలు మిగలడమో, పూర్తి తెగదెంపులో జరిగిన వర్గం అది.  దాని ఆలోచనావిధానం భిన్నంగా ఉంటుంది. సమాజంలో విలువల ఘర్షణకు ఆ వర్గం వేదికగా ఉంటుంది.  బ్రిటిష్‌ ఆంధ్రలో తొలిదశల్లో బ్రాహ్మణవిద్యావంతులతో ప్రాథమికంగా ఈ వర్గం ఏర్పడింది. అక్కడి ఆధునిక సాహిత్యం ఈ వర్గం నుంచి అధికంగా వచ్చింది. తెలంగాణలో మధ్యతరగతి సాహిత్యం తక్కువ.  కథలు, నవలలు వంటి ఆధునిక ప్రక్రియలలో కూడా ఈ వర్గ జీవితం ఉన్నవి తక్కువే.

ఇందుకు కారణమేమిటి?

1913 నాటికి తెలంగాణలో చదువుకున్నవారే 3 శాతం ఉన్నారట. అందులో తెలుగువారు పది శాతం కూడా లేరు. నిజాం ప్రభుత్వంలో పనిచేసిన తెలుగువారు స్వల్పం. ఉర్దూ చదువుకుని న్యాయవాద వృత్తిలో ఉన్నవారు అక్కడక్కడా కనిపించేవారు. వారు కాక ఉపాధ్యాయులు. అంతే. ఆ పరిస్థితి 1948 నాటికి కూడా విప్లవాత్మకంగా ఏమీ మారలేదు. ఇప్పటికయినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చదగ్గరీతిలో తెలంగాణలో మధ్యతరగతి లేదు. ఆ కాలంలో  హైదరాబాద్‌, వరంగల్‌ తప్ప పట్టణాలని చె ప్పదగ్గవే లేవు. ఈ మధ్యకాలంలో మాత్రం తెలంగాణలో మధ్యతరగతి వేగంగా ఏర్పడుతున్నది. అయితే వారిలో మధ్యతరగతి స్వభావం ప్రస్ఫుటంగా వ్యక్తం కావడానికి ఇంకా సమయం పడుతుంది.   తెలంగాణ ప్రాంతం వివక్షకు లోనయిందని చెబుతున్న రంగాలలో విద్యా, ఉద్యోగరంగాలు ముఖ్యమయినవి. ఆ అంతరమే మధ్యతరగతి నామమాత్రం కావడానికి, మధ్యతరగతి కేంద్రిత  సాహిత్యం రాకపోవడానికి కారణాలని చెప్పుకోవచ్చు.

 

 • తెలంగాణ సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం ఏ మేరకు ఉన్నది?

వికాసోద్యమకాలంలో ఉన్నదని చెప్పలేము. 1930 ద్వితీయార్థం నుంచి మొదలుపెట్టి, మార్క్సిస్టు భావాల ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలు కనిపిస్తాయి. సమకాలంలోని వివిధ రాజకీయ సిద్ధాంతాల గురించిన ఆసక్తితో, వాటిని ప్రజలకు తెలియజెప్పాలన్న సంకల్పంతో  కెసి గుప్త, వట్టికోట ఆళ్వారుస్వామి  పనిచేశారు. 1940ల ఆరంభం నుంచి కమ్యూనిస్టుపార్టీ తెలంగాణలో క్రియాశీలంగా విస్తరిస్తూ వచ్చింది. ప్రపంచపటం మీద తెలంగాణను ఆవిష్కరించిన  తెలంగాణ సాయుధపోరాటంమీద, పోరాట సాహిత్యం మీద మార్క్సిజం ప్రభావం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. స్తబ్దంగా ఉన్నదని అనుకున్న 1960లలో కూడా ప్రగతిశీల సాహిత్యం, కవిత్వం, కథలు రెండూ తెలంగాణ నుంచి వచ్చాయి.  1965 తరువాత విప్లవోద్యమం ప్రభావం గురించి కూడా తెలిసిందే. 1990 దాకా విప్లవసాహిత్యోద్యమ ప్రభావం గణనీయంగా ఉన్నది.  తరవాత కాలంలో కూడా  ఒక ప్రధాన కోవగా కొనసాగుతూనే ఉన్నది.  తొలి, మలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో పార్లమెంటరీ కమ్యూనిస్టుల వైఖరులు ఎలాగ ఉన్నా, విప్లవ కమ్యూనిస్టులు క్రియాశీలంగా పాలుపంచుకున్నారు.  అందువల్ల 1995 తరువాతి తెలంగాణవాద సాహిత్యంపై కూడా మార్క్సిజం ప్రభావం స్పష్టంగా చూడవచ్చు.

 • మార్క్సిజం వరమా, శాపమా?

వరాలు ఇవ్వడానికి అది దైవమూ కాదు, శపించడానికి దెయ్యమూ కాదు. అది ఒక సైద్ధాంతిక సాధనం, ఆచరణ మార్గం.   కమ్యూనిస్టు పార్టీలతో మనకు సమస్యలు ఉండవచ్చు, వారి ఆచరణ విధానాలతో విభేదాలు ఉండవచ్చు. కానీ, చరిత్రను, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి పనికివచ్చే  శాస్త్రీయమైన సిద్ధాంతం గా  విలువైనది మార్క్సిజం.  భౌతికవాద ఆలోచనలకు భారతీయ గతంలో కూడా మూలాలున్నాయి. మార్క్సిజం ఇప్పటికే అనేక కొత్త వ్యాఖ్యానాలకు, జోడింపులకు, విస్తరణలకు గురిఅయింది.  వర్తమాన భారతానికి అవసరమైన అన్వయాలను, సవరణలను చేసుకోవడం ఇక్కడి మార్క్సిస్టుల పని. వారికి ఆ తెలివిడి  కలగడానికి లోపలినుంచి, బయటినుంచి కూడా ఒత్తిడులు పెరుగుతున్నాయని మనకు తెలుసు.

 • సమాజంలో వివిధ డైమన్షన్లలో ఉండే ఖాళీలను సాహిత్యం ఎప్పటికైనా పరిపూర్ణంగా పూరించగలదా?

బాలగోపాల్‌ చెప్పినదాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడుగుతున్నట్టున్నారు. ప్రామాణికతా భావనలకూ నిజజీవితాని కీ మధ్య ఉండే అంతరం గురించి చెబుతూ, ఆ అంతరం వల్ల ఏర్పడే ఖాళీ కారణంగా ఏర్పడే దాహం గొప్ప సాహిత్య సృష్టికి దోహదకారి అవుతుందని ఆయన అన్నారు.  విస్మృతి వల్ల, అజ్ఞానం వల్ల, పాక్షికత వల్ల చూడలేకపోయిన వాస్తవికతలు కూడా ఖాళీలేనని, మంచి సాహిత్యం వాటిని భర్తీచేసి, అగోచరాలను కూడా గోచరం చేస్తుందని బాలగోపాల్‌ అన్నారు. మనం చూడలేకపోయిన వాస్తవికతలను కళ్లముందుకు లాక్కురాగలిగే సాహిత్యం సమాజంలోని ఖాళీలను పూరించే ప్రయత్నాలకు దోహదకారి అవుతుంది.  పరిపూర్ణత అనేది సాపేక్షం. భర్తీచేసుకుంటూ పోవడం ఒక ప్రక్రియ.

 • తెలంగాణ భాషను పూర్తిస్థాయిలో, కనీసం పాలన, విద్య, పత్రికారంగాలలో, అమలులోకి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?

ఈ విషయంలో నావి ఉద్యమకారులు అంతగా మెచ్చని అభిప్రాయాలు. తెలంగాణ భాష అనడం పొరపాటు. దేన్ని భాష అనాలి, దేన్ని మాండలికం అనాలి – నిర్ణయించడానికి భాషాశాస్త్రం ఉన్నది. మాండలికం ( అది కూడా పరిభాషాపదమే) అన్న మాట నచ్చకపోతే, మరో మాట పెట్టుకోవచ్చు.

మనం చేయగలిగింది, తెలుగుభాషలో తెలంగాణ పదజాలం ప్రాతినిధ్యం పెంచడం. తెలంగాణ వ్యక్తీకరణలను, జాతీయాలను, సామెతలను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం. సాహిత్యకారులు ఇప్పటికే విస్తృతమైన స్థానిక పదజాలాన్ని తమ రచనల ద్వారా ఆవిష్కరించారు. ఏది తెలంగాణ పదం, ఏది కాదు అని నిర్ణయించడం నిఘంటుకారులు చేయవలసిన పని. సమగ్ర తెలంగాణ పదకోశం ఒకటి రూపొందాలి. అప్పటికి కూడా అందులోని పదజాలం ఇతర తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా వాడుకలో ఉండదని చెప్పలేము. తెలంగాణ లోని వివిధ వృత్తులవారు, కులాల వారు ఉపయోగించే పదజాలాన్ని మొత్తం సేకరించాలి. సాహిత్యంలోని పదప్రయోగాలను క్రోడీకరించాలి. సాంకేతిక పరిభాషా నిర్ణయంలో స్థానిక పదజలాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.  అచ్చమైన తెలంగాణ స్థానిక వాడుకను సృజనాత్మక రచనల్లో మిగుల్చుకోవచ్చు. కానీ ఆధునిక వినియోగం కోసం, మాధ్యమాల వినియోగం కోసం ప్రమాణీకరణ అవసరం. యంత్ర భాషగా వాడడానికి కూడా ప్రమాణీకరణ కావాలి. తెలుగును యంత్రానువాదం కోసం, కంప్యూటర్‌ వినియోగం కోసం ప్రమాణీకరించే ప్రయత్నాలు మునుపే మొదలయ్యాయి, ఒకమేరకు పూర్తయ్యాయి కూడా. వారు వినియోగించే పదజాలంలో  స్థానిక పదజాలం ఎంత ఉన్నదో పరిశీలించి, తెలంగాణ పాఠాంతరాలను, వాడుకను కూడా అందులో చేర్చాలి.

 • పరిశోధన అనేది థ్యాంక్‌ లెస్‌ జాబేనా?

ఎవరి కృతజ్ఞతలూ  మనకు అవసరం లేదు కానీ, ఇదొక అనాకర్షణీయమైన వ్యాసంగం. ఎంతో కష్టపడాలి. ఫలితం ఏమీ ఉండదు. మనకు మాత్రమే ఎక్సైటింగ్‌గా ఉంటుంది, ఎదుటివారికి చాదస్తంగా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ముఖ్యంగా సాహిత్యరంగ పరిశోధనలు, చాలా వరకు మొక్కుబడిగా సాగుతుంటాయి. సామగ్రి సిద్ధంగా ఉన్న అంశాన్నే ఎంచుకొమ్మని గురువులూ చెబుతుంటారు, లఘువులూ అదే చేస్తుంటారు. మౌలిక సమాచారం సేకరించవలసి వచ్చే పని తీసుకోవడంలో ఎవరికీ ఆసక్తి ఉండదు.  స్వచ్ఛంద పరిశోధకులలో ఉండే తపన, డిగ్రీల పరిశోధకులలో లేదేమో అనిపిస్తుంది, ఏ డిగ్రీ కోసమని మీరు అంత పరిశోధన చేశారు?

*

బుజ్జిగాడి లాజిక్ నా ఆదర్శం: యాసీన్

 

-యాకూబ్ పాషా

~

 

సైన్స్ కాక్‌టెయిల్ నుంచి హ్యూమర్ కిక్ ఎలా? నా వరకు యాసీన్ అంటే…

‘రాతతో నవ్వించువాడు.

మాటతో నవ్వించువాడు.

మౌనంతో కూడా నవ్వించువాడు’

లోప్రొఫైల్, ఆఫీసు ఫైల్ తప్ప…‘ఇలా ఎదగాలి’ అనే స్కీమ్  ఫైల్లేవీ యాసీన్ దగ్గర లేకపోవడం వల్ల…

‘మీ ఇంటర్వ్యూ కావాలి?’ అని అడిగితే…

ఆయన సమాధానంగా నవ్వారు. నవ్వుతూనే ఉన్నారు. ఊహకందని విచిత్ర థీసీస్‌లలో భాగంగా కొన్ని బయో తిక్కల్ సూత్రాలను ఆవిష్కరించిన తీర్లు… కొన్ని సంప్రదాయాల వేర్లు… ఆ రెండీటి  కాక్‌టెయిల్‌తో  పేజీలోకి ఎలా వడబోసారంటూ అడిగితే తాను హ్యూమర్ కిక్‌ను ఫీలయిన విషయాలు కొన్ని చెప్పారు.

‘నవ్వు’ తప్ప ఏమీ తెలియని యాసీన్…  ఎన్నో మెలికలు తిరుగుతూ తన గురించి తాను చెప్పుకున్న కొన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూలో…

 

 బాల్యంలో తర్వాత మీరు ఇష్టపడ్డ వీర శూర హాస్యకారులు

 నా చిన్నప్పుడు మా ఇంటికి ఆంధ్రసచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వీక్లీ వస్తుండేవి. అవి రావడం ఆలస్యం అయినా నేను తెచ్చుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడు ‘రాము-శ్యాము’ కార్టూన్ స్ట్రిప్స్, రాగతి పండరి వంటి వారి కార్టూన్స్ ఇష్టంగా చూస్తుండేవాణ్ణి. ఆ తర్వాత కాస్త పెద్దయ్యాక యర్రంశెట్టి శాయి రచనలు చదువుతుండేవాణ్ణి. అప్పటికి ఉన్న పాపులర్ రచన కంటే హాస్యరచనలే నాకు ఇష్టంగా ఉండేవి. ఆ తర్వాత నండూరి పార్థసారథి లాంటి పెద్దల రచనలనూ ఇష్టంగా చదివేవాణ్ణి.

 

 రాయాలన్న కోరిక, తొలి హాస్యరచన

కోక్విల్ హాస్యప్రియలో 1985-86 ప్రాంతాల్లో నా మొదటి కథ ప్రచురితమైంది. ఆ తర్వాత నేను కాలేజీ రోజుల్లో పల్లకి అనే మ్యాగజైన్ వచ్చేది. అందులో ‘శాంపిల్ స్టుడెంట్ అనే తెలుగు దోహాలు’ అనే శీర్షికతో 1986లో మరొక రచన ప్రచురిమైంది.అప్పట్నుంచి రాస్తూనే ఉన్నాను.

సైన్స్‌నుంచి హాస్యం పుట్టించడం మీరు చేస్తుంటారు. సాధారణంగా అండర్ కరెంట్‌గా సైన్స్‌ను మీ హ్యూమర్‌కు ఆసరా చేసుకుంటూ ఉంటారు. ప్రముఖ కార్టూనిస్ట్, ఆర్టిస్ మోహన్ గారు కూడా మీ పుస్తకం ‘హాహాకారాలు’కు తాను రాసిన ముందుమాటలో ఇదో పాపులర్ సైన్స్ అన్నారు.

 

సైన్స్ అండ్ హ్యూమర్ కాక్టెయిల్ ఎలా?

ఆ… నిజమే. హ్యూమర్ పుట్టించడానికి సైన్స్‌ను బాగా ఆశ్రయిస్తుంటా. డార్విన్‌నూ, న్యూటన్‌నూ వాడుకుంటూ ఉంటా. నిజానికి నేను కాలేజీ చదువుల్లో ముఖ్యంగా సైన్స్ చదువుకునే సమయంలో అంత బ్రైట్ స్టుడెంట్‌ను కాదు. కానీ ఇంటర్మీడియట్ నుంచి సైన్స్ చదువుతున్నప్పుడు నేను సబ్జెక్ట్‌ను చాలా డిఫరెంట్‌గా చూసేవాణ్ణి. అంటే ఉదాహరణకు… ‘‘ఒక ఆదర్శ వాయువు ఎలా ప్రవర్తించాలి? ఏయే సూత్రాలు అనుసరించాలి. ఎలా అనుసరిస్తాయి… అన్న అంశాలన్నింటినీ క్రోడికరిస్తారు. చివరగా ఈ ప్రపంచంలో ఆదర్శవాయువు ఏదీ లేదని నిర్ధారణ చేస్తారు. అంతేకాదు ఐడియల్ గ్యాస్ అంటూ అన్ని సూత్రాలూ చెబుతారు కదా. తీరా చివరకు ‘దేర్ ఈజ్ నో ఐడియల్ గ్యాస్…  బట్ ఆల్ ఆర్ రియల్ గ్యాసెస్’ అని కరాఖండీగా తేల్చేస్తారు. అప్పుడు నాకు నవ్వు వచ్చేది. అలాగే కాకి గూట్లో కోకిల గుడ్డు పెడుతుంది. వాటిని కాకి గుర్తు పట్టకుండా పొదిగేస్తుంది. దీంతో మనకు తెలిసేదేమిటీ అని నన్ను నేను ప్రశ్నించుకుంటా. కాకికి మ్యాథ్స్ రావు కానీ తెలివైంది కుండలో రాళ్లు వేసి పైమట్టం పెంచుకుంటుంది. అంటే… కాకి మాథ్స్‌లో పూర్‌గానీ సైన్స్‌లో జెమ్ అని చెప్పుకుంటా. ఇలా నాకు తోచినవీ… నేను ఆ టైమ్‌కు డిఫరెంట్‌గా చూసేవన్నీ ఐటమ్స్ అవుతాయి.

చిత్రం: అన్వర్

చిత్రం: అన్వర్

 కన్యాశుల్కం గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తుంటారు. వాటి గురించే ఏవైనా

అవును… మొదట్నుంచీ హాస్యం అంటే ఇష్టపడే నేను కన్యాశుల్కాన్ని తరచూ చదువుకుంటూ ఉండేవాణ్ణి. మేం ఫ్రెండ్స్ కలిసినప్పుడల్లా, కన్యాశుల్కం లేకపోయినా అందులోని మానవ స్వభావాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మా ఫ్రెండ్స్ అభిప్రాయాలు ఒకేలా ఉండేది. అందుకే సమస్య లేకపోయినా ఆ పుస్తకం రెలవెన్స్ అందరిలాగే మేమూ బాగా ఫీలయ్యాం. అయితే నా ప్రత్యేక అభిమానం చాటుకోడానికి ఒక చిన్న పాయింట్ దొరికింది. దాని ఆధారంగా గురజాడను నేను పైలోకంలో కలిసినట్లుగా చెబుతూ ఒక కథ రాశాను. ‘‘కోడిగుడ్డుకు ఈకలు పెరుకుట (లేదా) రంధ్రాన్వేషణ అనే గొప్ప సస్పెన్సు కథ’’ అంటూ ఒక కథ కూడా రాశాను. 2008 మే 4 సాక్షి ఫన్ డేలో ‘హాస్య కథ’ అనే ట్యాగ్ కింద ఇది ప్రచురితం అయ్యింది. ఇక హ్యూమర్ రాయడం ఎంతటి మహామహులు చేసిందో తెలిసి కూడా ‘హాస్యం’ అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని రాయడానికి ఎంత ధైర్యం అని ఎవరైనా అనుకోవచ్చేమో. కానీ… నిత్యజీవితంలో పెద్దగా ధైర్యస్వభావం లేకపోయినా ఇలా నన్ను నేను ట్యాగ్ చేసుకోవడం మాత్రం ఒక అజ్ఞానంతో చేస్తుంటా. ఎవరైనా ఎంత ‘ధైర్యం’ అనే మాటకు పర్యాయపదంగా నా ‘అజ్ఞానం’ అనే మాటను ఈక్వలైజ్ చేసుకోవచ్చు.

 

 అలాగే మీరు బూదరాజు రాధాకృష్ణ గారిపై కూడా మీ అభిమానాన్ని దాచుకోరు. మీపైన ఆయన ప్రభావం

అభిమానాన్ని దాచుకోని ఎందరో మహామహుల్లో నేను వెల్లడించేది అణుమాత్రమేనని అనుమానం. దాంతో నా అభిమానాన్ని తగినంతగా వెల్లడించడం లేదన్న అభిప్రాయం కలిగినప్పుడల్లా మళ్లీ మళ్లీ మాట్లాడుతుంటా. చాలా యాక్సిడెంటల్‌గా ఆయన క్లాసులకు వెళ్ళే  అదృష్టం, నాకు వృత్తిపరిజ్ఞానం నేర్చుకునే భాగ్యం ఆయన వల్ల నాకు కలిగాయి. ఆయన క్లాసులన్నీ చాలా ఉల్లాసంగా ఉండాయి. నేను ఏ ఆలోచన ధోరణిని ఇష్టపడుతుంటానో అది నాకు అసంకల్పితంగా అందడంతో ఆయన క్లాస్‌లో ప్రస్తావించే ధోరణిని రచనల్లోనూ చూపడానికి విఫలయత్నం చేస్తుంటాను. అది విఫలయత్నమైనప్పటికీ యత్నం వల్లనే నాకు అప్రయత్నంగా చాలా సిద్ధిస్తుంటాయి. అలాంటి మహానుభావుడి దగ్గర చదువుకోవడం నా అదృష్టం.

 

 మీ బుజ్జిగాడి కథలకు ఇన్స్పిరేషన్ నిజంగా మీ బుజ్జిగాడేనా?

కొన్ని విషయాల్లో అవును. వాడితోపాటు మీలోని, నాలోని… ఇంకా ఎందరిలోనో ఉన్న పిల్లధోరణులు నాకు ఇష్టం. అలాగే లోకంలోని అనేకమంది బుజ్జిగాళ్ల లాజిక్ నాకు నచ్చుతుంది. అయితే పెరిగే క్రమంలో సామాజిక అంశాలను నేర్చుకుంటూ వాళ్లు తమ క్రియేటివ్ ధోరణులు వదిలేస్తుంటారని నా నమ్మకం. ఉదాహరణకు… మొన్ననే ఎండల తీవ్రతను మావాడు చెబుతూ వాడు అన్న మాట…‘‘నాన్నా… సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం పొరబాట్న ఏమైనా  తగ్గుతోందా?’’ అని అడిగాడు. అంతేకాదు… నేనెప్పుడూ గుర్తు చేసుకొని ఆనందించే లాజికల్ ప్రశ్న మరొకటి ఉంది. వాడు సూసూ పోసుకుంటూ… నేను పోస్తేనే ఎంత సూసూ వచ్చిందికదా… మరి డైనోసార్ పోస్తేనో?’’ అని ఒకసారి అడిగాడు. నాకు తెలిసి వాడొక్కడే కాదు… ఇంచుమించు పిల్లల మాటలన్నీ ఇలాగే ఉంటాయి. కాలక్రమంలో సోషియో లింగ్విస్టిక్స్, సోషియలాజికల్‌నెస్ ఎక్కువైపోయి అసలు లాజిక్‌లను కన్వీనియంట్‌గా విస్మరిస్తుంటారు. అయితే పెరుగుతున్నా తమ లాజిక్‌ను కోల్పోకుండా ఉంటూనే… తమ సోషియల్ బిహేవియర్‌తో సమన్వయం చేసుకుంటూ ఉంటారు కొందరు పిల్లల. ఇలా పై రెండు అంశాలనూ బ్యాలెన్స్ చేసి పిల్లలెందరో నాకు ఇన్స్‌పిరేషన్.

 

 మీరు మాటిమాటికీ చదివి ఆనందించే పుస్తకాలు

ఎవర్ గ్రీన్ పుస్తకం కన్యాశుల్కం. అలాగే మార్క్‌ట్వైన్  అనువాదాలు, ఆస్కార్‌వైల్డ్ కథలు. అన్నట్టు… ఆస్కార్ వైల్డ్ అలవోకగా ‘ప్రతి ఇంటికీ ఒక ఫ్యామిలీ దెయ్యం ఉండాలి’ అన్న మాట పట్టుకొని దెయ్యాలను సైతం నా హ్యూమర్‌కు వస్తువులా చేసుకుంటూ ఉంటా. వాటిని నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ అవి నన్ను నిరాశ పరచలేదు.

 

 మీ రచనలు ఎలా ఉండాలని మీరు అనుకుంటూ ఉంటారు?

ఇలా బుజ్జిగాడి లాజిక్‌తో అత్యంత సాధారణంగా కనిపించే ప్రశ్నల్లో ఎంత అసాధారణత ఉందో తెలుసుకొని, నేను ఫీలైన అదే థ్రిల్‌ను మిగతా వారికి అందించడం నాకు ఇష్టం. మామూలుగా మనం చూసే సమోసా త్రిభుజాకారం ఉందనీ, పూరీ లేదా చపాతీ వృత్తమనీ, కేక్ చతుర్భుజమనీ… ఇలా జామెట్రీకీ, తిండికీ లింక్ కలుపుతుంటా. దాంతో కొంత హాస్యం పుడుతుంది. ఇలా బుద్ధిమాంద్యతతో చేస్తున్నట్లు కనిపిస్తున్నా అందులోని ఇంటెలిజెన్స్‌ను అసంకల్పితంగానే ప్రదర్శించడం వంటి అంశాలు నాకు ఇష్టం. అది మరెవరికో ఆ బుద్ధిమాంద్యతను ఆపాదించడం ఇష్టం లేక దాన్ని నేనే ఆపాదించుకుంటూ ఉంటా. ఇదే కంటిన్యూ కావాలని కోరుకుంటా.

*

yaseen

 

 

 

 

సృజన, అనువాదం బొమ్మా బొరుసూ: నలిమెల

 

బహుభాషా వేత్త, ఆదర్శ అధ్యాపకుడు, కవి, రచయిత, అనువాదకుడు, తెలంగాణ పదకోశ రూపకర్త  నలిమెల భాస్కర్ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాకు చెందిన వారు.     పద్నాలుగు భారతీయ భాషల నుండి తెలుగులోకి, తెలుగు నుండి ద్రావిడ భాషల్లోకి అనువాదాలు చేసిన వారు. మలయాళంలో పునత్తిల్ కుంజ్ అబ్దుల్లా రాసిన ‘స్మారక   శిలగల్’ నవల తెలుగులోనికి అనువాదం చేసినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ       అవార్డును అందుకున్నారు.  బహుముఖీన మైన వారి ప్రతిభను కృషిని తెలుసుకోవడంలో       భాగంగా భాషారంగానికి పరిమితమవుతూ ఈ ముఖాముఖి బూర్ల వేంకటేశ్వర్లు మన        ముందుంచారు.

 

@  నమస్తే! ఉద్యోగమూ, సృజనా, వ్యక్తిగత జీవితమూ చక్కబెట్టుకుంటూ ఇన్ని  భాషలు నేర్వడంలో ఎట్లా సఫలీకృతులైనారు?

 • ఉద్యోగము చేయక తప్పని సరి పరిస్థితి, చేస్తే తప్ప వెళ్ళని స్థితి, కాకుంటే నిబద్ధతతో, నిజాయితీగా చేయడానికి మా తండ్రి రామచంద్రం స్ఫూర్తి. ఇక సృజన అంటారా! అది శ్వాసతో సమానం. ఐతే, అనువాదాలు ఆరంభమయ్యాక సృజన తగ్గింది. మా తరం అంతా ఆదర్శాల తరం. ఎటు చూసినా ఉద్యమాలు, పోరాటాలు. పొతే… భాషల అధ్యయనం గురించి నేను టీచర్ గా పనిచేసిన ఊరికి కనీసం పేపర్ రాదు. ఆ ఊళ్ళో గ్రంథాలయమూ లేదు. అక్కడ ఐదేండ్లు పని చేయాల్సి వచ్చింది. నాకు తొమ్మిదవ తరగతి నుండి పుస్తక పఠనం తప్ప మరే అలవాటు లేదు. ఏం చేయను. ముప్పై రోజుల్లో కన్నడ భాష పుస్తకం కంట బడింది. నేను దాని వెంట పడ్డాను. తర్వాత తమిళం వంతు అయ్యింది. ఐతే, భాషలు నేర్చుకోవడం అనేది ఒక అధ్బుతమైన క్రీడలాంటిది. గణితంలో కఠిన మైన లెక్కలు చేయడం లాంటిది. పైగా, అనేక భాషలను ఏక కాలంలో తులనాత్మకంగా నేర్చుకోవడం ద్వారా సులభమైంది. కొంత విలక్షణంగా పని చేయడం అనేది మొదటి నుండి నా స్వభావంలో ఉంది.

@ జాతీయ భాష, త్రిభాషా సూత్రం ఏమేరకు సాధించినై , భాష వలన ఇది సాధ్యమౌతుందా?

 • ఇది అకాడెమిక్ ప్రశ్న! జాతీయ భాష హిందీ ద్వారా దేశ సమైక్యతను కాపాడాలన్న సంకల్పం మంచిదే! కానీ, ఇది వికటించింది. హిందీ ఆధిపత్య భావజాలం దక్షిణాది మీద ముఖ్యంగా తమిళం మీద రుద్దబడింది అన్న అభిప్రాయలు ప్రచలితం అయినవి. ఇక, త్రిభాషా సూత్రం కూడా దాదాపు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైంది. జాతీయ సమైక్యత బలపడాలంటే ఉత్తరాది వాళ్ళు సైతం దక్షిణ దేశ భాషలలోని ఏ ఒక్కటైనా చదవాలి కదా! కానీ, అలా జరగడం లేదు. జాతీయ భాష హిందీతో పాటు ఆంగ్లాన్ని చదువుకొని ఉత్తరాది వారు ద్విభాషా సూత్రానికే పరిమితమవుతున్నారు.

భాష వల్ల జాతీయ సమైక్యత అనేది కొంత మేరకే సాధించ గలమనేది నా వ్యక్తిగత    అభిప్రాయం. అపారమైన దేశభక్తే ఈ దేశ సమైక్యతను, సమగ్రతను నిలబెట్టగలదు.

@ జ్ఞానార్జనలో, సృజనలో, భావ వ్యక్తీకరణలో మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం  కాగలుగుతుందా, అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద ఎలాంటి ప్రభావాన్ని    చూపుతున్నది?

 • దేనిలోనూ మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం కాదు. అది తల్లి వంటిది. మాతృమూర్తికి బదులుగా మరొకరు ఆ స్థానాన్ని పొందగలరా, లేదు. తల్లిభాష సహజమైనది, సులభమైనది, శాస్త్రీయమైనది. అతి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించే సాధనం తల్లి భాష. వ్యక్తి సమగ్ర వికాసానికి, మూర్తిమత్వ వృద్ధికి మూలకారణం భాష. అది, మాతృభాష ద్వారా జరిగినప్పుడు అనేక సత్పలితాలు చూడగలం.

అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద బాగా పనిచేస్తున్నది. ఎంత  కాదన్నా… శాస్త్ర సాంకేతిక సమాచారమంతా ఆంగ్లంలో ఉండిపోయింది. జ్ఞాన     సముపార్జనకు ఆంగ్లాన్ని వాడుకోవాల్సిందే. ఐతే, ఆ క్రమంలోనే మాతృభాషను మరింత సుసంపన్నం చేసుకోవాలి. విరివిగా అనువాదాలు జరగాలి. ఆంగ్లంలో ఉన్నఅపారమైన ఆయా శాస్త్రాల జ్ఞానాన్ని ఇతర         భాషల్లోకి తెచ్చుకోవాలి. అట్లు జరగక      పోగా రాను రాను ఆంగ్ల భాష ప్రభావం వల్ల ఇతర భాషలు కనుమరుగయ్యే ప్రమాదం   ఏర్పడుతున్నది. మాతృభాష తన మూలాలు కాపాడుకుంటూనే అంతర్జాతీయ భాష వల్ల  ప్రభావితమైతే ఏ రకమైన ఇబ్బంది రాదు.

@ బహుభాషలు నేర్చుకున్న మీరు తెలంగాణ పదకోశం గల కారణాలు ఏమున్నాయి?

 • సాహిత్యంలో నిర్దిష్టత ప్రవేశించాక స్థానికత ప్రబలమయ్యాక, అస్తిత్వ ఉద్యమాలు బాగా ప్రచలితం అయ్యాక మన చరిత్ర, భాష, సంస్కృతి పట్ల సోయి పెరిగింది. తెలంగాణ మలిదశ పోరాట సందర్భంలో తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం జరిగింది. ఆ వేదిక నన్ను నేను తవ్వి పోసుకోవడానికి కారణమైంది. ఆంధ్రా ఆధిపత్య వాదులు తెలంగాణ తెలుగుకు వెక్కిరించడం వల్ల అది తెలంగాణ ఆత్మకు శరాఘాతమైంది. తెలంగాణ ఆత్మ మేల్కొంది. కొందరు ఆ భాషలో కైతలు రాశారు. మరికొందరు కథల్ని పండించారు. నేనేమో పదకోశం వేశాను.

@ తెలంగాణ రాష్ట్రంలో భాషకు ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉన్నది?

 • మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ శిష్ట వ్యావహారిక భాషనే వాడడం ఒకింత విచారాన్ని కలిగిస్తున్నది. పాఠశాల స్థాయిలో ఒకటి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాచకాలు మారాయి. వీటిల్లో ఎనభై శాతం తెలంగాణ వాళ్ళవే ఉండడం ఆనందాన్ని కల్గించే  అంశం. అయితే, ప్ప్ర్వపు భాషే ఉన్నది. తెలంగాణ తెలుగులో వాచకాలు లేవు. ఒక ప్రామాణిక భాష ఏర్పడ లేదు. ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత మేరకైనా తెలంగాణ తెలుగును బోధనా భాషగా చేసుకోకపోతే బోలెడు నష్టం జరిగిపోతుంది. కేవలం బోధనా భాషగానే కాక, అధికార భాషగానూ, పత్రికా భాష గానూ, సినిమా భాషగానూ తెలంగాణ తెలుగు నిలదొక్కుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి. ఒక సమగ్ర నిఘంటు నిర్మాణం జరగాలి. తెలంగాణ తెలుగులో రాస్తున్న రచయితల్ని ప్రోత్సహించాలి. పాల్కురికి, పోతన వంటి కవుల పద ప్రయోగ సూచికలు రావాలి. భాషకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి.

@ సృజనలో భాష నిర్వహించే పాత్ర గురించి చెబుతారా?

 • సృజనలో భాష ఒక అంగం. పైగా ముఖ్యమైన అనుఘటకం. రచనకు అది ఒక కవితైనా, కథైనా, నవలైనా మరేదైనా వస్తువు చాలా ముఖ్యమైన అంశం. ఐతే, ఆ వస్తువు ఎంత ఉదాత్తమైనది ఐనా, ఎంత ఉన్నతమైనది అయినా ఏ భాషలో చెబుతున్నామనేది ఎంతో ముఖ్యమైన విషయం. నన్నయ తన భారతాన్ని తెలుగులో కాక సంస్కృతంలోనే అతనికి అంత ప్రశస్తి వచ్చి ఉండేది కాదేమో! పాల్కురికి సోమన దేశీ కవితా మార్గంలో బసవ పురాణాన్ని తీర్చిదిద్దడం వల్లే దేశి కవితా మార్గానికి ఆది పురాణమైంది. వేమన అలతి అలతి పదాలతో ఆటవెలదులు రాసినందువల్లనే అతని పద్యాలు ఈనాటికీ అందరి నోళ్ళలో నానుతున్నాయి. సృజనలో ఉన్న అంతస్సత్త అంతా భాష అనే మాధ్యమం ద్వారానే పాఠకుణ్ణి చేరుతుంది. అది మాతృభాష కాకున్నా, ప్రజల భాష కాకున్నా రచనలకు అంత ప్రాధాన్యత ఉండదు.

@ ప్రాచీన భాష తెలుగు అభిమాన భాషగా ఎదగక పోవడానికి ఆటంకాలు ఏమున్నాయంటారు?

 • మాతృభాష పట్ల మన ప్రభుత్వాలకు ఉన్న అభిమాన రాహిత్యమే ప్రధాన ఆటంకం. తమిళనాడులో ప్రజల కన్న మిన్నగా పాలకులకే భాషాభిమానం ఉంటుంది. కర్ణాటకలో సైతం కన్నడ భాషాభిమానం మెండు. తెలుగు వాళ్లకి తెలుగు పట్ల ఒక తేలిక భావం. పొరుగింటి పుల్లకూర రుచి వీళ్ళకి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వాల్లో కదలిక రావాలి, చిత్తశుద్ధి కావాలి. మొక్కుబడి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వవు.

@ అనువాదాల గురించి మీ అభిప్రాయమేమిటి?

* అనువాదం అనేది పొరుగు వాడి గురించి తెలుసుకోవడం వంటిది. ఇతరులగురించి అవగాహన ఉన్నప్పుడే వాళ్ళకన్నా మనం ఎంత ముందున్నాం లేదా వెనుకబడినాం అనేది తెలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు ఇతరులను పోల్చుకుని పోటీపడే స్వభావం పెరుగుతుంది. సృజన, అనువాదం ఇవి రెండు పరస్పర పరిపూరకాలు. ఇందులో ఏది లోపించినా మన జ్ఞానం అసంపూర్ణం. అనువాదాలు లేకపోతే ఇతర భాషల సాహిత్యం లేదు. ప్రపంచ సాహిత్యం లేదు. శాస్త్ర సాంకేతిక జ్ఞానం శూన్యం. హృదయ వైశాల్యానికి, దృష్టి నైశిత్యానికి, వ్యక్తి వికాసానికి అనువాదం ఒక ముఖ్యమైన మెట్టు.

*

మూలస్వరం మూగపోకూడదు: గౌరి

 

     – వారణాసి నాగలక్ష్మి

~

 

varanasi nagalakshmi

ఈ సంవత్సరం అనువాదరంగంలో ఇద్దరు ప్రవాసులకి సాహిత్య అకాడెమీ పురస్కారాలు రావడం తెలుగువాళ్ళందరికీ సంతోషాన్నిచ్చింది. ఒకరు తెలంగాణలో పాతికేళ్లు పెరిగి చెన్నైకి తరలి వెళ్ళిన గౌరీకృపానందన్. మరొకరు కేరళలో పుట్టి పెరిగి ఆంధ్రలో స్థిర నివాసమేర్పరచుకున్న ఎల్ ఆర్ స్వామి.‘సూఫీ చెప్పిన కథ’ని తెలుగువారందరికీ చెప్పిన స్వామి గారికీ, ఓల్గా ‘విముక్త’ని ‘మీట్చీ’గా తమిళులకి పరిచయం చేసిన గౌరీ కృపానందన్ కీ,  తెలుగు రాష్ట్రాలు రెండిటికీ  సాహిత్య ఎకాడమీ పురస్కారాలు సంపాదించి పెట్టినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకోవలసిందే.

‘జాటర్ ఢమాల్’ అంటే ఏమిటో ఆ పిల్లల భాషని అనువదించగల ముళ్ళపూడి పుణ్యమా అని మనకి తెలిసింది గాని లేకపోతే  బుడుగు మనకి అర్ధమయ్యేవాడే కాదు.   ఉత్తర భారతీయుల్లో బెంగాలీలు మనకి అర్ధమయినంతగా మిగిలిన వాళ్ళు అర్ధంకారంటే దానికి కారణం విస్తృతంగా మనకి చేరిన బెంగాలీ సాహిత్యమే. ఒక ప్రాంతాన్ని కూలంకషంగా అర్ధం చేసుకుందుకు దోహదం చేసేది అక్కడి సాహిత్యమే. ఒక ప్రాంత సాహిత్యం ఆ ప్రాంతానికే పరిమితమైపోకుండా నలుగురికీ అందుబాటులోకి తెచ్చే అనువాద ప్రక్రియ ప్రతిభావంతంగా సాగాలంటే మూల భాషా, లక్ష్య భాషా నేర్చుకుంటే సరిపోదు. ఆ ప్రాంతపు సామాన్య జనానీకంలో మమేకమై జీవిస్తే తప్ప ఆ అనువాదం సహజంగా పరిమళభరితంగా సాగదు.

ఇంట్లో తమిళం, గడప దాటగానే తెలుగు వాతావరణం..   గోదారి రెండు తీరాల మధ్య తిరుగాడే నావలా గౌరి  భాషాధ్యయనం ఆట పాటల మధ్య సాగింది. తెలంగాణలోని తెలుగు మీడియం పాఠశాలల్లో చదువుకుని, ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన  గౌరి, వివాహానంతరం చెన్నైకి తరలి వెళ్లినా, తెలుగుని తన మాతృ భాషగా భావిస్తూ, గత రెండు దశాబ్దాలుగా ‘చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు’ రుచిని తమిళ సోదరులకి  చవి చూపిస్తున్నారు.

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకోబోతున్నందుకు హార్దికాభినందనలు గౌరీ! వార్త వినగానే ఎలా అనిపించింది? మీ కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?

మీ అభినందనలకి ధన్యవాదాలు. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని తరుణం. ‘దినమణి’ దినపత్రికలో ఉన్న ఒక సాహితీ మిత్రులు  సమాచారం వచ్చిన వెంటనే అభినందనలు తెలియ చేస్తూ ఈ మెయిల్ పంపారు. మొదట అది నిజమేనా అని సందేహం కలిగింది. వెంటనే సాహిత్య అకాడమి వారి వెబ్ సైట్ కి వెళ్లి చూసినప్పుడు అందులో ప్రెస్ నోట్ కనబడింది. ఆ తరువాతే నమ్మకం కలిగింది. వెల్లువలా వచ్చే ఫోన్లు,  సందేశాల మధ్య మా వారు, కొడుకులు, కోడళ్ళు  అనుకోని ఈ శుభ వార్తకి ఎంతగానో సంతోషించారు.

unnamed

మీకు లభించిన ఇతర పురస్కారాల గురించి చెప్పండి.

‘లేఖిని’ సంస్థలో కామేశ్వరిగారి పురస్కారం, తిరుప్పూర్ లయన్స్ క్లబ్ వారి ‘శక్తి’ పురస్కారం అందుకున్నాను.

2014 లో కుప్పం ద్రావిడ  యూనివర్సిటీకి  అతిధిగావెళ్లాను.  అనువాదరంగంలో నా అనుభవాలు పంచుకున్నాను. అదే విశ్వవిద్యాలయంలో 2015 మార్చ్ లో జరిగిన పది రోజుల వర్క్ షాప్ లో అనువాదం లో ఉన్న సాధక బాధకాలు విద్యార్దులతో ముచ్చటించాను.

మీరు పుట్టిన కుటుంబ వాతావరణం, మీరు పెరిగిన పరిసరాలు ఎలాంటివి?

మాది మధ్య తరగతి కుటుంబం. మాతృభాష తమిళమే అయినా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ లో (ఇప్పటి తెలంగాణా) ఇరవై ఏళ్ల దాకా పెరిగాను. చదువు పూర్తిగా తెలుగు మీడియం లోనే సాగింది. (హైదరాబాద్, భువనగిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వరంగల్) చిన్నప్పుడు స్కూల్ నించి ఇంటికి రాగానే అమ్మ పెట్టింది తిని వెంటనే ఆడుకోవడానికి బైటికి పరిగెత్తే వాళ్ళం. పిల్లలందరూ తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పటిలా కాన్వెంటు చదువులూ, ఇంగ్లీషు లో మాట్లాడుకోవడాలు ఆ రోజుల్లో లేవు. చదువు గురించిన వత్తిడి, మార్కుల బెడద అప్పట్లో అంతగా లేవు. ఇప్పుడు ఎల్కేజీ  చదువుతున్న పిల్లలకి కూడా తలమీద కొండంత బరువు ఉంటోంది

ఈ మధ్య తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన సాహితీ సదస్సులో దక్షిణాది భాషల మధ్య రావలసినంతగా అనువాదాలు రాలేదన్న భావన వ్యక్తమయింది. అందువల్ల ప్రాంతీయంగా సాంస్కృతికంగా ఎంతో సారూప్యతలున్నా ఒక భాషలోని సాహిత్యం గురించి మరో భాష వారికి పెద్దగా తెలియకుండా పోతోందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా?

ఇండియాలో ఉన్నన్ని భాషలు ఏ ఒక్క దేశం లోనూ లేవు. ప్రాంతీయంగా సారూప్యతలు ఉన్నా ఒక భాషలోని సాహిత్యం మరోభాష లోని వారికి అందకుండా పోతూ ఉంది అన్నవాదనని ఒక విధం గా ఒప్పుకున్నా, దానికి మూల కారణాలను అన్వేషించి, వాటిని పరిష్కరించే మార్గాలు చూడాలి. ఎలాంటి రచనలు ఇంకో భాషలోకి వెళ్ళాలి అన్న దాంట్లో ప్రామాణికం అంటూ ఏమీ లేకపోవడం, మంచి అనువాదకులు లేకపోవడం, అనువాదాలు చేసినా ఆ రచనలు ప్రచురణ కి నోచుకోక పోవడం ఇలాంటి అవరోధాలు ఎన్నో ఉన్నాయి. సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కొంతవరకు కృషి చేస్తున్నా పూర్తి స్థాయిని అందుకోలేక పోతున్నాయి.

అనువాద రంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?

వివాహానంతరం చెన్నై వెళ్లాక తెలుగు పుస్తకాలు దొరక్క తమిళపుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అలా ఒకసారి తెలుగు నించి అనువదించబడ్డ నవల చదవడం తటస్థించింది. ఆ అనువాదం ఎంత హీనంగా ఉందంటే కోపం పట్టలేక వెంటనే ఆ అనువాదకులకి ఉత్తరం రాశాను. అప్పుడు మీరే అనువాదం చేసి చూడ మన్న సవాలే జవాబుగా వచ్చింది. దాన్ని స్వీకరించి నా మొదటి అనువాద రచన మొదలుపెట్టాను.

ఆ రచన ఎవరిదో చెప్తారా?

