టెక్సాస్ యూనివర్సిటీ తెలుగు కోసం శాశ్వత నిధి

వంగూరి చిట్టెన్ రాజు 

ఉత్తర అమెరికాలో కొత్త తరాలు తమ పిల్లలకి తెలుగు భాషా, సంస్కృతుల పైన మక్కువ కలిగించే ప్రయత్నాలు ప్రతీ చోటా తెలుగు పాఠశాలలు, నాట్య శిక్షణాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అధిక భాగం ఔత్సాహిక స్థాయిలో నిర్వహించడంలో కృతకృత్యులవుతున్నారు. కానీ తీరా ఆ పిల్లలు హైస్కూల్ దాటి ఉన్నత విశ్వ విద్యాలయాలలో అడుగు పెట్టగానే కేవలం “బాలీవుడ్” సంస్కృతికి తప్ప ఆ  తల్లిదండ్రులు కష్టపడి వేసిన ఆ భాషా పరమైన మౌలికమైన పునాదులని పటిష్టం చేసుకునే అవకాశాలు కల్పించడంలో అమెరికా తెలుగు సమాజం, జాతీయ స్థాయి తెలుగు సంఘాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ అటు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలకీ, ప్రజలకీ భాషా, సాహిత్యం, సాంస్కృతిక పెంపుదలపై ఉన్న నిర్లిప్తత  ఎంతో బాధాకరం. అందు వలన వారి నుంచి కూడా ఏమీ ఆశించకుండా అమెరికాలో మన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి.

ఈ నేపధ్యంలో అమెరికాలో యువతరానికి కేవలం తెలుగు భాష, సాహిత్య, సంస్కృతులపై అవగాహన, మునుపెరగని అభిలాష  ఉన్నత విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా కలిగించడం ద్వారానూ, మన ప్రాచీన, ఆధునిక సాహిత్యాలని, భాషా శాస్త్రాన్ని  ఇతర భాషా కోవిదులతో సరి సమానంగా, సగర్వంగా చాటుకోగల సంస్థాగత నిర్మాణాల ద్వారానూ  తెలుగు భాష మహోజ్జ్వలంగా మనుగడ సాగిస్తుంది అని విజ్ఞుల అభిప్రాయం.  అప్పుడే తెలుగు భాష అంతర్జాతీయ భాషలలో సముచిత స్థానాన్ని పొందడమే కాకుండా మన తెలుగు యువ తరం వారి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత  అవసరాలు ఈ పరాయి దేశంలో సముచితమైన స్థాయిలో నెరవేరుతాయి. ఈ దిశలో,  తెలుగు రాజకీయ, సామాజిక, వర్గ విభేదాలకి అతీతంగా అత్యున్నత స్థాయి అమెరికా విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రణాళిక తో మేము తలపెట్టిన ఒక చిన్న ప్రయత్నానికి మీ నైతిక ప్రోద్బలం, ఆర్ధిక సహాయం అర్థించడమే ఈ ఉత్తరం సారాంశం.  

గత ఇరవై ఏళ్ళకి పైగా తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదల పై దృష్టి కేంద్రీకరించి, మాకు  ఉన్న పరిమితులకి లోబడి, కేవలం మీ బోటి తెలుగు భాషా, సాహిత్యాభిమానుల ప్రోద్బలమే ఇంధనంగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించడమే “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” కి ఉన్న ఏకైక అర్హత.  దానికి కొనసాగింపుగా ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ వారి తెలుగు విభాగం అభివృద్దికి ఒక “శాశ్వత నిధి” (Program Endowment in Telugu Studies)  సమకూర్చడానికి ఆ విశ్వవిద్యాలయ అధికారులతో సూత్రప్రాయంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ శాశ్వత నిధుల నిర్వహణ పూర్తిగా ఆ విశ్వ విద్యాలయం అధికారుల చేతులలోనే ఉంటుంది, దాని పై ఏటా వచ్చిన ఆదాయం మొత్తం అక్కడి తెలుగు విభాగం ఖర్చులకి, పెంపుదలకి మాత్రమే శాశ్వత ప్రాతిపదిక మీద వినియోగించబడుతుంది. 

ఇటీవల హ్యూస్టన్ లో జరిగిన “పాడుతా తీయగా” కార్యక్రమ వేదిక పై గాన గంధర్వులు డా. ఎస్.పి. బాల సుబ్రమణ్యం ఈ శాశ్వత నిధి ఏర్పాటు గురించి తొలి సారిగా ప్రకటించి ప్రశంసించారు.  

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లాంటి అత్యత్తమ స్థాయి విశ్వవిద్యాలయం లో గత యాభై ఏళ్ల కి పైగా నడుస్తున్న తెలుగు విభాగం అభివృద్దికి మీ వంతు కర్తవ్యంగా ఈ శాశ్వత నిధి కి మీ ఆర్ధిక సహకారం అందించి, యువతరానికి మన తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులపై అవగాహన, అభిరుచి ఒక విశ్వ విద్యాలయ స్థాయిలో, తగిన ఎకడమిక్ క్రెడిట్స్ పొందే అవకాశం కల్పించమని కోరుతున్నాం.

             మీ అండదండలతో పౌర నిధుల సేకరణ ద్వారా తగిన ఆర్ధిక వనరులు సమకూర్చగలిగితే అమెరికా  విశ్వవిద్యాలయాలలో ఉన్న తెలుగు ఆచార్యులు కలిసి, మెలిసి ఇతర ప్రపంచ, భారతీయ భాషా శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పండితుల సహవాసంతో మన భాషా శాస్త్రం, ప్రాచీన & ఆధునిక సాహిత్య విషయాలపై పరిశోధనలు జరిపి, ఉన్నత స్థాయి అనువాదాలని ప్రచురించి, నిజమైన అంతర్జాతీయ భాషా సదస్సుల  ద్వారా తెలుగు భాషకి ప్రపంచ భాషలలో తగిన గుర్తింపు లభించే  దీర్ఘకాలిక  ప్రయోజనాలు  కూడా సమకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 

Brief History & Background of University of Texas Telugu Studies Department

University of Texas, Austin which was established in 1883 and is one of the highest rated Universtites in USA with over 50000 students from around the world.  

The first Telugu course was taught in 1960 and Hindi-Telugu Center at UT was established in 1961. Later on, It was changed to South Asia Center which is one of earliest such Institutes in North America. The person who made all this happen and ran this Insitute until 1990 is Ms. Andre’e F. Sjoberg. She is now 91 years old and lives in West campus of UT. And beleive it not, she procured 7859 Telugu books which are now available in UT, Austin Library making it one of the world’s largest Telugu Libraries out side of India.

At the present time, UT Telugu Studies Department is one of the largest and most active in USA, under the able leadership of Prof. Afsar Mohammed, a well known Telugu poet & literary critic. Per our information, over 450 students graduated from the Telugu Department in the last few years with an average enrollment of 50 students in several credit courses. It is unfortunate that  enrollment was denied last year for many more enthusiastic students for lack of supporting funds.  

UT, Austin offers eight credit courses to learn Telugu reading, writing and spoken language,  modern Telugu literature including short story & poetry.  UT also teaches Annamayya devotional music and classical music of Tyagaraja and other great  composers. All these prorgams attract not only Telugu heritage students but also non-Telugu students from main stream other ethnic groups.   The Telugu Students formed a separate student body for themselves called Telugu Students  Association which is very active with about 50 members.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వారి సహకారంతో ఈ శాశ్వత నిధి వలన చేకూరే కొన్ని సత్ఫలితాలు

·                  ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్న యువత సంఖ్యని 50 నుంచి పెంచి అందరికీ అవకాశం కలిగించడం.

·         ప్రాచీన, ఆధునిక సాహిత్యం, తెలుగు కథ, కవిత్వం మొదలైన ప్రక్రియలపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం.

·         తెలుగు భాషా శాస్త్రం, సాహిత్యాలపై మాస్టర్స్ మరియు డాక్టరేట్ స్థాయి కి విస్తరణ.

·         ఉన్నత స్థాయి పరిశోధనలకి, ప్రచురణలకి అవకాశాలు కల్పించడం.

·         విశ్వ విద్యాలయ స్థాయిలో అన్నమయ్య సంకీర్తనలు, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ, అవగాహన పెంపొందదించడం.

·         తెలుగు సంస్కృతి, శాస్త్రీయ నృత్యాలపై విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్యాంశాలు నెలకొల్పడం.

·         ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల, తదితర భాషలోకి అనువదించి అంతర్జాతీయ సాహిత్యంలో తగిన గుర్తింపు కి కృషి చెయ్యడం.  

·         పై అంశాలలో విషయాలలోనూ నిష్ణాతుల ప్రత్యేక ప్రసంగాలని (Endowment Lectures) ఏర్పాటు చెయ్యడం.

·         వివిధ దేశాల విశ్వ విద్యాలయాల తెలుగు ఆచార్యులు, విద్యార్థులు ఇతర భాషా, సాహిత్యవేత్తల తో అంతర్జాతీయ స్థాయిలో వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు భాషా, సాహిత్యాల పురోగతికి తోడ్పడడం.

 

The main purpose of creating the Endowment Fund is to support Telugu Studies Department on a permanent basis. Vanguri Foundation of America, Inc has made an initial committment of $25,000 to be donated directly to UT, Austin. Further endowment funds may be donated as needed to meet the permanent and specific needs such as Annual Endowment Lectures, Academic Conferences and to meet some of the above lsited objectives.   We plan to sign the Endowment Contract in a few days. This is the first time a permanent Endowment is being established where the funds will be invested by UT Endowment Management, and use the returns exclusively for Telugu Studies. The donated funds for Endowment can never be spent, only invested by UT.

We request your generous tax-deductible financial support as follows: Please help us raise $25000 by September 15, 2015. All donations are tax-deductible in USA.

Grand Benefactor (సార్వభౌమ పోషకులు): $5000

Grand Patron (చక్రవర్తి పోషకులు): $2500

Chief Benefactor (మహారాజ పోషకులు): $1000 ­

Chief Patron (రాజ పోషకులు): $500

Benefactor (యువరాజ పోషకులు):  $250

Patron (పోషకులు):  $100

 Any other donations are gratefully accepted.

(All donors may be recognized per UT policies and by VFA in its Media Releases)

 

Special Note on Matching Donations from Major Corporate Employers

Please note that Vanguri Foundation of America, Inc. has been approved to receive matching donations from many major companies in USA such as Google, Microsoft, Bank of America, Union Bank, Chevron, Microsoft, Dell, Intel, BP, Baker-Hughes, General Electric and others. We appreciate your contacting your empolyer for matching procedures and help double the impact of your own generous donations. Please contact us for details.

 

CONVENIENT OPTIONS ON HOW TO DONATE

On-Line with any credit card

Please log in or copy or paste the following in your URL and follow prompt.

 

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=VDB9HSSK7P8HE

 

or visit www.vangurifoundation.blogspot.com, click on DONATE button on right and follow prompt.

By Check

·         CHECK Payable to VFA, write “UT, Austin Fund” in Memo section  and mail to

Vanguri Foundation of America, Inc. P.O. Box 1948, Stafford, TX 77497

For More Information, Please contact

పసునూరి రవీందర్‌ కి యువ సాహిత్య అకాడెమీ అవార్డ్

Pasunoori Ravinder 1

 

సాహిత్య అకాడ‌మి 23భారతీయ భాషల యువపురస్కారం-2015 విజేతల్ని ప్రకటించింది. తెలుగు నుండి ప్రముఖ యువకవి, రచయిత డాక్టర్‌ పసునూరి రవీందర్‌ను ఎంపిక చేసింది. రవీందర్‌ రాసిన అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా పుస్తకానికి ఈ గౌరవం దక్కింది. కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, పరిశోధకునిగా బహుముఖీన కృషి చేస్తున్న పసునూరి రవీందర్‌ సాహిత్యలోకానికి సుపరిచితుడు. వరంగల్‌ నగరంలోని శివనగర్‌ ప్రాంతానికి చెందిన రవీందర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఫెలోగా పనిచేస్తున్నారు.

లడాయి దీర్ఘకవిత, మాదిగపొద్దు కవితా సంకలనంతో పాటు అవుటాఫ్‌ కవరేజ్‌ఏరియా, జాగో జ‌గావో, దిమ్మిస‌ పుస్తకాలను వెలువరించారు. తెలంగాణ ఉద్యమంలో బహుజన వాయిస్‌ను బలంగా వినిపించిన పదునైన గొంతుక రవీందర్‌. ఇటీవలే రవీందర్‌ కృషికి తెలంగాణ ఎన్నారై అవార్డుతో పాటు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును కూడా సీఎం కేసియార్‌ చేతుల మీదుగా అందుకున్నారు. ఇక సాహిత్య అకాడమి ఎంపిక చేసిన యువపురస్కారం ఈ యేడాది రవీందర్‌ను వరించింది.

 

సురవరం ప్రతాప రెడ్డి రచనలపై సభ

suravaram

పంజరం లో రంగుల ఆకాశం

బి. అనూరాధ

అరుణ్ ఫరేరా “సంకెళ్ళ సవ్వడి” పుస్తకానికి బి. అనురాధ రాసిన ముందుమాట నుంచి..

 

ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ దేశపు జైళ్లను చూడాలి అని ఎవరన్నారో కానీ అది అక్షరాలా నిజం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని పాలకులు నిస్సిగ్గుగా చాటుకొనే భారతదేశంలో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే జైళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. జైళ్లను బయటనుండి సందర్శించేవారికి తెలిసే విషయాలు పెద్దగా ఏమీ ఉండవు. లోపల ఏంజరుగుతుందో బయట ప్రపంచానికి ఏమాత్రం అర్థంకాదు. అరుణ్‌ పుస్తకం మనకా ప్రపంచాన్ని చూపిస్తుంది.

ఈ పుస్తకం తెలుగు అనువాదానికి ముందుమాట రాయడానికి నాకున్న ఏకైక అర్హత నేను జైలు జీవితానికి ఒక ‘ఇన్‌సైడర్‌’ని కావడమే. ఒకేలాంటి రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్నా, సామాజిక కార్యకర్తగా దాదాపు ఒకేకాలం లో రెండు దశాబ్దాలు పనిచేసినా, జైల్లో పడేవరకూ అరుణ్‌తో నాకు పరిచయం లేకుండింది. తాను మహారాష్ట్ర జైల్లోనూ నేను జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జైల్లోనూ ఉన్నప్పుడు, అక్కడున్న వేరే రాజకీయ ఖైదీలతో నాకు కలంస్నేహం ఉండింది. అప్పుడు నా ఉత్తరాలను వాళ్ళు సామూహికంగా చదువుకొనేవాళ్ళు. నా ఉత్తరాలు కొన్నిటికి తన బొమ్మలతో ప్రతిస్పందించేవాడు అరుణ్‌. అలా తాను మన కళ్ళముందించిన జైలు జీవితంలోని రంగులు కొన్నిటిని మాతోనూ పంచుకొని, మా నలుపుతెలుపుల జైలు జీవితానికి రంగులద్దే ప్రయత్నం చేశాడు. అలా పరిచయమైన అరుణ్‌ని విడుదలయ్యాకనే చూశాను. జైలు జీవితం నాకిచ్చిన ఒక మంచి స్నేహితుడు అరుణ్‌ అయితే, జైలు జీవితం వల్ల అరుణ్‌ మనకిచ్చిన మంచి కానుక ఈ పుస్తకం.

ఆ కాలంలో ఉత్తరాల కోసం మేము ఎంత ఉద్విగ్నతతో ఎదురు చూసేవాళ్లమంటే అన్నం సహించేది కాదు. అందువల్లే కావచ్చు అరుణ్‌ కూడా ఇందులో తాను చెప్పదలుచుకొన్న ప్రతి విషయాన్ని తాను బైటికి రాసిన ఉత్తరం తో మొదలుపెట్టాడు. తను ఎంచుకొన్న ఈ పద్ధతి వల్ల ఈ పుస్తకాన్ని కింద పెట్టకుండా చదివేస్తాం. అరుణ్‌ కేవలం బొమ్మలు వెయ్యడమే కాదు. తానొక కార్టూనిస్టు కూడా. కాబట్టి, తన బొమ్మల్లోనే కాకుండా తన రచనలో కూడా ఆ వ్యంగ్యం మనకి అడుగడునా కనిపిస్తుంది. ఇది తన శైలికి ఒక ప్రత్యేకతని ఆపాదించింది.

చీకటి కొట్లులాగా పిలవబడే జైళ్ళలో అసలేం జరుగుతుంది? ఎలా గడుపుతారు అన్నన్ని యేళ్ళు? మనం ఎన్నడూ వినని ఒక కొత్త భాష. అది జైలు కే ప్రత్యేకం. అక్కడ మనం మనుషులం కాదు శాల్తీలం. ప్రతిరోజూ మూడు సార్లు లెక్కల్లో తేలాక, గిన్తీలు, తలాశీలు వంటి రొటీన్లతో, ములాకాత్‌లు, తారీఖ్‌ లు వంటి విశేషాలతో, ”గిరాదేంగే”, ”పీ.సీ.ఆర్‌ కరాదేంగే” వంటి ధమ్కీలతో ఆశ నిరాశల మధ్య ఉద్వేగాలు, అప్పుడప్పుడు కొన్ని ఉత్సాహాలు, ఎదురుచూపులు, అనేక దిగుళ్ళు ఎన్ని ఉన్నా ఖైదీని చివరవరకు నిలిపి ఉంచేది ‘ఆశ’ ఒక్కటే. వాటి తాలూకు రంగులన్నీ అరుణ్‌ పుస్తకంలో ప్రతి పేజీలోను కనపడతాయి.

జైళ్ళలోని అవసరాలు ఖైదీల్లోని సృజనని అద్భుతంగా బయటకు తీస్తాయి. అందుకు ఈ పుస్తకంలో కొల్లలుగా ఉదాహరణలు కనిపిస్తాయి. క్రికెట్‌ ఆడడానికి బంతి తయారుచెయ్యడంలో కావచ్చు, ఏకాంతంలో ఉంచినా ఒకరికొకరు సమాచారం పంపుకోవడంలో కావచ్చు, ఏ రకంగానూ రుచిలేని తిండిని బాగుచేసుకోవడంలో కావచ్చు, ఐదు నిమిషాల్లోనే బట్టలు ఉతుక్కొని, స్నానం చెయ్యగల నేర్పుని సంపాదించడంలో కావచ్చు, పెన్నుల్లో ఖాళీ అయిన రీఫిల్స్‌ ని ఉపయోగించి చెప్పుల్ని మరమ్మత్తు చెయ్యడంలో కావచ్చు – ఆ సృజనకి సాటిలేదు.

ఖైదీలకి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంచడం కారాగార వాసంలోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఆ ఖైదీలు రాజకీయ ఖైదీలైతే కనుక వాళ్ళు తాము ఎక్కడున్నా ప్రజల మధ్య ఉన్నామనే అనుకొంటారు కనుక వాళ్ళని మిగతా ఖైదీల నుంచి వేరు చేసి వంటరిగా ఉంచే ఏర్పాట్లు దేశంలోని అన్ని కేంద్రీయ కారాగారాల్లోనూ ప్రత్యేక శ్రధ్ధతో చేసింది. అవే అండా బ్యారక్‌ లు. అత్యంత భద్రత కలిగినవి రాజ్యం దృష్టిలో. అరుణ్‌ కూడా అటువంటి అండా బ్యారక్‌ లోనే తన జైలు జీవితం మొత్తాన్ని గడిపాడు. అందులో ఉండే ఒంటరి సెల్స్‌ గురించి అరుణ్‌ ఇలా అంటాడు.

”….ఈ సెల్స్‌లోకి కాంతి చొరబడదు. సెల్‌లో నుంచి మీకు బయట ఏమీ కనపడదు. ఒక ఆకుపచ్చని చెట్టులేదు. ఆకాశం ముక్క లేదు. ‘అండా’ కు మధ్యలో ఎత్తుగా ఒక కాపలా స్తంభం ఉంటుంది. ఆ స్తంభం పైకెక్కి చూస్తే ఈ మొత్తం ఆవరణ ఒక పెద్ద, గాలి చొరబడని సిమెంటు గుడ్డు లాగా కనపడుతుంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఈ గుడ్డును పగలగొట్టడం అసాధ్యం. బహుశా ఈ గుడ్డు లోపల ఉండే ఖైదీలే పగిలిపోవాలని దీన్ని తయారుచేశారేమో!!”

”…… అండా నిర్మాణంలోని ఈ పాశవికమైన ఊపిరిసలపనితనం కన్నా మనిషితో సంబంధం లేకపోవడమే మీ ఊపిరిని బిగదీస్తుంది” అంటాడు.

జైలు లో దేన్నయినా కటకటాల్లోనించే చూడాలి. ఎందుకంటే ఆ చీకటకొట్ల బయట

ఉండే ఆవరణ పై కప్పు ఖాళీగా ఉండకుండా ఇనుప జాలీ తో మూసివేసి ఉంటుంది.

”పిట్ట కూడా దూరలేదు” అని మనం కేవలం ఒక అలంకారం కోసం వాడే ప్రయోగం ఇక్కడ అక్షరాలా వాస్తవం. అలాగే బావి పైనా అంతే. ఇనుప జాలీతో మూత పెట్టినట్టు ఉండే బావిలోనుండి, సన్నగా పొడుగ్గా ఉండే డబ్బాల్లాంటి ప్రత్యేక బక్కెట్లతోనే నీళ్ళు తోడుకోవాలి. ఇలాంటివి ఒక ఎత్తయితే బయటి సమాజంలో ఏమాత్రం ఊహించలేని విపరీత పరిస్థితులు జైల్లో మనకి తారసపడుతుంటాయి.

మహిళల హక్కుల కోసం పోరాటంలో రెండు దశాబ్దాల కార్యాచరణలో ఎన్నో వరకట్న హత్యలకి వ్యతిరేకంగా పోరాడినందుకు నేనూ, వరకట్న హత్యలు చేసో, వాటికి ప్రేరేపించో జైలుకి వచ్చిన స్త్రీలూ ఒకేచోట సుదీర్ఘ కాలం కలిసిఉండాల్సిరావడం. జైలు జీవితంలో మాత్రమే ఉండే ఒక అసంబద్ధత ఇది. అలాంటి విపరీత పరిస్థితులను అరుణ్‌ కూడా ఎదుర్కొన్నాడు. నిజానికి అంతకంటే తీవ్రమైనది. ఖైర్లాంజీ హత్యాకాండలోని నిందితులతో, అరుణ్‌ ఫాసీయార్డులో ఉండాల్సి రావడం అటువంటిదే.

”అంతటికీ కారణం సురేఖ భోట్‌మాంగే నే ……ఆమె మా మీద ఫిర్యాదు చేసె ధైర్యం చేసింది. మిగిలిన దళితులలాగా కాక ఎప్పుడూ బైటకి మాట్లాడు తుండేది. సాహసికంగా ఉండేది” అని వాళ్ళు అరుణ్‌తో చేసిన వాదనలు విన్నప్పుడు ‘డాటర్‌ ఆఫ్‌ ఇండియా’లో నిర్భయ పట్ల తమ చర్యలను సరిగ్గా ఇలాంటి వాదనలతోనే సమర్ధించుకొన్న ముఖేష్‌ సింగ్‌ గుర్తుకు వస్తాడు. ఇలాంటి వారితో కలిసి రోజంతా కలిసి ఉండాల్సిరావడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అలవాటుపడతాం. జనరల్‌ బ్యారక్‌ లలో కనీసం కొంతమంది నైనా దూరంగా పెట్టగల అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఫాసీయార్డు లాంటి చోట్ల మనుషులే కరువయిన ఒక వాతావరణంలో మాట్లాడాలన్నా ఉన్నది వాళ్ళే. కాసేపు ఉల్లాసం కోసం ఆటలాడుకోవాలన్నా ఉన్నది వాళ్ళే అయినప్పుడు, మనుషుల్లోని అమానుషత్వాన్ని, క్రూరత్వాన్ని తాత్కాలికంగా విస్మరించడం నేర్చుకొంటాం. అరుణ్‌ కూడా అలానే నేర్చుకొన్నాడు. ”సమాజంలో అతి అసహ్యానికి గురైన వారితో సుదీర్ఘ కాలం నిర్బంధంలో కలిసి ఉండడంలోని అనివార్యతలు ఇవి” అంటాడు.

ఈ పుస్తకంలో అరుణ్‌ కేవలం జైలు జీవితాన్ని గురించి మాత్రమే రాయలేదు. తాను జైలుకి వచ్చిన నేపథ్యం, తన రాజకీయ విశ్వాసాల గురించి కూడా రాశాడు. ఆ రకంగా జైలు జీవితానికి సంబందించిన ”సమయ సందర్భాలను” కూడా మనకి పరిచయం చేస్తాడు. అలాగే సమకాలీన రాజకీయాలను గురించి కూడా అవకాశమున్న ప్రతి సందర్భంలోనూ చర్చించాడు.

అరుణ్‌ 1990 ల మొదట్లో ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో విద్యార్థిగా ఉన్న కాలంలో అణగారిన ప్రజలకు సంక్షేమ చర్యలు అందించే శిబిరాలను గ్రామాలలో నడపటం ద్వారా సామాజిక కార్యాచరణ లోకి ప్రవేశించాడు. ఆ క్రమంలోనే భారత సమాజం స్వభావాన్ని గురించి కూడా తన కార్యాచరణనుంచే గ్రహించడం మొదలు పెట్టాడు. ”భారత సమాజం వర్గ, కుల అంతరాలతో ముక్కలైందనీ, అసంఖ్యాకమైన వైరుధ్యాలతో నిండి ఉన్నదనీ” గుర్తించాడు. ”వ్యవస్థలు మారకుండా దాతృత్వం ఎంత అర్థరహితమో” గ్రహించాడు.

బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పునరావాస చర్యలలో పాల్గొన్నాడు. కాలేజీ క్యాంటీన్‌ కార్మికుల జీవితాలను దగ్గరగా చూసి, వాళ్ళ హక్కుల కోసం జరిపే పోరాటాలలో సహాయపడుతున్న క్రమంలో విప్లవ విద్యార్థి సంస్థలలో ఒకటైన విద్యార్థి ప్రగతి సంఘటన్‌లో చేరాడు. కాలేజీ చదువు ముగిశాక ‘నవజవాన్‌ భారత్‌ సభ’ అనే యువజన సంస్థలో పనిచేశాడు. ఈ సంస్థలో పనిచేస్తూ ముంబయి లోని అట్టడుగు ప్రజల నివాస స్థలాలైన ”మురికివాడలను” తన నివాసంగా చేసుకొన్నాడు. శివసేన ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్డునపడ్డ బస్తీవాసులను సంఘటిత పరిచే ఆందోళనలు నిర్వహించడంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అలనాడు భగత్‌ సింగ్‌ నిర్మించిన సంస్థలాగే ఇదీ నిషేధానికి గురయ్యింది. ప్రపంచీకరణ వ్యతిరేక ఆందోళనల్లో తలమునకలుగా పాల్గొన్నాడు. ఇలాంటి రాజకీయ కార్యాచరణలో ఉన్నవారికి అరెస్టులు కొత్తకాదు. కాబట్టి తాను ఎప్పుడైనా అరెస్టు కావచ్చని అరుణ్‌ ఊహిస్తూనే ఉన్నాడు. ఊహించలేక పోయిన విషయం ఏమంటే తన అరెస్టు జరిగిన తీరు, ఆ తరవాత తనపైన జరిగిన అత్యాచారాలు, తనని, తనతో పాటుగా అరెస్టు కాకపోయినా అయ్యారని పోలీసులు అరెస్టు చూపిన ఇతర రాజకీయ కార్యకర్తలను ఎంత భయానక చిత్రహింసలకు గురిచేశారో చదువుతుంటే శరీరం గగుర్పొడుస్తుంది. అందుకే కస్టడీ మరణాలను అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రం మహారాష్ట్ర కావడం యాదృచ్ఛికం కాదంటాడు.

పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా పెట్టిన చిత్రహింసలు ఒక ఎత్తైతే కొన్ని నేరుగా చిత్రహింసలు పెట్టకుండానే అలాంటి పరిస్థితులను కల్పించి కష్టపెట్టడం మరొక ఎత్తు. ఉదాహరణకు పోలీసులు తన చెప్పులను ఎక్కడోపెట్టి మర్చిపోయి (?) తనని ఒట్ఠి కాళ్లతో జైలుకి పంపడం. ఎర్రని ఎండలో బొబ్బలెక్కించే తారురోడ్డు మీద జైలు గేటునుంచి కోర్టు వ్యాను వరకూ కాలిపోయే రోడ్డుమీద నడవలేక పరిగెత్తేవాడినని రాశాడు. రెండు నెలల వరకూ ఇదే పరిస్థితి.

ఇలాంటి పరిస్థితులని, నిరాశా నిస్పృహ కలిగించే జైలు వాతావరణాన్ని భరిస్తూ కూడా అరుణ్‌ కానీ, తన సహచర రాజకీయఖైదీలు కానీ తమ సెన్సాఫ్‌ హ్యూమర్‌ని ఏమాత్రం కోల్పోలేదు. అక్కడ జరిగే ఇటువంటి వాటికి కాలేజీ విద్యార్థుల్లాగా ముద్దు పేర్లు పెట్టుకోవడం… ఉదాహరణకు ఖైదీలకి మానవ హక్కులేంటని సుప్రీం కోర్టు తీర్పులపై విసుక్కొని, ఖైదీలకి ”బుద్ధి చెప్పడానికి” ఒక జైలర్‌ ఎంచుకొన్న భౌతిక హింసా కార్యక్రమానికి ”సాయంకాలం భజన” అని, ఆయన బదిలీ తరవాత చొక్కా చేతులు పైకి మడిచి సల్మాన్‌ స్టైల్‌ లో రుబాబ్‌ చేసే యువ జైలర్‌కి ”ధభంగ్‌” అని పేర్లు పెట్టడం వంటివి. అక్కడ జరిగే తతంగాలను వర్ణించేటప్పుడు కూడా ఆ హాస్యం, ఆ వర్ణనలు అంత బాధలోనూ నవ్వు తెప్పిస్తాయి. నిజానికి రాజకీయ ఖైదీలకి ఎప్పుడూ బలం అదే. ఎలాంటి పరిస్థితిలోనైనా నవ్వగలగడం. ముఖ్యంగా తానూ, తన సహచరులూ ఈ నవ్వులని తమకే పరిమితం చేసుకోకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న మాలాంటి వారికి కూడా ఉత్తరాల ద్వారా పంచారు. మా కలం స్నేహం వల్ల మేమంతా వేరు వేరు రాష్ట్రాల్లోని, వేరు వేరు కేంద్ర కారాగారాల్లో ఉన్నప్పటికి అందరం ఇంగ్లీష్‌ వార్తాపత్రికల్లో మొట్టమొదట చూసేది కాల్విన్‌ అండ్‌ హాబ్స్‌ కార్టూన్‌ అని తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఎలాంటి నిరాశలో ఉన్నా కాల్విన్‌ మమ్మల్ని ఒక్కసారైనా మనసారా నవ్వించేవాడు.

తరవాత కాలంలో ముంబై నుండి బదిలీ అయి వచ్చిన వెర్నన్‌, శ్రీధర్‌ అనే మరో ఇద్దరు రాజకీయ ఖైదీలు జైల్లో ”వకీల్‌ అంకుల్స్‌”గా పేరు పొందారు. నిజంగా వకీళ్ళు కాకపోయినా అంతకంటే ఎక్కువగా న్యాయసహాయాన్ని జైల్లో ఉంటూనే

అందించారు. ఆ సహాయాన్ని అందుకొన్న వారిలో రాజకీయ ఖైదీలకన్నా చాలా

ఎక్కువ సంఖ్యలో సామాన్య ఖైదీలే ఉన్నారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ కేంద్ర

కారాగారంలోని ఎందరో మహిళలకి అటువంటి సహాయాన్ని నేను ”వకీల్‌ అంకుల్స్‌” సహాయంతోనే చెయ్యగలిగాను.

ఈ పుస్తకంలో అరుణ్‌ తాను చదివిన అనేక పుస్తకాల గురించి కూడా ప్రస్తావించాడు. జైలు జీవితంలో ఉన్నప్పుడు పుస్తకాలు ఒక ఆక్సిజన్‌లాగా పనిచేస్తాయి. అయితే అవి ఎప్పుడూ ఒక లగ్జరీనే. ఈ విషయంలో మాత్రం అరుణ్‌ ”అదృష్టవంతుడే”. వాళ్ళకి దొరికినట్టు అందరికీ ఒక అలెన్‌ వాటర్స్‌ దొరకాలిగా!! బ్రిటన్‌ దేశస్థుడైన ఆయనకి వాళ్ళ దేశం నుండి ఒక సంస్థ చేసిన సాయం వల్ల అది సాధ్యం అయ్యింది. అసలు జైల్లోని వాళ్ళకి పుస్తకాలు సరఫరా చెయ్యడానికే ఒక సంస్థ ఉండాలనిపిస్తుంది. అయితే పుస్తకాలను అనుమతించని జైళ్ళు అనేకం ఇంకా ఉన్నాయి. అయినా అది అడ్డంకి కాదు పోరాడి సాధించు కోవాల్సిందే. అరుణ్‌ జైల్లో ఉన్నప్పుడు అనేక చిత్రాలు గీశాడు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ‘కలర్స్‌

ఆఫ్‌ ది కేజ్‌’ అని ఇష్టంగా పిలుచుకొన్నారు. తరవాత తాను ఇంగ్లీషులో రాసిన ఈ పుస్తకానికి కూడా అదే పేరు పెట్టాడు. ఇంగ్లీషులో ఎంతో ఆసక్తికరంగా రాసిన ఈ పుస్తకాన్ని అద్భుతంగా అనువాదం చేసి వేణుగోపాల్‌ పూర్తి న్యాయం చేశాడు. ఇంగ్లీషు పుస్తకాన్ని ఎంత ఆసక్తిగా, ఉద్విగ్నంగా, కిందపెట్టకుండా చదువుతామో, అంతే బాగా అసలు తెలుగులోనే ఈ పుస్తకం రాశాడా అనిపించేలా అనువాదం నడిచింది. అందుకు వేణు చాలా అభినందనీయుడు.