యండమూరి వీరేంద్రనాథ్ గారిది. ఆయన రచనలని నేను 1995 లో చదవడం ప్రారంభించాను. అవి ఎంతగా నన్ను ప్రభావితం చేసాయంటే, పుస్తకం చేతిలోకి తీసుకోగానే గబ గబా చదివేయాలి అనిపిస్తుంది. మళ్ళీ అలా చదువుతూ ఉంటే త్వరగా ముగిసి పోతోందే అని బాధగానూ అనిపిస్తుంది. ఇలాంటి ద్వైదీ భావం నాకు అంతకు ముందు ఎవరి రచనల పట్లా కలగ లేదు. ఆయన వ్రాసిన “పందెం” అన్నకధను వారి అనుమతితో తమిళంలోకి అనువదించాను. అది ‘కుంకుమ చిమిళ్’ అన్న పత్రికలో ప్రచురితమయింది.

మీ వివాహం ఎప్పుడు జరిగింది? ఎవరితో? వివాహంతో మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది?

నా వివాహం 1976లో జరిగింది. మా అత్తయ్య కొడుకుతోనే. ఇరవై ఏళ్ల దాకా తెలంగాణా లో పెరిగిన నేను ఒక్క సారిగా చెన్నైకి రావడం తో నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా చదువుకోవడానికి తెలుగు పత్రికలు, నవలలు అందుబాటులో ఉండేవి కావు. అప్పుడే తమిళ పత్రికలు, నవలలు చదవడం ప్రారంబించాను. మాతృ భాష తమిళమే అయినా అప్పటి వరకు తమిళంలో చదవడం తక్కువ. ఉత్తరంముక్క కూడా తమిళంలో రాసింది లేదు. ఇప్పటి లాగా కంప్యూటర్లు, ఇంటర్ నెట్ అప్పుడు లేవు.

సాధారణంగా ప్రతి వ్యక్తి విజయం వెనుక ఆ వ్యక్తికి స్ఫూర్తినో, శక్తినో, సాధించాలన్న కసినో అందించే వ్యక్తి ఒకరుంటారు. మీ జీవితంలో ఆ వ్యక్తి ఎవరు?

ఇరవై ఏళ్ల దాకా పట్టుమని ఒక్క పేజీ కూడా తమిళం లో నేనురాసింది లేదు. అలాంటిదిడెబ్బై నవలల దాకా అనువాదం చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అని ఒక్కో సారి ఆశ్చర్యం కలుగు తుంది. మన విజయాన్ని కుటుంబంలో అందరూ గుర్తిస్తే, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి ఆ గుర్తింపు దొరికితే ఆ సంతృప్తి వేరు. ఆ విషయంలో నేను అదృష్ట వంతురాలిని. మా వారికీ సాహిత్యంలో మంచి అభిరుచి ఉంది.”విముక్త” అనువాదం లో మా వారు కంటెంట్ ఎడిటింగ్ చేసారు.”విముక్త” కధలో భాష స్థాయి వేరు. ఆ స్థాయి అనువాదంలోనూ ఉండాలని సూచించారు.

మీ గురించి మీరు గర్వపడిన సందర్భం?

గర్వపడక పోయినా, ఒకసారి బెంగళూరులో నిడమర్తి ఉమా రాజేశ్వరరావుగారింట్లో జరిగిన సాహిత్య సమావేశానికి వెళ్ళినప్పుడు నేను ముందుగా వెళ్లాను. అప్పుడు ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఆయన “అవును అవును. ఐదు గంటలకే సమావేశం మొదలవుతుంది. చీఫ్ గెస్ట్ కూడా వచ్చేశారు” అని అన్నారు. అప్పుడు హాల్లో నేనూ ఆయన మాత్రమే ఉన్నాము. ఎవరినో చీఫ్ గెస్ట్ అంటున్నారు అని నా వెనక ఒకసారి తల తిప్పి చూశాను. ఒక్క క్షణం తరువాతే నేనే అని అర్ధం అయ్యాక కాస్త సిగ్గుగా అనిపించింది. అంతకు ముందు నెలలోనే కవనశర్మ గారి “విడాకులు” తమిళ అనువాదం “Kanaiyazhi”అన్న పత్రికలో వెలువడింది. కవనశర్మ, వివిన మూర్తి గార్ల పరిచయ భాగ్యం ఆ సమావేశంలోనే కలిగింది.

నేను పంపిన అనువాద కధను ప్రచురించే ముందు, ఆయా పత్రికల సంపాదకులు నాకు ఫోన్ చేసి కధనూ, నా అనువాదాన్ని మెచ్చుకున్న సందర్బాలు రెండు మూడు ఉన్నాయి.

మీ జీవితపు మరపురాని మధుర సన్నివేశం?

తొలిసారి మాతృమూర్తి అయినప్పుడు. “అంతర్ముఖం” నవల మొదటి ప్రతిని అందుకున్నప్పుడు.

మీరు చేయాలనుకుని ఇంతవరకు చేయలేకపోయిన పని?

తమిళంలో ప్రపంచన్ గారి “vaanam vasappadum”నవలను తెలుగులో తేవాలని, అశోకమిత్రన్ గారి సికింద్రాబాద్ కధలను ఒక సంపుటిగా తెలుగులో తేవాలని.

మిమ్మల్ని గాఢంగా ప్రభావితం చేసినవ్యక్తి ఎవరు?

ప్రత్యేకించి ఒక వ్యక్తి అని చెప్పలేను. మాటలు, చేతలు ఒక్కటిగా ఉండేవాళ్ళు, ఎదుటి మనిషిని మాటలతో కూడా గాయపరచని వాళ్ళు, స్నేహ శీలులు నాకు మార్గదర్శులు.

రచన?

తెలుగులో యండమూరిగారి ‘అంతర్ముఖం’. ఓల్గా గారి ‘తోడు’ కధ.

నా రచనలు కొన్ని మీ అంతట మీరే అడిగి అనువదించారు. సాధారణంగా మూల రచనల్ని మీరే ఎన్నుకుంటారా? రచయితలే మిమ్మల్ని సంప్రదిస్తారా అనువాదాల కోసం?

సాధారణంగా, నాకు నచ్చిన కధలను ఆయా రచయితల అనుమతి తీసుకుని మరీ చేస్తాను. యండమూరి, యద్దనపూడిగారి రచనలను అన్నింటినీ తమిళంలో చేయాలని నా తపన. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ‘నిర్జనవారధి’ని తమిళంలో అనువాదంచేసి ఇవ్వగలరా అని ‘కాలచువడు’ అన్న ప్రముఖ పబ్లిషర్స్ నన్ను అడిగినప్పుడు కొంచం సంకోచించాను. ఎందుకంటే అంతవరకు నేను కధలు, నవలలు మాత్రమే చేసి ఉన్నాను. నిర్జనవారధి లాంటి ఆత్మకధను అదే స్వరంతో తేవాలి. అప్పుడే దానికి సార్థకత. ఆ పుస్తకం తమిళ అనువాదం “Alatrapalam” అన్నటైటిల్ తో వెలువడింది. పాఠకుల ఆదరణ పొందింది.

ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు అనువదించారు? ఎన్ని విడి రచనలు, పుస్తక రూపంలో రానివి, అనువదించారు?

ఇంతవరకు తమిళంలో డెబ్బై నవలలు వచ్చాయి. ప్రచురణలో పది నవలల దాకా ఉన్నాయి. తమిళంలో నుంచి తెలుగులోకి ముప్పైఐదు కధలకి పైగా అనువదించాను. ఈ బుక్ గా కినిగెలో ‘తమిళ కధలు-ఆణిముత్యాలు’ రెండు భాగాలుగా ఉన్నాయి. పుస్తక రూపంలో రావాల్సి ఉంది. అలాగే తెలుగు నుంచి తమిళంలో అనువదించిన కధలు పుస్తక రూపంలో రావలసి ఉంది.

సాహిత్య అకాడెమి వారి కోసం కు. అళగిరి సామి గారి “Anbalippu” అన్న కధా సంపుటిని తెలుగులో “బహుమతి” పేరిట అనువదించాను. స్క్రిప్ట్ అప్రూవ్ అయింది. పుస్తకరూపంలో రావలసి ఉంది.

ఒక రచన చదివాక అది మిమ్మల్ని వెంటాడి వేధిస్తేనే అనువాదాలు చేస్తారని విన్నాను, నిజమేనా?

నిజమే. కొన్ని కథలు మనసులో ముద్రించుకుని ఉండిపోతాయి. వాటిని అనువాదం చేసేటప్పుడు కలిగే సంతృప్తి మాటలకి అందనిది.

మీ అభిరుచులు? మీ దిన చర్య?

ఎక్కువగా చదువుతాను. రోజుకి ఎనిమిది గంటలైనా కంప్యూటర్ లో చదవడం, అనువాదం చేయడం నా అలవాటు. మంచి పుస్తకం చదువుతూ ఉంటే విందు భోజనం చేసినంత తృప్తి కలుగుతుంది. నచ్చిన పుస్తకాలను కొని చదివి, నా సొంత గ్రంధాలయంలో ఉంచుకుంటాను. సాహిత్య సమావేశాలు ఎక్కడ జరిగినా నేనూ, మావారూ కలిసి వెళతాం.

IMG_3836 (2) (2)

మీ కుటుంబ సభ్యుల గురించి నాలుగు మాటలు?

మా వారు బాంక్ నుంచి రిటైర్ అయ్యారు. ముగ్గురు కొడుకులు. అందరికీ పెళ్ళిళ్ళు అయి పిల్లలు ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థులు(Seattle, US).

మీరెన్నుకున్న రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి చెప్పండి.

అనువాదం నేను ఎంచుకున్న రంగం కాదు. ఆ రంగమే నన్ను ఎంచుకుంది. తెలుగు నించి తమిళం లోకి, తమిళం నించి తెలుగు లోకి అనువాదం చేయడం నా మనస్సుకి నచ్చిన ప్రక్రియ. వృత్తి, ప్రవృత్తి ఒక్కటిగా ఉండటం నా సుకృతం.

కొన్ని రచనలను చదవగలం. కాని అనువదించడం కష్టం. అందరికీ కాక పోయినా చేయి తిరిగిన రచయితలకి ఒక స్వరం ఉంటుంది(tone). అనువాదంలో ఆ స్వరాన్ని తేగలిగితేనే ఆ అనువాదం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక భాష నుంచి నేరుగా ఇంకో భాషకి అనువాదం వెళ్ళినప్పుడే బాగా ఉంటుంది. మన దేశంలో పలు రకాల భాషలు ఉండటం వల్ల మొదట హిందీలో లేక ఆంగ్లం లో అనువాదం చేయబడి, వాటి నుంచి ప్రాంతీయ భాషలకి అనువాదం చేయడం ఆచరణ లో ఉంది. ఒక అనువాదానికి మళ్ళీ అనువాదం చేసినప్పుడు విషయం పలచబడిపోయే ప్రమాదం ఉంది. వీలైనంత వరకూ నేరుగా అనువాదాలు జరిగితే మంచిది. అనువాదకులకి మూలభాష, లక్ష్యభాషలమీద మంచి పట్టు ఉండాలి. రెండు భాషల యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన ఉండాలి.

గొప్ప స్పందన లభించిన మీ అనువాద రచన?

కథల్లో పి.సత్యవతిగారి “సూపర్ మాం సిండ్రోం”, వి.విజయలక్ష్మి గారి “మాతృత్వానికి మరో ముడి.”

మీకేవి ఎక్కువ ఇష్టం- కథలా నవలలా?

రెండూనూ.

మీ అభిమాన రచయితలు?

తెలుగులోయద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్, ఓల్గా. తమిళంలో అశోకమిత్రన్, D.జయకాంతన్, ఇందిరా పార్థసారథి.

తమిళ, తెలుగు సాహిత్యాల మధ్య పోలికలూ వైరుధ్యాలూ ఎలా ఉన్నాయంటారు?

కథల విషయానికి వస్తే తమిళంలో నిడివి తక్కువగా ఉంటుంది. ఒక సమస్య గురించి మాత్రమే ఉంటుంది. తెలుగులో సంభాషణలు, వర్ణనలు కాస్త ఎక్కువగానే ఉంటాయనిపిస్తోంది. తమిళంలో చారిత్రాత్మిక నవలలు వ్రాసే రచయితలు చాలా మంది ఉన్నారు. వాటిని తీవ్రంగా అభిమానించే పాఠకులు ఉన్నారు. కల్కి వ్రాసిన “పోన్నియిన్ సెల్వన్” ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. తెలుగులో విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలను చదివి అర్థం చేసుకునే ఓపిక  కొత్త తరం పాఠకులకి కొంచెం తక్కువే. పెద్ద రచయితలను వదిలేస్తే మిగిలిన రచయితలు తమ రచనలను తామే సొంత ఖర్చులతో ప్రచురించుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. మంచి రచనలను ప్రోత్సహించే విధంగా పబ్లిషర్స్ ముందుకు రావాలి.

తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా చదివిన వ్యక్తిగా  తెలుగు కథకులకి మీరిచ్చే సూచన?

వీలైనంత వరకు తక్కువ మాటల్లో ఎక్కువ అర్ధం వచ్చేలా చూసుకోండి. ప్రతి విషయాన్ని విపులంగా పాఠకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలివైనవాళ్ళు. అర్థం చేసుకోగలరు. కధలనువ్రాసిన వెంటనే పత్రికలకి పంపించకుండా రెండు మూడు రోజుల తరువాత మళ్ళీ మళ్ళీ చదివి చూడండి. అనవసరమైన పదాలు, వర్ణనలు తగ్గించండి. సమాజం పట్ల, మనిషి మనుగడ పట్ల బాధ్యతతో రచనలు చేయండి.

ప్రస్తుతం ఎలాంటి రచనల ఆవశ్యకత ఎక్కువగా ఉందంటారు?

ఎలాంటి సమాజం ఉండాలని ఎదురు చూస్తున్నామో, అటువంటి సమాజాన్ని రూపొందించ గలిగే రీతిలో మార్గ నిర్దేశం చేసే రచనలు.

అత్యంత శక్తివంతమైన టీవీ మాధ్యమాన్ని మెరుగైన సమాజ రూపకల్పనకి వాడుకోవాలంటే ఏం చెయ్యాలంటారు? ఇవాళ పెరిగిపోతున్న హింసకీ , సినిమాల్లో, టీవీల్లో కనిపిస్తున్న దృశ్యాలకీ సంబంధం ఉందంటారా? 

టి.వి. సీరియళ్ళ గురించి నాకు చాలా అసంతృప్తి ఉంది. ఒక ఇంట్లో ఎలాంటి సంభాషణలు ఉండకూడదో అలాంటి డైలాగులు, వయసుకి మించిన మాటలు మాట్లాడే పిల్లలు ….. చూసే వాళ్ళ ఇంట్లో ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని నా భావన. సినిమాల్లో ఆడపిల్లలని తక్కువ చేసి చూపించడం, చులకనగా చిత్రీకరించడం.. వీటిని బహిష్కరిస్తేనే సమాజం బాగు పడుతుంది. సంస్కరణ మన ఇంట్లో నించే మొదలవ్వాలి.

                                   *

తెలుగులో రాయడమే గొప్ప తృప్తి!

 

 

– జగద్ధాత్రి

~

 

తమిళం మాతృ భాష , మలయాళం విద్యాభ్యాసం చేసిన భాష , తెలుగు నేర్చుకుని పట్టు సాధించిన భాష . అందుకే నాకు ముగ్గురమ్మలు అని చెప్తారు స్వామి గారు. తెలుగు భామనే కాక తెలుగు భాషను కూడా స్వంతం చేసుకుని , అందులో మంచి రచనలు చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగిన వారు స్వామి గారు. అలాగే అనువాదకునిగా తెలుగు భాషలో సాహిత్య అకాడెమీ పురస్కారం సాధించడం  ఆనందదాయకం ఆశ్చర్యకరం కూడా. ఈ సందర్భంలో  రండి ఆయన మనసు విప్పి చెప్పే నాలుగు మాటలు విందాం. నిరంతర కృషీవలుడు , నిగర్వి ఎన్ని సాధించినా , ఎన్ని అవార్డులు వచ్చినా నిర్మమంగా తన పని చేసుకుంటూ పోయే స్వామి గారు మనందరికీ ఆదర్శంగా నిలుస్తారనడం లో అతిశయోక్తి లేదు. 2015 కు గాను “సూఫీ చెప్పిన కథ “ రామన్ ఉన్ని నవల తెలుగు అనువాదానికి సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని స్వామి గారికి ప్రకటించింది. ఇది మన తెలుగు వారికి అందరికీ గర్వ కారణం. నేనెప్పటికీ తెలుగు రచయితగానే ఉంటాను అని చెప్పే స్వామి గారి మనో భావాలు మనం కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.

1 . కధకుడిగా మీ ప్రారంభాలు, అనువాదకుడిగా ప్రారంభాలు ఒకే సారి జరిగాయా ?

       లేదు. ఒకే సారి జరగలేదు. నా మాతృభాష కాని తెలుగులో సాహిత్య రచన చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు.   కధకుడిగా ఆరంగేట్రం చేసిన పది సంవత్సరాల తరువాతనే అనువాదకుడి పాత్ర ధరించాను. నిజం చెప్పాలంటే ఒక అనువాదాలు చేయటం మొదట్లో నాకు ఇష్టం లేని పని గానే వుండేది. విశాఖలో స్దిరపడ్డాక తెలుగు నేర్చుకుంటే నా మిత్రులతో,  సహోద్యోగులతో కలసి మెలసి తిరగటం సుళువుగా వుంటుందనుకొని  తెలుగు నేర్చుకున్నాను. భాషా పరిజ్ఞానంతో తెలుగు సాహిత్యం చదివి ఆనందించేవాడ్ని. దీనికి ఒక కారణం ఉంది. నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టీ సమాజాన్ని బట్టి సాహిత్యం చదవటం బాగా అలవాటైంది. విశాఖలో ఆ రోజుల్లో మలయాళ పుస్తకాలు దొరికేవి కావు . నాకు ఆంగ్ల సాహిత్యం చదివే అలవాటు అప్పుడు –ఇప్పుడు కూడా లేదు –అందువల్ల తెలుగు సాహిత్యమే అందుబాటులో వుండేది. 1980 తరువాతనే తెలుగు బాగా చదవటం నేర్చుకున్నాను. అయినా కధలు వ్రాయాలని కానీ సాహిత్య రచన చేయాలని కానీ అనిపించలేదు.1988 ప్రారంభంలో ఒకానొక సందర్భమున  పోటీలో బహుమతి పొందిన ఒక కధ గురించి మా సహోద్యోగుల మధ్య జరిగిన వేడి వేడి చర్చ , తద్ఫలితంగా వాళ్ళు  విసిరిన సవాలు వల్ల తెలుగులో మొదటి కధ వ్రాసాను –నన్ను నా భాషా పరిజ్ఞానాన్ని రుజువు చేయటం కోసం –అదే నా మొదటి తెలుగు కధ –జవాబులేని ప్రశ్న –ఆ కధకి అలనాటి ఆంధ్రజ్యోతి వార పత్రిక నిర్వహించిన కధల పోటీలో బహుమతి వచ్చింది [1988 ]. ఆ హుషారులో ఎన్నో కధలు వ్రాసాను . అప్పుడే కొందరు పత్రికా సంపాదకులు మలయాళ కధలు తెలుగులోకి అనువాదం చేయమని నన్ను అడగటం జరిగింది. కాని ఒక సృజనాత్మక రచయితగా కొనసాగాలనుకునే నేను ఏ అనువాదమూ చేయలేదు. ఆ తరువాత 2000 ప్రాంతంలో కే. అయ్యప్పపనికర్ సంకలనం చేసిన మలయాళ జానపద గేయాలను తెలుగులోకి అనువదించమని   సాహిత్య అకాడెమి కోరటం వల్ల తప్పనిసరిగా ఒప్పుకున్నాను. ఆ పని పూర్తి అవగానే ప్రముఖ మలయాళ కవి కే. సచ్చిదానందన్ తన 96 కవితలను తెలుగులోకి అనువాదం చేయమని కోరారు [శరీరం ఒక నగరం]సమయాభావం వల్ల కొంత ఆలస్యం చేసినా మొత్తానికి అనువాదం పూర్తి చేసాను. నా అనువాదాలు బాగున్నాయనే పేరు రావటం వల్ల అనువాదాలు చేయమనే ఒత్తిడి పెరిగింది.మరో రెండేళ్ళు తరువాత పదవి విరమణ చేసాను కనుక ,సమయం అందుబాటులో వచ్చి,  వరసగా అనువాదాలు చేసి తెలుగులోకి 17 పుస్తకాలనూ మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువాదం చేసాను; ఇంకా చేస్తున్నాను.

swami 1

2 –    మలయాళ భాషలో మీరు రచనలు చేసారా ?మీ చిన్నతనం లో అటువంటి విశేషాలు వివరించండి

నేను విశాఖ రాక ముందు మలయాళంలో ఎన్నో రచనలు చేసాను. చిన్నప్పటినుంచి అంటే ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనుంచి మలయాళం లో కవిత్వం వ్రాసేవాడ్ని. కాని అచ్చైన మొదటి మలయాళ రచన నేను వ్రాసిన ఏకాంక నాటిక. ఈ నాటిక నేను పదో తరగతి చదివేటప్పుడు [1960] వ్రాసాను. ప్రముఖ మలయాళ వార పత్రిక వారు విద్యార్ధులకోసం [కాలేజీ స్కూల్ పిల్లలకోసం ] నిర్వహించిన ఏకాంక నాటక రచన పోటీలో మొదటి బహుమతి పొందింది ఈ నాటిక. 1960 నుంచి 1970 వరకు సుమారు 100 కవితలు వ్రాసి వుంటాను ,మలయాళంలో. కవితలు మాతృభూమి మలయాళ మనోరమ మొదలగు పత్రికల్లో వెలుబడ్డాయి. జాతీయ చంధసులో వ్రాయబడిన భావ కవితలే వాట్లో ఎక్కువ.

 1. మీరు ఎరిగిన, జీవించిన, మలయాళ సమాజంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వారి గురించి చెబుతారా ?

అలనాడు నేను జీవించిన మలయాళ సమాజం మొత్తం నన్ను ప్రభావితం చేసిందనే నేను అనుకుంటున్నాను. గుండెలో కవిత్వపు బీజం దాగివుంటే మొలకెత్తి చిగురించి విస్తరించడానికి అనువైన సామాజిక వాతావరణం సమాజంలో వుండేది. ప్రతి పల్లెలోని గ్రంధాలయం, అక్కడ చేరేవాళ్ళ చర్చలు, ఏదో ఒకటి వ్రాస్తే దాన్ని సరిదిద్ది ప్రోత్సాహించే పెద్దలు ,రచయితకి ఇచ్చే గౌరవం వగైరాలు చెప్పుకోదగ్గవి. అంతే కాదు మలయాళ భాషా భోదకులు [స్కూల్ లోనూ కాలేజీలో కూడా ] భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగేలా పాఠాలు చెప్పేవారు . ఇక రచనల విషయానికి వస్తే నేను మౌలికంగా కవిని. కవి హృదయం కలిగినవాడని నేను భావిస్తున్నాను. మలయాళం లో కవిత్వమే వ్రాసే వాడ్ని.ఆధునిక మలయాళ సాహిత్యం  మహాకవి పి. కుంజీరామన్ నాయర్ నన్ను కొంతవరకు ప్రభావితం చేసాడనే చెప్పాలి , కవిత్వ రచనలో-

4 . తెలుగులో కధలు వ్రాసినప్పుడు, అనువాదకులుగా మీకొక  భవిష్యత్తు ఊహించారా ?

  కధకుడిగా కాని అనువాదకుడిగా కాని ఏదో ఒకటి సాధిద్దామనుకొని రచన కాని అనువాదం కాని చేయలేదు. ఎవరూ ఎవరినీ రచన చేయమని బలవంతం చేయరు ఇష్టమైతే చేస్తారు అంతే. Just for the pleasure చేస్తారు. అలాంటప్పుడు ఆశలు పెట్టుకోవటం అనవసరం.

SufiBookFrontCover

5 . మలయాళం లోని సూఫీ పరంజ కధ అనువాదానికి ఎంచుకున్నారు –ఈ నవల వివరాలు చెప్పండి

1993 లో వెలుబడిన సూఫీ చెప్పిన కధ అనే నవల మలయాళ సాహిత్యంలో గొప్ప సంచలనం రేపింది. వస్తు పరంగానూ భాషా పరంగానూ కొత్త పోకడలతో కూడిన ఈ నవల పాఠకుల హృదయాన్ని ఆకట్టుకుంది. 2010 వరకు పది ముద్రణలు పొందింది. అంతే కాదు ఆంగ్ల, ఫ్రెంచ్,  హింది తమిళ్ కన్నడ భాషల్లోకి అనువదింపబడి పాఠకుల మన్ననలు కూడా పొందింది. మానవ జాతికి ఉమ్మిడి పైతృకం ఉందనేది చక్కగా గుర్తు చేస్తుంది ఈ నవల. గతంలో రెండు సంస్కృతుల మధ్య నిలిచిన సమన్వయాన్ని కూడా గుర్తు చేస్తుంది గతం సలిపే గాయాల పుట్ట కాదు ఇక్కడ. దయార్ద్రమైన స్నేహ శిలలు –సంఘర్షణా భరితమైన ఈ కాలం లో అది ఒక ఔషదంగా పరిణమిస్తుంది. గుడి అయినా మసీదు అయినా మానవుని అధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గమేననే స్పృహ కలుగుతుంది. విగ్రహారాధనను గౌరవించని వారు కూడా విగ్రహారాధన పట్ల వున్న వైమనస్యపు పట్టు సడలిస్తున్నారు. తెలియని ఒక సత్యం గురించిన ఆలోచన మనసులో ఒక వెలుగు రేఖగా కదులుతుంది కత్తులు నూరి గొడవ పడటానికి సిద్ధంగా నిలిచిన రెండు మతాల మధ్య అతి ప్రాచీనమైన సహవర్తిత్వం ఉండేదని సూఫీ చెప్పినప్పుడు ఏవేవో అడ్డుగోడలు కూలిపోతున్నాయి . ఈ సూక్ష్మ స్వరాన్ని మనకు వినబడే విధంగా వినిపించ గలిగింది ఈ నవల. ఈ నవలను అనువాదం చేయాలనుకోవడానికి ఇదొక్క కారణమైతే, ఈ నవలలో కనబడే అతి సుందరమైన కావ్యాత్మకమైన భాష. ఈ పుస్తకాన్ని నేను అనువాదం చేసి ప్రచురణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనుకోకుండా కల్పనా రెంటాల గారు ఈ పుస్తకాన్ని పంపమని,  చదివి వెంటనే తమ సారంగా బుక్స్ వారే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తామని మాట ఇచ్చారు. అంతే కాకుండా ఈ పుస్తకం ఇంత వేగం వెలుగు చూసేలా చేయడం, దానికి ఇలా అవార్డ్ రావడం రెండు నాకు చాలా ఆనందం కలిగించాయి. ఇందుకు కల్పన గారికి నా కృతజ్ఞతలు. తెలుగు లో కూడా ఈ పుస్తకం మంచి పేరు తీసుకొచ్చింది.

6 మలయాళం నుంచి తెలుగులోకి, తెలుగునుంచి మలయాళం లోకి ఎన్ని రచనలు వెలుబడ్డాయి ఏ ప్రముఖ రచయితలను అనువదించారు ?

మలయాళం నుంచి తెలుగులోకి 17 పుస్తకాలనూ తెలుగునుంచి మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువదించాను. నేను అనువదించిన రచయితలు ,మలయాళం నుంచి తెలుగులోకి  మహాకవి అక్కితం నంబూద్రి “ఇరవయ్యవ శతాబ్దం” [ ఒక దీర్ఘ కవిత ], ఆధునిక మలయాళ కవి సచ్చిదానందన్ [రెండు కవితా సంపుటాలు ], జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ,కవి ,ఓ.ఎన్.వి . కురుప్ [ఒక కవితా సంపుటం ],  నారాయణన్ [ ఒక నవల .ఒక కధా సంపుటి ], సేతు [ మూడు నవలలు ,20 కధలు ], శ్రీనారాయణ గురు,  సి . రాధాకృష్ణన్ [నవల ],  జెక్కేరియా [97 కధలు ],  తకలి, బాషీర్, కారుర్, హరికుమార్, సంతోష్ ఎచ్చికాణం, వైశాఖన్, కె .ఆర్ . మీర, పొంకున్నం వర్కి మొదలైనవారి కధలు

తెలుగు నుంచి మలయాళం లోకి, ఇక తెలుగు నించి  గోపి ,శివారెడ్డి ,కేతు విశ్వనాధ రెడ్డి ,సలీం ,జయంతి పాపారావు గురజాడ వారి కధలు , దివాకర్ల వేంకటావధాని గారి ఆంధ్ర వాగ్మయ చరిత్ర ,శ్రీ శ్రీ మోనోగ్రాఫ్ ,చక్రపాణి మోనోగ్రాఫ్  చాగంటి సోమయాజులు వగైరా.

స్వామి గారితో జగద్ధాత్రి

స్వామి గారితో జగద్ధాత్రి

7 .కధకుడిగా ఒక కధ మీరు వ్రాసినప్పుడా మంచి కధను అనువాదం చేసినప్పుడా మీకు ఎక్కువ సంతృఫ్తీ కలిగింది ?

కచ్చితంగా మంచి కధ వ్రాసినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది.

8 తెలుగు సాహిత్య అనువాద రంగపు అభివృద్ధికి మనం ఎటువంటి చర్యలు చేపెట్టాలని మీరు భావిస్తున్నారు ?

 పూర్వంకన్నా ఇప్పుడు తెలుగునుంచి ఇతర భాషల్లోకి ఇతర భాషల్లోనుంచి తెలుగులోకి చేసే అనువాదాల సంఖ్య పెరిగింది . ఎప్పుడైనా ఎన్ని అనువాదాలు చేసివున్నా ప్రతి సారి అనువాదం ఒక సవాలే, మూల లక్ష్య భాషల సంస్కృతుల పట్ల మంచి పట్టు లేనివాడు మంచి అనువాదం చేయలేరు. తెలుగు  మాతృభాష గలవాడు హింది నుంచి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు మూల భాషా సమాజం గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల అనువాదం మూల కృతికి న్యాయం చేయకపోవచ్చు. అందువల్ల అనువాదాన్ని ఒక సాధనగా భావించి మూల లక్ష్య భాషల సమాజాల గురించీ వాళ్ళ సంస్కృతుల గురించి వాట్లో చోటు చేసుకునే పరిణామాల గురించి నిరంతరం అధ్యయనం చేస్తూ వుండాలి-దానికి తగిన వాతావరణం వుండాలి, లేకపోతే కల్పించాలి.

 1.  మలయాళ సాహిత్య రంగం, పాఠకుల అభిరుచి ఇటువంటి రంగాల్లో తెలుగు సంస్కృతిక సమాజం అలవర్చుకోవలసిన ముఖ్యమైనవేమన్నా గమనించారా ?

గమనించాను. మలయాళీలకు సాహిత్యం పుస్తక పఠనం జీవితంనుంచి విడదీయలేని ఒక భాగం. చిన్నప్పటినుంచి పిల్లలకు సాహిత్య పుస్తకాల పఠనం అలవాటు చేస్తారు.  మలయాళ రచనలు బాగా చదివించేవిగా  ఎక్కువగా ఆర్ద్రంగా వుంటాయి. 300 –400 వందల పేజీల నవలలు కూర్చుని ఏకదాటిగా చదివేస్తారు. అందుకే అలాంటి నవలలు లక్షల  కాపీలు అమ్మకమవుతున్నాయేమో !

10 . అనువాద రంగంలో ప్రస్తుతం మీరు చేస్తున్న, అకాడెమి అప్పగించిన కర్తవ్యాలు గురించి చెప్పండి

   2013 లో అకాడెమి అవార్డు పొందిన కే . సచ్చిదానందన్ గారి మలయాళ కవితా సంపుటి MARANNU VECHA VASTHUKKAL AND OTHER POEMS  అనే పుస్తకం తెలుగులోకి అనువాదం చేస్తున్నాను . అంతే కాక ఒక మలయాళం తెలుగు నిఘంటువు  కూడా తయారు చేస్తున్నాను

 1.  కధకుడిగా అనువాదకుడిగా మీ సాహిత్య జీవితం మీకు సంతృప్తి నిచ్చిందా ?

 కొంత వరకు…పూర్తిగా సంతృప్తి పొందినవాడు తరువాత పని చేయడు.  నేను ప్రస్తుతానికి సంతృప్తి పొందినా ఇంకా ఈ రంగంలో కృషి చేయాలననుకుంటున్నాను కనుక మానసికంగా పూర్తి సంతృప్తి పొందానని చెప్పలేను . ఇంత క్రితం పలు మార్లు చెప్పినట్లు నాకు ప్రత్యేకమైన టార్గెట్ లేదు సాహిత్యంలో. ఒక టార్గెటు అంటూ వుంటే అది అందగానే సంతృప్తి చెందుతారు. ఆ తరువాత కొందరు నిష్క్రమిస్తారు కూడా. నాది నిరంతర సాధన.

 1. సమాజం లో సాహిత్యం పాత్ర ఎంతవరకు ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు ?

 సాహిత్యం తాలూకు పాత్ర ఎంతో ఉంది –ముఖ్యంగా అనువాద సాహిత్య పాత్ర –ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల ఇతర భాషా సాహిత్యం చదవటం వల్ల,భిన్న సంస్కృతులు తెలుసుకోవటం వల్ల మనిషి మనోభావాలు వాడు ఎక్కడున్నా ఒకటేనని అర్ధం చేసుకోగలుగుతారు. మనిషి తన లోపల వున్న మనిషిని డిస్కవర్ చేస్తాడు. భాషా ,వేషం ఆహారం కళా రూపాలు బ్రతుకుతున్న వాతావరణాన్ని బట్టి వచ్చేవేనని అవి కేవలం బాహ్యమేనని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నప్పుడు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సఖ్యత పెరిగి మనుషులందరూ కలసి మెలసి బ్రతికే అవకాశం ఉంది.

peepal-leaves-2013

 

 

ఒక్కడు కాదు  –  ఇద్దరు!

 

 

(మహా రచయిత, డాక్టర్ కేశవరెడ్డి చనిపోయి ఫిబ్రవరి 13 కి  సంవత్సరం కావస్తున్న తరుణంలో   కేశవరెడ్డి గారి మిత్రులు హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడ, హైదరబాద్ లో ఆ రోజు  సాయంత్రం సమావేశమవుతున్నారు. ఈ సంధర్భంగా కేశవరెడ్డి లోని అన్ని కోణాలు తెల్సిన ఆయన ఆప్త మిత్రులు, అంబటి సురేంద్ర రాజు (అసుర)ని  ‘ఛాయ’ సంస్థ తరుఫున కృష్ణ మోహన్ బాబు పలకరించారు.  ఆ మాటల ముచ్చట్లు ఇవి.)

 

కేశవరెడ్డి గారి చాలా పుస్తకాలకి వెనుక మాటల్లో మీరు ఉన్నారు.  అసలు కేశవరెడ్డి గారికి, మీకు పరిచయం ఎలా జరిగింది? ఇన్ని సార్లు వెనుక మాటలు రాయడం ఎలా సాధ్యమయ్యింది?

కేశవ రెడ్డి  గారిని 1979 నుంచి నేనెరుగుదును.  ఎమ్మే ఫిలాసఫీ  చదువుతున్న రోజులలో నా రూమ్ మేట్ అతిధి గా ఆయన మా గదికి ఆ రాత్రి ఉండడానికి వచ్చారు.  అప్పటికి ఆయన, ‘ఇంక్రెడిబుల్ గాడెస్’ అచ్చయ్యింది.  చలం గారు, కృష్ణ శాస్త్రి, కుటుంబ రావు లాంటి పెద్దలు బతికున్న రోజులు.  ఆ రాత్రి తెల్లారే దాకా నాకు, కేశవరెడ్డి గార్కి మధ్య మాటల యుద్ధమే జరిగింది.  తక్షణ కారణం త్రిపుర నేని మధుసూధన రావు ‘ముందు మాట’ అంటూ రాసిన చెత్త చెదారం. కేశవరెడ్డి గార్కి ఆయన అంటే మహా ప్రీతి, భక్తి.  అందుకనే అడిగి మరీ రాయించుకున్నారు.  ఆనాడు నా బాధేంటంటే ముందు మాట రాసిన పెద్ద మనిషికి ‘అర్జున రెడ్డి’ పాత్ర అర్ధం కాకపోవటం.  ఆ పాత్ర అర్ధం కాకపోతే, కేశవ రెడ్డీ అర్ధం కాడు.  ఆ సహ అనుభూతి (empathy) లేనివాడు ముందు మాట రాయడమేంటి? అదే అడిగా కేశవరెడ్డి ని.  ఆ ముందు మాటలో నవల గురించి ఒక్క మాట కూడా లేకపోవటమే కాదు, అదే అదనుగా తన సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని వాంతి చేసుకున్నాడు.  నా మాటలు కేశవరెడ్డి గార్కి రుచించ లేదు.   ఆయన కోపంతో విశ్వ రూపం చూపించాడు.  ఆ రోజు మధుసూధన రావు, మార్క్సిజం, సిధ్ద్ధాంతమ్, ఆచరణ అన్ని అంశాలు మా మధ్య చోటు చేసుకున్నాయి.  తర్వాతి కాలంలో కేశవరెడ్డి గారితో మంచి స్నేహం ఏర్పడింది.  నాకు ఆయన రచనలంటే చాలా ఇష్టం.  అందుకే ఆ ముందు మాట మీద అంత ఘర్షణ జరిగింది.  ఆ సంఘటన తర్వాత ఎంత కలవాలనుకున్నా, 1996 దాకా ఆయన్ను మళ్ళీ కలవటం జరగ లేదు.  కారణం ఆయన హైదరబాదు రాడు, నా పాత్రికేయ వృత్తి పని ఒత్తిడి వల్ల నేను డిచ్ పల్లి వెళ్ళటం కుదరలేదు.  ఈ మధ్యలో ‘శ్మశానం దున్నేరు, అతను అడవిని జయించాడు, రాముడుండాడు-రాజ్యముండాది, సిటీ బ్యూటీఫుల్’ నవలలొచ్చాయి.  కాండ్రేగుల నాగేశ్వర్రావు గారు పాత పుస్తకాలను మళ్ళీ వేస్తూ, కొత్త పుస్తకాలు, ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ లకి పరిచయాలు  రాయమన్నారు.  నా ఈ పరిచయాలు  చూశాక, తన నవల లన్నింటికి రాయమని కేశవరెడ్డి గారు కోరినా, కారణాంతాల వల్ల వీలు పడలేదు.  అలా కేశవరెడ్డి గారు నాకు మరింత దగ్గరయ్యారు.   మనల్ని విడిచి పోయే దాకా ఆయన నాతో మాట్లాడని రోజు లేదు.

మరైతే సంజీవ్ దేవ్ గారి ముందు మాట సరైనదేనా?

మధుసూధన రావుది ఎంత అసంబద్ధమో , ఇది కూడా అంతే అసంబద్ధం.   విషయం ఏం లేదు.

ఒక్క ‘సిటీ బ్యూటీఫుల్’ తప్ప మిగిలిన నవలలన్నిటి కథా కాలం 1900 – 45 మధ్యలో ఉంటుంది.  అది కూడా సూచనప్రాయంగా మాత్రమే తెలుస్తుంది.  దీనికేదైనా బలమైన కారణముందా? లేకపోతే ఆ తర్వాతి కాలంలో ఈ వాతావరణం అంతగా లేదనుకున్నారా?

వాతావరణం లేదని కాదు, వీటి మూలాలు ఆ కాలం లో ప్రస్ఫుటంగా ఉన్నాయని ఆయన ఉద్దేశ్యం.  1950 కి ముందు క్లాసికల్ ఫ్యూడలిజమ్ బలంగా ఉంది.  అదొక vantage పాయంట్ గా తీసుకుంటే వర్తమానాన్ని స్పష్టంగా చూసి అర్ధం చేసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే మీరు ఇంకో విషయం గమనిస్తే, ఆయన రాసిన ఏ కథ అయినా తను పుట్టి, పెరిగిన చిత్తూరు జిల్లా ఎల్లలు దాటవు.  మిగతా చోట్ల అలాంటివి లేవని కాదు.  తను స్వయంగా చూసిన వాస్తవిక పరిస్థుల చిత్రణ అది.

asura

 ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, మునెమ్మ’ లలో అంటే, చివరి నవలల్లోనే మీరనే పొయిటిక్ జస్టిస్ ఉంటుంది.  అంతకు ముందు లేని ఈ ప్రక్రియ వీటిలోనే ఎందుకు ఉంది? దీనికి  ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

వాస్తవికతకి, చారిత్రకంగా ఒక సామాజిక సంక్షోభ సందర్భాన్ని పొదివి పట్టుకొని, పరిశీలించి, పరిష్కరించే శక్తి యింకా సాధించలేదు. ఈ పరిస్థితులలో రచయిత మానవేతర శక్తులతో న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో, కాల్పనీకతను జోడించి, పరిష్కారాన్ని సూత్రప్రాయంగా చెప్తాడు.  ఇంతా చేసి యిది పరిష్కారం కాదు, ప్రతి చర్యే.  ‘మూగవాని పిల్లనగ్రోవి’ నాటికి కేశవరెడ్డి గారి ఆలోచనల్లో మౌలికమైన మార్పు వచ్చింది.  అదే ఆయన రచనల్లో ప్రతిబింబించింది.  తొలి అయిదు  నవలలు రాసిన కేశవరెడ్డి, అమెరికన్ నవలా సాహిత్యంతో ప్రభావితమైతే,  ఆ తర్వాత వచ్చిన మూడు  నవలల్లో లాటిన్ అమెరికన్ సాహిత్య ప్రభావం స్పష్టంగా  చూడ చ్చు.  దీనితో కంటెంటు, ఫాము  అన్నీ  మారాయి.  ఈ పొయటిక్ జస్టిస్ కి కారణం అదే.   మరో విషయం గమనిస్తే 1986 నుంచి 1996 దాకా ఆయన రచనలు మనం చూడలేదు.  ఈ మధ్య కాలంలో ఆయన చేసిన లాటిన్ అమెరికన్ సాహిత్య సేవని ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ ల్లో మనం చూస్తాం.   అలాగే 1997 నుంచి 2007 దాకా మౌనం.  ఆ తర్వాత వచ్చిన ‘మునెమ్మ’ మళ్లీ లాటిన్ అమెరికన్ ప్రభావంతో వచ్చింది.

ఆయన రచనల్లో  ‘సిటీ బ్యూటీఫుల్’ ఒక విభిన్నవైన నవల.  అదెలా కుదిరింది?

ఆ నవల పూర్తిగా ఆయన ఆత్మ కథే.  పాండిచ్చేరిలో ఆయన వైద్య విద్యార్ధిగా గడిపిన కాలాన్ని, అనుభవాన్ని విమర్శనాత్మకంగా చిత్రిస్తే వచ్చిందే ఆ నవల.  ఇదో విధంగా పీడకల లాంటి గతాన్ని రాసి వదిలించుకోవడమే.  ఉన్నత విద్యా విధానాన్ని, ముఖ్యంగా వైద్య విద్యా విధానం మీద ఉన్న అసహ్యాన్ని ఈ నవలలో ఎత్తి చూపాడు.  ఈ విధానం తెలివైన విద్యార్ధి కోసం కాదు.  మొక్కుబడిగా, వివేచన లేకుండా చదివేవాళ్ళ కోసం మాత్రమే.  ఇది ఈ రోజు సమస్త విద్యా వ్యవస్థ లకి వర్తిస్తుంది.

కేశవరెడ్డి గారిని అంత దగ్గరగా చూశారు కదా;  ఆయన గురించి మీకున్న బలమైన అభిప్రాయమేంటి? 

రచయితగానే కాకుండా మనిషిగా కూడా ఆయన ఉన్నతుడు, సర్వ స్వతంత్రుడు.  పుట్టుకతో వచ్చిన ప్రివిలేజ్ లన్నీ వదిలి పెట్టి, మధ్య తరగతి జీవితాన్ని తోసిపారేశాడు.  తమ సామాజిక వర్గపు విద్యాధిక యువతుల్ని కాదని అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాడు.  తను డాక్టర్, ఆమె నర్స్.  డాక్టర్ గా కూడా ఆయన మధ్య తరగతికి దూరంగా ఉండి, సమాజం తిరస్కరించిన నిరుపేద కుష్టు రోగులకి బంధువుగా నిల్చి ఆచరణ లో జీసస్ అయ్యాడు.  సాహిత్య సంఘాల్ని, ముఠాలని విసర్జించాడు.  వేసిన పుస్తకాల మీద హైదరాబాద్ బుక్ ట్రస్ట్  అధిపతి, గీతా రామస్వామి చిల్లర పైసలని విదిల్చినా  పల్లెత్తు మాటనలేదు.   కేశవ రెడ్డి ఒక గొప్ప డాక్టర్.  అణగారిన జీవితాల్లో వెలుగు నింపిన దార్శనికుడు.  రచయితగా ఆయన ఒకే ఒక్కడు.  అందుకే నే నంటాను ఆయన ఒక్కడు కాదు – ఇద్దరు.

***

 

ఈ మార్పు ఎటు అన్నదే ప్రశ్న: “కథా” నవీన్

 

  

వాసిరెడ్డి నవీన్ , పాపినేని శివశంకర్ ల సంపాదకత్వంలో ‘కథాసాహితి’ ప్రతి యేటా ప్రచురిస్తోన్నఉత్తమ  కథల సమగ్ర సంకలనం ఆవిష్కరణ జనవరి 24 న , హైదరాబాదులో .  ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాసిరెడ్డి నవీన్ తో ‘సారంగ’  సంభాషణ.

ఇంటర్వ్యూ : ఎ . కె . ప్రభాకర్ 

  

 • కథాసాహితి ‘కథ’ కి పాతికేళ్ళు , పాతిక సంకలనాలు. 155 మంది రచయితలు – 336 కథలు – రాయల్ సైజులో 2600 పేజీలు  ; 25 సంవత్సరాల కృషి అంతా వొకచోట చూసుకొన్నప్పుడు యెలా ఫీలవుతున్నారు?