ప్రస్తుత పరిస్థితిలో ఏటికి ఎదురీదడం ప్రతి ఒక్కరూ తమతమ జీవితాల్లో తప్పక చెయ్యవలిసి వస్తోంది. ఎలాంటి పరిస్థితిలోనైనా అలా ఈది చూపించిన జీవితం తన జైలు జీవితం. అరుణ్‌ వేసిన ‘ఆశ’ అనే చిత్రంలో లాగానే చీకటి కొట్టులాంటి జైలు జీవితం గురించీ, అందులో నుండి లాల్‌ గేట్‌ బయట పరుచుకొన్న రంగుల ప్రపంచం (అదీ ఒక పెద్ద జైలు లాంటిదే అయినప్పటికి) గురించీ మనతో పంచుకొన్నభావోద్వేగాలే సంకెళ్ళ సవ్వడి.

      ఒక ‘మావోయిస్ట్’ ఖైదీ జైలు అనుభవాలు

సంకెళ్ళ సవ్వడి

రచన: అరుణ్ ఫరేరా

తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్

మలుపు ప్రచురణ, హైదరాబాద్

వివరాలకు సందర్శిం చండి :

www.malupubooks.blogspot.com

కథా ఉత్సవం ..మే 3

రేల పూల గుండె ఘోష..

        సమ్మెట ఉమాదేవి

 

అమ్మ కథలు తరువాత నేను వెలువరిస్తున్న ఈ రేలపూలు నా రెండవ కధల సంపుటి. దాదాపు ఇందులోని కథాంశాలన్నీ యధార్థాలే. ఇందులోని కమ్లి.. చాంది.. అమ్రు.. కేస్లా..సాల్కీ.. చేర్యా.. తావుర్యా.. దివిలి.. జాలా ఇలా అందరూ వేరెే పేర్లతో నాకు ఏదో ఒక సమయంలో తటస్థపడిన వారే..

చిన్ననాట నాన్న ఉద్యోగరీత్యా..  నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో కొన్ని ప్రాంతాలలో నివాసమున్నాం.  ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా అడవుల్లో ప్రధమ స్థానంలో వున్న ఖమ్మంజిల్లాలోని చాలా మండలాలు తిరిగాను. నా ఉద్యోగ జీవితం నాకు ఎన్నో అనుభవాలను, అనుభూతులనూ ఇచ్చింది. పిల్లలను వదిలి బడివున్న ప్రాంతంలో వుండడంవల్ల.. బడిపిల్ల్లలు నా పిల్లలు అయ్యారు. వంటరిగా మైళ్ళ కొద్దీ నడిచిన వేళ.. ప్రకృతి నా నేస్తమయ్యింది. ఆకులో ఆకునై అని పాడుకుంటూ సాగిన నా ప్రయాణంలో.. నేను ఎదుర్కున్న ఆటు పోట్లు ఎన్నో.. నేను చూసిన బతుకు పాట్లు ఎన్నెన్నో..

ప్రస్థుతం నేను పని చేస్తున్న టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు, ఆ పరిసర ప్రాంతాలు చాలా అభివృద్ది చెందినవిగానే పరిగణించవచ్చు. కాని మారు మూల ప్రాంతాల్లో  గిరిజనులు నివాసముంటున్న తండా ప్రాంతాల్లో.. అర కొర సౌకర్యాల నడుమ చాలీ చాలీ చాలని ఆదాయంతో కాలం వెళ్ళదీసే వెతల బతుకులను ప్రత్యక్షంగా చూసాను. వాటినన్నింటినీ అక్షరబద్ధం చేయాలనుకున్న నా ప్రయత్నం ఇంత కాలానికి నెరవేరింది.

లాక్షణీకులు చేప్పే ప్రమాణాలలో నా కథలు వుండవచ్చు.. వుండక పోవచ్చు.. ఈ సంపుటిలో తండావాసుల సంస్కృతీ సంప్రదాయాలు, జీవనవిధానం అన్నీ కాచి వడబోసాను అని చెప్పడం లేదు. నా అనుభవంలోకి వచ్చిన సంఘటనలను, నన్ను కదిలించి, నా మనసును తొలిచేసి, నన్ను నన్నుగా నిలువనీయని అంశాలను, నాకు అనువైన పద్దతిలో కథలుగా మలుచుకున్నాను.  ఈ క్రమంలో అవి డాక్యుమెంటరీ రూపాన్ని సంతరించుకున్నవని ఎవరైనా అభిప్రాయ పడితే.. నేను బాధపడను. తండా వాసుల గాధలన్నీఏదో ఒక రూపాన అందరికీ చేరాలన్నదే నా ఉద్దేశ్యం.

uma

కారా మాస్టారితో…సమ్మెట ఉమాదేవి

 

నీవు ఎవరి గురించి రాస్తున్నావో వారు ఆ కథలు చదవరు. ఇంక ఎందుకు నీవు ఈ కథలు రాయడం..? ఇంత ఖర్చు పెట్టుకుని ఈ పుస్తకం వేయడం అన్న వారూ చాలా మంది వున్నారు. సమకాలీన పరిస్థితులను అక్షరబద్దం చేసి నిక్షిప్తపరచడం రచయిత విద్యుక్త ధర్మం. నేనూ, నాలాంటి వారెందలో అనునిత్యం విన్న.. కన్న.. అనుభూతించిన విషయాలను మిగతా ప్రపంచానికి తెలియాలంటే.. అవి కథలుగా మలచబడాలి అనుకున్నాను. మనం ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు ఇవి చదవక పోవచ్చు.. కానీ ఈ సమాజంలో సాటి పౌరులుగా వున్న వారి గురించి తెలుసుకోవాల్సిన, పట్టించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా వున్నదని నేను నమ్ముతున్నాను.

అలాగని తండావాసుల రాజకీయ, సామాజిక జీవనాల్లో అకస్మాత్తుగా వచ్చిన పెను మార్పుల గురించో.. రావలిసిన విప్లవాల గురించో నేను రాయలేదు. నాది కేవలం ఉపరితల పరిశీలన అయివుండవచ్చు. అందుకే దీని పేరు అగ్నిపూలనో.. మోదుగ  పూలనో కాకుండా రేలపూలని పెట్టుకున్నాను. ప్రకృతిలో అత్యంత అందమైన పూలు.. రేలపూలు. ఇంగ్లీష్‌లో గోల్డెన్‌ షవర్‌, కాసియా ఫిస్టుల్లా అంటారు. వన దేవతకు కాసులపేరు వేస్తున్నట్లు రహదారిన.. పూలజల్లులు చల్లుతున్నట్లు వున్న ఈ రేలపూలు అడవికే అంకితమై పోతున్నాయి. జనం వాటిని పెంచి పోషించాలని, వాటిని కాపాడుకోవాలని నా తాపత్రయం.

ఈ కధలు.. మీలో తండావాసుల గురించిన ఆలోచనలకు తావిస్తే..మీ  మనసు పొరలను కాస్త కదిలించగలిగితే ..  మీ మదిని ఒకింత అలరించితే…నా ప్రయత్నం ఫలించినట్టే..

(ఈ నెల 25 న హైదరాబాద్ లో “రేలపూలు” ఆవిష్కరణ)

 

‘ఎమరీ’లో కొప్పాక తెలుగు పీఠం!

వేలూరి వేంకటేశ్వర రావు

 

తెలుగు సాహిత్యానికి, పశ్చిమగోదావరి జిల్లాలో చిన్న ఊరు  వసంతవాడకి, ఈనాటికీ  వాడకంలో ఉన్న కేన్సర్ ఔషధం మిత్ర మైసీన్ కి, అమెరికాలో  ఎమరీ విశ్వవిద్యాలయానికీ ఒక  విచిత్రమైన అనుబంధం ఉంది.   ఆ అనుబంధం   తెలుసు కోవాలంటే, కొప్పాక విశ్వేశ్వర రావు గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి.  నిజం చెప్పాలంటే, ఆయన జీవితం ఒక అద్భుత కాల్పనిక కథలా కనిపిస్తుంది.

కొప్పాక విశ్వేశ్వర రావు (1925-1998), సీతాపతి, విజయలక్ష్మి గార్ల రెండవ కుమారుడు.   వాళ్ళది వసంతవాడలో ఒక పేదకుటుంబం. విశ్వేశ్వర రావు గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. క్రమంగా ఆయన  ఇరవమూడేళ్ళ వయసులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి   రసాయనశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకొని, తరవాత అమెరికాలో విస్కాన్‌ యూనివర్శిటీ లో బయోకెమిస్ట్రీలో మరొక డాక్టరేట్‌ డిగ్రీ తెచ్చుకున్నారు.  1954 లో ఆయన, భార్య సీత గారితో సహా  – అమెరికాకి వలస వెళ్ళారు.  అక్కడ  ఫైజర్‌ కంపెనీలో పరిశోధకుడిగా చేరారు.  సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాలు కేన్‌సర్‌ నివారణకి ఔషధాలుగా ఉపయోగించడానికి ఆయన చేసిన పరిశోధన ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఆయన కనిపెట్టిన  “ మిత్రమైసీన్,” అనే మందు ఇప్పటికీ కేన్‌సర్‌ నివారణకి వాడుతున్నారు.

విశ్వేశ్వర రావు గారికీ,  సీతగారికీ  ప్రాచీన తెలుగు సాహిత్యంఅన్నా, సంగీతం అన్నా, వల్లమాలిన ఇష్టం.  ఆయన తిక్కన్ననీ, పోతన్ననీ తన  పిల్లలకీ  ఆప్యాయంగా వినిపించేవారు. ఆయనజీవితం చివరి రెండు సంవత్సరాలలో, తెలుగు, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం  – అమెరికాలో పెరుగుతున్న భారతీయులకీ, అమెరికనులకీ చెప్పవలసిన అవసరం ఉన్నదని గ్రహించి, ఆపని చెయ్యడానికి  విశ్వవిద్యాలయాలే తగిన స్థానాలని గుర్తించి  అమెరికాలో ఏదయినా ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని స్థిరంగా నిశ్చయించుకున్నారు.  కాని, అది  ఆయన బతికి ఉండగా చెయ్యలేకపోయారు.

ఆయన కోరిక తీర్చడానికి వారి సతీమణి సీత గారు,  పిల్లలు, విజయ లక్ష్మీ రావు, వెంకటరామా రావు,   జయ రావు,  – 2000 సంవత్సరంలో  కొప్పాక ఫేమిలీ ఫౌండేషన్‌ స్థాపించారు.

అట్లాంటాలో ప్రసిద్ధికెక్కిన ఎమరీ యూనివర్శిటీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి  పదిహేను లక్షల డాలర్లు (సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు)  కావాలి.  అందులో సగం, అంటే 750,000 డాలర్లు (దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు) ఇచ్చి, మిగతా సగం ఎమరీ యూనివర్సిటీని ఇతర దాతల సహాయంతో కూడబెట్టుకోమని చెప్పారు.  కాని గత ఐదు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగావున్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, తెలుగు దేశపు  ప్రభుత్వాధికారులు, ఇక్కడి తెలుగు ధనవంతులూ – ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ ఆచార్య పదవి ఏర్పడదనే అనుమానం వచ్చింది.  అప్పుడు, కొప్పాక ఫేమిలీ ఫౌన్‌డేషన్‌ వారే కల్పించుకొని, ఆరెండవ భాగం, తామే ఇస్తామని వాగ్దానం చేసారు.

about-visiting-quad-students-walking-530

ఇప్పుడు, మార్చ్‌ 26, 2015 న ఎమరీ యూనివర్శిటీలో తెలుగు ఆచార్యపదవి నెలకొల్పబడబోతున్నది.  దాని పేరు  ఆధికారికంగా # The Visweswara Rao and Sita Koppaka Professorship in Telugu Culture, Literature, and History#.  విశ్వేశ్వర రావుగారి కోరిక తీర్చడానికి  వారి పిల్లలు ముందుకు వచ్చి, మాటలతో కాకండా, చేతలద్వారా మార్గదర్శకత్వం వహించడం  అందరు తెలుగువాళ్ళూ గర్వించదగ్గ విషయం.

ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీ లో తెలుగు ఆచార్య పదవికై  మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు.  దేశవ్యాప్తంగా పనిచేస్తున్న తెలుగు సాంస్కృతిక సంస్థలకీ, తెలుగు మీద నిజమయిన అభిమానం ఉన్న వ్యక్తులకీ, ఇది ప్రేరణ అవాలని వాంఛించడం  అనుచితం కాదు.

ఇది కాక కొప్పాక ఫౌండేషన్‌ వారు, ఇంకా చాలా జనహిత కార్యక్రమాలకి  అమెరికాలోను, తెలుగునాటా  విరాళాలు ఇస్తున్నారు.

 

విశ్వేశ్వర రావు గారికి  1998 లో గుండె పై శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వైద్యశాలలో ఉండగా, వారి పిల్లలు – ఇద్దరు వైద్యులు—వారికి వైద్య వ్యవస్థలో ఉన్న లోపం  చాలా బాధ కలిగించింది.   డాక్టర్లకీ, రోగులకీ, వారి కుటుంబ సభ్యులకీ  మధ్యన  అన్యోన్యత పెంపొందిచడం చాలా అవసరమని, ప్రస్తుతం వైద్యవిద్యాలయాలలో  పరిస్థితులు అందుకు అనుకూలంగా మారేటట్టు చెయ్యాలని వారు అనుకున్నారు. అందుకోసం ఇప్పటివరకూ, పదిహేడు వైద్యవిద్యాలయాలలో ఇరవై ఆరు సందర్శకాచార్య పదవుల కోసం  విరాళాలు  ఇచ్చారు. వర్జీనియా వైద్యవిద్యాలయంలో ఉపన్యాసక పదవికి  శాశ్వత నిధి నెలకొల్పారు.  (ఈ కార్యక్రమానికి ప్రేరణ అయిన సందర్బాలని చర్చిస్తూ డా. వెంకటరమణ రావు, డా. జయ రావు గారు కలిసి రాసిన  వ్యాసం, “శాంతి” అన్న మకుటంతో ప్రసిద్ధ వైద్య  శాఖ పత్రిక (#Annals of Internal Medicine, Volume  137, Number 10, 19 November 2002#)  లో ప్రచురితమయ్యింది.  అంతే కాకండా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక సహకారం కోసం కొప్పాక ఫౌన్‌డేషన్‌  నిధులు కేటాయిండానికి ప్రయత్నిస్తున్నారు.

విశ్వేశ్వర రావు గారు సహజ వనరుల ఔషధపరిశోధనలో ప్రపంచ ప్రసిద్ధులు. ఆయనకి తెలుగు భాషమీద, తెలుగు సాహిత్యం మీదా ఉన్న అధికారం, మమకారం ప్రపంచానికి తెలియదు గాని, ఆయన పిల్లలకి తెలుసు. వారు ఇప్పుడు, కొప్పాక ఫౌండేషన్‌ పేరుతో తెలుగు భాషకి అమెరికాలో చేసిన ఉపకారం, ఇంతకు పదింతలై పదిమందికి మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం. తెలుగు భాష ప్రపంచ భాష అవడానికి నిజమైన దారి ఏర్పడుతుందని నమ్ముదాం.

అంధ్ర జ్యోతి  – మార్చ్‌, 25, 2015 సౌజన్యంతో

 

వికర్ణ

సాహసి సాదిక్ ప్రయోగం ….కవిత్వం బండి మీ ముంగిట్లో..!

11021165_1561577087459564_7404130252634435640_n

కొత్త తరాన్ని ఆకట్టుకుంటున్న “తోపుడు బండి”

ఈ ఫోటోలో అట్లా తోపుడు బండి పక్కన నిలబడిన ఈ ఆసామిని చూడండి!
ఒక తోపుడు బండికి మహా కవుల బొమ్మలు అద్దిన తోరణాలు కట్టి, ఆ బండిలో కవిత్వ పుస్తకాలు వేసుకుని, హైదరాబాద్ నగర రహదారుల పైకి అట్లా తోసుకుంటూ వొచ్చి, జనంతో కవిత్వ పుస్తకాలు కొనిపించే ఒక సాహసానికి పూనుకున్న ఇతడిని చూస్తే మీకేమని అనిపిస్తోంది ?   
‘భలే వారే … చూడడానికి జీవితంలో అన్నీ అమరిన వెల్ – ఆఫ్ మ్యాన్ లా వున్న ఇతడు తోపుడు బండి నడపడం ఏమిటండీ బాబు ?’ అని నవ్వుకుంటున్నారు కదూ !
నిజమే … ఈయన ‘జీవితంలో అన్నీ అమరిన వెల్ – ఆఫ్ మ్యాన్’ అన్నది నూరుపాళ్ళ నిజం ! 
హాయిగా ఇంట్లో కూర్చుని చేసుకోగలిగే వ్యాపారం వున్నా, తనకు స్పూర్తిని యిచ్చిన, తనను మనిషిని చేసిన ‘కవిత్వం’ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు –
ఈ ఆలోచన వెనుక చిన్న నేపథ్యం కూడా వుంది.
గడిచిన డిసెంబర్ – జనవరి నెలలలో హైదరాబాద్ , విజయవాడ లలో జరిగిన పుస్తక ప్రదర్శన లలో వాసిరెడ్డి వేణుగోపాల్ గారి స్టాల్ ఒక వైపు, కవిసంగమం స్టాల్ మరొక వైపు అమ్మిన కవిత్వ పుస్తకాల సంఖ్య చూసి, ఈయనకి ఒక విషయం బోధపడింది. 
11018805_782788068464573_2656812974564013055_n
జనానికి కవిత్వం పట్ల ఆసక్తి వుంది. పేరు మోసిన పుస్తక ప్రచురణ సంస్థలు కవిత్వాన్ని ‘అసింటా పెట్టడం వలన’ కవిత్వ పుస్తకాలు జనానికి అందుబాటులో లేకుండా పోయి, ‘ఇప్పుడు కవిత్వం ఎవ్వరికీ పట్టదు ‘ అన్న ఒక నిరాశాపూరిత వాతావరణం నెలకొన్నది. అది ‘పూర్తి నిజం’ కాదనీ, సరైన రీతిలో కవిత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళ గలిగితే వాళ్ళు కవిత్వాన్ని ఆదరిస్తారనీ అతడికి ఆ పుస్తక ప్రదర్శనలు తెలిపాయి – 
అందుకే, మంచి సాహిత్యాన్ని ప్రజలకు చేరువగా తీసుకు వెళ్ళడం కోసం ఒకప్పుడు తెలుగునేల మీద గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు, వట్టికోట ఆళ్వారు స్వామి లాంటి మహనీయులు వేసిన ఒక దారిని స్పూర్తిగా తీసుకుని, ‘తోపుడు బండి పైన కవిత్వ పుస్తకాలు పెట్టుకుని నగర రహదారుల పైన తిరుగుతూ అమ్మడం’ అన్న ఆలోచనకు  శ్రీకారం చుట్టాడు. అతడి ఆలోచనకు, యాకూబ్, ఎన్ వేణుగోపాల్, మిమిక్రీ శ్రీనివాస్, వాసిరెడ్డి వేణుగోపాల్, అరవింద్ లాంటి మిత్రుల ప్రోత్సాహం తోడయింది. ఆదివారం ఉదయం రామనగర్ నుండి మొదలు పెట్టి నెక్లెస్ రోడ్ అడ్డా దాకా వొచ్చి అక్కడ సాయంత్రం దాకా వుండి కవిత్వ పుస్తకాలు అమ్మాడు. సోమవారం అంతా ఉస్మానియా విశ్వ విద్యాలయం పరిసర ప్రాంతాలలో ఈ పుస్తకాల బండిని తిప్పాడు. పుస్తకాలు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా వొచ్చిన ఒక ప్రొఫెసర్ గారు ‘గొప్ప పని చేశారు’ అంటూ మెచ్చుకున్నారు. 
విచిత్రం ఏమిటంటే, ఈ ‘తోపుడుబండి మనిషి’ తానొక గొప్ప పని చేసానని అనుకోవడం లేదు. ‘నాకు కవిత్వం అంటే వున్న అభిమానంతో తెలుగు కవిత్వాన్ని బతికిన్చుకోవాలన్న తపనతో నా బుర్రకు తట్టిన ఈ పని మొదలు పెట్టాను’ అంటున్నాడు. 
10993432_1540494056211172_1335700352262871666_n
అంతే కాదు – ‘రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ తోపుడుబండి పైన తెలుగు కవిత్వ పుస్తకాలు అమ్మాలనేది నా కల. డబ్బు ఖర్చయినా సరే – ఆ పని చేసి తీరతాను’ అంటున్నాడు.  
‘కవిత్వాన్ని బతికించుకోకుండా భాష ఎట్లా బతుకుతుంది ? … భాషని బతికించుకోలేని జాతికి మనుగడ ఏముంటుంది ?’ అని వాపోతున్నాడు!  
 
అతడికి వున్నది తెలుగు కవిత్వం పట్ల ‘ప్రేమని మించిన పిచ్చి’ ఏదో వుందని అనిపించడం లేదూ ?!   
తోపుడు బండి చుట్టూ చేరిన కొందరు మిత్రులు అన్నారు –
‘ఊరికొక మంచి గ్రంథాలయం ఏర్పాటు చేసి, అందులోకి పుస్తకాలు కొనే ప్రణాలికలు ప్రభుత్వం రూపొందించాలి’
‘అన్ని విశ్వ విద్యాలయాల ఆవరణ లలో కొత్త సాహిత్యం అమ్మకానికి ఉండేలా ఆయా విశ్వ విద్యాలయాలు ఏర్పాట్లు చేయాలి’
‘కవులు / రచయితలూ ఒక కో ఆపరేటివ్ సంస్థగా ఏర్పడి పుస్తకాలు అచ్చువేసుకోవడం , అమ్ముకోవడం అనే కార్యక్రమాలకు వీలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి’
‘………………………..…..’              ‘……………………….…………….’     ‘………………………..……….’       
భాషా దినాల పేర, భాషా సాహిత్య సంస్కృతుల పరిరక్షణ పేర, రాజకీయ నాయకులనీ, సినిమా వాళ్ళనీ, చివరికి సాహిత్య దళారులనీ వేదికలెక్కించి చిత్ర విచిత్ర కార్యక్రమాలు జరిపే మన ప్రభుత్వాలకు ఇట్లాంటి నిజమైన  సాహిత్యాభిమానుల ఘోషలు వినబడతాయా ఎప్పటికైనా ?   
ఏమో ?! …. ‘తోపుడు బండి ‘ కదిలింది కదా ! … ఇక చూడాలి !!
ఏదేదో చెప్పాను గానీ, ఈ ‘తోపుడు బండి మనిషి ‘ పేరు చెప్పనే లేదు కదూ !
ఇతడి పేరు …. సాదిక్ అలీ . పేరు మోసిన జర్నలిస్టు ….  సొంత  ఊరు ఖమ్మం … హైదరాబాద్ లో నివాసం ….  
facebook లో దొరుకుతాడు …. ‘తోపుడుబండి’ అనే పేరు మీద ఒక పేజి కూడా ఓపెన్ చేసాడు !     
 -కోడూరి విజయ్ కుమార్ 
vijay

__________________________________

గడప గడపకూ కవిత్వం: సాదిక్ 

 

 1. సాదిక్, మీకు కవిత్వం మీదనే ఎందుకు ఇంత ప్రేమ?

సాహిత్యంలో కవిత్వం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అదొక కళ .అందరికీ సాధ్యమయ్యే పని కాదు.కొన్ని భావాలను వ్యక్తం చెయ్యటానికి వచనం కన్నా కవిత్వమే బాగా ఉపయోగ పడుతుంది. చిన్నప్పుడు చదువుకున్న పారిజాతాపహరణం కానివ్వండి, ఇతర ప్రబంధాలు కానివ్వండి, మహా ప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, ఇవి రెండూ కవిత్వం పట్ల ప్రేమను పెంచాయి. వచనంలో వాడే పద ప్రయోగాలకన్నా, కవిత్వంలోని పద ప్రయోగాలు బాగా నచ్చుతాయి.
 2. తోపుడు బండి ఆలోచన- అంటే అది తోపుడు బండే-అన్న ఆలోచన ఎలా వచ్చింది?
హైదరాబాద్,విజయవాడ బుక్ ఫెయిర్ లలో స్టాల్ కి వచ్చిన అనేక మంది కవిత్వం గురించి వాకబు చేయటం చూసి ఆశ్చర్యం వేసింది. దానికి తోడూ. మేము చాలా మంది కవుల కవిత్వాన్ని అలవోకగా అమ్మగలిగాం.ఇక్కడ పరిస్థితి ఇలా వుంటే, తరచూ కవిసంగామంలోనూ,ఇతరత్రా కవిత్వ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కవులు తమ పుస్తకాలను అమ్ముకోలేక ,కాంప్లిమెంటరీ  కాపీలు,ఉచిత పంపిణీ కార్యక్రమం చూసి బాధేసింది. వాళ్ళు కవిత్వాన్ని మార్కెట్ చేసుకోలేక పోవటం, మార్కెట్ చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడటం చూసాను. ఒక్క కాపీ కూడా కాంప్లిమెంటరీ ఇవ్వకండి అని చెప్పేవాన్ని.నేను స్వయంగా డబ్బులిచ్చి కొనుక్కునే వాణ్ని. ఇవన్నీ చూసాక నేనే అమ్మిపెత్తోచ్చుగా అనే ఆలోచన వచ్చింది.
 గతంలో విశాలాంధ్ర వాళ్ళు మొబైల్ వ్యాన్లలో పుస్తకాలు అమ్మటం చూశాను. వాటికన్నా ప్రజలకు సన్నిహితంగా వెళ్ళాలంటే,అందరికీ బాగా పరిచయమైన తోపుడుబండి అయితే మంచిది అనుకున్నా.శారీరక ఆరోగ్యానికి అవసరమైన కూరగాయలు, పళ్ళు ఆ బండ్ల మీదే కదా కొంటున్నారు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కవిత్వాన్ని ఎందుకు కొనరు? అన్పించింది. ఎక్కడో సుల్తాన్ బజార్ ,అబిడ్స్ వెళ్లి కొనటం కుదరని వాళ్లకు, వాళ్ళ గడపకే తీసుకెళ్తే కొంటారు కదా అనే ఆలోచన నుంచి పుట్టిందే తోపుడు బండి.
 3.  కవిత్వంతో పాటు ఇతర సాహిత్య ప్రక్రియల పుస్తకాలు కూడా బండి మీద పెడతారా?

 
 ఇకపోతే, ఇతర సాహిత్య ప్రక్రియల అమ్మకం, …ఇది చాలా కీలకమైన ప్రశ్న. బండి దగ్గరికి వచ్చిన వాళ్ళు కథలు, నవలలు లేవా? అని అడుగుతున్నారు. వాటికి కూడా డిమాండ్ చాలా వుంది. అలాగే ఇంగ్లీష్ పోయెట్రీ ఉందా అని కూడా అడుగుతున్నారు.వాటి గురించి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రస్తుతం నా దృష్టి, సింగల్ పాయింట్ ఫోకస్ అంతా కవిత్వమే. కవిత్వం, కవుల పరిస్థితే మరీ దారుణంగా వుంది.ముందు కవిత్వానికి గౌరవం, హోదా,పూర్వ వైభవం తేవాలన్నదే నా లక్ష్యం.ప్రజల్లో కవిత్వం పట్ల ఆసక్తి కలిగించడం.కవిత్వం కొని చదవటం అలవాటు చేయాలన్నదే సంకల్పం. 
4. ఇంత వరకూ ప్రతిస్పందన ఎలా వచ్చింది?

 గత రెండు రోజులుగా వస్తున్నా స్పందన అద్భుతం, అనూహ్యం. నేను చేయగలను అనుకున్నాను,కానీ,అది ఇంత గొప్ప స్పందన తీసుకొస్తుందని అనుకోలేదు.అమ్మకాలు బాగున్నాయి. ప్రజల్లో ఆసక్తీ బాగానే వుంది. త్వరలో మరికొన్ని తోపుడు బళ్ళు అవసరమవుతాయని అన్పిస్తోంది. గోరటి వెంకన్న, శివసాగర్ పుస్తకాలు కావాలని అడుగుతున్నారు.అలాగే మరికొందరు కవుల పుస్తకాలను ప్రత్యేకంగా అడుగుతున్నారు. అవి ఎవరెవరి దగ్గర వున్నాయో తెలుసుకొని,సేకరించి బండి మీద పెట్టాలనే ప్రయత్నిస్తున్నాను. అలాగే మీరు ఈ వ్యాసం ప్రచురిస్తే, దాన్ని చదివిన వారు తమ పుస్తకాలు, తమ దగ్గర వున్న పుస్తకాలు నాకు అందజేయ గలిగితే నాకు మరింత సంతోషం.

*

యువకథకులు-కథన రీతులు చర్చ ఈ వారమే!

10352821_942895082387330_2633517836033313795_n

షరీఫ్ కథ “తలుగు” ఆవిష్కరణ ఈ వారమే!

10968171_941553642521474_1303105852_n

అధికారాన్ని ప్రశ్నించడం. బలవంతున్ని ఎదుర్కోవడం. ఉనికిని కాపాడుకోవడానికి కష్టించడం.అస్తిత్వం కోసం పోరాడటం. ఇవే మన విప్లవాలు. విజయాలు సాధించడం ఎప్పుడో తెలీదుగానీ, అనునిత్యం పోరాడటమే మన అస్తిత్వ వాదం. ఈ బాటలో పశువులూ, పక్షులూ, ప్రకృతీ కనీసం సహానుభూతైనా చూపిస్తాయేమోగానీ…సాటి మనిషే ఎందుకో చాలావరకూ అటువైపే ప్రత్యర్థిలా మిగిలిపోతున్నాడు. ఈ సత్యాన్ని చర్నాకోలుతో చరిచి చెప్పిన కథ వేంపల్లి షరీఫ్ “తగులు”.

కథమొత్తం ఉగ్గబట్టుకుని చదివాక, చివరి ఒక్క వాక్యంలో తను ఇమిడ్చిన కొన్ని వేల తరాల పోరాటస్ఫూర్తికి నేను దాసోహం అన్నాను. కళాకారుడిగా షరీఫ్ వేంపల్లి కి జైబోలో అన్నాను. కథరాసినందుకు అభినందనలు. నాచేత చదివించినందుకు కృతఙ్జతలు.

-కత్తి మహేష్ 

తానా వ్యాసరచన పోటీలకు ఆహ్వానం

రాబోయే 20 వ తానా సమావేశాలలో (జూలై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది.
తెలుగులో పురాణాల నుండి ఇప్పటి అధునాతన సాహిత్యం వరకు ఎంతో వైవిధ్యమున్న స్త్రీ పాత్రల చిత్రణ జరిగింది. ఇందులో పురాణాలతో పాటు, కావ్యాలు, నాటకాలు, కథలు, నవలలు, కవితలు, మొదలైన ఎన్నో ప్రక్రియలు పాలు పంచుకున్నాయి. ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర ఉన్న సాహిత్యంతో పాటు, గత 80 ఏళ్ళుగా చలనచిత్ర రంగం కూడా స్త్రీపాత్రల పరిణతిని ప్రదర్శించడంలో తన వంతు ప్రభావాన్ని చాలానే చూపింది. రచయితల (దృశ్య ప్రక్రియలను నిర్దేశించే వారితో సహా) సృష్టిలో ఆ పాత్రలు, ఆయా స్థల, కాలాల; ఆచార, వ్యవహారాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నంలో పాత్రలు సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించవచ్చు, భవిష్యదర్శనం చేయవచ్చు, లేదా గతస్మృతులను నెమరు వేసుకుంటూ ఉండవచ్చు.

ఈ నేపధ్యంలో స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఎలాంటి పరిణామాలకు లోనయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం. ఇంతటి విస్తృత వస్తువును కేవలం ఒక రెండు గంటల చర్చావేదికలో ఇమిడ్చడం అసాధ్యం. కానీ ఈ వస్తువుకు వీలైనంత విశాల వేదిక కల్పించడం, ఈ వ్యాస రచనా పోటీ ప్రధానోద్దేశం.

పోటీలో పాల్గొన దలుచుకున్నవారు, తమకు నచ్చిన, అనువైన, అభినివేశం ఉన్న, స్పష్టత ఉన్న, లేదా ప్రవేశం ఉన్న, ఏ కోణం నుండైనా, ఏ పరిమితులలోనైనా, ఈ వ్యాస రచన చేయవచ్చు. ఎన్నుకున్న పరిధిలో విషయాన్ని ఎంత కూలంకషంగా, ఎంత విస్తృతంగా పరిశీలించి, ఎంత సరళంగానూ, క్లుప్తంగానూ విశ్లేషించారన్న వాటిపైనే బహుమతి నిర్ణయం ఉంటుంది కానీ, కేవలం వస్తువు పరిమాణ విస్తృతి ఒక్కటే బహుమతికి అర్హత కాజాలదు.