సహజంగానే చాలా సంతోషంగా వుంది. పాతికేళ్ళ కృషిని వొకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది. మిగతా భాషల్లో ఏమో గానీ వొక సమాజలో చోటుచేసుకొన్న చలనాన్ని సామాజిక క్రమ పరిణామాన్ని కథలద్వారా చూసుకోగలగడం ఈ సంకలనాల రూపంలో తెలుగులోనే సాధ్యమైందని అనిపిస్తుంది. ఇంతకు ముందు వందేళ్ళ కథా చరిత్రని చూస్తే – ఏ యే కాలాల్లో మంచి కథలు వచ్చాయి , ఎప్పుడు రాలేదు – అందుకు కారణాలేంటి అని వెతుక్కోవలసి వస్తుంది. కానీ పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా మా కథాసాహితి వెలువరించిన సంకలనాల్లోని కథలన్నీ ఒకచోట చేర్చడం ద్వారా ఆ కారణాలు అన్వేషించడానికి తేలికగా వీలవుతుంది. ఉదాహరణకి 1990 నుంచీ 1998 వరకూ ఒక ఎనిమిదేళ్ళ పాటు తెలుగులో మంచి కథలు వచ్చాయి. ఆ తర్వాత క్వాలిటీ కొంచెం తగ్గింది. మళ్ళీ ఇటీవలి కాలంలో మంచి కథ రావడం మొదలైంది.  అన్ని కథలూ ఒక దగ్గర చూడడం వల్లే ఇటువంటి స్థూల విభజన వీలవుతోంది. అలాగే అందుకు కారణమైన సామాజిక పరిస్థితుల నేపథ్యాన్ని సూక్ష్మ పరిశీలన ద్వారా అధ్యయనం చేయడం కూడా సులువవుతుంది. ఆ విధంగా యీ సమీకృత బృహత్ సంకలనానికి కథా సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మేం ఆ చరిత్రలో భాగం అవుతున్నందుకు ఆనందంగా వుంది.

 • అసలీ వార్షిక సంకలనాలు తీసుకురావాలన్న సంకల్పానికి బీజం యెక్కడ పడింది?

దానికి ముందుగా – అసలు కథల మీద ఆసక్తి ఎలా కలిగిందో చెప్పాలి. ‘ప్రజాసాహితి’ పత్రిక సంపాదకుడిగా వున్నప్పుడు (1980 – 90 మధ్య కాలంలో) ‘నిన్నటి కథ’ పేరున పాత కథల్ని వేస్తుండేవాళ్ళం. అలా ప్రతి నెలా ఒక కథ వెయ్యడానికి చాలా  కథలు చదివి – వాటిలో మంచిది అనిపించింది ఎన్నుకునేవాళ్ళం.  ఆ క్రమంలో 1910 నుంచీ వచ్చిన అనేక కథలు చదవడం వల్ల కథల పట్ల ఆసక్తి ఏర్పడింది. దాంతో పాటు వాటి వెనకవున్న సామాజిక కారణాలు తెలుకోవడం మరింత ఉత్సాహంగా వుండేది. అప్పుడే తెలంగాణ రైతాంగ పోరాట నేపథ్యంలో వచ్చిన కథల్ని సేకరించాం. అది కథల అధ్యయనానికి ఎంతో ఉత్తేజానిచ్చింది.

ఇక కథా వార్షిక సంకలనాలు రావడం వెనక ఇద్దరు వ్యక్తులదీ ఒక సంస్థదీ ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ సంస్థ HBT(హైదరాబాద్ బుక్ ట్రస్ట్). వ్యక్తులు – చేకూరి రామారావు , హరి పురుషోత్తమరావు (హరి). అప్పుడు ట్రస్టు సభ్యుడు పరుచూరి సుబ్బయ్య పాతికేళ్ళ మంచి కథల సంకలనం తీసుకురావాలని సూచించాడు. ఆ అభిప్రాయాన్ని  అప్పటి చైర్మన్ C K నారాయణ రెడ్డి బలపరచి ఆ పని హరిగారికి అప్పచెబుదామని భావించారు. అయితే హరి నా పేరు సూచించారు. దాంతో ‘తెలుగు కథ 1960 – 85’ నా సంపాదకత్వంలో  తయారైంది. దాని కోసం కథల సేకరణలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో ప్రధానమైన సమస్య లభ్యత. చాల కథలు పత్రికల్లోనే ఉండిపోవడం , సంకలనాల్లోనో సంపుటుల్లోనో అతి కొద్ది కథలే రావడం వల్ల వచ్చిన ఇబ్బంది అది. పత్రికలు కూడా  గ్రంథాలయాల్లో అంత తేలికగా దొరికేవి కావు. అప్పుడు వచ్చిన ఆలోచన – ఎవరైనా ప్రతి సంవత్సరం మంచి కథలతో సంకలనం వేసి వుంటే బాగుండేది కదా అని. HBT సంకలనం పూర్తయ్యే సరికి మూడేళ్ళు పట్టింది. 90ల చివరికి ఆ పుస్తకం పూర్తయి విడుదలైంది. అంతవరకూ జనసాహితి సాంస్కృతిక సమాఖ్యలో ముఖ్య బాధ్యతల్లో వుండేవాణ్ని. వివిధ కారణాలతో 90 లో సంస్థ నుంచి బయిటికి రావడం వల్ల దొరికిన సమయాన్ని యిలా వార్షిక సంకలనాలు తీసుకురావడానికి ఉపయోగించవచ్చు అనిపించింది. అప్పటికే కథలమీద కొంత అవగాహన ఏర్పడింది. జనసాహితి తరపున జరిగిన ఒకటి రెండు వర్క్ షాపుల్లో పాఠాలు చెప్పిన పాపినేని శివశంకర్ తో యీ విషయం ప్రస్తావించాను. అతను సరేననడంతో పని మొదలైంది. పుస్తకం తయారై ‘కథాసాహితి’ ప్రచురణగా బయిటికి వచ్చింది. ఇలా మొదటి సంకలనం ‘కథ 90’ ని  1991 డిసెంబర్ 28న హైదరాబాద్ ద్వారకా హోటల్లో చే రా విడుదల చేశారు. ఈ వార్షిక సంకలనం రెగ్యులర్ గా వస్తుందా అని చాలా మందికి సందేహాలుండేవి. ఆ సందేహం నిర్వాహకులుగా మాకూ వుండేది. కానీ చేయగల్గినంత కాలం చేద్దాం అనే ఆలోచన. కానీ ఆ తర్వాత ఇక వెనక్కి చూడలేదు. పాతికేళ్ళుగా నిరాటంకంగా వస్తూనే వున్నాయి.

 • ఇటువంటి వార్షిక సంకలనాలు యింతకు ముందేమైనా వచ్చాయా? మీతోనే మొదలా?

మేం మొదలూ కాదు – చివరా కాదు. 1968 ప్రాంతంలో ఎమెస్కో వాళ్ళు ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులతో కథలు రాయించి ‘విద్యార్థి కథా సాహితి’ పేరు మీద ఒకటి రెండు సంవత్సరాల పాటు సంకలనాలు తెచ్చారు. ఆ ప్రయత్నం ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 90 లో మాతోనే మొదలైంది. అయితే విచిత్రంగా అదే సంవత్సరం ‘కథ’ అనే సంస్థ గీతా హరిహరన్ సంపాదకత్వంలో ‘Katha Prize Stories’ పేరు మీద భారతీయ భాషల్లో ఆ సంవత్సరం వచ్చిన మంచి కథల్ని ఎంపిక చేసి ఇంగ్లీషులోకి అనువదింప జేసి వార్షిక కథా సంకలనాలు వేయడం మొదలుపెట్టారు. అదొక పదేళ్ళు నడిచి ఆగిపోయింది. ఆ తర్వాత మన దగ్గర తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘తెలుగు కథ’ , మధురాంతకం నరేంద్ర – రాసాని సంపాదకత్వంలో ‘కథా వార్షిక’ , కర్ర ఎల్లారెడ్డి సంపాదకత్వంలో ‘తెలంగాణ కథ’ కొద్ది సంవత్సరాల పాటు వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు సామాన్య కిరణ్ ఫౌండేషన్ వారి ‘ప్రాతినిధ్య’ , సింగిడి వారి తెలంగాణ కథ ( రంది , తన్లాట) కొత్తగా మొదలయ్యాయి. ఇవన్నీ తెలుగు కథ వికాసానికి చేసిన/చేస్తున్న దోహదం  చాలా విలువైనది. ఇదిలా వుండగా 1915లో ప్రారంభమైన The Best American Short Stories అన్న సంకలనం 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలోనే మా కథ సంకలనాలు 25 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం యాదృచ్ఛికం. ప్రస్తుతానికి ఈ రెండూ తప్ప ఇన్నేళ్ళుగా నిరంతరాయంగా ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్న దాఖలాలు ఎక్కడా నాకు తెలిసి లేవు.

25 Years Katha Cover

 • నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే మంచి కథల ఎంపికలో మీరు పాటించే ప్రమాణాలు – పధ్ధతి యేమిటి?

నిజానికి ఇదొక పెద్ద చర్చ. ఇప్పటికీ చాలా మంది నోళ్ళలో నానుతున్న చర్చ. ఒక రకంగా యే ఎన్నిక అయినా వ్యక్తిగత అభిరుచికి సంబంధించినదే. మనం యెంత objective గా ఎన్నిక చేసినా యెంతో కొంత మేరకి అది subjective కాక పోదు. ఎందుకంటే మన వ్యక్తిగత ఆలోచనలు , సమాజం పట్ల  – సాహిత్య ప్రయోజనం పట్ల మనకుండే దృష్టి ,  మనం విశ్వసించే భావజాలం మన అభిరుచిని నిర్ధారిస్తాయి. అదే కథల ఎంపికలో ప్రతిఫలిస్తుంది. అందువల్ల ఆ మేరకు అది subjective అవుతుంది. తొలి రోజుల సంకలనాల్లో మా కథల ఎన్నిక చూసి – చాలామంది ఇవన్నీ కమ్యూనిస్టు కథలు అన్నారు. సమాజం గురించి మాట్లాడటమే కమ్యూనిజం అయితే అలా అనుకోవడం పట్ల మాకేం అభ్యంతరం లేదని సమాధానం యిచ్చేవాళ్ళం. వాస్తవానికి కథల ఎన్నికలో ప్రధానంగా రెండు విషయాలు దృష్టిలో పెట్టుకునే వాళ్ళం. వస్తువు సామాజిక ప్రయోజనోద్దిష్టమై వుండాలి. శిల్పం కొత్తగానూ చదివించేదిగానూ వుండాలి – ఆ సామాజిక ప్రయోజనాన్నిపాఠకుడికి అర్థవంతంగా అందించేదిగానూ వుండాలి. ఈ లక్ష్యంతో కలిసి నడిచిన సంపాదకులిద్దరం మార్క్సిస్ట్ భావజాల ప్రభావం నుంచి వచ్చిన వాళ్ళం కావడం వల్ల చాలామందికి ఇవి కమ్యూనిస్టు కథలని అనిపించవచ్చు.

తెలుగు కథ ఎప్పుడూ సమాజంతోనే ప్రయాణించింది.  దాన్ని మేం విడదీయ దల్చుకోలేదు. ఈ ఆలోచన 90 నుంచీ అలాగే కొనసాగింది. పాతికేళ్ళ తర్వాత నేటికీ కొనసాగుతోంది.

160 పేజీలున్న మొదటి సంకలనంలో 15 కథలున్నాయి. అప్పుడు ఆ 15 కథలు ఎంపిక చేయడానికి పెద్ద పరిశ్రమే చేయాల్సి వచ్చింది. సరిగ్గా 1990లోనే  ఆంధ్రజ్యోతి  వార పత్రిక ‘ఈ వారం కథ’ పేరుతో వారం వారం ఒక మంచి కథ ప్రచురిస్తూ వచ్చింది. అలా వాళ్ళు ప్రకటించినవే యాభైకి పైగా కథలున్నాయి ఆ సంవత్సరం. ఇతర పత్రికల్లో వచ్చిన  కథలు – మొత్తం చూసుకుంటే మంచి కథలు అనిపించినవి వందా నూట యాభై పైగానే లభ్యమయ్యాయి. వాటి నుంచి 15 కథలు వడపోయడం కష్టమే అయ్యింది.  పాతికేళ్ళ తర్వాత  యిప్పుడు అంత కష్టం అనిపించడం లేదు. దానికి రెండు కారణాలు. ఇరవై అయిదేళ్ళుగా కలిసి పని చేసే క్రమంలో సంపాదకుల మధ్య చక్కటి అవగాహన ఏర్పడడం ఒక కారణం. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే కథల స్థాయి తగ్గడం రెండో కారణం. కాకపొతే ఇటీవలి కాలంలో కొత్త తరం కథలు రాయడం మొదలెట్టాకా కథా రచనలో విలక్షణత పెరిగింది. కానీ యెక్కడో సామాజిక పరిణామాన్ని పట్టుకోవడం యింకా యీ కొత్త రచయితలకి పూర్తిగా అలవడలేదు అనిపిస్తుంది.

 • అంటే వస్తు శిల్పాల విషయికంగా తెలుగు కథలో యీ పాతికేళ్లలో పేర్కొదగ్గ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్తున్నట్లే గదా! ‘కథ’ సంపాదకులుగా మీరు గుర్తించిన మార్పులేమిటి – అవి తెలుగు కథ పురోగమనానికి గానీ విస్తృతికి గానీ తోడ్పడ్డాయా?

అవును మార్పులున్నాయి. ఉంటాయి కూడా. ఎటొచ్చీ ఆ మార్పులు ఎలా వున్నాయన్నదే ప్రశ్న. సమాజంలో సంభవిస్తున్న పరిణామాల్ని కథకులు తమ కథల ద్వారా పాఠకులకి అందించ గల్గుతున్నారా లేదా అన్నది ఒకటి – ఆ అందించే క్రమంలో కథా నిర్మాణంలో నూతన పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయా లేదా అనేది రెండోది. వీటి గురించి ఆలోచించాలంటే తెలుగు సమాజపు 25 ఏళ్ళ రాజకీయ – ఆర్ధిక – సామాజిక – సాంస్కృతిక జీవన పరిస్థితుల గురించి , వాటిలో వచ్చిన మార్పుల గురించి పెద్ద చర్చే చేయాల్సి వుంటుంది. ఒకప్పుడు వామపక్ష భావజాలం శాసించిన ఈ సమాజాన్ని ఇవ్వాళ అస్తిత్వవాద రాజకీయాలు శాసిస్తున్నాయి. ఇది అభివృద్ధా – తిరోగమనమా అనేది సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సిన అంశం. అయితే 1990 నుంచి 95 వరకు వచ్చిన కథల్లో వామపక్ష ఉద్యమ భావజాలం ప్రధానంగా కనపడటానికీ ఆ తర్వాత వచ్చిన కథల్లో స్త్రీవాద మొదలైన అస్తిత్వ వాద భావజాలం కనపడటానికీ వున్న కారణాలని సూక్ష్మ దృష్టితో అన్వేషించాలి. మరీ ఇటీవలి కాలంలో మానసిక సంఘర్షణలు , పురా జ్ఞాపకాలు , వైయక్తిక ధోరణులు , మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల గురించి వున్న కథలే ఎక్కువ వస్తున్నాయి. అంతకు ముందున్న రాజకీయ నిబద్ధత ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం వామపక్ష ఉద్యమాలు ఒకడుగు వెనక్కి వెళ్ళడం కావచ్చు.

90లో వచ్చిన ఒక తండ్రి కథ గానీ ఆ తర్వాత వచ్చిన అతడు , జాడ , పిలక తిరుగుడు పువ్వు వంటి కథలు గానీ యిప్పుడు రావడానికి అవకాశాలు కనిపించడం లేదు.

 • గ్రామీణ నేపథ్యం నుంచి కథలు రావడం తగ్గింది కదా!

ఇప్పుడు తెస్తున్న పెద్ద సంకలనానికి ముందుమాట రాస్తూ ఒకటి రెండు అభిప్రాయాలు ఈ విషయం గురించి చెప్పాను. సౌకర్యాల రీత్యా గ్రామాలు పట్టణాలకు బాగా దగ్గరయ్యాయి. మానసిక సంబంధం దృష్ట్యా గ్రామానికీ పట్టాణానికీ మధ్య దూరం పెరిగింది. గ్రామాల్లో వ్యవసాయ సంబంధాల్లో మార్పులొచ్చాయి. ఉత్పత్తి విధానం మారింది. చేతి వృత్తులు దాదాపు కనుమరుగవుతున్నాయి. కనుమరుగవుతున్న ఆ దశని 2000 – 2010 మధ్య వచ్చిన కథా సాహిత్యం బాగానే పట్టుకొంది. అన్నం గుడ్డ , కుట్ర , కొలిమి , పరవ వంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణలు. రైతు జీవన విధ్వంసాన్ని క్షతగాత్ర గానం , నేల తిమ్మిరి , మిత్తవ , బతికి చెడిన దేశం , రంకె , తెల్ల దెయ్యం వంటి కథలు , గ్రామీణ మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల్ని మాయి ముంత , భూమి దు:ఖం వంటి కథలు ప్రతిఫలించాయి.

నాగరికత అభివృద్ధి క్రమంలో ఇవి అనివార్య కారణాలు అని అనిపించవచ్చు ; కానీ అవి వచ్చిన వేగం , పధ్ధతి అందుకు మానసికంగా సిద్ధంగా లేని గ్రామీణ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. దానిలోని అమానవీయకరణ తెలుగు కథలో ప్రతిబింబించింది.

ఆ తర్వాత కథల వస్తు స్వరూప స్వభావాలు మారాయి. వీటన్నిటికీ దూరంగా వ్యక్తిగతమైన మనోవేదన , పరాయీకరణకి గురై అందులో ఇమడలేని తనం , దాన్నుంచీ పుట్టిన అంతస్సంఘర్షణ – ఇవి కథా వస్తువులయ్యాయి. గత రెండు మూడేళ్ళుగా మా వార్షిక సంకలనాలు చూస్తే యీ ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రయోగం ప్రయోజనం కోసం కాకుండా కేవల ప్రయోగం కోసమే చేసినట్లు అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని సమాజంలో యీ ధోరణి యిప్పుడే ప్రవేశించడం అంత ఆరోగ్యకరమైన పరిణామం కాకపోవచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది అదే.

Naveen Vasireddy2

 • సామూహిక భావన , ఆచరణ వెనకతట్టు పట్టి వైయక్తిక భావనలూ ప్రయోజనాలూ ముందుకు రావడంలో ప్రపంచీకరణ ప్రభావం యే మేరకు వుంది? అది కథ వస్తు రూపాల్లో యెలా ప్రతిబింబించింది?

నిజానికి ప్రపంచీకరణ ప్రభావం సమాజంలో పెనుమార్పులకు కారణమైంది. ముఖ్యంగా తెలుగు సమాజం ప్రపంచీకరణకు ప్రయోగ వేదిక అయ్యింది. ఈ మార్పులు కేవలం ఆర్ధిక విషయాలకే పరిమితం కాలేదు ; ప్రభుత్వ నిర్ణయాల్లోకి , గ్రామీణ జీవితం లోకీ , వ్యాపారాల్లోకీ , విద్యా – ఉద్యోగ రంగాల్లోకీ , నెమ్మదిగా వ్యక్తిగత జీవితాల్లోకీ ప్రవేశించాయి. ఇంతకు ముందు  చెప్పుకొన్నట్టు గ్రామీణ జీవితం ఛిన్నాభిన్నమైంది. పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఒకటొకటిగా మూతబడుతూ వచ్చాయి. అద్భుతమైన పనితనమున్న కార్మికులు పనికి దూరంగా నెట్టివేయబడ్డారు. అది వారికి తట్టుకోలేని స్థితి. ఈ స్థితిని చిత్రించిన కథలు ఈ కాలంలో  ఎక్కువగానే వచ్చాయి. ఉదా. విధ్వంస దృశ్యం , టైటానిక్ , జీవన్మృతుడు , అలజడి , మొగుడూ పెళ్ళాల ప్రేమ కత … వంటి కథలు. అలాగని కొత్తగా వచ్చిన ఉద్యోగ జీవితాల్లో భద్రత ఉందా అంటే అదీ లేదు. అభద్రతా భావం కొత్త వేతన జీవులను నిత్యం వెన్నాడుతూనే వుంది. క్రానికల్స్ ఆఫ్ లవ్ , సాలభంజిక వంటి కథలు యీ స్థితికి ప్రతీకలు మాత్రమే. దీన్నుంచీ నెమ్మదిగా కథా వస్తువు వ్యక్తిగత జీవితాలకు పరిమితమయ్యే వైపు ప్రయాణించింది. ఈ క్రమంలో కథా రచనలో శిల్ప పరమైన ప్రయోగాలూ పెరిగాయి. చంద్రుడు గీసిన బొమ్మలు , చిట్టచివరి సున్నా , రామేశ్వరం కాకులు , చిత్రలేఖ వంటి కథల్ని యిందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

 • ఒక్క మాట ; యీ పరిణామాల్ని వ్యతిరేకిస్తూ ఏదో వొక రూపంలో యెక్కడో వొక చోట ప్రజా వుద్యమాలు పురివిప్పుకొంటూనే వున్నాయి. వాటి ప్రభావంలో వస్తున్న కథా సాహిత్యాన్ని ప్రధాన స్రవంతిగా చెప్పుకొనే వాళ్ళు  యెందుకు పట్టించుకోవడం లేదు?

ప్రజా ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతాల నుంచి ఆ ఉద్యమాల నేపథ్యాన్నీ ఉద్యమ జీవితాన్నీ ప్రతిబింబిస్తూ తక్కువగానైనా మంచి కథలే వస్తున్నాయి. అయితే రకరకాల కారణాలచేత అవి ప్రధాన స్రవంతిలో భాగం కావడం లేదు. పత్రికా మాధ్యమాల నిర్లిప్తత కొంత కారణమైతే , ఆ యా రచయితలు విధించుకొన్న నియమాలు పరిమితులు మరికొంత కారణం కావచ్చు. అవి ప్రధాన స్రవంతిలోకి వచ్చినపుడు తెలుగు కథ వస్తు శిల్పాల రీత్యా విస్తృతినీ వైవిధ్యాన్నీ సాధించి మరింత బలపడుతుందని నా విశ్వాసం.

 • మీ యీ పాతికేళ్ళ ప్రయాణంలో – సంపాదకుల మధ్య కథల ఎంపికలో అభిప్రాయభేదాలు వచ్చాయా – వస్తే వాటిని యెలా పరిష్కరించుకొన్నారు?

సంపాదకులం ఇద్దరం ప్రధానంగా ఒకే భావజాలానికి చెందిన వాళ్ళం అయినప్పటికీ వ్యక్తిగత అభిప్రాయాలు అభిరుచుల విషయంలో చాలా తేడాలున్నాయి. దీనివల్ల ప్రతి సంకలనంలోనూ కథల ఎన్నిక విషయంలో తీవ్రమైన చర్చలే జరిగాయి. ఒక్కోసారి అవి తారాస్థాయికి వెళ్ళిన సందర్భాలూ వున్నాయి. అయినా సంపాదకుల ఇద్దరి మధ్య వున్న సంయమన ధోరణి వల్ల యీ బంధం కొనసాగింది. కథల ఎన్నికలో తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదం వచ్చినపుడు మూడో వ్యక్తి దగ్గరకు వెళ్ళేవాళ్ళం. హరి , శివారెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి , పెనుగొండ లక్ష్మీ నారాయణ , ఎ కె ప్రభాకర్ వంటి మిత్రులకు సాహితీవేత్తలకు నిర్ణయాల్ని వదిలేసేవాళ్ళం. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూనే వున్నాం. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత కథ – 2015 నుంచీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభిద్దామనే ఆలోచనలో వున్నాం. మేమిద్దరం ప్రధాన సంపాదకులుగా వుంటూనే యే సంవత్సరానికి ఆ సంవత్సరం మరో ఇద్దరు సంపాదకులకు ఎన్నిక బాధ్యతను అప్పజెప్పాలనుకుంటున్నాం. బహుశా అప్పుడు ఆ  మూడో వ్యక్తి పాత్ర మేం పోషించాల్సి రావచ్చు.

 • మీరింత కష్టపడి తెచ్చే వార్షిక సంకలనాల్ని పాఠకులు యెలా స్వీకరించారు? కథల ఎంపిక విషయంలో వచ్చిన విమర్శల్ని యెలా యెదుర్కొన్నారు? ఆ  విమర్శలు తదనంతర సంకలనాల పై ప్రభావం చూపాయా?

ముందుగా కథ 90 వెలువడినపుడు ‘కథా సాహిత్యానికి మార్కెట్ లేదు , కథా సంకలనాలు అమ్ముడుపోవు’ – అన్నది పుస్తక విక్రేతల ఏకాభిప్రాయం. అది వ్యాపార నవలలు రాజ్యమేలుతోన్న కాలం. విక్రేతలూ , ప్రచురణ కర్తలూ ప్రధానంగా వాటినే అమ్ముకొని నమ్ముకొని ప్రయాణం చేశారు. అప్పటికింకా తమ కథా సంపుటాల్ని ముద్రించుకొనే పరిస్థితి రచయితలకి లేదు. ప్రచురణ కర్తల కోసం ఎదురు చూసేవాళ్ళు. కథ 90 వెలువడ్డ తర్వాత యివన్నీ అపోహలేనని తేలిపోయాయి. మేం వేసిన వెయ్యి కాపీలూ కేవలం అయిదారు నెలల్లోనే అమ్ముడుపోయాయి. పునర్ముద్రించే ఆర్ధిక వనరులు లేక ఆ పని చేయలేదు. ఇది మాకూ ఆశ్చర్యమే. వరసగా రెండు మూడు సంకలనాలు తెచ్చే ఉత్సాహం వచ్చింది. వాటి పట్ల పాఠకులకున్న ఆదరణ చూసి ఇక వీటిని కొనసాగించాల్సిందే అని నిర్ణయించుకొన్నాం. ఈ లోపు రచయితలలో ఉత్సాహం పెరిగింది. కథలు చదివే పాఠకులు పెద్ద సంఖ్యలో వున్నారని వాళ్లకు అర్థమైంది. నెమ్మదిగా రచయితలు సొంతంగా కథా సంపుటులు ప్రచురించుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విశాలాంధ్ర వంటి ప్రచురణ సంస్థలు కథా సంపుటాలనూ సంకలనాలనూ తీసుకురావడం ప్రారంభమైంది. 95 నుంచి ఈ కథా వాతావరణం వెల్లివిరిసింది. నేటికీ అది కొనసాగుతోంది. అందులో కథాసాహితి వార్షికలు భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంటుంది.

అయితే యీ క్రమంలో విమర్శలూ రాకపోలేదు. విమర్శలు రెండు రకాలుగా వస్తున్నాయి. ఒకటి – కథల ఎన్నిక పట్ల పాఠకుల అసంతృప్తి , రెండు – రచయితల అసంతృప్తి. రచయితల అసంతృప్తిలో కొంత వ్యక్తిగత ధోరణులు ఉండవచ్చు. కానీ పాఠకుల స్పందనను మేం చాలా సీరియస్ గానే తీసికొన్నాం. కొన్ని సందర్భాల్లో బాధ్యతా యుతమైన , నిర్మాణాత్మకమైన విమర్శలు మా ఎంపికలోని లోపాల్ని ఎత్తిచూపాయి. వాటిని స్వీకరించాం. రచయితల అసంతృప్తి మా మీద వొత్తిడిని పెంచేది. ఒక ప్రాంతానికి , ఒక జెండర్ కి , ఒక వర్గానికి సరైన న్యాయం చేయడం లేదేమోనన్న వొత్తిడి అది. దాన్ని అధిగమించడానికి ఆ యా రచయితల రచనలను మరింత శ్రద్ధగా పరిశీలించేవాళ్ళం. ఇప్పటికీ ఆ స్థితి వుంది.

 • తెలంగాణ కథకి మీ సంకలనాల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని బలమైన విమర్శ వుంది. దానికి మీ సమాధానం యేమిటి?

మా ఎన్నిక ప్రధానంగా కథా వస్తువు  , కథా శిల్పం చుట్టూ మాత్రమే తిరిగేది. ఆ క్రమంలో కొన్ని ప్రాంతాలకీ కొన్ని వర్గాలకీ ఒక్కోసారి ప్రాతినిధ్యం లభించని మాట నిజమే( ప్రాతినిధ్య ప్రాతిపదికన వేసిన సంకలనాలు కావివని గమనించాలి). తెలుగు నేల మీద ఒక్కో ప్ర్రాంతంలో ఒక్కో సాహిత్య ప్రక్రియ బలంగా వెలువడింది. ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో కవిత , పాట వచ్చినంత  ఉధృతంగా ఆంధ్ర ప్రాంతంలో రాలేదు. రాయలసీమలో మరీ తక్కువ. కథ నవల అక్కడ ఎక్కువ. అందుకు అనేక చారిత్రిక కారణాలున్నాయి. ఒక వ్యాసంలో కె శ్రీనివాస్ చెప్పినట్లు తెలంగాణ ప్రాంతంలో చాలా కాలంపాటు తెలుగు భాష మీద వున్న ఆంక్షలు  ఒక కారణం. వాటిని కవిత్వం పాట ముందుగా ఛేదించుకొన్నాయి. 80 – 90 ల మధ్యలో తెలంగాణలో రగిలిన ఉద్యమాలు కథకి మంచి ఊపుని తీసుకువచ్చాయి. ఆ క్రమంలో 95 వరకు మేం వేసిన సంకలనాల్లో తెలంగాణ ప్రాంత రచయితలకు మంచి చోటే లభించింది. అంతే కాదు – ఆ కథలు అన్ని ప్రాంతాల ప్రజల్నీ విశేషంగా ఆకట్టుకొన్నాయి. మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యాకా కవిత్వం వచ్చినంత బలంగా కథ రాలేదు. అయినా తెలంగాణా రాష్ట్రోద్యమ నేపథ్యం  ఆ ప్రాంతం నుంచి వచ్చిన  రచయితల  కథల్ని ఎన్నిక చేయడానికి మా పై పెద్ద వొత్తిడినే తీసుకువచ్చింది. వచ్చిన ప్రతి కథనీ క్షుణ్ణంగా అదనపు జాగ్రత్తతో పరిశీలించాం. వచ్చిన ఏ కథా మా దృష్టి నుంచి పోలేదని  చెప్పగలం. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ కథలు వెలువడతాయని ఆశించడం అత్యాశ కాదు.

 • ఈ క్రమంలోనే సంపాదకుల అర్హతలపైనా , సంపాదకుల కథలు సంకలనంలో వుండటం పైనా ప్రశ్నలు వచ్చాయి. వాటికి మీ స్పందన యేమిటి?

ముందుగా సంపాదకుల కథలు ఉండటం గురించి మాట్లాడుకుందాం. ఇది కొత్త సంప్రదాయం ఏమీ కాదు. తెలుగు వాతావరణంలో కొత్త కావచ్చు గానీ ప్రపంచ సాహిత్యంలో సంపాదకులు కథకులు కూడా అయిన సందర్భాల్లో ఆ రచయితల కథలు సంకలనాల్లో చోటు చేసుకొన్నాయి. కాకపొతే శివ శంకర్ కథల్ని ఎన్నిక చేసినప్పుడు ఆ నిర్ణయం పూర్తిగా నాకో మూడోవ్యక్తికో మాత్రమే పరిమితం.

ఇక అర్హతల గురించి అంటారా – సంపాదకులు కథకులే అయివుండాలన్న నియమం ఏం లేదు. సంపాదకులకు కథ మంచి చెడులను నిర్ణయించే శక్తి ఉందా లేదా అన్నది ముఖ్యం. ఆ పని మంచి పాఠకుడు కూడా చేయగలడు. ఈ వార్షిక సంకలనాలు 25 ఏళ్లుగా పాఠకుల ఆదరణతో కొనసాగుతున్నాయంటే అదే సంపాదకుల అర్హతకు నిదర్శనంగా భావించవచ్చు. మేం ప్రచురించిన      ‘ రెండు దశాబ్దాల కథ’ సంకలనం కేవలం సంవత్సర కాలంలోనే రెండు వేల కాపీలు అమ్ముడుపోవడానికీ కారణం అదే.

 • అయితే యీ సంకలనాల్లో మీరు మిస్సయ్యాం అనుకొన్న కథలున్నాయా – అందుకు కారణాలేంటి? మంచి కథ అని భావించి వేసి – విమర్శలు యెదురయ్యాకా వేయకుండా  వుండాల్సింది అనుకొన్న సందర్భాలున్నాయా?

కథ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంలో ఈ సంకలనాల్లో ప్రచురించలేకపోయిన కథలతో ఒక కథా సంకలనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రకటన కూడా ఇచ్చాం. అంటే దానర్థం మేం మిస్ అయిన కథలు ఉన్నాయనే. ఇలా మిస్ కావడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి – తొలి రోజుల్లో కథల లభ్యతలో ఎదుర్కొన్న ఇబ్బంది. మారుమూల ప్రాంతాల నుంచి వెలువడే చిన్నపత్రికల్లో వచ్చిన కథలు మాకు అందుబాటులోకి రానందువల్ల వాటిని చూడలేకపోయాం. ఒక్కోసారి జడ్జిమెంట్ లో జరిగిన లోపాలూ వున్నాయి. అటువంటి లోపాలు పునరావృతం కాకుండా వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం.

ఇకపోతే – మేం ప్రచురించిన 339 కథల్లో ( మూడు కథలకు రచయితల అనుమతి లేనందువల్ల ఈ బృహత్ సంకలనంలో 336 కథలే వున్నాయి) కనీసం ఒక పాతిక కథలైనా ఎన్నిక చెయ్యకుంటే బాగుణ్ణు అని యిప్పుడు అనిపిస్తుంది. కథలన్నీ మళ్ళీ మళ్ళీ చదువుతూ వుండగా ఇప్పుడు కలిగే భావన అది. అయితే అవి ఆ యా సంవత్సరాల్లో వచ్చిన  కథల్లో మంచివే కదా అని సరిపెట్టుకోవచ్చు. ప్రతి సంకలనంలో వున్న కథలన్నీ పాఠకులందరికీ నచ్చాయని అనుకోలేం. మూడు /నాలుగు కథల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటూనే ఉన్నాయి.అందుకే యీ నచ్చడం నచ్చకపోవడం అనేది సంపాదకులకి యెంత subjective గా వుంటుందో పాఠకులకీ అంతే ఉంటుందని అనుకోవాలి కదా!

 • మంచి కథలు మిస్ అవడానికి కారణం మీరు కొన్ని పత్రికలు చూడరనీ వెబ్ పత్రికలు పరిశీలించరనీ ఆరోపణ వుంది….

అది నిజం కాదు. 9౦ లో మొదలు పెట్టినపుడు చక్కటి కథలు ప్రచురిస్తారన్న పేరున్న పత్రికలే గాక అందుబాటులో వున్న పత్రికలన్నీ చూసేవాళ్ళం. వాటిలో అచ్చయిన కథల్ని మాత్రమే తీసుకొన్నాం. అదే 92 నుంచి తొలిసారి సంపుటాల్లో సంకలనాల్లో అచ్చయిన కథలు కూడా స్వీకరించాం( ఉదా. ఏటి పాట – కథా వేదిక ). 2000 సంవత్సరం నుంచే వెబ్ పత్రికల్లో వచ్చిన కథల్ని సైతం చేర్చాం  ( కానుగు పూల వాన – తెలుగు కథ డాట్ కాం). కాబట్టి మేమా విషయంలో స్పష్టంగానే వున్నాం. కొందరికి తెలియక పోవడం వల్ల ఇలాంటి అపోహలు ఏర్పడ్డాయి. 2014సంకలనంలో 14 కథల్లో రెండు కథలు వెబ్ పత్రికలో వచ్చినవే.

 • పాతిక సంకలనాల్లో మీకు బాగా నచ్చిన సంకలనం యేది?

కథ 95 నాకు బాగా నచ్చిన సంకలనం. అందులో వున్నవి పది కథలే అయినా పది కాలాల పాటు నిలబడిపోయే కథలు కనీసం నాలుగైనా వున్నాయి. వస్తు శిల్పాల రీత్యా ఆ నాలుగు యీ పాతికేళ్లలో వచ్చిన ఉత్తమ కథలని నా అభిప్రాయం.

 • కథల్ని సంకలనాల్లోకి తీసుకు వచ్చేటప్పుడు – వాటి ఎంపికలోనే గాక ప్రచురణ విషయంలో యెటువంటి జాగ్రత్తలు పాటిస్తారు? అందుకు యేమైనా మెథడాలజీ రూపొందించుకొన్నారా?

కథ 90 లో చూసినట్లయితే మా పేర్లు సంకలన కర్తలుగా వుంటాయి. 93 నాటికి అది సంపాదకులుగా మారింది. అంటే కథని ఎన్నిక చేయడంతో పాటు వాటిలో కనిపించిన లోపాలను , వాక్య నిర్మాణ దోషాలను , చిన్న చిన్న కథా నిర్మాణ దోషాలను ఆ యా రచయితలకు చెప్పి వారితోనే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఈ పధ్ధతి నిజానికి 91 లోనే మొదలైనా 93 నుంచి మరీ క్షుణ్ణంగా చదివి మార్పులు చేసుకునే వెసులుబాటు వ్యవస్థని రూపొందించుకొన్నాం. అది నేటికీ కొనసాగుతూనే వుంది. అందుకే పత్రికల్లో వచ్చిన కథలకి , అవే కథలు మా సంకలనాల్లో అచ్చైనపుడు – వున్న తేడాలు గమనించవచ్చు. ఇందుకు రచయితలు మాకు పూర్తిగా సహకరించారు. వారు అభ్యంతర పెట్టినపుడు యథాతథంగానే ప్రచురించాం.

katha90

ఇది ఇలా వుండగా పుస్తక ప్రచురణ విషయంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నాం .కొన్ని సంవత్సరాలుగా మేం పొందిన అనుభవం నుంచి నిర్దేశించుకున్న ప్రమాణాలు అవి. అందులో ముఖ్యమైనవి – కథల తేదీలు , పత్రిక వివరాలు నమోదు చేయడం , ప్రతి సంవత్సరం అప్పటి వరకూ వచ్చిన రచయితల అకారాది క్రమ సూచీనీ  , పుస్తక ఆవిష్కరణ వివరాలను పొందుపరచడం. ప్రచురించే కథ సారాన్ని ఒకటి రెండు వాక్యాల్లో పరిచయం చేయడం కూడా అందులో భాగమే. రచయితల పరిచయాలివ్వడంలో కూడా ఒక పద్ధతిని పాటిస్తున్నాం.  రచయితల ఫోటోతో బాటు వారి పుట్టిన తేదీ , అచ్చైన తొలి కథ వివరాలు ,  కథా సంపుటుల పేర్లు రికార్డు చేస్తున్నాం. 2600 పేజీల ఈ బృహత్ సంకలనంలో కూడా 336 కథలకూ 155 మంది రచయితలకూ అకారాది క్రమ సూచిని పేజి నంబర్లతో సహా పొందుపరిచాం. నిర్దిష్ట  ప్రమాణాలకు లోబడి మాకు మేం గా రూపొందిచుకొన్న style manual ప్రకారమే కథల్ని అచ్చు వేస్తున్నాం. అందులో విరామ చిహ్నాలు కామాలూ ఫుల్ స్టాప్ లూ కొటేషన్లూ మొ. విషయాల్లో ఒక పధ్ధతి పాటిస్తున్నాం. తెలుగు పుస్తక ప్రచురణలో ఒక ప్రామాణికమైన పధ్ధతి ఆవిష్కరింపబడాలని మా కోరిక.

 • ఇంత అందంగా ముద్రిస్తూ తక్కువ ధరకి పుస్తకాలను యెలా అందించగలుగుతున్నారు?

కథ 90 ప్రచురించినపుడు దాదాపు 160 పేజీల పుస్తకాన్ని ఆ రోజుల్లో 17 రూపాయిలకే యిచ్చాం. నిజానికి ఆ రోజుల లెక్క ప్రకారం దాని రేటు 30 వుండాలి. ఆ పుస్తకంలో మాకు 3 వేల నష్టం వచ్చింది. అది మేమే భరించాం. ఆ తర్వాత తక్కువ రేటు వల్ల వచ్చే నష్టాన్ని భరించడానికి కొందరు మిత్రులు , కథా ప్రేమికులు ముందుకు వచ్చారు. 1999 నుంచి అమెరికాలోని ‘తానా’ (TANA) ప్రచురణల కమిటీ చైర్ పర్సన్ జంపాల చౌదరి చొరవ వల్ల ఈ సంకలనాల ప్రచురణలో కొంత ఆర్ధిక భారాన్ని మోయడానికి ‘తానా’ పూనుకొంది. అందువల్ల దాదాపు 200 పేజీలుండే ప్రతి పుస్తకాన్నీ ఈ నాటి వరకూ గరిష్టం 65 రూపాయిలకే ఇవ్వగలుగుతున్నాం.

మేం మా సంకలనాల్ని  అనేక నగరాల్లో పట్టణాల్లో ఆవిష్కరించడం వల్ల ఆ ప్రాంత పాఠకులకు పుస్తకాల గురించి తెలియడమే గాక అవి అందుబాటులోకి కూడా వచ్చాయి. అందువల్ల పాఠకులు వాటికోసం ఎదురు చూడటం , నెమ్మదిగా వెయ్యి నుంచి రెండున్నర వేల ప్రతుల వరకూ అమ్ముడు పోవడం జరిగింది. మొన్నటికి మొన్న తెనాలిలో కథ 2014 ఆవిష్కరణ జరిగినపుడు ఆ ఒక్క రోజే 450 కాపీలు అమ్ముడుపోవడం ఈ సిరీస్ సాధించిన విజయంగా భావిస్తాను.

‘మనసు ఫౌండేషన్’ వారు కూడా పుస్తకాలను పాఠకులకు తక్కువ ధరకే అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి కేవలం 750రూ. లకే ఈ 2600 పేజీల పెద్ద  సంకలనం స్టాండ్స్ లోకి వస్తుంది. దీన్ని కూడా మా పాఠకులు ఆదరిస్తారనే కథాసాహితి నమ్మకం.

 • ‘కథాసాహితి’ భవిష్యత్ ప్రణాళికలు యేమిటి?

పైన చెప్పినట్టుగా యీ సంవత్సరం నుంచీ ప్రతి సంకలనానికి సంపాదకుల మార్పు చేయదల్చుకొన్నాం. ఒక్కొక కథా సంకలనం మీదా పాతిక సమగ్ర సమీక్షా వ్యాసాలు రాయించి ఒక పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వుంది. అది  ఆ యా కాలాల్లో తెలుగు కథ , తెలుగు సమాజం ప్రయాణం చేసిన తీరు తెన్నుల్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని నమ్మకం. ఇది గాక – గతంలోనే రెండు సార్లు ఎంపిక చేసిన కథల అనువాదాలతో ఆంగ్లంలో పుస్తకం తేవాలని విఫల ప్రయత్నం చేశాం. అది ముందు ముందు సఫలం కావాలని ఆశిస్తున్నాం.

 • కథకోసం ప్రత్యేక పత్రిక తేవాలనే ఆలోచన యేమైనా వుందా?

ప్రస్తుతానికైతే లేదు.

 • ఈ సంకలనాలు కొత్త కథకులు తయారుకావడానికి స్ఫూర్తినిచ్చాయా?

కొత్త కథకులు తయారు కాక పోవచ్చు గానీ కొత్తగా రాస్తున్న కథా రచయితలకు ఇవి తప్పనిసరిగా తోడ్పడ్డాయి. కొత్త తరం రచయితలు తమ కథలు యీ సంకలనాల్లో రావాలని భావించడం , దానికోసం పాత తరం రచయితలతో పోటీ పడడం ఒక రకంగా మంచి పరిణామమే కదా!

 • తెలుగులో ఆధునిక సాహిత్యభాషలో వచ్చిన మార్పుని , వికాసాన్ని పరిశీలించడానికి యీ సంకలనాల అధ్యయనం ఉపయోగపడుతుందని భావిస్తారా?

తెలుగు భాషా వికాసంలో మాండలికాల పాత్ర ప్రముఖమైనది. భిన్న మాండలికాల్లో కథలు రాయడం 80 ల్లో ఊపందుకొని 90 ల నాటికి స్థిరపడింది. అన్ని ప్రాంతాల వాళ్ళూ ఇతర మాండలికాల్లోని కథలు చదవడం అలవాటు చేసుకోవడమే గాక వాటిని ఆస్వాదించడం కూడా జరిగింది. ఈ క్రమంలో 90 నుంచీ మొదలైన మా సంకలనాల పరంపర భిన్న ప్రాంతాల వర్గాల మాండలిక కథలకు వేదికయ్యింది. ఉదా. ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేదా’ కథలో నడిపిన మాండలికం యెంత క్లిష్టమైనదైనా యితర ప్రాంతాల వారికి యే మాత్రం అలవాటు లేనిదైనా ఆ కథని అన్ని ప్రాంతాల వారూ వర్గాల వారూ మళ్ళీ మళ్ళీ చదివినా ఆస్వాదించగలిగారు. అలాగే ఇటీవలి కాలంలో ‘పాంచలమ్మ పాట’ వంటి అచ్చ తెలుగులో వస్తున్న కథలు కూడా భాష విషయంలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ప్రజలో నోళ్ళలో నలిగిణ పదజాలం కథా సాహిత్యంలోకి వచ్చి చేరడం తెలుగు భాషకు అదనపు చేర్పు అవుతుంది. ఈ రంగంలో తెలుగు భాషలో జరిగినంత కృషి ఇతర భాషల్లో జరగలేదనుకొంటున్నాను. ఆ కృషి కి ‘కథాసాహితి’ నెలవయ్యింది. అందుకు సంతోషం .