నిబంధనలు:
1. వ్యాసాలు తెలుగులోనే వ్రాయాలి.
2. ఈ చర్చావేదిక నిర్వాహకులు, చర్చలో పాల్గొనడానికి రాబోయే ఆహ్వానితులు తప్ప, మిగిలిన తెలుగు వారందరూ ఈ వ్యాస రచన పోటీకి అర్హులే.
3. వ్యాసాలను చేతి వ్రాతలో కాకుండా కంప్యూటరులో టైపు చేసి, PDF ఫైలుగా మార్చి పంపాలి. (కంప్యూటరులో టైపు చేయడానికి వెసులుబాటు లేనివారు, గడువు తేదీకి కనీసం 30 రోజులు ముందుగా వ్యాస రచన పూర్తి చేసి మమ్మల్ని సంప్రదిస్తే, వీలును బట్టి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము.)
4. మొదటి పేజీలో వ్యాసం పేరు, రచయిత పేరు, చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్, వ్యాసం మొత్తం ఎన్ని పేజీలు, వివరాలు మాత్రమే ఉండాలి. తరువాతి పేజీలలో వ్యాసం పేరు, వ్యాసం తప్ప వేరే వివరాలు ఉండకూడదు. న్యాయనిర్ణేతలకు రచయిత వివరాలు తెలియరాదు కనుక వ్యాస రచయితకు సంబంధించిన వివరాలేవీ వ్యాసంలో (అంటే రెండవ పేజీ మొదలుకొని) ఉండకూడదు.
5. వ్యాసం నిడివి 5 పేజీలు మించకూడదు. (పేజీ పరిమాణాలు: 7.5 x 9 అంగుళాలు లేదా 19 x 23 సెంటీ మీటరులు. వాడే లిపి పరిమాణం 12 points కు తక్కువగా ఉండకూడదు). తీసుకున్న వస్తువును విశదీకరించి, విశ్లేషించడానికి అవసరమైనంత మేరకే వ్యాసం ఉండాలి గానీ, గరిష్ట నిడివి వరకు వ్యాసాన్ని పొడిగించనవసరంలేదు.
6. వ్యాసాన్ని ఈమెయిల్ ద్వారా tanavyasamu@gmail.com కు పంపాలి. వ్యాసాన్ని పంపినవారి ఈమెయిల్ తో, వ్యాస రచయితను, వ్యాస కర్తృత్వాన్ని, ఈ వ్యాస రచన పోటీ నిబంధనల్ని, చట్టరీత్యా ధృవీకరిస్తున్నట్టు, అంగీకరిస్తున్నట్టు, భావిస్తాము. వేరే ధృవీకరణల అవసరంలేదు.
7. వ్యాసాలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ: ఏప్రిల్ 4, 2015
8. న్యాయనిర్ణేతల దృష్టిలో ఉత్తమమైనవిగా ఎంపికైన మొదటి మూడు వ్యాసాలకు బహుమతులు (రు. 27,232; రు. 17,314; రు. 11,234; లేదా సమానమైన విలువలో రచయిత నివశించే దేశపు ద్రవ్యంలో) ఉంటాయి. బహుమతి పొందిన వ్యాసాలతో పాటు, మిగిలిన వాటిలో ఎన్నదగినవాటిని తానా 20 వ సమావేశాల సందర్భంగా ప్రచురించే హక్కులు నిర్వాహక వర్గానివే.
9. న్యాయనిర్ణేతల అభిప్రాయంలో ఏ వ్యాసానికీ తగిన అర్హతలు లేవని తోస్తే బహుమతిని ఇవ్వడానికి, ప్రచురించడానికి, నిరాకరించే హక్కులు కూడా నిర్వాహకవర్గానివే. ఈ నిబంధన కేవలం ఆషామాషీగా వ్యాస రచన పోటీలో పాల్గొని బహుమతులను ఆశించే వారిని నిరుత్సాహ పరచడానికి; నిబద్ధతతో, క్రమశిక్షణతో, చేసిన రచనలకు తగిన విలువను ఆపాదించడానికి మాత్రమేనని మనవి.

10391436_1519913701605194_6407369527125614767_n

పుస్తకాల అలల మీద ఎగసిపడింది కృష్ణమ్మ!

10888496_10204845333720483_5903717139337843051_n

బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ మాటకొస్తే!

బెజవాడ అంటే పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు. అంతే!

అటు అలంకార్ సెంటరు నుంచి ఇటు ఏలూరు రోడ్డు దాకా విస్తరించిన పుస్తకాల రోడ్డు. ఏం వున్నా, లేకపోయినా కానీ, ఆ పుస్తకాలూ, ఆ పుస్తకాల రోడ్డు లేని బెజవాడని అస్సలు వూహించలేను.

ఆ బీసెంటు రోడ్డుకీ, ఏలూరు రోడ్డుకీ, మోడర్న్ కేఫ్ కీ, ఇంకా కొన్ని అడుగులు వేస్తే, ఆకాశవాణికీ, ఆంధ్రజ్యోతి ఆఫీసుకీ మధ్య వొక లాంగ్ వాక్ కి వెళ్తే, వొకరిద్దరు గొప్ప రచయితలయినా వెతక్కపోయినా తామే గంధర్వుల్లా ఎదురు కావచ్చు. కొన్ని అపురూపమయిన క్షణాలు మీ గుండె జేబుల్లోకి అనుకోకుండా రాలిపడ వచ్చు.
కానీ, ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది, ఈ ఇరవయ్ మూడేళ్లుగా –

ప్రతి జనవరి నెలా వొక సాయంకాలం అలా స్టేడియం గ్రౌండ్స్ దాకా నడిచి వెళ్తే, ఆ అందమయిన దృశ్యాలన్నీ ఇప్పుడు వొకే దృశ్యం – అదే, పుస్తకాల పండగ-లో కలగలసిపోయి అనేక దీపకాంతుల దర్శనం వొక్కసారిగా అయ్యి, కళ్ళూ మనసూ జిగేల్మంటాయ్!

ఈ ఇరవై మూడేళ్లలో అన్నీ మారిపోయాయి. మనుషులు మారినట్టే, వీధులు మారిపోయినట్టే పుస్తకాలు మారిపోయాయ్! పుస్తకాల ముఖచిత్రాలు మారాయి, ధరలు మూడింతలు అయ్యాయి. పుస్తకం నల్ల పూస కాలేదు కానీ, పుస్తకం కొనాలంటే జేబు తడుముకునే పరిస్తితి వచ్చింది. ఎంతో ఇష్టపడి చదవాల్సిన పుస్తకం ధర బరువు వల్ల భారంగా మారుతోంది…అయినా, పుస్తకాలు కొనే అలవాటు తగ్గలేదు ఇప్పటికీ! దానికి కొండ గుర్తు: వొకప్పుడు పుస్తకాల పండక్కి వెళ్తే, వొక గంటలో రెండు రౌండ్లు కొట్టి చక్కా ఇంటికొచ్చేసేవాళ్లం. ఇప్పుడో? అది వొక పూట పని, సాలోచనగా అనుకుంటే వొక రోజు పని.

రాష్ట్రంలో ఎన్నో చోట్ల పుస్తకాలు పండగలు జరుగుతున్నాయి ఇప్పుడు. అన్ని చోట్లా అదే హడావుడి. దేశ విదేశాల పుస్తకాలు.కొత్త కొత్త పుస్తకాలు షాపులు. సాయంత్రపు సాహిత్య సాంస్కృతిక కచేరీల హోరు.

కానీ, అది బెజవాడకి మరీ లోకల్ పండగ. అసలు పుస్తకం అనే పదార్థానికి వొక రూపం ఇచ్చిన అమ్మ బెజవాడ. తెలుగు సంస్కృతిని వేలు పట్టి నడిపించిన పత్రికల బుడి బుడి నడకలు చూసిన బెజవాడ. ప్రసిద్ధ అక్షరజీవుల ఆత్మల్ని కలిపిన ఆధునిక బృందావని బెజవాడ. అట్లాంటి బెజవాడలో పుస్తకాల పండగ అంటే ….అది అందరి పండగ. బుద్ధిజీవుల హృదయస్పందనల్ని కలిపే పండగ. సహృదయ పఠితల మేధో సమాగమం.

కొన్ని సంధ్యల్లో ఇక్కడ వందనం చేద్దాం,
చేతులు గుండెల్లా జోడించి, మనసులోకి రెండు కళ్ళూ తెరిచి…

అక్షరాల్లో జీవిస్తున్న అపురూపమయిన వాళ్ళకి,
చేతుల్లో పుస్తకాలుగా మాత్రమే మిగిలిపోయిన కీర్తి శేషులకి,
జీవితాలకి అక్షర రూపాన్నిచ్చిన సౌందర్య మూర్తులకి,
మనలోని నిరాకార ఆలోచనల్ని సాకారం చేసిన వాక్య శిల్పులకి,
దారి తప్పిపోతున్న మానవీయ అనుభూతులకు చిరునామాలయిన ఆ సుపథికులకి.

(ఆంద్ర భూమి “మెరుపు” పేజీ నుంచి…)

చింతకింది శ్రీనివాసరావుకు చాసో స్ఫూర్తి పురస్కారం

Dr. Chintakindi Srinivasarao ప్రముఖ కథారచయిత డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుకు ప్రతిష్ఠాత్మకమైన  చాసో (చాగంటి సోమయాజులు) స్ఫూర్తి పురస్కారం లభించింది. చాసో స్ఫూర్తి  సాహిత్య ట్రస్ట్‌ ప్రతినిధి చాగంటి తులసి ఈ మేరకు ఒక ప్రకటన  విడుదలచేశారు. చాసో మార్గాన కళింగాంధ్ర మాండలికంలో ప్రజాజీవితపు కథలు  రచిస్తున్నందుకు గాను శ్రీనివాసరావును ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు ఆమె  పేర్కొన్నారు. పురస్కారాన్ని 2015 జనవరి 17న విజయనగరంలో జరిగే చాసో  శతజయంతి వేడుకల సభల్లో అందజేస్తామని ఆమె తెలియజేశారు.

ఉత్తరాంధ్ర యాసభాషల్లో కథలు రాస్తున్న రచయితగా చింతకింది శ్రీనివాసరావు  తెలుగుపాఠకలోకానికి సుపరిచితులు.  దాలప్పతీర్థం, పాలమ్మ, పిండిమిల్లు కథల  ద్వారా నిరుపేదల, బలహీనుల వ్యదార్థ జీవితాలను ఆయన చిత్రించారు. స్థానీయ  పరిస్థితులపై, మానవజీవితంపై ప్రపంచీకరణ చూపుతున్న ప్రభావాన్ని  వాడుకపదాల్లో కథగా కట్టడం ఆయనకు తెలిసిన కళ. రావిశాస్త్రి, చాసో, పతంజలి  వారసునిగా ఉత్తరాంధ్రలో కథల పంట పండిస్తున్న చింతకింది శ్రీనివాసరావుకు  ఇప్పటికే భరతముని సాహిత్య పురస్కారం సహా పలు అవార్డులు దక్కాయి. తాజాగా  చాసో స్ఫూర్తి లభించడంతో ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి  చేరినట్టుగా చెప్పవచ్చు

హైదరాబాద్ లో పుస్తక ప్రదర్శన

Dear Book lovers,

“Hyderabad Book Fair 2014” [http://hyderabadbookfair.com] is starting from today(17 dec) to 26th dec 2014 at NTR Grounds, lower tankbund,opp Indira park, Hyderabad. Timings: 2 to 8:30PM; Sunday and holidays: 12 to 9 pm. Please visit.
Some Book shops that I visit regularly are:
1. Manchi Pustakam [For Soviet Children book reprints][Suresh and Bhagyalaxshmi garu] and Kothhapalli(Children magazine) : Stall numbers 253, 254 and 255.
2. Peacock Classics[Gandhi garu]: Stall number: 148
3.Unique book centre[for old and rare books][Arif garu]: Stall numbers: 266, 267 and 268.
4. Navodaya Book House [Sambasivarao and Koteswara rao garu]: Stall numbers: 56, 57, 58 and 59.

Along with this visit Visalandhra , Prajasakthi and other book stalls aswell….
Happy BOOK FESTIVAL TO ONE AND ALL….

Regards,
Anil battula

30 న హైదరాబాద్ లో కథా ఉత్సవం

1535038_903793006297538_2212784229189647637_n

వెల్చేరుకి పురస్కారం

10409687_4754888485411_4191795819559649700_n

అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ వారమే!

10614218_300362290152515_8326601315087796337_n

 

10628066_300362316819179_131675058726844698_nఅక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) రెండు రోజులూ  ఉదయం  8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్ మహా నగరంలో జరుగుతున్న ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు ఇప్పటికే చాలా మంది సాహితీవేత్తలు అనేక నగరాల నుండి నమోదు చేసుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగిలిన వారందరినీ మరొక్క సారి సకుటుంబ, సపరివారంగా ఆహ్వానిస్తున్నాం.

ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు  గడిచిన  సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశం గా  “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  నిర్వహించబడుతోంది.

ఈ అద్వితీయమైన అమెరికా సాహితీ సదస్సులో పాల్గొనడానికి ఇతర నగరాల నుండి వస్తున్న అమెరికా సాహితీ వేత్తలు కిరణ్ ప్రభ, వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, చెరుకూరి రమా దేవి, అఫ్సర్, కల్పనా రెంటాల, శారదా పూర్ణ, విన్నకోట రవి శంకర్, ఎస్. నారాయణ స్వామి, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి, మెడికో శ్యాం, శ్యామలా దేవి దశిక, సత్యం మందపాటి, యడవల్లి రమణ మూర్తి, అపర్ణ గునుపూడి మొదలైన వారు. ఇంతటి అమెరికా హేమాహేమీలని అందరినీ ఒకేసారి కలుసుకోవడం, ఒకే వేదిక పై వారి అభిప్రాయాలని వినడం ఒక అపురూప అవకాశం. అంతే కాక భారతే దేశం నుంచి పాపినేని శివశంకర్, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా. ముక్తేవి భారతి, ప్రొ. జి. కృపాచారి (దళిత విశ్వవిద్యాలయ ఉప కులపతి), ఆకెళ్ళ రాఘవేంద్ర, కస్తూరి అలివేణి, జి. భగీరధ మొదలైన వారు అక్కడి సాహిత్య పురోగతిని (???) ఇక్కడ మనకి వివరించనున్నారు

10647170_300362460152498_8223353005422413139_n

 

ఈ సదస్సులో ప్రధానాంశాలుగా ఉత్తర అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి సతీమణి లీల గారు & కుటుంబ సభ్యులు ఎడ్మంటన్ (కెనడా) నుంచీ, అమెరికా తొలి కవి & తొలి తెలుగు పత్రిక సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి సతీమణి స్వరాజ్య లక్ష్మి గారు & కుటుంబం అట్లాంటా నుంచి విచ్చేసి మన ఆత్మీయ సత్కారం అందుకోనున్నారు. అదే విధంగా అమెరికా మొట్ట మొదటి కథా రచయితలైన చెరుకూరి రమా దేవి, వేమూరి వెంకటేశ్వర రావు, వేలూరి వెంకటేశ్వర రావు గార్లకు, జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించి అమెరికాలో తెలుగు సాహిత్యానికి సముచితమైన స్థానం కల్పించబడుతుంది.  ఈ సందర్భంగా ఉత్తర అమెరికా లో తెలుగు సాహిత్య తొలిదశకం (1964-1974) చరిత్ర నెమరు వేసుకునే ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. హైదరాబాద్ నుంచి తొలి సారిగా అమెరికా సందర్శిస్తున్న సీనియర్ రచయిత్రి, సుప్రసిద్ధ సాహితీవేత్త డా. ముక్తేవు భారతి గారు జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.

ఆత్మీయ వాతావరణలో జరిగే ఈ సాహిత్య సభలకి వచ్చి ఆనందించమని మిమ్మల్ని కోరుతున్నాం. సభలో సాహిత్య విషయాలపై ప్రసంగించ దల్చుకున్న వారు వెనువెంటనే మమ్మల్ని సంప్రదించండి.

ఏ కారణం చేతనైనా మీరు రాలేక పొతే, ఖర్చులతో తలమునకలయ్యే మా ప్రయత్నాలని మీ కనీస  విరాళంతో ఆర్థికంగా సమర్దించమని అర్దిస్తున్నాం.  మా నియమాలని బట్టి,  దాతలందరికీ $145 డాలర్లు విలువ జేసే పుస్తకాలు అందజేయబడతాయి. పోస్ట్ ఖర్చులు మావే! పుస్తకాల వివరాలు ఇందుతో జత పరచిన పూర్తి ప్రకటనలో చూడండి. అలాగే సదస్సు నమోదు పత్రం కూడా జతపరిచాం.

సాహిత్య పోషణకి కనీస విరాళం $50, సముచిత విరాళం $100, ఉదార విరాళం $2500 దాకా విరాళం పంపించడానికి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ క్రింది లంకె కి వెళ్తే చాలు.

ALL DONATIONS ARE TAX-DEDUCTIBLE IN USA

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=TQANE7ZAQDXQA

మరిన్ని వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి

వంగూరి చిట్టెన్ రాజు  Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

మారుతి రెడ్డి (కన్వీనర్), President – హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, maruthi@hotmail.com

Sai Rachakonda: Coordinator:, Phone:  281 235 6641, sairacha@gmail.com

కార్య నిర్వాహక సభ్యులు

C.N. Satyadev, Madhu Pemmaraju, Satybhama Pappu, Santha Susarla, Hema Nalini Tallavajjula, Sitaram Ayyagari, Pallavi Chillappagari, Uma Desabhotla, Sarada Akunuri, Ram Cheruvu, Venkatesh Nutalapati, Raj Pasala, Sudhesh Pilutla, Raghu Dhulipala, Krishna Keerty, Lalitha Rachakonda, Ravi Ponnapalli

లండన్ లో చరిత్ర సృష్టించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

 

సౌవెనిర్ ఆవిష్కరణలో...

సౌవెనిర్ ఆవిష్కరణలో…

లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ 27-28, 2014 తేదీలలో దిగ్విజయంగా జరిగి తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి తెర తీసింది. కళ్యాణి గేదెల మొదటి రోజు “మా తెలుగు తల్లికి” , రెండవ రోజు “జయ జయ ప్రియ భారత” శ్రావ్యంగా ఆలపించిన ప్రార్థనా గీతాలతో ప్రారంభం అయిన ఈ మహా సభలకి ఇంగ్లండ్, అమెరికా , ఫ్రాన్స్ , జర్మనీ దేశాలనుండి సుమారు 150 మంది సాహిత్యాభిలాషులు, కవులు, రచయితలూ పాల్గొనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారు ప్రధాన అతిథిగా విచ్చేసి తెలుగు బాషని ప్రపంచ బాషగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభోపన్యాసం, కేంద్ర సాహిత్యా ఎకాడెమీ బహుమతి గ్రహీత “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కీలకోపన్యాసం చేయగా సుప్రసిద్ధ కవులు “సిరివెన్నెల “ సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల, అశోక్ తేజ తమ అద్భుతమైన ప్రసంగాలతో రెండు రోజులూ ఈ సాహిత్య సభకి వన్నె తెచ్చారు. పౌరాణిక నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ తన పద్యాలతో సభని రంజింప జేయగా, ఫ్రెంచ్ దేశీయుడైన డేనియల్ నేజేర్స్ తన దండక పఠనంతోనూ, సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, పత్రికా సంపాదకురాలు కేతవరపు రాజ్యశ్రీ ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. సినీ నటులు సునీల్, రాజా రవీంద్ర ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచి సముచిత ప్రసంగాలు చేశారు.

ఈ మహా సభలని ఇటీవల నిర్యాణం చెందిన బాపు గారికి అంకితం ఇస్తూ జరిగిన అంకిత సభలో వంగూరి చిట్టెన్ రాజు, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల బాపు గారితో తమ వ్యక్తిగత అనుభవాలని సభికులతో పంచుకున్నారు. ఈ మహా సభల సందర్భంగా బాపు గారికి అంకితం ఇస్తూ ఎంతో తక్కువ సమయంలో డా. వెలగపూడి బాపూజీ రావు గారి సంపాదకీయంలో ఎంతో ఆకర్షణీయంగా వెలువరించిన సావనీర్ ని, తనికెళ్ళ భరణి రచించిన “ప్యాసా” రాజ్యశ్రీ రచించిన “రెక్కల్లో గీతామృతం”, సుద్దాల అశోక్ తేజ కవితల ఆంగ్ల అనువాదాలు పుస్తకం, వడ్డేపల్లి కృష్ణ గారి గేయాల సీడీ “తెలుగు రాగాంజలి” మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ ఎ. చక్రపాణి గారి కుమార్తె నీరజ రేగుల రచించిన “మై డాడ్” అనే పుస్తకం, ఆచార్య “పద్మశ్రీ” కొలకలూరి ఇనాక్ గారి కుమార్తె మధుజ్యోతి రచించిన ఆయన జీవిత చరిత్ర “నాన్న” ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయి.

స్వీయ రచనా పఠనం విభాగంలో డా. వ్యాకరణం అచ్యుత రామారావు, దివాకర్ అడ్డాల, డా. జొన్నలగెడ్డ మూర్తి, కేతవరపు రాజ్యశ్రీ మొదలైన వారు తమ కవితాలాపనలతో సభికులని రంజింపజేసారు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి శ్రీశ్రీ, దేవులపల్లి, భానుమతి, రేలంగి, సూర్యాకాంతం, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా, బాపు- బాపూజీ మొదలైన అనేక రంగాల లబ్ధప్రతిష్టులైన పైన తను రచించిన వచన కవితలను అద్భుతంగా చదివి సభ మెప్పుదల పొందారు.

అవధాని సత్కారం గుడ్

ఈ మహా సభలకి పరాకాష్ట గా యావత్ ఐరోపా ఖండంలోనే మొట్ట మొదటి సారిగా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంస్కృత పదాలు ఎక్కడా వాడకుండా అచ్చ తెనుగు పదాలతో అపురూపమైన అవష్టావధాన కార్యక్రమాన్ని, ధారణతో సహా కేవలం గంటా పదిహేను నిముషాలలో ముగించి చరిత్ర సృష్టించారు. కవి జొన్నవిత్తుల గారి సమర్థవంతమైన సంచాలకుడిగా ఆద్యంతం ఆహ్లాదంగా జరిగిన ఈ అష్టావధానంలో కేతవరపు రాజ్యశ్రీ (దత్త పది), శ్రీ రంగస్వామి (సమస్య), మాదిన రామకృష్ణ (చిత్రాక్షరి), డేనియల్ నేజేర్స్, వడ్డేపల్లి కృష్ణ (నిషిద్ధాక్షరి), అక్కిరాజు సుందర రామకృష్ణ (వర్ణన), “అమెరికా ఆస్థాన అప్రస్తుత ప్రసంగి” గా పేరొందిన వంగూరి చిట్టెన్ రాజు అప్రస్తుత ప్రసంగిగా చమత్కారమైన ప్రశ్నలతో పృఛ్చకులుగా వ్యవహరించారు. అవధానం అనంతరం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అవధాని పాలపర్తి వారి సత్కార కార్యక్రమం జరిగింది.

నాకు ఉప ముఖ్యమంత్రి గారి సత్కారం 2

వంగూరి చిట్టెన్ రాజు గారికి సత్కారం

ఈ మహా సభలలో “భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఉండే భారత దేశం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలుగు వారు విడిపోయిన నేపధ్యంలో, హిందీ భాష అభివృద్ది నమూనాలో తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ది బాధ్యతలు, కేంద్ర ప్రభుత్వమే చేపట్టి “కేంద్రీయ తెలుగు సంస్థ” ని ఏర్పాటు చేయాలి “ అనే తీర్మానాన్ని వంగూరి చిట్టెన్ రాజు ప్రవేశ పెట్టగా ఆ తీర్మానాన్ని నాలుగవ ప్రపంచ తెలుగు సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ సందర్భంగా ఈ రోజు ప్రారంభ సభలో వంగూరి చిట్టెన్ రాజు ప్రతిపాదించిన “యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో తెలుగు పీఠం” ఆవశ్యకతను గుర్తిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగానూ సహకరిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.యి. కృష్ణ మూర్తి, శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సమావేశాన్ని అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు, యునైటెడ్ కింగ్డం వాస్తవ్యులు డా. మాదిన రామకృష్ణ, డా. వెలగపూడి బాపూజీ రావు, కృష్ణ యలమంచి వేదిక నిర్వహణ బాధ్యతలని చేపట్టారు. ఈ రెండు రోజుల సమావేశాలని యుక్త అధ్యక్షులు జయకుమార్ గుంటుపల్లి పర్యవేక్షించగా, కిల్లి సత్య ప్రసాద్ & వెంకట పద్మ దంపతులు అన్ని చోట్లా వారే నిర్వహణ బాధ్యతలని చేపట్టి ఎంతో సేవ చేశారు. శ్రవణ లట్టుపల్లి, నరేంద్ర మున్నలూరి నాయకత్వంలో ప్రమోద్ పెండ్యాల, రాజశేఖర్ కుర్బా, అమర్ నాథ్ చింతపల్లి, ప్రసాద్ మద్దసాని, ఉదయ్ కిరణ్ బోయపల్లి, ఉదయ్ ఆరేటి, కృష్ణ యలమంచిలి, సుదీర్ కొండూరు, బలరామ్ ప్రసాద్ తదితరులు ఎంతో శ్రమ కోర్చి ఈ మహా సభలు విజయవంతం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించారు.

 

 -వంగూరి చిట్టెన్ రాజు

బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో రాజ్ నవల విడుదల

All_Things_Unforgive_Cover_for_ebook

పదేళ్ళ నించీ రాజ్ కారంచేడు వొకే పనిలో రకరకాలుగా కూరుకుపోయి వున్నాడు. రోజు వారీ బతుకు కోసం అతని వుద్యోగమేదో అతను చేసుకుంటూనే, ప్రతి గురువారం సారంగ పత్రిక పనిలో తనదో చెయ్యి ఉంటూ వుండగానే – తనదైన ఇంకోటేదో లోకంలో తన వాక్యాల మధ్య తనే సంచరిస్తూ పరధ్యానమవుతూ ఆశ పడుతూ ఎక్కువసార్లు నిరాశ పడుతూ నిట్టూరుస్తూ యీ చీకటి గుహ చివర వెల్తురేదో వుంది వుందనుకుంటూ- ఇవాళ్టికి ఇదిగో ఇలా ఈ నవల్లో ఇలా తేలాడు రాజుకన్నా బలవంతుడైన ఈ రాజ్ అనే మొండివాడు.

ఈ వారం ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో ఎంపికైన అయిదు ఇంగ్లీషు నవలల్లో రాజ్ నవల All Things Unforgiven కూడా వుండడం మన ‘సారంగ’ కుటుంబీకులందరికీ సంతోష సమయం.

ఈ ఆదివారం అంటే 21 వ తేదీన న్యూయార్క్ బ్రూక్లిన్ బరో హాల్లో మెయిన్ స్టేజ్ మీద రాజ్ రాసిన ఈ నవలని పరిచయం చేయబోతున్నారు. ఈ నవల సారంగ బుక్స్ తొలి ఇంగ్లీషు సాహిత్య ప్రచురణ. అంటే, ఇదే సందర్భంలో సారంగ బుక్స్ మొదటిసారిగా అంతర్జాతీయ పుస్తకాల మార్కెట్లోకి అడుగుపెడుతోందన్న మాట.

RajKaramcheduరాజ్ కారంచేడు ఇప్పటిదాకా కవిత్వ అనువాదకుడిగానే మనకు తెలుసు. రాజ్ అనువాదం చేసిన తెలుగు కవితల ఇంగ్లీషు అనువాదాలు కొన్ని Oxford University Press త్వరలో ప్రచురించబోతున్న తెలుగు కవితల సంపుటంలో చేరాయి. అలాగే, రాజ్ అనువాదం చేసిన శివారెడ్డి, వరవర రావు, ఇస్మాయిల్ ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య పత్రికల్లో ఈ ఏడాది రాబోతున్నాయి కూడా.

ఈ అనువాద కృషికి భిన్నంగా రాజ్ రాసిన ఈ నవల All Things Unforgiven మరచిపోలేని మైలురాయి. హైదరాబాద్ పాతబస్తీలో వొక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం కేంద్రంగా సాగే ఈ నవల అటు హైదరాబాద్ నీ, ఇటు ఆధునికతలోకి అడుగుపెడ్తున్న బ్రాహ్మణ కుటుంబం బతుకు చిత్రాన్నీ, ఆ జీవితాల ఎగుడు దిగుళ్ళనీ బలంగా ప్రతిబింబిస్తుంది. బహుశా, ఇటీవలి కాలంలో హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా వెలువడిన అరుదైన ఆంగ్ల నవల ఇదే కావచ్చు కూడా. ఈ నవల ప్రస్తుతం సారంగ బుక్స్ ద్వారా, అమెజాన్ ద్వారా కూడా అందుబాటులో వుంది.

 

సిక్కోలు బుక్ ట్రస్ట్ “మన ప్రపంచం” ఆవిష్కరణ

Invitation

ఫేస్ బుక్ లో తొలి తెలుగు కథల పోటీ

unnamed

యాకూబ్ ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ ఆవిష్కరణ

10347488_10152266211996466_130275867324807047_n

Yakoob Cover-Nadi final cover

బహుశా చాలా రోజుల్నించి, కొన్ని నెలల నుంచి నేను యాకూబ్ లోకంలోనే బతుకుతున్నా, ప్రతి కవికీ వాడిదయిన ప్రపంచం వుంది. అనుభవం వుంది. అందరి చుట్టూ అదే ప్రపంచం ఉంది, అనుభవం వుంది. అందరిచుట్టూ ప్రపంచం వున్నా. ఆ కవి అందుకున్న అనుభవం ప్రత్యేకమయింది. ఈ ప్రపంచాన్ని ఆ కవి ఎలా దర్శించాడు, ఘర్షించాడు, ఆనందించాడు, దు:ఖపడ్డాడు. తనదయిన అనుభవ ప్రపంచాన్ని ఎలా సృజించుకున్నాడు, బహుశా అతని ఆశలు ఆవేదనలు ఉద్వేగాలు సర్ధుబాటులు, సమన్వయాలు, తను కొత్తగా కనుగొన్న సత్యం తాలూకు వెలుగు-

ఏమి ప్రపంచమది, మనకందుబాటులో వున్న ప్రపంచాన్న అతనెలా అనువదించాడు, ఎప్పుడూ సుఖంగా వున్నట్టు, లేనట్టూ, రక్తాలోడుతున్నట్టు, అనంతమయిన పూదోటల్లో తిరుగుతున్నట్టు అడవికట్టంబడి నడుస్తున్నట్టు, అకస్మాత్తుగా వాగువెల్లువెత్తినట్టు, దరులు విరిగి పడుతున్నట్టు జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నట్టు- ఎప్పుడూ ఒక ఎదురుచూపు, ఒక ఆరాటం ఒక ఆప్యాయతకోసం అర్రులు చాచటం, ఒక చల్లని స్పర్శకోసం తపించటం, సుదీర్ఘమయిన రాత్రుల్ని కాయితాలుగా మలుచుకోవడం- బర్రెల్నో, గొర్రెల్నో కాయటం, ఏటి ఒడ్డున నడుస్తూ రేగ్గాయల్నో, మరే పిచ్చి కాయల్నో శబరి కొరికినట్లు కొరకటం, నెత్తురులోడే కాళ్ళతో నడవటం – దాహంతో తపించటం- అదంతా ఒక యాత్ర, యులెసిస్ యాత్ర, అదొక ప్రవాహం, ప్రవహించే జ్ఞాపకం. ‘‘ ఇరవై గంటల పొలంలో బంగారం పండించిన వైనాలు, ఏట పెట్టడాలు, ఎగసాయం చేయడాలు, మోటకట్టడాలు, మోపులెత్తడాలూ, కాసెపోసి పంచెకట్టడాలు, ఎలుగు కట్టడాలు, గిత్తఒట్టకొట్టడాలు, తాడుపేనడాలు, చిక్కంవేయడాలు, గుమ్మికట్టడాలు, ఇటుకబట్టీ కాల్చడాలు, మనుంపట్టడాలు, రుణం తీర్చుకోవడాలు, పందిరేయడాలు, పగ్గమేయడాలు- అబ్బా యిదంతా నా వారసత్వపు కథ ’’ (సరిహద్దురేఖ).

ప్రతి కవి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. ఒక పరిక్షకు సిద్ధమౌతాడు. కాలం పరీక్షకు పెడుతుంది. స్థలకాలాల్నుంచి అనుభవాన్ని స్వీకరిస్తూ స్థలకాలాలు దాటి ఎదగటం- ఒక పక్షికుండే స్వేచ్ఛా స్వభావమేదో కవిలో అణువణువునా జ్వలిస్తూ వుంటుంది. ఎన్నిరకాలుగా జీవితాన్ని ప్రపంచాన్ని చూడొచ్చు. ప్రతి అంశనీ, విషయాన్నీ పట్టి పట్టి చూడటం – లోతుల్లోకెళ్ళి మాట్లాడటం- బహుశ యిది ఎవరి కవిత్వానికయినా, ఒక అథెంటిసిటిని, ఒక ఒరిజినల్ టచ్ ని ఇస్తుందనుకుంటా! ‘ప్రవహించే జ్ఞాపకం ’ నుంచి సరిహద్దురేఖ దాటి సువిశాల జీవావరణంలోకి ఈ కవితా సంపుటి ‘ఎడతెగని ప్రయాణం’ తో ప్రవేశించాడు యాకూబ్. అంత submerge అయి ఒక సంయమనంతో అద్భుతమయిన రూపు తీసుకోవటం ఇందులో చూస్తాం. దీనికి బీజాలు ‘సరిహద్దురేఖ’ లోనే వున్నాయి. సంక్లిష్టమయిన, సమరశీలమయిన జీవితాన్నెన్నుకున్నాడు. జీవితమే నేర్పాలి – కవి నేర్చుకోవాలి. కన్ను చెవి బాగా పని చేయాలి. గతం స్మృతులుగానూ, జీవసారంగానూ, దృశ్యపరంపరగానూ కవిత్వమంతటా అల్లుకుంటుంది. సువాసనాభరితమయిన సువర్ణస్పర్శ ఏదో ఈ కవిత్వానికి వుంది. మనల్ని మనం మర్చిపోయి. కవి కనికట్టులో పడిపోతాం- కవి చెప్పేదే నిజమవుతుంది. కవి జీవితం, అనుభవం మన జీవిత మౌతుంది. మన అనుభవమవుతుంది. వస్తువిస్తృతి పెరుగుతుంది. జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాల్ని, అంచుల్ని అందుకుని అవలీలగా కవిత్వం చేయటం ప్రారంభిస్తాడు. ఒక పరిపక్వదశలోకి ప్రవేశించే సమయంలో పద్యాలు సజీవాలవుతాయి. అవే గమస్తాయి. మాట్లాడతాయి, మన చుట్టూ తిరుగుతాయి. మనలోనూ తిరుగుతాయి.