 • ఈ పాతికేళ్లలో కథ సాధించిన విస్తృతి కథా విమర్శలో కనపడుతుందా?

నిస్సందేహంగా కనపడదు. నిజానికి తెలుగులో సాహిత్య విమర్శ దాదాపు మృగ్యమై పోయినట్లే లెక్క. అది సమీక్షల వరకే పరిమితమై వుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య లా సాహిత్య విమర్శనీ కథా విమర్శనీ ఒక బాధ్యతలా స్వీకరించిన విమర్శకులు దాదాపుగా లేరు. విమర్శ అంటే అదేదో తిట్టులా మారిందే తప్ప ‘క్రిటికల్ అనాలిసిస్’ అనే విస్తృతమైన అర్థం తెలుగులో లేకుండా పోయింది. అందుకు విమర్శ లేకపోవడం ఒక కారణమైతే విమర్శను సహించలేని తెలుగు రచయితల ధోరణి మరో కారణం. నిజానికి మంచి విమర్శ మంచి కథా వాతావరణానికి దోహదం చేస్తుంది. రచయిత ఎదుగుదలకీ పరిణతికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని  విమర్శకులూ రచయితలూ లోతుగా ఆలోచించడం తెలుగు సాహిత్యానికి నేటి తక్షణ అవసరం. కథలో వచ్చిన విస్తృతి విమర్శలో రాలేదని భావించడం తప్పు కాదు.

 • 25 సంకలనాలకి సంపాదకులుగా శివశంకర్ , మీరూ రాసిన ముందుమాటలూ , అప్పుడప్పుడూ రాయించిన వ్యాసాలూ, సంకలనాలపై వచ్చిన స్పందనలూ , సమీక్షలూ – తెలుగు కథ ఉన్నతికి గానీ కథా విమర్శ అభివృద్ధికి గానీ  సహకరించాయా?

సంపాదకులుగా మేం రాసిన ముందు మాటలు అటుంచితే – వల్లంపాటి వెంకట సుబ్బయ్య  , కాత్యాయినీ విద్మహే , రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి , కె శ్రీనివాస్ వంటి వారు రాసిన యితర వ్యాసాలవల్ల కొంత మేరకు ఉపయోగం జరిగినా వాటికి కొనసాగింపుగా మా సంకలనాల బయట జరగాల్సిన చర్చ జరగలేదు. అందువల్ల మేం రాసిన ముందు మాటల్లో మేం లేవనెత్తిన అంశాల  మీద ఆశించినంత స్పందన రాలేదు. వీటన్నిటి మీదా అర్థవంతమైన చర్చ జరిగి వుంటే అది తెలుగు కథ ఉన్నతికి ఏదో ఒక రూపంలో దోహదం చేసేది.

ఈ పరిస్థితిని అధిగమించి విమర్శకులు , పత్రికలు కథని పట్టించుకొని కథా ప్రయోజనానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం.

 

 • థాంక్యూ నవీన్ ! ఆదివారం పుస్తకావిష్కరణ సభలో కలుద్దాం.  

సామాన్యుడే నా సిటీ, నా పీపుల్, నా స్టడీ: రమేష్

 

 

అవును. ఈ ప్రపంచాన్ని సన్నిహితంగా దర్శించడానికి ఒక కన్నుచాలు.

లేదా ఒక సామాన్యుడి జీవన సాఫల్యాన్ని గమనించినా ఈ ప్రపంచ రీతి అర్థమగును.
ఛాయ మిత్రులు జనవరి మూడో తేదీన ఏర్పాటు చేస్తున్న “నేను వదులుకున్న పాఠాలు” కార్యక్రమం సందర్భంగా కందుకూరి రమేష్ బాబుతో  మోహన్ బాబు, అనిల్ బత్తుల ముఖాముఖి
ఇంట్రో…
కందుకూరి రమేష్ బాబు  కేవలం ఒక రచయిత అనుకుంటే  అతని  ఇంకా  అనేక  సగాలు  ఫక్కున  నవ్వుతాయి. పోనీ, కేవలం  ఫోటోగ్రాఫర్  అనుకుంటే  అసలు అతన్ని  గురించి మనకేమీ తెలియదనే! తనకి  తానే  ఒక  అందమైన  వలయం రమేష్. ఈ  వలయంలో  రమేష్  అనేక  పాత్రలుగా కనిపిస్తాడు, గిర్రు  గిర్రున తిరుగుతూ- చాలా సార్లు అతనొక  అబ్బురం! భిన్న అభిరుచుల  సంబురం!   
పాఠకులకు తెలుసు, ‘దృశ్యాదృశ్యం’తో కందుకూరి రమేష్ బాబు సంభాషించే విధానం. అలాగే ‘సామాన్యశాస్తం’ పేరుతో రమేష్  రచించిన పుస్తకాలూ చాలామందికి తెలుసు. తొలి పుస్తకం ‘కోళ్ల మంగారం మరికొందరు’. మలి పుస్తకం ‘గణితం అతడి వేళ్ల మీది సంగీతం’. ఆ ఒరవడిలో  పన్నెండు పుస్తకాలు రచించి ప్రచురించాడు. ఇటీవలే మొన్నటి బుక్ ఫేర్ లో ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం విడుదల చేశాడు. ‘శిఖరాలుగా ఎదగడం కాదు, మైదానాలుగా విస్తరించడం ఇందులోని ఇతివృత్తం’ అంటాడు. అయితే, తాను ఐదేళ్ల తర్వాత ఈ పుస్తకం తెచ్చాడుగానీ, ఇటీవలి కాలంలో సోషల్ మీడియంలో తాను ఫొటోగ్రాఫర్ గానూ సుపరిచితుడు. మరి ఆ రచయిత, ఫొటోగ్రాఫర్ తో ఈ ఆదివారం సాయంత్రం ‘ఛాయ’ తన ఎనిమిదవ నెలవారీ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో తన ప్రసంగాంశం’ నేను వదులుకున్న పాఠాలు.’  ఈ సందర్భంగా ఈ ముఖాముఖి సారంగకు పాఠకులకు ప్రత్యేకం.
 రచన, ఫొటొగ్రఫి, జర్నలిజం – మిమ్మల్ని వీటి వైపు నడిపించిన నేపధ్యం ఏమిటి? కళల వైపు పడిన మొదటి అడుగుల గురించి చెప్పండి?
 
– స్కూల్లో నేవూరి రాజిరెడ్డి సార్ “బళ్లున తెల్లారింది…పిల్లల్లారా లేవండి” అన్న మాట కవిత్వం అని నాకప్పుడు తెలియదు. శ్రీనివాసా చారి సార్ తెలుగు పాఠాలు చెబుతూ, మధ్యలో “నిన్నటిదాకా శిలనైనా’ అన్న పాట పాడుతున్నప్పుడు కూడా నాకు తెలియదు, అది సాహిత్యం అని. ఎం.ఎ. చదివే రోజుల్లో కూడా నాకు మిల్టన్ గుడ్డివాడనే తెలుసుగానీ, ప్యారడైజ్ లాస్ట్ రాసినవాడే మళ్లీ ప్యారడైజ్ రిగేయిన్డ్ కూడా రాసిన చూపున్నవాడని తెలియదు. ఇదంతా సాహిత్యం అని అంతగా తెలియదు. శిష్టా లక్ష్మీనారాయణ అన్న మా ఫ్రొఫెసర్ ‘మెగలో మానియా’ గురించి చెప్పేవాడు. డాక్టర్ ఫాస్టస్ గురించి వివరించేవాడు. ఆయన చెబుతుంటే ఊగిపోయేవాడు. కానీ, తర్వాత తెలిసింది, ఇతడు చెబుతున్నది మార్లో సాహిత్యం గురించే తప్ప ఇతడు స్వయంగా సాహిత్యం కాదని. అట్లా కవులు, కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లు…నాకు జీవితంలో ఎంతోమంది ఎదురయ్యారు. లేదా నేనే ఎదురెళ్లాను వాళ్లకు. కానీ, వాళ్లు మామూలు మనుషులు. మరొకరి అసామాన్యతో వీళ్లు మాన్యులుగా కనిపించేవారే తప్ప వాళ్లు వాళ్లు కానేకాదు.  కొందరు నిజంగా తామే సాహిత్యం అని భ్రమించేవారు ఉన్నారు. తామే ఫొటోగ్రఫీ అని గర్వించేవాళ్లూ ఉన్నారు. వీళ్లను, వాళ్ల వివిధాలనూ చూస్తుంటే రచన, ఫొటోగ్రఫి వైపు నేను నిదానంగా వేసిన అడుగులు సాహిత్యం వైపు కాదు, నిజ జీవితం వైపనిపిస్తోంది. సాహిత్యం పేరుతో చెలామణి అయ్యే మనుషుల్లోని డొల్లతనం నుంచి తప్పించుకుని అమిత శ్రద్ధతో నేను సహజ  మానవులను కలిశానని! తమ పాట తాము పాడుకునే చిల్లర దేవుళ్లను పూజించడం నేర్చుకున్నానని! అందులో భాగంగానే నేను ఫిక్షన్ కాకుండా  నాన్  ఫిక్షన్ రచయితగా మిగిలి బతికి పోయాను. లేకపోతే గొప్ప రచయితనై ఇప్పటికే మరణించేవాడిని. కళల వైపు నడవకుండా జీవకళ దగ్గరే ఆగి, అదే సత్యం, శివం, సుందరం అని నమ్మి, మామూలు ఫొటోగ్రాఫర్ ని అయ్యాను గానీ  లేకపోతే మహా గొప్ప ఫొటోగ్రాఫర్ ని అయి, నా చుట్టుముట్టున్నవాళ్లలో ఒకడినై విర్రవీగేవాడిని. ధాంక్స్ టు మై నాన్న, అమ్మా. వాళ్లు నా తులసికోట. భూమండలం అంతా తిరిగి ఇంట్లోనే వెతుక్కున్న సామాన్యతే నా కళకు జీవనాధారం.
నిజం.
ఒక్క మాటలో నేను నడిచింది మనిషి దగ్గరకు. నేనే రచించి చేరింది, వాస్తవికత దగ్గరకు. నేను ప్రతిబింబించింది సహజ జీవన చందస్సును. జీవన వ్యాకరణం చెంతకు.  ఇంతకన్నా ఏమీ లేదు. అయితే నేను సూక్ష్మ దర్శినిని. ప్రపంచాన్ని దర్శించడానికి రెండు కళ్లు అక్కర్లేదని తెలుసుకున్న వ్యూ ఫైండర్ ని. ఇక, మొన్న తెచ్చిన “మీరు సామాన్యులు కావడం ఎలా?” అన్న పుస్తకం వాస్తవిత నుంచి సత్యం వైపు తీసుకొచ్చిన నా తొట్టతొలి పుస్తకం. దీంట్లో నేను జీవితాన్నే కల్పనగా గ్రహించి రచించి సామాన్యత తాలూకు తాత్వికతను విభూతిగా ధరించి జేబులో పెన్నూ, భుజానికి కన్నూతో హాయిగా బతుకుతున్న క్షణాన్ని.
my portriat (1)
మీ బాల్యం గురించి చెప్పండి?
రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్

రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్

ఇప్పటికీ బాల్యంలోనే ఉన్నాను. చిన్నప్పుడు  మమ్మల్ని అన్నం తినకపోతే భయపెట్టడానికి చాకలి తొంట మల్లయ్యను పిలిచేవారు. పెద్ద పెద్ద మీసాలతో కనిపించే ఆయన నా దృష్టిపథంలో ముద్రపడిన మొదటి ఫొటో. తొలి ఛాయ. తర్వాత మళ్లీ అలాంటి ఛాయలను నేను ఎన్నో తీశాను. ఆయన్ని తప్ప. చిత్రమేమిటంటే నేను పేర్లను, వ్యక్తులను చిత్రించను. మనుషులను చిత్రిస్తాను. ఒక రకంగా మానవులను చిత్రిస్తాను. ఒక భయపెట్టే మనిషి నాలో ముద్ర పడ్డాక భయాన్ని ఆ మనుషుల్లో చిత్రిస్తాను. ఆనందపరిచే ఈస్తటిక్స్ ఉంటే ఆ ఆనంద సౌరభాన్ని చిత్రీకరిస్తూ పో్తాను. అందాన్ని, ఆనందాన్ని అభిమానాన్ని, ప్రేమను, వయ్యారాన్ని అన్నింటినీ, నలుపును విస్మరించి తెలుపును చిత్రిస్తూ ఉంటాను. ఒక రకంగా  బ్రైటర్ సైడ్ ను చిత్రీస్తూ ఉంటాను. డెత్ ను కూడా చేస్తాను.  మనిషి శ్వాసించే అంతిమ శ్వాస మృత్యువు. దాన్ని కూడా అందంగా చిత్రిస్తాను. అసలుకు నాకు నెగటివ్ అంటే పాజిటివ్ కు భూమిక అన్న ఎరుక చిన్నప్పటినుంచే ఉంది. ఎందుకంటే మా నాన్న ఫొటోగ్రాఫర్. మా చెల్లెండ్ల పేర్లమీద స్వాతి, జ్యోతి ఫొటో స్టూడియోలు ఉండేవి. ఇల్లే మాకు  చిత్రాలయం. నేను బాలకార్మికుడిని అంటే ద్వేషిస్తాను. బాల కళాకారుడిని. మా ఇల్లే నాకు తొలి స్టూడియో. ప్రపంచం మలి స్టూడియో. నాకు డూమ్స్ సూర్యుడే. నాకు అంబరిల్లాలు ఆకాశం పరుస్తుంది.

ఫొటోలు కడగడం అన్నది నాకు వచ్చు. కెమెకల్ స్వయంగా తయారు చేసుకోవడం తెలిసిన వాడిని. మల్లెసారే మాకు డార్క్ రూమ్. 120, 35ఎం.ఎం. రీళ్లను డెవలప్ చేసి, ప్రింట్లు వేసి డెలివరీ చేసిన దశాబ్దాల అనుభవం మాది. దాంతో నెగటివ్ అంటే నాకు నలపు కాదు, తెలుపు. పాజిటివ్ అంటే తెలపు కాదు, నలుపు. అందువల్లే తెల్ల కాగితంపై నల్ల అక్షరం ఎలాగో లస్టర్, గ్లాసీ పేపర్ పై ఫొటో ప్రింట్ అలాగా. నా దుస్తుల్లోకీ ఆ నలుపు తెలుపులు వచ్చాయంటే అది సహజాతం  ఎప్పుడూ చెప్పలేదుగానీ, నేను కవి, చిత్రకారుడిని కాకముందే ఫొటోగ్రాఫర్ ని. తర్వాత పాత్రికేయ రచయితను. అటు పిమ్మట తిరిగి ఫొటోగ్రాఫర్ ని . తిరిగి తిరిగి జీవితం ఒక్క చోటుకే వస్తుందని సూర్యోదయం చంద్రోదయం తెలిపినట్లు నేను తొలి గురువుల దగ్గరే మళ్లీ వికసించాను. అమ్మా…నాన్న. తర్వాత మిగతా వాళ్లు. అయితే, నేను పని చేయలేదు. ఏదీ భారం కాలేదు నాకు. దీనర్థం  జీవితం పని చేసిందని!. గడిపిన జీవితం వల్ల దుస్తులు మారుతాయి తప్పా కొంటే వచ్చేవి కాదు. అందుకే నేనొక నలుపూ తెలుపూ. అదీ సంగతండీ.
సరే,  ఇక నేను నడవడం అన్నారు. నా దృష్టిలో మనల్ని నడిపించడం అంటూ ఏదీ వుండదు. మనం నడవడమూ వుండదు. నడకలో నడకైతాము. ఒక యూనిట్ విశ్వాన్ని నిర్ణయించదు. ఎవరైనా విశ్వంలో అంశం అవుతాం. నేను సోల్ ఆఫ్ ది యూనివర్స్ అన్న మాట వాడటానికి ఇష్టపడతాను. నాది కళ కూడా కాదు, క్షణం. కళ శాశ్వతమైంది. నేను క్షణభంగురమైన జీవితం గురించి ఆలోచిస్తాను. వాటికి శాశ్వతత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శాశ్వతమైన వాటిని క్షణికం చేసే పనిలో కొందరుంటారు. ఆ పని నాకు రాదు. దైనందినాన్ని శాశ్వతం చేసుకునే సామాన్యుడే నా సిటీ. నా పీపుల్. నా స్టడీ.
తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.

తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.

అయితే, ఒక మాట. రచన, పాత్రికేయం రెండూ ఒకటే. పాత్రికేయం చరిత్రకు చిత్తు ప్రతి అనుకుంటే ఛాయా చిత్రణం అన్నది చరిత్రకు చిత్తరువు. పాత్రికేయం కన్నా రచన గొప్పదనుకునేవారుంటారు. కానీ, అన్ని రచనలూ ఇప్పడు పాత్రికేయంలో్కి ఒదిగిపోయి చాలా ఏళ్లయింది. అయితే మొత్తంగా రచన చరిత్రకు కోరస్. అందులో నువ్వూ నేనూ ఉన్నామనుకుంటాం కానీ, వుండం. అదృశ్యం అయిపోతాం.అందుకే దృశ్యాదృశ్యం రాస్తున్నాను సారంగలో.
మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటాను. ఉన్నది వేరొకటి. అయినా దృశ్యాదృశ్యంగా ఒకరికొకరం దగ్గరవుతూ దూరం అవుతాం. కావాలి కూడా.
 అయితే, ఫొటోగ్రఫి అన్నది కూడా రచనే. కాంతి రచనం.  అంతిమంగా ప్రతిబింబించడం అన్న సార్వజనీన లక్షణం నా ఇతివృత్తం. ఎలా జరిగిందో తెలియదు. కానీ, వీటన్నిటికీ మూలం మా నాన్న.  తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ టీచర్ గా కాకుండా బోధించడం కన్నా తెలియజేయడం, చూపడం, ప్రతిబింబించడం ప్రధానంగా పనిచేయడం వల్ల నాకు ఇంట్లోనే మాస్టర్ లభించాడు. ఆయన అద్భుతమైన ఫొటోగ్రాఫర్. ఎక్కడా కరెక్షన్ లేని మనిషి. ఎక్కడా పింక్, టచింగ్ చేయని మనిషి. యాజ్ ఇట్ ఈజ్ అన్నది తననుంచే నేను అందిపుచ్చుకున్నాను. అందువల్ల రచన, ఛాయా చిత్రలేఖనం నాకు మా ఇంట్లోనే మా నాన్న దగ్గర మా సొంత ఫొటో స్టూడియోల్లోంచే రూపొందిందని, నేను ఇంట గెలవడం అన్నది జరిగాకే బయట ఓడిపోవడం జరుగుతూ ఉందనీ అర్థం అవుతూ ఉన్నది నాలో నాకు.  అవును మరి. గ్రహించింది బయట ప్రాక్టీస్ చేయకపోవడం ఓటమి. నేను వదులుకున్న పాఠాలూ అన్నది కూడా ఇందుకే. బయట విజయాలు వదులుకుంటూ చిన్నప్పటినుంచీ సాధన చేసింది మళ్లీ ఒంటబట్టించుకుంటూ విస్తరిస్తున్నాను. ఆ మేరకు నేను నెగటివ్. పాజిటివ్ అర్థంలో. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలంగాణలో పెరగడం అన్నా అంతే కదా. ఇంటికి రావడం. మళ్లీ వికసించడం.
 సామాన్యశాస్త్రం పేరుతో మీరు చేస్తున్నరచనల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? వీటిని రాయడానికి ప్రేరేపించిన అంశాలేమిటి?
 
– ‘ఈ జగత్తులో బతికిన మనుషులందరిపై ఒక లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయ వ్యాసం తప్పక ఉండాలి’ అన్న మాట ఒకానొక రోజు తట్టింది నాకు. పని మొదలు పెట్టాను. పరిచయ పత్రాలు రాశాను. విస్తరించి నవలల వంటివీ రాశాను. పన్నెండు పుస్తకాలు తెచ్చాను. ఇందులో ఉద్దేశ్యం ఏమీ లేదు. విరుద్దేశమే. ఏ ఉద్దేశంతో మిగతా వారు రాశారో అందులో సామాన్యుడు మిస్ అయ్యాడు. దరిద్రుడిగా, అభాగ్యుడిగా, అధో జగత్ సహోదరుడిగా కనిపించాడేగానీ సృజనశీలుడిగా, భాగ్యవంతుడిగా జవజీవాలతో సెలబ్రేట్ కాలేదు. జీవితం సమరంగా భావించి వచ్చిన రచనలేగానీ జీవితం సంబురంగా ఉందన్న మాట చెప్పిన సామాన్య రచయితలు లేకుండా పోయారు. అప్పుడనిపించింది. ఇది నా పని అని!
పిచ్చి పట్టినట్టు చేశాను ఓ పదేళ్లు. తర్వాత తెలంగాణ. అందులో బాధ్యత ఎరిగిన యువకుడిగా పనిచేశాను. బావుంది. ఇప్పుడు వ్యక్తమవుతున్నాను. సామాన్యంగా.
అయితే, పెద్దలను కలవడం మానేశాను మెలమెల్లగా. నేను నిర్వ్యాపారంగా  కనిపించే జీవన వ్యాపారానికి దగ్గరగా జీవించడం మొదలెట్టాను. సామాన్యావతారం ఈ యుగం లక్షణం అని ముందే గ్రహించి నిశ్శబ్దంగా నా పని చేసుకుంటూ వెళ్లడం ప్రారంభించాను.  ఈ యుగం శ్రీశ్రీ ది కాదు. సామాన్యుడిదని ఏ విప్లవాన్ని గ్రహించినా తేలిగ్గా అర్థమౌతుంది.
నాకూ అర్థమైంది. విప్లవించే శక్తులైనా, క్యాపిటల్  శక్తులైనా పిడికెడు. వీళ్లు నాయకత్వపు లౌల్యానికి గురైతుండగా సునాయాసంగా విప్లవాన్ని చేసే శక్తి సామాన్యులకు ఉంది. వారిని చైతన్యం చేయబూనడం కరక్టు కాదు. వారి చైతన్యానికి స్పందించే లక్షణం ప్రకృతికి ఉంది. ఆ పని జరిగిపోతూనే ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సాధన. అందరూ సామాన్యులై సకల జనులూ సాదించలేదా?సాధించాక ఎలా జరిగిందో అని వారే మళ్లీ  ముక్కుమీద వేలు వేసుకోలేదా? అది ఒక పాట వంటి సామాన్యత సాధించిన విశేషం. లాలిపాట వంటి తల్లి మహత్యం.
 ఇంతకీ  సామాన్యుడంటే మీ దృష్టిలో ఎవరు? 
– ఎవరైతే తనను తాను ప్రదర్శనకు పెట్టుకోడో అతడు. మరెవరైతే అజ్ఞాతంగా కాదు, అదృశ్యంగా ఉంటాడో వాడు. వాడు. ఆ వాడు ఏకవచనం. తాను మట్టిలో పరిమళం. గాలిలో స్పర్శ. నీటిలో రుచి. ఆకాశంలో శబ్దం. నిప్పులో ఆకలి. పంచభూతం. తాను సర్యాంతర్యామి. అడవిలో ఉంటాడు. మైదానంలో ఉంటాడు. రాజు వాడే, పేద వాడే. వర్గం కాదు. వర్ణం కాదు, లింగం కాదు. మనిషి. సామాన్యుడు. అసాధన తన తత్వం. అర్థం కావాలంటే ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ చదవండి.
హక్కుల గురించి మాట్లాడేవాడు కాదు, బాధ్యత గురించి మాట్లాడేవాడు సామాన్యుడు.
 మీరు సామాన్యులు కావడం ఎలా? అన్న తాజా పుస్తకంలో మీరేం చెప్పారు?
–  నిజానికి చెప్పలేదు. చూపాను. గుర్తు చేశాను. మీ జీవితాలు మీరు గడపడం ఎప్పుడు ప్రారంభిస్తారో ఆలోచించుకోమని మననం చేశాను.  మీరు గాయకులు కావడమో లేదా శ్రోత కావడమో కాదు, మీరు స్వయంగా పాట అన్న విషయాన్ని గుర్తు చేశాను. ఆ గుర్తు చేయడం అన్నది సామాన్యంగా చేయలేదు. ఒక పాటను కంపోజ్ చేసినట్లు చేశాను. హృదయం ఉన్న వాళ్లకు నా పుస్తకం ఒక గీతాంజలి. బుద్దిగల వాళ్లకు ఫౌంటెన్ హెడ్. విప్లవశక్తులకు కమ్యూనిస్టు  మ్యానిఫెస్టో. దళిత బహుజనులకు అంబేద్కర్ పూలే. ఇవేవీ చదవని వాళ్లకు సామాన్యశాస్త్రం.
 సామాన్యులను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని శ్వాసించిన నేపథ్యంలో మీరేదైనా నవల రాస్తే బాగుంటుందేమో కదా?
– నాకు వేరే ఉద్దేశ్యాలున్నాయి. వార్తలు, సంఘటనలు, విశేషాలు, విశ్లేషణలు, చరిత్రాక ఘట్టాలపై నాకు ఆసక్తి లేదు. అందులో నేనుంటాను. కానీ, నేను చరిత్రను రచించను. ఆ దరిదాపుల్లోకి వెళ్లను. ఎందుకంటే, నాకు పండు కన్నా రసం ఇష్టం. అది బాగుందని చెప్పడం కన్నా ఆరగించి ఆస్వాదించడం ఇష్టం. నేను సామాన్యుడిని.
ఒక సామాన్య రచయితగా,  ఏది చదివితే ఇక మరొకటి చదవనక్కర్లేదో అది చెప్పడానికి నేను యోచిస్తుంటాను. సూక్ష్మంలో మోక్షం లభించే అంశాల గురించి ఆలోచిస్తాను. నా రచన చదివితే మీరు దూరపు కొండల నునుపు కాలికింది కంకరలో కనపడేలా చేస్తాను. దైనందినంలో ఎంత వైశాల్యముందో, లౌకికంలో ఎంత అలౌకికం ఉందో తెలియజెబుతాను. అంతేగానీ, వర్తమానాన్ని చూపడానికో గతాన్ని గుర్తు చేయడానికో, భవిష్యత్తును తీర్చిదిద్దడానికో కాదు. కాలం గురించిన స్పహ లేకుండానే కాలం చేసే మనిషిలా నా రచన సర్వసామాన్యంగా ఉండాలని ఎవరి దిష్టీ తాకకూడదని భావిస్తాను. అందుకే నా పన్నెండు పుస్తకాలూ సామాన్యులకు తప్పా ప్రసిద్దులకు చేర్చలేదు. పద్దెనిమిదేళ్ల ప్రయాణంలో ఒక పుష్కర కాలం శ్రద్దతో కూడిన సామాన్యశాస్త్రం వ్యాసంగానంతరం ఒకడొచ్చాడు. నీ పుస్తకం నేను వేస్తాను అని వచ్చాడు. వాడు క్రాంతి. అతడికి తెలిసింది, ఇది ఇవ్వాళ్టి పుస్తకం అని. అవసరం అని. ఇచ్చాను. ఇక ముందు నేను ఎక్కువ రాయాల్సిన పనిలేదు. రాసిందంతా బయటకు వస్తే చాలు. నిజం.
అయితే, నవల. అవును, కల్పనాత్మక నవల. దానికన్నా జీవితం కల్పనగా కానవచ్చే మానవ ఇతిహాసం నాకిష్టం.  ‘మీరు సామాన్యులు కావడం ఎలా? ‘ చదివారా? మూడుసార్లు చదవాలని మిత్రులు చెప్పారు. మూడు సార్లయినా కంట తడిపెట్టించిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆ పుస్తకం వందలాది మంది చేతుల్లోకి వెళ్లింది. రాత్రుల్లు వారు మేలుకుని జీవితంలోకి తొంగి చూస్తున్నారు. మెసేజ్ లుకాదు, మనుషులు వచ్చి కలుస్తున్నారు, సామాన్యంగా.
ఇలా రచనలైతే, నా ప్రయాణంలో బతికిన క్షణాలను నిక్షిప్తం చేయడం నా ఛాయా చిత్రణం. అదీ కల్పనే. నమ్మలేని గ్రామీణ జీవన జానపద ఔపోసనం నా ఛాయలు. సిటీలోనే తీస్తారా అని అడుగుతారు. తీస్తాను. ఇదంతా తెలంగాణ కాదా? నేనెక్కడికైనా పోయానా? ఇదంతా నవల కాదా? కొత్తగా లేదా? చూస్తుంటే ఎన్ని జ్ఞాపకాలు గిర్రున తిరగడం లేదు?
మీరు సంప్రదాయ ప్రశ్నలు మానేయాలి. సమాధానాలు పురాతనంగా ఉంటాయి. ఒక మనోఫలకంపై ముద్రించిన ఛాయలా. నా ఛాయలు అవే. అందుకే ఒప్పుకున్నాను, ఛాయ నిర్వహించే సమావేశం నా జీవనఛాయలపై అంతే!
ramesh2
అయినా చెబుతాను. మరో మాటా పంచుకుంటాను. నిజానికి ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోని అంశం తెలంగాణ ఇరుసుగా జనించిందే. తెలంగాణ సమాజం అప్ వార్డ్ మొబిలిటీతో ఆక్రమిత దోపిడీకి గురై విలవిల్లాడి బయటపడ్డాకే ఈ బుక్కు వచ్చింది. ఒక రకంగా తెలంగాణ  సామాన్యతకు దగ్గరైనందువల్లే ఒక రాష్ట్రంగా ఏర్పడింది.  సకల జనుల కూడిక అంటే అదే. సాధారణాంశాలు, ప్రత్యేకాంశాలు ఒక ఈక్వలిబ్రియం లా ఒక్కచోటకు చేరడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అటు తర్వాత సాధారణత్వాన్ని, ప్రత్యేకాంశాలను ఈ స్థానిక జీవలాక్షాణికతతో వికసింపజేసుకోవాలి. ఆ పని పక్కకుపోతున్నదన్న భావంతోనే నేను ‘మీరు  సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. పొలిటికల్ సెన్స్ ఉన్న వారికి ఈ సంగతి తెలుస్తుంది. తెలియని వారికి నా పుస్తకం విజయానికి ఐదు మెట్లు వంటి పుస్తకాలకు భిన్నమైందని చదువుతారు. ఎలా అయినా నా ప్రయోజనం నెరవేరుతుంది. ఒక నావల్ ఎలిమెంట్ తో రాసిన పుస్తకం అది. విన్నవాళ్లకు విన్నంత పాట అది!
 ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్నది ఒక విత్తనమే.  వృక్షాన్ని విత్తాను, పుటల్లో. పుష్పాల్లోని సౌరభాన్ని అద్దాను అత్తరుగా. మై సిటీ మై పీపుల్ కూడా అంతే. అది మీ ముఖ పత్రం. ఫేస్ బుక్. పుటలు పుటలుగా మీరు వదులుకున్న బతికిన క్షణాలను నేను పరుస్తూ పోతాను, ఛాయలుగా, చిత్రాలుగా. అందుకే అవన్నీ నా ఫొటోలు కాదు. నేనూ ఫొటోగ్రాఫర్ నీ కాదు. అవన్నీ మీవైన జీవితాల్ని మీరు తీయలేనప్పటి ఫొటోగ్రాఫర్లు. మీవైన రచనల్ని మీరు చదవనప్పటి రైటర్లు.
అన్నట్టు, రచనల నుంచి మీ దృష్టి ఫొటోగ్రఫీ వైపు మళ్లడానికి బలమైన కారణాలే ఏమిటి?
–  నేను వేరేవాళ్ల రచనలు అచ్చువేసే పనిలో ఉన్నాను. ఉద్యోగరీత్యా అమిత శ్రద్దతో ‘బతుకమ్మ’ పత్రికను తీర్చిదిద్దాను. దాదాపు ఐదేళ్లుగా వేరే వాళ్ల రచనలు చదివి, అచ్చువేసే పనిలో నిమగ్నమయ్యాను. నన్ను ఫొటోగ్రఫిలో వుంచుకున్నాను. అదొక కారణం. అలాగే ఇంకో కారణం…అక్షరాస్యులు చాలా వాటిని చదవలేక పోతున్నారు. నిరక్షరాస్యులు చాలామంది అంధులవుతున్నారు. వారిద్దరి కళ్లూ తెరిపించాలని. నాతో సహా వారందరికీ మరింత అందమైన ప్రపంచాన్ని చూపాలని. మరింత విస్తారమైన జీవితాన్ని డైజెస్ట్ చేయించాలని. సూక్ష్మ నాళికలో జనజీవనాన్ని దాచి రాబోయే తరాలకు కానుకగా అందించాలని. ఒక మనిషి రెండు చేతులతో ఈ భూగోళాన్ని ఎత్తడం చాలా సులభం, భుజానికి కెమెరా వేసుకుని! నేను ఎత్తాను. మీకు తెలియదు. ఒక లక్షమంది మనుషులు నాతో సహజీవనం చేస్తున్నారు, మా ఇంట్లో. నా మూడు హార్డ్ డిస్కుల్లో. రేపటి తరానికి నా కానుక ఇది కనుకే ఇంత గట్టిగా సామాన్యంగా మాట్లాడటం. సామాన్యమే మరి.
అన్నింటికీ మించి, మనవల్ల ఈ ప్రపంచానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే అంత మేలు చేయడానికి దేనికైనా వెనుకాడడు సామాన్యుడు. నేనూ సామాన్యుడినే. రచించి, చిత్రించి మిమ్మల్ని సామాన్యులను చేయడానికి నాకేదో వరం లభించినట్లుంది. అందుకే సామాన్యంగా ఉండవలసి వస్తోంది కూడా. అంటే మరేం లేదు. ఇతివృత్తం వదలకుండా అదే పనిలో నిరాటంకంగా ఉండటం.
 రఘురాయ్ తో కలిసి పనిచేయాలని మీకెందుకనిపించింది? 
– సామాన్యుల జీవితాలను అధ్యయనం చేసే సమయంలో నాకు  కొన్ని సమస్యలుండేవి. ఆయన వద్దకు వెళ్లి వాటిని తానెట్లా పరిష్కరించుకుంటారో అర్థం చేసుకున్నాను. ఈ దేశంలోని మనుషులను, స్థలాలను ఆయన దర్శించి చిత్రీకరించినంతగా మరెవరూ చేయలేదు. అంతేగాక సామాన్య మానవుడిని డిగ్నిటీతో చూపారాయన. అందువల్లే ఆయన్ని కలవాలనుకున్నాను, కలిశాను. ఒక రచన చేయాలనుకుని వెళ్లి తిరిగి ఫొటోగ్రాఫర్ ని కూడా అయ్యాను.
 రఘురాయ్ ని కలిశాక మీరొదులుకున్న పాఠాలేమిటి? అంతగా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేమిటి? 
– రఘురాయ్ గారిని కలిశాక నేను సామాన్యశాస్త్రం రచనలు చేయలేదు. ఐదేళ్లుగా నేను పుస్తకం ప్రచురించలేదు. మొన్ననే ఆయన బర్త్ డే మరునాడే అంటే డిసెంబర్ 19 న ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. కారణం ఏమిటంటే, ఆయన నా దృక్పథాన్ని సాపు చేశాడు. నా వైకల్యాన్ని సవరించాడు. ఫొటోగ్రఫి అంటే ఒక కెమెరా పనితనం కాదని చూపించాడు. ఒక వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్ కాకుండా మీరు ఉత్తమ రచయితా, ఫొటోగ్రాఫర్ కాలేమన్న సత్యాన్ని అవగతం చేశాడు. చిత్రమేమిటంటే నేను అదే.అద్భుతాన్ని. కానీ, వేరొకరి జీవితాలను రచించి చూపించడంలో సామాన్యతను కోల్పోయాను. ఆయన్ని కలిశాక అసలు సిసలు సామాన్యుడెవరో తెలిసింది. కార్యక్రమంలో లేనివాడు సామాన్యుడని అవగతం అయింది. నేను కార్యక్రమాలను రద్దు చేసుకున్నాను. జీవించడం, ప్రతిబింబించడం. ఇంతే చేశాను. అందుకోసం నన్ను నేను చేరుకోవడానికి వేయిట్ చేశాను. ఆయన పుస్తకం రచన ఆపి మరీ ఆ పని చేశాను. ఐదేళ్లవుతోంది. ఈ క్రమంలో నన్ను నేను వదులుకున్నాను. ఒక బ్రాండ్ కు లొంగిపోకుండా నిలబడాలీ అనుకున్నాను. నాకు నేను బానిసను కాదల్చుకోలేదు. అన్నిటికన్నా మిన్నఅది ఎంత బాగున్నప్పటికీ వేరే వాళ్ల జీవితాలు గడపడం వదులకున్నాను. దీన్ని విడమర్చిచెప్పవలసి ఉందిగానీ, అది ఆదివారం రోజున ‘నేను వదులుకున్న పాఠాలు’ అన్న అంశంలో కొంచెం విడమరచి చెబుతాను. నిజానికి ఈ అంశాల సారాంశమే మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోనూ చర్చించాను.
రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం

రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం

 రఘురాయ్ తో మీరు పంచుకున్న కొన్ని మధురానుభూతుల్ని చెప్పగలరా? 
– లేదు. అవి చాలా విశిష్టమైనవి. వాటిని రాసి చూపిస్తాను. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భరతమాత ముద్దుబిడ్డ తనను తాను ఎంతగా అంకితమొనర్చి ఈ దేశాన్ని, ఇక్కడి స్థలాలను, మనుషులను పక్కపక్కనే…శతాబ్దాలకు శతాబ్దాలు నివసిస్తున్న  లౌకిక జీవన జన గణనని అపూర్వ పుస్తకంగా రచించి పంచుకుంటాను. అంతదాకా ఆయన్ని నాలో పొదగనీయండి. ఒక అందమైన అనుభవంలో ఉన్నాను. ఐదేళ్లయినా ఆసక్తి పోలేదంటే తప్పకుండా వారి పుస్తకం మీకు అందించడం ఖాయం. అయితే ఒకటి చెబుతాను. ఫొటోగ్రఫి ఈజ్ నాట్ ఫర్ ఆల్ ఫొటోగ్రాఫర్స్ అన్నారాయన. ఇంకో అద్భుతమైన సామాన్యతను చెప్పారాయన. జీవితం నువ్వు ఊహించని ఫలాన్ని ఇస్తుంది. నీకు ఫలానా కావాలనే ఉంటే నువ్వు చాలా మిస్ అవుతావు బాబూ అన్నాడు. నేను రఘురాయ్ పుస్తకం రచించడం నుంచి మెల్లగా తప్పుకున్నాను. అపుడు మీరు సామాన్యులు కావడం ఎలా అన్నపుస్తకం సునాయాసంగా వచ్చి నన్ను సఫలం చేసింది.
మీరు క్యాండిడ్ ఫొటోగ్రఫిని చేస్తుంటారు కదా? ఏదైనా ప్రత్యేక కారణాలున్నాయా?
– నిమగ్నం కావడమే. మనుషులు తమ ప్రకృతిలో తాము లీనం కావడంలో ఉన్న సత్యసంధత మరెక్కడా లేదు. అందుకే నా చిత్రాలు మీ వైపు చూడవు. నావైపూ చూడవు. తమలో తాముంటాయి. గడుపుతాయి జీవితాల్ని. ప్రదర్శించవు. నిజానికి క్యాండిడ్ ఫొటోగ్రఫి చేసేవాడు కూడా వేరేకాదు. వాడు కూడా జీవని. గడిపే మనిషి. వాళ్లను ఫొటో తీస్తూ  వాళ్ల పనిలో తాను పాటైతాడు. వాళ్ల పాటలో తాను బాటైతాడు. అందుకే అతడు తీసేవి చిత్రాలు కావు, రాసేవి రచనలూ కావు, జీవితాలు. నావి జీవితాలు సుమా.
అందుకే మొదలు అన్నాను. నా చిత్రాలు ఫొటోగ్రాఫర్లు. నా రచనలు రైటర్లు అని!
అవి వాళ్లవే. వాటిని చదువుతుంటే ఆయా పాత్రలు, వాటిని చూస్తుంటే ఆయా జీవితాలు మీతో సంభాషిస్తాయి. అందుకే అంటున్నాను. నేను వదులకున్న పాఠం ఏమిటంటే భగవంతుడి సంగతేమో గానీ, ఈ యుగంలో రచయిత మరణించాడు. మిగిలింది సామాన్యుడు. అతడితోటిదే నా వర్షిప్. అతడే నా సరస్వతి.
ఇది సామాన్య యుగం మరి.
 చివగా మరి రెండు ప్రశ్నలు. ఆగస్టులో మీరు నిర్వహించిన  సింగిల్ ఎగ్జిబిట్ ఛాయా చిత్ర ప్రదర్శనకి స్పందన ఎలా వుంది? భవిష్యత్ ప్రణాళికలేమిటి?
– ఫొటోగ్రఫిని జర్నలిజంలోకి తెచ్చి దాన్ని దెబ్బతీస్తున్నాం. నేను ఆ పని మున్ముందు చేయదల్చుకోలేదు. ఒక ఫొటో్గ్రాఫ్ చాలు, ప్రదర్శనకు అని నేను సాహసోపేతంగా ప్రదర్శించి  అభినందనలు అందుకున్నాను. ఒక్క చిత్రంతో సంభాషించగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగాను.
ఒక రచన మాదిరి కాదు ఫొటోగ్రఫి. అది ఒక లిప్త. క్షణ భంగురం. దాంట్లో సృష్టి స్తితి లయ అంతా ఉంటుంది. ఆ ఎరుక ఉన్నవాడికి విశ్వం ఆశీర్వదిస్తుంది. అది దేవాలయంలోని గర్భగుడిలోని దైవం అవుతుంది. ప్రదక్షణలు పూర్తయ్యాక రావలసింది మోకరిల్లడానికే. గర్భగుడిలోకే. నా సింగిల్ ఎగ్జిబిట్ కూడా అలాంటిదే. ఒక దర్శనం. అందుకే అంటాను, చూపు కాదు, దర్శనం వేరని! ఈ ప్రపంచాన్ని దర్శించడానికి ఒక కన్నుచాలని! కెమెరా కన్ను!
ఆ దర్శనం అన్నది దైవమే కానక్కర్లేదు,ఈ కాలానికి.
మనిషి చాలని! తనను తాను ప్రదర్శించుకోని సామాన్యుడే ఆ దైవం. ఇక, భవిష్యత్తు అంటారా? దానికి నాతో ఏం ప్రణాళిక ఉందో మీరే చూస్తారు. చూద్దాం.
కృతజ్ఞతలు.
*

ఎంత స్థానికత వుంటే అంత సార్వజనీనత!

 

కవి నందిని సిద్దారెడ్డి తో  కోడూరి విజయ కుమార్   సంభాషణ

ప్రశ్న:  ఇంత దూరం ప్రయాణించిన తరువాత, సాహిత్య రంగంలో ఇంకా చాలా పనులు చేసి వుండవలసింది అన్న అసంతృప్తి ఏమైనా వుందా ?

జవాబు: ఏ సృజనకారునికైనా తృప్తి అనేది ఉంటుందని అనుకోను. అందుకు సిద్దారెడ్డి కూడా మినహాయింపు కాదు. వాస్తవానికి, కవిత్వానికి సంబంధించినంతవరకూ నాకు లభించిన పేరు విషయంలో కొంత తృప్తి వుంది. అయితే, ఇంకా చాలా వ్రాసి వుండవలసింది అన్న ఒక అసంతృప్తి కూడా వుంది. కథల విషయానికి వొస్తే, నేను వ్రాసిన కొన్ని కథల విషయంలో నవీన్, అల్లం రాజయ్య లాంటి మిత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఆగిపోయాను. అయితే, ఒక్క భావజాలానికే పరిమితం కాకుండా వ్రాయవలసిన కథలు వున్నాయని అనిపిస్తుంది. ఉదాహరణకు, నా హీరో మా నాన్న గురించిన కథలు, అట్లానే నేను పుట్టి పెరిగిన మా ఊరు బందారం గురించిన కథలు కూడా వ్రాయాలని వుంది.  నేను పాటలు వ్రాయగలను. చాలా పాటలు  వ్రాసి వుండవలసింది అన్న ఒక అసంతృప్తి కూడా వుంది. కేవలం ఉద్యమకాలంలో వ్రాసిన పాటలనే కాదు. ఒక ఉదాహరణ చెబుతాను. ‘జై బోలో తెలంగాణ’ సినిమా కోసం శంకర్ ఒక ప్రేమగీతం వ్రాయమని ఒత్తిడి చేసినపుడు ‘నేను ఇప్పుడు లవ్ సాంగ్ వ్రాయడం ఏందని’ చాలా వారించిన. చివరికి ఆ పాట ‘ ఒక పువ్వు – ఒక నవ్వు’ బయటికి వొచ్చింది. చాలా పాపులర్ కూడా అయ్యింది. అప్పుడు అనిపించింది … ‘జీవితం లోని చాలా అనుభూతులను నేను పాటలుగా వ్రాసి వుండవలసింది గదా’ అని. దీనికి కొనసాగింపుగా ఒక సంఘటన కూడా చెబుతాను. ఒకసారి అకినేపల్లి బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి కే సి ఆర్, రమణాచారిలతో పాటు నేను, దేశపతి వెళ్తున్నాము. మాటల మధ్యన ఈ పాట  ప్రస్తావన వొచ్చినపుడు  కే సి ఆర్ అన్నారు -‘ ఒక్క విప్లవ గేయాలకే పరిమితం కావడం వల్ల మిగతావి కోల్పోయిన అన్న బాధ ఏమి లేదానే’  అని. నేను ఏదో చెప్పబోతే ‘లేదే – నువ్వు రాయగలవు’ అన్నడు! ఒక్క కవిత్వం, కథలు, పాటలు అనే కాదు. ఒక నవల వ్రాయాలన్న కోరిక కూడా వున్నది.