– యాకూబ్ “ఎడతెగని ప్రయాణం” కోసం శివారెడ్డి రాసిన ముందు మాట

 

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

10419479_10204326595991984_5763381120454654266_n

15న  పులికొండ సుబ్బాచారి “బాడిశ మొక్కబోయింది” ఆవిష్కరణ సభ

సుబ్బాచారి కవిత్వ సంపుటి కి అఫ్సర్ రాసిన ముందు మాట ఇది.

1

మొదలెట్టడం ఎప్పుడూ సమస్యే.. సుబ్బాచారి గురించి ఎక్కడ మొదలెట్టాలి?! నాకు ఇంకా కవిత్వం గాలి సోకని కాలంలో పుస్తకాల పురుగునై లైబ్రరీల మధ్యా, మనుషుల మధ్యా దాహార్తినై సంచరిస్తున్న  తొలి యౌవనకాలంలో తొలినాటి ఖమ్మం సాహిత్య మిత్రబృందంలో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వాడు సుబ్బాచారి. మా బంధం కవిత్వంతోనే మొదలైందో, సుబ్బాచారి కష్టజీవితం పట్ల నాకున్న ఇష్టంతో మొదలయిందో చెప్పడం కష్టం.

కాని, ఆ రోజుల్లో సుబ్బాచారిని చూడడం వొక ఆనందం. వొక ఉత్సాహం. వొక స్ఫూర్తి. తరవాతనే మొదలయింది మా సాహిత్య బంధం! ఇప్పటికీ మరచిపోలేని గుర్తులు ఖమ్మం రికాబ్ బజార్ స్కూలు వెనక కూర్చొని మేం అల్లుకున్న కవిత్వ కబుర్లు. వూరికి ఇంకో దిక్కున ప్రభాత్ టాకీస్ ఎదుట మా కోసమే అన్నట్టుండే వొక శిధిలమైన బెంచీ మీద రైళ్ళ రాకపోకల్ని గమనిస్తూ కలబోసుకున్న ఇంకేవో కబుర్లు. తిలక్ అన్నట్టు- “ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విషాదమో, విషాదం లాంటి ఆనందమో!” కాని, ఆనందమే ఎక్కువ అని చెప్పగలను.

సుబ్బాచారి క్రమంగా సుబ్బన్న అయిపోయాడు. అక్షరాలకు మించిన ఆ ఆత్మీయతే ఇవాళ తనని గురించి ఈ నాలుగు మాటలూ రాయాలని ఉత్సాహపెడుతోంది.

అవును, రాయాలి…శ్రమ సౌందర్యంలోంచి జీవితాన్ని నెగ్గుకు వచ్చిన సుబ్బన్న గురించి, పరిశోధన కోసమే జీవితాన్నీ, చాలా కాలం వరకూ కవిత్వాన్ని కూడా త్యాగం చేసిన సుబ్బన్న గురించి, కాలం కాని కాలంలో జీవితంలో అసలైన విలువల వెంట అమాయకంగా అదే అంకిత భావనతో సూటిగా వెళ్ళిపోతున్న సుబ్బన్న గురించి రాయాలి!

మొన్నా, నిన్నా సుబ్బన్న కవిత్వం చదువుతూ ఏమన్నా రాద్దామని కూర్చున్న వేళలోనే మార్క్వెజ్ మరణ వార్త నన్ను నిశ్శబ్దంలోకి నెట్టేసింది. వొక పాతిక ముప్పయ్యేళ్ళుగా చదువుతూ అనుభవిస్తూ పలవరిస్తున్న రచయిత కన్నుమూసినప్పుడు వాక్యాలు మొరాయిస్తాయి.

సుబ్బన్న గురించి రాస్తూ రాస్తూ నేను మార్క్వెజ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా సుబ్బన్నని చూసాను ఈ వాక్యాల్లో:

Ultimately, literature is nothing but carpentry. Both are very hard work. Writing something is almost as hard as making a table. With both you are working with reality, a material just as hard as wood. Both are full of tricks and techniques. Basically very little magic and a lot of hard work are involved.

ఆ రోజుల్లో సుబ్బన్నని గురించి నాన్నగారు అనే వారు: “చిత్రిక పట్టడం అలవాటైన చేతుల్లో కవిత్వం శిల్పం అవుతుంది. సుబ్బాచారి కవిత్వం మీద దృష్టి పెడితే మంచి కవిత్వ శిల్పి అవుతాడు.” అని!

 

2

 

కాని, వొకే దారిలో వెళ్ళనిస్తే అది జీవితం కాదు కదా!

సుబ్బన్న పరిశోధనలో చాలా దూరాలు వెళ్ళాడు. అతని పరిశోధన విలువని గుర్తించే స్థాయికి ఇంకా మన ప్రమాణాలు ఎదగలేదు. ఇక్కడ అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ఆ పరిశోధన ఎంత విలువైనదో నాకు తెలుసు. శ్రమించే చేయి, చిత్రిక పట్టే ఆలోచనా, అంకితమైపోయే చిత్తం వున్నప్పుడు ఏ రంగమైనా “చిత్తం!” అనేస్తుంది. ఇంత కూడా విరామం లేకుండా పనిచేస్తూనే సుబ్బన్న ఇంకో కిటికీ రెక్క తెరచి పెట్టుకున్నాడు, కవిత్వం కోసం! అదీ కష్టమైన పని.

వొక రంగంలో నిలబడి, ఆ పరిభాషతో తలపడుతున్నప్పుడు కవిత్వమనే సున్నితమైన భాషలోకి రాకపోకలు అంత తేలిక కాదు మరి! కష్ట సాధ్యమైంది సాధించడమే సుబ్బన్న జీవన సారం! శ్రమ పాఠం! ఈ పుస్తకంలో ప్రతి పుటలో మీకు సుబ్బన్న అంతరంగం కనిపిస్తుంది. అతని వేదనల తరంగాలు మిమ్మల్ని తడిపేస్తాయి. కష్టజీవికి ఇరుపక్కలా వుండే వాడే నిజమైన కవి. నిజమే! కాని, కష్టజీవే కవి అయినప్పుడు ఆ కవిత్వం ఎలా వుంటుంది..అందులో పలికే హృదయం ఎలాంటి చప్పుడు చేస్తుంది…మీరే వినండి!

3

తెలుగు సాహిత్యంలో  మనం కష్టజీవుల గురించి మాట్లాడుతూనే వున్నాం. కాని, సాహిత్యంలో ప్రతిఫలించిన కష్టజీవులు చాలా మటుకు అమూర్త మానవులు – అంటే, నిర్దిష్టంగా ఫలానా రకం కష్టజీవి – శ్రీశ్రీ అన్నట్టు కుమ్మరిచక్రం, చేనేత మగ్గం, లేదా ఈ కవిత్వంలో సుబ్బాచారి చెప్తున్న బాడిస బతుకుల జీవన చిత్రం లాంటివి కచ్చితంగా చిత్రిస్తున్న వాళ్ళు అరుదు. ఈ నేపధ్యంలో కష్టజీవికి నిర్దిష్టమైన నిర్వచనం ఇస్తూ, ఆ కష్టానికి తగిన పరిభాషని నిర్మిస్తున్న కవిగా సుబ్బాచారి ఈ కవితా సంపుటిలో కనిపిస్తున్నాడు.

“బాడిస మొక్కబోయింది” అనే కవిత నా మటుకు నాకు ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో వొక అరుదైన వ్యక్తీకరణ రెండు కారణాల వల్ల- 1) అంతకు ముందు మనం కవిత్వంలో విని వుండని వొక నిర్దిష్టమైన కులవృత్తి అస్తిత్వ వేదనని చెప్పడం, 2) ఏ కవిత ప్రత్యేకత అయినా వొక కొత్త వస్తు నిర్దేశం దగ్గిరనే ఆగిపోకూడదు. ఆ వస్తువు తనదైన కొత్త శిల్పాన్ని కూడా ఆవిష్కరించుకోవాలి. ఈ కవితలోని శిల్పాన్ని ఆత్మీయంగా చూసే చదువరికి వొక వుద్వేగ తీవ్రతని చిత్రిక పట్టే కొత్త భాష, పదచిత్ర నిర్మాణం అబ్బుర పరుస్తుంది.

కవిత ఎత్తుగడలోనే సుబ్బాచారి శిల్ప విన్యాసం కనిపిస్తుంది. “ఇంటి నిండా కంటి నిండా /కళని కుమ్మరించిన చెయ్యి”, “దంతే, గంటక, గొర్రు, కాడిమాను, బండిచక్రాలు, పందిరి మంచాలు, కార్నీసు దూలాలు” ఇవన్నీ అమర్చి పెట్టిన చెయ్యిని గుర్తు చేయాల్సి రావడంలో విషాదం వుంది. కాని, ఈ వస్తు సముదాయాన్నంతా గుర్తుచేయడం ద్వారా ఆ శ్రమజీవుల సౌందర్యాన్ని మాత్రమె కాకుండా, వారి జీవన ప్రాముఖ్యతని కావ్యబద్ధం చేసాడు సుబ్బాచారి. ఈ కవిత శిల్పంలో కూడా ఆ రెండు అంశాలు- సౌందర్యం, ఆ కులవృత్తి గతమైన జీవన ప్రాముఖ్యం కలిసి చేస్తున్న ప్రయాణం  వుంది. నిజానికి వొక దీర్ఘ కావ్యానికి కావలసిన సామాగ్రి ఇందులో వుంది.

బిడ్డలా సుబ్బాచారి కవిత్వ వ్యక్తిత్వంలో అది వొక కోణం మాత్రమే. ఈ సంపుటిలో సుబ్బాచారి ఇతర కవితలు అతని వున్న భిన్నత్వాన్ని చెప్తాయి. కవిత్వంలో వైయక్తిక కోణాన్ని దర్శించే పధ్ధతి వొక్కో కవికి వొక్కో విధంగా వుంటుంది. ఈ సంపుటిలో మొదటి కవిత “యుగళయానం” దీనికి వుదాహరణ. ఈ కవితలో నన్ను బాగా ఆకట్టుకున్న సందర్భమూ, వ్యక్తీకరణ:

 బిడ్డల కత్తి పడవలు ఒంటి మీద నడుస్తూంటే

తొణికిన తరంగాల దారి చెదరకుండా నిలబడింది.

 

వ్యక్తిగతమైన సందర్భాల్ని సాధారణీకరించి వాటికి కవిత్వ గౌరవాన్ని ఇవ్వడంలో సుబ్బాచారి నిబద్ధత కనిపిస్తుంది. ఇలాంటి కవితలు కవి దార్శనికతని కూడా చెప్తాయి. ఇలాంటిదే మరి కవిత “ తనువూ తనువూ మధ్య తనూభాష”. ఈ కవితలో చివరి వాక్యం “పెళ్లి ఒక ఉత్తుత్తి మిష” వొక జీవన సందర్భాన్ని తనదైన దృష్టితో చెప్పడం అంటే ఏమిటో చెప్తుంది. వృత్తి వొక సామాజిక సందర్భం అయితే, దాంపత్యం కౌటుంబిక వ్యక్తిగత సందర్భం. ఆ రెండీటి మధ్యా సమతూకమే దార్శనికత. సుబ్బాచారి కవిత్వంలో నాకు ప్రధానంగా కనిపించిన లక్షణం ఇదే!

4

ఈ సంపుటిలో సుబ్బాచారి కవిత్వ అనువాదాలు కూడా వున్నాయి. ప్రసిద్ధ ఉర్దూ కవి ఫైజ్ అహమద్ ఫైజ్ అంటే సుబ్బచారికి ప్రత్యేకమైన అభిమానం వున్నట్టు వుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. బహుశా, జీవితాన్ని శ్రమజీవుల కోణం చూస్తూనే, అందులో ఇమడాల్సిన పద్య సౌందర్యాన్ని పోగొట్టుకోని అరుదైన కవిత్వ శిల్పి ఫైజ్. సుబ్బాచారి ఆ వారసత్వాన్ని నిలుపుకొనే ప్రయత్నంలో భాగంగా ఈ అనువాదాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే, తన కవిత్వ వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే సాధనాలని నిర్మించుకునే దారిలో వాటి ఆసరాని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సుబ్బాచారి.

అలాగే, ఇతర భారతీయ భాషల నించి చేసిన అనువాదాలు కూడా సుబ్బాచారి వ్యక్తిత్వంలో వొదిగే లక్షణాలతో వుంటాయి. ఈ అనువాదాల ద్వారా ఈ తరం కవులకి కవిత్వ అభ్యాసానికి సంబంధించిన పాఠం చెప్తున్నాడు సుబ్బాచారి.

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

సుబ్బాచారికి ఆ ఆనంద రహస్యం తెలుసు.అందుకే, అతనికి చినుకు ఓనమాలు అర్థమవుతాయి. అయితే, ఈ వర్ష ధారలు బలపాలై నేల పలకతో సంభాషించినప్పుడే కవిత్వ వర్షానికి సార్ధకత అని కూడా సుబ్బా చారికి తెలుసు.

ఈ సారవంతమైన సార్ధకమైన కవిత్వ ధార సదా నిలిచి వుండాలని నా ఆకాంక్ష.

*

 

మృత్యుంజయ్ కార్టూన్ ప్రదర్శన

mruthyujay“సారంగ” చదువరులకు కార్టూనిస్ట్ మృత్యుంజయ్ ని ప్రత్యేకించి పరిచయం చేయకర్లేదు.

ప్రతి వారం “కార్టూనిజం” శీర్షిక ద్వారా మీకు మృత్యుంజయ్ తెలుసు. సొంత కుంచె మీద నిలబడ్డ ప్రతిభ మృత్యుంజయ్! కార్టూన్ అంటే కేవలం ఒక నవ్వు రేఖ అని కాకుండా, దాని చుట్టూ దృక్పథ కోణం కూడా వుండి తీరాలని నమ్మే రేఖాజీవి.

తెలంగాణా అరవయ్యేళ్ళ కల నిజమైన సందర్భంగా అరవై కార్టూన్లతో ఇదిగో ఇలా మీ ముందుకు వస్తున్నాడు మృత్యుంజయ్.

Invitation final

జూన్ 1న వంగూరి ఫౌండేషన్ అవార్డుల సభ

2011 VFA new logo

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు గత మార్చ్ , 2014 లో నిర్వహించిన 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో బహుమతి పొందిన వారిలో భారత దేశం నుంచి విజేతలైన వారి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మీకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.

 

తేదీ: జూన్ 1, 2014 (ఆదివారం)

సమయం: సాయంత్రం: 6 గంటలకు

వేదిక: శ్రీ కళా సుబ్బారావు వేదిక,  శ్రీ త్యాగరాజ గాన సభ ప్రాంగణం, చిక్కడ్ పల్లి, హైదరాబాదు.

ప్రధానాంశం: విజేతలకు నగదు (సుమారు  35 వేల రూపాయలు), ప్రశంసాపత్రాల బహూకరణ.

ప్రత్యేక ఆకర్షణ :  విజేతలచే బహుమతి పొందిన తమ రచనల స్వీయ రచనా పఠనం.