ప్రశ్న: ఆధునిక తెలుగు వచన కవిత్వం తెలంగాణ కవులను నిజంగానే చిన్న చూపు చూసిందా ?

జవాబు: అవును. ఆధునిక తెలుగు కవిత్వం తెలంగాణ కవులను చిన్న చూపు చూసింది. అసలు పట్టించుకోవడం అంటే ఏమిటి? కవిత్వ విమర్శా వ్యాసాలలో తెలంగాణ కవులకు కవిత్వానికి తగిన చోటు ఇవ్వడమే కదా! ఆ కోణంలో చూసినపుడు ఆధునిక తెలుగు వచన కవిత్వం తెలంగాణ కవులను చిన్న చూపు చూసింది అన్న మాట నిజమే కదా! ‘చేరాతలు’ లాంటి విమర్శా వ్యాసాలలో తెలంగాణ కవులకు దక్కిన చోటెంత? తెలంగాణ లోని లబ్దప్రతిష్టులైన కవులకు సైతం చేకూరి రామారావు లాంటి విమర్శకులు వ్రాసిన వ్యాసాలలో చోటు దక్కలేదు. ఇక కడియాల రామ్మోహన రాయ్ లాంటి విమర్శకులైతే తెలంగాణ కవుల కవిత్వం గురించి వ్రాయడం మాట అటుంచి, తెలంగాణ ఉద్యమ కవిత్వం పట్ల కనీస సహ్రుదయతని కూడా చూపలేదు. ఇంతెందుకు? దళిత కవిత్వమే తీసుకుందాము. చాలా మంది కోస్తా దళిత కవుల కన్నా ముందుగా సలంద్ర ‘దళిత మ్యానిఫెస్టో’ కవిత వ్రాసాడు. మరి, దళిత కవిత్వం పైన వొచ్చిన వ్యాసాలలో సలంద్ర కు న్యాయంగా ఇవ్వవలసిన స్థానాన్ని యిచ్చారా ?

ప్రశ్న: తెలంగాణ కవిత్వం అంటే తెలంగాణ భాషలో వ్రాసింది మాత్రమే అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు చూసినపుడు తెలంగాణ భాష ఒకే రకంగా లేదు కదా! ఇందులోనూ, పల్లెల భాష – పట్టణ భాషలలో భేదాలు కనిపిస్తాయి కదా!

జవాబు: కేవలం క్రియా వాచకాలకు సంబంధించిన కొన్ని పదాలను వాడి, దానిని తెలంగాణ కవిత్వం అనడం సరికాదు. అదే సమయంలో, ఒక నేలకు సంబంధించిన వేదననూ, దుఃఖాన్నీ కవిత్వం చేస్తున్నపుడు, ఆ నేలకు చెందిన భాష, పదజాలం అనివార్యంగా ఆ కవిత్వంలోకి వొస్తుంది. అట్లా వొస్తేనే ఆ కవిత రక్త మాంసాలతో తొణికిసలాడుతుంది. సార్వజనీన వస్తువు, సార్వజనీన వేదన అంటూ వుండవు. ఉదాహరణకు భారత దేశం మొత్తాన్నీ రిప్రేసెంట్ చేసే రైతు ఉండడు. ఎందుకంటే, కోస్తా రైతు దుఃఖం, తెలంగాణ రైతు దుఃఖం ఒకటి కాదు. తెలంగాణ నేల పైన నిలబడి రైతు దుఃఖం గురించి కవిత్వం చెబుతున్నావంటే, ఆ రైతు తెలంగాణ రైతే ఐ వుండాలి. ఆ కవిత స్థానికతకు ఎంత దగ్గరగా వుంటే అంతగా సార్వజనీనం అవుతుంది.

ప్రశ్న: మీ కవిత్వంలో తొలినుండీ తెలంగాణ భాషకు సంబంధించిన పదాల వాడుక చాలా విరివిగా కనిపిస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా జరిగిందా?

జవాబు: లేదు. నాకు నేను పుట్టి పెరిగిన నేల మీది భాష అన్నా, ఆ మాటలు అన్నా ఒక ప్రేమ.  వ్యామోహం అనడం సమంజసమేమో! అందుకే, ఆ వేదనని కవిత్వం చేసినపుడు ఆ నేటివ్ మాటలు విరివిగా వాడడం వల్ల ఆయా కవితలకు ఒక గొప్ప శక్తి వొస్తుందని నమ్మి వ్రాసేవాడిని. అయితే, ఆ తరువాత అట్లా వాడడం పైన వొచ్చిన విమర్శల పైన కసితో ఆ మాటలని మరింత ఎక్కువగా ఉపయోగించాను.             

ప్రశ్న: తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కవిత్వమంతా ఉద్యమమే ఆక్రమించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ కవిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు మున్ముందు ఏముంటాయని ఊహిస్తున్నారు ?

జవాబు: సృజనకారుడైన కవికి ఉద్యమం అనేది ఒక భాగం మాత్రమే! సృజనకారుడు గడిపే జీవితం, అతని చుట్టూ వున్న వాళ్ళు గడిపే జీవితం అతడి నిరంతన సృజనకు దోహదపడుతాయని అనుకుంటున్నాను. ఉదాహరణకు, తెలంగాణలో ఇంకా సాహిత్య సృజన లోనికి తీసుకుని రావలసిన జీవితం చాలా వుంది. తెలంగాణ ఉద్యమం విషయమే తీసుకుంటే, ప్రజలు ఎన్నో కలలతో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. సహజంగానే రేపటి కాలంలో కవులు, రచయితలు ఈ కలల సాధన గురించిన రచనలు చేస్తారు. ఇవి ఒక్కటే కాదు. తెలంగాణలో చిద్రమౌతున్న మానవ సంబంధాల గురించీ, కనుమరుగవుతోన్న కుల వృత్తుల గురించీ కూడా విరివిగా రచనలు వస్తాయని అనుకుంటున్నాను.

 ప్రశ్న: తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య పునరుజ్జీవనానికి ఎట్లాంటి కార్యక్రమాలు రూపొందించే అవకాశం వుంది? పైరవీలకు తావు లేని నిజమైన ప్రతిభకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లభిస్తుందని ఆశించవచ్చా ?

జవాబు: భారతదేశంలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం. కాబట్టి, పైరవీలకు తావు ఉండదని అనుకోవడం అత్యాశే! కాకపోతే, ఏది ఎట్లా వున్నా తెలంగాణ వాళ్ళకే గుర్తింపు లభిస్తుంది. ఇక తెలంగాణ లో సాహిత్య పునరుజ్జీవనానికి కార్యక్రమాలు అంటావా …. అట్లాంటిది జరగాలంటే, ముందుగా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సాహిత్య వికాసానికే అంకితమై వుండే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర సాహిత్య అకాడెమీ ఏర్పాటు అని చెప్పలేను గానీ, అట్లాంటి ఒక వ్యవస్థ. సమైక్య రాష్ట్రంలో ఒకప్పుడు వున్న రాష్ట్ర సాహిత్య అకాడెమి విషయంలో ఎన్ని ఫిర్యాదులు వున్నా, అది కొన్ని మంచి పనులు చేసింది. చాలా పుస్తకాలు ప్రచురించింది. తెలుగు నిఘంటువు కూడా ప్రచురించింది. ఇంతెందుకు? అప్పుడు రాష్ట్ర సాహిత్య అకాడెమి ఇచ్చే పురస్కారాలకు కూడా ఎంతో కొంత గౌరవం వుండేది. ఇప్పుడు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారాలు ఇస్తున్నా వాటికి అప్పటి గౌరవం వుందా? పైగా, అది విశ్వావిద్యాలయం కావడం వలన, దానికి వున్న సవాలక్ష విధులలో సాహిత్య సేవ అనేది ఒకానొక విధిగా మాత్రమే మిగిలిపోతోంది. సాహిత్యానికి సంబంధించి పురస్కారాలు ఇవ్వడం వరకు మాత్రమే తెలుగు విశ్వవిద్యాలయం పాత్ర కుదించుకు పోయింది. అటువైపు కేరళ సాహిత్య అకాడెమీ, ఇటువైపు కర్ణాటక సాహిత్య అకాడెమీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు, ఆయా భాషలకు, సాహిత్యాలకూ అవి చేస్తోన్న సేవలనీ పరిశీలించినపుడు సాహిత్యానికే అంకితమైన ఒక వ్యవస్థ వుంటే ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో అర్థం అవుతాయి. అట్లాంటి వ్యవస్థ వున్నపుడు, తెలంగాణ సాహిత్యాన్ని ప్రజల చేరువకు, మరీ ముఖ్యంగా యువతీ యువకుల చేరువకు తీసుకు వెళ్ళడం సాధ్యపడుతుంది.

ప్రశ్న: తెలంగాణ పల్లెలు పోలీసు క్యాంపుల్లా మారిన కాలంలో గానీ, మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో గానీ తెలంగాణ దుఃఖం పైన అక్షరం ముక్క కూడా వ్రాయని కవులు, రచయితలు ఇవాళ తెలంగాణ ఏర్పడిన తరువాత ఉన్నత పురస్కారాల కోసం, పదవుల కోసం ఎంపిక కాబడుతున్నారని కొందరు తెలంగాణ వాదుల ఫిర్యాదు. సిద్దారెడ్డి లాంటి కవులు ఎందుకు నోరు విప్పడం లేదని కూడా ఒక ఫిర్యాదు!

జవాబు: తమ రచనలనూ, సృజననూ నమ్ముకోవడం కన్నా ప్రచారం ద్వారా, పైరవీల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకునే కవులు, రచయితలూ అప్పటి రోజుల లోనూ వున్నారు. పెద్ద పురస్కారాల కోసం కవులనూ, రచయితలనూ నామినేట్ చేసే అధికార యంత్రాంగం ఒకటి వుంటుంది. సహజంగానే, ఆ యంత్రాంగం దగ్గరికి తమ సృజనను నమ్ముకుని తమ పని తాము చేసుకు పోయే వాళ్ళు ఎవరూ వెళ్ళరు. సిద్దారెడ్డి ప్రస్తుతం ఆ అధికార యంత్రాగం లో భాగం కాదు. అందువల్ల ఆ పేర్ల ఎంపిక కార్యక్రమం లో సిద్దారెడ్డి భాగం కాదు. ఇక కవి సిద్దారెడ్డిగా అంటావా …. ఇక్కడ మన సాహిత్య లోకంతో ఒక చిక్కు వున్నది. అర్హత లేని వాళ్ళ పేర్లు అత్యున్నత పురస్కారాలకు ప్రతిపాదించబడినపుడు ఏదైనా కామెంట్ చేస్తే, ‘ తన పేరు ప్రతిపాదించలేదు కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నాడు’ అని బద్నాం చేస్తారు. అయితే, ఎంపికలో నా పాత్ర వున్నపుడు అర్హులకు పురస్కారాలు లభించేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను.

ప్రశ్న: మీరు కవిత్వం వ్రాయడం ఆరంభించిన కాలంతో పోల్చుకుని చూసినపుడు, ఇప్పటి కవిత్వ వాతావరణం ఎట్లా వుందని అనిపిస్తోంది?

జవాబు: నిజానికి చాలా మంది ప్రతిభావంతులు కనిపిస్తున్నారు. అయితే, అప్పటి తరం కవులు విపరీతంగా అధ్యయనం చేసేవారు. ఒక మంచి కవితల పుస్తకం పట్టుకుంటే, రోజుల తరబడి దాంట్లో మునిగిపోయి వుండే వాళ్ళు. అట్లాంటి వాతావరణం ఇప్పుడు లోపించినట్లుగా వుంది. అంతేకాదు- ఇదివరకు ఒక కవిత వ్రాసి చర్చకు పెడితే, అందరూ మొహమాటం లేకుండా అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడందరికీ మొహమాటాలు ఎక్కువయ్యాయి. కవులలో డిప్లమసీ ఎక్కువయ్యింది. నొప్పించే మాట ఏదైనా చెబితే ఈ సంబంధం ఏమైనా చెడిపోతుందేమో అన్న బెంగ కనిపిస్తోంది. నేను గమనించిన మరొక అంశం ఏమిటంటే, ఇప్పుడిప్పుడే వ్రాస్తోన్న వాళ్ళు కూడా తమ రచనలను ప్రమోట్ చేసుకోవడం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. సాటి కవులతో, రచయితలతో కలవడం, సంభాషించడం బాగా తగ్గిపోయింది. ఎక్కడైనా కలిసినా పేస్ బుక్ కోసమో, వాట్సాప్ కోసమే ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు.

ప్రశ్న:  పురస్కారాలకు వ్యతిరేకి ఐన సిద్దారెడ్డి ఈ పురస్కారం తీసుకోవడం ….. ?

జవాబు: ఒకట్రెండు సందర్భాలలో ఆయా పురస్కార ప్రదాతలతో నాకున్న ఆత్మీయ అనుబంధం వల్లనే ఒప్పుకున్నాను. ఉదాహరణకు ఈ పురస్కారం ఇస్తోన్న యాకూబ్ వ్యక్తిగతంగా నాకు ఆత్మీయుడు. ఆర్నెళ్ళ కిందటే ‘అన్నా మీరు తప్పకుండా తీసుకోవాలే‘ అన్నడు. ఎట్ల కాదనటం ?

*

గొప్ప కథ దానంతటదే ఊడిపడదు. అదొక మథనం!

 

TV-99 ఛానెల్ ’99-అడ్డా’ కార్యక్రమం కోసం ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ సాటి కథకుడు అనిల్ ఎస్. రాయల్ తో జరిపిన చర్చాగోష్టి పూర్తి పాఠం. ఈ ఇంటర్వ్యూ ప్రచురించటానికి ‘సారంగ’ని అనుమతించిన వేంపల్లె షరీఫ్ కు ధన్యవాదాలు.

జీవితాన్ని కథగా రాయాలంటే అనుభవం కావాలి. మరి సైన్స్ ఫిక్షన్ రాయాలంటే ఏం కావాలి? మాత్రం బోర్ కొట్టకుండా సైన్స్ ఫిక్షన్లో సస్పెన్స్ నింపి రాయటం అనిల్ ఎస్. రాయల్కి వెన్నతో పెట్టిన విద్య.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి? మీరు ఆ తరహా కథలే రాయటానికి కారణమేంటి?

అనిల్: సైన్స్ ఫిక్షన్ అంటే – తేలికపాటి మాటల్లో చెప్పాలంటే – శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, దానికి కాస్త కల్పన జోడించి రాసే కథ.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ రాయటానికి, ఇతర కథలు రాయటానికి తేడా చెప్పండి.

అనిల్: ఇందాక మీరన్నారు – జీవితాన్ని కథగా రాయాలంటే అనుభవం కావాలని. సైన్స్ ఫిక్షన్ రాయాలంటే ఆలోచన కావాలి; ఒక ఐడియా కావాలి. ఎక్కువగా ఆలోచన – ‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది’ అనే ఆలోచన.

షరీఫ్: ఆ ఐడియాకి ఒక లాజిక్ కూడా కావాలా?

అనిల్: కచ్చితంగా కావాలి. ఆ ఐడియాకి ఒక శాస్త్రీయమైన పునాది కూడా కావాలి. అభూత కల్పనలు చేసి ఏదేదో రాసేసి అది సైన్స్ ఫిక్షన్ అనలేం.

షరీఫ్: మీ నేపధ్యం ఏమిటి? ఈ పునాదులు ఎక్కడినుండొచ్చాయి? అసలు సైన్స్ ఫిక్షనే ఎందుకు రాస్తున్నారు?

అనిల్: కంప్యూటర్ సైన్స్‌లో బాచిలర్స్, గణితంలో ఎం.ఫిల్; మొత్తమ్మీద సైన్స్ నేపధ్యం బాగా ఉంది. చరిత్ర అంటే కూడా చాలా ఆసక్తి. నాకు బాగా తెలిసినవి ఇవి. పెద్దగా జీవితం తెలీదు. అందువల్ల కథలు రాయాలనుకున్నప్పుడు సహజంగానే సైన్స్ ఫిక్షన్ ఎంచుకున్నాను.

షరీఫ్: తెలుగులో ఇప్పుడొస్తున్న సాహిత్యాన్ని గమనించినట్లైతే – అస్తిత్వ వాదాలొచ్చేశాయి. అలాగే, తాత్విక దృష్టితో తార్కికమైన అంశాలు తీసుకుని విరివిగా కథలు రాయటం కనిపిస్తూంది. వాటి ప్రభావం లేకుండా నాకంటూ ఓ ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసుకోవాలి, సైన్స్ ఫిక్షన్ అనే దారిలో ప్రయాణం చేయాలి అని ఎందుకనిపించింది?

అనిల్: నా మొదటి కథ ‘నాగరికథ’ రాసినప్పుడు ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసుకోవాలనేమీ అనుకోలేదు. అప్పట్లో ఇలా ఈ సైన్స్ ఫిక్షన్ జెండా పట్టుకుని పరుగెత్తాలనే ఆలోచనే లేదు. ఆ మొదటి కథ రాయటమే అనుకోకుండా జరిగింది. నాకు వర్తమాన కథల్లో వెరైటీ కనబడలేదు. ఇప్పుడు మీరన్నారు కదా – తాత్వికం అంటూ. లిటరరీ ఫిక్షన్ అంటారు దాన్ని. మనస్తత్వాల విశ్లేషణ గూర్చిన కథలు, ఎక్కువగా. అవి తప్పని కాదు. అవి కావాలి. వాటిని గొప్పగా రాసేవాళ్లు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అవి మరీ ఎక్కువైపోయాయి. వీటిలో భావోద్వేగాలకే పెద్దపీట. క్రైమ్, హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, హిస్టారిక్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ …. ఇటువంటివి – అంటే ప్లాట్ డ్రివెన్ కథలు – దాదాపు కనుమరుగైపోయాయి. నాకివి చదవాలని కోరిక. కానీ అవెక్కడా కనబడటం లేదు. నా స్నేహితులతో ఈ ‘బాధ’ వెళ్లబోసుకునేవాడిని (నవ్వు). వాళ్లు “ఎవర్నో అనేబదులు అవేవో నువ్వే రాయొచ్చు కదా,” అన్నారు. నేను రాయగలుగుతానో లేదో తెలీదు. ఐనా, “సరే రాద్దాం పద,” అనుకుని, “ఏం రాయాలి,” అని ఆలోచిస్తే, నాకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్స్ సైన్స్, చరిత్ర – అవి రెండూ కలిపేసి రాసేద్దాం అనిపించింది. అలా ‘నాగరికథ’ రాశాను. ఆ విధంగా మొదలైంది నా ప్రయాణం.

షరీఫ్: మీరు టైమ్ ట్రావెల్ నేపధ్యంలో ఎక్కువ కథలు రాశారు. టైమ్ ట్రావెల్ లేని వాటిలో కూడా ఏదో ఓ రూపంలో కాలం ప్రస్తావన వస్తూంటుంది. కాలంతో ఆ యుద్ధం ఎందుకు మీకు?

అనిల్: అదొక సరదా. కాలంలో వెనక్కి వెళ్లటం సాధ్యమైతే ఎలా ఉంటుందనే ఊహ అద్భుతంగా ఉంటుంది. అది సాధ్యమో కాదో అవతల పెట్టండి. అలా జరిగితే చాలా పారడాక్సెస్ పుట్టుకొస్తాయి. తిరకాసులన్న మాట. ఈ తిరకాసుల్లో చాలా రకాలున్నాయి. వీటిని వాడుకుని కథ రాయటం అనేది నాకో సరదా. అంతే.

షరీఫ్: ఒకవేళ మీకే ఓ టైమ్ మెషీన్ లభించి, మీరు మళ్లీ బాల్యంలోకి వెళ్లగలిగితే ‘ఇలా చెయ్యాలి’ అనే ఆలోచనలేమన్నా ఉన్నాయా? లేదా ఓ యాభై సంవత్సరాలు ముందుకి – భవిష్యత్తులోకి – వెళ్లగలితే ఏం చెయ్యాలి అనుకుంటారు?

అనిల్: అలాంటి ఆలోచనెప్పుడూ చెయ్యలేదు. టైమ్ ట్రావెల్ అనేది నిజంగా జరిగేది కాదని నాకు తెలుసు (నవ్వు). నేనెప్పుడూ వర్తమానంలో బ్రతుకుతాను. జీవితం విషయంలో నాకు పెద్దగా ప్లానింగ్ అంటూ లేదు. కథా రచయితనవటం కూడా కాకతాళీయంగానే జరిగింది. ‘నాగరికథ’ రాసినప్పుడు భవిష్యత్తులో మరికొన్ని కథలు రాస్తాననుకోలేదు. ఏదో పంతానికి పోయి ఆ ఒక్కటి రాశాను. ఆ తర్వాత ఇక చాలు అనుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత చూస్తే మరి కొన్ని కథలున్నాయి నా ఖాతాలో. ఏదో ఆశించటం, దాన్ని సాధించలేదనో, అది దక్కలేదనో బాధ పడటం ఇవన్నీ ఉండవు నాకు. అలాగని నేనేమీ జీవితాన్ని ఆషామాషీగా తీసుకోను. ప్రస్తుతం చేసే పని మీద ఎనలేని శ్రద్ధ పెడతాను – ఫలితంతో సంబంధం లేకుండా. అలా చేస్తే కొన్నిసార్లు అపజయాలు పలకరించినా, ఎక్కువగా విజయమే లభిస్తుందని నమ్ముతాను.

షరీఫ్: అంటే, మీరో ప్రాక్టికల్ మనిషి అంటారు. మరి కథలు మాత్రం ఎందుకలా రాస్తున్నారు? సాధ్యం కాని విషయాలని జనాలకు చెప్పటం వల్ల ఉపయోగం ఏమిటి?

అనిల్: చెప్పాను కదా, అదో సరదా. అయితే, అవన్నీ సాధ్యం కాని అంశాల చుట్టూతానే తిరగవు. టైమ్ ట్రావెల్ అనేది నా కథల్లో ఓ చిన్న అంశం మాత్రమే. అసలు కథ వేరే ఉంటుంది వాటన్నిట్లోనూ. నా ‘రీబూట్’ కథే ఉంది. అందులోనూ టైమ్ ట్రావెల్ ప్రస్తావనుంటుంది. అయితే దానిపై పెద్ద చర్చేమీ ఉండదు. ఈ తిరకాసులూ అవీ ఉండవు. తోకచుక్కలో, గ్రహ శకలాలో వచ్చి గుద్దుకుంటే భూమండలం నాశనమైపోతుందకుంటారు సాధారణంగా. కానీ అసలు ప్రమాదం ఈ భూమ్మీదనే పొంచి ఉంది. అదేంటనేది ఆ కథలో నేను చెప్పిన విషయం. దానికి టైమ్ ట్రావెల్ అనేది కొంచెం వాడుకున్నాను. అంతే తప్ప అందులో టైమ్ ట్రావెల్ అనేది అసలు విషయం కాదు.

anil2

షరీఫ్: కథకి ఓ ప్రయోజనం ఉండాలి అంటారు. మరి సైన్స్ ఫిక్షన్ కథలకి ఎటువంటి ప్రయోజనం ఉంది?

అనిల్: అస్తిత్వవాదాలు తీసుకున్నామనుకోండి. అవి కొన్ని వర్గాలకి పరిమితమవుతాయి. వద్దన్నా వివాదాలు, కొట్లాటలు, ఒకర్నొకరు చీల్చి చెండాడుకోవటాలు …. ఇవన్నీ వచ్చిపడతాయి. సైన్స్ ఫిక్షన్‌తో ఆ సమస్య లేదు. చదివిన వాళ్లు చదువుతారు, లేనివాళ్లు లేదు. అంతేతప్ప అనవసరమైన కొట్లాటలుండవు. అదో ప్రయోజనం (నవ్వు).

షరీఫ్: మీరు రాస్తున్న కథల్లో సామాజిక ప్రయోజనం ఏ మేరకు ఉందని భావిస్తున్నారు?

అనిల్: నా కథల్లో నేను అణగారిన వర్గాల గురించో, మరో వర్గం గురించో మాట్లాడను. అంత మాత్రాన వాటివల్ల సామాజిక ప్రయోజనం లేదనకూడదు. ఉదాహరణకి, ‘నాగరికథ’ చదివి ఓ పిల్లవాడు “ఓహ్. ఇలా కూడా చేయొచ్చా! ఇలా కూడా ఆలోచించొచ్చా!” అనుకోవచ్చు. డార్క్ మ్యాటర్, సింగ్యులారిటీ, సూపర్‌నోవా, క్వాంటం మెకానిక్స్ …. ఇలాంటివన్నీ కథ పరిధిలో వివరిస్తుంటాను నేను. నిన్నటిదాకా ఫిజిక్స్ చాలా బోరింగ్‌గా ఉందనుకున్న పిల్లలు ఇది చదివాక చాలా ఆసక్తికరంగా ఉందనుకోవచ్చు. “ఇదేదో ఆసక్తికరంగా ఉంది. దీని గురించి మరికొంత నేర్చుకుందాం,” అనుకోవచ్చు. సైన్స్ మీద వాళ్లకి ఆసక్తి పెరగొచ్చు. అది కూడా సామాజిక ప్రయోజనమే. నిజానికి, సమాజానికి లిటరరీ ఫిక్షన్ కన్నా సైన్స్ ఫిక్షన్ వల్ల కలిగే ప్రయోజనమే ఎక్కువని నేను భావిస్తాను. ఇవి ఏ ఒక్క వర్గానికో పరిమితమైన కథలు కావు. ప్రపంచం ముందుకు పోవటానికి ప్రధాన కారణం సాంకేతిక ప్రగతి. ఉద్యమాల ద్వారా కన్నా కూడా సాంకేతిక పురోభివృద్ధి ద్వారానే ఎక్కువ సమానత్వం సిద్ధిస్తుంది. మన సమాజంలో ఒకప్పుడు అణచివేయబడ్డ స్త్రీలు ఈ నాడు చాలా రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారంటే దానిక్కారణం సాంకేతికాభివృద్ధి వల్ల పుట్టుకొచ్చిన అపారమైన అవకాశాలే. ఆ విషయంలో స్త్రీవాద ఉద్యమాలు, ఇతర చోదక శక్తుల పాత్ర లేదని కాదు కానీ, అది పరిమితం. ఇది ఇతర వర్గాలకీ వర్తిస్తుంది. అంత ముఖ్యమైన సాంకేతిక పురోగతికి బీజాలు సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఉన్నాయి. ఇంటర్‌నెట్, శాటిలైట్లు, సెల్ ఫోనులు, క్రెడిట్ కార్డులు, అవయవ మార్పిడి, అణు శక్తి – ఇవన్నీ సైన్స్ ఫిక్షన్లో పురుడుపోసుకున్న ఆలోచనలే. వాటి ప్రమేయం, ప్రభావం లేని ప్రపంచాన్ని ఓసారి ఊహించుకోండి, సైన్స్ ఫిక్షన్ ప్రయోజనమేంటో అర్ధమవుతుంది.

షరీఫ్: మీ కథల ప్రేరణతో ఎవరైనా ఓ సైంటిస్ట్‌గా మారాలని కానీ, ఓ వస్తువు కనిపెట్టాలని కానీ అనుకున్న సందర్భం ఉందా? ఎవరైనా అలా ఇన్‌స్పైర్ అయినట్లు తెలుసా?

అనిల్: నేను అంత గొప్ప కథలు రాశానని అనుకోను. సైన్స్ ఫిక్షన్ రచయితల్లో మహామహులున్నారు. వాళ్ల స్థాయి కథలు నేను రాయలేదింకా.

షరీఫ్: ఎన్ని కథలు రాశారు ఇప్పటిదాకా?

అనిల్: పది కథలు. వాటిలో ఒకటి అనువాద కథ. మిగతా తొమ్మిది నా సొంతవి. వాటిలో ఎనిమిది సైన్స్ ఫిక్షన్. మిగిలిన ఒక్కటీ సైన్స్ ఫిక్షన్ కాదు.

షరీఫ్: ఇందాక ‘వివాదాలు, కొట్లాటలు’ అన్నారు. వివాదాలకి చోటిచ్చేవన్నీ తక్కువ స్థాయి రచనలు, తక్కినవన్నీ గొప్పవి అంటారా?

అనిల్: అలా ఏం లేదు. ఓ కథ గొప్పదా కాదా అనేది అందులో ఉన్న సరుకుని బట్టి నిర్ధారించబడుతుంది కానీ, దాని చుట్టూ జరిగే గొడవలని బట్టి కాదు. ఇందాక నేనన్నట్లు, సైన్స్ ఫిక్షన్ కథలు చదివితే చదువుతారు లేకుంటే లేదు. అంతే తప్ప వాటి గురించి వివాదాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇది నా మనస్తత్వానికి సరిపడే విషయం. ప్రశాంతంగా నా కథలేవో నేను రాసుకోవచ్చు, మిగతా గొడవల్లో ఇరుక్కోకుండా. అంతే తప్ప మరో ఉద్దేశం లేదు, ఆ ‘వివాదాలు, కొట్లాటలు’ వ్యాఖ్య వెనక.

షరీఫ్: ఒకవేళ సైన్స్ ఫిక్షన్ కి ఆ పరిస్థితొస్తే, మీరు ఆ తరహా కథలు రాయటం మానేస్తారా?

అనిల్: అందాకా వస్తే చూద్దాం. వస్తుందని మాత్రం నేను అనుకోను.

షరీఫ్: అసలు ఏ కథకైనా ఆ పరిస్థితి ఎందుకొస్తుంది? వివాదాలు ఎందుకు మొదలవుతాయి?

అనిల్: సమీక్షకులు, విమర్శకులు తమ కథలపై వ్యక్తం చేసే అభిప్రాయాలు రచయితలకి నచ్చకపోవటం దగ్గర గొడవ మొదలవుతుంది. రచయిత సంయమనం వహిస్తే అది వెంటనే సద్దుమణుగుతుంది. లేకుంటే పెద్దదవుతుంది. ఎక్కువగా రెండోదే జరుగుతుంది.

షరీఫ్: మీ దృష్టిలో కథని సమీక్షించటానికి, విమర్శించటానికి తేడా ఏమిటి?

అనిల్: సమీక్ష అంటే కథని పాఠకులకి పరిచయం చేసే సాధనం. సమీక్షకుడు కథని మరీ లోతుగా విశ్లేషించడు. అది విమర్శకుడి పని. అంతే తేడా. సమీక్ష అనేది ఓ రకంగా సేల్స్ పిచ్. విమర్శ అంటే కథని అధ్యయనం చేయటం. అయితే ఈ మధ్య ఈ రెండింటి మధ్య తేడా చెరిగిపోతూంది. రెండూ కలగలిసిపోతున్నాయి.

షరీఫ్: నేటి విమర్శకులపై మీ అభిప్రాయం?

అనిల్: విమర్శకులు స్వేఛ్చగా తమ పని చేసే పరిస్థితి ప్రస్తుతం ఉందనిపించటం లేదు. ఈ మధ్యనో ధోరణి గమనించాను. కొన్ని వర్గాలని ఉద్దేశించి రాసే కథలు బాగోలేవన్నవారిపై విరుచుకుపడటం జరుగుతోంది. ఓ స్త్రీవాద కథ బాగోలేదంటే అతన్ని పురుషాహంకారి అనటం, మరో వాద కథ బాగోలేదంటే ఆ వాదానికి వ్యతిరేకిగా ముద్రవేయటం జరుగుతోంది. విమర్శ అనేది కథలో ఉన్న సరుకుని బట్టి కాకుండా రచయిత నేపధ్యాన్ని బట్టి చేయాల్సొస్తున్న విచిత్ర పరిస్థితినీ గమనించాను. కుత్సితంగా విమర్శలు చేసేవాళ్లు ఉండరని కాదు. కథలో అసలు విషయం వదిలేసి దాని చుట్టూ ఉన్న విషయాలు పట్టుకొచ్చి విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్లని పట్టించుకోనవసరం లేదు. నేను చెప్పేది నిజమైన విమర్శకుల గురించి. వాళ్ల చేతులు కట్టేయబడి ఉన్నాయి ప్రస్తుతం. లిటరరీ ఫిక్షన్, ముఖ్యంగా అస్తిత్వవాద కథలకి సంబంధించిన సమస్య ఇది. సైన్స్ ఫిక్షన్‌కి అదృష్టవశాత్తూ ఈ పరిస్థితి లేదు. అక్కడ వచ్చే కథలు వేళ్ల మీద లెక్కించేన్ని మాత్రం కావటం వల్లనో, ఆ రకం కథలపై సాధికారికమైన విమర్శలు చేయగలిగేవారు దాదాపు లేకపోవటం వల్లనో, అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది (నవ్వు).

షరీఫ్: ‘నాగరికథ’ చదివాక ఓ వ్యక్తి ఫోన్ చేసి “ఇది నిజంగా జరిగేది కాదు. ఇది గొప్ప కథేంటి?” అన్నాడని చెప్పారు. మీ దృష్టిలో గొప్ప కథ అంటే ఏమిటి?

అనిల్: నాకెవరూ ఫోన్ చేసి అలా చెప్పలేదు (నవ్వు). కానీ ఆ మాట విన్నాను. గొప్ప కథ ఏది అంటే …. నా దృష్టిలో చదివించగలిగేది ఏదైనా మంచి కథే, గొప్ప కథే. దాని వల్ల కలిగే సామాజిక ప్రయోజనాలూ అవీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. కథనేది ముందుగా ఆసాంతం ఆసక్తిగా చదివించగలగాలి. ఆ పని చెయ్యలేని కథలో ఎంత గొప్ప సందేశం ఉన్నప్పటికీ అదో గొప్ప కథని నేననుకోను.

షరీఫ్: ‘గొప్ప కథ’ రాయటం ఎలా?

అనిల్: గొప్ప కథలు రాయటానికి గైడ్ బుక్ అంటూ ఏమీ లేదు. ఏ కళారూపానికీ లేదు. గొప్పగా పెయింటింగ్స్ వేయటం ఎలా, గొప్పగా నాట్యం చెయ్యటం ఎలా – ఇలాంటివి ఎవరూ నేర్పలేరు. కాకపోతే ప్రతిదానికీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి కథని శ్రద్ధగా చెక్కాలి. ఏ art form తీసుకున్నా, అదొక craft కూడా. కొందరు ఈ మాట ఒప్పుకోకపోవచ్చు. కళ అంటే కళే. అది క్రాఫ్ట్ కాదు అంటారు వాళ్లు. చెక్కుడూ అదీ ఉంటే ఆర్ట్ కానే కాదు అంటారు. నా దృష్టిలో అవన్నీ fine touches. అవి కూడా ఉండాలి. సానబట్టటం అన్నమాట. సానబట్టటాలు ఉండకూడదు అనే వారిని నేనేమీ అనను, అది వాళ్లిష్టం. నా వరకూ ఓ మంచి కథ గొప్ప కథగా రూపొందాలంటే దాన్ని సాన పట్టాల్సిందే. నిర్మాణ కౌశలం చూపించాల్సిందే. గొప్ప కథ దానంతటదే ఊడిపడదు. అదొక మథనం.

షరీఫ్: మీరు ‘కథాయణం’ పేరుతో ఫేస్‌బుక్‌లో పలు వ్యాసాలు రాశారు. పట్టుమని పది కథలైనా రాయని అనిల్ ఎస్. రాయల్ ఏం అర్హత ఉందని కథాయణాలు రాస్తున్నాడు అన్న వ్యాఖ్యలు వచ్చాయి. వాటిపై మీ స్పందన?

అనిల్: అలా అడిగిన వారికి ఏం అర్హత ఉందో, నాకూ అదే అర్హత ఉంది. కథంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వాళ్లకి కోపమొచ్చి ఉంటుంది, “ఇతనెవరు ఇలాంటివి రాసేదానికి” అని. తప్పేమీ లేదు. ఆ ఇష్టంతోనే నేను కూడా అవి రాశాను.

షరీఫ్: ‘కథాయణం’లో మీరు “నేను ముందుగా కథకి ముగింపు రాస్తాను. తర్వాత మిగతా కథ రాస్తాను,” అన్నారు. ఏమిటా టెక్నిక్?

అనిల్: నేను రాసే కథలకి ముగింపు చాలా కీలకం. నా కథలకే కాదు, అసలు ఏ కథకైనా – అది లిటరరీ లేదా genre తరహా ఫిక్షన్ ఏదైనా కానీడి – ముగింపే ముఖ్యం. మిగిలినదంతా పాఠకుడిని ఆ ముగింపువైపుకి తీసుకెళ్లటానికి రచయిత పడే ప్రయాస. ముగింపు అంత కీలకం కాబట్టి, అసలు కథలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది ముగింపులోనే ఉంది కాబట్టి, నేను ముందుగా ముగింపు గురించే ఆలోచిస్తాను. ముందుగా అదే రాస్తాను. కథని ‘అట్నుండి’ నరుక్కొస్తానన్న మాట (నవ్వు).

షరీఫ్: ఒక సందర్భంలో మీ కథని ఎవరో సమీక్షిస్తూ ముగింపు బయటపెడితే మీరు కాస్త ఇబ్బంది పడ్డారు. “సమీక్షకుడు ఎప్పుడూ ముగింపు చెప్పకూడదు” అనే వ్యాఖ్య చేశారు. ముగింపు చెబితే కథ చచ్చిపోతుందా?

అనిల్: కొన్ని కథలు కచ్చితంగా చచ్చిపోతాయి. నా కథలు అన్నీ చచ్చిపోతాయి. నేనిందాక అన్నాను కదా. నా కథలకి ముగింపెంత కీలకమంటే, నేను ముగింపుతోనే కథ రాయటం మొదలు పెట్టి వెనక్కు డెవలప్ చేసుకుంటూ వెళతానని. అంత ముఖ్యమైనది నాకు ముగింపు. అది తెలిసిపోయాక ఇక కథ చదవాలన్న ఆసక్తి ఏముంటుంది? ఇది కామన్ సెన్స్.

షరీఫ్: అంటే, మీ కథల్ని ఒకసారి చదివి ముగింపు తెలుసుకున్నాక మరోసారి చదవలేరు అంటారా?

అనిల్: తెలుగులో ఏడాదికి పదిహేనొందల కథల దాకా వెలువడుతున్నాయి. వాటిలో మంచి కథలు చాలా ఉంటాయి. అవన్నీ ఒక్క సారి చదివే సమయం ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఏ కథనైనా మళ్లీ మళ్లీ చదివే తీరుబడి ఎక్కువమందికి ఉంటుందని నేననుకోను. ఏ కొద్దిమందికో అంత తీరిక  ఉండొచ్చు. నేను రాసేది ఆ కొద్దిమంది కోసం మాత్రమే కాదు. రిపీట్ రీడర్‌షిప్ నాకు ముఖ్యం కాదు. నా కథని ఒకే ఒకసారి చదివినా, ఆ కాసేపూ పాఠకుడికి అద్భుతమైన అనుభూతినివ్వాలి. ముగింపు ముందే తెలిసిపోతే నా కథని ఆ ఒక్కసారీ చదవరు. అందుకే సమీక్షకులు ముగింపు బయటపెట్టేయటం పట్ల నా అభ్యంతరం.

షరీఫ్: అనిల్ ఎస్. రాయల్ కథల్ని, “ముగింపు తెలిసిపోతే చచ్చిపోయే కథలు” అనుకోవచ్చా?

అనిల్: అనుకోవచ్చు. ఏం ఫరవాలేదు. నేనేమీ అనుకోను (నవ్వు).

షరీఫ్: మీరు అమెరికాలో ఉంటున్నారు. అమెరికా తెలుగు కథకి, ఇక్కడి తెలుగు కథకి తేడా ఏమన్నా గమనించారా? గమనిస్తే, అదేమిటి?

అనిల్: ఇతివృత్తాలు, నాణ్యత పరంగా ఇక్కడి కథలే బాగున్నాయనిపిస్తుంది. అమెరికా తెలుగు కథల్లో చాలావరకూ మొనాటనీ కనిపిస్తుంది. నేనక్కడ పదహారేళ్ల నుండి ఉంటున్నాను. నా తరం ఎన్నారై జీవితాల పరిధి చాలా చిన్నది. ఎక్కువగా మనలో మనమే. ఇతర సంస్కృతులతో కలవటం చాలా తక్కువ. మొదటి తరం ఎన్నారైలు ఈ విషయంలో చాలా మెరుగు. అప్పట్లో వాళ్లు అక్కడొకరూ ఇక్కడొకరూ విసిరేసినట్లు ఉండటం వల్ల కావచ్చు, వాళ్లకి చుట్టూ ఉన్న అమెరికన్ సమాజంతో కలవక తప్పని పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు మనవాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవటం వల్ల వాళ్లుండే ప్రాంతాలు మినీ విజయవాడ, మినీ హైదరాబాద్ …. ఇలా తయారయ్యాయి. వాళ్లంతా చుట్టూ గిరిగీసుకుని ఆ పరిధిలోనే ఉంటున్నారు.  అమెరికన్ సమాజాన్నుండి ఐసొలేటెడ్ బ్రతుకులు. చుట్టూ ఉన్న పరిస్థితులపై, సమాజంపై superficial knowledge మాత్రమే తప్ప పెద్దగా అవగాహన లేదు. దాంతో ఎక్కువమంది ఎన్నారై రచయితల ఇతివృత్తాల్లో ప్రవాసం మొదట్లో కలిగే కల్చర్ షాక్, ఇళ్లలో జరిగే రోజువారీ సంఘటనలు, భార్యాభర్తల మధ్య పొరపొచ్ఛాలు, ఇలాంటివే తప్ప పెద్ద లోతు కనిపించటం లేదు. అక్కడినుండి అరుదుగా మాత్రమే మంచికథలొస్తున్నాయి.

షరీఫ్: ఈ మధ్య తానా సభలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. మీరు అమెరికాలో ఉంటూ కూడా వాటికి వెళ్లకపోవటానికి కారణమేంటి?

అనిల్: నేను తానా సభలకి కానీ, వేరే సభలకి కానీ ఎప్పుడూ వెళ్లలేదు. నాకు ఎటువంటి అసోసియేషన్స్‌లోనూ సభ్యత్వం లేదు.

షరీఫ్: ఎందుకని?

అనిల్: ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఏదన్నా ఆసక్తికరమైన కార్యక్రమం జరిగితే ఎప్పుడన్నా టికెట్ కొనుక్కుని వెళతాను. అంతే తప్ప మెంబర్‌షిప్స్ లాంటివేమీ లేవు. ఎందులోనైనా సభ్యత్వం ఉంటే చాలా కమిట్‌మెంట్ అవసరం పడుతుంది. వాళ్లకి ప్రతివారం ఏదో ఓ కార్యక్రమం ఉంటుంది. అవి చాలా hectic గా ఉండే పనులు. వారాంతాల్లో వాటితో చాలా హడావిడిగా ఉంటుంది. నాకంత తీరిక ఉండదు. నాకు దొరికే ఖాళీ సమయాన్ని నా కుటుంబంతో గడపటానికే ఇష్టపడతాను.

షరీఫ్: మీ కుటుంబం గురించి చెప్పండి.

అనిల్: నేను పుట్టింది గుంటూరు జిల్లా మాచర్ల. (పిడికిలి బిగించి) పల్నాడు …. బ్రహ్మనాయుడు (నవ్వు). మా తల్లిదండ్రులు నరసరావు పేట ప్రాంతం నుండొచ్చి మాచర్లలో స్థిరపడ్డారు. నా స్వస్థలం అదే కానీ నేను చదువుకున్నదంతా బయట. రెంటచింతల, విజయవాడ, మద్రాసు …. ఇలాంటిచోట్ల చదివాను. మా ఊరితో పెద్దగా అనుబంధం లేదు. పెద్దగా స్నేహితులూ లేరక్కడ. మద్రాస్ లయోలా కాలేజ్‌లో ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికా వెళ్లిపోయాను. నా ఉద్యోగ జీవితం అమెరికాలోనే మొదలైంది. అదే అసలైన జీవితం కూడా. నా భార్య పేరు చైతన్య. మాకో పాప, పేరు మనస్వి. హ్యాపీ ఫామిలీ.

షరీఫ్: సాహిత్య నేపధ్యం ఎక్కడా తగల్లేదు, మీరు చెప్పినదాంట్లో.

అనిల్: అవును. మా ఇళ్లలో కళాకారులెవరూ లేరు. కళాపోషకులు మాత్రం ఉండేవారు. మేనమామలు, ముఖ్యంగా. వాళ్ల పోషణకి ఆస్తులు అర్పణమైపోయాయి (నవ్వు). మా అమ్మకీ కళల్లో ఆసక్తి ఉంది, స్వయంగా ప్రవేశం లేకపోయినా. శాస్త్రీయ సంగీతం, నృత్యం, వగైరా. తన చిన్నతనంలో మా తాతగారింట్లో ఘోషా పద్ధతుండేది. ఇళ్లలో ఆడవారిని బయటికి పంపేవారు కాదు. అలా ఆమె చదువు ఏడో తరగతితోనే ఆగిపోయింది. కానీ ఆమెకి చదవటమ్మీద ఆసక్తి పోలేదు. కనిపించినవన్నీ విపరీతంగా చదివింది. ఆ ఆసక్తే నాకూ వచ్చింది. ఇక మా నాన్నకి చరిత్ర మీద చాలా ఆసక్తి. చరిత్రలో ఎప్పుడేం జరిగిందో తేదీలతో సహా ఆయనకి గుర్తుండేంది. హిస్టరీ మీద ఆసక్తనేది నాకు ఆయన దగ్గరనుండొచ్చింది.