 

ఆహ్వానిత 19 వ ఉగాది ఉత్తమ రచన విజేతలు (ప్రధాన విభాగం, నా “మొట్టమొదటి రచన” విభాగం, యువతరం విభాగం) :

గంధం యాజ్ఞ్యవల్క్య శర్మ, (నరసరావు పేట), భరత్ భూషణ్ రెడ్డి (హైదరాబాద్), టి. నవీన్ (హైదరాబాద్) భండారు విజయ (హైదరాబాద్), బి. మెర్సీ మార్గరెట్  (హైదరాబాద్), కుడికాల “సరోజనార్ధన్” వంశీధర్,(హనుమకొండ), కామేష్ పూళ్ళ (యానాం), చెన్నూరునరేంద్రనాథ్ (కలకత్తా) ,శివ్వాలా గోవింద రావు,కర్రి రఘునాథ శంకర్ (యలమంచిలి), మల్లిపూడిరవిచంద్ర (హైదరాబాద్), ప్రసూన రవీంద్రన్ (శేరిలింగంపల్లి) గొర్లెహరీష్ (కాకినాడ), దోర్నాదుల సిద్ధార్థ (పలమనేరు), మోహిత కౌండిన్య ( హైదరాబాద్),S. V. కృష్ణ జయంతి (హైదరాబాద్),  నగేష్బీరేడ్డి (రామగిరి)

 

అత్యధికంగా యువతీ యువకులే “సాహిత్య” విజేతలుగా ఈ సభలో పాల్గొంటున్న ఈ పురస్కార ప్రదానోత్సవానికి మీరు సకుటుంబ సమేతంగా వచ్చి, విజేతల రచనలని వారి గొంతుకలలోనే విని ఆనందించమని తెలుగు సాహిత్యాభిమానులందరినీ కోరుతున్నాం.

మరి కొన్ని వివరాలకు మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వంశీ రామరాజు గారికి ఫోన్ చేసి సంప్రదించండి. ఆయన ఫోన్ నెంబర్ 98490 23842.  (హైదరాబాదు)

 

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

హ్యూస్టన్, హైదరాబాద్

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

www.vangurifoundation.blogspot. com

‘ కథాసంధ్య’ లో గళం విప్పనున్న కథారచయిత సుంకోజి

NeeruNelaManishi

ప్రముఖ  కథా రచయిత సుంకోజి దేవేంద్రాచారి సాహిత్య అకాడమీ ఫిబ్రవరి 7 వ తేదీ శుక్రవారం కడప లోని ఎర్రముక్కపల్లి లో సి.ఫై.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం లో తన కథ ను చదివి తన నేపథ్యాన్ని వివరిస్తారు. దేవేంద్రాచారి నేపథ్యాన్ని కింద పిడిఎఫ్ లో చదువుకోవచ్చు.

 

 

Invitation1

రామా చంద్రమౌళి కి ‘ఫ్రీ వర్స్ ఫ్రంట్-2012’పురస్కారం

free verse front-2012

వరంగల్:1967 వ సంవత్సరంలో స్థాపించబడి మొట్టమొదట రు.116 రూపాయల నగదు పురస్కారంతో ‘వచన కవిత ‘కు జవజీవాలనందించి ప్రోత్సహించాలన్న సదాశయంతో డా.కుందుర్తి ఆంజనేయులుగారు స్థాపించిన ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం క్రమేపి తెలుగు కవితా ప్రపంచంలో ‘సాహిత్య అకాడెమి ‘తో సమాన విలువగల ఒక సామాజిక గౌరంగా స్థిరపడింది.కుందుర్తి కీర్తిశేషులైన తర్వాత ఆయన సతీమణి కుందుర్తి శాంత, కొడుకు సత్యమూర్తి ఈ పురస్కారాల ప్రదానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.తెలుగు కవుల్లో ప్రముఖులైన శివారెడ్డి,డా.ఎన్.గోపి, నగ్నముని,నిఖిలేశ్వర్,వరవరరావు..వర్థమాన కవులు శిఖామణి,యాకూబ్ వరకూ ఈ పురస్కారాన్ని ఇంతవరకూ అందుకుంటూ వచ్చారు.

నిన్న హైదరాబాద్ లోని చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సంవత్సర వార్షిక సాహిత్య సమావేశంలో ప్రతిష్టాత్మకమైన ఈ ‘ఫ్రీవర్స్ ఫ్రంట్-2012’ పురస్కారాన్ని వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళి రచించిన ‘అంతర ‘కావ్యానికి ప్రదానం చేసారు.ఈ సందర్భంగా ఘనంగా జరిగిన సభలో రామా చంద్రమౌళిని పదివేల రూపాయల నగదుతో,విలువైన జ్ఞాపికతో,శాలువాతో,శ్రీ నగ్నముని,శీలా వీర్రాజు,డా.నాళేశ్వరం శంకరం సన్మానించారు.శ్రీ శిఖామణి ‘అంతర ‘కవితా సంపుటిని సమీక్షించి ఎందుకు ఈ కావ్యం పురస్కారార్హమో సభికులకు తెలియజేశారు.

అనేకమంది కవితాభిమానులు పాల్గొన్న ఈ సభలో ప్రముఖ కవులు కె.శివారెడ్డి,డా.ఎన్.గోపి,నిఖిలేశ్వర్,సుధామ,కందుకూరి శ్రీరాములు,డా.గుడిపాటి,సి.ఎస్.రాంబాబు,డా.కె.ఎల్.వి.ప్రసాద్,స్వాతి శ్రీపాద మొదలైన ప్రఖ్యాతులతో పాటు శ్రీమతి శీలా సుభద్రాదేవి,కుందుర్తి శాంత మరియు కుందుర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవార్డ్ గ్రహీత రామా చంద్రమౌళి ని జంటనగరలకు చెందిన పలువురు ఆయన అభిమానులు,వరంగల్లు నుండి ప్రత్యేకంగా సభలో పాల్గొన్న కవిత్వ ప్రేమికులు అభినందించారు

5 న తెనాలి లో ‘ రియాలిటీ చెక్ ‘ ఆవిష్కరణ

RC_invi_leaf_jp

పూడూరి రాజిరెడ్డి కలం నుంచి వెలువడిన ” రియాలిటీ చెక్” పుస్తకం ఆవిష్కరణ సభ తెనాలి లో జనవరి 5 వ తేదీ జరుగుతుంది. పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య ఆవిష్కరిస్తారు.

కవి రామా చంద్రమౌళికి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్ -2013’ పురస్కారం

ramachandramouliవరంగల్: వచన కవిత్వ పితామహుడు  కుందుర్తి ఆంజనేయులు   స్థాపించిన ప్రతిష్టాత్మక పురస్కారం ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్   అవార్డ్  -2013 ‘ ఈ సంవత్స్తరం వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళి ని వరించింది  . ఆయన ఇటీవల విడుదల చేసిన  ‘ అంతర’ కవిత్వ సంపుటికి ఈ గౌరవం దక్కింది  . పురస్కార కమిటీ కన్వీనర్ శీలా వీర్రాజు ఈ పురస్కార విషయాన్ని ప్రకటిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ లో  జరిగే ప్రత్యేక సభలో పదివేల రూపాయల నగదు,ప్రశంసా పత్రం,జ్ఞాపిక మరియు శాలువాతో ఘనంగా రామా చంద్రమౌళి ని సత్కరిస్తామని చెప్పారు. ఇంతవరకు 20 నవలలు,250 కి పైగా కథలు,9 సంపుటాల కవిత్వం వెలువరించి వరంగల్లు ప్రతిష్టను ఖండాంతర పరచిన మౌళి గారికి ఈ పురస్కారం రావడం ఈ కాకతీయుల గడ్డకు ఒక అదనపు అలంకారంగా సాహిత్యాభిమానులు భావిస్తూ రామా చంద్రమౌళి ని అనేక సాహితీ ప్రియులు అభినందించారు .

తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

నిజం చెప్పద్దూ, మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు. దూరపు చుట్టాలలో సంగీతజ్ఞులు, ఇదే ఇంటిపేరుతో కొంతమంది రచయితలు వున్నా వారితో అనుబంధం తక్కువ. మరి నాలో ఈ సాహిత్యాభిలాష ఎక్కడిదా అని వెతుక్కుంటూ నాలోకి నేనే చూసుకుంటే –

ముందు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. గత పాతికేళ్ళుగా ఆమె జ్ఞాపకంగానే మిగిలింది. పాత సినిమాపాటలో, లలిత సంగీతమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా లేకుండా ఆమె నాకు గుర్తుకురాదు. రేడియో పాడుతుంటే, ఆమె పనులు చేసుకోవటం ఆమె గురించి గుర్తున్న సంతోషకరమైన జ్ఞాపకాలలో ఒకటి.

ఇక అదే రేడియోలో ఏ రాత్రిపూటో నాన్న పెట్టే కర్ణాటక సంగీతం – తెలియకుండానే త్యాగరాజునీ, శ్యామదాసునీ, పురంధరదాసునీ పరిచయం చేసేవి. సుబ్బలక్ష్మి, శమ్మంగుడి, మహారాజపురం, కున్నకూడి, పట్టమ్మాళ్ ఇలా ఒక్కొక్కళ్ళే మా గోడమీద చెక్కస్టాండ్ స్టేజి పైకి ఎక్కి టేప్ రికార్డర్ రూపేనా కచేరీలు చేస్తుండేవాళ్ళు. వీళ్ళంతా నాన్న సేకరించిన వందలకొద్ది సంగీతం క్యాసెట్లలో సంగీత సామ్రాట్టులు. వీరందరి మధ్యలో అక్కడక్కడ కనిపించే నాలుగైదు సినిమా పాటల క్యాసెట్లలో నుంచి ఎ.ఎమ్.రాజా, ఘంటసాల, లీల, సుశీల గొంతు సవరించేవాళ్ళు. వీళ్ళంతా అమ్మకోసం నాన్న రికార్డ్ చేయిస్తే ఇంటికి వచ్చిన అతిథులు. ఈ సంగీతం, సినీగీతం మధ్యలో ఎక్కడో కళల గురించి ఆసక్తో, అభిరుచో మొదలైంది.

వేమన్నని, పోతన్నని పరిచయం చేసింది మేనత్త. తొలి అడుగులు వేస్తున్నప్పుటి నుంచే తెల్లవారుఝామున లేపి, నీళ్ళు పోసి, దేవతార్చనకి పూలు కోసే నెపంతో నన్ను పక్కింటికి తీసుకెళ్ళి “శుక్లాంబర ధరం”తో మొదలుపెట్టి, “ఇంతింతై వటుడింతై” అంటూ పోతనని పలకరించి, ఆ తరువాత పాడ్యమి విదియ తదియలు, ప్రభవ విభవలు చెప్పించేది. తెల్లవారుఝామున చెప్పిన పద్యాలు, చదివిన చదువులు, నందివర్ధనం చెట్టు మీద నుంచి రాలిపడిన మంచుబిందువులంత స్పష్టంగా గుర్తున్నాయి. అక్కడ తెలుగుతో పరిచయం అయ్యింది.

“నానమ్మా కథ చెప్పవూ” అనే మాటతోనే రాత్రుళ్ళు మొదలయ్యేవి మాకు. రాజకుమారుడు, తెల్లగుర్రాలు, పూటకూళ్ళపెద్దమ్మలు, కాశీమజిలీలు, భోజరాజు కథలు, విక్రమార్కుడు… నిద్ర… కథ…! వింటూ నిద్రపోతూ, కథల్లో తూగుతూ, కలల్లో కథని చూస్తూ, మనమే యువరాజులై గుర్రం పైన స్వారీ చేస్తూ వుంటే… ఇంతలో రాక్షసుడొస్తే పక్కనే ధైర్యం చెబుతూ నానమ్మ. కొంత వూహ తెలిసాక రామాయణం, మహాభారతం ఆ తరువాత ధృవుడు, ఇంకోరోజు హరిశ్చంద్రుడు… “లోహితా, లోహితా” అంటూ హరిశ్చంద్రుడు ఎంత ఏడ్చాడోకానీ, నానమ్మ ఆ కథ చెప్పిన ప్రతిసారీ ఏడవడం ఒక ఆశ్చర్యకరమైన జ్ఞాపకం. కథతో, అందులో వుండాల్సిన ఎమోషన్ తో తొలి పరిచయం.

ఆ తరువాత ఇంకేముంది – మనకి చదవటం వచ్చేసింది. పాఠ్య పుస్తకాలలో – మొక్కపాటి, పానుగంటి, జాషువా, కరుణశ్రీ, సర్ ఆర్థర్ కానన్ డాయల్, సోమర్ సెట్ మామ్, బయట పుస్తకాలలో – యండమూరి, మల్లాది, సూర్యదేవర, యద్దనపూడి వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరినీ చదివి అవన్నీ చాలక కనపడ్డ పుస్తకమల్లా నమిలేస్తూ, నెమరేస్తూ – కిరాణా కొట్టులో కట్టిచ్చిన పొట్లాల కాగితంతో సహా చదివేసి తృప్తిగా తీరుబడిగా కూర్చున్నాక ఒక శుభముహుర్తాన శ్రీశ్రీ కనపడ్డాడు. ఆయన వెంట మొదలుపెట్టిన పరుగు “కలం కల” అంటూ కవితై మయూరి వారపత్రికలో అచ్చైంది. ఆ తరువాత కథలు – 1995 తొలికథ ఆంధ్రప్రభ ఆదివారం పత్రికలో దీపావళి కథలపోటీలో సాధారణ ప్రచురణ. అప్పుడే రైల్వే జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కథలపోటీలో మొదటి బహుమతి. తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

Cover

సాహితీవైద్యం కోసం వసుంధరగారికి రాయచ్చో రాయకూడదో అనుకుంటూ, ఒక రోజు ధైర్యం కూడగట్టుకోని “ఈరేశంగాడి ముచ్చట” పంపించాను. “కథాంశం బాగుంది. మీకంటూ ఒక శైలి ఏర్పడాలంటే మీరు ఎక్కువగా చదవా”లని వారి నుంచి ఉత్తరం. పెద్దల మాట చద్దన్నం మూట అని నాన్నమ్మ చెప్పిన మాట. అప్పుడే మరిన్ని పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నాను!

అదే మొదలు. ఇట్నుంచి షిడ్నీ షెల్డన్, అగాథా క్రిస్టీ అట్నుంచి ముళ్ళపూడి, కొకు, బుచ్చిబాబు, చలం…. చదువుతున్నకొద్దీ కుచించుకుపోయి, నేను రాసినవీ కథలేనా అని ఆ మహామహుల రచనలలో ఆవగింజంతైనా అందుకునేదాకా రాయకూడదని ఆరేడు సంవత్సరాలు అజ్ఞాతవాసం. నేను రాసేది నాకు నచ్చేదాకా చదవటమే ఒక పని (ఇప్పటికీ కొనసాగుతోంది). గుజరాత్ లో చదువులు ఆ తరువాత కార్పొరేట్ వుద్యోగం. వుద్యోగం వూళ్ళు తిప్పింది. కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొత్త పుస్తకాలు… కొత్త కొత్త కథలు. ఇందోరులో వున్నప్పుడు ఉజ్జైనిలో మంచినీటి కటకట గురించి పేపర్లో చదివిన తరువాత మళ్ళీ కలం కదిలింది. కొత్తగా పరిచయమైన టెక్నాలజీ సాయం తీసుకొని బ్లాగులు, అంతర్జాల పత్రికలకే పరిమితమై వుండిపోయాను.

ఆ తరువాత పరిచయమైన సాహితీ మిత్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. బ్లాగుల్లో గుట్టుగా వున్న నన్ను అచ్చోసిన రచయితని చేశారు.

వసుంధరగారిని మళ్ళీ పలకరించాను. “మీ కథలకి ఇక సాహితీవైద్యం అవసరంలేదు. పుష్టిగా వున్నా”యన్నారు. పత్రికలో నా కథ వచ్చినప్పుడల్లా చదివి అభినందించారు, ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఇచ్చిన ధైర్యం తోనే ఈ పుస్తకానికి వాళ్ళనే ముందుమాట అడిగేదాకా తీసుకొచ్చింది. వారి వాత్సల్యానికి, ప్రోత్సాహానికి నా సగౌరవనమస్సులు.

ఈ పుస్తకంతో నా సాహితీ ప్రస్థానం మొదలైంది.

***

చివరిగా ఒక్క మాట – ఇదంతా సోత్కర్షలా వుంటుందని తెలిసినా చెప్పే ధైర్యం చేశాను. చెప్పాల్సిన అవసరం వుందనిపించింది కాబట్టే ఆ సాహసం.

తెలుగు భాషని మరుగుపరుస్తున్నారన్న అపవాదు మోసే తరంలో వాడిని నేను. ఆంగ్లమాధ్యమంలో చదువులు, కార్పొరేట్ వుద్యోగాల పరుగుల మధ్యలో తెలుగు భాషాభిమానాన్ని, సాహితీ ఆసక్తిని సజీవంగా వుంచుకోవచ్చని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నాలాంటివారు ఎందరో వున్నారు. తెలుగు భాష అంతరించిపోతోందని బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మానకూడదు. రేపటి తరానికి రెండు కథలు, నాలుగు పద్యాలు, కాసిన్న సామెతలు చెప్పి తెలుగు భాషని రుచి చూపించండి. ఆ తరువాత పఠనాసక్తిని కలిగించి వదిలిపెట్టండి. ఏ మాధ్యమంలో చదివినా, జీవనానికి మరే భాష అవసరం అయినా తెలుగు మీద మక్కువ ఎక్కడికీ పోదు. అందుకు నేనే సాక్ష్యమని చెప్పడానికే ఈ ముందుమాట.

 

భవదీయుడు

అరిపిరాల సత్యప్రసాద్

final invi