షరీఫ్: తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు రావటం లేదు కాబట్టి, వాటిలో కూడా వేలు పెట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా? (నవ్వు)

అనిల్: (నవ్వు) సినిమాలు తీసే ఆలోచన నాకేమీ లేదు.

షరీఫ్: పోనీ కథలందిస్తారా, అలాంటి వాటికి?

అనిల్: ఎవరడుగుతారు నన్ను? అడిగితే ఇస్తాను, పోయేదేముంది (నవ్వు).  సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయాలంటే తెలుగు నిర్మాతలకి భయమనుకుంటా. అప్పుడెప్పుడో నా ఫేవరెట్ టైమ్ ట్రావెల్ కథాంశంతో ‘ఆదిత్య 369’ వచ్చింది. ఆ తర్వాత మరేవన్నా వచ్చాయో లేదో తెలీదు. బహుశా సైన్స్ ఫిక్షన్ అంటే పెద్ద పెద్ద యుద్ధాలూ అవీ ఉంటాయి, భారీగా ఖర్చవుతుందనేమో మరి. నిజానికి సైన్స్ ఫిక్షన్ కథలకి అవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న బడ్జెట్‌లోనూ తీయొచ్చు. కథని బట్టి ఉంటుంది కదా.

షరీఫ్: మీ కథల్లో మీకు ‘నచ్చనిది’ ఏదన్నా ఉందా? ఉంటే, ఏమిటా కథ?

అనిల్: నేనింత వరకూ రాసింది తొమ్మిది కథలే – అనువాద కథ కాక. అవన్నీ నచ్చినవే. నచ్చకపోతే అచ్చుకి పంపను. నేను ఆరేళ్ల నుండి రాస్తున్నాను. ఆరేళ్లలో తొమ్మిదే రాశానంటే, నాకు బాగా నచ్చితేనే అవి బయటికి వెళతాయి. లేకపోతే యాభై కథలు అచ్చేసి ఉండేవాడినిప్పటికి.

షరీఫ్: మీ కథల పుస్తకం ఎప్పుడొస్తుంది?

అనిల్: ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. త్వరలో విడుదలవుతుంది.

షరీఫ్: ఏం పేరు పెట్టబోతున్నారు? ఎన్ని పేజీలుంటుంది?

అనిల్: పేరు …. ఇంకా ఏమీ అనుకోలేదు. బహుశా నా తొలి కథ ‘నాగరికథ’ పేరే పెడతానేమో పుస్తకానికి. ఇక పేజీలు – పది కథలు కదా, సుమారుగా నూట నలభై ఉండొచ్చు.

[ ఇంటర్వ్యూ రికార్డ్ చేసేనాటికి ఇంకా సన్నాహకాల్లోనే ఉన్న అనిల్ ఎస్. రాయల్ కథల పుస్తకం నాగరికథఆగస్ట్ 5 విడుదల.  దానితో పాటే ఔత్సాహిక రచయితల కోసం అనిల్ రాసిన వ్యాసపరంపర కథాయణంకూడా పుస్తకరూపం తీసుకుంది ]

nagarikatha

kathayanam

షరీఫ్: ఓ సూటి ప్రశ్న. మీరు తక్కువ కథలే రాసినా, ఎక్కువ పేరు రావటానికి కారణం ఏమనుకుంటున్నారు?

అనిల్: ఎక్కువ పేరొచ్చిందనేది మీరు చెబితే కానీ తెలియలేదు. ఎక్కువ పేరుందో, ఎంత పేరుందో, అసలుందో లేదో నేను పట్టించుకోను. నా ధ్యాస కథ రాయటమ్మీదనే. నేను సాహితీ సమావేశాలకి, సభలకీ వాటికీ కూడా వెళ్లను. అందువల్ల నా గురించి ఎవరేం అనుకుంటున్నారనేది నాకు తెలియదు.

షరీఫ్: మీరు కథలు రాయటం మొదలు పెట్టటానికి ముందు బ్లాగుల్లో రాసేవారు. మీరు కథలు రాయటం మొదలు పెట్టాక వచ్చిన స్పందన అంతకు ముందు ఎందుకు రాలేదు, కథలకి మాత్రమే ఈ స్పందన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు?

అనిల్: బ్లాగులు రాసిన కాలంలోనూ స్పందన ఉంది. కాకపోతే వాటి పరిధి చిన్నది. అవి చదివేవాళ్లు తక్కువ. అదీ కాక నేనవి ‘అబ్రకదబ్ర’ అనే మారుపేరుతో రాసేవాడిని. అది నేనే అని చాలామందికి తెలియదు. ఇక, నా కథలు …. అవి విభిన్నంగా ఉండటం వల్ల నచ్చాయని అనుకుంటున్నాను.

షరీఫ్: మీ కథలు వివిధ సంకలనాల్లో రావటం వల్ల వాటికి పేరొచ్చిందని అనుకుంటున్నారా?

అనిల్: సంకలనాల్లో వచ్చే కథలన్నీ గొప్పవని కాదు. వాటిలో రానివన్నీ గొప్పవి కాదనీ కాదు. నేను ఆరేళ్లలో తొమ్మిదికథలు రాస్తే, 2013లో ఒక్క ఏడాదే ఐదు రాశాను. వాటిలో నాకు బాగా నచ్చింది ‘శిక్ష’. అది సైన్స్ ఫిక్షన్ కాదు. ఆ తర్వాత నచ్చింది ‘ప్రళయం’ (ఇది సారంగలో వచ్చింది). ‘రీబూట్’ అనే కథ ఆ ఏడాదిలో నాకు బాగా నచ్చిన నా కథల్లో మూడవ స్థానంలో ఉంది. కానీ ఆ కథ కథాసాహితి వారి సంకలనంలో వచ్చింది. సంకలనకర్తలకి వాళ్ల స్టాండర్డ్స్, కొలతలు ఏవో ఉంటాయి కదా. వాటి ప్రకారం చూస్తే వాళ్లకి ‘రీబూట్’ ఎక్కువ నచ్చిందేమో. సంకలనాలకి ఎంపిక కాకపోయినా ‘ప్రళయం’, ‘శిక్ష’ కూడా పేరు తెచ్చుకున్నవే కదా. కాబట్టి సంకలనాల్లో రావటం అనేదొక అదనపు గౌరవమే తప్ప, కథలో సరుకున్నప్పుడు సంకలనాల ఊతం లేకుండానే గుర్తింపు వస్తుందని నా నమ్మకం.

 

షరీఫ్: మీకు సైన్స్ ఫిక్షన్ కథలంటే చాలా ఇష్టం అన్నారు. మరి సైన్స్ ఫిక్షన్ కాని ‘శిక్ష’ ఎందుకు మీర్రాసిన వాటిలో మీ ఫేవరెట్ అయింది?

అనిల్: నాకెప్పట్నుండో నా సహజశైలిలో ఓ కథ రాయాలనుండేది. పదాలతో ఆడుకోవటం, వెటకరించటం, వాక్యాల్లో వ్యంగ్యం గుప్పించి రాయటం నాకిష్టం. కానీ నేను రాసే సైన్స్ ఫిక్షన్ కథలకి వాటి అవసరం లేకపోయింది. ఇవి చాలావరకూ సీరియస్ టోన్‌తో నడిచే కథలు. వీటికోసం నేను నా సహజ శైలికి చాలా దూరం జరిగి రాయాల్సొస్తుంది. అందువల్ల ఈ సైన్స్ గోల పక్కనబెట్టి ‘శిక్ష’ రాశాను. ఇందులో నేను చెలరేగిపోవచ్చు (నవ్వు). నా ఇష్టమొచ్చినట్లు రాసుకోవచ్చు. చెప్పుకోదగ్గ ప్లాట్ లేకుండా కేవలం కథనంతోనే పాఠకుల్ని ఆకట్టుకున్న కథ ‘శిక్ష’. అందుకే అది నాకు బాగా నచ్చింది.

షరీఫ్: సైన్స్ ఫిక్షన్ నవలేమన్నా రాసే ఆలోచనుందా?

అనిల్: సైన్స్ ఫిక్షన్ నవల అనే కాదు, ఏ నవలైనా ఇప్పుడు చదివేవాళ్లు ఎక్కువగా ఉన్నారని నేననుకోను. టెక్నాలజీ కారణంగా పాఠకుల అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోయింది. గంటలో పదిసార్లు ఎస్సెమ్మెస్ మెసేజెస్ వస్తాయి, లేకపోతే వాట్సాప్ సందేశాలు, లేదా ఫోన్ కాల్స్, ఇ-మెయిల్స్ ఇలాంటివొస్తుంటాయి. వీటన్నింటి మధ్యలో కథలు చదవటం కూడా కష్టమైపోతుంది. అలాంటిది నాలుగొందల పేజీల నవల చదవటం ఇంకా కష్టం. అందువల్ల కష్టపడి నవల రాసీ ఉపయోగం లేదు. నాకా పని చేసే ఆలోచనా లేదు.

షరీఫ్: ఒక కథ రాసేముందు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

అనిల్: ఇందాకన్నట్లు, నేను ముందుగా ముగింపు గురించి ఆలోచిస్తాను. ముగింపులో ఓ బ్రహ్మాండమైన, పాఠకుల బుర్ర తిరిగే రివిలేషన్ కావాలి. అటువంటిది తట్టిన తర్వాత, ఆ రివిలేషన్ జరగాలంటే ఎటువంటి సంఘటనల సమాహారం ఉండాలనేది చూస్తాను. వాటినో క్రమంలో పేర్చిన తర్వాత పాత్రల గురించి ఆలోచిస్తాను. ఇలా చేయటం వల్ల నాకో అడ్వాంటేజ్ ఉంది. నా కథకి తగ్గట్లు పాత్రల్ని మలచుకోవచ్చిక్కడ. అలా కాకుండా ముందుగానే పాత్రని సృష్టించి దానికో వ్యక్తిత్వం ఇచ్చేస్తే అది దాని చిత్తమొచ్చినట్లు ప్రవర్తించటం మొదలెడుతుంది. ఎటో పరిగెడుతుంది. దాన్ని మళ్లీ కథలోకి లాక్కురావటానికి నానా తిప్పలు పడాలి. అదే నా పద్ధతిలో ఐతే – ఇక్కడ ముగింపేమిటో ముందుగానే తెలుసు, దానికి దారి తీసే సంఘటనలూ తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగానే పాత్రలకి ఓ వ్యక్తిత్వాన్నిస్తాను. నేననుకున్న ముగింపుకి చేరాలంటే ఆయా పాత్రలు ఎలా ప్రవర్తించాలో, ఒకదానితో మరొకటి ఎలా సంఘర్షించాలో నిర్దేశిస్తాను. నా పాత్రలు నేను ఆడించినట్లే ఆడతాయి. ఆ విధంగా కథ మొత్తం నా కంట్రోల్‌లో ఉంటుంది. అలా ప్లాట్ డెవలప్ చేశాక కథకి ఒక రూపం – ఔట్‌లైన్ – వచ్చేస్తుంది. ఇక మిగిలింది దీనికి సంభాషణలూ అవీ చేర్చి కథ రాయటమే.

షరీఫ్: మీరు చాలా ఏళ్ల కిందటే తెలుగు ప్రాంతాన్ని వదిలేశారు. అమెరికాలో ఎక్కడో ఉంటున్నారు. కానీ మీ వచనం ఎటువంటి గందరగోళం, పునరుక్తులు లేకుండా, చిన్న చిన్న వాక్యాలతో హాయిగా ఉంటుంది. అంత అందంగా భాష అలవడటానికి మీరు చేసిన సాధన ఏమిటి?

అనిల్: నేను రాసే ప్రతి అక్షరాన్నీ తరచి చూసుకోవటమే. అంతకన్నా పెద్ద సాధన ఏమీ లేదు. నాదంతా వార్తాపత్రికలు, కథలు, నవలలు ఇలాంటివి చదివి నేర్చుకున్న తెలుగే తప్ప నేను ప్రబంధాలూ గట్రా చదవలేదు. నాకు భాషపై ఆ స్థాయి పట్టు కూడా లేదు. అది లేనప్పుడు భీకరమైన భాషలో ఏదో రాయబోవటం అనవసరం. చేతగాని పని చేసినట్లుంటుందది. అందువల్ల నాకొచ్చిన భాషలోనే రాసుకొస్తాను. ఆంగ్ల పదాల వాడకం విషయంలో మడికట్టుకు కూర్చోకపోయినా, వీలైనంత వరకూ తెలుగులోనే రాయటానికి ప్రయత్నిస్తాను. రాసినదాంట్లో తప్పులు లేకుండా జాగ్రత్త పడతాను. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాను. అంతే. కాకపోతే ఒకటి. లియొనార్డో డావించీ చెప్పినట్లు, simplicity is the ultimate sophistication. అత్యంత సాధారణంగా కనిపించటమే ఉత్కృష్టతకి పరాకాష్ట. ఇది స్టీవ్ జాబ్స్ నమ్మిన సిద్ధాంతం. నేనూ దాన్ని నమ్ముతాను. ఎంత క్లిష్టతరమైన కథాంశాన్నైనా తేలికపాటి భాషలో రాయటానికి ప్రయత్నిస్తాను. అనవసరమైన మార్మికత, నిగూఢార్ధాలు చొప్పించటం నాకిష్టం ఉండదు. బహుశా ఈ కారణం వల్లనే – సింపుల్‌గా కనిపించటం వల్లనే నా వాక్యాలకి మీరనే అందం చేకూరి ఉంటుంది.

Youtube link for the above interview

 

 

 

 

 

 

అవసరమే కథల్ని పుట్టిస్తుంది:గంటేడ గౌరునాయుడు

బాలసుధాకర్ మౌళి

 

ఇన్నాళ్లూ ఉత్తరాంధ్ర కథ ఏం మాట్లాడిందంటే మట్టి భాష మాట్లాడింది – మనుషుల వెతలను ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చింది. పోరాట ఆవశ్యకతను చాటిచెప్పింది. సాహిత్యం ఏం చేస్తుంది ? మనుషులను చైతన్యవంతం చేస్తుంది. ఉత్తరాంధ్రా కథ ఆ కర్తవ్యాన్నే నెరవేర్చింది – నెరవేర్చుతుంది. అటు పాటల రచయితగా, కవిగా ; ఇటు కథా రచయితగా – ఏం చేసినా ప్రజా చైతన్యమే పునాధిగా ; అవసరార్థమే కథ రాశాను – రాస్తున్నాను అని చెబుతున్న ‘గంటేడ గౌరునాయుడు’ మాస్టారు ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి. సూక్ష్మంగా ఆయన అంతరంగ అన్వేషణ.

గంటేడ గౌరునాయుడు మాస్టారు – ‘స్నేహకళాసాహితి’ అనే సాహితీ సంస్థని స్థాపించి చాలా మంది యువకవులకు, కథా రచయితలకు వొక వేదికనందించారు అని అనడం కంటే యువతరంతో కలిసి సాహితీసేద్యం చేస్తున్నారు అంటేనే ఆయనకు ఎంతో ఇష్టమౌతుంది.
‘ప్రియభారతి జననీ.. ‘ పాటలు; ‘నాగేటి చాలుకు నమస్కారం – నాగలి’ దీర్ఘ కవితలు; ‘కళింగోర’ పేరుతో కాలమ్ నిర్వహణ; ‘నదిని దానం చేశాక’ కవిత్వసంపుటి; ‘ఏటిపాట – ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ కథాసంకలనాలు; ఈ మధ్య వచ్చిన ‘ఎగిరిపోతున్న పిట్టల కోసం’ కవిత్వం – ఈయన సాహిత్య ఉత్పత్తులు. ‘ఇది నా ఊరేనా ! ‘ పేరుతో పాటల సి.డి వొకటి విడుదల చేశారు. తొలి రోజుల్లో ‘ పోడు మంటలు ‘ అనే నృత్య నాటకం రాసి చాలా ప్రదర్శనలిచ్చారు. ఈ మధ్య ‘ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ తర్వాత వచ్చిన ఆయన ఏడు కథలు చాలా చర్చనీయాంశాలను చెప్పాయి. ‘మాయ, పొద్దు ములిగిపోయింది’ ఈ రెండు కథలు – ముంపు నేపథ్యంలోంచి; ‘ఇండియాగాడి టి.సి, సంధ్య’ కథలు – ట్రైబల్ విద్య నేపథ్యంలోంచిమాట్లాడుతాయి. ‘మూడు దృశ్యాలు’ కథ – ప్రభుత్వపథకాలు ఎవరికి లాభం చేకూర్చుతున్నాయో చెబితే, ‘ఒక ఊరి కథ’ – పెట్టుబడిదారి విధానం మీద పూర్తిగా ఆధారపడిన తర్వాత రైతు పరిస్థితి ఏమిటి ? అనే విషయాన్ని చర్చిస్తుంది. గౌరునాయుడు మాస్టారి కొత్త కథ ‘అల్పపీడనం’ లక్ష్మిం పేట నేపథ్యంలోది. అదింకా ప్రచురితం కావాల్సి ఉంది.

1. మీ నేపథ్యం చెప్పండి?
నేను పుట్టిన ఊరు – దళాయి పేట, కొమరాడ మండలం, విజయనగరం జిల్లా. వ్యవసాయ కుటుంబం. నా చదువు పార్వతీపురంలో సాగింది. ఉద్యోగమూ ఈ పరిసరప్రాంతాల్లోనే.

2. కథా సాహిత్యంలోకి ఎలా వచ్చారు?
నా బాల్యస్నేహితుడు, కథా రచయత ‘అట్టాడ అప్పలనాయుడు’ కథా సంపుటి – ‘పోడు పోరు’ నన్ను కథా సాహిత్యంలోకి లాక్కొచ్చింది. అంతకు ముందూ కథలు రాసేవాణ్ణి కానీ అప్పలనాయుడు కథలు చదివాక కథ రాయడం మీద బాధ్యత పెరిగింది. కారా, భూషణం, చాసో, తిలక్ కథలు ఇష్టంగా చదివాను.

3. మిమ్మల్ని ప్రభావితం చేసిన కథకులు – కథలు ఏవి?
కారా – చావు, చాసో – వాయులీనం, తిలక్ – ఊరి చివర ఇల్లు, రావిశాస్త్రి – తప్పు కథలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.

4. కథ, పాట, కవిత ఈ మూడింటినీ మీరు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు ఈ మూడింటిని ఎలా సమన్వయం చేయగలిగారు ?
పాటతో బయలుదేరాను. కవిత్వాన్ని ఇష్టపడ్డాను. కథ అవసరం కనుక రాస్తున్నాను. కవిత ద్వారా, పాట ద్వారా చెప్పలేని విషయాన్ని కథ ద్వారా విస్తారంగా చెప్పడం సులువు. అందుకే కథనే ప్రధానంగా నా భావప్రసారానికి మాధ్యమంగా ఎన్నుకున్నాను.

IMG_20150428_100723

5. పాట మీ కథల్లోకి ఎలా ప్రవేశించింది?
పాట నాకు ఇష్టం కాబట్టి మొదట నేను పాటతో బయలుదేరాను. పాట కథాగమనానికి దోహదపడుతుందని అనుకున్నప్పుడే అక్కడక్కడ నా కథల్లో ఉపయోగించాను. అయితే శృతి మించిన కవిత్వం కథాగమనాన్ని నాశనం చేస్తుందని నా అభిప్రాయం.

6. మీరు రైతు, వ్యవసాయం ప్రధానంగా కథలు రాస్తారు కదా.. మీ ముందు తరం కథా సాహిత్యంలో రైతు జీవితం ఏమేరకు చిత్రితమయ్యింది ?
నిజానికి కథా సాహిత్యంలోకి రైతు ప్రధాన పాత్రగా ప్రవేశించింది మా తరం కధకులు కథా సాహిత్యంలోకి వచ్చిన తర్వాతే అనిపిస్తుంది. గురజాడ, ఆచంట
సాంఖ్యాయన శర్మ కథలు రాస్తున్న కాలం.. రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్న కాలం. నానా హింసలు పడుతున్న కాలం. అయినా గానీ ఏ కారణం గానో ( బహుశా
సంస్కరణోద్యమ ప్రభావం కావొచ్చు ) రైతు జీవితం కథల్లోకి రాలేదు. అయితే రైతు గురించిన ప్రసక్తి కా.రా మాస్టారు కథ ‘కీర్తి కాముడు’ 1949లో ఉంది.
రైతులు పితృ పితామహార్జితమైన ఆస్తిని దానధర్మాలనీ, పరువు ప్రతిష్టలనీ, పంతాలు పట్టింపులనీ, పౌరుషాలకు పోయి.. హారతి కర్పూరంలా హరాయింప చేసినట్టు
చెప్తారు. 1951 లో అవసరాల సూర్యారావు రాసిన ‘ఊరేగింపు’ కథలో జమిందార్లు వేసే పన్నులు కట్టలేక వారి వేధింపులు తట్టుకోలేక.. రైతులు తిరుగుబాటు
చేసిన వైనాన్ని చిత్రిస్తారు. నాకు తెలిసి ఇవి తప్ప రైతును గురించిన చిత్రణ ఉత్తరాంధ్రా కథా సాహిత్యంలో కనిపించదు. మళ్లీ కా.రా, భూషణం, శ్రీపతి కథల్లో ఉద్యమ చిత్రణ జరిగింది గానీ, రైతు ప్రధాన పాత్ర గాదు. వీరి కథల్లో పాలేర్లపై నాయుళ్ల పెత్తనం ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరువాత మా తరం సాహిత్యరంగంలోకి ప్రవేశించాక మరీ ముఖ్యంగా రైతు కుటుంబాల్లోంచి వచ్చాక.. రైతు జీవితం చిత్రించబడిందని నేననుకుంటాను.
ఇక్కడొకటి గమనించాలి.. రైతు అనగానే అతడొక భూస్వామిలాగ భావిస్తే పొరపాటు. ఏడాదంతా కష్టపడినా.. నేలబుగ్గినెత్తుకున్నా.. అప్పుల ఊబిలోనే కూరుకుపోయే అతి చిన్న, సన్నకారు రైతులూ వున్నారు. వారే మా కథల్లో ప్రధాన పాత్రధారులు. నేను మాట్లాడేది ఆ రైతుల గురించే.
7. మీ కథల్లో ‘నోష్టాల్జియా’ గురించి మాట్లాడుతున్నారని ఒక విమర్శ ఉంది. మీరేమంటారు ?
   ‘నోష్టాల్జియా’ అంటే గతమంతా వైభవంగా ఉందని.. ఆ వైభవం ఇప్పుడు లేదనీ నేనంటున్నట్టా ? నా కథల్లో ఏ రైతూ ఎప్పుడూ సుఖంగా ఉన్నట్టు గానీ, భోగ
భాగ్యాలు అనుభవిస్తున్నట్టు గానీ రాసానా ? నా కథల్లోని రైతులు పండిన పంట అప్పులూ, పాయిదాలూ తీర్చడానికీ.. కళ్లం గట్టునే అన్నీ కొలిచి ఇంకా తీరని
అప్పులతో, ఖాళీ చేతుల్తో మిగిలిపోయిన వాళ్లే. ఆ జీవితమే బాగుందనీ, అలాగే ఉండిపోవాలనీ నా కథలు చెప్తున్నాయా ? అలా అన్న వాళ్లు నా కథలు
చదివారనుకోవాలా ?
8. ‘నాగలి’ దీర్ఘకావ్యం రాసారు కదా.. యంత్రానికి మీరు వ్యతిరేకమా ?
వ్యతిరేకమని ఎందుకనుకుంటారు ? నాగలి రైతుకు దొరికినంత సులువుగా, సౌకర్యంగా ట్రాక్టరు కూడా అందుబాటులోకొస్తే ఎవరు కాదంటారు ? ట్రాక్టరుని
నమ్మి నాగళ్లని దూరం చేసుకున్నాక ట్రాక్టరు యజమాని కాళ్ల దగ్గర పడిగాపులు పడే రైతుల దుస్థితి చూస్తే అర్ధమవుతుంది… దిగువ మధ్యతరగతి రైతు వేదన.
9. ” మార్క్సీయ భావజాలంతో జీవితాన్ని ఎంత వాస్తవికంగా అర్ధం చేసుకోవచ్చునో మీ కథలు రుజువు చేస్తున్నాయని” వొకరు, ”మార్క్సీయ భావజాలమే’ అంటే నమ్మశక్యం కాదనీ” మరొకరూ అన్నారు. మీరేమంటారు ?
ఎవరు ఏమనడానికైనా కథకుడి కంటే కథే ప్రధానం. అటువంటప్పుడు మార్క్సీయ భావజాలం ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించకపోవడానికి కారణమేమైయుంటుంది ?
కథంతా వదిలేసి.. మధ్యలో ఏదో వొక వాక్యాన్ని పట్టుకుని, అదీ సరిగా అర్ధం చేసుకోకుండా భావజాలాన్ని నిర్ణయించడం సరైంది కాదని నా అభిప్రా

10. పాట, కవిత, కథ రాశారు. నవల?
నవల రాయాలని బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వలన, ఆరోగ్య కారణాల వలన అనుకున్న పని చెయ్యలేకపోతున్నాను. అదీకాక కథ రాయడానికే నేను చాలా సమయాన్ని తీసుకుంటాను. నవల అంటే మరి ఎక్కువ సమయం
పడుతుంది. కానీ రాస్తాను.

11. ఇప్పటి ఉత్తరాంధ్రా కథాసాహిత్యాన్ని మీరెలా నిర్వచిస్తారు?
వర్తమాన కథ అస్తిత్వ మూలాన్ని అన్వే స్తుంది. ఈ విషయాన్ని అట్టాడ అప్పలనాయుడు కథ ‘షా’ బలంగా మాట్లాడింది. క్షతగాత్రగానం, శిలకోల, వరద ఘోష మరికొన్ని. ఇక్కడి కథా రచయితలు ఈ నేలకే ప్రత్యేకమైన కథలు రాస్తున్నారు. స్థానీయత వుంటేనే సార్వజనీనత వుంటుందని నిరూపిస్తున్నారు.

12. రేపటి ఉత్తరాంధ్రా కథ ఎలా ఉండాలనుకుంటున్నారు?
సాగరతీర గంగ పుత్రుల కథలు రాలేదు. మందస జీడితోటల కథలు రావాలి. స్త్రీ, దళితవాద కథలు యిక్కడ రావాల్సినంతంగా రాలేదు. కాబట్టి ఈ అన్ని మూలాల నుంచి కథలు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడయినా, ఏ కాలంలోనైనా కథ వొక సామాజిక
అవసరం. సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది.

13. సమాజపు అన్ని మూలాల నుంచి ఆయా కథలు రాకపోవడానికి కారణమేమంటారు?
ఒకటి కళింగాంధ్రాలో దళిత, స్త్రీవాద కథకులు లేరు. దళితుల నుంచి కథకులు రావాలి. ఎవరి జీవిత అనుభవాల్లోంచి, వాళ్ల వాళ్ల అనుభవసారాన్నుంచి వచ్చేవే అసలైన కథలు అవుతాయని నా నమ్మకం. నేను రాసిన ‘నాణెం కింద చీమ’ దళిత సానుభూతి కథ – కానీ స్వీయానుభవం నుంచి వచ్చిన కథైతే బలంగా వస్తువును ప్రకటిస్తుంది.

14. తెలంగాణాను, ఉత్తరాంధ్రాను సామాజికగా, సాంస్కృతికంగా ఎలా ముడికడతారు?
ముడి పెట్టడం కాదు గానీ అక్కడ జరిగిన ఉద్యమాన్ని యిక్కడ సాహిత్యం ప్రభావితం చేసింది. భూషణం కొండగాలిలో అదే చెప్పారు.
సంస్కృతి విషయానికొస్తే ఎవరి సంస్కృతి వాళ్లదే. ఆయా సంస్కృతుల నుంచి గొప్ప కథలు వచ్చాయి. ఉద్యమ సంబంధమైన కథలొచ్చాయి. కాబట్టే ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని యిక్కడి సాహిత్యకారులు సమర్ధించారు.

15. ఈనాటి సామాజిక నిర్మాణంలో ఉత్తరాంధ్రా కథాసాహిత్యం ఏ మేరకు తన పాత్రని నిర్వహించాలి?
ఏ ప్రాంత సాహిత్యానికయినా సామాజిక పరిణామంలో గొప్ప పాత్ర వుంటుంది. ఉత్తరాంధ్రాకే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా ప్రాంతాల
నిర్ధిష్టతల్లోంచి.. సాహిత్యం సామాజిక వికాసానికి దోహదపడుతుంది.

16. ఉత్తరాంధ్రా కథా రచయితలు కథానిర్మాణంలో కొన్ని కొత్త పోకడలు పోయినా మరీ వినూత్న పోకడలు పోకపోవడానికి కారణమేమిటి ? పోవాల్సిన అవసరం ఉందా ?
ఇక్కడి రచయితలకు ముఖ్యంగా జీవితం, జీవితంలో వ్యధ ముఖ్యం. ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని నమ్మడం ఒక కారణమైతే, ఆంగ్ల సాహిత్యంతో అంత ఎక్కువగా సంబంధం లేకపోవడం కూడా కారణమే. రాయలసీమ నుంచి తెలంగాణా నుంచి సీరియస్ గా సాహిత్యాన్ని సృష్టిస్తున్న రచయితలకూ ఇదే వర్తిస్తుందనుకుంటాను. ప్రయోగాలు ప్రతిభని చెప్పడానికే తప్ప చెప్పాల్సిన విధంగా జీవితాన్ని చెప్పవని నేను అనుకుంటున్నాను. అయితే ఏ ప్రయోగాలైనా కథా గమనానికే దోహదపడాలి గానీ ఆటంకం కాకూడదు. స్వానుభవ గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చిన ప్రయోగాలు మన సాహిత్యంలో వున్నాయనీ నేను నమ్ముతున్నాను.

17. మేజిక్ రియలిజం గురించి మీ అభిప్రాయం చెప్పండి?
భారతీయ ప్రాచీన సాహిత్యంలో మ్యాజిక్ రియలిజం ఉంది. ఇది మన సాహిత్యంలోకి కొత్తగా వచ్చింది కాదని నా అభిప్రాయం.

18. ఉత్తమ సాహిత్యానికి నిర్వచనం ఇవ్వండి?
ఒకేసారి – ఒక అర్థాన్నిస్తూ, అనేక అర్థాలను స్ఫురింపజేయాలి.

19. ఉత్తరాంధ్రా యువరచయితల గురించి రెండు విషయాలు చెప్పండి?
వర్తమాన సమస్యల మీద స్పందన, వ్యక్తీకరణ బాగుంది. కానీ సాహిత్య సృజన వొక దగ్గరే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం – ప్రధానంగా అధ్యయన లోపం . పూర్వ రచయితల సాహిత్యం విశృంకలంగా చదవాలి. కవిత్వం రాసేవాళ్లు – కారా, చాసో లాంటి కథకుల కథలని చదవటలేదు – సాహిత్యం మొత్తాన్ని చదవాలి. గొప్ప కవులు, గొప్ప కథకులు అనదగినవారు సాహిత్యప్రక్రియలన్నీ చెయ్యకపోయినా, చదివారు. అదే దోవలో యువరచయితలూ వెళ్లాలి. సాహిత్యతరాలలో ఖాళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వుంది –
ప్రతీ తరానికి. ఇక్కడి రచయితలంతా సార్వజనీనమైన మానవ జీవన వికాసాన్ని చెప్పే ప్రయత్నంలో యింకా చాలా చెయ్యాల్సి ఉంది.

20. ఇప్పుడు తక్షణం ఉత్తరాంధ్రా సామాజిక సాంస్కృతిక నిర్మాణం కోసం.. ఏం చేస్తే బాగుంటుంది?
సంస్కృతిని నిలబెట్టడానికి, సామాజిక పునర్వికాసానికి కవులు, కథకులు వొకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ వొక వేదిక మీద నుంచే వొకే గొంతుకగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు జరిగే చర్చ – సమాజానికి ఎక్కువ లభ్యతని చేకూర్చుతుంది.

21. విమర్శని మీరెలా తీసుకుంటారు?
నిర్మాణాత్మక విమర్శ ఎప్పుడూ ఉండాలి. రచయతకి విమర్శ సహాయకారి అవ్వాలి – దారి దీపం కావాలి అంతేగానీ ప్రత్యేకంగా పనికట్టుకొని వ్యంగ్యం విమర్శలోకొస్తే విమర్శకుడు కథకుని మీద ఆధిక్యతని ప్రదర్శించినట్టే. విమర్శకుడు స్నేహితుడిలా ఉండాలి. వైరిపక్షం కాకూడదు. జ్ఞానంతో పాటూ విమర్శకునికి సంయమనం ఉండాలి. అనుకోకుండా దుర్విమర్శ  రచయిత మీద చెడు ప్రభావాన్ని చూపిస్తే అది సాహిత్యలోకానికి చాలా నష్టమవుతుంది.

22. నేటి పత్రికలలో ఉత్తరాంధ్ర కథకి ప్రోత్సాహం ఎలా వుందనుకుంటున్నారు?
కొన్ని పత్రికలు – పేజీలు యిన్ని రాయాలి అని ; మాండలికం వుండకూడదు అని పెట్టే కొన్ని నిబంధనలు – నిరుత్సాహకరంగా కనిపిస్తున్నాయి.

23. ఉత్తరాంధ్రా ప్రాంతం నుంచి కొత్తగా వస్తున్న ప్రచురణ సంస్థల (ఉదాహరణకు – ‘సిక్కోలు బుక్ ట్రస్ట్’ ) గురించి మీ అభిప్రాయం?
ప్రచురణ సంస్థలు అవసరమే. ఉండాలి. ఎన్ని వుంటే అంత మంచింది. ఉత్తరాంధ్రా గొంతును బలంగా ప్రకటించడానికి పత్రికల అవసరమూ ఉంది.

ఇదీ గంటేడ గౌరునాయుడు మాస్టారు అంతరంగం. సాహిత్యం – మనిషి వొక్కటైనప్పుడు అంతరంగం సువిశాలమౌతుంది. గౌరునాయుడు మాస్టారు అంటే నాగావళి అలల ఘోష . ఆయన కథల నిండా ఉత్తరాంధ్రా. ఉత్తరాంధ్రా అంటే దానివైన కొన్ని ప్రత్యేక లక్షణాలు వున్నా ఈ ప్రపంచంలో ఎక్కడయినా వుండే వొక ప్రాంతం మాత్రమే. కథలు – అమ్మమ్మ చెప్పేవైనా, యిప్పుడు ముద్రణలోకి వచ్చినవైనా కథల్లో వొక జీవనాడి వుంటుంది. ఉత్తరాంధ్రా జీవనాడిని వ్యక్తం చేసినవే ఉత్తరాంధ్ర కథలు. మా గౌరునాయుడు మాస్టారు కథలు.

ఇప్పుడు ముస్లి౦ రచయితల బాధ్యత పెరిగి౦ది

images (1)

pachikaluషేక్ హుస్సేన్ అంటే కడప జిల్లాలో పేరున్న రాజకీయ నేత. కాని, సత్యాగ్ని అంటే నిప్పులాంటి నిజాన్ని కథలుగా చెక్కిన పేరున్న రచయిత. తెలుగులో ముస్లిం కథ అంటే ఏమిటో, అలాంటి కథలో ఎలాంటి జీవనం వుంటుందో మొట్టమొదటి సారిగా ప్రతిబింబించిన కథకుడు సత్యాగ్ని. రాసింది తక్కువే అయినా, మంచి కథకుడిగా ఆయన పేరు నిలబడడానికి కారణం ఆయన మాత్రమే చెప్పిన ఆ ముస్లిం జీవనమే! ఆయన సాధారణంగా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. సాహిత్యం గురించి ఎక్కువ నోరు చేసుకునే మనిషి కాదు. ముస్లిం సాహిత్యం ప్రాధాన్యం పెరుగుతున్న ఈ కాలంలో తొలి తెలుగు ముస్లిం కథకుడి అంతరంగ అన్వేషణ ఈ ముఖాముఖి- 

 

– మైనారిటీ సాహిత్యానికి కాల౦ కాని కాల౦ లో కథలు రాసారు. ఎలా౦టి సవాళ్లు ఎదుర్కొన్నారు ?

* అప్పుడు నేను ముస్లి౦ మత సిద్ధా౦తాలను కానీ సా౦ప్రదాయాలను గానీ విమర్శి౦చాలనే వుద్దేశ్య౦ ను౦చీ కాకు౦డా వాటిని ఆసరా చేసుకొని కొ౦దరు తమ స్వార్థ౦ కోస౦ స్వలాభ౦ కోస౦ దుర్వినియోగ౦ చేసిన స౦ఘటనలను కథలుగా రాశాను. కాబట్టి సా౦ప్రదాయవాదుల ను౦డి ఏ ప్రశ్న, ఘర్షణా ఎదుర్కోలేదు. రె౦డవది ఆనాటి ముస్లి౦ ఆచారాలను సా౦ప్రదాయాలనూ, ప్రచార౦ చేసే “గీటురాయి” పత్రికలో నా కథలు రావడ౦ వలన ఈ కథల్లో నిజ౦ వు౦ది గీటురాయిలో వస్తున్నాయి కాబట్టి రచయిత యిస్లా౦ ను తప్పు పట్టట౦ లేదు వాస్తవాలను చెప్తున్నాడనుకున్నారు. నా కథలకు ముస్లి౦ స్త్రీలు ఎక్కువ పాఠకులయ్యారు.

 – మీరు బయల్దేరినప్పుడు మీరొక్కరే, ఆ మార్గ౦లోకి ఎ౦తో మ౦ది చేరారు, మైనారిటివాద౦గా దాని విస్తృత ప్రభావాన్ని చూస్తే ఏమనిపిస్తు౦ది ?

*   చాలా స౦తోషపడతాను. నిజ౦గా చాలా స౦తోషపడతాను. మా కథ విస్తరి౦చడాన్ని హర్షిస్తాను. నేను రాసిన తర్వాత మొదటి మూడేళ్లు ఎవరూ రాయలేదు. కారణ౦ స౦ప్రదాయవాదులతో యిబ్బ౦దుల గురి౦చి భయ౦ కావచ్చు. ఇప్పుడు ఆ తలుగులు తె౦చుకొని చాలా మ౦ది రాస్తున్నారు. 1992 బాబ్రి విధ్వ౦స౦ చాలా మ౦దిని తట్టి లేపి౦ది. వుత్తేజితుల్ని చేసి౦ది. అప్పుడు నా కథలు చదవని వాళ్లు ఆ తర్వాత చదివారు. అఫ్సర్ కూడా అట్లానే చదివాడు. “పాచికలు” కథ ప్రచురణ గురి౦చి చాలా ము౦దే తెలియజేశాడు. మొదటి ముస్లి౦ కథ అని కూడా చెప్పాడు. ము౦దెవరన్నా రాసి౦టారేమోగానీ ఆ వివరాలు నాకు తెలీదు.

సింగమనేనితో ఒక సభలో...

సింగమనేనితో ఒక సభలో…

 ఇతర ముస్లి౦ రచయితల్లా కాకు౦డా పాలక వర్గ రాజకీయాల్లో వున్నారు కదా, వ్యక్తిగా రచయితగా మీమీద దాని ప్రభావ౦ ఏమిటి?

*   ఇవి రె౦డు నాకు వేరు వేరు ముఖాలు. వేరు వేరు పార్శ్వాలు. రె౦డూ కలపలేదు కలపను  కూడా . మీకొక వుదాహరణ చెప్తా. ఒక కలెక్టర్ వు౦డేవాడు. మీ జిల్లా (కర్నూల్) లో పెద్ద పోస్ట్ ను౦డి కడపకు వొచ్చి౦డ్యా హి౦దువే..షేక్ హుస్సేన్ అని చీటి రాసి ప౦పిస్తే ఇ౦టర్యూ యిచ్చేవాడు కాడు. ఏమబ్బా ఈయన అనుకొని, హి౦దూ పేరులా వు౦డే ‘ సత్యాగ్ని ‘ అని రాసి ప౦పిస్తే వె౦టనే పిలిచేవాడు. ఒగసారి యే౦ది సార్ ఇది అని అడిగితే , ” అవున౦డి  షేక్ హుస్సేన్ పేరుతో లోనికి రమ్మ౦టే , ఆ పనులు చేయాలా యీ పనులు చేయాలా అని రాజకీయాలు మాట్లాడుతారు. అదే సత్యాగ్నిగా లోనికొస్తే , మీరు సాహిత్య విషయాలు మాట్లాడుతారని సూచన కదా. తెలీని విషయాలు తెలుసుకు౦దామని వె౦టనే రమ్మ౦టాను ’ అన్నాడు, నిజమే కదా, సత్యాగ్నిగా రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. షేక్ హుస్సేన్ గా కథల్ని ఎప్పుడూ ప్రమోట్ చేసుకోలేదు. రె౦డు వేర్వేరుగానే వు౦చుకున్నాను.

  అసలు ఈ షేక్ హుస్సేన్ లోకి సత్యాగ్ని ఎలా వచ్చాడు?

* నిజానికి నన్ను సత్యాగ్నిని చేసి౦ది మా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. ” అరే తిక్క నాయలా షేక్ హుస్సేన్ పేరుతో ప౦పినావ౦టే ఎడిటర్ చూస్తాడో చూడడో రా. సత్యాగ్ని అని ప౦పూ హి౦దూ అనుకొని చూడనన్నా చూస్తాడు. ఒగటి గాకు౦టే వొకటన్నా వేస్తాడు”  అని నాకు సత్యాగ్ని తగిలి౦చాడు. కొ౦చె౦ పేరొచ్చిన తర్వాత మా గురువు గారు కూడా వు౦డిన సభలో ఒక వక్త నన్ను పొగుడుతూ సత్యమైన అగ్నిని కథలుగా రాస్తున్న షేక్ హుస్సేన్ అని అ౦టు౦టే , మా గురువుగారు అడ్డు తగిలి ‘వీని మొగ౦ వీన్లో సత్యమూ లేదూ, అగ్ని లేదూ, వీడు రాజకీయనాయకుడైనాడు, నేను పెట్టి౦ది సత్యాన్ని అగ్నిగా చెప్పేవాడని కాదు. సత్యాగ్ని అ౦టె జఠరాగ్ని, జ్ఞానాగ్ని…అగస్తుడు చెరువుడు నీళ్లనైనా హరి౦చుకున్నట్టు వీడు జ్ఞానాన్ని ఎప్పుడూ ఎ౦తైనా హరి౦చుకోవల్లని యీ పేరు పెట్నా’ అన్నాడు. అ౦దుకే ఆ తత్వాన్ని నేనేప్పుడూ గుర్తు పెట్టుకు౦టా.

HY08KADAPA-HUSSAIN_1646075f

 ముస్లి౦ వాద౦తో యిప్పుడు రాస్తున్న వాళ్ల గురి౦చి ఏమనుకు౦టున్నారు ?

* షరీఫ్, అఫ్సర్ వె౦టనే గుర్తొస్తారు. మాజిల్లా ను౦చి షరీఫ్ నా థాట్ ను కొనసాగిస్తున్నాడనిపిస్తు౦ది. అ౦టే స౦ప్రదాయాల్ని పనిగట్టుకొని విమర్శి౦చకు౦డా వాటిని స్వార్థానికి వుపయోగి౦చుకునే వాళ్లను విమర్శి౦చేది. నిజానికి ముస్లి౦ రచయితలకు ఖురాన్ మీదా, హదీసుల మీదా సమగ్రమైన అవగాహన లేదు. తెచ్చుకోవాలనే ప్రయత్న౦ కూడా కన్పి౦చదు. అట్లా౦టి అవగాహన లేకు౦డా రాస్తే రచన వెకిలిగా వస్తు౦ది. జనజీవితాల్లో పైపైన కని౦చే సమస్యల మీద మౌళికమైన  జ్ఞాన౦ లేకు౦డా రాస్తున్నారు గానీ చాలా మ౦ది ముస్లి౦ రచయితలు అ౦తర్గత స౦ప్రదాయాల మీద బలమైన అవగాహనతో విమర్శలు పెట్టడ౦ లేదు. బాహ్య౦, అ౦తర్గత౦ యీ రె౦డి౦టిని ఎవరూ సరిచేసుకోవడ౦ లేదు. ఉదాహరణకు వుగ్రవాద౦ ఇస్లా౦కు వ్యతిరేకమై౦దని మతసిద్దా౦తల్లోన్ని౦చే సాధికార౦గా చెప్పిన రచయితలు కనిపి౦చడ౦ లేదు. దీనికి కారణ౦  ముస్లి౦వాద రచయితలమనే వాళ్లు, అ౦తర్గత జ్ఞానాన్ని అనవసర విషయ౦గా అనుకోవడమే. నువ్వు గ్రామ౦ గురి౦చే రాయి అక్కడ నీకు ఎదురు పడే ముల్లాను సక్రమ౦గా ఆయన దారిలోనే ఎదుర్కో. అది గావాల.

 మతతత్వ౦ పెరిగిపోయి౦ది, బి.జె.పి అధికార౦లోకొచ్చి౦ది కర్తవ్వమేమిటి?

* మైనారిటి మతాలు మరీ ముఖ్య౦గా ఇస్లా౦ను బూచిగా చూపి వ్యతిరేక౦గా ప్రభావిత౦ చేస్తున్నారు. ఖురాన్  హదీసులు తెలుగులోనూ వచ్చాయి. అవి చదివితే అ౦దులోని సత్యాల వల్ల ప్రవక్తనూ, అల్లానూ సరిగా చూపుతున్నామా లేదా తెలిసిపోతు౦ది. పరమత సహన౦ గురి౦చీ , జీహాద్ గురి౦చి ఇస్లా౦ ఏమ౦టు౦దో కూడా తెలుస్తు౦ది. ఇవన్నీ ముస్లి౦ సమూహ౦లోకి తీసుకెళ్లాల. బయట మతల్లోనూ ఇస్లా౦ నిజతత్వ౦ గురి౦చిన వాళ్ల భయాలన్నీ నిజాలు కావని చెప్పగలగాలి. ముస్లి౦ రచయితలు తమ మతపు పై పై లోపాల్ని మెజారిటి మతపు కళ్లతోనే చూస్తున్నారేమో. అట్లాగాకు౦డా అ౦తర్గతమైన చర్చ వొగటి గావాల. అసలు ఇస్లా౦ అ౦టేనే ‘శా౦తి’ . ఆ స౦దేశ౦ తెలియజేయాల. ఏ చారిత్రిక కారణాలతో ముల్లాలు ప్రవచిస్తున్న గిడసబారిపోయిన ఆచారాలు అసలైన ఆచారాలుగా చెలామణీ కావడాన్నీ వివరి౦చాల. ప్రజలకు సత్యం  చెప్పడ౦ ద్వారా, సామరస్యాన్ని సాధి౦చవచ్చు. ఇప్పుడు ముస్లి౦ రచయితల బాధ్యత పెరిగి౦ది.

  రాష్ట్ర౦ విడిపోయి౦ది. ఐక్యత దెబ్బతిని౦ది. మరీ ముఖ్యా౦గా మైనారిటి వాద౦ బలహీన పడి౦దని కొ౦దరు అ౦టున్నారు. మీరు ఏమ౦టారు ?

* నిజమే…తెల౦గాణా,  రాయలసీమల్లోని ముస్లి౦ రచయితల ఐక్యత ప్రాభావ౦త౦గా వు౦డేది. అది బలహీన పడి౦దని నేను అనుకు౦టున్నా.

 కోస్తా౦ద్ర ఆధిపత్య౦ స్పష్ట౦ అవుతో౦ది. రచయితగా రాజకీయవాదిగా మన ప్రతిక్రియ ఎలా వు౦డాలి అని అనుకు౦టున్నారు ?

* వేరుగానే చూస్తారు. చూడడ౦లోని ఆ అధిపత్య పీడన మరోక వుద్యమానికి అవకాశ౦ అవుతు౦ది. యిప్పుడే నేనయితే రాయలసీమ వుద్యమాన్ని అ౦దుకోవాలి అని అనుకోను. వాళ్ల ప్రతి క్రియ మేరకు వాళ్ల మన పట్ల చూపే బాధ్యతరాహిత్య౦ మేరకు మన అడుగులు వు౦టాయి. మరో వుద్యమ౦ రావాలా వద్దా వాళ్లే నిర్ణయ౦ చేస్తారు. సీమ మౌళిక అవసరాలు తీర్చాల. అది కోస్తా బాధ్యత. లేద౦టే తిరస్కార౦ చేస్తే తిరుగుబాటు చూస్తారు.

షరీఫ్ ని అభినందిస్తూ...

షరీఫ్ ని అభినందిస్తూ…

    షేక్ హుస్సేన్ సత్యాగ్ని యిప్పుడు ఏ౦ చేయబోతున్నాడు?

*  మళ్లీ కథలు రాస్తా. సత్యాగ్ని కథల పేరుతో పుస్తక౦ వస్తో౦ది. యిక ముమ్మర౦గా రాస్తా. ఆ వొరవడిలోనే పడ్డా. అటక మీద వున్న వాటిని ది౦చినా. ము౦దు కాలమ౦తా రాయడమే .

  రాయలసీమ నవల మరీ ముఖ్య౦గా మైనారిటి నవల అస్సలు లేదు. యి౦త జీవిత౦ చూశారు. మీరే ఎ౦దుకు పూనుకోకూడదూ ?

* అవును రాస్తాను కథ స౦కలన౦ పని అయిపోతూనే ఒక నవల ఎత్తుకోవాలనే వు౦ది. గ్రామీణ ముస్లి౦ జనజీవితాలని చిత్రిస్తూ రాస్తా. ఆత్మ కథ రాస్తే మ౦చి జీవిత విశేషాలు వెలికి వస్తాయి గాని మొదట నవలే రాస్తా…

 ముఖాముఖి:

జి.వె౦కటకృష్ణ

 

మౌనం సంధించిన బాణం కామన్ మాన్: ఆర్కే  లక్ష్మణ్

తేదీ గుర్తులేదు కానీ అది 1985 సంవత్సరం.
 
అప్పుడు నేను శ్రీ పద్మావతీ విశ్వ విద్యాలయం లో జర్నలిజం విద్యార్థినిగా ఉన్నాను. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, తిరుపతి  వారి జాతీయ అవార్డులు అందుకోవడానికి ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్, ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్, ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తదితరులు అవార్డ్స్ అందుకోవడానికి తిరుపతి వచ్చారు.  
 
మా జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ శర్మ గారు, లెక్చరర్  వి. దుర్గా భవాని గారు  ఆర్కే  లక్ష్మణ్ ని మా యూనివర్సిటీ కి ఆహ్వానించారు. (అప్పట్లో మా యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజి ఆవరణలోనే ఉండేది).  అలా జర్నలిజం విద్యార్థులుగా ఆర్కే  లక్ష్మణ్ ని ఇంటర్ వ్యూ చేసే అరుదైన అవకాశం మాకు దక్కింది.

అప్పటికి  ఆర్కే  లక్ష్మణ్ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ.  మాల్గుడి డేస్ రచయిత ఆర్కే  నారాయణ్ సోదరుడని మాత్రమే తెలుసు..  ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ వాతావరణం నుండి వెళ్ళిన నేను జర్నలిజం లో చేరిన తర్వాతే హిందూస్తాన్ టైమ్స్ పత్రిక గురించి విన్నాను.  మా శర్మ గారు ఇంటర్ వ్యూ చేయడానికి సిద్దం అవ్వమన్నారు.  ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు కొత్త.   మా లైబ్రరీలో ఉన్న హిందూస్తాన్ టైమ్స్ పేపర్స్ తిరగేసి అయన కార్టూన్స్ చూసి కొంత అవగాహన చేసుకొని ఇంటర్ వ్యూ కి సిద్దమయ్యాం. జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ విద్యార్థులుగా మేం చేసిన మొదటి ఇంటర్వ్యూ  ఆర్కే  లక్ష్మణ్ దే.

అతిసామాన్యంగా కనిపిస్తూన్న ఆర్కే  లక్ష్మణ్ అతని భార్య కమల గారితో కలసి మా యూనివర్సిటీకి వచ్చారు.   అతి సౌమ్యంగా కన్పిస్తున్న ఇతని కార్టూన్స్ బుల్లెట్స్ లా పేలుతున్నాయా.. రాజకీయ నాయకుల గుండెల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయా.. వారిలో కలవరం కలిగిస్తున్నాయా అని ఆశ్చర్యంగా ఆయనకేసి చూశాం.
10945637_10203558629236835_6306386002277021008_n

అప్పుడు మేం ఆయనతో చేసిన ముచ్చట్ల  జ్ఞాపకాలు మీ కోసం ….

*కామన్ మాన్ సృష్టి కి కారణం

– సాధారణ పౌరుడిగా ఆలోచించడమే (చిరునవ్వుతో )

*ప్రతి రోజు కొత్త దనంతో ఎలా జనం ముందుకు రాగలుగుతున్నారు. అసలు అంత వైవిధ్యంతో కూడిన కార్టూన్స్ కు సరుకు ఎక్కడి నుండి వస్తుంది ?

– ఆయన చిన్నగా నవ్వేసి  ఇంటి నుండి ఆఫీసుకి , ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు బస్ స్టాప్ లో నుంచొని సామాన్యుడి జీవితాన్ని పరిశీలించడం.  ప్రజల ఆశలను, ఆకాంక్షలను మన రాజకీయ నాయకులు స్వార్ధంతో ఎలా కాలరాస్తున్నారో వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో నాకక్కడే తెలిసేది. వారి ఆలోచనల్ని మౌనంగా పరికించడం మూలంగానే నా కామన్ మాన్ బతుకుతున్నాడు.
*అందుకే మీరు సృష్టించిన కామన్ మాన్ కూడా మౌని ..?
– ఆ మౌనంలోంచి సంధించిన బాణం కామన్ మాన్

* మీ వ్యంగ్య చిత్రాలతో ప్రముఖ నేతలందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు కదా .. ఆ రాజకీయ నాయకుల కేరికేచర్ల  వల్ల ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా .. 

– జవహర్ లాల్ నెహ్రూ ప్రతి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో తన గురించి కార్టూన్ ఏమైనా వచ్చిందా అని చూసుకునే వారనీ. కొందరు నాయకులు మొహాన్ని కందగడ్డలా ఎర్రబరుచుకునేవారనీ .  కొందరు నవ్వుకునే వారనీ . ఇందిరా గాంధీ మాత్రం అసహనం ప్రదర్శించే వారనీ విన్నాను.  అంతకు మించి ప్రత్యక్షంగా ఎలాంటి ఇబ్బంది పడలేదు.
* మీరు మీ వ్యంగ్య చిత్రణ లో ఏ నాయకుడినీ వదలలేదనుకుంటా .. ?
– అవును . (అంటూ ఆనాటి సంఘటనల ఆధారంగా వచ్చిన కార్టూన్లకి ప్రజల స్పందన, రాజకీయ నాయకుల ఆక్రోశం గురించి చాలా చెప్పారు కానీ అవి నాకు సరిగ్గా జ్ఞాపకం లేక రాయలేకపోతున్నా)

*మీరు హిందూస్తాన్ టైమ్స్ నుండే కార్టూనిస్టు గా జీవితం ప్రారంభించారా?

– మొదట్లో కన్నడ పత్రికకి పనిచేశాను. ( పేరు చెప్పారు. కాని నాకది గుర్తులేదు )

* మీకు స్ఫూర్తినిచ్చే కార్టూనిస్టు ఎవరు ?

– ఒక బ్రిటిష్ కార్టూనిస్ట్ ని నేను చాలా అభిమానిస్తాను.
( దాదాపు 30 ఏళ్ళ క్రితం నా  జ్ఞాపకాల మడతల్లో దాగిన విషయాలు ఇప్పుడు కొన్ని తుడుచుకుపోయాయనుకుంటా … )

*అసలు కార్టూన్స్ వేయాలని ఎందుకనిపించింది .. ?
– కార్టూన్స్ అని కాదు కానీ చిన్నప్పటి ఏవేవో గీతలు గీసేసే వాడిని.  అంతా  బొమ్మలు బాగా వేస్తున్నావ్ అనేవారు. అంతకు ముందు నుంచే బొమ్మల పుస్తకాలు బాగా చూసే వాడిని.  అలా రకరకాల బొమ్మల పుస్తకాలు చూసి చూసి బొమ్మలపై అభిరుచి నాకు తెలియకుండానే ఏర్పడింది కావచ్చు. ఎక్కడపడితే అక్కడ బొమ్మలు గిసేవాడిని. మా ఇంటి గోడల్ని, తలుపుల్ని నా బొమ్మలతో పాడుచేసేవాడిని.  మా పంతుళ్ళ బొమ్మలూ గీసేవాడిని .  నేను గీస్తున్న చిత్రాల్ని చూసి మెచ్చుకున్న మా టీచర్లు నాలో మరింత ఉత్సాహం నింపారు. ఆ తర్వాత మా అన్నయ్య  నారాయణ్ రాసిన మాల్గుడి డేస్ కి, ఇతర కథలకి బొమ్మలు వేసేవాడిని.
* మీకు పద్మ భూషణ్, రామన్ మెగ్సేసే అవార్డ్ వచ్చాయి కదా .. అభినందనలు
– ఆ పురస్కారాలు నావి కాదు నా కామన్ మాన్ వి.
సునిశిత హాస్యం, చమత్కారంతో కామన్ మాన్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చి, సామాన్య మానవుడి పక్షాన నిలిచి రాజకీయ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించే ఆర్కే  లక్ష్మణ్ భౌతికంగా మనమధ్య లేక పోయినా ఆయన సృష్టించిన కామన్ మాన్, ఆయన చిత్రాలు, వ్యాసాలూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.
-వి. శాంతి ప్రబోధ

“మన చరిత్ర మనమే చెప్పాలి, అందుకే ఈ సినిమా!”

10672304_573040749466414_4661177908740559609_n

సయ్యద్ రఫి పచ్చి తెలంగాణ వాడు. తెలంగాణ వాడిలో ఉండే కలిమిడి తత్వం రఫిలో కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంస్కారం అణువణువు జీర్ణించుకొని ‘నిజాయితే బలం’గా కనిపించే రఫిని నేను ఇంటర్యూ చేసే మొదటి వ్యక్తి కావడం నాకు గర్వంగా ఉంది. ఏ నటుడైనా దర్శకుడైనా టెక్నీషియనైనా పరిశ్రమలోని బడేబాబుల అండదండలు ఉంటే తప్పా ఎదగలేరు. కానీ సినిమా నిర్మాణంలో ఎటువంటి శిక్షణ తీసుకోకుండా, ఏ సినీ నిర్మాత గడప తొక్కకుండా, ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన సాదారణ వ్యక్తి తన అవకాశాన్ని తానే కల్పించుకొని, తన కళా సంపదనే పెట్టుబడిగా పెట్టి, చాలా వ్యయప్రయాసలతో నిజాయితితో దృడసంకల్పంతో స్వయంశక్తిని నమ్ముకొని కేవలం ఇరవైఐదు సంవత్సరాల వయసులో ‘మధురం’ సినిమా నిర్మించి విడుదల చేయడం అనేది సామాన్య విషయం కాదు.

ఆ సినిమాలోని ఇరవైనాలుగు శాఖల్లో కెమెరా, ఎడిటింగ్‌, మేకప్‌ శాఖలు మినహాయించి తన బహుముఖప్రజ్ఞలతో అన్ని శాఖలు ఆయనే స్వయంగా నిర్వహించడం ఓ ప్రపంచరికార్డు.. ఆ సినిమా సాదించిన విజయం చిత్రపరిశ్రమలో 2002వ సంవత్సరం నుండి చిన్నసినిమాలకు దారి చూపించింది. అప్పటి నుంచి లోబడ్జెట్‌ చిత్రాల ఒరవడి కొనసాగింది.

“ఇంకెన్నాళ్లు” సినిమాలో మూడు తరాల వాస్తవాలను ప్రజలకు చూపించడం కొన్ని శక్తులకు ఇష్టంలేక, సినిమాను అడ్డుకున్నప్పుడు ఆర్దిక భారాన్ని లెక్క చేయకుండా వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా, సినిమాను సిటికేబుల్‌ ద్వారా ప్రజలకు ఉచితంగా చూపించి, జనాన్ని జాగృతం చేయడంలో సఫలీకృతమై ఉద్యమానికి తోడ్పడిండు. సినిమా సాదించిన నంది అవార్డులు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకుపోయిన తీరు ఆయనకు సంతృప్తినే మిగిల్చింది.

ప్రస్తుతం ఆయన దర్శకనిర్మాణంలోనే విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటున్న రెండు సినిమాలతో ఉత్సాహంగానే ఉన్నడు. మరోవైపు హైద్రబాద్‌ నగర ‘ఖైరున్నిసా’ చారిత్రాత్మక ప్రేమకథను హాలివుడ్‌లో చిత్రీకరించడానికి డైరెక్టర్‌గా అవకాశం రావడం ఆయనలో నూతనోత్తేజాన్ని నింపింది..

@ ‘ఖైరున్నిసా’ చరిత్రను హాలివుడ్‌లో డైరెక్షన్‌ చేసే అవకాశం ఎలా వచ్చింది?

– మన ఇంకెన్నాళ్లు సిన్మా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ జేసినప్పుడు కొంతమంది NRIలు దాన్ని షేర్‌ చేయడం చూడడం జరిగింది. UKలో స్కాటిండస్‌ ప్రొడక్షన్‌ లిమిటెడ్‌ అనే గ్రూప్‌ 1947 చరిత్రను బాగనే చూపియ్యగల్గినని ఒక నిర్దారణకొచ్చి ఇంగ్లీష్‌లో ఒక సిన్మా తీద్దాం అది మన డక్కన్‌ హిస్టరీకి సంబందించి కులీకుతుబ్‌షా ఇంకా మన నిజాం కాలంనాటి చూపించతగ్గ కథ ఏదీ ఉన్న పర్వాలేదని నాకు తెలియపర్చిన్రు. తెలంగాణ హిస్టరీ సొసైటిలో తడకమల్ల వివేక్‌ నాకు పరిచయం కాబట్టి తెలంగాణలో మరుగున పడిపోయిన చరిత్ర, సిన్మాకు పనికొచ్చే కథ కోసం సంప్రదించడం జరిగింది. అప్పడు వాళ్లు నాకు ‘సలాం హైద్రబాద్‌’ అనే బుక్‌ ఇచ్చిన్రు. ఆ బుక్‌ల రకరకాల టచ్చెస్‌ ఉన్నయ్‌ కాబట్టి ఆ బుక్‌ మీరు సదివితే మీకు నచ్చేదేదన్న ఉంటే మీకు సిన్మాకు పనికొస్తుందని చెప్పారు.

అయితే నేనా బుక్‌ సదువుతూ సదువుతూ పోతావుంటే ఒక నాలుగు పేజీలు ఖైరున్నిస గురించి కూడా సదివిన అంత బుక్‌లో ఆమె గురించి నాలుగే పేజీలు ఉన్నప్పటికీ అది నన్ను టచ్‌ చేసిందన్నమాట. అది ఎందుకు టచ్‌ చేసిందంటే ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రిలేషన్‌ మీద తీయడానికి చాన్స్‌ ఉంటది. మంచి యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ ఐతది. సినిమా అన్నప్పుడు మతాలు కులాలు అని కాకుండా ఒక ఆకర్షణ, ఆత్మీయత, ఆత్మానుబందం అనేవి ఎవరితోనైనా ఎవరికైనా ఐతదని ఆకథల కనిపిస్తది.

అటు ఇంగ్లీషొల్లు ఇటు దక్కన్‌ ఇస్లామీలు ఉన్నరు కదా సమాజానికి గ్లోబల్‌గా రెండు సంస్కృతులు సూపించొచ్చు అనే భావన కలిగింది నాకు. ఎందుకంటే చారిత్రాత్మకంగా ఎన్నో సిన్మాలు వచ్చినయ్‌గని మనసును రంజింపజేసే ప్రేమే సక్సెస్‌ అయింది. ఇప్పుడు టైటానిక్‌ సిన్మాలో షిప్‌ స్టోరి ఉన్నప్పటికీ అందులో అంతర్లీనంగా ఓ దనవంతురాలికి ఒక గరీబోడికి మద్య ఉన్న ప్రేమనే టైటానిక్‌ సిన్మాను నడిపించింది. ఐతే ప్రేమ ఇది బాగుంటదని డిసైడ్‌ చేసుకొని ఆ బుక్‌లో ఆయన రాసిన రెఫరెన్సెస్‌లోని వైట్‌మొగల్స్‌ అవి ఇవి కూడా సదివిన.

ఐతే ఆ ‘వైట్‌ మొగల్స్‌’ బుక్‌ రాసిన విలియం డార్లింపుల్‌ ఏక్‌నెంబర్‌ బట్టెబాజ్‌ అనిపించింది నాకు. మొత్తం చరిత్రనే ఇంగ్లీషొల్లను హైలెట్‌ చేస్తూ వాళ్లు చేసిన బద్మాష్‌ పనులు కప్పిపుచ్చి ఇక్కడునొల్లందరిని బేకార్లు, బేకూబ్‌లనట్టు రాసిండు. మనమేమో ఆకథను సూపిచ్చేటట్టు లేదు చెప్పేటట్టు లేదు రేపు వచ్చే తరాలుగూడ అదే నిజమనుకునే ప్రమాదం కూడా ఉంది. ఐతే నేనొక సిన్మా వాన్ని కాబట్టి ఒక ఫిలింమేకర్‌గా పుస్తకాలు రాయకున్నా, నా సినిమా ద్వారా అసలు హిస్టరీ ఏందనేది ఆ బుక్‌ రాసిన వారికి దీటుగా ఎవరిది తప్పో నిరూపించుకుంటూ, ఉన్నదున్నట్టు యదార్దగాదను ఉన్న వాస్తవాలను కళారూపంగా చూపించే ప్రయత్నంగనే ఒక బాద్యతగా భావించి ఈ కథను ఎన్నుకున్న.

10628497_549147898523967_2784754594223428916_n

@ ఆ కథపై మీరు చేసిన పరిశోధన ఏంటి?

– పుస్తకాలే గనక తీసుకుంటే వారు వక్రీకరించిన చరిత్రే ఉంటది. ఐతే బతికున్న ముసలొల్లు, పాత నవాబుకాలం నాటి వాళ్లు వారి పెద్దల ద్వారా విన్నవి కూడా ఉంటయ్‌. కొందరు పెద్దపెద్ద జర్నలిస్టులుంటరు కదా పాశం యాదగిరి లాంటొళ్లు ఉంటరు కదా పెద్దపెద్దొల్లు వాళ్లను కూడా సిన్మా అని చెప్పకుండనే అసలీ ‘ఖైరున్నిసా’ ఏంది అని తెలుసుకున్న. సుల్తాన్‌బజార్‌ పోయిన అక్కడ లొకేషన్లు సూశిన, చౌమహల్లా ప్యాలెస్‌ డైరెక్టర్‌కాడికి పోయి మాట్లాడిన ఒక ఖైరున్నిస అనే ఇన్నోసెంట్‌ అమ్మాయిని ఎట్ల ఎక్స్‌ప్ల్రాయిడ్‌ చేసింన్రు అనేది వీళ్లు రాసిన చరిత్రలో ముఖ్యంగ ఉన్నది. ఖైరున్నిసను పొందడానికి కిర్క్‌ పాట్రిక్‌ తన పేరే మార్చుకున్నడు పెళ్లి కూడ నిఖా రూపంల చేసుకున్నడు. ఆయన పేరు సుల్తాన్‌ అని మార్చుకోవడంవల్ల ఇప్పుడు సుల్తాన్‌ బజార్‌కు ఆ పేరొచ్చింది. తర్వాత ఆమెకు పుట్టినటువంటి బిడ్డలను కూడా ఆమెకు చూసే యోగ్యం లేకుండా ఇంగ్లీషొల్లు పట్టుకపోయింన్రు. నా ప్రకారంగా నేనేమంటున్నానంటే ఆకర్షణ ఉండొచ్చు, ప్రేమగూడ ఉండొచ్చు. కాని ప్రేమ అనేది ఒకర్ని పటాయించుడు గిట్లాటివి ఉండయ్‌. ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకునేవి ఉంటయ్‌. వారిద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జీవించడం కూడా స్వచ్ఛమైన ప్రేమ ఇద్దరి మద్య నాకు కనిపించింది. తర్వాత చేసే పనులు ఏదైతే ఉన్నయో అది తప్పు. దాంట్లో ఇవ్వన్ని విషయాలు ఎంతబాగున్నయంటే చూసేటోనికి కూడా ఆలోచింపచేసి మనసును టచ్‌ చేయగల్గుతం అన్నట్టు. మనం కరెక్టుగా పాత్రలను తీయగలగడం అనేది చాలెంజింగ్‌గా ఉంటదనేది నా అభిప్రాయం.

@ ‘ఖైరున్నిసా’లో నటీనటులెవరు? వారి ఎంపిక ఎట్లుంటది?

– క్రిక్‌పాట్రిక్‌, రస్సెల్‌ వంటి పాత్రలకు అక్కడ బ్రిటీష్‌ లేక స్కాటీష్‌ యాక్టర్‌ల కోసం యాడ్‌లు కూడా ఇచ్చిన్రు ఆడిషన్‌గూడ మొదలైంది. ఇక్కడ నాదే లేటుంది ఖైరున్నిసగా ఒక కొత్త హీరోయిన్‌ ఉండాలని చెప్పిన. హైద్రబాద్‌లగాని, డిల్లీలగాని ఖైరున్నిస, ఖైరున్నిస బందువుల పాత్రలు వెతకాలిగ. నేనింక ఆడిషన్‌ ఎందుకు మొదలు పెట్టలేదంటే నేను ఏదైతే కమిటై ఉన్ననో ఇంకో వారం పదిరోజులల్ల అన్ని ముగించుకొని నేనిగ ఖైరున్నిస వేటనే ఫస్టు ఉంటదిప్పుడు.

@ ఇంతకు ముందు మీ సినిమాల్లాగ ఈ సినిమాలో మీరు నటిస్తున్నరా?

– లేదులేదు. నేను జస్టు డైరెక్టర్‌నే డైరెక్షనే పెద్ద క్యారెక్టర్‌ నాకు. అది కరెక్ట్‌ చేస్తే చాలు నాకు. ఇంకోటేంటంటే అనుకోకుండా మాటల మద్య నేనొక నాలుగైదు లైన్‌లు ఉర్దుల కొన్ని గజల్స్‌ వాళ్లకు చెప్పిన. అది విని నన్నే మ్యూజిక్‌ చేయమంటున్రు. ఇంగ్లీషొల్లకు అల్పసంతోషం వుంటది. ఈ సిన్మాలో కవ్వాలీలు, సూఫియానా మ్యూజిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ చేయాల్సి ఉంటది అది వాళ్లు నన్నే చేయ్యమంటున్రు. మ్యూజిక్‌ అనేది నా అభిరుచే ఇంకెన్నాళ్లు సినిమా అన్నిట్లో కూడా సందర్బానికి తగినట్టుగా చెయ్యగల్గిన ఐతే ఎవరైన సమర్దులు ఉంటే వారికి బాద్యతలు అప్పగిస్త. సంగీతానికైతే పెడితే రెహమన్‌నే పెట్టాలే లేకపోతే రెహమన్‌ అంతటి టాలెంటై ఉండాలి.

@ మీరు ఇంగ్లాండ్‌లో ఉన్న NRIలతో అక్కడికి వెళ్లి కలిసిన్రా లేకుంటే ఇక్కడ్నుంచే సంప్రదింపులు చేసిన్రా?

– వాళ్లను కలవక ముందే హైద్రబాద్‌ హిస్టారికల్‌ సబ్జెక్ట్‌ గురించి ఇండియాలో ఉన్నప్పుడే కథ చెప్పిన. వారి కోరిక మేరకు రడీ చేసుకున్న. ఒక సంవత్సరం క్రీతం UKలో ఉన్నవారి పిలుపు మేరకు ఇంగ్లాండ్‌ కూడా వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత వారితో ముఖాముఖి చర్చలు కూడా చేసిన. అక్కడున్న లొకేషన్లు కూడా చూసి సినిమా ప్రొడక్షన్‌ ఎట్లుంది అన్ని స్టడీ చేసుకొని, విలియం వర్డ్‌స్‌వర్త్‌ ఉన్న ఇల్లు కూడా చూసి అక్కడ నెలరోజులు ఉండి వచ్చిన. అక్కడ వాళ్లు చెప్పేదేమంటే ఇక్కడ మొత్తం మేం సెట్‌ చేసుకున్న తర్వాత మీకు మేం తెలియపరుస్తం మీరు మాత్రం మీ ప్రిపరేషన్ల మీరు ఉండురి. మేం ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు మీరు సిద్దంగా ఉండాలే అని చెప్పిన్రు. నేనొక డైరెక్టర్‌గా నేనేం డిమాండ్లు, కండీషన్లు ఏం పెట్టలే నాకు నేనున్న నాస్థాయికి నాకా అవకాశం రావడమే ఒక వరం.

వాళ్లది ఎట్లుంటదంటే పక్క డాక్యుమెంటేషన్‌లాగా ఉంటది. మన హైద్రబాద్‌ కల్చర్‌ కూడా ఇంగ్లీషొల్లకు చూపిస్తే బాగుంటదనే థాట్‌ కూడా వాళ్లకు ఉన్నట్టుంది. వాళ్లు నన్ను ఎంచుకుంటానికి కారణం ‘ఇంకెన్నాళ్లే’ ముఖ్యమైన పునాది అన్నట్టు. దాంట్లె పాత జమాన తెలంగాణ యాస, భాష, కట్టుబొట్టు మన హద్దులో ఉన్న బడ్జెట్‌తోని ఏదైతే సానుపు వాకిళ్లు పెంకుటిండ్లు, మట్టిగోడలు, మోటబావి, పటేలు, పట్వారీ, దొర గడీలు, దొరసాన్లు ఇవన్ని ఏదైతే సూపియ్యగల్గినమో అక్కడ వాళ్లకు అది నచ్చి ఇంకెన్నాళ్లు సిన్మాకు కాంప్లిమెంట్‌ ఇచ్చి నన్ను పిలవడం జరిగింది. అది చూసి చరిత్రమీదనే తీయాలనే ఇంట్రెస్టు వాళ్ళకు కలిగిందన్నట్టు. ఐతే ఆ చరిత్రకు అక్కడొల్లు వచ్చి డైరెక్షన్‌ చేసేదానికంటే నేనొక ముస్లీం తెలుగు కూడా వస్తది అని ఆలోచించి నన్నే చేయమని చెప్పిన్రు. అక్కడ UKకు పోయినప్పుడే తెలంగాణ NRI ఫోరం కూడా నాకు మెమొంటో ఇచ్చి సన్మానం చేసిన్రు.

@ మరి ఇంతకాలం ఈ విషయం ఎందుకు చెప్పలేదు?

– ఐతే ఇప్పటికి గూడా ఈ సిన్మా గురించి బయట పట్టే ఉద్దేశ్యం లేదు నాకు. ఎందుకంటే సినిమా ప్లాన్‌జేసుడు వేరు, తయారవుడు వేరు, రిలీజ్‌ అవుడు వేరు ఎన్నో ఉంటయ్‌ దాంట్ల. అది చెప్పినంత సులువుగా ఉండది కాబట్టి దాన్ని ప్రాక్టకల్‌గా జరిగినప్పుడే బయటకొద్దాం అనుకున్న. కాని అది ఎట్ల బయట పెట్టిన్నో చెప్తనీకు. వారం రోజుల క్రీతం ది హిందూ పేపర్లో రెసిడెన్సీ బొమ్మపెట్టి, చౌమహల్లా ప్యాలెస్‌ బొమ్మపెట్టి ఖైరున్నిసా సినిమా రాబోతుంది అని ఒక వార్త ఒచ్చింది. అది సదివి నేను పర్షానైనా ఖైరున్నిస గురించి నేను కాకుండా ఇంకెవడన్నా తీస్తుండా లేకుంటే నేనిచ్చిన కథనే ఏమన్న ఇంకేదన్నా జరుగుతుందా అని వందడౌట్లు వస్తయ్‌గదా మనం ఆలోచించుకున్న కథ గురించి ఎవడు తీస్తుండో పేపర్ల లేదు. ఐతే నేను హిందూ పేపర్‌ ఎడిటర్‌కు మేయిల్‌ రాశిన. ఈ కథ గురించి నేనొక సంవత్సరం నుంచి ప్లాన్‌ చేసి ఉన్న కాని మీ పత్రికల వచ్చినట్టు ఆ సినిమా ఎవరు చేస్తున్నరో వివరాలు కావాలని నేను ఈమేయిల్‌ చేసిన.

ఆ ఈమేయిల్‌ ఏమైందంటే యూనుస్‌ లసానియా అని ఆ వార్త రాసిన జర్నలిస్టుకు ఆ ఎడిటర్‌ ఫార్వర్డ్‌ చేసిండు. అది చూసి ఆ యూనుస్‌ లసానియా నాకు ఫోన్‌ చేసి రఫిబాయ్‌ మీరు ఖైరున్నిసా మీద సినిమా తీస్తున్నరట కదా ఎప్పుడు కలవాలే అని అడిగిండు. ఒకరోజు కలిసినప్పుడు నేను ఆవార్త గురించి అడిగితే, ఏం లేదు ట్విట్టర్‌లా విలియం డార్లింపుల్‌ రెండు సంవత్సరాల తర్వాత ఇది సినిమా తియ్యెచ్చు అని ఒక హింటిచ్చిండు ఓహో దీని మీద ఈయన ఆలోచిస్తుండా అని పేపర్ల రాసినం అంతే అని ఆ జర్నలిస్టు చెప్పిండు. తర్వాత మనం తీయబోయో ఖైరున్నిసా వివరాలు తీస్కొని హిందూ పేపర్ల ఫోటోతోని మంచిగనె కవరేజిచ్చి బూస్టప్‌ ఇచ్చిండన్నట్టు. మనం ఇగ మార్కెట్‌ల బయటపడ్డం. ఇగ తప్పదిగ అన్ని పేపర్లకూడా ఇచ్చిన్రు. హిందూల వచ్చిన ఆర్టికల్‌ను అటాచ్‌ చేసి స్కాటీష్‌ వాళ్లకు మేయిల్‌ చేసిన. అయితే వాళ్ల నుంచి నాకు ఫోనొచ్చింది మేమే ఫోన్‌చేద్దాం అని రడీగున్నం మీరు సిద్దమైపోన్రీ 2015 జనవరిలో మొదలు పెట్టి 2015 డిసెంబర్‌ చివరినాటికి కంప్లీట్‌ చేసేటట్టు ప్లాన్‌చెయ్‌, నువ్వు ఏదైన కమిట్‌ అయిన పనులున్నాగని అన్ని ఫినిష్‌ చేసుకొని వచ్చే సంవత్సరానికి మీరు మాకోసం ఫ్రీగా ఉండాలని నాకు ఫోన్లో తెలియజేసింన్రు.

photo.php

@ తెలంగాణ ఉద్యమంలో బాగంగా ఓ ఉద్యమకారుడిగా మీరు సినిమాల్లో సభలలో రోడ్లపై సోషల్‌మీడియా ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి చాలా కృషి చేసింన్రు. ఆ ఉద్యమ స్పూర్తితో తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌? అట్లనే సినిమా ప్రొటెక్షన్‌ ఫారం స్థాపించి పది జిల్లాల్లో కమిటి వేశారు దాని అవసరం ఎందుకొచ్చింది. దాని లక్ష్యాలు ఏంటి?

– ఉద్యమాన్ని దగ్గర్నుంచి చూసిన్నప్పుడు, ఇండస్ట్రీలో సీమాంద్ర రాజకీయ శక్తులను చూసినప్పుడు, నాకేం అనిపించిందంటే వట్టి సినిమా వాళ్లతోనే ఏది కూడా జరగదు. తెలంగాణల ఉన్నొల్లే తక్కువ మంది అది కూడా సీమాంధ్రులపై ఆదారపడేటొల్లే ఎక్కువ. తెలంగాణ ఉద్యమకారులకు కూడా దీని మీద అవగాహన లేదు. దీనికి మద్దతిచ్చేవారు కూడా ఉండరు. ఇదంతా గ్రహించి సినిమా పరిశ్రమలోనే సంఘాలుగా ఏర్పాటుచేస్తే ఒక గుర్తింపు ఉంటది. తెలంగాణ అసోషియోషన్‌ అట, ఆంధ్రా అట అనేది ఫస్ట్‌ క్రియేట్‌ చెయ్యాలే. ఎందుకంటే ఆంద్రొల్లు మనమంతా ఒకటే మనది తెలుగు అంటున్రు కాబట్టి మనం వేరు అనే విషయాన్ని తెలియజేయాలె. అందులో బాగంగా తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ దర్శకనిర్మాతల మండలి అని అనిపించుకోవడం జరిగింది ఇది ఫస్ట్‌ ఆపరేషన్‌. తెలంగాణ లైక్‌మైండెడ్‌ పీపుల్‌తోని తెలంగాణ రాకముందే ఆ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది.

తర్వాత సెకండ్‌ ఫేజ్‌ ఏందంటే ఈ సంఘాలు సినిమాలల్ల పనిచేసి కార్డులున్నొల్లకే అవకాశం ఇస్తున్నరు కాని బయట ఉన్న ప్రేక్షకులు మేదావులు, సిన్మా మీద క్రిటిక్స్‌ రాసేవాల్లు, సినీ గోయర్స్‌ ఇది కూడా ఒక వర్గం ఉంటది కదా వీళ్లందర్ని గూడ “తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం” అని పెడితే సినిమా కళాకారులకు సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు పంపిణిదారులకు ఎగ్జీబీటర్లకు అండగా నిలుస్తుంది.

‘తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం’ ద్యేయం ఏందంటే ఇప్పుడున్న వ్యక్తి పూజల విదానాలన్నింటిని మార్చేసి ఒక మంచి అభిరుచి మన సంస్కృతి సంప్రదాయాలు, నవరసాలున్న తెలంగాణ బతుకులను ప్రేమించేదిశగా ఆస్వాదించే దిశగా మోటివేట్‌ చేసేవిధంగా పనిచేయడం. అదేవిధంగా ఒక పెద్ద స్టార్‌ యొక్క కొడుకు మనవండ్లకు పెద్దఫ్యాన్స్‌ ఉంటరు. తెలంగాణల కొత్తకొత్తగా వచ్చేటోనికి ఉండరు. కాబట్టి మన సమాజమే అతనికి ఫ్యాన్స్‌. ఒక పెద్ద కంపెని సినిమా వస్తే మంచిగ నడిచే సినిమాను హాలు నుంచి తీసేసి అహంకారంతో వాళ్ల సినిమా ఏసుకునేది ఇప్పుడు కొనసాగుతుంది. అలాంటివి జరిగినప్పుడు మన వాళ్ళు తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం మద్దతుతో అన్యాయాన్ని అడ్డుకుంటరు. ఎవడన్న కష్ఠపడి వస్తే వాళ్లను ఆదుకునుడే దీని ద్యేయం. ఇట్లాంటివి ఎన్నో ఉన్నయన్నట్టు. సియంతో ఒక మీటింగ్‌ పెట్టించినం. ఇంకా మన ఇండస్ట్రీనే వేరుకాలే.. రెండువేల ఎకరాలు కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి ఇస్తం అని సియం చెప్పేశిండు. ఇచ్చిన రెండువేల ఎకరాలలో తెలంగానొల్లు దాంట్లె గడ్డి పీకాల్నా, చెట్లకు నీళ్లు పోయాల్నా ఆయన వైఖరి చెప్పలే.ఇవన్ని నిర్బయంగా నిర్మోహమాటగా అడిగే వేదిక కూడా ‘తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం’ చేస్తుంది.

ఫస్ట్‌ సినిమాలు తీస్తేనే కదా ఇండస్ట్రీ అయ్యేది. మనం సిన్మాలు తియ్యకుంటే సర్కారు మనకు అండగా ఉండాలే.. ఆంధ్రొల్లు ఎట్లైతే సబ్సిడీలు ఇచ్చిండ్రో మనక్కూడా ఇవ్వాలే ఐతే దాని గురించే వేయిట్‌ చేస్తున్నం. త్వరలో ఏమన్న ఇస్తరేమోనని అనుకుంటున్నం. ఇయ్యకుంటే మూమెంట్‌ తీసుకుంటం.

@ మరి మనకు ధియేటర్లు కూడా అందుబాటులో ఉండాలె కదా?

– రైతుబజారులాగ మండలానికో మినీ ధియేటరు పెడితే రేటుగూడా తక్కువ ఉంటది, జనాలకు దగ్గరగా ఉంటది. వచ్చిన సొమ్ము అటు సర్కారు ఇటు తీసినోడు పంచుకోవొచ్చు.

@ ఇప్పుడే చేస్తున్న సినిమాలు ఏంటి?

‘మిస్టర్‌ రాహుల్‌ పక్కా ప్రొఫెషనల్‌’ సినిమా విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటుంది. ‘జమీన్‌ హమారే ఫిర్‌ బీ పరాయే’ ఉర్దూ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

రఫీ సినిమా “ఇంకెన్నాళ్ళు? ” లింక్ ఇదీ… https://www.youtube.com/watch?v=gml73-SBqqQ&feature=youtu.be

ఇంటర్వ్యూ: మామిడి అమరేందర్

10364116_523464131092344_837543891470561885_n

అనగనగా ఒక అనిల్…అతని మరో ప్రపంచమూ…!

01_ANIL BATTULA photo

బహుశా సోవియట్ ప్రచురణల గురించి ఎక్కువగా తెలిసిన వారికి నా తాపత్రయం ఇంకా బాగా అర్ధం అవుతుందేమో.

1950 నుండి 1990 వరకు వచ్చిన ప్రచురణల్లో పుస్తకాలు చదివినవారందరూ సోవియెట్ ప్రచురణల గురించి తెలిసినవారై ఉంటారు. కొందరి ఉద్యమ జీవితాలను ఈ ప్రచురణలు వెలిగిస్తే, కొందరి బాల్యాన్ని ప్రత్యేకమైన అనుభవం గా మార్చాయి ఈ పుస్తకాలు. కాని ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవు. ఈ పుస్తకాలు నాస్టాల్జియాగా మాత్రమే పనికొస్తాయి అనుకుంటున్న సమయంలో అదాటున అనిల్ బత్తుల పీకలదాకా సోవియెట్ ప్రచురణల మత్తులో మునిగిపోయాడు. అది మనవంటి వారికి మంచిదైంది. అతన్ని పరిచయం చేద్దామనే నా ఉత్సాహమంతా!

ప్రేమలో పడ్డ పిచ్చివాడిలా కనిపిస్తాడు అనిల్ బత్తుల. పుస్తకాలంటే ఇంత పిచ్చి వున్నవాణ్ణి ఇప్పటివరకూ చూడలేదు. facebook లో ఒక ఉదయాన హఠాత్తుగా సోవియెట్ పుస్తకాల గురించి మాట్లాడుతూ నాకు దొరికిపోయాడు. ఆ పుస్తకాల గురించి మాట్లాడి జ్ఞాపకాల తేనెతుట్టెని కదిలించాడు.

అంతే…ఝామ్మంటూ…జ్ఞాపకాల పొరల్లోంచి బోల్డన్ని రంగురంగుల పుస్తకాలు బయటపడ్డాయి. తర్వాత అనిల్ తన పుస్తక భాండాగారాన్ని ఒకరోజు బయట పెట్టాడు. దానితో ‘సారువారు ఎంతో గొప్పవారు’ అనుకున్నాను.. తర్వాత ‘పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడు’ నవలా పరిచయం చేసాను మన సారంగలో. అప్పుడే ఒక మెసేజ్ పెట్టాను…’ఇదిగో ఇలా మీకిష్టమైన సోవియెట్ పుస్తకాలలో ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నానని.’ సంతోషపడ్డాడని అర్థమైంది.
ఇక అసలు కథ అప్పుడు మొదలైంది. మరి రాసాను కదా…గొప్పగా అనిల్ ని టాగ్ చేసాను. ఆయన సంతోషించి ఫోన్ లో మాట్లాడడమేకాకుండా కొన్ని పుస్తకాలు ఇస్తానని మాటఇచ్చాడు. నిజంగానే తర్వాత ఇంటికొచ్చి చాలా పుస్తకాలిచ్చాడు. అవన్నీ ఒరిజినల్ పుస్తకాలు కావు. జిరాక్స్ చేసి స్పైరల్ బైండ్ చేసినవి. ఒక ఇరవై పుస్తకాల దాకా ఉన్నాయ్. బాగానే ఖర్చయ్యి ఉంటుందని డబ్బులు ఇస్తానన్నా వద్దన్నాడు. రెండే మాటలు చెప్పాడు. “ ఈ పుస్తకాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఇవి మీరు చదివి ఒక నాలుగు మాటలు ఎక్కడో నలుగురికీ కనపడే చోట రాయండి. ఇలాంటి పుస్తకాలు ఉన్నాయని తెలియాలి” అని. అతనికి ఆ పుస్తకాల మీదున్న ప్రేమ చూసి నేనూ, మా ఆయనా అశ్చర్యపోయాం.

06_Ikathiyandar_A.Beliayev_001

సండే వస్తే దొరకడు అనిల్. ఆబిడ్స్ సండే మార్కెట్లో ఎనిమిదింటికి తేల్తాడు. కాసేపు అక్కడ పుస్తకాల మధ్య మహా ఆనందంగా తిరిగి, కొన్ని పుస్తకాలను స్వంతం చేసుకుని వెనక్కు మళ్ళుతాడు. రెండున్నరేళ్ళ క్రితం ఇలా మొదలైన కార్యక్రమం నిర్విరామంగా ప్రతి ఆదివారం నడుస్తూనే ఉంది. కాలం జర్రున జారింది. ఇదిగో ఈ రోజు ఇతని దగ్గర ఇంచుమించుగా రెండువందల పైనే సోవియెట్ పుస్తకాలున్నాయి.

ఇటువంటి అనిల్ బత్తుల గురించి ఓ నాలుగు మాటలు రాయాలని ఎప్పటినుంచో కోరిక ఈ రోజుకు తీరింది. ఈ ‘సెప్టెంబర్ పది’ న లామకాన్ లో తన పుస్తకాల కలెక్షన్ మొత్తాన్ని ఎగ్జిబిషన్ పెట్టడమే కాకుండా, ఎవరో ఒక మంచి ‘రాదుగ పబ్లికేషన్’ పుస్తకాన్ని(ఇకితియాందర్) సినిమాగా(యామ్ఫిబియన్ మాన్) తీస్తే, దాన్ని ప్రదర్శించాలన్న కార్యక్రమం కూడా ఇందులోనే ఇమిడ్చాడు.

ఆ సందర్భంలోనే నా ఇంటర్వ్యూ ను కూడా చేర్చాను. ఇదిగో ఇలాంటి కొన్ని ప్రశ్నలడిగి!

సొవియట్ పుస్తకాలతో ఎలా ప్రేమలో పడ్డారు?

నాకెప్పుడు అందిరిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేది. తెలుగంటే చాల ఇష్టం. స్కూల్ లో ఆరవక్లాసులో ‘సంపూర్ణ మద్యనిషేదం’ మీద ఎలక్యుషన్ పెడితే వేరేవారితో స్పీచ్ ప్రిపేర్ చేయించుకున్నాను. ఎనిమోదోతరగతికి వచ్చేసరికి నెమ్మదిగా నేనే స్వంతంగా రాయడం మొదలుపెట్టాను. ఏదో ఎడిటోరియల్ లో శ్రీశ్రీ లైన్లు చూసి ప్రాస బావుందని నా స్పీచ్ లో ఇరికిస్తే జనాలు అది విని విపరీతంగా చప్పట్లు కొట్టారు. “ఎవరు వీడు. నేనింత మాట్లాడినందుకు కన్నా ఇతని మాటలకు చప్పట్లు ఎక్కువ పడ్డాయి,” అని చాలా కోపం వచ్చింది నాకు. తర్వాత ఇంటర్ లో విశాలాంధ్ర వాళ్ళ స్టాల్ కాలేజీ దగ్గర పెట్టగానే కొందామా, వద్దా అని అరగంట కొట్టుకలాడి, ‘శ్రీ శ్రీ మహాప్రస్థానం’ కొన్నా… అప్పటికే పుస్తకం గురించి కాస్త విన్నా. నెమ్మదిగా ఆ కవిత అర్థం కాకపోయినా ఆ చదివే లిరికల్ సౌండ్ నాకు చాల గొప్పగా అనిపించింది.

తర్వాత బి. సి. యే చదవడానికి హైదరాబాద్ వచ్చా. నారాయణగుడాలో మా హాస్టల్ దగ్గరలోనే సుందరయ్య విజ్ఞాన భవన్, నవయుగ బుక్ హౌస్ ఉండేవి. సాయంత్రం ఆ ఏరియా లో ఎక్కడైనా ప్లాట్ఫారం మీద పుస్తకాలు దొరికేవి. అలా మొదలై శ్రీశ్రీ తర్వాత శివారేడ్డిగారిదీ, ఇలా మిగిలినవారిదీ…కవిత్వం అంటే నచ్చింది. తర్వాత కే. శ్రీకాంత్ కవిత్వం నచ్చి కలిసాను. అప్పుడే తన దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు ఇచ్చాడు. అందులో ‘జమీల్య’ ఉంది!

Kondagaali Kotta Jeevitham_001

కాని మొదటిసారి సోవియెట్ పుస్తకాలు ఎప్పుడు చూసారు?

మా హాస్టల్ దగ్గర ‘చిక్కడపల్లి లో ఉన్న ప్రజాశక్తి బుక్ హౌస్లో మొదటిసారి చూసాను. అక్కడ సొవియట్ పుస్తకాలు ఒక మూల రాక్ లో ఉండేవి. ఆ బుక్ కవర్స్ ఇప్పటికీ గుర్తు. తండ్రులు-కొడుకులు, పేద జనం, శ్వేతరాత్రులు….ఈ కవర్ పేజీలు నెమలిపింఛాల్లాగా చాలా బాగా అనిపించేవి. చాలా మంచి క్వాలిటీ, ఖరీదు తక్కువ- కాస్త సంభ్రమంగా చూసి వెళ్ళిపోయేవాణ్ణి. తర్వాత, కోఠీ గాంధీ జ్ఞాన్మందిర్ పక్కన విశాలాంధ్ర వాళ్ళు బుక్ ఎగ్జిబిషన్ పెట్టేవారు. ఒక మూల సొవియట్ పుస్తకాలు కుప్పగా పోసి అమ్మేవాళ్ళు. ఓసారి ఎనీ బుక్ టెన్ రుపీస్, థర్టిరుపీస్ అని సేల్ లో చూసాను. ౩౦ రూపాయలకు నాలుగొందల పేజీలు – రష్యన్ చరిత్ర కథలు, గాధలూ ఆ పుస్తకం. తెగించి ఆ రోజు కొన్న పుస్తకం నా జీవితాన్నే మార్చేసింది.

పుస్తకం చదవడం గొప్ప అనుభవమేమో మీకు?

నాకు పుస్తకం అంటే జ్ఞానం సంపాదించడం అని ఎప్పుడు ఉండదండి. పుస్తకం చదవడం అనేది నావరకు నాకు ఒక ఆనందాన్ని పొందడమే..ఒక పుస్తకం నాకు నచ్చిందంటే నేను అందులో ఏదోదో విధంగా కనిపిస్తాను. నా అనుభవం కావచ్చు, ఏదైనా కావొచ్చు. నాకు పుస్తకం అంటే ఆనందం…కాని పుస్తకం అంటే ఆనందం అనే స్థాయిని దాటి, పుస్తకం తో మోహంలో పడి, పుస్తకంతో పిచ్చిలో పడిపోయి, తర్వాత పుస్తకమే జీవితమేమో అన్న స్థితికి వెళ్ళిపోయాన్నేను. అదృష్టవశాత్తు నా భార్య మాధవిలత కూడా అర్థం చేసుకునే స్థితి లో ఉంది కాబట్టి నాకు పర్వాలేదు(నవ్వు).నాకు తెలుసండి. నేను ఫైనల్ స్టేజిలో ఉన్నాను…నేను పుస్తకంపిచ్చి నుండి ఇంక బయటపడలేను. పుస్తకం ఉంటే చాలు నాకేమి అవసరం లేదు అనిపిస్తుంది.. బహుశా నాకు జీవితంలో చాల పెద్ద సమస్యలు వచ్చి అన్ని కోల్పోయినా…అందరిలా భయపడతాను, ఏడుస్తాను కాని..’చేతిలో పుస్తకం ఉంది దాని చూస్తూ చచ్చిపోతాను కదా’ అన్న తృప్తి తో కళ్ళు మూస్తాను.

ఈ పుస్తకాలు సేకరించాలనే ఆలోచన మీకెలా వచ్చింది?

“ఉక్రనియన్ జానపద గాధలు” అనే పుస్తకం గురించి ‘మనసులో మాట’ సుజాతగారు రాసారు. ఆ పరిచయం చదవగానే నచ్చింది.వెబ్ సైట్ లో కామెంట్లు చదివాను. వాటిలో కామెంట్ చేసిన వాళ్ళ చిన్నతనం గురించి తెలుస్తుంది. చాలా పుస్తకాల పేర్లు ప్రస్తావించారు. అందరూ సేకరించాలి అంటారు కాని ఎవరు మొదలుపెడతారు? ఎవరు ఇవ్వడానికి ఇష్టపడతారు? ఎందుకంటే పుస్తకాలు దొరకవు. చిన్నప్పటి జ్ఞాపకాలను ఎవరు వదలుకోగలరు? తర్వాత ఇంకొన్ని పుస్తకాల లిస్టు సంపాదించాను. నా ఆఫీస్ విజిటింగ్ కార్డ్ ల వెనుక సోవియెట్ పుస్తకాల లిస్టు రాసి, పుస్తకాలు చదివే వారిని కలిసాక, లిస్ట్ లో బుక్ ఉందా అని అడిగి టిక్ పెట్టుకునే వాణ్ణి. కవి ఐలా సైదాచారి గారు నాకు ఏడు రష్యన్ క్లాసిక్స్ ఇచ్చారు. ఆర్టిస్ట్ మోహన్ గారి దగ్గర రిటైర్డ్ లైబ్రేరియన్ గంగాధర్ రావు గారు పరిచయం అయ్యారు. ఆయన ముందు ఆ బుక్ లిస్టు చదువుతుంటే ఇంచుమించుగా అన్నిటికీ ‘ఉంది’ అనే చెప్పారు.ఎప్పుడు రమ్మంటారో అడిగి వెళ్ళాను. గంగాధర్ గారిని కలవగానే నేనడిగిన పుస్తకాలు ఉన్నాయని చెప్పారు. తర్వతరోజు ఎనిమిదింటికి రమ్మంటే…నేనే ముందే రెడీ అయిపోయి ఉన్నా.

Ukrainian Jaanapada Gaathalu_000

నన్ను నమ్మడానికి కొన్ని పుస్తకాలు దగ్గర పెట్టు తీసుకువెళ్ళా. ఆయన పుస్తకాలు ఒకేసారి అన్నీ ఇచ్చారు. జాగ్రత్తగా జిరాక్స్ తీసుకుని ఇచ్చేసా. తర్వాత రచయత అజయ్ ప్రసాద్ పరిచయం అయ్యారు, మోహన్ గారు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. ఇలా చాలామంది సాయం చేసారు. అలానే కేవీఎల్ఎన్ మూర్తి అని విజయవాడ లో ఉండే ఒకాయనకు డిటెక్టివ్ నవలలు ఇష్టం. కాబట్టి నేను అతనికి కావాల్సిన నవలలు సండే మార్కెట్ లో కొని పంపేవాడిని, అతను విజయవాడలో దొరికిన పాత సోవియెట్ పుస్తకాలు నాకు పంపేవాడు. మనసు ఫౌండేషన్ రాయుడుగారి గురించి విన్నాను. అక్కడున్న శ్యాం నారాయణ గారి దగ్గర చాల పుస్తకాలు స్కాన్ చేసుకున్నాను.

అయితే మీ సేకరణలో కథలు నవలలే ఉన్నాయా?

మొదట్లో కథలు నవలలు దొరికితే చాలనుకున్నా. కాని నెమ్మదిగా అనిపించింది. నాకు కథలెంత ముఖ్యమో ఇంకొకరికి ఈ సైన్సు వ్యాసాలూ కూడా అంతే ముఖ్యమై ఉండొచ్చుకదా అని. ఇలాంటి పుస్తకం చిన్నతనంలో ఒకడు చదివి వాడు పెద్దయ్యాక కెమిస్ట్రీ లో గొప్ప శాస్త్రవేత్త అయి ఉండొచ్చేమో. అటువంటివాడికి మళ్ళీ ఆ బుక్ కావాలంటే ఎలా వస్తుంది? అది నేనెందుకు చేయకూడదు? అనే ఆలోచనతో ఇంకా చాలా కమ్యూనిజం, సోషలిజం, ఫిలాసఫీ, వ్యాసాలూ, ఇంకెన్నో డిక్షనరీలూ సేకరించా. రాదుగ, ప్రగతి, విదేశి భాషా ప్రచురణ సంస్థ, మీర్ ప్రచురణలు ఈ నాలుగు సంస్థల పుస్తకాలు కలిపి- రెండొందల పుస్తకాల వరకూ ఉంటాయి.

సినిమాలు సాహిత్యం గురించి చెప్పండి.

నాకు అక్షరాలెంత ఇష్టమో, విజువల్స్ అంత ఇష్టం. గికోర్, జమీల్య,  యామ్ఫిబియన్ మాన్, చైల్డ్ హుడ్ ఆఫ్ మాక్సింగోర్కీ నాకు బాగా ఇష్టమైన సోవియెట్ సినిమాలు. తెలుగు లిటరేచర్ లో దొరకనిదీ, సోవియెట్ లిటరేచర్ లో దొరికేది- లిటరేచర్ ని సినిమాలల్లో చూడడం! ఒక పుస్తకం చదవగానే దాని లింక్ ఇంటర్నెట్ లో దొరికేస్తుంది. కథ మనకి నచ్చి కనెక్ట్ అయితే మన ఊహలో ఆ పాత్రలకు రక్తమాంసాలు చేకురుతాయి. అవన్నీ నిజంగా ప్రేమించగలిగితే పాత్రలు మనముందే కదులుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను చాలా సోవియెట్ పుస్తకాలతో, ఇలా చూడగలిగా. నచ్చిన పుస్తకం చదివాక, ఒక వారం, పది, నెల రోజులు వరకు ఏమి చదవను.. కాఫీ తాగాక నోటిలో కాఫీ రుచి పోతుందని ఏమి తినన్నట్టు. సోవియెట్ లిటరరీ అడాప్టేషన్స్ గా చాల సినిమాలు వచ్చాయి. తెలుగులో రాజు పేద, కన్యాశుల్కంలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కాని భారీస్థాయిలో సాహిత్యం సినిమాగా మారలేదు. సినిమాలుగా తీయగలిగే మునెమ్మ లాంటివి లిటరరీవర్క్స్ తెలుగులో చాలా ఉన్నాయి. మన సాహిత్యం చాలా భాగం సినిమాల్లోకి కన్వర్ట్ కాలేదు. బావుంది, బాలేదు అని కాదు…సినిమాలుగా అడాప్ట్ కాలేదు. తెలుగులో గొప్ప సాహిత్యం సినిమాల్లోకి కన్వర్ట్ కాకపోవడం, సినిమాల్లో వచ్చే దానికీ జీవితానికీ సంబంధం లేకపోవడము, సినిమాకి సాహిత్యానికి సంబంధం లేకపోవడం, జీవితానికీ సాహిత్యానికీ సంబంధం ఉండడము, జీవితాని ప్రతిబింబించే సాహిత్యం సినిమాగా మారకపోవడము, జీవితాన్ని ఏ విధంగా సంబంధం లేని యుటోపియన్ విషయంగా సినిమాల్లో చూపించడం….బేసికల్ గా మన సాహిత్యానికి మన సినిమాలకూ మధ్య చాలా ఎడం ఏర్పడింది.

మీకిష్టమైన పుస్తకాలూ, రచనలూ, నచ్చే రచయితలూ…

శారద(ఎస్. నటరాజన్). ఈయన మీద ఒకలాంటి అబ్సెషన్ తో బతికాను. ఒకానొక టైం లో శారద పాత్రలు నా గదిలో అలా తిరుతున్నట్టు విషువల్స్ కనిపిచేవి. గోర్కి ఆత్మకథ- మూడు భాగాలు. ఆలూరి భుజంగరావు గారి ఆత్మా కథ రెండు భాగాలూ- గమనాగమనం, గమ్యం దిశగా గమనం. గోర్కీ ప్రతిరూపం ఆలురిలో కనిపిస్తుంది. ఆత్మకథ అంటే పరనిందా ఆత్మా స్తుతి, వాళ్ళెవరో అప్పు తీసుకుని ఎగ్గొట్టారులాంటివి వివరాలు గాక, స్వచ్చతతో వచ్చిన ఆలోచనలు ఉంటాయి వీటిలో. ఇంకా రచయితలలో శారద, ఆలూరి భుజంగరావు, ఆలూరి బైరాగి, బెల్లంకొండ రామదాసు, చెకోవ్, టాల్ స్తోయ్, దోస్తోవిన్స్కి, ఇంకా చాలా మంది. అనువాదకులలో ఉప్పల లక్ష్మినారాయణ రావు, ఆర్వియార్, రారా. ఇక సోవియెట్ పుస్తకాలలో నాకు ముందు సైన్సు ఫిక్షన్, తర్వాత చిన్నపిల్లల పుస్తకాలు తర్వాతే పెద్దవాళ్ళ కథలు, నవలలు ఇష్టం.

బాలసాహిత్యం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు?

సోవియట్ వాళ్ళు బాలసాహిత్యం ఎక్కువగా వేయడానికి కారణం- బహుశా కమ్మ్యునిజాన్ని ప్రపంచవ్యాప్తి చేయడానికయ్యి ఉంటుంది. లిటరేచర్ ద్వారా పెద్దలను, పిల్లలను చేరదామనుకున్నారు. బాలసాహిత్యానికి చాల శ్రద్ధ తీసుకున్నారు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మంచిగా తీర్చిదిద్దుదాం, వాడు పెద్దయిన తర్వాత సమాజానికి ఉపయోగ పడతారనుకున్నారని కూడా నా వ్యక్తిగతాభిప్రాయం.

బ్లాగ్ గురించి చెప్పండి.

ఈ పుస్తకాల వెతుకులాటలో వేరే భాషల్లో అనువాదాల గురించి ఏమన్నా తెలుస్తుందేమోనని ఇంటర్నెట్ లో వెతికితే కొన్ని బ్లాగులు బయటపడ్డాయి. చూస్తే చాలా బావున్నాయి. అలా మన భాషలో కుడా చెయ్యాలని బ్లాగ్ మొదలుపెట్టాను. ఒక్కరోజు ఎనభై పుస్తకాలు అప్డేట్ చేశా. కాని ఈ బ్లాగ్ పెట్టి నలుగురి దృష్టి పడ్డాకా చాల రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది వాళ్ళదగ్గరున్న బుక్స్ నాకు పంపారు. కాని అన్నీ అప్లోడ్ చెయ్యలేదు. రీప్రింట్ అయ్యేవి కొన్నివున్నాయి. అవి కొంటేనే మంచిది అనుకుని పెట్టలేదు. ఇంకా చాలమంది నాగురించి విని, నా బ్లాగ్ చూసి వారిదగ్గర ఉన్న పుస్తకాలు పంపారు. అప్పటిదాకా పంచుకోవాలనున్నా, తిరిగి వస్తాయో లేదో అన్న భయం తో ఇవ్వలేదన్నాళ్ళు. దీన్నిబట్టి నాకేమర్థం అయ్యిందంటే పుస్తకాలు చదివేవాళ్ళున్నారు. కాని అంతగా మంచి పుస్తకాలు రావడం లేదు. మరి అప్పుడు పాతవే చదువుకోవాలి. అంటే కదా! అన్నట్టు నా బ్లాగ్ అడ్రస్ http://sovietbooksintelugu.blogspot.in/

వేరే భాషల పుస్తక ప్రేమికులు ఎలా పరిచయం అయ్యారు?

బెంగాలీ బ్లాగ్, మలయాళం బ్లాగ్ చూశా. facebook లో మరాఠీ బ్లాగ్ నుంచి నిఖిల్, రాజ్ లు, రాజారాం మలయాళం నుంచి, వసుదేవులు బెంగాలి నుంచి పరిచయం అయ్యారు. ఉకైనియన్ గాధలు అన్ని భాషల్లో అనువదించబడ్డాయి. సోవియెట్ వాళ్ళు కొన్ని స్టాండర్డ్ అనుకున్నసాహిత్యాన్నే అనువాదం చేయించారని అర్థమైంది.

అనువాదాల గురించి చెప్పండి.

అనువాదాలు చాలా ఇష్టం. ఇంటెన్సిటీ ఎక్కువ. ప్రతి భాషలో వచ్చిన అన్ని కథలూ అనువాదం కావు, కొన్ని మంచి కథలను మాత్రమె ఎంచుకుని అనువదిస్తారు. అందుకే అనువాదకథలు బావుడక పోవడం జరగదు. శ్రీశ్రీ  అనువదించిన మిచెల్ చోలహేవ్ రాసిన ‘మానవుడి పాట్లు’ చాలా ఇష్టం. ఎంత స్లోగా చదివితే అంత బావుంటుంది. చదివే అనుభవం చాల బావుంటుంది. చిన్నప్పుడు త్వరగా చదివేవాణ్ణి కాని ఇప్పుడు నెమ్మదిగా చదువుతుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. శాంతారాం పుస్తకాలు చదివేడప్పుడు, ఇంగ్లీషు పుస్తకం ఇలా ఉండాలి అనిపించింది. గొప్ప రచయితలందరిలో అందం ఏంటంటే సిక్స్త్ క్లాసు తెలుగు మీడియం పిల్లవాడు కూడా హాయిగా చదువుకునే భాష వాడతారు. సోవియెట్ పుస్తకాలు కూడా అటువంటివే, పంటికింద రాల్లలాంటి పుస్తకాలు కావవి, హాయిగా చదువుకోగలిగేవే. ఈ అనువాదాలు ఎంత బావుంటాయంటే తెలుగు ఎలా చదివానో, అలాగే రష్యన్ అనువాదాలు కూడా అంతే అలవోకగా చదివాను.

1950 నుంచి 1980 వరకు చాలా అనువాదాలు వచ్చాయి. ప్రతి ఒక్కటి గొప్పదే. ఒక కథ బావుందంటే ఎక్కడ అన్వయించుకుంటే ఎక్కడైనా ఆదరణ అలభిస్తుంది- ఆర్మేనియాలోనైనా, ఇండియాలోనైనా. ఎందుకంటే మానవజీవితం సార్వజనియమైనది. అలాగే అనువాదం మక్కికి మక్కి చేయకూడదు. అనుభూతిని అందించడం ముఖ్యం. ఇంతకన్నా నాకు ఎక్కువగా తెలియదు.

AgniKanam+Nunchi+AnuVidyuth+Daka_000

అనువాదకుల గురించి ?

బెల్లంకొండ రామదాసుగారు, రెంటాల గోపాలకృష్ణగారు వీళ్ళిద్దరూ యుద్దము- శాంతి మూడు భాగాలు అనువదించారు. అలాగే అట్లూరి పిచ్చేశ్వరరావు గారు! వీళ్ళందరూ బంగారాల్లాంటి అనువాదాలు చేసారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ వారసులకు వారి వర్క్స్ ఎంత విస్తృతమో తెలీదు. వారి వారసులకు నా విజ్ఞప్తి ఒకటే. వారితో మీకున్న అనుబంధం వివరిస్తూ, వారు వర్క్ చేసిన పుస్తకాల లిస్టు అందరికి అందుబాటులో- ఒక బ్లాగ్ లోనో ఎక్కడో అందుబాటులో ఉంచగలిగితే చాలు. ఇదే నిజంగా వారిని స్మరించుకోవడమంటే అని నా నమ్మకం.

సండే మీ రొటీన్ ఎలా ఉంటుంది?

సండే రోజు- ఏడింటికి బయల్దేరి అమీర్పేట్ వస్తాను. అక్కడ అజయ్ కలుస్తాడు. ఇద్దరమూ సండే మార్కెట్ వెళ్తాం. “ఈ రోజు ఏ చేపలు పడతాయి” అన్నట్లు మాట్లాడటం. అన్నకరేనినా, ఉక్రేనియన్ జానపద గాధలు… దొరకవు…కానీ దొరుకుతాయేమోనన్న కలలు కంటూ పదకొండింటికి వెళ్తాం- ఐదింటికి వెనక్కివస్తాం.

ఈ పుస్తకాల కథ ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. పాత పుస్తకాలు కొన్నవాడు, కండిషన్ చూసి, ఏరియా వైస్ ఏజెంట్ కి అమ్మితే. వాళ్ళు ఇంట్లో బుక్స్ స్టోర్ చేస్తారు. ఆదివారం పొద్దున్నే మార్కెట్ చేరేందుకు ఒక ట్రాలీ మాట్లాడుకుంటారు. పొద్దున్నే ఆరింటికి అక్కడికి చేరకపోతే వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఉండదు. తర్వాత యునిక్ బుక్ సెంటర్, బెస్ట్ బుక్ సెంటర్ వాళ్ళు టోకున కొంటారు. వీరే పాత పుస్తకాల మీద ఎక్కువగా ఫోకస్ చేసేది. ఎందుకంటే ఇవి సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లు. ఒకరోజు అదృష్టం తిరిగి కళాతపస్వి యోగోరి- ఒక పెయింటర్ పుస్తకం దొరికింది. ఇలాగే ఇంకొన్ని గొప్ప పుస్తకాలు. ఇప్పుడు వీళ్ళతో ఎంత సంబంధం పెరిగిందంటే నాకోసం ప్రత్యేకంగా పక్కకు తీసిపెడతారు. యునిక్ బుక్ సెంటర్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడో ఫ్యామిలీ మెంబెర్ లా అయ్యాను. వాళ్ళ వెబ్ సైటు కూడా నేనే చేసిచ్చాను. ఇంకో విషయం ఏంటంటే, వేరే రాష్ట్రాల వాళ్లు ఆన్లైన్ లో కలుస్తారు కదా వాళ్లకి వీళ్ళ స్టాల్ అడ్రస్ ఇస్తే బోల్డన్ని పుస్తకాలు ఆర్డర్ చేసి తీసుకెళతారు.

సైన్సు పుస్తకాలకి చాల డిమాండ్ ఉంది. ఇప్పుడు మెట్రోపాలిటన్ యంగ్ క్రౌడ్ బాగా చదువుతారు., మీర్ పబ్లికేషన్స్ సైన్సు మాత్రమె పబ్లిష్ చేస్తుంది… ద్మిత్రి అనే అతనుఈ పుస్తకాలు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఒక మూడు వేలమంది మెంబర్లు- ఒకొక్కరు కనీసం ఒక్క పుస్తకమైన అందించి ఉంటారు.

Aelita_Puppala Lakshmanarao(ed)_001

ఇక ముందు లక్ష్యాలు…

తెలిసో తెలియకో కొన్ని మంచి పనులు చేసాను…కానీ ఎంతోమంది బాల్యానిన్ని వెనక్కివ్వగాలిగాను…ఈ పుస్తకాల ద్వారా. చాల మంది అన్నారు…ఈ పుస్తకాలు వచ్చేప్పటికి నువ్వు పుట్టి కుడా ఉండవయ్య అని. చాల మంది రీడర్స్ విశాలాంధ్ర వాన్స్ ద్వారా చదివినవాల్లె. దీనివల్ల నాకు రుపాయికుడా రాదు కాని నేను సంపాదించింది చాల ఎక్కువ.

ఈ సోవియెట్ రచనలూ కొన్ని విశాలాంధ్రవాళ్ళు ప్రింట్ చేసారు. బీదల పాట్లు అని, 1950 ల్లలోనే మహీధర జగన్మోహన రావు గారు గోర్కీ జీవిత కథ వేసారు, తర్వాత చెకోవ్, మపసా, టాల్ స్తాయ్ ఇదంతా 1957 లోనే. విశ్వ సాహిత్యమాలా, దేశి ప్రచురణ సంస్థ తర్వాత ప్రేమ చంద్ ప్రచురణ సంస్థ, దక్షిణభారత ప్రచురణ సంస్థ, ఎమెస్కో. ఇట్లా సొవియట్ ప్రచురణలు ప్రింట్ అయినవి చాలా ఉన్నాయండి. కాని అవన్ని బ్లాగ్ లో పెట్టలేను కొన్ని కాపీ రైట్ గోడవలవల్ల. కొన్ని నాకు నేను పెట్టుకున్న పరిధులవల్ల- నాకొకటే కోరిక సోవియెట్ యూనియన్ లో ప్రింట్ అయినా ప్రతి తెలుగు అక్షరాన్ని నేను చనిపోయిన కుడా భద్రంగా ఎత్తిపెట్టుకోవాలని. సోవియట్ బుక్స్ సోవియెట్ లో ప్రింట్ అయినవి కాకున్నా కూడా కనుక్కుంటే సోర్స్ చెప్పగలను. పబ్లిషర్స్ కి ప్రింట్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉంటె ఫ్రీగా ఇవ్వగలను కాపీ రైట్ ఇస్స్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు.

సిపిఎం , సిపిఐలా…రష్యా, చైనా లిటరేచర్. చైనా రచనల కలెక్షన్ నా నెక్స్ట్ లక్ష్యం. ఇప్పటికే కొన్ని ఉన్నాయి నా దగ్గర. చైనా లిటరేచర్ కుడా ఒక బ్లాగ్ పెట్టి మనం పెట్టాలి. ఎవరైనా సహాయం చేయగలితే చాలా సంతోషం. విశాలాంధ్ర వాళ్ళవి 1970 తో 1980 వరకు కేటలాగ్ కావాలి. మిగిలినవి నా దగ్గరున్నాయి. ఎవరికైనా పబ్లిష్ చేసే ఆసక్తి ఉంటె నేను నా వంతుగా ఆ పుస్తకం సంపాదించి సహాయపడగలను.

 

మరిన్ని చదివిన మిమ్మల్ని కమ్యునిజం ఆకర్షించలేదా?

ఎందుకు లేదు? మొదట్లో ఎరుపురంగు సాహిత్యమే చదివాను. కౌముది, చెరబండ రాజు, అనామకుడు, అలిసేట్టి ప్రభాకర్ మొదలైనవారిని విపరీతంగా చదివేవాణ్ణి. అరుణతార విపరీతంగా క్రమం తప్పకుండా చదివేవాణ్ణి. తర్వాత నా స్నేహితుడు చెప్పాడు. ఎరుపే కాదు, వేరే రంగులు కూడా ఉన్నాయి, చూడరా అని… కాలేజీలో నా నిక్ నేమ్ శ్రీశ్రీ. అందరికి శ్రీ శ్రీ పిచ్చివాణ్ణిగానే తెలుసు.

పుస్తకాలకు, ముందు వెనుక జీవితం.

చిన్నప్పటినుంచి దేనికో ఎప్పుడు వెతుకులాట ఉండేది. ఈ పుస్తకాలు దొరికాక వెతుకులాట తీరింది. ఈ పుస్తకాలు ఎంతటి మానసిక ధైర్యాన్నిస్తాయంటే ప్రపంచం కూలిపోయినా, నాకు అక్షరం అనేది తోడున్తుంది. అనిపిస్తుంది. పుస్తకం నాకో మంచి స్నేహితుడైపోయాడు. స్నేహితుడితో గొడవ పడొచ్చు, దూరం వెళ్ళొచ్చు, కోపం తెచ్చుకోవచ్చు. కాని పుస్తకం అదేమీ చేయదు. పుస్తకాలతో లెక్కలుండవు. పుస్తకం ఎప్పుడు నన్ను ప్రేమిస్తుంది. నాతో అలగదు, కోపగించుకోదు. నా జీవితం లో పరిపూర్ణతనేది చూడగలిగాను నేను. ఈ పుస్తకాల వల్ల. నాకొక ఆసరా ఉన్న స్నేహితుల్లా పుస్తకం నాకోసం ఎప్పుడు నిలబడి ఉంది. ఉంటుంది కూడా!

—–
ఇంతలా పుస్తకాన్ని ప్రేమించేవాడు మనకు మళ్ళి దొరుకుతాడా? మళ్ళీ ఇన్ని పుస్తకాలూ గుప్పుమన్న జ్ఞాపకాలతో మనముందుకు వస్తాయా…? ఈ రెండింటినీ ఆస్వాదించాలంటే ఒక్కసారి సెప్టెంబరు పదిన లామకాన్ వైపు అడుగెయ్యండి. ఇదిగో ఆహ్వానం. అడ్రెస్ కోసం అసలు ఇబ్బంది పడకండి. ఇదిగో మ్యాపు ఇంకా కష్టమైతే 9676365115 కు ఫోన్ చెయ్యండి. అనిల్ మీకు స్వయంగా సాయపడతాడు!

lamakaan map

Anil battula Invitation_10 sep 2014_Hyderabad

మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే!

brightfuture009-VJ

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రశంస పొందిన అనువాద నవల “నారాయణీయం” మూల రచయిత వినయ్ జల్లాతో – అనువాదకుడు కొల్లూరి సోమ శంకర్ జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ…

***

హాయ్ వినయ్ గారు,

మీ మొట్టమొదటి నవల “Warp and Weft“ని తెలుగులో ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చినందుకు ముందుగా అభినందనలు. ఈ పుస్తకాన్ని అనువదించే అవకాశం నాకు కల్పించినందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇప్పుడు కాసేపు మీ రచనల గురించి, కెరీర్ గురించి, వ్యక్తిగత, వృత్తిపరమైన సంగతులు మాట్లాడుకుందాం.

ప్ర: మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి కాస్త చెబుతారా?

జ: గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగుళూరు నగరంలో నేను పుట్టి పెరిగాను. నాకు మూడేళ్ళ వయసులోనే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచే బహుశా నాకు ఏకాంతమంటే ఇష్టం పెరిగిందేమో. నాదైన లోకంలో ఉండడం – జీవితం గురించి, ఇతర విషయాల గురించి ఆలోచించడానికి మార్గం చూపిందేమో.

నాకు చిన్నప్పటి నుంచీ కూడా చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. పరీక్షలు పాసవడం కోసమే తప్ప చదువుని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బడికెళ్ళే పిల్లాడిగా, నాకు చదువు తప్ప, మిగతావన్నీ ఎంతో కుతూహలాన్ని కలిగించేవి. నేను బాగా చదువుకుని పైకి రావాలనేది మా నాన్న కోరిక. ఆయన కోరిక (నాది కాదండోయ్) తీర్చేలా బిజినెస్ మానేజ్‌మెంట్‍లో డిగ్రీ పూర్తి చేయగలిగాను.

 

ప్ర: రచయితగా ప్రయత్నించాలన్న ఆలోచన మీకు ఏ వయసులో కలిగింది?

జ: ఇంటర్మీడియట్ పరీక్షలలో ఫెయిల్ అయ్యాక, నాకు బోలెడు సమయం దొరికింది. రకరకాల పనులు చేయడానికి ప్రయత్నించాను. ఓ రోజంతా సేల్స్‌మాన్‌గా పనిచేసాను, కొన్ని నెలలపాటు కంప్యూటర్ ప్ర్రోగ్రామింగ్ నేర్చుకున్నాను… అంతే కాదు, మా కుటుంబం నడిపే ‘పట్టు వస్త్రాల వ్యాపారం’లోకి ప్రవేశిద్దామని ఆలోచించాను. అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక నిర్వహించిన కాప్షన్ రైటింగ్ పోటీలో గెలవడంలో, నాలో ఓ రచయిత ఉన్నట్లు నాకు తెలిసింది. అప్పుడు నా వయసు సుమారుగా 18 ఏళ్ళు ఉండచ్చు.

ప్ర: “Warp and Weftకన్నా ముందు ఏవైనా రాసారా?

జ: డిగ్రీ చదువుతున్నప్పుడు, వ్యాసాలు, చిన్న కథలు (పిల్లలకీ, పెద్దలకీ) వ్రాయడం ప్రారంభించాను. నా కథలు దేశవ్యాప్తంగా ప్రచురితమయ్యే దినపత్రికలు (డెక్కన్ హెరాల్డ్, ఏసియన్ ఏజ్, టైమ్స్ ఆఫ్ ఇండియా), పత్రికలలోనూ (ఎలైవ్, పిసిఎం.. మొదలైనవి) ప్రచురితమయ్యాయి.

Cover5.5X8.5Size

ప్ర: “Warp and Weft” (నారాయణీయం) నవల ఇతివృత్తం ఎంచుకోడానికి మీకు ప్రేరణ కలిగించినదెవరు?

జ: ధర్మవరం గ్రామంలో మా అమ్మమ్మ గడిపిన జీవితంలోని ముచ్చట్లు వింటుంటే నాకెంతో ఆసక్తిగా ఉండేది. ఆ ఘటలనకు కథా రూపం కల్పించాను, కాస్త పరిశోధనతోనూ, తగినంత కల్పన జోడించి ఈ నవల రాసాను.

ప్ర: మీపై అత్యంత ప్రభావం చూపిన రచయిత ఎవరైనా ఉన్నారా?

జ: శ్రీ ఆర్. కె. నారాయణ్, ఆయన మాల్గుడి కథలు! ఆయన నిరాడంబరత్వం నిజంగా అద్భుతం. నా నవలను చదివితే, అది చాలా చోట్ల ఆయన రచనలను ప్రతిబింబిస్తుందని గ్రహిస్తారు.

ప్ర: ఎన్నేళ్ళ నుంచీ రచనలు కొనసాగిస్తున్నారు?

జ: గత 18ఏళ్ళకు పైగా..

ప్ర: మీరు ఏ తరహా రచనలు చేస్తారు?

జ: బ్లాగులు, కమ్యూనిటీల కోసం నాన్ ఫిక్షన్ ఆర్టికల్స్ రాస్తాను. పిల్లల కథలు రాస్తాను. త్వరలోనే నా రెండో నవల మొదలుపెట్టబోతున్నాను.

ప్ర: మీ రచనలలో ఎటువంటి సాంస్కృతిక విలువలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?

జ: కంటికి కనబడే జీవితాన్ని ప్రతిబింబిస్తాయి నా రచనలు. సాధారణంగా, రచనలు చేయడం కథన పద్ధతిని మెరుగుపరుస్తుంది.

ప్ర: మీ రచనా వ్యాసంగం పట్ల మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటుంటారు?

జ: మొదట్లో అయితే, ఏదో ఒక రోజు నేను రచయతనవుతానని- వారు కలలో కూడా ఊహించలేదు. 1996లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్రచురితమైన నా ఆర్టికల్ చదివాక, నన్ను బాగా ప్రోత్సహించారు.

ప్ర: ఈ నవల రాయడంలో మీకున్న లక్ష్యాలు, ఉద్దేశాలు ఏమిటి? అవి నెరవేరాయని భావిస్తున్నారా?

జ: 2001లో ఈ నవల రాయడం మొదలు పెట్టినప్పుడు, నాకు ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఏదీ లేదు. నా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది – మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే. నా నవలకి ప్రపంచ వ్యాప్తంగా… ముఖ్యంగా.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియాల లోని పాఠకుల నుంచి చక్కని ప్రతిస్పందన వచ్చింది. తొలి నవలా రచయితగా, దక్షిణ భారత దేశంతో నా అనుభవాలు అనే అంశాలపై బిబిసి రేడియో నన్ను రెండు సార్లు ఇంటర్వ్యూ చేసింది. ఈ నవల ఇంగ్లాండ్‌లో.. “Waterstone’s, WH Smith, Amazon, Blackwell” వంటి అన్ని ప్రముఖ పుస్తక సంస్థలలోనూ, ఇంకా అంతర్జాతీయంగా ఉన్న 70కి పైగా ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద లభిస్తోంది.

warp-and-weft-full-cover

 

ప్ర: ఈ నవల కోసం పరిశోధన చేస్తున్నప్పుడు మీకు తారసపడ్డ వ్యక్తుల గురించి కాస్త చెబుతారా?

జ: ఈ నవలలోని పాత్రధారులను సృష్టించడం కోసం నేనెంతో మంది ఆసక్తికరమైన వ్యక్తులను కలిసాను. ముఖ్యంగా, ఈ నవలలోని ఇద్దరు ప్రధాన పాత్రలను పోలిన వ్యక్తులు ఉన్నారు. రామదాసు పాత్ర దాదాపుగా మా నాన్నగారిలానే ఆలోచిస్తుంది. శ్రీరాములు పాత్ర మా దూరపు బంధువుకి ప్రతిరూపం.. కాస్త నత్తితో సహా.

ప్ర: ఈ నవలలో ఏ భాగం రాయడం మీకు కష్టమనిపించింది?

జ: నా నవల చీరలు నేయడం గురించి, నేతగాళ్ళ జీవితాలను స్పృశిస్తూ సాగుతుంది.. సరైన సాంకేతిక పదాలను ఉపయోగించాల్సి రావడం ఒక్కోసారి ఇబ్బందిని కలిగించింది.

ప్ర: ఈ పుస్తకంలోని ఏ భాగం మీకు బాగా నచ్చింది?

జ: 1950లలో తిరుమల ఎలా ఉండేదో రాసిన అధ్యాయం, అప్పటి భక్తిప్రపత్తుల ప్రస్తావన గురించి రాయడాన్ని నేను బాగా ఆస్వాదించాను.

ప్ర: జీవితం ఇప్పుడున్న స్థాయికి ఎలా చేరారు?

జ: నా జీవితంలోని ప్రతీ దశలోనూ.. స్వర్గస్తురాలైన మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను నమ్ముతాను. అదే నాకు జీవితంలోని ప్రతీ దశలోనూ.. నాకో ఆశ్చర్యకరమైన, ఘనమైన విశేషాన్ని అందిస్తోందని భావిస్తాను.

ప్ర: ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి మీరేం చేసారు? ఏ పద్ధతి పాటించారు?

జ: అనుకున్నంత తేలికగా ఈ నవల ప్రచురితమవలేదు. 2001లో ఈ నవలని వన్-సైడెడ్ పేపర్ల మీద రాసాను. అప్పట్లో కంప్యూటర్ కొనుక్కునే స్థోమత నాకు లేదు. ఓ డోలాయమానమైన నిర్ణయం తీసుకుని, విలేఖరిగా బెంగుళూరులోని నా ఉద్యోగాన్ని వదిలేసాను. ఏడు నెలల వ్యవధిలో 2,50,000 పదాలు రాసాను.

ఈ పుస్తకాన్ని ప్రచురించడం కోసం 2001నాటి శీతాకాలంలో ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాను. నా నవల చాలా నిరాదరణకి గురైంది. ప్రచురణకర్తలు ఉపేక్షించారు. ఎందరో పబ్లిషర్ల చుట్టూ తిరిగాను, ఏజంట్లను మార్చాను. అయినా ఫలితం లభించలేదు. చివరకి సెల్ఫ్-పబ్లిష్ చేసుకునేందుకు అమేజాన్ వాళ్ళని సంప్రదించాను. మొత్తానికి నా నవల వెలుగుచూసింది. భారతదేశంలో అంతగా పేరు పొందని ప్రాంతం గురించి అందరికీ చెప్పగలిగాను.
ప్ర: మీకూ మిగతా రచయితలకూ తేడా ఏమిటి? మీ విలక్షణత ఏమిటి?

జ: బిబిసి రేడియో వాళ్ళు కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. నా నవల చీరలు నేయడం గురించి, నేతగాళ్ళ జీవితం గురించి లోతుగా ప్రస్తావిస్తుంది. ముఖ్యంగా, తెలుగేతర ప్రాంతాలకి చెందినవారికి, తెలుగు వారసత్వం, సంస్కృతి గురించి చాల తక్కువ విషయాలు తెలుస్తాయి. ఈ నవలలో అవి చాలా స్పష్టంగా వ్యక్తమవుతాయి.

ప్ర: మీ మొదటి నవలని పబ్లిష్ చేసుకోడంలో మీరు ఎదురైన సవాళ్ళు ఏవి?

జ: నవల రాయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రచురింప జేసుకోగలడం మరొక ఎత్తు. నా కథని విశ్వసించే లిటరరీ ఏజంట్‌ని పట్టుకోగలగడం నాకు నిజంగానే సవాలైంది.

ప్ర: ఒక్కసారి వెనక్కిమళ్ళి, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి రాయాల్సివస్తే, ఈ నవలలోని ఏ భాగాన్నైనా మారుస్తారా?

జ: నవలలోని ప్రధాన భాగాలు వేటినీ మార్చను… కానీ ముగింపుని మరికాస్త వాస్తవికంగా ఉండేట్లు రాస్తాను.

ప్ర: ఓ రచయితగా మీకు ఎదురైన తీవ్ర విమర్శ ఏది? అలాగే ఉత్తమ ప్రశంస ఏది?

జ: నిర్మాణాత్మక విమర్శలు చాలా వచ్చాయి. నేను వాటి నుంచి నేర్చుకుంటున్నాను. పోతే, నాకు లభించిన ఉత్తమ ప్రశంస శ్రీ ఆర్. కె. నారాయణ్ నుంచి. రాయడం మానద్దని ఆయన ప్రోత్సహించారు.

 

ప్ర: చివరగా, సారంగ పాఠకులకు ఏమైనా చెబుతారా?

జ: ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు, నా నవలను చదివి వారి స్పందనని నాకు తెలియజేయమని అడగడం తప్ప. నా వెబ్‌సైట్ www.vinayjalla.co.ukద్వారా నన్ను సంప్రదించవచ్చు.

ప్ర: ఈ ఇంటర్య్వూకి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు వినయ్ గారు. మీరు మరిన్ని రచనలు చేసి రచయితగా రాణించాలని కోరుకుంటున్నాను.

జ: థ్యాంక్యూ, సోమ శంకర్ గారు. నా ఈ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చిన సారంగ వెబ్ పత్రిక ఎడిటర్లకి నా ధన్యవాదాలు. నమస్కారం.

 ముఖాముఖి: కొల్లూరి సోమశంకర్

 

ఆప్తవాక్యం

 

yandmuriఎవరైనాఒకరచయితతనపుస్తకానికిముందుమాటవ్రాయమంటే, కొంచెంకష్టంగానేఉంటుంది. వ్రాయటానికికాదు. ఆపుస్తకంమొత్తంచదవాలికదా. అందుకు (కొందరైతేచదవకుండానేవ్రాస్తారు. అదిమంచిపద్దతికాదు).

రచయితలబ్దప్రతిష్టుడైతేపర్వాలేదు. కొత్తవాడైతేమరీకష్టం. అందులోనూఅదిఅనువాదంఅయితేచదవటంమరింతరిస్కుతోకూడినవ్యవహారం.

ఇన్నిఅనుమానాలతోఈపుస్తకంచదవటంమొదలుపెట్టాను. మొదటిపేజీచదవగానేసందేహాలన్నీపటాపంచలైపోయినయ్. మొదటివాక్యమేఆకట్టుకుంది. ఇకఅక్కడినుంచీఆగలేదు.

ఆంగ్లరచయితతాలుకుఇదిమొదటిరచనోకాదోనాకుతెలీదు. సబ్జెక్టుమీదఎంతోగ్రిప్ఉంటేతప్పఈరచనసాధ్యంకాదు. కేవలంకథాంశమేకాదు. పాత్రపోషణ, నాటకీయత, క్లైమాక్స్అన్నీబాగాకుదిరాయి.

అనువాదకుడిగురిచిచెప్పకుండాముగిస్తేఅదిఅతడికిఅన్యాయంచెయ్యటమేఅవుతుంది. ఒక్కమాటలోచెప్పాలంటే: చెప్తేతప్పఇదిఅనువాదంఅనితెలీదు. అంతబాగావ్రాసాడు.

ఇద్దరికీఅభినందనలు.

యండమూరి వీరేంద్రనాథ్.

21-6-14

 

హిందీ వాళ్ళ కన్నా మనమే బాగా దూసుకుపోతున్నాం: శాంత సుందరి

 

శాంత సుందరి, గణేష్ రావు గారు

శాంత సుందరి, గణేష్ రావు గారు

                              

 కొంతమందికి నాలుగు మాటల పరిచయ వాక్యాలు సరిపోవు. శాంత సుందరి గారికైతే మరీ!

కొడవటిగంటి వారమ్మాయి అంటే ఆమెని కేవలం ఒక ఇంటి అమ్మాయిగానే చూడాల్సి వస్తుంది.

లేదూ, అందరి మన్ననలూ అందుకున్న స్నేహశీలి అంటే కేవలం ఆమెని ఒక వ్యక్తిగానే చూడడం అవుతుంది.

ఇటీవలి కాలంలో అనువాదాన్ని ఒక యజ్ఞంగా తీసుకొ